Activities calendar

22 October 2015

21:40 - October 22, 2015

చెన్నై : గెలవాల్సిన మ్యాచ్ టీమిండియా గెలిచింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో వన్డే మ్యాచ్ లో ధోని సేన 35 పరుగులతో విజయం సాధించింది. కోహ్లీ అద్భుత శతకం చేయగా రైనా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. రహానేలు రాణించాడు. తొలుత టాస్ గెలిచిన ధోని సేన బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 8వికెట్ల నష్టానికి 299 పరుగులు సాధించింది. అనంతరం లక్ష్య చేధనకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 264 పరుగులు మాత్రమే చేయగలిగింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్స్ ను భారత బౌలర్లు కట్టడి చేశారు. పద్ధతి ప్రకారం బౌలింగ్ చేయడంతో దక్షిణాఫ్రికా బ్యాట్ మెన్స్ పరుగులు రాబట్టలేకపోయారు. ఓపెనర్ కాక్, ఆమ్లాలు బ్యాటింగ్ ఆరంభించారు. కానీ జట్టు స్కోరు 36 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఆమ్లా (7) వికెట్ కోల్పోయింది. కాక్ మాత్రం భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని స్కోరు బోర్డును పరుగెత్తించాడు. 35 బంతులను ఎదుర్కొని 43 పరుగులు చేసిన కాక్ హర్భజన్ సింగ్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. అప్పటికీ జట్టు స్కోరు కేవలం 67 పరుగులు మాత్రమే. అనంతరం వచ్చిన డుప్లెసిస్ (17) కూడా వెనుదిరిగాడు. తరువాత వచ్చిన కెప్టెన్ డివిలియర్స్ వచ్చి రాగానే ఎదురుదాడికి దిగాడు. కొన్ని గతి తప్పిన బంతులను బౌండరీలకు తరలించాడు. కానీ ఇతనికి ఏ బ్యాట్ మెన్స్ సపోర్టు ఇవ్వలేదు. తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. దీనితో విలియర్స్ ఒంటరి పోరాటం చేశాడు. అర్ధ సెంచరీ పూర్తయిన తరువాత బ్యాట్ ను ఝులిపించాడు. జట్టు స్కోరు 88 పరుగుల వద్ద ఉన్నప్పుడు మిల్లర్ (6) వికెట్ కోల్పోయింది. కీలక వికెట్లు కోల్పోయిన దశలో సమయోచితంగా ఆడిన డివిలియర్స్ 67 బంతుల్లో 6x4 సాయంతో 51 పరుగులు చేశాడు. ఇదే జోరు కొనసాగించిన డివిలియర్స్ 98 బంతుల్లో 10x4, 2x6 సాయంతో 103 రన్లు సాధించాడు. వన్డే కెరీర్ లో డివిలియర్స్ కు ఇది 22వ శతకం కాగా ఈ సిరీస్ లో రెండోది కావడం విశేషం. ప్రమాదకరంగా మారుతున్న ఇతడిని భువనేశ్వర్ కుమార్ అవుట్ చేశాడు. 107 బంతులను ఎదుర్కొన్న డివిలియర్స్ 112 పరుగులు చేసి వెనుదిరిగాడు. గెలవడానికి సాధించాల్సిన పరుగులను మిగతా క్రీడాకారులు చేయలేకపోయారు.

కోహ్లీ అద్భుత సెంచరీ..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ధోని సేననకు ఆదిలోనే సౌతాఫ్రికా బౌలర్లు దెబ్బ తీశారు. ఓపెనర్లు శర్మ (21), ధావన్ (7) లు విఫలం చెందారు. అనంతరం వచ్చిన కోహ్లీ విరుచుకపడ్డాడు. బంతులను ఏమాత్రం వేస్ట్ చేయకుండా పరుగులు రాబట్టాడు. ఇతనికి రహానే చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి స్కోరు బోర్డును పరుగెత్తించారు. ఈ దశలో కోహ్లీ అర్ధ సెంచరీ సాధించాడు. మరోవైపు అర్ధ సెంచరీ వైపుకు దూసుకెళుతున్న రహానే (45) ను స్టేన్ అవుట్ చేశాడు. అప్పటికీ భారత జట్టు స్కోరు 139 పరుగులు. ఐదో ప్లేస్ లో వచ్చిన రైనా ఆచితూచి ఆడాడు. వికెట్ పడపోకుండా కోహ్లీ..రైనా జాగ్రత్త పడ్డారు. వీరిద్దరినీ విడదీయడానికి దక్షిణాఫ్రికా బౌలర్లు శ్రమించారు. ఈ దశలో కోహ్లీ సెంచరీ పూర్తి చేశాడు. 112 బంతుల్లో 4X4, 3x6 సాయంతో కెరీల్ లో 23వ శతకం పూర్తి చేసుకున్నాడు. మరోవైపు రైనా కూడా అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. భారత జట్టు స్కోరు 266 పరుగుల వద్ద ఉన్నప్పుడు రైనా (53) ను స్టేన్ అవుట్ చేశాడు. వెంటనే కోహ్లీ (138) పెవిలియన్ చేరాడు. తరువాత వచ్చిన ఇతర క్రీడాకారులు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కోహ్లీకి లభించింది. 

21:37 - October 22, 2015

హైదరాబాద్ : విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో దేవీ శరన్నవరాత్రులు ఘనంగా ముగిశాయి. తొమ్మిది రోజులూ అమ్మవారిని నిష్ఠతో పూజించిన భక్తులు.. చివరి రోజు మహిషాసుర మర్దని దర్శనం కోసం ఆలయాలకు పోటెత్తారు. దేవీ దర్శనం కోసం భక్తులు ఆలయాలకు భారీగా తరలి వచ్చారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. అనంతరం సాయం సంధ్యవేళ జమ్మి వృక్షం వద్దకు చేరిన భక్తులు, పాల పిట్టను చూసి ఆనందించారు.

ఏపీలో..
శ్రీశైలంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. భ్రమరాంభికా దేవి ఆలయంలో మహాగౌరి అవతారంలో ఉన్న ఉత్సవ మూర్తిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా మాతను వేలాది భక్తులు దర్శించుకున్నారు. సాయంత్రం కృష్ణానదిలో దుర్గామల్లేశ్వరస్వామి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గంగా పార్వతీ సమేత మల్లేశ్వర ఉత్సవమూర్తులు హంస వాహనంపై కృష్ణానదిలో విహరించారు. తెప్పోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

తెలంగాణలో..
మరోవైపు.. తెలంగాణ జిల్లాల్లోనూ విజయదశమి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. హైదరాబాద్‌ సైదాబాద్‌లో దుర్గామాత ఉత్సవమూర్తిని అంబారీపై ఊరేగించారు. మహిళల కోలాటాలు, దాండియా నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. పలు ఆలయాల్లో ఉదయం నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఇక ఆదిలాబాద్‌ జిల్లా బాసరలో జ్ఞానసరస్వతి దేవిని అశ్వవాహన రథంపై ఊరేగించారు. శోభాయాత్రలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

దేశ రాజధానిలో ..
ఇక విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా పలు నగరాల్లో రావణ దహన కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ఢిల్లీ రెడ్‌ ఫోర్ట్‌లో రామ్‌లీలా సమితి ఆధ్వర్వంలో రావణ దహన కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఈ వేడుకలకు హాజరయ్యారు. వీరితో పాటు... మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. చివరగా.. మైదానంలో ఏర్పాటు చేసిన రావణ, మేఘనాథ్‌, కుంభకర్ణ బొమ్మలను దహనం చేశారు. 

21:35 - October 22, 2015

గుంటూరు : అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఏపీ ప్రభుత్వం ఆయన్ను మిగిలిన వారికి భిన్నంగా గౌరవించింది. శంకుస్థాపనకు హాజరైన ప్రజలు కూడా.. కేసీఆర్‌ పేరు ప్రస్తావించినప్పుడు.. ఆయన ప్రసంగిస్తున్నప్పుడూ విశేషంగా స్పందించారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం.. తెలుగు రాష్ట్రాల మధ్య సుహృద్భావాన్ని చాటే వేదికగానూ కనిపించింది. ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులిద్దరూ కలివిడిగా తిరగడం.. చూపరులను ఆకట్టుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన వేదికకు వచ్చింది మొదలు.. ఈ ఇద్దరు నేతలూ.. ఆయన వెన్నంటే ఉన్నారు. గ్యాలరీని సందర్శించిన ప్రధానికి అధికారులు అక్కడి విశేషాలను వివరిస్తుంటే.. చంద్రబాబు.. కేసీఆర్‌తో ముచ్చట్లాడుతూ కనిపించారు.

సభలో ఈలలు..కేకలు..
అనంతరం.. శంకుస్థాపన ఫలకాన్ని ఆవిష్కరించేటప్పుడూ.. కేసీఆర్‌ పక్కకు వచ్చి నిలుచున్న చంద్రబాబు.. ఆయన భుజంపై చేయి వేసి నిలుచున్నారు. ఈ శిలాఫలకంలో కేసీఆర్‌ పేరునూ ప్రభుత్వం పొందుపరిచింది. కేసీఆర్‌ ప్రసంగానికి సమాయత్తమవుతున్నప్పుడు.. సభకు హాజరైన ప్రజలు ఈలలు, కేకలతో.. విశేషంగా స్పందించారు. వారి హర్షధ్వానాల మధ్యే కేసీఆర్‌ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అమరావతి అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.  అటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇద్దరు చంద్రుల కలయిక పట్ల.. సభా వేదిక నుంచే హర్షం ప్రకటించారు. చంద్రబాబు కేసీఆర్‌ ఇంటికే వెళ్లి శంకుస్థాపనకు ఆహ్వానించారన్న విషయం తెలిసి.. తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయని అన్నారు.

చివరి నిమిషంలో కేసీఆర్ ప్రసంగం..
ముందుగా నిర్ణయమైన షెడ్యూల్‌లో కేసీఆర్‌ ప్రసంగం లేదు. కానీ.. ఏపీ ప్రభుత్వం పిఎంఓతో చర్చలు జరిపి.. చివరి నిమిషంలో.. కార్యక్రమంలో కేసీఆర్‌ ప్రసంగాన్నీ చేర్చింది. మొత్తానికి మొన్నటి వరకూ ఉప్పూ నిప్పులా ఉన్న ఇద్దరు చంద్రులూ ఇలా కలివిడిగా కనిపించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇది రెండు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి దోహద పడుతుందన్న భావనా వ్యక్తమవుతోంది.

21:30 - October 22, 2015

హైదరాబాద్ : భారత ప్రధాన మంత్రి మోడీ రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని జగన్‌ విమర్శించారు. ప్రధాని మోడీ ప్రసంగంపై వైసీపీ అధినేత మీడియాకు లేఖ విడుదల చేశారు. పార్లమెంట్‌ సాక్షిగా ప్రత్యేక హోదాపై ఇచ్చిన మాటను మర్చిపోయి.. మట్టి, నీరు తెచ్చి సరిపెట్టుకున్నారని జగన్‌ మండిపడ్డారు. ప్రధాని నోట హోదా మాట వస్తుందని ప్రజలు ఆశపడ్డారని.. కాని నిరాశే మిగిలిందని.. బాబు కేసుల కోసం రాజీపడ్డారని ఆయన ఆరోపించారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని జగన్‌ స్పష్టం చేశారు.

 

21:27 - October 22, 2015

గుంటూరు : రాజుగారు వరాల జల్లు కురిపిస్తారని ప్రజలంతా ఎంతో ఆశపడ్డారు. లక్షకోట్ల వరాల మూట ఇస్తాడని లక్షకళ్లతో ఎదురుచూశారు. కానీ ఆ రాజుగారు మాత్రం లక్ష కోట్లు కాదు కదా...లక్ష రూపాయలను కూడా ప్రకటించలేదు. లక్ష కోట్లకు బదులు..యమునా నది జలాన్ని,.పార్లమెంట్‌ మట్టిని కుమ్మరించారు. ఇదీ..మన ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ కొత్తరాజధాని అమరావతికి ఇచ్చిన ఓ గొప్పవరం. లక్ష కోట్ల ప్యాకేజీ ప్రకటిస్తాడని ఎదురుచూసిన 5 కోట్ల మంది ప్రజల నోట్లో చివరకు మట్టికొట్టారు. ప్రధాని మోడి పేలవమైన ప్రసంగంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీకి లక్షకోట్లు ప్రకటిస్తాడని 5కోట్ల ఆంధ్రులు ఎంతో ఆశతో ఎదురుచూశారు. కానీ చివరకు ఊరించి...ఊరించి ఊసురుమనిపించారు.

ప్యాకేజీ..హోదాపై మాట్లాడని మోడీ..
పార్లమెంటు ఆవరణ నుంచి గుప్పెడు మట్టిని, ఢిల్లీలో ప్రవహించే యమునా నది నుంచి చెంబెడు నీటిని తీసుకొచ్చానని ప్రసంగించారే తప్ప...తన ప్రసంగంలో ఎక్కడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని మాత్రం మోడి ప్రస్తావించలేదు. రాష్ట్ర విభజనను తొందరపాటుతో చేశారని వ్యాఖ్యానించిన మోడి..రెండు రాష్ట్రాలు కలిసి పరస్పరం సహకరించుకోవాలని నాలుగు మంచి మాటలు చెప్పారే గానీ, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఏకైక ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదా అంశం గురించి ఒక్కటంటే ఒక్క మాట కూడా చెప్పలేదు. మానవ వనరుల అభివృద్ధి కోసం ఇక్కడ పలు జాతీయస్థాయి విద్యా సంస్థలను ఏర్పాటు చేశామన్నారుగానీ, ఇక్కడి పారిశ్రామికాభివృద్ధికి ప్రాణవాయువు లాంటి ప్రత్యేక హోదా విషయం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కనీసం ప్యాకేజీ కూడా ప్రకటించకుండా మొండిచేయి చూపించారు.

కొండంత ఆశతో ఎదురుచూసిన జనం..
ప్రధానమంత్రి వస్తున్నారంటూ..రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజిగానీ..ప్రత్యేక హోదా గాని ప్రకటిస్తారని రాష్ట్ర ప్రజలతో పాటు..అన్ని రాజకీయ పార్టీలు కొండంత ఆశతో ఎదురు చూశారు. బీహార్‌కు లక్షన్నర కోట్లను ప్రకటించిన మోడి..ఏపీకి కనీసం లక్షకోట్లప్యాకేజీ అయినా ప్రకటిస్తారని ప్రజలంతా వేయి కళ్లతో ఎదురుచూశారు. కానీ ప్రధాని మోడీ మాత్రం ప్రత్యేక హోదాగానీ..ప్రత్యేక ప్యాకేజీ గురించికానీ ఎక్కడా ప్రస్తావించలేదు. విభజన చట్టంలోని హామీలన్నింటిని నెరవేర్చుతామని హామీఇచ్చారు తప్పితే..ప్యాకేజీ గురించి ఎక్కడా పెదవివిప్పలేదు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు కలిసి పనిచేసి ఆర్ధిగప్రగతిని సాధించాలని..రెండు రాష్ట్రాలు ఆదిశగా కలిసి పనిచేస్తాయన్న నమ్మకం తనకుందని ప్రస్తావిస్తూ ..పరోక్షంగా మీరే కష్టపడి రాజధానిని నిర్మించుకోండంటూ సలహా ఇచ్చే ప్రయత్నం చేశారు మోడీ.

నిరాశకు గురైన ప్రజలు..
పునర్విభజన చట్టంలో ఏం చెప్పినా..ప్రతి అక్షరాన్నీ కేంద్ర ప్రభుత్వం తప్పకుండా అమలుచేస్తాం..చంద్రబాబు- మోడీ జోడీతో ఆంధ్రప్రజలందరి కలలను నూటికి నూరు శాతం నెరవేరుస్తాం అంటూ ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చారే తప్ప..రాష్ట్ర ప్రజలకు మనోధైర్యం ప్రకటించే ఆర్ధిక ప్యాకేజీపై మాత్రం ఒక్క మాట మాట్లాడలేదు. దీంతో శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు తీవ్ర నిరాశకు గురయ్యారు. 

21:23 - October 22, 2015

గుంటూరు : ఎన్నాళ్లనుంచో ఎదురుచూసిన మహాఘట్టం కళ్ల ముందు సాక్ష్యాత్కృతమైంది. తెలుగు ప్రజల కీర్తి కలికితురాయిగా నిలిచిపోయే విధంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. దేశ, విదేశాల నుంచి వచ్చిన అతిరథ మహారధుల మధ్య ఎంతో అట్టహాసంగా,.. అత్యద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. గౌతముడి బోధనలు పరిఢవిల్లిన నేల... శాతవాహనులు, ఇక్ష్వాకులు తిరుగాడిన ఇలలో అంగరంగ వైభవంగా అమరావతి శంకుస్థాపన పండుగ జరిగింది. చరిత్రలో నిలిచిపోయే విధంగా అజరామర అమరావతి నగర నిర్మాణానికి అడుగులు పడ్డాయి.

పండుగ వాతావరణం..
ఇక ఉదయం నుంచే ఉద్దండరాయునిపాలెంలో పండుగ వాతావరణం నెలకొంది. లక్షలాదిగా ప్రజలు, రైతులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. తెలంగాణ నుంచి సీఎం కేసీఆర్‌, డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మంత్రులు ఈటెల, జగదీష్‌రెడ్డి హాజరయ్యారు. అదేవిధంగా తెలంగాణ టీడీపీ నేతలు, బీజేపీ నేతలు శంకుస్థాపన మహోత్సవానికి విచ్చేశారు. కార్యక్రమానికి హాజరైన వారికి మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి సినీ నటులు వెంకటేష్‌, సుమన్‌, రాజేంద్రప్రసాద్‌తో పాటు పలు రంగాల ప్రముఖులు హాజరయ్యారు.

వీఐపీలకు ఘన స్వాగతం..
ఇక గన్నవరం ఎయిర్‌పోర్టులో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన వీఐపీలకు మంత్రులు ఘన స్వాగతం పలికారు. వచ్చిన అతిథులకు శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాలు ఇచ్చి ఆహ్వానం పలికారు. అతిథులను ప్రత్యేక వాహనంలో శంకుస్థాపన కార్యక్రమం వద్దకు తీసుకెళ్లారు. మరికొందరు నేతలు, ప్రముఖులు నేరుగా ప్రత్యేక హెలికాప్టర్‌లో శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. వీరికి మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు.

అంరంగ వైభవంగా కార్యక్రమాలు..
శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం నుంచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమ మహోత్సవానికి సినీనటుడు సాయికుమార్‌, గాయని సునీత వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. తొలుత సాంస్కృతిక కార్యక్రమాలు తెలుగు పద్యంతో ప్రారంభమయ్యాయి. అనంతరం మిమిక్రీ కార్యక్రమాలు, కూచిపూడి నృత్యాలు, అనేక రూపకాలు ఆహుతులను అలరించాయి. శివమణి డ్రమ్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శంకుస్థాపన మహోత్సవంలో పలు మతాలకు చెందిన మత పెద్దలతో సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. ఇక శంకుస్థాపన కార్యక్రమంలో సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ సందడి చేశారు. సభా వేదికపైకి ఎక్కి ప్రజలు, అభిమానులకు అభివాదం చేశారు. తనదైన శైలిలో ప్రసంగించి ప్రజలను ఆకట్టుకున్నారు. 

శంకుస్థాపన చేసిన ప్రధాని..
ఇక ప్రధాని మోడీ పన్నెండున్నర గంటలకు శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. 12 గంటల 36 నిమిషాలకు అమరావతి ప్రత్యేక హోమానికి పూర్ణాహుతి చేశారు. అనంతరం వేద మంత్రోచ్ఛరణల మధ్య... 12 గంటల 40 నిమిషాలకు నవ్యాంధ్ర రాజధానికి శంకుస్థాపన చేశారు. 12 గంటల 45 నిమిషాలకు అమరావతి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు అక్కడే ఏర్పాటు చేసిన అమరావతి చరిత్రకు సంబంధించిన ఎగ్జిబిషన్‌ మోడీ సందర్శించారు. అమరావతి రాజధాని నిర్మాణం ఎలా ఉంటుందో ఏర్పాటు చేసిన త్రీడీ ప్రింటింగ్‌ను మోడీ పరిశీలించారు.

మట్టి..నీళ్లను అందించిన మోడీ..
అనంతరం శంకుస్థాపన మహావేదికపై మోడీ, ఏపీ, అసోం, తమిళనాడు గవర్నర్లు అయిన నరసింహన్‌, పీబీ ఆచార్య, కె.రోశయ్య, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలాసీతారామన్‌, సుజనాచౌదరి, అశోక్‌గజపతిరాజు, దత్తాత్రేయలతో పాటు సింగపూర్‌, జపాన్‌ మంత్రులు ఈశ్వరన్‌, యోసుకే ఆసీనులయ్యారు. ఇక మోదీ అమరావతి శంకుస్థాపన కోసం స్వయంగా తీసుకువచ్చిన మట్టి, యమునా నది జలాన్ని చంద్రబాబుకు అందించారు. ఈ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మోడీ.. చంద్రబాబు మనవడు దేవాన్ష్ ఆప్యాయంగా పలకరించారు. దేవాన్ష్‌కు తన కళ్లద్దాలు అమర్చారు. కాసేపు దేవాన్ష్‌తో మోదీ ముద్దుముద్దుగా ముచ్చటించారు. అనంతరం చంద్రబాబు దంపతులు, లోకేష్‌ దంపతులు మోడీతో ఫొటో దిగారు. 

20:59 - October 22, 2015

విజయదశమి..చెడుపై మంచి సాధించిన విజయం. ప్రకృతిపై మానవుడు సాధించిన విజయానికి ప్రతిక. ఎందులోనైనా పురోగతి సాధించాలన్న ఆకాంక్షకు ఆలంబన. ఇలా అనేక రకాల విజయాలను అన్వయించే పండుగ దసరా. భారతీయుల అతి పెద్ద పండుగ. దేవీ నవరాత్రుల పేరుతో 9 రోజుల పాటు చేసుకునే వేడుక. దసరా అంటే విజయ పతాకాన్నే కాదు సరదాలు..సంప్రదాయాలు..ఆటపాటలు..వినోదాల మేళవింపు. వివిధ రాష్ట్రాల్లో విజయ దశమి వేడుకలపై ప్రత్యేక కథనం..

రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక వాతావరణం..
తెలుగు రాష్ట్రాల్లో దసరా వేడుకల సందడి అంతాఇంత కాదు. వీధి వీధిలో అమ్మవారి విగ్రహాలు..అందంగా అలంకరించిన మంటపాలు..బతుకమ్మ ఆటపాటలు. తెలుగు రాష్ట్రాల దసరా వేడుకలు సంప్రదాయాలు మననం చేసుకోవాల్సివసరం ఉంది. దసరా వేడుకలు అత్యంత వైభవంగా జరిగే నగరం మైసూరు. రాజదర్పం ఉట్టిపడేలా నగరం ముస్తాబవుతుంది. రాజభవనం విద్యుత్ కాంతులతో దేదీప్యమానం అవుతుంది. దసరా రోజు మైసూరు జాతరలా కిటకిటలాడుతుంది. అమ్మవారి భారీ విగ్రహాలు..అందంగా ముస్తాబు చేసిన మంటపాలు వైభవంగా నిమజ్జనోత్సవాలు వెలుగులు విరజిమ్మే వీధులు కలకత్తా కాళీమాత ఉత్సవాలు. నవరాత్రుల పర్వదినాల్లో కోల్ కతా నగరం ఆధ్యాత్మిక నగరంగా వెలిగిపోతుంది.

చెడుపై మంచి విజయానికి చిహ్నం దసరా..
ఉత్తరాదిలో నవరాత్రులు వేడుకలు వైభవంగా జరుగుతాయి. మంబై, ఢిల్లీ, గుజరాత్ ఇలా అన్ని రాష్ట్రాల్లోనూ విజయదశమి సంబరం అంబరాన్ని అంటుతుంది. దసరా సరదాలు అన్నీ ఇన్నీ కావు. బొమ్మల కొలువు..కోలాటం..గార్భా నృత్యాలతో పల్లెలు..పట్టణాలు హోరెత్తుతుంటాయి. ఆయుధ పూజ..జమ్మి చెట్టు ఆచారాలు దసరాకు మరింత ప్రాధాన్యత తెచ్చి పెట్టాయి. చెడుపై మంచి విజయానికి చిహ్నం దసరా. విజయం సాధించాలన్న పట్టుదలకు ప్రేరణ దసరా. ప్రకృతితో మానవుడి అనుబంధం దసరా. 

మోడీ..ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారు - జగన్..

హైదరాబాద్ : భారత ప్రధాని మోడీ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన మాటను మరిచారని, మట్టి, నీరు తెచ్చి సరిపెట్టుకున్నారని విమర్శించారు. ప్రధానిపై వత్తిడి తేవాల్సిన చంద్రబాబు కేసులకు భయపడి రాజీ పడ్డారని ఆరోపించారు. నిరుద్యోగులు, విద్యార్థుల భవిష్యత్ పై నీళ్లు చల్లారని, రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతామన్నారు. 

20:08 - October 22, 2015

శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై రవితేజ, తమన్నా, రాశీ ఖన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిన 'బెంగాల్‌ టైగర్‌' త్వరలో విడుదల కాబోతోంది. కె.కె. రాధామోహన్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మాస్‌ డైలాగ్స్ కు పెట్టింది పేరైన మాస్‌ మహరాజ్‌ హీరో రవితేజ. ఈ మధ్య కాస్త రూటు మార్చి చేసిన కిక్‌2 సినిమా రవితేజకి పెద్దగా కిక్‌ ఇవ్వలేదు. దీంతో మళ్లీ తనకు బిగ్గెస్ట్ హెల్ప్ అయిన మాస్‌ మసాలా కథతో చేసిన సినిమా 'బెంగాల్‌ టైగర్‌' ఈ టైటిల్‌తో ఎంత పవర్‌, ఎంత మాస్‌ ఉందో దానినే సినిమాలో చూపించటానికి ట్రై చేశారు. ఈ సందర్భంగా రవితేజ, తమన్నలు సినిమా విశేషాలు వెల్లడించారు. 

19:57 - October 22, 2015

ఆంధ్రప్రదేశ్ రాజధాని 'అమరావతి' శంకుస్థాపన కార్యక్రమం పూర్తయ్యింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం మోడీ ప్రసంగించారు. కానీ భావోద్వేగానికి మాత్రమే మోడీ ప్రసంగం పరిమితమైంది. ప్రత్యేక హోదా..ప్రత్యేక ప్యాకేజీల ప్రస్తావన లేకుండా ప్రసంగం సాగింది. విభజన చట్టంలోని అంశాల అమలు హామీకే పరిమితమయ్యారు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రస్తావన చేయలేదు. ఈ అంశంపై అమరావతి ప్రాంతంలో టెన్ టివి నిర్వహించిన చర్చా వేదికలో మధు (సీపీఎం ఏపీ కార్యదర్శి), దార సాంబయ్య (బిజెపి), జూపూడి ప్రభాకర్ (టిడిపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

సౌతాఫ్రికా 91/4..

చెన్నై : భారత్ తో జరుగుతున్న నాలుగో వన్డేలో సౌతాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసింది. విలియర్స్ 11, బెహార్డిన్ 2 పరుగులతో ఆడుతున్నారు. కాక్ 43, ఆమ్లా 7, డుప్లెసిస్ 17, మిల్లర్ 6 పరుగులు చేసి అవుట్ అయ్యారు. 

 

19:05 - October 22, 2015

మెగా కుటుంబం లో నాగబాబు వారసుడిగా తెరంగేట్రం చేసిన 'వరుణ్ తేజ్' తన మొదటి సినిమా 'ముకుందా' ద్వారా పర్వలేదనిపించినా ఈ సారి దర్శకుడు 'క్రిష్' తో కలిసి ఓ వైవిధ్యభరితమైన చిత్రం 'కంచె' ద్వారా మనముందుకి వచ్చాడు. మరి ఈ సినిమాతో 'వరుణ్' కెరీర్ మెగా ట్రాక్ ఎక్కేస్తుందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

విశ్లేషణ..
'కంచె' చిత్ర కథ 1930 ల కాలం నాటి ప్రేమ కథ. హరి అనే ఓ నిమ్న జాతి వర్గీయుడు..వాళ్ళ ఊరిలోనే సీతాదేవి అనే అగ్రకులానికి చెందిన అమ్మాయిని ప్రేమిస్తాడు, కానీ వీరి ప్రేమను సీతాదేవి కుటుంబం తో పాటు ఊళ్ళోని మిగిలిన వారు కూడా వ్యతిరేకిస్తారు. దీంతో కులాలు..మతాలు మనుషుల కర్తవ్యాన్ని బట్టి విభచించారు కానీ పెత్తనం చెలాయించడానికి కాదు అని పెద్దలను ఎదిరించి మరీ సీతను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి తర్వాత సీత అన్నయ్యకు హరి కి జరిగిన గొడవలో సీత ప్రమాదవశాత్తు చనిపోతుంది. ఆ తర్వాత సీత అన్నయ్య అలాగే హరి ఇద్దరు ఆర్మీ లో చేరి రెండవ ప్రపంచ యుద్దానికి వెళ్ళడం...ఆ యుద్ధం కుడా కులాలు మతాల కోసం జరుగుతుంది అని గుర్తించడం, వీరిద్దరూ కలసి యుద్దంలో ఎం చేసారు అనేది మిగిలిన కథ.

రెండు విధాలుగా సాగనున్న కథ..
ప్రధానంగా 'కంచె' చిత్ర కథ 'క్రిష్' స్టైల్లో భూతకాలం..వర్తమాన కాలం అనే రెండు విధాలుగా సాగుతుంది. రెగ్యులర్ ఫార్మాట్ లో కాకుండా ఇలా వినూత్నంగా తెలుగు సినిమాలకు భిన్నంగా హాలీవుడ్ తరహాలో సినిమాని చెప్పాలనుకున్న 'క్రిష్' అభినందనీయుడే. కానీ కథ పూర్తిగా 1936 నాటి రెండవ ప్రపంచ యుద్దానికి సంబంధించినది కావడం అది పెద్దగా ప్రేక్షకులకు తెలియకపోవడం, తెలిసినా ఆ కథను జనరంజకంగా చెప్పలేక పోవడం ఈ చిత్రం లోని ప్రధాన మైనస్. రొటీన్ కి భిన్నంగా ఈ చిత్ర కథ ఉన్నా సామాన్యులకు మాత్రం ఈ సినిమా చాలా దూరంలో ఉంది. టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఈ సినిమా సాగినా, చిత్రంలోని ప్రధాన అంశం, ప్రేక్షకులకు కాస్త కూడా ఎక్కకపోవచ్చు. పైగా ప్రేక్షకులను ఎమోషనల్ గా కనెక్ట్ చేయడానికి కావలిసినంత స్కోప్ ఉన్నప్పటికీ దర్శకుడు మాత్రం చాల సన్నివేశాలను చాలా లైట్ గా తీశాడు.అసలే మూవీ లాగ్ అవుతుందేమో అనుకుంటున్నా ప్రేక్షకులకు మధ్యలో వచ్చే పాటలు మరింత ఇబ్బంది పెడతాయి. ఇక నటీనటుల పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే హీరో 'వరుణ్ తేజ్' కి వందకు వంద మార్కులు వేయచ్చు. రెండవ సినిమా అయినా పాత్రోచితంగా చక్కటి నటనను కనబర్చాడు. హీరోయిన్ 'ప్రగ్య జైస్వాల్' కూడా 'వరుణ్' తో పోటీ పడుతూ పర్వాలేదనిపించింది. ఇక మిగిలిన నటీనటుల విషయానికి కుడా వస్తే గొల్లపూడి మారుతీరావు, షావుకారు జానకి, సింగీతం శ్రీనివాసరావు, అవసరాల శ్రీనివాస్ వంటి నటులతో సినిమాకి మంచి రిచ్ నెస్ తీసుకొచ్చాడు క్రిష్. ఇక టెక్నికల్ అంశాలు చూస్తే జ్ఞాన శేఖర్ అందించిన సినిమాటోగ్రఫి అధ్బుతం. సినిమాలోని ప్రతి ఫ్రేం చెక్కినట్లు తీర్చిదిద్దాడు. అలాగే రెండవ ప్రపంచానికి సంబంధించిన యుద్ద సన్నివేశాలు కానీ వారి వస్త్రధారణ కానీ అచ్చు గుద్దినట్లు ఏ మాత్రం తేడ రాకుండా చాల జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే చిరంతాన్ బట్ అందిన సంగీతం కుడా పాతకాలం నాటికి చక్కగా సరిపోయింది. చివరగా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే కమెర్షియల్ గా విజయం సాధించే అవకాశాలు ఈ చిత్రానికి లేనప్పటికీ ఓ గొప్ప ప్రయత్నంగా ఓ మంచి చిత్రంగా మాత్రం చెప్పుకోవచ్చు. సో రొటీన్ చిత్రాలతో విసిగి వేసారిన వారు గొప్ప పెర్ఫార్మన్స్ లు కావాలనుకున్న వారు ఈ 'కంచె చిత్రాన్ని హ్యాపీగా ఓ సారి చూడచ్చు.

ప్లస్ పాయింట్స్ : వరుణ్ తేజ్ పెర్ఫార్మన్స్.. యుద్ధ సన్నివేశాలు..సినిమాటోగ్రఫీ..బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్ : కథ..స్లో నేరేషన్..ఎమోషన్స్ మిస్ అవడం

రేటింగ్ : 2/5..

సౌతాఫ్రికా 67/2..

చెన్నై : భారత్ జరుగుతున్న నాలుగో వన్డేలో సౌతాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. ప్లెసిస్ 11, విలియర్స్ 1 పరుగుతో ఆడుతున్నారు. కాక్ 43, ఆమ్లా 7 పరుగులు చేసి అవుట్ అయ్యారు. భారత బౌలర్లలో శర్మ, హర్భజన్ సింగ్ తలా ఒక వికెట్ తీశారు.

18:28 - October 22, 2015

మొటిమలు..యువతీ యువకులు ప్రధాన సమస్య ఎదుర్కొంటుంటారు. ఇందుకు రకరకాల క్రీములు వాడుతూ ముఖాన్ని..ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటుంటారు. ఇందుకు కొన్ని టిప్స్ అనుసరిస్తే సరిపోతుందని వైద్యులు పేర్కొంటుంటారు. మీ కోసం కొన్ని టిప్స్...

  • బయటకు వెళ్ళి వచ్చినప్పుడు, దుమ్ము చేరకుండా తప్పకుండా చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కోవాలి.
  • వేప ఆకులను నీళ్ళలో ఉడికించి, ఆ నీటిని బకెట్ నీళ్ళలో కలుపుకుని స్నానం చేస్తే ఎంతో మంచిది. ఇలా చేయడంవల్ల మొటిమలే కాదు అనేక రకాల చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయి.
  • ముల్తాని మట్టిలో రోజ్ వాటర్ కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే ఫలితం కనిపిస్తుంది. చర్మం పొడిగా, సున్నితంగా ఉంటే ఈ ప్యాక్ వేసుకోకూడదు.
  • సొంటి, లవంగాలు నీటితో నూరి లేపనం తయారు చేసి ముఖంపై తరుచూ రాస్తూ ఉంటే మొటిమలు తక్షణమే తగ్గుముఖం పడతాయి.
  • మొటిమ గనక చితికినట్లయితే దానిమీద ఐస్ క్యూబ్ ఉంచి సుతిమెత్తగా రుద్దినట్లయితే అందులో ఉన రాసి అంతా వచ్చేస్తుంది.
  • చిటికెడు పసుపు ముఖానికి రాసి, కొద్దిసేపటి తర్వాత ముఖం కడుక్కోవడం ద్వారా మొటిమలను తగ్గించుకోవచ్చు.
18:10 - October 22, 2015

మహేశ్వర ఆర్ట్స్ పతాకంపై పర్స రమేష్‌ మహేంద్ర దర్శకత్వంలో కల్వకుంట్ల తేజేశ్వర్‌రావు (కన్నారావు) నిర్మిస్తున్న చిత్రం 'షీ'. ఈ సినిమాలో టైటిల్‌ పాత్రధారిణిగా శ్వేతమీనన్‌ నటిస్తోంది. ఓ వైవిధ్యమైన కథాంశంతో రూపొందించబోతున్న 'షీ' చిత్రంలో హీరోయిన్‌గా శ్వేతమీనన్‌ నటించడం ఆనందంగా ఉందని నిర్మాత పేర్కొన్నారు. ఇటీవల శ్వేతమీనన్‌ గెటప్‌కి సంబంధించి ఫొటోషూట్‌ చేయడం జరిగిందన్నారు. అతి త్వరలో ఓ మంచి సేవా కార్యక్రమంతో ఈ చిత్రాన్ని భారీగా ప్రారంభిస్తామని తెలిపారు. వచ్చే ఏడాది మార్చిలో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్‌ చేసినట్లు, సినిమాలో హీరోతో పాటు మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

18:07 - October 22, 2015

అక్షయ్ కుమార్‌, రితేష్‌ దేశ్‌ముఖ్‌, అభిషేక్‌ బచ్చన్‌, నర్గీస్‌ ఫక్రీ, లిసా హైడెన్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ వంటి భారీ తారాగణంతో రూపొందుతున్న 'హౌస్‌ఫుల్‌ 3' చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్‌ ఇటీవల విడుదల చేసింది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'హౌస్‌ఫుల్‌' చిత్రానికి సీక్వెల్‌గా 'హౌస్‌ఫుల్‌2' చిత్రం రూపొందిన సంగతి విదితమే. తాజాగా 'హౌస్‌ఫుల్‌ 2' చిత్రానికి సీక్వెల్‌గా 'హౌస్‌ఫుల్‌ 3' తెరకెక్కుతోంది. షాజిద్‌ఖాన్‌ రూపొందిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌గా నటిస్తున్నట్టు సమాచారం.

కృష్ణా నదిలో తెప్పోత్సవం..

విజయవాడ : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కృష్ణా నదిలో తెప్పోత్సవం జరుగనుంది. హంస వాహనంపై శ్రీ దుర్గామల్లేశ్వరి స్వామివార్ల జల విహారం కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. తెప్పోత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. 

ఇండియా 299/8..

చెన్నై : సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 299 పరుగులు చేసింది. కోహ్లీ 138 పరుగులు చేశాడు. రైనా 53, రహానే 45 పరుగులు చేసి రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో స్టేన్, రబడ తలా మూడు, మోరీస్ ఒక వికెట్ తీసుకున్నారు. 

శ్రీవారిని దర్శించుకున్న మోడీ..

చిత్తూరు : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తిరుపతికి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానికి టిటిడి ఘన స్వాగతం పలికింది. మోడీ వెంట కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్, అశోక్ గజపతి రాజు, ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు. 

17:31 - October 22, 2015

హైదరాబాద్ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం నిరాశపరచిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు పేర్కొన్నారు. అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాఘవులు టెన్ టివితో మాట్లాడారు. శంకుస్థాపన ఆర్భటంగా చేసినా ప్రధాని మోడీ ప్రసంగం ప్రజలను నిరాశపరిచిందన్నారు. బాబు..మోడీ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమి లేదన్నారు. హోదా..ప్యాకేజీల గురించి ఏమీ లేవని, ముఖ్యమంత్రి, ప్రధాని ప్రసంగాలు చప్పగా సాగాయని విమర్శించారు. రాష్ట్రానికి వరాలు ఇస్తారని..కేంద్రం సహాయం చేస్తుందని..ప్రత్యేకహోదా..ప్యాకేజీ వస్తుందని ఆశించిన ప్రజలకు అడియాసే ఎదురయైందన్నారు. ప్రత్యేక హోదాపై కానీ..ప్రత్యేక ప్యాకేజీపై కానీ మోడీ మాట్లాడకపోవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. విభజన చట్టంలో ఏమీ చెప్పలేదని, పార్లమెంట్ సమావేశాల్లో నేతల ప్రసంగాల్లో పలు అంశాలు పేర్కొన్నారని తెలిపారు. నేతలు పబ్బం గడుపుకోవడానికే మాటలు చెబుతున్నారని రాఘవులు విమర్శించారు. 

17:27 - October 22, 2015

గుంటూరు : ప్రధాని మోడీ ఏదో ప్రకటిస్తారని ఆశించి భంగపడ్డామని ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు. 'అమరావతి' శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న చలసాని, కారెం శివాజిలు టెన్ టివి తో మాట్లాడారు. మట్టి..నీరు తీసుకరావడం మంచిదే కానీ ఇంకేమీ ఇవ్వలేదని విమర్శించారు. రూ.40వేల కోట్లు అడిగితే ఏ ఒక్క మాట మాట్లాడ లేదని, అమరావతి గురించి మాట్లాడడం లేకపోవడం ఇక్కడ ప్రజలను అవమానించారని విమర్శించారు. అన్ని పనులు మానేసి ఇక్కడకు వస్తే నోటి నిండా మట్టి కొట్టి యమునా నదిలో ముంచారని ప్రత్యేక హోదా సాధన సమైక్య కన్వీనర్ కారెం శివాజి పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో విభజన హామీలు అమలయ్యే వరకు పోరాటం చేస్తామన్నారు. రాజకీయ ప్రసంగాల్లో నేతలు ఇచ్చే భరోసా కూడా ప్రధాని మోడీ ఇవ్వలేకపోయారని తీవ్రంగా విమర్శించారు. 

17:25 - October 22, 2015

గుంటూరు: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తారన్న ఆశలపై నీళ్లు చల్లారని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని 'అమరావతి' శంకుస్థాపన కార్యక్రమం ఉద్దండరాయపాలెంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎలాంటి వరాలు గుప్పించలేదు. విభజన చట్టంలో ఉన్న హామీలు అమలు చేస్తామని పేర్కొన్నారు. దీనిపై ప్రజలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతిపక్ష నేతలు భగ్గుమంటున్నాయి. ఈ సందర్భంగా పలువురు ప్రజలు టెన్ టివితో ముచ్చటించారు. ఎన్నికల ప్రచారం లాగా ఉందని, అతి త్వరలో ఢిల్లీ నుండి వార్త వస్తుందని ఆశిస్తున్నామన్నారు. మోడీ ఎలాంటి హామీ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. 

17:15 - October 22, 2015

గుంటూరు : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రసంగంలో తప్పులు వెతకవద్దని టిడిపి నేత వర్ల రామయ్య పేర్కొన్నారు. అమరావతి నగర శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎలాంటి ప్రకటన ఇవ్వకపోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా టిడిపి నేత వర్ల రామయ్య టెన్ టివితో మాట్లాడారు. రాజధాని నిర్మాణానికి మోడీ సహకరిస్తారని, భుజం..భుజం కలిపి ముందుకెళుతామని, విభజన హామీలు నెరవేరుస్తామని పేర్కొన్నారని తెలిపారు. ఈ అంశంపై తెలుగు ప్రజలను వక్రీకరించవద్దని, వేరే దానికి చోటు లేదన్నారు. బ్రహ్మాండమైన రాజధాని నిర్మాణం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

మోడీ నిరాశ పరిచారు - సీపీఎం..

విజయవాడ : రాష్ట్ర ప్రజలను ప్రధాని మోడీ నిరాశపరిచారని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. విభజన హామీలు కొన్నింటినైనా ప్రకటిస్తారని అనుకుంటే నీరు, మట్టి ఇచ్చి సరిపుచ్చుకున్నారని పేర్కొన్నారు. మోడీ, చంద్రబాబు కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని, పోరాటం తప్ప మరో మార్గం లేదని పి.మధు తెలిపారు. 

తెలుగు ప్రజలను మోడీ అవమానించారు - చలసాని..

గుంటూరు : ప్రధాన మంత్రి మోడీ తెలుగు ప్రజలను అవమానించారని, శంకుస్థాపనకు మోడీ వచ్చినా రాష్ట్రానికి ఒరిగిందేమి లేదని ఆంధ్రా మేధావుల ఫోరం నేత చలసాని శ్రీనివాస్ తెలిపారు. వామపక్షాలు, ప్రజా సంఘాలతో సాయంత్రం సమావేశమై ఉద్యమ కార్యాచరణపై చర్చిస్తామని తెలిపారు. 

అమృత నగరాలకు కేంద్రం నిధులు..

ఢిల్లీ : అమృత నగరాలకు కేంద్రం నుండి నిధులు కేటాయించారు. ఏపీలో 26 పట్టణాల్లో నీటి వనరుల అభివృద్ధికి రూ.646.29 కోట్లు కేటాయించారు. పచ్చదనం, ఉద్యానవనాల అభివృద్ధికి రూ.16.57 కోట్లు కేటాయించారు. మొదటి విడతగా రూ.66.29 కోట్లు విడుదల చేశారు. 

రైనా హాఫ్ సెంచరీ..అవుట్..

చైన్నై : సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో వన్డేలో రహానే అర్ధ సెంచరీ సాధించి అవుట్ అయ్యాడు. 52 బంతుల్లో 53 పరుగులు సాధించాడు. భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ 127, ధోని 4 పరుగులతో ఆడుతున్నారు. 

కోహ్లీ సెంచరీ..

చెన్నై : సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ సాధించాడు. 112 బంతుల్లో 101 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు మూడు సిక్స్ లున్నాయి. ప్రస్తుతం భారత్ మూడు వికెట్లు కోల్పోయి 207 పరుగులు సాధించింది. కోహ్లీ 101, రైనా 24 పరుగులతో ఆడుతున్నారు.

డబుల్ బెడ్ రూం ఇళ్లకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన..

నల్గొండ : సూర్యాపేటలోని గొల్లబజార్ లో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్లకు శంకుస్థాపన చేశారు. జగదీశ్ రెడ్డిని గెలిపిస్తే సూర్యాపేటను జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తానని ఎన్నికల్లో హామీనివ్వడం జరిగిందని, వచ్చే మార్చి వరకు ఈ హామీని అమలు చేస్తామన్నారు. త్వరలోనే ఇక్కడకు వచ్చి పాదయాత్ర చేపట్టి సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. ఈ ప్రాంతంలో రింగ్ రోడ్డు రావాల్సి ఉంటుందని, పాత మార్కెట్ యార్డులో ఆధునాతన వెజ్..నాన్ వెజ్ మార్కెట్ ఏర్పాటు చేస్తామన్నారు. 

భారత్ 192/3..

చెన్నై : సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో భారత్ మూడు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. కోహ్లీ 94, రైనా 16 పరుగులతో ఆడుతున్నారు. 

నల్గొండలో సీపీఎం..సీఐటీయూ నేతల అరెస్టు..

నల్గొండ : సీఎం కేసీఆర్ రాక సందర్భంగా పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. సీపీఎం, సీఐటీయూ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు. సీఎం సభలో ఆశాలు నిరసన వ్యక్తం చేస్తారనే ముందస్తుతో ఈ అరెస్టులకు తెరలేపారు. 

గరుడ టెర్మినల్ ప్రారంభం..

తిరుపతి : ఎయిర్ పోర్టులో గరుడ టెర్మినల్ ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఆయనతో పాటు ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అశోక్ గజపతి రాజు, నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. 

15:43 - October 22, 2015

హైదరాబాద్ : ప్రత్యేక హోదా..ప్రత్యేక ప్యాకేజీ ఈ అంశాలు లేకుండానే ప్రధాని మోడీ ప్రసంగం కొనసాగింది. ఏపీ రాష్ట్ర రాజధాని 'అమరావతి' శంకుస్థాపన కార్యక్రమం ఉద్దంరాయపాలెంలో జరిగింది. ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగంలో ప్రత్యేక హోదా..ప్యాకేజీ అంశాలను ప్రస్తావించలేదు. దీనిపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఏపీ ప్రజల ఆశలపై నీళ్లు చల్లారని విపక్షాలు మండిపడుతున్నాయి.

మోడీ..బాబు విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమం - సీపీఎం..
ప్రధాని మోడీ, ఏపీ సీఎం బాబు విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు వెల్లడించారు. వీరివల్ల రాష్ట్రానికి ఏమీ ఒరుగలేదని విమర్శించారు. ప్రత్యేక హోదాపై కానీ..ప్రత్యేక ప్యాకేజీపై కానీ మోడీ మాట్లాడకపోవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. నేతలు పబ్బం గడుపుకోవడానికే మాటలు చెబుతున్నారని, జపాన్ కంపెనీతో చంద్రబాబు ఒప్పందాన్ని బయట పెట్టాలని డిమాండ్ చేశారు.

నీళ్లు చల్లారు - సీపీఐ..
ఏపీ రాష్ట్ర ప్రజలపై ప్రధాన మంత్రి మోడీ నీళ్లు చల్లారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ప్రత్యేక హోదా ప్రకటించకుండా ప్రజలను మోసం చేశారని, రేపు రాష్ట్ర వ్యాప్తంగా మోడీ దిష్టిబొమ్మలను దహనం చేస్తామన్నారు.

రేపు ప్రధాని దిష్టిబొమ్మల దగ్ధం - ఏపీ కాంగ్రెస్..
శుక్రవారం ప్రధాని మోడీ దిష్టిబొమ్మలను దహనం చేయాలని పార్టీ శ్రేణులకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపునిచ్చింది. 

15:39 - October 22, 2015

ఏపీ రాజధాని 'అమరావతి' శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మోడీ ప్రసంగించారు. ప్రత్యేక హోదా..ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తారని అందరూ ఆశించారు. కానీ ప్రధాని మోడీ ప్రసంగంలో ఈ అంశాలను ప్రస్తావించలేదు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేస్తామని చెప్పారు. కానీ ఈ చట్టంలో ప్రత్యేక హోదా అంశం లేదని, అది పార్లమెంట్ ఇచ్చిన హామీ అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ అంశంపై 'అమరావతి' ప్రాంతంలో టెన్ టివి నిర్వహించిన చర్చా వేదికలో తులసీదాస్ (విశ్లేషకులు), పట్టాభీరామ్ (టిడిపి), సిటీ చౌదరి (ఆర్థిక రంగం నిపుణులు) అభిప్రాయాలు తెలిపారు. 

రేపు ప్రధాని దిష్టిబొమ్మల దగ్ధం - ఏపీ కాంగ్రెస్..

విజయవాడ : రేపు ప్రధాని మోడీ దిష్టిబొమ్మలను దహనం చేయాలని పార్టీ శ్రేణులకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపునిచ్చింది.

 

మోడీ..బాబు విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమం - రాఘవులు..

హైదరాబాద్ : ప్రధాని మోడీ, ఏపీ సీఎం బాబు విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు వెల్లడించారు. వీరివల్ల రాష్ట్రానికి ఏమీ ఒరుగలేదని విమర్శించారు. ప్రత్యేక హోదాపై కానీ..ప్రత్యేక ప్యాకేజీపై కానీ మోడీ మాట్లాడకపోవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. నేతలు పబ్బం గడుపుకోవడానికే మాటలు చెబుతున్నారని, జపాన్ కంపెనీతో చంద్రబాబు ఒప్పందాన్ని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. 

రాష్ట్ర ప్రజలపై మోడీ నీళ్లు చల్లారు - సీపీఐ..

గుంటూరు : ఏపీ రాష్ట్ర ప్రజలపై ప్రధాన మంత్రి మోడీ నీళ్లు చల్లారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ప్రత్యేక హోదా ప్రకటించకుండా ప్రజలను మోసం చేశారని, రేపు రాష్ట్ర వ్యాప్తంగా మోడీ దిష్టిబొమ్మలను దహనం చేస్తామన్నారు. 

కోహ్లీ అర్ధ సెంచరీ..భారత్ 120/2..

చెన్నై : చిదంబరం స్టేడియంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో కోహ్లీ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ప్రస్తుతం రెండు వికెట్లు కోల్పోయిన భారత్ 22 ఓవర్లలో 121 పరుగులు చేసింది. రహానే 36, కోహ్లీ 55 క్రీజులో ఉన్నారు.

 

కేంద్రం కహానీలు చెప్పడం మానాలి - ప్రొ.నాగేశ్వర్..

హైదరాబాద్ : కేంద్రం కహానీలు చెప్పడం మానాలని ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలను భావోద్వేగాలకు గురి చేసి వెళ్లారని, రాజధాని నిర్మాణం కోసం డబ్బులు కావాలని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా గురించి ఒక్క ముక్క మాట మాట్లాడలేదని, ప్రజలు నిలదీయాల్సినవసరం ఉందని తెలిపారు. విభజన చట్టం హామీలకు కట్టుబడి ఉన్నామని మోడీ పేర్కొనడం జరిగిందని కానీ ప్రత్యేక హోదా అంశం విభజన చట్టంలో లేదని తెలిపారు. ప్రత్యేక హోదా హామీని పార్లమెంట్ లో ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. పార్లమెంట్ లో ఇచ్చిన హామీని అమలు చేస్తామని మోడీ చెప్పలేదన్నారు. బీహార్ కు రూ.1.5 లక్షల ప్యాకేజీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. 

14:50 - October 22, 2015

హైదరాబాద్ : ఏపీ రాష్ట్ర ప్రజలను భారత ప్రధాన మంత్రి మోడీ దగా..మోసం చేశారని ప్రొ.నాగేశ్వర్ తీవ్రంగా విమర్శించారు. గుంటూరు జిల్లాలోని ఉద్దండరాయపాలెంలో 'అమరావతి' రాజధానికి మోడీ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన ప్రసంగించారు. కానీ ఆ ప్రసంగంలో ప్రత్యేక ప్యాకేజీ, హోదా అంశం ప్రస్తావించకపోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా టెన్ టివితో ప్రొ.నాగేశ్వర్ అభిప్రాయాలు తెలిపారు. కహానీలు..కథలు చెప్పి వెళ్లిపోయారని, పైసా ఖర్చు లేని పని చేసి పోయారని విమర్శించారు. వాస్తవంగా ఏపీ ప్రజలను భావోద్వేగాలను విడిచి వెళ్లారని, అమరావతి రాజధాని నిర్మాణ కోసం నిధులు కోరుకున్నారని, రాజధాని నగర నిర్మాణం కావాలంటే డబ్బులు కావాలని తెలిపారు. ప్రత్యేక హోదా విషయమై ఒక్క మాట చెప్పలేదని, బాబు చేతులు జోడించి అడిగారని పేర్కొన్నారు. ఇక్కడ చేతులు జోడించి అడగాల్సినవసరం లేదని డిమాండ్ తో అడగవచ్చన్నారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశం లేదని, దీనిపై పార్లమెంట్ లో ఆనాటి ప్రధాని మన్మోహన్ ఇచ్చిన హామీ అని గుర్తు చేశారు. విభజన చట్టం తెస్తున్న సమయంలో భారత పార్లమెంట్ కు ప్రతి హామీకి కట్టుబడి ఉంటామని చెప్పాలని పేర్కొన్నారు. విద్యా సంస్థలు ఏపీ రాష్ట్రానికి ఇచ్చినట్లు తెలిపారని వాస్తవానికి ఇక్కడ ప్రతి రాష్ట్రంలో ఈ విద్యా సంస్థలు ఉండడం కేంద్రం విధానమన్నారు. రూ.1800 కోట్లతో రాజధాని నిర్మాణం సాధ్యమౌతుందా అని ప్రశ్నించారు. ప్రభుత్వ..ప్రవేటు భాగస్వామ్యంతో నిర్మాణం కావాల్సి ఉంటుందని, సంపన్నవర్గాలు మాత్రం నివాసం ఉండే విధంగా రాజధాని నిర్మాణం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బీహార్ కు లక్ష కోట్లు ప్యాకేజీ ప్రకటించారని, ఏ చట్టంలో ఉందని..ఎలా చెప్పారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మట్టి నీరు..ఇచ్చారని, బీహార్ ప్రజలకు కోట్లు ఇచ్చారని విమర్శించారు. కేంద్రం కథలు..కహానీలు కథలు చెప్పడం కాదు..పని చేసే కేంద్రం కావాలని ప్రొ.నాగేశ్వర్ సూచించారు. 

14:16 - October 22, 2015

గుంటూరు : భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న హామీలు తు.చ.తప్పకుండా అమలు చేస్తామని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హామీనిచ్చారు. దసరా పర్వదినాన 'అమరావతి' శంకుస్థాపన కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు. ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు. 'అందరికీ విజయదశమి శుభాకాంక్షలు' అంటూ తెలుగులో మోడీ ప్రసంగాన్ని మొదలు పెట్టారు. విభజన చట్టంలో ప్రతి యొక్క అంశాన్ని తు.చ తప్పకుండా అమలు చేస్తామన్నారు. బాబు - మోడీ జోడి..అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతామన్నారు.

అందుకే మట్టిని..నీళ్లను తీసుకొచ్చాను..
గత ప్రభుత్వాలు చిన్న రాష్ట్రాలపై చిన్న చూపు చూశాయని, తెలుగు రాష్ట్రాలకు కేంద్రం సహాయం అందచేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ది పథంలో కేంద్రం, రాష్ట్రంతో కలిసి పని చేస్తుందన్నారు. ఏపీలో ఉన్న యువత ప్రపంచంలో అనేక చోట్ల స్థానాలు సంపాదించి దేశానికి పేరు తెస్తున్నారని కొనియాడారు. రాబోయే రోజుల్లో నవ్యాంధ్ర ఆర్ధిక క్రాంతి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతి ప్రపంచస్థాయి రాజధాని కావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. మన నీరు - మన మట్టి సేకరిస్తున్నారని తెలుసుకుని తాను కూడా మట్టిని..నీళ్లను తీసుకరావడం జరిగిందన్నారు. దేశం యొక్క రాజధాని ఇందులో కలవడానికి ముందుకొచ్చినట్లు తెలిపారు.

నగరం ఏర్పాటులో సమస్యలు...
వంద స్మార్ట్ సిటీల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకుందని, సంపద సృష్టించడం..ప్రజల జీవన విధానంలో మెరుగు కావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఆధునిక హంగులు కలిసి వ్యర్థ పదార్థాలు లేకుండా ఉండే నగరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇక్కడ అమరావతి రాజధాని దిక్సూచిగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కొత్త నగరం ఏర్పాట్లులో ఏఏ సమస్యలు వస్తాయో జపాన్ ప్రతినిధి పేర్కొనడం జరిగిందన్నారు. ఇలాంటి సమస్యలు తనకు ఎదురయ్యాయని, 2001లో గుజరాత్ లో భూకంపం వచ్చిందని, తిరిగి ప్రాంతాన్ని పునరుద్ధరించడానికి ఎన్నో సమస్యలు ఎదుర్కొనడం జరిగిందన్నారు. రాజకీయ దృడ సంకల్పం..ప్రజల భాగస్వామ్యం ఉంటే ఎలా ఉంటుందో కచ్ జిల్లా నిదర్శనమన్నారు.

విభజన అనంతరం విష బీజాలు నాటుతున్నారు...
వాజ్ పేయి హాయాంలో కొత్త రాష్ట్రాలు ఏర్పాటయ్యాయని, ఎలాంటి విధ్వేషాలు రాకుండా ఆ రాష్ట్రాలు ముందుకెళుతున్నాయన్నారు. ఇలాగే తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు ముందుకెళుతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. విభజన అయిన అనంతరం విష బీజాలు నాటే ప్రయత్నాలు చేస్తున్నారని, యువత మనోభావాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. బ్రిటీష్ వారు పోతూ పోతూ అలాంటి ఆలోచనలు వదిలి వెళ్లారని, అందుకే ఈ పరిస్థితులు వస్తున్నాయన్నారు. గత ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుండా పోవడం వల్ల ఏపీ, తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు వస్తున్నాయన్నారు. ఆంధ్ర..తెలంగాణ ఏదైనా తెలుగు వారి ఆత్మ ఒక్కటేనన్నారు.

కేసీఆర్ ఇంటికి బాబు వెళ్లడం చాలా సంతోషం..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి వెళ్లి అమరావతి రాజధాని శంకుస్థాపనకు రావాలని ఏపీ సీఎం బాబు ఆహ్వానించారని వార్తల ద్వారా తెలుసుకుని ఎంతో సంతోషించానన్నారు. కొంతమంది రాజకీయ కారణాలతో సరియైన ఆలోచన చేయకుండా విభజనపై తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఇక్కడ ఆస్తులు ధ్వంసం కావడం..ప్రాణాలు పోవడం తనను కలిచివేసిందన్నారు.

అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దుకోవాలి : మోదీ

గుంటూరు : ఏపీ రాజధాని అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దుకోవాలని ఆశిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు. అమరావతి శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ప్రియమైన సోదరీ సోదరీ మణులకు విజయదశమి శుభాకాంక్షలు అని ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. ఏపీ, తెలంగాణ గా విడిపోయినా తెలుగు వారంతా ఒక్కటేనన్నారు. విజయదశమి రోజు ఏపీ మహోన్నత ఘట్టం వైపు అడుగేసిందన్నారు. ప్రపంచ పరిజ్ఞానంతో ఆకర్షణీ నగరాల నిర్మాణానికి కేంద్ర సంకల్పించిందన్నారు.. పట్టణీకరణ వలన పౌరసదుపాయాలపై ఇంత కాలం దృష్టి పెట్టలేకపోయామన్నారు.

13:42 - October 22, 2015

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని 'అమరావతి' నిర్మాణానికి సహకరించిన రైతులకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని, వారికి పాదాభివందనం చేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. దసరా పర్వదినాన ఉద్దండరాయపాలెంలో ప్రధాని మోడీ చేతుల మీదుగా 'అమరావతి' శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఏపీకి ఒకేసారి రెండు పండుగలు వచ్చాయని, నేను సైతం అంటూ పార్లమెంట్ నుండి పుట్ట మన్ను..యమునా నది నుండి జలాలు తీసుకొచ్చిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వానికి ఒక బాధ్యత ఇచ్చారని, మంచి రాజధాని నిర్మాణం చేయాలని ప్రజలు ఆశిస్తున్నారని చెప్పారు. ప్రజల ఆశలకనుగుణంగా ముందుకు వెళుతున్నామని, ఎన్నో ఇబ్బందులున్నా ల్యాండ్ పూలింగ్ కు ముందుకు రావాలని పిలుపునిస్తే రైతులు 33వేల ఎకరాల భూములు స్వచ్ఛందంగా రైతులు ఇచ్చారన్నారు. వీరికి శిరస్సు వహించి పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు.

కేంద్రం రూ.1850 కోట్ల సహాయం..
ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని, ఇక్కడ రైతులు విజ్ఞత ప్రదర్శించారని ఇది చరిత్రలో నిలుస్తుందన్నారు. ప్రజా రాజధానిలో ప్రజల భాగస్వామ్యం అవసరమని..అందుకే మన నీరు - మన మట్టి సేకరించడం జరిగిందని, 13వేల గ్రామాలు 3వేల వార్డులు, 16వేల ప్రాంతాల్లో వీటిని సేకరించడం జరిగిందన్నారు. ఇక్కడ అన్ని మతాల వారు పాల్గొన్నారని, 33 నదుల నుండి జలాలను తీసుకొచ్చి ఏపీ రాజధాని ప్రాంతంలో చల్లడం జరిగిందన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం రూ.1850 కోట్ల రూపాయలను మూడు విడతలుగా చెల్లించారని, బ్లూ గ్రీన్ రాజధాని తయారవుతుందన్నారు. ప్రపంచంలో సుందరమైన రాజధానిగా నిర్మాణమౌతుందని, అందుకు ఎన్నో అవకాశాలున్నాయన్నారు. 9 సిటీలు, 7 సిటీ రీజియన్స్ ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు.

పలు దేశాల సహకారం..
ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇవ్వాలని, సహాయం చేయాలని సింగపూర్ ప్రభుత్వాన్ని అడిగితే వెంటనే మూడు మాస్టర్ ప్లాన్ లు తయారు చేసి ఇచ్చారని, ఇందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. ఇక్కడ జపాన్ దేశం కూడా ముందుకొచ్చి సహకరిస్తున్నారని, వీరితో ఒక ఎంవోయూ కుదుర్చుకున్నట్లు చెప్పారు. అమరావతిలో భాగస్వాములు కావాలని కంపెనీలు..సంస్థలు కోరుతున్నట్లు వెల్లడించారు. 16 నెలల్లో కేంద్రం పూర్తిగా సహకరించిందని, పోలవరం విషయంలో కేంద్రం సహాయం చేస్తోందన్నారు. కేంద్రం ప్రకటిస్తున్న పథకాలకు ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోందని, కేంద్రం ఆదుకోవాలని కోరారు. అదైర్యపడవద్దని, ఢిల్లీ కంటే మెరుగైన రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రధాన మంత్రి మోడీ హామీనిచ్చారని, అలాంటి సహాయ సహకారాలు ముందు ఉంటాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.

సమస్యలు పరిష్కరించుకుందాం..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేసుకుని ముందుకు వెళ్లాలని తెలిపారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటే బాగుంటుందన్నారు. ప్రస్తుతం నెలకొన్న సమస్యలను సామరస్యంగా పరిష్కరించడానికి కేసీఆర్ సహకరిస్తారని ఆశిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. 

13:33 - October 22, 2015

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాజధాని 'అమరావతి' రాజధాని నిర్మాణం అజరామరమని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. గురువారం ఉద్దండరాయపాలెంలో ప్రధాని మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వెంకయ్య ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా తయారు కావాలని, కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేయాలని సూచించారు. పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు ఒకే వేదిక మీదకు రావడం అభినందనీయమన్నారు. ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులను అభినందిస్తున్నట్లు, మంచి మార్గంలో పయనించాలని హితవులు పలికారు. మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకపోతోందని, ప్రపంచం అంతా దేశం వైపు చూస్తోందన్నారు. కేంద్రం, రాష్ట్రం చేపట్టే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని, విభజన హామీలు..పోలవరపై ఇచ్చిన మాటపై కేంద్రం తు.చ తప్పకుండా నెరవేరుస్తుందని మరోసారి హామీనిచ్చారు.  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పార్లమెంట్ నుండి మట్టి..యమున నది నుండి జలాలను ప్రధాని మోడీ తీసుకొచ్చారని, నేను సైతం అంటూ మోడీ పుట్టమన్నును సమర్పించారని తెలిపారు. తెలుగు జాతి ఐక్యంగా ముందుకు కదలాలని సూచించారు. అమరావతి అజరామరమై నిలుస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్య పేర్కొన్నారు. 

అమరావతి శంకుస్థాపన చారిత్రాత్మకం: సీఎం చంద్రబాబు

గుంటూరు : అమరావతి శంకుస్థాన కార్యక్రమం చారిత్రాత్మక ఘట్టం అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇటీవల ఎన్నికల్లో ప్రజలు ఒక బాధ్యత అప్పజెప్పారన్నారు. ఈ ఉత్సవానికి కారణం రైతులేనని కొనియాడారు. అసాధ్యం అనుకున్న 33 వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా రైతులు ఇచ్చారన్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చిన అందరికీ సుస్వాగతం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజయదశమి, అమరావతి రెండు పండగలన్నారు. పార్లమెంట్ నుంచి పట్టు మన్ను, యమునా తీరం నుంచి పవిత్ర జలాలు తెచ్చిన ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. 

హామీలన్నీ నెరవేస్తాం : వెంకయ్య నాయుడు

అమరావతి :రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు సంపూర్ణంగా నెరవేరుస్తామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం, రాష్ట్రం అందడగా ఉంటాయి. విడిపోయినా కలిసుండాలనే దానికి ఇదో సంకేతమని... ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దర్నీ అభినందిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచం భారత్ వైపు చూస్తోందన్నారు. భారత్ నేడు ఏపీ, హైదరాబాద్ వైపు చూస్తోందని తెలిపారు. తెలుగు రాష్ట్రాలు రెండూ పురోగమించాలన్నారు. 

13:19 - October 22, 2015

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని 'అమరావతి' నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహయ సహాకారాలు అందచేస్తుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ ప్రకటించారు. గుంటూరు జిల్లాలోని ఉద్దండరాయపాలెంలో 'అమరావతి' శంకుస్థాపన కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. పవిత్రమైన విజయదశమి రోజున ప్రధాని చేతలు మీదుగా శంకుస్థాపన చేయడం చాలా ఆనందదాయకమన్నారు. ప్రపంచంలో మేటైన రాజధానిగా 'అమరావతి' రూపుదిద్దుకోవాలని ఆకాక్షింస్తున్నట్లు చెప్పారు. 

'అమరావతి నిర్మాణంలో పాలుపంచుకోవడం ఆనందంగా ఉంది'

అమరావతి : ఏపీ రాజధాని అమరావతి రాజధాని నిర్మాణానికి తాము సహకరిస్తామని జపాన్‌ మంత్రి తకాచీ చెప్పారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అమరావతికి విశిష్ఠ చరిత్ర ఉందని, భవిష్యత్‌లో అమరావతి అద్భుత నగరంగా విరాజిల్లుతుందన్నారు. అమరావతి నిర్మాణంలో తాము పాలుపంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆసియా, ఫసిఫిక్‌ ప్రాంతానికి ఏపీ గేట్‌వే నిలుస్తుందని తకాచీ అన్నారు.

తెలుగుతల్లి గీతాలాపన చేసిన గాయని సునీత

అమరావతి : ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనలో భాగంగా తెలుగుతల్లి గీతాలపన చేశారు. మోదీ తదితరులు సభా వేదికపైకి చేరుకున్న అనంతరం చంద్రబాబు అతిథులందరికీ పుష్పగుచ్చాలు అందజేశారు. అనంతరం గాయని సునీత తెలుగుతల్లి గీతాలపన చేశారు.

పార్లమెంట్ మట్టి, యమునా నది జలాన్ని తెచ్చిన మోదీ

అమరావతి :నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసేందుకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటు ప్రాంగణంలోని మట్టిని, యమునా నది జలాన్ని తన వెంట తీసుకొచ్చారు. యాగశాలలో యంత్రన్యాసం చేసిన తర్వాత వేదికపైకి వచ్చిన మోదీ వాటిని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి అందజేశారు. ఈ సందర్భంగా మన మట్టి,- మన రాజధాని అన్న పదాలతో పాటు ప్రజా రాజధానిని తెలుగులో ఉచ్ఛరించారు. ప్రధాని మోదీ నోట తెలుగు పదాలు వినిపించడంతో జనం జేజేలు పలికారు.

21వ శతాబ్ది నవనగరి నిర్మాణానికి అంకురార్పణ

అమరావతి : 21వ శతాబ్ది నవనగరి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. శంఖునాదం, వేద పఠనం మధ్య శంకుస్థాపన వేడుక ఘనంగా జరిగింది. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనలో కీలక ఘట్టమైన యంత్రన్యాసం పూర్తైంది. నిర్దేశిత సమయం మధ్యాహ్నం 12:40 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ నవధాన్యాలతో యంత్రన్యాసాన్ని పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, సుజనా చైదరి తదితరులు పాల్గొన్నారు. 

12:47 - October 22, 2015

గుంటూరు : ఎప్పటి నుండో చూస్తున్న ముహూర్తం రానే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని 'అమరావతి'కి శంకుస్థాపన జరిగింది. దసరా పర్వదినాన భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతులు మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఉద్దండరాయపాలెంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతంలో కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన యాగశాల పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. శంకుస్థాపన జరిగే సమయంలో ప్రధాని వెంట ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్, సృజనా చౌదరి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్, సింగపూర్, జపాన్ ప్రతినిధులు పాల్గొన్నారు. 

అమరావతి నిర్మాణ శిలాఫలకం ఆవిష్కరణ

గుంటూరు : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం శిలాఫలకాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు.. ఈ కార్యక్రమంలో ప్రధాని తో పాటు కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, నిర్మలా శీతారమన్, గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తదితరులు ఉన్నారు.

అమరావతి నిర్మాణానికి శంకుస్థాప చేసిన ప్రధాని

గుంటూరు : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా ప్రధాని మోదీ మంత్రోచ్ఛారణల మధ్య శంకుస్థాప చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని తో పాటు కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, నిర్మలా శీతారమన్, గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తదితరులు ఉన్నారు.

బాబు సారధ్యంలోనే అద్భుతమైన రాజధాని నిర్మాణం'

అమరావతి : సీఎం చంద్రబాబు సారధ్యంలో ప్రపంచంలోనే అద్భుతమైన రాజధాని త్వరతగతిన పూర్తి అవుతుందని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆకాంక్షించారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు బాలయ్య ధన్యవాదాలు తెలిపారు. దశమినాడు ఏ కార్యక్రమం చేపట్టినా దిగ్విజయం చేకూరుతుందన్నారు. ఈ పర్వదినాన ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని శంకుస్థాపన జరగడం మనందరి అదృష్టమన్నారు. త్వరితగతిన అమరావతి నిర్మాణం పూర్తి అవ్వాలని బాలయ్య ఆకాంక్షించారు.

ఖమ్మం జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు తుమ్మల శంకుస్థాపన

ఖమ్మం: జిల్లాలోని రూరల్ మండలం మద్దులపల్లిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టిస్తామన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నదే సీఎం కేసీఆర్‌ సంకల్పం అని తుమ్మల స్పష్టం చేశారు.

దేవాన్స్ ను ముద్దాడిన ప్రధాని మోదీ

గుంటూరు :ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు దేవాన్ష్ ను ముద్దాడారు. తన కళ్లజోడును దేవాన్ష్ కు పెట్టి, చేతిలో చేయి వేసి పిల్లలపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. ఈ సమయంలో నారా భువనేశ్వరి, నారా లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణిలు మోదీతో ముచ్చటించారు. రాజధాని గ్యాలరీలో ఈ సన్నివేశం చోటు చేసుుంది. అనంతరం, గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను మోడీ ఆసక్తిగా తిలకించారు. ఫొటోలలో ఉన్న వాటి ప్రశస్త్యం గురించి చంద్రబాబుతో పాటు అధికారులు మోదీకి వివరించారు.

సభావేదిక వద్దకు చేరుకున్న మోదీ

గుంటూరు : ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన చేసేందుకు వచ్చిన ప్రధాని మోదీ సభా వేదిక వద్దకు చేరుకున్నారు. చంద్రబాబు మనవడు దేవాన్ష్ తో ముచ్చట్లాడి అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను తిలకిస్తున్నారు.

 

శంకుస్థాపన ప్రాంగణం వద్ద సర్వమత ప్రార్థనలు

గుంటూరు : రాజధాని అమరావతి శంకుస్థాపన ప్రాంగణం వద్ద సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అమరావతి నిర్మాణం నిర్విఘ్నంగా సాగాలంటూ ఈ ప్రార్థనలు చేశారు. మరోవైపు శంకుస్థాపన మహోత్సవానికి ప్రముఖులు విచ్చేస్తున్నారు. జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, రైతులు కార్యక్రమాన్ని చూసేందుకు తరలివస్తున్నారు.

అమరావతికి బయలుదేరిన ప్రధాని మోదీ

అమరావతి : ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ముఖ్య అతిధిగా వస్తున్న ప్రధాని నరేంద్ర మోది గన్నవరం ఎయిర్ పోర్టు నుండి ప్రత్యేక విమానంలో అమరావతికి బయలుదేరారు. ప్రధానితో పాటు తెలుగు రాష్ట్రాల గరవ్నర్ నరసింహన్, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు,ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు.

గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న మోదీ

అమరావతి : ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ముఖ్య అతిధిగా వస్తున్న ప్రధాని నరేంద్ర మోది గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. తెలుగు రాష్ట్రాల గరవ్నర్ నరసింహన్, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు,ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీ కి ఘన స్వాగతం పలికారు.

స్కేటింగ్ చేస్తూ అమరావతికి చేరుకున్న బాలుడు..

గుంటూరు : చిత్తూరు జిల్లా నారావారి పల్లె నుంచి దేవీశ్రీప్రసాద్ అనే ఓ బాలుడు మట్టి-నీరు తీసుకుని స్కేటింగ్ చేస్తూ అమరావతికి చేరుకున్నాడు. నారావారి పల్లె నుంచి మోటర్‌బైక్ ర్యాలీతో స్కేటింగ్ చేసుకుంటూ వచ్చాడు.

గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న గవర్నర్, సీఎం చంద్రబాబు

అమరావతి : ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ముఖ్య అతిధిగా వస్తున్న ప్రధాని నరేంద్ర మోదికి స్వాగతం పలికేందుకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు,ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.

అమరావతి చేరుకున్న ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు...

గుంటూరు : నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు దివంగత నందమూరి తారకరామారావు కుటుంబ సభ్యులంతా మూకుమ్మడిగా తరలివస్తున్నారు. నేటి ఉదయం హైదరాబాదు నుంచి విమానంలో బయలుదేరిన ఆ కుటుంబం కొద్దిసేపటి క్రితం విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్ పోర్టులో దిగింది. అక్కడి నుంచి మూడు బస్సుల్లో ఎక్కిన ఎన్టీఆర్ కుటుంబం అమరావతికి బయలుదేరింది. ఓ బస్సులో ఎక్కిన టాలీవుడ్ అగ్ర హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భుజానికి బ్యాగ్ తగిలించుకుని కొత్త లుక్ లో కనిపించారు. దారి పొడవునా ఆయన అభిమానులకు అభివాదం చేస్తూనే ముందుకు సాగారు. 

డబుల్ బెడ్ రూం ఇళ్లకు శంకుస్థాపన చేసిన మంత్రులు

హైదరాబాద్ : సనత్ నగర్ హమాలీ బస్తీలో డబుల్ బెడ్ రూం ఇళ్లకు మంత్రులు నాయిని, తలసాని, కేటీర్ శంకుస్థాపన చేశారు.

స్వర్ణ దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన

గుంటూరు :ఎడ్లపాడు మండలం చెంగిస్‌కాన్‌పేట దగ్గర స్వర్ణ దేవాలయం నిర్మించుటకు ఇస్‌కాన్‌ సంస్థ ప్రతినిధులు శంకుస్థాపన చేశారు. దీనిని రూ.500 కోట్లతో ఇస్‌కాన్ సంస్ధ నిర్మిస్తున్నట్లు వారు తెలిపారు. విజయదశమి రోజున స్వర్ణ దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన జరగడం శుభమని వారన్నారు.

అమరావతికి చేరుకున్న సీఎం కేసీఆర్‌

గుంటూరు : ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ఆయన తోపాటు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు ఈటెల, జదీశ్వర్ రెడ్డి ఉన్నారు.

అమరావతికి రామోజరావు

గుంటూరు : ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి రామోజీరావు సంస్థ ఛైర్మన్ రామోజీరావు హాజరయ్యారు. ప్రత్యేక వాహనంలో వేదిక వద్దకు చేరుకున్నారు. ఆయనకు ఎంపీ సీఎం రమేష్, మంత్రి అయ్యన్న పాత్రుడు తదితరులు ఆహ్వానం పలికారు..

అమరావతి చిరస్థాయిగా వర్ధిల్లుతుంది:వెంకయ్యనాయుడు

గన్నవరం : ఏపీ రాజధాని అమరావతి చిరస్థాయిగా వర్థిల్లుతుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యేందుకు గన్నవరం ఎయిర్ పోర్టు కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రజలు భారీగా తరలిరావడం శుభసూచకమన్నారు. అమరావతికి అందరి ఆశీస్సులు ఉన్నాయని పేర్కొను. ఏపీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏమైనా ప్రకటన చేస్తుందా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేశారు.

పారిశ్రామికాభివృద్ధిపై జపాన్‌ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం..

విజయవాడ : ఏపీలో పారిశ్రామికాభివృద్ధిపై జపాన్‌ ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో చంద్రబాబు, జపాన్‌ మంత్రి ఇసుకే టకాచీ సమక్షంలో ఎంవోయూ కుదిరింది. ఏపీ ఆర్థికశాఖ, జపాన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో అభివృద్ధి జరగనుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. జపాన్‌, సింగపూర్‌ దేశాల సహకారంతో ఏపీని అభివృద్ధి పథంలోకి తీసుకువెళతామని చంద్రబాబు చెప్పారు.

అమరావతికి బయలుదేరిన సీఎం కేసీఆర్

హైదరాబాద్ : ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ సూర్యాపేట నుండి ప్రత్యేక హెలీకాప్టర్ లో బయలు దేరారు. ఆయన వెంటన డిప్యూటీ సీఎం మహ్మద్ అలీ, మంత్రులు ఈటెల రాజేంద్ర,జగదీశ్ రెడ్డి ఉన్నారు.

మోదీకి స్వాగతం పలకనున్న చంద్రబాబు

అమరావతి :రాష్ట్ర రాజధాని నగరమైన అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్న ప్రధాని నరేంద్రమోదీకి ఏపీ సీఎం చంద్రబాబు గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలకనున్నారు. విజయవాడలో జపాన్‌ ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకోనుంది. అనంతరం చంద్రబాబు గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లనున్నారు. గన్నవరం విమానాశ్రయంతోపాటు అమరావతిలోని శంకుస్థాపన ప్రాంతం జనంతో సందడిగా మారింది. వివిధ దేశాల నుంచి వెయ్యి మందికి పైగా ఎన్‌ఆర్‌ఐలు విజయవాడకు తరలివచ్చారు.

అమరావతికి బయలు దేరిన ప్రధాని

గుంటూరు : ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ బయలుదేరారు. నేవీకి చెందిన ప్రత్యేక విమానంలో గన్నవరంకు చేరుకోనున్నారు.

అమరావతి ప్రాంగణంలో సినీ ప్రముఖులు...

అమరావతి : ఏపీ రాజధాని నగరమైన అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు సినీ ప్రముఖులు తరలివచ్చారు. శంకుస్థాపన కార్యక్రమానికి సినీప్రముఖులు అమితాబ్‌ దంపతులు, నటుడు వెంకటేష్‌, కృష్ణంరాజు, సినీనటులు సాయికుమార్‌, సుమన్‌లు తరలివచ్చారు. సినీనటుల రాకతో అమరావతి ప్రాంగణం కోలాహలంగా మారింది.

పవన్ కల్యాణ్ ఇంట్లో చోరీకి యత్నం...

హైదరాబాద్: సినీ హీరో పవన్‌కల్యాణ్ నివాసంలోకి మంగళవారం అర్ధరాత్రి ముగ్గురు అగంతకులు చొరబడేందుకు యత్నించారు. కలకలం సృష్టించిన ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలప్రకారం, రోడ్డు నెంబర్ 12 ఎమ్మెల్యే కాలనీలో నివసించే సినీహీరో పవన్ కల్యాణ్ నివాసానికి అర్ధరాత్రి 12 గంటల సమయంలో ముగ్గురు గుర్తుతెలియని యువకులు వచ్చి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా వాచ్‌మెన్ అడ్డుకున్నారు. దీంతో వారు వాచ్‌మెన్‌పై దాడిచేసి రెండో అంతస్తుపైకి పరుగుతీశారు. అక్కడ విధుల్లో ఉన్న పవన్ కల్యాణ్ బౌన్సర్ జాఫర్ వారిని అడ్డుకుని కిందవరకు తీసుకువచ్చాడు.

09:36 - October 22, 2015

గన్నరవరం : చిన్నరాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉందన్న ఆయన.. ఇతర రాష్ట్ర రాజధానులకు ధీటుగా అమరావతి అభివృద్ధి చెందాలన్నారు. రెండు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు అభివృద్ధిలో పోటీపడాలని.. విమర్శించుకోవడం సరికాదని కిషన్‌రెడ్డి అన్నారు.

09:34 - October 22, 2015

అమరావతి : నవ్యాంధ్రలో నవశకం మొదలైంది. ఆంధ్రుల రాజ సిరి అమరావతి... సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. దేశ, విదేశాల నుంచి తరలివస్తున్న... అతిరథ మహారథులకు, అశేష జనవాహినికి రారమ్మంటూ స్వాగతగీతం పాడుతోంది. కమ్మని ఆతిథ్య పరిమళం... ఘుమఘుమల గుబాళింపు వెదజల్లుతోంది. మరికొన్ని గంటల్లో ఆంధ్రుల స్వప్నం సాకారం కాబోతుంది. మొలకలెతుత్తుతున్న ఆశల వటవృక్షం. ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా శిలాన్యాసంతో శంకుస్థాపన జరుపుకొని మహానగరానికి అంకురార్పణ చేసుకోబోతోంది. లక్షలాదిగా తరలిరానున్న ప్రముఖులతో తీర్థస్థలిగా మారనున్న కృష్టాతీరం ఇప్పటికే కుహుకుహు రాగాలతో పులకిస్తోంది. రాజధాని ప్రాంతంలోని పల్లె పల్లె పరవశించి నవ రాజధానికి ప్రణామాలర్పిస్తోంది. వచ్చే అతిథులకు వందనాలు సమర్పిస్తోంది. దేశంలోనే ఒక అరుదైన చారిత్రక క్షణం. మహోన్నత వైభవాన్ని సంతరించుకుని సిరి సంపదలతో కళకళలాడి శతాబ్దాల పాటు తెలుగువారి శౌర్య పరాక్రమాలకు ప్రతీకగా నిలిచింది అమరావతి. గత కాలపు కీర్తి ప్రతిష్ఠలు అడుగంటి చిన్న పట్టణంగా ఒదిగిపోయింది, ఒరిగిపోయింది.

ఆర్టీసి బస్సును ఢీ కొట్టిన ప్రైవేటు బస్సు

కృష్ణా : ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సును ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటన జిల్లాలో కైకలూరు మండల పరిధిలోని ఆటపాక గ్రామం వద్ద చోటు చేసుకుంది హైదరాబాద్ నుండి భీమరవం వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు... విజయవాడ నుండి భీమరవం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ను వెనుక నుంచి ఢీ కొట్టి. ఈ ఘటనలో ట్రావెల్స్ బస్సు డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ప్రయాణీకులెవ్వరికీ ప్రమాదం జరగకపోవటంతో అంతా వూపిరి పీల్చుకున్నారు.

అరుణ్ జైట్లీ పై దేశ ద్రోహం కేసు...

న్యూఢిల్లీ: జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) చెల్లదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై విమర్శలు చేసిన కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీపై ఉత్తరప్రదేశ్‌లోని ఓ కోర్టు దేశద్రోహం అభియోగాలు మోపింది. జైట్లీ విమర్శలను సుమోటోగా స్వీకరించిన ఝాన్సీ జిల్లాలోని మహోబా సివిల్ కోర్టు న్యాయమూర్తి అంకిత్ జియోల్ ఆయనకు సమన్లు జారీచేశారు. నవంబర్ 19న కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించారు. గ్యాంగ్‌రేప్ విషయంలో చాలాసందర్భాల్లో అసలు కన్నా కల్పితమైన ఆరోపణలే ఎక్కువగా ఉంటున్నాయని గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్‌కు కూడా న్యాయమూర్తి జియోల్ సమన్లు జారీచేశారు.

పట్టువస్త్రాలు ధరించి తరలి వస్తున్న రైతులు..

గుంటూరు : నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులకు అమరావతి శంకుస్థాపన వేడుకకు రెడ్ కార్పెట్ స్వాగతం లభిస్తోంది. ఇప్పటికే 25 వేల మందికి పైగా రైతుల వద్దకు వెళ్లిన ప్రభుత్వ ప్రతినిధులు రైతులకు పేరు పేరునా ఆహ్వానాలు అందించారు. పట్టు వస్త్రాలు, తాపేశ్వరం స్వీట్ బాక్సులు పెట్టిన సంచులతో పాటు ఆహ్వాన పత్రికలను రైతులు అందుకున్నారు. ఇక నేటి మధ్యాహ్నం జరగనున్న శంకుస్థాపనను ప్రత్యక్షంగా వీక్షించేందుకు రైతులు ఉద్ధండరాయునిపాలెం చేరుకుంటున్నారు. ప్రభుత్వం అందించిన పట్టు వస్త్రాలను ధరించిన రైతులు ఉత్సాహంగా వేడుకకు తరలివస్తున్నారు.

కేసీఆర్ పర్యటనలో స్వల్ప మార్పులు..

హైదరాబాద్ : నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు హాజరు కానున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు షెడ్యూల్ లో కాస్తంత స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నల్లగొండ జిల్లా సూర్యాపేట నుంచి మరికాసేపట్లో హెలికాప్టర్ లో బయలుదేరనున్న కేసీఆర్ విజయవాడ సమీపంలోని గన్నవరం చేరుకుని అక్కడి నుంచి ఉద్ధండరాయునిపాలెం చేరుకోవాల్సి ఉంది. అయితే నేటి ఉదయం తన షెడ్యూల్ ను కేసీఆర్ కొంతమేర మార్చుకున్నారు. గన్నవరంలో దిగిన తర్వాత తొలుత ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను ఆయన దర్శించుకుంటారు. అనంతరం ఆయన అక్కడి నుంచి ఉద్ధండరాయునిపాలెం బయలుదేరతారు. 

08:59 - October 22, 2015

గన్నవరం : ఏపీ రాజధాని నగరమైన అమరావతి నగర శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రముఖుల రాక నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌తో పాటు ప్రతినిధిబృందం, జపాన్ ప్రతినిధి బృందం, తమిళనాడు రాష్ట్ర గవర్నరు రోశయ్య, నాగాలాండ్‌, అసోం రాష్ర్టాల గవర్నర్‌ బీపీ ఆచార్య, బిజెపి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి ఈటెల రాజేంద్ర తదితరులు గన్నవరానికి వచ్చారు. మరో వైపు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు ప్రముఖులు సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ రమణ, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్‌బోస్లే, హైకోర్టు జడ్జిలు జస్టిస్‌ జి. చంద్రయ్య, శివశంకర్‌, ఎం. సత్యనారాయణమూర్తి, ఎస్‌.రవికుమార్‌, వి.దుర్గాప్రసాద్‌, పి.సునీల్‌కుమార్‌, జయశంకర్‌నారాయణ, ఒడిశా ప్లానింగ్‌బోర్డు డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్‌ భాస్కర్‌రావులు విజయవాడకు చేరుకున్నారు.

రాజరాజేశ్వరి దేవీ అలంకారంలో దుర్గమ్మ

విజయవాడ : బెజవాడ కనకదుర్గమ్మవారి దేవీ శరన్నవరాత్రోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఇవాళ రాజరాజేశ్వరి దేవీ అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తుంది. ఇప్పటికే అమ్మవారి దర్శనానికి కొండపై భక్తులు బారీగా చేరారు. ఉత్సవాల్లో చివరి రోజుకావడంతో ఆలయంలో పోలీసులు నిఘా పెంచారు.

నేడు యాదాద్రి పనులకు శ్రీకారం

నల్లగొండ: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని యాదగిరి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాభివృద్ధి పనులకు ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. ఆలయ విస్తరణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ, ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వెళ్తున్న నేపథ్యంలో విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు పనులను ప్రారంభించనున్నారు. ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య ధనుర్‌లగ్నంలో, అభిజిత్ ముహూర్తంలో పాంచరాత్ర ఆగమ సంప్రదాయం ప్రకారం శ్రీ విష్వక్సేనారాధనతో పనులకు శ్రీకారం చుట్టనున్నారు.

భారీ భద్రత మధ్య గన్నవరం విమానాశ్రయం

అమరావతి : ఏపీ రాజధాని నగరమైన అమరావతి నగర శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రముఖుల రాక నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌తో పాటు ప్రతినిధిబృందం, తమిళనాడు రాష్ట్ర గవర్నరు రోశయ్య, నాగాలాండ్‌, అసోం రాష్ర్టాల గవర్నర్‌ బీపీ ఆచార్య, బిజెపి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి ఈటెల రాజేంద్ర తదితరులు గన్నవరానికి వచ్చారు.

08:38 - October 22, 2015

హైదరాబాద్ : ఏపీ రాజధాని అమరావతి సమ అవకాశాలు సృష్టిం రాజధానిగా ఉండాలని 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో ద హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.కె. నాగేశ్వర్ తెలిపారు. శాతవాహనుల కాలం నుంచి తెలుగు ప్రజల వారసత్వంగా ఆధ్యాత్మికంగా ఉన్న ప్రాంతం అమరావతి. అలాంటి అమరావతిలో ఏపీ రాజధాని శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ విభజన చట్టంలో ఉన్న అంశాల అమలుకు ప్రత్యేక ప్యాకేజీ లేదా... ప్రత్యేక హోదా ప్రకటిస్తారా? అలా ప్రకటించని పక్షంలో రాజకీయ చైతన్యం కలిగిన తెలుగు ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరం లేదా? ఏపీ రాజధాని అమరావతి నగరం అందరి నగరంగా ఉంటుందా... కొంత మంది నగరంగా ఉంటుందా? అభివృద్ధి అనేది అమరావతిలోనే కాకుండా ఏపీ అంతా విస్తరించాలి అని నాగేశ్వర్ తన విశ్లేషణలో తెలిపారు. పూర్తి విశ్లేషణా పాఠవాన్ని మీరూ వినాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

 

08:04 - October 22, 2015

హైదరాబాద్ : దుర్గాదేవి తొమ్మిది రాత్రులపాటు రాక్షసులను వెంటాడి, సంహరించింది. చివరికి పదవ రోజున రాక్షసులపై విజయం సాధించింది. దానికి గుర్తుగా పదవరోజును విజయదశమిగా పాటిస్తున్నాం. మనలోని దుర్గుణాలే రాక్షసులు, మన లోని దైవాంశే ఆ మహాశక్తి. ఆ శక్తిని గుర్తించి, ఆరాధించి తద్వారా మనలోని దుర్గుణాలను తొలగించమని వేడుకోవడమే దుర్గానవరాత్రుల పూజలోని అంతరార్థం. నవరాత్రులలో మొదటి మూడు రోజులు దుర్గా స్వరూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి మూడురోజులు లక్ష్మీ స్వరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడు రోజులు సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందవచ్చు. ఈ క్రమంలో నవరాత్రులలో దేవిని పూజించి తగు ఫలితాలు పొందవచ్చునని పెద్దలు చెబుతారు. 
ప్రాంతీయ ఆచారాలను బట్టి నవరాత్రులలో దేవీ అలంకారాలు చేస్తారు. బాలాత్రిపురసుందరి, అన్నపూర్ణాదేవి, గాయత్రీదేవి, శ్రీమహాలక్ష్మీదేవి, సరస్వతీదేవి, దుర్గా, మహిషాసుర మర్దిని, శ్రీరాజరాజేశ్వరీదేవిగా తొమ్మిది రోజులూ తొమ్మిది రూపాలలో అమ్మవారిని కొలుస్తారు. చాలా చోట్ల ఈ అవతారాలకే పూజలు చేస్తారు, ఉత్తర భారతంలో శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంటా, కూష్మాండ, స్కంధమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి లాంటి తొమ్మిది రూపాలలో అమ్మవారిని కొలుస్తారు. అయితే తెలుగునాట శ్రీశైలంలో అమ్మవారిని ఈ రూపాలలో అర్చిస్తారు.

07:57 - October 22, 2015

విజయవాడ : ఏపీ రాజధానికి ప్రత్యేక హోదా, లేదా ప్రత్యేక ప్యాకేజీ ఏది ఇచ్చినా దాని నిర్థిష్టత ఉండాలని అమరావతి నుండి 'న్యూస్ మార్నింగ్' చర్చలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ముఖ్య అతిధిగా వస్తున్న ప్రధాని ఏపీకి ఎలాంటి వరాలు ప్రకటిస్తారు? ఏపీ పునర్విభజన చట్టంలో చెప్పిన హామీల అమలుకు ప్రకటన చేయాలని సూచించారు. రాజధాని చూసి పెట్టుబడులు వస్తాయా? లేక ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల పరిశ్రమలు వస్తాయా? శంకుస్థాపనలో నిధులు దుర్వినియోగం అవుతున్నాయా? అ చర్చలో రామకృష్ణ ప్రసాద్ టిడిపి నేత, సీపీఎం నేత ఉమామహేశ్వరరావు, వైసీపీ నేత బత్తుల బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

హైదరాబాద్ : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి గంట, కాలినడకన వచ్చే భక్తులకు గంట సమయం పడుతోంది

ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రతి ఒక్కరూ అత్యంత ఆనందంతో పండుగ జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు. తొమ్మిది రోజులపాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహించుకున్న ప్రజలు విజయదశమిని కూడా చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఒక ఉత్సవంలాగా జరుపుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. బతుకమ్మ, దసరా ఉత్సవాలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తాయని అన్నారు.

మనిషిని మంచిమార్గంలో నడిపించే పండుగ: గవర్నర్

హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ప్రజలకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దసరా ప్రజల జీవితాలలో కొత్త వెలుగులను నింపాలని ఆకాంక్షించారు. దసరా పండుగ మనిషిని మంచిమార్గంలో నడిపించడానికి ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ దసరా పండుగ రెండు రాష్ర్టాలలో శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరిసేలా చేయాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు.

శంకుస్థాపన శిలాఫలకంపై 16 మంది పేర్లు..

గుంటూరు : నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాప మహాఘట్టంలో భాగమైన శిలాఫలకంపై మొత్తం 16 మంది పేర్లతో ఈ ఫలకం రూపొందింది. వారిలో ముఖ్య అతిథిగా హాజరవుతున్న ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు, పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య, నాగాలాండ్ గవర్నర్ పద్మనాభ బాలకృష్ణ ఆచార్య, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ భోసలే పేర్లు శిలాఫలకంపై ఉన్నాయి.

ఏడు విమానాలు, ఐదు హెలికాప్లర్లు...

విజయవాడ: రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్య అతిథులు కొందరు విమానాలలో, హెలికాప్టర్లలో విచ్చేస్తున్నారు. బుధవారం రాత్రికి అందిన సమాచారం ప్రకారం మొత్తం ఏడు విమానాలు, ఐదు హెలికాఫ్టర్లులో అతిథులు వస్తున్నారు. ప్రధాన మంత్రి బుధవారం ఉదయం 11.45 గంటలకు గన్నవరంలో ప్రత్యేక విమానంలో దిగుతారు. తెలంగాణ సిఎం సూర్యాపేట నుంచి 11.30 ప్రాంతంలో నేరుగా ఉద్దండరాయనిపాలేనికి చేరుకుంటారు.

వరంగల్‌ లోక్‌సభ స్థానానికి షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్ : వరంగల్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల అయింది. దీనికి సంబంధించి ఈ నెల 28న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ దాఖలుకు చివరి తేదీ నవంబర్ 4 కాగా నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీని నవంబర్ 7గా నిర్ణయించారు. నవంబర్ 5న అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించనున్నారు. నవంబర్ 21న పోలింగ్ నిర్వహించి 24న కౌంటింగ్‌ను నిర్వహించనున్నారు. 

06:47 - October 22, 2015

గుంటూరు :ఆంధ్రుల ఆకాంక్షలకు ప్రతిరూపం... కోట్ల మంది తెలుగువారి స్వప్నం.. ఆధునిక మహానగరం అమరావతికి అంకురార్పణ జరగబోతోంది. ఐదు కోట్ల మంది ఆంధ్రులను అలరించే రాజసాన్ని సంతరించుకోబోతోంది. నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. సుమారు 2 లక్షల మందికి పైగా అతిథులు వస్తారన్న అంచనాతో భారీ ఏర్పాట్లు చేశారు.

ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా....

అమరావతి శంకుస్థాపన కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు 15 రోడ్లును నిర్మించారు. గతంలో ఉన్న రోడ్లను వెడల్పు చేశారు. శంకుస్థాపన వేదికకు చేరుకునేందుకు ప్రధాన రోడ్లతో పాటు బైపాస్‌ రోడ్లను నిర్మించారు. మందడం శివారు నుంచి బైపాస్‌ రోడ్డును నిర్మించారు. అమరావతి వైపు నుంచి వచ్చే వాహనాలు తుళ్లూరు వెళ్లకుండా దొండపాడు నుంచి రాయపూడి మీదుగా ఉద్ధండరాయుని పాలెం చేరుకొనేందుకు మరో బైపాస్ రోడ్డు నిర్మించారు.

20 వేల వాహనాలను పార్క్‌ చేసేలా.....

ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా.. 20 వేల వాహనాలను పార్క్‌ చేసేలా 150 ఎకరాల స్థలాన్ని సిద్ధం చేశారు. ఇందులో బైకుల నుంచి భారీ వాహనాల వరకు పార్కింగ్‌ చేసుకునే సదుపాయం కల్పించారు. లక్షా 30 వేల మంది తరలింపునకు 2 వేల 275 బస్సులు అవసరమని భావిస్తున్న అధికారులు.. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు. కృష్ణా జిల్లా నుంచి 600 బస్సులను సమకూరుస్తున్నారు. మిగతా జిల్లాల నుంచి 175 బస్సుల చొప్పున తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

3 వేల మంది వీఐపీలు....

శంకుస్థాపన మహోత్సవానికి 3 వేల మంది వరకు వీఐపీలు హాజరుకానున్నారు. ప్రధాని, ఇతర ప్రముఖుల కోసం ఏడు హెలిప్యాడ్‌లు నిర్మించారు. ప్రధాన వేదిక, సాంస్కృతిక వేదిక, పారిశ్రామికవేత్తలు ఆసీనులయ్యేందుకు మరో వేదిక నిర్మించారు. అలాగే రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన దాదాపు 25వేల మంది రైతులు కూర్చోవడానికి వీలుగా ప్రధాన గ్యాలరీ నిర్మాణం పూర్తి చేశారు.

ప్రత్యక్ష ప్రసారం వీక్షణకు 15 ఎల్ఈడీ తెరలు............

శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రజలు వీక్షించేందుకు సభాప్రాంగణంలో 15 ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చే వాహనాలకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అనుమతి ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత వాహనాలు తిరిగి వెళ్లేందుకు అనుమతి ఇవ్వనున్నారు. ఏఏఏ పాస్‌లు ఉన్న ప్రముఖులను ప్రకాశం బ్యారేజీ మీదుగా అనుమతించాలని నిర్ణయించారు. సాధారణ వాహనాలను ఎన్ఆర్ఐ, మంగళగిరి, నిడుమర్రు మీదుగా అనుమతించనున్నారు.

నేడే అమరావతి శంకుస్థాపన మహోత్సవం

గుంటూరు : మేళ తళాలు... భాజా భజంత్రీలు.. వేదమంత్రాలు... సాంస్కృతిక సౌరభాలు....అంబరాన్నంటే సంబరాలు. గౌతమ బుద్ధుడి సాక్షిగా నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి మరికొన్ని గంటల్లో పునాదిరాయి పడబోతోంది. ఆంధ్రుల రాజధాని కల ఇవాళ సాకారమవ్వబోతుంది.

ముంబైలో అత్యవసరంగా ల్యాండైన హెలికాప్టర్

హైదరాబాద్ : భారత వైమానిక దళానికి చెందిన ఎంఐ-17 హెలికాప్టరు ముంబై సర్బన్ లోని బాండ్రా కుర్లా భవన సముదాయంపై సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. సాంకేతిక లోపం తలెత్తడంతో హెలికాప్టర్ ను కిందికి దింపాల్సి వచ్చిందని, ఇందులో ప్రయాణిస్తున్న నలుగురూ క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన బుధవారం అర్థరాత్రి జరిగింది.

ఫిలిప్పీన్స్ లో ఇద్దరు చైనా దౌత్యవేత్తల కాల్చివేత

హైదరాబాద్ : ఫిలిప్పీన్స్‌లోని కెబూ నగరంలో సాయుధులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు చైనా దౌత్యవేత్తలు మరణించారు. మరో దౌత్యాధికారికి గాయాలయ్యాయని జాతీయ పోలీసు అధికార ప్రతినిధి విల్బెన్ మేయర్ తెలపారు. వారు బుధవారం మధ్యాహ్నం 1.30 గంటకు ఓ రెస్టారెంట్‌లో ఈ ఘటన జరిగింది. మృతుల్లో డిప్యూటీ కాన్సుల్, కాన్సులేట్ అధికారి మరణించగా.. కాన్సులేట్ జనరల్‌కు గాయలయ్యాయి. ఇద్దరు చైనీయులు సహా మరో మహిళనుఅరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. ఘటనాస్థలం నుంచి సెమీ ఆటోమేటిక్ 0.45 కోల్ట్ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

స్వైన్ ఫ్లూ మృతురాలి ఖనానికి అడ్డుపడుతున్న గ్రామస్థులు..

కరీంనగర్: స్వైన్‌ఫ్లూతో మృతి చెందిన ఓ మహిళను గ్రామంలో ఖననం చేయకూడదని ఆ ఊరి జనం అడ్డుకున్నారు. కరీంనగర్ జిల్లాలోని గంగాధరం మండలం, నాగిరెడ్డిపూర్‌లో ఈ ఘటన జరిగింది. పట్ల లక్ష్మి(48) అనే మహిళ వారం రోజుల క్రితం స్వైన్‌ఫ్లూ వ్యాధితో హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చేరింది. అయితే పరిస్థితి విషమించడంతో బుధవారం రాత్రి 8 గంటలకు ఆమె మృతి చెందింది. దీంతో ఆమె మృతదేహాన్ని ఖననం చేసేందుకు గ్రామానికి తరలించారు. అయితే భంయకర వ్యాధితో మృతి చెందడంతో ఆమె మృత దేహాన్ని ఖననం చేయడానికి ఆ గ్రామస్థులు అంగీకరించడం లేదు.

Don't Miss