Activities calendar

23 October 2015

ఆర్టీసీ ఛార్జీల పెంపుతో అదనంగా రూ.3 కోట్ల ఆదాయం : సాంబ శివరావు

హైదరాబాద్ : ఎపిలో ఆర్టీసీ బస్సుల ఛార్జీల పెంపుతో అదనంగా రూ.3 కోట్ల ఆదాయం వస్తుందని ఆర్టీసీ ఎఉండ ఈ సంబ శివరావు తెలిపారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. అయినా లోటు ఇంకా రూ. 330 కోట్లు ఉందన్నారు. అయితే అంతర్గత శక్తి సామర్థ్యాలతో లోటును పూడ్చుకోవాలని... కానీ ఛార్జీలు పెంచడానికి వీలు లేదని సీఎం హెచ్చరించినట్లు తెలిపారు. 

22:00 - October 23, 2015

హైదరాబాద్ : ఎపిలో ఆర్టీసీ బస్సుల ఛార్జీల పెంపుతో ప్రభుత్వానికి అదనంగా రూ.3 కోట్ల ఆదాయం వస్తుందని ఆర్టీసీ ఎండీ సాంబ శివరావు తెలిపారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. అయినా లోటు ఇంకా రూ. 330 కోట్లు ఉందన్నారు. అయితే అంతర్గత శక్తి సామర్థ్యాలతో లోటును పూడ్చుకోవాలని... కానీ ఛార్జీలు పెంచడానికి వీలు లేదని సీఎం హెచ్చరించినట్లు తెలిపారు. విద్యార్థుల బస్సు పాస్ ల విషయంలో ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని.. బస్సు పాస్ ధరలను మాత్రం పెంచొద్దని సీఎం చెప్పినట్లు పేర్కొన్నారు. విద్యార్థులపై భారం మోపవద్దని సీఎం, ఆర్థికమంత్రి ఎనమల రామకృష్ణుడు చెప్పారని.. ఆ ప్రకారమే ముందుకు వెళ్తామని తెలిపారు. హైదరాబాద్ లో మున్సిపల్ కార్పొరేషన్ యాక్టు మార్చారని పేర్కొన్నారు. అర్బన్ ప్రాంతాల్లో నగర బస్సులన తిప్పుతున్నారు కాబట్టి.. నష్టాలను వారే పూడ్చుకోవాలని సూచింనట్లు తెలిపారు. కానీ ఎపిలో అలాంటి పెద్ద కార్పొరేషన్లు లేవని స్పష్టం చేశారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ చొరవ తీసుకుంటే ఎపిలో ఆర్టీసీకి కొంత డబ్బు వస్తుందన్నారు. మిగిలిన మున్సిపాలిటీలకు ఆర్టీసీకి ఆర్థిక సాయం చేసే పరిస్థితుల్లో లేవన్నారు.

 

21:53 - October 23, 2015

ఒకప్పుడు 40 ఏళ్లు.. తర్వాత 60 ఏళ్లు.,. ప్రస్తుతం 70 ఏళ్లు... అంతకంటే ఎక్కువ. సెంచరీకొట్టిన వృద్ధ యువకులే చాలా మందే ఉన్నారు ప్రపంచంలో. అంతకుమించి అంటుంది ఆధునిక వైద్య ప్రపంచం. అవును 150 ఏళ్ల ఆయుష్షు పెంచుకోవడానికి శాస్త్రవేత్తలు... పరిశోధనలు చేస్తున్నారు. ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్... మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:45 - October 23, 2015

కర్నాటక : సాహితీవేత్తల ఆందోళనలు కొనసాగుతూ ఉండగానే.. కర్ణాటకలో మరో యువ రచయితపై దాడి జరిగింది. హిందూ వ్యతిరేక రచనలు చేస్తున్నాడంటూ.. సెంట్రల్‌ కర్ణాటకలోని దావణగెరెకు చెందిన దళిత రచయిత హుచ్చంగి ప్రసాద్‌పై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. ఒళ్లు మంట.. అన్న అర్థం వచ్చే.. ఒడల కిచ్చు.. అన్న రచనలో.. ప్రసాద్‌.. సమాజంలోని కుల వివక్షతను ఎత్తి చూపాడు. తాను గత జన్మలో చేసిన పాపాల వల్లే దళితుడిగా పుట్టానంటూ దాడిచేసిన వారు ఎగతాళి చేసినట్లు.. ప్రసాద్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

 

21:40 - October 23, 2015

చండీఘర్ : హర్యానాలో దళితులపై హింస కొనసాగుతూనే ఉంది. వీటిపై కేంద్ర మంత్రి వికె సింగ్‌ స్పందించిన తీరుపైనా రాజకీయ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో.. కేంద్ర హోంమంత్రి జోక్యం చేసుకొని.. వికె సింగ్‌ నుంచి వివరణ కోరారు. తమ వ్యాఖ్యలకు పెడర్థాలు రాని రీతిలో నేతలు మాట్లాడాలని సూచించారు.
హర్యానాలో కొనసాగుతున్న హింస 
హర్యానాలో హింస కొనసాగుతూనే ఉంది. నాలుగు రోజుల వ్యవధిలోనే రెండు ఉదంతాలు వెలుగు చూశాయి. మూడు రోజుల క్రితం ఫరీదాబాద్‌లోని ప్రీత్లా ప్రాంతానికి చెందిన ఓ దళిత కుటుంబం.. ఇంట్లో నిద్రిస్తుంటే.. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వారి ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సజీవంగా తగులబడిపోయారు. ఇది మరువక ముందే.. శుక్రవారం గోహానాలో... గోవింద అనే 15 ఏళ్ల దళిత యువకుడు ప్రాణాలు కోల్పోయారు. అగ్రవర్ణాల ఒత్తిడితో గోవిందను అరెస్టు చేసిన పోలీసులు విచక్షణ రహితంగా కొట్టడం వల్లే మరణించాడంటూ.. మృతుడి బంధువులు ఆందోళకు దిగారు. దీంతో ఉన్నతాధికారులు ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు.
కలకలం సృష్టిస్తున్న మంత్రి వికె సింగ్‌ ప్రకటన 
హర్యానా ఘటనలపై కేంద్ర మంత్రి వికె సింగ్‌ చేసిన ప్రకటన కలకలం సృష్టిస్తోంది. కుక్కపై రాళ్లు పడ్డా కేంద్ర ప్రభుత్వాన్ని దర్యాప్తునకు డిమాండ్‌ చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం నాటి హత్యలకు పాత కక్షలే కారణమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రంగంలోకి హోంమంత్రి 
హర్యానా ఉదంతం.. దానిపై మంత్రి వికె సింగ్‌ ప్రకటనలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా మారడంతో.. హోంమంత్రి రంగంలోకి దిగారు. వికె సింగ్‌ తో పాటు.. రిజిజు కూడా ఇదే తరహాలో వ్యాఖ్యల చేయడం పట్ల.. ఇద్దరి నుంచీ వివరణనూ.. క్లాస్‌నూ తీసుకున్నారు. మరోవైపు.. గోహానాలో యువకుడి మృతిపై.. జాతీయ ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ పిఎల్‌ పునియా ప్రభుత్వాన్ని వివరణ కోరారు.

 

 

చెరువులో పడి ముగ్గురు విద్యార్థుల గల్లంతు

నిజామాబాద్ : నవీపేట్ మండలం అబ్బాస్ (బి)లో విషాదం నెలకొంది. ఈతకు వెళ్లి చెరువులో పడి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. వారి కోసం స్థానికులు గాలిస్తున్నారు. గాలింపులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయింది. మృతులు అశోక్, సతీష్, సాయికుమార్ లుగా గుర్తించారు. మృతులు ఎనిమిదో తరగతి చదువుతున్నారు.

 

 

ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపును ఖండిస్తున్నాం : మధు

విజయవాడ : ఎపిలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపును ఖండిస్తున్నట్లు సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు పేర్కొన్నారు. పెంచిన ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్నారని.. ఈనేపథ్యంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచడం సరికాదన్నారు.

 

21:16 - October 23, 2015

వరంగల్‌ : వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఓట్ల నమోదుకు ఈనెల 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ తెలిపారు. వరంగల్‌ ఉప ఎన్నికకు 1,751 పోలింగ్‌ బూతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వచ్చే నెలలో నారాయణఖేడ్‌ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని.. అదేవిధంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్‌ విడుదల చేస్తామన్నారు భన్వర్‌లాల్‌

 

21:11 - October 23, 2015

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసు,.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌ల మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని తెలంగాణ కాంగ్రెస్‌ షబ్బీర్‌ అలీ ఆరోపించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, కేసీఆర్‌ల మధ్యవర్తి ఎవరనేది త్వరలో బయటపెడతామని ఆయన అన్నారు.

 

21:09 - October 23, 2015

మెదక్‌ : జిల్లాలోని జహీరాబాద్‌లో పోలీసులు స్పిరిట్‌ను పట్టుకున్నారు. లారీలో అక్రమంగా తరలిస్తున్న 15 లక్షల విలువైన స్పిరిట్‌ను పోలీసులు.. బోచేలు వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ స్పిరిట్‌ను మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

21:08 - October 23, 2015

హైదరాబాద్ : ఏపీలో ఆర్టీసీ ఛార్జీలు పెంచేశారు. పది శాతం ఛార్జీలు పెంచుతూ ఆర్టీసీ యాజమాన్యం ఉత్తర్వులిచ్చింది. రేపటి నుంచే కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయని ప్రకటించారు. నిన్న, మొన్నటి వరకు ఛార్జీలు పెంచే ఆలోచన లేదని రవాణాశాఖా మంత్రి చెబుతూ వచ్చారు. కాని దసరా పండగ అయిపోగానే హఠాత్తుగా ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పల్లెవెలుగు మొదలు కొని ఎసి బస్సుల వరకు ఛార్జీలు పెంచారు. పల్లెవెలుగు బస్సులకు కిలోమీటరు 3 పైసలు, ఎక్స్ ప్రెస్, డీలక్స్ బస్సులో కిలోమీటరుకు 8 పైసలు, సూపర్ లగ్జరీ, వెన్నెల గరుడ సర్వీసులకు కిలో మీటరుకు 9 పైసలు పెంచారు. హైదరాబాద్-విజయవాడ ఎక్స్ ప్రెస్ ఛార్జీ రూ.213 నుంచి 235 కు పెంపు, హైదరాబాద్-విజయవాడ డీలక్స్ ఛార్జీ.. రూ.240 నుంచి 264 రూపాయల చొప్పున పెంచారు.  

20:40 - October 23, 2015

విజయవాడ : ఒక అద్భుత నగర నిర్మాణానికి శ్రీకారం చుట్టామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రైడ్ గా మాట్లాడడానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ఈమేరకు విజయవాడలో అయన మీడియాతో మాట్లాడారు. కొంతమంది చిన్న ఇబ్బందులు కల్గించారు అయినా... వాటిని ఎదుర్కొన్నామని తెలిపారు. కుల, మతాలకు అతీతంగా పూజలు చేశామని చెప్పారు. పవిత్రమైన మట్టి-నీరు కార్యక్రమాన్ని నిర్వహించామని పేర్కొన్నారు. నీరు, మట్టి పవిత్రమైనవని... ఈరెండూ మనుషుల మనుగడకు ముఖ్యమని.. ఇవి లేకపోతు మనుగడ లేదన్నారు. 16 వేల గ్రామాలు, వార్డుల నుంచి మట్టి, నీరు సేకరించామని తెలిపారు. నమ్మకంతో ప్రపంచం నడుస్తోందన్నారు. వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. కార్యక్రమానికి నాలుగు రాష్ట్రాల గవర్నర్లు, దేశ, విదేశాల్లో ఉండే పారిశ్రామిక వేత్తలు వచ్చారని పేర్కొన్నారు. వచ్చిన అతిథులకు పద్ధతి ప్రకారం గౌరవ, మర్యాదలు చేశామని చెప్పారు. నూతన రాజధాని ప్రాంతానికి స్థల బలం ఉంది.. కాని ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లేదన్నారు. అన్ని డిపార్టుమెంట్లు, అధికారులు, మంత్రులు అందరూ సమర్థవంతంగా పని చేశారని కొనిడియాడారు. ఎపి రాజధాని అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని జపాన్ ప్రధాని చెప్పారని పేర్కొన్నారు. సింగపూర్, జపాన్ రెండు దేశాలు మద్దతు పలికాయన్నారు. కార్యక్రామానికి ప్రధాని నరంద్రమోడీ ఫాస్టింగ్ లో వచ్చారని పేర్కొన్నారు. పెట్టుబడుల కోసం ప్రపంచమంతా తిరుగుతాం...కానీ జపాన్, సింగపూర్ దేశాల వారు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారని తెలిపారు.
భోజనాలు, తాగునీరు విషయంలో సంతృప్తిపరచలేకపోయాం
భోజనాలు, తాగునీరు విషయంలో సంతృప్తిపరచలేకపోయామన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నాయి.. ఆ విషయం అందరికీ తెలుసన్నారు. అయినా తాను అందరితో సమన్వయం చేసుకోవడం వలన పరిస్థితి ఇక్కడిదాకా వచ్చిందని పేర్కొన్నారు. రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా 26 శాతం, టీవీల్లో 51 శాతం మంది వీక్షించారని తెలిపారు. ఈ కార్యక్రమానికి 30 వేల వాహనాలు వచ్చాయన్నారు.

 

 

ఎపిలో ఆర్టీసీ ఛార్జీలు పెంపు

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగాయి. పది శాతం మేర ఛార్జీలను పెంచుతూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఛార్జీలు ఇవాళా అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.   

19:56 - October 23, 2015

పశ్చిమగోదావరి : అందంగా ఉండటం ఆ అమ్మాయికి శాపంగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. కన్నవారే కర్కశంగా ప్రవర్తించడంతో బంగారు జీవితం మృగాళ్ల పాలైంది. భర్తతో చిన్న గొడవ జరిగి పుట్టింటికి వెళితే.. వారు గృహహింస కేసు పెట్టి అబ్బాయిను జైలుపాలు చేశారు. అంతటితో ఆగకుండా అమ్మాయిని వ్యభిచారం రొంపిలోకి దింపాలని ప్రయత్నించారు. అందులో భాగంగానే ఒక మృగాడి దుర్మార్గానికి బలై పోయింది. వీడియోలు, ఫోటోలు బయటపెడతానని అతడు బ్లాక్‌మెయిల్‌ చేయడంతో.. పరువు పోతుందని.. ఆత్మహత్య చేసుకుంది. అయితే చనిపోయే ముందు ఆమె సెల్‌ఫోన్‌లో తన బాధను చెప్పుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేశానని.. అయినా న్యాయం జరుగుతుందని నమ్మకం లేదని.. ఆ వీడియోలు బయటపడక ముందే చనిపోతున్నానని అందులో చెప్పింది. ఈఘటన స్థానికంగా కలకలం రేపింది.
మృతురాలి వాగ్మూలం....
'నాచావుకు కారణం.. మా అమ్మ, నాన్న.. గత్తుల రామకృష్ణ...మా తమ్ముడు..నన్ను నగ్నంగా వీడియోలు తీసుకున్నాడు. పొటోలు తీశాడు.. ఇప్పుడు వాటితో మళ్లీ వాడి దగ్గరకు రావాలని నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. నా చావుతోనైనా వాడికి శిక్ష పడుతుందని అనుకుంటున్నాను. నేను చనిపోతున్నాను.. నన్ను క్షమించండి'.. అంటూ సెల్ఫీ రికార్డు చేసి.. కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. 

19:49 - October 23, 2015

ఫ్యాషన్ ప్రపంచం రోజుకో కొత్త పుంతలు తొక్కుతోంది. ట్రెండ్ కి అనుగుణంగా అనేక డిజైన్స్ తో అతివలను ఆకర్షిస్తోంది. ఇప్పుడు విభిన్న రంగులతో, అంతకు మించిన డిజైన్స్ తో లేసులు ఫ్యాషన్ ప్రపంచంలో హల్ చల్ చేస్తున్నాయి. అలాంటి స్పెషల్ లేసులతో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి సొగసు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...


 

19:48 - October 23, 2015

పుట్టబోయే పిల్లల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటం గృహ హింస అవుతుందని ఢిల్లీ న్యాయస్థానం స్పష్టం చేసింది. కుటుంబం పట్ల బాధ్యతలు విస్మరించే పురుషులకు ఈ తీర్పు ఒక హెచ్చరికగా పనిచేయనుంది.
ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక అధ్యయనం
ఆడపిల్లల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నిత్యం ఏదో ఒక చోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక అధ్యయనాన్ని చేపట్టింది.
నేపాల్ పార్లమెంట్ స్పీకర్ గా మాజీ మావోయిస్ట్ పోరాట యోధురాలు 
నేపాల్ పార్లమెంట్ సభాపతిగా మాజీ మావోయిస్ట్ పోరాట యోధురాలు ఎన్నికయ్యింది. పార్లమెంట్ కు తొలి మహిళా స్పీకర్ గా చరిత్ర లో నిలిచి పోనుంది. 
అవార్డులను వెనక్కిచ్చేయాలకున్న రచయితలు
కవులు, కళాకారులపై జరుగుతున్న దాడుల పట్ల అనేక వర్గాలలో నిరసన వ్యక్తం అవుతూనే ఉంది. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ అనేక మంది రచయితలు తమ అవార్డులను వెనక్కి ఇచ్చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించుకున్నారు.

 

19:45 - October 23, 2015

ఆటపాటలతో గడవాల్సిన బాల్యం కొందరు చిన్నారులకు శాపంగా పరిణమిస్తోంది. కుటుంబ సభ్యులు, బంధువులు, అయిన వారే వారిపై దాడులకు తెగబడుతూ బాల్యాన్ని చిద్రం చేస్తున్నారు. అలాంటి స్థితిలో తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తలేమిటి? పిల్లలకు ఎలాంటి స్థైర్యాన్నందించాలో ఇవాళ్టి నిర్భయలో తెలుసుకుందాం. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...


 

19:30 - October 23, 2015

హైదరాబాద్ : కేసీఆర్‌ కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో ఓ అవినీతిపరుడికి మేలు చేసే విధంగా కేసీఆర్‌ వ్యవహరించారని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి అన్నారు. ఈమేరకు హైదరాబాద్ లో రేవంత్ మీడియాతో మాట్లాడారు. ఇఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణం కాంట్రాక్ట్‌కు సంబంధించిన కేసులో సీఎం కేసీఆర్‌ను సీబీఐ ప్రశ్నించిందని అన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం,.. టీఆర్‌ఎస్‌ పార్టీ ఎందుకు గోప్యంగా ఉంచిందని ఆయన అన్నారు. వీటన్నింటిపై కేసీఆర్‌ నిజనిజాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరముందన్నారు.

 

19:26 - October 23, 2015

హైదరాబాద్ : చాటింగ్‌ చేసి.. మీటింగ్‌ అరేంజ్‌ చేసుకుని.. ఆ తర్వాత డేటింగ్‌లో దింపేస్తాడు. అలా 3 వందల మందిని మధు అనే యువకుడు ట్రాప్‌ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. బాధితుల్లో ఒకరు చేసిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన షీటీమ్‌.. నిందితుడి ఆయుధాన్నే ప్రయోగించింది. అదే చాటింగ్‌ను ట్రాప్‌ చేసి.. అతడిని పట్టుకుంది. గతంలో మధు ఎఫ్‌సీఐ అసిస్టెంట్‌ మేనేజర్‌గా పని చేసినట్లు తెలుస్తోంది.

 

19:08 - October 23, 2015

చెన్నై : తెలుగువారికి రెండు రాష్ట్రాలు..రెండు రాజధానులు ఉండటం అదృష్టమని నటుడు కమల్‌హాసన్‌ వ్యాఖ్యానించారు.ఈమేరకు చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి శంకుస్థాపన సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియచేశారు. 

19:05 - October 23, 2015

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర సాయం ఓ నిరంతర ప్రక్రియ అని.. ఇది ఒక ప్యాకేజితోనో, ఒక ప్రకటనతోనో అయిపోదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఇప్పుడే ఏదో అయిపోవాలంటే అది తొందరపాటు అవుతుందని మంత్రి చెప్పారు. దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం, పోలీస్‌ స్టేషన్లలో కేసులు పెట్టడం లాంటివి చేస్తే.. 50 ఏళ్లుగా పరిపాలించినవాళ్లలో ఒక్కరు కూడా బయట ఉండరని మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. హోదా, ప్యాకేజిలపై మోదీ ప్రకటన చేయలేదని ఆందోళనలు చేయడం అర్ధరహితమని మంత్రి మండిపడ్డారు.

 

19:03 - October 23, 2015

కృష్ణా : విజయవాడలో చంద్రబాబు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. రాజధాని కమిటీతో పాటు డిప్యూటీ సీఎంలు కేఈ, చినరాజప్ప, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, పీతల సుజాత, ఎంపీలు గల్లా జయదేవ్‌, కేశినేని నానిలు ఈ సమావేశానికి హాజరయ్యారు. నిన్న శంకుస్థాపన కార్యక్రమం జరిగిన తీరుపైనా, ప్రధాని మోదీ ఏమీ ప్రకటించకపోవడంతో తలెత్తిన పరిస్ధితులపైనా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

 

అద్భుత నగర నిర్మాణానికి శ్రీకారం : చంద్రబాబు

విజయవాడ : ఒక అద్భుత నగర నిర్మాణానికి శ్రీకారం చుట్టామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రైడ్ గా మాట్లాడడానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ఈమేరకు విజయవాడలో అయన మీడియాతో మాట్లాడారు. చిన్న ఇబ్బందులు కల్గించారు అయినా... వాటిని ఎదుర్కొన్నామని తెలిపారు. కులాలు, మతాలకు అతీతంగా పూజలు చేశామని చెప్పారు. పవిత్రమైన మట్టి-నీరు కార్యక్రమాన్ని నిర్వహించామని పేర్కొన్నారు.

 

18:36 - October 23, 2015

ఢిల్లీ : మతోన్మాదులు స్వేచ్ఛను హరిస్తున్నారని.. దాడులను అరికట్టాలంటూ రచయితలంతా రోడ్డెక్కారు. ఢిల్లీలో సాహిత్య అకాడమీ ఎదుట నిరసనలకు దిగారు. అకాడమీ ఇప్పటికైనా స్పందించాలంటూ డిమాండ్‌ చేశారు. బయట ఆందోళన కొనసాగుతుండగానే.. సాహిత్య అకాడమీ సమావేశంలో రచయితలపై దాడులను ఖండిస్తూ తీర్మానం చేశారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని తీర్మానంలో వారు కోరారు. 

18:32 - October 23, 2015

కర్నూలు : జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం గుడేకల్లులో యువకులు చేసిన విన్యాసాలు ఒళ్లు గగుర్పుట్టిస్తున్నాయి. దసరా పండుగ సందర్భంగా ప్రతి యేటా యువకులు సాహస విన్యాసాలు చేయడం ఆనవాయితిగా వస్తోంది. ఒంటికి చువ్వలు గుచ్చుకోవడం.. కత్తులపై వ్యక్తిని పడుకోబెట్టి లాగడం.. గాజుపై పడుకొని బండరాళ్లను పగలగొట్టడం లాంటి విన్యాసాలు చేస్తుంటారు. ఈ విన్యాసాలను యువకులు పోటీ పడి చేస్తుంటారు. వీటిని చూసేందుకు గ్రామస్తులు భారీగా తరలివస్తుంటారు. 

18:00 - October 23, 2015

హైదరాబాద్ : మోడీ ముందు ప్రజల ఆకాంక్షను వ్యక్తం చేయడంలో చంద్రబాబు ఎందుకు విఫలమయ్యారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. కేసుల నుంచి బయటపడేందుకు చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే.. చంద్రబాబు, మోదీ జోడికి రాష్ట్రంలో నూకలు చెల్లినట్లేనని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

17:58 - October 23, 2015

విజయవాడ : ప్రధాని మోడీ ప్రసంగం తనకు నిరాశ కలిగించిందని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ అన్నారు. రాష్ట్రానికి ఎంతో మేలు చేకూరేలా ప్రకటన వస్తుందని ప్రజలంతా ఆశించారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా ఓ ఎమోషనల్‌ ఇష్యూగా మారిందని.. దాని కోసం పోట్లాడుతూ రాష్ట్రానికి రావాల్సిన ఇతర లాభాల గురించి విస్మరించరాదని పేర్కొన్నారు.

 

17:55 - October 23, 2015

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్‌... ఎపి రాజధాని అమరావతి శంకుస్థాపనకు హాజరుకావడవం పట్ల అమరావతిలో ఆంధ్ర ప్రజలు హర్షం వ్యక్తం చేశారని టీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ చెప్పారు.ఈమేరకు కర్నె ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. భవిష్యత్‌లో కూడా పొరుగు రాష్ట్రాలతో తెలంగాణ సఖ్యతగా ఉండాలనేదే తమ విధానమని ఆయన స్పష్టం చేశారు.

17:52 - October 23, 2015

హైదరాబాద్ : ఆరోపణల ఆధారంగా.. గాలివార్తలు ప్రసారం చేసినా.. ప్రశ్నలు సంధించినా.. విలేకరులపై కేసులు పెట్టాల్సి వస్తుందని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి హెచ్చరించారు. చంచల్‌గూడ జైలు ఆవరణలో పదికోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రిజన్స్‌ న్యూ కాంప్లెక్స్‌ను ఆయన ఇవాళ ప్రారంభించారు. ప్రిజన్స్‌ కాంప్లెక్స్‌ నిర్మాణంలో అవకతవకలు జరిగాయని... నాణ్యత ప్రమాణాలు పాటించలేదంటూ వచ్చిన ఆరోపణలపై విలేకరులు నాయినిని ప్రశ్నించారు. దీంతో.. మంత్రి విలేకరులపై విరుచుకు పడ్డారు. గాలివార్తల ఆధారంగా ప్రశ్నిస్తే.. కేసులు పెట్టించాల్సి వస్తుందని హెచ్చరించారు.

 

17:50 - October 23, 2015

గుంటూరు : నవ్యాంధ్ర రాజధాని గ్రామమైన మల్కాపురంలో చెరుకు పంటను దుండగులు దగ్ధం చేశారు. భూసమీకరణకు భూమి ఇవ్వకపోవడం వల్లే తన పంటను దగ్ధం చేశారని.. బాధితుడు చంద్రశేఖర్‌ వాపోతున్నాడు. దాదాపు ఐదు లక్షల రూపాయల నష్టం వాటిల్లింది.

 

ప్రత్యేకహోదాపై ప్రధాని స్పష్టత ఇవ్వకపోవడం నిరాశ కల్గించింది : సరవరం

ఢిల్లీ : ప్రత్యేకహోదాపై ప్రధాని స్పష్టత ఇవ్వకపోవడం ప్రజలకు నిరాశ కల్గించిందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. వాగ్ధానాలే తప్ప ఏపీకి ఉపయోగపడే అంశం మోడీ ఉపన్యాసంలో ఒక్కటీ లేదని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ లో కేంద్రం ఇస్తానన్న ప్రత్యేకహోదాను ప్రకటించాలని డిమాండ్ చేశారు.

 

చెరుకు తోట దహనంపై విచారణ జరిపించాలి : బాబూరావు

గుంటూరు : చెరుకు తోట దహనంపై విచారణ జరిపించాలని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాబూరావు డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతమైన తుళ్లూరు మండలం మల్కాపురంలో దహనమైన 5 ఎకరాల చెరుకు తొటను చెరుకు తోటను ఆయన సందర్శించారు. రైతులను బెదిరించేందుకే దుశ్చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

 

మల్కాపురంలో దారుణం..

గుంటూరు : రాజధాని ప్రాంతమైన తుళ్లూరు మండలం మల్కాపురంలో దారుణం జరిగింది. 5 ఎకరాల చెరుకు తొట దహనం చేశారు. రాజధానికి తన భూమిని ఇవ్వనందుకే చెరుకును తగలబెట్టారని రైతు చంద్రశేఖర్ ఆరోపిస్తున్నారు.

16:48 - October 23, 2015

మహబూబ్ నగర్ : హైదరాబాద్ ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లో రహదారులు రక్తమోడాయి. వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 6 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.
మహబూబ్‌నగర్‌ జిల్లాలో నలుగురి మృతి
మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా వాహనం టైరు పేలి బోల్తాపడిన ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతిచెందారు. హైదరాబాద్‌ నుంచి ఇన్నోవాలో కర్నూలు వెళ్తుండగా..పెబ్బేరు మండలం గుర్రంగడ్డ స్టేజి దగ్గరకు రాగానే ఇన్నోవా టైరు పేలిపోయి వాహనం పక్కపొలాల్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురిలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందాగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు...కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రకాశం జిల్లాలో ఇద్దరు మృతి
ప్రకాశం జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఇన్నోవా కారు ఢీకొట్టడంతో...ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. గిద్దలూరు నుంచి ఇన్నోవా కారులో భద్రాచలం వైపు వెళ్తుండగా..రోడ్డుపై ఆగున్న ట్రాక్టర్‌ను కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ట్రాక్టర్‌ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక ధర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు...ట్రాక్టర్‌ డ్రైవర్‌ కోసం గాలిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో ఇద్దరికి గాయాలు
నిజామాబాద్ జిల్లాలో స్కోడా కారు బీభత్సం సృష్టించింది. ఉదయం ఏపి 25 ఏబి 0023 నంబరు గల స్కొడా కారు అతివేగంగా వచ్చి ఓ పండ్ల దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నాగేంద్ర సాయి, ప్రసాద్ అనే ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడున్న స్థానికులు గమనించి చికిత్స కోసం వారిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేయటంతోనే ఈ సంఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అనంతపురంలో తప్పిన పెను ప్రమాదం...
అనంతపురం జిల్లాలో ఆర్టీసి డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెనుప్రమాదం తప్పింది. గుంతకల్ నుంచి ఉరవకొండకు వెళ్తుండగా..గుళ్యపాలెం వద్దకు రాగానే ఆర్టీసి బస్సులో స్టీరింగ్ ఊడిపోయింది. ఇది గమనించిన బస్సు డ్రైవర్‌ వెంటనే బస్సును చాకచక్యంగా పక్కకు ఆపాడు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. డ్రైవర్‌ చాకచక్కంగా వ్యవహరించడం వల్లే పెనుప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.

 

 

16:38 - October 23, 2015

విజయవాడ : అమరావతి శంకుస్థాపనకు హాజరుకాని ప్రతిపక్ష నేత జగన్‌కు ప్రత్యేక ప్యాకేజి గురించి మాట్లాడే అర్హత లేదని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శంకుస్థాపనకు హాజరై ప్రధాని మోడీని ప్యాకేజీ గురించి ఎందుకు అడగలేదని జగన్‌ను ప్రశ్నించారు. చంద్రబాబు నాయకత్వంలో అమరావతి శంకుస్థాపన కార్యక్రమం విజయవంతమయిందని ఆయన అన్నారు. 

16:35 - October 23, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇవ్వాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.ఈమేరకు ఆయన మీడియాదో మాట్లాడారు. ప్రధాని మోడీ ప్రసంగం నిరాశపరించిందని అన్నారు. విభజన చట్టం హామీలను కేంద్రం పట్టించుకోవడంలేదని ఆరోపించారు.

 

16:30 - October 23, 2015

హైదరాబాద్ : కులమతాలకు అతీతంగా అలయ్ బలయ్ జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అన్నారు. హైదరాబాద్ లోని జలవిహార్ లో నిర్వహించిన ఆలయ్ బలయ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ప్రతి ఏడాది ఇంత మంచి కార్యక్రమం జరుపుతున్నారంటూ కేంద్రమంత్రి దత్తాత్రేయను ప్రశంసించారు. దేశంలో కూడా ఇలాంటి ఐకమత్యం ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు. ఇలాంటి కార్యక్రమం జరపడం అభినందనీయమన్నారు. అనంతరం కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ రెండు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో సాగాలని అకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కలుసుకోవడం తమకు ఎంతో సంతోషాన్నించిందని చెప్పుకొచ్చారు. అలయ్ బలయ్ చరిత్రను వివరించారు.

 

 

 

ఎపికి రూ.663 కోట్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయం...

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ కు రూ.663 కోట్లు ఇవ్వాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. అమృత్ సర్ ప్రాజెక్టుల కింద రూ.663 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. నీటి సరఫరాకు రూ.646 కోట్లు, పార్కుల అభివృద్ధికి రూ.44 కోట్లు, ఎపిలోని 26 పట్టణాలకు అమృత్ ప్రాజెక్టుల కింద నిధులు ఇవ్వనుంది. 

కుషాయిగూడలో దారుణం..

హైదరాబాద్: నగరంలోని కుషాయిగూడలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తాగిన మత్తులో తల్లిదండ్రులపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తండ్రి మృతి చెందగా తల్లి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

దసరా ఉత్సవాల్లో విషాదం..

పట్నా:  దసరా ఉత్సవాల్లో విషాదం చోటు చేసుకుంది. బిహార్ లోని బర్సా జిల్లాలో విజయద నిమజ్జనోత్సవంలో అమ్మవారి విగ్రహాలను నిమజ్జనానికోసం ట్రాక్టర్  ట్రాలీ పై తరలిస్తుండగా  పైనున్న హైటెన్షన్  వైర్లు తగిలి షాట్ సర్క్యూట్  అయ్యింది. దీంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో  ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో ఆరుగురు  తీవ్ర గాయాలపాలయ్యారు. 

13:48 - October 23, 2015

విజయవాడ : నగరంలో యూత్‌ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ప్రత్యేక హోదాను ప్రధాని మోదీ ప్రస్తావించలేదంటూ ఏలూరు రోడ్డుపై బైఠాయించారు. మోదీ, చంద్రబాబు దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని మండి పడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు రాజీలేకుండా పోరాడతామని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. 
టీడీపీ తప్పుడు ప్రచారం.. : సుంకర పద్మశ్రీ
అమరావతి నిర్మాణం పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేయడం అన్యాయమని ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ తెలిపారు.  ప్రధాని వస్తారని ఎన్నో వరాలిస్తారని టీడీపీ తప్పుడు ప్రచారం చేసిందని గన్నవరంలో  మండిపడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మోదీ, చంద్రబాబు దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.

13:44 - October 23, 2015

వరంగల్ : రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. ప్రస్తుతం అందరి దృష్టీ అక్కడ కేంద్రీకరించబడి ఉంది. ఒకరికి ప్రతిష్టాత్మకం మరొకరికి ఎలాగైనా నిలబెట్టుకోవాలనే తపన మొత్తంగా వరంగల్ బైపోల్స్ వేడి పుట్టిస్తోంది. 
షెడ్యూల్ విడుదల..
వరంగల్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల అయింది. దీనికి సంబంధించి ఈ నెల 28న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ దాఖలుకు చివరి తేదీ నవంబర్ 4 కాగా, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీని నవంబర్ 7గా నిర్ణయించారు. నవంబర్ 5న అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించనున్నారు. నవంబర్ 21న పోలింగ్ నిర్వహించి 24న కౌంటింగ్‌ను నిర్వహించనున్నారు. 
అభ్యర్థుల వేటలో.. 
టీఆర్‌ఎస్‌ ఎంపీ కడియం శ్రీహరి వరంగల్‌ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎంపీ స్థానానికి రాజీనామా చేసిన కడియం శ్రీహరి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కడియంకు ఉప ముఖ్యమంత్రి హోదా ఇచ్చి, విద్యాశాఖ మంత్రి పదవిని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కట్టబెట్టారు. కడియం రాజీనామాతో ఖాళీ అయిన ఎంపీ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేయడంతో..రాష్ట్రంలోని అన్ని పార్టీలు అభ్యర్థి వేటలో మునిగిపోయాయి. వరంగల్ ఎంపీ స్థానం ఎస్సీకి రిజర్వ్ కావడంతో..ఇప్పటికే ఆ స్థానానికి వామపక్షాలు ఎస్సీ అభ్యర్థిని ప్రకటించాయి. ప్రొఫెసర్‌ గాలివినోద్‌కుమార్‌ను తమ అభ్యర్థిగా వామపక్షాలు ప్రకటించాయి. అయితే ఇప్పటివరకు ఒక్క వామపక్షాలు తప్ప మిగతాపార్టీలేవీ అభ్యర్థిని ప్రకటించలేదు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ కూడా అభ్యర్థి ఎవరనేదానిపై తీవ్ర కసరత్తు చేస్తోంది. అలాగే టిడిపి, కాంగ్రెస్‌, బిజేపి కూడా అభ్యర్థుల వేటలో మునిగిపోయాయి. 
టీఆర్‌ఎస్‌ కసరత్తు..
వరంగల్‌ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకొని..తమ ఖాతాలో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేసుకునేందుకు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రయత్నిస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్‌ అభ్యర్థి ఎవర్ని నిలపెట్టాలన్నదానిపై కసరత్తు చేస్తున్నారు. అయితే వరంగల్ ఎంపీ స్థానాన్ని ఏ పార్టీ దక్కించుకుంటుందో నవంబర్‌ 24న జరిగే ఓట్ల లెక్కింపులో తేలనుంది.

13:22 - October 23, 2015

ప్రకాశం : జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగిఉన్న ట్రాక్టర్‌ను ఇన్నోవా కారు ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. గిద్దలూరు నుంచి ఇన్నోవా కారులో భద్రాచలం వైపు వెళ్తుండగా రోడ్డుపై ఆగి ఉన్న ట్రాక్టర్‌ను కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ట్రాక్టర్‌ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక ధర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు ట్రాక్టర్‌ డ్రైవర్‌ కోసం గాలిస్తున్నారు. 

13:17 - October 23, 2015

తిరుమల : ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోరుతూ తిరుపతిలో సీపీఎం కార్యకర్తలు వినూత్య కార్యక్రమాన్ని చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం వద్ద గుండుగీయించుకొని నిరనస తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పై కూడా విరుచుకుపడ్డారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, ముఖ్యమంత్రి, ప్రధాని ఎలాంటి హామీ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. అంతకముందు ర్యాలీగా వెళ్లి ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. 

ప్రత్యేక హోదా కోసం సీపీఎం వినూత్న నిరసన..

తిరుమల : ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ తిరుపతిలోను సీపీఎం కార్యకర్తలు వినూత్య కార్యక్రమాన్ని చేపట్టారు. గుండుగీయించుకొని నిరనస తెలిపారు. అంతకముందే ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. 

13:03 - October 23, 2015

విజయవాడ : కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం అన్ని వామపక్ష పార్టీలను కలుపుకొని ఉద్యమిస్తామన్నారు. అమరావతి శంకుస్థాపనలో ప్రధాని మోదీ నీరు, మట్టి చల్లి వెళ్లిపోయారని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం బలవంతంగా రైతులనుంచి భూములు లాక్కుంటోందని మండిపడ్డారు.  

12:44 - October 23, 2015

హైదరాబాద్ : రాష్ట్రంలోని ఇళ్లు లేని పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇవ్వాని తెలంగాణ సర్కార్‌ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఐదేళ్లలో రెండు లక్షల మంది పేదలకు ఇళ్లు ఇవ్వాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. హైదరాబాద్‌ ఐడీహెచ్‌ కాలనీలో పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద 400 మందికి మెరుగైన ఇళ్లను నిర్మించారు. ఇదేవిధంగా రాష్ట్రంలో ఈ ఏడాది చివరికల్లా 10 వేల ఇళ్లను నిర్మించాలని సర్కార్‌ నిర్ణయించింది. 
ప్రతిష్ఠాత్మకంగా..
ఇక ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పథకానికి సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఇళ్లకు భూమి పూజ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల కార్యక్రమాలకు శంకుస్థాపనలు జరిగాయని కేసీఆర్‌ తెలిపారు. అనంతరం మెదక్‌ జిల్లాలో తాను దత్తత తీసుకున్న ఎర్రవల్లి గ్రామంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు కేసీఆర్‌ భూమిపూజ చేశారు. 
నియోజకవర్గాల్లో శంకుస్థాపనలు..
అదేవిధంగా దసరా పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్రంలోని ఆయా నియోజకవర్గాల్లో డబుల్‌బెడ్‌రూం ఇళ్లకు శంకుస్థాపన చేశారు. ఎల్బీనగర్‌ నియోజకవర్గ పరిధిలో ఎరుకల నాంచారమ్మ బస్తీలో మంత్రి కేటీఆర్‌ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లకు శంకుస్థాపన చేశారు. కూకట్‌పల్లిలోని చిత్తారమ్మ బస్తీలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి మంత్రి మహేందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. 
అనవసర రాద్ధాంతం..
నిజామాబాద్‌ జిల్లాలోని నాగారం, బోధన్‌లో ఎంపీ కవిత, ఆర్మూర్‌లోని పెర్కిడ్‌, అంకాపూర్‌, బాల్కొండ, బాన్సువాడలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపట్టిన డబుల్‌ బెడ్‌ఇళ్ల నిర్మాణంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తోందని కవిత అన్నారు. 
అర్హులైన పేదలకు ఇళ్లు..
కరీంనగర్‌లోని సప్తగిరి కాలనీలో డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాలకు ఎంపీ వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ భూమిపూజ చేశారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలోనూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇళ్లు నిర్మించడమే తెలంగాణ సర్కార్‌ లక్ష్యమని ఆయన అన్నారు. ఏది ఏమైనా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజలు చేయడంతో పేదల్లో ఆశలు నెలకొన్నాయి. త్వరలోనే తమకు ఒక ఇల్లు దక్కుతుందనే ఆశలో పేద ప్రజలున్నారు. 

12:36 - October 23, 2015

టీమిండియా యాంగ్రీ యంగ్‌ గన్‌ ఢిల్లీ డైనమైట్‌ విరాట్‌ కొహ్లీ తిరిగి ఫామ్‌లోకొచ్చాడు. రాజ్‌కోట్‌ వన్డేలో హాఫ్‌ సెంచరీతో ఫామ్‌లోకొచ్చిన విరాట్‌ చెన్నై వన్డేలో మాత్రం అంచనాలకు తగ్గట్టుగానే అదరగొట్టాడు. మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ రికార్డ్‌ బద్దలు కొట్టిన విరాట్‌ సచిన్‌ రికార్డ్‌పై కన్నేశాడు.  
ఆకాశమే హద్దుగా..
రాజ్‌కోట్‌ వన్డేలో హాఫ్‌ సెంచరీతో ఫామ్‌లోకొచ్చిన విరాట్‌ చెన్నై వన్డేలో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అంచనాలకు ఏ మాత్రం తగ్గంకుండా రాణించిన విరాట్‌ విమర్శలకు సెంచరీతోనే సమాధానమిచ్చాడు. ఈ మ్యాచ్‌  ఆరంభంలో ఆచితూచి ఆడిన డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ హాఫ్‌ సెంచరీ పూర్తయ్యాక స్పీడ్‌ పెంచాడు. ట్రేడ్‌ మార్క్‌ షాట్లతో అలరించిన విరాట్‌ క్రీజ్‌లో పాతుకుపోయాడు. పర్‌ఫెక్ట్‌ టైమింగ్‌తో షాట్లు కొట్టి స్కోర్‌ బోర్డ్‌ను పరుగులు పెట్టించిన కొహ్లీ రహానే,రైనాలతో సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టు భారీ స్కోర్‌కు పునాది వేశాడు. ఫాంగిసో వేసిన 38వ ఓవర్‌ రెండో బంతికి లాంగ్‌ ఆన్‌ మీదుగా సిక్స్‌ కొట్టి తనదైన స్టైల్‌లోనే సెంచరీ పూర్తి చేశాడు.
రికార్డులు బద్దలు..
112 బంతుల్లో సెంచరీ నమోదు చేసిన విరాట్‌ ఆ తర్వాత కూడా అంతే దూకుడుగా ఆడాడు. 140 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 138 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇప్పటివరకూ  165 వన్డేలు ఆడిన విరాట్‌కు ఇది కెరీర్‌లో 23వ సెంచరీ కావడం విశేషం.ఈ సెంచరీతో విరాట్‌ పలు రికార్డ్‌లు బద్దలు కొట్టాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన బ్యాట్స్‌మెన్‌ లిస్ట్‌లో 5వ స్థానంలో నిలిచిన విరాట్‌ మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌ లిస్ట్‌లో ఇప్పటివరకూ 22 సెంచరీలతో ఇప్పటివరకూ గంగూలీతో కలిసి రెండో స్థానాన్ని పంచుకున్న కొహ్లీ దాదాను వెనక్కునెట్టాడు. ఈ లిస్ట్‌లో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండుల్కర్‌ 49 సెంచరీలతో టాప్‌ ప్లేస్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అంతే కాదు వన్డే ఫార్మాట్‌లో టెస్ట్‌ హోదా కలిగిన అన్ని జట్లపై సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గానూ కొహ్లీ రికార్డులకెక్కాడు.సచిన్‌ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాట్స్‌మెన్‌గా కొహ్లీ అరుదైన ఘనతను సొంతంచేసుకున్నాడు. 26 ఏళ్ల కొహ్లీ భవిష్యత్‌లోనూ  వన్డేల్లో  ఇదే జోరు కొనసాగిస్తే...మాస్టర్‌ సచిన్‌ 49 సెంచరీల రికార్డ్‌ను అధిగమించినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. 

12:24 - October 23, 2015

నల్గొండ : స్టైలిష్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ దసరా వేడుకలను అత్తగారింటిలో చేసుకున్నారు. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం చింతపల్లి గ్రామానికి వచ్చిన అల్లుఅర్జున్‌ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అభిమానులు డైలాగ్స్ చెప్పాలని కోరగా రుద్రమదేవిలోని గోనగన్నారెడ్డి డైలాగ్స్ చెప్పి అల్లు అర్జున్ అలరించారు. ఈ సందర్భంగా స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. అభిమానులు అల్లుఅర్జున్ కు కరాచలనం ఇవ్వడానికి ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఒకనొక సందర్భంలో సెక్యురిటీ సిబ్బంధి ఓ అభిమానిని తోసేయడంతో అభిమానులపై చేయి వేస్తే బాగుండదంటూ అల్లూ అర్జున్ సెక్యురిటీకి చెప్పడంతో అభిమానులు ఈలలతో ఎగిరి గంతేశారు. 

అలయ్ భలయ్ ప్రారంభం..

హైదరాబాద్ : జలవిహార్ లో అలయ్ భలయ్ ప్రారంభమైంది. దీనికి ముఖ్య అథితులుగా గవర్నర్ నరసింహన్ దంపతులు, మరియు సీఎం కేసీఆర్ దంపతులు విచ్చేస్తున్నారు. 

జమ్మూలో ఉద్రిక్తత..

జమ్మూ: జమ్మూకాశ్మీర్ లో శుక్రవారం ఉద్రిక్తత  నెలకొంది. తమ మత గ్రంథాన్ని అవమానించారంటూ ఓ వర్గం నిరసన తెలిపేందుకు వీదుల్లోకి వచ్చింది. నిరసన వ్యక్తం చేస్తూ వీదుల్లో టైర్లను కాల్చి రోడ్ల మధ్యలో వేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం వాటిల్లకుండా చూస్తున్నారు. 

కారు ప్రమాదంలో నలుగురు మృతి..

మహబూబ్‌నగర్: జిల్లాలోని పెబ్బేరు మండలం రంగాపూర్ హైవేపై ఘోర ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న ఇన్నోవా కారు బోల్తా పడటంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

 

10:50 - October 23, 2015

సోషల్ సైట్లు డార్లింగ్.. డార్లింగ్ అంటూ కలవరిస్తున్నాయ్.. 'డార్లింగ్' పేరుతో మారుమ్రోగుతున్నాయ్.. ఎందుకంటే నేడు డార్లింగ్ ప్రభాస్ బర్త్ డే కావడమే దీనికి కారణం. టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. బాహుబలి సక్సెస్ తర్వాత వచ్చిన మొదటి బర్త్ డే కావడంతో డార్లింగ్ ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. అయితే ఇప్పటికే ఫేస్ బుక్ లో #Prabhas యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చి ఊపేస్తోంది. అంతే కాకుండా టాలీవుడ్ సెటబ్రిటీలు సైతం హ్యాపీ బర్త్ డే డార్లింగ్ అంటూ సోషల్ సైట్లలో నింపేస్తున్నారు. రాజమౌళి, అఖిల్ అక్కినేని, సమంత, తమన్నా, చార్మీ, సుమంత్, శర్వానంద్, కొరటాల శివ, సుజిత్ మొదలైన వాళ్లు ట్విటర్ ద్వారా తమ విషెస్ ను తెలియజేశారు. కాగానే నేడు ప్రభాస్ తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకోనున్నారు. త్వరలో రాబోతున్న బాహుబలి-2 కూడా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటూ 'హ్యాపీ బర్త్ డే' డార్లింగ్. 

పాక్ లో భూకంపం..

కరాచి : పాకిస్తాన్ లో భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై ఈ భూకంప తీవ్రత  5.3గా నమోదయ్యింది. పంజాబ్ ప్రావిన్స్ పరిదిలోని డాజల్ పట్టాణానికి ఉత్తరాన 11కిమీ దూరంలో భూకంప కేంద్ర ఉంది. కాగా భూకంపం సంభవించడంతో ప్రజలు భయంతో వీదుల్లోకి పరుగులంకించుకున్నారు. 

10:18 - October 23, 2015

మహబూబ్ నగర్ : జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆసరాగా నిలిచింది ఫార్చూన్ ఇన్‌ఫ్రా బటర్ ఫ్లై సిటీ వెంచర్. పాలమూరు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతుకుటుంబానికి లక్షరూపాయలను సాయంగా అందించింది. ఆ సంస్థ ఎండీ శేషగిరిరావు అన్నదాతల కుటుంబాలకు బట్టలు పెట్టి, స్వీట్లు ఇచ్చారు. ఫార్చూన్ ఇన్‌ఫ్రా సభ్యులు 12 రైతు కుటుంబాలకు ధైర్యం చెప్పారు. వారికి అండగా ఉంటామని ఈ సందర్భంగా శేషగిరిరావు పేర్కొన్నారు. 

09:44 - October 23, 2015

తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. దసరా సెలవులు రావడంతో... శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. దాదాపు 31 కంపార్ట్‌మెంటులు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుండగా...కాలినడకదారి భక్తులకు 6 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. ఈ రద్దీ మరింత పెరుగుతుందని టిటిడి అధికారులు తెలిపారు. 

బైక్ ను ఢీకొట్టిన వోల్వో.. ఇద్దరు మృతి..

కృష్ణా: జిల్లాలోని నిడమనూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా ప్రయాణిస్తున్న వోల్వో బస్సు ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

09:40 - October 23, 2015

పశ్చిమగోదావరి : జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం హన్‌మాన్‌గూడెంలో దారుణం చోటు చేసుకుంది. రాంబాబు సుమలత దంపతులు తమ ఇద్దరు కూతుళ్లతో జీవనం సాగిస్తున్నారు. కాగా అదే గ్రామానికిచెందిన వడ్లపూడి బాలకృష్ణ సుమలతపై కన్నేశాడు.. ఫుల్లుగా మద్యం సేవించి రాంబాబు ఇంట్లోకి చొరబడ్డాడు. అడ్డొచ్చిన రాంబాబు తలపై రాడ్డుతోమోది సుమలతను బలాత్కారం చేసేందుకు ప్రయత్నించాడు. అలాగే అడ్డొచ్చిన ఇద్దరు కూతుళ్లతో బాలకృష్ణ అసభ్యంగా ప్రవర్తించాడు. వాళ్లు కేకలు వేయడంతో ఆ ఇంటికి నిప్పంటించి అక్కడినుంచి పారిపోయాడు. ఈ ఘటనలో ముగ్గురు కుటుంబసభ్యులు గాయపడ్డారు. వీరికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. రాంబాబు, సుమలత పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుని కోసం గాలిస్తున్నారు. 

తిరుమలలో భక్తుల రద్దీ..

తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. దసరా సెలవులు రావడంతో...శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. దాదాపు 31 కంపార్ట్‌మెంటులు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుండగా...కాలినడకదారి భక్తులకు 6 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. 

09:30 - October 23, 2015

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి మట్టి-నీరు కోరుకోవడం లేదని.. భరోసా-సహకారం కోరుతున్నారని 'ది హన్స్ ఇండియా' ఎడిటర్ ఫ్రొ. కె నాగేశ్వర్ తెలిపారు. శుక్రవారం 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో నాగేశ్వర్ పాల్గొని మాట్లాడారు. 'తొందరపాటులో.. తప్పుల తడకతో ఆంధ్రప్రదేశ్ ను విభజించారని మాట్లాడిన మోడీ ఆ రోజు ఈ విభజనకు ఎందుకు సహకరించారు. అయినప్పటికీ మోడీ ఇప్పుడు అధికారంలో ఉన్నాడు. తప్పుల తడకగా ఉన్న విభజన చట్టాన్ని మార్చొచ్చు కదా. అడగకుండా బిహార్ కు 1.5లక్షల కోట్లు ఇచ్చిన ప్రధాని ఆంధ్రప్రదేశ్ అడిగినప్పటికీ ఎందుకు ఇవ్వట్లేలేదు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ ప్రధానిని ఒప్పించిన వెంకయ్య, మోడీని ఎందుకు ఒప్పించడం లేదు. ఏపీ రాజధాని నిర్మాణానికి సహకరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ భారత ప్రధాని ఎందుకు ఇవ్వలేదు.' అంటూ ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపన, అందులో వక్తల ప్రసంగాలు వాటి వెనుక ఉన్న రాజకీయ కోణాల్ని నాగేశ్వర్ విశ్లేషణాత్మకంగా సామాన్యునికి సైతం సలువుగా అర్థమయ్యేట్లు వివరించారు. పూర్తి విశ్లేషణ కోసం వీడియోలో చూడండి. 

08:14 - October 23, 2015

ఆంధ్రప్రదేశ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి మోడీ ప్రసంగంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. శంకుస్థాపనకు వచ్చిన మోడీ ప్రత్యేకహోదా గానీ, ప్యాకేజీ కానీ ఇస్తాడని అంతా భావించారు. కానీ వీటి గురించి ప్రధాని కనీసం ప్రస్తావించకపోవడంపై  విమర్శలు వినిపించాయి. ఇదే అంశంపై నేటి న్యూస్ మార్నింగ్ లో చర్చ నిర్వహించడం జరిగింది.  ఈ డిబేట్ లో టీడీపీ ప్రతినిధి విజయ్ కుమార్, ఎంఎల్సీ లక్ష్మణ్ రావు, విశ్లేషకులు నడింపల్లి సీతారాములు, వైసీపీ ప్రతినిధి తులసీరెడ్డి పాల్గొన్నారు. వీరి మధ్య రసవత్తరమైన చర్చ జరిగింది. చర్చ కోసం వీడియో చూడండి..

30 మంది తలలు పగిలాయి..

కర్నూలు : బన్నీ ఉత్సవంలో భీభత్స వాతావరణం నెలకొంది. జిల్లాలోని హోళగుంద మండలం దేవరగట్టులో బన్నీ ఉత్సవంలో ఘర్షణ జరిగింది. ఉత్సవంలో భక్తులు కర్రలతో కొట్టుకున్నారు. ఈ కొట్లాటలో 30 మంది భక్తుల తలలు పగిలాయి. గాయపడిన భక్తులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు, సామాజిక కార్యకర్తలు ముందునుంచి ఈ అంశంపై అవగాహన కల్పించడానికి ప్రత్నించినా ఫలితం లేకపోయింది. కాగా ఘర్షణ జరుగుతున్న సమయంలో పోలీసులు మాయవ్వడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. 

ప్రకాశంలో రోడ్డు ప్రమాదం..

ప్రకాశం : జిల్లా కొమరోలు మండలం దద్దవాడ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురెరుగా వస్తున్న కారు, ట్రాక్టర్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

 

07:34 - October 23, 2015

అమరావతి : అమరావతి శంకుస్థాపనకు జనసేన అధినేత, సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డుమ్మా కొట్టారు. పైకి షూటింగ్ లో బిజీ అని చెబుతున్నప్పటికీ లోలోపల అసంతృప్తి సెగలతోనే హాజరు కాలేదనే వార్తలు షికారు చేస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును స్వయంగా ఇంటికి వెళ్లి ఆహ్వానించిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. పవన్ కళ్యాణ్‌ను మాత్రం స్వయంగా  ఆహ్వానించలేదు. ఈ విషయాన్ని పవన్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 
మంత్రులు స్వయంగా పిలిచినా..
శంకుస్థాపన మహోత్సవానికి   ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్సీ టీడీ జనార్దన్‌లు సర్ధార్ గబ్బర్ సింగ్ షూటింగ్ స్పాట్ కు వచ్చి మరీ ఆహ్వానించారు. ఆహ్వాన పత్రిక అందుకున్న వెంటనే మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను శంకుస్థాపనకు వస్తానో? లేదో అని అప్పుడే అనుమానంగానే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.  కానీ సీఎం చంద్రబాబు పవన్‌ కు ఫోన్‌ చేసి మరీ అమరావతికి రమ్మన్నారు. 
బాబు స్వయంగా పిలువలేదనేనా..?
అయితే అమరావతి శంకుస్థాపనకు చంద్రబాబు స్వయంగా పిలవకపోవడంపై పవన్ అభిమానులు, జనసేన మండిపడుతోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ నిమిత్తం గుజరాత్ రాష్ట్రంలో ఉన్నారు. పొరుగు రాష్ట్రం సీఎం కేసీఆర్‌ బిజీ షెడ్యూల్‌లోనూ వీలు చూసుకొని మరీ హాజరైన సందర్భంలో పవన్‌ హాజరు కాలేకపోవడం నిజంగా సాధ్యపడలేదా అనే అంశం గుసగుసలాడుతోంది.  
కోల్డ్ వార్..
సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టిడిపి - బిజెపి కూటమి తరఫున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చాక.. పవన్ పవన్ కళ్యాణ్ కూడా తమ గెలుపుకు కారణమని పలువురు టిడిపి నేతలు ఆయనను ప్రశంసించారు. అయితే రాజధాని భూముల విషయంలోనూ పవన్‌కు, టీడీపీకి మధ్య కోల్డ్‌ వార్‌ నడిచింది. రాజధాని రైతుల పక్షాన పోరాటం కూడా చేస్తానంటూ పవన్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు పైన పవన్ కళ్యాణ్ అలకవహించారా?  లేదా రాజధాని భూముల స్వాధీనం విషయంలో అసంతృప్తితో ఉన్నారా అనే చర్చ కూడా సాగుతోంది.

07:29 - October 23, 2015

అమరావతి : ప్రధాని మోదీ ప్రసంగంపై ఐదు కోట్ల ఆంధ్రులు భగ్గుమంటున్నారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తాడని ఎంతో ఆశతో ఎదురుచూస్తే.. తమ నోట్లో ఢిల్లీమట్టి కొట్టిపోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు విపక్షాలు సైతం మోదీ ప్రసంగంపై మండిపడుతున్నాయి. ఇప్పటికైనా ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించకపోతే...పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. 
విపక్షాలు ఆగ్రహం..
విపక్షాలు సైతం మోదీ ప్రసంగంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏపీ రాష్ట్రానికి మట్టి, నీళ్లతో ఏమీ పనిలేదని..రాష్ట్రానికి కావాల్సింది నిధులేనని సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు అన్నారు. తెలుగుప్రజలకు నరేంద్ర మోదీ కేవలం మట్టి. నీళ్లు తెచ్చారని అంతకు మించి ఏమీ తేలేదని..ఆంధ్రా మేథావుల ఫోరం అధ్యక్షులు చలసాని అన్నారు. 
టీడీపీ నేతలు సైతం..
మోదీ ప్రసంగంపై అటు టిడిపి నేతలు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తారని ఆశతో ఎదురుచూశామని...కానీ మోదీ ఆ మాట ఎత్తకపోవడం విచారకరమని గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రుల నోట్లో మట్టికొట్టిపోయారని మాలమహానాడు అధ్యక్షుడు కారెంశివాజీ మండిపడ్డారు. 
రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు..
ప్రధాని మోదీ ప్రసంగాన్ని నిరసిస్తూ.. రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు వామపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఏపీపై మోదీ యమునా నది నీళ్లు చల్లిపోయారని..సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడుతున్నారు. 
జగన్ ఫైర్..
మోదీ రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని జగన్‌ విమర్శించారు. ప్రధాని మోదీ ప్రసంగంపై వైసీపీ అధినేత మీడియాకు లేఖ విడుదల చేశారు. పార్లమెంట్‌ సాక్షిగా ప్రత్యేకహోదాపై ఇచ్చిన మాటను మర్చిపోయి.. మట్టి, నీరు తెచ్చి సరిపెట్టుకున్నారని జగన్‌ మండిపడ్డారు. తన కేసుల నుంచి బయటపడేందుకు ప్రత్యేక హోదాను చంద్రబాబు అమ్మేశారని జగన్ ఆరోపించారు. ఐదు కోట్ల ప్రజలు, నిరుద్యోగులు, విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాపై నోరు విప్పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలన్నారు.
ఆగ్రహ జ్వాలలు..
మొత్తానికి ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించకపోవండపై ఏపీలో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. మోదీ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ..శుక్రవారం రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికైనా మోదీ బీహార్‌కు ప్రకటించినట్లుగా ఏపీకి లక్షకోట్ల ప్యాకేజీని ప్రకటించాలని...లేకపోతే..ఆందోళనల్ని ఉదృతం చేస్తామని విపక్షాలు హెచ్చరిస్తున్నాయి. 

07:20 - October 23, 2015

అమరావతి : రాజుగారు వరాలజల్లు కురిపిస్తారని ప్రజలంతా ఎంతో ఆశపడ్డారు. లక్షకోట్ల వరాల మూట ఇస్తాడని లక్షకళ్లతో ఎదురుచూశారు. కానీ ఆ రాజుగారు మాత్రం లక్షకోట్లు కాదుకదా... లక్షరూపాయలను కూడా ప్రకటించలేదు. లక్షకోట్లకు బదులు..యమునా నది జలాన్ని,.పార్లమెంట్‌ మట్టిని కుమ్మరించారు. ఇదీ..మన ప్రధాని నరేంద్రమోడి ఏపీ కొత్తరాజధాని అమరావతికి ఇచ్చిన ఓ గొప్పవరం. లక్షకోట్ల ప్యాకేజీ ప్రకటిస్తాడని ఎదురుచూసిన ఐదు కోట్లమంది ప్రజల నోట్లో చివరకు మట్టికొట్టారు. ప్రధాని మోడి పేలవమైన ప్రసంగంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదీ మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడి మాట్లాడిన తీరు. ఏపీకి లక్షకోట్లు ప్రకటిస్తాడని ఐదు కోట్ల ఆంధ్రులు ఎంతో ఆశతో ఎదురుచూశారు. కానీ చివరకు ఊరించి...ఊరించి ఊసురుమనిపించారు. 
గుప్పెడు మట్టి.. యమునా నీరు..
పార్లమెంటు ఆవరణ నుంచి గుప్పెడు మట్టిని, ఢిల్లీలో ప్రవహించే యమునా నది నుంచి చెంబెడు నీటిని తీసుకొచ్చానని ప్రసంగించారే తప్ప...తన ప్రసంగంలో ఎక్కడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని మాత్రం మోడి ప్రస్తావించలేదు. రాష్ట్ర విభజనను తొందరపాటుతో చేశారని వ్యాఖ్యానించిన మోడి..రెండు రాష్ట్రాలు కలిసి పరస్పరం సహకరించుకోవాలని నాలుగు మంచి మాటలు చెప్పారే గానీ, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఏకైక ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదా అంశం గురించి ఒక్కటంటే ఒక్క మాట కూడా చెప్పలేదు. మానవ వనరుల అభివృద్ధి కోసం ఇక్కడ పలు జాతీయస్థాయి విద్యా సంస్థలను ఏర్పాటు చేశామన్నారుగానీ, ఇక్కడి పారిశ్రామికాభివృద్ధికి ప్రాణవాయువు లాంటి ప్రత్యేక హోదా విషయం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కనీసం ప్యాకేజీ కూడా ప్రకటించకుండా మొండిచేయి చూపించారు. 
కొండంత ఆశ ఆవిరైంది..
ప్రధానమంత్రి వస్తున్నారంటూ..రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజిగానీ..ప్రత్యేక హోదా గాని ప్రకటిస్తారని రాష్ట్ర ప్రజలతో పాటు..అన్ని రాజకీయ పార్టీలు కొండంత ఆశతో ఎదురుచూశారు. బీహార్‌కు లక్షన్నర కోట్లను ప్రకటించిన మోడి..ఏపీకి  కనీసం లక్షకోట్లప్యాకేజీ అయినా ప్రకటిస్తారని ప్రజలంతా వేయికళ్లతో ఎదురుచూశారు. కానీ ప్రధాని మోడి మాత్రం ప్రత్యేక హోదాగానీ..ప్రత్యేక ప్యాకేజీ గురించికానీ ఎక్కడా ప్రస్తావించలేదు. విభజన చట్టంలోని హామీలన్నింటిని నెరవేర్చుతామని హామీఇచ్చారు తప్పితే..ప్యాకేజీ గురించి ఎక్కడా పెదవివిప్పలేదు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు కలిసి పనిచేసి ఆర్ధిగప్రగతిని సాధించాలని..రెండు రాష్ట్రాలు ఆదిశగా కలిసి పనిచేస్తాయన్న నమ్మకం తనకుందని ప్రస్తావిస్తూ పరోక్షంగా మీరే కష్టపడి రాజధానిని నిర్మించుకోండంటూ సలహా ఇచ్చే ప్రయత్నం చేశారు మోడి. 
ఊకదంపుడు ఉపన్యాసం..
పునర్విభజన చట్టంలో ఏం చెప్పినా..ప్రతి అక్షరాన్నీ కేంద్ర ప్రభుత్వం తప్పకుండా అమలుచేస్తాం,..చంద్రబాబు- మోదీ జోడీతో ఆంధ్రప్రజలందరి కలలను నూటికి నూరు శాతం నెరవేరుస్తాం అంటూ మోడి ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చారే తప్ప..రాష్ట్ర ప్రజలకు మనోధైర్యం ప్రకటించే ఆర్ధిక ప్యాకేజీపై మాత్రం ఒక్క మాట మాట్లాడలేదు. దీంతో శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు తీవ్ర నిరాశకు గురయ్యారు.

07:02 - October 23, 2015


ఎన్నాళ్లనుంచో ఎదురుచూసిన మహాఘట్టం కళ్ల ముందు సాక్ష్యాత్కృతమైంది. తెలుగు ప్రజల కీర్తి కలికితురాయిగా నిలిచిపోయే విధంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. దేశ, విదేశాల నుంచి వచ్చిన అతిరథ మహారధుల మధ్య ఎంతో అట్టహాసంగా,.. అత్యద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. 
పండగ వాతావరణం..
ఇక ఉదయం నుంచే ఉద్దండరాయునిపాలెంలో పండుగ వాతావరణం నెలకొంది. లక్షలాదిగా ప్రజలు, రైతులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. తెలంగాణ నుంచి సీఎం కేసీఆర్‌, డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మంత్రులు ఈటెల, జగదీష్‌రెడ్డి హాజరయ్యారు. అదేవిధంగా తెలంగాణ టీడీపీ నేతలు, బీజేపీ నేతలు శంకుస్థాపన మహోత్సవానికి విచ్చేశారు. కార్యక్రమానికి హాజరైన వారికి మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి సినీ నటులు వెంకటేష్‌, సుమన్‌, రాజేంద్రప్రసాద్‌తో పాటు పలు రంగాల ప్రముఖులు హాజరయ్యారు. 
ఘన స్వాగతం..
ఇక గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన వీఐపీలకు మంత్రులు ఘన స్వాగతం పలికారు. వచ్చిన అతిథులకు శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాలు ఇచ్చి ఆహ్వానం పలికారు. అతిథులను ప్రత్యేక వాహనంలో శంకుస్థాపన కార్యక్రమం వద్దకు తీసుకెళ్లారు.  మరికొందరు నేతలు, ప్రముఖులు నేరుగా ప్రత్యేక హెలికాప్టర్‌లో శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. వీరికి మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు. 
అంగరంగవైభవం..
శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం నుంచే  నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమ మహోత్సవానికి సినీనటుడు సాయికుమార్‌, గాయని సునీత వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. తొలుత సాంస్కృతిక కార్యక్రమాలు తెలుగు పద్యంతో ప్రారంభమయ్యాయి. అనంతరం మిమిక్రీ కార్యక్రమాలు, కూచిపూడి నృత్యాలు, అనేక రూపకాలు ఆహుతులను అలరించాయి. శివమణి డ్రమ్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శంకుస్థాపన మహోత్సవంలో పలు మతాలకు చెందిన మత పెద్దలతో సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. 
బాలయ్య సందడి..
ఇక శంకుస్థాపన కార్యక్రమంలో సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ సందడి చేశారు. సభా వేదికపైకి ఎక్కి ప్రజలు, అభిమానులకు అభివాదం చేశారు. తనదైన శైలిలో ప్రసంగించి ప్రజలను ఆకట్టుకున్నారు. 
మోదీ హాజరు..
ఇక ప్రధాని మోదీ పన్నెండున్నర గంటలకు శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. 12 గంటల 36 నిమిషాలకు అమరావతి ప్రత్యేక హోమానికి పూర్ణాహుతి చేశారు. అనంతరం వేద మంత్రోచ్ఛరణల మధ్య... 12 గంటల 40 నిమిషాలకు నవ్యాంధ్ర రాజధానికి శంకుస్థాపన చేశారు. 12 గంటల 45 నిమిషాలకు అమరావతి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు అక్కడే ఏర్పాటు చేసిన అమరావతి చరిత్రకు సంబంధించిన ఎగ్జిబిషన్‌ మోదీ సందర్శించారు. అమరావతి రాజధాని నిర్మాణం ఎలా ఉంటుందో ఏర్పాటు చేసిన త్రీడీ ప్రింటింగ్‌ను మోదీ పరిశీలించారు. 
మహావేదికపై..
అనంతరం శంకుస్థాపన మహావేదికపై మోదీ, ఏపీ, అసోం, తమిళనాడు గవర్నర్లు అయిన నరసింహన్‌, పీబీ ఆచార్య, కె.రోశయ్య, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలాసీతారామన్‌, సుజనాచౌదరి, అశోక్‌గజపతిరాజు, దత్తాత్రేయలతో పాటు సింగపూర్‌, జపాన్‌ మంత్రులు ఈశ్వరన్‌, యోసుకే ఆసీనులయ్యారు. ఇక మోదీ అమరావతి శంకుస్థాపన కోసం స్వయంగా తీసుకువచ్చిన మట్టి, యమునా నది జలాన్ని చంద్రబాబుకు అందించారు. 
మోడీ... దేవన్ష్ తో ముద్దుముచ్చట్లు..
ఈ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మోదీ.. చంద్రబాబు మనవుడు దేవాన్ష్ ఆప్యాయంగా పలకరించారు. దేవాన్ష్‌కు తన కళ్లద్దాలు అమర్చారు. కాసేపు దేవాన్ష్‌తో మోదీ ముద్దుముద్దుగా ముచ్చటించారు. అనంతరం చంద్రబాబు దంపతులు, లోకేష్‌ దంపతులు మోదీతో ఫొటో దిగారు. 

06:53 - October 23, 2015

కర్నూల్ : మళ్లీ తలలు పగిలాయి... నెత్తురు చిందింది. ఒకరిపై ఒకరు పడి కొట్టుకున్నారు. ఎవరు ఎవరిని కొడుతున్నారో కూడా అర్థంకాని స్థితిలో పిచ్చికొట్టుడు కొట్టుకున్నారు. ఒకరా ఇద్దరా వందలు వేల మంది ఒక్కసారిగా వీధిలోకొచ్చి కర్రలు తీశారు. ఇనుప రింగులు తగిలించి మరీ కర్రలు విసురుకున్నారు. 
30 మంది తలలు బద్దలు..
బన్నీ ఉత్సవం సందర్భంగా సుమారు 30 మంది తలలు బద్దలయ్యాయి. ప్రతి ఏటా కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగే ఈ కర్రల యుద్ధం ఈసారీ అదే స్థాయిలో జరిగింది. బన్సీ ఉత్సవం సందర్భంగా కర్రల యుద్ధాన్ని ఆపేందుకు పోలీసులు పెద్దయెత్తున మోహరించినా... రక్తపాతం మాత్రం ఆగలేదు. 
పోలీసులు, సామాజిక కార్యకర్తలు మొత్తుకున్నా...
దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం, బన్ని ఉత్సవం, ఈ ఏడాది కూడా వార్తల్లో కెక్కింది. పోలీసులు, సామాజిక కార్యకర్తలు, జిల్లా యంత్రాంగం ఎంత మొత్తుకున్నా వినకుండా ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున్న జనం ఈ కర్రల వేడుకలో పాల్గొన్నారు. గత ఏడాది బన్ని ఉత్సవంలో నెరణికి గ్రామానికి చెందిన పదకొండేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. 
కొంత మెరుగైనా..
గతంలో పాతకక్షలతో ప్రత్యర్థులను మట్టుబెట్టేందుకు దేవరగట్టు బన్ని ఉత్సవాన్ని వేదికగా చేసుకునేవారు. పరిస్థితి గతంతో పోలిస్తే కొంత మెరుగైనా రక్త చరిత్ర మాత్రం పునరావృతమవుతూనే ఉంది. మండలంలోని నెరణికి, నెరణికి తాండా, కొత్తపల్లి, సులువాయి, విరుపాపురం, అరికేర, కురుకుంద, ముద్దనగేరి, ఆలూరు గ్రామాల ప్రజలు కర్రల పండుగలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 
అధికార యంత్రాంగం విఫలం..
బన్ని ఉత్సవంలో హింసను నివారించేందుకు అధికార యంత్రాంగం శాశ్వత చర్యలు తీసుకోవడంలో విఫలమైందనే వాదనలు ఉన్నాయి. ఏటా ఉత్సవానికి పది రోజుల ముందు పోలీసులు, అధికారులు గ్రామ సమావేశాల పేరిట హడావుడి చేయడమే కాని.. ఉత్సవాన్ని నిలువరించే కార్యక్రమం మాత్రం శూన్యం.
పోలీసులు మాయమయ్యారు..
ఈ ఏడాది కూడా  వెయ్యికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసారు... చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. కానీ ఎప్పటి లాగే ఉత్సవం ప్రారంభమయ్యే సమయానికి పోలీసులు మాయమైపోవడం ఆనవాయితీగా మారింది. ఇక ఇనుప రింగులు చుట్టిన కర్రలతో ప్రత్యక్షమై జనం బన్నీ ఉత్సవంలో పాల్గొంటున్నారు. ఎప్పటిలాగే రక్తం చిందటం యథావిదిగా జరిగిపోతుంది.  దేవరగట్టు బన్ని ఉత్సవాలపై నాలుగేళ్ల క్రితం మానవ హక్కుల కమిషన్ స్పందించింది. నివేదిక ఇవ్వాలనీ ఆదేశించింది.  అయినా అమలు శూన్యం.

నేటి నుంచి ద్వారకా తిరుమల బ్రహ్మోత్సవాలు.

తిరుమల : నేటి నుంచి ద్వారకా తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ ఉత్సవాలు ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతాయి. 

Don't Miss