Activities calendar

24 October 2015

గల్లంతైన విద్యార్థుల మృతదేహాల వెలికి తీత..

నిజామాబాద్ : జిల్లాలోని నవీపేట్ మండలంలోని అబ్బాపూర్ గ్రామంలో ముగ్గురు విద్యార్థులు గల్లంతు అయిన సంగతి తెలిసిందే. అశోక్ మృతదేహాన్ని నిన్ననే వెలికితీశారు. మరో ఇద్దరు విద్యార్థుల ఈ రోజు వెలికితీశారు.

డిసెంబర్ 2 బ్యాంకుల సమ్మె..

ఢిల్లీ : బ్యాంక్ ఉద్యోగులు మరోసారి సమ్మె చేయబోతున్నారు. డిసెంబర్ 2న దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు దిగనున్నట్లు ప్రకటించారు. 

21:26 - October 24, 2015

పంజాబ్ : సిక్కుల పవిత్ర గ్రంథమైన 'గురుగ్రంథ్ సాహెబ్'ను అవమానించేలా జరుగుతున్న ఘటనలను ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్రంగా ఖండించారు. పంజాబ్‌లో అశాంతిని రేపడానికే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఫరీద్‌కోట్‌లో ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు సిక్కులు మృతి చెందారు. శాంతియుత ప్రదర్శన జరుపుతున్నవారిపై కాల్పులు జరపడం అన్యాయమన్నారు. కాల్పులకు ఆదేశాలిచ్చిన అధికారులపై చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 

21:25 - October 24, 2015

ఢిల్లీ : భారతీయ యుద్ధ విమానాలను ఇకపై మహిళా పైలట్లు కూడా నడపనున్నారు. యుద్ధ విమానాల పైలెట్లుగా మహిళలను నియమించేందుకు కేంద్ర రక్షణశాఖ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఎయిర్‌ఫోర్స్ లో పని చేస్తున్న వారి నుంచి మహిళా పైలెట్లను ఎంపిక చేయనున్నట్టు కేంద్ర రక్షణశాఖ అధికార ప్రతినిధి శీతాన్షుకర్‌ తెలిపారు. ఎంపికైన వారికి ఫైటర్‌ పైలెట్స్ గా ఏడు నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఎయిర్‌ఫోర్స్ లో దాదాపు 15 వందల మంది మహిళలు పని చేస్తున్నారు. ఇందులో 94 మంది పైలెట్లుగా, 14 మంది నావిగేటర్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు సాధారణ రవాణా విమానాలకు మాత్రమే మహిళా పైలెట్లు ఉన్నారు.

21:20 - October 24, 2015

విజయవాడ : ఆర్టీసీ చార్జీలు పెంచడంపై ఆంధ్రప్రదేశ్‌లో నిరసన జ్వాలలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ విపక్షాలు భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. పెంచిన చార్జీలను వెంటనే తగ్గించకపోతే భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తామని నేతలు హెచ్చరిస్తున్నారు. నిత్యావసరాల ధరలు పెరిగి ఓ పక్క ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలు పెంచడం దారుణమని పలువురు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. శనివారం ఉదయం నుంచే ఆర్టీసీ బస్టాండ్ల వద్దకు చేరుకుని రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలిపారు. పలు చోట్ల ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పెంచిన చార్జీలను తగ్గించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఏపీ అన్ని జిల్లాల్లో..
ఆర్టీసీ ఛార్జీల పెంపుపై విజయవాడలో విపక్షాలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్‌, సీపీఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కష్టాల్లో ఉన్న ప్రజలపై చంద్రబాబు మరింత భారాన్ని మోపుతున్నారని నేతలు మండిపడ్డారు. ఆర్టీసీ చార్జీల పెంపును నిరసిస్తూ విశాఖలో సీపీఎం ఆందోళన చేపట్టింది. చార్జీలు తగ్గించాలంటూ పార్టీ ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. వెంటనే చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. పెంచిన ఆర్టీసీ చార్జీలను నిరసిస్తూ..శ్రీకాకుళం పట్టణంలో సిపిఎం నిరసన కార్యక్రమాలు చేపట్టింది. వెంటనే పెంచిన ఆర్టీసి చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ..ఆర్టీసి కాంప్లెక్స్ ఎదుట ధర్నా చేపట్టారు. ఉద్యోగుల వేతనాల పెంపును సాకుగా చూపి..ప్రజలకు, ఆర్టీసి ఉద్యోగులకు మధ్య ప్రభుత్వం చిచ్చు పెడుతోందని సిపిఎం నాయకులు విమర్శించారు. మరోవైపు ఆర్టీసీ చార్జీల పెంపును నిరసిస్తూ అనంతపురం ఆర్టీ డీపో ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక సప్తగిరి సర్కిల్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. పెంచిన ఆర్టీసీ చార్జీలు తగ్గించాలంటూ నెల్లూరులో సీపీఎం నేతలు ఆందోళన చేపట్టారు. పెంచిన ఆర్టీసీ చార్జీలతో ప్రజలపై ఏడాదికి 300 కోట్ల రూపాయలు అదనపు భారం పడనుందని నేతలన్నారు. మరోవైపు ఉభయగోదావరి జిల్లాల్లోనూ విపక్షాలు ఆందోళనలు చేపట్టాయి. ఆర్టీసీని లాభాల వైపు నడిపించేందుకు ప్రభుత్వం ప్రయత్నించకుండా.. ప్రజలపై భారం మోపే విధంగా చార్జీలు పెంచిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు.

సోమవారం కూడా..
పెంచిన ఆర్టీసి చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ...కడపలో సీపీఎం ఆందోళన చేపట్టింది. ప్రజల సంక్షేమం మర్చిపోయి.. సామాన్యుడి నడ్డి విరిగేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని నేతలు మండిపడ్డారు. ధరలు తగ్గించలేని ప్రభుత్వానికి ఆర్టీసీ చార్జీలు పెంచే నైతిక హక్కు లేదని నేతలన్నారు. నిత్యావసర వస్తువుల ధరలతో పాటు పెంచిన ఆర్టీసీ చార్జీలను తగ్గించకపోతే ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుడతామని వారు హెచ్చరించారు. మరోవైపు ఆర్టీసీ చార్జీల పెంపుపై వైసీపీ నిరసనలకు పిలుపునిచ్చింది. సోమవారం అన్ని బస్టాండ్ల ఎదుట ఆందోళనలు చేపట్టాలని వైసీపీ నిర్ణయించింది.

21:16 - October 24, 2015

వరంగల్ : ఓరుగల్లు ఉప ఎన్నిక‌లపై తెలంగాణ‌లో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. ముఖ్యంగా కొంతకాలంగా ప్రభుత్వ వైఖ‌రిపై కారాలు మిరియాలు నూరుతున్న టిడిపి, బిజెపిలు ఈ ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెలిచి అధికార పార్టీకి షాక్ ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యాయి. దానికి త‌గ్గట్టుగానే రెండు పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహ‌లను సిద్దం చేస్తున్నాయి. ఉమ్మడి స‌మావేశాలు పెట్టి ఉమ్మడి అభ్యర్థిపై ఎంపిక‌పై క‌స‌ర‌త్తు చేస్తున్నాయి. ఇప్పటికే రంగారెడ్డి, హైద‌రాబాద్‌ల‌లో జ‌రిగిన ఎమ్మెల్సి ఎన్నికల్లో గెలిచి అధికార పార్టీకి షాకిచ్చిన టిడిపి-బిజెపిలు వ‌రంగ‌ల్‌ను కూడా తన ఖాతాలో వేసుకొని గులాబీపార్టీకి సవాల్‌ విసిరేందుకు సిద్దమవుతున్నాయి.

బిజేపి అభ్యర్థి ? 
ఇప్పటికే ఉపఎన్నిక‌ల‌పై ప‌లుమార్లు స‌మావేశం అయిన టిడిపి-బిజేపిలు ఎట్టకేలకు బిజెపి త‌ర‌పున ఉమ్మడి అభ్యర్థిని నిలిపేందుకు ఇరుపార్టీలు ఓ అంగీకారానికి వ‌చ్చాయి. హైదరాబాద్ గోల్కొండ హోటల్లో జరిగిన కీలక ఉమ్మడి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నిక‌ల్లో స‌మ‌న్వయ లోపం కార‌ణంగా కొన్ని సీట్లను పోగొట్టుకున్నామని ఇప్పుడు అలాంటి ప‌రిస్ధితులు రాకుండా రాష్ట్రస్థాయి నుండి క్షేత్రస్థాయివరకు సమన్వయ కమిటీలను వేయాల‌ని ఇరుపార్టీలు నిర్ణయించాయి. వరంగల్ పార్లమెంట్‌ ఉపఎన్నిక‌లో టీఆర్ఎస్ గెలిస్తే ఆపార్టీ ఎంపిల్లో మ‌రొకరు చేరతారని అదే ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థి గెలిస్తే నియోజ‌క‌వ‌ర్గానికే గాక తెలంగాణాకే మేలు జ‌రుగుతుంద‌నే విష‌యాన్ని ఓటర్లలోకి తీసుకెళ్లాలని ఇరుపార్టీలు నిర్ణయించాయి.

సమన్వయ కమిటీ..
వరంగల్ ఉప ఎన్నికపై ఉమ్మడి అభ్యర్థిని నిలిపేందుకు సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తూ టిడిపి-బిజేపిలు నిర్ణయించాయి. టిడిపి నుండి పెద్దిరెడ్డి, బిజెపి నుండి పి.చంద్రశేఖర్‌లను సమన్వయకర్తలుగా ఏర్పాటు చేస్తూ ఇరుపార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. అలాగే జిల్లా, నియోజ‌క‌వ‌ర్గ, మండ‌ల, భూత్ క‌మిటీలను కూడా ఏర్పాటు చేయాలని టిడిపి-బిజేపిలు నిర్ణయించాయి. రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిని ఈనెల 28న వ‌రంగ‌ల్‌లో జ‌రిగే నియోజ‌క‌వ‌ర్గస్ధాయి భూత్ క‌మిటీ విస్త్రతస్ధాయి స‌మావేశంలో ప్రకటించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 1600 మంది రైతు ఆత్మహత్యలు సహ వివిధ అంశాల‌లో ప్రభుత్వం అనుస‌రిస్తున్న విధానాల‌ను ప్రజల్లో ఎండగడతామని టి టిడిపి అధ్యక్షులు ఎల్‌ రమణ అన్నారు. వరంగల్‌ను లండన్ చేస్తామ‌న్న కేసిఆర్ హ‌మీ ఏమైందో ప్రజలకు వివ‌రించాల‌ని ఆయన డిమాండ్ చేశారు. వీటినే అస్త్రాలుగా చేసుకుని ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తామని రమణ అన్నారు. మొత్తానికి వ‌రంగ‌ల్ ఉపపోరులో క‌మ‌లం పోటీచేసే అంశం దాదాపు ఖరారైంది. అయితే టిడిపి-బిజేపిలు కలిసి ప్రచారాన్ని ఎలా నిర్వహిస్తాయో..అభ్యర్థి విజయానికి ఎలాంటి ప్రణాళికలు రచిస్తారో మరికొద్ది రోజుల్లో తేలనుంది. 

21:00 - October 24, 2015

కర్నూలు : ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆస్పత్రి ఎదుట బాలుడి బంధువులు ఆందోళనకు దిగారు. జ్వరంతో ఆస్పత్రికి తీసుకువచ్చిన బాలుడిని.. సీరియస్‌గా ఉంది హైదరాబాద్‌కు తరలించాలని చెప్పారు. దీంతో బాలుడిని హైదరాబాద్‌కు తరలిస్తుండగానే మృతి చెందాడు. 

20:58 - October 24, 2015

కడప : జిల్లా జమ్మలమడుగులో ఐషర్‌ వ్యాన్‌ ఢీకొన్న ఘటనలో తిరుమలయ్య అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. 108 వాహనంలో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స చేస్తుండగా తిరుమలయ్య మృతి చెందాడు. తన తమ్ముడిని వైద్యుడే చంపేశాడని మృతుడి సోదరుడు ఆరోపించాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తిరుమలయ్య మృతి చెందాడని.. మృతుడి బంధువులు ఆందోళన చేపట్టారు. ఆస్పత్రికి తీసుకొచ్చిన రోగికి సరైన సమయంలో ఆక్సిజన్‌ పెట్టలేదని.. డాక్టర్‌కు ఫోన్‌ చేసిన 2 గంటల వరకు రాలేదని మృతుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

20:57 - October 24, 2015

ఆదిలాబాద్ : కుటుంబ తగదాలు..ఆర్థిక ఇబ్బందులు..మనస్థాపానికి గురై క్షణికావేశంలో నిండు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇందులో అభం..శుభం తెలియన చిన్నారులను చంపేసి వారు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీనితో ఆయా కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నాయి. తాజాగా ఆదిలాబాద్‌ జిల్లా పీచరలో రెండేళ్ల చిన్నారితో కలిసి తల్లి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలతోనే గౌతమి ఆత్మహత్య చేసుకుందని స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

20:53 - October 24, 2015

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి ఫ్యాక్షన్‌ రాజకీయాలు తప్ప రాష్ట్రంలోని సమస్యలపై అవగాహన లేదని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు ఆరోపించారు. వైసీపీ.. కాంగ్రెస్‌ తోలు కప్పుకొని టీడీపీపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జగన్‌ చేస్తున్న విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్న కళా వెంకట్రావు.. ప్రత్యేక హోదా కోసం టీడీపీ చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. 

20:31 - October 24, 2015

ఖమ్మం : తెలంగాణ పల్లెల్లో తుపాకులు మళ్లీ మోత మోగాయి. పోలీసులు..ఎన్డీ దళం మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. సుమారు పది నిమిషాల పాటు ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది బయ్యారం మండలంలోని పందిపంపుల వాగు – కంబాలపల్లి అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మహబూబాబాద్ డివిజన్ పోలీసులు..ఇల్లెందు సబ్ డివిజన్ పోలీసులు ఈ ఆపరేషన్ చేసినట్లు తె లుస్తోంది. అశోక్ దళానికి చెందిన ఐదుగురు సభ్యులను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. కానీ దీనిని పోలీసులు ధృవీకరించడం లేదు. అరెస్టు చేసిన వారిని వెంటనే కోర్టులో ప్రవేశ పెట్టాలని చంద్రన్న వర్గానికి చెందిన నేతలు డిమాండ్ చేశారు. గత కొన్ని ఏళ్లుగా గుండాల..బయ్యారం ప్రాంతంలో రెండు దళాలకు చెందిన కదలికలు తీవ్రస్థాయిలో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇటీవలే పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇందులో ఓ మహిళ కూడా ఉంది. వీరిని పట్టుకుని చంపారని ఆరోపణలు వినిపించాయి. 

 

20:19 - October 24, 2015

కర్నూలు : ప్రేమించడం నేరమా ? ప్రేమించిన పాపానికి యువతి కుటుంబసభ్యులు..యువకుడి కుటుంబసభ్యులు దాడులకు పాల్పడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ప్రేమ వ్యవహరంలో తల దూర్చి ఇద్దరు యువతులను కూతురు కుటుంబసభ్యులు చితకబాదారు. దీనితో మనస్థాపానికి గురైన ఆ ఇద్దరు యువతులు పురుగుల మందు సేవించారు. దీనితో ఓ యువతి మృతి చెందింది. ఈ ఘటన ఆత్మకూరు మండలం సిద్ధాపురంలో చోటు చేసుకుంది. ఆ గ్రామంలో ప్రేమ వ్యవహరంలో.. కూతురు పారిపోయేందుకు రేణుకమ్మ, ఫకీరమ్మలు సహకరించారని సదరు యువతి కుటుంబసభ్యులు భావించారు. తీవ్ర ఆగ్రహానికి లోనైన కుటుంబసభ్యులు శనివారం ఇద్దరు యువతులను పట్టుకుని కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనపై రేణుకమ్మ..ఫకీరమ్మలు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. పురుగుల మందు సేవించడంతో రేణుకమ్మ మృతి చెందింది. ఫకీరమ్మ పరిస్థితి విషమంగా ఉంది. ఇలా ఉంటే వాళ్లే విషం మింగించి చంపేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దాడి చేయడం అమానుషమని..ఈ విధంగా దాడి చేయడం సబబు కాదని యువతి కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

అక్రమ పప్పు దినుసుల నిల్వలపై దాడులు..

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా పప్పు దినుసుల అక్రమ నిల్వలపై దాడులు కొనసాగుతున్నాయి. పది రాష్ట్రాల్లో 74వేల టన్నుల పప్పు దినుసులు స్వాధీనం చేసుకున్నారు.

ఐటీసీ పేపర్ పరిశ్రమలో ప్రమాదం..

ఖమ్మం : సారపాక ఐటీసీ పేపర్ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. బాయిలర్ గ్యాస్ లీకేజ్ జరిగింది. అస్వస్థతకు గురైన ప్రసాద్ అనే ఉద్యోగి మృతి చెందాడు.

మావోయిస్టుల చెర నుండి చర్ల వాసుల విడుదల..

ఖమ్మం : మావోయిస్టుల చెర నుండి చర్ల వాసులు విడుదలయ్యారు. ఛత్తీస్ గడ్ లో వారం రోజుల క్రితం సతీష్, రామకృష్ణ అనే ఇద్దరు వ్యాపారులను కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. 

పిఠాపురంలో దారుణం..

కర్నూలు : ఆత్మకూరు మండలం పిఠాపురంలో దారుణం చోటు చేసుకుంది. తమ కూతరు ప్రేమ వ్యవహారంలో సహకరించారని యువతి బంధువులు ఇద్దరు యువతులను చితకబాదారు. అవమానంతో ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. 

20:06 - October 24, 2015

మతం అనేది లేకముందు ఆదిమ మానవులుగా బతికారని, డార్విన్ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్లున్నారు. నమ్మని వారున్నారని ప్రముఖ సామాజిక శాస్త్ర వేత్త కంచె ఐలయ్య అన్నారు. టెన్ టివిలో 'జన చరిత' కార్యక్రమంలో శ్రమ - మతం వైరుఢ్యంపై విశ్లేషించారు. ఆయన మాటల్లోనే..

దేవుడు శ్రమ చేసే మనుషులను అగౌరవంగా చూస్తాడా ?
మానవుడు కోతి నుండి ఎదిగాడు తరువాతా చింపాజిగా మారి తమ రెక్కలను..చేతులను వాడుకున్నారో అవే అవయవాలు పెరుగుకుంటూ పోయాయి. అలా మానవ దశ వచ్చిందని డార్విన్ పేర్కొన్నాడు. మానవుడు దేవుడు సృష్టించాడు అని రెండో వర్గం పేర్కొంటోంది. ఎక్కడ ? ఎలా ? సృష్టించాడో ఒక్కో మతం చెప్పింది. మొదట మతం తీసుకుంది బుద్ధిజం. తరువాత క్రిస్టియానిటి. హిందూ ఇజం అంతకముందే ఉన్నది అన్నా ఈ పేరిట 200-300 ఏళ్ల కింద హిందూ ఇజం అనేది చెప్పలేదు. సనాతన ధర్మం..అని వైదిక ధర్మం అని పేర్కొన్నారు. దీనికి నిర్ధిష్టమైన మత రూపం లేదు. చాలా మతాలు వచ్చాయి.

ప్రకృతితో మానవుడు సంఘర్షణ..
ప్రకృతితో సంఘర్షణ పడ్డాడు. ఇందులో శ్రమ ప్రధానం. ఏ రాయితో పండు కొట్ట వచ్చు ? ఏ ఆయుధం తో జంతును చంపవచ్చు ? అంటూ తమ తెలివిని అభివృద్ధి ఎలా చేసుకోవాలి ? దేవుడు ప్రక్రియ లేకముందు మానవ శ్రమ ఉంది. శ్రమతో మానవుడు క్రమానుగతంగా మార్చుకుంటూ వచ్చాడు. శ్రమను దేవుడుని ముడివేస్తే చేయకపోతే ఆ మతం అభివృద్ధి మతంగా ఎదగదు. పల్లెలు..గ్రామాలు..గ్రామ సమూహాలు..మండాలాలు..జిల్లాలు..ఇలా పట్టణాభివృద్ధి జరిగింది. ఇక్కడ శ్రమ కీలకం. దేశంలో అన్ని మతాల మీద శ్రమను అగౌరవపరిచే విధంగా ఉంది. ప్రపంచస్థాయిలో కొద్దిగా ఉంది. మతాలు నమ్మే వారు నమ్ముకోవచ్చు. 

మతాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి ?
జుడాయిజం ముందుకు వచ్చిందా ? వైదిక రచనల ద్వారా హిందు ఇజం ముందు వచ్చిందా ? బైబిల్ ముందు వచ్చింది అని అంటున్నారు. కానీ వీటతికి ఎవిడియెన్స్ లేదు. బుద్ధుడు గురించి తాను అధ్యయనం చేసినప్పుడు కొన్ని అంశాలు తేలాయి. బుద్ధుయిజంతో ప్రారంభమైంది. సంఘ జీవనంలో ఇది తీసుకొచ్చింది. అన్ని కులాలను బుద్ధుడు ఇందులోకి తీసుకొచ్చాడు. ఇందులో ఆదివాసీలున్నారు. మంగళి..బట్టలు నేసే మహిళలు..బనియాన్స్..పురుషులు కూడా వచ్చారు. సంఘం అనేది కలర్ ఉండదు అని బుద్ధుడు చెప్పాడు. తరువాత క్రిస్టియానిటీ ఎదిగింది. అనంతరం హిందూ ఇజం ఎదుగుతూ వచ్చింది. ఇస్లాంలో ఈ అసమానతలను తేడా చూపట్టే ప్రయత్నం చేశారు. దేవుడికి బ్లాక్..అండ్ వైట్ కు మధ్య తేడా లేదు. మనిషికి మనిషికి మధ్య తేడా లేదని పేర్కొన్నారు. కానీ పురుషుడు..స్త్రీకి మధ్య బేధాలు చూపారు. హిందూ మతంలో కుల వ్యవస్థ ఉన్నందు వల్ల అసమానత మెట్లు ఉన్నాయి'' అని పేర్కొన్నారు. 
కులం పోవాలంటే శ్రమ విలువ పెరగాలని, శ్రమ - మతం సంబంధాలు బాగా ఉంటాయా ? అనే విషయాలపై కూడా విశ్లేషించారు. వచ్చే వారం ఆఖరి చర్చగా శ్రమే జీవితం ఎలా బతకాలి ? అనే అంశంపై చర్చ జరుగుతుందని కంచె ఐలయ్య తెలిపారు. మరిన్ని విశేషాల కోసం వీడియో చూడండి. 

19:14 - October 24, 2015

హైదరాబాద్ : టి.టిడిపి పార్టీలో కీలక నేతలుగా ఉంటున్న ఎర్రబెల్లి..రేవంత్ మధ్యనున్న కోల్డ్ వార్ ఒక్కసారిగా బహిర్గతమైంది. వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం. తీవ్ర పదజాలంతో వీరిద్దరూ విరుచకపడినట్లు తెలుస్తోంది. వరంగల్ ఉప ఎన్నిక నేపథ్యంలో గొల్కోండ హోటల్లో టి.టిడిపి నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రేవంత్..ఎర్రబెల్లి ఇతర నేతలు హాజరయ్యారు. మధ్యలో రేవంత్ పై ఎర్రబెల్లి పలు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. తన దగ్గర పనిచేసే వ్యక్తిని ఎలా తీసుకుంటావు ? ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో పనిచేసే క్లర్క్ స్థాయి ఉద్యోగితో సేవలు చేయించుకుంటున్నావు..ఇది కరెక్టు కాదని ఎర్రబెల్లి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీనిపై రేవంత్ ఘాటుగా స్పందించినట్లు తెలుస్తోంది. పార్టీ సమావేశాలకు ఐటం సాంగ్ లా వచ్చి వెళుతుంటావు అని తీవ్రస్థాయిలో ఎర్రబెల్లి వ్యాఖ్యానించినట్లు వార్తలు వస్తున్నాయి. కష్టపడుతున్నది మేము..పార్టీని మోస్తున్నాం..ఎలాంటి అంశాలపై సీరియస్ గా ఉండవని ఎర్రబెల్లి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీనిపై రేవంత్ ధీటుగా స్పందించినట్లు సమాచారం. ఒకదశలో నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒకరిపై మరొకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నట్లు తెలిసింది. ఒక్కసారిగా ఈ ఘటనపై పార్టీ నేతలు ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమై వారిద్దరినీ వారించినట్లు తెలుస్తోంది. దూకుడు తగ్గించుకోవాలంటూ రేవంత్ కు పలువురు సీనియర్ నేతలు సూచించినట్లు సమాచారం. 

కూతురు..తల్లి ఆత్మహత్య..

ఆదిలాబాద్: జిల్లాలోని లక్ష్మణచందా మండలం పీచర గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కూతురిపై కిరోసిన్‌పోసి నిప్పంటించిన తల్లి తాను ఆత్మహత్య చేసుకుంది. తల్లి, రెండేళ్ల కూతురు మృతి చెందారు

ప్రాజెక్టుల డిజైన్ పై మంత్రి హరీష్ సమీక్ష..

హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల డిజైన్లు, భూసేకరణపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. 

దళిత బాలుడి హత్యపై సిట్..

హర్యాన: గోహనాలో జరిగిన దళిత బాలుడు హత్య కేసు విచాణకు హర్యాన ప్రభుత్వ ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక విచారణ కమిటీని(సిట్)ను ఏర్పాటు చేసింది. గురువారం దళిత బాలుడు గోవింద్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. సోన్‌పేట్ జిల్లా గోహనా గ్రామానికి చెందిన ఈ బాలుడు పోలీస్ కస్టడీలో మృతి చెందాడని ఆరోపణలు ఉన్నాయి. 

రేవంత్ - ఎర్రబెల్లి తీవ్ర వాగ్వాదం..

హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిర్ణయించేందుకు టీడీపీ నాయకులు ఈ రోజు గోల్కొండ హోటల్‌లో సమావేశం అయ్యారు. టీ టీడీపీ సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు - రేవంత్‌రెడ్డిల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం. నువ్వేంత అంటే నువ్వెంత అంటూ ఒకరిపై మరొకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నట్లు తెలిసింది.

 

 

17:57 - October 24, 2015

ముంబై : టీమిండియా - సౌతాఫ్రికా జట్ల వన్డే సిరీస్ క్లయ్ మాక్స్ దశకు చేరింది. ఐదుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి నాలుగు వన్డేలు ముగిసే సమయానికి రెండు జట్లూ చెరో రెండు మ్యాచ్ లు నెగ్గి సమ ఉజ్జీలుగా నిలవడంతో ముంబై వాంఖెడే స్టేడియం వేదికగా జరిగే సూపర్ సండే ఫైట్ డూ ఆర్ డై గా మారింది. టీమిండియా, సౌతాఫ్రికాజట్ల...ఐదు మ్యాచ్ ల వన్డే సిరీస్ నిర్ణయాత్మక దశకు చేరుకొంది. మొదటి నాలుగు వన్డేలు ముగిసే సమయానికి రెండు జట్లూ 2-2తో సమ ఉజ్జీలుగా లవడంతో ఇప్పుడు సిరీస్ లోని ఆఖరి వన్డే ఫలితమే నిర్ణయాత్మకంగా మారింది. ఫ్రీడం సిరీస్ గా జరుగుతున్న ఈ వన్డే సమరం..నీకొకటి నాకొకటి అన్నట్లుగా సాగుతోంది. నాలుగుకు నాలుగుమ్యాచ్ ల్లోనూ టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్టు నెగ్గడం, చేజింగ్ కు దిగిన జట్టు చేతులెత్తేయడం సాధారణ విషయంగా మారింది.

తొలి వన్డే నుండి నాలుగో వన్డే వరకు..
కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా సస్పెన్స్ థ్రిల్లర్లా ముగిసిన తొలి వన్డేలో విజయానికి చేరువగా వచ్చి..ఐదు పరుగుల ఓటమి పొందిన టీమిండియా ఆ తర్వాత ఇండోర్ హోల్కార్ స్టేడియంలో ముగిసిన రెండో వన్డేలో 22 పరుగుల విజయంతో దెబ్బకు దెబ్బతీసి సమఉజ్జీగా నిలిచింది. అయితే....రాజ్ కోట్ సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో ముగిసిన మ్యాచ్ లో సఫారీటీమ్ 18 పరుగులతో టీమిండియాను కంగు తినిపించడం ద్వారా...సిరీస్ పై 2-1తో పట్టు బిగించింది. చెన్నై చెపాక్ స్టేడియంలో ముగిసిన నాలుగో వన్డేలో టీమిండియా టాస్ నెగ్గడం బ్యాటింగ్ ఎంచుకొని 299 పరుగుల భారీస్కోరు సాధించడంతోనే...ధోనీసేన విజయం ఖాయమైపోయింది. 35 పరుగుల తేడాతో నెగ్గిన టీమిండియా సిరీస్ ను 2-2తో సమం చేయడంతో ముంబైలో జరిగే ఆఖరివన్డే నిర్ణయాత్మకంగా మారింది. 

భిన్నంగా మ్యాచ్ లు..
తొలి వన్డే హైస్కోరింగ్ మ్యాచ్ గా ముగిస్తే...రెండో వన్డే దానికి భిన్నంగా లోస్కోరింగ్ తో ముగిసింది. తొలివన్డేలో 303 పరుగుల భారీస్కోరు సాధించిన సఫారీ టీమ్ రెండో వన్డేలో 247 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక గెలుపు ముంగిట్లో 22 పరుగుల దూరంలో కుప్పకూలింది. మూడో వన్డేల టీమిండియా271 పరుగుల లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. నాలుగో వన్డేల్లో 300 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక సౌతాఫ్రికా చతికిలబడింది. మొత్తం నాలుగు వన్డేల్లోనూ చేజింగ్ కు దిగినజట్లే ఓటమిపాలు కావడం విశేషం.

సౌతాఫ్రికాదే మెరుగు..
ఓవరాల్ గా సౌతాఫ్రికాది పైచేయి కాగా భారత గడ్డ పైన మాత్రం టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. చెన్నైలో ముగిసిన నాలుగో వన్డే వరకూ ...ఈ రెండు జట్లు 76 వన్డేల్లో తలపడగా...భారత జట్టు కేవలం 28 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. సఫారీ టీమ్‌ 45 మ్యాచ్‌ల్లో విజేతగా నిలిచింది. మరో మూడు మ్యాచ్ లు ఫలితం తేలకుండానే ముగిసిపోయాయి. భారత్ వేదికగా.. ఈ రెండుజట్ల మధ్య ఇప్పటి వరకూ జరిగిన 28 మ్యాచ్ ల్లో టీమిండియా 15 మ్యాచ్ ల్లో విన్నర్ గా నిలిచింది. సౌతాఫ్రికా 13 విజయాలతో ఉంది. ముంబైలో జరిగే సిరీస్ ఆఖరివన్డేలో సైతం..టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న జట్టు హవానే కొనసాగుతుందా? ..చేజింగ్ కు దిగిన టీమ్ విజేతగా నిలిచి..సీన్ రివర్స్ చేస్తుందా? తెలుసుకోవాలంటే కొద్ది గంటలపాటు సస్పెన్స్ భరించక తప్పదు.

17:51 - October 24, 2015

భారత క్రికెట్లో సీనియర్ స్టార్ల రిటైర్మెంట్ జోరందుకొంది. ఓపెనింగ్ బౌలర్ జహీర్‌ ఖాన్‌, డాషింగ్ ఓపెనర్ వీరేందర్‌ సెహ్వాగ్‌ ఇంటర్నేషనల్‌ కెరీర్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టడంతో ఇప్పుడు దాని ప్రభావం మిగతా సీనియర్‌ క్రికెటర్లపై పడింది.కెరీర్‌ చివరి దశలో ఉన్న యువరాజ్‌ సింగ్‌, గంభీర్‌, హర్భజన్ సింగ్‌, ధోనీల రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు జోరందుకొన్నాయి. ఓ వైపు దేశవాళీ టోర్నీలో సత్తా చాటుతూ యువ క్రికెటర్లు దూసుకోస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం జట్టులో ఉన్న కుర్ర క్రికెటర్లు సైతం టీమిండియాలో తమ స్థానాలను పదిలం చేసుకునేందుకు పోరాడుతున్నారు. దీంతో గత దశాబ్దకాలంగా భారత జట్టులో చక్రం తిప్పిన స్టార్‌ ఆటగాళ్లందరూ ఒక్కోక్కరుగా రిటైరవుతున్నారు. సీనియర్‌ క్రికెటర్లందరూ వరుసగా రిటైరవుతుండటం ప్రస్తుతం భారత క్రికెట్‌లో చర్చనీయాంశంగా మారింది. రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న ఆటగాళ్ల లిస్ట్ కూడా పెద్దగానే ఉంది. ఈ లిస్టులో హర్భజన్‌ సింగ్‌, సిక్సర్ల కింగ్‌ యువరాజ్‌ సింగ్‌, గౌతమ్‌ గంభీర్‌లతో పాటు వన్డే, టీ 20 కెప్టెన్‌ మహేందర్‌ సింగ్‌ ధోనీ సైతం ఉన్నాడు.

ఘనంగా సచిన్ రిటైర్ మెంట్..
మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండుల్కర్‌ మినహా...భారత క్రికెట్‌ కంట్రోల్ బోర్డ్ మరే ఇతర క్రికెటర్‌కు ఘనంగా రిటైరయ్యే అవకాశం ఇవ్వలేదు. 24 ఏళ్లు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన మాస్టర్‌ సచిన్‌ ...40 ఏళ్ల వయసులో కెరీర్‌కు గుడ్‌ బై చెప్పాడు. సౌరవ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రావిడ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, అనిల్‌ కుంబ్లే వంటి దిగ్గజ ఆటగాళ్లకు కనీసం ఆఖరి అవకాశం ఇచ్చిన బీసిసిఐ ప్రస్తుతం సీనియర్‌ క్రికెటర్లకు అవకాశమే ఇవ్వట్లేదు. భారత జట్టుకు ఎన్నో మరపురాని విజయాలందించిన క్రికెటర్ల విషయంలో బోర్డు కఠినంగా వ్యవహరిస్తుందనే చెప్పాలి.

ధోని రిటైర్ మెంట్ పై వార్తలు..
జహీర్‌ ఖాన్‌.....భారత జట్టు ప్రధాన అస్త్రంగా దశాబ్దకాలంగా బౌలింగ్‌ భారాన్ని మోయగా విధ్వంసకర బ్యాట్స్ మెన్ గా వీరేందర్‌ సెహ్వాగ్‌ చరిత్రను తిరగరాశాడు. ఇద్దరు భారత జట్టు సాధించిన అపురూప విజయాల్లో భాగమైనవాళ్లే. పైగా ఈ ఇద్దరూ కొత్తగా నిరూపించుకోవాల్సింది కూడా ఏమీ లేకపోవడంతో రిటైర్‌ అవ్వాలని నిర్ణయించుకున్నారు. భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డ్ ఈ ఇద్దరికీ కనీసం రిటైర్మెంట్‌ మ్యాచ్‌ ఆడే అవకాశం కూడా ఇవ్వలేదు. ఇకపై జాతీయ జట్టులో చోటు దక్కే అవకాశం లేకపోవడంతో వీరూ,జహీర్‌ ఖాన్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశారు. అయితే ప్రస్తుతానికి ఇన్‌స్టంట్‌ ఫార్మాట్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్న ధోనీ ఏ సమయంలోనైనా రిటైర్‌ అవ్వొచ్చని పుకార్లు వినిపిస్తున్నాయి. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌ ఓడిపోవడం,సౌతాఫ్రికా చేతిలో టీ 20 సిరీస్‌తో పాటు, వన్డే సిరీస్‌లోనూ భారత జట్టు వైఫల్యం కారణంగా ధోనీపై మునుపెన్నడూ లేనంతలా విమర్శలు వెల్లువెత్తాయి. 2016 టీ 20 ప్రపంచకప్‌ తర్వాత రిటైర్మెంట్‌పై ఓ నిర్ణయం తీసుకుంటానని ధోనీనే స్వయంగా ప్రకటించాడు. 2015 వన్డే వరల్డ్ కప్‌ సెమీఫైనల్‌లో ఓడిన అనంతరం ఆటను ఆస్వాదిస్తున్నంత కాలం ఆడుతూనే ఉంటానని క్రికెటర్‌గా తన బాధ్యతలు ముగిశాయి అనిపించిన తర్వాత రిటైర్‌ అవుతానని చెప్పాడు. ఇప్పటికే గత యేడాది టెస్ట్ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన ధోనీ ఎక్కువ కాలం అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగేది అనుమానంగానే కనిపిస్తోంది.

స్థానం కోసం యువీ పోరాటం..
ఇక సిక్సర్ల కింగ్‌ యువరాజ్‌ సింగ్‌ సైతం టీమిండియాలో రీ ఎంట్రీ ఇవ్వడానికి పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడుతూనే ఉన్నాడు. రంజీల్లో పంజాబ్‌ జట్టు కెప్టెన్‌గా రాణిస్తూ భారత జట్టుకు తిరిగి ఆడాలని పట్టుదలతో ఉన్నాడు. గత యేడాది 2014 టీ 20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు చివరిసారిగా ఆడిన యువరాజ్‌ సింగ్‌ను సెలక్టర్లు పక్కన పెట్టారు. రంజీల్లో కొన్ని మెరుపులు మెరిపించినా యువీ టీమిండియాలో బెర్త్ మాత్రం ఖాయం చేసుకోలేకపోయాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లోనూ అంతంత మాత్రంగానే రాణిస్తున్న యువీ ఎంత కాలం కొనసాగుతాడో చెప్పలేం. గత యేడాది ఓ ఇంటర్వ్యూలో తిరిగి భారత జట్టుకు ఆడతానని ధీమాగా చెప్పిన యువీ...తాను ఇప్పటికే భారత జట్టు తరఫున ఆఖరి మ్యాచ్‌ ఆడేశానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరచాడు.

భజ్జీ రీ ఎంట్రీ..
మరోవైపు హర్భజన్‌ సింగ్‌ది అదే పరిస్థితి. రెండేళ్ల తర్వాత జాతీయ జట్టుకు ఎంపికైన భజ్జీ....రీఎంట్రీ ఇచ్చిన తర్వాత పెద్దగా రాణించింది లేదు.సౌతాఫ్రికాతో ముగిసిన టీ 20 సిరీస్‌లో తేలిపోయిన భజ్జీ...వన్డే సిరీస్‌లోనూ అంతంత మాత్రంగానే రాణిస్తున్నాడు.గాయం నుంచి కోలుకున్న తర్వాత అశ్విన్ తిరిగి జట్టులోకొస్తే హర్భజన్‌ సింగ్‌ మళ్లీ దూరమవ్వాల్సిందే. దక్షిణాఫ్రికాతో మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్‌ కోసం ఎంపిక చేసిన జట్టులో భజ్జీ చోటు కోల్పోయాడు. దీంతో హర్భజన్‌ సింగ్‌ కూడా అంతర్జాతీయ కెరీర్‌కు త్వరలోనే ఫుల్‌స్టాప్‌ పెట్టబోతున్నాడని జోరుగా ప్రచారం సైతం జరుగుతోంది.

ముగిసిన గంభీర్ కెరీర్...
ఇక మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ అంతర్జాతీయ కెరీర్‌ కూడా దాదాపు ముగిసినట్లే. గత యేడాది ఇంగ్లండ్‌ టెస్ట్ సిరీస్‌కు ఎంపిక చేసినా గంభీర్‌ దారుణంగా విఫలమయ్యాడు. రంజీల్లో ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న గౌతమ్‌ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. భారత జట్టులో లెఫ్ట్ హ్యాండ్‌ ఓపెనింగ్‌ బ్యాట్స్ మెన్‌గా శిఖర్‌ ధావన్‌ పాతుకుపోవడంతో గంభీర్‌ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. 

ధోనిపై లేని వత్తిడి...
రిటైర్మెంట్‌ విషయంలో బీసిసిఐ నుండి ధోనీపై ఎటువంటి ఒత్తిడి లేదు. కానీ టీమిండియా వరుస వైఫల్యాలు, వ్యక్తిగత ప్రదర్శనపై వస్తున్న విమర్శలు దృష్టిలో పెట్టుకుని ధోనీ హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. ధోనీ విషయం ఎలా ఉన్నా....భజ్జీ, యువీ, గంభీర్‌లపై జహీర్‌ ఖాన్‌, వీరేందర్‌ సెహ్వాగ్‌ రిటైర్మెంట్‌ అయిన ప్రభావం ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి కెరీర్‌ చివరి దశలో ఉన్న సీనియర్ క్రికెటర్లు ఇంకెన్నాళ్లు నెట్టుకొస్తారో చూడాలి. 

17:44 - October 24, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పాలన గాడితప్పుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా... పాలకులకు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. 

17:40 - October 24, 2015

హైదరాబాద్ : తెలంగాణలో రైతు ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని జేఏసీ చైర్మన్ కోదండరాం సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆత్మహత్యల్లో 20మండలాలల్లోనే అధికంగా జరుగుతున్నాయని తమ సర్వేలో తేలిందని తెలిపారు. రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో జరగిన సర్వేకు సంబంధించిన వివరాలను ఆయన ప్రకటించారు. ప్రభుత్వంతో పాటు తాము కూడా కొన్ని మండలాల్లో చర్యలు చేపడుతామన్నారు కోదండరాం. మార్కెట్‌లు రైతులను దోచుకునే కేంద్రాలుగా తయారయ్యాయని కోదండరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు

17:34 - October 24, 2015

హైదరాబాద్ : వచ్చేనెల 21న జరిగే వరంగల్‌ ఎంపీ స్థానం ఉప ఎన్నికపై టిడిపి-బిజేపి కసరత్తు ముమ్మరం చేసింది. అభ్యర్థిని ఎంపిక చేసే విషయంపై గోల్కోండ హోటల్లో టిడిపి-బిజేపి నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టి టిడిపి అధ్యక్షుడు ఎల్‌ రమణతో పాటు..ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి సహా మరికొందరు నేతలు పాల్గొన్నారు. అలాగే బిజేపి నుంచి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో పాటు..కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు. అయితే టిడిపి-బిజేపి కలిసి ఉమ్మడి అభ్యర్థిని ఖరారు చేసేందుకు ఓ సమన్వయ కమిటీని నియమిస్తున్నట్లు బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. టిడిపి నుంచి పెద్దిరెడ్డి, బిజెపి నుంచి చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ పనిచేస్తుందని తెలిపారు. టీఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా అభ్యర్థిని నిలపెడతామని కిషన్‌రెడ్డి ప్రకటించారు. వరంగల్ జిల్లాలో నె లకొన్న రాజకీయ పరిస్థితిని సమీక్షించడం జరిగిందని, మరింత సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించుకున్నామన్నారు. ఎన్నికలు ఏ రకంగా ఎదుర్కొవాలనే దానిపై కార్యచరణను కమిటీ ప్రకటిస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికలు టీఆర్ఎస్ కు కనువిప్పు కలుగాలని, పేదలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని టి.టిడిపి అధ్యక్షుడు రమణ డిమాండ్ చేశారు. 

17:21 - October 24, 2015

ఖమ్మం : జిల్లాలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వెంకటాపురంలో ఈఘటన చోటు చేసుకుంది. కృష్ణవేణి కాలేజీలో ప్రియాంక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కళాశాలకు దసరా సెలవులివ్వడంతో వారం రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చింది. శనివారం మధ్యాహ్నాం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రియాంక చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు, కుటుంబసభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ప్రియాంక మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. దీనితో ప్రియాంక కుటుంసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చదువులో బాగానే రాణిస్తుందని, ఆత్మహత్య ఎందుకు చేసుకుందో తెలియడం లేదని కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. ప్రియాంక తండ్రి ఇటీవలే మృతి చెందాడు. కుటుంబానికి ఎవైనా ఆర్థిక ఇబ్బందులున్నాయా ? ఆత్మహత్యకు ఇతర కారణాలున్నాయా ? అనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. ప్రియాంక ఆత్మహత్య చేసుకోవడంతో తల్లి షాక్ కు గురైంది. ఆత్మహత్యకు గల కారణాలు కొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. 

16:35 - October 24, 2015

కాకినాడ : ఆర్టీసీ సంస్థకు లాభాలు రావాలేంట ఎన్నో మార్గాలున్నాయి, ఛార్జీలు పెంచడం ఒక్కటే మార్గం కాదని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. ఆర్టీసీ ఛార్జీల పెంపును ఆయన తప్పుబట్టారు. వెంటనే ఛార్జీల పెంపును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన టెన్ టివితో మాట్లాడారు. నిత్యావసర ధరలు పెరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రస్తుతం పెంచిన ఛార్జీల వల్ల నిత్యావసర ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఛార్జీలు పెంచకుండానే లాభాలు గడించేలా అనేక మార్గాలున్నాయన్నారు. సరుకు రవాణాపై దృష్టి సారించాలని, పైవేటు ద్వారా ప్రజలు సరుకు రవాణా చేపడుతున్నారని తెలతిపారు. ప్రైవేటు రంగంపై పెద్ద ఎత్తున్న అవకాశాలు ఇవ్వడంతో ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయన్నారు. వీటిని అరికడితే రూ.1500 కోట్లు ఆర్టీసీకి ఆదాయం వచ్చే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజధాని శంకుస్థాపన కార్యక్రమం అట్టహాసంగా చేశారని, ప్రధాన మంత్రి ఏ ఒక్క హామీ ప్రకటించడం పోవడంపై నిరాశ మిగిలిందన్నారు. పోరాటం..ఆందోళన తప్ప వేరే మార్గం లేదన్నారు. పెట్రోల్, డీజీల్ పై అధికంగా వ్యాట్ ను విధించారని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని మధు పిలుపునిచ్చారు. 

16:30 - October 24, 2015

గుంటూరు : నవ్యాంధ్ర రాజధానికి సమీపంలో ఉన్న మాల్కాపురంలో చెరుకు పంట దగ్ధం ఘటనను వైసీపీ..సీపీఎం ఖండించింది. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. శనివారం సీపీఎం..వైపీపీ నేతలు కాలిపోయిన చెరుకు పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ల్యాండ్ పూలింగ్ భూమి ఇవ్వనందుకే ఈ విధంగా చేశారని ఆరోపించారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, పంట కోల్పోయిన రైతుకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎవరు భూములిస్తే వారి దగ్గర తీసుకోవాలని, కానీ ఇలా చేయడం అమానుషమన్నారు. ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా చూడాలని కోరారు. 

16:29 - October 24, 2015

బీహార్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ ఓ తాంత్రికుడిని కలిసిన వీడియో ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది. మొకామే నియోజకవర్గ అభ్యర్థి నీరజ్‌కుమార్‌తో కలిసి నితీష్‌ తాంత్రికుడిని కలిశారు. ఈ సందర్భంగా తాంత్రికుడు నితీష్‌కుమార్‌ను ఆలింగనం చేసుకున్న ఫొటోలు వివాదాస్పదంగా మారింది. సీఎం తాంత్రికుడిని కలవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఈ వీడియోను బిజెపి విడుదల చేసింది. వందేళ్లు దాటిన ఓ పెద్దాయన కొడుకులా భావించి తనను ఆలింగనం చేసుకుంటే తప్పేముందని నితీష్‌ అన్నారు. అది గత ఏడాది కింది ఫొటో ఇప్పుడు తెరపైకి తేవడంపై ఆయన మండిపడ్డారు.

16:13 - October 24, 2015

చిత్తూరు : అసలే మూగవాడు..తాను దొంగ కాదని అతడు మూగ భాషలతో చెబుతున్నా స్థానికులు వినిపించుకోలేదు..సృహ కోల్పోయేలా కొట్టారు..అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆ మూగవాడు మృత్యువుతో పోరాటం చేసి తుదిశ్వాస విడిచాడు. సంచలనం సంచలనం సృష్టించిన ఈ ఘటన జిల్లాలోని మదనపల్లెలో చోటు చేసుకుంది. చాంద్ బాషా..మూగవాడు. తల్లిదండ్రులు మృతి చెందడంతో సోదరి ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఆటోను నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలాగే ఆటో నడిపిన అనంతరం శుక్రవారం అర్ధరాత్రి నడుచుకుంటూ వస్తున్నాడు. కేవీఆర్ పార్కు సమీపంలోకి రాగానే స్థానికులు బాషాను దొంగగా అనుమానించారు. వెంటనే అతడిని ప్రశ్నించి చితకబాదారు. తాను దొంగ కాదని మూగ భాషలతో చెబుతున్నా స్థానికులు అర్థం కాలేదు. దీనితో స్థానికులు కొట్టిన దెబ్బలతో భాషా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అదే దారిలో వెళుతున్న వ్యక్తి భాషా పరిస్థితిని గమనించాడు. వెంటనే ప్రైవేటు ఆసుపత్రిలో చేరిపించాడు. చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నాం ఒంటి గంట సమయంలో కన్నుమూశాడు. ఈ విషయం తెలుసుకున్న భాషా కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. భాషా మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే దాడి చేసిన వారందరూ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మదనపల్లెలో దారుణం..

చిత్తూరు : జిల్లా మదనపల్లెలో దారుణం చోటు చేసుకుంది. దొంగ అనె నెపంతో మూగవాడిని స్థానికులు కొట్టి చంపారు. మృతుడు ఆటో డ్రైవర్ చాంద్ పాషాగా గుర్తించారు. శుక్రవారం రాత్రి ఈఘటన చోటు చేసుకుంది. 

అందరూ సమన్వయంతో పనిచేయాలి - కిషన్ రెడ్డి..

హైదరాబాద్ : టిడిపి, బిజెపిలు సమన్వయంతో పనిచేయాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతంలో టీఆర్ఎస్ పై వ్యతిరేకత ఉందని, మూడెకరాల స్థలం..ఇంటికో ఉద్యోగం హామీలను టీఆర్ఎస్ నెరవేర్చలేకపోయిందని విమర్శించారు.

 

15:44 - October 24, 2015

ఢిల్లీ : మాల్దీవుల ఉపాధ్యక్షుడు అహ్మద్ అదీబ్ ను పోలీసులు అరెస్టు చేశౄరు. అధ్యక్షుడు ప్రయాణిస్తున్న బోట్ లో బాంబు దాడి జరిగిన సంగతి తెలిసిందే. అదీబ్ ఈ ఘటనకు పూనుకున్నట్లు ఆరోపణలతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. చైనా పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న అహ్మద్ ను విమానాశ్రయంలో పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సెప్టెంబర్ 28వ తేదీన మాల్దీవుల అధ్యక్షుడు యమీన్ అబ్దుల్ గయూమ్ ప్రయాణిస్తున్న బోటు లో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో గయామ్ సురక్షితంగా బయటపడ్డారు. 

15:39 - October 24, 2015

మెక్సికో : భారీ తుఫాను కుదిపేసింది. గంటకు 210కిలోమీటర్ల వేగంతో వీచిన హరికేన్ గాలులతో తీర ప్రాంతం అతలాకుతలమైంది. హరికేన్ బీభత్సానికి తీర ప్రాంతంలో భారీగా ఆస్తినష్టం సంభవించింది. ప్రాణనష్టం లేకపోయినా... ఇళ్లు, రెస్టారెంట్లు, వాహనాలు భారీగా ధ్వంసమయ్యాయి. ఈ నష్టం వేలకోట్లలోనే ఉంటుంని అధికారులు అంచనావేస్తున్నారు. ముందుస్తు సమాచారంతో.. సుమారు 15వేల మంది విదేశీ టూరిస్టులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో... ప్రమాదం తప్పింది. 

15:37 - October 24, 2015

గుంటూరు : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక హోదా బదులు రాష్ట్రానికి మట్టి..నీరు తెచ్చి హోదాను వెనక్కి నెట్టేశారని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. సీఎం చంద్రబాబు ఓటుకు నోటు కేసులో బయటపడానికి సీఎం కేసీఆర్ ను అందలం ఎక్కించారని, రాజధానికి భూములు తీసుకొనే క్రమంలో చెరుకు తోటలకు నిప్పు పెట్టి రైతులను భయపెడుతున్నారని విమర్శించారు. రాజధాని నిర్మాణం చేయడానికి తాము వ్యతిరేకం కాదని, మూడు పంటలు పండే భూములు తీసుకోవడానికి వ్యతిరేకమని వైవీ పేర్కొన్నారు. 

15:30 - October 24, 2015

ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి పేదలను మోసం చేస్తున్నారని టి.కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అందరికీ ఇళ్లు ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఒక్కో నియోజకవర్గానికి 400 ఇళ్లు కేటాయించడం రుణమన్నారు. గత ప్రభుత్వ హాయాంలో నిర్మించిన ఇళ్లకు బిల్లులు చెల్లించలేదని, అసలు ఏ పద్దుల ద్వారా నిధులు కేటాయిస్తున్నారని మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. 

15:25 - October 24, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానికి పంపిన నివేదికలో ఏముందో బయటపెట్టాలని వైసిపి నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. శనివారం వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని రాష్ట్రానికి వచ్చే ముందు రాష్ట్ర ప్రభుత్వం ఏం కొరుకుంటుందో ముందే వివరణ అడుగారని, చంద్రబాబు మోసపూరిత మాటలతో ప్రజలను ఎన్ని రోజులు ఇబ్బంది పెడుతారని నిలదీవారు. ఇప్పటికి కూడా బాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి మాటలను చెప్పి ప్రజలను మోసం చేయవద్దని సూచించారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామన్నారు. 

15:19 - October 24, 2015

హైదరాబాద్ : లాస్యను హత్య చేసిన నిందితురాలు యాదమ్మ మృతి చెందింది. యాదమ్మను చితకబాదిన లాస్య తండ్రి, స్థానికులపై సనత్ నగర్ హత్య కేసు నమోదు చేశారు. ఈనెల 14వ తేదీన చిన్నారి లాస్యను యాదమ్మ దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర ఆగ్రహానికి గురైన లాస్య తండ్రి..స్థానికులు యాదమ్మను చితకబాదారు. తీవ్రగాయాల పాలైన యాదమ్మను గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వారం రోజులుగా యాదమ్మ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది.

కక్షలు..
దీన్‌ దయాళ్‌నగర్‌లో నవీన్‌చారి, మయూరి దంపతులు తమ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. వీరికి లాస్య (04)తో పాటు 3 నెలల బాబు ఉన్నాడు. వీరి ఇంటికి ఒకవైపు ఇళ్లల్లో పని చేసుకుంటూ జీవనం సాగించే లక్ష్మయ్య, యాదమ్మ కుటుంబం నివాసముంటోంది. కొన్ని వ్యక్తిగత కారణాలతో మయూరిపై కోపం పెంచుకున్న పద్మ కుటుంబ సభ్యులు, గిరి సహాయంతో ఎలాగైనా మయూరికి ప్రశాంతత లేకుండా చేయాలని పథకం వేశారు. ఆ విధంగా తమ కార్యాచరణ రూపొందించుకున్నారు.

14వ తేదీన హత్య..
ఇందుకు లక్ష్మయ్య కుటుంబ సభ్యులు తమ ఇంటి పక్కనే ఉండే నర్సయ్య, ఇందిరమ్మల సహాయం తీసుకున్నారు. ఈ నెల 14వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో బస్తీలో మున్సిపల్ సిబ్బంది ఫాగింగ్ చేపట్టారు. ఆ సమయంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన లాస్య ఇంటి ముందటే ఆడుకుంటోంది. ఫాగింగ్ అయిపోయిన తరువాత యాదమ్మ లాస్య దగ్గరకు వచ్చి చాక్లెట్ ఇస్తానని చెప్పి ఇంట్లోకి తీసుకువెళ్లింది. అప్పటికే ఇంట్లో ఉన్న వ్యక్తులచే లాస్యను మంచం కింద బలవంతంగా పడుకోబెట్టి దిండుతో ముఖంపై బలంగా అదిమి ఊపిరాడనీయకుండా చేసి హత్య చేశారు. అనంతరం గోనె సంచిలో లాస్య మృతదేహాన్ని భద్రపరిచారు. శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా దుర్వాసన అధికం కావడంతో అందరికి అనుమానాలు తలెత్తాయి. దుర్వాసన అదే విధంగా వస్తుండడంతో తలుపులు తెరవడంతో విషయం వెలుగు చూసింది. 

మాల్దీవుల ఉపాధ్యక్షుడు అరెస్టు..

ఢిల్లీ : మాల్దీవులు అధ్యక్షుడు ప్రయాణిస్తున్న బోట్ లో బాంబు దాడి జరిగిన కేసులో ఆ దేశ ఉపాధ్యక్షుడు అహ్మద్ అదీబ్ ను పోలీసులు అరెస్టు చేశారు. అధ్యక్షుడిని హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. 

ఆర్టీసీ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నాం - రఘువీరా..

హైదరాబాద్ : ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా తెలిపారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

ఘర్షణ పడి ఏం సాధించలేం - యనమల..

విజయవాడ : కేంద్రం..పొరుగు రాష్ట్రాలతో ఘర్షణ పడి ఏం సాధించలేమని ఏపీ ఆర్థిక మంత్రి యనమల స్పష్టం చేశారు. 13వేల గ్రామాల నుండి మట్టి తెస్తే వారి నమ్మకం..విశ్వాసాన్ని కించపరచవద్దని సూచించారు. 

 

మొహర్రం ఊరేగింపు..అదుపు తప్పిన అంబారీ..

హైదరాబాద్ : మొహర్రం సందర్భంగా నగరంలోని డబీర్ పురా బీబీ కా ఆలంలో మాతం ఊరేగింపు జరిగింది. ఈసందర్భంగా నిర్వహించిన అంబారీ అదుపు తప్పింది. ప్రజలు..పోలీసులపైకి అంబారీ దూసుకెళ్లింది. దీనితో కొంత ఆందోళన నెలకొంది. 

14:43 - October 24, 2015

హైదరాబాద్ : మొహర్రం పండుగ అనగానే మొదట గుర్తుకువచ్చేది ఇమామే హుస్సేన్. ఇమామే హుస్సేన్ మదిలో మెదలగానే రక్తపుటేరులతో ఎరుపెక్కిన కర్బలా మైదానం ముస్లింల కళ్లల్లో మెదులుతుంది. ఇమామే హుస్సేన్ ఎదుర్కొన్న అష్టకష్టాలు, త్యాగాలను గుర్తు చేసుకుంటూ పదకొండు నిరసన దినాలు పాటిస్తారు. ఇమామే హుస్సేన్ అమరుడై 1400 సంవత్సరాలు దాటింది. ఇమామే హుస్సేన్ మొహర్రం పండుగ ముందు రోజు అమరుడయ్యారు. అందుకు నిరసనగా 11రోజులు నిరసన దినాలు పాటించి 11వరోజు అయిన శనివారం నాడు షహాదత్‌ను ముస్లింలు ఘనంగా జరుపుకుంటారు. ఈ మొహర్రం మాసంతోనే ముస్లింల నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. మొహర్రం పండుగను ముస్లింలతో పాటు ముస్లిమేతర సోదరులు ఈ ఉత్సవాలలో ఉత్సాహంగా పాల్గొని మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నారు.
పాతబస్తీలో మొహర్రం సందర్భంగా పలు కార్యక్రమాలు జరిగాయి. మొహరం మాతం ను బీబీకా ఆలం నుండి ప్రారంభమైంది. ఈ సందర్భంగా యువకులు బ్లేడ్లతో గాయపరుచుకున్నారు. ఎలాంటి సంఘటనలు జరుగకుండా మూడు వేల మంది పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బందోబస్తు నిర్వహించారు. 

14:35 - October 24, 2015

పశ్చిమగోదావరి : జిల్లా తణుకులో కృపామణి ఆత్మహత్యకు కారణమైన ఆమె తల్లి, తండ్రి, సోదరుడికోసం పోలీసులు గాలిస్తున్నారు. అలాగే బాధితురాలిని బలవంతంగా వ్యభిచారంలోకి దింపేందుకు ప్రయత్నించిన సాయి శ్రీనివాస్‌కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు. ఆయన గురించి ఎలాంటి సమాచారం లభించినా 100 నెంబర్‌కు ఫోన్ చేసి చెప్పాలని పోలీసులు కోరుతున్నారు. సాయి శ్రీనివాస్ రాహుల్ గాంధీ, ప్రియాంక ఫోరం జాతీయ ఛైర్మన్‌గా ప్రచారం చేసుకునేవాడు. ఇతనిపై వివిధ కేసులున్నాయని పోలీసులు చెబుతున్నారు. గతంలో పలువురు అమ్మాయిలను ఇదే రకంగా వేధించారంటూ రౌడీషీట్ తెరిచామని ప్రకటించారు.

14:16 - October 24, 2015

హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నిక పోటీ విషయంలో టిడిపి..బిజెపి తర్జనభర్జన పడుతున్నాయి. ఎవరు పోటీ చేయాలనే దానిపై సందిగ్ధత నెలకొంది. తాము పోటీ చేస్తామని టిడిపి..తమకు అవకాశం ఇవ్వాలని బిజెపి కోరుతోంది. దీనితో ఎవరు పోటీ చేస్తారనే దానిప ఉత్కంఠ నెలకొంది. దీనిపై చర్చించేందుకు టిడిపి..బిజెపి సీనియర్ నేతలు గొల్కోండ హోటల్ లో భేటీ అయ్యారు. టిడిపి నుండి ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ, సీనియర్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి ఇతరులు హాజరు కాగా బిజెపి నుండి కిషన్ రెడ్డి, దత్తాత్రేయ, లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలంటే టిడిపి అభ్యర్థి బరిలో ఉండడమే శ్రేయస్కరమని టిడిపి నేతలు వాదిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ దీనిపై బిజెపి తీవ్ర అభ్యంతరం వ్యక్త చేస్తున్నట్లు సమాచారం. దొమ్మేటి సాంబయ్యకు అవకాశం ఇవ్వాలని టిడిపి కోరుతున్నట్లు సమాచారం. త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తామని బిజెపి పేర్కొంటోంది. చివరకు ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. 

14:09 - October 24, 2015

ఖమ్మం : రచయితలు, కవులు, కళాకారులపై సిరా దాడికి వ్యతిరేకంగా ఖమ్మంలో డివైఎఫ్ ఐ ఆందోళనకు దిగింది. బీజేపీ, శివసేన దిష్టిబొమ్మపై సిరాపోసి కార్యకర్తలు నిరసన తెలిపారు. మతమౌఢ్యాన్ని బిజెపి, ఆర్ ఎస్ ఎస్, వీహెచ్ పి లాంటి శక్తులు ప్రోత్సహిస్తున్నాయని మండిపడ్డారు.

 

14:07 - October 24, 2015

రంగారెడ్డి : ఓ వ్యక్తి ఇంట్లో ఉండగానే అధికారులు కూల్చివేశారు. దీనితో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన జిల్లాలోని జవహర్ నగర్ పీఎస్ పరిధిలో దేవేంద్రనగర్ లో చోటు చేసుకుంది. అక్రమ ఇళ్లు నిర్మాణం చేశారని అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. జేసీబీలతో వచ్చిన అధికారులు 120 ఇళ్లను కూల్చివేయడానికి రంగం సిద్ధం చేశారు. ఇటీవలే ఇక్కడ నివాసం ఉంటున్న వారికి నోటీసులు కూడా అందచేశారు. ఓ ఇంట్లో శ్రీనివాస్ గడియ పెట్టుకుని భోజనం చేస్తున్నాడు. ఇళ్లను కూల్చివేస్తున్నారన్న విషయం అతనికి తెలియదు. ఇంట్లో ఎవరన్నా ఉన్నారా ? లేదా ? అన్నది అధికారులు గమనించకుండా జేసేబీతో ఓ నివాసాన్ని కూల్చివేశారు. ఒక్కసారిగా ఇంట్లో నుండి అరుపులు..కేకలు వినిపించాయి. దీనితో ఇంట్లో గాయాలపాలైన శ్రీనివాస్ ను గుర్తించి రక్షించారు. శ్రీనివాస్ రోజు వారి కూలీ అని తెలుస్తోంది. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఇంట్లో ఎవరన్నా ఉన్నారా ? లేదా ? అన్నది అధికారులు నిర్ధారించకుండా కూల్చివేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం ఇళ్ల కూల్చివేతపై అధికారులు దృష్టి సారించారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

14:06 - October 24, 2015

నిజామాబాద్ : జిల్లాలో దారుణం జరిగింది. ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన స్ధానికంగా విషాదం నిపింది. నవీపేట్ మండలం అబ్బాపూర్‌లో అశోక్, సతీశ్, మదుకృష్ణ అనే ముగ్గురు విద్యార్థులు స్థానిక స్కూల్‌లో చదువుతున్నారు. దసరా సెలవుల్లో ఇంటికి వచ్చారు. ఆ ముగ్గురు చెరువులో స్నానం కోసం వెళ్లారు. నీటిలోకి దిగిన ఈ ముగ్గురూ చెరువులో చిక్కుకుపోయారు. స్థానికులు గమనించి బయటకు తీసేసరికే ప్రాణాలు కోల్పోయారు. వీరి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

 

 

రీమెక్ సినిమాలో నటిండం లేదు - మాధవన్..

చెన్నై : తాను ఎలాంటి రీమెక్ సినిమాలో నటించడం లేదని నటుడు 'మాధవన్' స్పష్టం చేశాడు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశాడు. 'తనీ ఒరువన్' సినిమాను తెలుగులో రీమెక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో 'రాం చరణ్' హీరోగా నటించనున్నాడు. విలన్ గా 'మాధవన్' నటించనున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై 'మాధవన్' క్లారిటీ ఇచ్చాడు. 

 

14:01 - October 24, 2015

కడప : జిల్లాలో 85 ఎర్రచందనం దుంగల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. రైల్వేకోడూరు ఉప్పరపల్లిలో కూంబింగ్‌చేస్తున్న పోలీసులకు ఈ దుంగలు కనిపించాయి.. ఈ దుంగల విలువ కోటిరూపాయలకుపైగా ఉంటుందని అధికారులు అంచనావేస్తున్నారు. ఈ ఘటనలో తప్పించుకున్న స్మగ్లర్లకోసం గాలిస్తున్నారు..

13:59 - October 24, 2015

విశాఖ : నిరసనలతో విశాఖ హోరెత్తింది.. ఆర్టీసీ చార్జీల పెంపును నిరసిస్తూ సీపీఎం ఆందోళన చేపట్టింది.. చార్జీలు తగ్గించాలంటూ పార్టీ ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. వెంటనే చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు..

 

13:57 - October 24, 2015

హైదరాబాద్ : ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో .. కేసీఆర్, బాబుల మధ్య చీకటి ఒప్పందం జరిగిందని ఆరోపించారు టీకాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి. ఓటుకు నోట కేసు, ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇద్దరు సీఎంల మధ్య సఖ్యత కుదిర్చేందుకే.. అమరావతి శంకుస్థాపనకు ప్రధాని వచ్చినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. 

13:55 - October 24, 2015

హైదరాబాద్ : ప్రత్యేక హోదాకోసం సరికొత్త నిరసన కార్యక్రమం చేపట్టినట్లు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తెలిపారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. మట్టి సత్యాగ్రహం పేరుతో పోరాటానికి సిద్ధమైనట్లు చెప్పారు. 16వేల గ్రామాలు, 3వేల వార్డుల నుంచి మట్టి సేకరించి ప్రధానమంత్రికి పంపుతామని ప్రకటించారు. వాటికి గ్రామ సర్పంచ్‌లు రాసిన లేఖలు జతచేస్తామని పేర్కొన్నారు.

 

ఆశారం సహాయకుడి హత్య కేసులో సీబీఐ విచారణ..

ఢిల్లీ : సాధువు ఆశారం కేసులో ప్రధాన సాక్షి హత్యపై సీబీఐ విచారణ చేపట్టింది. 16 ఏళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో ఆశారం 2013 ఆగస్టు నుండి జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆశారం ఇంట్లో వంటమనిషి, ఆయన సహాయకుడు అఖిల్ గుప్తా ప్రధాన సాక్షిగా ఉన్నాడు. ఈ ఏడాది జనవరి 11వ తేదీన అఖిల్ ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. దీనిపై విచారణ చేపట్టాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సీబీఐని కోరింది. 

మోటారు సైకిళ్ల ర్యాలీని ప్రారంభించిన బిగ్ బి..

ముంబై : పులుల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన మోటారు సైకిళ్ల ర్యాలీని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రారంభఙంచారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ మంగతి వార్ తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్ర పులుల సంరక్షణ అంబాసిడర్ గా బిగ్ బి వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 

నాంపల్లిలో బీజేపీ నేతల భేటీ..

హైదరాబాద్ : నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ నేతలు భేటీ అయ్యారు. సమావేశంలో వరంగల్ ఉప ఎన్నిక..తదితర అంశాలపై నేతలు చర్చిస్తున్నారు. 

 

స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన కేజ్రీ..

పంజాబ్ : ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్వర్ణదేవలయాన్ని సందర్శించారు. పంజాబ్ లో శాంతి నెలకొనాలని ఆయన ఆకాక్షించారు. ఈసందర్భంగా స్వర్ణదేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

13:53 - October 24, 2015

'తనీ ఒరువన్'..తమిళంలో ఈ సినిమా ఘన విజయం సాధించింది. దీనితో ఈ చిత్రంపై టాలీవుడ్ కన్ను పడింది. ఈ చిత్రాన్ని రీమెక్ చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. ఇందులో మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' హీరోగా నటిస్తున్నాడు. నటీ నటుల ఎంపిక చేపడుతున్నారు. 'తనీ ఒరువన్' సినిమాలో హీరో పాత్రతో పాటు విలన్ కు కూడా అధిక ప్రాధాన్యత ఉంది. తమిళంలో 'అరవింద్ గోస్వామి' నటించాడు. తెలుగులో ఎవరినీ నటిస్తే బాగుంటుందని నిర్మాతలు తర్జనభర్జన పడ్డారు. రానా..నుండి మొదలుకొని నాగార్జున వరకు పేర్లపై చర్చలు జరిగాయి. చివరకు లవర్ బాయ్ 'మాధవన్' చిత్రంలో విలన్ గా నటిస్తారని వార్తలు వచ్చాయి. దీనిపై 'మాధవన్' క్లారిటీ ఇచ్చాడు. తన నెక్ట్స్ ప్రాజెక్టు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశాడు. తాను ఓ రీమెక్ సినిమాలో నటిస్తున్నట్లుగా వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని కొట్టిపారేశాడు. 

13:39 - October 24, 2015

విజయవాడ : రెవెన్యూ శాఖలో అవినీతిని దశల వారిగా నివారిస్తామని మంత్రి కేఈ కృష్ణమూర్తి చెప్పారు. వచ్చే నెల 1 నుంచి మీ ఇంటికి-మీ భూమి రెండో విడత కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. మొదటి విడతలో గుంటూరు జిల్లా మొదటి స్థానం నిలవగా... కృష్జా జిల్లాల ఆఖరి స్థానంలో నిలిచిందన్నారు. గ్రామంలో పంచాయతీలో భూములు బదిలీకి ఆంక్షలు తొలగించామన్నారు. 

వచ్చే నెల 1 నుంచి 'మీ ఇంటికి-మీ భూమి' : కేఈ

విజయవాడ : వచ్చే నెల 1 నుంచి మీ ఇంటికి-మీ భూమి రెండో విడత కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. రెవెన్యూ శాఖలో అవినీతిని దశల వారిగా నివారిస్తామని చెప్పారు. మొదటి విడతలో గుంటూరు జిల్లా మొదటి స్థానం నిలవగా... కృష్జా జిల్లాల ఆఖరి స్థానంలో నిలిచిందన్నారు. గ్రామంలో పంచాయతీలో భూములు బదిలీకి ఆంక్షలు తొలగించామన్నారు. 

13:36 - October 24, 2015

షారూఖ్‌ ఖాన్‌ ద్విపాత్రాభినయంలో నటిస్తున్న చిత్రం 'ఫ్యాన్‌'. మనీష్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం లోగోను దసరా పండుగ నేపథ్యంలో విడుదల చేశారు. షారూఖ్‌ అభిమానులు 'ఐయామ్‌ ఏ బిగ్‌ ఫ్యాన్‌' అనే థీమ్‌సాంగ్‌ను పాడుతున్నట్లుగా లోగోను రూపొం దించడం విశేషం. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 15న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

13:35 - October 24, 2015

డెస్క్ టాప్‌ కంప్యూటింగ్‌లో భాగంగా మౌస్‌ ప్రధాన భూమిక పోషిస్తుంది. చాలా మందికి మౌస్‌ సాయంతోనే కంప్యూటర్‌ను ఆపరేట్‌ చేయటం తెలుసు. మౌస్‌ సాయంతో కీబోర్డు పని లేకుండా అనేక కమాండ్‌లను సెకన్ల వ్యవధిలో నిర్వహించుకోవచ్చు. మౌస్‌ డిజైనింగ్‌ విషయంలో అనేక మార్పులు వచ్చాయి. మౌస్‌ ఆపరేటింగ్‌లో కొత్తదనం కోరుకునే వారి కోసం వివిధ డిజైన్‌లతో కూడిన మౌస్‌లు అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్‌ మౌస్‌ ను తరచూ ఉపయోగించే వారి కోసం కొన్ని చిట్కాలు...

 • టెక్స్ట్ మొత్తం సెలక్ట్ అవ్వాలంటే కీబోర్డులోని షిప్ట్ 'కీ'ని హోల్డ్ చేసి ఉంచి మౌస్‌తో డాక్యుమెంట్‌ ముందు, చివరా రైట్‌ క్లిక్‌ చేయటం ద్వారా డాక్యుమెంట్‌లోని టెక్స్ట్ మొత్తం సెలక్ట్ అవుతుంది.
 • డాక్యుమెంట్‌లోని కావాల్సిన టెక్స్ట్‌ను సెలక్ట్ చేసుకోవాలంటే కీ బోర్డులోని కంట్రోల్‌ 'కీ'ని హోల్డ్ చేసి ఉంచి డాక్యుమెంట్‌లోని కావాల్సిన టెక్స్ట్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు.
 • విస్తరించిన కాంటెక్స్ట్ మెనూను చూడాలంటే కీబోర్డులోని షిప్ట్ 'కీ'ని హోల్డ్ చేసి ఉంచి ఫైల్‌ లేదా ఫోల్డర్‌ పై రైట్‌ క్లిక్‌ చేసినట్లయితే విస్తరించిన కాంటెక్స్ట్ మెనూను మీరు చూడొచ్చు.
 • స్క్రోలర్‌ను ఉపయోగించటం ద్వారా ఫొటో జూమ్‌ అవుతుంది. ఏదైనా ఫొటోను జూమ్‌ చేయాలంటే కీబోర్డులోని కంట్రోల్‌ 'కీ'ని హోల్డ్ చేసి మౌస్‌ మధ్యలోని స్క్రోలర్‌ను ఉపయోగిం చటం ద్వారా ఫొటో జూమ్‌ అవుతుంది.
 • డబుల్‌ క్లిక్‌ ఇస్తే చాలు ఓపెన్‌ చేసి ఉన్న నోట్‌ ప్యాడ్‌ లేదా వర్డ్ డాక్యుమెంట్‌ను డిలీట్‌ చేయాలంటే విండో బార్‌ ఎడమ వైపు పై భాగంలో డబల్‌ క్లిక్‌ ఇచ్చినట్లయితే విండోస్‌ క్లోస్‌ అవుతుంది. మినిమైజ్‌ లైదా మ్యాగ్జిమైజ్‌ చేయాలంటే విండో బార్‌ మధ్య భాగంలో డబల్‌ క్లిక్‌ ఇస్తే చాలు.
 • లింక్‌ను కొత్త ట్యాబ్‌లో ఓపెన్‌ చేయాలంటే ఏదైనా లింక్‌ను కొత్త ట్యాబ్‌లో ఓపెన్‌ చేయాలంటే కీబోర్డులోని కంట్రోల్‌ 'కీ'ని హోల్డ్ చేసి ఉంచి లింక్‌ పై రైట్‌ క్లిక్‌ చేసినట్లయితే లింక్‌ కొత్త ట్యాబ్‌లో ఓపెన్‌ అవుతుంది.
 • స్క్రోలర్‌ను క్లిక్‌ చేయటం ద్వారా మౌస్‌ మధ్యలోని స్క్రోలర్‌ను క్లిక్‌ చేయటం ద్వారా బ్రౌజర్‌లోని ట్యాబ్‌లను క్లోజ్‌ చేయవచ్చు.
13:31 - October 24, 2015

ఇటీవల చిన్నారుల కిడ్నాప్ లు అధికమౌతున్నాయి. పలు ప్రాంతాల్లో చిన్నారులను కిడ్నాప్ చేయడం..డబ్బులను డిమాండ్ చేయడం..హత్యలు చేయడం వంటి వార్తలను నిత్యం వింటూనే ఉంటుంటాం. దీనితో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతుంటారు. చిన్నారుల భద్రత అందుకోసం ఓ సంస్థ ఓ చిన్న పరికరాన్ని అందుబాటులో తెచ్చింది. అదే 'లోకస్‌' అనే పరికరం. పిల్లలను అనుక్షణం ఇది పసిగడుతుంది. జీపీఎస్‌, జీపీఆర్‌ఎల్‌ ఆధారంగా పని చేస్తుంది. స్కూల్‌ ఐడెంటికార్డు లాంటిదే 'లోకస్‌'. ఇది ఎల్లప్పుడూ ఆయా చిన్నారులు ఏ ప్రాంతంలో ఉన్నారో... ముందుగా సెట్‌ చేసిన పేరెంట్స్ మొబైల్‌ యాప్‌కి అప్‌డేట్స్ పంపుతుంది. దీంతో తల్లిదండ్రులు నిరంతరం తమ పిల్లల భద్రతపై ఓ కన్నేసి ఉంచొచ్చు. సేఫ్‌ జోన్‌, నాన్‌ సేఫ్‌ జోన్‌ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఒకవేళ ఆ చిన్నారి భద్రత లేని ఏరియాలోకి ప్రవేశిస్తే వెంటనే తల్లిదండ్రలను అలర్ట్ చేస్తుంది. మొబైల్‌ ద్వారా ఎస్‌ఎంఎస్‌ పంపుతుంది. . ఒకవేళ చిన్నారుల దగ్గరున్న డివైజ్‌కి బ్యాటరీ అయిపోవచ్చినా, స్విచాఫ్‌ అయినా ఈ తరహా సందేశం అందుతుంది. పిల్లలు ప్రయాణిస్తున్న వాహనం స్పీడ్‌ లిమిట్‌కి మించి ప్రయాణించినా సరే అలర్ట్ చేస్తుంది. ఇందులో సెట్‌ చేసిన ప్యానిక్‌ బటన్‌ని ప్రెస్‌ చేయడం ద్వారా తాము ప్రమాదంలో ఉన్నామనే సంకేతాన్ని పిల్లలు పేరెంట్స్ కు పంపొచ్చు. వెంటనే ఒక మొబైల్‌ కాల్‌ వారికి అందుతుంది. దీంతో పిల్లలున్న ప్రదేశంలో ఏం జరుగుతోందో తెలుసుకుని అందుకు తగిన చర్యలు చేపట్టేందుకు తల్లిదండ్రులకు అవకాశం ఉంటుంది.

13:27 - October 24, 2015

'శ్రీమంతుడు' చిత్రంతో ఊరిని దత్తత తీసుకోవడమనే ట్రెండ్‌కు తెరలేపిన మహేష్‌ బాబు ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌ జిల్లాలోగల సిద్ధాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం సిద్ధాపురం గ్రామస్థులు మహేష్‌బాబును కలిశారు. ఆల్‌ ఇండియా కృష్ణ, మహేష్‌ ఫ్యాన్స్ అధ్యక్షుడు ఖాదర్‌ గోరి ఆధ్వర్యంలో గ్రామస్థులు 'బ్రహ్మోత్సవం' షూటింగ్‌లో ఉన్న మహేష్‌ని కలిసి తమ ఊరిని దత్తత తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. సిద్ధాపురం గ్రామానికి రావాలని ఈ సందర్భంగా మహేష్‌ని కోరారు. గ్రామస్థులతో కాసేపు ఆప్యాయంగా మాట్లాడిన మహేష్‌ త్వరలో తప్పకుండా గ్రామానికి వస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ నర్సమ్మ, ఎంపీటీసీ బాలయ్య, శివాజీ యూత్‌, యువజన సంఘం కార్యకర్తలు పాల్గొన్నారు.

13:26 - October 24, 2015

ఈ ప్రపంచాన్ని అనుక్షణం మనకు చూపించే కళ్లు అలసిపోతే కళ్ల మంటలతో ఇబ్బందులు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత కంటిసమస్యలు వస్తాయి. అందుకే అలసిన కళ్ల గురించి కాస్త శ్రద్ధ తీసుకుంటే కంటి సమస్యలను నివారించవచ్చు. 
టీ ఆకులను మరిగించి, చల్లార నివ్వాలి. దీంట్లో ఐస్‌ పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని మృదువైన క్లాత్‌లో చుట్టి కనురెప్పలపై అయిదు నిమిషాలు ఉంచి తీయాలి. అలసిన కళ్లుకు ఎంతో ఉపశమనం లభిస్తుంది. 
అర కప్పు ఐస్‌వాటర్‌లో నాలుగు టీ స్పూన్ల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమంలో కాటన్‌ ముంచి కనురెప్పల మీద పది నిమిషాలు ఉంచి తీయాలి. ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రంగా ముఖం కడుకోవాలి. 
కీరా, టమాటా, బంగాళా దుంపలను చక్రాల్లా తరిగి ఫ్రిజ్‌లో ఉంచాలి. కళ్లు మంటగా అనిపించినప్పుడు వీటిని కాసేపు కళ్లపై ఉంచుకుంటే ఎంతో రిలాక్స్ గా ఉంటుంది. 

నెల్లూరు జిల్లాలో విష జ్వరాలు...

నెల్లూరు : సంగం, ఆత్మకూరు, ఎఎస్ పేట అనంతసాగరం మండలాల్లో విష జ్వరాలు ప్రభలాయి. వారం వ్యవధిలో 10 మంది మృతి చెందారు. 150 మంది జ్వరపీడితులు నెల్లూరు, చెన్నై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

13:25 - October 24, 2015

ఎంత అందమైన ముఖారవిందమైనా.. జిడ్డు కారుతుంటే అందమంతా ఆవిరైపోతుంది. అందుకే ఇంట్లోనే అందుబాటులో ఉండే వస్తువులతో మీ ముఖారవిందం మరింత మెరిసేలా చేసుకోవచ్చు. అదేలా అంటే ఈ చిట్కాలు పాటించి చూడండి..

 • రెండు టేబుల్‌ స్పూన్ల ఓట్‌మిల్‌ పొడిలో కోడిగుడ్డులోని తెల్లసొన, టీ స్పూన్‌ నిమ్మరసం కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వారానికి రెండు సార్లు క్రమం తప్పకుండా ఈ ప్యాక్‌ వాడుతోంటే చర్మం నిగారిస్తుంది.
 • ఆపిల్‌ పళ్ల పై పొట్టును చాలా మంది పడేస్తుంటారు. అలా కాకుండా ఈ పొట్టును మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. దీనికి ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముని వేళ్లతో ముఖంపై రాస్తూ.. ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి. ఆ తర్వాత మిగిలిన మిశ్రమాన్ని ప్యాక్‌లా వేయాలి. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేస్తే.. జిడ్డు మాయం అవుతుంది. 
 • ఒక స్పూన్‌ టమాటో గుజ్జులో అర స్పూన్‌ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
 • రెండు టీ స్పూన్ల ముల్తానా మట్టి, రెండు టీ స్పూన్ల రోజ్‌ వాటర్‌ కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని బ్రష్‌తో ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేయాలి. 
 • ఇలా ఇంట్లో అందుబాటులో ఉంటే వస్తువులతో ముఖానికి ప్యాక్‌ వేసుకుంటే మెరిసిపోయే అందం మీ సొంతం. 
13:19 - October 24, 2015

విజయనగరం : విజయనగర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవ ర్యాలీని రాష్ట్ర మంత్రి కిమిడి మృణాళిని ప్రారంభించారు. ఉత్సవాల సందర్భంగా ఈ మూడు రోజుల పాటు వివిధ సాంస్క్రతిక కార్యక్రమాలు, కళారూపాల ప్రదర్శనలు, క్రీడాపోటీలు నిర్వహించనున్నారు. ఇందుకు పట్టణంలో ఆరు వేదికలను ఏర్పాటు చేశారు. ర్యాలీ సందర్భంగా వివిధ జానపద కళారూపాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. విజయనగరం శ్రీపైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు తోడు విజయనగర ఉత్సవాలు జరుగుతుండటంతో పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది. 

13:04 - October 24, 2015

హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నికలో అభ్యర్థి ఎన్నిక, ఇతర అంశాలపై చర్చించేందుకు.. టిటిడిపి నేతలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో సమావేశమయ్యారు. ఈ భేటీకి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, సీనియర్ నేత ఎర్రబెల్లి హాజరయ్యారు.

 

ఎన్ టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీటీడీపీ నేతల భేటీ

హైదరాబాద్ : ఎన్ టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీటీడీపీ నేతల భేటీ అయ్యారు. వరంగల్ ఉప ఎన్నిక అంశంపై చర్చిస్తున్నారు. ఉప ఎన్నికలో టీడీపీ పోటీ చేయాలనే యోచనలో నేతులున్నట్లు సమాచారం.

 

మధ్యాహ్నం 1 గంటకు బీజేపీ,టీడీపీ నేతల సమావేశం

హైదరాబాద్ : మధ్యాహ్నం 1 గంటలకు గోల్కొండ హోటల్ లో బీజేపీ,టీడీపీ నేతల ముఖ్య నేతల ముఖ్య సమావేశం జరుగనుంది. వరంగల్ ఉప ఎన్నికపై చర్చ జరుగనుంది. 

చంద్రబాబు ప్రత్యేకహోదా కోసం డిమాండ్ చేయలేదు : దిగ్విజయ్

ఢిల్లీ : అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో చంద్రబాబు ప్రత్యేకహోదా కోసం డిమాండ్ చేయలేదని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. మోడీ ప్రత్యేకహోదా ప్రకటించకుండా ప్రజలను నిరాశపరిచారని విమర్శించారు. ఎపికి ప్రత్యేకహోదా కల్పించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందన్నారు.

 

12:46 - October 24, 2015

తూర్పుగోదావరి : ప్రేమించింది...ఆ విషయం ఇంట్లో చెప్పింది...కూతురి అందాన్ని అమ్ముకోవాలనుకున్న ఆ కన్నవారు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆ అమ్మాయి ప్రేమించినవాడితో మూడుముళ్లు వేయించుకుంది...కూతురు చేజారిపోయిందని కక్షతో రగిలిపోయారు.. ఆ రోజు నుంచి కూతురి జీవితాన్ని ఎలా బుగ్గిపాలు చేయాలో ప్లాన్ చేసుకున్నారు.. అమ్మానాన్న..మరోవైపు సోదరుడు..ఇలా ఆ కుటుంబం మొత్తం ఆ అమాయకురాలి బతుకును నాశనం చేసేందుకు రెడీ అయ్యారు..ఇలా అనుకున్నవారు అనుకున్నట్లే చేశారు..హాయిగా సంసారం చేసుకుంటున్న కూతురి జీవితాన్ని ఓ అర్ధరాత్రి నాశనం చేశారు. ఆ తర్వాత ఆమెను వేధించడం..చిత్రహింసలకు గురిచేయడం మొదలుపెట్టారు...బలన్మరణానికి ముందు ఆమె రాసిన ప్రతీ అక్షరం అమాయకురాలు పడుతున్న వేదనను బయటపెట్టింది...ఇది ఓ అమ్మాయి కన్నీటి వ్యథ...
కన్నవారి వేధింపులు...
యస్... కన్నవారి వేధింపులు... డబ్బులిచ్చి గదిలోకి వచ్చిన దుర్మార్గుడు..ఇలా ప్రతీ ఒక్కరి హింస తట్టుకోలేకపోయింది... వారి బారి నుంచి తప్పించుకోలేకపోయింది..వారి అంగబలం..అర్థబలం ముందు తలవంచలేకపోయింది..చివరకు ఆత్మహత్య చేసుకుంది... నిజమే..కృపామణి తన జీవితాన్ని ముగించేసుకుంది... 'నా కన్నవారే నాకు శత్రువులయ్యారు. నా సంసారాన్ని నాశనం చేయబోయారు. నా బతుకును బుగ్గిపాలు చేయాలనుకున్నారు. నా భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్తే గదిలో బంధించారు. కన్నతల్లిదండ్రులు చేసే పనేనా'.... ఇది ఓ ఇల్లాలి వేదన...అంతే కాదు...తన జీవితాన్ని బుగ్గిపాలు చేసిన కన్నవారు శత్రువలయ్యారు...పుట్టెడు దుఖ్ఖంతో వెళ్తే తన బతుకును నాశనం చేశారు... ఇవేవీ గాకుండా తనను వ్యభిచారం చేయాలంటూ బెదిరిస్తుండడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకుని నిర్ణయించుకుంది.. 'నేను చచ్చిపోతున్నా... నా చావుతోనైనా మార్పు రావాలి.. నా భర్తకు, కొడుక్కి రక్షణ కల్పించండి... నా మరణం తర్వాత వాడికి కఠిన శిక్ష వేయండి... ఇక నేను లేను...బై..బై'....అంటూ చనిపోయే ముందు తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ లేఖ రాసిన ఇల్లాలు తన ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీసి రెండు నిమిషాలు మాట్లాడింది...ఆ తర్వాత వెళ్లి కాలువలో పడి చనిపోయింది.
కూతురు భవిష్యత్తును ఎందుకు నాశనం చేశారు. ఆ ఇల్లాలికి జరిగిన అన్యాయాన్ని ప్రతీ అక్షరంలో తెలిపింది...తన బాధను వెల్లగక్కింది..తన బతుకు బుగ్గిపాలు కావడానికి కారణం కన్నవారేనని చెప్పింది...ఇంతటి ఘోరానికి పాల్పడిన ఆ దుర్మార్గులు సాధించిందేంటి..? కూతురు భవిష్యత్తును ఎందుకు నాశనం చేశారు...??? పెళ్లయి హాయిగా ఉన్న ఆ ఇల్లాలిపై కన్నేసిన కిరాతకుడు ఎందుకు తెగించాడు..??
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఘటన 
పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన వెల్దుర్తి కృపామణి, అదే గ్రామానికి చెందిన పవన్‌కుమార్ ను ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది...వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు...ఉన్నంతలో హాయిగానే ఉంటున్న ఆ కూతురు ప్రేమ వివాహం నచ్చని కన్నవారు ఆమెను వ్యభిచారంలోకి దించేందుకు ప్రయత్నాలు చేశారు.. ఇది ముందే పసిగట్టిన కృపామణి పెళ్లి తర్వాత భర్తతో వేరు కాపురం పెట్టుకుని జీవిస్తోంది....
భర్తతో చిన్న చిన్న పొరపొచ్చాలు..
ప్రేమించి పెళ్లి చేసుకున్న కృపామణి, పవన్‌ల మధ్య చిన్న చిన్న పొరపొచ్చాలున్నాయి..ఈ క్రమంలోనే ఒకానొక సమయంలో భర్తతో ఘర్షణపడి కొన్ని రోజుల పాటు తల్లి దగ్గరకు వెళ్లింది...అప్పటికే ఆమెను వ్యభిచారంలోకి దించాలని చూస్తున్న తల్లిదండ్రులు లక్ష్మి, రామలింగేశ్వరరావులు కొడుకుతో కలిసి ప్లాన్ చేశారు...ఒక గదిలో బంధించి గుడాల శ్రీనివాస్ అనే వ్యక్తిని కూతురిని బంధించిన గదిలోకి పంపారు...శ్రీనివాస్ ఆమెను కొట్టి నగ్నంగా ఫొటోలు, వీడియోలు తీసి ఆమెను లొంగదీసుకున్నాడు.
మొదలయిన శ్రీనివాస్‌ బ్లాక్‌మెయిలింగ్...
ఇక మళ్లీ భర్త వద్దకు వెళ్లి హాయిగా ఉంటున్న ఆమెను నీడలా వెంటాడాడు శ్రీనివాస్...ఆమె నగ్నదృశ్యాలు..ఫోటోలు తీసిన శ్రీనివాస్ నెల రోజుల తర్వాత రాకుంటే నెట్‌లో పెడతానంటూ బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు...దీంతో మనస్తాపం చెందిన కృపామణి తన బతుకును బుగ్గిపాలు చేశారని చివరకు నిర్ణయం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కృపామణి రాసిన సూసైడ్ నోట్‌తోపాటు తన చావుకు గల కారణాలను వివరిస్తూ తీసిన సెల్ ఫోన్ వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు....జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు...

 

12:26 - October 24, 2015

మహబూబ్‌నగర్‌ : జిల్లాలోని వనపర్తి డివిజన్‌ గ్రామాల్లో మొహర్రం ప్రశాంతంగా జరిగింది.. పెద్దగూడెం బురన్‌ దర్గాలో ముస్లింలు మొక్కులు చెల్లించుకున్నారు.. ఇతర మతస్తులు కూడా దర్గాలో ప్రార్థనలు చేశారు.. ఈ గ్రామంలో మొహరం ఉత్సవాలు భారీస్థాయిలో నిర్వహిస్తారు.. ప్రజలు మాళీజా తయారుచేసి బుర్రన్ స్వామికి సమర్పించారు..

 

12:24 - October 24, 2015

నెల్లూరు : కోరిన కోర్కెలు తీర్చే బారాషాహీద్ రొట్టెల పండుగ నెల్లూరు వైభవంగా ప్రారంభమైంది. ఏటా 4రోజుల పాటు జరిగే ఈ వేడుకకు మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన వారితో దర్గా ప్రాంగణం కిటకిటలాడుతోంది. మత సామరస్యానికి చిహ్నంగా మారిన ఈ దర్గాలో జరిగిన రొట్టెల పండుగలో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు.

 

12:16 - October 24, 2015

విశాఖ : ఓ విద్యార్థి తను చనిపోతూ... మరో నలుగురికి ప్రాణదానం చేశాడు. నగరంలోని మణిపాల్‌ ఆసుపత్రిలో 17 ఏళ్ల బాలుడు బ్రెయిన్‌డెడ్‌ అయ్యారు. రెండురోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో హరినాథ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బాలుడు బ్రెయిన్‌డెడ్‌తో అవయవదానం చేసేందుకు కుటుంబసభ్యులు అంగీకరించారు. కిడ్నీ, లివర్‌లను విశాఖ కేర్‌ ఆసుపత్రికి, గుండెను చెన్నైలోని ఆసుపత్రికి పంపిస్తామని వైద్యులు చెప్పారు. కళ్లు.. మోషన్ ఐ బ్యాంకుకు అప్పగిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. తల్లిదండ్రుల నిర్ణయానికి ప్రతిఒక్కరు అభినందనలు తెలుపుతున్నారు. 

ఆర్టీసీ చార్జీలు పెంచడం అన్యాయం : బాబూరావు

విజయవాడ : ఆర్టీసీ చార్జీల పెంపును నిరసిస్తూ... విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా రాజధాని ప్రాంత సీపీఎం కన్వీనర్ సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలు పెంచి దొంగ దెబ్బ తీసిందని... ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని విమర్శించారు. పెంచిన ఆర్టీసీ చార్జీల వల్ల ప్రజలపై రూ.350 కోట్ల భారం పడనుందని తెలిపారు. డీజిల్ ధరలు తగ్గినా చార్జీలు పెంచడం అన్యాయమన్నారు.

 

నేడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కొమురంభీమ్ సంస్మరణ సభ

హైదరాబాద్ : ఉదయం 11.45 గంటలకు గిరిజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కొమురంభీమ్ సంస్మరణ సభ జరుగనుంది. 

11:32 - October 24, 2015

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగాయి. ఆర్టీసీ యాజమాన్యం 10 శాతం ఛార్జీలను పెంచారు. కొత్త చార్జీలుర నేటి నుంచి అమలు కానున్నాయి. ఎపిలో ఆర్టీసీ ఛార్జీల పెంపునపై విపక్షాలు, ప్రజలు భగ్గుమంటున్నారు. ఛార్జీలు పెంచబోమంటూనే... ఇలా భారం వేయటంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించాలంటూ.. విపక్షాలన్ని ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఈమేరకు విజయవాడలోని పండిట్ నెహ్రూ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాజధాని ప్రాంతం సీపీఎం కన్వీనర్ బాబూరావు మాట్లాడుతూ ఎపిలో ఆర్టీసీ ఛార్జీల పెంచడం దుర్మార్గమన్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రకటించిన 5 గంటల్లోనే పెంచిన ఛార్జీలను అమలు చేయడం నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. ఎపికి ప్రత్యేకహోదా రాలేదు, ప్యాకేజీ రాలేదని... కానీ ఆర్టీసీ ఛార్జీల పెంపు భారం మాత్రం ప్రజలపై పడిందన్నారు. డీజిల్ ఛార్జీలు తగ్గినప్పుడు.. బస్సు ఛార్జీలు ఎలా పెరుగుతాయని ప్రశ్నించారు. పేదలపై భారాలు వేయడానికి ప్రభుత్వాలకు హక్కు ఎవరిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఛార్జీలు పెంచితే ఊరుకోమని.. ఆందోళలను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. 

10:58 - October 24, 2015

హైదరాబాద్ : ఏపీ రాష్ట్రంలో ఆర్టీసీ చార్జీలు మరోసారి పెరిగాయి. ఆర్టీసీ చార్జీలను 10 శాతం పెంచారు. తెలుగు వెలుగు సర్వీసులపై 5శాతం, లగ్జరీ, సూపర్ లగ్జరీ, డీలక్స్, వోల్వోలపై 10శాతం పెంచారు. కిలోమీటర్ కు 8, 9పైసల అదనపు భారం పల్లె వెలుగు బస్సుల్లో కిలోమీటరుకు 3 పైసల చొప్పున చార్జీలను పెంచుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో కిలోమీటరుకు 8 పైసల చొప్పున పెంచారు. అదే విధంగా సూపర్ లగ్జరీ, వెన్నెల, గరుడ బస్సుల్లో కిలోమీటరుకు 9 పైసల చొప్పున టికెట్ ధరలు పెరిగాయి. పెంచిన చార్జీలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. చార్జీల పెంపుపై వామపక్షాలు, విపక్షాలు, ప్రజా సంఘాలు భగ్గుమంటున్నాయి. పెంపును త్రీవంగా వ్యతిరేకిస్తున్నాయి. పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళన, పోరాటాలను చేపట్టారు.
గుంటూరు...
ఆర్టీసీ చార్జీలు పెంచడం చాలా అన్యాయం. రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా రూ.3 కోట్ల భారాన్ని ప్రజలపై వేసింది. ఇప్పిటికే నిత్యవసర ధరలు భగ్గుమంటున్నాయి. మళ్లీ ఛార్జీలను పెంపు దుర్మార్గం. ఎపి రాజధాని శంకుస్థాపనకు అయిన ఖర్చును పూడ్చుకోవడానికి ప్రభుత్వం బస్సు చార్జీ ధరలను పెంచారు. వందలాది కోట్ల రూపాయలను భూమి పూజ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు వెచ్చించారు. పేదలపై పన్నులు వేసి.. పెద్దలకు దోచిపెడుతున్నారు. పేదలు మరింత పేదలవుతున్నారు. సంపన్నులు, మరింత సంపనున్నలగా మారుతున్నారు. ధరలు, చార్జీల పెంపు రాష్ట్ర ప్రభుత్వ దివాళకోరుతనానికి నిదర్శనం. అన్ని దళిత, ప్రజా సంఘాలను కలుపుకుని పోరాటం చేస్తాం అని చెప్పారు.
విశాఖ...
చార్జీల పెంపుతో ప్రజలపై రూ.18 కోట్ల రూపాయల భారం పడనుంది. ప్రభుత్వమే కావాలని రాష్ట్రాన్ని నస్టాల ఊబిలోకి నెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో ఇప్పటికే నిత్యవసర ధరలు పెరిగాయి. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు మళ్లీ ఆర్టీసీ చార్జీలు పెంచారు. పేద ప్రజలకు ఇచ్చే సబ్సిడీలను తీసేస్తున్నారు. శంకుస్థాపనకు వృధాగా ఖర్చు పెట్టారు. పుష్కరాలకు డబ్బులను వృధాగా ఖర్చు పెట్టారు. పెంచిన ఛార్జీలను తగ్గించాలి. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని వామపక్ష నేతలు హెచ్చరిస్తున్నారు.
విజయవాడ ...
ఆర్టీసీ చార్జీలు పెంచి.. ప్రభుత్వం దొంగదెబ్బ తీసింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టారు. సీపీఎం ఆధ్వర్యంలో విజయవాడ పండింట్ నెహ్రూ బస్టాండులో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. చార్జీల పెంపును దసరా కనుగా చంద్రబాబు ప్రజలకు ఇచ్చారు. ప్రకటించిన ఐదు గంటలలో అమలు చేశారు. రూ.350 కోట్ల భారం వేశారు. రాష్ట్ర అభివృద్ధికి 15 నెలలు సరిపోవన్న సీఎంకు ఛార్జీలు పెంచడం మాత్రం సాధ్యమవుతుందా.. అని ప్రశ్నించారు.
తిరుపతి...
ఎపిలో ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు బాధాకరం. పేదలు, మధ్యతరగతి ప్రజలపై పెను భారం పడనుంది. పేద కుటుంబాలు ఎలా బతకాలి...ఛార్జీలను తగ్గించాలి... 
 

 

నేటి నుంచి ఎపిలో ఆర్టీసీ కొత్త ఛార్జీలు అమలు

హైదరాబాద్ : ఏపీ రాష్ట్రంలో ఆర్టీసీ చార్జీలు మరోసారి పెరిగాయి. ఆర్టీసీ చార్జీలను 10 శాతం పెంచారు. తెలుగు వెలుగు సర్వీసులపై 5శాతం, లగ్జరీ, సూపర్ లగ్జరీ, డీలక్స్, వోల్వోలపై 10శాతం పెంచారు. కిలోమీటర్ కు 8, 9పైసల అదనపు భారం పల్లె వెలుగు బస్సుల్లో కిలోమీటరుకు 3 పైసల చొప్పున చార్జీలను పెంచుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో కిలోమీటరుకు 8 పైసల చొప్పున పెంచారు. అదే విధంగా సూపర్ లగ్జరీ, వెన్నెల, గరుడ బస్సుల్లో కిలోమీటరుకు 9 పైసల చొప్పున టికెట్ ధరలు పెరిగాయి. పెంచిన చార్జీలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. 

10:34 - October 24, 2015

హైదరాబాద్ : ఎల్ బినగర్ లో చోరీ.. దసరా పండక్కి సొంతూరుకువెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్లయింది.. దొంగలు నగలు, డబ్బు దోచుకోవడంతోపాటు... ఇంట్లో ఉన్న ఆహారపదార్థాలు ఖాళీ చేశారు. మద్యం మొత్తం తాగి... చికెన్ వండుకొని తినేశారు. హైదరాబాద్‌ ఇంద్రప్రస్థకాలనీ, జనప్రియ ఎన్‌క్లేవ్‌లో ఈ చోరీలు జరిగాయి. వరుసగా నాలుగు ఇళ్లను దోచుకున్నారు దొంగలు. లక్ష రూపాయల నగదు, ఆరు తులాల బంగారం ఎత్తుకెళ్లారు.. 

10:29 - October 24, 2015

హైదరాబాద్ : సామాజిక వెబ్‌సైట్లు దేశ విదేశాలను దగ్గర చేస్తున్నాయి. కానీ ఇదే సామాజిక సైట్లు మోసాలకూ పురిగొల్పుతున్నాయి. అందుకు ఉదాహరణే తాజాగా హైదరాబాద్‌లో జరిగిన సంఘటన. ఫేస్‌బుక్‌ను అడ్డుపెట్టుకుని ఏకంగా మూడు వందల మంది అమ్మాయిలను ట్రాప్‌ చేశాడు. ఎంతో పకడ్బందీగా ఈ అమ్మాయిల ట్రాపింగ్‌ వ్యవహారాన్ని నడిపాడు. అయినా మోసం ఎక్కవకాలం దాగదు కదా..? చివరకు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళక తప్పలేదు.
మూడొందల మంది అమ్మాయిలకు వల
ఒకళ్లు కాదు... ఇద్దరు కాదు... ఏకంగా మూడు వందల మంది అమ్మాయిలకు వల వేశాడు. ఫేస్‌ బుక్‌ అడ్డాగా ప్రేమ వ్యాహారం సాగించాడు. అయితే మోసం ఎక్కవకాలం సాగదని గుర్తించలేక పోయాడు. చివరికి కటకటాల పాలయ్యాడు. 2011లో ఎఫ్ సీఐ అసిస్టెంట్ మేనేజర్ గా హైదరాబాదు వచ్చిన మధు, 2012 నుంచి అమ్మాయిలను మోసం చేయడం ప్రారంభించాడు. కేవలం ఫోన్ నెంబర్ల ఆధారంగా అతను అమ్మాయిలపై వల వేసి సోషల్ మీడియా ఆధారంగా వారిపై వేధింపులకు పాల్పడేవాడు.
మూడు నకిలీ ఫేస్ బుక్ అకౌంట్లు
కెరీర్ ఎడ్యుకేషనల్ సర్వీస్ పేరుతో కన్సల్టెన్సీ ఓపెన్ చేశానని, విద్యకు సంబంధించిన సలహాలు ఇస్తానని చెప్పి సుమారు 300 మంది అమ్మాయిలను మోసం చేశాడని పోలీసులు చెప్పారు. ఇతను కేవలం అమ్మాయిల కోసం 13 రిజిస్టర్లు మెయింటైన్ చేశాడు. ఈ 13 రిజిస్టర్లలో సుమారు 5వేల మంది అమ్మాయిల పేర్లు నమోదై ఉన్నాయి. మూడు నకిలీ ఫేస్ బుక్ అకౌంట్లు క్రియేట్ చేసి వాటి ద్వారా వారిని ముగ్గులోకి లాగేవాడు. ఈ ఛాటింగ్‌లే తనను పట్టిస్తాయని గుర్తంచలేకపోయాడు.
ఛాటింగ్ కు 14 సిమ్ కార్డుల వాడకం
తన వద్ద ఉన్న రిజిస్టర్ లోని అమ్మాయికి ఫోన్ చేసేవాడని, ఆ సమయంలో స్టూడెంట్ కానీ, తల్లిదండ్రులు కానీ అతనికి వార్నింగ్ ఇస్తే వారి పేరు ఎదురుగా డేంజర్ అని రాసుకునేవాడు. కొంత మంది పేరు ఎదుట వేస్ట్‌ అని రాశాడని, మరి కొంత మంది పేరు ఎదుట ఓవర్ అని రాశాడు. అలా సుమారు 300 నుంచి 500 మందిని మోసం చేశాడు. అమ్మాయిలతో ఫోన్ లో ఛాటింగ్ కు 14 సిమ్ కార్డులు తీసుకున్నాడు. వాటితోనే మధు మోసాలు చేయడం ప్రారంభించాడు. అయితే ఈ మోసగాడి బండారం బయటపడింది. పోలీసులు అతని అరెస్టు చేసి కటకటాల వెనక్కు నెట్టాడు. ఇతనిపై 2013లో సైఫాబాద్ లో ఒకటి, 2014లో హయత్ నగర్, కుషాయి గూడలో ఒకటి చెప్పున కేసులు నమోదయ్యాయని చెప్పారు. అయితే పోలీసులను సైతం బోల్తా కొట్టించడానికి ప్రయత్నించాడు.
ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరింపు
ఘరానా మోసగాడు మధు రెండు అద్దె ఇళ్లు తీసుకుని ఇతనీ మోసాలు చేసేవాడు. ఎవరైనా ఎదురు తిరిగితే తను తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించేవాడని, అలా చాలామందిని చాలా సార్లు మోసం చేశాడని పోలీసులు వివరించారు.

 

10:00 - October 24, 2015

మహబూబ్ నగర్ : తెలంగాణలో మళ్లీ స్వైన్ ఫ్లూ కలకలం రేగింది. జిల్లాలో నలుగురికి స్వైన్ ఫ్లూ నిర్థారణ అయింది. స్వైన్ ఫ్లూ సోకిన వారిలో ముగ్గురు వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులున్నారు. ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం, ఆసుపత్రి సిబ్బంది జాగ్రత్తలు తీసుకోకపోవడంతో... వారికి కూడా స్వైన్ ఫ్లూ సోకిందని అధికారులు తెలిపారు. 

08:33 - October 24, 2015

ఎపి సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను విస్మరిస్తున్నారని వక్తలు విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా.. ఓ సేల్స్ మెన్ లా వ్యవహరిస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు గఫూర్, బిజెపి నేత ప్రకాశ్ రెడ్డి, వైసిపి నేత కరణం ధర్మశ్రీ, టీడీపీ నేత సతీష్ మాదిగ పాల్గొని, మాట్లాడారు. రాజధాని విషయంలో కేంద్రప్రభుత్వంపై చంద్రబాబు ఒత్తిడి తేవడం లేదన్నారు. ప్రత్యేకహోదా వస్తేనే ఏపీ అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. ఎపిలో ఆర్టీసీ చార్జీల పెంపు మాట్లాడారు. ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు పరికాదన్నారు. వెంటనే చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని హితవు పలికారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

తెలంగాణలో మళ్లీ స్వైన్ ఫ్లూ కలకలం

మహబూబ్ నగర్ : తెలంగాణలో మళ్లీ స్వైన్ ఫ్లూ కలకలం రేపింది. మహబూబ్ నగర్ జిల్లాలో నలుగురికి స్వైన్ ఫ్లూ నిర్ధారణ అయింది. స్వైన్ ఫ్లూ సోకినవారిలో ముగ్గురు వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులున్నారు.

 

08:14 - October 24, 2015

ఢిల్లీ : సాహిత్యకారులు ప్రభుత్వానికి ఇచ్చేసిన అవార్డులు, పదవులను తిరిగి స్వీకరించాలని.. కేంద్ర సాహిత్య అకాడమీ విజ్ఞప్తి చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో సాహితీ వేత్తల హత్యల పట్ల.. అకాడమీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మరోవైపు.. అకాడమీ సమావేశానికి ముందు.. సాహిత్య కారులు.. ఢిల్లీ వీధుల్లో మౌన ర్యాలీ నిర్వహించారు. సాహిత్యవేత్తల కలవరం.. నిరసనల నేపథ్యంలో.. కేంద్ర సాహిత్య అకాడమీ స్పందించింది. సాహితీవేత్తలు ఒకరి వెంట ఒకరుగా అకాడమీ పురస్కారాలను వాపస్‌ చేస్తున్నా.. కేంద్ర సాహిత్య అకాడమీ మౌనంగా ఉండడం పట్ల.. రచయితలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రచయితలను శాంతింప చేసేందుకు.. కేంద్ర సాహిత్య అకాడమీ ఎగ్జిక్యూటివ్‌ బాడీ... శుక్రవారం ఢిల్లీలో అత్యవసరంగా సమావేశమైంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో రచయితల హత్యలను తీవ్రంగా ఖండించింది. సమాజంలో శాంతియుత వాతావరణాన్ని కొనసాగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. అదే సమయంలో.. సాహిత్యకారులు.. ప్రభుత్వానికి వాపస్‌ చేసిన పురస్కారాలను తిరిగి తీసుకోవాలనీ అభ్యర్థించింది.
రచయితలు మౌన ర్యాలీ
కేంద్ర సాహిత్య అకాడమీ ఎగ్జిక్యూటివ్‌ బాడీ సమావేశానికి ముందు.. రచయితలు మౌన ర్యాలీ నిర్వహించారు. సఫ్దర్‌ హష్మీ మార్గ్‌లోని శ్రీరాం సెంటర్‌ నుంచి సాహిత్య అకాడమీ భవనం వరకూ ర్యాలీ నిర్వహించారు. రచయితల వాక్‌ స్వాతంత్ర్యాన్ని పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకునేలా తీర్మానం చేయాలని కోరుతూ అకాడమీ అధ్యక్షుడికి మెమొరాండం సమర్పించారు. ఇప్పటివరకూ సుమారు 40 మంది రచయితలు సాహిత్య అకాడమీ అవార్డులను వెనక్కి ఇచ్చేశారు. అకాడమీ విన్నపంపై వీరు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

08:08 - October 24, 2015

నెల్లూరు : దేశం నలుమూలల నుంచే కాదు, ఇతర దేశాలనుంచి వచ్చి పండగ చేసుకుంటారక్కడ. వేడుకలను చూసి తరించేందుకు వేయికళ్లతో ఎదురుచూస్తారు. లక్షలాదిమంది దేశవిదేశీయులు వచ్చే ఆపండగ విశిష్టత అంతా ఇంతా కాదు. నిర్వాహకులు సైతం అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. ఇంతకీ ఆపండగ ఏమిటి..అదెక్కడ జరుగుతోంది.
నెల్లూరు జిల్లాలో వైవిధ్య ఉత్సవం
నెల్లూరు జిల్లాకే విశిష్టతను తెచ్చిపెట్టే వైవిధ్య ఉత్సవమిది. కోరిన కోర్కెలు తీర్చే సంబరాల రొట్టెల పండుగ ప్రతి ఏటా మొహర్రం నెల ప్రారంభమయిన తర్వాత వచ్చే 11వ రోజు నుంచి 3రోజుల పాటు జరుగుతుంది. అయితే ఈ ఏడాది మాత్రం నాలుగు రోజులు పాటు ఈ పండుగను జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మతసామరస్యానికి ప్రతీకగా అంగరంగవైభవంగా రొట్టెల పండగను జరుపుకునేందుకు జిల్లాలోని బారాషాహిద్ దర్గా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. దేశంలోని పలు రాష్ట్రాల నుంచే కాకుండా పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, సౌదీ అరబ్‌ దేశాలనుంచి రొట్టెల పండగకు రెండు రోజుల ముందుగానే తరలివస్తారు. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ పండుగ ఈనెల 24న శనివారం రోజు ప్రారంభమై 28వరకు జరగనుంది. రొట్టెల పండుగను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు, అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
ప్రత్యేక వసతులు ఏర్పాటు
భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక వసతులు ఏర్పాటు చేసింది బారాషాహిద్‌ దర్గా కమిటీ. భద్రత కోసం సిసి కెమెరాల్ని ఏర్పాటు చేశారు. ఇక పండగ జరిగే 16 ఎకరాల ప్రాంతంలో పోలీసుల గట్టి బందోబస్త్‌ ఏర్పాటు చేసారు. అయిదు ప్రాంతాల్లో వాహనాలకు పార్కింగ్‌ ఏర్పాట్లు చేసారు. నెల్లూరు జిల్లాలోని పలు స్వచ్చంధ సంస్థలు, స్థానికులు భక్తుల కోసం మంచినీరు, ఉచిత భోజన వసతి ఏర్పాటుచేస్తున్నారు. రకరకాల ఆటవస్తువులు, ఫ్యాన్సీ, పూజ సామగ్రి దుకాణాలు, హోటళ్లు, బట్టల అంగళ్లు వెలియడంతో బారాషాహిద్‌ దర్గా ప్రాంతమంతా సందడి నెలకొంది.
కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం
కొత్తగా కోర్కెలు కోరుకునే వారు..అప్పటికే ఆ కోరిక తీరిన వారి చేతుల మీదుగా రొట్టెలను అందుకుంటారు. కోర్కె తీరిన వారు స్వయంగా అయిదు రొట్టెలను తయారు చేస్తారు. ఒకదాన్ని ఇంట్లో ఉంచి, మిగిలిన నాలుగింటినీ దర్గా దగ్గరకు తీసుకువస్తారు. సమాధుల్ని దర్శించుకుని చెరువు వద్దకు తీసుకెళ్తారు. నీళ్లను తలపై చల్లుకుని, కోర్కెలు నెరవేరాలంటూ వాటిని అవి కావాల్సిన వారికి అందజేస్తారు. ఎన్ని కోర్కెలు కోరుకున్నా..ఒక్కో కోరికకు ఐదు రొట్టెలు పంచాలన్నది ఆచారం. రొట్టెలు పంచితే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. అలా కోర్కెలు తీరిన వారు కొత్తవారికి రొట్టెలను పంపిణీ చేస్తారు. కోరిక తీరిన వారి చేతుల మీదుగా రొట్టెను అందుకుంటారు
రాష్ర్ట పండుగగా రొట్టెల పండుగ
కోర్కెల్లో కూడా రకరకాలుంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో కోరిక ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, సౌభాగ్యం, వ్యాపారం, విదేశీయానంతో పాటు సంతాన రొట్టెలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటితో పాటు వివిధ కోరికలను బట్టి రొట్టెలు పంచుతుంటారు. ఇలా కులమతాలకు అతీతంగా ఇక్కడ రొట్టెల పండుగను జరుపుకుంటారు. దీంతో ఏటేటా భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతూనే ఉంది. దీంతొ ప్రభుత్వం కూడా భక్తుల రద్దీని గమనించి బారాషాహిద్ రొట్టెల పండుగను రాష్ర్ట పండుగగా ప్రకటించింది. దీంతొ జిల్లా అధికారులు ఈ పండుగపై ప్రత్యేక దృష్టిసారించి ఘనంగా ఏర్పాట్లు చేశారు.
దేశవిదేశాల నుంచి భక్తుల రాక..
రొట్టెల పండుగకు దేశవిదేశాల నుంచి 10 నుంచి 15 లక్షల మంది భక్తులు వస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

చెరువులో గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యం

నిజామాబాద్ : నవీపేట్ మండలం అబ్బాపూర్ లో చెరువులో గల్లంతైన ముగ్గురు విద్యార్థుల మృత దేహాలు లభ్యమయ్యాయి. చెరువులో ఈతకు వెళ్లి నిన్న ముగ్గురు విద్యార్థులు గల్లంతైన విషయం తెలిసిందే. 

జమ్మూకాశ్మీర్ సాంబా సెక్టార్ లో టెన్షన్

జమ్మూకాశ్మీర్ : సాంబా సెక్టార్ లో టెన్షన్ నెలకొంది. 9 మంది బీఎస్ ఎఫ్ బేస్ క్యాంపులు లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది. సాంబా సెక్టార్ లోని గ్రామస్తులపై పాక్ సైన్యం బాంబులు విసిరారు. పాక్ రేంజర్ల దాడిలో ఓ సాధారణ పౌరుడు మృతి చెందాడు. రాత్రి 2.30 నుండి కాల్పులు కొనసాగుతున్నాయి. అయితే పాక్ రేంజర్లకు ధీటుగా భారత జవాన్లు జవాబు ఇస్తున్నారు. 

07:47 - October 24, 2015

విజయనగరం : సాంస్కృతిక కళారంగాలకు పుట్టినిల్లు విజయనగరం. విద్యలనగరంగా పేరొందిన విజయనగరం ఈ ఏడాది ఉత్సవాలు జరుపుకోనుంది. కొత్త రాష్ట్రం, కొత్తరాజధాని ఏర్పాటవుతున్న తరుణంలో విజయనగర ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దసరా పండగతో పాటు ప్రతీఏటా జరిగే శ్రీపైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరానికి విజయనగర ఉత్సవాలు తోడవడంతో విజయనగరం పట్టణం నూతన శోభ సంతరించుకుంది.
విజయనగరానికి చారిత్రక నేపథ్యం
ఉత్తరాంధ్రలో విజయనగరం చారిత్రక నేపథ్యం ఉన్న పట్టణం. ఇక్కడి సంస్క్రతి, సంప్రదాయాలతో ప్రపంచ గుర్తింపు పొందింది. కళలకు కాణాచిగా, కళాకారుల నిలయంగా, విద్యలనగరంగా ప్రఖ్యాతి పొందింది. ఈ ఏడాది విజయనగర ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఈ నెల 24,25,26 తేదీల్లో ఈ ఉత్సవాలు నిర్వహించేందుకు అధికారులు, పాలకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సాంస్కృతిక కార్యక్రమాలు
ఉత్సవాల సందర్భంగా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు క్రీడాపోటీలు, ఫలపుష్ఫ ప్రదర్శనలు, ఫుడ్ ఫెస్టివల్ వంటి ప్రదర్శనలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. అలాగే, ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన జానపద కళారూపాల ప్రదర్శన, సాహిత్య కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం పట్టణంలోని ఆనందగజపతి ఆడిటోరియం, గురజాడ ఆడిటోరియం, లయన్స్ కమ్యూనిటీ హాలు, సంగీత కళాశాల, విజ్జీ స్టేడియం, అయోద్య మైదానాన్ని సిద్ధం చేస్తున్నారు.
పట్టణంలో కొత్త శోభ
దసరా పండగతో పాటు ప్రతీ ఏటా అత్యంత వైభవంగా జరిగే శ్రీపైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలు కూడా ఇదే నెలలో జరుగుతాయి. ఈ రెండు పండగలకు తోడుగా ఈ ఏడాది విజయనగర ఉత్సవ్ కూడా నిర్వహిస్తుండటంతో పట్టణంలో కొత్త శోభ సంతరించుకుంది. 24 నుంచి మూడు రోజుల పాటు విజయనగర ఉత్సవాలు జరుగుతుండగా, 26న పైడితల్లి అమ్మవారి తొలేళ్ల ఉత్సవం, 27న అంబరాన్నితాకే సిరిమాను సంబరం జరగనుంది. ఈ ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా పలు సాంస్క్రతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు.
పౌరాణిక నాటక ప్రదర్శనల ఏర్పాటు
26న కోట జంక్షన్ లో పంచరత్నాల పేరుతో పౌరాణిక నాటక ప్రదర్శనలను ఏర్పాటు చేస్తున్నారు. ఉత్సవాలలో వివిధ సాంస్క్రతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు, పోటీలు నిర్వహించేందుకు ఆరు వేదికలను ఏర్పాటు చేశారు. ఈ మూడు రోజులూ జిల్లా ప్రజలను అలరించేందుకు అన్ని రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

 

07:41 - October 24, 2015

హైదరాబాద్ : నగరంలో పలు నేరాలకు పాల్పడుతున్న ఐదుగురు అంతరాష్ట్ర ముఠా సభ్యులను సెంట్రల్‌ జోన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడుకు చెందిన రాంజీనగర్‌ గ్యాంగ్‌ ఆగడాలకు పోలీసులు చెక్‌ పెట్టారు. బ్యాంకుల నుంచి బయటకు వస్తున్న వారినే టార్గెట్‌ చేసుకొని వీరు చోరీలకు పాల్పడుతున్నారు. నగరంలో ఇప్పటికే పది గ్యాంగులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ నెల 19న అబిడ్స్‌లో జరిగిన చోరీ సీసీ ఫుటేజీ లో రికార్డు అవ్వడంతో గ్యాంగ్‌ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి.

 

07:38 - October 24, 2015

హైదరాబాద్ : రాష్ట్రంలో ఆర్టీసీ చార్జీలు మరోసారి పెరిగాయి. తెలుగు వెలుగు బస్సుల్లో కిలోమీటరుకు 3 పైసల చొప్పున చార్జీలను పెంచుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో కిలోమీటరుకు 8 పైసల చొప్పున పెంచారు. అదే విధంగా సూపర్ లగ్జరీ, వెన్నెల, గరుడ బస్సుల్లో కిలోమీటరుకు 9 పైసల చొప్పున టికెట్ ధరలు పెరిగాయి. పెంచిన చార్జీలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయని ఆర్టీసీ ప్రకటిచింది.
ఆర్టీసీ చార్జీలు 10 శాతం పెంపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలపై మళ్ళీ చార్జీల భారాన్ని మోపింది. ఇప్పటికే నిత్యవసర సరుకుల ధరలు తారాస్థాయికి చేరి ఇబ్బందులు పెడుతుంటే, ఈ సమయంలో ఆర్టీసీ చార్జీలు దాదాపు 10 శాతం అధికంగా భారాన్ని మోపనుంది. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఈ అధిక భారాల మోత మాత్రం మారడంలేదని సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
గత సంవత్పరం భారీగా నష్టాలు వచ్చాయి - ఎండీ
ఇదిలా ఉంటే ఆర్టీసీ భారీగా నష్టాలలో ఉన్నందున చార్జీల పెంపుకు నిర్ణయం తీసుకుంటున్నట్టు ఆర్టీసీ ఎండీ సాంబశివరావు అన్నారు. ఆర్టీసీకి గత సంవత్పరం భారీగా నష్టాలు వచ్చాయని, నష్టం దాదాపు 595 కోట్లు వరకు ఉంటుందన్నారు. అంతేకాక కార్మికులకు ఫిట్ మెంట్ చార్జీలు పెంచడం వలన నెలకు 55కోట్లు చప్పున 660కోట్లు సంవత్పరానికి అదనపు భారం పడిందన్నారు . దీనివిషయమై ముఖ్యమంత్రిగారిని చార్జీల పెంపు గురించి కోరగా . సాద్యాఅసాద్యాలను గురించి తెలుసుకున్న తరువాత 10శాతం పెంపుకు అనిమతిచ్చారన్నారు.
తెలుగు వెలుగు సర్వీసులు 5శాతం పెంపుదల
విద్యార్దులపై ఎటువంటి భారం వేయడంలేదని . తెలుగు వెలుగుకు సంబంధించి 5శాతం పెంచామని . లగ్జరీ , సూపర్ లగ్జరీ , డీలక్స్ , వాల్వోలపై 10శాతం పెంపుదలను చేస్తున్నామన్నారు. ఇవి కాక ఆర్టీసీ కి సంబంధించి స్థలాల నుంచి ఆదాయాన్ని తెచ్చే కార్యక్రమాలను కూడా ఆలోచిస్తున్నామన్నారు. వచ్చే సంవత్పరం మొదటి కల్లా 13 జిల్లాలో దాదాపు 20 బస్ స్టేషన్లను ఆధునీకరించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా జిల్లా ముఖ్య స్టేషన్లలో మార్పులు ఉంటాయని ఎండీ సాంబశివరావు తెలిపారు. వెన్నెల సర్వీసులకు సంబంధించి ఎటువంటి చార్జీలను పెంచలేదని తెలిపారు. గతంతో పోలిస్తే ఈ సారి చార్జీలను చాలా త్కువగా తగ్గించామని అన్నారు.

 

07:29 - October 24, 2015

హైదరాబాద్ : 10 రోజుల క్రితం అబిడ్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన 11 నెలల బాలుడి కిడ్నాప్‌ను పోలీసులు చేధించారు. కిడ్నాప్‌కు పాల్పడిన ఇద్దరు ఆటో డ్రైవర్లను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. యూనీస్‌, రియాజ్‌ అనే ఇద్దరు ఆటో డ్రైవర్లు ఆనంది బేగం అనే మహిళ కుమారుడిని కిడ్నాప్‌చేశారు. పిల్లలు లేని తన మరదలు హతీయా బేగం వద్ద 80 వేలు తీసుకొని బాలుడిని తీసుకొస్తానని చెప్పిన యూనిస్‌ ఈ విధంగా రోడ్‌పై నివసిస్తున్న ఆనంది కుమారుడి కిడ్నాప్‌కు ఇద్దరు స్కెచ్‌ వేసి సఫలం అయ్యారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సిసి ఫుటేజి ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

 

రోగికి సహాయంగా వచ్చిన వ్యక్తి ఆత్మహత్య

హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రి దారుణం జరిగింది. ఆరో అంతస్తు నుంచి ఓ వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఓ రోగికి సహాయంగా వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. మృతుడు మహబూబ్‌నగర్ జిల్లా మజ్‌బూర్ వాసి. మృతుడి బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

నేడు టీటీడీపీ ముఖ్యనేతల సమావేశం

హైదరాబాద్ : ఉదయం 11 గంటలకు ఎన్ టిఆర్ ట్రస్టు భవన్ లో ఎల్.రమణ అధ్యక్షతన టీటీడీపీ ముఖ్యనేతల సమావేశం జరుగనుంది. వరంగల్ ఉప ఎన్నిక అంశంపై చర్చించనున్నారు.

 

నేటి నుంచి రొట్టె పండుగ

నెల్లూరు : నేటి నుంచి నెల్లూరులో రొట్టెల పండుగ జరుగనుంది. పండగను ఘనంగా నిర్వహించనున్నారు. మతసామరస్యానికి ప్రతీకగా రొట్టెల పండుగ నిలిచింది. 

Don't Miss