Activities calendar

25 October 2015

21:31 - October 25, 2015

జార్ఖండ్‌ డైనమైట్‌...మహేందర్‌ సింగ్‌ ధోనీ ఐపీఎల్‌ వేలానికి రెడీ అయ్యాడు. గత 8 ఏళ్లుగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు కెప్టెన్‌గా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఆడిన మహీ....ఇప్పుడు మరో సరికొత్త జట్టుకు ఆడనున్నాడు. టీ 20 ఫార్మాట్‌లో తిరుగులేని కెప్టెన్‌ ఎదురులేని ఫినిషర్‌ అనగానే ఎవరికైనా గుర్తొచ్చే ఒకే ఒక పేరు...జార్ఖండ్‌ డైనమైట్‌...మహేందర్‌ ధనాధన్‌ ధోనీ మాత్రమే.

కూల్ కెప్టెన్..
ఈ కూల్‌ కూల్‌ కెప్టెన్‌....ఐపీఎల్‌ 9వ సీజన్‌లో కొత్త జట్టు తరఫున ఆడేందుకు సిద్దమయ్యాడు. ఒకటి కాదు రెండు కాదు....ఏకంగా ఎనిమిదేళ్లు చెన్నై సూపర్‌ కింగ్స్ జట్టులో చక్రం తిప్పిన ధనా ధన్‌ ధోనీ తొలి సారిగా మరో ఫ్రాంచైజీ తరఫున ఆడబోతున్నాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో సురేష్‌ రైనాతో పాటు....8 ఏళ్లు ఒకే జట్టులో కొనసాగిన ఆటగాడిగా రికార్డులకెక్కిన ధోనీ....మరో రెండేళ్లు కొత్త ఫ్రాంచైజీలో అడుగుపెట్టబోతున్నాడు. స్పాట్‌ ఫిక్సింగ్‌, మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వివాదం కారణంగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై రెండేళ్ల పాటు బిసిసిఐ నిషేధం విధించింది.

కొత్త జట్లకు ఆడబోతున్న ఆటగాళ్లు..
దీంతో ఈ ఫ్రాంచైజీల ఆటగాళ్లు మరో రెండు కొత్త జట్లకు ఆడబోతున్నారు. కొత్తగా ఏర్పడే ఫ్రాంచైజీలు ఏవో ఇంకా క్లారిటీ లేకపోయినా ధోనీ మాత్రం మరో రెండేళ్లు కొత్త జట్టుకు ఆడనున్నాడు. ధోనీ ఐపీఎల్‌ 9వ సీజన్‌ కోసం నిర్వహించే వేలంలో అందుబాటులో ఉంటే ఆక్షన్‌లో రికార్డ్‌ ధరకు సొంతం చేసుకోవడానికి కొత్త ఫ్రాంచైజీలు పోటీ పడతాయనడంలో సందేహం లేదు. ఎందుకంటే టీ 20 ఫార్మాట్‌లో ధోనీని మించిన కెప్టెన్‌ కమ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్ మెన్‌ మరొకరు లేరు.

అత్యధిక ధర పలికిన యువరాజ్..
ఇప్పటివరకూ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ చరిత్రలో యువరాజ్‌ సింగ్‌ మాత్రమే రెండు సార్లు అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఉన్నాడు. 2014 వేలంలో 14 కోట్లు పలికిన యువీ....2015 సీజన్‌లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ ఫ్రాంచైజీ ఏకంగా 16 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది. ఒకవేళ ధోనీ ఐపీఎల్‌ 2016 సీజన్‌ వేలంలో బరిలోకి దిగితే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా యువరాజ్‌ సింగ్‌ను వెనక్కునెట్టి టాప్‌ ప్లేస్‌లో నిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

21:27 - October 25, 2015

విద్యార్థి, విద్యావేత్త, పౌర హక్కుల నాయకుడిగా ఎలా మారారు ? ప్రత్యేక తెలంగాణలో ప్రభుత్వ ప్రాధాన్యాలు ఎలా ఉన్నాయి ? అనే అంశాలపై 'వన్ టు వన్ విత్ శ్రీధర్ బాబు' ముఖాముఖి కార్యక్రమంలో సామాజిక విశ్లేషకులు ప్రొ.జి.హరగోపాల్  పాల్గొని, మాట్లాడారు. 

21:22 - October 25, 2015

హైదరాబాద్ : ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్ మార్పుపై ప్రభుత్వం పునరాలోచించుకోవాలని డిమాండ్ చేసింది రైతు సంక్షేమ సమితి. తుమ్మిడి హట్టి వద్దనే ప్రాజెక్టు నిర్మించాలని అప్పుడే వెనకబడిన ప్రాంతాలకు నీరొస్తుందన్నారు జస్టిస్ చంద్రకుమార్. ప్రాణహిత డిజైన్ మార్పును వ్యతిరేకిస్తూ రైతు సంక్షేమ సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
తెలంగాణకు అన్యాయం...
ప్రాణహిత ప్రాజెక్టు రీ డిజైన్ వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు సమావేశంలో పాల్గొన్న వక్తలు. తుమ్మిడి హట్టి వద్ద కాకుండా మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ప్రజాధనం వృధా అవుతుందన్నారు. ప్రాజెక్టుల రి డిజైన్ పేరుతో మెదక్ జిల్లాకు నీరు తీసుకెళ్లేందుకు సిఎం ప్రయత్నిస్తున్నారన్నారు. ఆదిలాబాద్ లోని వెనకబడిన ప్రాంతాల్లో ఇప్పటికే కాలువ నిర్మాణం పూర్తయిందన్నారు. ఇప్పడు డిజైన్ మార్చడం వల్ల ఆప్రాంతాలు బీడుగా మారతాయన్నారు. తుమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్టు కడితేనే ప్రాణహిత నీటిని వాడుకునే వీలుంటుందన్నారు. మేడిగడ్డ వద్ద నిర్మిస్తే గోదావరి నీటి వినియోగం పరిధిలోకి వస్తుందన్నారు. దీనిపై మేధావులు, రిటైర్డ్ ఇంజనీర్లు నోరువిప్పాలన్నారు.

21:19 - October 25, 2015

నల్గొండ : సీపీఎం తెలంగాణ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు నాగార్జునసాగర్ లోని విజయవిహార్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. మార్క్సిస్టు యోధుల ప్రసంగాలు, యువ కామ్రేడ్ల కవాతు ప్లీనరీ సమావేశాల్లో ఉత్తేజాన్ని నింపాయి. పార్టీ రాష్ట్ర తొలి ప్లీనరీ సమావేశాల్లో భాగంగా భవిష్యత్తు ఉద్యమ కార్యచరణకు రూపకల్పన జరగనుంది. రెండు రోజుల పాటు జరుగుతున్న ఈ సమావేశాల్లో పది జిల్లాల నుంచి దాదాపు 600 మంది ప్రతినిధులు సమావేశాల్లో పాల్గొంటున్నారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం సమావేశాలను ప్రారంభించగా.. ఆహ్వానసంఘం తరుపున విద్యావేత్త చుక్కా రామయ్య స్వాగతోపన్యాసం చేశారు. ఈ సమావేశాలకు ముఖ్య అతిధిగా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు హాజరుకాగా.. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనీ వీరభద్రం, శాసనసభాపక్ష నేత సున్నం రాజయ్య, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు వీరయ్య, చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి వంటి ముఖ్య నేతలతో పాటు తెలంగాణలోని అన్నీ జిల్లాల నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలు సమావేశాలకు హాజరయ్యారు.

పాలకుల విధానాలపై విమర్శలు..
ప్లీనరీ సమావేశాలకు ప్రారంభ సూచకంగా జెండా ఎగురవేసిన మల్లు స్వరాజ్యం చేసిన ప్రసంగం ప్రతినిధుల్లో సమరోత్సాహాన్ని రగిల్చారు. కమ్యూనిస్టులు పోరాటాల గురించి కెసిఆర్ చేస్తున్న అవహేళన వ్యాఖ్యలపై మల్లు స్వరాజ్యం మండిపడ్డారు. దేశంలో పేదలకు అవసరమైన విద్య, వైద్య రంగాలు కార్పోరేట్ చేతుల్లోకి వెళ్లాయని స్వాగతోపన్యాసం చేసిన విద్యావేత్త చుక్కా రామయ్య విమర్శించారు. భారత దేశ నిపుణులను ప్రపంచం గుర్తిస్తుంటే.. తెలుగు రాష్ట్రాల సీఎంలు విదేశాల వెంట తీరుగుతున్నారని ప్రారంభోపన్యాసం చేసిన సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు విమర్శించారు. ఇబ్బడి ముబ్బడిగా వాగ్దానాలు చేసి వాటిని అమలు చేయకపోవడం వల్లే ప్రజలు టిఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కెసిఆర్ నిరంకుశ విధానాలపై ప్రజలు తిరగబడే రోజు వస్తుందని ఆయన హెచ్చరించారు.

ఉత్తేజపూరిత వాతావరణంలో సమావేశాలు..
తొలి రోజు సీపీఎం ప్లీనరీ సమావేశాలు ఉత్తేజపూరిత వాతావరణంలో కొనసాగాయి. నవతెలంగాణ ఉద్యమ చరిత్రలో నూతన అధ్యాయానికి ఈ ప్లీనరీ నాంది కావాలని, సమసమాజ సాధనకై జరిగే ఉద్యమాలకు మార్గదర్శనం చేయాలని శ్రేణుల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది.

21:15 - October 25, 2015

విజయవాడ : ఏపీలో పోలీస్ అధికారుల పనితీరుపై ప్రత్యేక వ్యవస్థ అందుబాటులోకి రానుంది. సిబ్బంది ఎక్కడ పని చేసినా... వారి పనితీరు, విధి నిర్వహణలో సాధించిన విజయాలు, ఫిర్యాదులతో సహా ఓ కొత్త సిస్టమ్ ను ప్రారంభించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శాంతి భద్రతలపై జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పోలీస్ అధికారుల పనితీరుపై ఐదేళ్ల ట్రాక్ రికార్డు రూపొందించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. విజయవాడలో జరిగిన రివ్యూ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్థాయిల్లోని అందరూ పోలీస్ అధికారుల పనితీరును మదింపు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. పనిచేసిన చోట నేరాల నియంత్రణలో పోలీస్ అధికారుల పనితీరుపై ఐదేళ్ల ట్రాక్ రికార్డు తయారు చేయాలని సీఎం తెలిపారు. నమోదైన కేసుల సంఖ్య నిందితులకు పడ్డ శిక్షల వివరాలను కూడా నమోదుచేసి వారి పనితీరును బేరీజు వేయాలన్నారు. ఈ కసరత్తును 2016 మార్చికల్లా పూర్తిచేస్తే తదుపరి పోలీస్ శాఖలో తీసుకునే నిర్ణయాలకు ఇది ప్రాతిపదిక అవుతుందన్నారు.

శాస్త్ర సాంకేతికతను వినియోగించుకోవాలన్న బాబు..
సెంట్రల్ క్రిమినల్ ట్రాకింగ్ సిస్టమ్ లో భాగంగా పోలీస్ శాఖలో సాఫ్ట్ వేర్ ను మరింత అభివృద్ధి చేయాలన్నారు చంద్రబాబు. నేరాల నియంత్రణలో శాస్త్ర సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, అవసరమైన చోట్ల సిబ్బందిని అవుట్ సోర్సింగ్ లో నియమించుకోవాలన్నారు. వివిధ నేరాల్లో గతంలో గుర్తించిన నోటెడ్ క్రిమినల్స్ వేలిముద్రలు, ఐరిస్ నమూనాలను సెంట్రల్ సర్వర్ లో నమోదు చేసి వారి కదలికలపై నిఘా పెంచాలన్నారు.  కొద్దిరోజులుగా మళ్లీ ఎర్రచందనం స్మగ్లర్ల కార్యకలాపాలు పెరిగాయంటూ ఆయా ప్రాంతాలలో మరింత అప్రమత్తంగా ఉండాలని, నిఘా పెంచాలని చంద్రబాబు ఆదేశించారు. సీసీ టీవీ మానిటరింగ్, ఎఫెక్టివ్ ట్రెంచింగ్, అవుట్ పోస్టులు పెంచడం, అదనపు సిబ్బందిని నియమించడం ద్వారా స్మగ్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. స్మగ్లర్ల ఆస్తులను జప్తుచేసే అధికారం ఉండేలా అటవీచట్టం 1967లో సవరణలు తీసుకురావాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు చంద్రబాబు. 

21:12 - October 25, 2015

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసిఆర్ మూడు రోజుల హస్తిన పర్యటన ఖరారయ్యింది. మూడు రోజు పాటు సాగే ఈ పర్యటనలో ప్రధానంగా నీతి ఆయోగ్ కార్యక్రమం లో పాల్గొననున్నారు. పనిలో పనిగా రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల నిధుల మంజూరు విషయం పై ప్రధానితో పాటు..పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. దీంతో పాటు ప్రధాని నరేంద్ర మోడిని కూడా కలిసేందుకు ఆయన అపాయింట్ మెంట్ కూడా కోరారు. ఇతర కేంద్ర మంత్రులును సైతం సీఎం కలవనున్నారు.

గవర్నర్ తో కేసీఆర్ భేటీ..
ఢిల్లీ వెళ్లే ముందు సీఎం కేసిఆర్ రాజ్ భవన్ లో గవర్నర్ తో భేటి అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో భర్తీ చేయాల్సిన కొన్ని ముఖ్యమైన నామినేటేడ్ పోస్టుల భర్తికి గవర్నర్ అమోదం కోరినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఢిల్లీ టూర్ లో ప్రధానంగా రాష్ట్రంలో ప్రకటించబోతున్న ఇరిగేషన్ పాలసీ పై కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి కి పవర్ ప్రాజెంటేషన్ సహాకారంతో వివరించాలని భావిస్తున్నారు. ఇక రాష్ట్రంలో నెలకొన్న కరువు, రైతు మరణాల పై కూడా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలసి నిధులు కోరడంతో పాటు కరువు అంచాన వేసేందుకు బృందాలను పంపాలని కోరనున్నట్లు తెలిసింది. విభజన చట్టంలోని అంశాల పరిష్కారం, ఉద్యోగుల విభజన, తొమ్మిది, పదో షెడ్యుల్ లోని కార్పోరేషన్లు, సంస్ధలు వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోడిని కోరనున్నట్లు సమాచారం. మొత్తానికి మూడు రోజుల పర్యటనలో రాష్ట్రానికి రావాల్సిన వివిధ శాఖల గ్రాంట్స్ తో పాటు ఇతర రాజకీయ పరమైన అంశాల పై హస్తిన నేతలతో సమావేశం కానున్నారు సీఎం. అలగే వచ్చే నెలలో తాను చేపట్టనున్న చండీ యాగానికి కూడా ప్రధానిని ఆహ్వానించనున్నట్లు సమాచారం.

చిట్టీ డబ్బులు అడిగినందుకు వ్యక్తి నిర్భందం..

రంగారెడ్డి : శంషాబాద్ లో చిట్టీల వ్యాపారి ఓ వ్యక్తిని నిర్భందించాడు. చిట్టీ డబ్బులు అడిగినందుకు వ్యాపారి ఈ విధంగా వ్యవహరించాడు. బాధితుడి భార్య ఫిర్యాదు అందుకున్న పోలీసులు వ్యాపారిని అదుపులోకి తీసుకుని నిర్భందంలో ఉన్న వ్యక్తిని విడిపించారు. 

దళితుల మృతి కేసులో పోలీసుల సస్పెన్షన్..

హర్యానా : దళిత వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తుల మృతి కేసులో పోలీసులు సస్పెన్షన్‌కు గురయ్యారు. హర్యానాలోని భట్లా గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మృతికి పోలీసులే కారణమని వారిని వెంటనే అరెస్ట్ చేయాలని గ్రామస్తులు ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో ఇద్దరు పోలీసులకు సంబంధముందని దర్యాప్తు బృందం నిర్దారించింది. దీంతో ఇద్దరు పోలీసులపై సస్పెన్షన్ వేటు వేసి అదుపులోకి తీసుకున్నారు. 

20:52 - October 25, 2015

ముంబై : భారీ శతకాల హీరో రోహిత్ ఉన్నాడు..ఇన్నింగ్స్ కు వెన్నెముకలాంటి కోహ్లీ ఉన్నాడు..అంతేగాక రాహానే క్లాసింగ్ బ్యాట్ మెన్ ఉన్నాడు..ఐదో వన్డే ఖచ్చితంగా భారత్ విజయం సాధిస్తుందని సగటు అభిమాని అనుకున్నాడు. ఎందుకంటే నాలుగో వన్డేలో సమిష్టి కృషితో గెలిచి సిరీస్ ను 2-2 తో సమం చేశారు గనుక. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్..ఫీల్డింగ్ ఇలా అన్ని రంగాల్లో టీమిండియా రాణించడంతో 'గాంధీ - మండేలా' శాంతి సిరీస్ మనదేనని భారత క్రికెట్ క్రీడాభిమానులు ఆశించారు. కానీ అది అంతా తప్పని తేలిపోయింది. చివరి వన్డేలో భారత్ ఘోర పరాజయం చవి చూసింది. సౌతాఫ్రికా నిర్ధేశించిన 438 పరుగులు చేరుకోవడంలో భారత బ్యాట్స్ మెన్స్ చేతులేత్తెశారు. 214 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. 3-2 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది.

కుప్పకూలిన బ్యాట్స్ మెన్స్..
సౌతాఫ్రికా నిర్ధేశించిన భారీ లక్ష్యాన్ని చూసి భారత క్రికెటర్ల కళ్లు బైర్లు కమ్మాయి. పరుగుల వేటలో కుప్పకూలిపోయారు. చివరకు సిరీస్ సౌతాఫ్రికా ఎగురేసుకపోయింది. ధావన్..రహానేలు మాత్రం అర్ధ సెంచరీలు సాధించారు. తొలుత టాస్ గెలిచిన సౌతాఫ్రికా భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. నిర్ణీత 50 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి 438 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యం సాధించడానికి బరిలో భారత ఓపెనర్లు బరిలో దిగారు. వచ్చి రాగానే రోహిత శర్మ తొలి ఓవర్ లో రెండు ఫోర్లు బాది భారత శిబిరంలో ఆనందాన్ని నింపాడు. కానీ ఆ సంతోషం ఎంతో సేపు నిలువలేదు. అబాట్ బౌలింగ్ లో రోహిత్ శర్మ (16) కొట్టిన షాట్ డీప్ పాయింట్ లో ఉన్న తాహీర్ క్యాచ్ అందుకున్నాడు. రబడ బౌలింగ్ లో షాట్ కోసం యత్నించిన కోహ్లీ (7) బంతి బ్యాట్ అంచున తాకుతూ ఫస్ట్ స్లిప్ వైపుకు వెళ్లింది. వెంటనే అప్రమత్తమైన డికాక్ అద్భుత డైవ్ చేసి క్యాచ్ ను అందుకున్నాడు.

44 పరుగులకే రెండు వికెట్లు..
44 పరుగులకే కీలకమైన రెండు వికెట్లు చేజార్చుకున్న భారత్ ఆత్మరక్షణలో పడింది. దీనితో ఎలాంటి సాహసాలు చేయకుండా ధావన్, రహానేలు సింగిల్స్ లు తీస్తూ వచ్చారు. ఇన్నింగ్స్ 14 ఓవర్ వేసిన స్టెయిన్ బౌలింగ్ లో ధావన్ బంతిని పాయింట్ దిశగా షాట్ కొట్టాడు. అక్కడనే ఉన్న ఫీల్డర్ మిల్లర్ బంతిని క్యాచ్ గా అందుకోవడంలో విఫలమయ్యాడు. దీనితో ధావన్ వూపిరి పీల్చుకున్నాడు. ఈ దశలో భారత బ్యాట్స్ మెన్స్ ను విడదీయడానికి కెప్టెన్ డివిలియర్స్ స్పిన్నర్ తాహిర్ ను రంగంలోకి దించాడు. అనంతరం ధావన్ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 51 బంతులను ఎదుర్కొన్న ధావన్ 7x4 సాయంతో 50 పరుగులు చేశాడు. గత తప్పిన బంతులను ధావన్, రహానేలు బౌండరీలకు తరలించారు. నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగెత్తించే ప్రయత్నంలో పడ్డారు. ఈ నేపథ్యంలో రహానే కూడా అర్ధసెంచరీ పూర్తి చేశాడు. 41 బంతుల్లో 5x4, 1x6 సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

క్యూ కట్టిన భారత బ్యాట్స్ మెన్స్...
జట్టు స్కోరు 156 పరుగుల వద్ద ఉన్నప్పుడు ధావన్ (60) వెనుదిరిగాడు. రబడ బౌలింగ్ లో షాట్ ఆడబోయిన ధావన్..ఆమ్లా చేతికి చిక్కాడు. ఈ దశలో రైనా వికెట్ పోకుండా జాగ్రత్తగా ఆడాడు. కానీ జట్టు స్కోరు 172 వద్ద ఉన్నప్పుడు రైనా (12) వెనుదిరిగాడు. రహానే ఆదుకుంటాడని అందరూ ఆశించారు. స్టెయిన్ బౌలింగ్ లో భారీ షాట్ కోసం ప్రయత్నించిన రహానే (87) బెహార్డీన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. విజయానికి 129 బంతుల్లో 246 పరుగులు చేయాల్సి వచ్చింది. క్రీజులో ఉన్న ధోని, అక్షర్ పటేల్ మాత్రమే ఉన్నారు. ఈ దశలో భారత్ స్కోరు 195 పరుగులున్నప్పుడు పటేల్ (5) అవుట్ కావడంతో భారత్ తీవ్ర వత్తిడిలోకి కూరుకపోయింది. మరో ఎనిమిది పరుగుల తరువాత హర్భజన్ ఎలాంటి పరుగులు చేయకుండా మోరీస్ కు సునాయస క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక క్రీజులో ఉన్న ధోనిపైనే అన్ని ఆశలు ఉన్న భారీ లక్ష్యం చేరుతారా ? అని సందేహాలు వ్యక్తమయ్యాయి. వెనువెంటనే భువనేశ్వర్ (1), ధోని (27) అవుట్ కావడంతో భారత్ పరాజయం ఖాయమైంది. మిశ్రా (4) పరుగులుతో అవుట్ కాగా శర్మ 0 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
సౌతాఫ్రికా బౌలర్లలో రబడ నాలుగు, స్టెయిన్ మూడు, తాహిర్ రెండు, అబౌట్ ఒక వికెట్ తీశారు. 
సౌతాఫ్రికా విధ్వంసకర బ్యాటింగ్..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 438 పరుగులు చేసింది. భారత పేలవమైన బౌలింగ్ చేయడంతో సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్స్ విధ్వంసకర బ్యాటింగ్ చేశారు. సఫారీ బ్యాట్స్ మెన్స్ లు డికాక్ (109), డుప్లెసిస్ (133), డివిలియర్స్ (119) లు శతకాలు బాది జట్టుకు భారీ స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించారు. ఆకాశమే హద్దుగా వీరు చెలరేగిపోయారు. ఫీల్డర్లు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. ఓపెనర్ ఆమ్లా(23) తక్కువ స్కోరుకే వెనుదిరిగినా మరో ఓపెనర్ డికాక్ (109, 87 బంతుల్లో 17x4, 1x6) శతకంతో జట్టు భారీ స్కోరుకు పునాది వేశాడు. అతనికి జోడుగా డుప్లెసిస్ (133 రిటైర్డ్ హర్ట్, 115 బంతుల్లో 9x4, 6x6) ఇన్నింగ్స్ నిర్మించాడు. శతకం తరువాత తన విశ్వరూపాన్ని చూపెట్టాడు. డుప్లెసిస్ తో పాటు కెప్టెన్ డివిలియర్స్( 119, 61 బంతుల్లో 3x4, 11x6) కూడా తన బ్యాట్ ను ఝులిపించాడు. వీరి విధ్వంసకర బ్యాటింగ్ తో భారత బౌలర్లు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయారు. డివిలియర్స్ ఔటైనా చివరిలో మిల్లర్ (22), బెహార్డీన్ (16) ధాటిగా ఆడడంతో దక్షిణాఫ్రికా 438 పరుగులు చేయగలిగింది.

స్కోరు బోర్డు :
దక్షిణాఫ్రికా : కాక్ (109, 17x4, 1x6), ఆమ్లా (23, 5x4), డుప్లెసిస్ (రిటైర్డ్ హార్ట్, 133, 9x4, 6x6), డివిలియర్స్ (119, 3x4, 11x6), మిల్లర్ (22 నాటౌట్), బెహార్డిన్ (16), ఎల్గర్ (5 నాటౌట్).

భారత్ : శర్మ (20, 3x4), ధావన్ (60, 8x4), కోహ్లీ (7, 1x6), రహానే (87, 9x4, 3x6), రైనా (12, 1x4, 1x6), ధోని (27, 3x4), పటేల్ (5), హర్భజన్ సింగ్ (0), కుమార్ (1), మిశ్రా (4, 1x4), శర్మ (0, నాటౌట్).

భారత్ 200/6..

ముంబై : ఐదో వన్డేలో భారత్ పరాజయం దిశగా పయనిస్తోంది. 29.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. 

20:16 - October 25, 2015

హైదరాబాద్ : 'కంచె' సినిమా ప్రయోగాత్మక చిత్రం అనేకంటే, విజయవంతమైన ప్రయోగమని మెగస్టార్ చిరంజీవి కొనియాడారు. ఆదివారం 'కంచె' సినిమా స్పెషల్ షో చూశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిరంజీవి మాట్లాడారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ప్రేమ కథతో పాటు అంతర్జాతీయ యుద్ధ సన్నివేశాలను చూపించడంలో 'క్రిష్' మంచి విజయం సాధించాడని ప్రశంసించారు. వరుణ్ నటనను చూసి ఓ ఫాదర్ గా గర్వంగా ఫీలవుతున్నట్లు తెలిపారు. ఇది చక్కటి విజయవంతమైన ప్రయత్నమని, యువకుడి యొక్క జీవితాన్ని..వృత్తిపరంగా..వ్యక్తిపరంగా రెండు కూడా చాలా చక్కగా కథనంతో రూపొందించారని ప్రశంసించారు. తెలుగు పరిశ్రమలో ఇలాంటి సినిమా రావడం అద్భుతమని, ఈ సినిమాను ప్రతొక్కరూ చూసి ఆనందించాలని చిరంజీవి తెలిపారు. 
క్రియేటివ్ డైరెక్టరేట్ 'క్రిష్' దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా తెలుగు సినిమా స్థాయిని మరోమెట్టు పైకి చేర్చిందని విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కమర్షియల్ గా కూడా మంచి విజయం సాధించిన 'కంచె' సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

రహానే అవుట్..

ముంబై : భారత్ ను ఆదుకుంటాడని అనుకున్న రహానే సైతం చేతులెత్తేశాడు. స్టెయిన్ బౌలింగ్ లో బెహార్డిన్ కు క్యాచ్ ఇచ్చి రహానే (87) వెనుదిరిగాడు. 

19:45 - October 25, 2015

కవిత్వం రాస్తే రసం చిప్పిల్లేలా ఉండాలి అన్నారు ప్రబంధకవి మల్లన. కవిత్వం కవిపిండుకున్న తాత్వికబిందువు అంటాడు యుగకవి శేషేంద్ర. ఈ ఇద్దరి కవుల మాటలను అక్షరాలా పాటించి కవిత్వం రాశాడో కవి. ఆయనే మునిమడుగు రాజారవ్. రసం చిప్పిల్లే కవితా పాదాలు, గాఢతాత్విక బిందువుల కలబోతగా కవితలల్లిన మధుర కవి రాజారావ్ పరిచయ కథనం.

19:43 - October 25, 2015

కవి కన్ను ఫ్రిజం..కవిత్వం మెస్మరిజం అన్నారు. మరి అలాంటి మెస్మరిజం కవిత్వాన్ని రాస్తున్న వందలాది కవులు ఒక చోట చేరితే ఎలాఉంటుంది ? ఇక అక్కడ కవిత్వానికి... కవులకు పండగే ..పండగ..అలాంటి పండగవాతావరణం..ఇటీవల కోనసీమలోని అంతర్వేదిలో కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఎందరో తెలుగు కవులతో ప్రపంచతెలుగు కవితోత్సవ ప్రాంగణం కళకళలాడింది. అంగరంగ వైభవంగా జరిగిన ప్రపంచ తెలుగు కవితోత్సవంపై 10 టి.వి.అక్షరం ప్రత్యేక కథనం.

19:41 - October 25, 2015

సాహిత్యం మానవజాతి వికాసానికి పాదులు వేస్తుంది. మనిషిలోని మృగత్వాన్ని తొలగించి మానవత్వాన్ని మేల్కొల్పుతుంది. మానవ సమూహాలను రసప్రవాహాల్లో ముంచెత్తుతుంది. ఆనందానుభూతులను పంచి పెడుతుంది. వారి భావోద్వేగాలకు అద్దం పడుతుంది. అలాంటి సాహిత్యాన్ని సృష్టించిన సృజలకారులెందరో ఉన్నారు. వారిలో కామల్ల అయిలయ్య ఒకరు. శ్రమ నుండి పాట పుట్టింది. ఆపాటే శ్రమను మరిపించి శ్రామికులను, సమస్త ప్రజావళిని మురిపించింది. సామాజిక చైతన్యానికి, ఆహ్లాద ఆనందాలకు ఆలంబనగా నిలిచింది. అలాంటి పాటల ప్రక్రియను ఎన్నుకుని నిబద్దతతో పాటలు రాసిన గేయ రచయిత కామల్ల అయిలయ్య. ప్రజా రచయిత కామల్ల అయిలయ్యపై కథనం.

ధావన్ అవుట్..

ముంబై : భారీ లక్ష్యాన్ని చేధించడానికి బరిలో దిగిన భారత్ మూడో వికెట్ కోల్పోయింది. అర్ధ సెంచరీ సాధించి మంచి ఊపు మీదున్నట్లు కనిపించిన ధావన్ (60) పెవిలియన్ చేరాడు. 

19:36 - October 25, 2015

బీహార్ : ఎన్నికల్లో మోడీ మాటల గారడీలో పడొద్దని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేర్కొన్నారు. పాట్నాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నితీష్.. ఈ రాష్ట్రానికి బీహారీ కావాలా... బాహర్ వాలీ కావాలా అంటూ.. స్థానికులను ప్రశ్నించారు. బయటి వాళ్ల అవసరం మనకు లేదని... ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో తమకు తెలుసన్నారు. ప్రధాని మాటలకు..చేతలకు పొంతన లేదని కొన్ని అంశాలపై మాట్లాడాల్సి వచ్చినా కూడా మోడీ మౌనంగా ఉంటున్నారని విమర్శించారు. బీహార్ కు ప్రత్యేక ప్యాకేజీ కల్పించడం వంటి ఎన్నో వాగ్ధానాలను మరిచిపోయారని నితీష్ తెలిపారు. 

19:30 - October 25, 2015

హైదరాబాద్ : విదేశాల్లో డాక్టర్లుగా తయారుచేసే అంశంలో షైన్‌ ఎడ్యుకేషన్‌ కన్సల్టెంట్‌ సంస్థ అద్భుతమైన అవకాశాలు కల్పిస్తుందని ఆ సంస్థ సీఈఓ కృష్ణ అన్నారు. హైదరాబాద్‌ సోమాజీ గూడలో ఎడ్యుకేషనల్‌ కన్సల్టెంట్‌ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఇంటరాక్షన్‌ ప్రోగ్రాంను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేవలం 30 లక్షలకే ఫిలిప్పీన్స్ దేశంలో ఎంబీబీఎస్‌ విద్యనందిస్తున్న షైన్‌ సంస్థ తెలంగాణ విద్యార్థులకు అద్భుత అవకాశం అందిస్తుందన్నారు. 

19:27 - October 25, 2015

హైదరాబాద్ : అత్యంత పవర్ ఫుల్ అనుకుంటున్న సి.బి.ఐ, ఎన్.ఐ.ఏలో గత వైభవం కనిపించడం లేదు. కీలకమైన పోస్టులు ఖాళీగా ఉండిపోతున్నాయి. ఐదేళ్లకే ఇలా కావడంతో వాటి మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతోంది. అసలు జాతీయ దర్యాప్తు సంస్థలను ఎందుకు ఇలా నీరుకారుస్తున్నారు. వీటిని పట్టించుకోకపోవడానికి కారణాలేంటి ? దేశ వ్యాప్తంగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా పేరు ప్రఖ్యాతలు ఉన్న జాతీయ దర్యాప్తు సంస్థలయిన సిబిఐ..ఎన్ఐఎలు నీరుగారిపోతున్నాయి. వీటి ప్రభావం కేసుల దర్యాప్తు పై తీవ్రంగా చూపుతోంది.

ఎన్.ఐ.ఏ పరిస్థితి దారుణం..
ఎన్.ఐ.ఏ పరిస్థితి దారుణంగా తయారైంది. ఉగ్రవాదం, నకిలీ కరెన్సీ వంటి అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో నేరాల దర్యాప్తు కోసం 5 సంవత్సరాల క్రితం ఎన్ఐఏ ఏర్పాటు చేశారు. దక్షిణ భారతదేశానికి హైదరాబాద్ లో హెడ్ క్వార్టర్‌ గా ఉంది. తమిళనాడు, కర్నాటక, కేరళతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయి. దీనికి సంబందించిన సిబ్బందిని రాష్ట్ర స్థాయి పోలీస్ శాఖ నుంచి తీసుకుంటారు.

ఎన్.ఐ.ఏ. ప్రస్తుతం పూర్తిగా ఖాళీ అయినట్లే..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ డి.ఐ.జి.గా రవిశంకర్ అయ్యర్ మొదటగా భాద్యతలు స్వీకరించారు. ఆ తర్వాత లడ్డా వచ్చారు. డిఎస్పీలు, సి.ఐలు మన రాష్ట్రానికి చెందిన వారే ఎక్కువగా ఉండే వారు. అయితే లడ్డా ఆ తర్వాత కొద్ది రోజులకే సీఆర్పీఎఫ్ వెళ్లిపోయారు. దీంతో డిఎస్పీలు, సి.ఐ.లు వెనక్కి వచ్చారు. దీంతో ఎన్.ఐ.ఏ. ప్రస్తుతం పూర్తిగా ఖాళీ అయినట్లే అనిపిస్తుంది.

సుమారు 30 పోస్టులు కూడా ఖాళీ..
దిల్ సుఖ్ నగర్ జంట బాంబు బ్లాస్టు కేసు, గోకుల్ చాట్, లుంబినీ పార్క్ పేలుళ్ల కేసును ఎన్.ఐ.ఏ. దర్యాప్తు చేస్తుంది. వీటికి తోడుగా నకిలీ నోట్ల కేసులు అనేకంగా ఉన్నాయి. 5 నెలలుగా డిఐజీ ఫోస్టు ఖాళీగా ఉండటం.. సుమారు 30 పోస్టులు భర్తీ కాకపోవడంతో.. ఎన్.ఐ.ఏ. పనితీరు మూడునాళ్ల ముచ్చటగా మిగిలే ప్రమాదం ఉంది.

సిబిఐది అదే దారి...
ఇక జగన్, ఎమ్మార్., ఓఎంసీ కేసులతో ఎన్నో సంచలనాలు సృష్టించిన సిబిఐ పరిస్థితి ఇదే దారిలో ఉంది. హైదరాబాద్ జేడి పోస్టు 2 సంవత్సరాలుగా ఖాళీగానే ఉంది. అప్పటి జేడీ లక్ష్మినారాయణ మహారాష్ట్రకు వెళ్లడం... డిప్యూటీగా ఉన్న వెంకటేష్ కేరళ త్రివెండరం సి.పి.గా నియామకం కావడంతో.. సిబీఐ చెన్నై విభాగం జే.డీ. ఆరుణాచలానికి హైదరాబాద్ ఇంచార్జీ బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి కీలకమైన హైదరాబాద్ జేడీ పోస్టు ఖాళీగా ఉంది. ఇప్పట్లో నియామకం పూర్తి అయ్యే అవకాశం లేదు. దీంతో సి.బి.ఐ ఉన్న సిబ్బందితోనే నెట్టుకొస్తోంది. 

19:23 - October 25, 2015

అనంతపురం : ఉభయ రాష్ట్రాల్లో ప్రతి రోజు రోడ్లు నెత్తురోడుతూనే ఉన్నాయి. ఎక్కడో ఒక చోట జరిగే ప్రమాదంలో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం..మితి మీరిన వేగంతో ప్రయాణించడం..ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. బత్తలపల్లి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బత్తలపల్లి నుంచి ఎర్రయాపల్లికి వెళ్లే దారిలో మారుతీ వ్యాన్, కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు చనిపోయారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. దీనితో ఆయా మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.

19:20 - October 25, 2015

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో అంగన్ వాడీల జీతాల పెంపునకు సంబంధించిన జీవోను వెంటనే విడుదల చేయాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. పెంచిన వేతనాలు సెప్టెంబర్ ఒకటి నుంచి అమలు చేస్తామని గతంలో మంత్రివర్గం హామీ ఇచ్చిందని తెలిపారు. ఆగస్టు 6వ తేదీన అంగన్ వాడీ వర్కర్ కు ప్రస్తుతం ఇస్తున్న రూ.4,200 నుండి రూ.7,100లు, హెల్పర్ కు రూ.2,200 నుండి రూ.4,600 అలాగే మినీ వర్కర్ కు రూ.2, 950 నుండి రూ.4,600 చొప్పున పెంచుతున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం పేర్కొందని గుర్తు చేశారు. పెంచిన వేతనాలు సెప్టెంబర్ 1 నుండి అమలు చేస్తామని నాడు హామీనివ్వడం జరిగిందని, అయితే 2 నెలలవుతున్నా.. నేటికి జీవో విడుదల కాలేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో అంగన్ వాడీ సెంటర్ల నిర్వహణ ఇబ్బందిగా మారిందన్నారు. ప్రభుత్వం వెంటనే వేతనాలకు సంబంధించిన జీవో విడుదల చేయడంతో పాటు.. పెంచిన వేతనాలు, బకాయిలు విడుదల చేయాలని లేఖలో మధు పేర్కొన్నారు.

19:16 - October 25, 2015

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ చార్జీల‌ పెంపుపై రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్త ఆందోళ‌న‌కు వైసీపీ సిద్ధమవుతోంది. ఇటీవ‌ల కాలంలో ప్రజా స‌మ‌స్యల‌పై వ‌రుస‌ ఉద్యమాల‌తో హోరెత్తించిన జగన్ పార్టీ.. తాజాగా ఆర్టీసీ చార్జీల‌ పెంపుపై రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల ముందు ఆందోళ‌న‌ల‌కు ప్రణాళిక సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ చార్జీలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాన ప్రతిప‌క్షం వ్యతిరేకిస్తోంది. పెంచిన చార్టీలు త‌గ్గించాలంటూ ఆందోళ‌న‌కు సిద్ధమ‌వుతున్నారు ఆ పార్టీ నేత‌లు. ఆర్టీసీ చార్జీల పెంపు తో సామాన్య ప్రజ‌ల న‌డ్డి విరిచే విధంగా ప్రభుత్వం వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని వైసీపి మండిప‌డుతుంది. త‌క్షణ‌మే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెన‌క్కు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తుంది వైసీపీ. లేక‌పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న కార్యక్రమాలు చేప‌డ‌తామ‌ని హెచ్చరించింది వైసీపీ.

సర్కార్ కు డెడ్ లైన్..
పెంచిన చార్జీలు వెంటనే త‌గ్గించాల‌ని వైసీపి ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించింది. పెంచిన ఆర్టీసి చార్జీలు త‌క్షణ‌మే త‌గ్గించ‌క‌పోతే 26 న రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసి డిపోల మందు ఆందోళ‌న‌లు చేప‌డ‌తామ‌ని ఆ పార్టీ పిలుపునిచ్చింది. టిడిపి ప్రభుత్వం వ‌చ్చిన ప‌ద‌హారు నెల‌ల్లోనే చార్జీల పెంచ‌డం దారుణ‌మ‌న్నారు. ఎన్నిక‌ల ముందు చార్జీలు పెంచ‌మ‌ని ఆర్బాటంగా ప్రక‌టించిన చంద్రబాబు, ఇప్పుడు చార్జీలు పెంచ‌డం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మెత్తానికి ప్రత్యేక హోదా అంశంతో పాటు, సామాన్య ప్రజ‌ల‌కు సంబంధించిన ఆర్టీసి చార్జీల పెంపుద‌లపై ఆందోళ‌న‌లు ఉదృతం చేసేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోంది. సోమ‌వారం ధ‌ర్నాల‌తో మెద‌ల‌య్యే ఈ ఆందోళ‌నా కార్యక్రమాలు మ‌రింత ఉదృతం చేసేలా ప్రణాళిక ర‌చిస్తోంది.

బాబు కు మధు లేఖ..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబుకు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు లేఖ రాశారు. అంగన్ వాడీ జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పెంచిన వేతనాలను ఇప్పటి వరకు చెల్లించకపోవడం దారుణమని, పెండింగ్ బకాయిలను కూడా ప్రభుత్వం చెల్లించడం లేదని లేఖలో తెలిపారు. అంగన్ వాడీ సెంటర్ల నిర్వాహణ సరిగ్గా లేదని తెలిపారు. 

భార్యను..వ్యక్తిని చంపేసిన భర్త..

గుంటూరు : దాచేపల్లి (మం) నడికుడిలో దారుణం చోటు చేసుకుంది. భార్యతో పాటు నాగేశ్వరరావు అనే వ్యక్తిని భర్త హత్య చేశాడు. వివాహేతర సంబంధమే దీనికి కారణమని తెలుస్తోంది. 

చాపరాయి జలపాతంలో ఇద్దరు యువకుల గల్లంతు...

విశాఖపట్టణం : డుంబ్రిగూడ (మం) చాపరాయి జలపాతంలో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఆనంద్ పురం నుండి యువకులు విహారయాత్రకు వచ్చారు. వీరి ఆచూకి కోసం స్థానికులు గాలింపులు చేపట్టారు. 

భారత్ 48/2..

ముంబై : ఐదో వన్డేలో భారత్ వికెట్ల పతనం ప్రారంభమైంది. జట్టు స్కోరు 22 వద్ద శర్మ (16)..44 పరుగుల వద్ద కోహ్లీ (7) పెవిలియన్ చేరారు. ప్రస్తుతం 9.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది. 

భారత్ వికెట్ల పతనం ప్రారంభం..

ముంబై : భారీ లక్ష్యాన్ని చేధించడానికి బ్యాటింగ్ దిగిన భారత్ కు ఆదిలోనే దెబ్బ తగిలింది. ఓపెనర్ శర్మ 16 పరుగులు చేసి వెనుదిరిగాడు. 5.2 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది. 

18:08 - October 25, 2015

హైదరాబాద్ : వైసీపీ, కాంగ్రెస్ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి వ్యతిరేకంగా పని చేస్తున్నాయని టిడిపి నేత జూపూడి ప్రభాకర్ విమర్శించారు. రాజధాని అమరావతి నిర్మాణ కార్యక్రమంపై ఆ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ప్రపంచంలోనే మేటి రాజధానిగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తుంటే విపక్షలు పసలేని ఆరోపణలు చేయడం తగదని జూపూడి సూచించారు. 

17:41 - October 25, 2015

వరంగల్ : తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. జిల్లాలో యువ రైతు తనువు చాలించాడు. గూడురు మండలం రాములతండా గ్రామానికి చెందిన శ్రీనివాస్ రైతు ఒక ఎకరం పొలంలో పత్తి సాగు చేస్తున్నాడు. అప్పులు చేసి సాగు చేసిన ఈ పంట తెగులు సోకి ఎండిపోయింది. దీనితో అతనికి ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. అప్పులు అధికం కావడంతో తీవ్ర మనస్థాపానికి గురయైన శ్రీనివాస్ పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనితో శ్రీనివాస్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

 

17:33 - October 25, 2015

ముంబై : కీలకమైన చివరి మ్యాచ్ లో దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్స్ చెలరేగిపోయారు. ఆకాశమే హద్దు అన్నట్లుగా బ్యాట్ తో విజృంభించారు. బౌండరీలు..సిక్స్ లు కొడుతుంటే భారత బౌలర్లు చూస్తుండిపోయారు. భారత బౌలర్లను సౌతాఫ్రికా క్రీడాకారులు చీల్చిచెండారు. తొలుత టాస్ గెలిచిన సౌతాఫ్రికా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ కాక్, ఆమ్లాలు ఆటను ఆరంభించారు. ఆరంభం నుండే కాక్ ఎదురుదాడికి దిగడం ప్రారంభించాడు. ఫోర్లు సాధిస్తూ స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. జట్టు స్కోరు 33 వద్ద ఉన్నప్పుడు ఆమ్లా (23) పెవిలియన్ చేరాడు. అనంతరం కాక్ కు డుప్లెసిస్ జత కలిశాడు. వీరిద్దరూ కలిసి బౌండరీలు..సిక్స్ లు సాధిస్తూ భారత శిబిరంలో ఆందోళన నింపాడు. 42 బంతులను ఎదుర్కొన్న కాక్ 50 పరుగులు పూర్తి చేశాడు. ఇందులో 10 ఫోర్లు ఉన్నాయంటే ఎలా ఆడాడో అర్థం చేసుకోవచ్చు.

90 బంతుల్లో 101 పరుగులు చేసిన జోడి..
మరోవైపు డుప్లెసిస్ తాను కూడా తక్కువ తినలేదని నిరూపించాడు. భారత బౌలర్లు సంధించిన బంతులను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. డికాక్ - డుప్లెసిస్ ల జోడి 90 బంతుల్లో రెండో వికెట్ కు అజయేయంగా 101 పరుగులు జత చేశారు. ఈ జోడిని విడదీసేందుకు కెప్టెన్ ధోని బౌలర్లందరినీ ప్రయోగించాడు. ఆది నుండి బౌలర్లపై ఎదురు దాడికి దిగిన డికాక్ కేవలం 78 బంతుల్లోనే 16x4, 1x6 సాయంతో వంద పరుగులు పూర్తి చేశాడు. వన్డే కెరీర్ లో డికాక్ కు ఇది ఎనిమిదివ శతకం కాగా ఈ సిరీస్ లో రెండోది కావడం విశేషం. శతకం సాధించిన డికాక్ అదే దూకుడు కొనసాగించడంతో దక్షిణాఫ్రికా 25 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోయి 176 పరుగులు చేసింది.

రైనా బౌలింగ్ లో డికాక్ అవుట్...
చివరకు ధోని..రైనాను బౌలింగ్ కు దింపాడు. అతడి బౌలింగ్ లో డికాక్ (109) వెనుదిరిగాడు. లాంగాఫ్ దిశగా భారీ షాట్ ఆడగా బంతి గాల్లోకి లేచి అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ చేతుల్లో పడింది. అనంతరం డుప్లెసిస్ కు విలియర్స్ జత కలిశాడు. వీరిద్దరూ కలిసి అదే జోరును కొనసాగించారు. చేతిలో ఎనిమిది వికెట్లు ఉండడంతో క్రీజులో ఉన్న డివిలియర్స్, డుప్లెసిస్ భారత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. కెప్టెన్ డివిలియర్స్ అర్థ శతకంతో రాణించాడు. 34 బంతుల్లో డివిలియర్స్ 2x4, 3x6 సాయంతో 51 పరుగులు చేశాడు. వన్డే కెరీర్ లో ఇది 48వ అర్ధ సెంచరీ. మరోవైపు డుప్లెసిస్ శతకం సాధించాడు. 105 బంతులను ఎదుర్కొన్న డుప్లెసిస్ 7x4, 2x6 సాయంతో 100 పరుగులు చేశాడు. ముఖ్యంగా డివిలియర్స్ భారత బౌలర్లను చీల్చి చెండాడు. డివిలియర్స్ మైదానం నలువైపులా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగెత్తించాడు.

అక్షర్ బౌలింగ్ లో 24 పరుగులు..
ఇన్నింగ్స్ 43 ఓవర్ వేసిన అక్షర్ బౌలింగ్ లో డుప్లెసిస్ మూడు సిక్స్ లు, ఒక ఫోర్ బాది ఏకంగా 24 పరుగులు రాబట్టాడు. ఈ దశలో కాలి నొప్పి కారణంగా డుప్లెసిస్ రిటర్డ్ హార్ట్ గా వెనుదిరిగాడు. 115 బంతులను ఎదుర్కొన్న డుప్లెసిస్ 9x4, 6x6 సాయంతో 133 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికా కెప్టెన్ శతకం పూర్తి చేశాడు. 57 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. ఇందులో మూడు ఫోర్లు, ఎనిమిది సిక్స్ లున్నాయి. వన్డే కెరీర్ లో ఇది 23వ శతకం. జట్టు స్కోరు 398 పరుగుల వద్ద ఉన్నప్పుడు భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో భారీ షాట్ కోసం యత్నించిన డివిలియర్స్ (119) కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక చివర్లో మిల్లర్, బెహార్డిన్ లు ధాటిగా ఆడారు. 430 పరుగుల వద్ద బెహార్డిన్ (16) వెనుదిరిగాడు. నిర్ణీత 50 ఓవర్లలో దక్షిణాఫ్రికా 438 పరుగులు చేయగలిగింది. మిల్లర్ 22, ఎల్గర్ 5 నాటౌట్ గా మిగిలారు. భారత బౌలర్లలో కుమార్, శర్మ, హర్భజన్ సింగ్, రైనా తలో ఒక వికెట్ తీశారు.

స్కోరు బోర్డు : కాక్ (109, 17x4, 1x6), ఆమ్లా (23, 5x4), డుప్లెసిస్ (రిటైర్డ్ హార్ట్, 133, 9x4, 6x6), డివిలియర్స్ (119, 3x4, 11x6), మిల్లర్ (22 నాటౌట్), బెహార్డిన్ (16), ఎల్గర్ (5 నాటౌట్).

17:31 - October 25, 2015

వరంగల్ : దళితుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి వీకే సింగ్ పై వామపక్షాల ఉమ్మడి అభ్యర్థి గాలి వినోద్ కుమార్ వరంగల్ మట్టెవాడ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం వరంగల్ సిటీలోని దళితవాడల్లో పర్యటించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దళిత ఓట్లతో గెలిచిన బిజెపి ప్రభుత్వం ఇప్పుడు దాడులకు దిగుతోందని విమర్శించారు. 

17:21 - October 25, 2015

హైదరాబాద్ : వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తుందని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో భాన్సువాడ నియోజకవర్గానికి చెందిన పలు పార్టీల నేతలు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా నేతలకు మంత్రి పోచారం గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి పోచారం మాట్లాడారు. వరంగల్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ నేతలు రాజకీయం చేస్తున్నారని, ఎన్ని రాజకీయ ఎత్తుగడలు వేసినా కాంగ్రెస్, టీడీపీలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంక్షేమానికి ప్రభుత్వ పెద్ద పీఠ వేస్తోందని, దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వివరించారు. పేదలకు ఇళ్లు కట్టించేందుకు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. 

డివిలియర్స్ అవుట్..

ముంబై : వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఐదో వన్డే మ్యాచ్ లో సౌతాఫ్రికా భారీ స్కోరు దిశగా ముందుకు వెళుతోంది. 61 బంతుల్లో 119 పరుగులు చేసిన డివిలియర్స్ కుమార్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. 

వాంఖడేలో మరో సెంచరీ..

ముంబై : వాంఖడేలో మరో సెంచరీ నమోదైంది. భారత్ తో జరుగుతున్న ఐదో వన్డే మ్యాచ్ లో డుప్లెసిస్ సెంచరీ సాధించాడు. 105 బంతులను ఎదుర్కొన్న డుప్లెసిస్ 100 పరుగులు సాధించాడు. ఇందులో 7 ఫోర్లు 2 సిక్స్ లున్నాయి. మరోవైపు విలియర్స్ కూడా భారత బౌలర్లను చితక్కొడుతున్నాడు. కేవలం 46 బంతులను ఎదుర్కొని 77 పరుగులు చేశాడు. ఇందులో రెండు ఫోర్లు, ఆరు సిక్స్ లున్నాయి. 

సౌతాఫ్రికా 302/2..

ముంబై : భారత్ తో జరుగుతున్న ఐదో వన్డే మ్యాచ్ లో సౌతాఫ్రికా భారీ స్కోరు సాధించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం 40.3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. 

చితక్కొడుతున్న డుప్లెసిస్..విలియర్స్..

ముంబై : ఐదో వన్డేలో సౌతాఫ్రికా బ్యాట్ మెన్స్ జూలు వదుస్తున్నారు. భారీ స్కోరు సాధించే దిశగా ముందుకు వెళుతున్నారు. అద్భుత శతకం చేసి అవుట్ అయిన కాక్ (109) తరువాత వచ్చిన డుప్లెసిస్, విలియర్స్ లు భారత బౌలర్లను చీల్చి చెండాడుతున్నారు. బౌండరీలు..సిక్స్ లు సాధిస్తున్నారు. వీరిని విడదీయడానికి భారత బౌలర్లు అష్టకష్టాలు పడుతున్నారు. 

16:27 - October 25, 2015

నల్గొండ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రజల ఆశలు సన్నగిల్లుతున్నాయని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు పేర్కొన్నారు. నాగార్జునసాగర్ లో జరుగుతున్న ప్లీనరీ సమావేశంలో పాల్గొనేందుకు రాఘవులు నల్గొండకు వచ్చారు. ఈసందర్భంగా టెన్ టివితో పలు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై విశ్లేషించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని అత్యధిక ప్రజలు కోరుకున్నారని, వారనుకున్న విధంగానే రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఇక్కడ లాభ పడవచ్చని బూర్జువా పార్టీలు ఆశించాయన్నారు. తెలంగాణ వస్తే అభివృద్ధి జరుగుతుందని, ఇతరుల వల్ల రాష్ట్రం అభివృద్ధి కాలేదని ప్రజలు ఆశించారని తెలిపారు. కానీ వారి ఆశలకు భిన్నంగా ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయని, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలు విస్మరించి స్వప్రయోజనాల కోసం ఇతరుల కోసం పార్టీ పని చేస్తుందనే భావన ప్రజల్లో నెలకొందన్నారు. విభజన తరువాత హైదరాబాద్ ఆదాయం బాగా ఉంటుందని ఆశించారని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో భూమి ఎక్కువ ఉందని, ఆరు ఎకరాలైనా పంచడానికి అవకాశాలున్నాయని దీనిని విస్మరిస్తున్నారన్నారు. దీర్ఘకాలికంగా నీటి వనరులపై అశ్రద్ధ కనబరుస్తున్నారని, వాగ్దానాలు వమ్ము అవుతున్నాయని..అలాగే అవకాశాలు జారిపోతున్నాయన్నారు. ఇక్కడ కేసీఆర్ కు పరిపాలన అనుభవం ఉందని, అయినా అహంకారపూరిత పద్ధతుల్లో కనబడుతుందన్నారు. ప్రజలను గౌరవించకపోతే రాజకీయాల్లో తొందరగా అప్రతిష్ట పాలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సంఘటిత ఉద్యమాలు అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. వామపక్షాలు బలంగా ఉన్నాయని, అలాగే సామాజిక శక్తులు చురుగ్గా ఉంటున్నాయని రాఘవులు పేర్కొన్నారు. 

16:21 - October 25, 2015

బీహార్ : రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మూడు సూత్రాలు అవలింబించాల్సి ఉంటుందని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఆదివారం నలంద ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ తనదైనశైలిలో ప్రసంగించారు. బీహార్ రాష్ట్రం అభివృద్ధికి మూడు సూత్రాలు అవసరమని, నీరు..విద్యుత్..రోడ్లు అభివృద్ధి చెందితే బీహార్ కు మహర్ధశ పడుతుందన్నారు. బీజేపీ ప్రభుత్వం వస్తే ఈ సౌకర్యాలు కల్పిస్తామన్నారు. నిరంతరం విద్యుత్ ఉంటే యువకులు వలసలు పోరని, మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు లేక యువత వలస బాటపడుతున్నారని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి వలసలు నివారిస్తామని, బీహార్ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని మోడీ మరోసారి స్పష్టం చేశారు. 

16:18 - October 25, 2015

ఢిల్లీ : మంత్రి వీకేసింగ్ ను మంత్రిమండలి నుండి తొలగించాలని యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం ఉదయం బీజేపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. వీరిని పోలీసులు ముందే అడ్డుకున్నారు. లోనికి రాకుండా ఉండేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసులు..కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనితో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. హర్యానాలో దళితుల చిన్నారుల ఆత్మహత్యలపై వీకే సింగ్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 

15:58 - October 25, 2015

'బాహుబలి'..తెలుగు సినిమాను దర్శకుడు రాజమౌళి ప్రపంచస్థాయికి తీసుకెళ్లాడు. ఈ సినిమాకు కొనసాగింపుగా 'బాహుబలి -2' వస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా షూటింగ్ ప్రారంభం కాకముందే దీనిపై రకరకాల వార్తలు వస్తున్నాయి. 'బాహుబలి-3' కథా చర్చలు జరుగుతున్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. బాహుబలి-3, బాహుబలి-4 కూడా ఉన్నాయంటూ వస్తున్న పుకార్లపై ఎస్ఎస్ రాజమౌళి స్పందించారు. రూమర్స్ నమ్మొద్దంటూ సినీ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా వివరణ ఇచ్చారు. 'బాహుబలి' కథ పార్ట్ 2తోనే ముగుస్తుందని, బాహుబలి-3 ఉండదని తేల్చేశారు. అయితే బాహుబలి-2 మాత్రం ఇంతకు ముందెప్పుడూ కలిగించని అనుభూతిని కలిగిస్తుందన్నారు. సమయం వచ్చినప్పుడు అన్నీ సవివరంగా చెప్తానని.. రూమర్స్ని నమ్మొద్దంటూ ట్వీట్ చేశారు. 

కాక్ అవుట్..ప్లెసిస్ అర్ధ సెంచరీ..

ముంబై : ప్రమాదకరంగా మారిన కాక్ అవుట్ అయ్యాడు. రైనా బౌలింగ్ లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి కాక్ పెవిలియన్ చేరాడు. 87 బంతుల్లో 109 పరుగులు చేశాడు. ఇందులో 17 ఫోర్లు 1 సిక్స్ ఉన్నాయి. మరో వైపు ప్లెసిస్ అర్ధ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం 27 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. 

15:27 - October 25, 2015

హైదరాబాద్ : ఏపీ రాష్ట్ర రాజధాని 'అమరావతి' శంకుస్థాపనకు ఎంత ఖర్చు చేశారో చెప్పాలని వైసీపీ నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దీనిపై ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. రాజధానికి సింగపూర్..ఇతర ప్రాంతాల నుండి వచ్చే ముఖ్యులకు రవాణా ద్వారా రూ.199 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆరోపించారు. 

15:23 - October 25, 2015

అనంతపురం : ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా..టిడిపి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య మాటలు తారాస్థాయికి చేరాయి. రఘువీరా ఓ శాడిస్టు అని..దెబ్బలు తింటాడని జేసీ ఘాటుగా స్పందించారు. అనంతపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను లంచం తీసుకోవడం లేదని, కాంట్రాక్టర్లు ఇచ్చే చందాలు డీడీల రూపంలో తీసుకుంటున్నానని టిడిపి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. తన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించాలని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. మొన్నటి దాక జగన్ పై విమర్శలు చేసిన రఘువీరా ప్రస్తుతం ఆయనతో కలిసి పని చేసేందుకు సిద్ధం అనడం దేనికి నిదర్శనమన్నారు. రఘువీరా ఎప్పటికైనా జగన్ దగ్గరకు చేరుతాడని జోస్యం చెప్పారు. తన గురించి పట్టించుకుంటే రఘువీరా గురించి పట్టించుకుంటానని, నీ పంచె..విప్పి కొడుతారని తీవ్రంగా విమర్శించారు. బిసిలకు ఏం చేశావు ? ఒక మంచి ప్రయోజన కార్యక్రమం చేశావా ? అని జేసీ ప్రశ్నించారు. 

15:16 - October 25, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం హస్తినకు బయలుదేరనున్నట్లు తెలుస్తోంది. ఎల్లుండి జరిగే నీతి అయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారని సమాచారం. అదే సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో కేసీఆర్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాలు..ఇతర రాజకీయపరమైన అంశాలు చర్చించేందుకు సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నాం ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. రెండు ప్రధాన అంశాలపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం. నామినేటెడ్ పోస్టుల భర్తీ..రాష్ట్రానికి వచ్చే నిధులు సమకూర్చడంలో అనుసరించాల్సిన వైఖరిపై కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. నామినేటెడ్ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని ఇటీవలే సీఎం కేసీఆర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. 75-80 పోస్టులున్నా కొన్నే భర్తీ చేయడంతో నేతల్లో కొంత అసంతృప్తి నెలకొని ఉంది. ఇందులో రాజ్యాంగబద్ధంగా గవర్నర్ ఆమోదం వేసే కొన్ని పోస్టులుండడం దీనికి గ్రీన్ సిగ్నల్ కోసం గవర్నర్ తో చర్చించినట్లు తెలుస్తోంది. గవర్నర్ సహకారంతో నిధులను సమీకరించాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల అంశాలు..ఇతర రాజకీయ పరమైన అంశాలను గవర్నర్ తో చర్చించినట్లు సమాచారం. 

కాక్ సెంచరీ..

ముంబై : దక్షిణాఫ్రికా బ్యాట్ మెన్ కాక్ విజృంభించి ఆడుతున్నాడు. 78 బంతులను ఎదుర్కొన్న కాక్ 100 పరుగులు చేశాడు. మరోవైపు ప్లెసిస్ కూడా రాణిస్తున్నాడు. ప్రస్తుతం 22.3 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 160 పరుగులు చేసింది. కాక్ 100, ప్లెసిస్ 36 పరుగులతో ఆడుతున్నారు. 

సెంచరీ వైపుకు దూసుకెళుతున్న కాక్..

ముంబై : టీమిండియాతో జరుగుతున్న ఐదో వన్డేలో సౌతాఫ్రికా బ్యాట్ మెన్ కాక్ విజృంభిస్తున్నాడు. అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న కాక్ సెంచరీ వైపుకు దూసుకెళుతున్నాడు. ప్రస్తుతం 21 ఓవర్లలో 147 పరుగులు చేసింది. కాక్ 88, ప్లెసిస్ 31 పరుగులతో ఆడుతున్నారు. 

ఏపీ మున్సిపాల్టీ అక్రమ కట్టడాల క్రమబద్దీకరణ గడువు పెంపు..

ప్రకాశం : మున్సిపాల్టీల్లో అక్రమ కట్టడాల క్రమబద్దీకరణ గడువును పెంచుతున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. నవంబర్ చివరి వరకు పొడిగించినట్లు తెలిపారు. ప్రత్యేక హోదాపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు.

అశోక్ గజపతిరాజును ప్రశంసించిన మోడీ..

ఢిల్లీ : ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం కింద విజయనగరం జిల్లా ద్వారపూడి గ్రామాన్ని అభివృద్ధి చేసిన కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజును ప్రధాన మంత్రి మోడీ ప్రశసించారు. వెనుకబడిన కుటుంబాలు ఎక్కువగా ఉన్నందున ద్వారపూడి గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగిందని ఈ సందర్భంగా అశోక్ గజపతి రాజు పేర్కొన్నారు. వచ్చే మూడేళ్లలో మరిన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామని, తెలుగు వారికి విభజన ద్వారా అన్యాయం జరిగిందన్నారు. కేంద్రం నుండి రాష్ట్రానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందాల్సి ఉందని, కేంద్రం రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదనడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

డబుల్ బెడ్ రూం ఇళ్లకు ఈటెల శంకుస్థాపన..

కరీంనగర్ : అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూం పథకం అమలు చేస్తున్నామని మంత్రి ఈటెల పేర్కొన్నారు. ఆదివారం జిల్లాలోని హుజురాబాద్ లో డబుల్ బెడ్ రూం ఇళ్లకు మంత్రి ఈటెల శంకుస్థాపన చేశారు. ఇళ్ల మంజూరులో అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్..?

హైదరాబాద్ : ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జరిపిన భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. సోమవారం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అక్కడ ప్రధాన మంత్రి మోడీని కలిసే అవకాశం ఉంది. 

కావలి వికటించిన ఇంజక్షన్..

నెల్లూరు : కావలి ఏరియా ఆసుపత్రిలో ఇంజక్షన్ వికటించడంతో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. ప్రశ్నించిన బాలుడి తల్లి పట్ల వైద్యులు దురుసుగా ప్రవర్తించారు. 

14:32 - October 25, 2015

 

బయటకు వెళ్లినప్పుడు కాస్త మేకప్‌ వేసుకోవడం అనేది సర్వసాధారణ అలంకరణగా మారింది. మరి ఇలా వేసుకున్న మేకప్‌ ఎక్కువ సమయం ఉండాలంటే ఈ చిట్కాలు పాటించి చూడండి..

  • ఆయిల్‌ స్కిన్‌ ఉన్నవారు యాస్ట్రింజెంట్‌ లోషన్‌ వాడితే ఎక్కువసేపు మేకప్‌ ఉంటుంది. ముందుగా యాస్ట్రింజెంట్‌ లోషన్‌ రాసుకుని, అది పూర్తిగా ఆరిన తర్వాత ఫౌండేషన్‌ రాసుకోవాలి.
  • లోషన్‌ అందుబాటులో లేకపోతే ఐస్‌క్యూబ్‌ను శుభ్రమైన బట్టలో చుట్టి ముఖంపై కొన్ని సెకన్ల పాటు రుద్దుకోవాలి.
  • లిప్‌స్టిక్‌ ఎక్కువకాలం ఉండాలంటే ఫౌండేషన్‌ను పెదవులపై లైట్‌గా వేసుకోవాలి.
  • ముఖం, మెడపై పౌడర్‌ రాసుకున్న తర్వాత నీటిలో ముంచిన స్పాంజ్‌తో అద్దాలి. ఇలా చేయడం వల్ల పౌడర్‌ ఎక్కువసేపు ముఖంపై నిలిచిపోతుంది.
  • కాంపాక్ట్‌ పౌడర్‌ వాడితే ముఖం మృదువుగా కనిపిస్తుంది.
  • మేకప్‌ పూర్తయిన తర్వాత ఫైనల్‌ టచ్చింగ్‌గా బ్లాటింగ్‌ పేపర్‌తో ముఖాన్ని సున్నితంగా అద్దాలి.

ఈ చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే... మేకప్‌ ఎక్కువ సేపు ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం .. ఇంటికి రాగానే మేకప్‌ పూర్తిగా తీసేయాలి. మేకప్‌ ఎక్కువ సేపు ఉంచుకుంటే ఇందులో ఉండే రసాయనాలు హాని చేస్తాయి.

సౌతాఫ్రికా దూకుడు..

ముంబై : సౌతాఫ్రికా జట్టు బ్యాట్స్ మెన్స్ దూకుడుగా ఆడుతున్నారు. టీమిండియాతో జరుగుతున్న ఐదో వన్డేలో కాక్ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 42 బంతులను ఎదుర్కొన్న కాక్ 50 పరుగులు పూర్తి చేశాడు. ఇందులో 10 ఫోర్లు ఉండడం విశేషం. మరోవైపు ప్లెసిస్ 16 పరుగులతో ఆడుతున్నారు. ప్రస్తుతం 12.4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 92 పరుగులు చేసింది.

14:28 - October 25, 2015

బాలీవుడ్‌ నటుడు 'అభిషేక్‌ బచ్చన్‌'తో కలిసి తమిళ స్టార్‌ హీరో 'సూర్య' విమాన ప్రయాణం చేశారు. అనుకోకుండా జరిగిన ఈ ప్రయాణం పట్ల 'సూర్య' ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. 'అభిషేక్‌'తో కలిసి చేసిన ఈ ప్రయాణం ఎంతో మజానిచ్చిందంటూ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. అంతే కాదు 'అభిషేక్‌'తో తీసుకున్న ఓ సెల్ఫీని కూడా ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 'అభిషేక్‌' యజమానిగా వ్యవహరిస్తున్న కబడ్డీ జట్టు జైపూర్‌ పాంథర్స్‌కి 'సూర్య' ఆల్‌ ద బెస్ట్ చెప్పారు. ఆయనతో కలిసి ప్రయాణించే అవకాశాన్ని కల్పించిన జెట్‌ ఎయిర్‌వేస్‌కి కూడా 'సూర్య' కృతజ్ఞతలు తెలియజేయడం విశేషం.

14:26 - October 25, 2015

పూరీ జగన్నాథ్‌.. వైవిధ్యమైన కథలకే కాదు భిన్న టైటిల్స్ కు కూడా పెట్టింది పేరు. ఆయన రూపొందించే చిత్రాలు, టైటిల్సే కాదు.. ఆయా చిత్రాల్లోని హీరోల క్యారెక్టర్స్ కూడా ఫ్రెష్‌గా సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. తాజాగా 'వరుణ్‌తేజ్‌' సినిమాకి 'లోఫర్‌' అనే టైటిల్‌ పెట్టి అందర్నీ ఆశ్చర్యపోయేలా చేశాడు. ఇదిలా ఉంటే, త్వరలోనే 'మహేష్‌', 'పూరీ' కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రానికి 'ఎనిమీ' అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారని సమాచారం. 'ఎనిమీ'కి సంబంధించి స్క్రిప్ట్ ను ఇప్పటికే 'మహేష్‌'కి 'పూరీ' వినిపించారట. కథ విని ఎక్స్ లెంట్‌గా ఉందంటూ 'మహేష్‌' పచ్చ జెండా ఊపినట్టు తెలుస్తోంది. వీరి కాంబినేషన్‌లో విడుదలైన 'పోకిరి', 'బిజినెస్‌మెన్‌' చిత్రాలు విశేష ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. హ్యాట్రిక్‌ హిట్‌ కోసం చేసే ప్రయత్నంలో భాగంగా 'పూరీ' మరోసారి వినూత్నమైన టైటిల్‌ 'ఎనిమీ' అని పెట్టి అందర్నీ మరోమారు ఆకట్టుకుంటున్నారు.

14:24 - October 25, 2015

'హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌', 'దేవదాస్‌', 'గుజారీష్‌' వంటి తదితర చిత్రాలు 'ఐశ్వర్యరాయ్', 'సంజయ్ లీలా భన్సాలీ' కాంబినేషన్‌లో రూపొంది విశేష ప్రేక్షకాదరణ పొందాయి. తాజాగా ఈ కాంబినేషన్‌లో మరో చిత్రం రూపొందనుంది. ఈ విషయాన్ని స్వయంగా 'ఐశ్వర్యరాయ్' తెలపడం విశేషం. ఐదేళ్ళ విరామం తర్వాత ఐశ్వర్య 'జజ్బా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా 'భన్సాలీ'తో ఓ చిత్రాన్ని చేసేందుకు అంగీకరించారు. భన్సాలీజీతో నాలుగో ప్రాజెక్ట్ చేయడం ఆనందంగా ఉందని, ఆయన ఎంచుకునే స్క్రిప్ట్ లు కష్టతరంగా ఉన్నప్పటికీ ఆయనతో సినిమా చేయడం చాలా ఈజీ అని 'ఐశ్వర్య' తెలిపింది. తాజా ప్రాజెక్ట్ విషయానికొస్తే, ఇదొక వైవిధ్యమైన కథతో రూపొందనుందని పేర్కొన్నారు. పాత్ర తీరు గురించి ఇప్పుడప్పుడే ఏమీ చెప్పలేనని, అతి త్వరలోనే ఈచిత్రానికి సంబంధించి షూటింగ్‌ ప్రారంభం అవుతుందని 'ఐశ్వర్య రాయ్' పేర్కొన్నారు.

14:20 - October 25, 2015

టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ల్లో స్టార్‌ హీరోయిన్‌గా తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్న మిల్కీ బ్యూటీ 'తమన్నా' ఓ సూపర్‌ లక్కీ ఛాన్స్ ను కొట్టేసింది. ఏకంగా 'కమల్‌హాసన్‌' సరసన నటించే అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకుంది. 'త్రిష' తర్వాత ఈ తరహా అవకాశాన్ని దక్కించుకుంది 'తమన్నా'నే అని అందరూ అంటున్నారు. 'కమల్‌హాసన్‌' ప్రస్తుతం 'చీకటి రాజ్యం' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో 'కమల్‌' సరసన 'త్రిష' నటిస్తోంది. ఈ సినిమా తర్వాత సీనియర్‌ దర్శకుడు మౌళి రాసిన కథతో 'కమల్‌' ఓ సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి కూడా 'చీకటి రాజ్యం' దర్శకుడు రాజేశ్‌ ఎం.సెల్వానే దర్శకత్వం వహిస్తారట. ఇందులో 'కమల్‌'కి జోడీగా 'తమన్నా'ని తీసుకోవాలని యూనిట్‌ యోచిస్తోందట. ఇదే విషయాన్ని 'కమల్‌' ముందు ప్రస్తావించగా, ఆయన సైతం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం. 'తమన్నా' ప్రస్తుతం 'నాగార్జున', 'కార్తీ' కాంబినేషన్‌లో రూపొందుతున్న 'ఊపిరి' చిత్రంలోను, 'రవితేజ' సరసన 'బెంగాల్‌ టైగర్‌'లోనూ నటిస్తోంది.

14:18 - October 25, 2015

లండన్‌: మద్యం తాగడం వల్ల రొమ్ము క్యాన్సర్‌ ముప్పు పెరిగే అవకాశం ఎక్కువని తాజా అధ్యయనాలు పేర్కొన్నాయి. రోజూ ఓ గ్లాస్ వైన్‌, బీర్‌ తాగడం వల్ల రొమ్ము క్యాన్సర్‌ ప్రమాదం నాలుగింతలు పెరుగుతుందని తెలిపాయి. పది ఐరోపా దేశాలకు చెందిన 35-70 మధ్య వయస్సు కలిగిన 3,34,850 మంది మహిళలపై అంతర్జాతీయ బృందం పరిశోధన నిర్వహించింది. ఐదు స్పానిష్‌ యూనివర్సిటీలు పరిశోధన నిర్వహించిన మద్యానికి, క్యాన్సర్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని ధ్రువీకరించాయి. 11 ఏళ్లు పరిశీలించిన తరువాత 11,576 మంది మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ ఉందని గుర్తించారు. రోజు 10 గ్రాముల మద్యాన్ని తాగిన మహిళల్లో ఈ ప్రమాదం నాలుగింతులు పెరిగినట్టు పరిశోధకులు తెలిపారు. మద్యం తీసుకునే పరిమాణాన్ని బట్టి క్యాన్సర్‌ ముప్పు పెరుగుతుందని పేర్కొన్నారు.

సౌతాఫ్రికా 61/1..

ముంబై : ఇండియాతో జరుగుతున్న ఐదో వన్డేలో సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్స్ నిలకడగా ఆడుతున్నారు. 8 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది. కాక్ 28, ప్లెసిస్ 9 పరుగులతో ఆడుతున్నారు. 

14:10 - October 25, 2015

నల్గొండ : తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబులపై సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు రాఘవులు విమర్శలు గుప్పించారు. ఇరువురికి రాష్ట్రాలు, దేశంతోనూ పనిలేదని... వారి చూపంతా విదేశాల పైనే ఉందన్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో జరుగుతున్న ఆ పార్టీ ప్లీనరీ సమావేశాలకు ఆయన హాజరై ప్రసంగించారు. అమెరికా, చైనా, సింగపూర్‌, జపాన్‌ దేశాలు సాయం చేస్తే తప్ప రాష్ట్రాలు బాగుపడవని అభిప్రాయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇక్కడి ప్రజల శ్రమ, మేధోశక్తి మీద వారికి నమ్మకం లేదని ఆరోపించారు.

 

14:09 - October 25, 2015

హైదరాబాద్ : ఇటీవల ఉభయ రాష్ట్రాల్లో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ప్రేమ విఫలమైందని..తీవ్ర మనస్థాపానికి గురై కొంతమంది..కొన్ని కొన్ని కారణాలతో నిండు జీవితాలను మధ్యలోనే తుంచేసుకుంటున్నారు. తాజాగా ఓ కళాశాలకు చెందిన హాస్టల్ వార్డెన్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రేమ విఫలమే ఇందుకు కారణమని తెలుస్తోంది. రాజేంద్రనగర్ లోని హైదర్ గూడలో నారాయణ రెసిడెన్షియల్ కాలేజీ హాస్టల్ లో వరంగల్ జిల్లాకు చెందిన కృష్ణ వార్డెన్ గా వ్యవహరిస్తున్నాడు. శనివారం రాత్రి వరకు విద్యార్థులతో కృష్ణ మాట్లాడాడు. ఆదివారం ఉదయం వార్డెన్ కనిపించకపోవడంతో విద్యార్థులు వెతికారు. అతను నివాసం ఉంటున్న ఇంట్లో ఉరి వేసుకుని చనిపోవడాన్ని విద్యార్థులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ప్రేమ విఫలంపై కృష్ణ తన ఫేస్ బుక్ లో పలు కామెంట్స్ రాసినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. 

 

14:06 - October 25, 2015

నల్గొండ : జ్ఞానాన్ని, చైతన్యాన్ని కల్గించే విశ్వ విద్యాలయాలను నేడు మార్కెట్‌ శక్తులు ఆక్రమించాయని చుక్కా రామయ్య ఆరోపించారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో సీపీఎం తెలంగాణ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ప్రారంభం సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అంటూ కేసీఆర్‌ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసిందని.. కానీ ఆ విద్యను పేదలకు అందుబాటులో లేకుండా చేశారని విమర్శించారు.  

14:01 - October 25, 2015

ఆదిలాబాద్‌ : జల్లాలోని నిర్మల్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. కడ్తాల్‌ గ్రామంలో ఒకేసారి మూడు ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. ఒక ఇంట్లోంచి 50 తులాల బంగారంతో పాటు లక్షన్నర రూపాయల నగదును దోచుకెళ్లారు. ఒకేరోజు దొంగలు బీభత్సం సృష్టించడంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు.

13:59 - October 25, 2015

ప్రకాశం : జిల్లాలోని కోరిశపాడు మండలం బొడ్డువానిపాలెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ నేరెళ్ల కోమలి ఉరివేసుకొని ఆత్మహత్యచేసుకుంది. దసరా పండుగకు సొంతగ్రామమైన బొడ్డువానిపాలెంకు వచ్చిన కోమలి ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించిన వ్యక్తితో పెళ్లికి ఇరు కుటుంబాలు అభ్యంతరాలు చెప్పడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.  

13:54 - October 25, 2015

ఢిల్లీ : మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ తన అంతరంగాన్ని తెలిపారు. ఇవాళ భారత్‌, సౌతాఫ్రికా మధ్య ఐదో వన్డే ఆసక్తికరంగా ఉంటుందన్నారు. ఇరు జట్లు రెండు మ్యాచ్‌లు గెలిచాయని చెప్పారు. భారత్‌, దక్షిణాఫ్రికా జట్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అవయవ దానంపై కొన్ని రాష్ట్రాలు చొరవ తీసుకున్నాయని పేర్కొన్నారు. అయితే అవయవ దానంలో తమిళనాడు బాగా కృషి చేస్తోందని అభినందించారు.

 

ఆమ్లా అవుట్..

ముంబై : ఐదో వన్డేలో సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. శర్మ బౌలింగ్ లో ఆమ్లా (23) పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం 4.0 ఓవర్లలో సౌతాఫ్రికా ఒక వికెట్ నష్టానికి 33 పరుగులు చేసింది. 

13:49 - October 25, 2015

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఏపీ పీసీసీ చీఫ్‌ రఘువీరా ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ వినూత్న నిరసన తెలిపింది. పాట్నా వెళ్తున్న రైలులో మోడీకో హటావో దేశ్‌కో బచావో అన్న నినాదాలు చేశారు. బీహార్‌ ఎన్నికల్లో బీజేపీ కూటమిని ఓడించి... కాంగ్రెస్‌ మిత్రపక్షాన్ని గెలిపించాలని ప్రయాణీకులను అభ్యర్థించారు. వారికి కరపత్రాలు పంపిణీ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి... ఇప్పుడు ఆ హామీలు విస్మరించి రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాయని రఘువీరా మండిపడ్డారు.

 

13:45 - October 25, 2015

ఖమ్మం : జిల్లాలో కామేపల్లి మండలం గోవిందరాలలో ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గోవిందరాల తండాకు చెందిన నెహ్రూ, పద్మలు ఎదురెదురు ఇళ్లల్లో ఉండేవారు. నాలుగు సంవత్సరం క్రింతం వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఈ వివాహం నెహ్రూ కుటుంబానికి ఇష్టం లేదు. నెహ్రూ హైదరాబాద్ లోని మియాపూర్ లో నివాసముంటూ.. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే గర్భిణీగా ఉన్న పద్మ గత ఆరునెలల కిత్రం హైదరాబాద్ వచ్చింది. ఆడ పిల్లకు జన్మనిచ్చింది. ఈక్రమంలోనే ఈనెల 23 వ తేదీన విద్యుత్ షాక్ తో పద్మ మృతి చెందినట్లుగా ఆమె తల్లిదండ్రులకు నెహ్రూ సమాచారం ఇచ్చారు. పద్మ తల్లిదండ్రులు దిండిగల్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. భర్త, కుటుంట సభ్యుల వేధింపులే తమ కూతురు మృతికి కారణమని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. పద్మ తల్లిదండ్రులు ఆర్థికపరిస్థితి అంతా బాగా లేకపోవడం గ్రామస్తులు ఆర్థికసహాయం చేయడంతో హైదరాబాద్ వెళ్లి మృతదేహాన్ని గొవిందరాలకు తీసుకొచ్చారు. పద్మ మృతదేహన్ని ఆమె అత్త ఇంటి ఎదుట ఖననం ఇంటి ముందు ఖననం చేశారు. ఈక్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అయితే ఖననం చేసిన మృతదేహాన్ని తీసి స్మశాన వాటికకు తరలించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. పద్మ కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నారు. కానీ పద్మ బంధువులు అందుకు ఒప్పుకోవడం లేదు. ఇదిలావుంటే భార్య పద్మను తానే హత్య చేసినట్లు భర్త నెహ్రూ పోలీసుల ఎదుటు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. గతంలో అత్తమామలు కట్నం కోసం వేధిస్తున్నారంటూ గతంలో పద్మ పిఎస్ లో ఫిర్యాదు చేసినట్లు కూడా సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నారు. 

సౌతాఫ్రికా 15/0..

ముంబై : భారత్ తో జరుగుతున్న ఐదో వన్డే మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఆరంభించింది. ఓపెనరుర్ల డికాక్, ఆమ్లా ఇన్నింగ్స్ ఆరంభించగా తొలి ఓవర్ భారత్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వేశాడు. ప్రస్తుతం 2.0 ఓవర్లలో సౌతాఫ్రికా 15 పరుగులు చేసింది. కాక్ 4, ఆమ్లా 10 పరుగులతో ఆడుతున్నారు. ఐదు వన్డేల సిరీస్ 2-2తో సమమైన నేపథ్యంలో నిర్ణయాత్మకమైన ఈ వన్డేలో గెలుపొంది సిరీస్ ను కైవసం చేసుకోవాలని ఇరుజట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. 

నారాయణ కాలేజీ హాస్టల్ వార్డెన్ ఆత్మహత్య..

హైదరాబాద్ : రాజేంద్రనగర్ హైదర్ గూడలో నారాయణ కాలేజీ హాస్టల్ వార్డెన్ కృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

పాలకుల మాటలు నీటి మూటలే - తమ్మినేని..

నల్గొండ : తాము అధికారంలోకి వస్తే ధర్నా చౌక్ ఖాళీగా ఉండాల్సిందేనని చెప్పిన పాలకుల మాటలు నీటి మూటలే అని తేలిందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని విమర్శించారు.

 

ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పాలన - రాఘవులు..

నల్గొండ : రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పాలన సాగుతోందని, హామీలు అమలు చేయకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి నెలకొందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు విమర్శించారు. ఇద్దరు చంద్రులు నల్లకళ్లద్దాలు పెట్టుకుని రాష్ట్రాలు వదిలి విదేశాల వెంట తిరుగుతున్నారని, ప్రజల ప్రతిభపై వారికి నమ్మకం లేదన్నారు. రైతులను యోగా చేయమని సలహా ఇచ్చే కేంద్ర మంత్రులు పాలన వదిలి హిమాలయాలకు వెళ్లి యోగా చేసుకోవాలని సూచించారు. ఐక్య ఉద్యమాలు ఉధృతం చేయడం ద్వారా వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల ఐక్యత బలపడుతోందని తెలిపారు.

నాగార్జునసాగర్ లో సీపీఎం రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు..

నల్గొండ : నాగార్జున సాగర్ లో సీపీఎం రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్టీ జెండాను మల్లు స్వరాజ్యం ఆవిష్కరించారు. ఫొటో ప్రదర్శనను చుక్కా రామయ్య ప్రారంభించారు. ఈ సమావేశంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు, తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, చెరుపల్లి సీతారాములు, వీరయ్య, ఎమ్మెల్యే రాజయ్య పాల్గొన్నారు. 

పోలీసు జీపు వాహనం ఢీకొని యువకుడి మృతి..

హైదరాబాద్ : ఛత్రినాక ఆర్ డీ ఫంక్షన్ హాల్ వద్ద అదుపు తప్పిన పోలీసు వాహనం యువకుడిపైకి దూసుకొచ్చింది. దీనితో యువకుడు అక్కడికక్కడనే మృతి చెందాడు. పీఎస్ ఎదుట మృతుడి కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. 

13:15 - October 25, 2015

నల్గొండ : నాగార్జునసాగర్ లోని విజయవిహార్ లో సీపీఎం తెలంగాణ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. పార్టీ జెండాను మల్లుస్వరాజ్యం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, కేంద్రకమిటీ సభ్యులు ఎస్.వీరయ్య, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు హాజరయ్యారు.

12:59 - October 25, 2015

విజయనగరం : జిల్లాలోని ఎస్‌కోట ముసిడిపల్లిలో దారుణం జరిగింది. వరుసకు బావ అయిన వ్యక్తే మరదలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మరదలిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం తాను గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. చికిత్స కొసం ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. ప్రస్తుతం మరదలి పరిస్థితి విషమంగా ఉంది. ముసిడిపల్లికి చెందిన పొట్నూరు బాబురావుకు ఎనిమిది సంవత్సరాల క్రింతం వివాహం అయింది. అతని వేధింపులు తాళలేక భార్య బాబురావును వదిలేసి వెళ్లిపోయింది. అప్పటి నుంచి బాబురావు బలాదూర్ గా తిరుగుతున్నాడు. అయితే అతని తమ్ముడు అన్న అయినా బాబురావును తను ఉంటున్న ఇంటికి దగ్గర్లో పక్కింట్లో ఉంచాడు. ఈక్రమంలో బాబురావు కన్ను తమ్ముని భార్యపై పడింది.  ఆమెను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. ఆమె స్నానం చేస్తుండగా వీడియోలు తీశాడు. దీంతో 15 రోజుల క్రితం యువతి కుటుంబ సభ్యులు బాబూరావుపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పటి నుంచి అతనను పరారీలో ఉన్నాడు. ఇవాళ తెల్లవారుజామున యువతి ఇంటికి వెళ్లిన బాబూరావు... కత్తితో ఆమెపై కిరాతకంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం నిందితుడు అదే కత్తితో గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. విశాఖ కేజీహెచ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసుల కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

 

12:40 - October 25, 2015

కరీంనగర్‌ : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కత్లాపూర్‌ మండలం భూషణ్‌రావుపేటలో రాజురెడ్డి అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పులబాధ తాళలేక మనస్తాపం చెందిన ఆయన.. పురుగుల మందు తాగి బలవన్మరణం చేసుకున్నాడు. 

కరీంనగర్ జిల్లాలో రైతు ఆత్మహత్య...

కరీంనగర్‌ : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కత్లాపూర్‌ మండలం భూషణ్‌రావుపేటలో రాజురెడ్డి అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

12:35 - October 25, 2015

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం... ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయిని హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ హెచ్చరించారు. హైదరాబాద్‌ కేబీఆర్‌ పార్క్‌ దగ్గర బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ క్యాన్సర్‌పై ఉన్న అపోహలు వదిలి ఈ వ్యాధిపై పోరాటం చేయాలని ఆయన కోరారు. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందన్న నమ్మకం ఉందని...ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. నిధుల విషయంలో ప్రణాళిక బద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఎప్పటికప్పుడు నివేదిక అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సినీ నటి అంజలి, బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు పుల్లెల గోపీచంద్‌, పీవీ సింధు ర్యాలీలో పాల్గొన్నారు.

 

12:22 - October 25, 2015

భారతదేశం అభివృద్ధి చెందాలంటే... ఆర్థికపరిస్థితి బాగుపడాలంటే మేకిన్ ఇండియా వల్ల సాధ్యం కాదని.. మేక్ ఫర్ ఇండియా వల్లే సాధ్యం అవుతుందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. 'ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతి శంకుస్థాపన ఘనంగా జరిగింది. అయతే అమరావతి కల సాకారం కావడానికి ప్రపంచఆర్థిక వ్యవస్థకు సంబంధం ఏంటీ.. అనే అంశాలపై ఫర్ ద పీపుల్ టాక్ షో విత్ రాఘవులు విశ్లేషణ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. మన దేశ ప్రజల కొనుగోలు శక్తిపై ఆధారపడి దేశ ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుందని రాఘువులు చెప్పారు. భారత్ విదేశాలపై ఆధారపడడం ముఖ్యం కాదని.. ఇప్పుడు కావాల్సింది.. మేక్ ఫర్ ఇండియా అన్నారు. దేశ ప్రజల కోసం తయారు చేయండి... దేశంలోనే అమ్మండి అనే నినాదంతో ముందుకు వెళ్లాలని సూంచించారు. మరిన్ని వివరాలను ఆయన మాటల్లోనే చూద్దాం....
కొనుగోలు శక్తి ఉంటే ఆర్థికపరిస్థితి మెరుగు పడుతుంది...
'రాజధాని శంకుస్థాపన రోజున ప్రధాని మోడీ.. మేకిన్ ఇండియా అని .. ఎపీ సీఎం చంద్రబాబు రాష్ట్రం అభివృద్ధిలో ముందకుపోనుందని గొప్పగా చెప్పారు. వారు చెప్పే మాటలు నిజం కావడానికి ప్రస్తుతం దేశంలో అలాంటి పరిస్థితులున్నాయా అనే అంశాలను పరిశీలించాలి. ఎపి రాజధానిని ప్రపంచంలోని ఇతర దేశాలపై ఆధారపడి నిర్మించాలని ప్రయత్నం చేస్తున్నారు. అది సరికాదు. మోడీ 18 దేశాలు తిరిగారు. కేసీఆర్ కూడా ప్రపంచంలోని ఇతర దేశాలు తిరిగారు. ప్రపంచం ఎలా వుందో తెలుసుకుంటే వీరు చెప్పేంది నిజమో కాదో తెలుస్తోంది. ఐఎంఎఫ్ ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రపంచ ఆర్థిక పరిస్థితిపై నివేదిక విడుదల చేస్తుంది. ఈనెలలో ఐఎంఎఫ్ నివేదికన విడుదల చేసింది. ప్రపంచ ఆర్థిక పరిస్థతి బాగలేదని పేర్కొంది. ధనిక దేశాలు, వర్ధమాన దేశాల పరిస్థితి అంతా బాగలేదని.. కొద్దిగా కోలుకుంటున్నాయని నివేదికలో పేర్కొన్నారు. లాభాలు ఉంటేనే పెట్టుడులు వస్తాయి. ప్రపంచంలో కొనేవారు లేరు. ప్రపంచ వ్యాపారం పడిపోయింది. 0.2 శాతం వ్యాపారం పడిపోయింది. ఇక్కడ పరిశ్రమలు పెట్టండని మోడీ, చంద్రబాబు విదేశాలను కోరుతున్నారు. కానీ వారు ఇక్కడి పెట్టుబడులు పెడితే... తయారైన ఉత్పత్తులను కొనేవారు లేరు. ప్రజలకు కొనుగోలు శక్తి ఉంటేనే ప్రపంచ ఆర్థికపరిస్థితి బాగుపడుతుంది. ధరలు పడిపోయినా.. కొనేవారు లేరు. డాలర్ అన్నింటికీ మార్గదర్శకంగా ఉంటుంది. ఎగుమతులపై ఆధారపడిన దేశాలు దెబ్బతిన్నాయి.
ప్రపంచ ఆర్థికవ్యవస్థను చైనా, ఇండియా రక్షించే పరిస్థితి లేదు..
ఆసియా ఖండంలో ఎక్కువ జనాభా కలిగిన దేశాలు ఉన్నాయి. జనాభా అధికంగా ఉన్న దేశాల ఆర్థికపరిస్థితి బాగుంటే.. ప్రపంచఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఎగుమతులపై ఆధారపడి దేశ ఆర్థికవ్యవస్థను నిర్మించాలనుకుంటే చైనాకు ఎదురైన పరిస్థితి మనకు ఎదురవుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చైనా, ఇండియా రక్షించే పరిస్థితి లేదు. ఎగుమతులు బాగా చేసే పరిస్థితి ఉంటే ఆర్థికవ్యవస్థలో ముందుకు పోతాయి. కానీ విదేశాల్లో కొనేవాడు లేడు. మన దేశ ఆర్థిక పరిస్థితి స్తబ్దతగా ఉందని ఐఎంఎఫ్ నివేదిక చెప్పింది. అని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

నాగార్జున సాగర్ లో సీపీఎం తెలంగాణ ప్లీనరీ సమావేశాలు

నల్గొండ : నాగార్జునసాగర్ లోని విజయవిహార్ లో సీపీఎం తెలంగాణ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. పార్టీ పెండాను మల్లుస్వరాజ్యం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, కేంద్రకమిటీ సభ్యులు ఎస్.వీరయ్య, చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య హాజరయ్యారు. 

09:48 - October 25, 2015

గుంటూరు : అసెంబ్లీ శీతాకాల సమావేశాలు గుంటూరు జిల్లా తుళ్లూరులో నిర్వహించేందుకు ఏపీ సర్కార్‌ సన్నాహాలు చేస్తోంది. నూతన భవన నిర్మాణంపై రహదారులు, భవనాల శాఖ ఉన్నతాధికారులతో స్పీకర్ కోడెల సమీక్ష నిర్వహించారు. తాత్కాలిక శాసన సభ నిర్మాణ వ్యయంపై ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం అంగీకరిస్తే టెండర్ ప్రక్రియ ద్వారా నిర్మాణం చేపడతామన్నారు. తాత్కాలిక శాసనసభలో సమావేశాల నిర్వహణపై చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
తాత్కాలిక భవనాల నిర్మాణానికి కసరత్తు
అసెంబ్లీ శీతాకాల సమావేశాల కోసం రాజధాని ప్రాంతం తుళ్లూరులో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. డిసెంబర్‌లో ఐదు రోజులపాటు జరిగే ఈ సమావేశాలతోపాటు, శాసనమండలి సమావేశాలూ తుళ్లూరులోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రహదారులు, భవనాల శాఖ అధికారులతో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీ ఆవరణలోని తన ఛాంబర్‌లో సమీక్ష నిర్వహించారు. తాత్కాలిక భవనాల నిర్మాణానికి సుమారు 12 కోట్లు వ్యయం అవుతుందని రహదారులు, భవనాల శాఖ అధికారులు స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు వివరించినట్లు సమాచారం.
పూర్తి వివరాలతో నివేదిక కోరిన స్పీకర్‌
ఆర్ అండ్ బి అధికారులు తాత్కాలిక శాసనసభ నిర్మాణ వ్యయం ఎక్కువ అవుతుందని అభిప్రాయపడిన నేపథ్యంలో ఇదే అంశంపై ప్రభుత్వానికి సవివరంగా ఒక నివేదిక ఇవ్వాలని స్పీకర్ కోడెల నిర్ణయించారు. వివిధ సంస్థలు అందచేసిన వ్యయ వివరాలను ఇందులో పొందు పరచనున్నారు. రాష్ట్రం ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సమావేశాల నిర్వహణపై తుది నిర్ణయాన్ని సీఎం చంద్రబాబుకు వదిలిపెట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే నామినేషన్ పద్ధతిలో కాకుండా టెండర్ల ద్వారా పనులు అప్పగించాలని సమావేశంలో నిర్ణయించారు.
ఖర్చులు భరించేందుకు స్పీకర్‌ అంగీకారం
హైదరాబాద్‌లో కాకుండా మరే ప్రాంతంలో సభ నిర్వహించినా, సభ్యుల వసతి, ఆహారం, రవాణా వంటి సదుపాయాలు అసెంబ్లీ భరించాల్సి ఉంటుందని కార్యదర్శి సత్యనారాయణ చెప్పడంతో.. అందుకు స్పీకర్‌ అంగీకారం తెలిపారు. అమరావతిలో అసెంబ్లీ నిర్మాణంతో పాటు, సభ్యుల రవాణ, ఆహారం తదితర విషయాల్లో తమ నైపుణ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పలు సంస్థలు సూచించడంతో.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు పనులు చేపడతామని స్పీకర్ తెలిపారు.

 

09:43 - October 25, 2015

నల్గొండ : నేటి నుంచి మూడ్రోజుల పాటు నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో సీపీఎం తెలంగాణ రాష్ర్ట ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. ఇప్పటికే కామ్రెడ్లు సాగరక్‌కు చేరుకున్నారు. పార్టీ భవిష్యత్‌ ఉద్యమాలపై ప్లీనరీలో చర్చించనున్నారు. తెలంగాణలోని పది జిల్లాల నుంచి 600 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత సారంపల్లి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాల అమలు, రైతుల ఆత్మహత్యలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, కేజీ నుంచి పీజీ ఉచిత విద్య, ఆశా వర్కర్ల సమస్యలు, ఆందోళనులు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై చర్చించనున్నట్లు తెలిపారు. అలాగే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, గత మహాసభలో తీసుకున్న నిర్ణయాలు, భవిష్యత్ ప్రణాళికపై చర్చిస్తామని పేర్కొన్నారు. సీఎం కేసీర్ ఫ్యూడలిస్టుగా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్భందాన్ని ప్రయోగిస్తున్నారని చెప్పారు. వామపక్షాలు ఒకే వేదికపైకి వచ్చాయన్నారు. ప్రజాస్వామ్య, ప్రజాతంత్ర శక్తులను కూడగడుతున్నామని తెలిపారు. ప్రజా సమస్యల పరిస్కారానికి ఉద్యమిస్తామిస్తామని స్పష్టం చేశారు. 

 

09:40 - October 25, 2015

ముంబై : నగరంలోని క్రాఫోర్డ్‌ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫుడ్‌ బజార్‌లో భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో.. 400 షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలార్పేందుకు ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగింది. మొదటగా థర్మాకోల్ దుకాణంలో వ్యాపించిన మంటలు వేగంగా మిగతా షాపులకు కూడా విస్తరించాయి. 10 అగ్నిమాపక యంత్రాలు, 8 నీటి ట్యాంకర్లతో మంటలార్పేందుకు యత్నిస్తున్నాయి. ప్రాణాపాయం జరగకపోయిన పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

 

09:39 - October 25, 2015

విశాఖ : నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎంపీవీ కాలనీలోని స్టేట్‌ బ్యాంక్‌ ఏటీఎం ఇ కార్నర్‌లో అర్ధరాత్రి మంటలు ఎగసిపడ్డాయి. ఈ ఘటనలో మొత్తం 7 ఏటీఎం యంత్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు 3 కోట్లరూపాయల ఆస్తినష్టం జరిగివుంటుందని బ్యాంక్‌ అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. దగ్గర్లోని ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి మంటలు చెలరేగడంతో... అవి స్టేట్‌ బ్యాంక్‌ ఏటీఎం ఇ కార్నర్‌కు వ్యాపించినట్లు స్థానికులు చెబుతున్నారు. షాప్‌ యజమానికి చెందిన కారు కూడా మంటల్లో దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

 

 

09:30 - October 25, 2015

హైదరాబాద్ : సనత్ నగర్ పీఎస్ పరిధిలోని ఫతేనగర్ లో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. 70 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నలుగురు చైన్ స్నాచర్లు ఉన్నట్లు గుర్తించారు. డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 230 మంది పోలీసులు పది బృందాలుగా ఏర్పడి విస్తృత తనిఖీలు చేపట్టారు. అర్ధరాత్రి 2 గంటల నుంచి మూడు గంటలపాటు తనిఖీలు చేపట్టారు. డాక్యుమెంట్లు లేని 30 బైకులను సీజ్ చేశారు.

విజయనగరం జిల్లాలో దారుణం...

విజయనగరం : ఎస్ కోట మండలం ముసిడిపల్లిలో దారుణం జరిగింది. మరదలిపై బావ కత్తితో చేశాడు. అనంతరం తాను గొంతుకోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది.  

08:48 - October 25, 2015

హైదరాబాద్ : మరోసారి చండీయాగానికి సీఎం కేసీఆర్‌ సిద్ధమయ్యారు. నవంబర్‌ లేదా డిసెంబర్‌లో ఎర్రవెల్లి వ్యవసాయక్షేత్రంలో ఆయత చండీయాగం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనకు కొద్దిరోజులుగా ముసురుకుంటున్న సమస్యలతో ఈ యాగం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చండీయాగానికి రాష్ట్రపతితోపాటు పలువురు ప్రముఖులను ఆహ్వానించే యోచనలో కేసీఆర్‌ ఉన్నట్లు ఆయన సన్నితవర్గాలు తెలిపాయి.
మెదక్‌ జిల్లాలో చంఢీయాగం
తెలంగాణ సీఎం కేసీఆర్‌ మరోసారి చండీ యాగానికి సిద్ధమవుతున్నారు. మెదక్‌ జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం ఎర్రవెల్లిలోని తన ఫామ్‌ హౌస్‌ను ఇందుకు వేదిక చేయనున్నట్లు సమాచారం. యాగంలో భాగంగా పదివేలమందితో వేద పారాయణం... వెయ్యి హోమాలను ఒకేసారి చేసేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. గతంలో మెదక్‌ జిల్లా కొండపాక మండలంలో సహస్ర చండీయాగం చేసిన కేసీఆర్‌.. తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే అయుత చండీ యాగం చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ యాగాన్ని నవంబర్‌ లేదా డిసెంబర్‌ చివరలో చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించినట్లు తెలిసింది.
రాష్ట్రపతి, ప్రధానిని ఆహ్వానించాలని యోచన
తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అయుత చండీ యాగం చేయాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. తన ఫాంహౌ్‌సలోనే ఈ యాగాన్ని చేయాలని శృంగేరీ పీఠం పండితులనూ సంప్రదించారు. గత ఫిబ్రవరిలో వారు ఫాంహౌస్‌లో స్థలాన్ని సైతం పరిశీలించారు. పలు కారణాల వల్ల అప్పుడు వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే శనివారం మరోసారి ఫాం హౌస్‌లో అయుత చండీ యాగం నిర్వహణకు స్థల పరిశీలన జరిగినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చూడాలని కేసీఆర్‌ తన దగ్గర బంధువులకు సూచించారాట. దాంతో శృంగేరీ పీఠం పండితులు ఏర్పాట్లను పరిశీలించనున్నట్లు తెలిసింది. సుమారు 4000 మంది వరకు పండితులు ఈ యాగంలో పాల్పంచుకుంటారని సమాచారం. దీనికి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్‌ను ఆహ్వానించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. గతంలోనూ పలుమార్లు కేసీఆర్‌ వివిధ రకాల యాగాలు చేయించారు. కొన్ని సమస్యల నుంచి బయటపడేందుకు సీఎం కేసీఆర్‌ చండీ యాగాన్ని నిర్వహించబోతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

 

ముంబై లో భారీ అగ్నిప్రమాదం

ముంబై : ఫుడ్ బజార్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది పది ఫైర్ ఇంజన్లతో మంటలార్పుతున్నారు. 

08:34 - October 25, 2015

వరంగల్ : అంతన్నారు ఇంతన్నారు..బ‌రిలోకి దిగి టీఆర్ఎస్ చుక్కలు చూపిస్తామ‌న్నారు. తీరా చూస్తే..అభ్యర్థి క‌రువై త‌ల‌ప‌ట్టుకుంటున్నారు. ఇది వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక‌పై తెలంగాణ బిజేపీ ప‌రిస్థితి. మొన్నటి వ‌ర‌కు గెలుస్తామంటూ..బీరాలు ప‌లికిన క‌మ‌ళ‌దళం..ఇప్పుడు ఎన్నిక‌ల్లో గ‌ట్టెక్కడం ఎలా అన్నది తేల్చుకోలేక ఉక్కిరిబిక్కిర‌వుతున్నారు.
అభ్యర్థి కోసం వెతుకులాట
వ‌రంగ‌ల్ ఉపఎన్నిక న‌గారా మోగడంతో..ఇప్పుడు బిజేపీకి గుండెల్లో రైల్లు ప‌రిగెడుతున్నాయి. మొన్నటి దాకా టిడిపి బీజేపీ పొత్తులో భాగంగా..తామే పోటీ చేస్తామంటూ చెప్తూ వ‌స్తున్న కాషాయ నేత‌ల‌కు ఇప్పుడు ఎన్నిక‌ల స‌మ‌యం దగ్గర ప‌డుతున్న కొద్ది టెన్షన్‌ పెరిగి పోతుంది. అభ్యర్థి కోసం బూత‌ద్దం పెట్టిమ‌రి వెతికుతోంది బిజేపీ
టిడిపితో దోస్తీ
ఓ వైపు ప్రధాని మోదీ హ‌వా..మరోవైపు టిడిపితో దోస్తీ,.మరోవైపు టీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకత ఇవన్నీ త‌మ‌ను ఎన్నికల్లో గెలిపిస్తాయ‌ని బిజేపి నేతలు సంబరపడ్డారు. అంతేకాదు..క‌డియం రాజీనామా చేసిన నాటి నుండే తామే పోటీ చేస్తామంటు ముందువరుసలో నిల్చున్నారు. దీనికి టిడిపి కూడా ఓకే చెప్పింది. ఇంకేముంది..అంతా ఓకే అనుకున్న బిజేపి రాష్ట్ర నాయ‌క‌త్వానికి ఉపపోరు న‌గారా మోగడంతో..అస‌లు క‌ష్టాలు క‌ల్లెదురుకొచ్చాయి.
పార్టీకి సవాల్‌గా మారిన అభ్యర్థి ఎంపిక
టీఆర్ఎస్ సిట్టింగ్‌గా ఉన్న వ‌రంగ‌ల్‌లో గెలిస్తే..ఇక భ‌విష్యత్‌ అంతా త‌మ‌దే అని అంచనావేసుకున్న బిజేపీ..ఇక్కడి నుండి బ‌ల‌మైన అభ్యర్థిని దింపాల‌ని యోచించింది. దీనికోస‌ం ఇత‌ర పార్టీల‌లో ఉన్న బ‌ల‌మైన నేత‌ల‌కు గాలం వేయోచ్చని అనుకుంది. అయితే ఎన్నిక‌ల ఖర్చు..భవిష్యత్‌ భరోసా ఇలా డిమాండ్స్ అన్ని స‌ద‌రు నేత‌ల ముందు పెట్టడంతో..రాష్ట్ర నాయ‌క‌త్వానికి కక్కలేని మింగ‌లేని ప‌రిస్థితి ఏర్పడింది. ఇదిలావుంటే..మ‌రోవైపు వ‌ల‌స నేత‌ల మాట ఎత్తితేనే లోక‌ల్ నేత‌లు ఊగిపోతున్నారు. జిల్లా నేత‌ల‌తో జరిగిన స‌మావేశంలో ఇదే అంశాన్ని స్థానికనేతలు కుండ‌బ‌ద్దలుకొట్టినట్లు స‌మాచారం. అయితే స్థానికంగా ఆస్థాయి లీడ‌ర్‌ను ఎంచుకోవ‌డం ఇప్పుడు సార్టీకి స‌వాల్‌గా మారింది. అయితే పైకి మాత్రం నేత‌లు మేక‌పోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే టీఆర్ఎస్‌ దూకుడును ఎదుర్కొనే నేత పార్టీలో లేక పోవ‌డం ఒకటైతే..మొన్నటి మెద‌క్ ఉప ఎన్నికలో మూడో స్థానం రావ‌డం ఇప్పుడు బిజేపీకి క‌ళ్లముందు కలాడుతోంది. దీంతో ఇప్పుడు వ‌రంగ‌ల్‌లో అదే రిపీట్ అయితే..జాతీయ పార్టీగా త‌మ ప‌రువు గంగ‌లో క‌లుస్తామంద‌న్న భ‌యం ఇప్పుడు కాషాయ పార్టీకి ప‌ట్టుకుంది. మ‌రి దీన్ని ఎలా గ‌ట్టెక్కడమో అని క‌మ‌ళదలం త‌ర్జనభర్జనలో ఉంది. 

 

08:23 - October 25, 2015

హైదరాబాద్ : తెలంగాణ టీడీపీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. అధిపత్యపోరు తారాస్థాయికి చేరింది. టీ టీడీపీలో ముఖ్య నేతలుగా ఉన్న ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. నువ్వేంత అంటే నువ్వెంత అంటూ పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. పార్టీ సమవేశాలకు ఐటెం సాంగ్‌లా వచ్చి వెళ్తుంటావని రేవంత్‌ పై ఎర్రబెల్లి ఘాటుగా విమర్శలు చేశారు. ఎవరు వ్యాంప్‌ క్యారెక్టరో..పార్టీ కోసం ఫుల్‌టైమ్‌ ఎవరు పనిచేస్తున్నారో అందరికీ తెలుసని రేవంత్‌ కౌంటర్‌ ఇచ్చారు.
ఎర్రబెల్లి వర్సెస్ రేవంత్
తెలంగాణ టీడీపీలో విబేధాలు ర‌చ్చకెక్కాయి. కొంతకాలంగా ఉప్పు నిప్పులా ఉంటున్న ఎర్రబెల్లి, రేవంత్‌ మధ్య...వరంగల్ ఉప ఎన్నిక అంశం ఇద్దరి మధ్య మరో చిచ్చు రేపింది. ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిర్ణయించేందుకు టీడీపీ నాయకులు శనివారం హైదరాబాద్‌ గోల్కొండ హోటల్‌లో సమావేశం అయ్యారు.
సనత్‌ నగర్‌ సీటు బీజేపీకి ఇద్దామని ఎర్రబెల్లి ప్రతిపాదన
ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి, ఎర్రబెల్లి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రేవంత్‌రెడ్డి టిడిఎల్పీ సిబ్బందితో తన ఇంటి పనులు చేయించుకుంటున్నారని ఎర్రబెల్లి ఆరోపించారాట. సనత్‌ నగర్‌ అసెంబ్లీ సీటు బీజేపీకి ఇచ్చి..వరంగల్‌ కార్పొరేషన్ సహా ఇతర అన్ని సీట్లు మనం తీసుకుందామని ఎర్రబెల్లి ప్రతిపాదించారట.
పరకాల, వరంగల్‌ కార్పొరేషన్లు బీజేపీకివ్వాలన్న రేవంత్‌!
దీన్ని విబేధిస్తూ..పరకాల, వరంగల్‌ కార్పొరేషన్లు బీజేపీకి ఇచ్చి.. వరంగల్‌ లోక్‌సభతో పాటు సనత్‌నగర్‌ తామే తీసుకుందామని రేవంత్ రెడ్డి అన్నారట. టీడీపీకి సిట్టింగ్‌ స్థానంగా ఉన్న సనత్‌ నగర్‌ సీటును బీజేపీకి ఇచ్చేది లేదని తెగేసి చెప్పినట్లుగా పార్టీ వర్గాల టాక్‌. ఐటెం సాంగ్‌లా వచ్చిపోయే నీకేం తెలుసంటూ ..రేవంత్‌ను ఎర్రబెల్లి ఘాటుగా విమర్శించినట్లు తెలుస్తోంది. ఎవరు వాంప్‌ క్యారెక్టరో...పొద్దున తిట్టి, రాత్రికి ఎవరు ఎవరిని కలుస్తున్నారో...ఎవరు పార్టీ కోసం ఫుల్‌ టైమ్‌ పనిచేస్తున్నారో అందరికీ తెలుసని రేవంత్‌ కౌంటర్‌ ఇచ్చారాట.
దూకుడు తగ్గించుకోవాలని రేవంత్‌ కు సీనియర్ల సలహా
ఇద్దరి మధ్య మాటమాట పెరగడంతో...టిడిపి సీనియర్లు జోక్యం చేసుకుని సర్ధిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. దూకుడు తగ్గించుకోవాలని రేవంత్‌ రెడ్డికి సీనియర్లు సలహా ఇచ్చినట్లు సమాచారం. త్వరలో వరంగల్‌, నారాయణ ఖేడ్‌ ఉప ఎన్నికలు జరగనున్న సమయంలో... టీ టీడీపీ నేతల మధ్య కీచులాటలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది.

 

08:06 - October 25, 2015

హన్మకొండ : వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక‌పై అన్ని రాజ‌కీయ పార్టీలు క‌స‌ర‌త్తు మొద‌లు పెట్టాయి. అభ్యర్థుల ఎంపిక‌పై పార్టీలు దృష్టి సారించాయి. ప్రధాన పార్టీల్లో ఈ వ్యవహారం మరింత ఉత్కంఠ రేపుతోంది. అభ్యర్థుల ఎంపిక‌పై సంస్థాగ‌తంగా అన్ని రాజ‌కీయ పార్టీలు కూడా బ‌లాబ‌లాల‌ను బేరీజు వేస్తున్నాయి. నోటిఫికేష‌న్ వ‌చ్చే నాటికి అభ్యర్థుల ఎంపిక‌పై క‌స‌ర‌త్తు పూర్తి చేసి ప్రజా క్షేత్రంలోకి వెళ్లేందుకు పార్టీలు సిద్ధమ‌వుతున్నాయి.
ఉప ఎన్నికపై రాజ‌కీయ పార్టీల దృష్టి
వరంగ‌ల్ పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక న‌గ‌రా మోగ‌డంతో తెలంగాణాలో రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. ప్రధాన రాజ‌కీయ పార్టీలన్నీ ఉప ఎన్నిక‌పై దృష్టి పెట్టాయి. ప్రభుత్వ ఏర్పాటు త‌ర్వాత దాదాపు ఏడాదిన్నర పూర్తి కావ‌డంతో అధికార పార్టీ ఈ ఎన్నిక‌ల‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. సాధార‌ణ ఎన్నిక‌ల్లో తమ పార్టీ అభ్యర్థిగా విజ‌యం సాధించిన క‌డియం శ్రీ‌హ‌రికి ద‌క్కిన మెజార్టీని మ‌రోసారి ద‌క్కించుకుని ప్రజల్లో త‌మ‌కు ఏమాత్రం వ్యతిరేకత రాలేద‌ని చెప్పుకునేందుకు అధికార పార్టీ పావులు కదుపుతోంది.
అభ్యర్ధి ఎంపికపై టిఆర్ ఎస్ లో ఉత్కంఠ
అధికార‌పార్టీ టీఆర్‌ఎస్‌ త‌ర‌పున రంగంలోకి దిగేందుకు నేత‌లు పెద్ద ఎత్తున ఆస‌క్తి చూపిస్తున్నారు. 10 మందికి పైగా అభ్యర్థులు పోటీ ప‌డుతున్నా అధిష్టానం ఎవ‌రిని అభ్యర్థిగా ఎంపిక చేస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తలుగా ఉన్న నేత‌ల పేర్లను గులాబీబాస్ ప‌రిశీలిస్తున్నట్లు పార్టీవ‌ర్గాలు చెప్తున్నాయి. పార్టీ అధినేత తీసుకున్న ప్రాథ‌మిక నిర్ణయం ప్రకారం జిల్లాకు చెందిన వారితో పాటు మాదిగ సామాజిక వ‌ర్గానికి పోటీ చేసేందుకు అవకాశం క‌ల్పిస్తార‌ని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే తెలంగాణ త‌ల్లి విగ్రహ త‌యారీదారు ప‌సునూరి ద‌యాక‌ర్, డాక్టర్స్‌ జేఏసీ నేత డాక్టర్‌ ర‌మేష్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇటీవ‌లే పార్టీలో చేరిన ప‌రంజ్యోతి అభ్యర్థిత్వంపై కూడా పార్టీలో చ‌ర్చ జ‌రుగుతున్నట్లు తెలుస్తోంది. స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే రాజ‌య్య కుటుంబ స‌భ్యుల్లో కూడా ఒకరికి అవ‌కాశం ద‌క్కే చాన్స్ ఉంద‌న్న ప్రచారం పార్టీలో ఉంది. ఇప్పటికే రాజ‌య్య భార్యను రంగంలోకి దించితే ఎలా ఉంటుంద‌న్న అంశంపై పార్టీ స‌మాచారాన్ని కూడా తెప్పించుకుంది. మరోవైపు ఉప ముఖ్యమంత్రి క‌డియం శ్రీహరి త‌న కూతురును రంగంలోకి దించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నార‌ని తెలుస్తోంది. అయితే పార్టీ కీల‌క నేత‌లు మాత్రం మాజీ ఎంపీ వివేక్‌తో చ‌ర్చలు జ‌రుపుతున్నట్లు తెలిసింది. ఒకవేళ వివేక్ రంగంలోకి దిగేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇక మ‌రో అభ్యర్ధి గురించి ఆలోచించం అని గులాబీనేతలు చెప్తున్నారు.
అభ్యర్థి ఎవరనే దానిపై కాంగ్రెస్ కసరత్తు
అటు కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థి ఎవరనే దానిపై తీవ్ర కసరత్తు చేస్తోంది. మాజీ కేంద్రమంత్రి స‌ర్వే స‌త్యనారాయణ, మాజీ ఎంపీ రాజ‌య్యలలో ఒక‌రిని అభ్యర్థిగా ప్రకటించేందుకు పార్టీ ఆసక్తి చూపిస్తోంది. మరోవైపు ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్న వివేక్ ఆస‌క్తి చూపిస్తే..వివేక్‌నే రంగంలోకి దించేందుకు పార్టీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే జిల్లాకు చెందిన మ‌రికొంత మంది నేత‌లు పోటీ చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నా పీసీసీ వారి గురించి ప‌ట్టించుకోవడంలేదని సమాచారం.
ఉమ్మడి అభ్యర్థిపై టిడిపి-బిజేపి కసరత్తు
ఇక తెలుగుదేశం, బిజెపి మిత్ర ప‌క్షాలు కూడా ఎవ‌రిని రంగంలోకి దించాల‌న్న దానిపై తీవ్రంగా క‌స‌ర‌త్తు చేస్తున్నాయి. అయితే బీజేపికి నేత‌కే పోటీ చేసే అవ‌కాశం ద‌క్కనుండడంతో..బిజెపి హైక‌మాండ్ ఎవ‌రిని ఫైన‌ల్ చేస్తోంద‌నేది ఉత్కంఠ రేపుతోంది. బ‌ల‌మైన అభ్యర్థిని బ‌రిలో ఉంచితే భ‌విష్యత్‌లో పార్టీకి ప్రయోజనం ఉంటుంద‌న్న అభిప్రాయం జిల్లాకు చెందిన నేత‌ల్లో వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం ఎన్‌ఆర్ఐ దేవ‌య్య పేరు బ‌లంగా వినిపిస్తున్నా..భ‌విశ్యత్‌ అవ‌స‌రాల దృష్ట్యా స్థానికుల‌కే అవ‌కాశం ఇవ్వాల‌ని జిల్లా నేత‌లు కోరుతున్నట్లు స‌మాచారం. ప‌రకాల మాజీ శాస‌న‌స‌భ్యులు జైపాల్‌ను రంగంలోకి దించాల‌ని జిల్లా నేత‌లు పార్టీ హైక‌మాండ్ దృష్టికి తెచ్చిన‌ట్లు స‌మాచారం. మెద‌క్ ఉప ఎన్నిక‌ల సంద‌ర్భంగా బిజెపి పోటీ చేసినా..కాంగ్రెస్ పార్టీ నుంచి వ‌చ్చిన నేత‌కు టికెట్ ఇవ్వడం వ‌ల్ల పార్టీకి కూడా ప్రయోజనం లేకుండా పోయింద‌న్న అభిప్రాయం క‌మ‌లనాథుల్లో వినిపిస్తోంది. అయితే నామినేష‌న్ల ప్రక్రియ మొద‌ల‌య్యే నాటికి అభ్యర్థుల ఎంపిక‌పై ఓ స్పష్టత వ‌చ్చేఅవ‌కాశం క‌నిపిస్తోంది. విప‌క్ష పార్టీలు తీసుకునే నిర్ణయరాలకు అనుగుణంగానే అధికార పార్టీ కూడా త‌మ అభ్యర్థిని ఫైన‌ల్ చేసే అవకాశం క‌నిపిస్తోంది. ఏది ఏమైనా ఉప ఎన్నిక‌ల షెడ్యూల్‌తో రాజ‌కీయ‌ పార్టీలు ప్రజా క్షేత్రంలో దూకుడు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి.

 

07:28 - October 25, 2015

హైదరాబాద్ : ప్రముఖ హాస్య నటుడు మాడా వెంకటేశ్వరరావు కన్నుమూశారు. కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. తూర్పు గోదావరి జిల్లా కడియం ప్రాంతానికి చెందిన మాడా వెంకటేశ్వరరావు 10 అక్టోబర్, 1950లో జన్మించారు. మాడా సినిమాల్లోకి రాకముందు విద్యుత్ సంస్థలో ఉద్యోగం చేశారు. అనంతరం సినిమాలో అవకాశాలు రావడంతో హాస్యనటుడిగా సిని పరిశ్రమలో స్థిరపడ్డారు. అనేక సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా, హాస్య నటుడిగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ముత్యాలముగ్గు, చిల్లరకొట్టు చిట్టెమ్మ, లంబాడోళ్ల రాందాసు, మాయదారి మల్లిగాడు, ముత్యాలముగ్గు, సఖియా, శివయ్య, తదితర సినిమాలతో మంచి గుర్తింపు పొందారు. మాడాకు అభినయ కళానిధి అనే బిరుదు ఉంది. కాగా, మాడా మృతి విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మాడా మృతదేహాన్ని చూసేందుకు సినీ ప్రముఖులు అపోలో ఆస్పత్రికి తరలి వస్తున్నారు.

 

నేడు పాండిచ్చేరిలో ఆంధ్రమహాసభ స్వర్ణోత్సవ వేడుకలు

తమిళనాడు : నేడు పాండిచ్చేరిలో ఆంధ్రమహాసభ స్వర్ణోత్సవ వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలకు ఎపి డీప్యూటీ సీఎం చినరాజప్ప పాల్గొననున్నారు. 

విశాఖ ఎస్ బిఐ ఈ కార్నర్ బ్రాంచ్ లో అగ్నిప్రమాదం

విశాఖ : ఎస్ బిఐ ఈ కార్నర్ బ్రాంచ్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏటీఎం మిషన్ తగలబడింది. ఈసంఘటన ఎంవీపీ డబుల్ రోడ్ లో చోటుచేసుకుంది.  

నేటి నుంచి సీపీఎం ప్లీనరీ సమావేశాలు...

నల్లగొండ : నాగార్జునసారగ్ లో నేటి నుంచి మూడు రోజులపాటు సీపీఎం తెలంగాణ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు జరుగనున్నాయి. 

నేడు భారత్, దక్షిణాఫ్రికా చివరి వన్డే మ్యాచ్

ఢిల్లీ : నేడు భారత్, దక్షిణాఫ్రికా మధ్య చివరి వన్డే మ్యాచ్ జరుగనుంది. వాంఖడే వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

ఫతేనగర్ లో పోలీసుల కార్డెన్ సెర్చ్

హైదరాబాద్ : సనత్ నగర్ పీఎస్ పరిధిలోని ఫతేనగర్ లో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 230 మంది పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. డాక్యుమెంట్లు లేని 30 బైకులను సీజ్ చేశారు. 

Don't Miss