Activities calendar

27 October 2015

21:32 - October 27, 2015

హైదరాబాద్ : ఢిల్లీలోని కేరళ హౌజ్‌లో బీఫ్‌ కలకలం రేపింది. అక్కడి మెనూలో బీఫ్‌ ఉందంటూ హిందూసేన పోలీసులకు ఫిర్యాదు చేసింది. మెనూలో అన్నీ ఇంగ్లీష్‌లో ఉండగా బీఫ్‌ మాత్రం మలయాళంలో రాసినట్టు హిందూసేన ఆరోపించింది. హిందుసేన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేరళ భవన్‌ చేరుకున్నారు.

గోమాంసం కాదు గేదె మాంసం....

అయితే కేరళ భవన్‌లో అమ్మేది గోమాంసం కాదు గేదె మాంసమని తేలడంతో పోలీసులు అవాక్కయ్యారు. గేదె మాంసం అమ్మడం తినడం చట్ట విరుద్ధం కాదు..దీంతో ఢిల్లీ పోలీసుల అత్యుత్సాహంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మండిపడ్డ కేరళ సీఎం...

తమ అధికారుల అనుమతి లేకుండా ఢిల్లీ పోలీసులు కేరళ గెస్ట్‌హౌస్‌లోకి ఎలా ప్రవేశిస్తారని కేరళ ముఖ్యమంత్రి ఊమెన్‌ చండీ మండిపడ్డారు. ఈ ఘటనపై విచారణ జరుపుతామని ఊమెన్‌ చండీ పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి ఊమెన్‌ చండీ వ్యాఖ్యలను సమర్థించిన ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌......

ముఖ్యమంత్రి ఊమెన్‌ చండీ వ్యాఖ్యలను ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ సమర్థించారు. కేరళ భవన్‌లోకి ప్రవేశించాల్సిన అవసరం ఢిల్లీ పోలీసులకు లేదన్నారు. ఢిల్లీ పోలీసులు బిజెపి సేనలాగా పనిచేస్తున్నారని కేజ్రీవాల్‌ ధ్వజమెత్తారు. ఢిల్లీలో బీఫ్‌పై బ్యాన్‌ లేదని బిజెపి ఒత్తిడి మేరకే కేరళ హౌజ్‌పై పోలీసులు దాడి చేశారని సిపిఎం ఆరోపించింది.. దీనిపై విచారణ జరిపించాల్సిందేనని సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ స్పష్టం చేశారు. కేరళ భవన్‌లో బీఫ్‌ పేరిట గేదె మాంసాన్ని అమ్ముతున్నారు. గోమాంసంపై నిషేధం ఉన్నందున తాము చట్టప్రకారమే వ్యవహరించామని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేరళ ప్రభుత్వం ఎలాంటి విచారణ జరిపిస్తుందన్నది వేచి చూడాలి.

21:28 - October 27, 2015

హైదరాబాద్ : భారత సైనికుల సేవా నిరతి అనన్య సామాన్యం. మొన్నామధ్య భూకంపం తాకిడికి అతలాకుతలమైన నేపాల్‌లోను.. అంతకుముందు.. చార్‌ధామ్‌ యాత్రలో యాత్రికులను కాపాడడంలోనూ.. ప్రపంచ దేశాలతో శభాష్‌ అనిపించుకుంది భారత ఆర్మీ. పెనుముప్పు ముంచుకొచ్చినప్పుడే కాదు.. కళ్లెదుట సాటివారు కష్టాల్లో ఉన్నా.. సేవాతత్వాన్ని.. మానవత్వాన్ని చాటుకుంటున్నారు... మన సైనికులు.

నాగర్‌-షిర్డీ దారిలో..

సోమవారంనాడు.. నాగర్‌-షిర్డీ దారిలో.. రాహూరి వద్ద ఓ డంపర్‌ ట్రక్కు.. అదుపు తప్పి.. రోడ్డు పక్కనే ఉన్న పాన్‌ షాప్‌పై పడిపోయింది. బంకు యజమాని.. షాపులోనే ఉండిపోయాడు.. అందరూ ప్రమాదాన్ని చూస్తూ ఉండిపోయారు. అంతలోపే.. అటువచ్చిన సైనికులు కొందరు పరిస్థితిని చూసి తక్షణమే రంగంలోకి దిగారు. తామంతా ఒక్కటై.. లారీని ఒంటి చేత్తో పక్కకు తోసేశారు. భారత సైనికుల చర్యతో.. పాన్‌ బంకు యజమాని ప్రాణాలతో బయటపడ్డాడు. కాంప్టీ గార్డ్స్‌ రెజిమెంటల్‌ కేంద్రానికి చెందిన సైనికులకు అందరూ అభినందనలు తెలిపారు. సైనికులు మాత్రం పని పూర్తి కాగానే.. తమ కేంద్రంలో రిపోర్ట్‌ చేసేందుకు తరలి వెళ్లిపోయారు. దటీజ్‌ ఇండియన్‌ ఆర్మీ..

21:25 - October 27, 2015

హైదరాబాద్ : కట్టుకున్న భార్యను వ్యభిచారిణిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన దుర్మార్గపు భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.. హైదరాబాద్‌ తిరుమల హిల్స్‌కుచెందిన మురళీకృష్ణ ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. అయితే ఆ తర్వాత భార్యకు తన అసలు రూపం చూపించాడు.. మరింత కట్నం తేవాలంటూ శారీరకంగా... మానసికంగా వేధించాడు.. భర్త చిత్రహింసలు తట్టుకోలేని బాధితురాలు పుట్టింటికి వచ్చేసింది.. అయినా ఊరుకోని మురళీకృష్ణ తన భార్య ఫోన్‌ నెంబర్‌ను కాల్‌ గాళ్ వెబ్‌సైట్‌లో పెట్టాడు.. తరచూ అసభ్య ఫోన్‌కాల్స్ రావడంతో భార్య అసలు విషయం తెలుసుకుంది.. వెంటనే ఈ కిరాతకుడిపై పోలీసులకు ఫిర్యాదుచేసింది..

 

21:11 - October 27, 2015

హైదరాబాద్ : ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ బిజీబిజీగా గడిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసిన కేసీఆర్‌.. రాష్ర్టాభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి, రాష్ట్ర పథకాలకు నిధులు కేటాయించాలని కోరారు. ఎఫ్‌ఆర్‌బీఎం ద్వారా రాష్ర్టానికి రుణ పరిమితి పెంపుతోపాటు, కేంద్ర ప్రభుత్వ పథకాల్లో కూడా నిధులు పెంచాలని విన్నవించారు. కేసీఆర్‌ విజ్ఞప్తులను ఆర్థిక శాఖ వినిమయ విభాగానికి పంపినట్లు జైట్లే తెలిపారు.

గడ్కరీతో కేసీఆర్‌ సమావేశం...

అనంతరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కేసీఆర్‌ భేటీ అయ్యారు. రాష్ర్టానికి సంబంధించిన జాతీయ రహదారులతోపాటు పలు సమస్యలను గడ్కరి దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో నాలుగు వేల కిలోమీటర్ల రహదారులు అవసరమని సీఎం కోరగా.. 13 వందల కిలో మీటర్ల రహదారి నిర్మాణానికి త్వరలోనే గెజిట్ విడుదల కానున్నట్లు గడ్కరీ వెల్లడించారు. రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన రోడ్ల విస్తరణ లేదని సీఎం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. డ్రైపోర్టు, అన్ని జిల్లాల్లో జాతీయ రహదారుల విస్తరణ చేపట్టాలని గడ్కరీని కోరారు. ఏటూరు నాగారం నుంచి కౌటాల వరకు జాతీయ రహదారి ఏర్పాటు..ఇన్‌ల్యాండ్ వాటర్, డ్రైపోర్టు ఏర్పాటుకు అవసరమైన నిధులను విడుదల చేస్తామని గడ్కరీ హామీ ఇచ్చారు.

ప్రధాని నివాసంలో నీతి ఆయోగ్‌ సబ్‌ కమిటీ భేటీ....

కేంద్రమంత్రులతో భేటీల అనంతరం.. ప్రధాని మోదీ నివాసంలో జరిగిన నీతి ఆయోగ్ సబ్ కమిటీ సమావేశంలో కేసీఆర్‌ పాల్గొన్నారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి రాజస్థాన్ సీఎం వసుంధర రాజే, జార్ఖండ్ సీఎం రఘవార్ దాస్‌లు హాజరయ్యారు. సంక్షేమ పథకాల కుదింపు అవకాశాలపై.. నీతి ఆయోగ్‌ సబ్ కమిటీ నివేదికను ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సమర్పించారు.

20:40 - October 27, 2015

హైదరాబాద్ : డాన్ లమధ్య యుద్ధమే 'రాజన్ చుట్టూ ' ఉచ్చు బిగించిందా? రాజన్ నోరు విప్పితే ఎవరి చీకటి రాజ్యాలు బద్ధలవుతాయి? చోటా రాజన్ పోలీసులకు ఎలా దొరికాడు? అసలు ఎవరీ చోటా రాజన్? చోటా రాజన్ నేర చరిత్ర ఎలా సాగింది? దావుద్ కి, చోటీకి మధ్య విభేదాలు ఎలా వచ్చాయి? అనారోగ్యంతో బాధపడుతున్న చోటా కు దావూద్ గ్యాంగ్ నుంచి ప్రాణ హాని ఉందా? అందుకే పోలీసులకు దొరికిపోయాడా? ఈ అంశాలపై నేటి వైడాంగిల్ లో విశ్లేషణ చేశారు. అసక్తికరమైన అంశాలను మీరూ వినాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి...

రోడ్డెక్కిన బాపట్ల మండల రైతులు

గుంటూరు : తమ పొలాలకు సాగునీరివ్వడంలేదంటూ గుంటూరు జిల్లా బాపట్ల మండల రైతులు రోడ్డెక్కారు.. రోడ్డుపై రాస్తారోకో చేశారు.. పంట పొట్టదశలో డెల్టా కాల్వనుంచి నీరివ్వడంలేదని ఆరోపించారు.. లక్షల రూపాయల పెట్టుబడిపెట్టిన తాము ఇప్పుడేం చేయాలంటూ నిరసన తెలిపారు.. రైతుల ఆందోళనతో రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి..

గుంటూరులో వాల్మీకి జయంతి వేడుకలు

గుంటూరు: నగరంలోని వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రులు పత్తిపాటి, కొల్లు రవీంద్ర హాజరయ్యారు.. వాల్మీకి చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు.. వాల్మీకి జీవిత విశేషాలతో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి..

కృపారాణికేసులో మరిన్ని సాక్ష్యాలు

పశ్చమగోదావరి : జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కృపారాణి కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకివస్తున్నాయి.. కృపారాణి తల్లి... తన కూతురు, అల్లుడిపై దౌర్జన్యంచేసిన వీడియోను టెన్‌టీవీ సంపాదించింది.. బాధితురాలు చనిపోకముందు మీ అంతుచూస్తామంటూ తల్లి బెదిరించిన వీడియో ఇందులో రికార్డయింది.. ఈ బాధలు భరించలేక పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదుచేసింది కృపారాణి.. అప్పటికే ఈ ఘటనలతో మనస్తాపానికి గురైన కృపామణి చివరికి ఆత్మహత్య చేసుకుంది..

హస్తినకు చేరిన టి.పిసీసీ చీఫ్

హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తిన చేరుకున్నారు. వరంగల్ బైపోల్ అభ్యర్థిని ఖరారు చేసేందుకు ఆయన రేపు రాహుల్, దిగ్విజయ్ ను కలవనున్నారు. ప్రధానంగా వరంగల్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ ఐదుగురి పేర్లను పరిశీలిస్తుంది.

20:20 - October 27, 2015

హైదరాబాద్ : ప్రధాని నివాసంలో నీతి ఆయోగ్ సబ్ కమిటీ సమావేశం ముగిసింది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి తెలంగాణ సీఎం కేసీఆర్, రాజస్థాన్ సీఎం వసుంధర రాజే, జార్ఖండ్ సీఎం రఘవార్ దాస్‌లు హాజరయ్యారు. సంక్షేమ పథకాల కుదింపు అవకాశంపై అధ్యయనం చేసిన సబ్ కమిటీ నివేదికను ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సమర్పించారు. అదేవిధంగా రాష్ర్టాలకు కేంద్రం నిధుల విడుదల విషయంపై సభ్యులు సమావేశంలో చర్చించారు.

20:13 - October 27, 2015

విజయవాడ : ఏపీ ప్రభుత్వం 7 జిల్లాలో 196 కరువు మండలాలను ప్రకటిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరువు మండలలా జాబితా ఇలా ఉంది. శ్రీకాకుళం-10, ప్రకాశం-21, నెల్లూరు-14, చిత్తూరు-39, కడప-33, అనంతపురం-39, కర్నూలు జిల్లాలో 40 కరువు మండలాలు ఉన్నట్లు ప్రకటించింది.

20:07 - October 27, 2015

హైదరాబాద్ : పాకిస్థాన్‌కు చెందిన ఈదీ ఫౌండేషన్ ప్రధాని మోదీ ప్రకటించిన కోటి రుపాయల విరాళాన్ని తిరస్కరించింది. 15 ఏళ్ల కిందట భారత్ నుంచి పాక్‌కు వెళ్లిన గీతను ఇన్నాళ్లూ కంటికి రెప్పలా కాపాడిన ఈధీ ఫౌండేషన్‌కూ.. ఇరు దేశాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 2003లో పాక్‌ సరిహద్దులు దాటి వెళ్లిన గీతను.. లాహోర్‌లోని పాకిస్థాన్‌ రేంజర్లు గుర్తించింది లగాయితు.. ఆమెను ఈధీ ఫౌండేషనే సంరక్షిస్తూ వచ్చిన విషయం తెలిసిందే.ఈపరిణామాల నేపథ్యంలో ఈదీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అబ్దుల్ సత్తార్ ఈదీ కుటుంబ సభ్యులు సోమవారం గీతను భారత్‌కు తీసుకొచ్చారు. ప్రధాని మోదీతో సమావేశం సందర్భంగా ఈదీ ఫౌండేషన్‌కు కోటి విరాళం ప్రకటించారు. అయితే దీనికి ధన్యవాదాలు చెప్పిన ఫాదర్ థెరిస్సాగా పేరుగాంచిన అబ్దుల్ సత్తార్ ఈదీ, తమ ఫౌండేషన్ విరాళాలకు వ్యతిరేకమంటూ మోదీ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారు. 1951లో పాక్‌లోని కరాచీలో ఏర్పడిన ఈదీ ఇప్పటి వరకు ఎవరి నుంచి విరాళాలు స్వీకరించలేదంటూ ఫౌండేషన్ ప్రతినిధులు మీడియాకు వెల్లడించారు.

 

ప్రధానికి నివేదిక సమర్పించిన నీటి ఆయోగ్ కమిటి

ఢిల్లీ: నీతి ఆయోగ్ సబ్ కమిటీ భేటీ ముగిసింది. కేంద్ర ప్రభుత్వ పథకాల కొనసాగింపు, మధింపుపై చర్చించి రూపొందించిన నివేదికను భేటీ అనంతరం సబ్ కమిటీ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సమర్పించింది. 72 కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను కుదించే అవకాశాలపై అదేవిధంగా రాష్ర్టాలకు కేంద్రం నిధుల విడుదల విషయంపై నివేదికను సమర్పించాలని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ ఆధ్వర్యంలో నీతి ఆయోగ్ సమ్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

19:58 - October 27, 2015

హైదరాబాద్ : అమరావతికి ఉద్యోగుల తరలింపుపై ఏపీ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. ఉద్యోగులకు 3 ఆఫ్షన్లు ఇచ్చింది. నవంబర్ 2015, ఫిబ్రవరి 2016, జూన్ 2016 తేదీల్లో ఏదో ఒకటి ఎంచుకోవాలని సూచించింది. నూతన రాజధాని అమరావతి నుంచి సాగించడానికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఆ ప్రక్రియలో భాగంగానే ఏపీకి చెందిన సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్ క్రిష్ణారావుతో మంగళవారమిక్కడ ప్రత్యేకంగా సమావేశమయ్యారు అయ్యారు. నూతన రాజధాని అమరావతికి ఉద్యోగులు జూన్‌ 2లోగా వెళ్లాలని సీఎస్ ఆదేశించారు.

 

19:54 - October 27, 2015

తిరుపతి :తిరుమల శ్రీవారి భక్తులకు ఉచిత లడ్డూ ఇవ్వాలనే ప్రతిపాదనపై టిటిడి కమిటీ ఏర్పాటు చేసింది. ఇవాళ భేటీ అయిన టీటీడీ పాలక మండలి పలు నిర్ణయాలను తీసుకుంది. రూ.13.89 కోట్లతో బంజారాహిల్స్‌లో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని పాలకమండలి నిర్ణయించింది.

19:50 - October 27, 2015

ప్రకాశం : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెదదోర్నాల మండలం బొమ్మలాపురంలోని జెడ్పీ హైస్కూల్ లో లైంగిక వేధింపుల బాగోతం బయటపడింది. స్కూల్లో తొమ్మిదో తరగతి విద్యార్థినిని ప్రసాద్ అనే టీచర్ లైంగింకంగా వేధించిన విషయం వెలుసుచూసింది. గ్రామస్తుల ఫిర్యాదుతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.

19:46 - October 27, 2015

హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడిప్పుడే నష్టాలనుంచి బయటపడుతోందన్నారు మంత్రి మహేందర్ రెడ్డి.. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 6 డిపోలుమాత్రమే లాభాల బాటలో నడిచాయని గుర్తుచేశారు.. తెలంగాణలోమాత్రం 21 డిపోలు ప్రాఫిట్‌లోఉన్నాయని చెప్పారు.. కొత్తగా 13గ్రామాలకు 4వందల పల్లె వెలుగు బస్సులు ఏర్పాటుచేస్తున్నామని ప్రకటించారు.. నిజామాబాద్‌ ఆర్టీసీ బస్టాండ్‌లో ఫ్లాట్‌ఫాంలు, అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు..

19:44 - October 27, 2015

హైదరాబాద్ : టీ టీడీపీ నేతలు సమన్వయంతో ముందుకెళ్తేనే మంచి ఫలితాలు సాధించవచ్చని చంద్రబాబు చెప్పినట్లు రావుల అన్నారు. వరంగల్‌ ఉప ఎన్నికలో టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని నిలబెడతామన్నారు. టీఆర్‌ఎస్‌ ఎన్నికల హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదన్న రావుల ధ్వజమెత్తారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల కోసం ఈనెల 29న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు.

జూన్ 2 లోగా అమరావతికి ఉద్యోగులు...

 హైదరాబాద్ : నవ్యాంధ్రప్రదేశ్ పాలనను నూతన రాజధాని అమరావతి నుంచి సాగించడానికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఆ ప్రక్రియలో భాగంగానే ఏపీకి చెందిన సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్ క్రిష్ణారావుతో మంగళవారమిక్కడ ప్రత్యేకంగా సమావేశమయ్యారు అయ్యారు. నూతన రాజధాని అమరావతికి ఉద్యోగులు జూన్‌ 2లోగా వెళ్లాలని సీఎస్ ఆదేశించారు. మూడు దశల్లో ఏపీ రాజధానికి ఉద్యోగుల తరలింపు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందింది. నవంబర్‌, ఫిబ్రవరి, జూన్‌ నెలల్లో వెళ్లడానికి సిద్ధంగా సిద్ధంగా ఉన్న ఉద్యోగులు ఆప్షన్స్‌ ఇవ్వాలని సీఎస్‌ సూచించినట్లు తెలిసింది.

 

17:59 - October 27, 2015

హైదరాబాద్ : తెలంగాణలో 4వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రాన్ని కోరారు. ఇవాళ కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కేసీఆర్ కలిశారు. రాష్ట్రంలోని రహదారుల విషయమై ఆయనతో చర్చించారు. 13 వందల కిలో మీటర్ల రహదారి నిర్మాణానికి త్వరలోనే గెజిట్ విడుదల చేస్తున్నట్టు గడ్కరీ పేర్కొన్నారు. వీటితో పాటు ఇన్‌ల్యాండ్ వాటర్, డ్రైపోర్టు ఏర్పాటుకు అవసరమైన నిధులను విడుదల చేస్తామని గడ్కరీ హామీ ఇచ్చారు.

17:57 - October 27, 2015

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ నేతల భేటీ ముగిసింది.. విజయవాడలో సమావేశమైన నేతలు వివిధ అంశాలపై చర్చించారు.. వరంగల్‌ ఉప ఎన్నికతోపాటు పార్టీ అంతర్గత అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు..

17:55 - October 27, 2015

నిజామాబాద్ : శక్తికి మించి కష్టం చేసి మరీ సాగు చేసారు. తాహతుకు మించి అప్పులు చేసి పెట్టుబడులు పెట్టారు. లాభాల వెల్లువ రాకాపోయినా నష్టాల ఊబిలోనుంచి బయటపడొచ్చనే కొండంత ఆశతో సేద్యం చేసారు. కానీ పత్తిరైతన్నకు అడుగడుగునా కష్టాలు, అవమానాలే ఎదురవుతున్నాయి. ప్రభుత్వాలు పట్టించుకోకపోవటంతో అవమానాలు స్వాగతం పలుకుతున్నాయి.

తెల్ల బంగారంగా....

తెల్ల బంగారంగా పేరున్నపత్తిని సాగు చేసిన రైతన్నల పరిస్తితి నిజామాబాద్‌ జిల్లాలో దయనీయంగా మారింది. ఆరుగాలం కష్టపడి ప్రతికూల పరిస్తితికే ఎదురొడ్డి నిలిచినా ప్రస్తుత పరిస్ధితులు ఎగతాళి చేస్తున్నాయి. రక్తాన్నే పెట్టుబడిగా పెట్టి సాగు చేసిన పంట దిగుబడులు నిరాశకు గురి చేస్తున్నాయి.

18 వేల హెక్టార్లలో పత్తి సాగు......

ఈ ఏడు ఖరీఫ్ సీజన్లో సుమారుగా 18 వేల హెక్టార్లలో రైతన్నలు పత్తి సాగు చేసారు. బోధన్‌ రెవెన్యూ డివిజన్ పరిదిలోని బోధన్‌, రెంజల్, బిచ్కుంద, మద్నూరు,జుక్కల్ మండలాల్లో అత్యధికంగా పత్తి సాగవుతుంది. అయితే గతంతో పోలిస్తే ఈ ఏడు పత్తి పంట సాగు గణనీయంగా తగ్గిపోయింది. బోధన్‌లో రెండేళ్ల క్రితం వరకు 8 వేల ఎకరాల్లో పత్తి పంట సాగు అయ్యేది కానీ ఈ యేడు కేవలం 3 వేల 600 ఎకరాల్లోనే సాగుఅయిందంటే పరిస్ధితి ఎంత గణనీయంగా పడిపోయిందో తెలుస్తోంది.

ఎకరానికి 2 నుంచి 3 క్వింటాళ్ల దిగుబడి......

సకాలంలొ వర్షాలు కురవక పూత, కాయ దశలొనే ఇబ్బందులు వచ్చాయి. దీంతో తొలి కోతలో ఎకరానికి 2 నుండి 3 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. మరో రెండు దశల్లో పంట కోతలున్నప్పటికి దిగుబడి అంతంత మాత్రంగానే ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఎకరానికి పెట్టుబడి 30 వేల వరకు ఉంటోంది. అయినా దిగుబడి మాత్రం 5 క్వింటాళ్లు కూడా దుస్ధితి. ఎకరానికి సుమారుగా 10 క్వింటాళ్లు దిగుబడి రావాల్సి ఉండగా ప్రస్తుతం ఆ పరిస్ధితి లేదు.

దయనీయంగా కౌలు రైతుల పరిస్థితి...

ఇక కౌలు రైతి పరిస్ధితి అయితే మరీ దయనీయంగా ఉంది. పెట్టుబడులు ఏ యేటికి కాయేడు పెరుగుతున్నాయే కానీ దిగుబడి, మద్దతు ధర మాత్రం పెరగటం లేదు. ఇప్పుడు మార్కెట్లో మద్దతు ధర క్వింటాకు 4వేలు మాత్రమే ఉంది. గతేడాది మాత్రం 6వేలకు పైగానే ఉంది. ఇప్పటికైనా నిజామాబాద్‌ జిల్లాలో ని ముఖ్యమైన రెవెన్యూ డివిజన్లలో సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. పత్తి రైతుల కళ్లల్లో ఆనందం నింపాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

17:46 - October 27, 2015

హైదరాబాద్ : సీసీఐ..కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా. పత్తి రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ ఇప్పుడు కుంభకర్ణుడి నిద్రపోతుంది. మద్దతు ధర కంటే ఓ రూపాయి ఎక్కువపెట్టి ప్రైవేటు వ్యాపారులే పత్తిని పోటీపడి కొనుగోలు చేస్తున్నా..సీసీఐ మాత్రం పట్టించుకోవడంలేదు. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు ప్రైవేటు వ్యాపారులు 74,500 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయగా సీసీఐ కేవలం 310 క్వింటాళ్ళ పత్తిని మాత్రమే కొనుగోలు చేసింది.

74,500 క్వింటాళ్ల పత్తి కొనుగోలు .....

జిల్లాలో ఈ ఏడాది దాదాపు 45 లక్షల క్వింటాళ్ళ పత్తి దిగుబడులు వస్తాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. రైతుల దగ్గరనుంచి పత్తిని కొనుగోలు చేసేందుకు గతేడాది సీసీఐ 24 కేంద్రాల్లో కొనుగోలు జరుపగా..ఈసారి మాత్రం కేవలం 14 కేంద్రాల్లోనే కొనుగోళ్లు జరుపుతోంది. సీసీఐ నిబంధనల ప్రకారం 8శాతానికి లోబడి తేమ ఉంటేనే కనీస మద్దతు ధర 4,100 ఇస్తామని ప్రకటించింది. అయితే తేమ శాతం 16 శాతం వరకు ఉన్నా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయినా సీసీఐ మాత్రం పట్టించుకోవడంలేదు.

జిల్లాలో ఈ ఏడాది 45 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి.....

క్వింటాల్‌ పత్తికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు 4,100 రూపాయలు. అయితే ప్రైవేటు వ్యాపారులు అంతకంటే ఎక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. పత్తి గింజల ధర క్వింటాల్‌కు రెండువేలకుపైనే పలుకుతుండడంతో..ప్రైవేటు వ్యాపారులే ఎక్కువగా పత్తిని కొనుగోలు చేస్తున్నారు. తేమ శాతం పేరుతో సీసీఐ కొర్రీలు పెడుతుండటంతో అక్కడ పత్తి విక్రయించడానికి రైతులు ఆసక్తి చూపడంలేదు. ఇప్పటికైనా ప్రభుత్వ రంగ సంస్థ అయిన సీసీఐ పత్తిని కొనుగోలు చేస్తే పోటీ ఎక్కువై తమకు లాభం చేకూరుతుందని రైతులు కోరుతున్నారు.

 

17:43 - October 27, 2015

హైదరాబాద్ : సంకల్పం ధృడమైనది అయితే సమున్నత ఆశయాలు సత్వరమే సిద్ధిస్తాయి. లక్ష్యం ఉన్నతమైనదే అయితే ధైర్యంతో వేసే ప్రతి ముందడుగుకు ప్రకృతి కూడా సహకరిస్తుంది. మార్పే ధ్యేయంగా పెల్లుబికే విప్లవం సమూల మార్పులు తీసుకొస్తుంది. కరీంగనర్ జిల్లాలోని కొన్ని గ్రామాలు ఇందుకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి . ధృడచిత్తం ఉండాలే కానీ అసాధ్యం సైతం సుసాధ్యమేననే నిజాన్ని నిరూపిస్తున్నాయి.

పెద్దకల్వల, సుద్దాల, నిట్టూరు, బొంతకుంటపల్లె .....

మద్య రహిత సమాజానికి అంకురార్పణ సమిష్టిగా కదిలారు. సమున్నత ప్రగతికి ప్రతీకగా నిలిచారు. పల్లెలను మద్యానికి దూరంగా నిలిపి గొప్ప ఆశయబాటలో పయనిస్తున్నారు. కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లి నియోజకవర్గంలోని పెద్దకల్వల, సుద్దాల, నిట్టూరు, బొంతకుంటపల్లె గ్రామాలు ఎన్నో ఏళ్ల నుంచి మద్యానికి దూరంగా ఉంటున్నాయి. మహిళలు, యువకుల్లో వచ్చిన సామాజిక చైతన్యం ఆ గ్రామాల రూపురేఖలనే మార్చింది. గ్రామస్తులు మద్యపానానికి వ్యతిరేకంగా సాగించిన పోరాట ఫలితంగా గ్రామాల్లో మద్యరహిత సమాజానికి అంకురార్పణ జరిగింది.

ముందుకు కదిలిన మహిళాలోకం....

మద్యం మహమ్మారి పెట్టిన చిచ్చు మాటలకు అందనిది. అందుకే పచ్చని కుటుంబాల్లో మద్యం రగిల్చిన దావానలానికి వ్యతిరేకంగా మహిళాలోకం ముందుకు కదిలింది. ఆర్దికంగా, శారీరకంగా దెబ్బతీస్తున్న మాయదారి మద్యాన్ని పారద్రోలాలని నిశ్చయించుకున్నారు. పెద్దపల్లి మండలం నిట్టూరు గ్రామంలోని మహిళ స్వశక్తి సంఘాలు మద్యాన్ని నిర్మూలించేందుకు ఉద్యమించాయి. గ్రామంలో బెల్టుషాపులు, గుడుంబా , సారా విక్రయాలను నిషేధించాలని పోరాటం చేశాయి . 3 నెలల సుధీర్ఘ పోరాటం ఫలితంగా ఆయా గ్రామాల్లో 2006 నుంచి మద్య నిషేదం అమలులోకి వచ్చింది. నిట్టూరు గ్రామ మహిళల స్ఫూర్తితో ఇతర గ్రామాలు కూడా పోరు శంఖారావాన్ని పూరించాయి.

చిన్న కల్వలలో 9 ఏళ్లుగా మద్య నిషేధం...

నిట్టూరు గ్రామ పోరాటతత్వాన్ని పుణికి పుచ్చుకున్న మరో గ్రామం సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల గ్రామం. ఈ గ్రామంలో మద్యం నిషేదం 9ఏళ్లుగా అమలవుతోంది. నవచైతన్య యువజన సంఘం సభ్యులు ఆధ్వర్యంలో ప్రజలంతా మద్యపానానికి వ్యతిరేకంగా పోరాడారు. మద్యపానం వల్ల కలిగే అనర్ధాలు ఒక్కొక్కటిగా వివరించటంతో ప్రజా చైతన్యం సునామీలా వచ్చింది. మద్యం అమ్మినా, తాగినా జరిమానాలు విధించటంతో మద్యపాన నిషేధం సంపూర్ణంగా అమలవుతోంది.

మద్యాన్ని తరిమేసిన బొంతకుంటపల్లి, సుద్దాల.....

సుల్తానాబాద్ మండలంలోని మరో రెండు గ్రామాలైన బొంతకుంటపల్లి, సుద్దాల గ్రామాలు కూడా మద్యం మహమ్మారిని తరిమేసాయి. అందరూ కలిసి సమిష్ఠిగా ఉద్యమించారు. మద్యం తెచ్చే అనర్ధాలను ఒక్కొక్కటిగా వివరించారు. అవమానాలు ఎదురైనా, అవహేళనలు రాజ్యమేలినా ధైర్యంగా ఎదుర్కొన్నారు. చివరికి సంపూర్ణ మద్య నిషేధం సాధించారు. మద్యాన్ని తరిమి కొట్టి ఆదర్శంగా నిలుస్తున్న సంపూర్ణ మద్య నిషేధ గ్రామాలు రాష్ట్రం మొత్తం స్ఫూర్తిగా నిలవాలని కోరుకుందాం....

 

17:15 - October 27, 2015

బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ 'విద్యా బాలన్' రాజస్థాన్ లోని జైపూర్ బస్టాండ్ లో కూలిగా అవతారం ఎత్తింది. మొదట ఈమెను ప్రజలు అంతగా పట్టించుకోలేదు. అనంతరం 'విద్య'ను గుర్తు పట్టిన వారు ఆశ్చర్యపోయారు. కూలీ వేషం ఓ రియాల్టీ షో కోసం అని తెలుసుకొని నవ్వుకున్నారు. ఓ రియాల్టీ షో చేస్తున్న 'విద్యా' ఆ షో పై ప్రజలకు అవగాహన కలిగించడానికి కూలీగా అవతారం ఎత్తిందంట. జైపూర్ బస్టాప్ లో కొద్ది సేపు నిలబడి ఓ కుర్రవాడినుంచి సూట్ కేస్ తీసుకొని బస్సులో పెట్టిన అనంతరం ఆ కుర్రవాడి నుంచి తన కూలీగా వంద రూపాయల్ని వసూలు చేసిన సన్నివేశం షూట్ చేశారు. 

17:14 - October 27, 2015

'కబాలి'..ఈ సినిమాపై రజనీకాంత్ అభిమానులు పెద్ద ఆశలు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్స్ సైతం హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన వార్త కూడా హడావుడి చేస్తోంది. 'రజనీ' సరసన అందాల తార 'ఐశ్వర్య రాయ్' నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఓ హీరోయిన్ గా 'రాధిక ఆప్టే'ని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రజనీకాంత్ పై యాక్షన్ ఎపిసోడ్స్ ను మలేషియాలో చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో 'రజనీకాంత్' రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడనే టాక్ ఆ మధ్య వినిపించింది. అదే నిజమేనన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఇప్పుడు 'ఐశ్వర్యరాయ్' పేరు కూడ బలంగా వినిపిస్తోంది. రజనీకాంత్ కోరడం వల్లనే ఈ పాత్ర చేయడానికి ఐశ్వర్య రాయ్ అంగీకరించిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వార్త నిజమా ? కాదా ? అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే.

17:13 - October 27, 2015

టాలీవుడ్ మెగాస్టార్, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి పేరిట చిరు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (కానా) బంగారు నాణెలు రూపొందించారు. ఈ మేరకు హైదరాబాద్ లో చిరును కలసి కానా సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బంగారు నాణేలను విడుదల చేశారు. అంతేగాక ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగా స్టార్ గా వెలుగొందిన చిరు, తెలుగు సహా పలు భాషల్లో సాధించిన విజయాలు, రికార్డులు, ఆయన సినీ జీవిత విశేషాలను పొందుపరచిన సంచికను ప్రత్యేకంగా చిరంజీవికి అందజేశారు.

17:13 - October 27, 2015

'పటాస్' తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన 'షేర్' చిత్రం ఈనెల 30న విడుదల కాబోతోంది. మల్లికార్జున్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో 'కళ్యాణ్ రామ్' సరసన హాట్ బ్యూటీ 'సోనాల్ చౌహాన్' జత కట్టింది. మొదట ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు కానీ ఆ టైంలో 'రుద్రమదేవి', 'బ్రూస్ లీ' చిత్రాలు ఉండడం..మరోవైపున 'కంచె', 'రాజుగారి గది' విడుదల కావడంతో విడుదల తేదీని అక్టోబర్ నెలాఖరుకు మార్చారు. ఈ మార్పు మాత్రం బాగానే కలిసొచ్చిందని 'షేర్' చిత్ర యూనిట్ భావిస్తోందంట. ప్రస్తుతం 'షేర్'కు పోటీ లేకపోవడమే ఇందుకు కారణం. 'షేర్' లాభాలు తెస్తుందని నిర్మాత కొమర వెంకటేశ్ నమ్మకంగా ఉన్నారంట. మరి ఆ నమ్మకం నిలుస్తుందా ? కల్ల అవుతుందా అనేది వేచి చూడాలి. 

ఏసీబీ వలలో జూనియర్ లైన్ మన్

రంగారెడ్డి : ఓ వ్యక్తి నుంచి రూ.6 వేలు లంచం తీసుకుంటూ జూనియర్ లైన్‌మన్ లింగరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మహేశ్వరం మండలం తుక్కుగూడ ఏఈ కార్యాలయంలో మంగళవారం ఓ వ్యక్తి వద్ద నుంచి డబ్బులు తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు డబ్బులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

16:58 - October 27, 2015

ఖమ్మం : రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. రోజుకొకరిని పార్టీలో చేర్చుకోవడం పైనే ఆయన ఆసక్తి చూపుతున్నారు తప్పా.. ప్రజలను, రైతులను పట్టించుకోవడం లేదని ఆయన ఖమ్మంలో ఆరోపించారు. కలెక్టరేట్ వద్ద ఆశావర్కర్ల దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు.

16:56 - October 27, 2015

కరీంనగర్‌ : జిల్లాలో ఆశా వర్కర్ల ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. 54 రోజులుగా పలు రూపాల్లో నిరసన తెలుపుతున్న ఆశా కార్యకర్తలు.. ఇవాళ పలు చోట్ల రాస్తారోకోలు చేపట్టారు. హుజురాబాద్‌, హుస్నాబాద్‌, గోదావరి ఖని రహదారుల్లో మానవ హారం, రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్‌ స్తంభించింది.

16:54 - October 27, 2015

హైదరాబాద్ : రైతుల భవిష్యత్తును విత్తన తయారీ సంస్థలకు తాకట్టుపెట్టొద్దని టీ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టివిక్రమార్క ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... సీడ్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా మార్చడం కాదు.. విత్తన వైఫల్యం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విత్తన తయారీ సంస్థలపై నియంత్రణ చట్టం తీసుకురావాలన్నారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా బిల్లును తెలంగాణ ప్రభుత్వానికి పంపుతున్నట్లు తెలిపారు. ఎలాంటి ఆంక్షలు విధించాలో కూడా అందులో పేర్కొన్నట్లు చెప్పారు.

16:51 - October 27, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పరిపాలన అంతా లోకేష్‌మయంగా నడుస్తోందని ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి అన్నారు. సీఎం కార్యాలయంలో ఓఎస్‌డీగా అభీష్ట నియామకం చట్టవిరుద్దమన్నారు. జీఏడీ అనుమతి లేకుండా ప్రైవేటు వ్యక్తుల నియామకం జరిగిందని రఘువీరారెడ్డి ఆరోపించారు. అభీష్ట లోకేష్‌కు సన్నిహితుడనే విషయాన్ని సమాచార హక్కుచట్టం ద్వారా సేకరించామన్నారు. ఈ విషయంపై బహిరంగ చర్చకు తాము సిద్దంగా ఉన్నామని రఘువీరారెడ్డి తెలిపారు.

16:48 - October 27, 2015

హైదరాబాద్ : బీహార్‌లో నాలుగో విడుత ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. బిట్టియా బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మహాకూటమి నేతలపై విరుచుకుపడ్డారు. బీహార్‌కు లోక్‌తంత్ర ప్రభుత్వం కావాలిగానీ.. మంత్ర తంత్ర ప్రభుత్వం కాదన్నారు. కేంద్రం బీహార్‌కు నిధులు ఇస్తున్నా.. సద్వినియోగం చేసుకోలేదని నితీష్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ నాలుగువేల గ్రామాల్లో విద్యుత్‌ లేదని మోడీ విమర్శించారు. లక్షా 25 వేల కోట్ల ప్యాకేజీతో బీహార్‌ను అభివృద్ధి చేస్తామని ప్రధాని మరోసారి స్పష్టం చేశారు.

16:46 - October 27, 2015

ఆదిలాబాద్ : వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందాడని.. ఆరోపిస్తూ ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ పట్టణంలోని శ్రీ లక్ష్మీ చైతన్య ప్రైవేటు నర్సింగ్‌హోం ముందు బంధువులు ఆందోళనకు దిగారు. నాలుగు రోజుల క్రితం ఖానాపూర్‌కు చెందిన సురేష్‌ తన భార్యను ప్రసూతి కోసం ఆస్పత్రిలో చేర్పించాడు. అయితే ఆమె కవల పిల్లలకు జన్మనిచ్చింది. శిశువు బరువు తక్కువగా ఉండటంతో.. వారిని ఇంక్యూబేటర్‌లో ఉంచారు. కిలోన్నర బరువున్న శిశువుకు డాక్టర్‌ కాకుండా కాంపౌండర్‌ ఇంజెక్షన్‌ చేయడంతో.. శిశువు మృతిచెందాడని బంధువులు ఆరోపించారు. పసికందు మృతి చెందిన వెంటనే చెప్పలేదని ఆరోపించారు. మరోవైపు కవల పిల్లలు.. బరువు తక్కువగా పుట్టడం వల్లే చనిపోయాడని వైద్యులు తెలిపారు.

16:44 - October 27, 2015

నల్లగొండ :జిల్లా నాగార్జున సాగర్‌లో 3 రోజుల పాటు జరిగిన సీపీఎం ప్లీనరీ సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశాలు పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో నెలకొ న్న రాజకీయ, సామాజిక అంశాలతో పాటు వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల ఐక్యతపై సమగ్రంగా చర్చించామన్నారు తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. దళితులు, గిరిజనులకు భూ పంపిణిని చిత్తశుద్ధితో అమలు చేయాలన్నారు. నాగార్జన సాగర్‌ ప్రాంత వెనకబాటుకు స్థానిక ప్రజా ప్రతినిధులే కారణమన్నారు.

16:43 - October 27, 2015

హైదరాబాద్ : ప్రపంచ విత్తన భాండాగారంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేని అనుకూలతలు తెలంగాణకు ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జాతీయ విత్తన కాంగ్రెస్ 8వ సదస్సును వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సదస్సుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, విత్తన కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. విత్తన చట్టాల్లో మార్పులు, అక్రమాల నియంత్రణ, విత్తన విధానాల రూపకల్పన తదితర అంశాలపై చర్చ జరుగుతుందని మంత్రి అన్నారు.

పంచాయతీలుగా గిరిజన గూడాలు : కేటీఆర్

హైదరాబాద్ : 500 జనాభా ఉన్న గిరిజన గూడాలను పంచాయతీలుగా మారుస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. వచ్చే పంచాయతీ ఎన్నికల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు ఆయన చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వైద్య సిబ్బందికి అదనంగా జీతభత్యాలు చెల్లిస్తామన్నారు. మూడేళ్లలో ప్రతి గిరిజనగూడేనికి వాటర్‌గ్రిడ్ ద్వారా మంచినీరును సరఫరా చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

సిరిమాను ఉత్సవంలో పోలీసులు అత్యుత్సాహం

విజయనగరం: జిల్లాలో జరుగుతున్న సిరిమాను ఉత్సవంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఉత్సవాల్లో భాగంగా ఓ మున్సిపల్ కార్మికుడిపై ఎస్‌ఐ చేయిచేసుకున్నాడు. ఎస్‌ఐ తీరును నిరసిస్తూ కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు.

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

ముంబై : స్టాక్‌మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 108 పాయింట్లు నష్టపోయి 27,253 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 27 పాయింట్లు నష్టపోయి 8,232 పాయింట్ల సూచీ వద్ద ముగిసింది.

తోటపల్లి రిజర్వాయర్ రద్దు చేస్తూ టీఎస్ సర్కార్ ఉత్తర్వులు

హైదరాబాద్ : తోటపల్లి రిజర్వాయర్ ను రద్దు చేస్తూ టీ.సర్కార్ నేడు ఉత్తర్వులు జారీ చేసింది. అంతే గాక ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టులో తోటపల్లి రిజర్వాయర్ కు చెందిన 6,7,8,9,10,11,12 ప్యాకేజీ పనుల్లో మార్పులను హైపవర్ కమిటీ ప్రతిపాదించింది. ఈ మార్పును అంగీకరిస్తున్నట్లు నీటి పారుదల శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

వరంగల్ ఉప ఎన్నికల ఇన్ చార్జిగా హరీష్ రావు

హైదరాబాద్ : వరంగల్ ఉపఎన్నిక ఇన్‌చార్జ్‌గా మంత్రి హరీష్‌రావు నియమితులయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈనెల 29 తర్వాతే అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం ఉంది. ఉపఎన్నికల బరిలో ప్రొ. సాంబయ్య, ఎర్రోళ్ల శ్రీనివాస్‌ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

గడ్కరీతో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ..

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భేటీ ముగిసింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఇవాళ నితిన్ గడ్కరితో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని జాతీయ రహదారులతోపాటు పలు అంశాలపై కేసీఆర్ కేంద్ర మంత్రితో చర్చించారు.

 

15:22 - October 27, 2015

హైదరాబాద్ : బెంగళూరు పోలీసులు భారత స్పిన్నర్ అమిత్ మిశ్రాను అరెస్టు చేశారు. యువతిపై దాడి కేసులో దాదాపు మూడు గంటల పాటు అతడిని విచారించిన పోలీసులు.. అనంతరం అరెస్టు చేశారు. అనంతరం మిశ్రా తరఫు న్యాయవాదులు బెయిల్ పేపర్లు దాఖలు చేసి అమిత్ మిశ్రాను విడుదల చేయించారు. సెప్టెంబర్ 25వ తేదీన బెంగళూరులో తాను ఉంటున్న హోటల్ గదిలో ఓ అమ్మాయిపై దాడి చేసినట్లు అమిత్ మిశ్రాపై పోలీసు కేసు నమోదైంది. అయితే.. ఈ కేసును ఆమె ఉపసంహరించుకున్నట్లు తొలుత కథనాలు వచ్చినా, ఆ తర్వాత మళ్లీ కేసు విషయంలో ముందుకు వెళ్లాలనే నిర్ణయించుకుంది. దాంతో పోలీసులు కూడా ఈ కేసు విచారణను వేగవంతం చేశారు.

కుషాయిగూడలో దంపతుల ఆత్మహత్య

హైదరాబాద్: నగరంలోని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. డీఏఈ కాలనీలో దంపతులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు దివాకర్‌కుమార్‌, దేవిగా తెలుస్తోంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

బీహార్‌లో మూడో దశ ఎన్నికలకు ప్రచారం

హైదరాబాద్ : బీహార్‌లో మూడో దశ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. చివరి రోజున రాజకీయ పార్టీలు హోరా హోరీగా ప్రచారం నిర్వహించాయి. రిజర్వేషన్లు, అభివృద్ధిపైనే ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. అక్టోబర్‌ 28న మూడో దశ పోలింగ్‌ జరగనుంది.

బెంగళూరులో క్రికెటర్ అమిత్ మిశ్రా అరెస్ట్

హైదరాబాద్ : క్రికెటర్ అమిత్ మిశ్రాను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. మిశ్రాపై బెంగళూరులో ఓ యువతిపై దాడి చేసినట్టుగా కేసు నమోదైంది. మూడు గంట పాటు విచారించి అనంతరం అరెస్టు చేసినట్లు తెలిపారు. అనంతరం మిశ్రా బెయిల్ పై విడుదలయ్యారు.

15:08 - October 27, 2015

విజయవాడ : ఏపీ రాజధాని భూముల దగ్దం వ్యవహారంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని డిప్యూటీ సీఎం, హోంమంత్రి చిన్నరాజప్ప అన్నారు. దీనిపై విచారణ కొనసాగుతుందని దోషులు ఎవరున్నా కఠినంగా శిక్షిస్తామన్నారు. అలాగే రాజధానిలో శాంత్రిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని..విభజన చట్టం ప్రకారం మరికొంత సిబ్బంది రాష్ట్రానికి ఇవ్వాల్సింది ఉంది అని చిన్న రాజప్ప స్పష్టం చేశారు.

15:06 - October 27, 2015

హైదరాబాద్ : వరంగల్‌ ఉప ఎన్నికలో లక్ష ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని టి పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. 16నెలల టీఆర్‌ఎస్ పాలనకు వరంగల్ ప్రజలు బుద్ది చెప్తారని ఆయన అన్నారు. ఐదుగురు అభ్యర్థుల పేర్లతో కూడిన లిస్ట్‌ను ఫైనల్ చేశామని..ఆ లిస్ట్‌ను ఇవాళ సాయంత్రం ఏఐసీసీకి అందిస్తామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కలిసొచ్చే పార్టీల మద్దతును మరోసారి కోరతామంటున్న ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తెలిపారు.

14:56 - October 27, 2015

హైదరాబాద్ : ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో సామాన్యులకు పోషకాహారం అందని ద్రాక్షలా మారుతోంది. కంది పప్పు ధర వూహించని స్థాయిలో పెరగడంతో అన్ని వర్గాల ప్రజలను కలవర పెడుతోంది. మరి పప్పులకు ప్రత్యామ్నాయం ఉందా? మరి సామాన్యులకు అందుబాటులో ఉండే పోషకపదార్థాలు ఏమిటి? ఆధునిక జీవన శైలికి దూరమైన తృణధాన్యాలు పోషకాహారానికి ప్రత్యామ్నాయంగా నిలుస్తాయా? ఈ అంశాలపై నేటి వేదికలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సలోమీ ఏసుదాసున్యూట్రీషీయనిస్టు కరుణ గృహిణి పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

13:45 - October 27, 2015

మహారాష్ట్ర : ముంబైలో హత్యకు గురైన అనూహ్య కేసులో ముంబై సెషన్స్‌ కోర్టు ట్యాక్సీ డ్రైవర్‌ చంద్రభానును దోషిగా నిర్ధారించింది. 2014 జనవరి 5న ఈ హత్య జరిగింది. కృష్ణాజిల్లా మచిలీపట్నంకు చెందిన అనూహ్య ముంబైలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసేది. సెలవులకు ఊరెళ్లి తిరిగొచ్చిన అనూహ్య చంద్రభాను ట్యాక్సీలో ఎక్కింది. చంద్రభాను ఆమెను శివారు ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు.

13:41 - October 27, 2015

కరీంనగర్ : కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని నిర్వీర్యం చేస్తోందని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి విమర్శించారు. ఈమేరకు ఆయన కరీంనగర్ లో మీడియాతో మాట్లాడారు. కార్పొరేట్‌ రంగాన్ని కేంద్రం పెంచిపోషిస్తూ..ధరల పెరుగుదలకు ప్రభుత్వం కారణమవుతుందని ఆయన అన్నారు. సాగునీటి రంగానికి నిధులు కేటాయించకుండా ప్రాజెక్టుల రీడిజైన్‌ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. 

13:35 - October 27, 2015

తూర్పుగోదావరి : జిల్లాలోని కాకినాడలో ఇవాళ తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది. గుడారిగుంట్లలో ఉన్న ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో దాదాపు 40 పూరిళ్లు దగ్ధం అయ్యాయి. తప్పిన ప్రాణనష్టం తప్పింది. అయితే లక్షల్లో ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. వరుసగా గ్యాస్‌ సిలిండర్లు పేలడంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. అగ్నిప్రమాద ఘటనపై బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నినాసాలు, డబ్బు, విలువైన వస్తువులు కాలిబూడిదయ్యాయని వాపోయారు.

13:28 - October 27, 2015

ఢిల్లీ : విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెలికితీసేందుకు ఏర్పాటైన సిట్‌ తన పనిని వేగవంతం చేస్తోంది. ఇప్పటికే మూడు దఫాలుగా సుప్రీంకోర్టుకు నివేదికలు సమర్పించిన సిట్..తాజాగా నాలుగో నివేదికను కోర్టుకు సమర్పించింది. విదేశాల్లోని ఏఏ బ్యాంకుల్లో ఎంతమంది భారతీయులకు ఎన్నెన్ని ఖాతాలున్నాయి? వాటిలో మూలుగుతున్న డబ్బు ఎంత ఉంది వంటి అంశాలపై సిట్‌ బృందం దర్యాప్తు చేస్తోంది.

 

ఎఫ్ఆర్ బీఎం చట్టాన్ని సవరించాలని కోరాం - వేణుగోపాలచారి..

న్యూఢిల్లీ : ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని సవరించాలని, విదేశాల నుంచి ఎక్కువ రుణం పొందేలా చూడాలని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీని కేసీఆర్‌ కోరారని టీఆర్‌ఎస్ ఎంపీ వేణుగోపాలచారి పేర్కొన్నారు.

13:26 - October 27, 2015

ముంబై : బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌కు మరోమారు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నుంచి సమన్లు వచ్చాయి. ఐపీఎల్‌ జట్టు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ను బాలీవుడ్‌ నటి జుహీచావ్లా, ఆమె భర్త జయ్‌ మెహతాతో కలిసి షారుఖ్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ జట్టుకు సంబందించి కొన్ని షేర్లను 2008లో షారుఖ్‌ ఖాన్‌ మారిషస్‌కు చెందిన ఓ సంస్థకు విక్రయించాడు. ఈ వ్యవహారం ఫెమా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై ఈ ఏడాది మే నెలలో ఈడీ షారుఖ్‌కు సమన్లు పంపింది. తాజాగా మరోమారు ఈడీ సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం ఇవ్వాలని షారుఖ్‌ ఈడీని కోరినట్లు సమాచారం. 

ఉభయ గోదావరి జిల్లా నేతలతో జగన్ భేటీ..

హైదరాబాద్ : ఉభయ గోదావరి జిల్లాల నేతలతో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. పార్టీ పటిష్టత, కార్పొరేషన్‌ ఎన్నికలు, కాపు రిజర్వేషన్లపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

 

పేదలందరికీ ఇళ్లు - వెంకయ్య..

ఢిల్లీ : దేశంలోని పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. మంగళవారం పరిమిత వ్యయంతో ఇళ్ల నిర్మాణంపై వర్క్ షాపును వెంకయ్య ప్రారంభించారు. అభివృద్ధే లక్ష్యంగా మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు.

మహా కూటమిపై మోడీ విమర్శలు.

పాట్నా: మహా కూటమీ నేతలకు ప్రజాస్వామ్యంపై నమ్మకంలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు. బీజేపీ తరపున బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సీతామడిలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. 

కొమరం భీమ్ కు మనువడు నివాళి..

ఆదిలాబాద్: ఆదివాసీల ముద్దుబిడ్డ కొమురం భీమ్‌ 75వ వర్ధంతి సందర్బంగా జోడేఘాట్‌కు ఆయన మనవడు సోనేరావు ఆధ్వర్యంలో వేలాది గిరిజనులు తరలి వచ్చారు. కొమురం భీం చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

13:17 - October 27, 2015

హైదరాబాద్ : ఆయనో మాజీ మంత్రి... అయితేనేం. సంగీతానికి అనుగుణంగా కాలుకదిపాడు.. స్టెప్పులతో అదరగొట్టాడు. పాతికేళ్ల యువకునిలా డ్యాన్సులు చేశారు. ఈపాటికే అర్థమైందనుకుంటా ఆయనే గ్రేటర్‌ హైదరాబాద్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు.. మాజీ మంత్రి దానం నాగేందర్‌. ఏపీ మంత్రులు గంటా శ్రీనివాస్‌ కుమారుడు, నారాయణ కూతురు వివాహ సంగీత్‌ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దానం ఆట పాటలతో తెగ ఎంజాయ్‌ చేశారు. 

13:11 - October 27, 2015

హైదరాబాద్‌ : నగరంలో మెట్రో కారిడార్‌-2 మార్గాన్ని మళ్లించడంపై సుల్తాన్‌ బజార్‌ వ్యాపారులు మండిపడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ..సుల్తాన్‌ బజార్‌లోని వ్యాపారస్తుల సంఘం ఇవాళ బంద్‌కు పిలుపుని్చింది. సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ...ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ నిరసనను తెలియచేశారు. అప్పట్లో ఉద్యమ నాయకుడిగా ఉన్న కేసీఆర్‌ తమ ఆందోళనను మద్దతిచ్చారని..ఇప్పుడు అధికారం వచ్చాక..మెట్రో కారిడార్‌-2 రూట్‌ను మర్చారని వ్యాపారస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుల్తాన్‌బజార్‌, బడీచౌడీని కాపాడే విధంగా కారిడార్‌-2లో మార్గాన్ని మార్చాల్సిందేనని వ్యాపరస్తులు డిమాండ్ చేశారు. లేకపోతే తమ ఆందోళనల్ని ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు.

 

 

12:53 - October 27, 2015

హైదరాబాద్ : ఎప్పుడొచ్చాం కాదన్నయ్యా.. బుల్లెట్‌ దిగిందా లేదా అనే టైపు ఒకరు. ఎప్పుడుబడితే అప్పుడు కాదు గన్‌ ఎప్పుడు పేల్చాలో తెలిసుండాలి అనే టైపు మరొకరు. ఒకరు విరాట్‌ కొహ్లీలా రెచ్చిపోతారు. ధోనిలా కూల్‌కెప్టెన్‌గా ఉండాలనే ఆలోచన మరొకరిది. సైకిల్‌ వెనక చక్రాన్ని నేనంటే.. ముందు చక్రాన్ని తానే అంటారు. ఒకరు బ్యాక్‌ బ్రేక్‌ నొక్కితే.. ఇంకొకరు ఫ్రంట్‌ బ్రేక్‌ నొక్కుతారు. మొత్తం మీద బండి మాత్రం బోల్తా పడేలా ఉంది.
ఎర్రబెల్లి, రేవంత్‌ల మధ్య వార్‌
విభజన వారిని విభజించలేకపోయింది. ఓటమి వారిని విడదీయలేకపోయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రకంపనలు మొదలయ్యాయి. అధికారపక్షం అవుతామనే ఆశలు కాస్త మొదలవడంతోనే రాబోయే రాజ్యానికి కాబోయే రాజెవరు అనేదాకా అప్పుడే వెళ్లిపోయారు. ఎవరి గ్రూపులో ఎవరు అని లెక్కలేసుకునేదాకా వ్యవహారం ముదిరిపోయింది. టీటీడీపీలో ఇప్పుడు ఇదే పరిస్ధితి. ఎర్రబెల్లి, రేవంత్‌రెడ్డిల మధ్య పచ్చగడ్డి కాదు ఏ గడ్డి లేకుండానే మండిపోతోంది.
దూకుడు మీదున్న రేవంత్‌
దూకుడుతో వ్యక్తిగత ఇమేజ్‌ను పెంచుకునే పనిలో రేవంత్‌రెడ్డి ఉన్నారు. గులాబీసేనపై కత్తి పట్టుకుని తిప్పేసి టీటీడీపీలో తానే తురుంఖాన్‌ అనిపించుకోవాలనే పనిలో ఉన్నారు. మొదట్లో ఆచి తూచి మాట్లాడిని ఎర్రబెల్లి సైతం ఈ కాంపిటీషన్‌లో స్వరం పెంచారు. కాని రేవంత్‌ అంత దూకుడు అయితే చూపించటం లేదు. ఓటుకునోటుతో రేవంత్‌ నైతికంగా దెబ్బ తిన్నారేమో కాని.. పార్టీ క్యాడర్‌లో మాత్రం ఇమేజ్‌ పెంచుకున్నారు. పైగా ఆ వీడియాలో ఆయన మాట్లాడిన కులాల ఈక్వేషన్లు మరింత కాక పుట్టించాయి. ఈ పరిణామాలతో సంప్రదాయిక సీనియర్లంతా ఒక వైపు.. దూకుడు మీదుంటే రేవంత్‌ బ్యాచ్‌ అంతా మరో వైపు చీలిపోయారు.
పార్టీ అధ్యక్షుడిగా రేవంత్‌ వైపు మొగ్గు చూపిన చంద్రబాబు
పార్టీ అధ్యక్షుడిగా రేవంత్‌ను పెట్టుకుందామనేదాకా అధినేత చంద్రబాబు వెళ్లిపోయారు. సీనియర్లు కాదనడంతో ఆగిపోయారు. అందుకే ఐవీఆర్‌ఎస్‌ నిర్వహించారు. దాంట్లోనూ రేవంత్‌దే ఆధిపత్యమైంది. అయినా ముందుచూపుతో చంద్రబాబు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మాత్రమే రేవంత్‌రెడ్డిని నియమించారు. ఎర్రబెల్లికి పొలిట్‌బ్యూరోలో స్థానమిచ్చినా.. విలువ తగ్గినట్లుగానే ఆ వర్గం ఫీలవుతోంది. చివరకు ఇటీవల ఒక సమావేశంలో ఒన్‌ టు ఒన్‌ తిట్టుకునేదాకా పరిస్ధితి దిగజారింది.
టీటీడీపీలో ఆందోళన
ఇప్పుడు ఇద్దరూ చంద్రబాబు ముందు పంచాయితీ పెట్టారిప్పుడు. ఇరు వర్గాలను శాంతపరిచి సెటిల్‌ చేసే బాధ్యత ఇప్పుడు అధినేత ముందు ఉంది. ఒకవైపు అధికారపక్షం ఆకర్ష్‌ మంత్రం.. మరోవైపు కాంగ్రెస్‌ పోరాట తంత్రం.. వీటి నడుమ బలహీనపడిపోతున్నామనే ఆందోళన టీటీడీపీలో ఉంది. ఇప్పుడు పార్టీని బలోపేతం చేసేదెలా.. చేసేదెవరు అనే దగ్గరే కొట్లాట నడుస్తోంది. మరిక ఏం జరగనున్నదో తెరపై చూడాల్సిందే.

 

12:45 - October 27, 2015

ఢిల్లీ : తెలంగాణ సీఎం కేసీఆర్‌ వరుస భేటీలతో ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశమయ్యారు. ఎఫ్‌ఆర్‌బీఎం పెంపు, ప్రభుత్వ పథకాలకు కేంద్ర సాయంపై చర్చించారు. మధ్యాహ్నం రెండున్నరకు ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కర్‌తో సమావేశమవుతారు. సాయంత్రం 7 గంటలకు నీతి అయోగ్‌ సమావేశంలో పాల్గొంటారు. అప్పుడే ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ అవుతారు.

 

12:38 - October 27, 2015

ముంబై : వరుస హిట్లతో బాలీవుడ్‌ను దీపికా పదుకొనె షేక్‌ చేసేస్తోంది. తాజాగా మరో క్రేజీ సినిమాతో వస్తోంది. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన బాజీరావు మస్తానీ విడుదలకు సిద్ధమైంది. ఇందులో దీవానీ మస్తానీ అనే సాంగ్‌ను ముందుగానే యూట్యూబ్‌లో విడుదల చేశారు. రికార్డు స్థాయిలో ఈ పాటకు యూట్యూబ్‌లో హిట్స్‌ వచ్చాయి. మంచి మ్యూజిక్‌కు తోడు దీపికా అందమైన అభినయం తోడవటంతో.. ఈ సాంగ్‌ కేక పుట్టిస్తోంది. ఈ దెబ్బకు సినిమాకు కూడా అదే రేంజ్‌లో క్రేజ్‌ పెరిగిపోయింది.

 

గుడారికుంట్ల అగ్నిప్రమాదంపై చిన రాజప్ప స్పందన..

తూర్పుగోదావరి : గుడారికుంట్లలో చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదంపై మంత్రి చిన రాజప్ప స్పందించారు. ఈ ఘటనపై వివరణనివ్వాలని కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. సత్వరం చర్యలు తీసుకోవాలని సూచించారు. 

బాబును కలిసిన రేవంత్ రెడ్డి..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కలిశారు. తనను వర్కింగ్ ప్రెసిడెంట్ గా గుర్తించడం లేదని బాబు ఎదుట రేవంత్ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. 

ఆర్కే నగర్ లో ఛైన్ స్నాచింగ్..

హైదరాబాద్ : మల్కాజ్ గిరి ఆర్కే నగర్ లో ఛైన్ స్నాచింగ్ జరిగింది. మహిళ మెడలో ఉన్న ఐదు తులాల బంగారు గొలుసును గుర్తు తెలియని దుండగులు అపహరించుకపోయారు.

 

ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు బుద్ధి చెబుతారు - ఉత్తమ్..

హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెబుతారని, లక్ష ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయమని టి.పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన టెన్ టివితో మాట్లాడారు. స్థానిక నేతల అభిప్రాయాలతో ఐదుగురు అభ్యర్థులతో జాబితా రెడీ చేసినట్లు తెలిపారు. ఈ జాబితాను రేపు అధిష్టానానికి అందిస్తామన్నారు. టీఆర్ఎస్ 16 నెలల మోసపూరిత వాగ్ధానాలే ఎన్నికల ప్రచారాస్త్రాలుగా ఉపయోగిస్తామని తెలిపారు. కలిసి వచ్చే పార్టీల మద్దతును మరోసారి కోరుతామన్నారు.

 

12:33 - October 27, 2015

విజయవాడ : నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంతో బెజవాడ పోలీస్‌ కమిషనరేట్‌ డిజిటలైజేషన్‌ వైపు అడుగులు వేస్తోంది. అమరావతి ప్రపంచ స్థాయి రాజధానివైపు శరవేగంగా అడుగులు వేస్తున్న క్రమంలో.. పోలీసు విభాగాన్ని కూడా అదేస్థాయిలోనే అభివృద్ధి చేయాలని అధికారులు యోచిస్తున్నారు. చంద్రబాబు సైతం టెక్నాలజీని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని ఆదేశించడంతో ఆ దిశగా కార్యాచరణ స్పీడ్‌ అందుకుంది.
నేరాల సంఖ్య అడ్డుకట్టకు టెక్నాలజీ సాయం
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంతో విజయవాడకు క్రమక్రమంగా ప్రముఖుల రాకపోకలు పెరిగాయి. అదేస్థాయిలో వాహనాల రద్దీ కూడా పెరిగింది. ఇక భవిష్యత్‌లో పెరిగిపోనున్న నేరాల సంఖ్యకు అడ్డుకట్ట వేసేందుకు సాంకేతిక టెక్నాలజీని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని పోలీసులు యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే బెజవాడ కమిషనరేట్‌ను డిజిటలైజేషన్‌ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం నివేదిక కూడా సిద్ధం చేశారు. దీన్ని త్వరలోనే ప్రభుత్వానికి పంపి.. ఆమోదం పొందాలని అధికారులు భావిస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకోవాలని చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో.. త్వరలోనే ఈ ప్రతిపాదన కార్యరూపం దాలుస్తుందని అధికారులు భావిస్తున్నారు.
రక్షక్‌, బూకోల్ట్‌ వాహనాలకు జీపీఆర్‌ఎస్‌ సిస్టమ్‌
ఇక నగరంలో అన్ని చోట్ల సీసీ కెమెరాల ఏర్పాటును తప్పనిసరి చేయాలని పోలీసు అధికారులు యోచిస్తున్నారు. షాపులు, పెద్ద పెద్ద సంస్థలలో వీటి ఏర్పాటును అనివార్యం చేయనున్నారు. రక్షక్‌, బ్లూకోల్ట్స్‌ వాహనాలకు జీపీఆర్‌ఎస్‌ సిస్టమ్‌ అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. వీటిద్వారా సంఘటనాస్థలానికి పోలీసులు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా వీటికి కెమెరాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా ఘటనాస్థలంలోని పరిస్థితులను చిత్రీకరించి సంబంధిత పోలీస్‌స్టేషన్లకు సమాచారం చేరవేయవచ్చు. దీంతో ఆయా నేరాలపై తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు అధికారులు సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం సులువు అవుతుందని అధికారులు భావిస్తున్నారు.
64 సిగ్నల్స్‌ ఐఐటీఎంఎస్ ద్వారా కెమెరాలు అనుసంధానం
మరోవైపు నగరంలోని 64 సిగ్నల్స్‌ను ఇంటిగ్రేటెడ్‌ ఇంటెలిజెంట్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ద్వారా ఆధునికి కెమెరాలను అనుసంధానం చేయనున్నారు. రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు ఈ విధానం ఉపయోగపడుతుంది. కంట్రోల్‌రూమ్‌కు దీన్ని అనుసంధానం చేయడం ద్వారా ఎప్పటికప్పుడు అధికారులు మానిటరింగ్‌ చేసే అవకాశం ఉంటుంది. రాజధానిగా మారిన బెజవాడలో సాంకేతికత ద్వారా నేరాలను అదుపు చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్న పోలీస్‌శాఖలో.. ఈ సాంకేతికత ఎంతవరకు సత్ఫలితాలిస్తాయో వేచి చూడాలి. 

జాతీయ విత్తన కాంగ్రెస్ సదస్సు ప్రారంభం..

హైదరాబాద్ : హైటెక్స్ లో జాతీయ విత్తన కాంగ్రెస్ 8వ సదస్సును వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సదస్సుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, విత్తన కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. విత్తన చట్టాల్లో మార్పులు, అక్రమాల నియంత్రణ, విత్తన విధానాల రూపకల్పన తదితర అంశాలపై చర్చ జరుగనుంది. 

జోర్దాన్ లో పేలుడు...ఐదుగురి మృతి..

జోర్దాన్ : రాజధాని అమ్మాన్ ప్రాంతంలో బాణ సంచా నిలువ ఉంచిన ట్రక్కు పేలిన ఘటనలో ఐదుగురు మృతిచెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

12:23 - October 27, 2015

తిరుపతి : తిరుపతి తిరుమల దేవస్థానం(టీటీడీ) బోర్డు సమావేశం ప్రారంభమైంది. ఆర్జిత సేవా టిక్కెట్లు, లడ్డూ ధర పెంపు తదితర అంశాలపై చర్చించనున్నారు. అలాగే టీటీడీ ఉద్యగులు, కాంట్రాక్టు కార్మికులకు ఇచ్చే బ్రహ్మోత్స బహుమతులపై చర్చించే అవకాశం ఉంది. ఇటీవలే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. అయితే లడ్డూ ధర పెంపుపై సర్వత్రా వ్యతిరేకత వస్తుంది. ఇదిలావుంటే మూడు పద్ధతుల్లో భక్తులకు లడ్డూలను ఇస్తున్నారు. ఒకటి రాయితీలపై, రెండోది 25 రూపాయలు, 100 రూపాయలకు లడ్డూలను భక్తులకు ఇస్తున్నారు. అయితే లడ్డూలపై రాయితీ ఎత్తివేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. భక్తులందరికీ ఒక్కొక్కరికి వంద గ్రాముల ఉచిత లడ్డు, నడకదారి భక్తులకు ఉచితంగా లడ్డు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు. 150 రూపాయల కళ్యాణోత్సవం లడ్డూను రూ. 100 రూపాయలకే ఇస్తున్నారు. ఈలోటును ధరల పెంపుతో భర్తీ చేయాలని చూస్తున్నారు. 

ప్రభుత్వ ప్రకటనలపై సుప్రీంలో కేంద్రం పిటిషన్ దాఖలు..

ఢిల్లీ : ప్రభుత్వ ప్రకటనలపై తీర్పును పున:సమీక్షించాలని సుప్రీంకోర్టులో కేంద్రం పిటిషన్ వేసింది. కేంద్రం పిటిషన్ పై జనవరి 12న సుప్రీంలో విచారణ జరుగనుంది. 

ప్రభుత్వ ప్రకటనలపై సుప్రీంలో కేంద్రం పిటిషన్ దాఖలు..

ఢిల్లీ : ప్రభుత్వ ప్రకటనలపై తీర్పును పున:సమీక్షించాలని సుప్రీంకోర్టులో కేంద్రం పిటిషన్ వేసింది. కేంద్రం పిటిషన్ పై జనవరి 12న సుప్రీంలో విచారణ జరుగనుంది. 

కోర్టులో హార్థిక్ పటేల్ కు చుక్కెదురు..

గుజరాత్ : హైకోర్టులో హార్థిక్ పటేల్ కు ఎదురు దెబ్బ తగిలింది. దేశద్రేహం కేసును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. జాతీయ జెండాను ఆవమానించారంటూ హార్దిక్ పటేల్ పై దేశద్రోహం కేసు నమోదైన సంగతి తెలిసిందే. 

29న కేసీఆర్ తో వరంగల్ జిల్లా నేతల భేటీ..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ తో ఈనెల 29వ తేదీన వరంగల్ జిల్లా నేతలు భేటీ కానున్నారు. వరంగల్ ఉప ఎన్నిక అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

బాబుతో టి.టిడిపి నేతల భేటీ..రేవంత్ గైర్హాజర్..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో టిటిడిపి నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరు కాలేదు. 

ప్రారంభమైన టీటీడీ బోర్డు సమావేశం

తిరుపతి : తిరుపతి తిరుమల దేవస్థానం(టీటీడీ) బోర్డు సమావేశం ప్రారంభమైంది. ఆర్జిత సేవా టిక్కెట్లు, లడ్డూ ధర పెంపు తదితర అంశాలపై చర్చించనున్నారు. అలాగే టీటీడీ ఉద్యగులు, కాంట్రాక్టు కార్మికులకు ఇచ్చే బ్రహ్మోత్స బహుమతులపై చర్చించే అవకాశం ఉంది. 

గుడారికుంట్లలో భారీ అగ్నిప్రమాదం..

తూర్పుగోదావరి : గుడారికుంట్లలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలండర్లు పేలుతుండడంతో మంటలు అధికమౌతున్నాయి. 40 పూరిళ్లు దగ్ధమయ్యాయి. మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.

 

సీఆర్డీఏ కమిషనర్ సమన్వయ సమావేశం..

విజయవాడ : సీఆర్డీఏ పరిధిలోని అన్ని శాఖల అధికారులతో సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం ఆదేశాలతో ఈ సమావేశం ఏర్పాటైంది. ఉద్యోగులకు తాత్కాలిక వసతుల ఏర్పాట్లపై చర్చించనన్నారు. 

12:12 - October 27, 2015

చిత్తూరు : తిరుపతి సుబ్బారెడ్డినగర్‌లో ఎర్రచందనం స్మగ్లర్‌ శ్రీనివాస్‌ను దారుణంగా హత్య చేశారు. ఇంట్లో ఉన్న శ్రీనివాస్‌పై దాడి చేసిన దుండగులు.. అతని నోట్లో యాసిడ్‌ పోశారు. కాసేపటికే శ్రీనివాస్‌ చనిపోయాడు. మృతుడిపై ఓ హత్య కేసు కూడా నమోదై ఉంది. శ్రీనివాస్, సుచిత్ర దంపతులు. తిరుపతి సుబ్బారెడ్డినగర్‌లో ఉంటున్నారు. శ్రీనివాస్.. ఎర్రచందనం స్మగ్లర్, ఓ హత్య కేసులో నిందితుడుగా ఉన్నాడు. అయితే ఇంట్లో శ్రీనివాస్ నిద్రిస్తున్నాడు. ఇంటి ఆవరణలో అతని భార్య సుచిత్ర నిద్రిస్తుంది. ఈక్రమంలో తెల్లవారు జామున కొంతమంది దుండగులు అతని ఇంటికి వెళ్లి.. భార్య నోట్లో గుడ్డలు కుక్కారు. అనంతరం ఇంట్లో నిద్రిస్తున్న శ్రీనివాస్ పై దాడి చేసి.. అతని నోట్లో యాసిడ్ పోసి, పరాయ్యారు. శ్రీనివాస్ పెద్దగా అరుస్తు ఇంటి బయటికి వచ్చాడు. కానీ అప్పటికే అతని పరిస్థితి విషమించి మృతి చెందాడు. అయితే పాత లావాదేవీలు, ఆర్థిక కారణాలు హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

11:53 - October 27, 2015

వరంగల్ : తెలంగాణ టీడీపీకి దెబ్బమీద దెబ్బ పడుతోంది. వరుసగా టి.టిడిపి నేతలు ఆ పార్టీని వీడిపోతున్నారు. తాజాగా ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి పార్టీని వీడనున్నారు. ఈనెల 29న టీఆర్ ఎస్ లో చేరడానికి సుధారాణి ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆమె సీఎం కేసీఆర్ తో భేటీ అవుతున్నట్లు సమాచారం. అయితే టిఆర్ ఎస్ లో చేరితే వరంగల్ మేయర్ పదవి ఇస్తారని సుధారాణికి గతంలో సీఎం కేసీఆర్ ఆఫర్ ఇచ్చారని, కానీ ఆమె ఎమ్మెల్సీ పదవిని ఆశించినట్లు వార్తలు వినిపడుతున్నాయి. ఆ పదవి ఇవ్వకపోవడం వల్లే టీఆర్ఎస్ లో చేరలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా వరంగల్ మేయర్ పదవిని స్వీకరించేందుకు సుధారాణి సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరోవైపు టీటీడీపీ నేతలతో ఎపి సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఉప ఎన్నికల సమయంలో సుధారాణి పార్టీ వీడితే.. ఆ ప్రభావం జిల్లా కేడర్ పై పడుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. తెలుగు తమ్ముళ్ల తీవ్ర ఆందోళనలో ఉన్నారు. 

11:48 - October 27, 2015

ఢిల్లీ : తెలంగాణ సీఎం కేసీఆర్ కాసేపట్లో కేంద్రఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో భేటీ కానున్నారు. ప్రభుత్వ పథకాలకు కేంద్ర సాయంపై చర్చ జరుపనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ పథకాలతోపాటు మరికొన్ని పథకాలకు కేంద్రం సహాయం కోరనునున్నారు. మధ్యాహ్నం 12.00 గంటలకు ప్రధాని మోడీతో, 2.30 గంటలకు నితిన్ గడ్కరీతో, అనంతరం ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. సాయంత్రం 7 గంటలకు నీతి అయోగ్ కమిటీతో సమావేశం కానున్నారు. ఐదు నెలల తర్వాత కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు.

 

కాసేపట్లో అరుణ్ జైట్లీతో సీఎం కేసీఆర్ భేటీ..

ఢిల్లీ : తెలంగాణ సీఎం కేసీఆర్ కాసేపట్లో కేంద్రఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో భేటీ కానున్నారు. ప్రభుత్వ పథకాలకు కేంద్ర సాయంపై చర్చ జరుపనున్నారు. మధ్యాహ్నం 12.00 గంటలకు ప్రధాని మోడీతో, 2.30 గంటలకు నితిన్ గడ్కరీతో, అనంతరం ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. సాయంత్రం 7 గంటలకు నీతి అయోగ్ కమిటీతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు.

 

టీఆర్ఎస్ లోకి గుండు సుధారాణి..?

వరంగల్ : ఉప ఎన్నిక కంటే ముందే టిడిపి ఎదురుదెబ్బ తగులబోతోంది. రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈనెల 29వ తేదీన సుధారాణి గులాబీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ ను సుధారాణి కలువనున్నట్లు ఇప్పటికే టీఆర్ఎస్ ఎంపీ వినోద్ తో చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. గుండు సుధారాణి పార్టీ మారకుండా బుజ్జగించేందుకు టీడీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కానీ గుండు సుధారాణి అందుబాటులోకి రావడం లేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే జూన్ నాటికి సుధారాణి రాజ్యసభ సభ్యత్వం ముగియనుంది. 

11:12 - October 27, 2015

ఆదిలాబాద్ : 'జల్‌- జంగిల్‌- జమీన్‌' అంటూ గిరిజనుల సంక్షేమం కోసం ప్రాణాల్నే పణంగా పెట్టి పోరాడిన యోధుడు కొమురం భీం. భూమి కోసం, భుక్తికోసం, నిజాం కబంద హస్తాల నుంచి విముక్తి కోసం..నిజాం ప్రభుత్వాన్నే గడగడలాడించిన అడవి తల్లి ముద్దు బిడ్డ కొమురం భీం. అలాంటి ధీరోదాత్తుడి 75వ వర్ధంతి నేడు జరుగుతోంది. కొమురం భీం వర్థంతితో ఆదిలాబాద్‌ జిల్లాలోని జోడేఘాట్‌ సర్వాంగ సుందరంగా ముస్తాబై గిరిజన ముద్దు బిడ్డలకు స్వాగతం పలుకుతోంది.
పాలకులను ప్రశ్నించిన కొమురం భీం
'ఈ నీళ్లు మనవి,.ఈ గాలి మనది,.ఈ ఎండ మనది,.ఈ ఆకాశం మనది,.మరి ఈ అడవి మనదెందుకు కాదు..? అని పాలకులను ప్రశ్నించిన పోరాట యోధుడు కొమురం భీం'. మన అడవి, మన నేల, మన నీళ్లు..మనకే దక్కాలని గిరిజనుల హక్కుల కోసం పోరాడిన..కొమురం భీం 75వ వర్ధంతి నేడు. ఆదివాసీల ఆరాధ్య దైవం కొమరం భీం 75వ వర్థంతి సందర్బంగా..పోరాటాల పురిటి గడ్డ జోడేఘాట్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
ఐటీడీఏ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు
ఆదిలాబాద్‌ జిల్లా కెరమొరి మండలంలోని జోడేఘాట్‌లో కొమురం భీం వర్ధంతికి ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. 75వ వర్థంతి సందర్బంగా కొమురం భీంకు నివాళలర్పించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్‌తోపాటు జిల్లా మంత్రులు జోగురామన్న, చందూలాల్‌,ఇంద్రకరణ్‌రెడ్డి హాజరుకానున్నారు. వీరితో పాటు..ఆదిలాబాద్‌ ఎంపీ గడం నగేష్‌,జిల్లా ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. వర్థంతి వేడుకలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరుకానుండడంతో..జిల్లా పోలీస్‌ యంత్రాంగం 600 మంది పోలీసులతో భారీ బందోబస్త్ ఏర్పాటు చేసింది. కొమురం భీం వర్థంతిలో పాల్గొనేందుకు జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా గిరిజనులు తరలివస్తున్నారు. వీరికోసం ఉట్నూర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల ఆర్టీసీ డిపోలనుంచి ప్రత్యేకంగా బస్‌లు వేయటంతో పాటు, కెరమెరి నుంచి జోడేఘాట్‌కు నిరంతరం బస్ సౌకర్యాన్ని కల్పించారు.
రూ.25 కోట్లతో జోడేఘాట్
గతేడాది జోడేఘాట్‌లో జరిగిన కొమరంభీం వర్థంతికి హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్‌..జోడేఘాట్‌లో 25 కోట్లతో భీం స్మారక ఉద్యాన వనం, గిరిజన మ్యూజియం నిర్మించి పర్యాటకం కేంద్రంగా ప్రపంచం గుర్తించేలా పనులు చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు వెంటనే 25 కోట్లను మంజూరు చేసి జోడేఘాట్‌లో పర్యాటకశాఖ ఆధ్వర్యంలో పనులను కూడా ప్రారంభించారు. రూ.25 కోట్లతో జోడేఘాట్ చుట్టూ ఉన్న 100 ఎకరాల్లో భీం స్మారక వనం ఏర్పాట్లు చురగ్గా సాగుతున్నాయి. ప్రత్యేక ఆర్కిటెక్చర్లతో స్మృతి చిహ్నాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా గోండు గూడేనికి తాగునీటి వసతి కల్పించేందుకు ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయు. హట్టినుంచి జోడేఘాట్ వరకు తారు రోడ్డు నిర్మాణం ఇప్పటికే పూర్తైంది.
ఏర్పాట్లపై గిరిజనుల సంతోషం
గిరిజనుల ఆరాధ్య దేవుడిగా చరిత్రలో నిలిచిపోయిన కొమురం భీం వర్ధంతిని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేస్తుండడంపై గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ దేవుడు చేసిన పోరాటాల ఫలితంగానే ఈనాడు తాము అభివృద్ధి ఫలాలను అందుకుంటున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లకు తమ కష్టాలు తీరే రోజులు వచ్చాయని..కొమురం భీం ఇచ్చిన పోరాట స్ఫూర్తితో తాము ముందుకెళ్తామని గిరిజనులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 

ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసు వద్ద టి.టూరిస్టు అసోసియేషన్ ధర్నా...

హైదరాబాద్ : ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం వద్ద తెలంగాణ టూరిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు పన్ను రద్దు చేయాలని టూరిస్టు వాహనాలపై త్రైమాసిక పన్ను తగ్గించాలని డిమాండ్ చేశారు. 

గీతను కలిసిన కేజ్రీవాల్..

న్యూఢిల్లీ : సీఎం కేజ్రీవాల్ తన నివాసంలో గీతను కలిశారు. 15 సంవత్సరాల క్రితం తప్పిపోయిన గీత పాక్ నుండి సోమవారం భారత్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. 

ప్రారంభమైన టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం..

చిత్తూరు : టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం ప్రారంభమైంది. ఆర్జిత సేవా టికెట్లు..లడ్డూ ధరల పెంపు..టిటిడి ఉద్యోగులు..కాంట్రాక్టు కార్మికులకు ఇచ్చే బ్రహ్మోత్సవ బహుమానం..ఇతర అంశాలపై చర్చ జరుగనుంది. 

విద్యుత్ వైర్లు తాకి ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలు..

ఖమ్మం : దుమ్ముగూడెం (మం) మహదేవపురంలో ప్రమాదం చోటు చేసుకుంది. 11కేవీ విద్యుత్ వైర్లు తాకి ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

మహబూబ్ నగర్ లో ప్రత్యేక పోలీసు బృందం తనిఖీలు..

మహబూబ్ నగర్ : బాలానగర్ (మం) రాజాపూర్ లో ప్రత్యేక పోలీసు బృందం తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలు, జేసీబీని సీజ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన బాలానగర్ ఎస్ఐ పై శాఖాపరమైన చర్యలను ఎస్పీ విశ్వప్రసాద్ ఆదేశించారు. 

ఖమ్మం ఎన్ఎస్ పీ క్వార్టర్ వద్ద ఉద్రిక్తత..

ఖమ్మం : ఎన్ఎస్ పీ క్వార్టర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. శిథిలావస్థకు చేరిన క్వార్టర్ ను కూల్చివేసేందుకు అధికారులు యత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. 

ఆశాల సమ్మె పట్ల ప్రభుత్వ తీరు సరికాదు - లక్ష్మణ్..

నల్గొండ : ఆశాల సమ్మె పట్ల ప్రభుత్వ తీరు సరికాదని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ పేర్కొన్నారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలన్న ఆశాల పట్ల మంత్రులు అవహేళనగా మాట్లాడడం తగదని సూచించారు. వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెబుతారని, ఉప ఎన్నికలో బీజేపీ - టీడీపీ కూటమి గెలుపు తథ్యమన్నారు. 

నవంబర్ 2న గాలి వినోద్ కుమార్ నామినేషన్ - చాడ..

కరీంనగర్ : నవంబర్ రెండో తేదీన వామపక్షాల ఉమ్మడి అభ్యర్థి గాలి వినోద్ కుమార్ నామినేషన్ వేస్తారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ ఫాం హౌస్ కోసమే పాములపర్తి రిజర్వాయర్ కు 50 టీఎంసీల నీటిని కేటాయించారని ఆరోపించారు. వినియోగదారుల చట్టాన్ని సవరించి బ్లాక్ మార్కెట్ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

10:55 - October 27, 2015

రైతులు దోపిడికి గురవుతున్నారని.. దళారి దోపిడిని తగ్గిస్తే రైతుకు మద్దతు ధర లభిస్తుందని ది హన్స్ ఇండియా చీఫ్ ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ చెప్పారు. రైతు డబ్బులతో నడిచే మార్కెట్ యార్డు.. రైతులకు సహకరించడం లేదన్నారు. గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ కార్యక్రమంలో పాల్గొని, మాట్లాడారు. మార్కెట్ యార్డులలో దళారీలు, వ్యాపారస్తులదే రాజ్యమైందన్నారు. రైతుల దగ్గర తక్కువ ధరకు ధాన్యం, పత్తిని కొని, ప్రభుత్వం కొనుగోలు సంస్థలకు అధిక ధరలకు అమ్ముకుంటున్నాయని ఆరోంపించారు. మార్కెట్ యార్డు అధికారులు, వ్యాపారస్తులు, ప్రభుత్వ కొనుగోలు అధికారులు కుమ్మక్కు అయి రైతును మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మరిన్ని వివరాలను ఆయన మాటల్లోనే...
ఉపన్యాసాలకు సమస్యలు పరిష్కారం కావు...
రాజకీయ నాయకుల ఉపన్యాసాలకు సమస్యలు పరిష్కారం కావు. ఏ మార్కెట్ యార్డుకు వెళ్లిన ఏ రకంగా రైతు దోపిడికి గురవుతున్నాడో తెలుస్తుంది. వరికి రూ.2600 ఉత్పత్తి ఖర్చు అని రాష్ట్ర ప్రభుత్వమే లెక్కలు వేసింది. 3900 రూపాయలు కనీస మద్దతు ధర ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేసింది. కానీ ఇవాళ కేంద్రం ప్రకటించిన మద్దతు ధర 1400. కానీ మార్కెట్ లో వస్తున్నది 1100 రూపాయలు. అలాగే పత్తికి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ. 4100. వాస్తవంగా ఉత్పత్తి ఖర్చులే రూ. 5100 ఉంటుంది. కాని మార్కెట్ లో వస్తున్నది 2600 నుంచి 3600 మధ్యలో వస్తుంది. మనదేశంలో వ్యవసాయ మార్కెట్ లో దళారీ దోపిడీ ఉంది. కనుక దీన్ని తగ్గించాలని ప్రభుత్వం కొనుగోలు సంస్థలే మార్కెట్ లోకి వచ్చి రైతుల దగ్గర కొనాలనే విధానం దశాబ్ధాలుగా అమలవుతుంది. ఉత్పత్తి ఎక్కువైనప్పుడు ధరలు పడిపోయి రైతు నష్టపోతాడు. ఉత్పత్తి తక్కువున్నప్పుడు ధరల పెరిగి వినియోగదారుడు నష్టపోతాడు. రైతుకు ఆహార భత్రత ఇవ్వాలి.. వినియోగదారునికి ఆహార భద్రత ఇవ్వాలి. అందుకే మార్కెట్ యార్డులో ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. ఇవి రైతుల పంటను కొనగులు చేస్తాయి. మార్కెట్ లో ధరల స్థిరీకరణ జరుగుతుంది.
దళారులు, వ్యాపారుల మోసాలు..
కానీ ప్రభుత్వం సంస్థలు సక్రమంగా పని చేస్తున్నాయా..? మార్కెట్ యార్డు అధికారులు, వ్యాపారులు, కాటన్ కార్పొరేషన్ అధికారులు కుమ్మక్కు అవుతున్నారు. రైతుల దగ్గర ప్రభుత్వ సంస్థలు కొనకుండా.. వ్యాపారులు కొంటున్నారు. సాయంత్రం తిరిగి వ్యాపారులు ప్రభుత్వ సంస్థలకు అమ్ముతున్నారు. రైతు నుంచి 36 వేలకు కొని... సాయంత్రం కాటన్ కార్పొరేషన్ కు 4వేలకు అమ్ముకుంటాడు. ఉమ్మడి ఎపి రాష్ట్రంలో జరిగింది. ఇప్పుడు తెలంగాణలో జరుగుతోంది. అధికారులు, మంత్రులు, ప్రభుత్వం నిద్రపోతోంది. మంత్రులు, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు మార్కెట్ యార్డులకు వెళ్లి... తనిఖీలు చేయాలి. అప్పుడు రైతుకు కనీస మద్దతు ధర వస్తుంది. ఓట్ల కావాలనప్పుడు రైతులు కావాలి. ఓటర్లను కొనుగోలు చేయడానికి వ్యాపారులు కావాలి. కళ్ల ముందు జరుగుతున్న దోపిడీని ఆపాలి'. అని పేర్కొన్నారు. ఆఫ్ఘన్, పాక్ సరిహద్దు హిందూకుష్ పర్వత శ్రేణుల్లో నిన్న సంభవించిన భారీ భూకంపం ఘటనపై మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

10:54 - October 27, 2015

'వీరేంద్ర సెహ్వాగ్' నడి రోడ్డుపై భోజనం చేయడం ఏంటీ ? బీసీసీఐ తీరును నిరసిస్తూ ఇలా చేశారా ? లేక ఇంకేదైనా కోపమా ? అని ఏవోవో ప్రశ్నలు వేసేసుకోకండి. అసలు సెహ్వాగ్ నడి రోడ్డుపై ఎందుకు భోజనం చేశాడో తెలుసుకోవాలంటే ఇది చదవండి...
సెహ్వాగ్ టీమిండియాలో అత్యుతమ క్రికెటర్ గా నిలిచాడు. ఇటీవలే అతను రిటైర్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే సోమవారం మధ్యాహ్నాం 'సెహ్వాగ్' భోజనం చేస్తున్నాడు. అదే సమయంలో ఇళ్లు కదలడం ప్రారంభమైంది. దీనితో సెహ్వాగ్ పరుగు పరుగునా బయటకు వచ్చేశాడు. బతకు జీవుడా అంటూ నడి రోడ్డుపైకి చేరాడు. ఆ తరువాత కాసేపటికి పరిస్థితి అదుపులోకి వచ్చింది. ముందు జాగ్రత్తగా 'సెహ్వాగ్' రోడ్డుపైనే ఉండిపోయాడు. ఇక మధ్యలోనే ఆపేసిన భోజనాన్ని రోడ్డుపైనే ముగించాడు. ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా వీరూ తెలిపాడు. 'భూకంపం వణికిస్తోంది బ్రదర్..అందుకే బయట కూర్చొని లంచ్ చేస్తున్నా' అంటూ ట్వీట్ చేశాడు. పాకిస్తాన్, అప్ఘనిస్తాన్ లో భూకంపం కారణంగా ఎంతో మంది మృత్యువాత పడ్డారు. భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించినా పెద్దగా ప్రాణనష్టం లేకున్నా పలు ప్రాంతాల్లో ఇళ్లు కదిలిపోయాయి. 

నితీష్ కు కేజ్రీవాల్ మద్దతు..

ఢిల్లీ : బీహార్ ఎన్నికల్లో నితీష్ కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. నితీష్ ను మరోసారి సీఎం చేయాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ లో నితీష్ కేజ్రీవాల్ సంఘీభావం ప్రకటించారు. 

కొడికొండ వద్ద ఆర్టీఏ అధికారుల దాడులు..

అనంతరపురం : చిలమత్తూరు (మం) కొడికొండ చెక్ పోస్టు వద్ద ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రెండు ఓల్వో బస్సులు..ఒక స్లీపర్ కోచ్ బస్సును సీజ్ చేశారు. 

కాల్పుల్లో ప్రకాశం జిల్లా వాసి మృతి..

ప్రకాశం : జమ్మూ కాశ్మీర్ వద్ద జరిగిన కాల్పుల్లో ప్రకాశం జిల్లాకు చెందిన జవాన్ సుబ్బారెడ్డి మృతి చెందాడు. గిద్దలూరు (మం) ముండ్లమూరుకు చెందిన వారు. 

శ్రీలంక నేవి అదుపులో భారత జాలర్లు..

శ్రీలంక : 34 మంది భారత జాలర్లను శ్రీలంక నేవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏడు బోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

చిత్తూరు: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వెంకన్న స్వామి దర్శనం కోసం భక్తులు 16 కంపార్ట్ మెంట్‌లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 12 గంటలు..ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు..కాలినడకన వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతోంది.

సౌదీలో ఆత్మహుతి దాడి..ఇద్దరు మృతి..

రియాద్ : సౌదీలో షియా ముస్లింలే లక్ష్యంగా బాంబు దాడులు జరుగుతున్నాయి. సౌదీలోని అల్ మసాద్ మసీదు వద్ద సోమవారం ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

బాసరలో పేలిన సిలిండర్..

ఆదిలాబాద్ : బాసర మండలం శారదానగర్‌లో ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. సిలిండర్ పేలడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

10:31 - October 27, 2015

భారీ తారాగణంతో బాలీవుడ్‌ ప్రముఖ దర్శక, నిర్మాత కరన్‌ జోహార్‌ 'యే దిల్‌ హై ముష్కిల్‌' చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలోని స్పెషల్‌ సాంగ్‌ కోసం కరీనాకపూర్‌ని ఎంపిక చేసినట్టు సమాచారం. రణ్‌బీర్‌ కపూర్‌, ఐశ్వర్యరాయ్, అనుష్కశర్మ, ఫావడ్‌ఖాన్‌, ఇమ్రాన్‌ అబ్బాస్‌నఖ్వీ వంటి హేమాహేమీలు నటిస్తున్న ఈచిత్రంలో ఇప్పటికే సన్నీ లియోన్‌ని సైతం కరన్‌జోహార్‌ తీసుకున్నారు. తాజాగా లిసా హైడెన్‌తోపాటు సైఫ్‌ ఆలీఖాన్‌ని కూడా కరన్‌ ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇంత మంది భారీ తారాగణం నటిస్తున్నప్పటికీ స్పెషల్‌సాంగ్‌లో మెరిసే కరీనానే హైలైట్‌గా నిలుస్తుందని అంటోంది చిత్రయూనిట్‌. ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం వియన్నాలో షెడ్యూల్‌ పూర్తయ్యింది. దీని తర్వాత ఓ పాట కోసం ప్యారిస్‌ వెళ్ళనున్నారు. కరీనాకపూర్‌ ప్రస్తుతం ఆర్‌.బల్కీ రూపొందిస్తున్న 'కీ అండ్‌ కా' చిత్రంలోను, 'ఉడ్తా పంజాబ్‌'లోను నటిస్తూ బిజీగా ఉంది.

10:28 - October 27, 2015

చెన్నై : బీఫ్‌ తిన్నారని లేదా ఇంట్లో దాచుకున్నారనే అనుమానాలతో, కారణాలతో దేశంలో జరుగుతున్న హత్యలు, దాడులు పెద్దలనే కాదు, పిల్లలను సైతం కదిలిస్తున్నాయి. ఎ.డి. ఆరుష్‌ అనే ఆరేళ్ల 'రేపటి పౌరుడు' రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ఒక లేఖ రాశారు. చెన్నైకి చెందిన ఈ పిల్లవాడు ప్రముఖ సిపిఎం నేత యు. వాసుకి మనవడు కావడం విశేషం. ఆరుష్‌ రాసిన లేఖ పూర్తి పాఠం ఇది :
''గౌరవనీయులైన రాష్ట్రపతి గారూ! నమస్తే. నేను ఒకటో తరగతి చదివే ఆరేళ్ల పిల్లవాణ్ని. బీఫ్‌ తిన్నందుకు లేదా ఇంట్లో బీఫ్‌ను నిల్వ చేసినందుకు చాలా మంది మీద దాడులు జరుగుతున్నాయని మా నానమ్మ చెప్పారు. మన దేశంలో ఇలాంటివి జరగకూడదు. నేనీ దేశాన్ని ప్రేమిస్తాను.
ఇది విన్నాక నాలో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. వాటిని ఈ కింద రాస్తున్నాను:

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో బీఫ్‌ ఎందుకు తినగూడదు? శాకాహారులైనా, మాంసాహారులైనా మనసుకు నచ్చిన ఆహారాన్ని తింటే నష్టమేమిటి ? బీఫ్‌ ఎవ్వరూ తినగూడదని కొంత మంది ఆదేశించడం ఏమిటి? వీరి ఆదేశాల్ని ఎవరైనా ఎందుకు పాటించాలి ? ఎవరికి ఇష్టమైనది వారు తినొచ్చు కదా ! పిల్లలు బీఫ్‌ తినాలనుకుంటే మీరేం చేస్తారు? పేద కుటుంబమైతే వాళ్లు మాంసాహారం తినడం ఎలా ? కూరగాయల ధరలేమో మండిపోతున్నాయి. మాంసాహారాల్లో అన్నింటికన్నా చౌకగా లభించేది ఎద్దు మాంసమే. మరి అలాంటప్పుడు తినక ఏం చేస్తారు ? హిందువైనా, ముస్లిమైనా బీఫ్‌ తినడమే తప్పు కాదు. ఎందుకంటే అది ఒక ఆహారం మాత్రమే. గ్రామాలలో, కొన్ని పశువులు వ్యవసాయానికి అవసరమైతాయి. మరి కొన్నింటిని ఆహారంగా ఉపయోగించుకోవచ్చు. కాదంటారా? వయస్సు మళ్లిన కొన్ని పశువులు నిరుపయోగంగా మారతాయి. వాటిని ఆహారంగా తీసుకోవచ్చు. ఆ పని ఎందుకు చేయగూడదు? మీ పట్ల పూర్తి గౌరవంతో, ఈ ప్రశ్నలకు జవాబివ్వాలని మిమ్మల్ని కోరుతున్నాను.''

10:27 - October 27, 2015

చాలా మందికి వివిధ రకాలైన ఇన్ఫెక్షన్లు సోకుతుంటాయి. ఇలాంటి వాటిలో గొంతు ఇన్ఫెక్షన్‌ కూడా ఒకటి. దీని నివారణకు వివిధ రకాల మందులను తీసుకుంటారు. ఇలాంటి ఇన్ఫెక్షన్లకు మందులతో చికిత్స తీసుకునే దానికంటే వంటింట్లో అందుబాటులో ఉండే చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే నయమైనట్టే.
గొంతు ఇన్ఫెక్షన్‌తో బాధపడేవారు ప్రతీరోజు నీళ్లలో తులసి ఆకులు వేసుకుని తాగినట్లయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. అలాగే, జీలకర్ర, పంచదార కలిపి నమిలితే కడుపునొప్పి నుండి విముక్తి లభిస్తుంది.
అల్లం ముక్కని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇందులో చిటికెడు జీలకర్ర పొడి, పంచదార కలిపి తింటే దగ్గు తగ్గుతుంది. గ్లాసు నీళ్ళలో పావు టీ స్పూన్‌ ఇలాచి పొడి కలుపుకుని తాగితే మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్‌ సమస్య విముక్తి పొందొచ్చు.

10:26 - October 27, 2015

ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో బ్రేక్‌ ఫాస్ట్ చాలా ముఖ్యం. ఉదయం పూట తినే ఆహారమే రోజంతా మనలో ఉత్తేజాన్ని నింపుతుంది. కనుక తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలి. అయితే ఉదయం పూట కేకులు తినడం సరికాదు. చక్కెర, వెన్నతో చేసినవి పొద్దున్నే తినడం వల్ల శరీరంలోకి ఎక్కువ క్యాలరీలు చేరతాయి. వేయించిన బంగాళాదుంపల్నీ అల్పాహారంలో తీసుకుంటే అరుగుదల అంతగా ఉండదు. పొట్టలో ఇబ్బందితో అసౌకర్యానికి గురవుతారు. ప్రయాణ సమయాల్లో ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, బంగాళాదుంపలతో చేసిన స్నాక్స్ కి దూరంగా ఉండటం ఉత్తమం.

తేలిగ్గా జీర్ణమయ్యే అల్పాహారం బెటర్..
త్వరగా తయారవుతాయని టిఫిన్‌ కోసం కొందరు నూడుల్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కాని ఇవి ఆరోగ్యానికి మంచివి కావు. వీటిల్లో సొడియం అధికం. ఇలాంటి మసాలా కలగలిసిన వాటిని తీసుకుంటే ఎండలో వెళ్ళినప్పుడు వికారంగా ఉంటుంది. సమయం చూసుకొని తేలిగ్గా అరిగే మామూలు అల్పాహారం తీసుకోవడం మంచిది. కొందరు రాత్రి మిగిలిన చికెన్‌ వంటకాలను మర్నాడు వేడి చేసి తింటారు. ఇలా చేస్తే హాని చేసే ట్రాన్స్ ఫ్యాట్లు శరీరంలోకి చేరిపోతాయి.

పండ్ల రసాల నిల్వ..
కొందరు పండ్ల రసాలను తయారు చేసి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తుంటారు. కానీ అప్పటికప్పుడు చేసిన వాటికే ప్రాధాన్యమివ్వాలి. ముందురోజు చేసిన వాటిని మర్నాడు ఉదయం తాగడం వల్ల పొట్టలో బ్యాక్టీరియా చేరుతుంది. పోషకాలు సరిగా అందవు. ఇక ఉదయం పూట గుడ్డు తినడం మంచిదే. అయితే నూనెలో ఫ్రై చేయకుండా తినొచ్చు. నూనెలో ఫ్రై చేసినవి మధ్యాహ్నం, రాత్రి పూట తీసుకోవడం బాగానే ఉంటుంది. కాని ఉదయాన్నే అల్పాహారంగా గుడ్డు తీసుకోవాలంటే ఉడికించిన గుడ్డు తీసుకుంటే మంచిది.

10:24 - October 27, 2015

నా పెళ్ళి తేదీపై మీడియా గందరగోళం సృష్టిస్తోందని 'ఆశిన్‌' పేర్కొంటోంది. నవంబర్‌ 26న ఢిల్లీలో ఆశిన్‌ పెళ్ళంటూ మీడియాలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ఖరాఖండిగా చెప్పింది. అంగీకరించిన ప్రాజెక్టులు, కాంట్రాక్టులు ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతాయని, ఆ తర్వాతే తమ పెళ్ళి జరుగుతుందని స్పష్టంగా చెప్పేసింది. పెళ్ళి ఎప్పుడనేది నేను, మా పెద్దలు చెప్పేవరకు మీడియా వాళ్ళు ఓపిక పట్టాలని సూచించింది. మైక్రో మ్యాక్స్ సహస్థాపకుడైన రాహుల్‌శర్మను ఆశిన్‌ పెళ్ళి చేసుకోబోతున్న విషయం విదితమే. ఇటీవల జరిగిన ఆశిన్‌ బర్త్ డే సెలబ్రేషన్స్ లో రాహుల్‌ శర్మ ఆరు కోట్ల విలువైన డైమండ్‌ రింగ్‌ను ఆశీన్ కు బహూకరించారంట.

 

10:23 - October 27, 2015

'జూనియర్ ఎన్టీఆర్' సరసన అతి లోక సుందరి 'శ్రీదేవి' కూతురు నటిస్తోందన్న పుకార్లు టాలీవుడ్ లో షికారు చేస్తున్నాయి. 'ఎన్టీఆర్‌', కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందబోయే చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో 'ఎన్టీఆర్‌' సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తారని దర్శకుడు కొరటాల శివ చెప్పారు. ఆ ఇద్దరిలో ఒక హీరోయిన్‌గా 'శ్రీదేవి' కూతురు 'జాహ్నవి కపూర్‌'ని ఎంపిక చేసినట్టు సమాచారం. 'ఎన్టీఆర్‌' సరసన 'శ్రీదేవి' కూతురు నటిస్తుందనే వార్త ప్రస్తుతం సామాజిక మీడియాలో హాట్‌న్యూస్‌గా మారింది. 'మిర్చి', 'శ్రీమంతుడు' వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్స్ తర్వాత హ్యాట్రిక్‌ బ్లాక్‌బస్టర్‌ కోసం సమాయత్తమవుతున్న దర్శకుడు కొరటాల శివకు ఈ హాట్‌ న్యూస్‌ కూడా ప్లస్‌ కాబోతోందని టాక్.

 

10:22 - October 27, 2015

'బాహుబలి' చిత్రం సృష్టించిన ప్రభంజనంతో జాతీయ స్థాయిలో తిరుగులేని గుర్తింపును ప్రభాస్ సంపాదించుకున్నారు. తెలుగు ప్రేక్షకులకు మాత్రమే సుపరిచితమైన ఆయన పేరు 'బాహుబలి' అఖండ విజయంతో ఖండాతరాలకు పాకిపోయింది. దీనితో హిందీ చిత్రసీమ నుంచి 'ప్రభాస్‌'కు భారీ అవకాశాలొస్తున్నట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు పాపులర్ బాలీవుడ్ యాక్షన్ సిరీస్ చిత్రాల్లో ఒకటైన 'ధూమ్-4'లో ప్రభాస్ ప్రతినాయకుడిగా కీలక పాత్రలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 'ధూమ్-4' చిత్రానికి దర్శక నిర్మాతలైన విజయ్‌కృష్ణ ఆచార్య, ఆదిత్య చోప్రాతో పాటు యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థకు చెందిన కొందరు సభ్యులు ఇటీవలే ముంబయిలో 'బాహుబలి' చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించారని తెలుస్తోంది. సినిమాలో 'ప్రభాస్' నటనకు ముగ్ధుడైన నిర్మాత ఆదిత్యచోప్రా 'ధూమ్-4'లో విలన్ పాత్రలో 'ప్రభాస్‌'ను నటింపజేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు టాక్. 'ధూమ్' సిరీస్ మొదటి మూడు భాగాల్లో జాన్ అబ్రహమ్, హృతిక్‌రోషన్, అమీర్‌ఖాన్‌లు వరుసగా విలన్ పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. 'ధూమ్-4' చిత్రానికి సంబంధించిన పూర్తి అధికారిక సమాచారాన్ని చిత్ర బృందం త్వరలో వెల్లడించనున్నట్లు తెలిసింది.

 

10:21 - October 27, 2015

మేర్లపాక గాంధి దర్శకత్వంలో 'ఎక్స్ ప్రెస్‌ రాజా' చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో 'శర్వానంద్' హీరోగా 'సురభి' కథా నాయిక నటిస్తోంది. షూటింగ్‌ దాదాపుగా పూర్తయిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. గాంధి చెప్పిన కథ, కథనం నచ్చాయని, 'రన్‌ రాజా రన్‌' లో 'శర్వానంద్‌'ని కొత్తగా ఎలా చూపించామో, ఈ సినిమాలోనూ అలాగే న్యూ లుక్‌తో ప్రెజెంట్‌ చేస్తున్నామని నిర్మాతలు వంశీ, ప్రమోద్‌ తెలిపారు. హరీష్‌ ఉత్తమన్‌, ఊర్వశి, ప్రభాస్‌ శ్రీను, సుప్రీత్‌, సప్తగిరి, షకలక శంకర్‌, దువ్వాసి, బండ రఘు, నాగినీడు, సూర్య తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. 

09:47 - October 27, 2015

నెల్లూరు : జిల్లాలో ఘోరం జరిగింది. గూడూరు జాతీయ రహదారిపై ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నడుస్తున్న బస్సులో నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు బెంగళూరు వాసిగా గుర్తించారు.

 

నేడు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం

విజయనగరం : నేడు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం జరుగనుంది. ఉత్సవ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ వేడుకలను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు.

 

నేడు నిజామాబాద్ జిల్లాలో మంత్రి మహేందర్ రెడ్డి పర్యటన

నిజామాబాద్ : నేడు జిల్లాలో మంత్రి మహేందర్ రెడ్డి పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

 

09:38 - October 27, 2015

ఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఢిల్లీ పర్యటన ప్రారంభమైంది. 2రోజుల పాటు సాగే ఈ పర్యటనలో రాష్ట్రానికి అధిక మొత్తంలో కేంద్ర నిధులను రాబట్టేందుకు.. ఆయన ఢిల్లీ పెద్దలతో భేటీ కానున్నారు. దీంతో పాటే.. డిసెంబర్‌లో నిర్వహించ తలపెట్టిన మహా చండీయాగానికి ప్రధాని, రాష్ట్రపతిలను ఆహ్వనించనున్నారు.
ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ ఢిల్లీ చేరుకున్నారు. రెండు రోజుల పాటు హస్తినలో పర్యటించనున్న ఆయన నీతి ఆయోగ్ సబ్‌ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ఢిల్లీ పెద్దలతో భేటీ అవుతారు. ముందుగా రేపు మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమవుతారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల వాటను పెంచే అంశంపై చర్చిస్తారు.
తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ కోరనున్న కేసీఆర్
విభజన చట్టంలో పొందు పరిచిన విధంగా తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ కోరనున్నారు. ఇక తెలంగాణకు రుణ పరిమితి మొత్తాన్ని పెంచాలనీ కేసీఆర్‌ విజ్ఞప్తి చేయనున్నారు. అందు కోసం ఎఫ్ ఆర్ బిఎం చట్టంలో పలు నిబంధనలను సడలించాలని కొరనున్నారు. ఇక అదే రోజు కేంద్ర రవాణ శాఖ మంత్రి నితన్ గడ్కరి తోనూ కేసీఆర్‌ భేటీ అవుతారు. రాష్ట్రం గుండా వెళుతున్న జాతీయ రాహదారులను మరింత అభివృద్ది చేయాలని కోరనున్నారు.
ప్రధాని మోడితో భేటీ కానున్న కేసీఆర్‌
ఇక నీతి ఆయోగ్ సబ్ కమిటీ సభ్యులతో కలసి ప్రధాని మోడితో సీఎం కేసీఆర్‌ భేటీ అవుతారు. కేంద్ర పథకాలు రాష్ట్రాలకు లబ్ది చేకూర్చే విధంగా రూపొందించిన నివేదికను మోడికి సమర్పించనున్నారు. కేంద్రం అందించే నిధుల ఖర్చులో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉండేలా నిబంధనలను సడలించాలని ప్రధానిని కోరనున్నారు. సీఎం కేసీఆర్‌ డిసెంబర్ 23 నుంచి నిర్వహించే ఆయత మహా చండి యాగానికి రాష్ట్రపతి, ప్రధానులను ఆహ్వానించనున్నారు. మొత్తంగా సీఎం రెండు రోజుల పాటు ఢిల్లీలో బీజీ బీజీగా గడపనున్నారు.

 

దంపతుల ఆత్మహత్య

రంగారెడ్డి : ఘట్ కేసర్ లో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు అన్నపూర్ణ, రాజేంద్రప్రసాద్ లుగా గుర్తించారు. 

09:27 - October 27, 2015

టీసర్కార్ పాలన నిరాశాజనకంగా ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు.' టీసర్కార్ పాలన' అనే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా విశ్లేషకులు నగేశ్ కుమార్, సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి, టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి, టీకాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ పాల్గొని, మాట్లాడారు. టీఆర్ ఎస్ ప్రభుత్వం పరిపాలన ప్రజలు ఆశించిన విధంగా లేదన్నారు. ప్రజలకిచ్చిన హామీలను ప్రభుత్వం నేరవేర్చాలని సూచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

 

నెల్లూరులో వ్యక్తి ఆత్మహత్య

నెల్లూరు : జిల్లాలో ఘోరం జరిగింది. గూడూరు జాతీయ రహదారిపై ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నడుస్తున్న బస్సులో నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు బెంగళూరు వాసిగా గుర్తించారు. 

09:08 - October 27, 2015

భూ పంపిణీ చేస్తామన్న ఎపి ప్రభుత్వ హామీ అటకెక్కిందని.... ల్యాండ్ బ్యాంకింగ్ తెర మీదకొచ్చిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నేత వి.వెంకటేశ్వర్లు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'ఆంధ్రప్రదేశ్ లో భూ హక్కుల పరిరక్షణ ఉద్యమం మొదలైంది. ఈ నెల 30న ఇందుకు సంబంధించిన సన్నాహక సదస్సును విజయవాడలో నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యమానికి కారణం ఏమిటి? ఈ సదస్సు లక్ష్యాలేమిటి? ల్యాండ్ బ్యాంకింగ్ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు రైతులు, కూలీల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి? ఇలాంటి అంశాలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:56 - October 27, 2015

దాదాపు 15 లక్షల ఎకరాల భూములనుసేకరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కొన్ని లక్షల మంది రైతుల గుండెల్లో దడపుట్టిస్తున్నాయి. చిన్న, సన్నకారు, బక్క రైతుల నుంచి భూములు సేకరించకుండా అభివృద్ధి సాధించలేమా? ల్యాండ్ బ్యాంకింగ్ పేరుతో ప్రభుత్వం ఎందుకంత అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది?

మారుతున్న ప్రభుత్వ విధానాలు
ప్రభుత్వ విధానాలు మారుతున్నాయి. దళితులు, గిరిజనులు, వ్యవసాయ కూలీలు, చిన్న రైతుల పట్ల ప్రభుత్వాల పోకడలు మారుతున్నాయి. ప్రభుత్వ, పోరంబోకు, అటవీ, మిగులు భూములను గుర్తించి వాటిని భూమిలేని నిరుపేదలకు పంచడం గత ఆదర్శంగా వుండేది. ప్రతి ఎన్నికల్లోనూ ప్రతి రాజకీయ పార్టీ పేదలకు భూమిలిస్తామని వాగ్ధానం చేయడం పరిపాటి. భూములు ఇవ్వడమే కాకుండా వాటి అభివ్రుద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ప్రభుత్వాలు చెబుతుండేవి. కానీ, ఇప్పుడు ప్రభుత్వాల స్వరం మారుతోంది.
భూ సంస్కరణల ఊసేత్తని సర్కార్
భూ పంపిణీ గురించి ఇప్పుడు ప్రభుత్వాలు మాట్లాడడం లేదు. భూ సంస్కరణల ఊసెత్తడం లేదు. భూ పంపిణీ కార్యక్రమం పక్కన పెట్టేసి, భూ సమీకరణ, భూ సేకరణ, ల్యాండ్ బ్యాంకింగ్ అంటూ జనం గుండెల్లో దడపుట్టిస్తున్నారు. భూమిలేని నిరుపేదలకు వ్యవసాయ యోగ్యమైన భూములు పంచడం మాట అటుంచి, చిన్న రైతుల ఆధీనంలోని ఒకట్రెండు ఎకరాల భూమిని కూడా ప్రభుత్వాలు స్వీకరించే కార్యక్రమం ఇప్పుడు నడుస్తోంది. ఈ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ లో మరింత వేగంగా అమలవుతున్నట్టు కనిపిస్తోంది. భూ సమీకరణ పేరుతో ఇప్పటికే అమరావతి కోసం 30 వేల ఎకరాలకు పైగా ప్రభుత్వం తీసుకుంది. భూములివ్వని వారి విషయంలో ఇంతకాలమూ సహనంగా వ్యవహరించినట్టు కనిపించిన ప్రభుత్వం ఇప్పుడు కఠిన వైఖరి ప్రదర్శిస్తోంది. రైతుల పంటలు తగలబెట్టడం, అగ్రికల్చరల్ జోన్ లుగా ప్రకటిస్తే మీ పరిస్థితి ఏమిటంటూ రైతులను బెదిరించడం లాంటి వ్యవహారాలు మనం చూస్తేనే వున్నాం.
హీటెక్కిన భోగాపురం ఎయిర్ పోర్ట్ భూసేకరణ వ్యవహారం
ఇక బందరు పోర్టు, భోగాపురం ఎయిర్ పోర్ట్ భూ సేకరణ వ్యవహారం ఇప్పటికే హీటెక్కింది. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 15 లక్షల ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం వ్యూహరచన చేసిందన్న వార్తలు రైతుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములు, దళితులకు, బలహీనవర్గాలకు గతంలో ఇచ్చిన భూములను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం పావులు కదుపుతోందన్న వార్తలు వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
మూతపడుతున్న పరిశ్రమలు
రాష్ట్రంలో అభివ్రద్ధి జరగాలన్నా, పరిశ్రమలు రావాలన్నా ల్యాండ్ బ్యాంకింగ్ ద్వారానే సాధ్యమవుతుందన్నది ప్రభుత్వ వాదన. నిజానికి ఇప్పటికే ఎస్ ఈ జడ్ ల పేరుతో కొన్ని వేల ఎకరాల భూములను విభిన్న సంస్థలకు అప్పగించారు. నయానో భయానో అదిరించో బెదిరించో ఇప్పటికే కొన్ని పారిశ్రామిక సంస్థలు కారుచౌకగా రైతుల భూములు తీసుకున్నాయి. పది పదిహేనేళ్ల క్రితం పారిశ్రామిక వేత్తలకు, ఎస్ ఈ జడ్ లకు ఇచ్చిన భూములు ఇప్పటికీ నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వాలు ప్రచారం చేసిన స్థాయిలో ఎక్కడా పరిశ్రమలు రాలేదు. ఒకవేళ ఒకట్రెండు చోట్ల పెట్టినా, వాటిలో స్థానికులకు, భూములిచ్చిన కుటుంబాలకు దక్కిన ఉద్యోగాలు ఎన్ని వున్నాయన్నదీ ప్రశ్నార్ధకమే. కొత్త పరిశ్రమలు రాకపోగా, వున్న పరిశ్రమలే మూతపడుతున్న దయనీయ స్థితి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. కరెంట్ కోతలు, విద్యుత్ చార్జీలు తట్టుకోలేక అనేక చిన్న చిన్న యూనిట్లు గుడ్లు తేలేస్తున్నాయి. మూతపడ్డ పరిశ్రమలను తెరిపించకుండా, సిక్ ఇండస్ట్రీస్ ను కాపాడే ప్రయత్నాలు చేయకుండా, పారిశ్రామికాభివ్రుద్ధి పేరుతో మరికొన్ని భూములను స్వాధీనం చేసుకోవడంలో అర్ధం వుంటుందా? పారిశ్రామిక అభివ్రుద్ధి పట్ల ప్రభుత్వాలకు నిజంగా చిత్తశుద్ధి వుంటే ఇప్పటికే కేటాయించిన భూముల్లో పరిశ్రమలు నెలకొల్పే చర్యలు తీసుకోవాలి. పరిశ్రమలు పెట్టేందుకు ఉత్సాహం చూపని యాజమాన్యాల నుంచి భూములను వెనక్కి తీసుకోవాలి. కానీ, అలాంటి ప్రయత్నాలు చేయకుండా, చిన్న చిన్న రైతుల నుంచి, గిరిజనుల నుంచి, దళితుల నుంచి, బలహీనవర్గా ల నుంచి భూములు తీసుకోవడంలోని ఆంతర్యం ఏమిటో?

 

08:41 - October 27, 2015

కృష్ణా: ఏపీ రాజధానికి ఉద్యోగుల త‌ర‌లింపు వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. వ‌చ్చే వేస‌విలోగా ఉద్యోగులను అమరావతికి తరలించడం కష్టంగా కనిపిస్తోంది. ఆరు నెలల్లో అన్ని శాఖలు తరలిరావాలని చంద్రబాబు ఆదేశిస్తున్నా... ఆచరణలో అడుగడుగునా సమస్యలు ఎదురవుతున్నాయి. ఉద్యోగులకు సరిపడా ఇళ్లు లేకపోవడం...ఆకాశన్నంటుతున్న అద్దెలు అవరోధంగా మారుతున్నాయి.
విజయవాడ నుంచే పూర్తిస్థాయి పాలన
ఏపీ రాజధానికి ఉద్యోగుల తరలింపు వ్యవహారం ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్లుగా మారుతోంది. అమరావతి నిర్మాణ పనులకు శంకుస్థాపన పూర్తి కావడంతో.. విజయవాడ నుంచే పూర్తిస్థాయి పాలన సాగించేందుకు సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే కార్యాల‌యాల తరలింపు,ఉద్యోగుల‌ వసతి సదుపాయాలు చూసేందుకు ఆర్ అండ్ బీ శాఖ ముఖ్య కార్యద‌ర్శి శ్యాంబాబు ఆధ్వర్యంలో క‌మిటీ వేశారు. ప‌లు ద‌ఫాలు విజ‌య‌వాడ ,గుంటూరుల్లో పర్యటించిన క‌మిటీ స‌భ్యులు...ఇటీవ‌లే సర్కార్‌కు నివేదిక అంద‌జేశారు.
హెచ్ ఆర్ ఏతో పాటు ఇత‌ర సౌక‌ర్యాలు కల్పిస్తేనే విజయవాడకు
మంత్రుల‌కు వ‌స‌తి సౌక‌ర్యం దొరికినా.. ఉద్యోగుల‌కు మాత్రం ఇప్పటికిప్పుడు అవ‌స‌ర‌మైన వ‌స‌తి కష్టమేనంటున్నారు అధికారులు. హైద‌రాబాద్ నుంచి విజయవాడకు సుమారు 20 వేల మంది ఉద్యోగులు త‌ర‌లివెళ్లాల్సి ఉండటంతో.. వీరంద‌రికీ అవ‌స‌ర‌మైన ఇళ్లు బెజవాడలో లేవంటున్నారు. ఆరేడు వేల మందికి ఇళ్లు దొరికినా.. అద్దెలు ఆకాశాన్నంటుతున్నట్లు నివేదిక‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హెచ్ ఆర్ ఏ తో పాటు ఇత‌ర సౌక‌ర్యాలు కల్పిస్తేనే విజయవాడకు వెళ్తామని ఉద్యోగులు అంటున్నారు.
ఇళ్ల నిర్మాణానికి స్థలాలివ్వాలని విజ్ఞప్తి
విజయవాడతో పోల్చితే హైదరాబాద్‌లోనే అద్దెలు తక్కువగా ఉన్నాయని ఏపీ సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు. విజయవాడలో పెరిగిన అద్దెల ప్రకారం నెలకు 15 వేలు రెంట్‌ చెల్లించే స్తోమత తమకు లేదంటున్నారు. హ‌డ్కో ద్వారా రుణాలు ఇప్పిస్తే సొంత ఇళ్లు నిర్మించుకుంటామంటున్నారు.
రెంట్‌ కంట్రోల్‌ యాక్ట్‌ ప్రయోగించే యోచన
మ‌రోవైపు విజ‌య‌వాడ‌లో పెరిగిన అద్దెల‌ను నియంత్రించేందుకు రెంట్ కంట్రోల్ యాక్ట్‌ను ప్రయోగించాలని సర్కార్‌ యోచిస్తోంది. ఉద్యోగుల తరలింపుపై ఏ విధంగా ముందకెళ్లాలనే దానిపై రెండు మూడు రోజుల్లో సీఎం ఓ నిర్ణయం తీసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది.

 

మంజీరా పైప్ లైన్ లీక్..

మెదక్ : రామచంద్రాపురం సంగీత థియేటర్ వద్ద మంజీరా పైప్‌లైన్ పగిలిపోయింది. మంజీరా పైప్‌లైన్ పగిలిపోవడంతో నీరు వృథాగా పోతోంది. రోడ్డుపై నీరు పోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరి కాసేపట్లో అధికారులు మరమ్మతులు చేపట్టనున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ...

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వెంకన్న స్వామి దర్శనం కోసం భక్తులు 16 కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతుంది.

నేడు టీటీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ

విజయవాడ : నేడు తెలంగాణ టీడీపీ నేతలతో ఎపి సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో వరంగల్ ఉప ఎన్నిక, పార్టీలో అంతర్గత కుమ్ములాటలపై చర్చించనున్నారు. 

07:50 - October 27, 2015

హైదరాబాద్ : నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే సీడ్ కాంగ్రెస్ సమావేశాలకు హైద్రాబాద్ వేదికవుతోంది.. తెలంగాణలో విత్తనొత్పత్తి అవకాశాలు, ఇతర వ్యవసాయ సమస్యలకు పరిష్కారం కోసం ప్రయత్నిస్తోంది.. అయితే ఇది కేవలం కార్పొరేట్‌ కంపెనీలకు లబ్ధి చేసేదిగా ఉందంటూ విమర్శలొస్తున్నాయి.
సీడ్ కాంగ్రెస్ సమావేశాలకు టీసర్కార్ ఆతిధ్యం
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని సీడ్ బౌల్ గా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది టీ సర్కారు. విత్తన ఉత్పత్తిపై అధ్యయనం చేసే సీడ్ కాంగ్రెస్ సమావేశాలకు ఆతిధ్యం ఇస్తోంది. హైదరాబాద్‌ హైటెక్స్ లో మంగళవారం నుంచి మూడురోజులపాటు జరగబోయే ఈ సమావేశాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. ఇప్పటివరకూ సీడ్స్ కాంగ్రెస్ దేశంలోని ఏడు రాష్ట్రాల్లో నిర్వహించారు.. మొదటిసారి ఈ సమావేశానికి హైదరాబాద్ వేదికవుతోంది. ఈ కార్యక్రమానికి కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి రాధామోహన్ సింగ్ హాజరు కాబోతున్నారు. విత్తనాల నాణ్యత, ఎగుమతులు, వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు అనుసరించాల్సిన పద్ధతులను ఈ సదస్సులో చర్చించనున్నారు.. 14దేశాలనుంచి వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లతోపాటు ప్రోగ్రెసివ్ రైతులు తమ అభిప్రాయాలు పంచుకోబోతున్నారు.
రాష్ట్రాన్ని విత్తనభాండాగారంగా మార్చేందుకు ప్రయత్నాలు
రాష్ట్రాన్ని విత్తనభాండాగారంగా మార్చేందుకు ఈ వేదికను ఉపయోగించుకోవాలని సర్కారు ప్రయత్నిస్తోంది.. శాస్త్రవేత్తలు, ఇతర వర్గాలతో చర్చించి సలహాలు, సూచనలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.. సమావేశం పూర్తయ్యాక అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని స్టేట్ సీడ్ పాలసీని ప్రకటిస్తామని మంత్రి పోచారం శ్రీనివాస్ అన్నారు. అయితే ఈ సదస్సు పూర్తిగా కార్పొరేట్ కంపేనీల కోసమే ఏర్పాటుచేసినట్లు ఆరోపణలొస్తున్నాయి.
సదస్సుకు రావాలంటే రూ. 3500 ఎంట్రీ ఫీజు
విత్తన ఉత్పత్తిలో తెలంగాణ ప్రభుత్వ వాటా కేవలం 12 శాతం మాత్రమే. మిగతా 88 శాతం కార్పొరేట్‌ కంపెనీల వాటాగా ఉంది. ఈ సదస్సులో వారికే ప్రాధాన్యం ఉందంటూ నిర్వాహకుల ప్రకటననుబట్టి తెలుస్తోంది. పైగా ఈ సదస్సుకు రావాలంటే మూడున్నరవేలు ఎంట్రీ ఫీజు చెల్లించాలంటూ రూల్ పెట్టడంపై విమర్శలొస్తున్నాయి.

 

07:34 - October 27, 2015

హైదరాబాద్ : పాతబస్తీ షాలిబండలో ఈనెల 25న కిడ్నాప్‌నకు గురైన పొన్నా శబరీష్‌ రైల్వే పోలీసుల అదుపులో క్షేమంగా ఉన్నాడు. పదో తరగతి చదువుతున్న శబరీష్‌.. స్టేషనరీ సామాన్లు కొనుక్కునేందుకు బయటకు వెళ్లగా.. కొంతమంది దుండగులు కిడ్నాప్‌ చేశారు. మత్తు ఇవ్వడంతో శబరీష్‌ అపస్మారక స్థితిలో వెళ్లాడు. ఆ తర్వాత ఎంఎంటిఎస్ రైల్లో వెళ్తుండగా మెళకువ వచ్చిన బాలుడు.. రైల్లోంచి కిందకు దూకి మరో ట్రైన్‌ ఎక్కాడు. ఆ విధంగా శబరీష్‌.. విశాఖ, తిరుపతి, విజయవాడలో తిరిగాడు. చివరకు బొకారో ఎక్స్‌ప్రెస్‌లో చెన్నై వెళ్తున్న బాలుడిని.. బాపట్ల రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని తల్లిదండ్రులకు సమాచారమందించారు.

 

07:31 - October 27, 2015

హైదరాబాద్ : హుక్కా సెంటర్లపై వెస్ట్ జోన్ పోలీసులు కొరడా ఝళిపించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న హుక్కా సెంటర్లపై అర్ధరాత్రి మెరుపుదాడులు చేసారు. దాదాపు 100మందిని ఖాకీలు అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ ఠాణాకు తరలించారు. టీనేజ్‌లోనే హుక్కాకు బానిసైన విద్యార్ధులు బంగారు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని పోలీసులు ఆందోళన వ్యక్తం చేసారు. తల్లితండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్‌ ఇస్తామని వెస్ట్ జోన్ పోలీసులంటున్నారు.

నేడు కొమురం భీం 75వ వర్థంతి

హైదరాబాద్ : నేడు కొమురం భీం 75వ వర్థంతి. జోడెఘాట్ లో వర్థంతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు మంత్రులు కేటీఆర్, చందులాల్, జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డి హాజరుకానున్నారు. 

నేడు రవీంద్రభారతిలో వాల్మీకి జయంతివేడుకలు...

హైదరాబాద్ : నేడు రవీంద్రభారతిలో వాల్మీకి జయంతి వేడుకలు జరుగనున్నాయి. వేడుకలను టీసర్కార్ అధికారికంగా నిర్వహించనుంది. మంత్రి ఈటెల రాజేందర్ హాజరుకానున్నారు. 

Don't Miss