Activities calendar

29 October 2015

టీడీపీ, బీజేపీ మధ్య సమన్వయం కోసం కమిటీ

విజయవాడ: టీడీపీ, బీజేపీ మధ్య సమన్వయం కోసం చంద్రబాబు కమిటీ వేశారు. ఐదుగురు మంత్రులతో సమన్వయ కమిటీ వేయనున్నారు. సోమువీర్రాజు, రాజేంద్రప్రసాద్‌ పరస్పర విమర్శలపై బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం మంత్రి కామినేని చంద్రబాబును కలిశారు. ఎన్డీఏలో భాగస్వాములుగా ఉండి విమర్శలు చేయడం మంచిది కాదని చంద్రబాబు నేతలకు సూచించారు.

ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనారిటీ సంక్షేమ శాఖలపై సీఎం సమీక్ష

విజయవాడ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమశాఖలపై చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు మృణాళిని, రావెల, కొల్లు రవీంద్ర హాజరయ్యారు. మహిళ సంఘాల ద్వారా బిసి, ఎస్.సి యాక్షన్ ప్లాన్‌లలో కొంత భాగం నిధులు ఖర్చు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. కన్వర్‌జెన్స్ పద్ధతుల ద్వారా నిధులను సమీకరించి మహిళ సంఘాల ఆదాయం పెరిగేలా అన్వేషించాలని సూచించారు. మహిళలకు శిక్షణ, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని మంత్రులతో చంద్రబాబు అన్నారు.

సాహితీ వేత్తలు అప్పుడెందుకు స్పందించలేదు: వెంకయ్య

ఢిల్లీ : అబ్దుల్‌ కలాం నివాసాన్ని కేంద్ర మంత్రి మహేష్‌శర్మకు కేటాయించడంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు విమర్శించారు. గత ప్రభుత్వంలోని మంత్రులు నివాసాలు ఖాళీ చేయకపోవడం వల్లే మహేష్‌శర్మకు కలాం నివాసాన్ని కేటాయించాల్సి వచ్చిందని ఆయన వివరించారు. నివాస స్థలాల్లో మోమోరియల్‌ నిర్మించవద్దని 2000లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మెమోరియల్‌ నిర్మించాలని కలాం కుటుంబ సభ్యులు కోరలేదని ఆయన స్పష్టంచేశారు. సిక్కుల ఊచకోత, బలహీనవర్గాలపై దాడులు జరిగినప్పుడు సాహితీవేత్తలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

లెవీ సేకరణ విధానానికి మోదీ సర్కార్‌ స్వస్ధి

హైదరాబాద్ : అసలే వర్షాభావ పరిస్థితులు. ఈ ఏడాది వర్షాల్లేక రైతులు అరకొరగానే పంటల్ని వేశారు. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మోదీ సర్కార్‌..రైతునెత్తిన మరో బండపడేసింది. రైతుకు మద్ధతు ధర కల్పించడం కోసం తీసుకువచ్చిన లెవీ సేకరణ విధానానికి కుంటి సాకులతో మంగళం పాడింది. 

19:48 - October 29, 2015

హైదరాబాద్ :తెలంగాణకు చెందిన ఐటీ నిపుణులు ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మారాలనుకుంటున్నారని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. బెంగళూరులో జరిగిన సీఈబీఐటీ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఐటీకి సంబంధించి భారత్‌లో ఉన్న అవకాశాలపై చర్చించే ఈ సదస్సులో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్ని ప్రసంగించారు. తెలంగాణలో ఐటీ బిజినెస్‌కు ఉన్న అవకాశాలను వివరించారు.

19:46 - October 29, 2015

మెదక్: అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్‌ జిల్లా న్యాల్‌కల్‌ మండలంలో చోటు చేసుకుంది. రాజోల గ్రామానికి చెందిన చెరుకు రైతు నాగన్న ప్రైవేటు ఫైనాన్షియర్ల వేధింపులు తట్టుకోలేక ఉరివేసుకొని బలవన్మరణం పొందాడు. ప్రైవేటు ఫైనాన్స్‌ వద్ద 3 లక్షల మేర అప్పు తీసుకోవడంతో పాటు 7 ఎకరాల పొలంలో నాగన్న చెరుకు సేద్యం చేశాడు . తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంటకు నీరందక ఎండిపోయింది. దీంతో అప్పుల బాధ భరించలేక రైతు బలవన్మరణం పొందాడు. 

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.6లక్షల నష్టపరిహారం

హైదరాబాద్ : తెలంగాణలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలపై తెలంగాణ ప్రభుత్వం కొంత కరుణ చూపింది. జూన్‌ 2 , 2014 తర్వాత ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. 6 లక్షల నష్టపరిహారాన్నిపెంచుతూ తెలంగాణ ప్రభుత్వం సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రూ.1.50 లక్షలు చెల్లించిన వారికి మిగిలిన డబ్బును ప్రభుత్వం అందించనుంది.

డ్రంక్ అండ్ డ్రైవ్ లో 29 మందికి జైలు శిక్ష

హైదరాబాద్ : సైబరాబాద్ పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 29 వాహనదారులకు జైలు శిక్ష పడింది. ఈ నెల 17 నుంచి 24 వరకు జరిగిన డ్రైవ్‌లో మొత్తం 394 కేసులు నమోదయ్యాయి. వీరిలో మోతాదుకు మించి మద్యం తాగి వాహనాలను నడిపిన 29 మందికి కోర్టు జైలు శిక్షను విధించింది. ఈ కేసులకు సంబంధించి ట్రాఫిక్ పోలీసులు 3.28 లక్షల జరిమానాను వసూలు చేశారు. వారంలో ఓఆర్‌ఆర్‌పై మొత్తం 395 కేసులను నమోదు చేశారు. ఇందులో రాంగ్ పార్కింగ్ 102, తప్పుడు రూట్‌ల్లో ప్రయాణించిన 293 వాహనాదారులకు చలాన్లు రాశారు. వీరి వద్ద నుంచి 3.52లక్షల జరిమానాను వసూలు చేశారు.

ఉప్పల వాగు వద్ద దారి దోపిడీ

మహబూబ్‌నగర్: జిల్లాలోని అయిజ కర్నూలు మార్గంలో గల ఉప్పలవాగు వద్ద దారి దోపిడీ జరిగింది. కారులో వెళ్తున్న రియల్ ఏస్టేట్ వ్యాపారులను కొందరు దుండగులు బెదిరించి దోపిడీ చేశారు. దుండగులు వ్యాపారుల నుంచి రూ. 6 లక్షలు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

6నుండి 9వ తరగతి వరకు సంస్కరణలు..

విజయవాడ : ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు పరీక్షల విధానంలో సంస్కరణలు అమలు చేయాలని ఏపీ విద్యాశాఖ నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే సంస్కరణలు అమలు చేయాలని నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలోకూడా సంస్కరణలు అమలు చేయనుంది. ఇకపై పరీక్షల నిర్వహణలో ఫార్మాట్ ఎస్సెస్‌మెంట్ సమ్మెటివ్ ఎస్సెస్‌మెంట్ విధానం అమలు చేయాలని ప్రధానోపాధ్యాయులకు ఏపీ విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది.

18:53 - October 29, 2015

విజయవాడ : రాజధాని నిర్మాణంలో తాము కూడా పాలు పంచుకుంటామని నెదర్లాండ్స్‌ ప్రతినిధులు చంద్రబాబుకు స్పష్టం చేశారు. ఈ రోజు విజయవాడలో సీఎంతో భేటీ అయిన నెదర్లాండ్స్‌ ప్రతినిధులు.. చర్చలు జరిపారు. రాజధాని నిర్మాణంలో తామేం చేయగలమనేది వారు చంద్రబాబుకు వివరించారు. 

18:52 - October 29, 2015

విజయవాడ: ఎన్ని సమస్యలున్నా ఉద్యోగులు అమరావతికి జూన్‌కల్లా వచ్చేయాల్సిందేనని చంద్రబాబు తేల్చి చెప్పేశారు. ఆర్ధికంగా పరిస్ధితి అనుకూలంగా లేకపోయినా ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చామని.. ఇప్పుడు పరిస్ధితి అర్ధం చేసుకుని త్యాగాలకు సిద్ధం కావాలని బాబు స్పష్టం చేశారు. హెచ్‌ఆర్‌ఏ వ్యవహారంపై పరిశీలిస్తామని సీఎం చెప్పారు. ఉద్యోగులు మాత్రం ఈ విద్యా సంవత్సరం అయిపోయాక వస్తామని చెబుతున్నారు.

18:51 - October 29, 2015

విజయవాడ : ప్రభుత్వం రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా రాజకీయాలను చేస్తోందని ఆరోపించారు వైసీపీ అధికార ప్రతినిధి పార్థసారథి. రాజధాని కోసం రైతుల నుంచి వేల ఎకరాల్లో భూములు తీసుకున్న ప్రభుత్వానికి భూదాహం తీరలేదని ఆయన విమర్శించారు. రాజధానిలో పేదవారు ఉండటం ప్రభుత్వానికి ఇష్టం లేకే బలవంతపు భూసేకరణ చట్టాన్ని రైతులపై ప్రయోగిస్తుందన్నారు. బలవంతపు భూసేకరణకు వైసీపీ వ్యతిరేకమని తెలిపారు.

గుండు సుధారాణిని సస్పెండ్ చేసిన టిడిపి

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీ గుండు సుధారాణి సస్పెన్షన్ కు గురయ్యారు. సుధారాణి టీఆర్ఎస్ లో చేరుతున్నారనే వార్తలు గత కొద్ది రోజులుగా హల్ చల్ చేస్తున్నాయి. దీనికి తోడు, ఢిల్లీలో నిన్న మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆమె భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ పాలన అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చారు. దీంతో, ఆమెపై టీడీపీ నాయకత్వం సీరియస్ అయింది. క్రమశిక్షణా చర్యల కింద ఆమెపై చర్యలు తీసుకుంటూ, పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

పద్మభూషణ్‌ అవార్డును వెనక్కి ఇచ్చేస్తా: పీఎం భార్గవ

హైరాబాద్ : వచ్చేవారం పద్మభూషణ్‌ అవార్డును వెనక్కి ఇచ్చేస్తానని ప్రముఖ శాస్త్రవేత్త పీఎం భార్గవ స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలు వ్యక్తి స్వేచ్ఛను హరిస్తున్నాయని మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లోనే ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. నాకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని తేల్చిచెప్పారు. అవార్డులు వెనక్కి ఇచ్చినవారు కాంగ్రెస్ మద్దతుదారులనడం తగదని పీఎం భార్గవ విమర్శించారు.

రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది: పోచారం

హైదరాబాద్ : రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ హైటెక్స్‌లో జరుగుతోన్న 8వ జాతీయ విత్తన సదస్సులో ఆయన ప్రసంగించారు. రైతులు ఆత్మైస్థెర్యం కోల్పోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చి దిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

17:51 - October 29, 2015

హైదరాబాద్ : భద్రత కోసం ప్రవేశపెట్టిన హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు వాహనదారులను భయపెడుతున్నాయి. నెంబర్ ప్లేట్ల బిగింపు ప్రహాసనంగా మారడం,..బిగించిన ప్లేట్లు నాణ్యతగా లేకపోవడంతో వాహరదారులు లబోదిబోమంటున్నారు. నెంబర్‌ ప్లేట్లను ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో ఏం చేయాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు.

సంఘ వ్యతిరేక చర్యలకు అడ్డుకట్ట ........

ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా తయారైంది వాహనదారుల పరిస్థితి. హైసెక్యూరిటీ నెంబర్‌ప్లేట్ల బిగింపు ప్రక్రియ పెద్ద ప్రహసనంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంఘవ్యతిరేక చర్యలను నిరోధించేందుకు వాహనాలకు విదేశాల తరహాలో హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు బిగించాలని గత కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై అప్పట్లో సుప్రీంకోర్టులో కేసు కూడా నమోదైంది. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ..వాహనాల వివరాలు నమోదయితే నేరాలు తగ్గుతాయని పేర్కొంటూ ఈ విధానం తప్పనిసరి చేయాలంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీనికోసం కేంద్రం విధివిధానాలను కూడా రూపొందించింది. దీంతో దశల వారీగా దేశంలో ఉన్న అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు బిగించాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది.

ఆర్టీసికి బాధ్యతను అప్పగించిన ప్రభుత్వం ....

దీనికోసం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ ప్లేట్లను బిగించే బాధ్యతను ఆర్టీసికి అప్పగించింది. ఆర్టీసి యాజమాన్యం టెండర్లు పిలిచి కొన్ని ఎజెన్సీలకు కాంట్రాక్టు పద్దతిలో ఈ పనిని అప్పగించింది. ఆర్టీసి నిర్ణయించిన రేట్లకే కాంట్రాక్ట్‌ తీసుకున్న ఎజెన్సీ నెంబర్‌ ప్లేట్లను బిగించాలి. ఇదంతా రవాణాశాఖ అధికారుల పర్యవేక్షణలో జరగాలి. ఇంతవరకు బాగానే ఉన్నా..నెంబర్‌ ప్లేట్ రావడానికి నెలలతరబడి వేచి చూడాల్సి వస్తోంది. తొలి విడతగా హైదరాబాద్ నగరంలోనే మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రెండు సంవత్సరాలుగా ఈ ప్రక్రియ సాగుతూనే ఉంది. కొత్త వాటికి బిగించడం తప్ప పాత వాటికి మార్చినవి తక్కువే. ప్లేట్ల నాణ్యతను పరీక్షించాల్సిన ఆర్టీసి అధికారులు నిర్లక్ష్యం వహించడంవల్ల నాసిరకం ప్లేట్లను వాడుతున్నట్టు వాహనదారులు ఆరోపిస్తున్నారు.

తెలంగాణ పేరుతో మార్చుకోవాలన్న ప్రభుత్వం .....

ఇదంతా ఒక ఎత్తయితే..తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నెంబర్ ప్లేట్లను తెలంగాణ పేరుతో మార్చుకోవాలని ఆదేశాలు జారీచేసింది. దీనికి 4నెలల గడువును విధించింది. మార్చుకునేటప్పుడు హైసెక్యూరిటీ ప్లేట్లు బిగించుకోవాలని సూచించింది. దీంతో తెలంగాణలో ఉన్న 70లక్షల వాహనదారులకు కొత్త చిక్కు వచ్చిపడింది. 4నెలల గడువులో ఎజెన్సీ కొత్త ప్లేట్లను బిగించే అవకాశం లేదు. ఎందుకంటే హైదరాబాద్‌లో రోజుకు వెయ్యి కొత్త వాహనాలు రిజిస్టర్ అయివున్నాయి. వీటికి నెంబర్‌ప్లేట్లను బిగించడానికి కనీసం నెల రోజుల సమయం పడుతుంది. దీంతో 70 లక్షల వాహనాలకు నాలుగు నెలల్లో నెంబర్‌ప్లేట్లను ఎలా మార్చుతారో అధికారులకే తెలియాలి. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి మరికొంత గడువు ఇవ్వాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.  

17:48 - October 29, 2015

హైదరాబాద్ : డాక్టర్‌ ఆఫ్‌ ఫార్మసీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థుల సర్టిఫికేట్లలో డాక్టర్‌ అని చేర్చకపోవడంపై జెఎన్టీయూ హైదరాబాద్‌ ఫార్మ్‌ డీ విద్యార్థులు నిరసనకు దిగారు. తెలుగు రాష్ట్రాలలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు డాక్టర్‌ అనే గుర్తింపుతో సర్టిఫికేట్‌లు జారీ చేస్తున్నారని విద్యార్థులు తెలిపారు. జెఎన్టీయూ హైదరాబాద్‌, ఉస్మానియా యూనివర్సిటీల్లో మాత్రమే డాక్టర్‌ పదం లేకుండా సర్టిఫికేట్లు ఇస్తున్నారంటూ మండి పడ్డారు. తమకు గుర్తింపు లేకుండా వర్సిటీ అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ విద్యార్థులు ఆరోపించారు. 

17:47 - October 29, 2015

హైదరాబాద్ : వరంగల్‌ పార్లమెంట్‌ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో వామపక్ష ప్రజాసంఘాల అభ్యర్థి గాలి వినోద్‌ కుమార్ ప్రచారం జోరందుకుంది. వరంగల్‌ జరిగిన సమావేశంలో వామపక్ష పార్టీలు గాలి అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ ప్రచార పర్వం కొనసాగించారు. ఈ సందర్భంగా సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ కేసీఆర్‌ చేసిన వాగ్దానాలను మరిచారని అందుకు గుణపాఠం నేర్పే అవకాశం ఉప ఎన్నికల్లో లభించిందన్నారు. 

గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూతో ఇద్దరు మృతి

హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూతో చికిత్స పొందుతూ ఇద్దరు మహిళలు ఈ రోజు మృతి చెందారు. నల్గొండ జిల్లాకు చెందిన ఓ మహిళ కొంత కాలంగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా పరిస్థితి విషమించి ఈ రోజు మృతి చెందింది. మౌలాలికి చెందిన బాలింత ఓ ప్రైవేటు ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో ఆరుగురు స్వైన్ ఫ్లూ వ్యాధితో చికిత్స పొందుతున్నారు.

'ప్రభుత్వం అంగీకరిస్తే జనవరి 26న ఖైదీలను విడుదల చేస్తాం'

హైదరాబాద్ : ఖైదీల విడుదలపై జైళ్ల శాఖ మార్గ దర్శకాలు రూపొందించింది. త్వరలో కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని స్పష్టం చేసింది. ప్రభుత్వం అంగీకరిస్తే జనవరి 26న ఖైదీలను విడుదల చేస్తామని తెలంగాణ జైళ్లశాఖ ఐజీ నర్సింహ తెలిపారు.

31న అన్ని పార్టీలతో ఈసీ బృందం సమావేశం

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీలో ఓట్ల తొలగింపుపై కేంద్ర ఎన్నికల బృందం విచారణకు వచ్చింది. వారు మూడు రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు. మర్రి శశిధర్‌రెడ్డి, ఇంద్ర సేనారెడ్డి ఫిర్యాదు మేరకు ఈ బృందం విచారణ చేపట్టింది. ఈనెల 31న అన్ని పార్టీలతో ఈసీ బృందం సమావేశం కానుంది.

17:23 - October 29, 2015

హైదరాబాద్‌ : నగరంలోని సీపీఎం పార్టీ కార్యాలయం ఎంబీ భవన్‌ను వియత్నాం ప్రతినిధులు సందర్శించారు. వీరికి ఘన స్వాగతం లభించింది. వియత్నాంకు వామపక్ష పార్టీల మద్దతు ఎప్పుడూ ఉందని వియత్నాం - భారత్‌ల మధ్య సంబంధాలు మరింత బలపడాలని ప్రతినిధి బృందం ప్రెసిడెంట్‌ ఎంపీ వూజువాన్‌ హంగ్‌ అన్నారు. 

17:15 - October 29, 2015

ఆదిలాబాద్ : శాస్త్ర సాంకేతిక రంగం ఎంతగానో అభివృద్ధి చెందినా.. గ్రామీణ ప్రాంత ప్రజలను మంత్రాల భయం ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. దళితులపై దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. అధికార దర్పంతో అగ్రవర్ణ పెద్దలు.. అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ప్రశాంతంగా ఉండాల్సిన పల్లెలు మూడ నమ్మకాలతో భయంతో వణికిపోతున్నాయి.అగ్రవర్ణాల దాడితో ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం బోరజ్‌ గ్రామంలో దళితులు బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అనారోగ్యాలకు మంత్రాలే కారణమని అభిప్రాయం........

ఇన్నాళ్లు కలిసి మెలిసి ఉన్న గ్రామస్తుల మధ్య మనస్పర్ధలు చెలరేగాయి. అగ్రవర్ణాలకు చెందిన మహిళలతో పాటు పలువురు అనారోగ్యానికి గురవడం వెనుక.. ఓ దళితుడు చేస్తున్న మంత్రాలే కారణమని పలువురు అభిప్రాయపడ్డారు. ఓ కాలువలో బొమ్మలు పాతిపెట్టడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని భ్రమపడ్డారు. అంతే వీటన్నింటికి దళితుడు, వృద్ధుడైన చిట్టిమెల్లి నర్సింగ్‌ కారణమని భావించారు. అంతే పంచాయతీ ఏర్పాటు చేసి నర్సింగ్‌పై అబాండాలు మోపారు. నర్సింగ్‌ కుటుంబ సభ్యులెవరికీ సమాచారమివ్వకుండానే తతంగమంతా నడిపించారు. పంచాయతీలో అగ్రవర్ణాలకు చెందిన యువకులు నర్సింగ్‌పై దాడి చేశారు. ఊరంతా తిప్పుతూ కొట్టారు. తాను ఎలాంటి మంత్రాలు చేయలేదని లబోదిబోమన్నా పట్టించుకున్న నాధుడే లేడు. అధికార దర్పంతో కళ్లుమూసుకుపోయిన అహంకారులు ఇష్టమొచ్చినట్లు నర్సింగ్‌ను చావబాదారు. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించారు. జంతువుల తోళ్లను ఉంచే నీటితొట్టిలోని నీళ్లను తాగించారు.

భార్యకు చెప్పుకొని బాధపడ్డ నర్సింగ్‌ ......

ఇక ఇంటికి చేరిన నర్సింగ్‌ తనకు జరిగిన అవమానాన్ని భార్య నర్సమ్మకు చెప్పుకొని బాధపడ్డాడు. ఉన్న ఊళ్లో తనకు జరిగిన తలచుకొని ఆవేదన చెందాడు. దీన్నే మనసులో పెట్టుకున్న నర్సింగ్‌.. అవమానం భరించలేక ఊరి చివర పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు నర్సింగ్‌ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నర్సింగ్‌ మృతిచెందాడు. తన తండ్రి మృతికి గ్రామపెద్దలైన కిష్ణారెడ్డి కారణమని కుటుంబసభ్యులంటున్నారు.

ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు .....

ఇక దాడి జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని నర్సింగ్‌ భార్య నర్సమ్మ అంటోంది. అప్పుడే పోలీసులు స్పందించి ఉంటే తన భర్త బతికేవాడని వాపోతుంది. పెద్ద కులపోల్లకు రోగాలొస్తే మాకేంటి సంబంధమని ఆమె అంటోంది.

దళిత సంఘాల ఆందోళన .....

వృద్ధుడి మృతికి కారకులైన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని దళిత సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. మరోవైపు ఘటనకు కారకులైన వారు పరారీలో ఉన్నారు. పోలీసులు మాత్రం దీనిపై మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు. గతంలోనూ ఆసిఫాబాద్‌ మండలం అంకుసాపూర్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగిందని పలువురంటున్నారు. అంతేకాకుండా వెలుగులోకి రాని ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటున్నారు. మారుమూల పల్లెల్లో జరుగుతున్న ఇలాంటి ఆగడాలతో దళితులు బిక్కుబిక్కుమంటున్నారు. మంత్రాల నెపంతో దళితులపై దాడులు చేయడం దారుణమంటున్నారు. 

మంత్రులకు వరంగల్ లోక్ సభ బాధ్యతలు

హైదరాబాద్ : వరంగల్ లోక్‌సభలో పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను మంత్రులకు అప్పగించారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వెల్లడించారు. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ బాధ్యతను ఒక్కో మంత్రికి ఇచ్చారని పేర్కొన్నారు. నియోజకవర్గాల వారీగా మంత్రులకు కేటాయించిన అసెంబ్లీ స్థానాల వివరాలు ఇలా ఉన్నాయి. పరకాల - ఈటెల రాజేందర్, వరంగల్ (తూర్పు) - హరీష్‌రావు, వరంగల్ (పశ్చిమ) - కల్వకుంట్ల తారక రామారావు, పాలకుర్తి - జగదీశ్‌రెడ్డి, భూపాల్‌పల్లి - పోచారం శ్రీనివాస్‌రెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్ - ఇంద్రకరణ్‌రెడ్డి, వర్ధన్నపేట - జోగు రామన్న

పెళ్లి ఆటో బోల్తా : 20 మందికి గాయాలు..

విజయనగరం : పెళ్లి కొడుకుతో పాటు పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో పెళ్లి కొడుకు సహా 20 మందికి గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా, వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో.. విజయనగరం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా భోగాపురం మండలం అగ్నివరం గ్రామ సమీపంలోని 43వ జాతీయ రహదారిపై గురువారం జరిగింది.

కరీంనగర్ లో కెన్ క్రెస్ట స్కూల్ ఛైర్మన్ ఆత్మహత్య

కరీంనగర్‌ : నగరంలోని ప్రముఖ విద్యా సంస్థ కెన్‌ క్రెస్ట్‌ స్కూల్‌ ఛైర్మన్‌ రామగిరి ప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారు. కొద్ది రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కరీంనగర్‌లో సంచలనం సృష్టించింది.

16:58 - October 29, 2015

విజయవాడ: రాజధాని ప్రాంతానికి భూములిచ్చేందుకు సిద్ధంగా లేని రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవాలని ప్రయత్నిస్తే ప్రతిఘటిస్తామని ఏపి సీపీఎం రాష్ర్ట కార్యదర్శి మధు హెచ్చరించారు. అవసరమైతే వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని అన్నారు. కృష్ణానది ఒడ్డున నివసించే పేదల ఇళ్లను తొలగించాలని ప్రయత్నించినా ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. అసైన్డ్‌ భూముల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తెలపాలని డిమాండ్‌ చేశారు.

16:56 - October 29, 2015

ఖమ్మం : ఆశ కార్మికుల సమ్మెకు సీపీఎం నైతిక మద్దతును అందచేస్తుందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈ నెల 31న రాష్ట్ర వ్యాప్తంగా సీపీఎం ఆధ్వర్యంలో బిక్షాటన చేపట్టి నిధులను సమీకరించి వారికి అండగా నిలువనున్నట్లు తెలియచేశారు. ఖమ్మంలో కలెక్టరేట్ ఎదుట ఆశ కార్యకర్తలు చేపట్టిన నిరసన దీక్షా శిబిరాన్ని సందర్శించిన తమ్మినేని వారికి సంఘీభావాన్ని ప్రకటించారు.

16:49 - October 29, 2015

మహబూబ్‌నగర్‌ : ఓ వైపు కందిపప్పు ధరలు సామన్యుడిని భయపెడుతుంటే..మరోవైపు అక్రమార్కులు కందిపప్పును దోచేస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తకోట మండలం గోవిందహళ్లి గ్రామ శివారులో ఖాళీ కందిపప్పు ప్యాకేట్లు బయటపడ్డాయి. ఎమ్మెర్వో కార్యాలయానికి కూతవేటు దూరంలో ఈ ఘటన చోటుచేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు 200 ధర పలుకుతోంది. అదే ప్రజాపంపిణికి ప్రభుత్వం సరఫరా చేసే కందిపప్పు ధర కేవలం 50రూపాయలే ఉండడంతో అక్రమార్కులు ప్యాకెట్లలోని కందిపప్పును దోచేస్తున్నారు. దాదాపు 2వేలకుపైగా ఖాళీ కందిపప్పు ప్యాకెట్లు ఎమ్మార్వో కార్యాలయం వెనకాల బయటపడడంతో రెవెన్యూ సిబ్బంది అలెర్ట్‌ అయ్యారు. రేషన్‌షాపులన్నింటిలో తనిఖీలు నిర్వహించి అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని ఎమ్మార్వో తెలిపారు. 

16:47 - October 29, 2015

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ లో సమ్మె సందర్భంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని హెచ్‌ఆర్సీ జీహెచ్‌ఎంసీని ఆదేశించింది. నెలరోజుల్లో విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. కార్మికుల జీవనానికి ఇబ్బంది కలుగుతున్నందున వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలని కోరింది.

16:45 - October 29, 2015

కృష్ణా : విజయవాడ దగ్గరలోని కొండపల్లి రైల్వేస్టేషన్‌లో ఇంటర్‌సిటీ, కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లను సాంకేతిక కారణాలతో అధికారులు నిలిపివేశారు. దాదాపు రెండుగంటలుగా నిలిచిపోవడంతో.. రైళ్లలోని ప్రయాణీకులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

16:41 - October 29, 2015

కరీంనగర్‌ : ముత్తారం మండలం ఆదివారం పేటలో వేల్పుల శ్యామల అనే పాలిటెక్నిక్‌ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మొదటి సంవత్సరం పాలిటెక్నిక్‌ చదువుతున్న శ్యామల కొద్ది రోజుల క్రితమే టీసీ ఇవ్వాలని కాలేజీ యాజమాన్యాన్ని కోరింది. దీంతో కాలేజీ యాజమాన్యం 50 వేలు డిమాండ్ చేసింది. మనస్థాపానికి గురైన శ్యామల పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. 

16:39 - October 29, 2015

విజయవాడ: టీచర్ల బదిలీల ప్రక్రియ ప్రారంభమైందని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని మొదటి సారిగా ఎపిలో ప్రవేశపెట్టినట్టు ఆయన చెప్పారు. మొదటి విడతగా ప్రకాశం, కడప, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో టీచర్ల బదిలీల ప్రక్రియ ప్రారంభమవుతుందని, మిగిలిన జిల్లాల్లో కూడా విడతల వారిగా బదిలీలు చేస్తామని ఆయన మంత్రి గంటా తెలిపారు. 

16:38 - October 29, 2015

విజయవాడ : తుళ్లూరు కాంట్రాక్టుల విషయంలో తనపై వస్తున్న వార్తలు అసత్య కథనాలని మంత్రి నారాయణ విమర్శించారు. తుళ్ళూరు పరిధిలో జరగాల్సిన పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఏపీ మంత్రి నారాయణ అన్నారు. ఇంకా కేవలం 29 గ్రామాల్లోని 300 ఎకరాలు మాత్రమే పెండింగులో ఉన్నందు వలన అక్కడి రైతులకు ల్యాండ్ పూలింగులో పాల్గొని వారి భూములకు విలువలు పెంచుకోవల్సిందిగా సూచించామన్నారు. లేని పక్షంలో భూ సేకరణ చట్టం తప్పదని వారికి తెలియజేసినట్టు మంత్రి నారాయణ తెలిపారు. 22న మాస్టర్ ప్లాన్ ఫైనలైజ్ చేసి, రాజధానికి భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.

16:36 - October 29, 2015

హైదరాబాద్ :యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ సింగ్‌ యాదవ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 8 మంది మంత్రులను బర్తరఫ్‌ చేయాలని గవర్నర్‌కు సిఫార్సు చేశారు. గవర్నర్‌ ఈ సిఫార్సును ఆమోదించారు. అక్టోబర్‌ 31న జరగనున్న మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగానే ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. మరో 9 మంది మంత్రుల శాఖలను కూడా మార్చనున్నారు. బర్తరఫ్‌ అయిన మంత్రుల్లో ఐదుగురు కేబినెట్‌ మంత్రులు కాగా.. ముగ్గురు సహాయ మంత్రులు ఉన్నారు.

16:35 - October 29, 2015

హైదరాబాద్ : వరంగల్‌ ఉప ఎన్నిక అభ్యర్ధిని రెండురోజుల్లో ప్రకటిస్తామని దిగ్విజయ్‌సింగ్‌ తెలియచేశారు. ఇప్పటికే పార్టీ నేతల అభిప్రాయాలన్నీ సేకరించామని ఆయన చెప్పారు. మరోవైపు సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ తాను వరంగల్‌లో పోటీ చేయడానికి సిద్ధమని స్పష్టం చేశారు.

16:33 - October 29, 2015

హైదరాబాద్ : వరంగల్‌ ఉప ఎన్నికకు పార్టీ అభ్యర్ధి ఎంపికపై సమావేశమైన టీఆర్‌ఎస్‌.. నిర్ణయాధికారాన్ని సీఎం కేసీఆర్‌కే అప్పచెప్పింది. రేపు కేసీఆర్‌ అభ్యర్ధి పేరును ప్రకటిస్తారు. గురువారం తెలంగాణ భవన్‌లో వరంగల్‌ జిల్లా నేతలతో కేసీఆర్‌ నిర్వహించిన సమావేశంలో పార్టీ అభ్యర్థి ఎంపికపై చర్చించారు. టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలతో పాటు వరంగల్‌ జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు, పలువురు నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థి ఎంపిక బాధ్యతను కేసీఆర్‌కు అప్పగిస్తూ నేతలు తీర్మానం చేశారు. స్థానికుడు, ఉన్నత విద్యావంతునికే అవకాశం ఇస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. కాగా ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గుడిమల్ల రవికుమార్‌కు టికెట్‌ ఖరారు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలియవచ్చింది. 

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

ముంబై: స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 2020 పాయింట్లు నష్టపోయి 26,838 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 59 పాయింట్లు నష్టపోయి 8,112 పాయింట్ల వద్ద ముగిసింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.27,270గా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.25,480గా ఉంది. కిలో వెండి ధర రూ.40,063కి అమ్ముడు పోతోంది.

వరంగల్ లో టిఆర్ ఎస్ గెలుపు ఖాయం: కడియం

హైదరాబాద్: ప్రతిపక్షాలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా వరంగల్ లోక్‌సభలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లా టీఆర్‌ఎస్ నేతలతో సమావేశమైన అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వరంగల్ లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని అన్నా టీఆర్‌ఎస్ గెలుపు ముమ్మాటికి ఖాయమన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు టీఆర్‌ఎస్ వెంటే ఉన్నారని అన్నారు. అవేవి తెలుసుకోకుండా ప్రతిపక్షాలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు.

వరంగల్ లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి నిమినేషన్

హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నిక వేడి అప్పుడే మెదలయ్యింది. ఎన్నికల బరిలో నిలవడానికి తొలి నామినేషన్ పడింది. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బి.సమ్మయ్య నామినేషన్ వేశారు. కాంగ్రెస్ పార్టీ తనను విస్శరించిందని సమ్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

అమెరికాలోని షాపింగ్ మాల్ లో కాల్పుల కలకలం

హైదరాబాద్ : అమెరికాలో లో ఇండియానా పోలిస్ నగరంలోని ఓ షాపింగ్ మాల్ లో దుండుగులు కాల్పులు జరపడంతో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. నగరంలో వాషింగ్టన్ స్క్వేర్ మాల్ కారిడార్ లో కాల్పులు జరిపి దుండగుడు తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తి మాస్క్ ధరించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఇల్లందులో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం...

ఖమ్మం : ఇల్లందు మండలం మాణిక్యారంలో ఘోరం జరిగింది. పురుగు మందు తాగి ఒక ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో యువకుడు మృతి చెందగా, యువతి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భయంతోనే గ్రేటర్ లో వార్డుల పునర్విభజన: మాగంటి

హైదరాబాద్ : టీఆర్ఎస్ పై గ్రేటర్‌ టీడీపీ అధ్యక్షుడు మాగంటి గోపినాథ్ నిప్పులు చెరిగారు. గ్రేటర్‌లో వార్డుల పునర్విభజన అశాస్త్రీయంగా ఉందని విమర్శించారు. 200 డివిజన్లు చేస్తామని చెప్పి 150 డివిజన్లకే కుదించారని ఆరోపించారు. గెలవలేమనే భయంతోనే వార్డుల పునర్విభజన చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కోర్టును కూడా తప్పుదోవపట్టించిందని మాగంటి దుయ్యబట్టారు.

ఏసీబీ వలలో ఆర్ ఐ, వీఆర్వో

కరీంనగర్ : భూమికి సంబంధించిన వివరాలను పహాణి లోకి రికార్డు చేయమని దరఖాస్తు చేసుకున్న రైతు నుంచి లంచం తీసుకుంటూ రెవెన్యూ ఇన్ స్పెక్టర్, వీఆర్వో ఏసీబీకి చిక్కారు. కరీంనగర్ జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామానికి చెందిన రైతు ఆది చంద్రమోహన్ తన భూమిని పహాణిలోకి ఎక్కించమని దరఖాస్తు చేసుకున్నాడు. అతడిని వీఆర్వో రవీందర్ రూ. 3 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో రైతు ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వీఆర్వో రవీందర్‌తో పాటు ఈ అవినీతి భాగోతంలో భాగస్వామి అయిన ఆర్‌ఐ లక్ష్మినారాయణను అదుపులోకి తీసుకున్నారు. అదనపు సమాచారంకోసం వారిని విచారిస్తున్నారు.

జూన్ 2 నాటికి అమరావతికి వస్తాం: ఏపీ ఎన్జీఓ నేత మురళీకృష్ణ

విజయవాడ : ఏపీ ఉద్యోగులందరూ జూన్ 2 నాటికి రాజధాని అమరావతికి వస్తారని సీఎం చంద్రబాబుకు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ హామీ ఇచ్చారు. ఈ మేరకు విజయవాడలోని సీఎం కార్యాలయంలో సహోద్యోగులతో కలసి ఆయన చంద్రబాబును కలిశారు. అనంతరం మురళీకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు విజయవాడకు వచ్చేందుకు షరతులు పెడుతున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదని సీఎంకు చెప్పానన్నారు. ప్రభుత్వ ఆఫీసులు ఎక్కడున్నాయో చెబితే వెంటనే తెలంగాణ నుంచి అమరావతికి వచ్చేస్తామని తెలిపామన్నారు. ఉద్యోగుల పీఆర్సీ, లోన్, అడ్వాన్సుల జీవోలను వెంటనే విడుదల చేయాలని సీఎంను కోరారు.

8మంది యూపి మంత్రుల తొలగింపు...

లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. పలు ఆరోపణల కారణంగా తన కేబినెట్‌లోని ఎనిమిది మంది మంత్రులను భర్తరఫ్ చేశారు. త్వరలో వీరి స్థానంలో కొత్త మంత్రులు కొలువుదీరనున్నట్టు సమాచారం. కాగా, అఖిలేష్ అసమర్థుడంటూ ఏకంగా ములాయం సింగ్ యాదవ్‌కే ఒక మంత్రి ఫిర్యాదు చేశారు. దీంతో అఖిలేష్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

వరంగల్ నేతలతో ముగిసిన కేసీఆర్ భేటీ

హైదరాబాద్: వరంగల్ జిల్లా టీఆర్‌ఎస్ ముఖ్య నేతలతో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భేటీ ముగిసింది. తెలంగాణభవన్‌లో జరిగిన ఈ సమావేశానికి వరంగల్ జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్‌తోపాటు పలువురు పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. వరంగల్ లోక్‌సభకు పార్టీ అభ్యర్థి ఎంపికపై చర్చించారు.

15:46 - October 29, 2015

క్యాన్సర్.. ఈ పేరు వినగానే ఒక భయం... మరణానికి చేరువవుతున్నామన్న దిగులు మనిషిని వెంటాడుతుంది.. క్యాన్సర్ ఉందంటే చాలు.. ఇక జీవితానికి చరమగీతమేనన్నభావన మొదలవుతుంది.. .. కానీ, అది తప్పని , మనోబలంతో దాన్ని జయించొచ్చని ఎంతో మంది క్యాన్సర్ బాధితులు నిరూపించారు.. నిరూపిస్తున్నారు....ఈ నేపథ్యంలో అక్టోబర్ నెలను బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహనా మాసంగా జరుపుకుంటున్న సందర్భంగా మానవి స్పెషల్ ఫోకస్.. ‘బ్రేవ్ అండ్ బ్యూటీఫుల్‘.

కలవరపెడుతున్న వ్యాధుల్లో క్యాన్సర్ ది రెండో స్థానం

గత దశాబ్ద కాలంగా, ప్రపంచాన్ని కలవరపెడుతున్న వ్యాధుల్లో క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది. ముఖ్యంగా మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వేగంగా విస్తరిస్తోంది. సరైన సమయంలో, గుర్తించక పోవడంతో ప్రమాదకరంగానూ మారుతోంది. ఈ నేపథ్యంలో జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ, బ్రెస్ట్ క్యాన్సర్ పై విస్తృతంగా అవగాహన పెంచేందుకు అనేక సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇతర క్యాన్సర్ల కన్నా భిన్నంగా బ్రెస్ట్ క్యాన్సర్ సెల్ఫ్ ఎగ్జామిన్ పరీక్షతో తొలి దశలోనే గుర్తించవచ్చు. ప్రాణాపాయం నుండి బైట పడొచ్చంటున్నారు వైద్య రంగంలోని నిపుణులు.

క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం ఒక్కటే మార్గం..

తొలి దశలోనే క్యాన్సర్ ను జయించి విజయవంతమైన జీవితం గడుపుతున్న వారెందరో మన ముందే ఉన్నారు. వారి మాటలు మనలో స్పూర్తిని నింపుతాయనడంలో సందేహాం లేదు..

విజయం సాధిస్తున్న విజయగాథ మరి కొందరిది..

కేవలం వారి ఆరోగ్యంపైనే కాదు. వ్యక్తిగత జీవితంపైనా ఎంతో ప్రభావం చూపుతుంది. అయినప్పటికీ ఏ మాత్రం ఆత్మస్థైర్యం కోల్పోకుండా, ఆ వ్యాధితో పోరాడి విజేతలుగా నిలిచిన వారు మనముందే ఉన్నారు. 

15:25 - October 29, 2015

హైదరాబాద్ : ఎన్నికలు వచ్చాయంటే చాలు రెండు మతాల మధ్య చిచ్చు పెట్టడం బిజెపికి రివాజుగా మారిందని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ విమర్శించారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హర్యానా ఎక్కడ ఎన్నికలు జరిగినా బిజెపి మత విద్వేషాలను రెచ్చగొడుతోందని, అయితే బీహార్‌ ఎన్నికల్లో పప్పులుడకలేదన్నారు. ఎన్నికల సభల్లో మోది- మహాకూటమిని ఉద్దేశించి సైతాన్, తాంత్రిక్‌, ఇడియట్స్‌ అని ప్రసంగించడం ద్వారా ప్రధాని పదవిని కించపరుస్తున్నారని రాహుల్‌ ఎద్దేవా చేశారు. మధుబని ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు.

15:21 - October 29, 2015

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్‌, మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ చోటా రాజన్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయనను ఇంటరాగేట్‌ చేయడానికి బాలి నుంచి డెన్‌పసార్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. రాజన్‌ను 6 గంటలపాటు అధికారులు ప్రశ్నించారు. ఇండోనేషియాలోని బాలిలో పోలీసులుకు చిక్కిన రాజన్‌.. మొదట్లో భారత్‌లో తనకు భద్రత లేదన్నాడు. జింబాంబ్వేకు పంపాలని విజ్ఞప్తి చేశాడు. ఇప్పుడేమో తనను భారత్‌ పంపాలని బాలీ పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. చోటా రాజన్‌పై 71 హత్య కేసులు ఉన్నాయి. ఇతనిపై 1995లో ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ చేసింది. 

15:19 - October 29, 2015

హైదరాబాద్ : పంజాబ్‌ పాటియాలలో న్యూఢిల్లీ పబ్లిక్‌ స్కూళ్లో ఓ నాలుగేళ్ల బాలుడిని టీచర్‌ చితకబాదింది. టీచర్‌ కొట్టిన దెబ్బలకు ఆ పసివాడి చర్మం ఎర్రగా వాచిపోయింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన కేంద్ర మానవవనరుల శాఖ దీనిపై ఓ నివేదిక పంపాలని పంజాబ్‌ రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై పేరెంట్స్‌ టీచర్‌ను నిలదీస్తే మీ బాబు మరో పిల్లాడిని కొట్టి గాయపరచాడని తప్పుడు ఆరోపణలు చేశాడన్నారు. స్కూలు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేస్తే ఈ విషయంలో తానేమి పట్టించుకోనని చెప్పినట్టు బాలుడి తల్లి పేర్కొంది. దీంతో బాలుడి పేరెంట్స్‌ జిల్లా విద్యాశాఖ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

15:15 - October 29, 2015

హైదరాబాద్ : పార్టీ మారక ముందు ఆయనకు ఎక్కడ లేని ప్రాధాన్యం. హస్తాన్ని వీడి కారెక్కిన వెంటనే బుగ్గ కారు ఇచ్చారు. బంగారు తెలంగాణ కోసం ఆయనకు భారీ బాధ్యతలను అప్పగించారు. అయితే ఇప్పుడు మాత్రం ఆయన ప్రాధాన్యతను కుదించారు. ఆయనకు కేటాయించిన వ్యవహారాలను సైతం ఆయన లేకుండానే కానిచ్చేస్తున్నారు. కనీసం సమావేశాలకు సైతం ఆయనకు ఆహ్వానం అందటం లేదు.

కాంగ్రెస్‌ గూటిని వీడి టీఆర్‌ఎస్‌ కారెక్కిన డీఎస్‌.......

డీ శ్రీనివాస్. ఒకప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత. పీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేసారు. అయితే తెలంగాణ ఉద్యమ ప్రభావంతో తన ప్రాబల్యాన్ని కోల్పోయారు. పోటీ చేసిన అన్ని ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే డీఎస్‌ కాంగ్రెస్ ను వీడి అధికార పార్టీ టీఆర్ఎస్ లో చేరారు. ఆయన సీనియార్టీకి గుర్తుగా ప్రభుత్వ సలహదారుగా నియమించారు. ఇప్పటికే ఆరుగురు సలహాదారులున్నా...డీఎస్‌ సేవలను వినియోగించుకునేందుకు మరో సలహదారు పదవి అప్పగించి కేబినేట్‌ హోదాను సైతం కట్టబెట్టారు. మంత్రులకు ఇస్తున్నఅన్ని వసతులు ఆయనకు కల్పిస్తున్నారు. అత్యంత కీలకమైన అంతర్‌ రాష్ట్ర బాధ్యతలను ఆయనకు అప్పగించారు.

పొరుగు రాష్ట్రాలతో పలు చిక్కులు ఉన్నాయి......

నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి పొరుగు రాష్ట్రాలతో పలు చిక్కులు ఉన్నాయి. అటు మహారాష్ట్ర, ఇటు ఆంద్ర ప్రదేశ్, మరో వైపు కర్ణాటకతో జల వివాదాలు నడుస్తున్నాయి. ఇలా ఎన్నో చిక్కు మూడులను విప్పే బాధ్యతను డీఎస్ కు కట్టబెట్టారు సీఎం కేసీఆర్. అంతర్రాష్ట వ్యవహరాల విషయంలో తన చతురతలో పరిష్కరించగలడన్ననమ్మకాన్ని ఉంచారు. తన పై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని భాద్యతలు స్వీకరించారు. బాద్యతలు చేపట్టిందే తడువుగా పలు వర్గాలతో సచివాలయంలో చర్చలు సాగించారు.

అంతర్‌ రాష్ట్ర వ్యవహారాల్లో డీఎస్‌కు ఆహ్వానం లేదు........

అయితే ఆదిలోనే హంసపాదు అన్నట్లు ఇప్పుడు ఆయన ఎక్కడా కనిపించడం లేదు. ఆయనకు కట్టబెట్టిన అంశాల్లో కూడా ఆయనను ఆహ్వనించడం లేదు. ఈ మద్య మహరాష్ట ఇంజనీర్లతో ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుపై తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు, ఇంజనీర్లు చర్చలు సాగించారు. అయితే అంతర్‌ రాష్ట్ర సంబంధాల్లో ప్రభుత్వ సలహదారులుగా ఉన్నడీఎస్ మాత్రం సమావేశంలో లేడు.

అమరావతి శంకుస్థాపన సమయంలోనూ డీఎస్‌కు ఆహ్వానం లేదు......

ఇక ఏపీ నూతన రాజదాని అమరావతి శంకుస్థాపనకు సీఎం కేసీఆర్ తన వెంట మంత్రులు ఈటేల, మహమూద్ అలీ, జగదీష్ రెడ్డిని తీసుకెళ్లారు. కానీ తెలంగాణ ప్రభుత్వానికి అంతర్‌ రాష్ట సంబంధాల సలహదారుడిగా ఉన్న శీనన్న కు మాత్రం ఆ అవకాశం దక్కలేదు. అంతకు ముందు చంద్రబాబు కేసీఆర్ ఇంటికి వచ్చిన సందర్భంలో కూడా డీఎస్ కు సమాచారం ఇవ్వలేదు.

ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ ఒప్పందాల సమయంలోనూ కానరాని డీఎస్‌ .......

ఇక చత్తీస్ ఘడ్ తో కుదిరిన విద్యుత్ ఒప్పందాల సమయంలో కూడా డీఎస్ కు ప్రాధాన్యత దక్కలేదు. ఈ సందర్భంలో కూడా డీఎస్ కు ఆహ్వనం దక్కలేదు. మరో వైపు కేరళా సీఎం ఊమెన్ చాండీ రాష్టంలో పర్యటించారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా కేసీఆర్ ఇంటికి వచ్చారు. అప్పుడు కూడా డీఎస్ సీన్లో లేరు. ఇక ఏపీతో ఉన్నపంచాయితీల పరిష్కారం కోసం అడపాదడపా కేసీఆర్ ఉమ్మడి రాష్ట గవర్నర్ ను కలుస్తున్నారు.గవర్నర్ తో చర్చించేది అంతర్‌ రాష్ట వివాదాలైప్పటికీ డీఎస్ ను తీసుకెళ్లట్లేదు.

కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనలోనూ డీఎస్‌ కనిపించడం లేదు.......

ఇక సీఎం ఢిల్లీ పర్యటన బృందంలో కూడా డీఎస్ లేడు. ఇలా పలు కీలక అంశాల్లో డీఎస్ కనబడకపోవడం చూస్తే తెలంగాణ ప్రభుత్వంలో ఆయనకు ప్రధాన్యత ఏంత మేర లభిస్తుందో తేట తెల్లమవుతుంది. అయితే అదే సందర్భంలో ఆయనకు మంత్రి పదవి దక్కుతుందనే చర్చ మొదలైంది. ప్రభుత్వ సలహదారుడిగా దక్కని గౌరవం,ప్రాధాన్యత..డీఎస్ కు మంత్రి అయ్యాక దక్కుతుందో లేదో చూడాలి. 

15:11 - October 29, 2015

కర్నూలు: రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కర్నూలు నగరంలో హెల్మెట్‌ వినియోగంపై కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కొండారెడ్డి బురుజు నుంచి కలెక్టరేట్‌ వరకు ప్రదర్శన కొనసాగింది. ప్రమాదాలనివారణ కోసం ద్విచక్రవాహనదారులు తప్పకుండా హెల్మెట్‌ను ధరించాలని జిల్లా ఎస్పీ రవికృష్ణ కోరారు.

15:10 - October 29, 2015

విజయవాడ: వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌పై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టిసీమను వ్యతిరేకించిన జగన్‌.. ఇప్పుడు వస్తున్న నీటిని చూసి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రైతులకు మేలు చేయాలని తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. జగన్‌ అడ్డుకోవాలని చూస్తున్నారని దేవినేని విమర్శించారు.

15:08 - October 29, 2015

హైదరాబాద్ : చండీయాగం పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని సీఎం కేసీఆర్‌ వృధా చేస్తున్నారని కాంగ్రెస్‌ ఎంపీ గుత్తా సుఖేంధర్‌ అన్నారు. నల్గొండ జిల్లాకు నీరవ్వలేని కేసీఆర్‌..యాగాల పేరుతో డబ్బును నీళ్లలా ఖర్చుపెడుతున్నారని విమర్శించారు. 

15:04 - October 29, 2015

హైదరాబాద్ : గత కొంతకాలంగా ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా వ్యక్తమవుతున్న నిరసన స్వరాలు తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా మైనార్టీలు, దళితులు, కవులు, రచయితలపై జరుగుతున్న దాడులు, వారినే టార్గెట్ చేసి సాగుతున్న హత్యలు దేశంలో పెద్ద కలకలమే సృష్టిస్తున్నాయి. దాడులు అరికట్టడంలో దేశ ప్రధానిగా మోడీ వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ పలువురు సాహితీవేత్తలు అవార్డులు వెనక్కి ఇచ్చేస్తుండగా, మతత్వదాడులు అణుబాంబు విస్ఫోటనాల కంటే ప్రమాదక రమైనవంటూ శాస్త్రవేత్తలు కూడా గళం విప్పారు. హింసాత్మక సంఘటనలపై స్పందించాలంటూ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారంటే జరుగుతున్న పరిణామాలపై శాస్త్రవేత్తలు ఎంతగా కలత చెందుతున్నారో అర్ధం చేసుకోవచ్చు.

రిటైర్డ్ అడ్మిరల్ రామ్ దాస్ లేఖాస్త్రం........

చివరకు రిటైర్డ్ అడ్మిరల్ ఎల్. రామ్ దాస్ కూడా తన ఆవేదననీ, బాధను దాచుకోలేక, రాష్ట్రపతికీ, ప్రధానికీ లేఖ రాశారు. 15 ఏళ్ల వయస్సులోనే భారత రక్షణ దళాల్లో చేరి, భారత నావికాదళం ప్రధాన అధికారిగా కూడా మూడేళ్ల పాటు సేవలందించారు. తాను హిందూ మత విశ్వాసాలు, సంప్రదాయాలలో పుట్టి పెరిగిన వ్యక్తినని రామ్ దాసే స్వయంగా చెబుతుంటారు. అలాంటి వ్యక్తి కూడా నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారు. తన సహచర భారతీయులైన మైనార్టీలు, దళితులపై పదేపదే జరుగుతున్న దాడులకు సిగ్గుతో తలదించుకుంటున్నట్టు బహిరంగ లేఖ రాశారు. మన ఉమ్మడి వారసత్వానికి ముప్పు వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

కేరళ భవన్ లో ఢిల్లీ పోలీసుల తనిఖీలు......

ఇంతమంది మేధావులు ఇంతగా నిరసిస్తున్నా మోడీ ప్రభుత్వ తీరు మారలేదు. బీఫ్ వండుతున్నారంటూ హిందూత్వ సేనలు చేసిన ఫిర్యాదును అడ్డం పెట్టుకుని ఢిల్లీ పోలీసులు కేరళ భవన్ లో తనిఖీలు చేయడం పెద్ద దుమారమే రేపుతోంది. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అధికారిక భవనంలో కేంద్రం కనుసన్నల్లో పనిచేసే ఢిల్లీ పోలీసులు ప్రవేశించడం, తనిఖీలు నిర్వహించడం సమాఖ్య స్పూర్తికే విరుద్ధమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సంఘటనపై కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీతో పాటు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, కర్నాటక సీఎం సిద్ధిరామయ్య, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లాంటివారు కూడా తీవ్రంగా స్పందించారు.

మోడీపై సీనియర్ల అసంతృప్తి

చివరకు బీజేపీ సీనియర్ నేతలు కూడా మోడీ ప్రభుత్వతీరుపై అసహనం వ్యక్తం చేస్తుండడం మరో తాజా పరిణామం. వాజ్ పేయి మంత్రివర్గంలో పెట్టుబడుల ఉపసంహరణ శాఖా మంత్రిగా పనిచేసిన అరుణ్ శౌరీ బీజేపీ వాణిని గట్టిగా వినిపించే నాయకుడిగా ప్రసిద్ధుడు. అలాంటి వ్యక్తి కూడా మోడీ ప్రభుత్వపనితీరు నిద్రలోకి జారుకునే తాబేలును తలపిస్తోందంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ప్రధాని కార్యాలయం మునుపెన్నడూ లేనంత బలహీనంగా వుందంటూ ఆర్థిక సంస్కరణలపై అసంత్రుప్తిని వ్యక్తం చేశారు.

మోడీ తీరును తూర్పార బట్టిన అరుణ్ శౌరీ.....

అరుణ్ శౌరీ లాంటి సీనియర్ నాయకుడు ఏకంగా తమ పార్టీ ప్రధాని మీదే ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయడం చిన్న విషయమేమీ కాదు. నిజానికి ప్రధానిగా మోడీ వ్యవహార శైలి మీద సీనియర్ నాయకులు కొంతకాలంగా లోలోపల అసంత్రుప్తితో రగిలిపోతున్నారు. పేరుకు తాము కేబినెట్ మంత్రులమే అయినా, తమకు తెలియకుండానే, తమ శాఖాధికారులతో మోడీ సమావేశమవుతండడం చాలామంది సీనియర్లకు రుచించడం లేదు. తమ శాఖకు బడ్జెట్ కేటాయింపులు తగ్గించడంపై స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి మేనకాగాంధీ కూడా అసంత్రుప్తి వ్యక్తం చేస్తుండడం విశేషం. గత పద్దెనిమిది నెలలుగా మోడీ వ్యవహార శైలిపై బీజేపీ సినియర్లలో పేరుకున్న అసంత్రుప్తి బద్దలు కాబోతోందనడానికి అరుణ్ శౌరీ వ్యాఖ్యలు సంకేతమా? 

14:53 - October 29, 2015

రక్తనాళంలో ఏదైనా అవరోధం కలగడాన్ని స్ట్రోక్‌ అని పిలుస్తారు. ఇటీవల అకాల మరణాల్లో స్ట్రోక్‌ మూడవ ప్రధాన కారణంగా ఉంటుంది. దీనికి సత్వర చికిత్స అందించకుంటే మెదడులో కణాలు త్వరగా నిర్వీర్యం అవటం ప్రారంభిస్తాయి. ఈ స్ట్రోక్‌ లక్షణాలు కలిగి ఉంటే మాత్రం ఆలస్యం లేకుండా అత్యవసర వైద్యసహాయాన్ని తీసుకోవటం ఉత్తమం. స్ట్రోక్‌ ప్రధానంగా పురుషుల్లో ఎక్కువగా వస్తుంది. కానీ ఇటీవల మహిళల్లో పెరగడం ఆందోళనకలిగించే అంశం. జీవనశైలిలో వచ్చిన మార్పులే దీనికి కారణం అంటున్నారు వైద్యులు. నేడు ప్రపంచ స్ట్రోక్‌ డే సందర్భంగా మహిళల్లో దీనికి సంబంధించిన చైతన్యం కలిగించాలని డబ్ల్యుహెచ్‌ఓ నిర్ణయించింది.
అకస్మాత్తుగా కంటిచూపు ఒకవైపుగానీ లేదా రెండు కళ్లల్లోగానీ సన్నగిల్లడం. ఆహారం లేదా మరేదైనా మింగటంలో బాధ కలగడం. ఆకస్మికంగా తీవ్రమైన తలనొప్పి సంభవించటం. అకస్మాత్తుగా ఒకవైపు శరీరం మొద్దుబారటం లేదా శరీరంలో బలహీనత ఏర్పడటం దీని ముఖ్య లక్షణాలు.

సొంతంగా స్ట్రోక్‌ నిర్ధారణ
స్ట్రోక్‌ అని అనుమానం కలిగినప్పుడు కొన్ని చిన్నపాటి పరీక్షలు దీనిని నిర్ధారించుకోవటానికి ఉపయోగపడగతాయి. ముఖంపై చిరునవ్వుకు ప్రయత్నించాలి. దీని ద్వారా ముఖంలో ఒకవైపు నవ్వు కనబడక శుష్కించుకుపోయి ఉంటే అనుమానించాలి. రెండు చేతులు పైకి లేపాలి. ఒకవేళ ఒకవైపు చేయి పైకి లేపలేకపోతే గమనంలోకి తీసుకోవాల్సిందే. ఒక వాక్యాన్ని చెప్పాలి. ఆ ప్రయత్నంలో పదాలు సక్రమంగా పలకలేకపోతే జాగ్రత్తపడాలి.
ఏం జరుగుతుంది: స్ట్రోక్‌ వచ్చినప్పుడు ప్రతి నిమిషం చాలా విలువైంది. మెదడులో ఆక్సిజన్‌ క్షీణిస్తున్నప్పుడు క్రమక్రమంగా కణాలు మరణించడం ప్రారంభమవుతాయి. మెదడు రక్త కణాల్లోని రక్తపు గడ్డలను కరిగించేందుకు మందులు అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ మందులు స్ట్రోక్‌ సంభవించిన మూడుగంల్లోపు వాడాలి. ఒక్కసారి మెదడులో ఒక్క కణం మరణించినా, ఆ కణానికి సంబంధించిన అవయవాలు పనిచేయటం ఆగిపోతాయి. దీనితో దీర్ఘకాలిక అంగవైకల్యం సంభవించే అవకాశం ఉంది.
స్ట్రోక్స్‌ ఎన్ని రకాలు: స్ట్రోక్‌ లక్షణాలు ఎవరికైనా వచ్చినప్పుడు ముందుగా ఎటువంటి స్ట్రోక్‌కు గురయ్యారు అనేది నిర్ధారించాలి. స్ట్రోక్స్‌లు రెండు రకాలుగా కలుగుతాయి. ఈ రెండింటికీ ఒకే విధమైన చికిత్స ఉండదు. రక్తనాళాలు బ్లాక్‌ అవటం వలన లేదా రక్తనాళాలు చిట్లడం వలన సంభవించిందా అనేది స్కానింగ్‌ ద్వారా కనుగొనవచ్చు. ఇతర పరీక్షల ద్వారా ఈ డామేజ్‌ శరీరంలో ఏ ప్రాంతంలో ఎంతవరకు జరిగిందనేది గుర్తించవచ్చు.
ఇస్కామిక్‌ స్ట్రోక్‌ : స్ట్రోక్‌లలో ఇది ప్రధానమైనది. ప్రతి 10 స్ట్రోక్‌లలో తొమ్మిది స్ట్రోక్‌లు దీని కిందికే వస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇందులో మెదడు లోపల రక్తపుగడ్డ మెదడు రక్త సరఫరాకు అంతరాయం కలిగిస్తుంది.
మినీస్ట్రోక్‌ : మెదడుకు రక్తం ప్రవహించే నాళాలు తాత్కాలికంగా మూసుకుపోయి, తరువాత తిరిగి రక్త ప్రవాహం పునరుద్ధరిం చబడుతుంది. దీనిని మినీస్ట్రోక్‌ అంటారు. ఈ లక్షణాలు కనబడితే వెంటనే వైద్యుని సంప్రదించడం అవసరం. ఈ స్ట్రోక్‌ను నివారించేందుకు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
కారణాలు: కొలెస్ట్రాల్‌, క్యాల్షియం ఇతర పదార్థాలు రక్త ప్రవాహ నాళాలలో ఫలకంలాగా ఏర్పడి, రక్త ప్రవాహాన్ని అడ్డు కుంటాయి. దీని మూలంగా కాలక్రమేణా ఫలకం పరిణామం పెరిగి, రక్తపు ముద్దల మాదిరిగా ఏర్పడతాయి. ఈ గడ్డకట్టిన రక్తపుముద్దలు నాళంలో ఒక సంకుచిత స్థానంలో చిక్కుకుపోయి, రక్త ప్రవాహానికి అడ్డు తగులుతాయి. ఇవే స్ట్రోక్‌ ఏర్పడేందుకు కారణమవుతాయి. ఇదే రక్తపు గడ్డ అడ్డుపడటం మూలంగా రక్తప్రవాహ ధాటికి రక్తనాళాలు చిట్లిపోయి కూడా స్ట్రోక్‌ రావొచ్చు.
కారకాలు: కొన్ని తీవ్ర పరిస్థితుల వలన స్ట్రోక్‌ ప్రమాదం పెరుగుతుంది. వాటిల్లో 1. అధిక రక్తపోటు 2. అధిక మద్యపానం, 3.మధుమేహ వ్యాధి 4. స్థూలకాయం 5. ధూమాపానం 6. వ్యాయామం చేయకపోవటం 7. అధిక కొవ్వు (ఇందుకు తోడ్పడే వంటకాల్ని తినడం) 8. అధికంగా ఉప్పు వాడటం. ఇవన్నీ కూడా స్ట్రోక్‌ కలిగించేందుకు దోహదపడేవి. వీటిని నియంత్రించడం వలన గుండెపోటును కూడా నివారించవచ్చు. కొన్ని కారణాలు స్ట్రోక్‌ రావడాన్ని నివారించలేవు. వీటిలో వయస్సు మీదపడటం, కుటుంబంలో ఎవరికైనా స్ట్రోక్‌ లక్షణాలు వంటివి అనివార్య కారణాలు. పురుషులలో ఎక్కువ శాతం స్ట్రోక్‌ కలిగే అవకాశం ఉంది. కానీ స్ట్రోక్‌ కారణంగా మరణాలు మాత్రం మహిళల్లోనే అధికశాతం. స్ట్రోక్‌ వచ్చిన మూడు గంటలలోపు రక్త సరఫరాను పునరుద్ధరించేందుకు తగిన వైద్యసదుపాయాలు కలిగించడం ద్వారా మరణాన్ని నివారించవచ్చు. భవిష్యత్తులో స్ట్రోక్‌ నివారణకు ధూమపానాన్ని ఆపేయడం సాధ్యమైనంత వరకూ శాకాహార వంటకాలు, చేపలు తీసుకోవడం, ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండటం అవసరం.

మాపై బురదజల్లడమే సాక్షి దినపత్రిక పని : మంత్రి నారాయణ

నెల్లూరు : ఏదో ఒకటి సృష్టించి మాపై బురదజల్లడమే సాక్షి దినపత్రిక పనైందని వారన్నారు. ఇంతవరకు నేను ఒక్క కాంట్రాక్టర్‌ను కూడా కలవలేదు కాని ప్రతి రోజు సాక్షి పత్రికలో నేనే వెళ్లి కాంట్రాక్టర్లను కలిసినట్లు తప్పుడు రాతలు రాయటమేమిటని ఆయన మండిపడ్డారు. నేనే కాంట్రాక్టర్లను కలిసినట్లు రుజువు చూపిస్తే పదవి నుంచి తప్పుకుంటానని చెబుతూనే రుజువు చూపించలేకుంటే సాక్షి పత్రికను మూసేస్తారా? అని మంత్రి నారాయణ ప్రశ్నించారు. ప్రభుత్వం, రైతుల మధ్య విభేదాలు సృష్టించొద్దని ఆయన కోరారు.

14:32 - October 29, 2015

టీసర్కార్ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని వక్తలు విమర్శించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టిడిపి నేత రాజారామ్ యాదవ్, బిజెపి నేత నల్లి ఇంద్రసేనారెడ్డి, టీఆర్ ఎస్ నేత రాకేష్, టీపీసీసీ నేత కైలాష్ పాల్గొని, మాట్లాడారు. యూనివర్సిటీలకు వీసీలను నియమించడంలో సర్కార్ జాప్యం చేస్తోందని చెప్పారు. ఉద్యోగాల కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే చిత్తశుద్ధి సర్కార్ కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ విభజన ఇంకా పూర్తి కాలేదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

14:30 - October 29, 2015

కౌలు రైతులు పెరగడానికి ఇటు భూ యజమానులు, అటు కౌలు రైతులూ కారణమని ది హన్స్ ఇండియా చీఫ్ ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ అన్నారు. గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కౌలు రైతులు పెరగడానికి భూ యజమానుల నుంచి.. కౌలు రైతుల నుంచి అనేక కారణాలున్నాయన్నారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే...

వ్యవసాయానికి గిట్టుబాట ధర లేక భూ యజమానులు పట్టణాలకు వసల వెళ్తున్నారు. వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం, వ్యవసాయం చేయడం వల్ల ఫలితం లేదని వ్యాపారాలతో పాటు ఇతర పనులు చేయడానికి భూ యజమానులు పట్టణాలకు వెళ్తున్నారు. అలాగే తమ పిల్లల చదువుల కోసం కూడా భూములున్న యజమానులు పట్టణాలకు వెళ్తున్నారు. దీంతో భూ యజమానులు తమ భూములను కౌలుకు ఇస్తున్నారు. కౌలు రైతు పెరగడానికి కారణం కౌలు రైతు నుంచి కూడా ఉంది. యంత్రికీకరణతో వ్యవసాయ రంగంలో ఉపాధి తగ్గిపోతుంది. దీంతో భూమిలేని పేద కూలీలు కనీసం ఒకటిట్రెండ్ ఎకరాలు భూమిని తీసుకుంటే.. సంవత్సరం మొత్తం ని దొరుకుతుంది.. కుటుంబం మొత్తం పని చేస్తే.. ఎంతో కొంత మిగులుతుందనే అశతో కౌలు తీసుకుంటున్నారు. గ్రామీణ సామాజిక వ్యవస్థలో భూమి ఉన్న వ్యక్తికి, లేని వ్యక్తికి సమాజిక హోదాలో కూడా తేడా ఉంది. భూమి ఉన్న వ్యక్తికి గౌరవం ఉంటుంది. కూలీలు రైతులుగా మారడానికి ఇష్టపడుతారు. కాబట్టి భూమి లేని పేదవాడు ఎప్పటికైనా ఒకట్రెండు ఎకరాల భూమి తీసుకోవాలని అనుకుంటున్నాడు. వ్యవసాయకూలీకి ఏ రుణం ఉండదు. భూమిని కౌలుకు తీసుకుంటే కనీసం రుణాన్ని పొందేందుకు అవకాశం ఉంటుందని కౌలు తీసుకోవాలని భావిస్తున్నారు. పేద కూలీలు ఒకటి, రెండు ఎకరాలను కౌలుకు తీసుకుంటున్నారు. ఉపాధి హామీ కూలీ పనులకు వెళ్లడానికి ఇష్టపడని ఒకటి,, రెండు ఎకరాలున్న రైతు కూడా మరో రెండు ఎకరాలను కౌలుకు తీసుకుంటున్నాడు. భూమి లేని వ్యవసాయ కూలీలు కూడా భూములను కౌలుకు తీసుకుంటున్నారు. కౌలు రైతులు పెరగడానికి ఇటు భూ యజమానుల నుంచి అటు కౌలు రైతుల నుంచి కారణాలున్నాయి. మెట్ట ప్రాంతంలోని అన్ని పంటలకు కౌలుదారీ విస్తరించింది. గతంలో భూ యజమాని నుంచి భూమిని కౌలు తీసుకున్న రైతు పంట వచ్చిన తర్వాత యజమానికి డబ్బు రూపంలో పంటను ఇచ్చేవాడు. ఎంతో కొంత ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు భూ యజమానులు కౌలు రైతుల నుంచి ముందే పంటను డబ్బు రూపంలో తీసుకుంటున్నారు. కౌలు దారుని పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి లా మారింది. రైతుకు రుణాలు ఉంటాయి. పంట భీమాలు ఉంటాయి. ఇన్ పుట్ సబ్సిడీ, నష్టం పరిహారాలు ఉంటాయి. ఇవి భూ యజమానికి దక్కుతున్నాయి. కానీ కౌలు రైతుకు దక్కడం లేదు.

తీవ్రంగా నష్టపోయిన కౌలు రైతులు అధికంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తెలంగాణలో 6 లక్షలు ఎకరాల దేవాదాయ భూములున్నాయి. వాటిలో కొన్నింటిని బడా రైతులు దేవాలయం భూములను ఆక్రమించుకున్నారు. ప్రతి కౌలుదారునికి కూడా పాస్ బుక్ ఉండాలి...

తెలంగాణ ప్రభుత్వం.. మిషన్ కాకతీయ..

కమీషన్ కాకతీయగా మారిందని ఆరోపణలున్నాయి. కానీ కాలేదని ప్రభుత్వం నిరూపించుకోవాలి. మిషన్ కాకతీయపై శ్వేతపత్రం విడుదల చేయాలి. సోషల్ ఆడిట్ చేయాలి. పంటల ఉత్పత్తి పెరగాలి. ఆ తర్వాతే మలిదశ మిషన్ కాకతీయకు వెళ్లాలి.

జనసేన పార్టీ ఎవరికీ అర్థం కానీ వ్యవస్థగా మారింది..

జనసేన పార్టీ ఎవరికీ అర్థం కానీ వ్యవస్థగా మారింది. పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో దూకుడుగా ట్వీట్స్ చేస్తున్నాడు... తప్ప బయటికి రావడం లేదు. ఎప్పుడో ఒకప్పుడు నిద్రలేసి ట్విట్టర్ లో కామెంట్స్

చేయడం వల్ల లాభం లేదు. జనసేన పార్టీ.. ఎవరికి అర్థంకాని వ్యవస్థగా మారింది. ప్రజలను సమీకరించి సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలి. కౌలు రైతులు, ప్రజా సమస్యలపై పవన్ కళ్యాణ్ పోరాడాలి. కౌలు రైతుల సమస్యలు, కూలీల సమస్యలపై మాట్లాడాలి'. అని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

విశాఖ లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు...

విశాఖపట్నం: అడ్రస్ అడిగేందుకు వచ్చి ఇద్దరు మహిళల నుంచి గొలుసులను లాక్కొని పరారయ్యారు. వివరాలు నగరంలోని ఎమ్వీపీ కాలనీలో ఇంటి ముందు పని చేసుకుంటున్న నారాయణమ్మ(40) కు దగ్గరకు ఇద్దరు వ్యక్తులు వచ్చి అడ్రస్ అడిగారు. ఆమె స్పందించే లోపల మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. మరో వైపు నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇలానే అడ్రస్ అడిగి మూడు తులాల గొలుసును అపరించుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిలకలగూడలో ఇద్దరు విద్యార్థుల అదృశ్యం

హైదరాబాద్:చిలకలగూడలో తొమ్మిదో తరగతి చదువుతోన్న హరి, గోపి అనే విద్యార్థులు అదృశ్యమయ్యారు. నిన్న సాయంత్రం నుంచి విద్యార్థులు కనిపించక పోవడంతో వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోన్నారు.

13:14 - October 29, 2015

ప్రేమను ప్రేమతోనే జయించాలనే అంశంతో 'పంబలకడి జంబ' చిత్రాన్ని తెరకెక్కించారు. బాబ్జీ, శ్రావణి, అశోక్‌, అనూష జంటలుగా నటించారు. గొర్రెపాటి శివరామ్‌ దర్శకత్వం వహించారు. రాజా ఫిలింస్‌ పతాకంపై యు.ఎస్‌.రాజ్‌ నిర్మించారు. కాగా, దీపావళి సందర్భంగా నవంబర్‌ 6న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలియజేశారు. నవంబర్‌ 6 నుంచి 11లోపు ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు ప్రతీ ఆటకు ఒకరిని లక్కీడీప్‌ ద్వారా ఎంపికచేసి దీపావళి గిఫ్ట్‌ ప్యాక్‌ అందజేస్తామని ఆయన తెలిపారు. అలాగే ప్రతి థియేటర్‌ నుంచి లక్కీడీప్‌ ద్వారా ఒకరికి నూతన రాజధాని అమరావతికి సమీపంలో వేసిన వెంచర్‌లో 50 చ.గ. ప్లాట్‌ను అందజేస్తామని పేర్కొన్నారు. సైంటఫిక్‌ అంశాల సమ్మేళనంతో ఈ చిత్రాన్ని మలిచామని, త్యాగం, సెంటిమెంట్‌ వంటి అంశాలున్నప్పటికీ వినోదానికి అధిక ప్రాధాన్యమిచ్చామని దర్శకుడు శివరామ్‌ తెలిపారు. గతంలో వచ్చిన 'జంబలకిడి పంబ' చిత్రం స్థాయికి తక్కువ లేకుండా కడుపుబ్బ నవ్వుకునే కామెడీ ఇందులో వుందన్నారు. 

13:14 - October 29, 2015

అక్కినేని అఖిల్‌ నటిస్తున్న 'అఖిల్‌' సినిమా దసరాకు విడుదల కావాల్సి వున్నా.. గ్రాఫిక్స్‌ వర్క్‌వల్ల ఆలస్యమయినట్లు నాగార్జున వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. కానీ విఎఫ్‌ఎక్స్‌ విషయంలో చిత్ర టీమ్‌ పూర్తి సంతృప్తికరంగా లేకపోవడంతో సినిమాను వాయిదా వేశారు. దీంతో 'అఖిల్‌' రీష్యూట్ జరుగుతుందనీ, సినిమా క్రిస్మస్‌ కానుకగా వస్తుందనే వార్తలు కూడా ప్రచారం జరిగాయి. కానీ అవన్నీ నిజం కాదనీ, విఎఫ్‌ ఎక్స్‌ వర్క్‌ ఫైనల్‌ స్టేజ్‌లో వుందనీ త్వరలో డేట్‌ ప్రకటించనున్నట్లు చిత్ర యూనిట్‌ పేర్కొంటోంది. ఐదు రోజుల్లో విఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ పూర్తి కానున్నట్లు, దీపావళికి విడుదల చేసేందుకు చిత్ర యూనట్ కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. వినాయక్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయేషా సైగల్‌ హీరోయిన్‌గా కన్పించనుంది. నితిన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అనూప్‌, తమన్‌ సంయుక్తంగా సంగీతాన్ని అందించారు.

13:13 - October 29, 2015

'కంచె' చిత్రం 'వరుణ్‌తేజ్‌' చేయబోయే చిత్రంపై అభిమానుల్లో అంచనాలు పెంచింది. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న సంగతి తెలిసిందే. ముందునుంచి 'లోఫర్‌' అనే పేరుతో ప్రచారం జరిగిన ఈ చిత్రానికి 'మా అమ్మ మహాలక్ష్మీ' అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇటీవలే వరుణ్‌ మాట్లాడుతూ... రెండు మూడు పేర్లు అనుకుంటున్నారనీ.. త్వరలో పేరు వెల్లడిస్తానని చెప్పారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయిందని, పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. సి. కళ్యాణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 18న విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈలోగా ఆడియోను విడుదలచేసే పనుల్లో వున్నారు. టైటిల్‌కు తగినట్లు మదర్‌ సెంటిమెంట్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో తల్లి పాత్రను రేవతి పోషించినట్లు సమాచారం.

13:10 - October 29, 2015

చెరకు రైతులు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారని... వారి సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ చెరకు రైతు సంఘం నేత కేశవరావు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 'రేపు, ఎల్లుండి విజయవాడలో చెరకు రైతుల మహాసభలు జరగబోతున్నాయి. ఈ మహాసభల ఎజెండా ఏమిటి? ప్రస్తుతం చెరకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? చెరకు రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి వుంటుంది? తదితర అంశాలపై ఆయన మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం....

13:09 - October 29, 2015

జురిచ్‌ :ప్రపంచ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఫిఫా) అధ్యక్ష పదవి కోసం 7 మంది పోటీ పడనున్నారు. సేప్‌ బ్లాటర్‌ రాజీనామాతో ఖాళీ అయిన అధ్యక్ష స్థానానికి ఫిబ్రవరి 26న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నామినేషన్లకు తుది గడువు ముగిసే సరికి ఎనిమిది మంది అభ్యర్థులు ఉన్నారు. అయితే వీరిలో ట్రినిడాడ్‌ అండ్‌ టుబాగో చెందిన డేవిడ్‌ నఖీద్‌ను ఫిఫా అధికారులు తిరస్కరించారు. సరైన సమయంలోగా దరఖాస్తు చేరలేదన్నారు. మిగిలిన 7 మంది అభ్యర్థులను ఫిఫా అంగీకరించింది. దీంతో ప్రిన్స్‌ అలీ బిన్‌ అల్‌ హుస్సెన్‌ (జోర్డాన్‌), షైక్‌ సల్మాన్‌ బిన్‌ ఇబ్రహిమ్‌ అల్‌ ఖలిఫా (బహ్రెయిన్‌), మిచెల్‌ ప్లాటిని, జెరోమ్‌ చాంపగే (ఫ్రాన్స్‌), గియాని ఇన్‌ఫాంతినో (స్విట్జర్లాండ్‌), ముసా బిలిటి (లెబెరియన్‌), టక్యో సెక్సావాలే (దక్షిణాఫ్రికా) చివరి పోటీలో మిగిలారు. వీరిని అభ్యర్థిత్వాన్ని బుధవారం నాడు ఫిఫా ఖరారు చేసింది. వీరిలో మిచెల్‌ ప్లాటిని ప్రస్తుతం నిషేధంలో ఉన్నాడు. అవినీతి ఆరోపణలతో విలువల కమిటీ 90 రోజుల నిషేధం విధించింది.
ప్రస్తుతానికి మిచెల్‌ ప్లాటిని అభ్యర్థిత్వాన్ని ఆమోదించినా ఫలితాలు వచ్చిన తరువాత అడ్‌హక్‌ కమిటీ సమీక్ష నిర్వహిస్తుంది. అధ్యక్ష స్థానానికి పోటీ పడుతున్న వారికి నిబంధనల ప్రకారం కనీసం ఐదు ఫుట్‌బాల్‌ సంఘాల నుంచి మద్దతు లభించాలి. 1904లో స్థాపించిన బడిన ఫిఫాలో 209 సభ్య దేశాలు ఉన్నాయి. కాగా, అధ్యక్ష పోటీలో చివరికి మిగిలిన వారిలో ప్రిన్స్‌ అలీ బిన్‌ అల్‌ హుస్సెన్‌ పిన్న వయస్కుడు. 39 ఏళ్ల ప్రిన్స్‌ అలీ జోర్డాన్‌ ఫుట్‌బాల్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 60 ఏళ్ల మిచ్చెల్‌ ప్లాటిని యూరోపియన్‌ యూనియన్‌ ఫుట్‌బాల్‌ సమాఖ్య ఆధ్యక్షుడిగా ఉన్నారు. 45 ఏళ్ల గియాని ఇన్‌ఫాంతినో ఇదే యూరోపియన్‌ యూనియన్‌లో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 57 ఏళ్ల జెరోమ్‌ చాంపగే ఫిఫా కార్యవర్గంలో మాజీ సభ్యులు. 48 ఏళ్ల ముసా బిలిటీ లెబెరియన్‌ ఫుట్‌బాల్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. 49 ఏళ్ల షేక్‌ సల్మాన్‌ అసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 62 ఏళ్ల టోక్యో సెక్సావేల్‌ దక్షిణాఫ్రికా ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. వీరిలో ఎవ్వరు ఎన్నికైనా సుదీర్ఘ కాలం తరువాత ఫిఫాకు కొత్త అధ్యక్షుడు లభిస్తాడు. 1998లో తొలిసారిగా అధ్యక్షుడిగా ఎన్నికైన సేప్‌ బ్లాటర్‌ ఇప్పటి వరకూ అదే పదవిలో కొనసాగుతూ వచ్చారు.

12:28 - October 29, 2015

స్కాట్లాండ్‌ : 'అమ్మా' అనే పిలుపు వినడం ఏ మహిళ జీవితంలోనైనా అపురూపమైనదే. ఆ బుడతడు రెండేండ్ల వయసులో 'అమ్మా' అని పిలిచాడు. మెదడు లేకుండా పుట్టిన తన కొడుకు కొన్ని నిమిషాలు కూడా బతుకుతాడో లేదో అనుకుంటే రెండేండ్ల వయసుకు చేరుకున్నాడు. తల్లిని గుర్తుపట్టి 'అమ్మా' అని పిలిచాడు. మరి సంతోషంగా ఉండదా ఎమ్మాకు. స్కాట్‌లాండ్‌లోని లనార్క్‌షాయర్‌లో నివసించే ఎమ్మా 2013 మార్చి నెలలో ఓ రోజు కడుపునొప్పి వస్తుందని ఆస్పత్రికి వెళ్లింది. భరించలేని ఆ నొప్పి అపెండిసైటిస్‌ కావచ్చు అనుకుంది ఎమ్మా. పరీక్షించిన వైద్యులు పురిటినొప్పులని చెప్పడంతో ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ప్రెగెన్సీ అనే అనుమానమే ఆమెకు రాలేదు. అంతకుముందు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు, నెలసరి కూడా ఆగిపోలేదు. దీంతో ఆనందం, ఆశ్చర్యం కలిగాయి ఆమెకు. ఆస్పత్రిలో బాబుకు జన్మనిచ్చింది. అయితే బాబు మెదడుకు సంబంధించిన హౌలోఫ్రాంజెన్సెఫెలీ జబ్బుతో పుట్టాడు. బాబు మెదడులో చిన్న భాగం మాత్రమే ఉంది. దీంతో బాబు మూడు నిమిషాలు లేదా మూడు గంటలు బతకొచ్చని, ఎక్కువ కాలం జీవించే అవకాశం లేదని వైద్యులు చెప్పారు. బాబు అవయవాలు ఎదగవని, మెదడు అభివృద్ధి చెందదని వివరించారు. బాబుకు ఎరాన్‌ అనే పేరు పెట్టింది తల్లి ఎమ్మా. కంటికి రెప్పలా కాపాడుకుంది. పుట్టుకతోనే వైకల్యం ఉన్న ఎరాన్‌కు ప్రస్తుతం రెండేండ్లు నిండాయి. తల్లిని చూడగానే, 'అమ్మా' అని పదే పదే పిలుస్తున్నాడు. చప్పట్లు కొడుతూ తన హావభావాలను తెలుపుతున్నాడు. ఎమ్మా ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. 10వేల మంది పిల్లల్లో ఒకరిద్దరికి మాత్రమే ఇలాంటి హౌలోఫ్రాంజెన్సెఫెలీ అనే జబ్బు వస్తుందని, చాలా సందర్భాల్లో గర్భంలోనే శిశువు చనిపోతుందని వైద్యులు తెలిపారు.

11:42 - October 29, 2015

విశాఖ : నగరంలో సంతోష్ అనే రౌడీషీటర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. రాత్రి 11 గంటల సమయంలో నడిరోడ్డుపై సంతోష్‌ను మారణాయుధాలతో హత్య చేశారు. పలు కేసుల్లో సంతోష్‌ నిందితుడిగా ఉన్నాడు. ఏడుగురితో కూడిన ముఠా నగరంలో పలు హత్యలు, దొంగతనాలు చేస్తూ హల్‌చల్‌ చేస్తోది. ఈ ముఠాలో సంతోష్‌ ఒక సభ్యుడిగా ఉన్నాడు. అయితే మిగిలిన ముఠా సభ్యులకు తెలీకుండా ప్రత్యేకంగా నేరాలకు ప్లాన్‌ చేస్తున్న సంతోష్‌ను ముఠా సభ్యులే చంపేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

11:38 - October 29, 2015

అనంతపురం : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో-టిప్పర్‌ ఢీకొనడంతో.. ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మృతులు ఆకుతోటపల్లివాసులుగా గుర్తించారు.

11:35 - October 29, 2015

పాకిస్తాన్ : లష్కర్-ఎ-తొయిబా వంటి ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ మద్దతునిచ్చిందని, వారికి శిక్షణ సైతం ఇచ్చిందని పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ వెల్లడించారు. కశ్మీర్‌లో అతివాదాన్ని వ్యాపింపజేసేందుకు పాక్ ఈ చర్యలకు పాల్పడిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ వార్తా ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ముషారఫ్‌ 'రష్యాపై పోరాటానికి తాలిబన్లకు మేం శిక్షణనిచ్చి పంపించాం. తాలిబన్లు, హక్కాని, లాడెన్, జవహిరి తదితరులు అప్పట్లో మా హీరోలు. అనంతరం వారు ప్రతినాయకులుగా మారారు' అని అన్నారు. వేర్పాటువాద నేతలు హఫీజ్ సయీద్, జాకీఉర్ రెహ్మాన్ లఖ్వీ వంటివారిని కూడా పాక్‌లో అభిమానించేవారని తెలిపారు. భారత్‌లో ఉగ్రవాద చర్యలకు పాక్‌ ఊతమిస్తోందని వార్తలు వస్తున్న నేపధ్యంలో ముషారఫ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి.

 

11:30 - October 29, 2015

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. కుల్గాంలో భద్రతా దళాలకు ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో లష్కరే తోయిబా చీఫ్‌ అబూ ఖాసిం హతమయ్యాడు. అబూఖాసింను భారత భద్రతా దళాలు కాల్చిచంపేశాయి. ఉధంపూర్‌ కాల్పుల ఘటనలో ప్రధాన సూత్రధారిగా అబూఖాసిం వ్యవహరించాడు.

 

11:30 - October 29, 2015

భారత క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోని జీవితం ఆధారంగా రూపొందుతున్న 'ధోని'చిత్రంలో ధోనికి తండ్రిగా ప్రముఖ బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనుపమ్‌ఖేర్‌ నటిస్తున్నారు. నీరజ్‌పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ధోనిగా సుశాంత్‌సింగ్‌ రాజ్‌ఫుత్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ట్విట్టర్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు అనుపమ్‌ ఖేర్‌ సమాధానమిచ్చారు. 'ఎంతో మంది క్రీడాభిమానులకు, క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచిన భారత క్రికెట్‌ కెప్టెన్‌ ధోని జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రంలో ముఖ్యమైన ధోని తండ్రి పాత్రలో నటించడం చాలా ఆనందంగా ఉంది' అని అనుపమ్‌ చెప్పారు.

11:29 - October 29, 2015

షారూఖ్‌ఖాన్‌, రోహిత్‌ శెట్టి కాంబినేషన్‌కి బాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉంది. ఈ కాంబినేషన్‌లో రూపొందిన 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌' ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. తాజాగా ఇదే కాంబినేషన్‌లో 'దిల్‌వాలే' తెరకెక్కుతున్న విషయమూ విదితమే. 'దిల్‌వాలే' షూటింగ్‌ పూర్తికాకముందే ఈ కాంబినేషన్‌ మరో ప్రాజెక్ట్‌కి సమాయత్తమవుతోంది. 1982లో విడుదలై బాలీవుడ్‌ ఎవర్‌గ్రీన్‌ క్లాసిక్‌గా నిలిచిన 'అంగూర్‌' చిత్రాన్ని నేటి ట్రెండ్‌కి అనుగుణంగా మార్చి రీమేక్‌ చేసేందుకు షారూఖ్‌, రోహిత్‌ శెట్టి సుముఖుంగా ఉన్నట్టు సమాచారం. గుల్జార్‌ దర్శకత్వంలో సంజీవ్‌కుమార్‌ నటించిన హాస్యభరిత చిత్రంగా 'అంగూర్‌' రూపొందింది. ఈశ్వర్‌ చంద్రవిద్యాసాగర్‌ రాసిన నాటకంతోపాటు, షేక్‌స్పియర్‌ రాసిన 'ద కామెడీ ఆఫ్‌ ఎర్రర్స్‌' ఆధారంగా 'అంగూర్‌' చిత్రాన్ని తెరకెక్కించారు.
సల్మాన్‌, అమితాబ్‌లతో కూడా : రోహిత్‌ శెట్టి
'చెన్నై ఎక్స్‌ప్రెస్‌', 'గోల్‌మాల్‌ రిటర్న్స్‌', 'గోల్‌మాల్‌-3', 'సింగం రిటర్స్న్‌' వంటి మాస్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన రోహిత్‌శెట్టి భవిష్యత్‌లో అమితాబ్‌బచ్చన్‌, సల్మాన్‌ఖాన్‌లతో కూడా సినిమాల్ని చేయాలనుందన్నారు. తాను దర్శకత్వం వహించిన 'బోల్‌ బచ్చన్‌' చిత్రంలోని ఓ పాటలో అమితాబ్‌ కనిపించారని, ఇప్పుడు పూర్తిస్థాయి సినిమాలో ఆయనతో కలిసి పని చేయాలని ఉందన్నారు.

11:28 - October 29, 2015

భువనేశ్వర్ : ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పొట్టకూటి కోసం వెళ్తున్న ఏడుగురు కూలీలు మృతి చెందారు. మరో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ విషాద ఘటన గంజాం జిల్లా గంజాం జిల్లా గోలంత్ర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చేటుచేసుకుంది. గంజాం జిల్లా రండా కూడలి వద్ద బస్సును తప్పించబోయిన లారీ.. ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. దీంతో ఫుట్‌పాత్‌పై నడుస్తున్న కూలీల్లో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఐదుగురు ఒడిశాకు చెందిన కూలీలుగా, శ్రీకాకుళంకు చెందిన ఇద్దరు కూలీలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

 

సీఆర్పీఎఫ్ జవాన్లపై తేనెటీగల దాడి..

విశాఖపట్టణం : బలపం అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్లపై తేనెటీగలు దాడి చేశాయి. దీనితో పలువురికి గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. 

జక్కంపూడిలో మంత్రి దేవినేని పర్యటన..

విజయవాడ : జక్కంపూడిలో మంత్రి దేవినేని ఉమ పర్యటించారు. పోలవరం కుడికాల్వ పనులను దేవినేని ఉమ పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల కొరత లేదని, ప్రాజెక్టుకు కేంద్రం సహకారం అందిస్తుందని చెప్పారు. విపక్షాలు దరుద్దేశ్యంతోనే ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూస్తున్నాయని తెలిపారు. 

కూలీలపైకి దూసుకెళ్లిన లారీ..ఏడుగురు మృతి..

ఒడిశా : గంజాం జిల్లా గోలంత్రలో కూలీలపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడ్డారు.

 

రామకృష్ణాపురంలో రౌడీషీటర్ హత్య..

విశాఖపట్టణం : రామకృష్ణాపురంలో రౌడీషీటర్ సంతోష్ ను గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి నరికి చంపారు. సంతోష్ పై గాజువాక, మల్కాపురం పీఎస్ లో పలు కేసులు నమోదై ఉన్నాయి.

 

కేసీఆర్ పై ఎంపీ గుత్తా విమర్శలు..

నల్గొండ : తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలను కలియుగం నుంచి ద్వాపర, త్రేతాయుగాలకు తీసుకెళుతున్నారని ఎంపీ గుత్తా సుఖేంద్ రెడ్డి విమర్శించారు. నిన్నటి వరకు పండుగలని పేర్కొన్న కేసీఆర్ ఇప్పుడు చండియాగానికి ఏర్పాట్లు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, జిల్లాలోని తూములకు నీటిని నిలిపివేసి ఖమ్మంకు నీళ్లను తరలించడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. జిల్లాలో తాగునీటి ఎద్దడి లేకుండా చెరువులను నింపాలని డిమాండ్ చేశారు. 

రాయల్ కెనాల్ 15వ బ్యాచ్ పాసింగ్ ఔట్ పరేడ్..

హైదరాబాద్ : మెయినాబాద్ పోలీసు ట్రైనింగ్ సెంటర్ లో రాయల్ కెనాన్ 15వ బ్యాచ్ పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయినీ, డీజీపీ అనురాగ్ శర్మలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైనీ డాగ్స్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. 

ఎన్కౌంటర్ లో లష్కర్ కమాండర్ కాల్చివేత...

జమ్మూ కాశ్మీర్ : కుల్గం లో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో లష్కర్ కమాండర్ అబూ ఖాసిం ను జవాన్లు కాల్చి చంపారు. కాగా ఖాసిం ఊధంపూర్ కాల్పుల ఘటన లో ప్రదాన నిందితుడిగా ఉన్నాడు. 

ఆడ పిల్ల పుట్టిందని భార్యను గెంటేశాడు

విజయవాడ : ఆడ పిల్ల పుట్టిందని ఓ భర్త భార్యను గెంటేశాడు. ఆ భార్య భర్త ఇంటి ముందు మహిళా సంఘాలతో ధర్నాకు దిగింది. 

భూములు లాక్కోవాలని ప్రయత్నిస్తే సహించం - సీపీఎం..

విజయవాడ : రాజధాని ప్రాంతంలో రైతుల నుండి బలవంతంగా భూములు లాక్కోవాలని ప్రయత్నిస్తే సహించమని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు హెచ్చరించారు. అవసరమైతే అసెంబ్లీని ముట్టడిస్తామని, అసైన్డ్ భూముల విషయంలో ప్రభుత్వ వైఖరి తెలపాలని డిమాండ్ చేశారు. కృష్ణా నది ఒడ్డున పేదల ఇళ్లను తొలగించాలని ప్రయత్నిస్తే ప్రజా సంఘాలతో ఉద్యమిస్తామని హెచ్చరించారు. 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు రెండు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి గంట, కాలినడకన వెళ్లే భక్తులకు గంట, ప్రత్యేక ప్రవేశదర్శనానికి గంట సమయం పట్టనుంది.

రోడ్డు ప్రమాదం లో ఇద్దరు మృతి

అనంతపురం :  జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.  పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు.
 

నేడు హైదరాబాద్ కు రానున్న దిగ్విజయ్ సింగ్

హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ నేడు హైదరాబాద్ కు రానున్నారు. ఉదయం 11 గంటలకు గాంధీభవన్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. వరంగల్ ఉప ఎన్నిక అభ్యర్థిని ఖరారు చేయనున్నారు.

 

Don't Miss