Activities calendar

07 November 2015

21:58 - November 7, 2015

 

ఢిల్లీ : హిందూమతాన్ని నిరంకుశంగా అమలు చేయడమే ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండా అని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. చరిత్రలో తొలిసారిగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆ సంస్థ వ్యవహరిస్తోందన్నారు. గత 18 నెలలుగా దేశంలో స్వేచ్ఛ, సెక్యులరిజంపై జరుగుతున్న దాడే ఇందుకు నిదర్శనమన్నారు. అయితే ఓర్పు, సహనశీలత దేశంలోని రక్తంలోనే ఉందని రాహుల్‌ పేర్కొన్నారు. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ 125 వ జయంతి సందర్భంగా కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన 'నో పీస్‌ విథౌట్‌ ఫ్రీడం-నో ఫ్రీడం విథౌట్‌ పీస్‌' సెమినార్‌లో నెహ్రూను రాహుల్ సహనశీలిగా కొనియాడారు.

21:54 - November 7, 2015

హైదరాబాద్ : టీ-టీడీపీ నేతల విస్తృతస్థాయి సమావేశంలో మరోసారి ఎర్రబెల్లి, రేవంత్‌రెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. రాష్ట్రస్థాయి పదవులిచ్చింది నియోజకవర్గాల్లో పెత్తనాలు చలాయించడానికి కాదని పరోక్షంగా రేవంత్‌ను ఉద్దేశించి ఎర్రబెల్లి మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే కష్టపడిన వారిని పార్టీ గుర్తిస్తుందని.. దానికి నేనే ఉదాహరణ అని రేవంత్‌ కౌంటర్‌ ఇచ్చినట్లు సమాచారం.

21:51 - November 7, 2015

హైదరాబాద్ : రాష్ట్రంలో పోలీస్‌ ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫైల్‌పై ఆయన సంతకం చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రిక్రూట్‌మెంట్‌ చేసేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. అదేవిధంగా మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వబోతోంది. కఠినతరంగా ఉన్న పాత నిబంధనలను సడలించడంతో నిరుద్యోగుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
9 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ
ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త అందించింది తెలంగాణ సర్కార్‌. ఇప్పటివరకు విద్యుత్‌, పంచాయతీరాజ్‌ విభాగంలో రిక్రూట్‌మెంట్లు నిర్వహించిన ప్రభుత్వం తొలిసారి యూనిఫాం సర్వీసెస్‌ నియామకాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. పోలీసుశాఖలో 9 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఫైల్‌పై సీఎం కేసీఆర్‌ సంతకం చేశారు.
పోలీసుశాఖలో 8,360 ఉద్యోగాలు
ఇక పోలీసుశాఖలో భారీగా 8,360 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లో 186, ఫైర్‌ డిపార్ట్‌మెట్‌లో 150, సివిల్‌కానిస్టేబుల్స్‌ 510, ఆర్మ్‌డ్‌ కానిస్టేబుళ్లు 2800, స్పెషల్‌ కానిస్టేబుళ్లు 3200, సివిల్‌ ఎస్సైలు 107, ఆర్మ్‌డ్‌ ఎస్సైలు 91, స్పెషల్‌ పోలీసు ఎస్సైలు 288, కమ్యూనికేషన్‌ ఎస్సైలు 35, స్పెషల్‌ ప్రొటక్షన్‌ ఫోర్స్‌ ఎస్సైలు 12, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ కానిస్టేబుళ్లు 174, ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌లో 500 ఫైర్‌మెన్లు, 9 మంది ఎస్సైల భర్తీకి సీఎం కేసీఆర్‌ ఆమోదం తెలిపారు.
నిబంధనలు సరళతరం
మరోవైపు గతంలో ఉన్న కఠినమైన నిబంధనలను ప్రభుత్వం సరళతరం చేసింది. పురుషులకు ఐదు కిలోమీటర్లు, స్త్రీలకు రెండున్నర కిలోమీటర్లు ఉన్న పరుగు పందాన్ని సడలించారు. ఫిజికల్‌ ఎఫీషియన్సీ టెస్ట్‌ ప్రక్రియలో కూడా మార్పులు చేశారు. పురుషుల విభాగంలో షాట్‌పుట్‌, హైజంప్‌, లాంగ్‌జంప్‌, 100 మీటర్ల పరుగు, 800 మీటర్ల పరుగులో ఖచ్చితంగా అర్హత సాధించాల్సి ఉండేది. కానీ తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 800 మీటర్ల పరుగుతో పాటు.. మరో రెడు విభాగాల్లో అర్హత సాధిస్తే చాలు. ఇక మహిళలకు 100 మీటర్ల పరుగుతో పాటు లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌ మాత్రమే ఉంటాయి. వీటిలో కూడా 100 మీటర్ల పరుగుతో పాటు మరొక విభాగంలో సక్సెస్‌ అయితే చాలని కొత్త మార్గదర్శకాలు రూపొందించారు. మరోవైపు మెకానిక్‌ నియామకాల్లో ఆర్టీసీ తరహాలో ట్రేడ్‌మిల్‌ టెస్ట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇక పోలీసు శాఖలోకి వచ్చేవారికి అనేక అంశాలపై అవగాహన కోసం ప్రభుత్వం పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ టెస్ట్‌ను ప్రవేశపెట్టనుంది.
నిరుద్యోగుల సంతోషం
పోలీసుశాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక నోటిఫికేషన్లు పోలీస్‌శాఖ ఎప్పుడు జారీ చేస్తుందా ? అని ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఇందుకోసం నిర్వహించే పరీక్షలో తప్పకుండా తెలంగాణ చరిత్రను ఉంచాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది.

 

కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో వామపక్షాల విజయం

త్రివేండ్రం : కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో వామపక్షాలు విజయం సాధించాయి. గ్రామ పంచాయతీలు : ఎల్ డీఎఫ్-551, యూడీఎఫ్-361, బిజెపి 15, ఇతరులు 14 స్థానాల్లో విజయం సాధించాయి. బ్లాక్ పంచాయితీలు : ఎల్ డీఎఫ్ 88, యూడీఎఫ్ 63, బిజెపి 1, ఇతరులు 1.

21:06 - November 7, 2015

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 19వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు సన్నాహాలు ఊపందుకున్నాయి. ఈనెల 14 నుండి 20వరకు నగరంలో జరగనున్న చలన చిత్రోత్సవాలను రాష్ట్ర పండుగలా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చిత్రోత్సవాలకు వచ్చే దేశ, విదేశాలకు చెందిన బాలలకు తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలు ప్రతిబింభేంచేలా సాంస్కృతిక కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చే విద్యార్థులు బాలభవన్‌లో జోరుగా రిహార్సల్స్‌ చేస్తున్నారు. నగరంలోని పలు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు ఈ రిహార్సల్స్‌లో పాల్గొన్నారు.

21:02 - November 7, 2015

నల్లగొండ : జిల్లాలోని రెడ్డీ లాబోరేటరీస్ కార్మిక సంఘ ఎన్నికల్లో సీఐటీయూ ఘన విజయం సాధించింది. త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి రెడ్డి ల్యాబ్స్ లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగాయి. అధికార పార్టీ అనుబంధ కార్మిక సంఘం టీఆర్ఎస్‌కేవీ, సీఐటీయూ కార్మిక సంఘం ఎన్నికల్లో పోటాపోటీగా తలపడ్డాయి. టిఆర్ ఎస్కెవిపై 35 ఓట్ల తేడాతో సీఐటీయూ విజయం సాధించింది. మొత్తం 111 ఓట్లు పోలవగా..సీఐటీయూకు 73 ఓట్లు, టీఆర్ఎస్‌కేవీకి 38 ఓట్లు వచ్చాయి. సీఐటీయూ గెలుపు ప్రకటన రాగానే నేతలు సంబరాలు చేసుకున్నారు. రెడ్డీ ల్యాబ్స్ సీఐటీయూ శాఖ గౌరవాధ్యక్షుడుగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ విజయం కార్మికులదేనని, ఇప్పటికైనా టీఆర్ఎస్ సర్కార్ కార్మిక హక్కులను, సంఘాలను గౌరవించడం నేర్చుకోవాలని జూలకంటి అన్నారు.

 

20:57 - November 7, 2015

హైదరాబాద్ : చంద్రబాబు అధికారంలోకి వస్తే జాబు ఇస్తామని చెప్పి.. ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు తొలగించే ప్రయత్నం చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు జోక్యం చేసుకొని.. ఆ ప్రయత్నం మానుకోవాలన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

20:55 - November 7, 2015

నల్లగొండ : జిల్లాలోని సూర్యాపేటలో తుపాకి కలకలం చెలరేగింది. మిర్యాలగూడ మండలం ఆళ్లగడ్డకు చెందిన రాజయ్య నుంచి తుపాకి, ఐదు రౌండ్ల బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజయ్య గతంలో ఓ కేసులో శిక్ష అనుభవించినట్లుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు రాజజయ్యను విచారిస్తున్నారు.

 

 

 

20:45 - November 7, 2015

కరీంనగర్‌ : జిల్లాలోని సిరిసిల్ల మండలం నేరేళ్ల గ్రామ శివారులో రెండు ఇసుక లారీలు ఢీకొన్నాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. లారీల నుంచి డ్రైవర్లు దిగే పరిస్థితి లేకపోవడంతో మంటల్లో చిక్కుకుని డ్రైవర్లు సజీవ దహనమయ్యారు. డ్రైవర్లతో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని మంటలార్పుతున్నాయి. మరోవైపు ఫైరింజన్‌లో నీళ్లు అయిపోవడంతో మంటలు మళ్లీ చెలరేగాయి. దీంతో రెండు లారీలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

20:38 - November 7, 2015

గుంటూరు : ఓడ ఎక్కే వరకే ఓడమల్లయ్య. ఓడ దిగాక బోడిమల్లయ్య అన్నట్టు వ్యవహరిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాజధాని నిర్మాణం కోసం హామీలు గుప్పించి..సారవంతమైన భూములు తీసుకున్న సర్కారు...ఇప్పుడు ఆ వాగ్ధానాలను గంగలో కలిపేస్తోంది. రాజధాని రైతుల నోట్లో మట్టికొడుతూ తాజాగా ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రతిపాదన పట్ల అన్నదాతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం హామీలు నిలబెట్టుకోలేకపోతే పోరాటానికి సిద్దమని రైతాంగం హెచ్చరిస్తోంది.
రాజధానికి భూములిచ్చిన రైతులు
అమరావతికి భూములిచ్చిన రైతుల్లో కనీసం 10 నుంచి 15 శాతం మందికి ఒకటికి మించిన రెవెన్యూ గ్రామాల్లో పొలాలు ఉన్నాయి. వారు మంత్రులు, అధికారుల మాటలను నమ్మి, వాటిని రాజధానికి ఇచ్చేశారు. నేలపాడులో నివసించే ఒక రైతుకు గ్రామంతోపాటు శాఖమూరు, నీరుకొండల్లో పొలాలుంటే తనకు ఇవ్వాల్సిన ప్లాట్లను నేలపాడులోనే ఇస్తారని ఆశించారు. ఒక గ్రామంలో నివసిస్తూ వేర్వేరు రెవెన్యూ గ్రామాల్లో పొలాలను ఇచ్చిన ఎందరో రైతులు సదరు భూములకు సంబంధించి ఇవ్వాల్సిన ప్లాట్లను తాముంటున్న గ్రామంలోనే అందజేస్తే ఒకేచోట చెప్పుకోదగిన విస్తీర్ణంలో స్థలాలు దక్కుతాయని భావించారు. అధికారగణం కూడా ఒక్క గ్రామంలోనే పెద్ద ప్లాట్లను ఇస్తే వాటి అభివృద్ధికి అయ్యే ఖర్చు తక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో రైతుల డిమాండ్లను ఆమోదించింది. అయితే రాజధానికి శంకుస్థాపన కార్యక్రమం పూర్తయిన తర్వాత ప్రభుత్వం అందుకున్న కొత్త రాగం రైతుల ఆగ్రహానికి కారణమవుతోంది.
రెవెన్యూ గ్రామాల ప్రాతిపదికన మాత్రమే ప్లాట్లు
మాస్టర్ ప్లాన్ల రూపకల్పన ప్రక్రియను చేపడుతున్నపుడు పెద్దపెద్ద ప్లాట్లను రైతులకిస్తే వాటివల్ల కొన్నిచోట్ల రాజధాని నిర్మాణాన్ని అనుకున్న విధంగా చేపట్టలేమని గుర్తించారు అధికారులు. దాంతో రెవెన్యూ గ్రామాల ప్రాతిపదికన మాత్రమే ప్లాట్లను ఇస్తామని సీఆర్డీఏ స్పష్టం చేసింది. తమకు వాగ్ధానం చేసిన మాదిరిగానే ప్లాట్లను తాముండే గ్రామాల్లోనే ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామిని నిలబెట్టుకోలేకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.
మరోసారి నిర్ణీత ఫారంల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్న సీఆర్డీఏ
మరో విషయంలోనూ రాజధానికి భూములిచ్చిన రైతుల్లో నిరసన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఒక రెవెన్యూ గ్రామంలో వేర్వేరు సర్వే నెంబర్లలో ఉన్న భూములకు సంబంధించి ఇవ్వాల్సిన ప్లాట్లను అదే ఊరిలో ఒక్కచోటనే పొందాలనుకునే రైతులు దరఖాస్తులను సమర్పించాల్సిందిగా అధికారులు కోరారు. ఆ ప్రకారం రైతులు సమర్పించారు. వాటికోసం ఇప్పుడు తాజాగా మరోసారి నిర్ణీత ఫారంల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సీఆర్డీఏ పేర్కొనడం తమను ఇబ్బంది పెట్టడమేనని రైతులంటున్నారు. కాగా, ఈ అంశాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి, తమకు న్యాయం చేయాల్సిందిగా కోరే యోచనలో ఉన్నారు రైతులు. ముందుగా అప్పట్లో హామీలిచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు ఉన్నతాధికారులకు చెప్పాలనుకుంటున్నారని సమాచారం. ఫలితం లేకుంటే సీఎం చంద్రబాబును కలవాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

 

20:27 - November 7, 2015

హైదరాబాద్ : బాక్సైట్‌ తవ్వకాలను గనుల శాఖ నుంచి ఎలాంటి అనుమతులు రాలేదని మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. బాక్సైట్‌ తవ్వకాలపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రత్యామ్నాయ అటవీ ప్రాంతం అభివృద్ధి కోసమే అన్నారు. గిరిజనుల మనోభావాలకు వ్యతిరేకంగా ఏజెన్సీలో ఎలాంటి మైనింగ్‌ కార్యక్రమాలు జరగవని ఆయన తెలిపారు. బాక్సైట్‌ తవ్వకాలపై గిరిజనులు అంగీకారంతోనే ముందుకెళ్తామని అయ్యన్నపాత్రుడు అన్నారు.

 

20:25 - November 7, 2015

విశాఖ : బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా నేడు విశాఖ ఏజెన్సీలో విపక్షాలు బంద్ పాటించాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ... పాడేరు ఆర్టీసీ డిపో ఎదుటు అఖిలపక్షం ధర్నా నిర్వహించింది. దీంతో ఏజెన్సీ ప్రాంతాలకు ఆర్టీసీ అధికారులు బస్సులు రద్దు చేశారు. ప్రభుత్వం వెంటనే బాక్సైట్ జీవో రద్దు చేయకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని విపక్ష నేతలు హెచ్చరించారు.

20:22 - November 7, 2015

హైదరాబాద్ : జూన్‌లోగా విజయవాడకు వెళ్లేందుకు సచివాలయ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ అన్నారు. కాకపోతే దీనివల్ల వచ్చే సమస్యలను మాత్రమే ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తున్నామని ఆయన అన్నారు. సచివాలయం మొత్తం ఒక యూనిట్‌గా ఏర్పాటు చేసి.. ఒకే చోట పరిపాలన ఉండేలా చూడాలని కోరామన్నారు. కొంతమంది మా సంఘంతో సంబంధం లేనివారు ఇష్టమొచ్చినట్లు విభేదాలు సృష్టిస్తున్నారని.. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం విజయవాడకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

 

19:32 - November 7, 2015

వరంగల్ : ఫోరెన్సిక్ నివేదిక రాలేదు. నిందితుల విచారణ పూర్తి కాలేదు. అనేక ప్రశ్నలకు సమాధానం లభించలేదు. అయినా పోలీసులు సారిక,పిల్లల సజీవదహనం ఆత్మహత్యేనని తేల్చేశారు. 10 పేజీలతో కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు. కీలకమైన 20 అంశాలను పొందుపర్చారు. అసలు ఆ రిమాండ్ రిపోర్టులో ఉన్న అంశాలేంటి..?
సారిక కేసు… పోలీసులు…రిమాండ్ రిపోర్టు
వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ముగ్గురు పిల్లల సజీవదహనం కేసులో పోలీసులు కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పించారు. 24 మందిని విచారించి ప్రాథమిక సాక్ష్యాలు సేకరించిన పోలీసులు 10 పేజీల నివేదికను తయారు చేశారు. అనిల్‌తో వివాహమైనప్పటినుంచి వేధింపులు పొందుపర్చారు. తల్లిదండ్రులకు ఇష్టంలేకుండా ఆర్య సమాజ్‌లో అనిల్‌, సారిక వివాహం జరిగింది. తర్వాత యాదగిరిగుట్టలో రెండోసారి పుట్టింటివారి సమక్షంలో పెళ్లి జరిపించారు.
సనతో అనిల్‌కు వివాహేతర సంబంధం
వివాహం తర్వాత సారిక,అనిల్ కొన్నేళ్లు బాగానే ఉన్నారు. సారిక బీటెక్‌ అయిపోగానే హైదరాబాద్‌కు కాపురం మార్చారు. ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగం చేసిన సారిక 2010లో హైదరాబాద్‌కు తిరిగొచ్చింది. ఇదే సమయంలో నగరంలోనే సనతో అనిల్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. సన పరిచయమయ్యాక సారికపై వేధింపులు తీవ్రమయ్యాయి. అయితే అనిల్ ను చక్కదిద్దాల్సిన తల్లిదండ్రులు రాజయ్య, మాధవి అతనికే వంతపాడారు. అనిల తో కలిసి ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించారు. ఎన్జీవోలు, పోలీస్‌ స్టేషన్లలో సారిక ఫిర్యాదు చేసింది. కేసులతో విసిగిపోయిన రాజయ్య, మాధవి, అనిల్‌ వేధింపులు మరింత పెంచారు. ఆత్మహత్య చేసుకొని చనిపోవాలని పదే పదే ఒత్తిడి తెచ్చారు.
పిల్లలతో సహా సారిక ఆత్మహత్య
ఉప ఎన్నికల్లో రాజయ్య గెలిస్తే వేధింపులు పెరుగుతాయని భయపడిందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. దీంతో రాజకీయ పలుకుబడి ఉపయోగించి చిత్రహింసలు పెడతారని ఆందోళన చెందిందని చెబుతున్నారు. దీంతో ఉదయం 4.30గం.ల సమయంలో పిల్లలతో సహా సారిక ఆత్మహత్య చేసుకుందని నిర్ధారించారు పోలీసులు. పొగలు, వాసన రావడాన్ని గమనించిన చుట్టుపక్కలవారు..100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారని తెలిపారు. బెడ్‌రూంలో రెండు గ్యాస్‌ సిలిండర్లు ఉన్నాయన్న పోలీసులు అందులో ఒకటి ఖాళీ సిలిండర్‌, ఒకటి నిండు సిలిండర్‌ అని తెలిపారు. మంటలు, పొగ కారణంగానే సారిక, పిల్లలు మరణించారని నిర్ధారించారు.
ఫోరెన్సిక్ నివేదిక రాకుండానే ఆత్మహత్యగా ఎలా నిర్ధారిస్తారు
అయితే పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో అనేక ప్రశ్నలకు సమాధానం దాట వేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు కీలకమైన ఫోరెన్సిక్ నివేదిక రాకుండానే ఆత్మహత్యగా ఎలా నిర్ధారిస్తారు..మరణానికి కొన్ని గంటల ముందు ఆ ఇంట్లో జరిగిన గొడవేంటి...ఆస్తుల పంపకాలపై ఘర్షణ చెలరేగిందా..ఘటన జరిగిన రోజు కుటుంబ సభ్యుల కాల్ డేటాను విశ్లేషించారా..? ఇలా ఎన్నో కీలక ప్రశ్నలకు సమాధానం వచ్చేలోపే పోలీసులు ఆత్మహత్యగా చిత్రీకరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

19:21 - November 7, 2015

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌లో బిపిఎల్, ఎల్ ఆర్ ఎస్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి తెలిపారు. ఈ పథకం రెండు నెలలపాటు అమల్లో ఉంటుందన్నారు. అక్టోబర్‌ 28 వరకు చేపట్టిన అక్రమ నిర్మాణాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఎలాంటి అక్రమాలు జరగకూడదనే ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. చెరువు శిఖం, ప్రభుత్వ భూములు, కోర్టులో కేసులున్న స్థలాలను ఎట్టి పరిస్థితుల్లో రెగ్యులరైజ్‌ చేయమని జనార్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు.

 

 

 

19:18 - November 7, 2015

హైదరాబాద్ : చిన్న సినిమాలకు మరింత ప్రోత్సాహం ఇస్తామని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. సినిమా షూటింగ్‌లకు తెలంగాణకు అనువైన ప్రాంతాలు ఉన్నాయని.. అక్కడ సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు. ఇక్కడే సినిమాలు తీస్తే నిర్మాతలకు ఖర్చు తగ్గుతుందన్నారు.

 

 

 

19:13 - November 7, 2015

హైదరాబాద్ : రైతు సమస్యలను సీఎం కేసీఆర్ గాలికొదిలేసి... రాజకీయాలు చేయడమే పనిగా పెట్టుకున్నారని టీ టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తి రైతులు గిట్టుబాట ధర లేక సతమతమవుతున్నా ఆయనకు పట్టడం లేదని మండిపడ్డారు. ఢిల్లీలో 3 రోజులున్నా పత్తికి మద్దతు ధర పెంచేందుకు ప్రధానితో మాట్లాడేందుకు ప్రయత్నించలేదన్నారు. మహారాష్ట్రలో సీసీఐ 4100 మద్ధతు ధర చెల్లిస్తుంటే.. క్విటాకు సీఎం అదనంగా 500 చెల్లిస్తున్నారని చెప్పుకొచ్చారు.

 

 

 

రెండు లారీలు ఢీ.. ఇద్దరు డ్రైవర్లు సజీవదహనం

కరీంనగర్ : సిరిసిల్ల మండలం నేరేళ్ల వద్ద రెండు ఇసుక లారీలు ఢీకొన్నాయి. లారీలకు మంటలు అంటుకుని ఇద్దరు డ్రైవర్లు సజీవదహనం అయ్యారు.

హామీలను తుంగలో తొక్కిన టీఆర్ ఎస్ : దత్తాత్రేయ

హైదరాబాద్ : టీఆర్ ఎస్ ఎన్నికల హామీలను తుంగలో తొక్కిందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. కాంగ్రెస్ పైనా ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి సరిగ్గా లేదని పేర్కొన్నారు.

వరంగల్ ఉప ఎన్నికపై చర్చించాం : కిషన్ రెడ్డి

హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నికపై చంద్రబాబుతో చర్చించామని బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. టిఆర్ ఎస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని చెప్పారు. మొదట్లో ఎన్ డిఎ అభ్యర్థి గెలుపుపై కొంత అనుమానం ఉన్నా..ప్రస్తుత పరిణామాలతో గెలుపుపై నమ్మకం వచ్చిందన్నారు.

ముగిసిన చంద్రబాబుతో బిజెపి నేతల సమావేశం

హైదరాబాద్ : సీఎం చంద్రబాబుతో బిజెపి నేతల సమావేశం ముగిసింది. రేపు ఉదయం 9 గంటలకు ఎర్రబెల్లి నివాసంలో టిడిపి, బిజెపి నేతల భేటీ కానున్నారు. నేతలు వరంగల్ లో ప్రచార వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు.

60 మైనార్టీ గురుకుల పాఠశాలలు ప్రారంభం : కేసీఆర్

హైదరాబాద్ : 60 మైనార్టీ గురుకుల పాఠశాలలు ప్రారంభం అయినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. చంచల్ గూడ జైలు, రేస్ కోర్సుల స్థలంలో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం జరుగుతుందని సీఎం చెప్పారు. మైనార్టీ యువత కోసం నూతన పథకాలు ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. హ్యాకర్లు, వెండర్లకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. మైనార్టీ రెసిడెన్సియల్ స్కూళ్లలో 2100 మంది బోధన, బోధనేతర సిబ్బంది నియామకం అయినట్లు తెలిపారు. తెలుగుతో పాటు ఉర్దూనూ కాపాడుకోవాల్సిన అవసరముందని కేసీఆర్ పేర్కొన్నారు. మైనార్టీ విద్యాలయాల్లో ఆప్షనల్ ల్యాంగ్వేజ్ గా ఉర్దూ ఉంటుందన్నారు.

ఎపి ప్రభుత్వంపై ఆర్.కృష్ణయ్య ఆగ్రహం

హైదరాబాద్ : ఎపి ప్రభుత్వంపై టిటిడిపి ఎమ్మెల్యే, బిసి సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు వస్తే జాబు వస్తుందన్నారని.. కానీ ఉన్న ఉద్యోగులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎపిలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 60 మైనార్టీ గురుకుల పాఠశాలలు ప్రారంభం అయినట్లు తెలిపారు.

 

18:16 - November 7, 2015

కర్నూలు : జిల్లాలోని డోన్‌ మండలం కొండపేటలో విషాదం చోటుచేసుకుంది. సెల్‌ఫోన్‌ దొంగతనం చేశావంటూ నింద మోపడంతో ఓ ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మంజుల అనే విద్యార్థిని ఇంటర్ చదువుతోంది. విజ్ఞాన్‌పబ్లిక్‌ స్కూల్లో చదువుతున్న తన అక్క కొడుకు రవితేజను స్కూలు నుంచి ఇంటికి తీసుకెళ్లేందుకు మంజుల మధ్యాహ్నం స్కూలుకు వెళ్లింది. అయితే అదే సమయంలో సెల్‌ఫోన్‌ పోయిందంటూ..దాన్ని నువ్వే తీశావంటూ ఆ స్కూలు యాజమాన్యం మంజులను నిలదీశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మంజుల ఇంటికి వచ్చిన తర్వాత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మంజుల మృతిపై తల్లిదండ్రులు స్కూలు యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్కూలు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

 

18:06 - November 7, 2015

హైదరాబాద్ : తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పోలీసు విభాగంలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 9 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కేసీఆర్‌ అంగీకరించారు. పోస్టుల భర్తీ ఉత్తర్వులపై కేసీఆర్‌ సంతకం చేశారు. ఇక సివిల్‌ విభాగంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. అదేవిధంగా దేహ దారుఢ్య పరీక్షలను కూడా సరళతరం చేయాలని నిర్ణయించారు. ఆర్మ్‌డ్‌ పోలీసులు నియామకంలో మహిళలకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పించింది.

 

18:02 - November 7, 2015

గుంటూరు : జిల్లాలో దారుణం జరిగింది. బాపట్ల సమీపంలోని సూర్యలంక బీచ్‌ రిసార్ట్‌లో హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీ సమీపంలో ఉండే కరాబి త్రిపాఠి అనే మహిళ శుక్రవారం ఉదయం సూర్యలంక బీచ్‌ రిసార్ట్‌లోని ఓ కాటేజీలో దిగింది. అయితే అప్పటినుండి కాటేజి నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కాటేజీ తలుపులను పగులకొట్టారు. అయితే అప్పటికే త్రిపాఠి అనే మహిళ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు ఎవరూ బాధ్యులు కారన్న సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు..కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

17:59 - November 7, 2015

మొహాలి : టెస్ట్ క్రికెట్ నెంబర్ వన్ సౌతాఫ్రికా తో జరుగుతున్న నాలుగుమ్యాచ్ ల సిరీస్ తొలిటెస్ట్ లో టీమిండియా బోణీ కొట్టింది. మొహాలీ పిసిఎ స్టేడియంలో జరిగిన ఈ ఐదురోజుల టెస్ట్ మూడోరోజుఆటలోనే టీమిండియా 108 పరుగులతో విజేతగా నిలిచింది. స్పిన్ బౌలర్ల హవాతో సాగిన ఈమ్యాచ్ లో...218 పరుగుల విజయలక్ష్యాన్ని చేదించడంలో సఫారీటీమ్ విఫలమయ్యింది. స్పిన్నర్ల త్రయం రవీంద్ర జడేజా, అశ్విన్, అమిత్ మిశ్రాల ముప్పేటదాడితో..109 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా స్పిన్నర్లలో జడేజా 4, అశ్విన్ 3 వికెట్లు, ఆరోన్, అమిత్ మిశ్రా చెరో వికెట్ పడగొట్టారు. సిరీస్ లోని రెండోటెస్ట్ నవంబర్ 14 నుంచి 18 వరకూ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది.

 

17:46 - November 7, 2015

చిత్తూరు : తిరుమల శ్రీవారి లడ్డూ కౌంటర్లలో ఆలయ డిప్యుటీ ఈవో చిన్నంగారి రమణ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో లడ్డూలను అక్రమంగా బ్లాకులో విక్రయిస్తున్న ఐదుగురు దళారులను గుర్తించి పట్టుకున్నారు. వారిలో నలుగురిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించగా ఒకరు పారిపోయారు. లడ్డు కౌంటర్లలోని సిబ్బంది పనితీరుపై తరచుగా వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టామని రమణ తెలిపారు. భక్తులు లడ్డూలకోసం దళారీలను ఆశ్రయించవద్దని..ఈ సందర్బంగా రమణ కోరారు.

 

17:42 - November 7, 2015

హైదరాబాద్‌ : మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో పాములు కలకలం సృష్టిస్తున్నాయి. మూడు రోజులుగా జూ సిబ్బంది పాములను పడుతున్నారు. ఇప్పటివరకు రక్తపింజర, జెర్రిగొడ్డు, క్యాట్‌ స్నేక్‌ వంటి విష సర్పాలను పట్టుకున్నారు. నల్లత్రాచు, నాగుపాము వంటి విష సర్పాలు కూడా ఉన్నాయనే అనుమానంతో జూ సిబ్బంది గాలిస్తున్నారు.

 

17:40 - November 7, 2015

పశ్చిమగోదావరి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో నలుగురు మృతి చెందారు. జంగారెడ్డిగూడెం మండలం పారిజాతగిరి సమీపంలో ఆటోబోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు చిన్నాయిగూడెం వాసులుగా గుర్తించారు.

 

 

 

17:33 - November 7, 2015

హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నికలు ఈనెల 21 న నిర్వహించనున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ తెలిపారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. 1,777 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మరో 27 అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని పేర్కొన్నారు. 5 తర్వాత ఓటింగ్ కు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. పార్లమెంటరీ నియోజవర్గంలో ఉన్న 15, 9, 671 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించకోనున్నట్లు తెలిపారు. వరంగల్ ఉప ఎన్నికల బరిలో 23 మంది అభ్యర్థులు ఉన్నారని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ ఉంటుందని పేర్కొన్నారు. ప్రతొక్క ఓటరుకు ఓటరు స్లిప్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఒక వేల ఇంటికి తాళం వేసి ఉంటే.… ఎన్నికల రోజున పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఓటర్ స్లిప్ ఇస్తారని చెప్పారు. టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చామని.. ఫుల్ గా కంప్లెయింట్ రికార్డు అవుతుందన్నారు.

 

17:14 - November 7, 2015

విజయవాడ : భావ ప్రకటన స్వేచ్ఛపై దాడికి నిరసనగా విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో కెవిపిఎస్ నేతలు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్య్రకమంలో పలువురు రచయితలు పాల్గొన్నారు. రచయితలు, ఆలోచనాపరులపై జరుగుతున్న దాడుల నిరసిస్తూ సంతకాలు సేకరించారు. దేశంలో పౌరులందరికీ రాజ్యాంగం హక్కులు ఇచ్చిందని, రచయితలపై జరుగుతున్న దాడులను నిరోధించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కేవీపీఎస్‌ నేత ఉమా మహేశ్వరరరావు డిమాండ్‌ చేశారు.

16:50 - November 7, 2015

విజయవాడ : రైతు వాణిని పార్లమెంట్‌లో వినిపించిన గొప్ప వ్యక్తి ఆచార్య ఎన్జీ రంగా అని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడలో ఆచార్య ఎన్జీరంగా జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో మంత్రి దేవినేని పాల్గొన్నారు. కంట్రోల్‌ రూం వద్దనున్న ఎన్జీరంగా విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎన్జీరంగా జీవిత విశేషాలతో కూడిన పుస్తకాన్ని విడుదల చేశారు.

16:46 - November 7, 2015

విజయవాడ : మహిళలకు రిజర్వేషన్లు అవసరం లేదని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. విజయవాడలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ ప్రెన్యూర్స్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని... ఇప్పుడు వారిని రిజర్వేషన్ల పేరుతో వేరు చేయడం సరికాదన్నారు. మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నాయని వాటిని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు.

 

16:42 - November 7, 2015

హైదరాబాద్‌ : నగరంలో ఓ స్కూలు బస్సు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన స్కూలు బస్సు ఆగివున్న వాహనాలను ఢీకొట్టింది. గచ్చిబౌలిలోని విప్రో చౌరస్తా సిగ్నల్‌ దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ముగ్గురు ఐటీ ఉద్యోగులున్నారు. వీరిందరినీ చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రికి తరలించారు.

 

16:39 - November 7, 2015

కృష్ణా : జిల్లాలోని జగ్గయ్యపేటలో ఆర్టీసీ ఉద్యోగి తన రెండు చేతులు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రతాప్ అనే ఆర్టీసీ ఉద్యోగి తనను జగ్గయ్యపేట రీజనల్ మేనేజర్ తీవ్ర వేధింపులు గురిచేస్తున్నాడని ఆరోపించారు. వాటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఈ ఉదయం డిపో ముందు అరుస్తూ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. వెంటనే తోటి ఉద్యోగులు అతడిని హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

తెలంగాణ పోలీసు శాఖలో 9 వేలకు పైగా పోస్టుల భర్తీ

హైదరాబాద్ : తెలంగాణ పోలీసు శాఖలో 9 వేలకు పైగా పోస్టులు భర్తీ కానున్నాయి. ఈమేరకు సీఎం కేసీఆర్ వాటికి సంబంధించిన ఫైల్ పై సంతకం చేశారు.

16:30 - November 7, 2015

వరంగల్ : సిరిసిల్ల రాజయ్య కోడలు, పిల్లల సజీవదహనం కేసులో రిమాండ్‌ రిపోర్టును టెన్‌ టీవీ సంపాదించింది.. ఇందులో అనేక ఆసక్తికరమైన అంశాలను పొందుపరిచారు.. 10 పేజీలతో కూడిన రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు.. 24మందిని విచారించి ప్రాథమిక సాక్ష్యాలు సేకరించారు.. అనిల్‌కు సారికతో వివాహమైనప్పటినుంచి కుటుంబంలో వేధింపులను ఈ రిపోర్టులో రాశారు.. ముఖ్యంగా 20 అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు.
వివరాల్లోకి వెళితే...
తల్లిదండ్రులకు ఇష్టంలేకుండా ఆర్య సమాజ్‌లో అనిల్‌, సారిక వివాహం చేసుకున్నారు. యాదగిరిగుట్టలో రెండోసారి పుట్టింటివారి సమక్షంలో వారికి పెళ్లి జరిగింది. వివాహం తర్వాత కొన్నేళ్లు బాగానే ఉన్నారు. సారిక బీటెక్‌ అయిపోగానే హైదరాబాద్‌కు కాపురం మార్చారు. అనిల్‌, సారిక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేశారు. ప్రాజెక్టు వర్క్‌ కోసం బెంగళూరు, కోల్‌కత్తా, ముంబై, పూనే, ఢిల్లీ వెళ్లారు. 2010లో సారిక, అనిల్ హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. నగరంలోని సనతో అనిల్‌కు అక్రమసంబంధం ఏర్పడింది. సన పరిచయమయ్యాక సారికపై అనిల్ వేధింపులు పెరిగాయి. సన ద్వారా అనిల్‌కు ఇద్దరు పిల్లలు సారిక నిలదీయడంతో వేధింపులు తీవ్రమయ్యాయి. అనిల్‌ తల్లిదండ్రులు రాజయ్య, మాధవి అతనికి మద్దతు పలికారు. అత్త, మామ, భర్త సారికను మానసికంగా, శారీరకంగా వేధించారు. ఎన్జీవోలు, పోలీస్‌ స్టేషన్లలో వారిపై సారిక ఫిర్యాదు చేసింది. రాజయ్య, మాధవి, అనిల్‌కు పోలీసులు కౌన్సిలింగ్‌ నిర్వహించారు. అయినా భర్త అనిల్‌, రాజయ్య, మాధవి మారలేదు. దీంతో మహిళా పోలీస్‌ స్టేషన్లో సారిక ఫిర్యాదు చేసింది. కేసులతో విసిగిపోయిన రాజయ్య, మాధవి, అనిల్‌ వేధింపులు మరింత పెంచారు. ఆత్మహత్య చేసుకొని చనిపోవాలని పదే పదే ఒత్తిడి తెచ్చారు. ఇంట్లో పనివారు, డ్రైవర్లు వేధింపులకు సాక్షులుగా ఉన్నారు. సారిక ఆమె పిల్లల్ని ఒంటరిని చేశారు. ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదు. ఈనేపథ్యంలో ఉప ఎన్నికల్లో రాజయ్య గెలిస్తే వేధింపులు పెరుగుతాయని సారిక భయపడింది. రాజకీయ పలుకుబడి ఉపయోగించి చిత్రహింసలు పెడతారని ఆందోళన చెందింది. వేధింపులతో విసిగిపోయిన సారిక ఉదయం 4.30గం.ల సమయంలో పిల్లలతోసహా సారిక ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో నుంచి పొగలు, వాసన రావడాన్ని గమనించిన చుట్టుపక్కలవారు పోలీస్‌ నెంబర్‌ 100కు సమాచారం ఇచ్చారు. పనివారు, డ్రైవర్లు డోర్‌ పగలగొట్టి ఇంట్లోకి వెళ్లారు. బెడ్‌రూంలో నీళ్లు చల్లి మంటలు ఆర్పే ప్రయత్నాలు చేశారు. బెడ్‌రూంలో రెండు గ్యాస్‌ సిలిండర్లు ఉన్నాయి. ఒకటి ఖాళీ సిలిండర్‌, ఒకటి నిండు సిలిండర్‌. మంటలు, పొగ కారణంగానే సారిక, పిల్లలు మరణించారు. అనిల్‌ రెండో భార్య సన పరారీలో ఉన్నారు.

 

తొమ్మిదో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా

మొహాలీ టెస్టు : దక్షిణాఫ్రికా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. విజయానికి భారత్ ఒక వికెట్ దూరంలో ఉంది.

ఎనిమిదో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా

మొహాలీ టెస్టు : దక్షిణాఫ్రికా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 102 పరుగుల వద్ద సౌతాఫ్రికా వద్ద ఏడు వికెట్ కోల్పోయింది. దక్షిణకాఫ్రికా విజయలక్ష్యం 218 పరుగులు.

 

దక్షిణాఫ్రికా 102/7..

మొహలి : భారత్ తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో సౌతాఫ్రికా ఏడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 35.1ఓవర్లలో 102 పరుగులు చేసింది. విజయానికి మరో 116 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. 

15:05 - November 7, 2015

పంజాబాద్ : మొహాలీటెస్ట్ లో సౌతాఫ్రికా ఎదుట టీమిండియా 218 పరుగుల లక్ష్యం ఉంచింది. ఓవర్ నైట్ స్కోరుతో మూడోరోజుఆట కొనసాగించిన టీమిండియా...రెండోఇన్నింగ్స్ లో 200 పరుగులకు ఆలౌటయ్యింది. ఓపెనర్ విజయ్ 47, వన్ డౌన్ పూజారా 77, కెప్టెన్ కొహ్లీ 29, వృద్ధిమాన్ సాహా 20 పరుగులు సాధించారు. సఫారీ బౌలర్లలో ఆఫ్ స్పిన్నర్ హార్మర్ 4, లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ 4 వికెట్లు పడగొట్టారు. మీడియం పేసర్లు వాన్ జిల్, ఫిలాండర్ లకు చెరో వికెట్ దక్కింది. తొలిఇన్నింగ్స్ లో 201 పరుగులు చేసిన టీమిండియా...రెండో ఇన్నింగ్స్ లో 200 పరుగులు మాత్రమే చేయగలిగింది. మొదటి రెండున్నరరోజుల ఆటలో 30 వికెట్లు పతనం కావడం విశేషం. సౌతాఫ్రికా రెండోఇన్నింగ్స్ లో 50 పరుగులకే 5 టాపార్డర్ వికెట్లు నష్టపోయి ఓటమి అంచుల్లో కూరుకుపోయింది..

ఆరో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా

మొహాలి : రెండో ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. 60 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. దక్షిణాఫ్రికా విజయలక్ష్యం 218 పరుగులు.

టెన్ టివి చేతిలో సారిక రిమాండ్ రిపోర్టు..

మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, మనవళ్ల మృతికి సంబంధించిన రిమాండ్ రిపోర్టు టెన్ టివికి చిక్కింది. సారిక ఎదుర్కొన్న వేధింపులను పోలీసులు రిమాండ్ లో పొందుపరిచారు. రిపోర్టులో 20 ప్రధాన అంశాలను పోలీసులు ప్రస్తావించారు. యాదగిరిగుట్టలో రెండోసారి పుట్టింటి వారి సమక్షంలో వివాహం చేసుకున్నారు. వివాహం తరువాత కొన్నేళ్లు బాగానే ఉన్నారని, సారిక బీటెక్ అయిపోగానే హైదరాబాద్ కు కాపు మార్చారు. అనీల్, సారిక సాప్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేశారు. ప్రాజెక్కు వర్కు కోసం బెంగళూరు, కోల్ కతా, ముంబై, పూనే, ఢిల్లీ వెళ్లారు. 2010లో నగరానికి తిరిగి వచ్చింది. నగరంలో సన అనే మహిళతో అనీల్ కు అక్రమ సంబంధం ఉంది.

14:02 - November 7, 2015

కత్తులు కటార్లు లేవు. ఆయుధాలూ తూటాలూ లేవు. రక్తపుటేరులు అసలే లేవు. ఒక్క.. పాట ఉంది. 'పల్లే కన్నీరు పెడుతుందో.. కనిపించని కుట్రల'..గోరటి వెంకన్న పాట ఎంతో సంచలనం సృష్టించింది. ఈ పాటకు ప్రాణం పోసి, బహుళ జాతి కంపెనీల పెత్తనాన్ని ఈ పాటలో ఎండగట్టారు. కవిగా తన సత్తాను చాటినా, సినీ పరిశ్రమలో గీత రచయితగా ప్రతిభను చూపినా ఆయనకు ఆయనే సాటి. టెన్ టివిలో ఆయన అనుభవాలను, జీవిత విశేషాలను తెలియచేశారు. 

12:52 - November 7, 2015

ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఎందుకంటే ఒకతను దీనిపై సవాల్ విసిరాడు. ఏ పాము ఏ పామును తింటోంది అని ? దీనిపై ఎవరూ కూడా సమాధానం చెప్పడం లేదంట. ఎంతో మంది మేధావుల మెదడుకు పని పెడుతోంది. ఒక పాము మరో పామును తింటుందని మనం చూస్తుంటాం..వింటుంటాం..అయితే ఇక్కడున్న ఫోటోలో ఏ పాము దేనిని తింటోందో కచ్చితంగా చెప్పడం ఎవరికీ సాధ్యం కావడం లేదు. ఈ ఫోటోను ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌ వేల్స్‌ నగరంలో జెఫ్‌ మిచెల్‌ అనే వ్యక్తి తీసి ఫేస్‌బుక్‌లో పెట్టాడు. అప్పట్నుంచి దీని మీద పెద్ద డిబేట్‌ జరుగుతోంది. ఈ ఫోటో చాలా విచిత్రంగా ఉంది. బ్లాక్‌ స్నేక్‌ను బ్రౌన్‌ స్నేక్‌ తింటున్నట్టుగా ఉంది. అయితే కచ్చితంగా మాత్రం చెప్పలేమని న్యూసౌత్‌ వేల్స్‌ జూ అధికారి ఒకరు పేర్కొన్నారు. బ్లాక్‌ స్నేక్‌ను బ్రౌన్‌ స్నేక్‌ తింటూ ఉంటే ఏదో వాహనం దానిపై నుంచి వెళ్లి ఉండవచ్చని రాబ్‌ ఆంబ్రోస్‌ అనే పాముల పరిశోధకుడు తెలిపారు. మీరైనా ఊహించి కరెక్టైన సమాధానం చెబుతారా ?

12:51 - November 7, 2015

హైదరాబాద్ : కందిపప్పు..అందరికీ ఇష్టమైన పప్పు..కందిపప్పుతో..ఎన్నో రుచికరమైన వంటకాలు చేసుకోవచ్చు. నోరూరించే సాంబారే కాదు..పాలకూరపప్పు, పప్పుటమాట లాంటి ఎన్నో ఎన్నెన్నో రుచికరమైన వంటకాలను ఇష్టంగా తింటాం. అయితే ఇప్పుడు ఆ కందిపప్పు కాస్తా కొండెక్కి కూర్చోవడంతో..పప్నన్నం బదులు నీళ్ల సాంబారుతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

మధ్యాహ్న భోజనంలో .....

నీళ్ల రసం, నీళ్ల సాంబారు. ఇప్పటివరకు కందిపప్పుతో కమ్మటి పప్పన్నం, గుమగుమలాడే సాంబారుతో కడుపునిండా తిన్న ఈ పిల్లలు..ఇప్పుడు నీళ్లరసం, నీళ్ల సాంబారుతో సరిపెట్టుకుంటున్నారు. ఇష్టంలేకున్నా ఆకలికి తట్టుకోలేక,..కడుపును చంపుకోలేక అలా నాలుగు మెతుకుల్ని మింగుతున్నారు.

కిలో కందిపప్పు ధర రూ. 200పైనే....

కందిపప్పు ధరలు కొండెక్కి కూర్చోవడంతో...మధ్యాహ్న భోజనంలో పప్పన్నాన్ని వడ్డించడంలేదు. బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు పప్పు 200 దాటడంతో..మధ్యాహ్న భోజనంలో పప్పును వడ్డేందుకు కాంట్రాక్టర్లు చేతులెత్తేస్తున్నారు. దీంతో చేసేదేంలేక ఇలా నీళ్లరసం, నీళ్ల సాంబారుతోనే తినాల్సి వస్తుంది. కందిపప్పులో అధికశాతం మాంసకృత్తులు, పోషకాలుండడంతో దీన్ని ఒక పౌష్టికాహారంగా పిల్లలకు అందిస్తారు. కానీ..కందిపప్పు సామాన్యుడికి అందనంద ఎత్తులో ఉండడంతో..ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తినే విద్యార్ధులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

పప్పన్నం తినడం అంటే ఇప్పుడు అప్పు చేయాల్సిందే...

కందిపప్పు ధరలు ఆకాశన్నండడంతో..పప్పన్నం తినడం అంటే ఇప్పుడు అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ప్రభుత్వ స్కూళ్లలో చదువుకుంటున్న పేద పిల్లలు పౌష్టికాహారానికి దూరమవుతున్నారు. వాస్తవానికి వసతి గృహాల్లోని విద్యార్ధులకు రెండు పూటలా మెనూ ప్రకారం భోజనం అందించాలి. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం పప్పు, సాంబారు వడ్డించాలి. కానీ..ఇలా నీళ్లచారు. నీళ్ల సాంబారు, సాధారణ కూరగాయలనే వడ్డించి మమ అనిపిస్తున్నారు.

కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపరులు .....

బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు ధరలు మండిపోతున్నా..వ్యాపారస్తులు మాత్రం నిల్వలను బయటకు తీయడంలేదు. మరోవైపు రాబోయేది పండగల సీజన్. ఈ నెలలో దీపావళి, డిసెంబర్‌లో క్రిస్మస్, జనవరిలో సంక్రాంతి ..ఇలా ప్రధాన పండగలన్నీ ఒకదాని తరువాత మరొకటి వస్తున్నాయి. అయితే భారీ లాభాలపై కన్నేసిన వ్యాపారులు కందిపప్పుకు కృత్రిమ కొరత సృష్టించి ధరలను శాసిస్తూ ప్రజలను దోచుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించి అక్రమ నిల్వల్ని బయటకు తీస్తే ఈ సమస్యకు కొంతైనా పరిష్కారం దొరుకుతుంది.

 

12:47 - November 7, 2015

వరంగల్‌ : జిల్లాలో కోతుల దాడిలో ఓ వ్యక్తి మృతిచెందాడు. భూపాల్‌పల్లి మండలం ఘన్‌పూర్‌లో ఈఘటన జరిగింది.మృతుడు నార్లసమ్మయ్యగౌడ్‌గా గుర్తించారు. 

12:45 - November 7, 2015

నల్గొండ: విద్యుత్‌ తీగలు వారి పాలిట యమపాశాలయ్యాయి. అత్తాకోడళ్లను బలితీసుకున్నాయి. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం రావులపెంటలో ఈ విషాదమైన ఘటన చోటు చేసుకుంది. కరెంటు షాక్‌తో అత్త, కోడలు మృతి చెందారు. దండెంపై బట్టలు ఆరేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికుల సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు మృతదేహాలకు పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

12:43 - November 7, 2015

ఆదిలాబాద్ : జిల్లాలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.. దిలావర్‌పూర్‌కుచెందిన సాయారెడ్డి వ్యవసాయం చేసి చాలా నష్టపోయాడు.. బతుకుతెరువుకోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాడు.. అక్కడ జీతం సరిగా రాకపోవడంతో తిరిగి సొంతూరుకువచ్చాడు.. తనపొలంతోపాటు ఐదెకరాలు కౌలుకు తీసుకొని సాగుచేశాడు.. అయినా ఆశించిన స్థాయిలో దిగుబడిరాక పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.. 

12:42 - November 7, 2015

హైదరాబాద్ : తెలంగాణవ్యాప్తంగా అసిస్టెంట్ ఇంజనీర్ల పరీక్ష ప్రశాంతంగా జరుగుతోంది.. ఉదయం పదినుంచి మధ్యాహ్నం 12.30గంటలరకూ... మళ్లీ 2.30నుంచి సాయంత్రం 5గంటలవరకూ పరీక్ష జరగనుంది.. బయోమెట్రిక్, బార్‌ కోడ్ స్కానర్‌ ద్వారా అభ్యర్థులను పరీక్షాకేంద్రంలోకి పంపారు.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ ఈ పరీక్షను నిర్వహిస్తోంది.. మొత్తం ఒకవెయ్యి 58 పోస్టులకు 63వేలమంది దరఖాస్తు చేసుకున్నారు.. హైదరాబాద్‌లో 38, నిజామాబాద్‌ జిల్లాలో 13, కరీంనగర్‌లో 21, వరంగల్‌లో 15, ఖమ్మంలో 14 పరీక్షాకేంద్రాలు ఏర్పాటుచేశారు.. 

12:41 - November 7, 2015

హైదరాబాద్ : వరంగల్‌ ఉప ఎన్నికల్లో ఓటర్లు టీఆర్ఎస్‌ పార్టీకి షాక్‌ ఇవ్వబోతున్నారని మాజీ పీసీసీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య జోస్యం చెప్పారు.ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్‌ ప్రభుత్వంపై ప్రజల్లో రోజు రోజుకు అసంతృప్తి పెరిగిపోతుందని..ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత ఎంటో బయటపడుతుందన్నారు. ఉప ఎన్నికల్లో హస్తం పార్టీ విజయ దుందుభీ మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

12:39 - November 7, 2015

హైదరాబాద్ : కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఫలితాల్లో ఎల్‌డీఎఫ్‌ దూసుకుపోతోంది.యూడీఎఫ్‌ రెండో స్థానంలో కొనసాగుతోంది. బీజేపీమూడో స్థానానికి పడిపోయింది. తిరువనంతపురం, కొల్లాం, కోజీకోడ్‌ కార్పొరేషన్లలో..ఎల్‌డీఎఫ్‌ ఆధిక్యాన్ని కనబరుస్తోంది. కొచ్చి, త్రిసూర్‌; కానూర్‌ కార్పొరేషన్లలో యూడీఎఫ్‌ లీడ్‌లో ఉంది.  

18 నుంచి నగరంలో రాష్ట్రపతి విడిది

హైదరాబాద్ : కొన్ని నెలల కిందట హైదరాబాద్ లో విడిది చేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరోసారి నగరానికి వస్తున్నారు. దక్షిణాది విడిదిలో భాగంగా ఈ నెల 18 నుంచి 31 వరకు ఆయన ఇక్కడ విడిది చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18న రాష్ట్రపతి హైదరాబాద్ కు వస్తున్నారు. ఇదిలాఉంటే, ఈ నెల 27న మెదక్ జిల్లా జగదేవ్ పూర్ మండలం ఎర్రవల్లి గ్రామంలోని సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లో జరిగి అయుత చండీయాగంలో రాష్ట్రపతి పాల్గొనే అవకాశమున్నట్లు అధికార వర్గాల సమాచారం.

కశ్మీర్ లో మోదీకి నల్ల బెలూన్లతో నిరసన

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కశ్మీర్ పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యే రషీద్ నేతృత్వంలో వందలాది మంది యువత ఆయనకు నల్ల బెలూన్లను ఎగరేసి నిరసన తెలిపారు. మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాల్సిన వేదికకు సమీపంలోనే ఈ ఘటన జరగడంతో పోలీసులు రషీద్ ను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన రషీద్ ఇటీవల బీఫ్ పార్టీ ఇవ్వగా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు ఆయనపై చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆయనపై ఢిల్లీలో ఇంకు దాడి కూడా జరిగింది.

చింతమనేని పై క్రిమినల్ కేసులు నమోదు...

పశ్చిమగోదావరి : దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలోని కైకలూరు మండలం ఆటపాక పక్షుల కేంద్రం నుంచి పశ్చిమగోదావరి జిల్లా కోమటివానిలంకకు శుక్రవారం అర్ధరాత్రి రోడ్డు నిర్మాణాన్ని జరిపించారు. కాగా... ఈ రోడ్డు రిజర్వు ఫారెస్టు గుండా వేస్తుండడంతో వైల్డ్ లైఫ్ డీఆర్‌వోతోపాటు అటవీశాఖాధికారులు అడ్డుకున్నారు. అయితే ఎమ్మెల్యే అనుచరులు అటవీశాఖ సిబ్బందిపై దౌర్జన్యం చేయడమేగాక తోసేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేగాక ఇదే విషయాన్ని అటవీ సిబ్బంది స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోగా పోలీసులు కిమ్మనకుండా ఉండిపోయారు.

సూర్యలంక బీచ్ వద్ద యువతి ఆత్మహత్య

గుంటూరు :సూర్యలంక బీచ్ వద్ద ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. బీచ్‌లోని హరిత రిసార్ట్స్‌లో త్రిపాఠి అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈమె హైదరాబాద్ లోని హైటెక్ సిటీ వాసిగా అక్కడి పోలీసులు గుర్తించారు. కాగా... తన చావుకు ఎవరూ కారణం కాదంటూ ఓ సూసైడ్ నోట్ రాసింది. ఈ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా... హైటెక్ సిటీ ప్రాంతానికి చెందిన ఈమె సూర్యలంక బీచ్ వద్దకు ఎలా, ఎందుకు వచ్చింది. ఆమె ఒక్కరే వచ్చారా... లేక ఆమెతోపాటు మరేవరైనా ఉన్నారా... అన్న విషయాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

12:05 - November 7, 2015

హైదరాబాద్ : ఢిల్లీలో మార్చ్‌ ఫర్ ఇండియా ర్యాలీ మొదలైంది.... అసహన ప్రచారానికి వ్యతిరేకంగా బాలీవుడ్ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడుస్తోంది.. ఇందులో నటులు, కళాకారులు పెద్దసంఖ్యలో పాల్గొంటున్నారు.. 

12:01 - November 7, 2015

తూర్పుగోదావరి: నగదు కోసం యువకుడిపై కత్తితో దాడి చేయడమేగాక అరవకుండా నాలుక సైతం కోసేసి తమ పని కానిచ్చేశారు. వివరాలిలా ఉన్నాయి. సామర్లకోట మండలం మఠం సెంటర్ లో ఓ యువకుడిపై దుండగులు నగదు కోసం కత్తితో దాడి చేశారు. ఈ సమయంలో ఆ యువకుడు పెద్దగా కేకలు వేస్తుండడంతో నాలుక సైతం కోసేసి నగదును అపహరించారు. అయితే... ఆ యువకుడిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ శనివారం ఉదయం మృతిచెందాడు.

12:00 - November 7, 2015

హైదరాబాద్: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. మరో 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో మరో రెండ్రోజుల్లో నెల్లూరు, ప్రకాశం, సహా రాయలసీమ జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 

కేరళ స్థానిక సంస్థల ఎన్నికలు..దూసుకపోతున్న ఎల్డీఎఫ్..

కేరళ : స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎల్డీఎఫ్ దూసుకపోతోంది.

11:57 - November 7, 2015

పశ్చిమగోదావరి : దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. ప్రభాకర్‌పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలోని కైకలూరు మండలం ఆటపాక పక్షుల కేంద్రం నుంచి పశ్చిమగోదావరి జిల్లా కోమటివానిలంకకు శుక్రవారం అర్ధరాత్రి రోడ్డు నిర్మాణాన్ని జరిపించారు. కాగా... ఈ రోడ్డు రిజర్వు ఫారెస్టు గుండా వేస్తుండడంతో వైల్డ్ లైఫ్ డీఆర్‌వోతోపాటు అటవీశాఖాధికారులు అడ్డుకున్నారు. అయితే ఎమ్మెల్యే అనుచరులు అటవీశాఖ సిబ్బందిపై దౌర్జన్యం చేయడమేగాక తోసేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేగాక ఇదే విషయాన్ని అటవీ సిబ్బంది స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోగా పోలీసులు కిమ్మనకుండా ఉండిపోయారు. దీంతో ఆగ్రహించిన అటవీ సిబ్బంది పోలీస్‌స్టేషన్ వద్ద ధర్నా చేయాలని కూడా నిర్ణయించారు. దీంతో ఎట్టకేలకు ఎమ్మెల్యే చింతమనేనిపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అటవీశాఖ సిబ్బందిపై దౌర్జన్యం చేసినందుకుగానూ 353, 447 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రిలో అగ్ని ప్రమాదం

అనంతపుం : కళ్యాణ దుర్గం ప్రభుత్వాస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో రోగులు సిబ్బంది భయంతో పలుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బది మంటలను అదుపు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయని ప్రాథమిక అంచానకు వచ్చినట్లు తెలుస్తోంది.

జమ్మూ కు చేరుకున్న మోడీ..

జమ్మూ కాశ్మీర్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జమ్మూ కాశ్మీర్ కు చేరుకున్నారు. హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం నిర్వహించే ర్యాలీలో మోడీ ప్రసంగించనున్నారు.

జాతీయ జెండాను తిరగేసి జేబులో పెట్టుకున్న సుజనా చౌదరి

విజయవాడ : మహిళా పారిశ్రామిక వేత్తల సదస్సులో కేంద్ర మంతి సుజనా చౌదరి పాల్గొన్నారు. జాతీయ జెండాను తిరగేసి జేబులో పెట్టుకున్నారు. దీంతో సదస్సులో కలకలం రేగింది.

11:27 - November 7, 2015

అనుష్క...టాలీవుడ్ లో వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఆమె 35వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది...తన సినీ జీవితం పదేళ్లు...చేసిన సినిమాలు మూడు పదులకు పైనే. అతి తక్కువ కాలంలోనే దక్షిణాదిలో అగ్రతారగా ఎదిగింది. వర్థమాన హీరోయిన్లలో ఏ ఒక్కరికీ రాని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. మొన్న జేజమ్మగా అభిమానుల గుండెల్లో ముద్ర వేసుకుంది. నిన్నటితో రుద్రమదేవిగా మరొక పేరు చెక్కుకుంది. అటు సరోజ గాను, ఇటు చారిత్రక నేపథ్యం ఉన్న రుద్రమ దేవిగాను చక్కగా నటించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. సినిమా కోసం ఏమైనా చేయాలనే ఈ యోగా టీచర్‌ 20 కేజీలు బరువు పెరిగి తగ్గింది. ఆమె అనుష్క శెట్టి. నేడు ఆమె జన్మదినోత్సవం.
ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో అనుష్క అగ్ర భాగాన్నే ఉందని చెప్పాలి. 1981లో కర్నాటకలోని మంగ్లోర్‌లో జన్మించిన ఈమె 2005లో 'సూపర్‌' సినిమా ద్వారా తెలుగు చిత్ర సీమకు పరిచయమైంది. బెంగుళూరులో బ్యాచిలర్‌ కంప్యూటర్‌ అప్లికేషన్‌లో పట్టా పొందింది. ఈమె యోగాలో శిక్షణ పొంది దాన్నే జీవితంగా ప్రారంభించింది. అనుకోకుండా పూరి జగన్నాథ్‌, నాగార్జున 'సూపర్‌' సినిమాతో వెండి తెరకు పరిచయం చేశారు. తన సినీ జీవితంలో మొత్తం పదేళ్లలో దక్షిణాది భాషల్లో 39 సినిమాల్లో నటించింది. అందులో 5 సినిమాల్లో పాటల్లో స్టెప్పులు వేసింది. మెగాస్టార్‌ చిరంజీవితో కూడా స్టాలిన్‌లో ఆడిపాడింది. తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో 'లింగ'లో నటించింది. ఎస్‌.ఎస్‌. రాజమౌళి రూపొందించిన 'విక్రమార్కుడు' చిత్రం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. తర్వాత ఆమె వదిలిన 'అస్త్రం' ఆకట్టుకోలేకపోయినా తర్వాత గోపీచంద్‌తో చేసిన 'లక్ష్యం' విజయం తెచ్చిపెట్టింది. మొదట ఆమె జతకట్టిన నాగార్జునతో 'డాన్‌'లో మరొకసారి నటించి మెప్పించింది. మళ్లీ మరొక సారి గోపీచంద్‌ 'శౌర్యం'తో సూపర్‌ హిట్‌ అందుకుంది.
ప్రత్యేకంగా చెప్పుకోదగిన పాత్ర జేజమ్మ. 2009లో వచ్చిన 'అరుంధతి'లో ఆమె మొదట సారిగా హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ పాత్ర పోషించి మెప్పించింది. ఈ చిత్రం ఆమెకు నంది అవార్డు కూడా తెచ్చిపెట్టింది. 'బిల్లా' తర్వాత 'వేదం'లో సరోజ పాత్రలో ఒదిగిపోయింది. ఈమె నటనకు బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు కూడా లభించింది. మళ్లీ లేడీ ఓరియెంటెడ్‌ పాత్రలో 'పంచాక్షరి'గా మెప్పించాలనుకున్నా ఫలించలేదు. మహేష్‌బాబుతో 'ఖలేజా' చేసింది. తమిళంలో సూర్యతో 'సింగం', 'సింగం 2' సూపర్‌ హిట్‌ అయ్యాయి. 'మిర్చి' 'బాహుబలి' చిత్రాల గురించి చెప్పనక్కర్లేదు. ఈ చిత్రాల్లో ఆమె నటన ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. భారీ బడ్జెట్‌తో గుణశేఖర్‌ తెరకెక్కించిన 'రుద్రమదేవి'గా కూడా విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ చిత్రం కోసం ఏకంగా రెండున్నర ఏళ్లు శ్రమించింది. 'సైజ్‌ జీరో' చిత్రం కోసం ఏకంగా 20 కేజీల బరువు పెరిగి తగ్గింది అనుష్క. ఇప్పుడు 'బాహుబలి 2'లో నటించనుంది. సైజ్‌ జీరో చిత్రం ట్రైలర్‌ని మిలియన్‌ మంది ప్రేక్షకులు చూశారని శుక్రవారం అనుష్క తెలిపింది.

పోలీసుల అదుపులో ఎమ్మెల్యే రషీద్..

p { margin-bottom: 0.25cm; line-height: 120%; }

జమ్మూ కాశ్మీర్ : ఎమ్మెల్యే రషీద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటను నిరసిస్తూ నల్లజెండాలు ప్రదర్శించడంతో పోలీసులు రషీద్ ను అదుపులోకి తీసుకున్నారు.

అసహనంపై ఢిల్లీలో అనుపమ్ ఖేర్ వ్యతిరేక ర్యాలీ..

ఢిల్లీ : దేశంలో పెరగుతున్న అసహనంపై వ్యతిరేకంగా బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఢిల్లీలో ర్యాలీ చేపట్టారు. రాష్ట్రపతి భవన్ వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది. తాను చేపట్టే ఈ ర్యాలీలో పాల్గొనాలని ప్రముఖలతో పాటు ప్రజలకు ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా పిలుపునిచ్చారు.

గచ్చిబౌలిలో స్కూల్ బస్సు బీభత్సం

హైదరాబాద్ : గచ్చిబౌలిలో స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. పార్క్ వద్ద వాహనాలను ఢీకొన్న స్కూల్ బస్సు. 10 మందికి గాయాలయ్యాయి.

కేరళ స్థానిక ఎన్నికలు..ఎల్డీఎఫ్ 44 స్థానాల్లో విజయం..

కేరళ : స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎల్డీఎఫ్ 44, బీజేపీ 22 స్థానాల్లో విజయం సాధించాయి.

మేడిపల్లి పీఎస్ పరిధిలో దొంగల హల్ చల్

రంగారెడ్డి: మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పీర్‌జాదిగూడలో దొంగలు హల్‌ చల్ చేశారు. స్థానికంగా ఉన్న మూడు దుకాణాలలో శుక్రవారం రాత్రి వరుస దొంగనాలకు పాల్పడి స్థానికులను భయబ్రాంతులకు గురి చేశారు. మెడికల్‌ షాప్, కిరాణ దుకాణం, చైనా బజార్‌ల షటర్లను ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించిన దొంగలు సుమారు రూ. 2 లక్షల వరకు నగదును ఎత్తుకెళ్లారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం

విశాఖ : బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.. నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అప్పటికే ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. మరో 48 గంటల్లో అల్పపీడనం మరింతబ లపడే అవకాశంఉ న్నట్లు తెలిపారు.

బాలికపై వైసీపీ నేత వీరరాఘవరెడ్డి లైంగిక దాడి

కడప: చాపాడు మండలం చియ్యపాడులో బాలికపై వైసీపీ నేత వీరరాఘవరెడ్డి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలికను ఆస్పత్రికి తరలించారు. సీఎస్ లో తల్లిదండ్రుల ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

కర్మన్‌ఘాట్ లో ఆటో డ్రైవర్ దారుణ హత్య

హైదరాబాద్ : నగరంలో ఓ ఆటో‌డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. కర్మన్‌ఘాట్ సుభాష్‌నగర్‌లో ఓ ఆటో‌డ్రైవర్‌ను చంపేసి శనివారం ఉదయం రోడ్డుపై పడేశారు. లింబోజిగూడకు చెందిన సుభాష్ అనే ఆటో డ్రైవర్ గత మూడు రోజులుగా కనిపించకుండా పోయాడు. తన ఆటోతో ఇంట్లోంచి బయటకు వెళ్ళిన ఆయన్ను చంపేసి శనివారం తెల్లవారుజామున సుభాష్‌నగర్ రోడ్డుపై పడేశారు.

కాసేపట్లో మార్చ్ ఫర్ ఇండియా..

ఢిల్లీ : కొద్దిసేపట్లో ఢిల్లీలో మార్చ్ ఫర్ ఇండియా కార్యక్రమం జరుగనుంది. ఇందులో బాలీవుడ్ కు చెందిన కొందరు సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నేషనల్ మ్యూజియం వద్ద సందడి నెలకొంది.

10:15 - November 7, 2015

బ్రష్‌ చేసుకోవడం(పళ్ళు తోమడం)లోనూ కొన్ని పద్దతులు పాటించాల్సిందేనంటున్నారు డెంటిస్ట్‌లు. ఎంపిక చేసుకునే బ్రష్‌ నుంచి టూత్‌పేస్ట్‌వరకూ వాటి నాణ్యత, ప్రయోజనాలు, హానికరమైన అంశాలు బేరీజు వేసుకుని ఆయా వస్తువుల్ని వాడాలన్నది డాక్టర్ల మాట. పంటి జాగ్రత్తల విషయంలో స్టాండర్డ్‌ కంపెనీలు ఉత్పత్తి చేసే బ్రష్‌లు, టూత్‌పేస్టుల్నే వాడాలి. కొద్దిరోజులు ఒక కంపెనీవి మరికొన్ని రోజులు వేరేకంపెనీ ఇలా తరచూ బ్రష్‌, టూత్‌పేస్ట్‌ కంపెనీలను మార్చడం అంత మంచిది కాదు. ముఖ్యంగా మార్కెట్లోకి కొత్తగా వచ్చే ఉత్పత్తులపట్ల ఒకటి రెండుసార్లు ఆలోచించాలి. చెట్ల కొమ్మలు, బొగ్గు వంటివాటితో పళ్ళుతోముకోవడం అంత మంచిదికాదు. బ్రష్‌ చేసుకునే విషయంలో ఓ శాస్త్రీయమైన పద్ధతి ఉంది. ఈ విషయంలో డాక్టర్‌ సలహా తీసుకోవడం మంచిది. అలాగే బ్రష్‌ చేసుకునేటప్పుడు పంటినొప్పులు లేదా పళ్ళ మధ్య నుంచి రక్తం కారినట్టు అనిపించినా ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. అన్నిటికంటే ముఖ్యమైంది మనం రోజూ ఉదయాన్నే బ్రష్‌ చేసుకుని ఎలా అయితే ఆరోజును ప్రారంభిస్తామో.. అలాగే రాత్రి భోజనం ముగిసిన తర్వాత కూడా బ్రష్‌ చేసుకోవడం అలవాటుగా మార్చుకుంటే మంచిది.

10:11 - November 7, 2015

చలికాలం ప్రారంభమైంది. 40 ఫారన్‌ హీట్‌ సెంటీగ్రేడ్‌ వేడి ఉండే నగరాల్లో సైతం ఈ కాలంలో ఉదయం, సాయంత్రాల్లో చలి ఎక్కువగా ఉండటం సహజం. శీతాకాలంలో చల్లని వాతావరణం అంటే అందరూ ఇష్టపడే అంశమే. అయితే చలి గిలిగింతలతో పాటు అకస్మాత్తుగా వాతావరణంలో వచ్చిన మార్పు కారణంగా చర్మ సంబంధిత సమస్యలూ వస్తుంటాయి. ముఖ్యంగా తల, మాడు, ముఖమూ, కాళ్ళూచేతులపై దురదలు వస్తుంటాయి. ఇలాంటి చర్మ సంబంధిత సమస్యల్ని అధిగమించాలంటే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు.
మసాజ్‌: మనలో చాలామంది తలకు కొబ్బరినూనె రాసుకోవడం అలవాటుగా ఉంటుంది. రోజూ నూనె తలకు పట్టించకపోయినా వారానికి ఒక్కసారైనా తలస్నానం చేస్తే ముందు కొబ్బరినూనెతో తలకు మర్దన చేసుకుంటారు. చలికాలంలో అయితే క్రమం తప్పకుండా చేస్తే ఇంకా మంచిదంటున్నారు ఆయుర్వేద వైద్యులు. శ్రేష్టమైన కొబ్బరి నూనెను గోరువెచ్చగా వేడిచేసి, తలకు చక్కగా పట్టించి, వేళ్ళతో మాడును సున్నితంగా మసాజ్‌ చేసుకుంటే శీతాకాలంలో తలమాడుపై వచ్చే చర్మ సంబంధిత సమస్యలు తగ్గించుకోవచ్చు.
స్నానానికి ముందు: స్నానానికి కనీసం పదిహేను నిముషాల ముందుగా కొబ్బరినూనె లేదా బాదం నూనెను ముఖానికి, కాళ్ళు, చేతులు, ఇతర శరీర భాగాలకు పట్టించాలి. కాసేపు ఆగిన తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చలికాలంలో వచ్చే చర్మ సమస్యల్ని చాలావరకూ దూరం చేయొచ్చు. పొడిబారిన చర్మానికి రక్షణకవచంగా ఉండటంతో పాటు చర్మం నిగారింపు కూడా కలుగుతుంది. ఇందుకు కొబ్బరి, బాదం నూనెలు బాగా ఉపయోగపడతాయి.

10:10 - November 7, 2015

టెక్నాలజీలో వచ్చిన మార్పులు మన కాళ్ళకు శ్రమ తగ్గించి కంటికి శ్రమ పెంచుతున్నాయనటంలో నిజం లేకపోలేదు. గంటలతరబడి కంప్యూటర్‌ స్క్రీన్‌కి కళ్ళను అతికించి ఉద్యోగాలు చేస్తునవారు ఎందరో ఉన్నారు. అలాంటి వారిని కంటికి సంబంధించిన సమస్యలు త్వరగా చుట్టుముడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇలాంటి సమస్యల నుండి బయటపడేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎక్కువ సమయం కంప్యూటర్‌ ముందు కూర్చుని పనిచేసేవారు ప్రతి 20 నిమిషాలకోసారి కొన్ని సెకన్లపాటు విరామం తీసుకుని ఓ 20 అడుగుల దూరంలో ఉన్న ఏదో ఒక వస్తువుని చూడాలి. అలా చేయడం వల్ల కళ్ళు నీరుకారడం, ఎర్రబారడం, దురద మంట రావడం, పొడిబారడం వంటి సమస్యలను అదిగమించవచ్చు. అంతేకాదు పని మధ్యలో కొన్నిసార్లు లేచి 20 అడుగులు నడవడం వల్ల శారీరక వ్యాయా మమేకాదు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. ఒకవేళ ఇరవై నిమిషాల కొకసారి లేవడం సాధ్యపడకపోతే చూపును ఇతర వస్తువులమీదకు మరల్చడం ద్వారా అయినా కళ్ళపై కొంత ఒత్తిడి తగ్గుతుందంటున్నారు నిపుణులు.

 

10:09 - November 7, 2015

టాలీవుడ్‌, కోలీవుడ్‌ల్లో స్టార్‌ హీరోయిన్‌గా పేరొం దిన సమంత సామాజిక సేవలోనే కాదు అవయవ దానం చేసేందుకు ముందుకొచ్చి మరి కొంతమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సామాజిక సేవలో భాగంగా ప్రత్యూష ఫౌండేషన్‌ను సమంత నెలకొల్పిన సంగతి విదితమే. ఈ ఫౌండేషన్‌ ద్వారా డబ్బుల్లేక ఆపరేషన్‌ చేయించుకోలేకపోతున్న చిన్నారులకు సాయం చేస్తోంది. తాజాగా మరో అడుగు ముందు కేసి అవయవదానం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈనెల 7వ తేదీన ప్రత్యూష ఫౌండేషన్‌, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసే ఓ కార్యక్రమంలో సమంత ఈ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. అంతే కాకుండా అవయవ దానానికి సంబంధించి ప్రజల్లో చైతన్యం కలిగించే విధంగా కూడా పలు కార్యక్రమాల్ని నిర్వహించాలని భావిస్తోంది. సమంత ప్రస్తుతం మహేష్‌బాబు సరసన 'బ్రహ్మోత్సవం'లోను, నితిన్‌తో 'అ..ఆ' చిత్రంలోనూ నటిస్తోంది. అలాగే పలు చిత్రాల్లో నటిస్తూ తమిళంలోనూ బిజీగా ఉంది.

10:08 - November 7, 2015

'కంచె' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన ముంబై నటి ప్రగ్యా జైస్వాల్‌ ఓ బంపర్‌ ఆఫర్‌ దక్కించుకుంది. 'మిర్చిలాంటి కుర్రాడు'తో టాలీవుడ్‌కి పరిచయమై, 'కంచె'లో వరుణ్‌తేజ్‌ సరసన నటించిన ప్రగ్యా తాజాగా స్టార్‌ హీరో మహేష్‌బాబు సరసన నటించే లక్కీ ఛాన్స్‌ను అందుకుంది. 'కంచె'లోని సీత పాత్రతో ప్రేక్షకుల్ని మెప్పించిన ప్రగ్యాను మురుగదాస్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్‌బాబు సరసన శ్రుతిహాసన్‌ని ఇప్పటికే ఒక నాయికగా తీసుకున్నారు. ఎన్వీప్రసాద్‌, ఠాగూర్‌మధు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రానికి సంబంధించి షూటింగ్‌ కార్యక్రమాలు ఏప్రిల్‌ 12, 2016 నుంచి ప్రారంభం కానున్నాయట.

10:07 - November 7, 2015

తనీష్‌, మేఘశ్రీ, పావని ప్రధాన పాత్రల్లో వి.శ్రీవాత్సవ్‌ దర్శకుడిగా శ్రీ వెంకటేశ్వర విజువల్స్‌ పతాకంపై వేణు ముక్కపాటి నిర్మించిన చిత్రం 'ఓ మై గాడ్‌'. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది. అతిథిగా విచ్చేసిన డి.ఎస్‌.రావు ఆడియో సీడీలను ఆవిష్కరించి మొదటి కాపీని శివశక్తి దత్తాకు అందిం చారు. ఈ సందర్భంగా శివశక్తిదత్తా మాట్లాడారు. నా శిష్యుడు శ్రీవాత్సవ్‌ ఈ చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. చిన్న బడ్జెట్‌లో ఓ హర్రర్‌ చిత్రాన్ని ఇంత బాగా తీర్చిదిద్దడం గొప్ప విషయమని, ఈ చిత్రం పెద్ద హిట్‌ అవుతుంది అని డి.ఎస్‌.రావు తెలిపారు. సినిమా బాగా రావడానికి సహకరించిన నిర్మాత, ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ధన్యవాదాలు అని దర్శకుడు చెప్పారు.

10:06 - November 7, 2015

ఇటీవల 'బ్రూస్‌లీ ద ఫైటర్‌' చిత్రంతో ప్రేక్షకుల ముందు కొచ్చారు చిరంజీవి. ఆయన నటించబోయే 150వ చిత్రం తాజాగా మరో కొత్త మలుపు తిరిగిందని సమాచారం. తొలుత పూరీజగన్నాథ్‌తో 'ఆటోజానీ' చిత్రాన్ని చేసేందుకు చిరంజీవి ఆసక్తి చూపించిన సంగతి తెలిసిందే. అయితే ఆ కథలో ద్వితీయార్థం చిరంజీవికి నచ్చకపోవడంతో ఆ ప్రాజెక్ట్‌కి ఫుల్‌స్టాప్‌ పడింది. తర్వాత వి.వి. వినాయక్‌ దర్శకత్వం లో తమిళంలో ఘనవిజయం సాధించిన విజయ్‌ 'కత్తి' చిత్రాన్ని రీమేక్‌ చేస్తున్నారనే వార్తలు బాగా హల్‌చల్‌ చేశాయి. అయితే తాజాగా ఈ వార్తకి కూడా బ్రేక్‌పడి చిరంజీవి 150వ చిత్రానికి సంబంధించి సరికొత్త విషయం వెలుగులోకి వచ్చింది. రాజ్‌కుమార్‌ హిరానీ 'మున్నాభాయ్‌' సిరీస్‌లో భాగంగా మరో చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి విదితమే. హిందీతో పాటు తెలుగులో కూడా ఆ చిత్రాన్ని హిరానీ చేసేందుకు సుముఖంగా ఉన్నారట. తెలుగులో చిరంజీవితో ఈ ప్రాజెక్ట్‌ ఉండొచ్చని తెలుస్తోంది. లేదా కథ మాత్రమే తీసుకుని తెలుగు దర్శకులతో ఈ సినిమాని చిరంజీవి చేసే అవకాశముందని సమాచారం.

10:03 - November 7, 2015

నేటి కాలుష్య వాతావరణంలో చర్మానికి రక్షణ చాలా అవసరం. దీనికోసం ఇంట్లో దొరికే వాటితోనే సహజసిద్దమైన ఫేస్‌ ఫ్యాక్‌ తయారు చేసుకోవచ్చు. ఒక బంగాళదుంపను ఉడికించుకుని ముక్కలుగా కోసుకోవాలి. ఒక చెంచా బంగాళాదుంప గుజ్జును అరచెంచా పెరుగుతో జత చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఓట్స్‌, గుడ్డులోని పచ్చసొన, తేనె సమపాళ్లలో తీసుకొని బాగా మిక్స్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్‌ వేసుకోవడం వల్ల చర్మం సున్నితంగా మారడంతో పాటు తాజాగా అనిపిస్తుంది.

10:02 - November 7, 2015

సాధారణంగా అమ్మాయిలు అందంగా కనిపించడానికి రకరకాలైన ఫెయిర్‌ నెస్‌ క్రీములు, లిప్‌ స్టిక్‌ లు, మేకప్‌ కిట్‌ లను ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ వాటివల్ల వచ్చే నష్టాలను గ్రహించలేకపోతున్నారు. వీటిలో అధిక మొత్తంలో ఫాస్పరస్‌, హానికరమైన నికెల్‌ వంటి లోహాలు ఉన్నాయని ఒక అధ్యయనంలో తేలింది. ఢిల్లీ, కోల్‌కతా లలోని సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌ మెంట్‌ సంస్థలు తమ నివేదికలో ఈ విధంగా వెల్లడించారు. నిబంధనల ప్రకారం సౌందర్య సాధనాల్లో పాదరసాన్ని వినియోగించడం నిషిద్ధం. ఎందుకంటే ఇవి కిడ్నీలను దెబ్బతీసే అవకాశం వుంది. అంతేకాదు.. శరీరంపై దద్దుర్లు రావడం, చర్మం రంగు మారి పోవడం, చర్మం మీద మచ్చలు ఏర్పడడం వంటివి జరుగుతాయని వారు తేల్చి చెబుతున్నారు. అమ్మా యిలు వీటిని నిరంతరం వాడటం వల్ల వారి ప్రాణానికే ప్రమాదం వుందని హెచ్చరిస్తున్నారు. అమ్మాయిలు వీలైనంతవరకు తక్కువ మోతాదు లోనే వీటిని వేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. అలాగే చర్మనిపుణులైన డాక్టర్ల దగ్గర వీటికి సంబంధించిన నిబంధనలను తీసుకొని, పాటించమని వారు సూచిస్తున్నారు.

ముగ్గురు ఫాస్టర్లను అపహరించిన మావోయిస్టులు

తూర్పుగోదావరి : చింతూరు, ఏటపాక మండలాల్లో ముగ్గురు ఫాస్టర్లను మావోయిస్టులు అపహరించారు. వారం రోజుల క్రితం ఓ ఫాస్టర్ కుమారుడిని కూడా మావోయిస్టులు ఎత్తుకెళ్లారు.

కసింకోటలో ఉద్రిక్తత....

విశాఖపట్టణం :కసింకోటలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. అయితే... మృతదేహాన్ని స్మశానవాటికకు తరలించే విషయంలో రెండు భిన్న సామాజిక వర్గాలు నిరాకరించడంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులేర్పడ్డాయి. తమ కాలనీల నుంచి మృతదేహాలను తీసుకెళితే అరిష్టమంటూ స్థానికులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని స్థానికులకు సర్ధిచెప్పినా కాలనీ వాసులు ఏమాత్రం వినలేదు. ప్రస్తుతం ఇంటి వద్దే మహిళ మృతదేహం ఉంది.

మరో సారి రెచ్చిపోయిన ఎమ్మెల్యే చింతమనేని

విజయవాడ : దెందులూరు ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయారు. సుప్రీం కోర్టు నిబందనలు వ్యతిరేకించి కొల్లేరు అభయారణ్యంలో రహదారి నిర్మాణం చేశారు. శుక్రవారం అర్థరాత్రి కృష్ణా జిల్లా ఆటపాక పక్షుల అభయారణ్యంలో తన నియోజకవర్గంలో ని గ్రామమైన కోమటిలంకకు సుమారు కిలోమీటరు పొడవున రహదారి నిర్మాణం చేపట్టారు. అడ్టువచ్చిన అటవీ శాఖ సిబ్బంది పై దురుసుగా ప్రవర్తించి అసవరమైతే కేసులు నమోదు చేసుకోమంటూ బెదిరించారు. దీనిపై డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కే ఈశ్వరరావు కైకలూరు పీఎస్ లో ఫిర్యాదు చేశారు.

శ్రీవారి సేవలో తమిళ నటుడు అజిత్

తిరుమల : శ్రీవాని తమిళనటుడు అజిత్ దర్శించుకున్నారు. ఈ రోజు వేకువజామున స్వామివారి సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ సిబ్బంది ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు.

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతు ఆత్మహత్య

ఆదిలాబాద్ : దిలావర్ పూర్ లో సాయరెడ్డి అనే పత్తి రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పదెకరాల్లో సాగు చేసిన పత్తి పంట ఎండిపోవడంతో మనస్తాపం చెంది పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ఒడిగట్టాడు.

09:17 - November 7, 2015

విశాఖ : ఏకపక్షంగా బాక్సైట్ తవ్వకాలకు ఏపీ సర్కార్ బాక్సైట్ తవ్వకాలకు అనుమతిని నిరసిస్తూ విశాఖ మన్యంలో సీపీఎం ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పాడేరు ఆర్టీసీ డిపో ముందు అఖిల పక్షం ధర్నా చేపట్టింది. ఏజెన్సీ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులను యాజమాన్యం రద్దు చేసింది. మరో వైపు రాజకీయ పక్షాలు అన్నీ ఒకే వేదిక పైకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అడవినే నమ్ముకుని బతుకుతున్న వారి నోట్లో మట్టి కొట్టేందుకు ప్రయత్నిస్తున్న సర్కార్‌పై ప్రజా సంఘాలు నిప్పులు కక్కుతున్నాయి. జీవో నెంబర్‌ 97ను వెనక్కు తీసుకునేవరకు పోరాడతామని బాక్సైట్ వ్యతిరేక కమిటీ సభ్యులు హెచ్చరిస్తున్నారు.

విద్యుదాఘాతంతో అత్తా కోడలు మృతి

నల్గొండ : వేములపల్లి మండలం రావుల పెంటలో విషాదం చోటు చేసుకుంది. దండెంపై బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్ తో అత్తా, కోడలు మృత్యువాత పడ్డారు.

ఆటో -లారీ ఢీ: ఐదుగురికి గాయాలు..

ప్రకాశం: దేశవారిపేట మండలం ఓంకారపురం సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో - లారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

08:45 - November 7, 2015

నల్లగొండ : శెట్టిపాలెంలో ఇద్దరు యువతుల సహజీవనం చర్చనీయాంశమైంది. మిర్యాలగూడ ప్రకాశ్ నగర్‌కు చెందిన శ్రీదేవి, శెట్టిపాలెంకు చెందిన అన్నామణి వరుసకు వదినా మరదళ్లు.. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి ఇంట్లోంచి పారిపోయారు.. గతంలో ఇద్దరికీ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ తర్వాత శ్రీదేవికి పెళ్లిచేశారు తల్లిదండ్రులు.. అయినా అతనితో కలిసి ఉండలేక విడాకులు తీసుకుంది.. అన్నామణితో కలిసి మళ్లీ సహజీవనం మొదలుపెట్టారు.. అయితే శ్రీదేవే తమ కుమార్తెను సహజీవనానికి పోత్సహిస్తున్నారంటూ అన్నామణి తల్లి వేములపల్లి పోలీసులను ఆశ్రయించారు..  

08:42 - November 7, 2015

హైదరాబాద్‌ : బంజారాహిల్స్‌లో పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలను నడుపుతున్న 14 మందిపై కేసులు నమోదు చేశారు. 6 కార్లు, 8 ద్విచక్రవాహనాలను సీజ్‌ చేశారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్న సమయంలోనే ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. డివైడర్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. 

08:40 - November 7, 2015

గుంటూరు: చిలకలూరిపేట మండలం గనపవరం హైవేపై లారీ బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లడంతో నలుగురు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతులను చిలకలూరి పేట ప్రభుత్వాసుపత్రిక తరలించారు. ఒంగోలు నుంచి విజయవాడకు వస్తున్న లారీ శనివారం తెల్లవారుజనమున హైవే పక్కన ఉన్న టీ స్టాల్ లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో టీస్టాల్ యజమానులు భార్యా, భర్త, టీ తాగేందుకు వచ్చిన మరో ఇద్దరు మృతి చెందారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడని.. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

07:59 - November 7, 2015

హైదరాబాద్ :రైతు ప్రయోజనాల కంటే ... రాజకీయ ప్రయోజనాలకే ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయని 'న్యూస్ మార్నింగ్' లో పాల్గొన్న నేతలు అభిప్రాయాపడ్డారు. తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిపై ఓ రైతు చెప్పు విసిరారు. రైతు ఆత్మహత్యలను తెలంగాణ సర్కార్ ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదు? కేంద్ర ప్రభుత్వం రైతు సమస్యలపై దృష్టి సారించడం లేదా? పండిన పంటకు కనీస మద్దతు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అయ్యిందా? బీహార్ ఎన్నికల ఫలితాలు దేశాన్ని శాసించనున్నాయా? దేశంలో అసహనం పెరగడానికి కాంగ్రెస్, వామపక్షాలే కారణమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆరోపిస్తున్నారు. వెంకయ్యనాయుడు మాటల్లో వాస్తవమెంత? ఇత్యాది అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో సీపీఎం నేత నంద్యాల నర్శింహారెడ్డి, కాంగ్రెస్ కైలాష్ , టిడిపి నేత సతీష్ మాదిగ, బిజెపి నేత వాసుదేవరావు, టిఆర్ ఎస్ నేత తాడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. మరి ఆ చర్చను మీరూ వినాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...


 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

హైదరాబాద్ : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 3 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 4 గంటలు, కాలినడక వచ్చే భక్తులకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. 

నేడు విశాఖ ఏజెన్సీ బంద్

హైదరాబాద్ : విశాఖపట్టణంలోని శనివారం ఏజెన్సీ ప్రాంతం బంద్‌కు అఖిలపక్షం పిలుపునిచ్చింది. ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ అఖిలపక్షం బంద్ కు పిలుపునిచ్చింది. ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వొద్దంటూ గత కొంతకాలంగా అక్కడి గిరిజనులతోపాటు ఆయా పార్టీలు, ప్రజా సంఘాలు కోరుతున్నాయి. అయినా... రాష్ట్ర ప్రభుత్వం వారి విన్నపాన్ని పక్కనబెట్టి బాక్సైట్ తవ్వకాలకు ఏపీఎండీసీకి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

రెండు బస్సుల మధ్య నగిలిపోయిన వ్యక్తి దుర్మరణం...

కర్నూలు : ఎదురుగా వస్తున్న రెండు బస్సుల మధ్య నుంచి వెళ్లబోయిన బైకిస్టు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా పాములపాడు మండలం రుద్రవరం గ్రామంలో జరిగింది. నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు(35) బైక్‌పై వెళ్తున్నాడు. రుద్రవరం వద్ద రెండు బస్సుల మధ్య నుంచి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే, అదే సమయంలో రెండు బస్సులు కదలటంతో వాటి మధ్యలో నలిగిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

07:08 - November 7, 2015

హైదరాబాద్ : బీహార్‌ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్‌ పోల్స్‌లో ఎన్డీటీవీ, ఎన్డీఏ కూటమికి ఊరటనిచ్చే ఫలితాల్ని వెల్లడించింది. ఇప్పటి వరకూ విడుదలైన ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల్లో ఒక్కటి మినహా, అన్నిటా ఎన్డీయే కూటమికి చేదు ఫలితాలే వచ్చాయి. దాంతో బీజేపీ శ్రేణులు కాస్తంత నిరాశ చెందాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ని పూర్తిగా నమ్మడానికి వీల్లేదనీ, తాము బీహార్‌లో తిరుగులేని విజయాన్ని నమోదు చేస్తామని ఎన్డీయే కూటమికి నాయకత్వం వహిస్తోన్న బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు.

ఎన్డీటీవీ ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల్లో .....

ఇక తాజాగా వెల్లడయిన ఎన్డీటీవీ ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల్లో బీజేపీకి అనుకూలంగా లెక్కలు తేలాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆధ్వర్యంలోని మహాకూటమికి మొత్తం 243 స్ధానాల్లో 105 నుంచి 115 స్థానాల వరకు వస్తాయని తేలగా.. బీజేపీ కూటమికి 120 నుంచి 130 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఇక ఇతరులకు ఐదు నుంచి పది స్థానాలు వచ్చే అవకాశం ఉందని NDTV ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల్లో తెలిపాయి.

ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో మహాకూటమికే...

కాగా ఇప్పటికే ఆయా చానెళ్లు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో బిహార్ వాసులు... మహాకూటమికే పట్టంగట్టే అవకాశం ఉందని అంచనాలు వేశాయి. ముఖ్యంగా టైమ్స్ నౌ వర్గాలు జేడీయూ 112-132 స్థానాలతో మహాకూటమి అధికారం చేపట్టే అవకాశం ఉందని స్పష్టం చేయగా, ఇండియాటుడే - సిసెరో సంస్థలు నిర్వహించిన సర్వేలో మాత్రం ఎన్డీయేకు 120, మహాకూటమికి 117 స్థానాలు రావొచ్చని అంచనా వేసింది.

ఆదివారం బీహార్‌ అసెంబ్లీ ఫలితాలు....

ఆదివారం బీహార్‌ అసెంబ్లీ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈలోపు ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలతో పండగ చేసుకునేవారు పండగ చేసుకోవచ్చు.. నీరసించేవారు నీరసించొచ్చు. ఫైనల్‌గా ఆదివారం రిజల్ట్‌ తేలిపోతుంది. దీంతో బీహార్‌ పీఠంపై ఎవరిది గెలుపో, ఎవరిది ఓటమో ఇట్టే తేలిపోతుంది.

07:06 - November 7, 2015

హైదరాబాద్ : మొహాలీ టెస్ట్‌పై భారత జట్టు పట్టు బిగిస్తోంది. తొలి రోజు బ్యాట్స్‌మెన్‌ తేలిపోయినా...రెండో రోజు బౌలర్లు సమిష్టిగా రాణించి టీమిండియాను పోటీలో నిలిపారు. రెండో ఇన్నింగ్స్‌లో చటేశ్వర్‌ పుజార, మురళీ విజయ్ బాద్యతాయుతంగా ఆడి భారీ స్కోర్‌కు పునాది వేశారు.

తొలి రోజు ఆటలో తేలిపోయిన టీమిండియా....

మొహాలీ టెస్ట్‌ తొలి రోజు ఆటలో తేలిపోయిన టీమిండియా....రెండోరోజు మాత్రం ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో మ్యాచ్‌పై పట్టు బిగించింది. స్పిన్నర్లు సమిష్టిగా రాణించడంతో పాటు....టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ రాణించడంతో భారత జట్టు దక్షిణాఫ్రికా కంటే మెరుగైన స్థితిలో నిలిచింది.

184 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా...

ఓవర్‌ నైట్‌ స్కోర్‌ 28 పరుగులకు 2 వికెట్లతో రెండో రోజు బ్యాటింగ్‌ కొనసాగించిన దక్షిణాఫ్రికా జట్టు...బ్యాట్స్‌మెన్‌ తేలిపోవడంతో భారీ స్కోర్‌ నమోదు చేయలేకపోయింది.భారత స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీందర్ జడేజా, అమిత్‌ మిశ్రాల ధాటికి సఫారీ బ్యాట్స్‌మెన్‌ క్యూ కట్టారు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 184 పరుగులకే కుప్పకూలింది.

డివిలియర్స్‌ 63 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా.....

సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో డివిలియర్స్‌ 63 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో అశ్విన్‌ 5 వికెట్లు పడగొట్టగా....జడేజా 3, మిశ్రా రెండు వికెట్లు తీశారు. 17 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో...రెండో ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌ ఆరంభించిన భారత జట్టు ఆరంభంలోనే తడబడింది.ఓపెనర్‌ శిఖర్ ధావన్‌ మరోసారి డకౌటై నిరాశపరచాడు.

బ్యాట్స్‌మెన్‌ భారీ స్కోర్ నమోదు చేయడంపైనే...

మరో ఓపెనర్‌ మురళీ విజయ్‌, వన్‌ డౌన్‌ బ్యాట్స్‌మెన్ చటేశ్వర్‌ పుజారాతో కలిసి 86 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకున్నాడు.47 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద విజయ్ ఔటైన తర్వాత వచ్చిన విరాట్‌కొహ్లీ...ఆచితూచి బ్యాటింగ్‌ చేయగా....మరో ఎండ్‌లో క్రీజ్‌లో పాతుకుపోయిన పుజారా టెస్టుల్లో 7వ హాఫ్‌సెంచరీ నమోదు చేశాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సరికి రెండు వికెట్లకు 125 పరుగులు చేసిన భారత జట్టు....ఓవరాల్‌గా 142 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.పుజారా 63 పరుగులు,కొహ్లీ 11 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాట్స్‌మెన్‌ భారీ స్కోర్ నమోదు చేయడంపైనే ....భారత జట్టు విజయావకాశాలు ఆధారపడిఉన్నాయి. మరి కీలకమైన మూడో రోజు ఆటలో కొహ్లీ అండ్‌ కో ఏ స్థాయిలో రాణిస్తుందో చూడాలి.

07:02 - November 7, 2015

హైదరాబాద్ : బెంగలూరులో మరో నిర్భయ తరహా ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న బస్సులో ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డ మృగాలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నెల రోజుల క్రితం బెంగలూరులో కాల్‌సెంటర్‌ ఉద్యోగినిపై ఇదే తరహా గ్యాంగ్‌ రేప్‌ జరిగింది.

నిర్భయ లాంటి మరో ఘటన....

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ లాంటి మరో ఘటన బెంగలూరుకు 40 కిలోమీటర్ల దూరంలో హోసకొటేలో చోటు చేసుకుంది. ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న 18 ఏళ్ల యువతి గ్యాంగ్‌ రేప్‌కు గురైంది.

బస్సులో ఒంటరిగా ఉన్న నర్స్‌ను బెదిరించి....

రోజు విధులకు వెళ్లే మాదిరిగానే బాధితురాలు ప్రయివేటు మినీ బస్సు ఎక్కింది. ఆ సమయంలో బస్సులో డ్రైవర్‌, క్లీనర్‌ మాత్రమే ఉన్నారు. కొద్ది దూరం వెళ్లాక బస్సు డ్రైవర్‌ రవి క్లీనర్‌ మంజునాథ్‌కు బస్సు నడపమని స్టీరింగ్‌ అప్పగించాడు. బస్సులో ఒంటరిగా ఉన్న నర్స్‌ను బెదిరించి రవి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను లక్కొండనహల్లి క్రాస్‌ వద్ద వదిలి పరారయ్యారు.

హోస్‌కోటెలోని ఓ ఆసుపత్రిలో చికిత్స....

బాధితురాలు హోస్‌కోటెలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మినీబస్సు డ్రైవర్‌ 26 ఏళ్ల రవి, క్లీనర్‌ 23 ఏళ్ల మంజునాథ్‌లను అరెస్ట్‌ చేశారు. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలను సహించేది లేదని కర్నాటక హోం మంత్రి పరమేశ్వర్‌ స్పష్టం చేశారు. చట్ట ప్రకారం నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు.

కాల్‌సెంటర్‌లో ఉద్యోగిని పై....

గత నెల అక్టోబర్‌ 3న బెంగలూరు కాల్‌సెంటర్‌లో ఉద్యోగం చేస్తున్న 23 ఏళ్ల యువతిపై కూడా కదులుతున్న మినీబస్సులో గ్యాంగ్‌రేప్‌ జరిగింది. ఒంటరిగా ఉన్న యువతిపై డ్రైవర్‌, క్లీనర్‌ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కూడా డ్రైవర్‌, క్లీనర్‌లను అరెస్ట్ చేశారు. కాల్‌సెంటర్‌ యువతి ఘటన జరిగి నెలరోజులు కాకముందే అదే తరహా ఘటన బెంగులూరులో వెలుగు చూడడంపై మహిళలు ఆందోళన చెందుతున్నారు. పోలీసుల వైఫల్యాన్ని ఎండగడుతున్నారు.

నిర్భయ చట్టం అమలులోకి వచ్చినా.....

2012లో ఢిల్లీలో కదులుతున్న బస్సులో విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం దేశ వ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ యువతికి మీడియా నిర్భయ అనే పేరు పెట్టింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వారం రోజులకు నిర్భయ మృతి చెందింది. నిర్భయ చట్టం అమలులోకి వచ్చినా మహిళలపై అత్యాచారాల పర్వం కొనసాగుతూనే ఉంది.

06:58 - November 7, 2015

హైదరాబాద్ : అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంతో ముంబై పోలీసులకు సంబంధం ఉందా? చోటా రాజన్‌ పేరు చెబితేనే ముంబై పోలీసులు ఉలిక్కి పడుతున్నారు. సిబిఐ విచారణలో రాజన్‌ ఎక్కడ తమ పేర్లు బయట పెడతాడోనని వారు టెన్షన్‌ పడుతున్నారు. సిబిఐ ముందు ఛోటా రాజన్‌ ఏం చెబుతాడన్నది ఆసక్తిగా మారింది.

ఛోటా రాజన్‌పై సిబిఐ విచారణ ముమ్మరం.....

అండర్‌ వరల్డ్‌ డాన్‌ ఛోటా రాజన్‌పై సిబిఐ విచారణ ముమ్మరం చేసింది. దావూద్‌ ఇబ్రహీంతో ముంబై పోలీసులకున్న సంబంధాలను సిబిఐ విచారణలో వెల్లడించే అవకాశం ఉందని ఇండియా టుడే వెబ్‌సైట్‌ ప్రధానంగా పేర్కొంది. దావూద్‌ ఇబ్రహీంతో కొందరు ముంబై పోలీసు అధికారులకు సంబంధం ఉందని రాజన్‌ గతంలో ఆరోపించారు. ఈ కోణంలోనే సిబిఐ విచారించే అవకాశం కనిపిస్తోంది. గతంలో తనను ముంబై పోలీసులు వేధించారని కూడా రాజన్‌ ఆరోపించాడు.

25 ఏళ్ల తర్వాత ముంబై కి ఛోటా...

గత నెల 25న ఆస్ట్రేలియా నుంచి బాలికి వచ్చిన రాజన్‌ను ఇండోనేసియాలో ఇంటర్‌పోల్‌ అధికారులు విమానాశ్రయంలోనే అరెస్ట్ చేశారు. 25 ఏళ్ల తర్వాత ముంబై అండర్‌ వరల్డ్‌ డాన్‌ ఛోటా రాజన్‌ ఇండియాలో అడుగు పెట్టాడు. ఛోటా రాజన్‌ అసలు పేరు రాజేంద్ర నిఖాల్జే. సీబీఐ అధికారులు భారీ భద్రత నడుమ ఇండోనేషియా బాలి నుంచి రాజన్‌ను ప్రత్యేక విమానంలో ఇండియాకు తీసుకొచ్చారు. భారత్‌లో రాజన్‌పై హత్య, స్మగ్లింగ్, బలవంతపు వసూళ్లు తదితర 75కు పైగా కేసులున్నాయి. దాదాపు 70 ముంబైలోనే నమోదై ఉన్నాయి. టాడా, ఉగ్రవాద నిరోధక చట్టం, మోకా చట్టాల కింద ఆయనపై కేసులున్నాయి. ముంబైలో తన ప్రాణాలకు ముప్పు ఉందని...అక్కడికి తరలించొద్దని రాజన్‌ కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించాడు. దీంతో చోటారాజన్‌పై నమోదైన కేసులన్నింటినీ మహారాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి బదిలీ చేసింది. 

06:55 - November 7, 2015

హైదరాబాద్ : స్వచ్ఛ భారత్‌ సేవా పన్ను వచ్చేస్తోంది. సర్వీస్‌ ట్యాక్స్‌ పరిధిలోకి వచ్చే అన్ని రకాల సేవలపైనా స్వచ్ఛ భారత్‌ సేవా పన్ను విధించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ దీపావళి తర్వాత నుంచి దేశ ప్రజలకు సైలెంట్‌గా పన్నుల మోత మోగించనున్నారు. ఇప్పటికే సేవా పన్ను 14 శాతానికి ఎగబాకిన నేపథ్యంలో మరో అదనపు భారంగా స్వచ్ఛ సెస్‌ పేరిట కొత్త పన్నులను వసూలు చేసేందుకు కేంద్రం సిద్ధమైపోతోంది.

ఈనెల 15 నుంచి పన్ను పరిధిలోకి....

త్వరలో హోటళ్లు, మొబైల్ బిల్లులు, సినిమా టిక్కెట్లు, బ్యాంకింగ్, విమానయాన సర్వీసులతోపాటు అన్ని రకాల సేవలు మరింత పైకి ఎగబాకనున్నాయి. ఈనెల 15 నుంచి పన్ను పరిధిలోకి వచ్చే సేవలన్నింటిపై అదనంగా 0.5 శాతం స్వచ్ఛభారత్ సుంకం విధిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ప్రస్తుతం అమలులో ఉన్న 14 శాతం సేవా పన్నుకు ఇది అదనమని పేర్కొంది.

మిగిలిన కాలానికి స్వచ్ఛభారత్ సుంకం.....

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి స్వచ్ఛభారత్ సుంకం విధింపు ద్వారా కేంద్రానికి రూ.400 కోట్ల ఆదాయం సమకూరనుందని అంచనా. అన్ని రకాల సేవలపై 2 శాతం వరకు స్వచ్ఛ భారత్ సుంకం విధించాలని ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపాదించారు. తాజాగా సుంకాన్ని 0.5 శాతంగా నిర్ణయించారు. అంటే ప్రతి రూ.100 విలువైన సేవలపై మరో 50 పైసలు సెస్సు రూపంలో వసూలు చేయనున్నారు.

దేశంలోని ప్రతిఒక్కరూ ఈ పథకానికిచ్చే తోడ్పాటని.....

అయితే ఇది అదనపు పన్ను కాదని, దేశంలోని ప్రతిఒక్కరూ ఈ పథకానికిచ్చే తోడ్పాటని, ఈ సుంకం విధింపు ద్వారా సమకూరిన మొత్తాన్ని స్వచ్ఛభారత్ కార్యక్రమాలకే ఉపయోగించనున్నట్లు తన స్టేట్‌మెంట్‌లో ఆర్థిక శాఖ పేర్కొంది. ప్రధాని మోదీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకాల్లో స్వచ్ఛ భారత్ ఒకటి. ఇదిలా ఉంటే ప్రధాని మోదీ ప్రారంభించిన స్వచ్ఛభారత్ కార్యక్రమం ఇటీవలే ఏడాది పూర్తయ్యింది. దీనిపై తాజాగా కేంద్రప్రభుత్వం సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. కాగా ఇప్పటికే స్వచ్ఛ భారత్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం తెగ పబ్లిసిటీ చేసింది. కేవలం ప్రచారం కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేసి నిధులను దుర్వినియోగం చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.  

06:49 - November 7, 2015

హైదరాబాద్ : వరంగల్‌ ఉపఎన్నికల ప్రచారానికి వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సిద్ధమయ్యారు. గతంలో పరాభవం ఎదురైన వరంగల్‌ జిల్లాలోనే మళ్లీ జాతకాన్ని పరీక్షించుకునేందుకు జగన్‌ ప్రణాళికలు రచిస్తున్నారు. వైఎస్‌ఆర్‌ సంక్షేమ, అభివృద్ధి పథకాలే వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తాయని ఆ పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. ఇక జగన్‌ ప్రచారంతో వైసీపీ ప్రభంజనం సృష్టిస్తుందని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

గెలుపే లక్ష్యంగా రెట్టించిన ఉత్సాహంతో....

వరంగల్‌ ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా రెట్టించిన ఉత్సాహంతో ప్రచారానికి ప్రణాళికలు రచిస్తోంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ. వైసీపీకి చెందిన తెలంగాణ, ఏపీ నేతలను రంగంలోకి దించడమే కాకుండా.. పార్టీ అధినేత జగన్‌ స్వయంగా ప్రచారంలో పాల్గొని వరంగల్‌ ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేయబోతున్నారు. ఈ నెల 16 నుంచి 19 వరకు జగన్‌ వరంగల్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించనున్నట్లు పార్టీ నేతలు ప్రకటించారు.

అభివృద్ధి పథకాలు వరంగల్‌ ప్రజల గుండెల్లో .....

దివంగత నేత వైఎస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, రైతు శ్రేయస్సు కోసం తీసుకున్న అభివృద్ధి పథకాలు వరంగల్‌ ప్రజల గుండెల్లో ఇంకా ఉన్నాయని వైసీపీ నేతలు విశ్వసిస్తున్నారు. అందులో భాగంగానే వైసీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌ వరంగల్‌ ఉపఎన్నికల్లో విజయం సాధిస్తారని ఆపార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. క్యాడర్‌లో ఉత్సాహం నింపడంతో పాటు వరంగల్‌ ఓటర్లను ఆకర్షించడానికి వినూత్నరీతిలో ప్రచారం చేయాలని వైసీపీ ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా ప్రజాధరణ ఉన్న ఎమ్మెల్యే రోజా, నేతలు బొత్స సత్యనారాయణ, సినీ నటులు రాజా, విజయ్‌చందర్‌, రాశి వంటి ప్రముఖులను ఉపయోగించుకోవాలని చూస్తోంది. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే తిరిగి దొరకబుచ్చుకోవాలనుకుంటున్న వైఎస్‌ జగన్‌కు వరంగల్‌ ఉప ఎన్నికలో ప్రజలు ఎలాంటి తీర్పును ఇస్తారో వేచి చూడాలి.

06:47 - November 7, 2015

హైదరాబాద్ : తెలంగాణ బీజేపీని ఇప్పుడు వ‌రంగ‌ల్ ఉపఎన్నిక‌ హడలెత్తిస్తోంది. ఢిల్లీని ఏలుతున్న పార్టీయే అయినా వ‌రంగ‌ల్‌ ఉప‌పోరు మాత్రం నిద్రపట్టనీయడం లేదు. తొలుత ఎంతో ఉత్సాహంతో బ‌రిలోకి దిగిన కమలనాథులకు ఓరుగ‌ల్లు గ‌డ్డమీద కాలుపెడుతుండగానే స‌మ‌స్యలు స్వాగతం పలికాయి. అభ్యర్థి ఎంపిక విషయంలో కినుకు వహించిన లోక‌ల్‌ నేత‌లు... ప్రచార పర్వంలో అంటీముట్టన‌ట్లుగా వ్యవహరిస్తుండ‌డంతో రాష్ట్ర అగ్రనేతలకు టెన్షన్‌ మొదలైంది.

అభ్యర్థి ఎంపిక నాడే బీజం...

బీజేపీ నాయకుల క‌ష్టాల‌కు వ‌రంగ‌ల్‌ అభ్యర్థి ఎంపిక నాడే బీజం ప‌డింది. ద‌శాబ్దాలుగా పార్టీ తరపున ప‌నిచేస్తున్న వారిని కాద‌ని ఎన్ఆర్ఐ దేవ‌య్యను రాష్ట్రనాయ‌క‌త్వం ఎంపిక చేయడం .. జిల్లా నేత‌లకు మింగుడుపడడం లేదు. మాజీ ఎమ్మెల్యే జైపాల్‌తోపాటు మ‌రో ఇద్దరు స్థానిక నేత‌లకు అవ‌కావం వ‌స్తుంద‌ని తొలుత ఆశించారు. అదే అంశాన్ని అగ్ర నాయకులకు విన్నవించినా రాష్ట్ర అధ్యక్షులు కిష‌న్‌ రెడ్డితోపాటు..ముఖ్య నేత‌లంద‌రు ఒక్కటిగామారి దేవ‌య్యను రంగంలోకి దించారు. దీంతో లోకల్‌ నేతలు ప్రచారపర్వంలో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పైగా రాష్ట్రనేత‌లకు జిల్లా కేడర్‌ నుండి ఎదురవుతున్న ప్రశ్నలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

టిడిపి దోస్తీ కూడా కాషాయనేతలను కంగారు.....

స్వంతింటి పోరుతోపాటు టిడిపి దోస్తీ కూడా కాషాయనేతలను కంగారుపుట్టిస్తోంది. ఉద్యమానికి పురిటిగ‌డ్డ అయిన ఓరుగ‌ల్లులో తెలంగాణ సెంటిమెంట్‌కు కొద‌వ‌లేదు. స‌రిగ్గా దీన్నే అస్త్రంగా ఎంచుకున్న టిఆర్ఎస్‌ ప్రత్యర్థులపై విమర్శలు ఎక్కుపెట్టడంతో బిజెపికి ఇబ్బందిగా మారింది. చంద్రబాబు తెలంగాణ అభివృద్ధికి అడ్డుప‌డుతున్నార‌ని... బాబు తెలంగాణ వ్యతిరేకనే అభిప్రాయాన్ని టిఆర్‌ఎస్‌ ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో పొత్తు మూలంగా లాభమేంటని నేతలు గుసగుసలాడుతున్నారు. అందుకే ప్రచారానికి చంద్రబాబును తీసుకుపోకూడదని నిర్ణయించుకున్నా డ్యామేజి మాత్రం త‌ప్పదన్న భయం నేతల్లో ఉంది.

ప్రతికూల పరిస్థితులు ఆందోళన .....

మొత్తానికి వ‌రంగ‌ల్‌లో గెలిచి మోడీతో మంచి మార్కులు కొట్టేయాలని ఆశ‌ప‌డ్డ రాష్ట్ర నాయ‌క‌త్వానికి ప్రతికూల పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో ఈ గండం గ‌డిచేదెలా అని తెలంగాణ కమలనాథులు వర్రీ అవుతున్నారు. మరి ఓరుగల్లు ఓటర్లు ఏరకంగా తీర్పిస్తారో చూడాలి.

06:44 - November 7, 2015

హైదరాబాద్ : రాజ‌య్య ఇంట్లో జ‌రిగిన ఎపిసోడ్‌తో స్లో అయిన కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. నామినేష‌న్ వేసిన రోజు నుంచే ప్రచారానికి ముందే సిద్ధం చేసుకున్న స‌రంజామాకు నేతలు దుమ్ము దులుపుతున్నారు. రాజ‌య్యను పార్టీ నుంచి స‌స్పెండ్‌ చేయాలా వ‌ద్దా అనే అంశంపై త‌ర్జన భ‌ర్జన ప‌డుతూనే ప్రచారంలో వెనుక‌ప‌డొద్దని నేతలు డిసైడ్ అయ్యారు.

నిర్ణయించుకున్న షెడ్యూల్‌ ప్రకారంగా.....

ఇప్పటికే నిర్ణయించుకున్న షెడ్యూల్‌ ప్రకారంగా ఉప ఎన్నిక ప్రచారంలోకి దూకుతున్నారు హ‌స్తం నేత‌లు. ప‌ర‌కాల నియోజ‌కవ‌ర్గ స‌భ‌తో నేత‌లంద‌రూ ఒకే వేదిక‌పైకి వ‌చ్చి ప్రచార న‌గారా మోగించారు. రాజ‌య్య పేరును ప్రస్తావనకు తేకుండా.. అధికార పార్టీని టార్గెట్ చేశారు. వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక‌ల్లో త‌మ‌కూ టీఆర్‌ఎస్‌కు మ‌ధ్యే పోటీ అని కాంగ్రెస్‌ నేతలు ప్రచారం చేస్తున్నారు.

ప్రచారంలో వేగం పెంచేందుకు యత్నం...

ప్రచారంలో వేగం పెంచేందుకు కాంగ్రెస్ నేత‌లు ప్రయ‌త్నిస్తున్నారు. ఎన్నిక‌కు రెండు వారాల స‌మ‌య‌మే ఉన్నందున ... ఉన్న స‌మ‌యాన్ని పూర్తిగా స‌ద్వినియోగప‌రుచుకునేందుకు కాంగ్రెస్ నేతలు దృష్టి పెట్టారు. పార్టీ ముఖ్య నేత‌లు ఉత్తమ్‌, భ‌ట్టి, జానా, ష‌బ్బీర్‌తో పాటు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలంతా వ‌రంగ‌ల్‌లోనే మ‌కాం వేయ‌నున్నారు. పాద‌యాత్రలు, డోర్ టూ డోర్ ప్రచారం, కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయ‌త్నం చేస్తున్నారు. నేత‌లంతా క‌లిసిమెలిసి ఉన్నామ‌నే భావ‌న‌ను పార్టీ క్యాడ‌ర్‌లో నింపే ప్రయ‌త్నం చేస్తున్నారు.

ఏక ప‌క్ష ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌నే భావ‌న‌....

రాజ‌య్య ఇంట్లో జ‌రిగిన సంఘ‌ట‌న‌తో ఏక ప‌క్ష ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌నే భావ‌న‌నుంచి బ‌య‌ట ప‌డేందుకు ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నారు కాంగ్రెస్ నేత‌లు. రాజ‌య్య ఎపిసోడ్‌తో ఎంతో కొంత న‌ష్టం త‌ప్పద‌నే భావ‌న‌లో ఉన్న కాంగ్రెస్ నేత‌లు.. డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే ప్రయ‌త్నం చేస్తున్నారు.  

06:41 - November 7, 2015

విశాఖ : మరో పోరాటానికి మన్యం సిద్ధమవుతోంది. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న సర్కార్‌ పై జంగ్‌ సైరన్ మోగించింది. తమ జీవితాలను నాశనం చేయాలని శతవిధాలా ప్రయత్నిస్తున్న ప్రభుత్వానిపై గిరిజనం సమరశంఖం పూరించింది. బాక్సైట్ తవ్వకాలకు ఒప్పుకోనంటూనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన పాలకపక్షంపై యావత్‌ ప్రజానీకం మండిపడుతోంది.

బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకమన్న చంద్రబాబు ......

విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు తాము వ్యతిరేకం అంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊదరగొట్టిన వ్యక్తి చంద్రబాబు. అంతేకాదు 2011లో బాక్సైట్‌ తవ్వకాలను నిలిపివేయాలంటూ గవర్నర్‌కు, కేంద్ర పర్యావరణ శాఖ కమిటీకి వినతిపత్రాలు సమర్పించారు. 1,212 హెక్టార్లలో బాక్సైట్‌ తవ్వకాలకు తానే అనుమతి మంజూరు చేశారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ బాక్సైట్ తవ్వకాలకు ఒప్పుకునేది లేదని చెప్పిన చంద్రబాబే ఇప్పుడు బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతినిస్తూ జీవో నెంబర్‌ 97ఇచ్చేసారు. మాది ప్రజాసంక్షేమ సర్కార్‌ అని చెబుతున్న చంద్రబాబే కార్పోరేట్ శక్తులకు పట్టం కడుతున్నారు.

ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న ప్రజాసంఘాలు.....

బాక్సైట్ తవ్వకాలకు అనుమతినివ్వటంపై విశాఖ మన్యం మండిపడుతోంది. అడవినే నమ్ముకుని బతుకుతున్న వారి నోట్లో మట్టి కొట్టేందుకు ప్రయత్నిస్తున్న సర్కార్‌పై ప్రజా సంఘాలు నిప్పులు కక్కుతున్నాయి. జీవో నెంబర్‌ 97ను వెనక్కు తీసుకునేవరకు పోరాడతామని బాక్సైట్ వ్యతిరేక కమిటీ సభ్యులు హెచ్చరిస్తున్నారు. శనివారం నిర్వహించే బంద్‌ తమ ఆందోళనకు శ్రీకారమని, భవిష్యత్తులో నిరసనలు, పోరాటాలను ఉధృతం చేస్తామంటున్నారు.

అరకు,చింతపల్లిలో 564.9 మిలియన్‌ టన్నుల బాక్సైట్ నిల్వలు.....

విశాఖ ఏజెన్సీలోని అరకు, చింతపల్లి ప్రాంతాల్లో దాదాపు 564.9మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వలు ఉన్నాయని అంచనా. ఈ బాక్సైట్‌ను తవ్వితే, అల్యూమినియంను ఉత్పత్తి చేసే క్రమంలో అత్యంత విషపూరితమైన రెడ్‌మడ్‌ ఉత్త్పత్తి అవుతుంది. ఇదీకాక బాక్సైట్ తవ్వకాలతో మైదానప్రాంతాల్లో నదుల్లో నీరు కన్పించదు. ఈ దుష్పరిణామాలపై గిరిజనులతో పాటు పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాక్సైట్ తవ్వకాలే ప్రారంభమయితే తమ ఆనవాలు కోల్పోతామని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సర్కార్‌ బాక్సైట్ తవ్వకాలకు అనుమతిపై పునరాలోచించుకోవాలని ప్రజాసంఘాల నేతలు హితవు పలుకుతున్నారు.

06:39 - November 7, 2015

హైదరాబాద్ : మారిన పరిస్థితులు.. సరికొత్త సమస్యల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ తెలంగాణ నేతలతో సమావేశం కాబోతున్నారు. రాష్ట్ర కమిటీ ఏర్పడ్డాక నిర్వహించబోతున్న తొలి సర్వసభ్య సమావేశమిది. వరంగల్‌ ఉప ఎన్నిక, ప్రభుత్వ అవినీతి.. ప్రజా వ్యతిరేక విధానాలు, తదితర అంశాలపై చర్చించబోతున్నారు. అయితే టీటీడీపీలో నెలకొన్న సమస్యలూ చంద్రబాబును కలవరపెడుతున్నాయి. అవీ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశముంది.

రాష్ట్ర విభజన తర్వాత మారిన హోదా....

రాష్ట్ర విభజన తర్వాత టిడిపి అధినేత చంద్రబాబు హోదా మారింది. ఇప్పుడు ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు. ఆ హోదాలో తెలంగాణ రాష్ట్ర కమిటీ ఏర్పడ్డాక చేస్తున్న మొట్టమొదటి సర్వసభ్య సమావేశమిది. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ వేదికగా నిర్వహించబోతున్న ఈ మీట్‌లో అనేక అంశాలపై వాడివేడిగా చర్చించనున్నారు.

ప్రభుత్వ చర్యలకు ధీటుగా .....

తెలంగాణలో ప్రభుత్వ చర్యలకు ధీటుగా ఎలా వ్యవహరించాలనే విషయంపై తెలంగాణ తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. వరంగల్లు ఉప ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి, త్వరలో జరగనున్న నారాయణ్‌ఖేడ్‌ ఉప ఎన్నిక టైంలో ఎలా వ్యవహరించాలన్నదానిపైనా చర్చిస్తారు. ప్రతిపక్షంగా ఎలాంటి పాత్ర పోషించాలి, స్వతంత్రంగా ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేసుకోవడం, ప్రజలకు మద్దతుగా నిలవడం గురించి పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు.

ఒకరిపై ఒకరు విమర్శలు.....

ఈమధ్య కాలంలో టి తమ్ముళ్లు పరస్పరం ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ రచ్చకెక్కుతున్నారు. ఇది బాబుకు తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో కలిసికట్టుగా పనిచేయడం గురించి నేతలకు హితబోధ చేసే అవకాశముంది. మొత్తంగా నాయకుల వ్యక్తిగత ప్రయోజనాలకంటే పార్టీ ప్రయోజనాలను కాపాడడమే ధ్యేయంగా పనిచేయాలని సూచించనున్నారు. ఇంతేగాక కృష్ణాగోదావరి నదులపై కర్ణాటక, మహారాష్ట్రలు కడుతున్న అక్రమ ప్రాజెక్టులు, ఎన్నికల హామీల అమలులో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వంపై అవినీతి అభియోగాలు తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఆందోళనలు నిర్వహించడంపై విస్తృతంగా చర్చించనున్నారు.

చాలారోజుల తర్వాత ఒక ముఖ్యమైన సమావేశం....

చాలారోజుల తర్వాత ఒక ముఖ్యమైన సమావేశం నిర్వహించడం, చంద్రబాబు హైదరాబాద్‌కు రానుండడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొందంటున్నారు టిడిపి నేతలు. మరి చంద్రబాబు ఇచ్చే సూచనలు వరంగల్‌ ఉప ఎన్నికలకు ఏమేరకు ప్లస్‌ అవుతాయో, తమ్ముళ్లలో ఐకమత్యం పెంచేందుకు ఎంతమేరకు సాయపడతాయో చూడాలి. 

06:33 - November 7, 2015

మహబూబ్ నగర్ : వరంగల్‌లో సారిక.. కర్నూల్‌లో శైలజ.. మహబూబ్‌నగర్‌లో శ్రీమతమ్మ.. అసహనం, అనాలోచిత నిర్ణయాలతో తీవ్రమైన చర్యలకు మాతృమూర్తులు ఒడిగడుతున్నారు. క్షణికావేశంలో కన్నపిల్లలనే కడతేర్చారు. మహబూబ్‌నగర్‌ జిల్లా ఉప్పునుంతల గ్రామంలో తన ఇద్దరు పిల్లలను చంపి.. తానూ ఆత్మహత్యకు యత్నించింది ఓ కన్నతల్లి. ఉప్పునుంతలకు చెందిన కొత్త నర్సింహారెడ్డి, శ్రీమతమ్మకు ఇద్దరు పిల్లలు. వీరికి ఐదేళ్ల జశ్వంత్‌, రెండేళ్ల కూతురు లక్కీ ఉన్నారు. నర్సింహారెడ్డి భోజనం చేసి పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లగా ఆ సమయంలో శ్రీమతమ్మ తన ఇద్దరు పిల్లల గొంతుకోసి చంపేసింది. తదుపరి తను కూడా కత్తితో గొంతుకోసుకుంది. ఇంట్లో శబ్దం రావడంతో అది గమనించిన అత్త తలుపులు తెరిచి చూడగా ఇద్దరు పిల్లలు అప్పటికే చనిపోయి రక్తపు మడుగులో పడి ఉన్నారు. కొనప్రాణంతో ఉన్న శ్రీమతమ్మను అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. ఆమె ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవడం వెనక ఉన్న కారణాలేంటో అంతుబట్టడంలేదు. భార్యాభర్తలిరువురూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అయితే కుటుంబ సమస్యలేవైనా ఈ దారుణానికి కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. 

ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ:నలుగురుమృతి

గుంటూరు : గనపవరం హైవే పై లారీ బీభత్సం సృష్టించింది. లారీ అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లడంతో నలుగురు మృతి చెందారు.

హైదరాబాద్ లో శ్రీవారి లడ్డు ప్రసాదం..

హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదాలను హైదరాబాద్లో విక్రయించనున్నారు. ఈనెల 8వ తేదీన హిమాయత్‌నగర్ లిబర్టీ వద్ద ఉన్న టీటీడీ తిరునిలయంలో విక్రయిస్తామని హైదరాబాద్ శాఖ జేఈవో రమేష్ శుక్రవారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విక్రయించనున్నారు. ప్రతి నెల రెండో ఆదివారం లడ్డూల అమ్మకం ఉంటుందని ఆయన తెలిపారు.

మాణికేశ్వర్‌నగర్‌లో కార్డన్ సర్చ్

హైదరాబాద్ : ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాణికేశ్వర్‌నగర్‌లో శుక్రవారం రాత్రి తూర్పు మండలం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మాణికేశ్వర్‌నగర్‌లోని పలు షాపులు, ఇళ్లల్లో సోదాలు చేశారు. ఈ సందర్భంగా పది మంది పాత నేరస్తులను అదుపులోకి తీసుకన్నారు. వాహనాల తనిఖీలలో భాగంగా పత్రాలులేని 87 ద్విచక్రవాహనాలు, మూడు ఆటోలు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో తూర్పు మండల డీసీపీ డాక్టర్ రవీందర్, అడిషనల్ డీసీపీ ఎల్‌టీ చంద్రశేఖర్‌రావు, కాచిగూడ ఏసీపీ లక్ష్మీనారాయణ, ఓయూ సీఐ అశోక్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

త్వరలో స్వచ్ఛభారత్ సేవా పన్ను

నూఢిల్లీ:ప్రధాని మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛభారత్ కార్యక్రమం ఇటీవలే ఏడాది పూర్తయ్యింది. దీనిపై తాజాగా కేంద్రప్రభుత్వం సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. అన్ని రకాల సేవలపై 0.5 శాతం స్వచ్ఛభారత్ సెస్ను వసూలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి ఈ పన్ను అమలులోకి రానుంది.

Don't Miss