Activities calendar

08 November 2015

22:14 - November 8, 2015

గుంటూరు : జిల్లాలో ర్యాగింగ్‌ రక్కసికి మరో విద్యార్థిని బలైంది. ఆకతాయిల వేధింపులు తాళలేక రాపోలు తిరుపతమ్మ అనే ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వెల్దుర్తికి చెందిన తిరుపతమ్మ.. మాచర్ల కృష్ణవేణి కాలేజీలో ఇంటర్ చదివేది. కాలేజీకి వెళ్లే సమయంలో ఆకతాయిలు వేధించేవారంటూ తిరుపతమ్మ మూడు పేజీల సూసైడ్‌ నోట్‌ రాసింది. ప్రేమ్‌రాజ్ నాయక్ అనే విద్యార్థి తనను తీవ్రంగా వేధించాడని, అతడిని ముక్కలు, ముక్కలుగా నరికి చంపాలని తన మనోవేదనను నోట్‌లో వెల్లడించింది. తననే కాక మరో పది మంది అమ్మాయిలను వేధించారని తెలిపింది. ప్రేమ్‌రాజ్‌తో పాటు గాబ్రియల్ నాయక్, పవన్, ఆదినారాయణ, వెంకటేష్, సురేష్ మొత్తం ఆరుగురు తన మానసిక వేదనకు కారణమని, వారందరిని కఠినంగా శిక్షించాలని ఆమె కోరింది. తమ కూతురు అర్థాంతరంగా మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమతో ఒక్కమాట చెప్పినా కాలేజీ మాన్పించేవాళ్లమని విలపిస్తున్నారు. ఈ ఘటనపై వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

22:12 - November 8, 2015

హైదరాబాద్ : పోలీసు కొలువుల్లో ఏజ్ అయిపోయింది అనుకున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ అందించింది తెలంగాణ సర్కార్. పోలీసు కొలువుల కోసం అభ్యర్థులకు వయోపరిమితి పెంచాలని నిర్ణయించింది. రాష్ట్రంలో సుమారు 9వేల పై చిలుకు ఎస్ ఐ, కానిస్టేబుల్ కొలువులను ఇవ్వాలని నిర్ణయంచింది ప్రభుత్వం. ఇక ఈ పోలీసు ఉద్యోగాల నియమకాల్లో మూడేళ్లు ఏజ్ రిలక్సేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇదీ ఎస్ ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు వర్తించనుంది. దీనికి సంబంధించిన ఫైల్ పై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. ఇప్పటి వరకు జనరల్ కేటగిరిలో కానిస్టేబుల్స్ నియమకానికి 22 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 27 ఏళ్లు ఉండేది. ప్రభుత్వం మూడేళ్ల సడలింపుతో జనరల్ కేటగిరి అభ్యర్థులకు 25 ఏళ్ల వరకు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు 30 ఏళ్లు ఉన్న వారు కూడా అప్లయ్ చేసుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఇక ఎస్ఐ పోస్టులకు ఇప్పుడు జనరల్ కేటగిరిలో 25 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 28 ఏళ్లు ఉండేది... వీరికి కూడా మూడేళ్లు సడలింపు ఇవ్వాలని నిర్ణయంచింది ప్రభుత్వం.
ఒకే సారి భర్తీ
పోలీసు కమ్యూనికేషన్ విభాగంలో విభజన తరువాత రాష్ట్రానికి 335 కానిస్టేబుల్ పోస్టులు వచ్చాయి. అయితే ఇందులో కేవలం ముగ్గురు మాత్రమే కానిస్టేబుల్స్ ఉన్నారు.... ఇంకా 332 పోస్టులు కాళీలు ఉన్నాయి. వీటిని కూడా ఒకే సారి భర్తీ చేయాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. మొత్తానికి పోలీసు కొలువుల కోసం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ సూచించిన పలు సూచనలను ప్రభుత్వం అమలు చేసింది. ఏళ్లుగా ఉద్యమాలతో నిరుద్యోగ యువత ఎంతో నష్టపోయిందని... వారి కోసమే వయోపరిమతి సడలించినట్లు సర్కార్ పేర్కోంది.

 

22:05 - November 8, 2015

పాట్నా : బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాల అభ్యర్దులు ఈసారి తమ ప్రాతినిధ్యం పెంచుకున్నారు. సీపీఐ ఎంఎల్‌ అభ్యర్ధులు మూడు చోట్ల విజయం సాధించారు. దరౌలీ, బలరామ్‌పూర్‌, జిరదై అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్ధులు విజయం సాధించారు. ఇంతకు ముందు సీపీఐ ఎంఎల్‌కు బీహార్‌ అసెంబ్లీ ప్రాతినిధ్యం లేదు. పశ్చిమ బీహార్‌లోని దరౌలీలో ఎంఎల్‌ అభ్యర్ధి 13 వేల ఓట్ల ఆధిక్యత సాధించారు. బలరామ్‌పూర్‌లో సీపీఐ ఎం ఎల్ అభ్యర్ధి మెహబూబ్‌ అలీ 22 వేల కోట్ల మెజారీటీతో గెలుపొందారు. 2010 అసెంబ్లీ ఎన్నికల్లో మెహబూబ్‌ అలీ 2500 కోట్ల తేడాతో ఓడిపోయారు. అప్పట్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి నెగ్గిన అభ్యర్దే ఇప్పబడు జేడీయూ అభ్యర్ధిగా బరిలోదిగారు. జిరదైలో అమర్‌జిత్‌ కుష్వాహా నెగ్గారు. కొన్ని చోట్ల వామపక్షాలు రెండో స్థానంలో నిలిచాయి.

 

21:55 - November 8, 2015

బీహార్ : దేశవ్యాప్తంగా ఉత్కంఠత రేపిన బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ నేతృత్వంలోని మహాకూటమి విజయం సాధించింది. వివిధ మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌కు భిన్నంగా మహాకూటమి అభ్యర్ధులు భారీ మెజారిటీ సాధించారు. మహాకూటమి 178 స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే 58సీట్లకే పరిమితమైంది. ఈ ఘన విజయంతో మహాకూటమి నేతలు సంబరాల్లో మునిగితేలుతుండా, కమలనాథులు నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. సీపీఐ ఎంల్‌ అభ్యర్ధులు మూడు చోట్ల నెగ్గారు.
మహాకూటమికి పట్టం
అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్‌ ప్రజలు మహాకూటమికి పట్టం కట్టారు. ఈ కూటమికి ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కమలనాథులు పెట్టుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. అధికారంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాషాయదళం ఫలితాలను చూసిఖంగుతిన్నది. సొంతంగా అధికారంలోకి రావాలకున్న బీజేపీ నాయకులు అడియాశలయ్యాయి. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటుపై దృష్టి పెట్టింది.
మహాకూటమి 178 స్థానాల్లో విజయం
ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచే మహాకూటమి అభ్యర్ధులు ఆధిక్యత కొనసాగింది. మొదటి నుంచి కూడా చాలా ప్రాంతాల్లో ఎన్డీయే అభ్యర్ధులు వెనుకబడిపోయారు. చివరి వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ వచ్చింది. మహాకూటమి అభ్యర్ధ్యులు 178స్థానాల్లో విజయం సాధించారు. ఈ కూటమికి నేతృత్వం వహించిన జేడీయూ 71 సీట్లలో విజయం సాధించింది. ఆర్జేడీ 80స్థానాలను గెలుచుకుంది. మహాకూటమిలోని మూడో పార్టీ కాంగ్రెస్‌ 26 సీట్లలో గెలుపొంది, గతంలో కంటే తన పరిస్థితి మెరుగుపరుచుకుంది. 2010 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 4 నోట్ల మాత్రమే నెగ్గింది. జేడీయూ, ఆర్జేడీ 101 స్థానాలకు పోటీ చేశాయి. కాంగ్రెస్‌ 40 సీట్లకు అభ్యర్ధులను నిలబెట్టింది. ఏడు చోట్ల స్వతంత్ర అభ్యర్ధులు గెలుపొందారు.
ఎన్డీయే 58 చోట్ల విజయం
ఎన్డీయేకి నేతృత్వం వహించిన బీజేపీ బీహార్‌లో తన ప్రాభవాన్ని కోల్పోయింది. 2005, 2010 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూతో పొత్తుపెట్టుకుని మంచిఫలితాలు సాధించిన కమలనాథులు ఈసారి సొంత జట్టును ఏర్పాటు చేసుకుని చేదు ఫలితాలను చవిచూశారు. ఎన్డీయే అభ్యర్ధులు 58చోట్ల విజయం సాధించారు. ఈ కూటమిలోని బీజేపీ 52స్థానాల్లో విజయం సాధించింది. 2010 అసెంబ్లీ ఎన్నికల్లో కమలనాథులు 91 స్థానాలు గెలుచుకున్నారు. ఆ పార్టీతో సీట్లు సర్దుబాటు చేసుకున్న ఎల్‌జేపీ రెండు స్థానాలకే పరిమితమయ్యింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 6 స్థానాల్లో నెగ్గిన ఎల్‌జేపీ అసెంబ్లీ ఎన్నికల్లో చతికిల పడింది. గత పార్లమెంటు ఎన్నికల్లో 3 లోక్‌సభ సీట్లలో విజయం సాధించిన ఆర్‌ఎల్‌ఎస్‌పీ ఈసారి అసెంబ్లీ ఎలక్షన్లలో 2 సీట్లకు పరిమితమయ్యింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 22 సీట్లు గెలుచుకున్న కమలనాథులు ఇప్పుడు కేవలం 52 అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పద్నాలు జిల్లాలో బీజేపీ ఖాతా కూడా తెరవలేదు. దీనిని బట్టి పరిశీలిస్తే పార్లమెంటు ఎన్నికల తర్వాత ఎన్డీయే పార్టీ పరిస్థితి బాగా దిగజారిందని విశ్లేషిస్తున్నారు.
ఓడిపోయిన మాజీ సీఎం మాంఝీ
ఈ ఎన్నికల్లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఇద్దరు తనయులు తేజస్వీయాదవ్‌, తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ విజయం సాధించారు. రఘోపూర్‌ అసెంబ్లీ స్థానంలో తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ తన సమీప బీజేపీ ప్రత్యర్ధి సతీష్‌కుమార్‌పై 5,400 కోట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. మహువా నుంచి తేజస్వీ యాదవ్‌ నెగ్గారు. రెండు సీట్లలో పోటీ చేసిన బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, హిందూస్థాన్‌ ఆవామ్‌ మోర్చ కన్వీనర్‌ జీతన్‌రామ్‌ మాంఝీ ఒక చోట మాత్రమే గెలుపొందారు. మఖ్దూమ్‌పూర్‌లో ఓటమిపాలైన మాంఝీ, ఇమామ్‌గంజ్‌లో విజయం సాధించారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపై ప్రభావం చూసే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాజకీయ పునరేకీకరణకు దారితీయొచ్చని అంచానవేస్తున్నారు.

 

పత్తికి మద్దతుధర పెంచాలని కేంద్రాన్ని కోరాం : పోచారం

వరంగల్ : పత్తికి మద్దతు ధర పెంచాలని మంత్రి హరీష్ రావు కేంద్రాన్ని కోరారని తెలిపారు. అంతకముందు మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. రేగొండ మండలం బాగిర్తిపేటలో పత్తికి మద్దతు ధర కల్పించడం లేదని మంత్రి పోచారాన్ని టీఆర్ ఎస్ కార్యకర్త రఘుపతి నిలదీశారు.

 

అర్థికఇబ్బందులతో అక్కాచెళ్లెళ్ల ఆత్మహత్యాయత్నం..

చిత్తూరు : అర్థిక ఇబ్బందులతో అక్కాచెళ్లెళ్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మదనపల్లెలో నాగమణి(8), మరియమ్మ(17) అనే ఇద్దరు అక్కాచెళ్లెళ్లు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. వారిని మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉంది.

 

మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డికి చేదు అనుభవం

వరంగల్ : మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. రేగొండ మండలం బాగిర్తిపేటలో పత్తికి మద్దతు ధర కల్పించడం లేదని మంత్రి పోచారాన్ని టీఆర్ ఎస్ కార్యకర్త రఘుపతి నిలదీశారు.

 

20:53 - November 8, 2015

'మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రొగ్రామ్… ఫ్యామిలీని ఒక దగ్గరికి చేర్చిందని హీరో, ప్రొగ్రామ్ వ్యాఖ్యాత నాగార్జున అన్నారు. 'మీలో ఎవరు కోటీశ్వరుడు హాట్ సీట్లో నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్ అనే పేరుతో టెన్ టివి వారితో స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా వారు పలు విషయాలను వివరించారు. నాలెడ్డ్ ఈజ్ పవర్ అని నాగార్జున అన్నారు. కాయిన్ కు బొమ్మ, బొరుసు రెండు ఫేజ్ లున్నట్లు కార్యక్రమానికి కూడా వ్యాపారంతోపాటు సేవాదృక్పథం ఉండాలని నిమ్మగడ్డ ప్రసాద్ అన్నారు. మీడియా అంటే వ్యాపారమే కాకుండా సోషల్ రెస్పాన్స్ కూడా ఉండాలన్నారు. పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం…

 

20:39 - November 8, 2015

హరిరామయ్య జోగయ్యతో టెన్ టివి స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా జోగయ్య పలు ఆసక్తిరమైన విషయాలు తెలిపారు. వంగవీటి మోహన రంగా హత్యకు సంబంధించిన పూర్వపరాలు విశ్లేషించుకున్నాకే చంద్రబాబు పాత్ర ఉందని నమ్మానని.. ఈ విషయంలో నిజానిజాలు దేవునికే తెలియాలన్నారు. ప్రజల్లో టిడిపిపై అంసంతృప్తి తీవ్రంగా ఉందని చెప్పారు. ప్రజారాజ్యంలో కలెక్షన్స్, టికెట్లు కేటాయింపు అంతా చిరంజీవికి తెలుసు… ఈ విషయంలో అల్లు అరవింద్ అమాయకుడని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి రావాలని.. సినిమాలు చేసుకుంటే కుదరదని చెప్పారు. చిరంజీవి రాజకీయాలు వదిలేసి.. సినిమాలు చేసుకోవాలని హితవు పలికారు. మరిన్ని వివరాలన వీడియోలో చూద్దాం…

 

మహాకూటమి.. 178 స్థానాలు కైవసం...

పాట్నా : బీహార్ లో మొత్తం 243 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మహాకూటమి 178 స్థానాలను కైవసం చేసుకుంది. ఎన్ డిఏ 59 స్థానాలకు పరిమితం అయింది. 80 స్థానాల్లో ఆర్ జెడి అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించింది. కాంగ్రెస్.. మహాకూటమితో బాగా లాభ పడింది. 4 స్థానాల నుంచి 27 స్థానాలకు ఎగబాకింది. బీహార్ లో రెండు స్థానాల్లో సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ గెలుపొందింది. 

నల్లగొండ జిల్లాలో విషాదం..

నల్లగొండ : జిల్లాలోని చివ్వెంల మండలం భీములతండాలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. మృతులు భోజతండాకు చెందిన సిద్దూ(7), ఆనంద్‌లుగా గుర్తింపు. తల్లిదండ్రులతో పొలానికి వెళ్లిన చిన్నారులు ఇలా మృత్యువాతపడటంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

19:50 - November 8, 2015

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం విజయం సాధించిందని వక్తలు పేర్కొన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు… ఫలితాలు అనే అంశంపై సీపీఎం జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు వి.శ్రీనివాసరావు, ఎపి కాంగ్రెస్ నాయకురాలు గంగాభవానీ పాల్గొని, మాట్లాడరారు. బీహార్ ఎన్నికల ఫలితాల ప్రభావం ఇతర రాష్ట్రాల్లో జరుగనున్న ఎన్నికలపై తప్పకుండా ఉంటుందని తెలిపారు. బీహార్... యాజరేజ్ ఇండియాకు కొలబద్దగా ఉంటుందన్నారు. బిజెపి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం చెందిందని చెప్పారు. ఎజెండాను బిజెపి కులం, మతం వైపు తిప్పిందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

బీహార్ పార్టీలవారీగా గెలుపొందిన స్థానాలు

పాట్నా : బీహార్ లో ఆర్ జెడీ 80, జేడీయూ 71, కాంగ్రెస్ 27, బిజెపి 53, ఎల్ జెపి 3, ఆర్ ఎల్ ఎస్పి 2, సీపీఐ(ఎంఎల్) లిజరేషన్ 2, హెచ్ఏఎం ఒక స్థానంలో విజయం సాధించింది. 

19:02 - November 8, 2015

మహబూబ్‌నగర్‌ : జిల్లాలోని వీపనగండ్ల మండలం జెట్‌ప్రోల్‌లో మాసూంబాబా ఉర్సు ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ ముగింపు ఉత్సవాలకు వివిధ జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. బుధవారం మొదలైన ఉర్సు ఉత్సవాలకు.. మొదటి గంధం మాసూంబాబా నివాసం నుంచి వెలువడింది. తర్వాత ఆయన శిష్యులు వివిధ ప్రాంతాల నుంచి గంధాన్ని తీసుకువచ్చి మాసూంబాబాకు సమర్పించారు.

 

18:48 - November 8, 2015

బీహార్ : మోడీ వెలుగులు మసకబారాయి.. ఏడాదిన్నర కాలంలోనే ఆయన ప్రభ తగ్గిపోయింది. మోడీ ప్రధాని పీఠం అధిరోహించాక.. పార్టీకి వన్‌సైడ్‌ విజయాలను అందించడంలో ఓ రెండు సందర్భాల్లో తప్ప దాదాపు విఫలమయ్యారు. ఈఏడాది జరిగిన రెండు రాష్ట్రాల ఎన్నికల్లోనూ మోదీ జాదూ ఏమాత్రం పనిచేయక పోగా.. పార్టీకి చావుదెబ్బ తగిలింది. దీంతో మోదీపై ఇంటా బయటా ఒత్తిళ్లు అధికమవుతున్నాయి.
మోడీకి వన్‌సైడ్‌ ఫలితం ఇవ్వని రాష్ట్రాల ఓటర్లు
బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి ఓటమి.. ప్రధాని మోదీకి పెద్ద షాకేనని చెప్పాలి. గత ఏడాది మే 26న ప్రధాని గద్దెనెక్కిన మోదీ... ఇప్పటివరకూ.. ఆరు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపారు. 2014లో సాధించిన ఓ రెండు విజయాలే తప్ప.. ఇప్పటి వరకూ ఆయనకు ఏ ఒక్క రాష్ట్రమూ వన్‌సైడ్‌ ఫలితాలివ్వలేదు. పైగా యూపీ, పశ్చిమ బంగ్లల్లో జరిగిన ఉప ఎన్నికలూ ఆయనకు పరాభవాన్నే మిగిల్చాయి.
ప్రతిపక్ష హోదాకూ దూరమైన బీజేపీ
మోడీ ప్రధాని అయిన సంవత్సరంలో.. హర్యానా, జార్ఖండ్‌, జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో.. కమల దళానికి ఆశావహ ఫలితాలు వచ్చాయి. హర్యానా, జార్ఖండ్‌లలో ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం రాగా.. జమ్మూ కశ్మీర్‌, మహారాష్ట్రలలో మరొకరితో కలిస్తే గానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి రాలేదు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీకి దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్‌బేడీ సహా.. పార్టీ ప్రముఖులంతా మట్టికరిచారు. కనీసం ప్రతిపక్ష హోదాను కూడా బీజేపీ దక్కించుకోలేక పోవడం గమనార్హం.
పాతికేళ్ల అనుబంధాన్ని తెంచుకున్న బీజేపీ-శివసేన
అటు మహారాష్ట్ర ఎన్నికల్లో పాతికేళ్ల అనుబంధాన్ని తెంచుకున్న బీజేపీ, శివసేనలు.. మహారాష్ట్ర ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశాయి. ఎన్నికల అనంతరం రెండు పార్టీలూ కలిస్తే కానీ అక్కడ అధికారాన్ని దక్కించుకోలేక పోయాయి. ఇక్కడ అధికారాన్ని దక్కించుకున్నామన్న ఆనందం కన్నా.. చిరకాల మిత్రుడు.. ప్రబల శత్రువుగా మారడం మోదీని తీవ్ర ఇబ్బందుల్లో పడేస్తోంది. ప్రస్తుత బీహార్‌ ఓటమికి బాధ్యత వహిస్తూ నరేంద్ర మోదీ.. ప్రధాని పదవికి రాజీనామా చేయాలని శివసేన డిమాండ్‌ చేయడం విశేషం.
విదేశీ పర్యటనలపైనే మోదీ శ్రద్ధ
వరుస పరాజయాలు మోదీకి మింగుడుపడకుండా ఉన్నాయి. విదేశీ పర్యటనలపై చూపుతున్న శ్రద్ధ.. పాలనపై చూపడం లేదన్న ఆరోపణలు మోదీకి వ్యతిరేకంగా వినిపిస్తున్నాయి. దేశంలో మత అసహనం పెరుగుతోందంటూ.. మేధావులు గగ్గోలు పెడుతున్నా.. మోదీ నామమాత్రంగానూ స్పందించక పోవడం బీహార్‌ ఓటర్లలో ఆందోళనకు కారణమై మోదీకి గుణపాఠం నేర్పారని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి బీహార్‌ ఓటర్లు.. మోదీ జాదూ ఇకపై చెల్లదని.. ఆయన అభివృద్ధిపై దృష్టి సారించకుంటే.. త్వరలో జరిగే మరిన్ని రాష్ట్రాల్లోనూ పరాభవం మూటగట్టుకోక తప్పదని విశ్లేషకులు సూచిస్తున్నారు.

 

 

18:44 - November 8, 2015

బీహార్ : ఒక్క బటన్‌ ఇప్పుడు దేశగతిని మార్చబోతుంది. బీహారీలు ఈవీఎంలో నొక్కిన బటన్‌లే ఇప్పుడు దేశ రాజకీయాలను ఊపేస్తున్నాయి. బీహార్‌లో మొదలైన ఈ భూకంప ప్రకంపనలు.. రేపు యూపీకి, బెంగాల్‌కు తాకే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలను కూడా ఈ సునామీ తాకబోతుంది. మోదీ, అమిత్‌షాల ఏకఛత్రాధిపత్యానికి కూడా ఈ తీర్పు చెక్‌ పెట్టబోతుంది.
కొత్తగా మారబోతున్న మోడీ చరిత్ర
మోడీ చరిత్ర ఇప్పుడు కొత్తగా మారబోతుంది. బీహార్‌ ఎన్నికల ముందు మోదీ... బీహార్‌ ఎన్నికల తర్వాత మోదీ అని రాసుకోవాల్సిందే. ఢిల్లీ ఎన్నికల్లో దెబ్బ తిన్నా.. ఆప్‌ విజయం ఊహించిందే కావటంతో.. అంతగా ప్రభావం చూపించలేదు. కాని సర్వశక్తులు ఒడ్డి బీహార్‌లో జాతీయ ఎన్నికల రేంజ్‌లో బరిలోకి దిగి మోదీ, అమిత్‌షాలు కదనరంగంలోకి దూకినా.. ఓటమే ఎదురైంది. ఇప్పుడీ ఓటమి ప్రభావం రకరకాలుగా మోదీ అండ్‌ కో ని దెబ్బ తీయబోతుంది.
యూపీ, బెంగాల్‌ ఎన్నికలపై ప్రభావానికి అవకాశం
త్వరలో రాబోతున్న యూపీ, పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలపై ఈ ప్రభావం ఖచ్చితంగా ఉండే అవకాశముంది. కూటమితో మంచి ఫలితాలు రాబట్టిన నితీష్‌ను యూపీలో ములాయం, బెంగాల్‌లో మమతలు ఆదర్శంగా తీసుకునే అవకాశాలున్నాయి. అదే జరిగితే బిజెపికి ఆ రెండు రాష్ట్రాల్లోనూ ఎదురుదెబ్బే తగులుతుంది.
భూసేకరణ, జీఎస్‌టి బిల్లులపై ప్రభావం
ఇప్పటికే భూసేకరణ సవరణ బిల్లును, జీఎస్‌టీ బిల్లును ఆమోదించుకోలేక ఆయాసపడుతున్న బిజెపికి తాజా పరిణామాలు మరింత భయపెట్టిస్తున్నాయి. కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షాలు పుంజుకోవడంతో పాటు.. మానసికంగా బలహీనపడ్డ కమలనాథులపై దాడిని పెంచడం ఖాయంగా కనపడుతుంది. ఇప్పుడు ప్రతిపక్షాలను కాదని బిజెపి ముందుకెళ్లే పరిస్ధితి కనపడటం లేదు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ఇక నుంచి అదే సీన్‌ కనపడబోతుంది.
మోడీ, అమిత్‌షాలకు పార్టీలో ఎదురుగాలి
ఇవన్నీ అలా ఉంచితే.. ఇప్పటివరకు మోదీ, అమిత్‌షాలకు ఆడింది ఆట, పాడింది పాటగా బిజెపిలో నడిచిపోయింది. వారేం చెప్పినా ఎదురు లేకుండా పోయింది. కాని మొన్న ఢిల్లీ, నేడు బీహార్‌ వీరి వ్యూహాలు చిత్తయ్యాయి. దీంతో మోడీ వ్యతిరేక వర్గం పుంజుకునే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. సీనియర్‌ నేత అరుణ్‌శౌరీ ఈ మధ్య మోదీపై నేరుగా విమర్శలు చేశారు. అలాగే శతృఘ్నసిన్హా లాంటి వారు అదే ట్రెండ్‌లో ఉన్నారు. మిత్రపక్షాల్లోనూ అసహనం పెరగొచ్చు. ఇప్పటికే శివసేన బీహార్‌ ఫలితాలకు బాధ్యత వహించి మోదీ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది.
బిజెపిలోనూ మోడీ వ్యతిరేక గళం
ప్రజా వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో బిజెపిలోనూ మోడీ వ్యతిరేక గళం పుంజుకుంటుందనడంలో సందేహం లేదు. త్వరలోనే అమిత్‌షా అధ్యక్షుడిగా ఏడాది పూర్తి చేసుకోబోతున్నారు. బీహార్‌ ఫలితాల ఎఫెక్ట్‌తో అమిత్‌షాను తప్పిస్తారా.. లేక మోడీ వర్గం ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా అనేది వేచి చూడాలి.

 

18:35 - November 8, 2015

ఢిల్లీ : మతత్వశక్తులకు బీహార్‌ ప్రజలు గుణపాఠం చెప్పారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. కుల, మతపరంగా సమాజాన్ని విభజించేందుకు బీజేపీ ప్రయత్నంచడం వల్లనే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమిపాలయ్యిందన్నారు. విభజనవాద శక్తులకు ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. విభజనవాదానికి వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేశారని పేర్కొన్నారు. ప్రధాని మోడీ కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. ధరల పెరుగుదలను నియంత్రించడంలో ఎన్డీయే విఫలమయ్యిందని విమర్శించారు. గతంతో పోలిస్తే ఈ ఎన్నికల్లో వామపక్షాల ఓట్ల శాతం పెరిగిందని చెప్పారు. 

18:29 - November 8, 2015

వరంగల్ : బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి చెంపపెట్టు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. టెన్ టివితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. దేశంలో మంచిరోజులు వచ్చాయనడానికి బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. బీహార్‌లో బీజేపీ ఘోరంగా ఓడిపోయిందని.. రాష్ట్రంలోనూ టీఆర్‌ఎస్‌ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. వరంగల్‌ ఉపఎన్నికలోనూ టీఆర్‌ఎస్‌కు భంగపాటు తప్పదన్నారు. కాంగ్రెస్‌లో గందరగోళం కొనసాగుతుందని.. బీజేపీ-టీడీపీ కూటమికి లోకల్‌ అభ్యర్ధే దొరకలేదన్నారు. వరంగల్‌ ఉప ఎన్నికల్లో వామపక్షాలు బలపరిచిన గాలి వినోద్‌ కుమార్‌ గెలుపు ఖాయమన్నారు.  

ఇండోనేషియాలో భూకంపం..

జకర్తా : ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1 శాతం నమోదు అయింది. నికోబార్ దీవుల్లో వరుస భూప్రకంపనలు సంభవిస్తున్నాయి. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.9, 4.9, 5.2, 4.8 గా నమోదు అయ్యాయి.

 

ఆర్టీసీ బస్సు ఢీకొని బాలుడి మృతి

హైదరాబాద్ : ఎల్ బి నగర్ లో ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. భార్య, భర్త, చిన్నారికి గాయాలయ్యాయి. 

17:53 - November 8, 2015

బీహార్ : ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్, జేడీయూ నేత ముఖ్యమంత్రి నితీష్ కుమార్...బీహార్‌ రాజకీయాల్లో కాకలు తీరిన యోధులు. దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు వారు రాజకీయంగా బద్ధ శత్రువులు. బీహార్‌లో గత లోక్‌సభ ఎన్నికల్లో మోది దెబ్బకు ఆర్జేడి, జెడియు కకావికలయ్యాయి. దీంతో బీహార్‌లో తమ ఉనికిని కాపాడుకునేందుకు మత తత్వశక్తులను ఓడించేందుకు తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన బెట్టారు. ఇద్దరు మహానేతలు చేతులు కలిపారు.
బీజేపీని ఓడించడానికి మిత్రులుగా మారారు
లోక్‌సభ ఎన్నికల అనంతరం బీహార్ లో జరిగిన శాసనసభ ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి వీరివురూ మిత్రులుగా మారిపోయారు. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ ఇచ్చిన ఇఫ్తార్ విందు సందర్భంగా ఇరువురు నేతల మధ్య సఖ్యత కుదిరింది. జెడియు-ఆర్జేడి-కాంగ్రెస్‌లు సెక్యులర్‌ కూటమిగా అవతరించాయి. తామనుకున్న వ్యూహం ఫలించింది. ఉపఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుపొంది సెక్యులర్‌ కూటమి సత్తా చాటడంతో ఇద్దరు నేతల మధ్య స్నేహబంధం మరింత బలపడింది. దాదాపు 24 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఉపఎన్నికల్లో లాలు-నితీష్‌ఒకే వేదికను పంచుకోవడం ద్వారా బీహార్‌ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యయనం మొదలైంది.
మహా కూటమిగా జెడియు-ఆర్జేడి-కాంగ్రెస్‌ పార్టీలు
ఉపఎన్నికల విజయంతో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లోను లాలూ-నితీష్‌లు అదే ఉత్సాహంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఆఖరు నిముషంలో జనతాపరివార్‌ నుంచి ములాయం వైదొలగడంతో జెడియు-ఆర్జేడి-కాంగ్రెస్‌ పార్టీలు మహా కూటమిగా అవతరించాయి. సీట్ల సర్దుబాటులో జెడియు-ఆర్జేడి చెరో వంద సీట్లు పంచుకోగా కాంగ్రెస్‌కు 40 సీట్లు కేటాయించారు. సిఎం అభ్యర్థి విషయంలో లాలూ-నితీష్‌లు మధ్య విభేదాలు తలెత్తుతాయని ఎన్డీయే పక్షాలు భావించాయి. గడ్డి స్కాం ఆరోపణలు ఎదుర్కొంటున్న లాలూ పెద్ద మనసుతో ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్‌కుమార్‌ను ప్రకటించి ప్రత్యర్థి శిబిరాల్లో గుబులు పుట్టించారు. దమ్ముంటే సిఎం అభ్యర్థిని ప్రకటించాలని లాలూ సవాల్‌ విసిరారు.
అసమ్మతి సెగలు రాకుండా నితీష్‌-లాలూ జాగ్రత్త
సీట్ల పంపకాల్లో ఎలాంటి అసమ్మతి సెగలు రాకుండా నితీష్‌-లాలూ జాగ్రత్త పడ్డారు. బీహార్‌లో బిజెపిని మట్టికరిపించడమే లక్ష్యంగా ఇద్దరు నేతలు పనిచేశారు. ఒకప్పుడు లాలూను జంగల్‌రాజ్‌గా సంబోధించిన నితీష్‌కుమార్‌ ఆయనతో ఎలా చేతులు కలుపుతారని ప్రధాని మోది టార్గెట్‌ చేశారు. నితీష్‌ తెలివిగా మోది విమర్శలను తిప్పి కొడుతూ బిహార్‌లో జరిగిన అభివృద్ధిని ప్రచారం చేశారు. మోది తనపై చేసిన డిఎన్‌ఏ విమర్శను అస్త్రంగా మలచుకుని నితీష్‌ ఎదురు దాడికి దిగారు.
బిజెపిని టార్గెట్‌ చేసిన లాలూ
ఆర్‌ఎస్‌ఎస్‌ లేవనెత్తిన రిజర్వేషన్ల అంశాన్ని మాస్‌ లీడర్‌ లాలూ అనుకూలంగా మలచుకున్నారు. బిజెపి అగ్రవర్ణాల పార్టీగా సంబోధిస్తూ భవిష్యత్తులో బిసి, ఎస్‌సి, ఎస్‌టి రిజర్వేషన్లు కేంద్రం రద్దు చేయనుందని కులాల కార్డును ప్రయోగించి కాషాయదళాన్ని ఆత్మరక్షణలో పడేలా చేశారు. బీఫ్‌ వివాదంపై కూడా బిజెపిని లాలూ టార్గెట్‌ చేశారు.
స్టార్ క్యాంపెయినర్లుగా లలూ, నితీష్
ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ మహాకూటమి తరపున లాలూ, జేడీయూ నేత, బిహార్ సీఎం నితీష్ కుమార్లు స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారాన్ని తమ భుజానా వేసుకున్నారు.. లాలూ 250 ఎన్నికల సభల్లో పాల్గొనగా... నితీష్ కూడా దాదాపు 200కు పైగా ర్యాలీల్లో పాల్గొన్నారు. వీరిద్దరూ డబుల్ సెంచరీలతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. యూపీఏ హయాంలో అవినీతి ఆరోపణలు మూటగట్టుకున్న కాంగ్రెస్‌ నామమాత్రంగానే ప్రచారం నిర్వహించిం. సోనియా, రాహుల్‌ పది పన్నెండు ర్యాలీల్లో మాత్రమే పాల్గొనడం గమనార్హం.
ఒక్కటైన లాలూ, నితీష్, కాంగ్రెస్
1970 ప్రాంతాల్లో లాలూ, నితీష్ లు జనతా పార్టీలో యువనేతలుగా ఎదుగుతున్న క్రమంలో కలిసి పనిచేశారు. ఆ తర్వాత ఇద్దరు నేతలు సొంతంగా పార్టీలను ఏర్పాటు చేసిన తర్వాత బీహార్ బరిలో అధికారం కోసం తలపడ్డారు. గత సార్వత్రిక ఎన్నికల్లో మోడీ సారథ్యంలో బీజేపీ దేశవ్యాప్తంగా సత్తా చాటి హస్తినలో పాగా వేయడంతో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీని దీటుగా ఎదుర్కొనేందుకు లాలూ, నితీష్ లతో పాటు కాంగ్రెస్ పార్టీలు ఒక్కటయ్యాయి.

 

17:36 - November 8, 2015

బీహార్ : ఎలాగైనా గెలుస్తాం..తమదే విజయం..స్పష్టమైన మెజార్టీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం..బీహార్ అభివృద్ధి పథకంలో ముందుకు దూసుకెళ్లాలంటే బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలి..అని బీజేపీ కన్న ఆశలపై బీహారీ ప్రజలు నీళ్లు చల్లారు. ఎగ్జిట్ పోల్స్ సైతం తప్పని నిరూపించబడ్డాయి. మహా కూటమి పెను సంచలనం సృష్టించింది. అంచనాలకు మించి స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకెళ్లింది. దీని ప్రభావం ఎన్డీయేపై స్పష్టంగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ముచ్చటగా మూడోసారి నితీష్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనున్నారు. ఒకసారి బీహార్ ఎన్నికల పరిణామ క్రమాన్ని చూద్దాం..

చతికిలపడిన బీజేపీ...
బీహార్ 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఐదు దఫాలుగా ఎన్నికల పోలింగ్ జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ ఎన్నికలను జీవన్మరణ సమస్యగా తీసుకున్నారు. ఏకంగా ప్రధాని 30కి పైగా ర్యాలీలో పాల్గొన్నారంటే ఎంత సీరియస్ గా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు దిగి వచ్చి బీహార్ లో భారీ స్థాయిలో ప్రచారం చేపట్టారు. వాళ్లు (మహా కూటమి) గెలిస్తే జంగల్ రాజ్ వస్తుందని హెచ్చరించారు. అందులో భాగంగా మహా దళితుల ఓట్లు చీల్చేందుకు హిందుస్థాన్ ఆవామీ మోర్చా పేరిట జితన్ రామ్ మాంఝీ పార్టీ పెట్టి ఎన్డీయే మిత్రపక్షంగా బరిలో నిలిచారు. కానీ ఈ ఎన్నికల్లో ఈ అంశాలు ఎలాంటి ప్రభావం చూపించలేదు. ఎన్నికల్లో భారీ మెజార్టీ తథ్యమని ఎగ్జిట్ పోల్స్..వివిధ మీడియా కోడై కూసింది. దీనితో నేతలు భారీ అంచనాలు పెట్టుకున్నారు. పోలింగ్ ప్రారంభమైన సమయంలో ఎన్డీయే దూసుకపోతుండడంతో కాషాయ దళాలు సంబరాలు చేసుకున్నారు. కానీ ఓ గంట అయిపోయిన అనంతరం జేడీయూ రివ్వున దూసుకొచ్చింది. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామంతో బీజేపీ శ్రేణులు ఆశ్చర్యపోయారు. పార్టీ కార్యాలయాల్లో నిశబ్ధ వాతావరణం అలుముకుంది.

లాలూ పునరాగమనం..
లాలూ ప్రసాద్ యాదవ్...మళ్లీ పునరాగమనం చేశారు. 15 ఏళ్లు అధికారంలో లేకున్నా రాష్ట్రీయ జనతా దళ్ పార్టీని మరిచిపోలేదని ఈ ఎన్నికలు గుర్తు చేశాయి. 'బాహరీ'లను నమ్మవద్దని..మహా కూటమి పక్షాల నేతలు చేసిన ప్రచారానికి పెద్ద ఎత్తున్న స్పందన లభించిందేనని చెప్పవచ్చు. మహా కూటమిని గెలిపించడమే కాకుండా అసెంబ్లీలో దాదాపు 80 స్థానాలకు పైగా ఆర్జేడీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. తరువాతి స్థానంలో జేడీయూ ఉండగా కాంగ్రెస్ పార్టీ 26 స్థానాలను పైగా కైవసం చేసుకుంది. 

విజయ సారథులు..పరాజితులు..

బీహార్ : రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాలకు ఐదు దశల్లో జరిగిన ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మహా కూటమి విజయదుందుభి మోగించింది. విజయం సాధిస్తామన్న బీజేపీ ఆశలపై బీహార్ ప్రజలు నీళ్లు చల్లారు. ఇందులో కొంతమంది విజయం సాధించగా మరికొంతమంది పరాజయం చెందారు.
జితన్ రాం మాంజీ (హెచ్ఎఎం) ఇమామ్ గంజ్ నుండి గెలుపొందారు.
ఉదయ్ నారాయణ్ చౌదీ (జేడీయూ) ఇమామ్ గంజ్ నుండి పరాజయం చెందారు.
శ్యామ్ రాజక్ (జేడీయూ) పుల్వారీ నియోజకవర్గం నుండి గెలుపొందారు.
తేజ్ ప్రతాప్ యాదవ్ (ఆర్జేడీ) మహువా నియోజకవర్గం నుండి గెలుపొందారు.

జేడీయూ 165 స్థానాల్లో విజయం..

బీహార్ : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ దూసుకపోతోంది. 165 స్థానాల్లో విజయం సాధించింది. ఇంకా 14 స్థానాల్లో అధిక్యాన్ని కనబరుస్తోంది. ఎన్డీయే కూటమి 51 స్థానాల్లో విజయం సాధించి ఏడు స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. 

కృష్ణవేణి కళాశాల విద్యార్థిని ఆత్మహత్య..

గుంటూరు : వెల్దుర్తిలో ఇంటర్ విద్యార్థిని తిరుపతమ్మ ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ లభ్యమైంది. కాలేజీలో సీనియర్లు ర్యాగింగ్ చేసినట్లు లేఖలో వెల్లడించింది. మాచర్ల కృష్ణవేణి కాలేజీలో తిరుపతమ్మ చదువుతోంది. సూసైడ్ నోట్ లో తిరుపతమ్మ ఆరుగురి పేర్లను రాసింది. 

మీ అండ్ మామ్స్ షోరూంలో మంటలు..

హైదరాబాద్ : కూకట్ పల్లిలోని మీ అండ్ మామ్స్ షోరూంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. 

సాధారణ మెజార్టీ దాటిన మహా కూటమి..

బీహార్ : మహా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 122 సీట్లను దాటి ముందుకు దూసుకెళుతోంది. దీనితో నితీష్ కుమార్ మూడో సారి బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 

16:33 - November 8, 2015

హైదరాబాద్ : మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. రాజయ్య ఇంట్లో జరిగిన ఘటనను అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లలు సజీవ దహనమైన ఘటన నేపథ్యంలో రాజయ్యను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేశారు. ఈమేరకు రాజయ్యను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఘటనల అనంతరం వరంగల్ ఉప ఎన్నిక అభ్యర్థిని మార్చింది. రాజయ్యను తొలగించిన.. ఆయన స్థానంలో సర్వే సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించారు. సారిక ఘటనల నేపథ్యంలో రాజయ్య రిమాండ్ లో ఉన్నారు. రాజయ్యను సస్పెండ్ చేయడం ఉత్తమమని కాంగ్రెస్ నేతలు భావించారు. ఈక్రమంలో రాజయ్య పార్టీలో ఉంటే నష్టం వస్తుందని భావించిన అధిష్టానం.. ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. సారిక ఘటన నేపథ్యంలో తర్వాత ఈ మచ్చను కడుక్కోవాలనే ఉద్దేశ్యంతోనే రాజయ్యపై సస్పెన్షన్ వేటు పడినట్లు తెలుస్తోంది.

 

16:28 - November 8, 2015

బీహార్ : రాష్ట్రంలో మహా కూటమి గెలుపు సాధించడం ఆత్మగౌరవానికి సంబంధించిందని సీఎం నితీష్ కుమార్ పేర్కొన్నారు. 243 స్థానాలకు ఐదు దఫాలుగా జరిగిన ఎన్నికల కౌంటింగ్ ఆదివారం ఉదయం ప్రారంభమైంది. మహా కూటమి ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకు వెళుతోంది. ఈసందర్భంగా నితీష్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని ప్రజలకు, మహా కూటమికి మద్దతిచ్చిన ప్రతొక్కరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. ఇది చాలా పెద్ద విజయమని, దీనిని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజల్లో కొన్ని ఆశలు నెలకొని ఉన్నాయని, రాష్ట్ర ప్రజల ఆశయాలకనుగుణంగా పనిచేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకపోవాలని ఆకాంక్షించారు. ఎన్నికలకు పూర్వం..ఎన్నికల అనంతరం ఉన్న మహా కూటమిని ప్రజలు ఆదరించారని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ చేపట్టినప్పుడు గంభీరమైన వాతావరణం నెలకొందని అనంతరం మహా కూటమికి అనుకూలంగా ఓట్లు వచ్చాయన్నారు. విపక్షాలు గట్టిగా ఉంటే ప్రభుత్వం అంత బాగా పనిచేసే అవకాశం ఉంటుందని, తాము విపక్షాలని గౌరవిస్తామన్నారు. ఎన్నికల క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలపై దృష్టి సారించమని తెలిపారు. అందులో భాగంగా కేంద్ర సహకారం అందించాలని, దేశ ప్రగతి కోసం కేంద్రంతో ముందుకెళుతామన్నారు. మహా కూటమి విజయం సాధించడం పట్ల పలువురు నేతలు ఫోన్ చేసి అభినందించారని, అందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు నితీష్ వెల్లడించారు. 

బీహార్ ప్రజలకు అభినందనలు : నితీష్

పాట్నా : బీహార్ ప్రజలకు ఆర్జేడీ అధినేత నితీష్ కుమార్ అభినందనలు తెలిపారు. తమ గెలుపు బీహార్ ఆత్మగౌరవానికి సంబంధించినదని పేర్కొన్నారు. మహా కూటమికి స్పష్టమైన మెజారిటీ అందించారని చెప్పారు. 

16:13 - November 8, 2015

పాట్నా : బీహార్ ఎన్నికల్లో మహాకూటమి భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు 122 స్థానాలు అవసరం ఉండగా మహాకూటమి 172 స్థానాలకు పైగా స్థానాలను కైవసం చేసుకునే దిశగా దూసుకుపోతోంది. నితీష్‌కుమార్‌ నేతృత్వంలోని మహాకూటమికి విజయం ఖరారు కావడంతో జేడీయు, ఆర్జేడీ, కాంగ్రెస్‌ కార్యాలయాల దగ్గర కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. మరో వైపు బీహార్‌లో కాంగ్రెస్‌ పార్టీ పుంజుకుంది. హ్యాట్రిక్‌ విజయం సాధించిన నితీశ్‌ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. నితీశ్‌కు ప్రధాని మోది ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. మరోవైపు శివసేన పార్టీ నితీశ్‌ను ప్రశంసలతో ముంచెత్తింది. రాజకీయ హీరోగా నితీశ్‌ను అభివర్ణించింది. బీహార్‌లో బీజేపీ ఓటమికి మోదీ బాధ్యత వహించాలంది. చారిత్రక విజయం సాధించిన నితీష్‌, లాలూ ద్వయానికి కేజ్రీవాల్‌, మమతాబెనర్జీ అభినందనలు తెలిపారు. తననకు మరోసారి విజయాన్ని అందించిన బీహార్‌ ప్రజలకు నితీశ్‌కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు.

 

146 స్థానాల్లో జేడీయూ విజయం..

బీహార్ : రాష్ట్ర ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఐదు దఫాలుగా ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం 146 స్థానాల్లో ఆర్జేడీ, 43 స్థానాల్లో బీజేపీ, 06 స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు. 

బీజేపీ - ఆర్ఎస్ఎస్ పతనానికి నాంది - సీపీఎం..

ఢిల్లీ : ఆర్జేడీ - జేడీయూ గెలుపు బీజేపీ - ఆర్ఎస్ఎస్ పతనానికి నాంది అని సీపీఎం పొలిట్ బ్యూరో పేర్కొంది. బీజేపీ నిర్వహించిన మతపరమైన ప్రచారాన్ని బీహార్ ప్రజలు తిరస్కరించారని, మోడీ, అమిత్ షా లేవనెత్తిన గో మాంసం, బీఫ్ రాజకీయాలు, మైనార్టీలకు ప్రత్యేక రిజర్వేషన్లు, పర్జలను విభజించే అంశాలను బీహార్ ప్రజలు పట్టించుకోలేదని తెలిపింది. 

15:56 - November 8, 2015

ఢిల్లీ : బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బిజెపికి చావుదెబ్బ లాంటివని కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి అన్నారు. రాజకీయాల్లో గెలుపోటమలు ఉంటాయన్నారు. కానీ 70 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఒక ప్రధాని ఇంతగా ప్రచారంలో పాల్గొనడం ఇదే మొదటిసారన్నారు. ప్రధాని పదవికి వుండే స్థాయిని, విలువను మోడీ దిగజార్చాడని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలను మోడీ.. మున్సిపల్ ఎన్నికల్ల లాగా మార్చారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల ద్వారా మోడీ పాత విషయాన్ని గుర్తుకు చేశారని చెప్పారు. 13 సంత్సరాల క్రితం గుజరాత్ లో మతపరమైన ఘోర కలి జరిగినప్పుడు మోడీ మది మతోన్మాదంతో నిండి ఉన్నదని... ప్రధాని అయిన తర్వాత కూడా మోడీ మానసిక స్థితిలో మార్పు లేదని, మొరుగుతనం లేదని ఎద్దేవా చేశారు.

 

15:50 - November 8, 2015

ఢిల్లీ : బీహార్‌ ఎన్నికల్లో జేడీయూ మహాకూటమి విజయం సాధించడంతో....ఢిల్లీలో సంబరాలు అంబరాన్నంటాయి. జేడీయూ కూటమిలో కాంగ్రెస్ కూడా 41 స్థానాలకు పోటీచేయడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిస్తుంది. ఢిల్లీలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం ముందు కార్యకర్తలు, నేతలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. 160 స్థానాల్లో మహా కూటమి ముందంజలో ఉంది. కాంగ్రెస్ ఓటర్లు మహాకూటమి వైపు మొగ్గుచూపారు. ఎన్ డిఎ కూటమి పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది. ఢిల్లీలోని బిజెపి కార్యాలయం బోసిపోయింది. బీహార్ ఎన్నికలు దేశ వ్యాప్తంగా బిజెపికి ఒక గుణపాఠం చెప్పాయి.

 

 

రాజయ్య సస్పెన్షన్..

హైదరాబాద్ : వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ను కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన కోడలు సారిక, ముగ్గురు మనవళ్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం..రాజయ్య కుటుంబసభ్యులు అరెస్టు కావడం తెలిసిందే. 

15:46 - November 8, 2015

హన్మకొండ : వరంగల్‌ ఉప ఎన్నికపై అనుసరించాల్సిన వ్యూహాంపై తెలంగాణ రాష్ట్ర బిజేపి-టిడిపి నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి టి టిడిపి నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు, ఎల్‌ రమణ, పెద్దిరెడ్డి హాజరయ్యారు. వీరితో పాటు బిజేపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి, బీజేపిఎల్పీ లక్ష్మణ్‌, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఉప ఎన్నికకు సమయం దగ్గరపడుతుండడంతో వ్యూహ, ప్రతివ్యూహాలపై చర్చించేందుకు రేపు చంద్రాగార్డెన్‌లో సమావేశం నిర్వహిస్తున్నామన్నారు టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను తమ ఎజెండాలుగా తీసుకొని ముందుకెళ్తామని రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. 

15:43 - November 8, 2015

బీహార్ : రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠకు మెల్లి మెల్లిగా తెరవీడుతోంది. మహా కూటమి అధిక్య దిశగా పయనిస్తోంది. బీహార్ ఫలితాలపై రాజీకయ పక్షాలు..నేతలు స్పందించారు. మహా కూటమి అధిక్యంలో దూసుకెళ్లడంతో నితీష్, లాలూతో పాటు ఆ కూటమి నేతలకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
నితీశ్‌కు మా సంపూర్ణ మద్దతు : రాహుల్‌గాంధీ
నితీశ్‌కుమార్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. బీజేపీకి బీహార్‌ ప్రజలు గుణపాఠం చెప్పారని, ఇది అసహనానికి, గర్వానికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పని అన్నారు. మహాకూటమి నేతలకు రాహుల్‌ అభినందనలు తెలిపారు.
గెలుపోటములు సహజం-అసదుద్దీన్‌ ఓవైసీ
బీహార్‌ ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష చేసుకొని రానున్న రోజుల్లో పుంజుకునే ప్రయత్నం చేస్తామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. 6 స్థానాల్లో పోటీచేసిన ఎంఐఎం ఒక్కదాన్ని కూడా కైవసం చేసుకోలేదు. దీనిపై అసదుద్దీన్‌ స్పందిస్తూ..ఎన్నికలన్న తర్వాత..గెలుపోటములు సహజమన్నారు. ఏడాదిన్నర తర్వాత ఉత్తరప్రదేశ్‌లో జరిగే ఎన్నికల్లో పోటీచేసి అత్యధిక స్థానాలు గెల్చుకుంటామని ఆయన అన్నారు.

 

15:41 - November 8, 2015

బీహార్ : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు ఊడ్చేశారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహా కూటమి అధిక్యంలో కొనసాగుతూ ప్రభుత్వ ఏర్పాటు దిశగా సాగిపోతోంది. ఈ సందర్భంగా లాలూ ప్రసాద్ యాదవ్ నివాసానికి సీఎం నితీష్ కుమార్ విచ్చేశారు. ఒకరినొకరు అభినందనలు తెలుపుకున్నారు. అనంతరం కిక్కిరిసిన మీడియా సమావేశంలో లాలూ మాట్లాడారు. త్వరలోనే మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తం పర్యటన చేపడుతానని లాలూ ప్రకటించారు. ప్రజలు తమకు అఖండ విజయం సాధించి పెట్టారని, ఇందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. ఆర్జేడీకి సీట్లు ఎక్కువ వచ్చినా నితీష్ సీఎంగా కొనసాగుతారని ప్రకటించారు. నితీష్ హాయాంలో బీహార్ అభివృద్ధి పథంలో దూసుకెళుతుందన్నారు. పేద, మధ్య తరగతి మహిళల ఆశయాలను నెరవేరుస్తామని చెప్పారు. నితీష్ కు ప్రధాన మంత్రి మోడీ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలు అభినందనలు తెలియచేస్తున్నారని, ఇందుకు వారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. 

బీహార్ సీఎంగా నితిష్ కుమార్ : లాలూ

పాట్నా : బీహార్ సీఎంగా నితీష్ కుమార్ కొనసాగుతారని ఆర్ జెడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. బిజెపిని ప్రజలు ఊడ్చేశారని ఎద్దేవా చేశారు. బీహార్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తామని చెప్పారు.

 

నితీష్ ఇంటి ఎదుట భారీ జనసందోహం..

బీహార్ : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమికి ప్రజలు పట్టం కట్టారు. స్పష్టమైన మెజార్టీతో జేడీయూ దూసుకపోతోంది. ఈ సందర్భంగా నితీష్ కు అభినందనలు తెలియచేసేందుకు నేతలు, కార్యకర్తలు భారీగా ఆయన నివాసం వద్దకు చేరుకుంటున్నారు. 

 

15:06 - November 8, 2015

బీహార్ : ప్యాకేజ్‌లు పత్తా లేకుండా పోయాయి. హామీలన్నీ గాలికి కొట్టుకుపోయాయి. అసహనం విసిరిన పంచ్‌కు మాటల గారడీకి మైండ్‌ బ్లాంక్‌ అయింది. వేయని ఎత్తు లేదు. విసరని పాచిక లేదు. అయినా ఓటర్లు విసిరిన పంచ్‌కు పాలిట్రిక్స్ అన్నీ చెత్తబుట్టలో పడ్డాయి. దీంతో బీహార్‌ గడీలో పాగా వేయాలనే బడా కాషాయనాధుల వ్యూహా ప్రతివ్యూహాలు గల్లంతయ్యాయి.
బీహారీల మది గెల్చుకోలేకపోయిన అమిత్‌షా, మోడీ
కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరిగారు. మైక్‌లు విరిగిపోయేలా ఉపన్యాసాలు దంచారు. అభివృద్ధి ఆమడదూరం పోయిందన్నారు. ఆటవిక రాజ్యం నడుస్తోందన్నారు. షార్ట్ కట్‌లో చెప్పాలంటే మేముండగా మహా కూటమి దండగ అన్నారు. అంతటితో ఆగలేదు.. నైతిక విలువలు మరిచి వ్యక్తిగత విమర్శలు చేసారు. బీహార్‌ ఎన్నికల్లో నెగ్గాలనే పంతంతో కమలనాధులు ప్రత్యర్ధులపై గోబెల్స్ ప్రచారానికి దిగారు.గొంతు చించుకుని అరిచినా, సుడిగాలితో పోటి ఎన్నికల ప్రచారం నిర్వహించినా మోదీ, అమిత్‌ షా బీహారీల మది గెల్చుకోలేకపోయారు. ఊహాకు అందని రీతిలో తీర్పునిచ్చే బీహార్‌ ఓటర్ల నాడి పట్టుకోలేకపోయారు.
తీవ్ర ప్రభావం చూపిన అసహనం, బీఫ్‌ పాలిట్రిక్స్
అయితే బీహార్‌లో బిజెపీకి ఎదురైన ప్రతికూల ఫలితాలకు కారణాలు ఎన్నో ఉన్నప్పటికి అసహనం, బీఫ్‌ పాలిట్రిక్స్ మాత్రం తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. గోమాంసం తినేవారిపై బిజెపీ నేతలు, సంఘ్‌ కార్యకర్తలు, విశ్వహిందు పరిషత్‌ సభ్యులు మూకుమ్మడిగా చేసిన దాడులు, గోమాంసం విక్రేతలే టార్గెట్‌గా ఇచ్చిన వార్నింగ్‌లు చావుదెబ్బ కొట్టాయి.
ప్రభావం చూపిన అవార్డుల తిరస్కారం
బీఫ్‌ పాలిట్రిక్స్‌తో పాటే కేంద్రం తీరుకు వ్యతిరేకంగా మేధావులు, రచయితలు,అవార్డులు వెనక్కు ఇచ్చేసి ప్రదర్శించిన పతాకస్ధాయి నిరసన కూడా హైరేంజ్‌లో ఇంపాక్ట్‌ చూపింది. అవార్డులు రిటర్న్‌ పంపిన పర్వం విద్యావంతులు, ఎగువ మధ్యతరగతి వారిని ప్రభావితం చేసింది. అందుకే బీహార్‌లో బిజెపీకి కలలో కూడా ఊహించని ఫలితాలను కానుకగా ఇచ్చారు. మాటలతో కోటలు కట్టాలని చూసే టక్కు టమార విద్యలు ఇక చెల్లవనే సత్యాన్ని బ్యాలెట్‌తో చెప్పారు.
స్వీయ చికిత్సకు కమలనాధులు రెడీ
ఓటర్లు ఇచ్చిన షాక్‌తో బీహార్‌ పీఠం మాదేనని ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చిన అమిత్‌షా, మోదీ పోస్ట్‌మార్టమ్‌కు రెడీ అయ్యారు. ఎక్కడ తప్పటడుగు వేసామోనని తెలుసుకునేందుకు స్వీయచికిత్సకు సిద్ధమయ్యారు. అధికారం చేతిలో ఉంది కదా అని విర్రవీగితే టైం... పర్ఫెక్ట్ టైమింగ్‌తో లాగి లెంపకాయ కొడుతుందనే సత్యాన్ని గ్రహించిన కమలనాధులు ఇప్పటికైనా రూటు మార్చుకుంటారో లేదో కాలమే సమాధానం చెప్పాలి.

 

సన అరెస్టు..

ఖమ్మం : వరంగల్ మాజీ ఎంపీ రాజయ్య కోడలు సారిక, మనవళ్ల హత్య కేసులో కీలకమైన ఏ4 నిందితురాలు సనను పోలీసులు ఖమ్మంలో అదుపులోకి తీసుకున్నారు. అనిల్(సారిక భర్త) రెండో భార్యనే సన. సనకు ఇద్దరు పిల్లలున్నట్లు కూడా సమాచారం.

దేశానికి మంచి రోజులు - తమ్మినేని..

వరంగల్ : దేశానికి మంచి రోజులు వచ్చాయని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. బీహార్ ప్రజల తీర్పే ఇందుకు నిదర్శనమని, యూజీసీ అనుమతితోనే గాలి వినోద్ కుమార్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నారని తెలిపారు. ఓయూ రిజిస్ట్రార్ లేఖను కోర్టు దృష్టికి తీసుకెళ్తామని, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకుంటున్నారని విమర్శించారు. 

14:50 - November 8, 2015

బీహార్ : పులి పంజా విసిరే ముందు మూడడగులు వెనక్కు వేస్తుంది. మాటు వేసి అదను కోసం కాచుకుంటుంది. బీహార్‌ కా షేర్‌ కూడా అదే చేసింది. నితీష్‌కుమార్‌ విజయం సాధించారు. తాను అనుకున్నదాని కోసం బలమైన మిత్రుడిని వదిలేశారు. ఓటమి ఎదురైనా చెక్కు చెదరలేదు. చిరునవ్వుతో పదవిని వదిలిపెట్టారు. రాజకీయ చదరంగంలో ఆట మార్చారు. శత్రువుని స్నేహితుడిగా చేసుకున్నారు. బలాన్ని కూడగట్టుకున్నారు. యుద్ధం గెలిచారు. బీహార్‌ బాద్‌షాగా మూడోసారి సింహాసనాన్ని అధిష్టించబోతున్నారు.

యుద్ధాన్ని గెలిచిన వీరుడు నితీష్‌కుమార్‌

నితీష్‌కుమార్‌.. ఇప్పుడు బీహారే కాదు.. యావత్‌ భారతదేశంలోనూ యుద్ధాన్ని గెలిచిన వీరుడిగా ఆయన పేరు మార్మోగిపోతోంది. బలమైన రాజకీయనాయకుడిగా పేరొందిన మోదీ, అపర చాణుక్యుడిగా వ్యూహకర్తగా చెప్పుకునే అమిత్‌షా ద్వయం దండయాత్ర చేసినా.. వెన్ను చూపకుండా దమ్ము చూపించిన మొనగాడుగా నిలబడ్డారు. లాలూకు స్నేహహస్తం అందించడంతో పాటు, కాంగ్రెస్‌ హస్తాన్ని కూడా అందుకున్న నితీష్‌కుమార్‌ విజయం సాధించారు. వరుసగా మూడోసారి బీహార్‌ సీఎం కాబోతున్నారు.
2014 ఎన్నికలకు ముందు మోదీని వ్యతిరేకించిన నితీష్‌
2014 ఎన్నికలకు ముందు మోదీ ప్రధాని అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకించిన నితీష్‌కుమార్‌ ఎన్‌డీయే నుంచి బయటికొచ్చేశారు. మోదీకి అంతా అనుకూలంగా ఉంటే.. నితీష్‌ ఒంటెద్దు పోకడ ప్రదర్శించారనే విమర్శలొచ్చాయి. అయినా వెనక్కి తగ్గలేదు. అనుకున్నదానికే కట్టుబడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బ తిన్నారు. లాలూ, కాంగ్రెస్‌, జేడీయూ అన్నీ విడివిడిగా పోటీ చేసి ఓటమి చెందాయి. ఇదే నితీష్‌ మదిలోకి కొత్త కాన్సెప్ట్‌ను తీసుకొచ్చింది. అందరూ కలిసి పోటీ చేసి ఉంటే ఈ ఫలితం వచ్చేది కాదని ఎన్నికల ఓట్ల శాతాలు తేల్చి చెప్పాయి.
ప్రజల్లో ముఖ్యమంత్రిగా మంచి పేరు
మాంఝీని సీఎంగా నిలబెట్టి.. ఆ తర్వాత ఆ మాంఝీయే ఎదురుతిరిగినా.. తిరిగి సీఎం కాగలిగారు నితీష్‌కుమార్‌. బీహార్‌ ఎన్నికల కోసం ఐక్య జనతాదళ్‌ ప్రతిపాదన ముందుకు తెచ్చి లాలూను, ములాయంను కూడా కలిపారు నితీష్‌. అయితే ఆఖరులో బిజెపి ఒత్తిడితో ములాయం హ్యాండిచ్చారు. అయినా లాలూ, నితీష్‌ మాత్రం వీడిపోలేదు. కాంగ్రెస్‌ను కలుపుకుపోవడంలో నితీష్‌ సక్సెస్‌ అయ్యారు. ఎన్ని పొత్తులు పెట్టుకున్నా.. తన నాయకత్వ స్ధానాన్ని మాత్రం నితీష్‌ నిలుపుకున్నారు. ప్రజల్లో ముఖ్యమంత్రిగా మంచి పేరు తెచ్చుకోవడమే ఇందుకు కారణం.
మూడోసారి సీఎం స్థానంలో కూర్చోబోతున్న నితీష్‌కుమార్‌
కులాలవారీగా కమలనాథులు వ్యూహాలు రచించినా.. మత విద్వేషాలను రెచ్చగొట్టినా.. అన్నిటినీ అలయెన్స్‌ అనే ఆయుధంతోనే నితీష్‌కుమార్‌ ఎదుర్కొన్నారు. మిత్రులను కలుపుకుంటూనే, తన నాయకత్వ స్థానాన్ని నిలుపుకుంటూ మూడోసారి సీఎం స్థానంలో కూర్చోబోతున్నారు నితీష్‌కుమార్‌. ఈ ఎన్నికల్లో విజయం ద్వారా జాతీయస్థాయిలోనూ మోడీకి పోటీగా నిలబడగలననే సంకేతాలను ఇచ్చారు.

 

 

చతికిలపడిన బీజేపీ..

బీహార్ : రాష్ట్ర ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ చతికిలపడింది. కేవలం 43 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతుండగా 21 స్థానాల్లో విజయం సాధించింది. మరోవైపు జేడీయూ 101 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతూ 71 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. 

14:45 - November 8, 2015

బీహార్ : ఒక్కడు.. ఒకే ఒక్కడు.. అఖండ శక్తులుగా కీర్తిస్తున్న మోదీ, షాల ద్వయాన్ని ఎదుర్కొన్నాడు. కాషాయదళాన్ని మహాకూటమితో కుమ్మేశాడు. తన పదేళ్ల పాలనతో మరో ఐదేళ్ల ప్రభుత్వానికి రాచబాటలు వేసుకున్నాడు. హ్యాట్రిక్ విజయంతో మోదీకి ధీటైన అభ్యర్థిగా కలబడి నిలబడ్డాడు. ఆయన నితీష్‌ కుమార్. దేశంతో పాటు ప్రపంచమంతా ఉత్కంఠగా వీక్షించిన ఎన్నికల్లో మహాకూటమి విజయ సారథి. అవినీతి మరకలంటని, స్కాముల స్కీముల మచ్చలేని మహా నాయకుడు.
బీమారు రాష్ట్రానికి వైద్యం చేసిన రాజకీయ వైద్యుడు
నితీష్‌ కుమార్. బీమారు రాష్ట్రానికి వైద్యం చేసిన రాజకీయ వైద్యుడు...అభివృద్దిలో అట్టడుగున ఉన్న బీహార్ ను తన పాలనాదక్షతతో శిఖరాలకు చేర్చే ప్రయత్నం చేస్తున్న యోధుడు. 1951 మార్చిన 1న ఓ సామాన్య కుటుంబంలో జన్మించారు నితీష్‌ కుమార్. తండ్రి రామ్ లఖన్ స్వాతంత్ర సమరయోధుడు. ఆధునిక బీహార్ కలల కన్న గాంధీయన్ అనురాగ్ నారాయణ్‌ సిన్హాకు రామ్ లఖన్ అనుచరుడు. ఉన్నత విలువల కుటుంబంలో జన్మించిన నితీష్‌..తన జీవితంలోనూ అవే విలువలు పాటించాడు. జయప్రకాష్‌ నారాయణ్‌, రామ్ మనోహర్ లోహియా, కర్పూరి థాకూర్ అడుగుజాడల్లో నడిచాడు.
ఎన్ ఐటి పాట్నా నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో పట్టా
ఎన్ ఐటి పాట్నా నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో పట్టా పొందాడు నితీష్‌. కొంతకాలం బీహార్ విద్యుత్ శాఖలో ఉద్యోగం చేసిన నితీష్‌..తర్వాత రాజకీయాల్లో ప్రవేశించారు. 1977లో జనతా పార్టీ టికెట్ మీద అసెంబ్లీకి పోటీ చేశారు. 1989లో తొలిసారి లోక్ సభకు పోటీ చేసి గెలిచారు. 1990లో కేంద్ర మంత్రిగా పని చేశారు. 1998 రైల్వే మంత్రిగా, 99లో ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ గానూ బాధ్యతలు నిర్వర్తించారు. అయితే 2000 సంవత్సరం బీహార్ ఎన్నికలు నితీష్‌ జీవితాన్ని మలుపుతిప్పాయి.
2000లో తొలిసారి సీఎం పగ్గాలు
అవినీతితో బీహార్ పరువును బజారుకీడ్చిన లాలూ ప్రసాద్ యాదవ్ కు వ్యతిరేకంగా 2000లో తీర్పిచ్చారు ప్రజలు. జేడీయూకు స్పష్టమైన మెజారిటీనివ్వడంతో నితీష్‌ తొలిసారి సీఎంగా బీహార్ పగ్గాలు చేపట్టారు. తర్వాత 2010 అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయఢంకా మోగించారు. 2014లో సార్వత్రిక ఎన్నికల సమయంలో జితన్ మాంఝీకి సీఎం బాధ్యతలు అప్పగించారు. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2015లో అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగిన శాసనసభ సమరంలో మహాకూటమి సారథిగా అఖండ విజయం సాధించారు.
బీహారీలకు పురోగతికి చూపించారు
మోడీ, అమిత్‌ షాల ద్వయం చాణక్యాన్ని ఎదుర్కొని, కాషాయదళం వ్యూహాలను తిప్పికొట్టి...నితీష్‌ కుమార్ ఇంతటి అఖండ విజయం సాధించడం వెనక పదేళ్ల అభివృద్ది నినాదముంది. ప్రభుత్వ వ్యతిరేకతకు బదులు అభిమానం సంపాదించుకున్నారు నితీష్‌. అభివృద్ది అంటే ఎరుగని బీహారీలకు పురోగతికి చూపించారు. మంచినీరు, రోడ్లు, విద్యుత్, వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపర్చారు. వేల సంఖ్యలో టీచర్లను నియమించి విద్యా వ్యవస్థను అభివృద్ది చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు పని చేసేలా చర్యలు తీసుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తీర్చిదిద్దారు. అసమానతలను తగ్గించి, సమానతకు బాటలు వేశారు. అభివృద్ది సూచిలో ఇప్పుడు బీహార్ టాప్‌ లో ఉందంటే నితీష్‌ కమార్ పాలనాదక్షతే కారణం. అందుకే బీహార్ ప్రజలు నితీష్‌ కూటమికి అఖండ విజయంతో వీర తిలకం దిద్దారు.
ఒక సమయంలో వరుస ఓటములతో విరక్తి చెందిన నితీష్‌
అయితే ఒకానొక సమయంలో వరుస ఓటములతో విరక్తి చెంది రాజకీయాల నుంచి వైదొలగాలని భావించారు నితీష్‌ కుమార్. వ్యాపారం చేసుకుని జీవితం సాగించాలని అనుకున్నారు. 1977, 1980 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఓటమి చవిచూడటంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. జర్నలిస్టు సంతోష్ సింగ్ రాసిన తాజా పుస్తకంలో ఈ విషయాలను వెల్లడించారు. అయితే పట్టుదల, పాలనాదక్షత ఆయనను రాజకీయాల్లో మేరున ధీరుడిగా నిలబెట్టింది.

 

 

పోలీసు నియామకాలకు వయో పరిమితి పెంపు..

హైదరాబాద్ : పోలీసు నియామకాలకు వయో పరిమితి పెంపు పైల్ పై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. కానిస్టేబుళ్ల నియామకంలో జనరల్ అభ్యర్థులకు 22 నుండి 25 ఏళ్ల వయో పరిమితి పెంచగా ఎస్టీ, ఎస్సీ, బీసీలకు 27 నుండి 30 ఏళ్లకు సడలించారు. ఎస్ ల విభాగంలో జనరల్ కేటగిరి అభ్యర్థులకు 22 ఏళ్ల నుండి 25 ఏళ్లకు సడలించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 30 ఏళ్ల నుండి 33 ఏళ్లకు సడలించారు. 

ప్రజల తీర్పును గౌరవిస్తాం - అమిత్ షా..

న్యూఢిల్లీ : బీహార్ శాసనసభ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. 

 

మాట్లాడడం బంద్ చేయండి - రాహుల్..

ఢిల్లీ : మాట్లాడడం మాని పనులు ప్రారంభించాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. 

13:38 - November 8, 2015

హైదరాబాద్ : బీహార్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రక్రియ కౌంటింగ్ సరళిపై కేంద్ర మంత్రి దత్తాత్రేయ స్పందించారు. మహా కూటమిపై స్పష్టమైన అధిక్యతన కనబరిచింది. ఆదివారం ఎర్రబెల్లి నివాసంలో టిడిపి, బిజెపి నేతల సమావేశం జరిగింది. ఈసందర్భంగా దత్తాత్రేయ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో గెలువాలని బీజేపీ పూర్తి ప్రయత్నం చేసిందని, ఇక్కడ ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్లు చెప్పారు. అనుకున్న విజయాన్ని సాధించలేకపోయామని, కుల సమీకరణాలు..మహా కూటమి వల్లే బిజెపి వెనుకబడిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. జాతీయస్థాయిలో సమీక్ష నిర్వహిస్తామని, రానున్న రోజుల్లో ఎలా ఉండాలనే దానిపై కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.

పోలీసు నియామకాల్లో వయోపరిమితి సడలింపు

హైదరాబాద్ : తెలంగాణ లో పోలీసు నియామకాల్లో వయోజపరిమితి మూడేళ్లు సడలిస్తూ టీఎస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కానిస్టేబుళ్ల నియామకంలో జనరల్ అభ్యర్థులకు 22 నుంచి 25 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బిసీ లకు 27 నుంచి 30 ఏళ్లకు వయో పరిమితి సడలించింది. పోలీసు కమ్యూనికేషన్ విభాగాన్ని పటిష్టం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ విభాగంలో 332 పోస్టులను ఒకేసారి భర్తీ చేయనున్నారు.

13:33 - November 8, 2015

బీహార్ : రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠకు మెల్లి మెల్లిగా తెరవీడుతోంది. మహా కూటమి అధిక్య దిశగా పయనిస్తోంది. బీహార్ ఫలితాలపై రాజీకయ పక్షాలు..నేతలు స్పందించారు. మహా కూటమి అధిక్యంలో దూసుకెళ్లడంతో ఆ కూటమి నితీష్, లాలూతో పాటు ఆ కూటమి నేతలకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
సహనం గెలిచింది..అసహనం ఓడిందన్న మమత..
మహా కూటమి అధిక్యంలో కొనసాగుతుండడంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ స్పందించారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ లకు మమత అధికారిక ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. సహనం..గెలిచింది..అసహనం ఓడిందంటూ వ్యాఖ్యానించారు.

సంపూర్ణ మద్దతిచ్చారు - నితీష్..
అసెంబ్లీ ఎన్నికల్లో మహా కూటమి విజయం దిశగా దూసుకపోవడంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు మహా కూటమికి సంపూర్ణ మద్దతిచ్చి ఆశ్వీరించారని తెలిపారు. 

నీతి..నిజాయితికి జరిగిన పోరు - శరద్ యాదవ్..
బీహార్ ఎన్నికల పోరు ధనస్వామ్యానికి, నీతినిజాయితీకి జరిగిన పోరు అని జేడీయూ అధినేత శరద్ యాదవ్ అన్నారు. బీహార్ ప్రజలు నిజాయితీ పాలనకే మొగ్గుచూపారని వ్యాఖ్యానించారు. జేడీయూ కూటమి విజయం బీహార్ ప్రజల విజయమే కాదు దేశ ప్రజల విజయమని చెప్పారు. ఎన్నికల ఫలితాలు జేడీయూ కూటమికి అనుకూలంగా వెలువడుతున్న సమయంలో ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు శరద్ యాదవ్. విజయం పట్ల ధీమా వ్యక్తం చేశారు.

సంతోషంలో శరద్ కుటుంబసభ్యులు..
బీహార్‌ ఎన్నికల ఫలితాలు మోడీ అవినీతి పాలనకు అద్దం పడుతున్నాయని జేడీయూ అధినేత శరద్‌ యాదవ్‌ కుటుంబసభ్యులు తెలిపారు. బీహార్‌ ప్రజలు మోడీకి చెంపదొబ్బ కొట్టి..నితీశ్‌ పాలనకే జై కొట్టారని శరత్‌ యాదవ్ కుటుంబసభ్యులు తెలిపారు. ఎన్నికల ఫలితాల్లో నితీశ్‌ కూటమి దూసుకుపోతుండడంతో కుటుంబసభ్యులు మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు.

మహా కూటమి శాసిస్తుంది - త్యాగి..
జేడీయు, ఆర్జేడీల మహాకూటమి ఇకపై దేశ రాజకీయాలను కూడా శాసిస్తుందని జేడీయు నేత కేసీ త్యాగి అన్నారు. ఇది మహాకూటమి విజయం కాదని బీహారీల విజయమని అన్నారు.

అందుకే ఓటమి చెందింది - చిదంబరం..
నరేంద్రమోడీ స్వీయ ప్రవర్తన, మాటల వల్లే ఇవాళ బిజేపి ఓటమి చవిచూసిందని మాజీ కేంద్ర మంత్రి చిదంబరం అన్నారు. దేశంలో పెరిగిపోతున్న అసహనం, మత, కుల రాజకీయాలు పెరిగిపోవడం కూడా ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపాయని ఆయన అన్నారు. ఇప్పటికైనా మోడీ ఎన్నికల ఓటమితో కళ్లు తెరవాలని చిదంబరం అన్నారు.

నీతికి ధర్మానికి పట్టం - ఆజాద్..
ఎన్ని పాచికలు వేసినా బీహార్‌ ప్రజలు నీతికి, ధర్మానికే పట్టం కట్టారని కాంగ్రెస్‌ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ అన్నారు. బీహార్‌ ప్రజలను లొంగదీసుకునేందుకు మోడీ ఎన్ని ప్రయత్నాలు చేసినా...ఓటర్లు నితీశ్‌కే పట్టంకట్టారని ఆయన అన్నారు. కుల, మతాలను చీల్చే కుట్రచేశారని..కానీ వాటన్నింటిని ప్రజలు తిప్పికొట్టారని ఆజాద్ అన్నారు.

మార్పులకు సూచకం - ఏచూరి..
బీహార్‌ ఎన్నికల్లో జేడీయూ కూటమి గెలవడం దేశంలో వస్తున్న మార్పులకు సూచకమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. 16నెలల మోదీ పాలనకు బీహార్‌ ఎన్నికలు అద్దం పడుతున్నాయని ఆయన అన్నారు. ప్రజల్లో వస్తున్న మార్పుకు బీహార్‌ ఎన్నికలే నిదర్శనమన్నారు . 

8మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్

తిరుపతి : అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలించడానికి ప్రయత్నిస్తున్న 8 మంది స్మగ్లర్లను తిరుపతిలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం పోలీసులు మీడియాతో మాట్లాడుతూ....స్మగ్లర్ల వద్ద నుంచి 75 ఎర్రచందనం దుంగలతో పాటు, 3 కార్లు, ఒక ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న దుంగల విలువ సుమారు రూ. 66 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

నితీశ్ కు చంద్రబాబు అభినందనలు

హైదరాబాద్ : బీహార్ ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతున్న ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ కు టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిజేశారు.

ఐసీడీఎస్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం

విశాఖ : షార్ట్‌సర్క్యూట్ వల్ల ఐసీడీఎస్ కార్యాలయంలో పార్క్ చేసి ఉన్న జీపు దగ్ధమైంది. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా మున్సంగిపుట్టు మండల కేంద్రంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఐసీడీఎస్ కార్యాలయ ఆవరణలోని షెడ్డులో ప్రమాదవశాత్తూ షార్ట్ సర్క్యూట్ జరగడంతో షెడ్డులో ఉన్న జీపు కాలిపోతోంది. ఇది గుర్తించిన స్థానికులు మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు.

నితీష్ కుమార్ మా సీఎం - లాలూ..

బీహార్ : అసెంబ్లీ ఎన్నికల్లో మహా కూటమి అధిక్యంపై లాలూ ప్రసాద్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని లాలూ స్పష్టం చేశారు. 

12:54 - November 8, 2015

బీహార్ : రాష్ట్రానికి లక్ష కోట్ల ప్యాకేజీ...రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే బీజేపీ రావాలి..జంగిల్ రాజ్ కావాలా ? అచ్చే దిన్ కావాలా ? అని కాషాయ దళం ఇచ్చిన పిలుపుకు బీహార్ ప్రజలు పట్టించుకోలేదు. మహా కూటమికి పట్టం కట్టారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు ఓటు ద్వారా సమాధానం చెప్పారు. ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో ఈ ఎన్నికలు సమాధానం ఇస్తున్నాయని, దేశ రాజకీయాల్లో ఈ ఎన్నికలు పెను ప్రభావం చూపుతాయని జాతీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. బీహార్ ఎన్నికలు…ప్రధాని మోడీ పాలనకు రెఫరండం గా మారాయి. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలేమీ జరుగలేదనే విమర్శలున్నాయి. పై పెచ్చు ఆ పార్టీ ఎంపీల కామెంట్లు తీవ్ర వివాదస్పదంగా మారాయి. అంతేగాక దేశంలో అసహన పరిస్థితులు మితిమీరిపోయాయి. ఈ నేపథ్యంలో బీహార్ రాష్ట్రంలో వచ్చిన ఎన్నికలపై అందరీలో ఉత్కంఠ రేపాయి. బీహార్ ఎన్నికలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, జాతీయ అధ్యక్షుడు అమిత్ షా జీవన్మరణ సమస్యగా తీసుకున్నారు. గతంలో ఏ ప్రధాని పాల్గొనని విధంగా ఏకంగా 30 కి పైగా సభల్లో పాల్గొన్నారు. ఇక బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా దీ 90 ర్యాలీల్లో పాల్గొన్నారు. బీజేపీ ఓడిపోతే పాకిస్తాన్ లో పటాకులు కాలస్తురాని షా వ్యాఖ్యానించారు. ఉప్పు, నిప్పు లాంటి నితీష్‌, లాలూ సైతం విభేదాలు పక్కన బెట్టి మోడీని ఓడించాలనే లక్ష్యంతో ఒక్కటయ్యారు. కాంగ్రెస్ సైతం వీరికి జత కూడింది. బీజేపీని అధికారంలోకి రానీవ్వకూడదనేదే తమ ఉద్దేశమని లాలూ పేర్కొన్నారు. వస్తున్న ఫలితాలపై మహా కూటమి నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

బిజెపి ఓటమి మోదీ పని తీరుకు నిదర్శనం : రాహుల్ గాంధీ

హైదరాబాద్ : బీహార్ ఎన్నికల్లో మహాకూటమి విజయం దిశగా దూసుకుపోతుండగా...బిజెపి ఘోర పరాజయం పాలైంది. బిజెపి ఓటమికి ప్రధాని నరేంద్ర మోడీ పని తీరుకు నిదర్శనమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు.

నలుగురు చైన్ స్నాచర్లు అరెస్ట్

మహబూబ్ నగర్ : ఒంటరి మహిళలను అనుసరిస్తూ.. వాళ్లు ఆదమరిచి ఉన్న సమయంలో గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు చైన్ స్నాచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 16 తులాల బంగారు ఆభరణాలతో పాటు స్నాచింగ్‌కు ఉపయోగించిన 3 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. షాద్‌నగర్, వనపర్తి, కొత్తకోట పోలీస్‌స్టేషన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈ ముఠా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

చారిత్రక విజయం : సీఎం కేజ్రీవాల్

హైదరాబాద్ : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకెళుతోంది. ఇది చారిత్రాత్మక విజయం అని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. నితీష్ కుమార్‌కు అభినందనలు తెలిపారు. కాగా ఢిల్లీ వాసులంతా బీహార్‌లో ఉన్న తమ బంధుమిత్రులకు ఫోన్‌ చేసి నితీష్‌కు ఓటు వేయాలంటూ బిహార్ ఎన్నికల సందర్భంగా కేజ్రీవాల్ విజ్ఞప్తి కూడా చేశారు. బిహార్ ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఓటమి తప్పదని, నితీష్ కుమార్ గెలుపు ఖాయమంటూ జోస్యం చెప్పిన విషయం తెలిసిందే.

మూడింట రెండొంతు మెజార్జీ

హైదరాబాద్ : బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాకూటమి మూడింట రెండొంతుల మెజార్జీకి చేరువవుతోంది. ఎన్నో అంచనాలతో ఎన్నికల బరిలో దిగిన ఎన్డీయే కూటమికి శృంగభంగమే అని విశ్లేషకులు భావిస్తున్నారు.

బీహార్ ఎన్నికల ఫలితాలపై హాట్ కామెంట్లు..

బీహార్ : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియపై సోషల్ మీడియాలో హాట్ కామెంట్లు చేస్తున్నారు. అసహనంపై సహనం సాధించిన విజయమంటూ పేర్కొంటున్నారు. బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలను తూర్పారపడుతున్నారు. 

ప్యాకేజీ ప్రకటించినా మోడీ గెలువలేకపోయారు - సీపీఐ..

మెదక్ : బీహార్ కు రూ.1.25 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించినా మోడీ గెలువలేకపోయారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. బీహార్ ప్రజలు జేడీయూకి స్పష్టమైన అధిక్యత ఇచ్చారని, వరంగల్ ఉప ఎన్నికల్లో కూడా గాలి వినోద్ కుమార్ గెలుస్తారని తెలిపారు. 

బీహార్ ఓటమికి స్థానిక పరిస్థితులే కారణం - దత్తాత్రేయ..

హైదరాబాద్ : బీహార్ ఓటమికి స్థానిక పరిస్థితులే కారణమని కేంద్ర మంత్రి దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ ఫలితాలకు మోడీ పనితీరుకు సంబంధం లేదని, కులాల సమీకరణలో బీజేపీ నిలబడలేకపోయిందని తెలిపారు. 

రాజకీయ హీరో నితీష్ : శివసేన

హైదరాబాద్ : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహా కూటమి దూసుకుపోతోంది. మరోసారి బీహార్ పగ్గాలు చేపట్టనున్న నితీష్ కుమార్ కు శివసేన ప్రశంసలు తెలిజేసింది. అంతే కాకుండా నితీష్ రాజకీయ హీరో అని అభివర్ణించింది.

నితీష్ కు అభినందనలు తెలిపిన సానియా..మమత..

కోల్ కతా : మహా కూటమి అధిక్యంలో కొనసాగుతుండడంపై నితీష్ కు పలువురు నేతలు అభినందలు తెలియచేస్తున్నారు. ఏఐసీసీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ.. నితీష్ కు అభినందనలు తెలిపారు. 

బిజెపి ఓటమికి మోదీ బాధ్యత వహించాలి: శివసేన

హైదరాబాద్ : బీహార్ లో బిజెపి ఓటమికి ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యత వహించాలని శివసేన డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ఓడినపుడు సోనియా బాధ్యత తీసుకుందని… ఇప4డు మోడీ కూడా బాధ్యత తీసుకోవాలని పేర్కొంది.

నితీష్ కు మోడీ ఫోన్..

బీహార్ : రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు జేడీయూ రంగం సిద్ధం చేసుకొంటోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ..నితీష్ కు ఫోన్ చేశారు. అధిక్యంలో కొనసాగుతున్నందుకు శుభాకాంక్షలు తెలిపినట్లు నితీష్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 

ప్రజల తీర్పును శిరసా వహిస్తాం : రాంమాధవ్

హైదరాబాద్ : బీహార్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహిస్తామని బిజెపి జాతీయ నేత రాంమాధవ్ అన్నారు.

8 జిల్లాల్లో ఒక్కచోటా ఆధిక్యంలో లేని బిజెపి

హైదరాబాద్ : బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహా కూటమి విజయ బావుటా ఎగరేస్తోంది. ఎన్డీయే కూటమి 8 జిల్లాల్లో ఏ ఒక్క స్థానంలోనూ ఆధిక్యంలో లేకుండా పోయింది. భాగల్పూర్, దర్భంగా, కోసి, మగధ్, ముంగేర్, పాట్నా, పూర్ణియా, సరణ్ ప్రాంతాల్లో జేడీయూ సంపూర్ణ ఆదిక్యంలో తిరుహుత్ ప్రాంతంలో బిజెపి ఆధిక్యంలో కొనసాగుతోంది.

బహదూర్ గంజ్ లో కాంగ్రెస్ తౌసిఫ్ ఆలం విజయం

హైదరాబాద్ :బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలను ఈసీ అధికారికంగా వెల్లడిస్తోంది. బహదూర్ గంజ్ లో కాంగ్రెస్ తౌసిఫ్ ఆలం విజయం సాధించారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ఫలితం వెల్లడి

హైదరాబాద్ :బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ఫలితాన్ని ఈసీ అధికారికంగా వెల్లడించింది. బిలియాపూర్ లో ఆర్జేడీ అభ్యర్థి కేదార్ నాథ్ సింగ్ గెలిచినట్లు ప్రకటించింది.

పొన్నాల నివాసంలో నేతల ఘర్షణ..

వరంగల్ : పొన్నాల నివాసంలో కాంగ్రెస్ నేతల మధ్య వివాదం చెలరేగింది. రెండు సామాజిక వర్గాలు ఘర్షణకు దిగాయి. రెడ్డి సామాజిక వర్గానికే ప్రాధాన్యతనిస్తున్నారని టి.పిసిసి చీఫ్ ఉత్తమ్ పై వెలమ నేతలు ఆరోపించారు. 

టిడిపి, బిజెపి నేతల ముఖ్య సమావేశం..

హైదరాబాద్ : టిడిపి, బిజెపి నేతల ముఖ్య సమావేశం నిర్వహించారు. వరంగల్ ఉప ఎన్నిక ప్రచారం వ్యూహంపై చర్చిస్తున్నారు. కిషన్ రెడ్డి, దత్తాత్రేయ, లక్ష్మణ్, ఎల్.రమణ, మోత్కుపల్లి సమావేశానికి హాజరయ్యారు.

 

నితీష్ కు శివసేన ప్రశంసలు..

బీహార్ : రాష్ట్రంలో జేడీయూ అధిక్యంలో కొనసాగుతోంది. నితీష్ కుమార్ పై శివసేన ప్రశంసలు గుప్పిచింది. నితీష్ ను రాజకీయ హీరోగా అభివర్ణించింది. బీహార్ లో బీజేపీ ఓటమికి మోడీ బాధ్యత వహించాలని సూచించింది. 

నితీష్ కు అభినందలు తెలిపిన శరద్ యాదవ్..

బీహార్ : చారిత్రక విజయం సాధించిన నితీష్ కు శరద్ యాదవ్ అభినందనలు తెలిపారు. దాద్రీ ఘటన బీజేపీని దెబ్బతీసిందని అభివర్ణించారు. 

ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన నితీష్..

బీహార్ : రాష్ట్ర ప్రజలకు నితీష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు మహా కూటమికి సంపూర్ణ మద్దతిచ్చి ఆశీర్వదించారు.

 

మోడీ ఇమేజ్ కు దెబ్బకాదు - రామ్ మాధవ్..

బీహార్ : ఫలితాలు మోడీ ఇమేజ్ కు దెబ్బకాదని రామ్ మాధవ్ వ్యాఖ్యానించారు. పొరపాట్లు సరిదిద్దుకుంటామని పేర్కొన్నారు. 

జేడీయూ అధిక్యం..

బీహార్ : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. భాగల్పూర్, దర్బంగా, కోసి, మగధ్, ముంగేర్, పాట్నా, పూర్నియా సరణ్ ప్రాంతాల్లో జేడీయూ అధిక్యంలో కొనసాగుతుండగా తిరుహుత్ ప్రాంతంలో బీజేపీ అధిక్యంలో కొనసాగుతోంది. పాట్నాలో జేడీయూ హావా కొనసాగుతుండగా 14 స్థానాల్లో అధిక్యత కనబరుస్తోంది. ఒక స్థానంలో సీపీఐ (ఎంఎల్ లిబరేషన్) అభ్యర్థి ముందంజలో నిలిచారు. 

 

బీహార్ లో స్పష్టమైన అధిక్యం దిశగా మహా కూటమి..

బీహార్ : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా కూటమి స్పష్టమైన అధిక్యాన్ని కనబరుస్తోంది. మహా కూటమి 155, ఎన్డీయే 77, ఇతరులు 11 స్థానాల్లో అధిక్యాన్ని కనబరుస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు 122 సీట్లు కావాల్సి ఉంటుంది. 

బిజెపి వైఫల్యాల వల్లే ఓటమి : మధు

హైదరాబాద్ : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి వైఫల్యాల వల్లే ఓటమి దిశగా పయనిస్తోందని సీపీఎం ఎపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. మధు ఆరోపించారు. ఆయన టెన్ టివితో మాట్లాడుతూ… ఆర్ ఎస్ ఎస్ స్వయంగా ప్రభుత్వంలో జోక్యం చేసుకుని మంత్రుల పనిని సమీక్ష చేశారు. బిజెపి ఉన్మాదాన్ని, అసహనాన్ని విమర్శించిన వారి చంపేశారు. ఏమి తినాలో కూడా శాసిస్తున్నారు. బీఫ్ తిన్న వారిని చంపేశారు. విపక్షాలు అన్ని కలిసి ఎన్నికల్లో పోటీచేసినందువల్ల కంటే బిజెపి వైఫల్యాల వల్లే ఓటమి పాలయ్యిందని తెలిపారు.

11:02 - November 8, 2015

బీహార్ : అసహనం అణగదొక్కింది..బీఫ్ రాజకీయం బద్ధలు కొట్టింది..మాటల గారడి బురిడీ కొట్టింది..మత విధ్వేసం మంటగలిపింది..వేయని ఎత్తు లేదు..విసరని పాచిక లేదు..ఎత్తులన్నీ చిత్తయ్యాయి..పాచికలన్నీ పేలిపోయాయి..బీహార్ బాద్ షాను బీజేపీకి దక్కించుకోవాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యూహాలన్నీ తలకిందులయ్యాయి. నితీష్ కుమార్ ఇమేజ్ ముందు ప్రధాని మోడీ ఇమేజ్ మసకబారిపోయింది. ఎన్ని చెప్పినా సీఎం అభ్యర్థి ఎవరో చెప్పుకోలేని కమలనాథుల బలహీనత ఓటమి తెచ్చి పెట్టింది. మాటలే తప్ప చేతలు లేని కేంద్రం ప్రభుత్వంపై వ్యతిరేకత బీహార్ ఎన్నికలపై ప్రభావం చూపిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అసహనం పేరిట కాషాయ కూటమి సాగించిన విధ్వేష ప్రచారం..మేధావి వర్గం చేసిన తిరుగుబాటు అన్నీ ఎన్నికలపై ప్రభావం చూపించాయని జాతీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

మూడోసారి...
రాష్ట్ర ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ మూడోసారిగా పగ్గాలు చేపట్టనున్నారా ? లాలూతో జత కట్టిన నితీష్ కు స్నేహం కలిసి వచ్చింది. కాంగ్రెస్ సైతం చేరడంతో మహా కూటమి బలోపేతం అయ్యింది. ఉమ్మడి శత్రువు అందరూ కలిసి మట్టికరిపించారనేది ప్రస్తుతం ఎన్నికల సరళిని బట్టి విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి సీఎం నితీష్ మూడోసారి పగ్గాలు చేపట్టడం ఖాయమని తెలుస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాటలకు విశ్వసనీయత తగ్గిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లక్షా 25వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన వరకే పరిమితమైందని ఓటర్లు భావించి ఉండవచ్చునని పేర్కొన్నారు. ముఖ్యంగా సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించకుండానే బరిలో దిగడం కొంత ప్రభావం చూపించగా సంక్షేమ కార్యక్రమాలు, తదితర పథకాలపై నిర్లక్ష్య వైఖరి పెనుప్రభావం చూపించిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

మహాకూటమికి 150 కిపైగానే :మీసా భారతి

హైదరాబాద్ : బీహార్ ఎన్నికల్లో మహా కూటమికి 150కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని లాలూ ప్రసాద్ యాద్ కుమార్తె మీసా భారతి ఆశాభావం వ్యక్తం చేశారు.

అంచనాలు తప్పిన ఎగ్జిట్ పోల్స్

హైదరాబాద్ : ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాలు మ‌రోమారుత త‌ప్ప‌ని తేలాయి. హోరాహోరీ పోరు త‌ప్ప‌ద‌ని చెప్పిన లెక్క‌లు దాటుతున్నాయి. మ‌హాకూట‌మి దూసుకుపోతోంది. సంపూర్ణ మెజార్టీ దాటి 150 స్థానాల దిశ‌గా వెళుతోంది. ఎన్డీయే ఆశలు దాదాపు గ‌ల్లంత‌య్యాయి. ఎన్డీటీవీ, చాణుక్య వంటి వార‌యితే ఎన్డీయే విజ‌యం అంటూ వేసిన అంచ‌నాలు త‌ల‌కిందుల‌య్యాయి. అనూహ్యంగా లాలూయాద‌వ్ పుంజుకున్నారు. అంచ‌నాల‌కు మించి ఆర్జేడీ ఫ‌లితాలు సాధిస్తోంది. డిల్లీ త‌ర్వాత బీహ‌ర్ లో కూడా బీజేపీ ఓట‌మి మోడీ ఇమేజ్ ప‌డిపోతున్న విష‌యాన్ని చాటుతున్నాయ‌ని ఇప్పుడంతా లెక్క‌లు వేస్తున్నారు.

మోడీ, షా ఒటమి: శరద్ యాదవ్

హైదరాబాద్ : బీహార్ లో మహాకూటమి ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. బిజెపి ఓటమి మోడీ, షా ఓట‌మి అంటూ జేడీయూ అధ్య‌క్షుడు శ‌ర‌ద్ యాద‌వ్ వ్యాఖ్యానించారు. వాళ్లిద్ద‌రి అరాచ‌కాల‌కు బీహార్ లో బుద్ధి చెప్పార‌ని వ్యాఖ్యానించారు.

సంబరాల్లో మహా కూటమి

 హైదరాబాద్ : బిహార్‌ ఎన్నికల ఫలితాల్లో మహాకూటమి ఆధిక్యంలో దూసుకుపోతోంది. దాంతో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నివాసం, ఆ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తున్నారు. టపాసులు కాలుస్తూ.. నృత్యాలు చేస్తున్నారు. మహాకూటమి 140 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరోవైపు ఎన్డీయే కూటిమి 88 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

సంబరాల్లో ఆర్జేడీ శ్రేణులు..

బీహార్ : రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. తొలుత అధిక్యంలో కొనసాగిన ఎన్డీయే వెనుకపడింది. జేడీయూ స్పష్టమైన అధిక్యంలో దూసుకపోతోంది. దీనితో ఆర్జేడీ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. 

స్పష్టమైన ఆధిక్యం దిశగా జేడీయూ కూటమి

హైదరాబాదద్ : బీహార్ లో జేడీయూ కూటమి స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళుతోంది. మొత్తం 243 స్థానాలకు గాను మహా కూటమి 146 స్థానాల్లో ఆధిక్యంలో వుంది. ఎన్డీఏ 84 స్థానాల్లో ఇతరులు 8 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. కుల, మత, ప్రాంతీయ వాదాలను బిజెపి వినిపించినా నితీష్ ఇమేజ్ బీహారీలపై ప్రభుత్వం చూపిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరో వైపు కేంద్ర ప్రభుత్వం పై పెరిగిన వ్యతిరేక ప్రభావం కూడా కనపడిందని తెలిపారు. మోదీ మాటలకు విశ్వసనీయత తగ్గిందని.. లక్షా 25 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటనకే పరిమితమని బీహారీలు భావించినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

10:27 - November 8, 2015

బీహార్ : రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకటించినట్లుగానే హోరాహోరీ కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాల్లో నువ్వా నేనా అనే కోణంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్డీయే అధిక్యంలో కనబర్చడంతో బీజేపీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. ఆయా ప్రాంతాల్లోని కార్యాలయాల వద్ద పటాకులు కాల్చారు. అనంతరం పరిస్థితి తారుమారైంది. జేడీయూ అధిక్యంలో కొనసాగింది. బీజేపీని వెనక్కు నెట్టి నితీష్ కుమార్ నేతృత్వంలో మహాకూటమి ముందంజలో సాగుతోంది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల ప్రకారం మహాకూటమి 151 స్థానాల్లో విజయం సాధించగా 21 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ కూటమి 44 స్థానాల్లో గెలుపొందగా, 13 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు ఆరు సీట్లలో గెలవగా, మరో ఒక స్థానంలో ముందంజలో ఉన్నారు. ఆర్జేడీ కార్యాలయాల వద్ద కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. 
పారని మోడీ పాచిక..
మొత్తం 243 నియోజకవర్గాలకు ఐదు దశల్లో పోలింగ్ జరిగింది. సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే బరిలోకి దిగిన బీజేపీకి ప్రధాన ప్రచార రథ సారథి నరేంద్ర మోడీయే అయ్యారు. బీహార్ ఎలక్షన్ క్యాంపెన్ లో చురుగ్గా పాల్గొన్నారాయన. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి 30 సభల్లో మాట్లాడ్డమంటే మామూలు విషయం కాదు. సుడిగాలి పర్యటనలు చేశారు. బీహార్ కు ప్రత్యేక ప్యాకేజీ కూడా ప్రకటించారు. లాలూ, నితీష్ లపై వ్యక్తిగత విమర్శలూ చేశారు. రిజర్వేషన్లపై దూకుడుగా మాట్లాడారు. ఇంత అగ్రెసివ్ గా క్యాంపెన్ చేయడం వెనక మోడీని తరుముతున్న అనేక అంశాలున్నాయి.

ఆర్జేడీ కార్యాలయంలో సంబరాలు

హైదరాబాద్ : బీహార్ ఓట్ల లెక్కింపు ఫలితాల్లో మహాకూటమి ఆధిక్యంలో రావడంతో రాజధాని పట్నాలో వున్న ఆర్జేడీ కార్యాలయంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తున్నారు. మహాకూటమి గెలుస్తుందని కార్యకర్తలు ఉత్సాహంగా నృత్యాలు చేస్తున్నారు.

128 స్థానాల్లో జేడీయూ అధిక్యం..

బీహార్ : తొలుత అధిక్యంలో కొనసాగిన ఎన్డీయే ప్రస్తుతం వెనుకంజలో ఉంది. 128 స్థానాల్లో జేడీయూ, 101 స్థానాల్లో బీజేపీ అధిక్యంలో కొనసాగుతోంది.

ఆధిక్యం దిశగా మహా కూటమి...

 హైదరాబాద్ : బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జేడీయూ, కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. మరోవైపు ఎన్గీయే కూటిమి ఆదివారం ఉదయం కౌంటింగ్‌ ప్రారంభం అయినప్పటి నుంచి ట్రెండ్స్‌ నిలబెట్టుకూవడంలో విఫలమైంది. ప్రస్తుతం ఎన్డీయే కూటిమి 91 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మహాకూటమిలో జూడియూ కంటే లాలూప్రసాద్‌ యాదవ్‌ పార్టీ ఆర్జేడీ ఆధిక్యంలో ఉండడం విశేషం. ఎన్డీయే కూటమిలో బీజేపీ 70 స్థానాల్లో ఆధిక్యం సాధించగా మిగతా మిత్ర పక్షాలు 20 సీట్లకు మాత్రమే పరిమితమయ్యాయి.

అధిక్యంలో జేడీయూ..

బీహార్ : రాష్ట్రంలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. జేడీయూ అధిక్యంలో కొనసాగుతుండగీ ఎన్డీయే వెనుకంజలో ఉంది. జేడీయూ 115, బీజేపీ 108 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. 

అద్వానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మోదీ

హైదరాబాద్ : బిజెపి సీనియర్ నేత ఎల్.కె. అద్వాని 89 సంవత్సరంలోకి అడుగు పెట్టారు. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోడీ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు మార్గదర్శకుడని మోదీ కీర్తించారు. దీర్ఘాయుష్షుతో పాటు అద్వానీకి భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షించారు.

క్షణ క్షణానికి మారుతున్న ఫలితాలు

హైదరాబాద్ : బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు క్షణ క్షణానికి ఉత్కంఠ రేపుతోంది. ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన విధంగానే హోరాహోరాగా పోటీ నెలకొంది. ఎన్డీయే కూటమి, మహా కూటమి ఫలితాల్లో పోటా పోటీ పడుతున్నాయి. మొత్తం 243 స్థానాల్లో ఓట్ల కఔంటింగ్ ఉదయం 8 గంటలకే ప్రారంభమయ్యింది. మహాకూటమిలో జేడీయూ కంటే ఆర్జేడీ ఎక్కువ స్థానాల్లో ముందంజలో వుండటం ఆసక్తికరంగా మారింది.

మొదటి ఫలితం 11 గంటలకు..

బీహార్ : రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొదటి ఫలితం ఉదయం 11గంటలకు వస్తుందని అడిషనల్ చీఫ్ ఎలక్రోల్ అధికారి ఆర్. లక్ష్మణ్ పేర్కొన్నారు. 

అధిక్యంలో కొనసాగుతున్న బీజేపీ..

బీహార్ : రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పాట్నాలో బీజేపీ అభ్యర్థి నందకిషోర్ యాదవ్, రాఘవ్ పూర్ లో లాలూ కుమారుడు తేజస్వీ..ఆలీనగర్ లో బరి సిద్దిఖీ (ఆర్జేడీ)..అలౌలీ నియోజకవర్గంలో పశుపతి పరాస్ (ఎల్ జేపీ) ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అమర్ పూర్..గయా ఝునజ్ పూర్..పర్సట్టలో గైఘట్..బర్హారా లో కరాకట్ నియోజకవర్గంలో బీజేపీ అధిక్యంలో కొనసాగుతోంది. రక్సాల్ నియోజకవర్గంలో బీఎస్పీ అధిక్యంలో కొనసాగుతోంది. 

అద్వానీ ఇంటికి చేరుకున్న షా..

ఢిల్లీ : బీజేపీ కురువృద్ధుడు అద్వానీ నివాసానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేరుకున్నారు. అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

ఆధిక్యంలో కొనసాగుతున్న ఎన్డీఏ

హైదరాబాద్ : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. సిట్టింగ్ స్థానాలను జేడీయూ కోల్పోతుంది. దీంతో బీహార్ ఎన్నికల ఫలితాలను దేశ వ్యాప్తంగా ఉత్కంఠ పెరుగుతోంది.

బీజేపీ విజయం తథ్యం - కైలాష్..

బీహార్ : రాష్ట్రంలో బీజేపీ విజయం సాధించడం తథ్యమని ఆ పార్టీ నేత కైలాష్ విజయ్ వర్గీయా ఓ జాతీయ ఛానెల్ తో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రెడిట్ అంతా మోడీ..అమిత్ షాలకు చెల్లుతుందన్నారు. 

చర్యలు తీసుకోలేదనడం సరికాదు - జైదీ..

బీహార్ : అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి నసీం జైదీ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోలేదనడం సరికాదని వ్యాఖ్యానించారు.

మేం వూహించిన ఫలితాలే : బిజెపి నేత రఘురామ్

హైదరాబాద్ : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మేం వూహించిన ఫలితాలే వెలువడుతున్నాయని ఏపీ బిజెపి సమన్వయ కర్త రఘురామ్ తెలిపారు.

అధిక్యంలో మంత్రి శ్యామ్ రాజక్..

బీహార్ : రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పుల్వరి షరీఫ్ నియోజకవర్గం నుండి మంత్రి శ్యామ్ రాజక్, పాట్నా సాహిబ్ నంద్ కిశోర్ యాదవ్ అధిక్యంలో కొనసాగుతున్నారు. 

08:44 - November 8, 2015

హైదరాబాద్ :ఇప్పుడున్న పరిస్థితుల్లో బిజెపి గెలిస్తే దేశంలో ప్రమాదకర పరిణామాలు ఏర్పడతాయని టెన్ టివి చర్చలో పాల్గొన్న నేతలు తెలిపారు. బీహార్ అభివృద్ధి భారతదేశ యావరేజ్ అభివృద్ధిని సూచిస్తుందని మంచి ఆల్టర్ నేటివ్ కోసం లెప్ట్ పోటీ చేస్తోంది. బీహార్ ఎన్నికలు కులాల మధ్య పోరులా మారిందని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ చర్చలో ప్రొ.విశ్వేశ్వరరావు, సీపీఎం నేత వి. శ్రీనివాసరావు పాల్గొన్నారు. పూర్తి సమాచారం కావాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

మహాకూటమి 42 స్థానాల్లో అధిక్యం..

బీహార్ : రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బీజేపీ 59 స్థానాల్లో..మహాకూటమి 42 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నాయి.

39 స్థానాల్లో బీజేపీ.. 22 స్థానాల్లో మహాకూటమి లీడింగ్..

బీహార్ : రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బీజేపీ 39 స్థానాల్లో..జేడీయూ 22 స్థానాల్లో లీడింగ్ కొనసాగుతున్నాయి.

లాలూ ఇంటికి స్వీట్లు..

బీహార్ : రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. తాము విజయం సాధిస్తామని ఆయా పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే లాలూ వర్గీయులు స్వీట్లతో ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. 

ఆరు స్థానాల్లో బీజేపీ లీడింగ్..

బీహార్ : రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బీజేపీ ఆరు స్థానాల్లో..జేడీయూ మూడు స్థానాల్లో లీడింగ్ కొనసాగుతోంది. 

08:12 - November 8, 2015

హైదారాబాద్ :బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల లెక్కింపు కొద్ది సేపటి క్రితమే ప్రారంభమయ్యింది. ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో 14,580 మంది అధికారులు, సిబ్బంది పని చేస్తున్నారు. 38 జిల్లాలో 39 ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల ఫలితాలతో 3,450 మంది అభ్యర్థుల ( వీరిలో 272 మంది మహిళలు) భవితవ్యం తేలనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రోజు మధ్యాహ్నానికి పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

తామే విజయం సాధిస్తామన్న నేతలు..
ఈ ఎన్నికల్లో తాము తప్పకుండా విజయం సాధిస్తామని ఆయా పార్టీల నేతలు పేర్కొంటున్నారు. 243 అసెంబ్లీ స్థానాలకు ఐదు దఫాలుగా ఎన్నికల పోలింగ్ జరిగింది. మ్యాజిక్ ఫిగర్ 122 ఏ పార్టీ కైవసం చేసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. ఎగ్జిట్ పోల్స్ లో మహా కూటమి, బీజేపీ మధ్య హోరాహోరీ తప్పదని అంచనా వేశాయి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏకంగా 31 ర్యాలీలు నిర్వహించడం గమనార్హం. 16 నెలల పాలన ఏ విధంగా ఉందో బీహార్ ఓటర్లు తీర్పునివ్వనున్నారు. ఇదిలా ఉంటే ఎవరికి వారు తాము విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఉదయం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, బీజేపీ నేత షాన్ వాజ్ హుస్సేన్ వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. తాము తప్పకుండా విజయం సాధిస్తామని, మధ్యాహ్ననికల్లా పూర్తి మెజార్టీ సాధిస్తామని లాలూ ధీమా వ్యక్తం చేశారు. తాము ఈ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ సాధిస్తామనిబీజేపీ నేత షాన్ వాజ్ హుస్సేన్ పేర్కొన్నారు.

 

బీహార్ కౌంటింగ్ ప్రారంభం..

బీహార్: రాష్ట్ర ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. 243 నియోజకవర్గాలకు ఐదు దశల్లో పోలింగ్ జరిగింది. 39 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

08:04 - November 8, 2015

బీహార్ : రాష్ట్రంలో ఏ పార్టీ ఎక్కువ కాలం అధికారంలో ఉంది...కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూ పాలన ఎలా సాగింది...అసలు బీహార్ కు కావాల్సింది ఏంటీ ? బీహార్‌. ఒక బీమారు రాష్ట్రం. దేశంలో అత్యంత వెనకబడిన స్టేట్. స్వాతంత్ర్యం పొందిన నాటి నుంచి అనేక పార్టీలు పాలించాయి. కానీ బీహార్ ముఖచిత్రాన్ని మార్చలేకపోయాయి. 1951లో బీహార్‌ లో తొలి అసెంబ్లీ కొలువుదీరింది. 331 స్థానాలతో శాసనసభ ప్రస్థానం మొదలైంది. తొలి అధికారం కాంగ్రెస్ దే. శ్రీకృష్ణ సిన్హా మొదటి ముఖ్యమంత్రి. వరుసగా మూడు పర్యాయాలు ఖద్దరు పార్టీదే అధికారం. 1977లో జనతా పార్టీ అధికారం కైవసం చేసుకుంది. జనతా పార్టీ ఓటమి అనంతరం 1980లో పవర్ లోకి వచ్చిన కాంగ్రెస్ పదేళ్లు బీహార్ ను పాలించింది. అయితే 1990 నుంచి లాలూ శకం మొదలైంది.

2000లో లాలూ సతీమణి రబ్రీదేవికి సీఎం బాధ్యతలు..

1990లో లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించింది. తర్వాత రెండు దశాబ్దాలు ఏకధాటిగా పాలన సాగించింది. లాలూ ముఖ్యమంత్రిగా ఏలారు. అయితే లాలూ జైలు కెళ్లడంతో 2000 సంవత్సరంలో ఆయన సతీమణి రబ్రీదేవి ముఖ్యమంత్రి అయ్యారు.

2010 ఎన్నికల్లోనూ నితీష్‌కే పాలనా పగ్గాలు..
అవినీతి ఆరోపణల ఊబిలో కూరుకుపోయిన లాలూపై కసితో 2005లో జేడీయూకి పట్టం కట్టారు బీహార్ ప్రజలు. ముఖ్యమంత్రిగా నితీష్‌ కుమార్ శకం మొదలైంది. అప్పటి నుంచే బీహార్ అభివృద్దిలో నవశకానికి నాందిపడింది. 2010 ఎన్నికల్లోనూ నితీష్‌ కుమార్ కే పట్టం కట్టారు బీహార్ ప్రజలు. సార్వత్రిక ఎన్నికల సమయంలో జితన్ మాంఝీకి పాలనా పగ్గాలు అప్పగించారు నితీష్‌. అయితే ఈ ప్రయోగం బెడిసికొట్టడంతో తిరిగి సీఎం సింహాసనంపై కూర్చున్నారు. అభివృద్ది కార్యక్రమాలతో అన్ని వర్గాల ఆదరాభిమానాలు పొందారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత అంతగా కనిపించకపోవడానికి నితీష్‌ కుమార్ అభివృద్ది అజెండానే కారణమని విశ్లేషకులు చెబుతారు.

మీకు జంగిల్ రాజ్ కావాలా...అభివృద్ది రాజ్ కావాలా?..
మొత్తానికి కాంగ్రెస్ తర్వాత బీహార్‌ ను ఎక్కువ కాలం పాలించింది ఆర్జేడీ, జేడీయూనే. కాంగ్రెస్ ఎప్పుడో వెనకబడిపోయింది. లాలూ సారథ్యంలోని ఆర్జేడీ చతికిలబడింది. అవినీతే ఆర్జేడీ కొంపముంచింది. ఇప్పుడు పోటీ నితీష్‌ వర్సెస్, బీజేపీల మధ్యే. దీనికి తోడు గతంలో జేడీయూ, ఆర్జేడీ శత్రుత్వాన్ని, నేటి ఫ్రెండ్ షిప్ ను కూడా ప్రచారాంశంగా మలచుకుంది బీజేపీ. అవినీతిలో కూరుకుపోయిన లాలూతో నితీష్‌ జట్టుకట్టాడని, బీహార్ ను మళ్లీ వీళ్లిద్దరూ కరప్షన్ స్టేట్ గా మారుస్తారని మోదీ, షాలు తమ ప్రసంగాల్లో విమర్శించారు. మీకు జంగిల్ రాజ్ కావాలా...అభివృద్ది రాజ్ కావాలా అంటూ సభల్లో మాట్లాడారు.

243 అసెంబ్లీ స్థానాల్లో సగానికి పైగా తమవేనంటున్న బీజేపీ..
లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు పొందిన బీజేపీ..అసెంబ్లీ ఎలక్షన్స్ లోనూ తమదే విజయమని ధీమాగా ఉంది. 243 అసెంబ్లీ స్థానాల్లో సగానికి పైగా సీట్లు తమవేనని అంచనాలు వేస్తోంది. అయితే ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీయే, మహాకూటమిలు హోరాహోరీగా తలపడుతున్నాయని అంచనాలు వ్యక్తమయ్యాయి.

బీహార్ ప్రజలకు ఇప్పుడు కావాల్సింది అభివృద్ది..
అయితే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా...బీహార్ ప్రజలకు ఇప్పుడు కావాల్సింది అభివృద్ది. మంచినీరు లేక ఎన్నో గ్రామాలు గొంతెండుతున్నాయి. కరెంటు లేక చీకట్లో గడుపుతున్నాయి. సరైన విద్యా వ్యవస్థ లేదు. పరిశ్రమల్లేవు. పక్కా రోడ్లు లేవు. ఉద్యోగాల్లేక యువత నైరాశ్యంలో కూరుకుపోయింది. దళితులకు రక్షణలేదు. శాంతిభద్రతలు గాల్లోదీపమయ్యాయి. ఇలా ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న బీహార్ రాష్ట్రానికి కావాల్సింది...పక్కా అభివృద్ది.

08:00 - November 8, 2015

బీహార్ : ఎన్నికల సాక్షిగా విద్వేష రాజకీయం పెచ్చరిల్లింది. కులం, మతం ప్రాతిపదికన ఓట్లు చీల్చేందుకు నేతలు ఏమాత్రం సంకోచించలేదు. నోటికొచ్చింది మాట్లాడి కులాల కుంపట్లలో చలికాచుకున్నారు. అమిత్‌ షా కామెంట్లపై ఎన్డీయేతర పక్షాలు విరుచుకుపడ్డాయి. విద్వేషాలు రెచ్చగొట్టేందుకు షా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డాయి. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. బీహార్ ఎన్నికల సమయంలోనే యూపీలోని దాద్రీలో గోమాంసం తిన్నాడనే నెపంతో ముస్లింను చంపడం కలకలం రేపింది. దీంతో ఒక్కసారిగా బీహార్ ప్రచారం గోమాంసం చుట్టే తిరిగింది. బీజేపీ ఎంపీలు, ఆరెస్సెస్ నేతలు గోమాంసం తిన్నవారిని దేశం నుంచి వెళ్లగొట్టాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ తో పాటు అనేక పార్టీలు బీజేపీ, ఆరెస్సెస్ అనుబంధ సంఘాల తీరుపై మండిపడ్డాయి. అసహనంతో బీజేపీ దేశంలో ప్రజల మధ్య చిచ్చుపెడుతోందని, మతం ప్రాతిపదికగా దేశ ప్రజల ఐక్యతకు భంగం కలిగేలా వ్యవహరిస్తోందని విమర్శించాయి. రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేశాయి.

రిజర్వేషన్లపై సమీక్ష జరగాలని మోహన్ భగవత్ కామెంట్స్..
మరోవైపు రిజర్వేషన్లపై సమీక్ష జరగాలని ఆరెస్సెస్ నాయకుడు మోహన్ భగవత్ చేసిన కామెంట్స్ కూడా బీహార్ ఎన్నికల్లో చర్చనీయాంశమయ్యాయి. దీనిపై మహాకూటమి ఓ రేంజ్‌ లో ఫైర్ అయ్యింది. రిజర్వేషన్లను ఎత్తివేయాలని బీజేపి కుట్ర చేస్తోందని ఆరోపించింది. దీంతో డిఫెన్స్ లో పడిన మోడీ...రిజర్వేషన్లకు అనుకూలంగా మాట్లాడి విమర్శల వేడిని తగ్గించే ప్రయత్నం చేశారు.

07:52 - November 8, 2015

బీహార్ : ఈ ఎన్నికల్లో తాము తప్పకుండా విజయం సాధిస్తామని ఆయా పార్టీల నేతలు పేర్కొంటున్నారు. 243 అసెంబ్లీ స్థానాలకు ఐదు దఫాలుగా ఎన్నికల పోలింగ్ జరిగింది. మ్యాజిక్ ఫిగర్ 122 ఏ పార్టీ కైవసం చేసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. ఎగ్జిట్ పోల్స్ లో మహా కూటమి, బీజేపీ మధ్య హోరాహోరీ తప్పదని అంచనా వేశాయి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీఏ కంగా 31 ర్యాలీలు నిర్వహించడం గమనార్హం. 16 నెలల పాలన ఏ విధంగా ఉందో బీహార్ ఓటర్లు తీర్పునివ్వనున్నారు. ఇదిలా ఉంటే ఎవరికి వారు తాము విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఉదయం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, బీజేపీ నేత షాన్ వాజ్ హుస్సేన్ వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. తాము తప్పకుండా విజయం సాధిస్తామని, మధ్యాహ్ననికల్లా పూర్తి మెజార్టీ సాధిస్తామని లాలూ ధీమా వ్యక్తం చేశారు. తాము ఈ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ సాధిస్తామని బీజేపీ నేత షాన్ వాజ్ హుస్సేన్ పేర్కొన్నారు. 

 

మహాగట్బందన్ విఫలం చెందింది - మాంజీ..

బీహార్ : ఎన్నికల్లో మహాగట్బందన్ విఫలం చెందిందని జితర్ రామ్ మాంజీ పేర్కొన్నారు. ఓ జాతీయ ఛానెల్ తో ఆయన మాట్లాడారు. 

07:48 - November 8, 2015

బీహార్ : కులాల కుంపట్లు... వర్గాల సిగపట్లు... బీహార్‌ లో కులానిదే బలం. వర్గాలదే విజయం. పట్నా సింహాసనం చేజిక్కించుకోవాలంటే కులాల సమీకరణాలే ముఖ్యం. అందుకే బీజేపీ, జేడీయూ సేన క్యాస్ట్ ఈక్వేషన్స్‌ను పక్కాగా చూసుకున్నాయి. బీహార్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు వేసిన సామాజిక వ్యూహాలు అన్నీఇన్నీ కావు. ఎన్డీయే, మహాకూటమి నువ్వానేనా అన్నట్లుగా తలపడిన బీహార్‌ లో కుల సమీకరణాలే ప్రధాన భూమికను పోషించాయి. క్యాస్ట్ ఈక్వేషన్స్ సరి చూసుకుంటే విజయం తమదేనన్న భరోసాతో ప్రధాన ప్రత్యర్థులు స్కెచ్ వేశాయి. మహాకూటమిలో ప్రధాన పార్టీలైన జేడీయూ, ఆర్జేడీకి బీసీ వర్గాల్లో మంచి పట్టుంది. వెనకబడిన వర్గాలైన కుర్మీలు, యాదవ్‌ లే వీటికి వెన్నుదన్ను. దళితుల మద్దతు కూడా వీటికి ఉంది. అయితే జితన్ మాంఝీ బీజేపీకిలోకి వెళ్లడంతో ఎస్సీ ఓట్లలో కొంత చీలిక వచ్చింది. దీంతో ఎస్సీలను గంపగుత్తగా ఆకట్టుకునేందుకు మహాకూటమి అనేక హామీలు గుప్పించింది. అంతేకాదు బనియా, బ్రాహ్మణులు, భూమిహార్లు, రాజ్ పుత్‌ లు, ముస్లింలకు కొన్ని సీట్లు కేటాయించి...సమీకరణాలను పక్కాగా ఫాలోయింది. అయితే వీరిలో అగ్రవర్ణాల ఓట్లను మహాకూటమి పొందలేకపోయిందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అంతేకాదు ఎంఐఎం ప్రవేశంతో ముస్లింల ఓట్లను కూడా మహాకూటమి కోల్పోయిందన్నది విశ్లేషకుల అంచనా.

యాదవ్‌ ల పాలనపై ఎస్సీ వర్గంలో వ్యతిరేకత..
మహాకూటమికి ఉన్న బీసీల మద్దతుకు దీటుగా.. బలసమీకరణలో మోడీ, అమిత్ షాల ద్వయం వ్యూహాత్మకంగా పావులు కదిపింది. అగ్రవర్ణాలు, దళితులను తమవైపు తిప్పుకునే యత్నాలు చేసింది. బీహార్‌లో దశాబ్దాలుగా యాదవ్‌ లు అధికారంలో ఉండటంతో సహజంగానే వారిపట్ల ఎస్సీల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉంది. దీన్ని తమకు అనుకూలంగా మలచుకుంది బీజేపీ. జేడీయూ నుంచి మాంఝీని తమవైపు లాక్కుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం ఎస్సీల్లో 51 శాతం ఓట్లు ఎన్డీయేకు పడ్డాయి. ఇక బనియాలు, బ్రాహ్మణులు, భూమి హార్లు, రాజ్ పుత్‌ ల వంటి అగ్రవర్ణాలు కాషాయదళం ఓటు బ్యాంకే. అంతేకాదు రాష్ట్రంలో 30 శాతం ఉన్న ఈబీసీల ఓట్లను ఆకర్షించేందుకు ఏకంగా మోడీ సామాజికవర్గాన్ని ప్రయోగించింది బీజేపీ.

కులాల సమీకరణలు..
ఈబీసీ నిరుపేద కుటుంబంలో పుట్టిన తాను ప్రధానిగా ఉండటం నితీష్‌ కు కంటగింపుగా మారిందని స్వయంగా ఓ సభలో మోడీ వ్యాఖ్యానించారు. అంతేకాదు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుశీల్ కుమార్ మోడీ ఒక అడుగు ముందుకేసి మోడీ తెలిక కులానికి చెందినవాడని ప్రకటించేశారు. అంతేకాదు ములాయం సింగ్ యాదవ్ ను మహాకూటమికి దూరం చేసి యాదవ్ ల ఓట్లను కూడా చీల్చింది ఎన్డీయే. ఇలా కులాల సమీకరణలతో బీహార్‌ లో తలపడ్డాయి ఎన్డీయే, మహాకూటమి. 

07:31 - November 8, 2015

బీహార్ : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ పర్వం ముగిసింది. ఆదివారం ఉదయం 9గంటలకు పోలింగ్ కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 243 స్థానాలకు ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో సీఎం ఎవరు కానున్నది ఉత్కంఠగా మారింది. మోడీ 16 నెలల పాలనపై బీజేపీ ఓటర్లు తీర్పునివ్వనున్నారు. ఒకసారి ఆయా ముఖ్యమంత్రుల గురించి..

ముఖ్యమంత్రి ఎప్పటి నుండి ఎప్పటి వరకు పార్టీ పేరు
రాష్ట్రపతి పాలన  ఫిబ్రవరి 11, 1999 నుండి మార్చి 9, 1999  
రబ్రీదేవి మార్చ్  9, 1999 నుండి మార్చి 2, 2000  ఆర్జేడీ
నితీష్ కుమార్ మార్  మార్చ్ 3, 2000 నుండి మార్చ్ 10, 2000  జేడీయూ
రబ్రిదేవి మార్చ్ 11, 2000 నుండి మార్చ్ 6, 2005  ఆర్జేడీ
రాష్ట్రపతి పాలన మార్చ్ 7, 2005 నుండి నవంబర్ 24, 2005  
నితీష్ కుమార్  నవంబర్ 24, 2005 నుండి మే 19, 2014  జేడీయూ
జితన్ రాం మాంజీ  మే 20, 2014 నుండి ఫిబ్రవరి 22, 2015  జేడీయూ
నితీష్ కుమార్  ఫిబ్రవరి 22, 2015 నుండి ....  జేడీయూ
07:20 - November 8, 2015

పూరి జగన్నాధ్ - వరుణ్ తేజ్ కాంబినేషన్ లో 'లోఫర్' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలయింది. తల్లి సెంటిమెంట్ తో సాగే ఎమోషనల్ డ్రామానే 'లోఫర్' కథ అని దర్శకుడు పూరి ఇదివరకే చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విడుదల చేసిన స్టిల్స్ లోనూ అదే విషయం స్పష్టమవుతోంది. 'దిశా పఠానీ' హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో పోసాని కృష్ణమురళి, రేవతి హీరో తల్లి తండ్రులుగా నటిస్తున్నారు. పూరి హీరో అంటే అభిమానుల్లో ఎన్నో అంచనాలు నెలకొంటాయి. రఫ్ అండ్ టఫ్ పాత్రలో 'వరుణ్' ఎలా నటిస్తాడో అని మెగా అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 

07:19 - November 8, 2015

ఫేషియల్‌ అనగానే పార్లర్‌కు పరిగెత్తి పర్స్‌ ఖాళీ చేసుకుంటారు చాలామంది. సింపుల్‌ ప్యాక్స్‌తో ఇంట్లో పార్లర్‌లాంటి నిగారింపు పొందవచ్చు. ఇంట్లోనే సహజంగా చేసుకోగలిగే ఫేస్‌ ప్యాక్స్ కొన్ని..
బొప్పాయితో...
చర్మానికి మెరుపునిచ్చే పండ్లల్లో బొప్పాయి ఒకటి. ఈ బొప్పాయి మాస్క్ తయారు చేసుకోవడానికి.. మూడు ముక్కలు బాగా పండిన బొప్పాయి తీసుకుని... దానికి రెండు చెంచాల బాదం పొడిని కలుపుకోవాలి. దీనిని ముఖానికి మాస్క్ లాగా వేసుకుని పది నిమిషాల తరువాత ముఖాన్ని మర్దన చేయాలి. తరువాత చల్లని నీళ్లతో కడిగేయాలి.
పెరుగుతో
రెండు చెంచాల పెరుగుకు రెండు లేదా మూడు చెంచాల బాదం నూనెను కలపాలి. ఒక చెంచా తేనెను చేర్చాలి. ముఖంపై సమానంగా అప్లై చేయాలి. 15 నిమిషాల తరువాత ముఖానికి మృదువుగా మసాజ్‌ చేసి చల్లని నీటితో కడిగేయాలి. చర్మాన్ని నునుపుగా చేయడమే కాదు... సహజమైన అందాన్నిస్తుంది.
తేనెతో...
వయసును తగ్గించే సహజమైన ద్రావణం తేనె. వారానికి మూడు సార్లు తేనెను ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ఆరిన తరవాత చల్లని నీటితో కడిగేయాలి.
బాదంతో...
బాదంలో విటమిన్‌ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది ఓట్స్‌, మిల్క్ తో కలిస్తే అద్భుతాలను సృష్టిస్తుంది. ఒక చెంచా బాదం పొడి, ఒక చెంచా ఓట్స్ తీసుకోవాలి. ఈ రెండింటిని పాలల్లో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తరవాత చల్లని నీటితో కడిగేయాలి. ఇది స్కిన్‌టోన్‌ను పూర్తిగా మార్చేస్తుంది. చర్మానికి నిగారింపునిస్తుంది.
క్యారెట్‌తో...
క్యారెట్‌లో విటమిన్‌ 'సి' 'కె' తోపాటు 'బి' కెరోటిన్‌ ఉంటుంది. క్యారెట్‌ తీసుకుని గుజ్జుగా చేసుకోవాలి. పాలపొడి, చక్కెరతో బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

 

07:18 - November 8, 2015

'ఐ లవ్‌ యు రస్నా' అంటూ రస్నా బేబీగా అందరికీ సుపరిచితురాలైన అంకిత హీరోయిన్‌గా 'లాహిరి లాహిరి లాహిరిలో', 'ప్రేమలో పావని కళ్యాణ్‌', 'ధనలక్ష్మీ ఐ లవ్‌ యు', 'సింహాద్రి', 'విజయేంద్రవర్మ' వంటి చిత్రాల్లోని పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించిన సంగతి తెలిసిందే. అంకిత నిశిత్చార్థ వేడుక ఈనెల 6వ తేదీన జరిగింది. న్యూజెర్సీకి చెందిన ఎన్నారై, జెపి మోర్గాన్‌ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ విశాల్‌ జగ్తాప్‌తో అంకిత నిశ్చితార్థం శుక్రవారం ముంబైలోని జె.పి.మారియట్‌ హోటల్‌లో పెద్దల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది.

07:17 - November 8, 2015

ఇలియానా మరోమారు తమిళ అగ్రనటుడు విజయ్‌ సరసన నటించే అవకాశాన్ని పొందింది. గతంలో శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన 'నన్బాన్‌' (తెలుగులో 'స్నేహితులు') చిత్రంలో ఇలియానా విజయ్‌కి జోడీగా నటించింది. విజయ్‌ 60వ చిత్రంగా రూపొందుతున్న ఈచిత్రానికి ఎం.రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఎం.రాజా ఇటీవల 'తని ఒరువన్‌' వంటి ఘనవిజయం సాధించిన చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. చరిత్రలో ప్రసిద్ధికెక్కిన కుమారి కందమ్‌ (ప్రస్తుతం 'లిమురై'గా పాపులరైంది) నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకుని దర్శకుడు ఈచిత్రాన్ని తెరకెక్కించ నున్నారు. విజయ్‌ ప్రస్తుతం 59వ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

07:16 - November 8, 2015

వరుణ్‌తేజ్‌, ప్రగ్యా జైస్వాల్‌ జంటగా రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో రూపొంది విశేష ప్రేక్షకాదరణ పొందిన 'కంచె' చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్‌ చేయనున్నారని సమాచారం. ఎరోస్‌, ఫాక్స్ స్టూడియోస్‌, రియలన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ సంస్థలు ఇటీవల 'కంచె' స్పెషల్‌ స్క్రీనింగ్స్ ను వీక్షించాయి. స్క్రీనింగ్‌ సమయంలో చిత్ర దర్శకుడు క్రిష్‌ కూడా వారితోపాటే వీక్షించారట. 'కంచె' హిందీ రీమేక్‌లో అక్షయ్ కుమార్‌ నటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. గతంలో కూడా 'ఠాగూర్‌' చిత్రాన్ని బాలీవుడ్‌లో 'గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌' పేరుతో క్రిష్‌, అక్షయ్ రీమేక్‌ చేసిన సంగతి తెలిసిందే.

మల్కాజ్ గిరిలో కార్డన్ సెర్చ్...

హైదరాబాద్ : మల్కాజ్ గిరిలోని ఆర్టీసీ కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అడిషనల్ డీసీపీ రాంచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో 60 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 110 బైక్ లు, 27 ఆటోలు, 4 కార్లను స్వాధీనం చేసుకున్నారు. 

ఎస్. కోట వద్ద రోడ్డు ప్రమాదం..

విజయనగరం : ఎస్ కోట (మం) తాటిపూడి వద్ద చెట్టుకు కారు ఢీకొంది. ఈప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. 

ఎర్రబెల్లి నివాసంలో టిడిపి, బిజెపి నేతల భేటీ..

హైదరాబాద్ : ఉదయం 9గంటలకు ఎర్రబెల్లి నివాసంలో టిడిపి, బిజెపి నేతల భేటీ కానున్నారు. వరంగల్ లో ప్రచార వ్యూహాన్ని నేతలు ఖరారు చేయనున్నారు. 

సూర్యాపేటలో తుపాకీ కలకలం..

నల్గొండ : సూర్యాపేటలో తుపాకీ కలకలం సృష్టించింది. మిర్యాలగూడ (మం) ఆళ్లగడ్డకు చెందిన విజయ్ వద్ద తుపాకీ, ఐదు రౌండ్ల బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

06:58 - November 8, 2015

బీహార్ : రాష్ట్రంలోని 243అసెంబ్లీ నియోజకవర్గాలకు ఐదు దశల్లో పోలింగ్ జరిగింది. ఇందులో ప్రముఖుల వ్యక్తులు బరిలో నిలుచున్నారు.
 

అభ్యర్థి పార్టీ  నియోజకవర్గం
అక్తరుల్ ఇమామ్ ఎఐఎంఐఎం  కోచదమన్
డా.సిఎన్. గుప్తా  బీజేపీ చాప్రా
అర్జిత్ షశ్వత్ చూబే బీజేపీ బాగ్లాపూర్
కిశోర్ కుమార్ బీజేపీ సుపాల్
అక్తరుల్ ఇమామ్ ఎఐఎంఐఎం కోచదమన్
లలిత్ కుమార్ యాదవ్  ఆర్జేడీ  దర్బంగ్ రూరల్
ఓం ప్రకాష్ ఖేరియా  ఆర్జేడీ దర్బంగ
సంజయ్ సరోగి  బీజేపీ  దర్బంగ
అనిరుద్ ప్రసాద్  జనతాదళ్ (సెక్యూలర్) గరీబ్ బారాల్లి
సుభాష్ సింగ్ బీజేపీ గోపాల్ గంజ్
వ్యాస్ డి ప్రసాద్  బీజేపీ షివాన్
డా.సిఎన్.గుప్తా  బీజేపీ చాప్రా
తేజ్ ప్రతాప్ యాదవ్  ఆర్జేడీ మహువా
తేజశ్వీ ప్రసాద్ యాదవ్  ఆర్జేడీ రాగోపూర్
రామ్ విలాస్ పాశ్వాన్ ఆర్జేడీ పిర్ పైంతి
అర్జిత్ షశావత్ చూబే  ఆర్జేడీ  బాగ్లాపూర్
పప్పు యాదవ్  ఎస్పీ జమ్లాపూర్
అరుణ్ కుమార్  ఎల్జేపీ హౌరానౌత్
నంద్ కిశోర్ యాదవ్  బీజేపీ పాట్నా సాహిబ్
దదన్ యాదవ్ జేడీయూ డుమ్రాన్
రామ్ బిహారి సింగ్ ఆర్ఎల్ ఎస్పీ డుమ్రాన్
ఆనంద్ భూషణ్ పాండే  బీజేపీ  బాబువా
జై కుమార్ సింగ్  జేడీయూ  దినారా
సుబేదార్ దాస్  ఆర్జేడీ మక్ద్మ్ పూర్
అరుణ్ కుమార్  బీజేపీ మక్ద్మ్ పూర్
జితన్ రామ్ మాంజీ  హెచ్ఎఎం(ఎస్)  మక్ద్మ్ పూర్
రామ్దార్ సింగ్  బీజేపీ  ఔరంగాబాద్
ఉదయ్ నారాయణ్ చౌదరీ  జేడీయూ  ఇమామ్ గంజ్
జితన్ రామ్ మాంజీ  హెచ్ఎఎం(ఎస్)  ఇమామ్ గంజ్
ప్రేమ్ కుమార్  బీజేపీ  గయా టౌన్
     

 

06:36 - November 8, 2015

హైదరాబాద్ : ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో చంద్రబాబు అధ్యక్షతన తెలంగాణ టిడిపి నేతల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. కేసీఆర్‌ అవినీతి పరాకాష్టకు చేరిందని.. ప్రభుత్వం ప్రజల ఆకాంక్ష మేరకు పని చేయడం లేదని నేతలు ఆరోపించారు. అవినీతి ఆస్కారం ఉన్న ప్రతి శాఖ కేసీఆర్‌ కుటుంబ సభ్యుల వద్దే ఉన్నాయని వారు ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ అవినీతిపై ప్రతి ఊరిలోని రచ్చబండలో ప్రచారం చేయాల్సిన అవసరముందని టిడిపి నేతలన్నారు.

06:34 - November 8, 2015

హైదరాబాద్ : ఉమ్మడి రాజధాని నుంచి ఏపీకి తరలివెళ్లేందుకు ఉద్యోగులు ఎట్టకేలకు అంగీకరించారు. వచ్చే ఏడాది జూన్‌ వరకు వెళ్లేందుకు తమకెలాంటి అభ్యంతరాలు లేవని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. అయితే తమకు కార్యాలయంతో పాటు మౌలికవసతులను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు ఉద్యోగులు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ నుంచి ఉద్యోగుల తరలింపు అంశంపై సచివాలయంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులంతా హాజరయ్యారు. కొన్ని రోజులుగా ఉద్యోగుల తరలింపుపై రకరకాలుగా వస్తున్న వార్తల నేపథ్యంలో ఉద్యోగులంతా భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. ఏపీకి తరలివెళ్లే విషయంలో తమకున్న అనుమానాలన్నింటిని నివృత్తి చేసుకునే ప్రయత్నం చేశారు ఉద్యోగులు. వచ్చే ఏడాది జూన్‌వరకు ఏపీకి ఖచ్చితంగా తరలివెళ్లాల్సిందే అన్న ప్రభుత్వం నిర్ణయాన్ని తాము వ్యతిరేకించడంలేదని..అందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మురళీకృష్ణ తెలిపారు.

 మానసికంగా సిద్ధమైన ఉద్యోగులు...
ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలివెళ్లేందుకు తమకెలాంటి అభ్యంతరం లేదని..కాకపోతే..పిల్లల చదువులు, ఇతర సౌకర్యాలపై ఉన్న ఇబ్బందులపై ప్రభుత్వం దృష్టిసారిస్తే బాగుంటుందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మరింత గడువు కోరాలని తొలుత భావించినప్పటికీ..మెజారిటి ఉద్యోగులంతా జూన్‌వరకు వెళ్లేందుకు అంగీకరించినట్లు సమాచారం. అయితే కొంతమంది ఉద్యోగులు మాత్రం ప్రభుత్వం కనీసం బ్యాచిలర్‌ ఎంప్లాయ్‌ సౌకర్యాలు కల్పిస్తే విజయవాడకు వెళ్లేందుకు అభ్యంతరం లేదని తెలిపారు. మొత్తానికి వచ్చే ఏడాది జూన్‌వరకల్లా ఏపీ రాజథాని అమరావతికి వెళ్లేందుకు ఏపీ ఉద్యోగులంతా మానసికంగా సిద్ధమయ్యారు. పిల్లల చదువుల దృష్ట్యా కొన్నాళ్లపాటు కష్టాలు తప్పవంటూనే...ప్రభుత్వ నిర్ణయాన్ని శిరసావహించిక తప్పదని ఉద్యోగులు భావిస్తున్నారు. 

06:32 - November 8, 2015

బీహార్ : మరికొన్ని గంటల్లో బీహార్‌ కా బాద్‌షా ఎవరో తేలిపోనున్నది. 243 నియోజకవర్గాల ఫలితాలు రానున్నాయి. మధ్యాహ్నానికల్లా పూర్తి ఫలితాలు వెల్లడవనున్నాయి. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేయడంతోపాటు..40 కంట్రోల్‌ రూమ్‌లను కూడా పెట్టారు. మొత్తం రికార్డు స్థాయిలో 56.8 శాతం పోలింగ్‌ నమోదైన బీహార్‌ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒకరు దేశానికి ప్రధాని. మరొకరు రాష్ట్రానికి చుక్కాని. కానీ ఇద్దరి మధ్యే అరవీర భయంకర పోటీ. నువ్వా నేనా అన్నట్టుగా సమరం. మాటల తూటాలు... వాడీవేడీ విమర్శనాస్త్రాలు. ఓడిపోతే అథోగథే అన్నదే ఇద్దరి మనోగతం. విశ్లేషకుల అంచనాలూ విశ్లేషణలూ అవే. ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల గెలుపోటములు ఆ ఇద్దరు నేతల భవిష్యత్ ను ఎలా ప్రభావితం చేస్తాయి..? నిజానికి బీహార్ ఎన్నికలు ఆ రాష్ట్రానికే పరిమితం. కానీ దేశ సార్వత్రిక ఎన్నికలను తలపింప చేశాయి. దేశమంతా బీహార్ ఎన్నికలవైపే చూసింది. మోడీ గెలుస్తారా...నితీష్‌ నిలుస్తారా...ఇదే అంశం చుట్టూ చర్చోపచర్చలు సాగాయి. ఈ ఎన్నికలు మోడీకి... దేశ పాలనా తీరును నిర్దేశించబోతున్నాయి.. హ్యాట్రిక్ విజేతగా నితీష్‌ నిలిస్తే జాతీయ స్థాయిలో మోదీకి దీటైన అభ్యర్థి అవుతారు.

30 సభల్లో మాట్లాడిన ప్రధాని మోడీ..
సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే బరిలోకి దిగిన బీజేపీకి ప్రధాన ప్రచార రథ సారథి నరేంద్ర మోడీయే అయ్యారు. బీహార్ ఎలక్షన్ క్యాంపెన్ లో చురుగ్గా పాల్గొన్నారాయన. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి 30 సభల్లో మాట్లాడ్డమంటే మామూలు విషయం కాదు. సుడిగాలి పర్యటనలు చేశారు. వ్యక్తిగత విమర్శలూ చేశారు. రిజర్వేషన్లపై దూకుడుగా మాట్లాడారు. ఇంత అగ్రెసివ్ గా క్యాంపెన్ చేయడం వెనక మోడీని తరుముతున్న అనేక అంశాలున్నాయి.

పాట్నా పీఠం కాషాయదళం ఆపసోపాలు..
సార్వత్రిక ఎన్నికల్లో విజయంతో నరేంద్ర మోడీ, అమిత్‌ షాల ఖడ్గానికి ఎదురే లేకుండాపోయింది. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ ఇలా వరుసగా రాష్ట్రాలను తమ ఖాతాలో వేసుకున్నారు. కానీ ఢిల్లీలో ఘోర పరాజయంతో మోడీ, షాలకు ఎదురు గాలి మొదలైందన్న విశ్లేషణుల జోరందుకున్నాయి. అటు ప్రతిపక్షాలు కూడా దూకుడు పెంచాయి. ఇటు రాజ్యసభలో బలంలేక భూసేకరణతో పాటు అనేక బిల్లులపై చతికిలపడుతోంది మోదీ సర్కారు. బీహార్ లో గెలిచి రాజ్యసభలో బలం పెంచుకుని పాలనా సంస్కరణలు వేగవంతం చేయాలని పట్టుదలగా ఉంది. బీహార్ లో ఓడిపోతే మరింత ఇబ్బందుల్లో పడతామని మోడీ, షా ద్వయం భయపడుతోంది. ఇలా ఎన్నో రకాలుగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మోదీకి ప్రతిష్టాత్మకం. అందుకే కాషాయదళం పట్నా పీఠం కోసం ఆపసోపాలు పడింది. బీహార్ కోసమే భూసేకరణ బిల్లును పక్కనపెట్టింది. లక్షా 65 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది కూడా పట్నాలో పాగా వేసేందుకే. కేంద్రమంత్రివర్గాన్ని, కాషాయ పార్టీని బీహార్ లోనే మోహరించిందీ అందుకే.

ప్రత్యర్థిగా నితీష్‌ లేకపోతే ఇంత చెమటోడ్చేదా?..
అయితే నరేంద్ర మోడీ, షా ద్వయం బీహార్ ను ఇంత ప్రతిష్టాత్మకంగా భావించడానికి కారణం ఒకే ఒక్కడు నితీష్‌ కుమార్. ప్రత్యర్థి స్థానంలో నితీష్‌ ఉండకపోతే కాషాయ శ్రేణులు ఇంత చెమటోడ్చేవి కావు. బీహారీ గుండెల్లో నితీష్‌ లేకపోతే ఇక్కడి లోక్ సభ స్థానాలను ఊడ్చేసిన కమలం...అసెంబ్లీ స్థానాల కోసం ఇంతలా కష్టపడేది కాదు. నితీష్‌ ది కూడా ఇదే భయం.

నితీష్‌ కూ ఎన్నికలు జీవన్మరణం..
వరుసగా రెండుసార్లు విజయఢంకా మోగించిన నితీష్‌ కు ఈ ఎన్నికలు జీవన్మరణం. ఎందుకంటే ఎంపీ స్థానాలను ఎగరేసుకుపోయిన కమలదళం.. తన సింహాసనాన్ని కూడా లాగేసుకుంటుందని భావించారు. అందుకే సర్వశక్తులను ఒడ్డారు. గ్రామ, మండల స్థాయిలో వినూత్నంగా ప్రచారాన్ని హోరెత్తించారు. అభివృద్దికి కొనసాగింపు కావాలంటే తనను ఎన్నుకోవాలని ప్రసంగాలు దంచారు. అంతేకాదు గుజరాత్ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంతో జాతీయ స్థాయిలో వెలిగిన మోడీ తరహాలోనే...తాను కూడా హ్యాట్రిక్ విజయంతో వచ్చే సార్వత్రిక పోరులో మోదీకి దీటైన అభ్యర్థిగా దూసుకెళ్లాలని ప్రణాళిక వేశారు. మూడో కూటమి, ములాయం దోస్తీ ఇలా అనేక ప్రయోగాలు చేసి ఎన్డీయేతర పక్షాలతో కలిసి మహా కూటమిగా బరిలోకి దిగారు. ఇలా ఇద్దరు మహానాయకులు బీహార్ ఎన్నికలను జీవన్మరణ సమరంగా కత్తులు దూశారు.

06:29 - November 8, 2015

హైదరాబాద్ : నగరంలోని జూబ్లీ హిల్స్ రోడ్‌ నెంబర్‌ 4లో ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులను బ్రీత్‌ ఎనలైజర్‌తో పరీక్షించారు. తనిఖీల్లో భాగంగా సినీనటి, మాజీ ఎంపీ జయప్రద వాహనాన్ని సైతం బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలు చేసేందుకు ఆపారు. అయితే వాహనంలో ప్రయాణిస్తున్న జయప్రద పోలీసుల పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మీడియాలో పబ్లిసిటీ కోసం కాకపోతే.. ఎందుకు ఆపినట్లు అని ఆగ్రహంగా ప్రశ్నించారు. ఇది సరైంది కాదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నేడే బీహార్ ఫలితాలు..

బీహార్ : నేడు రాష్ట్ర ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 8గంటల నుండి ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు నెల రోజుల పాటు ఐదు దశలుగా పోలింగ్ జరిగింది. 

నేడు టీఎస్ఎన్పీడీసీఎల్ ఏఈ రాత పరీక్ష..

హైదరాబాద్ : ట్రాన్స్ కో, జెన్ కోతో పాటు రెండు డిస్కంల పరిధిలో ఏఈ పోస్టుల భర్తీ కోసం నాలుగు విడతల్లో రాత పరీక్షలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం నార్తర్న్ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ 164 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీ కోసం రాత పరీక్ష జరుగనుంది. 35,263 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. మొత్తం 54 కేంద్రాల్లో ఉదయం పది గంటలన ఉండి మధ్యాహ్నాం 12 గంటల వరకు పరీక్ష జరుగనుంది. 

 

క్రమబద్ధీకరణ..రేపటి నుండి దరఖాస్తుల స్వీకరణ..

హైదరాబాద్ : అనధికారిక లే అవుట్లు..భవనాల క్రమబద్ధీకరణ ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పథకం అమలునుపక్కా పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సోమవారం నుండి దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నారు. 

సచిన్ బ్లాస్టర్స్ పై వార్నర్ వారియర్స్ గెలుపు..

అమెరికాలోని న్యూయార్క్ లో జరిగిన క్రికెట్ ఆల్ స్టార్ తొలి టీ20 మ్యాచ్‌లో సచిన్ బ్లాస్టర్స్ పై వారియర్స్ జట్టు అవలీలగా విజయం సాధించింది. టాస్ గెలిచిన వార్న్ ముందుగా సచిన్ బ్లాస్టర్స్ ను బ్యాటింగ్‌కు ఆహ్వానించగా సచిన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. సచిన్ జట్టులో సెహ్వాగ్ (55: 3x4, 6x6) ఓపెనర్‌గా దిగి వారియర్స్ జట్టు‌ బౌలర్ల‌పై చెలరేగి పోయాడు. సచిన్ బ్లాస్టర్స్ నిర్దేశించిన 141 పరుగుల లక్ష్యాన్ని వారియర్స్ జట్టు 17.2 ఓవర్లలో చేధించింది. వారియర్స్ జట్టులో రికి పాంటింగ్ 38 బంతుల్లో 48 పరుగులు చేసి వారియర్స్ విజయానికి కీలకమయ్యాడు.

Don't Miss