Activities calendar

10 November 2015

21:35 - November 10, 2015

హైదరాబాద్ : బార్‌ స్కాం కేసులో కేరళ ఆర్థికమంత్రి కె ఎం మణి రాజీనామా చేశారు. ఈ కుంభకోణంలో ఆయన పాత్రపై విచారణ జరిపించాలని కేరళ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో మణి రాజీనామాకు ఒత్తిడి పెరిగింది. ఈ మొత్తం వ్యవహారాన్ని యూడీఎఫ్‌ స్టీరింగ్‌ కమిటీ సమావేశంలో చర్చించారు. మణి రాజీనామాకు యూడీఎఫ్‌కు నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్‌తోపాటు, ఇతర భాగస్వామ పార్టీలు, ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఆయన మంత్రి పదవిలో కొనసాగడం మంచిదికాదని సమావేశం అభిప్రాయపడింది. ఇదే విషయాన్ని కమిటీ సభ్యులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మణి రాజీనామా చేశారు. 

21:34 - November 10, 2015

ఢిల్లీ : మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా.. డిసెంబర్‌ 1 నుంచి 6 వరకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వామపక్షపార్టీలు నిర్ణయించాయి. ఢిల్లీలో సమావేశమైన ఆరు వామపక్ష పార్టీలు .. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల తీర్పును అభినందించాయి. అలాగే దేశంలో మతోన్మాద దాడులకు వ్యతిరేకంగా సాహితీవేత్తలు, సినీ ప్రముఖులు, ప్రొఫెసర్లు అవార్డులు వెనక్కి ఇస్తున్న వారిని లెఫ్ట్‌ నేతలు అభినందించారు. 

21:31 - November 10, 2015

హైదరాబాద్‌ : నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సైబరాబాద్‌ కమిషనరేట్‌ సమీపంలోని బాణాసంచా దుకాణంలో మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ దట్టమైన పొగ అలుముకుంది. మంటలు, పొగకు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది.   

21:29 - November 10, 2015

విజయవాడ : నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వామ్యం అయ్యేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'మన ఇటుక- మన అమరావతి' కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఆన్‌లైన్‌లో ఈ-ఇటుకలను విక్రయిస్తోంది. తాజాగా ఈ-ఇటుకల విక్రయం గిన్నిస్ రికార్డును అధిగమించింది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు 1,05,803 మంది ఈ-ఇటుకలను కొనుగోలు చేశారు. దీంతో ఇప్పటివరకు చైనా పేరిట ఉన్న రికార్డును 'మన ఇటుక-మన అమరావతి' కార్యక్రమం అధిగమించింది.

21:27 - November 10, 2015

కడప/ అనంతపురం : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కడప, అనంతపురం జిల్లాల్లో పర్యటించారు. కడపలో గండికోట రిజర్వాయర్‌ను సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. అధికారులు, కాంట్రాక్టరల్లో సమీక్ష నిర్వహించారు. కొన్ని ప్రాజెక్ట్‌ల నిర్మాణం నత్తనడకన సాగుతున్న విషయాన్ని గమనించిన చంద్రబాబు... సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్దతి మార్చుకోపోతే తీవ్రపరిణామాలు తప్పవని హెచ్చరించారు.

పర్యాటక కేంద్రంగా గండికోట...

గండికోటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. రిజర్వాయర్‌ పక్కనే ఉన్న మసీదు, మందిరం పరిసరాలను కూడా చంద్రబాబు చూశారు. గండికోటను ప్రపంచ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు బృహత్‌ ప్రణాళిక రూపొందిస్తున్నట్టు చెప్పారు. ముందుగా తాత్కాలిక ప్రాతిపదికపై తీసుకునే చర్యలను వివరించారు.

రోడ్‌ మార్గం ద్వారా అనంతపురంకు...

కడప పర్యటన ముగించుకుని రోడ్‌ మార్గం ద్వారా అనంతపురం చేసుకున్న చంద్రబాబు.... హంద్రీనీవా ప్రాజెక్ట్‌ పనుల పురోగతిని సమీక్షించారు. సకాలంలో పనులు పూర్తిచేసి, సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరపురం పోలీసు శిక్షణా కళాశాలలో జరిగిన ఎస్‌ఐల పాసింగ్‌ అవుట్‌ పెరేడ్‌కు హాజరయ్యారు. 2014-15 బ్యాచ్‌లో ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్‌ఐల నుంచి గౌరవవందనం స్వీకరించారు. టెక్నాలజీని ఉపయోగించుకుని నేరాలు తగ్గించేందుకు ప్రయత్నిచాలని చంద్రబాబు కోరారు. రాయసీమ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు కడప, అనంతపురం జిల్లాల పర్యటనలో చంద్రబాబు చెప్పారు. 

21:25 - November 10, 2015

హైదరాబాద్ : దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి.. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో నెల్లూరు జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు నీటిమునిగాయి. చిత్తూరు జిల్లాలో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాలతో రోడ్లపై నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

చిత్తూరుజిల్లాలో కుండపోత వర్షాలు.....

వాయుగుండం ప్రభావంతో చిత్తూరుజిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.. వర్షాల ప్రభావంతో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది పొంగిప్రవహిస్తోంది. తిరుమల ఘాట్‌ రోడ్లపై విరిగిపడిన కొండచరియలను తొలగించడంతో వాహనాల రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. కపిలతీర్థం, గోగర్భం, పాపనాశం జలాశయాల్లోకి భారీగా వరదనీరు చేరింది..

వెంకటగిరిలో కుండపోతగా వర్షం....

నెల్లూరు జిల్లాలోనూ వర్షాలు కొనసాగుతున్నాయి.. వెంకటగిరిలో కుండపోతగా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.. ఇళ్లలోకి వరదనీరు చేరింది.. చాలా కాలనీలు నీట మునిగాయి.. గొడ్డేరు వాగు ఉధృతంగా పర్వహిస్తోంది. వెలిగొండ అడవుల్లోని నీరంతా గొడ్డేరువాగులోకే చేరుతోంది. చేనేత మగ్గాల గుంతల్లోకి వర్షపునీరు చేరింది.. దీంతో నేత పనులు స్తంభించాయి.. కైవల్యానది ఉధృతంగా ప్రవహిస్తోంది.. వివిధ ప్రాంతాల్లో చెట్లు, హోర్డింగులు నేలకూలాయి. నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని కొండ్లవాగులో 10 మంది పశువుల కాపర్లు చిక్కుకుపోయారు. చేజెర్ల మండలం యనమదల దగ్గర నల్లవాగు ఉధృతికి 10 గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలోని ఏఎస్‌పేట, అనంతసాగరం, సంగెం, మర్రిపాడు మండలాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈ ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.

కడప జిల్లాలోకూడా వర్షాలు భీభత్సం ......

కడప జిల్లాలోకూడా వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి.. రాజంపేట మండలంలో చక్రాలమడుగు పొంగిపొర్లుతోంది.. ఊటుకూరు చెరువు ఉధృతంగా ప్రవహిస్తోంది... కడప, చెన్నై రహదారిపై భారీగా వరదనీరు చేరింది.. రైల్వేకోడూరు నియోజకవర్గంలో వర్షాలు కొనసాగుతోంది.. గుంజన ఏరు పొంగిప్రవహిస్తోంది. దీంతో చుట్టుపక్కల గ్రామాలు రాకపోకలు నిలిచిపోయాయి.. ఓబులవారిపల్లెలోని పాములేరు వాగు నీటితో నిండిపోయింది.. 

21:21 - November 10, 2015

హైదరాబాద్ : కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్రం అనుమతిచ్చింది. 15 రంగాల్లో ఎఫ్‌డీఐలకు అనుమతులిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులో మైనింగ్‌, రక్షణ రంగం, విమానయానం, వార్తా ప్రసారాలు, నిర్మాణరంగం, వ్యవసాయం, హోల్‌సేల్‌ ట్రేడింగ్‌, బ్యాంకింగ్‌, తదితర రంగాలు ఉన్నాయి. కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతులివ్వడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

బీహార్‌ ఎన్నికల్లో ఘోరంగా ఓడినా....

బీహార్‌ ఎన్నికల్లో ఘోరంగా ఓడి రెండు రోజులు గడవక ముందే.. కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలకు శ్రీకారం చుట్టింది. కీలక 15 రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతులిచ్చింది. ఇందులో మైనింగ్‌, రక్షణరంగం, విమానయానం, వార్తా ప్రసారాలు, వ్యవసాయం, నిర్మాణ, తయారీ రంగాలు, హోల్‌సేల్‌ ట్రేడింగ్‌, బ్యాంకింగ్‌ తదితర రంగాలున్నాయి.

సర్వత్రా విమర్శలు....

కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతులివ్వడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. మేక్‌ ఇన్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా, స్టార్ట్‌ అప్‌ ఇండియా నినాదాలు చెబుతున్న మోడీ సర్కార్‌.. కార్మిక, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందని విపక్షాలు మండిపడ్డాయి. పార్లమెంట్‌లో చర్చించకుండా ఎఫ్‌డీఐలకు అనుమతివ్వడంపై సీపీఎం మండిపడింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో సాధారణ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ అన్నారు. ఈ అంశంపై పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన అన్నారు.

విదేశీ కార్పొరేట్‌ సంస్థలను ప్రసన్నం చేసుకునేందుకే.....

ప్రధాని మోదీ ఈనెల 12 నుంచి బ్రిటన్‌లో పర్యటిస్తుండటంతో.. విదేశీ కార్పొరేట్‌ సంస్థలను ప్రసన్నం చేసుకునేందుకే ఎఫ్ డీఐ లను అనుమతిచ్చారని సీపీఐ ఆరోపించింది. కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆమోదించడం వల్ల ప్రజలపై ధరల భారం పడుతుందని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని పార్లమెంట్‌లో ఎండగడతామన్నారు. పెరిగిన ధరలను నియంత్రించలేని కేంద్ర ప్రభుత్వం ఎఫ్ డీఐ లను అనుమతిస్తూ మరింత భారాన్ని మోపాలని చూస్తోందని విపక్షాలు మండిపడ్డాయి. ఈ విషయంలో కేంద్రం తగ్గక పోతే ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించాయి.      

ఏసీబీకి పట్టుబడ్డ అటవీ శాఖ అధికారి

పశ్చిమగోదావరి: ఏలూరులో లక్షరూపాయలు లంచం తీసుకుంటూ అటవీ శాఖ సెక్షన్‌ ఆఫీసర్‌ మహ్మద్‌ బాజీ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఏసీబీ అధికారులు లంచం తీసుకునే అధికారులపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

కొండ్ల వాగులో చిక్కుకున్న 10 మంది పశువుల కాపర్లు

నెల్లూరు : జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులూ వంకలు పొంగి పొర్లుతున్నాయి. కలువాయి మండలం చీపినాతి అటవీ ప్రాంతంలో కొండ్ల వాగులో 10 మంది పశువుల కాపర్లు చిక్కుకున్నారు. సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. మరో వైపు చేజెర్ల మండలం యనమదాల వద్ద నల్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

క్రికెట్ కు గుడ్ బై చెప్పిన రమేశ్ పొవార్...

హైదరాబాద్ : అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ రమేశ్ ‌పొవార్(37) మంగళవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. 2015-16 రంజీ ట్రోఫీ ముగిసిన అనంతరం దేశవాలీ క్రికెట్‌ నుంచి కూడా దూరం కాబోతున్నట్లు తెలిపాడు. దీంతో 15 ఏళ్ల సుదీర్ఘ దేశవాలీ కెరీర్‌కు తను దూరం కానున్నాడు. యూఏఈలో త్వరలో ఆరంభంకానున్న మాస్టర్స్ చాంఫియన్ లీగ్‌లో ఆడాలన్న ఉద్దేశ్యంతో తాను అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికినట్లు తెలిపాడు.

కేరళ ఆర్థిక మంత్రి కే.ఎం. మణి రాజీనామా...

న్యూఢిల్లీ : కేరళ ఆర్థిక మంత్రి కే.ఎం. మణి తమ పదవికి మంగళవారం రాజీనామా చేశారు. బార్‌ లైసెన్స్‌ల కోసం కోటి రూపాయలు లంచం తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని కేరళ హైకోర్టు ప్రకటించిన వెంటనే కాంగ్రెస్‌ అధిష్టానం సోమవారం స్పందించింది. మణిపై వెంటనే వేటు వేయాలని కాంగ్రెస్‌ అధిష్టానం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్ ఛాందీని ఆదేశించింది. దీంతో మంత్రి ఈరోజు తన పదవికి రాజీనామా చేశారు. మూసివేసిన బార్‌ లైసెన్సను పునరుద్ధరించేందుకు మణి కోటి రూపాయలు లంచం తీసుకున్నారని ఒక హోటల్‌ యజమాని ఆరోపించారు. దీనికి సంబంధించి కొన్ని సాక్ష్యాలు కూడా బయటపెట్టారు.

జాతీయ హాకీ పోటీలకు వరంగల్ జిల్లా విద్యార్థులు...

వరంగల్: జాతీయస్థాయిలో తెలంగాణ క్రీడా రత్నాలు వెలిగి పోనున్నారు. జాతీయస్థాయి హాకీ పోటీలకు జిల్లాలోని కేసముద్రం ప్రభుత్వ పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఈమేరకు ఇవాళ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శాంతకుమారి విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఈనెల 5,6 తేదీల్లో నిజామాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో పాఠశాలకు చెందిన బానోతు సౌజన్య, లాకావత్ సంధ్య, బాదావత్ పవన్‌కళ్యాణ్ ప్రతిభ చూపి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్టు తెలిపారు. పంజాబ్‌లో జరుగబోయే జాతీయస్థాయి హాకీ పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు.

బెజవాడ లో నరకాసుర వధ

హైదరాబాద్ : నగరంలో నరకాసుర వధ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దక్షిణ భారత దేశంలో తొలిసారిగా నరకాసుర వధ కార్యక్రమానికి కృష్ణానది తీరం వద్ద 72 అడుగుల ఎత్తు విగ్రాహాన్ని ఏర్పాటు చేశారు. నరకాసుర వధ ఏ విధంగా జరిగిందో అదే విధంగా ఇక్కడ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు నగర ప్రజలు పెద్ద ఎత్తున కృష్ణానది తీరం వద్దకు చేరుకున్నారు.

రూ.3లక్షల విలువైన గంజాయి స్వాధీనం...

ఖమ్మం: ఆర్టీసీ బస్సులో పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్టణం జిల్లా సీలేరు నుంచి భద్రాచలం మీదుగా హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ గంజాయి రవాణా అవుతున్న సమాచారం తెలుసుకున్న ఖమ్మం జిల్లా పాల్వంచ పోలీసులు బస్సును ఆపి తనిఖీలు నిర్వహించగా బస్సులో రూ. 3లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు

తెలుగు ప్రజలకు గవర్నర్ దీపావళి శుభాకాంక్షలు..

హైదరాబాద్ : తెలుగు ప్రజలకు ఉభయ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా చీకట్లు తొలగి కోటి పౌర్ణమిల కాంతి విరియాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే దీపావళి పర్వదినాన్ని ప్రజలు సుఖసంతోషాలతో జరుపుకోవాలన్నారు.

దమ్ముగూడెం ప్రాజెక్టు పై సీఎం కేసీఆర్ సమీక్ష....

హైదరాబాద్: దుమ్ముగూడెం ప్రాజెక్టుపై సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమీక్ష నిర్వహించారు. ఇవాళ్టి ఈ సమావేశానికి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, సీనియర్ అధికారులు నర్సింగ్‌రావు, ఎంజీ గోపాల్‌తోపాటు పలువురు ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాలో 5 లక్షల ఎకరాలకు పైగా నీరందించే విధంగా రిజర్వాయర్లు, కాలువలు నిర్మించాలని సీఎం ఆదేశించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద సాగయ్యే భూమి పోను ఖమ్మం జిల్లాలోని మిగతా వ్యవసాయ భూమికి దుమ్ముగూడెం ద్వారా నీరందించాలని తెలిపారు. 

సిపిఐ నారాయఖు జీహెచ్ ఎంసీ షాక్

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓట్ల తొలగింపు ప్రక్రియపై ఓ వైపు విచారణ జరుగుతుండగానే.. మరో వైపు... ఓటర్ లిస్టు నుంచి పేర్ల తొలగింపు పెద్ద సంఖ్యలో కొనసాగుతోంది. తాజాగా.. సీపీఐ పార్టీ జాతీయ నేత నారాయణ, ఆయన సతీమణి వసుమతి పేర్లు.. ఓటర్ల లిస్టు నుంచి తొలగించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. సాక్షాత్తు నాపేరే లిస్టులో లేదు. దీన్నిబట్టే ఓటర్ల జాబితాలో ఎన్ని అక్రమాలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు అని అన్నారు.

కోడిపందేలపై పోలీసులు దాడులు....

మహబూబ్ నగర్ : కోడిపందేలపై పోలీసులు దాడులు నిర్వహించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా ఆత్మకూరు మండలం ఆరేపల్లిలో కోడిపందేలు ఆడుతున్న సమాచారం తెలుసుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్బంగా 9 మందిని అరెస్ట్‌ చేయడమేగాక రూ.18 వేలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఐదు మోటార్ సైకిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

20:39 - November 10, 2015

హైదరాబాద్ : మయన్మార్ ప్రజాభిష్టమైన పాలన మొగ్గ తొడిగింది. సైన్యం అడుగుజాడల్లో నడుస్తున్న అరాచక పాలనకు తెరపడింది. తన జాతి కొరకు వెలుగెత్తిన విప్లవ యోధురాలికి 3 కోట్ల జనం పట్టం కట్టారు. శాంతి కపోతానికి రెక్కలు తొడిగారు. మయన్మార్ చారిత్రాత్మక ఎన్నికల్లో... సూకీ పార్టీ ఘన విజయం సాధించింది. మయన్మార్ లో సూకీ పార్టీ ముందు ఉన్న సవాళ్లు ఏమిటి? ప్రజల ఆకాంక్షలు ఏమిటి? నేటి వైడాంగిల్ లో చర్చించారు. మరి పూర్తి సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

సాంకేతిక లోపంతో నిలిచిన పలు రైళ్లు...

వరంగల్: జిల్లాలోని ఇంటికన్నె రైల్వేస్టేషన్ దగ్గర సాంకేతిక లోపం తలెత్తింది. సిగ్నల్ వ్యవస్థ పనిచేయక పోవడంతో పలు రైళ్లు ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఇంటర్‌సిటీ, శాతవాహన, నవజీవన్ రైళ్లు నిలిచి పోవడంతో అధిక సంఖ్యలో ఉన్న ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురైయ్యారు. రైల్వే అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలను చేపట్టారు.

20:28 - November 10, 2015

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ అహంకారం వల్లే బీహార్లో బిజెపి ఓడించిందన్నారు టిఆర్ఎస్ ఎంపీ కవిత. ఈ ఎన్నికలు నితీష్ కుమార్, మోదీ మధ్యే జరిగాయన్నారు. వరంగల్ బైపోల్ లో కూడా జాతీయ పార్టీలకు గుణపాఠం తప్పదన్నారు. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆశావర్కర్ల సమస్యలను లేవదీస్తామంటున్న కవిత స్పష్టం చేశారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో ను క్లిక్ చేయండి...

కీలక రంగాల్లోకి ఎఫ్ డీ ఐ లు

హైదరాబాద్: కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్రం అనుమతిచ్చింది. 15 రంగాల్లో ఎఫ్‌డీఐలకు అనుమతులిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులో మైనింగ్‌, రక్షణ రంగం, విమానయానం, వార్తా ప్రసారాలు, నిర్మాణరంగం, వ్యవసాయం, హోల్‌సేల్‌ ట్రేడింగ్‌, బ్యాంకింగ్‌, తయారీ రంగం ఉన్నాయి. కీలకమైన రక్షణ, మైనింగ్‌, వార్తాప్రసారాలు, హోల్‌సేల్‌ ట్రేడింగ్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతులివ్వడంపై అనేక విమర్శలు వస్తున్నాయి.

 

 

బిగ్ బీతో దీపికా పదుకొణె, రణబీర్ కపూర్ నృత్యం

హైదరాబాద్ : బాలీవుడ్ నటులు దీపికా పదుకొణె, రణబీర్ కపూర్, మికా సింగ్ ఒక ఛానెల్ లో ప్రసారమయ్యే 'ఆజ్ కి రాత్ హై జిందగీ'టివి షో లో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమానికి బిగ్ బి అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. దీపికా, రణబీర్ జంటగా రూపొందిన చిత్రం 'తమాషా' ఈ చిత్ర ప్రచారా కార్యక్రమంలో భాగంగా వీరిద్దరూ ఈ కార్యక్రమానికి హాజరై అమితాబ్ తో కలిసి నృత్యం చేసి సందడి చేశారు.

బాణాసంచా గోడౌన్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలిలో గల బాణాసంచా గోడౌన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎగసిపడుతున్న మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

శ్రీవారిని దర్శించుకున్న అఖిల్....

తిరుమల : వర్ధమాన హీరో అక్కినేని అఖిల్ మంగళవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తాను హీరోగా నటించిన తొలిచిత్రం 'అఖిల్' బుధవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు వీవీ వినాయక్‌తో కలసి ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి లడ్డూ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల అభిమానులు అఖిల్‌ను చూసేందుకు ఉత్సాహం చూపారు. తాను నటించిన చిత్రం విడుదల సందర్భంగా శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సులు అందుకునేందుకు వచ్చానని అఖిల్ చెప్పారు.

మాల్దీవులులో ఎమర్జెన్సీ ఎత్తివేత...

హైదరాబాద్ : మాల్దీవులులో విధించిన ఎమర్జెన్సీని ఎత్తివేస్తున్నట్టు ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడించింది. 'ప్రస్తుతం దేశంలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరడంతో ఎమర్జెన్సీని తొలగిస్తున్నట్టు' విదేశాంగ మంత్రి దునియా మౌమూన్ వెల్లడించారు.

కర్ణాటకకు కేంద్ర సాయం రూ.1,540 కోట్లు...

హైదరాబాద్ : కరువు కోరల్లో చిక్కుకున్న కర్ణాటకకు తక్షణ సాయంగా కేంద్రం జాతీయ ప్రకృతి వైపరీత్యాల సహాయనిధి నుంచి రూ. 1,540 కోట్లు విడుదల చేసింది. రెండుసార్లు ఢిల్లీకి వెళ్లిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య 136 తాలూకాలలో కరువు విలయతాండవం చేస్తోందని రూ.3,830 కోట్లు విడుదల చేయాలని ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. అయితే కోరిన మొత్తంలో సగానికంటే తక్కువగా విడుదల చేయడంపై కర్ణాటక ప్రభుత్వం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.

 

గచ్చిబౌలిలో అగ్నిప్రమాదం..

హైదరాబాద్ : నగరంలోని గచ్చిబౌలిలో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక బాణాసంచా గోడౌన్‌లో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

14:57 - November 10, 2015

హైదరాబాద్: ప్రపంచమంతా అభివృద్ధి పథంలో పయనిస్తుంది అనుకుంటున్న తరుణంలో సమాజంలో సగ భాగమైన మహిళలు ఇంటా బయట అనేక ఒత్తిడులకు గురవుతున్నారు. అటు ఇంటి పనులు.. ఇటు బయటి పనులతో వారి ఆరోగ్యం గురించి వారు పట్టించుకోవటం లేదు. ఇలాంటి స్థితి వారికి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు చేరువ చేస్తోంది. దీనికి పరిష్కారం వ్యాయామంతో కూడిన జీవన విధానం. అయితే ఇంట్లో పనే తమకు వ్యాయామంతో సమానం అనే భావనతో అనేక మంది మహిళలు ఉన్నారు. ఆ ఆలోచనల్లో నిజమెంతా? అపోహలు ఏంటి? మహిళలకు వ్యాయామం అవసరమా? లేదా?ఇవే అంశాలనై వేదిక లో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో అరుణ యోగా నిపుణురాలు, స్కూల్ కరస్పాండెట్ రేఖా వేణుగోపాల్ పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై చర్చించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...


 

మావోయిస్టుల చెరలో అటవీ అధికారులు...

హైదరాబాద్ : ఛత్తీస్‌ఘడ్ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు అటవీ అధికారులను మావోయిస్టులు సోమవారం అర్థరాత్రి కిడ్నాప్ చేశారు. ఖమ్మం జిల్లా అటవీ శాఖలో సహాయ అటవీ అధికారిగా పనిచేస్తున్న మోహన్, బీట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కోటేశ్వరరావు సోమవారం సాయంత్రం విధినిర్వహణలో సరిహద్దు గ్రామమైన చెన్నాపురం శివారులోని అడవుల్లోకి వెళ్లారు. అక్కడ కాపుకాసిన ఛత్తీస్‌ఘడ్ కు చెందిన మావోయిస్టులు వీరిని కిడ్నాప్ చేశారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇంతవరకూ వీరి ఆచూకి తెలియలేదు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

బలహీనపడిన తీవ్ర వాయుగుండం

హైదరాబాద్ : నైరుతి బంగాళాఖాతలంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం సోమవారం రాత్రి పుదుచ్చేరి వద్ద తీరం దాటింది. అనంతరం తీవ్ర వాయుగుండం బలహీనపడి వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ అదికారులు తెలిపారు.

చెరువులో పడి ఇద్దరు విద్యార్థులు మృతి

చిత్తూరు: కలకడలో ప్రమాదవశాత్తూ చెరువులో పడి ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు ఏడో తరగతి విద్యార్థులు మృత్యువాతపడినట్లు గ్రామస్థులు తెలిపారు.

నాగార్జున ఫ్యాన్స్ ఆత్మహత్యాయత్నం...

కర్నూలు : నగరంలో ఆనం థియేటర్ వద్ద నాగార్జున ఫ్యాన్స్ మంగళవారం ఆందోళనకు దిగారు. అఖిల్ సినిమా టికెట్లను అధిక ధరకు విక్రయిస్తున్నారని వారు సినిమా హాల్ ఎదుట ఆందోళనకు దిగారు. అయితే ఇద్దరు అభిమానులు మాత్రం తమ ఒంటిపై కిరోసిన్ పోసుకున్నారు. అంతలో అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు.

14:04 - November 10, 2015

ఢిల్లీ : ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు మరో మారణహోమానికి తెగబడ్డారు. మనిషి ప్రాణాలంటే ఇసుమంత కూడా లెక్కలేని ముష్కరులు 200మంది చిన్నారులను ఊచకోత కోసారు. కేవలం 2నిముషాల్లో 200మంది చిన్నారులను ఎకె. 47లతో కాల్చేసారు. పసివాళ్లనే కనికరం లేకుండా బుల్లెట్ల వర్షం కురిపించారు. ఏదో ఘనకార్యం చేసినట్లు అదే వీడియోను పోస్ట్ ఐఎస్ ఐఎస్ తీవ్రవాదులు చేసారు. లైంగిక కార్యకలాపాలకు సహకరించడం లేదనే కోపంతోనే ఐఎస్ ఐఎస్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.

14:00 - November 10, 2015

వరంగల్ : అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజలను మోసం చేసిందని వరంగల్‌ ఎంపి స్థానానికి పోటీ చేస్తున్న వామపక్ష అభ్యర్థి గాలి వినోద్‌కుమార్‌ విమర్శించారు. టన్ టివితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. తనను గెలిపిస్తే యువత కోసం ప్రత్యేక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తామన్నారు. కేసీఆర్‌ వత్తిడి వలనే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నోటీసులు వచ్చాయని తెలిపారు. తనను గెలిపిస్తే యువత కోసం ప్రత్యేక స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

 

13:56 - November 10, 2015

తూర్పు గోదావరి : జిల్లా రంపచోడవరం ఏజన్సీలో దారుణం జరిగింది.. చేతబడి చేస్తుందంటూ వై రామవరం మండలం చింతకర్రపాలెంలో మహిళను కొట్టి చంపారు.. ఈ గ్రామానికిచెందిన లక్ష్మమ్మ.... గంగాలమ్మ గుడిలో కొద్దిరోజులుగా పూజలు చేస్తూ గడుపుతోంది.. ఈ విషయం గమనించిన గ్రామస్తులు ఆమె క్షుద్ర పూజలు చేస్తోందని భావించారు.. అందరూ కలిసి ఆమెపై దాడిచేశారు.. మృతురాలికి నలుగురు పిల్లలున్నారు.. ఈ కేసులో ఐదుగురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు..

 

13:54 - November 10, 2015

బెంగళూరు : కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న టిప్పు సుల్తాన్‌ జయంతుత్సవాల్లో విహెచ్ పి కార్యకర్తలు రెచ్చిపోయారు. టిప్పు సుల్తాన్‌ జయంత్యుత్సవాలు జరిపితే అడ్డుకుంటామని కొన్ని వారాల క్రితమే వార్నింగ్‌ ఇచ్చిన సంఘ్‌ పరివార్‌ అన్నంత పని చేసారు. ఉత్సవాల్లో పాల్గొంటున్న వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విహెచ్ పి కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసారు. పోలీసుల లాఠీఛార్జ్‌లో ఓ విహెచ్ పి కార్యకర్త మరణించగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బెంగళూరులో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది.

 

13:48 - November 10, 2015

గుంటూరు : స్నేహం ముసుగేసుకున్న రాక్షసత్వం రెచ్చిపోయింది. కామంతో కళ్లు మూసుకుపోయిన పైశాచికత్వం కోరలు చాచింది. వేళ్లూనుకుపోయిన ర్యాగింగ్ భూతం మరో విద్యా కుసుమాన్ని మింగేసింది. కన్నవారి కలలను నిజం చేయాలనుకున్న సంకల్పాన్ని సమాధి చేసింది. ఉన్నత శిఖరాలకు చేరుకోనివ్వకుండానే ఓ అభాగ్యురాలిని కాలగర్భంలో కలిపేసింది.
తిరుపతమ్మ మనోవేదన..
'వాళ్లకు తగిన శాస్తి చేయండి. పట్టుకుని ముక్కలుగా ముక్కలుగా నరికేయండి. ఓ అమ్మాయి జోలికి వెళ్లాలంటే వాళ్ల అమ్మ,చెల్లి, అక్క ఇలా ఎవరో ఒకరు గుర్తుకు రావాలి. ఇది చూసిన వాళ్లంతా ఆడవాళ్ల జోలికి వెళ్లాలంటేనే భయపడాలి. అప్పుడే నా ఆత్మకు శాంతి కలుగుతుంది. నేను అనుభవించిన వేదనకు ప్రతిఫలం దక్కినట్లవుతుంది'. ఇది పగతో రగిలిపోయిన వారి పంతం కాదు. ప్రత్యర్ధుల రక్తం కళ్ల చూడాలనే ప్రతీకారవాంఛ అసలే కాదు. ఇది ర్యాగింగ్‌ భూతానికి బలైపోయిన ఓ నిస్సహాయురాలి ఆవేదన. మృగాళ్లు తనతో ఆడుకుంటోంటే ఎవరికి చెప్పుకోలేక తనలోతాను కుమిలిపోయి.. బలవన్మరణానికి పాల్పడిన ఓ అమాయకురాలి నివేదన.
ఆరిపోయిన విద్యాదీపం
వెలుగులు పంచాల్సిన రిషితేశ్వరి అనే విద్యాదీపం ఆరిపోయిన విషాదాంతం ఇంకా కళ్ళముందు మెదులుతూనే ఉంది. డైరీగా మారిన ఆమె ఆక్రందన చెవుల్లో మార్మోగుతూనే ఉంది. ఇంతలోనే గుంటూరు జిల్లా వెల్దుర్తిలో ర్యాగింగ్‌ భూతం తిరుపతమ్మ అనే విద్యార్ధినిని బలి తీసుకుంది.
తిరుపతమ్మే కీచకుల టార్గెట్
తిరుపతమ్మ మాచర్లలోని ఓ ప్రైవేట్ కాలేజ్‌లో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతోంది.ఇందుకోసం వెల్దుర్తి నుంచి ప్రతిరోజూ బస్సులో వెళ్లి వస్తుండేది. ఇదే రీతిలో మాచర్లలో చదువుకుంటున్న మరికొందరు విద్యార్ధులు తిరుపతమ్మను టార్గెట్ చేసుకున్నారు. తొలుత ర్యాగింగ్‌ పేరుతో వేధించారు. తర్వాత లైంగిక వేధింపుల పర్వాన్ని కొనసాగించారు. ప్రేమ్‌జీ నాయక్‌, గాబ్రియేల్‌ నాయక్‌, పవన్‌, ఆదినారాయణ, వెంకటేష్‌, సురేష్‌ అనే విద్యార్ధులు తిరుపతమ్మ జీవితంతో ఆటలు ఆడుకున్నారు. సెల్‌ఫోన్‌లో అసభ్యంగా చిత్రీకరించి చెప్పుకోలేని రీతిలో హింసించారు.
కీచక పర్వం
ఈ కీచక పర్వం అంతా కన్నీళ్లే అక్షరాలైన తిరుపతమ్మ సూసైడ్ లేఖలో వివరంగా ఉంది. వాళ్లను ముక్కలు ముక్కలుగా నరకండి..అప్పుడే నా ఆత్మకు శాంతి కలుగుతుందని రాసిందంటే తిరుపతమ్మ ఎంతటి మానసిక వేదనను అనుభవించిందో అర్ధం చేసుకోవచ్చు. ఎవరికి చెప్పుకోలేక తనలో తానే కుమిలిపోయిందంటే ఎంత చిత్రవధకు లోనయిందో తెలుసుకోవచ్చు. అయినా రిషితేశ్వరి, తిరుపతమ్మల వేదన,నివేదన అర్ధం కావల్సింది, అవగతం చేసుకోవల్సింది ప్రభుత్వాధినేతలే. లేకుంటే ర్యాగింగ్ భూతం ఇలా వికట్టాటహాసం చేస్తూనే ఉంటుంది. మరికొందరు అమాయకులను బలికోరే ప్రమాదం ఉండనే ఉంటుంది.

 

13:43 - November 10, 2015

చిత్తూరు : ఖాకీ అనగానే.. కరడుగట్టిన హృదయాలు అన్న భావన ప్రజల్లో స్థిరపడిపోయింది. అక్కడక్కడా కొందరు పోలీసులు.. ఈ భావనను చెరిపే ప్రయత్నాలు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా పుత్తూరు ఎస్‌ఐ హనుమంతప్ప ఈ రెండో కోవకే చెందుతారు.
పుత్తూరు ఎస్‌ఐ హనుమంతప్ప
చిత్తూరు జిల్లా పుత్తూరు ఎస్‌ఐ హనుమంతప్ప.. ఖాకీల్లోని మానవత్వపు కోణాన్ని చాటుతున్నారు. రోడ్లే ఆవాసాలుగా జీవిస్తున్న నిర్భాగ్యులను ఆదుకుంటున్నారు. పుత్తూరులో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా.. భిక్షగాళ్లు, మరిందరు అభాగ్యులు నిలువ నీడ లేకుండా.. చెట్టు పుట్టల పాలయ్యారు. చలి కారణంగా వృద్ధులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని గుర్తించిన హనుమంతప్ప.. వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. వర్షంలోనే ఊరంతా కలియతిరుగుతూ.. అభాగ్యులను గుర్తించి వారికి సొంత ఖర్చుతో కొన్న దుప్పట్లు, ఆహారం పంపిణీ చేశారు. ఎస్‌ఐ హనుమంతప్ప మానవత్వాన్ని స్థానికులు ప్రశంసిస్తున్నారు.

 

 

13:36 - November 10, 2015

కడప : గండికోటను గొప్ప టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు అన్నారు. కడప జిల్లా పర్యటనలో భాగంగా గండికోట రిజర్వాయర్‌ను పరిశీలించిన ఆయన పరిశీలించారు. గండికోట, సౌందర్యానికి పెట్టని కోట అని సీఎం ప్రశంసించారు. 17కోట్లతో గండికోటకు రోడ్డు మంజూరు చేశారు. గండికోట గ్రామవాసుల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేసారు.

 

ఫేస్‌బుక్.. పొటో మ్యాజిక్ ఫీచర్

హైదరాబాద్‌ : ఫేస్‌బుక్ వినియోగదారులకు శుభవార్త. ఆ సంస్థ తన మెసెంజర్ యూజర్ల కోసం కొత్తగా 'ఫొటో మ్యాజిక్' అనే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా యూజర్లు ఇంతకు ముందు కన్నా ఇప్పుడు వేగంగా తమ ఫోటోలను ఇతరులతో షేర్ చేసుకునేందుకు వీలు కలుగుతుంది. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ కేవలం ఆస్ట్రేలియాలోని పలు యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే దీన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకే కాకుండా ఐఓఎస్ వాడుతున్న వారికి కూడా ఈ ఫీచర్‌ను అందించనున్నట్టు ఫేస్‌బుక్ ప్రతినిధులు వెల్లడించారు.

తెలంగాణ సీఎస్ తో అనురాగ్ శర్మ భేటీ

హైదరాబాద్ : సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో డీజీపీ అనురాగ్ శర్మ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై చర్చించారు. నగరంలో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే నగరంలోని ప్రధాన కూడళ్లతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నగరంలో నేరాలను అరికట్టవచ్చు.

మంత్రి హరీశరావుకు చేదు అనుభవం

హైదరాబాద్‌ : వరంగల్‌ జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన రాష్ట్ర మంత్రి హరీశరావుకు చేదు అనుభవం ఎదురైంది. ఎంహెచనగర్‌లో మంత్రిని ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎస్సీల వర్గీకరణపై తమకు స్పష్టత ఇవ్వాలని ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు మంత్రిని డిమాండు చేశారు.

 

13:18 - November 10, 2015

హైదరాబాద్ : నగరంలో మాయమాటలు చెప్పి దొంగ బాబా ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మంత్రాలతో రోగం నయం చేస్తానని నమ్మించి మహ్మద్‌ సారిక్‌ బాలికపై లైంగికదాడి చేశాడు. రాజేంద్రనగర్‌ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. గత మూడేళ్లుగా అక్బర్‌హిల్స్ లో నివాసం ఉంటున్న మహ్మద్‌ సారిక్‌.. రోగాలు తగ్గిస్తానంటూ మహిళలను మోసం చేస్తున్నాడు. వైద్యం కోసం వచ్చిన ఓ బాలిక పట్ల మహ్మద్‌ సారిక్‌ అసభ్యకరంగా ప్రవర్తించడంతో.. తప్పించుకున్న బాలిక విషయాన్ని తల్లికి చెప్పింది. బాధితుల ఫిర్యాదుతో మహ్మద్‌ సారిక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

13:13 - November 10, 2015

గుంటూరు : జిల్లాలోని వేమూరు మండలం చావలిలో బాణాసంచా తయారీ చేస్తుండగా ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

 

13:09 - November 10, 2015

హైదరాబాద్‌ : నగరంలో చైన్‌స్నాచింగ్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. కంచన్‌బాగ్‌ పీఎస్‌ పరిధిలో స్కూటీపై తండ్రితో పాటు వెళ్తున్న యువతి మెడలో నుంచి చైన్‌స్నాచర్ 3 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లాడు. దీంతో స్కూటీపై నుంచి యువతి కిందపడిపోయింది. తీవ్రగాయాలైన యువతిని ఆస్పత్రికి తరలించారు.

 

12:48 - November 10, 2015

హైదరాబాద్ : ఆన్‌లైన్‌ షాపింగ్‌. మనకు కావాల్సిన వస్తువులను షాపులు తిరగకుండా ఇంట్లోనే కూర్చుని కొనుగోలు చేసేందుకు సులభతర మార్గం. ఇప్పటివరకు ఎన్నో వస్తువులు ఆన్‌లైన్‌లో లభిస్తుండగా.. తాజాగా దీపావళి క్రాకర్స్‌ కూడా ఆన్‌లైన్‌ జాబితాలోకి చేరాయి. అయితే దీపావళికి మాత్రమే కొనుగోళ్లు ఉండనున్న నేపథ్యంలో ఫేక్‌ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీపావళి అంటే.. యువతతో పాటు ఎంతోమంది సంతోషంగా గడుపుకునే పండుగ. ఈ పండుగకు టపాసులు పేల్చకపోతే మజానే ఉండదు. అందుకే టపాసుల కోసం అందరూ షాపులన్నీ తిరుగుతుంటారు. తక్కువ ధరతో పాటు.. కొత్త కొత్త వెరైటీలు ఎక్కడ లభిస్తాయా అని తెలుసుకుంటారు.
ఆన్‌లైన్‌లో 15 శాతం క్రాకర్స్‌ అమ్మకాలు
పండుగ పూట ఎన్ని ఎక్కువ టపాసులు పేల్చితే అంత క్రేజ్‌గా భావిస్తుంటోంది యూత్‌. అందుకే అందరికంటే భిన్నమైన టపాసులు ఎక్కడ లభిస్తాయా ? అని వెతుకుతుంటారు. ఇక ఇప్పుడు వారికి ఆ అవస్థలు అవసరమే లేదు. ఎందుకంటే.. ఆన్‌లైన్‌లో కూడా టపాసులు లభిస్తున్నాయి. దీపావళి సందర్భంగా ఎన్నో కంపెనీలు ఆన్‌లైన్‌లో అమ్మకాలు ప్రారంభించాయి. దీంతో ఈ ఏడాది ఆన్‌లైన్‌లో క్రాకర్స్‌ అమ్మకాలు 15 శాతం వరకు ఉంటాయని.. వేల కోట్ల రూపాయల బిజినెస్‌లో ఆన్‌లైన్‌ వాటా తక్కువేమీ కాదని మార్కెట్‌ నిపుణులంటున్నారు.
ఆన్‌లైన్‌ కొనుగోలు పట్ల ఆసక్తి
ఇక యూత్‌ను ఆకట్టుకుని అమ్మకాలు పెంచుకునేందుకు.. పలు కంపెనీలు వెబ్‌సైట్లను కలర్‌ఫుల్‌గా రూపొందిస్తున్నారు. మరోవైపు భారీ డిస్కౌంట్లు ఆఫర్లు చేస్తూ అమ్మకాలు పెంచుకునేందుకు చూస్తున్నారు. ఇప్పటివరకు షాపులన్నీ తిరిగి.. రేట్లతో విసిగిపోయిన వారికి అనుకూలమైన ధరలో.. వారికి కావాల్సిన బడ్జెట్‌లో క్రాకర్స్‌ లభిస్తుండడంతో చాలామంది ఆన్‌లైన్‌లో క్రాకర్స్‌ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఆన్‌లైన్‌లో అమ్మకాలు చేసేందుకు చిన్న సంస్థలు కూడా పెద్ద సంస్థలతో పోటీ పడుతున్నాయి. ఆన్‌లైన్‌ షాపింగ్‌తో ఎన్నో లాభాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు. షాపుకు వెళ్తే పిల్లలు ఇష్టమొచ్చినట్లు కొనుగోలు చేస్తారని.. దీంతో కొనుగోళ్లు తమ బడ్జెట్‌ దాటి జేబుకు చిల్లు పడుతుందంటున్నారు. అదే ఆన్‌లైన్‌ షాపింగ్‌తో మన కావాల్సినవి.. మన బడ్జెట్‌లో కొనుగోలు చేయొచ్చంటున్నారు.
ఫేక్‌ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తత
ఇప్పటికే ఆన్‌లైన్‌ అమ్మకాల ద్వారా అనేక మోసాలు జరుగుతున్న నేపథ్యంలో ఫేక్‌ వెబ్‌సైట్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. భారీ డిస్కౌంట్లను చూసి మోసపోవద్దని.. మంచి కంపెనీలకు సంబంధించిన వెబ్‌సైట్ల నుంచి మాత్రమే కొనుగోలు చేస్తే మంచిదని సూచిస్తున్నారు. లేకపోతే జేబుకు చిల్లు పడే అవకాశముందంటున్నారు. ఇక ఇప్పటికే ఆన్‌లైన్‌లో భారీగా ఆర్డర్లు పొందిన కంపెనీలు.. ప్రజలకు టపాసులు డెలీవరి చేసేందుకు సిద్ధమయ్యాయి.

 

12:42 - November 10, 2015

తిరుమల : అల్పపీడనం అలిసిపోకుండా కుమ్మేస్తోంది. వర్షాలు బ్రేక్‌ లేకుండా కుమ్మరించేస్తున్నాయ్‌. వాన చినుకులు రాయలసీమను వరదలతో ముంచేస్తున్నాయ్‌. పొంగుతున్న వాగులు, వంకలతో రహదారులన్నీ కాలువలుగా మారిపోయాయి. కార్లు, వాహనాలు పడవల్లా ఊగుతున్నాయి. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో వర్షాలు ముంచెత్తడంతో... పలు గ్రామాలు నీటిపాలయ్యాయి. రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి.
విరిగిపడ్డ కొండచరియలు
భారీవర్షాలకు తిరుమలలో కొండచరియలు విరిగిపడ్డాయి.. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో కొండపైనుంచి రాళ్లు కిందకు జారిపడుతున్నాయి... రోడ్డుమార్గం నీటితో నిండిపోయింది.. కపిలతీర్థం ఉప్పొంగిపోతోంది.. ఈదురుగాలులు భీభత్సం సృష్టిస్తున్నాయి..
బెంబేలెత్తిపోతున్న భక్తులు
కంటిన్యూగా కురుస్తున్న వర్షాలతో భక్తులు బెంబేలెత్తిపోతున్నారు.. ఎటునుంచి ఏ కొండ విరిగిపడుతుందో తెలియక టెన్షన్ పడుతున్నారు.. అటు వర్షాలతో కొండప్రాంతమంతా తడిసిపోయింది.. మట్టిపెళ్లలుకూడా ఊడిపడే అవకాశం కనిపిస్తోంది.
ఎడతెరిపి లేకుండా వర్షం
తీవ్ర వాయుగుండం ప్రభావంతో తిరుపతిలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రుయా ఆస్పత్రిలోకి భారీగా వర్షం నీరు చేరింది. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఆస్పత్రి ప్రాంగణంలో పలు చెట్లు నేలకొరిగాయి.
కపిలతీర్ధంలోకి భారీగా వర్షం నీరు
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తిరుమల కపిలతీర్ధంలోకి భారీగా వర్షం నీరు చేరింది. గత 15 ఏళ్లలో ఇంత నీరు రావడం ఇదే ప్రథమమని భక్తులంటున్నారు. పుష్కరిణిలోకి ఎవరూ వెళ్లకుండా అధికారులు గట్టి చర్యలు చేపట్టారు.

 

12:32 - November 10, 2015

మయన్మార్ : నిర్భంధాన్ని ప్రజాస్వామ్యం తుంగలో తొక్కేసింది. నిరంకుశత్వాన్ని ప్రజాబీష్టం పొలిమేరల వరకు తరిమికొట్టింది. వెల్లువెత్తిన ప్రజాభిప్రాయానికి బ్యాలెట్ బాక్స్‌ బెదిరిపోయింది. యావత్ ప్రజానీకం పూరించిన స్వేచ్ఛా శంఖారావానికి ఎన్నికల రణరంగమే తల వంచింది.
నేషనల్ లీగ్‌ ఆఫ్ డెమోక్రసీ క్లీన్‌ స్వీప్‌
నిర్భంధానికి, నిరంకుశత్వానికి ప్రపంచదేశాలు మయన్మార్‌ను ఓ ఉదాహరణగా చూపిస్తాయి. అలాంటిది ఇప్పుడు ప్రజాస్వామ్యానికి వేదికగా చూపించాల్సిన తప్పనిస్ధితి నెలకొంది. మయన్మార్‌ పోరాట యోధురాలు ఆంగ్‌ సాన్‌ సూకీ నేతృత్వంలోని నేషనల్ లీగ్‌ ఆఫ్‌ డెమోక్రసీ తాజా ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేసింది. 91 పార్టీలు దిగిన ఎన్నికల రణరంగంలో విజయకేతనం ఎగురవేసింది.
తొలి రౌండ్ లో 56 స్ధానాలు కైవసం
తొలి రౌండ్‌ నుంచే హవా కొనసాగించిన నేషనల్ లీగ్‌ ఆఫ్‌ డెమోక్రసీ 57 సీట్లలో 56 స్ధానాలను కైవసం చేసుకుని విజయఢంకా మోగించింది. దిగువ సభలోని 45 సీట్లకు గాను 44 సీట్లు కైవసం చేసుకుంది. ఇంకా వెల్లడి కాని పూర్తిస్ధాయి ఫలితాల్లోనూ నేషనల్ లీగ్‌ ఆఫ్‌ డెమోక్రసీనే సత్తా చాటుతుందని ఎన్నికల విశ్లేషకులు చెబుతున్నారు.
చరిత్రాత్మక విజయం దిశగా ఆంగ్‌ సాన్‌ సూకీ 
ఇక యాంగాన్‌ రాష్ట్ర అసెంబ్లీలోని 90 సీట్లలో 87 స్ధానాలను దక్కించుకున్న ఆంగ్‌ సాన్‌ సూకీ చరిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది. అతిపెద్ద ప్రజాస్వామ్య విజయాన్ని నమోదు చేసిన ఆంగ్‌ సాన్‌ సూకీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పొరుగు దేశమైన చైనాతో పాటు మరికొన్ని దేశాలు సూకీని పొగడ్తలతో ముంచెత్తుతున్నాయి.

 

12:13 - November 10, 2015

వరంగల్ : మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య పొలిటికల్‌ కెరీర్‌ ఫినిష్‌ అయిపోయేనట్టేనా. ఇప్పుడిదే చర్చ సర్వత్రా జరుగుతోంది. సారిక, ఆమె కుమారుల మృతి కేసులో నిందితుడిగా ఉన్న రాజయ్యను ఇప్పటికే కాంగ్రెస్‌ సస్పెండ్‌ చేసింది. వరంగల్‌ ఎంపీ అభ్యర్థిగా ఉన్న ఆయన ఊహించని పరిణామాల నేపథ్యంలో తప్పుకోవాల్సి వచ్చింది. రాజయ్య, ఆయన భార్య మాధవి, కుమారుడు అనిల్‌ ఇప్పుడు వరంగల్‌ జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. కొడుకు నిర్వాకం వల్లే రాజయ్య పొలిటికల్‌ కెరీర్‌ ఇలా కష్టాల్లో పడిందనే ప్రచారం జరుగుతోంది.
రాజయ్య మొదట్లో ప్రభుత్వ ఉద్యోగి
రాజయ్య మొదట్లో ప్రభుత్వ ఉద్యోగి. జడ్పీ సీఈవోగా పని చేశారు. అవినీతికి పాల్పడుతూ ఏసీబీకి పట్టుపడడంతో మొదటిసారి జైలుకు వెళ్లారు. ఆ దెబ్బకు సస్పెండ్‌ కూడా అయ్యారు. ఐనా అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి ఆశీస్సులతో కాంగ్రెస్‌లో చేరారు. 2009లో ఎంపీగా గెలిచారు. కొడుకును కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. పలుకుబడిని ఉపయోగించి తనయుడికి రైల్వేబోర్డు మెంబర్‌గా పదవి ఇప్పించగలిగారు. దీన్ని ఆసరా చేసుకున్న అనిల్‌ రైల్వే కాంట్రాక్ట్‌పనులు దక్కించుకున్నాడు. అదే సమయంలో జల్సాలకు అలవాటుపడ్డాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న సారికను పట్టించుకోవడం మానేశాడు. మరో మహిళతో వివాహేతర సంబంధం నడిపాడు. ఈ వ్యవహారమే రాజయ్య కొంపముంచిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
సారికను రాజయ్యకుటుంబం వేధించిందనే ఆరోపణలు
సారికను రాజయ్య కుటుంబ సభ్యులు వేధించేవారనే ఆరోపణలున్నాయి. స్వయంగా సారికనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎంపీగా ఉన్నప్పుడే రాజయ్యపై కేసు నమోదయ్యింది. సారిక ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడింది. ఐనా కుటుంబ పరిస్థితులను చక్క దిద్దుకోవడంలో రాజయ్య విఫలమయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొడుకు వ్యవహారాలు తెలిసినా...సరిచేసే ప్రయత్నం చేయకపోవడం ప్రస్తుత దుస్థితికి దారితీసింది.
కోర్టు ఆదేశాలకు మేరకు సారికకు ఇల్లు అప్పగింత
కోర్టు ఆదేశాలకు మేరకు సారికకు ఇల్లు అప్పగించి...రాజయ్య కుటుంబం వేరే చోట ఉంటోంది. ఉప ఎన్నికల నేపథ్యంలో కుటుంబ గొడవలు మరింత ముదిరాయనే వాదనలు ఉన్నాయి. రాజయ్యకు టికెట్‌ ఇవ్వొద్దంటూ సారిక ఏఐసీసీ లేఖ కూడా రాసింది. వరంగల్‌ లోక్‌సభ స్థానానికి నవంబర్‌ 2న తొలి నామినేషన్‌ వేసిన రాజయ్య..రెవెన్యూ కాలనీలో ఉన్న సొంతింటికి వెళ్లారు. కోడలితో మరోసారి గొడవపడ్డారు. రాజయ్య భార్య మాధవి, కొడుకు అనిల్‌ కూడా సారికతో గొడవపడినట్లు సమాచారం. ఈ పరిణామం తర్వాతే సారిక, ఆమె కుమారులు అగ్ని కీలల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. సారిక తల్లి ఫిర్యాదుమేరకు రాజయ్య కుటుంబ సభ్యులపై కేసు నమోదయ్యింది. కోర్టు రిమాండ్‌ విధించడంతో ప్రస్తుతం వీరు ముగ్గురూ వరంగల్‌ సెంట్రల్‌ జైల్లో అండర్‌ ట్రయల్‌ ఖైదీలుగా ఉన్నారు.
పార్టీ ఇమేజ్‌ డ్యామేజ్‌ అవుతుందని భావించన కాంగ్రెస్‌
రాజయ్య వ్యవహారంతో పార్టీ ఇమేజ్‌ డ్యామేజ్‌ అవుతుందని కాంగ్రెస్‌ పార్టీ భావించింది. ఉప ఎన్నికలో ఇది ప్రతికూలంగా మారే అవకాశముందని అంచనా వేసింది. స్థానిక పార్టీ శ్రేణులు కూడా రాజయ్యను సస్పెండ్‌ చేయాలని ఒత్తిడి చేశాయి. దీంతో రాజయ్యను సప్పెండ్‌ చేస్తూ హైకమాండ్‌ నిర్ణయం తీసుకుంది. మరోపక్క హన్మకొండలోని యూనివర్శిటీ ఆర్ట్స్ కాలేజీలో అసిస్టింట్‌ ఫ్రొపెసర్‌గా పనిచేస్తున్న సిరిసిల్ల మాధవిపై యూనివర్శిటీ అధికారులు సస్పెన్షన్‌ వేటు యోచనలో ఉన్నారని తెలుస్తోంది.

 

టీఆర్ ఎస్ లో చేరడం లేదు : దుగ్యాల

వరంగల్ : టీఆర్ ఎస్ లో చేరికపై కాంగ్రెస్ నేత దుగ్యాల శ్రీనివాస రావు స్పందించారు. టీఆర్ ఎస్ లో చేరడం లేదని దుగ్యాల స్పష్టం చేశారు. సర్వే సత్యనారాయణను బ్రేక్ ఫాస్టుకు తన ఇంటికి ఆహ్వానించానని చెప్పారు.

 

టిడిపి, బిజెపిల మధ్య సమన్వయ లోపం : కిషన్ రెడ్డి

హన్మకొండ : వరంగల్ ఉప ఎన్నికల్లో టిడిపి, బిజెపిల మధ్య సమన్వయ లోపం ఉన్న మాట వాస్తవమని బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బీహార్ ఎన్నికల ఫలితాల ప్రభావం ఇక్కడ ఉండదని చెప్పారు. పత్తికి మద్దతు ధర ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు.

 

నెల్లూరులో మంత్రి నారాయణ పర్యటన

నెల్లూరు : జిల్లాలో మంత్రి నారాయణ పర్యటించారు. భారీ వర్షాలపై మంత్రి ఆరా తీశారు. పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

 

బాణాసంచా పేలుడు.. ఒకరి మృతి

గుంటూరు : వేమూరు మండలం చావలిలో ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. బాణాసంచా తయారు చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. 

కంచన్ బాగ్ లో చైన్ స్నాచింగ్

హైదరాబాద్ : కంచన్ బాగ్ పీఎస్ పరిధిలో చైన్ స్నాచింగ్ జరిగింది. స్కూటీపై వెళ్తున్న యువతి మెడ నుంచి దుండగులు 3 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు.  

నెల్లూరు జిల్లాలో వర్షాలు..

నెల్లూరు : జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మర్రిపాడు మండలంలో కేతమన్నేరు, బొగ్లూరు వాగులు పొంగుతున్నాయి. ఎన్టీఆర్‌ కాలనీ, మూసాపేటల్లోకి నీరు వచ్చి చేరింది. గూడురులో కౌవల్య నది పొంగిపొర్లుతుండటంతో వెంటకగిరికి రాకపోకలు స్తంభించాయి. కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలియచేశారు.

 

11:16 - November 10, 2015

హైదరాబాద్ : అల్పపీడన ప్రభావంతో ఎపిలోని పలు ప్రాంతాల్లో ఎడతిరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, నెల్లూరు, కడపతోపాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో వానలు ఆగకుండా కుమ్మరిస్తున్నాయ్‌. దీంతో వర్షానికి నాని.. కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఘాట్‌రోడ్డులో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. లింక్‌రోడ్డు ద్వారానే వాహనాలకు అనుమతిస్తున్నారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో గోగర్భంతో పాటు కొండ మీద జలశయాలన్నీ నిండిపోయాయి. నాన్‌స్టాప్‌గా వర్షం కురుస్తుండటంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు.
కడపలో..
అల్పపీడన ప్రభావంతో కడప జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయ్‌. పలుచోట్ల చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయ్‌. దీంతో రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. రాజంపేట వద్ద ఊట్కూరు చెరువు పొంగిపొర్లడంతో కడప-చెన్నై మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే కోడూరు మండలం గుంజన ఏరు పొంగిపొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు లేకుండా పోయాయి. చిట్వేలు మండలం చెర్లోపల్లి దగ్గర ఏరు పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
నెల్లూరులో..
నెల్లూరు జిల్లాలోనూ పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మర్రిపాడు మండలంలో కేతమన్నేరు, బొగ్లూరు వాగులు పొంగుతున్నాయి. ఎన్టీఆర్‌ కాలనీ, మూసాపేటల్లోకి నీరు వచ్చి చేరింది. గూడురులో కౌవల్య నది పొంగిపొర్లుతుండటంతో వెంటకగిరికి రాకపోకలు స్తంభించాయి. కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలియచేశారు.

 

11:08 - November 10, 2015

చిత్తూరు : తిరుమలలో వానలు ఆగకుండా కుమ్మరిస్తున్నాయ్‌. దీంతో వర్షానికి నాని.. కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఘాట్‌రోడ్డులో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. లింక్‌రోడ్డు ద్వారానే వాహనాలకు అనుమతిస్తున్నారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో గోగర్భంతో పాటు కొండ మీద జలశయాలన్నీ నిండిపోయాయి. నాన్‌స్టాప్‌గా వర్షం కురుస్తుండటంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు.

 

11:00 - November 10, 2015

అందరికీ గుండె ఎక్కడుంటుంది.? లోపల ఉంటుంది అని చెబుతుంటాం. కానీ ఈ చిన్నారికి మాత్రం బయట ఉంది. దీనితో ఎన్నో ఇబ్బందులు పడుతోంది.
మానవ మనుగడలో కీలక భూమిక పోషించే అవయవం గుండె. మానవ శరీరంలోపల ఎమడవైపున ఉండాల్సిన గుండె ఈ చిన్నారికి శరీరం వెలుపల ఛాతి మధ్యలో ఉంది. కేవలం చిన్న చర్మపు పొర సహాయంతో ఉన్న ఆ హృదయం స్పందనలు కూడా బయటకు కనబుడుతాయి. అత్యంత అరుదుగా కనిపించే ఈ వ్యాధి పేరు 'థొరాకో అబ్ డోమినల్ సిండ్రోమ్'.
ఈ చిన్నారి పేరు విర్సావియాబోరన్..వయస్సు ఆరేళ్లు..రష్యాలో తల్లితో నివాసం ఉంటోంది. బయట గుండె ఉండడంతో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోంది. కానీ తల్లి డారి బోరన్ ఇచ్చిన ప్రోత్సాహంతో బోరన్ కృంగిపోలేదు. చిన్నారికి ఆపరేషన్ చేయించాలని ఎన్నో దేశాలు తిరిగింది. ఎంతో మంది వైద్యులు చెతులేత్తేశారు. పట్టువిడవని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేసింది. చివరకు బోస్టన్ లో ఓ వైద్యుడు ఆపరేషన్ చేసేందుకు ముందుకొచ్చాడు. కానీ రక్తపోటు ఎక్కువగా ఉండడం వల్ల రెండు సంవత్సరాలు ఓపిక పట్టాలని ఆ వైద్యుడు సూచించాడట. ఈ ఆపరేషన్ కు బాగానే ఖర్చవుతుందని వైద్యులు పేర్కొన్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ ఆపరేషన్ కు సహాయం చేయాలని దారి బోరన్ ఆర్థించింది. చిన్నారి పరిస్థితి చూసి చలించిపోయిన ఎంతో మంది సోషల్ మీడియా ద్వారా ఫండ్స్ అందించారు. ప్రస్తుతం అక్కడ వాతావరణం బాగా లేకపోవడం..రక్తపోటు తగ్గించేందుకు విర్సావియా, బోరెన్ అమెరికాలోని లాస్ ఏంజెల్స్ కు పయనమయ్యారు. తనకు బోస్టన్ లో కుటుంబసభ్యులు ఎవరూ లేరని, కానీ సాయం చేసిన వారందరూ తన కుటుంబసభ్యులేనని దారి బోరన్ పేర్కొంది. రక్త ప్రసరణ సరిగ్గా జరిగితే ఆపరేషన్ నిర్వహిస్తారని అందు కోసం నిరీక్షిస్తున్నట్లు పేర్కొంది. అమ్మ అంటే తనకు ఎంతో ప్రేమ అని విర్సావియా బోరన్ పేర్కొంది. తన కూతురు చిన్న గుండెకు సాయం చేసిన సోషల్ మీడియా పెద్ద మనస్సుకు బోరన్ తల్లి కృతజ్ఞతలు తెలిపింది. విర్సావియా బోరన్ కు జరుగబోయే ఆపరేషన్ విజయంతం కావాలని కోరుకుందాం..

 

10:59 - November 10, 2015

విశాఖ : జిల్లాలోని నాయన్‌పూడి వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను తుని ఆస్పత్రికి తరలించారు. విజయవాడ నుంచి విజయనగరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

 

10:54 - November 10, 2015

హైదరాబాద్ : తమిళనాడుతో పాటు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్ల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. రహదారులపై నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కడప చెన్నై మధ్య వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. తిరుమలలో ఆగకుండా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ఘాట్‌రోడ్డుపై వాహనాలను అనుమతించడం లేదు. కేవలం లింకు రోడ్డు ద్వారా మాత్రమే వెళ్లనిస్తున్నారు. తిరుమలలోని గోగర్భం డ్యామ్‌తో సహా జలాశయాలన్నీ నిండుకుండల్లా కళకళలాడుతున్నాయి. పుదుచ్చేరి వద్ద వాయుగుండం తీరం దాటింది. ఉత్తరదిశగా పయనించి మధ్యాహ్నానికి బలహీనపడే అవకాశముందని వాతావరణ శాఖ చెబుతోంది. నేడు కూడా వర్షాలు కొనసాగే అవకాశముంది.

 

10:48 - November 10, 2015

యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని ది హన్స్ ఇండియా చీఫ్ ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ అన్నారు. అయితే రాజకీపార్టీల తరపున కాకుండా స్వంతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని తెలిపారు. గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ విశ్లేషణ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే...
విశ్వవిద్యాలయాలు ప్రభుత్వ సంస్థలు కాదు. విశ్వవిద్యాలయాలు స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటాయి. ఎన్నికల నిబంధనలు, విశ్వవిద్యాలయాల నిబంధనలు వేర్వేరు. యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. అయితే రాజకీపార్టీల తరపున కాకుండా స్వంతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలి. ఒక వేళ నేరం చేసి ఉంటే... అదికూడా నేరం రుజువు అయి శిక్ష పడితే పోటీ చేయరాదు. చట్టసభల్లో ఉండే వ్యక్తి... ప్రభుత్వ ఉద్యోగిగా ఉండకూడదు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ వర్సిటీకి వర్తించదు. విశ్వవిద్యాలయాల అధ్యాపకులు రాజీనామా చేసి.. పోటీ చేయాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ అనేది పవిత్రమైన చట్టసభ. శాసనసభ చట్టం ప్రకారం యూనివర్సిటీలు ఏర్పడ్డాయి. యూనివర్శిటీలకు ప్రపంచ వ్యాప్తంగా స్వేచ్ఛ ఉంటుంది.
బీహార్ ఎన్నికలు.. ఫలితాలు..
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓటమిని మోడీ అంగీకరించాలి. మోడీ 30 ప్రచార ర్యాలీలలో పాల్గొన్నారు. గెలిచినప్పుడు మోడీ గొప్పతనమని.. ఓడిపోయినప్పుడు కాదనడం భావ్యం కాదు. ఓటమికి, గెలుపుకు రెండింటికి బాధ్యత తీసుకోవాలి. నిజాయితీగా తప్పు ఒప్పుకోవాలి. బిజెపికి ఎదురుదెబ్బ తగలడం మొదలైంది. అయితే కులాల అంకగణితం మహా కూటమి, ఎన్ డిఏలకు వర్తిస్తుంది. ప్రాంతీయపార్టీలదే భవిష్యత్, వారిదే హవా అనుకోవడం సరికాదు. ప్రాంతీయ పార్టీలకు సిద్ధాంతాలు, ఒక మాటపై ఉండలేవు. కానీ నేషనల్ పార్టీలను ప్రాంతీయ పార్టీలు ప్రభావితం చేస్తున్నాయనేది వాస్తవం. బీహార్ ఎన్నికలు రాహుల్ గాంధీకి ఉప శమనం లాంటివే. ఓడిపోయినప్పుడు, గెలిచినప్పుడు సమానంగా బాధ్యత వహహించాలి. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సోనియా, రాహుల్ గాంధీలే నాయకులు.
ఎపి సర్కార్.. సీఎం చంద్రబాబు
అధికారంలో ఉన్న వారికి విమర్శలను స్వీకరించే గుణం ఉండాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడం సరికాదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు పట్ల చులకన భావంతో ఉంటే అప్పుడు చంద్రబాబు దాన్ని వ్యతిరేకించారు. పలువురు వైఎస్ తీరును ఖండించారు. అయితే ఇప్పుడు చంద్రబాబు .. ప్రతిపక్షంలో ఉన్న జగన్ పట్ల అదే వైఖరిని అవలంభించడం సరికాదు. ప్రజలను పట్టింకచుకోకుండా ఏ రాజకీయ పార్టీ కూడా తామే శాశ్వతం అనుకుంటే బీహార్ లో పట్టిన గతే పడుతుందని జేసీ దివాకర్ రెడ్డి అన్న వ్యాఖ్యలను గుర్తు చేశారు. అందరినీ గౌరవించాలి. ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యం ఎక్కడా లేదు. ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యం అసలు ప్రజాస్వామ్యమే కాదు.
గొప్ప ప్రజాస్వామిక విజయం..
మయన్మార్ లో గొప్ప ప్రజాస్వామిక విజయం. ఆంగ్ సాక్ సూకీ నేతృత్వంలోని పార్టీ గొప్ప విజయాన్ని సాధించింది. వెసుకబాటును, శాంతి ప్రక్రియను ఆంగ్ సాక్ సూకీ ఉపయోగించుకుంది. మొదట్లో ఆమెకు అధికారం ఇవ్వకుండా నిర్బంధించారు. శ్రీలంకలో జాతుల సమస్య ఉంది. బంగ్లాదేశ్ లో ఛాందవాసవాదం నడుస్తోంది. నేపాల్ లో జరిగే పరిణామాలను భారత్ ప్రశ్నించడం సరికాదు. మయన్మార్ లో ఉన్న ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఆహ్వానించాలి. ఆంగ్ సాస్ సూకీ బలోపేతానికి భారత్ సహకరించాలి' అని నాగేశ్వర్ వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:32 - November 10, 2015

బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, కాజోల్, వరుణ్ ధావన్, కృతి సనన్ లు నటించిన చిత్రం 'దిల్ వాలే' సినిమా ట్రైలర్ మంగళవారం విడుదలైంది. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ని బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ 'దిల్ వాలే' అధికారిక ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. 'అందరికీ దిల్ ఉన్నా.. అందరూ దిల్ వాలే కాలేరు' అంటూ మనసును తట్టే డైలాగ్ తో స్టార్ట్ అవుతుంది. షారూక్ - కాజోల్ ఎంటర్ అయిపోయి.. ప్రేమ కురిపించేస్తారు. 15 ఏళ్ల క్రితం విడిపోయిన జంటగా కనిపించనున్నారు. యంగ్ జనరేషన్ అయిన వరుణ్ ధావన్ - క్రితి సనోన్ ప్రేమ కోసం ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడబోతారని తెలుస్తోంది. కానీ 'మోసపోయింది నేను.. ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను' అని షారుఖ్ అనడం..చివరలో 'మళ్లీ మొహం చూపించద్దు. ప్రాణం తీసేస్తానని' షారూఖ్ చెప్పే డైలాగ్స్ చిత్రంపై ఆసక్తి పెంచింది.
బాలీవుడ్‌ తెరపై షారుక్‌ఖాన్‌, కాజోల్‌ సూపర్‌ హిట్‌ పెయిర్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రం 'దిల్‌ వాలే దుల్హనియా లేజాయెంగే' భారతీయ సినీ పరిశ్రమలోనే ఓ అద్బుతంగా నిలిచింది. ఏళ్ళ తరబడి ముంబైలోని మరాఠా మందిర్‌లో ప్రదర్శితమైన సంగతి తెలిసిందే.

10:12 - November 10, 2015

గులాబీలను ఎవరు మాత్రం ఇష్టపడరు. సువాసనలు వెదజల్లే గులాబీలను అమ్మాయిలు అమితంగా ఇష్టపడతారు. అయితే అందంతో పాటు, సౌందర్య సాధనంగా కూడా గులాబీలు ఉపయోగపడతాయి. ముఖ తేజస్సు పెరగాలంటే పది గులాబీ రేకలను నీళ్లలో గంటపాటు నానబెట్టి మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి. దీనికి రెండు టీ స్పూన్ల గులాబీ నీళ్లూ, మూడు టీ స్పూన్ల తేనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పావు గంట ప్రిజ్‌లో ఉంచాక వేళ్లతో ముఖంపై వలయాకారంగా పది నిమిషాల పాటు రాయాలి. తరువాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. అంతే మిళ మిళ మెరిసేటి ముఖం మీ సొంతం.
గులాబీ పువ్వులు పొడిబారిన చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌లా కూడా ఉపయోగపడతాయి. అందుకోసం.. పది గులాబీ రేకలను మెత్తగా చేసి, అందులో రెండు చెంచాల గులాబీ నీళ్లూ, రెండు చెంచాల తేనె, మూడు చుక్కల బాదం నూనె వేసి మిశ్రమంలా చేయాలి. దీన్ని ముఖంపై వలయాకారంగా రాస్తూ పావుగంట తరువాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. అంతే... పొడిబారిన మీ చర్మం మృదువుగా మారిపోతుంది.
ఎనిమిది గులాబీ రేకలను మెత్తగా చేసి అందులో రెండు చెంచాల గులాబీ నీళ్లు, చెంచా పెరుగు, చెంచా తేనె వేసి కలపాలి. దీన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. పది గులాబీలు, పది పుదీనా ఆకుల్ని మెత్తని మిశ్రమంలా చేయాలి. దీనికి చెంచా గులాబీ నీళ్లు, గుడ్డులోని తెల్లసొన, చెంచా మొక్కజొన్న పిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పావుగంట తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే ముఖంపై ముడతలు తగ్గుముఖం పడతాయి.

10:10 - November 10, 2015

చిన్న వయసులోనే జుట్టు నెరసిపోతే.. కరివేపాకు ఉపయోగించండి. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ జుట్టు నెరవడం సహజమే. కానీ కొందరికి 20 ఏళ్లు కూడా నిండకుండా జుట్టు తెల్లబడిపోతుంది. ఈ సమస్య అమ్మాయిల్లో తలెత్తితే మరీ ఇబ్బందిగా ఉంటుంది. అలాంటివారికి కరివేపాకు హెయిర్‌ టానిక్‌లా పనిచేస్తుంది.
కరివేపాకును బాగా ఉపయోగించేవారికి జుట్టు అంత త్వరగా తెల్లబడదు. శిరోజ మూలానికి బలం చేకూర్చే గుణంతోపాటు జుట్టుకు మంచి రంగును ఇచ్చే గుణం కరివేపాకులో ఉన్నది.
ఇందుకుగాను ఒక కప్పు కొబ్బరి నూనెను తీసుకుని అందులో 20 కరివేపాకు ఆకులను వేసి కొద్దిసేపు వేడి చేయాలి. కరివేపాకులు నల్లగా మారిన తర్వాత వేడి చేయడం ఆపేసి దించేయాలి. ఇలా వచ్చిన నూనెను వారంలో రెండు మూడు సార్లు మాడుకు మర్దన చేస్తుంటే శిరోజాలు బాగా పెరగడంతోపాటు తెల్లబడటం కూడా తగ్గుతుంది. చక్కని రంగుతో నిగనిగా మెరిసిపోతాయి.

10:09 - November 10, 2015

రవితేజ, తమన్నా, రాశిఖన్నా హీరో హీరోయిన్లుగా సంపత్‌నంది దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న చిత్రం 'బెంగాల్‌ టైగర్‌'. ఈ చిత్రానికి సంబంధించి రెండు వీడియో సాంగ్స్‌ను సోమవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్స్‌లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు సంపత్‌నంది మాట్లాడారు. ఆడియోను హిట్‌ చేసిన ప్రేక్షకులకు, రవితేజ అభిమానులకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. ఐ ట్యూన్స్‌లో టాప్‌ 5లో రెండు సాంగ్స్‌ ఈ చిత్రానివే కావడం హ్యాపీగా ఉందన్నారు. సుద్దాల అశోక్‌తేజ, భాస్కరభట్ల, శ్రీమణి అందించిన అద్భుతమైన లిరిక్స్‌కు సంగీత దర్శకుడు భీమ్స్‌ అత్యద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారని పేర్కొన్నారు. 'అఖిల్‌' ఈనెల11న విడుదలవుతోందని, ఈ చిత్రాన్ని ఈ నెల 26 లేదా 27 తేదీల్లో విడుదల చేయాలనుకుంటున్నామని నిర్మాత చెప్పారు. ఈ నెలాఖరున విడుదలవుతున్న ఈచిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉందని తమన్నా అన్నారు.

10:08 - November 10, 2015

సల్మాన్‌ఖాన్‌, సోనమ్‌కపూర్‌ జంటగా రాజశ్రీ ప్రొడక్షన్స్‌ పతాకంపై సూరజ్‌.ఆర్‌.భరజాత్య దర్శకత్వంలో రూపొందిన 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో' చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దీంట్లో భాగంగా ముంబైలో ఏర్పాటు చేసిన ప్రమోషన్‌ మీట్‌లో షారూఖ్‌ఖాన్‌, కాజోల్‌ జంటగా నటించిన 'దిల్‌ వాలే దుల్హనియా లేజాయేంగే' చిత్రంలోని ఓ పాటకు చిత్ర బృందం నృత్యం చేసింది. ఈ వీడియోని సల్మాన్‌ స్వయంగా తన అధికారిక ట్విట్టర్‌ ఖాతా ద్వారా విడుదల చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా ఈనెల 12న విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

10:07 - November 10, 2015

1990లో విడుదలై ప్రేక్షకాదరణతో విజయం సాధించిన 'ఘాయల్‌' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన 'ఘాయల్‌ ఒన్స్‌ ఎగైన్‌' చిత్రానికి సంబంధించి ఫస్ట్‌ లుక్‌ను నిర్మాత ధర్మేంద్ర విడుదల చేశారు. సన్నీడియోల్‌, సోహా ఆలీఖాన్‌, ఓంపురి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల చేసేందుకు ధర్మేంద్ర సన్నాహాలు చేస్తున్నారు. 'ఓ మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కి విజయం సాధించిన 'ఘాయల్‌' చిత్రానికి సీక్వెల్‌గా నిర్మించిన ఈ చిత్రంలోనూ మంచి కాన్సెప్ట్‌ ఉంది. ఆ కాన్సెప్ట్‌ కచ్చితంగా ప్రేక్షకుల్ని అలరిస్తుంది' అని ధర్మేంద్ర తెలిపారు.

ఎపిలో నేటి నుంచి చౌకధర దుకాణాల్లో కందిపప్పు పున:ప్రారంభం

హైదరాబాద్ : ఎపిలో నేటి నుంచి చౌకధర దుకాణాల్లో కందిపప్పు పంపిణీ పున:ప్రారంభం కానుంది. 

నేడు అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటన

అనంతపురం : సీఎం చంద్రబాబు నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఎస్ ఐలు పాసింగ్ పరేడ్ ఔట్ కు ఆయన హాజరుకానున్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి కెనాల్ ను పరిశీలించనున్నారు. ఆత్మకూరు మండలం తలుపూరులో మీ ఇంటికి-మీ భూమి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. 

09:38 - November 10, 2015

ఢిల్లీ : అవినీతి, ఆశ్రితపక్షపాతం, వివాదాలతో మసకబారిన భారత క్రికెట్ బోర్డు ప్రతిష్టను తిరిగి పెంచే దిశగా...బోర్డు అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ప్రక్షాళన కార్యక్రమాలు ప్రారంభించారు. ముంబైలో ముగిసిన బిసిసిఐ 86వ కార్యవర్గ సమావేశంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకొన్నారు. 2013 ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంతో భారత క్రికెట్ కే మచ్చ తెచ్చిన శ్రీనివాసన్ శకానికి పూర్తిగా తెరదించారు.
శశాంక్ మనోహర్ శకం
ప్రపంచ క్రికెట్లోనే అత్యంత భాగ్యవంతమైన.. భారత క్రికెట్ నియంత్రణ మండలి చరిత్రలో..శశాంక్ మనోహర్ శకానికి తెరలేచింది. 2013 ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ తో...అభిమానుల నమ్మకాన్ని కోల్పోయి...అంతర్జాతీయంగా నవ్వులపాలైన భారత క్రికెట్ ప్రతిష్టను పెంచేదిశగా...బోర్డు అధ్యక్షుడు శశాంక్ మనోహర్ చర్యలు చేపట్టారు.
ముంబైలో బిసిసిఐ సర్వసభ్య సమావేశం
ముంబైలో ముగిసిన బిసిసిఐ 86వ వార్షిక సర్వసభ్య సమావేశంలో పలు విప్లవాత్మక చర్యలు తీసుకొన్నారు. పెద్దమనుషుల క్రీడ ప్రతిష్టకు భంగం కలిగించినవారికి.. భారత క్రికెట్లో చోటే లేదని చెప్పడానికి వీలుగా...ఐసీసీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ను తప్పించారు. శ్రీనివాసన్ కు భారత క్రికెట్ బోర్డు మద్దతు ఉపసంహరించుకొంది. ఆ స్థానంలో ప్రస్తుత అధ్యక్షుడు శశాంక్ మనోహర్ కొనసాగుతారని ఐసీసీకి అధికారికంగా తెలియచేసింది.
శశాంక్ మనోహర్ అధ్యక్షుడిగా
ఐసీసీ నిబంధనల ప్రకారం 2016 వరకూ...శశాంక్ మనోహర్ అధ్యక్షుడిగా కొనసాగుతారు. ఐపీఎల్ పుణ్యమా అంటూ భారత క్రికెట్ కు క్యాన్సర్ వ్యాధిలా అంటుకొన్న పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు ...చెక్ చెప్పేలా చర్యలు తీసుకొన్నారు. ఐపీఎల్ పాలకమండలి సభ్యుడిగా, భారత క్రికెట్ టీమ్ డైరెక్టర్ గా...జంటప్రయోజనాలు పొందుతున్న రవిశాస్త్రి లాంటి మాజీ సీనియర్లను..ఒక్క పదవికి మాత్రమే పరిమితం చేయాలని గట్టిగా నిర్ణయించారు. సౌతాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ లో టీమ్ కోచ్ కమ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న రవిశాస్త్రిని...ఐపీఎల్ పాలకమండలి నుంచి తప్పించారు. ఐపీఎల్ బోర్డు చైర్మన్‌ గా రాజీవ్ శుక్లాను కొనసాగించాలని బీసీసీఐ వార్షిక సర్వసభ్యసమావేశంలో నిర్ణయించారు. సునీల్ గవాస్కర్, కృష్ణమాచారీ శ్రీకాంత్, వీవీఎస్ లక్ష్మణ్ లాంటి పలువురు మాజీ గ్రేట్లు..ఇక నుంచి కేవలం ఒక్క పదవిని మాత్రమే ఉంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత భారతజట్టులో స్టువర్ట్ బిన్నీ సభ్యుడిగా ఉంటే...స్టువర్ట్ తండ్రి రోజర్ బిన్నీ సెలెక్షన్ కమిటీ సభ్యుడిగా ఉండటాన్ని గ్రహించిన బోర్డు పెద్దలు...పదవినుంచి రోజర్ ను తప్పించారు.
సీనియర్ సెలెక్టర్ గా ప్రసాద్
రోజర్ బిన్నీ స్థానంలో ఆంధ్రా క్రికెట్ కు చెందిన..టెస్ట్ మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ ను సీనియర్ సెలెక్టర్ గా నియమించారు. అలాగే...నార్త్ జోన్ కు చెందిన రాథోడ్ స్థానంలో పంజాబ్ కే చెందిన గగన్ ఖోడాను సీనియర్ సెలెక్టర్ గా అవకాశమిచ్చారు. భారత్ లో సరికొత్త అంతర్జాతీయ టెస్ట్ వేదికలుగా విశాఖపట్నం, రాంచీ, పూణే, ఇండోర్ నగరాలను తీర్చిదిద్ది, గుర్తింపు వచ్చేలా కృషి చేయాలని నిర్ణయించారు.
విశ్వాసాన్ని తిరిగి సంపాదించుకోవడమే లక్ష్యం
ఇప్పటి వరకూ...విశాఖ విడిసిఎ- ఎసిఎ స్టేడియం, రాంచీ ఇంటర్నేషనల్ స్టేడియం, పూణే, ఇండోర్ క్రికెట్ స్టేడియాలలో అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లు మాత్రమే నిర్వహిస్తూ వచ్చారు. ఇకముందు..జరిగే టెస్ట్ సిరీస్ ల్లోని కొన్ని మ్యాచ్ లను ..విశాఖ, రాంచీ, పూణే, ఇండోర్ స్టేడియాలకు కేటాయించడానికి చర్యలు తీసుకొంటారు. ఇదంతా చూస్తుంటే...గాడితప్పిన భారత క్రికెట్ బోర్డును..సక్రమమార్గం లో నడిపిస్తూ...అభిమానుల్లో పోగొట్టుకొన్న విశ్వాసాన్ని తిరిగి సంపాదించుకోవడమే..శశాంక్ మనోహర్ అండ్ కో లక్ష్యంగా కనిపిస్తోంది.

 

 

09:29 - November 10, 2015

ఎపి సీఎం చంద్రబాబు ఒంటెద్దుపోకడలు మానుకోవాలని వక్తలు హితవుపలికారు. ఎపి సర్కార్... సీఎం చంద్రబాబు పాలన అనే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో విశ్లేషకుడు నగేశ్ కుమార్, వైసిపి నేత.. మదన్ మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు, టిడిపి నేత.. శ్రీరాములు, పిడిఎఫ్ ఎమ్మెల్సీ గేయానంద్ పాల్గొని, మాట్లాడారు. రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రాయలసీమను ఆదుకుంటామని మాటలు చెప్తున్నారు కానీ.. చేతల్లో చూపించడం లేదని విమర్శించారు. కరువులో అల్లాడుతున్న రాయలసీమ ప్రజలకు భరోసా కల్పించడంలో ఎపి ప్రభుత్వం విఫలమైందన్నారు. చంద్రబాబు 17 నెలల పాలనలో అధికార వికేంద్రీకరణ జరగలేదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:21 - November 10, 2015

హన్మకొండ : వరంగల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు షాక్ తగలనుంది. పాలకుర్తి మాజీ ఎమ్మె ల్యే, కాంగ్రెస్ నేత దుగ్యాల శ్రీనివాసరావు టీఆర్ ఎస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దుగ్యాలను పార్టీలో చేర్చుకోవాలని మంత్రి కడియం శ్రీహరి.. సీఎం కేసీఆర్ పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. మంత్రి హరీష్ రావుతో దుగ్యాల శ్రీనివాసరావు, అతని అనుచరులు మంతనాలు జరుపున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంతో కాంగ్రెస్ అందోళనలో పడింది. హస్తం నేతలు అయోమయంలో ఉన్నారు.

 

టీఆర్ ఎస్ లో చేరనున్న దుగ్యాల..?

హన్మకొండ : వరంగల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు షాక్ తగలనుంది. ఆ పార్టీకి చెందిన దుగ్యాల శ్రీనివాసరావు టీఆర్ ఎస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. దుగ్యాలను పార్టీలో చేర్చుకోవాలని మంత్రి కడియం శ్రీహరి సీఎం కేసీఆర్ పై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. మంత్రి హరీశ్ రావుతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంతో కాంగ్రెస్ అందోళనలో పడింది.

 

08:49 - November 10, 2015

దేశం ఎటు వైపు పోతున్నది? గత 17 నెలలుగా మన దేశంలో జరుగుతున్న కొన్ని అమానవీయ సంఘటనలను చూసిన్నప్పుడు ఇలాంటి ఆవేదనే కలుగుతోంది. విభిన్న సంస్కృతులకు సంప్రదాయాలకు అభిరుచులకు మనదేశం పుట్టినిల్లు. భిన్నత్వంలో ఏకత్వం, పరమత సహనం మన ఆభరణాలు. అయితే, ఇవాళ మనదేశంలో సామాజిక సంబంధాలు అగ్నిపరీక్షకు గురవుతున్నాయి. కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మునుపెన్నడూలేనిరీతిలో సామాజిక సంబంధాలు కుదుపులకు లోనవుతున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అసహనపూరిత సంఘటనలు, కేంద్ర మంత్రులు, అధికార పార్టీ నాయకులు, దానికి వెన్నుదన్నుగా నిలిచే సంస్థల నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, చేష్టలు వివాదస్పదమవుతున్నాయి. ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఈ దేశ ప్రజలు వేసుకునే దుస్తుల మీద, ముఖ్యంగా మహిళల వస్త్రదారణ మీద ఆంక్షలు పెరుగుతున్నాయి. మనం ఏది తినాలో ఏది తినకూడదో శాసించే పరిస్థితులొస్తున్నాయి. బీఫ్‌ తిన్నారన్న పేరుతో దాడులు చేస్తున్న దృశ్యాలు మనం ఎటుపోతున్నామన్న ఆవేదనను రగిలిస్తున్నాయి. చివరకు స్కూల్స్‌ లో చిన్నపిల్లల కు పౌష్టికాహారాన్ని అందించే కోడిగుడ్డు విషయంలో కూడా రాద్ధాంతం చేస్తున్న పరిస్థితుల్లో మనం చిక్కుకుంటున్నాం. ఇలాంటి అమానవీయ ధోరణులను ప్రశ్నించడం నేరమవుతోంది. హేతుబద్దంగా ఆలోచించడం పాపమవుతోంది. సామాజిక సంబంధాలను గురించి విశ్లేషంచడాన్ని, మానవ సంబంధాల్లో మరింత ఉన్నతిని కాంక్షిస్తూ రచనలు చేయడాన్ని సహించలేని దుర్మార్గం రాజ్యమేలుతోంది. మరోవైపు ఈ దేశంలో సామాజిక సంబంధాలు మరింత ప్రేమపూరితంగానూ, అన్యోన్యంగానూ సాగాలని కోరుకుంటున్న ప్రజాస్వామిక శక్తులన్నీ ఒక్కతాటి మీదకు వస్తున్నాయి. దేశంలో పెరుగుతున్న అనారోగ్యకర వాతావరణానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నాయి. ప్రజాకళాకారుల ఐక్యవేదికలు, ప్రత్యామ్నాయ సాంస్కృతిక వేదికలూ ఏర్పడుతున్నాయి.

 

 

08:47 - November 10, 2015

దేశంలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయని.... ప్రజాస్వామ్యానికి భంగం కలుగుతుందని ప్రజాకళాకారుల ఐక్య వేదిక నేత సాంబరాజు అన్నారు. మతతత్వ శక్తులు రాజ్యమేలుతున్నాయని... నియంతృత్వ పోకడులను కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'తెలంగాణలో ప్రజాకళాకారుల ఐక్య వేదిక ఏర్పాటయ్యింది. ప్రజానాట్యమండలి, అరుణోదయ, విమలక్క ఇలా విభిన్న సంస్థలు, వ్యక్తులు, శక్తులు కలిసి తిరుగుబాటు పాట వినిపించేందుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే సదస్సులు, సెమినార్‌లు నిర్వహిస్తున్నారు. ప్రజాకళాకారుల ఐక్య వేదిక లక్ష్యాలేమిటి? ఆశయాలేమిటి? ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న విభిన్న సామాజిక సమస్యలకు ఈ వేదిక చూపించబోతున్న పరిష్కారాలేమిటి? అసలు తిరుగుబాటు పాటు లేదా తిరగబడ్డ పాట నినాదం స్ఫూర్తి ఏమిటి? ఇలాంటి అంశాలపై సాంబరాజు మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం..

 

తిరుమల జలాశయాల్లోకి భారీగా వరద నీరు

చిత్తూరు : తిరుమలలో ఎండతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. తిరుమల జలాశయాల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. గోగర్భం డ్యాం నిండింది. రాజంపేట వద్ద ఊట్కూరు చెరువు పొంగిపొర్లడంతో కడప, చెన్నై మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే కోడూరు మండలం గుంజన ఏరు పొంగిపొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.

 

 

తిరుమలలో ఎండతెరిపి లేకుండా వర్షం

చిత్తూరు : తిరుమలలో ఎండతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఘాట్ రోడ్డులో పలు చోట్ల కొండచరియలు, చెట్లు విరిగిపడ్డాయి. తిరుమలకు వెళ్లే వాహనాలు లింకు రోడ్డు ద్వారా మళ్లించారు.

 

07:57 - November 10, 2015

హైదరాబాద్ : వరంగల్‌ ఉప ఎన్నికల్లో వామపక్షాల అభ్యర్థిగా పోటీచేస్తున్న ప్రోఫెసర్‌ గాలి వినోద్‌కుమార్‌కు ఓయూ రిజిస్ట్రార్‌ ఇచ్చిన నోటీసులపై దుమారం రేగుతోంది. ఎమ్మెల్యేగా పోటీచేసే ముందు ప్రొఫెసర్‌ పదవికి రాజీనామా చేయాలని నోటీసులివ్వడంపై విద్యార్ధి సంఘాలు మండిపడుతున్నాయి. వెంటనే నోటీసుల్ని ఉపసంహరించుకోవాలని లేకపోతే...పెద్ద ఎత్తున ఆందోళనల్ని చేపడతామని విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు.
నోటీసులు జారీచేయడంపై విద్యార్థుల మండిపాటు 
వరంగల్ పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో వామపక్షాల అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రొఫెసర్‌ గాలి వినోద్‌కుమార్‌కు ఓయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ సురేష్‌కుమార్‌ నోటీసులు జారీచేయడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. నోటీసుల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ..ఓయూ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని ఎస్ ఎఫ్ఐ, ఏఐఎస్ ఎఫ్, పిడిఎస్ యు విద్యార్థులు ముట్టడించారు.
నోటీసుల్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్
సామాజిక తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న ప్రొఫెసర్‌ గాలి వినోద్‌కుమార్‌కు నోటీసులు ఇవ్వడం సరికాదని విద్యార్థులు మండిపడ్డారు. వరంగల్‌లో ఆయనకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే...అధికార పార్టీ ఈ దుర్మార్గానికి పాల్పడుతుందని విద్యార్థులు మండిపడ్డారు. నోటీసులివ్వడం వర్శిటీ చట్టాలకు విరుద్ధమని...ఈ చర్యను యావత్తు వర్శిటీ, అధికారులు విద్యార్థులు ఖండిస్తున్నారని తెలిపారు. వర్శిటీ చట్టాల్ని, ఎస్సీ, ఎస్టీ హక్కుల్ని కాలరాయడం రాజ్యాంగ విరుద్ధమని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే నోటీసుల్ని ఉపసంహరించుకోపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
నోటీసులవవ్వడం చట్టవిరుద్దం
ఇదిలా ఉంటే..యూనివర్శిటీ అధికారుల వాదన మరోలా ఉంది. గాలి వినోద్‌కుమార్‌కు వర్శిటీ నుంచి ఎలాంటి సెలవులు ఇవ్వలేదని ఓయూ రిజిస్ట్రార్‌ కార్యాలయం స్పష్టం చేసింది. తక్షణం గాలి వినోద్‌కుమార్‌ విధుల్లో చేరాలని లేనిపక్షంలో ఆయనపై చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. యూనివర్శిటీ యాక్ట్‌ 16 ప్రకారం ఓయూ ఆచార్యులు ఎమ్మెలయేగా గానీ..ఎమ్మెల్సీగా గాని పోటీచేసే నిబంధనలు లేవని,..పోటీ చేయాలనుకుంటే రాజీనామా చేయాలని తెలిపారు. ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్‌...సెలవు కోసం ధరఖాస్తు చేసుకున్నారు. కానీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని ప్రకటనలో స్పష్టం చేశారు.

 

 

07:51 - November 10, 2015

హైదరాబాద్ : తెలంగాణ డీజీపీగా నియమించుకోవడానికి యుపీఎస్‌సీ పానల్‌ కమిటీ మూడు పేర్లను ఖరారు చేసింది. ప్రస్తుతం తాత్కాలిక డీజీపీగా ఉన్న అనురాగశర్మతో పాటు ఆరుణాబహుగుణ, ఎకె ఖాన్‌ పేర్లకు క్లియరెన్స్‌ లభించింది. ఈ పేర్లను పరిశీలించిన అనంతరం వీరిలో ఎవరినైనా డీజీపీగా నియమించుకునే అధికారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం ఒకసారి డీజీపీగా నియమితులైన అధికారి రెండేళ్లు కొనసాగాల్సి ఉంటుంది.
అనురాగ్‌ శర్మ, అరుణా బహుగుణ, ఏకే ఖాన్‌కు క్లియరెన్స్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడాదిన్నర తరువాత పూర్తి స్థాయి డీజీపీని నియమించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా గత నెలలో సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు డీజీ హోదాలో ఉన్న ఐదుగురు అధికారుల జాబితాను పంపించారు. ఇందులో అనురాగ్‌శర్మ, అరుణా బహుగుణ, ఏకే ఖాన్‌తో పాటు కోడె దుర్గాప్రసాద్‌, తేజ్‌దీప్‌కౌర్‌ పేర్లు ఉన్నాయి. వీరిలో అనురాగ్‌శర్మ, అరుణా బహుగుణ, ఏకే ఖాన్‌కు యూపీఎస్సీ ప్యానెల్‌ కమిటీ క్లియరెన్స్‌ ఇచ్చింది. ఈ ముగ్గురిలో ప్రభుత్వం తనకు ఇష్టం వచ్చిన వారిని పూర్తి స్థాయి హోదాలో డీజీపీగా నియమించుకునే అవకాశం ఉంది.
వివాదాస్పదంగా డీజీపీల నియామకం
గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు తమకు ఇష్టం వచ్చిన వారిని డీజీపీలుగా నియమించుకునేవి. ఆరేడు నెలల్లో పదవీ విరమణ చేసే వారిని నియమించడంతో శాంతిభద్రతల విషయంలో వారు కఠినంగా వ్యవహరించకపోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. పైగా డీజీపీల నియామకం వివాదాస్పదంగా మారింది. దీనిపై కొందరు అధికారులు కోర్టును సైతం ఆశ్రయించారు.
డీజీపీ నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అందరికంటే జూనియర్‌గా ఉన్న అనురాగ్‌శర్మను తాత్కాలిక డీజీపీగా నియమించారు. 1982 బ్యాచ్‌కు చెందిన అనురాగ్‌ శర్మ 2017 ఫిబ్రవరిలో పదవీవిరమణ చేయనున్నారు. ప్రస్తుతం ఈయనే తాత్కాలిక డీజీపీగా కొనసాగుతున్నారు. అనురాగ్‌శర్మ విషయంలో సీఎం కేసీఆర్‌ అనుకూలంగానే ఉన్నందున ఆయననే కొనసాగించే అవకాశం ఉంది. ఇక 1979 బ్యాచ్‌కు చెందిన అరుణా బహుగుణ ఈ జాబితాలో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిణి. ప్రస్తుతం ఈమె హైదరాబాద్‌లోని జాతీయ పోలీసు అకాడమీకి డైరెక్టర్‌గా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుహైదరాబాద్ : తెలంగాణ డీజీపీగా నియమించుకోవడానికి యుపీఎస్‌సీ పానల్‌ కమిటీ మూడు పేర్లను ఖారారుడు హైదరాబాద్‌ నివాసి అయిన అరుణాబహుగుణకు డీజీపీ అవకాశం ఇస్తారని భావించారు. కేంద్ర సర్వీసులో ఉండటంతో ఆమె పేరును ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. ఇక ఏకే ఖాన్‌ ప్రస్తుతం తెలంగాణలో అవినీతి నిరోధక విభాగం చీఫ్‌గా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన సమయంలో మైనారిటీలకు అవకాశం ఇచ్చే సమయంలో ఖాన్‌నే డీజీపీగా చేస్తారని ప్రచారం జరిగింది. అయితే రాజకీయ సమీకరణాల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందని అనురాగ్‌శర్మ పేరును ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. ప్రస్తుతం యూపీఎస్‌సీ జాబితా కూడా సిద్ధం కావడంతో రాష్ట్రప్రభుత్వం డీజీపీ నియామకంపై తుది నిర్ణయం తీసుకోనుంది.

 

07:47 - November 10, 2015

హైదరాబాద్ : గ్రేటర్‌ ఇప్పుడు టీఆర్‌ఎస్‌ మెయిన్‌ టార్గెట్‌. జీహెచ్‌ఎమ్‌సీ కోటలో జెండా ఎగరవేయాలనేది ఆ పార్టీ ప్రయత్నం. దీని కోసం గులాబీ నేతలు ఎప్పటినుంచో ప్లాన్లు గీస్తున్నారు. సంక్షేమ పథకాలతో పాటు ఇతర అభివృద్ధి పథకాల విషయంలోనూ గ్రేటర్‌ ఎన్నికలే సెంటర్‌ పాయింట్‌గా నిలుస్తున్నాయి. ఐనా సింగిల్‌గా వెళ్లే ధైర్యం అధికార పార్టీకి రావడం లేదట. జత కట్టుకుని వెళితేనే బెటర్‌ రిజల్ట్‌ వస్తుందనే భావన ప్రభుత్వ పెద్దల్లోనే ఉందని తెలుస్తోంది. దీంతో మజ్లిస్‌తోనే ముందుకుసాగాలని నిర్ణయించారని సమాచారం.
టీఆర్ ఎప్, ఎంఐఎల మధ్య అవగాహన
గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్ ఎప్, ఎంఐఎల పార్టీలు అవగాహనతో ముందుకు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మొత్తం 24 నియోజకవర్గాల్లో ..ఎంఐఎ ప్రభావం 10 నుంచి 12 నియోజకవర్గాల్లో ఉంటుంది. దాదాపు 60 వరకు కార్పోరేటర్ స్థానాలు ఆయా నియోజకవర్గాల పరిధిలోకి వస్తాయి. ఎంఐఎ ఎంపిక చేసుకున్న వార్డులను ఆ పార్టీకే అప్పగించాలనే నిర్ణయానికి అధికార పార్టీ వచ్చినట్లు తెలుస్తోంది. విడివిడిగా పోటీ చేయాల్సి వస్తే ఎంఐఎ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించరాదనే అభిప్రాయంతో గులాబి బాస్ ఉన్నట్లు సమాచారం.
వార్డులపై దృష్టి
గ్రేటర్‌లో రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి అయిన వెంటనే ఆయా వార్డులపై దృష్టి సారించేందుకు టీఆర్‌ఎస్‌ సిద్ధమవుతోంది. ప్రాథమిక కసరత్తు కూడా మొదలైంది. రిజర్వేషన్ల ప్రక్రియ ఖరారైతే, అభ్యర్థుల ఎంపికతో పాటు ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను చేర్చుకునేందుకు మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
జనవరి 16, 17 తేదీల్లో పోలింగ్‌
రాజకీయంగా తెరవెనుక తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అధికార పార్టీ ఆందోళనను బయటపెడుతున్నాయి. జనవరి 31వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది. ఈ నేపథ్యంలో జనవరి 16 లేదా 17 తేదీల్లో పోలింగ్ జరిపేలా నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

 

07:35 - November 10, 2015

హైదరాబాద్ : నెలరోజులు గడిచిపోయాయి. రెండు నెలలు మూడు నెలలు..ఇలా రోజులు దొర్లిపోతున్నాయి.. కానీ తమ వారి జాడ తెలియక ఆ కుటుంబ సభ్యులు విలవిల్లాడిపోతున్నారు. ఊరు కాని ఊరు.. దేశం కాని దేశంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న తెలుగు వారిని ఉగ్రవాదులు బంధించారు. టెర్రరిస్టుల చెరలో మగ్గుతున్న తమ వారి రాక కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. గుండె దిటవు చేసుకుని కాలాన్ని భారంగా నెట్టకొస్తున్నారు. ఎప్పుడు వస్తారో తెలియదు.. కనీసం ఎలా ఉన్నారో కూడా తెలియదు. ఇప్పటికే వంద రోజులు గడిచిపోయాయి. అయినా ఎటువంటి సమాచారమూ లేదు. తమ ఆత్మీయుల సమాచారం లేక ఈ ప్రాణాలు అల్లల్లాడిపోతున్నాయి..
లిబియాలో తెలుగు ప్రొఫెసర్స్ కిడ్నాప్‌
లిబియాలో కిడ్నాప్‌కు గురైన తెలుగు ప్రొఫెసర్స్ బలరామ కిషన్‌, తిరువీధుల గోపీకృష్ణ జాడ ఇంకా తెలియలేదు. వారిని 100 రోజుల క్రితం ఐఎస్‌ఐస్‌ ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేశారు. అయితే వారి ప్రాణానికి హాని లేదని చెబుతున్నా వారెలా ఉన్నారో తెలియక కుటుంబసభ్యులు క్షణమొక యుగంలా గడుపుతున్నారు. ఈ ఏడాది జులై 29న నార్త్‌ లిబియాలోని సిర్టే యూనివర్సిటీ నుంచి నలుగురు భారతీయ ప్రొఫెసర్లు వస్తుండగా ట్రిపోలి ఎయిర్ పోర్ట్‌ సమీపంలో వారు కిడ్నాప్‌కు గురయ్యారు. వారిలో చిలువేరు బలరామకిషన్‌, తిరువీధుల గోపీకృష్ణ అనే తెలుగు ప్రొఫెసర్లు, కర్నాటకకు చెందిన విజయ్‌కుమార్‌, రామకృష్ణ ఉన్నారు. కాగా కర్నాటకకు చెందిన ప్రొఫెసర్లను వదిలేసి ఇద్దరు తెలుగువారిని మాత్రం ఇంకా చెరలోనే ఉంచుకున్నారు.
తెలుగు ప్రొఫెసర్లు... ఆందోళన
ఇప్పుడీ తెలుగు ప్రొఫెసర్ల విషయమే ఆందోళనకు గురిచేస్తోంది. వారి ప్రాణాలకు హాని లేదని ఐ.ఏస్ నుంచి సంకేతాలు అందుతున్నా.. వారు ఎక్కడ ఉన్నారనేది మాత్రం స్పష్టత లేదు. వారి విడుదల కోసం లిబియా దేశం రాయబారితో చర్చలు జరిపారు. ఐ.ఎస్.ఐ.ఎస్ స్టూడెంట్ లీడర్స్‌తో సైతం చర్చలు జరిపారు. ఆ చర్చలు ఫలించి కొన్ని రోజుల క్రితం కర్నాటకకు చెందిన విజయ్ కుమార్, రామకృష్ణలను విడుదల చేశారు. కానీ తెలుగు వారిని విడిచిపెట్టలేదు. అయితే యూనివర్శిటీ అధికారులు మాత్రం వారికి ఎలాంటి హానీ లేదని చెబుతున్నారు. కాగా యూనివర్శిటీ విద్యార్థులను తమ సంస్థకు అనుకూలురుగా మార్చేందుకు ప్రయత్నించాలని వారిపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అదెలా ఉన్నా అయినవారి వివరాలేవీ తెలియక ఇక్కడి కుటుంబసభ్యులు మాత్రం తీవ్ర అందోళనకు గురవుతున్నారు.
ఉగ్రవాదులు తెలుగువాళ్లను టార్గెట్‌ చేశారా..?
అయితే ఉగ్రవాదులు తెలుగువాళ్లను టార్గెట్‌ చేశారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రొఫెసర్లిద్దరూ తిరుగుబాటుదారుల చెరలో ఉండగానే మరో తెలుగువాడైన డాక్టర్ రామ్మూర్తిని ఉగ్రవాదులు అదుపులోకి తీసుకున్నారు. వారు క్షేమంగా తిరిగిరావాలని కుటుంబసభ్యులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇకనైనా చురుగ్గా స్పందించి తమవారిని విడుదల చేయించాలని కోరుతున్నారు.

 

07:27 - November 10, 2015

తమిళనాడు : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం కడలూరు వద్ద తీరం దాటింది. దీని ప్రభావంతో తీరం వెంబడి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలకు తమిళనాడు, పుదుచ్చేరిలలో ఆరుగురు మృతి చెందారు. వాయుగుండం ప్రభావంతో చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తుమ్మలపెంట వద్ద సముద్రం 500 మీటర్లు ముందుకొచ్చింది. అటు చిత్తూరు జిల్లాలోనూ భారీవర్షాలు కురుస్తున్నాయి.

 

07:18 - November 10, 2015

హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం చెన్నై సమీపంలో తీరం దాటింది. తుపాను ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. నెల్లూరు, చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు ప్రభావం చూపాయి. వచ్చే 24 గంటల్లో కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో తుపాను ప్రభావిత జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. ఏపీలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
గంటకు 55-75 కి.మీ. వేగంతో పెనుగాలులు
రెండు రోజులుగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తున్న రోవాన్‌ తుపాను పుదుచ్చేరి తీరాన్ని తాకింది. ఈ ప్రభావంతో వచ్చే 24 గంటల్లో రెండు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 55 నుంచి 75 కి.మీ. వేగంలో పెనుగాలు వీసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దీంతో తుపాను ప్రభావిత జిల్లాల్లో అప్రమత్తత ప్రకటించారు.
తిరుమల, తిరుపతిలో భారీ వర్షాలు
రోవాన్‌ తుపాను ప్రభావంతో తిరుమల, తిరుపతిలో భారీ వర్షాలు కురిశాయి. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. క్యూకాంప్లెక్స్ ల్లో వర్షంనీరు నిలిచింది. రెండో ఘాట్‌ రోడ్‌తోపాటు, మెట్లమార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. తిరుమలలో 140 మి.మీ.కు పైగా వర్షంపాతం నమోదయ్యింది. అన్ని డ్యాముల్లో భారీగా నీరు చేరుతోంది.
లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షం నీరు చేరిక
చిత్తూరు జిల్లాలో చంద్రగిరి, సత్యవేడు, శ్రీకాళహస్తి, పలమనేరు, మదనపల్లె వర్షాలు కురిశాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. శ్రీనివాసమంగాపురం సమీపంలో స్వర్ణముఖి నదికి వరదనీరు పోటెత్తుతోంది. నెల్లూరు జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
నెల్లూరులో రోడ్లన్నీ జలమయం
నెల్లూరు నగరంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షంనీరు చేరింది. జిల్లాలోని 11 మండలాల్లో తుపాను ప్రభావం చూపింది. మరోవైపు తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో మత్స్యకారులను చేపలవేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశించారు. ప్రకాశం జిల్లా వాడరేవు నుంచి చేపలవేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు నెల్లూరు జిల్లాలో తీరం చేరుకున్నారు.
కాశిమేడు, పుదుచ్చేరిలో ఆరుగురు మత్స్యకారుల గల్లంతు
రోవాన్‌ తుపాను ప్రభావంతో ప్రకాశం జిల్లాలో చీరాల, వేటపాలెం, చినగంజాం ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు పడ్డాయి. తమిళనాడులో తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. పదకొండు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. చెన్నై కాశిమేడుతోపాటు పుదుచ్చేరిలో సముద్రంలో చేపలవేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. భారీ వర్షాల కారణంగా చైన్నైలో రైలు, విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

 

07:09 - November 10, 2015

తమిళనాడు : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం పుదుచ్చేరి దగ్గర తీరం దాటింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో మరో 24 గంటలు వర్షాలు పడే అవకాశముంది. గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. వాయుగుండం నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభావిత జిల్లాల కలెక్టరేట్లలో అధికారులు కంట్రోల్‌రూంలను ఏర్పాటు చేశారు. సముద్రంలో వేటకు వెళ్ళొద్దని మత్స్యకారులను హెచ్చరించారు. తీవ్రవాయుగుండం తీరం దాడివెళ్లడంతో...నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఎడతెరపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలకు తమిళనాడులో ఆరుగురు మృతి చెందారు.

 

నేటి నుంచి 24 వరకు అంబేద్కర్ వర్సిటీ స్పాట్ అడ్మిషన్లు

హైదరాబాద్ : నేటి నుంచి 24 వరకు అంబేద్కర్ వర్సిటీ స్పాట్ అడ్మిషన్లు జరుగనున్నాయి.

 

Don't Miss