Activities calendar

20 November 2015

ఇంకా 138 మంది ఉగ్రవాదుల చెరలో

బమాకో : మాలి రాజధాని బమాకోలో ఉగ్రవాదుల దాడి చేసిన రాడిసన్‌ బ్లూ హోటల్‌లో ఇంకా 138 మంది ఉగ్రవాదుల బందీలుగానే ఉన్నట్లు హోటల్‌ యాజమాన్యం వెల్లడించింది. వారిలో 13మంది హోటల్‌ సిబ్బంది ఉన్నట్లు తెలిసింది . హోటల్‌పై ఉగ్రవాదుల దాడిచేసి 170మందిని బందీలుగా తీసుకున్నారు. వారిలో కొందరు సురక్షితంగా బయటపడ్డారు. భదత్ర బలగాలు హోటల్‌ వద్ద మోహరించి బందీలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

భూసమీకరణ ద్వారానే బందర్ పోర్టు భూమి : కొల్లు రవీంద్ర

విజయవాడ : భూసమీకరణ ద్వారానే బందర్ పోర్టు భూమిని తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం డెవలప్ మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. బందర్ ప్రాంతంలో కొత్త పరిశ్రమలను ఏర్పాటు, ఉపాధి అవకాశాలు, అభివృద్ధి కార్యక్రమాలన్నీ అథారిటీ ద్వారా చేపడతామని పేర్కొన్నారు. 

21:58 - November 20, 2015

టిప్పు సుల్తాన్ వ్యక్తిత్వంపై రగడ ఎందుకు మొదలైంది.? టిప్పు సుల్తాన్ ఇతర మతాలను ద్వేషించాడా..? చరిత్ర పేజీలకు రక్తపు మరకలంటించిన పాలకుడా..? అసలు టిప్పు సుల్తాన్ దేశభక్తుడే కాదా..? టిప్పు వ్యక్తిత్తమేంటి...? జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలేంటీ...? ఇదే ఈరోజు వైడ్ యాంగిల్ స్టోరీ.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

21:50 - November 20, 2015

హన్మకొండ : వరంగల్‌ పోరు తుది అంకానికి చేరింది. అభ్యర్థుల భవిష్యత్తు ఈవీఎంలలో నిక్షిప్తం కావడానికి సమయం దగ్గరపడుతోంది. శనివారం జరుగనున్న పోలింగ్‌కు ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు చేసింది. పోలింగ్‌ బూత్‌కు వచ్చిన మొదటి ఓటర్ని పోలింగ్‌ సిబ్బంది ప్రత్యేకంగా పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానించనున్నారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి
వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు ఎలక్షన్‌ కమిషన్‌ తీసుకుంది. భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అడుగడుగునా నిఘాను ఏర్పాటుచేశారు. మరోపక్క పోలింగ్‌ స్టేషన్‌కు వచ్చిన మొదటి ఓటర్ని స్పెషల్‌గా ఇన్‌వైట్‌ చేసేందుకు ఎన్నికల కమిషన్‌ ఏర్పాట్లుచేసింది. మొదటి ఓటరికి పుష్పగుచ్చం ఇచ్చి సాదరంగా ఆహ్వానించనున్నారు.
1778 పోలింగ్‌ స్టేషన్‌లు
ఉప ఎన్నిక కోసం 1778 పోలింగ్‌ స్టేషన్‌లను ఏర్పాటుచేశారు. ఎనిమిది వేల మంది పోలింగ్‌ సిబ్బందిని నియమించారు. మొత్తం పదివేలమంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. వీరిలో రెండు వేల మంది కేంద్ర సాయుధ బలగాలున్నారు. నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఈ బలగాలు విధులు నిర్వహిస్తున్నాయి. పోలింగ్‌ ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు రికార్డు చేయడానికి 500 మంది వీడియో గ్రాపర్లును రంగంలోకి దింపారు.
15 లక్షల మంది ఓటర్లు
వరంగల్‌ ఉప ఎన్నికలో 15 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తంలో 1778 పోలింగ్‌ స్టేషన్లలో 626 పోలింగ్‌ స్టేషన్లను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు.
రెండు కోట్ల రూపాయలను సీజ్‌
మరోపక్క ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నెంబర్లకు 11 ఫిర్యాదులు అందాయి. మద్యం, నగదు పంపిణీకి సంబంధించి ఈ ఫిర్యాదులు అందాయి. ఇప్పటివరకు ఐదువేల లీటర్ల లిక్కర్‌ను పోలీసులు పట్టుకున్నారు. రెండు కోట్ల రూపాయలను సీజ్‌ చేశారు.

 

21:45 - November 20, 2015

మాలి : బాంబుల వర్షం కురిపించినా భయపడట్లేదు. రష్యా రౌద్ర రూపం ప్రదర్శించినా పట్టించుకోవట్లేదు. తాటతీస్తామని అమెరికా హెచ్చరిస్తున్నా తమ మారణ హోమానికి స్వస్తి పలకట్లేదు. గ్రూప్ ఏదైతేనే తమ దాడుల సంఖ్య పెంచుతున్నారు. మా టార్గెట్లు ఇవీ కాసుకోండి అంటూ సవాల్లు విసురుతున్నారు. తాజాగా ఆఫ్రికా కంట్రీ మాలిలో ఓ హోటల్‌పై తెగబడి దాడులు నిర్వహించారు. పలువురిని తమ మృత్యు హస్తాలతో బంధించారు. పది మంది చనిపోగా వారిలో ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు కూడా ఉన్నారు.
బమాకోలో హోటల్‌పై దాడి 
మొన్న ఫ్రాన్స్ లో విరుచుకుపడి ఇసిస్‌ మారణహోమం సృష్టించింది. ఈసారి మరో గ్రూపుకు చెందిన ముష్కర మూక మాలి దేశ రాజధాని బమాకోలో ఓ హోటల్‌పై దాడి చేసి విదేశీయులతో సహా 170 మందిని బందీ చేసింది. బమాకోలోని రాడిసన్‌ బ్లూ హోటల్‌పై టెర్రరిస్టులు దాడి చేసి కాల్పులు జరిపారు. ఈ దాడిలో ముగ్గురు బలయ్యారు. విదేశీయులు, మాలి దేశస్తులతో సహా 170 మందిని బంధించారు. దాడిలో హోటల్‌లో ఉన్న ముగ్గురు మరణించారని భద్రతా శాఖమంత్రి తెలిపారు. జిహాదీలతో కూడిన కారులో హోటల్ కాంపౌండ్‌లోకి ప్రవేశించి దాడికి దిగారు. ఇద్దరు టెర్రరిస్టులు ఓ గదిలో 140 మంది అతిథులును, 30 మంది సిబ్బందిని బంధించి ఉంచారు.
బందీలుగా పలువురు విదేశీయులు
దాడికి గురైన హోటల్‌ రాడిసన్‌ అమెరికాకు చెందిన హోటల్ గ్రూప్ నిర్వహణలో ఉంది. బందీల్లో పలువురు విదేశీయులూ ఉన్నారు. మాలీ సైన్యం, పోలీసులు, ఐక్యరాజ్యసమితి స్పెషల్‌ ఫోర్స్‌, ఫ్రాన్స్‌ సైన్యం ప్రస్తుతం పశ్చిమ ఆఫ్రికాలోని ఉగ్రవాద కాలనీలపై దాడులు నిర్వహిస్తున్నాయి. ఆ దాడులను ఆపించాలనే కారణంతో రాడిసన్ హోటల్‌పై దాడికి పాల్పడి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. బందీలను అడ్డం పెట్టుకుని ఆ దాడులను ఆపించాలనేది టెర్రరిస్టుల వ్యూహం. అయితే దాడి చేసింది తామే అంటూ ప్రస్తుతానికి ఏ సంస్థా ప్రకటించలేదు. అయితే ఇదే హోటల్‌లో బస చేస్తున్న 20 మంది ఇండియన్లు భద్రంగా ఉన్నారని కేంద్రం తెలిపింది. వారు దుబాయి కేంద్రంగా నిర్వహిస్తున్న ఇండియన్‌ బిజినెస్‌ గ్రూపు తరుపున మాలిలో పనిచేస్తున్నారు.
బందీలను విడిపించేందుకు ప్రయత్నాలు
ఉగ్రవాదుల చెర నుంచి బందీలను విడిపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే టెర్రరిస్టుల డిమాండ్లు ఏ విధంగా ఉండబోతున్నాయి...అక్కడి ప్రభుత్వం, ఇతర భద్రతా బలగాలు ఎటువంటి చర్యలు తీసుకుంటాయన్నది చర్చనీయాంశమైంది. ఒకపక్క సిరియాలోని ఇసిస్‌ ఉగ్రవాద స్థావరాలపై ఫ్రాన్స్‌, రష్యా దాడులు చేస్తుండగానే బకామోలో దాడి జరగడంతో హై టెన్షన్‌ నెలకొంది.

 

21:39 - November 20, 2015

హన్మకొండ : వరంగల్‌ ఎంపీ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. రేపు జరగనున్న పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు అధికార యంత్రాంగం పూర్తి చేసింది. మొదటిసారిగా ఈవీఎంలపై అభ్యర్ధి ఫోటోను కూడా ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి బూత్‌కు వచ్చే మొదటి ఓటరుకు పుష్పగుచ్ఛం ఇచ్చి ఎన్నికల అధికారులు అభినందనలు తెలియచేయనున్నారు. మరోవైపు రాజకీయ నేతలంతా పోల్‌ మేనేజ్‌మెంట్‌లో బిజీ అయిపోయారు. మొత్తం 15,9,691 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉప ఎన్నిక పోలింగ్ లో 9,654 సిబ్బంది పాల్గొనున్నారు. 1778 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 630 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. 20 పారా మిలిటరీ దళాలు మొహరించనున్నారు. 626 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తారు. 476 పోలింగ్ కేంద్రాలను వీడియో తీస్తారు. 6300 ఈవీఎం సెంటర్లను సమకూర్చారు. బ్యాలెట్ పేపర్ పై అభ్యర్థుల ఫొటోలను అతికించి ఉంటాయి. టీఆర్ ఎస్ నుంచి పసునూరి దయాకర్, కాంగ్రెస్ నుంచి సర్వే సత్యనారాయణ, వామపక్షాల అభ్యర్థి గాలి వినోద్ కుమార్, టిడిపి-బిజెపి ఉమ్మడి అభ్యర్థి దేవయ్యతో సహా మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రూరల్ ఎస్పీ అంబరీ కిషోర్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పలవురి లైసెన్సుడు వెపన్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

21:25 - November 20, 2015

నెల్లూరు : జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. వారంరోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో వచ్చిన వరదల్లో మునిగిపోయిన బాధితులను పరామర్శిస్తున్నారు. వర్షం ఆగడంతో.. సహాయక చర్యలు చేపట్టిన అధికారులను అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని సీఎం బాబు హామీ ఇస్తున్నారు.

 

21:22 - November 20, 2015

హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్ అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుందని చెప్పారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్టేషన్ లోపలికి వస్తే ఓటేసేందుకు అనుమతిస్తామన్నారు. మొదటగా వచ్చిన ఓటర్ కు పుష్ప గుచ్చం ఇచ్చి సన్మానిస్తామని పేర్కొన్నారు. అలాగే అందరి ఓటర్లను సన్మానిస్తామని తెలిపారు. ఓటర్లు తమ ఓటును స్వచ్ఛందంగా, ఇష్టం వచ్చిన వ్యక్తికి ఓట్ వేయవచ్చని చెప్పారు. గత ఎన్నికల కంటే ఈ ఎన్నికలో ఓటింగ్ శాతం పెంచేందుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

మాలిలో ఉగ్రదాడులు.. 9 మంది మృతి

మాలి : పశ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రాజధాని బమాకోలోని రాడిసన్‌ బ్లూ హోటల్‌లోకి చొరబడి అక్కడివారిని బందీలుగా చేసుకున్నారు. హోటల్‌ సిబ్బంది, బస చేసిన వారు మొత్తంగా 170 మందిని బందీలుగా చేసుకున్నారు. వీరిలో 9 మందిని ఉగ్రవాదులు కాల్చిచంపారు. మృతుల్లో ఐదుగురు ఐరాస సిబ్బంది ఉన్నట్లు సమాచారం.

 

20:55 - November 20, 2015

కొత్తగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలనుకున్న మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు కానుంది. అన్ని రకాల అర్హతలున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తక్షణమే నిధులు సమకూరే అవకాశం ఉంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

20:35 - November 20, 2015

బమాకా : మాలిలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. మాలి రాజధాని బమాకాలో ఓ హోటల్‌లోకి చొరబడ్డారు. హోటల్‌లో ఉన్న 170 మందిని బంధించగా.. భద్రతాదళాలు వారిలో 80 మందిని విడిపించినట్లు తెలుస్తోంది. బందీలలో ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు ఉన్నట్లు తెలుస్తోంది. 15 మంది తెలుగువారున్నట్లు కూడా సమాచారం. ఇప్పటివరకు ఉన్న అంచనా ప్రకారం ఈ దాడికి ఇద్దరు ఉగ్రవాదులే పాల్పడింది.

 

20:32 - November 20, 2015

చిత్తూరు : నగర మేయర్ దంపతుల హత్య కేసులో పోలీసులు మరో అడుగు ముందుకు వేశారు. ఇప్పటికే సైంటిఫిక్ ఎవిడెన్స్ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తూనే ప్రధాన నిందితుడు చింటూ కోసం గాలిస్తున్నారు. చింటూ ఆచూకీగాని సమాచారం ఇచ్చినవారికి లక్ష రూపాయలు రివార్డును ప్రకటించారు. చింటూ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్న పోలీసులు పది బృందాలను రంగంలోకి దించారు.
రివార్డు ప్రకటించిన పోలీసు శాఖ..
చిత్తూరు మేయర్ అనురాధ, మోహన్ దంపతులను దారుణంగా చంపిన హంతకుల కోసం పోలీసుల వేట ముమ్మరమైంది...ఇప్పటికే కొందరు నిందితులు లొంగిపోగా... ప్రధాన సూత్రధారి మోహన్ మేనల్లుడు చంద్రశేఖర్ అలియాస్ చింటూ కోసం పోలీసులు గాలిస్తున్నారు... చెక్‌పోస్టులన్నీ మూసివేసిన పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు..చిత్తూరుతో పాటు మిగతా నగరాల్లోని సీసీ కెమెరాల్లో ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు..చింటూ కోసం ఏదైనా క్లూ దొరుకుతుందని ఆరా తీస్తున్నారు..ఈ క్రమంలోనే చింటూ గురించి సమాచారం గాని.. క్లూ గాని అందించినవారికి లక్ష రూపాయల రివార్డు ఇస్తామని పోలీసు డిపార్ట్‌మెంట్‌ ప్రకటించింది.
చింటూ కోసం పది ప్రత్యేక బృందాలు
ఇదిలా ఉంటే మేయర్ దంపతులను హత్య చేసిన కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు నిందితులను పట్టుకోవడంతో పాటు పక్కా ఎవిడెన్స్‌ కోర్టుకు సమర్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు..అందులో భాగంగా చిత్తూరులోని ప్రతీ సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలిస్తున్నారు.. నిందితులు ఎటువైపుగా వెళ్లారు..ఎలా వెళ్లారు..? ఎక్కడ తలదాచుకున్నారన్నదానిపై ఆరా తీస్తున్నారు..ఇప్పటికే ప్రధాన నిందితుడు చింటూ కోసం పోలీసులు పది ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
ఫోన్ కాల్స్ డిటేల్స్ తీస్తున్న కాప్స్..
ఇక ఈ హత్యలో ఐదుగురు ఉన్నారని తెలుస్తున్నా... ఇంకా కొంత మంది ఉండొచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయి... ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో ఐదుగురికంటే ఎక్కువే ఉన్నారని అంచనాకు వచ్చారు...అయితే చింటూకు ఈ హత్యలో సహకరించినవారెవరు..? ఎందుకు సహకారం అందించారు..? ఎలాంటి డీలింగ్స్‌ నడిచాయన్నదానిపై పోలీసులు దృష్టి పెట్టారు...ఇక మామాఅల్లుళ్ల మధ్య జరిగిన ఆర్థికపరమైన సంబంధాలు ఎలా ఉన్నాయన్నది కూడా ఆరా తీస్తున్నారు.. డబ్బు విషయంలో జరిగిన గొడవలతో పాటు మరేదైనా ఉన్నాయాన్నది తెలుసుకోవాల్సి ఉంది....
ఈ హత్యలో పోలీసుల నిర్లక్ష్యం..?
మేయర్ దంపతుల హత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉందని వస్తున్నవార్తలపై స్పందించిన పోలీసు బాస్‌ సీరియస్‌గా ఉన్నారు.. తమవారి తప్పులున్నట్లు తేలితే ముందుగా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని..ఆ తర్వాత^చట్టపరంగా కూడా చర్యలుంటాయని స్పష్టం చేస్తున్నారు...రాయలసీమ ఐజీ ఇచ్చే నివేదికపై వెంటనే స్పందిస్తామంటున్నారు.
చింటూ కోసం మెట్రోసిటీస్‌లో గాలింపు..
చెన్నై, హైదరాబాద్‌, ముంబై, తిరుపతి ఇలా ప్రతి ప్రాంత పోలీసులనూ అధికారులు అలర్ట్ చేశారు. ఆయా నగరాల ఎయిర్‌పోర్ట్ అధికారులకు జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి లేఖలు వెళ్లాయి. చింటూ అతని గ్యాంగ్ దేశం విడిచి పోకుండా అడ్డుకోవాలని ఎయిర్‌పోర్ట్ అధికారులను కోరారు.

 

20:14 - November 20, 2015

విజయవాడ : ఏపి సిఎం చంద్రబాబు ట్రాక్‌ రికార్డ్ చాలా గొప్పది. తాను అధికారంలో ఉండగా ఎవరికీ అప్పనంగా భూములు కేటాయించలేదని పదేపదే చెబుతుంటారు. తన ప్రధాన ప్రత్యర్థి గురించి మాట్లాడుతూ... ఆయన పలు అక్రమాలకు పాల్పడ్డారని అందుకే జైలుకు పోయొచ్చారని విమర్శిస్తుంటారు. ఇప్పుడు అదే సిఎంగారు తన ట్రాక్‌ తప్పి పయనిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అడిగినవాడు అయినవాడైతే దేనికైనా రెడీ అంటున్నారు. అయినవాళ్లకు విలువైన భూములు పంచిపెట్టడంలో ఏ ప్రభుత్వమూ తీసిపోవడం లేదు. పలానా వ్యక్తి తనవాడైతే కోట్ల రూపాయల భూములైనా కారు చౌకగా అప్పగించేస్తుంటారు మన ప్రభుత్వ పెద్దలు. ఇందుకు ఏపి గవర్నమెంట్‌ వ్యవహరిస్తున్న తీరే స్పష్టమైన ఉదాహరణ.
గల్లా కుటుంబం కంపెనీకి భూసంతర్పణ
ఏపీలో సహజంగానే భూముల రేట్లు చుక్కలు తాకుతుంటాయి. అలాంటి విలువైన భూములు ప్రభుత్వ నేతల బంధువులు, అనుయాయులకు మాత్రం డెడ్‌చీప్‌గా లభిస్తున్నాయి. మొన్న సిఆర్‌డిఎ పరిధిలోని 500 కోట్ల రూపాయల విలువ చేసే 498 ఎకరాల భూమిని ఏపి ప్రభుత్వం బాలయ్య వియ్యంకుడికి అతితక్కువ ధరకు అప్పగించింది. నిన్న రేణిగుంట విమానాశ్రయం దగ్గర్లో మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కుటుంబానికి చెందిన కంపెనీకి 48 కోట్ల రూపాయల విలువైన భూమిని సంతర్పణ చేసింది. అరుణకుమారి ఒకనాటి కాంగ్రెస్‌ మంత్రి కాగా ఆ తర్వాత ఎన్నికల సమయంలో టీడీపీలోకి వచ్చారు. ఆమె కుమారుడు జయదేవ్ ప్రస్తుతం టిడిపి ఎంపిగా ఉన్నారు.
బాలకృష్ణకు చంద్రబాబు భూసంతర్పణ
తాజాగా అలాంటి భూసంతర్పణే చంద్రబాబుగారి వియ్యంకుడు బాలకృష్ణకు చేస్తున్నట్లు సమాచారం. బాలయ్యకు చెందిన ఇండో అమెరికా డెంటల్‌ హాస్పిటల్‌కు విజయవాడలోని 5 ఎకరాల విలువైన ఆర్టీసీ భూములను ప్రభుత్వం కేటాయిస్తోందని వార్తలు గుప్పుమన్నాయి. ఆ భూమి విలువ ప్రస్తుత మార్కెట్‌లో 200 కోట్ల దాకా ఉంది. బాలయ్య వియ్యంకుడికి అత్యంత విలువైన భూములు కేటాయించిన ఇప్పటికే విషయం వివాదాస్పదమైంది. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట సమీపంలోని సిఆర్‌డిఎ పరిధినందలి 498 ఎకరాలను ఎంవివిఎస్ రామారావు సిఎండీగా ఉన్న విశాఖ బాట్లింగ్‌ కంపెనీకి అప్పగించారు. అది కూడా ఎకరా లక్ష రూపాయలకే ఇచ్చినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం అక్కడ భూ విలువ ఎకరా 60 లక్షల దాకా ఉంది. చంద్రబాబు ప్రతిసారీ తన రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించి వాళ్లు పలు అక్రమాలకు పాల్పడ్డారని జైలుకు కూడా పోయొచ్చారని ఆరోపణలు చేస్తుంటారు. ఆయన చెప్పే అక్రమాల్లో భూ కేటాయింపులూ ఉన్నాయి. పైగా తాను అధికారంలో ఉండగా ఎక్కడా కూడా బంధువులు, లేదా అయినవాళ్లకు భూములను కట్టబెట్టలేదంటూ ట్రాక్‌ రికార్డ్ చూపిస్తుంటారు. ఇప్పుడా ట్రాక్‌ నుంచి పక్కకు తప్పుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో పెట్టుబడిదారులను ప్రోత్సహించడంలో భాగంగానే కేటాయింపులు జరుగుతున్నాయని చెప్తోంది. ఇదెంతవరకు నిజమో బాబుగారికే తెలియాలి. 

20:08 - November 20, 2015

విజయవాడ : 'నగర అందాన్ని అందరూ మెచ్చుకోవాలి. ప్రపంచంలోని పర్యాటకులు పరుగు పరుగున రావాలి. ఆర్కిటెక్చర్‌ అదిరిపోవాలి. కట్టడాలు కళ్లు చెదిరేలా ఉండాలి. కల్చరల్‌ సిటీగా వరల్డ్ లోనే హైక్లాస్‌ సిటీ అవ్వాలి'. విజయవాడలో జరిగిన వరల్డ్ ఆర్కిటెక్చర్స్‌ జ్యూరీ సమావేశంలో అమరావతి నిర్మాణం ఎలా ఉండాలో వివరించేందుకు చంద్రబాబు ఆర్కిటెక్చర్‌ అవతారం ఎత్తారు. తన మైండ్‌లో ఉన్న అమరావతి సీనరీని.. సీఎం ఇలా జ్యూరీ సభ్యులకు వివరించారు.
వరల్డ్ ఆర్కిటెక్చర్స్ జ్యూరీ పరిచయం సమావేశం
అమరావతిని ప్రపంచలోనే అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విజయవాడలో సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో వరల్డ్ ఆర్కిటెక్చర్స్ జ్యూరీ పరిచయం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీకాంత్‌ ఆర్కిటెక్చర్స్‌ జ్యూరీని సీఎంకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా జ్యూరీ సభ్యులకు సీఎం కొత్త రాష్ట్రం విశిష్టతలను వివరించారు. సీడ్‌ క్యాపిటల్‌ నిర్మాణాలపై పలు సూచనలు చేశారు.
అమరావతి చారిత్రక గొప్పతనం నిలబెట్టేలా నిర్మాణాలు
అమరావతి చారిత్రక గొప్పతనాన్ని నిలబెట్టేలా, ఆంధ్రుల సంస్కృతి, వారసత్వాలను ప్రతిబింబించేలా నూతన రాజధానిలోని భవనాల నిర్మాణం జరగాలని చంద్రబాబు అన్నారు. సచివాలయం, హైకోర్టు, శాసనసభ, శాసనమండలి, రాజ్‌భవన్‌ తదితర ప్రధాన ప్రభుత్వ భవనాలన్నీ ఐకానిక్‌ కట్టడాలుగా ఉండాలన్నారు. ఈ భవనాలను సందర్శించేందుకు ప్రపంచ పర్యాటకులు వచ్చేలా రూపకల్పన చేయాలని జ్యూరీ సభ్యులను సీఎం కోరారు.
అమరావతి టూరిజం డెస్టినేషన్‌గా ఉండాలన్న సీఎం
భవిష్యత్తులో అమరావతి టూరిజం డెస్టినేషన్‌గా ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. బ్లూ, గ్రీన్‌, ఆక్వా సీటీగా అమరావతి ఉండేందుకు ప్రభుత్వ భవనాలను డిజైన్‌ చేయాలని సూచించారు. స్వాతంత్య్రం తర్వాత నిర్మాణమైన ఏ నగరం కూడా ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా మారలేకపోయిందని..అమరావతి ఆ లోటును తీర్చే విధంగా నిర్మాణం ఉండాలని చంద్రబాబు అన్నారు. ప్రపంచంలో పేరొందిన ఆర్కిటెక్చర్లు వరల్డ్‌ ఆర్కిటెక్చర్స్‌ జ్యూరీలో ఉన్నారు. ఫిబ్రవరి నాటికి ఈ జ్యూరీ తమ డిజైన్లను సమర్పించాల్సి ఉంటుంది.

 

20:03 - November 20, 2015

నెల్లూరు : వరద ప్రాంతాల బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్‌ చేశారు. ఈమేరకు వరద ప్రాంతాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మధు టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. విమర్శలకు, రాజకీయాలకు ఇది సమయం కాదని.. అందరూ పూనుకుని కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలని ఆయన కోరారు. బాధితులందరికీ వేగంగా సహాయమందేలా చూడాలన్నారు.

 

19:58 - November 20, 2015

హైదరాబాద్ : చట్టాలు చేసిన పథకాలకు తెలంగాణలో దిక్కులేకుండాపోతోంది.. బంగారుతల్లిని కొనసాగిస్తారా? ఆపేస్తారా? అన్న అంశంపై క్లారిటీ మిస్సయింది. ఇలా ఎటూ తేల్చకుండా పక్కనబెట్టడంపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అగమ్యగోచరంగా ప్రభుత్వ పథకాల అమలు
తెలంగాణలో కొన్ని ప్రభుత్వ పథకాల అమలు అగమ్యగోచరంగా మారింది.. పాత స్కీమ్‌ల స్థానంలో కొత్త విధానాలను రూపొందిస్తోంది టీ సర్కారు.. పాత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ఎత్తివేసేదిశగా అడుగులు వేస్తోంది.. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలొస్తున్నాయి..
బంగారుతల్లిపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ  
కిరణ్ కుమార్‌ రెడ్డి హయాంలో కాంగ్రెస్ బంగారుతల్లి, యువ కిరణాలు, మిల్క్ మిషన్‌, స్త్రీనిధి, ఇందిర జలప్రభ పథకాలను ప్రవేశపెట్టింది.. ముఖ్యంగా బంగారుతల్లికోసం ప్రత్యేక కేర్‌ తీసుకుంది.. ఆడపిల్లలను భారంగా భావిస్తున్న ఈ పరిస్థితుల్లో బంగారుతల్లి బాలికలకు మేలు చేస్తుందని భావించింది.. భవిష్యత్తులోవచ్చే ప్రభుత్వాలు ఈ స్కీమును అమలుచేసేలా అసెంబ్లీలో చట్టంకూడా చేసింది.. 2013 మే 1న ఈ పథకం మొదలైంది.. టీఆర్‌ఎస్‌ సర్కారు అధికారంలోకివచ్చాక ఈ పథకాల పరిస్థితి గందరగోళంలో పడింది.. సీఎం కేసీఆర్‌మాత్రం బంగారుతల్లిపై అధికారులతో చర్చలు జరుపుతున్నామని ప్రకటించారు.. అయితే ఈ స్కీముకు నిధులు మాత్రం విడుదల చేయడంలేదు.. హిందువులకోసం కల్యాణలక్ష్మి, మైనారిటీ యువతులకోసం షాదీ ముబారక్‌ ప్రకటించింది టీ సర్కారు.. దీంతో బంగారుతల్లిపై స్పష్టత కరువైంది. కాంగ్రెస్‌ మొదలుపెట్టిన పథకాలను అమలు చేసేందుకు తెలంగాణ సర్కారు పెద్దగా ఆసక్తి చూపడంలేదని సమాచారం.. ఒకవేళ బంగారుతల్లికి నిధులు విడుదలచేస్తే ఆ క్రెడిట్‌ అంతా హస్తం పార్టీ ఖాతాలోకే వెళుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులుమాత్రం బంగారు తల్లికి ఆంధ్ర ప్రదేశ్‌ పేరుతో చట్టబద్దత ఉందని... తెలంగాణలో అమలు చేయాలంటే ఇబ్బందులు తప్పవని అభిప్రాయపడుతున్నారు..
బంగారుతల్లిపై మంచి అభిప్రాయం
అటు బంగారుతల్లి చాలా మంచి పథకమన్న అభిప్రాయాలొస్తున్నాయి. ఈ స్కీం కింద శిశువు పుట్టినప్పటి నుంచి 18ఏళ్ల వయసు వచ్చేవరకూ ప్రతి ఏడాది విడతలవారీగా డబ్బు విడుదలవుతుంది.. పాప రెండేళ్ల వయసు వచ్చేవరకూ టీకాల ఖర్చులకోసం రెండు వేల రూపాయలు వస్తాయి.. మూడునుంచి ఐదేళ్లవరకూ అంగన్‌వాడీల్లో ఏడాదికి 15వందల రూపాయలు, ఆరునుంచి పదేళ్లవరకూ ఏడాదికి రెండువేలు, పదకొండేళ్లనుంచి 13ఏళ్లు వచ్చేవరకూ ఏడాదికి 2వేల 500, 14ఏళ్లనుంచి 15ఏళ్లవరకూ ఏడాదికి మూడువేలు, 16నుంచి 17ఏళ్ల వయసువరకూ ఏడాదికి 3వేల 5వందలు, 18నుంచి 21ఏళ్లవరకూ డిగ్రీలో ఏడాదికి నాలుగు వేల రూపాయలు చెల్లిస్తారు.. దీంతోపాటు బాలిక ఇంటర్‌ పూర్తయ్యాక 50వేలు, గ్రాడ్యుయేషన్‌ తర్వాత లక్ష రూపాయలచొప్పున మొత్తం 2లక్షల 16వేల రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తుంది.. ఇలా కొద్దికొద్దిగా అమ్మాయి ఖర్చులకోసం ఈ డబ్బు ఆయా కుటుంబాలకు ఎంతో ఆసరాగా ఉంటోంది. ఈ పథకంకోసం రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది దరఖాస్తు చేసుకున్నారు.. అటు మలివిడత నిధులకోసం చాలామంది ఎదురుచూస్తున్నారు.. అసలు ఈ పథకం కొనసాగిస్తారా? లేదా? అన్న అంశంపై క్లారిటీ ఇవ్వాలని వీరంతా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

 

 

19:49 - November 20, 2015

విజయవాడ : అభివృద్ధి, సేవ పేరుతో రాష్ట్రంలో కార్పొరేట్‌ సంస్థలకు ఏపీ ప్రభుత్వం ద్వారాలు తెరిచింది. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు వాల్‌మార్ట్, ఐటిసి తదితర 15 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. రానున్న రోజుల్లో రైతులకు డబ్బే డబ్బు అంటూ చంద్రబాబునాయుడు అన్నారు. అయితే ప్రతి నాణేనికీ బొమ్మా బొరుసూ ఉన్నట్లే ఇక్కడా కొన్ని బొరుసులున్నాయి.
15 సంస్థలతో ఒప్పందాలు
వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు వాల్‌మార్ట్, ఐటిసి, డాబర్‌ తదితర 15 సంస్థలతో ఏపి ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఈ ఒప్పందాల గురించి సిఎం చంద్రబాబు స్వయంగా మాట్లాడారు. రైతులు పండించిన పంటలకు తగిన మార్కెట్ విధానాన్ని కల్పిస్తామని ఇకనుంచి రైతుల కష్టాలు తొలగిపోనున్నాయని బాబు తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్రానికి అన్ని కార్పొరేట్‌ సంస్థలూ వస్తాయని ఈ సందర్భంగా అన్నారు.
బడా కార్పొరేట్‌ ప్రతినిధులు హాజరు
చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్‌ కంట్రీ డైరెక్టర్‌ ఒన్నోరుల్‌, వాల్‌మార్ట్ ప్రెసిడెంట్‌ క్రిష్‌ లేయర్‌, ఐటిసి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ శివకుమార్‌, తదితర బడా కార్పొరేట్‌ ప్రతినిధులు హాజరయ్యారు. గ్రామీణ సమ్మిళిత అభివృద్ధి ప్రాజెక్ట్ పేరుతో మొదలైన ఈ కార్యక్రమాన్ని ఐదేళ్లలో పూర్తిచేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. పైగా దీనికోసం ప్రపంచ బ్యాంక్‌ 495 కోట్ల రుణాన్ని అందిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం మరో 150 కోట్లు వెచ్చించి పనులు చేపడుతుందని బాబు తెలిపారు. 150 మండలాల్లో రెండున్నర లక్షల మంది రైతుల వార్షికాదాయం 50 శాతం పెంచే విధంగా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఇప్పటికే వాల్‌మార్ట్‌ సంస్థ రైతుల నుంచి సన్నబియ్యం కొనుగోలు చేస్తోందని ఇలాగే ఇతర సంస్థలూ అన్నిరకాల వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేస్తాయని సిఎం తెలిపారు.
సంస్కరణల విధానం ఇప్పటిది కాదు
అయితే చంద్రబాబు చెప్తున్న ఈ సంస్కరణల విధానం ఇప్పటిది కాదు. దీనిపై ఇప్పటికే పరిశీలకులు ఒక అంచనాకొచ్చారు. కార్పొరేట్‌ సంస్థలు రైతులకు మేలు చేస్తాయనడంలో ఎంతవరకు నిజముందో పలు రంగాలపై పట్టున్న పరిశీలకులకు సైతం అంతుబట్టట్లేదు. ఇటువంటి విధానం ప్రపంచ వ్యాప్తంగా చాలాచోట్ల విఫలమైంది. రైతులకు ఏకంగా 50 శాతం అదనపు లాభాలొచ్చేట్లయితే ఇటువంటి ప్లాన్‌ దేశవ్యాప్తంగా ఎప్పుడో మొదలై ఉండేదికదా అని వారు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం కొనుగోలు చేసే వ్యవహారానికి మంగళం
కార్పొరేట్ సంస్థలు వ్యవసాయోత్పత్తులను కొనుగోలు చేసే ఈ విధానం అమల్లోకి వచ్చి పూర్తిగా వ్యాపించిన తర్వాత ప్రభుత్వం కొనుగోలు చేసే వ్యవహారానికి మంగళం పాడుతుంది. ఆ తర్వాత కార్పొరేట్ సంస్థలు ఎంత చెబితే అంతకు రైతులు అమ్ముకోవాల్సొస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అన్నిటికి మించి ఈ ప్లాన్‌ గొప్పదైన పక్షంలో కాంగ్రెస్‌, లేదా బిజెపి ప్రభుత్వాలు ఆయా సంస్థలకు ఇప్పటికే స్వాగతం పలికుండేవని, ఇంతకాలంగా వందలాది మంది రైతులు మరణించి ఉండేవారు కాదని వారనడం కొసమెరుపు.

 

 

19:42 - November 20, 2015

హైదరాబాద్ : 2015 చాంపియన్స్ టెన్నిస్ లీగ్ హైదరాబాద్ అంచె పోటీలకు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. నవంబర్ 28 నుంచి 30 వరకూ మూడురోజులపాటు జరిగే ఈ పోటీలకు...హైదరాబాద్ లాల్ బహదూర్ ఇండోర్ టెన్నిస్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. దేశంలోని ఆరు ఫ్రాంచైజీజట్ల మధ్య.. ఆరు నగరాలు వేదికగా.. మొత్తం 14 రోజులపాటు జరిగే ఈటోర్నీలో భాగంగా 13 మ్యాచ్ లు నిర్వహిస్తారు. మొత్తం ఆరుజట్ల తరపున 24 మంది అగ్రశ్రేణి ప్లేయర్లు ఢీ కొనబోతున్నారు. లీగ్ లో పోటీపడుతున్న జట్లలో ముంబై మాస్టర్స్, రాయ్ పూర్ రేంజర్స్, చెన్నై వారియర్స్, హైదరాబాద్ ఏసెస్, నాగపూర్ ఆరెంజర్స్, పంజాబ్ మార్షల్స్ ఉన్నాయి. ముంబై, రాయ్ పూర్, చండీఘడ్, నాగపూర్, హైదరాబాద్, చెన్నై నగరాలు...మొత్తం 13 మ్యాచ్ లకూ వేదికలు కానున్నాయి. హైదరాబాద్ అంచె పోటీలు నవంబర్ 28న ప్రారంభమై..నవంబర్ 30న ముగియనున్నాయి. హైదరాబాద్ లాల్ బహదూర్ ఇండోర్ టెన్నిస్ స్టేడియంలో ఈ పోటీలు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతాయి.

 

గజ్వేల్ ప్రజ్ఞాపూర్ లో ఇళ్ల నిర్మాణానికి నిధుల విడుదల

మెదక్ : జిల్లాలోని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు గృహనిర్మాణశాఖ 1,250 ఇళ్ల నిర్మాణానికిగానూ రూ. 9.37 కోట్లు విడుదల చేసింది. మిగిలిన మొత్తం సీఎం ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి మంజూరు చేస్తామని వెల్లడించింది.

వరంగల్ ఉపఎన్నికలో పోలింగ్ శాతం పెంపుకు చర్యలు : భన్వర్ లాల్

హైదరాబాద్‌ : గతేడాది జరిగిన ఎన్నికల కంటే ఈసారి వరంగల్ ఉపఎన్నికలో పోలింగ్ శాతం పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్ లాల్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియను లైవ్ వెబ్ కాస్టింగ్ చేయడానికి 800 మంది విద్యార్థులను నియమించినట్టు చెప్పారు. మద్యం షాపులను రేపు సాయంత్రం 5 గంటల వరకు బంద్ చేయించినట్టు చెప్పారు.

 

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సీనియర్ అసిస్టెంట్

హైదరాబాద్ : నాంపల్లి డీఈవో కార్యాలయంలో లంచం తీసుకుంటూ సీనియర్ అసిస్టెంట్ వహీదుద్దీన్ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. ఓ వ్యక్తి నుంచి రూ. 4 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు వహీదుద్దీన్‌ను పట్టుకున్నారు. అనంతరం ఆయన కార్యాలయం, నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

రోడ్డు ప్రమాదంలో 150 గొర్రెల మృతి

మెదక్ : జిల్లాలోని సిద్ధిపేట మండలం రాఘవపూర్ గ్రామ సమీపంలో దారుణం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న గొర్రెల మందపైకి అతి వేగంగా వచ్చిన టిప్పర్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో అక్కడికక్కడే సుమారు 150 గొర్రెలు మృతి చెందాయి. మృతి చెందిన గొర్రెలు చెల్లాచెదురుగా పడ్డాయి. గొర్రెల కాపరులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. కన్నీరు పెట్టుకున్నారు.

 

 

హుస్సేన్ సాగర్ లో దూకి ఇద్దరి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌ : ఆర్థిక ఇబ్బందులతో ఒకరు, మానసిక అనారోగ్యంతో మరొకరు హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. లేక్ పోలీసులు వీరిని రక్షించారు. ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ తులసీరామ్‌ నాయక్ (35) ఆర్థిక సమస్యలతో విసిగిపోయి ఇవాళ సాయంత్రం హుస్సేన్ సాగర్‌లో దూకబోతుండగా స్థానికులు అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పార్సీగుట్ట ప్రాంతానికి చెందిన మరో యువకుడు సందీప్ (23) ఎన్టీఆర్ గార్డెన్ వద్ద హుస్సేన్ సాగర్‌లో దూకగా పోలీసులు అతన్ని రక్షించారు. మానసిక అనారోగ్యంతో ఉన్న సందీప్..

19:04 - November 20, 2015

ముంబై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్యకేసులో పీటర్ ముఖర్జియాను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందుంచారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ... విచారణ నిమిత్తం ముఖర్జియాను తమకు అప్పగించమని కోరింది. ఈ విషయమై ముంబాయి కోర్టు విచారిస్తోంది. ముఖర్జియాకు 14 రోజుల రిమాండ్ విధించే అవకాశముంది. షీనాబోరా హత్య కేసులో ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా ప్రథమ ముద్దాయి. కూతురుని ఆమే హత్య చేయించిందని, ఈ విషయం తెలిసినా పీటర్‌ ముఖర్జియా రహస్యాన్ని దాచి ఉంచారని సిబిఐ ఆరోపించింది.

 

18:55 - November 20, 2015

హైదరాబాద్‌ : పోలీస్‌ వ్యవస్థలో భారీ మార్పులు రాబోతున్నాయి. నగరం మొత్తం కమాండ్‌ చేసే కంట్రోల్‌ సిస్టం కోసం భారీ భవంతులు సిద్ధం కాబోతున్నాయి. ఈ టవర్లకు సీఎం కేసీఆర్‌ ఈ నెల 22న భూమి పూజ చేయబోతున్నారు.
అత్యాధునిక హంగులతో
అత్యాధునిక హంగులతో పోలీసులకోసం భారీ భవనాల నిర్మాణానికి ప్లాన్‌ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం... ప్రపంచస్థాయిలో ఈ కమిషనరేట్‌ నిలిచిపోయేలా భవనాలను కట్టబోతున్నారు.. ఇక్కడినుంచే కమాండ్ కంట్రోల్‌, ట్రాఫిక్‌ మూవ్‌మెంట్‌ మానిటరింగ్‌, అత్యవసర పరిస్థితుల్లో కో ఆర్డినేషన్‌, రోజువారీ కార్యకలాపాలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.. నగరంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే నిఘా వ్యవస్థకూడా ఈ భవనంలోనే ఉంటుంది.. ఈ బిల్డింగ్‌లో బేస్‌మెంట్‌నుంచి పై అంతస్తువరకూ అధునాతన టెక్నాలజీ వినియోగించబోతున్నారు.. దాదాపు లక్ష కెమెరాలనుంచి లైవ్‌ ఫీడ్ చూసేందుకు వీడియో వాల్‌ రూపొందిస్తున్నారు.
రెండు టవర్లుగా నిర్మాణం
ఈ బహుళ అంతస్తుల భవనాన్ని వందశాతం వాస్తుతో రెండు టవర్లుగా నిర్మిస్తున్నారు.. నైరుతి దిశగా ఉండే టవర్‌లో 24 అంతస్తులుంటాయి.. ఈశాన్యం టవర్‌లో 17 అంతస్తులు నిర్మిస్తారు.. పదిహేడో ఫ్లోర్‌లో రెండు టవర్లను కలుపుతూ మెగా సోలార్‌ రూఫ్ ఉంటుంది.. అలాగే పద్దెనిమిదో అంతస్తు దగ్గర లింకు బ్రిడ్జి ఏర్పాటుచేస్తారు.. సౌత్‌ వెస్ట్‌ టవర్‌మీద హెలిపాడ్‌తోపాటు రెండు టవర్లకు సోలార్‌ ప్యానళ్లను అమరుస్తారు.. భవనాలకు ధృఢమైన అద్దాలను బిగించబోతున్నారు. మొదటి మూడు అంతస్తులు గ్రానైట్‌, గ్లాస్‌తో కట్టబోతున్నారు.
రెండు దశల్లో ఆడిటోరియం నిర్మాణం
ఇక టవర్ల కింది అంతస్తుల్లో ఆడిటోరియం, కేఫ్, మల్టిపర్పస్ హాల్‌, మీడియా సెంటర్‌, రిసెప్షన్‌కు ప్లాన్ చేస్తున్నారు.. వెయ్యిమంది కూర్చునేలా రెండు దశల్లో ఆడిటోరియం ప్రణాళిక రూపొందిస్తున్నారు.. పదకొండో అంతస్తులో సోషల్‌ మీడియా మానిటరింగ్‌... పదిహేడో అంతస్తులో మ్యూజియం, అబ్జర్వేటరీ సిస్టమ్ ఉంటాయి.. పద్దెనమిదవ ఫ్లోర్‌లో పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం నిర్మిస్తారు.. 20వ అంతస్తులో సీనియర్‌ ఆఫీసర్‌ ట్రైనింగ్‌ సెంటర్‌, 23వ ఫ్లోర్‌లో సీఎంకోసం ప్రత్యేక కార్యాలయంను డిజైన్‌ చేశారు.. అలాగే 600 కార్లు ఒకేసారి పార్క్‌ చేసేలా మల్టిలెవర్‌ పార్కింగ్‌ సిస్టమ్‌ ఉంటుంది.. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణంకోసం భవనం చుట్టూ ల్యాండ్‌స్కేప్‌ గార్డెన్‌, సుందరమైన వాటర్‌ ఫౌంటెయిన్లు ఏర్పాటుచేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడాలేనివిధంగా కనీవినీ ఎరుగని రీతిలో టవర్ల నిర్మాణంకోసం టీ ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి టవర్లు సింగపూర్‌, న్యూయార్క్ లో మాత్రమే ఉన్నాయి. వీటికంటే మరిన్ని అధునిక సౌకర్యాల కల్పించాలని చూస్తోంది. ఈ భవనాలకు సీఎం కేసీఆర్‌ 22న భూమిపూజ చేయబోతున్నారు.

 

18:48 - November 20, 2015

విశాఖ : బాక్సైట్‌పై ఒప్పందాలు రద్దు చేసేవరకూ తమ పోరాటాలు కొనసాగుతుందని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు సీహెచ్‌ నర్సింగరావు అన్నారు. బాక్సైట్‌పై ప్రభుత్వం రోజుకోమాట చెబుతోందని ఆరోపించారు. ప్రజలను మభ్యపెడుతోందని మండిపడ్డారు. ఒప్పందాలు వెంటనే రద్దు చేయాలని పేర్కొన్నారు. ఈ ఒప్పందాల రద్దు కోరుతూ రేపటి నుంచి విశాఖ బాక్సైట్‌ ప్రాంతాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

 

18:41 - November 20, 2015

చిత్తూరు : నగర మేయర్ దంపతుల హత్య కేసులో పోలీసులు మరో అడుగు ముందుకేశారు. ప్రధాన నిందితుడు చంద్రశేఖర్ అలియాస్ చింటూను పట్టిస్తే లక్ష రూపాయల రివార్డును ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ప్రకటించింది. హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన ఏపీ అదనపు డీజీపీ ఆర్‌పీ ఠాగూర్‌ వివరాలు తెలుసుకున్నారు. నిందితుల కోసం పది ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు చెప్పారు. మేయర్ దంపతులు అనురాధ, మోహన్‌లను చంపిన కేసులో ఐదుగురికంటే ఎక్కువ ఉండొచ్చన్న అనుమానాలను పోలీస్‌ బాస్‌ కొట్టిపారేయలేదు. ఈ కేసులో ఇంకా కొంత మంది ఉండొచ్చన్న అనుమానాలున్నాయని. వారెవరనేదానిపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యం ఉంటే చర్యలు తప్పవన్నారు.

18:30 - November 20, 2015

హైదరాబాద్ : ఉద్యోగులకు జారీ చేసిన హెల్త్ కార్డులు దేనికీ పనికిరాకుండా పోయాయని వాటి విషయమై ఎపి హెల్త్ మినిస్టర్‌ కామినేని శ్రీనివాసరావును కలిశామని... ఉద్యోగుల సంఘం నాయకుడు అశోక్‌బాబు అన్నారు. సంవత్సరం క్రితం జారీ అయిన ఆ కార్డులు ఎక్కడా చెల్లడం లేదని అన్నారు. సమస్య పరిష్కారం పట్ల మంత్రి సానుకూలంగా స్పందించారని అశోక్‌బాబు తెలిపారు.

 

18:24 - November 20, 2015

హైదరాబాద్ : మావోయిస్టుల చెరలో ఉన్న తన భర్త మానె రామకృష్ణను విడిపించేందుకు సహాయం చేయాలని ఆయన భార్య లక్ష్మీ పౌరహక్కుల నేతలకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో ఉన్న వరవరరావుకు ఆమె ఫోన్‌ చేశారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో కార్యాలయంలోనే ఉన్న మహిళతో మాట్లాడారు. తన భర్తకు ఎలాంటి హాని జరగకుండా విడుదల అయ్యేలా ప్రయత్నించాలని లక్ష్మీ విజ్ఞప్తి చేశారు.

 

18:14 - November 20, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయంలో నీటిపారుదల శాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల శాఖకు బడ్జెట్‌లో ఏటా 25వేల కోట్ల రూపాయల కేటాయించాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందుకోసం రూపొందించాల్సిన విధి, విధానాలపై సమావేశంలో చర్చించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఆలస్యం జరగకుండా ఉండాలని ఇప్పటికే కేసీఆర్ ఆదేశించారు. ఇందుకోసం ఆయన ఇవాళ్టి సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. 

కడప జిల్లాలో చంద్రబాబు

కడప : రైల్వే కోడూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. అరటితోట రైతులను చంద్రబాబు ఆయన పరామర్శించారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో అరటి రైతుల కోసం కోల్డ్ స్టోరేజీ నిర్మిస్తామన్నారు. 

 

నిరుద్యోగ యువత కోసమే ఉద్యోగాల భర్తీ : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : నిరుద్యోగ యువత కోసమే ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు జారీ చేస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. రైతులకు సాగునీరు అందిచాల్సిన బాధ్యత మా పై ఉంది. 2, 3 ఏళ్లలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతోపాటు కృష్ణా, గోదావరి నదులపై నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. ఇక నుంచి నీటి పారుదల శాఖ నుంచే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కాంట్రాక్టర్లతో మూడు షిఫ్టులు పని చేయించాలని సూచించారు. గడువులోగా పని పూర్తి చేసని కాంట్రాక్టర్లకు ఒక శాతం ఇంటెన్సివ్ ఇవ్వాలన్నారు. 

16:47 - November 20, 2015

కర్నూలు : జిల్లాలోని ఆదోనిలో అంగన్‌వాడీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆర్ డీఓ కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమతో భారీగా పనిచేయించుకుంటూ అతి తక్కువ జీతాలిస్తున్నారని ఆరోపించారు. ఈ ధర్నాకు సిఐటియు మద్దతు ప్రకటించింది.

16:45 - November 20, 2015

కడప : జిల్లాలోని రైల్వేకోడూరుకు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేరుకున్నారు. వరద ప్రాంతాలను పరిశీలించేందుకు హెలికాప్టర్‌లో చేరుకున్న బాబుకు మంత్రి గంటా, ఎమ్మెల్సీ చెంగలరాయులు, కలెక్టర్‌ కెవి రమణ స్వాగతం పలికారు.

నితీష్ కొత్త క్యాబినెట్‌లో 28 మందికి చోటు

పాట్నా : బీహార్‌ సీఎం నితీష్ కుమార్‌ తన కొత్త క్యాబినెట్‌లో 28 మందికి చోటు కల్పించారు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఇద్దరు కుమారులు తేజస్వీప్రసాద్, తేజస్వీప్రతాప్ యాదవ్ లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్‌జేడీ నుంచి 12 మంది, జేడీయూ నుంచి 12 మంది, కాంగ్రెస్‌ నుంచి మరో 4 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు.

వరంగల్ ఉపఎన్నిక బందోబస్తుకెళ్లిన కానిస్టేబుల్ మృతి

హన్మకొండ : వరంగల్ లోక్ సభ ఉపఎన్నిక పోలింగ్ బందోబస్తుకు వచ్చిన ఎం.రాజు అనే పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందాడు. జిల్లాలో రఘనాథపల్లిలో డ్యూటీ నిర్వహిస్తున్న అతనికి ఇవాళ ఫిట్స్ రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగానే చనిపోయాడు. 48 ఏళ్ల రాజు స్వగ్రామం మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలం చాప్తఖడీం. రాజుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారని చెప్పారు.

జమ్మూకశ్మీర్ లో గ్రైనేడ్ దాడులు

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ పంపోర్ వద్ద గ్రైనేడ్ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరు పౌరులకు కూడా గాయలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

ఖమ్మం జిల్లా చెన్నూరులో పీహెచ్ సీ ప్రారంభం

ఖమ్మం : జిల్లాలోని కల్లూరు మండలం చెన్నూరులో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్యం కేంద్రాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం అందించే దిశగా ప్రభుత్వం అనేక వైద్య సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా వైద్యాధికారులు, నేతలు పాల్గొన్నారు.

 

15:57 - November 20, 2015

పాట్నా : బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఐదో సారి సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. మంత్రులుగా లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్ లు తేజస్వీప్రసాద్, తేజస్వీప్రతాప్ యాదవ్ లు ప్రమాణస్వీకారం చేశారు. పాట్నాలో జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, రాజీవ్ ప్రతాప్ రూడీ, తొమ్మిది రాష్ట్రాల సీఎంలు, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీలు హాజరయ్యారు.

 

ఛత్తీస్ గఢ్ దంతేవాడ జిల్లాలో ఎన్ కౌంటర్..

రాయ్ పూర్ : ఛత్తీస్ గఢ్ దంతేవాడ జిల్లా జెడ్కా దగ్గర ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందింది. భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

15:38 - November 20, 2015

రాయ్ పూర్ : ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందింది. దంతేవాడ జిల్లా జెడ్కా దగ్గర పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక మహిళ మావోయిస్టు మృతి చెందింది. భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. నిన్న కిడ్నాప్ కు గురైన టీఆర్ ఎస్ నేతలు ఇంకా మావోయిస్టుల చెరలోనే ఉన్నారు. వరుసగా జరుగుతున్న ఎన్ కౌంటర్లు, నేతల కిడ్నాపులతో ఖమ్మం, ఛత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

 

బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం

పాట్నా : బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. ఐదోసారి సీఎంగా నితీశ్ ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా లాలూ ప్రసాద్ యాదవ్ కుమారులు తేజస్వీప్రసాద్, తేజస్వీప్రతాప్ యాదవ్ లు ప్రమాణ స్వీకారం చేశారు. 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్ కలకలం

శంషాబాద్ : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏకే 47 గన్ కు చెందిన బుల్లెట్ కలకలం సృష్టించింది. శంషాబాద్ విమానాశ్రయ అధికారుల వివరాల ప్రకారం.. శుక్రవారం నాడు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఓ ప్రయాణికుడు ఎయిర్ పోర్టులో అనుమానాస్పదంగా కనిపించాడు. దాంతో ఎయిర్పోర్ట్ అధికారులు ఆ ప్రయాణికుడిని, లగేజీని తనిఖీ చేసి అతడి వద్ద నుంచి ఓ బుల్లెట్ స్వాధీనం చేసుకున్నారు.వ్యక్తిని అదుపులోకి తీసుకున్న అధికారులు అనంతరం పోలీసులకు అప్పగించారు. అయితే, ప్రయాణికుడు తన వెంట బుల్లెట్ ఎందుకు తీసుకువెళ్తున్నాడు, అతనికి ఏవైనా ముఠాలతో సంబంధం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు

13:03 - November 20, 2015

హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడి అధికార నివాసం వైట్ హౌస్ పేల్చివేస్తామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బెదిరించారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్లో మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరిస్తూ ఉగ్రవాదులు మరో వీడియోను 'పారిస్ బి ఫోర్ రోమ్' పేరుతో విడుదల చేశారు. 6 నిమిషాల నిడివి గల ఈ వీడియోను ఇరాక్లో రూపొందించారు. పారిస్ లో మరిన్ని దాడులు చేయడంతో పాటు వైట్హౌస్ను బాంబులతో పేల్చివేస్తామని వీడియోలో ఓ ఉగ్రవాది బెదిరించాడు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండెను చంపేస్తామని వీడియోలో మరో ఉగ్రవాది హెచ్చరించాడు. రెండురోజుల క్రితం కూడా ఐసిస్ ఉగ్రవాదులు తమ తదుపరి లక్ష్యం న్యూయార్క్ అని పేర్కొన్నారు. ఇప్పుడు వైట్ హౌస్ ప్రస్తావన రావడంతో... భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

 

13:00 - November 20, 2015

హైదరాబాద్ : కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతోందని ఆరోపించారు ఎంపీ కవిత.. కేంద్రంలోఉన్న ఆంధ్రా ఏజెంట్లవల్లే ఇలా జరుగుతోందని మండిపడ్డారు.. గతంలో రైతులు... తాజాగా ఇళ్ల మంజూరులో ఈ తేడా స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు..

13:00 - November 20, 2015

హైదరాబాద్ : నల్లబంగారాన్ని తయారుచేస్తూ దేశాభివృద్ధిలో కీలక భాగస్వామ్యంగాఉన్న సింగరేణిలో అవినీతి జడలు విప్పింది.. బదిలీలు, మెడికల్‌ అన్‌ఫిట్లలో భారీ అక్రమాలు బయటకొస్తున్నాయి.. ఈ అక్రమాలతో సంబంధమున్న అధికారుల అంతు తేల్చేందుకు సిద్ధమైంది ఏసీబీ, విజిలెన్స్...

36 భూగర్భ గనులు, 16 ఓపెన్ కాస్టు గనుల్లో 59వేల మంది కార్మికులు...

సింగరేణిలో ఏసీబీ, విజిలెన్స్ హడావుడితో అధికారులు వణికిపోతున్నారు.. మెడికల్‌ అన్‌ఫిట్‌లో భారీగా డబ్బు చేతులు మారాయంటూ వస్తున్న ఆరోపణలు వైద్యుల్లోనూ టెన్షన్ పెంచాయి.. ఈ సంస్థ గనులు కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విస్తరించిఉన్నాయి... ఈ సంస్థకు సంబంధించిన 36 భూగర్భ గనులు...16 ఓపెన్ కాస్టు గనుల్లో దాదాపు 59వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు.. 1996 తరువాత వచ్చిన సంస్కరణల తర్వాత సింగరేణిలో భారీ మార్పులొచ్చాయి.. అప్పటివరకు ఉన్న వారసత్వ ఉద్యోగాలను సంస్థ రద్దు చేసింది. ఇది కార్మికులపై తీవ్ర ప్రభావం చూపింది.. కుటుంబసభ్యులకు తమ ఉద్యోగం ఇప్పించాలంటే మెడికల్‌ అన్‌ఫిట్‌ తప్ప వేరే దారిలేకుండా పోయింది.. ఇది వైద్యులు, బోర్డు మెంబర్లలో అవినీతికి కారణమైంది..

మెడికల్‌ అన్‌ఫిట్‌ కేసుల సంఖ్య భారీగా పెరిగింది....

వారసత్వ ఉద్యోగాల రద్దు తర్వాత మెడికల్‌ అన్‌ఫిట్‌ కేసుల సంఖ్య భారీగా పెరిగింది.. 2009 నుంచి 2014 మధ్య పెద్దసంఖ్యలో కార్మికులు అనారోగ్యంతో విధులు నిర్వహించలేకపోతున్నామంటూ సర్టిఫికేట్లు తెచ్చుకున్నారు.. ఇందుకోసం ముందుగా ఏరియా ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు చేయించుకోవాలి.... వీటి ఆధారంగా కొత్తగూడెం మెడికల్‌ బోర్డుకు దరఖాస్తు చేసుకోవాలి.. ఈ కార్మికుల ఆరోగ్య స్థితిగతులపై సమీక్ష జరిపి బోర్డు తుది నిర్ణయం తీసుకుంటుంది.. అయితే ఈ ప్రక్రియలో భారీగా డబ్బు చేతులు మారాయంటూ ఆరోపణలొచ్చాయి.. కార్మికుల వీక్‌నెస్‌ను ఆసరాగా చేసుకున్న వైద్యులు, బోర్డు మెంబర్లు కలిసి అవినీతి చేశారంటూ విమర్శలు వినిపించాయి.. ఈ అంశంపై ఏసీబీకి ఫిర్యాదులు వెళ్లాయి...

సింగరేణిలో అవినీతిపై ఏసీబీ, విజిలెన్స్ ప్రత్యేక దృష్టి...

సింగరేణిలో అవినీతిపై ఏసీబీ, విజిలెన్స్ అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టారు.. మెడికల్‌ బోర్డు అధికారుల సంగతి తేల్చేందుకు ఏసీబీ రంగంలోకి దిగింది.. ఈ విషయం తెలుసుకున్న కొత్తగూడెం ఆస్పత్రి వైద్యుడు కోటేశ్వరరావు రాత్రికి రాత్రే మాయమయ్యాడు.. అతని అకౌంట్లను తనిఖీ చేసిన ఏసీబీ అధికారులు కోట్ల రూపాయల్లో లావాదేవీలు జరిగాయని గుర్తించారు.. అయితే కోటేశ్వరరావు కనిపించకుండాపోయి ఏడాది పూర్తవుతున్నా ఇంతవరకూ అతని జాడ దొరకలేదు.. అతనితో భాగస్వామ్యం ఉన్న మరో వైద్యుడిని సింగరేణి సంస్థ సస్పెండ్‌ చేసింది.. మిగతావారిని రహస్యంగా విచారిస్తున్నారు అధికారులు..

సింగరేణి అధికారుల అవినీతిపై విజిలెన్స్ ఆరా ......

ఇలా మెడికల్‌ బోర్డు అధికారుల సంగతి ఏసీబీ చూస్తుండగా... సింగరేణి అధికారుల అవినీతిపై విజిలెన్స్ ఆరా తీస్తోంది.. డైరెక్టర్‌ స్థాయివారితోపాటు.. జీఎం, కింది అధికారులపై విజిలెన్స్ నివేదిక తయారుచేసింది.. బదిలీలు, బొగ్గు, ఇసుక కుంభకోణాల్లో కొంతమంది భారీగా డబ్బు సంపాదించారని తేల్చారు.. వీరి వివరాలు, పూర్తి సమాచారం తెలుసుకునేందుకు సిద్ధమయ్యారు.. ఇందులోభాగంగా సంస్థలో అవినీతిపరుల సమాచారం చెప్పాలంటూ బొగ్గు గనులపై పోస్టర్లు అంటించింది విజిలెన్స్.. బాధితుల పేర్లు రహస్యంగా ఉంచుతామని అందులో తెలిపారు.. ఇవి చూసిన బాధితులు ఏసీబీ కొందరిపై ఫిర్యాదుచేసినట్లు తెలుస్తోంది.. ఈ సమాచారాన్ని నిర్ధారించుకున్న విజిలెన్స్... ఆయా అధికారులపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు సమాచారం.. అటు కార్మిక సంఘాలుకూడా అవినీతి తిమింగలాన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.. ఏసీబీ, విజిలెన్స్ హడావుడితో సింగరేణి అధికారులు హడలెత్తిపోతున్నారు.. ఏక్షణంలో ఎవరి పేరు బయటకు వస్తుందోనని టెన్షన్ పడుతున్నారు.. 

12:58 - November 20, 2015

విజయవాడ : ఏపీలో సాగునీటి ప్రాజెక్టుల పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు మంత్రి దేవినేని. అన్ని ప్రాజెక్టులకు టార్గెట్ నిర్ణయించామని.. ఆ ప్రకారమే పనులు జరగాలని కాంట్రాక్టర్లకు ఆదేశించినట్టు తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్ట్ నిర్మాణంపై రైతులు ఆనందంగా ఉన్నారన్నార దేవినేని తెలిపారు.

12:51 - November 20, 2015

కృష్ణా : విజయవాడలో సీపీఎం ఆందోళనకు దిగింది.. విద్యాధరపురంలోని ఐదెకరాల ఆర్టీసీ స్థలాన్ని ప్రైవేటు సంస్థకు ఇవ్వడంపై ర్యాలీ చేపట్టింది.. ఆర్టీసీ స్థలాన్ని కాపాడాలంటూ నేతలు నిరసన చేపట్టారు.. ఈ కార్యక్రమంలో సీపీఎం నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

12:50 - November 20, 2015

విశాఖ : అసహనం పేరుతో కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆరోపించారు. తనకు నచ్చని వాళ్లను ఏదోవిధంగా ఇబ్బందులకు గురిచేయడం కాంగ్రెస్‌పార్టీకి అలవాటేనన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం ఇంకా చర్చిస్తోందన్నారు. ప్రధాని ఈ అంశాన్ని నీతి ఆయోగ్ కు అప్పగించారని అక్కడి నుంచి నివేదిక రాగానే నిర్ణయం తీసుకుంటామని వెంకయ్య నాయుడు అన్నారు. 

వైట్ హౌస్ కి ఐఎస్ హెచ్చరికలు..

హైదరాబాద్ : వైట్ హౌస్ కి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ఓ వీడియోని కూడా విడుదల చేశారు. వైట్ హౌస్ ని ఆత్మాహుతి దాడి, కారు బాంబులతో పేల్చేస్తామంటూ వీడియోలో పేర్కొన్నారు. ఫ్రాన్స్ లో మరిన్ని దాడులు చేస్తామంటూ వారు హెచ్చరికలు జారీ చేశారు.

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీఏ తనిఖీలు..

హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీఏ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదు ప్రైవేట్ స్కూల్ బస్సులను సీజ్ చేశారు. సదరు బస్సులు నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్నాయని ఆర్టీఏ ఆధికారులు వెల్లడించారు. ఈ దాడులు ఇంకా కొనసాగుతాయని అధికారులు తెలిపారు. నిబంధనలు విరుద్ధంగా జిల్లాలో వాహనాలు నడుస్తున్నట్లు ఆర్టీఏకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆర్టీఏ దాడులు నిర్వహించింది.

చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యం అవసరం : నారా బ్రాహ్మణి

హైదరాబాద్: ప్రస్తుత కాలంలో నాణ్యమైన చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యం కూడా అవసరంమని సీఎం చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రాహ్మణి అన్నారు. గ్రూప్ 1, 2లతో పాటు వివిధ పోటీ పరీక్షలకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఉచితంగా శిక్షణ అందిస్తామని టీడీపీ యువనేత నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి తెలిపారు. ఆమె శుక్రవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ... కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. మంచి అధికారులను తయారు చేయడం మా లక్ష్యం అని తెలిపారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి 800 మందికి శిక్షణ అందిస్తామని వెల్లడించారు.

11:48 - November 20, 2015

హైదరాబాద్ : చిత్తూరు జిల్లాను వరద నీరు ముంచెత్తుతోంది. నిన్న కురిసిన వర్షాలకు నలుగురు మృతి చెందారు. 3 వేల హెక్టార్లలో వరిపంటకు నష్టం వాటిల్లింది. వెయ్యి హెక్టార్లలో ఉద్యానపంటలు ధ్వంసమయ్యాయి. మొత్తం జిల్లాలో 47 చెరువులకు గండి పడింది. 2 వేల ఇళ్లు దెబ్బతిన్నాయి. తక్షణసాయంగా ప్రభుత్వం జిల్లాకు కోటి రూపాయలు విడుదల చేసింది. కళ్యాణి డ్యాం గరిష్ట మట్టానికి చేరువలో ఉంది. తిరుపతిలోని నవోదయ, రైల్వే కాలనీ, చంద్రశేఖర్‌రెడ్డి కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి. నేడు కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు

ప్రకాశం : ప్రకాశం జిల్లాలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఎలడతెరిపిలేని వర్షం కురుస్తోంది. జిల్లాలో అత్యధికంగా లింగ సముద్రంలో 85.4 మి.మీ వర్షపాతం నమోదైంది. ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి ఒంగోలు నగరం జలమయమైంది. బాపూజీ కాంప్లెక్స్, ఆర్టీసీ బస్టాండ్, భాగ్యనగర్ ప్రాంతాల్లో రోడ్ల పై నీరు ప్రవహిస్తోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు మెట్ట పంటలకు మేలు చేస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు రాళ్లపాడు జలాశయం నీటి మట్టం 16 అడుగులకు చేరింది. 17.5 అడుగులకు చేరితే ప్రమాద హెచ్చరిక జారీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

వరంగల్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం...

హైదరాబాద్: వరంగల్‌ ఉప ఎన్నిక కోసం ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. నియోజక వర్గంలోని 15 లక్షల 9 వేల 671 మంది ఓటర్లుండగా, 1778 పోలీంగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 8వేల 160 మంది సిబ్బందిని నియమించారు. ఎన్నికల సిబ్బంది సామాగ్రితో నేడే పోలింగ్‌ కేంద్రాలకు బయలు దేరనున్నారు. ఎన్నికల నిర్వహణ సక్రమంగా జరిగేందుకు 738 మంది అబ్జర్వర్లను నియమించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో 144 సెక్షన్, వెబ్ కెమెరాల ద్వారా పోలింగ్ ప్రకియ పర్యవేక్షణ చేస్తున్నారు.

ఎన్నికల విధులకు వచ్చిన కానిస్టేబుల్ ఫిట్స్ తో మృతి

వరంగల్ : రఘునాథ పల్లి పోలింగ్ కేంద్రంలో ఎన్నికల విధులకు వచ్చిన కానిస్టేబుల్ ఫిట్స్ తో మృతి చెందాడు. మృతుడు మెదక్ జిల్లాకు చెందిన రాజ్ కుమార్ గా గుర్తించారు.

కాసేపట్లో సాగునీటి ప్రాజెక్టుల పై కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టు పై కాసేపట్లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ లో నీటి సమస్యే లేకుండా చేస్తానన్న తెలంగాణ సీఎం... ఆ దిశగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.. నీటి పారుదల అధికారులతో వరుస సమీక్షలు జరుపుతూ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు.. పక్కా ప్లాన్‌తో అనుకున్న సమయానికి ప్రాజెక్టులు పూర్తిచేసేలా చూడాలని ఆదేశిస్తున్నారు..

మైలాన్ ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం...

విజయనగరం : పూసపాటిరేగలో అగ్ని ప్రమాదం సంభవించింది. మైలాన్ ఫార్మా కంపెనీలోని 8వ యూనిట్ లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షత గాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

10:48 - November 20, 2015

హైదరాబాద్ : తెలంగాణలో నీటి సమస్యే లేకుండా చేస్తానన్న తెలంగాణ సీఎం... ఆ దిశగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.. నీటి పారుదల అధికారులతో వరుస సమీక్షలు జరుపుతూ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు.. పక్కా ప్లాన్‌తో అనుకున్న సమయానికి ప్రాజెక్టులు పూర్తిచేసేలా చూడాలని ఆదేశిస్తున్నారు..

ప్రాజెక్టులను రీడిజైన్‌ చేయాలని నిర్ణయం...

సాగు, తాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిపెట్టింది టీ సర్కారు.. ప్రాజెక్టులను రీడిజైన్‌ చేయాలని ఇప్పటికే నిర్ణయించిన ప్రభుత్వం.. గోదావరి పరివాహక ప్రాంతంలో లైడార్‌ సర్వే జరిపింది.. ఈ నివేదిక ఆధారంగా పనులు వేగంగా పూర్తిచేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.

ప్రాజెక్టుల నిర్మాణంపై కేసీఆర్‌ పట్టుదలగా.....

ప్రాజెక్టుల నిర్మాణంపై కేసీఆర్‌ పట్టుదలగా ఉన్నారు.. ప్రతిసారి ఏదో ఓ కారణంతో ఈ నిర్మాణాల్లో చాలా ఆలస్యం జరుగుతోందని.. ఇకనుంచి ఆ సంస్కృతికి తిలోదకాలు ఇవ్వాలని సీఎం సూచించారు. అనుకున్న సమయానికి ప్రాజెక్టులు పూర్తిచేసేలా చేయాలని ఆదేశించారు. భూసేకరణ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందే భూముల కొనుగోలుకోసం ప్రయత్నం చేస్తున్నామని స్పష్టం చేశారు. కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులో జాప్యం జరకుండా నిబంధనలు సరళతరం చేయాలని అధికారుల్ని ఆదేశించారు కేసీఆర్. ఇక నుంచి ప్రతి బడ్జెట్ లో 25 వేల కోట్ల రూపాయాలు కేవలం ప్రాజెక్టుల కోసం కేటాయించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. దీని సాధ్యాసాధ్యాలపై ఇవాళ మరోసారి ఇరిగేషన్ శాఖ అధికారులతో సమావేశం కానున్నారు ముఖ్యమంత్రి.

10:46 - November 20, 2015

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు అందించింది. వారి జీతభత్యాలు ఏకంగా 16 శాతం పెంచాలని ప్రతిపాదిస్తూ ఏడో వేతన సంఘం కేంద్రమంత్రి అరుణ్ జైట్లీకి నివేదిక సమర్పించింది. తద్వారా 50 లక్షల మంది ఉద్యోగులతోపాటు 54 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. కొత్త వేతనం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలు కానుంది.

జస్టిస్‌ ఎ.కే మాథుర్‌ నేతృత్వంలో ఏడవ వేతన సంఘం సిఫార్సులు...

జస్టిస్‌ ఎ.కే మాథుర్‌ నేతృత్వంలోని ఏడవ వేతన సంఘం ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి తన సిఫార్సులతో కూడిన నివేదికను అందజేసింది. దీనివల్ల 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల, 54 లక్షల మంది పెన్షనర్ల బేసిక్‌ వేతనంలో దాదాపు 16శాతం పెంచాలని కమిషన్‌ సిఫార్సు చేసింది. దీనితో పాటు డీఏ కూడా పెరిగితే మొత్తంగా ఉద్యోగుల వేతనాలు 23.44 శాతం పెరగనున్నాయి. ఇంటి అద్దె అలవెన్స్‌తో మొత్తంగా అలవెన్సులను 67 శాతం పెంచాలని సంఘం సిఫార్సు చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సుపై యథాతథ స్థితిని కొనసాగించాలని భావిస్తోంది.

బేసిక్‌ వేతనం 16 శాతం వరకు పెంచినప్పటికీ......

బేసిక్‌ వేతనం 16 శాతం వరకు పెంచినప్పటికీ ప్రభుత్వ వేతన బిల్లు 25 వేల కోట్లు పెరుగుతుందని భావిస్తున్నారు. ఇది మొత్తం జిడిపిలో 0.2 శాతంగా ఉంది. వివాదాస్పదమైన కొన్ని అంశాలపై ఏడవ వేతన సంఘం కూడా ఒక అంగీకారానికి రాలేదని తెలుస్తోంది. ఆరో వేతన సంఘం సూచించిన మొత్తం కన్నా 20 శాతం తక్కువగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 16 శాతం పెంపుదల వుండాలని ఏడవ వేతన సంఘం సిఫార్సు చేసింది. ఆరో వేతన సంఘం సిఫార్సులతో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు దాదాపు 40శాతం పెరిగాయి. అప్పుడున్నట్టుగా ఆర్థిక పరిస్థితి ఇప్పుడు లేదని అందువల్లే తక్కువ మొత్తాలకే సిఫార్సులు చేసినట్టు వేతన సంఘం తెలిపింది.

కనీస వేతనం 18 వేలు ఉండేలా నివేదిక ......

ఇదిలా ఉంటే ప్రభుత్వ ఉద్యోగికి నెలకు కనీస వేతనం 18 వేలు ఉండేలా నివేదిక సమర్పించింది. ఏడవ వేతన సంఘం 9 వందల పేజీల నివేదికను జైట్లీకి అందజేసింది. ఈ సిఫార్సుల ప్రాతిపదికన వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చేలా ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల వేతనాలను, అలవెన్సులను సవరించాలని మోడీ సర్కార్‌ భావిస్తోంది.

అసహనం పేరుతో కాంగ్రెస్ విమర్శలు :వెంకయ్యనాయుడు

విశాఖ : అసహనం పేరుతో కాంగ్రెస్ విమర్శలు చేస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆరోపించారు. తనకు నచ్చని వాళ్ళను ఏదో విధంగా ఇబ్బందులకు గురి చేయడం కాంగ్రెస్ పార్టీ అలవాటేనని పేర్కొన్నారు. మోదీ ప్రధాని కావడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేక విమర్శలు చేస్తోందని ఆరోపించారు. రాజకీయ తాత్కాలిక అవసరాల కోసం కుల, మతశక్తులను ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్సేనని మండి పడ్డారు. మతం పేరుతో ఎవరు రాజకీయాలు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.

చిత్తూరు జిల్లాను ముంచెత్తిన వర్షాలు : 4గురు మృతి

హైదరాబాద్ : చిత్తూరు జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. వర్షాలకు గురువారం నలుగురు మృతి చెందారు. 3వేల హెక్టార్లలో వరి, వెయ్యి హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. జిల్లాలో 47 చెరువులకు గండి పడగా, 2వేల ఇళ్లు దెబ్బతిన్నాయి. తక్షణ సాయంగా జిల్లాకు ప్రభుత్వం రూ. కోటి విడుదల చేసింది. కళ్యాణి డ్యామ్ గరిష్ట మట్టానికి చేరుకుంది. మరో వైపు స్వర్ణ ముఖి, బహుద నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.పలు కాలనీలు వరదనీటిలోనే మగ్గుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా నేడు కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.

మావోయిస్టుల చెరలోనే టీఆర్ఎస్ నేతలు

ఖమ్మం : ఇంకా మావోయిస్టుల చెరలోనే టీఆర్ ఎస్ నేతలు ఉన్నారు. దీంతో నేతల కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. మరో వైపు సరిహద్దుల్లో పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేసి.. జిల్లా వ్యాప్తంగా వాహనాలు తనిఖీలు చేస్తున్నారు.

చింటూ కోసం 10 ప్రత్యేక బృందాలు :డీజీ ఆర్పీ ఠాకూర్

చిత్తూరు : మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య ఘటనా స్థలిని అదనపు డీజీ ఆర్ పీ ఠాకూర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు పాల్గొన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. చింటూ కోసం 10 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని...చింతూ ఆచూకీ తెలిపిన వారికి రూ. లక్ష బహుమానం అందిస్తామని డీజీ తెలిపారు.

రూ.3లక్షల విలువైన టేకు దుంగలు స్వాధీనం

కరీంనగర్ : అక్రమంగా కలప తరలిస్తున్న వ్యాన్‌ను కరీంనగర్ జిల్లా పోలీసులు అదుపులోకి పట్టుకున్నారు. మహదేవ్ పూర్ మండలం బొమ్మాపూర్ క్రాస్ రోడ్డు వద్ద వాహనంలో కలప తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసుల తనిఖీల్లో సుమారు రూ. 3 లక్షల విలువ చేసే టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి వాహనాన్ని స్టేషన్‌కు తరలించారు.

10:16 - November 20, 2015

వచ్చే ఏడాది జనవరిలో జరిగే అండర్‌-19 ప్రపంచ కప్‌కు యువభారత్‌ సమాయత్తం అవుతోంది. ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే ముక్కోణపు పోరులో బంగ్లాదేశ్‌, ఆతిథ్య జట్టు బంగ్లాదేశ్‌, భారత్‌, ఆప్ఘనిస్తాన్‌లు తలపడనున్నాయి. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు బంగ్లాతో యువ ఆటగాళ్లు సై అంటున్నారు. డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ విధానంలో జరుగుతున్న ఈ టోర్నీల్లో మొదటి, రెండు స్ధానాల్లో నిలిచిన జట్లు ఫైనల్లో ఈ నెల 29న తలపడతాయి. కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సారథ్యంలో యువ జట్టు తొలి విజయంతో బోణి కొట్టేందుకు సన్నద్దం అయ్యింది. రాజస్థాన్‌ రాయల్స్‌ తరపున ఐపిఎల్‌ మ్యాచ్‌లు ఆడిన రాహుల్‌ యువ ఆటగాళ్లను విజయంపై తీసుకెళ్లాడన్న ఆశాభావం వ్యక్తం అవుతోంది. విశాఖ యువతేజం రికీ బురు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇండియన్‌ బ్లూ తరపున అండర్‌-19 ఛాలెంజర్‌ సిరీస్‌లో 117 బంతుల్లో 142 పరుగులు చేసి జట్టును విజయ పథాన నడిపాడు. ఆంధ్రా తరపున రంజీ మ్యాచ్‌లోను ముంబయిపై సెంచరీ నమోదు చేశాడు కూడా. ఇతనితో పాటు ఢిల్లీ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌, ఝార్కండ్‌ ఆటగాడు విరాట్‌ సింగ్‌, మధ్యప్రదేశ్‌కు చెందిన పేస్‌ బౌలర్‌ ఆవేశ్‌ ఖాన్‌లు కూడా జట్టుకు అండగా నిలబడనున్నారు. బంగ్లాదేశ్‌లో జనవరి 22 నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు బంగ్లాదేశ్‌లో జరిగే ప్రపంచ కప్‌ తలపడే జట్టుకు ఈ సిరీస్‌లో రాణింపుతో తన జైత్రయాత్ర ప్రారంభించాలని మేనేజ్‌మెంట్‌ యోచిస్తోంది. 

10:15 - November 20, 2015

'భూమిక చావ్లా' చాలా కాలం తర్వాత మళ్ళీ బాలీవుడ్‌ చిత్రరంగంలో ప్రవేశిస్తోంది. గత ఏడాది లడ్డుబాబుతో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ సుందరి. ఏడాది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె మళ్లీ కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించబోతోంది. నీరజ్‌ పాండేస్‌ ఆధ్వర్యంలో రూపొందుతోన్న 'మిస్‌ ధోనీ'కి ఆమె ఎంపికైంది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌, కైరా అద్వానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో భూమిక చావ్లా కీలక పాత్ర పోషించనుంది. ఇందుకు సంబంధించిన చర్చలు పూర్తయ్యాయి. సల్మాన్‌ఖాన్‌తో 'తేరానామ్‌'తో బాలీవుడ్‌లో ఆమె నటిగా ఎంటరయింది. 2007లో యోగా ఇన్‌స్ట్రక్టర్‌ భరత్‌ ఠాకూర్‌తో వివాహం తర్వాత ఆమె నటనను తగ్గించింది. ఈ సినిమాలో ఆమె పాత్ర స్ఫూర్తివంతంగా సరికొత్త కోణంలో ఉంటుందని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. చిత్ర కథను మలుపుతిప్పేలా భూమిక పాత్ర ఉంటుందని సమాచారం. నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ అతిథి పాత్రను పోషించనున్ననట్లు టాక్.

10:14 - November 20, 2015

తెలుగులో పలు హిట్‌ గీతాలను ఆలపించిన గాయని ప్రణవి త్వరలోనే పెళ్లి కూతురు కాబోతోంది. ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌ రఘు మాస్టర్‌ని చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ ప్రేమ వ్యవహారం ఇటీవలే జరిగిన ఓ ఆడియో వేడుకలో యాంకర్‌ ఝాన్సీ బయటపెట్టింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ ఇద్దరూ ఓ ఇంటివారు కాబోతున్నట్లు టాక్. రఘు మాస్టర్‌ కూడా పలు సూపర్‌ హిట్‌ పాటలకు డ్యాన్స్‌ మాస్టర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఒకరేమో పాటలు పాడటం మరొకరేమో ఆ పాటలకు నృత్యాలను సమకూర్చడంతో ఇద్దరూ ఒకే రంగానికి చెందినవారు కావడం విశేషం.

 

10:13 - November 20, 2015

నయనతార ప్రధాన పాత్రలో, 'పిజ్జా' హీరో విజరు సేతుపతి ప్రత్యేక పాత్రలో విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో ధనుష్‌ నిర్మించిన 'నానుమ్‌ రౌడీదాన్‌' చిత్రం విజయదశమికి విడుదలై తమిళంలో విజయం సాధించింది. ఈ చిత్రం తెలుగు హక్కులను కోనేరు కల్పన దక్కించుకున్నారు. కోనేరు చిత్ర, స్నేహ మూవీస్‌ పతాకాలపై 'నేనూ రౌడీనే' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు నిర్మాతలు కోనేరు కల్పన, రమేష్‌ అన్నమరెడ్డి.ఇటీవల పిశాచి, నాలో ఒకడు వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన కోనేరు కల్పన తెలుగులో సూపర్‌హిట్‌ అయిన స్నేహం కోసం, అన్నమయ్య, మనసారా చిత్రాలను మలయాళంలోకి, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, గోలీమార్‌, టక్కరిదొంగ, అల్లరి బుల్లోడు, అస్త్రం చిత్రాలను తమిళంలోకి అనువదించారు. తాజాగా తమిళ్‌లో సూపర్‌ డూపర్‌హిట్‌ అయిన 'నానుమ్‌ రౌడీదాన్‌' చిత్రాన్ని స్నేహ మూవీస్‌తో కలిసి 'నేనూ రౌడీనే' పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్‌ పనులు తుది దశలో వున్నాయి. నయనతార ప్రధాన పాత్రలో నటించడం, హీరో ధనుష్‌ నిర్మించడం, కొలవరి ఫేమ్‌ అనిరుధ్‌ సంగీతాన్ని అందించారు. అనిరుధ్‌ చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించారని, పాటలన్నీ సూపర్‌హిట్‌ అయ్యాయని చిత్ర నిర్మాతలు పేర్కొంటున్నారు. తెలుగులో కూడా ఆడియో పెద్ద హిట్‌ అవుతుందన్న నమ్మకం వుందన్నారు. నయనతార అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్‌ ఈ చిత్రానికి పెద్ద హైలైట్‌గా నిలుస్తుందని, త్వరలోనే తెలుగులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నయనతార, విజయ్ సేతుపతి, పార్తీబన్‌, రాధిక, ఆర్‌.జె.బాలాజీ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

10:13 - November 20, 2015

హైదరాబాద్ : కడప జిల్లాలో ఓ వింత సంఘటన జరిగింది. భారీ వర్షాలకు జిల్లాలోని చింతకొమ్మదిన్నె మండలంలో పలు చోట్ల భూమి కృంగిపోయింది. వృత్తాకారంలో భూమి 20నుంచి 30 అడుగుల లోతుకు కృంగిపోవడంతో..జనం భయాందోళనలకు గురయ్యారు. ఈ వింత సంఘటనను చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

ఏకంగా...20 చోట్ల ఇలాగే ...

చూస్తుండగానే భూమి ఇలా లోపలికి కృంగిపోవడం చూసిన జనం ఆశ్చర్యపోయారు. అంతేకాదు ఆందోళన కూడా చెందారు. కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలోని నాగిరెడ్డి పల్లె బుగ్గమల్లేశ్వర ఆలయం సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రకృతి వైపరీత్యం వల్ల కళ్లముందే ఇలా భారీ గోతులు పడుతున్నాయి. భూమి లోపలికి కృంగిపోతున్నప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు కూడా వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. ఈ గోతులు వృత్తాకారంలో ఉన్నట్లుండి 25 అడుగుల వెడల్పు,..25 అడుగుల లోతులో ఏర్పడడాన్ని గ్రామస్తులు గమనించారు.

.వాగులు, వంకల్లో కూడా.......

అంతేకాదు..వాగులు, వంకల్లో కూడా భూమి లోపలికి కృంగిపోవటంతో పలు చోట్ల భారీ సుడిగుండాలు ఏర్పడ్డాయి. పలు చోట్ల నీరు సుడులు తిరుగుతూ పారుతోంది. వంకల్లో దాదాపు 30 అడుగుల లోతున భూమి దిగబడిపోయినట్లు ఇక్కడి గ్రామస్తులు భావిస్తున్నారు. ఈ వింత సంఘటనను చూసేందుకు నాగిరెడ్డి పల్లె ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అయితే తెలియక ఎవరైనా వంకల్లో దిగితే ఘోర ప్రమాదం జరుగుతుందేమోనని ఈ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉండటతో పోలీసు, రెవెన్యూ అధికారులు వచ్చి పరిశీలించారు. రెండు రోజుల క్రితం నాయనోరి పల్లె గ్రామంలో కూడా ఇలాగే జరిగింది. గ్రామంలోనే భారీగా భూమి కృంగిపోవటంతో నీటి ట్యాంక్, పాఠశాల ప్రహరీ గోడ, చెట్లు భూమిలోనికి పడిపోయాయి. దీంతో నాయనోరి పల్లె ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ఇదే పరిస్థితి గ్రామంలో కూడా ఏర్పడుతుందేమో అన్న భయానికి ప్రజలు గురౌతున్నారు.

అధికారులు స్పందించాలి...

అధికారులు వెంటనే స్పందించి ఇలా ఎందుకు జరిగిందో కారణాలను చెప్పాలని గ్రామస్తులు కోరుతున్నారు. అంతేకాక ఏ ప్రాంతాల్లో ఇలా వైపరీత్యం జరిగే అవకాశం ఉందో ముందుగా గుర్తించి ఘోర ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

10:13 - November 20, 2015

న్యూయార్క్‌: ప్రతి యేడాది టైమ్‌ మ్యాగజైన్‌ అందజేసే 'పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌' పురస్కారానికి పోటీ పడుతున్న 50 మంది ప్రపంచ నాయకులు, పారిశ్రామిక వేత్తల పేర్లలో భారత ప్రధాని నరేంద్ర మోడీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేష్‌ అంబానీ, భారత సంతతికి చెందిన గూగుల్‌ సిఇఓ సుందర్‌ పిచారులు పోటీలో ఉన్నారు. టైమ్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ -2015ను డిసెంబరులో ప్రకటించనున్న విషయం తెలిసిందే. 'మంచి కారణాల రీత్యా లేదా చెడుగా అయినా ఈ ఏడాదిలో వార్తల్లో వున్న వ్యక్తిని ఈ పురస్కారం వరిస్తుంది' అని టైమ్‌ మ్యాగజైన్‌ పేర్కొంది. 'భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మోడీ ప్రోత్సహించారు, ప్రజాస్వామ్యాన్ని ఆధునీకరించేందుకు ప్రయత్ని స్తున్నారు. అయితే, ఆయన మితవాద తీవ్రవాదంపై వివాదాన్ని కూడా ఎదుర్కొన్నారు' అని 'టైమ్‌' తెలిపింది.

10:12 - November 20, 2015

బాలకృష్ణ, అంజలి, సోనాల్‌ చౌహాన్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న 'డిక్టేటర్' చిత్ర ఆడియోను ఏపీ రాజధాని అమరావతిలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు కో ప్రొడ్యూసర్‌, చిత్ర దర్శకుడు శ్రీవాస్‌ పేర్కొన్నారు. శ్రీవాస్‌ దర్శకత్వంలో ఈరోస్‌ ఇంటర్నేషనల్‌, వేదాశ్వ క్రియేషన్స్‌ సంయుక్తంగా 'డిక్టేటర్' చిత్రం రూపొందుతోంది. గురువారం శ్రీవాస్ మీడియాతో మాట్లాడారు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని పలువురి ప్రముఖుల ఆధ్వర్యంలో డిసెంబర్‌ 20న అమరావతిలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎపి రాజధానిలో జరుగుతున్న తొలి సినిమా కార్యక్రమం ఇదే కావడం విశేషమని, ఈ కార్యక్రమానికి నందమూరి అభిమా నులు భారీ సంఖ్యలో తరలి రానున్నట్లు చెప్పారు. నందమూరి బాలకృష్ణగారి 99వ చిత్రం 'డిక్టేటర్‌' గురించి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలుసని, సినిమా షూటింగ్‌ ఫైనల్‌ స్టేజ్‌లో ఉందన్నారు. సినిమా ప్రారంభం నుండి ఎప్పుడెప్పుడు బాలయ్యను తెరపై చూద్దామా అని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు, అభిమానులు బాలకృష్ణను ఎలా చూడాలనుకుంటున్నారో అలా ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు బాలకృష్ణగారిని చూడని స్టయిలిష్‌ యాంగిల్‌లో కనపడతారని, యాక్షన్‌, ఎమోషనల్‌ డ్రామా వంటి ఎలిమెంట్స్‌ ఉన్న సరికొత్త చిత్రమిదన్నారు. శ్యామ్‌ కె.నాయుడు సినిమాటోగ్రఫీ, థమన్‌ మ్యూజిక్‌ ఎక్సలెంట్‌గా ఉందని, సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు శ్రీవాస్ తెలిపారు.

 

10:07 - November 20, 2015

హైదరాబాద్ : గ్రహాంతర జీవుల మనుగడపై మరోమారు చర్చ సాగుతోంది. నాసాకు చెందిన ఆస్ట్రోనాట్‌.. స్కాట్‌ కెల్లీ.. అంతరిక్షం నుంచి పంపిన ఫోటో తాజా చర్చకు కారణమైంది.

స్కాట్‌ కెల్లీ పంపిన ఫోటోలో..

స్కాట్‌ కెల్లీ పంపిన ఫోటోలో.. ఏలియన్స్‌ ఉనికి స్పష్టంగా కనిపిస్తోందని.. గ్రహాంతర జీవులున్నాయని విశ్వసించే వారు చెబుతున్నారు. ఫోటో పైభాగంలో కుడివైపున కనిపించే ఆకారం ఏలియెన్‌దే అన్నది వీరి వాదన.

నాసా అంతరిక్ష కేంద్రంలో 233 రోజులుగా ......

నాసా అంతరిక్ష కేంద్రంలో 233 రోజులుగా గడుపుతున్న స్కాట్‌ కెల్లీ.. తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా ఈ ఫోటోను.. దాంతో పాటే.. భారత దక్షిణ భాగపు ఎగువన ఏదో నక్షత్రం కనిపించింది అన్న వ్యాఖ్యనూ ట్వీట్‌ చేశారు. ఇదే ఇప్పుడు ఏలియన్స్‌ ఉనికిపై సరికొత్త చర్చకు కారణమైంది. అయితే.. నాసా వర్గాలు ఈ ప్రచారంపై పెదవి విప్పడం లేదు. 

ఆకాశ్ బాయ్స్ హాస్టల్ లో డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్ : ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ఆకాశ్ బాయ్స్ హాస్టల్ లో డిగ్రీ విద్యార్థి తమాజ్ దేవగన్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

09:40 - November 20, 2015

తూర్పుగోదావరి : దండేపల్లి మండలం తాళ్లురు వద్ద శుక్రవారం ఉదయం టైరు పంక్చర్ కావడంతో అదుపు తప్పిన కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులోని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

09:37 - November 20, 2015

చిత్తూరు : బైరెడ్డిపల్లి మండలం మిట్టకురపపల్లి దగ్గర ఆర్టీసీబస్సు- కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు బస్సు కింద ఇరుక్కోవడంతో నుజ్జునుజ్జైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళ లు, డ్రైవర్, ఓ బాలిక అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు వేణు, కమలమ్మ, లక్ష్మమ్మ, రమణమ్మ, రేణుక లు మిట్టకురవపల్లి వాసులుగా పోలీసులు తెలిపారు. బాధితులంతా బైరెడ్డి పల్లిలోని ఓ వివాహానికి వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

కృష్ణా కరకట్ట వద్ద ఉద్రిక్తత...

గుంటూరు : కృష్ణా కరకట్ట ఒడ్డున శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. కరకట్ట వద్ద ఉన్నమత్య్సకారుల ఇళ్లను తొలగించేందుకు అధికారుల ఏర్పాట్లు చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. 50 ఏళ్లుగా నివాసముంటున్న తమకు ప్రత్యామ్నాయం చూపకుండా మత్య్సకారుల ఇళ్లను తొలగించడం అన్యాయమని స్థానికులు ఆందోళన చేస్తున్నారు

ఆర్డీసీ బస్సు - కారు ఢీ : ఐదుగురి మృతి

చిత్తూరు : బైరెడ్డిపల్లి మండలం మిట్టకురపపల్లి దగ్గర ఆర్టీసీబస్సు- కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మృతులంతా మిట్టకురవపల్లి వాసులుగా పోలీసులు గుర్తించారు. కుప్పంలోని తీర్ధం దగ్గర పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

08:37 - November 20, 2015

హైదరాబాద్ : హింస వల్ల సమస్యలు పరిష్కారం కావని 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో దహన్స్ ఇండియా ఎడిటర్, ప్రొ.కె.నాగేశ్వర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు టిఆర్ ఎస్ నేతలను మావోలు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ కు గల కారణాలు ఏమిటి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మావోయిస్టుల ప్రభావం పెరుగుతుందన్న వాదనకు బలం చేకూరుతోందా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా మౌలికమైన మార్పు రాలేదా? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సర్వ రోగ నివారణ అని ప్రజలు విశ్వసించారు. కానీ ఆచరణ లో అలా జరగలేదు... దీంతో ప్రజల్లో నిరాశ..నిస్పృహలు పెరిగాయి. టీ.సర్కార్ అటవీ హక్కుల చట్టం అమలు చేయకపోగా... అధికారులకు తుపాకులు ఇచ్చారు. శృతి,సారగ్ ఎన్ కౌంటర్ పై విచారణ ఎందుకు జరపడం లేదు? తెలంగాణ వచ్చినా రాజ్యహింస నుండి విముక్తి కలగడం లేదు. పౌర హక్కులను అణచివేస్తున్నారు. ప్రజాస్వామిక తెలంగాణగా, ప్రజా తెలంగాణగా ఉండేలా చూడాల్సిన అవసరం లేదా? రాజ్యాంగాన్ని అమలు చేస్తే దేశంలో మావోయిస్టులు ఉంటారా? పకృతి విప్తతుల నుండి పూర్తిగా మనల్ని మనం కాపాడుకునే సామర్థ్యం లేదు. కాని నివారించుకోవచ్చు. విపత్తులను ముందుగానే గుర్తించే నైపుణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నివారణ, నియంత్ర, సంసిద్ధత, స్పందన, సహాయ పునరావాసం, పునర్ నిర్మాణం అనే అంశాలను సమర్థవంతంగా అమలు చేయగలితే విప్తత్తుల నుండి కాపాడుకోవచ్చు. ఈ అంశాలపై నాగేశ్వర్ వివరణాత్మకమైన విశ్లేషణ చేశారు. పూర్తి వివరాలను వినాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్థి బలి

హైదరాబాద్ : ర్యాగింగ్ భూతానికి మరో బీటెక్ విద్యార్థి బయల్యాడు. ఈ ఘటన కూకట్ పల్లి పీఎస్ పరిధిలో గత రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం నిజాం పేట రోడ్డులోని అల్లాపూర్ సొసైటీ నివాసం ఉండే నరసింహాలాల్ బాబు కుమారుడు కృష్ణ చైతన్య చెన్నైలోని సత్యభామ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. రెండు రోజుల క్రితం నగరంలోని తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. గురువారం రాత్రి ఇంట్లో తన బెడ్ రూం తలుపులు మూసుకుని ఎంతకూ తెరవలేదు. తల్లిదండ్రులకు అనుమానం వచ్చి గది తలుపులు తెరిచేలోగా అక్కడే ఉన్న సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

08:00 - November 20, 2015

హైదరాబాద్ : ఖమ్మం జిల్లా భద్రాచలంలో మావోయిస్టులు టిఆర్ ఎస్ నేతలను కిడ్నాప్ చేశారు. ఎన్ కౌంటర్ల కు ప్రతిగా కిడ్నాప్ చేయడం సమంజసమేనా? మావోయిస్టులు చేసిన చర్యలు పునరాలోచించుకోవాలి అని న్యూస్ మార్నింగ్ లో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు. కిడ్నాప్ లు పరిష్కారం కాదు. ఎన్ కౌంటర్ల పై టిఆర్ ఎస్ పద్ధతి మార్చుకోక పోవడం వల్లే ఇలాంటి ఘటనలు పురావృతం అవుతున్నాయా? శృతి, సాగర్ ఎన్ కౌంటర్ పై జ్యుడీషియరీ ఎంక్వయిరీ ఎందుకు చేయించడం లేదు? అలాగే ఏపీలో బాక్సైట్ తవ్వకాలపై జీఓలు రద్దు చేయాలి. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ విధానాల నేపథ్యంలో మావోయిస్టులు కిడ్నాపులకు పాల్పడుతున్నారా? ప్రజా పోరాటాలను పోలీసుల ద్వారా అణచడం సాధ్యం అవుతుందా? తెలంగాణ లో ప్రజాస్వామ్య వాతావరణం ఏర్పాటుచేయాల్సిన అవసరం లేదా? తెలంగాణ రాష్ట్రానికి ఐపీఎస్ లు, ఐఏఎస్ అధికారులను కేటాయించడంలోకేంద్రం చొరవ చూపడం లేదా? మరోవైపు నేడు సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ సీఎం కేసీఆర్ విధివిధానాలను ఖరారు చేయబోతున్నారు. ఈ అంశం పై అఖిల పక్షసమావేశం ఎందుకు వేయడం లేదు? తెలంగాణ లో ప్రాజెక్టుల రీ డిజైన్ అవసరమా? టిఆర్ ఎస్ ఎదురుదాడికి ప్రయత్నిస్తోందా? ఇత్యాది అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సీపీఎం నేత బి.వెంకట్, టి.పిసిసి అధికార ప్రతినిధి మహేష్ బాబు, టిఆర్ ఎస్ తాడూరి శ్రీనివాస్, టిడిపి నేత పట్టాభిరామ్ పాల్గొన్నారు. వీరి మధ్య ఆసక్తి కరమైన చర్చ జరిగింది. ఆ చర్చను మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ సాధారనంగా ఉంది. 5 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి వున్నారు. శ్రీవారి సర్వ దర్వనానికి 4 గంటలు, కాలినడక భక్తులకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశదర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.

చింటూ లొంగిపోయాడు !?

హైదరాబాద్ :చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త మోహన్ ల దారుణ హత్య ఘటనలో ప్రధాన నిందితుడుగా అనుమానిస్తున్న చింటూ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది. దాడి జరిగిన మరుక్షణమే ముగ్గురు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. చిత్తూరు జిల్లా గుడిపాల పోలీస్ స్టేషన్ లో అతడు లొంగిపోయినట్లు తొలుత వార్తలు వచ్చినా, పుత్తూరులోని పోలీస్ స్టేషన్ కు తన న్యాయవాదితో కలిసి వచ్చిన చింటూ పోలీసుల ఎదుట లొంగిపోయాడని విశ్వసనీయ సమాచారం. దీంతో రాయలసీమ రేంజ్ అదనపు డీజీ ఆర్పీ ఠాకూర్ హుటాహుటిన చిత్తూరు తరలివెళ్లారని వార్తలు వినిపిస్తున్నాయి.

27న కోర్టు విధుల బహిష్కరణ

హైదరాబాద్ : న్యాయవాదుల సంక్షేమానికి రూ. 500కోట్లు కేటాయించాలని 27న రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో విధులు బహిష్కరించనున్నట్లు న్యాయవాదుల సంఘాల సమాఖ్య ప్రకటిం చింది. ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు ఫెడరేషన అధ్యక్షుడు బి.కొండారెడ్డి తెలిపారు. గురువారం ఆయన విలేకరు లతో మాట్లాడుతూ న్యాయవాదులకు హెల్త్‌కార్డులు, ఇళ్ల స్థలాలు, జూనియర్లకు స్టైఫండ్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులందరూ ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాల న్నారు.

నేడు బీహార్ సీఎంగా నితీశ్ ప్రమాణ స్వీకారం...

హైదరాబాద్ : బీహార్ సీఎంగా నితీశ్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీల అతిరథ మహారధులంతా ఈ వేడుకకు హాజరు కానుండటంతో భావి రాజకీయ సమీకరణాలకు నితీశ్ ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమం వేదిక కానున్నదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆయన ఐదోసారి సీఎంగా ప్రమాణం చేయనున్నారు.

07:04 - November 20, 2015

హైదరాబాద్ : ర్యాగింగ్ భూతానికి మరో బీటెక్ విద్యార్థి బయల్యాడు. ఈ ఘటన కూకట్ పల్లి పీఎస్ పరిధిలో గత రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం నిజాం పేట రోడ్డులోని అల్లాపూర్ సొసైటీ నివాసం ఉండే నరసింహాలాల్ బాబు కుమారుడు కృష్ణ చైతన్య చెన్నైలోని సత్యభామ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. రెండు రోజుల క్రితం నగరంలోని తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. గురువారం రాత్రి ఇంట్లో తన బెడ్ రూం తలుపులు మూసుకుని ఎంతకూ తెరవలేదు. తల్లిదండ్రులకు అనుమానం వచ్చి గది తలుపులు తెరిచేలోగా అక్కడే ఉన్న సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఆత్మహత్యకు సీనియర్ విద్యార్థి వేధింపులే కారణమని సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడినట్లు ఎస్ఐ జానయ్య తెలిపారు.


 

06:47 - November 20, 2015

హైదరాబాద్ : పుట్టిన ప్రతి శిశువుకీ జీవించే హక్కు వుంది. కానీ, తమ పేగులు చించుకు పుట్టిన బిడ్డకు కనీసం కప్పు పాలు కూడా పట్టలేని అనేకమంది తల్లులది. ఇలాంటివారికి అంగన్‌వాడే కేంద్రాలే పెద్ద దిక్కు. అయితే, భవనాలు, వసతులు సమకూర్చకపోవడం, నెలనెల జీతాలు ఇవ్వకపోవడం, పప్పులు, నూనెలు సక్రమంగా సరఫరా చేయకపోవడం లాంటి సమస్యలు అంగన్‌వాడీలను వేధిస్తున్నాయి.

25శాతం పిల్లల్లో తీవ్ర పోషకాహారలోపం..........

పసిపిల్లల కేరింతలు మనల్ని పరవశింపచేస్తాయి. వారి బోసినవ్వులు మనల్ని ఆహ్లాదపరుస్తాయి. పసిమొగ్గల పాదాలు మన గుండెల మీద సవ్వడి చేస్తున్నప్పుడు మనం అనుభవించే ఆనందమే వేరు. పసిపిల్లలు అంబాడే ఇంటికి వుండే కళే వేరు. అవును. పసిపిల్లలు మన ఆనందపు హరివిల్లులు.

పొత్తిళ్లలోని తన బిడ్డ క్షేమంగా ఎదగాలనీ.....

పొత్తిళ్లలోని తన బిడ్డ క్షేమంగా ఎదగాలనీ, ఆరోగ్యంగా పెరగాలనీ ప్రతి తల్లీ కోరుకుంటుంది. సాయంత్రంపూట ఆకాశంలో చందమామను చూపిస్తూ, లాలిపాటలు పాడుతూ, గోరుముద్దలు తినిపించాలని ప్రతి అమ్మా ఆరాటపడుతుంది. బుజ్జి పొట్ట త్రేనిస్తే ప్రతి తల్లీ సంతోషంగా నిద్రపోతుంది. చంటిబిడ్డ ఏడిస్తే ఆకలికి పేగులు కాలిపోతాయోమోనని ప్రతి తల్లీ ఆందోళన చెందుతుంది.

పసిపిల్లలకు కడుపు నిండా పాలు పట్టలేని......

కానీ, పసిపిల్లలకు కడుపు నిండా పాలు పట్టలేని , ఒక్కపూట కూడా పుష్టిగా బువ్వ పెట్టలేని తల్లులెందరో. ఆకలితో బిడ్డ గుక్క పట్టి ఏడుస్తున్నా, తన బిడ్డ పేగులు తన కళ్లెదుటే ఆకలితో నకనకలాడుతున్నా కనుగుడ్ల నిండా కన్నీళ్లు నింపుకోవడం తప్ప మరేమీ చేయలేని అభాగ్యపు అమ్మలెందరో. మన దేశంలో పుట్టిన ప్రతి నలుగురు బిడ్డల్లో ఒకరు ఆకలితో అలమటిస్తున్నారు. పుట్టిన ప్రతి వెయ్యిమందిలో 44 మంది పుట్టిన మరుక్షణమే కళ్లు మూస్తున్నారు. కొన్ని లక్షల మంది చిన్న పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.

తల్లులకీ, పసిమొగ్గలకీ కాస్తంత ఊరటనిస్తున్నవే అంగన్‌వాడీ కేంద్రాలు..

ఇలాంటి తల్లులకీ, పసిమొగ్గలకీ కాస్తంత ఊరటనిస్తున్నవే అంగన్‌వాడీ కేంద్రాలు. అవి లేకపోతే ఈ దేశంలో ఆరు కోట్లమంది చంటిపిల్లలు, కోటి మందికిపైగా బాలింతలు ఏమైపోయేవారోనన్న ఊహే మనల్ని మూగవేదనలోకి తీసుకెళ్తుంది.

1975లో ఏర్పడ్డ అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు...

1975లో ఏర్పడ్డ అంగన్‌వాడీ కేంద్రాలు ఆరుకోట్ల మంది పిల్లలకీ, కోటి మంది గర్భిణీలకీ, బాలింతలకీ చక్కటి సేవలు అందించాయంటూ కేంద్ర ప్రభుత్వమే సంతోషం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. మన దేశంలో 13 లక్షల 40 వేల అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటి ద్వారా పది కోట్ల మందికి పైగా లబ్ధి పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు ఆరు లక్షల మంది ఏడాదిలోపు పిల్లలు, మరో నాలుగు లక్షల మంది గర్భిణీలు బాలింతలు అంగన్‌వాడీ సేవలు పొందుతున్నారు. దేశవ్యాప్తంగా 18 లక్షల మందికి పైగా అంగన్‌వాడీ వర్కర్లు సేవలందిస్తున్నారు. వీరంతా రేపటి తరాన్ని కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసిదగ్గవి. గర్భిణీలకు, బాలింతలకు, ఆరేళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం అందించడం, పుట్టిన శిశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేయించడం, బడిఈడు రాని చిన్నారుల ఆలనాపాలనా చూసుకోవడం, వైద్య ఆరోగ్య స్పృహను పెంపొందించడం, కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు ప్రచారం చేయడం, కుటుంబ నియంత్రణ ఆవశ్యకతను బోధించడం లాంటి అత్యంత ముఖ్య బాధ్యతలు మోస్తున్నదీ అంగన్‌వాడీ కేంద్రాలే. వీరు సాగించిన కృషి ఫలితంగా మనదేశంలో శిశు మరణాలు, బాలింత మరణాలు గణనీయంగా తగ్గాయి. అయితే, ఆరేళ్లలోపు పిల్లల్లో యాభై శాతం మంది మాత్రమే ఐసీడీఎస్‌ సేవలు పొందుతున్నారు. వీటిని మరింత విస్తరించాల్సి వుంది. ఈ కర్తవ్యాన్ని పధ్నాలుగేళ్ల క్రితమే సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేసింది.

తీవ్రంగా బాధిస్తున్న శిశుమరణాలు....

ఇప్పటికీ మనల్ని తీవ్రంగా బాధిస్తున్న శిశుమరణాలను పూర్తిగా అదుపులోకి తీసుకురావాలన్నా, పసిపిల్లల్లో పోషకాహారం సమస్యను అధిగమించాలన్నా అంగన్‌వాడీ కేంద్రాల సేవలను మరింత విస్తరించాల్సి వుంటుంది. పసిపిల్లల పాలడబ్బాలకు చిల్లులు పెడుతున్న అవినీతిని అరికట్టాల్సి వుంటుంది. గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ, మురికివాడల్లోనూ అత్యంత ఓర్పుతో సేవలు అందిస్తున్న అంగన్‌వాడీ వర్కర్ల సమస్యల విషయంలో ప్రభుత్వాలు అత్యంత మానవీయంగా స్పందించాల్సిన సందర్భమిది. కానీ చాలా కేంద్రాల్లో అంగన్‌వాడీ వర్కర్లకు అయిదారు నెలలకొకసారి జీతాలిస్తున్న దుస్థితి. ప్రతి నెలా సక్రమంగా జీతాలివ్వకపోతే వారి కుటుంబాలు నడిచేదెలా? వారు బతికేదెలా? అన్న స్పృహే లోపిస్తోంది.

ప్రయివేట్, కార్పొరేట్‌ సంస్థల చేతుల్లో పెట్టేందుకు...

40 ఏళ్ల కాలంలో ఆరు కోట్ల మంది పసిపిల్లల మోముల్లో చిరునవ్వులు పూయించిన అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణను ప్రయివేట్, కార్పొరేట్‌ సంస్థల చేతుల్లో పెట్టేందుకు ప్రయత్నిస్తుండడమే ఆందోళన కలిగిస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రత్యేక విభాగంగా గుర్తించాలని యూనిసెఫ్‌ సూచించింది. కాగ్‌ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇలాంటి మంచి సూచనలను పెడచెవిన పెట్టి, కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించాలని చూస్తుండడమే తీవ్ర అభ్యంతరకరం. బడ్జెట్‌లో ఐసీడీఎస్‌ పథకానికి కేటాయింపులు తగ్గుతుండడం మరో ఆందోళనకర పరిణామం. 2014 -15 బడ్జెట్‌లో 18, 135 కోట్లు కేటాయించిన కేంద్రం 2015-16 బడ్జెట్‌లో సగం కంటే ఎక్కువ తగ్గించింది. ప్రభుత్వమే ఇలా వ్యవహరిస్తే ఆకలితో అలమటిస్తున్న చిన్నారులకు ఇక దిక్కెవరు? అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణలో స్థానిక రాజకీయ నేతల జోక్యాన్ని నివారించి, దాన్నొక ప్రభుత్వ విభాగంగా అభివృద్ధి చేయాలన్న డిమాండ్స్‌ను ఇకనైనా ప్రభుత్వం పరిశీలించడం ఉత్తమం. 

06:42 - November 20, 2015

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీ వర్కర్లు పోరుబాట పట్టారు. వీరి ఆందోళనకు కారణం ఏమిటి? ప్రస్తుతం అంగన్‌వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? ఐసీడీఎస్‌ కు వస్తున్న ముప్పేమిటి? అంగన్‌వాడీలకు జీతాలు పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయం ఎంతవరకు అమలవుతోంది? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను చర్చించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

06:38 - November 20, 2015

హైదరాబాద్ : కల్తీ కల్లు కలకలం కొనసాగుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో కొంత గ్యాప్‌ వచ్చినా మళ్లీ మరణాలు ప్రారంభమయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో ఐదు రోజులుగా కల్తీ కల్లు మరణ మృదంగం మోగిస్తోంది. కల్తీ కల్లుకు అలవాటుపడి.. ఇప్పుడు అది దొరక్క తట్టుకోలేనివారు ఇప్పటివరకు ఏడుగురు మృతిచెందారు.

మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలో .....

మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలో కల్తీ కల్లు సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు. కల్తీ కల్లు దొరక్క పదుల సంఖ్యలో ప్రాణాలను కోల్పోయారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం, ఎక్కడక్కడ వైద్య శిబిరాలను ఏర్పాటుచేయడంతో కొంతకాలానికి పరిస్థితి అదుపులోకి వచ్చింది. కాని మళ్లీ అదే సీన్‌ రిపీట్‌ అవుతోంది. రంగారెడ్డి జిల్లాలో కల్లీ కల్లుకు బానిసలై.. అది అందుబాటులో లేక ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందారు.

తాండూర్‌ పట్టణంలో గురువారం ముగ్గురు మృతి......

కల్తీకల్లు దొరక్క తాండూర్‌ పట్టణంలో గురువారం ముగ్గురు మృతిచెందారు. పట్టణంలోని మాణిక్‌నగర్‌, హరిజన వార్డ్, ఇందిరానగర్‌లో ఈ మరణాలు నమోదయ్యాయి. మాణిక్య నగర్‌కు చెందిన చంద్రప్ప కల్తీ కల్లు కోసం ప్రయత్నించాడు. ఎక్కడా దొరకకపోవడంతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అలా పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ట్రాక్టర్‌ను ఢీకొని చనిపోయాడు. హరిజనవార్డు, పాత తాండూర్‌లోనూ ఇద్దరు మహిళలు కల్లీ కల్లు దొరక్క మృతిచెందారు.

రంగారెడ్డి జిల్లాలో ఏడుకి చేరిన కల్తీకల్లు మరణాల సంఖ్య....

రంగారెడ్డి జిల్లాలో కల్తీకల్లు మరణాల సంఖ్య ఏడుకి చేరింది. కల్తీకల్లు బాధితులు దాదాపు 175 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మధ్య కాలంలో కల్తీకల్లు దుకాణాలపై ఎక్సైజ్‌ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే కల్తీ కల్లు లభించడం లేదు. ఐతే ఎప్పటినుంచో కల్తీకల్లును సేవించి..అకస్మాత్తుగా దొరకపోవడంతో దానికి అలవాటు పడిన వారికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కల్లు కోసం పిచ్చిపిచ్చిగా అరుస్తున్నారు. మూర్చపోతున్నారు. చివరికి చనిపోతున్నారు. జిల్లాలో కల్తీకల్లు మరణాల సంఖ్య పెరుగుతుండడంతో జిల్లా వైద్య శాఖ అప్రమత్తమయ్యింది. గ్రామాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటుచేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 

06:35 - November 20, 2015

హైదరాబాద్ : మొన్నటి వరకు ఉల్లి కన్నీళ్లు పెట్టించింది. ఇక నిన్నటి వరకు కందిపప్పు ధరలు సామాన్యులను బెంబేలిత్తించాయి. తాజాగా టమాట ధరలు ఆకాశన్నంటడంతో సామాన్యులు టమాట పేరు వింటేనే భయపడిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా నిత్యావసరాలు, కూరగాయల ధరలు భగ భగ మండిపోతున్నాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు నాలుగు మెతుకులు తినే పరిస్థితి కన్పించడంలేదు. అయితే పెరిగిన ఈ ధరల ప్రభావం సామాన్యులను ఎలా ముప్పుతిప్పలు పెడుతుందో తెలుసుకునేందుకు టెన్‌టీవీ ప్రయత్నం చేసింది.

కిలో కందిపప్పు రూ. 200కుపైనే ....

అప్పుడెప్పుడో ఓ సినీ కవి రాసిన ఈ పాట నిజంగా ఇప్పుడు ఆకాశన్నంటిన కూరగాయలు, నిత్యావసరాలతో సతమతమైపోతున్న సామాన్యుల జీవితాలకు సరిగ్గా అద్దంపడుతుంది. మొన్నటి వరకు కిలో 100 రూపాయలు పలికిన ఉల్లి సామాన్యులను బెంబేలిత్తించింది. ప్రస్తుతం ఉల్లి ధరలు కాస్తా దిగొచ్చినా..కందిపప్పు కిలో 200కుపైగా పెరిగి సామాన్యుడిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. కందిపప్పు ఇచ్చిన షాక్‌నుంచి ఇంకా కోలుకోకముందే తాజాగా టమాటా ధరలు ప్రజలను పరుగెత్తించేలా చేస్తున్నాయి.

కిలో టమాట రూ. 100 .....

టమాట..వంటింట్లో ఏ కూర వండినా అందులో నాలుగు టమాటాలు వేయందే ఆ వంటకం పూర్తికాదంటారు మహిళలు. అయితే ప్రస్తుతం ఏపీలో కిలో టమాటా 100కుపైనే ఉండడంతో..కిచెన్‌లో టమాటా కనిపించకుండా పోయింది. ఇటు తెలంగాణలోనూ కిలో టమాట 60 రూపాయలు పలుకుతోంది. దీంతో పెరిగిన ధరలతో మహిళలకు ఉల్లి కోయకుండానే కన్నీళ్లు వస్తున్నాయి. ఇలా ధరల మీద ధరలు పెరుగుతూ కూరగాయలు, నిత్యాసరాలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. కిలో కందిపప్పు గతంలో 70రూపాయలుంటే..ఇప్పుడది అమాంతం 200 దాటింది. దీంతో పప్పన్నం తినే పరిస్థితి కన్పించడంలేదు. 200 పెట్టి పప్పుకొనలేక..కేవలం నీళ్ల చారు చేసుకొని ఏదో అలా పూట గడుపుతున్నారు. ఇలా ఒక్క కందిపప్పే కాదు..మినపప్పు, శనగపప్పు ధరలు కూడా కొండెక్కి కూర్చోవడంతో..సామాన్యుడు ఏం కొనే,తినే పరిస్థితి

కొద్దిపాటి జీతంతో జీవితాన్ని ఎలా నెట్టుకురావాలని ఆవేదన,................

పెరిగిన ధరలతో తామెంట్లా బ్రతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు మహిళలు. వచ్చే కొద్దిపాటి జీతంతో జీవితాన్ని ఎలా నెట్టుకురావాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల చదువులు, ఫీజులు, అనారోగ్య సమస్యలు, పండగలకు అయ్యే ఖర్చుతో కుటుంబ పోషణ భారమైపోయిందని చెప్తున్నారు. ఇక ఇంటికి ఎవరైనా బంధువులొస్తే...ఆ భారం మాటల్లో చెప్పలేనిదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి...మండిపోతున్న నిత్యావసరాలు, కూరగాయల ధరలను అరికట్టాలని సామాన్యులు కోరుతున్నారు. పెరిగిన కందిపప్పు, టమాటా ఇతర నిత్యావసరాల ధరలను తగ్గించి సామాన్యులకు ఊరట కలిగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

06:31 - November 20, 2015

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు రెండు రోజుల పాటు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. నేడు నెల్లూరు లోని వరదలకు గురైన ముంపు మండలాల్లో, గ్రామాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. వరద బాధితులను పరామర్శిస్తారు. అంతేకాకుండా భారీ వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలిస్తారు. ఎన్ని హెక్టార్లో పంట నష్టపోయింది. రైతులు ఎంత మేరకు పంటలు నష్టపోయారనే విషయాన్ని జిల్లా అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. 

06:31 - November 20, 2015

నెల్లూరు / కపడ / చిత్తూరు : నైరుతి బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలను అతలాకుతలం చేసింది. తెంపు లేకుండా కురిసిన వర్షాలతో నెల్లూరు నగరం మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుంది. కాలనీలు, ఇళ్లు జలమయమవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సరైన ఆహారం, తాగునీరు లేక విలవిల్లాడుతున్నారు.

నెల్లూరు జిల్లాలో ..

నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు, వెంకటగిరి, ఆత్మకూరు, కావలిలో విస్తారంగా వర్షాలు కురిసాయి. లక్షలాది ఎకరాలు నీట మునిగి పంటలు ధ్వంసమయ్యాయి. వరదల మూలంగా చిత్తూరు, నెల్లూరు, కడప తదితర జిల్లాల్లో 3 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇదే విషయాన్ని సిఎం చంద్రబాబునాయుడు కేంద్రానికి లేఖ ద్వారా తెలిపి ఆ మేరకు సాయం అందించాలని కోరారు. తక్షణ సహాయక చర్యల నిమిత్తం వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేయాలని విన్నవించారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ భారీగా పంట నష్టం వాటిల్లిందని, అనంతపురం ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ఒక మాదిరి నష్టం వాటిల్లిందని లేఖలో తెలిపారు.

35 మంది మృతి....

ప్రభుత్వ లెక్కల ప్రకారం వరదల వల్ల 35 మంది మరణించారు. 146 గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 467 ఇళ్లు కూలిపోగా, 2029 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 613 పశువులు మృతి చెందగా 550 చెరువులు దెబ్బతిన్నాయి. 2 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. 1865 రోడ్లు చాలా చోట్ల కోతకు గురయ్యాయి. నెల్లూరు జిల్లా మనుబోలు సమీపంలో జాతీయ రహదారిపై వంద మీటర్ల మేర గండ్లు పడ్డాయి.

ఎన్‌ఆర్‌డిఎ సిబ్బంది సహాయ సహకారాలు ........

నీటి ముంపుకు గురైన ప్రాంతాల్లో ఎన్‌ఆర్‌డిఎ సిబ్బంది సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రభుత్వం 188 సహాయ శిబిరాలు ఏర్పాటుచేసి 26 వేల 206 మందికి వసతి కల్పిస్తున్నారు. వీలైనంత త్వరగా గ్రామాలకు విద్యుత్‌ సరఫరా పునరుద్ధరిస్తామని, ధ్వంసమైన జాతీయ రహదారిని బాగుచేయించి రవాణా ఆటంకాలను తొలగిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. సిఎం రెండు రోజులపాటు వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో గడుపుతూ సహాయక చర్యలను పరిశీలించనున్నారు. మంత్రులు ఇప్పటికే సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు.

గండ్లు పడిన చెరువులకు తక్షణమే మరమ్మతులు......

గండ్లు పడిన చెరువులకు తక్షణమే మరమ్మతులు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కోతకొచ్చిన పంట నీట మునిగిన నేపథ్యంలో తడిసి రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. నెల్లూరు జిల్లాలో సహాయక చర్యలు, పంట, ఆస్తి నష్టాలపై అంచనా కొరకు ప్రత్యేక అధికార బృందాన్ని ఏర్పాటు చేశారు. వరద పీడిత ప్రాంతాల్లో బాధితులకు 12 వేల దుప్పట్లు అందించారు. భారీ వర్షాల మూలంగా తీవ్రంగా నష్టపోయిన జిల్లాలు మళ్లీ కోలుకోవడానికి చాలాకాలమే పట్టేట్లుంది. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం కోసం బాధితులు ఎదురుచూస్తున్నారు.

 

06:27 - November 20, 2015

హైదరాబాద్ : వరంగల్‌ ఉప ఎన్నిక కోసం ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. నియోజక వర్గంలోని 15 లక్షల 9 వేల 671 మంది ఓటర్లుండగా, 1778 పోలీంగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 8వేల 160 మంది సిబ్బందిని నియమించారు. ఎన్నికల సిబ్బంది సామాగ్రితో నేడే పోలింగ్‌ కేంద్రాలకు బయలు దేరనున్నారు. ఎన్నికల నిర్వహణ సక్రమంగా జరిగేందుకు 738 మంది అబ్జర్వర్లను నియమించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. 

నాందేడ్-ముంబై ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరణ

హైదరాబాద్ : నాందేడ్-ముంబై ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధ్దరించడంతోపాటు మరికొన్ని రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. రద్దు చేసిన రైళ్లలో బెంగళూరు-కాకినాడ, యశ్వంత్‌పూర్- హాతియా, యశ్వంత్‌పూర్-కమాఖ్య ఎక్స్‌ప్రెస్, బెంగళూరు- కమాఖ్య సువిధ, కాచిగూడ- మంగళూరు ఎక్స్‌ప్రెస్, కాచిగూడ-తిరుపతి డబల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్, తిరుపతి- బిలాస్‌పూర్ రైలును రద్దు చేసినట్లు సీపీఆర్వో ఎం ఉమాశంకర్ తెలిపారు.

 

వరంగల్ డీపీవో ఇస్లావత్ సోమ్లా నాయక్‌ సస్పెండ్

హైదరాబాద్ : వరంగల్ జిల్లా పంచాయతీ అధికారి ఇస్లావత్ సోమ్లా నాయక్‌ను సస్పెండ్ చేస్తూ పంచాయతీరాజ్ ఇన్ చార్జ్ ముఖ్యకార్యదర్శి పార్థసారధి ఆదేశాలు జారీచేశారు. ఈ నెల 10న వరంగల్‌లోని తన కార్యాలయంలో సోమ్లా రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టడంతో ఆయనకు ఈ నెల 24 వరకు రిమాండ్ విధించారు. 48 గంటల కంటే ఎక్కువగా రిమాండ్‌లో ఉన్నందున నిబంధనల ప్రకారం ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు జీవోలో తెలిపారు. ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా జిల్లాకేంద్రాన్ని వదిలి వెళ్లవద్దని పేర్కొన్నారు.

గండేపల్లి వద్ద కారు బోల్తా..ఒకరి మృతి

తూ.గో : గండేపల్లి మండలం తాళ్లూరు వద్ద కారు బోల్తా పడి ఒకరు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Don't Miss