Activities calendar

25 November 2015

కృపామణి కేసులో ప్రధానిందితుడు అరెస్ట్

ప.గో : కృపామణి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు గుడాల సాయి శ్రీనివాస్ ను హైదరాబాద్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని జిల్లా పోలీసులు నిర్ధారించారు.

21:20 - November 25, 2015

ఢిల్లీ : ప్రధాని మోదీ పాలనలో దేశంలో మత అసహనం రోజురోజుకు పెరుగుతోందని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి ఆరోపించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి బదులు... విమర్శలు చేస్తున్నవారిపై పాలకులు ఎదురుదాడికి దిగుతున్నారని చెప్పారు. దీనిని ఆయన తప్పుపట్టారు. బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో మత అసహనంపై విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు రాహుల్‌ సమాధానం చెప్పారు. 

21:18 - November 25, 2015

హైదరాబాద్ : దేశంలో పెరుగుతున్న మత అసహనంపై అమీర్‌ ఖాన్‌ చేసిన ప్రకటనపై తీవ్ర వివాదం జరుగుతున్నప్పటికీ ఆయన ఎక్కడా వెనక్కి తగ్గడంలేదు. చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ధైర్యంగా ప్రకటించి... విమర్శలు చేస్తున్న వారికి గట్టి సమాధానం చెప్పారు. మత అసహనం ప్రకనటనపై తను జాతి వ్యతిరేకిగా ముద్రవేస్తున్నవారి నోళ్లు మూయించే ప్రయత్నం చేశారు. భారతీయుడిగా ఉన్నందుకు గర్వపడుతున్నానని, దీనికి ఎవరి అనుమతి కానీ, ధృవీకరణ కానీ అవసరంలేదన్న వాదాన్ని వినిపించారు. తన మనసులోని భావాలను వ్యక్తం చేసినందుకు విమర్శలు చేయడం బాధకలిగిస్తున్నాయన్నారు. మత అసహనంపై వ్యక్తం చేసిన అభిప్రాయాలను మద్దతు ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. సంకుచిత భావాల నుంచి బయటపడాలంటూ విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగూర్‌ రాసిన పద్యంతో అమీర్‌ ఖాన్‌ తన ప్రకటన ముగించారు.

సెప్టెంబర్‌లో రెహ్మన్‌పై ఫత్వా..

దేశంలో మత అసహనం పెరిపోతోందన్న అమీర్‌ ఖాన్‌కు ప్రముఖ సంగీత దర్శకుడు, అస్కార్‌ అవార్డు గ్రహీత ఏఆర్‌ రెహ్మన్‌ మద్దుతు పలికారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో తనకు వ్యతిరేకంగా ఓ ముస్లిం గ్రూపు ఫత్వా జారీ చేసినప్పుడు ఇదే అనుభవం ఎదురయ్యిందన్నారు. గోవాలో జరుగుతున్న 46 వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి హాజరైన రెహ్మాన్‌... ఇరాన్‌ సినిమా.. మహ్మద్‌: ది మెసెంజర్‌ ఆఫ్‌ గాడ్‌ కు సంగీతం అందించినందుకు ముంబైకి చెందిన రజా అకాడమీ ఫత్వా జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సినిమా పేరు మహ్మద్‌ ప్రవక్తను అవమానించేదిలా ఉందని రాజా అకాడమీ చేసిన ఆరోపణను గుర్తు చేశారు.

పిటిషన్‌ దాఖలు చేసిన మనోజ్‌కుమార్‌ దీక్షిత్‌ ............

మరోవైపు దేశంలో పెరుగుతున్న మత అసహనం గురించి అమీర్‌ ఖాన్‌ చేసిన ప్రటకనపై ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలయ్యింది. భారతీయ శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింది ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మనోజ్‌కుమార్‌ దీక్షిత్‌ అనే న్యాయవాది కేసు వేశారు. ఐపీసీలోని 124 A సెక్షన్‌ కింది ఆయన ప్రకటనను దేశ ద్రోహనేరంగా పరిగణించాలని న్యాయస్థానాన్ని అభ్యర్ధించారు. దేశంలోని విభిన్న మతాల మధ్య శత్రుత్వాన్ని పెంచేవిధంగా ఉందంటూ 153 B సెక్షన్‌ కింద కేసు పెట్టారు. అమీర్‌ ఖాన్‌ ప్రకటన ప్రజలను తప్పుదోవపట్టించేలా ఉందంటూ ఐపీసీలోని 505 సెక్షన్‌ కింది ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. వచ్చే నెల 1న ఈ కేసుపై విచారణ చేపడతారు. మొత్తంమీద మత అసహనంపై అమీర్‌ ఖాన్‌ చేసిన ప్రకటనలపై చెలరేగుతున్న వివాదం ఇప్పట్లో సమసిపోయే అవకాశం కనిపించడంలేదు. 

21:13 - November 25, 2015

గుంటూరు : ల్యాండ్‌ పూలింగ్‌లో అ్రగస్థానంలో ఉన్న తుళ్లూరులోనే తెలుగు తమ్ముళ్లు మంత్రి ప్రత్తిపాటిని నిలదీశారు. స్థానిక నాయకుడు చెప్పారని.. ఒక ఈసేవా కేంద్రాన్ని తొలగించారంటూ ఆగ్రహంగా ఊగిపోయారు. ఇవే ఇలా చేస్తే.. రేపు వేల ఎకరాలకు బదులుగా ఇస్తామన్న ప్లాట్లు సక్రమంగా ఇస్తారని గ్యారంటీ ఏంటంటూ మండిపడ్డారు. ఆ ప్రాంతమంతా ల్యాండ్‌ పూలింగ్‌కు భూములిచ్చేలా చేసింది తామేనని.. తాము నిలబడకపోతే ఆ పనే అయ్యేది కాదని.. అలాంటిది తమనే నిర్లక్ష్యం చేస్తే.. రేపు ప్లాట్ల విషయంలోనూ అన్యాయం జరగదని గ్యారంటీ ఏముందంటూ నిలదీశారు.

21:11 - November 25, 2015

హైదరాబాద్ : దాదాపు మూడు నెలల విరామం తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయానికి రాబోతున్నారు.. ఈ నెల 28న చంద్రబాబు మంత్రులు, అన్ని శాఖల హెచ్ ఓడీ లతో సమావేశం కాబోతున్నారు.. గత ఆగస్టులో అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సమయంలో బాబు నగరానికి వచ్చారు.. ఈ శని, ఆదివారాలు ఇక్కడే ఉండబోతున్నారు.. జయప్రద కుమారుడి వివాహానికి హాజరుకాబోతున్నారు ఏపీ సీఎం.. 

రోడ్డు ప్రమాదంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి

ఆదిలాబాద్ : కాగజ్‌నగర్ డీఎఫ్‌ఓ కార్యాలయం ఎదుట బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పరశురాం(40) మృతిచెందారు. ఆయన డీఎఫ్‌ఓ కార్యాలయానికి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన పరశురాంను 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందారు.

హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో పెరిగిన భూముల ధరలు

హైదరాబాద్ : నగరంలో రికార్డు స్థాయిలో భూముల ధరలు పెరిగాయి. టిఎస్ఐఐసీ ద్వారా రాయుదర్గం, మణికొండ, కోకాపేట భూములకు ప్రభుత్వం వేలం నిర్వహించింది. రాయదుర్గంలో ఎకరానికి రూ. 29.28 కోట్లచొప్పున ఐదెకరాల భూమిని అరబిందో ఫార్మా కొనుగోలు చేసింది. రాయదుర్గంలో మరో బిట్టును ఎకరానికి రూ.24.88 కోట్లతో 3.65 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఎకరానికి రూ. 24.20 కోట్ల చొప్పున రెండెకరాల భూమిని నయా ఇన్ ఫ్రా కంపెనీ కొనుగోలు చేసింది. ఎకరానికి రూ. 22.01 కోట్ల చొప్పున సైమెడ్ ల్యాబ్స్ రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేసింది.

20:44 - November 25, 2015

హైదరాబాద్ : ఎజెండా అసంతపూర్తిగానే మిగిలింది. ఆ మహాశయుని కలలు నెరవేరలేదు. కోట్లాది ప్రజల అభ్యున్నతిని కాంక్షించిన ఆ స్వప్నం అసంపూర్తిగానే ఉంది. ఆరు దశాబ్ధాల తరువాత కూడా వైఫల్యాలు వెంటాడుతూనే ఉన్నాయి. అసమానతలు రాజ్యమేలుతూనే ఉన్నాయి. అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి. అంబేద్కర్ మహాశయుని 127 జయంతి సందర్బంగా ఇదే అంశం చర్చకు వస్తోంది. ఇదే ధ్యేయంతో పార్లమెంట్ సీతాకాల సమావేశాల్లో...దళితుల సమస్యలు చర్చించి పరిష్కారానికి సర్కార్ ముందుకు రావాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై నేటి వైడాంగిల్ లో విశ్లేషణ చేశారు. ఈ విశ్లేషణను మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

20:32 - November 25, 2015

హైదరాబాద్: అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా 2015 రికార్డులోకి ఎక్కనుందని ఐక్యరాజ్య సమితికి చెందిన వాతావరణ ఏజెన్సీ వెల్లడించింది. పారిన్ లో వాతావరణ మార్పులకు సంబంధించి కీలక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఐరాస ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది ఉష్ణోగ్రతల ప్రకారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా 2015 నమోదు కానుందని ప్రపంచ వాతావరణ సంస్థ అధ్యక్షుడు మైకేల్ జార్రౌద్ తెలిపారు.

20:27 - November 25, 2015

నెల్లూరు : సింహపురి పాలిటిక్స్‌లో పరిచయం అక్కర్లేని పేర్లు ఆనం బ్రదర్స్. నెల్లూరు రాజకీయాల్లో రాటుదేలిన ఈ లీడర్ల మనసు ఈమధ్య పరిపరి విధాలుగా పయనిస్తోంది. హస్తం పార్టీలో ఫ్యూచర్‌ లేని తెగ దిగాలు పడుతున్నారు. కొత్త నీడ కోసం వెతుకులాట మొదలుపెట్టారు. ఇంతకీ ఈ సింహపురి చిన్నోళ్ల పయనమెటు..?

ఒకరిది గంభీరం.. మరొకరిది చిద్విలాసం...........

మాట తూలే తంత్రం వారి సొంతం. చేయి చేసుకునేంతగా సాగుతుంది పంతం. అధికారం ఎవరిదైనా వీరిదే ఆధిపత్యం..సింహపురి సింహాలు చిక్కిపోయిన వైనం .....అందుకే పవర్‌ కోసం పెరిగింది ఆత్రం. పవరుఫుల్లు సైకిల్‌ను ఎక్కడానికి ఆరాటం..కాంగ్రెస్‌ను వదిలేయడానికి మొహమాట నెల్లూరు జిల్లా అనగానే తెలుగు ప్రజలందరికీ గుర్తొచ్చే నాయకులు ఆనం బ్రదర్స్. జనం మదిలో ఆ స్థాయిలో క్రేజీ లీడర్లులుగా పేరు సంపాదించిన నేతలు వీరిద్దరూ.

తమదైన స్టైల్ పోలిటికల్ గేమ్ ....

రాజకీయాలే సర్వస్వంగా భావించి, తన స్టైల్ పోలిటికల్ గేమ్ నడిపించే లీడర్లుగా ఆనం బ్రదర్స్ రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. రాజకీయ రాజధానిగా పేరొందిన నెల్లూరులో వారిది ఎనభై ఏళ్ల పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ప్యామీలి. ఎందరికో రాజకీయాల్లో ఓనమాలు దిద్దించిన కర్మాగారమది. పవర్ పాలిటిక్స్ పవరంటే ఏంటో చూపించిన నేతలు ఆనం బ్రదర్స్ .

సెటైర్లతో కుమ్మేస్తాడు.....

ఆనం బ్రదర్స్ లో మొదటగా చెప్పుకోవాల్సింది ఆనం వివేకానందరెడ్డి. ఈయన రూటే సపరేటు. పొరపాటున ఈయనను ఎవరైనా గెలికితే ఇక అంతే. వాళ్లు ఇక అయిపోయినట్లే. వారిని టార్గెట్ చేసి దుమ్మెత్తి పోస్తారు. సెటైర్లతో కుమ్మేస్తారు. ప్రత్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తారు.

వరుసగా 3 సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన వివేకా.....

ఎప్పుడూ జనం మద్య తిరుగుతూ విచిత్ర వేషాలతో పోలిటికల్ షో ను బాగా రక్తి కట్టించే మాస్ లీడర్ వివేకానందరెడ్డి. వరుసగా 3 సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి జిల్లాలో చక్రం తిప్పారు. మనసులో ఏది అనుకున్నా కుండబద్దలు కొట్టే అరుదైన నేత.

ఆనం రాంనారాయణ రెడ్డి...........

ఆనం రాంనారాయణ రెడ్డి. అన్న పక్కా మాస్‌ అయితే తమ్ముడు క్లాస్. హుందాగా రాజకీయాలు నడిపిస్తారన్న భావన ప్రజల్లో ఉంది. గడిచిన పదేళ్లలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో మున్సిపల్ , సమాచార, కీలకమైన ఆర్ధిక శాఖామంత్రిగా పనిచేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం నడిచే మూమెంట్లో ఆయన సీఎం రేస్ లో కూడా ఉన్నారు. ఒకప్పుడు సింహపురి పాలిటిక్స్ లో ఓ వెలుగు వెలిగిన ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు ఎలాంటి కాంతులూ లేక వెలవెలబోతున్నారు. ప్రెస్‌మీట్లు పెట్టి ప్రసంగాలు దంచే నేతలు మౌనముద్రలో ఉండిపోయారు. కానీ ఈ సైలెన్స్ ను బద్దలుకొట్టి మరోసారి వీరవిహారం చేయడానికి సిద్దమవుతున్నారు. గూడు చెదిరిన ఈ అన్నదమ్ములు కొత్త నీడ కోసం పయనం మొదలుపెట్టారు.

పార్టీ మారేందుకు ఏడాది కాలంగా ప్రయత్నాలు.

రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ కు ఏపీలో గడ్డుకాలం ఎదుర్కొంటుండటంతో...ఇక అక్కడే ఉంటే భవిష్యత్ ఉండదని భావించి పార్టీ మారేందుకు ఏడాది కాలంగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఆనం సోదరులు. మొదట టిడిపిలోకి వెళ్లేందుకు విశ్వప్రయత్నం చేయగా అక్కడ ఆ పార్టీ నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వారి ప్రయత్నం ఫలించలేదు. దీంతో అప్పటి నుంచి కాంగ్రెస్ లోనే కొనసాగుతూ అడపాదడపా కాంగ్రెస్ కార్యక్రమాలు చేపడుతూ తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేశారు.

వైసీపీలో చేరేందుకు తొలుత ప్రయత్నం....

ఆనం సోదరులు కేవలం తమ ఉనికే కాదు తమ వారసుల భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తున్నారు. కనుచూపు మేరలో కాంగ్రెస్ కోలుకునే పరిస్థితి కనపడ్డం లేదు. అందుకే ఒకానొక సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు కూడా ఒక రాయి వేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆనం సోదరులంటేనే మండిపడే జగన్ తో బొత్స సత్యనారాయణ మంతనాలు జరిపి పార్టీలో ఆనం సోదరుల చేరికకు లైన్ క్లియర్ చేశారని, మీడియా కోడై కూసింది. అటు మేకపాటి సోదరులు, పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఆనం రాకకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పుకార్లు షికార్లు చేశాయి. అయితే అవన్నీ పుకార్లకే పరిమితం అయ్యాయి.

ఆనం బ్రదర్స్ సైకిలెక్కడం ఖాయమా?........

నిత్యం రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య ఉండే ఆనం బ్రదర్స్..అటు అధికారం లేక , పబ్లిక్ లోకి వెళ్లలేక గత కొంతకాలంగా సైలెంట్‌గా ఉంటున్నారు. మారుతున్న రాజకీయ సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని టిడిపిలోకి వెళ్లేందుకు మరోసారి ప్రయత్నం చేయగా సక్సెస్ అయినట్లు సమాచారం. దీంతో ఆనం సోదరులు తమ పాత సైకిల్‌ను ఎక్కడం ఖాయమని జిల్లాలో హాట్‌హాట్‌గా డిస్కషన్ జరుగుతోంది. ఇందుకు ఓ ఐఏఎస్ అధికారి రాయబారం నడుతున్నట్టు తెలుస్తోంది.

చంద్రబాబు,లోకేష్‌లతో ఐఏఎస్ అధికారి చర్చలు....

ఆనం రామనారాయణ రెడ్డితో సన్నిహితంగా ఉండే ఓ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం చంద్రబాబు విధేయుడుగా ఉంటున్నారు. అలాగే లోకేష్ కు అన్ని వ్యవహరాల్లో సలహాలు,సూచనలిస్తున్నారు. ఆయనే స్వయంగా నెల్లూరు రాజకీయాలపై దృష్టి సారించి చంద్రబాబుతో ,లోకేష్ తో చర్చలు జరిపి ఆనం బ్రదర్స్ రీ ఎంట్రీకి మార్గం సుగుమం చేశారన్న ప్రచారం జరుగుతోంది. గతంలో ఎలాగూ వీళ్లు టిడిపిలోనే ఉండటం, చంద్రబాబుతో కొంత సాన్నిహిత్యం కూడా ఉండడంతో ఇక చేరికే ఆలస్యంగా అనిపిస్తోంది. ఇక అన్నీ కలిసొస్తే ఈ నెల 27 కాని, లేక వచ్చే నెల మొదటి వారంలో కానీ పార్టీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

సొంత పార్టీ కాంగ్రెస్‌పైనే ఆనం విమర్శలు

ఆనం బ్రదర్స్ , సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు కూడా ఈ ప్రశ్నలకు అవుననే బలాన్ని చేకూరుస్తున్నాయి. సొంత పార్టీ కాంగ్రెస్ అధిష్టానంపైనే విరుచుకుపడడం..టిడిపికి మద్ధతుగా మాట్లాడటం చూస్తుంటే బ్రదర్స్ జంప్ అవడం ఖాయం అనిపిస్తోంది. అటు టిడిపి కూడా బలమైన నాయకుల కోసం వేట మొదలెట్టడం చూస్తుంటే బ్రదర్స్ రాక పక్కా అనిపిస్తుంది. అన్నీ కలిసొస్తే అతిత్వరలోనే ఆనం సోదరులు పాత గూటికి చేరతారని తెలుస్తోంది.

ఆనం బ్రదర్స్ రీఎంట్రీకి టీడీపీలో సర్వం సిద్దం....

ఆనం సోదరులు నిజంగా సైకిలెక్కితే ఆ పార్టీలో ఎలాంటి ప్రాధాన్యం లభిస్తుంది...పదవులు లభిస్తాయా లేదంటే ప్రచ్చన్న యుద్ధం మొదలవుతుందా...ఆనం సోదరులను బాబు ఆహ్వానిస్తే అందుకే ఆయనకున్న లెక్కలేంటి..?

ఆనం బ్రదర్స్ కు రెండు టికెట్లు ఖాయం..........

ఆనం బ్రదర్స్ కు టీడీపీ మంచి ఇంపార్టెన్స్ ఇస్తోంది. వారి రాకను ఏమాత్రం సంకోచం లేకుండా ఆహ్వానిస్తోంది. వారికి రెండు టికెట్లు కేటాయించడం ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి కాని కావలి నుంచి కాని బీఫారం ఇస్తామన్న హామినిచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఆనం వివేకా లేక ఆయన తనయుడు ఏసీ సుబ్బారెడ్డి నెల్లూరు రూరల్ నియోజక వర్గం నుంచి పోటీ చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.

కన్నబాబుకు సారి ఆత్మకూరు సీటిచ్చే ఛాన్స్ లేదా?..........

గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కన్నబాబుకు ఈ సారి ఆత్మకూరు సీటిచ్చే ఛాన్స్ లేదని, అతని వల్లే ఎంపీ సీటు కూడా పోయిందన్న ప్రచారం సాగుతోంది. మరోవైపు కావలిలో కూడా ఈసారి బీదామస్తాన్ రావుని రాజ్యసభకు పంపించి అక్కడ నుంచి ఆనం రామనారాయణ రెడ్డిని పోటీకి నిలబెట్టొచ్చు. రామనారాయణ రెడ్డి ఆత్మకూరు లేదా కావలి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ రెండు స్థానాల నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విధంగా ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాక ఆనం సోదరుల్లో ఎవరికో ఒకరికి 2017లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారన్న ప్రచారం ఉంది. ఒకవేళ ఎమ్మెల్సీ కాకున్నా ఒక అసెంబ్లీ సీటు, లేక నెల్లూరు పార్లమెంటు సీటు ఆనం సోదరులకు కేటాయించ వచ్చు.

నెల్లూరు జిల్లాలో టీడీపీకి సరైన లీడర్‌షిప్‌ లేదు........

ఆనం సోదరులను ఇంత గ్రాండ్‌గా వెల్కం పలికేందుకు సిద్దమవడానికి చంద్రబాబుకు వేరే లెక్కలున్నాయి. జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సరైన లీడర్స్ షిప్ లేదు. ఇటీవల నెల్లూరు పర్యటనలో కూడా నేతలపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో పార్టీ బాగా వెనుకబడిందని, రెండు ఎమ్మెల్సీలు ఇచ్చినా పార్టీ తీరు మారలేదని బాబు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. మార్పురాకపోతే తన స్టైల్ రాజకీయం చేస్తానని హెచ్చరించినట్టు కూడా ప్రచారం ఉంది. అంతేకాక తిరుపతిలో జరిగిన పార్టీ నాయకుల సమావేశంలో కూడా పార్టీ బలోపేతానికి ఇతర పార్టీల్లోని బలమైన నాయకులను పార్టీలోకి ఆహ్వానించండని చెప్పినట్లు తెలుస్తోంది. అంటే బాబు ఆనం బ్రదర్స్ ను దృష్టిలో పెట్టుకునే వార్నింగ్ ఇచ్చారనే వార్తలు వచ్చాయి. మరోవైపు అదే రోజు ఆత్మకూరులో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తన సొంత పార్టీ కాంగ్రెస్ అధినాయకత్వంపైనే విమర్శలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధిస్టానాన్నే టార్గెట్ చేసి విమర్శలు ...

ఆనం రామనారాయణ రెడ్డి ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధిస్టానాన్నే టార్గెట్ చేసి విమర్శలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసి మట్టి కొట్టిందని..ఓ తరం వెనక్కు వెళ్లామంటూ ఫైర్ అయ్యారు. అంతేకాదు పీసీసీ చేపట్టిన సత్యాగ్రహంపైనా ఆయన విమర్శలు చేశారు. రాహుల్ పర్యటనపై మాట్లాడిన ఆనం పార్టీ మారేందుకు సంకేతం ఇచ్చారు. అయితే పార్టీ మారేందుకు ప్రజల్లో చర్చ జరిగేందుకు ఈ టాక్ వదిలారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆనం బ్రదర్స్ టీడీపీ రీ ఎంట్రీతో సింహపురి రాజకీయాలు మరోసారి వేడెక్కనున్నాయి. చూడాలి నెల్లూరు రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో.  

20:18 - November 25, 2015

ఖమ్మం : కుక్కలు జనాలపై ప్రతాపం చూపుతున్నాయి.. ధ్వంసలాపురం, అగ్రహారం కాలనీల్లో స్వైరవిహారం చేస్తున్నాయి.. చిన్నారులపై దాడిచేయడంతో వారంతా తీవ్ర గాయాలపాలయ్యారు.. కుక్కకాటు బాధితులకు ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.. కుక్కల పళ్లు పిల్లల శరీరంపై లోతైన గాయాలు చేయడంతో కుట్లు వేసి చికిత్స అందిస్తున్నారు వైద్యులు..

 

20:16 - November 25, 2015

ఖమ్మం : భర్త ఇంటిముందు కొడుకుతోసహా ఆందోళనకు దిగిందో భార్య... ఈ ఘటన ఖమ్మం మణుగూరులో జరిగింది.. హైదరాబాద్‌కుచెందిన బాధితురాల్ని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు ఆమె బావ ప్రవీణ్... ఆ తర్వాత గుడిలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నాడు.. బాధితురాలు ఆమె గర్భం ధరించాక పారిపోయాడు..ఆ యువతి పోలీసులను ఆశ్రయించడంతో ముందస్తు బెయిల్‌ తెచ్చుకున్నాడు.. ఆ తర్వాత మరో పెళ్లికి సిద్ధపడ్డాడు... ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు ఆ వివాహాన్ని అడ్డుకుంది.. ఆ తర్వాత ప్రవీణ్ మళ్లీ కనిపించకుండాపోయాడు.. రెండేళ్లుగా ప్రవీణ్‌కోసం పోరాటం చేస్తున్న యువతి... తన తొమ్మిది నెలల బాబుతో అత్తవారింటిముందు ఆందోళనకు దిగింది.. బాధితురాలికి మహిళా సంఘాలు మద్దతుగా నిలిచాయి..

20:13 - November 25, 2015

రంగారెడ్డి : అల్వాల్‌లో ఘోరం జరిగింది.. వెంకటేశ్వర స్వామి ఆలయం కొలనులోపడి ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు.. ఆచూకీ కోసం గాలించినవారికి వారి మృతదేహాలు లభించాయి. ఇద్దరు పిల్లలు చనిపోవడంతో అందరూ విషాదంలో మునిగిపోయారు.

20:11 - November 25, 2015

హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లో ఓ కారు నడిరోడ్డుపై తగలబడిపోయింది. కారులో ఉన్నవారు మంటలను ముందే గమనించి బయటకు రావడంతో.. ప్రమాదం తప్పింది. మొదట ముందు భాగంలో చెలరేగిన మంటలు.. ఆ తర్వాత మొత్తం వ్యాపించాయి. కారు మొత్తం చూస్తుండగానే కాలిపోయింది. 

అసహనం పై చర్చకు సిద్ధం : వెంకయ్యనాయుడు

హైదరాబాద్ : దేశంలో అసహనం అంశంపై చర్చకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రధాని మోదీ నివాసంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ... వస్తు సేవల పన్ను సహా ఇతర బిల్లులపై కాంగ్రెస్ తో చర్చించనున్నట్లు తెలిపారు.

ఏపీలో ఇసుక విధానంపై చంద్రబాబు సమీక్ష

విజయవాడ : ఏపీలో ఇసుక విధానంపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఇసుక తవ్వకాలపై గురువారం విజయవాడలో శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. బాక్సైట్ తవ్వకాలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. టోల్ ఫ్రీ నంబర్,వెబ్సైట్, ఫీడ్ బ్యాక్ సెంటర్ ను ఏర్పాటు చేసి అభిప్రాయాలు సేకరించాలని సూచించారు.

బీసీల కోసం ప్రత్యేక పార్టీ : ఆర్ కృష్ణయ్య

మెదక్ : బీసీల కోసం దేశవ్యాప్తంగా ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేయాలని కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తున్నదని, ఆ దిశగా ముందుకు వెళుతున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. బుధవారం ఆయన మెదక్ జిల్లా రామాయంపేట వద్ద రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసగౌడ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఏపార్టీ కూడా బీసీల సంక్షేమం గురించి పట్టించుకోవడంలేదని ఆరోపించారు.

గుర్రంకొండలో 'పాఠశాల' ఘటనపై మంత్రి సీరియస్

చిత్తూరు : చిత్తూరు జిల్లా గుర్రంకొండలో పాఠశాల భవనం పై కప్పు కూలి ఓ విద్యార్థి మృతిచెందడంతో పాటు.. మరో పది మంది విద్యార్థులకు గాయలైన ఘటనపై మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన పై సమగ్ర విచారణకు ఆదేశించారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని అన్నారు. బాధిత విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా విద్యాధికారికి సూంచించారు

మేయర్ హత్య కేసులో మరో ఇద్దరి అరెస్ట్

చిత్తూరు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో పోలీసు అధికారులు మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మంగళవారం ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులు లొంగిపోయిన విషయం తెలిసిందే. బుధవారం మరో ఇద్దరు నిందితులైన యోగానందం, శశిధర్‌లను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.

18:24 - November 25, 2015

హైదరాబాద్ : తెలంగాణ సమస్యల్ని పార్లమెంటులో ప్రస్తావిస్తామన్నారు టీఆర్‌ఎస్‌ ఎంపీలు.. హైకోర్టు విభజనపై ఇంకా స్పష్టత ఇవ్వడంలేదని ఆరోపించారు.. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్ ఆధ్వర్యంలో అఖిలిపక్ష సమావేశం జరిగింది.. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ ఎంపీలు హాజరయ్యారు.. తమ ప్రభుత్వ పనితీరును అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్ మెచ్చుకున్నారని ఎంపీలు తెలిపారు..

18:22 - November 25, 2015

విజయవాడ : ఏపీలో ప్రభుత్వాసుపత్రులప నితీరును మారుస్తున్నామని, వైద్య, ఆరోగ్యశాఖలో సరికొత్త విధానాలు ప్రవేశపెడుతున్నామని ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ఆయన బుధవారం విజయవాడ లో 'టెన్ టివి'తో మాట్లాడుతూ.... మహిళలు, గర్భిణీలకు అందుబాటులోఉండేలా 102 విధానంపై కసరత్తు చేస్తున్నామని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నీ ప్రభుత్వ ఆసుపత్రులో ఉచితంగా మందులు, అన్ని పరీక్షలను ఫ్రీగా చేయబోతున్నాం అని తెలిపారు.. 150 కోట్ల రూపాయల ఎక్విప్ మెంట్ పని చేయడం లేదని... వాటిని రిపేరు చేసే పని చేస్తున్నామన్నారు. మహిళలకు ఉపయోగపడే విధంగా 102 కాల్ సెంటర్లు పెట్టి... డ్రాప్ బ్యాక్ ఫెసిలిటీని తీసుకువచ్చాం. మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సిబ్బంది కొరత లేకుండా చూస్తామని స్పష్టం చేశారు.

18:18 - November 25, 2015

విశాఖ : సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు శత వర్ధంతి వేడుకలకు విశాఖ సిద్ధమైంది.. రేపు బీచ్‌రోడ్డులో వందలాదిమంది విద్యార్థులు గురజాడ దేశభక్తిగీతాలను ఆలపించనున్నారు.. ఈ సంఘసంస్కర్తకు నివాళులు అర్పించేందుకు ఐద్వాతోపాటు వివిధ సంఘాలు ఏర్పాట్లు చేస్తున్నారు..

18:17 - November 25, 2015

విజయవాడ : డిసెంబర్‌ 7న చలో ఢిల్లీ నిర్వహిస్తామని ప్రకటించారు సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ.. విభజన చట్టంలోని హామీలు నెరవేర్చాలంటూ ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు.. ప్రజాసంఘాలు, మాలమహానాడు, ఏపీ విద్యార్థులు, మేధావులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు..

18:15 - November 25, 2015

హైదరాబాద్ : అమీర్‌ఖాన్‌ మరోమారు కుండబద్దలు కొట్టాడు. తాను భారతీయుడిని.. భారత్‌ తన మాతృభూమి అని చెప్పారు. ఇందులో ఎవరికీ సందేహాలు అక్కర్లేదని తేల్చి చెప్పారు. తాను గాని, తన భార్య గాని దేశం విడిచి వెళ్లాలనుకోవడం లేదని.. పరిస్ధితులు ఆ విధంగా ఉంటున్నాయనే అన్నానని.. తన ఇంటర్వ్యూ పూర్తిగా చూడనివారే విమర్శలు చేస్తున్నారని అమీర్‌ మండిపడ్డాడు. పరిస్ధితులు అలా ఉన్నాయనే వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని అమీర్‌ స్పష్టం చేశాడు.

18:13 - November 25, 2015

నల్గొండ: తుర్కపల్లి మండలం మల్కాపురం సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.. ఈ ఘటనలో ఇద్దరు ఆరుగురు చనిపోయారు.. ఇందులో ఇద్దరు చిన్నారులు, మరో ఇద్దరు మహిళలు ఉన్నారు.. గాయపడ్డ 9మందిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.. బొమ్మలరామారం మండలం నాయకునితండాకుచెందిన 17మంది మినీ లారీలో యాదాద్రికి వెళ్లారు.. తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగిపోయింది.. 

ప్రధాని నివాసంలో బిజెపి కార్యవర్గం భేటీ

ఢిల్లీ : ప్రధాని మోదీ నివాసంలో బిజెపి కార్యదర్శి వర్గ సమావేశం ప్రారంభం అయ్యింది. రేపు ప్రారంభం కాబోయే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

వాటర్ గ్రిడ్ పై ముగిసిన సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : వాటర్ గ్రిడ్ పై సీఎం కేసీఆర్ సమీక్ష ముగిసింది. సకాలంలో పనులు పూర్తి చేసే కాంట్రాక్టర్లకు 15 శాతం ప్రోత్సాహకాలు ఇస్తామని తెలిపారు. హైదరాబాద్ లోని 9 నియోజకవర్గాలకు ఏప్రిల్ 30 లోగా తాగునీరు సరఫరా చేయాలని తెలిపారు. 6 అడుగుల లోతున పైప్ లైన్లు వేయాలని సూచించారు. మెదక్ జిల్లాలో వేసే పైప్ లైన్ తన వ్యవసాయ క్షేత్రం నుంచే పోతుందని.. చట్టానికి సీఎం సహా ఎవరూ అతీతులు కారని తెలిపారు.

28న సచివాలయానికి ఏపీ సీఎం

హైదరాబాద్ : ఈ నెల 28 ఏపీ సచివాలయానికి సీఎం చంద్రబాబు నాయుడు రానున్నారు. దాదాపు మూడు నెలల తరువాత వస్తున్న చంద్రబాబు అన్ని శాఖ లహెచ్ ఓడీలతో సమావేశం అయి సచివాలయ తరలింపు హెచ్ వోలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

అమీర్ ఖాన్ కు ములాయం సింగ్ మద్ధతు...

హైదరాబాద్ : దేశంలో కలకలం రేపిన మత అసహనం నేపథ్యంలో దేశం వదిలి వెళదామంటూ తన భార్య ప్రతిపాదించిందంటూ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆమీర్ వ్యాఖ్యలతో బాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఓ వర్గం ఆమిర్ కు మద్దతుగా నిలిస్తే, మరో వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ నేతలు ఆమిర్ పై ఒంటికాలిపై లేచారు. అయితే కాస్తంత ఆలస్యంగా స్పందించినా, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ బాలీవుడ్ స్టార్ కు మద్దతుగా నిలిచారు.  దేశంలో స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని ములాయం వ్యాఖ్యానించారు.

నా దేశ భక్తికి ఎవరి కితాబు అవసరం లేదు : అమీర్ ఖాన్

హైదరాబాద్ : భారత్ నా మాతృభూమి. ఈ గడ్డ పై జన్మించడం నా అదృష్టం' అని బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ అన్నారు. అసహనం పై తాను చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతున్న నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. భారత్ విడిచి వెళ్లే ఉద్దేశ్యం తనకు, తన భార్యకు లేదని తెలిపారు. అసహనం పై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాని చెప్పారు. తన ఇంటర్వూను పూర్తిగా చూడనివారే తనను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. తనకున్న దేశభక్తికి ఎవరి కితాబు అవసరం లేదన్నారు.

రాష్ర్టాభివృద్ధికి కేంద్రం సాయం చాలా అవసరం : చంద్రబాబు

విజయవాడ : రాష్ర్టాభివృద్ధికి కేంద్రం సాయం చాలా అవసరమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తుపానులు, వరదలు వంటి విపత్తులను ఎదుర్కోవాలంటే కేంద్రం సాయం తప్పనిసరన్నారు. విభజన చట్టంలోని హామీలన్నీ కేంద్రం నెరవేరుస్తుందన్న నమ్మకం తనకు ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.

215 పరుగులకు భారత్ ఆలౌట్

నాగ్‌పూర్:దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా వీసీఏ స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 215 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాట్స్‌మెన్లలో విజయ్(40), రవీంద్రజడేజా(34), సాహా(32) పరుగులతో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో హార్మర్ 4, మోర్కెల్3 వికెట్లు తీయగా రబడ,తాహిర్, ఎల్గర్ చెరో వికెట్ పడగొట్టారు.

కాంచన్‌బాగ్ లో చైన్ స్నాచింగ్

హైదరాబాద్: నగరంలోని కాంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోన్న విజయలక్ష్మి అనే మహిళ మెడలోంచి చైన్ స్నాచర్లు 5 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

16:43 - November 25, 2015

కరీంనగర్‌ : జగిత్యాలలో ఓ హోంగార్డు రెచ్చిపోయాడు.. కూరగాయలు అమ్ముతున్న ఓ మహిళను చితకబాదాడు.. రోడ్డుపై కూరగాయలు ఎందుకు అమ్ముతున్నావంటూ దాడి చేశాడు.. దీంతో ఆగ్రహించిన స్థానికులు రోడ్డుపై ధర్నాకు దిగారు.. వెంటనే స్పందించిన ట్రాఫిక్‌ ఎస్‌ఐ వారికి నచ్చజెప్పారు.. హోంగార్డుపై చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు..

16:42 - November 25, 2015

కరీంనగర్ : ఆడపిల్ల పుట్టిందని అదనపు కట్నం చేశాడో ప్రబుద్దుడు.. కరీంనగర్‌ కోతిరాంపూర్‌కుచెందిన రాజేందర్‌కు లావణ్యతో గత ఏడాది వివాహమైంది.. పెళ్లిసమయంలో 3లక్షల కట్నం, 5 తులాల బంగారం కట్నంగా ఇచ్చారు తల్లిదండ్రులు.. భార్య గర్భందాల్చిన సమయంనుంచి రాజేందర్‌ వేధింపులు మొదలుపెట్టాడు.. ఆడపిల్ల పుట్టాక లావణ్యకు చెప్పకుండా దుబాయ్ వెళ్లిపోయాడు.. లక్ష రూపాయలు తెస్తేనే తన ఇంటికి రావాలని.. లేకపోతే పుట్టింట్లోనే ఉండాలంటూ ఫోన్‌లో వేధించడం మొదలుపెట్టాడు.. తాజాగా లావణ్య అత్తామామాలు ఆమె పుట్టింటివారు పెట్టిన సామానంతా రోడ్డుపై పడేశారు.. దీంతో లావణ్య తనకు న్యాయం చేయాలంటూ కరీంనగర్‌ టూటౌన్‌ పోలీసులను ఆశ్రయించింది..

16:41 - November 25, 2015

హైదరాబాద్ : ఎన్‌కౌంటర్లకు నిరసనగా మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల బంద్‌ కొనసాగుతోంది.. కాసంపూర్‌, జార్వండి గ్రామాల రోడ్లపై చెట్లను నరికిపడేశారు మావోయిస్టులు... యువకులు ఇన్ఫార్మర్లుగా ఉంటూ ఎన్‌కౌంటర్లకు కారణమవుతున్నారని బ్యానర్లు కట్టారు.. ఎవరూ పోలీసులకు ఇన్‌ఫార్మర్లుగా మారొద్దని హెచ్చరించారు.. నిన్న ఇన్ఫార్మర్‌ నెపంతో వినయ్‌ అనే యువకుడి గొంతు కోశారు.. 

16:39 - November 25, 2015

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా ఆలస్యం చేయొద్దని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుని కోరామని సుజనా చౌదరి తెలిపారు. ఆయన ఢిల్లీలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.....రైతులకు కనీస మద్దతు ధరలు ఇవ్వాలని సూచించినట్లు తెలిపారు. త్వరలో వరద సహాయం చేయాలని ప్రధానిని కోరినట్లు తెలిపారు. 

16:37 - November 25, 2015

మెదక్‌ : నర్సాపూర్‌ నియోజకవర్గంలో నకిలీ డాక్టర్లు అక్రమదందా మూడు పూవులు ఆరుకాయలుగా సాగుతోంది. గతంలో శిశు విక్రయాలు, గర్భసంచి తొలగింపు ఆపరేషన్లతో అమాయకుల జీవితాలతో ఆడుకుంటే, ఇప్పుడు తాజాగా అపెండిసైటిస్‌ ఆపరేషన్లతో నకిలీలు డబ్బులు కొల్లగొడుతున్నారు. కడుపు నొప్పి అంటూ రోగి ఆశ్రయిస్తే చాలు కత్తులు పట్టుకొని అపెండిసైటిస్‌ ఆపరేషన్‌ చేసేసి వేలకు వేలు దండుకుంటున్నారు. ముఖ్యంగా అమాయక గిరిజనులే టార్గెట్‌గా ఈ అక్రమ దందా కాసుల వర్షం కురిపిస్తోంది.

27 మందికి అపెండిసైటిస్‌ ఆపరేషన్లు .....

తాజాగా కౌడిపల్లి మండలం మహ్మద్‌ నగర్‌ కొత్త చెరువు తండాలో మొత్తం 20 కుటుంబాలు నివాసం ఉంటున్నారు. అందులో జనాభా కేవలం 50 మాత్రమే కానీ అక్కడ 27 మందికి అపెండిసైటిస్‌ ఆపరేషన్లు జరిగాయి. కడుపు నొప్పి అంటూ ఆసుపత్రికి వెళ్లిన పాపానికి ప్రమాదకరమైన జబ్బు ఉందని చనిపోతారని గిరిజనులను బెదిరించి అపెండిసైటిస్‌ ఆపరేషన్లు నిర్వహించేశారు నకిలీ డాక్టర్లు. ఒక్కో ఆపరేషన్‌కు 20 నుంచి 30 వేలు వసూలు చేసినట్లు సమాచారం. అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో అప్పులు తెచ్చి మరీ ఆపరేషన్లు చేయించుకుంటున్నారు గిరిజనులు.

ఓ ప్రైవేటు ఆసుపత్రి కేంద్రంగా....

కౌడిపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి కేంద్రంగా ఇద్దరు ఆర్‌ఎంపీ, ఒక పీఎంపీ ఈ అక్రమ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఏకంగా ఒక ఆపరేషన్‌ థియేటర్‌, మెడికల్‌ షాపును నడుపుతూ అక్రమదందా సాగిస్తున్నారు. గతంలో ఇదే తరహాలో గర్భసంచి ఆపరేషన్లు నిర్వహించినట్లు సమాచారం. నకిలీ డాక్టర్ల ఆగడాలతో అమాయక ప్రజల ప్రాణాలు పణంగా మారుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు.  

16:35 - November 25, 2015

హైదరాబాద్ : రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలకు సన్నాహాలు మొదలయ్యాయి. ఓ వైపు బీహార్‌ ఎన్నికల విజయంతో ప్రతిపక్షాలు బలం పుంజుకున్నాయి. దేశవ్యాప్తంగా నెలకొన్న అసహన పరిస్థితులపై కూడా ప్రతిపక్షాలు బీజేపీని ఇరకాటంలో పడేసేందుకు సమాయత్తం అవుతున్నాయి. మరో వైపు జీఎస్టీ సహా కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు అధికార పక్షం ఎత్తుగడలు వేస్తోంది.

అసహనం అంశంపై..........

శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో.. అసహనం అంశం.. సెగ పుట్టించనుంది. దేశంలో అసహనం పెరిగిందంటూ ఆందోళనలు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఆ అంశాన్ని పార్లమెంట్‌లో చర్చకు పట్టుపట్టేందుకు ప్రతిపక్షాలు సమాయత్తం అవుతున్నాయి. దీనిపై నోటీసు ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే ఇప్పటికే తెలిపారు.

సమావేశాల్లో వ్యూహాలను రచించేందుకు...

మరోవైపు... సమావేశాల్లో వ్యూహాలను రచించేందుకు... కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నివాసంలో జరిగిన కేంద్ర మంత్రుల భేటీలో జీఎస్‌టీ, రియల్ ఎస్టేట్, ద్రవ్య బిల్లులతో సహా పలు కీలకమైన బిల్లుల గురించి చర్చించారు. కాంగ్రెస్ సహా పలు విపక్షాలు జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జీఎస్‌టీ బిల్లుకు మద్దతు తెలపాలని కోరనున్నారు.

రాజ్యాంగ దివస్ అంశంపై....

శీతాకాల సమావేశాలు ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నా తొలి రెండు రోజులు రాజ్యాంగ దివస్ అంశంపై చర్చ కోసం కేటాయిస్తూ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. దీంతో లోక్‌సభలో ఈ నెల 30వ తేదీనే చర్చకు సమయం లభించే అవకాశం ఉన్నది. మరోవైపు వర్షాకాల సమావేశాలు పూర్తిగా వృథాగా ముగిసిన నేపథ్యంలో శీతాకాల సమావేశాల్లో ఆ పరిస్థితి రాకుండా చూడాలని పాలక బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.

అసహనంపై కేంద్రం మెడలు వంచి తీరాల్సిందేనని...

దేశవ్యాప్తంగా పెరుగుతున్న అసహనంపై కేంద్రం మెడలు వంచి తీరాల్సిందేనని, వైఫల్యాలను ఎండగట్టాల్సిందేనని పట్టుదలగా ఉన్న ప్రతిపక్షాలు అందుకు తగిన వ్యూహాన్ని రచిస్తున్నాయి. ఇందులో భాగంగా నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై ప్రశ్నాస్త్రాలు సంధించి.. సమాధానం కోసం పట్టుబట్టాలని వివిధ పార్టీలకు చెందిన 60 మంది ఎంపీలు... నిర్ణయించారు. మొత్తానికి రేపటి నుంచి ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాలు.. రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

16:31 - November 25, 2015

ఉసిరి చేతిలో ఉంటే చాలు సర్వరోగాలూ పోతాయని పెద్దలు అంటారు. చలికాలం లో ప్రకృతి ప్రసాదించిన అపురూప వరాలు ఉసిరికాయలు. ఉసిరి కాయంటే తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. అంతే కాదండోయో ఇందులో ఉండే ఆరోగ్యప్రయోజనాలు తెలుసుకుంటే మీకు ఆశ్చర్యం కలగక మానదు. స్వచ్ఛంగా కనిపిస్తూ చూడగానే తినాలనిపించే అత్యుత్తమమైన మూలిక. అందుకే దీనిని మూలికల రాజు అంటారు. ఉసిరి ద్వారా ఆరోగ్యవంతమైన శరీరాన్ని మన సొంతం చేసుకోవచ్చు. ఉసిరికాయను ఇంగ్లీష్ లో gooseberry అంటారు. దీని పేరులాగే ఇవి తినడానికి కూడా పుల్లగా, వగరుగా ఉంటాయి. ఆకుపచ్చగా ఉండే వీటిలో ఔషధ గుణాలు కూడా మెండుగా ఉంటాయి. ఈ ఉసిరికాయలో విటమిన్ సి, మరియు విటమిన్ ఐ పుష్కలంగా ఉంటుంది. ఉసిరి కాయలను, గింజలను, ఆకులను, పూలను, వేళ్ళను, బెరడును ఆయుర్వేద ఔషధాలలో వాడతారు.

కొన్ని ఉపయోగాలు...

ఉసిరిని తీసుకోవడం వల్ల శరీర బరువును తగ్గించుకోవడంతో పాటు అదనపు కొవ్వును కరిగించుకోవచ్చు.

ఉసిరికాయను హెయిర్ ఆయిల్ లో కలిపి రాసుకుంటే జుట్టు గట్టిగ ఉంటుంది.

ఉసిరికాయ తినటం వల్ల గొంతు సమస్యలు తగ్గించుకోవచ్చు, కోరింత దగ్గును తగ్గిస్తుంది.

ఉసిరిని తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.

గ్యాస్ సమస్యతో బాధపడుతున్న వారు ఒక గ్రామ్ ఉసిరి పౌడర్ తీసుకొని దీనికి కొంచెం పంచదార కలుపుకొని ఒక గ్లాస్ నీటిలో కలుపుకొని రోజుకు రొండు సార్లు తాగాలి.

ఉసిరి వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఉసిరి వల్ల స్పెర్మ్ కౌంట్ కూడా పెరుగుతుంది.

ఉసిరి రోజు తినటం వల్ల ఉపిరితిత్తులకు బాగా బలం వస్తుంది. ఉసిరి లో క్రోమియం అధికంగా ఉంటుంది దీని వలన మధుమేహాన్ని అదుపులో ఉంచొచ్చు.

ఉసిరి కాయ తినటం వల్ల అస్తమ రోగులకు మంచి ఉపయోగకారిగా ఉంటుంది.

ఉసిరి యూరినరి ప్రొబ్లెమ్స్ తగ్గించటంలో బాగా సహకరిస్తుంది. ఉసిరి కాయల గింజల పౌడర్ని నీమ్మరసంతో కలిపి రాసుకుంటే ఒక గంటలో పేలు చచ్చిపోతాయి.

అమీర్ ఖాన్ పై దేశ ద్రోహం కేసు...

హైదరాబాద్ : దేశంలో అసహనం పెరిగిపోతుందంటూ ఆందోళన వ్యక్తం చేసిన బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ పై పలుచోట్ల కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, దేశద్రోహం కేసు నమోదైంది. డిసెంబర్ 1న కాన్పూర్ సెషన్స్ కోర్టులో హాజరుకావాలని ఆయనకు నోటీసు జారీ అయింది. మరోవైపు అమీర్ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా కలకలం రేగుతోంది. కొంతమంది ఈ వ్యాఖ్యలను సమర్ధిస్తుంటే, మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. అయితే మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ మాత్రం తనపై వస్తున్న విమర్శలకు ఇంతవరకు స్పందించలేదు.

ఎంపి పసునూరికి సీఎం కేసీఆర్ అభినందనలు

హైదరాబాద్: వరంగల్ లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ భారీ మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈమేరకు ఇవాళ ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి తనకు సీటు ఇచ్చి గెలిపించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కష్టపడి ఎన్నికల ప్రచారం చేసి గెలిచావని పసునూరిని సీఎం అభినందించారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం పార్లమెంట్‌లో పార్టీ సభ్యులతో కలిసి పనిచేయాలని సీఎం పసునూరికి సూచించారు.

తాగిన మైకంలో చెవి కొరికేశాడు...

వరంగల్: తాగిన మైకంలో ఘర్షణపడ్డ వ్యక్తి తన ప్రత్యర్థి చెవిని కొరికి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఉదంతం వరంగల్ జిల్లా పరకాల మండలంలోని లక్ష్మీపురంలో మంగళవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. లక్ష్మీపురం గ్రామానికి చెందిన సాంబయ్య ఇదే గ్రామానికి చెందిన వైనాల భద్రయ్యతో గొడవపడ్డాడు. తాగిన మైకంలో ఉన్న సాంబయ్య భద్రయ్య చెవిని కొరకి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటనపై బాధితుడు భద్రయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

15:22 - November 25, 2015

చిత్తూరు : చిత్తూరు గుర్రంకొండలో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్‌ స్కూల్‌ కూలిపోవడంతో ఒక చిన్నారి మృతి చెందింది. మరొకరి పరిస్ధితి విషమంగా ఉంది. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మధ్యాహ్న భోజనం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఎల్‌కేజీ చదువుతున్న అఫ్సర్‌ అనే నాలుగేళ్ల బాలిక అక్కడికక్కడే చనిపోగా.. మరో ముగ్గురు చిరుహాసిని, సుమియా, కుసుమ అనే ముగ్గురు బాలికలకు తీవ్రంగా గాయాలయ్యాయి. వీరి పరిస్ధితి సీరియస్‌గా ఉండటంతో బెంగళూరుకు అంబులెన్స్‌లో తరలించారు. మరో 17 మందికి మదనపల్లె ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. శిథిలావస్ధలో ఉన్న ఓ పాత భవనంలో ఇండియన్‌ పబ్లిక్‌ స్కూల్‌ అనే ప్రైవేటు విద్యాసంస్ధను నిర్వహిస్తున్నారు. గత వారంరోజులుగా కురుస్తున్న వర్షాలతో గోడలు మరింత నానిపోయి.. ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

15:17 - November 25, 2015

విజయవాడ : విశాఖ మన్యంలో బాక్సైట్ మైనింగ్ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు డిమాండ్ చేశారు. ఆయన బుధవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.... బాక్సైట్ మైనింగ్ విషయంలో గిరిజనుల దగా చేస్తోందని ఆరోపించారు. వైట్ పేపర్, చర్చల పేరుతో మైనింగ్ తవ్వకాలు జరిపితే ఈ ప్రభుత్వానికి భంగపాటు తప్పదని హెచ్చరించారు. టిడిపిఅధికారంలోకి వచ్చిన 18 నెలలు అయినా ఇప్పటికీ గిరిజన సలహా మండలి ని ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాల విషయంలో చట్టాలు పాటించలేదని చెప్పిన బాబు గిరిజను భూముల విషయంలో గ్రామసభలలో చర్చించాలని డిమాండ్ చేశారు. ఆనాడు వైఎస్ ను విమర్శించిన చంద్రబాబు ప్రైవేటు, కార్పొరేట్ కంపెనీలకు కట్ట బెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని మండి పడ్డారు. బాక్సైట్ తవ్వకాల విషయంలో టిడిపి మోసం పూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటికే జరుగుతున్న బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ప్రైవేటు పాఠశాల పై కప్పు కూలి విద్యార్థి మృతి

చిత్తూరు : గుర్రం కొండలోని ఇండియన్ పబ్కిల్ స్కూల్ పై కప్పు కూలింది. ఈ ప్రమాదంలో అప్సర అనే విద్యార్థిని మృతి చెందగా మరో 20 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. వీరిలో ముగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చికిత్స నిమిత్తం వీరిని మదనపల్లె ఆస్పత్రికి తరలించారు.

14:53 - November 25, 2015

విజయవాడ : అసలే ఆర్థిక లోటుతో అల్లాడిపోతున్న ఏపీని తుఫానులు, వరదలు మరింత ఇబ్బందిపెడుతున్నాయి.. కేంద్రంనుంచి సాయంపై క్లారిటీ లేకపోవడంతో సర్కారులో టెన్షన్ మొదలైంది.. మొదటినుంచి మోదీ ప్రభుత్వంనుంచి ఆశించినస్థాయిలో సహకారం లేక ఏపీ ప్రభుత్వానికి కష్టాలు తప్పడంలేదు.... మిత్రపక్షమైనా సాయం అందడంలేదంటూ లోలోన బాధపడిపోతోంది టీడీపీ సర్కారు..

హుదూద్‌ తుఫాన్తో...

గత ఏడాది హుదూద్‌ తుఫాన్ విశాఖ నగరాన్ని అతలాకుతలం చేసింది.. వేలకోట్ల ఆస్తినష్టం జరిగింది.. నగరం రూపురేఖలే మారిపోయాయి.. మత్స్యారుల పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది.. వెంటనే తుఫాన్‌ ప్రాంతాలను ఆదుకోవాలంటూ కేంద్రాన్ని సాయం కోరారు చంద్రబాబు.. తుఫాన్‌పై స్పందించిన ప్రధాని మోదీ.. వరద ప్రభావిత ప్రాంతాలను హెలికాప్టర్‌ ద్వారా చూశారు.. ఆందోళన చెందొద్దంటూ ఎన్నో ఓదార్పు మాటలు చెప్పారు.. వెయ్యికోట్లు ఇస్తామని హమీ ఇచ్చారు.. చివరకు 284కోట్లతో సరిపెట్టేశారు..

కోస్తా జిల్లాల్లో వరదలు భీభత్సం.....

ఇప్పుడు రాయలసీమతోపాటు.. కోస్తా జిల్లాల్లో వరదలు భీభత్సం సృష్టించాయి.. భారీగా నష్టాన్ని మిగిల్చాయి.. వేలాదిమందిని రోడ్డున పడేశాయి.. పంటపొలాలన్నీ నీటమునిగాయి.. అసలే అప్పులతో కొట్టుమిట్టాడుతున్న ఏపీ సర్కారుకు వీరిని ఆదుకోవడం తలకుమించిన భారంగా మారింది.. కేంద్రంనుంచి సాయం అందితే తప్ప బాధితులకు న్యాయం జరిగేలా లేదు.. ఇప్పుడైనా మోదీ సర్కారు భారీగా సాయం చేస్తుందని టీడీపీ సర్కారు ఆశలు పెట్టుకుంది... వరదలపై ప్రధాని మోడీ, వ్యవసాయ మంత్రి రాధామోహన్‌ సింగ్‌కు లేఖలు రాశారు చంద్రబాబు.. 3వేల కోట్లవరకూ నష్టం జరిగిందని రిపోర్టు పంపారు..

తమిళనాడులోనూ అంతులేని నష్టం...

వరదలు తమిళనాడులోనూ అంతులేని నష్టాన్ని మిగిల్చాయి.. ఈ రాష్ట్రానికి కేంద్రం 940కోట్లు ఇస్తామని ప్రకటించింది.. ఏపీకి ఏం ఇస్తారన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు.. ఈసారిమాత్రం మోదీ సర్కారు ఉదారంగా వ్యవహరిస్తుందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.. 

14:50 - November 25, 2015

విశాఖ : ఆధార్ కార్టు తప్పనిసరి చేసిన ప్రభుత్వం.. ఆ కార్డు పొందాలంటే మాత్రం రాజకీయ నేతల చుట్టూ తిరిగేలా నిబంధనలు పొందుపరిచింది. కొత్త కార్టు కోసం దరఖాస్తు చేసేవారికి ఆ ప్రాంత ఎమ్మెల్యేల గుర్తింపు ధ్రువ పత్రం ఉంటే తప్ప కార్డు ఇవ్వబోమని విశాఖలోని కార్వీ సంస్ధ పెడుతున్న ఆంక్షలు ప్రజలకు అష్ట కష్టాలు తెచ్చిపెడుతున్నాయి.

ఇప్పటికీ రకరకాల నిబంధనలు పెట్టిన ప్రభుత్వం ..

ఆధార్ కార్డు.. ప్రతి ఒక్కరికి అత్యవసరం.. ఇది సర్కారు చెప్పే మాట. ఆధార్ కోసం ఇప్పటికీ రకరకాల నిబంధనలు పెట్టిన ప్రభుత్వం .. కొత్తగా ఎమ్మెల్యేల ధ్రువ పత్రాన్ని తప్పనిసరి చేసింది. ఆయా ప్రైవేటు ఏజెన్సీలకు పరోక్షంగా ఆదేశాలు సైతం జారీచేసింది. కొత్తగా ఎవరైనా ఆధార్ కార్డు కోసం వెళ్తే .. నియోజకవర్గ ఎమ్మెల్యే ధ్రువపత్రం తప్పనిసరి చేస్తూ విశాఖలోని కార్వీ అనే ఏజెన్సీ ప్రజలకు ముప్పతిప్పలు పెడుతోంది.

ఎమ్మెల్యే ధ్రువ పత్రం అవసరం లేకపోయినా...

వాస్తవానికి ఎమ్మెల్యే ధ్రువ పత్రం అవసరం లేదు. కళాశాలలో చదివే విద్యార్ధులకు ఆయా కాలేజీ నుంచి గుర్తింపు పత్రం చాలు. కొన్నింటికి గెజిటెడ్ అధికారి గుర్తింపు అవసరం. మరీ అవసరమైతే ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యే గుర్తింపు పత్రం అవసరం అని నిబంధనల్లో పెట్టారు. కాని విశాఖలోని కార్వీ సంస్ధ వచ్చే ప్రతివారికి ఎమ్మెల్యే లెటర్ ఉంటేనే కార్డు అంటూ ఇబ్బందులు పెడుతున్నారు.

ఇసుక తోట ప్రాంతంలో ఉన్న కార్వీ ఏజెన్సీలో....

విశాఖ ఇసుక తోట ప్రాంతంలో ఉన్న కార్వీ ఏజెన్సీలో ఆధార్ కార్డుల కోసం గుర్తింపు ధ్రువప్రతాలు, ఐరిస్ గుర్తింపు జరుగుతోంది. కార్డుల కోసం వచ్చేవారికి సంస్ధ ప్రతినిధులు ఇస్తున్న సమాధానాలు అయోమయానికి గురిచేస్తున్నాయి. ఆధార్ కార్డుల మంజూరుకు రాజకీయాలు జోడించడం.. టిడిపి ఎమ్మెల్యేల ప్రాంతాలలో ఖచ్చితంగా ఎమ్మెల్యే గుర్తింపు ధ్రువపత్రం ఉండాలని హుకుం జారీచేస్తున్నారు. దీంతో ఆధార్‌ గుర్తింపు విశాఖ వాసులకు కష్టాలు తెప్పిస్తోంది.

14:45 - November 25, 2015

హైదరాబాద్ : తెలంగాణ సెంటిమెంట్లకు, దైవ భక్తికి పెద్ద పీఠ వేసే తెలంగాణ సీఎం కేసీఆర్‌ మరోసారి భారీ యాగాన్ని నిర్వహించేందుకు సిద్ధమతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలు పెట్టారు. డిసెంబర్ 23 నుంచి 27 వరకు నాలుగు రోజుల పాటు మెదక్ జిల్లాలోని తన వ్యవసాయ క్షేత్రం వద్ద పెద్ద ఎత్తున ఆయుత చండీ మహాయాగం నిర్వహించేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని......

తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని గతంలో కూడా ముఖ్యమంత్రి తెలంగాణ భవన్‌తో పాటు.. జితేందర్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో యాగాలను నిర్వహించారు. ఈ విడత నిర్వహిస్తున్న ఆయుత చండీ మహాయాగం ఎంతో ప్రాధాన్యతతో కూడుకున్నదని.. దీనికి వేలాది మంది రుత్వికులు అవసరమని, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి రుత్వికులను రప్పిస్తామన్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఈ యాగానికి రాష్ట్రపతితో పాటు పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉందని సీఎం వెల్లడించారు. చంద్రబాబును తాను స్వయంగా వెళ్లి ఆహ్వనిస్తానని కేసీఆర్ అన్నారు.

ఎంతో మంది ఔత్సాహికులు.....

అతి ప్రాధాన్యత కలిగిన యాగం కావడంతో ఎంతో మంది ఔత్సాహికులు తమ వంతు సహాయాన్ని అందిస్తామన్నారని కేసీఆర్‌ చెప్పారు. యాగానికి ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయిని కూడా వినియోగించమని.. తన సొంత ఖర్చులతోనే యాగాన్ని చేస్తానని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. 

14:40 - November 25, 2015

హైదరాబాద్ : తెలంగాణలో మరో ఎన్నికల సందడి మొదలైంది. స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. హైదరాబాద్‌ మినహా మిగతా జిల్లాల్లో 12 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈసీ షెడ్యూల్‌ విడుదల చేయడంతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. 

12 స్థానిక సంస్థల నియోజకవర్గాలకు షెడ్యూల్‌ విడుదల ......................

వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నిక ఫలితం వెలువడడమే ఆలస్యం మరో ఎన్నికల సమరానికి తెలంగాణ రాష్ట్రం సిద్ధమైంది. శాసనమండలిలో ఖాళీగా ఉన్న 12 స్థానిక సంస్థల నియోజకవర్గాలకు ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.

డిసెంబర్‌ 2న ఎన్నికల నోటిఫికేషన్‌ .......

ఇక ఎన్నికల నోటిఫికేషన్‌ డిసెంబర్‌ 2న వెలువడనుంది. నామినేషన్ల సమర్పణకు డిసెంబర్‌ 9 చివరితేదీగా నిర్ణయించారు. 10వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్లు 12 వతేదీ వరకు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ఇక ఈ ఎన్నికలు 27వ తేదీన నిర్వహిస్తారు. ఎన్నికల కౌంటింగ్‌ 30వ తేదీన జరుగుతుందని కేంద్ర ఎన్నికల అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌ మినహా మిగతా జిల్లాల్లో ఎన్నికలు .............

మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలలో హైదరాబాద్‌ మినహా.. తెలంగాణలోని మిగతా జిల్లాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో కరీంనగర్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో రెండేసి స్థానాలు ఉండగా.. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరగనున్న అన్ని జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల కావడంతో రాష్ట్రంలో మరోసారి ఎన్నికల వాతావరణం నెలకొంది. 

14:39 - November 25, 2015

హైదరాబాద్ : న్యాయసలహాలు, సూచనలు అందించే 'మైరైట్' కార్యక్రమంలో పరస్పర అంగీకారంపై విడాకులు(కన్సర్న్డ్ డైవర్స్) ఎలా పొందవచ్చు అనే అంశం పై ప్రముఖ న్యాయవాది పార్వతి తెలియజేశారు. పార్వతి ఏఏ అంశాలను తెలియజేశారో వినాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి..

14:31 - November 25, 2015

హైదరాబాద్ : ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ అక్కసు వెళ్లగక్కుతున్నారని టీ టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలనే తాము వ్యతిరేకించామని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నాయంటున్న కేసీఆర్‌..తను కూడా అదే విధంగా వ్యవహరించారన్న విషయాన్ని తెలుసుకోవాలని రేవంత్‌రెడ్డి అన్నారు. 

14:29 - November 25, 2015

కృష్ణా : మోపిదేవి బీసీ ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుడు తన విశ్వరూపాన్ని చూపాడు. టీచర్‌ శ్రీనివాసరావు పదోతరగతి విద్యార్థులను చితకబాదడంతో ఓ విద్యార్థికి చేయి విరిగింది. మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ విద్యార్థులను అవనిగడ్డ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

14:27 - November 25, 2015

కడప : రాజంపేట డివిజన్‌ మందపల్లె చెయ్యేటి వాగులో చిక్కుకున్న ఐదుగురు జాలర్లను స్థానికులు రక్షించారు. ఈ జాలర్లు మంగళవారం నాడు చేపల వేటకు వెళ్లారు. వాగు మధ్యలో ఉన్న గట్లుపై నిలబడి చేపలు పడుతున్నారు. అదే సమయంలో పైన ఉన్న అన్నమయ్య ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు వదిలారు. దీంతో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. గట్లపై ఉన్న జాలర్లు ప్రవాహంలో చిక్కుపోయారు. స్థానికుల సహాయంతో బుధవారం ఉదయం జాలర్లు చెయ్యేటి వాగు నుంచి బయటపడ్డారు. 

14:25 - November 25, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా ఉదయభాస్కర్‌ నియమితులయ్యారు. ఆయన నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉదయ భాస్కర్‌ కాకినాడ జేఎన్‌టీయూలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 

సర్వే వల్లే వరంగల్ లో ఓడిపోయాం : శంకర్రావ్

హైదరాబాద్ : సర్వే సత్యనారాయణ వల్లే వరంగల్ లో ఓడిపోయామని కాంగ్రెస్ నేత శంకర్ రావు అన్నారు. మల్కాజ్ గిరి, కంటోనెమమంట్ చెల్లని సర్వే వరంగల్ లో ఎలా గెలుస్తారని శంకర్ రావు ప్రశ్నించారు. ఈ ఓటమికి బాధ్యత సీఎల్పీ,పీసీసీల లో ఎవరు బాధ్యత తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ముగ్గురు ఉగ్రవాదుల హతం

జమ్మూకాశ్మీర్ : తంగ్దార్ ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. టెర్రరిస్టుల కాల్పుల్లో ఓ స్థానిక పౌరుడు మృతి చెందాడు. ఉగ్రవాదుల నుంచి 3 ఏకే-47 స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల కోసం భారత సైన్యం కూబింగ్ నిర్వహిస్తోంది.

విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయుడు

కృష్ణా: మోపిదేవి ఆశ్రమ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులను ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు చితకబాదారు. ఇద్దరు విద్యార్థులతో వంద గుంజీలు తీయించి తీవ్రంగా కొట్టడంతో ఒకరికి చెయ్యి విరగ్డా మరో విద్యార్థి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు.

పార్లమెంట్ ఆవరణలో అఖిలపక్ష సమావేశం

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ పార్టీ ఓడలేదు - శంకర్రావు...

హైదరాబాద్ : వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల్లో ఓడింది కాంగ్రెస్ పార్టీ కాదని, అభ్యర్థి సర్వే సత్యనారాయణ అని మాజీ మంత్రి, సీనియర్ నేత శంకర్రావు వ్యాఖ్యానించారు. సర్వే స్థానికుడు కాకపోవడం వల్లే అతడిని ప్రజలు ఓడించారన్నారు. 

ప్రజల తీర్పును గౌరవిస్తాం - షబ్బీర్..

హైదరాబాద్ : వరంగల్‌ ఉపఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలను ఆపేస్తామని భయపెట్టారని ఆయన ఆరోపించారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని షబ్బీర్‌ డిమాండ్ చేశారు.

 

కేంద్రం సాయం చాలా అవసరం - బాబు..

విజయవాడ : రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సాయం చాలా అవసరమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విభజన చట్టంలోని హామీలన్నీ కేంద్రం నెరవేరుస్తుందన్న నమ్మకం తనకు ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. తుపానులు, వరదలు వంటి విపత్తులను ఎదుర్కోవాలంటే కేంద్రం సాయం తప్పనిసరన్నారు. 

 

భారత్ 124/5..

నాగ్ పూర్ : సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో భారత బ్యాట్స్ మెన్స్ క్యూ కడుతున్నారు. 116 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. విజయ్ (40), ధావన్ (12), పుజరా (21), కోహ్లీ (22), రహానే (13) పరుగులు చేశారు. క్రీజులో శర్మ 2, సాహా 6 పరుగులతో ఆడుతున్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో మోర్కెల్ మూడు, హార్మర్, ఎల్గర్ చెరో ఒక వికెట్ తీశారు. 

13:31 - November 25, 2015

ఆదిలాబాద్ : అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే ప్రాంతమిది. అడవుల జిల్లాగా పేరుగాంచిన వెనుకబడిన జిల్లా ఇది. ఇక పల్లెలో అభివృద్ధి ఊసే ఉండదు. అలాంటి ప్రాంతంలో కొత్త సంస్కృతి పుట్టుకొచ్చింది. కోడి పందాలను, పందెం కోళ్లను సినిమాల్లోనే తప్పా నేరుగా చూడని అడవిలో పందెం కోళ్లు కాలుదువ్వుతున్నాయి. పండగకో..పబ్బానికో కాదు ఏడాది పొడవునా ఆదిలాబాద్‌ జిల్లాలో కోడిపందాలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పుర్‌ టి, కౌటాల మండలాల్లో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. ప్రధానంగా లక్ష్మిపూర్‌, లోన్వెళ్లు, డబ్బా, బాబాసాగర్,ముత్యంపెట్,బాబాసాగర్,చింతల మానేపల్లి, రవింద్రానగర్ ...మరో మారుమూల ప్రాంతమైన దహేగాం మండలంలోని, గొర్రె గుట్ట, పెసరకుంటా,లగ్గాం, కోంచెవెళ్లిలో కోడి పందాల జోరు కొనసాగుతోంది.

ఆదివారం, మంగళవారాల్లో కోడిపందాలు..
ప్రతి ఆదివారం ,మంగళవారాల్లో ఆయా గ్రామాల్లో కోడిపందాల సందడి నెలకొంటోంది. గ్రామంలోని యువకులు, పెద్దలు పనులు ఎగ్గొట్టి పందెం కాస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పాడి పశువులను పూజించే పొలాల అమావాస్య పండుగ సమయంలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. దసరా, సంక్రాంతి పండుగ సీజన్‌లలోను పందెం రాయుళ్లు ఉన్న డబ్బునంతా ఊడ్చి కోడి పందాల్లో కాస్తున్నారు.

బానిసలు..
గ్రామాల్లోని యువకులు, పెద్దలు ఇదే పనిగా జూదానికి బానిసలు కావడంతో సంసారాలు గుల్ల అవుతున్నాయి. కూలీ డబ్బులను సైతం కోడి పందాల్లో పెట్టి చేతులు కాల్చుకుంటున్నారు జూదగాళ్లు. కోడి పందాలను కట్టడి చేసేందుకు పోలీసులు అప్పుడప్పుడు గ్రామాల్లో దాడులు చేసి యువకులపై కేసులు నమోదు చేస్తున్నారు. కొన్ని పందెం కోళ్లను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. అయినా ఆయా గ్రామాల్లో కోడిపందాల సంస్కృతి అంతకంతకూ పెరుగుతూనే ఉంది కాని కట్టడి కావడం లేదు.

కోడిపందాల వెనుక ముఠాలు..
ఆదిలాబాద్‌ జిల్లాలో కోడిపందాల వెనుక ముఠాలు పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. పందెం కోళ్ల పెంపకం దగ్గరనుంచి ఎక్కడెక్కడ పందాలను నిర్వహించాలనే దానిపై పక్కా ప్రణాళికతో ఈ ముఠాలు పనిచేస్తున్నట్టు సమాచారం. ముఠాల గుట్టు రట్టు చేయకుంటే పల్లెలు కోడిపందాల జూదంలో పడి ఆర్థికంగా చితికిపోయే ప్రమాదముంది.

13:28 - November 25, 2015

హైదరాబాద్ : మరికొన్ని రోజుల్లో గ్రేటర్‌ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి.. ఇదే టైంలో మున్సిపల్ కార్పొరేషన్‌ వివిధ రకాల కార్యక్రమాలు చేపడుతోంది. వాటిల్లో ముఖ్యమైంది పారిశుధ్యం. చెత్తను సేకరించడం, సిటీ బయటకు తరలించడం దానిని శాస్త్రీయ పద్ధతిలో పునర్వినియోగం చేయడం... ఇలాంటి అనేక ప్లాన్లు ఉన్నాయి. అయితే ఈ మూడు చర్యలకూ ఓ ప్రధాన సమస్య అడ్డంకిగా నిలుస్తోంది. ప్రతి ఇంటి నుంచీ తడి పొడి చెత్తను రెండు బుట్టల ద్వారా సేకరించి ఆటో టిప్పర్ల ద్వారా తరలించనున్నారు. అయితే సేకరించిన చెత్తను మొదటి దశలో ఎక్కడ వేయాలన్నదే సమస్యలా మారింది. ఇప్పటివరకూ యూసుఫ్‌గూడ, లోయర్‌ ట్యాంక్‌బండ్, ఇమ్లీబన్‌ బస్‌ డిపో వద్దనున్న ట్రాన్స్ ఫర్ సెంటర్లకు తరలిస్తున్నారు. ఇక్కడ మాత్రమే శాస్త్రీయ పద్ధతుల్లో ట్రాన్స్‌ఫర్ స్టేషన్లు ఉన్నాయి. శివారు ప్రాంతాల్లో రోడ్డుపక్కన లేక ఇతర స్థలాల్లో ఎక్కడ అవకాశముంటే అక్కడ చెత్తను డంప్‌ చేస్తున్నారు. అక్కడ నుంచి చివరగా జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డుకు తరలించేవారు. అయితే ఇంతవరకు లేని సమస్య కొత్తగా మొదలైంది.

వ్యతిరేకిస్తున్న స్థానికులు..
ప్రతి ఇంటి నుంచీ ఆటో టిప్పర్ల ద్వారా సేకరించిన చెత్తను 3 నుంచి 5 కిలోమీటర్ల రేడియస్‌ పరిధిలో డంప్ చెయ్యాల్సి ఉంటుంది. ఇందుకోసం 25 నుంచి 30 కేంద్రాలను నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. వీటికి నగరవాసుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. డంపింగ్ కేంద్రాల నుంచి దుర్వాసన వస్తుందని, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని స్థానికులు భయపడుతున్నారు. అందుకే ఆ కేంద్రాలను తమ ఇళ్ల వద్ద అనుమతించబోమని స్పష్టం చేస్తున్నారు.

నిర్మాణాలకు ప్రణాళికలు..
ఇప్పటికే పలు ట్రాన్స్ ఫర్‌ కేంద్రాలకు స్థలాలను ఐడెంటిఫై చేసిన అధికారులు అక్కడ నిర్మాణాలు చేపట్టడానికి ప్రణాళికలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్నవాటిని సరైన పద్ధతుల్లో నిర్వహిస్తే కొత్తవాటికి అడ్డంకులు తొలుగుతాయి. లేదంటే కొత్త కేంద్రాల ఏర్పాటుకు పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశముంది. ప్రస్తుత పరిస్థితుల్లో స్థానికులను అధికారులు ఏవిధంగా కన్విన్స్ చేస్తారో చూడాలి.  

13:23 - November 25, 2015

హైదరాబాద్‌ : డిసెంబరు 23 నుంచి 27 వరకు స్కై ఫెస్ట్ కార్యక్రమం జరగనుంది. నగరంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కేవలం విదేశాలకు మాత్రమే పరిమితమైన హాట్‌ బెలూన్స్ రైడ్‌ నగరవాసులకు కొత్త అనుభూతుని కలిగిస్తుందని మంత్రి కేటిఆర్‌ అన్నారు. కేన్సర్ రోగులకు చికిత్స అందించడంతో పాటు జీవిత చరమాంకంలో ఉన్నవారికి సపర్యలు సేవలు చేయడానికి స్పర్స్‌ హోస్పైస్‌ ఛారిటీని రోటరీ క్లబ్‌ ఏర్పాటుచేసింది. ఈ ఛారిటీకి సహకరించేందుకు 5 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. హాట్‌ ఎయిర్‌ బెలూన్స్ ఎగురవేయడం స్కై ఫెస్ట్ లో హైలెట్‌గా నిలుస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. 

13:21 - November 25, 2015

హైదరాబాద్ : వరంగల్ ఎంపీ స్థానానికి జరిగిన ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ పరాజయం చెందడంపై టీ కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేత జానారెడ్డి స్పందించారు. వరంగల్‌ లోకసభ ఉప ఎన్నిక ఓటమితో పార్టీ శ్రేణులు ఢీలాపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఓటమిపై సమీక్ష జరిపి ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఇచ్చిన హామీలన్నిటినీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేయాలని, ఓటమికి ఆత్మస్థైర్యం కోల్పోవడం సరికాదన్నారు. ప్రజలు విశ్వసించేలా మరింత ముందుకెళుతామని, కాంగ్రెస్ పార్టీ విధానాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. వరంగల్ ఉప ఎన్నికల్లో పనిచేసిన నాయకులు కార్యకర్తలకు జానారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

 

13:18 - November 25, 2015

ఢిల్లీ : రేపటినుంచి జరగనున్న పార్లమెంట్‌ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై అఖిలపక్ష సమావేశం ఢిల్లీలో ప్రారంభం అయ్యింది. ఈ సమావేశానికి అన్ని పక్షాల నేతలు హాజరయ్యారు. కీలక బిల్లులు బిల్లులు ప్రవేశపెట్టేందుకు అన్ని పక్షాలు సహకరించాలని విపక్షాలకు కేంద్ర మంత్రి వెంకయ్య విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశాల్లో జీఎస్టీ బిల్లు సైతం ప్రవేశ పెట్టేందుకు వీలుంది. అంతకంటే ముందు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి వెంకయ్యనాయుడు నివాసంలో భాజపా నేతల సమావేశం ముగిసింది. భేటీలో కేంద్రమంత్రులు ప్రకాశ్ జవదేకర్, రవిశంకర్‌ప్రసాద్, సుజనాచౌదరి, తెదేపా ఎంపీ సీఎం రమేష్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చించారు. 

13:14 - November 25, 2015

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మక చిత్రం 'బాహుబలి' అభిమానులకు షాక్ కలిగింది. గోవాలో జరిగే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా పనోరమా చిత్ర ప్రదర్శనకు బాహుబలిని ఎంపికచేయలేదు. దీనిపై తెలుగు చలనచిత్ర నిర్మాతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నిర్మాత కల్యాణ్‌.. నిర్వాహకులకు లేఖ కూడా రాశారు. తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిత్రం 'బాహుబ‌లి'. మ‌న‌దేశంలోనే కాదు విదేశాల్లోని ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు, ద‌ర్శకుడు రాజ‌మౌళిని ఎంతగానో అభినందించారు. అంతేగాక టాలీవుడ్‌కి కూడా హాలీవుడ్ స్థాయి ద‌ర్శకుల‌ను అందించ‌గ‌ల స‌త్తా ఉంద‌ని నిరూపించిన సినిమా. అందుకే జ‌నాలు నీర‌జ‌నాలు ప‌ట్టారు. క‌లెక్షన్ల వ‌ర్షం కురిపించారు. అందరూ స‌లామ్ కొట్టారు. అంతటి కీర్తిని సంపాదించిన సినిమాకు భార‌త‌దేశంలో జ‌రిగే చ‌ల‌న‌చిత్రోత్సవాల్లో చోటు దక్కలేదు. ఇది ఉత్తమ విలువలున్న చిత్రాన్ని అవమానించడమేనని సినిమా అభిమానులు అంటున్నారు.

బాహుబలి హావా..
దేశ విదేశాల్లో జ‌రిగే చిత్రోత్సవాల్లో బాహుబలి హవా మామూలుగా ఉండ‌టంలేదు. అసాధార‌ణ రీతిలో రిసీవ్ చేసుకున్నారు. ఈ మధ్యే బుసాన్‌ ఫిలిం ఫెస్టివల్లో మన సినిమాను ఒకటికి రెండుసార్లు ప్రదర్శిస్తే 5 వేల మంది పట్టే ఆడిటోరియం నిండిపోయింది. రాజమౌళికి అక్కడ స్టాండింగ్‌ ఒవేషన్‌ దక్కింది. మరికొన్ని చిత్రోత్సవాల్లోనూ బాహుబలి ప్రదర్శనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఐతే మన ఇండియాలో జరిగే ప్రతిష్టాత్మక పనోరమ చిత్రోత్సవాలకు మాత్రం బాహుబలి పనికి రాకుండా పోయింది.

ఇఫీ జ్యూరి సభ్యుల తిరస్కరణ..
గోవాలో ఏటా జరిగే ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా చిత్రోత్సవాలకు బాహుబలిని ఎంపిక చేయలేదు. కనీసం సెంట్రల్‌ కమిటీ పరిశీలనకు కూడా బాహుబలి నోచుకోలేదు. ప్రాథమిక దశలోనే బాహుబలిని ఇఫీ జ్యూరీ సభ్యులు తిరస్కరించడం గమనార్హం. దీనిపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. గతంలో పనోరమా విభాగంలో ప్రజాదరణ పొందిన హమ్‌ ఆప్కే హై కౌన్‌, త్రీ ఇడియట్స్‌ ప్రదర్శించారు. కానీ తెలుగు సినిమా అయిన బాహుబలికి మాత్రం చోటు దక్కలేదు.

జైట్లీకి సి.కల్యాణ్ లేఖ..
ఇదిలా ఉంటే కేంద్రప్రభుత్వం నిర్వహించే చిత్రోత్సవాల్లో వివక్షపై తెలుగు సినిమా నిర్మాతల మండలి అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్‌ కేంద్ర సమాచారశాఖ మంత్రి అరుణ్‌జైట్లీకి లేఖ రాశారు. గోవాలో జరుగుతున్న జాతీయ చలన చిత్రోత్సంలో బాహుబలి సినిమాను ప్రదర్శించకపోవడంపై నిరసన తెలుపుతున్నట్లు ఈ లేఖలో పేర్కొన్నారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న బాహుబలిని కేంద్రప్రభుత్వం గుర్తించకపోవడం దారుణమన్నారు.

నాలుగో వికెట్ కోల్పోయిన భారత్..

నాగ్ పూర్ : సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో భారత్ బ్యాట్స్ మెన్స్ మెల్లిమెల్లిగా వికెట్లు కోల్పోతోంది. 115 పరుగుల వద్ద రహానే (13)నాలుగో వికెట్ గా వెనుదిరిగాడు. 

బండ్లపల్లిలో దారుణం..

అనంతపురం : నార్పల మండలం బండ్లపల్లిలో దారుణం జరిగింది. పిల్లలకు పాలలో విషం కలిపి ఇచ్చి అనంతరం ఉరేసుకుని మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 

ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా ఉదయ్ భాస్కర్..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఛైర్మన్ గా పి.ఉదయ్ భాస్కర్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

జలహారం పనులపై టి.సీఎం సమీక్ష..

హైదరాబాద్ : జలహారం పనులపై అధికారులతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జూబ్లిహిల్స్ లోని ఎంసీహెచ్ఆర్డీలో సమీక్ష నిర్వహించారు. 

 

వంద పరుగులు దాటిన టీమిండియా స్కోరు..

నాగ్ పూర్ : సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో భారత్ మూడు వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. కోహ్లీ 13, రహానే 9 పరుగులతో ఆడుతున్నారు. తొలుత టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు విజయ్ 40, ధావన్ 12, పుజారా 21 పరుగులు చేసి అవుట్ అయ్యారు. 

పుజారా అవుట్..

నాగ్ పూర్ : సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో లంచ్ అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన కొద్దిసేపటికే మూడో వికెట్ కోల్పోయింది. పుజారా 21 పరుగులు చేసిఅ వుట్ అయ్యాడు. ప్రస్తుతం 94 పరుగులు చేసింది. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. విజయ్ (40), ధావన్ (12) పరుగులు చేసి పెవిలియన్ దారి పట్టారు. ప్రస్తుతం కోహ్లీ 13 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

లంచ్ సమయానికి భారత్ 85/2..

నాగ్ పూర్ : సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో భారత్ లంచ్ సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసింది. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. విజయ్ (40), ధావన్ (12) పరుగులు చేసి పెవిలియన్ దారి పట్టారు. ప్రస్తుతం పుజారా 18, కోహ్లీ 11 క్రీజులో ఉన్నారు. 

12:13 - November 25, 2015

కృష్ణా : కాదేదీ కల్తీకి అనర్హం అంటున్నారు బెజవాడలోని కొందరు కేటుగాళ్లు. నెయ్యి నుంచి గరం మసాల వరకు అన్నింటినీ కల్తీ చేస్తూ ప్రజా ఆరోగ్యానికి పొగపెడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా గుట్టుగా సాగుతున్న కల్తీ నెయ్యి దందా బట్టబయలైంది. దేశంలోని చాలా ప్రాంతాలకు నకిలీ సరుకులను సరఫరా చేసే ముఠాను.. పోలీసులు పట్టుకున్నారు. ప్రముఖ బ్రాండ్ల పేరుతో నెయ్యి తయారైనట్లుగా లేబుళ్ల తయారు చేసి మార్కెట్‌లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. హానికారక సాయనాలతో అడ్డదిడ్డంగా తయారు చేసి మార్కెట్‌లోకి దించేస్తున్నారు కల్తీ కిలాడీలు. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు.

2007 నుండి వ్యాపారం..
సింగ్‌నగర్లోని ఇందిరానాయక్‌ నగర్‌లో ఆవుల పణికుమార్‌ అనే వ్యక్తి... ఓ బిల్డింగ్‌లో 2007 నుంచి కల్తీ నెయ్యి దందా సాగిస్తున్నాడు. భారీస్థాయిలో మిషనరీ ఏర్పాటుచేసుకుని..150 మంది సిబ్బందితో దందా నడుపుతున్నాడు. నకిలీ నెయ్యి తయారు చేసి...వాటికి పలు కంపెనీల లేబుళ్లు తగిలించి ఏపీ, తెలంగాణతో పాటు ఒడిషా రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నాడు. ఇటీవల సింగ్‌నగర్‌లోని స్థావరంపై పోలీసులు దాడులు చేయడంతో... అరెస్టై బెయిల్‌పై బయటికొచ్చాడు. అడవినెక్కలంలోని మారుమూల ప్రాంతానికి కంపెనీని షిప్ట్‌ చేశాడు. అక్కడికి సామగ్రి తరలించి మళ్లీ నకిలీ దందాకు తెరలేపాడు.

విష రసాయనాలు...
నెయ్యితో పాటు మసాల దినుసులు, పసుపు, కారం...ఇక్కడ కల్తీ చేస్తున్నారు. ఇందుకోసం విషరసాయనాలను వాడుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఈ నకిలీ సరుకు తయారు చేస్తున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు..కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై దాడులు చేశారు. భారీ స్థాయిలో నకిలీ నెయ్యి డబ్బాలు, కల్తీ మసాల, పసుపు, కారం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పటమట పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. కల్తీ దందాతో ఫణికుమార్‌ ఏడాదికి సుమారు 25 కోట్ల లావాదేవీలు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

కల్తీ నెయ్యి పట్ల ప్రజలు అప్రమత్తం..
ఫణికుమార్‌ తన బావ అనిల్‌ కుమార్‌తో కలిసి కల్తీ దందా చేస్తున్నట్లు విచారణలో తేలింది. పరారీలో అతడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఫణికుమార్‌కు సహరించిన వ్యాపారులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. తక్కువ ధర లభిస్తోందని ఇలాంటి కల్తీ నెయ్యి కొనుగోలు చేసి మోసపోవద్దని ప్రజలను హెచ్చరిస్తున్నారు పోలీసులు. 

వరంగల్ లో పార్టీ ఓటమిపై జానా స్పందన...

హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నికల్లో పనిచేసిన నాయకులు కార్యకర్తలకు సీఎల్పీ నేత జానారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఓటమికి ఆత్మస్థైర్యం కోల్పోవడం సరికాదని, ప్రజలు విశ్వసించేలా మరింత ముందుకెళుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. 

 

హైటెక్స్ లో ఫౌల్ట్రీ ఇండియా -2015 ఎగ్జిబిషన్..

హైదరాబాద్ : హైటెక్స్ లో ఫౌల్ట్రీ ఇండియా -2015 ఎగ్జిబిషన్ ను మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఎగ్జిబిషన్ లో వివిధ దేశాల పౌల్ట్రీ యజమానులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో పౌలీ ఉత్పత్తులను ప్రోత్సాహిస్తున్నట్లు మంత్రి పోచారం తెలిపారు. చికెన్ ఉత్పత్తులపై మార్కెట్ ఫీజు మినహాయింపునివ్వడం జరిగిందని, పౌల్ట్రీ పరిశ్రమకు సబ్సిడీ ఇస్తున్నట్లు గుర్తు చేశారు.

 

కేంద్ర అఖిలపక్ష సమావేశం..

ఢిల్లీ : కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. శీతాకాల సమావేశాలకు, కీలక బిల్లుల ఆమోదానికి సహకరించాలని అన్ని పార్టీల నేతలను వెంకయ్య నాయుడు కోరారు. 

11:55 - November 25, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ప్రతిపక్షాలు ఎత్తి చూపడమే తప్పా అని టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వరంగల్ జిల్లా ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలపై పలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం రేవంత్ మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలపై కేసీఆర్ అక్కసు వెళ్లగక్కుతున్నారని, ప్రతిపక్షాలు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నాయని అనడం హాస్యాస్పదమని గత 14 ఏళ్లుగా కేసీఆర్ అదే పనిచేశారని తెలిపారు. రాష్ట్రంలో మూడు దఫాలుగా ఎన్నికలు జరిగాయని, శాసనసమండలికి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ నుండి దేవీశ్రీప్రసాద్ టిడిపి - బిజెపి అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారని గుర్తు చేశారు. సంవత్సరం తరువాత ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు చెప్పారన్నారు. ప్రభుత్వం చేపడుతున్న పనులకు ప్రజలు ఆమోదం తెలిపారని, ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతాన్ని తిరస్కరించారని కేసీఆర్ పేర్కొనడం జరిగిందన్నారు. పేర్కొన్నారు. గతంలో ఓటమిని కూడా స్వాగతిస్తే అభినందించే వాళ్లమని, ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనే విధంగా వ్యవహరించారని విమర్శించారు. ఇంతవరకు 520 మందిని మాత్రమే తెలంగాణ అమరవీరులుగా గుర్తించారని, ఇతరులను గుర్తించడానికి ఇంకెంతకాలం పడుతుందని ప్రశ్నించడం జరిందన్నారు. రైతు రుణమాఫీ, చీప్ లిక్కర్ ఇతర అంశాలపై ప్రశ్నించడం జరిగిందని, వాటర్ గ్రిడ్ పనుల రూపంలో ప్రజలను దోచుకుంటున్నారని తెలిపారు. 

టీమ్ ఇండియా 69/2..

నాగ్ పూర్ : సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. పుజారా (14) ఎల్ బి డబ్ల్యూగా వెనుదిరిగాడు. తొలుత టాస్ గెలిచిన ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు విజయ్, ధావన్ లు బ్యాటింగ్ ఆరంభించారు. తొలుత నిలకడగానే ఓపెనర్లు ఆడారు. జట్టు స్కోరు 50 పరుగులు చేసిన అనంతరం ధావన్ (12) వెనుదిరిగాడు. మరో ఓపెనర్ విజయ్ మాత్రం ఆచితూచి ఆడాడు. భారత్ స్కోరు 69 వద్ద ఉన్నప్పుడు విజయ్ (40)ను మోర్కెల్ పెవిలియన్ పంపించాడు. 

కేసీఆర్ ను కలిసిన పసునూరి..

హైదరాబాద్ : వరంగల్ ఎంపీగా గెలిచిన పసునూరి దయాకర్ కుటుంబం నగరానికి చేరుకుంది. సీఎం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ ను పసునూరి కుటుంబం కలిసింది. 

జవాన్ వీరమరణం..

జమ్మూ కాశ్మీర్ : ఆర్మీ పోస్టుపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఓ జవాన్ వీరమరణం పొందాడు. కుప్వారా ప్రాంతంలో తంగ్ధర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఉగ్రవాదులకు..భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

ధావన్ అవుట్..

నాగ్ పూర్ : సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో భారత్ ఓపెనర్ ధావన్ (12)అవుట్ అయ్యాడు. విజయ్ 35 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 

కాసేపట్లో కేంద్ర అఖిలపక్ష సమావేశం..

ఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఉదయం 11గంటలకు కేంద్ర మంత్రి వెంకయ్య అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరుగనుంది. సాయంత్రం ఐదు గంటలకు ప్రధాన మంత్రి మోడీ అధ్యక్షతనలో బీజేపీ పార్టీమెంటరీ పార్టీ భేటీ కానుంది. సాయంత్రం ఆరు గంటలకు ప్రధాని నివాసంలో ఎన్డీయే పార్లమెంటరీ పక్ష నేతల సమావేశం జరుగనుంది. సాయంత్రం 7గంటలకు లోక్ సభ స్పీకర్ అధ్యక్షతనలో అన్ని పార్టీల పార్లమెంటరీ పక్ష నేతలతో భేటీ జరుగనుంది. 

10:32 - November 25, 2015

వరంగల్ : తాను ఎంపీగా గెలువడం పట్ల చాలా సంతోషంగా ఉందని ఎంపీగా గెలిచిన పసునూరి దయాకర్ పేర్కొన్నారు. జిల్లా ఎంపీ స్థానానికి జరిగిన ఎన్నికల కౌంటింగ్ మంగళవారం జరిగింది. పసునూరి 4,59,092 ఓట్ల భారీ అధిక్యాన్ని కనబర్చారు. మొత్తం 6,15,403 ఓట్లు పోలయ్యాయి. విజయం సాధించడంతో పసునూరి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పసునూరి టెన్ టివితో ముచ్చటించారు. తాను జిల్లా ప్రజలకు, సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటానన్నారు. జిల్లాను అభివృద్ధి బాటలో పయనింప చేస్తానని హామీనిచ్చారు. ఉద్యమంలో తాను నిబద్ధతతో పని చేయడం జరిగిందని, గత ఎన్నికల్లో తనకు ఛాన్స్ ఇవ్వకపోయినా తాను నిరాశ చెందలేదని తెలిపారు. తన భర్త గెలువడం చాల సంతోషంగా ఉందని పసునూరి సతీమణి తెలిపారు. కానీ గతంలో పసునూరికి ఛాన్స్ రాలేకపోయేసరికి తాను మానసికంగా కొంత బాధ పడడం జరిగిందని తెలిపారు.

10:28 - November 25, 2015

హైదరాబాద్ : ఆర్టీసీ క్రాస్ రోడ్డు ప్రమాదాలకు నెలవుగా మారుతోంది. అధ్వాన్నంగా మారిన రోడ్డుపై ప్రయాణిస్తూ పలువురు గాయపడుతున్నారు. తాజాగా ప్రాణాలు కూడా పోతున్నాయి. తాజాగా కేఎంఐటీ విద్యార్థి విశాల్ రెడ్డి మృతి చెందాడు. వరంగల్ డీసీసీ అధ్యక్షుడు కుమారుడైన విశాల్ రెడ్డి ద్విచక్రవాహనంపై వెళుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొందని తెలుస్తోంది. హెడ్ ఫోన్ పెట్టుకుని మాట్లాడుకుంటూ వెళుతుండడం వల్లే ప్రమాదం జరిగిందా ? అనేది తెలియ రాలేదు. వాస్తవానికి ముషిరాబాద్ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వరకు మెట్రో రైలు పనులు చేపడుతుండడంతో రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. ఎక్కడ పడితే అక్కడ గుంతలు ఉండడంతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్డును బాగు చేయాలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని తెలుస్తోంది. 

10:23 - November 25, 2015

హైదరాబాద్ : ఔటర్ రింగ్ రోడ్డులో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్ గా ఉన్న పేర్వారం రాములు మనువడు దుర్మరణం చెందాడు. ఇతనితో పాటు మరో ఇద్దరు కూడా మృతి చెందారు. తీవ్రగాయాల పాలైన ఒకరు మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పేర్వారం రాములు బంధువులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. విగతజీవులుగా ఉన్న వారిని చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. మిల్క్ వ్యాన్ నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పేర్వారం రాములు బంధువు ఆరోపించారు.
అరుణ్, వరుణ్ పవార్ (పేర్వారం మనువడు), జ్ఞాన్ దేవ్, రాహుల్ లు పటన్ చెరువు నుండి గచ్చిబౌలి వైపు స్కోడా (ఎపి 09సిక్యూ 553) కారులో వెళుతున్నారు. కోకాపేట వద్ద పాల వ్యాన్ (టీఎస్ యూఏ0086)ను కారు వేగంగా ఢీకొంది. ఆ సమయంలో కారు 140-150 కి.మీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. కారు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. తీవ్రగాయాలపాలైన రాహుల్ ను ఆసుపత్రికి తరలించారు. 

హైదరాబాద్ కు పసునూరి దయాకర్..

హైదరాబాద్ : వరంగల్ ఎంపీగా గెలిచిన పసునూరి దయాకర్ కుటుంబసమేతంగా హైదరాబాద్ కు బయలుదేరారు. ఆయన సీఎం కేసీఆర్ ను కలువనున్నారు. రేపు ఎంపీగా పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

09:27 - November 25, 2015

నల్గొండ : జిల్లాలో కార్తీక పౌర్ణమి పుణ్యస్నానాల్లో అపశృతి చోటు చేసుకుంది. మునగాల వద్ద ఎడమకాల్వలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఒకరు మృతి చెందగా మరొకరు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళితే..బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా మహేష్..ప్రశాంత్ ఇద్దరు యువకులు ఎడమ కాల్వ వద్దకు వచ్చారు. స్నానం చేసేందుకు కాల్వలో దిగారు. కానీ నీటి ఉధృతి అధికంగా ఉండడంతో వీరు కొట్టుకపోయారు. ఆ సమయంలో అక్కడనే ఉన్న అయ్యప్పస్వాములు వీరిని రక్షించే ప్రయత్నం చేశారు. అందులో ప్రశాంత్ ను రక్షించారు. సూర్యాపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ప్రశాంత్ మృతి చెందాడు. ఇతనికి వారం రోజుల క్రితమే వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాలో ప్రశాంత్ సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఇక గల్లంతైన మహేష్ కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు. 

09:18 - November 25, 2015

హైదరాబాద్ : నేడు కార్తీక పౌర్ణమి..ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. గోదావరి, కృష్ణా నదులకు భక్తులు పోటెత్తారు. రాజమండ్రి పుష్కర ఘాట్ లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. ప్రధానంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కర్నూలు జిల్లా శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని శ్రీ రాజరాజేశ్వరి, ధర్మపురి, యాదాద్రి, కాళేశ్వరం ఆలయాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. 

09:16 - November 25, 2015

హైదరాబాద్ : కోకాపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ డీజీ పేర్వారం రాములు మనువడు దుర్మరణం చెందాడు. ఇతనితో పాటు మరో ఇద్దరు కూడా మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కోకాపేట వద్ద పాల వ్యాన్ ను స్కోడా కారు ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. జ్ఞాన్ దేవ్, అరుణ్, రాహుల్ లతో పేర్వారాం రాములు మనువడు వరుణ్ పవార్ స్కోడా కారులో గచ్చిబౌలి నుండి ఎయిర్ పోర్టుకు వెళుతున్నారు. మిల్క్ వ్యాన్ ను వెనుకనుండి స్కోడా కారు అతివేగంగా ఢీకొంది. దీనితో ముగ్గురు అక్కడికక్కడనే మృతి చెందగా రాహుల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదానికి గురైన కారు పేర్వారం ఇందిర పేరిట ఉందని తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పేర్వారం కుటుంబసభ్యులు ప్రమాదస్థలికి బయలుదేరారు. 

నేడు బాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం..

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతనలో నేడు సీఆర్డీఏ సమావేశం జరుగనుంది. 

08:45 - November 25, 2015

తెలంగాణ రాష్ట్రంలో అసంతృప్తి మొదలైందని, కానీ ఇది రాజకీయంగా రూపు దిద్దుకోలేదని ది హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.కె.నాగేశ్వర్ వ్యాఖ్యానించారు. వరంగల్ లో టీఆర్ఎస్ గెలుపు సాధించడం..ప్రతిపక్షాలు ఘోరంగా విఫలం చెందడంపై టెన్ టివి 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో విశ్లేషించారు. ఆయన మాటల్లోనే...

అంచనాలకు అందలేదు...
''టీఆర్ఎస్ సాధించిన విజయం. సాధారణ ఎన్నికలకంటే గొప్ప విజయాన్ని అందుకుంది. పార్టీలకు అందని అంచనా..ఎగ్జిట్ పోల్ వారికి కూడా అందని అంచనా. ప్రజల నాడి పట్టుకోవడం అంత సులభం కాదని తెలుస్తోంది. మెజార్టీ తగ్గుతుందని భావించారు. కానీ ఓటింగ్ కూడా అంతబాగా తగ్గలేదు. ప్రతిపక్ష పార్టీకి భారీగా ఓటింగ్ శాతం తగ్గింది. 6 శాతం ఓట్లు కోల్పోతే పార్టీకి చిరునామా ఉండదు. 16 నెలల కాలంలో ప్రధాన ప్రతిపక్షం ఓటింగ్ శాతం ఎందుకు కోల్పోయింది ? ప్రభుత్వ ఓటులాక్కొని తన ఓటు పెంచుకోవాల్సింది పోయి సొంత ఓటు శాతాన్ని కోల్పోయింది. ప్రతిపక్షం ఇక్కడ ఆలోచించుకోవాలి.

అసంతృప్తి..వ్యతిరేకత ఒక్కటే అనుకున్నారు...
క్షేత్రస్థాయిలో ఉన్న వాతావరణాన్ని అంచనా వేయడంలో విఫలమయ్యారు. అసంతృప్తి..వ్యతిరేకత ఒక్కటే అనుకున్నారు. అసంతృప్తి మొదలైంది మాత్రమే. విస్తృతస్థాయిలో ఊపుగా లేదు. అధికార పార్టీ రెఫరెండం అని పేర్కొనగానే ప్రతిపక్షం రెఫరెండం అంటూ మాట పట్టుకుంది. కేసీఆర్ గద్దెదించాలని చెబుతున్నారు ? ఈ పిలుపునిస్తే ప్రజలు ఓట్లు వేస్తారా ? కేసీఆర్ కు హెచ్చరిక చేయడం మంచిదని, అందుకు ప్రతిపక్షాలు ఓటు వేయాలని పేర్కొంటే బాగుండేది. వ్యూహాత్మక తప్పిదం. కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేస్తున్నారు. మరి మిగత పార్టీల రాజకీయాల్లో ఉన్న వారి కుటుంబాల సంగతేంటి ?

ప్రజల చైతన్యానికి తగిన నినాదాలు...
ప్రాజెక్టుల విషయంపై విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారో చెప్పాలి. ప్రత్యామ్నాయం చెప్పాలి. ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు జరగవనే దానికి ఒక విధానం అంటూ ఏమైనా ఉందా ? దళితులకు భూ పంపిణీ చేయలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. ఏ జిల్లాల్లో భూమి లేని దళితుల సమావేశాలు పెట్టారా ? నిరుద్యోగుల కోసం సమావేశాలు పెట్టారా ? అధికార పార్టీ చేయని పనులను పట్టుకుని ప్రశ్నించాల్సి ఉంటుంది. అసాధారణమైన ఎన్నికల పరిస్థితికి తీసుకెళ్లారు. రాజకీయాలను శాస్త్రీయంగా విమర్శించడం నేర్చుకోవాలి. బలం పట్టి అంచనా వేయాలి. ప్రజల చైతన్యానికి తగిన నినాదాలు ఇవ్వాలి. రాజకీయాలు నిరంతరం ప్రవహించే నదిలాంటింది''. అని నాగేశ్వర్ పేర్కొన్నారు. 

మునగాల కాల్వలో ఇద్దరు యువకుల గల్లంతు..

నల్గొండ : జిల్లా మునగాల వద్ద కాల్వలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. కాల్వలో ఒకరు కొట్టుకపోతుండగా స్థానికులు రక్షించారు. గల్లంతైన వ్యక్తి హైదరాబాద్ కు చెందిన మహేష్ అని గుర్తించారు. 

ఉగ్రవాద శిబిరంపై దాడులు..

జమ్మూ కాశ్మీర్ : ఉగ్రవాదుల శిబిరంపై భద్రతా దళాలు దాడి చేశాయి. పూంచ్ జిల్లాలో ఘటన చోటు చేసుకుంది. శిబిరంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటిలో పాకిస్తాన్ దేశానికి చెందిన కరెన్సీ కూడా ఉన్నట్లు సమాచారం. 

07:59 - November 25, 2015

వరంగల్ లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్తి పసునూరి దయాకర్ రావు గెలుపొందారు. ఈసందర్భంగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపించారు. మరోవైపు అసహనంపై బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. బీజేపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో బి. వెంకట్ (సీపీఎం), పాతూరి సుధాకర్ రెడ్డి (టీఆర్ఎస్), నడింపల్లి సీతరామరాజు (విశ్లేషకులు), రాకేష్ రెడ్డి (బీజేపీ) పాల్గొని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

కోకాపేట అదుపుతప్పిన స్కోడా కారు..

హైదరాబాద్ : రాయదుర్గం పీఎస్ పరిధిలో కోకాపేట వద్ద స్కోడా కారు అదుపు తప్పడంతో ముగ్గురు పరిస్థితి మృతిచెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

07:42 - November 25, 2015

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దానిమ్మ పండ్లలో ఉన్నాయి. అయితే, దానిమ్మ తొక్కలో కూడా అనేక ఔషధ గుణాలు ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉంటుంది. దానిమ్మ తొక్కను సన్‌స్క్రీన్‌గా, మాయిశ్చరైజర్‌గా, ఫేషియల్‌స్క్రబ్‌గా ఉపయోగించుకోవచ్చని బ్యూటీ నిపుణులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన పరిశోధనల్లో దానిమ్మతొక్కలో ఉండే ఏజెంట్స్ చర్మ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతుందని కనుగొన్నారు. దానిమ్మ తొక్కను ఫౌడర్‌గా చేసి ఉపయోగిస్తే చర్మానికి అవసరమేయ్యే తేమను అందిస్తుంది. ఇది చర్మంలోని పిహెచ్‌ బ్యాలెన్స్‌ను తిరిగి పునరుద్ధరింపజేస్తుంది. అలాగే కేశ సంరక్షణ కోసం కూడా ఉపయోగించవచ్చు. ఇది జుట్టు రాలడం అరికట్టి, చుండ్రు నివారిస్తుంది. ఈ పొడి నేచురల్‌ ఫేషియల్‌ స్క్రబ్బింగ్‌గా పనిచేస్తుంది. ఇది డెడ్‌ స్కిన్‌, బ్లాక్‌ అండ్‌ వైట్‌ హెడ్స్ ను నివారిస్తుంది.

07:41 - November 25, 2015

మన శరీరానికి అవసరమయ్యే క్యాల్షియమ్‌, మాంగనీస్‌, కాపర్‌, మెగ్నీషియమ్‌ పోషకాలు ఖర్జూరంలో పుష్కలంగా లభిస్తాయి. పైగా పై పోషకాలు మనలో కండరాల, నరాల శక్తిని పెంపొందిస్తాయి. ఎర్రరక్తకణాల ఉత్పత్తికి కాపర్‌ చాలా అవసరం. ఎముకలకు మెగ్నీషియమ్‌ చాలా మేలు. అంతే కాదు ఖర్జూరం తీసుకోవడం వల్ల మూత్ర సంబంధిత సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు. మూత్రపిండాలలోని రాళ్లు కరిగేందుకు ఖర్జూరపండు తరచుగా తింటూ ఉండాలి. వీటిలో అనేక పోషకాలతో పాటు విటమిన్‌ - బి కాంప్లెక్స్, విటమిన్‌-కె ఉన్నాయి. రక్తం గడ్డకట్టడానికి విటమిన్‌-కె దోహదపడుతుంది. ఖర్జూర పళ్ళేకాదు వాటి పువ్వులూ తినేందుకు అనువైనవి. ఇవి ఎంతో రుచికరంగా ఉంటాయి. కొన్ని దేశాల్లో ఈ పువ్వులను ప్రత్యేకంగా అమ్ముతారు. వాటి మొగ్గల్ని సలాడ్‌లలో, ఎండుచేపల కూరల్లో ఉపయోగిస్తారు. పెద్దపేగులోని సమస్యలకు ఈ పండులోని టానిన్‌ చక్కగా ఉపయోగపడుతుంది. గొంతునొప్పి, మంట, జలుబు, శ్లేష్మం లాంటివాటికి ఈ పండు గుజ్జు లేదా సిరప్‌ మంచి మందు. డయేరియా, మూత్రాశయ సమస్యల్ని నివారించేందుకు కాండం నుంచి తీసిన జిగురును వాడతారు. చెట్టువేళ్లను నూరి పెట్టుకుంటే పంటినొప్పి తగ్గుతుంది. అందుకే మనం తీసుకునే ఆహారంలో సుగుణాల ఖని ఖర్జూరం ఉండేలా చూసుకోవడం ఎంతో మంచిది.

07:37 - November 25, 2015

జుట్టు సమస్యల్లో చుండ్రు ఒక సాధారణ సమస్యగా ప్రతి ఒక్కరికీ ఉంది.తలను శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల కొన్ని బాక్టీరియా ఫంగస్‌ వల్ల, కాలుష్యం వల్ల చుండ్రు ఏర్పడుతుంది. చుండ్రు వల్ల తల్లో ఎక్కువగా దురద, తెల్లగా పొట్టుపొట్టుగా రాలుతుంటుంది. ఈ సమస్యను నివారించడానికి అలోవెరా సమర్థవంతంగా పనిచేస్తుందని డెర్మిటాలజిస్టులు అంటున్నారు.

  • కలబందలో ఉండే పెక్టిన్‌ అనే రసాయనం తలలో కొత్త కణాలను, కణజాలాలను ఉత్పత్తి చేయడానికి, నిర్వహించడానికి గొప్పగా సహయపడుతుంది. చుండ్రును నివారించాలంటే ముందుగా తలలోని మృత కణాలను, చర్మాన్ని తొలగించాలి. దానికి ఈ అలోవెరా చక్కగా సహాయపడుతుంది. అంతే కాదు, కొత్త జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది.
  • అలోవెరాలో ఉండే సహజ ఎంజైమ్స్ తలలోని మృతకణాలను తొలగిస్తుంది. అదే సమయంలో తలకు అవసరం అయ్యే తేమను కూడా అందిస్తుంది. షాంపు ఉపయోగించడానికి ముందు కలబంద రసాన్ని తలకు పట్టించి నిదానంగా మసాజ్‌ చేసి 20 నిముషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. దీన్నే ఫ్రీ షాంపు ట్రీట్‌మెంట్‌ అంటాం. ఇలా చేయడం వల్ల చుండ్రును నివారించడంతో పాటు జుట్టు బలంగా పెరగడానికి సహాయపడుతుంది. 
  • మెంతులను రాత్రంతా నానబెట్టుకోవాలి. నానిన మెంతులను ఉదయాన్నే మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. ఈ పేస్ట్‌కు అలోవెరా జెల్‌ను కలపాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని తలకు పట్టించాలి. ఇది తల మాడుకు ఏర్పడే జిడ్డును వదిలిస్తుంది. దాంతో తలలో ఎలాంటి బ్యాక్టీరియా, ఫంగస్‌ ఉన్నా తొలగిపోతుంది. ఇలా తరచూ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.
  • యూకలిప్టస్‌ ఆయిల్‌లో కొద్దిగా అలోవెరా జెల్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, మసాజ్‌ చేయాలి. ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. ఈ రెండు సహజహెర్బ్‌ల్స్‌లో ఉండే థెరపాటిక్స్ లక్షణాల వల్ల జుట్టు శుభ్రం అవుతుంది.
  • తాజా నిమ్మరసం చుండ్రు నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇది చాలా ఆరోగ్యకరమైనది కూడా. ఒక నిమ్మకాయలో సగభాగం నిమ్మరసం తీసుకొని అందులో అలోవెరా జెల్‌ మిక్స్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.
  • అరకప్పు అలోవెరా జెల్‌ను తీసుకొని అందులో రెండు చెంచాల ఆముదం, రెండు చెంచాల మెంతి పొడి, ఒక చెంచా తులసి పొడి కలిపి తలకు పట్టించాలి. ఇలా చేసిన తర్వాత షవర్‌ క్యాప్‌ పెట్టుకొని నిద్రపోవాలి. మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన వెంటనే మంచి నీరు, మన్నికైన షాంపుతో తలస్నానం చేయడం వల్ల జుట్టుకు అవసరం అయ్యే పోషకాలు అందడంతో పాటు చుండ్రు వదులుతుంది. ఈ హెయిర్‌ మాస్క్‌ సమర్థవంతమైన కండీషనర్‌గా పనిచేస్తుంది. దీన్ని కనీసం వారానికొకసారి ఉపయోగించాలి. చుండ్రు నివారించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
07:33 - November 25, 2015

జిగురు జిగురుగా ఉండే చేమ దుంపను తినాలంటే ఎవరూ ఇష్టపడరు. కాని దీనిలో అనేక పోషకాలున్నాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. చేమదుంపలో విటమిన్‌ ఎ, బి1(థయామిన్‌), బి2(రిబోఫ్లేవిన్‌), బి3 (నియాసిన్‌), బి5 (పాంటోథెనిక్‌ యాసిడ్‌), బి6 (పైరిడాక్సిన్‌), బి9 (ఫోలేట్‌), విటమిన్‌ సి, ప్రోటీన్‌, కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, ఫాస్పరస్‌, పొటాషియం, సోడియం, జింక్‌, కాపర్‌, మాంగనీస్‌, పీచు ఎక్కువగా ఉంటాయి. ఇందులో కొవ్వు చాలా తక్కువ.

  • చేమ దుంప హైపర్‌ టెన్షన్‌ని తగ్గిస్తుంది. వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది. సాధారణంగా వచ్చే జలుబు, జ్వరాలను నివారిస్తుంది.
  • దుంప కాబట్టి బరువు పెంచుతుందనుకోవడం సహజమే. కానీ దీనికి బరువు పెంచే లక్షణం లేదు. జీర్ణం కాకపోవడం అనే సమస్య ఎదురుకాదు. నిదానంగా జీర్ణం అవుతూ నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తుంది.
  • రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలను అదుపు చేస్తుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు నిరంభ్యతరంగా తీసుకోవచ్చు. చామదుంప క్రీడాకారులకు మంచి ఆహారం.
  • చేమదుంప కలోన్‌ క్యాన్సర్‌ను నివారిస్తుంది. శరీరంలో నిల్వ ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. చర్మ కణాల క్షీణతను అరికడుతుంది. చర్మవ్యాధులను నివారిస్తుంది. ఎముకల పటిష్టతకు, థైరాయిడ్‌ గ్రంథి పనితీరుకు దోహదం చేస్తుంది.

మరి ఇన్ని మంచి గుణాలున్న చేమ దుంపలను ఏకాలంలో దొరికినా తింటారు కదూ! 

07:30 - November 25, 2015

మోహన్‌బాబు, అల్లరి నరేష్‌ హీరోలుగా, రమ్యకృష్ణ, మీనా, పూర్ణ హీరోయిన్లుగా, శ్రీనివాస్‌ రెడ్డి దర్శకత్వం లో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మంచు విష్ణు నిర్మిస్తున్న చిత్రం 'మామ మంచు.. అల్లుడు కంచు' విడుదలకు సిద్ధమైంది. అచ్చు సంగీతమందిస్తున్న ఈ చిత్ర పాటలను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు. నాన్నగారు హీరోగా నటించిన 181వ చిత్రమిదని, అలాగే అల్లరి నరేష్‌కిది 50వ చిత్రం కావడం విశేషమన్నారు. డిఫరెంట్‌ కాంబినేషన్‌లో పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయ్యిందన్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతున్నట్లు దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి సినిమాను బాగా తెరకెక్కించారన్నారు. అచ్చు అద్భుతమైన మ్యూజిక్‌ని అందించడం జరిగిందని, నవంబర్‌ 28న సినీ ప్రముఖుల సమక్షంలో ఆడియో వేడుకను చాలా గ్రాండ్‌గా నిర్వహించడానికి ప్లాన్‌ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే సినిమాను క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న విడుదల చేస్తున్నట్లు మంచు విష్ణు పేర్కొన్నారు. 

07:27 - November 25, 2015

'తెలుగులో చేయకపోవడానికి కారణం నచ్చిన కథలు రాకపోవడమే. ఏది పడితే అది చేయడం నాకిష్టం లేదు. నచ్చిన కథల కోసం వెయిట్‌ చేస్తున్నా' అని మధుశాలిని అన్నారు. ఆమె హీరోయిన్‌గా నటించిన 'చీకటి రాజ్యం' సినిమా ఇటీవల విడుదలై పాజిటివ్‌ టాక్‌ను తెచ్చుకుంటున్న నేపథ్యంలో మంగళవారం మీడియాతో ముచ్చటించారు. కమల్‌హాసన్‌గారితో నటించాలనేది నా డ్రీమ్‌. అది ఈ చిత్రంలో నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. అదొక మధురమైన అనుభూతిని కలిగించిందని, ఈ ఛాన్స్ ప్రియా ఆనంద్‌ ద్వారా వచ్చిందన్నారు. 'చీకటి రాజ్యం' సినిమాలో ఓ పాత్ర కోసం ఆడిషన్‌ చేస్తున్నారని ప్రియా ఆనంద్‌ నాకు చెప్పడం జరిగిందని, హైదరాబాద్‌ వచ్చినప్పుడు కమల్‌ హాసన్‌ని కలవడం జరిగిందన్నారు. నన్ను చూసిన వెంటనే సెలక్ట్ చేసుకున్నారని, పాత్ర గురించి చెప్పినప్పుడు ఆ పాత్ర ప్రాధాన్యతేంటో తెలిసిందని పేర్కొన్నారు. ఎలా నటించాలో అర్థమైందని, షూటింగ్‌ సమయంలో ఆయన చాలా మెళకువలు నేర్పించారని తెలిపారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇలా చేస్తే బాగుంటుందని సూచించడం జరిగిందని, చాలా ఫ్రీడమ్‌ ఇచ్చారని తెలిపారు. ఇందులో కమల్‌ మధ్య వచ్చే లిప్‌ లాక్‌ గురించి అందరూ అడుగుతున్నట్లు, అయితే అది రొమాన్స్ కోసం కావాలని చేసింది కాదని స్క్రిప్టు డిమాండ్‌ మేరకే చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం తమిళం, మలయాళంలో ఒక్కొక్క సినిమా చేస్తున్నట్లు తెలుగులో కూడా అవకాశాలొస్తున్నాయని తెలిపారు. ఏ భాషలోనైనా కథ నచ్చితేనే అంగీకరిస్తున్నట్లు, ముఖ్యంగా పాత్ర తీరు తెన్నులు తనకు బాగా నచ్చాలని మధు శాలిని పేర్కొన్నారు. 

నేడు కార్తీక పౌర్ణమి..భక్తుల పుణ్యస్నానాలు..

హైదరాబాద్ : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. కర్నూలు జిల్లా శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. గోదావరి, కృష్ణా నదీ తీరాల్లోని ప్రముఖ ఆలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. 

నెల్లూరులో రెండో రోజు జగన్ పర్యటన..

నెల్లూరు : వైసీపీ అధ్యక్షుడు జగన్ రెండో రోజు జిల్లాలో పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది. 

నేడు నిజామాబాద్ లో ఎంపీ కవిత పర్యటన..

నిజామాబాద్ : నేడు నిజామాబాద్ లో ఎంపీ కవిత పర్యటించనున్నారు. శ్రావ్య గార్డెన్స్ కాంప్లెక్స్ లో తెలంగాణ జాగృతి స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను ఎంపీ కవిత ప్రారంభించనున్నారు.

 

07:00 - November 25, 2015

చిత్తూరు, కడప, నెల్లూరు ఈ మూడు జిల్లాలను అతలాకుతలం చేసిన తుపాన్‌ నష్టం విలువ ఎంత? ఎంతలేదన్నా మూడు వేల కోట్ల రూపాయలుంటుందన్నది ప్రభుత్వం అంచనా. ఈ తుపాన్‌ ధాటికి కొన్ని వేల మంది రైతులు ఘోరంగా దెబ్బతిన్నారు. రెండు లక్షల ఎకరాలకు పైగా పంట దెబ్బతింది. ఇంత తీవ్రస్థాయిలో దెబ్బతిన్న రైతులను ఆదుకునేదెలా? వీరికి తక్షణం ఎలాంటి సహాయం అందాలి? వివిధ తుపాన్‌లలో దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం నుంచి అందుతున్న సాయమెంత? గత అనుభవాలేమిటి? రైతుల మీద తుపాన్‌ ప్రభావం ఏ స్థాయిలో వుంది? ఈ అంశంపై జనపథంలో ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతుల సంఘం నేత రంగారావు విశ్లేషించారు.

 

06:57 - November 25, 2015

తుపాన్‌ లెప్పుడు వచ్చినా కోలుకోలేని దెబ్బతినేది రైతులే. ఒకట్రెండు రోజుల కుండపోత లక్షల ఎకరాలను పొట్టబెట్టుకుంటుంది. ఇప్పుడు చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలో అన్నదాతల పరిస్థితి ఘోరంగా తయారైంది. నిన్నటి తుపాన్‌ ఆంధ్రప్రదేశ్‌కి భారీ నష్టమే మిగిల్చింది. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలు తల్లడిల్లుతున్నాయి. దాదాపు మూడు వేల కోట్ల రూపాయల నష్టం జరిగినట్టు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. కనీసం వెయ్యి కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రాన్ని కోరారు. పొరుగున వున్న తమిళనాడు రాష్ట్రానికి 940 కోట్ల రూపాయల తక్షణ సాయం ప్రకటించిన కేంద్రం అంతకంటే తీవ్రంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్‌కి ఇంతవరకు సాయం ప్రకటించలేదు.

హుద్ హుద్ తుపాన్...
నిరుడు ఉత్తరాంధ్రకు తీవ్ర శోకం మిగిల్చిన హుద్‌ హుద్‌ తుపాన్‌ విషయంలోనూ కేంద్రం ఇలాగే వ్యవహరించింది. అప్పటి తుపాన్‌ నష్టాన్ని స్వయంగా పరిశీలించిన ప్రధాని నరేంద్రమోడీ వెయ్యి కోట్ల రూపాయల తక్షణ సాయం ప్రకటించినా, చివరకు విడుదల చేసింది 400 కోట్లే. ఇప్పుడు కనీసం సాయం గురించి కూడా మాట్లాడడం లేదు. తుపాన్‌ ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా కనీస భరోసా ఇవ్వలేకపోతున్నారు. ముందు రాష్ట్రం నష్టం నివేదికలు పంపిస్తే, కేంద్రం బృందం వచ్చి పరిశీలించిన తర్వాత, సాయం ప్రకటిస్తామంటున్నారు. రాష్ట్రం నివేదికలు పంపేదెప్పుడు? కేంద్రం బృందం వచ్చేదెప్పుడు ? కేంద్ర సాయం చేసెదెప్పుడు ? అప్పటి దాకా తుపాన్‌ బాధితుల జీవితాలు నిలబడేదెట్లా? రెండుమూడేళ్ల క్రితం నాటి తుపాన్‌ ల నష్టపరిహారాలే ఇప్పటికీ అందని దుస్థితి? అన్నదాత అంటే ఎందుకింత చిన్నచూపు? తుపాన్‌లు, వరదలు వచ్చిన ప్రాంతాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మెరుపు వేగంతో వెళ్తున్నారు. సమీక్షలు చేస్తున్నారు. కానీ, అంతే స్పీడుగా అన్నదాతలకు సహాయం ఎందుకు అందించలేకపోతున్నారు? వరదలొచ్చిన ఆ రెండు రోజులు సహాయ శిబిరాలు ఏర్పాటు చేసి, బియ్యమో, నూకలో, ఆహార పొట్లాలో పంపిణీ చేసి, చేతులు దులుపుకుంటే సరిపోతుందా?

రెండు లక్షల ఎకరాల్లో పంటల నష్టం..
చిత్తూరు, కడప, నెల్లూరు ఈ మూడు జిల్లాల్లో రెండు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అంచనా వేసింది. నెల్లూరులో 89,287 ఎకరాల్లోనూ, కడపలో 88, 467 ఎకరాల్లోనూ, చిత్తూరులో 25,160 ఎకరాల్లోనూ పంటలు దెబ్బతిన్నాయన్నది అగ్రికల్చర్‌ యూనివర్సిటీ అంచనా. కడప జిల్లాలో వేరుసెనగ పంట ఘోరంగా దెబ్బతింది. వరిపంట నాశనమైంది. కొన్నివేల మంది రైతులు దిక్కుతోచని స్థితిలో తల్లడిల్లుతున్నారు. వీరిని తక్షణం ఆదుకోవాల్సిన అవసరం వుంది. ఈసారి తుపాన్‌ ధాటికి ఘోరంగా దెబ్బతిన్న వారిలో కౌలు రైతులు ఎక్కువగా వున్నట్టు తెలుస్తోంది. వీరిలో ఎక్కువ మంది ప్రయివేట్‌ అప్పులు చేశారు. వీరికి బ్యాంక్‌ రుణాలు దక్కలేదు. ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితి చూస్తుంటే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. వారికిప్పుడు కావాల్సింది తమకు భరోసా ఇచ్చే నాయకులు. 

06:36 - November 25, 2015

ఢిల్లీ : రేపటినుంచి జరగనున్న పార్లమెంట్‌ సమావేశాలను సాఫీగా నిర్వహించేందుకు కేంద్రం తన ప్రయత్నాలను ముమ్మురం చేసింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు మంగళవారం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరిపారు. అసహనంపై విపక్షాలు చర్చ లేవనెత్తితే... ధీటుగా ఎదుర్కోవాలని మంత్రులు నిర్ణయించారు. శాంతి భద్రతలు రాష్ట్రాలకు సంబంధించిన అంశమని.. ఇప్పుడు దేశంలో ఏ ఘటన జరిగినా కేంద్రానికి ఆపాదిస్తున్నారని వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో ఆర్డినెన్స్‌ సంబంధిత బిల్లులనే ప్రవేశ పెట్టాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. వస్తుసేవల పన్ను, ఇతర కీలక బిల్లులకు ఆమోదం పొందేందుకు అధికార పక్షం పట్టుదలతో ఉంది. రాజ్యసభలో బిల్లులు పాస్‌ కావాలంటే విపక్షాల మద్దతు తప్పని సరి. ఎలాగైనా విపక్షాలను ఒప్పించి బిల్లులను ఆమోదించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఉభయ సభల్లో మొత్తం 38 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ తెలిపారు. మరోవైపు సమావేశాలు సజావుగా సాగేందుకు ఇవాళ ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, వివిధ పార్టీల నాయకులు పాల్గొంటారు. 

06:34 - November 25, 2015

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటనకు రెడీ అవుతున్నారు. ఒక్కో జిల్లాలో కనీసం వారం రోజుల పాటు పర్యటించే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల అనంతరం జిల్లాల్లో బస్సుయాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు. ఎన్నికలకు ముందు ఇచ్చినహామీల అమలుకోసం ఇప్పటి వరకు హైదరాబాద్‌లో ఉంటూనే ప్రణాళికలు రచించిన సీఎం క్షేత్ర స్థాయిలో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. త్వరలో జరుగనున్న గ్రేటర్ ఎన్నికలు, స్థానిక సంస్థల మండలి ఎన్నికల అనంతరం ప్రజలు, కార్యకర్తలకు సమయం కేటాయించేందుకు సిద్ధమవుతున్నారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి సమీక్షలకే ప్రాధాన్యత నిచ్చిన కేసీఆర్ రూట్ మారుస్తున్నారు. ఇప్పటి వరకు సమీక్షించిన వ్యవహారాలు క్షేత్ర స్థాయిలో ఎలా ఉన్నాయనే అంశాన్ని స్వయంగా పరిశీలించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలనే లక్ష్యంగానే సీఎం పావులు కదుపుతున్నారు. కోటి ఎకరాలకు సాగునీరు అందివ్వడమే తమ లక్ష్యమంటున్నారు. జిల్లాల పర్యటనతో ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తానని సీఎం వెల్లడించారు.

క్యాడర్ కు శిక్షణా శిబిరాలు..
అధికారంలోకి వచ్చిన తర్వాత....కార్యకర్తలకు, నేతలకు దూరంగా ఉంటున్నారనే విమర్శలను ఎదుర్కొంటున్న సీఎం దానికి కూడా పులిస్టాప్ పెట్టనున్నారు. పార్టీ నేతలకు అందుబాటులో ఉండటంతో పాటు పార్టీని మరింత బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టారు. త్వరలో పార్టీ క్యాడర్‌కు శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేస్తామన్నారు. పార్టీ నేతలను ఊరిస్తున్న నామినేటెడ్‌ పదవులను నెల రోజుల్లో భర్తీ చేస్తామని కేసీఆర్ వెల్లడించారు. ఎన్నికల అనంతరం ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామన్నారు.

231 మండలాల్లో కరవు..
వరంగల్ ఉప ఎన్నికల్లో భారీ విజయం సాధించేందుకు కృషి చేసిన నేతలను సీఎం అభినందించారు. తెలంగాణలో కరవు మండలాల జాబితాను విడుదలచేసింది ప్రభుత్వం.. జిల్లా కలెక్టర్ల ప్రాథమిక నివేదికల ప్రకారం 231 మండలాల్లో కరవుందని కేంద్రానికి నివేదిక పంపింది.. రైతులను ఆదుకునేందుకు వెంటనే వెయ్యికోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు టీ సీఎం కేసీఆర్‌.. 

06:29 - November 25, 2015

విజయవాడ : ఏపీ పునర్వస్థీకరణ చట్టంలో ఇచ్చిన అన్ని హామీల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. ఈనెల 26 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడలోని ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరితగిన ఈ సమావేశంలో ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహం, లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించారు. ఎంపీలకు... చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలపై చర్చించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని తీర్మానించారు. బయ్యారం, కడప స్టీల్‌ప్లాంట్ల నిర్మాణం కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని టీడీపీ పీపీ నిర్ణయించింది. ఏపీ సర్కార్‌ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న పోలవరం ప్రాజెక్ట్‌ను కేంద్రమైనా చేపట్టాలని లేదా దీనిని పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఇచ్చేలా కేంద్రాన్ని కోరాలని తీర్మానించారు.
తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వర్షాలు, వరదనష్టం పై చర్చించారు. మూడువేల కోట్ల నష్టం జరిగిందని అంచనా వేశారు. కేంద్రం నుంచి తక్షణసాయంగా వెయ్యి కోట్ల రూపాయాలు అందేలా చూడాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల్లో సహాయ కార్యక్రమాల నిధులురాబట్టేలా కృషి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి పర్యావరణ మంత్రిత్వ శాఖ విధించిన ఆంక్షలన్నిటి రద్దుకు ప్రయత్నించాలని నిర్ణయించారు.

పెండింగ్‌లో 68 అంశాలు..
ఏపీ పునర్వస్థీకరణ చట్టంలో పొందుపరిచిన అంశాలపై విస్తృతంగా చర్చించారు. పెండింగ్‌లో ఉన్న 68 అంశాల సాధన కోసం కృషి చేయాలని నిర్ణయించారు. వీటిలో ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీతోపాటు రైల్వే జోన్‌ సాధనపై ఒత్తిడి పెంచాలని తీర్మానించారు. తెలంగాణలో ఉద్యాన విశ్వవిద్యాలయం ఏర్పాటు, ఖమ్మం జిల్లాలో బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం అంశాలను పార్లమెంటులో ప్రస్తావించాలని నిర్ణయించారు. ఏపీలో పెట్రోలియం యూనివర్సిటీ, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్రం ఇచ్చిన హామీల అమలుకు కృషి చేయాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్ణయించింది. దొంగల నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం వేలానికి అనుమతి సాధించాలని తీర్మానించారు. 

06:26 - November 25, 2015

విజయవాడ : బాక్సైట్‌ తవ్వకాలపై ఏపీ సర్కార్‌ శ్వేతపత్రం విడుదల చేసింది. ఒడిశా తర్వాత ఏపీలో అపారమైన బాక్సైట్‌ నిక్షేపాలు ఉన్నాయన్నారు చంద్రబాబు. అయితే ఏపీ మినహా మిగతా రాష్ట్రాల్లో బాక్సైట్‌ తవ్వకాలు జరుగుతున్నాయన్నారు. గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాల వల్లే అనేక సమస్యలు తలెత్తాయని... బాక్సైట్‌ తవ్వకాలపై విస్తృత చర్చలు జరిపిన తర్వాతే తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని బాబు స్పష్టం చేశారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో బాక్సైట్‌ తవ్వకాల అంశం తెరపైకి వచ్చిందన్నారు సీఎం చంద్రబాబు. వీటిపై అధికారులు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా వైఎస్‌ పట్టించుకోకుండా ఒక కంపెనీ కోసం స్వార్ధంతో పని చేశారన్నారు. 2007లో బాక్సైట్‌ సరఫరాపై జేఎస్‌డబ్ల్యూ హోల్డింగ్స్ లిమిటెడ్‌తో ఏపీఎండీసీ ఒప్పందం కుదుర్చుకుందని... ఆ తర్వాత బాక్సైట్‌ గురించి రస్‌-అల్‌-ఖైమా వైఎస్‌కు లేఖ రాసిందని చెప్పారు. విశాఖలో అంతర్జాతీయ స్థాయి అల్యూమినియం ప్లాంట్‌ నిర్మిస్తామని.. 36 నెలల్లోనే పరిశ్రమలు నెలకొల్పుతామని పేర్కొన్నారు. అయితే.. రెవెన్యూశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, సీఎస్‌ను కాదని బాక్సైట్‌ తవ్వకాలకు వైఎస్‌ ఆదేశాలిచ్చారని శ్వేతపత్రంలో పేర్కొన్నారు. చింతపల్లి రిజర్వు ఫారెస్టు భూముల్లోని 1649 హెక్టార్లలో నిక్షిప్తమై ఉన్న 224 మిలియన్‌ టన్నుల బాక్సైట్‌ నిల్వలను రస్‌- అల్‌-ఖైమాకు ఏపీఎండీసీ అందించే విధంగా ఒప్పందం చేసుకున్నారని చంద్రబాబు చెప్పారు.

ఏపీఎండీసీ, అనరాక్‌ అల్యూమినియం మధ్య ఒప్పందం...
ఆ తర్వాత, బాక్సైట్‌ సరఫరాపై ఏపీఎండీసీ, అనరాక్‌ అల్యూమినియం మధ్య ఒప్పందం కుదిరిందని.. ఈ మేరకు జెర్రెల్లలో 1162 హెక్టార్లలో బాక్సైట్‌ తవ్వకాల కోసం ఏపీఎండీసీ చేసుకున్న దరఖాస్తును రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పర్యావరణ, అటవీశాఖకు పంపిందన్నారు. కడప జిల్లాలోని 1212 హెక్టార్లలోని బాక్సైట్‌ తవ్వకాలకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతిచ్చింది. కానీ.. విశాఖ జిల్లా చింతపల్లి రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో మాత్రం అభ్యంతరాలు తెలిపింది. అయితే 2011 అక్టోబర్‌లో రెండుసార్లు ఎంఓఈఎఫ్‌ మాజీ డీజీ ఆధ్వర్యంలో కమిటీ విశాఖ మన్యంలో పర్యటించింది. 2013 నవంబర్‌ 12న స్టేజ్‌-2కు క్లియరెన్స్ ఇచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 5న పూర్తిస్థాయి పర్యావరణ అనుమతులు వచ్చినందున.. ఏపీఎండీసీకి రిజర్వ్‌ ఫారెస్ట్‌ భూమిలోని బాక్సైట్‌ నిక్షేపాలను అప్పగిస్తూ రాష్ట్ర అటవీశాఖ నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఒక సంస్థ ప్రయోజనాల కోసం వైఎస్‌ అనుమతులు ఇచ్చారని చంద్రబాబు అన్నారు. బాక్సైట్‌ తవ్వకాలపై విస్తృత చర్చల తర్వాతే తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు. 

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు..

ఢిల్లీ : గురునానక్ జయంతి సందర్భంగా బుధవారం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లు సెలవు పాటిఒంచనున్నాయి.

 

గోల్డ్ బాండ్ల జారీ 30కి వాయిదా..

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం బంగారు బాండ్ల జారీ తేదీని ఈనెల 26 నుండి 30కి వాయిదా వేసినట్లు రిజర్వ్ బ్యాంకు వెల్లడించింది. గోల్డ్ బాండ్ల కోసం వచ్చిన దరఖాస్తులను ఈ-కుబేర్ సిస్టమ్ లోకి ఎలాంటి ఆటంకం లేకుండా అప్ లోడ్ చేసేందుకే గడువు తేదీని మరో నాలుగు రోజులు వాయిదా వేసినట్లు ఆర్బీఐ వెల్లడించింది.

నేడు బ్యాంకులు బంద్...

ఢిల్లీ : గురునానక్ జయంతి సందర్భంగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ప్రకటించాయి. మళ్లీ గురువారం యధావిధిగా బ్యాంకులు పనిచేస్తాయి. 

శ్రీకాకుళంలో అంగన్ వాడీల దీక్ష భగ్న..

శ్రీకాకుళం : కలెక్టరేట్ వద్ద అంగన్ వాడీల నిరాహారదీక్షలను పోలీసులు భగ్నం చేశారు. కార్యకర్తలను ఆసుపత్రికి తరలించారు. 

దర్భాఘాట్ అటవీ ప్రాంతంలో కాల్పులు...

ఛత్తీస్ ఘడ్ : దర్భాఘాట్ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. 

Don't Miss