Activities calendar

28 November 2015

గ్యాస్ సిలిండర్ పేలి.. 19 ఇళ్లు దగ్ధం..

శ్రీకాకుళం : జిల్లాలోని ఆముదాల వలస మండలం తుర్కంపేటలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. మంటలు వ్యాపించడంతో ఆ ఇంటితో పాటు మరో 18 ఇళ్లు దగ్ధం అయ్యాయి. 

కారు-టిప్పర్ ఢీ.. ముగ్గురి మృతి

హైదరాబాద్ : హయత్ నగర్ మండలం కోహెడ వద్ద కారు, టిప్పర్ ఢీన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కారులో ఇరుకున్న మరో ఇద్దరిని స్థానికులు బయలకు తీశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. 

22:03 - November 28, 2015

ఢిల్లీ : నెస్లేకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మ్యాగీ నూడిల్స్ వివాదం నుంచి బయటపడి మళ్లీ మార్కెట్‌లోకి ప్రవేశం చేసిన నెస్లేకు మరో ఉత్పత్తిపై దుమారం మొదలైంది. నెస్లేకు చెందిన పాస్తాలో మోతాదుకు మించిన సీసం పరిమాణం ఉన్నట్లు లాబరేటరీలో తేలింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఆహార లాబొరేటరీ సంస్థ నిర్వహించిన శాంపిల్ టెస్ట్లో నెస్లే పాస్తా విఫలమైంది. పాస్తాలో మోతాదుకు మించిన సీసం పరిమాణం ఉన్నట్లు లేబరేటరీ అధికారి అరవింద్ యాదవ్ ధృవీకరించారు. సాధారణంగా సీసం మోతాదు 2.5 పీపీఎం కు మించరాదు. అయితే పాస్తా శాంపిల్స్లో 6 పీపీఎం ఉన్నట్లు నిర్థారణ అయింది. ఈ రిపోర్టు ప్రకారం నెస్లే పాస్తా ప్రొడక్ట్ను హానికరమైన అహార పదార్థాల జాబితాలో చేర్చారు. పాస్తాపై కోర్టులో కేసు నమోదు చేయడానికి లాబ్‌ అధికారులు ప్రభుత్వ అనుమతి కోరారు.

 

21:59 - November 28, 2015

ఉత్తరప్రదేశ్ : వేసవి కాలం రాకముందే నీటి యుద్ధం మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో ప్రజలు మంచినీళ్ల కోసం ఆందోళనకు దిగారు. మెహ్దీతంజ్ మండలంలోని సుమారు 18 గ్రామ పంచాయితీల పరిధిలో ఆందోళన ఊపందుకుంది. 1991లో ఇక్కడ నెలకొల్పిన కోకా కోలా కంపెనీ ప్లాంట్ మూలంగానే తమకు తాగునీటి కొరత ఏర్పడిందని ఆరోపిస్తున్నారు. కోకోకోలా కంపెనీ భూగర్భజలాలను విపరీతంగా తోడేస్తూ ఉండడం వల్లే తమకీ దుస్థితి వచ్చిందని మండిపడుతున్నారు. ఇక్కడినుంచి కోకా కోలా బాట్లింగ్ ప్లాంట్ ను ఎత్తివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామస్థుల ఆరోపణలను కోకా కోలా కంపెనీ ఖండిస్తోంది. నీటి సమస్యకు తమ సంస్థ కారణం కాదని వాదిస్తోంది.

 

వరంగల్, మెదక్ డీఈవోలపై సస్పెన్షన్ ఎత్తివేత

హైదరాబాద్ : వరంగల్, మెదక్ డీఈవోలపై సస్పెన్షన్ ను ఎత్తివేశారు. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీచర్ల బదిలీల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై గతంలో వరంగల్, మెదక్ డీఈవోలను సస్పెండ్ చేశారు.

 

21:29 - November 28, 2015

చిత్తూరు : మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూకు స్వంత పార్టీవారే సహకరించారా..? మిగతా పార్టీలోని లీడర్ల హస్తం ఉందా..? ఆదిపత్యం కోసం ఈ హత్య జరిగిందా..? పట్టుసాధించడం కోసం చింటూను రెచ్చగొట్టారా..? పోలీసులకు వస్తున్న అనుమానలపై ఆరా తీస్తున్నారు..ఇప్పటికే కొందరు లీడర్లను విచారించిన పోలీసులు ఈ హత్యలో రాజకీయ కోణంపై దర్యాప్తు ముమ్మరం చేశారు...
టీడీపీ నేతలు సాయం చేశారా...?
చిత్తూరు మేయర్ కటారి దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూకు జిల్లాలోని పలువురు అధికారపార్టీకి చెందిన నేతలే సాయం చేశారన్న అనుమానాలు వెలుగుచూస్తున్నాయి...ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులు, పోలీసుల అదుపులో ఉన్నవారిని విచారిస్తుండగా పలు విషయాలు వెల్లడి అయినట్లు తెలుస్తోంది...ఇక కార్పోరేటర్‌ పద్మావతి భర్త మురగ ఇందులో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే... కాగా చిత్తూరు చెందిన అధికార పార్టీలోని ఓ లీడర్‌ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తూ ఈమధ్యనే పోలీసులకు చిక్కాడు..ఆ నేత ఇటీవల చింటూ సాయం తీసుకున్నట్లు తెలుస్తోంది....
ముంబైలో సెటిల్‌మెంట్‌ సాయం..
ముంబాయిలో ఆ లీడర్‌ చెందిన 3 కోట్ల విలువైన ఆస్తులను అక్కడి మాఫియా ద్వారా చింటూ సెటిల్ చేసినట్లు తెలుస్తోంది.. పోలీసులకు చిక్కిన చింటూ అనుచరులు విచారణలో వెల్లడించినట్లు సమాచారం...దీనికి ప్రతిఫలంగా చింటూకు ఆ నేత విదేశీ తుపాకులు ఇచ్చినట్లు తెలుస్తోంది....
ద్వీపాల్లో తలదాచుకున్నాడా...
ఇక చింటూ కోసం గాలింపు ముమ్మరం చేస్తూనే పలువురిని విచారిస్తున్న పోలీసులకు కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి.. పక్కాప్లాన్‌తోనే చింటూ హత్యానంతరం దేశం దాటి వెళ్లాడా..? అదే నిజమైతే చింటూ పాస్‌పోర్టు పోలీసులు సీజ్ చేశారు..? దీన్ని బట్టి నకిలీ పాస్‌పోర్టుతో దేశం దాటాడా..? ముందస్తు ప్లాన్‌ ప్రకారం ఇదంతా జరిగిందా..? దేశం దాటి వెళ్లినట్లు రుజువైతే మరిన్ని కేసులు నమోదు చేయాలని పోలీసులు ఆలోచిస్తున్నారు...ఇక పరారీలో ఉన్న చింటూ భారత్ కు సమీప దేశాల్లోని ద్వీపాల్లో తలదాచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా తమ దర్యాప్తు ముమ్మరం చేశారు. చింటూ నుంచి లేఖ వచ్చినప్పటికీ పోలీసులు మాత్రం నిందితుడి కోసం గాలింపు తీవ్రం చేశారు.. పట్టుకునేందుకు...అందుకు అవసరమయ్యే సమాచారం కోసం ప్రతీ క్షణం పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

 

21:22 - November 28, 2015

హైదరాబాద్ : బోరుబావి మళ్లీ నోరు తెరిచింది. మూడేళ్ల బాలుడిని మింగేసింది. బాలున్ని రక్షించేందుకు దాదాపు 12 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ సాగుతోంది. ఆడుకుంటు ఆడుకుంటూ కళ్లెదుటే పాతాళంలోకి పడిపోయిన పిల్లాన్ని తలుచుకుని తల్లిదండ్రుల గుండె తల్లడిల్లుతోంది. ఆ ఊరే కాదు తెలుగు ప్రజలంతా పిల్లాడు సురక్షితంగా బయటపడాలని ప్రార్థిస్తున్నారు.
బోర్ బావిలో పడిన బాలుడు
మెదక్‌ జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెం తండా. ఇదే తండాకు చెందిన కుమ్మరి రాములు తాగునీటి కోసం బోరు వేశాడు. కానీ నీళ్లు పడలేదు. అయితే బోరుబావిని మూతవేయకుండా అలాగే వదిలేశాడు. బోరుబావికి వంద మీటర్ల దూరంలో సాయిలు కుటుంబం నివసిస్తోంది. సాయిలు చిన్న కుమారుడే రాకేశ్‌. వయసు మూడేళ్లు.
అన్నతో కలిసి ఆడుకుంటూ...
అన్నతో కలిసి ఆడుకుంటున్నాడు రాకేశ్. అలాగే ఆడుకుంటూ ఆడుకుంటూ బోరు బావి దగ్గరకు వచ్చారు. అయితే ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. పక్కనే ఉన్న అన్న చేయిపట్టుకుని పైకి లేపడానికి ప్రయత్నించాడు. అయితే బరువు మొయ్యలేకపోయాడు. రాకేశ్‌ అంతకంతకు బావిలోకి జారిపోతూనే ఉన్నాడు. ఇద్దరు చిన్నారులు ఏడుపు మొదలుపెట్టారు. ఏడుపులు విన్న తల్లిదండ్రులు ఆందోళనగా పరుగెత్తుకుంటూ బోర్ వెల్ దగ్గరకు వచ్చారు. కానీ అంతలోపే చిన్నారి రాకేశ్‌ అందనంత లోపలికి పడిపోయాడు. వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు సమాచారమిచ్చారు. అంతలోపు తాడును జారవిడిచి రాకేశ్‌ను పైకి లాగడానికి ప్రయత్నించారు. బాలుడు తాడును కూడా పట్టుకున్నాడు. అయితే పైకి లేవడానికి ఇరుకుగా ఉండటం, చేతులకు నొప్పి పెట్టడంతో తాడును వదిలేశాడు. దీంతో మరింత లోపిలికి జారిపోయాడు.
33 అడుగుల లోతులో బాలుడు
బాధితుల సమాచారంతో పోలీసులు, 108, ఫైరింజన్, క్రేన్, రెస్క్యూ టీం మొత్తం ఘటనాస్థలానికి చేరుకుంది. ఆక్సిజన్‌ ను లోపలికి పంపించడం మొదలుపెట్టారు. బోరు బావికి సమాంతరంగా మరో గొయ్యి తీశారు. శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. తల్లిదండ్రులు గుండెను అదిమిపెట్టి, పంటిబిగువన ఆవేదనను దాచుకుని కుమారుని రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఊరు ఊరంతా ఘటనాస్థలికి తరలివచ్చారు. అటు న్యూస్ ఛానెల్స్ ముందు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది జనం ఊపిరి బిగపట్టి రెస్క్యూ ఆపరేషన్ తిలకిస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్‌ డేట్స్ తెలుసుకుంటున్నారు. అందరిదీ ఒకే ఆశ, ఒకే ప్రార్థన... రాకేష్‌ మృత్యంజయుడిగా తిరిగిరావాలని. రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ కావాలని..
అదే నిర్లక్ష్యం. అదే అలసత్వం.
అదే నిర్లక్ష్యం. అదే అలసత్వం. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏటా పదుల సంఖ్యలో చిన్నారులను బోరు బావులు మింగేస్తున్నా ఇటు అధికార యంత్రాంగం, అటు బోర్లు వేసిన యాజమాన్యం సరైన చర్యలు తీసుకోవడం లేదు. ఫలితం ముక్కుపచ్చలారని బాల్యం పాతాళంలోకి కూరుకుపోతోంది.
ఎక్కడ బోరు నోరు తెరిచిందో తెలియదు
ఎక్కడ బోరు నోరు తెరిచిందో తెలియదు. ఎక్కడ గుంత పాతాళానికి దారి తీస్తుందో తెలియదు. చిన్నారి లోకానికి తెలిసిందల్లా ఆడుకోవడం. ముందు వెనక చూసుకోకుండా ఆడుతూ, పాడుతూ గంతులేయడమే వారికి తెలిసిన జ్ఞానం. కానీ అన్నీ తెలిసిన పెద్దరికం ఏం చేస్తోంది...నిబంధనలు అమలు చేయాల్సిన అధికార గణం ఏం చేస్తోంది....బోర్లు చిన్నారులను కబలిస్తున్నా ఏం చేస్తున్నారు....
చిన్నారుల పాలిట మృత్యుద్వారాలుగా బోరు బావులు
చిన్నారుల పాలిట బోరు బావులు మృత్యుద్వారాలుగా మారుతున్నాయి. దేశవ్యాప్తంగా ఏటేటా బోర్లలో పడి పిల్లలు మృత్యువాతపడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో, అందులోనూ తెలంగాణలో ఇలాంటి ఘటనలు నిత్యకృత్యంగా మారాయి.
మంత్రగాళ్లు చెప్పిన చోట బోర్లు వేయడం, విఫలం కావడం
తెలంగాణలో బోరు వ్యవసాయం ఎక్కువ. దీంతో ఎడాపెడా రైతులు బోర్లు వేయిస్తున్నారు. ఇంజనీర్లను సంప్రదించకుండా మూఢనమ్మకాలతో మంత్రగాళ్లు చెప్పిన చోట బోర్లు వేయడం, విఫలం కావడంతో వాటిని అలాగే వదిలేస్తున్నారు. దీంతో నల్గొండ, రంగారెడ్డి,ఖమ్మం, నిజాబామాద్, వరంగల్‌, మహబూబ్ నగర్‌లో ఎందరో చిన్నారులు ఆడుకుంటూ ఆడుకుంటూ బోరు బావిలో పడి చనిపోయిన ఘటనలు చాలా ఉన్నాయి.
ప్రతి ఏడాది సగటున నాలుగు ఘటనలు
పిల్లలు బోరుబావిలో పడిన ఘటనలు ప్రతి ఏడాది సగటున నాలుగు చొప్పున చోటు చేసుకుంటున్నాయి. చాలా ఘటనల్లో చనిపోయిన వారి సంఖ్యే అధికం. మృత్యుంజయులుగా తిరిగొచ్చిన వారు స్పల్పం. చివరికి హాస్పిటల్ వరకు తరలించినా, చికిత్స పొందుతూ చనిపోయిన చిన్నారులున్నారు. కరీంనగర్ జిల్లాలో ఇలాగే బోరు బావిలో పడిన చిన్నారిని అతికష్టం మీద రక్షించినా, అంబులెన్సులో ఆక్సిజన్ లేకపోవడంతో మృత్యువాతపడ్డాడు.
తల్లిదండ్రులకు కడుపుకోత
బారుబావుల్లో చిన్నారులు జారి పడిపోవడం, ప్రాణాలు కోల్పోవడం వంటి సంఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి. బోరులో పడిన చిన్నారిని రక్షించేందుకు వివిధ శాఖల అధికారులు లక్షలాది రూపాయలను వెచ్చించి రాత్రింబవళ్లూ శ్రమించాల్సి వస్తోంది. అనేక సార్లు శ్రమ వృథాగా మారి తల్లిదండ్రులకు కడుపుకోతనే మిగులుస్తోంది. ఇలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతున్నా ప్రజల్లోనూ, అధికారుల్లోనూ ఏ మాత్రం చైతన్యం రాకపోవడంతో సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి.
నిబంధనలు గాలికి...
నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు. బోరు బావులను మూయకుండా, జాగ్రత్తల తీసుకోకుండా అలాగే విడిచేస్తున్నారు. దీంతో బోర్లు చిన్నారులను మింగేస్తున్నాయి. అసలు చట్టాలు ఏం చెబుతున్నాయి...ఈ నిబంధనలు మితిమీరిన వారికి ఎలాంటి శిక్షలున్నాయి....ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బోరు బావుల నుంచి పిల్లలను రక్షించుకోగలం...
బోర్లు వేసేటప్పుడు నిబంధనలు పాటించాలి
వ్యవసాయానికో, తాగునీటికో బోర్లు తవ్వడం సాధారణమే. కానీ కొన్ని నిబంధనలను తప్పకుండా పాటించాలి. ఎండిపోతున్న పంటను కాపాడుకోవాలనే ఆతృతలో రైతన్నలు తమ వ్యవసాయ భూములో బోర్లు తవ్వుతుంటారు. నిబంధనల ప్రకారం, భూగర్భ జలశాఖ ద్వారా ముందుగా సర్వే చేయించాలి. రెవెన్యూ అధికారి అనుమతి తీసుకుని బోర్లు వేయాలి. ఒకవేళ నీళ్లు పడకపోతే పూడ్చివేయాలి. తవ్వకం పనులు జరుగుతున్న సమయంలో బోరు రంధ్రాలకు గట్టిమూతలు వేయాలి. చిన్నారులను ఒంటరిగా వదలకూడదు. బోరు సమీపంలో హెచ్చరిక బోర్డులు పెట్టాలి. ఇటు బోర్లు వేసిన యాజమాన్యం, అటు రెవెన్యూ అధికారులు ఈ పని చెయ్యాలి. కానీ అలా జరగడం లేదు.
ముందుజాగ్రత్తలు తీసుకోవడంలో అలసత్వం
పిల్లలు బోరుబావిలో పడ్డప్పుడు ప్రభుత్వం తెగ హడావుడి చేస్తుంది. అధికారయంత్రాంగం లక్షల రూపాయలతో చిన్నారులను రక్షించేందుకు ప్రయత్నిస్తుంది. తర్వాత హడావుడిగా కొన్ని బోర్లను మూసివేస్తుంది. అయితే ముందుజాగ్రత్తలు తీసుకోవడంలో అలసత్వం వహిస్తున్నారు. అందుకే పక్క రాష్ట్రం తమిళనాడులో ఇలాంటి ఘటనలు పెరుగుతుంటంతో ఏకంగా ఓ చట్టం తెచ్చారు. ఆ చట్టాన్ని అతిక్రమించిన వారికీ కఠిన శిక్షలు వేస్తామంటోంది.
రూ.50వేల జరిమానా
అధికారుల అనుమతి పొందకుండా తవ్వకాలకు పాల్పడితే ఐపీసీ 143 ఏ లేదా ఐపీసీ 143 బీ సెక్షన్ల కింద కేసులు వేస్తారు. కనిష్టంగా 3 ఏళ్లు, గరిష్టం 7 ఏళ్ల జైలు శిక్ష, రూ.50వేల జరిమానా చెల్లించాలని చట్టం తెచ్చారు. ఇలాగే మన తెలుగు రాష్ట్రాల్లోనూ చట్టం తేవాలి.
బోర్లను మట్టితోనే, రాళ్లతోనో కప్పివేయాలి
జనంలోనూ బోరు బావులపై చైతన్యం రావాలి. బాధ్యతగా ఖాళీ బోర్లను మూసెయ్యాలి. బోర్లను మట్టితోనే, రాళ్లతోనో కప్పివేయాలి. బోర్లు వేసిన వారు, జనం కాస్త విజ్ఞత, బాధ్యతగా వ్యవహరిస్తే చిన్నారులను బోరుబావులను మింగేయకుండా కాపాడగలం.

 

21:06 - November 28, 2015

మహబూబ్ నగర్ : సేద్యాన్ని కరవు కాటేసింది. వరుణుడి కరుణ లేక.. వానలు రాక.. చెరువులు ఎండిపోయాయి. ఫలితంగా భూగర్భజలాలూ ఇర్రింకి పోయాయి. ఎలా చూసినా వ్యవసాయం అనుకూలించడం లేదు.. పైగా ఉన్న ఊళ్లో పని దొరికే దారీ కనిపించడం లేదు. దీంతో.. పాలమూరు రైతన్న.. మళ్లీ.. ఉపాధి కోసం.. వలస బాట పట్టాడు.
పాలమూరు రైతన్న మళ్లీ వలస
పాలమూరు రైతన్న మళ్లీ వలసెళ్లి పోతున్నాడు. రాష్ట్రం ఏర్పాటైందని.. బతుకులు మారిపోతాయని.. కొండంత ఆశతో.. ఏడాదిన్నర క్రితం స్వగ్రామాలకు తిరిగొచ్చిన పాలమూరు వలస కూలీలు.. మళ్లీ పొరుగు రాష్ట్రాల బాట పట్టారు. ప్రకృతి పగబట్టినట్లుగా వ్యవహరిస్తుంటే.. వ్యవసాయం అనుకూలించక.. నమ్మిన పాలకులు ఆదుకోక.. ఉన్న ఊళ్లో ఉపాధి దొరకక.. అయిన వారందరినీ వదిలేసి.. కడుపు చేత పట్టుకొని.. వలస వెళ్లి పోతున్నారు.
బోర్లలో నీటి జాడ లేదు...
జిల్లాలో సకాలంలో వానలు కురవక... బోర్లలో నీటి జాడే లేకుండా పోయింది. దీంతో..... సాగు కనాకష్టమై పోయింది. అప్పులు తెచ్చి.. అధిక ఖర్చులు భరించి.. సాగు చేస్తే మొలకే రాలేదు. అక్కడక్కడా విత్తనాలు అంకురించినా.. నీటితడి అందక... పంట కళ్లముందే మాడిపోయింది. ఈ పరిస్థితుల్లో సొంతూళ్లోనే ఉంటే అప్పులు తీర్చే మాటేమో గానీ.. తిండికీ కటకటలాడాల్సి వస్తుందన్న భయంతో.... ఉన్న పశువులను అమ్మేసుకొని.. ప్రాణాంతకంగా మారిన అప్పులను తీర్చేందుకు... ప్రజలు పొట్ట చేతపట్టుకుని వలస వెళ్లి పోతున్నారు.
ఊళ్లకు ఊళ్లే ఖాళీ
పాలమూరు జిల్లాలో ప్రస్తుతం ఊళ్లకు ఊళ్లే ఖాళీ అవుతున్నాయి. రోజూ.. వందలాది మంది... పొరుగు రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. వృద్ధులైన తల్లిదండ్రులను ఇంటిదగ్గరే ఉంచి... పిల్లల ఆలనాపాలనా వారికి అప్పగించి బతుకు బాటన.. భారంగా సాగుతున్నారు. మూటా ముల్లె సర్దుకొని.. ఇళ్లకు తాళాలు వేసి.. బతుకుదెరువు కోసం.. సుదూర ప్రాంతాలకు తరలి వెళున్న ఆత్మీయులను చూస్తూ.. ఉబికి వచ్చే దుంఖాన్ని దిగమింగుకోలేక.. బంధువులు తల్లడిల్లి పోతున్న దృశ్యాలు హృదయాన్ని బరువెక్కిస్తాయి. ఏ బస్‌స్టాండ్‌ చూసినా.. ఏ రైల్వే స్టేషన్‌ చూసినా.. ఇలాంటి హృద్యమైన దృశ్యాలే కనిపిస్తాయి.
వారి వేదనా వర్ణనాతీతం
కన్నవాళ్లను.. కన్నతల్లిలాంటి సొంతూరినీ వదిలి సుదూర తీరాలకు తరలి వెళుతున్న వారి వేదనా వర్ణనాతీతం. ముఖ్యంగా కన్నబిడ్డలకు దూరమవుతూ.. ఎన్నాళ్లకు తిరిగి వస్తామో.. అసలు వస్తామో రామో తెలియని స్థితిలోని మహిళల వేదన.. ఎవరినైనా కదిలించక మానదు.
ఈ ఏడాది వలసలు అధికం
గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది పాలమూరు నుంచి వలసలు అధికమయ్యాయి. ఖరీఫ్‌ సీజన్‌ ఆశాజనకంగా లేకున్నా.. రబీ అయినా ఆదుకుంటుందని భావిస్తే.. అదీ నిరాశాజనకంగానే కనిపిస్తోంది. దీనికి తోడు ఉపాధి హామీ పనులు దొరకడమే గగనమై.. దొరికినా.. చేసిన పనికి దక్కాల్సిన అరకొర డబ్బులూ సకాలంలో రాక.. రైతులు వలస బాట పట్టారు. జిల్లాలో భారీ పరిశ్రమలే లేకపోవడం.. ఉన్నవి కూడా ఇతర రాష్ట్రాల వారికే ప్రాధాన్యతను ఇస్తుండడంతో రైతులు ఉపాధి కోసం.. జీవన పోరాటం కోసం.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లోని పట్టణాల బాట పట్టారు.

 

20:56 - November 28, 2015

కర్నూలు : జిల్లాలోని అవుకు మండలం చెర్లపల్లెలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ-వైసీపరీ వర్గీయులు పరస్పరం వేటకొడవళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. 

 

జాతీయ ఆహార భద్రత ముసాయిదా విడుదల

హైదరాబాద్ : జాతీయ ఆహార భద్రత ముసాయిదాను విడుదల చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆహార భద్రత బిల్లుపై 15 రోజుల్లో అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరించాలని ప్రభుత్వం ఆదేశించింది.

 

20:32 - November 28, 2015

హైదరాబాద్ : సైబరాబాద్ కమిషనరేట్ ఎదుట ఓ ఎస్ ఐ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వనస్థలీపురం పోలీసు స్టేషన్ లో సైదులు ఎస్ ఐ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతనిపై అవినీతి ఆరోపణలు రావడంతో నిన్న సైబరాబాద్ కమిషనర్ సీవీ.ఆనంద్ సైదులును సస్పెండ్ చేశాడు. ఇదే విషయంపై వివరణ ఇచ్చేందుకు సైదులు ఇవాళ కమిషనరేట్ కు వచ్చాడు. కమిషనర్ ను కలిసి బయటికి వచ్చాడు. తనను సస్పెండ్ చేయడంతో మనస్థాపంతో అతను తన వెంట తెచ్చుకున్న ఆలౌట్ లిక్విడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. పరిస్థితి విషమించడంతో అతన్ని గచ్చిబౌలిలోని ఆస్పత్రికి తరలించారు.

 

సైబరాబాద్ కమిషనరేట్ ఎదుట ఎస్ ఐ ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్ : సైబరాబాద్ కమిషనరేట్ ఎదుట ఓ ఎస్ ఐ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పరిస్థితి విషమించడంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. 

20:05 - November 28, 2015

హైదరాబాద్ : పాతబస్తీలోని పలు ఆస్పత్రుల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. 20 ఆస్పత్రులపై దాడులు నిర్వహించారు. ఆయా ఆస్పత్రుల్లో పని చేస్తున్న 50 మంది నకిలీ వైద్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిగ్రీలు చేసిన వారు, నర్సుగా పని చేస్తున్నవారు, ఎంఎల్ టి, ఆర్ ఎంపీ కోర్సులు చేసిన కొంతమంది డాక్టర్ల అవతారమెత్తారు. రోగులకు ఎక్కువ యాంటిబయాటిక్ మందులు, ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. వేరే దగ్గర నర్సు ఉద్యోగం చేస్తున్నవారు పాతబస్తీలో డాక్టర్లుగా పని చేస్తున్నారు. వీరిలో ఎంబిబిఎస్ పూర్తి కానీ వారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

 

పాతబస్తీలోని పలు ఆస్పత్రుల్లో పోలీసుల సోదాలు

హైదరాబాద్ : పాతబస్తీలోని పలు ఆస్పత్రుల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. 20 ఆస్పత్రులపై దాడులు నిర్వహించారు. ఆయా ఆస్పత్రుల్లో పని చేస్తున్న 50 మంది నకిలీ వైద్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

19:57 - November 28, 2015

మెదక్ : జిల్లాలోని పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెంలో ప్రమాదవశాత్తు ఓ బాలుడు బోరువావిలో పడిపోయాడు. దాదాపు 33 అడుగుల లోతులో రాకేష్ పడిపోయాడు. బాలుడిని కాపాడేందుకు 9 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బోరుబావికి సమాంతరంగా జెసిబిలతో తవ్వకాలు జరుపుతున్నారు. తవ్వకాలకు అడ్డుగా నిలిచిన బండరాళ్లను తొలగించేందుకు అధికారులు ప్రత్యేకంగా ఐదు యంత్రాలను తీసుకొచ్చారు. అధికారులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు కేవలం పది అడుగులు మాత్రమే తవ్వకాలు జరిపారు. జహీరాబాద్ ఎంపీ పాటిల్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. 

బోరుబావిలో బాలుడు... టెన్షన్ వాతావరణం..

మెదక్ : జిల్లాలోని పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెంలో ప్రమాదవశాత్తు ఓ బాలుడు బోరువావిలో పడిపోయాడు. దాదాపు 33 అడుగుల లోతులో రాకేష్ పడిపోయాడు. బాలుడిని కాపాడేందుకు 9 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బోరుబావికి సమాంతరంగా జెసిబిలతో తవ్వకాలు జరుపుతున్నారు.

 

కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత

కర్నూలు : జిల్లాలోని అవుకు మండలం చెర్లపల్లిలో టిడిపి, వైసిపి వర్గీయుల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఈ ఘర్షణలో వేడకొడవళ్లతో దాడులు చేసుకొవడంతో 8 మందికి గాయాలయ్యాయి.

19:42 - November 28, 2015

హైదరాబాద్ : అంగన్ వాడీల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పీతల సుజాత అన్నారు. ఈమేరకు హైదరాబాద్ లో టెన్ టివితో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. సాధ్యమైనంత త్వరలో వేతనాల పెంపు జీవోను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అప్పటివరకు అంగన్ వాడీలు ఆందోళన విరమించాలని కోరారు.

 

19:37 - November 28, 2015

తిరుమతి : శ్రీవారి ప్రసాదాన్ని మరింత సుచి, శుభ్రంగా తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఈవో సాంబశివరావు చెప్పారు. యాత్రికుల వసతి సముదాయాలు, లడ్డూల కౌంటర్లను ఆయన తనిఖీ చేశారు. భక్తుల ఇబ్బందులను తెలుసుకున్నారు. ప్రసాదాల నాణ్యత తగ్గుతోందని చాలా మంది భక్తులు ఈవో దృష్టికి తెచ్చారు. లడ్డూలు సహా అన్ని రకాల ప్రసాదాల తయారీకి నాణ్యమైన ముడిపదార్ధాలు తెప్పిస్తున్నామని ఈవో చెప్పారు. 

19:30 - November 28, 2015

హైదరాబాద్ : ఎపి సీఎం చంద్రబాబుపై వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఎపి సీఎం చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు.. సీఎం కేసీఆర్ అనుమతితోనే హైదరాబాద్లో తిరిగి అడుగుపెట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని రాంబాబు విమర్శించారు. ఓటుకు కోట్లు కేసులో కేసీఆర్ ఇచ్చిన కండీషన్ బెయిల్ మీద చంద్రబాబు ఏపీని పరిపాలిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు జగన్ ను విమర్శించే హక్కు లేదన్నారు.

 

 

18:13 - November 28, 2015

హైదరాబాద్ : కాంగ్రెస్‌ ముందుచూపువల్లే హైదరాబాద్‌కు గోదావరి జలాలు వచ్చాయని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గోదావరి జలాలు హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి సహా..రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ నేతలంతా గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంరదర్భంగా ఆమె టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. 95శాతం పనులు కాంగ్రెస్‌ హయాంలో జరిగినా..టీఆర్‌ఎస్‌ మాత్రం తమ ఘనత వల్లే గోదావరి జలాలు వచ్చాయని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని సబిత అన్నారు. అయితే గ్రేటర్‌ ఎన్నికల కోసమే టీఆర్‌ఎస్‌ పార్టీ ఇంటింటికి నల్లా మంత్రం జపిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌కు గోదావరి జలాలు తీసుకొచ్చేందుకు కాంగ్రెస్‌ హయాంలో పనులు జరగలేదని టీఆర్‌ఎస్‌ చెప్పగలదా..? అని ప్రశ్నించారు.

 

గవర్నర్ తో సీఎం చంద్రబాబు భేటీ

హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్ తో ఎపి సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాజ్ భవన్ లో గవర్నర్ తో బాబు మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు. పలు విషయాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

 

17:56 - November 28, 2015

హైదరాబాద్ : సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఓ వ్యక్తికి గుండెమార్పిడి ఆపరేషన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుచ్చిలో బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి గుండె సేకరించిన వైద్యులు... ప్రత్యేక విమానంలో కాసేపట్లో హైదరాబాద్ తీసుకురానున్నారు. గుండె తరలింపు సందర్భంగా బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ఆసుపత్రి వరకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

 

17:53 - November 28, 2015

ఢిల్లీ : దళిత సమస్యలు, చట్టాలపై పార్లమెంట్‌ సమావేశాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని దళిత శోచణ ముక్తి మంచ్‌ జాతీయ నేత వి. శ్రీనివాసరావు అన్నారు. ఈమేరకు ఢిల్లీలో ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రైవేటు సెక్టార్‌లో రిజర్వేషన్లు కల్పించినప్పుడే దళితులకు సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. అంబేద్కర్‌ 125వ జయంతి సందర్భంగా నిర్వహించిన పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిరాశ పరిచాయన్నారు. రెండు రోజుల సమావేశాల్లో ఉపన్యాసాలు తప్ప సాధించింది ఏమీలేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం వల్లే దేశంలో అసహనం పెరుగుతోందని ఆరోపించారు. జీఎస్‌టీ బిల్లు వల్ల ఎవరికి ఉపయోగం ఉంటుందో కేంద్రం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు. దళిత సమస్యలపై చర్చించాలని మెమోరాండాలు ఇచ్చినా ఫలితం లేదని వాపోయారు. బడ్జెట్‌ సమావేశాల్లోపు దళితుల పరిరక్షణ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే దేశవ్యాప్త ఉద్యమాలు చేస్తామని ఆయన హెచ్చరించారు.

 

ఆత్మకూర్ నల్లమల అడవుల్లో పేలుడు సామాగ్రి స్వాధీనం

కర్నూలు : ఆత్మకూర్ సమీపంలోని నల్లమల అడవుల్లో పేలుడు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వాహనంలో ఉంచిన 1260 జిలిటెన్ స్టిక్స్, 30 బ్యాగుల అమ్మోనియం నైట్రైట్, 1650 డిటోనేటర్లు, 1200 మీటర్ల ఫీజు వైర్ ను స్వాధీనం చేసుకున్నారు. వాహనం డ్రైవర్, క్లీనర్లను అరెస్ట్ చేశారు. 

17:43 - November 28, 2015

కర్నూలు : ఆత్మకూర్ సమీపంలోని నల్లమల అడవుల్లో పేలుడు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వాహనంలో ఉంచిన 1260 జిలిటెన్ స్టిక్స్, 30 బ్యాగుల అమ్మోనియం నైట్రైట్, 1650 డిటోనేటర్లు, 1200 మీటర్ల ఫీజు వైర్ ను స్వాధీనం చేసుకున్నారు. వాహనం డ్రైవర్, క్లీనర్లను అరెస్ట్ చేశారు. 

17:38 - November 28, 2015

మెదక్‌ : జిల్లాలోని పుల్కల్‌ మండలంలో బోరుబావిలో పడిపోయిన బాలుడు రాజేష్ ను రక్షించడానికి స్థానికులు, అధికారులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. బోరుబావిలోకి ఆక్సిజన్‌ను పంపుతున్నారు. రాజేష్ 33 అడుగుల అడుగుల లోతున ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం బోరుకు సమాంతరంగా తవ్వే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సమాంతరంగా తవ్వుతున్న క్రమంలో బండలు రావడంతో సహాయక చర్యలకు ఆటంకం కల్గి ఆలస్యమవుతుంది. మరోవైపు సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులతో గ్రామస్తుల వాగ్వాదానికి దిగారు. వ్యవసాయబావి దగ్గరే నివాసముంటున్న బాలుడి తల్లిదండ్రులు తాగునీటి కోసం నిన్న ఉదయమే బోరు వేయించారు. అయితే అందులో నీరు రాకపోవడంతో అలాగే వదిలేశారు. ఇవాళ బాలుడు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తూ అందులో పడిపోయాడు. ఘటన జరిగి ఎనిమిది గంటలు గుడుస్తున్నా.. ప్రజాప్రతినిధి గానీ, జెడ్ పిటిసి గానీ అక్కడికి వెళ్లలేదు.

 

17:31 - November 28, 2015

చిత్తూరు : మేయర్‌ కఠారి అనూరాధ దంతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటును పట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఏపీ డీజీపీ... జేవీ రాముడు చెప్పారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. చిత్తూరు వచ్చిన డీజీపీ రాముడు... మేయర్‌ హత్య కేసు దర్యాప్తు పురోగతిపై సమీక్షించారు. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టు చేసిన వారి వివరాలను తెలుసుకున్నారు. చింటూ విదేశాలకు పారిపోయే అవకాశంలేదన్నారు.

 

17:24 - November 28, 2015

హైదరాబాద్ : ఏపీలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ప్రముఖ సాహితీవేత్త, ప్రొఫెసర్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుపై వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఏపీ పునర్విభజన చట్టం పదో షెడ్యూలులో ఉన్న సంస్థలను విభజించడం సాధ్యంకాదంటూ అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పదో షెడ్యూలులోనే ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం, అడ్మినిస్ట్రేటివ్‌ స్టాప్‌ కాలేజీని విభజించిన విషయాన్ని గుర్తు చేశారు. అటువంటప్పుడు తెలుగు యూనివర్సిటీని ఎందుకు విభజించకూడదని ప్రశ్నించారు. తెలుగు విశ్వవిద్యాలయం విభజనకు అడ్డుపడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామా చేయాలని యార్లగడ్డ డిమాండ్‌ చేశారు.

 

17:18 - November 28, 2015

ఢిల్లీ : అంబేద్కర్‌ 125వ జయంతి సందర్భంగా నిర్వహించిన పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిరాశ కలిగించాయని దళిత శోచణ ముక్తిమంచ్‌ జాతీయ నేత వి శ్రీనివాసరావు ఆరోపించారు. రెండు రోజుల సమావేశాల్లో ఉపన్యాసాలే తప్ప సాధించింది ఏమీ లేదన్నారు. దళిత సమస్యలు, చట్టాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం పనిచేస్తోందని శ్రీనివాసరావు విమర్శించారు. జీఎస్‌టి బిల్లు వల్ల ఎవరికి ఉపయోగం ఉంటుందో కేంద్రం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వల్లే దేశంలో అసహనం పెరుగుతోందని ఆరోపించారు.

 

నిరాశకల్గించిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు : వి.శ్రీనివాసరావు

ఢిల్లీ : అంబేద్కర్ 125 వ జయంతి సందర్భంగా నిర్వహించిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిరాశ కలిగించాయని దళిత శోషణ ముక్తిమంచ్ జాతీయ నేత వి.శ్రీనివాసరావు అన్నారు. 2 రోజుల సమావేశాల్లో ఉపన్యాసాలు తప్ప సాధించిందేమీ లేదని ఎద్దేవా చేశారు. దళిత సమస్యలు, చట్టాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని చెప్పారు. ప్రైవేట్ సెక్టార్ లో రిజర్వేషన్లు కల్పించినప్పుడే దళితులకు సామాజిక న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. జీఎస్ టీ బిల్లుతో ఉపయోగం ఎంటో కేంద్ర చెప్పాలన్నారు. బడ్జెట్ సమావేశాల్లోపు దళితుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే దేశ వ్యాప్త ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

 

మకావు ఓపెన్ బ్యాడ్మింటన్ ఫైనల్ కు చేరిన పీవీ.సింధు

హైదరాబాద్ : బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ.సింధు.. మకావు ఓపెన్ బ్యాడ్మింటన్ ఫైనల్ కు చేరింది. 

హైదరాబాద్ బుక్ ఫెయిర్ వెబ్ సైట్ ప్రారంభం

హైదరాబాద్ : హైదరాబాద్ బుక్ ఫెయిర్ వెబ్ సైట్ ను ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రారంభించారు. బుక్ ఫెయిర్ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం అయింది. జ్ఞానాన్ని పెంపొందించేందుకు పుస్తకాలు దోహదపడతాయన్నారు. వివిధ భాషల్లో లభించే పుస్తక ప్రదర్శనను ప్రతి ఒక్కరు తిలకించాలని చెప్పారు.

 

ముగిసిన చంద్రబాబు సమీక్ష సమావేశాలు

హైదరాబాద్ : సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశాలు ముగిశాయి. శాఖల వారిగా అభివృద్ధిపై చర్చించారు. దాదాపు 5 గంటలపాటు సమావేశాలు కొనసాగాయి. ఇకపై అన్ని సమావేశాలు విజయవాడలోనే నిర్వహించాలనుకున్నామని సీఎం తెలిపారు. 

15:56 - November 28, 2015

హైదరాబాద్ : 3 నెలల సుధీర్ఘవిరామం తర్వాత హైదరాబాద్‌ వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు సచివాలయంలో అన్నిశాఖల అధికారులతో వరుస సమీక్ష సమావేశాలు నిర్వహించారు. దాదాపు 5గంటలపాటు కొనసాగిన సమీక్షలో రేపు జరిగే క్యాబినెట్‌ సమావేశమే కాకుండా..ఇకపై అన్ని సమావేశాలు విజయవాడలోనే నిర్వహించుకుందామని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. గృహనిర్మాణ శాఖ పురోగతి బాగుందని మంత్రి అచ్చెన్నాయుడితో జరిగిన సమావేశంలో సీఎం అన్నారు. వచ్చేనెల 14,15న జరగనున్న జిల్లాల కలెక్టర్ల సమావేశం కల్లా రెండంకెల అభివృద్ధి సాధించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఇకపై ఉన్నతస్థాయి సమావేశాలు కూడా విజయవాడలోనే నిర్వహించుకోవడం ద్వారా ప్రజలకు భరోసా ఇచ్చినవాళ్లం అవుతామని చంద్రబాబు అన్నారు. సాయంత్రం గవర్నర్‌ నరసింహన్‌ను మర్యాదపూర్వకంగా చంద్రబాబు కలవనున్నట్లు సమాచారం.

 

15:46 - November 28, 2015

హైదరాబాద్ : శృంగారం శృతి మించకుండా...సంప్రదాయవాదుల మనసు నొప్పించకుండా వెండితెరపై తళుకుబెళుకులు చూపించడంలో బాలీవుడ్ స్టార్‌ డైరెక్టర్‌ సంజయ్‌ లీలాబన్సాలిది విభిన్న శైలి. భారీతారాగణంతో సాహసాలు చేయగల సాహసవంతుడు కూడా ఆయనే. అంతే కాదు ఇండియన్‌ క్లాసికల్‌ మ్యూజిక్‌లో అందునా జుగల్‌బందీ పాటలను తెరపైకి ఎక్కించి ప్రేక్షకుల మదిని మిక్సీలో వేసి మిక్స్ చేయగలడు కూడా. ఇందుకు నిదర్శనమే అప్పటి దేవదాసులోని డోలారా అయితే ఇప్పటి బాజీరావ్‌ మస్తానిలోని పింగాగ పాట. ఒకటి రొమాంటిక్‌ డ్రామా పిక్చర్‌.. మరొకటి చరిత్రతో ముడిపడిన ఓ వీరుని ప్రేమగాథ.. రెండూ క్లాసికల్ మూవీలే. అటు విజువల్స్ పరంగాను, కాస్ట్యూమ్స్ పరంగాను కల్చర్‌ గీసిన గీత దాటకుండా రిచ్‌లుక్ తేవడంలో బన్సాలీ తనదైన ముద్ర వేసుకున్నాడు. జుగల్‌బందీ నేపథ్యమున్న పాటలలోను ప్రయోగాలు చేసి సక్సెస్‌ కూడా అయ్యాడు.
ఐశ్వర్యారాయ్, మాధురి దీక్షిత్‌ల డోలారే సాంగ్
2002లో విడుదలైన ఫేమస్‌ నవలా ఆధారిత సినిమా దేవదాసులో ఐశ్వర్యారాయ్, మాధురి దీక్షిత్‌ల డోలారే సాంగ్ ఇప్పటికీ ప్రేక్షకుల మనసులో డోలు బజాయిస్తుంది. డ్యాన్స్‌ నేపథ్యమున్న ఏ కార్యక్రమాల్లోనైనా ఈ పాట ముందంజలో ఉంటుంది. బెంగాలి సంప్రదాయ నృత్య నేపథ్యంలో సాగే ఈ జుగల్‌బందీలో భారీ తారాగణం మాధురీ దీక్షిత్‌, ఐశ్వర్యరాయ్‌లో పోటాపోటీగా నర్తించారు. ఏ మాత్రం కోఆర్డినేషన్‌ మిస్‌ అవకుండా ఉర్రూతలూగించారు. కవితాకృష్ణమూర్తి, శ్రేయాగోషల్‌ పాటకు గాత్రం దానం చేస్తే కొరియోగ్రాఫర్‌ సరోజ్‌ఖాన్‌ ఇండియన్‌ క్లాసికల్‌ డ్యాన్స్‌లో మిక్సింగ్‌ చేస్తే ఎలా ఉంటుందో రుచి చూపించారు.
బన్సాలీ పింగాగ సాంగ్‌తో మరో ప్రయోగం
ఓ మరాఠవీరుని ప్రేమ గాథతో బన్సాలీ తెరపైకి తెస్తున్న చిత్రమే బాజీరావ్‌ మస్తాని. దేవదాసులో డోలారే పాటలానే ఇందులోను బన్సాలీ పింగాగ సాంగ్‌తో మరో ప్రయోగం చేశారు. పింగాగ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్‌చేస్తోంది. ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొణేపై చిత్రీకరించిన ఈ జుగల్‌బందీ పాట ఇప్పటికే సంగీతప్రియుల మదిలో ఫిక్స్‌ అయింది. మఠాఠ సంప్రదాయ దుస్తుల్లో స్టార్‌ హీరోయిన్లు ప్రియాంకా, దీపికా చేసిన నృత్యం చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ అంచనా వేస్తోంది. ఇద్దరు తారామణులకు శ్రేయాగోషలే గాత్ర దానం చేస్తే స్టార్‌ కొరియోగ్రాఫర్‌ రెమో డిసౌజా నృత్యదర్శకత్వం వహించి మరాఠ క్లాసికల్‌లో కొంచెం మిక్స్‌ చేసి జుగల్‌బందీని జిగేల్‌మనిపించారు.
ప్రేక్షకుల ఓటింగ్‌ ఎక్కువగా డోలారే పాటకే
దేవదాసులోని డోలారేపాటకు, బాజీరావు మస్తానీలోని పింగాగ పాటకు పోలికలున్నా ప్రేక్షకుల ఓటింగ్‌ మాత్రం ఎక్కువగా డోలారే పాటకే పడుతున్నాయి. ఐశ్వర్యా, మాధురీల నృత్యం అలరించినంతగా ప్రియాంకా, దీపికాల నృత్యం హైలెట్ అవ్వలేదని సోషల్ మీడియాలో మరోటాక్‌. 

15:40 - November 28, 2015

ఢిల్లీ : అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం హెచ్‌ఎస్‌బీసీ.. భారత్‌లో ప్రైవేట్ బ్యాంకింగ్ విభాగాన్ని మూసివేయనున్నట్లు ప్రకటించింది. ఈ విభాగం కింద సంస్థ ప్రస్తుతం వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసులను అందిస్తున్నది. అంతర్జాతీయంగా సంస్థ ప్రైవేట్ బ్యాంకింగ్ వ్యాపారంపై సమీక్ష జరిపిన తర్వాత ఇండియాలో ఈ విభాగాన్ని మూసివేయాలని నిర్ణయించుకున్నట్లు హెచ్‌ఎస్‌బీసీ అధికార ప్రతినిధి తెలిపారు.
ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ వ్యాపారాన్ని మూసేస్తున్నట్లు ప్రకటన
భారత్‌లో ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ వ్యాపారాన్ని మూసేస్తున్నట్లు హెచ్‌ఎస్‌బిసి ప్రకటించింది. ప్రైవేట్‌ బ్యాంకింగ్‌లో భాగంగా ఇప్పటివరకు వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సేవలను బ్యాంకు అందించింది. సంస్థ అంతర్జాతీయ ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ కార్యకలాపాలను సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంకు తెలిపింది.
వచ్చే ఏడాది మార్చి నుంచి పూర్తిగా కార్యకలాపాల నిలిపివేత
వచ్చే ఏడాది మార్చి నుంచి కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయనున్నట్లు యాజమాన్యం స్పష్టం చేసింది. ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే సేవలు అందించనున్నట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు. ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా ఇందుకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించింది.
రిటైల్ బ్యాంకింగ్‌లోకి సిబ్బంది విలీనం
ఇండియాలో హెచ్‌ఎస్‌బీసీ ప్రైవేట్ బ్యాంకింగ్ డివిజన్‌కు శంతను అంబేద్కర్ నేతృత్వం వహిస్తున్నారు. సంస్థలో 70 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ విభాగం కార్యకలాపాలను నిలిపివేశాక వీరందరినీ రిటైల్ బ్యాంకింగ్‌లోకి విలీనం చేసుకోనున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. అంతర్జాతీయ బ్యాంకులు భారత్‌లో ప్రైవేట్ బ్యాంకింగ్ వ్యాపారం నుంచి వైదొలగడం గడిచిన రెండు నెలల్లో ఇది రెండో ప్రకటన. ఈ మధ్య రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్‌ అలాగే గతంలో మోర్గాన్ స్టాన్లీ కూడా ఇండియన్ ప్రైవేట్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ నుంచి తప్పుకుంది.
హెచ్‌ఎస్‌బీసీ ప్రైవేట్ బ్యాంకింగ్ విభాగానికి బ్లాక్ మనీతో లింక్..?
భారత్‌లో హెచ్‌ఎస్‌బీసీకి కార్యకలాపాలను నిలిపివేయడం ఇది మొదటిసారి కాదు. రెండేళ్ల క్రితం సంస్థ మన దేశంలో రిటైల్ బ్రోకింగ్, రిటైల్ డిపాజిటరీ సర్వీసుల బిజినెస్‌లను మూసివేసింది. ఫలితంగా 300 మంది సిబ్బంది ఉపాధి కోల్పోయారు. భారత్‌లోని బ్లాక్‌మనీ వ్యవహారాలతో హెచ్‌ఎస్‌బీసీ ప్రైవేట్ బ్యాంకింగ్ విభాగానికి లింక్ ఉందని దర్యాప్తులో వెలుగుచూడటం కూడా తాజా నిర్ణయానికి కారణం కావచ్చని మార్కెట్‌ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

రియల్ ఎస్టేట్ వ్యాపారులు, క్రెడా సభ్యులతో సీఎం కేసీఆర్ భేటీ

హైదరాబాద్ : క్యాంపు కార్యాలయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, క్రెడా సభ్యులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. గ్రీన్ ఫీల్డ్ యాక్టివిటీ పెంచాలని వ్యాపారులకు సీఎం సూచించారు. నగరాభివృద్ధిలో రియల్ ఎస్టేట్ ది ప్రముఖ పాత్రని కేసీఆర్ అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా కలిసి ఓఆర్ ఆర్ ప్రాంతాల్లో 3, 4 వేల ఎకరాల్లో ప్రత్యేక నగరం నిర్మించాలన్నారు. రియల్ ఎస్టేట్ కూడా సులువైన వ్యాపారంలా సాగే పద్ధతి రావాలని ఆకాంక్షించారు.

 

అలా చేస్తే తెలుగును అవమానించడమే : యార్గలక్ష్మిప్రసాద్

హైదరాబాద్ : అమరావతి శంకుస్థాపన బోర్డులను ఇంగ్లీష్ లో పెట్టడం తెలుగును అవమానించడమే అవుతుందని రిటైర్డ్ ప్రొ.యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ అన్నారు. ఏపీలో తెలుగు వర్సిటీ ఏర్పాటు కాకపోవడానికి ఉన్నత విద్యాశాఖ అధికారులే కారణమన్నారు. ఉన్నత విద్యాశాఖ అధికారులపై మంత్రి గంటా శ్రీనివాస్ చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే గంటా తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

 

15:01 - November 28, 2015

హైదరాబాద్‌ : నగరంలోని కవాడిగూడలో దారుణం జరిగింది. ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. ఇద్దరు మహిళలు స్కూటీపై వెళ్తుండగా ఆర్టీసీ బస్‌ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో సుస్మిత అనే మహిళ దుర్మరణంపాలైంది. మరో మహిళ తీవ్రంగా గాయపడింది. క్షతగాత్రురాలి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

'

14:59 - November 28, 2015

అనంతపురం : జిల్లాలోని పెనగొండ మండలం శెట్టిపల్లి గ్రామంలో 10 రోజుల నుండి కురుస్తున్న వర్షాల వల్ల నష్టపోయిన వేరుశెనగ పంటను పెనుగొండ ఎమ్మెల్యే బీకే. పార్థసారథి పరిశీలించారు. భారీగా పంటను నష్టపోయిన వేరుశెనగ రైతులను పరామర్శించి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హెక్టారుకు 15వేల రూపాయల నష్టపరిహారం ఇస్తున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. రైతులను ఆదుకుంటామని భోరోసా ఇచ్చారు.

 

14:34 - November 28, 2015

ఫేస్ బుక్..సామాజిక మాధ్యమాల్లో అందర్నీ ఆకర్షిస్తోంది. కొత్త కొత్త ఫీచర్లు ఇందులో అందుబాటులోకి వస్తున్నాయి. తమ ఫొటోలు...భావ వ్యక్తీకరణ ద్వారా ఇతరులతో పంచుకుంటున్నారు. కానీ ఫేస్ బుక్ వల్ల అజాగ్రత్తలు కూడా ఉన్నాయని అంటున్నారు నిపుణులు. ఇదిలా ఉంటే ఫేస్‌బుక్ అకౌంట్‌లో స్నేహితుల సంఖ్య 300 ఉంటే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని తాజా సర్వే ఒకటి తేల్చిందంట. మీపై ఒత్తిడి పెరుగుతుందని..12-17 సంవత్సరాల వయసున్న 88మంది..కౌమార దశలో ఉన్న ఫేస్‌బుక్ వినియోగదారులపై జరిపిన ఈ పరిశోధనలో ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్ సంఖ్య 300పైగా ఉంటే వారు ఒత్తిడికి లోనవుతారని, ఒత్తిడికి కారణమైన హార్మోన్ కార్టిసోల్ వారిలో అధికంగా విడుదలవుతుందని తేలింది. అదే సమయంలో ఫ్రెండ్స్ పోస్టింగులకు లైక్‌లు కొట్టడం, రిప్లై మెసేజ్‌లు ఇవ్వడం ద్వారా కార్టిసోల్ హార్మోన్ విడుదల శాతాన్ని కొంత మేరకు తగ్గించవచ్చని పరిశోధనకారులు చెబుతున్నారు. ఈ పరిశోధన కోసం ఎంపిక చేసిన 88ని ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ సంఖ్య, వారిని వారు ప్రమోట్ చేసుకునే తీరు, అలాగే ఫ్రెండ్స్‌ను సపోర్ట్ చేసే తీరు, ఫేస్‌బుక్ ఉపయోగించే విధానంపై పరిశోధన చేశారు. పరిశోధనకు ముందు వీరి నుంచి కార్టిసోల్ శాంపిల్స్‌ను సేకరించి అధ్యయనం చేశారు. ఎఫ్‌బీలో స్నేహితుల సంఖ్య 300 దాటిన వారిలో కార్టిసోల్ స్థాయి 8 శాతం పెరిగినట్టు పరిశోధనలో తేలిందంటున్నారు. ఫ్రెండ్స్ సంఖ్య వెయ్యి, రెండువేలు దాటితే కార్టిసోల్ విడుదల మరింత ఎక్కువయ్యే ప్రమాదముందని హెచ్చరించారు.

14:24 - November 28, 2015

దేశంలో అసహనం పెరుగుతోందంటూ అమీర్‌ చేసిన వ్యాఖ్యలపై కొందరు దుమారం రేపుతుండగా, మరికొందరు ఆయనకు బాసటగా నిలుస్తున్నారు. తాజాగా ఈ అంశంపై సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ అమీర్‌కు పూర్తి మద్దతునిస్తూ ట్వీట్‌ చేశారు. 'తెలివి తక్కువ వారంతా అమీర్‌పై మండిపడుతున్నారు. ఆయన ఒక సెలబ్రిటీ కావడమే ఇందుకు కారణం. అమీర్‌ ఓ ఉగ్రవాది అయితే... ఏ భారతీయుడికైనా ఇలాంటి అతడికి వ్యతిరేకంగా ఇలాంటి మాటలు మాట్లాడ్డానికి ధైర్యం ఉంటుందా?' అని పూరీ పేర్కొన్నారు. అమీర్‌ వ్యాఖ్యలను రాద్దాంతం చేస్తున్నారు తప్ప, ఆయన బాధను ఎవరూ అర్థం చేసుకోవడంలేదని తెలిపారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి

హైదరాబాద్ : కవాడిగూడలో స్కూటీపై వెళ్తున్న ఇద్దరు మహిళలను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఒక మహిళ తీవ్రంగా గాయపడి మృతి చెందింది. మరో మహిళకు గాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించారు.

 

14:09 - November 28, 2015

బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్...తాజాగా వార్తల్లోకి ఎక్కాడు. ఇటీవలే దేశంలో జరుగుతున్న పరిణామాలపై తన భార్య దేశం వదిలి పోదామని ప్రతిపాదన తెచ్చినట్లు ఇటీవలే అమీర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ ఇతర నేతలు తీవ్రస్థాయిలో స్పందించారు. అమీర్ ఖాన్ కు కూడా కొంతమంది మద్దతు పలికారు. తాను భారతీయుడనని, భారత్ తన మాతృభూమి..తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానంటూ తరువాత అమీర్ పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం అమీర్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అమీర్ ఖాన్ ముంబై ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చినట్లు ఓ ఫొటో బయటకు వచ్చింది. ఆ ఫొటోలో ఈ అమీర్ చుట్టుపక్కల పోలీసులున్నారు. ప్రస్తుతం అమీర్ ఖాన్ నటిస్తున్న 'డంగల్' సినిమా షూటింగ్ కోసం అమెరికా వెళ్ళినట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే ఈ సినిమాకు సంబంధించి లూధియానాలో షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. తదుపరి షూటింగ్ కోసం ఇలా అమెరికా బాట పట్టాడని ప్రచారం జరుగుతోంది. 

13:39 - November 28, 2015

ఒకటి చూపులతోనే ప్రాణాలు తీసేసే ప్రమాదకర జంతువు. మరొకటి భయానికి ప్రతిరూపంగా ఉండే అమాయక ప్రాణి. ఆ రెండిటికి ఒకదానిపై మరొకదానికి ప్రేమా ఉండదు. జాలి అంతకన్నా ఉండదు. ఆ చిన్న జంతువును చూస్తే క్రూర మృగానికి పండగే. కానీ అక్కడ జరిగింది పూర్తిగా డిఫరెంట్‌. ఆ దృశ్యాన్ని చూసివాళ్లంతా ఇదెక్కడి విచిత్రమంటూ కళ్లప్పగించి చూడ్డానికే పరిమితమయ్యారు.

పులి ఇలా అత్యంత కౄర మృగమే.....కానీ...

మనకు తెలిసినంతవరకూ పులి ఇలా అత్యంత కౄర మృగమే..ఆహారం కావాల్సిన జంతువు ఎంత వేగంగా పరిగెత్తినా వేటాడివేటాడి చంపేస్తుంది..తనకంటే చిన్నదంటే దీనికెప్పుడూ వినోదమే.. కానీ ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం అత్యంత అసాధారణమైనది. మంచు కురుస్తున్న వేళ ఆకలి చలిలానే బాధిస్తున్న సమయాన తనకు ఆహారంగా వచ్చిన జంతువును ఈ పులి అమాంతం మింగేయాల్సిందిపోయి ఎంచక్కా ఫ్రెండ్‌షిప్ చేసింది. పులి అంటే హడలిపోయే జంతువే అయినా ఏమాత్రం బెరుకు ప్రదర్శించకుండా మేక ఇలా స్నేహ హస్తంచాచింది. జాతులు వేరే అయినా సంజ్ఞలతోనే కబుర్లు చెప్పుకున్నాయి. జాతి వైరానికి భిన్నంగా అత్యంత అరుదుగా జరిగిన ఈ సంఘటనకు రష్యాలోని ప్రైమార్‌స్కీలో ఉన్న సఫారీ పార్క్‌ వేదికైంది.

వారానికోసారి ఆహారం....

ఇక్కడ పులులు, సింహాలు తదితర జంతువులకు వారానికోసారి ఆహారం పెడతారు. అదీ మన జూపార్క్‌ల్లో మాదిరే మాంసాన్ని పెట్టక బ్రతికున్న ప్రాణులనే ఆహారంగా వేస్తారు. గతంలో ఇలాగే వారం వారం ఏదో ఒక జంతువును వేటగా వేసేవారు. వాటిని పులులు, సింహాలు కొద్దినిమిషాల్లోనే హాంఫట్‌ చేస్తాయి. ఈసారి ఎందుకో పులి మేకను చంపకపోగా దానితో చెలిమిచేసింది. అదే తినేస్తుందిలే అని జూపార్క్‌ సిబ్బంది ఒక వారం గడిపారు. అయినా వారం రోజులనుంచి మేకను తినకపోగా పులి దానితో కాలక్షేపం చేసింది.

జంకు లేకుండా పులితో కలిసి ఆటలాడడమే...

ఏమాత్రం జంకు లేకుండా పులితో కలిసి ఆటలాడడమే కాదు మేక ఏకంగా దాని శయనాగారాన్ని ఆక్రమించేసింది. జింక పులి బోనులో పడుకోవడంతో ఆ క్రూరమృగంకాస్తా పైన విశ్రాంతి తీసుకుంది. వారం రోజులుగా వీటి విచిత్ర స్నేహం కొనసాగుతూ ఉంది. 

భారత్‌లో ప్రైవేట్ బ్యాంకింగ్ విభాగాన్ని మూసుస్తున్న హెచ్ ఎస్ బీసీ

హైదరాబాద్ : అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం హెచ్‌ఎస్‌బీసీ.. భారత్‌లో ప్రైవేట్ బ్యాంకింగ్ విభాగాన్ని మూసివేయనున్నట్లు ప్రకటించింది. ఈ విభాగం కింద సంస్థ ప్రస్తుతం వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసులను అందిస్తున్నది. అంతర్జాతీయంగా సంస్థ ప్రైవేట్ బ్యాంకింగ్ వ్యాపారంపై సమీక్ష జరిపిన తర్వాత ఇండియాలో ఈ విభాగాన్ని మూసివేయాలని నిర్ణయించుకున్నట్లు హెచ్‌ఎస్‌బీసీ అధికార ప్రతినిధి తెలిపారు.

13:32 - November 28, 2015

హైదరాబాద్ : మరో పక్షం రోజుల్లో గ్రేటర్‌ ఎన్నికల నగారా మోగనుంది. ఇవే ఎన్నికలు ఇప్పుడు పార్టీల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. మొన్నటి వరంగల్‌ ఉప ఎన్నిక ఫలితాన్ని హైదరాబాద్‌లోనూ రిపీట్ చేయాలని టిఆర్‌ఎస్ ప్లాన్ చేస్తోంది. కానీ అదంత ఈజీ కాదనే భయమూ ఉంది. కనీసం గ్రేటర్ పీఠానన్నా కైవసం చేసుకోవాలని ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇంతకి బల్దియా పీఠం కోసం పార్టీలు ఎలాంటి ఎత్తుగడలు వేస్తున్నాయి.. ఎవరెవరి ప్లాన్ ఎలా ఉండబోతోంది.?

సుమారు కోటి జనాభా...

సుమారు కోటి జనాభా... వివిధ రాష్ర్టాల ప్రజల సంగమ స్థలి అయిన మహానగరం హైదరాబాద్‌. ఏపీ విడిపోయినా రెండు తెలుగు రాష్ట్రాలతోనూ విడదీయరాని బంధమేర్పరచుకున్న ఈ మహానగర ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. బల్దియా పీఠాన్ని అధిరోహించేందుకు పార్టీలు తమదైన రీతిలో వ్యూహ రచనలు చేస్తున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా టిఆర్‌ఎస్‌కు ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.

2009 గ్రేటర్‌ ఎన్నికల్లో ...

2009 గ్రేటర్‌ ఎన్నికల్లో కనీసం ఒక్క డివిజన్‌లోనైనా టిఆర్‌ఎస్‌ పోటీ చేయలేదు. 2014 సాధారణ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోని 24 అసెంబ్లీ స్థానాల్లో కేవలం రెండిటిని మాత్రమే సొంతం చేసుకోగలిగింది. దీన్నిబట్టే హైదరాబాద్ పరిధిలో టిఆర్ఎస్‌ చాలా బలహీనంగా ఉందని స్పష్టమవుతోంది. అయితే తన బలాన్ని పెంచుకోవాలన్న ఉద్దేశంతో ఆపరేషన్‌ ఆకర్ష్‌ పేరుతో టిడిపి నుంచి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, తీగల కృష్ణారెడ్డి, మాదవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ సలీంలను తనవైపుకు తిప్పుకుంది. దీంతోపాటు టిడిపి మాజీ కార్పొరేటర్లను, ఇతరత్రా నాయకులకు తన బుట్టలో వేసుకుంది. అంతేగాక కాంగ్రెస్‌ నాయకులనూ తనవైపుకు తిప్పుకునేలా టిఆర్‌ఎస్‌ ప్రయత్నాలు చేస్తోంది.

నోటిఫికేషన్ విడుదల కాగానే....

నోటిఫికేషన్ విడుదల కాగానే హైదరాబాద్‌ ముఖ్యనేత, మాజీ మంత్రి అయిన కాంగ్రెస్ నాయకుడు ఒకరు పార్టీలో చేరేవిధంగా టిఆర్‌ఎస్‌ మంతనాలు జరుపుతోంది. ఇక నగరంలోని ప్రధాన రాజకీయ పార్టీ అయిన ఎంఐఎంతో ఒప్పందం చేసుకునేందుకు టిఆర్‌ఎస్‌ ప్రయత్నం చేస్తోందని నేతల మిలాఖత్‌లు రుజువు చేస్తున్నాయి. రాజకీయంగా ఇలా ఉంటే డబుల్ బెడ్‌రూం, స్వచ్‌ హైదరాబాద్ తదితర పథకాలతో అభివృద్ధి పరంగానూ దగ్గరయ్యేందుకు పడరాని పాట్లుపడుతోంది టిఆర్ఎస్‌.

టిడిపి, బిజెపిలు మొత్తం 55 స్థానాలు దక్కించుకున్నాయి...

గత కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఎవరికివారే పోటీచేసినా టిడిపి, బిజెపిలు మొత్తం 55 స్థానాలు దక్కించుకున్నాయి. 2014 సాధారణ ఎన్నికల్లో సంయుక్తంగా పోటీ చేసి జిహెచ్‌ఎంసి పరిధిలోని 24 స్థానాల్లో సగం కైవసం చేసుకున్నాయి. అయితే ముగ్గురు ఎమ్మెల్యేలు కారెక్కడంతో టిడిపి, బిజెపికి కొంత ఇబ్బందిగానే ఉంది. అయినా కార్యకర్తలు తమపక్కనే ఉన్నారని టిడిపి భావిస్తోంది. ప్రచారంలో భాగంగా సెటిలర్ల రక్షణ, తొలగించిన ఓట్లు, కేంద్ర ప్రభుత్వ పథకాలు తదితర అంశాలను వాడుకునేందుకు ఈ రెండు పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. దీంతోపాటు జనసేన నేత పవన్‌కళ్యాణ్‌ను రంగంలోకి దింపి వాడుకునే వ్యూహమూ ఉంది.

హైదరాబాద్‌లో మాత్రం ఎంఐఎంకు మంచి పట్టు....

తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేకున్నా హైదరాబాద్‌లో మాత్రం ఎంఐఎంకు మంచి పట్టుంది. ఇక ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో అవగాహన కల్పించుకుని ముందుకెళ్తుంటుంది ఆ పార్టీ. కానీ ఎన్నికల టైంలో ఏ పార్టీతోనూ ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోదు. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసిన మజ్లిస్‌ 45 వార్డులను సొంతం చేసుకుంది. 2014 ఎన్నికల్లో 7 అసెంబ్లీ స్థానాలు సాధించి టిడిపికితో సమానంగా నిలిచింది. అయితే పాతబస్తీలో మంచి పట్టున్న ఈ పార్టీ మిగతా స్థానాల్లో అధికార పార్టీతో పొత్తుపెట్టుకుని ముందుకు సాగే ప్రయత్నాలు చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఎంఐఎంతో కలిసి మేయర్‌ పీఠాన్ని దక్కించుకునేందుకు...

ఇక గత ఎన్నికల్లో సత్తాచాటుకుని ఎంఐఎంతో కలిసి మేయర్‌ పీఠాన్ని పంచుకుంది కాంగ్రెస్‌ పార్టీ. రాష్ట్ర విభజన తర్వాత నగరంలోనూ ఆ పార్టీ చతికిలబడింది. 2014 ఎన్నికల్లో గ్రేటర్‌ పరిధిలో ఒక్క సీటునైనా సంపాదించలేకపోయింది. వరుస ఓటములతో హడలిపోతున్న కాంగ్రెస్‌ నుంచి నేతలు కార్యకర్తలు పక్క చూపులు చూస్తున్నారు. అయినా వారిని కాపాడుకుంటూనే గెలుపు సాధించేందుకు కాంగ్రెస్ మరో స్కెచ్‌ వేస్తోంది. ఓల్డ్‌ సిటీలో ప్రత్యర్థులైన ఎంఐఎం, ఎంబిటిల వైరాన్ని కాంగ్రెస్ క్యాష్‌ చేసుకోవాలని చూస్తోంది. ఎంబిటిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నాలు మొదలుపెట్టిందని టాక్.

అన్ని పార్టీలకూ జిహెచ్‌ఎంసి ఎన్నికలు ప్రతిష్టాత్మకమే....

అన్ని పార్టీలకూ జిహెచ్‌ఎంసి ఎన్నికలు ప్రతిష్టాత్మకమే. ముఖ్యంగా టిఆర్‌ఎస్‌కు ఇది పెనుసవాలే. మరి ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యాక ఆయా పార్టీలు ఎలాంటి ఎత్తుకు పైఎత్తులేస్తాయో జిమ్మిక్కులకు పాల్పడతాయో చూడాలి. 

13:30 - November 28, 2015

టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ నితిన్ హీరోగా సినిమా చేస్తున్నసంగతి తెలిసిందే. 'అ...ఆ' (అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి) అనే టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం ఇటీవల రామానాయుడు స్టూడియోలో జరిగింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫోటో ఒకటి బయటకు వచ్చింది. సినిమా షూటింగ్ గ్యాపులో సమంత, నితిన్ రిలాక్స్ అవుతున్నట్లు ఉంది.
గత నెలలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్ చేస్తున్న తొలి సినిమా ఇది. ఈ సినిమాలో నితిన్ ఇద్దరు హీరోయిన్లతో డ్యూయోట్లు పాడుతున్నారు. సినిమాలో మెయిన్ హీరోయిన్ గా సమంత నటిస్తుండగా.... మరో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. త్రివిక్రమ్ గత సినిమా 'అత్తారింటికి దారేది' మూవీలో కీలక పాత్ర పోషించిన నటి నదియా కూడా ఇందులో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమాను ప్రముఖ తెలుగు నిర్మాత రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. 

13:29 - November 28, 2015

విజయవాడ : పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కృపామణి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితుడైన శ్రీనివాస్‌... కొంతకాలంగా పోలీసుల కన్నుగప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. అతన్ని అరెస్ట్‌ చేసిన అనంతరం తణుకు ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. శ్రీనివాస్‌ను కోర్టులో హాజరుపరిచే అవకాశముంది. కృపామణి గత నెల 19న ఆత్మహత్య చేసుకుంది. 

13:27 - November 28, 2015

విజయవాడ : నేను లొంగిపోతా.. కాని నన్ను చంపేస్తారు.. కటారి దంపతుల హత్య కేసు ప్రధాన నిందతుడు చింటూ లేఖా సారాంశమిది. సీఎం నుంచి డీజీపీ, ఐజీలకు, న్యాయస్థానాలకు సైతం చింటూ లేఖ పంపాడు. లేఖ అందిందనే విషయాన్ని డీజీపీ రాముడు కూడా కన్‌ఫామ్‌ చేశారు. మొత్తానికి మరికొన్ని రోజుల్లో లొంగిపోవటానికి చింటూ సిద్ధంగా ఉన్నట్లు అర్ధమవుతోంది. ముందుజాగ్రత్త చర్యగానే ఈ లేఖను పంపినట్లు తెలుస్తోంది. అయితే లేఖలో ఈ నేరంతో తనకెలాంటి సంబంధం లేదని కూడా చింటూ పేర్కొన్నాడు.

13:26 - November 28, 2015

వరంగల్ : విభిన్న రాష్ట్రాలకు సంబంధించిన వారంతా ఒకే వేదికపైకి వచ్చారు. తమ సంస్కృతీ సాంప్రదాయాలకు తగ్గట్లు రంగురంగుల వస్త్రధారణతో మురిపించారు. ఆట పాటలతో అందరినీ అలరించారు. ఎప్పుడూ చదువుల్లో సంఘ సేవాకార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే ఆ విద్యార్థులంతా ఎన్సీసీ కి చెందినవారే.

ఎన్సీసీ అంటే స్ట్రిక్ట్‌గా డ్రిల్స్, పెరేడ్స్‌ చేయడమే కాదు...

ఎన్సీసీ అంటే స్ట్రిక్ట్‌గా డ్రిల్స్, పెరేడ్స్‌ చేయడం మాత్రమే కాదు. ఇలా ఆటపాటల సందడీ ఉంటుంది. డాన్స్‌లతో అలరించడమూ ఉంటుంది. వరంగల్‌లోని నేషనల్‌ క్యాడెట్‌ కార్ప్స్ నాలుగవ బెటాలియన్‌లో ఇంటిగ్రేటెడ్‌ క్యాంపు నిర్వహించారు. క్యాంపు చివరి రోజున ఆటవిడుపుగా ఇలా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ఎన్సీసీ విద్యార్థులు వేడుకలో పాల్గొని తమ సంస్కృతీ సాంప్రదాయాలను ఘనంగా చాటుకున్నారు.

600ల మంది విద్యార్థులు...

వివిధ ప్రాంతాల నుంచి సుమారు 6 వందల మంది విద్యార్థులు ఈ క్యాంపులో పాల్గొన్నారు. మహారాష్ట్రకు సంబంధించి ఎన్సీసీ విద్యార్థిని తమ సాంప్రదాయ నృత్యం చేసి అందరినీ ఆకట్టుకుంది. తెలంగాణ సంస్కృతిని చాటే బోనాల ఆట పాటలనూ ప్రదర్శించి ఆహా అనిపించారు. ఈ క్యాంపు ద్వారా తమ ఆహారపు అలవాట్లు, సాంప్రదాయ విషయాలను అందరూ తెలుసుకోగలిగారని విద్యార్థులు అంటున్నారు.

చారిత్రత్మాక ప్రదేశాల టూరు...

వరంగల్ జిల్లాలోని చారిత్రత్మాక ప్రదేశాల టూరు నిర్వహించారు. ఆయా ప్రాంతాలు తమను అమితంగా ఆకట్టుకున్నాయని ఉత్తరభారతీయ విద్యార్థినులు తెలిపారు. పది రోజుల పాటు జరిగిన ఈ స్పెషల్‌ క్యాంపు ఆయా రాష్ట్రాల విద్యార్థులను ఆకట్టుకుంది. తెలంగాణ కల్చర్‌ ఇక్కడ మరో ఎసెట్‌ అని అంతా అభినందించారు. 

13:23 - November 28, 2015

హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతితో విడదీయరానివిగా చెప్పుకునేవాటిల్లో గొంగడి ఒకటి. ఆకర్షించే రంగుతో ప్రతి ఇంటా కనిపించే ఈ గొంగడి... నేటి ఆధునిక యుగంలో కులవృత్తుల్లానే కనుమరుగవుతోంది. ప్రత్యేక నేత పద్ధతిలో జాగ్రత్తగా తయారుచేసే ఈ రగ్గులు అంతరించిపోవడానికి ప్రభుత్వ విధానాలే కారణమంటున్నాయి కులసంఘాలు. తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడతామంటున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం గొంగడి కనుమరుగవకుండా చూడాలని కోరుతున్నాయి.

ప్రత్యేక స్థానం...

తెలంగాణ సంస్కృతిలో ఈ నల్లని గొంగడికీ ప్రత్యేక స్థానముంది. దీనిలోని ప్రతిపోగూ అలనాటి సాంప్రదాయాలను వెల్లడిచేస్తాయి. ఒకప్పుడు భారత సైన్యానికి సైతం ఈ గొంగడులను తెలంగాణ నుంచి సరఫరా చేసేవారు. ఒక్క తెలంగాణలోనేగాక ఇతర రాష్ట్రాలకూ వీటిని సరఫరా చేసేవారు. బరువు అంత ఎక్కువగా ఉండకుండా నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ గొంగడులను తయారుచేస్తారు. తయారీలోనే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఇంతటి చరిత్ర ఉన్న ఇవి ప్రస్తుతం కనుమరుగయ్యే స్థితికి చేరాయి. కొన్నేళ్ల క్రితం ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయమే గొంగడి కనుమరుగయ్యే పరిస్థితికి కారణమైంది.

డెక్కనీ నల్ల జాతి గొర్రెల ఉన్నిని సేకరిస్తారు...

గొంగడి తయారీకి డెక్కనీ నల్ల జాతి గొర్రెల ఉన్నిని సేకరిస్తారు. మహిళలు ఉన్నిని చేతితో వడికితే... మగవారు వడికిన ఉన్నిని మగ్గంపై గొంగడిగా నేస్తారు. అయితే కాలక్రమంలో గొర్రెల మందల్లో డెక్కనీ జాతికి సంబంధించినవి తగ్గిపోతుండడంతో ఉన్ని సేకరణకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కొన్నేళ్ల క్రితం ప్రభుత్వం నెల్లూరు జాతి ఎర్ర గొర్రెలను మందల్లో ప్రవేశపెట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 1990ల్లో మొదలైన ఈ ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దీంతో నల్లని డెక్కనీ గొర్రెల సంఖ్య తగ్గిపోయింది. పైగా ఎర్రని గొర్రెల ఉన్ని రగ్గుల తయారీకి అనుకూలంగా ఉండదు. దీంతో ఉన్ని సేకరణకు ఇబ్బంది ఏర్పడుతోంది.

ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలంటున్న కులసంఘాలు...

తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలను రక్షించుకునే క్రమంలో గొంగడినీ కాపాడుకునేందుకు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కులసంఘాలు కోరుతున్నాయి. గొల్ల కుర్మ కులసంఘానికి 5 ఎకరాల చొప్పున మేత భూములు కేటాయించాలని, తద్వారా గొర్రెల పెంపకానికి ఊతమివ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కులవృత్తినే నమ్ముకున్న తమను ప్రభుత్వమే ఆదుకోవాలని గత ప్రభుత్వానికి ఈ విషయం వ్యక్తంచేసినా పట్టించుకోలేదని గొల్ల కుర్మ సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. గొంగడిని తెలంగాణ సంస్కృతి నుంచి విడదీయొద్దు.. బతుకమ్మ, తదితర సాంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లే ఈ ఉపాధి మార్గాన్నీ సంరక్షించాలన్నది వీరి విన్నపం. 

చింటూ విదేశాలకు వెళ్లే అవకాశం లేదు : డీజీపీ రాముడు

విజయవాడ : చిత్తూరు మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ విదేశాలకు వెళ్లే అవకాశం లేదని ఏపీ డీజీపీ రాముడు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... చింటూ పాస్ పోర్టును గతంలోనే సీజ్ చేశామన్నారు. ఈ కేసులో దోషులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు. తాను లొంగిపోవడానికి సిద్ధమేనని అయితే తనకు పోలీసులతో పాటు చిత్తూరులో కొందరి నుండి ప్రాణహాని ఉందంటూ శుక్రవారం చింటూ అలియాస్ శ్రీరామ చంద్రశేఖర్ పేరిట లేఖ వచ్చిన మాట నిజమేనని... చింటూ రాసిన లేఖ పై పరిశోదన చేస్తున్నామని తెలిపారు.

భూగర్భ జలాలు పెరిగాయి :చంద్రబాబు

హైదరాబాద్ : 20 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా భూగర్భ జలాలు పెరిగాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సచివాలయంలో వివిధ అధికారులు, మంత్రులు విభాగాధిపతులతో చంద్రబాఉ సమీక్ష నిర్వహించారు. నదులు అనుసంధానం, నీరు - చెట్లు, సూక్ష్మ బిందు సేధ్యం విధానాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టి.టిడిపి విస్తృతస్థాయి సమావేశం...

హైదరాబాద్ : ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఎల్.రమణ అధ్యక్షతన జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ ఛార్జుల సమావేశం జరుగుతుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, జిల్లాల్లో కరువు పరిస్థితి పై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

పోలీసుల అదుపులో 'కృపామణి' కేసు ప్రధాన నిందితుడు

ప.గో : జిల్లాలో సంచంలనం సృష్టించిన కృపామణి ఆత్మహత్యకేసులో ప్రధాన నిందితుడు గుడాల శ్రీనివాస్ ను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని సాంయంత్ర మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.

వివాహిత పై హోంగార్డ్ అత్యాచారయత్నం...

హైదరాబాద్ : నగరంలో హస్తినాపురం ద్వారకా తిరుమలనగర్లో శనివారం దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న వివాహితపై హోంగార్డ్ అత్యాచారయత్నం చేశాడు. ఆ ప్రయత్నాన్ని ఆమె భర్త అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన హోంగార్డు... వివాహిత భర్తపై దాడి చేశాడు. అనంతరం హోంగార్డు అక్కడి నుంచి పరారైయ్యాడు. దీంతో బాధితురాలు ఎల్బీనగర్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహిత భర్తను ఆమె బంధువులు ఆసుపత్రికి తరలించారు.

11:45 - November 28, 2015

హైదరాబాద్‌ : నగరంలో కాలుష్యానికి చెక్‌ పెట్టేందుకు అడుగులు పడనున్నాయి. నగరాన్ని కాలుష్యరహితంగా మార్చేందుకు సర్కారు ఎలక్ట్రిక్‌ వాహనాల పరిశ్రమ పెట్టేందుకు కసరత్తు మొదలు పెట్టింది. ప్రజారవాణా వాహనాలతో పాటు ప్రైవేటు వెహికిల్స్‌లో భారీ సబ్సిడీలు ఇచ్చి వాహనాలను తేవాలని నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే కేంద్రంతో సంప్రదింపులు జరిపిన ప్రభుత్వం... దీనిని మొదటగా మెట్రో రైలు ప్రయాణికుల కోసం ఉపయోగించాలని ప్లాన్‌ చేస్తోంది.

గంటల తరబడి ట్రాఫిక్ సమస్యతో.. .

రోడ్లపై ప్రయాణం అంటేనే నరకంగా మారింది. గంటల తరబడి ట్రాఫిక్‌ సమస్య అయితే వాహనాల కాలుష్యం మరో సమస్యగా మారింది. ఈ కాలుష్యంతో ఎన్నో వ్యాధులు..మరెన్నో ఇబ్బందులు. అందుకే హైదరాబాద్‌లో వాహనాల కాలుష్యానికి చెక్‌ పెట్టాలని నిర్ణియించింది సర్కార్‌. దీనికోసం ఎలక్ట్రిక్‌ వాహనాలు తేవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్‌ వాహనాలు తయారీని, వాడకాన్ని ప్రోత్సాహించాలని భావిస్తోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు తెచ్చే అంశంపై కేంద్ర భారీ పరిశ్రమల శాఖ అదనపు కార్యదర్శి అంబుజ్‌ శర్మతో అధికారులు సమావేశం అయ్యారు.

కాలుష్యానికి చెక్‌ పెట్టేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు......

ఎలక్ట్రిక్‌ వాహనాల పరిశ్రమను కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని భావిస్తోంది.దీనికి ఆర్థిక సాయం అందించేందుకు కేంద్రం కూడా సుముఖత వ్యక్తం చేసింది. ఇక ఇందులో బస్సులతో పాటు కార్లు, బైకులు కూడా తేవాలని చూస్తోంది. ఈ వాహనాలను కొనే వారికి భారీ సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది కేంద్రం. బస్సుకు సుమారు 66 లక్షలు, బైక్‌లకు సైతం భారీగా సబ్సిడీ ఇవ్వాలని కేంద్రం డిసైడ్‌ అయ్యింది. ఇలాంటి ఎలక్ట్రిక్‌ వాహనాలు ఇప్పటికే ఫ్రాన్స్‌ ఇతర దేశాల్లో వినియోగిస్తున్నారు. అక్కడి రోడ్లపై అసలు పొల్యూషన్‌ అనే మాటే ఉండదు అంటున్నారు.

మన దేశంలో ఇప్పటికే కర్నాటక, మహారాష్ట్రలో ...

ఇక మన దేశంలో ఇప్పటికే కర్నాటక, మహారాష్ట్రలో ఈ పరిశ్రమలు ప్రారంభమయ్యాయి. వాహనాల పరిశ్రమ ప్రారంభించి ఉత్పత్తి ప్రారంభమైతే.. రోడ్లపై అక్కడక్కడ బ్యాటరీ స్టేషన్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మన రాష్ట్రంలో మొదటగా ఈ ఎలక్ట్రిక్‌ వాహనాలను మెట్రో రైలు ప్రయాణికుల కోసం వినియోగించాలని చూస్తోంది. బస్టాప్‌ నుంచి మెట్రో స్టేషన్ల వరకు వీటిని వాడాలని భావిస్తుంది. ఎలక్ట్రిక్‌ వాహనాల పరిశ్రమల విస్తరణపై డిసెంబర్‌ 9న అన్ని రాష్ట్రాల పరిశ్రమల మంత్రులతో ఢిల్లీలో సమావేశం నిర్వహించనుంది కేంద్ర సర్కార్‌. దాని తర్వాత ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి మరి కొద్ది రోజుల్లో నగర ప్రయాణికులు వాహనాల కాలుష్యంనుంచి కొంతైనా ఉపశమనం కలిగే అవకాశం ఉంది.

కవాడిగూడలో ఆర్టీసీ బస్సు బీభత్సం

హైదరాబాద్ : కవాడిగూడలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు అదుపు తప్పి ఆటో, స్కూటీని ఢీకొట్టింది. దీంతో స్కూటీపై వెళుతున్న ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన మహిళలను ఆసుపత్రికి తరలించారు.

దుర్గ గుడి ఫ్లైఓవర్ ముహూర్త ఖరారు

విజయవాడ : దుర్గ గుడి ఫ్లై ఓవర్ ముహూర్త ఖరారు అయ్యింది. డిసెంబర్ 5న ఉదయం 10 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు గడ్కరీ, వెంకయ్య నాయుడు తదితరులు పాల్గొననున్నారు.

అలంపూర్ ఆలయాలను దర్శించుకున్న హైకోర్టు సీజే

మహబూబ్ నగర్ : అలంపూర్ లోని దక్షిణ కాశీ బాల బ్రహ్మేశ్వర స్వామి, ఐదో శక్తి పీఠమైన జోగులాంబ ఆలయాను తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి బోసలే, హైకోర్టు న్యాయవాది రాజశేఖర్ రెడ్డి, జిల్లా జడ్జి శివనాగిరెడ్డి తదితరులు దర్శించుకున్నారు. 

11:24 - November 28, 2015

జీవితంలో అపురూప ఘట్టం 'వివాహం' జీవితం లొ ఓ అపురూప ఘట్టం వివాహం.. పచ్చని తోరణాలు.. ముత్యాల పందిరి.. వేద మంత్రాలు.. జీలకర బెల్లం...మంగళ వాద్యం..మూడు ముళ్ళు.. ఏడు అడుగులు.. సౌభాగ్య వైభోగం..బంధు జన సంద్రం.. పెద్దల ఆశీస్సులతో జంటలు ఒక్కటయ్యే మధుర జ్ఞాపకం. ఆయా కుటుంబాల వారు వారి ఆర్థికస్థితిని బట్టి వివాహాన్ని జరుపుతుంటారు. కొంతమంది నిరాడంబరంగా జరుపుకుంటుంటే డబ్బున్న మారాజులు కోట్లకు కోట్లు ఖర్చు పెడుతుంటారు. అలాంటి వారిలో కేరళకు చెందిన ఓ ఎన్నారై నిలిచారు. అతని కుమార్తె వివాహం కోసం ఏకంగా రూ.55 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. పెళ్లిళ్ల పేరిట విచ్చలవిడిగా చేసే ఖర్చును నియంత్రించాలని కేరళ మహిళా కమిషన్ ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తోంది.
కేరళ రాష్ట్రానికి చెందిన రవి పిళ్లై కుమార్తె డాక్టర్ ఆరతిని కొచ్చికి చెందిన డాక్టర్ ఆదిత్య విష్ణుకు ఇచ్చి గురువారం వివాహం జరిపించారు. నభూతో నభవిష్యత్ అనే విధంగా ఈ వివాహ వేడుక జరిగింది. ఈ వివాహ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 42 దేశాల ప్రభుత్వాధినేతలను పిలిపించారు. వీఐపీలను వివాహ వేదిక వద్దకు తరలించేందుకు ఏకంగా రెండు ఛార్టర్డ్ ఫ్లైట్లు తిరవంతపురం ఎయిర్ పోర్టు వద్ద నిలిపారు. కళ్యాణ మండపం కోసం టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'బాహుబలి' చిత్రానికి సంబంధించిన సెట్స్ వేయించారు. ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్ సెట్టింగ్స్ వేశారు. ఇందుకోసం ఎనిమిది ఎకరాల్లో రూ.20 కోట్లు ఖర్చు పెట్టారు. పెళ్లిలో ఏర్పాటు చేసిన సంగీత కార్యక్రమంలో మళయాళం సినిమా హీరోయిన్ మంజు వారియర్, శోభన ఆడిపాడారు. పెళ్లికి మొత్తంగా 30 వేల మంది హాజరైనట్టు అంచనా. పిళ్లైకి చెందిన ఆర్‌పీ గ్రూప్ గల్ఫ్‌లో నిర్మాణరంగం, మౌలిక వసతుల అభివృద్ధి, గనులు, విద్య తదితర రంగాల్లో ప్రముఖంగా ఉంది. అతనికున్న మొత్తం 26 కంపెనీల్లో 80వేల మంది ఉద్యోగులు ఉన్నారు.

ఏపీ సచివాలయానికి సీఎం చంద్రబాబు నాయుడు

హైదరాబాద్ : విజయవాడ నుంచి పాలన కొనసాగిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూడు నెలల విరామం తర్వాత హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయానికి వచ్చారు. అమరావతికి ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై మంత్రులు, పలుశాఖ ముఖ్యకార్యదర్శులు, హెచ్‌వోడీలతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సర 15శాతం వృద్ధిరేటే లక్ష్యంగా వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతోనూ ముఖ్యమంత్రి చర్చించబోతున్నారు.

కూనవరంలో ముగ్గురు యువతుల ఆత్మహత్యాయత్నం

తూ.గో : కూనవరం మండలం ముల్లూరులో పురుగుల మందు తాగి ముగ్గురు యువతులు ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ముగ్గురు యువతులను ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. 

జూబ్లీహిల్స్‌లో కృష్ణా వాటర్ పైప్ లైన్ లీక్

హైదరాబాద్ :జూబ్లీహిల్స్‌లోని రోడ్డు నెంబరు 78లో కృష్ణా వాటర్‌ పైపులైను లీక్‌ అయింది. దీంతో కృష్ణా నీరు వృథాగా పోతుంది. అయినా జలమండలి అధికారులు పట్టించుకోవడం లేదు.

10:41 - November 28, 2015

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో అంగన్ వాడీలది సుదీర్ఘ పోరాటం. తమకు వేతనాలు పెంచాలంటూ కొంతకాలంగా వీరు ఉద్యమిస్తున్నారు. వీరి సమస్యను పరిష్కరించేందుకు గత మే నెలలో ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం నియమించింది. మంత్రులు యనమల రామక్రిష్ణుడు, పీతల సుజాత, అచ్చంనాయుడు, కామినేని శ్రీనివాస్ తో కూడిన ఈ మంత్రివర్గ ఉపసంఘం నాలుగు సార్లు సమావేశమైంది. అంగన్ వాడీలకు వేతనాలు పెంచాలంటూ సిఫారసు చేసింది. అంగన్ వాడీలకు 7,100 , మినీ అంగన్ వాడీలకు, హెల్పర్లకు 4,600 రూపాయల చొప్పున వేతనాలివ్వాలన్నది ఈ సంఘం సిఫారుసుల్లో అత్యంత ముఖ్యమైంది. ఇలా వేతనాలు పెంచడం వల్ల లక్షా నాలుగు వేల మంది అంగన్ వాడీలకు 317 కోట్ల రూపాయల మేర లబ్ధి జరుగుతుందని మంత్రివర్గ ఉపసంఘం భావించింది. మంత్రివర్గంలో చర్చించి , సెప్టెంబర్ 1 నుంచి పెంచిన వేతనాలు అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఇలా మూడు నెలలు గడిచాయి. నాలుగో నెల కూడా వస్తోంది. ఈ మూడు నెలల కాలంలో ఆరుసార్లు కేబినెట్ సమావేశాలు జరిగాయి. కానీ, అంగన్ వాడీల వేతనాల పెంపుదల జీవో మాత్రం జారీ కాలేదు. దీంతో మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులు, ప్రభుత్వం చేసిన వాగ్ధానాలు నెరవేర్చాలంటూ అంగన్ వాడీలు ఆర్డీవో కార్యాలయాల ఎదుట, కలెక్టరేట్ల ఎదుట ఆందోళనలు చేస్తున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ కొన్ని వేల మంది ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారు. అయితే, తాము ప్రకటించిన వేతనాల పెంపుదల జీవో జారీ చేయకపోగా, అంగన్ వాడీల పట్ల ప్రభుత్వం అసహనంగా ప్రవర్తిస్తోంది. ఇందుకు సాక్ష్యం వివిధ కలెక్టరేట్ల ఎదుట కనిపిస్తున్న ఈ ద్రుశ్యాలే.

కొత్త కోరికలేమీ కోరడం లేదు...

నిజానికి అంగన్ వాడీలు కొత్త కోరికలేమీ కోరడం లేదు. పెంచిన వేతనాలు అమలు చేయాలని మాత్రమే కోరుతున్నారు. కలెక్టర్ల దగ్గరకు, ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్లి వినతిపత్రాలిస్తున్నారు. ఇలా తమ సమస్యలు ఏకరువు పెడుతున్న అంగన్ వాడీల మీద పోలీసులు విరుచుకుపడుతున్నారు. పెడరెక్కలు విరిచేసి అరెస్టు చేస్తున్నారు. ఈ పెనుగులాటలో కొందరు అంగన్ వాడీలు స్పృహ తప్పి పడిపోతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలంటూ అదే ప్రభుత్వానికివిన్నవించుకుంటున్న అంగన్ వాడీలతో ఇంత దురుసుగా ప్రవర్తించాల్సిన అవసరం వున్నదా? జీవో జారీ చేయాలన్న విషయాన్ని గుర్తు చేస్తున్న అంగన్ వాడీలపై ఇంత అసహనమెందుకు? ఇంతమంది పోలీసు బలగాలను మొహరించడమెందుకు?  

10:38 - November 28, 2015

హైదరాబాద్ : గాల్లో ఎగిరేది గంట. ఎయిర్‌పోర్టుకు ఇక్కడొక గంట.. అక్కడొక గంట.. కాని విమానంలో వెయిటింగ్‌ మాత్రం ఆరు గంటలు. ఇక ఆ ప్రయాణీకుడి పరిస్ధితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు శంషాబాద్‌లో ఇదే సీన్‌ కనపడుతోంది. పైలెట్‌ లేక ఎయిరిండియా విమానం ఎగరలేక.. ఆగిపోయింది. ఉదయం 4.30కు టేకాఫ్‌ అవ్వాల్సిన విమానం.. పైలెట్‌ లేక నిలిచిపోవడంతో.. ప్రయాణీకులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్లాల్సిన విమానం.. పైలెట్‌ లేక ఇప్పటికీ ఎగరలేదు. దీంతో ప్రయాణీకులు ఎయిరిండియా యాజమాన్యంపై మండిపడుతున్నారు.

10:35 - November 28, 2015

మెదక్ : ఎన్ని జరిగినా.. ఎంతమంది చనిపోయినా.. మళ్ల అదే తప్పు అందరూ పదే పదే చేస్తున్నారు. పనికిరాని బోరుబావులను మూసేయకుండా చిన్నారులను మింగేసే కొండచిలువల్లా వాటిని తయారు చేస్తున్నారు. మెదక్‌ జిల్లాలో మరో బోరుబావి ప్రమాదం జరిగింది. ఓ బాలుడు ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిపోయాడు. పుల్కల్‌ మండలం బొమ్మారెడ్డిగూడెంలో ఈ ఘటన జరిగింది. ఆ బాలుడిని వెలికితీసేందుకు స్థానికులు, అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 

లుథియానాలో పేలిన గ్యాస్ సిలీండర్ : ముగ్గురు మృతి

పంజాబ్ : లుథియానాలో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

10:19 - November 28, 2015

సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న దేవి శ్రీ ప్రసాద్‌ త్వరలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అవును.. రాజ్‌ తరుణ్‌, హేబా పటేల్‌ జంటగా నటించిన చిత్రం 'కుమారి 21 ఎఫ్‌'. ఈ చిత్రం సక్సెమీట్‌లో దేవిశ్రీప్రసాద్‌ను హీరోగా పరిచయం చేస్తున్నానని దిల్‌ రాజు ప్రకటించారు. 'దేవి శ్రీ ప్రసాద్‌కు ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్‌ ఉందో అందరికీ తెలిసిందనని, ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో 'నేను నటించ దగ్గ కథ కుదిరితే హీరోగా నటిస్తానని' దేవి చెప్పాడని గుర్తు చేశారు. అందుకే అతన్ని తమ సంస్థ ద్వారా హీరోగా పరిచయం చేయబోతున్నట్లు వెల్లడించారు. 12 ఏళ్ల క్రితం 'ఆర్య'తో ట్రెండ్‌ సెట్టింగ్‌ ఫిల్మ్‌ని అందించిన అదే టీమ్‌తో ఈ సినిమా చేయబోతున్నట్లు, సుకుమార్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి రత్నవేలు ఛాయాగ్రహణం అందిస్తారని కూడా ప్రకటించేశారు. నిర్మాతల్లో శిఖరం లాంటి వ్యక్తి దిల్‌ రాజు అని, దర్శకుల్లో శిఖరం సుకుమార్‌, కెమెరామెన్‌లలో శిఖరం రత్నవేలు ఈ ముగ్గురు నన్ను హీరోగా పరిచయం చేస్తూ సినిమా చేస్తామని చెప్పడం ఆనందంగా ఉందని దేవీ పేర్కొన్నారు. తన సినిమాలపై దిల్‌రాజుకు గట్టి నమ్మకం ఉంటుందని, 'కుమారి 21 ఎఫ్‌'తో కలిపి నాకు సంబంధించిన నాలుగు సినిమాలను ఆయన పంపిణీ చేశారని సుకుమార్ పేర్కొన్నారు. 

ఒంగోలులో స్వల్ప భూ కంపం

ప్రకాశం : ఒంగోలు నగరంలో స్వల్ప భూకంపం సంభవించింది. దీంతో ఇళ్లలో ప్రజలు బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్టేల్ పై ఎంత నమోదయ్యింది.. దీని మూలం ఎక్కడ అనే అంశాన్ని జియాలజికల్ అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు.

10:14 - November 28, 2015

రోజులో మంచినీళ్ళు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. ఇది అందరికీ తెలిసిందే. అయితే రాత్రి సమయాల్లోనూ మంచినీళ్ళు తాగడం కూడా చాలా మంచిదంటున్నారు వైద్యులు. రాత్రి పూట చాలా మంది నిద్రలేమితో బాధపడుతుంటారు. అలాంటప్పుడు కడుపునిండా మంచినీళ్ళు తాగితే సులభంగా నిద్రపడుతుంది. అంతకు ముందు తీసుకున్న ఆహారంలో నూనె పదార్థాలు, జంక్‌ఫుడ్స్‌ ఎక్కువగా ఉన్నప్పుడు కడుపులో నీళ్ళశాతం తక్కువై, దాహార్తి కలుగుతుంది. దీంతో నిద్రపట్టదు. ఇలాంటి సమయంలో మంచినీళ్ళ తాగితే ఉపశమనం కలిగి సుఖనిద్ర కలుగుతుంది. ముఖ్యంగా వేడి శరీరం గల వారు రాత్రిపూట రెండు మూడుసార్లు మంచినీళ్ళు తాగితే శరీర ఉష్టోగ్రత తగ్గి, మూత్ర సమస్యలు తగ్గే అవకాశం ఉంది. కనుక పగటిపూట మాత్రమే కాకుండా రాత్రిపూట మెలకువగా ఉన్న సమయాల్లోనూ వీలైనంతగా మంచినీళ్ళు తాగితే మేలు.

10:06 - November 28, 2015

ప్రస్తుత కాలంలో యువతులు ఆధునిక ట్రెండ్‌కు అనుగుణంగా హైహీల్స్‌ ధరించేందుకు అమితాసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కాస్తంత ఎత్తు తక్కువగా ఉండే అమ్మాయిలు అయితే.. హైహీల్సే వేసేందుకే ఇష్టపడుతారు. అయితే, హైహీల్స్‌ ధరించడం వల్ల అందంగా కనిపించడం కంటే.. అనారోగ్య సమస్యల బారిన పడుతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
హైహీల్స్‌ వేసుకోవడం వల్ల కాళ్లపై అధిక ఒత్తిడి పడుతుంది. హీల్‌ సైజ్‌ పెరిగే కొద్దీ ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది. అలాగే, సాధారణంగా నిలబడక పోవడం వల్ల కండరాలపై అధికంగా ఒత్తిడి పడుతుంది. ఒక అంగుళం ఉన్న హీల్‌ వల్ల 22 శాతం, రెండు అంగుళాల హీల్‌ వల్ల 57 శాతం, మూడు అంగుళాల హీల్‌ వల్ల 76శాతం అధిక భారం పాదాలపై పడుతుందట.
అలాగే, నడుము కింది భాగంలో ఒత్తిడి పడి కొంచెం వెనక్కి వంగిపోయి, ఛాతిభాగం ముందుకు వస్తుంది. అందువల్ల స్పాండిలైటిస్‌ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. కాళ్లకూ పాదాలకు మధ్య రక్తప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల నరాలు బలహీనంగా మారి అనేక సమస్యలు వస్తాయి. మోకాళ్ళపై ఎక్కువ ఒత్తిడి పడడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్‌ వస్తుంది. శరీర బరువు అంతా పాదాలపై పడటం వల్ల నరాలు ఎముకలు దెబ్బతినే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

10:00 - November 28, 2015

ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో ఏదో ఒక మోతాదులో హాని కలిగించే పదార్థాలు కచ్చితంగా వుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు.. ఏదైనా ఒక కూర చేసినప్పుడు అందులో ఉప్పు, కారం, నూనె తదితరాలను తప్పకుండా వేస్తాం.. అయితే మరికొందరు మాత్రం వీటిని ఎక్కువ పరిమాణంలో చేర్చుకుంటారు. తద్వారా ఏదో ఒక జబ్బు దరిచేరే అవకాశం వుంటుంది. అలా ఏదో ఒక ఆహార రూపంలో ఇబ్బందులు తప్పనిసరి. అలాంటి వాళ్ళకు ఆరోగ్యానికి ఔషధంలా పనిచేసే కొన్ని ఆరోగ్య వంటకాలను నిపుణులు అందిస్తున్నారు. వాటిని తరచూ ఆహారంలో చేర్చుకుంటే.. అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చని వారు సూచిస్తున్నారు. మరి.. ఆ ఆహారాలేంటో చూడండి..

అటుకుల కొబ్బరి: కావలసినన్ని అటుకులను బాగా కడిగి నానబెట్టాలి. నానిన తర్వాత నీటిని వంపేసి, వాటిలో తగినంత కొబ్బరి తురుము, బెల్లాన్ని చేర్చాలి. దీన్ని తింటే రుచిగా ఉంటుంది. ఇంకా శరీరానికి బలాన్ని ఇస్తుంది.

మూలికా కాఫీ: ఒక పాత్రలో శొంఠి, తేనె, ధనియాలు, మిరియాలు, యాలకులు, ఇంకా దాల్చిన చెక్కలు సమానమైన పరిమాణంలో తీసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఎండబెట్టి పొడికొట్టాలి. ఈ పొడిని కాఫీ పొడికి బదులుగా వాడాలి. చక్కెరకు బదులు బెల్లం వేసుకోవాలి. ఒక కప్పు కాఫీకి ఒక స్పూను పొడి వెయ్యాలి. ఇది తలనొప్పి, ముక్కు దిబ్బడ లాంటి సమస్యలకు మంచి ఉపశమనం కలిగించడంతోపాటు జీర్ణశక్తిని కూడా పెంచుతుంది.

తీపి గులాబీ రేకులు: ముందుగా.. తాజాగా వున్న గులాబీ రేకులను తీసుకుని నీడలో ఆరబెట్టాలి. బాగా ఆరిన తర్వాత వాటిని తేనెలోగాని బెల్లం పాకంలోగాని పది రోజుల పాటు ఊరనివ్వాలి. తర్వాత తింటే చాలా రుచిగా ఉంటాయి. వీటిని తింటే రక్తహీనతను పోగొట్టి శరీరానికి రక్తం పట్టేలా చేస్తాయి.

వడపప్పు: పెసరపప్పును రెండు గంటలు పాటు నీటిలో నానబెట్టి, ఆ పప్పులో కొద్దిగా పచ్చిమిరపకాయలు, మిరియాలపొడి, శొంఠిపొడి వేయాలి. అనంతరం ఈ మిశ్రమంలో ఒక నిమ్మకాయను పిండితే చాలా రుచిగా ఉంటుంది. ఇది శరీరానికి బలాన్నిస్తుంది. 

09:58 - November 28, 2015

హైదరాబాద్ : తిన్నది అరక్కే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అప్పట్లో ఓ పెద్దాయన ఎకసెక్కం చేశారు. ఇప్పుడు కేసీఆర్‌ సర్కారూ అచ్చంగా అట్లాంటి పలుకులే వల్లె వేస్తోంది. రైతు కుటుంబాల్లో అనారోగ్యాలు.. పిల్లల ప్రైవేటు చదువులు.. వారింట పెళ్లిళ్లే అన్నదాతల ఆత్మహత్యలకు కారణమని సర్కారు తేల్చి పారేసింది. రైతుల బలవన్మరణాలకు అసలు ప్రభుత్వం కారణం కానే కాదని.. హైకోర్టు సాక్షిగా బుకాయించేసింది. దీనిపై రైతు సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. 

09:57 - November 28, 2015

'శ్రీమంతుడు' వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్‌తో ఓ ప్రాజెక్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. విజయదశమి పండుగ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. అయితే ఈ ప్రాజెక్ట్‌ ఆగిపోయిందని, దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్‌తో కాకుండా అల్లుఅర్జున్‌తో ఈ ప్రాజెక్ట్‌ని చేయబోతున్నారనే వార్త గత కొన్నిరోజులుగా ఫిల్మ్‌నగర్‌లోను, సామాజిక మీడియాలోనూ హల్‌చల్‌ చేస్తోంది. ఈ వార్తపై ఇప్పటివరకు మైత్రి మూవీస్‌ సంస్థ నిర్మాతలు, దర్శకుడు కొరటాల శివ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. దర్శక, నిర్మాతల సన్నిహిత వర్గాల సమాచారం మేరకు అల్లు అర్జున్‌ చేయబోయే సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఏది ఏమైనా సినిమా ప్రారంభమయ్యాక కాంబినేషన్లు మారిపోవడం ఈ రోజు కొత్తమీ కాదు. తాజా నేపథ్యంలో కొరటాల శివ, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనుందని టాక్. ఇదిలా ఉంటే, ఎన్టీఆర్‌ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో 'నాన్నకు ప్రేమతో' సినిమాలోను, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తూ అల్లు అర్జున్‌ బిజీగా ఉన్నారు.

09:56 - November 28, 2015

వెంకటేష్‌, నయనతార ముచ్చటగా మూడవసారి కలిసి నటించబోతున్నారు. 'లక్ష్మీ', 'తులసి' చిత్రాల్లో జంటగా నటించిన ఈ ఇద్దరూ తాజాగా మారుతి దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంలో నటిస్తున్నారు. ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ప్రొడక్షన్‌ నెం 2గా సూర్యదేవర నాగవంశి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, 'మా బ్యానర్‌లో వెంకటేష్‌, నయనతార జంటగా కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఇటీవలే 'భలే భలే మగాడివోయ్' చిత్రంతో పెద్ద హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న మారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్‌ 16న సినిమాను ప్రారంభించి అదే రోజు నుంచి షూటింగ్‌ జరుపనున్నాం. 'రన్‌ రాజా రన్‌', 'జిల్‌', 'ఉత్తమ విలన్‌', 'చీకటి రాజ్యం' వంటి చిత్రాలకు సంగీతమందించిన జిబ్రాన్‌ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ను నిర్ణయించలేదు. త్వరలో పూర్తి వివరాలు తెలియజేస్తాం' అని అన్నారు.

09:56 - November 28, 2015

హైదరాబాద్ : 82 రోజుల తర్వాత ఏపీ సచివాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వేంచేస్తున్నారు. పరిపాలన దుమ్ము దులపాలని 150 శాఖల అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. అధికారులకు మాత్రం ఫ్లాష్‌బ్యాక్‌ గుర్తొస్తుంది. ఒకప్పుడు అధికారులను పరుగులు పెట్టించిన బాబు గుర్తొస్తున్నారు. రాజధాని అమరావతికి ఉద్యోగుల తరలింపులో జరుగుతున్న ఆలస్యం.. దాని వలన పరిపాలనలో వస్తున్న సమస్యలు వీటిపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనపడుతోంది.

09:55 - November 28, 2015

'దిల్‌వాలే' చిత్రం ఫైనల్‌ కట్‌ దాదాపు పూర్తయింది. ఈ సినిమా మొత్తం చూశాక జీవితానికి ముఖ్యమైన ఔషధం కొంచెం నవ్వు, కాసిన్ని కన్నీళ్లని తెలిసింది' అని షారూఖ్‌ఖాన్‌ అన్నారు. సంతోషం, దు:ఖం అనేవి మన చేతుల్లోనే ఉన్నాయి. మిగిలినవన్నీ మన ఆధీనంలో లేకుండానే జరిగిపోతుంటాయన్నారు. రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో రూపొందిన 'దిల్‌వాలే' చిత్రాన్ని డిసెంబర్‌ 18న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో షారూఖ్‌ సరసన కాజోల్‌ నటించగా, వరుణ్‌ధావన్‌కి జోడీగా కృతి సనన్‌ నటించింది. షారూఖ్‌, కాజోల్‌ నటించిన 'గెరువా..'పాట ఇప్పటికే దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందింది. యూట్యూబ్‌లో అత్యధిక హిట్స్‌ పొందిన పాటగా నిలవడం విశేషం.

09:55 - November 28, 2015

గత కొన్ని రోజులుగా మహేష్‌బాబు, ఏ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం రూపొందనుందనే వార్త ఇటు పరిశ్రమలోను, అటు సామాజిక మీడియాలోను హల్‌చల్‌ చేసిన విషయం విదితమే. అయితే ఆ 'వార్త'ను నిజం చేస్తూ ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ సంతోష్‌ శివన్‌ ఓ ప్రకటన చేశారు. 'మహేష్‌బాబు, మురుగదాస్‌ కాంబినేషన్‌లో సినిమా చేయడం హ్యాపీగా ఉంది. వచ్చే ఏడాది షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుంది' అని ట్వీట్‌లో పేర్కొనడంతో ఈ కాంబినేషన్‌లో కచ్చితంగా సినిమా ఉంటుందని తెలిసింది. అంతేకాకుండా ప్రముఖ సంగీత దర్శకుడు హ్యారీస్‌ జైరాజ్‌ సైతం సంగీతాన్ని సమకూరుస్తున్నట్టు సమాచారం. దాదాపు వంద కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందనుందట. ఈ చిత్రం తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీతోపాటు పలు భాషల్లో సైతం రీమేక్‌ లేదా డబ్బింగ్‌ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్‌లో రూపొందే సినిమాలో మహేష్‌బాబు సరసన దీపికా పదుకొనె నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు సమాచారం.

 

09:54 - November 28, 2015

మహబూబ్‌నగర్‌ : దౌల్తాబాద్‌ మండలం చంద్రకల్‌లో దారుణం జరిగింది. మతిస్థిమితం లేని యువకుడు తండ్రిని, వదినను రోకలి బండతో కొట్టి చంపాడు. అనంతరం తండ్రి మృతదేహాన్ని ఆలయంలో సమీపంలో పడేశాడు.

09:54 - November 28, 2015

ముంబై ఉగ్రవాదుల దాడుల్లో చనిపోయిన వారికి నివాళిగా ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్‌ పురస్కార గ్రహీత ఏ.ఆర్‌.రెహ్మాన్‌ ఓ పాటను విడుదల చేశారు. 'హమ్‌కో మాన్‌ కి శక్తి దే..' అంటూ సాగే పల్లవిగల పాటను స్వరపరచి మృతులకు నివాళిగా అందిస్తున్నట్టు రెహ్మాన్‌ తన అధికారిక ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. 2008లో నవంబర్‌ 26న ముంబైలోని తాజ్‌ హోటల్‌, ఛత్రపతి శివాజీ టెర్మినల్‌తోపాటు పలు ప్రాంతాల్లో పాక్‌ ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమానికి ఏడేళ్ళు నిండింది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని రెహ్మాన్‌ ఈ పాటను విడుదల చేశారు. 'నవంబర్‌ 26.. ఇదొక విషాదభరితమైన రోజు. ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన రోజు. వారందరి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా' అని రెహ్మాన్ ట్వీట్‌ చేశారు.

09:53 - November 28, 2015

తమిళ నటుడు విజయ్ నటిస్తున్న 59వ చిత్రానికి 'థెరి' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని హీరో విజయ్ ఇటీవల తన ఫేస్‌బుక్‌ ద్వారా విడుదల చేశారు. ఫస్ట్‌లుక్‌ విడుదల చేసిన కొన్ని నిమిషాల్లోనే వేల సంఖ్యలో లైక్స్‌ రావడం విశేషం. విడుదల చేసిన పోస్టర్స్‌ చూస్తుంటే ఈ చిత్రంలో విజయ్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

09:53 - November 28, 2015

ప్రముఖ దర్శకుడు ప్రకాష్‌ ఝా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌, కత్రినాకైఫ్‌ జంటగా రూపొందిన 'రాజనీతి' (2010) సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈచిత్రానికి సీక్వెల్‌గా 'రాజనీతి2' చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రకాష్‌ ఝా సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్‌ పెట్టారు. ఆ ట్వీట్‌లో,'ప్రస్తుతం 'రాజనీతి' సీక్వెల్‌ స్క్రిప్ట్‌ పనిలో బిజీగా ఉన్నాను. ప్రస్తుతం రాజకీయాల్లో చాలా మార్పులొచ్చాయి. ఆ మార్పులకు అనుగుణంగానే ఈ సీక్వెల్‌ ఉంటుంది. పైగా ఇటువంటి తరుణంలోనే సీక్వెల్‌ను విడుదల చేస్తే చాలా బాగుంటుంది. దీంట్లో కూడా 'రాజనీతి'లో నటించిన జంటే నటించవచ్చు లేదా మారిపోవచ్చు. అయితే రణ్‌బీర్‌, కత్రినాలు తప్పకుండా ఈ ప్రాజెక్ట్‌కి అంగీకరిస్తారని ఆశిస్తున్నాను. ఒకవేళ ఏదైన కారణంతో వాళ్ళు నటించని నేపథ్యంలో అజరుదేవగన్‌, ప్రియాంక చోప్రాలతో వెళ్ళేందుకు కూడా సిద్ధంగా ఉన్నాను' అని పేర్కొన్నారు. ప్రకాష్‌ ఝా ప్రస్తుతం ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రధారిణిగా రాజకీయ నేపథ్య చిత్రం 'జై గంగాజల్‌' చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మార్చి 4, 2016న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

09:52 - November 28, 2015

హైదరాబాద్ : అమెరికాలోని కొలరాడో స్ప్రింగ్స్ పట్టణంలోని ఓ ఆసుపత్రిలోకి చొరబడి దుండుగుడు కాల్పులకు తెగబడ్డాడు. కాల్పుల్లో ఓ పోలీసు అధికారి సహా ఇద్దరు మృతిచెందారు. మరో ఐదుగురు పోలీసులు, నలుగురు పౌరులకు గాయాలయ్యాయి. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 11.30గంటల సమయంలో కాల్పులకు జరిగాయి. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఐదు గంటల ఆపరేషన్ తర్వాత నిందితుడ్ని పోలీసులు సజీవంగా పట్టుకోగలిగారు.

09:52 - November 28, 2015

ఎర్రగా నిగనిగలాడే చెర్రీ పళ్లంటే ఇష్టపడనివారు ఉండరు. నేరేడు జాతికి చెందిన ఈ పళ్లలో మంచి పోషకాలున్నాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇందులో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లేమెటరీ కెమికల్‌ గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తాయి. నిద్రలేమితో బాధపడేవారికి ఇవి మంచి మందు. చాలా దూరం పరుగెత్తే రన్నర్స్‌ కండరాల నొప్పి నుంచి తప్పించుకునేందుకు ట్రైనింగ్‌కు ముందు పెయిన్‌ కిల్లర్స్‌ను వాడుతున్నారట. అయితే వీటిని దీర్ఘకాలికంగా వాడటం ప్రాణానికే ప్రమాదం. పెయిన్‌కిల్లర్స్‌కు బదులు చెర్రీస్‌ను తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు వైద్యులు. వీటివల్ల వ్యాయామం సమయంలో వచ్చే నొప్పి చాలా వరకు తగ్గుతుంది. చెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉన్నాయి. ఇవి మంచి రంగును ఇస్తాయి. చెర్రీ పండ్లు తినడం వల్ల ఆర్థ్రైటిస్‌ దూరమవుతుంది. ఆస్టియో ఆర్థ్రైటిస్‌తో బాధపడుతున్న మహిళలు చెర్రీ జ్యూస్‌ను రోజూ రెండు సార్లు మూడు వారాలపాటు తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది. కొవ్వు తక్కువగా ఉండే ఈ పండ్లు తినడం వల్ల లావు తగ్గొచ్చు. నిద్రలేమి చాలా మందిని బాధపెడుతున్న సమస్య. దీని కారణంగా చాలా మంది క్రానిక్‌ పెయిన్‌, హైబిపి, టైప్‌2 డయాబెటిస్‌ బారిన పడుతున్నారు. మెలటోనిన్‌ హార్మోన్‌ ఎక్కువగా ఉండే ఈ చెర్రీలు తినడం వల్ల నిద్ర బాగా పడుతుంది. పండ్లు డైరెక్ట్‌గా తినడంకంటే జ్యూస్‌ చేసుకుని తాగడం వల్ల మంచి ఫలితాలుంటాయంటున్నారు వైద్యులు.

భార్యపై అనుమానంతో నరికి... చచ్చాడు

: భార్యపై అనుమానంతో కత్తితో నరికి చంపి... భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. విడవలూరు మండలం రామతీర్ధంలో భార్యపై అనుమానంతో కత్తితో నరికి చంపాడు. ఆపై భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రామతీర్థం గ్రామంలో సంచలనం సృష్టించింది. పోలీసులు వచ్చి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

నాగార్జున వర్శిటీలో విద్యార్థి అదృశ్యం...

గుంటూరు : ర్యాగింగ్ కు అడ్డాగా మారిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిన్న సాయంత్రం వెలుగుచూసిన మరో ఘటన కలకలం రేపుతోంది. బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న వర్సిటీలోని ఇంజినీరింగ్ కళాశాలలో థర్డ్ ఇయర్ చదువుతున్న గణేశ్ అనే విద్యార్థి మూడు రోజులుగా కనిపించడం లేదు. కాస్త ఆలస్యంగా సమాచారం అందుకున్న గణేశ్ తల్లిదండ్రులు నిన్న వర్సిటీకి వచ్చి, కుమారుడి అదృశ్యంపై పెదకాకాని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ర్యాగింగ్ కు సంబంధించి వరుస ఘటనలు చోటుచేసుకుంటున్న కళాశాలలో విద్యార్థి గణేశ్ అదృశ్యం కలకలం రేపుతోంది.

82 రోజుల తరువాత ఏపీ సచివాలయానికి చంద్రబాబు

హైదరాబాద్ : స్వరాష్ట్రం నుండి పరిపాలన కొనసాగిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 82 రోజుల తర్వాత నేడు సచివాలయానికి రానున్నారు. అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి వచ్చే ఆర్థిక సంవత్సరంలో సాధించాల్సిన 15 శాతం వృద్ధి రేటు పై ప్రధానంగా చర్చించనున్నారు.

నెల్లూరు జిల్లా కంగనపల్లిలో విషాదం

నెల్లూరు : డక్కలి మండల కంగనపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గ్రావెల్ కోసం తవ్విన గుంటలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.

ఫైలెట్ లేక ఆగిన ఎయిరిండియా విమానం..

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో బెంగుళూరు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం నిలిచిపోయింది. వేకువ జామున 4.30 గంటలకు బయలుదేరాల్సిన విమానం ఆగిపోవడం ప్రయాణీకులు ఆందోళన చేపట్టి అధికారులను నిలదీశారు. అయితే ఫైలెట్ లేని కారణంగా విమానం ఆగిందని సమాధానం చెప్తున్నారని ప్రయాణీకులు మండి పడుతున్నారు.

అమెరికాలో కాల్పులు : ఇద్దరి మృతి

హైదరాబాద్: అగ్రరాజ్యం అమెరికాలో మరోమారు కాల్పులు కలకలం రేపాయి. కొలరాడోలో చోటుచేసుకున్న ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఆయుధం చేతబట్టిన గుర్తు తెలియని దుండగుడు పార్టీలో ఎంజాయి చేస్తున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఐదుగురు పోలీసులతో పాటు మొత్తం తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుప్రతికి తరలించారు. కాల్పులు జరిపిన దుండగుడిని అరెస్ట్ చేశారు. 

మందమర్రి లో విస్తృత తనిఖీలు...

ఆదిలాబాద్: జిల్లాలోని మందమర్రి మండలం పులిమడుగులో అధికారులు సోదాలు నిర్వహించారు. ఆబ్కారీ, అటవీ, పోలీసు సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. గుడుంబా స్థావరాలు సహా ఇళ్లల్లో అధికారులు సోదాలు చేశారు. భారీగా గుడుంబా, బెల్లం పానకంను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 30 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న రూ. లక్షల విలువైన టేకు కలపను స్వాధీనం చేసుకున్నారు.

 

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం

హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది బలపడి రేపటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అల్పపీడనంకు అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో కోస్తా, రాయలసీమ, తమిళనాడులకు రేపటి నుంచి రెండు రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

పెన్నా నదిలో ఇద్దరు విద్యార్థులు గల్లంతు

నెల్లూరు : కొవూరు వద్ద పెన్నా నదిలో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన విద్యార్థులు కోవూరు పెళ్లకూరు కాలనీవాసులుగా గుర్తించారు.

07:57 - November 28, 2015

హైదరాబాద్ : పార్లమెంట్‌లో రాజ్యాంగంపై నిర్వహించిన చర్చను మతంపై మళ్లించారని న్యూస్ మార్నింగ్ చర్చలో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు ఆరోపించారు. వంద ఏళ్ల తర్వాత కూడా ప్రపంచం ఎలా, ఉండబోతుందో ఊహించి రాజ్యాంగాన్ని రచించారని అంబేద్కర్‌ను ప్రధాని కొనియాడారు. భారత దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి రాజ్యాంగ భావనను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, విద్యాసంస్థల్లో కూడా రాజ్యాంగంపై చర్చ జరగాలని లోక్‌సభలో ప్రధాని అభిప్రాయపడ్డారు. కులమతాలు, రాజకీయాలకు సంబంధం లేని విషయం కాదా? బిజెపి మత రాజకీయాలకు పాల్పడుతుందా? మతాన్ని ఆధారం చేసుకొని బిజెపి అధికారంలోకి వచ్చిందా? ప్రధాని దేశంలో జరుగుతున్న ఘటనకు... మాట్లాడుతున్న మాటలకు సంబంధం ఉందా? దేశంలో వ్యక్తి స్వేచ్ఛ పై దాడులు జరగటం లేదా? జీఎస్ టీ బిల్లు పై సోనియా, మన్మోహన్ తో ప్రధాని భేటీ అయ్యారు. ఈ అంశం పై కాంగ్రెస్, బిజెపి రెండూ ఒకటేనా? పేదల పై పన్నులు వేయడానికే జీఎస్టీ బిల్లును తీసుకువస్తున్నారా? ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అంగన్ వాడీ, ఆశా కార్యకర్తలు ఆందోళన ఎందుకు చేస్తున్నా ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఈ అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో మధుతో పాటు టి.టిడిపి నేత సతీష్ మాదిగ, బిజెపి నేత కుమార్, కాంగ్రెస్ నేత మల్ల రవి పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను చర్చించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

తండ్రి, వదినను రోకలి బండతో మోది చంపిన యువకుడు

మహబూబ్ నగర్ : దౌల్తాబాద్ మండలం చంద్రకల్ లో దారుణం జరిగింది. తండ్రి, వదినను యువకుడు రోకలి బండతో కొట్టి చంపేశాడు. తండ్రి మృతదేహాన్ని ఆలయం వద్ద పడేశాడు.

06:59 - November 28, 2015

అమరావతి : మొన్నటివరకు ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి మలేషియా కంపెనీలు పోటీపడ్డాయి. మారిన పరిణామాల నేపథ్యంలో కేవలం రెండు కంపెనీలే పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. మలేషియాలో ప్రధాన టౌన్‌షిప్‌లు ఉన్న అసెండాస్‌ సిస్‌ బ్రిడ్జ్‌, సెంబ్‌ కార్ప్‌ సంస్థలను ఏపీ సర్కార్‌ పరిశీలిస్తోంది.

పోటీలో రెండు కంపెనీలు ....

అమరావతి నిర్మాణానికి ఇప్పటివరకు పలు కంపెనీలు ముందుకు వచ్చినప్పటికీ కేవలం రెండు కంపెనీలు మాత్రమే పోటీలో ఉన్నాయి. అమరావతి నిర్మాణానికి సింగపూర్ కంపెనీలు కన్సార్టియంగా ఏర్పడి ఏపీ రాష్ట్ర అభివృద్దికి ప్రతిపాదనలు పంపించాయి. నిర్మాణాన్ని చేపట్టే కంపెనీని స్విస్ ఛాలెంజ్ పద్దతిలో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికిగాను స్విస్ ఛాలెంజ్ విధానంలో ఓ ప్రణాళిక అందజేసింది రాష్ట్ర ప్రభుత్వం.

సీడ్‌ కేపిటల్‌ కోసం బృహత్‌ ప్రణాళిక .....

సీఆర్డీఏ రాజధాని సీడ్ కేపిటల్ నిర్మాణం కోసం బృహత్ ప్రణాళికను సింగపూర్ ప్రభుత్వం సిద్దం చేసింది. జరాంగ్, సుర్భానా కన్సల్టెన్సీ సంస్థలు ప్రణాళికను రూపొందించాయి. రాజధాని శంకుస్థాపన సమయంలోనూ సింగపూర్ ప్రభుత్వం ప్రతినిధులను రాష్ట్రానికి పంపించింది. రాజధాని నిర్మాణంలో కన్సార్టియం కంపెనీ పాత్ర ఎంత అన్న దానిపైనా, ఎంతమేరకు నిర్మాణ ప్రాంతాన్ని కేటాయించాలి అన్ని దానిపైనా చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టింది. పూర్తి వాణిజ్య విధానంలోనే మాస్టర్ డెవలపర్ సంస్థను ఎంపిక చేయాలని నిర్ణయించారు సీఎం.

3 వేల ఎకరాలు ఇవ్వాలని అసెండాస్‌ కంపెనీ షరతులు....

సింగపూర్ కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయి బాగానే ఉంది కాని ఇందులో కాస్త తిరకాసు ఉంది. తొలిదశలో 3 వేల ఎకరాలపై పూర్తి హక్కులు ఇవ్వాల్సిందిగా అసెండాస్ కంపెనీ షరతులు విధించింది. ఐకానిక్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం 350 ఎకరాలు కంపెనీకి ఉచితంగా ఇవ్వనున్నారు. అందులో 250 ఎకరాలపై హక్కులు ఇవ్వాల్సిందిగా షరతులు విధించింది. ఇది ఇలా ఉండగా 99 ఏళ్ల పాటు లీజుకు ఇస్తామని.. అభివృద్ది చేసిన తర్వాత హక్కులు కల్పిస్తామంటున్నారు.

2018 నాటికి తొలిదశ రాజధాని పనులు............

తొలిదశ రాజధాని పనులను 2018 నాటికి పూర్తి చేయడానికి అసెండాస్ కంపెనీ అంగీకరించింది. రహదారులు , నీటి పారుశుద్ద్యం, డ్రైనేజీ డెవలప్ మెంట్ వంటి వసతుల కల్పనకు పూర్తి వ్యయాన్ని తొలుత డెవలపర్ సంస్థ భరిస్తుందని లిటికేషన్ పెట్టింది సంస్థ . ఇక సీఆర్డీఏ అథారిటీ ల్యాండ్ స్కేలింగ్ స్కీములో భూములిచ్చిన వారిని నిర్ణయించే బాధ్యతలు సుర్బానాకే అప్పగించింది ప్రభుత్వం. 45 రోజుల్లోగా డిసెంబర్ 15కల్లా సవివరమైన ప్రణాళికను కంపెనీ ప్రభుత్వనికి అందజేయనుంది సుర్బానా. మరోవైపు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సింగపూర్‌ కంపెనీలతో అధికార పార్టీ నేతలు లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. అమరావతి నిర్మాణానికి సింగపూర్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. సింగపూర్ కంపెనీలు కమర్షియల్‌గా ఏర్పడి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాయి. ఇది అమరావతికి లాభమా, సింగపూర్ కంపెనీలకి లాభమా అనేది కాలమే నిర్ణయించాలి. సారీ సారీ అమరావతే నిర్ణయించాలి.

06:56 - November 28, 2015

విజయవాడ : విద్యార్ధుల‌కు ప‌రీక్షల స‌మ‌యం షురూ అయింది. ఇంట‌ర్, టెన్త్ ప‌రీక్షల షెడ్యూల్ ను ఏపీ మాన‌వ వ‌న‌రుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస‌రావు విడుద‌ల చేశారు. ఇంట‌ర్ మీడియ‌ట్ ప‌రీక్ష విధానంలో తొలిసారిగా ప్రయోగాత్మకంగా ఒకేష‌న‌ల్ కోర్సుల వ్యాల్యుయేష‌న్ ను... ఆన్ లైన్ లో పెట్టనున్నట్లు మంత్రి తెలిపారు. 2016 మార్చి రెండో తేదీ నుంచి ఇంట‌ర్.... మార్చి 21 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి.

టెన్త్ ,ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.......

ఆంధ్రప్రదేశ్ లో ఇంట‌ర్మీడియ‌ట్, పదో తరగతి ప‌రీక్షల షెడ్యూల్ ను విడుద‌ల చేశారు మంత్రి గంటా శ్రీనివాస‌రావు. వచ్చే సంవత్సరం మార్చి-2వ తేదీ నుంచి ఇంట‌ర్ ప‌రీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది కూడా ఇంట‌ర్ ప‌రీక్షల‌ను జంబ్లింగ్ విధానంలోనే నిర్వహించనున్నారు. ఫిబ్రవరి నాలుగో తేదీ నుంచి ప్రాక్టిక‌ల్ ప‌రీక్షలు నిర్వహించనున్నారు. ఇంట‌ర్ మొద‌టి సంవత్సరం ప‌రీక్షలకు వొకేష‌న‌ల్ కోర్సుతో క‌లిపి 5ల‌క్షల 26 వేల 483 మంది విద్యార్ధులు హాజ‌రుకానున్నారు. ఇందులో బాలురు రెండు ల‌క్షల 68 వేల 106 కాగా.. బాలిక‌లు రెండు ల‌క్షల 58 వేల 377 మంది ఉన్నారు.

ప్రయోగాత్మకంగా ఆన్ లైన్ లో వొకేషనల్ రిజల్ట్స్ పేపర్లు..

రెండో సంవ‌త్సరం ప‌రీక్షల కోసం రెగ్యుల‌ర్... ఒకేష‌న‌ల్ క‌లిపి మొత్తం ఆరు ల‌క్షల 13 వేల 793 మంది విద్యార్ధులు హాజ‌రు కానున్నారు. ఇందులో బాలిక‌లు రెండు ల‌క్షల 88 వేల‌ 924 మంది కాగా.. బాలురు మూడు ల‌క్షల 24 వేల 869 మంది ఉన్నారు. ఇంట‌ర్ ప‌రీక్షల కోసం 1550 ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రక‌టించింది. ఇంట‌ర్ ప‌రీక్షలు ఉద‌యం 9 గంట‌లకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు జరుగుతాయి. తొలిసారిగా ప్రయోగాత్మకంగా ఇంట‌ర్ ఓకేష‌న్ కోర్సుల వ్యాల్యూయేష‌న్ ను అన్ లైన్ లో పెట్టనున్నది ప్రభుత్వం. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షలను వచ్చే సంవత్సరం మార్చి 21 నుంచి ఏప్రిల్ 7 తేదీ వ‌ర‌కు నిర్వహించనున్నారు. ఈ ప‌రీక్షల కోసం 3100 కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఉద‌యం 9 గంటల 30 నిమిషాల నుంచి మద్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్షలు జ‌ర‌గ‌నున్నాయి.

ఎన్‌సిటిఇ అనుమ‌తులు లేకుండా...

ఎన్‌సిటిఇ అనుమ‌తులు లేకుండా డీఎడ్ అడ్మిష‌న్లు నిర్వహించిన సంస్ధల పై చ‌ర్యలు తీస‌కుంటామ‌ని మంత్రి గంటా శ్రీనివాస‌రావు ప్రక‌టించారు. విద్యార్ధుల‌కు న్యాయం చేయడానికి తీసుకోవాల్సిన చ‌ర్యల‌పై న్యాయ స‌ల‌హా తీసుకోనున్నట్లు తెలిపారు. విద్యాశాఖ పరిధిలోని అన్ని విభాగాలనూ.. విద్యాభవన్ పేరిట ఒకే కాంప్లెక్స్‌లోకి తీసుకు రానున్నామని మంత్రి తెలిపారు. అగ్రిగోల్డ్ వ్యవహారాన్ని ప‌ర్యవేక్షిస్తున్న క‌మిటీయే.. కేశవరెడ్డి విద్యాసంస్థల వ్యవహారంలోనూ పర్యవేక్షిస్తుందని.. ప్రయివేటు విశ్వవిద్యాల‌యాల అంశాన్ని వ‌చ్చే మంత్రివ‌ర్గ స‌మావేశంలో చ‌ర్చించనున్నామని మంత్రి తెలిపారు. పరీక్షలకు షెడ్యూలు విడుదల కావడంతో.. అన్ని పాఠశాలలు, కళాశాలలు విద్యార్థులను సిద్ధం చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 

టెన్త్ ,ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.......

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో ఇంట‌ర్మీడియ‌ట్, పదో తరగతి ప‌రీక్షల షెడ్యూల్ ను విడుద‌ల చేశారు మంత్రి గంటా శ్రీనివాస‌రావు. వచ్చే సంవత్సరం మార్చి-2వ తేదీ నుంచి ఇంట‌ర్ ప‌రీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది కూడా ఇంట‌ర్ ప‌రీక్షల‌ను జంబ్లింగ్ విధానంలోనే నిర్వహించనున్నారు. ఫిబ్రవరి నాలుగో తేదీ నుంచి ప్రాక్టిక‌ల్ ప‌రీక్షలు నిర్వహించనున్నారు. ఇంట‌ర్ మొద‌టి సంవత్సరం ప‌రీక్షలకు వొకేష‌న‌ల్ కోర్సుతో క‌లిపి 5ల‌క్షల 26 వేల 483 మంది విద్యార్ధులు హాజ‌రుకానున్నారు. ఇందులో బాలురు రెండు ల‌క్షల 68 వేల 106 కాగా.. బాలిక‌లు రెండు ల‌క్షల 58 వేల 377 మంది ఉన్నారు.

06:52 - November 28, 2015

హైదరాబాద్ : తెలంగాణలో ప్రైవేట్‌ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌ చేసిన ప్రకటనపై ప్రకంపనలు మొదలయ్యాయి. ఉన్నత విద్యను ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో పెట్టే ప్రక్రియను అడ్డుకుంటామని విద్యావేత్తలు, విద్యార్ధి సంఘాలు నేతలు హెచ్చరిస్తున్నారు. సర్కార్‌ ప్రైవేట్‌ యూనివర్సిటీల అంశాన్ని పక్కనపెట్టి.. ప్రభుత్వ యూనివర్సిటీల బలోపేతం చేయడంపై దృష్టి సారించాలంటున్నారు.

విద్యావేత్తలు, విద్యార్ధి సంఘాల నుంచి వ్యతిరేకత....

అయితే సర్కార్‌ నిర్ణయాన్ని విద్యావేత్తలు, విద్యార్ధి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం వల్ల బడుగు, బలహీన, పేద వర్గాలకు ఉన్నత విద్య అందని ద్రాక్షగానే మారుతుందంటున్నారు. ఉన్నత విద్య ప్రభుత్వ ఆధీనంలో లేకపోతే అది వ్యాపార వస్తువుగా మారుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మండిపడుతున్న విద్యార్ధి సంఘాలు ....

చారిత్రక నేపథ్యం ఉన్న యూనివర్సిటీలను విస్మరించి ప్రైవేట్‌ వైపు సర్కార్‌ ఆలోచించడం పట్ల విద్యార్ధి సంఘాలు మండిపడుతున్నాయి. అరకొర వసతులున్న యూనివర్సిటీలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టని సర్కార్‌.. ఉన్నత విద్యను ప్రైవేట్‌ వ్యక్తుల్లో పెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ప్రైవేట్‌ వర్సిటీలకు అనుమతిస్తే.. డబ్బున్నవారికే ఉన్నత విద్య దక్కే అవకాశముందంటున్నారు.

ప్రైవేట్‌ వర్సిటీలకు అనుమతిస్తే ప్రభుత్వ యూనివర్సిటీల పరిస్థితి ఏంటి ?

ఇక ప్రైవేట్‌ యూనివర్సిటీలకు ప్రభుత్వం అనుమతి ఇస్తే.. చారిత్రక నేపథ్యమున్న ప్రభుత్వ యూనివర్సిటీల పరిస్థితి ఏంటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేట్‌ యూనివర్సిటీలలో చదివే విద్యార్ధులకు మాత్రమే ఉద్యోగాలు వస్తాయని భ్రమలు కల్పిస్తే.. సామాన్య విద్యార్ధులు సైతం అప్పులు చేసి అటువైపే వెళ్లే ప్రమాదముందంటున్నారు. దీంతో ప్రభుత్వ యూనివర్సిటీల వైపు ఎవరూ చూడరంటున్నారు. దీన్ని ఆసరాగా చేసుకునే సర్కార్‌ ప్రభుత్వ యూనివర్సిటీలను మూసివేసే అవకాశముందంటున్నారు. ఏది ఏమైనా ప్రైవేట్‌ యూనివర్సిటీలకు అనుమతి ఇవ్వాలన్న కేసీఆర్‌ నిర్ణయంపై విద్యావేత్తలు, విద్యార్ధి సంఘాల నేతలు మండిపడుతున్నారు. సీఎం తన నిర్ణయాన్ని మార్చుకొని ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపేతం చేసే అంశంపై దృష్టి సారించాలని కోరుతున్నారు. 

06:49 - November 28, 2015

హైదరాబాద్ : తెలంగాణలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం తెలంగాణ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పాఠశాల విద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారిగా ఉపాధ్యాయుల ఖాళీల వివరాలు, స్కూళ్లలో ఉన్న సిబ్బంది గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల, డీఎస్సీ నిర్వహణ, ఎన్నికల కోడ్‌, నోటిఫికేషన్‌ సాధ్యాసాధ్యాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా విద్యను సమూలంగా ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేయాలని...వీలైనంత త్వరగా ఖాళీల భర్తీ వివరాల్ని అందచేయాలని అధికారులను మంత్రి ఆదేశించినట్లు తెలుస్తోంది.

 

06:47 - November 28, 2015

విజయవాడ : అధికారంలోకి వస్తే.. నామినేటెడ్‌ పోస్టులు వస్తాయని ఆశించారు. పదేళ్లుగా జెండా మోసి పార్టీని గెలిపించారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చినా.. ఇప్పటి వరకూ నామినేటెడ్‌ పోస్టుల ఊసే లేకపోవడం ఇబ్బందిగా మారింది. నిన్న మొన్నటి వరకూ దసరా- దీపావళి అంటూ నెట్టుకొచ్చిన నేతలు సైతం అధిష్టానం వైఖరి అర్ధంకాక తలలు పట్టుకుంటున్నారు. అసలు టీడీపీ ఎందుకు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడం లేదు. రేపుమాపు అంటూ ఎందుకు నెట్టుకొస్తోంది.

వర్షం కోసం ఎదురుచూసే చకోర పక్షుల్లా .....

వర్షం కోసం ఎదురుచూసే చకోర పక్షుల్లా తయారైంది టీడీపీ నాయకుల పరిస్థితి. పార్టీ అధికారంలోకి వస్తే తమ కష్టాలు తీరిపోతాయని భావించిన కార్యకర్తలకు సైకిల్ పార్టీ ఇంకా ఉత్తి చేతులే చూపిస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో సీటు త్యాగం చేసి, తరువాత వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం పక్కకు తప్పుకొన్న వారు నామినేటెడ్ పోస్టుల పైన కొండత ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా పార్టీలో సీనియర్లు అయిన పుష్పరాజ్‌, వర్ల రామయ్య, లింగారెడ్డి వంటి వారు అధిష్టానం నిర్ణయం కోసం ఎదురు చూస్తుంటే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు బెర్తు ఖరారు అయ్యి అఖరు నిమిషంలో తప్పుకోవాల్సి వచ్చిన మంతెన సత్యనారాయణ రాజు, పంచుమర్తి అనురాధ, జూపూడి వంటి వారు నామినేటెడ్ పదవుల కోసం తపస్సు చేస్తున్నారు. అయితే ఇంత చేస్తున్నా అధిష్టానం మాత్రం నామినేటెడ్ పోస్టులను జన చైతన్య యాత్రల తరువాత భర్తీ చేస్తామని చెప్పింది. అదికాస్తా ఏపీలో వరదలు కారణంగా డిసెంబరుకు వాయిదా పడ్డాయి. వాటి తరువాత కూడా పదవులు వస్తాయా అంటే ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేని పరిస్ధితి నెలకొంది.

అధిష్టానం చేస్తున్న జాప్యానికి కారణాలు వేరే...

నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో అధిష్టానం చేస్తున్న జాప్యానికి కారణాలు వేరే ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. అంతంత మాత్రంగా ఉన్న ఏపీ ఆర్ధిక పరిస్ధితే నామినేటెడ్ పదవులకు అడ్డం పడుతుందని సమాచారం. ఇప్పటికే నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారికి జీత భత్యాలు ఇవ్వడం కష్టంగా మారుతోంది. తాజాగా నామినేటెడ్ పేరుతో వేలాది మందికి ఉపాది కల్పిస్తే వారికి జీతాలు ఇవ్వడం కష్టంగా ఉంటుందనేది ప్రభుత్వ వర్గాల భావన. అందుకే నామినేటెడ్ పోస్టుల విషయంలో టీడీపీ అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రభుత్వం లక్షలకు లక్షలు జీతాలు ఇస్తూ.. రిటైర్డ్ ఐఏఎస్‌ లను సలహాదార్లుగా నియమించుకుంటోందని దీనికి అడ్డం కాని ఆర్ధిక ఇబ్బందులు తమ నామినేటెడ్ పదవులకు అడ్డం అవుతాయా అని పార్టీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పది సంవత్సరాల పాటు పార్టీ జెండా మోసిన కార్యకర్తలను ఆర్ధిక ఇబ్బందుల పేరుతో విస్మరించడం తగదనే వాదనా వినిపిస్తోంది. ఇప్పటికైనా నామినేటెడ్ పదవులను అధిష్టానం భర్తీ చేస్తుందో లేక మరికొంత కాలం నాన్చుతుందో వేచిచూడాలి.

06:45 - November 28, 2015

విజయవాడ : వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు గోదావరి జిల్లాల్లో పంటనష్టపోయిన రైతులను వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని చిన్నగూళ్లపాలెం, పెద్దగూళ్లపాలెం, దేవరపల్లి, తిమ్మప్పదొడ్డి, బాలయోగిపేట, ఈతకోటలో రైతుల కష్ట నష్టాలను జగన్‌ అడిగితెలుసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో నేలకొరిగిన వరి పొలాలను పరిశీలించారు. పంట ముంపుతో రైతన్నలు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయారు.

వర్షాలు తగ్గి రెండు వారాలైనా....

వర్షాలు తగ్గి రెండు వారాలైనా ప్రభుత్వం కనీసం స్పందించటం లేదని... ముఖ్యమంత్రిగా వచ్చి, చూసి, భరోసా ఇవ్వాల్సిన చంద్రబాబు కనీసం జిల్లాలో అడుగుపెట్టలేదంటే.. ఆయనకు రైతులపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందన్నారు జగన్‌. మంత్రులు ప్రకటనలకే పరిమితమవుతున్నారు తప్ప రైతులను ఆదుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. గతంలో వచ్చిన నీలం, పైలాన్, హెలెన్ తుపాన్ల సాయం ఇప్పటివరకు అందలేదన్నారు. ఆ పరిహారం వస్తుందన్న నమ్మకం లేదని రైతులే చెబుతున్నారని జగన్‌ అన్నారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతులు, కౌలు రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలన్నారు. ఎకరానికి కనీసం 10 వేల రూపాయల పరిహారం ఇస్తేనే గాని రైతన్నలు కోలుకోలేరని జగన్‌ అన్నారు.

ప్రభుత్వమే కొనుగోలు చేయాలి...

వాయుగుండం ఫలితంగా చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయన్న జగన్‌.. తడిసి, రంగుమారిన, మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే సర్కారు మెడలు వంచైనా కొనిపిస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఉపేక్షిస్తే వారి పక్షాన అసెంబ్లీలో పోరాడతానని, ప్రభుత్వాన్ని నిలదీస్తానని జగన్‌ స్పష్టం చేశారు. ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో అడుగడుగునా జగన్‌కు మహిళలు, రైతులు నీరాజనం పట్టారు.

06:42 - November 28, 2015

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చండీయాగం ఏర్పాట్లలో బిజీ అయ్యారు. మెదక్‌ జిల్లాలోని తనసొంత వ్యవసాయం క్షేత్రం ఎర్రవెల్లిలో 30 ఎకరాల్లో చండీయాగం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే చండీయాగం ప్రారంభానికి ముందు చేయాల్సిన ప్రత్యేక పూజలను సీఎం కేసీఆర్‌ దంపతులు నిర్వహించారు. డిసెంబర్‌ 23 నుంచి 30 వరకు నిర్వహించనున్న ఈ యాగానికి దేశవ్యాప్తంగా ఉన్న 4వేల మంది పండితులను కేసీఆర్‌ ఆహ్వానిస్తున్నారు. ఆదివారం వరకు వ్యవసాయ క్షేత్రంలోనే సీఎం ఉంటారని సమాచారం. దీంతో వ్యవసాయ క్షేత్రం చుట్టూ భారీ బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. 

సీఎం చంద్రబాబు అధ్యక్షతన కీలక సమీక్ష సమావేశం

హైదరాబాద్ : వచ్చే ఆర్థిక సంవత్సరంలోగా.. రెండంకెల‌ వృద్ధి రేటును సాధించాలని ఏపీ సర్కారు కృత నిశ్చయంతో ఉంది. ఈ దిశగా రాష్ట్రాభివృద్ధికి నిర్దేశించుకోవాల్సిన లక్ష్యాలు.. సమీకరించాల్సిన నిధులు.. తదితర అంశాలపై చర్చించేందుకు నేడు కీలక సమావేశం నిర్వహిస్తోంది. పాలనా యంత్రాంగం మొత్తం హాజరు కానున్న ఈ భేటీపై.. సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

06:41 - November 28, 2015

హైదరాబాద్ : వచ్చే ఆర్థిక సంవత్సరంలోగా.. రెండంకెల‌ వృద్ధి రేటును సాధించాలని ఏపీ సర్కారు కృత నిశ్చయంతో ఉంది. ఈ దిశగా రాష్ట్రాభివృద్ధికి నిర్దేశించుకోవాల్సిన లక్ష్యాలు.. సమీకరించాల్సిన నిధులు.. తదితర అంశాలపై చర్చించేందుకు నేడు కీలక సమావేశం నిర్వహిస్తోంది. పాలనా యంత్రాంగం మొత్తం హాజరు కానున్న ఈ భేటీపై.. సర్వత్రా ఆసక్తి నెలకొంది.

భేటీకి 150 ప్రభుత్వ శాఖల అధిపతులు.............

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక.. రెండోసారి భారీ సమీక్షను నిర్వహించేందుకు సమాయత్తమైంది.. ఏపీ ప్రభుత్వం. మంత్రులతో పాటు.. 150 ప్రభుత్వ శాఖలు, 33 మంది కార్యదర్శులు, 20 మంత్రిత్వ శాఖల ప్రతినిధులు ఈ సమీక్షలో పాల్గొంటాయి. శనివారం ఉదయం పది గంటలకు హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయంలో.. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ సమీక్ష జరగనుంది. వచ్చే ఆర్దిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి రేటు సాధించడమే ప్రధాన అజెండాగా ఈ సదస్సు సాగనుంది.

రహదారుల అనుసంధానం, నీటి వనరుల నిర్వహణపై చర్చ..........

రాష్ట్రంలో మెరుగైన రోడ్‌ కనెక్టివిటీ సాధన, నీటి వనరుల సమగ్ర నిర్వహణ, నాలుగేళ్లలో 60 లక్షల టాయిలెట్ల నిర్మాణం, ఘనవ్యర్థాల నిర్వహణ, ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎల్‌ఈడీ బల్బుల వాడకం తదితర అంశాలపై సమావేశంలో సమీక్షించనున్నారు. అలాగే పారిశ్రామిక రంగంపై కూడా ప్రత్యేక చర్చ సాగనుంది. గతంలోనే జిల్లాల వారీగా రూపొందించిన అభివృద్ధి ప్రణాళికల ఆధారంగా.. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోనున్నారు. అలాగే స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ పథకం అమలు తీరుతెన్నులు, ఎన్నారైలను ఆకర్షించే అంశాలపైనా చర్చిస్తారు.

వనరుల సమీకరణపై ప్రత్యేక దృష్టి..........

రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు అంతర్గత వనరుల సమీకరణ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిధుల సేకరణల అంశాలపై.. ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక‌ రాజధాని నిర్మాణం మాస్టర్‌ డెవలపర్స్‌ ఎంపిక, సచివాలయం తరలింపు అంశాలు కూడా చర్చకు రానున్నాయి. జూన్ 2 లోపు స‌చివాలయం త‌ర‌లింపు డెడ్‌ లైన్‌పై అధికారులకు సీఎం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశంలో 12 ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇవ్వనున్నారు.

 

వనస్థలీపురంలో అవినీతి ఎస్సై సస్పెండ్

హైదరాబాద్ :అవినీతికి పాల్పడ్డాడంటూ ఓ ఎస్సైని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వనస్థలిపురంలో ఎస్సైగా పని చేస్తున్న సైదులును సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ సస్పెండ్ చేశారు. గత ఏడాదిన్నర కాలంగా సైదులు వనస్థలిపురంలో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎస్సై సైదులుపై తరచు అవినీతి ఆరోపణలు వస్తుండడంతో అధికారులు అతనిపై దృష్టిసారించారు. గతంలో తన పరిధిలోని చౌకధరల దుకాణం కేసులోను, వినాయక చవితి సందర్భంగా వినాయక మండపాల నిర్వాహకుల నుంచి నగదు వసూలు చేసినట్టు ఆరోపణలు రావడంతో అతనిని సస్పెండ్ చేసినట్టు అధికారులు తెలిపారు.

కుటుంబ కలహాలతో విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్ : పార్శిగుట్ట సంజీవ‌య్యన‌గ‌ర్‌లో 9వ తరగతి విద్యార్థిని హ‌రిత శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యలు తెలుపుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టుం కోసం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ప్రైవేటు బస్సు

తూ.గో : రాజమండ్రి లోని దివాన్ చెరువు వద్ద ఆగి వున్న లారీని ప్రైవేటు బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

Don't Miss