Activities calendar

15 December 2015

21:35 - December 15, 2015

విజయవాడ : కాల్‌మనీ వ్యవహారం విజయవాడలో పెను దుమారం రేపుతోంది. హాట్‌హాట్‌గా ఉన్న ఈ సమయంలో ప్రస్తుత సీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆస్ట్రేలియా వెళుతుండటం కలకలం రేపుతోంది. అది ముందు పెట్టుకున్న సెలవే అని పోలీస్‌బాస్‌ చెపుతుండగా..sకావాలనే పంపిస్తున్నారని వైసీపీ విరుచుకుపడుతోంది. ఇంతకీ బెజవాడ సీపీ సెలవుపై ఎందుకు ఆస్త్రేలియా వెళ్తున్నారు? దీని వెనక రాజకీయ వత్తిళ్లు ఉన్నాయా ? వాచ్‌ దిస్‌ స్టోరీ.

కుటుంబసభ్యులతో ఆస్ట్రేలియా టూర్‌ ...

కాల్‌మనీ గ్యాంగ్ వ్యవహారాలను విచారిస్తున్న గౌతమ్‌ సవాంగ్‌ సెలవులో వెళుతున్నారు. కాల్‌మనీ వ్యవహారంలో అధికార పార్టీ నేతల పేర్లు ఎవరివీ బయటకు రాకూడదంటూ గత రెండు రోజులుగా గౌతమ్ సవాంగ్‌పై విపరీతమైన ఒత్తిళ్లు వస్తున్నాయని.. అందుకే సెలవుపై విదేశాలకు వెళ్లాల్సిందిగా పైస్థాయి నుంచి ఒత్తిళ్లు వచ్చినట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాల్‌మనీ కేసు కీలక దశలో ఉన్న సమయంలో సీపీకి ప్రభుత్వం సెలవు ఎలా మంజూరు చేసిందంటూ వారు ప్రశ్నిస్తున్నారు.

ఏడీజీ ఆపరేషన్స్ విభాగం అధిపతి సురేంద్రబాబుకు...

కాల్‌మనీ వ్యవహారం దర్యాప్తులో అనేక కొత్తకొత్త విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి ముందుకొస్తున్నారు. డీజీపీ రాముడు గౌతమ్ సవాంగ్ స్థానంలో ఏడీజీ ఆపరేషన్స్ విభాగం అధిపతి సురేంద్రబాబుకు బాధ్యతలు అప్పగించారు.

ఎంతటి పలుకుబడి ఉన్నవారైనా కఠినచర్యలు ....

కాల్‌మనీ వ్యవహారంతో సంబంధం ఉన్నవారు ఎంతటి పలుకుబడి ఉన్నవారైనా కఠినచర్యలు తప్పవని డీజీపీ జేవీ రాముడు స్పష్టం చేశారు. బాధితులపై బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయడంతో పాటు..వడ్డీకి డబ్బులు ఇచ్చి మహిళలను లోబర్చుకున్న వారిపై నిర్భయ కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఇక సీపీ గౌతమ్‌ సవాంగ్‌ సెలవుపై స్పందిస్తూ..నెలరోజుల క్రితమే సెలవు మంజూరైందని..కాల్‌మనీ వ్యవహారం వల్లే ఆయన సెలవుపై వెళ్తున్నారన్న వార్తల్లో నిజం లేదన్నారు.

సురేంద్రబాబు సమర్ధవంతంగా పని చేశారనే పేరు....

గతంలో విజయవాడలో సురేంద్రబాబు సమర్ధవంతంగా పని చేశారనే పేరు ఉంది. కఠినంగా వ్యవహరించే సురేంద్రబాబును ముందుకు తేవడం ద్వారా.. డ్యామేజ్‌ అవుతున్న ప్రభుత్వ ఇమేజ్‌ను కాపాడుకునే ప్రయత్నం బాబు చేస్తున్నారనే టాక్‌ వినపడుతోంది. మరోవైపు బెజవాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేయటం ద్వారా.. కేసును జనరలైజ్‌ చేసి.. అన్ని పార్టీలు ఉన్నాయనిపించే వ్యూహం అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

21:31 - December 15, 2015

హైదరాబాద్ : భాగ్‌ మిల్కా భాగ్‌తో కేక పుట్టించిన ఫరాన్‌ అక్తర్‌.. ఇప్పుడు ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌తో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నారు. విధు వినోద్‌ చోప్రా నిర్మిస్తున్న వాజీర్‌ సినిమా జనవరి 6న విడుదల కాబోతుంది. అమితాబ్‌ కూడా నటిస్తున్న ఈ చిత్రం టీజర్‌ యూట్యూబ్‌లో క్రేజీగా మారింది. 

21:30 - December 15, 2015

హైదరాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆఖరి రెండుసీజన్లలో పాల్గొనే...నయా ఫ్రాంచైజీలు పూణే, రాజ్ కోట్ జట్ల ప్రధాన ఆటగాళ్ళ ఎంపిక ను ప్లేయర్ డ్రాఫ్ట్ కార్యక్రమం ద్వారా నిర్వహించారు. ముంబై వేదికగా ముగిసిన ఈ కార్యక్రమంలో...రెండు ఫ్రాంచైజీలు చెరో ఐదుగురు ప్రధాన ఆటగాళ్లను సొంతం చేసుకొన్నాయి.

చెన్నై, జైపూర్ యాజమాన్యాలపై...

ఐపీఎల్ ప్రధానజట్లుగా గుర్తింపు పొందిన చెన్నై, జైపూర్ యాజమాన్యాలపై...బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో...రెండేళ్ల నిషేధం విధించడంతో... ఆ రెండు ఫ్రాంచైజీల స్థానాలను న్యూరైజింగ్ గ్రూప్ కు చెందిన పూణే, ఇంటెక్స్ కు చెందిన రాజ్ కోట్ ఫ్రాంచైజీలతో ఐపీఎల్ బోర్డు భర్తీ చేసింది.

ఒకేజట్టులో సభ్యులుగా ఆడిన స్టార్ ప్లేయర్లు....

గత ఎనిమిదిసీజన్లుగా ఒకేజట్టులో సభ్యులుగా ఆడిన స్టార్ ప్లేయర్లు మహేంద్రసింగ్ ధోనీ, సురేశ్ రైనా, రవిచంద్రన్ అశ్విన్, డ్వయన్ బ్రావో ..ఆఖరి రెండుసీజన్లకు మాత్రం వేర్వేరు ఫ్రాంచైజీలకు ఆడాల్సి వస్తోంది. రెండుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని...2016, 2017 సీజన్ల కోసం..పూణే ఫ్రాంచైజీ...12 కోట్ల 50 లక్షల రూపాయల ధరకు సొంతం చేసుకొంది. చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ ఆల్ రౌండర్ సురేశ్ రైనాను రాజ్ కోట్ ఫ్రాంచైజీ 12 కోట్ల 50 రూపాయలకు దక్కించుకొంది. చెన్నై సూపర్ కింగ్స్ మ్యాజిక్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, రాజస్తాన్ రాయల్స్ మాజీ ఓపెనర్ అజింక్యా రహానే, స్టీవ్ స్మిత్, డూప్లెసీ సైతం...పూణే ఫ్రాంచైజీకి సొంతమయ్యారు. రహానే, అశ్విన్ లకు 9కోట్ల 50 లక్షల రూపాయలు, స్టీవ్ స్మిత్, డూప్లెసీలకు 7 కోట్ల 50 లక్షల చొప్పున ఫ్రాంచైజీ చెల్లించనుంది.

సౌతాఫ్రికాతో ముగిసిన నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో...

సౌతాఫ్రికాతో ముగిసిన నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో అంచనాలకు మించి రాణించిన లెఫ్టామ్ స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను 9 కోట్ల 50 లక్షల రూపాయల ధరకు రాజ్ కోట్ ఫ్రాంచైజీ సొంతం చేసుకొంది. అంతేకాదు..చెన్నై సూపర్ కింగ్స్..మీడియం పేస్ ఆల్ రౌండర్ డ్వయన్ బ్రావో, డాషింగ్ ఓపెనర్ బ్రెండన్ మెకల్లమ్...చెరో 7 కోట్ల 50 లక్షల రూపాయల మొత్తానికి..రాజ్ కోట్ ఫ్రాంచైజీలో చోటు దక్కించుకొన్నారు. జేమ్స్ ఫాక్నర్ కు రాజ్ కోట ఫ్రాంచైజీ 9కోట్ల 50 లక్షల రూపాయలు చెల్లించనుంది. మొత్తం మీద...రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన ఆటగాళ్లను...సరికొత్త ఫ్రాంచైజీలు పూణే, రాజ్ కోట్...నీకొకరు నాకొరు అన్నట్లుగా..ప్లేయర్ డ్రాఫ్ట్ విధానం ద్వారా సొంతం చేసుకోడం విశేషం.

21:27 - December 15, 2015

విజయవాడ : యువ హీరో అల్లు అర్జున్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ అభిమాని కోరిక తీర్చాడు.. విజయవాడ సింగ్‌ నగర్‌లో ఉంటున్న మస్తాన్‌ బీ కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది.. ఆమె ఎక్కువకాలం బతకదని వైద్యులు తేల్చి చెప్పారు.. అప్పటినుంచి తన అభిమాన నటుడు బన్నీని చూడాలని ఆమె ప్రయత్నాలు చేస్తోంది.. ఈ విషయం తెలుసుకున్న యంగ్‌ హీరో విజయవాడవెళ్లి మస్తాన్‌ బీని కలిశాడు.. ఆమెను పరామర్శించడంతోపాటు.. కుటుంబసభ్యులతో కొద్దిసేపు గడిపారు.. 

21:25 - December 15, 2015

విజయవాడ : ఏపీలో కాల్‌మనీ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. కాల్‌మనీ స్క్యాంలో మీరున్నారంటే...మీరున్నారంటూ రాజకీయ పార్టీలు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. కాల్‌క్రిమినల్స్‌ను కఠినంగా శిక్షించాలంటూ అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేయడంతో ఇప్పుడు అసలు దొంగలు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.

అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం .....

గుమ్మడి కాయల దొంగ ఎవరంటే..భుజాలు భుజాలు తడుముకుంటున్నట్లు ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీల పరిస్థితి. రాష్ట్రంలో కాల్‌మనీ స్కాం డొంక కదులుతుండడంతో...రాజకీయ పార్టీల్లో వణుకు మొదలైంది. ఈ స్కాంలో ఎవరి పేర్లు బయటపడతాయోనని అన్ని పార్టీల నేతలు భయంతో వణికిపోతున్నారు. ఏ క్షణంలో ఏపార్టీ నేత అరెస్టు అవుతారో తెలియకపోవడంతో..నేతలు భయంతో అజ్ఞాతంలోకి జారిపోతున్నారు. అయితే పోలీసులు దాడుల్ని ముమ్మరం చేయడంతో ఏ కలుగులోంచి ఏ కాల్‌కంత్రి బయటపడతారో అన్న ఆసక్తి నెలకొంది.

రాజకీయ పార్టీల్లో వణుకు .......

కాల్‌మనీ వ్యవహారంలో మీ పార్టీనేతల ప్రమేయం ఉందంటే...లేదు లేదు మీ పార్టీనేతలే ఉన్నారంటూ అధికార, విపక్షాలు మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. ఈ స్కాంలో అధికార పార్టీ నేతలే ఉన్నారంటూ ప్రతిపక్షం వైఎస్సార్‌సీపి ఆరోపిస్తుంటే..లేదు లేదు అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన మీ పార్టీ వాల్లే ఉన్నారంటూ అధికార పక్షం టిడిపి నేతలు కౌంటర్‌ ఎటాక్‌ ఇస్తున్నారు. దీంతో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

అధికార-విపక్షాల మధ్య మాటల తూటాలు .......

ఏపీలో అధికార పార్టీ నేతలే కాల్‌మనీ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని ప్రతిపక్షం వైసిపి ఆరోపిస్తోంది. అధికార పార్టీ నేతల్ని రక్షించుకోవడం కోసమే ఇవాళ విజయవాడ పోలీస్‌కమిషనర్‌ను సెలవుపై విదేశాలకు పంపించారని ఆపార్టీ నేత అంబటి రాంబాబు ఆరోపిస్తున్నారు.

ప్రతిపక్షం వ్యాఖ్యల్ని అధికార పార్టీ నేతలు తిప్పికొట్టే ప్రయత్నం....

కాల్‌మనీ వ్యవహారంలో టిడిపి నేతలు ఉన్నారన్న ప్రతిపక్షం వ్యాఖ్యల్ని అధికార పార్టీ నేతలు తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన వైసిపి నేతలే ఈ స్కాంలో ఉన్నారని టిడిపి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు విమర్శించారు.

అధికార పక్షంపై విమర్శలు గుప్పించిన సీపీఎం....

ఇదిలా ఉంటే...సీపీఎం నేతలు అధికార పక్షంపై విమర్శలు గుప్పించారు. కాల్‌మనీ వ్యవహారంలో టిడిపి నేతలు ఉన్నారు కాబట్టే...వారిని రక్షించడం కోసమే విజయవాడ సీపీని సెలవుపై విదేశాలకు పంపిస్తున్నారని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. మొత్తానికి కాల్‌మనీ వ్యవహారం ఏపీలో పొలిటికల్ దుమారాన్నే రేపుతోంది. కాల్‌మనీ దొంగలు మీరంటే మీరంటూ..ఒకరిపై మరొకరు విమర్శించుకుంటూ రాజకీయ పబ్బం గడుపుతున్నారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు ఉంది అధికార, ప్రతిపక్ష పార్టీల పరిస్థితి. 

21:21 - December 15, 2015

హైదరాబాద్ : ఏపీ శీతాకాల సమావేశాలు ఈసారి వేడిగా జరగబోతున్నాయి. సమావేశాలకు సర్వం సిద్దమైంది. ఈ నెల 17 నుండి 22 వరకూ 5 రోజుల పాటు శాసనసభ సమావేశం కానుంది. అయితే..ప్రస్తుత సమావేశాలు హాట్ హాట్ గా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు కల్తీమద్యం చావులు, మరోవైపు సొంతపార్టీవారే ఎక్కువగా ఉన్న కాల్‌మనీ ప్రకంపనలు అసెంబ్లీని కుదిపేయబోతున్నాయి. ప్రతిపక్షాలు ఆరోపణలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటుంటే.. ధీటుగా బదులిచ్చేందుకు అధికారపక్షం కూడా ప్రిపేరవుతోంది. కాల్‌మనీ, కల్తీ మద్యంపై ప్రభుత్వం ఓ ప్రకటన చేసే అవకాశముంది.

బాక్సైట్‌ తవ్వకాలపై విధాన ప్రకటన...........

వివాదాస్పద బాక్సైట్‌ త్రవ్వకాలపై సభలో ప్రభుత్వం ప్రకటన చేయనుంది...తవ్వకాలకు సంబంధించిన నిర్ణయం ఎవరి హయాంలో జరిగిందనే విషయం తెలపడంతో పాటు బాక్సైట్‌ వెలికితీతపై తమ వైఖరి స్పష్టం చేయనుంది. ఇక ఇసుక అక్రమ త్రవ్వకాలపై కూడా కీలక చర్చసాగనుంది. అలాగే రాష్ట్రంలో ఇటివల సంభవించిన వరదలు....వాటిల్లిన నష్టం పై ప్రభుత్వం నివేదిక ప్రవేశపెట్టనున్నది.

సభలో ప్రయివేట్‌ యూనివర్శిటీల బిల్లు..........

ఇక ఈ సమావేశాలలోనే పలు కీలక బిల్లులు సభముందుకు రానున్నాయి... రాష్ట్రంలో ప్రయివేట్ యూనిర్శిటీల ఏర్పాటుచేసేందుకు వీలు కల్పిస్తు ప్రభుత్వం చట్టం చేయనుంది. అలాగే రాష్ట్రంలో పట్టణీకరణే ప్రధాన ధ్యేయంగా నూతన కార్పొరేషన్ల ఏర్పాటు పై నూతన పట్టణాభివ్రుద్ది అధారిటీ బిల్లు సభ ముందుకు రానుంది. మొత్తం మీద 5 రోజులే సమయం ఉన్న నేపథ్యంలో.. చర్చలు సజావుగా సాగుతాయో.. లేక అధికార, ప్రతిపక్షాల రభసతోనే ముగుస్తాయో వేచి చూడాల్సిందే.

అనంత లో ప్రకాష్ కారత్ పర్యటనకు అనుమతి నిరాకరణ

అనంతపురం : 17వ నంబుల పూలకుంటలో సీపీఎం జాతీయ నేత ప్రకాష్ కారత్ పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ సహా 11 మంది పై బైండోవర్ సమన్లు జారీ చేశారు.

20:40 - December 15, 2015

హైదరాబాద్ : అడ్డంగా ఆక్రమించేశారు. అందిన కాడికి ఆగం చేసేశారు. నీటి తావులను మాయం చేసి… కాంక్రీట్ కట్టడాలను నిలబెట్టారు. స్వచ్ఛమైన నీటితో అలలారే చెరువులను కాలుష్య కాసారాలుగా మార్చారు. ప్రమాదకర విష రసాయనాలతో నింపేశారు. చెత్త డంపింగ్ తో సర్వ నాశనం చేసేశారు. ఇప్పుడు పరిస్థితి చేయిదాటి పోతోంది. నగరంలో చెరువులు లేని ఫలితం తీవ్ర పరిణామాలకు కారణం కాబోతోంది. చెరువులూ, కుంటలూ మాయం అవుతున్న భాగ్య నగరం దుస్తితిపై 'టెన్ టివి' గ్రౌండ్ రిపోర్టు పై నేటి వైడాంగిల్ లో విశ్లేషణ చేశారు. మరి మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

20:12 - December 15, 2015

హైదరాబాద్ : మఫ్లర్ వాలా ఆఫీసు పై సీబీఐ మరక, మోడీ వాల పని నాకెరుక అంటున్న కేజ్రీ, మతిలేని పని చేసిన మహారాష్ట్ర సర్కార్, పీఎస్ లలో బార్ డ్యాన్స్ సినిమాలు, హైదరాబాద్ లో వెలిసిన మరో జ్యూపార్క్… చూసి నోరు తెరుస్తున్న లష్కర్ పబ్లిక్…, అత్తగారింటి కాడా ఆడోళ్ల ఆపద మొక్కులు.. నిజామాబాద్ ఎంపి కవితక్క చేతుల్లోనే వారి బతుకులు, రాజంపేట దేవత ముందే గుడి దోపిడీ… కాపాడుకోలేకపోయానని అమ్మవారి ఏడుపు, బుడ్డపిల్ల కంట్లోకెళ్లి కట్టె పుల్లలు… కరీంనగర్ జిల్లాలో విచిత్ర బాధ...ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

రైతులకు ధాన్యం వ్యాపారి రామయ్య కుచ్చుటోపీ

నల్గొండ : హుజూర్ నగర్ మండలం గోపాలపురంలో రైతులకు ధాన్యం వ్యాపారి రామయ్య కుచ్చుటోపీ పెట్టాడు. దీంతో గరిడేపల్లి, నేరేడు చర్ల, హుజూర్ నగర్ ప్రాంతాల్లో రమాయ్యకు పెద్ద ఎత్తున రైతులు ధాన్యం విక్రయించారు. రూ. కోటిన్నర మేర ఐపీ పెట్టాడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఫిబ్రవరి 1 కల్లా అందరికీ రేషన్ కార్డులు : సీఎం చంద్రబాబు

విజయవాడ : ఫిబ్రవరి 1 కల్లా అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ తాత్కాలిక కార్డు ఇచ్చి చంద్రన్న సంక్రాంతి కానుక అందజేస్తామని స్పష్టం చేశారు.

స్వల్పంగా తగ్గిన పెట్రో ధరలు

హైదరాబాద్ : స్వల్పంగా పెట్రో ధరలు తగ్గాయి. లీటర్ పెట్రోల్ పై 50 పైసలు, డీజిల్ పై 48 పైసలు తగ్గాయి. తగ్గిన ధరలు ఈ రోజు అర్థరాత్రి నుండి అమలు కానున్నాయి.

19:06 - December 15, 2015

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో కాల్ మనీ వ్యవహారం రగులుతోంది. కాల్ మనీకి సెక్స్ స్కాండిల్ తోడవడం దారుణం, కాల్ మనీ ఘటనపై అధికార పార్టీ కలవర పడుతోందా? ఈ అంశంపై 'టెన్ టివి ' విజయవాడ స్టుడియో లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సీపీఎం నేత బాబూరావు, టిడిపి నేత గొట్టి పాటి రామకృష్ణ ప్రసాద్, వైసీపీ నేత కొణిజేటి రమేష్ పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

18:58 - December 15, 2015

విశాఖ : కాలేజీ రోజులు గుర్తొస్తే ఎవరికైనా ఉత్సాహం ఉరకలు వేస్తుంది. గతంలోకి ప్రయాణం ఎంతో ఉద్విగ్నంగా సాగుతుంది. కాలేజీ చదువు పూర్తి చేసుకుని విద్యార్థులందరూ విడిపోయి 23 ఏళ్ళ తరువాత కలుసుకుంటే ఆ ఆనందమే వేరు. విశాఖపట్నంలోని ఎన్.వి.పి లా కళాశాల విద్యార్థులు గత వారంతంలో ఈ ఆనందాన్నే సొంతం చేసుకున్నారు. నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని... నేటి అనుభవాలను పంచుకున్నారు.

23 ఏళ్ళ తరువాత...

విశాఖ పట్నంలోని న్యాయ విద్యా పరిషత్ లా కళాశాలలో 1992లో పట్టా అందుకున్న విద్యార్థులందరూ 23 ఏళ్ళ తరువాత మళ్ళీ కలుసుకున్నారు. గత వారాంతంలో ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల సంగమంలో వారంతా కలసి నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ రెండు దశాబ్దాల ప్రయాణంలో తీపి గుర్తులను కలబోసుకున్నారు.

ఫైవ్ ఇయర్స్ లా కోర్సు పూర్తి చేసిన బ్యాచ్....

ఈ లా స్టూడెంట్స్ బ్యాచ్ కు ఒక ప్రత్యేకత ఉంది. అదేమంటే, ఉమ్మడి రాష్ట్రంలో ఇది మొట్టమొదటి ఫైవ్ ఇయర్స్ లా కోర్సు పూర్తి చేసిన బ్యాచ్. ఇంటిగ్రేటెడ్ లా కోర్సును మొదటిసారిగా ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో 1987లో ప్రవేశపెట్టినప్పుడు, వైజాగ్ లోని ఎన్.వి.పి లా కళాశాలలో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కలసి చదువుకున్నారు. అయిదేళ్ళ పాటు కలిసి చదువుకున్న ఈ విద్యార్థుల్లో చాలా మంది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సక్సెస్ ఫుల్ అడ్వకేట్స్ గా రాణిస్తున్నారు. కె.ఎస్.ఎన్. రాజు చోడవరం ఎమ్మెల్యే అయ్యారు. సివిల్స్, జర్నలిజం, పాలిటిక్స్ వంటి రంగాల్లో కూడా ఈ బ్యాచ్ విద్యార్థులు తమదైన గుర్తింపును చాటుకున్నారు.

ఎన్.వి.పి ఆలమ్నీ మీట్ లో...

ఎన్.వి.పి ఆలమ్నీ మీట్ లో ఆనాటి లెక్చరర్స్ కూడా పాల్గొన్నారు. ఇరవై మూడేళ్ళ కిందటి తమ విద్యార్థులు నేడు వివిధ రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవడం గర్వంగా ఉందని వారు సంతోషం వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యమాల సహాయంతో ...

వాట్సప్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల సహాయంతో దాదాపు అరవై మంది విద్యార్థులను ఒక చోట చేర్చిన ఘనత రామ్మోహన్ దైతే, ఈవెంట్ ను విజయవంతంగా నిర్వహించినందుకు సూరిబాబును మిత్రులంతా అభినందించారు.

ఒక ట్రస్ట్ గా ఏర్పడి...

ఎన్నో ఏళ్ళ తరువాత ఇలా కలుసుకోవడంతో ఎంతో ఎగ్జయిట్ అయిన అలనాటి విద్యార్థులు.. భవిష్యత్తులో కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటామని.. పరస్పరం సహకరించుకుంటామని, ఒక ట్రస్ట్ గా ఏర్పడి నలుగురికీ సహాయం అందించేందుకు కూడా ముందుకు వస్తామన్నారు.

18:57 - December 15, 2015

ఐఎస్ ఐఎస్ కథ కంచికి చేరనుందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఉగ్రవాదం కారణంగా ప్రపంచ దేశాల్లోని ముస్లిములపై అనుమానపు చూపులు పెరిగిపోతున్నాయి. ముస్లిములపై కొన్ని దేశాలు నిషేధం విధించే దిశగా పావులు కదుపుతున్నాయి. దీంతో మేల్కొన్న ఇస్లాం దేశాలు ఐఎస్ ఐఎస్ పై పోరాటానికి సిద్ధమవుతున్నాయి. 34 ముస్లీము దేశాలు కలిసి సంకీర్ణ సేవలను తయారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా నేతృత్వంలో రియాద్ కేంద్రంగా సంకీర్ణ సేనలు ఐఎస్ ఐఎస్ పై విరుచుకుపడనున్నాయి. ఈ దేశాల జాబితాలో ఈజిప్టు, ఖతార్, యూఏఈ, టర్కీ, మలేషియా, పాకిస్తాన్, గల్ఫ్, అరబ్, ఆఫ్రికన్ దేశాలున్నాయి. ఇస్లామిక్ దేశాలను ఉగ్రవాదం నుంచి రక్షించుకోవడం తమ విధి అని ఈ దేశాలు పేర్కొన్నాయి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా..దానిని అంతం చేయడం తమ విధి అని ఈ దేశాలు తెలిపాయి. ఐఎస్ ఐఎస్ పై చర్యలు తీసుకునే సమయంలో అంతర్జాతీయ సమాజంతో సమన్వయం చేసుకోవాల్సిన అవసరం వుందని వారు పేర్కొన్నారు. ఏకపక్షంగా ఎటువంటి చర్య తీసుకోలేమని సౌదీ అరేబియా తెలిపింది.

 

18:54 - December 15, 2015

తూ.గో : తమ భూములను తమకు ఇవ్వాలంటున్న రైతుల డిమాండ్లను పట్టించుకోవడం మానేసి.. ఏకంగా ఫెన్సింగ్‌ వేయాలని చూసిన అధికారులకు అన్నదాతల తమ ఆగ్రహావేశాలను రుచి చూపించారు. ఫెన్నింగ్‌ దిమ్మలను పీకి పారేశారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో.. అక్కడ ఉద్రిక్త పరిస్ధితి ఏర్పడింది. తూర్పుగోదావరి జిల్లా రమణక్కపేటలో ఈ ఘటన జరిగింది. సుమారు 500 మంది సెజ్‌ బాధిత రైతులు, వ్యవసాయ కూలీలు భారీ ఎత్తున తరలి వచ్చారు. పోలీసులు కూడా అందుకు తగ్గట్టుగానే మోహరించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సెజ్‌ భూములు తిరిగివ్వాలన్న బాబు ఇప్పుడు మాట నిలబెట్టుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

18:52 - December 15, 2015

ఢిల్లీ : విజయవాడలో సంచలనం సృష్టించిన కాల్‌మనీ వ్యవహారంపై ఎన్‌హెచ్‌ఆర్సీకి ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఫిర్యాదు చేశారు. కాల్‌మనీ వ్యవహారం వల్ల ఎంతో మంది మహిళలు తమ మానాలను కోల్పోయారని...వారందరికి న్యాయం జరిగేలా చూడాలని ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్మన్‌ను కోరారు. ఈ వ్యవహారంలో ఎంతమంది ఉన్నా వారందరికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని చైర్మన్‌ను కోరారు. ఢిల్లీలో ఉన్న ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేసిన వారిలో రఘువీరారెడ్డితో పాటు..కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు సుబ్బిరామిరెడ్డి, కేవీపీ, జేడీ శీలం, జైరాం రమేష్‌,ఏపీ కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలు పద్మశ్రీ ఉన్నారు. అయితే కాల్‌మనీ వ్యవహారంపై ఇవాళే ఏపీ సీఎస్‌, డీజిపికి నోటీసులు జారీచేస్తామని ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్మన్‌ అన్నారు. 

కృష్ణాజిల్లా వ్యాప్తంగా టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీలు

కృష్ణా :కాల్‌ మనీ కేసులో తనిఖీలు పెంచారు పోలీసులు.. ఈ కేసుతో సంబంధమున్నవారి ఇళ్లపై తనిఖీలు కొనసాగిస్తున్నారు.. విజయవాడ ఉయ్యూరులో సోదాలు జరిపారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. విలువైన డాక్యుమెంట్లు, ఖాళీ ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు ... వీటిని పట్టణ పోలీసులకు అప్పగించారు.. మరోవైపు ఈ మనీ నిర్వాహకుల్లో ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌ ముఖ్య అనుచరుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి చలపతిరావు కుమారుడు శంతన్‌ ఉన్నారు.. అటు తనకు 30వేలు అప్పుగాఇచ్చి పదిలక్షల విలువైన ప్రాపర్టీ రాయించుకున్నారని ఓ మైనార్టీ మహిళ పోలీసులకు ఫిర్యాదుచేసింది..

ఉయూరులో 'కాల్ మనీ' దాడులు

కృష్ణా : కాల్‌మనీ కేసులో కృష్ణాజిల్లా వ్యాప్తంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇప్పటివరకు ఓ కార్పొరేటర్‌ను, అతని భార్యను అదుపులోకి తీసుకున్నారు. ఉయ్యూరులో పలువురు కాల్‌మనీ నిర్వాహకుల ఇళ్లపై దాడులు చేసి విచారిస్తున్నారు. పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రపసాద్‌ అనుచరుడు నాగరాజును, అలాగే వంగవీటి శంతన్‌కుమార్‌ అనుచరుడు రామును అరెస్ట్ చేశారు. వీరి దగ్గర నుంచి పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. 

కాల్‌ మనీ వ్యవహారంలో కొనసాగుతున్న అరెస్టులు

విజయవాడ : కాల్‌ మనీ వ్యవహారంలో అరెస్టులు కొనసాగుతున్నాయి.. విజయవాడలోని 92 ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సోదరుడు బుద్ధా నాగేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన నుంచి కోట్ల విలువ జేసే డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే 57మందిని అదుపులోకి తీసుకున్నారు.. 193 చెక్కులు, 938 ప్రామిసరీ నోట్లు, 310 డాక్యుమెంట్లతోపాటు... 14లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.. కాల్‌మనీ వ్యాపారంలో బుద్ధా వెంకన్న సోదరుడు నాగేశ్వరరావును కీలక నిందితునిగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. 

18:47 - December 15, 2015

విజయవాడ : కాల్‌మనీ వ్యవహారంలో ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తేలేదని ఏపీ డిజిపి రాముడు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ఎంతమంది ఉన్నా...అవసరమైతే వారిపై పీడీయాక్ట్‌, నిర్భయచట్టం కింద కేసులు నమోదు చేస్తామని ఆయన అన్నారు. కాల్‌మన్‌ వ్యవహారంలో ప్రధానంగా మహిళలు చిత్రహింసలకు గురయ్యారని తెలిసిందని వారందరిపై నిర్బయ చట్టం కింద కేసులు నమోదు చేస్తామన్నారు. ఇక విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్‌ లీవ్‌పై స్పందిస్తూ...నెల రోజుల క్రితమే సవాంగ్‌ ఆస్ట్రేలియా వెళ్లేందుకు లీవ్‌ పెట్టుకున్నారని...అప్పుడే లీవ్‌ మంజూరు చేశామన్నారు. 

రామగుండం ఎన్టీపీసీలో అంతరాయం...

కరీంనగర్ : రామగుండం ఎన్టీపీసీలోని ఐదో యూనిట్‌లో సాంకేతిక సమస్యలతో మంగళవారం సాయంత్రం ఉత్పత్తి నిలిచిపోయింది. ఐదో యూనిట్‌లో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోవటంతో అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టారు. ప్రస్తుతం 2100 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోంది.

18:44 - December 15, 2015

ఆరోగ్యశ్రీ... పేదలకు ఉచితంగా వైద్య సేవలందించేందుకు ప్రవేశపెట్టిన ప్రభుత్వం పథకం. ఎంతోమంది పేదలు ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ పథకం పేదలకు ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఈ పథకం ద్వారా అందించే సేవలను నిలిపివేస్తామని తెలంగాణలోని ప్రైవేట్ ఆస్పత్రులు, నిర్సింగ్ హోమ్స్ అసోసియేషన్(టీహెచ్ ఏఎన్ ఏ) హెచ్చరిస్తోంది. సుమారు ఆరు నెలలకు సంబంధించి ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.200 కోట్లు తమకు చెల్లించాల్సి ఉందని టీహెచ్ఏఎన్ ఏ అధికారులు మండిపడ్డారు. ఈ విషయమై ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు (ఏహెచ్ సీటీ) అధికారులకు పలుమార్లు విన్నవించామని.. అయినా ప్రయోజనం లేదని టీహెచ్ ఏఎన్ ఏ అధికారులు వాపోయారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు విలిపివేసే విషయమై చర్చించిన తర్వాత ఒక తేదీని ప్రకటిస్తామని ఇటీవల నిజామాబాద్ లో జరిగిన టీహెచ్ ఏఎన్ ఏ సమావేశంలో పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు తమకు చెల్లించకపోవడతో తమ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేకపోతున్నామని టీహెచ్ ఏఎన్ ఏ అధ్యక్షుడు డి.నారాయణరావు పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిల అంశమే కాకుండా ఇంకా పలు అంశాలపై టీహెచ్ ఏఎన్ ఏ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆరోగ్యశ్రీ ఆపరేషన్లకు సంబంధించి చెల్లించే మొత్తంలో కోత విధిస్తుండటాన్ని టీహెచ్ ఏఎన్ ఏ ఆరోగ్యశ్రీ విభాగం చైర్మన్ డా.టి.నరసింగారెడ్డి ప్రశ్నించారు. ఈ పద్ధతిలో మార్పు రావాలని ఆయన కోరారు. ప్రైవేట్ ఆస్పత్రుల వాళ్లు మూడు నెలలకొకసారి తప్పనిసరిగా హెల్త్ క్యాంపులు నిర్వహించాలంటూ ఏహెచ్ సీటీ ఇటీవల ఆదేశాలు జారీ చేసిందని.. ఈ హెల్త్ క్యాంపులు నిర్వహించేందుకని.. వ్యయప్రయాసల కోర్చి ప్రైవేట్ ఆస్పత్రుల సిబ్బంది వెళ్తున్నారని అన్నారు. కాగా టీహెచ్ ఏఎన్ ఏకు చెల్లించాల్సిన ఆరోగ్యశ్రీ బకాయిలపై ఏహెచ్ సీటీ చీఫ్ మెడికల్ ఆడిటర్ గోవర్థన్ రెడ్డిని వివరణ కోరగా.. ఇటీవల జరిగిన టీహెచ్ ఏ సమావేశంలో ఏ ఒక్కరూ ఈ అంశాన్ని ప్రస్తావించలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. సుమారు రూ.50 కోట్ల వరకు తాము చెల్లించామని పేర్కొన్నారు. అయితే ఈప్రకటనను టీహెచ్ ఏఎన్ ఏ ఆఫీస్ బేరర్లు ఖండించారు. 

ఏసీబీకి పట్టు పడ్డ వాణిజ్య పన్నుల శాఖ అధికారి

కృష్ణా : గుడివాడ వాణిజ్య పన్నుల శాఖ అధికారి రామారావు ఏసీబీ వలలో చిక్కారు. కార్యాలయంలో ఓ వ్యాపారి నుంచి రూ. 2 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు. నగదు స్వాధీనం చేసుని… విచారిరిస్తున్నారు.

అన్ని పీఎస్ లకు వీడియో కాన్ఫరెన్స్ : అనురాగ్ శర్మ

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇకపై అన్ని పోలీస్ స్టేషన్లకు వీడియో కాన్ఫరెన్సింగ్ (వీసీ) సౌకర్యం అందుబాటులోకి తీసుకు వస్తున్నామని డీజీపీ అనురాగ్ శర్మ వెల్లడించారు. ఫైలెట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ బషీర్ బాగ్ లోని కమిషనరేట్ కార్యాలయంలో వీసీ వ్యవస్థను డీజీపీ ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు.

రాష్ట్రంలో మాఫియా పాలన సాగుతోంది : పి.మధు

నెల్లూరు : రాష్ట్రంలో మాఫియా పాలన సాగుతోందని ఆంధ్రప్రదేశ్ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు అన్నారు. ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ… రాజధానిలో సంచలనం రేపిన కాల్ మనీ సిండికేట్ పై విచారణ కమిటీ వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటన పై ప్రభుత్వం నిష్పక్షపాతం విచారణ చేయించాలని, దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని కోరారు.

29 మంది జర్నలిస్టులను చంపేశారు...

హైదరాబాద్ : కల్లోలిత ఇరాక్ లో జర్నలిస్టుల బతుకులు ఘోరంగా ఉన్నాయి. ఈ ఏడాదిలో 29 మంది జర్నలిస్టులు హతమయ్యారు. వీరిలో 20 మందిని ఉగ్రవాద సంస్థ ఐఎస్ఎస్ కాల్చి చంపింది. ఐఎస్ వ్యతిరేక పోరాటాలను కవర్ చేస్తున్న క్రమంలో మరో ముగ్గురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇరాక్ రాజధాని బాగ్ధాద్ తో పాటు, ఇతర నగరాల్లో జరిగిన హింసాత్మక ఘటనల్లో మిగిలిన ఆరు మంది చనిపోయారు. మరోవిషయం ఏమిటంటే... ఇరాక్ వ్యవహారాల్లో అమెరికా తల దూర్చినప్పటి (2003) నుంచి ఇప్పటి వరకు 435 మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారని జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. ఐక్యరాజ్య సమితి కూడా ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేసింది.

సాంకేతిక లోపంతో నిలిచిపోయిన పినాకిని ఎక్స్ ప్రెస్

హైదరాబాద్ : విజయవాడ - చెన్నై నగరాల మధ్య ప్రయాణించిఏ పినాకిని ఎక్స్ ప్రెస్ నెల్లూరు జిల్లా గూడూరు జంక్షన్ లో నిలిచిపోయింది. ఇంజన్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో రైలును గూడూరు లో నిలిపివేశారు. రైల్వే సిబ్బంది ఇంజన్ కు మరమ్మత్తులు చేపట్టారు.

రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

కరీంనగర్: మహదేవ్‌పూర్ అయ్యప్ప ఆలయం దగ్గర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు లారీ ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న భార్యభర్తలిద్దరూ మృతిచెందారు. మృతులు సర్వాయిపేట వాసులుగా గుర్తింపు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

జల్లికట్టు నిషేధానికి క్రికెటర్లు, నటుల మద్దతు

హైదరాబాద్ : తమిళనాడులో ఎద్దుల వికృత క్రీడ అయినటువంటి జల్లికట్టును తిరిగి నిర్వహించకుండా చూడాలని అటు బాలీవుడ్ నటులు, ఇటు క్రికెటర్లు కోరుతున్నారు. జల్లికట్టుపై నిషేధంపై జాతీయ అవార్డు గ్రహీత విద్యాబాలన్ తో పాటు, టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిలు ఓ విజ్ఞాపన పత్రంపై సంతకం చేసి తమ మద్దుతు ప్రకటించారు. మళ్లీ జల్లికట్టు నిర్వహించకుండా ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని కోరుతూ పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్(పెటా) తరపున వారు విన్నవించారు.

పాతబస్తీలో ఆర్టీఏ కార్యాలయం ప్రారంభం...

హైదరాబాద్ : ఓల్డ్‌సిటీలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఆర్టీఏ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించారు. మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, నాయిని నర్సింహారెడ్డిలు నేడు పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా నాలుగు నీటి రిజర్వాయర్లకు అదేవిధంగా రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపనలు చేశారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని మైసారంలో 5ఎంఎల్ రిజర్వాయర్‌కు సంబంధించిన ఇన్‌లెట్, ఔట్‌లెట్ నీటి సరఫరాను ప్రారంభించారు.

17:45 - December 15, 2015

మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా...? మీ ఆండ్రాయిడ్‌ ఫోన్‌ కు తరచుగా నెట్‌వర్క్ సమస్య ఉందా..? అయితే ఈ విధంగా ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చు. 

- ఫోన్‌ నుంచి బ్యాటరీ, సిమ్‌ కార్డ్ ను తొలగించి రీ-ఇన్సర్ట్ చేయటం ద్వారా నెట్‌వర్క్ ఎర్రర్‌ తొలగిపోయే అవకాశముంది. ఈ ట్రిక్‌ను అప్లై చేసేందుకు ముందుగా మీ ఆండ్రాయిడ్‌ ఫోన్‌ను పవర్‌ ఆఫ్‌ చేసి బ్యాటరీ, సిమ్‌ కార్డ్ ను తొలగించాలి. ఐదు నిమిషాల తర్వాత తిరిగి వాటిని రీ-ఇన్సర్ట్ చేసి ఫోన్‌ స్విచ్‌ ఆన్‌ చేయాలి. దీంతో నెట్‌వర్క్ ఎర్రర్‌ పరిష్కారమయ్యే అవకాశముంది.

- అయినా ఫలితం లేనట్లయితే డివైస్‌ సెట్టింగ్స్ లోకి వెళ్లి ప్రయత్నించండి. ముందుగా ఫోన్‌ సెట్టింగ్స్ లోకి వెళ్లి వైర్‌లెస్‌ అండ్‌ నెట్‌వర్క్ సెట్టింగ్స్ పై క్లిక్‌ చేయండి. ఈ సెట్టింగ్స్ లో మొబైల్‌ నెట్‌వర్క్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని నెట్‌వర్క్ ఆపరేటర్స్ ఆప్షన్‌పై టాప్‌ చేయండి. మీ నెట్‌వర్క్ ఆటోమెటిక్‌గా సెలక్ట్ అవుతుంది.

- అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే ఫోన్‌ సాఫ్ట్ వేర్‌ను అప్‌డేట్‌ చేయండి.

- ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్‌ చేయటం ద్వారా నెట్‌వర్క్‌ సమస్యలు తొలగిపోయే అవకాశముంది. ఫోన్‌ను రీసెట్‌ చేసే క్రమంలో ముందుగా డివైస్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. ఆ తర్వాత బ్యాకప్‌ అండ్‌ రీసెట్‌ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకుని ఫ్యాక్టరీ డేటా రీసెట్‌ పై క్లిక్‌ చేయండి. ఫోన్‌ రీసెట్‌ అయిపోతుంది.

-రేడియో సిగల్‌ టెస్ట్ చేయడం ద్వారా మీ ఫోన్‌లో నెట్‌వర్క్ ఎర్రర్‌కు సంబంధించి ఏమైనా హార్డ్ వేర్‌ సమస్యలు ఉన్నట్లయితే తెలిసిపోతాయి. ముందుగా మీ ఫోన్‌ నుంచిలిచలిచ4636చలిచలి డయల్‌ చేయండి. దీంతో టెస్టింగ్‌ మెనూకు ప్రాంప్ట్ చేయబడతారు. ఇప్పుడు ఫోన్‌ ఇన్ఫర్మేషన్‌ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకోండి. ఆ తర్వాత పింగ్‌ టెస్ట్ ను రన్‌ చేయండి. అనంతరం ఫోన్‌ను రీస్టార్ట్ చేయండి.

 

పొదుపు చర్యలు చేపట్టిన సర్కార్

హైదరాబాద్ : ఆర్ధిక కష్టాలు మీద పడుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం పొదుపు చర్యలు చేపట్టింది. మంత్రులు, అధికారులు ఎవరూ విదేశీ పర్యటనలకు వెళ్లొద్దని ఆంక్షలు విధించింది. ఎవరికీ విదేశీ టూర్లకు అనుమతులు ఇవ్వొద్దంటూ ఆర్ధికశాఖకు సీఎంఓ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాయి.

17:43 - December 15, 2015

హైదరాబాద్ : మొన్న వరంగల్‌ ఉప ఎన్నికలో కారు పార్టీ ఫుల్ మెజార్టీతో వీరవిహారం చేసింది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్రెడీ సగం స్థానాలు కైవసం చేసుకుని దూసుకుపోతోంది. ఇక మిగిలింది జిహెచ్‌ఎంసి ఎన్నికలే. బల్దియా పీఠాన్నీ ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నారేమో గులాబీ నేతలు మాటల తూటాలు విసురుతున్నారు. వాళ్లూ వీళ్లూ అని చూడకుండా.. గ్రేటర్‌ గెలుపుకు అవసరమైన టార్గెట్‌పై క్లారిటీతో అటాక్‌ చేస్తున్నారు.

మిగతా స్థానాల్లోనూ గెలుపు కోసం...

వరంగల్ ఉప ఎన్నికలో జోరు చూపించిన కెసిఆర్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ దూకుడు ప్రదర్శిస్తోంది. ఎలా గెలిచామన్నది కాదు ముఖ్యం ఎన్ని సీట్లు సాధించామన్నదే ప్రధానమన్నట్లు 12 ఎమ్మెల్సీలకుగాను 6 సీట్లు ఇప్పటికే తన ఖాతాలో వేసుకుంది. మిగిలిన ఆరిట్లోనూ మ్యాగ్జిమమ్‌ స్థానాలు సొంతం చేసుకునేలా వ్యూహాలు అమలుపరుస్తున్నారు.

టిఆర్ ఎస్ ను విమర్శిస్తోన్న కాంగ్రెస్....

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిమ్మినిబమ్మిని టిఆర్‌ఎస్‌ గెలుపొందుతోందని ఒకపక్క కాంగ్రెస్ విమర్శిస్తోంది. తమ నేతలను గులాబీ పార్టీ కొనుగోలు చేసిందనో లేక బెదిరించి సీట్లు సాధించిందనో హస్తం నేతలు బాధను దిగమింగుకోలేక బయటపడుతున్నారు. అయితే ఇదే విషయాన్ని టిఆర్‌ఎస్ మంత్రి తలసాని ఒప్పుకుంటూ అవును మీరు చూపించిన దారిలోనే మేమూ నడుస్తున్నామన్నట్లు చెప్పుకొచ్చారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూపిస్తున్న దూకుడే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లోనూ....

ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూపిస్తున్న దూకుడే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లోనూ కొనసాగించాలని గులాబీ పార్టీ నేతలు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ దిశగా హైదరాబాద్‌ నగరంలోని ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు గులాబీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతం పలికారు. ప్రస్తుతం నగర పాలిక ఎన్నికల్లో టిడిపి, బిజెపి ప్రధాన ప్రత్యర్థులు కావడంతో వాటిపైనే విమర్శలు ఎక్కుపెట్టారు. నేతలు, కార్యకర్తలను ఆహ్వానిస్తూ ఏర్పాటుచేసిన సభలో కెటిఆర్‌ మాట్లాడుతూ బిజెపిపై విమర్శలు గుప్పించారు. ఏకంగా ప్రధాని మోడీపైనే మాటల తూటాలు పేల్చారు. ఆయనది అసమర్థ పాలన అంటూ చురకలు అంటించారు.

మోడీతో ఢీ అంటే పరిస్థితులు భిన్నంగా.....

మోడీతో ఢీ అంటే పరిస్థితులు భిన్నంగా ఉంటాయని గులాబీ పార్టీకి తెలుసు. అయినా దూకుడు ప్రదర్శిస్తున్నారంటే వరుస విజయాలు ఆ ధైర్యాన్నిస్తున్నాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఏదేమైనా ఎమ్మెల్సీ వార్‌కన్నా భిన్నంగా జిహెచ్‌ఎంసి ఎన్నికలు అధికార పార్టీ టిఆర్‌ఎస్‌కు సవాలు విసురుతున్నాయి. ఆ ఎన్నికలకు ఇంకొన్ని రోజుల గడువే ఉంది. ఈ లోపు నగర పరిధిలోని ఎవరెవర్ని టిఆర్‌ఎస్‌ తమ గూటికి చేర్చుకుంటుందో, మోడీ, బిజెపిపై ఇంకెన్ని విసుర్లు విసురుతుందో చూడాలి. 

17:39 - December 15, 2015

హైదరాబాద్ : వరంగల్‌ ఉప ఎన్నికతో మంచి ఊపు మీదున్న కేసీఆర్‌.. తెలంగాణ మొత్తం పట్టు సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలన్నీ చుట్టేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పర్యటనకు ముందే జిల్లాల్లోని సమస్యలను తెలుసుకునేందుకు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఒక్కో జిల్లాలో మూడు నుంచి ఐదు రోజులు పర్యటన ఉండేలా కేసీఆర్‌ ప్లాన్‌ చేస్తుండడంతో.. అధికారులు పెండింగ్‌ పనులు పూర్తి చేసే పనిలో పడ్డారు.

జిల్లాలోని సమస్యలపై సీఎం రివ్యూ.....

సీఎం కేసీఆర్‌ జిల్లాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. పర్యటనకు ముందే జిల్లాలోని సమస్యలపై దృష్టి సారిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే జిల్లాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో ఆయా శాఖల మంత్రులతో పాటు.. జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఏ సమస్యలను సత్వరం పరిష్కరించాలి.. ఎన్నికల సమయంలో ఏయే హామీలు ఇచ్చామనే అంశాలను పరిశీలిస్తున్నారు.

ఒక్కో జిల్లాలో మూడు నుంచి ఐదు రోజులు....

ఒక్కో జిల్లాలో మూడు నుంచి ఐదు రోజులు పర్యటించేలా కేసీఆర్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ పర్యటనలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమస్యలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. మరోవైపు పరిపాలనలో భాగంగా అత్యవసరమైతే హెలికాప్టర్‌లో నగరానికి చేరుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏర్పాట్లు చేస్తున్న అధికారులు ....

ప్రతి జిల్లాలో మూడు నుంచి ఐదు రోజులు ఖచ్చితంగా ఉంటానని కేసీఆర్‌ ప్రకటించడంతో.. అధికారులు ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓవైపు ఆయుత చండీయాగం,.. మరోవైపు గ్రేటర్‌ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడనున్న నేపథ్యంలో కేసీఆర్‌ జిల్లాల పర్యటన సాధ్యమేనా అనే సందేహం వ్యక్తమవుతోంది. అయితే.. ఇది సాధ్యం కాకపోయినా మధ్యమధ్యలో ఏదో ఒక జిల్లాకు వెళ్లడం ఖాయమని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి.

పెండింగ్‌ పనులపై దృష్టి సారిస్తున్న అధికారులు .........

ఇక కేసీఆర్‌ ఆదిలాబాద్‌ జిల్లా నుంచే పర్యటన ప్రారంభిస్తాననని చెప్పడంతో.. ఆ జిల్లాలో చేపట్టాల్సిన పనులపై అధికారులు దృష్టి సారించారు. అయితే సీఎం టూర్‌ ఆదిలాబాద్‌ నుంచి ప్రారంభమవుతుందా ? లేక నల్లగొండ జిల్లా దామరచర్లలోని విద్యుత్‌ప్లాంట్‌ నుంచి ప్రారంభమవుతుందా ? అనేది ఇంకా తేలాల్సి ఉంది. అయితే సీఎం కేసీఆర్‌ పర్యటనల వల్ల ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలు భావిస్తున్నారు.

15 రోజులకోసారి మూడు రోజులు జిల్లాలో...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చివరి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిరమ్మ బాట పేరుతో 15 రోజులకోసారి మూడు రోజులు జిల్లాలో పర్యటించి.. అక్కడి సమస్యలు పరిష్కరించేందుకు చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలిచ్చాయి. అదే బాటలో కేసీఆర్‌ కూడా జిల్లాల పర్యటనలకు వెళ్లడం మంచిదేనని ప్రతిపక్ష నేతలంటున్నారు. మరి సీఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటనల నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నీ ఎంతవరకు పరిష్కారమవుతాయో చూడాలి. 

17:34 - December 15, 2015

హైదరాబాద్ :టీఆర్ఎస్‌ నాయకత్వాన్ని మూడు జిల్లాలు ముప్ప తిప్పలు పెడుతున్నాయి. ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోని తమ అభ్యర్థులు గెలుస్తారా..? లేక పరాజయంతో ప్రతిపక్షాల ముందు తల దించుకోవాల్సి వస్తుందా..? ఈ ప్రశ్నలు.. ఆ మూడు జిల్లాల టీఆర్ఎస్‌ ఇంచార్జిలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంతకీ ఆ మూడు జిల్లాలు ఏవి..? అక్కడి పరిస్థితి ఏంటి..? వాచ్‌ దిస్‌ స్టోరీ.

పోలింగ్‌ సమీపిస్తున్న కొద్దీ టీఆర్ఎస్‌లో ఉత్కంఠ....

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని స్థానాలూ తమవేనని పాలక టీఆర్ఎస్‌ ధీమాగా ఉండేది. నామినేషన్‌ల ఉపసంహరణ నాటికే మొత్తం సీట్లు ఏకపక్షం అయిపోతాయని భావించింది. ఒకటి రెండు చోట్ల విపక్ష పోటీ ఉన్నా.. తమ అభ్యర్థుల గెలుపు నల్లేరుపై బండి నడకే అని భావించింది. కానీ.. రోజులు గడిచే కొద్దీ.. పోలింగ్‌ తేదీ దగ్గర పడే కొద్దీ.. ఓ మూడు జిల్లాలు టీఆర్ఎస్‌ ఇంచార్జిలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.

ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు 27న ఎన్నికలు....

ప్రస్తుతం ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 27 ఎన్నికలు జరుగుతున్నాయి. పాలక టీఆర్ఎస్‌ను ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలు కొరకరాని కొయ్యగా మారాయి. నల్లగొండ, ఖమ్మం జిల్లాలు పాలక పక్షానికి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారాయి. నల్లగొండలో భారీగా వలసలను ప్రోత్సహిస్తోన్న టీఆర్ఎస్‌.. ఇప్పటికీ తగిన సంఖ్యాబలం లేక సతమతమవుతోంది. ఇక్కడ విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావడం... పాలక పక్షానికి గడ్డు పరిస్థితిని తెచ్చి పెట్టింది.

మంత్రి తుమ్మలకు ప్రతిష్ఠాత్మకంగా ఖమ్మం స్థానం....

ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నిక.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఇక్కడ సీపీఐ అభ్యర్థి పువ్వాడ నాగేశ్వరరావుకు విపక్షాలన్నీ మద్దతునిస్తున్నాయి. దీంతో ఇక్కడ పాలక పక్షానికి ముచ్చెమటలు పోస్తున్నాయి. జలగం వర్గం ఏమేరకు సహకరిస్తుందో తెలియదు.. విపక్షాల ఓటర్లు ఎందరు కారెక్కుతారో తెలియదు.. పైగా కొద్దో గొప్పో ఓట్లున్న వైసీపీ కూడా బరిలో నిలిచింది. దీంతో ఫలితం ఎలా ఉంటుందోనని టీఆర్ఎస్‌ శిబిరంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

విపక్షాలు విడివిడిగా పోటీ చేయడం కలిసొచ్చే అంశం...

పాలమూరు జిల్లాలోనూ టీఆర్ఎస్‌ పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. అయితే ఇక్కడ విపక్షాలు విడివిడిగా పోటీ చేస్తుండడం.. పాలక పక్షానికి కలిసి వచ్చే అంశమని అంటున్నారు. మొత్తానికి ఖమ్మం, నల్లగొండ, పాలమూరు జిల్లాల్లో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల నుంచి పూర్తి స్థాయి మద్దతు లభించక పోవడంతో.. పర్యవసానాలపై టీఆర్‌ఎస్‌ తర్జన భర్జన పడుతోంది.

గెలిచేందుకు అవసరమైన ఓట్లపై లెక్కలు.....

మూడు జిల్లాల్లోనూ .. గెలిచేందుకు అవసరమైన సంఖ్యాబలంపై టీఆర్ఎస్‌ లెక్కలు వేసుకుంటోంది. ఎన్ని ఓట్లు సాధిస్తే.. ఇక్కడ తమ అభ్యర్థులు గెలుస్తారో లెక్కలేసుకుంటోంది. ఆమేరకు విపక్ష సభ్యులను కారెక్కించేందుకు కసరత్తు చేస్తోంది. అయితే ఇప్పటి వరకూ ఇక్కడ ఇంకా పట్టు చిక్కలేదంటున్నారు. ప్రస్తుతం ఎలా ఉన్నా.. పోలింగ్‌ నాటికి పరిస్థితులన్నీ తమకు అనుకూలంగా మారతాయని టీఆర్ఎస్‌ ధీమాను వ్యక్తం చేస్తోంది. 

17:31 - December 15, 2015

హైదరాబాద్‌ : నగరంలో హైవే రోడ్లు.. ఫైఓవర్లు.. స్కైవేస్‌ మీద దృష్టిసారించిన.. తెలంగాణ ప్రభుత్వం అందుకు అనుగుణంగా నిధులు సేకరణపైనా దృష్టిసారించింది. నగరంలో రోడ్లు.. డ్రైనేజ్‌ వ్యవస్థ మెరుగుపరిచేందుకు మౌలిక రంగ సంస్థ IL&FS సహాయం కోరింది రాష్ట్ర సర్కార్‌. ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంగా ఇదే విషయం చర్చకు వచ్చింది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో మౌలిక సదుపాయాల కల్పనలో సహకరించాలని ఆ సంస్థను కేసీఆర్‌ కోరారు.

ఐఎల్ అండ్ ఎఫ్ ఎస్ సంస్థకు మంచి అనుభవం...

హైవేరోడ్లు.. ఫైఓవర్లు.. స్కైవేస్‌ నిర్మాణంలో ఐఎల్ అండ్ ఎఫ్ ఎస్ సంస్థకు మంచి అనుభవం ఉంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌ అభివృద్ధిలో ఆ సంస్థ సహకారాన్ని సర్కార్‌ కోరుతోంది. రాజధానిలో రోడ్లు..డ్రైనేజీ వ్యవస్థ..మూసీ నది ప్రక్షాళనలో తోడ్పాటు అందించాలని ఐఎల్ అండ్ ఎఫ్ ఎస్ ను కేసీఆర్‌ కోరడంతో..అందుకు ఆ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది.

వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్కు నిర్మాణంలో సహకారం కోరిన కేసీఆర్‌.....

దేశంలో అతిపెద్ద టెక్స్‌టైల్‌ పార్కును వరంగల్‌లో ఏర్పాటుచేస్తున్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి కంపెనీ దృష్టికి తీసుకెళ్లారు. పార్కు నిర్మాణంలో పాలు పంచుకోవాలన్న కేసీఆర్‌ సూచనకు ఆ సంస్థ సానుకూలంగా స్పందించింది జనవరిలో మరోసారి సమావేశమయ్యి.. సీఎం ప్రతిపాదనలపై విధి విధానాలను ఖరారు చేయాలనే నిర్ణయానికి ఆ సంస్థ ప్రతినిధులు వచ్చినట్లు తెలుస్తోంది. 

17:28 - December 15, 2015

సాధారణంగా కొంతమందిలో రక్తపోటును చూస్తుంటాం. శరీరంలోని రక్త నాళాలలో ఉండే రక్తం వాటి గోడలపై చూపించే వత్తిడిని రక్తపోటు లేదా బ్లడ్‌ ప్రెషర్‌ (బీపీ) అంటారు. బ్లడ్‌ ప్రెషర్‌ వచ్చాక నయం కావడమన్నది ఉండదు. అయితే జీవనవిధానంలో కొద్దిపాటి మార్పులు చేసుకోవడం ద్వారా బీపీ రాకుండా జాగ్రత్తపడొచ్చు. చిన్న చిన్న మార్పుల ద్వారా బీపీని అదుపులో ఉంచుకోవచ్చు.

- ఆహారంలో ఉప్పు వాడకం తగ్గించాలి. రోజుకు 5 గ్రాములకంటే మించి ఉప్పు వాడకూడదు.

- ఫాస్ట్‌ పుడ్స్‌ తినడం బాగా తగ్గించాలి. ఎందుకంటే వీటిలో ఉప్పు అధికంగా ఉంటుంది. సోడియం క్లోరైడ్‌ బిపిని పెంచేస్తుంది.

- కొవ్వు పదార్థాల వల్ల కొలెస్ట్రాల్‌ పెరిగి బీపీ పెరిగేందుకు కారణమవుతోంది.

- తక్కువగా నూనె పదార్థాలు తీసుకోవాలి. నూనెలు ద్రవరూపంలో ఉన్న కొవ్వులు. వీటి వాడకం తగ్గించడం ఎంతో అవసరం.

- పచ్చళ్ళు తగ్గించాలి. వాటిలో నూనెలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బీపీ ఉన్నవారు వీటి జోలికి వెళ్లవద్దు.

- ఎక్కువ పీచు పదార్ధం ఉండే ఆహారం తీసుకోవాలి.

- పండ్లు, కాయగూరలు, ఆకు కూరలు, పప్పులు తినాలి.

- ఆల్కహాల్‌ తీసుకునే అలవాటు ఉంటే వెంటనే మానివేయాలి. ఇందులో ఉండే ఎక్కువ కేలరీలు శరీరంలో కొవ్వును పెంచుతాయి.

- పొగ త్రాగడం మానేయాలి. సిగరెట్లలోని నికొటిన్‌ రక్తనాళాల పై ప్రభావం చూపిస్తుంది. రక్తనాళాలు కుంచించుకుపోతాయి.

- బీన్స్‌, బఠాణీలు, నట్స్‌ , పాలకూర , జ్యాబేజీ , కొత్తిమిర , అరటి , బొప్పాయి, ద్రాక్ష , కమలా , నారింజ , నిమ్మ వంటి పండ్లలలో పొటాషియం లభిస్తుంది. తక్కువ సోడియం, ఎక్కువ పొటాషియం గల పండ్లు రక్తపోటు తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి.

- కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకోవాలి. ఇందులో రక్తపోటును నివారించే పొటాషియం ఎక్కువగా ఉంటుంది.

 

17:27 - December 15, 2015

హైదరాబాద్ : ఎన్ని కష్టనష్టాలు వచ్చినా రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని టి జేఏసీ చైర్మన్‌ కోదండరాం అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ...రైతులు మనోధైర్యంతో ముందుకెళ్లాలని ఆయన సూచించారు. అలాగే రైతు ఆత్మహత్యల పరిహారంపై ప్రభుత్వం అనేక కొర్రీలు పెట్టడం సమంజసం కాదన్నారు. రైతు ఆత్మహత్య చేసుకున్న తర్వాత వారికి నష్ట పరిహారం ఇచ్చే విషయంలో ప్రభుత్వం అనేక నిబంధనలు పెట్టిందని వాటిని సరళీకరించాల్సిన అవసరం ఉందన్నారు. నిర్థిష్ట వ్యవధిలోపల విచారణ పూర్తిచేసి..ఆత్మహత్య చేసుకున్న రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోదండరామ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

17:26 - December 15, 2015

హైదరాబాద్ : ఆర్ధిక కష్టాలు మీద పడుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం పొదుపు చర్యలు చేపట్టింది. మంత్రులు, అధికారులు ఎవరూ విదేశీ పర్యటనలకు వెళ్లొద్దని ఆంక్షలు విధించింది. ఎవరికీ విదేశీ టూర్లకు అనుమతులు ఇవ్వొద్దంటూ ఆర్ధికశాఖకు సీఎంఓ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాయి.

17:24 - December 15, 2015

హైదరాబాద్ : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఓ ప్రయాణీకుడి లగేజిలో ఎనిమిది బుల్లెట్లు దొరికాయి. హైదరాబాద్‌ నుంచి వైజాగ్‌కు వెళుతున్న ప్యాసింజర్‌ లగేజిని సెక్యూరిటీ సిబ్బంది చెక్‌ చేస్తుండగా.. ఎనిమిది బుల్లెట్లు కనపడ్డాయి. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఆ బ్యాగ్‌ తన బంధువుదని చెప్పడంతో.. అతడిని కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇద్దరు నిందితులను పోలీసులు విచారిస్తున్నారు.

17:21 - December 15, 2015

ప్రశ్న: బ్లడ్‌ క్యాన్సర్‌ వచ్చిన వారు ఆరు నెలలకోసారి రక్తమార్పిడి చేసుకుంటున్నట్లు హెచ్‌ఐవి సోకినవారు కూడా రక్తమార్పిడి ద్వారా ఎక్కువ కాలం జీవించవచ్చా?నిఖిల్‌రెడ్డి, 9వ తరగతి, ఎపిఆర్‌ పాఠశాల వేలేరు,
మడికొండ మండలం, వరంగల్‌
జవాబు: రక్త క్యాన్సర్‌ అంటే సాధారణంగా రక్తంలో కేంద్రకం (nulear) తో కూడిన తెల్లరక్తకణాలు అవిచ్ఛిన్నంగా, అవాంఛనీయంగా, అనేకంగా, అని యాంత్రికంగా, అనవసరంగా, అనుపయోగకంగా పెరగడం. మన శరీరాలన్నీ రోగాల బారి నుంచి, అంటువ్యాధుల నుంచి రక్షించే రక్షణ వ్యవస్థ (immunefylte) తో తెల్లరక్తకణాలు సైన్యం లాంటివి. వాటి అవసరం ఉంది. కానీ సైన్యం సంఖ్య అవసరాన్ని మించి ఉంటే అవసరానికున్న వారి అవసరాలను అడ్డుకుంటారు. సగటు తిండి తగ్గిపోతుంది. ఇక అనవసరంగా ఉన్న ఆ రకపు సైనికులు యుద్ధం చేయడం చేతకాకపోయినా, కుంటిగ్రుడ్డి వారైనా ప్రయోజనం ఉండదు కదా! అలాగే ఇలా అదనంగా, అనవసరంగా ఉత్పత్తి అయిన తెల్లరక్తకణాలు రక్షణ వ్యవస్థకు సహకరించే సామర్థ్యంలో ఉండవు. సోమరిపోతుల్లా ఉంటాయి. పైగా వికారంగా (Unshaped), క్రియాశూన్యంగా ఉంటాయి. అంతేకాదు 'తాచెడ్డ కోతి వనమెల్లా చెరిచినట్ల' తమ దుర్లక్షణాలను మంచి కణాలకు సంక్రమింపజేస్తాయి. రక్తంలో ఆక్సిజన్‌ రవాణాల్లో పాల్గొనే ఎర్రరక్తకణాలు, రక్షణకు ఉపయోగపడే తెల్లరక్తకణాలుగా మారినప్పుడు రక్తం అనవసరంగా వృథా కాకుండా రక్తాన్ని గడ్డకట్టించేందుకు సహకరించే ప్లేట్‌లెట్లు తదితర మిశ్రమ ధాతువులు ఎన్ని ఉంటాయి. ఇలాంటి రక్తం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఒకే ద్రవం కాదు. పదేపదే పునరుత్పత్తి అవుతుంటుంది. ఈ విధమైన రక్త పునరుత్పత్తి ఎముకల నుజ్జు (bone marrow) తో జరుగుతుంది. క్యాన్సర్‌ బారిన పడ్డ పనికిమాలిన తెల్లరక్తకణాలు ఈ నుజ్జు కార్యకలాపాల్నీ కూడా పక్కదారి పట్టిస్తాయి. రక్తం ఉత్పత్తిలో కలగజేసుకుంటాయి. తద్వారా రక్తం ఉత్పత్తి తగ్గిపోతుంది. రక్తహీనత (anaemia) సంభవిస్తుంది. కాబట్టి ఇలాంటి వృథా తెల్లరక్తకణాల్ని రక్తం నుంచి తరిమేయడానికి రక్తమార్పిడి సహకరిస్తుంది. ఒక వైపున బయటికి (exit) మరోవైపున లోపలికి (entry) వెళ్లేలా రక్తాన్ని బయటి నుంచి శరీరంలోకి పంపించడం వల్ల శరీరంలో ఉన్నా మలిన గ్రస్త, నిరుపయోగ తెల్లరక్తకణాలమయమైన క్యాన్సర్‌ సహిత రక్తం బయటికి తోడేయబడుతుంది. అదే స్థానంలో ఆరోగ్యకరమైన రక్తం కూడా లోపల దొంగచాటుగా దాగి ఉన్నా క్యాన్సర్‌ కణాల బారిన చేరిపోయిన తర్వాత తిరిగి మరలా రక్తమార్పిడి జరుపుకుంటుంది. ఇలా పదే పదే సమయానుకూలంగా రక్తమార్పిడి ద్వారా బ్లడ్‌ క్యాన్సర్‌ వ్యాధి గ్రస్తుల జీవితకాలాన్ని కొంత మేరకైనా పొడిగించగలుగుతున్నారు. ఇది ఆధునిక ఆరోగ్య విధానం. ఇలాంటి విధానాలు హోమియోపతి, ఆయుర్వేద పద్ధతుల్లో ఉండవు. అది వేరే విషయం.

ఇక హెచ్‌ఐవి విషయానికొద్దాం. హెచ్‌ఐవి అంటే (human immuno deficiency virus) అనే పొడుగాటి సమాసానికి పొట్టిపేరు. ఈ వైరస్‌లలో ఎన్నో రకాలున్నట్లు తెలిసింది. ప్రధానంగా హెచ్‌ఐవి వైరస్‌లు మనకు ఎయిడ్స్ (acquired immunity deficiency syndrome) వ్యాధిని నిల్వజేస్తాయి. ఈ వ్యాధి అంటువ్యాధి. ప్రధానంగా లాలజల సంపర్క (శృంగార కార్యకలాపాల్లో జరిపే ముద్దులు), పాలద్వారా (పసిపిల్లలు ఎయిడ్స్ రోగిష్టి పాలు తాగడం), రక్తమార్పిడి (పొరపాటున ఎయిడ్స్ వ్యాధి ఏమీ లేని రక్త గ్రహీతకు ఇవ్వడం), ఎయిడ్స్ రోగిష్టి పురుషుడి శుక్రం ఆరోగ్యకర స్త్రీ యోనిలోకి వెళ్లినప్పుడు మామూలు ఆరోగ్యకర పురుషుడి మేహనం ఎయిడ్స్ రోగిష్టి స్త్రీ యోని లోకి వెళ్లినప్పుడు యోని ద్రవాల సంపర్కం జరిగినప్పుడు ఎయిడ్స్ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటుంది. అందువల్లనే ఆరోగ్యకర శృంగారాన్ని ప్రభుత్వం, ఆరోగ్య సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. విశృంఖులత్వాన్ని వివాహేతర సంబంధాల్ని ప్రోత్సహించని సంసారిక, సంస్కారిక, జీవితాన్ని ప్రజలు అలవర్చుకునేలా సామాజిక నీతి నియమాలు అమలు కావాలి. ఎయిడ్స్ వ్యాధి ఉన్న వారిని తాకడం వల్లగానీ, కరచాలనం చేయడం ద్వారా గానీ, కలిసి కూచోవడం ద్వారా గానీ ఎయిడ్స్ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి అంటుకోదు. శృంగార ప్రక్రియలో పాల్గొనే ఇద్దరిలో ఒకరికి ఎయిడ్స్ ఉన్నట్లయితే పూర్తిగా శృంగార జీవితానికి దూరం కానవసరం లేదు. సురక్షితమైన కాండోమ్‌లను డాక్టరు సలహా ప్రకారం వాడడం ద్వారా పాల్గొనవచ్చు. ఎయిడ్స్ వ్యాధి గ్రస్థుణ్ని వివక్షతతో ఏమాత్రం చూడకూడదు. ఎయిడ్స్ వ్యాధి కేవలం దుర్య్వసనం ద్వారా మాత్రమే లేదా వ్యభిచారం ద్వారా మాత్రమే లేదా వ్యాధిగ్రస్తులైన సెక్స్‌ వర్కర్స్‌ ద్వారా మాత్రమే సంక్రమించదు. అవన్నీ ఎయిడ్స్ రావడానికి కొన్ని మార్గాలు మాత్రమే! అనుకోకుండా రక్తమార్పిడిలోనూ, అవయవమార్పిడిలోనూ అమాయకంగా ఎయిడ్స్ బారిన పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అంతేకాదు తల్లిదండ్రులు ఒకరికో ఇద్దరికో ఎయిడ్స్ వ్యాధి వుండడం వల్ల కూడా పిల్లలకు సంక్రమించి ఉండవచ్చును. అది వారి తప్పుకాదు. కాబట్టి ఎయిడ్స్ వ్యాధి గ్రస్థుల్ని మానవీయదృక్కోణంలో చూడాలి. వారిని వివక్షతకు గురిచేస్తే వారిలో ఉన్న అంతంత మాత్రం రక్షణ వ్యవస్థ మానసిక కుంగుబాటుతో మరింత తగ్గిపోయి మరీ తొందరగా మృత్యువు బారినపడే అవకాశం ఉంది. ఎయిడ్స్ వ్యాధికి కారణమైన హెచ్ ఐవి వైరస్‌ పరాయి జీవి (నిర్జీవి). క్యాన్సర్‌ బారిన కణాలు క్యాన్సర్‌ వ్యాధి గ్రస్తుడివే.

అవి పరాయి కణాలు కావు. కానీ వైరస్‌లు బాహ్యమైనవి. బయటి నుంచి సంక్రమించిన అవాంఛనీయ పూరిత కణాలు. ఇవి రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైన జణ-4 అనే తెల్లరక్తకణాల మీద దాడి చేస్తాయి. ఆ తెల్ల రక్తకణాల్లో ఉండే క్రోమో దాడుల్ని చిన్నాభిన్నం చేసి తమ లాంటి వైరస్‌ల్ని సృష్టించే జిరాక్స్ మెషిన్‌లాగా జణ-4 కణాల్ని దారి మళ్లిస్తాయి. మన స్వంత కణాలే మనల్ని మరణానికి సరికొత్తే హైఐవి వైరస్‌ ల ఉత్పత్తికి కర్మాగారాలవుతాయి. అంతేకాదు రక్షణ వ్యవస్థలోని మిగిలిన పద్దతుల్ని ఈ హైఐవి వైరస్‌లు కార్యవీహినం చేస్తాయి. విషపదార్థాల్ని గుర్తించి రక్షణను ప్రేరేపించే త్యాగశీల ఆత్మాహుతి రక్షణ కణాల్ని కూడా కార్యశూనుల్ని చేస్తాయి. హైఐవి వైరస్‌ శరీరం బయట ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్నట్టుగా బెల్లం కొట్టిన రాయిలాగా ఉన్నా, శరీరంలోకి ఒకసారి వెళ్లిందంటే దానికున్న విశృంఖుల చైతన్యం మన స్వంత కణాలకు కూడా ఉండదు. కొన్ని కోట్ల హైఐవి వైరస్‌లను మన స్వంత కణాల ద్వారా తయారు చేయించుకుంటుంది. ఫలితంగా తెల్లరక్తకణాల సంఖ్య తగ్గిపోయి రక్షణ వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. చిన్న గాయం తగిలినా, జలుబు చేసినా దోమ కుట్టి మలేరియా సోకినా , విరేచనాలు కలిగినా, పొట్టలో అల్సర్లు వచ్చినా ఓ పట్టాన మానవు. మనిషికి ఎన్నో రోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటికన్నింటికీ ఎయిడ్స్ వ్యాధి గ్రస్తుడు బలిపశువుతాడు.

ఇంతటి బయమైన అవాంఛనీయమైన చైతన్యం ఉన్న హైఐవి వైరస్‌ రక్తంలో ఉన్న వ్యక్తికి మంచి రక్తాన్ని ఒక వేళ రక్తమార్పిడి ద్వారా చేసినాగానీ అక్కడక్కడ మాటున దాగి వున్న హైఐవి వైరస్‌లు వెనువెంటనే ఎక్కించిన మంచి రక్తంలోని కణాల్ని దెబ్బతీస్తాయి. తిరిగి అతి తొందరగానే పరిస్థితి దుర్భరంగా పునరావృతం అవుతుంది. కాబట్టి రక్తమార్పిడి చేసినా ఫలితం ఉండదు. ఎయిడ్స్ వ్యాధి లక్షణాల్ని తొలిదశలోనే గురించినట్లయితే అది అవిచ్ఛిన్నంగా వ్యాప్తిచెందకుండా చేసేందుకు ఖరీదైన మందులు ఉన్నాయి. కానీ పూర్తిగా హైఐవి వైరస్‌ను నిర్మూలించే చికిత్స ఇంకా రాలేదు. కాబట్టి ఆరోగ్య కరమైన రోగి విధానంలో ఆరోగ్యకర అలవాట్లతో హెఐవి వ్యాధి గ్రస్తుడి ఆముదాయాన్ని గణనీయంగా పొడిగించగలము. ఇదే ప్రస్తుతమున్న అసలు కిటుకు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య

సంపాదకులు, చెకుముకి,

జన విజ్ఞాన వేదిక

 

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

ముంబై: స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతోముగిశాయి. సెన్సెక్స్ 170 పాయింట్లు లాభపడి 25,320 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 పాయింట్లు లాభపడి 7,700 వద్ద ముగిసింది.

బర్థన్ ను పరామర్శించిన సోనియా

హైదరాబాద్ : అనారోగ్యంతో బాధపడుతున్న సీపీఐ నేత ఏబీ బర్థన్ ను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పరామర్శించారు. అక్కడ ఉన్న సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజాను అడిగి బర్థన్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

విశాఖలో కాల్ మనీ కేసు

విశాఖ : నగరంలోని అరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్‌మనీ దందాపై కేసు నమోదైంది. రామకృష్ణ అనే ఫైనాన్షియర్ వేధింపులు వెలుగు చూడడంతో మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఇతడిపై లోగడ నగరంలోని నాల్గవ టౌన్‌లో కూడా ఓ కేసు నమోదైనట్లు తెలుస్తోంది.

కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాల్సిందే: రవిశంకర్ ప్రసాద్

ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అరవింద్ కేజ్రీవాల్ తక్షణమే క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని పిరికిపంద, సైకో అంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా సీఎంవో కార్యాలయంపై సీబీఐ దాడుల ఘటనకు సంబంధించి రవిశంకర్ ప్రసాద్ మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. సీబీఐ దాడులకు ముఖ్యమంత్రి అనుమతి అవసరం లేదన్నారు. అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తిని కేజ్రీవాల్ సమర్థించడం సరికాదన్నారు. అవినీతి ఆరోపణలు ఉంటేనే సీబీఐ దాడులు చేస్తుందని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్ల కలకలం

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఓ వ్యక్తి వద్ద బుల్లెట్లు లభించటం కలకలం రేపింది. మంగళవారం మధ్యాహ్నం విశాఖపట్టణం వెళ్లేందుకు విమానాశ్రయానికి వెళ్లిన జయరాం అనే వ్యాపారవేత్తను భద్రతా సిబ్బంది సోదాలు చేయగా అతని వద్ద నాలుగు బుల్లెట్లు లభించాయి. వాటితోపాటు వాడేసిన బుల్లెట్లు కూడా నాలుగు దొరికాయి. దీనిపై సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

17:00 - December 15, 2015

హైదరాబాద్ : మనదేశంలో మందుల పరిశ్రమకు ఉజ్వల భవిష్యత్ వుంది. రాబోయే ఐదేళ్ల కాలంలో ఏటా 20 శాతం వ్రుద్ధి రేటు నమోదు చేయడం ఖాయం. ఇది మార్కెట్ నిపుణులు తరచూ వ్యక్తం చేస్తున్న విశ్వాసం. ఇందులో అతిశయోక్తి లేదు. గత ఆరేడేళ్లుగా మన ఫార్మా రంగం ఉరుకులు పరుగులు పెడుతోంది. ప్రపంచ మార్కెట్ లో తన ముద్ర వేస్తోంది. ప్రపంచ మార్కెట్ పరిమాణంలో మూడో స్థానాన్ని మన ఔషధ పరిశ్రమ ఆక్రమించింది. 20 బిలియన్ డాలర్ల మైలురాయిని గత సంవత్సరమే దాటేసిన భారతీయ ఫార్మా రంగం రాబోయే పదేళ్లలో వంద బిలియన్ డాలర్ల క్లబ్ లో చేరుతుందన్న అంచనాలున్నాయి.

ఇక కారు చౌకగా లభించే జనరిక్ మందుల ఉత్పత్తిలో మనది టాప్ గేర్. మనదేశ ఉత్పత్తుల్లో 70 నుంచి 80శాతం జనరిక్ మందులే వుండడం విశేషం. ప్రపంచం మొత్తం మీద జనరిక్ మందుల ఎగుమతుల్లో 20శాతం వాటా మనదే. ఇలాంటి లెక్కలన్నీ చూసిన్నప్పుడు సహజంగానే మనకు సంతోషం కలుగుతుంది.

మన ఔషధరంగాన్ని భయాలూ వెన్నాడుతున్నాయి...

ఎంత అభివ్రుద్ధి సాధించినా, భవిష్యత్ కు సంబంధించిన అంచనాలు ఎంత అమోఘంగా వున్నా, మన ఔషధరంగాన్ని భయాలూ వెన్నాడుతున్నాయి. 40 ఏళ్ల క్రితం నాటి చరిత్ర పునరావ్రుతం అవుతుందేమో నన్న దిగులు నిద్రపోనివ్వడం లేదు. ఓ వైపు మన దేశంలో ప్రయివేట్ రంగంలో ఫార్మా కంపెనీలు విస్తరిస్తున్నా, ప్రభుత్వరంగంలో వాటి వ్రుద్ధి కుంటుపడింది. 1970ల నాటి స్పూర్తి కొరవడుతోంది. గత పది పదిహేనేళ్ల నుంచి వినాశనకర విధానాలు తెర మీదకొస్తున్నాయి. కారు చౌకగా పెన్సిలిన్ మందును అందించిన ప్రభుత్వరంగ పరిశ్రమకే మనుగడలేని దురావస్థ వచ్చింది. ప్రభుత్వరంగ పరిశ్రమలను ఎప్పటికప్పుడు ఆధునికరించకపోవడం, వాటి విస్తరణ మీద ద్రుష్టి పెట్టకపోవడం, రీ సెర్చ్ అండ్ డవలప్ మెంట్ కి అవసరమైన ప్రోత్సాహకాలు అందించకపోవడం లాంటి కారణాలు ప్రభుత్వరంగంలోని ఫార్మా కంపెనీలకు శాపాలుగా మారాయి. ఆర్థిక సమస్యలతో కునారిల్లుతున్న ప్రభుత్వరంగ కంపెనీల కు చేయూత నివ్వకపోగా, వాటి ఆస్తులను తెగనమ్ముకుని, సొమ్ము చేసుకునేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తుండడం ఆందోళనకర పరిణామం.

మందుల వ్యాపారం పూర్తిగా ప్రయివేట్ రంగం చేతిలోకి...

ఇప్పటికే జనం ప్రాణాలను నిలబెట్టే మందుల వ్యాపారం పూర్తిగా ప్రయివేట్ రంగం చేతిలోకి వెళ్లింది. మనదేశంలో 5వేలకు పైగా ఫార్మా కంపెనీలున్నప్పటికీ, 250 నుంచి 300 కంపెనీలే 70శాతం మార్కెట్ ను శాసిస్తున్నాయి.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెద్ద సవాలే ...

ఇప్పుడు మన ఫార్మా కంపెనీలకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెద్ద సవాలే విసురుతున్నాయి. ఫార్మా రంగంలోకి వంద శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించేందుకు ప్రభుత్వం సై అనడంతో భవిష్యత్ లో సామాన్యులు అత్యవసర మందులు కొనగలరా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ మాటకొస్తే అమెరికన్ ఫార్మా కంపెనీలు మన జనరిక్ మందుల ఉనికినే భరించలేకపోతున్నాయి. నిత్యం ఏదో ఒక కొర్రీలు పెట్టి, వాటి ఎగుమతులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు మన కంపెనీలను టేకోవర్ చేసి, దేశీయ మార్కెట్ మీద గుత్తాధిపత్యం సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అదే జరిగితే, ఇక మందుల ధరలకు అడ్డుఅదుపు వుండదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఈ దేశ ప్రజలకు కారుచౌకగా మందులివ్వాలన్న ఆకాంక్షలుగానీ, ఆశయాలుగానీ విదేశీ కంపెనీలకుండవు. పేషెంట్ల రక్తం తాగైనా లాభాలు జుర్రుకునేందుకే అవి మనదేశంలో ప్రవేశిస్తాయనడంలో సందేహం లేదు.

వైద్య ఖర్చుల ధాటికి తట్టుకోలేక ....

నిజానికి ఇప్పటికే మనదేశంలో వైద్య ఖర్చుల ధాటికి తట్టుకోలేక జనం అల్లాడిపోతున్నారు. వైద్య ఖర్చుల కారణంగా ఏటా 5 కోట్ల మంది పేదరికంలోని వెళ్తున్నారంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థే ఆక్రోషించింది. మనదేశంలో బీపీ, షుగర్ లాంటి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. వీటి కంట్రోల్ కి ప్రతిరోజూ మందులు వాడడం తప్పనిసరి. ఇలాంటి నిత్యావసర మందుల ధరల మరింత ప్రియం అవుతాయన్న ఆందోళనలున్నాయి. జనరిక్ మందుల దుకాణాల సంఖ్యా పెంచుతామంటూ ప్రభుత్వాలు చేస్తున్న వాగ్ధానాలు క్షత్రస్థాయిలో కనిపించడం లేదు. మరోవైపు ఔషధరంగంలోకి కూడా ఆన్ లైన్ బిజినెస్ ప్రవేశించింది. ఇది మన వీధుల్లోని రిటైల్ వ్యాపారాన్ని దారుణంగా దెబ్బతీస్తుందన్న ఆందోళనలున్నాయి. ఫార్మారంగంలో ఆన్ లైన్ అమ్మకాలు విజృంభిస్తే అది ఎలాంటి విపత్కర పరిస్థితులను స్రుష్టిస్తుందోనన్న భయాలు వెన్నాడుతున్నాయి. ఇక ఫార్మా కంపెనీలు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి ప్రధానంగా ఆధారపడేది మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ ల మీదనే. కంపెనీల మధ్య పోటీ పెరగడంతో మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ ల మీద అదే స్థాయిలో ఒత్తిడి పెరుగుతోంది. నిర్ణీత పనిగంటలు, వేళాపాళా లేకుండా ఎప్పుడంటే అప్పుడు డాక్టర్ల చుట్టూ, డిస్ట్రిబ్యూటర్ల చుట్టూ , బాస్ ల చుట్టూ పరుగులు తీయాల్సి వస్తోంది. అదే స్థాయిలో వేతనాలు పెరగడం లేదన్న అసంత్రుప్తి వీరిని వెన్నాడుతోంది. మొత్తానికి ఇవాళ భారతీయ ఔషధ రంగం అత్యంత కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రభుత్వరంగంలో ఔషధ పరిశ్రమను ఏనాడో ముంచేసిన మన ప్రభుత్వాల విధానాలు ఇప్పుడు స్వదేశంలోని చిన్న చిన్న ఫార్మా కంపెనీలకు కూడా ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. 

16:54 - December 15, 2015

హైదరాబాద్ : వివాహ బంధం విచ్చిన్నం అయిపోతోంది. రోజు రోజుకు విడాకుల సంఖ్య కూడా పెరిగి పోతోంది. జీవిత భాగస్వామికి క్యాన్సర్ కారణంగా విడాకులు తీసుకోవచ్చా? ఈ అంశంపై న్యాయస్థాం ఒక కేసులో ఓ తీర్పు వెలువరించింది. ఈ తీర్పునకు సంబంధించి చర్చను చేపట్టింది వేదిక. ఈ చర్చా కార్యక్రమంలో పీఓడబ్ల్యు నేత సంధ్య, జెఎల్ ఎన్ మూర్తి న్యాయవాది పాల్గొన్నారు. . వివాహాన్ని బాధ్యతతతో కూడిన బంధంగా గుర్తించాల్సిన అవసరం లేదా? మహిళా చట్టాలు పకడ్జందీగా అమలుపర్చాల్సిన బాధ్యత లేదా? వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

రాష్ట్రపతి, ప్రధానులతో భేటీ కానున్న సుందర్ పిచాయ్

హైదరాబాద్ : సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సుందర్ పిచాయ్ తొలిసారి ఇండియాకు రాబోతున్నారు. భారత పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీతో భేటీకానున్నారు.

16:30 - December 15, 2015

హైదరాబాద్ :దాదాపు మూడు లక్షల మంది మెడికల్ రిప్రజెంటేటీవ్ లు రేపు దేశవ్యాప్తంగా సమ్మె చేయబోతున్నారు. ఈ సమ్మెకు కారణం ఏమిటి? పరిశ్రమ యాజమాన్యాల ముందు, ప్రభుత్వం ముందు వీరు ఏయే డిమాండ్స్ పెడుతున్నారు? ప్రస్తుతం భారత ఫార్మా రంగం ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? సవాళ్లేమిటి? వంద శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించడం ఫార్మా రంగం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఇలాంటి అంశాలపై టెన్ టివి చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటీవ్స్ అసోసియేషన్ నేత నాగేశ్వరరావు పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

13:39 - December 15, 2015

ఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ అంశం రాజ్యసభ దద్ధరిల్లింది. బీజేపీ నియమించిన గవర్నర్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ సభ్యుడు గులాం నబీ ఆజాద్ తెలిపారు. గవర్నర్ పాలన బ్రిటీష్ పాలనకంటే దారుణంగా ఉందని ఆరోపించారు. స్పీకర్ ను తొలగించాలన్న నిర్ణయాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. ఆజాద్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అయ్యింది. దీనితో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ సభ్యులు వెల్ లోకి దూసుకొచ్చి ఆందోళన చేపట్టారు. దీనితో డిప్యూటి ఛైర్మన్ సభను వాయిదా వేశారు. 

13:34 - December 15, 2015

ఢిల్లీ : సీఎం కేజ్రీవాల్ ఆఫీసులో సీబీఐ దాడులు జరపడం పట్ల రాజ్యసభలో గందరగోళం చెలరేగింది. దీనిపై చర్చ చేపట్టాలని తృణముల్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మరోవైపు సీబీఐ దాడులపై కేంద్రం స్పందించింది. కేజ్రీవాల్ కార్యాలయంపై ఎలాంటి దాడులు చేయలేదని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ అధికారి కార్యాలయంలో దాడులు జరిగాయిన ఆర్థిక మంత్రి జైట్లీ స్పష్టం చేశారు. 

13:29 - December 15, 2015

విజయవాడ : కాల్ మనీ కేసులో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సోదరుడు నాగేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్ మనీ కేసులో అధికార పార్టీకి చెందిన నేతలు అధికంగా ఉన్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం ఉదయం కృష్ణా, గుంటూరు, కడప జిల్లాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. నాగేశ్వర రావు వద్ద కోట్లాది విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆయన భార్యను, ఒక కార్పొరేటర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుతో తన కుటుంబానికి సంబంధం లేదని ఎమ్మెల్సీ బుద్ధా పేర్కొన్న సంగతి తెలిసిందే. 

13:26 - December 15, 2015

విజయవాడ : కాల్ మనీ కేసు యూ టర్న్ తీసుకుంది. కాల్ మనీ వ్యవహారంలో దారుణ ఘటనలు బయటకు తెలుస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా సీపీ గౌతమ్ సవాంగ్ సెలవుల్లో వెళుతుండడం కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పది రోజుల వరకు ఆయన సెలవుల్లో ఉండనున్నారు. ఇన్ ఛార్జీగా సురేంద్ర బాబు వ్యవహరించనున్నారు. కాల్ మనీ వ్యవహారంలో వత్తిళ్లు రావడంతోనే సవాంగ్ సెలవులపై వెళుతున్నారనే పుకార్లు వినిపిస్తున్నాయి. దీనిని సీపీ కార్యాలయం ఖండించింది. కొద్ది రోజుల కిందట సెలవుల కోసం సవాంగ్ కోరడం జరిగిందని పేర్కొంది. కానీ కేసు ఒ కొలిక్కి రాకముందే..అధికార పార్టీకి చెందిన నేతలు పట్టుబడుతుండడం పరిణామాల నేపథ్యంలో సీపీ సెలవులపై వెళ్లడం తీవ్ర దుమారం రేగే సూచనలున్నాయి.
కాల్ మనీ..వ్యవహారంలో దారుణ ఘటనలు వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు నడుం బిగించారు. మంగళవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. కృష్ణా, గుంటూరు, కడప జిల్లాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. పాతబస్తీ, చిట్టినగర్ ప్రాంతంలో..గుంటూరులోని శారదా కాలనీ, పట్టాభిపురం, డొంకరోడ్డులో..కడప జిల్లాలోని రాయచోటి, ప్రొద్దుటూరులో వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అధికార పార్టీకి చెందిన నేత గుర్రం కొండను అదుపులోకి తీసుకున్నారు. ఉయ్యూరులో కాల్ మనీ వ్యాపారుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అనుచరుడు నాగరాజు, వంగవీటి చెంతన్ కుమార్ అనుచరుడు దాములులను పోలీసులు అరెస్టు చేశారు. వీరివద్ద నుండి కోట్లాది రూపాయల విలువ చేసే డాక్యుమెంట్లు..ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

విజయవాడ సీపీ సెలవు..

విజయవాడ : పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ సెలవులపై వెళుతున్నారు. ఇన్ ఛార్జీ సీపీగా సురేంద్ర బాబు వ్యవహరించనున్నారు. కాల్ మనీ వ్యవహారంపై వత్తిళ్లు రావడంతోనే సెలవులపై వెళుతున్నట్లు పుకార్లు వెల్లువెత్తుతున్నాయి.

 

12:40 - December 15, 2015

ముంబై : ఐపీఎల్ లో కొత్త జట్లు అయిన పుణే, రాజ్ కోట్ లు ఆటగాళ్లను ఎంచుకున్నాయి. ముంబైలో నిర్వమించిన వేలంలో పుణే జట్టుకు ధోని, అశ్విన్, రహానే, స్టీవెన్ స్మిత్ లు ఎంపికయ్యారు. రాజ్ కోట్ జట్టుకు సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, మెక్ కల్లమ్ లను ఎంచుకున్నారు. ఈ వేలంలో ధోని, రైనాలను ఇట్లు జట్లు అత్యధికంగా రూ.12.5 కోట్లకు కొనుగోలు చేశాయి. రహానే రూ.9.5 కోట్లు, అశ్విన్ రూ.7.5 కోట్లు, జడేజా రూ.9.5 కోట్లకు ప్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. వచ్చే రెండు ఐపీఎల్ సీజన్ల కోసం ఈ వేలం నిర్వహిస్తున్నారు.

మొత్తం పది మందే :
నేటి వేలంలో మొత్తం 51 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. వీరిలో కొత్తగా ఐపీఎల్‌లో చేరిన పుణే, రాజ్‌కోట్‌లు గరిష్టంగా ఐదుగురు ఆటగాళ్లను మాత్రమే తీసుకోవాల్సి వుంది. తొలి ఎంపికలో తీసుకున్న ఆటగాడికి రూ.12.5 కోట్లు దక్కనున్నాయి. తర్వాత అమ్ముడుపోయిన (డ్రాఫ్ట్‌లోని క్యాప్‌డ్‌ ఆటగాళ్లు) వరుసగా రూ.9.5, రూ. 7.5, రూ.5.5, రూ.4 కోట్లు దక్కించుకోనున్నారు. ఇరు జట్లలోని ఐదుగురు ఆటగాళ్లకు ఇది వర్తిస్తుంది. వేలం డ్రాఫ్ట్‌లోని ఈ ఐదుగురు ఆటగాళ్లను కాకుండా వేరే వారిని తీసు కుంటే వారికి రూ. 4 కోట్లు చెల్లించాల్సి వుంటుంది. వేలంలో పాల్గొనబోయే పుణే, రాజ్‌కోట్‌లు ఆటగాళ్లను కొనుక్కునేందుకు కనిష్టంగా రూ. 40 కోట్లు.. గరిష్టంగా రూ. 66 కోట్లు ఖర్చు చేయాలి.

వేలానికి అందుబాటులో ఉన్న ఆటగాళ్లు దేశీయ ఆటగాళ్లు..
ధోని, అశ్విన్‌, స్టువర్ట్‌ బిన్ని, జడేజా, కులకర్ణి, అభిషేన్‌ నాయర్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, రహానే, రైనా, సంజూ శాంసన్‌, మోహిత్‌ శర్మ, రాహుల్‌ శర్మ, బాబా అపరాజిత్‌, అంకుశ్‌ బెయిన్స్‌, రజత్‌ భాటియా, ఏక్‌లవ్య ద్వివేదీ, దీపక్‌ హుడా, విక్రమ్‌జిత్‌ మాలిక్‌, మిథున్‌ మన్హాస్‌, రోనిత్‌ మోరే, కరుణ్‌ నాయర్‌, పవన్‌ నేగీ, ఈశ్వర్‌ పాండే, ప్రదీప్‌ సాహు, దినేశ్‌ సాలంకే, బరీందర్‌ సింగ్‌ శరణ్‌, అంకిత్‌ శర్మ, ప్రత్యూష్‌ సింగ్‌, ప్రవీణ్‌ తంబే, రాహుల్‌ తెవటియా, సాగర్‌ త్రివేదీ, దినేశ్‌ యాగ్నిక్‌ లున్నారు. 

విదేశీ ఆటగాళ్లు..
కైల్‌ అబాట్‌, శామ్యూల్‌ బద్రీ, డ్వేన్‌ బ్రావో, బెన్‌ కట్టింగ్‌, డుప్లెసిస్‌, జేమ్స్‌ ఫాల్క్‌నర్‌, మాట్‌ హెన్రీ, మైకల్‌ హస్సీ, బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌, క్రిస్టోఫర్‌ మోరీస్‌, కానే రిచర్డ్‌సన్‌, డ్వేన్‌ స్మిత్‌, స్టీవెన్‌ స్మిత్‌, టిమ్‌ సౌథీ, జాన్‌ థీరన్‌, అండ్రూ టై, షేన్‌ వాట్సన్‌.

12:32 - December 15, 2015

హైదరాబాద్ : విజయవాడ రాష్ట్రంలో బయటపడిన కాల్ మనీ వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డబ్బు ఉందని వైసీపీ అధ్యక్షుడు జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన డబ్బే కాకుండా ఆ పార్టీకి చెందిన మంత్రులు..ఎంపీలు..ఎమ్మెల్సీల డబ్బు కూడా ఉందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై వైసీపీ అధ్యక్షుడు జగన్..గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నేతలతో రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిశారు. భేటీకి సంబంధించిన వివరాలను జగన్ మీడియాకు వివరించారు.

ప్రభుత్వ ద్వంద్వ వైఖరి..
బాక్సైట్ తవ్వకాలు..కాల్ మనీ వ్యవహారాన్ని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారని, ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలింబిస్తోందని జగన్ పేర్కొన్నారు. ఈ రెండు అంశాల్లో గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరడం జరిగిందన్నారు. గిరిజన ప్రాంతంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా ట్రైబల్ అడ్వయిజరీ కమిటీని వేయాలని చట్టంలో ఉందని తెలిపారు. ఇందులో గిరిజన ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉండాలని చట్టంలో పేర్కొనడం జరిగిందన్నారు. ఆరుగురు గిరిజన ప్రాంతానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యేలున్నారని, వీరు అడ్డుతగులుతారనే ఉద్ధేశ్యంతో బాబు కమిటీ వేయడం లేదని ఆరోపించారు. ఇటీవల నిర్వహించిన బహిరంగసభలో గిరిజన మహిళా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి చేసిన వ్యాఖ్యలను పెద్దదిగా చూపిస్తున్నారని, ఆమెపై కేసులు పెట్టారని పేర్కొన్నారు. తమను కూడా వేలు చూపిస్తూ అంతు చూస్తానని చంద్రబాబు పేర్కొనడం జరిగిందని, మరి అతనిపై కేసులు ఎందుకు పెట్టరని ప్రశ్నించారు. అంశంపై కూడా గవర్నర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.

ఎయిర్ పోర్టు వివాదం...
ఇటీవల ఎయిర్ పోర్టు అంశాన్ని కూడా వివాదాస్పదం చేశారని తెలిపారు. అక్కడి అథార్టీ ముందుగానే కౌంటర్ ను మూసివేయడం పట్ల 19 మంది ప్రయాణికులు ఫిర్యాదు చేయడం జరిగిందని, వీరికి అండగా నిలబడితే వేధించారని తెలిపారు. అనంతరం అథార్టీ మేనేజర్ పార్టీకి చెందిన ఎంపీకి క్షమాపణ చెప్పి 19 మందిని లోనికి పంపించారని, కానీ రాత్రికి రాత్రి ఎయిర్ పోర్టు అథార్టీ మేనేజర్ తో దొంగ కేసులు పెట్టించారని ఆరోపించారు. ఎంపీ దాడి చేస్తే సీసీ కెమెరాలు రికార్డు కాదా ? వాటిని బయట ఎందుకు చూపించడం లేదని సూటిగా ప్రశ్నించారు.

మాఫియా నగరాలుగా మార్చివేశారు..
విజయవాడ, గుంటూరు నగరాలను మాఫియా నగరాలుగా మార్చివేశారని, బాబు ప్రోత్సాహించి మాఫియాను ప్రోత్సాహిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే చింతమనేని వ్యవహారంలో ఒక్క కేసు లేదని, అంగన్ వాడీలను కూడా ఇష్టమొచ్చినట్లుగా దూషించాడని తెలిపారు. కనీసం ఈ వ్యవహారంలో చంద్రబాబు స్పందించలేదన్నారు. కల్తీ మద్యం సరఫరా జరుగుతున్నా ఒక్క కేసు ఉండదని, డ్వాకా రుణమాఫీ బాగుందని ఇటీవల నిర్వహించిన సర్వేలో పేర్కొన్నారని, అసలు డ్వాక్రా రుణమాఫీ జరగనే లేదని తెలిపారు. కాల్ మనీ వ్యవహారంపై త్వరలో ఆందోళన చేపట్టనున్నట్లు జగన్ ప్రకటించారు. 

ఐపీఎల్ -9 వేలం..

ఢిల్లీ : ఐపీఎల్ - 9 వేలం ముగిసింది. రూ. 66 వేల కోట్లు కేటాయించారు. పూణే జట్టు : ధోని రహానే, అశ్విన్, స్టీవెన్ స్మిత్, డుప్లెసిస్. రాజ్ కొట్ : రైనా, రవీంద్ర జడేజా, బ్రేవో, మెక్ కల్లమ్, జేమ్స్ ఫాల్కనర్ లున్నారు. 

కాకినాడ సెజ్ లో ఉద్రిక్తత..

కాకినాడ : సెజ్ లో అధికారులు వేసిన ఫెన్సింగ్ ను రైతులు తొలగిస్తున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి రైతులను అడ్డుకున్నారు. దీనితో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 

ఐపీఎల్ -9 వేలం ప్రారంభం..

ఢిల్లీ : ఐపీఎల్ - 9 వేలం ప్రారంభమైంది. ధోని, రహానే, అశ్విన్ లను పూణే కొనుగోలు చేసింది. రైనా, రవీంద్ర జడేజాలను రాజ్ కోట్ కొనుగోలు చేసింది. రూ.9.5 కోట్లతో జడేజాను రాజ్ కోట్ కొనుగోలు చేసింది.

 

గవర్నర్ ను కలిసిన జగన్..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను వైసీపీ అధ్యక్షుడు జగన్ కలిశారు. బాక్సైట్ తవ్వకాలు..విజయవాడలో కాల్ మనీ వ్యవహారంపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.

ఎనుమాముల మార్కెట్ ఎదుట హామాలీల ఆందోళన..

వరంగల్ : ఎనుమాముల మార్కెట్ ఎదుట హామాలీల ఆందోళన నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో హామాలీలు ఆందోళనకు దిగారు. 

నిజామాబాద్ మార్కెట్ యార్డులో దొంగల బీభత్సం..

నిజామాబాద్ : మార్కెట్ యార్డులో దొంగలు బీభత్సం సృష్టించారు. వరుసగా ఏడు దుకాణాల్లో చోరికి పాల్పడ్డారు. 

విజయవాడలో అల్లు అర్జున్..

విజయవాడ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విజయవాడకు వచ్చారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్న మస్తాన్ బీ పరామర్శించారు. తన అభిమాన నటుడు అల్లు అర్జున్ ను చూడాలని మస్తాన్ బీ చెప్పింది. అల్లు అర్జున్ ను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు. 

11:51 - December 15, 2015

హైదరాబాద్ : ప్రతిభా వంతులైన క్రికెటర్లను గుర్తించి భారత జట్టులో చోటు కల్పించడమే తన లక్ష్యమని బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుడు ఎమ్మెస్కే ప్రసాద్ పేర్కొన్నారు. తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా స్పోర్ట్స్ జర్నలిస్టుల సంఘం ప్రసాద్ ను సన్మానించింది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. తన ఎదుగుదలలో తొడ్పాటు అందించిన వారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. క్రికెటర్ గా తాను ఎంత నిజాయితీగా ఉన్నానో జాతీయ సెలక్టర్ గా అంతే నిజాయితీ..అంకిత భావంతో పనిచేస్తానన్నారు. 

11:29 - December 15, 2015

విశాఖపట్టణం : బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఐదు పేజీల లేఖను మావోయిస్టులు విడుదల చేశారు. పెద్దబయలు ఏరియా కమిటీ కన్వీనర్ మంగన్న పేరిట లేఖ విడుదలైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాక్సైట్ సంపదను దోచుకొనేందుకు చేస్తున్న కుట్రలను ఆదివాసీలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బాక్సైట్ అనుకూల వర్గాలపై దాడులు చేయాలని పిలుపునిచ్చారు. బాక్సైట్ తవ్వకాలు చేపడితే గిరిజన ప్రాంతం భూస్థాపితం అవుతుందని, దీనిని వ్యతిరేకించాలని లేఖలో పేర్కొన్నారు. 

11:29 - December 15, 2015

శ్రీమంతుడు సినిమా తర్వాత ప్రిన్స్ మహేహ్ బాబు తన కెరీర్ ను పక్కాగా ప్లాన్ చేస్తున్నాడు. క్రేజీ కాంబినేషన్లతో సినిమా ప్రారంభానికి ముందే హైప్ క్రియేట్ చేస్తూ.. తన రేంజ్ పెంచుకుంటున్నాడు. త్వరలో పూరీ జగన్నాధ్ తో చేయబోయే సినిమాపై కూడా అప్పుడే ప్రచారం మొదలైంది. ఈ సినిమా గురించి వినిపిస్తున్న ఓ వార్త నిజమో కాదో ఇంత వరకూ క్లారిటీ లేదు. కానీ టావీవుడ్ లోనే కాదు. ఇండియా వైడ్ గా ఈ గాసిప్ క్యూరియాసిటీ పెంచేస్తోంది.

మహేష్ తో పోకిరి, బిజినెస్ లాంటి ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన పూరీ.. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నాడు. త్వరలో మల్టీ స్టారర్ గా ఓ మూవీకి ప్లాన్ చేస్తున్నాడు. అందులో ఇంటర్నేషనల్ స్టార్ జాకీచాన్ ను ఓ కీలక రోల్ కు ఫైనల్ చేసే ప్రయత్నాల్లో పూరీ సీరియస్ గా వర్కవుట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

భారీ ఖర్చుతో ఇంటర్నేషనల్ లెవల్ లో ఈ సినిమా రూపొందనున్నట్లు పూరీ ఇంతకముందే చెప్పాడు. అందుకు తగ్గట్టే జాకీచాన్ ను మూవీలోకి తీసుకుంటే హైప్ మరింత పెరుగుతుందని పూరీ నమ్ముతుతున్నాడట. స్క్రిప్ట్ పై కూడా ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న పూరీ... ఎలాగైనా జాకీచాన్ ను టాలీవుడ్ రప్పించే ప్రయత్నాల్లో ఉన్నాడట.

బాలీవుడ్ స్టార్ సోనూ సూద్ కు టాలీవుడ్ లో సూపర్ సినిమాతో మంచి బ్రేక్ ఇచ్చాడు పూరీ. ఇప్పటికీ సోనూసూద్ తో పూరీకి మంచి రిలేషన్స్ ఉన్నాయి. రీసెంట్ గా సోనూ బాలీవుడ్ ప్రాజెక్టులో జాకీచాన్ నటిస్తున్నాడు. అదే పరిచయంతో మహేష్ సినిమాలో జాకీని తీసుకుందామని పూరీ ప్లాన్ చేస్తున్నాడని టాక్. ఈ ప్లాన్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో.. చూడాలి మరి...

 

11:17 - December 15, 2015

ఢిల్లీ : సీబీఐ దాడులు రాష్ట్రంలో కలకలం సృష్టించాయి. తన కార్యాలయంపై సీబీఐ దాడి చేస్తోందని, ఆఫీసును సీజ్ చేశారని సీఎం కేజ్రీవాల్ స్వయంగా ట్విట్టర్ లో ట్వీట్ చేయడం సంచలనం సృష్టించింది. తాము సీఎం కార్యాలయంలో ఎలాంటి దాడులు చేయలేదని, సీజ్ చేయలేదని సీబీఐ పేర్కొంది. కేవలం చీఫ్ సెక్రటరీ రాజేంద్రకుమార్ కార్యాలయం సోదాలు నిర్వహించడం జరిగిందని, అలాగే అతని ఇంట్లోను కూడా తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపింది. రాజేంద్రకుమార్ అధికార దుర్వినియోగానికి పాల్పడి పలు కంపెనీల నుండి లబ్ధి పొందినట్లు ఆరోపణలున్నాయని సీబీఐ పేర్కొంది. అవినీతి ఆరోపణలపై సీఎం ప్రిన్స్ పాల్ ను డిసెంబర్ 10 సీబీఐ అరెస్టు చేసింది.

మోడీ ఫైర్..
సీబీఐ దాడులు చేయడం పట్ల సీఎం కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎంవో చేతిలో సీబీఐ కీలుబొమ్మగా మారిందని, రాజకీయంగా ఎదుర్కోలేక సీబీఐని ఉసిగొల్పిందన్నారు. ప్రధాని మోడీది పిరికిపంద చర్య అని అభివర్ణించారు.

కేంద్రానికి ఏం సంబంధం - వెంకయ్య నాయుడు..
ఢిల్లీ సచివాలయంలో సీబీఐ దాడులపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. కేంద్రంతో కయ్యాలు ఆయనకు అలవాటై పోయిందని, సీబీఐ ఓ స్వతంత్ర సంస్థ అని తెలిపారు. దాని అజమాయిషీ ప్రభుత్వ కనుసన్నల్లో ఉండదన్న విషయం కూడా కేజ్రీవాల్ కు తెలియకపోవడం దురదృష్టకరమన్నారు. 

11:11 - December 15, 2015

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు శుభవార్త. చిరు 150వ సినిమా ఎప్పుడనేది ఇండస్ట్రీలో మిలియన్ డాలర్ క్వశ్చన్. ఎట్టకేలకు ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది. బెంగళూరు సాక్షిగా 150వ సినిమాకి సంబంధించిన వార్తను రామ్‌చరణ్ అధికారికంగా ప్రకటించారు. ఆదివారం రాత్రి పొద్దుపోయిన తరువాత జరిగిన ఓ అవార్డు వేడుకలో తన తండ్రి చేయనున్న చిత్రం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు చరణ్. తమిళ చిత్రం ‘కత్తి’ రీమేక్‌లో తన తండ్రి నటిస్తారనీ, వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తారనీ చరణ్ పేర్కొన్నారు. సంక్రాంతికి పూర్తి వివరాలు ప్రకటిస్తామని చెప్పారు.
బ్రూస్ లీ సినిమాలో చిరు స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చినా ఆశించన ఫలితం రాకపోవడంతో నిరాశగా ఉన్న ప్రేక్షకులకు ఈ సినిమాతోనైనా ఊరట లభిస్తుందేమో చూడాలి. అయితే గతం నుంచి చిరు 150వ సినిమా రిమేక్ చేయడం పై పలువురు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కానీ మెగా ఫ్యామిలీ మాత్రం కొత్త స్టోరీకి వెళ్లి చేతులు కాల్చుకోకుండా హిట్ సినిమాగా ఉన్న 'కత్తి'ని రిమేక్ చేయడానికే ఆసక్తి చూపిస్తున్నారు. 
అయితే ముందుగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో మూవీ రానుందని అనేక వార్తలు వచ్చాయి. దీని గురించి పూరి కూడా మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత శ్రీనువైట్ల డైరెక్షన్ లో చిరు 150వ సినిమా అనే వార్తలు వినిపించినా అవి పెద్దగా ప్రాధాన్యతలోకి రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా 'కత్తి'ని రీమేక్ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. 'చరణ్' స్టేట్మెంట్ దీనికి మరింత బలం చేకూర్చింది. కాగా ఎన్నో రోజులుగా మెగాస్టార్ 150వ సినిమా గురించి అనేక పుకార్లు శికార్లు చేస్తున్న తరుణంలో ఈ వార్త కూడా 'గాసిప్' కాకుంటే బావున్ను అని టాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి. 

11:08 - December 15, 2015

హీరోగా సూపర్ సక్సెస్ సాధించి విలన్ గా మారుతున్నవాళ్ల లిస్ట్ లో మరో హీరో చేరిపోయాడు. ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న యాంగ్రీ హీరో రాజశేఖర్.. ఇటీవల ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. 'ఎవడైతే నాకేంటి' సినిమా తరువాత ఒక్క హిట్ కూడా సాధించలేకపోయిన రాజశేఖర్.. ఇప్పుడు జగపతిబాబు బాటలోనే విలన్ గా టర్స్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు.
'వందకు వంద' లో విలన్ గా రాజశేఖర్
రాజశేఖర్ కూతురు శివాని 'వందకు వంద' పేరుతో తెరకెక్కుతున్న సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. అయితే ఈ సినిమాతోనే తను కూడా విలన్ గా మారాలని ప్లాన్ చేసుకుంటున్నాడు రాజశేఖర్. ఇటీవల రవితేజ హీరోగా తెరకెక్కుతున్న 'ఎవడో ఒకడు' సినిమాలో నెగెటివ్ పాత్ర చేయాలంటూ దిల్ రాజు అడిగినా.. కాదన్న రాజశేఖర్.. తన కూతురి సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇస్తే ఇద్దరికీ ప్లస్ అవుతుందని భావిస్తున్నాడట. మరి రాజశేఖర్ కూడా జగపతిబాబు తరహాలో ప్రతినాయక పాత్రలో కూడా సక్సెస్ అవుతాడేమో చూడాలి.

 

వరద బాధితులకు బీజేపీ ఎంపీల విరాళం..

ఢిల్లీ : చెన్నై వరద బాధితులకు బీజేపీ ఎంపీలు ఒక్కొక్కరు రూ.10వేల చొప్పున విరాళం ఇస్తారని ఆ పార్టీకి చెందిన నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ పేర్కొన్నారు. 

వరద బాధితులకు ఎఐఎడిఎంకే విరాళం..

చెన్నై : ఇటీవల వచ్చిన వరద బాధితులను ఆదుకొనేందుకు ఎఐఎడిఎంకె ఎమ్మెల్యేలు ముందుకొచ్చారు. తమ నెల జీతాన్ని బాధితులకు విరాళంగా ఇస్తున్నట్లు ఎమ్మెల్యేలు ప్రకటించారు. 

మధ్యప్రదేశ్ లో రోడ్డు ప్రమాదం..15 మంది మృతి..

మధ్యప్రదేశ్ : హోషంగాబాద్ ప్రాంతంలో ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది దుర్మరణం చెందారు. 

ఆదేశాల మేరకే దాడులు - సీబీఐ..

ఢిల్లీ : సీబీఐ డైరెక్టర్ ఆదేశాల మేరకు దాడులు నిర్వహించినట్లు సీబీఐ పేర్కొంది. చీఫ్ సెక్రటరీ రాజేంద్రకుమార్ కార్యాలయం సోదాలు నిర్వహించడం జరిగిందని, అలాగే అతని ఇంట్లోను కూడా తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపింది. సీఎం కేజ్రీవాల్ కార్యాలయాన్ని సీజ్ చేయలేదని తెలిపింది. 

మోడీది పిరికిపంద చర్య – కేజ్రీవాల్..

ఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీది పిరికిపంద చర్య అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఉదయం తన కార్యాలయంపై సీబీఐ దాడులు చేసిందని, కార్యాలయాన్ని సీజ్ చేసిందని కేజ్రీవాల్ ట్విట్టర్ లో ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. సీబీఐ దాడులు రాజకీయ కుట్రేనని, తనను ఎదురించే సత్తా లేక మోడీ ప్రభుత్వం ఈ తరహా దాడులు చేస్తోందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. 

10:44 - December 15, 2015

సెర్బియా : పెప్పర్ స్ర్పేలతో అందరినీ హడలెత్తించిన కొసావో ప్రతిపక్ష ఎంపీలు ఈసారి ఏకంగా టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. ఒక్కసారిగా భారీగా వచ్చిన పొగతో ఎంపీలు ఉక్కిరిబిక్కిరయ్యారు. బయటకు ఉరుకులు..పరుగులు పెట్టారు. ఇద్దరు ఆసుపత్రి పాలయ్యారు. యూరప్ ఖండంలోని ఈ దేశం 2008 సెర్బియా నుండి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించింది. సరిహద్దులోని కొన్ని ప్రాంతాలపై సెర్బియాకు ఎక్కువ అధికారాలు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిని ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు వ్యతిరేకించారు. పార్లమెంట్ ను రణరంగం చేశారు. సెప్టెంబర్, నవంబర్ నెలలో పెప్పర్ గ్యాస్ ప్రయోగించి ఎంపీలను ముప్పుతిప్పలు పెట్టిన సంగతి తెలిసిందే. 

10:40 - December 15, 2015

ప్రస్తుత పరిస్థితుల్లో ఆడవాళ్లు, మగ వాళ్లు ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి కారణం ఎక్కువమందితో ఉంటే గొడవలు, మనస్పర్ధలు రావడం. అయితే తాజాగా ఒక సర్వేలో తేలిన విషయం ఏంటంటే.. ఒంటరిగా ఉండే వాళ్లు హెల్త్ కేర్ ఎక్కువగా తీసుకోరని, ఎందుకంటే మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడానికి ఒంటరిగా ఉండేవాళ్లు వెనకాడుతారు. కూరగాయలు, మాంసం, చేపలు వంటివి కొనడానికి కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే వాటికి ఎక్కువ ఖర్చు అవ్వడం వల్ల అంత డబ్బు పెట్టడానికి ఆలోచిస్తారు. అంతే కాకుండా ఒక్కరమే కదా అని నిర్లక్ష్యం చేస్తారు. కానీ అలా చెయ్యడం వల్ల వారి ఆరోగ్యం పాడైపోతుందని ఆలోచించరు. అవి కాకుండా ఒంటరిగా ఉండే వాళ్లకు సమయానికి ఆహారం తీసుకోవాలనే ఆలోచన కూడా రాదు. తినమని చెప్పడానికి పక్కన ఎవరూ లేకపోవడం, తినేటప్పుడు కూడా ఒంటరిగా తినడం వల్ల ఎక్కువగా తినబుద్ధి కాదు. మరికొందరికి వంట చెయ్యడం రాకపోవడం కూడా దీనికి కారణం. కాబట్టి ఒంటిరిగా ఉండే వాళ్లు సరిగ్గా తినకపోవడానికి ఈ కారణాలున్నాయని పరిశోధనలో తేలింది. అలాంటి వాళ్లు ఈ విషయం గురించి ఆలోచిస్తే మంచింది. మరిచి పోకండి.

 

10:37 - December 15, 2015

ప్రకాశం : జిల్లాను అభివృద్ధి చేస్తామని, ఈ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. జనచైతన్య యాత్రల ముగింపు సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. గత పది హేను రోజులుగా 95 పంచాయతీల్లో ప్రజల భాగస్వామ్యంతో జన చైతన్య యాత్రలు నిర్వహించడం జరిగిందన్నారు. ఏగ్రామానికి వెళ్లినా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు..ప్రభుత్వ పథకాలపై ప్రజలు సంతోషం వ్యక్తం చేశారని, గతంలో ప్రకాశం జిల్లా పూర్తిగా నిర్లక్ష్యం చేశారని తెలిపారు. ప్రస్తుతం అభివృద్ధి విషయంలో రోడ్ మ్యాప్ ను తయారు చేయడం జరుగుతుందని, జిల్లా అభివృద్ధిని చేయడానికి బాబు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఏపీలో ప్రతిపక్షం అనే పార్టీ లేదని, వైసీపీ ఫెయిల్ అయ్యిందని విమర్శించారు. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శిస్తున్నారని, అవగాహన లేకపోవడంతో జగన్ పై నేతలు అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. ఎవరైనా పార్టీలోకి రావచ్చని, అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. 

10:33 - December 15, 2015

ఢిల్లీ : సీఎం కేజ్రీవాల్ కార్యాలయంపై సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. స్వయంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ లో ట్వీట్ చేయడం సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది. ఎందుకోసమో చెప్పకుండా తనిఖీలు నిర్వహించడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఆమాద్మీ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుండి ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ మధ్యన కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మంత్రివర్గంలో ఉన్న వారిపై అవినీతి ముద్ర పడడంతో కేజ్రీవాల్ వారిని తొలగించారు. రాష్ట్ర హోదాకు సంబంధించిన అధికారాలు తమ చేతికి ఇవ్వాలని కేజ్రీవాల్ గత కొంతకాలంగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. అంతేగాకుండా పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై కూడా కేజ్రీవాల్ పలు విమర్శలు కూడా చేశారు. తాజాగా జరిగిన దాడులపై కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. సీబీఐ దాడులు రాజకీయ కుట్రేనని, తనను ఎదురించే సత్తా లేక మోడీ ప్రభుత్వం ఈ తరహా దాడులు చేస్తోందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. 

10:28 - December 15, 2015

మన శరీరంలో పేరుకుపోయే కొవ్వును కరిగించడం ఎలా..? అనేది అందరినీ వేధిస్తున్న ప్రశ్న. చాలా మంది కొవ్వు కరిగించాలంటే క్లిష్టమైన ఎక్సర్‌సైజులు చేయాలనుకుంటారు. కానీ, ఆహార అలవాట్లలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే కొవ్వును కరిగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కొవ్వు కరిగించే ఆహారపదార్థాలు..
పండ్లు..
మనం రోజూ తీసుకునే అనేక పండ్లలో కొవ్వును కరిగించే లక్షణాలున్నాయి. రక్తంలోని కొలెస్ట్రాల్‌ నిల్వల్ని తగ్గించడంలో ఆపిల్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. చెడ్డ కొలెస్ట్రాల్‌ని ఇది తగ్గిస్తుంది. ఇందులో ఎక్కువగా ఉండే మాలిక్‌ ఆమ్లం శరీరంలోని కొవ్వులను కరిగిస్తుంది. ద్రాక్షపండ్ల లోని ఎక్కువగా ఉండే పొటా షియం, బ్లాక్‌ బెర్రీ లోని పెక్టిన్‌ కొలెస్ట్రాల్‌ కరిగిస్తాయి. అంతే కాదు..జామపండ్లలోని విటమిన్‌ సి, భాస్వరం, నికోటిన్‌ ఆమ్లం శరీరంలోని రోగనిరోధకశక్తిని పెంచి, కొలెస్ట్రాల్‌ తగ్గిస్తాయి.
కూరగాయలు..
బీన్స్ లోని లేసిథిన్‌ కొలెస్ట్రాల్‌ కరిగిపోయేలా చేస్తుంది. పొటాషియం, రాగి, భాస్వరం, మాంగనీసు ఫోలిక్‌ ఆమ్లాలు వంకాయలో ఉండే ఆంతో సైనిన్స్, టానిన్స్, గుమ్మడిలో ఎక్కువగా ఉంటే పీచు, కొలెస్ట్రాల్‌ నిల్వల్ని బాగా తగ్గిస్తాయి. పుట్టగొడుగులలోని విటమిన్స్ బి, సి కాల్షియం, మినరల్స్ కొలెస్ట్రాల్‌ నిల్వలు తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. మొక్కజోన్నలలో ఉండే లినోలికాసిడ్‌, ఫోలికాసిడ్‌, విటమిన్‌ ఇ, బి1,బి6, నియాసిన్‌, రిబోఫ్లావిన్‌, బాదంలోని ఒలియిక్‌ ఆమ్లం చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

 

10:28 - December 15, 2015

తిరుమల : తిరుమల వెంకటేశ్వరుని పేరు చెప్పగానే 'లడ్డూ' ప్రసాదం గుర్తొస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఈ తిరుమల శ్రీవారి లడ్డూను కొంతమంది బ్లాక్ లో తరలిస్తూ అక్రమార్జన చేస్తున్నారు. ఎన్నోమార్లు ఈ కుంభకోణాలు వెలుగు చూసినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఇటీవలే టిటిడి ప్రింటింగ్ ప్రెస్ లో నకిలీ లడ్డూ కూపన్ల గుట్టు రట్టైన సంగతి తెలిసిందే. తాజాగా ఓ అటెండర్ దాతలకు చేరాల్సిన లడ్డూలను ఓ అటెండర్ బ్లాక్ లో విక్రయిస్తున్నాడు. ఈ ఉదంతం మంగళవారం వెలుగులోకి వచ్చింది. లక్ష రూపాయల నుండి పది కోట్ల రూపాయల వరకు విరాళాలు అందచేసే వారికి టిటిడి ఉచితంగా లడ్డూలను అందచేస్తుంటుంది. వెంకటరమణ అనే వ్యక్తి అటెండర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతను లడ్డూలను దాతలకు చేర్చకుండా బ్లాక్ లో విక్రయించాడు. ఇలా ఏడాదికి 60వేలకు పైగా లడ్డూలను దాతలకు చేరుకుండా దారి మళ్లిస్తూ బ్లాక్ లో విక్రయించాడు. రూ.25 ధర ఉండే ఈ లడ్డూను బ్లాక్ లో రూ.40-50 వరకు విక్రయించే వాడని తెలుస్తోంది. సుమారు రూ.30 లక్షల స్కాం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న టిటిడి ఈవో అటెండర్ వెంకటరమణను సస్పెండ్ చేశారు. వెంకటరమణనను విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నారు. ఇతనికి ఎవరు సహకరించారనే దానిపై అధికారులు దృష్టిసారించారు. 

10:25 - December 15, 2015

ఒత్తిడికీ, గుండెజబ్బులకీ సంబంధం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఎవరి జీవితంలోనైనా ఎంతో కొంత ఒత్తిడి సహజం. అయితే ఆధునిక మనిషి జీవితంలో ఒత్తిడి ఒక భాగమైంది. దాన్ని తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అయితే ఆ ఒత్తిడి అదేపనిగా పెరిగిపోతూ ఉంటే అది ఉద్వేగ సమస్యలకు, మానసిక సమస్యలకు, ఆ తర్వాత శారీరక సమస్యలకు దారి తీస్తుంది. అలాంటి శారీరక సమస్యల్లో గుండెజబ్బు ఒకటి. ఇది ఒక్కోసారి ప్రమాదకరంగా మారి గుండెపోటుకు దారితీయవచ్చు. ఒత్తిడి.. గుండెజబ్బులు ఈ రెండింటికీ ఉన్న అవినాభావ సంబంధం, దాన్ని అధిగమించడానికి కొన్ని మార్గాలు తెలుసుకోవడం కోసమే ఈ కథనం..
ఒత్తిడి అన్నది ఒక్కోసారి నేరుగా గుండెజబ్బులకు కారణం కావచ్చు. లేదా గుండెజబ్బు రిస్క్ ను పెంచే అంశాలను ప్రేరేపించి తద్వారా గుండెజబ్బు వచ్చేందుకు కారణం కావచ్చు. అందుకే ఒత్తిడి అన్నది ప్రత్యక్షంగా, పరోక్షంగా గుండె మీద ఒత్తిడి పెంచుతుందని గుర్తుంచుకోవాలి.
గుండెపై దుష్పరిణామాలు..
మానసిక ఒత్తిడి కారణంగానే గుండెజబ్బులు వస్తాయని ఎన్నో పరిశోధనల ద్వారా స్పష్టమైంది. పరోక్షంగా, ప్రత్యక్షంగా గుండెజబ్బులకు మానసికఒత్తిడే కారణం.
పరోక్షంగా..
మనసుపై ఒత్తిడి పెరిగినప్పుడు అడ్రినాలిన్‌, కార్టిజాల్‌ వంటి హార్మోన్లు ఎక్కువగా స్రవిస్తాయి. మనం ఒత్తిడితో ఉద్వేగం అనుభూతించడానికి ఈ హార్మోన్లే కారణం. వీటి కారణంగానే నరాల్లోని రసాయనాల (న్యూరోకెమికల్‌) మార్పులకు దోహదం చేస్తాయి. ఈ మార్పుల వల్ల రక్తపోటు పెరగడం, రక్తంలో కొలెస్ట్రాల్‌ అధికం కావడం, మధుమేహం వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఒక్కోసారి బాగా ఒత్తిడిలో ఉన్న వ్యక్తి ఆ ప్రభావంలో ఉండి తానెంత తింటున్నాడో తెలియనంతగా తినేస్తుంటారు. దీనికి తోడు ఒత్తిడి గురైన వాళ్లు తక్కువ వ్యాయామం చేస్తారు. ఒత్తిడి నుంచి బయటపడేందుకు పొగతాగడం, మద్యపా నానికి అలవాటు పడతారు. ఒత్తిడి కారణంగా నిద్రలేమి సమస్య వస్తుంది. ఇవన్నీ గుండెజబ్బును విపరీతంగా ప్రేరేపించే అంశాలే.
ప్రత్యక్షంగా..
ఒక్కోసారి విపరీతమైన ఒత్తిడి పెరిగిపోవడం వల్ల గుండెపై భారం పడి గుండెపోటు వస్తుంది. ఒకేసారి తీవ్రమైన ఒత్తిడి పడినప్పుడు రక్తనాళాల్లోని లోపలి గోడలు దెబ్బతింటాయి. సాధారణంగా నునుపుగా ఉన్న గోడలపై రక్తప్రవాహానికి, దెబ్బతిన్న గోడలపై ఉన్న రక్తప్రవాహానికి మార్పు ఉంటుంది. ఇలా దెబ్బతిన్న గోడలపై ఉన్న రక్తం ఆగిఆగి అవాంతరాలతో ప్రవహించడం వల్ల కొన్ని చోట్ల రక్తం గడ్డకట్టి కొన్ని ప్రాంతాల్లో పేరుకునే ఆస్కారం ఉంది. ఈ రక్తపు గడ్డలు మరింత ప్రవాహానికి అవరోధం కల్పిస్తుండటంతో గుండెకు అందాల్సిన రక్తం అందకపోవడంతో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.
ప్రమాద తీవ్రత ఇలా..
అసలు గుండెజబ్బేలేని వారిలో కూడా ఒత్తిడి వల్ల రక్తనాళాలలో ఏర్పడిన కొద్దిపాటి గడ్డలు ఇలా క్రమంగా పెరుగుతూ పోయి గుండెపోటును కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కోసారి అకస్మాత్తుగా కలిగే తీవ్రమైన ఒత్తిడి గుండె స్పందనల్లో వచ్చే తీవ్రమైన మార్పులు సైతం గుండెపోటును కలిగించడం వల్ల సడన్‌ కార్డియాక్‌ డెత్‌ లాంటి ఉత్పాతం అకస్మాత్తుగా పెనుప్రమాదం రూపంలో రావచ్చు. దీనికి తోడు తీవ్రమైన ఒత్తిడి గుండె కండరాల పనితీరుపై తీవ్రమైన ప్రభావం చూపి టుకోట్సుబో కార్డియో మయోపతి లాంటి గుండెపనితీరు విఫలమయ్యే పరిస్థితికి దారితీసే ప్రమాదం ఉంది.
కారణాలు..
శాస్త్ర విజ్ఞాన పరిశోధనల వల్ల ఎన్నో విషయాలు స్పష్టమయ్యాయి. మనం చేసే రోజు వారీ వృత్తుల్లో దీర్ఘకాలం కొనసాగే ఒత్తిడి, కుటుంబంలో పీట ముడిలా సాగే సమస్యలు, దాంపత్య బంధాలు దెబ్బతినడం, మానవీయ సంబంధాల్లో విఘాతం వంటి అంశాలు ఒత్తిడికి .. తద్వారా పరోక్షంగా గుండె, రక్తనాళాల సమస్యలకు దారితీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులపై దీర్ఘకాలం పాటు అధ్యయనం చేసిన ఒక డచ్‌ హృద్రోగ నిపుణులు '' ఒక వ్యక్తికి అటు వృత్తిలోనూ, ఇటు ఇంట్లోనూ సంతోషం, మనశ్శాంతి లేకపోతే దాన్ని వెతుక్కుంటూ త్వరత్వరగా సమాధి వైపు సాగిపోతాడు.'' అని పేర్కొన్నారు. అందుకే ఈ మాటను గుర్తుపెట్టుకుని ఒత్తిడిని ఎప్పుటికప్పుడు అధిగమిస్తూ ఉండటం అవసరం.
హెచ్చరికలు...
మన శరీరం తీవ్రమైన ఒత్తిడి గురవుతున్నప్పుడు అది కొన్న సంకేతాలను పంపుతుంది. ఆ ఒత్తిడి భారం నుంచి తప్పించమని హెచ్చరి కలు చేస్తుంది. అవి మన ఉద్వేగాల్లో, ప్రవర్తనల ద్వారా వ్యక్తమవుతుంటాయి. అయితే ఇవి ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటాయి.
సహజంగా కనిపించే లక్షణాలు..
- నిద్ర రాకపోవడం,
- కండరాల నొప్పులు
- తలనొప్పి
- విపరీతమైన అలసట
మానసిక పరమైన లక్షణాలు...
- అధిక భయము,
- ఆందోళన,
- నిరుత్సాహం, శక్తి కోల్పోవడం
- చిరాకు, నిస్పృహ
- ఆహారపు అలవాట్లలో మార్పులు ఆకలి ఎక్కువగా ఉండటం లేదా ఆకలి లేకపోవడం వంటి లక్షణాల్లో మనలోని ఒత్తిడి బయట పడుతుంది. ఒక్కోసారి ఏవైనా ఇతరత్రా ఆరోగ్య సంబంధమైన సమస్యలు, మానసిక సమస్యలు ఉన్నా పైన పేర్కొన్న లక్షణాలేమీ లేకుండానే తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తాయి.
ఒత్తిడి కలిగించే సాధారణ అంశాలు..
- వ్యక్తిగత అనారోగ్యం, కుటుంబ సభ్యుల, సన్నిహితుల తీవ్ర అనారోగ్యం
- వ్యక్తిగత బాంధవ్యాలలో విఘాతం
- పనిచేసే చోట తీవ్రమైన ఒత్తిడి
- నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు
- పదవీ విరమణ
- న్యాయ, చట్టపరమైన వివాదాలు, సమస్యలు
అధిగమించడం ఎలా..?
తీవ్రమైన ఒత్తిడిని అధిగమించడానికి వేర్వేరు వ్యక్తులు వేర్వేరు మార్గాలను అవలంభిస్తుంటారు. వారికి ఉపయుక్తమయ్యే ప్రక్రియను ఎంచుకుంటుంటారు. అయితే ఈ క్రమంలో ఒకసారి నిపుణులైన వైద్యులను సంప్రదించడం మంచిది. మితంగా తినడం.. సమతుల ఆహారం మితంగా ఎక్కువ సార్లు తీసుకోవడం, ఆల్కహాల్‌ వంటి అలవాట్లలో పరిమితిని తప్పనిసరిగా పాటించడం ఎంతో అవసరం. పొగతాగే అలవాటు మానాలి.. ఒత్తిడి వల్ల కలిగే దుష్పరిణా మాలకు అదనంగా సిగరెట్‌లోని ఉత్ప్రేరకమైన నికోటిన్‌ వల్ల సమస్య పెరుగుతుంది. వ్యాయామం...రోజూ చేసే ఏరోబిక్‌ వ్యాయామాలు ఎండార్ఫిన్‌ ను విడుదల చేస్తాయి. సానుకూల దృక్పథానికి ఇది దోహదం చేస్తుంది.
ఒత్తిడికి కారణమయ్యే అంశాలను నివారించడం..
ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి అనేది ప్రతిఒక్కరూ ఎదుర్కోంటున్నారు. తక్కువ సమయంలో పెద్దపెద్ద లక్ష్యాలను నిర్ణయించుకు నేవారు సరైన రీతిలో సమయపాలన (ఎఫెక్టివ్‌ టైమ్‌ మేనేజ్‌మెంట్‌) పాటించాలి. తమలోని నైపుణ్యాలను సమర్థంగా వినియోగించుకోవాలి.

సానుకూలదృక్పథం.. ప్రతి విషయంలోనూ పాజిటివ్‌ యాటిట్యూడ్‌తో ఉండటం వల్ల అసలు సమస్య, దాని వల్ల గుండెపైన దుష్ప్రభావం ఈ రెండు సమస్యలనూ ఏకకాలంలో పరిష్కరించవచ్చు. యోగా, ధాన్యం అన్నవి ఒత్తిడిని ఎదుర్కోడానికి ఎంతో ఉపయోగపడుతాయి. పై విషయాలపై కాస్త అవగాహన పెంచుకోవడం వల్ల గుండెపోటు వంటి రిస్క్‌లను గణనీయంగా తగ్గించుకోవచ్చని గుర్తించుకోండి.

 

10:10 - December 15, 2015

విజయవాడ : కాల్ మనీ వ్యవహారం తేల్చేందుకు ఏపీ పోలీసులు నడుం బిగించారు. మంగళవారం ఉదయమే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని ఏపీ సీఎం ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తూ పలువురిని అదుపులోకి తీసుకుంటున్నారు.
కృష్ణా..గుంటూరు..కడప జిల్లాలోని వడ్డీ వ్యాపారుల ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా పాల్గొన్నారు. పాతబస్తీ, చిట్టినగర్ ప్రాంతంలో..గుంటూరులోని శారదా కాలనీ, పట్టాభిపురం, డొంకరోడ్డులో..కడప జిల్లాలోని రాయచోటి, ప్రొద్దుటూరులో వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అధికార పార్టీకి చెందిన నేత గుర్రం కొండను అదుపులోకి తీసుకున్నారు. ఉయ్యూరులో కాల్ మనీ వ్యాపారుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అనుచరుడు నాగరాజు, వంగవీటి చెంతన్ కుమార్ అనుచరుడు దాములులను పోలీసులు అరెస్టు చేశారు. వీరివద్ద నుండి కోట్లాది రూపాయల విలువ చేసే డాక్యుమెంట్లు..ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. 250 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. వడ్డీ వ్యాపారుల బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు పేర్కొంటున్నారు. సాయంత్రం వరకు సోదాలు నిర్వహించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాల్ మనీ వ్యవహారం బయటి ప్రపంచానికి తెలియడంతో కొంతమంది వ్యాపారులు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

బాక్సైట్ తవ్వకాలపై మావోయిస్టుల లేఖ..

విశాఖపట్టణం : బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఐదు పేజీల లేఖను మావోయిస్టులు విడుదల చేశారు. పెద్దబయలు ఏరియా కమిటీ కన్వీనర్ మంగన్న పేరిట లేఖ విడుదలైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాక్సైట్ సంపదను దోచుకొనేందుకు చేస్తున్న కుట్రలను ఆదివాసీలు తిప్పికొట్టాలని, బాక్సైట్ అనుకూల వర్గాలపై దాడులు చేయాలని పిలుపునిచ్చారు. 

మల్లాది విష్ణు కోసం పోలీసుల గాలింపు..

విజయవాడ : కల్తీ మద్యం కేసులో 9వ నిందితుడిగా ఉన్న మల్లాది విష్ణు కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు. ఫోరెన్సిక్ లాబ్ నుండి నివేదిక పోలీసుల వద్దకు చేరింది. 

టిటిడిలో లడ్డూల కుంభకోణం..

తిరుమల : టిటిడిలో లడ్డూల కుంభకోణం వెలుగు చూసింది. దాతల లడ్డూలను అటెండర్ వెంకటరమణ బ్లాక్ లో విక్రయించాడు. ఏడాదికి 60వేలకు పైగా లడ్డూలను దాతలకు చేరుకుండా దారి మళ్లిస్తూ బ్లాక్ లో విక్రయించాడు. అటెండర్ ను టిటిడి ఈవో సస్పెండ్ చేశారు. వెంకటరమణనను విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నారు. 

కడపలో ఫైనాన్సర్ల ఇళ్లపై పోలీసుల దాడులు...

కడప : ప్రొద్దుటూరు, రాయచోటిలో ఫైనాన్సర్ల ఇళ్లపై పోలీసులు దాడులు జరిపారు. పలు డాక్యుమెంట్లను పరిశీలించారు. 

ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అనుచరుడు అరెస్టు..

కృష్ణా : ఉయ్యూరులో కాల్ మనీ వ్యాపారుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అనుచరుడు నాగరాజు, వంగవీటి చెంతన్ కుమార్ అనుచరుడు దాములులను పోలీసులు అరెస్టు చేశారు.

 

విజయవాడలో పోలీసుల దాడులు...

విజయవాడ : కాల్ మనీ వ్యాపారుల ఇళ్లల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఐదు బృందాలుగా విడిపోయి సోదాలు చేస్తున్నారు. అధికార పార్టీ గుర్రం కనకదుర్గతో పాటు ఆమె భర్త కొండను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. 

బీహార్, జార్ఖండ్ లో స్వల్ప భూకంపం..

ఢిల్లీ : బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో మంగళవారం ఉదయం స్వల్ప భూప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. బీహార్ లోని గయా, జమాయి, జార్ఖంఢ్ లోని డియోఘర్, ధన్ బాద్ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. 

కేరళలో రెండో రోజు ప్రధాని పర్యటన..

కేరళ : భారత ప్రధాని నరేంద్ర మోడీ కేరళలో రెండో రోజు పర్యటించనున్నారు. త్రివిధ దళాల కమాండర్ల సమావేశాన్ని ఆయన ప్రారంభించనున్నారు. కొళ్లాంలో నిర్వహించే వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. 

శ్రీవారి ఆలయంలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం..

చిత్తూరు : తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా జరిగింది.

09:22 - December 15, 2015

హైదరాబాద్ : నగరంలో పోలీసులు నిర్వహస్తున్న కార్డన్ సెర్చ్ మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ఈ తనిఖీల్లతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్నారు. తాజాగ ఫలక్ నుమా పీఎస్ పరిధిలో డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఫాతిమానగర్, వట్టేపల్లిలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఓ గాజుల పరిశ్రమలలో వెట్టిచాకిరి చేస్తున్న బాల కార్మికులకు విముక్తి కల్పించారు. వీరంతా 8-10 వయస్సులోపు ఉన్నవారే. ఆ సమయంలో బాలలు పనిచేస్తున్నారు. పని కోసం ఇక్కడకు తరలించారని ఓ బాలుడు పేర్కొన్నాడు. మొత్తం 21 మంది బాల కార్మికులను వారి వారి స్వగ్రామాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరిశ్రమల్లో బాలలచే పనిచేయించవద్దని అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు.
ఈ తనిఖీల్లో 34 మంది రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నారు. అంతేగాకుండా 110 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని, 300 లీటర్ల కిరోసిన్ ను స్వాధీనం చేసుకున్నారు. పేదలకు అందాల్సిన సరుకులను అక్రమంగా తరలిస్తున్న ముఠా సభ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ పేర్కొన్నారు. ముఠాలో కీలకంగా ఉన్న వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని పేర్కొన్నారు.

09:15 - December 15, 2015

గుంటూరు : కాల్ మనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం విస్తరించిందా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. కృష్ణా జిల్లాలో బహిర్గతమైన కాల్ మనీ వ్యవహారంలో దారుణాలు వెలుగు చూస్తున్నాయి. ప్రధాన పార్టీలకు చెందిన నేతలు..మాజీ మంత్రుల హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఎంతటివారైనా ఉపేక్షించవద్దని ఆదేశాలు జారీ చేశారు. తాజాగా గుంటూరు జిల్లాలో పోలీసులు జరిపిన దాడుల్లో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. డొంక రోడ్డు, శారదా కాలనీలో ఈ దాడులు కొనసాగాయి. టిడిపి పార్టీకి చెందిన వైసీపీ ముఖ్య నాయకుడి నివాసంపై దాడులు చేసినట్లు సమాచారం. ప్రామిసరీ నోట్లు..రోజు వారీ వడ్డీకి సంబంధించిన బుక్స్ ఇతరత్రా వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు.
గుంటూరు జిల్లా నుండే కాల్ మనీ వ్యవహారం పుట్టిందని తెలుస్తోంది. రోజు వారీ వడ్డీలకు పెద్ద ఎత్తున డబ్బులు ఇస్తున్నారు. డబ్బులు ఇవ్వలేనిపక్షంలో వ్యాపారులు దారుణాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. డబ్బులు ఇవ్వలేదని ఓ వ్యక్తి కిడ్నీ అమ్మిన ఘటన అప్పట్లో పెను సంచనలం సృష్టించింది. ఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు మాత్రమే పోలీసులు దృష్టి సారిస్తారనే విమర్శలున్నాయి. 

09:10 - December 15, 2015

కృష్ణా : కాల్ మనీ వ్యవహారాన్ని తేల్చేందుకు పోలీసులు ప్రయత్నాలు వేగవంతం చేశారు. ఈ కేసును వదిలిపెట్టేది లేదని, ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇవ్వడంతో పోలీసులు విస్తృత దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా మంగళవారం కృష్ణా జిల్లా వ్యాప్తంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. కాల్ మనీ వ్యాపారుల నివాసాలపై ఏకకాలంగా జరిపిన దాడుల్లో ఓ కార్పొరేటర్..అతని భార్యను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా వడ్డీ వ్యాపారుల కార్యాలయాలు..ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఉయ్యూరులో కాల్ మనీ నిర్వాహకులన్నారన్న సమాచారం మేరకు వారి వారి నివాసాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలకమైన డ్యాక్యుమెంట్లు, ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

కాల్ మనీ వ్యాపారుల నివాసాలపై దాడులు...

గుంటూరు : డొంక రోడ్డు, శారదా కాలనీలో కాల్ మనీ వ్యాపారుల నివాసాలపై పోలీసులు దాడులు చేశారు. పలు కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని అర్బన్ పోలీసులకు బాధితులకు ఫిర్యాదు చేశారు. 

కిడ్నాపైన సాయి నిఖిల్ సురక్షితం...

అనంతపురం : హిందూపురంలో నిన్న రాత్రి కిడ్నాప్ కు గురైన మూడో తరగతి విద్యార్థి సాయి నిఖిల్ సురక్షితంగా ఉన్నాడు. కర్నాటకలోని తుంకూరు జిల్లా సిరువలంచలో సాయి నిఖిల్ ను వదిలిపెట్టి వెళ్లారు. 

08:34 - December 15, 2015

ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో ఎన్నో ప్రశ్నలు..అనుమానాలు కలుగుతున్నాయని ది హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు. కేసీఆర్..చంద్రబాబుల భేటీ..జీఎస్టీ బిల్లు...కాల్ మనీ కేసు..బీజేపీపై తెలంగాణ మంత్రుల విమర్శలు..తెలంగాణ కాంగ్రెస్ లో ఎదురు దెబ్బలు..అంశాలపై ప్రొ.నాగేశ్వర్ విశ్లేషించారు. ఆయన మాటల్లోనే..

ఇదేనా జర్నలిజం..
''సమస్యల పరిష్కారం కావాలంటే సంబంధిత అధికారులు..మంత్రులు..ఇతరులు ఒక్కో అంశంపై చర్చించుకుంటారు. ఎవరూ లేకుండానే ఏకాంత చర్చలు అంటే ఎలా ? రెండు రాష్ట్రాల మధ్య విబేధాల పరిష్కారానికి ముఖ్యమంత్రులు కలిశారు అని అనుకోవాల్సినవసరం లేదు. ముఖ్యమంత్రులు కూడా చెప్పలేదు. ఇక్కడ మీడియా పలు వార్తలు ప్రచురించింది. చేపల పులుసు..బిర్యాని..ఇష్టంగా తిన్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాలకు కావాల్సింది ఇదేనా ? ఇదేనా జర్నలిజం. ప్రజలకు ఏమి ఇస్తాం ? ప్రజల తరపున మాట్లాడే మీడియా ఉండాలి.

ఎన్నో వాదాలు..
ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఎన్నో వాదనలు జరిగాయి. ఇరు పార్టీల మధ్య వాదాలు..ఓటుకు నోటు..ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ అంశంపై సీఎం కేసీఆర్ విమర్శలు కూడా చేశారు. ప్రస్తుతం ఇప్పుడంతా గప్ చుప్. చంద్రబాబును ఒక్కమాట కూడా అనడం లేదు. ఓటుక నోటు కేసు ఎందుకు ఆగిపోయింది ? అవసరాలకు ప్రజల మధ్య ఆగాధం సృష్టించారు. తాజాగా జరుగుతున్న భేటీ వ్యూహాత్మక అవసరాలా ? అనే అనుమానాలు వస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలంగాణేతర ప్రజలున్నారు. సహజంగానే కొంత బాధతో..కోపంతో..వారు ఆవేదనతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో విజయవాడకు కేసీఆర్ వెళ్లారు. కొంత వ్యతిరేకత రాకుండా ఉండేందుకు ఎత్తుగడ ? అనేది అనుమానం కలుగుతుంది.

జీఎస్టీ బిల్లు..
ఏ బిల్లుకైనా రాజకీయాలే. జీఎస్టీ బిల్లు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నం. రెండు రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రాధాన్యతనిస్తున్నారు. ఏకాభిప్రాయానికి ఏమైనా అవకాశం ఉందా అనే ప్రయత్నాలు జరగడం లేదు. నేషనల్ హెరాల్డ్ కంటే ఇతర కుంభకోణాలు లేవా ? కాంగ్రెస్ ను కవ్వించేందుకు చేస్తున్నట్లుగా ఉంది. జీఎస్టీకి రాజకీయ గ్రహణం పడుతుంది.

కాల్ మనీ వ్యవహారం..
ఈ అంశంలో ఎవరున్నారనేది విచారణలో తేలాలి. నేరాలు ఎక్కడుంటే అక్కడ రాజకీయ నేతలుంటున్నారు. అమరావతి ఇమేజ్ దెబ్బ తింటుందని బాబు చెప్పారు. అంతేకాదు..తెలుగు ప్రజల ఇమేజ్ దెబ్బతింటోంది. కల్తీ మద్యం..కాల్ మనీ రాకెట్లు జరుగుతుంటే అమరావతిని ఎలా తీర్చిదిద్దుతారు ? సింగపూర్ లో ఇలాగే జరగుతుందా ? చర్యలు తీసుకుంటామని అంటున్నారు. చర్యలు తీసుకుని చూపించాలి''. అని పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికలు..తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై కూడా ప్రొ.నాగేశ్వర్ విశ్లేషించారు.

08:07 - December 15, 2015

హైదరాబాద్ : నగరంలో పోలీసులు నిర్వహిస్తున్న కార్డన్ సెర్చ్ లు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఎప్పుడు..ఎక్కడ కార్డన్ సెర్చ్ నిర్వహిస్తారోనని రౌడీషీటర్లు..దొంగలు..అక్రమార్కులు భయ పడుతున్నారు. తాజాగా ఫలక్ నుమా పీఎస్ పరిధిలోని ఫాతిమానగర్, వట్టేపల్లిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. 350 మంది పోలీసులు తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ తనిఖీల్లో 34 మంది రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నారు. అంతేగాకుండా 110 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని, 300 లీటర్ల కిరోసిన్ ను స్వాధీనం చేసుకున్నారు. గాజుల పరిశ్రమలో పనిచేస్తున్న 21 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించారు. వీరిని స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. పేదలకు అందాల్సిన సరుకులను అక్రమంగా తరలిస్తున్న ముఠా సభ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ పేర్కొన్నారు. ముఠాలో కీలకంగా ఉన్న వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని పేర్కొన్నారు. పరిశ్రమల్లో బాలలచే పనిచేయించవద్దని అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు. 

07:48 - December 15, 2015

పొలాల్లో ఉన్న పంట చేతికొచ్చి రైతులంతా ఆనందంగా ఉండే రోజు సంక్రాంతి. అప్పటి వరకు కోతలు, నూర్పిళ్లతో తీరిక లేకుండా ఉండే అన్నదాతలు పండగ రోజుకు అన్ని పనులు పూర్తి చేసేసుకుని ఆనందంగా ఉంటారు. పల్లెల్లో కోడి పందాలు ఆడుతూ సంతోషంగా గడుపుతారు. అలాగే తెలుగు చిత్రసీమకు కూడా ఇది గొప్ప పండగే. పండగలకు సినిమాలు విడుదల చేస్తే విజయం సాధిస్తుందని నమ్మకం ఎప్పటినుంచో ఉంది. అన్ని పండగల్లో సంక్రాంతికి ఈ సినిమాల విడుదల సందడి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది కూడా పెద్ద హీరోల చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఏకంగా రూ. 150 కోట్ల వరకు ఈ పండగకు వ్యాపారం జరుగుతుందని అంచనా. బాలకృష్ణ ప్రస్తుతం చేస్తున్న చిత్రం 'డిక్టేటర్‌'. శ్రీవాస్‌ దర్శకత్వంలో రూపొందుతోంది. భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పుడు బాలకృష్ణకు ఒక హిట్‌ అవసరం. బోయపాటి శ్రీను తీసిన 'లెజెండ్‌' ఎంత ఊపునిచ్చిందో 'లయన్‌' అంత నిరాశ పరచింది. కుటుంబ కథా చిత్రంగా తీస్తున్న ఈ సినిమాలో అంజలి, సోనాక్షి చౌహన్‌ నటిస్తున్నారు. అంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఈ చిత్రం ఆడియోను ఈనెల 20న విడుదల చేసేందుకు ఈ చిత్ర బృందం సన్నద్ధమవుతుంది. ఈలోగా చిత్రం రెండో టీజర్‌ను కూడా విడుదల చేయనున్నట్టు శ్రీవాస్‌ తెలిపారు. జనవరి 14న సినిమా విడుదల చేస్తారు.

నాగార్జున...సొగ్గాడే చిన్ని నాయనా..
నాగార్జున ప్రస్తుతం 'సోగ్గాడే చిన్ని నాయనా', 'ఊపిరి' చిత్రాలు చేస్తున్నాడు. ఈ సంక్రాంతికి 'సోగ్గాడే చిన్ని నాయనా' విడుదల చేయడానికి ఈ చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. దీనికి సంబంధించి శనివారం ఈ చిత్రం కొత్త టీజర్‌ను కూడా విడుదల చేశారు. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాను జనవరి 15న విడుదల చేస్తామని ప్రటించారు. నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి ముఖ్య కథానాయికలుగా చేస్తున్నారు. కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున, రామ్మోహన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి అనుప్‌ రూబెన్స్‌ బాణీలు అందిస్తున్నారు.

ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో....
'టెంపర్‌' తర్వాత ఎన్టీఆర్‌ చేస్తున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో'. సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ఎన్టీఆర్‌ కొత్త లుక్‌లో కన్పిస్తున్నారు. లండన్‌లో ప్రత్యేకంగా సెట్‌ వేసి అక్కడే సుమారు 60 రోజులు షూటింగ్‌ జరిపారు. తర్వాత కొద్ది భాగం హైదరాబాద్‌లో చిత్రీకరించి ఇప్పుడు స్పెయిన్‌లో ప్రత్యేకమైన లొకేషన్స్‌లో షూటింగ్‌ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే సుకుమార్‌ ప్రకటించారు. ఎన్టీఆర్‌కు జోడీగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తుంది. ఎన్టీఆర్‌ తండ్రిగా రాజేంద్రప్రసాద్‌, ప్రతినాయకుడుగా జగపతిబాబు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 13న విడుదల చేయనున్నారు.

శర్వానంద్ ఎక్స్ ప్రెస్ రాజా..
శర్వానంద్‌ కూడా ఈ సంక్రాంతికి తన సినిమా 'ఎక్స్‌ప్రెస్‌ రాజా'ను విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా ఆ చిత్రం పోస్టర్లను కూడా శనివారం విడుదల చేశారు. శర్వానంద్‌కు జోడిగా సురభి అనే అమ్మాయి నటిస్తుంది. సుశాంత్‌ కూడా ఈ చిత్రం నటిస్తున్నట్టు తెలిసింది. మేర్లపేక గాంధీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని డిసెంబర్‌లోనే విడుదల చేయాల్సి ఉంది కాని ఎందుకో సంక్రాంతికి మార్చారు.

07:45 - December 15, 2015

సినిమాల్లో నటులు పాటలు పాడడం ఈ మధ్య బాగా పెరుగుతోంది. ఈ ధోరణి దక్షిణాది భాషల చిత్రాలతో పాటు బాలీవుడ్‌లో కూడా ఉంది. బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ కూడా ఆయన నటించే సినిమా 'వజీర్‌' కోసం ఓ పాట పాడారు. విధు వినోద్‌ చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమితాబ్‌, ఫర్హాన్‌ అక్తర్‌, ఆదిత్యారావు తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం అమితాబ్‌.. సుజయ్ ఘోష్‌ చిత్రం 'టిఈ3ఎన్‌' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. కలకత్తాలో చిత్రీకరణ జరుగుతుంది. ఈ షూటింగ్‌లో ఉన్న అమితాబ్‌ను వినోద్‌ చోప్రా ఫోన్‌ చేసి త్వరగా రావాలని చెప్పారట. వెంటనే అమితాబ్‌ షూటింగ్‌ మధ్యలోనే ముంబాయి వెళ్లిపోయారట. తీరా అక్కడకు వెళ్లాక తెలిసింది ఆయనతో ఓ పాట పాడిస్తున్నారని. మొత్తానికి 'వజీర్‌' చిత్ర సంగీత దర్శకుడు సంతూ మోయిత్రా బిగ్‌ బి చేత ఓ పాట పాడించారు. మరి ఆ పాట ఎలా ఉంటుందో చూడాలి.

07:33 - December 15, 2015

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మళ్లీ కలుసుకున్నారు. తాను నిర్వహించే ఆయుత చండీయాగానికి రావాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్..బాబును ఆహ్వానించారు. అనంతరం వీరు ఏకాంతంగా భేటీ అయ్యారు. ఈ భేటీలపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బాకీ పడిన కోట్లాది రూపాయలు చెల్లించాలంటూ కావూరి సాంబశివరావు నివాసం ఎదుట బ్యాంకు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో దుర్గా ప్రసాద్ (టిడిపి), మహేష్ గౌడ్ (కాంగ్రెస్), ప్రేమేందర్ రెడ్డి (బిజెపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

07:30 - December 15, 2015

బాలకృష్ణ, అంజలి, సోనాల్‌ చౌహాన్‌, అక్ష హీరోహీరోయిన్లుగా, శ్రీవాస్‌ దర్శకత్వంలో ఈరోస్‌ ఇంటర్నేషనల్‌, వేదాశ్వ క్రియేషన్స్‌ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం 'డిక్టేటర్‌'. తమన్‌ సంగీతమందించిన ఈ చిత్రం ఆడియో త్వరలో విడుదల కానుంది. 'ప్రస్తుతం ఫైట్‌ మాస్టర్‌ రవివర్మ నేతృత్వంలో భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్న క్లైమాక్స్‌ ఫైట్‌ సన్నివేశాల్లో బాలకృష్ణ నటిస్తున్నారు. ఈ క్లయిమాక్స్‌ ఫైట్‌ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. దీంతోపాటు నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఎస్‌.ఎస్‌. తమన్‌ సంగీతమందించిన ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక ఈనెల 20న ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతిలో నందమూరి అభిమానుల సమక్షంలో భారీ ఎత్తున నిర్వహిస్తున్నాం. అమరావతిలో జరుగుతున్న తొలి సినిమా కార్యక్రమం ఇదే కావడం విశేషం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని నిర్మాతలు తెలిపారు.

07:24 - December 15, 2015

కొంత మందిని చూడగానే వయసు తక్కువగానే ఉన్నా వారి ముఖంలో వచ్చే ముడతలు మాత్రం వయసుపైబడినట్లు కనిపించేలా చేస్తాయి. ఇందుకు కారణం వారి ముఖం మీద చేరిన మృత కణాలు. వాటిని తొలగించేందుకు ముఖానికి చక్కని ఫేషియల్‌ మాస్క్‌ వేసుకుంటే వయసు తక్కువగా కనిపిస్తారు. మరి మీరూ వయసు తక్కువగా కనిపించాలనుకుంటున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించండి.
 చర్మం పొడిబారినట్లుగా కాకుండా మృదువుగా ఉంటేనే ముడతలను చాలా వరకు నివారించవచ్చు. మృదువైన చర్మం కోసం ఆలివ్‌ నూనె బాగా పనిచేస్తుంది. ఎలాంటి చర్మతత్త్వం ఉన్నవారైనా ఒక టీ స్పూన్‌ ఆలివ్‌ నూనెలో కొద్దిగా పంచదార వేసి దానితో ముఖం పై సున్నితంగా రుద్దాలి. ఐదు నిమిషాల పాటు మెల్లగా మసాజ్‌ చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి. ఇలా చేయడం వల్ల మృత కణాలు చాలా వరకు తొలిగిపోయి ముడతలు త్వరగా రావు. ఆలివ్‌ నూనెలో కాఫీ గింజల పొడిని వేసి ఈ మిశ్రమంతో ముఖంపై మెల్లగా మసాజ్‌ చేసినా మంచి ఫలితం కనిపిస్తుంది. మృతకణాలు తొలగించిన తర్వాత బాగా పండిన అరటిపండు గుజ్జు తీసుకుని దానిలో కొద్దిగా తేనె, పెరుగూ కలపాలి. దాన్ని ముఖానికి పై పూతలా వేసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే వయసుతో పాటు వచ్చే ముడతలు తగ్గుతాయి. 

07:23 - December 15, 2015

సీజనల్‌ వారీగా వచ్చే పూలు ఎన్నో ఉన్నా.. డిసెంబర్‌ పూలది ఓ ప్రత్యేకత. గట్టువెంట సహజంగా విరబూసే ఈ పూలు శీతాకాలంలో వలసవచ్చే చిన్నచిన్న పక్షులకు మకరందాన్ని అందిస్తాయి. ఊదారంగు, బంగారు వర్ణం, అరుదుగా తెలుపు, లేతగులాబీ వర్ణాలలో కనిపించే ఈ పూలు తెలియనివారు ఉండరు. నవంబర్‌ నెల చివరి నుంచే చిగురులు తొడిగి.. డిసెంబర్‌ నెల ప్రారంభం నుంచి ఫిబ్రవరి నెల చివరి వరకు విరబూస్తాయి. తక్కువ సూర్యకాంతిలో ఈ పూలు వికసిస్తాయి. అంతేకాదు.. ఈ మొక్కలో అనేక ఔషధగుణాలున్నాయి.

  • ఈ మొక్క ఆకులను దగ్గు, న్యుమోనియా చికిత్సకు ఉపయోగిస్తారు.
  • వేర్లు, ఆకులు జలుబు, ఫ్లూ వంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి.
  • హెపాటిక్‌ వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు.
  • విత్తనాలు పాము కాటు విరుగుడుగా ఉపయోగిస్తారు.
  • ఈ మొక్కను రక్తహీనతతో బాధపడేవారికి ఔషధంగా కూడా ఆయుర్వేదంలో సూచిస్తారు.
  • డిసెంబర్‌ పూలమొక్కను రక్త శుద్ధి కోసం, మధుమేహం చికిత్సలో ఉపయోగిస్తారు.
  • వేర్ల రసం అజీర్తీకి ఉపశమనంగా పనిచేస్తుంది.
07:22 - December 15, 2015

బాపు... రేపటి సినిమాను.. నిన్ననే ఆలోచించి.. ఇవాళే తీసేసిన దిగ్దర్శకుడు. పదహారణాల తెలుగుదనానికి ఆయన రాసిన రాతలు, గీసిన గీతలే సజీవ సాక్ష్యాలు. చెప్పదల్చుకున్న విషయాన్ని భావ వ్యక్తీకరణ ద్వారా అందంగా, అర్థవంతంగా అత్యద్భుతంగా వెండితెర పై ఆవిష్కరించిన ఘనుడు. తెలుగు సినిమా చరిత్రలో తన కంటూ ఓ ప్రత్యేక బొమ్మల అధ్యాయాన్ని సృష్టించుకుని నేటి తరానికి మార్గదర్శిగా నిలిచిన బాపు జయంతి నేడు (మంగళవారం).

1933 డిసెంబర్ లో జననం..
కార్టూనిస్ట్‌గా, పెయింటర్‌గా, ఇల్లేస్టేటర్‌గా, రచయితగా, దర్శకుడిగా పలు విభాగాల్లో రాణించిన బాపు అసలు పేరు సత్తి రాజు లక్ష్మీ నారాయణ. 1933, డిసెంబర్‌ 15వ తేదీన నర్సాపురం (వెస్ట్‌ గోదావరి)లో జన్మించారు. బి.కాం., బి.ఎల్‌. పూర్తి చేసిన బాపు తొలుత పొలిటికల్‌ కార్టూనిస్ట్‌గా 'ఆంధ్రపత్రిక'కు పనిచేశారు. రామాయణం, మహాభారతంలోని పాత్రల్ని ఆధారంగా తీసుకుని ఆయన గీసిన ఎన్నో చిత్రాలు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందాయి. అంతేకాదు తనకంటూ ఓ ప్రత్యేక అక్షరశైలిని కూడా రూపొందించి అందరి మన్ననలు పొందారు. ఆయన డిజైన్‌ చేసిన 'బాపు' ఫాంట్స్‌ అధిక ప్రాచుర్యంలో ఉన్నాయంటే అతిశయోక్తి లేదు. బాపు గీసిన బొమ్మలతో విడుదలైన 'అమరావతి కథలు', పిల్లలకు సంబంధించి 'బుడుగు' వంటివి విశేష ఆదరణ పొందాయి. అలాగే పబ్లిసిటీ డిజైనర్‌గా కూడా పనిచేశారు. ఆయన చిత్రాల్లోని కథా, కథనాలు.. పాత్రలు.. ఆ పాత్రల తీరు తెన్నులు.. ఇలా ఏది తీసుకున్నా తెలుగుదనానికి ప్రతీకలుగా తీర్చిదిద్దడంలో ఆయనకు ఆయనే సాటని నిరూపించుకున్న సందర్భాలెన్నో ఉన్నాయి. ముఖ్యంగా గోదావరి అందాల్ని, పల్లెటూరి సోయగాల్ని వెండితెర మీద అత్యద్భుతంగా ఆవిష్కరించిన ఘనత కూడా బాపుకే దక్కుతుందనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

బాపు..రమణల స్నేహం..
బాపు జీవితంలో అన్నింటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం.. బాపు, రమణల స్నేహం. బాల్యం నుంచి ప్రారంభమైన వీరిద్దరి స్నేహం ఎటువంటి విభేదాలు లేకుండా కడవరకు సాగింది. ఈ ఇద్దరూ నర్సాపురంలోని టేలర్‌ హైస్కూల్లో కలిసి చదువుకున్నారు. 14 ఏళ్ళ వయసులో ముళ్ళపూడి వెంకటరమణ 'అమ్మ మాట వినకపోతే' అనే పేరుతో ఓ షార్ట్‌ స్టోరీ రాశారు. ఆ స్టోరీకి బాపు బొమ్మల్ని వేశారు. పిల్లల్ల మ్యాగజైన్‌ 'బాల'లో ఆ కథ ప్రచురితమైంది. ఇక్కడ్నుంచి ప్రారంభమైన వీరిద్దరి స్నేహం సినిమాల్ని రూపొందించే వరకు వచ్చింది. కృష్ణ, విజయనిర్మల జంటగా రూపొందిన 'సాక్షి' (1967) చిత్రంతో బాపు దర్శకుడిగా సరికొత్త బాధ్యతలు చేపట్టారు. బాపు దర్శకుడిగా మారటానికి ఆప్తమిత్రుడు రమణే కారణమని బాపు పలు సందర్భాల్లో చెప్పారు. తొలి చిత్రం 'సాక్షి' ప్రేక్షకుల విశేష ఆదరణ పొంది బాపుకి మంచి పేరు తీసుకొచ్చింది. ఆ ప్రోత్సాహంతో ఆయన మరెన్నో చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఒక రంగంలో సృజనాత్మకంగా అత్యున్నత శిఖరాలకు వెళ్ళిన ఈ ఇద్దరు 66 ఏళ్ళకు పైగా ఏ గొడవా లేకుండా కలిసి బతికారు, కలిసి నడిచారు, కలసికట్టుగా తమ రంగంలో విశేష కృషి చేశారని చెబితే.. ఇక వాళ్ళ స్నేహం గురించి మనం ప్రత్యేకించి ఏమీ చెప్పక్కర్లేదు.

ఎన్నో చిత్రాలు...
'సాక్షి' చిత్రం తర్వాత 'బంగారు పిచుక', 'బుద్ధిమంతుడు', 'ఇంటి గౌరవం', 'సంపూర్ణ రామాయణం', 'అందాల రాముడు', 'శ్రీరామాంజనేయ యుద్ధం', 'త్యాగయ్య', 'ముత్యాల ముగ్గు', 'సీతా కళ్యాణం', 'శ్రీ రాజేశ్వరి విలాస్‌ కాఫీ క్లబ్‌', 'భక్త కన్నప్ప', 'స్నేహం', 'మనవూరి పాండవులు', 'గోరంత దీపం', 'తూర్పు వెళ్ళే రైలు', 'వంశ వృక్షం', 'రాజాధి రాజు', 'కలియుగ రావణాసురుడు', 'రాధా కళ్యాణం', 'కృష్ణావతారం', 'పెళ్ళీడు పిల్లలు', 'ఏది ధర్మం ఏది న్యాయం', 'మంత్రి గారి వియ్యంకుడు', 'సీతమ్మ పెళ్ళి', 'పెళ్ళి పుస్తకం', 'మిస్టర్‌ పెళ్ళాం', 'శ్రీనాథ కవి సార్వభౌముడు', 'పెళ్ళి కొడుకు', 'పరమాత్మ', 'రాంబంటు', 'రాధాగోపాళం', 'సుందరకాండ', 'శ్రీరామ రాజ్యం' వంటి తెలుగు చిత్రాలతోపాటు 'హమ్‌ పాంచ్‌', 'బేజుబాన్‌', 'మొహబ్బత్‌', 'వో సాత్‌ దిన్‌', 'ప్యార్‌ కా సిందూర్‌', 'దిల్‌జలా', 'సీతా స్వయంవర్‌' వంటి హిందీ చిత్రాలూ ఉన్నాయి. అలాగే తమిళంలో 'నీతి దేవన్‌ మయగుజిరన్‌' చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు.

వేటికవే వైవిధ్యం...
బాపు దర్శకత్వం వహించిన చిత్రాల సరళి చూస్తే వేటికవే వైవిధ్యంగా ఉంటూ ప్రత్యేకతను చాటుకుంటాయి. ఎటువంటి కథలోనైనా గ్రామీణ నేపథ్యాన్ని, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు బాపు పెద్ద పీట వేస్తారని ఆయా చిత్రాలు చెప్పకనే చెప్పాయి. అంతేకాదు ఏనాడూ కమర్షియాలిటీ పాకులాడలేదని కూడా స్పష్టం చేశాయి. వీటితోపాటు షాట్‌ కంపోజింగ్‌, మేకింగ్‌, విజువలైజేషన్‌, నేపథ్య సంగీతం.. ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రూపొందిం చారని సినీ విమర్శకులు సైతం అభినందించిన సందర్భాలెన్నో ఉన్నాయి. తెలుగు గడ్డకే పరిమితమైపోయిన అంతర్జాతీయ ఫిల్మ్‌ మేకర్‌గా బాపుకి మంచి పేరు కూడా ఉంది. ఓ కథతో కథా నాయకుడ్ని ఎంతగా ఎలివేట్‌ చేయగలరో అదే స్థాయిలో ప్రతినాయ కుడిని కూడా ఎలివేట్‌ చేయొచ్చని 'ముత్యాల ముగ్గు'లోని రావుగోపాల రావు పాత్ర ద్వారా బాపు నిరూపించారు.

ఎన్నో అవార్డులు..పురస్కారాలు..
ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'సాక్షి' తాష్కెంట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది. అలాగే 'సీతా కళ్యాణం' చిత్రం బిఎఫ్‌ఐ లండన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లోను, చికాగో చలన చిత్రోత్సవంలోనూ ప్రదర్శితమై ప్రేక్షకుల ఆదరణ పొందింది. అలాగే 'త్యాగయ్య', 'పెళ్ళి పుస్తకం' చిత్రాలు ఇండియన్‌ పనోరమ విభాగంలో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (1991)లో ప్రదర్శితమయ్యాయి. బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందించిన 'శ్రీరామ రాజ్యం' చిత్రం సైతం 2011లో జరిగిన గోవా చలన చిత్రోత్సవంలో ప్రదర్శితమై అందర్నీ అలరించింది. 'ముత్యాల ముగ్గు', 'మిస్టర్‌ పెళ్ళాం' చిత్రాలకుగాను ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డుల్ని సైతం సొంతం చేసుకున్నారు. 'బాలరాజు కథ', 'అందాల రాముడు', 'ముత్యాలముగ్గు', 'పెళ్లి పుస్తకం', 'మిస్టర్‌ పెళ్ళాం', 'శ్రీరామ రాజ్యం' చిత్రాలకు ఉత్తమ దర్శకుడిగా ఏడు రాష్ట్ర నంది అవార్డుల్ని అందుకున్నారు. 1986లో అత్యంత ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డుని పొందారు. అలాగే ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్టునిస్ట్స్‌ 2001లో లైఫ్‌ టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డుతో ఘనంగా సత్కరించారు. తిరుపతి అకాడమీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ వారు రాష్ట్రపతి అవార్డుతో గౌరవించారు. వీటితోపాటు మరెన్నో అవార్డుల్ని, పురస్కారాల్ని బాపు సొంతం చేసుకున్నారు. సినిమా రంగంలో బాపు చేసిన విశిష్ట సేవలను గుర్తించిన కేంద్రప్రభుత్వం 'పద్మశ్రీ' పురస్కారంతో సముచితంగా గౌరవించింది.

ఫలక్ నుమాలో పోలీసుల కార్డన్ సెర్చ్...

హైదరాబాద్ : ఫలక్ నుమా పీఎస్ పరిధిలోని ఫాతిమానగర్, వట్టేపల్లిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. 

గవర్నర్ ను కలువనున్న జగన్..

హైదరాబాద్ : ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను వైసీపీ అధ్యక్షుడు జగన్ కలువనున్నారు. ఉదయం 11.30 గంటలకు ఈ భేటీ జరగనుంది. కాల్ మనీ వ్యవహారంపై గవర్నర్ కు జగన్ ఫిర్యాదు చేయనున్నారు. 

నేడు దేవీశ్రీ ప్రసాద్ తండ్రి అంత్యక్రియలు...

చెన్నై : నేడు దేవీశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి అంత్యక్రియలు జరుగనున్నాయి. బెసన్ నగర్ శ్మశాన వాటికలో జరుగనున్నాయి. 

నేడు టి.టిడిపి నేతలతో లోకేష్ భేటీ..

హైదరాబాద్ : నేడు ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో టి.టిడిపి నేతలతో నారా లోకేష్ సమావేశం కానున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చించనున్నారు. 

06:46 - December 15, 2015

తెలంగాణలో అనుమతులు లేని అక్రమ నిర్మాణాలు, లే అవుట్ల క్రమబద్దీకరణ కోసం ఉద్దేశించిన జీవోను సవరించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్ఆర్ఎస్, బీపీఎస్ స్కీమ్ పై పౌర సమాజం వ్యక్తం చేస్తున్న కోరికలేమిటి? ఈ జీవోలో వున్న ప్రమాదకర అంశాలేమిటి? ఈ జీవోలో చేయాల్సిన మార్పులేమిటి? పార్కులు, స్కూళ్లు ఇతర ప్రజాప్రయోజనాల కోసం కేటాయించిన స్థలాల పరిరక్షణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎల్ ఆర్ఎస్, బీఆర్ఎస్ లాంటి స్కీమ్ లు నిలువ నీడలేని పేద ప్రజలకంటే అక్రమార్కులకే ప్రోత్సాహకరంగా మారుతున్నాయన్న విమర్శల్లో ఎంత వరకు నిజముంది? గతంలో వైఎస్ ప్రభుత్వం హయాంలో ఈ స్కీమ్ ప్రవేశపెట్టినప్పుడు ఎదురైన అనుభవాలేమిటి? ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? మొదలైన అంశాలపై టెన్ టివి జనపథంలో చర్చించేందుకు ఫాకా కన్వీనర్ అంజయ్య విశ్లేషించారు. 

06:44 - December 15, 2015

తెలంగాణలో ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ స్కీమ్ కింద అక్రమ నిర్మాణాల క్రమబద్దీకరణ దరఖాస్తులకు ఆఖరి తేదీ సమీపిస్తోంది. మరోవైపు అక్రమ నిర్మాణాల, లే అవుట్ల క్రమబద్దీకరణ విషయంలో మరికొన్ని మార్పులు చేయాలని పౌర సమాజం సూచిస్తోంది. అనుమతులు లేని లేవుట్లు, అక్రమ నిర్మాణాలు పట్టణాలు, నగరాలలో సర్వ సాధరణమైపోయాయి. ఎవరిష్టం వచ్చినట్టు వారు లే అవుట్లు వేసి, ఎవరికి తోచినట్టు వారు భారీ నిర్మాణాలు చేపడుతుండడంతో టౌన్ ప్లానింగ్ దెబ్బతింటోంది. దీంతో సౌకర్యాల కల్పన కష్ట తరమవుతోంది. అగ్ని ప్రమాదాలకు కారణమవుతోంది. వివిధ ప్రమాదాల సమయంలో బాధితులను రక్షించడం సమస్యాత్మకంగా మారుతోంది. నిబంధనలు, విధి విధానాలు, వాటి ప్రాధాన్యత తెలియక కొందరు అక్రమ నిర్మాణాలు సాగిస్తుంటే, ధనాశతో, పేరాశతో కొంతమంది బిల్డర్లు, అక్రమార్కులు ఇలాంటి అక్రమాల ఇటుకలు పేర్చి, నాలుగు చేతులా సంపాదిస్తున్నారు. ప్రతి నిర్మాణానికీ కొన్ని నిబంధనలుంటాయనీ, వాటిని ఉల్లంఘిస్తే భవిష్యత్ లో తామే కష్ట నష్టాలు అనుభవించాల్సి వస్తుందన్న తెలియక చాలామంది విద్యావంతులు సైతం బిల్డర్ ల బుట్టలో పడుతుంటారు.

పరిష్మన్ లేకున్నా కొనుగోళ్లు...
తక్కువ ధరకు వస్తుందనో, తమకు అనుకూలమైన ప్రాంతంలో వున్నదనో లాంటి కారణాలతో కొంతమంది సరియైన లే అవుట్లు, అన్ని రకాల పర్మిషన్లు లేని అపార్ట్ మెంట్లు, బిల్డింగ్లు, ప్లాట్లు కొంటుంటారు. ఒక్కొక్కసారి అనుమతుల మేరకు అపార్ట్ మెంట్ నిర్మించి, ఫ్లాట్స్ అమ్ముకున్న తర్వాత కొంతమంది బిల్డర్ లు అక్రమంగా పెంట్ హౌస్ నిర్మిస్తుంటారు. ఇలాంటి సందర్భంలో ఆ అపార్ట్ మెంట్ లో వుండేవారంతా ఆ కష్ట నష్టాలు భరించాల్సి వుంటుంది. ఇలాంటి విషయాలు చాలా మందికి తెలియదు. మరి కొందరు బిల్డర్ లు పార్క్లు, ప్రభుత్వ స్థలాలు, అసైన్డ్ భూములు ఆక్రమించి నిర్మాణాలు సాగిస్తుంటారు. ఆయా భూములకు సంబంధించిన లోతుపాతులు తెలియనివారు మాయగాళ్ల వలలో చిక్కుకుంటారు. బిల్డర్ లతోనూ, అక్రమార్కులతోనూ లాలూచీపడ్డ అధికార గణం ఆయా నిర్మాణాలు సాగుతున్న కాలం మౌనంగా వుండి, ఆ తర్వాత కొనుగోలుదారుల మీద విరుచుకుపడుతుంటారు.

మరో అవకాశం...
ఆమ్యామాలకు ఆశ పడో, అధికార పార్టీ నాయకుల ఒత్తిడిల కారణంగానో అధికార యంత్రాంగం నిద్ర నటించడం కారణంగా రోజురోజుకీ అక్రమ నిర్మాణాలు పెరుగుతున్నాయి. కారణం ఏదైనా అనుమతులు లేని నిర్మాణాలు పట్టణాభివృద్ధి ప్రణాళికలకే ఇబ్బందికరంగా పరిణమిస్తున్నాయి. విపరీతంగా పెరిగిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామంటూ బెదిరించే ప్రభుత్వాలు అంత సీరియస్ గా ముందుకు వెళ్లే సాహసం చేయలేవు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఇలాంటి హడావిడే చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం చివరకు ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ స్కీమ్ ప్రవేశపెట్టి, అక్రమ లే అవుట్ల, నిర్మాణాల క్రమబద్దీకరణకు మరో అవకాశం ఇచ్చింది.

రూ.1500 కోట్ల ఆదాయం..
ఈ నెలాఖరుతో దరఖాస్తుల గడువు ముగుస్తోంది. ఈ క్రమబద్దీకరణ వల్ల కనీసం 1500 కోట్ల రూపాయల ఆదాయం సంపాదించవచ్చని అధికార యంత్రాంగం అంచనా వేయగా, ఇప్పటికి పట్టుమని పదివేల అప్లికేషన్లు కూడా రాలేదని తెలుస్తోంది. అయితే, ఈ జీవో వచ్చిన తర్వాత అక్రమ నిర్మాణాలు మరింత జోరందకున్నాయి. ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో అక్రమార్కులు పాగా వేసి, క్రమబద్దీకరణ జీవోను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పాత నిర్మాణాలను క్రమబద్దీకరించేటప్పుడు, ఇలాంటి కొత్త ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద వుంది. మరోవైపు తప్పులు చేసిన రియాల్టర్లు, బిల్డర్ల మీద చర్యలు తీసుకోకుండా, వాటిని కొనుగోలు చేసినవారి మీద మరికొంత ఆర్థికభారం మోపడం ఎంత వరకు ధర్మం అన్న ప్రశ్న కూడా ఉదయిస్తోంది. 

06:38 - December 15, 2015

ఢిల్లీ : స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంతో ఐపీఎల్ లో చెన్నై, రాజస్థాన్ రాయల్స్‌ భవితవ్యం ఒక్కసారిగా మారిపోంది. వీటి స్థానంలో కొత్తగా ఏర్పాటైన పుణె, రాజ్ కోట్ కై ప్రత్యేక వేలం నిర్వహించనుంది ఐపీఎల్ యాజమాన్యం. వేలం నిర్వహించే ప్రాంచైజీ చెన్నై స్టార్లను కొనుక్కునేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సీజన్ లో రెండు ఫ్రాంచైజీలు ఆటగాళ్లను వేలంలో కొనుక్కోనున్నాయి. 

06:36 - December 15, 2015

కేరళ : ప్రధాని మోడీ కేరళ పర్యటన వివాదంగా మారింది. ముఖ్యంగా కేరళలో నేడు జరగునున్న మాజీ ముఖ్యమంత్రి ఆర్‌ శంకర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మోడీ ఒక్కరే హాజరవుతూ సీఎం ఉమెన్‌ చాందీని ఆహ్వానించలేదు. ప్రధాని హాజరయ్యే ఈ కార్యక్రమానికి హాజరుకావద్దంటూ కేరళ ముఖ్యమంత్రి ఉమెన్‌ చాందీని ఎస్‌ఎన్‌డిపి ప్రధాన కార్యదర్శి వల్లపల్లి నటేశన్‌ సూచించారు. దీనిపై వివాదం మొదలైంది. ఈ ఘటనపై కాంగ్రెస్‌ తీవ్రంగా విరుచుకుపడింది. తమకు వ్యతిరేకమైన పార్టీ పాలించే ప్రతి రాష్ట్రంలోనూ బిజెపి ఇలానే వ్యవహరిస్తోందని విమర్శించారు.

కొల్లంలో కార్యక్రమం..
కొల్లంలో జరగుతున్న ఈ కార్యక్రమానికి మొదట చాందీని ఆహ్వానించినప్పటికీ, కార్యక్రమ నిర్వాహకుడు నటేశన్‌ మాత్రం కార్యక్రమానికి రావొద్దని సూచించారు. దీనిపై సీఎం చాందీ స్పందిస్తూ తనకు ఆహ్వానం అందినప్పటికీ కార్యక్రమ నిర్వాహకుల వినతి మేరకు హాజరు కావట్లేదని తెలిపారు. కార్యక్రమంలో తాను హాజరైతే వ్యతిరేకత తలెత్తే అవకాశం ఉందని నటేశన్‌ తెలిపినట్లు చాందీ అన్నారు. శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం ఆధ్వర్యంలో ఈ విగ్రహావిష్కరణ జరగనుంది. కార్యక్రమ నిర్వాహకులు బీజేపీతో మిత్రధర్మం పాటిస్తున్నారు. ఇదిలా ఉంటే యోగం ప్రతినిధులు ఎవరి ఒత్తిళ్లకు లొంగి చాందీని కార్యక్రమానికి రావద్దని సూచించారో తెలపాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఏకే ఆంటోని విమర్శించారు.

కాంగ్రెస్ ఆగ్రహం..
మాజీ ముఖ్యమంత్రి ఆర్‌. శంకర్‌ విగ్రహావిష్కరణకు చాందీని హాజరు కాకుండా చూడాలని ఎవరు ఒత్తిడి చేశారో బయటపెట్టాలంటూ కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదిలా ఉంటే మోడీ చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరగనున్న మాజీ సీఎం ఆర్‌. శంకర్‌ గతంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అయినప్పటికీ చాందీని కార్యక్రమానికి ఆహ్వానం అందలేదు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ తీవ్రంగా విరుచుకుపడింది. తమకు వ్యతిరేకమైన పార్టీ పాలించే ప్రతి రాష్ట్రంలోనూ బిజెపి ఈ విధమైన అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతోందని లోక్‌ సభలో రాహుల్‌ గాంధీ విమర్శించారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరణ ఇచ్చారు. కేరళ ప్రభుత్వంతో తమకు ఎటువంటి ఘర్షణ లేదని, సీఎం రావొద్దని ప్రధాని ఎప్పుడూ సూచించలేదని, ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న సంస్థే రాష్ట్ర సీఎం రాకను అడ్డుకుందని రాజ్‌నాథ్ అన్నారు. కొల్లామ్ కాలేజీలో జరిగే కార్యక్రమానికి తాను హాజరు కావడం లేదని ఆ రాష్ట్ర సీఎం లేఖ విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి రాజీవ్‌ ప్రతాప్‌సింగ్‌ రూఢీ లోక్‌సభలో తెలిపారు.

06:31 - December 15, 2015

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్‌లో ఎన్నికలకు మరికొన్నిరోజుల్లో నగారా మోగనుంది. గ్రేటర్‌లో పట్టు సాధించేందుకు అన్ని పార్టీలు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టాయి. దీనిలో భాగంగా రానున్న గ్రేటర్ ఎన్నికల్లో తమ ఉనికి చాటుకోవాలనుకుంటోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ . తెలంగాణలో అంతగా ప్రాబల్యం లేని వైసీపీ.. అభ్యర్థుల ఎంపికకు ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఇంటర్వూలు నిర్వహిస్తోంది. తమకు ఆసక్తి ఉందంటూ వచ్చిన వారి కుల , మత ఆర్థిక పరమైన అంశాలపై ప్రశ్నలు సందిస్తున్నారు తెలంగాణ వైసీపీఅధ్యక్షులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. 

అభ్యర్థుల ఆశ్చర్యం...
పార్టీ కార్యాలయంలో జరుగుతున్న ఇంటర్వూ విధానంపై అక్కడికి వస్తున్న వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి గ్రేటర్ లో పోటీకి సిద్దమయ్యేంత సత్తా వైఎస్సార్ కాంగ్రెస్‌కు లేకున్నా రసవత్తర గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్థులను నిలిపాలనుకుంటోంది పార్టీ అధిష్టానం. కేవలం వైఎస్‌ఆర్ పై ఉన్న అభిమానంతో వస్తున్నారు కాని వింత వింత ఇంటర్వూలతో ప్రశ్నలు అడగడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  స్థానికంగా ఉన్న నాయకుడి బలం.. పలుకుబడిని బట్టి మిగతా పార్టీలు అభ్యర్థులను నిలబెడుతుంటే వైసీపీ మాత్రం అందుకు భిన్నంగాప్రవర్తిస్తోంది. ఇంటర్వూలు పెడుతూ రోటీన్‌కు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఏది ఏమైనా వైసీపీ పార్టీ నేతల తీరు ఇలాగే ఉంటే పార్టీ తరపున పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రారనేది.. ఇంటర్వూలకు వస్తున్న వారి అభిమతం. పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

06:28 - December 15, 2015

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వీరు చర్చించారు. అనంతరం రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజనులకు వ్యతిరేకంగా చేపట్టిన బాక్సైట్ తవ్వకాలపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన తీవ్రతరం చేయనున్నట్లు రఘువీరారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా జనవరి 28, 29 తేదీల్లో విశాఖ మన్యంలో కాంగ్రెస్ నాయకులు, గిరిజన ఎంపీల బృందం పర్యటించాలని నిర్ణయించినట్లు రఘవీరా తెలిపారు.

పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలన్న రఘువీరా...
జగన్‌కి బాక్సైట్‌ మైనింగ్‌ ఆలోచన రాకముందే తాము గిరిజనుల హక్కుల కోసం పోరాడామని రఘువీరారెడ్డి చెప్పారు. ఒకరిని చూసి అనుసరించాల్సిన అవసరం తమకు లేదన్నారు. విజయవాడ కాల్ మనీ వ్యవహారం సభ్యసమాజం తలదించుకునేలా ఉందని రఘువీరారెడ్డి అన్నారు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని అన్నారు. న్యాయ విచారణ జరిపించి కాల్ మనీ స్కాంతో సంబంధం ఉన్న ఎంతటి వారినైనా వదలకుండా శిక్షించాలని రఘువీరా డిమాండ్ చేశారు.

అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి...
ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్‌ పేటెంట్‌ హక్కు అని చెప్పిన రఘువీరారెడ్డి పార్లమెంట్‌ సమావేశాలు ముగిసేలోపు సీఎం చంద్రబాబు అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకువెళ్లాలన్నారు. లేదంటే కాంగ్రెస్‌ పార్టీయే అన్ని రాజకీయపార్టీలను కలుపుకుపోయి ప్రధాని వద్దే ప్రత్యేక హోదా అంశాన్ని తేల్చుకుంటామని చెప్పారు. మొత్తానికి ఏపీలో కాంగ్రెస్‌ నేతలు మళ్లీ ఉనికి చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. 

06:24 - December 15, 2015

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు పార్టీ అధిష్టానం అక్షింతలు వేసింది. టీఆర్‌ఎస్‌లోకి పార్టీ నాయకులు వలసలను అరికట్టలేకపోతున్న టీ పీసీసీ తీరుపై కాంగ్రెస్‌ అధినాయకత్వం మండిపడినట్టు సమాచారం. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా తెలంగాణలో రోజు రోజుకు కాంగ్రెస్‌ బలహీనపడుతున్న వైనంపై ఏఐసీసీ ఆందోళన వ్యక్తం చేసింది. పార్టీ పటిష్టతకు చర్యలు తీసుకోవాలని టీ పీసీసీ నేతలను ఆదేశించింది.

డిగ్గీ రాజా క్లాసు...
అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీ వచ్చిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌ క్లాసు తీసుకున్నారు. ముఖ్యంగా పార్టీ నాయకులు టీఆర్‌ఎస్‌లోకి వలసపోతున్న అంశంపై ఆరా తీశారు. తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కార్యనిర్వహాక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, సీఎల్‌పీ నేత జానారెడ్డి, శానస మండలిలో కాంగ్రెస్‌ పక్ష నేత షబ్బీర్‌ అలీ, గ్రేటర్‌ హైదరాబాద్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దానం నాగేందర్‌, మెదక్‌ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కీ తదితరులతో దిగ్విజయ్‌ భేటీ అయ్యారు.

ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి...
స్థానిక సంస్థల కోటా నుంచి 12 మండలి స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో నామినేషన్లు వేసిన మెదక్‌, నిజామాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధులు చివరి నిమిషంలో ఉపసంహరించుకుని టీఆర్‌ఎస్‌లో ఎందుకు చేరారన్న అంశంపై దిగ్విజయ్‌ వివరణ కోరారు. ఫిరాయించే అభ్యర్థులను ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చిందని క్లాసు తీసుకున్నారు. ఇలాంటి వారి ఉద్దేశాలను ముందుగానే పసికట్టలేకపోయారా? అంటూ ఏఐసీసీ నేతలు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేయడంతో సమాధానం చెప్పలేక నీళ్లు నమలడం తెలంగాణ కాంగ్రెస్‌ నేతల వంతు అయ్యింది. అన్ని విషాయలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని టీపీసీసీ అధ్యక్షడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెబుతున్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సొంతంగానే పోటీ...
ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా తెలంగాణలో కాంగ్రెస్‌ బలహీనపడుతున్న అంశంపై అధిష్టానం దిగ్విజయ్‌ సింగ్‌ ఆరా తీశారు. కాంగ్రెస్‌ నేతలను ప్రజలు నమ్మడం లేదా? నాయకులే ప్రజలకు దూరంగా ఉంటున్నారా? లేక మరేమైనా కారణాలున్నాయా ? అని తెలుసుకున్నారు. తర్వలో జరుగనున్నజీహెచ్‌ఎంపీ ఎన్నికల్లో పార్టీ సన్నద్ధతపై సమీక్షించారు. గ్రేటర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దానం నాగేందర్‌.. జంటనగరాల్లో పార్టీ పరిస్థితిని వివరించారు. అంతా అనుకూలంగా ఉందని పార్టీ నేతలు చెప్పడంతో.. దిగ్విజయ్‌ సింగ్‌ విస్మయం వ్యక్తం చేశారు. వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నికల నుంచి కూడా ఇదే విషయం చెబుతున్నా... ఫలితాలు వేరుగా ఉంటున్నాయని దిగ్విజయ్‌సింగ్‌ అనడంతో... తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సొంతంగానే పోటీ చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. టీఆర్‌ఎస్‌లో చేరేందుకు దానం నాగేందర్‌ చేసిన ప్రయత్నం బెడిసికొట్టడంపై కూడా దిగ్విజయ్‌ సింగ్‌ ఆరా తీశారు. అధిష్టానం ధోరణి చూస్తుంటే.. తెలంగాణ కాంగ్రెస్‌లో కొన్ని మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. 

06:20 - December 15, 2015

విజయవాడ : విజయవాడలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా కల్తీ మద్యం, కల్తీ నెయ్యి విక్రయాలు, కాల్‌ మనీ వ్యవహారాలను ప్రస్తావించారు. కొంత మంది స్వార్ధపరులు, సంఘ విద్రోహ శక్తలుతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా స్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉంటే ఇలాంటి ఘటనలు జరిగేందుకు ఆస్కారం ఉండదన్నారు. ఇవి రాజధాని అమరావతి నిర్మాణంపై కూడా ప్రభావం చూపుతాయన్నారు. కాల్‌ మనీ బాధితులెవరూ డబ్బులు చెల్లించొద్దని చంద్రబాబు చెప్పారు.

15 శాతం వృద్ధి రేటు..
2018 నాటికి అమరావతిని పరిపాలనా నగరంగా సిద్ధం చేస్తామని చంద్రబాబు అన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సేవలు... ఈ మూడు రంగాలకు ప్రాధాన్యత ఇస్తూనే.. సమ్మిళిత వృద్ధి సాధించాలని అధికారులకు సూచించారు. మొదటి త్రైమాసికానికి 9.72 శాతం, రెండవ త్రైమాసికానికి 13.94 శాతం వృద్ధి సాధించామని.. ఈ రెండు త్రైమాసికాలలో కలిపి మొత్తం వృద్ధి రేటు 11.77 శాతంగా ఉందని తెలిపారు. రాష్ట్రం 15 శాతం వృద్ధి రేటు సాధించేలా కలెక్టర్లు కృషి చేయాలన్నారు.

బాబు పలు సూచనలు...
కలెక్టర్ల సమావేశంలో అధికారులకు చంద్రబాబు పలు సూచనలు చేశారు. ఆధ్యాత్మిక , సాంస్కృతిక, విద్య, వినోద, విజ్ఞాన, ఆహార ఫెస్టివల్స్ లాంటి 9 కార్యక్రమాలను 9 ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాల్లో నిర్వహించాలని సీఎం ఆదేశించారు. దుబాయి షాపింగ్ ఫెస్టివల్, సింగపూర్ షాపింగ్ ఫెస్టివల్ తరహాలో భారీ ఏర్పాట్లు చేయాలన్నారు. విశాఖ ఫెస్టివల్ కు కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. విశాఖ , విజయవాడ, తిరుపతి లలో ఫెస్టివల్స్ ఏడదంతా జరిగే విధంగా ప్లాన్ చేయాలన్నారు సీఎం. పర్యాటకరంగ అభివృద్దికి కలెక్టర్లు చొరవ తీసుకోవాలన్నారు.

మరో రెండు పోర్టల్స్...
ఈ సేవలో మరో రెండు పోర్టల్స్ ను ప్రారంభించామని చంద్రబాబు చెప్పారు. ఈ పోర్టల్స్ ద్వారా అన్ని రకాల ధృవీకరణ పత్రాలు నమోదు చేసుకోవచ్చని రాష్ట్ర స్థాయి నుండి గ్రామస్థాయి వరకు పలు పర్యాటక ప్రాంతాల చరిత్రను పొందుపరిచామన్నారు సీఎం. ఈ పోర్టల్ లో సమస్యల పరిష్కారానికి పోర్టల్ ను కేటాయించామని పెద్ద సమస్యలు అయితే 48 గంటలు, చిన్నసమస్యలు అయితే 24 గంటల్లో పరిష్కారించే దిశగా అధికారులు సిద్దంగా ఉండాలని ఆదేశించారు. రాష్ట్రంలోని పలు సమస్యల పరిష్కారం దిశగా అధికారులు అడుగులు వేసి జన్మభూమి - మా ఊరు కార్యక్రమానికి బాటలు వేయాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారం తర్వాతే గ్రామాల్లోకి వెళ్లాలన్నారు బాబు. మొత్తంగా పర్యాటక , సమస్యల పరిష్కార పోర్టల్స్ ముఖ్య ఉద్దేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు బాబు. 

06:17 - December 15, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నేడు గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఉదయం 11.30గంటల ప్రాంతంలో రాజ్ భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఫిర్యాదు చేస్తారు. ఇందులో ప్రధానంగా విశాఖ గిరిజనులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన బాక్సైట్ విధానంతోపాటు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన 'కాల్ మనీ' వ్యవహారం తదితర అంశాలున్నాయి. ముఖ్యంగా కాల్ మనీ సెక్స్ రాకెట్‌లో టీడీపీ ప్రజాప్రతినిధుల హస్తం ఉన్నట్లు కేసులు నమోదైనా వాటిని ముందుకు తీసుకెళ్లకుండా సీఎం పేషీ నుంచే పోలీసు అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని జగన్‌ గవర్నర్‌కు వివరించనున్నారు. 

06:16 - December 15, 2015

విజయవాడ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న కాల్‌మనీ వ్యవహారం అన్ని మలుపులూ తిరిగి ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. వందలాది కుటుంబాలను మనీ సాలెగూటిలో ఇరికించి ఆర్థికంగా శారీరంగా వాడుకున్నారు. కడితే డబ్బులైనా కట్టు లేదా శీలాన్నైనా సమర్పించు అంటూ కాల్‌ మనీ మాఫియా మహిళలతో లైంగికంగా ఆడుకుంది. అసలు విషయమేమంటే ఈ మాఫియాలోని పెద్దలంతా రాజకీయ నాయకులు కావడమే. వారంతా పెద్ద పెద్ద పదవుల్లో ఉంటూ అధికారాన్ని అండగా చేసుకుని కోట్లు కూడబెడుతున్నారన్నది ప్రతిపక్షాల ఆరోపణ. ఇంతకి ఈ వ్యవహారంలో ఉన్న పెద్దలు ఎవరు..? ఈ కాల్‌మనీ పాపంలో ప్రతిపక్ష నేతలకూ భాగముందా.?

రాజకీయ నాయకుల పేర్లు...
కాల్‌మనీ కోట్లాది రూపాయల వ్యవహారం తుట్టె కదులుతోంది. రోజులు గడిచేకొద్దీ రాజకీయ నాయకుల పేర్లు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. అధికార తెలుగు దేశం పార్టీని ప్రతిపక్షాల విమర్శలు జోరీగల్లా ముసురుకుంటున్నాయి. పది ఇరవై చొప్పున పెద్ద మొత్తంలో వడ్డీలు వేయడం డబ్బులు కట్టలేక అప్పు తీసుకున్నోడు చేతులెత్తేస్తే లైంగిక వేధింపులకు పాల్పడడం తదితర దారుణ చర్యలతో కాల్‌మనీ వ్యాపారులు కొన్నేళ్లుగా అరాచకాలకు పాల్పడుతున్నారు. కాల్‌మనీ గుట్టు రట్టయ్యే టైమ్‌ చివరికి వచ్చింది. అటుఇటు తిరిగి ఇప్పుడు అధికార పార్టీనేతల పేర్లు బయటకొస్తున్నాయి. కొందరు ప్రతిపక్ష నేతలపైన కేసులు బుక్‌ అవుతున్నాయి. కాల్‌ మనీ వ్యవహారంపై సిఎం చంద్రబాబు మాట్లాడుతూ అప్పులు తీసుకున్నవాళ్లెవరూ డబ్బు కట్టొద్దని సలహా ఇచ్చారు. దీన్లో ప్రమేయమున్నవారు ఎంతటివారైనా విడిచిపెట్టమంటున్నారు.

జగన్ లేఖ..
ఇన్నేళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని సిఎం ఎందుకు చూసీచూడనట్లు వదిలేశారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. రాజధాని ప్రాంతంలోనే ఈ తంతు ఇలా కొనసాగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టిడిపి ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సోదరుడు, తదితర పేర్లు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆ పాపంలో తనకు ప్రమేయం లేదన్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం చంద్రబాబే వాళ్లను వెనకేసుకొస్తున్నారని ఫైరవుతున్నాయి. ఏకంగా ఎమ్మార్వోపైనే చేయిచేసుకున్న చింతమనేని ప్రభాకర్‌ను బాబు వెనకేసుకొస్తున్నప్పుడు అధికార పార్టీ నేతలమీద సామాన్య ప్రజలు ఎలా ఫిర్యాదు చేస్తారని వైసిపి అధినేత జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. సిఎం చంద్రబాబుకు ఘాటుగా లేఖ రాశారు.

ఆరోపణలను ఖండించిన బోడే ప్రసాద్..
మీ వాళ్లను వెనకేసుకొస్తూ ప్రతిపక్షాల నేతలను ఈ కాల్‌మనీ వ్యవహారంలోకి గుంజుతున్నారని జగన్ విమర్శించారు. మరి ఈ మేటర్‌లో వైసిపి నేతలు ఎందరున్నారనేది చర్చనీయాంశమవుతోంది. నిందితుల్లో వైసిపికి చెందినవారు చాలామంది ఉన్నారని టిడిపి నేత అనురాధ ఆరోపిస్తున్నారు. ఇక తనపై వస్తున్న ఆరోపణలను పెనమలూరు టిడిపి ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ ఖండించారు. తన స్నేహితుడు వెనిగళ్ల శ్రీకాంత్‌ కాల్‌మనీ వ్యవహారంలో నిందితుడే అయినా తనకు ఈ కేసులో ప్రమేయం లేదన్నారు. టిడిపికి చెందిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాట్లాడుతూ తన సోదరుడికి ఈ వ్యవహారంలో హస్తమున్నా తనకు అతనికి సంబంధం లేదని డైరెక్ట్‌గా చెప్పారు. ఇక కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోనేరు రంగారావు బంధువు, ఇతరత్రా నేతల బంధువుల పేర్లూ బయటకొస్తున్నాయి. ప్రస్తుతం నిందితుల వేటలో పోలీసులు సమర్థవంతంగా వ్యవహరిస్తున్నారని ప్రశంసలు వస్తున్నాయి. అయితే పెద్దపెద్ద నేతలు అరెస్టవుతారా లేదా అన్నదే ప్రధాన అంశంగా మారుతోంది.

నేడు ధర్మశాలలో ఐసీసీ, బీసీసీఐ పర్యటన..

చండీఘడ్ : వచ్చే ఏడాది జరిగే టీ 20 ప్రపంచ కప్ మ్యాచ్ లకు అతిథ్యమివ్వనున్న పలు స్టేడియాలను ఐసీసీ, బీసీసీఐ తనిఖీలు చేపట్టింది. సోమవారం మొహాలీ స్టేడియాన్ని తనిఖీ చేసిన బృందం నేడు ధర్మశాలలో పర్యటించనుంది. 

ఐఎస్ఎల్ లో ఢిల్లీతో సెమిస్ నేడే..

మార్గవో : ఐఎస్ఎల్ లో గోవా జట్టుకిప్పుడు చావోరేవో పరిస్థితి. ఇప్పటికే తొలి అంచె సెమిస్ లో ఢిల్లీ చేతిలో ఓడిన గోవా రెండో మ్యాచ్ కు సిద్ధమైంది. మంగళవారం జరిగే రెండో సెమీస్ లో ఢిల్లీపై భారీ విజయంతో గెలిస్తేనే గోవాకు ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది. 

నేడే ఐపీఎల్ ఆటగాళ్ల డ్రాఫ్ట్..

ముంబై : ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణాల్లో చిక్కుకొని చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు రెండేడ్ల నిషేధం ఎదుర్కొనడంతో అనివార్యంగా వాటిస్థానాల్లో లీగ్ లోకి రెండు కొత్త జట్లు చేరాయి. లీగ్ లోకి కొత్తగా ప్రవేశించిన పుణె ఫ్రాంచైజీని కోల్ కతాకు చెందిన వ్యాపారవేత్త సంజీవ్ గొయెంక సంస్థ, రాజ్ కోట్ ఫ్రాంచైజీని ఇంటెక్స్ కంపెనీ సంస్థలు దక్కించుకున్నాయి. తాజాగా ఈ జట్ల కోసం ఆటగాళ్ల పంపకం మంగళవారం జరుగనుంది. 

రేపు కృష్ణా బోర్డు సమావేశం..

హైదరాబాద్ : కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం బుధవారం జరుగనుంది. ఈ మేరకు సమావేశానికి హాజరు కావాలని తెలుగు రాష్ట్రాలకు బోర్డు అధికారులు సమాచారం అందించారు. 

నేడు నగరంలో కేటీఆర్ పర్యటన..

హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం నగరంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పర్యటన కొనసాగనుంది.

 

రేపు ప్రధానితో నేతాజీ బంధువుల భేటీ..

కోల్ కతా : నేతాజీ మృతికి సంబంధించిన రహస్యాలను రష్యా బయటపెట్టేలా ప్రధాని చొరవ తీసుకోవాలని నేతాజీ బంధువులు కోరుతున్నారు. ఈ విషయమై వారు బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలువనున్నారు. 

Don't Miss