Activities calendar

24 December 2015

గుంటూరు నీటి ఎద్దడిపై జయదేవ్..మోదుగుల అత్యవసర భేటీ..

గుంటూరు : తాగునీటి కొరతపై కార్పొరేషన్ అధికారులతో ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే మోదుగలలు అత్యవసర భేటీ నిర్వహించారు. రేపటికల్లా నీటిని సరఫరా చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. 

గుంటూరులో నీటి ఎద్దడి..

గుంటూరు : నగరంలో నాలుగు రోజులుగా నీటి ఎద్దడి నెలకొంది. తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి సరఫరాకు కార్పొరేషన్ అధికారులు చేపట్టలేదు. తాత్కాలిక ట్యాంకర్లతో అరకొరగా నీటి సరఫరా జరుగుతోంది. ప్రకాశం బ్యారేజీలో నీరు అడుగంటిపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

అమరావతి ముసాయిదా మాస్టర్ ప్లాన్ సిద్ధం - నారాయణ..

గుంటూరు : అమరావతి ముసాయిదా మాస్టర్ ప్లాన్ సిద్ధమైందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. సింగపూర్ ఇచ్చిన మాస్టర్ ప్లాన్ కు సీఎం కొన్ని సూచనలు చేశారని తెలిపారు. రేపు రాత్రి ముసాయిదా మాస్టర్ ప్లాన్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు, 30 రోజుల వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామన్నారు. అనంతరం రైతులకు ప్లాట్ల కేటాయింపు చేస్తామన్నారు. 

క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్..

హైదరాబాద్ : పవిత్ర క్రిస్మస్ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల్లో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించేందుకు జీసస్ జీవితం స్పూర్తిగా నిలుస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు. 

అమీర్ ఖాన్ ఇంట్లో క్రిస్మస్ సందడి..

ముంబై : బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఇంట్లో క్రిస్మస్ సందడి నెలకొంది. తాతా (శాంటా) వేషంలో స్వయంగా అమీర్ ఖాన్ చిన్నపిల్లలకు చాక్లెట్లు...బహుమతులను అందచేశారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేశారు.

 

అరకు ఎంపీపై మావోయిస్టుల ఆగ్రహం..

విశాఖపట్టణం : అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై మావోయిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తపల్లి గీతపై బాక్సైట్ ఎజెంట్ అంటూ మావోయిస్టులు పోస్టర్లు విడుదల చేశారు. పెదబయలు ఏరియా కమిటీ నేత మంగన్న పేరిట పోస్టర్లు విడుదలయ్యాయి. కొత్తపల్లి గీతను ఏజెన్సీ నుండి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. 

21:29 - December 24, 2015

ఢిల్లీ : మాఫియా డాన్‌ దావుద్‌ ఇబ్రహీం రిటైర్‌ కాబోతున్నాడా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. శనివారం 60 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న దావుద్‌ ఇక మాఫియా కార్యకలాపాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాడట. తన స్థానంలో మరొకరికి బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. తన సోదరులలో ఒకరిని వారసుడిగా చేయొచ్చని, అందులో అనీస్ అహ్మద్‌కు అవకాశాలు ఎక్కువని తెలుస్తోంది. ఇక దావూద్ గ్యాంగులో అత్యంత కీలకమైన వ్యక్తి, గ్యాంగు సీఈవోగా చెప్పుకునే ఛోటా షకీల్‌కు అతడి స్థానం యథాతథంగా ఉంచుతారని సమాచారం. అయితే ఈ విషయాన్ని అత్యంత సీక్రెట్‌గా ఉంచుతున్నారు. డ్రగ్స్, బెట్టింగ్, హవాలా, ఆయుధాల స్మగ్లింగ్ లాంటి వ్యవహారాల ద్వారా 66 వేల కోట్ల రూపాయలను దావుద్‌ కంపెనీ సామ్రాజ్యం నడిపిస్తోంది. తన అనారోగ్యం కారణంగా డీ కంపెనీ కుప్పకూలకూడదని దావూద్ భావిస్తున్నట్లు తెలిసింది. రాబోయే రెండు మూడేళ్ల పాటు మాత్రమే తాను కూడా ఉండి.. వచ్చేవాళ్లకు కాస్త మార్గదర్శనం చేయాలన్నది దావూద్ ప్లాన్‌గా తెలుస్తోంది. 

21:28 - December 24, 2015

త్రిపుర : మున్సిపల్‌ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన వామపక్షాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. మొత్తం 19 మున్సిపాలిటీలను సిపిఎం గెలుచుకుంది. అగర్తాల మున్సిపల్ కార్పోరేషన్‌తో పాటు 13 పురపాలక సంస్థలు, ఐదు నగర పంచాయితీల్లో లెఫ్ట్‌ ఫ్రంట్‌ విజయ ఢంకా మోగించింది. డిసెంబర్‌ 9న ఎన్నికలు జరగగా, డిసెంబర్‌ 12న ఫలితాలు వెలువడ్డాయి. ఈ సందర్భంగా సిపిఎం విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. గ్రామీణ ప్రజలతో పాటు నగర ప్రజలు కూడా మాణిక్‌ సర్కార్‌ ప్రభుత్వంపై విశ్వాసంతో ఉన్నారనడానికి ఈ ఎన్నికలే నిదర్శనమని సిపిఎం నేతలు పేర్కొన్నారు.

21:28 - December 24, 2015

ఢిల్లీ : త్వరలో పార్లమెంటు సభ్యుల జీతభత్యాలు పెరగనున్నాయి. ప్రస్తుతం వారు పొందుతున్న జీత భత్యాలకంటే రెట్టింపు మొత్తంలో వారికి అందనున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఇప్పటికే ఆర్థికశాఖకు ప్రతిపాదన చేసినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఎంపీల నెలసరి జీతాలు రెట్టింపును ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఎంపీకి 50 వేలు చెల్లిస్తుండగా అది లక్షకు పెరగనుంది. నియోజకవర్గ అలవెన్సుల కింద 45 వేలు చెల్లిస్తుండగా దానిని 90 వేలు చేయనున్నారు. ఇతర అలవెన్సులతో కలిపి ఎంపీ నెలసరి వేతనం 2 లక్షల 80 వేలకు చేరనుంది. దీనికి ఆర్థిక శాఖ ఆమోదం లభించాల్సి ఉంది. 2010లో పార్లమెంటు సభ్యులకు జీతభత్యాలు పెంచారు.

21:24 - December 24, 2015

ఢిల్లీ : డిడిసిఎలో జరిగిని నిధుల దుర్వినియోగంపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీపై బహిరంగంగా వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ నుంచి సస్పెన్షన్ వేటుకు గురైన బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ మరోసారి ఘాటుగా స్పందించారు. నిజాలు చెప్పడమే తాను చేసిన నేరమా అని ప్రశ్నించారు. నా సస్పెన్షన్ కు గల కారణాలేంటో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాధానమివ్వాలని కీర్తి ఆజాద్‌ డిమాండ్ చేశారు. బిజెపి చీఫ్‌ తనకు జారీ చేసిన నోటీసులో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు తప్ప మరేమీ లేవన్నారు. తాను డిడిసిఎ అక్రమాలపై ప్రశ్నించినందుకే తనపై చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. నేను గత 9 ఏళ్లుగా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నానని ఆజాద్‌ స్పష్టం చేశారు.

ఆ ఫైళ్ల కోసమే సిబిఐ దాడులు..
జైట్లీని కాపాడేందుకే డిడిసిఏ ఫైళ్ల కోసం ఢిల్లీ సెక్రటేరియట్‌లో సిబిఐ దాడులు నిర్వహించిందని సిఎం కేజ్రీవాల్‌ గతవారం ఆరోపించారు. ముఖ్యమంత్రి కార్యాలయంపై దాడి చేసినట్టే డిడిసిఏపై సిబిఐ ఎందుకు దాడులు జరపడం లేదని కీర్తి ఆజాద్‌ ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా చేయడానికి డిడిసిఏ నుంచి రెండు బాక్సుల డాక్యుమెంట్లను తీసుకెళ్లారని ఆయన వెల్లడించారు.

బిజెపి సీనియర్ల భేటీ..
మరోవైపు బిజెపి సీనియర్ నేతలు అద్వాని, శాంతకుమార్, యశ్వంత్ సిన్హా ఢిల్లీలోని మురళీ మనోహర్‌ జోషి ఇంట్లో సమావేశమయ్యారు. కీర్తి అజాద్ సస్పెన్షన్‌ విషయంపై వారు మంతనాలు జరిపారు. డిడిసిఎ వ్యవహారంలో జైట్లీపై విచారణకే మార్గదర్శక మండలి మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. బిజెపికి చెందిన మరో సీనియర్‌ నేత సుబ్రహ్మణ్యస్వామి కూడా కీర్తి ఆజాద్‌కు అండగా నిలిచారు. నిజాయితీపరుడైన నేతను పార్టీ కోల్పోవద్దని ఆయన సూచించారు. డిడిసిఏ చీఫ్‌గా జైట్లీ 13 ఏళ్ల కాలంలో ఆర్థిక అక్రమాలు జరిగాయని కీర్తి ఆజాద్‌ సొంతపార్టీకి చెందిన మంత్రిపైనే బహిరంగంగా ఆరోపణలు చేయడంతో ఆయనపై సస్పెన్షన్‌ వేటు పడింది.

21:21 - December 24, 2015

మెదక్ : కేసీఆర్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అయుత చండీయాగం రెండో రోజు ఘనంగా ముగిసింది. ఎర్రవల్లి గ్రామం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. పుణ్యక్షేత్రాల్లో జరిగే జాతరను తలపిస్తోంది. చండీయాగానికి అనేకమంది ప్రముఖులు హాజరై అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ యాగానికి కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ సహా పలువురు ప్రజాప్రతినిధులు, ఆధ్యాత్మిక వేత్తలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు ప్రముఖులను కేసీఆర్‌ సాదరంగా ఆహ్వానించారు.

గులాబీ రంగు వస్త్రాలు..
ఇవాళ సీఎం కేసీఆర్ దంపతులు, రిత్విజులు గులాబీ రంగు వస్ర్తాలు ధరించి ఈ యాగంలో పాల్గొన్నారు. పలువురు మహిళలు అమ్మవారి కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. శృంగేరి రిత్విజులు ఇవాళ పలు రకాల యాగాలు, జపాలు, మంగళహారతులు నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ను శృంగేరి భావి పీఠాధిపతి విధుశేఖర భారతి ఆశీర్వదించారు. ఈ యాగానికి భక్త జనం తండోపతండాలుగా తరలి వచ్చారు. పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న దృష్ట్యా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. యాగానికి విచ్చేస్తోన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రసాదం, అన్నదానం వంటివి ఏర్పాటు చేశారు. 

21:18 - December 24, 2015

గుంటూరు : నవ్యాంధ్ర రాజధాని అమరావతి ముసాయిదా మాస్టర్‌ ప్లాన్‌ సిద్దమైందని మంత్రి నారాయణ తెలిపారు. అయితే సింగపూర్‌ ఇచ్చిన మాస్టర్‌ ప్లాన్‌కు సీఎం చంద్రబాబు కొన్ని సూచనలు చేశారన్నారు. రేపు రాత్రి ముసాయిదా మాస్టర్‌ప్లాన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామన్నారు. దీనిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే.. 30 రోజుల వరకు స్వీకరిస్తామని నారాయణ తెలిపారు. 

21:16 - December 24, 2015

హైదరాబాద్ : అసెంబ్లీ ప్రోసీడింగ్స్‌ సీడీలు మీడియాకు విడుదల చేసిన దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్న ప్రభుత్వ చీఫ్ విప్‌ కాల్వ శ్రీనివాసులు స్పీకర్‌ అనుమతితోనే సీడీలు రిలీజ్‌ చేశామని బాహాటంగా ప్రకటించగా, నేడు కాల్వ వ్యాఖ్యలను స్పీకర్‌ కోడెల ఖండించారు. తాను బహిర్గతం చేయమని ఎవరికీ చెప్పలేదని స్పీకర్‌ కోడెల ప్రకటించారు. దీంతో చీఫ్‌ విప్‌ కాల్వది అత్యుత్సాహమా.. లేదా.. వ్యూహమా అనేది తేలట్లేదు.

విభిన్న వాదనలు..
వైసీపీ శాసనసభ్యులు అసెంబ్లీలో చేసిన రగడ మీడియాకు విడుదల చేయడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. చీఫ్‌ కాల్వ శ్రీనివాసులు స్పీకర్‌ అనుమతితోనే సీడీలు మీడియాకు రిలీజ్‌ చేశామని తెలిపితే, స్పీకర్‌ కోడెల మాత్రం కాల్వ శ్రీనివాసులుకు బహిర్గతం చేయమని ప్రత్యేకంగా ఏమి చెప్పలేదని పేర్కొన్నారు. అలాగే తాను సీడిలు అన్ని పార్టీలకు ఇచ్చానని, వాటిని బహిర్గతం చేయడం చేయకపోవడం వారి ఇష్టమని తెలిపారు.

స్పీకర్ మీడియా సమావేశం..
ఇదిలా ఉంటే స్పీకర్‌ కోడెల నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాకు అసెంబ్లీ ఫుటేజీ అందడంపై వివరణ ఇచ్చారు. ప్రతిపక్ష వైసీపీ పార్టీ 18 తేదీ జరిగిన ప్రోసీడింగ్స్‌ టేపులు మొత్తం కావాలని కోరగా, సీడీల రూపంలో అన్ని పార్టీలకు అందజేశామని స్పీకర్ తెలిపారు. అంతేకాదు ప్రోసీడింగ్స్‌కు సంబంధించిన విషయాలు తెలుసుకోవడం సభ్యుల హక్కుగా పేర్కొన్నారు.

స్పీకర్ కు కాల్వ ఏమని వివరణనిస్తారు ?
కాగా అసెంబ్లీ ప్రోసీడింగ్స్‌ సోషల్‌ మీడియాలో రావడం దురదృష్టకరం అన్నారు. సభకు సంబంధించిన ఎలాంటి సమాచారం అయినా తన అనుమతితోనే బయటకు వెళ్తుందని స్పీకర్‌ తెలిపారు. కాగా సోషల్‌ మీడియాలో తన అనుమతి లేకుండా బహిర్గతం అయిన క్లిప్పింగ్స్‌పై విచారించేందుకు అన్ని పార్టీల సభ్యులతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇదిలా ఉంటే 18 తేదీ శాసనసభలో జరిగిన క్లిప్పింగ్స్‌ను మీడియాకు విడుదల చేయడంపై స్పీకర్‌ ప్రమేయం లేదని చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. స్పీకర్‌పై బురద జల్లే ప్రయత్నం చేయొద్దంటూ తెలిపారు. మొత్తానికి అసెంబ్లీ క్లిప్పింగ్‌లు మీడియా విడుదల చేయడంలో చీఫ్‌ విప్‌ చూపించిన అత్యుత్సాహంతో చివరకు స్పీకర్‌ వివరణ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. దీనిపై కాల్వ స్పీకర్‌కు ఏమని వివరణ ఇస్తారనేది తేలాల్సి ఉంది.     

21:01 - December 24, 2015

ఖండాలుగా చీలిపోయిన మనుషులను కలిపేది ఇప్పటికీ మతమేనని ఎందరో విశ్వసిస్తుంటారు. ప్రపంచంలోని అన్ని మతాల అభిమతం మాత్రం మానవళి సౌభాగ్యమే అన్నది అందరూ గట్టిగా నమ్ముతుంటారు. ఆ నమ్మకమే ఈ నాటికి అనేక దేశాల్లో అనేక మతాల విశ్వాసాల వెలుగులో పర్వదినాల సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. డిసెంబర్ నెల ప్రవేశించిందంటే ఇక ప్రపంచంలో క్రిస్మస్ వేడుకల ఆనందాల కోలాహాలం వర్ణించడానికి పదాలు చాలవు. అదే సమయంలో వెండితెరపై కూడా అనేక సినిమాలు క్రీస్తు జీవితాన్ని ఆయన బోధనల సారాంశాన్ని చూపుతూ వచ్చాయి. ఆ విశేషాలతో ప్రత్యేక కథనం.. క్రిస్మస్...క్రైస్తవులకు అతి ముఖ్యమైన పండుగ డిసెంబర్ 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఏస్తుక్రీస్తు జన్మదినాన్ని జరుపుకుంటుంటారు. ఏసు జన్మించి రెండు వేల సంవత్సరాలు దాటిపోయినా ఇప్పటికీ ఆయన్ను కరుణారసిమూర్తిగా, దయామూర్తిగా ప్రజలు ప్రార్థిస్తున్నారు.

భారీ చిత్రాలు...
హాలీవుడ్ అంటేనే భారీ చిత్రాలకు అడ్డాలాంటిది. క్రీస్తు పుట్టుక నుండి శిలువ వేసే వరకు ప్రతి ఘట్టాన్ని అనేక సినిమాలుగా తెరకెక్కించారు. వాటిలో అత్యంత భారీ బడ్జెట్ తో ఏళ్ల తరబడి తీసిన కళాఖండాలు కొన్ని నేటికి ప్రేక్షకులను అబ్బురపరుస్తూనే ఉన్నాయి. క్రీస్తు ప్రేమతత్వాన్ని బోధిస్తూ భక్తి భావాన్ని గుండెలో నింపుతూనే ఉన్నాయి. ఒక్కో మతానికి ఒక్కో జీవన విధానం ఉంటుంది. మత విలువల ఆధారంగా మత బోధనల ప్రభావంతో ఆయా మతస్తుల జీవితం ఉంటుంది. క్రైస్తవులకు క్రీస్తు పుట్టుక అతి ముఖ్యమైన పండుగ కావడంతో డిసెంబర్ మొదటి నుండే సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఈ వేడుకలతో కలిసి ఫన్..కామెడీ..డ్రామా..ఎలిమెంట్స్ తో అనేక సినిమాలు తెరకెక్కాయి.

ఓ పక్క వినోదం..మరో పక్క భక్తి..
హాలీవుడ్, బాలీవుడ్ లనే కాదు తెలుగులోనూ క్రీస్తు జీవితంపై అనేక సినిమాలు వచ్చాయి. వీటిని క్రిస్మస్ పర్వదినాన భక్తులు గుర్తు చేసుకోవడం సర్వసాధారణం. ఓ పక్క వినోదం..మరో పక్క భక్తి..రెండూ కలిసి పండుగ సంబరాలను రెట్టింపు చేస్తాయి.  ప్రపంచం అశాంతిగా ఉన్న ఈ తరుణంలో యుద్ధ మేఘాలు ఆవరిస్తున్న ప్రమాదకర పరిస్థితుల్లో శాంతి..సామరస్యాలు..దయా..క్షమాగుణాలు ఎంత ముఖ్యమో గుర్తించాల్సినవసరం ఉంది. దయామయుడిగా ప్రపంచానికి ప్రేమైక జీవనాన్ని బోధించిన క్రీస్తు జన్మదినం ప్రపంచానికి వేడుకలాంటిది. కానీ ఎన్ని వైరుఢ్యాలున్నా పరస్పర సహజీవనంతో సాగిపోవాలంటే ప్రజలంతా లౌకిక సూత్రాన్ని అనుసరించవల్సింటుదనేది నిజాన్ని కూడా గమనించాలి. క్రిస్మస్ సమయంలో యావత్తు ప్రపంచం ఈ నిజాన్ని గుర్తుంచుకొంటుందని ఆశిద్దాం..

గోదావరిఖణిలో 8మంది ముఠా సభ్యుల అరెస్టు..

కరీంనగర్ : గోదావరిఖనిలో ఎనిమిది మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ వజ్రాలు, నాణాలు, కరెన్సీని చలామణి చేస్తోంది.  

20:28 - December 24, 2015

చండీయాగానికి భారీగా వస్తున్న భక్తులు..అధికారులపై ఎమ్మెల్యే పుట్టా తీవ్ర ఆగ్రహం...జాతీయ గీతం ఆలపిస్తుండగా ప్రధాని మోడీ రెడ్ కార్పెట్ పై నడిచారు..మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ పుట్టిన వంగర గ్రామంలో సౌకర్యాల కరవు...కరీంనగర్ లో కొత్త సైకో...నకిలీ నెయ్యి తయారు చేస్తున్న వ్యక్తి అరెస్టు..వనపర్తిలో మహిళల చేతివాటం....ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

అమరావతి బృహత్ ప్రణాళికపై నోటిఫికేషన్ - నారాయణ..

గుంటూరు : అమరావతి బృహత్ ప్రణాళికపై సీఆర్డీఏ గురువారం రాత్రి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు. నోటిఫికేషన్ విడుదల తరువాత 30 రోజుల్లోగా ప్రజలు మార్పులు చేర్పులు సూచించవచ్చన్నారు. 

క్రైస్తవులకు బాబు శుభాకాంక్షలు..

హైదరాబాద్ : క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవులకు టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు క్రిస్మస్ శుభాకాంక్షలు పేర్కొన్నారు. 

భారత్ - రష్యా సంబంధాలు ధృడమైనవి - మోడీ..

రష్యా : భారత్ - రష్యా సంబంధాలు ఎప్పటి నుండో ధృడంగా ఉన్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. రష్యా పర్యటనలో ఉన్న ఆయన మాస్కోలో నిర్వహించిన భారత్ - రష్యా 16వ వార్షిక సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మోడీ పాల్గొన్నారు. 

వైకుంఠం క్యూ కాంప్లెక్సు వద్ద భక్తుల ఆందోళన..

చిత్తూరు : వైకుంఠం క్యూ కాంప్లెక్సు వద్ద శ్రీవారి భక్తులు ఆందోళన చేపట్టారు. ప్రత్యేక దర్శనం..సహస్ర దీపాలంకరణ సేవల టికెట్లు ఉన్నా దర్శనానికి అనుమతించకపోవడంతో భక్తులు ఆందోళనకు దిగారు.

 

పుట్టా మధు వ్యాఖ్యలను ఖండించిన టీజేఏసీ...

కరీంనగర్ : రెవెన్యూ అధికారులపై ఎమ్మెల్యే పుట్టా మధు వ్యాఖ్యలను టీజేఏసీ ఖండించింది. బంగారు తెలంగాణ కోసం కష్టపడి పనిచేస్తామని మాటలతో వేధిస్తే ఊరుకోమన్నారు. ఫోన్ చేసి పనులు చేయాలని ఆదేశిస్తే పనులు కావని, రాతపూర్వకంగా ఇస్తేనే చర్యలు తీసుకోగలమని వ్యాఖ్యానించారు. వచ్చే నెల రెండో తేదీన మంత్రి ఈటెలతో భేటీ అవుతామన్నారు. 

సీడీ విడుదలలో స్పీకర్ పాత్ర లేదు - కాల్వ శ్రీనివాసులు..

అనంతపురం : సీఎంపై రోజా అనుచిత వ్యాఖ్యలు చేసిన సీడీ విడుదల చేయడంలో స్పీకర్ పాత్ర లేదని చీప్ విప్ కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. సభలో జరిగిన వాస్తవాలు ప్రజల ముందుంచేందుకే ఆ సీడీని ప్రభుత్వమే విడుదల చేసిందన్నారు. 

19:35 - December 24, 2015

ఎంతో ఆవేదనతో విజయవాడ చేరుకున్న అంగన్ వాడీలు ముఖ్యమంత్రి ప్రకటనతో ఉపశమనం పొందారు. మరో నాలుగు నెలల్లో తమ జీవితాలు కాస్తంత ఒడ్డున పడతాయని ఆశించారు. కానీ, ఇంతలోనే ఆందోళన చేసినవారి మీద ప్రభుత్వం కన్నెర్ర చేయడం, విజయవాడ ఆందోళనలో పాల్గొన్నవారిని ఉద్యోగంలోంచి పీకేయాలంటూ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలివ్వడం ఏ రకంగానూ సమర్ధనీయం కాదనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై టెన్ టివి జరిగిన చర్చలో సుబ్బరావమ్మ (ఏపీ అంగన్ వాడీ వర్కర్స్ ప్రధాన కార్యదర్శి), రామకృష్ణ ప్రసాద్ (టిడిపి), బేబి రాణి (అంగన్ వాడీ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. 

ఏపీలో అంగన్ వాడీల ఆందోళన..

విజయవాడ : అంగన్ వాడీల తొలగింపు ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీలు ఆందోళనలు చేపట్టారు. లెనిన్ సెంటర్ లో ముఖానికి నల్లబట్టలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. చల్లపల్లిలో అంగన్ వాడీ తొలగింపు కాపీలను దహనం చేశారు. విశాఖపట్టణంలో అంగన్ వాడీల తొలగింపు జీవోకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. జగదాంబ సెంటర్ లో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు సాగాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు పాతబస్తీ సెంటర్ లో అంగన్ వాడీలు జీవో కాపీలను దగ్ధం చేశారు. ప్రకాశం జిల్లాలో మార్కాపురం, కనిగిరిలో అంగన్ వాడీలు ఆందోళన చేశారు.

 

ఢిల్లీ ప్రభుత్వం బాటలో బీహార్..

ఢిల్లీ : దేశ రాజధాని ప్రభుత్వం బాటలో బీహార్ పయనించబోతోంది. కాలుష్యం నియంత్రణకు డీజిల్ వాహనాలను నియంత్రించాలని సీఎం నితీష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. పాట్నాలో 15 ఏళ్ల సర్వీసు నిండి వాహనాలను అనుమతించలేదని నితీష్ స్పష్టం చేశారు.

సిక్కోలులో స్వల్ప భూ ప్రకంపనాలు..

శ్రీకాకుళం : జిల్లాలో పలుచోట్ల స్వల్ప భూ ప్రంకపనాలు చోటు చేసుకున్నాయి. సాయంత్రం 6.05 నిమిషాలకు లావేరు, రస్థలం, కొందూరులో నాలుగు సెకన్ల పాటు భూమి కంపించింది. 

ఆంధ్రా వర్సిటీ రిజిస్ట్రార్ కు స.హ. నోటీసులు..

విశాఖపట్టణం : ఆంధ్రా యూనివర్సిటీ రిజిస్ట్రార్, ప్రొ.జాన్ లకు సమాచార హక్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అక్రమ నియామకాల్లో వారం రోజుల్లోగా సమాచారం ఇవ్వనందుకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 29వ తేదీన హాజరు కావాలని ఆదేశాల్లో పేర్కొంది. 

కటారి హత్య కేసులో పదో నిందితుడు లొంగుబాటు..

చిత్తూరు : మేయర్ కటారి దంపతుల హత్య కేసులో మరో నిందితుడు లొంగిపోయాడు. టూ టౌన్ పీఎస్ లో 10వ నిందితుడు మొగిలి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. స్టేషణ్ ఎదుట మొగిలిపై కటారి అనుచరులు దాడికి యత్నించారు.

 

బాబును కలిసిన కొణతాల..

హైదరాబాద్ : సీఎం చంద్రబాబు నాయుడును మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కలిశారు. కొణతాల టిడిపి పార్టీలో చేరుతారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. 

18:30 - December 24, 2015

విశాఖపట్టణం : సీఎం చంద్రబాబు చేసేవన్నీ ప్రజా వ్యతిరేకమైనవేనని సీపీఎం విశాఖ జిల్లా కార్యదర్శి లోకనాథం పేర్కొన్నారు. జీవో 97 రద్దుపై ఎందుకు మాట్లాడటం లేదని చంద్రబాబును సీపీఎం ప్రశ్నిస్తోంది. గిరిజనులను విభజించి పాలించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని సీపీఎం నేతలంటున్నారు. ఇప్పటివరకు బాక్సైట్‌ ఉద్యమాలు నడిపిన సీపీఎం భవిష్యత్‌లో ఏం చేయబోతుంది ? గిరిజనులు సీపీఎం ఉద్యమంతో కలిసి వస్తారా లేక.. సర్కార్‌ అభివృద్ధి నినాదానికి మోసపోతారా? అనే అంశాల లోకనాథం మాట్లాడారు. అవినీతి అక్రమాలు జరుగుతున్నాయంటూ చెబుతూనే రద్దు చేయడం లేదన్నారు. అభివృద్ధి చేస్తామని చెప్పి పైపైన మెరుగులు చేయడం కరెక్టు కాదని, ప్రణాళికబద్ధంగా చేయడం లేదన్నారు. బాక్సైట్ తవ్వకాలు చేపట్టి అభివృద్ధి చేస్తామనడం బూటకమన్నారు. 

18:23 - December 24, 2015

విశాఖపట్టణం : నీ నగలు విడిపించా...మరినాకేంటి లాభం...అప్పుకు వడ్డీ ఇస్తే కుదరదు...ఇంకా ఏదో కావాలి...ఇస్తావా లేదా..? లేదంటే నీ డాక్యుమెంట్లు నా దగ్గర ఉన్నాయి..చెక్కులున్నాయి.. ఈ మాటలు వినగానే కాల్‌మనీ కాలనాగులే అనేది తెలుస్తుంది కదూ... కాని విజయవాడలో కాదు.. విశాఖలో... ఎందరో మహిళలను వేధిస్తున్న గుడివాడ రామకృష్ణ దొరికిపోయాడు.

వ్యాపారం అప్పులు ఇవ్వడం..
గుడివాడ రామకృష్ణ...ఉండేది విశాఖ నగరంలోనే... ఇతని వ్యాపారం అప్పులు ఇవ్వడం. కాల్‌మనీ రామకృష్ణగా పేరొందిన ఇతని అరాచకాలు ఒక్కొక్కటి వెలుగుచూస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం ఓ మహిళ తన బంగారం విడిపించేందుకు డబ్బు అవసరమై రామకృష్ణను కలిసింది. వెంటనే ఆమెకు డబ్బు ఇచ్చిన రామకృష్ణ ప్రామిసరీ నోట్లు..డాక్యుమెంట్లు తీసుకున్నాడు. నగలు విడిపించాక అసలు కథ మొదలుపెట్టాడు. ఆ ఇల్లాలి కష్టాన్ని తీర్చినట్లే తీర్చిన రామకృష్ణ ఇక ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. తనతో పాటు ఏకాంతంగా గడపకుంటే సమస్యలు వస్తాయంటూ బ్లాక్‌మెయిల్ చేసేవాడు. ఇలా ఎందరో ఆడాళ్లను మానసికంగా హింసిస్తున్న రామకృష్ణపై ఎంవీపీ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుసుకున్న రామకృష్ణ విశాఖ వదిలి పారిపోయాడు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిన పోలీసులు తిరుపతిలో అదుపులోకి తీసుకుని విశాఖకు తరలించారు. ఆ తర్వాత విచారిస్తే ఎన్నో నిజాలు తెలిశాయి. నిందితుని నుంచి మారణాయుధాలు, విలువైన ప్రతాలు స్వాధీనం చేసుకున్నారు.

విజయవాడలో..
విజయవాడలో కాల్ మనీ వ్యాపారం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుండి 452 ప్రామిసరి నోట్లు, 330 బ్లాంక్ చెక్కులు, 134 బ్యాంక్ పాస్ బుక్ లు, 158 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు 19 స్టాంప్ పేపర్లు, 1.60 లక్షలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. జిల్లాలోని పలువురి వద్ద అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఇతరుల ఇళ్లలో వడ్డీల కాగితాలను దాచిపెడుతున్న వారి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. కాలాంతకులు కిరాతకాలు బయటపడుతూనే ఉన్నాయి. బాధితుల ఫిర్యాదులతో పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించడంతో ఒక్కొక్కరూ పట్టుబడుతున్నారు.

18:19 - December 24, 2015

విశాఖపట్టణం : ఊహించని దారుణం జరిగింది...అప్పటివరకు చిన్నారి వస్తుందని ఎదురుచూస్తున్న ఆ కన్నవారికి కడుపుకోతే మిగిలింది.. నమ్మకంగా ఉంటూ..ఆ కుటుంబం బాధ్యతలను ఓ అన్నగా చూస్తున్నవాడే కిరాతకుడయ్యాడు.. రెండ్రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి చిట్టితల్లి దివ్యను బలితీసుకున్నాడా దుర్మార్గుడు. విశాఖపట్నం జిల్లా దేవరాపల్లిలో రెండ్రోజుల క్రితం అదృశ్యమైన ఏడేళ్ల చిన్నారి దివ్య ఆచూకీ దొరక్క పోలీసులు తలలు పట్టుకున్న సమయంలో ఓ సమాచారం దొరికింది. చిన్నారిని మామ వరుసయ్యే శేఖర్ తీసుకెళ్లినట్లు తెలియడంతో ఏ మాత్రం ఆలస్యం చేయని పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అనుమానమే నిజమైంది.. చిన్నారిని బలితీసుకున్నాడు శేఖర్. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం చెప్పాడు. తానే చంపేసి పడేసినట్లు చెప్పడంతో ఖంగుతిన్న పోలీసులు డెడ్‌బాడీ కోసం చెట్లు..పుట్టలు..గుట్టలు దాటి పరుగులు తీశారు. అప్పటివరకు చిన్నారి బతికే ఉందనుకున్నారు..శేఖర్ చెప్పిన మాటల్లో అనుమానం రావడంతో చిన్నారి సేఫ్‌గానే ఉందనకున్నా ఆ రాక్షసుడు చెప్పిందే నిజమైంది. శేఖర్‌ ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు రైవాడ రిజర్వాయర్ వెనుక వైపు ముళ్లపొదల్లోకి వెళ్లి గాలిస్తే చిట్టితల్లి దివ్య మృతదేహం కన్పించింది. మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని. పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు.

తమిళనాడు నుండి వలస..
తమిళనాడుకు చెందిన కొన్ని కుటుంబాలు కొన్నేళ్ల క్రితం విశాఖలోని దేవరాపల్లికి వచ్చి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. అందులో వేపాడ మురుగన్, ధనలక్ష్మి దంపతులు కూడా ఉన్నారు. వీరికి ఏడేళ్ల దివ్య, గణేష్ ఉన్నారు. కష్టం చేసుకునే మురుగన్‌ ఈ మధ్యకాలంలోనే ఒంగోలులో పనివస్తే వెళ్లాడు. వెళ్తూ వెళ్తూ దగ్గరి బంధువు శేఖర్ అలియాస్ తంబికి తన కుటుంబాన్ని అప్పగించాడు. వారి బాగోగులు చూసుకోవాలన్నాడు. స్థానిక ఉషోదయ కాన్వెంట్‌లో యూకేజీ చదువుతున్న చిన్నారి దివ్య మంగళవారం సాయంత్రం స్కూలు నుంచి ఇంటికి రాలేదు. ఈ క్రమంలోనే వారంతా కలిసి చిన్నారి కోసం గాలించి ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దివ్య కోసం అందరూ కలిసి వెతకగా జాడ తెలియకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇక దివ్య కోసం వెతుకుతుండగా తెలిసినవారు శేఖర్ చిన్నారితో కలిసి రిజర్వాయర్ గుట్టలవైపు వెళ్లినట్లు చెప్పారు. దీంతో కుటుంబీకులు పోలీసులకు ఆ సమాచారం చెప్పడంతో శేఖర్ చేసిన దారుణం బయటపడింది. 

స్పీకర్ పై అవిశ్వాస తీర్మానమివ్వడం తప్పు - పల్లె..

హైదరాబాద్ : స్పీకర్ కోడెలపై వైసీపీ అవిశ్వాస తీర్మానం ఇవ్వడం తప్పని మంత్రి పల్లె వ్యాఖ్యానించారు. ఆంధ్రా ప్రజల సమస్యల కంటే రోజాను శాసనసభ నుండి సస్పెండ్ చేసిన అంశమే ప్రతిపక్ష నేత జగన్ కు ముఖ్యమై పోయిందన్నారు. 

17:30 - December 24, 2015

ఖమ్మం : సివిల్ సప్లయి అధికారి రామకృష్ణ తమ లంచాల కోసం వేధిస్తున్నాడని ఖమ్మం జిల్లా ఇల్లందు టేకులపల్లి, గుండాల మండలాల రేషన్ డీలర్లు, సేల్స్ మెన్ లు ఇల్లందు తహశీల్దార్ ప్రకాష్ రావు కు ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ దాడులు చేయకుండా ఉండాలంటే రూ.5వేల రూపాయలు ఇవ్వాలంటూ రామకృష్ణ వేధించే వాడని రేషన్ డీలర్లు పేర్కొంటున్నారు. రేషన్ డీలర్ల ఫిర్యాదు మేరకు ఇల్లందు తహశీల్దార్ విచారణ జరిపారు. నివేదికను ఉన్నతాధికారులకు అందచేస్తామన్నారు. మరోవైపు గిట్టని వాళ్లు తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని రామకృష్ణ చెప్పుకొస్తున్నారు. 

17:25 - December 24, 2015

నిజామాబాద్ : ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చావ రవి డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉపాధ్యాయుల హెల్త్ కార్డులన్నీ ఆసుపత్రుల్లో అమలు చేయాలని, పడింట్ పీఈటీ టీచర్లను స్కూల్ అసిస్టెంట్ లుగా అప్ గ్రేడ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పీఆర్సీ బకాయిలను విడుదల చేయాలని, అన్ని పాఠశాలలో ఒకటో తరగతి నుండి ఇంగ్లీషు మీడియం విద్యను ప్రారంభించాలన్నారు. డీఎస్సీ నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని పేర్కొన్నారు. జనవరి 10,11వ తేదీల్లో యూటీఎఫ్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాలు నిజామాబాద్ లో నిర్వహిస్తున్నట్లు చావ రవి తెలిపారు. 

కీర్తి ఆజాద్ కు సుబ్రమణ్యస్వామి మద్దతు..

ఢిల్లీ : కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీపై అవినీతి ఆరోపణలు చేసి సస్పెండ్ కు గురైన బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్ కు మద్దతు ప్రకటించారు. ఢిల్లీ క్రికెట్ లో జరిగిన అవకతవకల గురించి మాత్రమే ఆజాద్ మాట్లాడారని, ఇందులో పార్టీకి వ్యతిరేకంగా ఏమి లేదన్నారు. 

ముగిసిన బీజేపీ సీనియర్ల భేటీ..

న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేతల భేటీ ముగిసింది. మురళిమనోహర్ జోషీ నివాసంలో బీజేపీ నేతలు యశ్వంత్ సిన్హా, ఎల్‌కే అద్వానీ, శాంతాకుమార్ తో పాటు పలువురు సీనియర్ నేతలు భేటీ అయ్యారు. పార్టీలో ఇటీవల పరిణామాలు, పార్లమెంట్ సమావేశాలు, ఎంపీ కీర్తి ఆజాద్ సస్పెన్షన్, డీడీసీఏ వ్యవహారంపై చర్చించినట్టు సమాచారం. 

16:37 - December 24, 2015

ఢిల్లీ : డీసీసీఏ అక్రమాలపై విచారణ జరిపించాలని ఏఐసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో అవినీతిని సహించేది లేదని పేర్కొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంత పార్టీ ఎంపీ కీర్తీఆజాద్ అవినీతిపై మాట్లాడితే ఎందుకు స్పందించడం లేదని, అవినీతిపై మోడీ మౌనం వీడాలని రాహుల్ పేర్కొన్నారు. మోడీ పట్ల ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోందని తెలిపారు. రాహుల్ తన సొంత నియోజకవర్గమైన అమేథీలో రెండు రోజుల పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్నారు. 

16:32 - December 24, 2015

ఢిల్లీ : బీజేపీ సీనీయర్ నేతలు మురళీ మనోహర్ జోషి నివాసంలో భేటీ అయ్యారు. వృద్ధనేత అద్వానీ, శాంతకుమార్, యశ్వంత్ సిన్హాలు ఈ భేటీకి హాజరయ్యారు. పార్టీ ఎంపీ కీర్తీ ఆజాద్ సస్పెండ్ పై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. డీసీసీఏ నిధులు దుర్వినియోగంలో కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ పాత్ర ఉందని కీర్తి ఆజాద్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. జైట్లీపై ఆరోపణలు చేసినందుకు బీజేపీ అధిష్టానం కీర్తి ఆజాద్ ను పార్టీని నుండి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. కీర్తీ ఆజాద్ కు సుబ్రమణ్యస్వామి మద్దతు పలికారు. తనకు నోటీసులు అందాయని, ప్రధాన మంత్రి మోడీ స్పందించాలని కీర్తి ఆజాద్ డిమాండ్ చేశారు. 

16:21 - December 24, 2015

మహబూబ్ నగర్ : కొంతమంది మహిళలు దుకాణాల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఎవరికీ తెలియకుండా దొంగతనాలకు పాల్పడుతున్నారు. నగరంలోని పలు బట్టల షాపుల్లో జరుగుతున్న దొంగతనాలతో యజమానులు ఆందోళన చెందారు. చివరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో వీరి గుట్టు రట్టైంది. వారు దొంగతనం ఎలా చేశారో వీడియోలో చూడండి. 

16:14 - December 24, 2015

హైదరాబాద్ : వరకట్న వేధింపులకు భరించలేక ఐదు నెలల గర్భిణీ మృతి చెందిన ఘటనలో భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతని వెనుక ఎవరున్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోస్టల్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగిగా పనిచేస్తున్న లక్ష్మీ ఐదు నెలల గర్భిణీ. గురువారం బేగంపేటోని నివాసంలో ఈమె ఆత్మహత్య చేసుకుంది. ఇందుకు వరకట్న వేధింపులే కారణమని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం వచ్చిన తర్వాత అదనపు కట్నం కావాలని యోగేష్ డిమాండ్ చేయడంతోనే తమ కూతురు చనిపోయిందని ఆరోపిస్తున్నారు. లక్ష్మీ ఆత్మహత్య విషయం తెలిసిన వెంటనే యోగేష్ తన సెల్ ఫోన్ తో కనిపించకుండా పోయాడు. ఇదిలా ఉంటే గాంధీ ఆసుపత్రి వద్ద మృతురాలు లక్ష్మీ బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నాలుగు నెలల క్రితం బేగంపేట పీఎస్ లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని, శ్రీమంతం చేసిన ఇంట్లో ఇలాంటి ఘటన చోటు చేసుకుందని ఊహించలేదని వాపోయారు. పోలీసులు చర్యలు తీసుకుంటే తమ కూతురు బతికేదని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

16:08 - December 24, 2015

తూర్పుగోదావరి : ఉన్మాది చేతికి ముగ్గురు బలయ్యారు. ఇద్దరు అక్కడికక్కడనే మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన కోరుకోండలో చోటు చేసుకుంది. మృతి చెందిన వారిలో వరుసకు వదిన, ఎంపీటీసీ సభ్యురాలు ఉన్నారు. వివరాల్లోకి వెళితే...ఆనంద్ అనే వ్యక్తి సొంత వదినయైన జ్యోతిపై గురువారం దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో జ్యోతి అక్కడికక్కడనే మృతి చెందింది. ఈ దురాఘాతాన్ని చూసి అడ్డుకోవడానికి యత్నించిన గడ్డం నాగభూషణంపైకి దాడికి దిగాడు. అతను కూడా మృతి చెందాడు. అనంతరం ఎంపీటీసీ సభ్యురాలు కుమారిపై కూడా దాడి చేసి పరారయ్యాడు. తీవ్రగాయాలైన కుమారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం కుమారి మృతి చెందింది. మరొకరు కూడా ఆసుపత్రిలో ప్రాణాలతొ కొట్టుమిట్టాడుతున్నట్లు సమాచారం. ఇంట్లో కుటుంబ..ఆస్తికి సంబంధించిన తగదాలు ఉండడంతో సొంత వదిన అయిన జ్యోతిని ఆనంద్ హత్య చేసినట్లు తెలుస్తోంది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

15:55 - December 24, 2015

సినిమాకు కథ... ఇంటికి పునాది లాంటిది. బేస్ మెంట్ బలంగా ఉంటే దానిపై కోట కట్టొచ్చు. అలాగే మూలకథ బాగుంటే...దానిపై రెండున్నర గంటల పాటు ఎన్ని విన్యాసాలైనా చేయొచ్చు. స్టోరీ లేకుండా స్టంట్స్ చేస్తేనే...ఆ సినిమా ప్రేక్షకులు భరించలేనట్లు తయారవుతుంది. 'గోపీచంద్' కొత్త సినిమా 'సౌఖ్యం'...ఇలాంటి ఫీట్లనే చేస్తూ...చూసే జనాలను అనేక పాట్లకు గురి చేసింది. పైగా రచయిత బుర్రకు తోచిన ట్విస్టులు స్క్రీన్ ప్లే లో చేర్చి వరస్ట్ ఫిల్మ్ చేసేశాడు.

కథ..
తనకు కథలను సెలెక్ట్ చేసుకోవడం రాదని హీరో 'గోపీచంద్' మరోసారి ఫ్రూవ్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని అతను గతంలోనే ఒప్పుకున్నా...'సౌఖ్యం' సినిమా ఎవర్ గ్రీన్ ఎగ్జాంపుల్ గా నిలుస్తుంది. 'సౌఖ్యం' కథ గురించి చెప్పాలంటే...ఓ పెద్ద ఫ్యామిలీ...అందులో ఏ బాధ్యతా లేకుండా తిరిగే కుర్రాడు 'గోపీచంద్'. ఓసారి ట్రైన్ లో హీరోయిన్ 'రెజీనా'ను చూసి లవ్ లో పడిపోతాడు. ప్రపోజ్ చేస్తాడు. మనం నిజంగా కలవాలని ఉంటే కలుస్తాం అని చెప్పి వెళ్లిపోతుంది 'రెజీనా'. ఆమె తండ్రి పీఆర్...కలకత్తా లో పెద్ద డాన్. ఈ డాన్ కు హైదరాబాద్ లో ఉండే మరో రౌడీ 'ప్రదీప్ రావత్' కి శత్రుత్వం ఉంటుంది. 'ప్రదీప్ రావత్' కొడుకుని ఓ సందర్భంలో హీరో చితక్కొడతాడు. దీంతో 'గోపీచంద్' కోసం 'ప్రదీప్ రావత్' వేట మొదలుపెడతాడు. ఈ క్రమంలో 'గోపీచంద్' సత్తా చూసిన రావత్....పీఆర్ ను ఢీ కొట్టగలవాడు ఇతడే అని ఫిక్స్ అవుతాడు. చిన్న నాటకం ఆడి....వీళ్లిద్దరు గొడవపడేలా చేస్తాడు. హీరోయిన్ పీఆర్ కూతురు అన్న విషయంలో ఈ సందర్భంలోనే తెలుస్తుంది. మరి కలకత్తాలో అంత పెద్ద డాన్ కూతురుని హీరో ఎలా కలుసుకున్నాడు. ఇక్కడ విలన్ల ప్లాన్స్ ఎలా తిప్పికొట్టాడనేది మిగిలిన వ్యథ...సారీ కథ.

నటీ నటుల అభినయం..
'సౌఖ్యం' లో ఏ 'సౌఖ్యం' లేదని...థియేటర్లో సినిమా మొదలైనప్పటి నుంచే తెలిసిపోతుంది. హీరో ఇంట్రడక్షన్ నుంచి...హీరో హీరోయిన్ లవ్ ట్రాక్, ఫ్యామిలీ మెంబర్స్ ప్రవర్తన, విలన్ల వేషాలు...ఒక్కటీ కన్విన్సింగ్ గా ఉండదు. ప్రతి పాత్ర అతిగా ప్రవర్తిస్తుంటుంది. తన ఇష్టాల కోసం ఇంట్లో వాళ్లను కూడా బకరా చేయడం ఏం కామెడీనో రైటర్ శ్రీధర్ కే తెలియాలి. ఇక స్క్రీన్ ప్లే రాసిన కోన వెంకట్, గోపీ మోహన్...ఉన్న కాస్త కథను మరింత గందరగోళం చేసేశారు. సోలోగా 'పిల్లా నువ్వు లేని జీవితం' సినిమాను హిట్ చేసుకున్న డైరక్టర్ ఏఎస్ రవికుమార్....'సౌఖ్యం'తో మళ్లీ ట్రాక్ తప్పాడు. అనూప్ తన కెరీర్ లోనే ఇలాంటి వరస్ట్ ఆల్బమ్ చేసి ఉండడు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ నేలబారుగా ఉన్నాయి. సీఎంతో వియ్యం అందుకునే ఓ డాన్ ఇళ్లు....అద్దె ఇల్లులా ఉంటుంది. సింగిల్ బెడ్ రూం పోర్షన్ లా....పల్లెటూళ్లో పెద్ద పెంకుటిల్లులా. ఫిల్మ్ మేకింగ్ ఖర్చు విషయంలో ఇలా నడిచింది నిర్మాతల వ్యవహారం. శ్రీను పాత్రలో 'గోపీచంద్', శైలజా క్యారెక్టర్ లో 'రెజీనా' యావరేజ్ ఫెయిర్ గా నటించారు. విలన్లు 'ప్రదీప్ రావత్', 'అవినాష్' లకు నటించేందుకు ఏం లేదు. ఫృథ్వీ, బ్రహ్మానందం, జయప్రకాష్, సప్తగిరి, పోసాని, రఘుబాబు...ఇలా కాస్టింగ్ పేర్లు బాగున్నా...ఒక్క క్యారెక్టర్ బలంగా లేదు. టైటిల్ , ట్రైలర్స్ చూసి ఫ్యామిలీ కథ అనుకుంటే పొరపాటే...ఇంటర్వెల్ నుంచి డబుల్ మీనింగ్ డైలాగులతో నింపేశారు. ఇక క్లైమాక్స్ వచ్చేసరికి థియేటర్లో ప్రేక్షకులు పారిపోవడం కనిపించింది. చివరిదాకా సినిమా చూడలేక జనాల హాహా కారాలు వినడం చూడాలని ఉంటే ఓసారి 'సౌఖ్యం' చూడండి అనేది ఇప్పటికే ఈ సినిమా బారినపడ్డ వాళ్ల మాట.

ఫ్లస్ పాయింట్స్...
ఏమీ లేవు.
మైనస్ పాయింట్…
మొత్తం సినిమా.

రహదారుల నిర్మాణాలపై బాబు సమీక్ష..

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారుల నిర్మాణాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. జనవరి 31వ తేదీలోపు అన్ని రహదారులపై ఉన్న గుంతలపూడిక, ఇతర మరమ్మత్తులు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కేంద్ర మంత్రి గడ్కరికి ఇవ్వాల్సిన ప్రాజెక్టుల నివేదికలు డీపీఆర్ లను సిద్ధం చేయాలని, దుర్గగుడి ఫ్లై ఓవర్ ను కృష్ణా పుష్కరాలలోపు పూర్తి చేయాలని సూచించారు. రహదారుల నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంక్, జైకా నుండి నిధుల సమీకరణను పరిశీలించాలని, గ్రామీణ రహదారుల నిర్మాణం, నిర్వాహణకు నాబార్డు నిధులను ఉపయోగించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని బాబు ఆదేశాలు జారీ చేశారు. 

దత్తత గ్రామంలో జేపీ పర్యటన..

అనంతపురం : దత్తత గ్రామం రుద్రంపేటలో లోక్ సత్తా అధినేత జేపీ పర్యటించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, మురుగునీరు సమస్యలతో పాటు ఇతర సమస్యలను జేపీ దృష్టికి మహిళలు తీసుకొచ్చారు. 

చైనాలోని పది నగరాల్లో రెడ్ అలర్ట్..

చైనా : పది నగరాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. వాతావరణ కాలుష్యం భారీగా పెరిగిపోవడంతో పది నగరాల్లో పొల్యూషన్ రెడ్ అలర్ట్ ను అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

15:39 - December 24, 2015

అనేక కారణాలతో ఎంతో మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. మరి సంతాన లేమి అంటే ఏమిటి ? సమస్యను గుర్తించటమెలా ? పరిష్కారమార్గాలేమిటో మానవి హెల్త్ కేర్ లో వైద్యులు విశ్లేషించారు. వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

15:31 - December 24, 2015

ఢిల్లీ : దేశ రాజధానిలో సరి, బేసి నెంబర్ల ఆధారంగా వాహనాల రాకపోకలకు రంగం సిద్ధమవుతోంది. జనవరి 1నుంచి 15వరకూ ట్రయల్‌ రన్‌ నిర్వహించబోతోంది ఢిల్లీ ప్రభుత్వం. ఆ తర్వాత పూర్తిస్థాయిలో అమలు చేయనుంది. నిబంధనలు అతిక్రమిస్తే 2వేల రూపాయలు ఫైన్‌ కట్టాలంటూ ఆర్డర్ పాస్ చేసింది. ఆదివారం ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేసింది సర్కారు. రాష్ట్రపతి, ప్రధాని వాహనాలు..అంబులెన్స్, ఫైరింజన్‌లకు ఈ రూల్‌ వర్తించదని తెలిపింది. సీఎం వాహనమైనా ఈ నిబంధన పాటించాల్సిందే అన్నారు కేజ్రీవాల్‌. ముందు కార్లకు..ఆ తర్వాత టూవీలర్లకు ఈ నిబంధనలు వర్తింపజేసేలా చర్యలు చేపట్టింది ప్రభుత్వం. కాలుష్యం తగ్గించేందుకు రిజిస్ట్రేషన్‌ నెంబర్లలో చివరి సంఖ్య ఆధారంగా సరి, బేసి రూల్‌ ప్రవేశపెట్టింది కేజ్రీవాల్‌ సర్కారు.

15:26 - December 24, 2015

రంగారెడ్డి : జిల్లా రాజేంద్రనగర్‌లో క్రిస్టమస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. ఓఫిర్‌ మినిస్ట్రీన్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. క్రీస్తు అవతరించి తీరును నృత్యాలతో చిన్నారులు వివరించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కేక్‌ కట్‌చేసి అందరికీ సంస్థ అధ్యక్షుడు రంజిత్‌ ఓపిర్‌ శుభాకాంక్షలు తెలిపారు. 

15:16 - December 24, 2015

విశాఖపట్టణం : స్టీల్ ప్లాంట్ గ్రీన్ బెల్ట్ భూములకు రెక్కలొచ్చాయి. పర్యావరణ పరిరక్షణ కోసం కేటాయించిన ఈ భూముల్లో మొక్కలు నాటుతున్నామంటూ ప్రకటించిన మాటలు కాగితాలకే పరిమితమయ్యాయి. రాజకీయ ప్రోద్బలంతో ఇప్పుడు భూములు అన్యుల చేతికి చేరాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణ సమయంలో పర్యావరణ సమతుల్యత కోసం గ్రీన్ బెల్ట్ ఏర్పాటుకు వందల ఎకరాలు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ కు అప్పగించింది. అయితే ఇక్కడ చెట్ల పెంపకం సంగతేమో కానీ... ఇప్పుడా భూములపై కబ్జారాయుళ్ల కన్నుపట్టింది. గాజువాక అగనంపూడి సమీపంలోని డొంకాడ గ్రామంలో సర్వే నెంబరు 207లోని 4 ఎకరాల గ్రీన్ బెల్ట్ భూములు ఆక్రమణకు గురయ్యాయి. ఈ ఆక్రమణల వెనక గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అనుచరుల హస్తముందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో వెనుకా ముందు చూడకుండా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేసారు అధికారులు. 2012 లోనే రాజకీయనేతల ప్రోద్భలంతో ఈ భూములు ఆక్రమణకు గురి కావడంతో అప్పటి కలెక్టర్ సీరియస్ గా పరిగణించి స్టీల్ ప్లాంట్ భూసేకరణ విభాగం డిప్యుటీ కలెక్టర్ ను సస్పెండ్ చేసారు. తిరిగి టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్రమణదారులు మళ్లీ రెచ్చిపోయారు. స్టీల్ ప్లాంట్ భూముల ఆక్రమణలపై స్టీల్ కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు పరిపాలన భవనం ఎదుట ధర్నా నిర్వహించారు. గ్రీన్ బెల్ట్ భూములకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేసారు. స్టీల్ ఫ్లాంట్ భూములు ఇంత పక్కాగా ఆక్రమణలు జరుగుతున్నా అధికారులు స్పందిచడంలేదు. ఆక్రమణదారుల పట్ల అధికారుల మెతకవైఖరి వల్లే ఈ సమస్యలు వస్తున్నాయని విశాఖ వాసులు ఆరోపిస్తున్నారు.

నిరుద్యోగ యువతకు రుణాలు - ఈటెల..

కరీంనగర్ : లక్ష మంది నిరుద్యోగ యువతకు రుణాలు ఇవ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఈటెల పేర్కొన్నారు. రుణాలను సబ్సిడీ కోసం కాకుండా ఉపాధి కోసం ఉపయోగించుకోవాలని సూచించారు. రామగుండం జిల్లా ఏర్పాటు ప్రతిపాదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళుతానని ఈటెల తెలిపారు. 

15:00 - December 24, 2015

నేరస్థుడి వయసుతో ముడిపడి న్యాయస్థానం తీర్పు చెప్పాలా? లేక నేరానికి తగినట్టుగా శిక్షలుండాలా? గత వారం రోజులుగా జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చ ఇది. మొత్తానికి ఈ చర్చకు పార్లమెంట్ ఓ ముగింపు పలికింది. ఎట్టకేలకు జువెనైల్ జస్టిస్ చట్టానికి సవరణ చేసింది. దీనిపై ప్రత్యేక కథనం..నిర్భయ ఘటన, భారత చరిత్రలో ఎప్పటికీ ఒక చారిత్రక పరిణామమే. ఈ తర్వాత వెలువెత్తిన ఉద్యమాలు, భావోద్వేగాలు దేశంలో, రెండు ప్రధాన చట్టాల్లో కీలక మార్పులను తీసుకొచ్చాయి. నిర్భయ పై జరిగిన లైంగికదాడిలో న్యాయస్థానం వెలువరించిన తీర్పు, అనంతర పరిణామాలు, న్యాయశాస్త్ర చరిత్రలో ఒక ప్రత్యేకతను మాత్రం సంతరించుకుంటాయి. అయితే అదే సమయంలో నేరప్రవృత్తి కలిగిన వారిలో మార్పు కోసం కూడా కృషి జరగాల్సిన అవసరముంది. 

14:37 - December 24, 2015

కరీంనగర్ : మంత్రి ఈటెల సమక్షంలో హౌజింగ్ పై నిర్వహించిన సమీక్ష సమావేశం వాడివేడిగా జరిగింది. రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యేల మాట వినడం లేదని జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు మంత్రి ఈటెలకు విన్నవించుకున్నారు. అవినీతికి అండగా నిలుస్తూ జిల్లా కలెక్టర్ అండదండలతో తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు ఆందోళన వ్యక్తం చేశారు. తమపై మంత్రికి ఫిర్యాదు చేయడంతో జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ , ఎమ్మార్వోలు అధికారుల తీరుకు ఎమ్మెల్యేలే కారణమంటూ మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో సమీక్ష సమావేశం కాస్త ఫిర్యాదుల సమావేశంగా మారిపోయింది. 

14:35 - December 24, 2015

విజయవాడ : కాల్ మనీ వ్యాపారం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుండి 452 ప్రామిసరి నోట్లు ,330 బ్లాంక్ చెక్కులు, 134 బ్యాంక్ పాస్ బుక్ లు, 158 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నమని డీసీపీ తెలిపారు. దాంతో పాటు 19 స్టాంప్ పేపర్లు, 1.60 లక్షలు స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. జిల్లాలోని పలువురి వద్ద అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఇతరుల ఇళ్లలో వడ్డీల కాగితాలను దాచిపెడుతున్న వారి ఇళ్లలో సోదాలు నిర్వహించి స్వాధీనం చేసుకున్నామని డీపీసీ తెలిపారు. 

14:33 - December 24, 2015

విశాఖపట్టణం : కాల్‌మనీ కేసులో కీలక నిందితుడు రామకృష్ణను విశాఖలో మీడియా ముందు ప్రవేశపెట్టారు పోలీసులు.. రామకృష్ణపై వివిధ సెక్షన్లకింద కేసులు నమోదు చేశామని తెలిపారు.. నిరుపేదలకు అప్పులు ఇచ్చి... ఆ నగదు చెల్లించాలంటూ ఈ నిందితుడు వేధించేవాడని పోలీసులు తెలిపారు.. డబ్బు కట్టినా ప్రామిసరీ నోట్లు, డాక్యుమెంట్లు ఇవ్వకుండా తిప్పించుకునేవారని చెప్పారు... ముఖ్యంగా మహిళలను బ్లాక్‌మెయిల్‌ చేసేవాడని పోలీసులు వివరించారు..రామకృష్ణపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఒక టీం ఏర్పాటు చేసిన వివిధ ప్రాంతాల్లో గాలింపులు చేసినట్లు తెలిపారు. ఇతని ఇంటి దగ్గర 37 చెక్స్, 39 ప్రామిసరీ నోట్లు, 4 కత్తులు, ఎల్ ఐసీ బాండ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 

14:25 - December 24, 2015

కరీంనగర్ : కన్నవారి పర్యవేక్షణ లోపం ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది.. ఎదిగిన కూతుళ్లు..కుర్రాళ్లు ఏం చేస్తున్నారు..? ఎటు వెళ్తున్నారు..? కాలేజీలకు సరిగా వెళ్తున్నారా..? లేదా..? చదువుతున్నారా లేదా..? ఈ విషయాలను పట్టించుకోపోవడంతో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి... కరీంనగర్‌లో కొడుకు నిర్వాహంతో తల పట్టుకున్న ఓ తండ్రి కథను చూడండి.
జల్సాల కోసం పడరాని పాట్లు..
ఇతను రాజు...ఆ పక్కనే తలదించుకున్న ఇతను ప్రశాంత్.. రాజు కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌ చెందినవాడు.. డిగ్రీ చదువుతున్నాడు..ఇక కోరుట్లకు చెందిన ప్రశాంత్‌తో రాజుకు పరిచయం ఏర్పడ్డంతో ఇద్దరూ స్నేహితులయ్యారు.. జల్సాలు చేయడం మొదలుపెట్టారు....
జల్సాలు చేసేందుకు అప్పులు
ప్రశాంత్, రాజులు కలిసి జల్సాలు చేసేందుకు అప్పులు చేశారు..ఆ డబ్బుతో జల్సాలు చేశారు.. ఇక అప్పులు తిరిగి ఇచ్చేందుకు మాత్రం డబ్బు కోసం మరో అప్పు కోసం ప్రయత్నం చేసినా దొరక్కపోవడంతో స్వంత ఇళ్లలోనే బంగారం మాయం చేయడం మొదలు పెట్టారు...ముందుగా అప్పులు తీర్చారు..ఆ తర్వాత అప్పులు చేశారు.. బంగారం అమ్మేసి బైక్‌లు కొన్నారు.. వచ్చిన డబ్బుతో జల్సాలు చేశారు..
కాలేజీ మానేసి బార్ల వెంట
ఇలా వీరిద్దరూ కాలేజీ బాట మానేసి బార్ల వెంట నడిచారు.. స్వంత ఇంట్లోనే కన్నం వేస్తూ బంగారం మాయం చేయడం మొదలుపెట్టారు.. చేసిన అప్పులు తీర్చిన మిత్రులు ఆ తర్వాత బంగారం అమ్మేసి జల్సాలు చేస్తూనే ఉన్నారు.. ఇలా తన ఇంట్లో ఐదు తులాల బంగారం మాయం కావడంతో రాజు తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.. విచారిస్తే ఇంకేముంది ఇంటి దొంగేనని తేలింది..వెంటనే రాజు,ప్రశాంత్‌లను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి 15 తులాల బంగారం రికవరీ చేశారు...
కోరుట్ల పోలీసు స్టేషన్లో సైతం కన్నం
కోరుట్ల పోలీసు స్టేషన్లో సైతం వీరిద్దరూ కన్నాలేసిన కేసులున్నట్లు పోలీసులు చెబుతున్నారు.. కన్నవారి పర్యవేక్షణ లేకపోవడంతో దారి తప్పిన కుర్రాళ్లు కటకటాలపాలయ్యారు..కన్నవారికి తలవంపులు తెచ్చారు...

 

14:25 - December 24, 2015

తూర్పుగోదావరి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఉన్మాది వీరంగం సృష్టించాడు. సొంత వదినను హత్య చేయడమే కాకుండా మరో ఇద్దరిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన కోరుకొండలో చోటు చేసుకుంది. ఆనంద్ అనే వ్యక్తి సొంత వదినయైన జ్యోతిపై గురువారం దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో జ్యోతి అక్కడికక్కడనే మృతి చెందింది. ఈ దురాఘాతాన్ని చూసి అడ్డుకోవడానికి యత్నించిన గడ్డం నాగభూషణంపైకి దాడికి దిగాడు. అతను కూడా మృతి చెందాడు. అనంతరం ఎంపీటీసీ సభ్యురాలు కుమారిపై కూడా దాడి చేసి పరారయ్యాడు. తీవ్రగాయాలైన కుమారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంట్లో కుటుంబ..ఆస్తికి సంబంధించిన తగదాలు ఉండడంతో సొంత వదిన అయిన జ్యోతిని ఆనంద్ హత్య చేసినట్లు తెలుస్తోంది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

14:19 - December 24, 2015

ఢిల్లీ : రైల్వే శాఖ తత్కాల్ టికెట్ల ఛార్జీలను భారీగా పెంచేసింది. ఇప్పటికే పలుమార్లు ప్లాట్ ఫామ్, ఎక్స్ ప్రెస్ ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ మరోసారి  ఛార్జీలను పెంచింది.  స్లీపర్ క్లాస్ తత్కాల్ బుకింగ్ ఛార్జీ గతంలో 175 ఉండగా ఇప్పుడు దాన్ని 200 కు పెంచారు. థర్డ్ ఏసీ ఛార్జీని 350 నుంచి 400 పెంచారు. స్లీపర్ ఛార్జీ కనీస ధర 90 రూపాయలు ఉండగా దాన్ని 100 రూపాయలకు పెంచుతూ రైల్వే శాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఛార్జీలు రేపటి నుండి అమలులోకి రానున్నాయి. 

 

14:18 - December 24, 2015

హైదరాబాద్ : తాను ఏ పార్టీకి వత్తాసు పలుకనని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ వెల్లడించారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ అసెంబ్లీ జరిగిన తీరు..సీడీల బహిర్గతం తదితర అంశాలపై ఆయన మాట్లాడారు. సీడీలు బహిర్గతం చేయమని తాను చెప్పలేదని వివరించారు. సోషల్ మీడియాలో దృశ్యాలు వచ్చిన తరువాతనే సీడీలను కావాలని వివిధ పక్షాలు కోరిన మీదట, తన ప్రమేయం లేకుండానే వాటిని విడుదల చేశారని చెప్పుకొచ్చారు. వాటిని బహిర్గతం చేయమని, చేయవద్దని కానీ తాను ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదన్నారు. విడుదల చేయకుండానే బయటకు వచ్చిన దృశ్యాలపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 

సభా కార్యక్రమాలు అడ్డుకోవడం సరికాదు..
తాను చిత్తశుద్ధితో పనిచేస్తున్నానని, చిన్నమాట దొర్లినందుకు పార్లమెంట్ స్పీకర్ క్షమాపణలు చెప్పారని గుర్తు చేశారు. తనపై అవిశ్వాస తీర్మానం ఇచ్చారని, తన బాధ్యత ఎంత వరకు ఉన్నదో అంత వరకు నిర్వహిస్తానన్నారు. ఒక వర్గానికి కొమ్ము కాయాల్సినవసరం తనకు లేదన్నారు. సభా కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదని, ఏ పార్టీయైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.

రోజా సస్పెన్షన్ అంశంపై కమిటీ...
చాలా సార్లు సర్దిచెప్పినా వినకపోవడంతో చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఘటన జరిగిన తీరుపై వారు తన దగ్గరకు వచ్చి పశ్చాతాపం వ్యక్తం చేస్తూ ఒక లెటర్ ఇచ్చారని తెలిపారు. లెటర్ లో మీకు హక్కు లేదు..బాధ్యతలు అతిక్రమించారంటూ లెటర్ లో పేర్కొనడం జరిగిందన్నారు. రెండు రోజుల పాటు సస్పెండ్ చేసినా సభ వాయిదా వేసే వరకు సభలోనే ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం జరిగిన పరిణామాలపై కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని, డిప్యూటి స్పీకర్ ఛైర్మన్ అధ్యక్షతనలో ఈ కమిటీ పనిచేస్తుందన్నారు. మూడు పార్టీలకు చెందిన ముగ్గురు సభ్యులు వాస్తవాలు తెలుసుకుని నివేదిక అందచేస్తారని పేర్కొన్నారు. అంతేగాక ఎథిక్స్ కమిటీ ఇచ్చే నివేదిక ఇస్తుందని, భవిష్యత్ లో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయం తీసుకుంటామని కోడెల తెలిపారు. 

14:15 - December 24, 2015

మెదక్ : జిల్లాలోని ఎర్రవెల్లి లో రెండో రోజు అయుత చండీయాగానికి కేంద్రమంత్రులు హాజరయ్యారు. కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయకు పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి పూజలు నిర్వహించారు. యాగం జరుగుతున్న విధానాలను వారు అడిగి తెలుసుకున్నారు.

 

14:12 - December 24, 2015

హైదరాబాద్‌ : నగరంలో మరో కల్తీ బాగోతం బట్టబయలైంది.. బాల్‌నగర్‌లో కల్తీ నెయ్యి తయారీకేంద్రంపై ఎస్‌వోటి పోలీసులు దాడి చేశారు.. 300లీటర్ల నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు... నెయ్యి తయారుచేస్తున్న వ్యక్తిని అదుపులోకితీసుకున్నారు..

 

సభా కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదు - కోడెల..

హైదరాబాద్ : సభా కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదని ఏపీ స్పీకర్ కోడెల వెల్లడించారు. వైసీపీ సభ్యుల తీరు అభ్యంతకరమని, చాలాసార్లు సర్దిచెప్పినా వినకపోవడంతో చర్య తీసుకున్నట్లు చెప్పారు. 

రంపచోడవరంలో కుటుంబం ఆత్మహత్యాయత్నం..

రాజమండ్రి : రంపచోడవరంలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక పురుగులు మందు తాగి కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కొడుకు వీరబాబు మృతి చెందగా తల్లిదండ్రుల పరిస్థితి విషమంగా ఉంది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 

14:05 - December 24, 2015

హైదరాబాద్ : నగరంలో ఘోరం జరిగింది. వరకట్న వేధింపులకు మరో మహిళ బలి అయింది. శ్రీమంతం చేయించుకోవాల్సిన వేల మృత్యుఒడిలోకి వెళ్లింది. వరకట్న వేధింపులు భరించలేక ఓ ఐదునెలల గర్భిణీ ఆత్మహత్యకు పాల్పడింది. గుంటూరుకు చెందిన యోగేష్, విజయవాడకు చెందిన లక్ష్మీలకు 2013 లో వివాహం జరిగింది. యోగేష్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి.. కాగా లక్ష్మీ పోస్టల్ డిపార్టు మెంట్ లో అసిస్టెంట్ క్లర్కు గా పని చేస్తోంది. హైదరాబాద్ లోని బేగంపేటలో నివాసం ఉంటున్నారు.  అయితే వివాహ సమయంలో యోగేష్ కు సాఫ్ట్ వేర్ ఉద్యోగం రాలేదు. అతను తక్కువ కట్నానికి పెళ్లి చేసుకున్నాడు. అయినా లక్ష్మి తల్లిదండ్రులు యోగేష్ కు రూ. పది లక్షల కట్నం ఇచ్చారు. అయితే కొన్నాళ్లకు యోగేష్ కు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జాబ్ వచ్చింది. ఈనేపథ్యంలో అదనపు కట్నం కావాలంటూ... భార్య లక్ష్మీని వేధిస్తున్నాడు. ఈక్రమంలో ఆరు నెలల క్రితం బేగంపేట్ మహిళా పీఎస్ కేసులో వరకట్న వేధింపుల కింద అతనిపై కేసు నమోదు అయింది.. అయితే... అయితే పోలీసులు కౌన్సిలింగ్ మాత్రమే ఇచ్చి వదిలిపెట్టారు. రూ.20 లక్షల కావాలంటూ.. మళ్లీ వేధిస్తున్నాడు. ఈనేపథ్యం భర్త వేధింపులు తట్టుకోలేక ఐదు నెలల గర్భంతో ఉన్న భార్య లక్ష్మీ ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగం వచ్చిన తర్వాత అదనపు కట్నం వేధింపులు తట్టుకోలేకే తమ కూతురు లక్ష్మీ ఆత్మహత్య చేసుకుందని తల్లిండ్రులు బేగంపేట పీఎస్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం వచ్చిన తర్వాత అదనపు కట్నం కావాలని యోగేష్ డిమాండ్ చేయడంతోనే తమ కూతురు చనిపోయిందని ఆరోపిస్తున్నారు. లక్ష్మీ ఆత్మహత్య విషయం తెలిసిన వెంటనే యోగేష్ తన సెల్ ఫోన్ తో కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. వారి బంధువుల వద్ద కూడ అతని ఆచూకీ లభ్యం కావడం లేదు. గతంలో బేగంపేట పీఎస్ నమోదు అయిన కేసు కూడా విచారణలోనే ఉంది. ఈనేపథ్యంలో యోగేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

 

సాగునీరందించేందుకే ప్రాజెక్టులు - మంత్రి ఈటెల..

కరీంనగర్ : గోదావరి, ప్రాణహిత నదుల నుండి రైతులకు సాగునీరందించేందుకే ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్మిస్తోందని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల పేర్కొన్నారు. మంచిర్యాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మూడేళ్లలో ప్రాజెక్టులు నిర్మాణాలను పూర్తి చేయాలనే సంకల్పంతో బడ్జెట్ లో రూ.25వేల కోట్లు కేటాయిస్తున్నారని తెలిపారు. 

13:42 - December 24, 2015

తిరుపతి : ఏపీ ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను నిరసిస్తూ తిరుపతిలో అంగన్‌వాడీ కార్యకర్తలు రోడ్డెక్కారు. సమ్మెలో పాల్గొన్న అంన్ వాడీలను తొలగిస్తూ... ప్రభుత్వం విడుదల చేసిన జీవోకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. జీవోకు వ్యతిరేకంగా తిరుపతి కలెక్టరేట్ దగ్గర ఆందోళనకు దిగారు. ప్రజాస్వామ్యబద్దంగా ఆందోళన చేసిన అంగన్‌వాడీల తొలగించాలంటూ ప్రభుత్వం జీవో జారీ చేయడం అన్యాయమని అంటున్నారు. ఆందోళన చేస్తే విధుల నుంచి తొలగిస్తారా అని ప్రశ్నిస్తున్నారు.
సర్కార్ పై నేతల మండిపాటు
'చంద్రబాబు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం.. తప్పుడు విధానాలను అనుసరిస్తున్నారు. సీఎం చంద్రబాబు రాజీనామా చేయాలి. టీడీపీ నేతలు కూడా గతంలో ధర్నాలు, ఆందోళనలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అంగన్ వాడీలకు క్షమాపణలు చేప్పాలి. అంగన్ వాడీల తొలగింపు దారుణం. తొలగింపు జీవోను ఉపసంహరించుకోవాలి. పెంచిన జీతాలు, పెండింగ్ లో ఉన్న వేతనాలను ఇవ్వాలలని అని డిమాండ్ చేశారు. 

వదినను చంపిన మరిది..

తూర్పుగోదావరి : కోరుకొండలో దారుణం చోటు చేసుకుంది. వదినను ఆనంద్ అనే వ్యక్తి కత్తితో నరికి చంపాడు. అడ్డుకొనేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులపై దాడి చేశాడు. ఒకరు మృతి చెందగా ఎంపీటీసీ సభ్యురాలు కుమారికి గాయాలయ్యాయి.

 

మీడియా ఎదుట కాల్ మనీ నిందితుడు..

విశాఖపట్టణం : కాల్ మనీ నిందితుడు గుడివాడ రామకృష్ణను పోలీసులు మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. రామకృష్ణ ను బుధవారం అదుపులోకి తీసుఉన్నారు. అప్పులు తీసుకున్న మహిళలను వేధిస్తున్నాడని ఫిర్యాదులు అందాయని పోలీసులు పేర్కొంటున్నారు. రామకృష్ణ నివాసంలో 39 ప్రామిసరీ నోట్లు, 4 కత్తులు, చెక్కులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

వరకట్న వేధింపులకు మహిళ బలి..

హైదరాబాద్ : బేగంపేటలో వరకట్న వేధింపులకు ఐదు నెలల గర్భిణీ లక్ష్మీ ఆత్మహత్యకు పాల్పడింది. వరకట్న వేధింపులే కారణమని పీఎస్ లో బంధువులు ఫిర్యాదు చేశారు. భర్త యోగేష్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి కాగా మృతురాలు పోస్టల్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగి. 

జోషి ఇంట్లో బీజేపీ నేతల భేటీ..

ఢిల్లీ : మురళీ మనోహర్ జోషి నివాసంలో బీజేపీ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి సీనియర్ నేత అద్వానీ, శాంతకుమార్, పలువురు నేతలు హాజరయ్యారు. పార్టీలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై వారు చర్చిస్తున్నారు.

 

ఉద్యోగాల పేరుతో మోసం..

కరీంనగర్ : ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి కొందరు వ్యక్తులు రూ. కోటికి పైగా వసూలు చేశారు. ఉద్యోగ కల్పన కాదు కదా కనీసం ఇచ్చిన డబ్బులు సైతం తిరిగి ఇవ్వకుండా మోసానికి పాల్పడ్డారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో చోటుచేసుకుంది. దీంతో బాధితులంతా పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ముఠాలోని ముగ్గురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ కొనసాగుతుంది.

 

12:52 - December 24, 2015

హైదరాబాద్ : నగరంలోని లాలాగూడలో పోలసులు ఓవరాక్షన్ ప్రదర్శించారు. మిర్జాలగూడకు చెందిన తరుణ్ స్నేహితుల మద్య వివాదంలో గొడవ జరిగింది. దీంతో తరుణ్ ను స్టేషన్ కు తీసుకెళ్లిన ఎస్సై అతన్ని కొట్టడమే కాకుండా అసభ్యంగా దూషించాడు. దీంతో మనస్థాపానికి గురైన తరుణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సై పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

 

 

12:40 - December 24, 2015

ఆధునిక కాలంలో చిన్నప్పటి నుంచే తెల్ల వెంట్రుకలు బాధిస్తున్నాయి. వాటిని నిరోధించుకోవడానికి అనేక రసాయనిక రంగులను వాడుతున్నారు. ఇవి చర్మానికి హాని చేస్తాయి. అందుకే ప్రకృతి ప్రసాదించిన సహజమైన ఉత్పత్తులతో తెల్ల వెంట్రుకలను నివారించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవి ఏమిటంటే...
-  తెల్లవెంట్రుకలను నివారించేందుకుగాను రాత్రిపూట ఇనుప చేసిన బాండీలో ఉసిరికాయ, కుంకుడుకాయ, శీకాకాయల మిశ్రమాన్ని నీటిలో నానబెట్టాలి. దీనికి ఉదయాన్నే గోరింటాకు కలిపి మరల రెండు-మూడు గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత వెంట్రుకలకు అప్లై చేసుకొని అరగంట తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే వెంట్రుకలు నల్లగా మారి, ఒత్తుగానూ పెరుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
-  ఆహారంలో కరివేపాకును ఎక్కువగా తీసుకోవాలి. దీని వల్ల వెంట్రుకల రంగు మారుతుంది.

12:23 - December 24, 2015

'బాహుబలి' సినిమాలో కిలిక్కి భాషను ఉపయోగించిన విషయం తెలిసిందే. 'బాహుబలి' చిత్రం ద్వారా విశేష ఆదరణ పొందిన కిలిక్కి భాష ఆధారంగా నటి, సింగర్‌ స్మిత ఓ వీడియో సాంగ్‌ను కంపోజ్‌ చేశారు. అతిథిగా విచ్చేసిన సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి బుధవారం హైదరాబాద్‌లో ఈ పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'స్మిత ఎంతో నిజాయితీగా, ఫ్యాషన్‌తో వర్క్‌ చేసి రూపొందించిన ఈ వీడియో సాంగ్‌ పెద్ద హిట్‌ కావాలి' అని అన్నారు. ''బాహుబలి' సినిమా చూసిన తర్వాత కిలిక్కి భాషలో ఓ వీడియో సాంగ్‌ చేయాలనే ఆలోచన వచ్చింది. దీంతో 'బాహుబలి'లో కిలిక్కి భాషకు మాటలు రాసిన మదన్‌ కార్కిని సంప్రదించాను. నేను అడగ్గానే రెండు రోజుల్లో ఈ పాటకు లిరిక్స్‌ అందించారు. ఈ పాటకు బాస్కో కొరియోగ్రఫీ అందించడం ఎప్పటికీ మర్చిపోలేను. ఈ పాటను ఇదివరకే విడుదల చేయాల్సింది. కాని చెన్నై వరదల కారణంతో వాయిదా వేశాం. ఈ పాట బాగా రావడానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు' అని స్మిత తెలిపారు. మదన్‌ కార్కి చెబుతూ, 'బాహుబలి' సినిమా చేసేటప్పుడు రాజమౌళికి కిలిక్కి భాషల్లో ఒక పాట ఉంటే బాగుంటుందని చెప్పాను. కాని స్పేస్‌ లేక సాంగ్‌ పెట్టడం కుదరలేదు. స్మిత వచ్చి కిలిక్కి భాషలో పాట చేయాలనగానే హ్యాపీగా ఫీలయ్యాను. ఈ సాంగ్‌ పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను' అని అన్నారు. ఈ కార్యక్రమంలో మెహర్‌ రమేష్‌, శోభు యార్లగడ్డ, నోయల్‌ తదితరులు పాల్గొన్నారు.

 

12:19 - December 24, 2015

నిర్భయ కేసులో బాలనేరస్థుడి విడుదలకు మద్దతిచ్చేందుకు సుముఖంగా లేనని బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా అన్నారు. బాల నేరస్థుడి దుశ్చర్య క్షమించరానిదని, అతని విడుదలవడం సరికాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రకాశ్‌ ఝా దర్శకత్వంలో రూపొందుతున్న 'జై గంగాజల్‌' చిత్రానికి సంబంధించి ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమంలో పాల్గొన్న ప్రియాంక చోప్రా పై విధంగా స్పందించారు. 'న్యాయ వ్యవస్థకు గౌరవం ఇస్తాను. చట్టాలకు కట్టుబడి ఉంటాను. అయితే నిర్భయ ఘటనలో బాల నేరస్థుడి పాత్ర అంత్యంత హేయమైనది. నామమాత్రపు శిక్షతో అతడిని స్వేచ్ఛగా వదిలేయడం సరికాదు' అని ప్రియాంక ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

12:17 - December 24, 2015

అభిమాన నటుడు అమీర్‌ఖాన్‌ని చూడాలన్న ఓ ప్రత్యేక అభిమాని కోరికను అమీర్‌ఖాన్‌ స్వయంగా తీర్చడం విశేషం. లక్షల్లో అతికొద్ది మందికి వచ్చే ప్రొజేరియా వ్యాధితో 14 సంవత్సరాల నిహాల్‌ భిట్ల బాధపడుతున్నాడు. కొన్ని రోజుల క్రితం ఓ ఫేస్‌బుక్‌ పేజీలో నిహాల్‌ పరిస్థితి గురించి, అమీర్‌ని ఎంతగా అభిమానిస్తున్నాడోననే విషయాల్ని పొందుపరిచారు. 
ఆ విషయాల్ని చదివి స్పందించిన అమీర్‌ ఆ అభిమాని పూర్తి వివరాలు తెలిసిన వెంటనే, ఆ అభిమాని ఎక్కడున్నా సరే స్వయంగా వెళ్ళి కలుస్తానని చెప్పారు. అన్నట్లుగానే అభిమానిని కలిసి ఇచ్చిన మాటని అమీర్‌ నిలబెట్టుకున్నారు. తన దగ్గరికి వచ్చిన అభిమాన నటుడిని చూసిన నిహాల్‌ ఆనందానికి పట్టాపగ్గాల్లేకుండా పోయాయి. ఇద్దరూ సరదాగా కొద్దిసేపు గడిపారు. 
ఈ సందర్భంగా ఒకరికొకరు గిఫ్ట్ లు కూడా ఇచ్చిపుచ్చుకున్నారు. వీడియో గేమ్స్, డీవీడీలను నిహాల్‌కు అమీర్‌ ఇవ్వగా, తాను గీసిన ఓ గణేశ్‌ చిత్రపటాన్ని అమీర్‌కు నిహాల్‌ బహుమతిగా అందించాడు. అమితాబ్‌బచ్చన్‌, విద్యాబాలన్‌ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన 'పా' చిత్రంలో ప్రొజేరియా వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారి పాత్రలో అమితాబ్‌ నటించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాధితో బాధపడే వారికి చిన్న వయస్సులోనే వృద్ధాప్యం ముంచుకొస్తుంది. సరిగ్గా ఇటువంటి వ్యాధితోనే అమీర్‌ఖాన్‌ అభిమాని బాధపడుతున్నారు. అతని గురించి 'హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే' అనే ఫేస్‌బుక్‌ పేజీలో రాశారు. అందులో అమీర్‌ 'తారే జమీన్‌ పర్‌' చిత్రం తనకెంతో నచ్చిందని, వీలైతే ఒక్కసారి అమీర్‌ను కలుసు కోవాలనుందని కూడా ఆ అభిమాని పేర్కొన్నారు.

 

సౌదీలో అగ్నిప్రమాదం...25 మంది మృతి

హైదరాబాద్ : సౌదీ అరేబియాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దర్ఘుటనలో 25 మృతి చెందగా . సౌదీలోని ఓ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 25 మందికి పైగా మృతి చెందారని, మరో 107 మందికి పైగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. 

11:50 - December 24, 2015

విశాఖ : నగరంలో కిడ్నాప్ కు గురైన బాలిక మిస్టరీ విషాదాంతంగా ముగిసింది. బాలిక హత్య గావించబడింది. విశాఖలో మూడు రోజుల క్రితం దివ్య అనే ఏడేళ్ల బాలిక కిడ్నాప్ కు గురైంది. ఈనేపథ్యంలో ఇవాళ దేవరపల్లి శివారులో రైవాడ జలాశయం వద్ద దివ్య మృతదేహం లభ్యమయింది. చిన్నారి మృతి పట్ల తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే కిడ్నాప్, హత్య వెనకాల బాలిక మేనమామ గుణశేఖర్ హస్తం ఉందని అనుమానిస్తున్నారు. దీంతో గుణశేఖర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు. 

 

 

11:37 - December 24, 2015

ఢిల్లీ : జార్ఖండ్‌ డైనమైట్‌...ధనా ధన్‌ ధోనీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. భారత క్రికెట్‌ చరిత్రలో టీమిండియాలో 11 ఏళ్లు కొనసాగిన ఏకైక వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌గా ధోనీ రికార్డ్‌లకెక్కాడు.ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి నేటితో సరిగ్గా 11 ఏళ్లు పూర్తయ్యాయి. 2004లో చిట్టగాంగ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేతో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చిన ధోనీ....ఆ తర్వాత ఏ స్థాయికి చేరుకున్నాడో అందరికీ తెలిసిందే. భారత జట్టుకు కెప్టెన్‌గా వన్డే, టీ20 ప్రపంచకప్‌లు అందించిన ధోనీ...టెస్టుల్లోనూ టీమిండియాను నెంబర్‌వన్‌గా నిలిపాడు.గత యేడాది టెస్ట్‌ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన....2016 టీ 20 ప్రపంచకప్‌ వరకూ కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. 

 

వరంగల్ లో దారుణం..

వరంగల్‌ : జిల్లాలోని శంభునిపేటలో దారుణం జరిగింది. మూడేళ్ల చిన్నారిపై వీధికుక్కలు రెచ్చిపోయాయి. శునకాలు కరవడంతో తీవ్రగాయాలపాలైన బాబును తల్లిదండ్రులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ బాలుడు మృతి చెందాడు. 

11:32 - December 24, 2015

వరంగల్‌ : జిల్లాలోని శంభునిపేటలో దారుణం జరిగింది. మూడేళ్ల చిన్నారిపై వీధికుక్కలు రెచ్చిపోయాయి. శునకాలు కరవడంతో తీవ్రగాయాలపాలైన బాబును తల్లిదండ్రులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ బాలుడు మృతి చెందాడు.

 

 

11:26 - December 24, 2015

గుంటూరు : జిల్లాలోని చుండూరు మండలం ఎడ్లపల్లిలో విషాదం జరిగింది. కుటుంబ సమస్యలు తట్టుకోలేక ఓ ఇల్లాలు పిల్లలతోసహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇద్దరు చిన్నారులను రైలునుంచి తోసి తానుకూడా దూకేసింది. దీంతో తల్లితోసహా కూతురు మృతిచెందగా... బాలుడి పరిస్థితి విషమంగా ఉంది.

 

10:43 - December 24, 2015

విజయవాడ : ఎపి సర్కార్ అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్లే రైతుల ఆత్మహత్యలు పెరిగాయని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆరోపించారు. ఈమేరకు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ రంగాన్ని చంద్రబాబు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మూలంగా రైతాంగంపై రుణభారం పెరిగిందన్నారు. వ్యవసాయరంగంలో రుణభారం పెరిగిపోయిందని చెప్పారు. కౌలు రైతులకు రుణాలు ఇస్తామని ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. డ్వాక్రా మహిళలకు ఇచ్చే రుణాలు కూడా తగ్గిపోయాయని పేర్కొన్నారు. అనంతపురం, కర్నూలు , ప్రకాశం జిల్లాల్లో దారుణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. వ్యవస్థాగత రుణాలను రైతులను ఇవ్వకుండా మభ్యపెడుతున్నారని ఆరోపించారు. దీనిని తాము సమగ్రంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు ప్రకటిస్తున్నామన్నారు. టీడీపీ అవలంబిస్తున్న విధానాల కారణంగా దీర్ఘ కాలిక రుణాలు 7వేలకు పడిపోయాయని తెలిపారు. ఇటీవల రైతుల రుణాలు చెల్లించామని చంద్రబాబు అసత్యప్రచారాలు ప్రకటించడం దారుణమన్నారు.

 

బస్సు బోల్తా.. బాలిక మృతి

చెన్నై : తమిళనాడులోని కాంచీపురం వద్ద అదుపు తప్పి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బాలిక మృతి చెందింది. మరో 37 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు తిరుపతికి చెందిన వారిగా గుర్తించారు. 

'కాల్ మనీ' నిందితుడు గుడివాడ రామకృష్ణ అరెస్టు

విశాఖ : కాల్ మనీ నిందితుడు గుడివాడ రామకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. 

వీడని బాలిక దివ్య కిడ్నాప్ మిస్టరీ

విశాఖ : బాలిక దివ్య కిడ్నాప్ మిస్టరీ వీడలేదు. బాలిక మేనమామను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేవరాపల్లిలో దివ్య (7) రోజుల క్రితం కిడ్నాప్ అయింది.

10:31 - December 24, 2015

ఢిల్లీ : రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మోడీ రష్యా వెళ్లారు. మాస్కోలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. పర్యటనలో భాగంగా ఆదేశ అధ్యక్షుడితో మోడీ భేటీ అయ్యారు. రష్యా, భారత్‌ సంబంధాలపై ఇరువురు నేతలు చర్చించారు.
మోడీకి ఘనస్వాగతం
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్రమోడీ మాస్కో చేరుకున్నారు. ఆయనకు రష్యా అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా మాస్కోలో ద్వైపాక్షిక వార్షిక సదస్సులో మోడీ పాల్గొననున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఏర్పాటుచేసిన విందుకు హాజరుకావడానికి కొన్ని గంటల ముందు ఆ దేశానికి చెందిన టాస్‌ వార్తా సంస్థకు మోదీ ఇంటర్వ్యూ ఇచ్చారు.
భారత్ కు నిజమైన మిత్రదేశంగా రష్యా
భారత దేశానికి నిజమైన మిత్రదేశంగా రష్యా అండగా నిలుస్తున్న విషయాన్ని మోడీ గుర్తు చేశారు. సంక్షోభ సమయంలో రష్యా తన స్నేహహస్తాన్ని అందిస్తున్నదని ఆయన ప్రశంసించారు. అనంతరం మోదీ.. రష్యా అధ్యక్షుడి పుతిన్‌తో భేటీ అయ్యారు. రష్యా-భారత్ సంబంధాలంపై చర్చించామని భేటీ అనంతరం మోదీ ట్వీట్‌ చేశారు. ఈ సమావేశం ఫలవంతమైందని ప్రధాని పేర్కొన్నారు.
నేడు ఇండియా-రష్యా వార్షిక సమావేశం
గురువారం జరిగే 16వ ఇండియా-రష్యా వార్షిక సమావేశంలో మోడీ, పుతిన్‌లు పాల్గొంటారు. ఆర్థిక, అణుశక్తి, రక్షణ సహకారంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. భారత్‌, రష్యాల మధ్య వాణిజ్య సంబంధాలపైనా మోదీ, పుతిన్‌ చర్చించనున్నారు. ఇరు దేశాలకు చెందిన పలు కంపెనీల సీఈవోలతో వీరు భేటీ అవుతారు.ప్రస్తుతం 10 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రాబోయే పదేళ్లలో 30 బిలియన్‌ డాలర్లకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఇరుదేశాల లీడర్లు నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
భారతీయులతో సంభాషణ
గురువారం జరిగే మరో కార్యక్రమంలో మాస్కోలో ఉంటున్న భారతీయులతో మోదీ ముచ్చటిస్తారు. ఫ్రెండ్స్‌ ఆఫ్‌ ఇండియా పేరుతో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.

 

 

ఎపి ప్రభుత్వంపై మధు ఆగ్రహం..

విజయవాడ : ఎపి సర్కార్ పై సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్లే రైతుల ఆత్మహత్యలు జరిగాయని ఆరోపించారు.  ఈమేరకు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మూలంగా రైతాంగంపై రుణభారం పెరిగిందన్నారు.

 

09:44 - December 24, 2015

సమ్మె చేస్తున్న అంగన్ వాడీలపై ఎపి సర్కార్ చర్యలు తీసుకోవడం సరైనది కాదని ది హన్స్ ఇండియా చీఫ్ ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ విశ్లేషణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టిడిపి మ్యానిపెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని అంగన్ వాడీలు సమ్మె చేస్తుంటే.. వారిని తొలగిస్తామనడం ఎంతవరకు సమంజసమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకమాట.. అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. సమ్మెల పట్ల ఎపి ప్రభుత్వంతోపాటు మిగతా ప్రభుత్వాల వైఖరేంటో స్పష్టం చేయాలన్నారు. ఎపిలో అంగన్ వాడీలు అక్కడి ప్రభుత్వాన్ని కూల్చడానికి సమ్మె చేయలేదని.. తమ న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేపట్టారని తెలిపారు. ప్రభుత్వాలు.. తాము ఇచ్చిన వాగ్ధానాలనే అమలు చేయడం లేదన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయమంటే... అణిచివేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉంటే ప్రజాస్వామ్యవాదులవుతారు.. అధికారంలో ఉంటే నిరంకుశులవుతారని ఘాటుగా విమర్శించారు. తెలంగాణలో మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తుంటే.. వారిపై టీసర్కార్ తీరును వ్యతిరేకించిన టీటీడీపీ నేతలు.. ఇప్పుడు విజయవాడలో సమ్మె చేస్తున్న అంగన్ వాడీలపై ఎపి సర్కార్ తీసుకుంటే ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. సమ్మెలు, అంగన్ వాడీ కార్మికులు, ఇతర కార్మికుల పోరాటాల పట్ల టీడీపీకి తెలంగాణలో ఒక వైఖరి, ఎపిలో మరో వైఖరి ఉంటుందా.. అని నిలదీశారు. సమ్మె చేయడం ప్రజాస్వామ్యంలో హక్కు అని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.....

 

కరీంనగర్ లో అక్రమనిర్మాణాల కూల్చివేత..

కరీంనగర్‌ : జిల్లాలోని గోదావరిఖని పట్టణంలోని శ్రీనివాస థియేటర్‌ సమీపంలో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను ఇవాళ ఉదయం రామగుండం నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేశారు. నిర్మాణానికి అనుమతులు లేకపోవడంతో పాటు రహదారిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో కూల్చివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

 

రోడ్డ ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికురాలి మృతి

కడప : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ పారిశుద్ధ్య కార్మికురాలు మృతి చెందింది. తిలక్‌నగర్‌కు చెందిన మోహన్‌, బాలసుబ్బమ్మ దంపతులు నగరపాలక కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ ఈరోజు తెల్లవారుజామున 5గంటలకు సైకిల్‌పై విధులకు బయల్దేరారు. వెనుక నుంచి వచ్చిన లారీ వేగంగా ఢీకొనడంతో బాలసుబ్బమ్మ లారీ కిందపడి అక్కడికక్కడే మృతిచెందింది. మోహన్‌కు గాయాలయ్యాయి.

ఇద్దరు పిల్లలతోసహా వివాహిత ఆత్మహత్యాయత్నం.. తల్లి మృతి

గుంటూరు : జిల్లాలో విషాదం జరిగింది. రైలులో కిందికి దూకి ఇద్దరు పిల్లతో సహా తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో తల్లి మృతి చెందింది. ఇద్దరు పిల్లలు గల్లంతు అయ్యారు. 

08:31 - December 24, 2015

ఎపి సీఎం చంద్రబాబు అప్రజాస్వామిక వైఖరి అవలంభిస్తున్నారని వక్తలు పేర్కొన్నారు. అంగన్ వాడీలను తొలగిస్తామనడం దుర్మార్గమన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో నవతెలంగాణ ఎడిటర్ వీరయ్య, బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు, టిడిపి నేత రామకృష్ణ ప్రసాద్ పాల్గొని, మాట్లాడారు. ఉమ్మడి ఎపిలో చంద్రబాబు భయంకరమైన వాతావరణాన్ని సృష్టించారని పేర్కొన్నారు. అంగన్ వాడీలను గుర్రాలతో తొక్కించారని గుర్తు చేశారు. గతంలో విద్యార్థి సంఘాల నేతలతో కూడా ఇలానే ప్రవర్తించారని తెలిపారు. అంగన్ వాడీల తొలగిస్తామనడం రాజ్యాంగం విరుద్దం, చట్ట విరుద్దమన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తారని.. బాబు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

 

08:08 - December 24, 2015

పార్కులను కాపాడుకోవాలని కుమార్ అన్నారు. ప్రభుత్వమే పార్కుల నిర్వహణ బాధ్యతను తీసుకోవాలని కోరారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'ఒక చోట పార్కులు కబ్జాలకు గురవుతున్నాయి. మరొక చోట అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారుతున్నాయి. మరికొన్ని చోట్ల వ్యాపార కేంద్రాలై సామాన్యులను వెక్కిరిస్తున్నాయి. అన్ని సౌకర్యాలుండి జనాభిమానం చూరగొన్న పార్కులను ప్రయివేట్‌ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి. మొత్తానికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ పార్కుల నిర్వహణ అస్తవ్యస్థంగా మారింది. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? పార్కుల వల్ల సమాజానికి, పర్యావరణానికి జరుగుతున్న మేలేమిటి? పార్కుల నిర్వహణలో తలెత్తుతున్న లోపాలేమిటి? పార్కుల అభివృద్ధికి ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు తీసుకోవాల్సిన చర్యలేమిటి? వంటి అంశాలపై కుమార్‌ మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోల్లో చూద్దాం..

 

08:04 - December 24, 2015

సిటీలు పెరుగుతున్నా పార్క్ లు పెరగడం లేదు. సమాజానికీ, ప్రకృతికీ ఎంతో మేలు చేసే పార్కుల విషయంలో ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. పార్కులకు కేటాయించిన భూములు కబ్జా అవుతున్నా అధికారులు నిద్ర నటిస్తున్నతీరు ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైనా పార్కుల నిర్వహణపై శ్రద్ధ పెట్టకపోతే ఫలితాలు దారుణంగా వుంటాయి.
పార్క్ లు అమ్మ ఒడిలాంటివే
వారాంతపు సెలవుల్లో పార్క్ కి వెళ్లి ఎంజాయ్‌ చేయాలనుకోవడం సిటీ పిల్లల సహజ లక్షణం. బండెడు పుస్తకాలతో, బిజీబిజీ క్లాసుల షెడ్యూల్‌తో, క్షణం తీరికలేని హోంవర్క్‌లతో అలసిసొలసిన చిన్నారులను కాస్తంత సేదదీర్చేవీ పార్కులే కదా! కాంక్రీట్‌ జంగిల్‌లో, గజం జాగా కూడా లేని గల్లీల్లో, ఇరుకు ఇరుకు గదుల్లో జీవించే పసిమొగ్గలకు పార్క్ లు అమ్మ ఒడిలాంటివే కదా! పట్టణంలోని చుట్టాలింటికి వచ్చిన పల్లెటూరి పిల్లల మోముల్లో చిరునవ్వులు పూయించేవీ పార్క్ లే. చిన్నారుల మోముల్లో కోటానుకోట్ల కాంతిరేఖలు సృష్టించి, సంతోషపు వెలుగులు విరజిమ్మే పార్క్ ల నిర్వహణను ఏ నాగరిక సమాజమైనా నిర్లక్ష్యం చేయగలదా?
మానసిక ఒత్తిడికి ఉపశమనం కల్పిస్తున్నవీ పార్కులే
ఇప్పుడు పిల్లలనే కాదు పెద్దలనూ రీచార్జి చేస్తున్నవీ పార్కులే. ఈ స్పీడ్‌ యుగంలో కెరీర్‌ పరుగు పందెంలో మానసిక ఒత్తిడి నుంచి కాస్తంత ఉపశమనం కల్పిస్తున్నవీ పార్కులే. స్ట్రెస్‌, బీపీ, షుగర్‌, ఒబేసిటీ ఇలా ఏ ఆపద వచ్చినా, వాటి నుంచి కాపాడే నడక సాగించాలంటే ముందు వెదుక్కునేది పార్క్ నే కదా!
పెద్దలనీ అమ్మలా లాలిస్తున్న పార్క్ లు
అవును. ఇప్పుడు పార్క్ లు పిల్లలనే కాదు పెద్దలనీ అమ్మలా లాలిస్తున్నాయి. ఊరడిస్తున్నాయి. కాసేపు నా వాకిట్లో షికారు చేయరా నాయనా నీ ఆరోగ్యాన్ని కాపాడుతానంటూ అభయమిస్తున్నాయి. ఆధునిక యుగంలో ఇంత ప్రాధాన్యత సంతరించుకున్న పార్క్ ల నిర్వహణను ఏ ప్రజాస్వామిక ప్రభుత్వమైనా అలక్ష్యం చేయగలదా?
మానవ సమాజానికి పార్క్ లు గొప్ప మేలు
పిల్లల ఆట పాటలకీ, పెద్దల వాకింగ్‌కి మాత్రమే కాకుండా ఇంకా అనేక రకాలుగా మానవ సమాజానికి గొప్ప మేలు చేస్తున్నాయి పార్క్‌లు. పట్టణాల్లో వివిధ రకాల పరిశ్రమలు, వాహనాలు వెదజల్లే వాయు, జల, ధ్వని కాలుష్యాల తీవ్రతను తగ్గించడంలో పార్క్‌లు చేస్తున్న సహాయం చిన్నదేమీ కాదు. అనేక పట్టణాల్లో భూగర్భజలాలను కాపాడడంలోనూ, వరదలను నిరోధించడంలోనూ పార్క్‌లు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. వివిధ పరిశ్రమలు, వాహనాలు మనం పీల్చేగాలినీ, తాగే నీటిని కాలకూటవిషంగా మారుస్తున్న వేళ వాటిని శుభ్రం చేసి, మనకు స్వచ్ఛమైన గాలినీ, స్వచ్ఛమైన నీటిని ప్రసాదించేవీ పార్కులే. వాతావరణంలో వేడిని తగ్గిస్తున్నవీ ఇవే.
పార్కులతో బలపడుతున్న సామాజిక సంబంధాలు
అమెరికాలాంటి దేశాల్లో జరిగిన పరిశోధనలు పార్క్ లు పర్యావరణానికీ , ఆర్థిక వ్యవస్థకు చేస్తున్న సహాయాన్ని కళ్లకు కట్టాయి. పట్టణాల్లో పార్కులనేవి లేకపోతే మంచినీటి సరఫరా కోసం మరిన్ని నిధులు వెచ్చించాల్సి వస్తుందని ఓ పరిశోధనలో తేలింది. అమెరికన్‌ ఫారెస్ట్ ఆర్గనైజేషన్‌ వేసిన అంచనాల ప్రకారం మంచినీటి సరఫరాకు వెచ్చించే ఖర్చులో దాదాపు 400 బిలియన్‌ డాలర్ల నిధులు ఆదా అవుతున్నట్టు తేలింది. పార్కుల వల్ల సామాజిక సంబంధాలు బలపడుతున్నాయనీ, నేరప్రవృత్తి రేటు తగ్గుతోందని, మూడ్స్ ను మార్చడంలో ముఖ్య భూమిక పోషిస్తున్నాయనీ, మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు తోడ్పడుతున్నాయనీ అమెరికాలో జరిగిన అధ్యయనాల్లో వెల్లడయ్యింది. ఇన్ని ప్రయోజనాలు చేకూర్చే పార్క్ ల నిర్వహణను ఏ ప్రభుత్వమైనా నిర్లక్ష్యం చేయగలదా?
పార్కుల నిర్వహణపై ప్రభుత్వాల నిర్లక్ష్యం
కానీ, దురదృష్టవశాత్తు పార్కుల నిర్వహణను ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. నగరాలు, పట్టణాల్లో వివిధ కాలనీల్లో వుండే పార్క్‌ల నిర్వహణను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. వాటి రక్షణ గురించి ఆలోచించడం లేదు. రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లలో పార్క్‌ కోసం కచ్చితంగా స్థలం కేటాయించాలన్న నిబంధనలు వాటిని చాలా చోట్ల అమలు చేయడం లేదు. ఒకవేళ స్థలం కేటాయించిన దానిని చూడముచ్చటగా తీర్చిదిద్దడం లేదు. ఆహ్లాదభరితంగా మార్చడం లేదు. కనీసం ఆ స్థలాన్ని రక్షించేందుకు అవసరమైన చర్యలేవీ తీసుకోవడం లేదు. పార్క్ లకు కేటాయించిన స్థలాలనే కాదు- ఉనికిలో వున్న పార్క్ లను సైతం కబ్జాదారులు స్వాహా చేస్తున్నా ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, అధికారులు నిద్ర నటిస్తున్నారు. పౌరులు స్పష్టమైన ఫిర్యాదులు చేసిన్నప్పటికీ స్పందించని జడత్వం పాలనావ్యవస్థలో పేరుకుపోయింది.
వ్యాపార కేంద్రాలుగా పార్కులు
ఓ వైపు వివిధ కాలనీల్లోని పార్కులను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు మరోవైపు నగరం నడిబొడ్డున అందరికీ అందుబాటులో వుండే పార్కులను వ్యాపార కేంద్రాలుగా మార్చేస్తున్నాయి. సామాన్యుల పిల్లలెవరూ వాటిలో ప్రవేశించలేని, ఎంజాయ్‌ చేయలేని పరిస్థితిని సృష్టిస్తున్నాయి. చివరకు పార్క్‌ల నిర్వహణను కూడా కార్పొరేట్‌ సంస్థల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తున్న దీనస్థితే మన చుట్టూ తాండవిస్తోంది. ఓ వైపు పార్కుల నిర్వహణను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వాలు క్రమబద్దీకరణ పేరుతో పార్క్‌ స్థలాలను కబ్జాకోరులకు రాసిస్తాయోమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

 

07:47 - December 24, 2015

ఢిల్లీ : కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు చేదు అనుభవం ఎదురైంది. విమాన ప్రమాదంలో మృతి చెందిన జవాన్లకు నివాళులర్పించడానికి వెళ్లిన హోంమంత్రిని వారి కుటుంబాలు నిలదీశాయి. జవాన్లకేమో పాత విమానాలు... వివిఐపిలకు కొత్త విమానాలా అంటూ కుటుంబసభ్యులు ప్రశ్నించారు. పాత విమానమే జవాన్ల ప్రాణాలను బలిగొందని ధ్వజమెత్తారు.
సైనికులకు ఎందుకు పాత విమానాలు ఇస్తున్నారు..?
ఢిల్లీలో మంగళవారం జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందిన జవాన్లకు సఫ్దర్‌ జంగ్‌ విమానాశ్రయంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా హోంమంత్రి బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లగా ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఎస్‌ఐ రవీందర్‌ కుమార్‌ కూతురు సలోనీ రాజ్ నాథ్‌పైకి ప్రశ్నలు సంధించింది. 'సర్, ఎప్పుడూ సైనికుల కుటుంబాలే ఎందుకు ఏడవాలి? వీఐపీల విమానాల్లో ఎందుకు ఇలా జరగదు? సైనికులకు ఎందుకు పాత విమానాలు ఇస్తున్నారు? నాకు తక్షణమే సమాధానం చెప్పాలంటూ వెక్కివెక్కి ఏడుస్తూ హోంమంత్రిని నిలదీసింది.
బీఎస్ఎఫ్ విభాగానికి కొత్త విమానాలు అవసరం
బీఎస్ఎఫ్ విభాగానికి కొత్త విమానాలు కావాల్సిన అవసరం ఉందని, ప్రమాదానికి గురైన ఈ విమానం ఎంతోకాలం నుంచి వాడుతున్నట్టు తన భర్త తరచూ చెప్పేవారని చనిపోయిన కో పైలెట్ కెప్టెన్‌ రాజేష్‌ శివరెయిన్‌ భార్య తెలిపారు. గత ఏడాది ఆ విమానం వాడేందుకు ఆయన పలుమార్లు నిరాకరించారని పేర్కొన్నారు.
విమానం 20 ఏళ్ల క్రితం నాటిది
ప్రమాదానికి గురైన బీఎస్ఎఫ్ కు చెందిన సూపర్ కింగ్ విమానం 20 ఏళ్ల క్రితం నాటిదని అధికారులు చెబుతున్నారు. ఉదయం విమానం బాగానే ఉందని, సాంకేతిక లోపం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.
విమాన ప్రమాదం... 12 మంది మృతి
బీఎస్ఎఫ్ కు చెందిన సూపర్ కింగ్ చిన్న విమానం రాంచీ హెలికాప్టర్‌ బాగు చేయడానికి వెళ్తూ ఢిల్లీ విమానాశ్రయానికి సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు అధికారులతో పాటు పది మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. జవాన్ల మృతదేహాలను అంతిమ సంస్కారం కోసం వారి కుటుంబాలకు అధికారులు అప్పగించారు.

 

07:39 - December 24, 2015

ఢిల్లీ : రుణభారంలో చిక్కుకున్న కన్సస్ట్రక్సన్ కంపెనీలు కొత్త పోకడలు పోతున్నాయి. బ్యాంక్ లకు తాము చెల్లించాల్సిన బకాయిలను ఈక్విటీలుగా మార్చి, వాటాదారులుగా చేర్చుకుంటున్నాయి. జాతీయ రహదారుల పనులు చేపట్టిన పలు కంపెనీలు ఇప్పటికే ఈ బాటపట్టాయి. ఈ కొత్త పరిణామం బ్యాంకింగ్ రంగం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నది ఆసక్తికరంగా మారుతోంది.
పెరుగుతున్న నిర్మాణ కంపెనీల రుణభారం
రుణ భారంతో కుంగిపోతున్న నిర్మాణ కంపెనీలు కొత్త వ్యూహాలు అనుసరిస్తున్నాయి. కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన రుణాలను తిరిగి వసూలు చేసుకోవడంలో అష్టకష్టాలు పడుతున్న బ్యాంక్ లు కూడా కొత్త పంథాను అనుసరిస్తున్నాయి. ఇటు అప్పులిచ్చినవారు, అటు అప్పు తీర్చాల్సిన వారు ఒకేరకంగా ఆలోచిస్తుండడంతో కొత్త ట్రెండ్ మొదలవుతోంది. రోడ్డు నిర్మాణ పనులు చేపట్టే ఐవీఆర్ సీఎల్ ఉదంతమే ఇందుకు తాజా ఉదాహరణ. ఈ కంపెనీకి 7,500 కోట్ల రూపాయలకు పైగా అప్పులున్నాయి. ఎస్ బీ ఐ, ఐడీబీఐలలో రుణాలున్నాయి. దీంతో ఈ బ్యాంక్ లు ఐవీఆర్ సీఎల్ చెల్లించాల్సిన రుణాలను ఈక్విటీలుగా మార్చుకుంటున్నాయి.
కొత్త ట్రెండ్ కి సంకేతాలు
గత ఆగస్టులో గామన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కూడా ఇదే వ్యూహాన్ని అనుసరించింది. తాను చేపట్టిన తొమ్మిది రోడ్డు ప్రాజెక్ట్ లలో ఆరింటిని బీఐఎఫ్ ఇండియా హోల్డింగ్స్ ప్రయివేట్ లిమిటెడ్ కి విక్రయించింది. ఈ డీల్ విలువ 563 కోట్లు రూపాయలు. గామన్ ఇండియా లిమిటెడ్ కి అప్పులిచ్చిన సంస్థలు గత నవంబర్ లో దాదాపు 15వేల కోట్ల రూపాయల రుణాన్ని ఈక్విటీల కిందకు మార్చుకున్నాయి. ఈ ఉదాహరణలు రుణదాతలు, రుణ గ్రహీతలు సృష్టిస్తున్న కొత్త ట్రెండ్ కి సంకేతాలు.
నిర్మించు-నిర్వహించు-బదలాయించు పద్ధతిలో రోడ్డు ప్రాజెక్ట్ లు
ఐవీఆర్ సీఎల్, గామన్ లాంటి సంస్థలు నిర్మించు - నిర్వహించు - బదలాయించు పద్ధతిలో రోడ్డు ప్రాజెక్ట్ లు చేపట్టాయి. ఈ పద్ధతిలో నిర్మాణం పనులు చేపట్టిన సంస్థకు ప్రభుత్వం ఎలాంటి చెల్లింపులు చేయదు. నిర్మాణ సంస్థ టోల్ గేట్స్ ద్వారా తాను పెట్టిన ఖర్చులు, లాభాలు రాబట్టుకోవాల్సి వుంటుంది. ఒప్పంద కాలం ముగిసిన తర్వాత తాను చేపట్టిన నిర్మాణాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి వుంటుంది. బీవోటీ పద్ధతిలో చేపట్టిన పనులు నిర్మాణ సంస్థలకు లాభాలు సంపాదించకపోగా, వాటి రుణభారాన్ని పెంచుతున్నాయి. ఈ తరహా ప్రాజెక్ట్ లకు ఇచ్చిన రుణాలు వసూలు కాక బ్యాంక్ లు గుడ్లు తేలేస్తున్నాయి. . 2010 12 మధ్య కాలంలో 7500 కిలోమీటర్ల పొడవైన హై వేల నిర్మాణ పనులకిచ్చిన రుణాలు ఇప్పుడు హై రిస్క్ గ్రూపులో చేరిపోయాయి.
బీవోటి పద్ధతిపై నిర్మాణ సంస్థలు అనాసక్తి
వివిధ శాఖల నుంచి నిర్మాణ అనుమతులు త్వరితగతిన రాకపోవడం, భూ సేకరణలో జాప్యం, నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కాకపోవడం, కోర్టు కేసులు మొదలైన కారణాలతో నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతోందనీ, టోల్ గేట్ ద్వారా ఆదాయాలు రాబట్టుకోవడానికి ఎక్కువ టైమ్ పడుతోందని, దీంతో వడ్డీల భారం పెరుగుతోందని నిర్మాణ సంస్థలు వాపోతున్నాయి. పెట్టుబడులు ఇరుక్కుపోవడం వల్ల కొత్తగా చేపట్టే ప్రాజెక్ట్ లకు నిధుల కొరత సమస్య కూడా ఉత్పన్నమవుతోంది. దీంతో బీవోటి పద్ధతిపై పనులు చేపట్టేందుకు నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపడం లేదు. ఈ పీసీ పద్ధతికే ప్రాధాన్యత ఇస్తున్నాయి.
నేషనల్ హైవే అథార్టీకి తలనొప్పిగా నిధుల సమీకరణ
గత రెండేళ్లలో హైవే పనుల్లో 80శాతం ఈపీసీ పద్ధతిలో చేపట్టగా, బీవోటీ పద్ధతిలో చేపట్టినవి 15, 20శాతానికే పరిమితమయ్యాయి. అయితే ఈపీసీ పద్ధతిలో చేపట్టే పనులకు నిధులు సమకూర్చడం నేషనల్ హైవే అథార్టీకి పెద్ద తలనొప్పిగా మారుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనుల కు కేటాయించిన మొత్తం దాదాపు 23, 691 కోట్ల రూపాయలు కాగా నేషనల్ హై వే అథార్టీ 6, 208 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టగలిగినట్టు పార్లమెంటరీ ప్యానెల్ సమీక్షలో తేలింది. దీంతో బీవోటీ, ఈపీసీ పద్ధతులకు బదులుగా ప్రాజెక్ట్ వ్యయంలో 40శాతాన్ని గ్రాంట్ రూపంలో సమకూర్చే పద్ధతిని గత అక్టోబర్ లో ప్రవేశపెట్టారు. మరోవైపు, బీవోటీ పద్ధతిలో హై వే పనులు చేపట్టిన సంస్థలు నిర్మాణం పూర్తయిన రెండేళ్ల తర్వాత వంద శాతం ఈక్విటీలు అమ్ముకునే ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ గత ఆగస్టులోనే క్లియరెన్స్ ఇచ్చింది. ఇప్పుడు ఈ అవకాశాన్ని నిర్మాణ సంస్థలు ఉపయోగించుకోవడానికి ఉత్సుకతచూపిస్తున్నాయనడానికి ఐవీఆర్ సీఎల్, గామన్ సంస్థలే నిదర్శనం.

 

 

 

 

 

ఎయిర్ కోస్తా విమానంలో సాంకేతికలోపం

విజయవాడ : ఎయిర్ కోస్తా విమానంలో సాంకేతికలోపం ఏర్పంది. విమానం... 9.15 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు రావాల్సింది. విమానం రాకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. ఎయిర్ పోర్టు అధికారులు స్పందించలేదు. 

నేటి నుంచి రాష్ట్రస్థాయి ఖోఖో, విలువిద్య పోటీలు

ఆదిలాబాద్ : నేటి నుంచి జిల్లాలో రాష్ట్రస్థాయి ఖోఖో, విలువిద్య పోటీలు నిర్వహించనున్నారు.

సముద్రంలో వేటకు వెళ్లి 11 మంది గల్లంతు

కాకినాడ : సముద్రంలో వేటకు వెళ్లి 11 మంది గల్లంతయ్యారు. వారికి అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈనెల 10న మత్స్యకారులు వేటకు వెళ్లారు. 

07:18 - December 24, 2015

హైదరాబాద్ : రేపో మాపో ఎన్నికలు అన్న హడావుడి జరిగింది. పార్టీలన్నీ ప్రాథమిక కసరత్తులు చేశాయి. టిక్కెట్ల కోసం ఆశావాహులు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టేశారు. ఐనా అయోమయం వెంటాడుతోంది. వార్డుల వారీగా రిజర్వేషన్లు..ఎన్నికల తేదీలు ఇప్పటికీ ఖరారు కాకపోవడంతో నేతల్లో కంగారు మొదలైంది. ఐతే అధికార పార్టీ కావాలనే ఆలస్యం చేస్తోందని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. జీహెచ్‌ఎమ్‌సీ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న స్ట్రాటజీపై ఆ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఖరారు కాని ఎన్నికల తేదీలు..వార్డుల వారీగా రిజర్వేషన్లు
జీహెచ్‌ఎమ్‌సీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. వార్డుల వారీగా రిజర్వేషన్లు..ఎన్నికల తేదీలను ఇప్పటికీ ప్రకటించకపోవడంతో కొన్ని రాజకీయ పార్టీల్లో కలవరం మొదలైంది. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు...నగరంలో బీసీ ఓటర్ల నివేదికను ఇప్పటికే బల్దియా అధికారులు ప్రభుత్వానికి అందించారు. సర్కార్‌ మాత్రం ముందడుగు వేయడం లేదు. వార్డులు వారీగా రిజర్వేషన్లు..ఎన్నికల తేదీలను ఇప్పటికీ ప్రకటించలేదు.
ప్రతిపక్షాల విమర్శలు
ఐతే ప్రభుత్వం కావాలనే జీహెచ్‌ఎమ్‌సీ ఎన్నికలను ఆలస్యం చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వలసలను ప్రోత్సహించేందుకే అధికార పార్టీ ఎన్నికలను జాప్యం చేస్తోందని ఆరోపిస్తున్నాయి.
అమల్లో ఎమ్మెల్సీ కోడ్‌
రిజర్వేషన్లు..ఎన్నికల తేదీలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఐతే ప్రస్తుతం అందరూ చండీయాగంలో బిజీగా ఉన్నారు. మరోపక్క ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంది. కొత్త పథకాలను అమలు చేయడానికి ఇది ఆటంకంగా మారింది. నీటి బకాయిలు మాపీ, పెండింగ్‌ కరెంట్ బిల్లులు రద్దుకు సంబంధించి జీవోలు విడుదల కావాల్సి ఉంది. ఇవన్నీ పూర్తి చేయకుండా ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటిస్తే అనుకూల ఫలితాలు రావని టీఆర్‌ఎస్‌ పార్టీ అంచనా వేస్తోంది. దీంతో అన్నీ సర్దుకున్నాకే ఎన్నికల నగారా మోగించాలని ప్రభుత్వం భావిస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఇది ఇలా ఉంటే నూతన సంవత్సరం తొలి వారంలో ఎన్నికల తేదీలు ఖరారవుతాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జనవరి నెలాఖరులోగా ఎన్నికల ప్రక్రియ ముగిస్తుందని అంచనా వేస్తున్నాయి.

 

07:13 - December 24, 2015

హైదరాబాద్ : తెలంగాణాలో శాసనమండలి ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ పార్టీల్లో వేడి పెరుగుతోంది. ఎన్నికలకు మరికొద్ది రోజుల వ్యవధి మాత్రమే ఉంది. హోరాహోరిగా ఉన్న  జిల్లాల్లో  ఇప్పటికే కోట్ల రుపాయలు చేతులు మారినా.. రాబోయే రెండు మూడు రోజులు  ఈ వ్యవహారం మరింత ముదిరే అవకాశం ఉంది.
నేతల్లో ఉత్కంఠ 
శాసనమండలి ఎన్నికలు జరుగనున్న జిల్లాల్లో పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో నేతల్లో ఉత్కంఠ పెరుగుతోంది. నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం లాంటి జిల్లాల్లో అధికార పార్టీకి విపక్షాల నుంచి గట్టి పోటీ ఎదురౌతుంది. ఒక్క రంగారెడ్డి జిల్లాపై మాత్రం అధికార పార్టీ ధీమాగా ఉంది.
మహబూబ్ నగర్ లో ఏకమవుతున్న విపక్షాలు
మహబూబ్ నగర్ జిల్లాలోని రెండు స్థానాల్లో కనీసం ఒక స్థానాన్ని సాధించాలనే పట్టుదలతో విపక్షాలు ఏకమవుతున్నాయి. అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ తో స్థానిక సంస్థల ఓటర్ల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది.  
నల్గొండలో అధికార పార్టీకి పెద్ద సవాల్
నల్గొండ జిల్లా ఎన్నికలు అధికార పార్టీకి పెద్ద సవాల్ విసరుతోంది.  ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేశామని గులాబి పార్టీ నేతలు అంటున్నా... హస్తం నేతలు ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తారో... అధికార పార్టీ ఇంకా ఓ అంచనాకు రాలేకపోతుంది. దీంతో ఆ జిల్లా రాజకీయం రసవత్తరంగా మారుతోంది.
ఖమ్మంలో విజయంపై అధికార పార్టీ ధీమా 
ఖమ్మం జిల్లాలో ముగ్గురు  ప్రధాన పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నా... అధికార పార్టీ నేతలు మాత్రం విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మెజార్టీ ఓటర్లు తమకే మద్దతు తెలుపుతున్నరన్న ధీమా గులాబి నేతల్లో కనిపిస్తోంది.
గెలుపు కోసం కొత్త దారులు 
పోలింగ్ కు తేదీ సమీపిస్తుండడంతో అధికార పార్టీల నేతలంతా మద్దతు దారుల లెక్కలు వేసుకుంటున్నారు. గెలుపు కోసం కొత్త దారులను వెతికే పనిలో పడ్డారు.

06:48 - December 24, 2015

ప్రకాశం : తనతోపాటు కుటుంబం.. అందరూ సుఖంగా, సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో అయ్యప్పమాల వేశారు. కొన్ని రోజులు అంత్యంత కఠినమైన నియమ, నిష్టలతో ప్రత్యేక పూజలు చేశారు. శబరిమల వెళ్లే మందు అంతా బాగానే జరిగింది..కానీ దర్శనం తర్వాత తిరుగుప్రయాణంలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ఓ అయ్యప్పభక్తుడు మృతి చెందారు. ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురానికి చెందిన పులువురు అయ్యప్పస్వాములు బస్సులో శబరిమల వెళ్లారు. దర్శనం తర్వాత తిరిగి వస్తుండగా మార్గంమధ్యలో ప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలం రేణంగివరం వద్ద ఆగివున్న లారీని అయ్యప్పస్వాముల బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు.

 

 

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ప్రకాశం : జిల్లాలోని జె.పంగులూరు మండలం రేణంగివరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. శబరిమల నుంచి శ్రీకాకుళం వస్తుండగా ప్రమాదం చోటు చేటుసుకుంది. 

Don't Miss