Activities calendar

25 December 2015

21:50 - December 25, 2015

విశాఖ : బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం సిద్ధమవుతుండటంపై సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అడవి తల్లిని కార్పొరేట్ సంస్థలకు దత్తత ఇస్తున్న ప్రభుత్వానికి అరకు ఉత్సవాలు జరిపే అధికారం లేదని సీపీఎం నేతలు మండిపడ్డారు. తవ్వకాలకు సిద్ధమౌతున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆ పార్టీ నేతలు విశాఖలో అరకు ఉత్సవాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కాగా గిరిజన సమస్యలను పట్టించుకోని ప్రభుత్వానికి 'గిరిజన ఉత్సవాలు' చేయడమేంటోనని అక్కడి స్థానికులు మాట్లాడుకుంటున్నారు.

21:47 - December 25, 2015

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఇక గ్రౌండ్‌లోకి నేరుగా దిగాలని కాంగ్రెస్‌ నేతలు వ్యూహరచన చేశారు. కేసీఆర్‌తో పాటు మంత్రులు చేసిన శంకుస్థాపనలనే లక్ష్యంగా చేసుకొని ఓటర్లకు దగ్గరయ్యేందుకు స్కెచ్‌ వేశారు. 

పకడ్బందీ ప్రణాళికలు..
కాంగ్రెస్ నేతలు ఇప్పటి నుంచే పకడ్బందీ ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కేటీఆర్ సహా మంత్రులు ఇస్తున్న హామీలు, వేసిన శంకుస్థాపన రాళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల శంకుస్థాపనలు, క్రిస్టియన్‌, బంజారా, మొదలైన భవన్‌ల నిర్మాణానికి వేసిన శిలాఫలకాలే లక్ష్యంగా కాంగ్రెస్‌ నేతలు నిరసనలకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా క్రిస్టియన్‌ భవన్‌ కోసం వేసిన శిలాఫలకం వద్ద శుక్రవారం ఆందోళన చేపట్టారు.

హామీలపై గురి.. 
నిరుడు క్రిస్మస్‌ సందర్భంగా క్రిస్టియన్‌ భవన్‌కు కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఏడాదిలోగా భవనాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకూ ఆ హామీ అతీగతీ లేకుండా పోయింది. దీంతో క్రిస్టియన్‌ భవన్‌ శంకుస్థాపన శిలాఫలకం వద్ద హస్తం పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. గ్రేటర్‌ ఎన్నికల కోసమే కేసీఆర్‌ అన్ని వర్గాలనూ మోసం చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ నేతలు విరుచుకు పడ్డారు. 

లొసుగల కోసం ఆరా..
గడచిన ఏడాదిన్నర కాలంలో కేసీఆర్‌ బృందం గ్రేటర్‌ పరిధిలో ఎక్కడెక్కడ శంకుస్థాపనలు చేశారో కాంగ్రెస్‌ నేతలు ఆరా తీస్తున్నారు. సీఎం కేసీఆర్‌ వైఖరిపై ప్రజలను చైతన్య పరుస్తామని అంటున్నారు. డబుల్‌ బెడ్‌రూం పథకం లొసుగులను ప్రజలకు వివరిస్తామని అంటున్నారు.  గ్రేటర్‌లో నివసిస్తున్న ఏపీ సెటిలర్లు, దళితులు, క్రిష్టియన్‌ల ఓట్లను లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ నేతలు పావులు కదుపుతున్నారు. వీరి ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో వేచి చూడాలి. 

21:42 - December 25, 2015

హైదరాబాద్ : తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసింది. ఆదివారం పోలింగ్‌ జరగనుంది. దీంతో గెలుపు కోసం అన్ని పార్టీలూ చివరి ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. వలసలు, క్యాంపు రాజకీయాలు.. వైరి పక్షాల విమర్శలు.. రాజకీయ వాతావరణాన్ని హోరెత్తిస్తున్నాయి. 

ఆరు ఎమ్మెల్సీ  స్థానాలకు 27న ఎన్నికలు
స్థానిక సంస్థల కోటాలో ఖమ్మం, నల్లగొండ, పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లోని ఆరు  ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారానికి ఈసాయంత్రం గడువు ముగియడంతో అన్ని పార్టీలూ గెలుపు కోసం చివరి ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. వీలైన అన్ని అస్త్రాలనూ ప్రయోగిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీకి గట్టి పట్టున్న నల్లగొండ జిల్లాలో విజయాన్ని టీఆర్ఎస్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దీంతో అక్కడ భారీగా వలసలను ప్రోత్సహిస్తోంది. శుక్రవారం కూడా జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్‌ నాయకులను టీఆర్ఎస్‌లోకి చేర్చుకుంది. 

కోమటి రెడ్డి విజయం కోసం..
 నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి విజయం కోసం కాంగ్రెస్‌ పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది. జిల్లాలో టీఆర్ఎస్‌ నేతలు అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్‌ నాయకత్వం తీవ్రంగా మండిపడింది. 

వలసలతో సంఖ్యాబలం..
అటు ఖమ్మం జిల్లాలోనూ ఇదే తరహా పరిస్థితి ఉంది. ఇక్కడ క్యాంపు రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ కేవలం నలుగురు సభ్యుల మద్దతుతోనే బరిలోకి దిగిన టీఆర్ఎస్‌ వలసలను ప్రోత్సహించి సంఖ్యాబలాన్ని పెంచుకుంది. పాలకపక్షం తమ మద్దతుదారులతో పొరుగు రాష్ట్రంలో శిబిరాన్ని నిర్వహిస్తోంది. అటు వైఎస్సార్సీపీ కూడా ప్రత్యేక శిబిరాన్ని నిర్వహిస్తోంది. తమ పార్టీకి చెందిన ఓటర్లను పులివెందులలో ఉంచింది. ఇక్కడ తమ విజయం తథ్యమని ఆ పార్టీ నమ్ముతోంది. 

అక్కడ కూడా ఆపరేషన్ ఆకర్ష్
ఇక పాలమూరులోనూ పాలక పక్షం దూకుడును కనబరుస్తోంది. ఇక్కడా ఆపరేషన్‌ ఆకర్ష్‌పైనే ఆపార్టీ నమ్మకంగా ఉంది. ఇక్కడ టీఆర్ఎస్‌ తీరును విపక్షాలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి. టీఆర్ఎస్‌ మంత్రులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, బలం లేకపోయినా పోటీకి దిగి.. ఓటర్లను కొంటున్నారని ఆరోపిస్తున్నాయి. ఎన్నికల సంఘానికి ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. 

పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లూ పూర్తి
మరోవైపు ఈనెల 27న పోలింగ్‌కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లూ చేసింది. పోలింగ్‌ జరిగే అన్ని ఆర్డీవో కార్యాలయాల్లోనూ వెబ్‌ కెమెరాలను అమర్చుతున్నారు. వీటితో పాటు ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌, స్టాటికల్‌ సర్వేయలెన్స్‌ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. ఈనెల 30న ఓట్ల లెక్కింపు చేపట్టి.. అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు. 

21:36 - December 25, 2015

లాహోర్ : ప్రధాని నరేంద్రమోదీ పాక్ బాటపట్టారు. ఆప్ఘన్ పర్యటనలో ఉన్న ప్రధాని.. అకస్మాత్తుగా లాహోర్ వెళ్తున్నట్టు ప్రకటించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. అనుకోకుండా వచ్చిన అతిథికి పాక్ ప్రధాని రాచమర్యాదలు చేశారు. నేడు షరీఫ్‌ పుట్టినరోజు కావడం.. మోదీ గ్రీటింగ్స్‌ చెప్పడం ప్రత్యేకతను సంతరించుకుంది. 

ఆకస్మిక పర్యటన..
ఆకస్మికంగా పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ఘనస్వాగతం పలికారు. లాహోర్‌ విమానాశ్రయంలోనే షరీఫ్‌... మోదీకి స్వాగతం పలికారు. మోదీ ప్రధాని అయ్యాక పాకిస్థాన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. నవాజ్‌ షరీఫ్‌ పుట్టినరోజు కావడంతో ఆయనకు శుభాకాంక్షలు చెప్పేందుకే మోదీ ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి లాహోర్‌ చేరుకున్నట్లు సమాచారం. భారత ప్రధాని పాకిస్తాన్‌లో పర్యటించడం 11 ఏళ్ల తర్వాత ఇదే ప్రథమం. 2004లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి.. సార్క్‌ సదస్సు కోసం ఇస్లామాబాద్‌ వెళ్లారు. ఆకస్మికంగా పాకిస్తాన్‌లో పర్యటించిన తొలి ప్రధాని కూడా మోదీయే. మోదీది అనూహ్య పర్యటనే అయినా పాక్ సైన్యం భద్రతను కట్టుదిట్టం చేసింది. 

ఇరు ప్రధానుల భేటీ.. 
పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ నివాసంలో ఇరు దేశాల ప్రధానులు భేటీ అయ్యారు. నవాజ్‌ షరీఫ్‌కు మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అనంతరం విందులో పాల్గొన్నారు. మోదీ విందు కోసం మటన్ ఫ్రై, పాలక్ పన్నీరు మెనూలో ఉంచినట్లు సమాచారం. ఇరు దేశాల ప్రధానుల భేటీతో ప్రపంచ మీడియా కూడా అవాక్కైంది. 

ఎవరికీ తెలియదు.. 
మోదీ పాకిస్తాన్ ప‌ర్యట‌న విష‌యం ఎవరికీ తెలియదు. పాకిస్తాన్‌కు విమానం ఎక్కబోయే ముందు మోదీ ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. దీంతో ఆ విష‌యం బ‌య‌టికి తెలిసింది. ఇది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. పొరుగు దేశానికి వెళ్లేముందు దేశానికి చెప్పాల్సిన అవసరం లేదా అని ప్రతిపక్షాలు విమర్శించాయి. మోదీ పాకిస్తాన్‌ పర్యటన మంచిదే అయినా ఎవరికీ చెప్పకుండా వెళ్లడం అందరినీ విస్తుగొలిపింది. 

పొగడ్తలు.. తెగడ్తలు. 
మోదీ పర్యటనను కాశ్మీర్‌ వేర్పాటువాదులు స్వాగతించారు. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయని బీజేపీ అభిప్రాయపడింది. మరోవైపు కాంగ్రెస్‌ మాత్రం దీన్ని తప్పుపట్టింది. మోదీ పాక్‌ పర్యటనను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మోదీ పాక్ పర్యటన రెండు గంటల పాటు సాగింది. సాయంత్రం ఐదు గంటలకు లాహోర్ చేరుకున్న మోదీ తిరిగి రాత్రి 7గంటల సమయంలో ఢిల్లీ ప్రయాణమయ్యారు. 

ఢిల్లీ చేరుకున్న మోడీ

ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ చేరుకున్నారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పుట్టినరోజు సందర్భంగా మోడీ లాహోర్ వెళ్లి షరీఫ్‌కు స్వయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఇదేరోజున నవాజ్ షరీఫ్ మనవరాలు పెళ్లి వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు. గంటకు పైగా ఇరు ప్రధానుల భేటీ జరిగింది. అనంతరం లాహోర్ విమానాశ్రయం నుంచి బయల్దేరిన ప్రధాని ఢిల్లీకి చేరుకున్నారు. 

20:29 - December 25, 2015

ఈ రోజు 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో వెరైటీ చోటు చేసుకుంది. ప్రతిసారి మల్లన్నే ముచ్చట్లు చెబుతాడా.. నేను చెబుతా అంటూ పాలమూరు ప్రాంతానికి చెందిన వెంకటేశం అనే అంధుడు వచ్చాడు. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు...వివిధ ప్రాంతాల్లో శాంతాక్లాజుల పొరపాటు..ఎర్రవెల్లిలో అయిత చండీయాగం..తెలంగాణ జైళ్ల శాఖ సరికొత్త నిర్ణయం..రూ. 200 దాటిన చికెన్ ధర...రైతుల పేరిట నేతల రాజకీయాలు..కల్తీ పాలు..మద్యం తయారీ...కాగుతున్న నూనెలో చేతితో వంటల తయారీ..అంశాలపై ముచ్చట్లు కొనసాగాయి. మరి ఆ విశేషాలేంటో తెలియాలంటే వీడియో క్లిక్ చేయండి..

అసోం రైఫిల్స్ కానిస్టేబుల్ దాడిలో నిందితుడు అరెస్టు..

బెంగళూరు : అసోం రైఫిల్స్ కానిస్టేబుల్స్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడు అతోషె చొపెను బెంగళూరులో ఎన్ఐఏ అరెస్టు చేసింది. మార్చి 26వ తేదీన రైఫిల్స్ సిబ్బందిపై నాగా తీవ్ర వాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. 

ముగిసిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార గడువు..

హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార గడవు ముగిసింది. ఆదివారం ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. 

అరకు ఉత్సవాలు నిర్వహించడంలో అర్థం లేదు - సీపీఎం..

విశాఖపట్టణం : ఏజెన్సీలో సమస్యలు పరిష్కరించకుండా అరకు ఉత్సవాలను నిర్వహించడంలో అర్థం లేదని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. గిరిజనులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని బాక్సైట్ తవ్వకాలపై జీవో 97 ను రద్దు చేయకుండా గత జీవోను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం మోసపూరితమన్నారు. కాంట్రాక్టర్లను సంతృప్తిపరచడానికి అరకు ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

అరకు ఉత్సవాలు ప్రారంభం..

విశాఖపట్టణం : మూడు రోజుల పాటు జరిగే అరకు ఉత్సవాలను తుడుం కొట్టి మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. రూ. 50 లక్షలతో పద్మావతి గార్డెన్స్ అభివృద్ధికి చర్యలు తీసుకొనున్నట్లు గంటా తెలిపారు. 

మోడీ పర్యటనను స్వాగతిస్తున్నాం - పాక్ విదేశాంగ శాఖ..

పాకిస్తాన్ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాక్ పర్యటనను స్వాగతిస్తున్నట్లు పాక్ విదేశాంగ ప్రకటించింది. భారత్ తో చర్చలను ముందుకు తీసుకెళుతామని తెలిపింది.

20:06 - December 25, 2015

హైదరాబాద్ : నగరంలోని ఓ చర్చి తనదైన విశిష్టతను సంతరించుకుంది. రాష్ట్రంలోని ఏ చర్చిలోనూ లేని రీతిలో ఇక్కడ ఉర్దూ, హిందీ భాషలు రాజ్యమేలుతున్నాయి. హిందీలో ప్రార్థనలు జరిపి.. ప్రభువు సందేశాన్ని ఉర్దూ భాషలో వినిపిస్తారు. ఇక్కడ ఉర్దూ భాషలో ప్రచురితమైన పుస్తకాల నుంచే ఏసుక్రీస్తు కీర్తనలను ఆలపిస్తారు. ఆబిడ్స్‌లోని చిరాగ్‌ అలీలేన్‌లోని.. హిందుస్థానీ చర్చ్‌ రాష్ట్రంలోనే తనదైన విశిష్టతలను సొంతం చేసుకుంది. ఎప్పుడో 120 సంవత్సరాల క్రితం బ్రిటిష్‌ పాలకుల హయాంలో నిర్మించిన ఈ చర్చిలో... మిగిలిన చర్చిలకు భిన్నమైన వాతావరణం కనిపిస్తుంటుంది. ఇక్కడ ప్రార్థనలు హిందీలోను, ప్రవచనాలు ఉర్దూలోనూ కొనసాగిస్తున్నారు. బ్రిటిష్‌ పాలకుల హయాంలో.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మిలట్రీ అధికారుల కుటుంబాలకు అందుబాటులో ఉండేలా ఈ చర్చిని నిర్మించారు. బ్రిటీష్‌ పాలన ముగిసిన తరువాత ఈ చర్చి సౌత్‌ ఇండియా క్రిస్టియన్‌ చర్చి సంస్థ ఆధ్వర్యంలోకి వెళ్లిపోయింది. మేఘాలయ, నేపాల్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ల నుంచి వలస వచ్చి.. హైదరాబాద్‌లో స్థిరపడిపోయిన క్రిస్టియన్‌లు ఈ చర్చికి వచ్చి ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. క్రిస్టియన్‌ మతాన్ని స్వీకరించిన హైదరాబాదీ ముస్లింలూ ఇక్కడికొచ్చి క్రీస్తు ఆరాధనల్లో పాల్గొంటారు. ఇలాంటి వారందరికీ అనువుగా ఉండేందుకు.. ఇక్కడ హిందీలో ప్రార్థనలు.. ఉర్దూలో బోధనలు జరుపుతున్నారు. ఇక్కడికి వచ్చే క్రైస్తవ భక్తుల కోసం.. ఉర్దూలో ముద్రించిన బైబిల్‌, కీర్తనల గ్రంథాలను అందుబాటులోకి తెచ్చారు. హిందీ, లాటిన్‌ అమెరికా ప్రచురణలనూ అందుబాటులోకి తెచ్చారు. చర్చి గోడలపై సూక్తులు హిందీ భాషలో ఉంటాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే తెలుగు భాష అర్థం కాక ఇబ్బందులు పడే వారికి ఈ చర్చి వరప్రసాదినిలా మారితే.. చర్చిని సందర్శించే వారికి మాత్రం దేశంలోని విభిన్న సంస్కృతులను దర్శించే అవకాశమూ లభిస్తుంది. 

20:03 - December 25, 2015

హైదరాబాద్ : ఏపీలో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రీస్తు జన్మించిన రోజున ఆయన్ను ఆరాధిస్తూ.. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ప్రత్యేక కీర్తనలు ఆలపించారు. కృష్ణా జిల్లాలో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు.

కృష్ణా జిల్లాలో..
కృష్ణా జిల్లాలో.. క్రిస్మస్‌ పర్వదినాన్ని క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. అన్ని చర్చిలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. కాంతులతో ధగధగలాడేలా విద్యుత్‌ దీపాలను అలంకరించారు. చిన్నా పెద్దా తేడా లేకుండా క్రైస్తవులంతా చర్చిల్లోని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుణదలలోని మేరీమాత ఆలయంలో నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్నారు. క్రిస్మస్‌ సందర్భంగా.. పేదలకు చంద్రన్న క్రిస్మస్‌ కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నవ్యాంధ్ర కష్టాలన్నీ తీరిపోయి స్వర్ణాంధ్రగా రూపుదిద్దుకునేందుకు.. ఏసు దీవెనలు లభిస్తాయన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. నగరంలోని గుణదల చర్చిని అభివృద్ధి చేస్తామని.. దేశంలోనే అత్యున్నత చర్చిగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

విజయవాడలో..
విజయవాడ నిర్మలాకాన్వెంట్ రోడ్డులోని చర్చి, గుణదల చర్చి, పాతబస్తీలోని ఇఎస్ఐ చర్చిలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరై ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా బిషప్ లు, ఫాదర్ లు యేసు గీతాలను ఆలపించి విశిష్టతను వివరించారు.

నెల్లూరులో..
నెల్లూరు జిల్లాలోనూ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పండుగ సందర్బంగా చర్చిలను విద్యుద్దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అన్ని చర్చిలలోనూ ప్రత్యేక ప్రార్దనలు నిర్వహించారు. ఏసు జన్మవృత్తాంతాన్ని తెలియజేసే ప్రదర్శనలనూ ఏర్పాటు చేశారు. క్రీస్తు జననం.. లోకానికి చేసిన సేవల గురించి మతపెద్దలు వివరించారు. క్రిస్మస్‌ సంబరాల్లో.. మాజీ ఎమ్మెల్యే వివేకానందరెడ్డి పాల్గొన్నారు. ఏసు చూపిన శాంతి మార్గం అందరికీ ఆచరణీయమని అన్నారు.

విశాఖపట్టణంలో..
అతి పురాతన చర్చిలకు కేంద్రమైన విశాఖ జిల్లాలోనూ క్రిస్మస్‌ సంబరాలు ఘనంగా జరిగాయి. క్రైస్తవులు భక్తి ప్రపత్తులతో క్రీస్తును ఆరాధించారు. అన్ని చర్చిలను విద్యుద్దీపాలతో అలంకరించారు. ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.

గుంటూరు, ఉభయ గోదావరి, ప్రకాశంలో
గుంటూరు, ఉభయ గోదావరి, ప్రకాశం జిల్లాల్లోనూ క్రిస్మస్‌ సంబరాలు ఘనంగా జరిగాయి. అన్ని చర్చిలను ప్రత్యేకంగా అలంకరించారు. అర్ధరాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభించారు. ఈ ఉత్సవాలకు.. రాజకీయ ప్రముఖులూ పెద్ద సంఖ్యలో హాజరై.. క్రైస్తవులకు శుభాకాంక్షలు అందజేశారు.

రాయలసీమలో..
రాయలసీమ వ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. నాలుగు జిల్లాల్లోనూ.. క్రైస్తవులు అర్ధరాత్రి నుంచే క్రిస్మస్‌ సంబరాలు ప్రారంభించారు. రాజకీయ నేతలూ హాజరై.. క్రైస్తవులకు పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగ సందర్భంగా.. ప్రభుత్వం తరఫున మంత్రులు పేదలకు చంద్రన్న క్రిస్మస్‌ కానుక ప్యాకెట్లను పంపిణీ చేశారు. కడప జిల్లాలో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. చర్చిలను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. రాత్రి నుంచే క్రైస్తవులు పండుగ ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. క్రీస్తును కీర్తిస్తూ రచించిన కీర్తనలు ఆలపించారు. జిల్లాలోని పులివెందులలో జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో వైసీపీ అధినేత జగన్‌, గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో పాటు వారి కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. క్రీస్తును స్తుతిస్తూ.. కీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా.. జగన్‌ సతీమణి భారతి.. క్రీస్తు సందేశాన్ని వినిపించారు. కడప జిల్లాలోని క్రిస్మస్‌ వేడుకల్లో.. దాదాపుగా అన్ని చర్చిల్లోనూ భారీ క్రిస్మస్‌ కేక్‌లు కట్‌ చేసి.. పరస్పరం తినిపించుకున్నారు. అనంతరం.. పాస్టర్లు.. క్రీస్తు జననం గురించిన విశేషాలను వినిపించారు. ఈ వేడుకల్లో క్రైస్తవేతరులూ పాల్గొని శుభకామనలు అందజేశారు. అటు అనంతపురం జిల్లాలోనూ క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి పల్లె రఘునాథరెడ్డితో పాటు పలువురు రాజకీయ నాయకులు వేడుకల్లో పాల్గొన్నారు. ఎంపీ దివాకరరెడ్డి తనయుడు పవన్‌కుమార్‌ రెడ్డి చర్చిలన్నింటికీ తిరిగి.. క్రైస్తవులకు శుభాకాంక్షలు అందించారు. తనను తాను ప్రేమించుకున్నట్లే. పొరుగువారినీ ప్రేమించే తత్వం.. క్షమాగుణం అలవరచుకోవాలని.. వేడుకల్లో పాల్గొన్న మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆకాంక్షించారు. హిందూపురం పట్టణంలోని సీఅండ్‌ ఐజీ మిషన్స్‌ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ సంబరాలకు పౌర సరఫరాల మంత్రి పరిటాల సునీత, చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న నేతలు.. క్రైస్తవులకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా.. పేదలకు చంద్రన్న క్రిస్మస్‌ కానుక ప్యాకెట్లను నేతలు పంపిణీ చేశారు. చిత్తూరు, కర్నూలు జిల్లాల్లోనూ క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. అన్ని చర్చిల్లోనూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

తెలంగాణలో..
తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ క్రిస్మస్‌ సంబరాలు ఘనంగా జరిగాయి. ప్రఖ్యాత మెదక్‌ చర్చితో పాటు.. అన్ని ప్రధాన ప్రార్థనాలయాల్లోనూ వైభవంగా క్రీస్తు ఆరాధనలు నిర్వహించారు. విద్యుద్దీపాలంకరణలు.. ఏసు కీర్తనలతో.. ప్రార్థనాలయాలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. సుప్రసిద్ధమైన మెదక్‌ చర్చిలో క్రిస్మస్‌ సంబరాలు ఘనంగా జరిగాయి. అర్ధరాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. విద్యుద్దీపాలంకరణలతో.. చర్చి ప్రత్యేక శోభను సంతరించుకుంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి.. క్రీస్తు ఆరాధనలో పాల్గొన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లోనూ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా.. టీడీపీ సీనియర్‌ నేత మోత్కుపల్లి నరసింహులు కేక్‌ కట్‌ చేశారు. ఈ వేడుకల్లో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. క్రీస్తు చూపిన ప్రేమ, శాంతి మార్గాలు అందరికీ అనుసరణీయాలని మోత్కుపల్లి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జంట నగరాల్లోనూ క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. అన్ని ప్రార్థనాలయాలనూ అందంగా అలంకరించారు. అర్ధరాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు మొదలు పెట్టారు. క్రీస్తు ఆరాధనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మతపెద్దలు క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని వివరించారు. ఆదిలాబాద్‌ జిల్లాలోనూ క్రిస్మస్‌ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. మెదక్‌ తర్వాత రెండో పెద్ద చర్చిగా పేరొందిన లక్సెట్టి పేట సీఎస్‌ఐ చర్చిలోనూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ప్రార్థనాలయానికి తరలి వచ్చి.. క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్నారు. కరీంనగర్‌ జిల్లాలోనూ క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. అన్ని ప్రార్థనాలయాలనూ విద్యుద్దీపాలతో అలంకరించారు. అర్ధరాత్రి నుంచే ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలియజెప్పే ప్రత్యేక కీర్తనలు ఆలపించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో క్రిస్మస్‌ వేడుకలు సంబరంగా జరిగాయి. ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి తదితరులు వేడుకలకు హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో చర్చిలకు తరలి వచ్చిన క్రైస్తవులకు.. పలువురు రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు రాజకీయ ప్రముఖులకు మత పెద్దలు ఆశీర్వచనాలు పలికారు. 

19:57 - December 25, 2015

ముంబై : బాలీవుడ్‌లో మరో తార రాలిపోయింది. 60వ దశకంలో టాప్ స్టార్‌గా ఏలిన నటి సాధన ముంబైలో కన్నుమూశారు. సుదీర్ఘ కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాధన శుక్రవారం తన నివాసంలో తుదిశ్వాస విడిచారని ఆమె స్నేహితురాలు, బీజేపీ ముంబై అధికార ప్రతినిధి షైనా తెలిపారు. సాధనకు పెంపుడు కుమార్తె ఉన్నారు. 1941, సెప్టెంబర్ 2న కరాచీలో జన్మించిన సాధన.. 1959లో వచ్చిన 'లవ్ ఇన్ సిమ్లా' సినిమాతో బాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమయ్యారు. 1960 దశకంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందారు. పరాఖ్, హమ్ దోనో, ప్రేమ్ పత్రా, అసలీ-నకిలీ, మేరీ మెహబూబ్, తదితర సినిమాల్లో నటించారు. అప్పట్లో 'సాధనా కట్' పేరుతో ఆమె హెయిర్ స్టైల్ బాగా పాపులర్ అయింది. సాధన మరణం పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.

19:53 - December 25, 2015

ఢిల్లీ : కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ అవినీతిపై ప్రధానిని ప్రశ్నించడం ఈ సంవత్సరంలో పెద్ద జోక్‌ అని కేంద్ర మంత్రి వెంకయ్యానాయుడు అన్నారు. అంతేకాదు కాంగ్రెస్‌ హయాంలో జరిగిన డీడీసీఎ అవకతవకల గురించి ఇప్పుడు ప్రశ్నించడం ఏంటని వెంకయ్య అన్నారు. నిష్కళంకుడైన అరుణ్‌ జైట్లీపై ఆరోపణలు చేయడం ద్వారా కాంగ్రెస్‌ భంగపడటం ఖాయమని వెంకయ్యనాయుడు విమర్శించారు.

19:09 - December 25, 2015

పాకిస్తాన్ : భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాక్ లో అకస్మిక పర్యటన ముగిసింది. సుమారు గంట పాటు ఆయన పాక్ లో ఉన్నారు. తొలుత అప్ఘనిస్తాన్ నుండి నేరుగా మోడీ లాహోర్ ఏయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడ ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం సైనిక వందనం స్వీకరించిన మోడీని తన నివాసానికి షరీఫ్ తీసుకెళ్లారు. లాహోర్ లోని ప్రధాని షరీఫ్ అధికారిక నివాసం రైవిండ్ ప్యాలెస్ కు చేరుకున్న అనంతరం వీరిద్దరూ ఏకాంతంగా చర్చించినట్లు తెలుస్తోంది. షరీఫ్ కు మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదే సందర్భంలో షరీఫ్ ఇంట్లో ఆయన మనువరాలి పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. షరీఫ్ నివాసంలో గంట పాటు గడిపిన మోడీ లాహోర్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. వీడ్కోలు పలికేందుకు షరీఫ్ కూడా ఎయిర్ పోర్టుకు వెళ్లారు. షరీఫ్..మోడీ భేటీలో ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయనేది అధికారికంగా తెలవాల్సి ఉంది.
మరోవైపు మోడీ అకస్మిక పాక్ పర్యటనపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ భద్రతపై పెను ప్రభావం పడుతుందని ఆ పార్టీ నేత మనీష్ తివారీ పేర్కొన్నారు. ఇది పిచ్చి వ్యవహారమన్నారు. పాక్ తో సత్సంబంధాలు ఉండడం ఈ ప్రాంత ప్రయోజనాలకు మంచిదని, అప్పుడే ఇక్కడి అభ్యంతరాలు చెప్పవచ్చని బీజేపీ నేత నళీల్ కోహ్లీ వ్యాఖ్యానించారు. మంచి రాజనీతిజ్ఞత అంటే ఇదేనని, పొరుగుదేశాలతో ఇలాంటి సత్సంబంధాలు ఉండాలని సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. ఇదొక మంచి పరిణామమని..భారత్ అందిస్తున్న స్నేహపూర్వక హస్తాన్ని తీసుకుని పాక్ ముందుకు రావాలని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.

లాహోర్ ఎయిర్ పోర్టుకు మోడీ..

పాకిస్తాన్ : ప్రధాని నవాజ్ షరీఫ్ తో భారత ప్రధాని మోడీ జరిపిన భేటీ ముగిసింది. షరీఫ్ నివాసంలో ఈ భేటీ జరిగింది. గంట పాటు షరీఫ్ నివాసంలో గడిపిన మోడీ లాహోర్ ఎయిర్ కు పోర్టుకు పయనమయ్యారు. 

18:43 - December 25, 2015

చిన్నప్పుడు వేసుకున్న చొక్కా బాగుండేదని ఇప్పుడు మళ్లీ వేసుకుంటే జనం నవ్వుతారు. అలాగే అప్పుడెప్పుడో ఇద్దరు భార్యల కథతో చేసిన సినిమా సక్సెస్ అయ్యిందని...దశాబ్దాల తర్వాత మళ్లీ తీస్తే...ప్రేక్షకులు తిరస్కరిస్తారు. కెరీర్ కు అనుభవం పనికిరానప్పుడు అది ఉన్నా లేనట్లే. టాలీవుడ్ లో నలభై ఏళ్ల ప్రయాణం చేస్తున్న మోహన్ బాబుకు....'మామ మంచు అల్లుడు కంచు' లాంటి సినిమా కథపై కనీసం అనుమానమైనా రాలేదంటే ఆశ్యర్యమే. కాలం చెల్లిన ఈ కథను ఎలా సినిమాగా తీశారనేది మరో సందేహం. పైగా అల్లరి నరేష్, కలెక్షన్ కింగ్ కాంబినేషన్ అంటూ పబ్లిసిటీ ఒకటి. తీరా సినిమా చూశాక గానీ అర్థం కాదు....ఇంట్లో టీవీలో వచ్చే సీరియల్స్ చాలా బెటరని.

కథ..
మామ మంచు అల్లుడు కంచు కథా వివరాలు చూస్తే.....భక్తవత్సలం నాయుడుకి ఇద్దరు భార్యలుంటారు. ఆయనకు ఇద్దరున్నట్లు..ఆ ఇద్దరికీ తెలీదు. వాళ్లను అలా మెయింటేన్ చేస్తుంటాడు భక్తవత్సలం. ఆయనకున్న ఇద్దరు భార్యల్లో ఒకరికి అబ్బాయి, మరొకరికి అమ్మాయి పుట్టి పెరిగి పెద్దవాళ్లవుతారు. తమకు తండ్రి ఒకరేనని తెలీదు కాబట్టి ఓ సందర్భంల్లో వరుసకు అన్నా చెల్లెల్లు అయ్యే వీళ్లిద్దరు ఒకరికొకరు అట్రాక్ట్ అవుతారు. ఒకరోజు హోటల్ లో కలుసుకోవాలని అనుకుంటారు. విషయం తెల్సుకున్న భక్తవత్సలం...కొడుకు హోటల్ కు రాకుండా చేసి అతని స్థానంలో మరో కుర్రాడిని హోటల్ కి పంపిస్తాడు. నటించమని పంపిన ఆ కుర్రాడు నిజంగానే అమ్మాయిని ప్రేమిస్తాడు...క్రమంగా అల్లుడు కంచుగా తయారవుతాడు. తన కొడుకు, కూతురు పెళ్లిళ్లు కుదిరి....అవీ ఒకే తేదీకి రావడం...భక్తవత్సలంను ఇరకాటంలో పడేస్తుంది. ఇద్దరు భార్యలకు దొరక్కుండా ఈ పెళ్లిళ్లు తండ్రిగా ఎలా చేశాడు. అల్లుడు కంచుతో ఎలా కలిసిపోయాడనేది మిగిలిన కథ.

నటీ నటుల అభినయం..
కథ రాసేప్పుడు కామన్ సెన్స్ లేకుంటే...ఇక సన్నివేశాలు, అవి ఫెర్మా మెన్స్ చేసే ఆర్టిస్టులు, వాళ్ల నటన...అన్నీ గంతకు తగ్గ బొంతలాగే ఉంటాయి. ఇద్దరు భార్యల కథలు అనే కాన్సెప్టులు ఇప్పటివా...దశాబ్దాల క్రితంవి. కొన్ని సీన్స్ లో ఉత్తరాలు రాయడం చూస్తుంటే...దర్శకుడు ఏ కాలంలో ఉన్నాడనే సందేహం వస్తుంటుంది. నటుడిగా ఎవరెస్ట్ లాంటి అమితాబ్ కూడా నటనలో అతి చూపించడు. తాను గొప్ప నటుడైనా...ఆ భావం అతని ఫెర్మార్మెన్స్ లో కనిపించదు. కానీ ఇక్కడ మోహన్ బాబు నటనలో అతి విశ్వాసం తొణికిసలాడుతుంటుంది. ఈ సీన్ ను చితగ్గొట్టేస్తా అన్నట్లు. ఆయన మంచి నటుడైనా...ఆ లక్షణం పాత్రతో ప్రేక్షకులను కనెక్ట్ కాకుండా చేస్తుంటుంది. తాను రొమాంటిక్ హీరో అన్న భావం నుంచి ఆయనింకా బయటపడినట్లు లేరు. లేకుంటే రమ్యకృష్ణ, మీనాలతో ఇప్పటికీ రొమాంటిక్ సీన్స్ ఎందుకో అర్థం కాదు. ఆ సన్నివేశాలు ప్రేక్షకులకు వెగటు పుట్టిస్తుంటాయి. ఇక అల్లరి నరేష్ అల్లుడు క్యారెక్టర్లో నటించినట్లు ఆడియోన్స్ కు తెలిసిపోతుంది. పాత్ర కనిపించాలి నటుడు కాదు. రమ్యకృష్ణ, మీనా లకు నటించేందుకేం లేదు. చాలా మొహమాటంగా ఉన్నారు సినిమా అంతా. పూర్ణ...పూర్ణంలా గుడ్రంగా తయారైంది. తన పాత్ర మేరకు నటించింది. వరుణ్ సందేశ్ కు ఈ సినిమా తర్వాత హీరోగా ఇక సినిమాలు రావేమో. ఇలా క్యారెక్టర్లు చేసుకోవాల్సిందే. అలీ సినిమా స్టార్టింగ్ నుంచీ బూతు కామెడీ చేస్తూనే ఉంటాడు. కొంతకాలం తర్వాత అలీ తన కెరీర్ ను చూసుకుంటే...అన్నీ ఇలాంటి పాత్రలే ఉంటాయోమో. అలీ ఇలాంటి క్యారెక్టర్లు చేయడం ఆపేయకుంటే...ఎవరైనా సన్మానాలు గట్రా చేసేప్పుడు, అవార్డులు ఇచ్చేప్పుడు..బాధపడాల్సి ఉంటుంది. కెరీర్ లో ఒక్కటైనా మంచి పాత్ర చేయలేదే అని.

పేలవమైన కథ..
నాగార్జునతో ఢమరుకం లాంటి పెద్ద సినిమా చేసిన దర్శకుడు శ్రీనివాసరెడ్డి...మామ మంచు అల్లుడు కంచు తెరకెక్కించాడంటే నమ్మకం కుదరదు. ఇంత పేలవమైన కథ, స్క్రీన్ ప్లే, క్యారెక్టర్స్ డిజైన్...అతనొక్కడికే నచ్చి ఉంటాయి. లేక చుట్టూ ఉన్న వాళ్లు అతనికి స్వేచ్ఛ ఇచ్చి ఉండరు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ టీవీ సీరియల్ లా ఉన్నాయి. అచ్చు, రఘు కుంచే, కోటి లాంటి ముగ్గురు సంగీత దర్శకులు ఉన్నా....నేపథ్య సంగీతం అఘోరించింది. పాటలు గురించి చెప్పుకోనవసరం లేదు. మొత్తంగా ఈ కాలం చెల్లిన మామ అల్లుల్ల కామెడీ చూసేకంటే...సాయంత్రం వచ్చే వెయ్యి వారాల డైలీ సీరియల్ చూడటం బెటరనేది సినిమా చూసొచ్చిన ఆడియెన్స్ మాట.

ఫ్లస్ పాయింట్స్
ఏమీలేవు
మైనస్ పాయింట్స్
కాలం చెల్లిన కథ
ప్రధాన పాత్రల చిత్రణ
డబుల్ మీనింగ్ డైలాగులు
నేపథ్య సంగీతం
పాటలు
అలీ క్యారెక్టర్

18:36 - December 25, 2015

విజయవాడ : గొల్లపాలెం గట్టు వద్ద విషాదం చోటు చేసుకుంది. క్వారీ కొండపై పేకాట ఆడుతున్న వారి వైపు పోలీసులు వెళ్లడంతో ముగ్గురు వ్యక్తులు కొండపై నుండి కిందకు దూకేశారు. దీనితో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పాతబస్తీలోని క్వారీ కొండపై నిత్యం పేకాట ఆడుతుంటారు. చెట్లు..పొదలు భారీగా ఉండడంతో ఇక్కడ పేకాట ఆడుతున్న విషయం ఎవరికీ కనిపించదు. సెలవు రోజుల్లో ఈ ప్రాంతాన్ని పేకాట స్థావరంగా మార్చుకుంటుంటారు. అయితే పోలీసులు వేరే కేసు నిమిత్తం కొండపైకి రావడంతో పేకాటరాయుళ్లు కిందకు దూకారు. 

అప్ఘనిస్తాన్ లో ఘోర బస్సు ప్రమాదం..

అప్ఘనిస్తాన్ : సమంగన్ ప్రావిన్స్ రహదారిపై కాబుల్ నుండి మజర్ ఈ షరీఫ్ వెళుతున్న బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొంది. ఈ ఘటనలో 24 మంది దుర్మరణం చెందారు. 

షరీఫ్ ఇంటికి చేరుకున్న మోడీ..

పాకిస్తాన్ : లాహోర్ లోని ప్రధాని నవాజ్ షరీఫ్ అధికారిక నివాసం రైవిండ్ ప్యాలెస్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ చేరుకున్నారు. అక్కడ ఆయనకు నాలుగంచెల భద్రతను పాక్ కల్పిస్తోంది. 

అరకు ఉత్సవాలను అడ్డుకున్న సీపీఎం..

విశాఖపట్టణం : అరకు ఉత్సవాలను సీపీఎం నేతలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు పలువురిని అరెస్టు చేసింది. బాక్సైట్ తవ్వకాలకు సిద్ధమౌతున్న ప్రభుత్వానికి అరకు ఉత్సవాలను జరిపే అవకాశం లేదని సీపీఎం నేతలు పేర్కొన్నారు. 

17:24 - December 25, 2015

నల్గొండ : పోటీలో ఉన్న తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి ఓడిపోతే తాను వెంటనే పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతే సీఎం కేసీఆర్ ఆ పని చేస్తారా ? అని సవాల్ విసిరారు. టీఆర్ఎస్ గ్రూపులోకి చేరలేదని, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న మహిళా ఎంపీటీసీ భర్తలను ఉద్యోగాల నుండి తప్పించారని, ఇంతటి దారుణాలు దేశంలో ఎక్కడా చూడలేదన్నారు. 

17:19 - December 25, 2015

పాకిస్తాన్ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లాహోర్ లో అడుగుపెట్టారు. అప్ఘనిస్తాన్ పర్యటన అనంతరం ఆయన అకస్మిక పాక్ పర్యటనకు వెళ్లారు. తాను పాక్ లో పర్యటించనున్నట్లు మోడీ స్వయంగా ట్విట్టర్ ద్వారా ట్వీట్స్ చేయడం సంచలనం సృష్టించింది. లాహోర్ ఎయిర్ పోర్టులో ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ స్వాగతం పలికారు. అనంతరం మోడీ సైనిక వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మోడీ..షరీఫ్ లు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు.
అనంతరం వారు ప్రత్యేక విమానంలో ఇతర ప్రాంతానికి వెళ్లారు. కేవలం నవాజ్ షరీఫ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు మోడీ పాక్ పర్యటనకు వెళ్లారు. ఇదిలా ఉంటే మనువరాలు వివాహం నేపథ్యంలో మోడీని ఇంటికి ఆహ్వానించాలని షరీఫ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వీరి భేటీలో దేశ భద్రత..ఇతర అంశాలు చర్చకు వస్తాయా ? లేదా ? అన్నది తెలియరావడం లేదు.
మరోవైపు మోడీ పాక్ లో అకస్మికంగా పర్యటించడంపై తీవ్ర దుమారం రేపుతోంది. జాతీయ భద్రతపై ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ పేర్కొనగా ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగు పడుతాయని బీజేపీ వ్యాఖ్యానిస్తోంది. 

లాహోర్ లో మోడీ..

పాకిస్తాన్ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లాహోర్ లో అడుగు పెట్టారు. అప్ఘనిస్తాన్ పర్యటన అనంతరం అకస్మికంగా పాక్ లో పర్యటించేందుకు మోడీ నిర్ణయం తీసుకున్నారు. 

శ్రీవారిని దర్శించుకున్న ప్రణబ్..

చిత్తూరు : శ్రీవారిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికంటే ముందు వరహాస్వామిని రాష్ట్రపతి ప్రణబ్ దర్శించుకున్నారు. 

16:33 - December 25, 2015

ఢిల్లీ : భారత క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ సయ్యద్ కిర్మాణికి ప్రతిష్టాత్మక ప్రతిష్టాత్మక కల్నల్ సీకే నాయుడు జీవిత సౌఫల్య పురస్కారం లభించింది. 2015 సంవత్సరానికి ఈ అవార్డు కోసం కిర్మాణి పేరును ముగ్గురు సభ్యుల అవార్డు కమిటీ సిఫార్సు చేసింది. భారత క్రికెట్ కు విలక్షణ సేవలందించిన క్రికెటర్లకు సీకే నాయుడు పురస్కారం ఇచ్చి గౌరవిస్తున్నారు. ఈ అవార్డు కింద జ్ఙాపికతో పాటు రూ. 25 లక్షల నగదును కూడా అందచేయనున్నారు. గతంలో లారా అమర్ నాథ్, పాలీ ఉమ్రీగర్, చంద్రశేఖర్, బిషన్ సింగ్ బేడీ, గుండప్ప విశ్వనాథ్, మోహిందర్ అమర్ నాథ్, సలీం దురాని, అజిత్ వాడేకర్, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, దిలీప్ వెంగ్ సర్కార్ ఈ అవార్డులు పొందిన వారిలో ఉన్నారు. 

డోపింగ్ లో లంక క్రికేటర్..

ఢిల్లీ : శ్రీలంక క్రికెటర్, వికెట్ కీపర్ కుశాల్ పెరీరా డోపింగ్ టెస్టులో దొరికాడు. ఐసీసీ అతడిన ఉండి శాంపిల్స్ సేకరించి పరీక్షించగా అతడు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు రుజువైంది. దీనితో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అతడిపై నాలుగేళ్ల పాటు నిషేధం విధించింది.

 

లాహోర్ లో భద్రత కట్టుదిట్టం..

పాకిస్తాన్ : లాహోర్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అకస్మికంగా పాక్ లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. దీనితో ఎయిర్ పోర్టు చుట్టుపక్కల భారీగా భద్రతా దళాలను మోహరించారు. ప్రధాని మోడీ రెండు గంటల పాటు ఉంటారని పీఎంఓ కార్యాలయం పేర్కొంది. నవాజ్ షరీఫ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అనంతరం పలు అంశాలపై మోడీ చర్చించనున్నట్లు తెలుస్తోంది. 

డీడీసీఏ..జైట్లీకి క్లీన్ చిట్ - వెంకయ్య..

ఢిల్లీ : డీడీసీఏలో అవినీతి ఆరోపణలు పాతవని..యూపీఏ హాయంలో వెలుగులోకి వచ్చినవని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై విచారణ జరగడం..జైట్లీకి క్లీన్ చిట్ లభించడం జరిగిందన్నారు. 

16:20 - December 25, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిపై టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి మళ్లీ గళమెత్తారు. శాసనమండలి ఎన్నికల సందర్భంగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుపై ఆయన మండిపడ్టారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజాస్వామిక విలువులు పెంపొందించాలని, మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుద్దామని పేర్కొన్నా కేసీఆర్ పట్టించుకోలేదని విమర్శించారు. కుక్కతోక వంకర అనే చందంగా కేసీఆర్ కథ ఉందని ఎద్దేవా చేశారు. అధికార దుర్వినియోగం..బలప్రయోగం ద్వారా శాసనమండలి అభ్యర్థులను గెలుచుకోవాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో పేదవాడు ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి ఉందని, కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలంటే టీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించాల్సినవసరం ఉందని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో అభ్యర్థులను నయానో..భయానో ఏకగ్రీవంగా ఎన్నికయ్యే విధంగా చేశారని, మిగగా ఆరు స్థానాల్లో అధికార పక్షం ఓటర్లను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఖమ్మం..నల్గొండ..రంగారెడ్డి..మహబూబ్ నగర్ జిల్లాల్లో ఓటర్లకు లేకపోయినా ఎన్నికల్లో నిలబడడటానికి పార్టీకి మద్దతు లేకపోయినా ఇతర పార్టీల్లో ఉండే ఎంపీటీసీలు..జడ్పీటీసీలు..కౌన్సిలర్లను చేరిపించుకుంటున్నారని ఆరోపించారు. ఉద్యమాకారులు..జెండాలు మోసిన వారందరూ ఆలోచించాలని రేవంత్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

16:16 - December 25, 2015

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అకస్మిక పాక్ పర్యటన తీవ్ర దుమారం రేపుతోంది. అప్ఘనిస్తాన్ లో పర్యటిస్తున్న మోడీ పాక్ పర్యటనపై అకస్మిక నిర్ణయం తీసుకున్నారు. తాను పాక్ లో పర్యటించనున్నట్లు ట్విట్టర్ ద్వారా వెళ్లడించడం సంచలనం సృష్టించింది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు మోడీ వెళుతుండడం పట్ల పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదొక పిచ్చి చర్య అని కాంగ్రెస్ పేర్కొంది. జాతీయ భద్రతపై పెను ప్రభావం పడుతుందని ఆ పార్టీ నేత మనీష్ తివారీ పేర్కొన్నారు. ఇది పిచ్చి వ్యవహారమన్నారు. పాక్ తో సత్సంబంధాలు ఉండడం ఈ ప్రాంత ప్రయోజనాలకు మంచిదని, అప్పుడే ఇక్కడి అభ్యంతరాలు చెప్పవచ్చని బీజేపీ నేత నళీల్ కోహ్లీ వ్యాఖ్యానించారు. మంచి రాజనీతిజ్ఞత అంటే ఇదేనని, పొరుగుదేశాలతో ఇలాంటి సత్సంబంధాలు ఉండాలని సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. ఇదొక మంచి పరిణామమని..భారత్ అందిస్తున్న స్నేహపూర్వక హస్తాన్ని తీసుకుని పాక్ ముందుకు రావాలని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. కేవలం ట్విట్టర్ ద్వారా ప్రకటన చేయడం..అది షరీఫ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి పాక్ కు వెళ్లడంపై ఇంకా ఎలాంటి విమర్శలు చెలరేగుతాయో వేచి చూడాలి. 

తిరుమలలో రాష్ట్రపతి...

చిత్తూరు : భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరుపతికి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుండి రోడ్డు మార్గంలో ఆయన తిరుమలకు చేరుకున్నారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు. 

15:11 - December 25, 2015

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులు ఘనంగా క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నారు. కాకినాడలో క్రిస్మస్‌ వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. క్రీస్తు గీతాలాపనలతో చర్చ్‌లు కళకళలాడాయి. కాకినాడ జగన్నాథపురంలోని చర్చ్‌లు క్రైస్తవులతో కిటకిటలాడాయి. నగరంలోని ప్రముఖులు, రాజకీయ నాయకులు క్రైస్తవులకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలుపుతా వేడుకల్లో పాల్గొన్నారు.
హైదరాబాద్ నగరంలోని చర్చ్‌లు క్రిస్మస్‌ సందర్భంగా కళకళలాడాయి. ఖైరతాబాద్‌ చర్చ్‌లు ఫాదర్స్‌ ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. నగరవాసులకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు.
నెల్లూరులో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని సైన్ట్‌ జోసాఫ్‌, డ్వైనిహాల్ చర్చ్‌, సైన్ట్‌ ఆంతోని చర్చ్‌తో పాటు పలు ప్రార్థనా మందిరాలు కిటకిటలాడాయి. క్రీస్తు గీతాలాపనలతో చర్చ్‌లు హోరెత్తాయి.
విజయవాడలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి. నగరంలోని చర్చీలన్నీ కిటకిటలాడాయి. రంగుల రంగుల విద్యుద్దీపాలతో చర్చీలు కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా నిర్మలాకాన్వెంట్ రోడ్డులోని చర్చ్‌, గుణదల, పాతబస్తీలోని ఇఎస్‌ఐ చర్చ్‌లకు క్రైస్తవులు భారీ సంఖ్యలో హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 

15:02 - December 25, 2015

కాలుష్యకారకంగా నిలుస్తున్న ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తూ ప్రత్యామ్నాయాలను ఆలోచించాల్సిన తరుణమిది. అలాంటి ప్రత్యామ్నాయాలలో జూట్ ది ప్రత్యేక స్థానం. అందుకే జూట్ తో ఎన్నో వస్తువులను తయారు చేయవచ్చు. ఆ విశేషాలను వీడియోలో చూడండి.

 

15:01 - December 25, 2015

ఇంటా, బయటా మహిళలకు రక్షణ కరువైన నేపథ్యంలో మహిళలు ఆత్మరక్షణ పద్ధతులపై పట్టు సాధించాల్సిన అవసరం ఉంది. అలాగే ఆపద సమయంలో తమ దగ్గర ఉన్న వస్తువులనే ఆయుధాలుగా ఉపయోగించి తమను తాము రక్షించుకునే వీలుంటుంది. అలాంటి పద్ధతులేమిటో వీడియోలో చూడండి..

15:00 - December 25, 2015

నిర్భయపై దాడికి పాల్పడిన మైనర్ విడుదలయ్యాడు. జువెనైల్ జస్టిస్ యాక్ట్ కి అనుగుణంగా ఈ తీర్పు వెలువడింది. దీనిపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నేరస్థుడి వయసుతో ముడిపడి న్యాయస్థానం తీర్పు చెప్పాలా? లేక నేరానికి తగినట్టుగా శిక్షలుండాలా? గత వారం రోజులుగా జాతీయస్థాయిలో జరుగుతున్న చర్చ ఇది. మొత్తానికి ఈ చర్చకు పార్లమెంట్ ఓ ముగింపు పలికింది. ఎట్టకేలకు జువెనైల్ జస్టిస్ చట్టానికి సవరణ చేసింది.
బాలికపై నాలుగుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డ పోలీసు అధికారికి మలేసియా కోర్టు వందేండ్ల జైలు శిక్ష విధించింది. అతడి నేరం క్షమించరానిదని, శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేసింది.
యుద్ధం అంతమొందించేందుకు కృషి చేయాలని మలాలా, ముజూన్‌లు పిలుపునిస్తున్నారు. సిరియా శరణార్ధుల పిల్లలకు విద్యనందించడానికి కలిసి కృషి చేయాలని, సంయుక్తంగా ప్రచారం చేపట్టాలని నోబెల్‌ బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్‌జాయ్, సిరియా విద్యార్ధిని ముజూన్‌ అల్‌మెల్లన్‌ నిర్ణయించారు.
అంగన్ వాడీలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టింది. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ధర్నా చేసినందుకు వారందరినీ గుర్తించి తొలగించాలని ఆదేశిస్తూ, అన్ని జిల్లాలకు మెమో జారీ చేసింది. 

లాహోర్ కు చేరుకున్న మోడీ..

పాకిస్తాన్ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లాహోర్ కు చేరుకున్నారు. అప్ఘనిస్తాన్ నుండి మోడీ పాక్ కు వెళ్లారు. ఎయిర్ పోర్టులో మోడీకి ఆ దేశ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ స్వాగతం పలికారు. 

క్రిస్టియన్ భవన్ వద్ద కేక్ కట్ చేసిన టి.కాంగ్రెస్ నేతలు..

హైదరాబాద్ : కేసీఆర్ క్రిస్టియన్ భవన్ కు శంకుస్థాపన చేసిన చోట కేక్ కట్ చేసి కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. క్రిస్టియన్ భవన్ ఇప్పటి వరకు ఎందుకు నిర్మించలేదని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టిడిపికి ఓటు వేస్తే వాళ్లు టీఆర్ఎస్ లోకి వస్తారని మాజీ ఎంపీ సర్వే పేర్కొన్నారు. 

14:32 - December 25, 2015

తూర్పుగోదావరి : జిల్లాలో కల్తీ పాల తయరీ గుట్టురట్టయింది. జిల్లాలోని కిర్లంపూడి మండలం గెద్దనాపల్లిలో కల్తీ పాలు తయారుచేస్తున్న ఓలేటి విశ్వనాద్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తన ఇంటివద్దే గుట్టుచప్పుడు కాకుండా కల్తీపాలు తయారుచేస్తున్నారన్న సమాచారం అందుకున్న ఆహారభద్రతా అధికారులు ఓలేటి ఇంటిలో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో మాల్టో డెక్షన్‌ పౌడర్‌తో పాటు ఆయిల్ ప్యాకెట్లు, 290 లీటర్ల కల్తీచేసిన పాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కల్తీపాలను పరీక్షల కోసం హైదరాబాద్‌ నాచారంలోని ల్యాబ్‌కు పంపించామని..ఒకవేళ కల్తీ నిజమని పరీక్షల్లో తేలితే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కల్తీపాలతో ప్రజల ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉందని ఆహారభద్రత అధికారులు తెలిపారు. పాలలో నూనె కలపడం వల్ల శరీరంలో కొవ్వుశాతం అధికంగా పెరుగుతుందన్నారు. 

14:29 - December 25, 2015

హైదరాబాద్ : టిడిపి సీనియర్ నేత మెట్ల సత్యనారాయణ మరణం పార్టీకి తీరని లోటని మాజీ మంత్రి, కాకినాడ టిడిపి ఎంపీ, స్వయానా అల్లుడైన తోట నరసింహం అన్నారు. నిమ్స్‌లో ఇవాళ ఉదయం 10.15 నిమిషాలకు మృతిచెందారన్న వార్త తెలియగానే తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యామని ఆయన అన్నారు. రేపు మధ్యాహ్నం అమలాపురంలో ప్రభుత్వ లాంచనాలతో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని తోట నరసింహం తెలిపారు. 

14:27 - December 25, 2015

హైదరాబాద్ : టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు గవర్నర్‌ నరసింహన్‌కు లేఖ రాశారు. శాసనసభ శీతాకాల సమావేశాలను నిర్వహించేందుకు స్వతంత్రంగా నిర్ణయం తీసుసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ర్ట ప్రజల సమస్యలను పక్కకు పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాలయాపన చేస్తున్నారని, ప్రజాసమస్యల చర్చకు వేదికగా ఉండాల్సిన అసెంబ్లీ ఉనికిని కోల్పోయిందని రాశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజాసమస్యలను, శాసనసభను, సచివాలయాన్ని పట్టించుకునే స్థితిలో లేదనందునా గవర్నరే చొరవతీసుకొని సమావేశాలను నిర్వహించాలని ఎర్రబెల్లి లేఖలో పేర్కొన్నారు.

14:26 - December 25, 2015

మెదక్‌ : జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహిస్తున్న అయుత చండీయాగం మూడో రోజు నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఉదయం గురుప్రార్థనతో యాగ ప్రక్రియ ప్రారంభమైంది. సీఎం కేసీఆర్‌ కుటుంబ సహా సభ్యులు మూడో రోజు జరుగుతున్న యాగంలో పాల్గొన్నారు. సంప్రదాయం ప్రకారం మూడో రోజు రుత్విజులు, యాగకర్తలు, నిర్వాహకులు శ్వేతవర్ణం దస్తులు ధరించారు. మంత్రి హరీశ్‌రావు యాగప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీచక్రం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ డీజీపీ, పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ పేర్వారం రాములు యాగానికి విచ్చేశారు. వీరితో పాటు ఆధ్యాత్మికవేత్త చిన జీయర్‌స్వామి, మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, ఏపీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు, మండలి ఛైర్మన్‌ చక్రపాణి, ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ తదితరులు యాగంలో పాల్గొన్నారు. ఇక యాగాన్ని వీక్షించేందుకు తెలంగాణ జిల్లాల నుంచి వేలాది మంది ప్రజలు తరలివస్తున్నారు. దీంతో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం జాతరను తలపిస్తోంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడంతో యాగ ప్రక్రియ సాఫీగా సాగుతున్నాయి. 

14:23 - December 25, 2015

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ షాక్ ల మీద షాక్ లిస్తున్నారు. పర్యటనకు సంబంధించిన విషయాలను ఎవరికీ వెల్లడించడం లేదు. రష్యాలో రెండు రోజుల పాటు పర్యటించిన మోడీ నేరుగా అప్ఘనిస్తాన్ వెళ్లారు. ఈ పర్యటన విషయాన్ని గోప్యంగా ఉంచారు. భద్రతా కారణాల రీత్యా పర్యటనను గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అటు నుండి అంటే పాక్ కు మోడీ వెళ్లనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మోడీ తన అధికారిక ట్విట్టర్ ద్వారా ట్వీట్స్ చేశారు. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయనున్నారు. లాహోర్‌లో నవాజ్‌షరీఫ్‌తో భేటీ అవనున్నట్లు కూడా తెలియచేశారు. వీరి భేటీలో దేశ భద్రతకు సంబంధించిన అంశాలు చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. 

గ్రేటర్ ఎన్నికల్లో టిడిపి, బిజెపి కూటమిదే విజయం - కిషన్ రెడ్డి..

హైదరాబాద్ : జనవరిలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపి, బీజేపీ కూటమిదే విజయమని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

 

అప్ఘనిస్తాన్ అభివృద్ధికి భారత్ అండగా నిలుస్తుంది - మోడీ..

ఢిల్లీ : అప్ఘనిస్తాన్ పర్యటనలో భాగంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాబూల్ లో నూతనంగా నిర్మించిన అప్ఘనిస్తాన్ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించారు. 

పాక్ కు మోడీ..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి పాకిస్థాన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన ట్విట్టర్ లో ట్వీట్స్ చేశారు. రెండు రోజుల పాటు రష్యాలో పర్యటించిన మోడీ అప్ఘనిస్తాన్ లో పర్యటించారు. అనంతరం ఆయన నేరుగా భారత్ కు రావాల్సి ఉంది. 

గవర్నర్ కు లేఖ రాసిన ఎర్రబెల్లి

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కు టి.టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర్ రావు లేఖ రాశారు. ఈ లేఖ లోని ముఖ్యాంశాలు… ''ప్రభుత్వం అసెంబ్లీ శీతాల సమావేశాలు నిర్వహించడం లేదు. మీరు జోక్యం చేసుకుని సమావేశాలు త్వరగా నిర్వహించేలా చేయాలి? టిఆర్ ఎస్ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ సమావేశాలు నామమాత్రంగా నడుస్తున్నాయి. పార్టీ ఫిరాయించిన వారిపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు''. గవర్నర్ టిఆర్ ఎస్ ప్రభుత్వం ఫిర్యాదు చేశారు.

రోడ్డు ప్రమాదంలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్ మృతి

హైదరాబాద్: నగరంలో పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దూలపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోన్నారు.

అమిత్ షాకు లేఖరాయనున్న ఎంపీ కీర్తీ ఆజాద్

న్యూఢిల్లీ: బీజేపీ బహిష్కృత నేత, లోక్‌సభ సభ్యుడు కీర్తి ఆజాద్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు లేఖ రాయనున్నారు. తనకు ఎలాంటి షోకాజ్ నోటీసు ఇవ్వకుండా పార్టీ నుంచి ఎందుకు తొలగించారని కోరనున్నారు. కాగా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ కీర్తి ఆజాద్‌ను బీజేపీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే.

శాంతాక్లాస్ అవతారంలో అమీర్ ఖాన్...

ముంబై : క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ శాంతాక్లాస్ అవతారమెత్తాడు. ఈ సందర్భంగా క్రిస్టియన్లకు ఖాన్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఇక అమీర్ శాంతా సూట్ ధరించాడు. గడ్డం, గుండ్రని గ్లాసులతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు ఖాన్. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కనున్న దంగాల్ చిత్రంలో అమీర్‌ఖాన్ నటించనున్నారు. ఈ చిత్రంలో మాజీ రెజ్లర్ మహావీర్ సింగ్ పగత్ పాత్రలో కనిపించనున్నారు. దంగాల్ చిత్రం వచ్చే ఏడాది క్రిస్మస్ రోజున విడుదల కానుంది.

13:30 - December 25, 2015

హైదరాబాద్ : వివాదాలకు కేరాఫ్‌ అయిన ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం మరో వివాదంలో పడింది. ప్రభుత్వ సలహాదారుడి నోటిదురుసుతో ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్‌కు తలబొప్పి కట్టేంత పని అయింది. కేబినెట్‌ హోదా మంత్రి ఓంపాల్‌ నెహ్రా ముస్లీంములకు చేసిన విన్నపం వివాదాస్పదమైంది. అయోధ్య, మధుర వంటి ప్రాంతాల్లో వివాదాలను పక్కకు పెట్టి హిందూ దేవాలయాల నిర్మాణాలకు ముస్లీంలు సహకరించాలని నెహ్రా ఓ ప్రైవేటు ఫంక్షన్‌లో ముస్లీంలకు అప్పీల్ చేశారు. అంతేకాదు అయోధ్యలో రామమందిర నిర్మాణానికి కరసేవకులుగా ముస్లీంలు రావాలని పిలుపునిచ్చారు. ఒక మందిరం నిర్మాణానికి ముస్లీంలు సహకరిస్తే వేరే ప్రాంతాల్లో మసీదుల నిర్మాణానికి స్థలాలు కేటాయిస్తామని అన్నారు. ఓంపాల్‌ నెహ్రా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కేబినెట్ మంత్రి హోదాలో ఉన్న నేత ఈ విధంగా మాట్లాడటం అఖిలేష్‌కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. దీన్ని సరిదిద్దుకునేందుకు అఖిలేష్‌ ఓంపాల్‌ నెహ్రాను కేబినెట్ హోదా నుంచి తప్పించారు. కాని నెహ్రా వ్యాఖ్యలు యూపీలో ఇంకా దుమారం రేపుతూనే ఉన్నాయి.

13:29 - December 25, 2015

హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ రాష్ర్టం అలిఘర్‌లో కిరాతకులకు మరో బాలిక బలైపోయింది. ట్యూషన్‌ నుంచి సైకిల్‌పై ఇంటికి వెళ్తున్న17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్యచేశారు కీచకులు. అలిఘర్‌ పట్టణం నుంచి సైకిల్‌పై హర్దుగని ప్రాంతానికి వెళ్తున్న బాలికను రెండు బైకులపై వెంబడించారు కిరాతకులు. చెరకు తోటలోకి లాక్కెళ్లి సామూహిక అత్యచారానికి పాల్పడ్డారు. అనంతరం బాలికను అతిక్రూరంగా హత్యచేశారు. ఆగ్రహించిన గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులపై తిరగబడ్డారు. బాలిక మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించకుండా అడ్డుపడ్డారు. దీంతో అక్కడ ఘర్షణ జరిగింది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించిన పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇంత వరకు ఎవరిపైనా కేసులు నమోదు చేయకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

13:28 - December 25, 2015

చిత్తూరు : తిరుమల శ్రీవారిని బ్యాట్మింటన్ స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌, తెలంగాణరాష్ట్ర బీజేపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి దర్శించుకున్నారు. ఇవాళ మాజీ ప్రధాని వాజ్‌పేయి జన్మదిన సందర్బంగా శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని కిషన్‌రెడ్డి అన్నారు. దేశం సుభిక్షంగా ఉండడం కోసం ఆనాడు వాజ్‌పేయి ఎంతో ధైర్యంగా సాహోసపేత నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు.

13:26 - December 25, 2015

నిజామాబాద్ : అనుకున్నంతా అయింది..రైతులు భయపడ్డట్టే జరిగింది. ఖండాంతరాల ఖ్యాతి గడించిన నిజాం చక్కెర కర్మాగారం మూతబడింది. ఇన్ని రోజులు చీకటిలో మిణుకుమిణుకుమంటూ మెరిసిన నిజాం చక్కెర కర్మాగారానికి తైలం వేసి దీపం వెలిగించాల్సింది పోయి మొత్తానికే ఆర్పేసింది ప్రభుత్వం.

ఆసియా ఖండానికే తలమానికంగా....

ఆసియా ఖండానికే తలమానికంగా నిలిచిన కర్మాగారం ఇది. కార్మికులు, రైతుల పాలిట కల్పతరువు ఈ కర్మాగారం. ఇదంతా గతం. ఘనమైన చరిత్ర ఇప్పుడు చెప్పుకోడానికే మిగిలింది. నిజాం కాలంలో పురుడుపోసుకొని...ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని..కార్మికుల, రైతుల పాలిట ఆశాదీపంగా వెలిగిన నిజాం చక్కెర కర్మాగారం పాలకుల పుణ్యమా అని మూతపడింది.

నిజాం కాలంలో నిర్మించిన నిజాంషుగర్స్‌.....

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో నిజాం నవాబులు కట్టించిన చక్కెర కర్మాగారం అటు కార్మికులకు, ఇటు రైతులకు ఉపాధి కల్పించింది. లాభాలు కూడా అంచనాలు మించడంతో దీనికి అనుంబంధంగా పక్కనే ఉన్న మెదక్, కరీంనగర్ జిల్లాల్లోను నిజాంషుగర్స్‌ను నిర్మించారు. బోధన్‌లోని కర్మాగారం ప్రాంతాన్ని చక్కెరనగర్‌గా నామకరణం చేశారు.

6 నెలల్లో 5 లక్షల టన్నుల చెరకు క్రషింగ్‌..........

ఆ తరువాత నిజాంషుగర్స్‌ చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంది. నిజాంషుగర్స్ కర్మాగారం ఏడాదిలో సుమారు ఆరు నెలలు నడిచేది. దాదాపు 5 లక్షల టన్నుల చెరుకు క్రషింగ్ జరిగేది. 2002లో నిజాంషుగర్స్ ప్రైవేటీకరణ అనంతరం ఆటుపోట్లు ప్రారంభమయ్యాయి. NDSL ప్రైవేటు యాజమాన్యం 2004 నుంచి 2008 వరకు సుమారుగా 4 లక్షల టన్నుల చెరుకును క్రషింగ్ చేసింది. కాని ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలు, రాజకీయ కోణాలు నిజాంషుగర్స్‌ను నిర్వీర్యం చేశాయి. పాలకులు పఠించిన, పాటించిన ప్రైవేటీకరణ మంత్రం నిజాంషుగర్స్‌ను కోలుకోలేని దెబ్బతీశాయి.

చేతులెత్తేసిన కమిటీలు....

కమిటీలు వేసి కర్మాగారాన్ని నడిపిస్తామని చెప్పారు. అలా వచ్చిందే సీఎస్‌ శర్మ నేతృత్వంలోనే కమిటీ. ఐఏఎస్ అధికారులు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ ఆరు నెలలైనా ఎలాంటి నివేదికా ఇవ్వలేదు. ఇంతలోనే క్రషింగ్‌ నిలిపివేయడంతో పాటు కంపెనీకి లాకౌట్ కూడా ప్రకటించేసింది యాజమాన్యం. ఫలితం కార్మికులు, రైతులు రోడ్డున పడ్డారు.

ఇతర ప్రాంతాలకు తరలుతున్న నిజాంషుగర్స్‌ చెరకు.......

ఫ్యాక్టరీని నమ్ముకొని చెరుకు పంటలు వేసిన రైతులు పండిన పంటను తీసుకొని తలోదిక్కుగా వెళ్తున్నారు. నిజాంషుగర్స్ పరిధిలోని చెరుకును ఇతర కర్మాగారాలకు తరలిస్తున్నారు. టన్నుకు 2600 ధర అయితే రవాణా ఛార్జీలు 1000, టోల్‌ట్యాక్స్‌ 700, చెరుకును నరికేందుకు కూలీల డబ్బులు అన్ని పోను టన్నుకు 5 వందల నుండి 7 వందల వరకు కూడ రైతుకు మిగలడం లేదు.

మూసేంత వరకు నిద్రపోలేదు పాలకులు....

ఏదైతేనేం ప్రఖ్యాతిగాంచిన నిజాంషుగర్స్‌ను మూసేంత వరకు నిద్రపోలేదు పాలకులు. ఘనమైన చరిత్రను భూస్థాపితం చేసి కార్మికులకు, రైతులకు కన్నీటిగాథలను మిగిల్చారు.

13:22 - December 25, 2015

వరంగల్ : మహబూబాబాద్‌ మండలం బేతోలు గ్రామంలో విషాదం నెలకొంది. గుర్తు తెలియని వాహనం ఢీకొని తండ్రీ, కూతురు మృతి చెందారు. కురవి మండలం బలపాల గ్రామ శివారు లింగ్యా తండాకు చెందిన భూక్యా హేమ, కూతురు శిరీష క్రిస్మస్‌ సందర్భంగా చర్చ్‌లో ప్రార్థనలు ముగించుకొని ఇంటికి వస్తుండగా ప్రధాన రోడ్డుపై గుర్తుతెలియని వాహనం వీరిని ఢీకొట్టింది. దీంతో వీరు అక్కడికక్కడే మృతి చెందారు. చర్చి ముందే ప్రమాదం జరగడంతో ఈ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

13:19 - December 25, 2015

మెదక్ : కేసీఆర్‌ అయుత చండీయాగం మూడోరోజూ ఘనంగా జరుగుతోంది. మొదటిరోజు పసుపువర్ణం, రెండోరోజు గులాబీవర్ణంలో మెరిసిన ఎర్రవెల్లి.. ఈరోజు శ్వేతవర్ణంలో ధగధగలాడుతోంది. మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగరరావు ఈ రోజు ముఖ్య అతిథిగా వచ్చారు. విద్యాసాగరరావు దంపతులిరువురూ యాగంలో పాల్గొన్నారు.

13:17 - December 25, 2015

ప.గో : టిటిడి ఆధ్వర్యంలో నిర్మించిన వేదపాఠశాల...దేశంలో ఓ గొప్ప పాఠశాలగా నిర్మిస్తుందని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. వేదాలపట్ల శ్రద్దపెట్టి ఇలాంటి గొప్ప పాఠశాలను నిర్మించినందుకు తిరుమల తిరుపతి దేవస్థానానికి రాష్ట్రపతి అభినందనలు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా ఐ భీమవరంలో టీటీడీ నిర్మించిన వేదపాఠశాలను రాష్ట్రపతి ప్రారంభించారు. 4 కోట్ల 70 లక్షల రూపాయలతో అత్యాధునిక వసతులతో నిర్మించిన ఈ వేదపాఠశాల దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. వేదాలకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని బాబు అభిప్రాయపడ్డారు. వేదపాఠశాలను రాష్ట్రపతి ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర మంత్రులు పీతల సుజాత, మాణిక్యాలరావు, ఎంపీలు మాగంటి బాబు, గోకరాజు గంగరాజు, టిటిడి ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, మాజీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.

బాలీవుడ్ నటి సాధన కన్నుమూత

హైదరాబాద్ : అలనాటి నటి ప్రముఖ బాలీవుడ్ నటి సాధన కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందారు. సాధన పూర్తి పేరు సాధనా శివదాసాని. రాజ్ కపూర్ చిత్రం శ్రీ 420లో నృత్యబృందంలో ఒకరిగా నటించిన సాధన ఆతర్వాత హీరోయిన్ గా రెండు దశాబ్ధాల పాటు వైవిధ్యమైన పాత్రలు పోసించి అలరించింది.

రాజగోపాల్ రెడ్డి ఓడిపోతే శాస్వతంగా రాజీనామా చేస్తా : కోమటిరెడ్డి

నల్గొండ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి ఓడిపోతే రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. అవినీతి, అక్రమాలతో గెలిచేందుకు టిఆర్ ఎస్ యత్నిస్తోందని… బెదిరించి పార్టీలో చేర్చుకుంటున్నారని విమర్శించారు. కుట్రలు, కుతంత్రాలు చేస్తూ యాగాలు చేస్తే పుణ్యం రాదన్నారు. తెలంగాణ కోసం పోరాడిని వారిని కాదని… చిన్నపరెడ్డికి సీటు ఎలా ఇచ్చారో చెప్పాలనడి కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.

12:43 - December 25, 2015

హైదరాబాద్ : చికెన్ ధరలు దడ పుట్టిస్తున్నా యి. మొన్నటి వరకు రిటైల్ మార్కెట్లో కేజీ రూ.160కి లభించిన స్కిన్లెస్ చికెన్‌పై కిలోకు రూ.40 వరకు పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో లైవ్ కోడి కేజీ 120, డ్రెస్డ్ చికెన్ కిలో రూ.175, స్కిన్‌లెస్ రూ.205కు అమ్ముతున్నారు. గత వారం చికెన్ (స్కిన్‌తో) కిలో రూ.140, స్కిన్ లెస్ రూ.160 కు లభించింది. సోమవారం నుంచి స్కిన్ లెస్ చికెన్ కేజీ డబుల్ సెంచరీ దాటేసింది. దీంతో సామాన్యులు చికెన్ వైపు చూడాలంటేనే హడలెత్తే పరిస్థితి తలెత్తుతోంది. సోమవారం నుంచి చికెన్ రేటు డబుల్ సెంచరీని క్రాస్ చేసింది. దీంతో, చికెన్ షాపుల వైపు చూడ్డానికే సామాన్యులు భయపడుతున్నారు. మరోవైపు, చికెన్ తో పాటే కోడి గుడ్లు, మటన్ రేట్లు కూడా పెరిగాయి. అయితే, ఈ సీజన్ లో రేట్లు పెరగడం సహజమేనని... సంక్రాంతి వరకు ధరలు అస్థిరంగానే ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. గుడ్లు, మటన్ ధర లు కూడా రోజురోజుకూ పైపైకి ఎగబాకుతున్నాయి. ఇప్పటికే పప్పులు, నూనెల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న తరుణంలో ఆ లిస్ట్లో చికెన్ కూడా చేరిపోయిందని మాంసం ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

12:25 - December 25, 2015

విజయవాడ : పైరసీ సీడీల ముఠా గుట్టును విజయవాడ నగర టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. నగరంలోని పంజా సెంటర్లోని పలు దుకాణాలపై టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం దాడి చేసి సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లోఫర్, నవమన్మధుడు, సౌఖ్యం సినిమాల పైరసీ సీడీలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సీడీ షాపులను సీజ్ చేశారు. సదరు షాపు యజమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు

టిటిడి వేదపాఠశాలను ప్రారంభించిన రాష్ట్రపతి

విజయవాడ :ప.గో జిల్లా ఐ.భీమవరంలో టీటీడీ వేదపాఠశాలను రాష్ట్రపతి ప్రారంభించారు. ప్రణబ్‌ వెంట గవర్నర్‌ నరసింహన్‌, సీఎం చంద్రబాబు ఉన్నారు.

రాయ్‌కల్‌ మండలంలో మహిళ దారుణ హత్య...

కరీంనగర్ ‌: జిల్లాలోని రాయ్‌కల్‌ మండలం అల్లీపూర్‌లో ఓ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గతంలో హతురాలు తన భర్త, అత్తామామ హత్యకేసులో శిక్ష అనుభవించినట్లు తెలుస్తోంది.

వాజ్ పేయి పరిపాలన అందరికీ ఆదర్శం : దత్తాత్రేయ

హైదరాబాద్ : భారత మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయి 91వ జన్మదినాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ వికలాంగులకు త్రిచక్ర వాహనాలను, పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. వాజ్‌పేయి ఒక అజాత శత్రువు అని కొనియాడారు. ఆయన పరిపాలన అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు.

11:47 - December 25, 2015

విజయవాడ : ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారుస్తానని క్రిస్మస్‌ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. విజయవాడలోని ప్రఖ్యాతిగాంచిన గుణదల మేరీమాతా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన చంద్రబాబు..ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్లకు క్రిస్‌మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలో క్రిస్టియన్లు ఎదుర్కొంటున్న బరియల్ గ్రౌండ్ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఆప్ఘన్ లో పార్లమెంట్ భవనాన్ని ప్రారంభంచిన మోదీ

హైదరాబాద్: ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. భారత్ సహకారంతో ఆ బిల్డింగ్‌ను నిర్మించారు. సుమారు వెయ్యి కోట్లతో పార్లమెంట్ భవన నిర్మాణం చేపట్టారు. 2007లో బిల్డింగ్ నిర్మాణం ప్రారంభమైంది. ఓ బహుమానంగా పార్లమెంట్ భవనాన్ని ఆఫ్ఘనిస్తాన్‌కు భారత్ అందించింది. దీని కోసం ఉభయసభలను ఆ భవనంలో నిర్మించారు. దిగువ సభలో 294 సీట్ల సామర్థ్యం ఉంది. ఎగువ సభ సామర్థ్యం 192 సీట్లు. ఆ దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో సహ పలువురు మంత్రులు కొత్త భవనాన్ని మోదీకి పరిచయం చేశారు.

చండీ యాగానికి హాజరైన మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు

మెదక్ : జిల్లాలోని ఎర్రవల్లిలో జరుగుతున్న అయుత మహాచండీయాగానికి మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు వేదపండితులు, మంత్రి హరీశ్‌రావు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మరోవైపు మూడోరోజు చండీయాగం భక్తి ప్రవత్తులతో కొనసాగుతోంది. గురు ప్రార్థనతో మహా చండీయాగం ప్రారంభమైంది. చండీయాగానికి భారీగా ప్రజలు హాజరవుతున్నారు. కుంకుమార్చన కోసం భారీగా మహిళలు క్యూకట్టారు.

11:39 - December 25, 2015

హైదరాబాద్ : మాజీ మంత్రి, టీడీపీ నేత మెట్ల సత్యనారాయణ కన్నుమూశారు. ఐదు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ రోజు సాయంత్రానికి సత్యనారాయణ భౌతికకాయాన్ని స్వస్థలం తూ.గో జిల్లా అమలాపురంకు తరలించనున్నారు. రేపు ఆయన అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. మెట్ల సత్యనారాయణ మృతి పట్ల టీడీపీ నేతలు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

విజయవాడలో పైరసీ ముఠాగుట్టు రట్టు

విజయవాడ : జిల్లాలో పైరసీ సీడీలను తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారంపంజాసెంటర్ లోని పలు సీడీ దుకాణాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా పైరసీ సీడీలను స్వాధీనం చేసుకున్నారు.

11:20 - December 25, 2015

హైదరాబాద్ : ప్రకృతి ధర్మాలు మారిపోతున్నాయి. పురుషుడిగా జన్మించి, ఆపై లింగమార్పిడి చేయించుకున్న ఓ వ్యక్తి గర్భం ధరించి చరిత్ర సృష్టించాడు. ఈ ఘటన ఈక్వెడార్ లో జరిగింది. పుట్టుకతో స్త్రీగా ఉండి లింగమార్పిడి చేయించుకున్న మహిళతో జతకట్టిన ఫెర్నాండో మచాదో తాను గర్భం దాల్చినట్టు ప్రకటించాడు. ప్రపంచంలో ఈ తరహా ఘటనల్లో ఇదే మొదటిదని తెలుస్తోంది. కాగా, వీరిద్దరూ పూర్తి స్థాయి లింగ మార్పిడి కోసం హార్మోనులు తీసుకున్నారని, డెలివరీ సమయంలో ఎటువంటి ప్రమాదం జరిగే అవకాశాలు లేవని వైద్యులు చెబుతున్నారు. కాగా, ఈ ఘటనపై ఇప్పటివరకూ చర్చి లీడర్స్ స్పందించ లేదు. ఇటీవల అమెరికాలో ట్రాన్స్ జండర్ల వివాహాలను చట్టబద్ధం చేసిన సంగతి తెలిసిందే.

దుర్గంపల్లి లో చిరుత సంచారం...

నెల్లూరు : ఉదయగిరి మండలం దుర్గంపల్లి గ్రామ పరిసరాల్లో చిరుత సంచారంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. గురువారం రాత్రి గ్రామంలోకి ప్రవేశించిన చిరుత గ్రామస్థులు చెన్నయ్య, మోహన్‌రావులకు చెందిన మేకలపై దాడి చేసి నాలుగు మేకలను చంపేసింది. మరో ఆరు మేకలు చిరుత దాడిలో గాయపడ్డాయి. అటవీ ప్రాంతం కావడంతో ఏ సమయంలో ఏం జరుగుతుందోనన్న భయంతో స్థానికులు ఉన్నారు.

మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ మృతి

విజయవాడ : మాజీ మంత్రి, టిడిపి నేత మెట్ల సత్యనారాయణ అనారోగ్యంతో నిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. మెట్ల మృతిపట్ల డిప్యూటీ సీఎం చినరాజప్ప సంతాపం తెలిపారు. మెట్ల మృతి పార్టీకి తీరని లోటన్నారు.

ఢిల్లీ లోని సరోజిని రైల్వేస్టేషన్ వద్ద కలకలం

ఢిల్లీ : సరోజిని రైల్వేస్టేషన్ వద్ద కలకలం రేగింది. రైల్వే ట్రాక్ వద్ద మూడు మృతదేహాలను స్థానికులు గుర్తించారు. అప్రమత్తమైన రైల్వే అధికారులు పోలీసుల సహాయంతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

 

11:07 - December 25, 2015

హైదరాబాద్ : అసలే పేదరికం. రెక్కాడితేగాని డొక్కాడని బతుకులు. పైగా ఎక్కడెక్కడినుంచో బతుకుదెరువుకు వలసలు. ఏరోజు సంపాదనతో ఆ రోజు కాలం వెళ్లదీసే ఆ పేద ప్రజలకు నివాసమూ సమస్యే. వేలకు వేలు అద్దెలిచ్చుకోలేని పరిస్థితుల్లో ప్రమాదాన్ని పక్కనే ఉంచుకుని బతుకులీడుస్తున్నారు. ఎప్పుడు ఏ ముప్పు వచ్చిపడుతుందోనన్న భయంతో క్షణమొక యుగంగా జీవిస్తున్నారు. ఈ మధ్యనే జరిగిన ఓ ప్రమాదం వారిని మరింత హడలెత్తిస్తోంది.

పేదరిక కోణమూ......

విశాఖపట్నం.. సుందర బీచ్‌లు, ప్రకృతి సోయగాలతో అలరారే ఈ నగరంలోనూ ప్రతి ఊరులో మాదిరే పేదరిక కోణమూ ఉంది. చుట్టుపక్కల పలు జిల్లాల నుంచి ఇక్కడకు నిత్యం వందలాది మంది వలసొస్తున్నారు. వారంతా వేలకు వేలు అద్దెలు చెల్లించుకోలేక ఇలా కొండలపై చిన్నచిన్న ఇళ్లేసుకుని కాలం గడిపేస్తున్నారు. అయితే ప్రమాదం మాత్రం ఎప్పుడూ పొంచే ఉంటుంది. ఇందుకు కొద్ది రోజుల క్రితం జరిగిన దుర్ఘటనే ఉదాహరణ.

జివిఎంసి పరిధిలో 2లక్షల గృహాలు....

విశాఖ మహానగరంలో కొండ ఏటవాలు ప్రాంతాలన్నీ జనావాసాలతో నిండిపోతున్నాయి. ఇలా జివిఎంసి పరిధిలో 2లక్షల గృహాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇవన్నీ బఫర్ జోన్ పరిధిలో ఉన్నట్లు నిర్ధారించారు. కొండవాలుల్లో జీవించడం ప్రమాదకరమని తెలిసినా కదిలే పరిస్థితిలో లేరు. కంచరపాలెం, తాటిచెట్లపాలెం, గాజవాక, ఆరిలోవ, ఎన్‌ఎడి కొత్త రోడ్డు ప్రాంతాల్లో ఇలాంటి నివాసాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే సమయంలో అప్పుడప్పుడు కొండ చెరియలు మట్టి పెళ్ళలు విరిగి మీదపడుతుండడంతో విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.

కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి....

కొద్ది రోజుల క్రితం సంజీవయ్యనగర్‌లో కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు క్షతగాత్రులయ్యారు. వారంతా శ్రీకాకుళం జిల్లా నుంచి వలసొచ్చినవారే. ఈ దుర్ఘటన నేపథ్యంలో టిడిపి సర్కార్‌లో హఠాత్తుగా కదలికొచ్చింది. మీడియా ఎదుట నేతలు కార్యాచరణ ప్రకటించారు. బఫర్‌ జోన్‌లో ఉన్న నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని మంత్రి గంటా ప్రకటించారు. ఐదుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఆ కమిటీ రక్షణ చర్యలకు సంబంధించి నివేదిక ఇస్తుందన్నారు.

స్పందించిన ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు...

కొండఏటవాలు ప్రాంతాలు ఎక్కువగా ఉన్న ఉత్తర నియోజకవర్గంలో ఆ ప్రాంత ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా స్పందించారు. ఓట్లు వేస్తారనే నెపంతో వీరిని ఇక్కడే ఉంచకుండా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని అన్నారు. అయితే ప్రభుత్వాల వైఫల్యమే ప్రమదాలకు కారణమవుతోందని వామపక్షాలు విమర్శిస్తున్నాయి. సంఘటన జరిగినపుడు హడావుడి చేయడం తర్వాత మౌనం దాల్చడం తప్పించి ఇప్పటివరకూ చేసిందేమీ లేదని సిపిఎం నేత గంగారావు ఆరోపించారు.

ఈసారైనా చర్య తీసుకుంటారో లేక కొండల్లోనే వదిలేస్తారో....

గతంలోనూ ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వం పేదల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. కానీ ఆచరణలో మాత్రం కనిపించలేదు. మరి ఈసారైనా చర్య తీసుకుంటారో లేక కొండల్లోనే వదిలేస్తారో చూడాలి.

 

11:02 - December 25, 2015

విజయవాడ : కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం నట్టనంపేట దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. బైక్‌ వ్యాన్‌ ఢీకొనడంతో ఈ యాక్సిడెంట్‌ జరిగింది. మృతులు జి.కొండూరు మండలం పినపాకకు చెందిన శివరాం, గంగినేనిపాలంకు చెందిన సీతారామయ్య, ఇబ్రహీంపట్నంకు చెందిన విజయ్‌గా గుర్తించారు.

10:59 - December 25, 2015

హైదరాబాద్ : ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ సాయిబాబా మధ్యంతర బెయిల్‌ను నాగ్‌పూర్‌ కోర్టు రద్దు చేయడాన్ని విద్యావేత్తలు, ప్రజాస్వామ్యవాదులు ఖండిస్తున్నారు. 2014 మే9న ఢిల్లీ యూనివర్శిటీలో ప్రోఫెసర్‌ సాయిబాబాను అరెస్ట్‌ చేశారు. కాని బెయిల్‌ రాకుండా పోలీసులే అడ్డుకుంటున్నారని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. సాయిబాబా ఆరోగ్యకారణాల రీత్యా వెంటనే ఆయన్ని విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

10:57 - December 25, 2015

హైదరాబాద్ : తమిళ హీరో శింబు బీప్‌ సాంగ్‌ పాడాడా లేదా.? రకరకాల స్టైల్స్‌తో ఎప్పుడూ హుషారెత్తించే ఈ హీరో ఇప్పుడు బీప్‌ సాంగ్‌ విషయంలో ఎన్నడూ ఎరగని వ్యతిరేకతను చవిచూస్తున్నాడు. ఒకపక్క పోలీస్‌లు శింబు కోసం సెర్చ్‌ చేస్తూనే ఉన్నారు. మరోపక్క పలు వర్గాల నుంచి ఎక్కడలేని నిరసనను ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలోనే నా కొడుకు ఏం తప్పు చేశాడని ఇంతలా అతన్ని వేధిస్తున్నారని శింబు తల్లి ఉష ఆవేదన వ్యక్తం చేశారు. మరో సంచలన వ్యాఖ్య కూడా చేశారు.

వివాదాలకు, రీల్ లైఫ్‌లో మాదిరే రియల్‌లైఫ్‌లోనూ....

ఈ చిందులు.. ఈ తరహా డ్యాన్స్‌లు శింబుకు కామనే. వివాదాలకు, రీల్ లైఫ్‌లో మాదిరే రియల్‌లైఫ్‌లోనూ హీరోయిన్‌లతో సయ్యాటకు మనోడు సదా ముందుంటాడు. ఈసారి మాత్రం వివాదాల ఊబిలోకి పీకల్లోతు కూరుకుపోయాడు.

తమిళ్‌ హీరో ధనుష్‌ మాదిరే శింబు కూడా.....

తమిళ్‌ హీరో ధనుష్‌ మాదిరే శింబు కూడా మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌తో కలిసి సరదాగా ఒక పాటేసుకున్నాడు. పాడేప్పుడు మహా హుషారుబోయినా అదెంత కాంట్రవర్సీ అవుతుందో ఊహించకుండా బీప్‌ సాంగేసుకున్నాడు. అయితే మహిళలను కించపరిచేలా ఆ పాట ఉందంటూ మహిళా సంఘాలు శింబుపై ఫైరయ్యాయి. వివాదంకాస్తా చినికిచినికి గాలివానలా మారి శింబు ఎస్కేప్‌ అయ్యే పరిస్థితిని సృష్టించింది. పోలీసులకు చిక్కకుండా పారిపోయేంత సీన్‌ క్రియేట్‌ అయింది. అయితే తన కొడుకు ఏ పాపమూ చేయలేదని అతని తల్లి ఉషా టి.రాజేందర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

తన కుమారుడిని ఎవరో కావాలనే వివాదంలో....

తన కుమారుడిని ఎవరో కావాలనే వివాదంలో ఇరికిస్తున్నారని శింబు ఎంత మంచివాడో అందరికీ తెలుసుకదాని ఆమె ఫైరయ్యారు. అసలతను చేసిన పాపమేంటని ప్రశ్నించారు. శింబు పాడిన ప్రైవేట్‌ పాటలో ఎవరో కావాలనే వివాదాస్పద పదాలను జోడించి ఇంత హడావుడి సృష్టిస్తున్నారని వాపోయారు. తమిళనాడును నమ్ముకుని మొదటినుంచి ఇక్కడే సినిమాలు చేస్తుంటే ఇప్పుడు వారిచ్చే బహుమతి ఇదేనా అని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడి ఎదుగుదలను ఓర్వలేకనే ఇదంతా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. పరిస్థితి ఇలాగే ఉంటే తాము తమిళనాడును వదిలేసి వేరే రాష్ట్రానికి వెళ్లిపోతామని అన్నారు.

జీర్ణించుకోలేకపోతున్న శింబు ఫ్యాన్స్...

ఈ వ్యవహారం ఇలా ఉండగా శింబు ఇంకా అజ్ఙాతంలోనే ఉన్నాడు. అయితే అంతటి ప్రముఖ హీరో ఇంతకాలం కన్పించకుండా పోవడమేంటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు శింబు ఫ్యాన్స్ అతని వ్యవహారాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

10:53 - December 25, 2015

హైదరాబాద్ : చెన్నైలో క్రిస్‌మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. అర్థరాత్రి నుంచే క్రైస్తవులు తమ చర్చీల్లో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. దక్షిణాధిలో అతిపెద్ద చర్చిలుగా ప్రఖ్యాతిగాంచిన చెన్నైలోని శాంతోమ్‌, సెయింట్‌ థామస్‌ మౌంట్‌, వేలాంగిణిమాతాలో క్రిస్‌మస్‌ వేడుకలు అంబరాన్నంటాయి. శాంతోమ్‌ చర్చిలో దాదాపు 3 లక్షలమంది క్రిస్టియన్‌ భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేసి అరుదైన రికార్డును నెలకొల్పారు.

 

గుణదల చర్చిని అభివృద్ధి చేస్తా : సీఎం చంద్రబాబు

విజయవాడ : గుణదల మేరీ మాత చర్చిలో క్రిస్ మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్ మస్ వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గుణదల చర్చిని అభివృద్ధి చేసి... పేదరకి నిర్మూలనకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా పేదలకు చంద్రన్న కానుకలు అందించారు.

తన కేబినెట్ లోని మంత్రిని బర్తరఫ్ చేసీ యూపీ సీఎం

హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ కొద్దిసేపటి క్రితం సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన మంత్రివర్గంలోని పర్యాటక శాఖ మంత్రి ఓం ప్రకాశ్ నెహ్రాను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తున్నట్లు అఖిలేశ్ ప్రకటించారు. ఓ అంశానికి సంబందించి ఓంప్రకాశ్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన అఖిలేశ్ యాదవ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

వన్నె చింతలపూడిలో ఉన్మాది వీరంగం

తూ.గో: అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడిలో ఉన్మాది వీరంం సృష్టించాడు. తనను ప్రేమించకపోతే యువతిని చంపుతానంటూ ఇంటిపై దాడికి యత్నించాడు. అప్రమత్తమైన స్థానికులు ఉన్మాదిని పట్టుకుని బంధించారు.

09:48 - December 25, 2015

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు అధికార పార్టీతో కలిసి అడుగులు వేస్తామని ఎంఐఎం పరోక్షంగా వెల్లడించింది. గ్రేటర్లో సగం స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. టిఆర్ ఎస్, ఎంఐఎం పార్టీలలో ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రాథమిక కసరత్తు కూడా పూర్తయింది.

అధికార పార్టీలో హడావుడి.....

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై అధికార పార్టీలో హడావుడి రోజురోజుకు పెరుగుతోంది. విపక్ష పార్టీలను కోలుకోలేని దెబ్బ తీసేందుకు గులాబి పార్టీ పావులు కదుపుతోంది. సిటీలో పార్టీకి పూర్తిస్థాయి బలం లేకపోవడంతో బలమైన నాయకులను గుర్తించి వారిని కారెక్కించుకునే విషయంలో ప్రస్తుతం విజయవంతం అయింది.

వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోన్న అధికార పార్టీ....

గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే సభ్యత్వ నమోదు నుంచే అధికార పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఓల్డ్ సిటీలోని 7 నియోజకవర్గాల్లో ఇతర పార్టీల ప్రభావం అంతంత మాత్రం కావడంతో, ఆ స్థానాల్లో బలంగా ఉన్న MIMతో అవగాహనతో కుదుర్చొకొని అధికార పార్టీ పలు నిర్ణయాలు తీసుకుంటోంది.

గ్రేటర్‌ లోని మొత్తం 150 డివిజన్లలో.....

గ్రేటర్‌ లోని మొత్తం 150 డివిజన్లలో దాదాపు 50 డివిజన్ల వరకు ఎంఐఎం విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన 100 డివిజన్లలో విజయంపై అధికార పార్టీ ఎత్తులు వేస్తోంది. వార్డుల పునర్విభజనతో పాటు రిజర్వేషన్ల ప్రక్రియ కూడా ఈ రెండు పార్టీల నేతల కనుసన్నల్లోనే జరిగాయనే విమర్శలు ఉన్నాయి.

మంత్రి కేటీఆర్ నేరుగా ప్రధాని మోడీ పై విమర్శలు....

ఈ నేపథ్యంలో ఎంఐఎంను మచ్చిక చేసుకునేందుకు మంత్రి కేటీఆర్ నేరుగా ప్రధాని మోడీ పై విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు MIMతో అవగాహనతోనే పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నా సొంత బలంతోనే గ్రేటర్ పై జెండా ఎగురవేసేందుకే గులాబి పార్టీ పావులు కదుపుతున్నట్లు సమాచారం.

09:44 - December 25, 2015

మహబూబ్‌నగర్‌ : 30 సెకండ్లలో 600 మంది విద్యార్థులు 583 దీపాలను వెలిగించి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డును నమోదు చేశారు. కల్వకుర్తిలోని అక్షరవనంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని వందేమాతరం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న 600 మంది విద్యార్థులు 30 సెకండ్లలో 583 ప్రమిదలు వెలిగించి అరుదైన గిన్నిస్ వరల్డ్‌ రికార్డును సాధించారు. ఈ కార్యక్రమానికి ఐటీ కమిషనర్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వందేమాతరం ఫౌండేషన్‌ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని పలువురు అభినందించారు.

09:40 - December 25, 2015

హైదరాబాద్ : శాసనసభలో జరిగిన పరిణామాలు తనను ఎంతో ఆవేదనకు గురి చేసిందన్నారు ఏపీ శాసనసభ స్పీకర్‌ కోడెల. తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి దృశ్యాలు చూడలేదన్నారు కోడెల. జరిగిన పరిణామాలపై అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని పార్టీలతో త్రిసభ్య కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. వీడియోలీకేజీలపై కూడా కమిటీ నివేదిక ఆధారంగానే చర్యలు ఉంటాయన్నారు.

తీవ్ర అభ్యంతరకరమైనవని స్పీకర్‌....

శాసనసభలో చోటు చేసుకున్న పరిణామాలు తీవ్ర అభ్యంతరకరమైనవని స్పీకర్‌ కోడెల ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యుల తీరుతో మనస్తాపం చెందినట్లు కోడెల అన్నారు. రోజాపై సస్పెన్షన్, అసెంబ్లీ ప్రొసీడింగ్ వీడియోలు బయటకు వచ్చిన అంశంపై సభాపతి కోడెల శివప్రసాద రావు మీడియాతో మాట్లాడారు. వీటికి సంబంధించి ఓ కమిటీని వేస్తున్నట్లు చెప్పారు. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.

రాజకీయ జీవితంలో ఇలాంటి సంఘటనలు చూడలేదు...

తన రాజకీయ జీవితంలో ఇలాంటి సంఘటనలు చూడలేదని కోడెల అన్నారు. సభా కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదన్నారు. వైసీపి సభ్యురాలు రోజాను వారించి, వార్నింగ్ ఇచ్చిన తర్వాతనే సస్పెన్షన్ చర్య తీసుకోవడం జరిగిందని తెలిపారు. శాసనసభలో వైసీపీ సభ్యుల తీరు చాలా అభ్యంతరకరంగా ఉందన్నారు. సభాపతిగా నేను ఏ పార్టీకి అనుకూలంగా వ్యవహరించనని కోడెల స్పష్టం చేశారు. తనపై వైసీపీ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారన్నారు. తన పైన అవిశ్వాసం ఇవ్వడం.. సభ్యులుగా వారికి ఉన్న హక్కు అన్నారు.

స్పీకర్‌గా నేను తాను బాధ్యతల నుంచి వెనక్కి తప్పుకునేది లేదు....

స్పీకర్‌గా నేను తాను బాధ్యతల నుంచి వెనక్కి తప్పుకునేది లేదన్నారు. ఏ పార్టీకి అనుకూలంగా ఉండనని చెప్పారు. అసెంబ్లీ తీర్మానం చేశాకే రోజా పైన సస్పెన్షన్ వేశానని చెప్పారు. అసెంబ్లీ ప్రొసీడింగ్ వీడియోలను అందరికీ ఇచ్చామని చెప్పారు. సభ్యుల సస్పెన్షన్, సోషల్ మీడియాలో వీడియో లీకేజీ పైన డిప్యూటీ స్పీకర్ చైర్మన్‌గా మూడు పార్టీలతో విచారణ కమిటీ వేస్తామన్నారు. వీడియో లీకేజీ, రోజా సస్పెన్షన్ కమిటీ నివేదిక ఇస్తుందన్నారు. రోజాతో పాటు ఇతర సభ్యుల పైన సస్పెన్షన్ పెంచాలన్నా, తగ్గించాలన్నా అది కమిటీ బాధ్యత అన్నారు. ఈ కమిటీలో మూడు పార్టీల నుంచి ముగ్గురు సభ్యులు ఉంటారని చెప్పారు. ఈ కమిటీ అసభ్యంగా మాట్లాడిన ఇతర సభ్యుల పైన కూడా విచారణ జరుపుతుందన్నారు.

ముందే వీడియోల లీక్ గురించి తనకు తెలియదు....

క్లిప్పింగులు పార్టీలకు ఇవ్వడానికి ముందే వీడియోల లీక్ గురించి తనకు తెలియదన్నారు. సోషల్ మీడియాలో వీడియోలు రావడం పైన విచారణ జరిపిస్తామని తెలిపారు. రోజా పైన సస్పెన్షన్ తన వ్యక్తిగత నిర్ణయం కాదని, అసెంబ్లీ తీర్మానించాకే సస్పెన్షన్ విధించామన్నారు. అది సభ నిర్ణయమని తెలిపారు. సభలో సభ్యుల ప్రవర్తనను ప్రజలు గమనించారన్నారు.

ఏకగ్రీవంగా స్పీకర్‌గా ఎన్నికయ్యానననే విషయం....

తాను ఏకగ్రీవంగా స్పీకర్‌గా ఎన్నికయ్యానననే విషయం తనకు గుర్తుందని కోడెల చెప్పారు. సస్పెన్షన్, ఇతర సభ్యుల పైన చర్యలు, వీడియో లీకేజ్ పైన వచ్చే సమావేశాల నాటికి కమిటీ నివేదిక ఇస్తుందన్నారు.

ఇండోనేషియాలో భూకంపం

హైదరాబాద్ : ఇండోనేషియాలో ఈ రోజు ఉదయం భూకంపం సంభవించింది. మలుకు ప్రావిన్స్ లో ఉదయం 6.11గంటలకు భూకంపం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. భూకంప లేఖిని పై తీవ్రత 5.9గా నమోదైంది.

వ్యాన్ - దిచక్రవాహనం ఢీ : ముగ్గురి మృతి

కృష్ణా : కంచికర్ల వ్ద జాతీయ రహదారిపై ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్ - దిచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

గురు ప్రార్థనతో ప్రారంభమైన అయుత చండీ మహాయాగం

మెదక్ : గురు ప్రార్థనతో ప్రారంభమైన అయుత చండీ మహాయాగం మూడో రోజు వైభవోపేతంగా కొనసాగుతుంది. గురు ప్రార్థన, గోపూజ, ఏకాదశ న్యాస పూర్వక త్రిసహస్ర చండీ పారాయణములు రుత్వికులు చేశారు. ఇక సీఎం కేసీఆర్ దంపతులు, రుత్వికులు తెల్ల వస్ర్తాలు ధరించి యాగంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం నుంచి ధార్మిక ప్రవచనాలు ప్రారంభం కానున్నాయి.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 11 గంటలు, కాలినడక భక్తులకు 8 గంటలు, ప్రత్యేక ప్రవేశదర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.

08:47 - December 25, 2015

గుంటూరు : క్రిస్‌మస్‌ పండుగ పర్వదినాన గుంటూరు జిల్లాలో తాగడానికి గుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితి నెలకొంది. క్రిస్‌మస్‌ పండుగను బందువులతో ఉల్లాసంగా గడుపుదామకున్న గుంటూరు నగర ప్రజలకు కార్పొరేషన్ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. ప్రకాశం బ్యారేజి నీటిమట్టం తగ్గిపోవడంతో నాలుగు రోజులుగా నగరంలో నీటి సరఫరా ఆగిపోయింది. ట్యాంకర్ల ద్వారా తాత్కాలికంగా నీటి సరఫరా చేస్తున్నప్పటికీ...అవి పూర్తిస్థాయిలో నీటి అవసరాలను తీర్చలేకపోతున్నాయి. దీంతో శివార్లలో ఉండే కాలనీ వాసులు గుక్కెడు నీళ్లకోసం అష్టకష్టాలు పడుతున్నారు. అయితే ప్రస్తుతం నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు స్థానిక ఎమ్మెల్యే మోదుగ వేణుగోపాల్‌రెడ్డి, ముస్తాఫా, ఎంపీ గల్లా జయదేవ్‌లు కార్పొరేషన్‌ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి..నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టారు. అయితే ఇప్పుడున్న పరిస్థితిల్లో నగర ప్రజలకు పూర్తిస్థాయిలో నీటి సరఫరా సాధ్యం కాదని ఇంజనీరింగ్‌ అధికారులు తేల్చిచెప్పడంతో ఎలాగోలా ప్రజలకు నీటి సరఫరా చేయాలని ఎంపీ జయదేవ్‌, ఎమ్మెల్యే మోదుగుల అధికారులను ఆదేశించారు.

08:45 - December 25, 2015

గుంటూరు : మంగళగిరిలో దారుణం జరిగింది. మార్కెట్‌ యార్డు సమీపంలో మేకతోటి హేమంత్‌, కాకర్ల రమేష్‌ ఇద్దరు స్నేహితులు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో హేమంత్‌, కాకర్ల రమేష్‌ ఇద్దరూ మృతిచెందగా..మరో ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. వీరి ఘర్షణతో మార్కెట్‌ యార్డు సమీపంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చింటూ అనే స్నేహితుడి బర్త్‌డే పార్టీలో పాల్గొన్న హేమంత్‌,రమేష్‌ మధ్య ఘర్షణ జరిగినట్లు సమాచారం. అయితే వీరికి మరికొంతమంది స్నేహితులు తోడుకావడంతో పరస్పరం రాళ్లతో దాడిచేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరూ చనిపోవడంతో మిగతా స్నేహితులంతా పరారయ్యారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

08:43 - December 25, 2015

హైదరాబాద్ : మెదక్‌ సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా ఆరంభమయ్యాయి. ఉదయం నాలుగున్నరకే ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. భారీ సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. క్రిస్మస్‌ సందర్భంగా చర్చిని చక్కగా అలంకరించారు.

11ఎర్రచందనం దుంగల స్వాధీనం..

చిత్తూరు : యాదమర్రి మండలం వరిగపల్లి వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారుతోపాటు 11 ఎర్రచందనం దుంగలను పోలీస్ స్టేషన్కి తరలించి పోలీసులు సీజ్ చేశారు. డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

కాబూల్ కు ప్రధాని మోదీ

హైదరాబాద్ : ప్రధాని మోదీ ఈ రోజు ఉదయం ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ కు చేరుకున్నారు. కాబూల్ లో రూ. 710కోట్ల వ్యయంతో భారత్ నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని మోదీ ప్రారంభించనున్నారు. పార్లమెంట్ భవనానికి 2005లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పునాది రాయి వేశారు.

07:32 - December 25, 2015

హైదరాబాద్ : స్పీకర్ అనుమతి లేకుండా అసెంబ్లీ సమావేశాల సీసీ టీవీ ఫుటేజీలను విడుల చేసిన టిడిపినేత కాల్వ శ్రీనివాసరావు పై వెంటనే స్పీకర్ చర్యలు తీసుకోవాలని న్యూస్ మార్నింగ్ లో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు. టిడిపి నేత కాల్వ శ్రీనివాసరావు సీసీ ఫుటేజీ విడుదలపై స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ అనుమతి లేకుండా సీసీ ఫుటేజీలను విడుదల చేయడం సభాహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందా? సభాహక్కులను ఉల్లంఘించిన కాల్వను సభ నుండి వెంటనే సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదా? దొంగ బిల్లుల ఆమోదం కోసం ప్రతిపక్షాన్ని రెచ్చగొట్టి సస్పెండ్ చేశారా? టిడిపి డిఫెన్స్ లో పడిందా? ఇత్యాది అంశాలపై న్యూస్ మార్నింగ్ చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రవిచంద్రారెడ్డి, వైసీపీ నేత మదన్ మోహన్ రెడ్డి, టిడిపి నేత పట్టాభిరామ్ వారి మధ్య జరిగిన చర్చను చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

ఏ ఎన్ యూ పరిధిలో బీఈడీ పరీక్షలు వాయిదా

గుంటూరు : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలం పరిధిలో ఈ నెల 29 నుంచి ప్రారంభం కావాల్సిన బీఈడీ పరీక్షలు వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఎం. సాయిబాబు తెలిపారు. ఈ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం కానున్నాయన్నారు.

అబాకస్ ఓపెన్ కాంపిటీషన్స్ కు దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్ : వండర్‌కిడ్జ్ ఆర్థమెటిక్ ఆధ్వర్యంలో ఐదో ఆల్ ఇండియా అబాకస్ అండ్ మెంటల్ ఆర్థమెటిక్స్ ఓపెన్ కాంపిటిషన్‌ను బర్కత్‌పురలోని తెలంగాణ యువతి మండలి హాల్‌లో నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ ఎ.ఆంజనేయులు తెలిపారు. జనవరి 9న ఈ పోటీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు కో-ఆర్డినేటర్ శైలజ ఫోన్ నెంబర్ 9989260430, 984982045లో సంప్రదించాలని సూచించారు.

06:52 - December 25, 2015

హైదరాబాద్ : క్రిస్మస్‌ సందడి అంబరాన్ని అంటుతోంది. క్రైస్తవ దేవాలయాలు విద్యుత్‌ దీపాల కాంతులతో మిరుమిట్లు గొలుపుతున్నాయి. చర్చిలను అందంగా అలకరించారు. క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు అర్థరాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.

ప్రత్యేక శోభను సంతరించుకున్న చర్చిలు...

రంగు రంగు విద్యుత్‌ దీపాలతో చర్చిలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. క్రిస్‌మస్‌ తాతలు సందడి చేస్తూ పిల్లలకు బహుమతులు పంచుతున్నారు. క్రీస్తు జననంపై ప్రబోధకులు ప్రత్యేక సందేశాలు అందిస్తున్నారు.

శుభాకాంక్షలు తెలిపిన పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు .....

క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో క్రిస్మస్‌ పండుగను జరుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాక్షించారు. ప్రజల్లో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించేందుకు ఏసుక్రీస్తు జీవితం స్ఫూర్తిగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన గొప్ప మానవతావాది ఏసుప్రభువని చంద్రబాబు కొనియాడారు. జీసస్‌ జీవితం ఆదర్శప్రాయమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అన్నారు. క్రిస్‌మస్‌ సందర్భంగా ఆయన ప్రజలకు శుభాక్షాంక్షలు చెప్పారు.

క్రిస్మస్ శుభాక్షాంక్షలు తెలిపిన జగన్...

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ తెలుగు ప్రజలందరికీ క్రిస్మస్ శుభాక్షాంక్షలు చెప్పారు. సమానత్వం, శాంతి, ప్రేమ, కరుణ వంటి క్రీస్తు బోధనలు మానవాళికి అనుసరణీయమని జగన్‌ అన్నారు. మెగస్టార్‌ చిరంజీవి క్రిస్మస్‌, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామ్‌ చరణ్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఓ వీడియోని పోస్ట్ చేశారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

క్రైస్తవ సోదరులకు శుభాక్షాంక్షలు తెలిపిన బాలయ్య.....

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ క్రైస్తవ సోదరులకు శుభాక్షాంక్షలు తెలిపారు. ఏసుప్రభు బోధనల స్ఫూర్తితో ప్రతిఒక్కరూ శాంతికి బాటలు వేయాలని ఆయన అన్నారు.

06:48 - December 25, 2015

హైదరాబాద్ : మెదక్‌ జిల్లా ఎర్రవల్లిలో కేసీఆర్‌ చేపట్టిన అయుత చండీయాగం మూడో రోజుకు చేరుకుంది. ఈ రోజు కూడా పలువురు ప్రముఖులు చండీ యాగానికి హాజరవుతున్నారు. ఇవాళ రాత్రి 10 గంటల వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతాయి. త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌ స్వామి చండీయాగానికి వస్తున్నారు. మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు, ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌, ఏపీ శాసనమండలి ఛైర్మన్‌ చక్రపాణి చండీయాగంలో పాల్గొంటారు

రెండో రోజు పాల్గొన్న పలువురు ప్రముఖులు...

మెదక్‌ జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తలపెట్టిన అయుత మహా చండీయాగం రెండో రోజు కన్నులపండువగా సాగింది. ఈ యాగానికి కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ సహా పలువురు ప్రజాప్రతినిధులు, ఆధ్యాత్మిక వేత్తలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు ప్రముఖులను కేసీఆర్‌ సాదరంగా ఆహ్వానించారు.

కేసీఆర్‌ను ఆశీర్వదించిన శృంగేరి భావి పీఠాధిపతి విధుశేఖర భారతి ....

ఇవాళ సీఎం కేసీఆర్ దంపతులు, రిత్విజులు గులాబీ రంగు వస్ర్తాలు ధరించి ఈ యాగంలో పాల్గొన్నారు. పలువురు మహిళలు అమ్మవారి కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. శృంగేరి రిత్విజులు ఇవాళ పలు రకాల యాగాలు, జపాలు, మంగళహారతులు నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ను శృంగేరి భావి పీఠాధిపతి విధుశేఖర భారతి ఆశీర్వదించారు.

తండోపతండాలుగా భక్త జనం...

ఈ యాగానికి భక్త జనం తండోపతండాలుగా తరలి వచ్చారు. పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న దృష్ట్యా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. యాగానికి విచ్చేస్తోన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రసాదం, అన్నదానం వంటివి ఏర్పాటు చేశారు.

06:45 - December 25, 2015

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతి బృహత్‌ ప్రణాళిక నోటిఫికేషన్‌కు అంతా సిద్ధమయ్యింది. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సీఆర్‌డీఎ వైస్‌ ఛెర్మన్, మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ, మౌలిక సౌకర్యాల కల్పన ప్రిన్సిపాల్‌ కార్యదర్శి అజయ్‌ జైన్‌, సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీకాంత్‌, ఇతర ఉన్నతాధికారులతో మూడుగంటలపాటు సమావేశమయ్యారు. సింగపూర్‌ బృందం సమర్పించిన అమరావతి మాస్టర్‌ ప్లాన్‌, ప్రాస్పెక్టివ్‌ ప్లాన్‌ మీద సుదీర్ఘ చర్చ జరిగింది.

మార్పులు సూచించిన ముఖ్యమంత్రి.........

సింగపూర్‌ సమర్పించిన మాస్టర్‌ ప్లాన్‌, ప్రాస్పెక్టివ్‌ ప్లాన్స్‌కు ముఖ్యమంత్రి కొన్ని మార్పులు సూచించారు. దీనికి సంబంధించి వెంటనే నోటిఫికేషన్‌ విడుదల చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో సీఆర్‌డీఏ రాజధాని బృహత్‌ ప్రణాళిక సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేస్తోంది.

ప్రజలు, నిపుణుల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాల స్వీకరణ........

బృహత్‌ ప్రణాళిక నోటిఫై అనంతరం 30 రోజుల పాటు ప్రజలు, నిపుణుల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం రైతులకు ప్లాట్లు కేటాయింపు ప్రక్రియ మొదలవుతుందని మంత్రి నారాయణ తెలిపారు.

06:43 - December 25, 2015

విజయవాడ : రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఏపీలో పర్యటిస్తున్నారు. మొదటిగా ఆయన పశ్చిమగోదావరి జిల్లా వస్తారు. అక్కడి నుంచి తిరుపతి వెళతారు. వెంకటేశ్వరస్వామి దర్శనం అనంతరం తిరిగి ఆయన హైదరాబాద్‌ బయలుదేరుతారు.

ఉదయం 11.05 గంటలకు గన్నవరం రానున్న రాష్ట్రపతి......

ఉదయం 11.05 గంటలకు రాష్ట్రపతి గన్నవరం చేరుకోనున్నారు. అక్కడ రాష్ట్రపతికి గవర్నర్‌, సీఎం స్వాగతం పలకుతారు. అనంతరం ప.గో జిల్లా ఐ.భీమవరానికి ప్రణబ్‌ వెళతారు. మధ్యాహ్నం 12.45 గంటలకు టీటీడీ వేద పాఠశాలను రాష్ట్రపతి ప్రారంభిస్తారు. అనంతరం ఆయన తిరిగి ప్రయాణమవుతారు. గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు తిరుపతికి బయలుదేరుతారు.

తిరుమల పద్మావతి అతిథి గృహంలో విశ్రాంతి.....

పశ్చిమ గోదావరి జిల్లా పర్యటను ముగించుకున్న తరువాత రాష్ట్రపతి తిరుపతి వెళతారు. తిరుమల పద్మావతి అతిథి గృహానికి వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 4 గంటలకు వరహాస్వామిని, ఆ తర్వాత వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. 6 గంటలకు ఆయన తిరుమల నుంచి తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పర్యటన

విజయవాడ : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తారు. పశ్చిమగోదావరి జిల్లాలో వేద పాఠశాలను ఆయన ప్రారంభిస్తారు. అనంతరం తిరుపతి వెళతారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని శ్రీవారిని దర్శించుకుంటారు. ఆ తరువాత తిరిగి హైదరాబాద్‌ బయలుదేరుతారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటుచేశారు.

06:40 - December 25, 2015

విజయవాడ : కృష్ణా పుష్కరాలలోపు విజయవాడ దుర్గగుడి ఫ్లై ఓవర్ పూర్తిచేయాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో పెద్దఎత్తున చేపడుతున్న రహదారుల పనులు, ప్రణాళికలపై అధికారులతో సమీక్షించారు. నిధుల సేకరణకు కేంద్రంతో సహా విదేశీ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తదితర అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు.

రూ.13,500 కోట్లతో మొత్తం తో ....

రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం రూ.13,500 కోట్లతో మొత్తం 1350 కి.మీ. మేర కొత్త జాతీయ రహదారుల పనులు ప్రారంభిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. హైదరాబాద్‌లో తన నివాసంలో సీఎం రాష్ట్రంలో పెద్దఎత్తున చేపడుతున్న రహదారుల పనులు, ప్రణాళికలపై అధికారులతో సమీక్షించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించిన ప్యాకేజీ మేరకు ప్రాజెక్టుల వారీగా కేంద్రానికి అందజేయాల్సిన నివేదికలు, డీపీఆర్‌లను వెంటనే సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

విజయవాడ దుర్గగుడి ఫ్లై ఓవర్‌ పుష్కరాల లోపే పూర్తి చేయాలని ఆదేశం.......

విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే కృష్ణా పుష్కరాలలోపు పూర్తవ్వాలని సీఎం స్పష్టం చేశారు. అలాగే 413 కిలోమీటర్ల అనంతపురం- తాడిపత్రి- తొక్కపల్లి- నరసరావుపేట- గుంటూరు జాతీయ రహదారి పనులను ఈ ఏడాదే ఆరంభించాలని సీఎం ఆదేశించారు. మొత్తం 125 కిలో మీటర్ల కర్నూలు-నందికొట్కూరు-ఆత్మకూరు-డోర్నాల జాతీయ రహదారి పనులను కూడా ఈ ఆర్ధిక సంవత్సరంలోనే చేపట్టాలని తెలిపారు. ఆనందపురం నుంచి రాజమండ్రి వరకు 130 కి.మీ. మేర జాతీయ రహదారి రీ ఎలైన్‌మెంట్ చేయాలని ఆదేశించారు. రహరాదుల నెట్‌వర్క్‌ను డిజిటలైజ్‌ చేయాలని ఆదేశించారు.

గ్రామీణ ప్రాంతాలలో రహదారుల నిర్మాణం కోసం నాబార్డు నిధులు....

గ్రామీణ ప్రాంతాలలో రహదారుల నిర్మాణం, నిర్వహణ కోసం నాబార్డు నిధులను ఉపయోగించుకునేందుకు అవసరమయ్యే ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అంతేకాకుండా, ప్రపంచ బ్యాంక్, జైకా సంస్థల నుంచి రహదారుల నిర్మాణానికి నిధులు సమీకరించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. అమరావతి నగరానికి చుట్టూ 180 కిలోమీటర్ల మేర ఔటర్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించగా, దీనికి రూ. 20 వేల కోట్లు వ్యయం అయ్యేలా అంచనాలు రూపొందించినట్లు తెలిపారు.

06:37 - December 25, 2015

హైదరాబాద్: పార్లమెంట్‌ సభ్యుల వేతనాలను రెట్టింపు చేయాలని పార్లమెంటరీ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. నెలవారీ వేతనం..నియోజకవర్గం అలవెన్సులను డబుల్‌ చేయాలని ప్రపోజ్‌ చేసింది. ప్రస్తుతం ఎంపీల జీతం 50 వేలు. దీనికి అదనంగా మరో రూ. 45 వేలు నియోజకవర్గ భత్యంగా ఇస్తున్నారు.

కొత్త ప్రతిపాదనల ప్రకారం పెరగనున్న ఎంపీల జీతభత్యాలు.......

తాజా ప్రతిపాదనల ప్రకారం ఈ జీత భత్యాలు రెట్టింపు అవ్వనున్నాయి. నెల జీతం 50 వేలు నుంచి లక్షకు పెరుగుతుంది. నియోజకవర్గ భత్యం 45 వేల నుంచి 90 వేలుకు చేరుతుంది. ఈ ప్రతిపాదనలకు ఆర్థికశాఖ ఆమోదం లభిస్తే ఎంపీలకు నెలకు రూ. 2.8 లక్షలు అందుతుంది.

మూలవేతనంలో పెంపును వ్యతిరేకిస్తున్న ఎంపీలు!.....

మూలవేతనంలో పెంపుపై ఎక్కువమంది ఎంపీలు ఇంట్రస్ట్ చూపడంలేదని తెలుస్తోంది. బేసిక్‌ను పెంచితే అధిక ఆదాయపన్ను పరిధిలోకి వస్తారనే కారణంతోనే దీన్ని వ్యతిరేకిస్తున్నారని సమాచారం. ఇది ఇలా ఉంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించిన వేతన కమిషన్‌కే ఎంపీల జీతభత్యాల అంశాన్ని జత చేయాలనే ప్రతిపాదనను ఆర్థికశాఖ పరిశీలిస్తుంది.

ఎంపీల వేతనాలు చివరిసారిగా 2011లో పెంపు......

ఎంపీల వేతనాలను చివరిసారిగా 2011లో సవరించారు. మళ్లీ పార్లమెంట్‌ సభ్యుల వేతనాలను పెంచాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతిపాదన తీసుకొచ్చింది. ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్‌ సమావేశాల్లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.

06:35 - December 25, 2015

హైదరాబాద్ : రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. రెండు రోజుల రష్యా పర్యటనలో భాగంగా ఆయన ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో కలిసి 16వ వార్షిక శిఖరాగ్ర సదస్సు నిర్వహించారు. నిరుడు న్యూఢిల్లీలో జరిగిన 15వ వార్షిక శిఖరాగ్ర సదస్సులోనూ మోడీ భాగస్వామయ్యారు.

ఇరు దేశాలు 16 ఒప్పందాలపై సంతకాలు....

గురువారం జరిగిన సమావేశాల్లో ఇరు దేశాలు 16 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. న్యూక్లియర్‌ రియాక్టర్లు, సోలార్‌ ఎనర్జీ ప్లాంట్లు, రైల్వే, రక్షణ రంగాలకు సంబంధించి ఆ ఒప్పందాలు చేసుకున్నాయి. మేక్‌ ఇన్‌ ఇండియా మంత్రం జపిస్తున్న మోడీ రక్షణ రంగానికి చెందిన కొమోవ్‌ 226 హెలికాప్టర్లను భారత్‌లో నిర్మించబోతున్నట్లు చెప్పారు. మేక్‌ ఇన్ ఇండియాలో భాగంగా రక్షణ రంగానికి సంబంధించి జరుగుతున్న మొదటి అతిపెద్ద ఉత్పత్తి ఇది అని చెప్పారు. ఇక రష్యా సాంకేతిక పరిజ్ఙానంతో కూడిన 12 న్యూక్లియర్‌ రియాక్టర్లను భారత్‌లో రెండు ప్రదేశాల్లో నిర్మించబోతున్నట్లు స్పష్టం చేశారు.

భారత్‌ గొప్ప శక్తివంతంగా బాధ్యతాయుతంగా....

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ మాట్లాడుతూ విదేశీ విధానాల రూపకల్పనలో భారత్‌ గొప్ప శక్తివంతంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని ప్రశంసించారు. ఈ చర్చల వల్ల ఇరు దేశాల స్నేహసంబంధం మరింత బలపడుతుందని అన్నారు. మోడీ పర్యటనలో భాగంగా వ్యాపారాత్మక ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న 10 బిలియన్‌ డాలర్లు అంటే సుమారు 70 వేల కోట్ల వ్యాపారాన్ని రాబోయే పదేళ్లలో మూడింతలకు చేర్చాలని నిర్ణయించారు. రెండో ప్రపంచ యుద్ధంలో ప్రాణాలర్పించిన సోవియట్ సైనికుల స్మారక చిహ్నం వద్ద మోడీ నివాళులర్పించారు. వెనుక రష్యన్‌ మిలటరీ బ్యాండ్ మోగిస్తుండగా స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛాన్ని ఉంచారు.

మెదక్ చర్చిలో ప్రారంభమైన క్రిస్ మస్ వేడుకలు

హైదరాబాద్: మెదక్ లోని ప్రఖ్యాత కేథడ్రల్ చర్చిలో క్రిస్ మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. నేటి తెల్లవారుజామున 5 గంటలకు మొదటి ఆరాధాన మొదలైంది. చర్చి ఆవరణలో ఏసుక్రీసు శిలువ వూరేగించారు. భక్తులకు సీఎస్ఐ మెదక్ అధ్యక్ష మండలం వైస్ ఛైర్మన్ దైవ సందేశాన్ని చదివి వినిపించారు.

మంగళగిరి లో ఇరువర్గాల మధ్య ఘర్షణ : ఇద్దరి మృతి

గుంటూరు : మంగళగిరి మార్కెట్ యార్డు సమీపంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో రమేష్, హేమంత్ లను రాళ్ల తో ప్రత్యర్థులు కొట్టి చంపారు. అంతే కాకుండా మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

Don't Miss