Activities calendar

26 December 2015

ఒంగోలు సిండికేట్‌ బ్యాంక్‌లో చోరీయత్నం

ప్రకాశం : జిల్లా ఒంగోలులోని సిండికేట్‌ బ్యాంక్‌లో చోరీకి యత్నం చేశారు. బ్యాంక్‌ తాళాలు దొంగలు పగలగొట్టారు.

జమ్మలమడుగు నియోజకవర్గంలో జగన్‌ పర్యటన

కడప : జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో జగన్‌ పర్యటించారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి జగన్‌ పర్యటనకు దూరంగా ఉన్నారు.

డిప్యూటీ తహసీల్దార్ సస్పెన్షన్

విజయనగరం : జిల్లా మెంటాడ ఉప తహసీల్దార్‌ రామకృష్ణపై ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేసింది. మెంటాడ ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్‌ను కూడా విధుల నుంచి తప్పించింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వీరిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం వీరిని విధుల నుంచి తప్పించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు కలెక్టర్‌ చర్యలు తీసుకున్నారు.

చంద్రబాబు - అంబానీ భేటీ..

విజయవాడ: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ దిరుబాయి అంబానీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిశారు. శనివారం విజయవాడలో కలిసిన సందర్భంగా ఆయన చంద్రబాబుతో సమావేశమైయ్యారు. ఈ సమావేశంలో అనిల్‌ అంబానీ చంద్రబాబుతో 4 జీ సేవలపై చర్చించినట్టు తెలిసింది.

సోమవారం కేసీఆర్ వేములవాడ పయనం

హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం కుటుంబ సమేతంగా వేములవాడకు వెళ్లనున్నారు. అక్కడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అయుత చండీయాగం ముగిశాక ఈ పర్యటనకు వెళ్లనున్నారు.

21:59 - December 26, 2015

ఢిల్లీ : తమ విమానాల్లో అందించే భోజనంపై ఎయిర్‌ఇండియా సంస్థ ఆంక్షలు విధించింది. 90 నిమిషాలు, అంతకన్నా తక్కువ సమయం ప్రయాణం చేసే ప్రయాణికులకు కేవలం శాకాహార భోజనమే అందజేయనున్నట్లు ఎయిర్‌ఇండియా సంస్థ ప్రకటించింది. అంతేకాకుండా లంచ్‌, డిన్నర్‌ సమయాల్లో టీ, కాఫీలను రద్దు చేసినట్లు తెలిపింది. అదేవిధంగా తక్కువ సమయం ప్రయాణించే ప్రయాణికులకు అందజేసే సాండ్‌విచ్‌ కేకులను కూడా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీటిని జనవరి ఒకటి నుంచి అమలు చేస్తామని ఎయిర్‌ ఇండియా సంస్థ తెలిపింది.

 

21:57 - December 26, 2015

హైదరాబాద్ : న్యూ ఇయర్‌ వేడుకలపై సైబరాబాద్‌ పోలీసులు ఆంక్షలు విధించారు. హోటల్స్‌, పబ్బులు, రిసార్టులు, ఫామ్‌ హౌస్‌లలో 31 రాత్రి 8 గంటల నుంచి ఒంటి గంట వరకే పార్టీలకు అనుమతి ఉందని సైబరాబాద్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు. డ్రగ్స్‌, హుక్కా, రేవ్‌ పార్టీలకు అనుమతి లేదన్నారు. పోలీసులు విధించిన ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్‌ హెచ్చరించారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 25 స్టార్‌ హోటల్స్‌, 3 పబ్బులు, 22 రిసార్టులు, 269 ఫామ్‌ హౌస్‌లు ఉన్నాయని కమిషనర్‌ తెలిపారు. తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. లైసెన్స్‌ ఆయుధాలు వెంట తెచ్చేవారిని పార్టీలకు అనుమతించవద్దని నిర్వాహకులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. పబ్బుల్లో జరిగే పార్టీలను సీసీ కెమెరాలో రికార్డు చేయాలని సూచించారు. అలాగే పార్టీలలో బాణాసంచాను నిషేధించారు. ఇక రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఔటర్‌ రింగ్‌ రోడ్డును క్లోజ్‌ చేస్తున్నట్లు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. మహిళల కోసం ప్రత్యేక బ్యారాక్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అశ్లీల డ్యాన్స్‌లను నిషేధించినట్లు తెలిపారు. ఆంక్షలు ఉల్లంఘిస్తే లైసెన్స్‌ల రద్దుతో పాటు కఠిన చర్యలు తప్పవని సైబరాబాద్‌ పోలీసులు హెచ్చరించారు.

 

21:54 - December 26, 2015

నవ్వు ఒక భోగం. నవ్విచడం ఒక యోగం. సాధారణంగా సినిమాల్లో కామెడీని చూస్తాం. కానీ వార్తల్లో కూడా కామెడీ కోణం ఉంటుందండోయ్. మనం ఆ కోణాన్ని పట్టుకోగలిగినప్పుడు ఆ వార్తల్ని మనం ఎంజాయ్ చేయగలం. వార్తల్లో కామెడీని వెతుక్కోవడమే 'క్రేజీ' న్యూస్ ప్రత్యేకత. ఇక ఈ రోజు మనం చూడబోయే అంశాలు. 'ఇండియన్ రైల్వే ఆఫ్ టిక్కెట్ ను వెనక్కితీసుకోవడం వల్ల మనకు వచ్చే లాభమేంటీ? ఢిల్లీలో కాలుష్యనియంత్రణకు ఆప్ సర్కార్ కొత్త రూల్ వల్ల ఎంత ప్రయోనం చేకూరింది? నితిన్ గడ్కరీ.. థాయ్ లాండ్ వరకు రోడ్లు వేయిస్తే ఏం చేయొచ్చు?  పార్లమెంట్ లో ఆప్ ఎంపీకి మోడీ నీళ్లివ్వడం వెనక కారణాలేంటి? సినిమాలు ఫిజిక్స్ ను ఎలా ఫెయిల్ చేస్తున్నాయి?  ఈ క్రేజీ క్రేజీ అంశాలను క్రేజీన్యూస్ లో చూద్దాం. వీడియో క్లిక్ చేయండి పండగ చేస్కోండి. వీడియో చూసే ముందు ఒక్క నిమిషం...! ఈ రోజే ప్రారంభమైన ఈ కార్యక్రమానికి మీ ఫీడ్ బ్యాక్ కూడా ఇవ్వొచ్చండోయ్..

 

 

21:36 - December 26, 2015

హైదరాబాద్ : ఎపి నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి సీఆర్ డీఏ మాస్టర్ ప్లాన్ నోటిఫికేషన్ విడుదల అయింది. అన్ని రకాల వసతులకు సంబంధించిన వివరాలను పొందుపర్చుతారు. మాస్టర్ ప్లాన్ నోటిఫికేషన్ ను ఇవాళ అర్ధరాత్రి వెబ్ సైట్ లో పెట్టనున్నారు. మాస్టర్ ప్లాన్ పై ప్రజలు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు జనవరి 31 వరకు గడువు ఇచ్చారు. ప్రజల నుంచి వచ్చే సూచనలన స్వీకరిస్తామని ప్రభుత్వం తెలిపింది.

 

20:35 - December 26, 2015

ప్రకాశం : జిల్లాలో సింగరాయకొండలో కాల్‌మనీ వ్యవహారం సంచలనం కలిగిస్తోంది. బాధితులు తమకు న్యాయం చేయాలంటూ రోడ్డెక్కారు. అంబేద్కర్‌ విగ్రహం ముందు నిరాహార దీక్షలు చేపట్టారు. మహిళలు తమను కాల్‌ మనీ వడ్డీ వ్యాపారులు వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి 6 రోజులు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. 

 

 

20:33 - December 26, 2015

కృష్ణా : చట్టమే తన చేతిలో ఉందని... ఇక తనకు తిరుగేలేదని ఫీలైపోయాడు ఓ హెడ్‌ కానిస్టేబుల్‌. ఓ ఫర్నిచర్‌ షాపులో హంగామా సృష్టించాడు. కృష్ణా జిల్లా కైకలూరులో హెడ్‌కానిస్టేబుల్‌ జయరాజు.. షాపులో యజమానిలేడంటూ సిబ్బందిని చితకబాదాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డయింది. ఈ ఫుటేజీతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న జయరాజు పరారయ్యాడు. అతనికోసం పోలీసులు గాలిస్తున్నారు. 

 

 

19:56 - December 26, 2015

కృష్ణా : విజయవాడ పంజా సెంటర్‌లో ఓ రౌడీ మూక రెచ్చిపోయింది. టిఫిన్‌ కావాలంటూ ఓ యువకుడు హోటల్‌ సిబ్బందిని డిమాండ్ చేశాడు.. టిఫిన్ అయిపోయిందని చెప్పినా వినలేదు.. అతను ఆకలితో ఉన్నాడని భావించిన సిబ్బంది తమకోసం దాచుకున్న కిచిడీ అతనికి పెట్టారు.. అందులో చికెన్‌ లేదని... టేస్టు బాగాలేదంటూ దుండగుడు హొటల్‌ సిబ్బందిని తిట్టాడు.. అతని ప్రవర్తనచూసి ఆగ్రహించిన సిబ్బంది ఆ రౌడీని బయటకు నెట్టేశారు.. తనను బయటకు పంపుతారా అంటూ కోపంతో రగిలిపోయిన ఆ దుండగుడు మరో ఏడుగురిని వెంటతెచ్చుకున్నాడు.. వారంతాకలిసి హొటల్‌ సర్వర్‌ను చితకబాదారు.. అడ్డుకున్న యజమానితోపాటు.. కస్టమర్లపై దాడి చేశారు.. దుండగుడి చేతిలో చావు దెబ్బలు తిన్న హొటల్‌ సిబ్బంది స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు..

 

19:52 - December 26, 2015

నిజామాబాద్ : అదో రాజుగారి గదిలాంటి ఊరు.. చీకటిపడుతోందంటే చాలు అక్కడ అసలు కథ మొదలవుతుంది.. ఏం జరిగినా ఒక్కరూ బయటకు అడుగుపెట్టరు.. అనుక్షణం భయంతో వణికిపోతారు.. ఇలా టెన్షన్‌తో బతకలేక ఇప్పుడు ఊరుమొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది.. ఆ గ్రామంలో ఏం జరుగుతోంది? స్పెషల్ స్టోరీ..
ఏ ఇళ్లు చూసినా తాళాలే 
ఏ ఇళ్లు చూసినా తాళాలే దర్శనమిస్తాయి. ఎవ్వరిని కదిలించినా భయం భయంగా సమాధానమిస్తారు. చీకటిపడుతుందంటే బయటకు రావాలంటే వణికిపోతారు. సిర్నపల్లి దొరసాని శీలం జానకీబాయికి ఈ గ్రామం అంటే అభిమానం. దగ్గరుండి పల్లెను అభివృద్ధి చేయించారు. 250 కుటుంబాలు ఎంతో సంతోషంతో బతికేవి. 
త్రియంబక్‌పేట్‌ గ్రామం
నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం త్రియంబక్‌పేట్‌ గ్రామం ఇది.. ఒకప్పుడు ఇక్కడ ప్రజలు ఎంతో సంతోషంగా బతికారు.. ఈ పల్లెకు ఘనమైన పురాతన చరిత్రకూడా ఉంది.. సిర్నపల్లి దొరసాని శీలం జానకీబాయికి ఈ ప్రాంతమంటే ఎంతో అభిమానం ఉండేదట.. తనే దగ్గరుండి ఈ పల్లెను అభివృద్ది చేయించారని స్థానికులు చెప్పుకుంటారు.. 44వ జాతీయ రహదారికి పక్కనే ఉండటంతో ప్రయాణాలకు ఎంతో అనుకూలం.. దాదాపు 250 కుటుంబాలు పచ్చని పైర్లమధ్య వ్యవసాయం చేసుకుంటూ హాయిగా జీవించేవారు.. 
220 కుటుంబాలు ఊరు వదిలి వెళ్లిపోయాయి
ఇదంతా గతం... ఇప్పుడు ఇక్కడ పరిస్థితి అంతా మారిపోయింది.. అనుక్షణం భయంతో బతకలేక 220 కుటుంబాలు ఊరు వదిలి వెళ్లిపోయాయి.. ఉన్న ఆ 30 కుటుంబాలు టెన్షన్‌తో బతుకుతున్నాయి... విద్యార్థులులేక ప్రభుత్వ పాఠశాల మూసేశారు.. ఈ గ్రామం యువకుడికి అమ్మాయినిచ్చే ధైర్యం ఎవ్వరూ చేయడంలేదు.. ఇక సాయంత్రమైందంటే చాలు.. అందరూ తలుపులు మూసుకుని ఇంట్లోనే ఉంటారు.. ఊరివెనకవైపున్న గుడి పేరు చెప్పడానికికూడా భయపడిపోతారు.. పూరిళ్లు, పెంకుటిండ్లు తప్ప ఎక్కడా ఒక్క స్లాబ్ ఇల్లు కనిపించదు.. ఆ గృహాలుకూడా శిధిలావస్థకు చేరాయి.. అందులో వృద్ధులు, వితంతువులుమాత్రమే ఉంటున్నారు.. 
15మంది పురుషుల మృతి
రెండేళ్లక్రితంవరకూ ఎంతో సంతోషంతో ఉన్నారు ఈ గ్రామస్తులు.. ఆ తర్వాతనుంచి వీరికి కష్టాలు మొదలయ్యాయి.. 11 నెలలకాలంలో 15మంది పురుషులు చనిపోయారు. మృతులంతా 25నుంచి 30 ఏళ్లలోపు వయసున్నవారుకావడంతో కుటుంబాల పరిస్థితి దారుణంగా మారింది.. ఇలా వరుస మరణాలతో వితంతువుల సంఖ్య పెరుగుతూ పోతోంది.. వీరు మృత్యువాత పడ్డ కారణం స్థానికుల్లో భయం పెంచింది.. అప్పటివరకూ ఎంతో సంతోషంగా ఉన్నవారు అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు... మరికొందరు అంతుచిక్కని జబ్బులతో తుదిశ్వాస విడిచారు.. ఒకరితర్వాత ఒకరు మగవాళ్లు ఇలా చనిపోవడంతో గ్రామస్తులు హడలిపోయారు.. ఒక్కొక్కరిగా ఊరు విడిచి వలసబాట పట్టారు..
గ్రామానికి వాస్తు దోషం ఉందంటూ పుకారు
వరుస మరణాలతో గ్రామానికి వాస్తు దోషం ఉందంటూ పుకారు ప్రారంభమైంది.... ఏదో అతీత శక్తి తమను వెంటాడుతోందని అంతా హడలిపోయారు.. గుడివైపు వెళితే మళ్లీ తిరిగిరామన్న ప్రచారం మొదలైంది.. ఇప్పుడు ఇక్కడ ఎవ్వరిని కదిలించినా విషాదమే కనిపిస్తుంది.. కన్నీళ్లతోనే తమ కష్టాలు వెల్లబోసుకుంటారు.. బతికిఉన్నవారు ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ టెన్షన్ పడుతున్నారు.. ఇలా మూఢనమ్మకాలతో అల్లాడిపోతున్న ఈ గ్రామాన్ని ఏ అధికారీ పట్టించుకోలేదు.. ప్రజలను చైతన్యం చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందిన ఈ కాలంలోకూడా మూఢనమ్మకాలు ఇంకా జనాల్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఊరు మొత్తం ఖాళీ అయ్యేలా చేస్తున్నాయి.

 

19:40 - December 26, 2015

హైదరాబాద్ : తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో శాసనమండలి ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే అధికార పార్టీ ఆరుస్థానాలను ఏకగ్రీవం చేసుకుంది. మరో ఆరు స్థానాల్లో ఎన్నికలను ఎదుర్కొంటుంది. రెండు జిల్లాలపై గులాబీ పార్టీలో ధీమా కనిపిస్తున్నా.. మరో రెండు జిల్లాలు మాత్రం ఉత్కంఠ రేపుతున్నాయి. ఆదివారం జరిగే పోలింగ్‌ కోసం అన్ని రాజకీయ పార్టీల నేతల చివరి నిమిషం వరకు స్థానిక ఓటర్ల మద్దతు కోసం పావులు కదుపుతున్నారు. 
విజయం కోసం అస్త్ర శస్త్రాలను ఉపయోగిస్తున్న రాజకీయపార్టీలు
మరి కొద్ది గంటల్లో సాగే స్థానిక సంస్థల కోటా శాసనమండలి ఎన్నికల కోసం ప్రధాన రాజకీయ పార్టీలన్నీ విజయం కోసం అస్త్ర శస్త్రాలను ఉపయోగిస్తున్నాయి. ఎన్నికలు జరుగుతున్న మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో పొలిటికల్‌ హీట్‌ తారాస్థాయికి చేరుకుంది. ఈ జిల్లాల్లో ఎన్నికలు అనివార్యం  కావడంతో అభ్యర్థులను ఇప్పటికే తమ తమ ఓటర్లను క్యాంపులకు తరలించారు. సభ్యులను క్యాంపుల్లో పెట్టి సకల మర్యాదలు చేస్తున్నారు. పోలింగ్‌ రోజు నేరుగా పోలింగ్‌ కేంద్రాలకు తరలించేలా ఏర్పాట్లు సైతం చేస్తున్నారు.
నాలుగు స్థానాలు గెలుస్తామని టీఆర్ ఎస్ ధీమా  
ఎన్నికలు జరుగుతున్న నాలుగు జిల్లాల్లో అధికార పార్టీ ఖచ్చితంగా నాలుగు స్థానాలు గెలుస్తామన్న ధీమాతో కనిపిస్తోంది. మరో రెండు స్థానాల ఫలితాలు మాత్రం తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉన్న రెండు స్థానాలకు ఓ స్థానం సులువుగానే గులాబీ పార్టీ ఖాతాలో చేరిపోయే అవకాశం ఉంది. మరో స్థానంపై ఆసక్తి రేగుతోంది. కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు అవగాహనకు రావడం అధికార పార్టీకి కొత్త చిక్కులు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. అయినా.. అందిన కాడికి ఓటర్లను గులాబీ పార్టీ నేతలు కారెక్కించుకుంటూ విజయం కోసం పావులు కదుపుతున్నారు. 
నల్గొండలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ హోరాహోరీ
ఇక నల్గొండ జిల్లాలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. అధికార పార్టీకి బలం తక్కువగా ఉండడంతో కాంగ్రెస్‌ సహా మిగిలిన పార్టీలు స్థానిక సంస్థల ప్రతినిధుల మద్దతు కూడగొట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆర్థికంగా, సామాజికంగా బలమైన వర్గానికి చెందిన నేతలు పోటీ పడుతుండడంతో నల్గొండలో రాజకీయం రసవత్తరంగా మారింది. స్థానిక ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇరు పార్టీల నేతలు అన్ని మార్గాలను వెతుకుతున్నారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీ నుంచి కోమటి రెడ్డి బ్రదర్స్‌ నల్గొండ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మరింత ఆసక్తి రేపుతోంది. 
రంగారెడ్డిలో గెలుపుపై గులాబీ ధీమా
రంగారెడ్డి జిల్లాలోని రెండు స్థానాల్లోనూ విజయం సాధించడం పెద్ద సమస్య కాదనే గులాబీ దళం అంచనా వేస్తోంది. కాంగ్రెస్‌, టీడీపీ పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నా, ఈ రెండు స్థానాలు తమ పార్టీ ఖాతాలో చేరడం ఖాయమన్న ధీమా నేతల్లో కనిపిస్తోంది. ఖమ్మం జిల్లాల్లో అధికార పార్టీని అడ్డుకునేందుకు విపక్షాలన్నీ ఏకమైనా , వైసీపీ కూడా బరిలో ఉండడం కూడా తమకు కలిసి వచ్చే అంశంగానే అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇప్పిటికే వైసీపీ ఓటర్లను ఏకంగా కడప జిల్లా ఇడుపుల పాయ తరలించి మరీ క్యాంపు నిర్వహించడం జిల్లా రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా నిలిచింది. 
రోజురోజుకూ మారుతోన్న సీన్‌ 
ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో ఓ వైపు క్యాంపు రాజకీయాలు నడుస్తున్నా మరోవైపు రోజురోజుకూ సీన్‌ మారుతోంది. విపక్ష పార్టీలు నిర్వహిస్తున్న క్యాంపుల్లో ఉన్న ఓటర్లలో చాలా మంది అధికార పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతుండడంతో పరిస్థితి ఎటు దారి తీస్తుందో అంతు చిక్కడం లేదు. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల శిబిరాలకు ఆదివారంతో తెరపడనుంది. 

సిరియన్ రెబల్ నేత అలోష్‌ హతం

సిరియా : జయల్‌ అల్‌ ఇస్లాం ఆర్మీ రెబల్‌ గ్రూపుకు చెందిన ఓ నేత హతమయ్యాడు. డమస్కస్‌లో శుక్రవారం జరిపిన వైమానిక దాడుల్లో జోహ్రన్‌ అలోష్‌ అనే టెర్రరిస్టు మృతిచెందినట్లు సిరియన్‌ ఆర్మీ జనరల్‌ కమాండ్‌ తెలిపారు. 1971లో జన్మించిన అలోష్‌ సిరియన్‌ రెబల్‌ తిరుగుబాటు నాయకుడిగా వెలుగొందాడు. అతను తిరుగుబాటు నేతల్లో బలమైన నాయకుడని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి.

18:34 - December 26, 2015

హైదరాబాద్  : మహిళా స్వయం సహాయక బృందాలకు ఇచ్చే లోన్లు ఐదు లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచేందుకు సీఎం కేసీఆర్‌ ఆలోచిస్తున్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. నెక్లెస్‌రోడ్డులో నిర్వహిస్తున్న మహిళా సాధికారిత సదస్సులో పాల్గొన్న కేటీఆర్ మహిళా సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో నిర్ణయాలు తీసుకుందన్నారు. ఇకపై అడిగిన వెంటనే దీపం పథకం కింద గ్యాస్‌ కనెక్షన్లు మంజూరు చేస్తామని చెప్పారు.
 

18:28 - December 26, 2015

ఢిల్లీ : భారత్‌-పాకిస్థాన్‌ల  దృక్పథాల్లో మార్పు వస్తోందా..?  ఇరు దేశాలూ.. సత్సంబంధాలు నెలకొల్పే దిశగా.. వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నాయా..? తాజా పరిణామాల నేపథ్యంలో... అంతర్జాతీయ పరిణామాల విశ్లేషకుల మదిలో ఈ ప్రశ్నలే సుడులు తిరుగుతున్నాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా.. భారత్‌-పాక్‌ల  మధ్య శాంతి చర్చలకు గతంలో విఘాతం కలిగింది. అయితే.. ఇటీవల పరిస్థితుల్లో కొంత మార్పు కనిపిస్తోంది. తాజాగా, నిన్న ప్రధాని మోడీ లాహోర్‌ వెళ్లడం.. ఇరు దేశాల విదేశాంగ మంత్రులు వచ్చే నెల 15న ఇస్లాబాబాద్‌లో భేటీ కానుండడం విశేషం. 
ద్వైపాక్షిక చర్చలకు మార్గదర్శకాల రూపకల్పన 
భారత్‌-పాక్‌ల మధ్య మళ్లీ చర్చల ప్రక్రియ ప్రారంభం కానుంది. వచ్చే నెల 14న భారత విదేశాంగ కార్యదర్శి జైశంకర్‌..ఇస్లామాబాద్‌లో పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ కార్యదర్శి అజీజ్‌ అహ్మద్‌ చౌధురితో భేటీ కానున్నారు. భారత ప్రధాని మోదీ శుక్రవారం ఆకస్మికంగా పాకిస్థాన్‌ వెళ్లి... ఆదేశ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విదేశాంగ శాఖల కార్యదర్శుల సమావేశంపైన, ఈ ద్వైపాక్షిక చర్చల మార్గదర్శకాల రూపకల్పనపైనా ఇద్దరూ ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. 
కశ్మీర్‌ సమస్య, పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదంపై చర్చలు 
భారత్‌-పాక్‌ల మధ్య చర్చల ప్రక్రియ కొత్తదేమీ కాదు.  గతంలోనూ చాలాసార్లు ఇరు దేశాల మధ్య చర్చలు జరిగినా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రేగడంతో.. చర్చల ప్రక్రియ స్తంభించిపోయేది. ఈనెల 7న థాయిలాండ్‌ రాజధాని బాంకాక్‌లో రెండు దేశాల  అంతర్గత భద్రతా సలహాదారులు సమావేశమయ్యారు. భారత అంతర్గత భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, పాక్‌ అంతర్గత భద్రతా సలహాదారు నసీర్‌ జంజువాతో భేటీ అయ్యారు. కశ్మీర్‌ సమస్యతోపాటు, పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదంపై చర్చలు జరిపారు. వాతావరణ మార్పులపై పారిస్‌లో జరిగిన సదస్సు సందర్భంగా గతనెల 30 న  ప్రధాని మోదీ, పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌తో కొద్దిసేపు  భేటీ అయ్యారు. ఆ సందర్భంగా చర్చల అంశం ప్రస్తావనకు వచ్చింది. దీని ఫలితంగానే  రెండు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు బాంకాక్‌లో సమావేశమయ్యారు. ఈ ఏడాది ఆగస్టులోనే ఇస్లామాబాద్‌లో ఈ భేటీ జరగాల్సి ఉంది. అయితే రెండు దేశాల సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా రద్దయ్యింది. 
వేర్వేరు సదస్సుల్లో పాల్గొన్న మోడీ, షరీఫ్‌
ద్వైపాక్షిక చర్చలు స్తంభించిపోవడంతో.. ఇరు దేశాధినేతల మధ్య మాట పలకరింపులూ నిలిచిపోయాయి. ఈ ఏడాది రెండు సందర్భాల్లో భారత ప్రధాని మోదీ, పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌... రెండు వేర్వేరు వేదికలపై జరిగిన శిఖరాగ్ర సదస్సుల్లో పాల్గొన్నా... ఇద్దరి మధ్య ఒకసారి కలచాలనం మినహా , మాటామంతీ కానీ లేదు. ఈ ఏడాది మధ్యలో రష్యాలోని యుఫాలో బ్రిక్స్ దేశాల సదస్సు జరిగింది. ఈ సందర్భంగానే షాంఘై సహకార సంస్థ సమావేశం నిర్వహించారు. దీనికి ఇద్దరు ప్రధానులు హాజరైనా కలచాలనం మినహా  పలకరింపులులేవు. అలాగే ఈ ఏడాది సెప్టెంబర్‌లో న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ  సమావేశాల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ఒబామా... వాతావరణ మార్పులపై ఏర్పాటు చేసిన సమావేశానికి మోదీ, షరీఫ్‌ హాజరైనా... దూరం నుంచి చేతులు ఊపుకుని అభివాదం చేసుకున్నారేకానీ... కలుసుకోలేదు. 
సర్తాజ్‌ అజీజ్‌తో సుష్మా స్వరాజ్‌ భేటీ 
భారత్‌-పాక్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం క్రమంగా తగ్గుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పారిస్‌లో భారత-పాక్‌ ప్రధానులు కలుసుకున్నప్పటి నుంచీ పరిణామాలు చర్చల పునరుద్ధరణ దిశగా సాగుతున్నాయంటున్నారు.  భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ కూడా ఈనెలోనే పాకిస్థాన్‌లో పర్యటించి వచ్చారు. ఆ దేశ ప్రధాని నవాజ్‌ షరీఫతోపాటు,  పాక్‌ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్‌ అజీజ్‌తో భేటీతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక  సంబంధాలపై చర్చలు జరిపారు. శుక్రవారం మోదీ స్వయంగా పాకిస్థాన్‌ వెళ్లి... షరీఫ్‌తో భేటీ అవడం ఈ పరిణామాల్లో అత్యంత కీలకంగా భావిస్తున్నారు.  వరుసగా జరుగుతున్న ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి దోహదం చేస్తాయని భావిస్తున్నారు. 
మోడీ-షరీఫ్‌ల మధ్య భేటీకి సజ్జన్‌ జిందాల్‌ చొరవ 
మరోవైపు మోడీ పాకిస్థాన్‌ పర్యటనపై కాంగ్రెస్‌ నుంచి విమర్శలు  వస్తున్నాయి. పాక్‌తో చర్చల విషయంలో ఎన్డీయే సర్కార్‌ యూ టర్న్‌ తీసుకుందని  వ్యాఖ్యానించింది. మోదీ  పాక్‌ పర్యటన వెనుక కార్పొరేట్ల వ్యాపార  ప్రయోజనాలున్నాయని కేంద్ర మాజీ మంత్రి మనీష్‌ తివారి విమర్శించారు. ఈ విషయంలో ఉక్కు దిగ్గజం సజ్జన్‌ జిందాల్‌ పేరు బయటకు వస్తోంది. మోదీ-షరీఫ్‌ల మధ్య సమావేశానికి ఆయనే చొరవ తీసుకున్నారని వినిపిస్తోంది. శుక్రవారం మోదీ పాకిస్థాన్‌లో పర్యటించినప్పుడు సజ్జన్‌ జిందాల్‌  లాహోర్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.  మొత్తానికి తాజా పరిణామాలు దేశ సరిహద్దుల్లో పరిస్థితులను ఏమేరకు చక్కదిద్దుతాయో వేచి చూడాలి. 

 

గుంతలో పడి బాలిక మృతి

హైదరాబాద్ : ప్రమాదవశాత్తు గుంతలో పడి ఓ బాలిక మృతి చెందింది. రెండో తరగతి చదువుతోన్న నందిని అనే బాలిక కూకట్‌పల్లి నిజాంపేట్ క్రాస్‌రోడ్ వద్ద మధుకాన్ కంపెనీ భవన నిర్మాణం కోసం తీసిన గుంతలో ప్రమాదవశాత్తు మృతి చెందింది. 

 

18:17 - December 26, 2015

కోల్ కతా : ప్రతి అడుగూ ప్రజాఉద్యమాల వైపే...ప్రతీ నినాదం ప్రజల పక్షమే.. మిత్రపక్షమైనా..ప్రతిపక్షమైనా ప్రజాసమస్యల విషయానికొస్తే పాలకులపై సమరశంఖమే. ప్రజాపోరాటాలే ఊపిరిగా నిత్యం ప్రజలతోనే మమేకమైన కామ్రేడ్లు ఇప్పుడు పార్టీ  నిర్మాణంపై దృష్టి  సారించారు. కోల్‌కతాలో రేపటి నుంచి 31వ తేదీ వరకు జరగనున్న సీపీఎం  నిర్మాణ ప్లీనరీ సమావేశాల్లో ప్రధానంగా పార్టీ బలోపేతంపైనే చర్చించనున్నారు. 
పార్టీ బలోపేతంపై సీపీఎం దృష్ణి
ఓ వైపు మతతత్వం...మరో వైపు ప్రైవేటీకరణ మంత్రం..ఇంకో వైపు పాలకుల నయా ఉదారవాద విధానాలతో రోడ్డెక్కుతున్న కార్మికవర్గం. వీటన్నింటికీ వ్యతిరేకంగా ప్రజాఉద్యమాలు పెరగాలని..ఉద్యమాల్లో బాధిత ప్రజలు కలిసి రావాలని.. అదే సమయంలో పార్టీ కూడా ప్రజలకు చేరువ కావాలని సీపీఎం భావిస్తోంది. ఇవన్నీ జరగాలంటే పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఈ దిశగా.. ఓ వైపు పోరాటాలు చేస్తూనే వైపు పార్టీ నిర్మాణం వైపు దృష్టి సారించాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్స్కిస్టు తీర్మానించుకుంది. దీనికి కోల్‌కతా ప్లీనం వేదికైంది.
1968లో బర్ద్వాన్‌లో సీపీఎం తొలి ప్లీనం
సీపీఎం ఆవిర్భవించాక 1968లో చారిత్రాత్మక బర్ద్వాన్‌ ప్లీనం జరిగింది. ఆ తరువాత  పదేళ్లకు 1978లోని హౌరాలోని సాల్కియాలో రెండో ప్లీనం జరిగింది. 37 ఏళ్ల సుదీర్ఘ కాలం తరువాత సీపీఎం మూడో ప్లీనం ఇప్పుడు కోల్‌కతాలో జరుగుతోంది. ఈ ప్లీనరీ సమావేశం కూడా చరిత్రాత్మకమౌతుందని పార్టీ వర్గాలంటున్నాయి. 
పార్టీ నిర్మాణంలో మార్పులు
మారుతున్న రాజకీయ, సామాజిక అంశాలకు అనుగుణంగా పార్టీ నిర్మాణంలోను మార్పులు ఉంటాయని సీపీఎం జాతీయ నేతలు అంటున్నారు. ఈ మార్పులు ఎలా ఉన్నా  పార్టీ ప్రాథమిక సిద్ధాంతానికి విరుద్ధంగా ఉండవని చెప్తున్నారు. అంతేకాదు పార్టీకి ఆయువుపట్టైన ప్రజాసంఘాల బలోపేతంపైనా ఈ ప్లీనంలో చర్చిస్తారు. 
పార్టీ స్వతంత్ర బలాన్ని పెంచుకోవడంతో పాటు దేశంలో వామపక్ష ఐక్యతతో ప్రత్యామ్నాయశక్తిని బలోపేతం చేయాలని పార్టీ అఖిల భారత మహాసభల్లో కామ్రేడ్లు  తీర్మానం చేశారు. ఈ నిర్ణయాలన్నీ అమలుకావాలంటే పార్టీ నిర్మాణం బలోపేతం కావడం అనివార్యమని కామ్రేడ్లు భావిస్తున్నారు. ఈ దిశగా కోల్‌కతా ప్లీనంలో చర్చలు జరపనున్నారు.
ఆదివారం కోల్‌కతాలో భారీ ప్రజార్యాలీ
కోల్‌కతాలో ఐదు రోజుల పాటు జరిగే సీపీఎం నిర్మాణ ప్లీనరీ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 27న చారిత్రాత్మక ప్రజార్యాలీతో ప్లీనం ప్రారంభమవుతుంది. బ్రిగేడ్‌ ర్యాలీకి మమత సర్కార్‌ ఆటంకాలు కలిగిస్తున్నా దీన్ని విజయవంతం చేసి తీరుతామంటున్నారు కామ్రేడ్లు.  సీపీఎంను బలోపేతం చేయాలని ఈ ప్లీనరీ నుంచి పిలుపివ్వబోతున్నారు. 

 

18:12 - December 26, 2015

ఖమ్మం : దేశంలోనే తొలిసారి బొగ్గును వెలికి తీసిన భూగర్భగని అది. శతాబ్దానికిపైగా ఘన చరిత్ర కలిగిన నల్లబంగారాన్ని వెలికితీసిన ప్రాంతమది. దాని ద్వారా కోట్ల రూపాయలే సంపాదించారో వేలాది మందికి జీవనోపాధినే చూపించారో ఏవిధంగానైతేనేం ఇప్పటిదాకా ఆ గనిని నిర్వహిస్తూ వచ్చారు. ఇప్పుడు కేవలం డబ్బును దృష్టిలోపెట్టుకుని చారిత్రక గనిని మూసేయాలని నిర్ణయించారు. ఓపెన్‌ కాస్ట్‌ల మోజులోపడి కార్మికుల జీవితాన్ని పణంగా పెట్టబోతున్నారు.
గనుల చరిత్రలో చిరస్థాయిగా నిలవాల్సిన ఇన్‌క్లైన్‌
భారతదేశంలోనే తొలిసారి బొగ్గును వెలికితీసిన గని ఇది. గనుల చరిత్రలో చిరస్థాయిగా నిలవాల్సిన ఇన్‌క్లైన్‌ ఇది. ఎన్నో విద్యుత్‌ ప్లాంట్లకు పారిశ్రామిక అవసరాలకు ఇక్కడనుంచి దశాబ్దాలుగా బొగ్గును సరఫరా చేశారు. అలాంటిది దీన్నిప్పుడు మూసేయాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది.
తొలిసారిగా బొగ్గును కనుగొన్న బ్రిటిష్‌ అధికారి 
ఖమ్మం జిల్లా ఇల్లందు ప్రాంతంలో 1887వ సంవత్సరంలో అప్పటి బ్రిటిష్‌ అధికారి విలియంకింగ్‌ తొలిసారిగా బొగ్గును కనుగొన్నారు. అప్పటి పరిజ్ఞానంతో భూగర్భ గనులను ఏర్పాటు చేసి బొగ్గును వెలికితీశారు. అందుకు తగ్గట్టుగా భారీ సంఖ్యలో కార్మికులు అవసరమయ్యారు. అయితే రానురాను భూగర్భ గనులకన్నా భూ ఉపరితలంలోంచి వెలికితీస్తున్న గనులు ఎక్కువయ్యాయి. ఇలాంటి ఓపెన్‌ కాస్ట్‌ల మూలంగా ఖర్చు తక్కువగా ఉంటుందని ఎక్కువమంది కార్మికులతో పనుండదని సింగరేణి యాజమాన్యం చాలా ఏళ్ల క్రితమే ప్లాన్‌ చేసింది. క్రమంగా భూగర్భ గనులను తగ్గించేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. 
నాడు వేల సంఖ్యలో కార్మికులు... 
ఒకప్పుడు ఇల్లందు ప్రాంతంలో వేల సంఖ్యలో పనిచేసిన కార్మికులు నేడు వందల సంఖ్యకు చేరుకుంటున్నారు. ఒక్కో భూగర్భ గనిలో సుమారు 2 వేల మంది కార్మికులు అవసరమవుతారు. అదే ఓపెన్‌ కాస్ట్‌లో వంద మంది సరిపోతారు. ఈ నేపథ్యంలో చారిత్రక ఇల్లందు సమీపంలోని 21వ ఇంక్లైన్‌ గనిని గతంలోనే మూసివేయాలని సిద్ధపడగా కార్మికులు పోరాటానికి దిగారు. దాంతో నిర్ణయాన్ని పూర్తిగా వెనక్కితీసుకోకపోయినా క్రమంగా కార్మికుల సంఖ్యను తగ్గిస్తూ వస్తున్నారు. అయితే కార్మికులు మాత్రం సింగరేణి యాజమాన్యం చర్యను నిరసిస్తున్నారు. కనీసం చారిత్రక నేపథ్యాన్నైనా దృష్టిలో పెట్టుకుని ఈ గనిని కొనసాగించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇల్లందు బొగ్గు గనిని ఎప్పటికీ మూసివేయకుండా నిర్వహించాలని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలనేది కార్మికుల కోరిక. మరి వారి విన్నపం యాజమాన్యం మనసును టచ్‌ చేస్తుందో లేదో చూడాలి. 

17:59 - December 26, 2015

మెదక్ :  ఐడీఎల్‌ బొల్లారం పీఎస్‌ పరిధిలోని ఔటర్‌ రింగ్‌రోడ్డుపై గుర్తు తెలియని వాహనం ఢీకొని కానిస్టేబుల్‌ గోవింద్‌సింగ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. బీడీఎల్‌ పీఎస్‌కు చెందిన గోవింద్‌సింగ్‌ అయుత చండీయాగం వద్ద డ్యూటీ ముగించుకొని వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గోవింద్‌సింగ్‌ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

17:56 - December 26, 2015


మెదక్ : అయుత చండీ మహా యాగం నాలుగో రోజు ఘనంగా జరుగుతోంది. సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వ్యవసాయ క్షేత్రంలో జరుగుతోన్న ఈ యాగానికి పలువురు ప్రముఖులు, భక్తజనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు ఉదయమే వచ్చి పూజలో పాల్గొన్నారు. మధ్యాహ్నం తమిళనాడు గవర్నర్‌ రోశయ్య, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, ఎన్సీపీ నేత శరద్‌పవార్‌, కాంగ్రెస్‌నేతలు సుబ్బిరామిరెడ్డి, గీతారెడ్డి హాజరయ్యారు. అతిథులకు వేదపండితులు పూర్ణకుంభం, మంగళవాయిద్యాలతో స్వాగతం పలికారు. 

 

శ్రీలంకపై న్యూజిలాండ్ గెలుపు

హైదరాబాద్ : సొంత గడ్డపై శ్రీలంకతో జరుగుతున్న 5 వన్డేల సిరీస్‌లో భాగంగా క్రైస్ట్ చర్చ్‌లో జరిగిన మొదటి వన్డేలో న్యూజిలాండ్ జట్టు 7 వికెట్ల తేడాతో 174 బంతులు మిగిలి ఉండగానే ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టు 47 ఓవర్లలో 188 పరుగులు మాత్రమే చేయగలిగింది. 
189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ జట్టు 21 ఓవర్లల్లో 3 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసి విజయం సాధించింది. న్యూజిలాండ్ బౌలర్ హెన్రీ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌'గా నిలిచాడు.

 

జనవరి 15న భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శుల భేటీ

హైదరాబాద్‌: భారత్‌, పాకిస్థాన్‌ దేశాలకు చెందిన విదేశాంగ కార్యదర్శులు సమావేశం 2016 జనవరి 15న జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. భారత ప్రధాని నరేంద్రమోడీ పాకిస్థాన్‌లో ఆకస్మిక పర్యటన అనంతరం ఈ భేటీకి సంబందించిన విషయాలు వెల్లడయ్యాయి. ఇరు దేశాల నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. భారత విదేశాంగ కార్యదర్శి ఎస్‌. జయశంకర్‌ ఇస్లామాబాద్‌కు ప్రయాణం కానున్నారు. పాక్‌ విదేశాంగ కార్యదర్శి సర్తాజ్‌ అజీజ్‌తో భేటీ కానున్నారు. నవంబర్‌ 30 న పారిస్‌లో ఇరుదేశాల ప్రధానులు భేటీ అయ్యిన దగ్గర నుంచి చర్చల ప్రక్రియ మళ్లీ గాడిన పడినట్లు కనిపిస్తోంది. 

సైబరాబాద్ పరిధిలో పోలీసుల ఆంక్షలు

హైదరాబాద్ : న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా సైబరాబాద్ పరిధిలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. రాత్రి 8 గంటల నుంచి ఒంటి గంట వరకు మాత్రమే వేడుకలను నిర్వహించుకోవాలని సైబరాబాద్ కమిషనర్ ఆనంద్ తెలిపారు. డీజేని ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించబోమని స్పష్టం చేశారు. వేడుకలు నిర్వహించే చోట కపుల్స్ ను మాత్రమే అనుమతించాలని చెప్పారు. హోర్డింగులు, పేపర్లలో అశ్లీల ఫొటోలు, అర్ధనగ్న ఫొటోలు నిషిద్ధమని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు తెగబడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిటీ పరిధిలోని 25 స్టార్ హోటళ్లు, 269 ఫామ్ హౌస్ లు, 22 రిసార్ట్స్, 3 పబ్బులపై నిఘా పెట్టామని చెప్పారు.

గుడివాడలో హెడ్‌కానిస్టేబుల్‌ వీరంగం

కృష్ణా : జిల్లాలోని గుడివాడలో హెడ్‌కానిస్టేబుల్‌ లింగం జయరాజ్‌ వీరంగం సృష్టించాడు. యజమానికోసం ఓ షాపుకు వెళ్లిన జయరాజ్‌ వర్కర్‌ మోహన్‌ యజమాని లేదన్నందుకు అతని పోలీస్‌ జయరాజ్‌ చితకబాదాడు. ఈ దృశాలు మొత్తం సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. జయరాజ్‌ కైకలూరు పీఎస్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.

 

ఈనెల 30 న ఏపీ కేబినెట్‌ సమావేశం

హైదరాబాద్ : ఈనెల 30 న ఏపీ కేబినెట్‌ సమావేశం జరగనుంది. ఈ ఏపీ కేబినెట్‌ సమావేశంలో జన్మభూమిపై ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తుంది.

 

17:12 - December 26, 2015

విజయవాడ : తమను రెచ్చగొడితే ఎంతటికైనా తెగిస్తామని వంగవీటి రాధా అన్నారు. వంగవీటి మోహనరంగా 27 వర్ధంతి సందర్భంగా విజయవాడలోని బందర్ రోడ్డులో రంగా విగ్రహానికి ఆయన తనయుడు వంగవీటి రాధా పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబంలో పెద్దను కోల్పోయి విషాదంలో ఉన్న తమను దేవినేని రెచ్చగొడుతున్నారని రాధా చెప్పారు. చనిపోయిన రంగాపై 20 మర్డర్ కేసులు ఉన్నాయని దేవినేని నెహ్రూ తప్పుగా మాట్లాడడం సరికాదన్నారు. దేవినేని నెహ్రూ ఇంట్లో కూర్చొని రాజకీయాలను శాసిస్తున్నామన్న భ్రమలో ఉన్నారని ఎద్దేవా చేశారు.

 

17:04 - December 26, 2015

విజయవాడ : ఇప్పటివరకు కాల్‌మనీపై 600 ఫిర్యాదులు అందాయని విజయవాడ పోలీస్‌కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. ప్రతి ఫిర్యాదును సమగ్రంగా పరిశీలిస్తున్నామన్నారు. కాల్‌మనీ నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని..ఆ విషయంలో టాస్క్ ఫోర్స్‌ బాగా పనిచేస్తుందన్నారు. త్వరలోనే టాస్క్‌ఫోర్స్‌ను మరింత బలోపేతం చేస్తామని సీపీ తెలిపారు. కొత్త రాష్ట్ర, కొత్త రాజధాని కావడంతో కాల్‌మనీ వ్యాపారులు బరితెగిస్తున్నారని...ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. 

 

17:01 - December 26, 2015

విజయవాడ : తమ అవసరాల కోసం కేవీ సుబ్బారెడ్డి దగ్గర అప్పు తీసుకుంటే..ఆ తర్వాత అధిక వడ్డీలు వేస్తూ తమను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని బాధితులు వాపోతున్నారు. నెల నెలా వడ్డీ కడుతున్నా..తమ దగ్గరనుంచి ఏటీఎం కార్డులు, బ్యాంకు పాస్‌పుస్తకాలను బలవంతంగా తీసుకుంటూ తమను కోర్టుకీడుస్తున్నాడని బాధితులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. ప్రాంసరి నోట్లపై సంతకాలు చేయించుకోని మానసికంగా వేధిస్తున్నాడని వాపోతున్నారు.

16:56 - December 26, 2015

హైదరాబాద్ : సుల్తాన్‌ బజార్‌లో ఎలాంటి వారసత్వ కట్టడాలను కూల్చడంలేదని మెట్రో రైల్ ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి స్పష్టం చేశారు. మెట్రో ప్రాజెక్టులో ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నా..ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నామన్నారు. ఇప్పటివరకు మెట్రో ప్రాజెక్టులో 63శాతం మేర పనులు పూర్తయ్యాయని ఎన్‌వీఎస్‌ రెడ్డి తెలిపారు. సుల్తాన్‌బజార్‌ వ్యాపారస్తులకు అత్యధిక నష్టపరిహారం అందచేస్తున్నామన్నారు. 

 

గనిలో ప్రమాదం... 18 మంది మృతి

బీజింగ్ : చైనాలోని ఓ జిప్సమ్ గనిలో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 18 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. షాన్‌డాంగ్ రాష్ట్రంలో ఉన్న గనిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గనిలో 29 మంది కార్మికులు చిక్కుకు పోయారని భావిస్తున్నారు. ఇప్పటి వరకు అధికారులు 11 మందిని రక్షించగలిగారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మిగతా వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు.

 

నాగా దళ తీవ్రవాది అరెస్ట్

కర్నాటక : నాగా దళానికి చెందిన ఓ తీవ్రవాదిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అతోషీ చోపే (27) అనే వ్యక్తిని బెంగళూరులోని ఎంజి రోడ్‌లో అదుపులోకి తీసుకున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అధికారులు తెలిపారు. చోపే నాగాలాండ్‌లోని జున్హెబోతో జిల్లాకు చెందిన నాగా సంస్థలో క్రీయశీలక కార్యకర్తగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. అతని నుండి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. కోహీమాలోని ఇందిరాగాంధీ స్టేడియం వద్ద అస్సాం రైఫిల్స్ స్థావరంపై మార్చి 26న నాగా తీవ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే 

చోటా రాజన్‌ను జైల్లోనే చంపేస్తాం..

న్యూఢిల్లీ : అండర్‌ వరల్డ్ డాన్‌ చోటా షకీల్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చోటా రాజన్‌ను తీహార్‌ జైల్లోనే చంపేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని హెచ్చరికలు చేశాడు. దావూద్‌ షష్టి పూర్తి సందర్భంగా ఓ ఛానెల్‌తో షకీల్‌ ఫోన్‌లో మాట్లాడాడు. రాజన్‌ను మట్టుబెట్టేందుకు ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశామని, కానీ విఫలమయ్యాయని చెప్పాడు. జైల్లో ఉన్నంత మాత్రాన రాజన్‌ను తప్పించుకోలేడన్నాడు. ఇండోనేషియాలో పట్టుబడ్డప్పుడే రాజన్‌ను చంపేందుకు యత్నించామని, కానీ ఆయుధాల జాప్యం కారణంగా రాజన్‌ను తప్పించుకున్నాడని షకీల్‌ అన్నాడు.

 

13:39 - December 26, 2015

వరంగల్‌ : నగరంలో పట్టపగలే దోపిడీదొంగలు విజృంభించారు. స్థానిక తిలక్ నగర్‌లో శోభారాణి అనే మహిళను కత్తులతో బెదిరించి 4 తులాల బంగారు గొలుసులు, ఉంగరాలను దొంగిలించారు. హైద‌రాబాద్ లో హోంగార్డుగా ప‌ని చేస్తున్న శోభ సెల‌వు నిమిత్తం త‌మ స్వస్థలానికి వ‌చ్చింది. ఉదయం ఇంటి ముందు ప‌ని చేస్తున్న సమయంలో ద్విచ‌క్ర వాహ‌నంపై వ‌చ్చి దోచుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

13:38 - December 26, 2015

విజయవాడ : సీపీఐ 90వ వార్షికోత్సవాలు విజయవాడలో ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ర్టాభివృద్ధికి, ఏపీకి ప్రత్యేక హోదా హోసం వామపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని సీపీఐ రాష్ర్టకార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాష్ర్టంలోని 13 జిల్లాల్లో 5 రోజుల పాటు సీపీఐ 90వ వార్షికోత్సవాలను నిర్వహిస్తామన్నారు.

13:35 - December 26, 2015

కృష్ణా : బెజవాడలో పేద, మధ్యతరగతి ప్రజలకు అధిక వడ్డీలకు రుణాలిచ్చి వాళ్లను చిత్రహింసలకు గురిచేస్తున్న కేవీ సుబ్బారెడ్డి అనే కాల్‌మనీ నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈయన దగ్గరనుంచి 1469 ప్రాంసరినోట్లు, 911 ఖాళీ చెక్కులు, 59 బ్యాంకు పాస్‌పుస్తకాలు, 83 ఏటీఎంలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే ఎంప్లాయిస్, మధ్య తరగతి ప్రజలే లక్ష్యంగా కేవీ సుబ్బారెడ్డి అధిక వడ్డీలకు అప్పులిచ్చి...ఆ తర్వాత బలవంతంగా డబ్బులను లాక్కొంటున్నాడని విజయవాడ డీసీపీ తెలిపారు. అప్పులు తీసుకునే క్రమంలో ప్రజలు చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.  తమ అవసరాల కోసం కేవీ సుబ్బారెడ్డి దగ్గర అప్పు తీసుకుంటే..ఆ తర్వాత అధిక వడ్డీలు వేస్తూ తమను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని బాధితులు వాపోతున్నారు. నెల నెలా వడ్డీ కడుతున్నా..తమ దగ్గరనుంచి ఏటీఎం కార్డులు, బ్యాంకు పాస్‌పుస్తకాలను బలవంతంగా తీసుకుంటూ తమను కోర్టుకీడుస్తున్నాడని బాధితులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. ప్రాంసరి నోట్లపై సంతకాలు చేయించుకోని మానసికంగా వేధిస్తున్నాడని వాపోతున్నారు.

 

13:34 - December 26, 2015

హైదరాబాద్ : నాగపూర్‌లో ముగ్గురు ఐఎస్ ఐఎస్ అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు... అక్కడి పోలీసులు నాగపూర్ ఎయిర్‌పోర్టులో పట్టుకున్నారు. వీరిని తెలంగాణకు చెందిన అబ్దుల్ వసీమ్, ఉమర్ హసన్, మజ్‌హసన్‌గా గుర్తించారు. ఐఎస్ ఐఎస్ లో చేరేందుకే వీరు వెళ్తున్నట్టు అనుమానిస్తున్నారు.

13:00 - December 26, 2015

          టాలీవుడ్ సూపర్ స్టార్స్ లో మహేష్, ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటారు. ఇంక నంబర్ వన్ ఎవరంటే ఎవరికి వారే సాటి అని చెప్పుకోవచ్చు. కానీ కొన్ని సార్లు వీరు ఒకరిని మించి మరొకరు రికార్డులు షేక్ చేస్తుంటారు. ఇక వీరి సినిమాలే కాదు టీజర్లు కూడా పోటీ పడుతున్నాయ్. తాజాగా వీరి కలెక్షన్ల లెక్కలు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి.
ఎన్టీఆర్ లేటెస్ట్ సినిమా ‘నాన్నకు ప్రేమతో’. ఈ సినిమా ఫస్ట్ లుక్ , టీజర్ తోనే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అసలు లెక్కల్లోకి వెళితే , ఒవర్సీస్ మార్కెట్ తో కలిపి శ్రీమంతుడు చేసిన బిజినెస్ దాదాపుగా 150 నుంచి 170 కోట్లు దాటింది. అయితే సంక్రాంతికి రానున్న ఎన్టీఆర్ సినిమా ఆ రికార్డును బీట్ చేస్తుందనే టాక్ వినిపిస్తోంది. అసలు ఇంతవరకూ 50 కోట్ల క్లబ్ లోనే లేని జూనియర్ ఎన్టీఆర్ కు ఈ సినిమా అంత కలెక్షన్స్ ఇస్తుందా అనే అనుమానాల్ని కూడా విమర్శకులు వ్యక్తం చేస్తున్నారు. 
ఈ నేపథ్యంలో కేవలం యూట్యూబ్ లోవచ్చిన ఒక టీజర్ తోనే తన స్టామీనాను, కెపాసిటీని చాటుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. బాహుబలి కంటే కూడా ఈ టీజర్ యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీనికి విపరీతమైన రెస్పాన్స్ రావడంతో, అంతేకాకుండా పోటాపోటీగా అన్ని విభాగాల్లో ఈ సినిమా టాప్ క్లాస్ లుక్ ఉండటంతో  ఈ సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ చేస్తుందనే చెబుతున్నారు. 
జూనియర్ యన్టీఆర్ స్టైల్ దగ్గర్నుంచీ, డ్యాన్స్ లు, పాటలు,  స్టోరీబలం ఇలా ప్రతీదీ ప్లస్ పాయింట్లే ఉండటం విమర్శకుల నోళ్లు మూయిస్తోంది. మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ గా పేరుపొందిన సుకుమార్ లాంటి దిగ్గజ దర్శకుడు ఈ సినిమాను ఒక ఛాలెంజింగ్ గా చేయడం అదనపు బలాన్ని చేకూర్చింది. మ్యూజిక్ రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ గా మారనుంది. దీంతో ఒవర్సీస్ లో మునుపెన్నడూ రాని వసూళ్లనిస్తుందని ఖచ్చితమైన లెక్కలు వేస్తున్నారు సినీ పండితులు. ఫస్ట్ లుక్ కి , టీజర్ కి , ఇప్పుడు ఆడియోఫంక్షన్ కి వస్తున్న రెస్పాన్స్ ను చూసి ప్రీ రిలీజ్ కలెక్షన్స్ పై అంచనాలు వేస్తున్నారు. 
అంతే కాకుండా, సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ , ప్రింట్ మీడియాలలో ఎక్కడ చూసినా ఈ సినిమా పై వస్తున్న టాక్ రోజురోజుకీ అంచనాలను పెంచేస్తోంది. ఈ దెబ్బకి టాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్స్ వచ్చిన శ్రీమంతుడు సినిమాని ఇప్పుడు నాన్నకు ప్రేమతో బీట్ చేస్తుందనే చెబుతున్నారు. ఈ అంచనాలెలా ఉన్నా మిస్టర్ ఫర్ఫెక్షనిస్ట్ సుకుమార్ డైరెక్షన్, యంగ్ టైగర్ స్టామినా స్ర్కీన్ పైన ఎంత ఫర్పెక్ట్ గా ఉండబోతోందో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. 

12:51 - December 26, 2015

విజయవాడ :ఏపీ సీఎం చంద్రబాబు ఓఎస్డీగా పనిచేస్తున్న అభీష్టా రాజీనామా యోచనలో ఉన్నట్టు సమాచారం. కొద్దిరోజులుగా ఆయన ఓఎస్ డీ విధులకు దూరంగా ఉంటున్నారు. ఆయన పనితీరుపై చంద్రబాబు కూడా అసంతృప్తిలో ఉన్నట్టు సమాచారం. రెండు, మూడు రోజుల్లో అభీష్టా రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

12:49 - December 26, 2015

గుంటూరు : నగరంలో నెలకొన్న మంచినీటి ఎద్దడి సమస్య ఇప్పట్లో తీరేలా కన్పించడంలేదు. ప్రకాశం బ్యారేజీలో నీటిమట్టం తగ్గిపోవడంతో ఐదు రోజులుగా నగరంలో చుక్కనీరు కూడా సరఫరా కాని పరిస్థితి నెలకొంది. ట్యాంకర్ల ద్వారా తాత్కాలికంగా నీటి సరఫరా చేస్తున్నప్పటికీ నగర ప్రజలకు ఏమాత్రం సరిపోవడంలేదు. దీంతో గుక్కెడు నీళ్లకోసం నగర ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. మంగళగిరి, తాడేపల్లిగూడెం మున్సిపాలిటి ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక శివార్లలో ఉండే కాలనీ వాసుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గుక్కెడు నీళ్లకోసం శివారు ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. అయితే నగర పాలక సంస్థ తీరును నిరసిస్తూ ప్రజలు ఆందోళన బాటపట్టారు. వెంటనే మంచినీటి సరఫరాను పునరిద్దాంచాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.

12:47 - December 26, 2015

మెదక్ : ఎర్రవెల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో సాగుతున్న అయుత మహా చండీయాగం 4వ రోజుకు చేరుకుంది. నాల్గవ అరుణ స్త్రాలలో రుత్విజులు యాగంలో పాల్గొంటున్నారు. శనివారం భక్తుల తాకిడి దృష్ట్యా కుంకుమార్చన కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఇవాళ యాగంలో సప్తద్రవ్య మృత్యుంజయ హోమం, మహాసౌరము వంటి కార్యక్రమాలున్నాయి. వరుస సెలవులు కావడంతో అయుత మహా చండీయాగానికి భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. ఎర్రవెల్లికి వచ్చేదార్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. సుమారు మూడు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. మరో వైపు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ యాగానికి హాజరయ్యారు. శరద్ పవార్ వెంట మాజీ మంత్రి గీతారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత టి.సుబ్బిరామిరెడ్డి తదితరులు ఉన్నారు. పవర్‌తోపాటు ఇతర నేతలు యాగశాలలో అమ్మవారిని దర్శించుకున్నారు.

12:43 - December 26, 2015

ఖమ్మం : జిల్లాలోని భద్రాచలం రాములవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వరుస సెలవులు కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో స్వామివారి దర్శనానికి 2 గంటల నుంచి 3 గంటల సమయం పడుతుంది. ముక్కోటి ఉత్సవాల అనంతరం స్వామివారి నిత్యకళ్యాణాలను పునరుద్దరించారు అధికారులు. దీంతో నిత్య కళ్యాణాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు.

 

12:42 - December 26, 2015

తూ.గో : అనారోగ్యంతో మృతిచెందిన మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ మృతదేహాం కాసేపటి క్రితమే అమలాపురానికి చేరుకుంది. మధ్యాహ్నం 12గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుందని సమాచరం. ఆ తర్వాత మధ్యాహ్నం 3గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో మెట్ల సత్యనారాయణ అంత్యక్రియలు జరుగనున్నాయి. మధ్యాహ్నం జరిగే అంత్యక్రియలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు.

12:23 - December 26, 2015

హైదరాబాద్ : ‘ఓం సిటీ’కి తెలంగాణ సర్కారు వెయ్యి ఎకరాల భూమి కేటాయించబోతోంది. ఇందులో ఐదు వందల ఎకరాల వరకూ ప్రభుత్వ భూమి కాగా..మిగిలిన మొత్తం సేకరించి ఇవ్వనుంది. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు కొద్ది కాలం క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుతో సమావేశం అయి..ఓం సిటీ ప్రాజెక్టు గురించి వివరించటంతోపాటు..ప్రాజెక్టుకు సహకరించాల్సిందిగా కోరారు. దీనిపై సీఎం కెసీఆర్ కూడా సానుకూలంగా స్పందించటంతో పాటు..ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అన్ని రకాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే తొలి దశలో ఐదు వందల ఎకరాల భూమి త్వరలోనే ఈ సంస్థ చేతికి అందనుంది. మిగిలిన మొత్తం కూడా వీలైన వేగంగా సేకరించి ఇఛ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే నగర శివార్లలో ‘రామోజీ ఫిల్మ్ సిటీ’ పేరుతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్వహిస్తున్న రామోజీరావు …ఇప్పుడు కొత్తగా సుమారు రెండు వేల ఎకరాల్లో ఓం సిటీ ప్రాజెక్టును చేపట్టనున్నారు.

అన్ని దేవుళ్లు ఒకే చోట...

దేశంలో ఉన్న అన్ని ప్రముఖ ఆలయాలకు చెందిన నమూనా దేవాయాలు ఓం సిటీలో కొలువుదీరనున్నారు. ప్రతి ఒక్కరూ ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ దేవుళ్ళను సందర్శించుకోవటం సాధ్యం కాదు కనుక..అన్నింటిని ఒకే చోటకు చేర్చే ప్రాజెక్టుగానే ఓం సిటీకి శ్రీకారం చుట్టారు. దేశంలోని సుమారు 108 దేవాలయాలకు చెందిన ప్రతిరూపాలు ఓం సిటీలో ఉంటాయి. దీనికి సంబంధించిన సమగ్ర నివేదిక ఇఫ్పటికే సిద్దం అయింది. ఈ ప్రతులను రామోజీరావు స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ, తెలంగాణ సీఎం కెసీఆర్ లకు అందజేశారు కూడా. ఓం సిటీ నిర్మాణం పూర్తయితే తెలంగాణ ప్రాంతంలో ఇదే ప్రముఖ పర్యాటక ప్రాజెక్టుగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర నివేదిక ఇఫ్పటికే సిద్దం అయినందున దీనికి సంబంధించిన పనులు కూడా ప్రారంభం అయ్యాయని..భూమి చేతికి అందగానే పనులు ఊపందుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

రాజీనామా యోచనలో ఏపీ సీఎం ఓఎస్టీ అభీష్టా...

విజయవాడ : రాజీనామా యోచనలో ఏపీ సీఎం చంద్రబాబు ఓఎస్టీ అభీష్టా ఉన్నట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా అభీష్టా విధులకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన కు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వహించడం లేదని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. రెండు, మూడు రోజుల్లో రాజీనామాకు చేసే యోచనలో అభీష్టా ఉన్నారని అనధికారికంగా తెలుస్తోంది.

యువకుల పై స్క్రూ డ్రైవర్ తో ఓ వ్యక్తి దాడి

నల్గొండ : సూర్యాపేటలో ఓ చర్చి కాంపౌండ్ లో యువకుల పై స్క్రూ డ్రైవర్ తో ఓ వ్యక్తి దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరికి గాయాలవ్వగా వారిని ఆసుపత్రికి తరలించారు.

'జన్మభూమి - మా వూరు' పై ఏపీ సీఎం సమీక్ష

విజయవాడ : జన్మభూమి - మా వూరు కార్యక్రమంలో చేపట్టాల్సిన పనులు, లక్ష్యాలపై సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం ఉండేలా 'జన్మభూమి - మా ఊరు' కమిటీలు చొరవ తీసుకోవాలని, ఈ కమిటీలకే ఫుడ్ అడ్వయిజరీ బాధ్యతలు అప్పగించి 2 రోజుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

జూన్ లోపు విజయవాడకు సచివాలయం: చంద్రబాబు

విజయవాడ : వచ్చే సంవత్సరం జూన్ లోపు ఏపీ సచివాలయాన్ని విజయవాడకు తరలించనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. సచివాలయం కోసం 6లక్షల చదరపు అడుగుల భవనం నిర్మిస్తున్నట్లు తెలిపారు. అన్ని జిల్లాలో ఫామ్ పాండ్స్ ఏర్పాట్లు చేస్తామన్నారు.

రేపు చండీ యాగానికి సీఎం చంద్రబాబు

హైదరాబాద్ : మెదక్ జిల్లా తెలంగాణ సీఎం కేసీఆర్ ఫాం హౌస్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అయుత చండీ యాగానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు హాజరు కానున్నారు. రేపు ఉదయం విజయవాడ నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో ఎర్రవల్లి చేరుకుని 10 గంటలకు యాగంలో పాల్గొననున్నారు.

నాగపూర్ లో ముగ్గురు ఐఎస్ అనుమానితుల అరెస్ట్

హైదరాబాద్ : నాగపూర్ లో ముగ్గురు ఐఎస్ ఐఎస్ అనుమానితులను పోలీసుల అరెస్ట్ చేశారు. తెలంగాణ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు నాగపూర్ ఎయిర్ పోర్టులో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారు హైదరాబాద్ వాసులుగా అనుమానిస్తున్నారు.

నెహ్రూ పిచ్చి మాటలు మానుకోవాలి: వంగవీటిరాధా

విజయవాడ : వంగవీటి రంగ 27వ వర్థంతి కార్యక్రమం సందర్భంగా వంగవీటి విగ్రహానికి పూల మాల వేసి వంగవీటి రాధా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...నెహ్రూ పిచ్చి మాటలు మానుకోవాలని, చనిపోయిన వారి గురించి మాట్లాడటం తగదని నెహ్రూను హెచ్చరించారు. ఇప్పటికే మాతో పాటు అనేక కుటుంబాలు నష్టపోయాయన్నారు. మా మౌనాన్ని చేతగానితనం అనుకుంటే ఊరుకోమని దేనికైనా సిద్ధంగా ఉన్నామన్నారు.

11:44 - December 26, 2015

విజయనగరం : కురుపాం మండలం.. ఎగువగున్నాంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఈ దాడుల్లో 18 గుడిసెలు, 6 ఎకరాల అరటిపంట ధ్వంసమయ్యాయి. ఏనుగుల దాడిలో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఏనుగుల ప్రవేశ నేపథ్యంలో గ్రామస్థులను అటవీశాఖ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక ఏనుగులను గ్రామం నుంచి బయటపడేందుకు అధికారులు శ్రమిస్తున్నారు.

ఎర్రవల్లి వద్ద మూడు కిలోమీటర్ల మేర ఆగిన ట్రాఫిక్‌

మెదక్ : ఎర్రవెల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో సాగుతున్న అయుత మహా చండీయాగం 4వ రోజుకు చేరుకుంది. నాల్గవ అరుణ స్త్రాలలో రుత్విజులు యాగంలో పాల్గొంటున్నారు. శనివారం భక్తుల తాకిడి దృష్ట్యా కుంకుమార్చన కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఇవాళ యాగంలో సప్తద్రవ్య మృత్యుంజయ హోమం, మహాసౌరము వంటి కార్యక్రమాలున్నాయి. వరుస సెలవులు కావడంతో అయుత మహా చండీయాగానికి భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. ఎర్రవెల్లికి వచ్చేదార్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. సుమారు మూడు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.

11:39 - December 26, 2015

పశ్చిమగోదావరి : ద్వారకాతిరుమల మండలం.. మారంపల్లిలో పులి సంచారం వెలుగుచూసింది. మారంపల్లిలో ఆవుదూడను చంపినట్టు స్థానికులు చెబుతున్నారు. స్థానికంగా పులి అడుగులు కూడా కనిపించడంతో... గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫారెస్‌ సిబ్బంది.. పులిపై నిఘా ఉంచారు.

11:37 - December 26, 2015

ఖమ్మం : భద్రాద్రి ఆలయం మంచుతెరల మధ్య సరికొత్త సోయగాలను సంతరించుకుంది. భద్రాచలంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చలి తీవ్రతకు భక్తులు, స్థానికులు వణికిపోతున్నారు. మంచుతెరల మధ్య గోదావరిని చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.

11:36 - December 26, 2015

శ్రీకాకుళం : జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీసూర్యదేవాలయంలో ప్రసాదం కోసం భక్తులు నానాపాట్లు పడుతున్నారు. ప్రత్యక్ష నారాయణుడి దర్శనం చేసుకుని..ప్రసాదం కోసం వెళ్తే..అది అందని ద్రాక్షగానే మారుతోంది. ఆలయ అధికారులు, సిబ్బంది పర్యవేక్షణ కొరవడటంతో నిత్యం లభించాల్సిన ఆదిత్యుడి ప్రసాదం లిమిటెడ్ స్టాక్‌గా మారింది.

దేశంలోనే పూజలందుకునే ఏకైక దేవాలయం...

దేశంలోనే పూజలందుకునే ఏకైక సూర్యదేవాలయంగా శ్రీకాకుళం జిల్లా అరసవల్లి ఆలయం ప్రఖ్యాతిగాంచింది. అరుణ శిలతో ఇంద్రుడితో ప్రతిష్టించబడింది అని పేరుగాంచిన అరసవల్లి ఆదిత్యుడిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు. అయితే దర్శనం వరకూ పరవాలేదనిపిస్తోన్నా.. స్వామివారి ప్రసాదం విషయంలో మాత్రం భక్తులు పెదవి విరుస్తున్నారు. అరసవల్లి ఆదిత్యుడి ఆలయంలో ప్రసాదం లిమిటెడ్ స్టాక్‌గా మారింది. ఉదయం 11గంటల తర్వాత వెళ్తే..ప్రసాదం దొరకడంలేదు. దీంతో భక్తులు నిరాశకు గురవుతున్నారు. నిత్యాన్నదానం కాంప్లెక్సు సమీపంలోని పాకశాలలో లడ్డూ, పులిహోర ప్రసాదం తయారీ అవుతున్నా..భక్తులకు సరిపడా ప్రసాదాలను అందించడంలో దేవస్థానం విఫలమవుతోంది.

కొరవడిన ఆలయ అర్చకుల పర్యవేక్షణ....

తయారీ అవుతున్న ప్రసాదం నైవేథ్యంగా అందించే విషయంలో ఆలయ అర్చకుల పర్యవేక్షణ కొరవడింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. రెండేళ్ళ క్రితం ఆదిత్యుడి ప్రసాదమైన పులిహోర, లడ్డూలను బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారే తయారు చేసేవారు. అయితే ప్రస్తుతం వేరే సామాజిక వర్గానికి చెందినవారు తయారు చేస్తున్నారని తెలుస్తోంది. దానికి తోడు ఆలయ ప్రాంగణంలో లేని అన్నదానం కాంప్లెక్స్ వద్ద ప్రసాదం తయారీ అవుతుండటంతో.. అక్కడి ప్రసాదం నైవేద్యంగా మూల విరాట్‌కు సమర్పించడం లేదనే వాదన ఉంది. దీంతో ఆదిత్యుడికి నైవేద్యంగా సమర్పించని ప్రసాదం తాము కొనుగోలు చేస్తున్నామంటూ భక్తులు నిరాశ చెందుతున్నారు. దీనిపై స్పష్టత ఇవ్వడంతో పాటు.. అందరికీ అరసవల్లి సూర్యదేవుడి ప్రసాదం అందేలా దేవస్థానం చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఇప్పటికైనా దేవస్థానం అధికారులు స్పందించి భక్తులందరికి ప్రసాదం అందేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

11:34 - December 26, 2015

శ్రీకాకుళం : కంటిపాపలా చూసుకున్న కూతురిని ఎవరికో ఇచ్చి దూరం చేయడం ఎందుకని బావమరిదికే ఇచ్చి పెళ్లి చేశాడు...కొన్నాళ్లు బాగానే ఉన్న ఆ ఇల్లాలు ఆ తర్వాత మారిపోయింది..భర్త బోర్డర్‌లో విధులు నిర్వర్తిస్తుంటే ఆమె మాత్రం అనైతిక సంబంధాలు పెట్టుకుంది..దీంతో కూతురి పద్దతి మార్చుకోమని హెచ్చరించినా వినలేదు..పరువు తీస్తుందని కన్నతండ్రే కడతేర్చాడు..

పెళ్లయి పిల్లలున్నా తప్పటడుగులు..

టెక్కలి మండలం సోమనాధపురం చెందిన కణితి భూపతి కూతురు జయలక్ష్మిని మేనమామ జగ్గారావుకు ఇచ్చి పెళ్లి చేశారు...జగ్గారావు బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో హవల్దార్‌గా పనిచేస్తున్నాడు... కొన్నాళ్లు టెక్కలిలో ఉన్న జయలక్ష్మి ఆ తర్వాత భర్త పేరుతో లోన్ తీసుకుని స్వంత ఇల్లు కట్టుకుంది..

భర్త బోర్డర్‌లో విధులు..

సోమనాథపురం ఇంటికి మకాం మార్చాక జయలక్ష్మి చెడు తిరుగుళ్లకు అంతులేకుండా పోయింది..స్థానికంగా ఉంటున్న ఓ వ్యక్తితో సంబంధం పెట్టుకున్న జయలక్ష్మి నిత్యం ఇంట్లోనే అతనితో కలిసి ఉండేవారు...ఈ విషయం గమనించిన తండ్రి భూపతి ఎన్నోసార్లు మందలించాడు..పద్దతి మార్చుకోమంటూ చెప్పినా వినలేదు...

అర్థరాత్రి తండ్రీకూతుళ్ల మధ్య గొడవ...

ఇదిలా ఉంటే జయలక్ష్మి పద్దతి మార్చుకోపోగా కన్నవారిపైనే ఎదురు తిరిగేది..దీంతో విషయం అందరికీ తెలిసిపోయి పరువు తీస్తుందని మందలించినా వినలేదు.. అర్థరాత్రి ఇదే విషయంలో ఘర్షణ పడ్డారు తండ్రీకూతుళ్లు..ఎంత చెప్పినా కూతురు మారడం లేదని భూపతి ఉదయం మళ్లీ మందలించే ప్రయత్నం చేయగా ఆమె తిప్పికొట్టింది..దీంతో కోపోద్రేకుడైన భూపతి కూతురిని తలపై కర్రలతో కొట్టి హతమార్చాడు…

నేరాన్ని అంగీకరించిన భూపతి...

విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరి విచారించగా వారి సమక్షంలో కూడా భూపతి నేరాన్ని అంగీకరించాడు. అయితే తన కూతురు అనైతిక సంబంధాలు పెట్టుకుని పరువు తీస్తుందని చంపినట్లు పోలీసులకు చెప్పాడు...కేసు నమోదు చేసుకున్న పోలీసులు తండ్రి భూపతిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

11:30 - December 26, 2015

హైదరాబాద్: ప్రపంచంలోనే అతి పెద్ద భారీకాయుడి ఆండ్రెస్ మోరినో(38) శుక్రవారం మెక్సికోలో మృతి చెందాడు. గుండె నొప్పి కారణంగామృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దాదాపు 450 కిలోల బరువు ఉండే ఆండ్రెస్ మోరినో గత రెండు నెలల క్రితం బరువు తగ్గేందుకు ఆపరేషన్ చేయించుకుని 100 కిలోల బరువు తగ్గి సాధారణ జీవనాన్ని సాగిస్తున్నట్లు స్థానిక న్యూస్ ఏజెన్సీ తెలిపింది. అయితే శుక్రవారం అకస్మాత్తుగా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందినట్లు తెలిపారు.

విజయనగరం జిల్లాలో ఏనుగుల బీభత్సం...

విజయనగరం : కురుపాం మండలం ఎగువగుండలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గ్రామంలోకి ప్రవేశించిన ఏనుగులు 18 ఇండ్లను ధ్వంసం చేశాయి. దీంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏనుగుల ప్రవేశ నేపథ్యంలో గ్రామస్థులను అటవీశాఖ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక ఏనుగులను గ్రామం నుంచి బయటపడేందుకు అధికారులు శ్రమిస్తున్నారు.

తాడేపల్లి మండలం సీతానగరంలో ఉద్రిక్తత

గుంటూరు : తాడేపల్లి మండలం సీతానగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మత్స్యకారుల ఇళ్లు తొలగించేందుకు అధికారులు యత్నించారు. దీంతో మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, స్థానికులు అడ్డుకుంటున్నారు. దీంతో అధికారులు, స్థానికుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొనడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

అయుత చండీ యాగంలో గవర్నర్ దంపతులు..

హైదరాబాద్‌: మెదక్‌ జిల్లా ఎర్రవల్లిలో తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహిస్తున్న అయుతచండీయాగం నాలుగోరోజుకు చేరింది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు నాలుగోరోజు యాగంలో పాల్గొన్నారు. ఐదోరోజు యాగంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పాల్గొనున్నారు. ఈనేపథ్యంలో రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై గవర్నర్‌ నరసింహన్‌... సీఎం కేసీఆర్‌తో చర్చించారు.

వైరా ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో గుట్కా ప్యాకెట్లు...

ఖమ్మం : జిల్లాలోని వైరా ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. సోదాల్లో భాగంగా భారీ సంఖ్యలో గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గుట్కా ప్యాకెట్ల విలువ రూ. 7 లక్షల విలువ చేస్తాయని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఓ ఆర్ ఆర్ పై రోడ్డు ప్రమాదం : కానిస్టేబుల్ గోవింద్ మృతి

మెదక్ : ఐడీఏ బొల్లారం వద్ద ఓ ఆర్ ఆర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొన్ని బైక్ పై వెళ్తున్న కానిస్టేబుల్ గోవింద్ మృతి చెందారు. గజ్వేల్ లో డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

మోమిన్‌పేటలో భారీగా జిలెటిన్‌స్టిక్స్‌ స్వాధీనం..

రంగారెడ్డి : జిల్లాలోని మోమిన్‌పేటలో పోలీసులు దాడులు నిర్వహించారు. నాగరాజు అనే వ్యక్తి నివాసంలో భారీగా జిలెటిన్‌స్టిక్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. జిలెటిన్ స్టిక్స్ అక్రమ నిల్వపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

09:29 - December 26, 2015

హైదరాబాద్‌ : నగరంలో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. సరూర్‌నగర్‌ శ్రీరామ్‌నగర్‌లో ఇంటిముందు ముగ్గు వేస్తున్న మహిళ మెడలో 4తులాల బంగారు ఆభరణాన్ని తెంచుకెళ్లారు. బైక్ పై సైదాబాద్ లోని వచ్చిన ఇద్దరు వ్యక్తులు... తన మెడలోని చైన్ లాక్కెళ్లినట్టు... బాధితురాలు తెలిపింది. మరోవైపు సైదాబాద్ కాలనీలో పాల ప్యాకెట్లు తీసుకు వస్తుండగా మరో మహిళ మెడలోని 3 తులాల గొలుసు తెంచుకెళ్లారు.

09:27 - December 26, 2015

హైదరాబాద్ : చలి ఒక్ససారిగా పంజా విసిరింది. ఇరు రాష్ర్టాల్లో ఉన్నట్టుండి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో వృద్ధులు, చిన్నపిల్లలు వణికిపోతున్నారు. కొన్ని జిల్లాలో కేవలం ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదయ్యాయి. ఉత్తర, ఈశాన్య భారత్ నుంచి వీస్తున్న చలిగాలులే కారణమని వాతావరణ నిపుణులంటున్నారు. మరో వైపు విశాఖ మన్యంలో చలిగాలుల తీవ్రత పెరగడంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పాడేరులో 8, చింతపల్లిలో 9, మినుములూరులో 6, లంబసింగిలో 7, చింతపల్లిలో 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రతకు ఏజెన్సీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

హైదరాబాద్ శివారు ప్రాంతాలను కమ్మేసిన పొగమంచు

నగర శివారు ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రధానమార్గంతో పాటు... హైదరాబాద్-బెంగళూరు హైవే, ఔటర్ రింగ్ రోడ్ ను సైతం మంచు దుప్పటి కమ్మేసింది. ఊటీని తలపించేలా కమ్ముకున్న తెల్లని మంచు తెరలను చూసి ప్రకృతి ప్రేమికులు ఏంజాయ్ చేస్తుంటే.. వాహనదారులు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు.

ఆదిలాబాద్‌లో జిల్లాలో....

ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క సారిగా ఉష్ణోగ్రతలు పడిపోయా యి. ఉత్తరాది నుంచి శీత ల గాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. కనిష్ట ఉష్ణోగ్రత ఒక్కసారిగా 6.3 చేరుకుంది. దీంతో జిల్లాలోని వృద్దులు, పిల్లలు చలి తీవ్రతకు తట్టుకోలేకపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోనైతే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఉట్నూర్, ఇంద్రవెల్లి, జైనూరు, నార్నూర్ మండలాల్లో చలి ఎక్కువగా ఉంది. గిరిజనులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. రాబోయే రెండురోజుల్లో మరింత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు న్నాయని నిపుణులు చెబుతున్నారు.

09:23 - December 26, 2015

అనంతపురం : కన్న కుమారుడే కసాయిగా మారాడు. తండ్రిని కొడవలితో నరికి చంపేశాడు. అనంతపురం జిల్లా తాడిపడ్రి గన్నెవారి కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. తండ్రి ఓబులేసు ప్రవర్తనతో విసిగిపోయిన తనయుడు సురేష్‌ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఓబులేసు కూడా గతంలో తన కుమారుల్లో ఒకరిని కొడవలితో నరికి చంపేశాడు. చెప్పినమాట వినలేదన్న కోపంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఓబులేసు భార్యను కూడా వేధింపులకు గురి చేస్తుండటంతో తట్టుకోలేక... తండ్రిని కొడవలితో నరికి చంపినట్టు నిందితుడు తెలిపాడు.

ఏటూరు నాగారంలో వ్యక్తి దారుణ హత్య

వరంగల్ : ఏటూరునాగారంలోని నందమూరు నగర్‌ కాలనీలో వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. రేసు హన్మంత్‌ను అతని ఇంటి వద్ద గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో పొడిచి హతమార్చారు. శనివారం ఉదయం హన్మంత్‌ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

శ్రీశైలంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

హైదరాబాద్ : శ్రీశైలంలో భక్తుల రద్దీ శనివారం కూడా కొనసాగుతోంది. రద్దీ కారణంగా ప్రాత: కాల పూజా టికెట్లను నిలిపివేశారు. మల్లన్న జన్మ నక్షత్రన్ని పురస్కరించుకుని ఈరోజు ఆరుద్రోత్సవం నిర్వహిస్తున్నారు. ఉత్సవం నేపథ్యంలో వేకువజామున సుప్రభాత సేవ, మహా మంగళహారతులను ఏకాంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామికి ప్రత్యేక పూజల అనంతరం నందివాహనంపై ఉత్సవ మూర్తులను గంగాధ మండపం వద్దకు చేర్చి, అక్కడ నుంచి గ్రామోత్సవం ప్రారంభిస్తారు.

నగరంలో రెండు చోట్ల చైన్ స్నాచింగ్ లు

హైదరాబాద్ : నగరంలో ఈ రోజు ఉదయం చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. సరూర్ నగర్ సాయిరాంనగర్ లో మహిళ మెడలో నుంచి నాలుగు తులాల పుస్తెలతాడు లాక్కెళ్లారు. అలాగే చంపాపేట్ రెడ్డి కాలనీలో మహిళ మెడలోని 3 తులాల గొసులు తెంచుకెళ్లారు.

 

08:57 - December 26, 2015

హైదరాబాద్ : టాలీవుడ్ పరిశ్రమలో విజువలైజేషన్ లో వినూత్నమైన దర్శకుడు సుకుమార్. ఈ స్టార్ డైరెక్టర్ ఏది చేసినా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ప్రతీ ప్రాజెక్ట్ ని అత్యంత శ్రద్ధతో చేసే ఈ క్రియేటివ్ డైరెక్టర్ 'నాన్నకు ప్రేమతో' సినిమాను మాత్రం చాలా ఛాలెంజింగా తీశాడట. ప్రతి సినిమాను చక్కగా అలవోకగా తీసే ఈ డైరెక్టర్ తన విజువలైజేషన్ ను మించి ఎన్టీఆర్ అభినయం చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడని అందుకే సినిమా రావడానికి కొంచెం ఆలస్యమయ్యిందని ఒక టాక్. లొకేషన్ లో ఎన్టీఆర్ కి సీన్ చెప్పగానే తన పెర్ఫామెన్స్ చూసిన సుకుమార్ ఒక్కక్షణం నిర్ఘాంతపోయాడట. కొన్ని సన్నివేశాల్లో ఎన్టీఆర్, సుకుమార్ నువ్వా నేనా అన్నట్లుగా పోటాపోటీగా సినిమాను చిత్రీకరించారట. దాంతో సుకుమార్ ఈ సినిమాలో ప్రతి విభాగంలోనూ ఇప్పటి వరకు తీసిన సినిమాలన్నింటి కన్నా, అత్యంత శ్రద్ధ చూపించాల్సి వచ్చింది. కాస్ట్యూమ్స్, మేకప్, గెటప్, స్టైల్స్, బాడీలాంగ్వేజ్ ఇలా అన్నింటిలోనూ తనకు కావాల్సినట్లుగా ఎన్టీఆర్ లుక్ ని మార్చేశాడట సుకుమార్. వీటన్నింటిలోనూ అనుకున్నదానికంటే ఈ లెక్కలమాస్టార్ ఎక్కువ మార్కులే సంపాదించాడని టాలీవుడ్ ప్రముఖులు చెవులు కొరుక్కుంటున్నారాట. . అటు మాస్ ప్రేక్షకుల, ఇటు క్లాస్ ప్రేక్షకుల పల్స్ ని పట్టేశాడనే అంటున్నారు సినీ విశ్లేషకులు.

08:37 - December 26, 2015

హైదరాబాద్ : అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. క్రిస్మస్ పర్వదిన ఆనందాలను టోర్నడోలు తుడిచిపెట్టుకుపోయాయి. యుఎస్‌లోని అలబామా, ఇలినాయిస్‌నందలి అనేక గ్రామాల్లో భారీ ఎత్తున పంట నష్టం వాటిల్లింది. 14 మంది మృత్యువాత పడ్డారు. పలు ఇళ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. రవాణా, విద్యుత్‌ వ్యవస్థలకు తీవ్ర అంతరాయం కలిగింది.

నష్టం మాత్రం తీవ్రంగా....

ఇలాంటి రాకాసి సుడిగాలులు ఇక్కడ కొత్తేంకాదు. కానీ నష్టం మాత్రం తీవ్రంగా ఉంటుంది. అయితే కాలంకాని కాలంలో టోర్నడోలు సంభవించడమే అమెరికా ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.

ఇలినాయిస్ అలబామా, మిసిసిపి రాష్ట్రాల్లో....

ఇలినాయిస్ అలబామా, మిసిసిపి రాష్ట్రాల్లో పలు గ్రామాలు టోర్నడోల దెబ్బకు భారీగా నష్టపోయాయి. ఈ రెండేగాక మరో 3 రాష్ట్రాల్లో టోర్నడోలు విరుచుకుపడ్డాయి. వాటి ధాటికి వేలాది ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. తీవ్రమైన వెచ్చని సుడిగాలుల ధాటికి లక్షలాదిమంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విద్యుత్‌ స్తంభాలు నేలకూలడంతో పవర్ సప్లైకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సెల్‌ టవర్లు సైతం నేలకూలడంతో సమాచార వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది .

వివిధ ప్రాంతాల్లో 14 మంది మృతి....

ఈ ప్రకృతి విపత్తు మూలంగా వివిధ ప్రాంతాల్లో 14 మంది మృతిచెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి. సహాయ బృందాలు రంగంలోకిదిగి పరిస్థితులను అదుపులోకి తెస్తున్నాయి. రోడ్లపై పడిన చెత్తా చెదారం, అడ్డంకులను తొలగించి రవాణా వ్యవస్థను పునరుద్ధరిస్తున్నారు.

క్రిస్మస్‌ రోజునే ఇలా టోర్నడోలు .....

సరిగ్గా క్రిస్మస్‌ రోజునే ఇలా టోర్నడోలు విరుచుకపడడంతో లక్షలాదిమంది పండుగ ఆనందానికి దూరమయ్యారు. అన్ని రాష్ట్రాలకన్నా మిసిసిపిలో నష్టం ఎక్కువగా జరిగింది. దీంతో అక్కడ హై ఎలర్ట్‌ను ప్రకటించారు.

08:34 - December 26, 2015

తలనొప్పి తీవ్రంగా వేధిస్తోందా? కళ్ల దగ్గర దురదగా ఉందా? ముక్కు ఇరువైపులా ముట్టుకుంటే నొప్పిగా ఉందా? అయితే మీరు సైనసైటిస్‌తో బాధపడుతున్నట్టే. ముఖంలో కళ్ళ దగ్గర, ముక్కు పక్క భాగంల్లోని ఎముకలలో ఉండే సన్నని గాలితో నిండే ప్రదేశాన్ని సైనస్ అంటారు. ఈ భాగంలో ఇన్ఫెక్షన్ సోకి వాచి పోవడాన్ని సైనసైటిస్ (Sinusitis) అంటారు.

వాతావరణ మార్పులు జరిగినప్పుడల్లా....

వాతావరణ మార్పులు జరిగినప్పుడల్లా సైనసైటిస్‌ సమస్య మొదలవుతుంది. ఇది 90 శాతం మందిలో కనిపించే సాధారణ సమస్య. దాదాపుగా ప్రతి మనిషి జీవనకాలంలో దీని బారిన పడనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మళ్లీ మళ్లీ వస్తూ దీర్ఘకాలం వేధించే ఈ సమస్యతో కాలం వెళ్లదీస్తున్న వారు చాలా మందే ఉంటారు. ఈ సైనసైటిస్ ఇన్‌ఫెక్షన్ వలన వస్తుంది. వైరస్, బ్యాక్టీరియా వలన కూడా వస్తుంది. ముఖ్యంగా స్టైప్టోకోకస్ నిమోనియా, ఇన్‌ఫ్లుయోన్‌జా వలన వస్తుంది. ఈ సైనసైటిస్‌కు హోమియోలో అద్భుత చికిత్స ఉంది. పూర్తిగా మందుల ద్వారా నివారించడమే కాకుండా వ్యాధినిరోధకశక్తిని పెంచి మళ్లీ మళ్లీ రాకుండా నివారించవచ్చు.

సైనస్‌ రకాలు ....

ఈ సమస్యను మూడు విభాగాలుగా చూడవచ్చు. ఒకటి ఎక్యూట్‌. ఇది వస్తే వారం రోజులుంటుంది. రెండోది సబ్‌ఎక్యూట్‌. ఇది నాలుగు నుంచి ఎనిమిది వారాలుంటుంది. మూడోది క్రానిక్‌. ఇది దీర్ఘకాలంపాటు అంటే 8 నుంచి 10 వారాల పైన ఉంటుంది. ఈ సైనసైటిస్‌ వైరస్‌, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ వల్ల వస్తుంది. సె్ట్రప్టోకాకస్‌, న్యుమోనియా, ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ వల్ల వస్తుంది. ముఖంలో కళ్ల దగ్గర, ముక్కు పక్కభాగంలో ఎముకలలో ఉండే సన్నని గాలితో నిండి ఉండే ప్రదేశాన్ని సైన్‌సలు ఉంటారు. ఈ భాగం ఇన్‌ఫెక్షన్ల మూలంగా వాచిపోవడాన్ని సైనసైటిస్‌ అంటారు. సైనస్‌ రకాలు : ఫ్రాంటల్‌, పారానాసల్‌, ఎత్మాయిడల్‌, మాగ్జిలరీ, స్ఫినాయిడల్‌.

వ్యాధి లక్షణాలు....

తరచూ జలుబు చేయడం, జలుబుతో ఎక్కువ రోజులు బాధపడటం సైనసైటిస్ ప్రాథమిక లక్షణం. ఈ దశలో సరైన చికిత్స తీసుకోకపోతే తరువాత ఇది మందులకు కూడా లొంగదు. ముక్కులు బిగదీసుకుపోతాయి. ఆపైన ముక్కు నుంచి పసుపు పచ్చని స్రావం వస్తుంది. దగ్గు, శ్వాస దుర్గంధంతో కూడి ఉంటుది. ముఖంలో వాపు, పళ్లు, కళ్ల వెనుక భాగంలో నొప్పి కనిపిస్తుంది. కొద్దిరోజులకు వాసన తెలియకుండా పోతుంది. తరచూ తలనొప్పి, తలంతా బరువుగా ఉండుట, ముఖంలో వాపు, సైనస్‌ భాగంలోనొప్పి, ముక్కు దిబ్బడ, ముక్కు దురద, నీరు కారడం, గొంతులోకి ద్రవాలు కారడం, దగ్గు, జలుబు, చెవిలో చీము వంటి లక్షణాలుంటాయి. ఈ లక్షణాలతో పాటు కొందరిలో నిరంతరం ముక్కులో దురదగా ఉంటుంది. ముఖం, తల అంతా బరువుగా ఉంటుంది.

హోమియో చికిత్స ద్వారా....

హోమియోపతి చికిత్స వల్ల సర్జరీ అవసరం లేకుండానే సైనసైటి్‌సను సమూలంగా తగ్గించుకోవచ్చు. కాలిబైక్‌, కాలిసల్ఫ్‌, హెపర్‌సల్ఫ్‌, మెర్క్‌సాల్‌, సాంగ్‌న్యురియా, స్పైజిలియా వంటి మందులు ఉన్నాయి. హోమియో మందులు వాడిన చాలా మందికి సర్జరీ అవసరం లేకుండానే సైనసైటిస్‌ తొలగిపోతుంది. అల్లోపతి మందులు వాడటం వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ చాలా ఉంటాయి. హోమియో మందుల్లో ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఇతర చికిత్సల వల్ల తాత్కాలిక ఉపశమనం కలుగుతుందే తప్ప శాశ్వత పరిష్కారం లభించదు. కానీ హోమియో చికిత్స వల్ల సైనసైటిస్‌ సమస్య సమూలంగా తొలగిపోతుంది. మళ్లీ మళ్లీ బాధించడం జరగదని హోమియో వైద్యులు వెల్లడిస్తున్నారు.

నివారణకు కొన్ని చిట్కాలు..

నోటిని తరచుగా గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
దుమ్ము, ధూళి లేకుండా చూసుకోవాలి.
ఎక్కువ సమయం ఈత కొట్టడం చేయకూడదు. చల్లని నీటితో స్నానం చేయకూడదు. చల్లటి పదార్ధాలకు దూరంగా ఉండటం, చెవిలో దూదిపెట్టుకోవడం, ఆవిరిపట్టడం చేయడం వల్ల సైనసైటిస్‌ సమస్య రాకుండా కాపాడుకోవచ్చు.
మరో వైపు నిరంతరం బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ చేయడం వల్ల కూడా సైనస్ బాధ నుండి ఉపసమనం పొందవచ్చు.
టీ స్పూన్ జీలకర్రను వేయించి పొడిచేసి, అందులో రెండు స్పూన్ల తేనె కలిపి రోజుకు రెండు సార్లు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. జీలకర్రను పల్చని కాటన్ వస్త్రంలో కట్టి వాసన పీల్చాలి.
250 మిల్లీ లీటర్ల నీటిలో టీ స్పూన్ మెంతులను వేసి బాగా మరిగించి కషాయం కాయాలి. ఈ కషాయాన్ని రోజుకు నాలుగు సార్లు తీసుకోవాలి.
300 మిల్లీ లీటర్ల క్యారట్ రసంలో 200 మిల్లీ లీటర్ల పాలకూర రసం కలిపి రోజుకు ఒక సారి తాగాలి.
మామిడి పండ్లు లభించే కాలంలో వాటిని బాగా తినాలి. వీటిలోని ‘ఎ’ విటమిన్‌తో మిగతా ఔషధ గుణాలు సైనసైటిస్ వంటి ఇన్‌ఫెక్షన్లను నివారిస్తాయి.
ఉల్లి, వెల్లుల్ని రేకులను తింటే సైనసైటిస్ బాధ తగ్గుతుంది. వంటకాల్లో ఉల్లి, వెల్లుల్లిపాయలను విరివిగా వాడితే మంచిది.

08:04 - December 26, 2015

హైదరాబాద్ : ఉగ్రవాదం అనేదికి అందరికీ ప్రమాదమే… అని 'న్యూస్ మార్నింగ్' చర్చలో ప్రజాశక్తి మాజీ ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ వినయ్ కుమార్ తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ అకస్మాత్తుగా పాకిస్తాన్‌లో పర్యటించారు. ఆప్ఘన్ పర్యటనలో ఉన్న ప్రధాని.. సడన్‌గా లాహోర్ వెళ్తున్నట్టు ప్రకటించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. అనుకోకుండా వచ్చిన అతిథికి పాక్ ప్రధాని రాచమర్యాదలు చేశారు. శుక్రవారం షరీఫ్‌ పుట్టినరోజు కావడం.. మోదీ గ్రీటింగ్స్‌ చెప్పడం ప్రత్యేకతను సంతరించుకుంది. భర్తడే దౌత్యమేనా? సీమాంతర ఉగ్రవాదంపై చర్చించారా? కాంగ్రెస్ ఎందుకు తప్పుపడుతోంది? చర్చలు అనేవి సమస్యల పరిష్కారం దిశగా ఉండాల్సిన అవసరం లేదా? ఎంపి కీర్తీ ఆజాద్ సస్పెండ్ చేయడం అసహనం లో భాగమేనా? అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేపట్టాలని శివసేన వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. రాజకీయ అవసరాల కోసం రామమందిరం వివాదాన్ని తీసుకువస్తుందా? ఈ అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో వినయన్ కుమార్ తో పాటు పీసీసీ అధికార పత్రినిది వకుళాభరణం కృష్ణ మూర్తి, బిజెపి నేత లక్ష్మినారాయణ పాల్గొన్నారు.

తిరుపతి నుండి షిరిడీకి వీక్లీ ఎక్స్ ప్రెస్

తిరుపతి:ఆంధ్రప్రదేశ్‌కు కొత్తగా ఎక్స్‌ప్రెస్‌ రైలును మంజూరు చేశారు. తిరుపతి-సాయినగర్‌ షిర్డీ మధ్య నడిచే ఈ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ శనివారం సాయంత్రం పట్టాలెక్కనుంది. ఈ రైలును సురేష్‌ప్రభు తిరుపతి రైల్వేస్టేషన్‌లో ప్రారంభించనున్నారు. రెగ్యులర్‌ సర్వీసు మాత్రం జనవరి 5 నుంచి ప్రతి మంగళవారం ఉదయం 7 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ...

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 27 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10గంటలు, కాలినడక భక్తులకు 8గంటలు, ప్రత్యేక ప్రవేశదర్శనానికి 2గంటల సమయం పడుతోంది.

07:51 - December 26, 2015

 

ఢిల్లీ: తత్కాల్‌ కింద బుక్‌చేసుకునే టికెట్‌ రుసుములను రైల్వేశాఖ పెంచింది. ప్రయాణ దూరాన్ని బట్టి తత్కాల్‌ కనీస, గరిష్ఠ ఛార్జీలుంటాయని తెలిపింది. ఆయా తరగతులను బట్టి కనీస, గరిష్ఠ రుసుములు రూ.10 నుంచి 100 వరకు పెరిగాయి. ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి.

- స్లీపర్‌ తరగతిలో టికెట్‌ను బుక్‌ చేసుకోవటానికి ప్రయాణికులు తత్కాల్‌ కింద రూ.175కు బదులు ఇప్పుడు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది.

  ఈ  తరగతిలో కనీస తత్కాల్‌ రుసుము రూ.90 నుంచి 100కు పెరిగింది.

- ఏసీ -3 కి తత్కాల్ గరిష్ట రుసుమును రూ. 350 నుంచి 400 కు … కనీస రుసుము రూ. 250 నుంచి 300 కు పెంచారు.

ఏసీ -2 తరగతిలో తత్కాల్ కనీస రుసుము రూ. 300 నెంచి 400 కు… గరిష్ట రుసుము రూ. 400 నుంచి 500కు పెంచారు.

- ఎగ్జిక్యూటి్ తరగతిలో తత్కాల్ కనీస రుసుము ను రూ. 300 నుంచి 400 కు, గరిష్ట రుసుమును రూ. 400 నుంచి 500 కు పెంచారు.

నేడు సీపీఐ 90వ వార్షికోత్సవాలు

హైదరాబాద్ : సీపీఐ90వ వ్యవస్థాపక వార్షికోత్సవాలను పురస్కరించుకుని నేడు రాష్ట్ర వ్యాప్తంగా అరుణ పతాక ఆవిష్కరణలు, సదస్సులు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అరుణ పతాకాన్ని విష్కరిస్తారని తెలిపారు.

మేకల మందపై చిరుత దాడి

నెల్లూరు : ఉదయగిరి అటవీ ప్రాంతంలో మేకల మందపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో 8 మేకలు మృతి చెందగా మరో 6 మేకలకు గాయాలయ్యాయి. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు. అప్రమత్తమైన స్థానికులు అటవీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

07:29 - December 26, 2015

హైదరాబాద్ : క్రిస్మస్ పండగ రోజు.. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) నుంచి ఎర్త్ ప్లానెట్ కు ఒక రాంగ్ కాల్ వచ్చింది. ఆ రాంగ్ కాల్ చేసింది బ్రిటిష్ వ్యోమగామి టిమ్ పీక్. ‘హెలో, ఈజ్ దిస్ ప్లానెట్ ఎర్త్?’ అంటూ ఒక మహిళకు ఈ రాంగ్ కాల్ వెళ్లింది. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్న టిమ్ అందుకు క్షమాపణలు చెప్పాడు. కావాలని ఈ ఫోన్ కాల్ చేయలేదని, పొరపాటున జరిగిందని అన్నాడు. క్రిస్మస్ సందర్భంగా తన ఇంటికి ఫోన్ చేస్తుండగా పొరపాటున రాంగ్ నంబర్ డయల్ అయిందని ట్వీట్ చేశాడు.

07:09 - December 26, 2015

అనంతపురం : తమను కాల్‌మనీ వ్యాపారులబారి నుంచి రక్షించాలంటూ బాధితులు కొందరు అనంతపురం జిల్లాలో పోలీసులను ఆశ్రయించారు. జిల్లాలోని తాడిపత్రిలో వడ్డీ వ్యాపారులు 9 నుంచి 10 రూపాయల దాకా అధికమొత్తంలో వడ్డీ వసూలు చేస్తున్నారని పోలీసుల వద్ద వాపోయారు. పెద్దమొత్తాల్లో వడ్డీలు చెల్లించాలని వేధిస్తున్నారని మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. డిఎస్పీ చిదానందరెడ్డి వారి ఫిర్యాదులు స్వీకరించారు.

07:06 - December 26, 2015

హైదరాబాద్ : శివసేన పార్టీ మరోసారి అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే కోర్టులో ఉన్న ఈ అంశంపై స్పందిస్తూ అయోధ్యలో రామమందిర నిర్మాణం జాతీయ కార్యక్రమమని తన అధికార పత్రిక సామ్నాలో తెలిపింది. ఇకనైనా మందిర నిర్మాణం తేదీని ప్రకటించాలని రాముడు గుడారంలాంటి చిన్నపాటి మందిరంలో ఉండటమేంటని ప్రశ్నించింది. రాముడి పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చి మందిరం అంశాన్ని పక్కనబెట్టినందుకు సిగ్గుపడాలని బిజెపిని టార్గెట్‌ చేస్తూ ఆ పత్రిక వ్యాఖ్యలు చేసింది. ఇదిలా ఉండగా కొద్ది రోజులుగా కొందరు కాషాయ సైనికులు అయోధ్యకు ఇటుకలు తరలించిన అంశం ఇప్పటికే పెద్ద న్యూసైంది. దీనిపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్పందిస్తూ అయోధ్యలో ఏం జరుగుతోందని ఇంటెలిజన్స్‌ వర్గాలను ఆరాతీసింది.

07:05 - December 26, 2015

హైదరాబాద్ : ఒకరు పొగుడుతున్నారు. మరొకరు తిడుతున్నారు. కొంతమంది స్వాగతిస్తున్నారు. మరికొంతమంది తిరస్కరిస్తున్నారు. కొందరు ఆశావాదం చూపిస్తున్నారు. మరికొందరు నిరాశావాదం తెరమీదకు తీసుకొస్తున్నారు. మొత్తంగా మోడీ పాకిస్తాన్‌ పర్యటనపై ఇలా మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.

మోదీ లాహోర్‌ పర్యటనను స్వాగతించిన సీపీఐ, సీపీఎం........

ప్రధాని లాహోర్‌ పర్యటనను వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎంలు స్వాగతించాయి. ఇరు దేశాల మధ్య చర్చలు స్థిరంగా, నిరంతరాయంగా కొనసాగాలని సీపీఎం అభిప్రాయపడింది. రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలు మెరుగవ్వాలని, ఇదే విద్వేషవాదులకు, ఉగ్రవాదులకు అసలైన విరుగుడు అవుతుందని ఆ పార్టీ నేతలు ట్వీట్‌ చేశారు. పాకిస్తాన్‌ ప్రధానితో తన భేటీకి ఏ అంశాలు ప్రేరణగా నిలిచాయో భారత ప్రధాని జాతికి తెలియజేస్తారని ఆశిస్తున్నామని సీపీఎం అభిప్రాయపడింది. ఇక పాక్‌ ప్రధానితో భేటీ కావడం వల్ల ఇరు దేశాల మధ్య చర్చల ప్రక్రియ ముందుకు వెళ్తుందని సీపీఐ ఆశాభావం వ్యక్తం చేసింది.

మోదీ లాహోర్‌ పర్యటనపై వేర్పాటువాదుల హర్షం.......

మోదీ లాహోర్‌ పర్యటనను కశ్మీర్‌ వేర్పాటువాదులు స్వాగతించారు. ఇది సానుకూల పరిణామమని హర్రియత్‌ నేతలు అన్నారు. ఐతే మోదీ పాక్‌ పర్యటనను కాంగ్రెస్‌ తప్పుపట్టింది. ఇది దుస్సాహసమని ఆ పార్టీ అభిప్రాయపడింది. ఇలాంటి విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా తెలియజేయడం సరికాదని విమర్శించింది. పర్యటనపై గోప్యంగా ఉంచాల్సిన అవసరమేమిటని ప్రశ్నించింది. కనీసం పార్లమెంట్‌లో కూడా ప్రకటన చేయకపోవడాన్ని ఆ పార్టీ తప్పుపట్టింది.

మోదీ పాక్‌ పర్యటనపై ఆప్‌ విమర్శలు....

మోదీ పాక్‌ పర్యటనపై ఆప్‌ విమర్శలు గుప్పించింది. ఉగ్రవాదం సాకుగా చూపిస్తూ.. ఇంతవరకు చర్చలకు ప్రక్రియకు వెళ్లని బీజేపీకి ..ఇప్పుడు ఆ సమస్య తీరిపోయిందా అని ఆప్‌ నేతలు ప్రశ్నించారు. మోదీ పాకిస్తాన్‌ పర్యటనకు తమకు దిగ్భాంతి కలిగించిందని జేడీయూ అభిప్రాయపడింది.

సమర్థించిన బిజెపి....

ఇది ఇలా ఉంటే మోదీ పర్యటనను బీజేపీ సమర్థించింది. ప్రధానిని విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ పొగడ్తలతో ముంచెత్తారు. రాజనీతిజ్ఞత అంటే ఇదేనని..పొరుగు వారితో సంబంధాలు ఇలా ఉండాలంటూ ఆమె ట్వీట్‌ చేశారు. మోదీ పాకిస్తాన్‌ పర్యటనను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మెచ్చుకున్నారు.

07:02 - December 26, 2015

హైదరాబాద్ : స్పర్శ్‌ హాస్పిటల్, రోటరీ క్లబ్‌ వారి సంయుక్త ఆధ్వర్యంలో క్యాన్సర్‌ రోగుల కోసం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న స్కై ఫెస్ట్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మూడో రోజు పండగ వాతావరణాన్ని తలపించింది. సెలవు రోజులు కావడంతో సిటీ ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. నిర్వాహకులు వివిధ కార్యక్రమాలు ఏర్పాటుచేయడంతో చిన్నాపెద్దా అంతా సందడి చేస్తున్నారు.

ఫుల్‌గా ఎంజాయ్‌ చేసిన నగర వాసులు...

స్కై ఫెస్ట్ వేడుకలు హైదరాబాద్‌ నగరవాసులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటివరకు కార్నివాల్స్‌ను టివిల్లో చూసిన సిటిజన్స్‌ స్కై ఫెస్ట్‌లో జరిగిన కార్నివాల్‌ను రియల్‌గా చూసి ఫుల్‌గా ఎంజాయ్‌ చేశారు. కార్నివాల్‌లో భాగంగా ఏర్పాటుచేసిన హాట్‌ బెలూన్లలో విహరిస్తూ చిన్నాపెద్దా అందరూ సందడి చేశారు.

ఔత్సాహికుల కోసం.....

వాటర్‌బెలూన్‌, జుగ్లియర్‌ బాల్‌ గేమ్స్‌ తదితర ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఔత్సాహికుల కోసం వాల్ క్లైంబింగ్‌ లాంటివీ ఎరేంజ్‌ చేశారు. వాటర్‌ బెలూన్లతో నీటిలో తేలుతూ చిన్నారులు హాలిడేస్‌ను జాలీగా గడిపేశారు. మెజీషియన్స్ ప్రదర్శించిన వివిధ రకాల మ్యాజిక్‌లు అందర్నీ ఆకట్టుకున్నాయి.

క్యాన్సర్‌ రోగుల సహాయార్థం....

క్యాన్సర్‌ రోగుల సహాయార్థం రోటరీ క్లబ్‌ వారు నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ స్కై ఫెస్ట్‌ను ఏర్పాటు చేశారు. మూడు రోజులుగా జరుగుతున్న ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో జనం తరలివస్తున్నారు. క్యాన్సర్‌ రోగుల సహాయార్థం ఇలా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ప్రశంసనీయమని సందర్శకులు అంటున్నారు. ఈ ఫెస్ట్‌కు నగరవాసుల నుంచి స్పందన బాగుందని నిర్వాహకులు అంటున్నారు. 23న ప్రారంభమైన ఈ ప్రత్యేక కార్యక్రమం 27 వరకు జరగనుంది. 26, 27న మరికొన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

06:58 - December 26, 2015

హైదరాబాద్ : విశాఖలో ఇంట్లో పని కోసం పెట్టుకున్న బాలికను నేవీ ఉద్యోగి భార్య చావబాదింది. బీహర్‌కు చెందిన మనోజ్‌కుమార్‌సింగ్‌ నేవీలో సెయిలర్‌గా పనిచేస్తూ శ్రీహరిపురం ప్రాంతంలో కుటుంబంతో నివాసం వుంటున్నాడు. ఇంట్లో పనిచేసేందుకు బీహర్‌ నుంచి గీత అనే బాలికను తీసుకువచ్చాడు. అయితే పని సక్రమంగా చేయడం లేదని నేవీ ఉద్యోగి భార్య అంజూ ఆ బాలికను చావబాదింది. ఆ బాలిక కేకలు పెడుతూ ఏడ్వడంతో స్థానికులు వచ్చి నేవీ ఉద్యోగి భార్యను నిలదీశారు. అయితే ఆమె నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో స్థానికులు మల్కాపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అంజూను పోలీస్‌ స్టేషనకు తరలించారు. అనంతరం నేవీ పోలీసులకు అప్పగించారు. మల్కాపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

06:55 - December 26, 2015

అనంతపురం : జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముదిగుబ్బ మండలం సంకేపల్లి దగ్గర లారీని , మినీ వ్యాన్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మృతులు గంగాధర్, రామన్న గౌడ్, విష్పాజీ గా పోలీసులు తెలిపారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వీరిని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు. మృతులు కర్ణాటక వాసులుగా పోలీసులు గుర్తించారు. తిరుపతి నుంచి వస్తుండగా శనివారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో జరిగింది.

06:49 - December 26, 2015

హైదరాబాద్ : తెలంగాణ టిడిపికి సంక్రాంతి జ్వరం పట్టుకుంది. గ్రేటర్ ఎన్నికలను వ్యూహత్మకంగా సంక్రాంతికి కాస్తా అటు ఇటుగా నిర్వహించాలని అధికార టిఆర్ఎస్ భావిస్తుండడంతో ఈ నిర్ణయం తమ విజయావకాశాలపై ప్రభావం చూపుతుందేమోనని టి.టిడిపిలో ఆందోళన మొదలైంది.

సాధారణ ఎన్నికల్లో గ్రేటర్‌ లో...

తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో తిరుగులేని విజయాన్ని టిడిపి కైవసం చేసుకుంది. గ్రేటర్ లో ఏ ఎన్నికలు వచ్చినా తమకు తిరుగుండదని చెప్పుకొచ్చింది. అయితే తాజాగా అధికార పార్టీ వ్యూహలతో పరిస్ధితులు తలకిందులు అవుతాయని అందోళన చెందుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో సంక్రాంతి పెద్దపండుగ. ఆరోజుకు నగరం మొత్తం పల్లెకు పయనం అవుతుంది. ఇదే అదునుగా జనవరి నెలలోనే గ్రేటర్ ఎన్నికలు నిర్వహించడానికి ప్రత్యర్ధి బలాన్ని బలగాన్ని వీలున్నంత ఎక్కువగా తగ్గించేందుకు అధికార పార్టీ ఎత్తులు వేస్తోంది.

జనవరి మూడు లేదా నాలుగో వారంలో ఎన్నికలు....

గ్రేటర్ సమరాన్ని జనవరి మూడు లేదా నాలుగో వారంలో నిర్వహించే అవకాశం ఉండటంతో... ఆ ప్రభావం టిడిపి ప్రచారం, ఎన్నికలపైనా పడనుంది. దీంతో దేశం నేతలు.. అధికార పార్టీపై ఆరోపణలకు దిగారు.

గ్రేటర్‌ ఎన్నికలతో టీఆర్‌ఎస్‌పై అసంతృప్తి బయటపడుతుంది - టీటీడీపీ.........

టిఆర్ఎస్ ప్రభుత్వం పట్ల తెలంగాణ ప్రజలు సంతోషంతో లేరనే విషయం గ్రేటర్ ఎన్నికలతో తేటతెల్లం అవుతుందని టిడిపి నేతలు అంటున్నారు. ఆఖరి అస్త్రంగా పండగ సెలవుల్లో గ్రేటర్ ఎన్నికలు నిర్వహించాలని చూస్తోందని ఆరోపిస్తున్నారు. ఇకనైనా గెలుపుకోసం దొంగదారులు వెతకడం అధికార పార్టీ మానుకోవాలని సూచించారు. గ్రేటర్ ఎన్నికల్లో విజయంపై టిడిపి కోటి ఆశలు పెట్టుకోంది. ఈ ఆశల్ని కాస్తా కూల్చేయడానికి గులాబిపార్టీ వ్యూహలు రచిస్తోంది. మరి గ్రేటర్‌లో ఎవరి వ్యూహలు ఫలిస్తాయో వేచిచూడాలి.

06:45 - December 26, 2015

మెదక్ : అయుత చండీయాగం నాలుగో రోజుకు చేరింది. ఉదయం 5 గంటల నుంచే భక్తులు యాగస్థలికి రావడం మొదలుపెట్టారు. తమిళనాడు గవర్నర్‌ కె. రోశయ్య ఇవాళ అయుత చండీయాగంలో పాల్గొంటారు. మూడో రోజైన శుక్రవారం క్రిస్మస్‌ సెలవుదినం కావడంతో భక్తులు ఎర్రవల్లికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రెండువేల సప్తశథీ పారాయణాలు, 30 లక్షల నవావరణ జపాలు, చతుష్షష్టి యోగినీ బలి, మహాగణపతి పూజలు నిర్వహించారు.

పెద్ద సంఖ్యలో తరలిన భక్తులు...

మూడోరోజు అయుత చండీయాగానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 8 గంటల 20 నిమిషాలకు సీఎం కేసీఆర్‌ దంపతులు యాగశాల ప్రవేశం చేశారు. గురుప్రార్థనతో యాగం ప్రారంభమైంది. సప్తశథీ పారాయణం ప్రారంభించే ముందు పూర్వాంగ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో అంతర మాతృకన్యాసాలు, బహిర్‌ మాతృకన్యాసాలు, చండీ కవచం, అర్గళ, కీలక పఠనం, ఏకాదశిన్యాసాలు నిర్వహించారు.

బంతి, చామంతి పూలతో సుందరంగా .....

యాగశాల ప్రాంగణాన్ని బంతి, చామంతి పూలతో సుందరంగా అలంకరించారు. యాగానికి శ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామి, పరిపూర్ణానందస్వామి అతిథులుగా హాజరయ్యారు. వారికి సీఎం కేసీఆర్‌ ఆహ్వానం పలికి పాదాభివందనం చేశారు. స్వామీజీలు సీఎంను ఆశీర్వదించారు.

మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు దంపతులు....

మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు దంపతులు ఉదయం పూజలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. యాగశాలకు వచ్చిన అతిథులను ప్రధాన ద్వారం వద్ద మంత్రి హరీష్‌రావు ఆహ్వానించగా.. యాగశాలలో సీఎం కేసీఆర్‌ వారితో ప్రదక్షిణం చేయించారు. పూర్ణాహుతి కార్యక్రమంలో అతిథులతో సహా సీఎం పాల్గొన్నారు. అంతకు ముందు సీఎం దంపతులు గోపూజ నిర్వహించారు. మూడో రోజు కార్యక్రమంలో రెండువేల సప్తశథీ పారాయణాలు, 30 లక్షల నవావరణ జపాలు, చతుష్షష్టి యోగినీబలి, మహా గణపతి పూజలు చేశారు. సాయంత్రం కోటి నవాక్షరీ జపం, పార్ధివ లింగపూజ, అష్టావధాన సేవ, మహా మంగళహారతి నిర్వహించారు.

ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు...

అయుత చండీయాగంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌, ఏపీ మండలి చైర్మన్‌ చక్రపాణి, ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, తెలంగాణ మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, చందూలాల్‌తో పాటు పేర్వారం రాములు, మీడియా సంస్థల అధిపతులు గిరీష్‌సంఘీ, గౌతమ్‌, రాధాకృష్ణ, శైలజా కిరణ్‌, పలువురు అధికారులు పాల్గొన్నారు.

06:42 - December 26, 2015

చిత్తూరు : ఎర్రబండ అటవీప్రాంతంలో పోలీస్‌ కాల్పుల కలకలం చెలరేగింది. కూంబింగ్‌కు వెళ్లిన టాస్క్‌ఫోర్స్‌కు 40 మంది ఎర్రచందనం కూలీలు ఎదురుపడ్డారు. దీంతో వారు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పోలీసులు గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరపడంతో ఎర్రచందనం కూలీలు పారిపోయారు. డిఐజీ కాంతారావు ఘటనాస్థలానికి బయల్దేరివెళ్లారు.

06:41 - December 26, 2015

హైదరాబాద్ : ఆప్ఘనిస్తాన్‌ సరిహద్దుల్లో శుక్రవారం అర్ధరాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదైంది. పాకిస్తాన్‌, తజికిస్తాన్‌ సరిహద్దుల్లోని ఈశాన్య ఆప్ఘనిస్తాన్‌ ప్రాంతంలో ఈ భూకంపం వచ్చింది. దీని ప్రభావం ఉత్తరభారతదేశంలోనూ కనిపించింది. దేశ రాజధాని ఢిల్లీలోనూ భూమి కంపించింది. చండీగఢ్‌, జైపూర్, ఢిల్లీ, శ్రీనగర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు వ్యాపించాయి. పాకిస్తాన్‌లోను పలు చోట్ల భూమి కంపించింది.

లారీ- మినీ వ్యాన్ ఢీ : నలుగురు మృతి

అనంతపురం : ముదిగుబ్బ మండలం సంకేపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ- మినీ వ్యాన్ ఢీ కొట్టడంతో నలుగురు మృతి చెందగా… మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు కర్ణాటకకు చెందిన వారుగా గుర్తించినట్లు సమాచారం. తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

ఆప్ఘనిస్థాన్ సరిహద్దుల్లో భూకంపం

హైదరాబాద్ : ఆప్ఘనిస్తాన్ సరిహద్లుఓ్ల శుక్రవారం అర్థరాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు పై దీని తీవ్రత 6.2గా నమోదైంది. దీని ప్రభావంతో ఉత్తర భారతదేశంతో పాటు, పాకిస్థాన్ లోనూ పలు చోట్ల స్వల్పంగా భూమి కంపించింది.

Don't Miss