Activities calendar

30 December 2015

నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు - సవాంగ్..

విజయవాడ : నూతన సంవత్సర వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. వేడుకలో రోడ్లపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూడాలని విజయవాడ పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు చేపడుతామని, అన్ని ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కొనసాగుతాయని తెలిపారు. 

అంబేద్కర్ విగ్రహం తొలగించడంపై సీపీఎం ఆగ్రహం..

విజయవాడ : కడప జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడాన్ని సీపీఎం ఖండిస్తోందని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. విగ్రహ ఏర్పాటు దారులను రిమాండ్ కు తరలించడం దారుణమని, తక్షణమే విగ్రహాన్ని పునప్రతిష్టించాలని డిమాండ్ చేశారు. రిమాండ్ కు పంపిన వారిని బేషరతుగా విడుదల చేయాలని గత కలెక్టర్ విగ్రహ ఏర్పాటుకు అనుమతినిచ్చినా కొత్తగా వచ్చిన కలెక్టర్ విగ్రహాన్ని తొలగించారని పేర్కొన్నారు. వివిధ సంఘాలకు చెందిన వారిని రిమాండ్ కు తరలించారని తెలిపారు. ఈ సంఘటనపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని మధు డిమాండ్ చేశారు. 

త్వరలో ఢిల్లీ యాత్ర - రఘువీరా..

తిరుపతి : త్వరలో ఢిల్లీ యాత్ర చేపడుతామని, ఈ యాత్రకు అన్ని పార్టీల వారిని ఆహ్వానించనున్నట్లు ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ఏపీ సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఢిల్లీ నుండి వచ్చేది లేదని స్పష్టం చేశారు. బీజేపీ, టిడిపి ప్రభుత్వాల కళ్లు తెరిపించేందుకు మట్టి సత్యాగ్రహం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు, ప్రత్యేక హోదా - ఆంధ్రుల హక్కు నినాదంతో కోటి సంతకాలు, మట్టిని సేకరించినట్లు తెలిపారు. 

జగదీష్ మార్కెట్ లో కార్డన్ సెర్చ్..

హైదరాబాద్ : ఆబిడ్స్ లోని జగదీష్ మార్కెట్ లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పత్రాలు లేకుండా విక్రయిస్తున్న 165 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 55 బైక్ లను సీజ్ చేశారు. 

అరవింద్ పనగారియతో బాబు..

విజయవాడ : నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ అరవింద్ పనగారియతో సీఎం చంద్రబాబు జరిపిన భేటీ ముగిసింది. రాష్ట్రాభివృద్ధికి సహకరించాల్సిందిగా అరవింద్ పనగారియను సీఎం కోరారు. ఏపీలో అపార వనరులు, సరిపడా ల్యాండ్ బ్యాంక్, నీరు, విద్యుత్ ఉన్నాయని బాబు వివరించారు. 

ఎన్నికల శిక్షణలో హాజరు కాని ఉద్యోగులపై జనార్ధన్ రెడ్డి ఆగ్రహం..

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల శిక్షణకు హాజరుకాని 651 మంది ఉద్యోగులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి ఆదేశించారు. మున్సిపల్ యాక్ట్ 612 ప్రకారం పోలీసు శాఖకు లేఖలు రాయాలని పేర్కొన్నారు. సంబంధిత హెచ్ వోడీలకు కూడా ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. 

గ్రేటర్ ఎన్నికల వ్యయం పెంపు..

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వ్యయ పరిమితిని పెంచుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. కార్పొరేటర్ల ఎన్నికల వ్యయ పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్టు పేర్కొంది. నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు చేసిన సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. మిగతా మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో కూడా ఎన్నికల వ్యయ పరిమితిని పెంచింది. 

21:33 - December 30, 2015

ఢిల్లీ : జనవరి 1 నుంచి అమలులోకి రానున్న ఆడ్‌-ఈవెన్‌ ఫార్మూలాపై హైకోర్టు కొన్ని సందేహాలు వ్యక్తం చేసింది. మహిళలు, టూ వీలర్స్‌ను ఆడ్‌-ఈవెన్‌ ట్రయల్‌ నుంచి ఎందుకు మినహాయించారని ఆప్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణకు సరి-బేసి నెంబర్ ప్లేట్ ఆధారంగా దినం తప్పించి దినం కార్లను రోడ్ల మీదకు అనుమతించేందుకు కేజ్రీవాల్ సర్కార్ సిద్ధమైంది. ట్రయల్‌లో భాగంగా జనవరి 1 నుంచి 15 వరకు ఆడ్‌-ఈవెన్‌ ఫార్మూలా అమలులో ఉంటుంది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఢిల్లీ ప్రభుత్వం 3 వేల ప్రయివేట్‌ బస్సులను ఏర్పాటు చేసింది. ట్రాఫిక్‌ పోలీసులతో కలిపి మొత్తం 10 వేల వాలంటీర్లు ఇందుకోసం పనిచేయనున్నారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే వాహనదారులకు 2 వేలు జరిమానా విధించనున్నారు. 

21:31 - December 30, 2015

ఢిల్లీ : నవంబర్‌లో జరిగిన బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని ప్రధాని నరేంద్ర మోడీ జీర్ణించుకోలేకపోతున్నారు. కేబినెట్‌లో కొందరు మంత్రుల పనితీరుతో అసంతృప్తిగా ఉన్న ఆయన ప్రభుత్వ ప్రతిష్టను ఇనుమడింపజేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం కేబినెట్‌లో మార్పులు తేవాలని యోచిస్తున్నట్టు మోది సన్నిహిత వర్గాల సమాచారం. కొత్త సంవత్సరంలో కొత్త కేబినెట్‌ రూపకల్పన జరగబోతోందా? ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన మంత్రి మండలిలోకి కొత్తవారిని చేర్చుకునేందుకు వేట మొదలు పెట్టారు. కానీ... ఆయనకు కావలసిన ప్రతిభావంతులు మాత్రం దొరకడం లేదట.

జల్లెడ పడుతున్న మోడీ..
మరోవైపు ప్రభుత్వ పనితీరు మారాలంటూ పార్టీ నుంచి కూడా ఒత్తిడి వస్తోంది. అభివృద్ధి, ఉద్యోగాల పేరిట అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంది. ప్రభుత్వ పనితీరు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కరువు కరాళ నృత్యం చేస్తుంటే... పెట్టుబడులు లేక నగరాల్లోనూ అభివృద్ధి కుంటుపడుతోంది. ఈ నేపథ్యంలో తాను కోరుకున్న అభివృద్ధి దిశగా పనిచేసే వ్యక్తుల కోసం మోడీ జల్లెడ పడుతున్నారు. ఆర్థిక సంస్కరణలు- ప్రభుత్వ పాలసీలపై అవగాహన ఉన్నవారి కోసం వేటాడుతున్నారు.

పలువురిపై వేటు...
ప్రస్తుత ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ శాఖ మార్చి రక్షణశాఖ అప్పగించాలని మోడీ యోచిస్తున్నారు. జైట్లీ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆర్థిక సంస్కరణలపై అవగాహన ఉన్న వ్యక్తి మాత్రం మోడీ దృష్టికి రాలేదని సమాచారం. అయితే ఆర్థిక మంత్రి మార్పుపై తమకు సమాచారం లేదని జైట్లీ కార్యాలయానికి చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. మైనారిటీలపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన గిరిరాజ్‌సింగ్‌, నిరంజన్‌ జ్యోతిలపై కూడా వేటు పడే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ కూడా తన శాఖను మార్పు చేయాలని కోరుతున్నట్టు విదేశీ మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం.

అంతా పుకార్లే...
కేబినెట్‌లో మార్పులు మోడీ కనుసన్నల్లోనే జరుగనుంది. ఈ విషయంలో అంతిమ నిర్ణయం కూడా ప్రధానిదే. అయితే కేబినెట్‌లో మార్పులు అంతా ఉత్తిదేనని, ఇవన్నీ పుకార్లేనని మోదికి చెందిన మరో సన్నిహితుడు కొట్టిపారేశారు. సాధారణ ఎన్నికలు 2019 వరకు సమయమున్నా...2017లో ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి రెండో వారంలో ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపిలు ఢిల్లీలో సమావేశం కానుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

21:28 - December 30, 2015

 

ఢిల్లీ : ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీపై ఆప్‌ మళ్లీ ధ్వజమెత్తింది. జైట్లీ రాసిన రెండు లేఖలను బయటపెట్టింది. ఢిల్లీ డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో జరిగిన ప్రతి పని అరుణ్‌జైట్లీకి తెలిసే జరిగిందని ఆప్‌ ఆరోపించింది. ఆయనకు తెలియకుండా ఏ ఒక్క పని జరగదని స్పష్టం చేసింది. జైట్లీ అవినీతిని కప్పిపుచ్చుకునే పనిలో నిమగ్నమయ్యారని పేర్కొంది. ఫ్రాడ్‌ కేసును మూసేయాలని అక్టోబర్‌ 27, 2011లో జైట్లీ పోలీస్‌ కమిషనర్‌ గుప్తాకు రాసిన లేఖను ఆప్‌ బహిర్గతం చేసింది. మే 5, 2012లో విచారణ మూసేయాలంటూ ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ రంజిత్‌ నారాయణకు రాసిన మరో లేఖను బయటపెట్టింది. అవినీతిపరులను రక్షించేందుకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న జైట్లీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆప్‌ నేత ఆశుతోష్‌ ఆరోపించారు.

21:26 - December 30, 2015

హైదరాబాద్ : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. వచ్చే ఫిబ్రవరి 6, 7 తేదీల్లో హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగే కాన్ఫరెన్స్‌లో ప్రసంగించాల్సిందిగా ఆహ్వానం అందింది. డిజిటల్‌ ఇండియాలో భాగంగా తెలంగాణలో స్టార్టప్‌ విధానంతో సాంకేతిక విప్లవం- సమగ్రాభివృద్ధి అనే అంశాలపై కేటీఆర్‌ ప్రసంగించనున్నారు. ఈ కాన్ఫరెన్స్‌కు సుమారు వెయ్యి మంది హాజరుకానున్నారు. 

21:21 - December 30, 2015

విజయనగరం : ఈ పచ్చని భూములు ఇక కనిపించవు. బిజినెస్‌ ఎంతజరుగుతుందో ఇంకా క్లారిటీ లేకపోయినా ఈ భూముల్లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ నిర్మించాలని ఏపీ సర్కార్‌ కంకణం కట్టుకుంది. అందుకు తగ్గట్లే కేంద్ర పౌర విమానయాన శాఖ ఆమోదం తెలిపింది. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో నిర్మించతలపెట్టిన ఎయిర్ పోర్టుకు మొదటి నుంచీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విశాఖపట్టణానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో ఎయిర్ పోర్టు నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు మొదలుపెట్టినప్పటినుంచే స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభించారు.

15వేల ఎకరాల భూమి సేకరణ..
విమానాశ్రయ నిర్మాణం కోసం ఏకంగా 15 వేల ఎకరాల భూమి సేకరించాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. దీన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో 5వేల ఎకరాలకు కుదించింది. ఈ మేరకు ఆగస్టు 31న జిల్లా కలెక్టర్ భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్ జారీపై ఆగ్రహించిన బాధిత ప్రజలు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. తమ గ్రామాల్లో నిరాహార దీక్షలు, జిల్లా స్థాయిలో ఆందోళనలు చేశారు. సీపీఎం నేతల మద్దతుతో ఉద్యమాన్ని తీవ్రం చేశారు. ఇదే సమయంలో రైట్స్ అనే సంస్థ సర్వేకు దిగింది. దానికి రైతులు ఎక్కడికక్కడ అడ్డుతగిలారు. పోలీసులను మోహరింపజేసి రైతులను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తూ భయపెట్టజూశారు. ఇటీవల భూ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వామపక్ష నేతలు చేపట్టిన పాదయాత్రలను అడ్డుకొని పలువురిపై కేసులు నమోదు చేశారు.

ఒప్పుకొనేది లేదంటున్న సీపీఎం..
ఇదిలా ఉండగా తాజాగా విమానాశ్రయ స్థలానికి పౌర విమానయాన శాఖ ఆమోదం తెలిపినట్లు ఆ శాఖ కార్యదర్శి రాజీవ్‌ నయన్ చౌబే ఢిల్లీలో ప్రకటించారు. దీంతో నిర్వాసితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల నుంచి భూములు సేకరించేందుకు తాము ఒప్పుకునే ప్రసక్తేలేదని సిపిఎం నేతలు అంటున్నారు. విమానయాన శాఖ ఆమోదం తెలపడంతో మౌలిక సౌకర్యాల కల్పనకు సుమారు 15 వందల కోట్ల రూపాయల అవసరం ఉంది. ఈ నిధుల కోసం వాణిజ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థలను సంప్రదించేందుకు స్పెషల్‌ వెహికల్ పర్సస్ వెహికల్‌ బోర్డు డైరెక్టర్లు ప్రయత్నాలు ప్రారంభించారు. విమానాశ్రయం కోసం భూసేకరణ విధానం లేదా భూ మార్పిడి విధానం ద్వారా గాని రైతుల నుంచి భూములను సేకరించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. 

21:19 - December 30, 2015

విజయవాడ : సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది. సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా పింఛన్లు,రేషన్‌కార్డులు, ఇసుక విధానంపై కేబినెట్‌లో చర్చించారు. అంగన్‌వాడీల వేతనాలపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి నూతన ఇసుక విధానం అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీనిపై సబ్‌కమిటీని నియమించనున్నారు. సబ్‌ కమిటీలో ఆర్థిక, మైనింగ్‌, ఇరిగేషన్‌శాఖలకు సంబంధించిన మంత్రులు ఉంటారు. యూనిట్‌కు రూ. 500 నుంచి 550 వరకు ధర నిర్ణయించాలని కేబినెట్‌ నిర్ణయించింది.

మూడో విడత జన్మభూమి..
అంగన్‌వాడీల జీతాలను పెంచాలని మంత్రివర్గం నిర్ణయించింది. మూడో విడత జన్మభూమి కార్యక్రమంపైనా కేబినెట్‌లో చర్చ సాగింది. జనవరి 2 నుంచి 11 వరకు జన్మభూమిని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పింఛన్లు, కొత్త రేషన్‌కార్డులను పంపిణీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. వైద్యశాఖలో కొత్త పథకాలు ప్రవేశపెట్టడంపైనా కేబినెట్‌లో చర్చించారు. ప్రసవం తర్వాత తల్లీ బిడ్డలను ఇంటికి చేర్చేందుకు 102 సేవలను ప్రారంభించనున్నారు. ఈసేవలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పశ్చిమగోదావరి జిల్లాలో ప్రారంభిస్తారు. ఏపీ భవన్‌లో ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రత్యేక అధికారిని నియమించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 659 గ్రామాల్లో వీధి దీపాలను ఎల్‌ఈడీ లైట్లుగా మార్చే ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. 

21:17 - December 30, 2015

హైదరాబాద్ : మండే ఎడారి.. గొంతెండిపోతున్న కష్ట సమయం.. సరిగ్గా అలాంటి సమయంలో గుక్కెడు మంచినీళ్లు దొరికితే ఎంత హాయిగా ఉంటుంది.? టికాంగ్రెస్ పరిస్థితి కూడా సేమ్‌ ఇలాగే ఉంది. ఏపీలో నష్టం జరుగుతుందని తెలిసీ తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్‌ను ఓటర్లు కనికరించలేదు. ఇక వరంగల్ ఉప ఎన్నిక ఓటమితో కుదేలైపోయింది. ఇలాంటి పీక్‌ టైంలో కాంగ్రెస్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో దక్కిన విజయాలు కరువునుంచి బయటపడేసినట్లైంది.

రెండు స్థానాల్లో విజయం...
తెలంగాణలో ప్రతిపక్షహోదాకు పరిమితమైంది మొదలు కాంగ్రెస్‌ ఎదుర్కొంటున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. తెలంగాణ రాష్ట్ర పీఠం దక్కించుకుంది మొదలు అధికార టిఆర్‌ఎస్‌ దూకుడుకు అది తలపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌కు టి కాంగ్రెస్‌ విలవిల్లాడిపోయింది. వరంగల్ ఉప ఎన్నికలో కనీసం డిపాజిట్లు దక్కని దయనీయ స్థితిలో షాక్‌తిన్నది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ 6 స్థానాలు ఏకగ్రీవంగా గెలవడంతో కాంగ్రెస్‌ సొమ్మసిల్లిపడిపోయినట్లైంది. ఇక టిఆర్‌ఎస్ దూకుడును ఎదుర్కోలేమా అనుకుంటున్న తరుణంలో రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించడంతో కాంగ్రెస్‌ కోమాలోంచి బయటపడినట్లైంది.

రంగారెడ్డిలో కూడా..
తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. అయితే ఐదు స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్‌ బరిలో దిగింది. వాటిల్లోనూ టిఆర్‌ఎస్‌ ఆకర్ష్‌, కాంగ్రెస్‌ వ్యూహాత్మక తప్పిదాలతో మూడింటిలోనే ప్రధానంగా పోటీలో నిలిచింది. మిగిలిన స్థానాల్లో టిఆర్‌ఎస్ గులాబీ జండా ఎగరేసింది. ఐతే జిల్లా నేతల పట్టుదలతో పాలమూరులో దామోదర్‌రెడ్డి, నల్గొండలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయం సాధించడంతో కాంగ్రెస్‌కు చెప్పలేని సంతోషాన్నిస్తోంది. పాలమూరులో టిఆర్‌ఎస్‌ హవాకు అడ్డుగా నిలిచి కాంగ్రెస్‌ నాయకురాలు డికె.అరుణ అన్నీ తానై నడిపించడంతో దామోదర్‌రెడ్డి విజయం సాధించారు. ఇక నల్గొండలో హస్తం నేతలు తమ కుమ్ములాటలను పక్కనబెట్టి పనిచేయడం, దీనికితోడు భారీగా ఖర్చుపెట్టడంతో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయం సాధించారు. అయితే ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుంటే రంగారెడ్డిలోనూ విజయం సాధించేవాళ్లమనే అభిప్రాయం నేతల్లో వ్యక్తమవుతోంది. మొత్తమ్మీద విజయం కోసం మొహం వాచిపోయున్న కాంగ్రెస్‌కు రెండు ఎమ్మెల్సీ స్థానాలు దక్కడం బూస్టప్‌ ఇచ్చినట్లైంది. అయితే ప్రజలు ప్రత్యక్షంగా ఓట్లేసి గెలిపించిన విజయాలు కావివి. మరో కొద్ది రోజుల్లో జరగనున్న జిహెచ్ఎంసి ఎన్నికలను బట్టి కాంగ్రెస్‌ పరిస్థితి ఏంటో ఇంకా క్లారిటీ వచ్చే అవకాశముంది.

20:41 - December 30, 2015

ఆకాశాన్ని అంటుతున్న ధరలు...భారమై పోయిన సామాన్యుడి బతుకులు..హక్కుల కోసం ఉద్యమాలు..అస్తిత్వం కాపాడుకొనే ఆరాటం..ఎప్పటిలాగే ప్రజల బాగోగులు చివరి ప్రాధాన్యతగా పెట్టుకున్న ప్రభుత్వాలు..పై పై మెరుగులు తప్ప సామాన్యుడి బతుకులు నిర్లక్ష్యం చేసే విధానాలు..ఇది తెలుగు రాష్ట్రాలు 2015లో చూసిన అనుభవాలు..అలనాటి రాజధాని అమరావతికి కొత్త వెలుగులు రాబోతున్నాయా?అమరావతి ఘన చరిత్ర సుందర వర్తమానానికి బాటలు వేస్తుందా? ఎన్నో ఆకాంక్షలు....మరెన్నో సందేహాలు..... ఆంధ్ర ప్రజల కలల రాజధానిగా అమరావతి మారుతుందా? లేక రియల్ కేంద్రంగా మిగులుతుందా? 2015మిగిల్చిన సందేహాలు అనేకం.. ప్రముఖ పార్టీలో ఓ స్థాయి ఉన్ననేత.. పైగా శాసనసభాపక్ష ఉపనేత కూడా.. సమకాలీన రాజకీయాల్లో విపక్షనేతల్లో ఓ స్థాయి ఉన్న వ్యక్తి.. భవిష్యత్తులో మరెన్నో పదవులపై ఆశలు పెట్టుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక్క దెబ్బకు చిత్తయ్యాడు.. సీన్ రివర్సై అయోమయంలో పడ్డాడు. 2015లో తెలంగాణ టీడీపీకి తగిలిన పెద్ద ఎదురుదెబ్బ ఇది..

తెలంగాణలో రైతన్నల చావు కేకలు...
వరుసగా కొన్నేళ్లుగా తెలంగాణ రైతన్నల చావుకేకలతో విలవిల్లాడుతోంది. తెలంగాణలో గత ఇరవై ఏళ్లలో అక్షరాలా 26వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రోజూ ఇద్దరు, ముగ్గురు. ఒక్కోరోజు ఐదారుగురు కూడా... ఉరికొయ్యలకు వేలాడుతున్నారు. 2015 రైతన్నలకు కన్నీళ్లే మిగిల్చింది. ఆ మాటలన్నీ వట్టి అబద్ధాలే అని తేలిపోయింది. కల్లబొల్లి కబుర్లతో జనాలను మభ్యపెడుతూ వచ్చారని అర్ధమయింది. ప్రత్యేక ప్రతిపత్తి అన్నారు.. నిధుల వరద పారిస్తామన్నారు. స్వర్ణాంధ్రను సృష్టిస్తామన్నారు. కానీ, అన్నిరకాలుగా నమ్మించి ఇప్పుడు నైస్ గా హ్యాండిచ్చారు. కష్టాల సంద్రంలో ఉన్న ఏపీ భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మార్చారు. 2015లో ఏపీ ప్రజలకు తీరని నిరాశ మిగిల్చిన అంశం ఇది.

తెలుగు రాష్ట్రాల్లో గర్చించిన తుపాకులు..
తెలుగు రాష్ట్రాల్లో తుపాకులు గర్జించాయి.. వరుస ఎన్ కౌంటర్లతో దద్దరిల్లాయి..అటు తెలంగాణ.. ఇటు ఆంధ్ర ప్రదేశ్ రెండు చోట్ల పలు ఘటనలు సంచలనం కలిగించాయి. ఎర్రచందనం కూలీలైనా, సాగర్ శృతిల విషయమైనా, ప్రభుత్వాల విధానాలకు అద్దం పడుతోంది. గోదావరి..ఈ మాటవింటేనే ఓ గంభీర రూపం... పరవళ్లు తొక్కే ఉత్సాహం.. ఉరుకుల పరుగుల ప్రవాహం కళ్లముందు కదలాడుతుంది. ఆ అందాల గోదావరి.... తెలుగు ప్రజల బతుకు కెరటాల గోదావరిగా .... వేదంలా ఘోషించే గోదావరిలా.. తెలుగు వారితో పెనవేసుకుపోయింది. పుష్కర గోదావరిగా 2015లో రారమ్మని పిలిచింది. కానీ, అంతలోనే అంతులేని విషాదం ఒకటి ప్రజలను వణికించింది.

పోరాటాలు...
ఊరికి చాకిరీ చేస్తారు కాని వారు ఉద్యోగులు కాదట..పథకాల అమలులో, ఊరిని స్వచ్ఛంగా మార్చటంలో, ఆరోగ్య పథకాలు గమ్యాన్ని చేర్చటంలో వారే వాహకాలు కానీ, వారికి ప్రోత్సాహకాలు ఉండవు..కొండంత బరువులెత్తుతున్నా గోరంత జీతం లేని బడుగులు... తమ బతుకులకు న్యాయం చేయాలంటూ 2015లో అంగన్‌వాడీలు, ఆశావర్కర్లు, మున్సిపల్ కార్మికులు ఉద్యమించారు..అధికారంలో లేనపుడు వ్యతిరేకించారు..!! అందలం ఎక్కాక అడ్డం తిరిగారు..!!గిరిపుత్రుల బతుకుల్లో మట్టికొట్టడానికి రెడీ అయ్యారు...!! ఏపీ సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆదివాసీలు ఆందోళనలు తీవ్రంచేశారు. గిరిజనమంతా ఏకమై సర్కారుపై పోరాటానికి సైఅన్నారు. దీంతో సర్కారు బాక్సైట్ తవ్వకాలపై ప్రస్తుతానికి వెనక్కు తగ్గింది.

సత్తా చాటిన బాహుబలి..
ఇండియన్ సెల్యులాయిడ్ పై ఆవిష్కృతమైన భారీ చిత్రం.. కనీవినీ ఎరుగనంత భారీ బడ్జెట్.. ఎన్నో అంచనాల మధ్య.. మరెంతో ఉత్కంఠను రేకెత్తించి, లక్షలాది ప్రేక్షకులను అలరించింది. మగధీర, ఈగ బాటలోనే బాహుబలి సత్తా చాటింది. 2015లో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటింది.  ఇవీ 2014లో తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ముఖ్య ఘటనల వివరాలు. అనంత కాల గమనంలో మరో వసంతం గడిచిపోతోంది. 2015 రెండు రాష్ట్రాల్లో శాంతి, సామరస్యాలు నెలకొని, ప్రజలకు మంచి జరగాలని ఆశిద్దాం... మరిన్ని ముఖ్యాంశాలను తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

మరో మూడు నోటిఫికేషన్లు జారీ..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇవాళ గ్రూప్-2 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. గ్రూప్-2తోపాటు మరో 350 పోస్టులకు కూడా నోటిఫికేషన్లు జారీ చేసింది. మెట్రో వాటర్ వర్క్స్‌లో డిప్యూటీ మేనేజర్ 2 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి నుంచి జనవరి 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మెట్రో వాటర్ బోర్డు టెక్నికల్ గ్రేడ్-2 పోస్టులు 44 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయింది. రేపటి నుంచి జనవరి 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్ పేర్కొంది. టెక్నికల్ గ్రేడ్-2 అగ్రికల్చరల్ విస్తరణ అధికారులు 311 పోస్టుల భర్తీ కోసం కూడా ప్రకటన జారీ చేసింది.

20:32 - December 30, 2015

స్థానిక సంస్థల్లో కారు జోరు..ఊపుకోచ్చిన కాంగ్రెస్..గ్రేటర్ లో మంత్రి కేటీఆర్ పర్యటన..పశ్చిమగోదావరి జిల్లాలో టిడిపి జడ్పీ ఛైర్మన్, మంత్రి మాణిక్యాలరావు కొట్లాట..కరీంనగర్ లో రూ.1కే మంచినీరు..ఎన్ టాయిలెట్ మనీ..మాజీ ప్రధాని చదువు పత్రాలు సత్రోలు...ఎమ్మార్వో కార్యాలయంలో లంచగొండి అధికారిని..కూకట్ పల్లి వద్ద ఈవ్ టీజింగ్ చేసిన యువకుడికి దేహశుద్ధి..ఖర్జూర కల్లు..దానిమ్మ వైన్..పోలీసోళ్లను పొర్క పొర్క కొట్టిన జనం..తమిళనాడులో దిష్టిబొమ్మను కాల్చబోయి ధోతులను కాల్చుకున్నారు...ఈ అంశాలపై టెన్ టివిలో 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో 'మల్లన్న' తనదైన శైలిలో విశ్లేషించారు. వివరాలకు వీడియో క్లిక్ చేయండి..

19:53 - December 30, 2015

మహబూబ్ నగర్ : పాలమూరు జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఒక స్థానాన్ని టీఆర్ఎస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి, మరో స్థానాన్ని కాంగ్రెస్ అభ్యర్థి కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కైవసం చేసుకున్నారు. తెలుగుదేశం అభ్యర్థి ఎక్కడా పోటీలో లేకుండా పోయారు. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసిపోవడంతో.. అభ్యర్థులంతా ఇప్పుడు జమా ఖర్చుల లెక్కలు వేసుకుంటున్నారు. గతానికి భిన్నంగా ఈ ఎన్నికలు ఎంతో ఖరీదైనవిగా నిలిచాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అధికార పార్టీ అభ్యర్థి రూ.15 కోట్లు ఖర్చు..
పాలమూరు బరిలో నిలిచిన ఐదుగురు అభ్యర్థుల్లో.. ఇండిపెండెంట్‌ మినహా మిగతా నలుగురు విపరీతంగా డబ్బులు ఖర్చు చేశారు. ఓట్లను దక్కించుకోవడానికి వారం రోజులపాటు క్యాంపులు నిర్వహించడం... శిబిరంలోని ప్రతి ఓటరుకూ నగదు, ఆభరణాల కానుకల సమర్పణల ద్వారా ప్రతి అభ్యర్థికీ ఖర్చు తడిసి మోపెడైనట్లు ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీకి చెందిన ఓ అభ్యర్థి దాదాపు 15 కోట్ల దాకా ఖర్చు చేసినట్లు సమాచారం. గెలుపు కోసం.. ఇతను ఒక్కో ఓటరుకు రెండు లక్షల రూపాయల వరకూ చెల్లించి.. గెలుపును ముందే ఫిక్స్‌ చేసుకున్నారన్నది పాలమూరు టాక్‌. అధికార పార్టీకి చెందిన రెండో అభ్యర్థి ఖర్చులో కాస్తంత వెనుకబడ్డంతో ప్రతికూల ఫలితం వచ్చిందనీ చెబుతున్నారు.

ఇద్దరు మంత్రులు..
పాలక పక్షం అభ్యర్థుల గెలుపు బాధ్యతలను మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిలు స్వీకరించారు. వీరిలో ఓ మంత్రి వ్యూహం ఫలించగా..మరో మంత్రి వ్యూహం.. నిధుల లేమి కారణంగా విఫలమైందని సమాచారం. దీనికి తోడు.. నిర్దిష్టమైన ప్రణాళిక లేకపోవడం.. ఓటర్లను ఆకట్టుకోలేక పోవడం కూడా టీఆర్ఎస్‌ రెండో అభ్యర్థి పరాజయానికి కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయినా ఇతనికి తక్కువలో తక్కువగా.. ఐదు కోట్ల రూపాయల వరకూ ఖర్చయినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

దామోదర్ రెడ్డి ఖర్చు చేసింది రూ.8 కోట్లు ?
ప్రతిపక్షపార్టీలు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్... గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డి సఫలీకృతమైంది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన కూచుకుళ్ల దామోదర్ రెడ్డి మరోసారి తన అదృష్ఠాన్ని పరీక్షించుకున్నాడు. ఈయన దాదాపు 8 వరకూ ఖర్చు చేసినట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఓటరును బట్టి లక్ష నుంచి రెండు లక్షల వరకూ సమర్పించుకున్నట్లు చర్చించుకుంటున్నారు.

గెలుపుపై ఆశలు పెట్టుకోని దయాకర్..
ఇక టీడీపీ అభ్యర్థి కొత్తకోట దయాకర్ రెడ్డికి పార్టీ ఫండ్ ఎక్కువ మొత్తంలోనే వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కాస్తో కూస్తో బలం ఉన్న పాలమూరులో ఎలాగైనా గెలిచి ఉనికిని చాటుకోవాలనే ఉద్దేశంతో టీడీపీ అధిష్ఠానం భారీ మొత్తాన్నే పంపినట్లు సమాచారం. అయితే గెలుపుపై అంతగా ఆశలు లేని దయాకర్ రెడ్డి పార్టీ ఫండ్‌ నుంచి 70 శాతం మేర నిధులు ఖర్చు చేశారని.. చివరి నిమిషంలో ఖర్చు విషయంలో డ్రాప్‌ అయ్యారనీ చెబుతున్నారు.

కళకళ..
మొత్తమ్మీద పాలమూరు జిల్లాలో... నలుగురు అభ్యర్థులూ కలిపి.. సుమారు 35 కోట్లకు పైగానే ఖర్చు చేసినట్లు టాక్‌. ఎన్నికల పరిశీలకులూ అభ్యర్థుల వ్యూహాత్మక వ్యయాన్ని పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇన్నాళ్లు అభివృద్ధి నిధులు లేక బోసిపోయిన స్థానిక సంస్థలు వాటి ప్రతినిధులు ఎమ్మెల్సీ ఎన్నికల పుణ్యమా అని కాస్త కళకళలాడుతున్నట్లు సమాచారం. 

19:46 - December 30, 2015

ఖమ్మం : స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్‌కు చెందిన బాలసాని లక్ష్మీనారాయణ ఘన విజయం సాధించారు. నిజానికి ఇక్కడి గెలుపు.. బాలసానిది అనడం కన్నా.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుదే అనడంలో అతిశయోక్తి లేదు. కేవలం నలుగురు సభ్యులు మాత్రమే ఉన్న టీఆర్ఎస్‌కు.. 313 ఓట్లు దక్కడం వెనుక.. తుమ్మల వ్యూహమే కారణం. ఈ ఎన్నికల్లో అన్నీ తానై చక్రం తిప్పి.. పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నారు. అయితే.. అడుగడుగునా.. ప్రలోభాల వల.. అనుక్షణం.. ఆపరేషన్‌ ఆకర్షాస్త్ర ప్రయోగాలతో పాలక పక్షం అనైతికతకు పాల్పడిందన్న విమర్శలూ మూటగట్టుకున్నారు. తెలంగాణలోనే పూర్తి బలహీనంగా ఉన్న ఖమ్మం జిల్లాలో.. టీఆర్ఎస్‌ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుపొందారు. సీపీఐ అభ్యర్థి పువ్వాడ నాగేశ్వరరావుకు.. వైసీపీ మినహా ప్రతిపక్షాలన్నీ సంఘీభావం ప్రకటించాయి. అయినా.. పాలకపక్షం గెలుపును నిలువరించలేక పోయాయి. 31 ఓట్ల తేడాతో.. సీపీఐ అభ్యర్థిపై.. టీఆర్ఎస్‌ అభ్యర్థి బాలసాని లక్ష్మీనారాయణ గెలుపొందారు.

వలసలకు ప్రోత్సాహం..
ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూలు విడుదలైంది మొదలు.. పాలక పక్షం విపరీతంగా వలసలను ప్రోత్సహించిందన్న ఆరోపణలున్నాయి. ప్రలోభాలతో.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఓటర్లను తమవైపు లాగేసుకున్నారన్నది టీఆర్ఎస్‌పై విమర్శ. వైరా ఎమ్మెల్యేకి సంబంధించి బయటపడ్డ వీడియో ఫుటేజీ ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. మరోవైపు.. ఈ ఎన్నికల్లో అసెంబ్లీ సాధారణ ఎన్నికల స్థాయిని మించి.. ధనప్రవాహం సాగిందన్న ఆరోపణలూ లేకపోలేదు.

శిబిరాలు..
ఓవైపు విపక్ష ఓటర్లకు గాలం వేస్తూనే.. తమ శిబిరంలోని వారు ఇంకో పార్టీవైపు చూడకుండా.. పాలక పక్షం పకడ్బందీగా క్యాంపులను నిర్వహించింది. ఎన్నికల షెడ్యూలు రోజు నుంచే జిల్లాలో క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి. టీఆర్ఎస్‌ అభ్యర్థి బాలసాని లక్ష్మీనారాయణ, సీపీఐ అభ్యర్థి పువ్వాడ నాగేశ్వరరావు, వైసీపీ అభ్యర్థి లింగాల కమల్ రాజ్‌లు మద్దతుదారులతో క్యాంపులు నిర్వహించారు. టీఆర్ఎస్‌ హైదరాబాద్‌లో శిబిరాన్ని నిర్వహించగా.. మిగిలిన పార్టీలు శిబిరాలను ఏపీకి తరలించాయి.

బాలసానికి 313 ఓట్లు...
మొత్తం 20 రోజుల పాటు సాగిన ఈ శిబిరాల్లోనూ.. వైరిపక్షం సభ్యులను ఆకర్షించేందుకు..పార్టీలు వలలు వేసినట్లు సమాచారం. ఈ క్రమంలో పాలకపక్షం అగ్రభాగాన నిలిచిందని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్‌ తరఫున కేవలం నలుగురే ప్రజాప్రతినిధులు గెలిచారు. అలాంటిది ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆపార్టీ అభ్యర్థి బాలసాని లక్ష్మీనారాయణకు 313 ఓట్లు లభించడం విశేషం. పాలకపక్షం ప్రలోభాలే దీనికి కారణమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

పాలకపక్షం రూ.12 కోట్లు ఖర్చు...
అధికార పార్టీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, గ్రామాలకు రోడ్లు, తదితర అభివృద్ధి పనులకు సంబంధించి విపరీతమైన హామీలు గుప్పించి వైరి వర్గం ఓట్లను ఆకర్షించిందనీ అంటున్నారు. హైదరాబాద్ లోని టిఆర్ఎస్ శిబిరానికి పలువురు రాష్ట్ర మంత్రులే ప్రత్యక్షంగా వచ్చి.. ఓటర్లకు తమ, తమ స్థాయిలో హామీలిచ్చినట్లు సమాచారం. ఇక డబ్బుల పందేరమూ భారీస్థాయిలోనే జరిగినట్లు చెబుతున్నారు. పాలక పక్షం దాదాపు 12 కోట్ల వరకూ ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సీపీఐ అభ్యర్థి పువ్వాడ నాగేశ్వరరావు తరఫున ఆయన కుమారుడు.. స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ కూడా శిబిరం నిర్వహణకు భారీగానే ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. ఈ శిబిరంలో ఉన్న ఒక వామపక్ష పార్టీ మాత్రం ప్రలోభాలకు దూరంగా ఉంది. ఇక వైసీపీ నేతలూ శిబిరం నిర్వహణకు భారీగా ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. డబ్బులతో పాటు.. బంగారు గొలుసులనూ కానుకగా సమర్పించినట్లు ప్రచారం జరుగుతోంది. ఓటర్లు శిబిరాల్లో ఉన్నా.. వారి కుటుంబ సభ్యులను ప్రలోభ పెట్టి.. ఓట్లు తమకే పడేలా పార్టీలు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

మండిపడుతున్న ప్రజాస్వామ్యవాదులు...
ఎవరికి వారు తాము విసిరిన ప్రలోభాల వలకు ఓటర్లు చిక్కుకుంటారని లెక్కలు వేసుకున్నారు. చివరకు ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించటంతో.. పాలక పక్షంలో ఉత్సాహం నెలకొంది. పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి కట్టబెట్టిన కేసీఆర్‌కు.. ఎమ్మెల్సీ స్థానాన్ని కానుకగా ఇవ్వాలన్న తపనతో.. ముందునుంచీ శ్రమించిన తుమ్మల నాగేశ్వరరావు.. చివరికి అనుకున్నది సాధించారు. అన్ని రకాల ప్రలోభాలకు లోను చేసి మెజారిటీ ఓటర్లు తమవైపు ఉండేలా చూసుకున్నారు. మరోవైపు.. ఈ ప్రలోభాల వ్యవహారంపై ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు. నైతికత, ప్రజాస్వామ్యం అనే పదాలకు ఈ ఎన్నికలు అర్దం లేకుండా చేశాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

19:39 - December 30, 2015

నల్గొండ : తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాల రిజల్ట్స్‌ వచ్చేశాయి. అయితే ఈ ఎన్నికల్లో అత్యంత ఉత్కంఠను కలిగించిన స్థానమేదైనా ఉందంటే అది ఖచ్చితంగా నల్గొండ స్థానమే. బరిలో దిగిన ప్రధాన అభ్యర్థులు ఇద్దరూ ఆర్థికంగా హేమాహేమీలే. పార్టీల పరంగా మంచి పలుకుబడి ఉన్న క్యాండెట్లే. ఇద్దరికీ గెలుపు ప్రతిష్టాత్మకమే. ఈ నేపథ్యంలోనే ఆ ఎమ్మెల్సీ స్థానంపై అత్యంత ఉత్కంఠ నెలకొంది. అయితే కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపొందాడంటే అసలు కారణం మరోటి ఉంది. ఆ కారణమే అద్వితీయమైన విజయాన్ని అందించింది. ఇద్దరూ వారివారి పొజీషన్లు బట్టి హేమాహేమీలు. అందుకే మిగతా ఎమ్మెల్సీ స్థానాలకన్నా నల్గొండ ఎమ్మెల్సీ పోరు అందరి దృష్టినీ ఆకర్షించింది. అంతేకాదు అన్ని పార్టీలూ నల్గొండపై ఫోకస్‌ పెట్టడం వెనక మరో కారణముంది. అదే మనీ.

ఖర్చు 100 కోట్లు..
నల్గొండ జిల్లాలో ఉన్నది మొత్తం 1110 ఓటర్లు, అయిన ఖర్చు మాత్రం 100 కోట్లు. గత సాధారణ ఎన్నికల్లో భువనగిరి నుంచి ఎంపి అభ్యర్థిగా పోటీచేసి స్వల్ప తేడాతో ఓటమి పాలైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఈసారి ఎమ్మెల్సీ బరిలో దిగారు. ఆయనకు ఆర్థికంగా సరితూగే అభ్యర్థి కావాలని టిఆర్‌ఎస్... వ్యాపారవేత్త తేరాచిన్నపరెడ్డిని పోటీకి దింపింది. దీంతో ఇరు పార్టీలూ ఓటర్లను శక్తివంచన లేకుండా ఆర్థికంగా ప్రభావితం చేశాయని జిల్లాలో జోరుగా చర్చసాగుతోంది.

1110 మంది ఓటర్లు..
జిల్లాలో మొత్తం 1110 మంది స్థానిక సంస్థల ఓటర్లు ఉండగా వారిలో ఓటు హక్కు వినియోగించుకోని 9 మంది సిపిఎం ఓటర్లు, మరో స్వతంత్ర అభ్యర్థి ఓటు మినహా రాజకీయ పార్టీలకు అతీతంగా అందరికీ పచ్చనోట్లు అందినట్లు సమాచారం. ఒక్కొక్కరికి మూడు నుంచి కోటి రూపాయల దాకా నోట్లు పంచినట్లు తెలుస్తోంది. కొందరు ఇరు పార్టీల అభ్యర్థుల దగ్గరా ఆమ్యామ్యా పుచ్చుకున్నట్లు టాక్. అలా ఏకంగా 700 మంది ఉన్నట్లు సమాచారం. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు తలా లక్ష రూపాయలు, తర్వాత మరో రెండు లక్షలు అందించినట్లు తెలుస్తోంది. అంతేగాక ఇతర పార్టీలకు చెందిన ఓటర్లను ముగ్గురిని తెచ్చినవారికి అదనంగా మరో విలువైన బహుమతినీ ఇచ్చినట్లు సమాచారం. ఎన్నికలు సమీపించే కొద్ది కొంతమంది కాంగ్రెస్‌ స్థానిక సంస్థల సభ్యులు అధికార పార్టీలోకి వెళ్తున్నారన్న సమాచారం అందడంతో 550 మంది ఓటర్లతో వివిధ ప్రాంతాల్లో క్యాంపులు నిర్వహించారు. మొత్తమ్మీద కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థికి 50 కోట్లకు పైగానే ఖర్చైనట్లు ఆయా వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

టీఆర్ఎస్ అభ్యర్థికి 60 కోట్లు ఖర్చు...?
ఇక అధికార టిఆర్‌ఎస్‌ కూడా విజయం కోసం బాగానే ఓటర్లను ప్రభావితం చేసేందుకు ట్రై చేసిందని సమాచారం. ఒక్కో ఓటరకు మూడు లక్షలు చెల్లించుకున్నట్లు... పోలింగ్‌కు ముందు పార్టీలో చేరినవారిని బాగానే సంతృప్తిపరిచినట్లు జోరుగా చర్చ జరుగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్‌కు మూడు రోజుల ముందునుచే టిఆర్‌ఎస్ అభ్యర్థి తేరాచిన్నపరెడ్డి క్యాంపెన్లు నిర్వహించారు. నిజానికి టిఆర్ఎస్‌కు మొదట్లో 136 మంది ఓటర్లు అనుకూలంగా ఉండగా వివిధ పార్టీల నేతలు వలసరావడంతో ఆ పార్టీ బలం 455కి చేరింది. మొత్తంగా టిఆర్‌ఎస్‌ అభ్యర్థికి 60 కోట్ల వరకు ఖర్చైనట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కోమటిరెడ్డికే విజయం..
అధికార పార్టీ విజయం కోసం ఎంత కృషి చేసినా చివరకు కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డినే విజయం వరించింది. కాంగ్రెస్‌ అభ్యర్థికి 642 ఓట్లు రాగా టీఆర్ఎస్‌ అభ్యర్థికి 449 ఓట్లు దక్కాయి. ఇదే సమయంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఇతర స్థానిక సంస్థల నేతలూ బాగానే బాగుపడ్డారని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. 

19:35 - December 30, 2015

హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాలక టీఆర్ఎస్‌ దూకుడు కొనసాగింది. పోటీ చేసిన ఆరు స్థానాలకు గాను.. నాలుగింట ఆపార్టీ అభ్యర్థులు గెలుపొందారు. మూడుస్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌.. రెండు చోట్ల గెలిచి పరువు దక్కించుకుంది. కాంగ్రెస్‌కు.. ఈ ఫలితాలు ఓరుగల్లు ఓటమి భారాన్ని కొంతైనా తగ్గించాయనే చెప్పాలి. ఇక టీడీపీకి ఈ ఎన్నికల్లోనూ దారుణ పరాభవం తప్పలేదు. మొత్తానికి షెడ్యూలు ప్రకారం 12 స్థానాలకు ఎన్నికలు ప్రకటించగా.. టీఆర్ఎస్‌ మొత్తం పది స్థానాలను గెలుచుకుని దూకుడును ప్రదర్శించింది. తెలంగాణలో హోరాహోరీగా జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ హవా కొనసాగించింది. ఆపార్టీ నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లోని రెండు స్థానాలతో పాటు.. పాలమూరు జిల్లాలోని ఓ స్థానాన్నీ టీఆర్ఎస్‌ గెలుచుకుంది. గతంలోనే ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ గెలుపుతో పాలక టీఆర్ఎస్‌ మొత్తం పది ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకుని.. మండలిలో బలాన్ని గణనీయంగా పెంచుకుంది. మొత్తం ఆరుస్థానాలకు ఎన్నికలు జరిగిన.. ఖమ్మం, నల్లగొండ జిల్లాల ఎన్నికలను పాలక, ప్రతిపక్ష పార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించాయి. ఖమ్మంలో టీఆర్ఎస్‌, నల్లగొండలో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందారు. నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్‌ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డిని.. కాంగ్రెస్‌ అభ్యర్థి రాజగోపాలరెడ్డి 193 ఓట్ల భారీ మెజారిటీతో ఓడించారు. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీనేత జానారెడ్డి, ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లాంటి దిగ్గజాలున్న ఈ జిల్లాలో.. కాంగ్రెస్‌ పార్టీ తాజా విజయంతో పరువును దక్కించుకుంది. జిల్లాలో మొత్తం పదకొండు వందల ఓట్లు పోలవగా.. కాంగ్రెస్‌ అభ్యర్థికి 642, టీఆర్ఎస్‌ అభ్యర్థికి 449 ఓట్లు వచ్చాయి. మూడు ఓట్లు ఇద్దరు ఇండిపెండెంట్లకు దక్కగా.. మరో ఆరు ఓట్లు చెల్లకుండా పోయాయి. ఈ విజయంతో.. కాంగ్రెస్‌ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా సంబరాల్లో మునిగి తేలుతున్నారు.

ఖమ్మంలో...
ఇక రాష్ట్రాన్ని ఆకర్షించిన మరో జిల్లా ఖమ్మం ఎమ్మెల్సీ స్థానం పాలకపక్షానికే దక్కింది. ఇక్కడ టీఆర్ఎస్‌ అభ్యర్థి బాలసాని లక్ష్మీనారాయణ 31 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓట్లలో 313 ఓట్లు రాగా.. రెండో ప్రాధాన్యతలో మరో మూడు ఓట్లు జతకలిశాయి. సీపీఐ అభ్యర్థి పువ్వాడ నాగేశ్వరరావుకు మొదటి ప్రాధాన్యతలో 275 ఓట్లు రాగా రెండో ప్రాధాన్యతలో 10 ఓట్లు మాత్రమే లభించాయి. దీంతో ఆయనకు మొత్తం 285 ఓట్లు దక్కాయి. వైసీపీ అభ్యర్థి లింగాల కమల్‌రాజుకు మెదటి ప్రాధాన్యతలో 102 ఓట్లు రాగా రెండో ప్రాధాన్యతలో ఒక్క ఓటూ రాలేదు. అయితే ఇద్దరు స్వతంత్య్ర అభ్యర్థులకు నామినేషన్‌ దాఖలు సమయంలో బలపర్చిన 10 మంది సభ్యులు కూడా ఓటు వేయకపోవడం గమనార్హం. ఫలితంగా 31 ఓట్ల తేడాతో సీపీఐపై తెరాస అభ్యర్థి విజయం సాధించింది. తెరాస విజయంతో ఆపార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.

మహబూబ్ నగర్..రంగారెడ్డి...
మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని రెండు స్థానాలను, కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌లు చెరొకటి పంచుకున్నాయి. ఇక్కడ టీఆర్ఎస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన కసిరెడ్డి నారాయణరెడ్డి.. సమీప కాంగ్రెస్‌ అభ్యర్థిపై 65 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. నారాయణరెడ్డికి 445 ఓట్లు రాగా.. కాంగ్రెస్‌ అభ్యర్థికి 380 ఓట్లు పోలయ్యాయి. మరో స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి దామోదర్‌రెడ్డి విజయం సాధించారు. రంగారెడ్డి జిల్లాలో... గ్రూపు తగాదాలు కాంగ్రెస్‌ కొంప ముంచాయి. ఇక్కడ రెండు ఎమ్మెల్సీ స్థానాలనూ అధికార పక్షం కైవసం చేసుకుంది. తెరాస అభ్యర్థులుగా బరిలో దిగిన నరేందర్‌రెడ్డి, శంభీపూర్‌రాజు గెలుపొందారు. తెరాస విజయంతో ఆపార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. 

సమాజ్ వాది పార్టీ నేతకు బెయిల్..

ఉత్తర్ ప్రదేశ్ : యూపీ పంచాయతీ ఎన్నికల్లో బూత్ క్యాప్చరింగ్ చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన సమాజ్ వాది పార్టీ నేత తొతారం యాదవ్ కు బెయిల్ మంజూరైంది. 

19:14 - December 30, 2015

విజయనగరం : ఎయిర్ పోర్టు నిర్మాణానికి పౌర విమానయాన శాఖ నుండి బుధవారం క్లియరెన్స్ లభించడంపై సీపీఎం కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ స్పందించారు. ఆయన టెన్ టివితో మాట్లాడారు. ప్రస్తుతమున్న ఎయిర్ పోర్టులో ప్రయాణీకులు లేకుండా వెలవెలబోతోందని, ఇక్కడ ఎయిర్ పోర్టు వద్దని తాము గత కొన్ని నెలలుగా ఆందోళన చేయడం జరుగుతోందన్నారు. దీనివల్ల ఎలాంటి ఉపాధి రాదని, ఎయిర్ పోర్టు వద్దని రైతులు చెబుతున్నా వినడం లేదన్నారు. వందలాది పోలీసులు నిర్భందాలు ప్రయోగించారని, ప్రజల నుండి ప్రతిఘటన తీవ్రంగానే వచ్చిందన్నారు. ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వమని అక్కడి రైతులు తేల్చి చెబుతున్నారని స్పష్టం చేశారు. ప్రజలను కదిలిస్తామని, ఇప్పటికే గ్రామాల్లోకి అధికారులను రాకుండా గ్రామస్తులు అడ్డుకుంటున్నారని తెలిపారు. 

19:11 - December 30, 2015

హైదరాబాద్ : తెలంగాణలో సర్కారీ కొలువును చేజిక్కించుకోవడమే లక్ష్యంగా కష్టపడి చదువుతున్న అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్ - 2 నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) బుధవారం సాయంత్రం విడుదల చేసింది. కేవలం 439 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం నిరుద్యోగుల నుండి కొంత అసంతృప్తులు వ్యక్తమౌతున్నట్లు తెలుస్తోంది. వేలాది పోస్టులు ఖాళీగా ఉంటే కొన్నింటికే నోటిఫికేషన్ జారీ చేయడంపై పలువురు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఇదిలా ఉంటే గురువారం నుండి మరిన్ని నోటిఫికేషన్స్ విడుదల చేస్తామని టీఎస్పీఎస్సీ పేర్కొంటోంది. ప్రస్తుతం ఏసీటీవో, మున్సిపల్ కమిషనర్లు, ఎక్సైజ్ సబ్ ఇన్ స్పెక్టర్ల పోలీసుల పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. గురువారం నుండి ఫిబ్రవరి 9 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు లభ్యం కానున్నాయి. ఏప్రిల్ 24, 25 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. నెల రోజుల్లో రిజల్ట్స్ ప్రకటిస్తామని టీఎస్పీఎస్పీ పేర్కొంటోంది. 

నెట్ నూట్రాలిటి..తుది గడువు పెంపు..

న్యూఢిల్లీ : నెట్ నూట్రాలిటీ అంశంపై తుది గడువును మరింత పొడిగిస్తున్నట్లు ట్రాయ్ వెల్లడించింది. కామెంట్స్ ను పంపించేందుకు గడువు బుధవారంతో ముగియాల్సి ఉందని, అయితే టెలికాం కంపెనీల అభ్యర్థన మేరకు ఆ గడువును జనవరి 7 వరకు పెంచుతున్నట్లు ట్రాయ్ ఛైర్మన్ ఆర్ఎస్ శర్మ పేర్కొన్నారు. 

ఎర్రచందనం స్మగ్లింగ్..ముగ్గురు చైనీయుల అరెస్టు..

కడప : ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురు చైనీయులను కడప జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వీరిని బుధవారం మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. వీరి వద్ద నుండి 1.4 టన్నుల ఎర్రచందనం, ఐదు లాప్ టాప్ లు, 12 మొబైల్స్, రూ.78వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎర్రచందనం స్మగ్లింగ్ ఆపరేషన్ స్పెషల్ అధికారి రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. 

గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలైంది. 439 పోస్టులకు సబ్ రిజిష్ట్రార్, ఏసీటీవో, మున్సిపల్ కమిషనర్లు, ఎక్సైజ్ సబ్ ఇన్ స్పెక్టర్ల పోలీసులకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. రేపటి నుండి ఫిబ్రవరి 9 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు లభ్యం కానున్నాయి. ఏప్రిల్ 24, 25 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. 

18:22 - December 30, 2015

విజయనగరం : భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం వద్దు..తాము ఉపాధి కోల్పోతామని..రోడ్డున పడుతామని రైతులు ఎంత మొత్తుకున్నా కనికరం రాలేదు. ఈ ఎయిర్ పోర్టు నిర్మాణానికి పౌర విమానయాన శాఖ నుండి బుధవారం క్లియరెన్స్ లభించింది. దీనితో అక్కడి బాధిత గ్రామాల్లో తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. ఈ భూములు లాక్కొంటే తమ ఉపాధి పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం చేయాలని ఏపీ ప్రభుత్వం భావించింది. అందుకు భూ సేకరణ చేయాలని నిర్ణయానికి వచ్చింది. తమ భూములు లాక్కోవద్దని రైతులు ఎన్నోమార్లు విజ్ఞప్తులు చేశారు. వీరి ఆవేదనను సర్కార్ పెడచెవిన పెట్టింది. చివరకు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళనలు చేశారు. వీరి ఆందోళనలపై పోలీసులు ఉక్కుపాదం మోపే ప్రయత్నాలు చేశారు. 15 వేల ఎకరాల భూమి సేకరించేందుకు ప్రయత్నించింది. దీనిపై తీవ్రంగా వ్యతిరేకత రావడంతో 5వేల ఎకరాలకు కుదించింది. అయినా కూడా రైతులు సమ్మతించలేదు. భూమి కోల్పోతే తాము ఎలా బతకాలని నిలదీశారు. తమకు భూమే జీవనాధారమని, ఇది పోతే ఎలా బతుకుతామని ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. అయినా ఏపీ సర్కార్ ముందుకెళ్లేందుకు నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 31న భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పటి దాక మెల్లిగా సాగిన ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. తాజాగా పౌర విమానయాన శాఖ క్లియరెన్స్ ఇవ్వడంతో పోరాటం మరింత ఉధృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

18:18 - December 30, 2015

విజయవాడ : ఫిబ్రవరి 1వ తేదీ నుండి నూతన ఇసుక విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తెలిపారు. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం సమావేశానికి సంబంధించిన అంశాలను ఆయన మీడియాకు తెలియచేశారు. ఏర్పాటు చేసిన జిల్లా శాండ్ కమిటీలలో జిల్లా కలెక్టర్ ఛైర్మన్ గా వ్యవహరిస్తారని పేర్కొన్నార. జనవరి 2వ తేదీ నుండి మూడో విడత జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. జన్మభూమిలో అభివృద్ధి సంక్షేమ పథకాలకు పెద్ద పీఠ వేస్తామని, స్మార్ట్ విలేజ్ స్మార్ట్ వార్డులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం జరుగుతుందని ఇందులో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. 

భోగాపురం స్థలానికి పౌర విమానాయన శాఖ క్లియరెన్స్..

విజయనగరం : భోగాపురం స్థలానికి పౌర విమానాయన శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. ఐదు వేల ఎకరాల్లో ఎయిర్ పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం యోచిస్తోంది. ప్రతిపాదిత స్థలంలో 1600 ఎకరాల అసైన్డ్ భూములున్నాయి. ఎయిర్ పోర్టు వద్దంటూ ఇప్పటికే విపక్షాలు, స్థానికులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. 

బెజ్జంకి వ్యవసాయ మార్కెట్ లో మంత్రి హరీష్ రావు..

కరీంనగర్ : బెజ్జంకి వ్యవసాయ మార్కెట్ ను మంత్రి హరీష్ రావు సందర్శించారు. జిల్లాకు కొత్తగా 13 కొత్త మార్కెట్ యార్డులను మంజూరు చేస్తామని, ప్రాణహిత చేవెళ్ల, మిడ్ మానేరు ద్వారా మండలంలో 25 ఎకరాలకు సాగునీరందిస్తామని, రూ. 30 కోట్లతో తోటపల్లి చెరువు అభివృద్ధి చేస్తామని తెలిపారు. 

'ఎయిర్ ఇండియా నష్టాలు లేకుండా ముందుకెళుతోంది'

ఢిల్లీ : ఎయిర్ ఇండియా నష్టాలు లేకుండా ముందుకెళుతోందని కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు పేర్కొన్నారు. పౌర విమానయాన శాఖకు సంబంధించి ఎన్ వోసీ అప్లికేషన్ సిస్టమ్ 2.0 ను ఆయన ప్రారంభించారు. విమానాశ్రయాల సమీపంలో నిర్మాణాలకు ఎన్ వోసీ ఇచ్చేందుకు ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు మాట్లాడారు. అమెరికా యూనివర్సిటీ విషయంలో అక్కడి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సినవసరం ఉందన్నారు. విద్యార్థులు గుర్తింపు లేని అమెరికా యూనివర్సిటీలకు వెళితే ఇమ్మిగ్రేషన్ అధికారులు తిరిగి పంపిస్తున్నారని తెలిపారు.

తిరుపతిలో రూ.30లక్షల చోరీ..

చిత్తూరు : తిరుపతి తిలక్ రోడ్డులోని శ్రీదేవి కాంప్లెక్సు వద్ద డ్రైవర్ దృష్టి మరల్చి కారులో ఉన్న రూ. 30 లక్షలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. పోలీసులు విచారణ చేపట్టారు. 

సెట్ టాప్ బాక్సుల గడువు పొడిగింపుపై సుభాష్ రెడ్డి హర్షం..

హైదరాబాద్ : సెట్ టాప్ బాక్సుల గడువు పెంపుపై ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఎంఎస్ వో సుభాష్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇండియాలో సెట్ టాప్ బాక్సులకు కొరత ఉందని, ప్రభుత్వానికి 40 శాతం పన్నులు చెల్లించడం జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డిజిటలైజేషన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తమ ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు.

పేదలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది - సీపీఎం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలతో చెలగాటమాడుతోందని సీపీఎం సిటీ సెక్రటరీ శ్రీనివాస్ విమర్శించారు. ఇళ్లు శంకుస్థాపనలు చేస్తున్న మంత్రులు ఎక్కడ, ఎలా దరఖాస్తు చేసుకోవాలో చెప్పడం లేదన్నారు. ఇళ్లు లేని పేదలు రేషన్ కార్డు, ఆధార్ కార్డులు, ఇతర ధృవపత్రాల కోసం భారీగా ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు తమ లెటర్ ప్యాడ్ లపై ఇళ్లు సిఫార్సు చేస్తూ వేలాది మందిని దరఖాస్తు చేయిస్తునారని తెలిపారు.

 

కేటీఆర్ ను కలిసిన రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీలు..

హైదరాబాద్ : సచివాలయంలో మంత్రి కేటీఆర్ ను రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీలు నరేందర్ రెడ్డి, శంబీపూర్ రాజులు కలిశారు. 

రైతు సంఘాలతో ముగిసిన అధికారుల భేటీ..

హైదరాబాద్ : రైతు సంఘాలతో అధికారుల భేటీ ముగిసింది. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు నివారించాలంటే ప్రభుత్వం వ్యవసాయ విధానాన్ని ప్రకటించాలని..రైతుల జీవన స్థితిగతులు, ప్రభుత్వ పథకాల అమలు తీరు, నిధుల కేటాయింపులు ఖర్చు జరిగిన తీరును బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టాలని రైతు సంఘం నేతలు కోరారు. భూమి వినియోగ విధానం తేవాలని, భూ పరిణామంతో నిమిత్తం లేకుండా సంక్షేమ పతకాలు అమలు చేయాలని సమావేశంలో వెల్లడించారు. రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వీడాలని, ఈ సమావేశానికి మంత్రి రాకపోవడం బాధాకరమని కోదండరాం, చంద్రాకరెడ్డి, పద్మ, రైతు సంఘ నేతలు పేర్కొన్నారు. 

ఆ రాష్టాల తరహాలోనే తెలంగాణకు సాయం - రాధా మోహన్ సింగ్..

హైదరాబాద్ : తెలంగాణలోని రైతులను ఆదుకుంటామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రూ. 3వేల కోట్లు కరవు సాయం కోరడం జరిగిందని, కేంద్ర బృందాలు మాత్రం రూ. 2500 కోట్ల నష్టం జరిగినట్లు నివేదికలు ఇచ్చాయని రాధా మోహన్ సింగ్ తెలిపారు. హైలెవల్ కమిటీ జనవరి తొలి వారంలో తెలంగాణ కరవు పరిస్థితులపై చర్చించిన తరువాత కేంద్రం నుండి కరువు నిధులు విడుదల చేస్తామన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తరహాలో తెలంగాణకు ఆర్థిక సాయం కల్పిస్తామని, జనవరి 1న తెలంగాణ కరవు నివేదికను కేంద్ర హోం శాఖకు అందచేస్తామని రాధా మోహన్ సింగ్ తెలిపారు. 

బొల్లారంలో రాష్ట్రపతి తేనేటీ విందు..

హైదరాబాద్ : బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తేనేటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ దంపతులు, సీఎం కేసీఆర్, డిప్యూటి సీఎంలు, తెలంగాణ, ఏపీ మండలి ఛైర్మన్ లు హాజరయ్యారు. 

17:09 - December 30, 2015

హైదరాబాద్ : రహేజా భూముల వ్యవహారంపై ఏసీబీ న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. న్యాయవాది శ్రీ రంగారావు ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం విచారణకు స్వీకరించింది. అందులో భాగంగా ఐఏఎస్ అధికారులు రత్నప్రభ, బి.పి.ఆచార్య, సుబ్రమణ్యం, పీఎస్ మూర్తితో సహా ఐపీఎస్ అధికారి గోపికృష్ణలకు సమన్లు జారీ చేసింది. వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. కుట్రపూరితంగా ప్రభుత్వ ఖజానాకు రూ. 500 కోట్ల నష్టం కలిగించారనే ఆరోపణలున్నాయి. 

విశ్వోదయ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి ఆత్మహత్య..

నెల్లూరు : కావలిలోని విశ్వోదయ ఇంజినీరింగ్ కళాశాల భవనంపై నుండి ఇంజినీరింగ్ విద్యార్థి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎగ్జామినర్ మందలించాడని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఏపీ కేబినెట్ నిర్ణయాలు..

విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతనలో జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి నూతన ఇసుక విధానం అమలు కానుంది. అన్ని రకాల వైద్య సేవల కోసం 102 టోల్ ఫ్రీ నంబర్ సేవలు అమల్లోకి రానున్నాయి. జనవరి 1వ తేదీన పశ్చిమగోదావరి జిల్లాలో 102 సేవలను బాబు ప్రారంభించనున్నారు. విజయవాడలో జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం డీపీఆర్ తయారీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆరు నెలల్లోగా డీపీఆర్ తయారు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 

రాధా మోహన్ సింగ్ తో దత్తాత్రేయ...

ఢిల్లీ : కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ ను కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ కలిశారు. తెలంగాణలో కరవు ప్రాంతాలకు నిధులు కేటాయించాలని దత్తాత్రేయ కోరారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లకు నిధులు కేటాయించినట్లుగానే తక్షణమే తెలంగాణకు నిధులు కేటాయించాలని దత్తాత్రేయ కోరారు. 

16:26 - December 30, 2015

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ఎన్ని కుయుక్తులు ప్రదర్శించినా.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా రెండు జిల్లాల్లో కాంగ్రెస్‌ సత్తాచాటిందని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా ధర్మాన్ని గెలిపించారని చెప్పారు. నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో గెలిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులకు జానారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

16:25 - December 30, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రశాంతంగా జరిగాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ తెలిపారు. 7స్థానాల్లో ఏకగ్రీవంగా నేతలు గెలువగా మిగిలిన స్థానాలకు ఎన్నికలు నిర్వహించామని తెలిపారు. నల్లగొండలో కోమటిరెడ్డి , ఖమ్మంలో బాలసాని , మహబూబ్ నగర్ లో రిజర్వేషన్ ప్రకారంగా కసిరెడ్డి గెలిచారని తెలిపారు. మహాబూబ్ నగర్ లో మిగిలిన రెండు స్థానాలకు త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు భన్వర్ లాల్ . పలు చోట్ల ఓట్లు రద్దయ్యాయని వాటికి సంబంధించిన వివరాలు అందుబాటులో ఉంచామని భన్వర్ లాల్ తెలిపారు.టీఆర్ఎస్ 4 స్థానాల్లో కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలిచాయి.

 

16:24 - December 30, 2015

చిత్తూరు :తిరుమల శ్రీవారికి ఓ ముస్లిం భక్తుడు 30 లక్షల విలువైన ఏసీ కంటైనర్‌ లారీని కానుకగా ఇచ్చాడు. చెన్నైకి చెందిన అబ్దుల్‌ ఘనీ.. శ్రీవారికి కూరగాయలు, పూలు, ఫలాలు తీసుకువచ్చేందుకు వీలుగా ఈ కంటైనర్‌ను తయారు చేయించారు. శ్రీవారి ఆలయ డిఫ్యూటీ ఈవో చిన్నంగారి రమణకు ఈ లారీని అందించారు. గతంలోనూ అబ్దుల్‌ ఘనీ తిరుమల అశ్వనీ ఆస్పత్రికి వైద్య పరికరాలు అందించారు. అబ్దుల్‌ ఘనీని ఆలయ అధికారులు అభినందించారు. 

16:22 - December 30, 2015

చిత్తూరు : న్యూ ఇయర్‌ మొదటి రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుమల జేఈఓ శ్రీనివారాజు తెలిపారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశిలకు ఏర్పాట్లు చేసిన తరహాలోనే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జనవరి 1 శుక్రవారం కావడంతో ఆ రోజున స్వామివారి దర్శనం ఆలస్యంగా ప్రారంభం అవుతుందని భక్తులు సహకరించాలని కోరారు. ఉదయం 5 గంటలకు వీవీఐపీ దర్శనానికి అనుమతిస్తామని, 7 గంటల నుంచి సామాన్య భక్తుల దర్శనాన్ని మొదలుపెట్టి ఆలయం మూసేవరకూ నిర్విరామంగా సర్వదర్శనం కొనసాగిస్తామని చెప్పారు. 

16:21 - December 30, 2015

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లేందుకు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ సరికొత్త వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. సర్కార్‌ అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా బల్దియా ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు సానుకూల ఓట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. మరో వారంలో రోజుల్లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యులు విడుదయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు అధికార టీఆర్‌ఎస్‌ చేయని ప్రయత్నమంటూ లేదు. తెలంగాణ పంచాయతీరాజ్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌... ఎన్నికల బాధ్యతలను భుజానికెత్తుకున్నట్టు కనిపిస్తోంది. కొద్ది రోజులుగా కేటీఆర్‌ నగరంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరుతున్న వారికి గులాబి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఒకే రోజు నగరంలోని పదికిపైగా ప్రాంతాల్లో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కేటీఆర్‌..పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ ఓటర్లకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
మంగళవారం హైదరాబాద్‌ శిల్పారామంలో బ్రాండ్‌ హైదరాబాద్‌ను ఆవిష్కరించారు. భవిష్యత హైదరాబాద్‌ను కళ్లముందు ఆవిష్కరించారు. విశ్వనగరాన్ని వీనుల విందుగా ఆహ్వానించారు. నగర ప్రజలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంతో ప్రజలు ప్రస్తావించిన పలు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సోదాహరణంగా వివరించి జనం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. గతంలో సరైన పద్ధతిలో హైదరాబాద్‌ అభివృద్ధి చెందలేదన్న కేటీఆర్‌..రోడ్లు, వంతెనలు, మంచినీటి సరఫరాకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రస్తావించారు. జంటనగరాల వాసులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్‌ కష్టాలను తీరుస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగ, ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.
హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చేందుకు తగిన ప్రణాళికలను కేటీఆర్‌ ప్రస్తావించారు. ఫ్లై ఓవర్లు, స్కైవేస్‌, వాక్‌ వేస్‌తో హైదరాబాద్‌ స్వరూమే మారిపోతుందని పేర్కొంటున్నారు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు మహిళలకు ఎక్కువగా ఉద్యోగాలు ఇవ్వడంలేదని కొందరు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెడతామని హామీ ఇచ్చారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో..మంత్రి కేటీఆర్‌ వ్యూహాత్మంగా వేస్తున్న అడుగులు టీఆర్‌ఎస్‌కు ఎంతవరకు సానుకూలంగా మారతాయో చూడాలి. 

సమాజ్ వాది పార్టీ నేత అరెస్టు..

ఉత్తర్ ప్రదేశ్ : సమాజ్ వాది పార్టీ నేత తొతారం యాదవ్ ను పోలీసులు అరెస్టు చేశారు. యూపీ పంచాయతీ ఎన్నికల్లో బూత్ క్యాప్చరింగ్ చేశారన్న ఆరోపణలతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. 

కర్నాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు..

కర్నాటక : రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోతంది. కాంగ్రెస్ 13 స్థానాలు, బీజేపీ 6 స్థానాలు, జేడీఎస్ 4, స్వతంత్రులు 2 స్థానాల్లో విజయం సాధించాయి. 

ఎఐఎడిఎంకె నిరసనలో అపశృతి..

చెన్నై : డీఎండీకే అధినేత విజయ్ కాంత్ చేసిన వ్యాఖ్యలపై నిరసలను ఇంకా భగ్గుమంటూనే ఉన్నాయి. ఎఐఎడిఎంకె శ్రేణులు జరిపిన నిరసన ప్రదర్శనలో అపశృతి చోటు చేసుకుంది. విజయకాంత్ దిష్టి బొమ్మ దగ్ధం చేసే సయమంలో పలువురికి మంటలు అంటుకున్నాయి. దీనితో పలువురికి గాయాలయ్యాయి. 

గిరిజన ఆశ్రమ విద్యార్థి మృతి కేసులో ఇద్దరు సస్పెన్షన్..

వరంగల్ : మూడుచెక్కలపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థి మృతి ఘటనలో ప్రధానోపాధ్యాయుడు అంజనామూర్తి, వార్డెన్ వీరమ్మపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఏటూరు నాగారం ఐటీడీఏ పీవో ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగు రోజుల క్రితం పాఠశాలలో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. 

ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కృతజ్ఞతలు..

మహబూబ్ నగర్ : ఓటేసి గెలిపించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఫలితాలు చూసైనా టీఆర్ఎస్ బుద్ధి తెచ్చుకోవాలని, శాసనమండలిలో ప్రజా సమస్యలపై పోరాడుతానన్నారు. 

టీఆర్ఎస్ కు తగిన బుద్ధి చెప్పారు - డీకే అరుణ...

మహబూబ్ నగర్ : కాంగ్రెస్ గెలుపు టీఆర్ఎస్ కు చెంపపెట్టు అని ధన, అధికార బలంతో ఏదైనా చేయవచ్చన్న టీఆర్ఎస్ కు ఓటర్లు తగిన బుద్ధి చెప్పారని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ పేర్కొన్నారు. ఈ గెలుపు కాంగ్రెస్ శ్రేణుల్లో మనోస్థైర్యం నింపిందన్నారు.

 

కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజేతలకు ఉత్తమ్ అభినందనలు..

హైదరాబాద్ : ఎమ్మెల్సీగా గెలుపొందిన కోమటిరెడ్డి, దామోదర్ రెడ్డిలకు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభినందనలు తెలిపారు. టీఆర్ఎస్ బెదిరింపు రాజకీయాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, ఇది గ్రేటర్ ఎన్నికల్లో రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో వైసీపీ, టీఆర్ఎస్ కు ఏజెంట్ గా మారిందని ఖమ్మంలో టీఆర్ఎస్ గెలుపునకు వైసీపీ సహకరించిందని ఆరోపించారు. గ్రేటర్ లో స్థానికంగా బలమైన నేతకు టికెట్ ఇస్తామన్నారు. 

ముగ్గురు అంతరాష్ట్ర ఎర్రచందనం స్మగర్ల అరెస్టు...

కడప : ముగ్గురు అంతరాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. నిందితుల దగ్గరి నుండి 1.4 టన్నుల ఎర్రచందనం, ఐదు ల్యాబ్ ట్యాబ్ లు, 12 సెల్ ఫోన్లు, రూ. 78 వేలు స్వాధీనం చేసుకున్నారు. 

15:36 - December 30, 2015

కాలం శక్తిమంతమైంది.. . గతాన్ని మంచిచెడుల జ్నాపకంగా మారుస్తుంది.. సంతోష విషాదాలను నింపుతుంది.. వర్తమానాన్ని దానికి కొనసాగింపుగా చేస్తుంది.. గతం ఎలా గడిచినా, భవిష్యత్ పై కొత్త ఆశను కలిగిస్తుంది.. అటువంటి అనుభవాలు, అనుభూతులతో నిండిన ఈ ఏడాదిని సింహావలోకనం చేసుకుంటూ, విమెన్ ఎట్ 2015 లో మహిళలకు సంబంధించి న్యాయపరంగా వచ్చిన మార్పులతో కథనం..

అత్యాచార కేసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు...
అత్యాచార కేసులకు సంబంధించి సుప్రీంకోర్టుకీలక వ్యాఖ్యలు చేసింది. తమిళనాడు కోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన కేసుకు సంబంధించి సుప్రీం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. పిల్లలకు అవివాహిత తల్లే సంరక్షురాలంటూ సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. నవమోసాలు మోసి కని పెంచటంలో కీలకపాత్ర పోషించే అమ్మ చట్టబద్ధమైన సంరక్షురాలని ఉన్నత న్యాయస్థానం తేల్చింది. మహిళలు పురుషులకు ధీటుగా అన్ని రంగాలలో సమర్థత చాటుతున్నప్పటికీ వారికి ఇంకా కొన్ని రంగాలలో ప్రవేశం లేకపోవటం విచారకరం. ఇదే విషయాన్ని ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా పరిగణించి మహిళలకు కీలక భద్రతా విభాగాలలో ప్రవేశం కల్పించాల్సిందిగా తీర్పు వెలువరించింది.

అద్దె గర్భంపై....
పుట్టబోయే పిల్లల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటం గృహ హింస అవుతుందని ఢిల్లీ న్యాయస్థానం స్పష్టం చేసింది. కుటుంబం పట్ల బాధ్యతలు విస్మరించే పురుషులకు ఈ తీర్పు ఒక హెచ్చరికగా పనిచేయనుంది. ప్రస్తుత సమాజంలో ఏ వర్గంలోనైనా, ఏ మతంలోనైనా మహిళల పట్ల వివక్ష కొనసాగుతున్న తీరే కన్పిస్తోంది. అయితే విడాకుల సందర్భాల్లో మహిళలు నిస్సహాయ స్థితిలోకి జారిపోతున్నారు. ఈ స్థితి ముస్లిం మహిళలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందో అధ్యయనం జరగనుంది. విదేశీయుల కోసం అమ్మతనాన్ని వ్యాపార పరం చేస్తున్న సరోగసీ పద్ధతికి చెక్ పెట్టాలంటూ అత్యున్నత న్యాయస్థానం తేల్చింది. అద్దె గర్భంతో పిల్లలను పొందే విషయంలో స్పష్టమైన విధానాలు లేకపోవటంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

చిన్నారుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట...
దేశ రాజధానిలో సంచలనం సృష్టించిన ఉబర్ క్యాబ్ అత్యాచారం కేసులో తీర్పు వెలువడింది. ట్యాక్సీలో ప్రయాణిస్తున్న మహిళా ఉద్యోగినిపై అత్యాచారం చేసిన ఈ నిందితునికి కోర్టు జరిమానా కూడా విధించింది. ఆడపిల్లల పుట్టుకను ప్రశ్నార్థకం చేస్తున్న వ్యవస్థపై ఇక ముందు నిఘా పెంచనున్నారు. అందుకు సంబంధించి గర్భస్థ పిండ నిర్ధారణ నిషేధిత చట్టం అమలు పర్యవేక్షణలో కొన్ని మార్పుల కోసం ఉత్తర్వులు జారీ అయ్యాయి. భారత సంస్కృతిలో వివాహ బంధానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో భాగంగానే భార్య ఎలాంటి అనారోగ్యం పాలైనా భాగస్వామి పూర్తి బాధ్యతలు తీసుకోవాలని న్యాయస్థానం సూచించింది. చిన్నారుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందకు కేంద్రప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయనుంది. అందుకోసం పటిష్టమైన చట్టాలను రూపొందించే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. 

గర్భస్థ పిండ నిర్ధారణ నిషేధిత చట్టం...
హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం అంటే మూడుముళ్లు, ఏడడుగులు.. ఇలా అనేక రకాల తంతులు సర్వసాధారణం. కానీ ఇవేవీ లేకుండా జరిగే వివాహం కూడా చెల్లుబాటవుతుందంటోంది మద్రాసు హైకోర్టు. అమ్మతనాన్ని వ్యాపారంగా మలుచుకుంటున్న సంస్థలకు కేంద్రం ధీటైన సమాధానం చెప్పింది. విదేశీయులను అందుకు నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొనే వ్యక్తుల నుండి సమ్మతి తీసుకోవడం చాలా అరుదుగా మాత్రమే జరుగుతోంది. ఈ నేపథ్యంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిరోధానికి కౌమార దశలో ఉన్న ఆడపిల్లలకు వేస్తున్న వ్యాక్సిన్ల విషయంలో అనుమతి తీసుకున్నారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఆడపిల్లల పుట్టుకను ప్రశ్నార్థకం చేస్తున్న వ్యవస్థపై ఇక ముందు నిఘా పెంచనున్నారు. అందుకు సంబంధించి గర్భస్థ పిండ నిర్ధారణ నిషేధిత చట్టం అమలు పర్యవేక్షణలో కొన్ని మార్పుల కోసం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

జువెనైల్ చట్టానికి సవరణ...
సర్వ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయవ్యవస్థ ఒక్కో సందర్భంలో అనూహ్యమైన తీర్పులు వెలువరిస్తోంది. ముఖ్యంగా చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడిన వారికి కఠిన శిక్షను విధించాలని మద్రాస్ హైకోర్ట్ ఇటీవలే సంచలనాత్మక తీర్పునిచ్చింది. నేరస్థుడి వయసుతో ముడిపడి న్యాయస్థానం తీర్పు చెప్పాలా? లేక నేరానికి తగినట్టుగా శిక్షలుండాలా? జాతీయస్థాయిలో జరిగిన చర్చ ఇది. మొత్తానికి ఈ చర్చకు పార్లమెంట్ ఓ ముగింపు పలికింది. ఎట్టకేలకు జువెనైల్ చట్టానికి సవరణ చేసింది.  నిర్భయ ఘటన, భారత చరిత్రలో ఎప్పటికీ ఒక చారిత్రక పరిణామమే. ఈ తర్వాత వెల్లువెత్తిన ఉద్యమాలు, భావోద్వేగాలు దేశంలో, రెండు ప్రధాన చట్టాల్లో కీలక మార్పులను తీసుకొచ్చాయి. 

ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం..

విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతనలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. 

15:21 - December 30, 2015

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రంగారెడ్డి..హైదరాబాద్ నేతల పంచాయతీ టి.పిసిసికి తలనొప్పిగా మారింది. వీలైనంత తొందరలో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఆపార్టీ భావించింది. అందులో భాగంగా ఓ నిర్ణయం తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని డివిజన్ బాధ్యతలను రంగారెడ్డి డీసీసీకి అప్పగించారు. హైదరాబాద్ పరిధిలోని డివిజన్ బాధ్యతలను దానం నాగేందర్ కు అప్పగించారు. రెండు రోజుల క్రితం ఉప్పల్ లో పార్టీ పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న దానంపై రంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రేణులు దాడికి దిగారు. దీనితో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పిసిసి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిని విభజిస్తూ బాధ్యతలను నేతలకు అప్పగించారు. ఈసందర్భంగా టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీలో కలిసిమెలిసి పనిచేసి పార్టీ గెలుపునకు కృషి చేయాలని నేతలకు ఉద్భోదించారు. 

15:10 - December 30, 2015

విజయవాడ : ఏపీ కేబినెట్ భేటీ ఇంకా కొనసాగుతోంది. గత మూడు గంటలకు పైగా ఈ భేటీ కొనసాగుతంది. సీఎం కార్యాలయంలో బాబు అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ప్రధానంగా ఇసుక విధానంపై చర్చించారు. ఇసుక విధానంలో అనేక లోపాలున్నాయని గుర్తించిన సర్కార్ ఇందుకు ఓ కమిటీ వేసింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఇటీవలే శ్వేతపత్రం విడుదల చేశారు. తాజాగా జరుగుతున్న ఏపీ కేబినెట్ సమావేశంలో ఇసుక విధానంపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. డ్వాకా సంఘాల ద్వారా నిర్వహించాలన్న విధానికి స్వస్తి పలకాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇసుక వేలానికి ఆన్ లైన్ ద్వారా టెండర్లు పిలువాలని, సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు, తాత్కాలిక సచివాలయం నిర్మాణం, రాజధాని నిర్మాణం, చంద్రన్న సంక్రాంతి కానుక, జన్మభూమి కార్యక్రమంపై సమావేశంలో చర్చిస్తున్నారు. ఆక్రమిత స్థలాలను క్రమబద్ధీకరణ చేయాలనే అంశంపై కూడా చర్చించారు. దీనిపై తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. కాల్ మనీ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని కేబినెట్ అభిప్రాయపడింది. దీనిపై ఓ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.

నూతన ఇసుక విధానాన్ని మంత్రివర్గం ఆమోదం..

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో నూతన ఇసుక విధానానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విజయవాడలోని సీఎం కార్యాలయంలో మంత్రివర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి నూతన ఇసుక విధానం అమలు చేయాలని, ప్రసవం తరువాత తల్లీ, బిడ్డలను ఇంటికి చేర్చేందుకు 102 సేవలను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. 

రామగుండం టీఆర్ఎస్ లో విభేదాలు..

కరీంనగర్ : రామగుండం టీఆర్ఎస్ లో విబేధాలు పొడచూపాయి. 20 మంది కార్పొరేటర్లు రాజీనామాకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యే - మేయర్ మధ్య వివాదాలతో ప్రజాభివృద్ధి చేయలేకపోతున్నామని కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రజలను బాబు మోసం చేశారు - ఎంపీ వైవీ..

విజయవాడ : అమలుకాని హామీలతో చంద్రబాబు ప్రజలను మోసం చేశారని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. జన్మభూమి కమిటీలు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్నాయని, కుంభకోణంలో భాగమే తాత్కాలిక రాజధాని అని విమర్శించారు. ప్రజల భూములపై ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందా చేస్తోందన్నారు. 

'రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించడం అభినందనీయం'..

హైదరాబాద్ : హైకోర్టు చొరవతో రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించడం అభినందనీయమని టి.కాంగ్రెస్ నేత పొంగులేటి పేర్కొన్నారు. రైతు సమస్యలపై మండలస్థాయి నుండి సమావేశాలు జరగాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే ఆత్మహత్యలకు మూలమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ధనిక రాష్ట్రమని చెప్పుకుంటున్న టీఆర్ఎస్ ఆత్మహత్యల నివారణకు కృషి చేయాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతిక విజయం తమదేనన్నారు. నలుగురు ఓటర్లున్న ఖమ్మంలో టీఆర్ఎస్ గెలవడం ఓ రికార్డు అన్నారు. 

14:33 - December 30, 2015

ముంబై : గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ను తుదముట్టించిన కథనాల ఆధారంగా నిర్మించిన కిల్లింగ్‌ వీరప్పన్‌ చిత్రానికి వరుస అడ్డంకులు తగులుతున్నాయి. ఈ నెల 4వ తేదీన విడుదలవ్వాల్సిన కిల్లింగ్‌ వీరప్పన్‌ ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది. తాజాగా మరోసారి ఈ చిత్రం వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రం విడుదలైతే తమిళనాడులో శాంతి భద్రతల సమస్య నెలకొంటుంది అని ఓ పిటిషనర్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీంతో కిల్లింగ్‌ వీరప్పన్‌ విడుదలపై మరోసారి సందేహాలు చుట్టుముట్టాయి. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కిల్లింగ్ వీరప్పన్ మూవీ అన్ని అడ్డంకులు తొలగించుకుని జనవరి 1, 2016న విడుదలయ్యేందుకు అంతా సిద్ధమైన నేపథ్యంలో మరో అడ్డంకి వచ్చి పడింది. ఈ సినిమా విడుదల నిలిపి వేయాలని మద్రాస్ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. సినిమా మొత్తం తప్పుల తడక అని, సినిమాలో అవాస్తవాలు చిత్రీకరించారు అంటూ పిటీషనర్ పేర్కొన్నారు. సినిమా విడుదలైతే తమిళనాడులో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుంది' అని పిటీషనర్ పనీర్‌సెల్వి పేర్కొన్నారు.

యూ సర్టిఫికేట్ వెనక్కి తీసుకోవాలి..
కిల్లింగ్‌ వీరప్పన్‌ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ జారీ చేసిన 'యూ' సర్టిఫికెట్ వెనక్కి తీసుకోవాలని కోరారు. కేవలం కర్నాటక పోలీసులు మాత్రమే 2004లో వీరప్పన్‌ను చంపినట్లు చూపించారని... ఈ ఆపరేషన్‌లో తమిళనాడు పోలీసులు, రాజకీయ నాయకుల ప్రమేయం లేదనే విధంగా చూపించారు. ఇలా చేయడం వారిని అవమానించడమే అని పిటీషనర్ తన పిటీషన్లో పేర్కొన్నారు. శివరాజ్ కుమార్, పరుల్ యాదవ్, యగ్నా శెట్టి, సందీప్ భరద్వాజ్ ముఖ్య పాత్రలు పోషించిన 'కిల్లింగ్ వీరప్పన్' మూవీ కన్నడ, తెలుగు, తమిళం, హిందీలో రిలీజ్ అవుతోంది. ఇదిలా ఉంటే మూడు రాష్ట్రాల పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన వీరప్పన్‌కు ఓ పోలీస్ అధికారి ఎలా చెక్ పెట్టాడు, అతన్ని పట్టుకోవడానికి ఎలాంటి వ్యూహాలు అమలు చేసాడు, చివరకు అతన్ని ఎలా మట్టుపెట్టారు అనేది అసలు స్టోరీ. ఈ చిత్రంలో ఒకప్పుడు వీరప్పన్ చేతిలో కిడ్నాప్ అయిన కన్నడ సీనియర్ నటుడు రాజ్ కుమార్ తనయుడు శివరాజ్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు. తన సినిమా గురించిన విశేషాలను ఆయన ట్వీట్ చేశారు. ఒక పోలీసు అధికారికి పుట్టిన ఆలోచన వల్లే వీరప్పన్ హతమయ్యాడని, ఆ అధికారికి సంబంధించిన కథే 'కిల్లింగ్ వీరప్పన్' సినిమా అని వర్మ తెలిపారు. 1200 మంది పోలీసులు కలిసి కూడా 15 ఏళ్ల పాటు వీరప్పన్‌ను పట్టుకోలేక పోయారని, భారతదేశ నేరచరిత్రలో పోలీసు శాఖ అతిపెద్ద వైఫల్యం అదేనని కూడా వర్మ వ్యాఖ్యానించారు. 'కిల్లింగ్ వీరప్పన్'ను మొట్టమొదట పోలీసులకే చూపిస్తానని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెప్పారు.

14:31 - December 30, 2015

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కరువు ప్రాంతం అయిన రాయలసీమకు ప్రత్యేక పాకేజీ ఇస్తానన్న చంద్రబాబు ఇప్పుడు దాని ఊసు కూడ తీయట్లేదని, అంతా అమరావతి జపం చేస్తున్నారని అన్నారు. దీనిపై జనవరి 5న నిరసన కార్యక్రమం చేపడతామంటున్నారు. జనవరి 8,9,10 తేదీల్లో జాతీయ స్థాయి పార్టీ కార్యవర్గ సమావేశం గుంటూరులో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశానికి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం, పార్లమెంట్ పక్ష నాయకులు డి.రాజా తదితరులు హాజరవుతున్నారని పేర్కొన్నారు. 

14:17 - December 30, 2015

విజయవాడ : పైరసీ సీడీలను ప్రోత్సాహించకండి..సీడీలను తయారు చేయవద్దు..అని ఎంత మంది చెబుతున్నా ఎక్కడో ఒక చోట పైరసీ సీడీలు తయారవుతూనే ఉన్నాయి. గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యాపారం సాగుతోంది. తాజాగా ఫిలి ఛాంబర్ ఆధ్వర్యంలో ఏపీ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఇటీవలే విడుదలైన మామ మంచు అల్లుడు కంచు, జత కలిసే, భలే మంచి రోజు చిత్రాలతో పాటు మరికొన్ని కొత్త సినిమాల పైరసీ సీడీలను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లాలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. చెన్నై తరువాత పైరసీ కేంద్రంగా గుంటూరు జిల్లా తయారవుతోంది. కొత్త సినిమాలు విడుదల కాగానే పైరసీ సీడీలు లభ్యమౌతున్నాయి. పూర్ణ అనే వ్యక్తికి చెందిన దుకాణంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. పెద్త ఎత్తున్న ఇతను పైరసీ సీడీ కేంద్రం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేంద్రం ఎక్కడ ఉన్నదనే దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. గతంలో కూడా పూర్ణ పైరసీ సీడీలను తయారు చేసి గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేశాడని తెలుస్తోంది. కోట్లాది రూపాయలు కూడబెట్టాడని పోలీసులు భావిస్తున్నారు. చట్టంలో ఉన్న లొసుగుల ద్వారా పూర్ణ తప్పించుకుంటున్నట్లు సమాచారం. ఇతనికి అధికార పార్టీకి చెందిన నేతలు పూర్ణకు సహాయ సహాకారాలు అందిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

14:14 - December 30, 2015

విజయవాడ : సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. మూడు గంటలకు పైగా జరుగుతున్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చిస్తున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు, తాత్కాలిక సచివాలయం నిర్మాణం, రాజధాని నిర్మాణం, చంద్రన్న సంక్రాంతి కానుక, జన్మభూమి కార్యక్రమంపై సమావేశంలో చర్చిస్తున్నారు. జనవరి 2వ తేదీన జన్మభూమి కార్యక్రమం సందర్భంగా గ్రామ సభల నిర్వాహణపై, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బాబు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అమరావతి మాస్టర్ ప్లాన్, జనవరి నెలలో నుండి విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రధానంగా చర్చించారు. మూడు నుండి నాలుగు శాతం వరకు పెంచితే ప్రజల నుండి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలుస్తోంది. 

వన్ టౌన్ లో సీడీ షాపులపై దాడులు...

విజయవాడ : వన్ టౌన్ లో సీడీ షాపులపై ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. మామ మంచు అల్లుడు కంచు, జత కలిసే, భలే మంచి రోజు మరికొన్ని కొత్త సినిమాల పైరసీ సీడీలను స్వాధీనం చేసుకున్నారు. 

టిడిపిలో చేరేందుకు సిద్ధమే కానీ..:ఆదినారాయణరెడ్డి

హైదరాబాద్: తాను తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వెల్లడించారు. అయితే పార్టీలో చేరే అంశంపై టీడీపీ నాయకత్వం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. పార్టీ ఎప్పుడు ఆహ్వానిస్తే అప్పుడు వెళతానని చెప్పారు. అయితే ఆదినారాయణ చేరికను కడప జిల్లా జమ్మలమడుగు టీడీపీ ఇన్ ఛార్జి రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనను చేర్చుకోవద్దని ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబుకు నేరుగా ఫిర్యాదు చేశారు. దాంతో కొంతకాలం నుంచి టీడీపీలో ఆదినారాయణ చేరికపై స్థబ్ధత నెలకొంది.

ఐసీయూలో ముఫ్తీ మహ్మద్ సయ్యద్...

జమ్మూ కాశ్మీర్ : రాష్ట్ర ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయ్యద్ ను ఐసీయూలో చేరిపించారు. జ్వరం, ఛాతి నొప్పి రావడంతో ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిపించిన సంగతి తెలిసిందే. 

'ఫితూర్' ఫస్ట్ లుక్ విడుదల..

ముంబై : కత్రినా కైఫ్, ఆదిత్య రాయ్ కపూర్ లు జంటగా నటిస్తున్న 'ఫితూర్' చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర దర్శకుడు అభిషేక్ కపూర్ విడుదల చేశారు. 

రూ. వెయ్యి కోట్లతో గోదాములు - హరీష్ రావు..

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా రూ. వెయ్యి కోట్లతో గోదాములు ఏర్పాటు చేస్తున్నామని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. బెజ్జంకి మండల కేంద్రంలో ఆయన పర్యటించారు. 

పాలమూరులో ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ..

మహబూబ్ నగర్ : పాలమూరు జిల్లాలోని ఎల్లూరు, గోపాల్‌పేటలో ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ పనులను సురేందర్‌రెడ్డి పరిశీలించారు.

13:48 - December 30, 2015

కడప : నూతనంగా నిర్మిస్తున్న కడప కలెక్టర్‌ కార్యాలయంలో దళితులు అర్ధరాత్రి అంబేద్కర్‌ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఎంతో కాలంగా అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో దళితులే స్వయంగా విగ్రహాన్ని ప్రతిష్టించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. పలువురిని అరెస్ట్‌ చేశారు. పోలీసుల తీరుపై దళితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విగ్రహ ఏర్పాటు కోసం సుప్రీంకోర్టు అనుమతి ఉందని వారు తెలిపారు. 

13:46 - December 30, 2015

హైదరాబాద్ : నగరంలో ఈవ్‌ టీజర్లు రోజు రోజుకి రెచ్చిపోతున్నారు. కేపీహెచ్‌బీ కాలనీలో స్వాతి ఉమెన్‌ హాస్టల్‌కు చెందిన యువతి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా ఓ యువకుడు అడ్డగించి ఈవ్‌ టీజింగ్‌కి పాల్పడ్డాడు. దీంతో యువతి కేకలు వేసింది.. స్థానికులు ఆ యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

 

13:44 - December 30, 2015

హైదరాబాద్ : 2015వ సంవత్సరంలో తెలంగాణలో నమోదైన నేరాలపై డీజీపీ అనురాగ్‌ శర్మ సమీక్ష నిర్వహించారు. గత సంవత్సరంతో పోలిస్తే 8 శాతం నేరాలు తగ్గినట్టు ఆయన పేర్కొన్నారు. 92వేల ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని చెప్పారు. ఈ ఏడాది షీటీమ్స్‌ను రంగంలో దింపడంతో 825 మంది ఈవ్‌టీజర్స్‌ను అరెస్ట్‌ చేశామన్నారు. షీ టీమ్స్‌ బాగా పనిచేశాయని కొనియాడారు. గణాంకాల ప్రకారం చైన్‌ స్నాచింగ్‌లు తగ్గినట్టు తెలిపారు. అంతేకాక రికవరీ శాతం 55 శాతంగా ఉందని డీజీపీ అనురాగ్‌శర్మ వెల్లడించారు.

13:43 - December 30, 2015

హైదరాబాద్ : గ్రేటర్‌లో వార్డుల రిజర్వేషన్‌ ప్రకటన జాప్యం చేస్తున్నారని కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. టీఆర్‌ఎస్‌, ఎంఐఎం పథకం ప్రకారమే వార్డుల ప్రకటన ఆలస్యం చేస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీల ఓటర్ల జాబితాను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.  

13:40 - December 30, 2015

హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా ముత్తారం మండలం లద్నాపూర్‌లో రోడ్డుప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో 30మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను దగ్గరలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.

టీ.పీసీసీ చీఫ్ నివాసంలో కాంగ్రెస్ నేతల భేటీ

హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌‌కుమార్ నివాసంలో కాంగ్రెస్ నేతలు మల్లు భట్టి, దానం, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్‌ భేటీ అయ్యారు. ఉప్పల్‌లో జరిగిన గొడవపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

ఏపీలో 12 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ

హైదరాబాద్ : ఏపీ లో 12 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. నర్సీపట్నం ఏఎస్పీగా ఐశ్వర్య రస్తోగీ, రంపడచోడవరం ఏఎస్పీగా నయీం అస్మి, సీఐడీ ఏఎస్పీగా ఎన్.శ్వేత, పాడేరు ఏఎస్పీగా శశికుమార్, కడప అదనపు ఎస్పీ (ఆపరేషన్స్)గా బి.సత్య ఏసుబాబు నియమితులయ్యారు. గ్రేహౌండ్స్ స్క్వాడ్రన్ కమాండర్ గా కె.ఫకీరప్ప, నర్సీపట్నం అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) గా బాబూజీ, విజయనగరం అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) గా సీహెచ్.వెంకట అప్పలనాయుడు, చిత్తూరు పరిపాలన అదనపున ఎస్పీగా అభిషేక్ మొహంతి నియమితులయ్యారు. డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని విజయరావు, రాహుల్ దేవ్ శర్మ, విశాల్ కు ఆదేశాలు ఇచ్చారు.

13:13 - December 30, 2015

హైదరాబాద్ : మహబూబ్‌ నగర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ చేరో స్థానం దక్కించుకుంది.. ఒక స్థానంలో బ్రిలియంట్‌ విద్యాసంస్థల అధినేత కసిరెడ్డి నారాయణరెడ్డి విజయ కేతనం ఎగురవేశారు.. మరో స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి దామోదర్‌ రెడ్డి గెలుపొందారు.. రెండో ప్రాధాన్యత ఓటు కౌంటింగ్‌ తర్వాత 12 ఓట్లతో దామోదర్‌ రెడ్డి విజయం సాధించారు.. 

13:12 - December 30, 2015

హైదరాబాద్ : నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి రాజగోపాల్‌ రెడ్డి గెలిచారని ప్రకటించారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి.. రాజగోపాల్‌ రెడ్డికి 642 ఓట్లు, చిన్నపరెడ్డికి 449 ఓట్లు వచ్చాయని తెలిపారు.. 191 ఓట్లతో చిన్నపరెడ్డిపై రాజగోపాల్‌ రెడ్డి గెలిచారని స్పష్టం చేశారు.. మరోవైపు ఈ విజయంతో సంతోషంలో మునిగిపోయారు కోమటిరెడ్డి సోదరులు... కార్యకర్తల విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు.. రంగులు చల్లుకుంటూ, స్వీట్లు తినిపించుకొని సంబరాలు జరుపుకున్నారు.. 

కొనసాగుతున్న ఏపీ కేబినెట్

విజయవాడ :ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో జన్మభూమి, ఇసుకు విధానంపై చర్చించనున్నారు. విద్యుత్ చార్జీల పెంపుపై కసరత్తు చేయనున్నారు. అలాగే తాత్కాలిక సచివాలయ నిర్మాణం, చంద్రన్న సంక్రాంతి కానుక తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.

రామగుండం టీఆర్ ఎస్ లో విభేదాలు

కరీంనగర్ : రామగుండం టీఆర్ ఎస్ లో విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే - మేయర్ మధ్య వివాదాలతో ప్రజాభివృద్ధి చేయలేకపోతున్నామని కార్పొరేట్లు ఆవేదన వ్యక్తం చేస్తూ 20 కార్పొరేటర్లు రాజీనామాకు సిద్ధమయ్యారు.

12:51 - December 30, 2015

హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవాతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలకు దిగారు. నామినేషన్ల వరకు 6స్థానాలు ఏకగ్రీవం చేసుకున్న అధికారపార్టీ.... ఇవాళ్టి కౌంటింగ్ లో 4స్థానాలు గెలుచుకొని తమ సత్తా చాటింది. తమ పార్టీ అభ్యర్థుల గెలుపుతో కౌంటింగ్ కేంద్రాల వద్ద గులాబీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. 

12:49 - December 30, 2015

హైదరాబాద్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తనను గెలిపించాయన్నారు రంగారెడ్డి ఎమ్మెల్సీ విజేత శంభీపూర్‌ రాజు... తన గెలుపుకు కృషి చేసిన నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.. 

12:47 - December 30, 2015

హైదరాబాద్ : వాటర్‌గ్రిడ్‌, మిషన్‌ కాకతీయలాంటి పథకాలే తమను గెలిపించాయన్నారు రంగారెడ్డి ఎమ్మెల్సీ విజేత పట్నం నరేందర్‌ రెడ్డి... తన గెలుపుకు కృషి చేసివారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.. జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పుకొచ్చారు.. 

12:45 - December 30, 2015

హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో గులాబీ పార్టీ జెండా రెప రెపలాడింది.. రంగారెడ్డి జిల్లాల్లోని 2స్థానాలతో పాటు.. ఖమ్మం, మహబూబ్ నగర్‌లో ఒక్క స్థానం కైవసం చేసుకుంది... ఖమ్మంలో టిఆర్ ఎస్ అభ్యర్థి బాలసాని లక్ష్మి నారాయణ సీపీఐ అభ్యర్థి పువ్వాడపై 31 ఓట్లతో గెలుపొందారు... రంగారెడ్డి జిల్లాలో శంభీపూర్‌ రాజు, నరేందర్‌ రెడ్డి విజయం సాధించారు.. మొదటినుంచి లీడ్‌లోఉన్న వీరినే గెలుపు వరించింది.. ఇక మహబూబ్‌నగర్‌ జిల్లాలో కసిరెడ్డి నారాయణ రెడ్డి జోరు నడిచింది.. 96 ఓట్లతో కసిరెడ్డి గెలుపొందారు.. కసిరెడ్డికి మొత్తం 445 ఓట్లు వచ్చాయి.. పోటీ జరిగిన మిగతా 2 స్థానాలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. ఉత్కంఠ రేపిన నల్లగొండలో చివరికి విజయం కాంగ్రెస్‌వైపే నిలిచింది.. 191 ఓట్లతో కోమటిరెడ్డి విజయ దుందుభీ మోగించారు.. అటు మహబూబ్ నగర్ జిల్లాలోని మరో స్థానాన్ని కూడా కాంగ్రెస్ గెలుచుకుంది. 

తెలంగాణ లో నేరాలు తగ్గాయి: డీజీపీఅనురాగ్ శర్మ

హైదరాబాద్ : ఈ ఏడాది తెలంగాణలో నేరాలు తగ్గాయని డీజీపీ అనురాగ్‌ శర్మ చెప్పారు. చైన్‌ స్నాచింగ్స్‌, వరకట్న వేధింపుల కేసులు తగ్గాయని డీజీపీ పేర్కొన్నారు. దోపిడీలు, మహిళలపై వేధింపులు, అత్యాచారాలు పెరిగాయని, మొత్తం మీద శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని తెలంగాణ డీజీపీ చెప్పారు. ట్రాఫికింగ్‌పై 554 కేసులు నమోదు చేసి 808 మందిని కాపాడామని ఆయన వివరించారు. షీ టీమ్స్ 660 కేసులు నమోదు చేసిందని తెలంగాణ డీజీపీ వెల్లండించారు.

12:34 - December 30, 2015

హైదరాబాద్ : సెట్ టాప్ బాక్సుల కొరత ఉన్నందున గడువు పొడిగించాలని ఎంఎస్ వోలు హైకోర్టును ఆశ్రయించారు. 85 శాతం ప్రజలకు సెట్ టాప్ బాక్సులు కేంద్రం సరఫరా చేయలేదని ఎంఎస్ వోలు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఎంఎస్ వోల సమస్యలు విన్న కోర్టు సెట్ టాప్ బాక్సుల ఏర్పాటుకు మరో 2 నెలల గడువు పొడిగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.

12:28 - December 30, 2015

హైదరాబాద్ : గ్రేటర్ పరిధిలో ఆక్రమణకు గురౌతోన్న పార్కులను కాపాడేందుకు ప్రత్యేక ప్రణాళికలను ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ కమిషనర్ జనార్థన్ రెడ్డి తెలిపారు. ఆయన బుధవారం ఇందిరాపార్క్ లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన 'టెన్ టివి'తో మాట్లాడుతూ...గ్రేటర్ పరిధిలో పార్కుల అభివృద్ధి పై కమిషనర్ జనార్థన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టాని.... వున్న పార్కుల్లో పర్యవేక్షణ చేపట్టడం దృష్టి సారించినట్లు తెలిపారు. ఆక్రమణలకు గురౌతున్న పార్క్ లను కాపాడేందుకు ప్రయత్నిస్తామన్నారు. హరితహారం కార్యక్రమం కింద గత సంవత్సరం కోటి మొక్కలు నాటాలని ఆశించామని వర్షాభావం వల్ల ఆ పని జరగలేదని... ఈ సంవత్సరం 2 లక్షల మొక్కలు నాటుతామని తెలిపారు.

చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు

మెదక్ : జిల్లాలోని ముత్తారం మండలం లడ్నాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

నేరెడ్ మెట్ లో ఉద్రిక్తత

హైదరాబాద్ : నేరెడ్‌మెట్‌లో పుట్‌పాత్‌పై ఉన్న అక్రమ నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ అధికారులు తొలగిస్తున్నారు. పలు దుకాణాలు యజమానులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దుకాణాలు తొలగించొద్దని అధికారులకు విన్నపం చేస్తున్నారు స్థానికులు. పోలీసులకు, స్థానికులకు వాగ్వాదం జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సెట్ టాప్ బాక్సుల ఏర్పాటుకు మరో 2 నెలల గడువు

హైదరాబాద్ : సెట్ టాప్ బాక్సుల కొరత ఉన్నందున గడువు పొడిగించాలని ఎంఎస్ వోలు హైకోర్టును ఆశ్రయించారు. 85 శాతం ప్రజలకు సెట్ టాప్ బాక్సులు కేంద్రం సరఫరా చేయలేదని ఎంఎస్ వోలు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఎంఎస్ వోల సమస్యలు విన్న కోర్టు సెట్ టాప్ బాక్సుల ఏర్పాటుకు మరో 2 నెలల గడువు పొడిగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.

11:53 - December 30, 2015

హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో గులాబీ పార్టీ జెండా రెప రెపలాడింది.. ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లోని మూడు స్థానాలను గులాబీ పార్టీ కైవసం చేసుకుంది... ఖమ్మంలో బాలసాని లక్ష్మి నారాయణ సీపీఐ అభ్యర్థి పువ్వాడపై 31 ఓట్లతో గెలుపొందారు... రంగారెడ్డి జిల్లాలో శంభీపూర్‌ రాజు, నరేందర్‌ రెడ్డి విజయం సాధించారు.. మొదటినుంచి లీడ్‌లోఉన్న వీరినే గెలుపు వరించింది.. ఇక మహబూబ్‌నగర్‌ జిల్లాలో కసిరెడ్డి నారాయణ రెడ్డి జోరు నడిచింది.. 96 ఓట్లతో కసిరెడ్డి గెలుపొందారు.. కసిరెడ్డికి మొత్తం 445ఓట్లు వచ్చాయి.. మరో స్థానంలో కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉంది.. ఉత్కంఠ రేపిన నల్లగొండలో చివరికి విజయం కాంగ్రెస్‌వైపే నిలిచింది.. 158 ఓట్లతో కోమటిరెడ్డి విజయ దుందుభీ మోగించారు..

11:52 - December 30, 2015

హైదరాబాద్ : నెల్లూరు జిల్లా శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్‌.. విశ్వయవనికపై విశిష్ట స్థానాన్ని సముపార్జించుకుని.. సంబరాల్లో మునిగి తేలుతోంది. షార్‌లో ఇప్పటివరకూ 50 రాకెట్‌లను విజయవంతంగా ప్రయోగించారు. వీటి ద్వారా పంపిన 101 ఉపగ్రహాల్లో 57 విదేశాలకు చెందినవి కావడం విశేషం. ఒకప్పుడు పరిహాసం చేసిన విదేశాలే.. నేడు అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపేందుకు ఇస్రోను ఆశ్రయిస్తున్నాయి. తప్పటడుగులతో ప్రారంభమై.. లక్షల డాలర్లలో విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించే స్థాయికి ఎదిగి.. నేడు ఉత్సవాలు జరుపుకుంటున్న ఇస్రో పురోభివృద్ధిపై 10టీవీ స్పెషల్‌ ఫోకస్‌..

రాకెట్‌ ప్రయోగాలకు అనువైనదిగా గుర్తించిన సారాబాయి.

నెల్లూరు జిల్లాలో.. సూళ్లూరుపేట వద్ద.. శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం.. ఎన్నో విశిష్టతలతో ప్రపంచ దేశాల్లో భారత కీర్తి ప్రతిష్టలను ఇంతింతలుగా ఇనుమడింప చేస్తోంది. 1968లో ఈ ప్రాంతాన్ని రాకెట్‌ ప్రయోగాలకు ఎంతో అనువైనదిగా అంతరిక్ష శాస్త్రవేత్త విక్రమ్‌ సారాబాయి గుర్తించింది మొదలు... ఒకటీ రెండు తప్పటడుగులు తప్ప.. ఈ క్షేత్రం విజయపథంలో దూసుకు పోతోంది. భూమధ్య రేఖకు సమీపంలోని శ్రీహరికోటలో భూమ్యాకర్షణశక్తి తక్కువగా ఉండటం వల్ల రాకెట్‌లు రోదసిలోకి సునాయాసంగా దూసుకుపోతాయని సారాబాయి గుర్తించారు.

1971లో షార్‌ ఏర్పాటు......

సారాబాయి సూచనలతో.. ప్రభుత్వం 1971లో ఈ ప్రాంతాన్ని శ్రీహరికోట హైఆల్టిట్యూడ్‌ రేంజ్‌ .. షార్‌గా ప్రకటించింది. అనంతరం అధికారులు సూళ్లూరుపేట నుంచి పులికాట్‌ సరస్సును చీలుస్తూ రోడ్డేశారు. తొలుత 150 మంది ఉద్యోగులతో షార్‌ కేంద్రం ప్రారంభమైంది. సముద్రతీరంలో చిన్న ప్లాట్‌ఫారం... దాని వద్దకు చిన్న చిన్న సౌండింగ్‌ రాకెట్లను భుజాలపై, సైకిళ్లపై, ఎడ్లబండ్లపై తీసుకెళ్లి ఆకాశంలోకి ప్రయోగించేవారు.

490 సౌండింగ్‌ రాకెట్‌ల ప్రయోగం.......

అతి కష్టమ్మీద.. 490 సౌండింగ్‌ రాకెట్లు ప్రయోగించిన తర్వాత.. 1979లో ఉపగ్రహాలను రోదసిలోకి పంపే ప్రయత్నానికి శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. అబ్దుల్‌ కలాం ఆధ్వర్యంలో 1979 ఆగస్టు 10న తొలిసారిగా భాస్కర-1 ఉపగ్రహాన్ని ఎస్‌ఎల్‌వీ-3 రాకెట్‌తో షార్‌ నుంచి ప్రయోగించారు. అయితే రాకెట్‌ నిర్ణీత కక్ష్యలోకి చేరకనే కూలిపోయింది.

నాలుగు ఎస్‌ఎల్‌వి, నాలుగు ఏఎస్‌ఎల్‌వి ప్రయోగాలు.......

శ్రీహరి కోట నుంచి ఇప్పటి వరకు నాలుగు ఎస్ ఎల్వీ, నాలుగు ఎఎస్ ఎల్వీ, 32 PSLV, 9 GSLV, ఒక్క GSLV మార్క్‌3 రాకెట్లను ప్రయోగించారు. ఈ నెల 16న పీఎస్‌ఎల్‌వీ-సి 29 రాకెట్‌ను షార్‌ నుంచి పంపారు. ఈ ప్రయోగం ద్వారా.. షార్‌ రాకెట్‌ ప్రయోగాల సంఖ్య 50కి చేరుకుంది. తొలి పరాజం నుంచి పాఠాలు నేర్చుకుని.. అంచెలంచెలుగా రాకెట్లను అభివృద్ధి చేస్తూ.. శాస్త్రవేత్తలు ఈ అపురూపమైన ఘనతను సొంతం చేసుకున్నారు.

షార్‌లో వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం........

షార్‌లో వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏ దేశం నుంచో దిగుమతి చేసుకున్నది కాదు.. ఇక్కడి శాస్త్రవేత్తల కృషితోనే అది సాధ్యమయ్యింది. ఎప్పటికపుడు కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకెళ్లారు. పాత రోజుల్లో ప్రయోగానికి ముందుగా గాలి వేగం తెలుసుకొనేందుకు ఆత్యాధునిక పరికరాలు షార్‌ వద్ద ఉండేవి కావు. దాంతో కంప్యూటర్‌ సాయంతో దానిని తెలుసుకొనేవాళ్లు. ఏ దేశానికి తీసిపోని విధంగా ఇస్రోలో అనుభవజ్ఞులు ఉన్నారు.

50 రాకెట్‌ల ద్వారా రోదసీలోకి 101 ఉపగ్రహాలు.....

ఇప్పటి వరకూ 50 రాకెట్లను ప్రయోగించి.. 101 ఉపగ్రహాలను రోదసీలోకి చేరవేశారు. వీటిలో 57 విదేశీ ఉపగ్రహాలూ ఉన్నాయి. జనవరి 20న ఐదో మార్గదర్శక ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. పీఎస్‌ఎల్‌వీ సీ-31 రాకెట్‌ ద్వారా ఈ ఉపగ్రహాన్ని పంపనున్నారు.

టిప్పు రాకెట్‌లే అంతరిక్ష ప్రయోగాలకు స్ఫూర్తి............

రాకెట్‌లను అంతరిక్షంలోకి ప్రవేశ పెట్టాలన్న ఆలోచనకు స్ఫూర్తి టిప్పు సుల్తాన్‌ అని చెబుతారు. బ్రిటిష్‌ సైన్యంపైకి ఆయన రాకెట్లను ప్రయోగించినప్పుడే.. వాటిని అంతరిక్షంలోకి ప్రయోగించే ఆలోచనను రగిలించిందట. భారత్‌లో.. అంతరిక్ష విజయాలకు బీజం వేసింది మాత్రం విక్రమ్‌ సారాబాయి. రష్యా స్ఫుత్నిక్‌ను ప్రయోగించాక.. దేశానికి శాటిలైట్‌ల అవసరాన్ని అప్పటి ప్రధాని నెహ్రూకు వివరించి.. అంతరిక్ష పరిశోధన వ్యవస్థ ఏర్పాటుకు కారకుడయ్యారు. ఆయన చొరవతోనే.. 1962లో హోమీ జే భాభా పర్యవేక్షణలో అంతరిక్ష పరిశోధన కేంద్రం ఏర్పాటైంది.

తొలినాళ్లలో ఉపగ్రహాల నిర్మాణాన్నే దృష్టిలో .....

తొలినాళ్లలో ఉపగ్రహాల నిర్మాణాన్నే దృష్టిలో ఉంచుకొని.. భూ ఉపరితల లక్షణాలను అధ్యయనం చేయడానికి త్రివేండ్రం వద్ద కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అమెరికా, రష్యాల నుంచి దిగుమతి చేసుకున్న రాకెట్లను ప్రయోగిస్తూ.. ఉపరితలాన్ని అధ్యయనం చేసేవారు. భారత దేశ పురోగతిని గమనించిన ఇతర దేశాలు.. ఉపగ్రహానికి అవసరమైన అన్ని పరికరాలు సమకూర్చక పోవడాన్ని గుర్తించిన విక్రం సారాభాయి.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో శాటిలైట్‌ అన్ని విడి భాగాలను మన దేశంలోనే తయారు చేసేలా బృందాన్ని నడిపారు. ఈ క్రమంలో 1969లో ఇస్రో.. 1972లో ప్రత్యేక అంతరిక్ష విభాగం ఏర్పడ్డాయి.

దేశీయ రాకెట్‌ అవసరాన్ని గుర్తించిన సారాబాయి.....

నాసాతో చర్చలు జరిపిన అనంతరం కేవలం శాటిలైట్లను తయారు చేయడమే కాకుండా వాటిని ప్రయోగించే సౌకర్యాన్ని కలిగిఉండడం ఆవశ్యకతను గుర్తించిన సారాభాయ్, ఇస్రోతో కలసి ఉపగ్రహాలను ప్రయోగించే వేదికకు రూపకల్పన చేయడం మొదలు పెట్టారు. దీని పేరే ఎస్‌ఎల్‌వి. 1979లో శ్రీహరి కోటలో ఎస్‌ఎల్‌వీ లాంచ్‌ ప్యాడ్‌ సిద్ధమైంది. అయితే ఆ వేదిక నుంచి ప్రయోగించిన రాకెట్‌ సాంకేతిక లోపాల వల్ల విఫలమైంది. లోపాలను సరిదిద్ది 1980లో విజయవంతంగా ప్రయోగించిన రోహిణి-1 భారతదేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహంగా చరిత్రలో నిలిచిపోయింది.

భవిష్యత్‌ అవసరాలకు పీఎస్‌ఎల్‌వి నిర్మాణం....

ఎస్‌ఎల్‌వి విజయంతో శాస్త్రవేత్తలు వెనక్కి తిరిగి చూడలేదు. భవిష్యత్‌ అవసరాలకు వీలుగా.. పీఎస్‌ఎల్‌వీ నిర్మాణాన్నీ చేపట్టారు. ఇందులో భాగంగా పరీక్షలను నిర్వహించేందుకు ఏఎస్‌ఎల్‌వీని నిర్మించారు. అయితే 1987, 88లలో చేసిన ASLV ప్రయోగాలు రెండూ విఫలమయ్యాయి. చివరికి 1992లో ఏఎస్‌ఎల్‌వీ విజయవంతమైంది. కానీ అప్పటి వరకూ తక్కువ బరువున్న ఉపగ్రహాలను మాత్రమే ప్రయోగించగలిగే వారు.

1993 నాటికి పీఎస్‌ఎల్‌వీ లాంచ్‌ ప్యాడ్‌ సిద్ధం.....

అభివృద్ధి పథంలో సాగుతున్న ఇస్రో.. 1993లో పీఎస్‌ఎల్‌వీ లాంచ్‌ ప్యాడ్‌ను రూపొందించింది. అయితే.. అనూహ్యంగా తొలి ప్రయత్నం విఫలమైంది. మళ్లీ దాని నుంచి పాఠాలు నేర్చుకున్న శాస్త్రవేత్తలు.. 1994లో చేపట్టిన ప్రయోగం విజయవంతం చేశారు. అప్పటి నుంచి పీఎస్‌ఎల్‌వీ విషయంలో భారత శాస్త్రవేత్తలు వెనక్కి తిరిగి చూడలేదు. భారత్‌ నుంచి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు.. PSLV స్థిరమయిన వేదికగా నిలిచింది.

2001లో మొదలైన జీఎస్‌ఎల్‌వీ నిర్మాణం........

విఓ 2 : పీఎస్‌ఎల్‌వీ తర్వాత.. జీఎస్‌ఎల్‌వీ నిర్మాణానికీ ఇస్రో శ్రీకారం చుట్టింది. 2001లో మొదలైన ఈ ప్రయత్నం వల్ల ఐదు వేల కిలోల బరువున్న ఉపగ్రహాలనూ భూ ఉపరితల కక్ష్యలోకి ప్రవేశ పెట్టే వీలుంటుంది. చంద్రుడిపైకి మనిషిని పంపే దిశగా ఇక్కడ ప్రయోగాలు జరుగుతున్నాయి.

2008 అక్టోబర్‌ 24న చంద్రయాన్‌ ప్రయోగం.....

చంద్రయాన్‌ భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన మానవ రహిత చంద్రయాన ప్రయోగమిది. ఈ మిషన్‌ను పీఎస్‌ఎల్‌వీ ద్వారానే ప్రయోగించారు. తొలుత ఈ చంద్ర ఉపగ్రహాన్ని 2008 జూలైలో ప్రయోగించాలని భావించినా.. చివరికి అక్టోబర్ 24న ప్రయోగించారు. ఈ కార్యక్రమం కోసం ఇస్రో 380 కోట్ల రూపాయలు ఖర్చు చేసినది. ఈ కార్యక్రమంలో ఇస్రో కు చెందిన ఐదు పేలోడ్లు, ఇతర దేశాలకు చెందిన ఆరు పేలోడ్లు ఉన్నాయి.

చంద్రుని ఉపరితలాన్ని త్రీడీలలో చిత్రీకరించడం ...........

చంద్రుని ఉపరితలాన్ని త్రీడీలలో చిత్రీకరించడం.. వివిధ ఖనిజాలు వాటి రసాయనిక స్పీసిస్‌లను, వాటి రేడియో ధార్మికత తదితరాలను అధ్యయనం చేసేందుకు చంద్రయాన్‌-1 ప్రయోగం చేపట్టారు. భూమిపై నుంచి కనిపించకుండా నీడలో ఉండే ఉత్తర, దక్షిణ ధృవ ప్రాంతాల ఖనిజ, రసాయనాలకు సంబంధించిన హై రెజెల్యూషన్‌ చిత్రాలను పంపుతుంది. చంద్రుడికి సంబంధించిన అన్ని కోణాలనూ ఈ ప్రయోగం విశ్లేషిస్తోంది.

2013 నవంబర్‌ 5న మంగళ్‌యాన్‌ ప్రయోగం

అరుణగ్రహంపై పరిశోధనల కోసం.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన మంగళ్‌యాన్‌ను.. 2013 నవంబర్ 5వ తేదీన... శ్రీహరికోట లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించారు. మంగళవారం మధ్యాహ్నం షార్ అంతరిక్ష కేంద్రం నుంచి రాకెట్ లాంచర్ సాయంతో "మంగళ్‌యాన్" మొదలైంది.

దాదాపు 40 కోట్ల కి.మీ. ప్రయాణించిన మంగళ్‌యాన్‌.....

రోదసీలోకి దూసుకు వెళ్లిన మామ్‌.. మూడు వందల రోజుల పాటు.. దాదాపు 40 కోట్ల కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించి మంగళగ్రహాన్ని చేరుకుంది. అరుణగ్రహం చుట్టూ పరిభ్రమిస్తూ అక్కడ జీవాన్వేషణ, ఆ గ్రహం నిర్మాణం, ఖనిజాల మిశ్రమం తదితరాలను శోధిస్తుంది.

మార్స్‌పై ప్రయోగాలు చేసిన నాలుగో దేశంగా గుర్తింపు......

ఈ ప్రయోగం ద్వారా... అరుణగ్రహంపై విజయవంతంగా ప్రయోగాలు నిర్వహించిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. ఇప్పటివరకూ ఈ ఘనతను సాధించిన అమెరికా, రష్యా, ఐరోపాల సరసన నిలిచింది. అంతేకాదు మొదటి ప్రయత్నంలోనే అంగారక కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన తొలి దేశంగానూ గుర్తింపు పొందింది. అంగారకుడి ఉపరితలాన్ని, భౌగోళిక స్వరూపాన్ని అధ్యయనం చేయడం.. అక్కడి వాతావరణాన్ని పరిశీలించడం.. భవిష్యత్తులో మానవసహిత అంగారక యాత్రకు వేదికను సిద్ధం చేయడం లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రయోగం.. భారత సత్తాను ప్రపంచ దేశాలకు చాటింది. 

గ్రేటర్ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. గ్రేటర్ ఓట్ల తొలగింపు పై స్పష్టత వచ్చాకే ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలంటూ సుప్రీం ను ఆశ్రయించగా ఈ అంశాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలన్న సుప్రీం సూచనతో మహేష్ గౌడ్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు.

కాల్ మనీ కేసు నీరుగారుస్తున్నారనడం అవస్తవం:చినరాజప్ప

గుంటూరు : కాల్ మనీ కేసు నీరుగారుస్తున్నారనడం అవస్తవం అని హోం మంత్రి చినరాజప్ప అన్నారు. పోలీసుల పని పోలీసులు చేశారని... న్యాయస్థానం తీర్పును ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని, సత్యానందం బెయిల్ పొందినంతమాత్రాన కేసు నీరుగారుతుందనటం సరికాదన్నారు. ఈ కేసులో సత్యానందం దోషిగా తేలితే సస్పెండ్ చేస్తామని తెలిపారు.

 

11:12 - December 30, 2015

హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికలో ప్రజాస్వామ్యమే గెలిచిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార పార్టీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా చివరికి కాంగ్రెస్సే గెలిచిందన్నారు. ఈ విజయవాన్ని సోనియాకు బహుమతిగా ఇవ్వాలనుకున్నానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు.

రెండు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు

హైదరాబాద్ : స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలను ఖాతాలో వేసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లగొండ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గెలుపొందారు. మరోవైపు మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి కూచిపూళ్ల దామోదర్‌రెడ్డి విజయం సాధించారు.

ఏపీలో నీతిఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ పర్యటన

హైదరాబాద్ :ఏపీలో నీతిఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ పనగరియా పర్యటించారు.విజయవాడ రూరల్‌ మండలం జక్కంపూడిలో పోలవరం కుడికాలువ పనులను పనగరియా పరిశీలించారు. నీతిఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ పనగరియా వెంట మంత్రి దేవినేని ఉమ, అధికారులు ఉన్నారు.

రంగారెడ్డి జిల్లాలో టిఆర్ ఎస్ విజయం

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి విజయం సాధించారు. 

10:43 - December 30, 2015

హైదరాబాద్: బాబా రాందేవ్ ఆధ్వర్యంలో మార్కెటింగ్ అవుతున్న పతంజలి ప్రొడక్టులను వాడవద్దని తమిళనాడు తహీద్ జమాత్ (టీఎన్టీజే) ఫత్వా జారీ చేసింది. ఇస్లాంలో ఎంతమాత్రమూ స్థానంలేని గోమూత్రాన్ని వివిధ ఆహార, చర్మ సంరక్షణ, ఆరోగ్య ఉత్పత్తుల్లో వాడుతున్నారని, ఇవి బహిరంగ మార్కెట్లో, ఆన్ లైన్లో లభ్యమవుతున్నాయని టీఎన్టీజే ఓ ప్రకటనలో ఆరోపించింది. "ముస్లింల నమ్మకాల ప్రకారం ఆవు మూత్రం ఎంతమాత్రమూ ఉపయోగించరాదు. అందువల్ల పతంజలి ఉత్పత్తులు కూడా వాడకండి" అని ఆ ఫత్వాలో పేర్కొన్నారు. ముస్లింలు వాటిని వాడటం సరికాదని, ఆ ఉత్పత్తుల్లో ఏం కలుపుతున్నారన్న విషయం చాలా మందికి తెలియడం లేదని కూడా టీఎన్టీజే వెల్లడించింది. రోజువారీ జీవనంలో పతంజలి ప్రొడక్టులు వాడతగినవి కాదని పేర్కొంది.

10:42 - December 30, 2015

హైదరాబాద్ : ఉత్కంఠ రేపిన నల్లగొండ ఎమ్మెల్సీ స్థానం కాంగ్రెస్‌ ఖాతాలో చేరింది.. 158 ఓట్లతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చిన్నపరెడ్డిపై కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి విజయం సాధించారు.. మొదటినుంచి కౌంటింగ్‌లో హస్తం హవా కొనసాగింది.. 

10:40 - December 30, 2015

హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో టీఆర్‌ఎస్‌ బోణీ కొట్టింది.. ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుంది.. హోరాహోరీగా సాగిన పోరులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాలసాని లక్ష్మినారాయణ 31 ఓట్లతో గెలుపొందారు.. 

10:36 - December 30, 2015

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ఉన్నత న్యాయస్థానం ఈ ఏడాది ఎన్నో సంచలన తీర్పులు ఇచ్చింది. రాష్ట్ర విభజన చట్టంలోని తగాదాలను ధర్మాసనం పరిష్కరించింది. మునుపెన్నడు లేనివిధంగా మానవీయత కోణంలో కేసులను సుమోటోగా స్వీకరించి.. సంచలన తీర్పులు ప్రకటించింది. సంచలనాల నిలయంగా మారిన హైకోర్ట్ ఆఫ్ జ్యుడీషియర్ ఎట్ హైదరాబాద్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రపద్రేశ్ పై ఇయర్ ఎండ్ రివ్యూ .

కోడిపందాలపై నిషేధం విధించడం.....

ఉమ్మడి హైకోర్టు. ఇప్పుడు ఎన్నో కథనాలకు ప్రత్యేక కేంద్రంగా మారింది. ఈ ఏడాదిలో సుమోటో కేసులు దీర్ఘకాలిక కేసుల పరిష్కారం చూపడం వంటి వాటితో హైకోర్టుపై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగింది. ఈ ఏడాది ప్రారంభంలోనే కోడిపందేలపై హైకోర్టు కీలక తీర్పు ప్రకటించింది. ఆంధ్ర, రాయలసీమలో కోడిపందేలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు అదేశించింది. ఎవరు పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. హైకోర్టు విభజన జరపాలని సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అప్పటి వరకు జూనియర్ సివిల్ జడ్జి పరీక్షలు నిర్వహించవద్దని వాదనలు వినిపించారు. అయితే పరీక్షలు నిర్వహించి.. తుది ఫలితాలు రిజర్వ్‌ చేయాలని అదేశాలు జారీ చేసింది.

ఉద్యోగుల విభజనలపై స్పష్టత..........

ట్రాన్స్‌కో ఉద్యోగుల విభజన, అంబేద్కర్, తెలుగు ఓపెన్ యూనివర్శిటీ స్టడీ సెంటర్స్ నిర్వహణ, ఉద్యానవన ఉద్యోగుల విభజన వంటి విషయాలలో స్పష్టత ఇచ్చింది. 610 జీ.వో. అమల్లో ఉంటుందని తెలిపింది. నెంబర్ ప్లేట్ వివాదాన్ని, ఆర్టీసీ విభజన అంశాన్ని విచారించింది. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని సెక్షన్ 8 పై వేసిన పిటిషన్స్ ను తమ పరిధిలో లేదని పార్లమెంట్ చేసిన బిల్లులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

పార్టీ ఫిరాయింపులపై ప్రభుత్వాలకు మొట్టికాయలు........

ఇరు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల పార్టీ పిరాయింపులపై కోర్టు సుధీర్ఘంగా వాదనలు వింది. తెలంగాణలో టీ.డీ.పీ, కాంగ్రెస్, వై.ఎస్.ఆర్.సీపి నుంచి టీ.ఆర్‌.ఎస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేల పై వేటు వేయకుండా స్పీకర్ కాలయాపన చేస్తున్నారని, ఆయాపార్టీలకు చెందిన నేతలు పిటిషన్ వేశారు. 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని అదేశాలు జారీచేసింది. ఇక జగన్ ఆస్తుల కేసులో ఐ.ఏ.ఏస్. అధికారిణి రత్నప్రభకు హైకోర్టులో ఊరట లభించింది. క్వాచ్ పిటిషన్ పై విచారణ జరిపి రత్నప్రభను నిందుతుల లిస్టులోంచి తొలగించాలని అదేశించింది. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ఎపీ మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేసిందన్న పిటిషన్‌పై విచారించింది. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం తరుపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాధి రాంజెఠ్మలాని వాదనలు వినిపించారు.

అగ్రిగోల్డ్ కేసును సీరియస్ గా తీసుకున్న కోర్టు .........

ఇక అగ్రిగోల్డ్ కేసును హైకోర్టు సీరియస్‌గా తీసుకుంది. 30 లక్షల మంది బాధితులకు వడ్డీతో సహా చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఇందుకు హైకోర్టు రిటైర్డ్ జడ్జితో కూడిన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. సి.ఐ.డి. దర్యాప్తు సరిగా లేదని ఆగ్రహాం వ్యక్తం చేసింది. అగ్రిగోల్డ్ 7 వేల కోట్ల స్కాంను బాధితులకు చెల్లించే ప్రక్రియను స్వయంగా మానిటరింగ్ చేయడంతో హైకోర్టు పై ప్రజలకు పూర్తి విశ్వాసం పెరిగినట్లుగా న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక సవితి తల్లి, తండ్రి వేధింపులు తాళ్లలేక ఇబ్బంది పడ్డ ప్రత్యూష కేసును .. జడ్జి రాసిన లేఖతో విచారణ చేపట్టి.. బాధితురాలికి పూర్తి న్యాయం చేసింది. మహాబూబ్ నగర్ జిల్లాలో నేషనల్ హై వే వద్ద తండా ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని వచ్చిన వార్తను సుమోటగా స్వీకరించి రోడ్డుకు వంతెనె ఏర్పాటు చేయాలని అదేశించింది.

పేపర్ లెస్ కోర్టుగా మర్చేందుకు....

ఈ ఏడాదిలోనే ఉమ్మడి హైకోర్టు ప్రధాన జడ్జిగా జస్టిస్ జ్యోతి కళ్యాన్ సేన్ గుప్తా.. పదవి విరమణ చేయగా తాత్కలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి. బోసలే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పేపర్ లెస్ కోర్టుగా మర్చేందుకు ట్యాబ్ ద్వారానే విచారణ జరిపేలా చర్యలు తీసుకుంటున్నట్లు పలు సార్లు ప్రధాన న్యాయమూర్తి ప్రకటించారు. ఇందుకు గాను హై కోర్టులో డిస్‌ప్లే బోర్డులు, ఎస్.ఎం.ఎస్.ల అలర్ట్స్ వంటి కార్యక్రమాలు చేపట్టి నయా ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. 

10:32 - December 30, 2015

హైదరాబాద్ : ప్రముఖ గుజరాత్‌ రచయిత రఘువీర్‌ చౌదరిని జ్ఞానపీఠ్‌ అవార్డు వరించింది. 2015కు గాను ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఆయన కైవసం చేసుకోనున్నారు. ప్రముఖ రచయిత నామ్‌వర్‌ సింగ్‌ నేతృత్వంలోని కమిటీ.. జ్ఞానపీఠ్‌ అవార్డుకు రఘువీర్‌ను ఎంపిక చేసింది. వచ్చే ఏడాది ప్రత్యేక కార్యక్రమంలో 11 లక్షల నగదు, సరస్వతి దేవి ప్రతిమతో పాటు ప్రశంసా పత్రాన్ని రఘువీర్‌కు అందజేస్తారు. ఇప్పటికే తన రచనలకు.. రఘువీర్‌ సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. రఘువీర్‌ నవలలు, పద్యాలు, కథలతో పాటు పత్రికలకు వ్యాసాలు కూడా రాస్తుంటారు. ఇప్పటివరకు 80కి పైగా పుస్తకాలను ఆయన రచించారు. 

మహబూబ్ నగర్ లో టిఆర్ ఎస్ గెలుపు

మహబూబ్‌నగర్‌: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ హవా హోరాహోరీగా కొనసాగుతోంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరగగా.. ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి 443 ఓట్లతో విజయం సాధించారు. తొలి ప్రాధ్యానత ఓట్లలోనే ఆయన గెలుపొందారు.

సిరిసిల్లలో దంపతుల ఆత్మహత్యాయత్నం...

కరీంనగర్ : సిరిసిల్ల విద్యానగర్‌లో దంపతులు నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో భార్య మృతి చెందారు. భర్త పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

విజయం దిశగా కోమటిరెడ్డి

నల్గొండ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోమటిరెడ్డి విజయం దిశగా దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ తరపున పోటీస్తున్న కోమటిరెడ్డికి 492 ఓట్లు, ప్రత్యర్థి టిఆర్ ఎస్ అభ్యర్థి చిన్నపరెడ్డి కి 391 ఓట్లు వచ్చాయి.

ఖమ్మం ఎమ్మెల్సీ టిఆర్ ఎస్ కైవసం

ఖమ్మం: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో భాగంగా మొదటి రౌండ్ లో టీఆర్‌ఎస్ అభ్యర్థి బాలసాని లక్ష్మీనారాయణ 38ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 725ఓట్లకు 692 ఓట్లు పోలయ్యాయి. ఖమ్మంలో 347 ఓట్లు సాధించిన అభ్యర్థిదే విజయం కానుంది. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

పుత్తూరులో భారీగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం...

చిత్తూరు : పుత్తూరు వద్ద రూ.3 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను అటవీ అధికారులు పట్టుకున్నారు. పుత్తూరు చెక్‌పోస్టు వద్ద మంగళవారం అర్థరాత్రి అటవీ అధికారులు తనిఖీలు చేస్తుండగా ఒక టాటా ఇండికా కారు ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో అధికారులు కారును వెంబడించారు. అయితే, పరమేశ్వర మంగళం వద్ద కారును స్మగ్లర్లు వదిలేసి వెళ్లిపోయారు. దీంతో కారు సహా అందులోని రూ.3 లక్షల విలువైన 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు రేంజి అధికారి రెడ్డప్ప తెలిపారు.

08:38 - December 30, 2015

హైదరాబాద్ : చిత్తూరు జిల్లా సి.మల్లవరం వద్ద మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత రెండు వోల్వో బస్సుల ఢీ కొన్నా ఈ ఘటనలో డ్రైవర్ సహా 20 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. గాయపడ్డ వారిలో 15 మంది వరకు అయ్యప్పస్వాములు ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

08:34 - December 30, 2015

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలకు కరువు సాయం అందించడంలో కేంద్రం చిన్న చూస్తోంది. ఓవైపు చుక్క వర్షాల్లేక తెలంగాణ..మరోవైపు అకాల వ‌ర్షాల‌తో సర్వస్వం కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని ఆదుకోవడంలో కేంద్రం సవతి తల్లి ప్రేమను ప్రదర్శించింది. దాదాపు 5వేల కోట్లకుపైగా కరువు సాయం చేయాలని ఏపీ ప్రతిపాదనులు పంపగా..కేంద్రం మాత్రం సాయం చేసేందుకు ఒక్కడుగు కూడా ముందుకు వేయడంలేదు.

13 జిల్లాల్లోని 359 కరువు మండలాలు....

ఓ వైపు అంతులేని కరువు..మరోవైపు అకాల భారీ వర్షాలతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కేంద్రం చొరవచూపడంలేదు. తాజాగా రాష్ట్రంలో క‌రువు ప్రాంతాల‌ను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 359 క‌రువు మండ‌లాల జాబితాను ప్రకటించి కేంద్రానికి నివేదిక‌లు పంపింది. ఆ తర్వాత కేంద్ర పరిశీల‌క బృందాలు కూడా వ‌చ్చాయి. కానీ స‌హాయానికి సంబంధించిన ప్రకటనలు మాత్రం చేయలేదు. దీంతో క‌రువు మండ‌లాల రైతులు తీవ్ర అవస్థలు ప‌డుతున్నారు. కరువు సాయం కోసం రాష్ట్రప్రభుత్వం కేంద్రం వైపు ఆశగా చూస్తుంటే..కేంద్రం మాత్రం ఏపీ పట్ల నిర్లక్ష వైఖరి అవలంభిస్తోంది.

రాష్ట్రానికి రూ. 2వేల 56 కోట్లు అవసరం.....

రాష్ట్రంలో కరువు నివారణకు తక్షణం 2వేల.56 కోట్లు అవసరమని, ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలోనే కేంద్ర పరిశీలక బృందాలకు తెలిపారు. రాష్ట్రంలో కరువు, అకాల వర్షాల కారణంగా 5,759 కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక సమర్పించింది. రాష్ట్రంలోని 670 మండలాలలో 359 మండలాలు వర్షాభావ పరిస్థితులతో బీడు భూములుగా మారాయనీ,.ఖరీఫ్‌లో 10 జిల్లాల్లో దాదాపు 5 లక్షల హెక్టార్లలో విత్తనాలు నాటే పరిస్థితులు లేవని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి ఏపీకి కరువు సాయం చేయాలని సీఎం చంద్రబాబు కోరుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంపైనా కేంద్రం చిన్నచూపే....

అటు కరువుతో అల్లాడిపోతున్న తెలంగాణ రాష్ట్రంపైనా కేంద్రం చిన్నచూపు చూస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కరువు నివేదిక ఆలస్యంగా అందిందన్న కారణంతో నిధుల్ని ఇవ్వడంలేదు. తెలంగాణ వ్యాప్తంగా 60శాతం మేర కరువు నెలకొందని కేంద్రానికి తెలిపింది. 459 మండలాల్లో 231 మండలాలను కరువు మండలాలుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించి దీనికింద 2450 కోట్ల కరువు సాయం చేయాలని కేంద్రాన్ని కోరింది. దేశంలోని ఇతర రాష్ట్రాలకు నిధులు మంజూరుచేసి తెలంగాణకు ఇవ్వకపోవడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని వెంటనే ఢిల్లీ వెళ్లి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిని కలిసి కరువు సాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి తెలుగు రాష్ట్రాలకు కరువు సాయం ప్రకటించాలని ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రాన్ని కోరుతున్నారు. 

08:31 - December 30, 2015

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేసిన కాలమనీ కేసు దర్యాప్తును నీరు కార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా? నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాలన్సిన పాలకులు, పోలీసులు..... దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారా ? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే..అవుననే సమాధానం వస్తోంది. ఈ కేసులో అరెస్టైన నిందితులే తక్కువ. వీరిలో కూడా కొందరు కోర్టులకు వెళ్లి బెయిల్‌ తెచ్చుకుంటే.. మరికొందరు మందస్తు బెయిల్‌ పొందుతున్నారు.

తప్పించుకుంటున్న బడా బాబులు ........

కాల్‌ మనీ కేసు.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసులో బడా బాబులు తప్పించుకున్నా, చిన్నా చితక వ్యాపారుల్ని పోలీసులు బుక్‌ చేశారు. కొందరిని అరెస్ట్ చేసి కటకటాలు లెక్కపెట్టేలా చేస్తే... మరికొందరి పట్ల ఉదాసీంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి కుటుంబ సభ్యులు ...........

కాల్‌ మనీ కేసులో రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి కుటుంబ సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు... ఇలా రకరకాల వర్గాల వారు ఉన్నారు. అర్ధబలం, అంగబలం, రాజకీయ పలుకుబడి ఉన్నవారి జోలికి పోలీసులు వెళడంలేదున్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో నిందితుడుగా ఉన్నప్రభుత్వ ఉద్యోగి సత్యానందం హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్‌ తెచ్చుకోవడమే ఇందుకు నిదర్శనం. పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్న సత్యానందంకు బెయిల్‌ ఇచ్చిన హైకోర్టు..దర్యాప్తుకు సహకరించాలని ఆదేశించింది.

సత్యానందాన్ని పోలీసులే పక్కకు తప్పించారా ? .....

అయితే సత్యానంతం నిజంగా పోలీసులకు చిక్కలేదా....? కావాలనే పోలీసులు పక్కకు తప్పించారా...? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో ప్రభుత్వ పాత్రపై కూడా ప్రజలకు అనుమానాలు కలుగుతున్నాయి. పరోక్షంగా సర్కార్‌ మౌకిక ఆదేశాల మేరకే కాల్‌ మనీ కేసు దర్యాప్తును పోలీసులు నీరు కారుస్తున్నారని విమర్శలున్నాయి. సత్యానందం లాయర్లను సంప్రదిస్తూ ముందుస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకుని, జామీను పొందే వరకు పోలీసులు ఏం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఖాకీలు ప్రయత్నించి ఉంటే సత్యానందం దొరకడం కష్టమవుతుందా? అని కొందరు అడుగుతున్నారు.

శివశంకర్‌ కేసులో సరిగా వ్యవహరించని పోలీసులు ........

కాల్‌ మనీ కేసులో అరెస్టైన మరికొందరు నిందితులు కూడా బెయిల్‌ కోసం దరఖాస్తు చేస్తున్నారు. విజయవాడకు చెందిన మాజీ రౌడీ షీటర్‌ మాదంసెట్టి శివకుమార్‌ను అరెస్టు చేశారు. అయితే తనకు ఆరోగ్యం సమస్యలున్నాయని..చికిత్స అవసరమంటూ కోర్టును ఆశ్రయించి, దర్జాగా ఆస్పత్రిలో ఉంటున్నారు. ఈ విషయంలో కూడా పోలీసులు సరిగా వ్యవహరించలేదన్న విమర్శలున్నాయి. కాల్‌మనీ కేసు దర్యాప్తులో పోలీసుల వ్యవహార శైలిపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిందితులకు బెయిల్‌ రాకుండా చూడాల్సిన ఖాకీలు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. 

08:21 - December 30, 2015

హైదరాబాద్ : బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్, హీరోయిన్ అనుష్కా శర్మ.. వీళ్లిద్దరినీ 2015 సంవత్సరానికి గాను హాటెస్ట్ వెజిటేరియన్లగా పెటా ఎంపిక చేసింది. అమితాబ్ బచ్చన్, ఆలియా భట్, కంగనా రనౌత్, షాహిద్ కపూర్, ఆర్. మాధవన్, ధనుష్.. ఇలా ఎంతోమంది ఈ టైటిల్ కోసం పోటీపడినా, వాళ్లందరినీ తోసిరాజని ఆమిర్, అనుష్క గెలుచుకున్నారు. పెటాఇండియా.కామ్ వెబ్‌సైట్ చూసేవాళ్లందరినీ తమకు బాగా నచ్చిన వెజిటేరియన్లకు ఓట్లు వేయాల్సిందిగా కోరారు. తాను పూర్తి 'వెగన్'గా మారుతున్నట్లు ఆమిర్ ఇటీవలే ప్రకటించాడు. అంటే పాలు, పాల ఉత్పత్తులు, కోడిగుడ్లు, తేనె, తోలు, ఫర్, పట్టు, ఊలు, కాస్మొటిక్స్, పశు ఉత్పత్తుల నుంచి తయారుచేసిన సోపులు కూడా వాడరన్నమాట. వెగన్స్ అంటే నాన్ వెజిటేరియన్లు, వెజిటేరియన్ల కంటే కూడా ఎక్కువని తాను కన్విన్స్ అయినట్లు ఆమిర్ చెప్పాడు. అలాగే.. మనం ఏం తింటున్నామన్నది చాలా ముఖ్యమని, తగినన్ని కాయగూరలు తినడం, తగినంత నీళ్లు తాగడం అవసరమని, తాను ఎప్పుడూ అలాగే చేస్తానని అనుష్కాశర్మ ఈ సందర్భంగా ఓ ప్రకటనలో తెలిపింది. ఆమిర్.. అనుష్క.. వీళ్లిద్దరూ వెజిటేరియన్లకు సరైన ఉదాహరణ అని పెటా ఇండియా మేనేజర్ సచిన్ బంగెరా అన్నారు.

08:13 - December 30, 2015

హైదరాబాద్ : తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. ఈ ఓట్ల లెక్కింపులో తొలిసారిగా ‘తొలగింపు’ పద్ధతిని అవలంభిచనున్నారు. అంటే తొలుత చెల్లని ఓట్లను తొలగించిన తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. స్థానిక సంస్థల కోటాలో మొత్తం 12 స్థానాలకుగానూ ఇప్పటికే ఆరు స్థానాల్ని అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ పార్టీ ఏకగ్రీవం గెలుచుకుంది. ఇక మిగిలిన ఆరు స్థానాలకు ఈనెల 27న 4 జిల్లాల్లో పోలింగ్‌ నిర్వహించారు. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో రెండేసి స్థానాలు, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఆయా స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇవాళ ఉదయం 8గంటల నుంచి ప్రారంభంకానుంది. ఖమ్మం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ భవనంలో, నల్గొండ జిల్లా కేంద్రంలోని డ్వామా కార్యాలయంలో, మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ కళాభవన్‌లో, రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్‌ ఆర్డీవో కార్యాలయంలో ఓట్ల లెక్కింపు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 

నేడు భేటీ కానున్న ఏపీ కేబినెట్

విజయవాడ: సీఎం క్యాంపు ఆఫీస్ లో సీఎం చంద్రబునాయుడు అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ఏపీకేబినెట్ భేటీ జరగనుంది. వీరి భేటీ వచ్చే నెల 2 నుంచి ఏపీలో జన్మభూమి కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంపై నేటి కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరగనున్నట్లు సమాచారం. ఇక నూతన ఇసుక పాలసీపైనా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు కూడా తెలుస్తోంది.

హెల్మెట్ ధరించాల్సిందే

హైదరాబాద్ : ద్విచక్ర వాహనచోదకులు కచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందే అని హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ విభాగాల అధికారులు స్పష్టం చేశారు. మోటారు వాహనాల చట్టంలో ఉన్న ఈ నిబంధన ప్రస్తుతం అమలులోనే ఉందని, ఉల్లంఘించిన వారికి రూ.100 జరిమానా విధిస్తున్నామని పేర్కొన్నారు. అదే వ్యక్తి మరోసారి ఉల్లంఘనకు పాల్పడినట్లు తేలితే ఈ జరిమానా రూ.300 వరకు విధించే అవకాశం ఉందని తెలిపారు.

ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.

హైదరాబాద్ : తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. ఈ ఓట్ల లెక్కింపులో తొలిసారిగా ‘తొలగింపు’ పద్ధతిని అవలంభిచనున్నారు. అంటే తొలుత చెల్లని ఓట్లను తొలగించిన తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొత్తం 12 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా, ఆయా పార్టీల అభ్యర్థులను తన వైపు తిప్పుకోగలిగిన టీఆర్ఎస్ ఆరింటిని ఏకగ్రీవంగానే దక్కించుకుంది. ఇక మిగిలిన ఆరు స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థుల విజయం నల్లేరుపై నడకేనన్న వాదన వినిపిస్తోంది. నేటి మధ్యాహ్నంలోగా పూర్తి స్థాయి ఫలితాలు విడుదల కానున్నాయి.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం...

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాలినడకన వచ్చిన భక్తులకు 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.

07:32 - December 30, 2015

హైదరాబాద్ : అధికార, ప్రతిపక్షాల మధ్య గ్రేటర్ వేడి ప్రారంభం అయ్యింది. గ్రేటర్ హైదరాబాద్‌లో నేడో, రేపో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. దీంతో నగరంలో అధికారపార్టీ తన యంత్రాంగాన్ని సిద్దంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఓవైపు చుక్క వర్షాల్లేక తెలంగాణ..మరోవైపు అకాల వ‌ర్షాల‌తో సర్వస్వం కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని ఆదుకోవడంలో కేంద్రం సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తోందా? ఏ నియోజకవర్గానికి ఎంతెంత ఖర్చు పెట్టారో స్పష్టం చేసే దమ్ము కేసీఆర్ ప్రభుత్వానికి ఉందా? ప్రజల కోసం టిఆర్ ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందా? అబద్ధాలు చెప్పడంలో టిఆర్ఎస్ నేతలు గ్లోబల్స్ ను మించి పోయారా? ఇత్యాది అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో బిజెపి నేత ప్రకాష్ రెడ్డి, టిఆర్ ఎస్ నేత రాకేష్ రెడ్డి, టిడిపి అధికార ప్రతినిధి విద్యాసాగర్ పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై మాట్లాడారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

07:10 - December 30, 2015

హైదరాబాద్ : డిడిసిఎలో జరిగిన అవినీతిపై విచారణకు కేజ్రీవాల్‌ నియమించిన గోపాల్ సుబ్రమణ్యం కమిటీ నడుం బిగించింది. విచారణ కోసం టాప్‌మోస్ట్‌ అధికారులను కేటాయించాలని కోరుతూ గోపాల సుబ్రమణ్యం ఎన్‌ఎస్‌ఏకు లేఖ రాశారు. మరోవైపు డిడిసిఏ బాగోతం బయటపడాలంటే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.

విచారణకు అధికారులను కేటాయించాలని కేంద్రానికి గోపాల్‌ సుబ్రమణ్యం లేఖ.....

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ హయాంలో డిడిసిఏలో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ జరపడానికి కేజ్రీవాల్‌ ప్రభుత్వం మాజీ సొలిసిటర్‌ జనరల్ గోపాల్‌ సుబ్రమణ్యం అధ్యక్షతన విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో విచారణ కోసం ఉత్తమ అధికారులను కేటాయించాలని గోపాల సుబ్రమణ్యం జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌కు లేఖ రాశారు.

స్పెషల్‌ ఇన్విస్టిగేషన్‌ టీం- సిట్‌ ఏర్పాటు....

డిడిసిఏ అవినీతిపై విచారణకు గాను స్పెషల్‌ ఇన్విస్టిగేషన్‌ టీం- సిట్‌ ఏర్పాటు చేయాలని గోపాల్‌ సుబ్రమణ్యం యోచిస్తున్నారు. ఇందులో భాగంగా సిబిఐ, ఐబి, ఢిల్లీ పోలీసులతో విచారణ కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రానికి రాసిన లేఖలో తెలిపారు. ఒక్కో విభాగం నుంచి ఐదుగురు బెస్ట్‌ ఆఫీసర్స్‌ కావాలని గోపాల సుబ్రమణ్యం కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ కేసు విచారణకు సంబంధించి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ధోవల్‌కు విజ్ఞప్తి చేసినట్టు ఆయన తెలిపారు.

సుబ్రమణ్యం కమిటీపై కేంద్రం పలు సందేహాలు.....

మరోవైపు డిడిసిఏపై ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గోపాల సుబ్రమణ్యం కమిటీపై కేంద్రం పలు సందేహాలు వ్యక్తం చేస్తోంది. విచారణ కమిటీని నియమించే అధికారం ఢిల్లీ ప్రభుత్వానికి లేదని చెబుతోంది. డిడిసిఎ వ్యవహారం కేంద్రం వాణిజ్య శాఖ పరిధిలోకి వస్తోందని కేంద్రం పేర్కొంది.

రాజ్యాంగ నిబంధనల ప్రకారమే ఢిల్లీ ప్రభుత్వం కమిటీ.....

రాజ్యాంగ నిబంధనల ప్రకారమే ఢిల్లీ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసినట్టు గోపాల్‌ సుబ్రమణ్యం స్పష్టం చేశారు. విచారణ కమిటిని నియమించే అధికారం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో గోలాప్‌ సుబ్రమణ్యం లేఖపై ఎన్‌ఎస్‌ఏ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది.

సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐతో విచారణ చేయాలి...

డిడిసిఎ కుంభకోణంలో నిజాలు బయటకు రావాలంటే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. అరుణ్‌జైట్లీ 2013 వరకు 13 ఏళ్ల పాటు డిడిసిఎ అధ్యక్షులుగా కొనసాగారు. ఆ సమయంలో డిడిసిఎలో అక్రమ ఒప్పందాలతో కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందని ఆప్‌ ఆరోపించింది. డిడిసిఎలో జరిగిన అవినీతి బయపడకుండా ఉండేందుకే ప్రిన్సిపల్‌ సెక్రెటరీ కార్యాలయంపై సిబిఐ దాడులు జరిపిందని కేజ్రీవాల్‌ జైట్లీని టార్గెట్‌ చేశారు.

07:04 - December 30, 2015

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌లో జీహెచ్ఎంసి ఎన్నికల వేడి ఊపందుకుంది. ఇప్పటికే ఎన్నికల కోసం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘం..తాజాగా ఆల్‌ పొలిటికల్‌ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటుచేసింది. కోడాఫ్‌ కండ‌క్ట్, ఎన్నిక‌ల నిర్వహణ, ఖ‌ర్చుపై రాజకీయ పార్టీలతో సుదీర్ఘంగా చ‌ర్చింది. బేగంపేట హ‌రిత ప్లాజాలో నిర్వహించిన ఈ స‌మావేశానికి అన్ని రాజ‌కీయ పార్టీల నాయ‌కులు హాజరయ్యారు.

అన్ని రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం ............

గ్రేటర్‌ ఎన్నికల్ని నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా అడుగులు వేస్తోంది. ఎన్నికల నిర్వహణ కోసం వ‌రుస స‌మావేశాలు నిర్వహిస్తున్న రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా పొలిటిక‌ల్ పార్టీలలతో భేటీ అయింది. ఈసి నిర్వహించిన ఈ సమావేశానికి కాంగ్రెస్, టీఆర్ఎస్, బిజేపి. సిపిఎం, సిపిఐ, ఎంఐఎం, ఎంబిటి, వైసిపి పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. .

కార్పొరేటర్‌గా పోటీచేసే అభ్యర్థి వ్యయం రూ. 2లక్షలు.....

జీహెచ్ఎంసి ఎన్నిక‌ల్లో కార్పొరేట‌ర్‌గా పోటీచేసే అభ్యర్థుల ఎన్నిక‌ల వ్యయం 2లక్షల రూపాయ‌లుగా, ఎస్సీ, ఎస్టీల‌కు నామినేష‌న్ డిపాజిట్‌గా 2,500, ఓసీ, బీసీల‌కు 5వేల రూపాయ‌లుగా ఈసీ నిర్ణయించింది. జ‌న‌వ‌రి 31వ తేదీలోగా ఎన్నిక‌ల ప్రక్రియ పూర్తిచేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నాగిరెడ్డి తెలిపారు. ఈ సారి గ్రేటర్‌ ఎన్నిక‌ల‌్లో 7,750 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని..ప్రతివార్డుకు ప్రత్యేకంగా రిట‌ర్నింగ్ అధికారుల్ని నియమిస్తున్నామన్నారు.

రిజ‌ర్వేష‌న్ల మీద క్లారిటి ఇవ్వకుండా.....

అయితే రిజ‌ర్వేష‌న్ల మీద క్లారిటి ఇవ్వకుండా రిజ‌ర్వేష‌న్లు ప్రకటించకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని రాజకీయ పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. డిసెంబ‌ర్ 31 నాటికే ఎన్నిక‌లు పూర్తి చేస్తామ‌ని చెప్పిన సర్కార్‌..ఇప్పుడు జ‌న‌వ‌రి 31 వ‌ర‌కు ఓలా పొడిగించుకుందని విమర్శిస్తున్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌..తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు.

ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని....

గ్రేటర్‌ ఎన్నికలపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని అధికార టీఆర్‌ఎస్‌ నేతలు విమర్శిస్తున్నారు. ఎన్నిక‌ల నిర్వహణలో అధికారులు చేస్తున్న క‌స‌ర‌త్తును అభినందించారు. మొత్తానికి రిజ‌ర్వేష‌న్లు ప్రకటించిన త‌ర్వాత కొంత సమయం కావాలని కొన్ని పార్టీలు కోరుతుంటే..మ‌రి కొన్ని పార్టీలు మాత్రం ఎంత తొందరగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్ని నిర్వహిస్తే అంత మంచిదని అభిప్రాయపడుతున్నారు. దీంతో అస‌లు రిజ‌ర్వేష‌న్స్ ఎప్పుడు ప్రకటిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

07:00 - December 30, 2015

గుంటూరు : ఎంతో కాలంగా ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న తాత్కాలిక రాజధానిపై కసరత్తుకు ఫైనల్ గా ప్లేస్ ఓకే అయింది. ఏపీ నూతన రాజధాని అమరావతి దగ్గర్లో ఉన్న టౌన్ షిప్ లో తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు బాబు. ఇందుకు గాను మాస్టర్ ప్లాన్ కూడా రెడీ అయింది. దీంతో తాత్కాలిక రాజధాని పనులను వేగంగా చేపట్టాలని భావిస్తోంది టీడీపీ సర్కార్. తాజాగా అమరావతి టౌన్ షిప్ లో నేలను చదును చేసే పనులను సైతం ప్రారంభించారు. మంత్రి నారాయణ, పత్తిపాటి పుల్లారావు అమరావతి టౌన్ షిప్ ప్రాంతాన్ని పరిశీలించి రాజధాని ఏర్పాటుపై అధికారులతో సమాలోచనలు జరిపారు.

అమరావతి టౌన్ షిప్ ను పరిశీలించిన మంత్రులు.....

కాని అమరావతి టౌన్ షిప్ ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రులే.. తరువాత కాలంలో బడ్జెట్ ను దృష్టిలో ఉంచుకుని ఆలోచనను విరమించుకున్నట్లు ప్రకటించారు. తాత్కాలిక రాజధాని నిర్మాణం కోసం ఖర్చుపెట్టే డబ్బుతో శాశ్వతంగా రాజధాని నిర్మించవచ్చని భావించింది ప్రభుత్వం. మంగళగిరిలో అమరావతి టౌన్ షిప్ గతంలో హుడా ఆధీనంలో ఉండేది. సీఆర్డీఏ ఏర్పాటుతో ఆ ప్రాంతమంతా ప్రభుత్వ ఆధీనంలోని అమరావతిపరిధిలోకి వచ్చింది. సుమారు 400 ఎకరాల విస్తీర్ణం గల అమరావతి టౌన్ షిప్ లో 120 ఎకరాల స్థలం ఖాళీగా ఉంది.

రెండంతస్థులతో ఫ్యాబ్రికేటెడ్ సచివాలయం.....

ఈ ప్రాంతంలోనే రెండంతస్థులతో ఫ్యాబ్రికేటెడ్ సచివాలయం నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి 180 కోట్లు ఖర్చు కానుంది. అమరావతి టౌన్ షిప్ లో ఉన్న 400 వందల ఎకరాల్లో కొంత భాగం అరిహంత్ ఇండో ఆఫ్రికన్ ఇన్ ఫ్రా డెవలపర్స్ సంస్థ ఆధీనంలో ఉండేది. తాత్కాలిక సచివాలయ ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆ సంస్థకు వేరే చోట స్థలాన్ని కేటాయిస్తూ గత ఆగష్టులో జీవోను జారీ చేసింది ప్రభుత్వం. ఇప్పుడు అదే స్థలంలో తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేస్తోంది ఏపీ సర్కార్ .

నవ్యాంధ్ర నుంచే పాలనను.....

హైదరాబాద్ ను తొందరలోనే వీడి, నవ్యాంధ్ర నుంచే పాలనను కొనసాగించాలని బాబు నిర్ణయించారు. ఇందుకు గాను తాత్కాలిక రాజధాని నిర్మాణానికి ప్రభుత్వ భూమిని సెలక్ట్ చేశారు అధికారులు. ఇది ఇలా ఉంటే తాత్కాలిక రాజధానికి అంత ఖర్చు అవసరమా అంటూ విశ్లేషకులు వాదిస్తున్నారు.  

06:58 - December 30, 2015

హైదరాబాద్‌ : ఓయూ పీఎస్‌ పరిధిలో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. హబ్సీగూడలోని జీజీ కాలనీలో డీసీపీ రవీందర్‌ ఆధ్వర్యంలో సుమారు 150 మంది పోలీసులు పాల్గొన్న ఈ కార్డెన్‌ సెర్చ్‌లో ఎటువంటి ధ్రువపత్రాలు లేని 45 వాహనాలను, ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రౌడీషీటర్లు, అనుమానిత వ్యక్తులను కనుగొని ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడటమే ఈ కార్డన్‌ సెర్చ్‌ల ముఖ్య ఉద్దేశ్యమని డీసీపీ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి తనిఖీలను అన్ని పోలీస్‌ స్టేషన్‌ల పరిధులలో నిర్వహిస్తామని డీసీపీ రవీందర్‌ తెలిపారు. 

06:55 - December 30, 2015

హైదరాబాద్: మరికొన్ని గంటల్లో వెలువడనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ముఖ్యనేతలకు టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఉప ఎన్నికల వరుస ఓటములతో బెంబేలెత్తిపోతున్న నేతలకు ఇప్పుడు ఎన్నికల ఫలితాలు ఇంత చలిలో కూడా చెమటపుట్టిస్తున్నాయి. 12 ఎమ్మెల్సీ స్థానాలకుగాను ఐదింటిలో అభ్యర్థులను ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో ఉంచింది కాంగ్రెస్. చివరికి మూడు స్థానాలకు పరిమితం కావడంతో పోటీలో అసలుటెన్షన్ మొదలైంది.

సొంతజిల్లాలో గెలుపు కోసం ఉత్తమ్, జానా ప్లాన్ .....

అసలే పోటీలో నిలబడలేని నేతలు జిల్లాలో ఎంత సపోర్ట్ గా ఉన్నా.. పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎల్పీ లీడర్ జానారెడ్డి సొంత జిల్లా నల్లగొండ. దీంతో నేతలపై మరింత ఒత్తిడి పెరిగింది. మాజీ ఎంపీ కోమటిరెడ్డి పోటీలో ఉండడం పోలింగ్ వరకు హోరాహోరీగా తలపడడంతో నేతలు కాస్త సక్సెస్ అయ్యారు. అయినా ఫలితాలు ఎలా ఉంటాయో అన్న సందిగ్ధంలో పడ్డారు పార్టీ సీనియర్ నేతలు. వర్గవిభేదాలను సైతం ప్రక్కకు నెట్టి కోమటిరెడ్డి గెలుపుకోసం కృషి చేశారు నేతలు.

అన్నిఎన్నికల్లో ఘోర ఓటమి ఎదురైనా .....

ఇప్పటి వరకు జరిగిన అన్నిఎన్నికల్లో ఘోర ఓటమి ఎదురైనా హైకమాండ్ కు నచ్చ జెబుతూ వచ్చారు. కాని సొంత జిల్లాలో ఫలితం అటుఇటుగా మారితే ఏం చెప్పాలో కూడా తెలియక డీలా పడుతున్నారు నేతలు. అయినా నల్లగొండ లో గెలిచి తీరాలని పెద్దలు సీనియర్ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లాలోని సీనియర్ నేతలందరూ జానా, ఉత్తమ్ ల వైపు చూస్తున్నారు.

గట్టేందుకు నేతలు పడరాని పాట్లు.....

నల్లగొండలో గట్టేందుకు నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. అధికార పార్టీతో పోటాపోటీగా బరిలో దూకిన నేతలకు చేదు అనుభవం ఎదురైతే జిల్లా నేతల దగ్గర అస్త్రాలు లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు నేతలు. 

06:52 - December 30, 2015

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఇప్పుడు కాంగ్రెస్ నేతల మెడకు చుట్టుకుంన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఒకవైపు. నల్లగొండ జిల్లాలో జరిగిన ఎన్నికలు ఒకవైపు అన్నట్లు తయారైంది. అన్ని జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల కంటే నల్లగొండ జిల్లాలో జరిగిన ఎన్నికలు భిన్నంగా ఉన్నాయి. దీంతో పందెం రాయుళ్లు రెచ్చిపోతున్నారు.కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ,టీఆర్ఎస్ నుంచి తేరా చిన్నప్పరెడ్డి పోటీలో ఉన్నారు. దీంతో ఇద్దరు బడా పారిశ్రామిక వేత్తలు అందునా రాజకీయాల్లో పలుమార్లు పోటీచేసిన వారు కావడంతో అందరిలోను ఉత్కంఠ నెలకొంది.

బరిలో బడా పారిశ్రామిక  వేత్తలు.....

నల్లగొండ జిల్లా నుంచి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి , కోమటిరెడ్డి ఎంపీలు గుత్తాసుఖేందర్ రెడ్డి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ప్రాతినిద్యం వహిస్తున్నారు. దీంతో అందరిలోను ఉత్కంఠ నెలకొంది. మరో వైపు పందెం రాయుళ్లు నేతలపై పెద్ద మొత్తంలో బెట్టింగులకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ గెలుస్తుందంటూ కొందరు , అధికారపార్టీ గెలుస్తుందంటూ మరొకరు ఇలా బెట్టింగులకు పాల్పుడుతున్నారు.

ఊపందుకున్న బెట్టింగులు...

కౌంటింగ్ కు మరికొద్ది గంటల సమయం ఉండడంతో గెలిచేవారెవరంటూ బెట్టింగులు ఊపందుకున్నాయి. పందెంరాయుళ్లు రంగంలోకి దిగి కౌంటింగ్ కు మరింత ఇంట్రెస్టును కలిగిస్తున్నారు. కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు బెట్టింగ్ రాయుళ్లు. 

06:48 - December 30, 2015

హైదరాబాద్ : ఉత్కంఠ పోరుమధ్య సాగిన తెలంగాణలోని ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో తేలనున్నాయి. రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో రెండేసి స్థానాలకు, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి జరిగిన ఎన్నికల ఫలితాలు తేలనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఇవాళ వెలువడే 6 ఎమ్మెల్సీ స్థానాల్లో నల్గొండపైనే అందరిచూపు ఉంది.

మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలు....

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో వెలువడనున్నాయి. దీనికి సంబంధించిన ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక సంస్థల కోటాలో మొత్తం 12 స్థానాలకుగానూ ఇప్పటికే ఆరు స్థానాల్ని అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ పార్టీ ఏకగ్రీవం గెలుచుకుంది. ఇక మిగిలిన ఆరు స్థానాలకు ఈనెల 27న 4 జిల్లాల్లో పోలింగ్‌ నిర్వహించారు. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో రెండేసి స్థానాలు, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఆయా స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇవాళ ఉదయం 8గంటల నుంచి ప్రారంభంకానుంది. ఖమ్మం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ భవనంలో, నల్గొండ జిల్లా కేంద్రంలోని డ్వామా కార్యాలయంలో, మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ కళాభవన్‌లో, రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్‌ ఆర్డీవో కార్యాలయంలో ఓట్ల లెక్కింపు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.

ఆయా జిల్లాల్లో పోలైన ఓట్లు....

తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాలో బరిలో నిలిచిన ఐదుగురు అభ్యర్థులలో ఇద్దరిని ఎన్నుకునేందుకు..770 మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో బరిలో నిలిచిన ఐదుగురిలోంచి ఇద్దరిని ఎన్నుకునేందుకు 1257 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు ఖమ్మంలోనూ 725 మందికి గాను 692 మంది ఓటేశారు. నల్గొండ జిల్లాలో 10మంది తప్ప మిగిలిన 1100 వందలమంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు..అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికలు కావడంతో ఎన్నికల కౌంటింగ్‌పై అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు.

అధికార టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష పార్టీలకు....

మొదటి నుంచీ అధికార టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష పార్టీలు ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో పార్టీలు సర్వశక్తులూ ఒడ్డి ఎన్నికల బరిలో నిలిచాయి. మొత్తం 12 స్థానాలకు గాను..ఆరు ఎమ్మెల్సీలను ఇప్పటికే అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఏకగ్రీవంతో తన ఖాతాలో వేసుకుంది. ఇక మిగిలిన ఆరు స్థానాల్లో ప్రతిపక్ష పార్టీలు బలంగా ఉండడంతో టీఆర్‌ఎస్‌ వ్యూహం ఫలించలేదు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ ఆరుస్థానాల్లో ఎన్నింటిని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకుంటుందనేది మధ్నాహ్నం ఒంటిగంటకల్లా వెలువడే తుదిఫలితాల్లో తేలనుంది.  

06:45 - December 30, 2015

హైదరాబాద్ : ఆదివాసీలకీ అడవికీ వున్న అనుబంధం వీడదీయలేనిది. ఇంతకాలమూ అడవిని సంరక్షిస్తూ వచ్చిన ఆదివాసీలకు ఇప్పుడు అక్కడే నిలువ నీడలేని పరిస్థితి ఎదురవుతోంది. ఆదివాసీల సంక్షేమం కాగితాలకే పరిమితమవుతోంది.

గిరిజన ప్రాంతాల్లో ప్రాణాంతక వ్యాధులు.....

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, చత్తీస్‌గడ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, జార్ఖండ్‌, ఒడిసా, పశ్చిమబెంగాల్‌, అస్సాం, మహారాష్ట్రలలో ఆదివాసీల జనాభా ఎక్కువ. అడవినే అంటిపెట్టుకుని జీవిస్తూ, అడవిని సంరక్షిస్తున్న ఆదివాసీల కష్టాలు వర్ణణాతీతం. చదువు చెప్పే దిక్కువుండదు. ఆదివాసీలు మాట్లాడే భాషలకు లిపిలేకపోవడం, ఇతర భాషల్లో సాగే బోధన వారికి అర్ధంకాకపోవడం పెద్ద సమస్యై వెక్కిరిస్తోంది . టీచర్స్‌లో ఆదివాసీల సంఖ్య అతితక్కువగా వుండడం మరో శాపం. మొత్తం గిరిజనుల్లో పదో తరగతి పాసైనవారు 27శాతం మంది కూడా లేరు. ఇక ఇంటర్‌ స్థాయికి చేరుకోగలిగింది 14శాతం మందే. ఇక ఉన్నత విద్యలో పరిస్థితి మరీ ఘోరం.

ఆదివాసీలకు వైద్యం చేసే నాధుడుండడు.......

ఇక ఆదివాసీలకు వైద్యం చేసే నాధుడుండడు. ప్రతి ఏటా సీజన్‌ మారిన్నప్పుడల్లా రకరకాల అంటువ్యాధులతో ఎక్కువ సంఖ్యలో మరణిస్తున్నది ఆదివాసీలే. ఆదివాసీలలో కేవలం 14శాతం మందికే రక్షిత మంచినీరు అందుతోంది. 69శాతం మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు.

ఆదివాసీలకు నిలువనీడ దొరకని పరిస్థితిని.....

ఓ వైపు పరుగులు తీస్తున్న ఆధునికాభివృద్ధీ ఆదివాసీలకు నిలువనీడ దొరకని పరిస్థితిని సృష్టిస్తోంది. భారీ ప్రాజెక్టులు కట్టిన ప్రతి చోటా ముందుగా నిర్వాసితులవుతున్నదీ ఆదివాసీలే. ప్రాజెక్టులు, పరిశ్రమలు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, రిసార్ట్స్‌, బాక్సైట్‌ తవ్వకాలు ఇలా ఎన్నో రూపాలు ఆదివాసీలకీ అడవికీ వున్న బంధాన్ని తెంపేస్తున్నాయి. భారీ ప్రాజెక్ట్ ల నిర్మాణమంటూ, బాక్సెట్ తవ్వకాలంటూ, ఖనిజ నిక్షేపాల వెలికితీత అంటూ, రకరకాల పేర్లతో అడవుల నుంచి గిరిజనులను తరిమివేస్తున్న దృశ్యాలే దేశమంతా కనిపిస్తున్నాయి. దీంతో అడవిబిడ్డలు నిలువనీడ కోల్పోతున్నారు. అడవులు తరిగిపోతున్నా కొద్ది ఆదివాసీల కష్టాలూ పెరుగుతున్నాయి. అటవీ ఉత్పత్తుల సేకరణ వారికి మరింత భారంగా మారుతోంది.

విద్యా ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అవకాశాలు.....

అటు అడవిలో బతకనీయక, ఇటు విద్యా ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అవకాశాలు కల్పించకపోతే ఆదివాసీలు ఎక్కడ బతకాలి? ఎలా బతకాలి? ఈ ప్రశ్నే ఇప్పుడు ఆదివాసీలను పోరుబాట పట్టిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆదివాసీల సమగ్రాభివృద్ధికి నడుం బిగించాలి. 

06:42 - December 30, 2015

హైదరాబాద్ : కొత్త సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ ఆదివాసీలు ఏకమవుతున్నారు. జనవరి 2 నుంచి ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరులో ఆదివాసీలు మహాసభ నిర్వహించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆదివాసీలు ఈ మహాసభ ఎందుకు పెడుతున్నారు? ఈ సభల లక్ష్యం ఏమిటి? ఈ సభల్లో ఏయే అంశాలు చర్చించబోతున్నారు? ప్రస్తుతం ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? వీరి సంస్కృతి సంప్రదాయాలు ఎలా వుంటాయి? ప్రభుత్వ విధానాలు ఆదివాసీల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయి? ఆదివాసీల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలేమిటి? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఆదివాసీ గిరిజన సంఘం నేత బండారు రవికుమార్‌ పాల్గొన్నారు. అంతే కాకుండా శ్రోతలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు నేడు

హైదరాబాద్ : స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపును బుధవారం ఉదయం 8 గంటల నుంచి చేపట్టనున్నారు.స్థానిక సంస్థల కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 12 స్థానాలకుగాను కరీంనగర్‌లో రెండు, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో ఒకటి చొప్పున ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన ఆరు స్థానాలైన ఖమ్మం, నల్లగొండలో ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రెండేసి స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

చిత్తూరు జిల్లాలో రెండు వోల్వో బస్సులు ఢీ

చిత్తూరు : సి.మల్లవరం వద్ద మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత రెండు వోల్వో బస్సుల ఢీ కొన్నా ఈ ఘటనలో డ్రైవర్ సహా ఆరుగురు ప్రయాణీకులు గాయపడ్డారు. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Don't Miss