Activities calendar

31 December 2015

22:42 - December 31, 2015

కోల్ కతా : ఎ్రరజెండా మరింత ఎరుపెక్కింది. ఎదురీతను అధిగమించి దమ్ము చూపించటానికి మార్క్సిస్టులు ముందడుగు వేస్తున్నారు. సరికొత్త పంథాలో సమరం చేయటానికి సంసిద్ధమయ్యారు. ప్రజాపోరాటాలతో మమేకమై.. స్వతంత్ర పోరాటాలతో పదునెక్కాలని ప్రతిన పూనారు. వామపక్షాల ఐక్యతకు ప్రాధాన్యతనిచ్చి  లెఫ్ట్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ను బలపర్చుకునే దిశగా పయనించాలని సీపీఎం ప్లీనం నిర్ణయించింది.

పార్టీ నిర్మాణం, ఎత్తుగడలపై సీపీఎం ప్లీనం
ఎన్నో ఎత్తుగడలు .. మారుతున్న పరిస్ధితుల్లో ఎదురవుతున్న కొత్త సవాళ్లు.. ప్రజాపునాదిని పెంచుకోవటానికి.. పార్టీ నిర్మాణాన్ని, ఎత్తుగడల పంథాలను పునఃసమీక్షించుకోవటానికి సీపీఎం కోల్‌కతాలో ప్లీనం నిర్వహించింది. 27 నుంచి 31 వరకు ఐదురోజులపాటు జరిగిన ఈ ప్లీనంలో.. నిర్మాణ ముసాయిదా నివేదికపై చర్చించారు.

ముసాయిదా నివేదికకు 191 సవరణలు
ముసాయిదా నివేదికకు 191 సవరణలను ప్రతినిధులు ఈ ప్లీనంలో సూచించారు. వాటిలో 36 సవరణలు ఆమోదం పొందాయి. అలాగే నిర్మాణంపై ముసాయిదా తీర్మానానికి 73 సవరణలు రాగా, ఆరు ఆమోదం పొందాయి. ముసాయిదా నివేదికపై పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌కరత్‌ వివరణ ఇవ్వగా, నిర్మాణ ముసాయిదా తీర్మానంపై పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చర్చకు బదులిచ్చారు.

ప్రజా సమస్యలపై స్వతంత్ర పోరాటాలు
పార్టీని బలోపేతం చేయాలని, ప్రజాపోరాటాలను స్వతంత్రంగా నిర్వహించేలా సమర్ధతను పెంపొందించుకోవాలని ప్లీనం నిర్ణయించింది. సామాజిక ఆర్ధిక సమస్యలపై విస్తృతంగా పోరాటాలను నిర్మించాలని సీపీఎం భావించింది. మొత్తం మీద భారతదేశంలో సీపీఎం బలమైన పార్టీగా రూపొందడానికి నిర్దిష్ట కాలపరిమితితో కూడిన వ్యూహంతో ప్రజల ముందుకొస్తోంది.

21:53 - December 31, 2015

విజయవాడ : కాల్‌మనీ కేసులో నిందితుడైన సత్యానంద్‌ని పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. ఇంతకు ముందు ఇదే కేసులో సత్యానంద్‌ బెయిల్‌పై విడుదలయ్యారు. ఆయనను రెండోసారి అరెస్ట్‌ చేసిన విషయాన్ని పోలీసులు ధృవీకరించారు. సత్యానందం నుంచి టాస్క్‌ఫోర్స్‌ బృందం మరింత విలువైన సమాచారాన్ని రాబట్టేందుకు ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీనికితోడు కాల్‌మనీ కేసులో సత్యానంద్‌పై పలువురు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై మరికొన్ని కొత్త కేసులు నమోదయ్యాయి. 

21:49 - December 31, 2015

విజయవాడ : కాదేదీ కవితకనర్హం ఇది శ్రీశ్రీగారి మాట. కాదేదీ ప్రైవేటీకరణకు అనర్హం ఇది బాబుగారి మాట. అవును ప్రైవేటీకరణకు బ్రాండ్‌ అంబాసిడర్‌లా దూకుడు చూపిస్తున్న చంద్రబాబు కన్ను సమాచార పౌర సంబంధాల శాఖ మీద కూడా పడింది. ప్రభుత్వ పథకాలపై ప్రచారం సరిగా చేయలేకపోతున్నారని.. ఆ బాధ్యత కూడా ప్రైవేటుకు అప్పచెప్పేస్తే పోలా అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ ప్రసారాల భాధ్యతలు.?

ఏపీ ప్రభుత్వం ఒక్కో ప్రభుత్వ విభాగాన్ని పూర్తి స్థాయిలో ప్రైవేట్ పరం చేస్తోంది. ఇప్పటికే విద్యా వైద్య శాఖలను పూర్తి ప్రైయివేట్ పరం చేసిన సర్కార్ తాజాగా పౌరసంబంధాల శాఖపై దృష్టి సారించింది. పలు దఫాలుగా  ఇప్పటికే స్కూల్స్ ను రేషనలైజేషన్ పేరుతో మూసివేసింది.  ప్రైవేట్ యూనివర్శిటీలకు డోర్లు బార్లా తెరిచింది. వైద్య సేవలను కూడా సాధ్యమైనంత వరకు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేసింది. 
ఆ వంకతో..
గత కొద్ది కాలంగా ప్రభుత్వంలోని పెద్దలు సమాచార పౌరసంబంధాల శాఖపై గుర్రుగా ఉన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్న ఆ పథకాలు ప్రజల వద్దకు చేరడం లేదనేది అసలు కారణం. వీటిని చేరవేయడంలో సమాచార శాఖ విఫలమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. గోదావరి పుష్కరాలు, అమరావతి శంకుస్థాపనలను ప్రయివేట్ సంస్థలకు అప్పగించినట్లు ప్రభుత్వ ప్రచార బాధ్యతలను ప్రైవేటికరిస్తే బాగుంటుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

అబ్బే అదేం లేదే..
అయితే అలాంటి ఆలోచన ఏమీ లేదని.. పని తీరు మెరుగుపర్చుకోవాలనే అనుకుంటున్నట్లు మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. సమాచార పౌరసంబంధాల శాఖ లో దాదాపు 1000 మంది పనిచేస్తున్నారు. దీనిలో చాలా మంది కాంట్రాక్ట్ ఉద్యోగులే ఉన్నారు. ఈ శాఖను ప్రైవేటీకరిస్తే దాదాపు ఉద్యోగులందరూ రోడ్డున పడాల్సి ఉంటుంది. మరి ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశగానే వెళుతుందా.. మంత్రిగారు చెప్పినట్లు అలాంటిదేమీ జరగదా వేచి చూడాల్సిందే.

21:44 - December 31, 2015

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త బార్ల ఏర్పాటు ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది. ఏపీలో కొత్త బార్ల ఏర్పాటు కోసం ఎక్సైజ్‌ శాఖ ఈ నెల 21న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ జనవరి 29కి వాయిదా వేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

 

21:34 - December 31, 2015

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో  2016-17 సంవత్సరానికి గాను విద్యుత్‌ చార్జీల పెంపునకు సంబంధించి ఎపీఇఆర్సీకి అధికారులు ప్రతిపాదనలు సమర్పించారు. ఆదాయ లోటును భర్తీ చేసేందుకు ఛార్జీలను పెంచాలని అధికారులు ప్రతిపాదించారు. వ్యవసాయానికి 7 గంటల ఉచిత విద్యుత్‌.. గృహావసరాలకు నిరంతర విద్యుత్‌ అందించుట తదితర అంశాలకు సంబంధించి ప్రతిపాదనలు అందజేశారు. దీనిపై ఈఆర్‌సీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. 

 

20:01 - December 31, 2015

రెండు వేల పదహేను సంవత్సరానికి గాను.. తెల్గురాజకీయ తెరమీద దిగ్విజయంగా ఆడి.. ప్రేక్షకుల మన్ననలు పొంది చిత్రాలు అనేకం ఉన్నయ్.. అండ్లకెళ్లి జల్లెడ పట్టి పట్టి ఏరంగ మూడు మాత్రమే మిగిలినయ్ ఆ మూడు ఉత్తమ చిత్రాలళ్ల ఏ చిత్రానికి అవార్డు వరించింది అనేది సూద్దామని 'మల్లన్న' పేర్కొన్నారు. టెన్ టివి 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో 'మల్లన్న' విశ్లేషించారు.

ఉత్తమ డైలాగ్..
ఒక్కొక్కడు కాదు షేర్కాన్.. వందమందిని ఒకేసారి పంపు.. కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్త.. ఇసొంటి డైలాగులు గూడ శిగ్గుతోని తలదించుకోని ఆత్మహత్యజేస్కునెతట్టు గొప్పగొప్ప డైలాగులు గొట్టెటోళ్లకు ఇచ్చె అవార్డే ఈ ఉత్తమ డైలాగ్ అవార్డు. ఈ యాడాది మొత్తంల అత్యుత్తమ ప్రతిభను కనబర్చి.. మూసుకున్న జనం నోర్లు దెరిపిచ్చిన ఆ మహా డైలాగ్ ఏంది..? అవార్డు ఎవ్వలికి అనేది సూద్దాం.

ఉత్తమ నటి..
ఆ ఇప్పుడు ఉత్తమ నటి.. తన నటనతో వాగ్ధాటితో ప్రేక్షకులను మెప్పించుట్ల ఎవ్వలు ముందుగాళ్ల ఉన్నరనేది ఈ పోటి..ఇగ ఈ ఉత్తమ నటి కేటగిరిల పోటీ తక్వైంది.. అంటె సెమీఫైనల్ దాక అటో ఇటో ఇద్దరు ముగ్గురు వచ్చిండ్రుగని.. ఫైనల్ పోటీ మాత్రం ఏకగ్రీవమైంది.. మరి ఈ యాడాది ఉత్తమ నటి అవార్డు ఎవ్వలందుకుంటున్నరో సూడుండ్రి.

ఉత్తమ పర్యాటకుడు..
ఇప్పుడు ఉత్తమ పర్యాటకుడు కేటగిరి.. వడిగల గుర్రానికి తిర్గుడు రోగం అన్న సామెతను ఎవ్వలైతె సాక్షాత్కరించుతరో వాళ్లకే ఈ అవార్డు ఇస్తరన్నట్టు.. ఈ రెండువేల పదిహేను సంవత్సరానికి గాను.. ఉత్త ఉత్తమ పర్యాటకుడి అవార్డు అందుకునేది ఎవ్వలనేది ఇచ్చినంక దెలుస్తది.

ఉత్తమ ప్రేక్షకుడు..
ఒక సీన్మ సక్సెస్ గావాలన్నా.. అట్టర్ ప్లాప్ గావాలన్నా.. ఆ సీన్మల నటించిన నటీనటుల మీద ఎంతుంటదో.. సూశె ప్రేక్షకుల మీద గూడ అంతే ఉంటది.. సీన్మ బోరుగొట్టినా..? అద్భుతంగ ఉన్నా.. ఒకే తీరుల ఆస్వాధించేవాడే అసలైన ప్రేక్షకుడు.. సేమ్ టూ సేమ్ మన పొలిటికల్ సీన్మలను గూడ అదే విధంగ జూశిన అభ్యర్థులకు ఇచ్చేదే ఈ ఉత్తమ ప్రేక్షకుడు అవార్డ్.. ఈసారి ఎవ్వలిని వరించిందో..

ఉత్తమ భక్తుడు..
ఆ ఇప్పుడు ఉత్తమ భక్తుడు కేటరిగి..ఈ కేటగిరి ఇద్వరకు లేకుండె ఈసారే కొత్తగ ఇంట్రడ్యూస్ జేయవల్సొచ్చింది.. అన్నిచ్చి మళ్ల గీ కేటగిరికి ఇయ్యకపోతె పర్శాను అయితదని ఇట్ల వెట్టిండ్రు.. ధర్మం నాల్గు పాదల మీద నడ్వాల్నని.. పరిపాలనను గూడ పక్కకు వెట్టి పూజలు పునస్కారలతోని ప్రజల సుభిక్షాన్ని కాంక్షించిన ఉత్తమ భక్తునికి ఇచ్చె అవార్డు.. మరి ఇది ఎవ్వలికి దక్కింది అనేది సూద్దాం.

ఉత్తమ విలన్..
ప్రతియేటిలాగే రెండువేల పదిహేను సంవత్సరానికి ఉత్తన్ విలన్ ఎంపిక జరిగింది.. ఈ కేటగిరిల చాలమందే ప్రతిభకనబర్చిండ్రుగని.. ఫైనల్ కు మాత్రం ముగ్గురే చేరిండ్రట.. తెలంగాణ ప్రాంతం నుంచి ఇద్దరు.. ఆంధ్ర నుంచి ఒక్కరు పోటీ పడగా..? విజయం ఎవరిని వరించింది అనేది సూద్దాం..

ఉత్తమ హాస్యనటుడు..
ఉత్తమ కమేడియన్.. అదే అదురగొట్టిన హాస్యనటుడన్నట్టు.. తెల్గు రాజకీయ తెరమీద పొలిటికల్ బోర్ లేకుంట.. ప్రేక్షకులను కడ్పుబ్బ నవ్విచ్చి.. నవ్వులపాలైన.. నల్గురిలో సగర్వంగ నిలవడ్డోళ్లకు ఇచ్చె అవార్డన్నట్టు ఇది.. మరి ఈ కేటగిరిల ఎవ్వలెవ్వలు పోటీ వడ్తున్నరు..? ఆఖరికి ఈ హాస్యరత్న అవార్డు ఎవ్వలిని వరించింది అనేది సూద్దాం..మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

19:35 - December 31, 2015

విశాఖపట్టణం : ఆయనో ఆఫీసర్... తాను సంతకం చేస్తే చాలు...ఎంతటి స్థలమైనా...భవంతులైనా పేర్లు మారిపోతాయి...ఆ తర్వాత ఏం జరుగుతుందనుకుంటున్నారా...? ఏమీ జరగదు..ఎందుకంటే ఆయన వెనకాల ఉన్నది అధికారులు కాదు... రౌడీలు..గూండాలు.. అసాంఘీక శక్తులతో చేతులు కలిపి తన అక్రమాలకు ఆజ్యం పోసుకున్నదెవరా అనుకుంటున్నారా...? విశాఖపట్నంలోని మధురవాడ సబ్‌రిజిస్ట్రార్‌ ఆనంద్‌ కుమార్...ఈ సారువారి యవ్వారం తెలుసుకున్న ఏసీబీ అధికారులు నిఘా వేస్తే దొరికిన క్లూతో దాడులు మొదలుపెట్టారు.

విలాసవంతమైన భవంతి..
రౌడీ షీటర్లు, క్రిమినల్స్ అండదండలతో ఆనంద్‌కుమార్‌ అవినీతికి పాల్పడ్డారని ఏసీబీ అధికారులు గుర్తించారు. విలాసవంతమైన జీవితానికి ఆనంద్‌కుమార్‌ కేరాఫ్ అడ్రస్...సర్కారు జాబ్ తో అక్రమ ఆస్తులతో అందలమెక్కిన ఓ సబ్ రిజిస్టార్ ఉదంతం ఎసిబి అధికారులను మైండ్ బ్లాంక్ చేస్తోంది. ఆనందకుమార్ ఇంట్లో తుపాకీ, ఇతర మారణాయుధాలు దొరికినట్లు పోలీసులు తెలిపారు. అతిపెద్ద భవంతి మధురవాడ సబ్ రిజిస్టార్ ఆనందకుమార్ అక్రమాస్తుల జాబితాలో ఒకటి..మూడు ఫ్లోర్లు ఎవరికీ అద్దెకివ్వకుండా విలాసవంతమైన జీవనం కోసం ఉంచుకున్నాడు.

బయటపడుతున్న ఆస్తులు..
ఇక ఇంట్లోకి వెళ్తి చూస్తే ప్రతీ ఫ్లోర్‌లో ఇటాలియన్ మార్బల్, గ్రానైట్ ఫ్లోరింగ్, అత్యాధునికమైన హోం ధియేటర్ ఇలా ఒక్కటేమిటి లక్షల విలువ జేసే ప్రతీ ఒక్కటీ సమకూర్చుకున్నాడు. విలావంతంగా జీవిస్తున్నాడు. మూడు రోజులుగా ఎసిబి చేసిన వరుసదాడుల్లో మతిపోయే ఆస్తులు బయటపడుతున్నాయి. ఇప్పటికి రెండు కోట్ల అక్రమాస్తులు సంపాదించినట్లు గుర్తించారు. మరి కోట్ల రూపాయలు ఆస్తులున్నట్లు తవ్వేకొద్దీ బయటపడుతున్నట్లు ఎసిబి అధికారులు చెబుతున్నారు. సర్కారీ నౌకరి చేస్తూ అధికారిగా హుందాగా ఉండాల్సిన ఆనంద్‌లో అలాంటి లక్షణాలు కన్పించడం లేదని సోదాలు చేస్తున్న అధికారులు చెబుతున్నారంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో.

19:31 - December 31, 2015

విజయవాడ : ఇంద్రకీలాద్రి భవానీ దీక్షాధారులతో అరుణవర్ణ శోభితమైంది. అమ్మవారి సన్నిధిలో నేటినుంచే దీక్షల విరమణ కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. దీక్షా విరమణలు ఐదురోజుల పాటు జరగనున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇదే దీక్షల విరమణ కార్యక్రమాన్ని కొందరు సొమ్ము చేసుకునే ప్రయత్నాలు చేయడంతో విమర్శలు వెల్లువెత్తాయి. 41 రోజుల పాటు భవానీ దీక్ష చేసిన భక్తులు దీక్షా విరమణకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కొండచుట్టూ గిరి ప్రదక్షణ చేసి అమ్మవారి మొక్కు తీర్చుకోవడానికి బారులు తీరుతున్నారు. రైల్వేస్టేషన్, బస్టాండ్‌ల మీదుగా వచ్చే భక్తులు వినాయక గుడి మీదుగా గిరి ప్రదక్షణ చేసి క్యూలైన్లలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

పది కౌంటర్లు...
భవానీలు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గురు భవానీల సమక్షంలో దీక్ష విరమణలు చేస్తున్నారు. నెయ్యి, కొబ్బరి చిప్పలు తదితర ఇరుముడి సామగ్రిని హోమంలో వేసి పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని దుర్గగుడి ఈవో నర్సింగరావు తెలిపారు. వినాయక మందిరం నుంచి నాలుగు క్యూలైన్ల ద్వారా దీక్షాధారులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నామని, దర్శనం అనంతరం పులిహోర, లడ్డూ ప్రసాదాలను విక్రయించేందుకు పది కౌంటర్లను ఏర్పాటు చేశామని అన్నారు. 150 మంది గురు భవానీల చేత దీక్ష విరమణ చేయిస్తున్నామని వచ్చిన భక్తులందరికీ అన్నదాన సౌకర్యం కల్పించామని అన్నారు.

అర్చకులు..భవానీల మధ్య వాగ్వాదం..
దీక్ష విరమణ తొలిరోజే అర్చకులు, గురు భవానీల మధ్య వాగ్వివివాదం చోటు చేసుకుంది. అమ్మవారి మొక్కు చెల్లిస్తున్న భవానీల నుంచి అర్చకులు డబ్బులు వసులు చేస్తున్నారని గురు భవానీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్ష విరమణ చేయించాలంటే 50 రూపాయలు కాదని వంద రూపాయలు ఇవ్వాలని అర్చకులు పట్టుబట్టారు. దీంతో గురు భవానీలు కల్పించుకుని అర్చకులు సేకరించిన సొమ్మును హుండీలో వేశారు. దీంతో అర్చకులు, గురుభవానీల మధ్య స్వల్ప వాగ్వివివాదం జరిగింది. దీక్ష విరమణ కార్యక్రమాన్ని అర్చకులు చేయకూడదని గురుభవానీలే చేయాలని వారంటున్నారు. అధికారులు నిబంధనలు అమలుపరచకుండా ఇలాంటి తప్పుడు చర్యలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.  దీనిపై దుర్గగుడి ఈవో స్పందిస్తూ దీక్ష విరమణలను గురు భవానీల చేతనే చేయిస్తున్నామని అర్చకులను విధులనుంచి తొలగించామని అన్నారు. భక్తుల నుంచి ఎవరైనా డబ్బు డిమాండ్‌ చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

నూతన సంవత్సర వేడుకలపై పోలీసుల ఆంక్షలు..

హైదరాబాద్ : నూతన సంవత్సర వేడుకలపై పోలీసుల ఆంక్షలు విధించారు. వేడుకల్లో జంటలను మాత్రమే అనుమతించాలని, మద్యం తాగి వాహనాలు నడిపితే భారీగా జరిమాన విధించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వేడుకల్లో సాధారణ మైకులే వాడాలని, అర్థనగ్న నృత్యాలపై నిషేధం ఉన్నట్లు తెలిపారు. రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ఫ్లై ఓవర్లు, రింగ్ రోడ్డులు, పీవీ ఎక్స్ ప్రెస్ వేపై రాకపోలు నిషేధం విధించినట్లు, ఎయిర్ పోర్టు కు వెళ్లే వారు ఆధారాలు చూపిస్తే అనుమతినివ్వనున్నట్లు తెలిపారు. 

కేసీఆర్ వైఖరి మార్చుకోవాలి - డీకే అరుణ..

హైదరాబాద్ : 2016 సంవత్సరంలోనైనా సీఎం కేసీఆర్ వైఖరి మార్చుకోవాలని, ప్రతిపక్షాలను అణగదొక్కి బలపడాలని అనుకోవడం మానుకోవాలని ఎమ్మెల్యే డీకే అరుణ సూచించారు. 

అద్నాన్ సమీకి భారత పౌరసత్వం..

ఢిల్లీ : పాకిస్తాన్ గాయకుడు అద్నాన్ సమీకి భారత పౌరసత్వం లభించింది. కేంద్ర హోం శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. జనవరి 1వ తేదీ నుండి అద్నాన్ సమీకి భారత పౌరసత్వం అమలు కానుంది. 2001లో పర్యాటక వీసాపై భారత్ కు సమీ వచ్చారు.

పాక్..భారత్ శత్రువుల్లా ఉండలేవు - షరీఫ్..

పాకిస్తాన్ : భారత్ , పాక్ దేశాలు భత్రువుల్లా ఉండలేవని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. భారత్, పాక్ లు సమస్యలపై నిర్మాణాత్మకంగా చర్చించి పరిష్కరించుకోవాలన్నారు. 

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ముంబై: స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 157 పాయింట్లు లాభపడి 26,118 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 50 పాయింట్లు లాభపడి 7,946 వద్ద ముగిసింది. 

17:59 - December 31, 2015

హైదరాబాద్ : సామాన్య మానవుడికి వైద్యాన్ని తక్కువ ఖర్చుతో ఏపీ ప్రజలకు అందించేందుకు ఎన్టీఆర్ వైద్య పరీక్షల కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఏలూరులో ప్రారంభించనున్నట్లు మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తెలిపారు. అదే సమయంలో 13 జిల్లాల్లో సంబంధిత మంత్రులు, కలెక్టర్లు సాయంత్రం నాలుగు గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. శానిటేషన్ పెంపు..నాణ్యమైన విద్య..వైద్యం అందించాలని ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 60 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించేందుకు ప్రభుత్వం పూనుకుందని తెలిపారు. తల్లి, బిడ్డ సంరక్షణకు 102 అంబులెన్స్ ఉపయోగ పడుతాయని తెలిపారు. 

17:53 - December 31, 2015

ఏడాది కాలగమనంలో సగ భాగమైన మహిళా ప్రపంచంలో అనేక మలుపులు...మరెన్నో మెరుపులు..కొన్ని చారిత్రాత్మకతను సంతరించుకున్నాయి. కొన్ని పోరాట స్పూర్తిని రగిలించేవి. మరికొన్ని విషాద వార్తలుగా మిగిలాయి. ఇంకొన్ని కొత్త ఆశలు కలిగించేవి. అలాంటి విభిన్న వార్తల సమాహారంతో కొత్త ఏడాదికి 'మానవి' స్వాగతం పలుకుతోంది.
ఆకలి తీర్చే అమ్మలున్నారు. పేద పిల్లల ఆలనా పాలనా..చూసే ఆయాలు..ప్రభుత్వ పథకాలు ఆచరణ సాధ్యం చేసే సంఘ సేవకులు..ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య సంధాన కర్తలు అంగన్ వాడీలు..అయినా వారికిచ్చేది అరకొర వేతనమే. పదే పదే వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నా పాలకులు పట్టించుకొనే పరిస్థితి లేదు. అందుకే మరోసారి గళమెత్తారు. ఇలాటి మరెన్నో వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

రేపు ఎన్టీఆర్ వైద్య పరీక్షల పథకం ప్రారంభం..

హైదరాబాద్ : రేపు ఏపీలో ఎన్టీఆర్ వైద్య పరీక్షల పథకం ప్రారంభం కానుంది. ఏలూరులో సీఎం బాబు ఈ పథకాన్పి ప్రారంభించనున్నారు. పీహెచ్సీలో 19, ఏరియా ఆసుపత్రుల్లో 60, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో 40 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా ప్రభుత్వం నిర్వహించనుంది. త్వరలో '102' మదర్ అండ్ చైల్డ్ ఎక్స్ ప్రెస్ పథకం ప్రారంభించనున్నట్లు, ఆసుపత్రులను ప్రైవేటీకరిస్తామన్నది అవాస్తవమని మంత్రి పల్లె పేర్కొన్నారు. 

నూతన సంవత్సర వేడుకలు ప్రారంభం..

న్యూజిలాండ్ : ఆక్లాండ్ లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. అక్లాండ్ స్వ్కేర్ వద్ద బాణాసంచా వెలుగులు విరజిమ్మాయి. 

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి..

ఢిల్లీ : దేశ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో ప్రజల మద్య ప్రేమ, అప్యాయత పెరిగి సమాజంలో శాంతి నెలకొనాలని ప్రణబ్ ఆకాంక్షించారు. 

17:12 - December 31, 2015

పాకిస్థాన్ గాయకుడు అద్నాన్ సమీకి భారతీయ పౌరసత్వం ఇచ్చినట్లు భారత హోంశాఖ అధికారులు గురువారం వెల్లడించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ అధికారులు మాట్లాడుతూ.. సమీకి రేపటి నుంచి భారతీయపౌరసత్వం అమల్లోకి వస్తుందన్నారు. తనకు భారతీయ పౌరసత్వం కావాలంటూ సమీ రెండేళ్ల క్రితం పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు. కాగా, పాకిస్థాన్ లోని లాహోర్ కు చెందిన అద్నాన్ సమీ విజిటర్స్ వీసాపై భారత్ కు మొట్టమొదటిసారిగా 2001, మార్చి 13 న వచ్చారు. ఒక ఏడాది పాటు చెల్లుబాటు అయ్యే విధంగా ఇస్లామాబాద్ లోని ఇండియన్ హైకమిషన్ వీసా ఇచ్చింది. తర్వాత ఆయన వీసా గడువును క్రమబద్ధీకరిస్తూ వచ్చారు.
ఈ క్రమంలో సమీకి పాకిస్థాన్ పాస్ పోర్ట్ జారీ చేసిన తేదీ 2010, మే 27. ఈ ఏడాది మే 26తో ఆ పాసు పోర్ట్ గడువు ముగిసింది. అయినప్పటికీ సమీ దానిని రెన్యువల్ చేయించలేదు. ఆ తర్వాత భారత ప్రభుత్వ అధికారులను సమీ కలుసుకున్నారు. మానవతా దృక్పథంతో తనకు భారత పౌరసత్వాన్ని లీగలైజ్ చేయాలంటూ విన్నవించుకోవడం జరిగింది. ‘కభీ తో నజర్ మిలావో’, ‘లిఫ్ట్ కరా దే’ అనే రెండు పాటలతో సమీ చాలా పాప్యులర్ అయ్యాడు. ఈ ఏడాది విడుదలైన సల్మాన్ ఖాన్ భజరంగీ భాయి జాన్ చిత్రంలోని ‘భర్ దో జోలి మేరీ’ అనే పాటను సమీ పాడిన విషయం తెలిసిందే. అలాగే తెలుగు సినిమాలలో కూడా పలు పాటలు పాడాడు.

 

16:59 - December 31, 2015

ఢిల్లీ : రేపటి నుండి సరి, బేసి పద్ధతి అమల్లోకి రానుందున్న గురువారం ట్రయల్ రన్ నిర్వహించారు. ఉదయం 9 నుండి 11 గంటల వరకు ట్రయల్ రన్ జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గోపాల్ రాయ్ పేర్కొన్నారు. ముందస్తు ఏర్పాట్లలో భాగంగా 200 పాయింట్ల వద్ద వేర్వేరు ఏజెన్సీల వారు సమన్వయాన్ని పరీక్షించుకొనేందుకు ఇది ఉపయోగపడినట్లు తెలిపారు. రవాణా శాఖకు చెందిన 66 ఎన్ ఫోర్స్ మెంట్ బృందాలు 27 సబ్ డివిజన్ లలో మెజిస్ట్రేట్ బృందాలు ఇందులో ఉన్నాయి. ఆడ్ ఈవెన్ ట్రయల్ రన్ కు ఆశించిన స్పందన రాలేదు. పోలీసులతో కలిసి రిహార్సల్ చేయాల్సిన వేలాది మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. 

16:55 - December 31, 2015

తమిళనాడు : అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఏడోసారి ఎన్నికయ్యారు. తిరువన్మయూర్ లో అన్నాడీఎం పార్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. జయలలితను ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2016లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తరువాత జయలలితనే ముఖ్యమంత్రి అవుతారని పార్టీ కౌన్సిల్ విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా 14 తీర్మానాలను అన్నాడీఎంకే ఆమోదించింది. జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేయాలని, జాలర్ల సమస్యలను పరిష్కరించాలని కేంద్రాన్ని కోరింది. వరద బాధితులను ఆదుకొనేందుకు వీలుగా తమిళనాడు రాష్ట్రానికి వెంటనే నిధులు మంజూరు చేయాలని అన్నాడీఎంకే కేంద్రాన్ని అభ్యర్థించింది. 

16:50 - December 31, 2015

ఆదిలాబాద్ : నూతన సంవత్సరం వచ్చిందంటే చాలా మంది వినూత్న కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. కొంతమంది వ్యాపారస్తులు కూడా భిన్నంగా వ్యాపారాలు చేస్తుంటారు. కానీ ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ కు చెందిన వ్యాపారీ 2016 సంవత్సరం పురస్కరించుకుని వినూత్న ఆలోచనకు తెరలేపారు. బేకరీలో కేక్ కొనుగోలు చేసిన వారికి ఎర్రచందనం మొక్క ఫ్రీగా అందిస్తున్నాడు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

16:48 - December 31, 2015

హైదరాబాద్ : నవ్యాంధ్ర చరిత్రలో 2015 సంవత్సరం ఒక మైలు రాయిగా నిలిచిపోతుందని ఏపీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన టెన్ టివితో మాట్లాడారు. కేంద్రం, తెలంగాణ రాష్ట్రంతో సన్నిహితంగా మెలుగుతూ నూతన సంవత్సరంలో అభివృద్ధి పథంలో ముందుకెళుతామని పేర్కొన్నారు. రాబోయే కాలంలో మరిన్ని లక్ష్యాలను చేరుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. అనేక రకమైన ప్రజాహిత సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, 84 కుటంబాలకు 24 కోట్ల రుణ సహయం చేయడం జరిగిందన్నారు. అలాగే 70 లక్షల డ్వాక్రా సంఘాలకు మూలనిధి ఏర్పాటు చేసినట్లు పెన్షన్ లను పెంచడం జరిగిందన్నారు. ప్రత్యేక హోదా ఇతర అంశాలు వస్తాయనే నమ్మకం ఉందన్నారు. 

16:34 - December 31, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఆయన మాటల్లోనే…
''భూములు రేట్లు పడిపోయాయా ? కరెంటు పోయిందా ? ఎర్రటి ఎండల్లో సైతం కరెంటు పోకుండా చేశాం..మంచినీళ్ల గురించి ఏ ముఖ్యమంత్రి ఆలోచించలేదు. ముందుచూపుతో కృష్ణా పేజ్ 3 విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఆంధ్రా వారిపై వివక్ష పెరుగుతుందని..దాడి చేస్తారని గతంలో విష ప్రచారం చేశారు. ప్రాంతాలుగా విడిపోయినా..కలిసే ఉంటామని ఆనాడు చెప్పడం జరిగింది. ఇలా విష ప్రచారం చేయడం వల్ల 2014లో వారికి ఓట్లు పడ్డాయి. విడిపోతే మీరు బాగుపడుతారు..తెలంగాణ ప్రజలు బాగుపడుతారని ఆనాడు చెప్పాం. ఆంధ్రాలో ఎయిమ్స్, అంతర్జాతీయ విమానాశ్రయాలు, కొత్తగా పోర్టులు..కొత్తగా అమరావతి నిర్మాణం వస్తోంది. తెలంగాణ ఏర్పడిన అనంతరం ఇదంతా రావడం లేదా ? ఆంధ్రప్రదేశ్ ఉంటే ఇవన్నీ వచ్చేవా ? ఈ విషయాలపై ఆలోచించాలి. 19 నెలల కాలంలో ఆంధ్రా సోదరుడు..సోదరిపై ఈగ వాలిందా..వివక్షకు గురయ్యారా అనే దానిపై ఆలోచించాలి''. అని కేటీఆర్ పేర్కొన్నారు. 

16:29 - December 31, 2015

నెల్లూరు : జిల్లాలోని కోవూరు మండలం వేగూరు కండ్రీగ లో విషాదం చోటు చేసుకుంది. పెన్నానదిలో స్నానానికని వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గ్రామానికి చెందిన చక్రపాణి, కావలి జయపాల్ పెన్నా నదికి వెళ్లారు. వీరు ప్రమాదవశాత్తు నదిలో పడిపోయి గల్లంతయ్యారు. వీరికోసం స్థానికులు గాలింపులు చేపట్టారు. ఒకరి మృతదేహం లభ్యం కాగా మరొకరి మృతదేహం కోసం గాలింపులు చేపట్టారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 

16:28 - December 31, 2015

ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులకు కొత్త సంవత్సరం కానుకగా 'బ్రహ్మోత్సవం' టీజర్ రేపు విడుదల కానుంది. ఉదయం 9.36 గంటలకు బ్రహ్మోత్సవం చిత్ర టీజర్ ను విడుదల చేయనున్నామని సినిమా నిర్మాతలు తమ ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. ''ఏ సూపర్ వే టూ స్టార్ట్ న్యూఇయర్'' అంటూ ట్వీల్ చేశారు. మహేష్ బాబు సరసన సమంత, కాజల్, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో మహేష్ తో సీతమ్మవాకిట్లో సిరిమల్లేచెట్టు చిత్రాన్ని తీసిని శ్రీకాంత్ అడ్డాల దీనికి దర్శకుడు. 

 

16:17 - December 31, 2015

మధ్యప్రదేశ్ : బీజేపీ ఎమ్మెల్యే ఫొటో పక్కన పాకిస్థాన్ జాతీయ పతాకం ముద్రించి ఉన్న పోస్టర్ సంచలనం సృష్టించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే విశ్వాస్ సరంగ్ ఫొటోతో ఉన్న ఒక పోస్టర్ లో పాక్ జెండా కూడా  ఉంది. మిలాద్ నబీ సందర్భంగా ముస్లిములకు శుభాకాంక్షలు తెలియచేస్తున్న ఈ పోస్టర్ ను ఒక కరెంట్ స్తంభంపై ఏర్పాటు చేశారు. సరంగ్ ఫొటోతో పాటు అయన మద్దతుదారులు కూడా ఈ పోస్టర్ లో ఉన్నారు. దీంతో రాజకీయపార్టీల నుంచి పలు విమర్శలు ఆయనకు ఎదురవుతున్నాయి. ఈనేపథ్యంలో విశ్వాస్ సరంగ్ మాట్లాడుతూ పోస్టర్ పై తన ఫొటో వార్త విని ఆశ్వర్యపోయానని, దీంతో తనకేమి సంబంధం లేదని చెప్పారు. ఈ సంఘటనకు కారణం అసాంఘిక శక్తులేనని అన్నారు. ఈ విషయమై భోపాల్ డీజీపీ ఒక లేఖ కూడా రాసినట్లు ఆయన చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో తన వేరిట తప్పుడు సందేశాలు పంపుతున్నట్లు సరంగ్ ఆరోపించారు. 

16:12 - December 31, 2015

హైదరాబాద్ : నూతన సంవత్సరం కొద్ది గంటల్లో వస్తుందనగా సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ కొద్ది రోజుల్లో ప్రకటిస్తారన్న ప్రచార నేపథ్యంలో అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. ప్రజలను ఆకర్షించే పనిలో పడ్డారు. అధికారపక్షం కూడా పలు కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగా సీఎం కేసీఆర్ నేడు మంత్రులు..ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈభేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఆస్తి పన్నును తెలంగాణ ప్రభుత్వం తగ్గించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు జీహెచ్ఎంసీ చట్టంలో మార్పులు తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాదికి రూ. 1200 చెల్లించే ఇంటి పన్నును రూ.101కి తగ్గిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. ఇంటి పన్ను తగ్గింపుతో సుమారు 5.10 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. దీనివల్ల ప్రభుత్వం రూ. 90 కోట్ల రాబడి తగ్గిపోనుంది. మరోవైపు ఎన్నో రోజుల నుండి ఆందోళన చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు..ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై కూడా కేసీఆర్ వరాలు కురిపించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు..ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంపునకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ గడవును నెల రోజులకు పొడిగించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చిన వినపత్రాల కోసం ఒక స్పెషల్ కౌంటర్ ఏర్పాటు చేయాలని, అందులో వచ్చిన వినతపత్రాలను శాఖల వారీగా విభజించాలని సూచించారు. ఈ వినతిపత్రాలపై అధ్యయనం చేసి తగిన సూచనలు చేయాలని అధికారులకు కేసీఆర్ సూచించారు. 

కేసీఆర్ కీలక నిర్ణయాలు..

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఆస్తి పన్నును తెలంగాణ ప్రభుత్వం తగ్గించింది. ఇందకు జీహెచ్ఎంసీ చట్టంలో మార్పులు తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాదికి రూ. 1200 చెల్లించే ఇంటి పన్నును రూ.101కి తగ్గిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. ఇంటి పన్ను తగ్గింపుతో సుమారు 5.10 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. దీనివల్ల ప్రభుత్వం రూ. 90 కోట్ల రాబడి తగ్గిపోనుంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు..ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంపునకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ గడవును నెల రోజులకు పొడిగించింది.

15:49 - December 31, 2015

మహిళల మానప్రాణాలకు విలువు లేకుండా పోయింది. స్త్రీల ప్రాణాలకూ రక్షణ లేకుండా పోయింది. మహిళలపై కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడితే... నిందితులపై చిన్నపాటి శిక్షలు వేసి... పంచాయతీ పెద్దలు సరిపెడుతున్నారు. ఇలాంటి ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. మహిళపై అత్యాచారానికి పాల్పడిన వారికి బూటు దెబ్బతో శిక్షను సరిపెట్టారు పంచాయతీ పెద్దలు. ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి యూపీలోని పంచాయతీ పెద్దలు విధించిన శిక్ష ఎంటో తెలుసా.. బూటు తీసుకుని బహిరంగంగా చెంపపై కొట్టడం, ముఖంపై ఇంకు చల్లడం, మరిన్ని వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ లోని ఓ గ్రామంలో పది రోజుల క్రితం ఇద్దరు కామాంధులు ఓ మహిళపై అత్యాచారం చేశారు. విషమ పరిస్థితుల నుంచి బాధితురాలు కోలుకుంది. విషయం తెలుసుకున్న పంచాయతీ పెద్దలు సమావేశమై కేసు విచారించారు. మొదట ఓ ఐదు లక్షల రూపాయలు జరిమానా కట్టమన్నారు. అందుకు నిందితులు ఒప్పుకోకపోవడంతో నలుగురూ చూస్తుండగా శిక్షించాలని తీర్పు ఇచ్చారు. ఇక ఇదేనా న్యాయం..? అని ప్రశ్నించడం తప్ప సామాజికవేత్తలది ఏమీ చేయలేని పరిస్థితి. 
పోలీసులు పట్టించుకోకనే పంచాయతీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. 

కేసీఆర్ కు షబ్బీర్ ఆలీ న్యూ ఇయర్ కార్డు..

హైదరాబాద్ : ప్రారంభోత్సవాలతో గ్రేటర్ ప్రజలను కేటీఆర్ మోసం చేస్తున్నారని కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ పేర్కొన్నారు. ఏడాదంతా దొంగ హామీలు, ఫిరాయింపులతో గడిచిందని, కొత్త సంవత్సరంలో అయినా ప్రజలను మోసం చేయవద్దని సూచిస్తూ సీఎం కేసీఆర్ కు న్యూ ఇయర్ కార్డును పంపుతున్నట్లు తెలిపారు.

 

రైతు ఖాతాలో కరవు సాయం - పోచారం..

ఢిల్లీ : రైతుల ఖాతాలో కరవు సాయం జమ చేయడం జరుగుతుందని మంత్రి పోచారం ప్రకటించారు. ఆయన కేంద్ర మంత్రి రాధా మోహన్ సింగ్ తో భేటీ అయ్యారు. కరవు సాయం ప్రకటించాలని మంత్రిని కోరారు. అనంతరం మీడియాతో మంత్రి పోచారం మాట్లాడారు. వర్షాభావం వల్లే రైతల ఆత్మహత్యలు జరిగాయని పేర్కొన్నారు. 

నూతన ఇసుక పాలసీపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ..

విజయవాడ : నూతన ఇసుక పాలసీపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. నూతన ఇసుక పాలసీకి వాతావరణ అనుమతులు వచ్చాయని, ఇసుకను వేలం వేయాలన్న కేబినెట్ నిర్ణయంపై చర్చించినట్లు ఆర్థిక మంత్రి యనమల తెలిపారు. జనవరి 8న ఇసుక టెండర్లకు నోటిఫికేషన్ ఇవ్వనున్నుట్లు పేర్కొన్నారు.

 

కేసీఆర్ కు మోడీ అభినందనలు..

ఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను భారత ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. అయిత చండీయాగాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు కేసీఆర్ ను అభినందించారు. 

హెల్త్ కార్డులు..ఫీజు రీయింబర్స్ మెంట్ గడువు పెంపు..

హైదరాబాద్ : ఉద్యోగుల హెల్త్ కార్డులు, ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు గడువు ఆరు నెలల పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

మంత్రులు..కార్యదర్శులతో కేసీఆర్ సమావేశం..

హైదరాబాద్: మంత్రులు, కార్యదర్శులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఎల్లుండి జరగనున్న మంత్రివర్గ సమావేశం..గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు వరాలు, డీఎస్సీ ప్రకటనపై సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 

మధ్యాహ్న భోజన పథకం..వంట ధరల పెంపు...

హైదరాబాద్: మధ్యాహ్న భోజన పథకం కింద వంట ధరలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు వంట ధర రూ.4.60 నుంచి రూ.4.76కు పెంచారు. ఆరు నుంచి పదోతరగతి వరకు వంట ధర రూ.6.38 నుంచి రూ.6.64కు పెంచారు. పెంచిన వంట ధరలు 2015 జులై 1 నుంచి వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

నగరంలో డ్రగ్స్ ముఠా అరెస్టు..

హైదరాబాద్ : నగరంలో డ్రగ్స్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెడికల్ షాపుల్లో మత్తు ఇంజెక్షన్లను కొనుగోలు చేశారని పోలీసులు తెలిపారు. నూతన సంవత్సర వేడుకల్లో విద్యార్థులకు అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. 

15:00 - December 31, 2015

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ నూతన సంవత్సరం కానుకగా ఢిల్లీ - మీరట్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సుమారు 74 కిలోమీటర్ల పొడవున, 14 లేన్ల ఈ హైవే నిర్మాణానికి సుమారు 7వేల 566 కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. కేంద్రం నిర్మిస్తున్న హైవేలు కేవలం రోడ్లు మాత్రమే కాదని అభివృద్ధికి రాజమార్గమని ప్రధాని మోడీ కొనియాడారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పాయి స్వర్ణ చతుర్భుజి పేరిట దేశాన్ని కలిపారని మోడీ గుర్తుచేశారు.

టి. ప్రభుత్వం ప్రజలకు సినిమా చూపించింది - ఎర్రబెల్లి..

హైదరాబాద్ : 2015లో ప్రభుత్వం ప్రజలకు సినిమా చూపించిందని టిటిడిపి నేత ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల నుండి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు నాలుగు ఓట్లు ఉన్న చోట 314 ఓట్లు వేయించి మంత్రి తుమ్మల హీరో అయ్యాడని ఎద్దేవా చేశారు. అవినీతిని నిలదీయాలని చెప్పిన సీఎం కేసీఆర్ తన కుటుంబం అవినీతి చేస్తుంటే ఎవరు నిలదీయాలని ప్రశ్నించారు. 

మోడీ విదేశీ మోజులో ఉన్నారు - సీపీఐ..

హైదరాబాద్ :మోడీ విదేశీ మోజులో ఉన్నారని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కలవడం మంచిదేనని, కమ్యూనిస్టులు చట్టసభల్లో లేకపోవడం వల్లే ప్రజా సమస్యలు చర్చకు రావడం లేదని తెలిపారు. 

ఏపీలో నేరాల సంఖ్య తగ్గింది - డీజీపీ..

విజయవాడ : గత ఏడాదితో పోల్చితే 2015లో నేరాల సంఖ్య 4.23 శాతం తగ్గిందని ఏపీ డీజీపీ రాముడు వెల్లడించారు. 40 మంది అంతర్జాతీయ స్మగ్లర్లను అరెస్టు చేయడం జరిగిందని, ఈ ఏడు వంద మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. 13 సార్లు పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయన్నారు. 51 మంది ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ యాక్టు నమోదు చేయడం జరిగిందని, 27100 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. అంతర్జాతీయ స్మగ్లర్ గంగిరెడ్డిని కూడా అరెస్టు చేసినట్లు చెప్పారు. 

ఏపీలో వీఆర్ఏ, వీఆర్ఓ పోస్టుల భర్తీకి నిర్ణయం..

హైదరాబాద్ : ఏపీలో విలీనమైన ఏడు మండలాల్లో ఖాళీగా ఉన్న వీఆర్ఏ, వీఆర్ ఓ పోస్టు భర్తీకి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నియామకాల బాధ్యత జిల్లా సెలక్షన్ కమిటీకి అప్పగించింది. 

14:37 - December 31, 2015

అనంతపురం : రాయలసీమ రైతుల్ని సీఎం చంద్రబాబు మరోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యారని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మాఫియాగా ఏర్పడి ఇసుక అక్రమ వ్యాపారం చేశారన్నారు. ఈ అక్రమాలపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

14:36 - December 31, 2015

హైదరాబాద్ : ఏపీ రాజధాని విజయవాడను టీడీపీ ప్రభుత్వం మాఫియా రాజధానిగా మార్చిందని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. 2015 సంవత్సరంలో విజయవాడలో కల్తీ మద్యం, ఇసుక, కాల్‌మనీ లాంటి మాఫియాలు వెలుగు చూశాయని దీని వెనుక ఉన్న నిందితులను ప్రభుత్వం కాపాడుతోందని అంబటి విమర్శించారు. 

14:32 - December 31, 2015

హైదరాబాద్ : యాదాద్రిని జిల్లాగా ప్రకటించాలని టి.టిడిపి నేత మోత్కుపల్లి పేర్కొన్నారు. గత కొంతకాలంగా యాదాద్రి జిల్లాగా ప్రకటించాలని మోత్కుపల్లి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ విషయంపై రేపు లక్ష్మీ నరసింహస్వామికి వినతిపత్రం ఇస్తామని ప్రకటించారు. స్వామివారు కేసీఆర్‌ మనసు మార్చుతారని తాను భావిస్తున్నట్లు చెప్పారు.

14:29 - December 31, 2015

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ 18 నెలల పాలనలో రాష్ట్రానికి చేసిందేమీలేదని టిపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. ముఖ్యంగా హైదరాబాద్‌నైతే అన్యాయం చేశారని విమర్శించారు. ఏ కారణంలేకుండా మెట్రో నిర్మాణం ఆపేశారని మండిపడ్డారు. సెక్రటరీ, ఉస్మానియా కూల్చివేస్తాం..చార్మినార్ ను కూల్చివేస్తామని మాటలు చెప్పడమే తెప్పించి ఒక మట్టి..ఒక ఇసుక వేసిందేమి లేదని ఉత్తమ్ పేర్కొన్నారు. 

14:28 - December 31, 2015

ఢిల్లీ : జనవరి నెలలోనే తెలంగాణకు కరవు సాయం అందనుందంట. అవును..స్వయంగా ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రాధా మోహన్ సింగ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరవు రావడంతో రైతులు మృతి చెందడం..భారీ నష్టం కలిగిన సంగతి తెలిసిందే. ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో కరవు బృందం ప్రకటించింది. వెంటనే కరవు సాయంపై కేంద్ర మంత్రిని కలవాలని మంత్రి పోచారాన్ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీనితో మంత్రి పోచారం కేంద్ర మంత్రి రాధా మోహన్ సింగ్ ను కలిశారు. ఈసందర్భంగా మంత్రి పోచారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు వెంటనే కరవు సహాయం అందించాలని కేంద్రమంత్రి రాధామోహన్‌ సింగ్‌ను మంత్రి పోచారం కోరామన్నారు. దీనికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని స్పష్టం చేశారు. అలాగే జనవరి 7న హర్టికల్చర్ యూనివర్శిటీ ప్రారంభోత్సవానికి రావాలని రాధామోహన్‌ సింగ్‌ను ఆహ్వానించామని చెప్పారు. తాను తప్పకుండా వస్తానని రాధామోహన్‌ సింగ్‌ హామీ ఇచ్చారని పోచారం చెప్పుకొచ్చారు.

తప్పకుండా కరవు సాయం అందిస్తాం - రాధా మోహన్ సింగ్..
జనవరి మొదటివారంలో తెలంగాణకు కరవు సాయం అందిస్తామన్నారు కేంద్రమంత్రి రాధామోహన్ సింగ్. తెలంగాణలో కరవు నష్టం 2500కోట్లని కేంద్రబృందం నివేదిక ఇచ్చిందన్నారు. దీనిపై టీఎస్ సర్కార్.. 3వేల కోట్ల సాయం చేయాలని కోరినట్టు మంత్రి తెలిపారు. ఈ అంశం తమ దృష్టిలో ఉందని... వచ్చేనెల మొదటి వారంలో దీనిపై ప్రకటన ఉంటుందని హామీ ఇచ్చారు.

14:23 - December 31, 2015

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ కొద్ది రోజుల్లో ప్రకటిస్తారన్న ప్రచార నేపథ్యంలో పార్టీలన్నీ అప్రమత్తమయ్యాయి. పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో ఉప్పల్ నియోజకవర్గం పలు సంఘటనలతో వార్తల్లోకి ఎక్కుతోంది. మొన్న టి. కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ పడితే నేడు బీజేపీ - టీఆర్ఎస్ వర్గీయులు ఘర్షణ పడ్డారు. ఏకంగా కేంద్ర, రాష్ట్ర మంత్రుల సమక్షంలోనే ఇదంతా జరగడం గమనార్హం. వివరాల్లోకి వెళితే వెలిగుట్ట మంచినీటి పైప్ లైన్ ప్రారంభోత్సవం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి దత్తాత్రేయతో పాటు మంత్రులు నాయినీ, తలసాని, పద్మరావు, కేటీఆర్ తదితరులు హాజరయ్యారు. ఆయా పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తమదంటే తమదే క్రెడిట్ అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. తమ హాయాంలోనే ఇదంతా జరుగుతోందని గులాబీ దళం పేర్కొనడంతో ఘర్షణ చెలరేగింది. ఇరు పార్టీల వర్గీయులు ఒకరిపైకొకరు దాడి చేసుకున్నారు. దీనితో కొంతమందికి గాయాలయ్యాయి. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని సద్దుమణిపించారు. 

14:17 - December 31, 2015

మనలో చాలా మంది గ్యాస్ ట్రబుల్ సమస్యతో బాధపడుతుంటారు. చాలా మంది కడుపులో ఏది తిన్నా, తినకపోయినా గ్యాస్ పట్టేసింది అంటుంటారు. నిజానికి కడుపులో గ్యాస్ అనేది అందరికీ ఉంటుంది. వేళకు భోజనం చెయ్యకపోయినా.. మితిమీరి ఆహారం తీసుకున్నా గ్యాస్ ట్రబుల్ రావడం మనం చూస్తుంటాం. దీని వల్ల చాలా మంది అసహనంగా ఫీల్ అవుతుంటారు. రాత్రిళ్లు నిద్రపట్టక, దీని నివారణకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. నిజానికి ఈ గ్యాస్ ట్రబుల్ సమస్యను అధిగమించే మార్గాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఆయుర్వేదంలో ఎన్నో చిట్కాలు ఉన్నాయి. 

1. కడుపు ఉబ్బరంతో బాధపడుతుంటే చిత్రకాదివటి అనే ఔషదాన్ని మజ్జిగలో కొంచెం ఉప్పు వేసుకుని, చిత్రకాదివటి ఒక మాత్ర వేసుకుని ఆ మజ్జిగను ప్రతిరోజు తాగుతుంటే, పుల్లటి త్రేన్పులు, పొట్ట ఉబ్బరం, పైత్యం కూడా తుగ్గుతాయి.

2. ప్రతిరోజూ ఇంగవను చూర్ణంగా చేసుకుని అన్నం తినేటప్పుడు మొదటి ముద్దలో అది కలుపుని తిన్నా గ్యాస్ సమస్యను అధిగమించవచ్చు.

3. మన శరీరానికి పడని పిండిని, గ్యాస్ ను క్రియేట్ చేస్తున్న కొన్ని రకాల కూరగాయలను గుర్తించి వాటిని ఆపేయడం మంచిది. ఉదాహరణకు చాలా మందికి శనగపిండి, దుంపలు, పల్లీలు, డీప్ ఫ్రైడ్ ఐటెమ్స్, గ్యాస్ ను కలిగిస్తుంటాయి. వాటికి దూరంగా ఉండటం మంచిది. 

4. పరగడుపుతో కరివేపాకు ఆకులను తిన్నా కూడా చక్కని ఫలితం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 

 

టీఆర్ఎస్, బీజేపీ వర్గీయుల ఘర్షణ..

హైదరాబాద్ : ఉప్పల్ లో టీఆర్ఎస్, బీజేపీ వర్గీయుల ఘర్షణ పడడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వెలిగుట్ట మంచినీటి పైప్ లైన్ ప్రారంభోత్సవంలో ఈ గొడవ చెలరేగింది. కార్యక్రమానికి కేంద్ర మంత్రి దత్తాత్రేయ, మంత్రులు నాయినీ, తలసాని, పద్మరావు, కేటీఆర్ తదితరులు హాజరయ్యారు. 

13:50 - December 31, 2015

హైదరాబాద్ : కరీంనగర్‌ జిల్లా కోర్టు ఆవరణలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అక్రమవడ్డీ వ్యాపారం కేసులో నిందితునిగా ఉన్న ఏఎస్సై మోహన్‌రెడ్డి అనుచరులు కోర్టు ఆవరణలో హల్‌చల్ చేశారు. న్యాయవాదులపై దాడి చేశారు. ఇందుకు నిరసనగా లాయర్లు ఆందోళనకు దిగారు.

13:49 - December 31, 2015

హైదరాబాద్ :తెలంగాణలో జాతీయ, రాష్ట్ర రహదారులకు వంద మీటర్ల లోపు నెలకొల్పిన వైన్‌ షాపులు, బార్లను తొలగించే దిశగా ఎక్సైజ్ శాఖ అడుగులు వేస్తోంది. రహదారి భద్రతపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం మద్యం విక్రయ కేంద్రాలను తొలగించే పనిలో పడింది ఎక్సైజ్‌ శాఖ. మరోవైపు ఎక్సైజ్‌ శాఖ నిర్ణయంతో మద్యం విక్రయదారులు గగ్గోలు పెడుతున్నారు.

రహదారి భద్రతాపై సుప్రీం కోర్టు కమిటీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం...

రహదారి భద్రతాపై సుప్రీం కోర్టు కమిటీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర హైవేలపై ఏర్పాటు చేసిన బార్లతో పాటు మద్యం దుకాణాలను 15 రోజుల్లోగా తొలగించేందుకు ఎక్సైజ్‌ శాఖ కసరత్తు చేస్తోంది. హైవేలకు 100 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఎక్సైజ్‌ శాఖ నోటీసులు జారీ చేసింది.

జిల్లాల్లో ఇప్పటికే ఎక్సైజ్ సూపరింటెండెంట్‌లు నోటీసులు...

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వైన్‌షాపులు, బార్లతో పాటు అన్ని జిల్లాల్లో ఇప్పటికే ఎక్సైజ్ సూపరింటెండెంట్‌లు నోటీసులు పంపించారు. దీంతో గత అక్టోబర్‌లోనే కొత్త లెసైన్సులు తీసుకొని మద్యం దుకాణాలు ఏర్పాటు చేసిన వారితో పాటు గత కొన్నేళ్లుగా రహదారులకు ఇరువైపులా బార్లు ఏర్పాటు చేసిన వారు కూడా ఎక్సైజ్ నోటీసులతో ఆందోళన చెందుతున్నారు.

జాతీయ రహదారులకు వంద మీటర్ల లోపు....

మరోవైపు జాతీయ, రాష్ట్ర రహదారులకు వంద మీటర్ల లోపు మత్తు పానీయాల విక్రయాలు జరపకూడదని జస్టిస్ కె.ఎస్. రాధాకృష్ణన్ చైర్మన్‌గా రోడ్‌సేఫ్టీపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. నూతన ఎక్సైజ్ పాలసీతో సంబంధం లేకుండా వెంటనే హైవేలలో మద్యం విక్రయాలపై నిషేధం విధించాలని, ఇప్పటికే ఏర్పాటైన దుకాణాలను తొలగించాలని ఆదేశించింది. ఈ మేరకు గత నెలలో ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలిస్తూ, తీసుకున్న చర్యలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.

500కు పైగా మద్యం దుకాణాలు హైవేల పైనే ....

ఇదిలా ఉంటే రాష్ట్రంలోని 2 వేల 216 మద్యం దుకాణాలకు గాను 500కు పైగా మద్యం దుకాణాలు హైవేల పైనే ఉన్నాయి. దీంతో పాటు బార్లు సైతం గత కొన్నేళ్లుగా రహదారుల పక్కనే కొనసాగుతున్నాయి. అక్టోబర్ 1 నుంచి నూతన ఎక్సైజ్ పాలసీ ద్వారా వందలాది మద్యం దుకాణాలు ఇప్పటికే హైవేలపై ఏర్పాటయ్యాయి. ఈ నేపథ్యంలో రహదారులపై ఆల్కహాల్ విక్రయాల నిషేధానికి తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు కమిటీ కోరింది.

వ్యాపారులు ఆందోళన....

సుప్రీంకోర్టు నిబంధనల నేపథ్యంలో హైవేలపై ఉన్న మద్యం విక్రయ కేంద్రాలను 100 మీటర్ల దూరానికి తరలించాలన్న ఆదేశాల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వ్యాపారులు కొంత ఆందోళనకు గురవుతున్నారు. 

13:41 - December 31, 2015

హైదరాబాద్‌ : నెక్లెస్‌ రోడ్ లోని జలవిహార్‌లో ఏర్పాటుచేసిన వీవ్స్‌ కాటన్‌ అండ్‌ సిల్స్క్‌ వస్త్రాల ప్రదర్శన ప్రారంభమైంది. 16 రాష్ట్రాలకు చెందిన చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శన 3వ తేదీ వరకు కొనసాగుతుంది. 

13:40 - December 31, 2015

హైదరాబాద్ :అమెరికన్‌ టెన్నిస్‌క్వీన్స్‌ సెరెనా విలియమ్స్‌, వీనస్‌విలియమ్స్‌ బ్యాలెన్‌సిల్స్‌ కంట్రీ క్లబ్‌లో సందడి సందడి చేశారు. పేద విధ్యార్ధుల సహాయార్ధం బ్యాలెన్‌సిల్స్‌ చారిటీ ఫౌండేషన్‌, జీనా గ్యారిసన్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా నిర్వహించిన ఎగ్జిబిషన్‌ ఈవెంట్‌కు సెరెనా, వీనస్‌ ప్రత్యేక అతిధులుగా హాజరయ్యారు. విరాళం కోసం యువ టెన్నిస్‌ ప్లేయర్స్‌తో కలిసి ఎగ్జిబిషనల్‌ మ్యాచ్‌ ఆడి అభిమానులను అలరించారు.

13:38 - December 31, 2015

హైదరాబాద్ : బాలీలోని మెంటావాయ్‌ ద్వీపంలో ఓ అరుదైన సర్ఫింగ్‌ రేస్‌ జరిగింది. ప్రపంచంలోనే అందమైన సముద్ర తీరాల్లో ఒకటిగా పేరున్న మెంటావాయ్‌ ద్వీపంలో మాజీ సర్ఫింగ్‌ వరల్డ్ చాంపియన్లు రోడ్నీ ఓడ్గార్డ్‌, ఫిలిప్‌ వాసిలెవ్‌ సర్ఫింగ్‌ ఫీట్స్‌తో వీక్షకుల చూపు తిప్పుకోనివ్వకుండా చేశారు. 500 మీటర్ల దూరం ఎక్కడా తడబడకుండా సర్ఫింగ్‌ చేసి ఆకట్టుకున్నారు. 

13:29 - December 31, 2015

దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ ఒడిషా రాష్ట్ర పర్యాటక శాఖ రోడ్ షోలను నిర్వహిస్తుంది. అందులో భాగంగా తెలుగువారికి ఒడిషా గొప్పదనాన్ని తెలియజేస్తూ ఇటీవల హైదరాబాద్‌లో రోడ్ షో కార్యక్రమం నిర్వహించింది. మహోన్నతమైన పర్యాటక ప్రదేశాలు కలిగిన ఒడిషాను బంగారు త్రికోణాకృతితో పోలుస్తుంటారు. వీటిలో భువనేశ్వర్, పూరీ, కోణార్క్ లు ప్రధానమైనవి. ప్రపంచంలో సూర్యదేవాలయాలకు ఆంధ్రప్రదేశ్‌లోని అరసవిల్లి, ఒరిస్సాలోని కోణార్క్ మందిరాలు అత్యంత పేరుగాంచాయి. సూర్యమాసంగా పిలిచే మాఘమాసంలో ప్రతి యేటా కోణార్క్ ఉత్సవాలు ఘనంగా జరుపుతారు.

ఈ సందర్భంగా అక్కడి రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ ఉత్సవాలను నిర్వహిస్తాయి. కోణార్క్ పూరీకి సరిగ్గా 85 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సూర్య రథాన్ని పోలినట్టు నిర్మించిన ఈ ఆలయం 12 చక్రాలతో 7 గుర్రాలతో శిల్పచాతుర్య పటిమతో నిర్మించారు. కోణార్క్ సముద్ర తీరంలో నిర్మించిన ఈ ఆలయం సూర్యగమనానికి అనుగుణంగా నిర్మించినట్టు తెలుస్తోంది. రథానికి అమర్చిన 12 చక్రాలు 12 నెలలు, 12 రాశులకు చిహ్నం. అలాగే సూర్య గమనం ఒక్కొక్క చక్రంలో ద్యోతకమవుతుంటుంది.

అతి పురాతనమైన గిరిజన తెగలు బొండా, కోయ, పదజ, సంతాల్ వంటి వాటికి నిలయమైన ఒడిషా సందర్శకులు వీక్షించడానికి ఎన్నో అద్భుతాలను అందిస్తుంది. పచ్చదనం పరుచుకున్న తూర్పు కనుమలు, నీలి సొబగులతో రారమ్మనే బంగాళాఖాతం ఒడిషా అందాలను ద్విగుణీకృతం చేస్తుంటాయి.
  
హైదరాబాద్ నుంచి సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరంలో గల ఒడిషాకు రాజధాని భువనేశ్వర్. రాష్ట్రానికి కేంద్రబిందువుగా ఉన్న ఈ ప్రాంతానికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి రోడ్డు, రైలు, వాయు మార్గాల ద్వారా చేరుకోవచ్చు.

టిఆర్ఎస్-బిజెపి వర్గీయుల మధ్య ఘర్షణ

హైదరాబాద్ : ఉప్పల్ లో టిఆర్ఎస్-బిజెపి వర్గీయుల ఘర్షణ చోటు చేసుకుంది. వెలిగుట్ట మంచినీటి పైప్ లైన్ ప్రారంభోత్సవం సందర్భంగా పోటా పోటీ నినాదాలు చేస్తూ ఇరు వర్గాలు ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణ లో పలువురికి గాయాలయ్యాయి. ఈ కార్యక్రమానికి ముక్య అతిధులుగా కేంద్ర మంత్రి దత్తాత్రేయ, మంత్రులు నాయిని నర్శింహారెడ్డి, కేటీఆర్ పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఢిల్లీ టూ మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే కు శంకుస్థాపన

న్యూఢిల్లీ : ఢిల్లీ నుంచి మీరట్ వరకు ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం కోసం ఇవాళ ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఎక్స్‌ప్రెస్‌వే వల్ల ఢిల్లీ శివారు ప్రాంత ప్రజల అభివృద్ధి జరుగుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త హైవే వల్ల ఢిల్లీ ప్రజలు వీకెండ్ ట్రిప్ వెళ్లేందుకు సులువు అవుతుందని మోదీ అన్నారు. ఎక్స్‌ప్రెస్ వేను ఢిల్లీ ప్రజలకు న్యూ ఇయర్ కానుకగా అందిస్తున్నట్లు మోదీ చెప్పారు. నేషనల్ హైవే-24 ప్రాజెక్టు కోసం రూ. 7244 కోట్లు ఖర్చు చేయనున్నారు. మూడేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి కానుంది. కాలుష్య నియంత్రణలోనూ ఎక్స్‌ప్రెస్‌వే తోడ్పడుతుందని ప్రధాని అన్నారు.

12:58 - December 31, 2015

తెలంగాణ ఉద్యమంపై ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ఎస్‌.కె.బ్యానర్‌పై డా.ఎస్‌.కె.మొహియుద్దీన్‌ ఆశీస్సులతో ఎస్‌.కె.హబీబుద్దీన్‌ దర్శకత్వంలో 'ఎన్‌కౌంటర్‌ ఆట మొదలైంది' పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, 'తెలంగాణ తొలి దశ, మలి దశ ఉద్యమం ఇతివృత్తంగా వరంగల్‌, జనగాం, కరీంనగర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్లలో వాస్తవ సంఘటనల నేపథ్యంతో నిజాం రాజుకు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో పాల్గొన్న యస్‌.కె.మొహియుద్దీన్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. 

'దొరల రాజ్యమా?, బడుగు వర్గాల రాజ్యమా' అనేది ట్యాగ్‌లైన్‌. ఇందులో ఎస్‌.కె.మొహియుద్దీన్‌ పాత్రలో సూపర్‌ స్టార్‌ కృష్ణ నటిస్తున్నారు. అలాగే ఇతర మూడు కీలక పాత్రల్లో సుద్దాల గౌతమ్‌, జి.రంగరాజు, బల్విందర్‌ సింగ్‌ నటిస్తున్నారు. వీరితోపాటు కొంత మందిని నూతన నటులను ఎంపిక చేయనున్నాం. వచ్చే నెల జనవరి 20న షూటింగ్‌ ప్రారంభించి సింగిల్‌ షెడ్యూల్‌లో పూర్తి చేస్తాం. మేడే సందర్భంగా సినిమాను విడుదల చేస్తాం' అని తెలిపారు. 'మంచి కథాంశంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది' అని నిర్మాతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో సుద్దాల దేవయ్య, చందర్‌, కమల్‌, గౌతమ్‌ తదితరులు పాల్గొన్నారు.

16 నెలల్లో ఇసుక ద్వారా రూ.880 కోట్ల ఆదాయం:యనమల

విజయవాడ : 16 నెలల్లో ఇసుక ద్వారా రూ.880 కోట్ల ఆదాయం చేకూరిందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. గురువారం ఇసుకపాలసీపై కేబినెట్ సబ్‌కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ క్యూబిక్ మీటర్ ఇసుక ధర రూ.550గా నిర్ణయించామని... ఎక్కువ ధరకు ఇసుక అమ్మితే లైసెన్స్‌లు రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఏడాదికోసారి ఇసుక రీచ్‌ల వారీగా వేలం వేయనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ హయాంలో పదేళ్లలో 23 జిల్లాల్లో రూ.610 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందన్నారు.

12:49 - December 31, 2015

హైదరాబాద్ : జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఎన్ కౌంటర్ జరిగింది. తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. తీవ్రవాదులు స్థానిక గుస్సు గ్రామంలో సంచరిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు భద్రతా దళాలు, పోలీసు అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు చనిపోయారు. వీరిలో ఒకరిని విదేశీయునిగా గుర్తించారు. 

12:47 - December 31, 2015

హైదరాబాద్ : ఔట్‌లుక్‌ మ్యాగజైన్‌కు హైకోర్టుకు ఊరట లభించింది. ఐఏఎస్‌ అధికారిణి స్మిత సభర్వాల్‌ మీద ప్రచురించిన ఆర్టికల్‌ కేసు నుంచి తమను మినహాయించాలని ఔట్‌లుక్‌ మ్యాగజైన్‌ హైకోర్టును అభ్యర్థించింది. ఔట్‌లుక్‌ అభ్యర్థనను ఈ మేరకు హైకోర్టు పరిగణలోకి తీసుకుంది.

12:45 - December 31, 2015

విశాఖ : చార్జిషీట్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆరా మధురవాడ సబ్‌రిజిస్ట్రార్‌ ఆనంద్‌ కుమార్‌ అక్రమాస్తులు, అవినీతి తవ్వేకొద్దీ బయటపడుతూనే ఉన్నాయి.. ఆనంద్‌కుమార్‌కు రౌడీషీటర్లు, క్రిమినల్స్‌తో సంబంధాలున్నాయని ఏసీబీ గుర్తించింది.. అతని ఇంట్లో తుపాకీ, ఇతర మారణాయుధాలు దొరికాయని పోలీసులు తెలిపారు.. అత్యంత విలాసవంతమైన అతని జీవితంచూసిన ఏసీబీ అధికారులు నివ్వెరపోతున్నారు.. మూడు అంతస్తులున్న ఇల్లు, అందులో ఇటాలియన్‌ మార్చుల్స్, గ్రానైట్‌ ఫ్లోరింగ్, అత్యాధునికమైన హోం థియేటర్‌... ఇలా ఎక్కడచూసినా అతి ఖరీదైన వస్తులు దర్శనమిస్తున్నాయి... మూడురోజులుగా... అధికారుల దాడుల్లో కోట్ల రూపాయల విలువైన ఆస్తులు బయటపడ్డాయి... తవ్వేకొద్దీ మరిన్ని బయటపడుతున్నాయి... రౌడీ షీటర్లు, క్రిమినల్స్ అండదండలతో ఆనంద్‌కుమార్‌ అవినీతికి పాల్పడ్డారని అధికారులు గుర్తించారు.. 

12:44 - December 31, 2015

హైదరాబాద్ : అగ్రిగోల్డ్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఆరు ఆస్తుల అమ్మాకానికి కోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. మూడు ఏజెన్సీలకు ఆరు ఆస్తుల అమ్మకాలను అప్పగించింది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఆస్తుల అమ్మకాలు మొదలుకానున్నాయి. మీడియా ముందు మాట్లాడొద్దని పిటిషనర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

న్యాయవాదులపై ఏఎస్సై మోహన్ రెడ్డి అనుచరులు దాడి

హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా కోర్టు ఆవరణ లో ఏఎస్సై మోహన్ రెడ్డి అనుచరులు హల్ చల్ చేశారు. కోర్టు వద్ద న్యాయవాదులపై మోహన్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. ఆగ్రహించిన న్యాయవాదులు కోర్టు ఎదుట ఆందోళన చేపట్టారు.

ఔట్ లుక్ పై కేసును కొట్టేసిన హైకోర్టు..

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కార్యాలయం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్‌ వ్యవహారంలో ఔట్‌లుక్‌పై కేసును గురువారం హైకోర్టు కొట్టివేసింది. స్మితా సబర్వాల్‌ పరువుకు నష్టం కలిగించారని అమె భర్త అకున్‌ సబర్వాల్‌ ఫిర్యాదు మేరకు గతంలో సీసీఎస్‌ పోలీసులు ఔట్‌లుక్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలతో సీఎం కేసీఆర్

హైదరాబాద్ : రాష్ట్రపతికి వీడ్కోలు పలికిన అనంతరం తెలంగాణ సచివాలయానికి వచ్చిన సీఎం కేసీఆర్ వివిధ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు.

ఉప్పల్ వద్ద నీటి పంపిణీ రిజర్వాయర్ ప్రారంభం...

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని వెలుగుగుట్టలో ఇన్‌లెట్-ఔట్‌లెట్ నీటి పంపిణీ రిజర్వాయర్‌ను మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రులు పద్మారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్‌లు హాజరైయ్యారు.

12:19 - December 31, 2015

బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్, అందాల తార, మాజీ విశ్వసుందరీ ఐశ్వర్యరాయ్.. అభిషేక్ బచన్ అర్ధాంగిగా మారాక ఐదేళ్ల గ్యాప్ తీసుకుంది. తర్వాత 2015 లో 'జజ్బా' చిత్రంతో మెరుపులు మెరిపించింది అందాల రాశి ఐశ్వర్య. 2016లో వరుస సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే 'యే దిల్ హై ముష్కిల్', 'సరబ్జిత్' వంటి సినిమాల్లో నటిస్తోన్న ఐష్... ఓ ప్రతిష్టాత్మక మల్టీ స్టారర్ మూవీలోనూ ప్రధాన పాత్ర పోషించనుంది. ఈ మూవీ షూటింగ్ లతో ప్రస్తుతం బిజీగా ఉంది ఐశ్వర్యరాయ్. వచ్చే ఏడాది మే 20న సరబ్జిత్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. 

ఇక దీపావళి సందర్భంగా యే దిల్ హై ముష్కిల్ విడుదల చేయనున్నారు. ముగ్గురు కథానాయికలుండే ఓ ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ చిత్రానికి కూడా ఐష్ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందంటున్నారు. ఈ మూవీ 2016 లోనే ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. 2016 లో మంచి జోష్ తో అభిమానులకు పండగ చేయనుంది ఐష్. 

 

పాతబస్తీలో భారీగా మత్తు ఇంజెక్షన్లను స్వాధీనం

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో పోలీసులు భారీగా మత్తు ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు చేపట్టిన పోలీసులు నలుగురు యువకుల వద్ద నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నారు. యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మత్తు ఇంజెక్షన్లు కొన్న మెడికల్ దుకాణాల వివరాలను సేకరిస్తున్నారు.

11:52 - December 31, 2015

వరంగల్‌ : వరంగల్‌ లో మానవత్వం మంటకలిసింది. తల్లి పొత్తిళ్లలో నుంచి అప్పుడే పుట్టిన పసికందు.. చెత్తకుప్పలోకి చేరింది. పద్మాక్షిగుట్ట సమీపంలో అప్పుడే పుట్టిన ఆడశిశువును గుర్తు తెలియని వ్యక్తులు... ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి చెత్తకుప్పలో వదిలేశారు. శిశువును పందులు పీక్కుతినటాన్ని స్థానికులు గమనించి మున్సిపల్ అధికారులకు సమాచారమందించారు. కాలనీవాసుల సమాచారంతో సిబ్బంది వచ్చి మృతదేహాన్ని తొలగించారు.

11:50 - December 31, 2015

చిత్తూరు : శేషాచల అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు సుమారు కోటి రూపాయల విలువైన ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జూపార్క్‌ను ఆనుకొని ఉన్న లక్ష్మీపురం చెరువు దగ్గర టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూంబింగ్ జరుపుతుండగా.. స్మగ్లర్లు తారసపడ్డారు. టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై వారు రాళ్లదాడికి దిగడంతో... ఓ రౌండ్ గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం ఆ ప్రాంతంలో కోటిరూపాయల విలువైన దుంగలు స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన స్మగ్లర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

11:48 - December 31, 2015

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై భవానీల దీక్షల విరమణ సందర్భంగా గురు భవానీలు, అర్చకుల మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. అలయ అధికారులు భవానీల ఇరుముడులు గురు భవానీలకు అప్పగించారు. ఇరుముడులు ఇచ్చేందుకు వచ్చిన అర్చకులను గురుభవానీలు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు ఇంద్రకీలాదిపై భవానీ భక్తులు దీక్షలు విరమించనున్నారు.

ఐఏఎస్ ల సస్పెన్షన్ ను రద్దు చేసిన కేంద్రం

హైదరాబాద్ : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కేంద్రం మరో షాక్ ఇచ్చింది. ప్రభుత్వ న్యాయవాదులకు వేతనాలు పెంచుతూ తన కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదన్న కారణంతో ఇద్దరు సీనియర్ ఐఏఎస్ లను కేజ్రీవాల్ సస్పెండ్ చేశారు. దీనికి నిరసనగా ఢిల్లీలో పని చేస్తున్న అధికారులు సస్పెన్షన్ ఉత్తర్వులు రద్దు చేయకపోతే సామూహిక శెలవుల్లో వెళతామంటూ 200 మంది ఐఏఎస్ లు కేజ్రీ సర్కార్ కు అల్టిమేటం జారీ చేశారు. అయినా సర్కార్ స్పందిచకపోవడంతో కేంద్ర హో మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం కేజ్రీవాల్ జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేసింది.

11:39 - December 31, 2015

నటుల వరుస మరణాలు ఈ ఏడాది టాలీవుడ్ ను పట్టిపీడించాయి. పలువురు సినీ హాస్య, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఈ లోకాన్ని విడిచిపెట్టి శాశ్వతంగా వెళ్లిపోయారు. తెలుగు సినీ పరిశ్రమ ఆణిముత్యాల్లాంటి నటులను కోల్పోయింది. వరుస మరణాలతో ఈ ఏడాది తెలుగు చిత్ర సీమ తీవ్ర వేదనకు గురైంది. దాదాపు 30 మంది ఆణిముత్యాల్లాంటి ప్రతిభావంతుల్ని శాశ్వతంగా కోల్పోయింది. ఆకస్మిక మరణాల తాకిడిని తట్టుకునేందుకు పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ ఏకతాటిపైకొచ్చి యజ్ఞాలు, యాగాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. 

శ్రీహరితో మొదలుకుని ఉదరు కిరణ్‌, అక్కినేని నాగేశ్వరరావు, బాపు, బాలచందర్‌ గత ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమకు శాశ్వత వీడ్కోలు పలకగా, 2015 ప్రారంభంలోనే 'ఆహుతి' ప్రసాద్‌ కన్నుమూశారు. క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయన జనవరి 4న హఠాన్మరణం చెందారు. ఆ మరునాడే ప్రముఖ రచయిత గణేష్‌ పాత్రో తుదిశ్వాస విడిచారు. 'అంతస్తులు', 'ఆత్మబలం', 'ఆస్తిపరులు', 'అక్కా చెల్లెలు' వంటి గొప్ప చిత్రాలను తెరకెక్కించిన దర్శక, నిర్మాత వి.బి. రాజేంద్రప్రసాద్‌ జనవరి 12న కన్నుమూశారు. 16న 'శివాజీ', 'ఒరేరు తమ్ముడు' వంటి చిత్రాలను నిర్మించిన నిర్మాత రగుతు సత్యనారాయణ, నెలాఖరులో పాపులర్‌ హాస్య నటుడు ఎమ్మెస్‌ నారాయణ అనారోగ్యంతో మరణించారు. దీంతో ఒక్క జనవరి నెలలోనే ఐదుగురిని కోల్పోయింది. ఉషాకిరణ్‌ మూవీస్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ అట్లూరి రామారావు ఫిబ్రవరి 6న కన్నుమూశారు.

అత్యధిక భాషల్లో సినిమాలు రూపొందించిన నిర్మాతగా గిన్నీస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం పొందిన మూవీ మొఘల్‌ దగ్గుబాటి రామానాయుడు ఫిబ్రవరి 18న చనిపోయారు. 'రాముడు భీముడు', 'ప్రస్థానం', 'శ్రీకృష్ణ తులాభారం', 'ప్రేమ్‌నగర్‌' వంటి వందకు పైగా బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను నిర్మించిన రామానాయుడు మరణంతో యావత్‌ ఇండిస్టీ షాక్‌కు గురయ్యింది. ఆ తర్వాత 'పెళ్ళి పుస్తకం' చిత్రాన్ని నిర్మించిన నిర్మాత నాగిరెడ్డి, సినిమాటోగ్రాఫర్‌ విన్‌సెంట్‌ ఒకేరోజు ఫిబ్రవరి 24న మరణించారు. మార్చి 28న 'రెడ్‌ అలర్ట్‌' నిర్మాత తిన్నింటి వీర శ్రీరామ్‌ రెడ్డి, ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి కొడుకు, సంగీత దర్శకుడైన శ్రీ ఏప్రిల్‌ 18న సంగీత ప్రపంచానికి దూరమవ్వగా, 'సిసింద్రీ', 'గోవిందా గోవిందా' వంటి ఎన్నో చిత్రాలకు ఆడియోగ్రాఫర్‌గా పనిచేసిన మధుసూధన్‌ రెడ్డి ఏప్రిల్‌ 20న, సీనియర్‌ నటి బిందుమాధవి మే 22న, 'రాజమండ్రికి 50 కిలోమీటర్ల దూరంలో' చిత్రానికి సంగీతమందించిన దర్శకుడు ఆకాష్‌ మే 24న తుది శ్వాస విడిచారు. 'నువ్వు నాకు నచ్చావ్‌', 'నువ్వులేక నేను లేను', 'ఇంద్ర', 'అడవి రాముడు', 'అల్లరి రాముడు' వంటి చిత్రాలతో వెంకటేష్‌, తరుణ్‌, చిరంజీవి, ప్రభాస్‌, ఎన్టీఆర్‌తో కలిసి హీరోయిన్‌గా నటించిన ఆర్తీ అగర్వాల్‌ అనారోగ్య కారణంగా జూన్‌ 6న అమెరికాలో కన్నుమూశారు. ఆ తర్వాత రెండు రోజుల్లోనే ప్రముఖ రచయిత దాశరధి రంగాచార్య జూన్‌ 8న మరణించారు. 

వందల చిత్రాలకు సంగీతమందించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎస్‌.విశ్వనాథన్‌ అనారోగ్యంతో జూలై 14న తుది శ్వాస విడిచారు. ఆ వెనువెంటనే రెండు రోజులకు మధుర గాయకుడు పి.రామకృష్ణ మరణించారు. ఆగస్టులో నిర్మాతలు నాగేందర్‌ గౌడ్‌, బొల్లు సత్యనారాయణ, అడుసుమిల్లి వెంకటేశ్వర్లు మృతి చెందారు. అక్టోబర్‌ 7న ప్రముఖ టాలీవుడ్‌ సీనియర్‌ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు, 10న సీనియర్‌ నటి మనోరమ, 19న హాస్య నటుడు 'కళ్లు' చిదంబరం తుది శ్వాస విడిచారు. వీరితోపాటు దేవిశ్రీప్రసాద్‌ తండ్రి, రచయిత సత్యమూర్తి, మరో రచయిత శ్రీనివాస చక్రవర్తి ఒకే రోజు డిసెంబర్‌ 14న అనారోగ్యంతో మరణించారు. 18న ప్రముఖ రచయిత, నటుడు చాట్ల శ్రీరాములు పరిశ్రమకు శాశ్వత వీడ్కోలు పలకగా, 19న సీనియర్‌ నటుడు రంగనాథ్‌ బలవన్మరణంకి పాల్పడ్డారు. కాశీ విశ్వనాథ్‌ 22న, హాస్య నటుడు పొట్టి రాంబాబు డిసెంబర్‌ 29న అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు.

కాల్‌మనీ నిర్వాహకులపై 250 కేసులు : చినరాజప్ప

చిత్తూరు : రాష్ట్రవ్యాప్తంగా కాల్‌మనీ నిర్వాహకులపై 250 కేసులు నమోదు చేశామని డిప్యూటీ సీఎం చినరాజప్ప వెల్లడించారు. కాల్‌మనీ వ్యవహారంపై వైసీపీ రాద్దాంతం చేస్తోందని ఆయన ఆరోపించారు. జన్మభూమి కార్యక్రమంలో రేషన్‌కార్డులు పంపిణీ చేస్తామన్నారు. అన్ని శాఖల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పోలీస్‌శాఖలో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని చినరాజప్ప పేర్కొన్నారు. 

అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకాలకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. 6 ఆస్తులను అమ్మేందుకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫ్రిబవరి 1 నుంచి ఆరు ఆస్తుల అమ్మకాలను 3ఏజెన్సీలకు హైకోర్టు అప్పగించింది. పిటిషనర్ కు మీడియా ముందు మాట్లాడవద్దని ఆదేశించింది. చార్జిషీట్ దాఖలు చేయకపోవడాన్ని హైకోర్టు ఆరా తీసింది. నిందితులు విచారణకు హాజరవుతున్నారు కాబట్టి అరెస్ట్ చేయలేదని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు.

11:29 - December 31, 2015

ఉత్తర, దక్షిణ భారతంలో పలు భాషల్లో 2015 సంవత్సరంలో అనేక చిత్రాలు విడుదలయ్యాయి. వాటిలో కొన్ని బ్లాక్ బస్టర్స్ చిత్రాలుగా నిలిచాయి. ప్రేక్షకుల నుంచి విశేష ఆధరణ పొందాయి. ప్రేక్షకుల్ని అలరించేందుకు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషా చిత్రాలు ఈ ఏడాది కూడా విశ్వ ప్రయత్నం చేశాయి. ఈ ప్రయత్నంలో భాగంగా ఒక్కొక్క భాషలో దాదాపు 100 నుంచి 200 చిత్రాల వరకు ఈ ఏడాది విడుదలయ్యాయి. వీటిల్లో బడా హీరో, హీరోయిన్ల సినిమాలు, భారీ, క్రేజీ కాంబినేషన్లతో రూపొందిన చిత్రాలతోపాటు నూతన నాయకానాయికల చిత్రాలూ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. థియేటర్‌కొచ్చిన ప్రేక్షకుడు తన ప్రపంచాన్ని మరిచిపోయేలా చేసిన చిత్రాలను విశేషంగా ఆదరించారు. కాంబినేషన్లని పట్టించుకోకుండా కథ, కథనం, వినోదంలో నవ్యత ఉంటే కొత్త వాళ్ళు నటించిన చిత్రాలకు, అలాగే సీనియర్‌ దర్శకులా.. నూతన దర్శకులా అని కూడా చూడకుండా బాగున్న ప్రతి చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టి కలెక్షన్ల వర్షం కురిపించారు. ప్రేక్షకులతో శభాష్‌ అనిపించుకుని ఈ యేడాది బ్లాక్‌బస్టర్‌ చిత్రాలుగా నిలిచిన పలు భాషా చిత్రాల పరంపర గురించి ఇప్పుడు చూద్దాం...  

తెలుగు
ఈ ఏడాది విడుదలైన 172 చిత్రాల్లో తెలుగు సినిమా మార్కెట్‌ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తృత పరిచిన చిత్రంగానే కాకుండా ప్రేక్షకుల్ని విశేషంగా అలరించిన చిత్రంగా 'బాహుబలి' నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 600 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను వసూలు చేసి తెలుగు సినిమా సత్తా చాటింది. 12వ శతాబ్దం నాటి కాకతీయ సామ్రాజ్యానికి చెందిన వీరనారి రాణి రుద్రమదేవి జీవిత కథ ఆధారంగా రూపొందిన 'రుద్రమదేవి' చిత్రం సైతం జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ మంచి గుర్తింపు పొందింది. స్టీరియోస్కోపిక్‌ త్రీడీ చిత్రంగా తెరకెక్కి సాంకేతికంగా కూడా తెలుగు సినిమా ఘనతని చాటింది. ఊరిని దత్తత తీసుకోవడమనే స్ఫూర్తిదాయక కాన్సెప్ట్‌తో రూపొందిన 'శ్రీమంతుడు' చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది. అంతేకాకుండా ఎంతోమందికి ఇన్స్‌ప్రిరేషన్‌గా నిలిచి ఊర్లని దత్తత తీసుకునేలా చేసి అందరితోనూ 'శ్రీమంతుడు' శభాష్‌ అనిపించుకున్నాడు. పక్కా కమర్షియల్‌ చిత్రంగానే కాకుండా రెండున్నర గంటలపాటు ప్రేక్షకుల్ని హాయిగా నవ్వించిన 'పటాస్‌' బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

హిందీ
ఈ ఏడాది బాలీవుడ్‌లో దాదాపు 170కి పైగా చిత్రాలు విడుదలైతే అందులో బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ నటించిన 'భజరంగీ భాయిజాన్‌' చిత్రం మాత్రమే ఎవర్‌గ్రీన్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. భారతదేశం, పాకిస్తాన్‌ల మధ్య శత్రుత్వ సరిహద్దుల్ని చెరిపేసిన సెంటిమెంట్‌ చిత్రంగా 'భజరంగీ భాయిజాన్‌' విశేష ఆదరణ పొంది ప్రపంచ వ్యాప్తంగా 626 కోట్ల రూపాయల్ని వసూలు చేసి బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేసింది. దీని తర్వాత మహిళా ప్రధాన చిత్రంగా కంగనారనౌత్‌ నటించిన 'తను వెడ్స్‌ మను రిటర్స్న్‌' చిత్రం బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్స్‌ లిస్ట్‌లో నిలిచింది. వరల్డ్‌వైడ్‌గా 243 కోట్ల రూపాయల వసూళ్ళని రాబట్టింది. వీటి తర్వాత సల్మాన్‌ నటించిన మరో చిత్రం 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో' చిత్రం సైతం 400 కోట్ల రూపాయల్ని వసూలు చేసి విశేష ఆదరణ పొందిన చిత్రంగా పేరొందింది. వీటి తర్వాత 'దిల్‌వాలే', 'బాజీరావు మస్తానీ', 'బేబీ', 'ఎన్‌హెచ్‌10', 'పీకూ' చిత్రాలు బెస్ట్‌ చిత్రాలుగా నిలిచాయి.

తమిళం
200 చిత్రాలతో ఈ ఏడాది అత్యధిక చిత్రాలు విడుదలైన పరిశ్రమగా తమిళ చిత్ర సీమ ప్రత్యేకత చాటుకుంది. వీటిల్లో అజిత్‌ నటించిన 
'వేదాలమ్‌' (119.22) చిత్రాలు, లారెన్స్‌ దర్శకత్వంలో రూపొందిన కాంచన 2 (112.20 కోట్లు) చిత్రాలు కలెక్షన్ల పరంగా వందకోట్ల క్లబ్‌లో చేరి బ్లాక్‌బస్టర్స్‌గా నిలిస్తే, అజితే నటించిన 'ఎన్నై అరిందాల్‌' (94 కోట్లు), ధనుష్‌ నటించిన 'అనేగన్‌' (53.47 కోట్లు), జయమ్‌ రవి 'తని ఒరువన్‌' (75.17 కోట్లు), కమల్‌హాసన్‌ నటించిన 'పాపనాశమ్‌' (57.83 కోట్లు), విజరు సేతుపలి, నయనతార కాంబినేషన్‌లో తెరకెక్కిన 'నానుమ్‌ రౌడీధాన్‌' (57.78 కోట్లు), సూర్య నటించిన 'మాస్‌' (52 కోట్లు) వంటి చిత్రాలు బెస్ట్‌ చిత్రాలుగా ప్రేక్షకాదరణ పొందాయి. 

మలయాళం
ఈ యేడాది 140 చిత్రాలతో మలయాళ చిత్ర సీమ ప్రేక్షకుల్ని అలరించేందుకు సమాయత్తమైంది. వీటిల్లో నివిల్‌పాల్‌ నటించిన 'ప్రేమమ్‌' చిత్రం ఆల్‌టైమ్‌ బ్లాక్‌బస్టర్‌గా మాలీవుడ్‌లో రికార్డ్‌ సృష్టించింది. 65 కోట్లు కలెక్ట్‌ చేసి వసూళ్ళ పరంగా సత్తా చాటింది. దీని తర్వాత 'ఎన్ను నింతే మొదిన్‌' (45 కోట్లు), పృధ్వీ రాజ్‌, జయసూర్య, ఇంద్రజీత్‌ కాంబినేషన్‌లో రూపొందిన 'అమర్‌ అక్బర్‌ అంథోని' (25 కోట్లు), 'ఒరు వడక్కన్‌ సెల్ఫీ' (21కోట్లు) కలెక్ట్‌ చేసి బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌గా నిలిచాయి. మమ్ముట్టి నటించిన 'భాస్కర ద రాస్కెల్‌', 'ఫైర్‌మెన్‌' చిత్రాలు, పృధ్వీరాజ్‌ నటించిన 'పికెట్‌ 43', మోహన్‌లాల్‌ 'లోహమ్‌' (13 కోట్లు) చిత్రాలు మాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసి సక్సెస్‌ లిస్ట్‌లో చేరాయి.

కన్నడ
ప్రేక్షకుల్ని అలరిచేందుకు కన్నడ చిత్ర సీమ 136 చిత్రాలతో రంగం సిద్ధం చేసుకుంది. వీటిల్లో శివరాజ్‌కుమార్‌ నటించిన 'వజ్రకాయ' (12.90 కోట్లు), నిరూప్‌ భండారీ, అవంతికశెట్టి కాంబినేషన్‌లో రూపొందిన 'రంగి తరంగ' (7.93 కోట్లు), పునీత్‌రాజ్‌కుమార్‌, అంజలి జంటగా తెరకెక్కిన 'రానా విక్రమ' (7.50 కోట్లు) చిత్రాలు విశేష ప్రేక్షకాదరణతో బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. వీటి తర్వాత 'వాస్తు ప్రకార', 'రానా', 'కృష్ణలీలా', 'బుల్లెట్‌ బాస్య', 'ఆరంభ', 'సపనోమ్‌కి రాణీ' తదితర చిత్రాలు విజయాల్ని సొంతం చేసుకున్నాయి.

తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషా చిత్రాల విజయపరంపరను గమనిస్తే, అన్ని చోట్ల నవ్యతకే ప్రేక్షకులు పట్టం కట్టారు.
కాంబినేషన్లలో రూపొందిన చిత్రాల్లో కథాబలం లేకపోతే నిర్మొహమాటంగా తిరస్కరించారు. అలాగే అన్ని చిత్ర పరిశ్రమల్లో భారీ అంచనాలతో విడుదలైన చిత్రాలన్ని ప్రేక్షకుల నిరాదరణకు గురై ఘోర పరాజయాన్ని చవిచూశాయి. కలెక్షన్ల పరంగా, ప్రేక్షకుల విశేష ఆదరణ పరంగా 'బ్లాక్‌బస్టర్స్‌'గా నిలిచిన చిత్రాలైనప్పటికీ ఆస్కార్‌ అవార్డుల బరిలో ఎంట్రీ లెవల్‌కే పరిమితమయ్యాయి.

ఢిల్లీ బయలు దేరిన రాష్ట్రపతి

హైదరాబాద్ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాలకాల విడిది ముగించుకుని కొద్ది సేపటి క్రితం హకీంపేట విమానాశ్రయం నుండి ఢిల్లీ బయలు దేరారు. అంతక ముందు రాష్ట్రపతికి సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్, తెలంగాణ మంత్రులు, అధికారులు వీడ్కోలు పలికారు.

11:09 - December 31, 2015

శరీరానికి క్యాలరీలు అవసరం. మనకు అవసరమయ్యే క్యాలరీలను మాత్రమే తీసుకోవాలి. అలా కాకుండా అధిక క్యాలరీలను తీసుకుంటే కొవ్వు చేరుతుంది. రోజుకు ఇన్ని క్యాలరీలే తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. కాని వేటిలో ఎన్ని క్యాలరీలున్నాయో తెలియక ఏవేవో ఆహారపదార్ధాలు మనం తీసుకుంటాం. అలా మన శరీరంలో అధిక క్యాలరీలు చేరి కొవ్వుగా మారతాయి. మరి వాటిని కరిగించుకునేందుకు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో తెలుసుకోవాల్సిందే. ఇవి బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడతాయి. మరి క్యాలరీలను కరిగించే ఆ ఆహారపదార్ధాలేమిటో చూద్దామా...

ద్రాక్షలో క్యాలరీలను తగ్గించే గుణం ఉంది. వీటిలో ఫైబర్‌ అధికంగా ఉంటుంది కాబట్టి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే ఇది రక్తంలోని చక్కెరస్ధాయిలను సమతుల్యం చేస్తుంది. కాబట్టి ద్రాక్షను డైరెట్‌గానే కాక, సలాడ్‌గా, జ్యూస్‌గా, పెరుగుతో కలిపి కూడా తీసుకోవచ్చు.

కొత్తిమీర శరీరంలోని ఎక్కువ క్యాలరీలను కరిగిస్తుంది. అందుకే ప్రతి వంటకంలో కొత్తిమీరను చేర్చుకోవడం ఉత్తమం. మొక్కజొన్న కూడా క్యాలరీలను తగ్గిస్తుంది. ఇంకా గ్రీన్‌ టీ, చేపలు, అవకాడో, పనస గింజలు వంటల్లో చేర్చుకోవడం వల్ల కెలరీలను తగ్గించుకోవచ్చు. అందుకే ఫైబర్‌ ఎక్కువగా ఉండే ఆహారపదార్ధాలను రోజువారీ ఆహారంలో చేర్చడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. 

 

అభ్యుదయ రచయిత చిక్కాల కృష్ణారావు కన్నుమూత..

విశాఖ : ప్రముఖ అభ్యుదయ రచయిత చిక్కాల కృష్ణారావు(84) కన్నుమూశారు. విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రచయిత చలానికి అత్యంత సన్నిహితుడైన కృష్ణారావు... శ్రీశ్రీ, దేవులపల్లితో కూడా సన్నిహితంగా మెలిగేవారు. చలం మృతి తర్వాత తమిళనాడు నుంచి విశాఖ జిల్లా భీమిలి వచ్చి స్థిరపడ్డారు. ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి జీవితంపై కృష్ణారావు పరిశోధన చేశారు. మహారాత్రి, భగవాన్ రమణమహర్షి, జీసెస్ స్మృతులు, ఖలీల్ జిబ్రాల్, కృష్ణా జీవితం, బుద్ధంశరణంగచ్ఛామి వంటి రచనలు చేశారు.

10:52 - December 31, 2015

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ ప్రారంభమైంది. దుర్గగుడి ఈవో అగ్నిప్రతిష్టాపన చేసి దీక్షా విరమణ ప్రారంభించారు. దీక్షలను విరమించేందుకు ఇంద్రకీలాద్రికి భవానీలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మరో వైపు దీక్షా విరమణకు అర్చకులు డబ్బులు వసూలు చేస్తుండటంతో భవానీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

10:50 - December 31, 2015

హైదరాబాద్ : న్యూ ఇయర్‌ సెలబ్రేషన్లకు జంట నగరాల వాసులు రెడీ అవుతున్నారు. ఎవరికి వారుగా పార్టీలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పార్టీ అంటే కిక్కెక్కాల్సిందే. బీర్లు పొంగాల్సిందే. బాంద్రీ, విస్కీ, రమ్‌, జిన్‌... ఇలా రకరకాల మద్యాన్ని ఏరులై పారించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చాలా మంది ముందుగానే మద్యం బాటిళ్లను కొనుక్కుని నిల్వ చేసుకున్నారు. మరికొందరు వైన్‌ షాపుల దగ్గర క్యూ కట్టారు.

డిసెంబర్‌లో 30 లక్షల లీటర్ల బీరు అమ్మకం ……..

ఇదే అదునుగా భావించిన తెలంగాణ స్టేట్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్‌... న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌లో మద్యం అమ్మకాలను గణనీయంగా పెంచి సొమ్ము చేసుకునే విధంగా ప్లాన్‌ చేసింది. సాధారణంగా డిసెంబర్‌లో హైదరాబాద్‌లో 30 లక్షల లీటర్ల బీరు, 25 లక్షల లీటర్ల ఐఎంఎఫ్‌ఎల్‌ అమ్ముడుపోతుంది. ఈసారి ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. జంటనగరాల్లో 272 మద్యం దుకాణాలు ఉన్నాయి. బార్లు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. పబ్‌లు, క్లబ్బులు, రిసార్ట్స్‌ కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఫంక్షన్‌ హాల్స్‌ అన్నీ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్లకు రెడీ అయ్యాయి. డిసెంబర్‌ 31, జనవరి 1 తేదీల్లో మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు 160 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తంమీద చివరి రెండు రోజుల్లో టీఎస్‌బీసీఎల్‌ నుంచి మద్యం సరఫరాలు ఊపందుకోవడంతో వైన్‌ షాపుల యజమానులు, బార్ల ఓనర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

విశాఖ సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో ఏసీబీ సోదాలు..

విశాఖ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాఖ మధురపూడి సబ్‌రిజిస్ట్రార్ ఇంట్లో గురువారం ఉదయం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు.  లాసన్స్‌బేలో ఉన్న ఆయన ఇంటికి సోమవారం ఏసీబీ అధికారులు సోదాలకు వెళ్లగా అంతకుమునుపే సమాచారం అందుకున్న సబ్‌రిజిస్ట్రార్ ఆనంద్‌కుమార్ ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. మూడు రోజులపాటు వేచి చూసిన అధికారులు గురువారం ఇంటి తాళం పగులగొట్టి తనిఖీలు చేపట్టారు. అయితే, ఇప్పటికే తెలంగాణ, ఏపీల్లో హైదరాబాద్‌తోపాటు పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల్లోని 10 చోట్ల ఏసీబీ తనిఖీలు చేసింది.

కుమారులతో పాటు బావిలో దూకి తల్లి ఆత్మహత్య

నెల్లూరు : డక్కిలి మండలం నాగులపాడులో విషాదం నెలకొంది. ఇద్దరు కుమారులతో పాటు బావిలో దూకి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

డిగ్రీ విద్యార్థిని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం...

ప్రకాశం :సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి రైల్వేగేట్‌ దగ్గర పెట్రోల్‌ పోసుకుని డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశారు. విద్యార్థి పరిస్థితి విషమించడంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ప్రేమ విఫలం కావడమే విద్యార్థి ఆత్మహత్యకు కారణమని పోలీసులు చెప్పారు.

10:16 - December 31, 2015

హైదరాబాద్ : అవును వారు రాజీ కొచ్చారు. స‌రిహ‌ద్దుల పంచాయితీలో రోడ్డెక్కి త‌న్నుకున్న నేత‌లు.. పీసీసీ జోక్యంతో రాజీ ప‌డ్డారు. గ్రేట‌ర్ పరిధిని హైద్రాబాద్‌కు పరిమితంచేసి.. మిగతాదంతా.. రంగారెడ్డి డీసీసీకి బాధ్యతలు క‌ట్టబెట్టడంతో.. ఇన్నాళ్ళూ నానుతూ వ‌స్తున్న వివాదానికి ఎట్టకేల‌కు తెర‌ప‌డింది.

దానం నాగేంద‌ర్‌తో విభేదించిన రంగారెడ్డి జిల్లా నేత‌లు....

తెలంగాణ ఏర్పాటు త‌రువాత గ్రేట‌ర్ కాంగ్రెస్‌లో ర‌గిలిన వివాదం నెల‌ల త‌ర‌బ‌డి డైలీ సీరియ‌ల్‌లా కొన‌సాగుతూ వ‌చ్చింది. గ్రేట‌ర్ కాంగ్రెస్ క‌మిటీ అధ్యక్షుడుగా ఉన్న దానం నాగేంద‌ర్‌తో విభేదించిన రంగారెడ్డి జిల్లా నేత‌లు .. దానం పెత్తనం త‌మ‌పై ఏంట‌ని వాయిస్ పెంచుతూ వ‌చ్చారు. ఇదే అంశంలో ఢిల్లీ పెద్దల‌కు పోటా పోటీగా ఫిర్యాదులు కూడా చేశారు.

దిగ్విజ‌య్ సింగ్ స‌మ‌క్షంలో....

అయితే ఈ వివాదంపై కొద్ది రోజుల క్రితం దిగ్విజ‌య్ సింగ్ స‌మ‌క్షంలో ఇరు జిల్లాల నేత‌లు కూర్చొని మాట్లాడి.. గ్రేట‌ర్‌లో ఎవ‌రి ప‌రిధి ఏంట‌ని నిర్దేశించుకున్నారు. కానీ దానం నాగేంద‌ర్ దాన్ని ప‌ట్టించుకోలేదు. సోమవారం పార్టీ ఆవిర్భావం రోజు ఉప్పల్‌లో పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న దానం నాగేందర్‌ వర్గంపై.. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ శ్రేణులు దాడికి దిగాయి. దీంతో ఇరు వర్గాలూ కర్రలతో బాహాబాహీకి దిగాయి.

ఆందోళ‌న చెందిన పీసీసీ....

గ్రేట‌ర్ ఎన్నిక‌ల వేళ పార్టీలో ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటుచేసుకోవ‌డంపై ఆందోళ‌న చెందిన పీసీసీ .. వెంట‌నే న‌ష్టనివార‌ణ చ‌ర్యల‌కు దిగింది. పీసీసీ చీఫ్ ఉత్తం కుమార్‌రెడ్డి ఇరువ‌ర్గాల నేత‌ల‌తో త‌న నివాసంలో చ‌ర్చలు జ‌రిపారు. అనేక త‌ర్జన భర్జన‌ల‌ త‌రువాత వివాదం కొలిక్కి వ‌చ్చింది. హైద్రాబాద్ ప‌రిధిలో ఉండే 84 డివిజ‌న్ల వ‌ర‌కే దానంకు అధికారాలు ఉంటాయ‌ని .. రంగారెడ్డి ప‌రిధిలో మెద‌క్‌తో క‌లుపుకొని 66 డివిజ‌న్లలో రంగారెడ్డి మెద‌క్ డీసీసీలు ప‌ర్యవేక్షించేట్టుగా పీసీసీ చీఫ్ ఉత్తం రాజీ కుదిర్చారు.

రంగారెడ్డి, గ్రేట‌ర్ మ‌ధ్య వివాదానికి తెర‌...

మొత్తానికి ఉప్పల్‌లో దానంపై దాడితో తేరుకున్న కాంగ్రెస్ .. రంగారెడ్డి, గ్రేట‌ర్ మ‌ధ్య వివాదానికి తెర‌దించింది. అంతేకాదు..ఇక పార్టీని యాక్టివ్‌ చేసేప‌నిలో ప‌డ్డారు పీసీసీ చీఫ్ ఉత్తం. జ‌న‌వ‌రి ఒక‌టి క‌ల్లా డివిజ‌న్ల క‌మిటీలు ఏర్పాటు చేయాల‌ని డీసీసీల‌కు ఆదేశాలు ఇచ్చారు. స్థానిక నేత‌ల అభిప్రాయాల మేర‌కే టికెట్ల కేటాయింపులు ఉండేలా చ‌ర్యలు తీసుకుంటున్నామ‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

10:12 - December 31, 2015

హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలో ప్రాణహిత చేవెళ్ల 22వ ప్యాకేజీ పనులను ప్రభుత్వం అడ్డుకుంటోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రాజెక్టు 19, 20,21 ప్యాకేజీ పనులు పూర్తి కావస్తున్నా 22 ప్యాకేజీ పనులను ప్రభుత్వం చేపట్టాల్సి ఉంది. కాని ప్రభుత్వం కుట్రపూరితంగానే కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గ రైతులకు నీళ్లు ఇవ్వకుండా చేస్తోందని అఖిలపక్షాలు మండిపడుతున్నాయి. 22 వ ప్యాకేజీ పనులు పూర్తయితే కామారెడ్డి లోని 17 వేల ఎకరాలకు మాచారెడ్డి మండలానికి 22 వేల ఎకరాలకు దోమకొండలోని 22వేల ఎకరాలకు నీరు అందనుంది.

రామాయంపేట్ మండలంలోని 16 వేల ఎకరాలకు నీరు....

వీటితో పాటు రామాయంపేట్ మండలంలోని 16 వేల ఎకరాలకు నీరు అందనుంది. ఇప్పటికే ఉన్న అరకొర బోరు బావుల ద్వారానే పంటలు పండిస్తున్న రైతన్నలకు 22 వ ప్యాకేజీ ఆపద్బంధువుడి లాంటిది. ప్రాణహిత నుండి కాలువల ద్వారా నీరు అందుతుందని ఆశించిన రైతన్నలకు నిరాశే ఎదురైంది. దీంతో పాటు కాలువల తవ్వకాలకు భూములు సేకరించింది ప్రభుత్వం. అప్పటి రాజశేఖర్ రెడ్డి అపరభగీరథ ప్రయత్నంలా చేపట్టిన ప్రాజెక్టు డిజైన్ లోనే మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నది రైతలు వాదన. భూగర్భ జలాలు ఇంకిపోతున్న నేటి తరుణంలో ప్రాజెక్టు 22వ ప్యాకేజీ ను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ప్రాణహిత చేవెళ్లను పూర్తి చేసి....

ప్రాణహిత చేవెళ్లను పూర్తి చేసి 1.56 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చే పథకం విషయం లో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శస్తోందని అఖిలపక్ష నేతలు విమర్శిస్తున్నారు. దీనికి నిరసనగా అఖిలపక్ష నేతలు పాతయాత్ర చేపట్టారు. 22వ ప్యాకేజీ అమలు చేయపోతే ఇంకో 20 ఏళ్లకు రైతులకు నీరు అందే పరిస్థితి లేదు. కేవలం 20 కిలోమీటర్లు దూరం నుండి నీరు వచ్చే పథకాన్ని రద్దు చేసి కాళేశ్వరం నుండి మిడ్ మానేరు సిద్దిపేట వరకు 210 కిలో మీటర్ల మేర ఉన్న కామారెడ్డికి నీరు అందిస్తామని చెప్పడం రైతులను మోసం చేయడమేనని నేతలు ఆరోపిస్తున్నారు.

22 వ ప్యాకేజీనిఅమలు చేసి...

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 22 వ ప్యాకేజీనిఅమలు చేసి నిజామాబాద్ రైతన్నలను ఆదుకోవాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. కుట్రపూరితంగా ప్యాకేజీని రద్దు చేయడమే కాకుండా కొత్తగా నయా కాలువలంటూ రైతులను మోసం చేయొద్దని హెచ్చరిస్తున్నారు అఖిలపక్ష నేతలు. 

10:09 - December 31, 2015

హైదరాబాద్ : స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని సామాజిక ఉద్యమంగా అమలు చేయాలని తెలంగాణ సర్కార్‌ నిర్ణయించింది. ఈ విషయంలో అన్ని వర్గాల సహకారం తీసుకోవాలని ప్రతిపాదించింది. హైదరాబాద్‌ను విశ్వనగరిగా తీర్చిదిద్దేక్రమంలో ఘన, ద్రవ వ్యర్ధాల నిర్వహణ, నిరంతర విద్యుత్‌, మంచినీటి సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జంటనగరాల్లోని మూడున్నర లక్షల వీధి దీపాలను ఎల్‌ఈడీ లైట్లుగా మార్చాలని నిర్ణయించింది.

హోటళ్లు, ఫంక్షన్‌ హాళ్ల యజమానులతో జీహెచ్‌ఎంసీ సమావేశం....

స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా జంటనగారాల్లోని హోటళ్లు, ఫంక్షన్‌ హాళ్లు, కేటరింగ్‌ సంస్థల యజమానులతో జీహెచ్‌ఎంసీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పంచాయతీరాజ్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌, ఎక్సైజ్‌ శాఖ మంత్రి పద్మారావు, నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్లాస్టిక్‌ వ్యర్ధాలతో మూసుకుపోతున్న నాలాలు .....

ఘన వ్యర్ధాల నిర్వహణలో ఆయా సంస్థల సహకారం కోరారు. ద్రవ, ఘన వ్యర్ధాల రవాణలో జాగ్రత్తలు తీసుకోపోవడం వలన ఉత్పన్నమవుతున్న సమస్యలను మంత్రులు ప్రస్తావించారు. ప్లాస్టిక్‌ వ్యర్ధాలతో నాలాలు మూసుకుపోతున్న విషయాన్ని ప్రస్తావించారు. నివాస ప్రాంతాల నుంచి ఘన, ద్రవ వ్యర్ధాల సేకరణకు ప్రతి ఇంటికి రెండు బుట్టులు ఇస్తున్నట్టు చెప్పారు. సేకరించిన వ్యర్ధాల రవాణ కోసం 2 వేల ఆటో ట్రాలీలను పంపిణీ చేస్తున్న విషయాన్ని మంత్రి కేటీఆర్‌ గుర్తు చేశారు.

ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా....

స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని వాణిజ్య పన్నుల శాఖ మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌ కోరారు. మంచినీరు, విద్యుత్‌ సరఫరాలో ఎదురవుతున్న సమస్యలు గురించి హోటళ్లు, ఫంక్షణ్ హాళ్ల యజమానులు మంత్రుల దృష్టికి తీసుకురాగా...వాటిని పరిష్కరిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. 

10:04 - December 31, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూంలంటూ పేదల చెవుల్లో టీఆర్ఎస్ పార్టీ మోతమోగించింది. కాని సిటీలో డబుల్ బెడ్ రూమ్‌లంటే ఎవరు వదులుకుంటారు. అంతే కాలనీల్లో ఎక్కడ దరఖాస్తులు ఇస్తున్నారంటే అక్కడ జనం క్యూ కడుతున్నారు. ఇళ్లు ప్రభుత్వమే నిర్మించి పేదలకు ఇస్తామనడంతో అసలు సమస్య మొదలైంది. ఇది ఇలా ఉంటే ఒకవైపు ప్రభుత్వం దళారులను ఆశ్రయించవద్దు అంటూనే దరఖాస్తులు ఎక్కడ ఇస్తారో క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో ఇళ్లులేని వారంతా దిక్కులు చూస్తున్నారు.

గ్రేటర్ పరిధిలో మొత్తం 1470 మురికివాడలు....

గ్రేటర్ పరిధిలో మొత్తం 1470 మురికివాడలు ఉన్నాయి. అందులో వేలాది కుటుంబాలు నివసిస్తున్నారు. వారిని సొంతింటివారిని చేయాలని కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మురికి వాడల్లో నివసిస్తున్న వారిని ఒప్పించడం కోసం స్రాకో అనే సంస్థ ద్వారా కౌన్సిలింగ్ నిర్వహించింది. కాని వారు నివసిస్తున్న స్థలంలోనే వారికి డబల్ బెడ్ రూంలు ఇవ్వాలని తేల్చిచెప్పారు. మొత్తంగా ఖాళీగా ఉన్న ఏరియాలు ఏవి, ఎంత స్థలంలో నిర్మిస్తే వారికి ఉపయోగకరం అన్నదానిపై పలుమార్లు తర్జనభర్జనలు చేశారు అధికారులు ఫైనల్ గా 12ప్రాంతాల్లో టెండర్లు పిలివాలని నిర్ణయించారు.

రెండు డజన్లకు పైగా శిలాఫలకాలు....

దాదాపుగా రెండు డజన్లకు పైగా శిలాఫలకాలు వేశారు మంత్రులు. ముషీరాబాద్ వంటి ప్రాంతాల్లో 7,8 కూడా శిలాఫలకాలు వేసారు నేతలు. పేదలకోసమే డబుల్ బెడ్ రూమ్ లు అంటున్న నేతలు మాటలు శిలాఫలకాలకే మితమవుతున్నాయి.   

హన్మకొండలో దారుణం..

వరంగల్: హన్మకొండ పద్మాక్షి కాలనీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడశిశువును గుర్తుతెలియని వ్యక్తులు చెత్తకుప్పలో వదిలివెళ్లారు. చెత్తలో సంచరిస్తున్న పందులు ఆ శిశువును పీక్కుతిన్నాయి. ఈ అమానవీయ ఘటన ప్రతిఒక్కరిని కలిచివేసింది.

కాసేపట్లో ఢిల్లీ బయలుదేరనున్న రాష్ట్రపతి...

హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ దక్షిణాది శీతాకాల విడిది నేటితో ముగిసింది. కాసేపట్లో(ఉదయం 11.20 గంటలకు) హకీంపేట విమానాశ్రయం ప్రణబ్ ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. దక్షిణాది విడిదిలో భాగంగా 14 రోజుల పర్యటన నిమిత్తం భారత ప్రథమ పౌరుడు హైదరాబాద్ నగరంలోని బొల్లారంలో గల రాష్ట్రపతి నిలయానికి విచ్చేసిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి కర్నాటక, తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో పర్యటించారు.

భవానీ దీక్షల విరమణలో స్వల్ప ఉద్రిక్తత

విజయవాడ : భవానీ దీక్షల విరమణలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అర్చకులు, గురు భవానీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భక్తుల నుంచి అర్చకులు భారీగా కానుకలు వసూళ్ల కార్యక్రమంచేపట్టడంతో గురుభవానీలు అడ్డుకున్నారు. దీంతో వారిరువురు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

గుంటూరు జీజీహెచ్ లో పాము కలకలం...

గుంటూరు : జీజీహెచ్‌లో మరోసారి పాము కలకలం సృష్టించింది. ఎముకల వార్డులో పామును గుర్తించిన ఆసుపత్రి సిబ్బంది... గదికి తాళం వేశారు. 

విశాఖ జిల్లాలో 850 కిలోల గంజాయి స్వాధీనం..

విశాఖ : గొలుగొండ మండలం చోద్యం జంక్షన్ లో 850 కిలోల గంజాయి ని పోలీసులు పట్టుకున్నారు. అంతేకాకుండా ఐదురుగురిని అరెస్ట్ చేసి, రెండు బైకులను సీజ్ చేశారు.

ఏ కొండూరు మండలం మాధవరంలో విషాదం

కృష్ణా : ఏ కొండూరు మండలం మాధవరంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ముగ్గురు బావిలో పడి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

అమృత్ సర్ లో ఘోర రోడ్డు ప్రమాదం : 9 మంది మృతి

పంజాబ్ : అమృత్ సర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోని ని మినీ బస్సు ఢీ కొట్టడంతో 9 మంది మృతి చెందగా 15 మందికి గాయలయ్యాయి.

డివైడర్ ను ఢీకొన్న కారు : 6గురికి గాయాలు..

నెల్లూరు : కావలి రూర్ మండలం మద్దూరుపాడు వద్ద జాతీర రహదారిపై డివైడర్ ను ఢీకొని కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని దగ్గరల్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ నుండి నెల్లూరు వస్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

08:42 - December 31, 2015

హైదరాబాద్ : ప్రజల విశ్వాసం పొందేలా నేతలు మాట్లాడాలని గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ కార్యక్రమంలో దహన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.కె.నాగేశ్వర్ సూచించారు. 2015కి ముగింపు పలికి 2016 కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ సందర్భంగా 2015 లో జరిగిన రాజకీయాలు, ప్రభుత్వ పరిపాలనలు ఏ విధంగా జరిగాయో అంతర్జాతీయ, జాతీయ,రాష్ట్ర పరిణామాలపై నాగేశ్వర్ విశ్లేషణ చేశారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత రెండు రాష్ట్రాల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు ఎంత వరకు నెరవేరాయి? రాజకీయ సెంటిమెంట్ల ఆధారంగా చేసుకుని ప్రభుత్వాలు నడవాలని చూస్తున్నాయా? అనుకున్న స్థాయిలో ప్రజలను ప్రతిపక్షాలు ఆకర్షించగలిగాయా? జాతీయ రాజకీయాల్లో అసహనం పై ఎందకు చర్చ జరిగింది? ఇలాంటి అంశాలపై నాగేశ్వర్ విశ్లేషణ చేశారు. పూర్తి విశ్లేషణ సారాంశాన్ని వినాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

'ఎర్ర' స్మగ్లర్లపై పోలీసుల కాల్పులు..

చిత్తూరు : తిరుపతి శివారు శేషాచలఅటవీ ప్రాంతంలో లక్ష్మీపురం చెరువు దగ్గర ఎర్రచందనం స్మగ్లర్ల కోసం పోలీసులు కూంబింగ్ జరిపారు. రూ. 12 లక్షల విలువచేసే ఎర్రచందనాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఓ స్మగ్లర్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా పోలీసులపై ఎర్రస్మగ్లర్లు దాడి చేశారు. దీంతో, పోలీసులు స్మగ్లర్లపై కాల్పులు జరిపారు. ఘటన స్థలానికి డీఐజీ కాంతారావు బయలుదేరి వెళ్లారు. పోలీసు కాల్పులతో స్మగ్లర్లు పారిపోయారు.

భద్రతా వలయంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్...

హైదరాబాద్:నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఉగ్రదాడులు జరగొచ్చని కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రయాణికులను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. 
అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఆర్జీఐఏ పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశామని అధికారులు పేర్కొన్నారు. డిపాచర్‌, అరైవల్‌, ఎయిర్‌పోర్టు విలేజ్‌, కారు పార్కింగ్‌ ప్రదేశాలలో డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేస్తున్నారు.

జమ్మూకాశ్మీర్ ల్వామాలో ఎన్ కౌంటర్: ఇద్దరి మృతి

హైదరాబాద్ : జమ్మూకాశ్మీర్ ల్వామాలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో లష్కర్ తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదుల హతమయ్యారు. హతమయిన ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరు విదేశీయుడు ఉన్నట్లు సమాచారం.

07:32 - December 31, 2015

హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాలక టీఆర్ఎస్‌ దూకుడు కొనసాగింది. పోటీ చేసిన ఆరు స్థానాలకు గాను.. నాలుగింట ఆపార్టీ అభ్యర్థులు గెలుపొందారు. మూడు స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌.. రెండు చోట్ల గెలిచి పరువు దక్కించుకుంది. కాంగ్రెస్‌కు.. ఈ ఫలితాలు ఓరుగల్లు ఓటమి భారాన్ని కొంతైనా తగ్గించాయనే చెప్పాలి. ఇక టీడీపీకి ఈ ఎన్నికల్లోనూ దారుణ పరాభవం తప్పలేదు. మొత్తానికి షెడ్యూలు ప్రకారం 12 స్థానాలకు ఎన్నికలు ప్రకటించగా.. టీఆర్ఎస్‌ మొత్తం పది స్థానాలను గెలుచుకుని దూకుడును ప్రదర్శించింది. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ లోపభూయిష్ట విధానాలు అవలంభించిందా? గ్రేటర్ పీఠం మాదే అని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అది ఎలా సాధ్యం? ఈ అంశంపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో టిఆర్ ఎస్ నేత నరేంద్ర గౌడ్, కాంగ్రెస్ నేత శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను చర్చించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం...

తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటలు, కాలిడనక భక్తులకు 3గంటలు, ప్రత్యేక ప్రవేశదర్శనానికి 2గంటల సమయం పడుతోంది.

07:12 - December 31, 2015

హైదరాబాద్ : గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్త సంవత్సరం మొదటి వారంలో వరంగల్‌ జిల్లాలో పర్యటించనున్నారు. జనవరి 3 నుంచి 6 వరకు నాలుగు రోజుల పర్యటనలో పలు అభివృద్ధి పథకాలను ప్రారంభిస్తారు. సంక్షేమ కార్యక్రమాల అమలుకు శ్రీకారం చుడతారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి... సీఎం పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్షించారు.

జనవరి 3 మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల ప్రారంభం

చేర్యాల మండలంలోని కొమురవెల్లి నుంచి కేసీఆర్‌ పర్యటన ప్రారంభమవుతుంది. జనవరి 3న మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తారు. ఆ రోజు హైదరాబాద్‌ తిరిగివెళ్లి... మరుసటి రోజు.. అంటే వచ్చే నెల 4న వరంగల్‌ జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతోపాటు.... గత ఏడాది ఇచ్చిన హామీల అమలను సమీక్షిస్తారు. జనవరి 5న భూపాలపల్లి అసెంబ్లీ నియోజవర్గ పరిధిలోని చెల్పూర్‌లో కేటీపీఎస్‌లో నిర్మించిన 600 మెగావాట్ల యూనిట్‌ను ప్రారంభించి, జాతికి అంకితం చేస్తారు. మ అదేరోజు మేడారం జాతర ఏర్పాట్లతోపాటు మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పనులను సమీక్షిస్తారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ చివరినాటికి జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌, పాలకుర్తి నియోజకవర్గాల్లోని ఆవాసాల నల్లా నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించిన నేపథ్యంలో ఈ పనుల పురోగతపై కూడా సీఎం సమీక్షిస్తారు.

వస్త్ర పరిశ్రమ స్థలంపై సమీక్ష .....

వరంగల్‌ జిల్లాలో భారీ వస్త్ర పరిశ్రమ ఏర్పాటకు కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ప్రతిపాదించిన స్థలాలపై అధికారులతో సమీక్షించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ రంగంలో భారీగా పెట్టుబడులు ఆకర్షించేందుకు వస్త్ర పరిశ్రమల విధానాన్ని కేసీఆర్‌ ప్రకటించొచ్చని భావిస్తున్నారు. యాదాద్రి-వరంగల్‌ మధ్య 163 వ నంబర్‌ జాతీయ రహదారి విస్తరణకు పనులకు శంకుస్థాపన చేస్తారు. గోదావరి నదిపై ఏటూరు నాగారం దగ్గర నిర్మించిన వంతెను కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో కలిసి ప్రారంభిస్తారు. దీంతో తెలంగాణ, చత్తీస్‌గఢ్‌ మధ్య దూరం తగ్గుతుంది. 

సెట్‌టాప్‌ బాక్సుల గడువు 2 నెలలు పొడిగింపు

హైదరాబాద్ : మూడోదశ టీవీ డిజిటలైజేషన్‌లో భాగంగా సెట్‌టాప్‌ బాక్సులు ఇంతవరకు అమర్చుకోనివారికి శుభవార్త. గడువును 2 నెలలు పొడిగిస్తూ ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు ఆదేశాలిచ్చింది. హైకోర్టు ఆదేశాలపై తెలంగాణ ఎమ్‌ఎస్‌వోల సంఘం అధ్యక్షుడు సుభాష్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోని నూటా పదిహేను పట్టణాలు, నగరాల్లో సెట్‌టాప్‌ బాక్సులు అమర్చుకోవడానికి గడువు డిసెంబర్‌ 31తో ముగియనుంది. లేకపోతే ప్రసారాలు నిలిపివేయాల్సి ఉంటుంది.

06:57 - December 31, 2015

హైదరాబాద్ : 2015 కి గుడ్‌బై చెబుతూ 2016 కి వెల్‌కమ్‌ పలకడానికి హైదరాబాద్‌ ముస్తాబవుతోంది. కొత్త సంవత్సర వేడుకలు సంతోషంగా జరుపుకునేందుకు కంట్రీక్లబ్‌ సిద్ధమైంది. న్యూ ఇయర్‌ వేడుకల్లో హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌ కంట్రీ క్లబ్‌లో సందడి చేయనున్నారు. అంతేగాకుండా ఈ కార్యక్రమంలో గాయనీ గాయకులు పాల్గొననున్నారు.ఇండియాతో పాటు దుబాయ్‌, అబుదాబి, మస్కట్‌, దోహా, బహ్రెయిన్‌లలో హాస్పిటాలిటీ సేవలు అందిస్తోన్న కంట్రీక్లబ్‌ ఈ సంవత్సరం సరికొత్త థీమ్‌తో వేడుకల నిర్వహణకు ముందుకొచ్చింది. పదో ఎడిషన్‌గా చేపట్టిన ఈ వేడుకలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నామని సీఎండీ రాజీవ్‌రెడ్డి చెప్పారు. 

06:55 - December 31, 2015

తిరుపతి : కొత్త సంవత్సరం మొదటి రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల కోసం టిటిడి విస్త్రత ఏర్పాట్లు చేస్తోంది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశిలకు ఏర్పాట్లు చేసిన తరహాలోనే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తిరుమల జేఈవో శ్రీనివాస్‌రాజు తెలిపారు. ఈ సారి కూడా సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

వైకుంఠ ఏకాదశి తరహాలో సామన్య భక్తులకే ప్రాధాన్యత......

న్యూ ఇయర్‌ మొదటి రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుమల జేఈఓ శ్రీనివారాజు తెలిపారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశిలకు ఏర్పాట్లు చేసిన తరహాలోనే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జనవరి 1న శుక్రవారం కావడంతో ఆ రోజున స్వామివారి దర్శనం ఆలస్యంగా ప్రారంభం అవుతుందని అందుకు భక్తులు సహకరించాలని కోరారు. అర్ధరాత్రి 12 గంటలకు శ్రీవారి ఆలయాన్ని తెరిచి తిరుప్పావై, అర్చన, తోమాల, అభిషేకం సేవలు ఏకాంతంగా నిర్వహించిన తర్వాత ఉదయం 5 గంటలకు వీవీఐపీ దర్శనానికి అనుమతిస్తామన్నారు. ఆ తర్వాత ఉదయం 7 గంటల నుంచి సామాన్య భక్తుల దర్శనాన్ని మొదలుపెట్టి ఆలయం మూసేవరకూ నిర్విరామంగా సర్వదర్శనం కొనసాగిస్తామని జేఈవో తెలిపారు.

ఉదయం 5 గంటలనుంచి వీఐపీలకు దర్శనం.....

ప్రోటోకాల్ పరిధిలోని వీవీఐపీలు వసతి, దర్శనం సులభంగా పొందడానికి శ్రీపద్మావతి నిలయంలో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. క్యూలైన్లలో వేచిఉండే సామాన్య భక్తులు ఇబ్బంది పడకుండా తాత్కాకాలిక టాయిలెట్లు, ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సామాన్య భక్తులు అర్థరాత్రి 12 గంటలకే స్వామివారిని దర్శించుకోవాలన్న ఆత్రుతతో గంటలకొద్ది క్యూలైన్లలో నిలపడి ఇబ్బందులు పడొద్దని జేఈవో సూచిస్తున్నారు. శుక్రవారం ఉదయం 7గంటల తర్వాతే సామాన్య భక్తులకు దర్శనం అవకాశం కల్పిస్తామన్నారు. శుక్రవారం కావడంతో స్వామివారికి నిర్వహించాల్సిన విశేష సేవలన్నింటిని తూచా తప్పకుండా నిర్వహిస్తామని..అందులో ఏ ఒక్కటి వదిలిపెట్టే ప్రసక్తేలేదని జేఈవో స్పష్టం చేశారు. కాబట్టి భక్తులకు టిటిడికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.  

న్యూ ఇయర్‌కు తిరుమలలో విస్త్రుత ఏర్పాట్లు

తిరుపతి : కొత్త సంవత్సరం మొదటి రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల కోసం టిటిడి విస్త్రత ఏర్పాట్లు చేస్తోంది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశిలకు ఏర్పాట్లు చేసిన తరహాలోనే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తిరుమల జేఈవో శ్రీనివాస్‌రాజు తెలిపారు. ఈ సారి కూడా సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 

06:53 - December 31, 2015

హైదరాబాద్ : మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వేడుకలు ఆరంభం కానున్నాయి..ఇప్పటికే కొన్ని చోట్ల ఆ హడావుడి కొనసాగుతుండగా మరికొందరు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు... అయితే ఈ సారి మాత్రం ప్రతీ ఈవెంట్‌ పోలీసుల కనుసన్నల్లో జరగాల్సిందే.. ప్రతీ కదలిక వీడియోలో బందించాల్సిందే..ఇది పోలీసుల హుకూం... మత్తులో యూత్‌ను చిత్తు చేసేందుకు మాఫియా ఏర్పాట్లు చేసిందన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు... కదలికలపై డేగకన్ను వేశారు...

మత్తులో కొత్త ఏడాది వేడుకలు...

డ్రగ్‌ మాఫియా హైదరాబాద్‌లో వందల కోట్ల వ్యాపారం చేయాలని ప్లాన్ చేసిందా..? పోలీసులు అనుమానిస్తున్నట్లు ఇప్పటికే నగరంలోకి మత్తు పదార్థాలు దిగుమతి అయ్యాయా..? నగర యువతను మత్తులో ముంచేసేందుకు ప్లాన్ చేసుకున్నారా..? ఎన్నో అనుమానాల నేపథ్యంలో పోలీసులు భారీగా కట్టడి చేసేందుకు డేగకన్ను వేశారంటే నగరంలో ఏదో జరుగుతోందా..? భారీ మొత్తంలో డ్రగ్స్‌ను యువతకు అందుబాటులోకి తీసుకువెళ్లాలని మాఫియాలు చీకటి కార్యకలాపాలకు తెరలేపిందని అనుమానిస్తున్నారు... మద్యం మత్తులో దూసుకుపోయే యువతకు బ్రేకులు వేయడంతో పాటు డ్రగ్‌ మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ప్రత్యేక వ్యూహాలు చేశారు...గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి హైదరాబాద్‌ న్యూఇయర్‌ ఉత్పవాలు పోలీసుల నిఘా నీడలో జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

నిఘా నీడలో న్యూ ఇయర్ వేడుకలు...

ఈసారి న్యూఇయర్‌ వేడుకలు పూర్తిగా పోలీసుల కనుసన్నలలో జరగనున్నాయి. హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో ఉత్సవాలు నిర్వహించే ఈవెంట్‌ మేనేజర్లతో ఇప్పటికే పోలీసులు సమావేశమయ్యారు....పబ్‌లు, హోటళ్లు, ఫంక్షన్‌ హాళ్లు, ఫామ్‌ హౌస్‌లు..... ఇలా ఎక్కడ ఉత్సవాలు చేసుకున్నా ప్రతి కదలికను వీడియో చిత్రీకరణ చేయాలని ఆదేశించారు...పెద్ద సంఖ్యలో సిసి కెమెరాలు ఏర్పాటుచేసి మొత్తం కార్యక్రమాన్ని సిడిలలో ఎక్కించాలని స్పష్టం చేశారు.... ముందుగా ఆహ్వానించిన వారికి మాత్రమే పార్టీల్లో అనుమతి ఇవ్వాలని సూచించారు....ఈవెంట్లకు సంబంధించిన వాల్‌పోస్టర్లలో ఏమాత్రం అశ్లీలత ఉండకూడదని హెచ్చరించారు....అన్ని కార్యక్రమాలు రాత్రి ఒంటి గంటకు పూర్తి కావాలని, మద్యం సరఫరా చేస్తే అందుకు తగిన లైసెన్స్‌లు ఉండాలని ఆదేశించారు...

నేడు రాత్రి అన్ని ఫ్లైఓవర్లు బంద్...

యువత శృతిమించకుండా ఉత్సవాలు నిర్వహించుకోవడానికి ఒక పక్క కట్టడి చేస్తూనే మరోపక్క అనుమానితుల కదలికలపై నిఘా వేశారు....ఇప్పటికే నగరంలోడ్రగ్‌ పెడలర్స్‌ పట్టుపడ్డారు...గోవా, ముంబై, దుబాయ్‌ ప్రాంతాల నుంచి డ్రగ్స్‌ భారీగానే నగరానికి చేరుకుంటున్నాయని తెలుస్తోంది....బయట నుంచి తెప్పించేందుకు కష్టంగా మారడంతో కొందరు స్థానిక ఎపిడ్రయిన్‌, కెటామైన్‌ వంటి మత్తు కలిగించే ఔషదాలపై దృష్టి పెట్టారు...వాటికి రసాయనిక చర్య చేసి కొకైన్‌తో సమానమైన మత్తు కలిగించే హానీకర డ్రగ్‌గా మారుస్తున్నారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలికే ఉత్సవాల్లో మత్తులో మునిగి తేలే యువతకు వీటిని అందుబాటులో తీసుకురావడానికి నెట్‌వర్క్‌ పటిష్టం చేసుకుంటున్నారు. దీనితో ఈసారి న్యూఇయర్‌ వేడుకల్లో డ్రగ్స్‌ కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటిని నివారించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పడ్డాయి. ప్రజలకు రక్షణ ఇవ్వడానికి, అర్థరాత్రి ప్రమాదాలు నివారించేందుకు పోలీసులు పెద్ద సంఖ్యలో రోడ్లపైనే బందోబస్తు చేసేందుకు రంగం సిద్దమైంది. 

ఏపీలో నూతన ఇసుక విధానం ఆమోదం

విజయవాడ : ఫిబ్రవరి నుంచి నూతన ఇసుక విధానాన్ని అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ఏడాదీ ఇసుక రీచ్‌లకు వేలం వేయాలని నిర్ణయం తీసుకుంది. అంగన్‌వాడీల వేతనాల పెంపునకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. 

టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్ : ఎప్పటి నుంచో వేచి చూస్తున్న సమయం రానే వచ్చింది. తెలంగాణ నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తీపి కబురు అందించింది. నూతన సంవత్సరం కానుకగా గ్రూప్‌-2 నోటిఫికేషన్ విడుదల చేసింది. పరీక్షల తేదీలను కూడా ప్రకటించింది. మరోపక్క మెట్రో వాటర్‌ వర్క్స్‌ లోనూ పలు రకాల పోస్టుల భర్తీకి టీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. టీపీఎస్సీ నోటిఫికషన్లపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

06:48 - December 31, 2015

హైదరాబాద్ : శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ప్రతి ఏటా హైదరాబాద్‌ రావడం ఆనవాయితీ. చాలా మంది రాష్ట్రపతుల మాదిరిగానే ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కూడా దీనిని కొనసాగించారు. ఈ నెల 18 నుంచి 31 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేశారు. శీతాకాల విడిదిలో భాగంగా దక్షిణాదిలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొన్నారు.

ఈనెల 19 ఎంసీఈఎంఈ స్నాతకోత్సవానికి హాజరు ....

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఈనెల 18న హైదరాబాద్‌ వచ్చారు. హకీంపేటలో ఉన్న వాయుసేన విమానాశ్రయంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. గవర్నర్‌ నరసింహన్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రభుత్వ ఉన్నతాధికారులు రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. ఆ మరుసటి రోజు..అంటే ఈనెల 19న ఆయన సికింద్రాబాద్‌లోని మిలటరీ కాలేజ్‌ ఆఫ్‌ ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో జరిగిన స్నాతకోత్సవానికి హాజరయ్యారు. దేశ రక్షణలో సైనికులు పోషిస్తున్న పాత్ర, యుద్ధతంత్రంలో టెక్నాలజీ ఆవశ్యత గురించి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు.

ఈనెల 22, 23 తేదీల్లో గుల్బర్గ, బెంగళూరుల్లో పర్యటన .......

ఆతర్వాత రెండు రోజుల పాటు ప్రణబ్‌ ముఖర్జీ కర్నాటకలో పర్యటించారు. ఈనెల 22, 23 తేదీల్లో గుల్బర్గ, బెంగళూరుల్లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డిసెంబర్‌ 22న గుల్బర్గలోని కర్నాటక కేంద్ర విశ్వవిద్యాలయం 2వ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. విద్యావ్యవస్థలో ప్రమాణాల ఆవశ్యకత గురించి ఆయన ప్రసంగించారు. 23న బెంగళూరులోని కిద్వాయ్‌ మెమోరియల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంకాజీలో స్టేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కేన్సర్‌ నిర్మాణానికి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ శంకుస్థాపన చేశారు. అలాగే బిషప్‌ కాటన్‌ బాయిస్‌ స్కూల్‌ 150వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. అదే రోజు నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ న్యూరో సైన్సెస్‌ కొత్త భవనాలను ప్రారంభించి, సికింద్రాబాద్‌ చేరుకున్నారు.

ఈనెల 27 ఇండియన్‌ ఎకనమిక్‌ అసోసియేషన్‌ సదస్సు .........

ఈనెల 25న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఐ భీమవరంలోని టీటీడీ వేద పాఠశాలను ప్రారంభించారు. అదే రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకుని సికింద్రాబాద్‌కు తిరిగి వచ్చారు. ఈనెల 27న హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో ఉన్న ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన ఇండియన్‌ ఎకనమిక్‌ అసోసియేషన్‌ వార్షిక సదస్సులో పాల్గొన్నారు. భారత ఆర్ధిక వ్యవస్థ తీరుతెన్నులపై ప్రసంగించారు. ఆదే రోజు ఆయన మెదక్‌ జిల్లాలో ఎర్రవల్లిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించిన అయుత చండీయాగానికి హాజరు కవాల్సి ఉన్నా..అనివార్య కారణాల వల్ల వెళ్లలేకపోయారు. గవర్నర్‌ నరసింహన్‌ మంగళవారం రాత్రి రాజ్‌ భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్‌ గౌరవార్ధం విందు ఇచ్చారు. బుధవారం జంటనగరాలకు చెందిన ప్రముఖులకు రాష్ట్రపతి ప్రణబ్‌ తేనీటి విందు ఇచ్చారు. ఈ విందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా, మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

కాల్‌ మనీ, కల్తీ మద్యం, విశాఖ బాక్సైట్‌ జీవో 97 పై ఫిర్యాదు .....

ప్రణబ్‌ హైదరాబాద్‌లో ఉన్న సమయంలో ప్రతిపక్ష నేత జగన్‌ సహా వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు ఆయన్ను కలిశారు. వైసీసీ అధినేత జగన్‌ కాల్‌ మనీతోపాటు..విజయవాడ కల్తీ మద్యం, విశాఖ మన్యంలో బాక్సైట్‌ నిక్షేపాల తవ్వకానికి అనుమతిస్తూ సీఎం చంద్రబాబు సర్కార్‌ జారీ చేసిన 97 వ జీవో..వంటి అంశాలను రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. అలాగే తెలంగాణ పీసీసీ నేతలు... కేసీఆర్‌ ప్రభుత్వ విధానాలపై ఫిర్యాదు చేశారు.

ఏడాది జూన్‌ 29 నుంచి జులై 8 వరకు బొల్లారంలో బస ......

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఈ ఏడాది బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విడిది చేయడం ఇది రెండోసారి. జూన్‌ 29 నుంచి జులై 8 వరకు ఇక్కడే ఉన్నారు. దక్షిణాదిలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గతేడాది డిసెంబర్‌లో శీతాకాల విడిది కోసం ఆయన హైదరాబాద్‌ రావాల్సి ఉంది. అయితే అప్పట్లో ఢిల్లీలోని మిలటరీ ఆస్పత్రిలో హుద్రోగ శస్త్రచికిత్స చేయించుకోవడంతో దక్షిణాది విడిదికి రాలేకపోయారు. దీంతో జూన్‌, జులైలో పది రోజుటు పాటు ఇక్కడకు వచ్చి బొల్లారంలో బస చేశారు. 

నేటితో ముగియనున్న రాష్ట్రపతి శీతాకాల విడిది

హైదరాబాద్ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిది ఇవాళ్టితో పూర్తవుతుంది. నేటి ఉదయం ఆయన హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళతారు. విమానాశ్రయంలో రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు రాష్ట్రప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.  

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ దూకుడు

హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాలక టీఆర్ఎస్‌ దూకుడు కొనసాగింది. పోటీ చేసిన ఆరు స్థానాలకు గాను.. నాలుగింట ఆపార్టీ అభ్యర్థులు గెలుపొందారు. మూడు స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌.. రెండు చోట్ల గెలిచి పరువు దక్కించుకుంది. కాంగ్రెస్‌కు.. ఈ ఫలితాలు ఓరుగల్లు ఓటమి భారాన్ని కొంతైనా తగ్గించాయనే చెప్పాలి. ఇక టీడీపీకి ఈ ఎన్నికల్లోనూ దారుణ పరాభవం తప్పలేదు. మొత్తానికి షెడ్యూలు ప్రకారం 12 స్థానాలకు ఎన్నికలు ప్రకటించగా.. టీఆర్ఎస్‌ మొత్తం పది స్థానాలను గెలుచుకుని దూకుడును ప్రదర్శించింది. 

06:42 - December 31, 2015

విజయవాడ : చనిపోయిన ఆత్మీయులకు కన్నీళ్లతో కడపటి వీడ్కోలు పలికే స్థలమే స్మశానం. కొన్నేళ్ల పాటు తమతో కలిసి జీవించిన వ్యక్తి చనిపోయారన్న దుర్వార్త విన్న మరుక్షణమే గుండెలు కకాలవికాలమవుతాయి. అంతులేని బాధతో మన హృదయభారం భారమవుతాయి. మన కళ్ల వెంట కన్నీళ్లొస్తాయి. చనిపోయిన ఆత్మీయ నేస్తానికి తుది వీడ్కోలు పలికేందుకు ఎక్కడెక్కడి నుంచో బంధువులు, స్నేహితులు, సన్నిహితులు తరలివస్తారు. చనిపోయిన వ్యక్తికి ఏ లోటూ లేకుండా అంత్యక్రియలు జరిపించాలని బంధువులంతా తాపత్రయపడతారు. కానీ, మృతదేహాన్ని దహనం చేసేందుకో, ఖననం చేసేందుకు ఆరడుగుల స్థలం కూడా లేకపోతే... అంతకు మించిన దైన్యం మరొకటి వుండదు. కానీ, మన దేశంలోనూ, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో అలాంటి దురావస్థ తప్పడం లేదు. అంత్యక్రియలు నిర్వహించేందుకు అవసరమైన స్మశానాలు లేక కొందరు, వాటికి వెళ్లే దారి లేక మరికొందరు అవస్థ పడుతున్నవారెందరో. చాలా ప్రాంతాల్లో స్మశానాలున్నా అక్కడ అంత్యక్రియలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లుండవు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత కపాలమోక్షం జరిగిన తర్వాత అక్కడ స్నానమాచరించి, ఇంటికి వెళ్లడం చాలా కుటుంబాల్లో సంప్రదాయం. స్నానం కాదు కదా కనీసం కాళ్లు కడుక్కోవడానికైనా నీళ్లు దొరకని దుస్థితి. అంత్యక్రియలకు హాజరైన బంధువులు, స్నేహితులు ఆ కార్యక్రమం ముగిసేంతవరకు కూర్చునేందుకు షెడ్డులు కూడా లేని స్మశాన వాటికలెన్నో. ఇక మనదేశంలో దళితుల పరిస్థితి మరీ ఘోరం. కొన్ని వేల గ్రామాల్లో ఇప్పటికీ దళితులకు అసలు స్మశానాలే లేవు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 450, చిత్తూరు జిల్లాలో 550కిపైగా దళిత కాలనీలకు స్మశానవాటికలు లేవు. స్మశానాలున్న చోట దారులేవు. చనిపోయిన మనిషిని నలుగురు, నాలుగు భుజాల మీద తీసుకెళ్లి, అంతిమ వీడ్కోలు పలుకుతారు. అది మన సంప్రదాయం. కానీ, కొన్ని చోట్ల నలుగురు మోసుకేళ్లేందుకు అవసరమైన దారిలేక ఇద్దరే పాడె మోయాల్సిన దుస్థితి. ఎక్కడ జాగా కనిపడితే అక్కడ గద్దల్లా వాలిపోయే కబ్జాకోరులు చివరకు స్మశానాలను కూడా వదలని దౌర్భాగం మన తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది. ఇలాంటి సమస్యలు పరిష్కరించాలంటూ గతంలో దళితులు ఆందోళనలు చేయడంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 1235 జీవోను జారీ చేశారు. దళితులకు స్మశాన వాటికలు నిర్మించాలనీ, ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు లేకపోతే ప్రయివేట్ స్థలాలు కొనైనా వాటిని నిర్మించాలంటూ ఆ జీవో పేర్కొన్నారు. స్మశానాలు ఆక్రమణలకు గురికాకుండా వాటి చుట్టూ ప్రహరిగోడ నిర్మించాలనీ , దహన సంస్కారాలకు వీలుగా షెడ్డులు నిర్మించి, బోర్ లు ఏర్పాటు చేయాలన్నది ఆ జీవోలోని మరో ముఖ్యమైన పాయింట్. కానీ, ఆ జీవో సక్రమంగా అమలు కావడం లేదు. ఇప్పటికైనా ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు స్మశానాల సమస్య మీద ద్రుష్టి సారించాలి. తమ ఆత్మీయులకు సగౌరవంగా అంతిమ వీడ్కోలు పలికి, సక్రమంగా అంత్యక్రియలు నిర్వహించలేకపోయామన్న బాధ ఏ ఒక్క కుటుంబానికీ కలగనీయకూడదు. 

06:41 - December 31, 2015

విజయవాడ : స్మశానం పుట్టిన ప్రతి ఒక్కరూ అంతిమంగా చేరకునేది ఇక్కడికే. చనిపోయిన మన ఆత్మీయులకు కన్నీటి వీడ్కోలు పలికే స్థలం ఇదే. కానీ, మన తెలుగు రాష్ట్రాల్లో స్మశానాలు లేక, అవి వున్న చోట షెడ్డులు, నీళ్లు, సరియైన దారులు లేక కొన్ని వందల గ్రామాల్లో ఇబ్బంది పడుతున్నారు. దళితుల పరిస్థితి మరింత ఘోరంగా వుంది. స్శశానాలు లేక దళితులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఆంధ్రప్రదేశ్ కేవీపీఎస్ నేత మాల్యాద్రిగారు విజయవాడ స్టూడియో నుండి పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను తెలిపారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

Don't Miss