Activities calendar

05 January 2016

21:31 - January 5, 2016

హైదరాబాద్ : కాల్ మనీ వడ్డీ అరాచకాలు ఒకవైపు గగ్గోలెత్తిస్తుంటే ...చడీ చప్పుడు లేకుండా అంతేభారీగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలూ కాతాదారులకు గుండు సున్నా పెట్టేస్తున్నాయి. వడ్డీల మోత మోగిస్తూ నిలువు దోపిడీ సాగిస్తున్నాయి. వందలాది శాఖలతో వేల కోట్ల రూపాయల వ్యాపారం చేసే శ్రీరాం సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్ వంటి సంస్థలూ తెలివిగా కస్టమర్లకు టోపీ పెడుతున్నాయి. చెప్పే వడ్డీ మొత్తం ఏడాదికి 16 శాతంలోపే. కానీ వసూలు చేసే మొత్తం 27 శాతం దాటి పోతోంది. ఇదే లెక్కల మతలబు ... అసలు విషయం అంతుచిక్కని గరీబు ఎంత కట్టినా అప్పు తీరక వేసారి పోతున్నాడు.

శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ....

సింపుల్ ఇంటరెస్టు, ప్లాట్ రేట్, డిమినిషింగు ఇంటరెస్టు రేటు.. కాంపౌండ్ రేట్ పేరు ఏదైనా సాగుతున్నది మాత్రం నిలువు దోపిడీ. సామాన్యునికి అర్థం కాని పదాలు..సాంకేతిక గణాంకాలు అర్థశాస్త్రంలో అవసరానికి మించే ఉన్నాయి. అయితే ఎంత అప్పు తీసుకున్నాను? ఎంత వడ్డీ కట్టాలి? ఇవి మాత్రమే సామాన్యుడు తెలుసుకోవాలనుకునే అంశాలు. సగటు రుణగ్రహీత బలహీనతను ఆసరాగా చేసుకుంటూ వందల కోట్ల రూపాయలు అడ్డగోలుగా దండుకుంటున్నాయి కొన్ని ఆర్థిక సంస్థలు. శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ కూడా ఇటువంటి లావాదేవీలకు పాల్పడుతోందని తాజాగా వెలుగు చూసిన ఒక ఉదంతం బట్టబయలు చేస్తోంది.

ఒక ఈఎంఐ చెల్లించని కారణంగా భారీ మొత్తంలో జరిమానా........

శ్రీకాకుళానికి ఛెందిన సుధాకర్ అనే ఈ వ్యక్తి శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్ లో 12 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. మూడు సంవత్సరాల వ్యవధిలో తిరిగి చెల్లించేందుకు సమాన వాయిదాల్లో నెలవారీ 49 వేల 233 రూపాయల చొప్పున చెల్లించేందుకు కంపెనీకి, ఇతనికి మధ్య అంగీకారం కుదిరింది. మధ్యలో ఒకవాయిదా చెల్లించలేకపోయాడు. ఇందుకు భారీ మొత్తం జరిమానాగా విధించడంతో ఒక చార్టర్డ్ అకౌంటెంట్ను ఇతను ఆశ్రయించాడు. దాంతో తనకిచ్చిన రుణం పైన అధిక మొత్తం వడ్డీ వసూలు చేస్తున్నారనే విషయం వెల్లడైంది. ఇతను చెబుతున్న ప్రకారం కంపెనీ 15.88 శాతం వడ్డీకి గాను తనకు రుణం మంజూరు చేసింది. కానీ చార్టర్డ్ అకౌంటెంట్ ద్వారా లెక్కలు తీస్తే వడ్డీ మొత్తం 27.33 శాతం పైగానే పడుతోంది. అంటే నూటికి రూపాయి పావలా మేరకు ఉండాల్సిన వడ్డీ రెండు రూపాయలకు పైగానే వసూలు చేస్తున్నారన్నమాట.

జాతీయ, రాష్ట్ర స్థాయి దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు........

బయట ప్రయివేటు వడ్డీ వ్యాపారుల కంటే ఒక అధీకృతమైన సంస్థ అధిక వడ్డీ వసూలు చేయడంపై ఈయన జాతీయంగానూ, రాష్ట్రస్థాయిలోనూ కూడా పలు దర్యాప్తు సంస్థలను ఆశ్రయించారు. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంటు, రెవిన్యూ ఇంటిలిజెన్సు, ఇన్ కం టాక్సు డిపార్టు మెంటు లకు కూడా ఫిర్యాదులు చేశారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్లు ఇంత అధిక మొత్తం వడ్డీ వసూలు చేయవచ్చునా? అన్న కోణంలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ను కూడా ఆశ్రయించి కంప్లయింటును దాఖలు చేశానంటున్నారు.

ఆర్థిక నేరాల నియంత్రణ విభాగాన్నీ సంప్రదించిన వినియోగదారుడు.....

రాష్ట్రస్థాయిలోనూ నేరపరిశోధన శాఖలో భాగమైన ఆర్థిక నేరాల నియంత్రణ విభాగాన్ని కూడా సంప్రతించి ఫిర్యాదు అందచేశారు. అయితే మొత్తమ్మీద ఎక్కడా కూడా ఆశించినంత వేగంగా కదలిక లేకపోవడంతో వేలాది మంది కాతాదారులు భవిష్యత్తులో నష్టపోకూడదనే ఉద్దేశంతో 10 టీవీని ఆశ్రయించారు. ఇదే కంపెనీకి చెందిన అనేక కాతాలను తాను పరిశీలించానని అందరి వద్దా కూడా అదిక వడ్డీలే వసూలు చేస్తున్నట్లు స్పష్టమవుతోందంటున్నారు సుధాకర్.

నిబంధనల మేరకే వడ్డీ వసూలు చేస్తున్నామంటున్న సంస్థ....

అయితే తాము నిబంధనల ప్రకారమే వడ్డీ వసూలు చేస్తున్నామని సదరు ఫిర్యాదీ దారు డిఫాల్టర్ కావడంతో తాము కూడా న్యాయపరంగా విషయాన్ని పరిష్కరించుకొనే దిశలో ఉన్నామని శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్ చెబుతోంది. వడ్డీ విషయంలో రుణగ్రహీతలదే పొరబాటు తప్ప చట్టబద్ధంగా తాము చేసే వ్యాపారంలో ఎటువంటి అక్రమాలు లేవని యాజమాన్య ప్రతినిధులు వివరణ ఇస్తున్నారు.

వడ్డీల మాయాజాలానికి కారణమేంటి..?

ఇంతకీ ఇంతటి వడ్డీల మాయాజాలం ఎందుకు చోటు చేసుకొంటోంది? రిజర్వు బ్యాంకు లేదా ప్రభుత్వ విభాగాలు వడ్డీ రేట్లను ఎందుకు నియంత్రించలేకపోతున్నాయనేది సగటు రుణగ్రహీతకు అంతుచిక్కని ప్రశ్న. ఫ్లాట్ వడ్డీ రేటులో 15.88 శాతం చూపించే వడ్డీ నిజానికి క్సీణించే విలువను పరిగణనలోకి తీసుకుంటే 27.33 శాతం వరకూ పడుతోంది. అయితే ఆర్థిక సంస్థలు ఈ విషయాన్ని తెలివిగా దాచి పెడుతున్నాయి. అప్పు మంజూరు చేస్తున్నప్పుడు తగిన వివరణ, పారదర్శకత లోపించడంతో సగటు కాతాదారు 15 లేదా 16 శాతమే తమకు వడ్డీ పడుతోందని భావిస్తున్నాడు. కానీ చెల్లించే మొత్తంలో నెలవారీ అసలును మినహాయించకుండా తీసుకున్న మొత్తం రుణంపై వడ్డీ వేయడంతో వడ్డీ భారం తడిసిమోపెడవుతోంది.తాను చెల్లించిన అసలు మొత్తానికి కూడా వడ్డీ కట్టాల్సి వస్తోంది రెట్టింపు దరిదాపుల్లో వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. . గతంలో సూక్ష్మరుణ సంస్థల విషయంలో ఇదే లోపం చోటు చేసుకుంది. తెలివిగా చిన్నాచితక అప్పుల కోసం వచ్చేవారిని వడ్డీల భారంతో ముంచేశారు.

ఫ్లాట్‌ రేటు, డిమినిషింగ్‌ రేట్లపై స్పష్టమైన వివరణ ఇవ్వాలి :ఆర్‌బీఐ

అధీకృతమైన ఆర్థిక సంస్థలు సైతం ఇదే తోవపడుతున్నాయి. ప్లాట్ రేటు, డిమినిషింగ్ రేటుల విషయంలో రుణగ్రహీతలకు సుస్పష్టమైన వివరణ ఇవ్వాలని రిజర్వు బ్యాంకు నిబంధనలు సైతం చెబుతున్నాయి. అయితే ఆర్థిక సంస్థలు ఈ రెంటి మధ్య తేడాను కాతాదారు దృష్టికి తేవడం లేదు. ఒక్కసారిగా 27 శాతం వడ్డీ అంటే బెంబేలెత్తి పోతాడనే భావనతో ప్లాట్ ఇంటరెస్టు రేటును మాత్రమే బహిరంగ పరుస్తున్నారు. ఇదే రుణ గ్రహీతల కొంప ముంచుతోంది. అప్పుల ఊబి నుంచి బయటపడలేని పరిస్థితిని కల్పిస్తోంది. కేవలం ప్లాట్ రేటు అని చెప్పకుండా నికరంగా ఎంతమొత్తం వడ్డీ పడుతుందనే విషయాన్ని స్థానిక భాషలో సామాన్యునికి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత ఆయా సంస్థలకు ఉంటుంది. అదే సమయంలో అలా చెప్పక పోతే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతను రిజర్వు బ్యాంకు అయినా తీసుకోవాలి. లేకపోతే ఈ మాయాజాలం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుంది. 

21:25 - January 5, 2016

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ను కుదించడం దారుణమన్నారు టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రతిపక్షాలకు ప్రచారం చేసుకునే సమయం కూడా ఇవ్వకపోవడం అన్యాయమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా గ్రేటర్ ఎన్నికల్ని ధైర్యంగా ఎదుర్కొంటామని ఎర్రబెల్లి ధీమా వ్యక్తం చేశారు. ప్రచారం, ఎన్నికల స్టంట్‌లకే టీఆర్‌ఎస్ సర్కార్ పరిమితమవుతోందని ఎద్దేవా చేశారు.

21:23 - January 5, 2016

విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో జరిగిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్నారు. స్మార్ట్‌ విలేజ్‌, స్మార్ట్‌ వార్డు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపు ఇచ్చారు. పెనుగంచిప్రోలు గ్రామంలో ఉన్న తిరుపతమ్మతల్లి దేవాలయాన్ని దత్తత తీసుకునేలా ఆదేశాలు జారీ చేస్తానని హామీ ఇచ్చారు. జన్మభూమి వేదిక దగ్గర గర్భిణిలకు ప్రభుత్వం తరుపున... చంద్రబాబు సామూహిక సీమంతాలు నిర్వహించారు.

నదుల అనుసంధానం, కరువ నివారణకు....

ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు... నదుల అనుసంధానం, కరువ నివారణకు సర్కార్‌ చేపట్టిన చర్యలను వివరించారు. రైతులు వ్యవసాయానికి తోడు వ్యవసాయ అనుంబంధ కార్యక్రమాలు చేపడితే... ఆర్ధికంగా నిలదొక్కుకోవచ్చని సూచించారు. రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న తమ ప్రభుత్వానికి ప్రజలు సహకారం అందించాలని చంద్రబాబునాయుడు కోరారు. 

21:19 - January 5, 2016

హైదరాబాద్ : టీడీపీకి వ్యతిరేకంగా.. కాపులు సమైక్యమవుతున్నారా..? కాపుల మద్దతును కూడగట్టేందుకు వైఎస్‌ జగన్‌ ప్రయత్నిస్తున్నారా..? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్‌హాట్‌గా జరుగుతున్న చర్చ ఇది. కొంతకాలంగా చంద్రబాబుకు వ్యతిరేకంగా కాపులు నిరసన గళం వినిపిస్తుండడం.. ఇవాళ దాసరి నారాయణరావు ఇంటికి జగనే స్వయంగా వెళ్లి మంతనాలు సాగించడం.. రాష్ట్ర రాజకీయాల్లో త్వరలోనే సంభవించే కీలక మార్పులకు సంకేతమన్న ప్రచారం జరుగుతోంది.

కాపులు టీడీపీకి పూర్తిగా దూరమవుతున్నట్లేనా..?

కాపుల్లో అసంతృప్తిని జగన్‌ క్యాష్‌ చేసుకుంటున్నారా..? వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా జగన్‌ పావులు కదుపుతున్నారా..? అందుకే దాసరి నారాయణరావును కలిశారా..?

కాపు కమిషన్‌ ఏర్పాటు చేస్తానన్న చంద్రబాబు....

అన్ని ప్రశ్నలకూ అవుననే సమాధానమే వస్తోంది. గత ఎన్నికల్లో కాపులు తెలుగుదేశం పార్టీని భుజానికెత్తుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో అనూహ్య విజయాన్ని అందించారు. అప్పట్లో కాపులను బీసీల్లో చేరుస్తామని.. కాపుల అభివృద్ధి కోసం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని, ఏటా వెయ్యి కోట్ల రూపాయలను కేటాయిస్తానని.. చంద్రబాబు హామీల వర్షం కురిపించారు. దీనికి పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఫ్యాక్టర్‌ కూడా పనిచేసింది. తమ దీర్ఘకాలిక డిమాండ్‌ను చంద్రబాబు పరిష్కరిస్తారన్న నమ్మకంతో.. కాపులు గంపగుత్తగా టీడీపీకి ఓట్లేశారు. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ అఖండ విజయం సాధించింది. టీడీపీయే ఊహించని రీతిలో.. అన్ని స్థానాల్లోనూ ఆపార్టీ అభ్యర్థులనే గెలిపించార ఓటర్లు.

మరో ఉద్యమానికి సన్నద్ధమైన ముద్రగడ పద్మనాభవం.....

ఎన్నికలై అధికారం చేపట్టాక.. చంద్రబాబు కాపుల సమస్యపై పెద్దగా స్పందించింది లేదు. దీంతో ముద్రగడ పద్మనాభం మరో ఉద్యమానికి సన్నద్ధమయ్యారు. భారీ బహిరంగ సభ నిర్వహించాలనీ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం.. తూర్పుగోదావరి జిల్లాలో అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు, సభలు నిర్వహించరాదంటూ సెక్షన్‌ 30 కింద ఆంక్షలు విధించింది. దీంతో కాపులు మరింతగా రగులుతున్నారు. తెలుగుదేశం అధినేత తమను నమ్మించి వంచించాడన్న భావనలో ఉన్నారు. ఈ తరుణంలో కాపుల్లోని అసంతృప్తిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు.. జగన్‌ వ్యూహాత్మకంగా రంగంలోకి దిగారని భావిస్తున్నారు.

ఓటమికి కాపుల మద్దతు లేకపోవడం కారణంగా గుర్తించిన జగన్‌?......

గత ఎన్నికల్లో.. రెడ్లు, దళితులు పూర్తిగా సమర్థించినా.. తన పార్టీ ఓటమికి కాపుల మద్దతు లేకపోవడమే కారణమని జగన్‌ గుర్తించాడని అంటున్నారు. అందుకే వచ్చే ఎన్నికల నాటికి వారినీ తనకు అనుకూలంగా మలచుకునేందుకే జగన్‌ మంగళవారం దాసరి నారాయణరావును కలిశారని అంటున్నారు. పీసీసీ మాజీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ వైసీపీలో చేరింది మొదలు.. కాపులను దువ్వే ప్రయత్నాలు సాగుతున్నాయని పార్టీ వర్గాల భోగట్టా. కాంగ్రెస్‌ హయాంలో.. ముఖ్యంగా వైఎస్‌ జమానాలో యాక్టివ్‌గా ఉండి ప్రస్తుతం స్తబ్దుగా ఉన్న కాపు నాయకులందరినీ సమీకరించే పనినీ పార్టీ నేతలకు జగన్‌ అప్పగించారని చెబుతున్నారు. వంగవీటి గీత, కన్నబాబు లాంటి నేతలను సమైక్య పరిచే ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం.

ఏనాడూ వైఎస్‌కు అనుకూలంగా లేని దాసరి....

కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నా.. గతంలో దాసరి నారాయణరావు ఏనాడూ వైఎస్‌కు అనుకూలంగా లేరు. ఎన్నికల ప్రచారాల్లోనూ దాసరి వైఎస్‌కు భిన్నమైన మార్గంలో వెళ్లేవారు. అట్లాంటి దాసరిని.. జగన్‌ స్వయంగా వచ్చి కలవడం విశేషం. జగన్‌కు తన సంపూర్ణ ఆశీస్సులుంటాయనీ దాసరి చెప్పడం.. కాపులను టీడీపీకి వ్యతిరేకంగా సమైక్యపరుస్తున్నారనడానికి నిదర్శనమని భావిస్తున్నారు.

టీడీపీకి కాపులకు మధ్య సంధానకర్తగా పవన్‌ కల్యాణ్‌......

టీడీపీకి కాపులకు మధ్య సంధాన కర్తగా.. అదే వర్గానికి చెందిన పవన్‌ కల్యాణ్‌ వ్యవహరిస్తున్నారు. కానీ కాపుల సమస్యపై గానీ.. రాజధాని భూముల సేకరణ అంశంపై గానీ.. పవన్‌ ఇటీవల ఉదాసీనంగా ఉన్నారు. దీంతో.. ఆయనపైనా ప్రజల్లో ముఖ్యంగా కాపుల్లో అసహనం ఉందని భావిస్తున్న జగన్‌.. దాసరిని అస్త్రంగా వాడుకుంటున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా మెగా కుటుంబంపై ముందునుంచీ గుర్రుగా ఉన్న దాసరి ద్వారా.. తన కార్యం నెరవేర్చుకోవాలన్నదే జగన్‌ వ్యూహమనీ విశ్లేషకులు భావిస్తున్నారు.

సెక్షన్‌ 30 ప్రయోగంపై కాపుల్లో ఆగ్రహం.......

ఉభయ గోదావరి జిల్లాల్లో కాపులు సభ నిర్వహించకుండా.. సెక్షన్‌ 30 కింద ప్రభుత్వం ఆంక్షలు విధించిన నేపథ్యంలో.. ఎట్టి పరిస్థితుల్లోనూ సభను జరిపి తీరతామని కాపు నేతలు.. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం లాంటి వారు ప్రకటిస్తున్నారు. ఆ సభకు వైసీపీ పూర్తి మద్దతు ప్రకటించే అవకాశమూ లేకపోలేదని అంటున్నారు. మొత్తానికి దాసరి ఇంటికి జగన్‌ వెళ్లడంపై.. రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ హాట్‌ చర్చకు తెరలేపింది. 

డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి టెండరు ఆహ్వానం...

హైదరాబాద్:  నగరంలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ టెండర్లు ఆహ్వానించింది. రూ. 151 కోట్ల ప్రాథమిక అంచనాతో టెండర్లు ఆహ్వానించిన జీహెచ్‌ఎంసీ తొమ్మిది బస్తీల్లో 2,160 ఇళ్ల నిర్మాణం చేపట్టనుంది. తొలివిడతలో సనత్‌నగర్, యాకుత్‌పురా, మలక్‌పేట్, చాంద్రాయణగుట్ట, అంబర్‌పేట్, ముషీరాబాద్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టనుంది.

 

తెలంగాణ లో ఏఈఈ పోస్టుల భర్తీపై హైకోర్టు స్టే...

హైదరాబాద్ : తెలంగాణలో ట్రాన్స్‌కో, జెన్‌కోలో ఏఈఈ పోస్టుల ఎంపిక ప్రక్రియను ఈనెల 20 వరకు చేపట్టరాదని హైకోర్టు ఆదేశించింది. విద్యుత్‌ సంస్థల్లో ఏఈఈ పోస్టుల నియామకంలో స్థానికేతర కోటా వివాదంపై హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. ఉద్యోగాల్లో స్థానికులకు 70 శాతం, స్థానికేతరులకు 30శాతం కేటాయిస్తూ ప్రభుత్వం గతంలో ప్రకటన జారీ చేసింది. అయితే స్థానిక కోటాలో స్థానిక జోన్‌వారు, స్థానికేతర కోటాలో రాష్ట్రంలోని ఇతర జోన్ల వారని పేర్కొంది. దీనిపై పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. స్థానికేతర కోటాలో రాష్ట్రేతరులను కూడా అనుమతించాలని...

20:11 - January 5, 2016

హైదరాబాద్ : అయ్యది ఒక మాట... కొడుకుది మరోమాట.. జీహెచ్ఎంసీ ఓట్ల కోసం పార్టీలో కొట్లాట. భూపాలపల్లి ఇక భూతల స్వర్గమే... పెద్దమ్మ కథ చెప్పిన కేసీఆర్ సార్. ఏడు కొండల వెంకన్నకు అగ్ని పరీక్ష. కొండెక్కిన కోడెల సార్... రోజమ్మ పంచాయతీ. తీరా ఇంటికి చేరిన తీర్థయాత్రీకుడు... మనసిప్పక మాట్లాడిన మల్లాది... పశువుల కాపరులను మింగిన ముసళ్లు... మెదక్ జిల్లా పుల్కలోళ్లకు పుట్టెడు భయం. కథాకలి, భరతనాట్యం దంచి కొట్టిన మంచు... తిరుపతి కొండ కింద నాట్యమయూరి ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లు కార్యక్రమంలో మన మల్లన్న వాక్చాతుర్యాన్ని ఎలా ప్రదర్శించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

19:37 - January 5, 2016

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ ఎన్నికల ప్రక్రియ 29 రోజుల నుంచి 15 రోజులకు కుదించారు. మొత్తం 15 రోజుల్లో ప్రక్రియ పూర్తయ్యేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. అస్సలు సమయాన్ని ఎందుకు కుదించారు. దీని పై విపక్షాలు కోర్టు గుమ్మం తొక్కాయి. విపక్షాల తీరుపై అధికారపక్షం ఎలా వ్యవహరించబోతోంది? ఈ అంశాలపై హెడ్ లైన్ షోలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సీపీఎం నేత శ్రీనివాస్, టిడిపి నేత మేడిపల్లి సత్యం, టిఆర్ ఎస్ నేత తాడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై మాట్లాడారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

19:14 - January 5, 2016

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్ కు నా దీవెనెలు ఎప్పుడూ ఉంటాయని...జగన్ మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని కేంద్ర మాజీ మంత్రి, సినీ దర్శకుడు దాసరి నారాయణరావు అన్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ తో భేటీపై ఆయన స్పందించారు. వారిద్దరి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై జగన్ పోరాడుతున్నారంటూ ఆయన ప్రశంసించారు. జగన్ కు తన దీవెనలు, ఆశీర్వచనాలు ఆయనకు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. ఇప్పటికే జగన్ మంచి నాయకుడిగా ఎదిగారని, భవిష్యత్ లో మరింత ఎదగాలని తాను కోరుకుంటున్నానని దాసరి అన్నారు. కాగా, దాసరి నివాసానికి జగన్ ఈరోజు వెళ్లారు. చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న దాసరిని వైఎస్సార్సీపీలోకి రావాలంటూ జగన్ ఆహ్వానించారు. అయితే, వైఎస్సార్సీపీ లోకి ఆయన చేరతారా లేదా అన్న విషయమై మీడియాతో దాసరి ప్రస్తావించ లేదు.

డీవోపీటీ అధికారులతో ముగిసిన సీఎస్ భేటీ

ఢిల్లీ: డీవోపీటీ(డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, జీఏడీ సెక్రటరీ అదర్‌సిన్హా జరిపిన భేటీ ముగిసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఉన్నత స్థాయి ఉద్యోగుల క్యాడర్ పెంపుపై వీరు డీవోపీటీతో తొలిసారిగా సమావేశమయ్యారు. భేటీ అనంతరం సీఎస్ రాజీవ్‌శర్మ వివరాలను వెల్లడిస్తూ.. తెలంగాణ రాష్ట్రంలో సివిల్ అధికారులను పెంచాలని డీవోపీటీని కోరినం. 45 మంది ఐఏఎస్, 31 మంది ఐపీఎస్ అధికారులను కేటాయించాలని కోరినం. 25 నుంచి 27 శాతం పెంచేందుకు డీవోపీటీ సానుకూలంగా స్పందించింది.

18:58 - January 5, 2016

హైదరాబాద్ : అంగన్‌వాడీల జాతీయమహాసభలకు హైదరాబాద్‌ నగరం ఆతిథ్యమివ్వనుంది. జనవరి 7 నుంచి 10వ తేదీ వరకు జరిగే మహాసభలకు దేశం నలుమూలల నుండి వెయ్యి మంది వరకు అంగన్‌వాడీ ప్రతినిధులు హాజరవుతున్నారు. పాలకులు ఐసీడీఎస్ ను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో సర్కారు విధానాలకు వ్యతిరేకంగా ఈ మహాసభల్లో పోరాట కార్యాచరణను రూపొందించనున్నారు .

అంగన్‌వాడీ కార్యకర్తలంటే పాలకులకు చిన్న చూపు......

ప్రభుత్వ పథకాలు గ్రామాలకు చేరాలంటే సర్కారుకు సారథులుగా కనిపించేది అంగన్‌వాడీలే. పేద పిల్లలకు సౌష్టికాహారం పెట్టాలన్నా... నిండుచూలాలు క్షేమంగా, ఆరోగ్యంగా పురుడు పోసుకోవాలన్నా అంగన్‌వాడీల అమృతహస్తమే కావాలి. అలాంటి అంగన్‌వాడీ కార్యకర్తలంటే పాలకులకు చిన్న చూపు. కనీస వేతనాలిచ్చి కడుపునింపడని అడిగితే లాఠీలతోనే సమాధానం చెప్తున్నాయి ప్రభుత్వాలు.

తెలంగాణాలో 32 వేల అంగన్‌వాడీ సెంటర్లు.......

తెలంగాణాలో 32 వేలకు పైగా అంగన్‌వాడీ సెంటర్లు ఉన్నాయి. వీటిలో 70 వేల మందికి పైగా వర్కర్స్ ,హెల్పర్స్ పనిచేస్తున్నారు . టిఆర్ఎస్ అదికారంలోకి వచ్చిన తర్వాత తమకు కనీస వేతనం 15 వేలు ఇచ్చి ,రిటైర్ మెంట్ బెనిపిట్స్ కల్పించాలని కోరుతూ వివిద రూపాల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళనలు ,పోరాటాలు నిర్వహించారు అంగన్‌వాడీ కార్యకర్తలు. నవంబర్ 18న సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున చలో హైదరాబాద్ నిర్వహించారు. వీరి ఆందోళన ఫలితంగా యూనియన్ నేతలతో ప్రభుత్వం చర్చలు జరిపి రాత పూర్వక హామీ ఇచ్చింది . వీటి అమలుకు కొంత సమయం కావాలని ప్రభుత్వం అడిగింది. దీని ప్రకారం వర్కర్స్‌కు 4200 నుంచి 7000 వేలకు ,హెల్పర్స్ కు 2200 నుంచి 4500 రూపాయలకు వేతనాలు పెంచింది . పెంచిన వేతనాలు మార్చి ఒకటి నుంచి అమల్లోకి వచ్చాయి. కాని నెలల తరబడి వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి. ఒక్క వేతనాలే కాదు సెంటర్ అద్దెలు ,ఇతర అలవెన్సులు నెలల తరబడి పెండింగ్ లో ఉన్నాయి .

మెడపై కత్తిలా జీవో 14......

ఇది చాలదన్నట్టు కేసీఆర్‌ ప్రభుత్వం జీవో 14 తీసుకొచ్చింది. ఈ జీవో అంగన్ వాడీల మెడపై కత్తిలా వేలాడుతోంది . అంగన్‌వాడీ వర్కర్‌కు రెండు మెమోలు ఇచ్చిన తర్వాత మూడో మోమోకు ఎలాంటి విచారణ లేకుండానే ఉద్యోగం నుంచి తొలగించాలని ఈ జీవోలో పేర్కొన్నారు .దీనిపై అంగన్‌వాడీల్లో తీవ్ర వ్యతిరేకత , ఆగ్రహం వ్యక్తమవుతోంది. నాలుగు సెంటర్లను కలిపి ఒకే చోట చేసే ప్రయత్నం చేస్తోంది . దీని ద్వారా వర్కర్స్ ను తగ్గించే కుట్ర చేస్తోంది. దీనిపైనా జాతీయ మహాసభల్లో చర్చించనున్నారు.

ఏపిలో 48 వేల అంగన్‌వాడీ సెంటర్లు....

ఎపిలో మొత్తం 48 వేలకు పైగా సెంటర్లలో లక్ష మందికి పైగా అంగన్‌వాడీ కార్మికులు పనిచేస్తున్నారు. కనీస వేతనం 15 వేలు , రిటైర్మెంట్ బెనిఫిట్స్ , ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ సీఐటీయూ ఆద్వర్యంలో వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించారు . చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వర్కర్స్ కు 4200 నుండి 7100 , హెల్పర్స్ కు 2200 నుంచి 4600 కు వేతనాలు పెంచుతున్నట్లు ఆగస్టులో ప్రకటించింది . సెప్టెంబర్ 1 నుండి పెంచిన వేతనాలు అమల్లోకి వస్తాయని ప్రకటించినా అది అమలు కాలేదు .

ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని బాబు ప్రకటన........

డిసెంబర్‌ 18న కార్మికసంఘాల ఆధ్వర్యంలో చలో విజయవాడ నిర్వహించారు అంగన్‌వాడీలు. వీరిపై లాఠీలు ఝుళిపించారు అంగన్‌వాడీలు . అదే రోజు అసెంబ్లీలో చంద్రబాబు వేతనాల పెంపు పై ప్రకటన చేస్తూ ఏప్రియల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. ఇంతలోనే ఏపీ ప్రభుత్వం అంగన్‌వాడీలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. ఆందోళనలో పాల్గొన్న అంగన్‌వాడీలను సీడీల ఆధారంగా గుర్తించి తొలగించాలని మెమో జారీ చేసింది ప్రభుత్వం .దీనిపై రాష్ట వ్యాప్తంగా అంగన్ వాడీలు భగ్గుమన్నారు . సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేయటం తప్పా అని ప్రశ్నిస్తున్నారు.

2014 -15 బడ్జెట్‌లో రూ. 18,391 కోట్లు...

ఇప్పటికే కేంద్రం 2014 -15 బడ్జెట్‌లో 18,391 కోట్లు , 2015 -2016 బడ్జెట్‌లో 8754 వేల కోట్లు కేటాయించి సగానికి పైగా నిధులు కోత పెట్టింది. పోషకాహార లోపాలను ,శిశు మరణాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఐసీడీఎస్‌ ఏర్పడి 40 సంవత్సరాలు అవుతోంది .ఈ సందర్భంగా ఐసీడీఎస్ పరిరక్షణకు , కార్మిక సమస్యల పరిష్కారం కోసం జనవరి 7 నుంచి 10వ తేదీ వరకు హైదరాబాద్‌లో జరిగే జాతీయ మహాసభల్లో పోరాట కార్యాచరణ రూపొందించనున్నారు. దేశం నలుమూలల నుండి వెయ్యి మంది వరకు అంగన్‌వాడీ ప్రతినిధులు మహాసభలకు హాజరవుతున్నారు. 

18:54 - January 5, 2016

విజయవాడ : కోడిపందాల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. వారసత్వంగా వస్తున్న కోడిపందాల నిర్వహణకు ఆదేశాలు జారీ చేయాలంటూ... బీజేపీ నేత రఘురామ కృష్ణంరాజు... ఇంప్లీడ్ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని విచారించిన ధర్మాసనం.. కోడిపందాలపై ఎల్లుండిలోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఏపీ సర్కార్‌ను ఆదేశిస్తూ.. విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది. 

18:52 - January 5, 2016

కృష్ణా : ఏసీబీ అధికారుల గాలానికి మరో అవినీతి చేప చిక్కింది. విజయవాడ ట్రాన్స్‌కో ఏడీఈ సుబ్బారావు వద్ద భారీగా అక్రమ ఆస్తులు గుర్తించారు. మారుతీనగర్‌లో సుబ్బారావు ఇంట్లో అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. సుబ్బారావు అక్రమ ఆస్తుల విలువ సుమారు 15కోట్ల వరకు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రాధమికంగా మారుతీనగర్‌ లో మూడంతస్తుల భవనం, గన్నవరం సమీపంలో ఆరెకరాల భూములు, 850గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు భారీగా ప్రామిసరి నోట్లు, చెక్కులు స్వాధీనం చేసుకున్నారు. 

అమరావతి ఎక్స్ ప్రెస్ కు బాంబు బెదరింపు...

హైదరాబాద్ : అమరావతి ఎక్స్‌ప్రెస్‌లో బాంబు ఉందన్న వార్త కలకలం సృష్టించింది. దీంతో రైల్వే అధికారులు అమరావతి ఎక్స్‌ప్రెస్‌ను అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వేస్టేషన్లో నిలిపివేశారు. సమాచారం తెలుసుకున్న బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు చేపట్టింది.

ఎంపి కవిత సవాల్ పై స్పందించిన దత్తాత్రేయ

హైదరాబాద్ : కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.20వేల కోట్ల ప్యాకేజీ ఇప్పిస్తే గ్రేటర్ ఎన్నికల్లో తాను బీజేపీకే ఓటేస్తానని ఎంపీ కవిత చేసిన సవాల్ పై కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ స్పందించారు. ఆమె వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఎన్నికలకు, నిధులకు ముడిపెట్టవద్దని ఢిల్లీలో అన్నారు. తెలంగాణలో రోడ్ల అభివృద్ధికి రూ.40వేల కోట్లు కేటాయించామని, గృహ నిర్మాణం కింద 40వేల ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. అలాంటప్పుడు టీఆర్ఎస్ నేతలు తమపై అనవసరంగా విమర్శలు చేయడం ఎందుకని దత్తాత్రేయ మండిపడ్డారు. ఈ ఏడాది సనత్ నగర్ ఈఎస్ఐ మెడికల్ కాలేజి ప్రారంభిస్తామని...

17:47 - January 5, 2016

హైదరాబాద్ : వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈజిల్లా అభివృద్ధిపై సమీక్ష చేపట్టారు. నందన గార్డెన్స్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరైయ్యారు. కేటీపీపీ రెండో దశ విద్యుత్ ప్లాంట్‌ను సీఎం నేడు జాతీకి అంకితం చేసిన విషయం తెలిసిందే.

17:45 - January 5, 2016

హైదరాబాద్ : కేసీఆర్ పాలనలో హైదరాబాద్ మురికికూపంగా మారిందన్నారు టిడిపి అధ్యక్షులు ఎల్.రమణ. గ్రేటర్ పీఠం కోసం ఇప్పుడు.. హైదరాబాదీలపై... ముఖ్యమంత్రి కుటుంబం.. ఎక్కడలేని ప్రేమ కురిపిస్తున్నారని ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టడంలో కేసీఆర్, ఆయన కొడుకు, కూతురు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారని రమణ విమర్శించారు. 

17:44 - January 5, 2016

వరంగల్ : తెలంగాణలో విద్యార్థినులకు భద్రత కరువైందని టిడిపి ఎమ్మెల్యే సీతక్క అన్నారు. వరంగల్‌లో ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమైనా... ఎవరూ పట్టించుకోలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు అమ్మాయిల హత్యల్ని ఆత్మహత్యలుగా... చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని సీతక్క ఆరోపించారు. ప్రభుత్వంలోని పెద్దలు, కొందరు అధికారులు అసలు నిందితుల్ని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

17:42 - January 5, 2016

వరంగల్: జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు వచ్చిన పోలీసుల అమరవీరుల కుటుంబాలకు నిరాశే ఎదురైంది. హన్మకొండలోని మాజీ మంత్రి కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు ఇంట్లో బసచేసిన కేసీఆర్‌ను కలిసి తమ సమస్యలు విన్నవించాలని 5గంటల సేపు ఎదురుచూసిన వారికి సీఎం అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. దీంతో బాధిత మహిళలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

17:40 - January 5, 2016

హైదరాబాద్ : అమెరికా కాన్సులేట్ జనరల్ మైఖేల్ ముల్లిన్స్‌తో మంత్రి కేటీఆర్‌ భేటీ అయ్యారు. నగరంలోని బేగంపేటలో ఉన్న అమెరికన్ కాన్సులేట్‌లో ఆయన ముల్లిన్‌ను కలిసి పలు అంశాలపై చర్చించారు. అమెరికాలో తెలంగాణ విద్యార్థులు ఎదుర్కొంటొన్న సమస్యలపై చర్చించారు. అమెరికా వెళ్లి చదువుకోవాలనుకునే విద్యార్థుల విషయమై ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈమేరకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు లేఖ రాస్తామని వెల్లడించారు. ప్రైవేటు వ్యక్తులు నకిలీ డాక్యుమెంట్స్‌ ఇస్తే చర్యలు తప్పవని..విద్యార్థులు అమెరికా వెళ్లకంటే ముందే ఇక్కడే డాక్యుమెంట్లను పరిశీలిస్తే బాగుంటుందని మంత్రి అన్నారు.  

17:38 - January 5, 2016

నిజామాబాద్ : పచ్చని పైరు ఎండిపోయింది. వడ్లు లేవు సరికదా గడ్డి కూడా మొలవడం లేదు. తీవ్ర వర్షాభావ ప్రభావం రైతులపైనే కాదు ఇప్పుడు మూగజీవాలపైనా పడింది. నిండైన పాలపొదుగుతో నిగనిగలాడిన పశువులు ఇప్పుడు గ్రాసం లేక బక్కచిక్కిపోతున్నాయి. చివరకు దళారుల చేతుల్లోకి చేరుతున్నాయి.

ఎన్ని యంత్రాలు వచ్చినా....

ఆధునిక వ్యవసాయంలో ఎన్ని యంత్రాలు వచ్చినా కాడెద్దులు లేని వ్యవసాయాన్ని ఊహించుకోలేరు. ఇంటి వ్యవసాయాన్ని, రైతు కుటుంబ భారాన్ని మోయగల సత్తా కాడెద్దులవి. అలాంటి కాడెద్దులకు ఇప్పుడు గ్రాసం కరువైంది. కడుపునిండా కంచెలో మేయడానికి గడ్డ పరక కూడా కనిపించడం లేదు. వ్యవసాయానికి చేదోడువాదోడుగా ఉంటూ రైతుకు దన్నుగా నిలిచిన కాడెద్దుల పోషణ రైతుకిప్పుడు భారమైంది.

బాల్కొండ సంతకు భైంసా, ఆదిలాబాద్‌, భీమ్‌గల్‌..

నిజామాబాద్‌ జిల్లాలో వర్షాభావం కారణంగా మూగజీవాలను పోషించలేక అమ్మేస్తున్నారు రైతులు. గతంలో బాల్కొండ సంతలో భైంసా, ఆదిలాబాద్, భీమ్‌గల్, మెట్‌పల్లి, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల రైతులు వచ్చి ఇక్కడి నుంచి ఎడ్లను, గేదెలను కొనుగోలు చేసుకొని గ్రామాలకు తీసుకెళ్లేవారు. రైతులకు వరంగల్ జిల్లా పరకాల, కరీంనగర్ జిల్లా గంగాధర, ఇతర ప్రాంతాల నుంచి దళారులు ఇక్కడికి గేదెలు, ఎడ్లను తీసుకొచ్చి అమ్మేవారు.

ఎడ్లను కొనుగోలు చేసే రైతులు కరవు.......

ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. బాల్కొండ సంతలో మొత్తం 400 ఎడ్లు ఉంటే కొనుగోలు చేసే రైతులు ఒక్కరూ లేరు. పైగా ఇంటి ఎద్దులను అమ్ముకునే రైతులే కనిపించారు. దళారులు ఎంత చెప్తే అంతకు మూగజీవాలను వారి చేతుల్లో పెట్టేసి వెళ్లిపోతున్నారు.

గతంలో రూ.70వేలకు ఎడ్ల అమ్మకం........

గతంలో చాలా గ్రామాల్లో వ్యవసాయానికి నడిచే ఎడ్లతో వచ్చిన కిరాయితో ఇల్లు గడిచేది. మరో రెండు, మూడు జతల ఎడ్లను పెంచి బయట రైతులకు అమ్మితే ఆరు నెలల్లో ఒకటికి రెండింతలు ఆదాయం వచ్చేది. వర్షాభావం కారణంగా ఇప్పుడా పరిస్థితి లేదు. గతంలో 70 రూపాయలకు కూడా ఎడ్లను అమ్మని రైతు ఇప్పుడు 40 వేలు ఇచ్చినా చాలని అనుకుంటున్నాడు.

రుణాలు చెల్లించాలని బ్యాంకుల నోటీసులు.....

కరవుతో అల్లాడుతున్న రైతన్నకు మరో కష్టం వచ్చి పడింది. వాణిజ్య బ్యాంకుల నుంచి గతంలో తీసుకున్న రుణాలను వెంటనే చెల్లించాలని, లోక్ అదాలత్‌కు వచ్చి ఒప్పందం చేసుకోవాలని వివిధ బ్యాంకుల అధికారులు రైతులకు కోర్టు నుంచి నోటీసులు పంపించారు. ఒకవైపు వర్షాభావంతో పంటలు ఎండిపోయి పెట్టిన పెట్టుబడి నష్టపోతున్నామని ఆందోళన చెందుతున్న అన్నదాతలకు బ్యాంకర్లు పంపించిన కోర్టు నోటీసులు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆర్మూర్ ప్రాంతంలో వందలాది మంది రైతులకు ఈ మేరకు నోటీసులు వచ్చాయి. కోర్టులో జరిగే లోక్ అదాలత్‌కు విధిగా హాజరు కావాలని, వన్‌టైం ఒప్పందం చేసుకుని రుణ బకాయిలను ఏకమొత్తంగా చెల్లించాలని నోటీసులు రావడంతో ఏం చేయాలో తోచక అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు. పాడి లేక..పంట లేక రైతులు ధీనావస్థలో ఉంటే బ్యాంకు రుణాలు ఇప్పుడు మెడపై కత్తిని పెట్టాయి. ఈ పరిస్థితి నుంచి పాలకులైనా కాపాడుతారనే ఆశను కూడా రైతులు వదిలేసుకున్నారు.

వరంగల్ జిల్లా అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈజిల్లా అభివృద్ధిపై సమీక్ష చేపట్టారు. నందన గార్డెన్స్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరైయ్యారు. కేటీపీపీ రెండో దశ విద్యుత్ ప్లాంట్‌ను సీఎం నేడు జాతీకి అంకితం చేసిన విషయం తెలిసిందే.

17:09 - January 5, 2016

పంజాబ్ : ఉగ్రవాద చర్యలను ఉపేక్షించేది లేదని కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ హెచ్చరించారు. ఇవాళ ఆయన పఠాన్‌కోట్‌లోని ఎయిర్‌బేస్‌ను సందర్శించారు. కాల్పులు జరిపిన ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రక్షణ దళాలు చేపట్టిన ఆపరేషన్‌లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారని మంత్రి వెల్లడించారు. ఎయిర్‌బేస్‌లో ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందని తెలిపారు. ఎప్పుడు ముగుస్తుందో తెలియదన్నారు. ఆపరేషన్ ముగింపు విషయంలో ఎన్‌ఎస్‌జీదే తుది నిర్ణయమని పేర్కొన్నారు. అత్యంత శక్తివంతమైన ఆయుధాలతో ఉగ్రవాదులు ఎయిర్‌బేస్‌లోకి ప్రవేశించారని తెలిపారు. ఏకే-47, గ్రేనేడ్స్, 40 నుంచి 50 కిలోల బుల్లెట్లతో లోనికి చొరబడ్డారని వివరించారు. 36 నుంచి 38 గంటలపాటు ఎన్‌కౌంటర్ కొనసాగిందని తెలిపారు. ఆపరేషన్ నిర్వహణలో భద్రతా దళాలు సమర్థవంతంగా పనిచేశాయన్నారు. ఇద్దరు ఉగ్రవాదుల మృతేహాలను గుర్తించామన్నారు. అమరులైన జవాన్ల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

క్రిస్ గేల్ కు జరిమానా

ఆస్ట్రేలియా: మహిళా టీవీ వ్యాఖ్యాత మెల్ మెక్‌లాలిన్‌తో అసభ్యంగా మాట్లాడినందుకు వెస్టిండిస్ స్టార్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్‌కు జరిమానా విధించారు. 10 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు(4.75 లక్షలు) జరిమానాగా విధించారు. ఈ మొత్తం రొమ్ము కేన్సర్ బాధితులకు సహాయంగా నడుస్తున్న మెక్ గ్రాత్ ఫౌండేషన్‌కు వెళ్తుందని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది.

పఠాన్ కోట్ ఘటనపై మోదీతో నవాజ్ సంభాషణ

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఫోన్ చేశారు. పఠాన్ కోట్ ఘటనపై మోదీతో సంభాషించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించేది లేదని, జరిగిన దానికి చింతిస్తున్నామని చెప్పారు. ఘటనకు బాధ్యులైన వారిపై విచారణ ప్రారంభిస్తామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. కాగా, నవాజ్ షరీఫ్ మనవరాలి వివాహాన్ని పురస్కరించుకుని మోదీ పాకిస్థాన్ వెళ్లిన సందర్భంగా శాంతి చర్చలకు పునాది పడిన సంగతి తెలిసిందే. ఈ శాంతి చర్చలను ఆపాలనే ఉద్దేశంతోనే ఉగ్రదాడులకు పాల్పడినట్టు నిపుణులు పేర్కొంటున్నారు.

'కోడి పందాల' విచారణ వాయిదా....

హైదరాబాద్ : సంక్రాంతి పండగ సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే కోడి పందాలపై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. పీపుల్స్ ఫర్ ఏనిమల్స్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది. కోడి పందాలు చారిత్రక సంప్రదాయమని, వాటిని కొనసాగించాలని బీజేపీ నేత రామకృష్ణంరాజు వాదించారు. మరోవైపు కోడి పందాలను జీవహింసగా పేర్కొంటూ పీపుల్స్ ఫర్ ఏనిమల్స్ సంస్థ తమ వాదనలు వినిపించింది. వాటిపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 7కి వాయిదా వేసింది.

మే 2వ తేదీన తెలంగాణ ఎంసెట్

హైదరాబాద్: మే 2వ తేదీన తెలంగాణ ఎంసెట్ ను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి పేర్కొన్నారు. ఎంసెట్ తో పాటు పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మే 12న ఈసెట్, 19న ఐసెట్, 27న ఎడ్ సెట్, 29న పీజీ ఈసెట్, 24న లా సెట్, పీజీ లాసెట్, 11న పీఈ సెట్ లను నిర్వహించనున్నట్లు చెప్పారు. కాగా, జాతీయ స్థాయి పరీక్షల తేదీలను కూడా పరిగణనలోకి తీసుకుని విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసి ఆయా తేదీలను ప్రకటించినట్లు పాపిరెడ్డి చెప్పారు.

కోడిపందాలపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్ : సంక్రాంతికి ఏటా నిర్వహించే కోడి పందాలపై మంగళ వారం హైకోర్టులో విచారణ జరిగింది. పీపుల్స్ ఫర్ ఎనిమల్స్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ ను హై కోర్టు విచారణకు స్వీకరించింది. కోడి పందాలు చారిత్రక సంప్రదాయమని.. వాటిని కొనసాగించాలని బీజేపీ నేత రామకృష్ణం రాజు వాదించారు. మరో వైపు.. కోడి పందాలు జీవ హింసగా పేర్కొంటూ పీపుల్స్ ఫర్ ఎనిమల్స్ సంస్థ తమ వాదనలు తెలియజేసింది. వీటి పై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది.

పఠాన్ కోట్ లో మళ్లీ పేలుడు కలకలం...

పంజాబ్: పఠాన్కోట్ భారత వైమానిక స్థావరం బయట మంగళవారం మరోసారి భారీ పేలుడు శబ్దం వినిపించింది. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతూండగానే మళ్లీ పెద్ద ఎత్తున పేలుడు వినిపించడం కలకలం రేపింది. దీంతో లోపలఎంతమందిఉగ్రవాదులు దాగివున్నారనే దానిపై మరింత ఆందోళన నెలకొంది.

ఏపీ నుండి తెలంగాణకు 2వేల మెగావాట్ల విద్యుత్

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ 2వేల మెగావాట్ల విద్యుత్ ను తెలంగాణ రాష్ట్రానికి అమ్మనుంది. పవర్ ట్రేడింగ్ కార్పోరేషన్ (పిటిసి) ద్వారా ఈ మొత్తం విద్యుత్ ను తెలంగాణకు ఇవ్వనుంది. 2016 జూన్ నుంచి 2017 మే నెల వరకు ఏపీలో మిగులు విద్యుత్ ఉండనుందని ఏపీ ట్రాన్స్ కో పంపిణీ కంపెనీలకు సమాచారం ఇచ్చింది. ప్రతి నెల దాదాపు 300 మెగావాట్ల నుంచి 500 మెగావాట్ల వరకు ఏడాది పాటు మిగులు విద్యుత్ ఉండనుందని తెలిపింది. అదే సమయంలో తెలంగాణ డిస్కమ్ లు మే 27, 2016 నుంచి మే 25, 2017 మధ్య 2,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు ఏపీ దృష్టికి వచ్చింది.

కోర్టు మెట్లు ఎక్కిన అరుణ్ జైట్లీ

హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ మధ్యాహ్నం పటియాలా కోర్టుకు వచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై తాను దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసు విచారణకు రాగా, విచారణ తీరుతెన్నులను పరిశీలించేందుకు ఆయన కోర్టు మెట్లెక్కారు. ఢిల్లీ క్రికెట్ బోర్డులో జరిగిన అవకతవకల వెనుక జైట్లీ హస్తముందని ఆప్ ఆరోపించగా, తన పరువు పోయిందని జైట్లీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం జైట్లీ తరఫు న్యాయవాది వాదనలు ప్రారంభిస్తూ, డీడీసీఏ నుంచి తన క్లయింటు ఒక్క పైసా కూడా తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. ఆప్ నేతలు తప్పుడు ఆరోపణలు చేశారని అన్నారు.

తెలంగాణలో ఎంట్రన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

హైదరాబాద్ : తెలంగాణలో ఎంట్రన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదలైంది. మే 2న ఎంసెట్, మే 24న లాసెట్ జరగనుంది. మే 29న పీజీ ఈసెట్ పరీక్ష నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. మే 19న ఐసెట్ పరీక్షను నిర్వహించనున్నారు. 

15:43 - January 5, 2016

హైదరాబాద్ : తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి షెడ్యూల్ విడుదల చేశారు. మే 2న ఎంసెట్ పరీక్ష, మే 12న ఈ సెట్ పరీక్ష జరగనుంది. ఈ పరీక్షల్ని జేఎన్ టీయూ- హైదరాబాద్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఇక ఐసెట్‌ను కాకతీయ యూనివర్సిటీ మే 19న నిర్వహించనుంది. ఈసారి మే 27న ఎడ్‌సెట్‌, మే 29న పీజీఈసెట్‌లను ఉస్మానియా విశ్వవిద్యాలయం కండక్ట్ చేయనుంది. మే 24న లాసెట్‌ను కేయూ, మే 11న పీజీసెట్‌ను ఓయూ నిర్వహించనున్నట్టు పాపిరెడ్డి తెలిపారు. అలాగే నాణ్యత ప్రమాణాలు పాటించని కాలేజీలపై కొరడా తప్పదని హెచ్చరించారు. కాలేజీల్లో తనిఖీలు చేస్తామని పాపిరెడ్డి స్పష్టం చేశారు. 

15:40 - January 5, 2016

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. అవినీతిని అరికట్టాలని, అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవాలంటూ ఆయన సూచించారు. ఎవరైతే అవినీతికి పాల్పడుతారో..? వారిని కఠినంగా శిక్షించాలని బొత్స డిమాండ్ చేశారు. మంచి రాజధాని నిర్మాణం కోసం సహకరిస్తామని ఆయన స్పష్టం చేశారు. 

15:38 - January 5, 2016

హైదరాబాద్ : కేసీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. మాయమాటలతో ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్‌కు గ్రేటర్ ఎన్నికల్లో గుణపాఠం తప్పదని ఉత్తమ్ స్పష్టం చేశారు. మోసపూరిత ప్రకటనల్ని నమ్మొద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

15:37 - January 5, 2016

హైదరాబాద్ : వరంగల్‌ జిల్లాలో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లాకు, రాష్ట్ర ప్రజలకు పలు వరాలు కురిపించారు. ఇప్పటికే కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు క్రమబద్దీకరించడంతో పాటు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న కేసీఆర్‌ మరో తీపి కబురు అందించారు. రాష్ట్ర విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్న సీజేఎల్‌ఎమ్‌ పోస్టులను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులన్నింటిని రేపటినుంచే రెగ్యులరైజ్‌ చేస్తున్నట్లు సీఎం ప్రకటించడంతో లైన్‌మెన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

15:32 - January 5, 2016

విజయవాడ :27వ పుస్తక మహోత్సవం సందర్శకులతో కళకళలాడుతోంది. పెద్దలు, చిన్నారులు, విద్యార్థులు, యువతీ యువకులు ఇలా అన్ని వర్గాల వారు పుస్తక మహోత్సవానికి తరలివస్తున్నారు. బందర్‌రోడ్‌లోని పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌లో బుక్‌ ఫెస్టివల్‌ను ఏర్పాటుచేశారు. సుమారు 235 సాళ్లు ఎగ్జిబిషన్‌లో కొలువు దీరాయి. అన్ని వర్గాల వారికీ ఉపయోగపడే పుస్తకాలను అందుబాటులో ఉంచారు. పలు రాష్ట్రాలకు చెందిన పబ్లిషర్లు, పుస్తక విక్రేతలు తమ స్టాళ్లను ఏర్పాటుచేశారు. ప్రజాశక్తి, విశాలాంద్ర, సాహిత్య అకాడమీ, నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ పబ్లిషర్స్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ యూనివర్శీటీలు కూడా తమ స్టాళ్లను ఏర్పాటుచేశాయి. పిల్లల కోసం ప్రత్యేక విక్రయశాలలను ఏర్పాటుచేశారు. 118 స్టాళ్లలో 200 రకాల పుస్తకాలను చిన్నారుల కోసం అందుబాటులో ఉంచారు. వీటిలో సైన్స్‌, చరిత్ర, కథలు, ఫజిల్స్‌కు సంబంధించి వందల పుస్తకాలు ఉన్నాయి. పుస్తక మహోత్సవానికి వస్తున్న స్పందనపై నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నెట్‌ యుగంలోనూ పుస్తక పఠనంపై ఆసక్తి తగ్గలేదని బుక్‌ ఎగ్జిబిషన్‌కు వస్తున్న స్పందనే నిదర్శనమని చెబుతున్నారు. సందర్శకుల సందడి మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. 

15:29 - January 5, 2016

నిజామాబాద్ : తెలంగాణాలో రైతు ఆత్మహత్యలు ఆగడం లేదు. తాజాగా నిజామబాద్ జిల్లా బోధన్‌ మండలం పాన్‌గల్లికి చెందిన రైతు షేక్‌ నసీంపాషా అప్పుల బాధతో పొలంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. పాషా తనకున్న ఒకటిన్నర ఎకరం పొలంతో పాటు పక్కనే మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేశాడు. వర్షాభావ పరిస్థితులు, భూగర్భజలాలు అడుగంటిపోవడంతో నీరు లేక పంట మొత్తం ఎండిపోయింది. అప్పులు తీరే మార్గం లేక నసీంపాషా తన పొలంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. 

15:28 - January 5, 2016

విశాఖ : కాల్ మనీ వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అనుమానాస్పదంగా ఉందని విశాఖ యునైట్ పీపుల్స్ ఫ్రంట్ ఆరోపించింది. కాల్ మనీ వ్యవహారంలో నిందితులను అరెస్ట చేయాని డిమాండ్ చేస్తూ జీవిఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. వడ్డీ వ్యాపారుల నుండి మహిళలను రక్షించాలని వడ్డీ లేనిరుణాలు ఇవ్వాలని ఆందోళనకు సంబంధించి మా ప్రతినిధిప్రసాద్ అందిస్తారు.  

15:25 - January 5, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన మంత్రి మోడీ ఫిబ్రవరిలో అడుగు పెడుతారని బీజేపీ నేత కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇంతవరకు మోడీ అడుగు పెట్టలేదని టీఆర్ఎస్ ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4000 వేల మెగావాట్స్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడానికి ఫిబ్రవరి మొదటి వారంలో ప్రధాని మోడీ వస్తారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైవేలపై పలు ఆక్సిడెంట్ లు జరగడంపై బీజేపీ రాష్ట్ర కమిటీకి, నేషనల్ హైవేల అభివృద్దికి కమిటీ వేయాలని కేంద్ర మంత్రి ఆదేశించారని తెలిపారు. సెంట్రల్ గవర్నమెంట్ అగ్రికల్చర్ యూనివర్శిటీకి శంకుస్థాపన చేసేందుకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి వస్తున్నట్లు పేర్కొన్నారు. రాజకీయ లబ్దికోసం కేసీఆర్ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నియమావళికి విరుద్దంగా జీవో జారీ చేశారని ఆరోపించారు.

15:24 - January 5, 2016

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల గడువు తగ్గించడాన్ని సవాల్ చేస్తూ మర్రి శశిధర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. హైకోర్టు విధించిన 31 రోజుల గడువును మరో 20 రోజులు పొడిగించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

15:22 - January 5, 2016

హైదరాబాద్ : టీఎస్సీపీఎస్సీ ద్వారా 1069 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. వెయ్యి అగ్రికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ పోస్టులతో పాటు భూగర్భ జల శాఖలో మరో 69 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

15:20 - January 5, 2016

వరంగల్‌ : నగరంలోని కాకతీయ మెడికల్‌ కాలేజీలో దారుణం జరిగింది. ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న మౌనిక ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్‌ గదిలో ఉరేసుకుని మౌనిక ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మృతురాలు హైదరాబాద్ నివాసి. పరీక్షల సమయం దగ్గరపడుతున్నందువల్ల భయంతో ఉరి వేసుకున్నట్లు తోటి విద్యార్థులు చెప్తున్నారు. 

14:40 - January 5, 2016

హైదరాబాద్ : మన దేశంలో ఎంతో మంది మహిళలు, బాల బాలికలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. మాతా శిశు మరణాలు రేటు పెరిగి పోవడానికి ప్రధాన కారణం పౌష్టికాహారం లోపం, రక్తహీనత అని లెక్కలు చెపుతున్నాయి. మరి ఈ సమస్యలు అధిగమించాలంటే ఏం చేయాలి? ఎటువంటి ప్రజా చైతన్య కార్యక్రమాలు చేపట్టాలి? ఇదే అంశంపై 'వేదిక' ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో గాంధీ ఆసుపత్రి స్త్రీ వ్యాధి వైద్యురాలు.. డాక్టర్ నర్మద, న్యూట్రీషినిస్టు డాక్టర్ హరిత పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.


 

ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడి కాల్చివేత...

విశాఖ : పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో ఒక గిరిజన యువకుడిని మావోయిస్టులు మంగళవారం మధ్యాహ్నం కాల్చిచంపారు. విశాఖపట్టణం జిల్లా మున్సంగిపుట్టు మండలం బూసిపుట్టు గ్రామానికి చెందిన శివయ్య(25) అనే యువకుడిని కాల్చిచంపారు. సరియపుట్టు గ్రామ శివారులో శివయ్య వెళుతుండగా అటవీ ప్రాంతం నుంచి వచ్చిన మావోయిస్టులు కాల్చి హతమార్చారు. మావోలకు చెందిన సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నాడనే అనుమానంతో అతనిని చంపారని గ్రామస్తులు తెలిపారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై హైకోర్టులో పిటిషన్

మెదక్ : పటాన్ చెరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని పిటిషనర్ రఘునందన్ రావు కోరారు. ఓ వ్యక్తిపై దాడి చేసిన కేసులో మహిపాల్ రెడ్డికి రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష పడిందని పిటిషన్ లో పేర్కొన్నారు. అయినప్పటికీ అనర్హత ఎమ్మెల్యేకు జీతం ఎలా చెల్లిస్తారని, అందుకు అసెంబ్లీ సెక్రటరీ పై కూడా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. 

 

14:14 - January 5, 2016

హైదరాబాద్ : బాక్సాఫీసు దగ్గర బాజీరావ్ రికార్డులు బద్దలు కొడుతోంది. ప్రపంచవ్యాప్తంగా మస్తానీ మత్తులో సినీ ప్రేక్షకులు కొట్టుకుపోతున్నారు. సంజయ్ లీలా భన్సాలీ డైరక్షన్‌లో వచ్చిన బాజీరావ్ చిత్రం ఇప్పటి వరకు 300 కోట్లు వసూళ్లు చేసింది. డిసెంబర్ 18న విడుదలైన ఈ సినిమాకు విశేష ఆదరణ లభిస్తోందని ఈరోస్ సంస్థ పేర్కొంది. బాజీరావ్ మస్తానీ బాలీవుడ్ చిత్రంలో రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకునే, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలు పోషించారు.

కేటీపీపీ రెండో దశ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం కేసీఆర్

వరంగల్‌ :భూపాలపల్లి సమీపంలో నిర్మించిన కేటీపీపీ రెండో దశ ప్రాజెక్టును మంగళవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. కేటీపీపీ ప్రాంగణంలో అంబేడ్కర్‌ విగ్రహం, పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం... 600 మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

13:44 - January 5, 2016

ముంబై : ముంబై స్కూల్ కుర్రాడు ప్రణవ్ ధన్ వాడే చరిత్ర సృష్టించాడు. ఒకే రోజు 652 పరుగులు సాధించి మైనర్ క్రికెట్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన ధన్ వాడే మరో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఒకే ఇన్నింగ్స్ లో 1000 పరుగులు చేశాడు. ముంబై క్రికెట్ సంఘం ఇంటర్ స్కూల్ టోర్నీ నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఆర్య గురుకుల్ జట్టుతో కేసీ గాంధీ స్కూల్ పోటీ పడుతోంది. ప్రణవ్ కేసీ గాంధీ స్కూల్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మంగళవారం లంచ్ సమయానికి ప్రణవ్ 921 పరుగులతో క్రీజులో ఉన్నాడు. లంచ్ సమయానికి ప్రణవ్ టీమ్ 1337 పరుగులు సాధించింది. మధ్యలో కొత్త బ్యాట్ తీసుకుని సరికొత్త రికార్డు నెలకొల్పాడు. సోమవారం కేవలం 199 బంతుల్లో ధన్ వాడే 652 పరుగులతో అజేయంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇందులో 78 ఫోర్లు, 30 సిక్సర్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఏ స్థాయిలోనైనా ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం.
1899 లో ఏఈజే కొలిన్స్ 628 పరుగుల పేరిట ఉన్న ప్రపంచ రికార్డును ప్రణవ్ 116 సంవత్సరాల తర్వాత బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో 2014లో ముంబైలోనే పథ్వీ షా నెలకొల్పిన 546 పరుగుల భారత రికార్డు కూడా బద్దలైంది. ఆటో డ్రైవర్ కొడుకైన ప్రణవ్.. ఇప్పుడు ప్రపంచ క్రికెట్ క్రికెట్లో ఓ సంచలనం. ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో చూద్దాం.

టీఎస్పీఎస్సీ ద్వారా మరో నోటిఫికేషన్..

హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ ద్వారా మరో 1069 ఉద్యోగాల పోస్టుల భర్తీకి ప్రభుత్వం జీవో జారీ చేసింది. వ్యవసాయ విస్తరణ అధికారి గ్రేడ్ -2లో 1000 పోస్టులు, భూగర్భ జల శాఖలో 69 పోస్టుల భర్తీ జరగనుంది. 

స్కూల్ క్రికెట్ చరిత్రలో ప్రపంచ రికార్డు..

స్కూల్ క్రికెట్ చరిత్రలో ప్రపంచ రికార్డు నమోదైంది. ముంబైకి చెందిన ప్రణబ్ ధన్ వాడే ఒకే ఇన్నింగ్స్ లో వెయ్యి పరుగులు చేశాడు. నిన్న ఒక్క రోజే 652 పరుగులు సాధించాడు. గాంధీ స్కూల్ జట్టు 1400 పరుగుల చేరువలో ఉంది. 117 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ప్రణబ్ రికార్డును తిరగరాశాడు. 127 ఫోర్లు, 59 సిక్స్ లు కొట్టాడు. 

గొల్లపల్లిలో ఉద్రిక్తత...

కృష్ణా : నూజివీడు మండలం గొల్లపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవంలో ప్రొటోకాల్ పాటించడం లేదని ఎంపీపీ శ్రీనివాస్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శిలాఫలకాన్ని శ్రీనివాస్ రావు వర్గీయులు ధ్వంసం చేశారు. దీనితో మంత్రి కామినేని శ్రీనివాస రావు ప్రారంభోత్సవం చేయకుండానే వెనుదిరిగారు. 

ఎర్రచందనం స్మగ్లర్ ఖలీల్ అరెస్టు..

నెల్లూరు : ఎర్రచందనం స్మగ్లర్ ఖలీల్ రెహ్మాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైలో ఖలీల్ ను కలువాయి పోలీసులు అరెస్టు చేశారు. రూ.1.30 కోట్ల విలువైన 70 ఎర్రచందనం దుంగలు, 1100 కిలోల ఎర్రచందనం వస్తువులు, 3 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 

పార్కుల కబ్జాలపై స్పెషల్ ఫోకస్ - జీహెచ్ఎంసీ కమిషనర్..

హైదరాబాద్ : పార్కుల కబ్జాలపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నగరంలో పార్కుల అభివృద్ధికి ప్రత్యేక ప్లాన్ రూపొందిస్తున్నట్లు, పార్కుల అభివృద్ధిపై ప్రతినెల అధికారులతో సమావేశం జరుగుతుందన్నారు. క్లీన్ హైదరాబాద్ కోసం రెడ్ చెత్తబుట్టలను వాడాలని సూచించారు.

 

ప్రారంభ ట్రేడింగ్ లో పుంజుకున్న రూపాయి..

ముంబై : ప్రారంభ ట్రేడింగ్ లో 15 పైసలు రూపాయి పుంజుకుంది. డాలర్ తో పోలిస్తే 15 పైసలు బలపడింది. రూపాయి మారకం విలువ రూ.66.48గా నమోదైంది.

 

గిరిజనుడిని హత్య చేసిన మావోయిస్టులు...

విశాఖపట్టణం : ముంచంగిపుట్టు (మం) కొసంపుట్టు వద్ద ఇన్ ఫార్మర్ నెపంతో గిరిజనుడిని మావోయిస్టులు హత్య చేశారు. 

13:20 - January 5, 2016

చిత్తూరు : టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టులో పనిచేస్తున్న కళాకారులు మళ్లీ ఆందోళన బాట పట్టారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలంటూ గానంతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. టిటిడి దేవస్థానంలో అన్నమాచార్య ప్రాజెక్టులో కొన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్నామని, ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని నెలవారీ జీతాలు ఇవ్వాలని కోరడం జరుగుతోందన్నారు. స్వామి వారి కీర్తలను అన్ని ప్రాంతాల్లో వ్యాపింప చేస్తున్నామని కానీ టిటిడి కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని ఓ కళాకారుడు వాపోయాడు. 450 మంది కళాకారులున్న ఈ చోట మానవత్వంతో నిర్ణయాలు తీసుకోకుండా ధ్యాస లేకుండా టిటిడి ప్రవర్తిస్తోందని సీఐటీయూ నేత పేర్కొన్నారు. 

13:17 - January 5, 2016

వరంగల్ : జిల్లా గణపురం మండలం దుబ్బపల్లిలో ఏర్పాటు చేసిన కేటీపీపీ రెండో యూనిట్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ విద్యుత్ ప్లాంట్ ద్వారా 6 వందల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. తొమ్మిది వందల ఎకరాల్లో ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. రూ.3,400 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును చేపట్టారు.

13:10 - January 5, 2016

విజయవాడ : కల్తీ మద్యం ఘటన జరిగిన తర్వాత తాను పరారీలో ఉన్నమాట అవాస్తవం అని కాంగ్రెస్ పార్టీ నేత మల్లాది విష్ణు అన్నారు. తాను రేపు కోర్టుకు హాజరు అవుతానని చెప్పారు. కృష్ణలంకలో గల స్వర్ణ బార్‌లో కల్తీ మద్యం సేవించి ఐదుగురు ప్రాణాలు విడవగా, మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం విదితమే. ఈ కేసులో మల్లాది విష్ణు తొమ్మిదో నిందితుడిగా ఉన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే మల్లాది విష్ణు అజ్ఞాతంలోకి వెళ్లారు. ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేశారు. కానీ కోర్టు బెయిల్ తిరస్కరించడంతో అజ్ఞాతం వీడారు. కొన్ని కార్యక్రమాల దృష్ట్యా తాను వెళ్లాను తప్ప ఎక్కడికీ పారిపోలేదని చెప్పారు. రేపు కోర్టు విచారణకు హాజరవుతానని చెప్పారు. కోర్టుకు వెళ్లివచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడుతానని మల్లాది విష్ణు పేర్కొన్నారు. 

కాకతీయ మెడికల్ కాలేజీ హాస్టల్ లో విద్యార్థిని ఆత్మహత్య..

వరంగల్ : కాకతీయ మెడికల్ కాలేజీ హాస్టల్ లో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న చెందిన మౌనిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మౌనిక స్వస్థల అదిలాబాద్.  

జీహెచ్ఎంసీ ఎన్నికల గడువుపై హైకోర్టులో పిటిషన్..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల గడువు తగ్గించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు విధించిన 31 రోజుల గడువును మరో 20 రోజులు పొడిగించాలని శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. 

కేటీపీపీ పైలాన్ ను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్..

మ: జిల్లా గణపురం మండలం దుబ్బపల్లిలో ఏర్పాటు చేసిన కేటీపీపీ రెండో యూనిట్‌ను ఆయన జాతికి అంకితం చేశారు. ఈమేరకు ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు. 

బాబుతో రాజధాని అభివృద్ధి కమిటీ భేటీ..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో రాజధాని అభివృద్ధి కమిటీ సమావేశమైంది. మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్, ఎంపీ గల్లా జయదేవ్, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. 

సుప్రీం మాజీ చీఫ్ జస్టిస్ కపాడియా కన్నుమూత..

ముంబై : సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.హెచ్.కపాడియా కన్నుమూశారు. ముంబై అంధేరిలోని కోకిలాబెన్ ధీరూభాయి అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. 

12:21 - January 5, 2016

మెదక్ : తెలంగాణ రాష్ట్రంలో రైతుల బలవన్మరణాలు ఆగడం లేదు. నిజామాబాద్ జిల్లా బోధన్ పాన్ గల్లికి చెందిన రైతు షేక్ నజీమ్ ఫాషా ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకటిన్నర ఎకరం పొలంతో పాటు పక్కనే ఉన్న రెండు ఎకరాలను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. వర్షాభావ పరిస్థితులు..భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో నీరు లేక పంట మొత్తం ఎండిపోయింది. అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో ఫాషా తన పొలంలోనే ఉరి వేసుకుని తుదిశ్వాస విడిచాడు. దీనితో ఫాషా కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

12:11 - January 5, 2016

విజయవాడ : ఏపీ రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపిన కల్తీ మద్యం కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అజ్ఞాతం వీడారు. స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్ సెల్లార్ లో ఉన్న బార్ లో కల్తీ మద్యం సేవించి ఆరుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మొత్తం 9 మంది నిందితులను పోలీసులు తేల్చారు. అందులో 7గురు వ్యక్తులను ఇప్పటికే అరెస్టు చేశారు. ఘటన జరిగిన అనంతరం మల్లాది విష్ణు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇతడి కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే మల్లాది విష్ణు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ కోర్టు బెయిల్ నిరాకరించింది. సిట్ అధికారుల ఎదుట లొంగిపోయి విచారణకు సహకరించాలని సూచించింది. దీనితో మంగళవారం ఉదయం విజయవాడలో ఆయన స్వగృహానికి చేరుకున్నారు. పుణ్యక్షేత్రాలకు, ఇతర కార్యక్రమాలకు వెళ్లినట్లు, తాను ఎక్కడకు పారిపోలేదని విష్ణు పేర్కొంటున్నారు. రేపు సిట్ అధికారుల ఎదుట విష్ణు లొంగిపోయే అవకాశం ఉంది. సెల్లార్ లో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ విష్ణు బంధువుల పేరిట ఉందని పోలీసులు నిర్ధారించారు. దీనిపై ఇప్పటికే టౌన్ ప్లానింగ్, ఇతర అధికారులను విచారించారు. మల్లాది విష్ణు దీనికి బాధ్యుడని ఎక్సైజ్ శాఖ మంత్రి గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. విచారణలో ఎలాంటి సంగతులు బయటపడుతాయో వేచి చూడాలి. 

ఏపీ శాసనసభ నైతిక విలువల కమిటీ సమావేశం..

చిత్తూరు : పద్మావతి అతిథి గృహంలో ఏపీ శాసనసభ నైతిక విలువల కమిటీ సమావేశం జరిగింది. స్పీకర్ కోడెల, మండలి డిప్యూటి స్పీకర్ లు హాజరయ్యారు. శాసనసభలో నైతిక విలువల పాటింపు అంశంపై మేధావులు, ప్రజా సంఘాల నుండి కమిటీ సభ్యులు వినతిపత్రాలు, అభిప్రాయ సేకరణ చేపట్టారు. 

పఠాన్ కోట్ ఘటనపై కాంగ్రెస్ స్పందన..

ఢిల్లీ : పఠాన్ కోట్ జరిగిన ఉగ్రదాడిపై కాంగ్రెస్ స్పందించింది. ఈ దాడి దేశం మీద జరిగిన దాడిగా భావిస్తున్నట్లు పేర్కొంది. భారత్, పాక్ దేశాలు కలిసి ఉగ్రవాదంపై పోరాడాలని, ప్రధాని మోడీ భారత ప్రజలకు విశ్వాసం కల్పించాలని సూచించింది. 

మామిళ్లమందలో టాస్క్ ఫోర్స్ కూంబింగ్...

తిరుమల : మామిళ్లమందలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. 9 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరివద్ద 9 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

జాతీయ భద్రతపై రాజ్ నాథ్ సమీక్ష..

ఢిల్లీ : జాతీయ భద్రతపై హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ భద్రత సలహాదారు దోవల్ హాజరయ్యారు.

 

కాసేపట్లో మీడియా ఎదుట మల్లాది విష్ణు..

విజయవాడ : మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అజ్ఞాతం వీడారు. విజయవాడలోని తన ఇంటికి చేరుకున్నారు. కల్తీ మద్యం కేసులో విష్ణు 9వ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. కోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో ఆయన అజ్ఞాతం వీడారు. కాసేపట్లో ఆయన మీడియా ఎదుట మాట్లాడనున్నారు.

 

గులాబీ వనం ప్రారంభం..

హైదరాబాద్ : సంజీవయ్యనగర్ పార్కులో గులాబీ వనాన్ని డిప్యూటి సీఎం మహమూద్ ఆలీ ప్రారంభించారు. ఈకార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, తలసానిలు పాల్గొన్నారు. 

ఆయుధగారం నిర్మాణానికి ఏపీ డీజీపీ శంకుస్థాపన..

కర్నూలు : రెండో బెటాలియన్ లో ఆయుధగారం నిర్మాణానికి ఏపీ డీజీపీ రాముడు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గిందని, నేరాలు తగ్గడంతో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎర్రచందనం దొంగలను అరికట్టడానికి చట్టంలో సవరణలు చేయాలని పేర్కొన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటును పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

 

గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు...

ఢిల్లీ : పటేళ్ల నాయకుడు హర్థిక్ పటేల్ మీద దేశద్రోహం కేసుపై గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 9వ తేదీలోగా పటేల్ పై చార్జిషీట్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

9వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..

రాజమండ్రి : మారేడుపల్లి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ లో 9వ తరగతి విద్యార్థి శంకర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సహ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తుండడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. 

11:36 - January 5, 2016

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్‌ అభ్యర్ధి రేసులో ముందున్న డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి నోరు జారారు. ముస్లింలపై గతంలో చేసిన వివాదాస్పద వాఖ్యలను మళ్లీ వినిపించారు. ప్రచారంలో భాగంగా విడుదల చేసిన మొదటి టీవీ ప్రకటనలో ఈ కాంట్రవర్సీ కామెంట్లు చేశారు. ముస్లింలను అమెరికాలోకి రాకుండా అడ్డుకోవాలని గతంలో కామెంట్‌ చేసిన డోనాల్డ్‌ ట్రంప్ ఆ వాఖ్యలను రిపీట్‌ చేశారు. అందుకు ఈ సారి టీవీ ప్రకటనను వాడుకున్నారు. అధ్యక్ష ఎన్నికల కోసం రిపబ్లికన్‌ అభ్యర్థి రేసులో ట్రంప్‌ ముందంజలో ఉన్నారు. ప్రచారంలో భాగంగా ఇంతవరకూ వివిధ వేదికల మీద మాట్లాడుతూ వచ్చిన ట్రంప్‌...తన మొదటి టీవీ ప్రకటన విడుదల చేశారు.

టివిల్లో ప్రకటనలు..
తాన అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఎస్ఐఎస్ తల నరికేస్తానని.. వారి చమురును ఆధీనంలోకి తీసుకుంటానంటూ డొనాల్డ్ ట్రంప్ టీవీ ప్రకటనలో హామీలిచ్చారు. అమెరికాలోకి ముస్లింలు రాకుండా తాత్కాలిక నిషేధం విధించాలని, దేశంలో ఏం జరుగుతున్నదో స్పష్టంగా తెలుసుకొనే వరకు ఇది కొనసాగాలని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్ ఫొటోలతో ఈ టీవీ ప్రకటన మొదలవుతుంది. యుద్ధరంగంలో అమెరికా క్రూయిజ్ క్షిపణిని పేల్చడం, కాలిఫోర్నియాలో ఉగ్రవాద దాడికి పాల్పడిన నిందితుల ఫొటోలు, అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో వలస దృశ్యాలు, ఇస్లామిక్ స్టేట్ దృశ్యాలు ఈ టీవీ యాడ్‌లో ఉన్నాయి. మెక్సికోలోని దక్షిణ సరిహద్దుల్లో గోడ నిర్మిస్తామని, దానితో అక్రమ వలసను అడ్డుకుంటామని ట్రంప్‌ ప్రకటనలో చెప్పుకొచ్చారు. అమెరికాను మళ్లీ గొప్పదిగా మారుస్తా నంటూ ట్రంప్‌ ఈ ప్రకటనను ముగించారు. మొత్తం మీద ఎన్నికల్లో గెలుపు కోసం ట్రంప్‌ చూపిస్తున్న దూకుడు ఏ పరిణామాలకు దారి తీస్తుందో.. అమెరికన్లు ఈ ట్రెండ్‌ను లైక్‌ చేస్తారో లేదో వేచి చూడాలి.

11:33 - January 5, 2016

కృష్ణా : జిల్లా కంకిపాడు మండలం కుందేరులో అక్రమ మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అధికార పార్టీ నేత పేరు చెప్పి.. కొందరు అక్రమంగా మట్టి తవ్వుతున్నారు. దీంతో ప్రభుత్వానికి రావల్సిన లక్షలాది రూపాయల ఆదాయానికి గండిపడుతోంది. గ్రామానికి చెందిన పంచాయితీ చెరువు మట్టి తరలింపుతో పాటు గట్లను బలపరిచేందుకు బహిరంగ వేలం నిర్వహించారు. ఈ పనిని 53లక్షలకు దక్కించుకున్నాడో కాంట్రాక్టర్‌. అతను బోడె ప్రసాద్‌ పేరు చెప్పి మైనింగ్‌, సీఆర్‌డీఏ అనుమతులు లేకుండా యధేచ్ఛగా అక్రమ తవ్వకాలకు తెగబడ్డాడు. నిబంధనలకు విరుద్ధంగా 10వేల క్యూబిక్‌ మీటర్ల మట్టిని అదనంగా తరలించనట్లు ఆరోపణలొచ్చాయి.  ఈ విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధి గ్రామ పంచాయతీ కార్యదర్శి శేఖర్‌ను వివరణ కోరారు. దీంతో ఆగ్రహించిన కార్యదర్శి మీడియా ప్రతినిధిని గదిలో నిర్భందించారు. ఇతర విలేఖరుల జోక్యంతో అతను బయటకు వచ్చాడు.. ఇదేమని ప్రశ్నించిన మీడియాపై గ్రామపంచాయతీ కార్యదర్శి దౌర్జన్యానికి దిగారు. మట్టి అక్రమ తవ్వకందారులకు పంచాయతీ కార్యదర్శి తోడ్పాటునందించాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాదాయానికి భారీగా గండి పడిందని.. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

11:30 - January 5, 2016

చిత్తూరు : ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావు ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్‌ సమయంలో స్వామి వారిని దర్శించుకున్న కోడెలకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రజల ఆకాంక్షలకు అసెంబ్లీ అద్దం పట్టాలని కోడెల అన్నారు. ప్రచారానికే టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమం నిర్వహిస్తోందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఇవాళ ఉదయం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా ప్రజల సమస్యలకు పరిష్కారం లభించడం లేదని ఆమె అన్నారు. ఎక్కడా లేని విధంగా పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. అప్పులిచ్చిన వారు సెక్స్ రాకెట్ లో ఇరికిపిస్తుంటే..మహిళల జీవితాలు బలైపోతున్న సమయంలో తమను అసెంబ్లీలో డైవెర్ట్ చేసే విధంగా ప్రయత్నించారని తెలిపారు. 

11:28 - January 5, 2016

కరీంనగర్ : సింగరేణి సంస్థ తీసుకుంటున్న నిర్ణయాల దెబ్బకు ఊళ్లకు ఊళ్లు ఖాళీ అవుతున్నాయి. భవిష్యత్ అవసరాం కోసం ఊళ్లకు ఊళ్లు కొనేస్తున్నారంటున్నారు గ్రామస్థులు. దీనిని ఆయా గ్రామాలు వ్యతికిస్తే పోలీసులతో బెదిరిస్తున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు గ్రామస్థులు. కరీంనగర్ జిల్లా ముత్తారం మండలం బుధవారం పేట గ్రామపంచాయతీలోని రామయ్యపల్లి,రాజాపూర్ గ్రామస్థుల వ్యధ ఇది. రామయ్యపల్లి, రాజాపూర్ గ్రామాలు కనుమరుగవుతాయనే భయంతో ఎక్కడికెళ్లాళి ఎలా బ్రతకాలి అనే ప్రశ్నలు స్థానికులను కలిచివేస్తున్నాయి. రెండు పంటలు పండే వ్యవసాయ భూములతో సంతోషంగా గడుపుతున్న గ్రామాల్లో సింగరేణి చిచ్చుపెడుతోందంటున్నారు గ్రామస్థులు. దాదాపు రెండు ఊళ్లలో కలిపి 1300 కుటుంబాలు ఉన్నాయి. బొగ్గు వెలికితీత భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సింగరేణి చుట్టుప్రక్కల గ్రామాలను కొనేస్తోంది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు చిన్నాభిన్నం కావడం ఖాయమని గ్రామస్థులు ఆవేదన వ్యక్దం చేస్తున్నారు.

మట్టిలో కలిసిపోవడం ఖాయం..
రాజాపూర్ గ్రామంలో సింగరేణి అధికారులు తాజాగా ఇళ్లకు నెంబర్లు వేసే కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ఊళ్లోకి వచ్చేముందు గ్రామపెద్దలకు సమాచారం అందించాలని, రెవెన్యూ, సింగరేణి అధికారులు గ్రామస్థులతో చర్చించిన తర్వాతే మద్దతు ధరలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. పోలీసులు సింగరేణికి వత్తాసు పలుకుతూ తమకు రొడ్డునపడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయంగా ధరలు నిర్ణయించిన తర్వాతనే నెంబర్లు వేసే కార్యక్రమం జరపాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్థులు. సింగరేణి అవసరాల కోసమో.. ఓపెన్ కాస్ట్ ల కోసమో.. అసరాలు తీరాక లీజు రద్దవడమే కారణమేదైనా కాని ఊళ్లకు ఊళ్లు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది కరీంనగర్ జిల్లాలో. సింగరేణి అనాలోచిత నిర్ణయాలతో భవిష్యత్ లో పరిసర ప్రాంత గ్రామాలు మట్టిలో కలిసిపోవడం ఖాయం. 

11:25 - January 5, 2016

విశాఖపట్టణం : అరకు వైసీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీ తీర్థం పుచ్చుకొనేందుకు రెడీ అయ్యారనే వార్తలు పొలిటికల్‌ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతానికి ఆయన ఎటూ తేల్చుకోలేకపోతున్నారట. ఐనా అధికార పార్టీవైపే కిడారి మనసు లాగుతుందనే ప్రచారం జరుగుతోంది. గురువుగారు టీడీపీలోకి జంప్‌ అవుతుండడంతో తాను కూడా అదే బాటలో వెళ్లడమే బెటర్‌ అన్న ఫీలింగ్‌ సర్వేశ్వరరరావు మైండ్‌లో ఉందని పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. సర్వేశ్వరరావు కొణతాల రామకృష్ణ శిష్యుడుగా కొనసాగుతున్నారు. కొణతాల వైసీపీకి హ్యాండ్‌ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. సైకిల్‌ ఎక్కేందుకు ముహూర్తం కూడా ఖరారయ్యింది. కొణతాలతో పాటు మరికొంతమంది టీడీపీలోకి వెళతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. జెడ్‌పీ మాజీ ఛైర్మన్‌ వంజంగి కాంతమ్మ ఇప్పటికే అధికార పార్టీలోకి జంప్‌ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీతో పాటు సర్వేశ్వరరావు కూడా గురువుగారి బాటలోనే వెళతారనే టాక్‌ విపిస్తోంది.

లాభనష్టాల అంచనా..
పార్టీ మారుతారనే వార్తలను సర్వేశ్వరరావు ఖండించడం లేదు. ప్రస్తుతానికి కిడారి కన్‌ఫ్యూజన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీలోకి వెళితే కలిగే లాభ నష్టాలను ఆయన బేరీజు వేసుకుంటున్నారని సమాచారం. బాక్సైట్‌ తవ్వకాల కోసం గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలకు తాయిలాలు ఇస్తూ పార్టీలోకి లాక్కొంటున్నారని వైసీపీ విమర్శిస్తోంది. మరోపక్క మావోయిస్టులు కూడా టీడీపీ నేతల్ని తరిమికొట్టాలని పిలుపు ఇచ్చారు.ఈ నేపథ్యంలో అధికార పార్టీ తీర్థంపై కిడారి కొంత సంశయిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కిడారి సర్వేశ్వరరావు పార్టీ మార్పుపై మరికొద్ది రోజుల్లో క్లారిటీ రావచ్చు. 

టిడిపి కార్యకర్త దారుణ హత్య..

కర్నూలు : బనగాపల్లె (మం) రామకృష్ణాపురంలో టిడిపి కార్యకర్త నగేష్ ను దండగులు దారుణ హత్య చేశారు. నగేష్ గతంలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 

నిలిచిన భద్రాచలం - కాజిపేట ప్యాసింజర్..

ఖమ్మం : కారేపల్లి (మం) గాంధీపురం వద్ద సాంకేతిక లోపంతో భద్రాచలం - కాజిపేట ప్యాసింజర్ నిలిచిపోయింది. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

మంథనిలో స్కూల్ ఆటో బోల్తా..

కరీంనగర్ : మంథని పెట్రోల్ బంక్ సమీపంలో అదుపుతప్పిన స్కూల్ ఆటో బోల్తా కొట్టింది. 8 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 

వడమాలపేటలో అటవీ అధికారుల తనిఖీలు..

తిరుమల : వడమాలపేట సమీపంలో అటవీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కల్వర్టు కింద నిల్వఉంచిన 29 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

మీడియాతో ఎస్పీ సల్వీందర్ సింగ్..

పంజాబ్ : తాను ఎస్పీననే విషయం ఉగ్రవాదులకు తెలియదని ఎస్పీ సల్వీందర్ సింగ్ పేర్కొన్నారు. కిడ్నాప్ ఘటనకు సంబంధించిన వివరానలు ఆయన మీడియాకు తెలియచేశారు. ఆలయానికి వెళుతుండగా నలుగైదుగురు వ్యక్తులు కారును ఆపారని, ఏకే 47 చూపి తన కాళ్లు, చేతులు కట్టేశారని పేర్కొన్నారు. ఆ సమయంలో తమ వద్ద ఎలాంటి ఆయుధాలు లేవని తెలిపారు. ఎస్పీని అపహరించిన అనంతరం పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడి చేసి బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. 

పఠాన్ కోట్..కొనసాగుతున్న కూంబింగ్..

పంజాబ్ : పఠాన్ కోట్ వైమానిక స్థావరంలోకి చొరబడిన ఉగ్రవాదు కోసం నాలుగో రోజు కూడా వేట కొనసాగుతోంది. సోమవారం రాత్రి వరకు నిర్వహించిన ఆపరేషన్ లో ఆరుగురు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు వెల్లడించారు. 

10:30 - January 5, 2016

ఢిల్లీ : పంజాబ్‌లో పఠాన్‌కోట్‌ ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్లకు అంత్యక్రియలు నిర్వహించారు. అధికారులు, నేతలు, ప్రజలు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఓవైపు దేశం కోసం జీవితాన్ని అర్పించారన్న గర్వం, మరోవైపు తమ వాడిని కోల్పోయామన్న దుఃఖంతో కుటుంబ సభ్యులు అంతిమ వీడ్కోలు పలికారు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో అమరుడైన లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ కుమార్ మృతదేహాన్ని ఉదయం బెంగళూరులోని ఆయన నివాసానికి తీసుకు వచ్చారు. అంత్యక్రియల కోసం అక్కడి నుంచి కేరళలోని పాలక్కడ్‌కు తరలించారు.

కేరళలోని పాలక్కడ్ లో నివాసం..
కేరళలోని పాలక్కడ్‌ జిల్లాకు చెందిన 32 ఏళ్ల నిరంజన్‌కుమార్‌ 2004లో సైన్యంలో చేరారు. ఎస్‌ఎస్‌జీలో చేరడానికి ముందు మద్రాస్‌ ఇంజినీరింగ్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఆర్మీలో పనిచేశారు. పేలుడు పదార్థాలు నిర్వీర్యం చేయడంలో నిపుణుడైన నిరంజన్‌ - ఆ విభాగం అధికారిగా ఇటీవలే పదోన్నతి పొందారు. పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంలో ఉగ్రవాదులు విసిరిన గ్రెనేడ్‌ను నిర్వీర్యం చేస్తుండగా అది పేలి దుర్మరణం చెందారు. ఆయన భార్య డాక్టర్‌ రాధిక డెంటిస్టుగా పనిచేస్తున్నారు. ఆయనకు రెండేళ్ల కూతురుంది. నిరంజన్‌కు చిన్నప్పటి నుంచే ఆర్మీలో చేరాలన్న తపన ఉండేదని తండ్రి ఈకే సివరంజన్‌ పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కల్నల్ నిరంజన్‌కు సైనిక అధికారులు, విద్యార్థులు, రాజకీయనేతలు దొడ్డబొమ్మనసంద్రలోని ఆయన ఇంటివద్ద ఘనంగా నివాళులర్పించారు. నిరంజన్‌ అమర్ రహే అంటూ జనం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

అంబాలలో గురు సేవక్ సింగ్ కు అంత్యక్రియలు..
పఠాన్‌కోట్‌లో భారత వైమానిక దళ ఆస్తులను రక్షించుకొనేందుకు ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలర్పించిన గరుడ్ కమెండో గురుసేవక్ సింగ్‌కు పంజాబ్‌లోని అంబాలాలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. తన కుమారుడు దేశం కోసం ప్రాణాలర్పించడం తనకు గర్వంగా ఉందని గురుసేవక్‌సింగ్ తండ్రి సచ్చాసింగ్ పేర్కొన్నారు. మరోవైపు కుమారుడి మృతి బాధ కలిగించిందన్నారు. నా పెద్ద కొడుకు కూడా సైన్యంలో ఉంటూ దేశానికి సేవ చేస్తున్నాడని గద్గద స్వరంతోఅన్నారు. సైన్యాధికారి అయిన తన పెద్దకుమారుని ద్వారా చిన్నకుమారుని మరణవార్త తెలిసిందని సచ్చాసింగ్ చెప్పారు. తన కుమారుడు మొదటి ప్రయత్నంలోనే ఎయిర్‌ఫోర్స్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడని తెలిపారు. దేశ సేవలో అమరుడైన గురుసేవక్‌కు 45 రోజుల క్రితమే వివాహం జరిగింది. ఆయన మరణవార్తతో అంబాలానగర సమీపంలోని గర్నాలా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ గురుసేవక్ కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. 

10:26 - January 5, 2016

హైదరాబాద్ : పాతబస్తీలో అక్రమ వడ్డీ వ్యాపారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మొత్తం 56 మందిని అదుపులోకి తీసుకున్నారు. చిరు వ్యాపారును లక్ష్యంగా చేసుకొని లెక్కకు మించిన వడ్డీలకు అప్పులిస్తున్నారని సౌత్‌ జోన్‌ డీసీపీ సత్యనారాయణ చెప్పారు. ఏటీఎం, రేషన్‌కార్డ్‌, స్కూటర్‌, బైక్‌ ఏదైనా సరే తాకట్టుపెట్టుకొని అప్పులిచ్చేస్తున్నారని, ఆ తరువాత 10 నుంచి 20 శాతం వడ్డీలు వసూలు చేస్తున్నారని చెప్పారు. అసలు, వడ్డీ తీర్చకుంటే ఆస్తులను సైతం బలవంతంగా రాయించుకుంటున్నారని అన్నారు. సౌత్‌జోన్‌లో వడ్డీ వ్యాపారుల ఆగడాలు ఎక్కువ కావడంతో వారిపై దృష్టిపెట్టామన్నారు. అక్రమ వడ్డీలకు పాల్పడుతున్న వడ్డీ వ్యాపారులపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని డీసీపీ సత్యనారాయణ హెచ్చరించారు.

10:24 - January 5, 2016

హైదరాబాద్ : నగరాలు, పట్టణాల్లో.. రియల్‌ వ్యాపారులేకాదు... సామాన్యులకూ ఉపయోగపడేలా సరి కొత్త నిర్ణయాలను తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.. ఇందుకోసం మున్సిపల్‌ చట్టంలో 23 మార్పులు చేసింది.. తాజా ఉత్తర్వులతో అపార్ట్‌మెంట్ల నిర్మాణం సులభతరం కానుంది. అనుమతుల కోసం చెప్పులరిగేలా తిరిగే బాధలనుంచి రియల్‌ వ్యాపారులకు ఉపశమనం కలిగించింది టీ సర్కారు. అనుమతులనుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ వరకూ అన్నీ ఆన్‌లైన్‌లోనే జరిగేలా కొత్త విధానాన్ని అందుబాటులోకి తేనుంది. ఈ పనులకోసం రోజులకొద్దీ సమయం వృధా కాకుండా చర్యలు చేపట్టింది. దరఖాస్తు చేసుకున్న 15రోజుల్లో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించింది. ఆలస్యంచేస్తే సంబంధిత అధికారులు రోజుకు 5వందల రూపాయలు జరిమానా కట్టాలని ఆదేశించింది.

సైబరాబాద్ కు వరాలు..
అలాగే బహుళ అంతస్తుల నిర్మాణంలో కామన్‌ స్పేస్‌ తగ్గించింది సర్కారు. నాలుగు కేటగిరీలుగా ఉన్న అంతస్తుల విభాగంలోనూ మార్పులు తెచ్చింది. 17 అంతస్తులు, అంతకన్నా ఎక్కువ అంటూ రెండు విభాగాలు చేసింది. హైదరాబాదే కాదు.. సైబరాబాద్‌కు కూడా వరాలు ప్రకటించింది ప్రభుత్వం. సైబరాబాద్‌ పరిధిలో అభివృద్ధి పన్నును రద్దు చేసింది. జీహెచ్‌ఎంసీకి బెటర్‌మెంట్ ఫీజు చెల్లిస్తున్నారని డబుల్‌ ట్యాక్స్ అవసరంలేదని స్పష్టం చేసింది. నిర్మాణాలు చేపట్టిన స్థలాల్లో భూపన్నులు వసూలు చేయొద్దని నిర్ణయించింది. అక్కడ ఆరేళ్లలో నిర్మాణాలు పూర్తిచేయాలని ఆదేశించింది.

సంతోషంలో రియల్ వ్యాపారులు...
రోడ్డు విస్తరణలో స్థలాన్ని కోల్పోయినవారికి భవన నిర్మాణంలో అదనపు అంతస్థులు కట్టుకునేందుకు అనుమతి ఇచ్చింది. అవుటర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలో నిర్మించే భవనాలకు అభివృద్ధి పన్నులు 50 శాతం తగ్గించింది. పాతబస్తీలాంటి స్లమ్‌ ఏరియాలలో చిన్న చిన్న ప్లాట్లను కలిపి పెద్ద ప్లాట్లుగా మార్చే అవకాశం కల్పించింది. గేటెడ్‌ కమ్యూనిటీకికూడా వెసులుబాటు ఇచ్చింది. భవనాల ఎత్తు లెక్కింపులో పార్కింగ్‌ ఫ్లోర్లకు మినహాయింపు ఇచ్చింది. భవన నిర్మాణ నిబంధనలను అతిక్రమించకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయించింది. సర్కారు తాజా నిర్ణయాలతో రియల్‌ వ్యాపారులు సంతోషంలో మునిగిపోయారు.

10:21 - January 5, 2016

విశాఖపట్టణం : విశాఖ ఉత్సవ్‌నూ... అవినీతి సేద్యానికి వాడుకున్నారు.. కొందరు ప్రబుద్ధులు. ఈ ఉత్సవం పేరు చెప్పి... అందినకాడికి సొమ్ము వెనకేసుకున్నారు. నిర్వాహకులను నమ్మి కార్యక్రమంలో పాల్గొన్న క్రీడాకారులను నిట్టనిలువునా ముంచేశారు. విశాఖ ఉత్సవ్‌ సందర్భంగా.. నిర్వహించిన 5కె రన్‌, 10కె రన్‌ కార్యక్రమాలను అవినీతి బాటపై పరుగు పెట్టించారు. విశాఖ ఉత్సవ్‌ సందర్భంగా.. 10కె రన్‌ నిర్వహిస్తున్నట్లు కొందరు పెద్దలు ఊదరగొట్టారు. పార్టిసిపెంట్స్‌కి బహుమతులు ఇస్తామంటూ నమ్మబలికారు. క్రీడాకారుల నుంచి వందల్లో వసూళ్లు చేశారు. కార్యక్రమానికి మంత్రి గంటా శ్రీనివాస్‌తో బూస్టప్‌ చేయించారు. పెద్ద ఎత్తున స్పాన్సర్లనూ సమకూర్చుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్‌ల బొమ్మలతో ఫ్లెక్సీలను నగరమంతా అలంకరించేశారు. చివరికి.. వసూలు చేసిన మొత్తాన్ని నిర్వాహకులు దిగమింగేశారు.. విజేతలకు మొండిచేయే చూపారు.

కలెక్టరేట్ ఎదుట విజేతల ధర్నా..
విశాఖ ఉత్సవ్‌ సందర్భంగా రన్‌ నిర్వహిస్తున్నట్లు అధికారులూ, మంత్రులు ప్రకటించారు. కానీ బాధ్యతను అనామకులకు అప్పగించారు. కానీ నిర్వాహకుల ఎంపిక వెనుక మంత్రి గంటా పీఎస్‌.. మరికొందరు ప్రబుద్ధుల పాత్ర ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రి పీఎస్‌.. ఈ కార్యక్రమానికి స్పాన్సర్‌లను ఎలా పొందాలో.. క్రీడాకారుల నుంచి ఎలా... ఎంత మేర డబ్బు వసూలు చేయాలో అనుక్షణం నిర్వాహకులకు గైడ్‌ చేసినట్లు చెబుతున్నారు. అనుకున్నట్లే భారీగా సమకూరిన నిధులను ముందుగా అనుకున్న వాటాల మేరకు పంచుకున్నట్లు సమాచారం.
కార్యక్రమంలో పాల్గొనే వారి నుంచి ప్రవేశ రుసుమునూ వసూలు చేశారు నిర్వాహకులు. చివరికి పోటీలో పాల్గొనేందుకు గిరిజన ప్రాంతాల నుంచి వచ్చి... విజేతలుగా నిలిచిన వారికీ ప్రైజ్‌ మనీ ఇవ్వకుండా చెక్కేశారు. దీంతో విజేతలు కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. టెన్‌-కె రన్‌ నిర్వహణ కుంబకోణం వెలుగులోకి రావడంతో.. గంటా అనుచరుడిగా చెప్పుకు తిరిగే గంటాస్వామి, మరొక వ్యక్తీ బాహాటంగానే.. తప్పును ఒకరిపై మరొకరు నెట్టుకునే ప్రయత్నాలు చేశారు.

సమగ్ర విచారణ జరపాలి..
మొత్తానికి టెన్‌-కె రన్‌ కార్యక్రమాన్ని విశాఖ ఉత్సవ్‌లో భాగంగా నిర్వహించినదిగా చూపి.. అక్కడ కూడా బిల్లులు వసూలు చేసుకునేందుకు నిర్వాహకులు ప్లాన్‌ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా రన్‌ నిర్వహణకు.. వే-ఫౌండేషన్‌ వారికి ఎలాంటి అనుమతీ లేకపోయినా.. అదే ఫౌండేషన్‌ పేరిట సర్టిఫికెట్లు ఎలా ఇచ్చారనేది అర్థం కావడం లేదు. ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు మంత్రి గంటా శ్రీనివాసరావు నిరాకరించారు. మొత్తానికి ఎలెక్ట్రానిక్‌ మీడియా చొరవతో.. నిర్వాహకులు దిగి వచ్చి... విజేతలకు ప్రైజ్‌ మనీ చెక్కులను అందజేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని క్రీడాకారులు కోరుతున్నారు. 

విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టు..

వరంగల్ : సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా నిరసన వ్యక్తం చేస్తారనే సమాచారంతో ముందస్తుగా విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ జిల్లా భూపాలపల్లి కేటీపీపీలో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కేసీఆర్ ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. 

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ స్పీకర్..

చిత్తూరు : ఏపీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న సభాపతికి టిటిడి ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, జేఈవో శ్రీనివాసరాజు తదితరులు స్వాగతం పలికారు. 

09:12 - January 5, 2016

ఆదిలాబాద్ : జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు వంతెన పై పడిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే జిల్లాలోని కాగజ్ నగర్ నుండి ఓ ఆర్టీసీ బస్సు బెజ్జూరుకు వెళుతోంది. 30 మంది ప్రయాణీకులతో వెళుతున్న ఈ బస్సు నామానగర్ వద్ద ఎర్రవాగు వంతెన పై నుండి కిందకు పడిపోయింది. దీనితో బస్సులో ఉన్న 18 మందికి గాయాలయ్యాయి. తీవ్రగాయాలైన ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగజ్ నగర్ లో ప్రైవేటు ఆసుపత్రిలో క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. బస్సు ఎలా ప్రమాదానికి గురైందో తెలియరాలేదు. 

కల్నల్ నిరంజన్ భౌతికకాయానికి చాందీ నివాళులు..

కేరళ : పఠాన్ కోట్ లో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో వీరమరణం పొందిన లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ భౌతికకాయానికి ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ ఘనంగా నివాళులర్పించారు.

08:38 - January 5, 2016

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పిల్లలకు మంచి విద్యనందించాలని ది హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అందరూ సిగ్గుపడేలా ఉందని, అసలు కొన్నింటిని పాఠశాలలని కూడా ఎలా పిలవాలో అర్థం కాకుండా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అధికారులకు టీచర్ల బదిలీలపై ఉన్న శ్రద్ధ విద్యార్థుల ప్రయోజనాలపై ఉండడం లేదని మండిపడింది. ప్రభుత్వ పాఠశాలల దుస్థితి మారాలంటే అధికారుల పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్చాలని... అప్పుడే వారికి సమస్య అర్థమవుతుందని పేర్కొంది. ఈ అంశంతో పాటు ఇతర అంశాలపై ప్రొ.నాగేశ్వర్ విశ్లేషించారు. ఆయన మాటల్లోనే…

పోస్టులు ఖాళీగా ఉంటే విద్యావ్యవస్థ ఎలా మార్పు వస్తుంది ? 
''ప్రభుత్వ పాఠశాలలు మెరుగు కావాలి. వ్యవస్థ లోపానికి తమనెందుకు బలి చేస్తారని పిల్లలు ప్రశ్నిస్తారు. ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు ప్రభుత్వ పాఠశాలలో చదివితే మార్పు వస్తుందని భావిస్తుంటారు. మరోవైపు ఎక్కడ మెరుగైన సేవలందుతాయా అని ప్రజలు చూస్తుంటారు. ప్రభుత్వ ఆసుపత్రులు..స్కూల్స్ వచ్చేవరకు ప్రైవేటు వైపు చూస్తున్నారు. పోరాటం పరిస్థితులపై ఉండాలి. పాఠశాలలపై పర్యవేక్షణ వ్యవస్థ లేదు. ఎంఈవోల నియామకం ఇంతవరకు లేదు. కనీస సదుపాయాలు లేవు. విద్యాహక్కు చట్టం అమలైందా ? కొన్ని స్కూల్స్ లో ఇప్పటికీ పుస్తకాలు రాలేదు. 15వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలుంటే విద్యావ్యవస్థ ఎలా మార్పు చెందుతుంది. విద్యావాలంటీర్లు..ఉపాధ్యాయులు లేరు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఉదయం అల్పాహారం..మధ్యాహ్నం భోజనం పెట్టి చదువు చెప్పించాలి. అమెరికాలో ప్రభుత్వ పాఠశాలలు అత్యద్భుతంగా ఉంటాయి. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీని టీఆర్ఎస్ టార్గెట్ చేస్తుంది. అనంతరం పరిస్థితి సద్దుమణుగుతుంది. గ్రేటర్ ఎన్నికల తరువాత బీజేపీని టీఆర్ఎస్ టార్గెట్ చేయదు. మెదక్ ఉప ఎన్నికప్పుడు చూశాం. వరంగల్ ఉప ఎన్నికల్లో మళ్లీ గొడవ. తరువాత కామ్''.. అని నాగేశ్వర్ పేర్కొన్నారు. 

08:13 - January 5, 2016

హైదరాబాద్ : సరూర్ నగర్ పరిధిలోని కమలానగర్ లో తుకారంగేట్ డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్ గా పనిచేస్తున్న అర్జున్ కుమార్తె యువతి అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. కమలానగర్ లో అర్జున్ కుటుంబం నివాసం ఉంటోంది. కుమార్తె చందన నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మంగళవారం ఉదయం ఇంటి గుమ్మం ఎదుట చందన రక్తపు మడుగులో ఉండడం ఇతరులు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని అర్జున్ కు తెలిపారు. దీనితో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించారు. బిల్డింగ్ లోని రెండో అంతస్తులో నుండి దూకి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదవశాత్తు పడిందా ? ఆత్మహత్య చేసుకుందా ? అనే కారణాలు తెలియరాలేదు.

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ...

చిత్తూరు : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ తగ్గింది. వెంకన్న స్వామి దర్శనానికి భక్తులు 2 కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.

కాగజ్ నగర్ లో ఆర్టీసీ బస్సు బోల్తా…

ఆదిలాబాద్ : కాగజ్ నగర్ మండలం సమానగర్ వద్ద ఎర్రవాగు వంతెనపై ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. 

07:38 - January 5, 2016

పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ మూడో రోజు సాయంత్రం ముగిసింది. దీనితో దాదాపు 60గంటల పాటు కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. సోమవారం ఇద్దరు ఉగ్రవాదులు హతమవడంతో ఈ ఆపరేషన్ లో మృతి చెందిన మృతి ఉగ్రవాదుల సంఖ్య ఆరుకు చేరుకుంది. మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియను సమయాన్ని కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. 15 రోజుల్లోనే బల్దియా ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో నగేష్ (విశ్లేషకులు), రాజారాం యాదవ్ (టి.టిడిపి), తాడూరి శ్రీనివాస్ (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

తలసాని చేతుల మీదుగా గ్యాస్ కనెక్షన్ల పంపిణీ..

హైదరాబాద్ : బన్సీలాల్‌పేటలో ఉదయం 11గంటలకు దీపం పథకం కింద మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌చే గ్యాస్ కనెక్షన్‌ల పంపిణీ కార్యక్రమం జరగనుంది. 

నేడు వెస్ట్ బెంగాల్ కు ప్రణబ్..

కోల్ కతా : రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ రెండు రోజుల పర్యటనకు గాను మంగళవారం తన సొంత రాష్ట్రమైన పశ్చిమబంగాకు రానున్నారు. ప్రముఖ బెంగాలీ రచయిత పండిట్‌ తరకలంకర్‌ 200వ జయంతి వేడుకలకు గాను ప్రణబ్‌ అక్కడికి వెళ్లనున్నారు. 

06:56 - January 5, 2016

పట్టణాలు నగరాల్లో ట్రాఫిక్‌ పెరుగుతోంది. ప్రయాణం ఓ పద్మవ్యూహంగా మారుతోంది. ట్రాఫిక్‌ సమస్యలను ఛేదించేందుకు ప్రభుత్వాలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఫ్లయ్‌ ఓవర్లు, స్కై ఓవర్లు నిర్మిస్తున్నారు. రోడ్లు వెడల్పు చేస్తున్నారు. అవుటర్‌ రింగ్‌ రోడ్డులు నిర్మిస్తున్నారు. ఇన్ని చేస్తున్న ప్రభుత్వాలు పాదచారుల గురించి పట్టించుకోవడం లేదు. పాదచారుల సమస్యలను అలక్ష్యం చేస్తున్నారు. దీంతో ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదాల్లో పాదచారులు చనిపోతున్నారు. పాదచారుల రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? పాదచారులు నడిచేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలి? వివిధ దేశాల్లో ఎలాంటి ఏర్పాట్లున్నాయి? మన దగ్గర జరుగుతున్న లోపాలేమిటి? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో వాధా ఫౌండేషన్‌ ఆర్గనైజర్‌ సురేష్‌ విశ్లేషించారు. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

06:54 - January 5, 2016

మెట్రో రైలు మార్గాలు, అవుటర్‌ రింగురోడ్డులు, ఫ్లయ్‌ ఓవర్లు, స్కై ఓవర్లు, ఎయిర్‌ పోర్టులు, జలరవాణా మార్గాలు అంటూ వినూత్న ఆలోచనలు చేస్తున్న ప్రభుత్వాలు నడిచేవెళ్లేవారికి దారిలేకుండా చేస్తున్నాయి. ఫుట్‌పాత్‌ల నిర్మాణాన్ని, వాటిని నిర్వహణను అలక్ష్యం చేయడంతో నడిచివేళ్లేవారిని ప్రమాదాలు వెంటాడి, మృత్యుకుహరంలోకి ఈడ్చుకెళ్తున్నాయి. మన దేశంలో పట్టణ జనాభా సంఖ్యా పెరుగుతోంది. స్మార్ట్‌ సిటీలు, అమృత సిటీలు తెర మీదకు వస్తున్నాయి. చిన్న చిన్న పట్టణాల్లో సైతం ఎయిర్‌ పోర్టులు నిర్మించి, విమానాలు నడిపేందుకు ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు జల రవాణా మీద కూడా దృష్టి సారిస్తున్నాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వమూ సహకరిస్తానంటోంది. కానీ, పాదచారుల గురించి ఏ ప్రభుత్వమూ పట్టించుకోవడం లేదు. పాల ప్యాకెట్ల కోసమో, కూరగాయల కోసమో, స్కూల్‌ కెళ్లేందుకో, ఆఫీసుకెళ్లేందుకో, వాకింగ్‌ కోసమో, సిటీ బస్సెకేందుకో మరింకేదనైనా పని మీదనో నడిచేవెళ్లేవారికి కనీసం జాగా చూపించడం లేదు.

అవస్థలు పడుతున్న జనాలు...
ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ, తిరుపతి, వరంగల్‌ ఇలా ఏ సిటీకైనా వెళ్లండి. ఎక్కడైనా పాదచారులు నడవడానికి కనీస ఏర్పాట్లున్నాయా? ఏ ఒక్క పట్టణంలోనైనా ఏమాత్రం టెన్షన్‌ పడకుండా రోడ్డు దాటగలమా? రోడ్డు పక్కన నడవాలంటే భయం. నిలబడాలంటే భయం. రోడ్డు దాటాలంటే భయం. ఏవో కొన్ని ప్రధాన కూడళ్లలో మినహా మరెక్కడా పాదచారులు రోడ్డు క్రాస్‌ చేయడానికి జీబ్రా లైన్స్ వుండవు. కనీసం 500 మీటర్లకు ఒకచోటైనా రోడ్డు దాటేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ వాటిని అమలు చేస్తున్నవారేరీ ? మన దేశంలో రోడ్డు ప్రమాద మృతుల్లో అత్యధికులు పాదచారులే. మన దేశంలో ఏటా నమోదవుతున్న రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నవారిలో 30 నుంచి 35 శాతం మంది పాదచారులే. దాదాపు ఇదే సంఖ్యలో సైక్లిస్ట్ లు చనిపోతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నవారిలో 60 నుంచి 70శాతం మంది పాదచారులు, సైక్లిస్టులే వుంటే ఇక సామాన్యుడికి భద్రత ఎక్కడ వున్నట్టు? ఒక్క హైదరాబాద్‌లోనే గడిచిన నాలుగేళ్లలో రెండు వేల మంది పాదచారులు రోడ్డు ప్రమాదాల్లో బలైపోయారు. ఇదేనా మనం సాధించుకున్న అభివృద్ధి?
మనదేశంలోని పట్టణాల్లో దాదాపు 30శాతం మంది చిన్నా చితక పనులు చక్కబెట్టుకోవడానికి నడిచివెళ్తుంటారు. కానీ తాము నడిచేందుకు యోగ్యమైన ఫుట్‌పాత్‌లు లేక, రోడ్డు దాటే దారిలేక వారంతా అవస్థ పడుతున్నారు.

నిర్లక్ష్యం..
చాలా నగరాల్లో రోడ్ల వెంట నడవడానికి కనీసం ఫుట్‌పాత్‌లే వుండవు. ఎక్కడైనా పొరపాటున నిర్మించినా వాటిని ఎక్కడం కష్టం. వాటి మీద నడవడం పెద్ద శిక్ష. రాళ్లు, గాజుపెంకులు, చెత్తకుప్పులు, జంతువుల మృత కళేబరాలు ఇలాంటివెన్నో ఫుట్‌పాత్‌ల మీద పడివుంటాయి. ఎలక్ర్టికల్‌ పోల్స్‌, ట్రాన్స్‌ఫార్మర్లు, పోలీస్‌ అవుట్‌ పోస్టులు, ట్రాఫిక్‌ అంబ్రిల్లాస్‌, కేబుల్‌ వైర్లు, ముళ్లతీగలు లాంటివెన్నో ఫుట్‌పాత్‌ల మీద దర్శనమిస్తుంటాయి. ఫుట్‌పాత్‌ల నిర్వహణ విషయంలో పోలీస్‌ యంత్రాంగం, ఇతర ప్రభుత్వ శాఖలే ఇంత నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా వ్యవహరిస్తే ఇక పాదచారులు నడిచేదెలా?  

06:48 - January 5, 2016

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ పార్టీ జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకోవాలని లక్ష్యంగా నిర్ణయించుకున్న అధికారపార్టీ ముందు నుంచే ప్రచారం మొదలు పెట్టింది. నగరంలో ఎక్కడ చూసినా గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. రిజర్వేషన్లు ఖరారై... షెడ్యూలు వెలువడిన తర్వాత పూర్తి స్థాయి ప్రచారంలోకి దిగాలని టీఆర్‌ఎస్‌ నేతలు నిర్ణయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరాభివృద్ధి కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లాలని గులాబీ దళం నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రజలు సహకరించి, టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. గత పాలకులు హైదరాబాద్‌ అభివృద్ధిని విస్మరించారని పరోక్షంగా టీడీపీని విమర్శిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపు కోసం టీఆర్‌ఎస్‌ నేతలు ముందు నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. డివిజన్ల వారీగా నాయకులకు బాధ్యతలు అప్పగించారు. ప్రతి ఓటరును కలుసుకుని... ప్రజాభిప్రాయాన్ని పార్టీకి అనుకూలంగా మలచుకునేలా పని చేస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ టికెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. అభ్యర్ధుల ఎంపిక పై ఇప్పటికే కసరత్తు చేస్తున్న టీఆర్‌ఎస్‌ నేతలు... షెడ్యూలు వెలువడిన తర్వాత డివిజన్ల వారీగా పోటీ చేసే వారి పేర్లును ప్రకటించాలని నిర్ణయించారు. ప్రచారం తరహాలోనే ఈ విషయంలో కూడా అన్ని పార్టీల కంటే ముందుండాలని భావిస్తున్నారు. 

06:43 - January 5, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ లో ఎన్నికల సందడి మొదలైంది. బహిరంగ సభలు, ర్యాలీలతో నగరం హోరెత్తిపోతోంది. ఇప్పటికే తెలంగాణ మంత్రి కేటీఆర్‌ నియోజక వర్గాల్లో పర్యటనలు చేసి ఓటర్లను ఆకర్షిస్తున్నారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ సైతం సీనియర్లతో కలిసి సమాలోచనలు మొదలు పెట్టింది. ఈ సందర్భంగా తాజాగా బీజేపీ- టీడీపీ కూటమి బహిరంగ సభతో గ్రేటర్‌ ఎన్నికల ప్రచార నగరాను మోగించింది. కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ హాజరైన భారీ బహిరంగ సభలో తెలుగు తమ్ముళ్లతో పాటు కమలం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మల్కాజ్‌ గిరిలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభకు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సభలో కేంద్రమంత్రి దత్తాత్రేయ, టీడీపీ నేతలు రేవంత్‌ రెడ్డి, ఎల్‌ రమణ, ఎంపీ మల్లారెడ్డి, లక్ష్మణ్ హాజరయ్యారు. హైదరాబాద్‌ ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని రేవంత్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే అది ఎంఐఎం పార్టీకి వేసినట్లేనని రేవంత్‌ పేర్కొన్నారు.

టీడీపీ, బీజేపీ కూటమిని గెలిపించాలి..
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమిని గెలిపించాలన్నారు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ. కేంద్రం నుంచి అధికంగా నిధులు తెచ్చి హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామని గడ్కరీ హామీనిచ్చారు. అలాగే కేసీఆర్‌ మాయమాటలు నమ్మవద్దని గడ్కరీ హితవు పలికారు. ఈ సందర్భంగా ఎంఐఎం - టీఆర్‌ఎస్‌ మైత్రి హైదరాబాద్ కు ప్రమాదకరమని కేంద్ర మంత్రి దత్తాత్రేయ అన్నారు. ఎన్నికల ముహూర్తం ముంచుకొస్తున్న తరుణంలో ఇప్పుడే రాజకీయ వేడి రాజుకుంది. మరోవైపు బీజేపీ టీడీపీ కూటమిని ఎదుర్కొనేందుకు అధికార పార్టీ అన్ని రకాల ఎత్తులను ప్రయోగించనుంది. ఈ బహిరంగ సభకు బీజేపీ - టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. 

06:40 - January 5, 2016

గుంటూరు : సచివాలయ నిర్మాణంపై ఏపీ సర్కార్‌ రోజుకోమాట మాట్లాడుతోంది. మేధా టవర్స్‌లోనే తాత్కాలిక సచివాలయమని ఒకసారి. విజయవాడ బందరు రోడ్డులోని ఆర్‌అండ్‌బీ స్థలంలో కొత్త భవనం కడతామని మరోసారి.. మంగళగిరి సమీపంలోని అమరావతి టౌన్‌షి‌ప్‌లో ఆరులక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తామని ఇంకోసారి.. ఇలా తాత్కాలిక సచివాలయంపై రోజుకో మాట చెప్పిన సర్కార్‌ ఇప్పుడు మరోసారి మాట మార్చింది. రాజధాని ప్రాంత పరిధిలోని 29 గ్రామాల ప్రజలకు మేలు జరిగేలా వాటి మధ్యలోనే తాత్కాలిక సచివాలయ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

జూన్ నాటికి ఉద్యోగులను తరలిస్తాం..
తాత్కాలిక సచివాలయ నిర్మాణాలను జూన్‌ నాటికి పూర్తి చేసి ఉద్యోగులను నూతన రాజధానికి రప్పిస్తామని నారాయణ చెప్పారు. భవనాలను జీ+1 రూపంలో నిర్మిస్తామన్నారు. రాజధాని గ్రామాల మధ్యలో నిర్మాణాలు చేపట్టడానికి అవసరమైన భూసార పరీక్షలు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. రెండు మూడు రోజుల్లో నివేదికలు వస్తాయని వాటి తర్వాత నిర్మాణాలకు టెండర్లు పిలుస్తామన్నారు. రాజధాని గ్రామాల మధ్య తాత్కాలిక సచివాలయం నిర్మించడంవల్ల అన్ని గ్రామాలకూ న్యాయం జరుగుతుందని నారాయణ చెప్పారు. దాదాపు ఆరు లక్షల చదరపు అడుగుల్లో నిర్మించే ఈ తాత్కాలిక నిర్మాణాలను ఈ ఏడాది జూన్‌ నాటికి పూర్తి చేస్తామన్నారు. ఆ వెంటనే ఉద్యోగులను విడతల వారీగా తరలిస్తామని చెప్పారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ టెక్నాలజీ ద్వారా రోజుకు కేవలం 6 వేల చదరపు అడుగుల్లో మాత్రమే నిర్మాణాలు చేపట్టగలమని, దీనికంటే మెరుగైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, అతిత్వరగా నిర్మాణాలు పూర్తి చేసేలా టెండర్లను ఆహ్వానిస్తామని తెలిపారు. సాధ్యమైనంత తక్కువ సమయంలో అమరావతిని పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని నారాయణ అన్నారు. రాజధాని ప్రాంతంలోని గ్రామ కంఠాలను సాధ్యమైనంత వరకు కదిలించబోమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

 

06:37 - January 5, 2016

గుంటూరు : అమరావతిని మహానగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో 'జన్మభూమి-మా ఊరు' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో అనేక ఇబ్బందులు పెట్టారని... రాజధాని ఎక్కడ ఉంటుందో చెప్పకుండానే రాష్ట్రాన్ని విభజించారన్నారు. అయితే అన్ని ఇబ్బందులను సమర్ధవంతంగా ఎదుర్కొని రాష్ట్రాన్ని అభివృద్ధిబాటలో నడిపిస్తామన్నారు చంద్రబాబు. ఇక విజయవాడ-గుంటూరు-తెనాలిని కలుపుతూ 220 కిలోమీటర్ల ఔటర్‌ రింగ్‌రోడ్డు నిర్మిస్తామని చంద్రబాబు తెలిపారు. పట్టుదల, క్రమశిక్షణ ఉంటే ఏదైనా సాధించవచ్చునని చంద్రబాబు అన్నారు. ఆ ఉద్దేశంతోనే జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విభజన సమయంలో రాష్ట్రంలో 16 వేల కోట్ల లోటు బడ్జెట్‌ ఉంది. అయినా అదైర్యపడకుండా ముందుకు సాగుతామన్నారు. మరోవైపు పట్టణ పేదలందరికీ సకల సౌకర్యాలతో పక్కా ఇళ్లు నిర్మిస్తామన్నారు. కాంగ్రెస్‌ హయాంలో గృహ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారన్నారు చంద్రబాబు.

మిల్క్ ప్లాంట్ ప్రారంభం..
ఇక జాగర్లమూడిలోని సంగం పాల ఫ్యాక్టరీలో 20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన దూళిపాళ్ల వీరయ్య చౌదరి మిల్క్‌ప్లాంట్‌ను చంద్రబాబు ప్రారంభించారు. ఎంతో మంది మహిళలు పాడి పరిశ్రమను నమ్ముకుని జీవనం సాగిస్తున్నారని.. వీరి అభివృద్ధి కోసం వీరయ్య చౌదరి ఎంతగానో కృషి చేశారని చంద్రబాబు ప్రశంసించారు. అంతకుముందు ప్రకాశం జిల్లా రాయవరంలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి అందరూ చేయూతనివ్వాలని బాబు అన్నారు. రాష్ట్రంలో అపారమైన వనరులున్నాయి.. వాటిని సక్రమంగా వినియోగించుకుంటే అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రకాశం జిల్లాలో ఏ జిల్లాలోనూ లేనంత భూమి ఉందని.. అయితే నీళ్లు మాత్రం లేవన్నారు. వరద నీటిని భూగర్భ జలాలుగా మార్చుకోవడం ద్వారా నీటి సమస్యకు పరిష్కారం కనుగొనవచ్చన్నారు. జన్మభూమి సందర్భంగా ఏర్పాటు చేసిన అనేక ప్రదర్శనశాలలను చంద్రబాబు పరిశీలించారు. ప్రకాశం జిల్లాలో కరవు పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. రైతులతో స్వయంగా మాట్లాడారు. కార్యక్రమానికి భారీగా ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు. ఇక ఈరోజు కృష్ణాజిల్లాలోని పెనుగంచిప్రోలులో నిర్వహిస్తున్న జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. 

నేడు వరంగల్ కు మంత్రి పోచారం..

వరంగల్ :  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నేడు జిల్లాకు రానున్నారు. భూపాలపల్లిలో నిర్వహించనున్న సమావేశంలో మంత్రి పాల్గొనున్నారు. 

06:33 - January 5, 2016

వరంగల్ : జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌ పర్యటించనున్నారు. గణపురం మండలం చెల్పూరు శివారులో నిర్మించిన 'కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌' రెండో దశలో 600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించి.. ప్లాంట్‌ను జాతికి అంకితం చేయనున్నారు. ఇప్పటికే మొదటి దశలో 500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. ఈ ప్లాంట్‌ను 2006లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసి 2009లో ప్రారంభించారు. మొదటి దశ ప్లాంట్‌కు 2200 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇప్పుడు రెండో దశ ప్లాంట్‌ను 3,400 కోట్ల రూపాయలతో.. 900 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పుతున్నారు. దీని ద్వారా 600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అందుబాటులోకి రానుంది. ఈ రెండు ప్లాంట్ల ద్వారా మొత్తం 1100 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే కమర్షియల్‌ ఆపరేషన్‌ డిక్లరేషన్‌ పూర్తి కావడంతో కేటీపీపీ సూపర్‌ థర్మల్‌ పవర్‌స్టేషన్‌గా అవతరించనుంది. ఇక ఈ ప్రాజెక్ట్‌తో తెలంగాణలో విద్యుత్‌ కష్టాలు తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు రెండో దశలో 600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అందుబాటులోకి వస్తే జెన్‌కోకు ప్రతిరోజు నాలుగు కోట్లకు పైగా ఆదాయం రానుంది. 

06:29 - January 5, 2016

హైదరాబాద్‌ : బోరబండలో పోలీసులు కార్డన్‌సెర్చ్‌ నిర్వహించారు. వెస్ట్‌జోన్‌ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 300 మంది పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో 13 మంది రౌడీషీటర్లతో పాటు.. 36 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 62 బైక్‌లు, 13 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. 

ఎల్బీనగర్ లో అగ్నిప్రమాదం..

హైదరాబాద్ : ఎల్బీనగర్ లో ఓ ఫ్లై వుడ్ దుకాణంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఎగిసి పడుతుండడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. 

నగరంలో కార్డన్ సెర్చ్..

హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జూబ్లిహిల్స్, యూసఫ్ గూడ, పెద్దమ్మనగర్, ఇందిరానగర్ కార్డన్ సెర్చ్ కొనసాగింది. 60 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పత్రాలు లేని 62 బైక్ లు, 13 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. 

నేడు గ్రేటర్ పరిధిలో షర్మిల పరామర్శ యాత్ర..

హైదరాబాద్ : నేటి నుండి గ్రేటర్ పరిధిలో షర్మిల పరామర్శ యాత్ర జరగనుంది. 18 కుటుంబాలను షర్మిల పరామర్శించనుంది. శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజ్ గిరిలో పరామర్శ యాత్ర జరగనుంది.  

Don't Miss