Activities calendar

13 January 2016

కిడ్నీ రాకెట్ లో కొనసాగుతున్న అరెస్టుల పర్వం..

నల్గొండ : కిడ్నీ రాకెట్ లో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. కిడ్నీ అమ్ముతున్న కృష్ణ చైతన్య అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికీ ప్రధాన సూత్రధారితో సహా ఏడుగురిని అరెస్టు చేశారు.  

తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఏర్పాటు..

హైదరాబాద్ : తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఏర్పాటైంది. ఛైర్మన్ గా డా.రవీంద్రారెడ్డి, వైస్ ఛైర్మన్ గా డా.వి. రాజలింగం నియమితులయ్యారు. 

భార్యను చంపిన భర్త ఆత్మహత్య...

కర్నూలు : డోన్ మండలం కొత్తపల్లిలో విషాదం చోటు చేసుకుంది. భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త శంకరయ్య రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఏపీలో 8 మంది సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతులు..

హైదరాబాద్ : ఏపీ రాష్ట్రంలో 8 మంది సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతులు లభించాయి. ఈ మేరకు డీజీపీ రాముడు ఉత్వర్వులు జారీ చేశారు. నెల్లూరు డీసీఆర్ బీ డీఎస్పీగా సీతారామయ్య, గుంటూరు ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీగా డి. గురుమూర్తి, హైదరాబాద్ ఏపీ కమాండ్ కంట్రోల్ డీఎస్పీగా గోవిందరావు, గ్రే హౌండ్స్ డీఎస్పీలుగా రమణమూర్తి, అబ్దుల్ హజీజ్, కృష్ణా జిల్లా సీసీఎస్ డీఎస్పీగా ధర్మేంద్ర, తిరుపతి అర్బన్ మహిళ పీఎస్ డీఎస్పీగా కాంతంరాజులకు పదోన్నతులు లభించాయి.

టాస్క్ ఫోర్స్ అదుపులో పెండ్యాల శ్రీకాంత్..

విజయవాడ : కాల్ మనీ కేసులో పెండ్యాల శ్రీకాంత్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రహస్య ప్రదేశంలో విచారణ జరుపుతున్నారు. సంక్రాంతి తరువాత కోర్టులో హజరు పరిచే అవకాశం ఉంది. మరో ఇద్దరు కీలక నిందితుల కోసం గాలింపులు చేపట్టారు. 

లడ్డూ రూ.77లక్షల 77 వేలు..

మెదక్ : సంగారెడ్డిలో గోదా రంగనాథస్వామి లడ్డూ వేలం నిర్వహించారు. రూ.77 లక్షల 77 వేలకు లడ్డూను మాజీ డిప్యూటి సీఎం రాజనర్సింహ సతీమణి పద్మిణి సొంతం చేసుకున్నారు. 

20:41 - January 13, 2016

ఎంపీ మల్లారెడ్డి స్టైలే వేరు. ఇటీవలే ఓ ఫంక్షన్ లో గంగ్నమ్ డ్యాన్స్ చేసింది తెలిసే కదా. అంతేగాక మల్కాజ్ గిరిలో నిర్వహించిన ఓ సభలో కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేశారు. ఇది విన్న నేతలు..జనాలు అప్పట్లో నోరెళ్ల బెట్టారు. కేసీఆర్ దేవుడు అని పొడిగారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికల పుణ్యాన కేసీఆర్ కాస్తా శని అయ్యాడంట. ఆయన అప్పుడు ఏమన్నారో..ఇప్పుడు ఏమన్నారో వీడియోలో చూడండి. 

20:38 - January 13, 2016

నగరంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు పతంగులపైకి ఎక్కింది. కేంద్ర మంత్రివర్గంలో మార్పులు..ఉభయ రాష్ట్రాల సీఎంల వ్యవహార శైలిలో మార్పులు..జీహెచ్ంఎసీ ఎన్నికల్లో పోటీ చేయబోమని వైసీపీ ప్రకటించింది...మల్కాజ్ గిరి ఎంపీ గతంలో కేసీఆర్ పై పొగడ్తలు..ఇప్పుడు తిట్లు..కేసీఆర్ ను కలిసిన మహరాష్ట్ర నేత శరద్ పవార్..తెలంగాణలో మద్యం ఆదాయం అధికం..జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహం తదితర అంశాలపై టెన్ టివి 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో 'మల్లన్న' ముచ్చటించాడు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లాకు చెందిన రమేష్ అనే బ్యాంకు ఉద్యోగి 'మల్లన్న'తో ముచ్చటించాడు. విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:21 - January 13, 2016

ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు గతంలో ఎలా ఉండే. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే లాగా ఉండే. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటుండే. ఓటుకు నోటు కేసు గుర్తే కదా. ఆ కేసు బయటపడినప్పుడు ఈ ఇద్దరు సీఎంలు ఒకటే తిట్టుకున్నరు. ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఈ ఇద్దరు ఎక్కడ తిట్టుకోవట్లే. మంగళవారం నిజాం కాలేజీ మైదానంలో టిడిపి, బిజెపి బహిరంగసభ నిర్వహించింది. అందులో తెలంగాణ ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక్కమాట అనలేదు. గతంలో ఎలా తిట్టుకున్నారో వీడియోలో చూడండి. 

20:07 - January 13, 2016

హైదరాబాద్ : ఏపీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డికి ప్రభుత్వం భద్రతను పెంచింది. కేవలం సీఎం చంద్రబాబు నాయుడుకు ఉపయోగించే బుల్లెట్ ఫ్రూప్ కారు మంత్రి బొజ్జలకు ఉపయోగించనున్నారు. అంతేగాకుండా మరో ఇద్దరు అదనపు భద్రతా సిబ్బందిని కేటాయించారు.ఎర్రచందనం స్మగ్లర్ల నుండి మంత్రికి బెదిరింపు కాల్స్ రావడంతోనే భద్రతను పెంచినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇంటిలిజెన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి పలు హెచ్చరికలు చేసినట్లు సమాచారం. ఇటీవలే ఏపీ రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లర్ల ఆగడాలు ఎక్కువయ్యాయి. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం పలు కఠిన చర్యలు తీసుకొంటోంది. ఈ నేపథ్యంలో మంత్రి బొజ్జలను హతమార్చేందుకు ఎర్రచందనం స్మగ్లర్లు పథకాలు పన్నారని ఇంటిలిజెన్స్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు సమాచారం. ఇంటిలెజెన్స్ అధికారుల హెచ్చరికలతో ఈ భద్రతను పెంచారు. 

19:33 - January 13, 2016

పాకిస్తాన్ : పఠాన్ కోట్ ఉగ్రదాడి ఘటనను పాకిస్తాన్ దర్యాప్తును ముమ్మరం చేపట్టింది. అందులో భాగంగా జైష్ ఏ మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ ను అరెస్టు చేశారు. అజహర్ తో పాటు మరో 12 మంది ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు జియో న్యూస్ చానెల్ కథనం పేర్కొంది. జైషే మహ్మద్ కార్యాలయాన్ని కూడా మూసివేశారు. గతంలో అజహర్ భారత్ చేతికి చిక్కి హైజాక్ డ్రామా ఆడి పాక్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. 

19:31 - January 13, 2016

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో 'నాన్నకు ప్రేమతో' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అతి తక్కువ టైంలో అగ్ర హీరోగా ఎదిగి అతికొద్ది మందికి దక్కే స్టార్ డమ్ అందుకున్న నటుడు ఎన్టీఆర్. చూస్తుండగానే 24 సినిమాలు చేశారు. 'నాన్నకు ప్రేమతో' 25వ సినిమా. మైల్డ్ స్టోన్ లా ఉండాల్సిన సినిమా కాబట్టే నాన్నకు ప్రేమతో సినిమాను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాడు ఎన్టీఆర్. ఇంటిలిజెంట్ మరియు క్లాస్ మేకర్ గా పేరు తెచ్చుకున్న 'సుకుమార్' తో కలిసి ఎన్టీఆర్ ఈ సినిమా చేశారు. నాన్నకు ప్రేమతో అని టైటిల్ అనౌన్స్ చేయగానే ఓ స్టైలిష్ ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ తీయబోతున్నారనే అంచనాలు ఏర్పడ్డాయి. సుకుమార్ 'వన్' నేన్కొక్కడినే తరువాత మళ్లీ అలాంటి పీల్ గుడ్ సినిమా సెంటిమెంట్ తీయడానికి రెడీ అయ్యారు. ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ టాలీవుడ్ లో క్రేజీని సంపాదించి పెట్టింది. ఒకరు మాస్ హీరో..మరొకరు క్లాస్ డైరెక్టర్. ఇద్దరు కలిసి ఎలాంటి సినిమాను చేస్తారనే క్యూరాసిటీ నెలకొంది. పైగా ఎన్టీఆర్ ను సరికొత్తగా లుక్ లో ప్రజెంట్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్ గా ఉన్న సినిమాలు మంచి సక్సెస్ అందుకున్న టైంలో 'నాన్నకు ప్రేమతో' ఏ మాత్రం బాగున్నా రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం. ఎన్టీఆర్ సూపర్ హిట్ కోసం చాలాకాలంగా వెయిట్ చేస్తున్నారు. అయితే హిట్ కోసం పక్కా కమర్షియల్ సినిమాల కోసం వెంపర్లాడకుండా సెలక్టివ్ గా మంచి కథను ఎంచుకుంటున్నాడు. అటు సుకుమార్ కూడా హిట్ కోసం ఏదో ఒకటి తీసే బాపతు కాదు. తను రూపొందించే సినిమాలో కొత్తదనం ఉండాలని కోరుకుంటాడు. మరి ఈ ఇద్దరి కాంబినేషన్ ఎలాంటి సినిమాను ప్రేక్షకులకు అందించింది ? నాన్నకు ప్రేమతో సంక్రాంతి బరిలో పాజిటివ్ టాక్ ఉన్న సినిమా రిలీజ్ అయ్యింది. మరి ప్రీ రిలీజ్ అంచానాలు సరే..అసలు సినిమా ఎలా ఉంది ? 
సిల్వర్ స్క్రీన్ పై లాజిక్ లేకున్నా ఫర్వాలేదు మ్యాజిక్ ఉంటే చాలనేది కొందరు దర్శకులు పద్ధతి. ప్రతి సీన్ లో ప్రేక్షకులకు రీజన్ చెప్పాలనేది మరికొందరు ఫిల్మ్ మేకర్స్ స్టైల్. వీటిలో ఏదో ఒకటి ఫాలో అయి సక్సెస్ అయినవారున్నారు. కానీ...అటు సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా...ఇటు రియాలిటీగా చూపకుండా సినిమాలు రూపొందిస్తేనే థియేటర్లో కన్ప్యూజన్ క్రియేట్ అవుతుంది. నాన్నకు ప్రేమతో సినిమాను టాలీవుడ్ హై ఎండ్ క్వాలిటీ ఫిల్మ్ గా రూపొందించిన దర్శకుడు సుకుమార్....కథను మరీ డీటేయిల్డ్ గా చెప్పాలనుకుని కొన్ని వర్గాలకే సినిమా పరిమితం అయ్యేలా చేశాడు.

కథ..
లండన్ లో ప్రవాస భారతీయుడైన రాజేంద్రప్రసాద్ కోటీశ్వరుడు. అక్కడి భారతీయులకు ఏదైనా సాయం చేయాలని ప్రయత్నిస్తాడు. వాళ్లందరికీ సొంతిళ్లు కట్టించాలని ప్రాజెక్టు మొదలు పెడతాడు. స్నేహితుడు జగపతిబాబు ఈ ప్రాజెక్టులో రాజేంద్రప్రసాద్ ను మోసం చేస్తాడు. దీంతో పెట్టుబడులు పెట్టిన వారంతా రాజేంద్రప్రసాద్ పై తిరగబడతారు. ఈ అనూహ్య పరిణామంతో పేరు వేషం మార్చుకుని పిల్లలని తీసుకుని వేరే ప్రాంతానికి వెళ్లిపోతాడు. ఆ బాధతోనే అనారోగ్యంతో మరణం అంచులకు చేరుతాడు. తనకు జరిగిన మోసాన్ని కొడుకు ఎన్టీఆర్ కు చెప్పి తన ప్రతీకారం తీర్చమని అప్పుడే మనశ్సాంతిగా చనిపోతానంటాడు రాజేంద్రప్రసాద్. మోసంతో కుటుంబాన్ని రోడ్డున పడేట్లు చేసిన మల్టీ మిలీనీర్ జగపతిబాబును నెలరోజుల్లో దివాళా తీయిస్తానని తండ్రికి మాటిస్తాడు ఎన్టీఆర్. మరి ఆ మాటను కథానాయకుడు ఎలా నిలబెట్టుకున్నాడన్నది మిగిలిన కథ.

పాత్రల అభినయం..
వ్యాపారంలో తండ్రిని మోసం చేసిన వాళ్లను పిల్లలు పెరిగాక...రివేంజ్ తీర్చుకోవడం..చాలా పాత ఫార్ములా కథ. ఈ మధ్య కూడా తెలుగులో ఇలాంటి స్టోరీలు వచ్చాయి. ఐతే ఇక్కడ ఫిల్మ్ మేకింగ్ లో సుకుమార్ తన ప్రత్యేకత చూపించాడు. వెరీ రిచ్ మేకింగ్ తో టాలీవుడ్ కు హై క్వాలిటీ మూవీ ఇచ్చాడు. క్వాలిటీ లో సక్సెస్ అయిన ఈ దర్శకుడు....ప్రతి సీన్ లోనూ బోలెడన్ని కారణాలు చూపించాడు. ఈ చాదస్తం మూలంగా నాన్నకు ప్రేమతో సినిమా మాస్ ప్రేక్షకులకు రీచ్ అవలేకపోయింది. మల్టీఫ్లెక్సులు, ఏ సెంటర్ల ఆడియెన్స్ ను మాత్రం అట్రాక్ట్ చేసే అవకాశాలున్నాయి. ఇక ఎన్టీఆర్ తన కెరీర్ లోనే ఇలాంటి వైవిధ్యమైన క్యారెక్టర్ చేయలేదు. అప్పీయరెన్స్, స్టైలిష్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రకుల్ ప్రీత్ ది కథలో ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర. తండ్రిగా రాజేంద్రప్రసాద్, విలన్ గా జగపతి బాబు క్యాజువల్ గా నటించారు. నాన్నకు ప్రేమతో సినిమాకు ప్రధాన ఆకర్షణ ప్రొడక్షన్ వ్యాల్యూస్. విజయ్ సినిమాటోగ్రఫీ, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం, నవీన్ ఎడిటింగ్ సినిమాకు బలాన్నిచ్చాయి.
మొత్తానికి తన కెరీర్ లో మైల్ స్టోన్ గా ఉండాలని ఎన్టీఆర్ కోరుకున్న ఇరవై ఐదో సినిమా నాన్నకు ప్రేమతో...అతనికో స్పెషల్ ఫిల్మ్ గా నిలిచినా....ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కొంతవరకే సక్సెస్ అయ్యింది. ఈ సినిమా తర్వాతైనా సుకుమార్ ఆడియోన్స్ రీజనింగ్ ఎబిలిటీ టెస్ట్ చేయకుండా లిబరల్ గా సినిమాలు చేస్తే మన నేటివిటీకి సరిపోయేలా సినిమాలు చేయగలుగుతాడు. లేకుంటే ఇంత ఇంటలెక్చువల్ ఫిల్మ్స్ ను మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలంటే దశాబ్దాల మారాలి.

ఫ్లస్ పాయింట్స్
ఎన్టీఆర్
కొన్ని సెంటిమెంట్ సీన్స్
సినిమాటోగ్రఫీ
సంగీతం
మైనస్ పాయింట్స్
పాత కథ
ఊహాతీత కథనం
స్క్రీన్ ప్లే లోపాలు
సాంగ్స్ ప్లేస్ మెంట్

మసూద్ అజహర్ అరెస్టు..

పాకిస్తాన్ : పఠాన్ కోట్ ఉగ్రదాడి ఘటనలో పాక్ దర్యాప్తు ముమ్మరం చేపట్టింది. జైష్ ఏ మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ ను అరెస్టు చేశారు. అజహర్ తో పాటు మరో 12 మంది ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు జియో న్యూస్ చానెల్ కథనం పేర్కొంది. 

నివేదికలు పరిశీలించాకే కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ - సీఎస్...

మహబూబ్ నగర్ : ఆయా శాఖల నివేదికలను పరిశీలించాక కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని సీఎస్ రాజీవ్ శర్మ వెల్లడించారు. త్వరలో పాలమూరు ఎత్తిపోతల పథకానికి టెండర్లు పిలుస్తామన్నారు. 

మంత్రి బొజ్జలకు భద్రత పెంపు..

చిత్తూరు : మంత్రి బొజ్జలకు భద్రతను పెంచారు. బుల్లెట్ ఫ్రూప్ వాహనంతో పాటు మరో ఇద్దరు అదనపు భద్రతా సిబ్బందిని కేటాయించారు. బొజ్జలకు ఎర్రచందనం స్మగ్లర్ల నుండి ముప్పు ఉందనే దానిపై భద్రతను కేటాయించారు. 

18:42 - January 13, 2016

ఏలూరు : పశ్చిమ గోదావరిలో పందెం కోళ్లు బరిలోకి దిగాయి. ఏలూరులో సాక్షాత్తూ అధికార పార్టీ నేతలు మాగంటి బాబు, ఎమ్మెల్యే బడేటి బుజ్జి కోడి పందాలను ప్రారంభించారు. ఇరు నేతలు ఏలూరు ఇండోర్‌ స్టేడియంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో కోడి పందాలు ఆడారు. అయితే కోడి పందాల కోసం నేతలు తహతహలాడుతున్న తీరును ఎమ్మెల్సీ రాము సూర్యారావు నిరసించారు. కోర్టు తీర్పుల అమలు కోసం పోలీసులు కఠినంగా వ్యవహరించాలని డిమాండ్‌ చేశారు. దురలావాట్లకు లోనయ్యేలాగా చేస్తున్నారని, సంక్రాంతి పండుగ ధనికులకు డబ్బు సంపాదించే విధంగా మారిందన్నారు. క విధంగా వాళ్ల అలవాట్లకు ఆటవిడుపుగా తయారైందని ఆయన విమర్శించారు. మరోవైపు కొత్త సంవత్సరం సందర్భంగా ప్రతి జిల్లాకు కోటి రూపాయల నిధులు విడుదల చేయడం జరిగిందని మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. 12వ తేదీన మండల కేంద్రాల్లో అట్టహాసంగా పండుగ సంబరాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఎన్ని కష్టాలున్నా ఇచ్చిన మాట తప్పకుండా అమలు చేస్తున్నామన్నారు. పెన్షన్ అమలు చేయడం జరిగిందని, లేని వారికి రేషన్ కార్డులు ఇస్తున్నామన్నారు. 

18:39 - January 13, 2016

విశాఖపట్టణం : మూడు రోజులు పాటు నిర్వహించిన భాగస్వామ్య సదస్సు రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడదని సీపీఎం విమర్శించింది. ప్రభుత్వం వివిధ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల్లో ఒక్క శాతం కార్యరూపం దాల్చే అవకాశంలేదని పార్టీ విశాఖ నాయకులు లోకనాథం, గంగారామ్‌ విమర్శించారు. పారిశ్రామికవేత్తలకు భూములు ధారదత్తం చేసేందుకే భాగస్వామ్య సదస్సు ఉపయోగపడుతుందంటున్నారు. ఏ భూములున్నాయో కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడం ప్రయత్నాలు జరుగుతున్నాయని, రైతుల భూములు లాక్కొంటారని అదే విధంగా ప్రభుత్వ భూములు కారు చౌకగా ఇచ్చే కుట్ర జరుగుతోందన్నారు.

18:28 - January 13, 2016

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్‌ సవాల్‌కు స్పందించాల్సిన అవసరం లేదని పార్టీ అధ్యక్షునిగా కేసీఆర్‌ సవాల్‌ చేస్తే అప్పుడు చూస్తామని పీసీసీ చీఫ్‌ ఉత్తంకుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మీట్ ద ప్రెస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిందే కాంగ్రెస్‌ అని చెప్పారు. గ్రేటర్‌ బడ్జెట్‌ను 500 కోట్ల నుంచి 5 వేల కోట్లకు తీసుకెళ్లిన ఘనత కాంగ్రెస్‌దన్నారు. గ్రేటర్‌లో వార్డుల విభజన.. రిజర్వేషన్ల ఖరారు అంతా ఇష్టారాజ్యంగా చేశారని ఉత్తం మండిపడ్డారు. అధికార పార్టీ నేతలు అవినీతి సొమ్ముతో హోర్డింగులు నింపుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను టీఆర్‌ఎస్ నేతలు తమ గొప్పతనమని చెప్పుకుంటున్నారని ఉత్తం విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ ఏదీ నిలబెట్టుకోలేదని, ప్రజలను మోసం చేశారని తెలిపారు. సీమాంధ్ర ప్రజలను ఏ విధంగా వ్యాఖ్యానించారో తెలుసని, రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. 

18:23 - January 13, 2016

గుంటూరు : అమరావతి సమీపంలోని వెలగపూడిలో ఏపీ తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. వెలగపూడిలో 26 ఎకరాల్లో 180 కోట్ల వ్యయంతో సచివాలయం నిర్మించేందుకు టెండర్లు పిలుస్తున్నారు. 21 రోజుల్లో టెండర్ల ప్రక్రియను అధికారులు పూర్తి చేయనున్నారు. 205,206,207,208 లో సచివాలయం నిర్మాణం కానున్నట్లు పేర్కొన్నారు. ఆరు నెలల్లో సచివాలయం నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మూడు ప్రాంతాలలో ప్రభుత్వం భూసార పరీక్షలు నిర్వహించారు. అనంతరం వెల్గపూడిలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 

నెల్లూరులో స్వల్ప భూ ప్రకంపనాలు..

నెల్లూరు : జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది. వరికుంటపాడు (మం) జడదేవి, వేంపాడు, చాకలికొండ, తూర్పుచెన్నంపల్లి, తూర్పు బోయిపడుగులలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దుత్తలూరు (మం) లక్ష్మీపురం, నందిపాడు, దాసరపల్లిలో మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. 

హస్మత్ పేటలో ఘరానా మోసం..

హైదరాబాద్ : సికింద్రాబాద్ లోని హస్మత్ పేటలో ఘరానా మోసం బయటపడింది. ఎక్స్ పర్ట్ ట్రేడింగ్ సంస్థ బోర్డు తిప్పేసింది. ఖాతాదారులకు రూ. 4కోట్ల వరకు కుచ్చుటోపి పెట్టింది. సీపీఎస్ పీఎస్ లో బాధితులు ఫిర్యాదు చేశారు. 

17:31 - January 13, 2016

అనంతపురం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సంబరాల కోసం ప్రభుత్వం కోటి రూపాయల బడ్జెట్ కేటాయించినట్లు మంతి పల్లె ప్రకటించారు. జిల్లాలోని పోలీసు పరేడ్ గౌండ్స్ లో ఏర్పాటు చేసిన సంబరాల్లో మంత్రులు పల్లె, పరిటాల సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు..అధికారులు సంప్రదాయ దుస్తులు ధరించి సంబరాల్లో పాల్గొన్నారు. మంత్రి పల్లె రఘునాథ రెడ్డి పంచెకట్టుతో కనిపించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఏకంగా కబడ్డీ సైతం ఆడారు. ఇక మంత్రి పరిటాల సునీత పిండి ముగ్గులు వేయడమేకాకుండా వంటలను స్వయంగా చేశారు. అనంతరం గంగిరెద్దుల విన్యాసాలు, ముగ్గుల పోటీలను తిలకించారు. అందంగా అలంకరించిన జోడెడ్ల బండిపై మంత్రి పల్లె నిలబడ్డారు. 

'డిక్టేటర్' టికెట్ల వేలం..

అనంతపురం : హిందూపురం గురునాథ్ థియేటర్ లో 'డిక్టేటర్' సినిమా మొదటి మూడు టికెట్లకు వేలం నిర్వహించారు. రూ. 36,600 లకు మొదటి మూడు టికెట్లను అభిమానులు నంబూరి సతీష్, బాలాజీ, రాము కొనుగోలు చేశారు. టికెట్ల ద్వారా వచ్చిన ఈ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని ఎన్ బీకే అభిమాన సంఘం ప్రకటించింది. 

17:18 - January 13, 2016

కరీంనగర్: పట్టపగలు దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ మహిళను హత్య చేసి నగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన హుజురాబాద్ లో కలకలం సృష్టించింది. నగలు ఎతుకెళ్లడమే కాకుండా హత్యలకు పాల్పడుతుండడంతో జిల్లా వాసులు బెంబేలెత్తుతున్నారు. వివరాల్లోకి వెళితే..బీఎస్ఎన్ఎల్ నగర్ లో భాగ్యలక్ష్మి అనే గృహిణి నివాసం ఉంటోంది. బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం నగలు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. అనంతరం రోకలి బండతో తలపై మోదడంతో భాగ్యలక్ష్మి అక్కడికక్కడనే కుప్పకూలిపోయింది. కూతురు నివాసం వచ్చి చూసే సరికి తల్లి భాగ్యలక్ష్మి రక్తపు మడుగులో పడి ఉంది. ఈ పరిణామంతో బిగ్గరగా కేకలు వేసింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దొంగలను అరికట్టడంలో పోలీసులు విఫలం చెందారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ముంబై : బుధవారం స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 172 పాయింట్లు లాభపడి 24,854, నిఫ్టీ 52 పాయింట్లు లాభపడి 7,562 పాయింట్ల వద్ద ముగిసింది. 

16:45 - January 13, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ గుండెకాయలాంటిదని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ పేర్కొన్నారు. బుధవారం మీట్ ద ప్రెస్ లో ఉత్తమ్ మాట్లాడారు. తెలంగాణ బిల్లు డ్రాఫ్ట్ చేస్తున్న సమయంలో తాను చర్చలో పాల్గొనడం జరిగిందన్నారు. నగర రెవెన్యూ పై చర్చ జరిగిందని, రెవెన్యూలో భాగస్వామ్యం కావాలని అన్నప్పుడు సోనియా పట్టుదలతో రాష్ట్రం ఇస్తూ ఉమ్మడి ఏపీలో 60 శాతం రెవెన్యూ ఉన్న హైదరాబాద్ ను తెలంగాణకు కేటాయించడం జరిగిందన్నారు. ఎంఐఎం పార్టీ తెలంగాణను అడ్డుకోవాలని చాలా ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. కరెంటు కోత ఉండవద్దని రూ.20 వేల కోట్ల పెట్టుబడితో 4వేల మెగా ప్రాజెక్టు ఎన్టీపీసీ కంపెనీతో పెట్టుబడితో పెట్టిస్తామని ఆనాడు చట్టంలో పేర్కొనడం జరిగిందన్నారు. అలాగే రోడ్ అండ్ రైల్వే నెట్ వర్క్...భారీ స్టీల్ ప్లాంట్ నిర్మాణం..రైల్వే కోచ్..ఎన్నో అభివృద్ధి పథకాలు చట్టంలో పేర్కొనడం జరిగిందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను సృష్టించింది కాంగ్రెస్సేనని తెలిపారు. 5వేల కోట్ల బడ్జెట్ కు చేర్చిన ఘనత కాంగ్రెస్ దని, ఎన్నికల సరైన సమయంలో ఎందుకు నిర్వహించలేదో దానికి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ అక్రమాలు చేసైనా గెలవడానికి టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించార. ఎన్నికల ప్రక్రియలో ఏ విధంగా లాభం పొందాలి..టీఆర్ఎస్ సాగిస్తున్న అడ్డదారులు గమనించాలని ఉత్తమ్ సూచించారు. 

16:40 - January 13, 2016

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల బరి నుండి వైసీపీ తప్పుకుంది. ఈ మేరకు ఆ పార్టీ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం పార్టీ బలోపేతంగా లేదని అందుకనే ఎన్నికల బరి నుండి తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఏ పార్టీకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని, అధికార పక్షం ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ పరాజయం కావడంతో ఆ పార్టీ అంతర్మథనం చేసిందని తెలుస్తోంది. పార్టీ నిర్మాణం పటిష్టం చేయడం..క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోటీ నుండి తప్పుకోవాలని పార్టీ అధినేత జగన్ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనితో ఆ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

16:36 - January 13, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు దేశ రాజధానిలో బిజీ బిజీగా గడుపుతున్నారు. కేంద్ర మంత్రులు రాధా మోహన్ సింగ్, పాశ్వాన్ లతో బుధవారం భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై హరీష్ రావు వారికి సమాచారం అందించారు. ఈ సందర్భంగా మీడియాతో హరీష్ రావు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కరవు తీవ్రంగా ఉందని, ఈ సహాయాన్ని తొందరగా అందించాలని కోరడం జరిగిందన్నారు. దీనిపై కేంద్ర హోం మంత్రి, ఆర్థిక శాఖ మంత్రితో మాట్లాడడం జరుగుతుందని, గురువారం మధ్యాహ్నాం జరిగే హై పవర్ కమిటీలో ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని కేంద్ర మంత్రి రాధా మోహన్ సింగ్ హామీనిచ్చారని పేర్కొన్నారు. అలాగే రూ. 24 కోట్లు నాబార్డు నుండి రుణం తీసుకోవడం జరిగిందని, కేంద్రం నుండి సహాయం అందించాలని కోరడం జరిగిందన్నారు. ఈ విషయంపై కూడా ఆర్థిక మంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగిందన్నారు. రూ. 125 కోట్ల సబ్సిడీ పెండింగ్ చాలాకాలం పెండింగ్ లో ఉందని, వెంటనే విడుదల చేయాలని కోరడం జరిగిందన్నారు. ప్రస్తుతం బడ్జెట్ కొంత తక్కువగా ఉందని, ఆర్థిక మంత్రితో మాట్లాడిన అనంతరం ఈ బడ్జెట్ లో లేదా వచ్చే బడ్జెట్ లో ఈ సహాయం అందే విధంగా చూస్తానని కేంద్ర మంత్రి పేర్కొనడం జరిగిందని హామీనిచ్చారని మంత్రి హరీష్ తెలిపారు. 

16:30 - January 13, 2016

హైదరాబాద్ : నగరం అభివృద్ధి చెందలేదంటే దానికి ఎంఐంఎం ఒక కారణమని టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో మేయర్ పదవిలో ఎంఐఎం కూడా ఉందని, ప్రస్తుతం టీఆర్ఎస్ తో కలిసి అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని రేవంత్ విమర్శించారు. మంత్రి కేటీఆర్ విమర్శించాలని అనుకొంటే ముందు ఎంఐఎం పార్టీని అనాలని సూచించారు. మేయర్ గా అత్యధిక సమయం ఎంఐఎం పార్టీ చేపట్టిందని, కానీ వారిని పల్లెత్తు మాట కూడా అనడం లేదని విమర్శించారు. 

16:18 - January 13, 2016

ఢిల్లీ : సంక్రాంతి పండుగ సమీపిస్తోంది. తమిళనాడు రాష్ట్రంలో సంప్రదాయ బద్ధ క్రీడ అని పేర్కొనే జల్లికట్టుపై సుప్రీం మరోసారి తీర్పు చెప్పింది. జల్లికట్టుపై సుప్రీం ఇచ్చిన స్టేపై నిర్వాహకులు రివ్యూ పిటిషన్ వేశారు. దీనిపై బుధవారం సుప్రీం విచారణ చేపట్టింది. రివ్యూ పిటిషన్ తోసిపుచ్చింది. జల్లికట్టు ఆడడం కుదరదని తేల్చిచెప్పింది. మరోవైపు కేంద్రం ఆర్డినెన్స్ తేవాలని తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. జల్లికట్టుకు అనుమతినివ్వాలంటూ రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.

కేంద్రం అనుమతి..
సంక్రాంతి సందర్భంగా ఎద్దులతో ఆడే ఈ క్రీడకు కేంద్రం కొన్ని షరతులతో ఇటీవల అనుమతించిన విషయం తెలిసిందే. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భారత జంతు సంరక్షణ బోర్డు (ఏడబ్ల్యూబీఐ), పెటా ఇండియా, బెంగ ళూరుకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ పిటిషన్లు వేశాయి. ఈ అంశంపై మంగళ వారం విచారించనున్నట్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌ ఠాకూర్‌ తెలిపారు. 2011 నుంచి తమిళనాడులో జల్లికట్టు, ఇతర రాష్ట్రాలలో ఎద్దుల బండ్ల పోటీలపై నిషేధం అమలులో ఉండగా, ఈ ఏడాది జనవరి 7న నిషేధాన్ని తొలగిస్తూ మోడీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రీడల్లో ఎద్దులు గాయపడటంతోపాటు మనుషులు చనిపోతున్నారని పెటా ఇండియా తెలిపింది. 2010 నుంచి 2014 వరకు 1100మంది గాయపడగా, ఓ చిన్నారితోపాటు 17మంది చనిపోయారని పెటా ఇండియా పేర్కొన్నది. సుప్రీం తీర్పునకు వ్యతిరేకంగా వెళ్లొద్దని ప్రభుత్వ సలహా సంఘం ఏడబ్ల్యూబీఐ గత డిసెంబర్‌లో సూచించినా కేంద్రం పెడచెవిన పెట్టిందంటూ పెటా ఇండియా మండిపడింది. 

గ్రేటర్ ఎన్నికల బరిలో నుండి తప్పుకున్న వైసీపీ..

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల బరిలో నుండి వైసీపీ తప్పుకుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. 

జల్లికట్టు నిర్వాహణకు మరోసారి ఎదురు దెబ్బ..

ఢిల్లీ : తమిళనాడు సంప్రదాయ క్రీడ అని పేర్కొంటున్న జల్లికట్టు నిర్వాహణకు మరోసారి సుప్రీంలో ఎదురుదెబ్బ తగిలింది. కొంతమంది నిర్వాహకులు వేసిన రివ్యూ పిటిషన్ ను తోసిపుచ్చింది. స్టే ఎత్తివేసేందుకు సుప్రీం నిరాకరించింది. 

మాజీ కార్పొరేటర్లతో లోకేష్ భేటీ..

హైదరాబాద్ : మాజీ కార్పొరేటర్లతో లోకేష్ సమావేశమయ్యారు. సిట్టింగ్ స్థానాలను బీజేపీకి కేటాయించవద్దని కార్పొరేటర్లు విజ్ఞప్తి చేశారు. 

ప్రధాని పంటల బీమా పథకానికి కేబినెట్ సిగ్నల్ - రాజ్ నాథ్...

ఢిల్లీ : కేంద్ర కేబినెట్ లో చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ప్రధాన మంత్రి పంటల బీమా పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. పంటల బీమా పథకం రైతులకు రక్షణ కల్పిస్తుందన్నారు. 

పఠాన్ కోట్ ఉగ్రదాడిపై పాక్ ప్రధాని ఉన్నతస్థాయి సమావేశం..

పాకిస్తాన్ : పఠాన్ కోట్ ఉగ్రదాడిపై పాక్ ప్రధాని ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాక్ కేబినెట్ మంత్రులు, ఐఎస్ఐ డీజీ పాల్గొన్నారు. ఉగ్రదాడిపై దర్యాప్తులో భాగంగా భారత్ కు పాక్ అధికారులను పంపనుంది. ఇదిలా ఉంటే జైష్ ఏ మహ్మద్ సంస్థకు చెందిన పలువురిని పాక్ అరెస్టు చేసింది. 

రాధా మోహన్ సింగ్ తో ముగిసిన హరీష్ భేటీ..

ఢిల్లీ : కేంద్ర మంత్రి రాధా మోహన్ సింగ్ తో మంత్రి హరీష్ రావు జరిపిన భేటీ ముగిసింది. కరవు సహాయంపై రేపు నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీనిచ్చారని హరీష్ పేర్కొన్నారు. కరవు సహాయం కింద కేంద్రాన్ని రూ. 1,500 కోట్లు అడిగినట్లు, జాతీయ డెయిరీ పథకం కింద ఇవ్వాల్సిన రూ. 1,024 కోట్లను త్వరగా విడుదల చేయాలని అభ్యర్థించినట్లు తెలిపారు. 

బాబుతో ముగిసిన టి.టిడిపి నేత భేటీ..

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో టి.టిడిపి నేతలు జరిపిన భేటీ ముగిసింది. బీజేపేతో కలిసి గ్రేటర్ పీఠం కైవసం చేసుకోవాలని, వీలైనంత త్వరగా చర్చలను పరిసమాప్తం చేసి ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని బాబు సూచించారు. ఈ సాయంత్రం సీట్ల సర్దుబాటుపై బీజేపీ నేతలతో మరోసారి చర్చిస్తామని ఎల్.రమణ పేర్కొన్నారు. 

చేతబడి నెపంతో దంపతుల సజీవహనం..

విజయనగరం : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చేతబడి నెపంతో దంపతులను స్థానికులు సజీవదహనం చేశారు. మక్కువ (మం) కొత్తకాముడి వలసలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. 

15:50 - January 13, 2016

విజయవాడ : జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'నాన్నకు ప్రేమతో' చిత్రం భారీ అంచనాల నడుమ మంగళవారం విడుదలైంది. దీనితో ఏపీ, తెలంగాణ రాష్ట్రంలోని పలు థియేటర్ల వద్ద భారీగా ఎన్టీఆర్ అభిమానులు చేరుకున్నారు. థియేటర్ల వద్ద టికెట్లు దొరక్కపోవడంతో అభిమానులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విజయవాడలోని యువరాజ్ థియేటర్ యాజమాన్యంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లాక్ లో టికెట్లు విక్రయించారంటూ థియేటర్ పై రాళ్లు రువ్వారు. దీనితో అద్దాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. మరింత సమాచారంకోసం వీడియో చూడండి. 

15:40 - January 13, 2016

ఢిల్లీ : కేంద్ర మంత్రివర్గంలో త్వరలో భారీ మార్పులు చోటు చేసేకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఎందుకంటే మళ్లీ బీజేపీ అధ్యక్షుడిగా అమీత్ షా నియామకం కానున్నారని సమాచారం. ఆయన పదవీ కాలం ముగియబోతున్న తరుణంలో మరో వారం రోజుల్లో షాను అధ్యక్షుడిగా తిరిగి ఎన్నుకోనున్నారు. అధ్యక్ష పగ్గాలు చేపట్టగానే కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేయాలని షా భావిస్తున్నారు. ఈ ఏడాది ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనుండడం..ఆ రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకొనేందుకు పక్కా ప్రణాళిక ప్రకారం ప్రధాని మోడీ వ్యూహ రచన చేస్తున్నారు. అయితే హోం, రక్షణ, విదేశీ వ్యవహారాల, ఆర్థిక శాఖల్లో ఎలాంటి మార్పులుండవని తెలుస్తోంది. మిగతా శాఖల్లో మార్పులు జరుగుతాయని తెలుస్తోంది. 

15:35 - January 13, 2016

హర్యానా : సిక్కు మత గురువు బాబా గుర్ మీత్ రామ్ రహీం ను అనుకరించినందుకు కామిడీ యాక్టర్ కికూ శ్రాద్దను హర్యాన పోలీసులు అరెస్టు చేశారు. శ్రాద్దకు 14 రోజుల రిమాండ్ విధించింది. కామెడీ నైట్స్ విత్ కపిల్ ప్రోగ్రాంలో భాగంగా కిక్కు రామ్ రహీంను అనుకరించడాన్ని ఆయన భక్తులు సహించలేకపోయారు. మత విశ్వాసానికి భంగం కలిగిలంచేలా కిక్కు ప్రవర్తించారని రహీం అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

మట్టిపెళ్లలు విరిగిపడి ఒకరు మృతి..

చిత్తూరు : పుంగనూరు (మం) చెంగలాపురం వద్ద విషాదం చోటు చేసుకుంది. ఇసుక తవ్వుతుండగా మట్టిపెళ్లలు కూలి ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.  

కోటలో అంతర్ రాష్ట్ర దొంగ అరెస్టు..

నెల్లూరు : కోటలో అంతర్ రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్టు చేశారు. రూ.20 లక్షల విలువైన బంగారం, రెండున్నర కిలోల వెండి, రూ. లక్ష సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

15:22 - January 13, 2016

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ ను విమర్శించడం కంటే చేసిన సవాల్ ను స్వీకరించాలని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ డిమాండ్ చేశారు. గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార, విపక్ష సభ్యులు సవాళ్లు విసురుకుంటున్నారు. గ్రేటర్ పీఠం టీఆర్ఎస్ చేజిక్కించుకోకపోతే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ చేసిన సవాల్ పై ప్రతిపక్షాలు ప్రతి సవాల్ విసురుతున్నాయి. ఈ అంశంపై ఎంపీ సుమన్ బుధవారం మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ లో మేయర్ పదవిని టీఆర్ఎస్ గెలుచుకోకపోతే మంత్రి కేటీఆర్ చేస్తారని పేర్కొనడం జరిగిందని దమ్ముంటే ఆ సవాల్ ను స్వీకరించాలన్నారు. విపక్ష నేతలు గెలవకపోతే కనీసం పార్టీ పదవులకు రాజీనామా చేస్తామని ఒక్క మాట చెప్పాలని టిడిపి, బిజెపి, కాంగ్రెస్ పక్షాలకు ఎంపీ సుమన్ డిమాండ్ చేశారు. పనిలో పని గా దిగ్విజయ్ సింగ్ పై కూడా పలు విమర్శలు గుప్పించారు. ఆయన అడుగు పెట్టిన చోట్ల అపజయం ఎదురౌతోందని దిగ్విజయ్ ను ఉద్ధేశించి సుమన్ వ్యాఖ్యానించారు. దిగ్విజయ్ సింగ్ ను పేరు మార్చుకోవాలని, అపజయసింగ్ పేరు పెట్టుకోవాలని ఎంపీ సుమన్ ఏద్దవా చేశారు. 

15:18 - January 13, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వాటర్ గ్రిడ్ పథకం మెగా కుంభకోణమని కాంగ్రెస్ నేత మధుయాష్కి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రా కంపెనీలకు కేసీఆర్ ప్రభుత్వం పనులు అప్పగించిందని, భారీగా కమీషన్లు దండుకొంటోందని ఆరోపించారు. ఆంధ్రా కంపెనీలకు వాటర్ గ్రిడ్ పనులు చేపట్టేందుకు అర్హత లేకపోయినా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ తెరవెనుక ఉండి అంతా నడిపిస్తున్నారని విమర్శించారు. ఇద్దరు చంద్రుల ముద్దుల కృష్ణుడు మెగా అధిపతి కేటీఆర్ అని ఎద్దేవా చేశారు. మంత్రి ఆధీనంలో ఉన్న వరంగల్ లో జీవీపీఆర్ అనే కంపెనీకి రూ. 850 కోట్ల ఆన్ లైన్ కాంట్రాక్టు అప్పగించిందని తెలిపారు. కొన్ని కంపెనీలకు అర్హత వచ్చే విధంగా చేస్తున్నారని తెలిపారు. అంతే సొమ్ముకు గరుడ ఇన్ ఫ్రా అనే కంపెనీకి జీవీపీఆర్ అనే సంస్థ సబ్ కాంట్రాక్టు ఇచ్చిందని, దీనిపై కేటీఆర్ సమాధానం చెప్పాలని యాష్కి డిమాండ్ చేశారు. 

రాధా మోహన్ సింగ్ తో హరీష్ భేటీ..

ఢిల్లీ : కేంద్ర మంత్రి రాధా మోహన్ సింగ్ తో తెలంగాణ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. రాష్ట్రంలో గోదాం నిర్మాణానికి రూ.1000 కోట్ల సాయం అందించాలని హరీష్ అభ్యర్థించారు. 

కోళ్ల పందేలను ప్రారంభించిన ఎంపీ మాగంటి..

పశ్చిమగోదావరి : జిల్లాలోని ఏలూరులో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎంపీ మాగంటి బాబు కోళ్ల పందేలను ప్రారంభించారు. పందేలకు హైకోర్టు అనుమతి నిరాకరించడం...కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వమే చెప్పినా ఎంపీ వీటిని ప్రారంభించడం విశేషం.

పఠాన్ కోట్ అమరవీరుల కుటుంబాలకు కేజ్రీవాల్ పరామర్శ.

పంజాబ్ : పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై జరిగిన దాడిలో అమరులైన వారి కుటుంబసభ్యులను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పరామర్శించారు. అన్ని విధాల అండగా ఉంటామని, ఒక్కో కుటుంబానికి రూ.2లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇస్తామని కేజ్రీవాల్ వెల్లడించారు. 

14:57 - January 13, 2016

498 (ఎ) ..మానసికంగా హింసించినా, అందుకు ప్రేరేపించి ప్రోత్సహించినా ఈ సెక్షన్ కింద కేసు వేయొచ్చు. దీనిపై ఫిర్యాదు చేసే సమయంలో అనేక పొరపాట్లు చేస్తున్నారని లాయర్ పార్వతి పేర్కొన్నారు. మానవి 'వేదిక'లో పార్వతి ఈ అంశంపై విశ్లేషించారు. వరకట్న వేధింపులు..అత్తగారింటి నుండి వేధింపులు..హింసించబడినా..మానసికంగా..శారీరకంగా..ఆరోగ్యానికి తీవ్రమైన విఘాతం కలిగించడం..ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి విషయాలు చేసినా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదు ఇవ్వాలంటే తోచింది రాసిస్తుంటారని, అసలు ఏ విషయాలు రాయాలి ? ముఖ్య ఉద్ధేశ్యం ఏంటీ ? అనేక విషయాలు మరిచిపోతున్నారని పేర్కొన్నారు. ఈ కేసు విచారణకు వెళ్లినప్పుడు ఇచ్చిన ఫిర్యాదుపై వాదోపవాదాలు జరుగుతాయని, ఇందులో పెట్టిన కేసులు కొన్ని వీగిపోతున్నాయన్నారు. తెలిసిన వారి దగ్గరకు వెళ్లి ఫిర్యాదు నమోదు చేసుకొనే అవకాశం ఉందని లాయర్ పార్వతి తెలిపారు. మరిన్ని విషయాలకు వీడియో క్లిక్ చేయండి. 

14:40 - January 13, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం ఎక్కడ ఉంటుందనే ఉత్కంఠ వీడింది. తాత్కాలిక సచివాలయం ఏర్పాటు చేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. గుంటూరులోని వెల్గపూడిలో తాత్కాలిక సచివాలయం ఏర్పాటు చేయబోతున్నట్లు ఏపీ మంత్రి నారాయణ వెల్లడించారు. 205,206,207,208 లో సచివాలయం నిర్మాణం కానున్నట్లు పేర్కొన్నారు. తాత్కాలిక రాజధానికి టెండర్లను రేపటి నుండి పిలువనున్నట్లు తెలిపారు. 25 రోజుల పాటు టెండర్లు పిలిచి ఆరు నెలల్లో సచివాలయం నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మూడు ప్రాంతాలలో ప్రభుత్వం భూసార పరీక్షలు నిర్వహించారు. అనంతంర వెల్గపూడిలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 

14:29 - January 13, 2016

ఢిల్లీ : ఏపీ భవన్ లోను సంక్రాంతి పండుగను నిర్వహిస్తున్నామని హస్తినలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు తెలిపారు. గ్రామంలో ఉన్న అనుభూతిని కలిగించేందుకు ఏపీభవన్ లో సంబరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నాలుగు రోజుల పాటు సంబరాలు జరుగుతాయని , ముగ్గుల పోటీలు, భోగి మంటలు, చిన్నారులకు భోగిపండ్లు, కూచిపూడి నృత్యాలను.. ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా నిర్వహిస్తామని కంభంపాటి తెలిపారు. 

వెల్గపూడిలో తాత్కాలిక సచివాలయం..

హైదరాబాద్ : వెల్గపూడిలో ఏపీ తాతాల్కిక సచివాలయం ఏర్పాటు కానుంది. సర్వేనెంబర్ 205,206,207,208 లో సచివాలయం నిర్మాణం కానున్నట్లు ఏపీ మంత్రి నారాయణ పేర్కొన్నారు. తాత్కాలిక రాజధానికి టెండర్లను రేపటి నుండి పిలువనున్నట్లు తెలిపారు. 

14:22 - January 13, 2016

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు మాటలతోనే కాలం గడిపేస్తున్నారని విమర్శించారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. తన తొమ్మిదేళ్ల గత పాలనలో వెయ్యికోట్ల రూపాయల విలువైన ఒక్క పరిశ్రమైనా రాష్ట్రానికి వచ్చిందా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌కు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు.

14:19 - January 13, 2016

హైదరాబాద్‌ : గ్రేటర్‌ ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీచేస్తామని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ ప్రకటించారు. గాంధీభవన్లో టి పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. అభ్యర్థుల ఎంపికను ఈనెల 17కల్లా పూర్తిచేసి ప్రకటిస్తామని, సాధారణ ఎన్నికల్లో ఎన్నో హామీలను గుప్పించిన సీఎం కేసీఆర్‌...వాటిలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని దిగ్విజయ్ విమర్శించారు. కేంద్రంలోని నరేంద్రమోడీ, రాష్ట్రంలో కేసీఆర్‌ యూ టర్న్ తీసుకోవడంలో సిద్ధహస్తులని విమర్శించారు. 

క్షమాపణలు చెప్పిన అమెరికా..

ఢిల్లీ : అగ్రరాజ్యం అమెరికా క్షమాపణలు చెప్పింది. ఇరాన్ సముద్ర జలాల్లోకి ప్రవేశించిన 10 మంది అమెరికా సైనికులను ఆ దేశం అరెస్టు చేసింది. దీనిపై క్షమాపణ చెప్పాలని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ డిమాండ్ చేశారు. ఆ డిమాండ్‌ను ఒప్పుకున్న అమెరికా తమకు క్షమాపణలు చెప్పినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ జనరల్ అలీ ఫద్నవీ తెలిపారు.

13:54 - January 13, 2016

కాకినాడ : ప్రముఖ కవి, సాహితీవేత్త అద్దేపల్లి రామ్మోహన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనార్యోగంతో బాధపడుతున్నారు. కాకినాడలోని గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రామ్మోహన్ మృతి పట్ల పలువురు కవులు, రచయితలు, సీపీఎం నేతలు సంతాపం తెలిపారు.
1936, సెప్టెంబరు 6న బందరు సమీపంలోని చింతగుంటపాలెంలో పుట్టారు. తండ్రి హిందూ కాలేజీలో గుమస్తాగా పని చేసేవారు. ఎలాంటి సాహిత్య వారసత్వంలేని కుటుంబంలో పుట్టిన అద్దేపల్లి.. తిరుపతిలో ఎంఏ ఎంఎ పూర్తిచేసి లెక్చరర్‌గా స్థిరపడ్డారు. కాకినాడలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని అనేక పుస్తకాలు రాశారు.. మధుజ్వాల, గోదావరి నా ప్రతిబింబం, రక్త సంధ్య, జాషువా కవితా సమీక్ష తదితర రచనలు చేశారు.. ఈయన రచనలకు ఎన్నో అవార్డులొచ్చాయి. సాహితీ సంచార యోధుడు బిరుదు కూడా అందుకున్నారు. చిన్నప్ప భారతి ఏర్పాటు చేసిన సాహిత్య పురస్కారాన్ని పొగచూరిన ఆకాశం" కవితా సంపుటికి అందుకున్నారు అద్దేపల్లి.

 

రాష్ట్రానికి బాబు నష్టం చేస్తున్నారు - రఘువీరా..

హైదరాబాద్ : బాబు డాబుకు పోయి రాష్ట్రానికి నష్టం చేస్తున్నారని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాపై కేంద్రంపై వత్తిడి పెంచేందుకు పార్లమెంట్ సమావేశాల్లో చలో ఢిల్లీ చేపడుతామన్నారు. 2019లో బాబు ఉద్యోగం పోతది..మాదే అధికారమని పేర్కొన్నారు. 

బాబును కలిసిన దత్తాత్రేయ...

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబును కేంద్ర మంత్రి దత్తాత్రేయ కలిశారు. ఏపీకి చెందిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించడం జరిగిందని దత్తాత్రేయ తెలిపారు. విశాఖలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు. జీహెచ్ఎంసీ సీట్ల సర్దుబాటుపై మరోసారి చర్చిస్తామని పేర్కొన్నారు.

ముగిసిన కేబి కేబినెట్ సమావేశం..

హైదరాబాద్ : ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. 500 గజాలలోపు భూముల క్రమబద్ధీకరణకు విది విధానాలు ఖరారు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

 

చింటూకు 27 వరకు రిమాండ్..

చిత్తూరు : మేయర్ కటారి దంపతుల హత్య కేసులో నిందితుడు చింటూను జిల్లా కోర్టులో పోలీసులు హజరు పరిచారు. మిగిలిన 22 మంది నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి విచారించారు. నిందితులందరికీ 27 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. 

సంక్రాంతి శుభకాంక్షలు - కేసీఆర్..

హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ సంక్రాంతి శుభకాంక్షలు తెలిపారు. తెలంగాణ భూముల్లో బంగారు పంటలు పండేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలన్నారు. 

సర్కారీ మాటలు అమలుకు నోచుకోవడం లేదు - బీజేపీ..

హైదరాబాద్ : ప్రభుత్వం ఇచ్చిన మాటలు అమలుకు నోచుకోవడం లేదని, స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం ఏమైందని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రకటనలపై విశ్వాసం కలగడం లేదని, మెట్రో ఆలస్యానికి టీఆర్ఎస్, మజ్లిస్ కారణమన్నారు. పాతబస్తీ వాసులను మోసం చేసేలా మజ్లీస్ వ్యవహరిస్తోందని,అధికారంలోకి వచ్చాక మొదటి రోజే కేసీఆర్ మాట తప్పారని, దళితుడిని సీఎం చేస్తానని చెప్పి మాట తప్పారని విమర్శించారు. నగరంలో సమస్యల పరిష్కారం కోసం బీజేపీ కృషి చేస్తాందన్నారు. 

13:41 - January 13, 2016

ఆదిలాబాద్ : 10 టెన్ టివి నూతన సంవత్సర క్యాలెండర్ ను సిర్పూర్ ఎమ్మేల్యే కోనేరు కోనప్ప ఆదిలాబాద్ లో ఆవిష్కరించారు. ప్రజల కోసం ప్రజల చేత ప్రారంభించబడిన 10 టెన్ టివి కార్మిక, కర్శకలోకం సమస్యలను ప్రపంచానికి చాటుతుందని అన్నారు. ఇకముందు కూడా అలాంటి కార్యక్రమాలతో సామాన్యజనం సమస్యలను వెలికితీయాలని ఆయన ఆకాంక్షించారు.

 

13:37 - January 13, 2016

హైదరాబాద్ : ఎందరో త్యాగధనుల ఫలితంతో తెలంగాణ రాష్ట్రం అవతరించింది. ఎంతో మంది విద్యార్థులను తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేయడంతో స్వరాష్ట్రం సిద్ధించింది. అలాంటి అమరుల కుటుంబాలు ఇప్పుడు సాయం కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలు..ఒక్క అడుగు ముందుకు..ఆరడుగులు వెనక్కి వెళ్లిపోతుండడంతో.. వారి కుటుంబాలకు నిరీక్షణ తప్పడంలేదు. 
అమరుల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రభుత్వం హామీ
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో..ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఉద్యమం కోసం పోరాడిన వీరులు ఎందరో. నాటి ఉద్యమ కాలంలో ప్రాణాన్ని సైతం తృణప్రాయంగా వదిలి..ఉద్యమానికి ఊపిరి పోశారు. ఎట్టకేలకు ప్రత్యేక రాష్ట్రం అవతరించడంతో..ప్రభుత్వం వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీఇచ్చింది.10లక్షల ఆర్థిక సహాయంతోపాటు ఇంటికో ఉద్యోగం, 3ఎకరాల వ్యవసాయ భూమి, ఇళ్లు లేని వారిక ఇళ్లు కట్టిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటివరకు 500 కుటుంబాలను గుర్తించి వారికి 10 లక్షల ఆర్ధిక సహాయాన్ని అందించారు. కానీ..మిగిలిన హామీలపై మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. స్వరాష్ట్రం ఏర్పడి 19నెలలు గడుస్తున్నా..అమరుల కుటుంబంలో ఇంతవరకు ఎవరికీ ఉద్యోగం ఇవ్వలేదు. అసలు అమరుల కుటుంబంలో ఎవరికి ఉద్యోగం ఇవ్వాలి, ఏ స్థాయిలో ఇవ్వాలి, అర్హత లేని కుటుంబస్తుల పరిస్థితి ఏంటి అన్న విషయాలపై గైడ్ లైన్స్ ప్రిపేర్ చేయాల్సి ఉన్నా..ఇంతవరకు దాన్ని పట్టించుకున్న వారే లేరు.
కలెక్టర్ల ప్రపోజల్స్ పై గందరగోళం 
ఇక కలెక్టర్ల నుండి వస్తున్న ప్రపోజల్స్ కూడా గందరగోళంగా ఉన్నాయని అధికారులంటున్నారు. మానవతా దృక్పథంతో తప్పితే.. టెక్నికల్‌గా ఉద్యోగ నియామకాలు చెల్లవని అధికారులంటున్నారు. ఓవైపు గైడ్ లైన్స్ అంశాన్ని పక్కనపెట్టి, మరోవైపు నిజమైన అమరవీరుల గుర్తింపుపై ప్రభుత్వం వ్యవహారిస్తున్న తీరుపై ఆయా కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై స్పందించి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని అమరుల కుటుంబాలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాయి. 

13:33 - January 13, 2016

వాషింగ్టన్ : అల్‌ఖైదా, ఐసిస్‌తో అమెరికాకు ప్రత్యక్ష ముప్పు పొంచి వుందని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా హెచ్చరించారు. అమెరికా ప్రజలను కాపాడుకోవడం, ఉగ్రవాదుల స్థావరాలను నిర్వీర్యం చేయడం తమ ప్రాధామ్యాలని తన వీడ్కోలు ప్రసంగంలో వివరించారు. రానున్న రోజుల్లో కొత్త ఉగ్రవాదానికి పాకిస్తాన్‌ స్వర్గధామంగా మారనుందని ఒబామా అన్నారు.  పాకిస్తాన్‌, ఆఫ్గనిస్తాన్‌తో పాటు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో అస్థితరత కొన్ని దశాబ్దాల పాటు కొనసాగనుందని తెలిపారు.  

 

ప్రముఖ కవి అద్దేపల్లి రామ్మోహన్ కన్నుమూత

కాకినాడ: ప్రముఖ కవి, సాహితీవేత్త అద్దేపల్లి రామ్మోహన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళా ఆయన మరణించారు.

 

13:22 - January 13, 2016

తిరుపతి : సీఎం చంద్రబాబు  ఆధ్వర్యంలో ఏపీ సర్వతోముఖాభివృద్ధి జరగడం ఖాయమని కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరి, టిడిపి నేత కాల్వ శ్రీనివాసులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న వీరికి టిటిడి అధికారులు తీర్థప్రసాదాలను అందచేశారు. అనంతరం కాల్వ మీడియాతో మాట్లాడుతూ విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఏపీకి లక్షల కోట్ల పెట్టుబడులు రావడం శుభపరిణామమన్నారు. 

650 మంది ప్రభుత్వ వైద్యులకు షోకాజ్ నోటీసులు…

హైదరాబాద్ : విధుల్లో అలసత్వం వహిస్తున్న ప్రభుత్వ వైద్యులపై ఎపి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 650 మంది ప్రభుత్వ వైద్యులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

 

13:12 - January 13, 2016

హైదరాబాద్ :  సీఎం చంద్రబాబు గొప్పలు, హెచ్చులతో ఎపికి తీవ్ర నష్టం జరుగుతుందని ఎపిసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి విమర్శించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం ఎపికి రూ.5 లక్షల కోట్లు ఇచ్చిందని బాబు లెక్కలు చెప్పారు... కానీ రాష్ట్రానికి రూ.5 వేల కోట్లు కూడా ఇవ్వలేదని ఇందుకు చంద్రబాబే కారణమన్నారు. సీఎం హెచ్చులు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఎపికి ప్రత్యేకహోదా, ప్రత్యేక రాయితీలు అవసరం లేదన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. బాబు హెచ్చులు చెప్పడంతో ఎపికి కష్టాలొచ్చాయన్నారు. రాష్ట్రంలో 11.7 శాతం వృద్ధి రేటు ఉందని చంద్రబాబు చెబుతూ.. డాంబీకాలకు పోవడంతోనే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని ఆరోపించారు. కేవలం ప్రతిష్టను పెంచుకునేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేయడం లేదన్నారు. కేంద్రం ప్రభుత్వం ప్రణాళిక సంఘం పేరును నీతి ఆయోగ్ గా పేరు మార్చింది… అయితే పేరులో మార్పు వచ్చింది తప్ప… ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని ఎద్దేవా చేశారు.

 

13:00 - January 13, 2016

హైదరాబాద్ : తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మరో మంత్రి చందూలాల్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో భేటీ అయిన వీరు..వరంగల్‌లో రేయాన్స్‌ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించడానికి సహకరించాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఫ్యాక్టరీకి కావాల్సిన కలపను సరఫరా చేయాల్సిందిగా చంద్రబాబుకు కడియం శ్రీహరి విజ్ఞప్తి చేశారు. అయితే దీనికి చంద్రబాబు అంగీకరించారని సమాచారం. 


 

12:57 - January 13, 2016

కాబూల్ : ఆఫ్గనిస్థాన్‌లోని భారత దౌత్య కార్యాలయం సమీపంలో ఉదయం బాంబు పేలుడు సంభవించింది. పేలుడు ఘటనలో ఐదుగురు మృతి చెందారు. జలాలాబాద్‌లోని భారత ఎంబసీకి 200 మీటర్ల దూరంలో ఈ పేలుడు జరిగింది. పేలుడు ఘటనలో ఐదుగురు మృతి చెందారు. 11 మంది గాయపడ్డారు. దౌత్యకార్యాలయంలోని భారతీయులంతా క్షేమంగా ఉన్నారని అధికారవర్గాలు తెలిపాయి. ఆత్మాహుతి దాడిగా అధికారులు భావిస్తున్నారు.  నలుగురు ఉగ్రవాదులు పాల్గొనగా అందులో ఒకరు ఆత్మాహుతి దాడి చేసుకున్నట్టు సమాచారం. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ఉగ్రవాదులు ఇండియన్‌ ఎంబసీని టార్గెట్‌ చేయలేదని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.

 

12:54 - January 13, 2016

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని క్వెట్టాలో ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఓ పోలియో కేంద్రం సమీపంలో జరిగిన ఈ ఘటనలో 15మంది మృత్యువాత పడ్డారు. మరో 20మందికి గాయాలైనట్లు సమాచారం. పోలియో కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. మృతుల్లో 12మంది పోలీసులు, ఒక పారామిలిటరీ అధికారి, ఇద్దరు సాధారణ పౌరులు  ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

12:45 - January 13, 2016

హైదరాబాద్ : విధుల్లో అలసత్వం వహిస్తున్న ప్రభుత్వ వైద్యులపై ఎపి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 650 మంది ప్రభుత్వ వైద్యులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

 

12:41 - January 13, 2016

హైదరాబాద్: హైదరాబాద్, వరంగల్‌లో మూతపడిన రేయాన్స్‌ ఫ్యాక్టరీ పున:ప్రారంభానికి కేంద్రం తప్పకుండా సహకరిస్తుందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఫ్యాక్టరీ పున:ప్రారంభానికి ఏపీ సీఎం చంద్రబాబు కూడా సహకరిస్తానని హామీ ఇచ్చారన్నారు. అలాగే విశాఖలో 400 నుంచి 500 కోట్ల రూపాయల ఖర్చుతో 350 పడకల అత్యాధునికి ఈఎస్‌ఐ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తామన్నారు. ఆస్పత్రికి స్థలం ఇవ్వడానికి ఎపి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. ఎంపీ హరిబాబు తనతో చర్చలు జరిపారని తెలిపారు. టీఆర్ఎస్ కు సరిసమానంగా ఎన్ డిఎ, టిడిపి, బిజెపిలున్నాయిని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై మరోసారి సమావేశం అవుతామని చెప్పారు. నిజాంకాలేజీ మైదానంలో నిన్న జరిగిన టిడిపి-బిజెపి బహరంగసభ విజయంతం అయిందని దత్తాత్రేయ అన్నారు.

 

11:55 - January 13, 2016

హైదరాబాద్ : ఏపీ తాత్కాలిక సచివాలయం ఎక్కడ..? ఈ ప్రశ్నకు రేపటిలోగా స్పష్టత రానుంది. సీడ్‌ కేపిటల్‌ మధ్యలోనే తాత్కాలిక సచివాలయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే.. భవిష్యత్తులో సమస్యలు రాకుండా... వివిధ ప్రాంతాల్లో భూసార పరీక్షలూ చేయించింది. దీనికి సంబంధించిన రిపోర్ట్‌ చేతికందడంతో.. తాత్కాలిక సచివాలయంపై ఇవాళ తుది ప్రకటన వచ్చే అవకాశముంది. 
తాత్కాలిక సచివాలయం స్పష్టత
ఏపీలో తాత్కాలిక సచివాలయం ఏర్పాటుపై ప్రభుత్వానికి స్పష్టత వచ్చింది. మొదట్లో మంగళగిరి సమీపంలోని అమరావతి టౌన్‌షిప్‌లో తాత్కాలిక సచివాలయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. అంతలోనే మనసు మార్చుకుని రాయపూడిలో ఏర్పాటు చేస్తామంది. మళ్లీ మనసు మార్చుకుని.. సీడ్‌ కేపిటల్‌ మధ్యలోనే తాత్కాలిక సచివాలయం ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. ఇలా పూటకో మాట చెబుతుండడంతో.. ప్రజల్లోనూ, ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ గందరగోళం నెలకొంది. 
సీడ్‌ కేపిటల్‌ మధ్యలోనే టెంపరరీ సెక్రెటరియేట్‌
ప్రస్తుతానికి సీడ్‌ కేపిటల్‌ మధ్యలోనే టెంపరరీ సెక్రెటరియేట్‌ భవనాల నిర్మాణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాజధాని శంకుస్థాపన జరిగిన ఉద్దండరాయునిపాలెం, మందడం, రాయపూడి, ఐనవోలు గ్రామాల్లో భూసార పరీక్షలు నిర్వహించింది. వీటి నివేదికలు ఈ ఉదయమే ప్రభుత్వానికి అందాయి. వీటి ప్రకారం.. మందడం.. ఐనవోలు మధ్యలో తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు సమాచారం. 
చంద్రబాబుతో మంత్రి నారాయణ చర్చ
అయితే మందడం, ఐనవోలు గ్రామాలు నదీతీరానికి దగ్గర్లో ఉండడం వల్ల.. నిర్మాణాల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు తమ నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. భూసార పరీక్షల రిపోర్ట్ పై సీఎం చంద్రబాబుతో... మంత్రి నారాయ‌ణ‌,సీఆర్డీఏ అధికారులు చ‌ర్చించ‌నున్నారు. ఆ తర్వాత తుది ప్రకటనను వెలువరించనున్నారు. 

 

11:48 - January 13, 2016

ప్రభాస్‌ నిమ్మల దర్శకత్వంలో ప్రీతమ్‌, మధులగదాస్‌, దీపాళి హీరోహీరోయిన్లుగా మై టీమ్‌ వర్క్‌ క్రియేషన్స్‌ పతాకంపై అల్లాడి శకుంతల, కనాల నారపరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'చోరి'. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ విడుదల కార్యక్రమం సోమవారం ఫిల్మ్‌ ఛాంబర్‌లో జరిగింది. నిర్మాత రామసత్య నారాయణ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేయగా, రాజ్‌ కందుకూరి ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేశారు. 'సరికొత్త ఆలోచనలతో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడని ఈ మోషన్‌ పోస్టర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ యువకులంతా కలిసి చేస్తున్న ఈ ప్రయత్నం సక్సెస్‌ కావాలి' అని రామసత్య నారాయణ, రాజ్‌కందుకూరి ఆకాంక్షించారు. దర్శకుడు మాట్లాడుతూ, 'ఈ చిత్రానికి సంగీతం కూడా నేనే అందించాను. దర్శకుడిగా నాకిది తొలి చిత్రం. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో రెండు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడుతున్న ఓ వాస్తవిక సమస్య గురించి చర్చించాం. ప్రీతమ్‌ సైంటిస్టుగా నటిస్తున్నారు. ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం' అని అన్నారు. 'మంచి కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ చిత్రంలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది' అని హీరో ప్రీతమ్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో మధులగ దాస్‌, విక్కీ అండ్రూ.ఎమ్‌, భాస్కరభట్ల, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

11:45 - January 13, 2016

'బే వాచ్‌' హాలీవుడ్‌ టెలివిజన్‌ సిరీస్‌లో నటిచేందుకు ప్రియాంక గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఈ సిరీస్‌కు సేట్‌ గోర్డాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. విహారం కోసం సముద్ర తీరానికొచ్చి ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోయిన వారిని, ప్రాణహాని కలిగించే సముద్ర ప్రాణుల నుంచి కాపాడే బృందం నేపథ్యంలో ఈ సిరీస్‌ ఉంటుంది. అయితే ఇంతకుముందు అమెరికన్‌ టెలివిజన్‌ సిరీస్‌ 'క్వాంటికో'లో ఎఫ్‌బిఐ ఆఫీసర్‌గా బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా నటించి ప్రశంసలు పొందిన విషయం విదితమే.

 

11:41 - January 13, 2016

గౌరీషిండే దర్శకత్వంలో బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ఖాన్‌, అలియాభట్‌ నటిస్తున్న చిత్రానికి 'వాక్‌ అండ్‌ టాక్‌' అనే టైటిల్‌ని నిర్ణయించినట్టు సమాచారం. గౌరీషిండే దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్‌ కార్యక్రమాలు ఫిబ్రవరి రెండోవారం నుంచి గోవాలో ప్రారంభం కానున్నాయి. 50 సంవత్సరాల షారూఖ్‌, 22 ఏళ్ళ వయస్సుగల అలియాభట్‌.. వీళ్ళిద్దరి జోడీ ఏంటని చాలా మంది ప్రశ్నిస్తున్న నేపథ్యంలో దర్శకురాలు గౌరీ షిండే స్పందిస్తూ, 'ఈ చిత్రంలో షారూఖ్‌ఖాన్‌కి జోడీగా అలియాభట్‌ నటించడంలేదని, కథలో భాగంగా వీరిద్దరూ ఎలా కలుస్తారనే అంశం ఇంత వరకు బాలీవుడ్‌కి సంబంధించి ఏ చిత్రంలోనూ రాలేదు. ఇదొక టిఫికల్‌ లవ్‌స్టోరీ. అనుబంధాలతో నేపథ్యంలో ఉండే ప్రేమకథే గాని, ఆడ,మగ మధ్య రొమాంటిక్‌ రిలేషన్‌షిప్‌ని ఎస్టాబ్లిష్‌ చేశాలా ఉండదు' అని చెప్పారు. ఇదిలా ఉంటే, ఈ చిత్రంలోని ఓ స్పెషల్‌రోల్‌లో గౌరీషిండే కూడా ప్రేక్షకుల్ని అలరించనున్నారు. షారూఖ్‌ ప్రస్తుతం 'రెయిస్‌' చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అనంతరం ఈ చిత్రం ప్రారంభం అవుతుందని నిర్మాత కరణ్‌జోహార్‌ అన్నారు.

తాగునీటి బావుల్లో విషం కలిపిన దుండగులు

నెల్లూరు: వెంకటాచలం ఇందిరమ్మ కాలనీలో దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. తాగునీరు సరఫరా చేసే బావుల్లో దుండగులు విషం కలిపారు. దీంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. 

11:16 - January 13, 2016

హైదరాబాద్: ఇన్ని రోజులు ఎన్నో టార్గెట్‌ల‌ను ఫేస్ చేసిన బ‌ల్దియా ఇప్పుడు మరో సమస్యను పరిష్కరించేందుకు రంగంలోకి దిగింది. అత్యంత పూర్‌గా ఉంటున్న జిహెచ్‌ఎంసి పోలింగ్ ప‌ర్సంటేజీని పెంచేందుకు కార్యాచరణ మొదలుపెట్టింది. దేశంలోని పలు కార్పోరేషన్ల ఎన్నికల ఓట్ల పర్సంటేజీతో పోల్చితే గత గ్రేటర్ ఎన్నికల్లోనే చాలా తక్కువ శాతం పోలింగ్‌ నమోదైంది. ఇంతకి జిహెచ్‌ఎంసి పోల్‌ పర్సంటేజీ పెంచేందుకు అధికారులు ఏంచేయబోతున్నారు.? వాళ్ల కార్యాచరణ ఏవిధంగా ఉండబోతోంది.?
ఓటర్లలో చైతన్యం తెచ్చే ప్రక్రియ
జిహెచ్‌ఎంసి అభ్యర్థుల వేట, ప్రచార పర్వంలో పార్టీలు బిజీబిజీగా ఉంటే బల్దియా మాత్రం ఓటర్లలో చైతన్యం తెచ్చే ప్రక్రియపై ఫోకస్‌ పెట్టింది. గత గ్రేటర్‌ ఎన్నికల్లో ఓటింగ్ శాతం అత్యంత తక్కువగా నమోదైంది. కానీ అందరూ ఓటేస్తేనే సరైన నేతలు ఎంపికవుతారనే ఎవరూ కాదనలేని మాట. ఈ నేపథ్యంలోనే గ్రేటర్‌ ఓటింగ్‌ శాతాన్నిపెంచేందుకు బల్దియా అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు మొదలుపెట్టారు. 
2009లో 43 శాతం ఓటింగ్
2009లో జరిగిన గ్రేటర్‌ ఎన్నికలో 43 శాతం, 2002 ఎన్నికల్లో అత్యంత హీనంగా 28 శాతం మాత్రమే ఓటింగ్‌ నమోదైంది. దీంతో తక్కువగా ఓటింగ్ నమోదు కావడానికిగల కార‌ణాలను బల్దియా అన్వేషించింది. విద్యావంతులు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఓటింగ్‌లో పాల్గొనలేద‌ని అందుకే ఓట్ల శాతం త‌గ్గింద‌ని గుర్తించారు. దీంతో పాటు పోలింగ్‌ కేంద్రం ఎక్కడ ఉందో సరైన సమాచారం లేకపోవడం, ఓటర్లను చైతన్య పరిచే కార్యక్రమాలు నిర్వహించకపోవడం మరికొన్ని కారణాలుగా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో నెట్‌లో ఓటర్ల వివరాలను ప్రవేశపెట్టనున్నారు. ఆ వెబ్‌సైట్‌తోపాటు మరో అప్లికేష‌న్‌ను కూడా డిజైన్ చేశారు. 
వెబ్‌సైట్‌లో ఓటర్ల జాబితా 
ఇకముందు ఓట్‌ స్లిప్‌ కోసం ఓటర్లు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఉంచుతుంది. దీనిద్వారా ఓటర్లు నేరుగా తమ స్లిప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. గత ఎన్నికల్లో అతి తక్కువ ఓటింగ్‌ శాతం నమోదైన వార్డులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అధికారులు తెలిపారు. సిటీలో విద్యావంతులు, హై క్లాస్‌ పీపుల్‌ ఎక్కువ‌గా ఉండే సెంట్రల్‌, వెస్ట్‌జోన్‌లలోని వార్డుల్లోనే గతంలో అతి తక్కువ ఓటింగ్‌ నమోదైంది. ఈ ప్రాంతాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సెలబ్రిటీల సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు. దీని కోసం కొన్ని వెరైటీ ప్రోగ్రామ్‌లను ప్రవేశపెట్టనున్నారు. 
44,280 స్వయం సహాయక బృందాల సహకారం 
ఓటింగ్ శాతం పెంచే ప్రక్రియలో భాగంగా గ్రేటర్‌లో ఉన్న 44,280 స్వయం సహాయక బృందాల సహకారం కూడా తీసుకోనున్నారు. మహిళాసంఘాలకు అవగాహన కల్పించడం, సర్కిళ్ల వారీగా సమావేశాలు నిర్వహించడం తదితర ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అన్ని సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు, జోనల్‌ కమిషనర్లు తమ పరిధిలోని అన్ని డిగ్రీ, ప్రొఫెషనల్‌ కళాశాలలను సందర్శించి ఓటింగ్‌పై అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమాలన్నీ ఓటింగ్ శాతం పెంచడానికి దోహదం చేస్తాయని బల్దియా అధికారులు నమ్ముతున్నారు. మరి ఈసారైనా పోల్‌ పర్సంటేజీ పెరుగుతుందో లేదో చూడాలి. 

 

కాసేపట్లో బాబు నివాసంలో టీటీడీపీ నేతల సమావేశం...

హైదరాబాద్ : ఎపి సీఎం చంద్రబాబు నివాసంలో టీటీడీపీ నేతలు కాసేపట్లో సమావేశం కానున్నారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నారు. బిజెపి నేత బండారు దత్తాత్రేయ, లక్ష్మణ్, చింతల చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. 

10:58 - January 13, 2016

కేరళ: శబరిమల ఆలయంలోకి మహిళలకు అనుమతించాల్సిందేనని సిపిఎం పేర్కొంది. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని సిపిఎం సమర్థించింది. యుడిఎఫ్‌ దీనిపై ఎందుకు అభ్యంతరం చెబుతోందని ప్రశ్నించింది. మరోవైపు ఆలయ సాంప్రదాయం ప్రకారం మహిళలపై నిషేధం కొనసాగించాల్సిందేనని అయ్యప్ప స్వామి ఆలయ బోర్డు స్పష్టం చేసింది. 
మహిళాభక్తులను ఎందుకు అనుమతించడం లేదన్న కోర్టు 
కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలోకి మహిళాభక్తులను ఎందుకు అనుమతించడం లేదని సుప్రీంకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో ట్రావన్‌కోర్‌ దేవస్థాన బోర్డు స్పందించింది. అనాదిగా వస్తున్న ఆలయ సంప్రదాయం ప్రకారమే మహిళలపై నిషేధం కొనసాగుతోందని పేర్కొంది. ఆలయంలోకి పది నుంచి 50 ఏళ్ల మధ్య వయసు మహిళలకు అనుమతి లేదని.. ఈ నిబంధనకు తాము కట్టుబడి ఉన్నామని, దీన్ని కచ్చితంగా కొనసాగించాల్సిందేనని బోర్డు ప్రెసిడెంట్‌ గోపాలకృష్ణన్‌ స్పష్టంచేశారు. నమ్మకాల ప్రకారం కొన్ని సంప్రదాయాలు, ఆచారాలు పాటించాలని సుప్రీంకోర్టు ఎదుట తాము ఇదే వాదన వినిపిస్తామని పేర్కొన్నారు. మతం ఆధారంగా తప్ప- మహిళలకు ఆలయ ప్రవేశాన్ని నిషేధించే హక్కు రాజ్యాంగ విరుద్ధమని దీనిపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు సోమవారం ట్రావన్‌కోర్‌ దేవస్థానం బోర్డుకు, కేరళ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
సుప్రీం తీర్పును స్వాగతించిన సిపిఎం
శబరిమలై ఆలయంలోకి మహిళలను నిషేధించడంపై సుప్రీంకోర్టు కేరళ ప్రభుత్వం, ఆలయబోర్డును ప్రశ్నించడాన్ని సిపిఎం స్వాగతించింది. 2008లో సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌ అధికారంలో ఉండగా అయ్యప్ప ఆలయ ప్రవేశం కల్పించాలని కోరుతూ కొందరు మహిళలు వేసిన పిటిషన్‌కు తాము మద్దతిచ్చామని గుర్తు చేసింది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుడిఎఫ్‌ ప్రభుత్వం  పిటిషన్‌పై ఎందుకు అభ్యంతరం చెబుతోందని ప్రశ్నించింది. మహిళలకు ఆలయ ప్రవేశం రాజ్యాంగ హక్కని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్ పేర్కొన్నారు.
ఫిబ్రవరి 8న తదుపరి విచారణ 
మహిళలందరికీ శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశం కల్పించాలని కోరుతూ యువన్యాయవాదుల సంఘం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై తదుపరి విచారణ ఫిబ్రవరి 8న జరగనుంది.

 

10:48 - January 13, 2016

చిత్తూరు : జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులపై దాడికి పాల్పడ్డారు. జిల్లాలోని ఏర్పేడు దగ్గర టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న లారీని వెంబడించారు. ఈక్రమంలో టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌ఐ, ఎఎస్ ఐపై స్మగ్లర్లు రాళ్లతో దాడి చేశారు. పోలీసులు ఎర్రచందనం తరలిస్తున్న లారీని 20 కిమీ మేర వెంబడించి.. స్మగ్లర్లను పట్టుకున్నారు. ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. లారీని సీజ్ చేసి రూ.50 లక్షలు విలువ చేసే 32 ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు.  స్మగ్లర్లు జరిపిన దాడిలో ఎస్ ఐకి గాయాలు కాగా ..మరో ఆర్‌ఎస్‌ఐకి తీవ్రగాయాలయ్యాయి. వీరిని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు.

పాకిస్థాన్ లో బాంబు పేలుడు... 5 మంది మృతి

పాకిస్థాన్ : క్వెట్టా పోలియో కేంద్రం సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో 20 మందికి పైగా గాయాలయ్యాయి. 

 

రెచ్చిపోయిన ఎర్రచందనం స్మగ్లర్లు

చిత్తూరు : జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. ఎర్రచందనం తరలిస్తుండగా వెంబడించిన టాస్క్ పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆర్ ఎస్ ఐ వాసుకు గాయాలాయ్యాయి. 

 

09:52 - January 13, 2016

గతంలో లాగా తెలంగాణ సీఎం కేసీఆర్, ఎపి సీఎం చంద్రబాబులు విమర్శలు చేసుకోవడం లేదని… దీంతో కేసీఆర్, చంద్రబాబుల మధ్య ఏదైనా ఒప్పందం కుదిరిందా… ? అన్న అనుమానం కలుగుతుందని ది హన్స్ ఇండియా చీఫ్ ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ అన్నారు. గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. నిన్న హైదరాబాద్ లోని నిజాంకాలేజీ మైదానంలో జరిగిన టీడీపీ, బీజేపీ సభలో కూడా టీఆర్ ఎస్ ను విమర్శించకుండానే చంద్రబాబు మాట్లాడారని తెలిపారు. పరిణామాలను బట్టి చూస్తే కేసీఆర్, చంద్రబాబులు ఒకనొకరు తిట్టుకోవద్దని ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోందన్నారు. తెలంగాణలో కరువు గురించి పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం లేదన్నారు. భారత రాజ్యాంగాన్ని గౌరవించేవారు సెటిలర్ అనే పదాన్ని వాడకూడదన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు మాత్రమే సెటిలర్స్ అవుతారని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యం అంటే వారసత్వ సంపద కాదని తెలిపారు. వారసత్వరాజకీయాలు.. ఉండకూడదని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను ఆయన మాటల్లోనే చూద్దాం....
టీసర్కార్ ను విమర్శించని బాబు
'హైదరాబాద్ లో నిన్న జరిగిన టీడీపీ, బీజేపీ సన్నాహక సభలో ఎపి సీఎం చంద్రబాబు టీసర్కార్ మాట ఎత్తకుండా ప్రసంగించారు. కేసీఆర్ ను విమర్శించ లేదు. పరిణామాలను చూస్తుంటే కేసీఆర్, చంద్రబాబులు ఒకనొకరు తిట్టుకోవద్దని ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికలపై చంద్రబాబు ఆసక్తి చూపడం లేదు. ఇదిలావుంటే బిజెపి, టిడిపిలు కలిసి 2019లో అధికారంలోకి వస్తాయని చంద్రబాబు చెప్పారు. కానీ బీజేపీలో బలమైన వర్గం టీడీపీతో పొత్తును విమర్శిస్తోంది. బిజెపితో పెట్టుకోవడంపై టిడిపి సానుకూలంగా ఉంది… కానీ టిడిపితో పెట్టుకోవడంపై బీజేపీలో కొంతమంది అనాసక్తిగా చూపుతున్నారు. ఎపి బిజెపిలో రెండు వర్గాలున్నాయి… చంద్రబాబుని పొగిడేవారు.. విమర్శించే వారు. ఎపిలో టిడిపి, బిజెపి కలుస్తాయా.. అన్న సందిగ్దత ఉంది. 
జనసేన జాడ లేదు…
పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ జాడ లేదు. జనసేనలో జనం లేరు, సేన లేడు. తెలంగాణలో కరువు గురించి పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం లేదన్నారు. ప్రజా సమస్యల గురించి పవన్ ప్రశ్నించడం లేదు.
విదేశాల నుంచి వచ్చిన వారే సెటిలర్స్…
భారత రాజ్యాంగాన్ని గౌరవించేవారు సెటిలర్ అనే పదాన్ని వాడకూడదు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు మాత్రమే సెటిలర్స్ అవుతారు. సెటిలర్ అనే పదానికి అర్థం.. ఇతర దేశాల నుంచి వచ్చి మన దేశంలో ఉంటే.. సెటిలర్స్ అనాలి… దేశానికి ఒకే పౌరసత్వం ఉంటుంది. తెలంగాణ ఉద్యమ కాలంలో టీఆర్ ఎస్ నేతలు.. ప్రజలను రెచ్చగొట్టించే ప్రసంగాలు చేశారు. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రా వారిపై మెతక వైఖరి అవలంభిస్తున్నారు. శాంతిమంత్రాన్ని జపిస్తున్నారు. ఉద్యమకాలంలో కూడా రెచ్చగొట్టకుండా.. ఉంటే.. విద్యార్థుల ఆత్మహత్యలు జరిగివుండేవి కావు. ఒక వ్యక్తి ఎప్పుడైనా… ఒకే మాట మాట్లాడాలి.. స్వలాభం, రాజకీయాల కోసం నేతలు ప్రజల మనోభావాలతో చెలగాటం ఆడుతున్నారు. ఉపన్యాసాల వల్ల ప్రయోజనం లేదు. ఎన్నికలయ్యేదాకా…  విమర్శలు, ఆరోపణలు చేసుకుంటారు. రాజకీయాల్లో శాశ్వతమైన శాసనాలు చేయలేము' అని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం…

 

09:13 - January 13, 2016

విజయవాడ : కాల్ మనీ కేసులో మరో కీలక నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న పెండ్యాల శ్రీకాంత్ ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లోని ఓ హోటల్ ఉన్న శ్రీకాంత్ ను టాస్క్ పోర్స్ పోలీసులు రాత్రి అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ మాచవరం పోలీసులకు శ్రీకాంత్ ను అప్పగించారు. నిందితున్ని నేడు కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉంది. ఓ మహిళను లైంగికంగా వేధించినట్లు శ్రీకాంత్ పై అభియోగాలున్నాయి. ఇప్పటి వరకు ఈకేసులో 7 మందిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో ఆ ఇద్దరు నిందితులను అరెస్టు చేసి.. కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు చెప్పారు.

 

08:52 - January 13, 2016

జీహెచ్ ఎంసీ ఎన్నికలు మినీ ఎలక్షన్స్ లాంటివని వక్తలు అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో విశ్లేషకుడు నడింపల్లి సీతారామరాజు, కాంగ్రెస్ అధికారప్రతినిధి వకుళాభరణం కృష్ణమోహన్, టీఆర్ ఎస్ అధికార ప్రతినిధి తాడూరు శ్రీనివాస్, టిడిపి నేత విద్యాసాగర్ రావు పాల్గొని, మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు మారాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికార పార్టీ నేరవేర్చ లేదడం లేదన్నారు. ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధికి టీడీపీ కూడా కృషి చేసిందన్నారు. జల్లికట్టు పై మాట్లాడారు. సంప్రదాయ క్రీడలను వ్యాపారంగా మార్చేస్తున్నారని ఆవేదన వాపోయారు.

నేడు కేబినెట్ సబ్ కమిటీ భేటీ

హైదరాబాద్ : ఏపీ డిప్యూటీ సీఎం కేఈ ఆధ్వర్యంలో నేడు కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణపై సమీక్ష చేయనున్నట్లు తెలుస్తోంది. 

 

కాల్ మనీ కేసులో మరో కీలక నిందితుడు అరెస్టు

విజయవాడ : కాల్ మనీ కేసులో మరో కీలక నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న పెండ్యాల శ్రీకాంత్ ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లోని ఓ హోటల్ ఉన్న శ్రీకాంత్ ను టాస్క్ పోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాచవరం పోలీసులకు శ్రీకాంత్ ను అప్పగించారు. నేడు కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉంది.  

 

07:44 - January 13, 2016

క్షరకుల జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయని… వారి సమస్యలను పరిష్కరించాలని క్షౌరవృత్తిదారుల సంఘం నేత మల్లేష్ డిమాండ్ చేశారు. మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో  దాదాపు పాతిక నుంచి 30 లక్షల మందికి క్షౌరవృత్తే జీవనాధారం. ఆధునిక పోకడలు ఈ వృత్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. హెయిర్  అండ్ బ్యూటీ కేర్ పేరుతో కార్పొరేట్ సంస్థలు కూడా ఈ వ్రుత్తిలో ప్రవేశించాయి.  కార్పొరేట్ సంస్థల విస్తరణ క్షౌర వృత్తిదారుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తోంది?  సంప్రదాయ బద్దంగా క్షౌరవృత్తిని నిర్వహిస్తున్న వారు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? క్షౌరవృత్తిదారుల పట్ల ప్రభుత్వాల విధానాలు ఎలా వున్నాయి? బడ్జెట్ కేటాయింపులు, వాటి అమలు ఎలా వుంటోంది? ఈ వృత్తిదారుల సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇదే అంశంపై మల్లేష్ మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం…

 

07:32 - January 13, 2016

ఢిల్లీ : ఆయనేంటో అందరికీ తెలుసు. కొత్తగా పరువు తీయాల్సిన పనేం లేదు. ఓ కేంద్రమంత్రిపై ఢిల్లీ సీఎం మాటలివి. ఆ మాత్యుడికి పరువే లేదంటూ... మీడియా ముందు పరువు తీశారు కేజ్రీవాల్‌. ఢిల్లీలో మాటలు మంటలు రేపుతున్నాయి. తూటాల్లా తగులుతున్నాయి. బిజెపి, ఆప్ నేతల మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ నడుస్తోంది. 
అరుణ్ జైట్లీపై కేజ్రీవాల్ ఫైర్ 
హస్తినలో పొలిటికల్ గేమ్‌కు తెరపడటం లేదు. డిడిసిఎ వివాదం ముదురుతోంది. రోజురోజుకు చినికిచినికి గాలివానలా మారుతోంది. బిజెపి, ఆమ్‌ ఆద్మీ మధ్య మంటలు పుట్టిస్తోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఇరు పార్టీల లీడర్లు ప్రకంపనలు సృష్టిస్తున్నారు. తాజా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీపై ఢిల్లీ సీఎం తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
పరువునష్టం దావాపై కేజ్రీవాల్ ఘాటు స్పందన
తనపై జైట్లీ వేసిన పరువునష్టం దావాపై కేజ్రీవాల్ ఘాటుగానే స్పందించారు. సుమారు 2 వేల పేజీలతో కూడిన సమాధాన పత్రాలను ఢిల్లీ హైకోర్టుకు సమర్పించారు. అనంతరం కమల నేతపై తనదైన స్టయిల్‌లో సెటైర్లు విసిరారు. పరువు నష్టం దావా వేసిన వ్యక్తికి ప్రజల్లో ఎలాంటి ఆదరణ లేదని మీడియా ముందే జైట్లీ పరువు తీశారు. ఆయనకు పరువు ఉంటే కదా..! పరువు నష్టం కేసు వేయడానికి, తనను తాను కాపాడుకోవడానికే... తనపై ఈ కేసు వేశారని ఢిల్లీ సీఎం ఆరోపించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అమృత్‌సర్‌లో లక్ష ఓట్ల తేడాతో జైట్లీ ఓడిపోయారని కేజ్రీవాల్ గుర్తుచేశారు. ప్రజల్లో తనకు గొప్ప వ్యక్తిత్వం, ప్రతిష్టలు ఉన్నాయని జైట్లీ చెప్పుకొంటున్నదంతా అల్పమైన వాదనేనని కేజ్రీవాల్ కొట్టిపారేశారు. ప్రజల్లో తనకు గొప్ప వ్యక్తిత్వం ఉందని జైట్లీ చేసిన వాదనను భారత ప్రజాస్వామ్యం ఎన్నడూ అంగీకరించలేదని ఢిల్లీ సీఎం అన్నారు.
కేజ్రీవాల్ కామెంట్లపై కమలదళంలో కలవరం
మరోవైపు కేజ్రీవాల్ కామెంట్లు కమలదళంలో కలవరం సృష్టిస్తున్నాయి. ఆయనపై బీజేపీ కార్యకర్తలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ముఖ్యమంత్రి హోదాను మరిచిపోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. మొత్తానికి ఈ వివాదం ఎక్కడకు దారి తీస్తుందో చూడాలి.

 

నేడు మహబూబ్ నగర్ జిల్లాలో సీఎస్ రాజీవ్ శర్మ....

మహబూబ్ నగర్ : తెలంగాణ ప్రభుత్వ సీఎస్ రాజీవ్ శర్మ ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

07:21 - January 13, 2016

హైదరాబాద్: ఏపీ నూతన సీఎస్‌ ఎవరనేది హాట్‌టాపిక్‌గా మారింది. ఇద్దరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్‌పై అధికార వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. 
ఈనెల 31న ఐవైఆర్‌ కృష్ణారావు ఉద్యోగ విరమణ 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేయనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన చీఫ్‌ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీసీఎల్‌ఎ కమిషనర్‌గా పనిచేశారు. రాష్ట్ర విభజన అమల్లోకి వచ్చిన 2014 జూన్‌2కి ముందు కొన్ని గంటలపాటు కృష్ణారావు ఉమ్మడి రాష్ట్ర సీఎస్‌గా పనిచేశారు. ఆ తరువాత నూతన ఆంధ్రప్రదేశ్‌కు తొలి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 
రాష్ట్ర ఎన్నికల అధికారిగా కృష్ణారావు..?
ఐతే కృష్ణారావును రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుందా లేక..మరేదైనా ఇతర బాధ్యతలు..అప్పగిస్తుందా అనే చర్చ కొనసాగుతోంది. సీఎస్‌గా కొనసాగించకపోయినా..రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది.
సీఎస్‌గా తెర మీదకు ఇద్దరు పేర్లు
ఒకవేళ కృష్ణారావు ఉద్యోగ విరమణ చేస్తే..సీఎస్‌గా ఇద్దరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 1981 బ్యాచ్‌కు చెందిన సత్యప్రకాశ్‌ ఠక్కర్‌, 1982 బ్యాచ్‌కు చెందిన నిమ్మగడ్డ రమేష్‌లు సీఎస్‌ రేసులో ఉన్నారు. ఎస్‌పి ఠక్కర్‌ ప్రస్తుతం ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇక రెండో అధికారి నిమ్మగడ్డ రమేష్‌ గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో పనిచేస్తున్నారు. 
రేసులో 1983 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారులు 
మరోపక్క 1983 బ్యాచ్‌కు చెందిన కొంతమంది ఐఏఎస్‌ అధికారులు కూడా సీఎస్‌ రేసులోకి వస్తున్నారు. నూతన సీఎస్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంతవరకు ఎటువంటి సంకేతాలు ఇవ్వలేదని తెలుస్తోంది. కాని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఠక్కర్‌కే ఛాన్స్ దక్కే అవకాశముందని సమాచారం. మొత్తానికి నూతన సీఎస్‌పై వారం పది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముంది. 

 

07:16 - January 13, 2016

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. మంగళవారం తొలి రోజు ఐదు డివిజన్ల నుంచి ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి.  ఈనెల 17వరకూ నామినేషన్‌లను స్వీకరిస్తారు. సంక్రాంతి పండుగ తర్వాత ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్‌లు దాఖలు చేసే అవకాశం ఉంది.
150 డివిజన్లలో ఆర్‌వోలు, ఏఆర్‌వోలు 
గ్రేటర్‌ ఎన్నికల  నోటిఫికేషన్‌ జారీ కావడంతో నామినేషన్ల దాఖలుపై అభ్యర్ధులు దృష్టి పెట్టారు. నామినేషన్ల స్వీకరణకు జీహెచ్‌ఎంసీ విస్తృత ఏర్పాట్లు చేసింది.  మొత్తం 150 డివిజన్లకు గాను అదే సంఖ్యలో ఎన్నికల రిటర్నింగ్‌ ఆఫీసర్లు, అసస్టెంట్‌ టర్నింగ్‌ ఆఫీసర్లను నియమించారు. ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్ధులను ఇంకా ప్రకటించకపోవడంతో తొలిరోజు నామినేషన్లకు పెద్దగా స్పందన కనించలేదు. కేవలం ఐదు డివిజన్ల నుంచి ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి.  
ఈనెల 17 మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్లు 
మొదటిరోజు 126, 130, 140 డివిజన్ల నుంచి ఒక్కోక్కటి, 11, 19 డివిజన్లలో రెండేసి నామినేషన్లు దాఖలయ్యాయి. ఈనెల 17  మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్లు   వేసేందుకు వచ్చే అభ్యర్ధులు ఎన్నికల కమిషన్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జీహెచ్ ఎంసీ ఎన్నికల కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి సూచించారు.
అఫిడవిట్‌లో ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలు
నామినేషన్‌ పత్రాలతోపాటు జతచేసే ఎన్నికల అఫిడవిట్‌లో అభ్యర్ధులు, తమతో పాటు.. తమ జీవిత భాగస్వాముల ఆస్తులు, అప్పులు,  కేసులు వంటి అంశాలను దాచిపెడితే ఇబ్బందులు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. రిజర్వేషన్లు వర్తించే అభ్యర్ధులు  నామినేషన్లతోపాటు  కుల  ధృవీకరణ పత్రాలు  సమర్పించాలని కోరుతున్నారు. 
మొత్తం 74,36,247 మంది ఓటర్లు 
గ్రేటర్‌ వార్‌లో మొత్తం 74 లక్ష 36 వేల 247 మంది ఓటర్లు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో కొత్తగా నమోదైన ఓటర్లు 3 లక్షల 83 వేల 530 మంది ఉన్నారు. అందరూ స్వేచ్ఛగా ఓటు హక్కు  వినియోగించుకునేందుకు వీలుగా  జీహెచ్‌ఎంసీతోపాటు, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఏర్పాట్లు చేస్తోంది. 

 

07:13 - January 13, 2016

హైదరాబాద్ : కాంగ్రెస్‌ను వరుస ఎన్నికలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నుండి ఊపిరి పీల్చుకునేలోపు గ్రేటర్‌ ఎన్నికలు తరుముకు రావడంతో  నేతలు ఇప్పటికే ఆపసోపాలు పడుతున్నారు. దీనికి తోడు ఇప్పుడు నారాయణఖేడ్‌ ఎన్నికల షెడ్యూల్‌ కూడా విడుదల కావడంతో ఎలా నెట్టుకురావాలో అర్ధం కాక హస్తం నేతలు తలలు పట్టుకుంటున్నారు. 
వరుస ఎన్నికలతో 'హస్తం' కుదేలు
తెలంగాణలో కాంగ్రెస్‌కు ఎలక్షన్‌ ఫీవర్‌ పట్టుకుంది. వరుస ఎన్నికలతో పార్టీ కుదేలవుతోంది. సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో కారు జోరును అడ్డుకోలేక డీలా పడుతూ వస్తోంది. మెదక్‌ ఉప పోరు మొదలు.. మొన్నటి వరంగల్‌ ఉప ఎన్నికల వరకు వరుస ఓటమిలను చవిచూసింది. నిన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలోనైతే మధ్యలోనే కాడిని దించేసింది. అయితే గుడ్డిలో మెల్లలా పోటీ చేసిన మూడింటిలో రెండు స్థానాలు దక్కించుకోవడం ఆపార్టీకి కొంత ఊరటనిచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికలు ఇలా ముగిశాయో లేదో.. తరుముకొచ్చిన గ్రేటర్‌ ఎన్నికలతో నేతలంతా తలమునకలయ్యారు. 
అభ్యర్ధుల వేటలో పడ్డ కాంగ్రెస్‌ 
గ్రేటర్‌లో నామినేషన్ల పర్వం మొదలు కావడంతో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధుల వేటలో పడింది. 150 డివిజన్లలో వంద చోట్లైనా అభ్యర్ధులను నిలపాలని యోచిస్తోంది. ఈ తరుణంలో ఆశావాహుల నుంచి వచ్చిన 1500 దరఖాస్తులను షార్ట్‌ లిస్ట్‌ చేయడం పార్టీకి సవాల్‌గా మారింది. మరోవైపు టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ పీఠమే లక్ష్యంగా ఒకరౌండ్‌ ప్రచారం ముగించినా.. కాంగ్రెస్‌ ఇంకా గెలుపు గుర్రాల కోసం భూతద్దంతో వెతుకుతూనే ఉంది. 
నారాయణఖేడ్‌ షెడ్యూల్‌తో కలవరపాటు 
మరోవైపు గ్రేటర్‌లో గట్టెక్కేందుకు నానా తంటాలు పడుతున్న కాంగ్రెస్‌... ఇప్పుడు తరుముకొచ్చిన నారాయణఖేడ్‌ ఉప ఎన్నికతో మరింత కలవరపెడుతోంది. కిష్టారెడ్డి మృతితో వచ్చిన ఉప ఎన్నికలో ఆయన కుమారుడికే టికెట్‌ కన్ఫమ్‌ చేసింది. అయితే ఇక్కడ జెండా ఎగురవేసేందుకు టీఆర్‌ఎస్‌ ఇప్పటికే గ్రౌండ్‌వర్క్‌ పూర్తి చేసింది. ఏకంగా మంత్రి హరీష్‌రావును రంగంలోకి దింపి ఆపరేషన్‌ ఆకర్ష్‌ అస్త్రంతో కాంగ్రెస్‌ నేతల గుండెల్లో గుబులు రేపుతోంది. ఇప్పటికే కొందరు కాంగ్రెస్‌ ముఖ్య నేతలతో పాటు... ద్వితీయశ్రేణి నాయకత్వం గులాబీగూటికి చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరోవైపు నియోజకవర్గానికి మంత్రి నిధుల వరద పారిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ గట్టెక్కడం  అంతా ఈజీ కాదని కాంగ్రెస్‌ నేతలే చెబుతున్నారు. అదేవిధంగా గ్రేటర్‌, నారాయణఖేడ్‌ పోలింగ్‌ మధ్య సమయం కూడా ఎక్కువ లేకపోవడం,.. నేతలంతా గ్రేటర్‌ ఎన్నికల్లోనే బిజీగా ఉండడం పార్టీని కలవరపరుస్తోంది. 
హస్తం ఎలా గట్టెక్కుతుందో..? 
గ్రేటర్‌ టార్గెట్‌గా టీఆర్‌ఎస్‌ చేస్తున్న పాలిట్రిక్స్‌తో ఉక్కిరిబిక్కిరవుతున్న కాంగ్రెస్‌కు.. ఇప్పుడు తరుముకొచ్చిన నారాయణఖేడ్‌ ఉప ఎన్నిక తెగ టెన్షన్‌ పెడుతోంది. ఈ కీలక ఎన్నికల్లో హస్తం పార్టీ ఎలా గట్టెక్కుతుందో వేచి చూడాలి. 

 

07:06 - January 13, 2016

హైదరాబాద్: ఎన్నికల బరిలో సరైన అభ్యర్థులు లేకపోతే పార్టీ ఎంతగొప్పదైనా ఓటమి ఖాయమనేది ఎవరూ కాదనలేని నిజం. అందులోనూ తెలంగాణకు ఆయువు పట్టులాంటి గ్రేటర్ హైదరాబాద్‌ ఎన్నికలు కాబట్టి పార్టీలు పక్కా ప్లాన్‌తో బరిలో దిగుతుంటాయి. ఈ కోణంలోనే అత్యంత ముఖ్యమైన అభ్యర్థుల ఎంపిక విషయంలో టిఆర్‌ఎస్‌ పకడ్బందీగా వ్యవహరిస్తోంది. పైగా విజయం తమదే అంటూ మంత్రి కేటీఆర్‌ ఛాలెంజ్‌ కూడా చేశారు.
150 డివిజన్లలోనూ బరిలో టీఆర్ ఎస్ అభ్యర్థులు 
బల్దియా పరిధిలోని 150 డివిజన్లలోనూ అభ్యర్థులను బరిలో నిలపాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక కోసం పలు సర్వేలు నిర్వహించింది. ప్రజలతో ఎవరెవరికి సత్సంబంధాలున్నాయి, పార్టీ ఆవిర్భావంనుంచి పార్టీలో కొన‌సాగుతున్నదెవరు, తదితర అంశాలను దృష్టిలోపెట్టుకుని డివిజన్లవారీగా టిఆర్‌ఎస్‌ మూడు సర్వేలు నిర్వహించింది. ఇదే సమయంలో గులాబీ టికెట్ కోసం ఆశావహులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఇప్పటికే క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగిన పార్టీ నేత‌లు పోటీ చేయాలనుకుంటున్న వారినుంచి అభ్యర్థన పత్రాలు స్వీక‌రించారు. 
పైరవీలకు తావులేకుండా వ్యవ‌హ‌రించాలి : సిఎం కేసీఆర్
అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి పైరవీలకు తావులేకుండా వ్యవ‌హ‌రించాల‌ని సిఎం కేసీఆర్ నేత‌ల‌ను ఆదేశించారట. ఇక గెలుపు గుర్రాల ఎంపిక కోసం సీనియ‌ర్ నేత కేకే ఆధ్వర్యంలో ఐదుగురు స‌భ్యుల‌తో కూడిన ఓ క‌మిటీని నియ‌మించారు. క‌మిటీలో ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు డిఎస్, డిప్యూటి సీఎం కడియం శ్రీహరి, మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి ఉన్నారు. కేకే నివాసంలో ప్రాథ‌మికంగా భేటీ అయిన కమిటీ సభ్యులు డివిజ‌న్ల వారీగా పార్టీ నేత‌లు సేక‌రించిన స‌మాచారంపై క‌స‌ర‌త్తు చేశారు.
అభ్యర్థుల ఖ‌రారుపై అధికార పార్టీ నేత‌ల పావులు
అభ్యర్థులకు స్థానికంగా ఉన్న ప‌ట్టు, ఆర్థిక‌, అంగ‌బ‌లం త‌దిత‌ర అంశాల‌పై కమిటీ నేత‌లు దృష్టిపెట్టారు. వీలైనంత త్వర‌గా అభ్యర్థులను ఖ‌రారు చేసేందుకు అధికార పార్టీ నేత‌లు పావులు క‌దుపుతున్నారు. డివిజ‌న్‌లలో ఏక‌ప‌క్షంగా ఉన్న స్థానాలపై ఒక అంచనాకొచ్చి మొద‌టి విడ‌త‌లో క‌నీసం 50 సీట్లకు అభ్యర్థుల పేర్లను మ‌రో రెండు రోజుల్లో ప్రక‌టించే అవ‌కాశం ఉంద‌ని సమాచారం. కీల‌క స్థానాల్లో మాత్రం అభ్యర్థుల ఎంపికపై వ్యూహాత్మకంగా వ్యవహరించనున్నారు. ఆయా స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనపై ఆచితూచి వ్యవహరించే అవకాశముంది. 

 

06:59 - January 13, 2016

శ్రీకాకుళం : జిల్లాలోని రాజాం మండలం అంతకాపల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా 14 పూరిళ్లు దగ్ధమయ్యాయి. నాలుగు గ్యాస్‌ సిలిండర్లు పేలిపోయాయి. భయంతో జనం పరుగులు పెట్టారు. రూ. 30 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. 

నేడు రెండో రోజు పురపాలక కమిషనర్ల సమావేశం...

హైదరాబాద్ : నేడు రెండో రోజు పురపాలక కమిషనర్ల సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో ఆస్తిపన్ను, నీటిపన్ను వసూళ్లు, ఆదాయ మార్గాల పెంపు, స్వచ్ఛ్ భారత్ అమలుపై సమీక్ష చేయనున్నారు. 

 

నేడు చంద్రబాబు నివాసంలో టీటీడీపీ నేతల భేటీ

హైదరాబాద్ : ఎపి సీఎం చంద్రబాబు నివాసంలో నేడు తెలంగాణ టిడిపి నేతలు సమావేశం కానున్నారు. గ్రేటర్ ఎన్నికలు, బీజేపీతో సర్దుబాటు వంటి పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. 

 

శ్రీకాకుళం జిల్లాలో అగ్నిప్రమాదం..

శ్రీకాకుళం : జిల్లాలో రాజం మండలం అంతకాపల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం సంభవించింది. నాలుగు సిలిండర్లు పేలాయి. దీంతో 15 పూరిళ్లు దగ్ధం అయ్యాయి. దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. రూ.30 లక్షల ఆస్తినష్టం సంభవించింది.

 

Don't Miss