Activities calendar

14 January 2016

తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి టెండర్లు..

విజయవాడ : తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి కాసేపట్లో టెండర్ల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. వెలగపూడిలో రూ. 180 కోట్లతో మూడు బ్లాక్ ల నిర్మాణానికి టెండర్లు పిలువనున్నారు. ఒక్కో బ్లాక్ లో రెండు బిల్డింగ్ ల చొప్పున మొత్తం ఆరు బిల్డింగ్ ల టెండర్ల వివరాలను కాసేపట్లో సీఆర్డీఏ వెబ్ సైట్ లో పూర్తి వివరాలు రానున్నాయి. 

కేంద్ర గిరిరాజ్ సింగ్ కనబడడం లేదంట..

పాట్నా : కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కనబడడం లేదని నెవడా నియోజకవర్గ ప్రజలు పోస్టర్లు అంటించారు. ఎంపీగా ఎన్నికైన నాటి నుండి నియోజకవర్గానికి ఒక్కసారి కూడా రాలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

నిర్మల్ లో టీఆర్ఎస్ కౌన్సిలర్ల బహిష్కరణ..

ఆదిలాబాద్: నిర్మల్ లో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆరుగురు కౌన్సిలర్లను టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బహిష్కరించారు. 

ఆత్మకూరులో కారు బీభత్సం..

మహబూబ్ నగర్ : ఆత్మకూరులో కారు బీభత్సం సృష్టించింది. పార్క్ చేసిన ద్విచక్రవాహనాలపైకి కారు దూసుకెళ్లింది. నలుగురికి గాయాలయ్యాయి. కారు డ్రైవర్ పరారయ్యాడు. 

రేపు టీఆర్ఎస్ తొలి జాబితా ?

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికలకు టీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. 40 మందిని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

21:32 - January 14, 2016

బ్రిస్బేన్ : ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా, మాజీ చాంపియన్ టీమిండియాజట్ల ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ షో....పెర్త్ నుంచి బ్రిస్బేన్ నగరానికి చేరింది. కొత్త సంవత్సరంలో సరికొత్తగా జరుగుతున్న ఈ సిరీస్ లో ఇప్పటికే 1-0 ఆధిక్యం సంపాదించిన కంగారూ టీమ్ బ్యాక్ టు బ్యాక్ విజయాలకు ఉరకలేస్తుంటే....పెర్త్ వన్డే దెబ్బతో కంగుతిన్న టీమిండియా దెబ్బకు దెబ్బతీయాలన్న పట్టుదలతో ఉంది. సంక్రాంతి రోజున జరిగే ఈ పోటీలో ధోనీసేన విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. పెర్త్ లో ముగిసిన హైస్కోరింగ్ తొలివన్డేలో 5 వికెట్ల విజయం సాధించిన ఆత్మవిశ్వాసంతో ఆతిథ్య ఆస్ట్రేలియా ఓ వైపు ఉరకలేస్తుంటే మరోవైపు తొలివన్డే ఓటమితో రగిలిపోతున్న టీమిండియా దెబ్బకు దెబ్బ తీయాలన్న పట్టుదలతో ఉంది. బ్యాట్స్ మన్ స్వర్గంలాంటి పెర్త్ పిచ్ పై..టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ, వన్ డౌన్ విరాట్ కొహ్లీ...డబుల్ సెంచరీ భాగస్వామ్యంతో తమజట్టుకు భారీస్కోరు అందించినా...బౌలర్ల వైఫల్యంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. వాక్ పిచ్ ...స్లో బౌలర్లకు ఏ మాత్రం సహకరించకపోడంతో భారత స్పిన్నర్ల ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఒక్కమాటలో చెప్పాలంటే కంగారూజోడీ బెయిలీ- స్టీవ్ స్మిత్ లను నిలువరించలేకపోయారు. పేస్ బౌలింగ్ కు అనువుగా ఉండే బ్రిస్బేన్ గబ్బా పిచ్ పైన టీమిండియా బౌలర్లు స్థాయికి తగ్గట్టుగా బౌల్ చేయగలిగితేనే పవర్ ఫుల్ కంగారూ టీమ్ ను అధిగమించే అవకాశాలు ఉన్నాయి. భారత బౌలర్లలో యువపేసర్ బరీందర్ తొలివన్డేలో అంచనాలకు మించి రాణించి..3 వికెట్లతో తానేమిటో నిరూపించుకొన్నాడు. మిగిలిన ఇద్దరు పేసర్లు భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్ దారుణంగా విఫలం కావడం...భారత టీమ్ మేనేజ్ మెంట్ ను ఆలోచనలో పడేసింది. 

విజయం ధీమాతో ఉన్న ఆసీస్..
మరోవైపు..స్వదేశంలో జరిగిన గత 15 వన్డేల్లోనూ వరుస విజయాలతో దూకుడుమీదున్న టాప్ ర్యాంకర్ ఆస్ట్రేలియా బ్రిస్బేన్ వన్డేలో సైతం విజయం తమదేనన్న ధీమాతో ఉంది. తొలివన్డేలో 310 పరుగుల విజయలక్ష్యాన్ని అలవోకగా అధిగమించినతీరు చూస్తుంటే..ఆస్ట్రేలియా బ్యాటింగ్ పవర్ ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓపెనర్లు ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్ విఫలమైనా...కెప్టెన్ స్టీవ్ స్మిత్, బెయిలీ మూడో వికెట్ కు డబుల్ సెంచరీ భాగస్వామ్యంతో పాటు..సెంచరీలు బాదినతీరు చూస్తుంటే..భారత బౌలర్లకు కష్టాలు తప్పవు ఫాస్ట్ బౌలింగ్ కు అనువుగా ఉండే గబ్బా పిచ్ పైన కంగారూ ఫాస్ట్ బౌలర్లు హేజిల్ వుడ్, పారిస్, ఫాక్నర్, బోలాండ్..చెలరేగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏదిఏమైనా..సంక్రాంతి రోజున ..బ్రిస్బేన్ గబ్బాలో జరిగే ఈ సమ ఉజ్జీల సమరంలో...ప్రత్యర్థిని ఏ జట్టు..అబ్బా అనిపిస్తుందన్నదే ఇక్కడి అసలు పాయింట్..

18 నుండి ఒంగోలులో నాటకోత్సవాలు..

ప్రకాశం : జిల్లా ఒంగోలులో జనవరి18వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు నాటకోత్సవాలు నిర్వహించనున్నట్లు జడ్పీ చైర్మన్, ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు వెల్లడించారు.

 

21:27 - January 14, 2016

హైదరాబాద్ : స్వచ్చ రాజకీయాల కోసం, అవినీతిరహిత పాలన అందించడమే ధ్యేయంగా గ్రేటర్‌లో 'వన్‌ హైదరాబాద్‌' కూటమి ఏర్పడింది. నాలుగు పార్టీలతో ఏర్పడిన కూటమి.. మిగతా పార్టీలకు తామే ప్రత్యామ్నాయమంటున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీపీఎం, సీపీఐ, లోక్‌సత్తా, ఎంసీపీఐయూలు 'వన్‌ హైదరాబాద్‌' పేరుతో కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. గ్రేటర్‌లో పోటీ చేసేందుకు నాలుగు పార్టీల మధ్య సీట్ల పంపకాలు జరిగాయి. సీపీఎం-32, సీపీఐ-22, లోక్‌సత్తా-31, ఎంసీపీఐ యూ రెండు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. ఈనెల 20వ తేదీన ఇందిరాపార్క్‌లో జరిగే సభలో అభ్యర్ధులను ప్రకటించి.. ప్రజలకు పరిచయం చేయాలని నిర్ణయించారు.

పలు సంఘాల మద్దతు..
ప్రస్తుతం రాజకీయాలు వ్యాపారమయ్యాయని కూటమి నేతలన్నారు. క్రిమినల్స్‌, వ్యాపారులకు టికెట్లు ఇస్తున్నారన్నారు. స్వచ్చ రాజకీయాల కోసం, అవినీతిరహిత పాలన అందించేందుకు గ్రేటర్‌ ఎన్నికలలో పోటీ చేస్తున్నామన్నారు. ప్రజలు తమను ఆదరించి గెలిపించాలని నేతలు కోరారు. ఇక టీఆర్‌ఎస్‌ చేసే అభివృద్ధి అంతా హోర్డింగ్‌లలోనే ఉంది తప్ప.. నిజంగా ప్రజలకు ఏమీ చేయడం లేదన్నారు నేతలు. వన్‌ హైదరాబాద్‌ కూటమి స్వచ్ఛ హైదరాబాద్‌- స్వచ్ఛ రాజకీయాలు అనే నినాదంతో ప్రజల ముందుకు వచ్చిందన్నారు. వేలం పాటలో కార్పొరేటర్‌ టికెట్లు అమ్ముకుంటూ అవినీతిపరులను నిలబెడుతున్నారని, ఇలాంటి వ్యాపార రాజకీయాలకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు నేతలు. మరోవైపు అత్యంత వెనుకబడిన వర్గాల ఐక్యవేదికతో పాటు మరికొన్ని సంస్థలు కూడా వన్‌ హైదరాబాద్‌కు మద్దతు ప్రకటించాయి.

21:25 - January 14, 2016

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల నామినేషన్లకు సమయం దగ్గర పడుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అభ్యర్ధుల ప్రకటనపై దృష్టి పెట్టాయి. కానీ టీడీపీ-బీజేపీల మధ్య ఇంకా సీట్ల సర్దుబాటు చర్చలే కొలిక్కిరాలేదు. అభ్యర్ధుల ప్రకటనలో జాప్యం చేస్తే.... అది గెలుపు, ఓటములపై ప్రభావం చూపుందన్న విషయం ఈ రెండు పార్టీల నేతలకు బాగా తెలుసు. వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఈ అంశం వీరికి అనుభవం అయ్యింది. చివరి నిమిషయంలో అభ్యర్ధిని ప్రకటించడం వలన బీజేపీ అభ్యర్ధి దేవయ్యకు డిపాజిట్‌ కూడా దగ్గలేదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అయినా దీని నుంచి గుణపాఠం నేర్చుకుంటారా... అంటే.. అదీ లేదనే విమర్శలు వినపడుతున్నాయి.

జాప్యంపై టీడీపీ కార్యకర్తల నిరసన..
సీట్ల సర్దుబాటుపై టీడీపీ-బీజేపీ నేతలు మూడు దఫాలుగా చర్చలు జరిపారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేష్‌ స్థాయిలో కూడా చర్చలు జరిగినా సీట్ల సర్దుబాటు కొలిక్కిరాలేదు. టీడీపీ, బీజేపీ నేతలు ఎవరికి వారు ఎక్కువ స్థానాల కోసం పట్టుపడుతున్నారు. రెండు పార్టీలు బలంగా ఉన్న బంజారాహిల్స్‌, ఖైరతాబాద్‌, ముషీరాబాద్‌, ఉప్పల్‌ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఎక్కువ స్థానాలు కావాలని ఇటు టీడీపీ, అటు బీజేపీ నేతలు కోరుతున్నారు. రెండు పార్టీలకు పాతబస్తీలో పట్టులేదు. దీంతో సిటీలోనే ఎక్కవ సీట్లు కావాలని కోతున్నాయి. బీజేపీ 70 డివిజన్లు కేటాయించాలని పట్టుపడుతుండటంతో ఏంచేయాలో పాలుపోక టీడీపీ నేతలు తలబాదుకుంటున్నారు. బీజేపీవి గొంతెమ్మ కోర్కెలని..వాటికి తలొగ్గరాదని పార్టీ నాయకత్వాన్ని డిమాండ్‌ చేస్తూ టీడీపీ కార్యకర్తలు పార్టీ కార్యాలయం దగ్గర ప్లకార్డులతో నిరసన కూడా తెలిపారు. అయితే గెలుపే లక్ష్యంగా సీట్ల సర్దుబాటు ఉంటుందని టీడీపీ నాయకులు చెబుతున్నారు. సీట్ల సర్దుబాటులో జరుగుతున్న జాప్యంతో టీడీపీ, బీజేపీల్లో ఆశావహులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అయితే పోటీ చేసే స్థానాలపై రెండు పార్టీల నేతలు ఒకటి, రెండు రోజుల్లో అంగీకారానికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

21:22 - January 14, 2016

హైదరాబాద్ : సంక్రాంతి పండుగ అంటే రంగురంగుల రంగవల్లికలు గుర్తుకు రావడం సహజం. ఇందుకోసం మహిళలకు ముగ్గుల పోటీలనే నిర్వహిస్తుంటారు. అయితే గ్రేటర్‌లో ఈసారి ఈ పోటీలను రాజకీయ పార్టీలు ప్రచారానికి ఉపయోగించుకుంటున్నాయి. అనేక ప్రాంతాల్లో నేతలు ముగ్గుల పోటీలను నిర్వహిస్తూ మహిళలు, యువతులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గ్రేటర్‌లో 50 శాతం సీట్లు మహిళలకు రిజర్వ్‌ కావడంతో మహిళా నేతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆశావాహులు పోటీపడి మరీ ఈ పోటీలను నిర్వహించడంలో ముందుంటున్నారు. టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. సైదాబాద్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ నేత సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు హాజరయ్యారు. ఇక ఈ పోటీల్లో మహిళలకు ప్రభుత్వం నిర్వహిస్తున్న భద్రత చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయం ఉట్టిపడేలా మహిళలు ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు. ఇక ముగ్గుల పోటీలలో గెలిచిన మహిళలకు మైనంపల్లి బహుమతులు అందజేశారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ 18 నెలల్లో ఎంతో అభివృద్ధి చేశామని.. తమకు అవకాశమిస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు మైనంపల్లి. మహిళల రక్షణకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుందని, మహిళల అభివృద్ధి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు ఆ పార్టీ నేతలు. మొత్తానికి గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో నేతలంతా ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ మహిళలు, యువతులను ఆకట్టుకోవడం విశేషం.  

21:20 - January 14, 2016

తూర్పుగోదావరి : రూపాయి రివ్వున ఎగిరింది. చేతుల్లో చక్కర్లు కొట్టింది. జేబుల్లోంచి జంపింగ్‌ చేసింది. కొంతమందికి సంతోషాన్ని ఇచ్చింది. మరికొంతమందికి ఏడ్పును మిగిల్చింది. కొందరిని అందలమెక్కించింది. మరికొందరిని అట్టడుగికి పడేసింది. మొత్తానికి కోడి పందాల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయి. కోడి పందాల్లో కాసులే కీలకం. ఈ మూడు రోజుల్లో కోట్ల రూపాయలు పందాలు జరుగుతాయి. మొదటి రోజే కోట్ల రూపాయలు చేతులు మారాయని అంచనా. రంగును బట్టి కోడి పుంజు రేంజ్‌ పెరుగుతుంది. సైజును బట్టి దాని స్టామినాను అంచనా వేస్తారు. ఈ రెండు అంశాల ఆధారంగా పందెం రేటు పలుకుతుంది. ఒక్కో పందానికి ఒక్కో రేటు. వేలల్లో ఉంటుంది. లక్షల్లో పలుకుతుంది. చివరకి కోట్లకు చేరుకుంటుంది.  ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగిన కోడి పందాల్లో కరెన్నీ నోట్లు కట్టలు తెంచుకున్నాయి. కోట్ల రూపాయలు జేబులు మారాయి. కాయ్‌ రాజా కాయ్‌ అంటూ... పందెంరాయుళ్ల పచ్చనోట్లతో కాక్‌ పిచ్‌ల్లో హడావిడి చేశారు. పశ్చిమలో భీమవరం, ఆకివీడు, నరసాపురం, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం వంటి ప్రాంతాల్లో పందాలు జోరుగా సాగాయి. క్రికెట్‌ బెట్టింగ్‌ను తలదన్నేలాకోడి పందాలు నడిచాయి. తూర్పు గోదావరి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, ఎన్ఆర్ఐలు డబ్బులు వెదజల్లారు. ఓ వైపు కోడి పందాలు జోరుగా సాగితే... మరోవైపు పేకాట, గుండాటలు సైతం జోరుగా జరిగాయి. ఇదంతా మూడాటలు... ఆరు నోట్ల కట్టలుగా నడిచింది. 

21:18 - January 14, 2016

పశ్చిమగోదావరి : కోడి కూత పెట్టింది. సమరానికి సిద్ధమంటూ తొడ కొట్టింది. దమ్ముంటే దాడికి రమ్మని ప్రత్యర్థికి సవాల్‌ విసిరింది. తాడో పేడో తేల్చుకోవడానికి బరిలోకి రమ్మని ఛాలెంజ్‌ చేసింది. రింగ్‌లో కాలు మోపడంతోనే పొట్లాట ప్రారంభించింది. చావో రేవో బరిలోనే తేల్చుకుంది. ప్రజల వినోదం కోసం ప్రాణాలనే పణంగా పెట్టింది. గోదావరి జిల్లాల్లో కోడి కూత పెట్టింది. కయ్యానికి కాలు దువ్వింది. కత్తులతో సయ్యాటలాడింది. లక్షలాది మందికి వినోదాన్ని పంచింది. తను మాత్రం ప్రాణాలను ఫణంగా పెట్టింది. కోడి పుంజులు కసితీరా కొట్టుకున్నాయి. కత్తులతో శరీరాన్ని చీల్చుకున్నాయి. విజయం కోసం చివరి వరకు పోరాటం చేశాయి. ఏడాది పాటుగా జీడి పప్పు తిని జాడీలా తయారైన పుంజులు.. పోరాటం కోసం బరిలోకి దిగాయి. నెలల పాటు పిస్తా పప్పు తిని ఫుల్‌ఫిట్‌నెస్‌తో రింగ్‌లోకి దూకాయి. ఇంటి దగ్గర కట్టేసి..కడుపు నిండా పెట్టేసి..బాగా బలిసేలా చేసి...చివరికి కొట్లాడండంటూ బరిలోకి దింపారు యాజమానులు. బరిలోకి దిగడమే లేటు. పోరాటం షురూ అయ్యింది. ప్రత్యర్థిని పడగొట్టడమే లక్ష్యం. ఎదుటివాడి బాడీని బ్లేడులా చీల్చేయడమే టార్గెట్‌. కళ్లలో కసి కనిపిస్తోంది. ఆవేశంతో రక్తం ఉడుకుపోతోంది. బరిలోకి దిగిన పుంజు ఉన్నపాటున శత్రువుపై దాడి మొదలుపెట్టింది. రక్తం కారుతున్నా వెనక్కి తగ్గలేదు. శరీరంలో సత్తువ తగ్గుతున్నా పోరాటం ఆపలేదు. విజయమో..వీర సర్గమో...బరిలోనే తేల్చుకుంది. గోదావరి జిల్లాలో కోడి పందాలకు పక్కా ఏర్పాట్లు జరిగాయి. నిర్వాహకులు ఎక్కడా తగ్గలేదు. ప్రజా ప్రతినిధుల అండ దొరికింది. పోలీసులు తొంగి చూస్తారనే భయమే లేకుండా పోయింది. దీంతో నిర్వాహకులు రెచ్చి పోయారు. భారీ స్థాయిలో బరిలు పుట్టుకొచ్చాయి. ప్రజా ప్రతినిధులు కూర్చోవడానికి స్పెషల్‌ సిట్టింగ్‌లు ఏర్పాటయ్యాయి. క్రికెట్‌ స్టేడియం స్టైల్లో భారీ మైదానాలు ఏర్పటయ్యాయి. 

విజయనగరంలో స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ ఆత్మహత్య..

విజయనగరం : స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ చిన్ని కృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంద్రానగర్ సమీపంలో రైలు కిందపడి ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

20:25 - January 14, 2016

సంక్రాంతి అంటే ఏమిటీ ? మూడు రోజుల పాటు పండుగ ఎందుకు నిర్వహిస్తారు. ఈ అంశంపై టెన్ టివి మల్లన్న ముచ్చట్లు కార్యక్రమంలో 'మల్లన్న' వివరించారు. భోగి మంటలు..చిన్నారులపై భోగి పండ్లు ఎందుకు పోస్తారు ? అలాగే రంగు రంగుల ముగ్గులలు..హరిదాసులు గంగిరెద్దులు..పిండివంటలు కథ..సంక్రాంతికి నల్లనువ్వులతో తర్పణం..సంక్రాంతి పండుగలో వచ్చే కనుమ ఎందుకు చేస్తారు ? సంక్రాంతి పండుగ సందర్భంగా ఆటలు..పాటలు.అంశాలపై 'మల్లన్న' ముచ్చట్లు చెప్పారు. మరింత తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

19:33 - January 14, 2016

ముంబై : డేరా సచ్ఛాసౌదా చీఫ్ గుర్మీత్ సింగ్ రాం రహీమ్ సింగ్ ను విమర్మించాడంటూ అరెస్టయిన 'కామెడీ నైట్ విత్ కపిల్' షో నటుడు కికు శార్దకు బాలీవుడ్ నటులు మద్దతు ప్రకటించారు. మిమిక్రీ చేయడం కూడా తప్పంటే ఎలా ? అని వారు ప్రశ్నిస్తున్నారు. గుర్మీత్ రాం రహీం రాక్ స్టార్ ఫొజులో ఉన్న ఓ ఫొటోను ట్విట్టర్ లో పెట్టిన బాలీవుడ్ వెటరన్ నటుడు రిషీ కపూర్ 'తాను రాక్ స్టార్ లా నటించాలని అనుకుంటున్నా..చూద్దాం నన్ను జైల్లో ఎవరు వేస్తారో' అంటూ వ్యాఖ్యానించారు. కేవలం ఆరో తరగతి పాసై ఎంఎస్ జీ వంటి సినిమా తీసిన గుర్మీత్ రాం రహీంను ఎందుక అరెస్టు చేయలేదంటూ అనురాగ్ కశ్యప్ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. కలియుగంలోనే ఇలాంటి పనులు జరుగుతాయని నెటిజన్లు మండిపడ్డారు. గుర్మీత్ ను అనుకరించడాని ఆరోపిస్తూ ఆయన అనుచరులు కేసు పెట్టడంతో కికు శార్దను అరెస్టు చేశారు. అనంతరం కికు క్షమాపణలు చెప్పిన తరువాత బెయిల్ పై విడుదల చేశారు. కికు ను క్షమిస్తున్నట్లు రాం రహీమ్ సింగ్ పేర్కొన్నారు. 

ఫుడ్ పెస్టివల్ ను ప్రారంభించిన బాబు..

చిత్తూరు : తిరుపతిలోని హోటల్ మానస సరోవర్ లో ఫుడ్ ఫెస్టివల్ ను ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడారు. వచ్చే సంక్రాంతికి అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు, వారసత్వంగా వస్తున్న వాటిని కాపాడుకోవాల్సిన అవశ్యకత ఉందన్నారు. 

18:28 - January 14, 2016

హీరో హీరోయిన్లు సినిమా అంతా పరుగులు పెడితే...సినిమా బాక్సాఫీస్ దగ్గర అలాగే పరుగెత్తుతుందని అనుకోవడం మూర్ఖత్వం. ఒకే బానర్ లో ఒకసారి కుదిరిన కథ...అన్నీ సార్లూ కుదరక పోవచ్చు. కథగా అనుకున్నది తెరపై అస్సలు రిఫ్లెక్ట్ కాకపోవచ్చు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో నవ్వులు పూయించి సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు మేర్లపాక గాంధీ...ఎక్స్ ప్రెస్ రాజా తో మళ్లీ అలాంటి ప్రయత్నమే చేశాడు. ఐతే ఈ సారి రిజల్ట్ రివర్స్ అయ్యింది.

కథ..
రాజా...చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ బతికేసే కుర్రాడు. అమూల్య అనే ఓ అమ్మాయిని చూసి ప్రేమలో పడిపోతాడు. రాజాను ఇష్టపడుతుంది. ఈ విషయం చెప్పేలోపు అమూల్య పెంపుడు కుక్క పిల్ల సిల్కీని రాజా చేసిన చిన్న మిస్టేక్ వల్ల మున్సిపాలిటీ వాళ్లు తీసుకెళ్లిపోతారు. ఆ కుక్కతో తనకున్న అనుబంధాన్ని రాజాకు చెబుతుంది అమూల్య. తను బాగా హర్ట్ అయ్యిందని తెలుసుకున్న రాజా...ఆ కుక్క పిల్లను వెతికే పనిలో పడతాడు. సిల్కీ చేతికి దొరికినట్లే దొరికి..మరో వ్యక్తి చేసిన తప్పు వల్ల చేజారిపోతుంది. అది బ్రిటీష్ అనే ఒక విలన్ కూతురి దగ్గరకు చేరుతుంది. 75 కోట్ల రూపాయలతో ఒక డైమండ్ కొన్న ఆ విలన్..ఐటీ వాళ్లకు దొరక్కుండా ఆ డైమండ్ కు కుక్క మెడ గొలుసులో దాచి పెడతాడు. ఇలా కుక్క వ్యాల్యూ కోట్లకు పెరిగి....హీరో తో పాటు విలన్లు కూడా ఆ కుక్కను వెతుకుతుంటారు. చివరకు ఈ కుక్క పిల్ల సిల్కీ....నెల్లూరులో పెద్ద రౌడీ ఇంట్లోకి చేరుతుంది. ఇంతలో ఆ రౌడీతోనే అమూల్య పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఇలా కథలోని పాత్రలన్నీ నెల్లూరుకు చేరుతాయి. అక్కడి నుంచి కథ క్లైమాక్స్ కు చేరుకుంటుంది.

నటీ నటుల అభినయం..
ఎక్స్ ప్రెస్ రాజా....ప్రొడక్షన్ వ్యాల్సూస్ సూపర్భ్ గా తీశారు. సినిమాటోగ్రఫీ, సెట్టింగ్స్, పాటల పిక్చరైజేషన్ ఇలా చాలా డిపార్ట్ మెంట్స్ వెరీ స్టైలిష్ అండ్ క్వాలిటీగా ఉన్నాయి. ఐతే కథలోని ఈ ట్రావెలింగ్ దర్శకుడు మేర్లపాక గాంధీ ఆశించినంతగా కుదరలేదు. కొన్ని సన్నివేశాలు నవ్వించినా...చాలా సీన్లు బోరింగ్ తయారయ్యాయి. రాజా క్యారెక్టర్ లో శర్వానంద్ ఎనర్జిటిక్ గా నటించాడు. సురభి గ్లామర్ సినిమాకు ఆకర్షణ అయ్యింది. మొత్తానికి ఎక్స్ ప్రెస్ రాజా కాస్త గుడ్స్ రాజా గా తయారయ్యాడు.

ఫ్లస్ పాయింట్స్
రిచ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్
శర్వానంద్, సురభి
కొన్ని కామెడీ సీన్స్
మైనస్ పాయింట్స్
పాత కథ
బోర్ కొట్టించే కథనం
కుదరని కామెడీ

18:24 - January 14, 2016

బాలకృష్ణ డిక్టేటర్ మాస్ ఆడియెన్స్ ను, అభిమానుల్ని అలరించే ఎంటర్ టైనర్ అయ్యింది. ఐతే హిట్ రేంజ్ ను మాత్రం చేరుకోలేకపోయింది. బాలకృష్ణ నటించిన ఈ తొంబై తొమ్మిదో సినిమా....తెలుగు, తమిళం, హిందీలో వచ్చిన 99 సినిమాలను కలిపి తయారుచేసిన ఫీలింగ్ ఇస్తుంది. కొత్తదనం కోరుకునే ఆడియోన్స్ కు, సాధారణ ప్రేక్షకులకు ఇది రుచించడం కష్టమే.

కథ..
ఓ సూపర్ మార్కెట్ లో మేనేజర్ గా పనిచేస్తుంటాడు బాలకృష్ణ. ఇతను ఓ సాధారణ కుటుంబానికి అల్లుడు. ఇంట్లో అందరి బాగోగులు చూస్తూ వాళ్లను కంట్రోల్ చేస్తుంటాడు. మంత్రి కొడుకు పార్టీలో ఒకరిని హత్య చేస్తాడు. ఆ మర్డర్ ను చూసిన క్యాటెరింగ్ సప్లయర్ రాజీవ్ కనకాల భయంతో పారిపోతాడు. రాజీవ్ సాక్ష్యం చెబితే శిక్ష తప్పదని..అతన్ని చంపేందుకు మంత్రి కొడుకు గ్యాంగ్ వెంటాడుతుంటారు. ఈ క్రమంలో రాజీవ్ చెల్లిలిని వేధిస్తుంటారు. రాజీవ్ చెల్లి ఓ సందర్భంలో బాలకృష్ణకు పరిచమయవుతుంది. ఈ పరిచయం వల్ల రాజీవ్ ను వెతుకుతున్న రౌడీలకు బాలకృష్ణకు గొడవలు మొదలవుతాయి. వాళ్లందరినీ చంపేసిన బాలకృష్ణ....పైకి కనిపించే మామూలు వాడు కాదని...ఓ అసాధారణ వ్యక్తి అని ఇంట్లో వాళ్లకు, చుట్టుపక్కల వాళ్లకు తెలుస్తుంది. కొడుకు చంపిన బాలకృష్ణ కోసం మంత్రి ఢిల్లీ నుంచి విలన్లను రప్పిస్తాడు. ఇలా హీరో విలన్ల మధ్య గొడవ తీవ్రమవుతుంది. ఇక్కడే మల్టీ మిలీనీర్ సుమన్...చందూ పేరుతో సాధారణ జీవితం గడుపుతున్న బాలకృష్ణ తన తమ్ముడన్న నిజం చెబుతాడు. బాలకృష్ణ అంత ఐశ్వర్యాన్ని వదిలిపెట్టి ఈ కుటుంబంతో ఎందుకు ఉంటున్నాడన్నది మిగిలిన ఫ్లాష్ బ్యాక్ కథ.

నటీ నటుల అభినయం..
డిక్టేటర్ లో రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించాడు బాలకృష్ణ. ఒకటి చందూ సూపర్ మార్కెట్ లో పనిచేసే ఓ సాధారణ ఉద్యోగి. రెండోది మల్టీమిలీనీర్ చంద్రశేఖర్. ఈ పాత్రల్లో మాస్ ఆడియెన్స్ ను మెప్పించాడు. డాన్సులు బాగా చేశాడు. హీరోయిన్స్ అక్ష, అంజలి నటనకు పెద్దగా స్కోప్ లేదు. సుమన్, నాజర్ పాత్ర మేరకు నటించారు. ఫృథ్వీ కామెడీ మరోసారి పండింది. ఉన్నంత సేపు నవ్వించాడు. థమన్ సంగీతం ఫర్వాలేదు. చిన్నా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. దర్శకుడిగా శ్రీవాస్ సక్సెస్ చేరువలో ఆగిపోయాడు. మొత్తానికి అభిమానులు కోరుకునే అంశాలతో తెరకెక్కింది డిక్టేటర్. ఇంతకంటే సినిమాలో కొత్తగా ఏదీ ఆశించొద్దు.

ఫ్లస్ పాయింట్స్
బాలకృష్ణ ఫర్మార్మెన్స్
మాస్ ను అట్రాక్ట్ చేసే డైలాగ్స్
పాటల చిత్రీకరణ
మైనస్ పాయింట్స్
పాత కథ
రొటీన్ స్క్రీన్ ప్లే
బోరింగ్ సీన్స్
వినోదం లేకపోవడం
దర్శకత్వం

18:14 - January 14, 2016

ఢిల్లీ : కరవుతో అల్లాడుతున్న తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం కరుణ చూపింది. తమకు కరవు సాయం ప్రకటించాలని గత కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వం కోరుతూ వస్తున్న సంగతి తెలిసిందే. గురువారం ఉన్నతస్థాయి సంఘం కమిటీ భేటీ జరిగింది. ఈ భేటీ అనంతరం కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి కరవు సాయంగా రూ.800 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. అత్యున్నతస్థాయి కమిటీ నిర్ణయం ఆధారంగా ఈ మొత్తాన్ని మంజూరు చేస్తున్నట్లు వెల్లడదించారు. గతంలో భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఉన్న ఏపీకి ఇంత పెద్ద మొత్తంలో మంజూరు చేయలేదని చెప్పుకొచ్చారు.
ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో కరవు బృందం ప్రకటించింది. వెంటనే కరవు సాయంపై కేంద్ర మంత్రిని కలవాలని మంత్రి పోచారాన్ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీనితో మంత్రి పోచారం కేంద్ర మంత్రి రాధా మోహన్ సింగ్ ను కలిసిన సంగతి తెలిసిందే. తెలంగాణకు వెంటనే కరవు సహాయం అందించాలని కేంద్ర మంత్రిని పోచారం కోరారు. అనంతరం జనవరి మొదటివారంలో తెలంగాణకు కరవు సాయం అందిస్తామని ఈ సందర్భంగా కేంద్రమంత్రి రాధామోహన్ సింగ్ వెల్లడించారు. తెలంగాణలో కరవు నష్టం 2500కోట్లని కేంద్ర బృందం నివేదిక ఇచ్చిందని, దీనిపై టీఎస్ సర్కార్.. 3వేల కోట్ల సాయం చేయాలని కోరినట్టు మంత్రి తెలిపారు. ఈ అంశం తమ దృష్టిలో ఉందని... వచ్చేనెల మొదటి వారంలో దీనిపై ప్రకటన ఉంటుందని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే రాష్ట్ర మంత్రి హరీష్ రావు బుధవారం కేంద్ర మంత్రి రాధా మోహన్ సింగ్ ను కలిశారు. కరవు సాయం వెంటనే ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. అనుకున్నట్లుగానే కేంద్రం కరవు సాయం ప్రకటింది. కానీ అడిగినంత ప్రకటించకపోవడం పట్ల తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

రైలు టికెట్ లేని వారిపై కేసులు..

హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోని రైళ్లలో టీసీలు తనిఖీలు నిర్వహించారు. టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న 1,766 మందిపై కేసు నమోదు చేశారు. రూ.7,70,765 జరిమానాను వసూలు చేశారు. 

జకర్తా బాంబు పేలుళ్లలో ఐఎస్ఐఎస్ హస్తం - ఇండోనేషియా..

ఢిల్లీ : జకర్తా బాంబు పేలుళ్ల వెనుక ఐఎస్ఐఎస్ హస్తం ఉందని ఇండోనేషియా పోలీసులు పేర్కొంటున్నారు. రాజధాని జకార్తా బాంబు పేలుళ్లు, తుపాకీ కాల్పుల మోతతో దద్దరిల్లింది. నాలుగు ప్రాంతాల్లో 8 బాంబు పేలుళ్లు జరిగాయి. యూఎన్ కార్యాలయం, స్టార్ బక్స్ కేఫ్ టార్గెట్ గా ఈ పేలుళ్లు జరిగాయి. ఈ దాడిలో ఏడుగురు మృతి చెందారు.

17:45 - January 14, 2016

పశ్చిమగోదావరి జిల్లాలోని ఆరు పట్టణాల్లో సంక్రాంతి ఫుట్ బాల్ హంగామా కొనసాగుతోంది. ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియం వేదికగా ఫైనల్స్ మ్యాచ్ జరగనుంది. భీమవరం లో సెమీఫైనల్స్ మ్యాచ్ ముగిసింది. పది రోజుల్లో 15 లీగ్, 2 నాకౌట్ మ్యాచ్ లు ముగిశాయి. ఈ మ్యాచ్ లను తిలకించడానికి జిల్లాల సాకర్ అభిమానులు భారీగా తరలివస్తున్నారు. ప్రొ.ఛైర్మన్ శ్రీధర్ కోటగిరి ఆధ్వర్యంలో జిల్లా లీగ్ ఫుట్ బాల్ పోటీలు జరుగుతున్నాయి. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

మరో రెండు ప్రత్యేక రైళ్లు..

హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరో రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు మీదుగా వెళ్లనున్న ఈ రైళ్లలో అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు వెల్లడించింది. 

తెలంగాణ కరవు సాయం రూ. 800 కోట్లు..

ఢిల్లీ : ఉన్నతస్థాయి కమిటీ సమావేశం ముగిసింది. కరవు సహాయం కింద తెలంగాణకు రూ. 800 కోట్లు ఇవ్వాలని కమిటీ నిర్ణయం తీసుకుందని, త్వరలో విడుదల చేస్తామని కేంద్ర మంత్రి రాధా మోహన్ సింగ్ వెల్లడించారు. 

ఉగ్రదాడి..పాక్ దర్యాప్తును సాగతిస్తున్నాం - భారత్..

ఢిల్లీ : పఠాన్ కోట్ ఉగ్రదాడి ఘటనపై పాక్ చేస్తున్న దర్యాప్తును స్వాగతిస్తున్నట్లు భారత్ వెల్లడించింది. జైష్ ఏ మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ అరెస్టుపై తమకు సమాచారం లేదని పేర్కొంది. పాక్ దర్యాప్తు బృందానికి పూర్తిగా సహకరిస్తామని తెలిపింది. 

ఫిబ్రవరి చివరి మాసంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..

ఢిల్లీ : ఫిబ్రవరి చివరి మాసంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 29వ తేదీన సాధారణ బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. 

16:51 - January 14, 2016

ఆస్ట్రేలియా : వరుసగా 6 టైటిళ్లు..29 విజయాలు. ఏడాది కాలంగా రికార్డులు సృష్టిస్తోంది సానియా మీర్జా, మార్టినా హింగిస్‌ జోడీ. గతేడాది మొదట్లో ప్రారంభమైన వీరి జోరు 2016లోనూ కొనసాగుతోంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఈ జంట.. తాజాగా ప్రపంచ రికార్డును తిరగరాసింది. సిడ్నీ ఇంటర్నేషనల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ సెమీఫైనల్లో ఒలారు, యురస్లోవా ష్వేదోవా జోడిపై 4-6, 6-3, 10-8 తేడాతో గెలుపొంది ఫైనల్‌కు దూసుకెళ్లారు. దీంతో సానియా, మార్టినాలు వరుసగా 29 విజయాలు అందుకుని టెన్నిస్‌ మహిళల డబుల్స్‌లో చరిత్ర సృష్టించారు. 1994లో గిగి ఫెర్నాండెజ్‌, నటాషా జెరెవా వరుసగా 28 విజయాలు సాధించి ప్రపంచ రికార్డు సాధించారు. ఇప్పుడు సానియా- హింగిస్‌ జోడీ ఆ రికార్డును బద్దలు కొట్టింది. ఆ జోడి ఇప్పటి వరకు ఆరు వరుస టైటిళ్లు నమోదు చేసింది. కాగా సిడ్నీ టోర్నమెంట్‌ ఫైనల్‌లోనూ గెలిస్తే.. మరో రికార్డు ఖాయం కానుంది.

16:41 - January 14, 2016

హైదరాబాద్ : నగరంలో ఉంటున్న అన్ని ప్రాంతాల ప్రజలను టీఆర్‌ఎస్‌ సమదృష్టితో చూస్తున్నదని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. కార్వాన్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చిన బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే భాగ్యనగరం అల్లకల్లోలమవుతుందదని, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌తోపాటు, కొన్ని పార్టీలు దుష్ప్రచారం చేశాయని ఆయన విమర్శించారు. ఈ ఏడాదిన్నర కాలంలో ఏమైనా జరిగిందా ? ఎవరిపైనా దాడి చేశామా ? గుద్దామా ? గిచ్చామా ? అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఆయా పార్టీ నాయకులకు వాస్తవం అర్ధమయ్యిందని కేటీఆర్ అన్నారు. గరంలో ఉంటున్న ఏ ప్రాంత ప్రజలపై చీమ కూడా వాలనివ్వమని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. 

16:35 - January 14, 2016

అనంతపురం : పాపంపేటలో ఇంటి నిర్మాణం విషయంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా ఇల్లు నిర్మిస్తున్నారని రాజేశ్వరి, చంద్రన్న దంపతులు ఏడాదిన్నర క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత రెండు రోజులుగా ఈ వివాదం మరింత తీవ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో పక్కింటివాళ్లు తనపై దాడి చేసి, వివస్త్రను చేశారని చంద్రన్న కుమార్తె సుష్మా ఆరోపిస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితురాలు ఆరోపిస్తోంది. సంవత్సరం క్రితం కేసు నమోదు చేసుకుంటే ఇలా జరిగేది కాదని బాధితులు పేర్కొంటున్నారు. విషయం చాలా ముదిరిన అనంతరం పోలీసులు స్పందిస్తారా ? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. 

16:33 - January 14, 2016

పశ్చిమగోదావరి : హైకోర్టు ఆదేశాలు అమలు కాలేదు. పోలీసుల మాటలు చేతల్లోకి రాలేదు. మొత్తానికి పశ్చిమ గోదావరి జిల్లాలో కోళ్ల పందాలు ప్రారంభమయ్యాయి. కోడి పుంజులు కత్తులతో సయ్యాటలాడుతున్నాయి. సమరానికి సిద్ధమంటూ తొడలు కొడుతున్నాయి. బరిలు రక్తమోడుతున్నాయి. జిల్లాలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. గుండుగోళంలో భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. పక్కాగా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి బరి ఏర్పాటు చేశారు. దీనిని చూసేందుకు వచ్చే వారికి అన్నీ ఏర్పాట్లు చేశారు. తెలంగాణలోని హైదరాబాద్ ప్రాంతం నుండి పెద్ద సంఖ్యలో వచ్చారు. రిబ్బన్ కట్ చేసి మరీ పోటీలను ప్రారంభించారు. పందేలను అడ్డుకుంటామని చెప్పిన పోలీసులు ఆ ప్రాంతం నుండి వెళ్లిపోయారు. కోళ్ల పందేలు అనేది సంప్రదాయం వచ్చేది అని, మూడు రోజులు నాశనం కారని తెలిపారు. సంవత్సరం పాటు కష్టపడుతారని, మూడు రోజుల పాటు సంతోషంగా గడుపుతారని తెలిపారు. ఇక్కడున్న వారిలో ఆనందం తాండవిస్తోందన్నారు. ప్రతి సంవత్సరం ప్రకారం పందేలు అనావాయితీ ప్రకారం వస్తోందని మరొకరు పేర్కొన్నారు.

కోళ్ల పందేలు జాతర..
విజయవాడ :
గన్నవరం నియోజకవర్గంలో కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. హైటెక్‌ హంగుల బరుల మధ్య కోడిపందాల్ని నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. మరోవైపు కోడిపందాలను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనం తరలివస్తున్నారు. గన్నవరం సమీపంలోని పందిళ్లు వేసి కోళ్ల పందేలు నిర్వహిస్తున్నారు. పోటెళ్ల పందేలు నిర్వహించారు. దాదాపు ఐదు లక్షల నుండి ఆరు లక్షల రూపాయల వరకు పందేలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

 

నాలుగేళ్లలో పేదలందరికీ రెండు పడక గదుల ఇళ్లు - కేటీఆర్..

హైదరాబాద్ : నాలుగు ఏళ్లలో గ్రేటర్ పేదలందరికీ రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రాంతం పేరిట ఓ పార్టీ, మతం పేరిట మరో పార్టీ ప్రజలను మభ్య పెడుతున్నాయని తెలిపారు. 

కోళ్ల పందేలను ప్రారంభించిన ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రమణ్యం..

తూర్పుగోదావరి : ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామంలో ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రమణ్యం కోళ్లపందేలను ప్రారంభించారు. మండంపేట, కోరుకొండ, గోకవరం మండలాల్లో కోడి పందేలు, గుండాట, పేకాట జోరుగా సాగుతున్నాయి. 

పోలీసుల అదుపులో సత్తెనపల్లి మున్సిపల్ వైస్ ఛైర్మన్..

గుంటూరు : సత్తెనపల్లి మున్సిప్ వైస్ ఛైర్మన్ నాగేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మత విధ్వేషాలు రెచ్చగొడుతున్నారని ఫిర్యాదు నమోదైంది. నాగేశ్వరరావును పీఎస్ కు తరలించారు. 

16:03 - January 14, 2016

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం యొక్క టీజర్ పోస్టర్ ని తాజాగా నిర్మాత శరత్ మరార్ ట్విట్టర్ ద్వారా విడుదల చేసాడు. ఈ టీజర్ లో గల్ల లుంగీ వేసుకుని చేతిలో గుర్రాని పట్టుకుని పవన్ నడిచే దృశ్యం కనిపిస్తోంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం యొక్క టీజర్ ని అభిమానులకు సంక్రాంతి కానుకగా ఈ రోజు విడుదల చేశారు. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించగా శరత్ మరార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సాధ్యమైనంత తొందరగా షూటింగ్ ని పూర్తి చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో వేసవిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

15:46 - January 14, 2016

వరంగల్ : తన కూతురు అదృశ్యమైందని ఫిర్యాదు చేసిన ఓ గిరిజన తండ్రి అనంతలోకాలకు వెళ్లిపోయాడు. పోలీసుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న గిరిజన సంఘాలు, ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఆందోళన నిర్వహించారు. గూడూరు మండలం చర్ల తండాకు చెందిన రవి దంపతులు పొట్టకూటి కోసం హైదరాబాద్ కు వచ్చారు. కూతురు కవితను గూడూరు ఆశ్రమ పాఠశాలలో చదివిస్తున్నాడు. సంక్రాంతి సెలవులు రావడంతో గూడూరుకు రవి దంపతులు బుధవారం చేరుకున్నాడు. కూతురు లేదని తెలుసుకున్న అతను పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. కానీ గురువారం రవి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికంతటికి కారణం పోలీసులే అని కుటుంసభ్యులు పేర్కొంటున్నారు. దోషిగా రవిని తేల్చడంం..తీవ్రంగా వేధించడంతోనే అతను ఆత్మహత్య చేసుకున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న గిరిజన సంఘాలు, ప్రజా సంఘాలు నల్లవెల్లి - గూడూరు రహదారిపై ఆందోళన నిర్వహించాయి. పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

9వ తరగతి చదువుతున్న కవిత..
బోడ రవి కూతురైన 17 ఏళ్ల కవిత స్థానిక గిరిజన ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. హాస్టల్‌లో ఉంటూ చదువు కొనసాగిస్తోంది. కవిత తండ్రి రవి హైదరాబాద్‌లో పనిచేసేవాడు. డిసెంబర్‌ 8న స్కూల్‌కు వెళ్తున్నాని చెప్పి ఇంటి నుంచి బయల్దేరిన కవిత అదృశ్యమైంది. కవిత ఆగస్ట్‌ 26 నుంచి స్కూల్‌కు వెళ్లడం లేదని తెలుస్తోంది. ఎక్కువ రోజులు గైర్హాజరు కావడంతో కవిత పేరును స్కూల్‌ రికార్డుల నుంచి తొలగించారు. అయితే ఈ విషయాన్ని స్కూల్‌ అధికారులు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సంక్రాంతి పండగకు చర్ల తండాకు వచ్చిన కవిత తండ్రి రవి...కూతురు ఇంట్లో కనిపించకపోవడంతో ఆందోళన చెందాడు. తోటి విద్యార్థినులను సంప్రదించగా డిసెంబర్‌ 8 నుంచి కవిత కనిపించడం లేదని చెప్పడంతో.. ఆమె ఆచూకీ కోసం తీవ్రంగా గాలించాడు. ఎంతకీ ఫలితం కనిపించకపోవడంతో గూడూరు పోలీస్‌ స్టషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చర్ల తండాతో పాటు గూడురు ఆశ్రమ పాఠశాలలో దర్యాప్తు చేపట్టారు.

 

15:38 - January 14, 2016

రంగారెడ్డి : హయత్ నగర్ మండలంలోని నేషనల్ పార్కులో అగ్నిప్రమాదం సంభవించింది. ఎండు గడ్డి అంటుకోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. తట్టి అన్నారం - కుత్బుల్లాపూర్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గురువారం ఉదయం 9గంటల ప్రాంతంలో 35 కి.మీటర్లు విస్తరించి ఉన్న ఈ పార్కులో ఎండుగడ్డి ఒక్కసారిగా మండింది. దీనిని స్థానికులు చూశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. జింకల పార్కుకు సమీపంలో ఈ ప్రమాదం జరగడంతో అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. వారు వచ్చే లోపే ఐదు కిలోమీటర్ల మేర మంటలు వ్యాపించాయి. దీనితో ఐదు ఫైరింజన్లతో మంటలను సిబ్బంది ఆర్పే ప్రయత్నం చేశారు. సుమారు ఐదు గంటల తరువాత మంటలు అదుపులోకి వచ్చాయి. ఫారెస్టులో ఉన్న జంతువులకు ఎలాంటి హానీ కలుగలేదని తెలుస్తోంది.

చర్ల తండాలో వ్యక్తి ఆత్మహత్య..

వరంగల్ : గూడూరు (మం) చర్ల తండాలో రవి అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గూడూరు ఆశ్రమ పాఠశాలలో బుధవారం నుండి రవి కూతురు కవిత కనిపించపోయిన సంగతి తెలిసిందే. పోలీసుల వేధింపుల వల్లే రవి ఆత్మహత్యకు కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసుల తీరును నిరసిస్తూ నల్లవెల్లి - గూడూరు రహదారిపై గిరిజన, ప్రజా సంఘాలు ఆందోళన నిర్వహించాయి. పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

హయత్ నగర్ మండలంలో అగ్నిప్రమాదం..

రంగారెడ్డి : హయత్ నగర్ మండలం తట్టి అన్నారం - కుత్బుల్లాపూర్ అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎండుగడ్డికి మంటలు అంటుకున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. 

15:06 - January 14, 2016

కళ్లతో చూస్తాం..కళ్లతో ప్రపంచాన్ని వీక్షిస్తాం..ప్రకృతిలోని అందాలను ఆస్వాదిస్తాం..ఇంతేకదా అనుకుంటే పొరపాటే. కళ్లతో అవధానం కూడా చేయవచ్చని ఇద్దరు చిన్నారులు నిరూపిస్తున్నారు. బొటన వేలితో కూడా భావ వ్యక్తీకరణ చేస్తూ ఎందరినో అబ్బుర పరుస్తున్నారు. అంతేగాకుండా ఇండియాలోనే ఈ కళ్లలో నైపుణ్యాన్ని సాధించిన చిన్నారులు కూడా వీళ్లిద్దరే. తెలుగు సాహితీ ప్రపంచాన్ని శాసించిన సాహితి సౌరుభమైలనుటువంటి మహనీయులు తిరుపతి వెంకట కవులు..కొప్పురపు కవులు..గుర్రంజాషువా లాంటి మహనీయులైన కవులకు మాత్రమే సాధ్యమైనది ఈ 'నేత్రావధానం'. అదే విధంగా అంగుష్టావధానం. చదువుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఆదినారాయణ స్వామి ఇద్దరు చిన్నారులను చేరదీశారు. వీరికి ఉన్నతమైన చదువు చెప్పించడంతో పాటు ఈ కళను నేర్పించారు.
ఈ చిన్నారులదీ పేద కుటుంబ నేపథ్యం. వీరు 100కు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. నిపుణ 2014 జాతీయ అవార్డు, సూపర్ కిడ్స్ అవార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డులను అందుకున్నారు. కానీ ఈ కళ అంతరించిపోతుండడమే కాకుండా వీరికి ఆదరణ కరువైంది. వీరి మరిని ప్రదర్శనలు ఇస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని టెన్ టివి 'మానవి' కోరుకొంటోంది. 

14:42 - January 14, 2016

హైదరాబాద్ : టి.టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి కంటతడి పెట్టారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎన్టీఆర్‌ కృషిచేశారని గుర్తుచేసుకుంటూ మోత్కుపల్లి కంటతడి పెట్టారు. ఆలేరు నియోజకవర్గ ప్రజలతో ఆత్మీయ కార్యక్రమానికి మోత్కుపల్లి శ్రీకారం చుట్టారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్లో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా మోత్కుపల్లి మాట్లాడారు. రాజకీయాల్లో ఒక వ్యవస్థను సృష్టించిన మహానాయకుడిగా దివంగత ఎన్టీరామారావు కృషి చేశారని ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఆలేరు నియోజకర్గం నుంచి తనను నాలుగుసార్లు గెలిపించిన ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ఆయన అన్నారు. ప్రస్తుతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం రెండుగా విడిపోవడం వల్ల పార్టీ అనేక కష్టాలను ఎదుర్కొంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

14:39 - January 14, 2016

కడప : జిల్లా రైల్వే కోడూరు మండలంలోని బాలపల్లి అటవీ శాఖ చెక్ పోస్టు వద్ద భారీగా ఎర్రచెందనం దుంగలను అధికారులు పట్టుకున్నారు. భారీ కంటైనర్ లో 2 కోట్ల విలువైన 3 టన్నుల ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కంటైనర్ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసుల తెలిపారు. ఇతను తమిళనాడులోని వెల్లూరు కు చెందిన వ్యక్తి అని పేర్కొన్నారు. 

14:38 - January 14, 2016

హైదరాబాద్ : సంక్రాంతి బరిలో విడుదలైన 'డిక్టేటర్‌' మూవీ బాలయ్య అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. హైదరాబాద్‌ కూకట్‌పల్లి భ్రమరాంబ థియేటర్‌లో బెన్ఫిట్‌ షోను.. హీరోలు నారా రోహిత్‌, తారకరత్న, దర్శకుడు శ్రీవాస్‌ అభిమానుల మధ్య కూర్చుని తిలకించారు. తారకరత్న, నారా రోహిత్‌, శ్రీవాస్‌ డిక్టేటర్‌ మూవీపై ప్రశంసల జల్లు కురిపించారు. 

14:36 - January 14, 2016

నెల్లూరు : జిల్లా వెంకటగిరిలో 10 టీవీ క్యాలెండర్‌ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. వెంకటగిరి సంస్థానాధీశులు డాక్టర్ విబి సాయికృష్ణ యాచేంద్ర రాజా ప్యాలెస్‌లో క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ భీరం రాజేశ్వరరావుతో పాటు కౌన్సిలర్లు, టీడీపీ నేతలు, పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టిడిపి ప్రజాహిత కార్యక్రమాలు చురుగ్గా చేస్తోందని భీరం రాజేశ్వరరావు పేర్కొన్నారు. 

14:35 - January 14, 2016

హైదరాబాద్ : సంక్రాంతి సంబురాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. నగరంలోని పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పతంగుల పండుగ సంబురాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. రైట్ టు ఓట్ ఛాంపియన్‌ను ప్రారంభించారు. సంక్రాంతి పండుగను దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో జరుపుకుంటారని తెలిపారు. సూర్యుడు తన దిశను మార్చుకుని మకర రాశిలోకి ప్రవేశిస్తాడని అందుకే మకర సంక్రాంతి అంటామని వివరించారు. ఈసారి ప్రత్యేకంగా కైట్ మీద జీహచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని రాయడం గొప్ప విషయమన్నారు. ఈ ఫెస్టివల్ కి ఆరు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. రెండు దేశాల వారు కైట్ కాంపిటేషన్ లో పాల్గొన్నారు.

14:32 - January 14, 2016

తూర్పుగోదావరి : జిల్లాలోని బీవీసీ ఇంజినీరింగ్ కాలేజీలో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారు. పల్లె వాతావరణాన్ని బీవీసీ కాలేజీ విద్యార్థుల ముందుకు తీసుకువచ్చింది. విద్యార్థులందరికి సంక్రాంతి పండుగ విశిష్టతను తెలియజేస్తూ ప్రత్యేక కార్యక్రామాలను నిర్వహించింది. పల్లె వాతావరణాన్ని కళ్లకు కట్టారు విద్యార్థులు. పండుగ విశేషాలను అందిస్తున్న 10 టీవీకి ముగ్గులతో లోగో వేసి శుభాకాంక్షలు తెలిపారు.

14:26 - January 14, 2016

ఉభయ గోదావరి : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి జోరందుకుంది. గోదావరి జిల్లాల్లో ఉదయం భోగి మంటలతో మొదలైన సదండి.. కోడి పందాలతో ఊపందుకుంది. పందాలపై పోలీసులు ఆంక్షలు, హైకోర్టు ఆదేశాలను పట్టించుకోని నిర్వాహకులు.. ఎప్పటిలాగానే... పందాలు జోరుగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా గ్రౌండ్స్ ఏర్పాటు చేసి... పోటీలు నిర్వహిస్తున్నారు. పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేస్తున్న పట్టించుకోవడం లేదు. కొన్ని చోట్ల ప్రజా ప్రతినిధులే పోటీలను ప్రారంభించడం విశేషం. మరోవైపు నారావారిపల్లెలో చంద్రబాబు కుటుంబసభ్యులు, బంధువులు వేడుకగా పండుగ జరుపుకుంటున్నారు.  కోనసీమలో కోడిపందాలు, గుండాట జోరుగా సాగుతున్నాయి. హైటెక్‌ హంగుల బరుల మధ్య కోడిపందాల్ని నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. మరోవైపు కోడిపందాలను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనం తరలివస్తున్నారు. దీంతో కోడి పందాలు ప్రాంతాలు పెద్ద జాతరను తలపిస్తున్నాయి. ఎక్కడ చూసిన కోడిపందాల బరులే కన్పిస్తున్నాయి. ఒక్కో పందెం 5 లక్షల నుంచి 50లక్షల వరకు సాగుతున్నాయి. మరోవైరపు పందెంలో ఓడిపోయిన కోళ్లకు కూడా బాగా గిరాకీ ఏర్పడింది. పందెంలో ఓడిపోయిన కోడిని వండుకుని తినేందుకు వేలరూపాయలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. ఓ వైపు కోడిపందాలు జోరుగా సాగుతుంటే..అంతే జోరుగా మద్యం అమ్మకాలు కూడా ఊపందుకున్నాయి. కోడి పందెం బరుల పక్కనే డ్రమ్ముల్లో ఐస్‌ను వేసి మరి బీర్లు, మద్యం బాటిళ్లను అమ్ముతున్నారు వ్యాపారులు. 

14:21 - January 14, 2016

పశ్చిమగోదావరి : సంక్రాంతి..అనగానే అక్కడ కోళ్ల పందేలు గుర్తుకొస్తాయి. కోర్టులు..ప్రభుత్వాలు ఎన్ని హెచ్చరికలు చేసినా వారు పట్టించుకోరు. సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజులు ఈ పందేలలో మునిగితేలుతుంటారు. కోట్లాది రూపాయలు చేతులు మారుతుంటాయి. స్వయంగా ప్రజాప్రతినిధులే ఈ పందేలలో పాల్గొంటుండడంతో ఇతరులు కూడా విచ్చలవిడిగా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం సంక్రాంతి వేడుకలు గతంలో ఎన్నడూ లేని విధంగా జరుగుతున్నాయి. సుమారు 500 ప్రాంతాల్లో కోళ్ల పందేలు నిర్వహిస్తున్నారు. పోలీసులు పూర్తిగా చేతులెత్తేశారు. ఓ ప్రాంతంలో బీజేపీ నాయకుడు కోళ్ల పందేలను ప్రారంభించగా ఒంగుటూరులో ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు పందేలను ప్రారంభించారు. పాలకొల్లులో సంగీత దర్శకుడు కోటి పాల్గొన్నారు. దీనితో పాటు ఇతర జూద క్రీడలు యదేచ్చగా సాగుతున్నాయ. ఈ సంవత్సరం కోళ్ల పందేలలో పాల్గొనేందుకు హైదరాబాద్ ప్రాంతం నుండి ఎక్కువ మంది వచ్చినట్లు సమాచారం. వీరికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు నిర్వాహకులు సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కోర్టులు..ప్రభుత్వాలు హెచ్చరికలు చేసినా కోళ్ల పందేలు..ఇతర జూద క్రీడలు జరుగుతున్నాయని స్వయంగా టెన్ టివి రిపోర్టర్లు ఫోన్ చేసి సమాచారం అందించినా పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానాలు ఇచ్చారు. 

గ్రేటర్ ఎన్నికలు..కూటమి స్థానాల ఖరారు..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ, లోక్ సత్తా, ఎంసీపీఐయూ కూటమి పోటీ చేసే స్థానాలు ఖరారయ్యాయి. లోక్ సత్తా 35, సీపీఎం 33, సీపీఐ 22, ఎంసీపీఐయూ 2 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ఈ నెల 20వ తేదీన ఇందిరాపార్కు వద్ద భారీ బహిరంగసభ నిర్వహించనున్నారు. ఈ సభలో కూటమి నేతలు తమ్మినేని, జయప్రకాశ్, నారాయణ, చాడాలు పాల్గొననున్నారు. నీతివంతమైన రాజకీయాల కోసం కూటమిని గెలిపించాలని, కాంట్రాక్టర్లు, క్రిమినల్స్ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని నేతలు పేర్కొన్నారు.  

టీఆర్ఎస్ జనం మధ్య విబేధాలు సృష్టించింది - రేణుకా..

హైదరాబాద్ : టీఆర్ఎస్ సెటిలర్ల పేరిట జనం మధ్య విబేధాలు సృష్టించిందని, సీమాంధ్రులకు సెటిలర్లు అని పేరు పెట్టింది టీఆర్ఎస్సేనని కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి విమర్శించారు. తాము ఏం చేస్తామో చెప్పాల్సిన అవసరం లేదని చేసి చూపిస్తామని, టీఆర్ఎస్ నేతలు రాజీనామా చేసి ఓట్లు అడగాలన్నారు.

 

జకర్తాలో బాంబు పేలుళ్లు..ఏడు మంది మృతి

ఇండోనేషియా : జకర్తాలో వరుసగా బాంబు పేలుళ్లు సంభవించాయి. నాలుగు చోట్ల 8 సార్లు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనల్లో ఏడుగురు మృతి చెందినట్లు సమాచారం. 

సోనియాకు ఉత్తమ్ లేఖ..

హైదరాబాద్ : ఏఐసీసీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. నారాయణఖేడ్ ఉప ఎన్నిక అభ్యర్థిగా కృష్ణారెడ్డి కుమారుడు సంజీవరెడ్డిని ప్రకటించాలని ఉత్తమ్ కోరారు. 

రైల్వే కోడూర్ వద్ద పోలీసుల తనిఖీలు..

కడప : రైల్వే కోడూరు (మం) బాలపల్లె చెక్ పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. కంటైనర్ లో తరలిస్తున్న రూ. 2 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకుని డ్రైవర్ ను అరెస్టు చేశారు. 

ఓపెరా హౌస్ మూసివేత..

ఆస్ట్రేలియా : సిడ్నీలోని ప్రధాన పర్యాటక ప్రాంతమైన సిడ్నీ ఓపెరా హౌస్ ను ఉగ్రదాడి భయాలతో తాత్కాలికంగా మూసివేశారు. ఓపెరా హౌస్ వద్ద అనుమానాస్పద వస్తువులున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందని..దీనితో భద్రతా దళాలు తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. 

భారత్ - పాక్..మళ్లీ చర్చలు వాయిదా..

ఢిల్లీ : జేషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ అరెస్టును పాకిస్తాన్ ధృవీకరించడం లేదు. దీనితో భారత్ - పాక్ విదేశాంగ కార్యదర్శుల చర్చలు వాయిదా పడ్డాయి. 

13:42 - January 14, 2016

తూర్పుగోదావరి : రాజమండ్రిలోని శ్రీ సత్యదేవా నర్సరీ లో సంక్రాంతి పండుగను  ఘనంగా జరుపుకుంటున్నారు. నర్సరీలోని పలు రకాల మొక్కలతో 10 టీవీ లోగో ఆకృతిలో ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.  ప్రతి ఒక్కరు పండుగరోజున ఒక మొక్కను నాటాలని కోరారు. 

 

మేడ్చల్ లో గ్యాస్ పైప్ లైన్ కు లీక్..

హైదరాబాద్: నగరంలోని మేడ్చల్ జాతీయ రహదారి పక్కన ఉన్న భాగ్యనగర్ గ్యాస్ పైప్‌లైన్‌కు లీకేజీ ఏర్పడింది. గ్యాస్ లీక్ కావడంతో స్థానికులు తీవ్ర ఆందోళన గురయ్యారు.

సరి - బేసి సంఖ్యను రద్దు చేయం - సుప్రీం..

న్యూఢిల్లీ : రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన సరి-బేసి సంఖ్య విధానాన్ని రద్దు చేయబోమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సరి-బేసి సంఖ్య నెంబర్లు ఉన్న వాహనాలు రోజు విడిచి రోజు రోడ్డు ఎక్కాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం జనవరి ఒకటో తేదీ నుంచి నియమాన్ని పాటిస్తున్న సంగతి తెలిసిందే. 

సానియా - హింగీస్ జోడి విజయం..

ఆస్ట్రేలియా: డబ్ల్యూటీ సిడ్నీ ఇంటర్నేషనల్ ఓపెన్ టెన్నిస్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 4-6, 6-3, 10-8 స్కోర్ తో సానియా-హింగీస్ జోడీ గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. ఓలారు, స్వెదొవా జోడీపై గెలుపొందింది. 29 వరుస విజయాలతో సానియా-జోడీ ప్రపంచ రికార్డు సృష్టించింది. 

సీఎం ఆదేశాల మేరకే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ - చందూలాల్..

హైదరాబాద్: సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకే తాము నగరంలో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నామని మంత్రి చందూలాల్ అన్నారు. నగరంలోని ఆగాఖాన్ అకాడమీలో అంతర్జాతీయ పతంగుల సంబురాలను మంత్రి ప్రారంభించారు. 

కాలువలోకి దూసుకెళ్లిన బస్సు...

కృష్ణా : పెద్దపారుపూడి మండలం వెంట్రప్రగడ వద్ద ఓ బస్సు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురికి స్వల్పంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి భీమవరం వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. 

ఓబుల్ రెడ్డి తండాలో పోలీసుల తనిఖీలు..

అనంతపురం : జిల్లా తలుపుల మండలం ఓబుల్ రెడ్డి తండాలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. గురువారం స్ధానిక సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో ఈ దాడులు చేశారు. ఈ సందర్భంగా నాటు సారా తయారీ కేంద్రాలపై దాడులు చేసి సుమారు 2000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు.

13:38 - January 14, 2016

పశ్చిమగోదావరి : సుప్రీంకోర్టు కోడిపందాలు నిషేధించిందని చాలా ప్రాంతాల్లో పోలీసులు నోటీసులు పెట్టారని...ఇది పూర్తిగా అభూత కల్పన అని రఘురామకృష్ణంరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. భీమవరంలో బీజేపీ నేత కనుమూరి రఘురామకృష్ణం రాజు కోడి పందాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు. 

 

13:35 - January 14, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి జోరందుకుంది. గోదావరి జిల్లాల్లో ఉదయం భోగి మంటలతో మొదలైన సదండి.. కోడి పందాలతో ఊపందుకుంది. పందాలపై పోలీసులు ఆంక్షలు, హైకోర్టు ఆదేశాలను పట్టించుకోని నిర్వాహకులు.. ఎప్పటిలాగానే... పందాలు జోరుగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా గ్రౌండ్స్ ఏర్పాటు చేసి... పోటీలు నిర్వహిస్తున్నారు. పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేస్తున్న పట్టించుకోవడం లేదు. కొన్ని చోట్ల ప్రజా ప్రతినిధులే పోటీలను ప్రారంభించడం విశేషం. మరోవైపు నారావారిపల్లెలో చంద్రబాబు కుటుంబసభ్యులు, బంధువులు వేడుకగా పండుగ జరుపుకుంటున్నారు. 
భోగి..చలిమంటలు
భోగి అంటే ఆరుబయట చలిమంటలు,..వాకిళ్లలో ముగ్గులు, వాటిపై గొబ్బెమ్మలతో ఆడపిల్లల ఆనందం. ఆకాశంలో పతంగులతో అబ్బాయిల ఉత్సాహం, గంగిరెద్దుల ఆటలను చూసి పిల్లల కేరింతలు. తెలుగు సంప్రదాయాలకు అద్దంపట్లే సంక్రాంతి సంబరాలను చూసేందుకు రెండు కళ్లు చాలవు. అలాంటి సంక్రాంతి పండుగను తెలుగు ప్రజలు ఆనందంగా జరుపుకుంటున్నారు. తొలిరోజు భోగిమంటలతో ఘనంగా ప్రారంభించి..కోడిపందాలతో సంక్రాంతి పండుగను హోరెత్తిస్తున్నారు.   
అంబరాన్నంటిన సంబరాలు 
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సంక్రాంతి పండగ అనగానే గుర్తొచ్చే కోనసీమలో ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. మూడు రోజుల పాటు సాగే ఈ పండుగలో తొలిరోజు భోగి మంటలతో ఘనంగా ప్రారంభమైంది. తెల్లవారుజామునే భోగిమంటలను వెలిగించి సంక్రాంతి పండుగకు తెలుగు ప్రజలు ఘనస్వాగతం పలికారు.  
కోనసీమలో
తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో భోగి పండుగ అత్యంత ఘనంగా జరుపుకున్నారు. తెలుగు సంప్రదాయాలను ప్రతిబింబించే సంక్రాంతి పండుగలో భాగంగా తొలిరోజు భోగి మంటలు పల్లెల్లో కాంతులు నింపాయి. తెల్లవారు జామునుంచే గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద భోగి మంటలు వెలిగించి సంక్రాంతి పండుగకు ఘనంగా స్వాగతం పలికారు. ఆవుపేడతో తయారు చేసిన భోగి దండలను మంటల్లో వేసి సంప్రదాయాలు కొనసాగించారు. 
విజయనగరంలో
భోగభాగ్యాలను ఇచ్చే భోగి పండగను విజయనగరం జిల్లా ప్రజానీకం ఘనంగా జరుపుకున్నారు. సినిమా పాటలకు చిందులేస్తూ, సంప్రదాయ క్రీడలు ఆడుతూ పండగను ఉత్సాహంగా జరుపుకున్నారు. 
శ్రీకాకుళం జిల్లాలో
శ్రీకాకుళం జిల్లాలో భోగి పండుగ సందడిగా సాగింది. జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలితో పాటు వీధులలో పెద్ద ఎత్తున భోగి మంటలు వేశారు. అటు ప్రకాశం జిల్లా ఒంగోలులో భోగిని ఘనంగా జరుపుకున్నారు. భోగి మంటల చుట్టూ తిరుగతూ సంప్రదాయ జానపదాలను ఆలాపించారు. రాష్ట్ర మంత్రి శిద్ధా రాఘవరావు భోగి కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు కష్టాల చీకట్లు తొలగి వెలుతురుల ఆనందమయమైన జీవితంలో కొనసాగలని అగ్ని దేవున్ని ప్రార్ధించినట్లు మంత్రి తెలిపారు. 
నారావారి పల్లెలో 'డిక్టేటర్‌' సందడి
చిత్తూరు జిల్లా నారావారి పల్లెలో డిక్టేటర్‌ సందడి చేశారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నారావారిపల్లెలో కుటుంబసభ్యులతో కలిసి బోగి పండుగలో పాల్గొని సందడి చేశారు. అనంతరం అభిమానులతో కలిసి తన 99వ సినిమా డిక్టేటర్‌ను వీక్షించేందుకు బాలకృష్ణ తిరుపతి వెళ్లారు. 
కాకినాడలో
ఇక కాకినాడలో కూడా భోగి సంబరాలు అంబర్నాంటాయి. హరిదాసుల కీర్తనలతో కోనసీమ పల్లెలు మార్మోగాయి. అమ్మాయిలు ఇంటిముందు రంగురంగుల ముగ్గులు వేస్తూ పండగను ఘనంగా జరుపుకున్నారు. 
కోడిపందాల హడావుడి
మరోవైపు సంక్రాంతి పండగంటేనే వెంటనే గుర్తొచ్చేది. కోడిపందాల హడావుడి. కోనసీమ వ్యాప్తంగా కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. నిర్వాహకులు రెండు, మూడు ఎకరాల్లో పెద్ద పెద్ద బరిలను ఏర్పాటు చేసి లక్షలు, కోట్లలో కోడి పందాలను నిర్వహిస్తున్నారు. 

 

13:24 - January 14, 2016

ఢిల్లీ : భారతీయ దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ టెక్నాలజీ మరోసారి మురిపించింది. మూడో త్రైమాసికంలో సంస్థ అంచనాలను మించిన ఫలితాలను నమోదు చేసింది.  అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో సంస్థ...3వేల 470కోట్ల నికర లాభాన్ని  సాధించింది. ఈ సమయంలో ఆదాయం 15వేల 902 కోట్లు.  2016లో సంస్థ ఆదాయం 13 శాతం పెరుగుతుందని అంచనావేసింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి బలహీనపడటంతో ఇన్ఫీ లాభాలు భారీగా పెరిగాయి. ఈ సమాచారంలో స్టాక్ ఎక్సేంఛ్‌లలో సంస్థ షేర్ 5శాతం పెరిగింది. 

13:21 - January 14, 2016

టోక్యో : ఉత్తర జపాన్‌లో షింజునాయి ప్రాంతంలో ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.7గా నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో.. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. 

 

13:12 - January 14, 2016

'7 టు 4' సినిమా టీంతో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు సినిమా విశేషాలను తెలిపారు. చిత్రం అందరికీ నచ్చుతుందన్నారు. వారి సినిమా అనుభవాలను వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం…

 

12:32 - January 14, 2016

తూర్పుగోదావరి : జిల్లాలో పందే కోళ్లను నిర్వహకులు రెడీ చేశారు. అయితే సుప్రీంకోర్టు కోళ్ల పందేళ్లను నిషేధిస్తూ.. సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది…  ఎపి సర్కార్ కూడా కోళ్ల పందేళ్లను నిర్వహించవద్దని హెచ్చరించింది. సుప్రీంతీర్పును, సర్కార్ హెచ్చరికలను నిర్వహకులు బేఖాతరు చేస్తున్నారు. యదేచ్చగా కోళ్లపందేం ఆటలకు సిద్ధం అయ్యారు. 20 బరులకు పైగా ఏర్పాటు చేశారు. ఎసీడీ స్క్రీన్ లను ఏర్పాటు చేశారు. కోళ్ల పందేళ్లను చేసి తీరుతామనే ధోరణీలో ఉన్నారు. పోలీసులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఒక్కో పుంజు వాల్యు… రూ.5 లక్షలు ఉంది. పది లక్షల రూపాయలు పందెం కడుతున్నారు. పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. ఆవరణమంతా పసుపుమయం అయింది. గతంలో హైకోర్టు కూడా కోళ్ల పందేళ్లను నిర్వహించవద్దని తీర్పు ఇచ్చింది. కానీ మూడు రోజులు మాత్రం కొడి పందేళ్లు కొనసాగిస్తామని నిర్వహకులు చెబుతున్నారు. 

12:23 - January 14, 2016

కృష్ణా : జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు భీమవరం వెళ్తుండగా.. మార్గంమధ్యలో పెదపారుపూడి మండలం వెండ్రప్రగడ వద్ద బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మహిళలు, బాలుడు గాయపడ్డారు. క్షతగాత్రులను గుడివాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు…

కృష్ణా : జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు భీమవరం వెళ్తుండగా.. మార్గంమధ్యలో పెదపారుపూడి మండలం వెండ్రప్రగడ వద్ద బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మహిళలు, బాలుడు గాయపడ్డారు. క్షతగాత్రులను గుడివాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

 

12:12 - January 14, 2016

జకర్తా : ఇండోనేషియా రాజధాని జకార్తా బాంబు పేలుళ్లు, తుపాకీ కాల్పుల మోతతో దద్దరిల్లింది. నాలుగు ప్రాంతాల్లో 8 బాంబు పేలుళ్లు జరిగాయి. యూఎన్ కార్యాలయం, స్టార్ బక్స్ కేఫ్ టార్గెట్ గా ఈ పేలుళ్లు జరిగాయి. ఈ దాడిలో ఏడుగురు మృతి చెందినట్లు సమాచారం. వీరిలో ముగ్గురు భద్రతా సిబ్బంది, ముగ్గురు పౌరులున్నారు. పేలుళ్లు అధ్యక్ష భవనానికి కిలోమీటరున్నర దూరంలోనే జరిగాయి. బాంబులు పేల్చిన ముగ్గురు దుండగులు.. ఆ తర్వాత కాల్పులకు తెగబడ్డారు. ఆ ముగ్గురు తీవ్రవాదులు భవనంలో దాక్కున్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. ఉగ్రవాదులు దాకున్న భవనాన్ని ప్రత్యేక బలగాలు చుట్టుముట్టాయి. పోలీసులు, తీవ్రవాదుల మధ్య గన్ ఫైర్ కొనసాగుతోంది. ఈ దాడి వెనక ఐసిస్ ఉగ్రవాదుల హస్తం ఉందని అనుమానిస్తున్నారు. గతేడాది ఫ్రాన్స్ రాజధాని పారిస్ దాడి తరహాలోనే జకార్తాలోనూ దాడులు జరగడంపై అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

 

11:58 - January 14, 2016

విజయనగరం : భోగభాగ్యాలను ఇచ్చే భోగి పండగను విజయనగరం జిల్లా ప్రజానీకం ఘనంగా జరుపుకున్నారు. వేకువజాము నుంచే భోగి పండగ సందడి మొదలైంది. వాడవాడలా భోగి మంటలను వెలిగించి..చిన్నాపెద్దా అనే తేడా లేకుండా పండగను వేడుకగా జరుపుకుంటున్నారు. సినిమా పాటలకు చిందులు వేస్తూ, సంప్రదాయ క్రీడలు ఆడుతూ పండగను ఉత్సాహంగా జరుపుకున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా భోగి మంటలు వేసి సంక్రాంతి పండగకు ఘనస్వాగతం పలికారు. 
శ్రీకాకుళంలో 
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భోగి పండగ సందడిగా సాగుతోంది. వేకువ జామునుండి భోగి మంటలు వేసి సంక్రాంతి సందడిని ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలితో పాటు..వీధులలో పెద్ద ఎత్తున భోగి మంటలు వేశారు. కుటుంబ సమేతంగా జిల్లా వాసులు భోగి మంటలు వేసుకుని ఆనందంగా పండగను జరుపుకుంటున్నారు. భోగి పండగ మొదలు సంక్రాంతి సందడి అంతా పూర్వ కాలం నుండి ఒక సంప్రదాయంగా వస్తోందని..ఇలాంటి ఆచార సాంప్రదాయాలను కాపాడే పండగలను జరిపి రానునన తరాలకు అందివ్వాలని జిల్లా వాసులు కోరుతున్నారు. 

 

11:54 - January 14, 2016

తూర్పుగోదావరి : జిల్లాలోని కోనసీమలో భోగి పండుగను అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు. తెలుగు సంప్రదాయాలను ప్రతిబింభించే సంక్రాంతి పండుగలో భాగంగా తొలిరోజు భోగి మంటలు పల్లెల్లో కాంతులు నింపాయి. తెల్లవారుజామున గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో భోగి మంటలు వెలిగించి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు కోనసీమవాసులు. తెలుగు వారికి సంక్రాంతే పెద్ద పండుగని..ముఖ్యంగా కొత్త పంట ఇంటికొచ్చిన వేళ..రైతులు చాలా ఆనందంతో సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నామని కోనసీమ వాసులు చెప్తున్నారు. 
విశాఖలో 
విశాఖలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. తెల్లవారుజామునే బోగి మంటలతో పండుగను ఘనంగా ఆరంభించారు. దక్షిణాయణం పూర్తయి ఉత్తరాయణం ప్రవేశిస్తున్న వేళ భోగి పండుగను జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం అని విశాఖ వాసులు చెప్తున్నారు. 

 

11:51 - January 14, 2016

'నాది కామెడీ ఫేస్ కాదని...సీరియస్ గా ఉంటుందని' హాస్యనటుడు పృథ్వీరాజ్ చెప్పారు. 30 ఇయర్ ఇండస్ట్రీ పృథ్విరాజ్ తో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన తన సినిమా అనుభావాలను వివరించారు. కెరీర్ ఆటుపోట్లు, ఎత్తుపల్లాలను వివరించారు. తను నటించిన సౌఖ్యం, బెంగాల్ టైగర్ తోపాటు పలు చిత్రాల్లో నటించిన అనుభవాలను వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

11:46 - January 14, 2016

అమలాపురం : కోడి పందేళ్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎపి రాష్ట్ర డిప్యూటీ సీఎం, హోంమంత్రి చినరాజప్ప హెచ్చరించారు. తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు.  చుట్టాలు, బంధువులతో కలిసిమెలిసి సంక్రాతి పండుగ చేసుకుంటామని చెప్పారు. పండుగ రోజే.. ఇంటి దగ్గర ఉంటామని....మూడు రోజులు చాలా సంతోషంగా ఉంటామని చెప్పారు. సంప్రదాయంగా కోడి పందేళ్లు అలవాటైందని… అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం…  ప్రభుత్వం కూడా కోడి పందేళ్లను ఆడొద్దని చెబుతుందని చెప్పారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు కోడి పందేళ్లల్లో పాల్గొంటున్నారని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు..బుదులుగా ఆయన మాట్లాడుతూ  కోడి పందేళ్లను హర్షించే ప్రసక్తి లేదన్నారు. పోలీసులు వారి పని వారు చేస్తున్నారని చెప్పారు. కోడి పందేళ్లు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు. 

 

11:29 - January 14, 2016

పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే నిద్ర చాలా అవసరం. అయితే పిల్లలు అంత సామాన్యంగా నిద్రపోరు. ఎక్కువగా మారాం చేస్తూ, ఆడుకుంటూ కాలం గడుపుతుంటారు. అలాంటి పిల్లలను నిద్రపుచ్చేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. పిల్లలకు ఎన్ని గంటల నిద్ర అవసరమనేది వారి వయస్సు మీద ఆధారపడి ఉంటుంది. ప్రీ-స్కూల్‌ వయసు పిల్లలయితే రోజుకు 10 నుండి 12 గంటలు, యుక్తవయస్కులయితే ఎనిమిది నుండి తొమ్మిది గంటల మధ్య నిద్ర అవసరం. తొమ్మిదేళ్ళ వయసులో దాదాపు 10 గంటల నిద్ర అవసరం. అంతేకాదు పిల్లలు పడుకునేందుకు సరదా సరదా కథలు చెప్తే మంచిది. ఆహారంలో కెఫీన్‌ లేకుండా చూసుకోవాలి. వీడియో గేమ్స్, టెలివిజన్‌ వంటి ఉద్రేకపరిచే కార్యక్రమాలను చూడనివ్వకూడదు. బెడ్‌రూమ్‌ ప్రశాంతతను మెరుగుపరిచేలా, శరీర ఉష్ణోగ్రతను సమంగా ఉండాలి. శబ్ధ్దాలు ఉండకుండా చూసుకోవాలి. అలాగే లేత రంగు కర్టెన్లను ఉపయోగించడంతో పాటు సౌకర్యవంతమైన మంచం, అక్కడ ఎలక్ట్రానిక్‌ వస్తువులు(కన్సోల్స్, కంప్యూటర్లు) లేకుండా చూసుకోవాలి. పడుకునే ముందు గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం వల్ల మంచి నిద్ర పడుతుంది.

11:27 - January 14, 2016

'పులి' ఘోర పరాజయం తర్వాత తమిళ అగ్ర నటుడు విజయ్‌ సినిమాలు చేసే విషయంలో దూకుడు పెంచారు. ఇప్పటికే తన 59వ చిత్రంగా 'థెరి' చిత్రంలో నటిస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రం దాదాపు పూర్తి కావచ్చింది. ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఉండగానే తదుపరి ప్రాజెక్ట్ (60వ సినిమా)కి సంబంధించిన పనుల్ని విజయ్‌ వేగవంతం చేశారు. మ్యూజికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి భరతన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు ఏకధాటిగా జరుగుతున్నాయి. విజయ్‌ 60వ చిత్రానికి సంబంధించి రెగ్యులర్‌ షూటింగ్‌ కార్యక్రమాలు ఏప్రిల్‌ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి నటించే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉంటే, 'తుపాకి' చిత్రానికి సీక్వెల్‌గా 'తుపాకి2' చిత్రాన్ని విజయ్‌తోనే రూపొందించేందుకు దర్శకుడు ఏ.ఆర్‌.మురుగదాస్‌ రంగం సిద్ధం చేస్తున్నారు. 'తుపాకి2' చిత్రకథను మురుగదాస్‌ ఇప్పటికే విజయ్‌కి నెరేట్‌ చేశారని తెలుస్తోంది. విజయ్‌ సినిమాల్ని అంగీకరిస్తున్న తీరు చూస్తుంటే సూపర్‌డూపర్‌ హిట్‌ కొట్టాలనే కసితో ఉన్నారనిపిస్తోంది.

11:25 - January 14, 2016

హృతిక్‌ రోషన్‌, సోనమ్‌కపూర్‌ జంటగా నటించిన రీమేక్‌ వీడియో సాంగ్‌ 'ధీరే..ధీరే..' సంచలన రికార్డ్ సృష్టించింది. యో యో సింగ్‌ ఆధ్వర్యంలో టీ సిరీస్‌ రూపొందించిన 'ధీరే..ధీరే' వీడియో సాంగ్‌ను యూట్యూబ్‌లో ఏకంగా 100 మిలియన్ల మంది చూశారు. అంతేకాకుండా 4,65,479 లైక్స్‌ కూడా వచ్చాయి. దీంతో 100 మిలియన్ల మార్క్ కి చేరిన తొలి వీడియో పాటగా బాలీవుడ్‌లో 'ధీరే ధీరే' సంచలన రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఈ సందర్భంగా టీ సీరిస్‌ అధినేత భూషణ్‌కుమార్‌ మాట్లాడుతూ, 'ఇలాంటి రికార్డ్ బాలీవుడ్‌లోనే ప్రథమం. మేం ఊహించిన దానికంటే ఈ వీడియో సాంగ్‌కి అత్యద్భుతమైన స్పందన లభించింది. ఈ పాటను ఇప్పటికీ వీక్షకులు ఎంతో ఇష్టంగా మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు. ఈ పాటలో హృతిక్‌, సోనమ్‌కపూర్‌ల కెమిస్ట్రీ ఎంతో బాగా కుదిరింది. 'ధీరే ధీరే..'తోపాటు మా కంపెనీ ద్వారా విడుదలైన మరికొన్ని పాటలు సైతం విశేష ఆదరణ పొందాయి' అని తెలిపారు. 1990లో విడుదలై సంచలన విజయం సాధించిన 'ఆషికీ' చిత్రంలోని 'ధీరే ధీరే..' పాటను సంగీత దర్శకుడు, నేపథ్యగాయకుడు యో యో సింగ్‌ వీడియో సాంగ్‌గా రీ క్రియేషన్‌ చేశారు.

11:25 - January 14, 2016

హైదరాబాద్ : భూముల క్రమబద్ధీకరణపై ఏపీ ప్రభుత్వం దృష్టిసారించింది. దీనిపై ఏర్పాటుచేసిన మంత్రి వర్గ ఉప సంఘం పలు ప్రతిపాదనలు తయారుచేసింది. ఈ ప్రతిపాదనలను వచ్చే కేబినెట్‌ సమావేశంలో చర్చించే అవకాశముంది. అనంతరం ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. 

క్రమబద్ధీకరణపై సబ్‌ కమిటీ సమావేశం

ఆంధ్రప్రదేశ్‌లో భూముల క్రమబద్ధీకరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. మంత్రులు కేఇ కృష్ణమూర్తి, యనమల, నారాయణతో ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం సెక్రటేరియట్‌లో సమావేశమయ్యింది. గృహవసరాల కోసం ఆక్రమణలో ఉన్న భూముల క్రమబద్ధీకరణపై సబ్‌ కమిటీ చర్చించింది.

వంద చదరపు గజాల వరకు క్రమబద్ధీకరణ

వంద చదరపు గజాల వరకు క్రమబద్ధీకరించాలని మంత్రివర్గ ఉప సంఘం మొదట నిర్ణయించింది. ఐతే దీనిని ఐదు వందల చదరపు గజాల వరకు పరిశీలించాలని సబ్‌ కమిటీ భావించింది. దీంతో వంద చదరపు గజాల నుంచి 500 చదరపు గజాల వరకు ఉన్న ఆక్రమణల వివరాలను ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. తొలి వంద చదరపు గజాలను ఉచితంగా క్రమబద్ధీకరించాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది.

క్రమబద్ధీకరణకు 90 రోజుల గడువు 

100 నుంచి 150 చదరపు గజాల క్రమబద్ధీకరణ కోసం బేసిక్‌ వాల్యూలో 60 శాతం ఫీజుగా నిర్ణయించాలని సబ్‌ కమిటీ అభిప్రాయానికి వచ్చింది.151 నుంచి 250 చదరపు గజాల వరకు 75 శాతం, 251 నుంచి 500 చదరపు గజాల వరకు 100 శాతం ఫీజు వసూలు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనికి 90 రోజుల గడువు ఇవ్వాలని ప్రతిపాదించింది.
2014, జనవరి1 నాటికి ఆక్రమణలో ఉన్న భూముల క్రమబద్ధీకరణ
2014, జనవరి1 నాటికి ఇళ్ల నిర్మాణం కోసం ఆక్రమణలో ఉన్న భూములనే క్రమబద్ధీకరించాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. ఆక్రమణల వివరాలు...క్రమబద్ధీకరిస్తే వచ్చే ఆదాయంపై పూర్తి వివరాలను ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. ఈ ప్రతిపాదనలపై మంత్రి వర్గ ఉప సంఘం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. వచ్చే కేబినెట్‌ సమావేశంలో ఈ నివేదికపై చర్చించి..తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. 

11:20 - January 14, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ పీఠంపై గులాబీ జెండా ఎగరేయాలన్నది టిఆర్‌ఎస్ చిరకాల వాంఛ. ఇందుకోసం ఎన్ని ఆటంకాలొచ్చినా వాటిని సైలెంట్‌గా మాఫీ చేసి గ్రేటర్‌లో తమ పట్టు నిరూపించుకునేందుకు నేతలు పావులు కదుపుతున్నారు. దీనికితోడు కొన్ని వార్డులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. వీలైనన్ని స్థానాల్లో విజయం సాధించడం అటుంచి కొన్ని వార్డులైనా ఏకగ్రీవమయ్యేలా అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
అధికార పార్టీ వ్యూహాలు..
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచార రంగంలో అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ దూసుకు పోతున్న గులాబి దళం ఎన్నికల ముందే ప్రత్యర్థులను మానసికంగా దెబ్బతీసేందుకు వ్యూహ రచన చేస్తోంది. నిజానికి మొదటి నుంచీ హైదరాబాద్‌ టిఆర్‌ఎస్‌కు కొరకరానికొయ్యగానే ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఎలాగైనా హైదరాబాద్‌ పీఠంపై గులాబీ జెండా ఎగరేసేందుకు రెండు నెలల క్రితం నుంచే ఆ ఆపార్టీ వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది.
గ్రేటర్‌ రిజర్వేషన్ల వ్యవహారం.. టిఆర్‌ఎస్‌లో అసంతృప్తులు
గ్రేటర్‌ రిజర్వేషన్ల వ్యవహారం టిఆర్‌ఎస్‌లో అసంతృప్తులు రగిలిస్తున్నా అదేమంత సమస్యకాదనే అభిప్రాయం నేతల్లో కనిపిస్తోంది. ఇప్పటికే అనేకమంది నేతలు వలసరావడంతో టికెట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మరోపక్క వంద స్థానాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవడంతో అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సాములా మారింది. దీంతో ఏకపక్షంగా ఉన్న డివిజన్లలో అభ్యర్థుల జాబితాను ముందుగా ప్రకటించేందుకు గులాబీ అగ్రనేతలు ప్లాన్ చేస్తున్నారు. మంత్రులు, కీలక నేతలకు పట్టున్న స్థానాల్లో ఏకపక్షంగా అభ్యర్థులను గెలిపించుకునేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
అధికార పార్టీ..  సర్దుబాట్లు ప్రక్రియ తీవ్రతరం 
కనీసం 5 స్థానాలనైనా ఏకగ్రీవం చేసుకుంటే విపక్ష పార్టీలపై మానసికంగా పైచేయి సాధించినట్లు అవుతుందని అధికార పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఈ దిశగానే పావులు కదుపుతున్నారు. మరో నాలుగు రోజుల పాటు నామినేషన్ల ప్రక్రియ ఉండడంతో అధికార పార్టీ  సర్దుబాట్లు ప్రక్రియను మరింత తీవ్రతరం చేసినట్లు తెలిసింది. శుక్ర, శనివారాల్లో పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాను వెల్లడించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఏకగ్రీవం చేయాలన్న టిఆర్‌ఎస్‌ ఆలోచనలు సఫలమవుతాయోలేదో చూడాలి. 

10:51 - January 14, 2016

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ప్రభుత్వాలు గౌరవించాలని ది హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ అన్నారు. గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తూ.. ఎపిలో అధికార పార్టీ నేతలు కోళ్ల పందేళ్లలో పాల్గొనడం సరికాదన్నారు. రాజ్యాంగాలు, చట్టాలు ఉన్నా సమాజంలో దోపిడీ జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాల అమలు సరిగ్గా లేకుంటే చట్టాలను తీసేయాలనడంలో అర్థం లేదన్నారు. తెలుగు ప్రజలకు భోగీ, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని వివరాలను ఆయన మాటల్లోనే....
కోళ్ల పందేళ్లు నిర్వహించవద్దని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా.. ఎపిలో కోళ్ల పందేళ్లు నిర్వహిస్తున్నారు. స్వయంగా అధికార పార్టీ నేతలు పాల్గొంటున్నారు. అలా చేస్తే కోర్టు తీర్పు, రాజ్యాంగాన్ని ధిక్కరించినట్లవుతుంది. ప్రభుత్వ కోళ్ల పందేళ్లను నిషేధిస్తూనే.. అధికార పార్టీకి చెందిన నేతలు కోళ్ల పందేళ్లలో పాల్గొనడం శోచనీయం. కోళ్ల పందేళ్లలాగా మనుషుల పందేళ్లు సాగుతున్నాయి. సంప్రదాయం, ఆచారం పేరుతో ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే ఆధునిక కాలం, చట్టం అంగీకరించదు. సతీసహాగమనం విషయంలో కూడా ఇదే వాదన వచ్చింది.. అలా అని దాన్ని ఆమోదించలేము. రాజ్యాంగాన్ని నమ్మమని నక్సలైట్లు చెబుతున్నారు.. అలాంటప్పుడు.. ప్రభుత్వం వారి వ్యాఖ్యలు, చేష్టలను సమర్థిస్తారా...? వారిపై ఎన్ కౌంటర్ ఎలా చేస్తారు..? 
చట్టమే గెలుస్తుంది..
సంప్రదాయం, ఆచారం, చట్టం మధ్య ఘర్షణ నెలకొంటే చట్టమే గెలుస్తుంది. చట్టం అవసరం లేదంటే కుదరదు. మనిషి తన అత్యఅవసరం కోసం కోళ్లు, జంతువులను తింటే తప్పుబట్టలేము. చట్టబద్దమైన పాలనను అంగీకరిస్తే.. రాజ్యాంగాన్ని అంగీకరించాల్సిందే. ఎపిలో అధికార పార్టీ నేతలు కోళ్ల పందేళ్లలో పాల్గొనడం సరికాదు. సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించి… కోళ్ల పందేంలో పాల్గొన్న టిడిపి నేతలపై చర్యలు తీసుకుంటారా.. లేదా.. చట్టాలను గౌరవిస్తారా లేదా.. ఎపి సర్కార్ చెప్పాలి.. 
తమిళనాడులో జరిగే జల్లికట్లు ఆటలో విషయంలో కూడా సుప్రీంకోర్టు నిషేధిస్తూ.. స్టే విధించింది. ఇష్టమొచ్చినట్లు ప్రవరిస్తామంటే కుదరదు. మనుషులు తమ తరపున లాయర్లను పెట్టుకుంటారు. మూగు జీవులకు ఆ అవకాశం లేదు. కాబట్టి 
మూగ జీవుల తరపున సుప్రీంకోర్టు ఆలోచన చేయాలని రాజ్యాంగం చెప్పింది. ఆధునిక కాలంలో సమాజంలో మార్పు రావాలి. 
అమెరికాలో ఉండే సంస్కృతిని మనం ఫాలో కాలేము. గేమ్ ఆఫ్ స్కిల్.… జూదం కాదు. గేమ్ ఆఫ్ ఛాన్స్….. జూదం. నచ్చినా… నచ్చకపోయినా.. చట్టాలు, కోర్టు తీర్పులను గౌరవించాలి అని నాగేశ్వర్ అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం…

 

జకర్తాలో వరుస బాంబు పేలుళ్లు

ఇండోనేషియా : జకర్తాలో వరుసగా బాంబు పేలుళ్లు సంభవించాయి. ఆరు చోట్ల పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనల్లో  
నలుగురు మృతి చెందారు. పలవురు గాయపడ్డారు. 
 

10:20 - January 14, 2016

హైదరాబాద్: గ్రేటర్‌ ఎన్నికల బరి నుంచి టివైసిపి తప్పుకుంది. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఆ పార్టీ పోటీచేస్తుందని మొదటినుంచీ ప్రత్యర్థి పార్టీలు వ్యూహరచన వేస్తూ వచ్చాయి. కానీ జగన్‌ పార్టీ అనూహ్యంగా తీసుకున్న నిర్ణయంతో ఆయా పార్టీల అంచనాలు తారుమారయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు టివైసిపి నేతలు అంటున్నారు. అయితే ఈ నిర్ణయంపై పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

బరిలో రాజకీయ పార్టీలు

గ్రేట‌ర్ హైదరాబాద్‌ ఎన్నిక‌ల‌ వేళ ఉనికిలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలూ బరిలో దిగుతున్నాయి. వీలైనన్ని స్థానాల్లో గెలిచి తమ సత్తా నిరూపించుకునేందుకు ఇప్పటికే ప్రచారపర్వంలో దుమికాయి. అయితే అందరి అంచనాలనూ తారుమారుచేస్తూ వైసిపి ఎన్నికలకు దూరంగా ఉండాల‌ని నిర్ణయించుకుంది. 

టీఆర్ఎస్‌.. హామీలు... విఫలం : టీవైసీపీ

అధికార టీఆర్ఎస్‌ ప్రజ‌ల‌కి ఇచ్చిన హామీలు నెర‌వేర్చడంలో విఫలం ఆయిందని, ప్రధాన ప్రతిప‌క్షం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిల‌దీయ‌డంలో ఫెయిలైందని టీవైసీపీ ఆరోపిస్తోంది. మ‌రోవైపు ఓటుకి నోటు కేసులో ఆడ్డంగా దొరికిపోయిన టీడీపీ నేతలు టీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కయ్యారని విమర్శిస్తోంది. ఇలాంటి సిచ్యుయేషన్‌లో భవిష్యత్‌లో టిఆర్‌ఎస్‌కు తమ పార్టీని ప్రధాన ప్రత్యర్థిగా నిలిపేందుకు ఇప్పటినుంచే ప్రయత్నిస్తామని వైసిపి కీలక నేతలు అంటున్నారు. అయితే గ్రేటర్‌లో పెద్దసంఖ్యలోనే ఆభిమానులు, మ‌ద్దతుదారులున్నా సంస్థాగతంగా బలంగా లేకపోవడం, ప‌రిస్థితులు అననుకూల‌ంగా ఉండడంతో ప్రస్తుత ఎన్నిక‌ల‌కు దూరంగా వుండాల‌ని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. 

జ‌గ‌న్ పై ఆ పార్టీ నేతల అసంతృప్తి

అధినేత జ‌గ‌న్ తీసుకున్న ఈ నిర్ణయంపట్ల టివైసిపి అధ్యక్షుడు పొంగులేటిశ్రీ‌నివాస్‌రెడ్డితో పాటు గ్రేటర్ నేత‌లు, కార్యకర్తలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యా గ్రేటర్‌లో పోటీ చేయడం ద్వారా కనీసం ప్రజల మనసుల్లోంచి పార్టీ ముద్ర తొలగిపోకుండా ఉంటుంది కదా అని అభిప్రాయపడుతున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ కొనసాగుతున్న పార్టీగా చెప్పుకునే వైసీపీ.. గ్రేటర్ ఎన్నికల్లో అసలు పోటీలోనే ఉండకపోవడం సరికాదనే చర్చ పార్టీ వర్గాల్లో జరగుతోంది. గ్రేట‌ర్‌లో పోటీ చేయ‌కూడ‌ద‌ని భావిస్తే ష‌ర్మిల‌తో ప‌రామ‌ర్శ యాత్రలు ఎందుకు చేయించార‌ని కొందరు ప్రశ్నిస్తున్నారు.

వరంగ‌ల్ లోక్‌స‌భ ఎన్నికలు.. వైసిపి ఓటమి

ఇంతకుముందు జరిగిన వరంగ‌ల్ లోక్‌స‌భ ఉప ఎన్నిక‌ల్లో త‌మ‌కు ఏమాత్రం బ‌లం లేకున్నా వైసిపి పోటీచేసి ఘోరంగా ఓడిపోయింది. ఖమ్మం ఎమ్మెల్సీ విషయంలోనూ అదే రిజల్ట్ రిపీటైంది. కానీ గ్రేటర్‌లో పోటీచేయకపోవడమేంటా అనే చర్చ జరుగుతోంది. అయితే అధికార టిఆర్ఎస్‌కు మేలు చేసేందుకే జగన్‌ పార్టీ పోటీ నుంచి త‌ప్పుకుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెరవెనుక ఎలాంటి రాజకీయాలు జరిగుంటాయో అందరికీ తెలియకపోయినా వైసిపి తీసుకున్న నిర్ణయం మాత్రం చర్చనీయాంశంగా మారింది. 

 

09:27 - January 14, 2016

తూర్పుగోదావరి: తెలుగురాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. కోనసీమలో భోగి సందడి నెలకొంది. భోగిమంటలతో సంక్రాంతికి తెలుగు ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. మంచుదుప్పటిని తరిమికొడుతూ... వెచ్చని మంటల్లో సంక్రాంతికి స్వాగతం పలుకుతున్నారు. పల్లెల్లో భోగి మంటలు కాంతులు నింపాయి. తెల్లవారుజాము నుంచే గ్రామాల్లో భోగి మంటలు వెలిగించి... స్థానికులు సంతోషంతో కేరింతలు కొడుతున్నారు. ఆవు పేడతో తయారు చేసిన భోగి దండలను మంటల్లో వేసి సంప్రదాయాలు కొనసాగించారు. ఎక్కడ చూసినా భోగిమంటలు దర్శనమివ్వడంతో తెల్లవారుజాము నుంచే పండగ వాతావరణం నెలకొంది. యువతీయువకులు ఆడిపాడారు. సంక్రాంతి మూడు రోజులు ఉంటుందని.. చాలా సంతోషంగా పండుగను జరుపుకుంటామని తెలిపారు. బంధువులందరినీ కలుసుకుంటామని తెలిపారు. కుటుంబసమేతంగా బంధువులతో కలిసిమెలిసి పండుగను నిర్వహించుకుంటామని చెప్పారు. సంక్రాంతి పండుగ ఎంతో ఇష్టమైన పండుగ తెలిపారు.

 

08:51 - January 14, 2016

అమలాపురం : తెలుగురాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. భోగిమంటలతో సంక్రాంతికి తెలుగు ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. మంచుదుప్పటిని తరిమికొడుతూ... వెచ్చని మంటల్లో సంక్రాంతికి స్వాగతం పలుకుతున్నారు. అమాలాపురంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే భోగి మంటలు వెలిగించి... స్థానికులు సంతోషంతో కేరింతలు కొడుతున్నారు. ఆవు పేడతో తయారు చేసిన భోగి దండలను మంటల్లో వేసి సంప్రదాయాలు కొనసాగించారు. ఎక్కడ చూసినా భోగిమంటలు దర్శనమివ్వడంతో తెల్లవారుజాము నుంచే పండగ వాతావరణం నెలకొంది. 

 

సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న బాలయ్య

చిత్తూరు: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. భోగి మంటలు వేసి సంబరాల్లో పాల్గొన్న హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు. 

 

08:03 - January 14, 2016

గ్రామర్ ద్వారా, బుక్స్ చదవడం ద్వారా ఇంగ్లిష్ నేర్చుకోవడం అసంభవమని… మాట్లాడడం ద్వారానే ఇంగ్లిష్ నేర్చుకోవచ్చని ఇంగ్లీష్‌ టంగ్‌ పుస్తక రచయిత బీకే రెడ్డి తెలిపారు. ఇదే  'ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా..?' అనే అంశంపై నిర్వహించిన జనపథం చర్చ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌, రీసెర్చి అండ్‌ ట్రైనింగ్‌ నిర్వహించిన సర్వేలో బాధాకర వాస్తవమొకటి బయటపడింది. మన దేశంలో 60శాతం మంది విద్యార్థులకు ఇంగ్లీషు ప్రావీణ్యం వుండడం లేదని తేలింది. ఇంజనీరింగ్‌ చదివినవారికి కూడా ఇంగ్లీష్‌లో తగినంత ప్రావీణ్యం వుండడం లేదని మరో సర్వేలో వెల్లడయ్యింది.  ఆధునిక సమాజంలో ఇంగ్లీషు భాషకున్న ప్రాధాన్యతేమిటి? మన విద్యార్థులు ఇంగ్లీషులో ఎందుకు వెనకబడుతున్నారు? ఇంజనీరింగ్‌ లాంటి ఉన్నత చదువులు చదివినవారికీ కూడా ఇంగ్లీషు రాకపోవడానికి కారణం ఏమిటి? ఇంగ్లీషు మాట్లాడలేకపోవడం వల్ల మన విద్యార్థులు ఎలా నష్టపోతున్నారు?  ఇంగ్లీషు శులభంగా నేర్చుకునే మార్గాలేమిటి? ఇంగ్లీషు పట్ల వుండే భయాన్ని పోగొట్టుకోవడం ఎలా?' ఈ అంశాలపై బీకే రెడ్డి మాట్లాడారు. 
పలువురి కాలర్స్ నుంచి వచ్చిన సందేహాలను నివృత్తి చేశారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం..

 

07:53 - January 14, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ వచ్చేసింది. ఓ వైపు పల్లెలు కళకళలాడుతున్నాయి. మరోవైపు రాజధాని బోసిబోతోంది. పల్లెల వైపు నగరవాసులు పరుగులు తీస్తున్నారు. ఆత్మీయుల మధ్య ఆహ్లాదంగా గడిపేందుకు తరలిపోతున్నారు. రైల్వేస్టేషన్లు, బస్‌స్టాండ్‌లు కిక్కిరిసిపోయాయి. రైళ్లు, బస్సులు సరిపోక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

సొంతూళ్లకు వెళ్తున్న నగరవాసులు

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారి సంఖ్య ఏటా పెరిగిపోతోంది. కాంక్రీట్‌ జంగిల్‌లో గడిపేకంటే పచ్చని పల్లెల్లో సేదతీరేందుకు జనాలు ఇష్టపడుతున్నారు. ఆత్మీయులతో కలిసి సరదాగా గడపటానికి మొగ్గుచూపుతున్నారు. దీంతో హైదరాబాద్‌లోని జనాలు కుటుంబ సమేతంగా సొంతూళ్లకు తరలిపోతున్నారు.
భారీ ఎత్తున ఊళ్లకు వెళ్తుండటంతో నగరం బోసిపోతోంది. 

రైల్వేస్టేషన్‌లలో సంక్రాంతి కళ

భాగ్య నగరంలోని రైల్వేస్టేషన్‌లలో సంక్రాంతి కళ కనిపిస్తోంది. సికింద్రాబాద్‌, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లు ప్రయాణికులతో నిండిపోయాయి. అన్ని రైళ్లలనూ ప్రయాణికులు కిక్కిరిసిపోతున్నారు. రైల్వే రిజర్వేషన్లు నెల ముందే చేసుకున్నారు. అప్పటికప్పుడు వెళ్లాలనుకున్న చాలా మంది తత్కాల్‌నే నమ్ముకున్నారు. పేద ప్రజలు మాత్రం జనరల్‌ బోగీల్లోనే అతికష్టం మీద వెళ్తున్నారు. అదీ కుదరకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయిస్తున్నారు.

ఎంజీబీఎస్‌, జేబీఎస్‌లో ప్రయాణికుల రద్దీ 

ఎంజీబీఎస్‌, జేబీఎస్‌లో ప్రయాణికుల రద్దీ ప్రధాన బస్‌స్టేషన్‌లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్‌లతో పాటు శివారు ప్రాంతాల్లోని బస్‌స్టాండ్‌లలో ప్రయాణికుల రద్దీ పెరిగిపోయింది. అదనపు రైళ్లు, బస్సులు ఎన్ని వేసినా ఫలితం లేదు. ప్రయాణికులు రద్దీ ఏ మాత్రం తగ్గటం లేదు.  దీంతో సొంతూళ్లకు వెళ్తున్న జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అదనపు బస్సులు 

మరోవైపు ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అదనపు బస్సులు కేటాయించామంటున్నారు. ప్రయాణికుల రద్దీ బట్టి వాటి సంఖ్యను మరింత పెంచుతామని స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి నగరవాసులకు సంక్రాంతి చుక్కలు చూపిస్తోంది. ఊళ్లకు వెళ్లాలంటే నానా పాట్లు పడక తప్పటం లేదు. కిక్కిరిసిన రైళ్లు, బస్సుల్లో వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఎక్కువ మొత్తంలో చార్జీలు వెచ్చించి ప్రైవేట్ వాహనాల్లో వెళ్తున్నారు.

07:47 - January 14, 2016

హైదరాబాద్ : ఏపీలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ప్రభుత్వం అధికారికంగా వేడుకలను నిర్వహిస్తోంది. దీంతో సంక్రాంతి సంబరాలు హుషారుగా సాగుతున్నాయి. ఏపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సంక్రాంతి సంబరాలకు కొత్త జోష్‌ తీసుకొస్తున్నారు. తాము మంత్రులం, ప్రజాప్రతినిధులం అన్న భేషజాన్ని పక్కనపెట్టి వారు ఆడిపాడి అందరినీ అలరిస్తూ... ప్రజలను హుషారెక్కించారు.
ఏలూరులో 
సంక్రాంతి వేడుకలతో ఏపీలో చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా హుషారుగా వేడుకలు చేసుకుంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఏపీ మంత్రి పీతల సుజాత, ఎంపీ మాగంటి బాబు తదితరులు పాల్గొని సంక్రాంతికి కొత్త ఊపు తెచ్చారు. మంత్రి పీతల సుజాత అయితే ఏకంగా కబడ్డీ కబడ్డీ అంటూ మహిళా నేతలతో కలిసి కబడ్డీ ఆడి ఇరగదీశారు. ఆ తరువాత కోలాటమాడుతున్న ఆడవాళ్లతో కలిసి అందంగా అడుగులేసి పాటలు, కోలాటంతో సందడి చేశారు.
ఒంటె ఎక్కి కూర్చుని వీధులన్నీ తిరిగిన మాగంటి 
ఇక ఎంపీ మాగంటి బాబు ఒంటె ఎక్కి కూర్చుని వీధులన్నీ తిరిగారు. అంతేకాదు... బాడీబిల్డింగ్‌ పోటీలు జరుగుతుంటే అక్కడికి వెళ్లి కండలు తిరిగిన యోధుల మధ్య నిల్చుని తన సరదాగా బాడీ బిల్డింగ్ ఫోజులు ఇచ్చారు. అలాగే ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్‌, బడేటి బుజ్జి ప్రజల్లో పూర్తిగా కలిసిపోయి ఆడిపాడారు. 
విజయవాడలో
ఇక విజయవాడ సిద్ధార్థ కళాశాల మైదానంలో సంక్రాంతి వేడుకలను మంత్రి దేవినేని ఉమా, జిల్లా కలెక్టర్ బాబు ప్రారంభించారు. మంత్రి దేవినేని ఉమా, కలెక్టర్ బాబు వివిధ కళాకారులతో కలిసి దరువేశారు.  
అనంతపురంలో 
అనంతపురంలో మంత్రులు పల్లె రఘునాథ్‌ రెడ్డి, పరిటాల సునీత సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి డప్పు వాయించారు. మంత్రి సునీత ముగ్గులు వేసి ఉత్సాహం నింపారు. సంక్రాంతి అంటే కేవలం కోడి పందేలే కావని చెబుతూ ఆటపాటలతో పండుగను ఉత్సాహంగా ఏపీలో ప్రజలంతా జరుపుకుంటున్నారు. 

 

07:41 - January 14, 2016

హైదరాబాద్ : రంగురంగుల ముగ్గులు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు... కోడిపందాలు, ఎడ్ల పోటీలు... ఇవన్నీ తలుచుకుంటే కళ్లముందు సంక్రాంతి మెదలుతుంది. సంక్రాంతి వచ్చిందంటే అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. సంక్రాంతి పండగ గ్రామాల్లో నూతన శోభను చేకూర్చింది.
తెలుగువారు జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి
తెలుగువారు జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి. ఈ పర్వదినానాన్ని రైతులు వైభవంగా జరుపుకుంటారు. పంట చేతికొచ్చిన ఆనందంలో అన్నదాతలు ఈ వేడుకను నిర్వహిస్తారు. అందుకే సంక్రాంతి రైతుల పండుగగా ఖ్యాతి గడించింది. పట్టణాల్లో కన్నా పల్లెటూర్లలోనే సంక్రాంతి పండుగ కన్నులపండుగగా జరుపుకుంటారు. అందుకే పట్టణవాసులు వ్యయ ప్రయాసలకు ఓర్చి పల్లెలకు పయనమవుతారు. 
ఇళ్ల ముంగిళ్లలో రంగవల్లులు 
సంక్రాంతి నెల ప్రారంభం కాగానే ప్రతి రోజూ ఇళ్ల ముంగిళ్లలో రంగవల్లులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఆవుపేడతో తయారు చేసే గొబ్బెమ్మలు, రకరకాల పువ్వులతో ముఖ్యంగా గుమ్మెడిపూలతో ప్రత్యేకంగా అలంకరిస్తారు. మరోవైపు హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, బుడుబుక్కల వాళ్లు, పగటి వేశగాళ్లు, జానపద కళాకారుల పద్యాలు పల్లెల్లో మారుమోగేవి. అయితే నేటి యాంత్రిక జీవితంలో గ్రామాల్లో కూడా ఇవి కనుమరుగవుతున్నాయి. పండగన్న ఆ మూడురోడు రోజుల్లో మాత్రమే సందడి కనిపిస్తోంది. 
సంక్రాంతి అంటేనే పిండివంటలు 
సంక్రాంతి అంటేనే పిండివంటల గుమగుమలు. కొత్త బియ్యం ఇంటికి చేరడంతో పలు రకాల రుచులను ఆస్వాదిస్తాం. నువ్వుల అరిసెలు, జంతికలు, సున్నుండలు, బొబ్బట్లు, బూరెల గుమగుమలు నోరూరిస్తుంటాయి. ఏ ఇంటికి వెళ్లినా పిండివంటలను వారం ముందునుంచే తయారుచేసేవారు. అయితే పట్టణాల్లో మాత్రం రెడిమేడ్‌ రుచులను ఆస్వాదించాల్సిందే. తయారు చేసే ఓపిక లేక స్వీటు షాపులను ఆశ్రయిస్తున్నారు.  
సంక్రాంతి పండగలో మొదటి రోజు భోగి
సంక్రాంతి పండగలో మొదటి రోజు భోగి. భోగి రోజు మంటలు వేయడం ఆనవాయితీ. ఇంటినిండా పేరుకుపోయిన చెత్తను పోగుచేసి మంటలు వేస్తారు. ఇందులో పిడకలు, కర్రలు వేసి అగ్గి రాజేస్తారు.  ఎముకలు కొరికే చలిని భోగిమంటలతో పారదోలుతారు. తలంటు స్నానం చేసి కొత్తబట్టలు ధరించి,  పిల్లలు,  పెద్దలు సందడి చేస్తారు. ఇళ్లలో బొమ్మల కొలువులు, చిన్నపిల్లలకు భోగిపళ్లు పోస్తారు. ఈ పండగకు అల్లుళ్లు అత్తగారింటికి రావడం ఆనవాయితీ. 
రెండో రోజు మకర సంక్రాంతి
ఇక రెండో రోజు మకర సంక్రాంతి. ఈ రోజున చేతికి వచ్చిన కొత్త బియ్యంతో తీపి పొంగలి చేస్తారు. పిండివంటలను నలుగురికీ పంచిపెట్టి.. తాము తింటారు. సంక్రాంతికి ఏ పల్లెలో చూసినా కోడిపందాలు, ఎండ్ల పందాలు జోరుగా సాగుతుంటాయి. ఇళ్లలో ఉండే పశువులను శుభ్రంగా కడిగి అలంకరించి ఊరేగిస్తారు.
మూడవ రోజున కనుము పండుగ
మూడవ రోజున జరుపుకునే పండుగ కనుము. దీన్నే పశువుల పండుగ అని కూడా అంటారు. చేతికి వచ్చిన పంటను తామే కాకుండా పశు, పక్షులు పాలు పంచుకునేలా పిట్టల కోసం ధాన్యం కంకులను ఇంటి గుమ్మాలకు కడతారు. పశు, పక్షులే రైతుకు వెన్ను దన్ను. పశువులు లేకపోతే.. అన్నదాత లేడు. నేడు ఆధునిక యంత్రాలు పశువుల స్థానాన్ని లాగేసుకుంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నాలుగోరోజును ముక్కనుమ అని జరుపుకుంటారు. ఈ రోజున స్నేహితులకు, పనివారికి బహుమతులు ఇవ్వడం ఆనవాయితీ.
దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో సంక్రాంతి పండుగ  
తెలుగువారు జరుపుకునే సంక్రాంతి పండుగను దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో నిర్వహిస్తారు. కర్ణాటకలో సంక్రాంతి అంటే.. తమిళనాడులో పొంగల్‌ అని.. మహారాష్ట్ర, గుజరాత్‌లతో మకర సంక్రాంతి అని అంటారు. పంజాబ్‌, హర్యానల్లో లోరీలు అని పిలుస్తారు. గుజరాత్‌లో పతంగుల పండుగగా నిర్వహిస్తారు. పేర్లు వేరైనా పండగ మాత్రం ఒక్కటే. అదే రైతు పండగ. సంక్రాంతిని ప్రజలంతా ఆనందంతో జరుపుకోవాలని మనమూ ఆశిద్దాం. 

07:28 - January 14, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి నెలకొంది. హైదరాబాద్‌లో వేడుకలు మిన్నంటాయి. బంజారాహిల్స్‌లో భోగి మంటలు వెలుగుల్ని నింపాయి. కేబీఆర్‌ పార్క్‌లో జరిగిన వేడుకల్లో నిజామాబాద్ ఎంపీ కవిత పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆమె సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రైతులు సుభిక్షంగా ఉండాలని కోరారు. తెలుగు రాష్ట్ర ప్రజలు సంక్రాంతిని ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు సుఖ, సంతోషాలతో కలిసి మెలగాలని సూచించారు.

కోనసీమ పల్లెల్లో భోగి మంటలు
ఇక కోనసీమ పల్లెల్లో భోగి మంటలు కాంతులు నింపాయి. తెల్లవారుజాము నుంచే గ్రామాల్లో భోగి మంటలు వెలిగించి... స్థానికులు సంతోషంతో కేరింతలు కొడుతున్నారు. ఆవు పేడతో తయారు చేసిన భోగి దండలను మంటల్లో వేసి సంప్రదాయాలు కొనసాగించారు. ఎక్కడ చూసినా భోగిమంటలు దర్శనమివ్వడంతో తెల్లవారుజాము నుంచే పండగ వాతావరణం నెలకొంది. సంక్రాంతి పండుగలో మొట్టమొదటి సందడి భోగి. సంక్రాంతి సంబరాలకే ప్రత్యేకతగా చెప్పుకునే భోగి నాడు సందడే వేరు.

 

సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఎంపి కవిత

హైదరాబాద్ : నగరంలోని కేబీఆర్ పార్క్ లో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఎంపి కవిత పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలన్నారు. 

 

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు…

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలను జరుపుకుంటున్నారు. తొలిరోజు బోగీ మంటలు వేసి సంక్రాంతి పండుగను ప్రారంభించారు. కోనసీమలో బోగి మంటలు ప్రత్యేకం. 

06:12 - January 14, 2016

Don't Miss