Activities calendar

20 January 2016

21:53 - January 20, 2016

కంప్యూటర్ ల కొలువైన బంగారు తెలంగాణ.. భూమ్మీదికి దిగుదతో చెప్పుడు కష్టం, భక్తి పెంచేసుకున్న నారా బాబుగారు… ఉత్తమ భక్తుని స్థానం కోసం…పోటాపోటీ, స్వచ్ఛమైన నీళ్లు.. అచ్చమైన తెలంగాణ.... వాటర్ గ్రిడ్ పథకానికి గవర్నర్ వన్నెలు, సర్కార్ దావఖానకు పోతున్నరా జాగ్రత్త.. అప్రమత్తంగుండమంటున్న బాధితులు, పోలీసు వ్యవస్థకు మచ్చదెచ్చిన కానిస్టేబుళ్లు…లంచాలు తీసుకోశాతగాకా మీదోళ్ల మీద ఫిర్యాదులు, భారత జట్టు కష్టాలకు ఇగ నుంచి విముక్తేనట.. బ్యాట్ బాల్ అందుకున్న సునితమ్మ.. ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం....

 

21:48 - January 20, 2016

తమకు సంబంధం లేదని బుకాయిస్తున్నారు. తాము ఏ రకంగా బాధ్యులం కాదంటున్నారు.. ఇంకా చెప్తే, అలసిది దళితుల సమస్యే కాదంటున్నారు. తమ తప్పేం లేదని వాదిస్తున్నారు. ఎవరో చనిపోతే మేమెలా కారణమంటున్నారు. కానీ, దీనివెనుక జరిగిన తతంగాన్ని విస్మరిస్తున్నారు. లేఖలు రాసిన సంగతిని దాటేస్తున్నారు. అవి మూల కారణమని వస్తున్న వాదనలు కొట్టిపారేస్తున్నారు. ఏమిటా ఏడు లేఖల సంగతి..? ఆ లేఖల్లో ఉన్నవిషయమేంటి? స్మృతి ఇరానీ ప్రెస్ మీట్ లో వదిలేసిన విషయాలేంటి? ఆ 7లెటర్స్ పై ఈ రోజు వైడాంగిల్ ప్రత్యేక కథనం చూద్దాం.. 

 

21:45 - January 20, 2016

హైదరాబాద్ : స్వచ్ఛమైన, నీతివంతమైన రాజకీయాల కోసం.. వన్‌ హైదరాబాద్‌ కూటమిని గెలిపించాలని నేతలు  విజ్ఞప్తి చేశారు. ఇందిరా పార్కు వద్ద జరిగిన భారీ బహిరంగ సభలో.. కూటమి నేతలు  పాల్గొన్నారు. తమను గెలిపిస్తే అవినీతి రహిత పాలన అందిస్తామని వాగ్దానం చేశారు.
అభ్యర్థుల పరిచయ కార్యక్రమం 
గ్రేటర్‌ ఎన్నికల బరిలో నిలిచిన వన్‌ హైదరాబాద్‌ కూటమి అభ్యర్థుల పరిచయ కార్యక్రమం స్థానిక ఇందిరాపార్కు వద్ద జరిగింది. ఇందులో పాల్గొన్న నేతలు.. వన్ హైదరాబాద్ కూటమిని గెలిపిస్తే అవినీతి రహిత పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. గ్రేటర్‌ ఎన్నికల్లో 90కి పైగా స్థానాల్లో పోటీ చేస్తున్నామని.. తమ అభ్యర్థులను ఆదరించి విజయాన్ని అందించాలని.. కూటమి నేతలు విజ్ఞప్తి చేశారు. 
ధన, కుల రాజకీయాలను అంతం చేయాలని పిలుపు
ధన, కుల రాజకీయాలను అంతం చేయాలని పిలుపునిచ్చారు.  గ్రేటర్‌ ఎన్నికల్లో కూటమి విజయం నగర ప్రజల జీవన విధానాన్నే మార్చుతుందని భరోసా ఇచ్చారు. 
అవకాశం ఇస్తే.. అవినీతి రహిత పాలన 
గ్రేటర్‌ పరిధిలోని ఓటర్లు గతంలో ఎన్నో పార్టీల పాలనను చూశారని.. ఈసారి తమకు అవకాశం ఇస్తే.. అవినీతి రహిత పాలనను అందిస్తామని, పేదల అభివృద్ధికి కృషి చేస్తామని నేతలు హామీ ఇచ్చారు. రాజకీయాలను డబ్బు ఏలుతోందని.. రాజకీయం అంటే వ్యభిచారం అన్న భావన ప్రజల్లో స్థిరపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సెటిలర్‌ల ఓట్ల కోసమే కేసీఆర్‌, కేటీఆర్‌లు నాటకాలాడుతున్నారని విమర్శించారు. అభివృద్ధి అంటే ప్లై ఓవర్లు, రోడ్లు, భవనాల నిర్మాణం కాదని..  పేదల జీవన ప్రమాణాల మెరుగు పడడమే అసలైన అభివృద్ధి అని వన్‌ హైదరాబాద్‌ కూటమి నేతలు అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో తమ కూటమి అభ్యర్థులనే గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 

 

21:42 - January 20, 2016

పశ్చిమ గోదావరి : కాల్‌మనీ... ఈ దందా చేస్తున్నవారి కిరాతకాలు కొనసాగుతూనే ఉన్నాయి..పశ్చిమలో ఓ మహిళ బలి కావడానికి కారణమయ్యారు కాలనాగులు.. తీసుకున్న అప్పుకు మూడింతలు చెల్లించినా ఐదు రేట్లు పెంచి డబ్బు ఇవ్వాలని బెదిరింపులకు దిగారు.. కాదూ కూడదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు..ఈ హెచ్చరికలకు బెదరిన మహిళ గుండె ఆగింది... 

కాలాంతకుల వేధింపులతో మహిళ బలి...?

కాల్‌మనీ కిరాతకాలు ఎక్కడో ఒక చోట కొనసాగుతూనే ఉన్నాయి...పోలీసులు దాడులు చేస్తున్నారు... కేసులు పెడుతున్నారు..కాలాంతకుల భరతం పడుతున్నారు..అయినా కొన్ని చోట్ల కిరాతకాలకు అడ్డూఅదుపులేకుండా పోతుంది.. కాల్‌నాగుల బెదిరింపులకు భయపడి బయటకు రాని వారు ఉన్నదంతా ఊడ్చి ఇచ్చేస్తున్నారు...మరికొందరు ఆ భయంతోనే గడపదాటడం లేదు....

కాలాంతకుల వేధింపులేనంటున్న కుమారుడు..

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని కొండ్రుపోలు గ్రామానికి చెందిన కనకదుర్గ అనుమానాస్పద మృతి చెందింది... అయితే కాల్‌మనీ కాలాంతకుల బెదిరింపుల వల్లే తన తల్లి చనిపోయిందంటున్నాడు కుమారుడు సత్యనారాయణ...

బెదిరింపులకే బలయిందంటున్న కుటుంబీకులు..

కనకదుర్గ తన ఇంటి పత్రాలు తాకట్టుపెట్టి మంచలి గ్రామానికి చెందిన వడ్డీ వ్యాపారుల వద్ద మూడు లక్షలు అప్పు తీసుకుంది.. తీసుకున్నప్పటి నుంచి పలు దఫాలుగా 8 లక్షలవరకు చెల్లించామని, మరో 15 లక్షలు బాకీ ఉన్నారంటూ కాల్‌మనీ వ్యాపారులు బెదిరిస్తున్నారని చెబుతున్నారు..అయితే వ్యాపారి హెచ్చరికలతో భయపడ్డ కనకదుర్గ హఠాత్తుగా కుప్పకూలిపోయి చనిపోయింది... కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కాలాంతకుల బెదిరింపులతో భయపడ్డ కనకదుర్గ గుండెఆగిపోయిందా.. లేక మరేదైనా కారణాలున్నాయాన్నది పోలీసులు శోధిస్తున్నారు....

21:36 - January 20, 2016

హైదరాబాద్: ఏపీలోని 16 ప్రభుత్వ ఆస్పత్రుల్లో మేనేజర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.. ఇందుకుసంబంధించిన ఉత్తర్వులు జారీచేసింది.. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎంబీఏ పూర్తిచేసినవారిని ఈ పోస్టుల్లోకి తీసుకోవాలని ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ను ఆదేశించింది.. వీరికి నెలకు 40వేల రూపాయలు జీతంగా నిర్ణయించింది ప్రభుత్వం. ఈ ఏడాది మార్చి 31నాటికి భర్తీ ప్రక్రియ పూర్తిచేయాలని కోరింది.. ఏప్రిల్ 1నాటికి విధుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.. 

21:35 - January 20, 2016

హైదరాబాద్ : ఏపీలో ఆరోగ్యమిత్ర ఉద్యోగులను తొలగించడంలేదని మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. వారి కాంట్రాక్ట్ కాలపరిమితి ముగిసిందని తెలిపారు. వీరి స్థానంలో నర్సింగ్, ఫార్మసీ కోర్సులు పూర్తిచేసిన 19వందలమందిని తీసుకుంటామని చెప్పారు.. రోగులను ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించడంలో ఆరోగ్యమిత్రలు కీలకపాత్ర పోషించారని ఆరోపించారు.. ఇక హెచ్‌సీయూలో రోహిత్‌ ఆత్మహత్యను రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు..

 

21:33 - January 20, 2016

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. 'ఫ్యూచర్ ఆఫ్ అర్బన్ డెవలప్‌మెంట్ అండ్ సర్విసెస్' అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు హాజరైన చంద్రబాబు ఏపీ ఎదుర్కొంటున్న సవాళ్లు, రాజధాని నిర్మాణాన్ని గురించి.. సదుస్సులోని సభ్యులకు వివరించారు. నిధులు లేని సంక్షోభ స్థితిలో భూ సమీకరణకు వెళ్లామని..అయినా రైతుల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని తెలిపారు. అమరావతి భూముల సమీకరణ విధానంపై..సదస్సులోని పాల్గొన్న ప్రముఖులు ఆసక్తి కనబరిచారు. 

 

21:31 - January 20, 2016

హైదరాబాద్: వైసీపీ అధినేత జగన్‌ హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులతో మాట్లాడారు. రోహిత్‌ ఆత్మహత్య ఘటనపై సస్పెండైన విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రోహిత్‌ ఆత్మహత్యకు నిరసనగా జరుగుతున్న  ఉద్యమానికి తాను సంపూర్ణ మద్దతిస్తున్నట్టు జగన్‌ తెలిపారు.

21:19 - January 20, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ ఎన్నికలు టీడీపీని ముప్పుతిప్పలు పెడుతున్నాయి.. అభ్యర్థుల ఎంపికపై సొంత పార్టీ నేతలు, అనుబంధ సంఘాలనుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.. ఏకంగా టికెట్లే అమ్ముకున్నారంటూ  తెలుగునాడు విద్యార్థి సంఘం నేతలు నానా హంగామా చేస్తున్నారు.. ఎన్టీఆర్‌ ట్రస్ట్ భవన్‌లో ఇద్దరు మాజీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు.. అటు టీడీపీ ముఖ్యనేతలుమాత్రం ఇవేం పట్టించుకోకుండా బీఫాంల పంపిణీలో మునిగిపోయారు.. 

టీటీడీపీలో గ్రేటర్‌ చిచ్చు

తెలంగాణ టీడీపీ గ్రేటర్‌ చిచ్చు కొనసాగుతోంది.. తమకు ఎన్నికల్లో సీట్లు కేటాయించలేదంటూ టీడీపీ అనుబంధ సంస్థ అయిన తెలుగునాడు విద్యార్థి సంఘం ఫైర్ అవుతూనేఉంది. టీడీపీ కార్యాలయంలో లోకేశ్ ఫ్లెక్సీలు, బ్యానర్లు చించి టీఎన్ ఎస్ ఎఫ్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలాకాలంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నా తమను ఎవ్వరూ గుర్తించడంలేదని టిఎన్ ఎస్ ఎఫ్ నేతలు మండిపడ్డారు. పనిచేసేవారికి టికెట్లు ఇవ్వకుండా అమ్ముకున్నారని ఆరోపించారు. 
పార్టీలో నాయకత్వ లోపం ఉందని విమర్శించారు. 

 

సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత
 

అభ్యర్థుల ఎంపికపై సొంత పార్టీ నేతల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో పార్టీ మాజీ కార్పొరేటర్లు శ్రీనివాస్, చంద్రమౌళి ఆందోళనకు దిగారు.. సిట్టింగ్ కార్పొరేటర్లయిన తమకు టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలా పార్టీలో నిరసనల పర్వం కొనసాగుతున్నా... టీడీపీ ముఖ్య నేతలు మాత్రం బీఫాం పంపిణీలో బిజీబిజీగా ఉన్నారు.. త్వరగా ఈ ప్రక్రియ పూర్తిచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. 

20:39 - January 20, 2016

చెక్ బౌన్స్.... ఎన్ ఐ యాక్టు అంశంపై లాయర్ పార్వతి మాట్లాడారు. చెక్ బౌన్స్ పై ప్రత్యేక చట్టాలున్నాయని తెలిపారు. 1881 నుంచి చెక్ బౌన్స్ చట్టాలు ఉన్నాయని చెప్పారు. చెక్ అంటే వినిమయ పత్రమని తెలిపారు. వ్యాపారాల్లో ఎక్కువగా చెక్స్ వాడుతుంటారని పేర్కొన్నారు. బాకీ వసూళ్ల నిమిత్తం చెక్స్ ఉపయోగిస్తుంటారని చెప్పారు. అప్పు వసూళ్లకు ఇచ్చే పత్రాన్ని చెక్స్ అంటారని వివరించారు. చెక్ బౌన్స్ పై విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారని తెలిపారు. చెక్ బౌన్స్ .. తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆమె తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

20:29 - January 20, 2016

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌ పీఠం తమదేనని మంత్రి పద్మారావు అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏ గడపదొక్కినా ప్రజల నుంచి సానుకూల అభిప్రాయం వ్యక్తమవుతోందన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్‌కు అత్యధిక ఓట్లేసి గెలిపించాలని సీతాఫల్‌మండి డివిజన్ ఇన్‌ఛార్జ్‌, నిజామాబాద్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా కోరారు. 

20:25 - January 20, 2016

ఢిల్లీ : టీమిండియా యంగ్ గన్ , ఢిల్లీ డైనమైట్ విరాట్ కొహ్లీ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అతితక్కువ ఇన్నింగ్స్ లో ఎక్కువ సెంచరీలు సాధించిన మొనగాడిగా నిలిచాడు.  ఇప్పటి వరకూ సచిన్ టెండుల్కర్ పేరుతో ఉన్న 124 ఇన్నింగ్స్ లో 14 సెంచరీల ప్రపంచ రికార్డును కొహ్లీ తెరమరుగు చేశాడు. మనూకా ఓవల్ వేదికగా జరుగుతున్న నాలుగో వన్డేలో..349 పరుగుల భారీ టార్గెట్ ను చేజింగ్ చేస్తున్న సమయంలో కొహ్లీ సెంచరీ పూర్తి చేశాడు. ప్రస్తుత సిరీస్ లో కొహ్లీకి ఇది వరుసగా రెండో సెంచరీ కావడం విశేషం. ఇప్పటి వరకూ కొహ్లీ 13 సెంచరీలను కేవలం 56 ఇన్నింగ్స్ లోనే సాధించాడు. 14వ సెంచరీని 57వ ఇన్నింగ్స్ లో పూర్తి చేయడం విశేషం.

 

20:09 - January 20, 2016

హైదరాబాద్ : పేదరిక నిర్మూలన పథకాలు రాష్ట్రాభివృద్ధికి టిఆర్‌ఎస్‌ చేపడుతున్న కార్యక్రమాలు ఎక్కడికెళ్లినా తమకు ప్రజలు బ్రహ్మరథం పట్టేలా చేస్తున్నాయని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. మంత్రి లక్ష్మారెడ్డితో టెన్ టివి ముఖాముఖి నిర్వహించింది. గ్రేటర్ ఎన్నికల్లో అత్యధిక ఓట్లేసి టిఆర్ఎస్‌ను గెలిపించాలని కోరారు. భాగ్యనగరి మేయర్‌ పదవిని టిఆర్ఎస్ సాధించి తీరుతుందని మూసారాంబాగ్‌ టిఆర్ఎస్ అభ్యర్థి సునరిత స్పష్టం చేశారు.

 

19:29 - January 20, 2016

హైదరాబాద్ : వన్‌ హైదరాబాద్‌ కూటమి అభ్యర్థులను గెలిపించాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహించిన సభలో ఆయన పాల్గొని, మాట్లాడారు. వన్‌ హైదరాబాద్‌ కూటమి పార్టీలు నీతివంతమైన పాలనకోసం కృషి చేస్తున్నాయని స్పష్టం చేశారు. తెలంగాణలో ఆశలు ఆవిరైపోతున్న సమయం ఇదని... రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయడమని గుర్తుచేశారు.  ఈ సభలో వామపక్షాలు, లోక్‌సత్తా పార్టీల ముఖ్యనేతలు పాల్గొన్నారు.

 

రోహిత్ కుటుంబాన్ని పరామర్శించిన ఏచూరీ

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ కుటుంబాన్ని ఉప్పల్ లో సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరీ పరామర్శించారు.  

రష్యా కాన్సులేట్ కార్యాలయం ఎదుట బాంబు పేలుడు…

కాబూల్ : రష్యా కాన్సులేట్ కార్యాలయం ఎదుట బాంబు పేలుడు సంభవించింది. కారులో బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో 12 మందికి పైగా మృతి చెందారు. 

17:12 - January 20, 2016

హైదరాబాద్ : ప్రెస్ క్లబ్ ను దేశంలోనే ఆదర్శ క్లబ్ గా తీర్చిదిద్దాలని రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసంఅన్నిరకాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో 18 లక్షలతో నిర్మించబోయే అదనపు భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి తో చర్చించి పాత బిల్డింగ్ ప్థానంలో కొత్తబిల్డింగ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామనిమంత్రి తెలిపారు.మరో సమయంలో ప్రెస్ అకాడమికి కూడా నూతన భవనాన్ని కేటాయించాలని ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ మంత్రిని కోరారు. 

 

భారత్ పై ఆస్ట్రేలియా విజయం

కాన్ బెర్రా: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో వన్డే మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 25 పరుగుల తేడాతో భారత్ పై ఆస్ట్రేలియా గెలుపొందింది. ఆస్ట్రేలియా నిర్ణీత 50 వోవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి.. 348 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 50 వోవర్లలో 323 పరుగులకు ఆఔట్ అయింది. వరుసగా నాలుగు వన్డేల్లోనూ భారత్ ఓడిపోయింది. టాప్ ఆర్డర్ రాణించినా... లోయర్ ఆర్డర్ విఫలం అయింది.

 

 

16:39 - January 20, 2016

ఢిల్లీ : హస్తినలో సరిబేసి విధానం సక్సెస్ అయ్యిందా...? రాజధానిలో కాలుష్యం తగ్గిందా...? గతంతో పోల్చుకుంటే పరిస్థితులు మెరుగయ్యాయా..? దీనికి అవుననే అంటోంది  ఓ  విదేశీ సంస్థ నిర్వహించిన నివేదిక.

వాయు కాలుష్యం కంట్రోల్‌

ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని కంట్రోల్‌ చేయడానికి ఆప్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన సరి బేసి విధానం మంచి ఫలితాలను ఇస్తున్నట్లు కనిపిస్తోంది. జనవరి 1 నుంచి రెండు వారాల పాటు రాజధానిలో ప్రయోగాత్మకంగా సరి బేసి విధానాన్ని అమలు చేశారు. ఈ విధానానికి నగర ప్రజలు సంపూర్ణంగా సహకరించారు. 

సరి బేసి విధానంపై సర్వే

ఐతే సరి బేసి విధానం అమలు తరువాత ఢిల్లీలో వాతావరణ కాలుష్యం తగ్గింద లేదా అనే అంశంపై చికాగోలోని ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌, హార్వర్డ్‌ యూనివర్శిటీకి చెందిన పాలసీ డిజైన్‌ గ్రూప్‌లు సంయుక్తంగా సర్వే నిర్వహించాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సేకరించిన వివరాలు ఆధారంగా యుఎస్‌ సంస్థలు కాలుష్యానికి సంబంధించి నివేదికను తయారు చేశాయి.

 సరి-బేసి విధానంతో వాయు కాలుష్యం 18 శాతం తగ్గింపు 

ఢిల్లీలో రెండు వారాల పాటు చేపట్టిన సరి-బేసి విధానం వల్ల వాయు కాలుష్యం 18 శాతం తగ్గిందని అమెరికా సంస్థల నివేదిక తెలిపింది. సరి బేసి విధానం అమల్లో ఉన్న జనవరి 1 నుంచి 15 వరకు మధ్యాహ్న వేళల్లో కాలుష్యం పూర్తిగా తగ్గిపోయిందని పేర్కొంది. ఇది ఇలా ఉంటే పూర్తి స్థాయి కాలుష్యాన్ని పరిగణలోకి తీసుకుంటే రాజధానిలో పొల్యూషన్‌ పెరిగిందని నివేదిక స్పష్టం చేయడం కొసమెరుపు. 
 

రోహిత్ కుల వివాదంపై పోలీసులు విచారణ

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ కుల వివాదంపై తెలంగాణ పోలీసులు విచారణ చేపట్టారు. గురజాలలో పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. రోహిత్ తాత, నానమ్మలను విచారిస్తున్నారు. పోలీసులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.

16:24 - January 20, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ కుల వివాదంపై తెలంగాణ పోలీసులు విచారణ చేపట్టారు. గురజాలలో పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. రోహిత్ తాత, నానమ్మలను విచారిస్తున్నారు. పోలీసులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. రోహిత్ తండ్రి ఆచూకీ తెలియదు. అతని మానసిక స్థితి బాగోలేకపోవడంతో అతను ఎక్కడున్నాడో తెలియడం లేదు. మాదాపూ్ర్ ఎసిపి రమణకుమార్ నేతృత్వంలో పోలీసులు విచారిస్తున్నారు. రోహిత్ ఆత్మహత్యపై అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. 

 

ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్

కాన్ బెర్రా : భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో వన్డే కొనసాగుతోంది. భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 308 పరుగుల వద్ద కుమార్ (2) ఔట్ అయ్యాడు. 

16:12 - January 20, 2016

హైదరాబాద్ : గాంధీభవన్‌లో మహిళా నేతలు ఘర్షణ పడ్డారు. ఫలక్‌నుమా డివిజన్‌ కార్పొరేటర్‌ సీటు కోసం ఇరువురు అభ్యర్ధులు ఘర్షణకు దిగారు. పరస్పరం దాడులకు దిగారు. చివరకు నేతలు జోక్యం చేసుకుని సర్దిచెప్పాలన్సిన పరిస్థితి ఏర్పడింది. 

 

16:02 - January 20, 2016

రాజకీయ ఒత్తిళ్లే.. రోహిత్‌ను ఆత్మహత్యకు కారణమన్న వాదనకు బలం చేకూరుతోంది. దత్తాత్రేయతో పాటు.. స్మృతి ఇరానీ మంత్రిత్వ శాఖ రాసిన ఆరు లేఖలు.. ఒత్తిడికి గురై యూనివర్శిటీ యంత్రాంగం తీసుకున్న చర్యలు... ఈ వ్యవహారంలో రాజకీయ జోక్యాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.  
ఉసురు తీసిన ఆరు లేఖలు
హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్శిటీ పరిశోధక విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్య వెనుక.. రాజకీయ ఒత్తిళ్లే ప్రధాన కారణమని తెటతెల్లమవుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరు లేఖల ద్వారా.. కేంద్ర మంత్రిత్వ శాఖలు.. యూనివర్శిటీపై ఒత్తిళ్లు తేవడం వల్లే.. రోహిత్‌ సహా.. మరికొందరు విద్యార్థులపై సస్పెన్షన్‌ వేటు పడిందని తెలుస్తోంది. 
ఆగస్టు 17న దత్తాత్రేయ లేఖ
ఆగస్టులో.. వర్శిటీకి చెందిన ఏబీవీపీ కార్యకర్తపై దాడి అంశానికి సంబంధించి.. కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి దత్తాత్రేయ అదే నెల 17న కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రికి లేఖ రాశారు. వర్శిటీ.. కులాల కుహరంగాను.. తీవ్రవాద, జాతివ్యతిరేక రాజకీయాలకు వేదికగానూ మారిందని దత్తాత్రేయ తన లేఖలో ఫిర్యాదు చేశారు. ఏబీవీపీ కార్యకర్తపై దాడి చేసిన వారిపై ఎలాంటి చర్యా తీసుకోలేదనీ లేఖలో దత్తాత్రేయ ఆక్షేపించారు. ఈ దాడి ఘటనలో రోహిత్‌ సహా ఆరుగురు విద్యార్థులు ముద్దాయిలుగా ఉన్నారు. 
దత్తన్న లేఖతో వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న హెచ్‌ఆర్‌డీ
నిజానికి వర్శిటీలో ఎవరిపైనా ఎలాంటి దాడీ జరగలేదని.. ఆగస్టు 5న విచారణ జరిపిన యూనివర్శిటీ అధికారులు తేల్చి చెప్పారు. కానీ.. దత్తాత్రేయ లేఖతో.. కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖ ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించింది. ప్రతి నెలా ఒకటి చొప్పున లేఖలు రాస్తూ.. యూనివర్శిటీ అధికారులపై తీవ్ర ఒత్తిడిని పెంచింది.  దత్తాత్రేయ లేఖ అందగానే.. సెప్టెంబర్‌ 3న కేంద్ర మంత్రిత్వ శాఖ అధికారులు.. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీకి లేఖ రాశారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని... దత్తాత్రేయ లేఖలోని అంశాలను పరిశీలించాలనీ సూచించారు. అంతటితో ఆగకుండా.. సెప్టెంబర్‌ 24, అక్టోబర్‌ 6, అదేనెల 20, నవంబర్‌ 19 తేదీల్లో.. వరుసగా లేఖాస్త్రాలను సంధించారు. మధ్యలో ఓ జీ-మెయిల్‌నూ పంపారు. దత్తాత్రేయ ఫిర్యాదుపై ఎందుకు స్పందించలేదని.. ఏబీవీపీ కార్యకర్తపై దాడికి బాధ్యులపై చర్యలెందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. 
రోహిత్‌ స్టయిఫండ్‌ నిలిపివేత
ఆగస్టు 5న ఎవరిపైనా దాడి జరగలేదని పేర్కొన్న విశ్వవిద్యాలయం అధికారులు.. రాజకీయ ఒత్తిళ్లతో రూటు మార్చుకున్నారు. రోహిత్‌కు జూలై నెల నుంచి రావాల్సిన స్టయిఫండ్‌ను నిలిపివేశారు. పేపర్‌ వర్క్‌ జాప్యమే దీనికి కారణమని వర్శిటీ చెబుతున్నా.. కక్ష సాధింపు చర్యలతోనే వర్శిటీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దత్తాత్రేయ లేఖ.. దాని వెంటే కేంద్ర మానవ వనరుల శాఖ నిలదీతల నేపథ్యంలో.. రోహిత్‌ సహా ఐదుగురిపై వర్శిటీ అధికారులు సస్పెన్షన్‌ వేటు వేశారు. 
జనవరి 3 నుంచి రోహిత్‌ సహా ఐదుగురిపై ఆంక్షలు
తరగతులు, లైబ్రరీలలో తప్ప మరెక్కడా విద్యార్థులు కనిపించడానికి వీల్లేదంటూ.. జనవరి 3న వర్శిటీ రోహిత్‌ సహా ఐదుగురిపై ఆంక్షలు విధించింది. ఈ నిర్ణయానికి నిరసనగా విద్యార్థులు రిలే నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఈ క్రమంలోనే రోహిత్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేంద్ర మంత్రిత్వ శాఖ.. లేఖల ద్వారా ఒత్తిళ్లు తేవడం వల్లే.. రోహిత్‌ స్టయిఫండ్‌ కూడా పొందలేక పోయాడని.. రకరకాల చర్యలతో అతడిని మానసిక సంఘర్షణకు గురి చేశారని.. ఈ ఒత్తిళ్లు భరించలేకే రోహిత్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడనీ సహ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. 
 

కోహ్లీ సెంచరీ

కాన్ బెర్రా : భారత్, ఆస్ట్రేలియాల మధ్య నాలుగో వన్డే మ్యాచ్ కొనసాగుతోంది. భారత బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. 84 బంతుల్లో వంద పరుగులు పూర్తి చేశాడు.

 

 

 

84 బంతుల్లో 

15:24 - January 20, 2016

హైదరాబాద్ : హెచ్‌సీయూలో విద్యార్ధుల ఆందోళన కొనసాగుతోంది. రోహిత్‌ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్ధులు భారీ ర్యాలీ చేపట్టి దిష్టిబొమ్మను దహనం చేశారు. వీసీ, బీజేపీకి వ్యతిరేకంగా భారీ నినాదాలు చేశారు. వీసీ వెంటనే రాజీనామా చేయాలని విద్యార్ధులు డిమాండ్‌ చేశారు. 

శిఖర్ ధావన్ సెంచరీ

కాన్ బెర్రా : భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో వన్డే మ్యాచ్ కొనసాగుతోంది. భారత్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ సెంచరీ చేశాడు.  దావన్ తొమ్మిదో సెంచరీ పూర్తి చేశాడు. 

15:08 - January 20, 2016

హైదరాబాద్ : ఎన్టీఆర్‌ వైద్య పథకం ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఏపీ సర్కార్‌ షాక్‌ ఇచ్చింది. సరైన విద్యార్హతలు లేవని ఏడు వేల మంది వైద్య మిత్రులను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరి స్థానంలో కొత్త వారిని నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. 

ఎపిలో వైద్యమిత్రులు తొలగింపు

హైదరాబాద్ : ఎన్టీఆర్‌ వైద్య పథకం ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఏపీ సర్కార్‌ షాక్‌ ఇచ్చింది. సరైన విద్యార్హతలు లేవని ఏడు వేల మంది వైద్య మిత్రులను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరి స్థానంలో కొత్త వారిని నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. 

 

కోహ్లీ అర్ధ సెంచరీ

కాన్ బెర్రా : భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో వన్డే మ్యాచ్ కొనసాగుతోంది. భారత్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీ చేశాడు. 34 పరుగుల్లో 50 పరుగులు చేశాడు.

వన్ హైదరాబాద్ కూటమి బహిరంగ సభ

హైదరాబాద్ : ఇందిరా పార్క్ వద్ద వన్ హైదరాబాద్ కూటమి ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. ఈ సభకు కూటమి భాగస్వామి పక్షాలైన లోక్ సత్తా, దాని అధినేత జయప్రకాశ్ నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడవెంకట్ రెడ్డి, ఇతర కూటమి నేతలు పాల్గొన్నారు.

రోహిత్ అవుట్..

కాన్ బెర్రా : ఆసీస్ తో జరుగుతున్న నాలుగో వన్డే మ్యాచ్ లో ధీటుగా ఆడుతున్న రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. 25 బంతుల్లో 41 పరుగులు చేసిన రోహిత్ రిచర్డ్ సన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ప్రస్తుతం 8 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. ధావన్ 24 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 

భారత్ 55/0..

కాన్ బెర్రా : ఆసీస్ నిర్ధేశించిన 348 పరుగుల లక్ష్యాన్ని చేరుకోవడానికి భారత్ ఓపెనర్లు ఆటను ఆరంభించారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, ధావన్ లు ప్రారంభం నుండి ఎదురు దాడి ఆరంభించారు. భారత్ వికెట్ నష్టపోకుండా 7.2 ఓవర్లలో 55 పరుగులు చేసింది. ప్రస్తుతం శర్మ 31, ధావన్ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

13:29 - January 20, 2016

ఢిల్లీ : ఫ్రీ బేసిక్స్‌పై దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో నెట్‌ న్యూట్రాలిటీపై గురువారం బహిరంగ చర్చ జరగనుంది. ఫ్రీ బేసిక్స్‌కు వ్యతిరేకంగా..అనుకూలంగా ఇప్పటికే లక్షల సంఖ్యలో అభిప్రాయాలు ట్రాయ్‌కు చేరాయి. ఈ నేపథ్యంలో గురువారం జరిగే బహిరంగ చర్చలో మరిన్ని అభిప్రాయాలు ట్రాయ్‌ సేకరించనుంది.

5.44 లక్షల అభిప్రాయాలు..
ఇది ఇలా ఉంటే ట్రాయ్‌ వెలువరించిన సంప్రదింపుల పత్రంపై జనవరి 7 నాటికి 24 లక్షల మంది తమ స్పందనలు తెలిపారు. అభిప్రాయాలు పంపిన వారిలో విడి వ్యక్తులతో పాటు, టెలికం కంపెనీలు, వాటి సంఘాలు కూడా ఉన్నాయి. ఈ అభిప్రాయాలను విశ్లేషించగా...దాదాపు 18 లక్షల వరకు ఫేస్‌బుక్‌ ''ఫ్రీ బేసిక్స్‌ను సమర్థించేవిగా ఉన్నాయని ట్రాయ్‌ తెలిపింది. వాటిలో 13.5 లక్షల అభిప్రాయాలు ఈ మెయిల్‌ ఐడీ లేకుండానే సపోర్ట్‌ ఫ్రీ బేసిక్స్. ఇన్‌ ద్వారా చేరగా..మిగిలిన 5.44 లక్షల అభిప్రాయాలు ఫేస్‌బుక్‌మెయిల్‌.కామ్‌ ద్వారా ట్రాయ్‌కు అందాయి. మరోవైపు సేవ్‌ది ఇంటర్నెట్‌ తదితర వేదికల ద్వారా 4.84 లక్షల మంది నెట్‌ సమానత్వ సమర్థకులు తమ అభిప్రాయాలను ట్రాయ్‌కు పంపించారు. ఫేస్‌బుక్‌ ఫ్రీబేసిక్స్‌కు వ్యతిరేకంగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. పలువురు విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు ఫ్రీ బేసిక్స్‌ను వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రాయ్‌ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాల్సిందే. 

అప్రమత్తమైన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు

హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు దాడి చేయవచ్చన్న నిఘావర్గాల హెచ్చరికలతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు అప్పమత్తమై భద్రతను కట్టుదిట్టం చేసి విస్తృత తనిఖీలు చేపట్టారు.

13:26 - January 20, 2016

ఢిల్లీ : రిపబ్లిక్‌ డే సందర్భంగా పాకిస్థాన్‌ ప్రేరేత ఉగ్రవాద సంస్థలు మన దేశంలో విధ్వంసం సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నాయని హెచ్చరించిన నిఘా వర్గాలు ఇప్పుడు మళ్లీ తాజా అలెర్ట్‌లు జారీ చేశాయి. తాజాగా మన దేశానికి మరో కొత్త ఉగ్రవాద సంస్థ నుంచి ముప్పు పొంచివుందని గుర్తించిన ఇంటెలిజెన్స్‌ అధికారులు. అన్ని రాష్ట్రాలను మళ్లీ అప్రమత్తం చేశాయి. బంగ్లాదేశ్‌కు చెందిన హిజ్బ్‌ ఉత్‌-తహ్‌రీర్‌- హట్‌ ... అనే ఉగ్రవాద సంస్థ నుంచి వచ్చిన కొన్ని సందేశాలను ఇంటెలిజెన్స్‌ బ్యూరో వర్గాలు అడ్డగించాయి. డాక్టర్‌ మెడిసిన్‌ లేకర్‌ జాయేగా సంకేతంతో ఈనెల 15న ఓ టెలికాం గేట్‌వే నుంచి సందేశాలు వచ్చాయి. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లలో ఉనికిలో ఉన్న ఈ ఉగ్రవాద సంస్థ నుంచి వచ్చిన ఫోన్‌ కాల్స్‌ను విశ్లేషించిన మన నిఘా అధికారులకు నివ్వెరపరిచే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

కీలక ప్రాంతాలు, స్థావరాల దగ్గర అదనపు భద్రత..
మన దేశంలో విధ్వంసానికి పాల్పడేందుకు హిజ్బ్‌ ఉత్‌-తహ్‌రీర్‌-హట్‌ పెద్ద కుట్ర పన్నిందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈనెల 23న దేశంలోని 23 ప్రాంతాల్లో భయోత్పాతం సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నాయని నిఘా వర్గాలు గుర్తించాయి. హట్‌ ఉగ్రవాదుల పన్నాగంలో పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌, గురుదాస్‌పూర్‌ కూడా ఉన్నాయి. పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై ఈనెలలోనే ఉగ్రవాద దాడి జరిగింది. గురుదాస్‌పూర్‌ జిల్లాలోని దీనానగర్‌ పోలీసు స్టేషన్‌పై కొన్ని నెలల క్రితం ఉద్రవాదులు దాడి చేశారు. హట్‌ ఉగ్రవాదులు బాంబు దాడులతోపాటు, ఆత్మాహుతి దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్‌ బ్యూరో హెచ్చరించింది. అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దేశంలోని అన్ని కీలక ప్రాంతాలతోపాటు, స్థావరాల దగ్గర అదనపు భద్రత ఏర్పాటు చేయాలని ఐబీ కోరింది. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌, బీఎస్‌ఎఫ్‌ దళాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ప్రమాదకర అంశాల్లో శిక్షణ..
పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై దాడి చేసిన పాకిస్థాన్‌కు చెందని జైషే మహ్మద్‌తోపాటు లష్కరే తోయిబాతో కలిసి బంగ్లాదేశ్‌ ఉగ్రవాద సంస్థ హిజ్బ్‌ ఉత్‌-తహరీర్‌ ఉగ్రవాద సంస్థ దాడులకు ఎంచుకున్న స్థావరాలు కలవరపరిచేలా ఉన్నాయి. జనసమర్ధంగా ఉండే షాపింగ్‌ మాల్స్‌, షాపింగ్‌ బజార్లు, విద్యాసంస్థలు వీరి టార్గెట్‌లో ఉన్నాయి. హట్‌కు సాయుధ శిక్షణాదళం కూడా ఉంది. హర్కత్‌ ఉల్‌-ముహోజిరిన్ఫి బ్రిటానియా పేరుతో ఉన్న ఈ సాయుధ దళం... హట్‌ కార్యకర్తలకు అత్యంత ప్రమాదకరమైన రసాయన, బాక్టీరియా, జీవరసాయ ఆయుధాల వాడకంలో శిక్షణ ఇస్తున్నట్టు మన నిఘా వర్గాలకు సమాచారం ఉంది. భవిష్యత్‌లో హట్‌ ఉగ్రవాద సంస్థతోనే ఎక్కువు ముప్పు ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నాయి. 

గాంధీ భవన్ లో మహిళా నేతల మధ్య ఘర్షణ

హైదరాబాద్ : గాంధీ భవన్ మహిళా కాంగ్రెస్ నేత లమధ్య ఘర్షణ జరిగింది. ఫలక్ నుమా డివిజన్ కార్పొరేటర్ సీటు కోసం ఘర్షణ పడినట్లుసమాచారం.

13:21 - January 20, 2016

పాకిస్తాన్ : వాయువ్య పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు తెగబడ్డారు. ఖైబర్‌ రాష్ట్రంలోని బచాఖాన్‌ యూనివర్సీలో ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఏడుసార్లు బాంబులు పేలినట్టు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. పెషావర్‌కు 50 కిలోమీటర్ల దూరంలోనే యూనివర్సిటీ ఉంది. ఈ ఘటనలో చాలా మంది విద్యార్ధులు గాయడ్డారు. పదిమంది ఉగ్రవాదులు యూనివర్సిటీ క్యాంపస్‌లోకి ప్రవేశించినట్టు అధికారులు చెబుతున్నారు. ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య హోరాహోరా కాల్పులు జరిగాయి. కేవలం ఆరుగురు మాత్రమే మృతి చెందినట్లు పాక్ పేర్కొంటుండగా మీడియాలో మాత్రం 60 మంది మృతి చెందారని వందల సంఖ్యలో గాయపడ్డారని కథనాలు వస్తున్నాయి. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఉగ్రవాదులు ప్రవేశించిన సమయంలో బచాఖాన్‌ యూనివర్సిటీలో బుధవారం కవితా పఠనం జరుగుతోంది. ఈ పఠనం కార్యక్రమానికి ఇతర ప్రాంతాల నుండి విద్యార్థులు తరలివచ్చారు. సుమారు 3 వేల మంది విద్యార్ధులు ఉన్నట్లు తెలుస్తోంది. పద్యపఠనంలో పాల్గొనేందుకు 600 మంది అతిథిలు కూడా ఉన్నారు. క్యాంపస్‌లో చిక్కుపోయిన వారిని తరలించేందుకు హెలికాప్టర్లు ఉపయోగిస్తున్నారు. దాడికి తామే కారణమని తెహ్రీక్‌ ఇ-తాలిబాన్‌ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. 2014 డిసెంబర్‌లో పెషావర్‌ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌పై ఉగ్రవాదులు దాడి చేసి 130 మంది విద్యార్ధులను పొట్టన పెట్టుకున్న తర్వాత పాకిస్థాన్‌లోని ఓ విద్యాసంస్ధపై దాడి జరగడం ఇదే మొదటిసారి. ఓ గదిలో తీవ్రవాదులను నిర్భందించే విధంగా చర్యలు తీసుకున్నట్లు పాక్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. అసలు తీవ్రవాదులు ఎంత మంది ఉన్నారో తెలియడం లేదు. 

13:20 - January 20, 2016

విజయవంతమైన జోడీ అనిపించుకొన్న నాగార్జున – శ్రియ మరోసారి జోడీ కట్టి అలరించబోతున్నారట. నాగార్జున, కార్తీ కథానాయకులుగా నటిస్తున్న ‘వూపిరి’లో శ్రియ ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్టు తెలిసింది. నాగ్‌, శ్రియలపై ఇటీవలే కీలక సన్నివేశాల్ని చిత్రీకరించినట్టు సమాచారం. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రసాద్‌ వి.పొట్లూరి నిర్మిస్తున్నారు. తమన్నా కథానాయిక. ఫ్రెంచ్‌లో విజయవంతమైన ‘ది ఇన్‌టచబుల్స్‌’ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో నాగార్జున వీల్‌ఛైర్‌లో కనిపిస్తూనే వినోదాలు పంచనున్నట్టు తెలిసింది. చిత్రాన్ని మార్చి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు నిర్మాత ప్రసాద్‌ వి.పొట్లూరి ఒక ప్రకటనలో తెలిపారు. నాగార్జున కెరీర్‌లో మరో విభిన్నమైన చిత్రంగా ‘వూపిరి’ నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ఏపీలో 7వేల వైద్య మిత్రులను తొలగిస్తూ ఉత్తర్వులు

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో 7 వేల మంది వైద్య మిత్రులను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పని చేస్న్ను వారికి విద్యార్హత లేవని ప్రభుత్వం ఆరోపిస్తోంది. వారి స్థానంలో కొత్త వారిని రిక్రూట్ చేయాలని ఆదేశాలు చేసింది.

హెచ్ సీయూలో విద్యార్థుల ఆందోళనకు జగన్ సంఘీభావం

హైదరాబాద్ : హెచ్ సీయూలో విద్యార్థుల ఆందోళనకు వైసీపీ నేత జగన్ సంఘీభావం తెలిపారు. రోహిత్ చిత్రపటానికి జగన్ పూల మాలవేసి నివాళులర్పించారు. రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై జగన్ ఆరాతీశారు.

12:47 - January 20, 2016

కాన్ బెర్రా : భారత్ తో జరుగుతున్న నాలుగో వన్డే మ్యాచ్ లో ఆసీస్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన ఆసీస్ 348 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇంత స్కోరు చేయడానికి ఆసీస్ ఓపెనర్లు ప్రధాన పాత్ర పోషించారు. వీరిద్దరూ సెంచరీలు తృటిలో మిస్ కావడం విశేషం. టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. వచ్చీ రాగానే ఓపెనర్లు వార్నర్, ఫించ్ లు వీర బాదుడు బాదారు. బంతిని బౌండరీలకు తరలించే పనిలో పడ్డారు. వీరిద్దరినీ విడదీయడానికి ధోని వేసిన ప్లాన్ లన్నీ చిత్తయ్యాయి. ఆసీస్ భారీ స్కోరు ఖాయమనే పరిస్థితికి చేరుకుంది. ఏడు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా ఆసీస్ 51 పరుగులు చేసింది. ఇదే ఊపును ఇరువురూ కొనసాగించారు.

తృటిలో శతకం మిస్...
వార్నర్ 46 బంతుల్లో 8x4, 1x6, సాయంతో అర్ధ శతకం నమోదు చేయగా, ఆరోన్ ఫించ్ 61 బంతుల్లో 4x4 సాయంతో 50 పరుగులు చేశాడు. అరోన్ ఫించ్ తో కలిసి తొలి వికెట్ కు ఏకంగా 29.2 ఓవర్లలో 187 పరుగులు జత చేసిన వార్నర్ ఆసీస్ భారీ స్కోరుకు బాటలు వేశాడు. ఇన్నింగ్స్ 29.3 ఓవర్ లో శతకం వైపు దూసుకెళుతున్న వార్నర్ (93: 92 బంతుల్లో 12x4, 1x6) ను భారత పేసర్ ఇషాంత్ శర్మ పెవిలియన్ పంపాడు. మరోవైపు ఫించ్ కూడా శతకం వైపుకు దూసుకెళ్లాడు. నాలుగో వన్డేలో శతకం సాధించిన ఫించ్ రెండో వికెట్ గా ఔటయ్యాడు. 107 బంతుల్లో 9x4, 2x6 సాయంతో 107 పరుగులు చేసిన ఫించ్ యాదవ్ బౌలింగ్ లో భారీ షాట్ కోసం యత్నించి అవుట్ అయ్యాడు. వార్నర్ తో కలిసి ఫించ్ తొలి వికెట్ కు ఏకంగా 29.2 ఓవర్లలో 187 పరుగుల భాగస్యామ్యం నెలకొల్పాడు. వన్డే కెరీర్ లో ఇది ఏడో శతకం.

వీరిద్దరూ అవుట్ అయినా...
వీరిద్దరి ఔట్ అయినా ఆసీస్ దూకుడు కొనసాగించింది. స్టీవ్ స్మిత్ (51 : 29 బంతుల్లో 4x4, 3x6 ) దూకుడుగా ఆడడంతో స్కోరు బోర్డు పరుగులెత్తింది. ఇతనికి మార్ష్ (33) చక్కటి సహకారం అందించాడు. చివరిలో భారత బౌలర్లు మేలుకున్నారు. మరి భారీ స్కోరు కాకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. బెయిలీ (10), ఫాల్క్ నర్ (0), మాథ్యూ హెడ్ (0) పెవిలియన్ పంపించారు. మాక్స్ వెల్ (41: 20 బంతుల్లో 6x4, 1x6) బ్యాట్ జులిపించాడు. చివరకు ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 348 పరుగుల భారీ స్కోరును సాధించింది. భారత్ బౌలర్లలో ఇషాంత్ శర్మ 4, ఉమేష్ యాదవ్ మూడు వికెట్లు తీశారు. ఆస్ట్రేలియా నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరుకుని ధోని పరువు నిలబెడుతాడా ? లేదా ? అనేది చూడాలి. 

మంత్రులు రావెల, పీతల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్ : సాంఘీక సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి రావెల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతే కాకుండా మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారులతో మంత్రి పీతల సుజాత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

వైద్యం కోసం వచ్చిన మహిళపై చేయి చేసుకున్న డాక్టర్

మహబూబ్ నగర్ : నాగర్ కర్నూలు ఆస్పత్రి వైద్యుడి నిర్వాకం బయటపడింది. వైద్యం కోసం వచ్చిన మహిళపై డాక్టర్ రాకేష్ చేయి చేసుకున్నాడు. దీంతో బాధితురాలు పీఎస్ లో ఫిర్యాదు చేశారు.

నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ నామినేషన్

మెదక్ : నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి సంజీవరెడ్డి తొలి నామినేషన్ దాఖలు చేశారు.

12:29 - January 20, 2016

పాకిస్తాన్ : ఉగ్రవాదం.. పెంచిపోషించిన పాక్ పైనే ఉగ్రవాదులు పగపట్టారు. గత కొంతకాలంగా విద్యార్థులు..ఇతరులపై తమ ప్రతాపం చూపుతున్నారు. విచక్షణారహితంగా చంపేస్తున్నారు. తాజాగా పెషావర్ కు 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న బచాఖాన్ యూనివర్సిటీపై ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 20 మంది మృతి చెందగా 60 మందికిపై గా విద్యార్థులు గాయపడినట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఏడుసార్లు బాంబులు పేలినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు.
ముగ్గురు ఉగ్రవాదులు యూనివర్సిటీలోకి చొచ్చుకొని వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ సమయంలో యూనివర్సిటీలో మూడు వేల మంది ఉన్నట్లు సమాచారం. పద్యపఠనంలో 600 మంది అతిథులు కూడా ఉన్నారు. ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో పాక్ ఉలిక్కిపడింది. వెంటనే భద్రతాదళాలు యూనివర్సిటీని చుట్టుముట్టాయి. ఉగ్రవాదులును ఏరివేసేందుకు చర్యలు చేపట్టింది. వర్సిటీలో ఉన్న విద్యార్థులను బయటకు పంపుతున్నారు. గతంలో ఇలాగే ఓ ఘటన జరిగిన సంగతి తెలిసిందే. 2014 డిసెంబర్ నెలలో ఆర్మీ పబ్లిక్ స్కూల్ పై దాడి చేసి ముష్కరులు 130 మంది అమాయకులైన విద్యార్థులను పొట్టన పెట్టుకున్నారు. ప్రస్తుతం పాక్ భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. 

పాక్ యూనివర్శిటీపై ఉగ్రదాడి....

పాకిస్థాన్ : బచాఖాన్ యూనివర్శిటీపై ఉగ్రవాదుల దాడిలో 8 చోట్ల బాంబులు పేలాయి. భద్రతాదళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయినట్లు సమాచారం. దాడి సమయంలో యూనివర్శిటీలో 3వేల మంది విద్యార్థులు, 600 మంది అతిథులు ఉన్నట్లు తెలుస్తోంది. 50మందికి గాయాలైనట్లు పాక్‌ ప్రభుత్వం ప్రకటించింది. ముష్కరుల దాడిలో దాదాపు 70మంది వరకు మృతిచెందినట్లు పాక్‌ మీడియా వెల్లడించింది. ఉదయం దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతో యూనివర్సిటీలోకి ఎంతమంది ఉగ్రవాదులు చొరబడ్డారన్న దానిపై పోలీసులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. యూనివర్సిటీ ప్రాంగణం చుట్టూ భద్రతా సిబ్బంది భారీగా మోహరించి ఉగ్రవాదులపై ఎదురుదాడి చేస్తున్నారు.

రోహిత్ ది హత్యే : సీతారం ఏచూరి

హైదరాబాద్ : హెచ్ సీయూలో విద్యార్థులకు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి రోహిత్ ది ఆత్మహత్య కాదు అని హత్యే అనే స్పష్టం చేశారు. కేంద్రమంత్రుల ఒత్తి వల్లే ఫైల్ రీఓపెన్ చేశారన్నారు. రోహిత్ ఆత్మహత్యకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర మంత్రులు, వీసీ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. వర్శిటీ వైస్ ఛాన్సలర్ ను వెంటనే తొలగించాలన్నారు. రోహిత్ మృతి పై పార్లమెంట్ లో పోరాడుతామన్నారు. కుల వివక్ష రిపీట్ కాకూడదనే మేమంతా వర్శిటీకీ వచ్చినట్లు స్పష్టం చేశారు.

ప్రభుత్వాసుపత్రిలో 9 నెలల బాలుడు అదృశ్యం

గుంటూరు : జిల్లా ప్రభుత్వాసుపత్రిలో 9 నెలల బాలుడు అదృశ్యం అయ్యాడు. దీంతో బాలుడు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ టివి ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

12:15 - January 20, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూ దళిత విద్యార్థి రోహిత్ ది ఆత్మహత్య కాదని హత్యేనని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. రోహిత్ ఆత్మహత్య ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికుతున్న సంగతి తెలిసిందే. పలువురు ప్రజా సంఘాలు, నేతలు హెచ్ సీయూలో విద్యార్థులకు మద్దతు పలుకుతున్నారు. ఈ సందర్భంగా ఏచూరి హెచ్ సీయూను సందర్శించారు. రోహిత్ ఆత్మహత్య చేసుకోవడానికి ఘటనకు సంబంధించిన పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్ధేశించి ప్రసంగించారు. కేంద్ర మంత్రుల వత్తిడి వల్లే ఫైల్ ను రీఓపెన్ చేశారని పేర్కొన్నారు. తాను స్పీచ్ ఇవ్వడానికి రాలేదని, కేవలం ఈ క్యాంపస్ లో చోటు చేసుకున్న పరిణామాలపై స్పందించానికి వచ్చానన్నారు. రోహిత్ మృతి చెందడం బాధాకరమని, రోహిత్ హత్య. ఆత్మహత్య కాదు హత్యే అని స్పష్టం చేశారు. ఇలా జరగడం దురదృష్టకరమన్నారు. తాను స్టూడెంట్ ఉద్యమాల నుండి వచ్చిన వాడేనని, హిందూత్వకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలన్నీ వాళ్లకు పనికిరానివిగానే కనబడుతాయని తెలిపారు. ఈ కుల వివక్ష రిపీట్ కాకూడదనే తామంతా ఇక్కడకు రావడం జరిగిందని స్పష్టం చేశారు. యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్ సాంఘీక బహిష్కరణ విధించడం నేనెప్పుడూ చూడలేదన్నారు. యూనివర్సిటీలో 12 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. ఇటీవలే పార్లమెంట్ లో కొత్తగా క్రిమినల్ చట్టం తీసుకరావడం జరిగిందని, రోహిత్ ఆత్మహత్యకు కారణమైన కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ, వీసీలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు కారకులైన వారందరీపైనా కేసులు పెట్టాలని సూచించారు. విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తామని హామీనిచ్చారు. పార్లమెంట్ లో ఈ అంశంపై తాము పోరాటం చేస్తామని, ప్రధాని విదేశీ టూరిస్టుగా మారారని విమర్శించారు. రోహిత్ వేముల కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నట్లు ఏచూరి పేర్కొన్నారు. 

12:10 - January 20, 2016

ఇంటి నుంచి బ‌య‌లుదేరే ముందు కాస్త బెల్లం తిని వెళ్తే మంచి శ‌కునమ‌ని పెద్ద‌వాళ్లు కూడా చెబుతుంటారు. భారతీయ వంటలలో బెల్లం ఒక ముఖ్యమైన భాగం. బెల్లం (Jaggery)ఒక తియ్యటి ఆహార పదార్థం.. అంతే ఔషధాల గని అని కూడా చెప్పవచ్చు. బెల్లం తినాలంటే ఎక్కువ ప్ర‌యాస ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. బెల్లం కోసం ఎక్కువ డ‌బ్బు ఖ‌ర్చుపెట్టాల్సిన అవ‌స‌రం కూడా ఉండ‌దు. మార్కెట్లో ఇత‌ర ధ‌ర‌ల‌తో పోలిస్తే బెల్లం రేటు కాస్తంత త‌క్కువే. ఏదో పండ‌గ సంద‌ర్భంలో త‌ప్ప బెల్లం జోలికి వెళ్ల‌డం చాలా త‌క్కువ‌. ఆ బెల్ల‌మే క‌దా అని తీసి పారేయ‌కండి. బెల్లంతో ఎన్నో ప్ర‌యోజ‌నాలున్నాయి. ముఖ్యంగా చ‌లికాలంలో బెల్లం తిన‌డం ఆరోగ్యానికి ఎంతో మంచిద‌ట‌. ముఖ్యంగా దీంతో శ‌రీరానికి కావాలసిన వేడి అందుతుంద‌ని చెబుతారు. అంతేకాదు ఎన్నోర‌కాల రోగాల‌ను నిరోధించే శ‌క్తి బెల్లానికి ఉంది. ముఖ్యంగా గ‌ర్భ‌వ‌తి అయిన స్త్రీలు బెల్లాన్ని సేవిస్తే ఎంతో మంచిద‌ట‌.ఆయుర్వేదంలోనూ బెల్లానికి ఎంతో ప్రాధాన్య‌త ఉంది. చ‌లికాలంలో ద‌గ్గు, జలుబు లాంటి ఎన్నో రోగాల‌ను నిరోధించే శ‌క్తి బెల్లానికి ఉంది. చిటికెడు బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే చాలు... ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ బాగా జ‌రుగుతుంద‌ట‌. రోజంతా ఆఫీసుల్లో టెన్ష‌న్ టెన్ష‌న్ గా గ‌డిపేవాళ్ల‌కు ఇది ఎంతో మంచిద‌ట‌.

చెరకు నుండి...

దీనిని సాధారణంగా చెరకు నుండి తయారు చేస్తారు. సాధారణంగా చెరకు రసము నుంచి కొలాసిస్ ను వెలికితీసి బెల్లము తయారు చేస్తారు. తాటికల్లు, ఈతకల్లు, ఖర్జూరము నుంచి బెల్లం తయారుచేస్తారు . బెల్లం తయారిలో వివిధ రాకలు ఉన్నాయి. చెరకు బెల్లం, ఖర్జూర బెల్లం, తాటి బెల్లం, ఈతబెల్లం, కొబ్బరి బెల్లం ఇలా వివిధ రకాలుగా తయారు చేస్తారు. అయితే ఇళ్ళలో వాడేరకం చెరకు బెల్లం. ఇది భారతీయ వంటలలో బెల్లం ఒక ముఖ్యమైన పదార్థం. చెరకు బెల్లము గోల్డ్ బ్రౌన్‌ కలర్ నుంచి డార్క్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది . ఈ బెల్లంను చెరకు రసాన్నిబాగా కాయడం ద్వారా తయారుచేస్తారు. ఈ బెల్లం నేల రకాన్ని బట్టి, నీటి పారుదల సౌకర్యాన్ని బట్టి తెల్లగాను, లేదా నల్లగాను, మెత్తగాను లేదా గట్టిగాను వుంటుంది. దాన్ని బట్టి దానికి ధర వస్తుంది. పంచదార లేదా చక్కెర కంటే బెల్లం ఆరోగ్యపరంగా శ్రేష్టం ఎందుకంటే బెల్లంలో ఇనుము మొదలైన మూలకాలు ఉంటాయి.

బెల్లంలో ఎలాంటి రసాయ‌న ప‌దార్థాల వాడ‌కం ఉండ‌దు. చూశారా బెల్లానికి ఎంత ప్రాధాన్య‌త ఉందో.. ఇక నుంచి ఆ బెల్ల‌మే క‌దా అని లైట్ తీసుకోకండి.. కాస్త అప్పుడ‌ప్పుడు చిటికెడు బెల్లాన్ని నోట్లో వేసుకుందాం...

ఉపయోగాలు..

ఆయుర్వేద వైద్యశాస్త్రంలో కూడా బెల్లాన్ని చాలా రకాల మందులలో వాడతారు.

పొడి దగ్గు ఇబ్బంది పెడుతుంటే .. గ్లాసు బెల్లం పానకం లో కొద్దిగా తులసి ఆకులు వేసి రోజుకు మూడు సార్లు తీసుకుంటే ఉపసయనం కలుగుతుంది .

అజీర్తి సమస్యతో విసిగిపోయిన వారు భోజనం చేశాక చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది . అజీర్తి సమస్యలుండవు .జీవ క్రియ ను వేగవంతం చేస్తుంది .

కాకర ఆకులు , నాలుగు వెల్లుల్లి రెబ్బలు (రెక్కలు) , మూడు మిరియాల గింజలు , చిన్న బెల్లం ముక్క వేసి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని రోజు రెండుపుతల వారం రోజులు తీసుకున్నా , లేదా గ్లాసు పాలలో పంచధరకి బదులు బెల్లం వేసి రోజు త్రాగిన ... నెలసరి సమస్యలు ఉండవు.

నేయ్యి తో బెల్లం వేడిచేసి నొప్పి ఉన్నా చోట పట్టు వేస్తె భాధ నివారణ అవుతుంది .

ముక్కు కారడము తో బాధపడుతున్న వారికి ... పెరుగు , బెల్లం కలిపి రోజుకు రెండు పూటలు తింటే తగ్గుతుంది .

బెల్లం , నెయ్యి .. సమపాళ్ళలో కలిపి తింటే 5 -6 రోజులలో మైగ్రిన్ తల నొప్పి తగ్గుతుంది .

కడుపులో మంటగా ఉన్నప్పుడు బెల్లం చిట్కాను ప్రయోగించవచ్చని పోషణ నిపుణులు సూచిస్తున్నారు. బెల్లంలో పొటాసియం సమృద్ధిగా ఉంటుంది. ఇది కణాల్లో ఆమ్లాలు, అసిటోన్లపై దాడి చేసి ఆమ్ల సమతౌల్యాన్ని కాపాడుతుంది. భోజనం చేసిన తర్వాత ప్రతిసారీ చిన్న బెల్లం ముక్క తినటం ద్వారా అసిడిటీని తగ్గించుకోవచ్చు. ఇలాంటి ప్రయోజనాలు ఉండటం వల్లే బెల్లాన్ని 'మెడిసినల్‌ సుగర్‌'గా వ్యవహరిస్తారు.

ఆసీస్ 307/4…

కాన్ బెర్రా : భారత్ తో జరుగుతున్న నాలుగో వన్డేలో ఆసీస్ నాలుగు వికెట్లు కోల్పోయి 307 పరుగులు సాధించింది. ప్రస్తుతం బెయిలీ 5, మాక్స్ వెల్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

ఫించ్ అవుట్

హైదరాబాద్: సెంచరీ చేసి మంచి ఊపు మీదున్న ఫించ్ (107) ను యాదవ్ వెనక్కిపంపించాడు. నాలుగో వన్డే మ్యాచ్ లో 40 ఓవర్లలో ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. ప్రస్తుతం మార్ష్ 18, స్మిత్ 7 పరుగులు చేసింది. 

రోహిత్ కుటుంబానికి రూ. కోట్లు ఎక్స్ గ్రేషియా చెల్లించాలి...

హైదరాబాద్ : ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి రోహిత్ కుటుంబానికి రూ. 5 కోట్లు ఎక్స్గ్రేషియా చెల్లించాలని హెచ్సీయూ విద్యార్థి జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బుధవారం హైదరాబాద్లో విద్యార్థి జేఏసీ నాయకులు మాట్లాడుతూ... వీసీ పి. అప్పారావును వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే రోహిత్ మరణానికి కారణమైన కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, బండారు దత్తాత్రేయపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్లో జరగకుండా చూడాలని ప్రభుత్వానికి హెచ్సీయూ విద్యార్థి జేఏసీ సూచించింది.

11:23 - January 20, 2016

కరీంనగర్ : డబుల్‌ దమాకా అంటూ ఆర్భాటంగా ప్రకటించారు. ఆరేళ్లలో రెట్టింపు అంటూ పబ్లిసిటీ చేశారు. పాలసీలు కట్టండి..పైసలు పట్టండి అంటూ యాడ్లను గుప్పించారు. ఏజెంట్లను నియమించి ఎడాపెడా డిపాజిట్లు సేకరించారు.కంపెనీ ప్రకటనకు కనెక్ట్ అయిపోయిన ఖాతాదారులు భారీగా పాలసీలు తీసుకున్నారు. కాసులు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్న సమయంలో నిర్వాహకులు కనిపించకుండా పోయారు. దీంతో ఖాతాదారులు గగ్గోలు పెడుతున్నారు. కరీంనగర్‌ జిల్లాలో పెరల్స్‌ కంపెనీ బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.నాలుగేళ్లగా డిపాజిట్లు సేకరించిన నిర్వాహకులు ఇప్పుడు కనిపించకుండా పోయారు. దీంతో ఖాతాదారులు లబోదిబోమంటున్నారు.కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా 50 వేల మంది వరకు బాధితులు ఉన్నారు. వీరి వద్ద నుంచి దాదాపు 35 కోట్ల రూపాయల వరకు పెరల్స్ సంస్థ వసూలు చేసింది.

పెద్ద మొత్తంలో డిపాజిట్లు..
కరీంనగర్‌ జిల్లాలో పెరల్స్ సంస్థ తన మొదటి బ్రాంచ్‌ను 2013 సెప్టెంబర్ 11న ప్రారంభించింది. ఆ తరువాత జిల్లాలో పలు ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించి వ్యాపారాన్ని విస్తరించింది. కూలీలు, రైతులతో పాటు వ్యాపారుల నుంచి కూడా పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించారు. కమీషన్లకు ఆశ పడిన ఆర్ఎంపి వైద్యులు, అంగన్ వాడి వర్కర్లు, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ సంస్థకు ఏజెంట్లుగా చేరి తమ పరిచయాలతో చాలా మందిని ఇందులో చేర్పించారు. జిల్లాలో రామడుగు, హుజురాబాద్, కోరుట్ల, హుస్నాబాద్, తిమ్మాపూర్, భీమదేవరపల్లి మండలాల్లో పెద్ద మొత్తంలో డిపాజిట్లను సేకరించారు.

ఖాతాదారుల ఆందోళనలు..
ఆరేళ్ళలో రెట్టింపు సొమ్ముతో డిపాజిట్లను చెల్లిస్తామని ఖాతాదారులకు పెరల్స్‌ సంస్థ బాండ్లను జారీ చేసింది.పెరల్స్‌ నిర్వహిస్తున్న ఈ గొలుసుకొట్టు వ్యాపారంలో అక్రమాలు జరుగుతున్నాయని సెబీ గుర్తించడం..తరువాత కోర్టులు జోక్యం చేసుకోవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. వారం క్రితం కంపెనీ ఉన్నతాధికారులను సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో పెరల్స్ బ్రాంచ్ మూతపడింది. దీంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. మరోపక్క కమీషన్లకు ఆశపడి ఏజెంట్లుగా అవతారమెత్తిన వారంతా ఇప్పుడు తప్పించుకొని తిరుగుతున్నారు. ఇటు ఖాతాదారులకు సమాధానం చెప్పలేక..అటు నిర్వహకుల నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

ఫించ్ సెంచరీ..ఆసీస్ 209/1..

కాన్ బెర్రా : భారత్ తో జరుగుతున్న నాలుగో వన్డే మ్యాచ్ లో ఆసీస్ ఒక వికెట్ నష్టానికి 35.3 ఓవర్లలో 213 పరుగులు చేసింది. ఓపెనర్ ఫించ్ సెంచరీ సాధించాడు. కేవలం 104 బంతుల్లో 106 పరుగులు చేశాడు. ఇందులో 9x4, 2x6 సాయంతో ఈ స్కోరు చేశాడు. 

11:16 - January 20, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూలో దళిత విద్యార్థి రోహిత్ వేముల మృతి చెందడం చాలా బాధకరమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి పేర్కొన్నారు. సస్పెండ్ కు గురైన రోహిత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికుతున్నాయి. దీనిపై విద్యార్థులు హెచ్ సీయూలో ఆందోళన కొనసాగిస్తున్నారు. బుధవారం ఏచూరి హెచ్ సీయూని సందర్శించేందుకు ఏచూరి నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. యూనివర్సిటీపై వత్తిడి తెచ్చిన కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలపై చర్య తీసుకోవాలన్నారు. వీసీ అప్పారావును తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్థులందరి వ్యవహారంపై విచారణ జరపాలని, ఈ ఆత్మహత్యకు కారకులైన వారందరికీపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ పాలకవర్గం అనాలోచిత నిర్ణయాల వల్లే ఈ దుష్ర్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ రకంగా ఐదుగురిని సస్పెండ్ చేయడం..వాళ్ల స్కాలర్ షిప్, ఫెలో షిప్ లు ఇవ్వకపోవడం..సోషల్ బాయ్ కాట్ తదితర నిర్ణయాలు యూనివర్సిటీ తీసుకుందో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్నారు. పార్లమెంట్ సెషన్ లో కొత్త చట్టాన్ని ఆమోదించడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కొత్త చట్టం ఆధారంగా క్రిమినల్ యాక్షన్స్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగానికి వ్యతిరేకమని, అన్ని యూనివర్సిటీల్లో ఇలాంటి వాతావరణం సృష్టిస్తున్నారని ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమన్నారు. తమకు తెలిసినంత వరకు 12 మంది ఆత్మహత్య చేసుకున్నారు ఇందుకు గల కారణాలేంటీ ? అనే దానిపై దృష్టి పెట్టాలని ఏచూరి పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే విద్యార్థుల దీక్షలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రోహిత్ మృతికి కారణమైన వీసీ అప్పారావును తొలగించాలని, కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, దత్తాత్రేయపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల ఉద్యమానికి పలు విద్యార్థి సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. 

దత్తాత్రేయ ఇంటిని ముట్టడించిన ఏఐఎస్ ఎఫ్

హైదరాబాద్ : హెచ్ సియూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు కారణమైన కేంద్ర మంత్రి దత్తాత్రేయ బాధ్యత వహించాలని కోరుతూ ఏఐఎస్ ఎఫ విద్యార్థులు దత్తాత్రేయ ఇంటిని ముట్టడించారు. అప్రమత్తమైన పోలీసలు వారిని అడ్డుకుంటున్నారు.దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు...

హైదరాబాద్‌: పీఎస్‌ఎల్వీసీ- సీ31ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రదాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగం ద్వారా నావిగేషన్‌ వ్యవస్థకు సంబంధించిన 1,425 కిలోల ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఇ ఉప్రగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కూడా ఇస్రో విజయంపై అభినందనలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.

కేంద్ర మంత్రులను తొలగించాలి : సీతారం ఏచూరి

హైదరాబాద్ : హెచ్ సియూను సీపీఎం నేత సీతారాం ఏచూరి సందర్శించారు. వర్శిటీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంఘీభావాన్ని తెలిపారు. దళిత విద్యార్థి రోహిత్ మృతి బాధాకరం. ఈ ఘటనకు బాధ్యులు కేంద్ర మంత్రులు దత్తాత్రే, స్మృతీ ఇరానీలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఘటనకు బాధ్యుల పై ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే వీసీనికూడా తొలగించి క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలన్నారు.

హెచ్ సీయూలో కొనసాగుతున్న విద్యార్థుల దీక్షలు

హైదరాబాద్ : హెచ్ సియూలో విద్యార్థుల దీక్షలు కొనసాగుతున్నాయి. రోహిత్ మృతికి కారణమైన వీసీ అప్పారావును తొలగించాలని, కేంద్ర మంత్రులు దత్తాత్రే, స్మృతీ ఇరానీలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల ఉద్యమానికి పలు విద్యార్థి సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి.

10:56 - January 20, 2016

హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పరికర్‌-ను చంపేస్తామంటూ బెదిరింపు లేఖ వచ్చింది. ఈ అంశాన్ని గోవా పోలీస్ ఐజీ సునీల్ గార్గ్ ధృవీకరించారు. 'ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌ పేరుతో గోవా సచివాలయానికి ఈ లేఖ వచ్చింది. బీఫ్ వినియోగంపై భారత్ విధానాలకు వ్యతిరేకంగా ఐసిస్ ఈ లేఖ పంపించిందని భావిస్తున్నారు. ‘మా యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్, మా గోవా పోలీసులు ఈ లేఖపై హై అలర్ట్ అయ్యారని' సునీల్ గార్గ్ తెలిపారు. కేసును యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్‌ దర్యాప్తు చేస్తోంది. బెదిరింపు లేఖ వచ్చిన మాట వాస్తవమేనని గార్గ్ ధ్రువీకరించారు. ఈ బెదిరింపు లేఖను తేలిగ్గా తీసుకోవడం లేదని సీరియస్‌-గా విచారణ జరుపుతున్నామని ప్రకటించారు. ఆ లేఖలోని వివరాలను బయటకు వెల్లడించాలనుకోవడం లేదని, అయితే.. గోవాలో పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశామని గార్గ్ వివరించారు.

వార్నర్ అవుట్..

కాన్ బెర్రా : సెంచరీ దిశగా దూసుకెళుతున్న వార్నర్ (93) అవుట్ అయ్యాడు. శర్మ బౌలింగ్ లో వార్నర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం 29.3 ఓవర్లలో ఆసీస్ జట్టు 187 పరుగులు చేసింది. ఫించ్ 88 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

తడ చెక్ పోస్టుపై ఏసీబీ దాడి

నెల్లూరు : ఆంధ్రా-తమిళనాడు సరిహద్దులోని ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుపై బుధవారం ఉదయం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడి చేశారు. కాంపౌండ్ ఫీజు కంటే అదనంగా ఉన్న 46,640 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే చెక్‌పోస్టు పరిసరాల్లో వెతగ్గా రూ.7,980 ఒకచోట, రెండు 500 రూపాయల నోట్లు మరో చోట దొరికాయి. వీటిని సిబ్బంది లోపలి నుంచి విసిరివేసి ఉంటారని భావిస్తున్నారు. చెక్‌పోస్టులో అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు దాడి చేశారు. విధి నిర్వహణలో ఉన్న వాణిజ్యపన్నుల శాఖ అధికారులపై కేసు నమోదు చేశారు.

పుల్వామా జిల్లాలో ఎదురుకాల్పులు...

శ్రీనగర్: దక్షిణ కాశ్మీర్ పుల్వామా జిల్లాలో తీవ్రవాదులకు... భద్రత దళాలకు మధ్య ఎన్కౌంటర్ కొనసాగుతుందని సైనిక అధికారులు బుధవారం వెల్లడించారు. జిల్లాలోని నైనా బాటాపొరా గ్రామంలో తీవ్రవాదులు దాగి ఉన్నారని మంగళవారం సాయంత్రం భద్రత దళాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో సదరు గ్రామానికి చేరుకున్న భద్రత దళాలు తనిఖీలు నిర్వహించాయి. ఆ విషయాన్ని గమనించిన... తీవ్రవాదులు... భద్రత దళాలపైకి కాల్పులు జరిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రత దళాలు... ఎదురు కాల్పులకు దిగారు. ఆ క్రమంలో ఇరువైపులా కాల్పులు బుధవారం ఉదయం కూడా కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు.

పాకిస్థాన్ లో బాచాఖాన్ యూనివర్శిటీపై ఉగ్రదాడి

పాకిస్థాన్ : బాచాఖాన్ యూనివర్శిటీపై ఉగ్రదాడి జరిగింది.వ ర్శిటీలోకి ఆయుధాలతో ముగ్గురు ఉగ్రవాదలు చొరబడ్డారు. ఉగ్రవాదుల దాడిలో ఇప్పటి వరకు ఒకరు మృతి చెందగా.. 5గురికి గాయాలయినట్లు సమాచారం.

ఫించ్ అర్ధ సెంచరీ..

కాన్ బెర్రా : ఆసీస్ భారీ స్కోరు చేయడానికి ప్రయత్నిస్తోంది. భారత్ తో జరుగుతున్న నాలుగో వన్డే మ్యాచ్ లో ఆసీస్ ఓపెనర్లు ఇద్దరూ హాఫ్ సెంచరీలు నమోదు చేసి మంచి ఊపు మీద ఉన్నారు. వార్నర్ మొదటగా హాఫ్ సెంచరీ నమోదు చేసి సెంచరీ దిశగా ముందుకెళుతున్నాడు. మరోవైపు తానేమి తక్కువ కాదనట్లుగా ఫించ్ బ్యాట్ ఝులిపిస్తున్నాడు. 64 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ప్రస్తుతం 24.3 ఓవర్లలో ఆసీస్ జట్టు 144 పరుగులు చేసింది. వార్నర్ 87, ఫించ్ 52 పరుగులు చేశారు. 

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు...

ముంబై : అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో స్టాక్‌ మార్కెట్లు నేడు ప్రారంభం నుండే భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 370 పాయింట్లకు పైగా నష్టంలో, నిఫ్టీ 120పాయింట్లకు పైగా నష్టంలో ట్రేడవుతున్నాయి.

10:09 - January 20, 2016

నెల్లూరు : పీఎస్ ఎలీవ సీ -31 ప్రయోగం విజయంతమైంది. ఈమేరకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో షార్ నుండి ఈ రోజు ఉదయం 9.31గంటలకు పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సీ31 (పీఎస్ఎల్ వీ) వాహన నౌకను ఇస్రో విజయవంతంగా నింగిలోకి పంపింది. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడారు. 2016 తొలి సంవత్సరంలో ఇస్రో సాధించిన ఘన విజయమని శాస్త్రవేత్తలు ప్రకటించారు. పీఎస్ఎల్ వీ మరోసారి నమ్మకాన్ని నిలబెట్టిందన్నారు. మరో రెండున్నర నెలల్లో మిగతా రెండు ఉపగ్రహాలను ప్రయోగిస్తామని, 2016 చివరి నాటికి దిక్సూచీని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తామని తెలితపారు. తాజా ఉపగ్రహంతో గ్లోబల్ పొజిషినింగ్ సిస్టమ్ (జీపీఎస్)కు మరింత ఊతం లభించనుంది. 

పీఎస్ ఎల్వీ -సీ31 ప్రయోగం విజయవంతం

నెల్లూరు : పీఎస్ ఎల్వీ - సీ31 రాకెట్ ప్రయోగం విజయంతం అయ్యింది. దాదాపు ఒకటిన్నర కిలోల బరువున్న ఈ రాకెట్ ‘ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఈ అనే ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశ పెట్టింది. 19 నిమిషాల 30 సెకన్లలో ‘ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఈ’ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశ పెట్టిన్లు శాస్త్రవేత్తలు తెలిపారు. 

ఆసీస్ 112/0..

కాన్ బెర్రా : భారత్ తో జరుగుతున్న నాలుగో వన్డే మ్యాచ్ లో ఆసీస్ వంద పరుగుల మైలురాయిని దాటింది. ఓపెనర్లు ఓపెనర్ ఫించ్, వార్నర్ లు ధీటుగా ఆడుతున్నారు. ఇప్పటికే వార్నర్ హాఫ్ సెంచరీని దాటగా ఫించ్ అర్ధ సెంచరీకి సమీపంలో ఉన్నాడు. టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఆరంభించింది. ఓపెనర్లు మొదటి నుండి ధీటుగా బ్యాటింగ్ ఆరంభించారు. ప్రస్తుతం 17 ఓవర్లలో ఆసీస్ వికెట్ నష్టపోకుండా 112 పరుగులు పూర్తి చేసింది. వార్నర్ 72, ఫించ్ 38 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

09:58 - January 20, 2016

నెల్లూరు : సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లోని రెండోవ ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ -సీ 31 రాకెట్‌ను బుధవారం ఉదయం 9 గంటల 31 నిమిషాలకు ప్రయోగించారు. ప్రయోగ సమయానికి 48 గంటల ముందుగానే కౌంట్ డౌన్ ప్రారంభించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఇండియన్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ రాకెట్ నింగిలోకి తీసుకెళ్లింది. ఇప్పటి వరకు పీఎస్ఎల్వీ సిరీస్‌లో 33 ప్రయోగాలను ప్రయోగించినట్లైంది. పీఎస్ఎల్వీ ప్రయోగాల్లో మొదటిది అపజయంతో ప్రారంభమైనా తర్వాత ప్రయోగించిన 31 ప్రయోగాలు విజయవంతంగా కొనసాగించింది. ప్రస్తుతం పీఎస్ఎల్వీ - సీ 31 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.
రేడియో, వాతావరణం, భూగర్భ పరిశోధనలు, గ్రహాల స్ధితిగతులను కనుగొనేందుకు 100కు పైగా ఉపగ్రహాలను ఇప్పటికే ఇస్రో ప్రయోగించింది. పీఎస్ఎల్వీ - సి 31 రాకెట్‌ ద్వారా 1425 కిలోల బరువున్న ఐఆర్ఎన్ఎస్ఎస్- 1ఇ ఉపగ్రహాన్ని రోదసీకి పంపారు. ఐఆర్ఎన్ఎస్ఎస్- 1ఇ ఉపగ్రహం ఇండియన్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం ఉపగ్రహాల సీరిస్‌లో ఇది ఐదోవది. ఈ ఉపగ్రహంలో రెండు రకాల సాంకేతిక పరికరాలను అమర్చి పంపుతున్నారు. నావిగేషన్ పేలోడ్స్‌లో ఎల్-5 బ్యాండ్, ఎస్‌ బ్యాండ్ ట్రాన్స్‌ఫాండర్స్‌ను పంపుతున్నారు. దీనివల్ల నావిగేషన్ సర్వీస్ సిగ్నల్స్‌ను వేగంగా అందిస్తుంది. రేంజింగ్ పేలోడ్స్‌లో సీ బ్యాండ్ ట్రాన్స్‌ఫాండర్స్, రెట్రోరిఫ్లెక్షన్ లేజర్ రేంజింగ్ అనే పరికరాలు పనిచేస్తాయి. ఈ సాంకేతిక పరికరాలన్నీ భారత్‌కు దిక్సూచి వ్యవస్థలను అందిస్తాయి. ఈ ప్రయోగంతో ఐదు ఉపగ్రహాలను పూర్తి చేసుకుని ఫిబ్రవరి, మార్చిలో మరో రెండు ఉపగ్రహ ప్రయోగాలను పూర్తి చేసే లక్ష్యంతో ఇస్త్రో శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు.

వార్నర్ హాఫ్ సెంచరీ..

కాన్ బెర్రా : భారత్ తో జరుగుతున్న నాలుగో వన్డే మ్యాచ్ లో ఆసీస్ ఓపెనర్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఆరంభించింది. ఓపెనర్లు మొదటి నుండి ధీటుగా బ్యాటింగ్ ఆరంభించింది. ప్రస్తుతం 15 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 87 పరుగులు పూర్తి చేసింది. వార్నర్ 53, ఫించ్ 33 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

09:36 - January 20, 2016

వరంగల్ : మమ్మేలు మల్లన్నా..కోర మీసాల కొమురన్న అంటూ కొమురవెళ్లి భక్త పారవశ్యంతో పొంగిపోయింది. వేలాది మంది భక్తులు పోటెత్తడంతో పట్నాల మల్లన్న పరిసరాలు ఒగ్గు డప్పులు, గజ్జెల మోతలతో హోరెత్తాయి. కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలలో మొదటి ఘట్టం 'పట్నం వారం' వైభవంగా ముగిసింది. మల్లన్నస్వామిని దర్శించుకునేందుకు రెండు లక్షలకు పైగా భక్తులు పోటెత్తారు. బోనాలతో కిలోమీటరు పొడవునా భక్తులు బారులుదీరారు. బోనాలు నెత్తినెత్తుకొని భక్తి పారవశ్యంతో, పూనకాలతో ఊగిపోయారు. ఒంటినిండా పసుపు పూసుకొని పోతరాజులు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

పోటెత్తిన భక్తులు..
కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి ఘట్టం 'పట్నం వారం' అత్యంత వైభవంగా ముగిసింది. తోటబావి వద్ద కొత్తగా నిర్మించిన కల్యాణ వేదిక వద్ద మొదటిసారిగా ఈ వేడుకలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. పెద్దపట్నం, అగ్నిగుండాల తంతులో ప్రధాన భూమిక పోషించే ఒగ్గు పూజారులు మల్లన్న నామాన్ని జపించారు. పెద్దపట్నం వేయడానికి భక్తులు క్వింటాళ్ల కొద్ది పసుపుని వాడారు. పట్నం సందర్భంగా ఆనందంతో భక్తులు ఒకరినొకరు బండారి పూసుకోవడంతో ఆలయ పరిసరాలు పసుపు వర్ణమయ్యాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలను చూసేందుకు హైదరాబాద్‌ నుంచే అత్యధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వీరికి తోడు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో కొమురవెళ్లి పరిసరాలు భక్తజనంతో కిటకిటలాడాయి. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. 

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ ఎల్వీ సి-31

హైదరాబాద్ : పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఇండియన్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం ఉపగ్రహాన్ని పీఎస్ ఎల్వీ రాకెట్ నింగిలోకి తీసుకెళ్లింది. ఈ ఉదయం సరిగ్గా 9:31 నిమిషాలకు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్‌ఎల్వీ సీ31 రాకెట్‌ ను విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. దీని ద్వారా దాదాపు ఒకటిన్నర కిలోల బరువున్న ‘ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఈ’ షార్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది. ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌ కుమార్ దగ్గరుండి ప్రయోగాన్ని పర్యవేక్షిస్తున్నారు.

ఆటో - లారీ ఢీ :4గురు విద్యార్థులకు గాయాలు..

నెల్లూరు : జిల్లాలోని దొరవారిసత్రం మండలం నేలబల్లి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ఆటో, లారీ ఢీకొనడంతో ఆటోలోని నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు.

09:26 - January 20, 2016

హైదరాబాద్ : గ్రేటర్ లోఎన్నికల వేడి....రాజుకుంటున్న సమయంలోనే అధికార పార్టీకి మరో అస్త్రం చేతికి అందింది. గ్రేటర్లో తమ ప్రత్యర్థి బీజేపీ అని అంచనా వేస్తున్న గులాబి దళం.. ఆ పార్టీని ఇరుకున పెట్టేందుకు మరింత జోరు పెంచుతోంది. గత రెండు నెలలుగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న టీఆర్ఎస్ నేతలు..ఆ దాడిని మరింత పెంచేందుకు సిద్ధమవుతున్నారు.

దూకుడు పెంచేందుకు సిద్ధం..
సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఘటన రాజకీయ రంగు పలుముకోవడంతో తెలంగాణాలో పొలిటికల్ పార్టీలన్నీ అంశంపై దృష్టి పెట్టాయి. రాజకీయ నేతలు రంగంలోకి దిగి కేంద్ర మంత్రులు వ్యవహరించిన తీరును తప్పుబడుతున్నారు. విద్యార్థి ఆత్మహత్య ఘటనపై జాతీయ స్థాయిలో ఆందోళనలు కూడా తీవ్రం కావడంతో జాతీయ నేతలు రంగంలోకి దిగి కేంద్రంపై దాడిని మొదలు పెట్టారు. హైదరాబాద్ లో ఘటన జరుగడంతో గులాబి పార్టీ కూడా ఈ విషయంపై ముందుగా ఆచి తూచి స్పందించింది. విద్యాలయాల్లో రాజకీయం ఎందకంటూ తాము జోక్యం చేసుకోలేదని, అయితే పరిస్థితి తీవ్ర రూపం దాల్చడంతో టీఆర్ఎస్ దూకుడు పెంచేందుకు సిద్ధమవుతోంది.

రంగంలో జాగృతి..
దీనికి తోడు గ్రేటర్ ఎన్నికల వేడి కూడా రగలడంతో.....అధికార పార్టీ తమ అనుబంధ సంఘమైన జాగృతిని ముందుగా రంగంలోకి దింపింది. కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఇంటిని ముట్టడించి అన్ని పార్టీల కంటే ముందుగానే తాము కేంద్ర మంత్రిని నిలదీశామనే సంకేతాలను ఇచ్చింది. బీజేపీపై దాడిని మరింత తీవ్రం చేసేందుకు ఏ అవకాశం వచ్చినా వదులుకునేది లేదని చెప్పకనే చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం కంటే స్థానికంగా బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు రాజకీయంగా తమకు కలిసి వస్తుందనే అంచనాతో అధికార పార్టీ నేతలున్నారు.

ఆసీస్ అప్పుడే 50 పరుగులు..

కాన్ బెర్రా : భారత్ తో జరుగుతున్న నాలుగో వన్డే మ్యాచ్ లో ఆసీస్ ఓపెనర్లు ఉతికిఆరేస్తున్నారు. టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. వార్నర్, ఫించ్ లు భారత బౌలర్లపై విరుచుకపడుతున్నారు. వార్నర్ 30, ఫించ్ 20 పరుగులతో ఆడుతున్నారు. ప్రస్తుతం ఆసీస్ 6.4 ఓవర్లలో 51 పరుగులు చేసింది. 

09:17 - January 20, 2016

ప్రిన్స్ మహేష్ బాబు ఇక డబ్బింగ్ ఆర్టిస్ట్ కాబోతున్నాడా?! అంటే అవుని చెప్తున్నాడు దర్శకుడు ముప్పలనేని శివ... అయితే తన తండ్రి, సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ నటిస్తున్న సినిమాకు డబ్బింగ్ చెప్పే ఆర్టిస్టుల్లో తానూ ఒకడవుతున్నాడు. నిజానికి ఈ ఐడియా గురించి మహేష్ బాబే ఈ మూవీ ప్రొడ్యూసర్లకు చెప్పాడని, వాళ్ళు కూడా ఓకే అన్నారని ఈ చిత్రం డైరెక్టర్ ముప్పలనేని శివ తెలిపారు. అయితే ఇందులో మహేష్ కేమియో రోల్ లో నటిస్తాడని వచ్చిన వార్తలు రూమర్లేనని శివ క్లారిటీ ఇచ్చారు. దీనిపై మహేష్ కు, నిర్మాతలకు మధ్య డిస్కషన్స్ ఏవీ జరగలేదని చెప్పారు. శ్రీశ్రీ అని ఈ సినిమాకు టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. పాపులర్ పోయెట్ శ్రీరంగం శ్రీనివాస రావు జీవిత కథ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్..

ఊపుతున్న ఆసీస్ ఓపెనర్స్..

కాన్ బెర్రా : భారత్ తో జరుగుతున్న నాలుగో వన్డే మ్యాచ్ లో ఆసీస్ ఓపెనర్స్ బ్యాట్ ఝులిపిస్తున్నారు. ముఖ్యంగా వార్నర్ భారత బౌలర్లను చీల్చిచెండాడుతున్నాడు. కేవలం ఆరు ఓవర్లలో ఆసీస్ 45 పరుగులు చేసింది. ప్రస్తుతం ఫించ్ 15, వార్నర్ 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

09:14 - January 20, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూ లో దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికుతున్నాయి. హెచ్ సీయూలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతు పెరుగుతోంది. ఈ ఘటనకు కారకులుగా ఉన్న కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, వీసీ అప్పారావులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హెచ్ సీయూకు చేరుకుని విద్యార్థులతో ముచ్చటించారు. నేడు విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, సీపీఎం జాతాయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, బీఎస్పీ నేత మాయావతి తదితరులు నగరానికి రానున్నారు. లోక్ జన శక్తి పార్టీ (ఎల్జేపీ) పార్లమెంటరీ బోర్డు అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలో మరో బృందం కూడా హెచ్ సీయూకు రానుంది. అదే విధంగా వైసీపీ అధ్యక్షుడు జగన్ కూడా హెచ్ సీయూకి వచ్చి విద్యార్థులతో ముచ్చటించనున్నారు. మరోవైపు విద్యార్థుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. 

09:09 - January 20, 2016

హైదరాబాద్ : నగరంలో నాగోల్ లో ఉన్న ఓ ఏటీఎం మంటల్లో కాలిపోయింది. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. నాగోల్ పరిధిలో హెచ్ డీఎఫ్ సీ, ఐసీసీఐ బ్యాంకులకు చెందిన ఏటీఎంలున్నాయి. తాను తెల్లవారుజామున ఊడుస్తుండగా హెచ్ డీఎఫ్ సీ ఏటీఎంలో పొగ..మంటలు వచ్చాయని సెక్యూర్టీ గార్డు పేర్కొన్నాడు. ఒక్కసారిగా మంటలు ఏటీఎం మొత్తం విస్తరించాయి. క్షణంలోనే ఏటీఎం..అందులో ఉన్న కరెన్సీ మంటలకు ఆహుతై పోయాయి. పక్కనే ఉన్న ఐసీసీఐ బ్యాంకు ఏటీఎంకు కూడా మంటలు వ్యాపించాయి. అక్కడ ఫర్నీచర్ ధ్వంసం కాగా ఏటీఎం పాక్షికంగా కాలిపోయింది. అప్పటికే అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. హెచ్ డీఎఫ్ సీ ఏటీఎంలో షార్ట్ సర్క్యూటే కారణమని తెలుస్తోంది. 

09:05 - January 20, 2016

హైదరాబాద్ : రాజకీయం సంగతలా ఉంచితే, తన దేశభక్తిని కూడా శంకిస్తున్నారని బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో పాకిస్థాన్ గజల్ గాయకుడు గులాం అలీ సంగీత ప్రదర్శనల ఏర్పాటు పై మీడియా షారూఖ్ స్పందనను కోరగా, అందుకు ఆయన నిరాకరించాడు. తానేం మాట్లాడిన రాజకీయం చేస్తున్నారని అన్నాడు. అందుకే ఈ విషయంలో తానెలాంటి కామెంట్ చేయనని షారూఖ్ మీడియాకు స్పష్టం చేశాడు. రాజకీయ, మత సంబంధ విషయాలపై మీరెన్ని ప్రశ్నలు వేసినా నేను మాట్లాడను. ఇటువంటి వాటిపై నేనేం మాట్లాడినా వివాదాస్పదమవుతోంది. అందుకే నేను మీ ప్రశ్నలకు సమాధానం చెప్పాలనుకోవడంలేదు. గతంలో నేను ‘అసహనం’పై చేసిన వ్యాఖ్యల ప్రభావం ‘దిల్‌వాలే’ సినిమా కలెక్షన్లపై పడింది. అందుకే ఇటువంటి విషయాలపై మాట్లాడదలచుకోలేదు అని స్పష్టం చేశారు. ఎన్నో అంచనాలతో రూపొందిన ఈ సినిమా కలెక్షన్లు ఊహించినంతగా దూసుకుపోలేదు. దీంతో షారూఖ్ ఆచితూచి మాట్లాడుతున్నాడు.

పోలీసుల అదుపులో 120 మంది బర్మా దేశస్తులు..

హైదరాబాద్ : నగరంలోని కిషన్‌బాగ్‌, అసద్‌బాబానగర్‌లో బుధవారం ఉదయం నుంచిపోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నారు. బహదూర్‌పురా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 300 మంది పోలీసులతో తనిఖీలు చేపట్టారు. దక్షిణ మండలం పోలీసుల ఆద్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇంటెలిజెన్స్‌, ఎస్బీ హెచ్చరికలతో పోలీసుల సోదాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో అనుమతి లేకుండా నివసిస్తున్న 120 మంది బర్మా దేశస్తులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.

మాజీ ఎమ్మెల్యే సత్యలింగ నాయర్ మృతి

కాకినాడ : టిడిపి మాజీ ఎమ్మెల్యే సత్యలింగ నాయర్ మృతి చెందారు. కోరంగిలోని తన స్వగృహంలో కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు సత్యలింగనాయర్ కన్నుమూశారు. సంపర నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ గా సత్యలింగ నాయకర్ పని చేశారు.

బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్..

కాన్ బెర్రా : భారత్ తో జరుగుతున్న నాలుగో వన్డేలో టాస్ గెలిచిన ఆసీస్ ఓపెనర్లు వార్నర్, ఫించ్ బ్యాటింగ్ ఆరంభించారు. ఇప్పటికే మూడు వన్డేలో ఆసీస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

హైదరాబాద్ : భారత్‌, ఆస్ట్రేలియా మధ్య కాన్‌బెర్రా వేదికగా నాలుగో వన్డే కాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇప్పటికే 3-0 తేడాతో ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ కైవసం చేసుకుంది.

08:48 - January 20, 2016

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లిపై పెదనాన్న కృష్ణంరాజు క్లారిటీ ఇచ్చేశారు. 36వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన ప్రభాస్ పెళ్లి ఈ ఏడాది అయిపోతుందని ఆయన చెప్పారు. ప్రభాస్ ఈ మేరకు సంక్రాంతి పండుగ రోజున తనకు మాట ఇచ్చాడని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తగిన అమ్మాయి కోసం వెతుకు తున్నామని, అమ్మాయి దొరికిన వెంటనే ప్రభాస్ పెళ్లి అయిపోతుందని కృష్ణం రాజు అన్నారు. ప్రభాస్‌కు సూటయ్యే అమ్మాయిని సెర్చ్ చేసే పనిలో మా ఫ్యామిలీ బిజీ అయినట్టు తెలిపాడు. కృష్ణంరాజు మాటలను బట్టి ప్రభాస్ ఎవరితోనైనా డేటింగ్‌లో వున్నాడా? వుంటే ఆ అమ్మాయి ఎవరు? అంటూ సోషల్ మీడియాలో ఒకటే చర్చ. గతంలో భీమవరంకు చెందిన అమ్మాయిని మ్యారేజ్ చేసుకోనున్నట్లు పెద్ద ఎత్తున క్యాంపెయిన్ సాగింది. మరి ఇందులో నిజమెంతో? ఏదైతేనేం ఈ ఏడాది ఓ ఇంటివాడు కాబోతున్నాడు ప్రభాస్.

సర్కారీ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్..

బీహార్ : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు35 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు. 

08:37 - January 20, 2016

హెచ్ సీయూలో దళిత విద్యార్థులను సంఘ బహిష్కరణ ఎలా విధిస్తారు ? ఏ చట్టంలో చెప్పింది ? అని ది హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు. హెచ్ సీయూలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. ఈ అంశంపై టెన్ టివిలో 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో ప్రొ. నాగేశ్వర్ విశ్లేషించారు. ఆయన మాటల్లోనే.

అవును రాజకీయమే..
''దీనిని రాజకీయం చేస్తున్నారు. అంటున్నారు. అవును ఇది రాజకీయమే. రాజకీయం చేయడం వల్ల మరింత మరింత మంది రోహిత్ లు రాకుండా ఉండేందుకు జాగ్రత్తపడవచ్చు. రాజకీయం ముందే ఈ స్థాయిలో జరిగి ఉంటే బాగుండేది. సస్పెన్షన్ ఎత్తివేసే వారు. ఇక్కడ లెటర్ రాయడం రాజకీయం కాదా ? ఆరు సార్లు ఎందుకు రాశారో చెప్పాలి. ఎన్ని యూనివర్సిటీలకు ఆరుసార్లు లెటర్ రాశారు. ప్రమాణాలు, పరిశోధనలు పెంచాలని రాశారా ? దళితపట్ల వివక్ష ఉంది దీనిని ఆపాలని లెటర్ రాశారా ? దళిత వర్గ బిడ్డల పట్ల వివక్ష ఉందని ప్రభుత్వం నియమించిన కమిటీయే చెప్పింది. ఇంత రాజకీయం జరుగుతుంది కదా...ఇప్పటి వరకైనా
వీసీ అప్పారావుపై చర్యలు తీసుకుందా ? శిక్షలు రద్దు చేసిందా ? పేద కుటుంబానికి చెందిన దళిత విద్యార్థి చనిపోతే కనీసం సహాయం చేస్తామని మానవ వనరుల శాఖ ఎందుకు చెప్పడం లేదు. ఇతర ప్రమాదాల్లో ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఇంతవరకు రోహిత్ కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ప్రకటించారా ?

సూసైడ్ నోట్ ను విశ్లేషించడంలో అర్థం లేదు...
గతంలో రాహూల్ స్పందించకపోతే మొద్దబ్బాయ్ అన్నారు. ఇప్పుడు స్పందిస్తే విమర్శలు చేయడం ఎలా ? బీజేపీ మద్దతుదారుడు రాం విలాశ్ పాశ్వాన్ వస్తారని కథనాలు వస్తున్నాయి. కారణం వీళ్లే కదా అని సూసైడ్ నోట్ లో పేర్కొనలేదు కదా అని అంటున్నారు. ఊహకందని మానసిక స్థితి. ఆయన సహేతుంగా సమగ్రంగా లేఖ రాయాలని అనుకోవడం అత్యాశే అవుతుంది. అతని సూసైడ్ ను లేఖలో విశ్లేషించడంలో అర్థం లేదు.

అంటరానితనం శిక్ష విధిస్తారా ? 
కేంద్ర మంత్రి శిక్ష విధించమని చెప్పాడా ? బహిష్కరణ చేయమని చెప్పాడా ? అనే వాదనలు తెస్తున్నారు. ఇప్పటి వరకు సంఘ బహిష్కరణ శిక్షలు అనాగరికం అని అంటున్నారా ? అంటరానితనం శిక్ష విధిస్తారా ? భౌతిక దాడులకు పాల్పడితే పోలీసులు చూసుకుంటారు. భారత శిక్షాస్మృతి ప్రకారం సంఘ బహిష్కరణ ఉంటుందా ? వీసీ అప్పారావు చెప్పాలి. భారత రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛగా తిరగడం అనేది ప్రాథమిక హక్కు. ఇప్పటి వరకు పలు గ్రామాల్లో దళితుల పట్ల వివక్ష ఉంది. యాకూబ్ మెమన్ ను వీళ్లు వ్యతిరేకించారని అంటున్నారు. అబ్దుల్ కలాం ఉరి శిక్షలను అనుమతించలేదు. ప్రపంచంలో సగం దేశాలు ఉరిశిక్షలను బ్యాండ్ చేశాయి. ఉగ్రవాది కసీబ్ కు లాయర్ ను నియమించిన సంగతి తెలిసిందే. దీనిని ఏమంటారు ? సంఘ విద్రోహ శక్తులు..జాతి వ్యతిరేక శక్తులు అంటే నిర్వచనం అంటే ఏమిటీ ? భావ స్వేచ్ఛను హరించడం తప్పు. అభిప్రాయాలు ఉండడం నేరం కాదు'' అని ప్రొ. నాగేశ్వర్ పేర్కొన్నారు. మరిన్ని అభిప్రాయాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

భారీ పొగమంచు..నదిలోకి దూసుకెళ్లిన కారు..

ఉత్తర్ ప్రదేశ్ : భారీ పొగమంచు ఉండడంతో ఓ కారు నదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. బెలా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. 

హెచ్ సియూకు కేజ్రీవాల్, మాయావతి, ఏచూరి

హైదరాబాద్‌ : హెచ్ సియూ విద్యార్థి రోహిత్‌ మృతికి నిరసనగా హెచ్‌సీయూలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, బీఎస్పీ నేత మాయావతి తదితరులు బుధవారం హైదరాబాద్‌ రానున్నారు. లోక్‌జనశక్తి పార్టీ (ఎల్జేపీ) పార్లమెంటరీ బోర్డు అధ్యక్షుడు చిరాగ్‌ పాసవాన్‌ నేతృత్వంలో మరో బృందం కూడా హైదరాబాద్‌ రానుంది.

పఠాన్ కోట్ ఉగ్రవాదుల్లో ఇద్దరు ఇంటి దొంగలు..

హైదరాబాద్: పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో భారత రక్షణ బలగాలు మట్టుపెట్టిన ఆరుగురు ఉగ్రవాదుల్లో ఇద్దరు ఇంటి దొంగలుండవచ్చని జాతీయ దర్యాప్తు సంఘం అనుమానిస్తోంది. ఎన్ఐఏకి చెందిన అధికారులు నేరుగా ఇంటి దొంగల పేర్లను వెల్లడించకపోయినా ఈ సమాచారాన్ని మీడియాకు తెలియజేశారు కాగా ఈ కేసులో ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చేవారంలో రానుంది. దీంతో అప్పుడు ఈ దాడులకు తెగబడిన ఇన్ సైడర్స్ గురించి స్పష్టంగా తెలిసే అవకాశముందని అధికారులు తెలిపారు. మరణించిన ఉగ్రవాదుల్లో నలుగురిని గుర్తుపట్టినప్పటికీ, ఇద్దరి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. దీంతో వారిద్దరే ఇంటి దొంగలైవుండవచ్చని తెలుస్తోంది.

భార్యపై అనుమానంతో పిల్లలను నేలకేసి కొట్టేశాడు...

నిజామాబాద్ : నందిపేట్‌ మండలం తల్వెదలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో పిల్లలను తండ్రి నేలకేసి కొట్టాడు. ఈ ఘటనలో బాలుడు మృతి చెందాడు. గాయపడ్డ బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం...

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.స్వామి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతుండగా, నడకదారి భక్తులకు 2 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు తెలిపారు.

07:47 - January 20, 2016

దైవ భక్తి మన కేసీఆర్ సార్కే ఎక్వ వుంది అన్కున్న.. ఎందుకంటే.. మొన్ననే ఆయత చండీ యాగం జేశి అశేష తెలంగాణలున్న దరిద్రాన్ని పోడగొట్టె గదా.. కేసీఆర్ సారు గురించి అట్లుండని గని.. గా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జి మేడం గుడ.. భక్తితోని భజనలు జేస్తున్నదట. మరి మేడం ఏం యాగాన్కి పూన్కున్నదో సూద్దాం పార్రి. 

07:45 - January 20, 2016

తెలుగు, తమిళంతోపాటు హిందీ సినిమాల్లోనూ తనదైన నటనతో ఆకట్టుకున్న అసిన్.. మైక్రోమ్యాక్స్ కో ఫౌండర్ రాహుల్ శర్మను నేడు వివాహమాడింది. మంగళవారం ఉదయం ఢిల్లీలోని ప్రత్యేక చర్చిలో క్రిస్టియన్ పద్దతిలో వీరి పెళ్లి జరిగింది. 50మంది బంధువులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. సాయంత్రం రాహుల్ శర్మ ఫామ్‌హౌస్‌ ‘వెస్ట్‌ఎండ్ గ్రీన్స్’లో హిందూ సంప్రదాయంలో మరోసారి వీరు పెళ్లి చేసుకోనున్నారు. కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులతోపాటు క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే పెళ్లికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే... అసిన్, రాహుల్‌ల వెడ్డింగ్ రిసెప్షన్ ఈనెల 23న ముంబైలో గ్రాండ్‌గా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ముంబైలో జరగబోయే రిసెప్షన్‌కు బాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు. అక్షయ్ కుమార్ తో ఆల్ ఈజ్ వెల్ సినిమా చేసిన టైంలో రాహుల్ శ‌ర్మతో ఆసిన్ కు ప‌రిచ‌యమైంది. అదికాస్తా.. ప‌రిణ‌యానికి దారి తీసింది. పూరీజగన్నాథ్ తెరకెక్కించిన 'అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయి' చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన అసిన్. గ‌జిని, శివ‌మ‌ణి, ల‌క్ష్మి న‌ర‌సింహా త‌దిత‌ర చిత్రాల ద్వారా మంచి పేరు తెచ్చుకుంది. చివరికి మైక్రో మ్యాక్స్ అధినేతను పెళ్లాడి ఓ ఇంటిదైపోయింది. ఓకే... హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఆసిన్....

07:39 - January 20, 2016

తెలుగు రాష్ట్రాల్లో నకిలీ దందాలు మస్తు మొదలవుతున్నాయి. ఎక్కడో ఒక దగ్గర నకిలీ బట్టేవాజి గాళ్లు దొరుకుతున్నరు. కల్తీకాదేది కనర్హం అనే విధంగా ఉంది ప్రస్తుత పరిస్థితి. వీళ్లను ఎట్ల జేస్తే సోయి కొస్తరో.. అరె రామశంద్రా.. వొక దిక్కు దొర్కుతనే వున్నరు మల్లో దిక్కు తయారు జేస్తనేవున్నరు. శెప్పీ శెప్పి నానోరే వోతున్నది గని.. ఆ సోడిగాళ్లు మాత్రం సోయికొస్తలేరు. వాళ్ల మీద మన్ను వడ మల్లా దొర్కిండ్రు.. ఎవ్వలనుకుంటుండ్రు. ఇగో ఈ బట్టెవాజీ గాళ్లె.. 

నాగోల్ లో హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎం లు దగ్ధం

హైదరాబాద్ : విద్యుదాఘాతంతో ఎల్బీనగర్‌ నాగోల్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎం కేంద్రం దగ్ధమైంది.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎం నుంచి పక్కనే ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎం వరకు మంటలు వ్యాపించాయి. స్థానికులు స్పందించి ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎం కేంద్రంలో మంటలు ఆర్పారు. 

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

విశాఖ : దక్షిణ మధ్యప్రదేశ్‌ నుంచి కర్ణాటక వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో బుధవారం తెలంగాణ, రాయలసీమ, కోస్తాలో ఒకటి, రెండు చోట్ల వానలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. 

07:37 - January 20, 2016

సుక్కురారం.. శనివార మొస్తె సాలు హైద్రావాదుల రోడ్ల పొంటి పైపులు వట్కోని నిలవడ్తరు పోలీసోళ్లు.. ఎందుకంటె తాగి బండ్లు నడ్పెటోళ్లు ఉంటరుగదా..? వాళ్ల తాట దీస్తందుకు.. ఒక్క హైద్రావాదులనే ఉండె నిన్నమొన్నటిదాక ఈ కథ.. ఇగ మెల్లెగ మెల్లెగ.. రాష్ట్రమంత ఇస్తరిస్తున్నట్టున్నరు.. నిన్న యాదగిరి గుట్టకాడ గూడ గొట్టాలు దిగేసుడు సుర్వు జేశిండ్రు పోలీసోళ్లు..

07:36 - January 20, 2016

నీతులు నియమాలు నీవంతు.. చేతలు కోతలు నావంతు అన్నట్టే ఉన్నది అనంతపురం జిల్లా అన్నదమ్ముల ముచ్చట గూడ.. నీతులు జెప్పుమంటే నీ పొడ్గు.. నా దొడ్డు జెప్తరు.. అచరణ మాత్రం ఈళ్లకు సంబంధం ఉండది అదేదో కథ ఉంటది సూడుండ్రి... ఊరోళ్లనందరిని ఉల్లిగడ్డ తినొద్దని చెప్పి ఇంట్ల అదే కూరదినె అయ్యగారు.. అగో సేమ్ అదే కథ. స్వచ్ఛ అనంతరంలో జేసీ ఏమన్నడో వీడియోలో సూడుండ్రి...

నేడు పీఎస్ ఎల్వీ సీ-31 ప్రయోగం...

నెల్లూరు : శ్రీహరికోట(సూళ్లూరుపేట): శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి బుధవారం ఉదయం 9.31కు పీఎస్‌ఎల్‌వీ సీ31 రాకెట్‌ను ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ ప్రయోగానికి సంబంధించి సోమవారం ఉదయం 9.31 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభించారు. 48 గంటలపాటు సాగే ఈ ప్రక్రియలో భాగంగా సోమవారం నాలుగో దశలో 2.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని, రెండో దశలో మంగళవారం 42 టన్నుల ద్రవ ఇంధనం నింపే కార్యక్రమాన్ని పూర్తిచేశారు. మంగళవారం రాత్రికి హీలియం, నైట్రోజన్ గ్యాస్‌లను నింపే కార్యక్రమాన్ని చేపట్టారు.

07:35 - January 20, 2016

హెచ్ సీయూలో దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికుతున్నాయి. జాతీయ వ్యాప్తంగా ఓ చర్చ జరుగుతోంది. వివిధ రాజకీయ పక్షాలు మద్దతు ప్రకటించాయి. వెంటనే ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో కమలాకర్ రావు (కాంగ్రెస్), ఎస్.కుమార్ (బిజెపి), జాన్ వెస్లీ (కేవీపీఎస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

07:33 - January 20, 2016

చిరంజీవి తిరిగి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 'కత్తి' సినిమాలో చిరంజీవి లుక్ ఇదే అంటూ మెగా అభిమానులు వెబ్ మీడియాలో చేస్తున్న హడావిడి టాపిక్ ఆఫ్ ది డేగా మారింది. ఈ లేటెస్ట్ లుక్ లో కనపడుతున్న చిరంజీవిని చూస్తూ ఉంటే చిరు ఈసినిమా కోసం గుబురు మీసాన్ని బాగా పెంచుతున్నట్లుగా అర్ధం అవుతుంది. అయితే చిరంజీవి నటిస్తున్న 'కత్తి' తమిళ సినిమాలో హీరో విజయ్ ఎటువంటి మీస కట్టుతో కనిపించడు. ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేయడంతో ఒక పాత్రలో దొంగగా మరొక పాత్రలో సామాజిక కార్యకర్తగా కనిపిస్తాడు. ఈ రెండు పాత్రలకు కూడ విజయ్ కు మీస కట్టు పెట్టలేదు అయితే ఇప్పుడు చిరంజీవికి ఈ రీమేక్ లో మీసం అవసరం ఎందుకు వచ్చింది అన్న విషయం ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నగా మారింది. ఎంతో కాలంగా ఊరించిన చిరంజీవి 150వ సినిమాకు చరణ్ పుట్టిన రోజైన మార్చి 27న ముహూర్తం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇదిలాఉంటే ఇటీవల గోవా సన్ బర్న్ ఫెస్టివల్ లో యంగ్ హీరోస్ తో ఫొటోలకు ఫోజులిచ్చిన చిరంజీవి చాలా హుషారుగా కనిపించారు. రామ్‌చరణ్‌, వరుణ్‌తేజ్ లతో పాటు రానా, రవితేజ, నిర్మాత దిల్‌రాజు తదితరులతో కలిసి ఎంజాయ్ చేశారు చిరు.

07:23 - January 20, 2016

తెలుగులో సూపర్ హిట్ కామెడీ టివీ షో అయిన జబర్దస్త్. టాలీవుడ్ ని ఎట్రాక్ట్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ ఆర్టిస్టుల్లో చాలామంది వెండితెరకు ఎక్కుతున్నారు. ఏదో ఒక తెలుగు మూవీలో ఈ టీమ్ కనిపించడం మామూలైపోయింది. పవన్ కళ్యాణ్ తాజా సినిమా సర్దార్ గబ్బర్ సింగ్‌‌లో ఈ టీమ్ కామెడీకి పెద్ద పీట వేశారు. సన్నీ, సుడిగాలి సుధీర్, షకలక శంకర్, వేణు పోలీస్ డ్రెస్సుల్లో కనిపించడం విశేషం.ఈ టీమ్ అంతా పవన్ ఫ్యాన్సేనని యూనిట్ ప్రకటించింది కూడా. షకలక శంకర్ అయితే పవన్‌‌కు గుడి కట్టిస్తానని ఆ మధ్య స్టేట్‌మెంట్ ఇచ్చాడు. సుధీర్, శంకర్ తమ స్కిట్ షోలలో పవన్‌‌ను ఇమిటేట్ చేస్తూ తమ వీరాభిమానాన్ని చాటుకున్నారు. సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రం షూటింగ్ సందర్భంగా వీళ్ళు సెట్స్‌‌లో సెల్ఫీ తీసుకుని ఎంజాయ్ చేశారు. బాబీ దర్శకత్వంలో ఈ మూవీ సమ్మర్‌‌లో రిలీజ్ కానుంది.

07:14 - January 20, 2016

హైదరాబాద్ : చిత్రంతో నిర్మాతగా సక్సెస్ అందుకున్న సుకుమార్‌కు నాన్నకు ప్రేమతో హిట్‌ జోష్ పెంచింది. నాన్నకు ప్రేమతో సక్సెస్‌‍‌ను ఆస్వాదిస్తూనే తరువాతి ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే పనిలో పడిపోయాడు ఈ లెక్కల మాస్టర్. అది కూడా ఓ యంగ్ హీరోతో. సుకుమార్ తన సోదరుడి కొడుకు అశోక్‌ని హీరోగా పరిచయం చేసే పనిలో ఇప్పుడు బిజీగా ఉన్నాడు. త్వరలో పట్టాలెక్కనున్న ఆ సినిమాకు ‘దర్శకుడు’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశాడట. ఇక తన ఫ్యామిలీకి చెందిన వ్యక్తినె పరిచయం చేయబోతోన్న సుకుమార్ పక్కా స్క్రిప్ట్, డైలాగ్స్‌ రెడీ చేస్తున్నట్లు టాక్

07:06 - January 20, 2016

ప్రకృతి ప్రసాదించిన వరాల్లో సహజ సిద్ధమైన ఔషధం 'తేనె' ఒకటి.. ఒకప్పుడు అడవుల్లో మాత్రం లభించే ఈ తేనె ఇప్పుడు పట్టణాల్లో అదీ ఇళ్ల పెరడులో కూడా తయారవుతోంది. తేనె వాడకం ఈ నాటిది కాదు. అనాదినుంచి కూడా వాడుకలో ఉంది. శిలాయుగం చివర్లోనే అడవి తేనె సేకరణ జరిగిందని చెప్పడానికి ఆధారాలున్నాయి. అంటే సుమారు పది వేల సంవత్సరాల మొదలు, యాభై వేల సంవత్సరాల ముందునుంచి ఈ తేనె మాధుర్యాన్ని చవి చూస్తూ ఉన్నారని చెప్పవచ్చు. నిజానికి తేనెటీగ జీవన చరిత్రను ప్రపంచానికి పరిచయం చేసిన కీర్తి స్పెయిన్ శాస్తజ్ఞ్రుడు హ్యూబర్‌కు దక్కుతుంది. 
తేనె లో నాలుగు రకాలు....
పట్టు తేనె, పుట్ట తేనె, కర్ర తేనె, తొర్ర తేనె. పట్టు తేనె ఈగలు పెద్దవిగా ఉండి, సాధారణంగా చెట్ల కొమ్మలకు, నగరాల్లో ఇళ్ళ పై కప్పులకు తెరలను నిర్మించుకుంటాయి. పుట్ట తేనె ఈగలు అడవుల్లో తమ తెరను గుహల్లోను, చీమల పుట్టల్లోను నిర్మించుకుంటాయి. కర్ర తేనె ఈగలు చిన్నవిగా ఉండి చెట్ల కొమ్మలకు తమ చిన్న తెరను నిర్మించుకుంటాయి. తొర్ర తేనె ఈగలు అడవుల్లో చెట్ల తొర్రల్లో నిర్మించుకుంటాయి. పట్టు తేనె రుచికి కొద్ది వగరుగా ఉంటుంది. మిగిలిన మూడు రకాల తేనెలు తీపిగా ఉండును. తేనె రకాల్లో పుట్ట తేనె శ్రేష్టమని చాలా మంది భావిస్తారు.
తేనెలోఎంజైములు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా...
తేనెలో కాల్షియం, రాగి, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, భాస్వరం, పొటాషియం, జింక్, సల్ఫర్, సోడియం, సిలికాన్ వంటి ఖనిజలవణాలు, థైమీన్, రిబోఫ్లావిన్, పైరిడాక్సిన్, పాంటోథెనిక్ యాసిడ్, నికోటెనిక్ యాసిడ్... లాంటి విటమిన్లూ పుప్పొడి ద్వారా చేరిన ప్రోటీన్లూ అమైనోఆమ్లాలూ ఎంజైములూ ఉంటాయి. ముదురు రంగు తేనెలో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజలవణాలూ ఎక్కువగా ఉంటాయి. ఇన్ని రకాల పోషకాలున్నాయి కాబట్టే తేనెను బలవర్ధకమైన ఆహారంగా చెబుతారు. శక్తిని అందించే తేనెలో ఎలాంటి కొలెస్ట్రాల్ ఉండదు. తేనెల్లో రంగులూ రకాలూ ఉంటాయి. పసుపు, బూడిద, ముదురు కాఫీ, నలుపు... ఇలా భిన్నవర్ణాలతోపాటు కొన్ని తేనెలు వర్ణవిహీనంగానూ ఉంటాయి. అలాగే ఒక్కో తేనె ఒక్కో రకమైన రుచినీ సుగంధాన్నీ వెదజల్లుతుంటుంది. అంటే తేనె రంగు, సువాసన, రుచి... అన్నీ మధుకీటకాలు సేకరించే పూలజాతుల మీద ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు యూకలిప్టస్, నిమ్మ, నారింజ పూల నుంచి మకరందాన్ని సేకరిస్తే అది ఘాటైన వాసననీ రుచినీ కలిగి ఉంటుంది. చాలామంది వంటలో పంచదార కన్నా తేనె వాడటానికి ఇష్టపడతారు. బేకింగ్ ఉత్పత్తులో తేనె వాడటంవల్ల రుచిగా ఉండటంతోపాటు అవి సువాసన వెదజల్లుతూ ఉంటాయి. పైగా ప్రాసెస్ చేయకుండా నేరుగా తేనెపట్టు నుంచి తీసిన జుంటి తేనెలో ఎంజైములు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా దొరకుతాయి.
తేనెతో ఉపయోగాలు...
తేనెను రోజూ మన దంతాలకు, చిగుళ్ళకు పట్టించినట్లయితే అవి తెల్లగా మెరవడమే కాకుండా, దంత క్షయం , దంతాలు త్వరగా ఊడటం లాంటివి జరగవు. ఒక కప్పు నీటిలో రెండు స్పూన్ల తేనెను కలుపుకొని పడుకోబోయే ముందు తాగితే చక్కటి నిద్ర పడుతుంది.అర గ్లాసు గోరు వెచ్చని నీటిలో ఒక స్పూను తేనె, సగం నిమ్మ రసమూ కలిపి రోజూ ఉదయాన పరగడపున తాగితే అది మలబద్ధకానికి ,హైపర్ అసిడిటీకి చక్కని ఔషదంగా పని చేస్తుంది.
~ కాలిన గాయాలకీ చర్మ క్యాన్సర్లకీ పుండ్లకీ హనీ పూస్తే త్వరగా తగ్గుముఖం పడతాయి. ఇది 'యాంటీ మైక్రోబియల్' ఏజెంట్‌గా చక్కగా పనిచేస్తుంది
మొటిమలు:తేనె (15 భాగాలు), దాల్చిన చెక్క పొడి (1 భాగం)... ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ రాత్రి పూట 2వారాలపాటు ప్రయోగిస్తే మొటిమలు తగ్గుతాయి.
కళ్ల నొప్పి:2 చెంచాలు తేనెను కప్పు దాల్చిన చెక్క కషాయానికి కలిపి పుచ్చుకుంటే కీళ్లనొప్పిలో ఉపశమనం లభిస్తుంది.
కాలిన గాయాలు:తేనెకు పసుపును చేర్చి బాగా కలిపి పై పూతగా ప్రయోగిస్తే అగ్నిదగ్ధ వ్రణాలు మచ్చపడకుండా ఇనె్ఫక్షన్‌కి గురికాకుండా త్వరగా తగ్గుతాయి.
జలుబు, దగ్గు, గొంతునొప్పి:తేనె (4్భగాలు), పిప్పళ్ల పొడి (1 భాగం), మిరియం పొడి, లవంగాల పొడి, జీలకర్ర పొడి కలిపి గొంతు తగిలేలా పుక్కిట పడితే గొంతునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
పెదవుల పగుళ్లు:2 భాగాల తేనెకు 1 భాగం మీగడను, నాలుగైదు చుక్కలు రోజ్ వాటర్‌ని కలిపి పెదవుల మీద ప్రయోగిస్తే పెదవుల పగుళ్లు తగ్గి నున్నగా తయారవుతాయి.
పిల్లల్లో విరేచనాలు:తేనెకు జాజికాయ పొడిని కలిపి ఇస్తే అతిసారం తగ్గుతుంది.
వ్యాధి నిరోధకశక్తి పెరగడానికి:3 భాగాల తేనెకు 1 భాగం దాల్చిన చెక్క పొడిని కలిపి పుచ్చుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
పంటి నొప్పి లేదా దంతశూల:3 భాగాల తేనెకు 1 భాగం దాల్చిన చెక్క పొడిని కలిపి చిగుళ్ల పైన ప్రయోగిస్తే వాపు తగ్గి దంతశూల నుంచి ఉపశమనం లభిస్తుంది.
స్థూలకాయం:చెంచాడు దాల్చిన చెక్క పొడిని 2 గ్లాసుల నీళ్లకు చేర్చి అరగ్లాసు కషాయం మిగిలేంతవరకూ మరిగించాలి. దీనికి మూడు టీస్పూన్లు తేనెను కలిపి ఆహారానికి అరగంట ముందు రెండు పూటలా పుచ్చుకుంటూ ఉంటే స్థూలకాయంలో మంచి ఫలితం కనిపిస్తుంది.
ముఖంమీద మంగు మచ్చలు:తేనెకు తగినంత పాల పొడి కలిపి ఫేస్‌మాస్క్ మాదిరిగా పెట్టుకుంటుంటే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
మృతకణాలను తొలగించడానికి:తేనెను బాదం పప్పు పొడికి కలిపి పేస్టుగాచేసి ముఖం మీద ప్రయోగించి రుద్దుకోవాలి. ఇది చక్కని స్క్రబ్‌గా పనిచేస్తుంది. చర్మంమీద పేరుకుపోయిన మృత కణాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
ముఖ చర్మం స్నిగ్ధంగా తయారుకావడానికి:తేనె (3 భాగాలు), కోడిగుడ్డు తెల్లసొన (1 భాగం), గ్లిజరిన్ (1 భాగం), మసూర్‌దాల్ (ఎర్ర కందిపప్పు) తగినంత... ఈ నిష్పత్తిలో కలిపి ముఖంమీద ఫేస్ ప్యాక్ మాదిరిగా ప్రయోగించాలి.
వృద్ధాప్యం:వృద్ధాప్య సమస్యల్లో తేనె చక్కగా ఉపయోగపడుతుంది. తేనె జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరాన్ని సేద తీరేలా చేస్తుంది. మెదడును నిశ్శబ్దపరుస్తుంది. చర్మాన్ని బిగువుగా చేస్తుంది. చిన్నపాటి నొప్పులను దూరంచేస్తుంది. ఒక జగ్గులో 3 కప్పుల తేనెను, 2 కప్పుల సిడర్ వెనిగార్‌ని, 1 కప్పు నీళ్లను కలపాలి. దీనిని ప్రతి రోజూ ఉదయం ఒక కప్పు చొప్పున తాగుతుంటే వృద్ధాప్యంలో ఆరోగ్యంగా ఉంటుంది.
రక్తహీనత:ఎర్ర రక్తకణాలు తక్కువగా ఉన్నవారు, హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్నవారు తేనెను వాడి ప్రయోజనం పొందవచ్చు. తాజా ఆకుకూరల మీద తేనెను పరిచి తీసుకుంటుంటే హితకరంగా ఉంటుంది. రక్తహీనత క్రమంగా దూరమవుతుంది.
కీళ్లనొప్పి:1 లీటరు వేడి నీళ్లకు 1 కప్పు తేనెను, అరకప్పు నిమ్మ రసాన్ని చేర్చి నూలు గుడ్డను ముంచి నొప్పి, వాపు ఉన్నచోట కీలుమీద పరిస్తే ఉపశమనం లభిస్తుంది.
నోటి దుర్వాసన: ఒక బాటిల్‌లో మూడువంతులు సిడర్ వెనిగార్‌ని నింపి, కప్పు తేనెను కలపాలి. బాగా గిలకొట్టాలి. దీనిని ఆహారం తర్వాత వౌత్‌వాష్‌గా పుక్కిట పట్టాలి. చివరగా నీళ్లతో పుక్కిలించాలి. దీంతో నోటి దుర్వాసన దూరమవుతుంది.
శయ్యామూత్రం (బెడ్ వెట్టింగ్):చిన్నపిల్లలు పక్క తడుపుతున్నప్పుడు రెండు టీ స్పూన్ల తేనెను పిల్లలకు రెండుపూటలా ఇస్తుండాలి. సాయంత్రం అదనపు నీళ్లను నియంత్రించాలి.
సెగ గడ్డలు:రెండు చెంచాలు తేనెను, కోడిగుడ్డు తెల్లసొనను, గోధుమ పిండిని కలిపి పేస్టుమాదిరిగా చేసి సెగ్గడ్డమీద పూసి పైన గుడ్డతో కట్టుకట్టాలి. రాత్రి పగలూ సెగ గడ్డ పగిలి చీము స్రవించేవరకూ దీనిని మార్చుతుండాలి.
బ్రాంకైటిస్, దగ్గు:తేనెను వేడి పాలకు గాని, కాఫీకి గాని లేదా టీకి గాని కలిపి పుచ్చుకుంటే గొంతులో అసౌకర్యంలో ఊపిరితిత్తుల్లో పట్టేసినట్లు ఉండటం తగ్గుతుంది
పొడి దగ్గు:చెంచాడు అల్లం రసానికి చెంచాడు తేనెను కలిపి మూడు పూటలా పుచ్చుకుంటూ వుంటే దగ్గునుంచి ఉపశమనం లభిస్తుంది
కాలిన గాయాలు:స్టౌవద్ద కాలిన గాయాలకు, వేడి నీళ్లుపడటంవల్ల కాలిన గాయాలకు తేనెను నేరుగా ప్రయోగించవచ్చు. గాటుపడకుండా గాయం మానుతుంది.
చర్మం పగుళ్లు:మోచేతులు, పాదాల వంటి భాగాల్లో చర్మం పగిలి ఇబ్బందిని కలిగిస్తుంటే తేనె, నిమ్మరసం ఆలివ్ నూనె కలిపి పేస్టులా చేసి ప్రయోగించాలి.
తేనె వాడకూడని సందర్భాలు....
మధుమేహ వ్యాధిగ్రస్తులు యథేచ్ఛగా తేనెను వాడకూడదు. ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే తేనెను వాడాలి.
తేనెను వేడి పదార్థాలతో కలిపి వాడకూడదు. అలాగే పిప్పళ్లు, మిరియాలు వంటి వాటితో కలిపి నేరుగా వాడకూడదు. తేనెను మరిగించకూడదు. తేనె ఉష్ణ వీర్య పదార్థం కాబట్టి తేనెను నేరుగా మంటపైన వేడిచేయకూడదు. తేనెను వేడి వాతావరణంలోనూ, ఎండాకాలంలో పరిమితంగానే వాడాలి. (తేనెలో రకరకాల పువ్వుల మకరందాల అంశ ఉంటుంది. వీటిల్లో విష పుష్పాలు సైతం ఉంటాయి. .)
మసాలా పదార్థాలతోనూ, మద్యంతోనూ, ఆవనూనె వంటి పదార్థాలతోనూ కలపకూడదు.
తేనెను వర్షం నీళ్లతో కలిపి వాడకూడదు.
తేనెను ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఫ్రిజ్‌లో ఉంచితే పంచదార స్పటికాలు తయారవుతాయి. అలాంటి సందర్భాల్లో ఎండలో ఉంచితే సరిపోతుంది. లేదా తేనె సీసాను వేడి నీళ్లలో పెట్టి పరోక్షంగా వేడిచేస్తే తేనె స్పటికాలు కరిగి తిరిగి తేనె తయారవుతుంది.
తేనెను, నెయ్యిని సమాన భాగాలుగా తీసుకోకూడదు (సంయోగ విరుద్ధం).

06:52 - January 20, 2016

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ నగర సమస్యలు మరోసారి తెరమీదకు వస్తున్నాయి. మహానగరంగా విరాజిల్లుతున్న హైదరాబాద్ ను పారిశుద్ధ్యం సమస్య వెక్కిరిస్తోంది. హైదరాబాద్ లో పారిశుద్ధ్యం ఒక ప్రధాన సమస్యగా మారడానికి కారణం ఏమిటి? ఈ సమస్య పరిష్కారానికి తక్షణం చేపట్టాల్సిన చర్యలేమిటి? పారిశుద్ధ్యం నిర్వహణలో కీలకపాత్ర పోషించే పారిశుద్ధ్య కార్మికుల విషయంలో జీహెచ్ఎంసీ ఎలా వ్యవహరిస్తోంది? పారిశుద్ధ్య నిర్వహణలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? ఈ అంశాలపై జనపథంలో పారిశుద్ధ్య కార్మికుల యూనియన్ నేత జె. వెంకటేష్ విశ్లేషించారు. 

06:50 - January 20, 2016

77 లక్షల మంది ఓటర్లున్న మహానగరం మన హైదరాబాద్. కోటిమందిని తన గుండెల్లో దాచుకున్న విశ్వనగరమిది. విద్య, వైద్య రంగాల్లో దూసుకెళ్తూ, ఐటీకి అడ్డాగా మారిన హైటెక్ సొగసరి. అభివ్రుద్ధితో పాటు సమస్యలూ తిష్టవేస్తున్నాయి. ఇందుకు చక్కటి ఉదాహరణ పారిశుద్ధ్యం. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ ఇలా ఎన్ని వినసొంపైన నినాదాలిచ్చినా, వాటి ప్రచారానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా హైదరాబాద్ వాసులను పారిశుద్ధ్య సమస్య కలవరపెడుతూనే వుంది. ప్రజారోగ్యాన్ని కాపాడడంలో పారిశుద్ధ్య విభాగానిదీ కీలకపాత్రే. ఎక్కడ చెత్త అక్కడ పేరుకుపోతే వ్యాధికారక క్రిములు పెరిగి, వ్యాధులు విజ్రుంభిస్తాయి. హైటెక్ సొగసులున్న హైదరాబాద్ లాంటి నగరాల్లో సైతం ఈగలు, దోమలు విజృభించడానికి పారిశుద్ధ్య నిర్వహణా వైఫల్యాలూ కారణమే.

ఆరోగ్యాలకు దిక్కెవరు ?
హైదరాబాద్ మహానగరంలో దాదాపు 8 వేల కిలోమీటర్ల రోడ్లున్నాయి. కానీ, అందులో నాలుగో వంతు రోడ్లను కూడా శుభ్రంగా వుంచలేకపోతున్నారు. కేవలం 2 వేల కిలోమీటర్ల రోడ్ల మీదనే పారిశుద్ధ్య నిర్వహణ కనిపిస్తోంది. దీంతో అనేక ప్రాంతాల్లో రోడ్ల మీదే చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి. రోడ్ల వెంట డంపర్ బిన్ లలో పోగుబడ్డ చెత్తను ఎప్పటికప్పుడు డంపింగ్ యార్డులకు తరలించడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. తగినంత మంది సిబ్బందిని నియమించకపోవడం, చెత్తను తరలించేందుకు అవసరమైనన్ని వాహనాలు సమకూర్చకపోవడమూ సమస్యకు కారణమవుతోంది. జీహెచ్ఎంసీ అధికారిక లెక్కల ప్రకారమే హైదరాబాద్ లో ప్రతిరోజూ 4వేల టన్నుల చెత్త పోగుబడుతోంది. జీహెచ్ఎంసీ లెక్కల్లోకి రాని చెత్త దీనికి అదనం. ఇంత చెత్తను శుభ్రం చేయడానికి, ఎత్తిపోయడానికీ, తరలించడానికి వున్నది కేవలం 18వేల మంది సిబ్బంది మాత్రమే. వీరిలోనూ చాలామంది పేర్లు పట్టికలో వుంటాయి తప్ప వాస్తవంగా పనిచేయరన్న ఫిర్యాదులున్నాయి. కాగితాల్లో సిబ్బంది పనిచేస్తున్నట్టుగా చూపించి, ఆ డబ్బులను కొంతమంది అక్రమార్కులు కాజేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పారిశుద్ధ్య నిర్వహణలోనూ అధికారులు ఇలా కక్కుర్తిపడి, చెత్తనే భోంచేస్తుంటే, ఇక హైదరాబాద్ ప్రజల ఆరోగ్యాలకు దిక్కెవరు?

హైదరాబాద్ లో సాధారణ చెత్తతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు, బయోమెడికల్ వేస్ట్, ఎలక్ర్టానిక్ వ్యర్థాలు కూడా భారీ సంఖ్యలో పోగుపడి, ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. అత్యధిక ఎలక్ర్టానిక్ వ్యర్థాలు పోగుబడుతున్న నగరాల్లో హైదరాబాద్ దేశంలోనే ఐదవ స్థానాన్ని ఆక్రమించింది. ఏటా దాదాపు 45 వేల టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పోగుపడుతున్నా, అందులో సగభాగం సాధారణ చెత్తలో కలుస్తున్నా, వాటి నిర్మూలనలో తీసుకుంటున్న చర్యలు ఏమిటన్నది ప్రశ్నార్ధకం. మరోవైపు ఆస్పత్రుల్లో పోగుబడే బయో మెడికల్ వ్యర్థాలను ఇష్టమొచ్చినట్టు రోడ్ల మీదనే సాధారణ చెత్తతో కలిపి తగలబెడుతుండడంతో 20శాతం మంది అంటు వ్యాధుల బారినపడుతున్నారు. సిటీలో ప్రతి రోజూ దాదాపు 50 టన్నుల బయోమెడికల్ వ్యర్థాలు సాధారణ చెత్తలో కలుస్తుండడం చిన్న విషయమేమీ కాదు. ఇంత ప్రమాదకరమైన చెత్త, ఇంత భారీ స్థాయిలో పోగుబడుతున్నా, వాటి నిర్మూలన మీద జీహెచ్ఎంసీకానీ, ప్రభుత్వం కానీ తగినంత శ్రద్ధ పెట్టకపోవడం ఆందోళనకర పరిణామం. హైదరాబాద్ లో డంపింగ్ కేంద్రాలకు చెత్తను తరలించేందుకు కేవలం 564 వాహనాలు మాత్రమే వున్నాయి. వీటిలో వందకు పైగా అద్దె వాహనాలున్నాయి. వీటిలో సగం తుప్పు పట్టిన వాహనాలే. ఇలాంటి నిర్వహణా వైఫల్యాలే పారిశుద్ధ్య సమస్యకు కారణమై, హైదరాబాద్ నగరపాలిటవాసుల శాపంగా మారుతున్నాయి.

కోట్లాది రూపాయల ఖర్చు...
స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ భారత్ అంటూ ప్రచారానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం, సెలబ్రిటీలతో హడావిడి చేయడం వల్ల పారిశుద్ధ్య సమస్య పరిష్కారం కాదన్నది గత ఏడాది కాలంగా నిరూపితమైంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు సవ్యంగా ఆలోచించాలి. ప్రచార ఆర్భాటాలు ప్రదర్శించడం మాని, క్షేత్ర స్థాయి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న సిబ్బందికి అవసరమైన పనిముట్లు సమకూర్చిపెట్టాలి. అవసరాలకు తగ్గట్టుగా సిబ్బంది సంఖ్యను, వాహనాల సంఖ్యను పెంచడమే కాకుండా వారి యోగక్షేమాల గురించి, ఆరోగ్య సంరక్షణ చర్యల గురించి ఆలోచించాలి. పారిశుద్ధ్య విభాగంలో జరుగుతున్న అవినీతిని నిలువరించాలి.

06:45 - January 20, 2016

ఆస్ట్రేలియా : ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా, మాజీ చాంపియన్ టీమిండియా జట్ల ఐదుమ్యాచ్ ల వన్డే సిరీస్ సర్కస్...కాన్ బెర్రా మనూకా ఓవల్ కు చేరింది. మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే ఈ పోటీ లో టీమిండియా పరువు కోసం పోరాడుతుంటే....ఇప్పటికే 3-0 ఆధిక్యంతో సిరీస్ ఖాయం చేసుకొన్న కంగారూ టీమ్ మాత్రం క్లీన్ స్వీప్ కు గురిపెట్టింది. రెండుజట్లు పలు మార్పులతో బరిలోకి దిగటం ఖాయంగా కనిపిస్తోంది. పెర్త్, బ్రిస్బేన్, మెల్బోర్న్ వేదికలుగా ముగిసిన మొదటి మూడువన్డేల్లోనూ...టీమిండియా తనముందుంచిన లక్ష్యాలను అలవోకగా చేదించి..ఇప్పటికే 3-0తో సిరీస్ ఖాయం చేసుకొన్న ప్రపంచ నెంబర్ వన్ కంగారూ టీమ్...ఐదుకు ఐదుమ్యాచ్ లూ నెగ్గాలన్న పట్టుదలతో ఉంది. బ్యాటింగ్ పవర్ తో టీమిండియా బౌలింగ్ ఎటాక్ ను కకావికలు చేస్తూ వచ్చిన ఆస్ట్రేలియా కాన్ బెర్రాలోని మనూకా ఓవల్ లో జరిగే నాలుగో వన్డేలో సైతం అదే దూకుడు ప్రదర్శించాలన్న పట్టుదలతో ఉంది. డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తిరిగి జట్టులో చేరడంతో షాన్ మార్ష్ ను పక్కనపెట్టే అవకాశాలు లేకపోలేదు. బౌలింగ్ కూర్పులో సైతం..ఆఫ్ స్పిన్నర్ నేథన్ లయన్ ను కంగారూటీమ్ మేనేజ్ మెంట్ తుదిజట్టులో చేర్చుకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కెప్టెన్ స్టీవ్ స్మిత్, మాజీ కెప్టెన్ జార్జి బెయిలీ, సూపర్ హిట్టర్ గ్లెన్ మాక్స్ వెల్ కళ్ళు చెదిరే ఫామ్ లో ఉండడంతో...కంగారూటీమ్ బ్యాటింగ్ లైనప్ అమేయంగా కనిపిస్తోంది. 

టీమిండియా అయోమయం..
మరోవైపు టీమిండియా పరిస్థితి మాత్రం బలమైన బ్యాటింగ్, బలహీనమైన బౌలింగ్ తో అయోమయంగా తయారయ్యింది. 310 పరుగుల భారీటార్గెట్లను ప్రత్యర్థి ఎదుట ఉంచినా...ధోనీసేనకు ఓటమి వెంట ఓటమి తప్పడంలేదు. బరీందర్ స్రాన్, గురుకీరత్ సింగ్ మాన్, రిషి ధావన్ లాంటి యువబౌలర్లకు తుదిజట్టులో చోటు కల్పించినా భారత టీమ్ మేనేజ్ మెంట్ కు నిరాశ తప్పలేదు. 2015 వన్డే ప్రపంచ కప్ తర్వాత టీమిండియా ఇప్పటి వరకూ ఆడిన 14 వన్డేల్లో ఆరు విజయాలు, ఎనిమిది పరాజయాల రికార్డుతో ఉంది. ఆతిథ్య ఆస్ట్రేలియా మాత్రం స్వదేశంలో ఆడిన గత 19 వన్డేల్లోనూ అజేయంగా నిలిచింది. అంతేకాదు వరుసగా 17 సిరీస్ లు నెగ్గి..తనకు తానే సాటిగా నిలిచింది. మ్యాచ్ కు వేదికగా ఉన్న కాన్ బెర్రా మనూకా ఓవల్ పిచ్...లో బౌన్స్ తో...స్లో బౌలర్లకు అనువుగా ఉండే అవకాశం ఉంది. గతంలో ఇదే గ్రౌండ్లో రెండుమ్యాచ్ లు ఆడిన...కంగారూ టీమ్ రెండుకు రెండు విజయాలు నమోదు చేసింది. 2013లో వెస్టిండీస్, 2014లో సౌతాఫ్రికా జట్లతో ఆడిన వన్డేల్లో 329 పరుగుల లక్ష్యాన్ని ఉంచి విజయవంతంగా కాపాడుకోగలిగింది.
మనూకా ఓవల్ లో ముందుగా బ్యాటింగ్ చేసినజట్లు మాత్రమే విజేతగా నిలవడం ఆనవాయితీగా వస్తోంది. దీనిని బట్టిచూస్తే...టాస్ కీలకమనడంలో ఎలాంటి సందేహమూలేదు. ఆస్ట్రేలియాకు చెలగాటం, టీమిండియాకు పరువు, ప్రతిష్టల సంకటంగా మారిన ఈమ్యాచ్ లో ధోనీసేన సంచలనం సృష్టిస్తుందా? లేక ఓటమి నెంబర్ నాలుగుతో మరింతగా దిగజారిపోతుందా?....తెలుసుకోవాలంటే మాత్రం మరికొద్ది గంటలపాటు వేచిచూడక తప్పదు.

06:41 - January 20, 2016

అసోం : కాంగ్రెస్‌ పాలనలో అసోం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. అసోం అసెంబ్లీకి వచ్చే ఏప్రిల్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కోక్రాఝర్‌లో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పదిహేనేళ్ల నుంచి అసోంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా మంచినీరు, విద్యుత్‌ వంటి సమస్యలు పరిష్కారం కాలేదని విమర్శించారు. నిరుద్యోగం తాండవిస్తోందన్నారు. బీజీపీకి అధికారం ఇస్తే 15 నెలల్లోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని మోడీ హామీ ఇచ్చారు. 

06:39 - January 20, 2016

జమ్మూ కాశ్మీర్ : రాష్ట్ర ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ మరణం తర్వాత ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పీడీపీ-బీజేపీ కలసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఇప్పుడు కూడా ఇదే దిశగా రెండు పార్టీల మధ్య అంతర్గతంగా చర్చలు సాగుతున్నాయి. బీజేపీతో పొత్తు కొనసాగింపు, ప్రభుత్వం ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అంశాన్ని పార్టీ నాయకురాలు మెహబూబా ముఫ్తీకి అప్పగిస్తూ పీడీపీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే అసెంబ్లీని రద్దు చేసి తాజా ఎన్నికలకు వెళ్లాలని నేఫనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా డిమాండ్‌ చేసిన తర్వాత పీడీపీ వైఖరిలో కొద్దిగా మార్పు వచ్చింది. బీజేపీతో పొత్తు కొనసాగింపుకే నిర్ణయం తీసుకున్నారు.

ఉప ముఖ్యమంత్రి పదవి ఉండదు..
అయితే ప్రభుత్వం ఏర్పాటుపై పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు. కశ్మీర్‌ను ఆదుకునేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో చాలా వాటిని అమలు చేయకపోవడాన్ని పీడీపీ నాయకులు వేలెత్తిచూపుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటుపై జాప్యం చేయడం ద్వారా అటు కేంద్రంతోపాటు, ఇటు బీజేపీపై ఒత్తిడి పెంచి, తమ డిమాండ్లను సాధించుకోవచ్చన్న ఆలోచలో మెహబూబాముఫ్తీ ఉన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కింద రాష్ట్రానికి ప్రకటించిన ఆర్ధిక సహాయాన్ని వెంటనే విడుదల చేయాలన్న డిమాండ్‌ లేవనెత్తుతున్నారు. ముఫ్తీ మహ్మద్‌ కేబినెట్‌లో బీజేపీకి చెందని నిర్మల్‌సింగ్‌ ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. ఇప్పుడు ఈ పదవి ఉండదని మెహబూబా ముఫ్తీ చెబుతున్నారు. బీజీపీని ఇరకాటంలో పెట్టి, తమ డిమాండ్లను సాధించుకునే ఎత్తుగడల్లో ఇదో భాగంగా భావిస్తున్నారు.

సయీద్ అంత్యక్రియలకు హాజరు కాని మోడీ...
కాశ్మీర్‌లో జరిగిన ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ అంత్యక్రియలు ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కాకపోవడాన్ని పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ తప్పుపడుతున్నారు. సయీద్‌ మృతదేహానికి ప్రధాని మోడీ ఢిల్లీలోని ఎయిమ్స్‌లోనే నివాళి అర్పించారు. ఎన్టీయే వన్‌ హయాంలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. ఎన్‌సీ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా తల్లి బేగం అక్తర్‌ జహాన్‌ చనిపోయినప్పుడు... శ్రీనగర్‌లో జరిగిన అంత్యక్రియలకు అప్పటి ప్రధాని వాజ్‌పేయి, ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ హాజరైన విషయాన్ని మెహబూబా ముఫ్తీ గుర్తు చేస్తున్నారు. అయితే గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే క్రమంలో పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ ఇప్పుడు బెట్టుతో ఉన్నా... త్వరలోనే దిగొచ్చి ప్రభుత్వం ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

06:33 - January 20, 2016

విజయవాడ : ఏజెన్సీ ఏరియాల్లో 501 వైద్యుల పోస్టులు, వెయ్యి నర్సు పోస్టులును కాంట్రాక్ట్‌ పద్దతిన నియమిస్తున్నట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై ప్రజల్లో విశ్వాసం కల్పించడానికి తాను ఈనెల 22న గుంటూరు జనరల్ ఆసుపత్రిలో మోకాలి ఆపరేషన్‌ చేయించుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. పరిమిత వైద్యసేవలు అందించేందుకు ఈనెల 25న విజయవాడలో మరోసారి సమావేశం నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. 

06:31 - January 20, 2016

హైదరాబాద్ : అరకొర సౌకర్యాలతో... అంతంతమాత్రం వైద్యంతో ఎప్పుడూ వార్తల్లో ఉండే ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మారబోతున్నాయి.. హైదరాబాద్‌తోపాటు.. జిల్లాల్లోని ఆస్పత్రులను బలోపేతం చేయడంపై దృష్టిపెట్టింది ప్రభుత్వం.. ఇందులో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టింది.. హైదరాబాద్‌ను హెల్త్ హబ్‌గా మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ముందు ఉస్మానియా ఆస్పత్రిని ఆధునికరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాతభవానాన్ని కూల్చొద్దని నిర్ణయించింది.. అక్కడే ఖాళీ స్థలంలో ట్విన్‌ టవర్స్ నిర్మించాలని చూస్తోంది. 2వేల పడకలతో ఈ టవర్స్‌కు ప్లాన్‌ చేస్తోంది ప్రభుత్వం. ఈ ఆస్పత్రికి అనుబంధంగా నర్సింగ్‌ కళాశాల ఏర్పాటు చేయనున్నారు.. తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొర్పొరేట్‌ స్థాయి వైద్యం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.. ఆస్పత్రులకు అదనపు భవనాలు, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్లాన్ చేస్తోంది.. ఉస్మానియాలో ట్విన్ టవర్స్, నిమ్స్‌లో అత్యాధునిక వైద్య సేవలదిశగా ప్రయత్నాలు చేస్తోంది.. ఎన్నికల కోడ్ ముగిశాక నిమ్స్, గాంధీ కొత్త భవనాల డిజైన్లకు ప్రభుత్వం ఒకే చెప్పే అవకాశముంది.

గాంధీ ఆస్పత్రిలో అత్యాధునిక పరికాలు..
ఇక గాంధీ ఆస్పత్రిలోకూడా చాలా మార్పులు రాబోతున్నాయి. ఈ ఆస్పత్రికి అత్యాధునిక పరికాలు సమకూర్చాలని సర్కారు యోచిస్తోంది. ఎమర్జెన్సీ వార్డులో మెరుగైన సౌకర్యాలు కల్పించబోతున్నారు. అలాగే నిమ్స్‌లోకూడా అదనంగా మరిన్ని సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. గుండె సంబంధిత రోగులకోసం అయిదు అంతస్థులతో ఒక టవర్‌, కిడ్నీ వ్యాధిగ్రస్తులకోసం ఐదు అంతస్తులతో మరో టవర్‌ కట్టాలని ప్రభుత్వం తలపెట్టింది. మెటర్నిటీ విభాగం కోసం కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఎర్రమంజిల్‌లోని స్థలంలో కొత్త ఓపీ విభాగాన్ని ప్రారంభించనుంది.

వరంగల్ జైలులోని స్థలంలో అదనపు బ్లాక్‌లు..
హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లోని ప్రధాన ఆస్పత్రులుకూడా బలోపేతం చేయాలని సర్కారు సంకల్పించింది.. వరంగల్ ఎంజీఎంకు అనుబంధంగా కొత్తగా మరో భవనాన్ని నిర్మించాలని ప్రణాళికలు తయారుచేస్తోంది.. వరంగల్ జైలులోని స్థలంలో ఈ అదనపు బ్లాక్‌లు ఏర్పాటుచేయాలని యోచిస్తోంది.. నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలోకూడా కార్పొరేట్‌ స్థాయి వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది... అన్ని జిల్లా ఆస్పత్రుల్లో రోగుల సహాయకులకోసం బ్లాక్‌లు, షెల్టర్ల నిర్మాణానికి ప్లాన్‌ చేస్తోంది..

సిద్ధమైన నిమ్స్, గాంధీ ఆస్పత్రుల డిజైన్లు..
ఆస్పత్రుల ఆధునీకరణలోభాగంగా ఇప్పటికే నిమ్స్, గాంధీ ఆస్పత్రుల నవీనీకరణ డిజైన్లు సిద్ధమయ్యాయి.. ఎన్నికల కోడ్‌ ముగిశాక ఈ డిజైన్లకు సర్కారు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.. ఈ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తే ప్రజలు కార్పొరేట్‌ ఆస్పత్రులవైపు కన్నెత్తి చూడరని సర్కారు భావిస్తోంది.. ఆ దిశగా చర్యలు చేపట్టింది.

06:29 - January 20, 2016

హైదరాబాద్ : తెలంగాణ అటవీశాఖలో 42 సూపర్‌ న్యూమరరీ పోస్టులను సృష్టిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో పాటు మహబూబ్‌నగర్‌ మెడికల్‌ కాలేజీకి 462 పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీచేసింది. వీటితో పాటు కాలేజీ సూపరింటెండెంట్‌ కార్యాలయంకు 55, ప్రిన్సిపల్‌ ఆఫీసుకు 24 పోస్టులు, క్లినికల్‌ స్పెషాలిటీ విభాగానికి 302, నాన్‌ క్లినికల్‌ స్పెషాలిటీ విభాగానికి 81 పోస్టులను మంజూరు చేసింది. అదే విధంగా వరంగల్‌ ఎంజీఎంలో 147 పోస్టులను సృష్టిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

06:25 - January 20, 2016

హైదరాబాద్ : సెంట్రల్‌ వర్శిటీ పరిశోధక విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్య వెనుక.. రాజకీయ ఒత్తిళ్లే ప్రధాన కారణమని తెటతెల్లమవుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరు లేఖల ద్వారా.. కేంద్ర మంత్రిత్వ శాఖలు.. యూనివర్శిటీపై ఒత్తిళ్లు తేవడం వల్లే.. రోహిత్‌ సహా.. మరికొందరు విద్యార్థులపై సస్పెన్షన్‌ వేటు పడిందని తెలుస్తోంది. ఆగస్టులో.. వర్శిటీకి చెందిన ఏబీవీపీ కార్యకర్తపై దాడి అంశానికి సంబంధించి.. కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి దత్తాత్రేయ అదే నెల 17న కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రికి లేఖ రాశారు. వర్శిటీ.. కులాల కుహరంగాను.. తీవ్రవాద, జాతివ్యతిరేక రాజకీయాలకు వేదికగానూ మారిందని దత్తాత్రేయ తన లేఖలో ఫిర్యాదు చేశారు. ఏబీవీపీ కార్యకర్తపై దాడి చేసిన వారిపై ఎలాంటి చర్యా తీసుకోలేదనీ లేఖలో దత్తాత్రేయ ఆక్షేపించారు. ఈ దాడి ఘటనలో రోహిత్‌ సహా ఆరుగురు విద్యార్థులు ముద్దాయిలుగా ఉన్నారు.

దత్తాత్రేయ లేఖ..
నిజానికి వర్శిటీలో ఎవరిపైనా ఎలాంటి దాడీ జరగలేదని.. ఆగస్టు 5న విచారణ జరిపిన యూనివర్శిటీ అధికారులు తేల్చి చెప్పారు. కానీ.. దత్తాత్రేయ లేఖతో.. కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖ ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించింది. ప్రతి నెలా ఒకటి చొప్పున లేఖలు రాస్తూ.. యూనివర్శిటీ అధికారులపై తీవ్ర ఒత్తిడిని పెంచింది. దత్తాత్రేయ లేఖ అందగానే.. సెప్టెంబర్‌ 3న కేంద్ర మంత్రిత్వ శాఖ అధికారులు.. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీకి లేఖ రాశారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని... దత్తాత్రేయ లేఖలోని అంశాలను పరిశీలించాలనీ సూచించారు. అంతటితో ఆగకుండా.. సెప్టెంబర్‌ 24, అక్టోబర్‌ 6, అదేనెల 20, నవంబర్‌ 19 తేదీల్లో.. వరుసగా లేఖాస్త్రాలను సంధించారు. మధ్యలో ఓ జీ-మెయిల్‌నూ పంపారు. దత్తాత్రేయ ఫిర్యాదుపై ఎందుకు స్పందించలేదని.. ఏబీవీపీ కార్యకర్తపై దాడికి బాధ్యులపై చర్యలెందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.

ఐదుగురిపై వేటు..
ఆగస్టు 5న ఎవరిపైనా దాడి జరగలేదని పేర్కొన్న విశ్వవిద్యాలయం అధికారులు.. రాజకీయ ఒత్తిళ్లతో రూటు మార్చుకున్నారు. రోహిత్‌కు జూలై నెల నుంచి రావాల్సిన స్టయిఫండ్‌ను నిలిపివేశారు. పేపర్‌ వర్క్‌ జాప్యమే దీనికి కారణమని వర్శిటీ చెబుతున్నా.. కక్ష సాధింపు చర్యలతోనే వర్శిటీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దత్తాత్రేయ లేఖ.. దాని వెంటే కేంద్ర మానవ వనరుల శాఖ నిలదీతల నేపథ్యంలో.. రోహిత్‌ సహా ఐదుగురిపై వర్శిటీ అధికారులు సస్పెన్షన్‌ వేటు వేశారు.

విద్యార్థుల రిలే నిరహార దీక్షలు..
తరగతులు, లైబ్రరీలలో తప్ప మరెక్కడా విద్యార్థులు కనిపించడానికి వీల్లేదంటూ.. జనవరి 3న వర్శిటీ రోహిత్‌ సహా ఐదుగురిపై ఆంక్షలు విధించింది. ఈ నిర్ణయానికి నిరసనగా విద్యార్థులు రిలే నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఈ క్రమంలోనే రోహిత్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేంద్ర మంత్రిత్వ శాఖ.. లేఖల ద్వారా ఒత్తిళ్లు తేవడం వల్లే.. రోహిత్‌ స్టయిఫండ్‌ కూడా పొందలేక పోయాడని.. రకరకాల చర్యలతో అతడిని మానసిక సంఘర్షణకు గురి చేశారని.. ఈ ఒత్తిళ్లు భరించలేకే రోహిత్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడనీ సహ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. 

రోహిత్ ఆత్మహత్య పై నోరువిప్పిన వీసీ

హైదరాబాద్ : ఎట్టకేలకు హెచ్ సియూ వీసీ నోరు విప్పారు. రోహిత్‌ ఆత్మహత్య దురదృష్టకరమని వీసీ అప్పారావు వ్యాఖ్యానించారు. రోహిత్‌ కుటుంబ సభ్యులకు ఆయన సానుభూతి తెలిపారు. రోహిత్‌ మరణం యూనివర్శిటీలో ప్రశాంతతను చెరిపివేసిందన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. సీనియర్‌ అధ్యాపకులు, డీన్‌, విద్యార్థి సంక్షేమ అధికారితో దీనిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

నేడు భారత్ ఆస్ట్రేలియా నాలుగో వన్డే..

ఢిల్లీ : నేడు భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో వన్డే మ్యాచ్ జరగనుంది. ఉదయం 8.50 గంటలకు మనుకా ఓవల్ వేదికగా మ్యాచ్ జరగనుంది.

మూడు జిల్లాల్లో గవర్నర్ పర్యటన..

హైదరాబాద్ : నేడు వరంగల్, మెదక్, నల్గొండ జిల్లాల్లో గవర్నర్ నరసింహన్ పర్యటించనున్నారు. మిషన్ భగీరథ పనులను ఆయన పరిశీలించనున్నారు. 

Don't Miss