Activities calendar

22 January 2016

కేంద్రానికి టీసర్కార్ లేఖ

హైదరాబాద్ : కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 2న హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాలో ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సెలవు ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది.

రేపు ఏఎన్‌యూ బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపు

గుంటూరు :  రేపు ఏఎన్‌యూ విద్యార్థి సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చారు. హెచ్‌సియూ విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్యకు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చారు.

సల్మాన్‌ ను వీడని హిట్‌ అండ్‌ రన్‌ కేసు

హైదారబాద్‌ : బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ను హిట్‌ అండ్‌ రన్‌ కేసు వీడటం లేదు. సల్మాన్‌ను హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడాన్ని సవాల్‌ చేస్తు సుప్రీంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసింది.

22:14 - January 22, 2016

హైదరాబాద్ : రోహిత్ ఆత్మహత్యతో... సెంట్రల్ వర్సిటీ రగిలిపోతోంది. న్యాయం కోసం... దళిత, బహుజన గొంతుకలు గర్జిస్తున్నాయి. పాలకులపై పోరుచేసేందుకు... జెండాలకు అతీతంగా ఒక్కటై నినదిస్తున్నాయి. మరోవైపు బరువెక్కిన గుండెలకు బాసట లభిస్తోంది. విద్యార్థుల ఆందోళనకు మద్దతు పెరిగిపోతోంది. హెచ్ సీయూ విద్యార్థులకు త్రిపుర సీఎం అండగా నిలిచారు. చదువుతూ పోరాడు-చదువుకై పోరాడమన్నారు మాణిక్ సర్కార్‌.

కొనసాగుతున్న ఆందోళనల పర్వం

హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో ఆందోళనల పర్వం కొనసాగుతూనే ఉంది. నిరసనలు, నినాదాలతో క్యాంపస్ మార్మోగిపోతోంది. తమ న్యాయపరమైన డిమాండ్ల కోసం విద్యార్థులు పోరాటం చేస్తూనే ఉన్నారు. వీసీ అప్పారావును తక్షణమే తొలగించాలని, కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, దత్తాత్రేయల రాజీనామాకు విద్యార్థులు డిమాండ్ చేశారు.

కొనసాగుతోన్న విద్యార్థుల దీక్షలకు సంఘీభావం

హెచ్ సీయూ విద్యార్థుల దీక్షలకు సంఘీభావం కొనసాగుతోంది. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్‌... సెంట్రల్ యూనివర్సిటీ సందర్శించారు. ఆయనతో పాటు తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఉన్నారు. ఆమరణ దీక్ష చేస్తున్న విద్యార్థులతో మాణిక్ సర్కార్ మాట్లాడారు. రోహిత్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాజకీయ ఒత్తిళ్లకు వీసీ తలొగ్గాడని మాణిక్ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహిత్‌ ఆత్మహత్యపై విచారణ ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా జరగాలన్నారు. విద్యార్థుల పోరాటానికి అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు మాణిక్ సర్కార్‌. విద్యాలయాల్లో రక్షణ కరువైందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల మద్దతు

హెచ్‌సీయూ విద్యార్థులకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల మద్దతు రోజురోజుకు పెరిగిపోతోంది. శుక్రవారం సీపీఎం రాజ్యసభ ఎంపీ సీమ, రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ చంద్రకుమార్‌, మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, ప్రొఫెసర్ కంచె ఐలయ్య, కాంగ్రెస్ మాజీ ఎంపీ మధు యాష్కీ వర్సిటీలో పర్యటించారు. ఆందోళనకారులకు మద్దతు ప్రకటించారు. ఇక వర్సిటీ ప్రొఫెసర్లు మేముసైతం అంటూ విద్యార్థులకు మద్దతు పలికారు. దీక్షా శిబిరానికి చేరుకుని విద్యార్థులకు సంఘీభావం తెలిపారు.

క్షీణిస్తోన్న విద్యార్థుల ఆరోగ్యం

మరోవైపు ఆందోళన చేస్తున్న విద్యార్థుల ఆరోగ్యం క్షీణిస్తోంది. బీపీ, షుగర్ లెవల్స్ పడిపోయాయి. కానీ విద్యార్థులు మాత్రం దీక్షను విరమించే ప్రసక్తే లేదంటూ తేల్చి చెబుతున్నారు. ప్రాణత్యాగానికైనా సిద్ధమంటూ ప్రకటించారు.

 

22:04 - January 22, 2016

ఢిల్లీ : హస్తినలోనూ హెచ్ సీయూ ఘటనపై కీలక పరిణామాలు చోటు చేసుకున్నారు. రోహిత్ ఆత్మహత్యపై న్యాయవిచారణకు... మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలంటూ కమిటీకి సూచించింది. ఇటు హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ సైతం ఆర్థికసాయం చేసేందుకు ముందుకొచ్చింది. రోహిత్ కుటుంబానికి 8 లక్షల రూపాయల్ని నష్ట పరిహారంగా ప్రకటించింది. మరోవైపు హెచ్ ఆర్ డీ న్యాయవిచారణ, హెచ్ సీయూ నష్టపరిహారంపై వర్సిటీ జేఏసీ ఘాటుగా రియాక్ట్ అయింది. హెచ్ ఆర్ డీ కమిషన్‌ను వ్యతిరేకిస్తున్నట్లు హెచ్ సీయూ జెఎసి స్పష్టం చేసింది. కాలయాపన కోసమే కమిటీ అంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రోహిత్ కుటుంబానికి నష్టపరిహారం పెంచాలంటూ డిమాండ్ చేశారు. 

 

22:00 - January 22, 2016

ఢిల్లీ : రిపబ్లిక్‌ డే సందర్భంగా ఉగ్రవాదులు పన్నిన భారీ కుట్రను కేంద్ర హోంశాఖ భగ్నం చేసింది. దేశవ్యాప్తంగా 14 మంది ఐసిస్‌ సానుభూతిపరులను ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసింది. హైదరాబాద్‌లో నలుగురిని అదుపులోకి తీసుకుంది. పఠాన్‌కోట్‌లో కారు హైజాక్‌ నేపథ్యంలో ఢిల్లీలో  హై అలర్ట్‌ ప్రకటించారు.
రిపబ్లిక్ డే వేడుకలను లక్ష్యంగా కుట్రలు 
రిపబ్లిక్ డే వేడుకలను లక్ష్యంగా కుట్రలు చేస్తున్న ఉగ్రవాదుల ప్రయత్నాలను భద్రతా దళాలు భగ్నం చేశాయి. ఒకే రోజు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 14 మంది ఐసిస్ సానుభూతిపరులను ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో నలుగురు ఐసిస్ సానుభూతిపరులను అరెస్ట్‌ చేయగా.. మరో ఐదుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కర్ణాటకలో ఆరుగురు అనుమానితులను అరెస్ట్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌, ముంబైలో ఇద్దరు చొప్పున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
14 మంది ఐసిస్‌ సానుభూతిపరుల అరెస్ట్‌
మొత్తం 14 మంది ఐసిస్‌ సానుభూతిపరులను అరెస్ట్‌ చేసినట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వీరందరిని ఢిల్లీలో విచారణ జరపనున్నట్టు హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఎన్‌ఐఏ 12 మందిని అరెస్ట్‌ చేయగా, మహారాష్ట్రకు చెందిన ఎటిఎస్‌ ఇద్దరిని అరెస్ట్‌ చేసింది. హైదరాబాద్‌, కర్ణాటక, ముంబై, యుపిలో అరెస్ట్‌ చేసిన వారి వద్ద నుంచి ఐఈడీలు, బాంబు సామాగ్రి, టైమర్లను ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుంది. ఉగ్రవాదులు ఆన్‌లైన్‌ ద్వారా 6 లక్షలు సమకూర్చుకున్నారని... పేలుడు పదార్థాలను సమకూర్చుకునే పనిలో ఉన్నట్టు కేంద్రం తెలిపింది. ఇండియన్‌ ముజాహిదీన్‌ మాజీ ఉగ్రవాది యూసుఫ్‌ ఆర్మర్‌తో  వీరికి సంబంధాలున్నాయని పేర్కొంది. దేశ రాజధానిలో ప్రముఖ స్థలాలపై దాడికి ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టు హోంశాఖ ప్రకటించింది. 
నలుగురు సానుభూతిపరులు బుధవారం అరెస్ట్‌
ఐసిస్‌తో సంబంధం ఉన్న ఉత్తరాఖండ్‌కు చెందిన నలుగురు సానుభూతిపరులను బుధవారం అరెస్ట్‌ చేశారు. వీరు ఇస్లామిక్‌ స్టేట్‌కు సంబంధించిన వెబ్‌సైట్‌ చూస్తూ పట్టుబడ్డారు. ఉత్తరప్రదేశ్‌ హరిద్వార్‌లో అర్ధ కుంభమేళాతో పాటు ఆ రూట్లో నడిచే రైళ్లపై దాడులు చేయడానికి కుట్ర పన్నారని హోంశాఖ వెల్లడించింది. 
పఠాన్‌కోట్‌లో తెల్ల ఆల్టో కారు హైజాక్‌ కలకలం
పఠాన్‌కోట్‌లో తెల్ల ఆల్టో కారు హైజాక్‌ కావడం కలకలం రేపింది. ఈ కారులో ఢిల్లీ నగరంలోకి ముగ్గురు అనుమానిత వ్యక్తులు ప్రవేశించినట్లు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. అనుమానిత వ్యక్తులు పఠాన్‌కోట్‌లో హెచ్‌పీ 01డీ 2440 నంబరు గల ఆల్టోకారును అద్దెకు తీసుకున్నారు. అనంతరం కారు డ్రైవర్‌ను చంపి ఢిల్లీకి వచ్చినట్లు భావిస్తున్నారు. మృతి చెందిన డ్రైవర్‌ను విజయ్‌ కుమార్‌గా గుర్తించారు. అతడి మృత దేహాన్ని హిమాచల్‌ ప్రదేశ్‌లోని కంగ్రాలో స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం
ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలాండే భారత పర్యటనను నిరసిస్తూ బెంగుళూరులోని ఫ్రెంచ్‌ కాన్సులేట్‌కు ఓ లేఖ వచ్చింది. ఈ లేఖను చెన్నై నుంచి మెయిల్‌ చేశారు. రిపబ్లిక్‌ డే ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు హోలాండ్‌ పాల్గోనున్న నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

 

21:56 - January 22, 2016

దావోస్ : అమరావతి నిర్మాణంలో ప్రపంచ సంస్థలు పాలు పంచుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. ప్రపంచ ఆర్థిక సదస్సు నాలుగో రోజు ఆయన వివిధ సంస్థల అధిపతులతో సమావేశమయ్యారు. ఎపి నూతన రాజధాని అమరావతి రానున్న పదేళ్లలో దేశంలోనే అత్యున్నత రాష్ట్రంగా ఎదుగుతుందన్నారు చంద్రబాబు. 

 

21:53 - January 22, 2016

పశ్చిమ  గోదావరి : పచ్చని కోనసీమ రణరంగమైంది.. కార్పొరేట్‌ కాసుల కోసం.. తమ బతుకుల్లో కాలుష్యం నింపొద్దంటూ జనం కన్నెర్ర చేశారు.. ఆందోళనతో సర్కారును హడలెత్తించారు.. స్థానికుల నిరసనతో అధికారులు దిగొచ్చారు. ప్రజలు వ్యతిరేకించిన ఆక్వా పార్క్‌ నిర్మాణాన్ని వాయిదా వేశారు.. 
గోదావరి ఆక్వా మెగా పార్క్‌ నిర్మాణంపై వ్యతిరేకత
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో నిర్మిస్తున్న గోదావరి ఆక్వా మెగా పార్క్‌ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ.. స్థానికులు కదం తొక్కారు. భీమవరం మండలం తుందుర్రు, జొన్నలగరువు... నర్సాపురం మండలం కంసాలి బేతపూడి గ్రామాల పరిధుల్లోని ప్రజలు.. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా.. నిరసన ప్రదర్శన చేపట్టారు. అది కాస్తా పోలీసుల ఓవరాక్షన్‌తో ఉద్రిక్తంగా మారింది. పోలీసుల లాఠీచార్జ్‌తో పదిమంది మహిళలు, యువకులు గాయపడ్డారు.. ఓ వృద్ధుడి తలకు తీవ్ర గాయమైంది.. సీపీఎం నేతలు బలరాం, జేఎన్వీ గోపాలన్‌పైకూడా పోలీసులు లాఠీతో రెచ్చిపోయారు.. అయినా ఆందోళనకారులు ముందుకే సాగారు.. లోపలికి వెళ్లి రాళ్లు రువ్వారు.. 
ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండానే నిర్మాణ పనులు
పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా పార్క్‌ నిర్మించాలని.. ప్రభుత్వం ఏడాది క్రితమే నిర్ణయించింది. ycp నుంచి tdpలో చేరిన మాజీ ఎమ్మెల్యే రంగనాధరాజుతోపాటు.. ఆనంద సీ ఫుడ్స్ కంపెనీ ఆధ్వర్యంలో ఈ పార్క్‌ పనులు మొదలయ్యాయి. అయితే ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండానే.. ఈ పనులు ప్రారంభించడాన్ని స్థానికులు తప్పుబట్టారు.. తమ గ్రామాల్లో పార్క్ వద్దంటూ కొద్దినెలలుగా... భీమవరం మండలం తుందుర్రు, జొన్నలగరువు... నర్సాపురం మండలం కంసాలి, బేతపూడి వాసులు ఉద్యమాలు చేస్తున్నారు.
ఫ్యాక్టరీ యాజమాన్యం, గ్రామస్తుల మధ్య సమావేశం

ప్రజల ఆందోళనతో దిగివచ్చిన నర్సాపురం, భీమవరం ఎమ్మెల్యేలు... ఫ్యాక్టరీ యాజమాన్యం, గ్రామస్తులకు మధ్య సమావేశం ఏర్పాటు చేశారు..  ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా పార్క్ నిర్మించరాదని నిర్ణయించారు. అయితే.. కంపెనీ ప్రతినిధులు దీన్ని పట్టించుకోకుండానే... ఫ్యాక్టరీ నిర్మాణ పనులు మొదలుపెట్టారు.. దీంతో స్థానికులు మళ్లీ నిరసనకు దిగారు..  ఆక్వా పార్క్‌ తమకొద్దంటూ నినదించారు. వెంటనే కంపెనీ యాజమాన్యం పోలీసులు, కిరాయి మనుషుల్ని కాపలాగా పెట్టింది.. దీంతో గ్రామస్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.. చిన్నా పెద్దా తేడాలేకుండా అంతా పోలీసుల బారికేడ్లను తోసుకుని ఫ్యాక్టరీ నిర్మాణ ప్రాంతంలోకి చొచ్చుకు వచ్చారు.. వీరిని అడ్డుకున్న పోలీసులు లాఠీచార్జ్ చేశారు.. 
ప్రజలతో చర్చలు జరిపిన అధికారులు
రెండు వర్గాల మధ్య ఘర్షణతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.. ఈ విషయం తెలుసుకున్న నర్సాపురం సబ్‌ కలెక్టర్‌ దినేశ్ కుమార్‌, డిఐజి హరికుమార్‌ ఘటనాస్థలానికి వచ్చారు.. అక్కడి ప్రజలతో చర్చలు జరిపారు.. తాత్కాలికంగా పనులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.. సబ్‌ కలెక్టర్‌ సమక్షంలో చర్చల తర్వాత కంపెనీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.. 
సబ్‌ కలెక్టర్‌ ప్రతిపాదనను అంగీకరించిన పోరాటకమిటీ
సబ్‌ కలెక్టర్‌ ప్రతిపాదనను పోరాటకమిటీ అంగీకరించింది.. చర్చలకు తాము సిద్ధమని తెలిపింది.. ఈ చర్చలు కొసాగుతుండగానే పోలీసులు మరోసారి ఆందోళనకారులను రెచ్చగొట్టారు. దీంతో.. వాళ్లు పోలీసులపై రాళ్లు విసిరారు.. ఈ గొడవలో ముగ్గురు పోలీసులకూ గాయాలయ్యాయి.. వెంటనే పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పారు.. ఈ లాఠీఛార్జ్‌లో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు..  అదనపు బలగాలు రప్పించి భారీ భద్రత ఏర్పాటు చేశారు... ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.. 
ఆక్వా పార్క్ కు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించిన గ్రామస్తులు
లాఠీ దెబ్బలతో రక్తాలు కారుతున్నా.. ఆక్వా పార్క్ కు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించారు గ్రామస్తులు.. తమ బతుకులు బుగ్గి పాల్జేసే చర్యలను ఇదే స్ఫూర్తితో వ్యతిరేకిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. మొత్తానికి వీరి ఆందోళన ఫలితంగా.. పార్క్ నిర్మాణ పనులకు ప్రస్తుతానికి బ్రేక్‌ పడింది. 

21:47 - January 22, 2016

విశాఖ : డిక్టేటర్ సక్సెస్ టూర్ లో భాగంగా విశాఖలో చిత్ర బృందం పర్యటించింది. జగదాంబ సెంటర్ లో డిక్టేటర్ ప్రదర్శన జరుగుతున్న ధియేటర్ లో బాలకృష్ణ సందడి చేశారు. అభిమానుల కోసం సినిమాల్లో నటిస్తూనే ఉంటానని.. త్వరలో మరో సినిమాపై ప్రకటన చేస్తానని తెలిపారు బాలయ్య. అభిమానుల ఉత్సాహాన్ని చూసిన బాలయ్య డాన్స్ చేసి ఉత్సాహాన్ని పెంచారు.

21:43 - January 22, 2016

చందమామపై మానవ మనుగడ సాధ్యమా..?! అక్కడి వాతావరణాన్ని మనిషి తట్టుకోగలడా?.. చంద్రుడిపైకి పోదాం చలో చలో అంటున్న సైంటిస్టులు.., 2030 నాటికి బాబిలిపై నివాసం..!!, చందమామ కాలనీ.. ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం…. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

21:39 - January 22, 2016

ఇనావర్స్ బయోలాజికల్స్ ఇన్ కార్పొరేషన్ ఎండీ టి.సుబ్రహ్మణ్యం టెన్ టివి నిర్వహించిన అంతరంగం కార్యక్రమంలో పాల్గొని, మాట్లాడారు. తన అంతరంగాన్ని వివరించారు. ఆయన జీవిత విశేషాలు, అనుభవాలు తెలిపారు. మరిన్ని వివరాలను ఆయన మాటల్లోనే…'నేను ప్రొద్దుటూరులో పుట్టాను. నా తల్లిదండ్రులు శేశమ్మ, వెంకటేశ్వర్లు. పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివాను. నేను ఇంటర్ వరకు చదివాను. మొదటగా మెడికల్ షాపులో గుమస్తాగా జాయిన్ అయ్యాను. 150 రూపాయల జీతం నుంచి రూ. 15 కోట్లు టర్నోవర్ కు ఎదిగాను. నిజాయితీగా ఉంటే ఎవరైనా పైకి వస్తారు. మరరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

ఇద్దరు చిన్నారుల సజీవదహనం

విజయనగరం : జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండలో విషాదం చోటుచేసుకుంది. వరికుప్పలకు మంటలు అంటుకోవడంతో మంటల్లో చిక్కుకుని ఇద్దరు చిన్నారులు సజీవదహనం అయ్యారు.

టిటిడిపిలో రాజీనామాల పర్వం

హైదరాబాద్‌: తెలంగాణ టిడిపిలో రాజీనామాల పర్వం కొనసాగుతుంది. టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి, శేరిలింగంపల్లి సినియర్‌ నేత బండి రమేష్‌, మాల్కాజ్‌గిరి టిడిపి ఇంచార్జ్ వీకే మహేష్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఈరోజు ఉదయమే టి. టిడిపి ఉపాధ్యక్షుడు కృష్ణయాదవ్‌ పార్టీకి రాజీనామా చేసారు.

 

20:33 - January 22, 2016

రంజు మీదికొచ్చిన జీహెచ్ ఎంసీ ఎన్నికలు, రంగులు మారుస్తున్న నేతలు, సర్కార్ దావఖానలో మంత్రి కామినేని మోకాలుకు ఆపరేషన్, గోపాల మిత్రుల గోసకు 20 దినాలు, కర్నూలులో తెలివి తక్కువ దొంగలు, కూతురిని కడప కోర్టులో ఇడిసిపెట్టి పోయిన తల్లిదండ్రులు, ఉజ్జయిని జాతర... ఆవులతోటి తొక్కించుకునే భక్తులు...ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

20:23 - January 22, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ డిమాండ్ చేశారు. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్మి తమ్మినేని వీరభద్రంతో కలిసి హెచ్ సీయూ విద్యార్థుల దీక్ష స్థలిని సందర్శించి.. విద్యార్థులను ఆయన పరామర్శించారు. విద్యార్థుల దీక్షకు సంఘీభావం తెలిపారు. దళిత విద్యార్థుల బహిష్కరణ, రోహిత్ మృతిపై వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. దీక్ష చేస్తున్న విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం మాణిక్ సర్కార్ మాట్లాడుతూ హెచ్ సీయూ ఘటనపై వీసీ సరిగ్గా స్పందించలేదని.. రాజకీయ ఒత్తిడులకు వీసీ తలొగ్గారని పేర్కొన్నారు. న్యాయ విచారణలో రాజకీయ జోక్యాలు లేకుండా చూడాలని సూచించారు. విద్యార్థుల డిమాండ్లు న్యాయమైనవన్నారు. విద్యార్థుల దీక్షకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. 

20:00 - January 22, 2016

హెచ్ సీయూ మృతికి కేంద్రంప్రభుత్వమే బాధ్యత వహించాలని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, బిజెపి అధికార ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి, విశ్లేషకులు మల్లేపల్లి లక్ష్మయ్యలు పాల్గొని, మాట్లాడారు. రోహిత్ ది ఆత్మహత్య కాదని.. హత్య అని ఆరోపించారు. 
రోహిత్ ఆత్మహత్యకు బిజెపి, ఎబివిపి, ఆర్ ఎస్ ఎస్ లు కారణమని విమర్శించారు. రోహిత్ నేరస్తుడని, అతని కులంపై చర్చ జరుపడం దారుణమన్నారు. హెచ్ సీయూలో దళిత విద్యార్థులు తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నారని వాపోయారు. రోహిత్ ఆత్మహత్యపై విచారణ జరిపి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీసీ అప్పారావును తొలగించాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

హెచ్ సీయూను సందర్శించిన మాణిక్ సర్కార్, తమ్మినేని

హైదరాబద్ : త్రిపుర సీఎం మాణిక్ సర్కార్, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్ సీయూను సందర్శించారు. ఆమరణ నిరాహాదీక్ష చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. 

తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా…

హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఫిబ్రవరి 2న జీహెచ్ ఎంసీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆరోజు ప్రారంభమయ్యే పరీక్షలను ఇంటర్ బోర్డు వాయిదా వేసింది. ఫిబ్రవరి 5 నుంచి 24 వరకు ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించనున్నారు.

 

ప్రైవేట్ స్కూల్ బస్సులో మంటలు

ఆదిలాబాద్ : నిర్మల్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి. విద్యార్థులను ఇళ్లకు తరలిస్తుండగా బస్సులో మంటలు చెలరేగాయి. విద్యార్థులను సకాలంలో బస్సు నుంచి కిందకు దింపడంతో ప్రమాదం తప్పింది. 

 

19:02 - January 22, 2016

వస్త్ర ప్రపంచంలో చీరదెప్పుడూ ప్రత్యేక స్థానమే. అందుకే ఫ్యాషన్ ప్రపంచాన్ని ఎన్ని డిజైనర్ వేర్స్ చుట్టేసినా, చీరదెప్పుడూ అగ్రతాంబూలమే. అలాంటి వెరైటీ డిజైనర్ శారీస్ తో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి సొగసు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం…

 

19:00 - January 22, 2016

బస్టాపుల్లో, రోడ్డు మలుపుల్లో, కాలేజీ క్యాంపస్ లో ఇలా ఎక్కడైనా, ఎప్పుడైనా ఆకతాయిలూ విరుచుకుపడే అవకాశముంది. అలాగని ఆయుధాలు వెంటపెట్టుకుని తిరగలేం కదా? కానీ, చేతిలో ఉండే కర్చీఫ్ తోనే సెల్ప్ డిఫెన్స్ ఎలా చేసుకోవాలో ఇవాళ్టి నిర్భయ లో తెలుసుకుందాం. మరిన్ని వివరాలను వీడియాలో చూద్దాం...

18:58 - January 22, 2016

ముంబై మహిళా పోలీసులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వృద్ధుల పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. 

రానున్న ఐదేళ్లలో అంగన్ వాడీ సెంటర్ల రూపురేఖలు మారిపోనున్నాయి. స్వంత భవనాలు ఏర్పాటు కానున్నాయి.  

తైవాన్ ఎన్నికలు ప్రత్యేకతంగా నిలిచాయి. సాధారణ ఎన్నికల్లో,  తొలిసారి ఓ మహిళకు అధికార పీఠాన్నికట్టబెట్టాయి. 

ఊహ తెలియని వయస్సులోనే తన ప్రాణాలను పణంగా పెట్టి తోటి విద్యార్థులను కాపాడింది ఒక బాలిక. అందుకు గుర్తింపుగా సాహస బాలల అవార్డుకు ఎంపికై ప్రత్యేకత సాధించింది

ప్రపంచ నెం.1 ఖాతాలో అరుదైన ఘనత. 1990 తర్వాత మహిళల డబుల్స్ లో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జంటగా సానియా మీర్జా, మార్టినా హింగిస్ జోడి రికార్డు సాధించింది. 

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మహిళా శరణార్థుల విషయంలో స్పందించింది. వారిపై శారీరక దాడులు పెరుగుతున్నాయని, ఆర్థిక దోపిడీ జరుగుతోందని విమర్శించింది. 

18:52 - January 22, 2016

విజయవాడ : గ్రీన్ బెల్ట్ గ్రామాల నుండి కుప్పలు కుప్పలుగా వినతి పత్రాలు విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయానికి చేరుతున్నాయి. తాజాగా ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామవాసులు సైతం తమకు గ్రీన్ బెల్ట్ జోన్ వద్దంటూ తమని వ్యవసాయానికే పరిమితం చేయొద్దని సీఆర్డీఏ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. కొండప్రాంతమైన ఆగిరిపల్లిలో వ్యవసాయం సాధ్యపడదని ప్రభుత్వం పునరాలోచించుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

18:44 - January 22, 2016

హైదరాబాద్ : సాక్షం కళ్ల ముందే ఉంది... జరిగిన.. జరుగుతున్న అన్యాయం రోజుకో రూపంలో బయటపడుతూనే ఉంది. అయినా నేరం తమది కాదంటున్నారు. బాధితుడినే బాధ్యుణ్ణి చేసే పన్నాగాలు పన్నుతున్నారు. అసలు విషయాన్ని పక్కకు నెట్టి.. నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. 
ఒక్క మరణం వేయి గొంతుకలకు ప్రాణం పోసింది
ఒక్క మరణం వేయి గొంతుకలకు ప్రాణం పోసింది. ఒకరి ప్రాణత్యాగం యావత్‌దేశాన్ని కులవివక్షకు వ్యతిరేకంగా గర్జించేలా  చేసింది. ఆ ఒక్కడి ఆక్రందన విశ్వ విద్యాలయాల్లో కులజాఢ్యాన్ని ప్రశ్నిస్తోంది. కాని పాలకులకు ఆ  ఆక్రందనలు వినిపించడంలేదు. పైగా ఎదురుదాడి చేస్తోంది. ఏ వివక్షకు రోహిత్‌ బలయ్యాడో అసలు అతను ఆ కులమే కాదంటూ విషయాన్ని పక్కదారి పట్టిస్తోంది. రోహిత్‌ ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులను, ఇందుకు బాధ్యులెవ్వరు అన్న విషయాలపై విచారణ చేపట్టడం మానేసి రోహిత్‌ పుట్టుపూర్వోత్తరాలు, కుల గోత్రాలు తెలుసుకుంటున్నారు దర్యాప్తు ఆధికారులు. గుంటూరు జిల్లాలోని గురజాలకు వెళ్లి రోహిత్‌ నాయనమ్మను కలిసి విచారించారు.
రాధికది ప్రేమ వివాహం 
ఎస్‌సి మాల వర్గానికి చెందిన రోహిత్‌ తల్లి రాధిక వడ్డెర కులస్తుడిని ప్రేమవివాహం చేసుకున్నారు. కుటుంబాన్ని, ముగ్గురు పిల్లలను తండ్రి ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో  పెళ్లైన కొన్ని సంవత్సరాలకే ఇద్దరు వేరుపడ్డారు. పిల్లలు తల్లి దగ్గరే  పెరిగారు. ధృవీకరణ పత్రాల్లోనూ తల్లి కులమే నమోదైంది. ఇప్పుడు దీనినే ఎబివిపితో పాటు రాష్ట్ర ప్రభుత్వమూ వివాదాస్పదం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే  తల్లి కులం పిల్లలకు వర్తించే విషయంలో సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు  ఇచ్చింది. తల్లిదండ్రులు కులాంతర వివాహం చేసుకున్నప్పుడు పిల్లలు తల్లి కులాన్నిగాని, తండ్రికులాన్ని గాని ఎంపిక చేసుకునే స్వేచ్ఛను ఇచ్చింది. సుప్రీం ఆదేశాల ప్రకరమూ రోహిత్ దళితుడు అన్నది స్పష్టమౌతుంది. అయినా రోహిత్‌ వడ్డెర కులస్తుడనే వాదాన్ని  తెరపైకితెచ్చే కుట్ర సీరియస్‌గానే సాగుతోంది.
రోహిత్‌ కులంపై ఆరా
ఈ కేసులో నిందితులుగా ఉన్న హెచ్ సీయూ వీసీ అప్పారావునుగానీ, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను గానీ ఇంతవరకు విచారించని పోలీసులు రోహిత్‌ కులంపై ఆరా తీస్తున్నారు. మిత్రపక్షమైన బిజెపి, తెలుగుదేశం పార్టీలు ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరో వైపు రోహిత్‌ ఆత్మహత్యపైగాని, తాజా పరిణామాలపైగాని టీడీపీ నోరుమెదకపోవడంతో మరిన్ని  అనుమానాలు రేకెత్తుతున్నాయి. 

 

18:40 - January 22, 2016

ఆదిలాబాద్ : నిర్మల్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి. విద్యార్థులను ఇళ్లకు తరలిస్తుండగా బస్సులోని డీజిల్ ట్యాంక్ లో మంటలు చెలరేగాయి. బస్సులో ఉన్న 40 మందికి పైగా విద్యార్థులను సకాలంలో బస్సు నుంచి కిందకు దింపడంతో ప్రమాదం తప్పింది. విద్యార్థులు క్షేమంగా ఉన్నారు. అనంతరం బస్సు పూర్తిగా దగ్ధం అయింది. అయితే పాత బస్సులను కొత్త బస్సులుగా చేసి.. యాజమాన్యం నడుపుతుందని... దీంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయిని పలువురు ఆరోపిస్తున్నారు.  

18:38 - January 22, 2016

వరంగల్ : ప్రేమ వేధింపులు తట్టుకోలేక మరో యువతి ఆత్మహత్య చేసుకుంది. నల్లగొండ జిల్లాకు చెందిన లలిత వరంగల్‌ జిల్లాలోని ఓ కాలేజీలో ఇంజనీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. ప్రేమిస్తున్నానంటూ యువకుడు వెంట పడడంతో మనస్తాపం చెందింది.. తనను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని బెదిరించడంతో కుటుంబసభ్యులకు విషయం చెప్పింది. ఆ తర్వాత చింతల్‌ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు వేధింపులే కారణమని లేఖలో తెలిపింది. తన సోదరి మృతికి కారణమైన యువకున్ని శిక్షించాలని మృతురాలి కుటుంబసభ్యులు పోలీసుల్ని కోరుతున్నారు. 

 

18:28 - January 22, 2016

హైదరాబాద్ : చేతులు కాలాక ఆకులు పట్డుకున్న చందంగా మారింది హెచ్ సీయూ పరిస్థితి. రోహిత్ కుటుంబానికి హెచ్ సీయూ రూ. 8 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. ఈమేరకు జీవో విడుదల చేశారు. అయితే రోహిత్ తోపాటు మరో ఐదు మందిని వర్సిటీ అధికారులు గతంలో బహిష్కరించారు. దీంతో తీవ్ర మనస్తాపానాకి గురైన రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈనేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయియి. కేంద్రం నుంచి వచ్చిన జాతీయ సంఘాలు, జాతీయ నేతలు వర్సిటీని సందర్శించి రోహిత్ మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వర్సిటీ వీసీని తొలగించాలని విద్యార్థులు కోరుతున్నారు. 
రోహిత్ మృతికి బాధ్యత వహిస్తూ.. కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలను వారి పదువులను తొలగించాలని అనే మొదటి డిమాండ్ ను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు తమ ఆందోళనను విరమించమని చెప్పారు. అయితే నిరాహారదీక్ష చేస్తున్న ఏడు మంది విద్యార్థులకు టీచింగ్, నాన్ టీచింగ్, అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంట్లు సంఘీభావం తెలిపారు. న్యాయవిచారణను తాము ఆహ్వానించడం లేదని చెబుతున్నారు. న్యాయ విచారణ కాలయాపన కోసమే ఆదేశించారని చెబుతున్నారు. 

 

రోహిత్ కుటుంబానికి హెచ్ సీయూ ఎక్స్ గ్రేషియా

హైదరాబాద్ : విద్యార్థి రోహిత్ కుటుంబానికి హెచ్ సీయూ రూ.8 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. రోహిత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. 

17:59 - January 22, 2016

హైదరాబాద్ : ఇంగ్లండ్ లోని వరల్డ్ ఎడ్యుకేషనల్ ఫోరం సెమినార్‌లో.. తమ టూర్ సక్సెస్ అయిందని ఎపి మంత్రి గంటా శ్రీనివాస్ రావు అన్నారు. ఈ పర్యటనలో లండన్ లో పేరున్న ఆల్ సెంట్స్ అకాడమిని సందర్శించామని తెలిపారు. దేశంలోనే నెం 1గా ఎదిగిన స్కూల్ అభివృద్ధికి గల కారణాలను విశ్లేషించామన్నారు. ప్రిన్సెస్ చార్లెస్ చారిటీ సంస్థ.. రాష్ట్రంలో బ్రాంచ్ స్థాపనకు సుముఖంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. 

17:55 - January 22, 2016

కరీంనగర్ : టీ.ప్రభుత్వంపై సీపీఎం సీనియర్ నేత సున్నం రాజయ్య విరుచుకుపడ్డారు. దళితులకు ఇస్తామన్న మూడెకరాల భూమిని ఇప్పటికి వరకు పంపిణీ చేయకపోవడం దారుణమని అన్నారు. కరీంనగర్ జిల్లాలో వ్యవసాయకార్మికసంఘం నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. అటవీచట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆపహాస్యం చేస్తున్నాయన్నారు. గిరిజనుల నుంచి అటవీభూములను దూరం చేసే విధంగా కుట్ర పన్నుతోందని మండిపడ్డారు.

 

17:28 - January 22, 2016

లక్నో : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్‌ మృతిపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పందించారు. మంచి విద్యావంతుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. ఓ తల్లి తన కొడుకును కోల్పోయిన బాధను తాను అర్థం చేసుకోగలనని ప్రధాని అన్నారు. రోహిత్‌ మృతిపై ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. లక్నోలోని బిఆర్‌ అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో మోడీ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. జీవితంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా దేశం కోసం డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఎనలేని కృషి చేశారని నరేంద్రమోడీ అన్నారు. అణగారిన వర్గాల కోసం అంబేద్కర్‌ తన జీవితాన్ని ధార పోశారని తెలిపారు. విద్యపట్ల స్పష్టమైన దూరదృష్టి ఉన్న వ్యక్తి అంబేద్కర్‌ అని కొనియాడారు. రోహిత్‌ ఆత్మహత్య నేపథ్యంలో మోడీ ప్రసంగాన్ని  అడ్డుకునేందుకు యత్నించారు. మోది గో బ్యాక్‌ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. విద్యార్థులను పోలీసులు హాలు నుంచి బయటకు పంపారు.
 

17:17 - January 22, 2016

ఢిల్లీ : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ మృతిపై ఢిల్లీలో ఎన్ ఎస్ యూఐ ఆందోళన చేపట్టింది. హెచ్ ఆర్ డీ కార్యాలయం ముట్టడికి యత్నిచారు. వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు హారయ్యారు. బారికేడ్లను తోసుకుని వెళ్లేందుకు ముందుకు సాగేందుకు ప్రయత్నించారు. కార్యాలయానికి అర కిలో మీటర్ దూరంలోనే విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులు, పోలీసులు మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. 

 

16:58 - January 22, 2016

కరీంనగర్ : బిజెపి... పేదల వ్యతిరేక ప్రభుత్వమని త్రిపుర సీఎం మాణిక్ సర్కార్  విమర్శించారు. కేంద్రప్రభుత్వ విధానాలు సామాన్య ప్రజలకు ఉపయోగపడేలా లేవన్నారు. కరీంనగర్ లో నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ తొలి మహాసభకు ముఖ్య అతిథిగా హాఐరై, ప్రసంగించారు.  దేశ, విదేశాల్లోని బడా పెట్టుబడిదారులు, భూస్యాములు, సంపన్నుల కోసం కేంద్రం పని చేస్తుందని చెప్పారు. గత ప్రభుత్వాల పరిపాలనకు, ఇప్పుడున్న ఎన్ డీయే ప్రభుత్వ పాలనకు తేడా లేదని బిజెపి నిరూపించిందన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చాక ఆర్థిక దాడే కాకుండా … రాజకీయ దాడి కూడా పెరిగిందన్నారు. కార్మికులకు ఉపయోగపడే చట్టాలకు సవరణలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశ, విదేశాల్లోని బడా పెట్టుబడిదారులు, కోటీశ్వరులకు అనుకూలంగా కేంద్రం చట్టాలు తయారు చేస్తుందని విమర్శించారు. కార్మిక హక్కులు, చట్టాలను కాలరాస్తున్నారని మండిపడ్డారు. కార్మికుల పట్ల కక్షపూరిత ధోరణితో కేంద్రం వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న చిన్న, సన్న కారు రైతుల వద్ద ఉన్న సెంటు భూములను కూడా కాజేసేందుకు బిజెపి ప్రభుత్వం దాడి ప్రారంభించిందని విమర్శించారు. బీజెపీ అధికారంలోకి వచ్చిన 20నెల కాలంలో వ్యవసాయం రంగం పెద్ద ఎత్తున సంక్షోభంలోకి నెట్టబడిందన్నారు. రైతాంగం చేసే ఉత్పత్తులకు న్యాయమైన ధరలు కల్పిస్తామన్న బిజెపి హామీ అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు. బిజెపి... కనీస వాగ్ధానాలు కూడా అమలు కావడంలో లేదన్నారు. నేరుగా రైతులు, వ్యవసాయదారులకు ఉపయోగ పడే విధానాలు కావన్నారు. భూసేకరణ చట్ట సవరణ పేరుతో రైతుల భూమలు లాక్కోవడానికి ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. నిరుద్యోగం వెర్రితలలు వేస్తుందన్నారు.

 

16:45 - January 22, 2016

ఉత్తరప్రదేశ్ : లక్నోలోని అంబేద్కర్ విశ్వవిద్యాలయ స్నాత్సకోవంలో ప్రధాని మోడీకి మోడీకి చేదు అనుభవం ఎదురయింది. స్నాత్సకోవంలో మోడీ ప్రసంగాన్ని విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆడిటోరియంలో మోడీ మాట్లాడుతున్న సమయంలో 'మోడీ గోబ్యాక్‌ అంటూ' నిరసనకారులు నినాదాలతో హోరెత్తించారు. దాంతో ఆందోళన చేపట్టిన విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

 

రోహిత్ ఆత్మహత్యపై న్యాయవిచారణ

ఢిల్లీ : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై న్యాయ విచారణకు హెచ్ ఆర్ డీ మంత్రిత్వత్వ శాఖ నిర్ణయించింది. 
ఈ మేరకు న్యాయ కమిషన్ ఏర్పాటు చేసింది. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 

16:40 - January 22, 2016

ఢిల్లీ : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై న్యాయ విచారణకు హెచ్ ఆర్ డీ మంత్రిత్వత్వ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు న్యాయ కమిషన్ ఏర్పాటు చేసింది. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఈఘటనపై  ఇదివరకు ద్విసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు. కానీ ఈ కమిషన్ పై వ్యతిరేక, విమర్శలు వచ్చాయి. ఈనేపథ్యంలో హెచ్ ఆర్ డీ మంత్రిత్వ శాఖ న్యాయ కమిషన్ ఏర్పాటు చేసి… న్యాయ విచారణకు ఆదేశించింది. రోహిత్ తల్లిదండ్రులు, బంధువులను విచారించి మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. నివేదిక అనంతరం రోహిత్ మృతికి కారకులైన వారిపై చర్యలు ఉంటాయని చెప్పింది. 

స్థానికుల ఉద్యమానికి తలొగ్గిన అధికారులు

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లాలో స్థానికుల ఉద్యమానికి అధికారులు తలొగ్గారు. ప్రజా ఉద్యమానికి అధికారులు తలొగ్గారు. ఆక్వా ఫుడ్స్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు  జిల్లా సబ్ కలెక్టర్ ప్రకటించారు. సమప్యల పరిష్కారానికి పోరాట కమిటీ యాజమాన్యంతో సబ్ కలెక్టర్ చర్చలు జరుపుతున్నారు. వీరి మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇరువురి మధ్య జరుగుతోన్న చర్చలు ఫలప్రదం అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 

16:32 - January 22, 2016

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజా ఉద్యమానికి అధికారులు తలొగ్గారు. భీమవరం మండలం తుండుర్రులో నిర్మించ తలపెట్టిన ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీ నిర్మాణపనులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సబ్ కలెక్టర్ ప్రకటించారు. తమ ప్రాంతంలో ఆక్వాఫుడ్ ఫ్యాకర్టీ వద్దంటూ.. స్థానికులు ఉదయం నుంచి ర్యాలీకి దిగడంతో... అధికారులు దిగొచ్చారు. సమస్య పరిష్కారానికి పోరాట కమిటీ యాజమాన్యంతో త్వరలో చర్చలు సబ్ కలెక్టర్ ప్రకటించారు. 

హెచ్ సీయూలో క్షీణించిన విద్యార్థుల ఆరోగ్యం…

హైదరాబాద్ : హెచ్ సీయూలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న విద్యార్థులు ఆరోగ్యం క్షీణించింది. దీక్ష చేపట్టిన విద్యార్థుల ఆరోగ్యం విషమంగా ఉంది. విద్యార్థుల బీపీ, షుగర్ లెవల్స్ కూడా తగ్గినట్లు తెలుసోక్తంది.

16:22 - January 22, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న విద్యార్థులు ఆరోగ్యం క్షీణించింది. దీక్ష చేపట్టిన విద్యార్థుల ఆరోగ్యం విషమంగా ఉంది. విద్యార్థుల బీపీ, షుగర్ లెవల్స్ కూడా తగ్గినట్లు తెలుసోక్తంది. దళిత విద్యార్థుల బహిష్కరణ, రోహిత్ ఆత్మహత్య ఘటనలపై గత మూడు రోజులుగా ఏడు మంది విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నారు. విద్యార్థులు ఇప్పటికీ ప్లూయిడ్స్ తీసుకోలేదు. దీంతో వారిలో కొంతమంది ఆరోగ్యం క్షీణించింది. వర్సిటీ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విద్యార్థుల దీక్షా స్థలానికి సందర్శించిన పలువురు ప్రొఫెసర్లు వారి దీక్షలకు సంఘీభావం వ్యక్తం చేశారు. విద్యార్థుల డిమాండ్లను కేంద్రప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు తమ మద్దతు పూర్తిగా ఉంటుందని తెలిపారు. 

15:59 - January 22, 2016

ఢిల్లీ : హస్తినలో హై అలర్ట్ కొనసాగుతోంది. గణతంత్ర దినోత్స వేడుకులపై ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందన్న ఐబీ హెచ్చరికలతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. సెంట్రల్‌ ఢిల్లీలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దేశంలో ఉగ్రవాదులు అలజడి సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన జాతీయ దర్యాప్తు సంస్థ.. దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా 25 మంది అనుమానితులను ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది. ఢిల్లీలో ముగ్గురు, హైదరాబాద్‌లో నలుగురు, బెంగళూరులో ఆరుగురు ఐసీస్‌ సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు. రిపబ్లిక్‌ డే వేడుకలను భగ్నం చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా హైఅలర్ట్‌ విధించారు.

 

15:54 - January 22, 2016

హైదరాబాద్ : కిడ్నీ రాకెట్‌ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. కొలంబోలో కిడ్నీ రాకెట్‌తో సంబంధం ఉన్న నాలుగు ప్రధాన ఆస్పత్రులతో పాటు.. ఆరుగురు డాక్టర్లపై దర్యాప్తునకు అక్కడి దర్యాప్తు సంస్థలు ఆదేశించాయి. నల్లగొండ జిల్లాలో రాకెట్‌ బయటపడడంతో.. పోలీసులు జాతీయ దర్యాప్తు సంస్థలను అప్రమత్తం చేశారు. అంతేకాకుండా తెలంగాణ సర్కార్,.. జాతీయ దర్యాప్తు సంస్థలు శ్రీలంక ప్రభుత్వానికి సమాచారమిచ్చారు. దీంతో శ్రీలంకలో విదేశీయులకు సంబంధించిన కిడ్నీ మార్పిడి చికిత్సలపై నిషేధం విధించారు. కిడ్నీ రాకెట్‌ వ్యవహారంపై విచారణ జరిపించనున్నట్లు శ్రీలంక ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించినట్లు ఆ దేశ వార్తాసంస్థలు ప్రకటించాయి. 

 

15:51 - January 22, 2016

హైదరాబాద్ : ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో గ్రేటర్‌ టీడీపీ అభ్యర్ధులతో లోకేష్‌ సమావేశమయ్యారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేస్తామని పోటీ చేస్తున్న అభ్యర్ధులతో లోకేష్‌ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఎల్‌.రమణ, రేవంత్‌రెడ్డి, దయాకర్‌రెడ్డితో పాటు పలువురు సీనియర్‌ నేతలు హాజరయ్యారు. గ్రేటర్‌ ఎన్నికల ప్రచార సీడిని లోకేష్‌ విడుదల చేశారు. 

15:50 - January 22, 2016

కరీంనగర్‌ : వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ ప్రథమ మహాసభ ఇవాళ కరీంనగర్ లో జరగనుంది. ఈ కార్యక్రమానికి వ్యవసాయ కార్మికులు భారీ ఎత్తున తరలివచ్చారు. నగరంలోని అంబేద్కర్‌ స్టేడియం నుంచి ఆర్ట్స్‌ కాలేజీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ మహాసభల్లో చర్చిస్తామని నేతలంటున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా త్రిపుర సీఎం మాణిక్‌ సర్కార్‌ హాజరుకానున్నారు.

 

15:47 - January 22, 2016

హైదరాబాద్ : రోహిత్‌ ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలని కోరుతూ ప్రజాసంఘాలు, వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతమవుతోంది. కేంద్రమంత్రులు స్మృతిఇరానీ, దత్తాత్రేయలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో కేంద్రమంత్రుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. రోహిత్‌ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని నేతలు తెలిపారు. 

నిజాం కాలేజీ ప్రొఫెసర్ ఖాసిం అరెస్ట్‌కు రంగం సిద్ధం

హైదరాబాద్ : మావోయిస్టు అగ్రనేతలతో సంబంధాలు ఉన్నాయనే అభియోగాలతో నిజాం కాలేజీ ప్రొఫెసర్ ఖాసిం అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. ఆదిలాబాద్‌కు చెందిన మావోయిస్టు కొరియర్ శ్యాంసుందర్‌రెడ్డిని అరెస్ట్ చేసిన గజ్వేల్ పోలీసులు అతని దగ్గర ఉన్న కాల్‌డేటా ఆధారంగా ఖాసింకు కూడా మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఒకటిరెండు రోజుల్లో ప్రొఫెసర్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

కరీంనగర్ లో వ్యకాస మహాసభలు ప్రారంభం...

కరీంనగర్ : వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ తొలి మహాసభలు కరీంనగర్ లో ప్రారంభం అయ్యాయి. ఈ మహాసభల్లో త్రిపుర సీఎం మాణిక్ సర్కార్, సున్నం రాజయ్యలు పాల్గొన్నారు. 

హెచ్ ఆర్ డీ కార్యాలయ ముట్టడికి ఎన్ ఎస్ యూఐ యత్నం

ఢిల్లీ : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ మృతికి నిరసనగా ఎన్ ఎస్ యూఐ నేతలు ఢిల్లీలోని హెచ్ ఆర్ డీ కార్యాలయ ముట్టడికి యత్నించారు. పోలీసులు ఆందోళన కారులను అడ్డుకున్నారు. 

దేశ వ్యాప్తంగా హైఅలర్ట్

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఐబీ హైఅలర్ట్ ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఐసిస్ కుట్ర పన్నినట్లుగా ఐబీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 

కరీంనగర్ చేరుకున్న త్రిపుర సీఎం మాణిక్ సర్కార్

కరీంనగర్ : త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ కరీంనగర్ చేరుకున్నారు. జిల్లాలో కాసేపట్లో వ్యవసాయ కారిమ్మక సంఘం తెలంగాణ తొలి మహాసభలు ప్రారంభం కానున్నాయి. ఈ మహాసభలకు మాణిక్ సర్కార్ హాజరు కానున్నారు. 

 

టీటీడీపీ ఉపాధ్యక్ష పదవికి కృష్ణయాదవ్ రాజీనామా

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీకీ కృష్ణ యాదవ్ ఝలక్ ఇచ్చారు. టీటీడీపీ ఉపాధ్యక్ష పదవికి కృష్ణ యాదవ్ రాజీనామా రాజీనామా చేశారు. 

 

కరీంనగర్ లో కాసేపట్లో వ్యకాస బహిరంగ సభ

కరీంనగర్ : జిల్లాలో కాసేపట్లో వ్యవసాయ కారిమ్మక సంఘం తెలంగాణ తొలి మహాసభలు ప్రారంభం కానున్నాయి. ఈ మహాసభలకు త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ హాజరుకానున్నారు. 

 

లాభాల్లో స్టాక్ మార్కెట్లు...

హైదరాబాద్: స్టాక్‌మార్కెట్లు నేడు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 42 పాయింట్లు, నిఫ్టీ 130 పాయింట్లకు పైగా లాభాపడి ట్రేడ్‌లో కొనసాగుతున్నాయి. 

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం - మోడీ..

వారణాసి : పేదల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోడీ అన్నారు. సొంత నియోజకవర్గమైన వారణాసిలో ప్రధాని మోడీ ఇవాళ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇటీవల పర్యటించిన జపాన్ ప్రధాని షింజో అబే పవిత్ర వారణాసిపై ప్రశంసలు కురిపించారని మోదీ గుర్తు చేశారు. అంతకముందు ఆయన మహామానా ఎక్స్‌ప్రెస్ రైలుకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. మూగ, అంధ విద్యార్థులకు మోదీ పరికరాలు అందించారు

13:29 - January 22, 2016

విజయవాడ : కల్తీ మద్యం ఘటనలో రిమాండ్ లో ఉన్న కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు బెయిల్ మంజూరైంది. అతని సోదరుడు శ్రీనివాస్ కు కూడా బెయిల్ మంజూరైంది. కృష్ణలంకలోని స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్ సెల్లార్ లో కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతి చెందగా 35 మంది తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. దీనిని సిట్ దర్యాప్తు చేపట్టింది. ఈ ఘటనలో పలువురిని ఇప్పటికే అరెస్టు చేసింది. అందులో విష్ణు అతని సోదరుడిని కూడా అరెస్టు చేసింది. ఇప్పటికే రిమాండ్ లో ఉన్న వీరు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. దీనిపై శుక్రవారం విజయవాడ మెజిస్ట్రేట్ విచారణ జరిపి బెయిల్ మంజూరు చేసింది. ఇందుకు కొన్ని షరతులు విధించింది. రూ. 50వేల చొప్పున పూచీకత్తు సమర్పించాలని, సిట్ పోలీసులు విచారణ చేస్తున్న నేపథ్యంలో విచారణకు సహకరించాలని..విజయవాడలో అందుబాటులో ఉండాలని..ప్రతి బుధవారం కృష్ణలంక పీఎస్ కు హాజరు కావాలని పలు షరతులు విధించింది. ప్రస్తుతం సబ్ జైల్లో ఉన్న వీరిద్దరూ రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. షరతు విధించారు. పోలీసు విచారణకు సహకరించాలని ఆదేశాలు జారీ చేసింది.

డిసెంబర్ 7వ తేదీన ఘటన..
డిసెంబర్ ఏడో తేదీన కృష్ణలంకలో ఉన్న స్వర్ణ బార్ రెస్టారెంట్ సెల్లార్ లో ఉన్న బార్ లో కల్తీ మద్యం సేవించి ఏడుగురు మృతి చెందగా 35 మంది తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. మద్యం కల్తీ అవ్వడం వల్లే ఫోరెన్సిక్ నివేదిక కూడా పేర్కొంది. ఈ బార్ మల్లాది విష్ణుదని ప్రచారం జరిగింది. అనంతరం మల్లాది విష్ణు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ ఘటనలో ఏడుగురిని అరెస్టు చేసింది. మల్లాది విష్ణును 9వ నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మల్లాది విష్ణు ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేశారు. కానీ కోర్టు బెయిల్ తిరస్కరించింది. అరెస్టు చేయమని, విచారణ మాత్రమే చేస్తామని పోలీసులు కోర్టుకు తెలిపారు. కల్తీ మద్యం కేసులో సహకరించాలని, సిట్ బృందం ఎదుట హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనితో నాటకీయఫక్కీలో మంగళవారం విజయవాడలో మల్లాది విష్ణు ప్రత్యక్షమయ్యారు. తాను ఎక్కడికి పారిపోలేదని, విచారణకు సహకరిస్తానని ఈ సందర్భంగా విష్ణు తెలిపారు. 41 ఎ కింద సిట్ నోటీసు జారీ చేసింది. రెండు రోజుల పాటు విచారించిన అనంతరం మల్లాదిని పోలీసులు అరెస్టు చేశారు. 

మల్లాది విష్ణుకు బెయిల్..

విజయవాడ : కల్తీ మద్యం కేసులో అరెస్టు అయిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. రూ. 50వేల చొప్పున మల్లాది.. అతని సోదరుడికి పూచికత్తుతో బెయిల్ మంజూరు చేశారు. ప్రతి బుధవారం కృష్ణలంక పీఎస్ కు హాజరు కావాలని షరతు విధించారు. పోలీసు విచారణకు సహకరించాలని ఆదేశాలు జారీ చేసింది. 

రామగుండంలో కేంద్ర సహాయ మంత్రి హన్సరాజ్..

కరీంనగర్ : రామగుండం ఎరువుల కర్మాగారాన్ని కేంద్ర రసాయన శాఖ సహాయ మంత్రి హన్సరాజ్ సందర్శించారు. ఫిబ్రవరి రెండో వారంలో ప్రధాని మోడీ ఎరువు కర్మాగారం ప్రారంభిస్తారని, రామగుండంలో బొగ్గు అధారిత యూరియా కర్మాగారానికి ప్రతిపాదన ఉందని తెలిపారు. మరో నాలుగేళ్ల వరకు యూరియా ధరలు పెంచమని స్పష్టం చేశారు. రైతులకు సబ్సిడీతోనే ఎరువులను అందిస్తామని, 16 కోట్ల మంది రైతులకు భూసార పరీక్ష కార్డులను అందచేయం జరుగుతుందన్నారు. 

గాంధీ భవన్ ఎదుట మల్కాజ్ గిరి నేతల ధర్నా...

హైదరాబాద్ : గాంధీభవన్ ఎదుట మల్కాజ్ గిరి కార్యకర్తలు ధర్నా చేపట్టారు. సర్వే సత్యనారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సర్వే టికెట్లు అమ్ముకున్నాడని కార్యకర్తలు ఆరోపించారు. సర్వే దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ నుండి సర్వేను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. 

హెచ్ సీయూలో ముగిసిన టీచింగ్..నాన్ టీచింగ్ సిబ్బంది సమావేశం..

హైదరాబాద్ : హెచ్ సీయూలో టీచింగ్..నాన్ టీచింగ్ సిబ్బంది సమావేశం ముగిసింది. వీసి వచ్చి ముందు అధ్యాపకులతో చర్చించాలని, తరువాత విద్యార్థులతో చర్చించాలని ప్రొ.లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

25 మంది ఐసీస్ సానుభూతి పరుల అరెస్టు..

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఐబీ హై అలర్ట్ ప్రకటించింది. రిపబ్లిక్ డే వేడుకలను భగ్నం చేసేందుకు ఐసీసీ కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా 25 మంది ఐసీస్ సానుభూతి పరులను అరెస్టు చేశారు. హైదరాబాద్ నలుగురు, బెంగళూరు ముగ్గురు, ముంబైలో ఒకరు ఐసిస్ సానుభూతి పరులను అరెస్టు చేశారు. మరో ఐదుగురి కోసం ఎన్ఐఏ గాలింపు చేపట్టింది. 

ఢిల్లీలో హై అలర్ట్..

ఢిల్లీ : దేశ రాజధానిలో హై అలర్ట్ ప్రకటించారు. నగరంలోకి ముగ్గురు అనుమానితులు ప్రవేశించినట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు పఠాన్ కోట్ లో కారు డ్రైవర్ ను హత్య చేసి విజయ్ కుమార్ ను హత్య చేశారు. పలు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. 

12:47 - January 22, 2016

ఢిల్లీ : భారతదేశంలో భారీ విధ్వంసానికి ఐసీసీ పక్కా ప్లాన్ వేసింది. ఇదే ముందే గ్రహించిన ఇండియన్ ఇంటెలిజెన్స్ వారి కుట్రను భగ్నం చేసింది. రిపబ్లిక్ డే వేడుకలను ప్రధానంగా వీరు టార్గెట్ చేశారు. ఇటీవలే అదుపులోకి తీసుకున్న ఉగ్రవాది విచారణలో పలు అంశాలు వెల్లడించినట్లు సమాచారం. దీనితో ఇంటెలిజిన్స్ అధికారులు పలు రాష్ట్రాలపై నిఘా పెట్టారు. దేశ వ్యాప్తంగా 25 మంది ఐసీస్ సానుభూతి పరులను అరెస్టు చేశారు. హైదరాబాద్ లో నలుగురు, బెంగళూరు ముగ్గురు, ముంబైలో ఒకరు ఐసిస్ సానుభూతి పరులను అరెస్టు చేశారు. మరో ఐదుగురి కోసం ఎన్ఐఏ గాలింపు చేపట్టింది. కర్నాటకలో ఇద్దరు ఐసీసీ సానుభూతి పరులను అరెస్టు చేశారు. రిపబ్లిక్ డే వేడుకల్లో విధ్వంసానికి పాల్పడేందుకు నజ్ముల్ హుదా, సయ్యిద్ హుస్సేన్ లు ప్లాన్ లు రచించారు. వీరిని ఏటీఎస్ అరెస్టు చేసింది. నజ్ముల్ హుదా మంగళూరులో ఇంజినీరింగ్ చేస్తుండగా సయ్యిద్ తుంకూరులో డిప్లామా చేస్తున్నాడు. వీరిపై భద్రతా అధికారులు గత కొంతకాలంగా నిఘా పెట్టి ఈ రోజు అరెస్టు చేశారు. మరోవైపు పఠాన్ కోట్ లో కారు డ్రైవర్ విజయకుమార్ ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పారిపోయినట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని కంగ్డాలో కారు(హెచ్ పీ 01డి 2440) డ్రైవర్ మృతదేహం లభ్యమైంది.

నగరంలో కూడా..
మరోవైపు హైదరాబాద్ నగరంలో కూడా ఐసీస్ సానుభూతి పరులను అరెస్టు చేయడం కలకలం సృష్టిస్తోంది. ఓ వ్యక్తి దగ్గర విధ్వంసానికి సంబంధించిన సామాగ్రీని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీరిని అదుపులోకి తీసుకున్న అనంతరం ఢిల్లీకి తీసుకెళ్లారు. మొత్తంగా దేశ వ్యాప్తంగా 25 మందిని అరెస్టు చేయడం ఐసీసీ భారీ విధ్వంసానికి వ్యూహ రచన చేస్తున్నట్లు తేటతేల్లమైంది. కేంద్ర నిఘా బృందం హెచ్చరికలు జారీ చేయడంతో పలు ఎయిర్ పోర్టులో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక తనిఖీ బృందాలు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టాయి. 

ఆర్ అండ్ బీ సీనియర్ అసిస్టెంట్ పై ఏసీబీ దాడి..

గుంటూరు : అర్ అండ్ బీ సీనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వరరావు ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని వెంకటేశ్వరరావుపై ఆరోపణలు ఉన్నాయి. 

అల్లాదుర్గం ఎంపీడీవో కార్యాలయంలో జెడ్పీ సీఈవో...

మెదక్ : అల్లాదుర్గం ఎంపీడీఓ కార్యాలయాన్ని జెడ్పీ సీఈవో వర్షిణి అకస్మిక తనిఖీ నిర్వహించారు. ఎంపీడీవో కరుణ శీల, సూపరింటెండెంట్ స్వప్నలు కార్యాలయంలో లేకపోవడం..రిజిష్టర్ సరిగ్గా మెయిన్ టెన్ లేకపోవడం గ్రహించారు. వారిద్దరినీ జెడ్పీ సీవో సస్పెండ్ చేశారు. 

దళిత ప్రొఫెసర్లకు చర్చలకు ఆహ్వానం..

హైదరాబాద్ : హెచ్ సీయూలో దళిత ప్రొఫెసర్లను చర్చలకు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆహ్వానించింది. కానీ ప్రొఫెసర్లు చర్చలకు వెళ్లేందుకు నిరాకరించారు. విద్యార్థుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు చర్చలకు రామని ప్రొఫెసర్లు ఖరాఖండిగా చెప్పారు.

 

12:22 - January 22, 2016

హైదరాబాద్ : సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి రోహిత్ మృతిని నిరసిస్తూ.. విద్యార్థులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు దీక్షలు చేపట్టిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం హెచ్ సీయూకు వచ్చిన వైద్యులు విద్యార్థుల ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. మరోవైపు చర్చలకు రావాలని దళిత ప్రొఫెసర్లను ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆహ్వానించింది. కానీ చర్చలకు వెళ్లేందుకు దళితర ప్రొఫెసర్లు నిరాకరించారు.

రోహిత్ విద్యార్థి ఘటనకు కారణమైన కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ, వీసీలపై తక్షణ చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీరు చేస్తున్న ఆందోళనకు జాతీయ స్థాయిలో మద్దతు పెరుగుతోంది. జాతీయ, రాష్ట్ర నేతలు వీరికి సంఘీభావం తెలుపుతున్నారు. ఆందోళన ఉధృతమౌతోందని గ్రహించిన యూనివర్సిటీ అధికారులు అత్యవర భేటీ అయి విద్యార్థుల సస్పెండ్ ను తాత్కాలికంగా ఎత్తివేశారు. దీనిపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు ఆందోళన ఆపేది లేదని స్పష్టం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం వీసీ వర్సిటీకి వస్తారని తెలుస్తోంది. 

12:15 - January 22, 2016

పశ్చిమగోదావరి : అక్వా ఫుడ్ ఫ్యాక్టరీ మా కొద్దు..మా జీవితాలను నాశనం చేయొద్దు అని భీమవరం మండలం తుండుర్రు గ్రామస్తులు పేర్కొన్నా ఫ్యాక్టరీ యాజమాన్యం పెడచెవిన పెట్టింది. ఏడాదిన్నరగా వారు విజ్ఞప్తులను బేఖాతర్ చేశారు. పచ్చగా కళకళలాడే పొలాలు..అక్వా సాగుతో ఉండే ఈ గ్రామంలో ఫ్యాక్టరీ వద్దని..మూడు గ్రామాల మధ్యన ఈ ఫ్యాక్టరీ వద్దని వారు పేర్కొంటున్నారు. ఫ్యాక్టరీ నిర్మాణం చేయడం వల్ల కాలుష్యం వెదజల్లుతుందని..గ్రామాలను ఖాళీలను చేయడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని గ్రామస్తులు కోరారు. కానీ నిర్మాణం వైపుకే అడుగులు పడుతుండడంతో సంబంధిత గ్రామస్తులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఒక్కసారిగా శుక్రవారం గ్రామస్తులందరూ చీమల దండులా కదిలారు. నిర్మాణం వద్దు..మా పొట్ట కొట్టద్దూ అని నినాదాలు చేశారు. వీరి ఆందోళన కార్యక్రమాన్ని ముందే తెలుసుకున్న పోలీసులు భారీగా మోహరించారు. ఫ్యాక్టరీ నిర్మాణం అవుతున్న స్థలంలోనికి రాకుండా ఉండేందుకు బారికేడ్లు అడ్డంగా నిలిపారు. కానీ ఈ బారికేడ్లను తోసేసుకొని వచ్చేందుకు ప్రయత్నం చేసిన వారిపై పోలీసులు లాఠీలు జులిపించారు. మహిళలని చూడకుండా బాదారు. తీనితో పలువురికి గాయాలయ్యాయి. ఆందోళనలో పాల్గొన్న సీపీఎం జిల్లా కార్యదర్శి బలారంను కిందపడేసి తొక్కారు. ఇరువర్గాల మధ్య తీవ్రవాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
ఫ్యాక్టరీ నిర్మాణం వద్దంటూ ప్రజాప్రతినిధులు..గ్రామస్తులు ఏకగీవ్రంగా తీర్మానం చేశారని నిరసనకారులు పేర్కొంటున్నారు. ఇటీవల ప్రజాప్రతినిధులు..గ్రామస్తులు..యాజమాన్యంతో జరిగిన సమావేశంలో ఫ్యాక్టరీ వద్దంటూ అత్యధిక శాతం పేర్కొనడం జరిగిందని తెలిపారు. ప్రజాభిప్రాయా సేకరణ జరగకుండా నిర్మాణం ఎలా చేపడుతారని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఫ్యాక్టరీ నిర్మాణం ఆపాలని, సముద్ర తీర ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవాలని గ్రామస్తులు సూచించారు. 

మహాత్మ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన మోడీ..

లక్నో : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వారణాసి చేరుకున్నారు. అక్కడ మహాత్మా ఎక్ర్ ప్రెస్ ను ప్రారంభించారు. 

కర్నాటకలో ఇద్దరు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు..

కర్నాటక : నజ్ముల్ హుదా, సయ్యిద్ హుస్సేన్ అనే ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను ఏటీఎస్ అరెస్టు చేసింది. 

ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో టిటిడిపి సమావేశం..

హైదరాబాద్ :ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో టిటిడిపి నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి నారా లోకేష్ హాజరయ్యారు. గ్రేటర్ ఎన్నికల నిబంధనలు..ప్రచార సరళి వ్యూహంపై చర్చించారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటామని అభ్యర్థులు ప్రమాణం చేశారు. 

కిడ్నీ రాకెట్ లో కదిలిన శ్రీలంక సర్కార్..

నల్గొండ : కిడ్ని రాకెట్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. తెలంగాణ పోలీసుల ఫిర్యాదుతో శ్రీలంక ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కొలంబోలోని నాలుగు ఆసుపత్రులతో పాటు కొందరి వైద్యులపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది. కిడ్నీ మార్పిడి చికిత్సలు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

హెచ్ సీయూను సందర్శించనున్న మాణిక్ సర్కార్..

హైదరాబాద్ : త్రిపురా రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ హెచ్ సీయూకు రానున్నారు. రాత్రి ఏడు గంటలకు ఆయన విద్యార్థులతో భేటీ కానున్నారు. 

10:13 - January 22, 2016

విజయవాడ : బీసీ సబ్‌ప్లాన్‌ రూపకల్పనకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు టీడీపీ ప్రభుత్వం..సబ్‌ప్లాన్‌పై దృష్టిసారించింది. బీసీ సబ్‌ ప్లాన్‌ చట్ట రూపకల్పనపై ఆరుగురు అధికారులతో కమిటీని ఏర్పాటుచేసింది. బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌ దీనికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. అదే శాఖకుచెందిన అదనపు, సంయుక్త కార్యదర్శులు, బీసీ ఫెడరేషన్స్ మేనేజింగ్‌ డైరెక్టర్‌, ప్రణాళికా శాఖ సంయుక్త కార్యదర్శి, సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

కమిటీకి 15 రోజుల సమయం..
బీసీ సబ్‌ప్లాన్‌కు సంబంధించి ఈ కమిటీ 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం నిర్దేశించింది. గత బడ్జెట్‌లో బీసీల కోసం రాష్ట్ర ప్రభుత్వం 6640 కోట్లు కేటాయించింది. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ఈ నిధులను కేటాయించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టంగా రూపు దిద్దుకోంది. అదే తరహాలో బీసీ సబ్‌ప్లాన్‌ తయారు చేయాలని సర్కార్‌ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ దీనిపై హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే బీసీ సబ్‌ ప్లాన్‌ చట్ట ముసాయిదాపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటుచేసింది. కమిటీ నివేదిక అనంతరం సబ్‌ప్లాన్‌పై ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశముంది. 

నల్గొండలో ఆర్ డబ్ల్యూఎస్ కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె..

నల్గొండ : ఆర్ డబ్ల్యూఎస్ కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. సమ్మెతో 750 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. ప్రభుత్వం బకాయిపడిన రూ. 83 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈసమ్మెలో చేపట్టారు. 

హెచ్ సీయూలో విద్యార్థులకు వైద్య పరీక్షలు…

హైదరాబాద్ : హెచ్ సీయూలో దీక్షలు చేస్తున్న విద్యార్థులకు వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. 

తుండ్రులో ఉద్రిక్తత..

పశ్చిమగోదావరి : తుండ్రులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్వాఫుడ్ పార్కును అడ్డుకుంటామని స్థానికులు హెచ్చరించడంతో పోలీసులు భారీగా మోహరించారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో విదేశీ కరెన్సీ స్వాధీనం..

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో దుబాయ్ నుండి వచ్చిన ప్రయాణీకుడి వద్ద భారీగా విదేశీ కరెన్సీని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ. కోటి విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకుని అతడిని విచారిస్తున్నారు. 

వ్యవసాయ శాఖ కంప్యూటర్ ఆపరేటర్ మాయాజాలం..

మెదక్ : జిల్లా వ్యవసాయ శాఖలో కంప్యూటర్ ఆపరేటర్ మానయ్య మాయాజాలం ప్రదర్శించాడు. ఏడీ వద్ద 12 చెక్కులు దొంగిలించి రూ.103 కోట్లను ఇతర ఖాతాల్లోకి మళ్లించాడు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి రూరల్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

09:28 - January 22, 2016

నెల్లూరు : ఓ వైపు బిడ్డ పోయిందన్న శోకం..విషాద వాతావరణం..అయినా కుటుంబసభ్యులు ముందుకొచ్చారు. తమ బిడ్డను ఇతరుల్లో చూసుకుంటామని అనుకుని అవయవదానం చేసేందుకు ముందుకొచ్చారు. జిల్లాలో సుభాషిణి అనే యువతి బ్రెయిన్ డెడ్ కు గురైంది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో సుభాషిణికి తీవ్రగాయాలై నారాయణ ఆసుపత్రిలో చేరింది. కానీ ఆమె బ్రెయిన్ డెడ్ కు గురైందని వైద్యులు ప్రకటించారు. దీనితో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మానవత్వంతో ముందుకొచ్చి సుభాషిణి గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులు, కళ్లు, కాలేయం, ఇతరులకు ఇచ్చేందుకు అంగీకరించారు. చెన్నై, హైదరాబాద్, తిరుపతికి అవయవాలు తరలించేందుకు వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

అసలేం జరిగింది ?
సుభాషిణిది నిరుపేద కుటుంబం. వీరి స్వస్థలం సంగం. సంక్రాంతి పండుగ సందర్భంగా సుభాషిణి కుటుంబం ఆటోలో వస్తున్నారు. ప్రమాదవశాత్తు ఆటో అదుపు తప్పి ముందు వెళుతున్న ఇసుక లారీని ఢీకొట్టింది. సుభాషిణికి తలకు తీవ్రగాయమైంది. స్థానిక నారాయణ ఆసుపత్రికి తరలించారు. కానీ ఆమె బ్రెయిన్ డెడ్ కు గురైందని వైద్యులు పేర్కొన్నారు. దీనితో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తమ బిడ్డ లేదని..అయినా అవయవదానాలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇంత విషాదంలోనూ అవయవాలు దానం చేసేందుకు ముందుకొచ్చిన ఆ కుటుంబాన్ని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. అవయవాలు తరలించేందుకు ట్రాఫిక్ పోలీసులు పలు చర్యలు తీసుకుంటున్నారు. 

09:14 - January 22, 2016

పశ్చిమగోదావరి : జిల్లాలో మళ్లీ పాత కక్షలు భగ్గుమన్నాయి. పత్తికోళ్లలంకలో నిన్న రాత్రి ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. కత్తులతో దాడులు చేసుకోవడంతో ఒకరు మృతి చెందగా 20 మందికి గాయలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. 

ముంబైలో పోలీసుల మాక్ డ్రిల్..

ముంబై : గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున నగరంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ముంబైలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. 

భారీ పొగమంచు..పలు రైళ్లు రద్దు..

ఢిల్లీ : దేశంలోని పలు ప్రాంతాల్లో భారీగా పొగమంచు కమ్ముకోవడంతో పలు రైళ్లు రద్దయ్యాయి. 14 రైళ్లు ఆలస్యంగా తిరుగుతున్నాయని, 35 రైళ్లను రద్దు చేసినట్లు ఇండియన్ రైల్వే ప్రకటించింది. ఢిల్లీలో కూడా భారీగా పొగమంచు కమ్ముకుంది.

 

08:45 - January 22, 2016

చూడు ఒకవైపే చూడు.. రెండో వైపు చూడకు తట్టుకోలేవు.. మాడిపోతావ్.... అన్న బాలికాక డైలగ్ ఇన్నరా..? సింహ సీన్మల గొట్టడా..? వాస్తవానికి బాలికాకయ్య రెండో వైపే జెప్పిండుగని.. మూడో వైపు గురించి చెప్పలే.. బాలికాకయ్య ఒకటి రెండు వైపులు జూశినోళ్లు.. ఇగో మూడో వైపు జూడటానికి వీడియో క్లిక్ చేయండి.

08:36 - January 22, 2016

హెచ్ సీయూలో విద్యార్థులపై పూర్తిగా సస్పెన్షన్ ను ఎత్తివేయాలని ది హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు. విద్యార్థుల సస్పెన్షన్...కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె..తెలంగాణలో విద్యా ప్రమాణాలు తదితర అంశాలపై ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు. ఆయన మాటల్లోనే..
ప్రశ్నిస్తున్న ప్రజలు..
''హెచ్ సీయూలో జరిగిన ఘటనపై ప్రజలంతా ప్రశ్నిస్తున్నారు. దళితులే కాదు అన్ని వర్గాల వారు ప్రశ్నిస్తున్నారు. నలుగురి విద్యార్థులపై తీసుకున్న సస్పెన్షన్ ఎత్తివేసినట్లు కాదు. కోర్టు తీర్పు వచ్చే దాక సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. సంఘ బహిష్కరణ శిక్ష కరెక్టు కాదు. తెలివిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది కోర్టు నిర్ణయం అని చెబుతున్నారు. కోర్టు మీద వేసి యూనివర్సిటీ అధికారులు పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నారు. కానీ ఈస్థాయిలోనా ? వాళ్లకు వాళ్లు తప్పించుకోవడానికి చేస్తున్న నాటకం. ఎవరిపై పోరాటం చేస్తున్నారో అర్థం చేసుకోవాలి. తప్పు చేస్తే దండించవచ్చు. ఏ కోర్టు చెప్పింది టెర్మినెటేడ్ చేశారు ? తప్పు చేశామని చెప్పుకోవచ్చు. ఇదే పది రోజుల కిందట చేసి ఉంటే రోహిత్ జీవించే వాడు కదా. బీజేపీ పరువుపోయేది కాదు కదా. తప్పును తప్పు అని చెప్పే ధైర్యం వీసీకి ఉండాలి. ఆ సీట్లో ఉంటే తాను ఖచ్చితంగా వారికి లెటర్ వాసి ఉండేవాడిని. నిజాయితీగా స్పందించాలి. సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టండి. భారత ప్రధాన మంత్రి ఇన్ వాల్ మెంట్ కావాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా లేఖ రాయాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందన లేదు. భవిష్యత్ లో కేంద్ర ప్రభుత్వంలో చేరుతారా అనే సందేహం కలుగుతోంది. ఎంతోమంది వస్తున్నారు. బీజేపీ మిత్రపక్షమైన నేతలు వచ్చారు. గతంలో చనిపోయిన వారిపై విచారణకు ఎందుకు ఆదేశించలేదు ?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె..
ఏ  వేతనం సంఘమైన వేతనాలు పెంచాలనే సిఫార్సులుంటాయి. 20 శాతం ఇస్తామని చెప్పారు. ఆరో వేతన సంఘం సమయంలో 2005-06 75 ద్రవ్యోల్బణం శాతం పెరిగింది. 2015-16 ద్రవ్యోల్బణం 127 శాతం పెరిగింది. 26వేల కనీస వేతనం ఉండాలని ఉద్యోగ సంఘాలు ఏడో వేతన సంఘానికి వినతిపత్రం ఇచ్చింది. 97 కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కందిపప్పు..27 రూపాయలకు బియ్యం ఇవ్వండి అని ఇటీవల జరిగిన సమావేశంఓ చెప్పాను. ఈ దొంగ లెక్కలు ఎందుకు ? ఆరో వేతన సంఘం అమలైన తరువాత ఉద్యోగులకు జీతాలు..పెన్షనర్లు జీడీపీలో 0.77 శాతం మాత్రమే. భారం పెరిగినట్లా ? తగ్గినట్లా'' ? అని ప్రొ. నాగేశ్వర్ పేర్కొన్నారు. రాష్ట్ర విద్యా విధానంలో భారీ మార్పులు అనే అంశంపై విశ్లేషించారు. 

08:19 - January 22, 2016

తెలంగాణ ప్రజానికమా..? మీకు ఏ కష్టమొచ్చినా..? ఎంత ఆపతొచ్చి ఏం మంత్రినోని పనివడ్డా.?? ఏ ఎమ్మెల్యేను గల్వాలె అనుకున్నా..? జర్ర మీ అక్కెరను ఫిబ్రవరి రెండు తారీఖుదాక వాయిదేస్కోండ్రి.. ఎందుకంటె సార్లు ఇప్పుడు చాల బిజీగున్నరు.. లేదు మేము కచ్చితంగ కల్వాలే లేకపోతె ఆగమైతరనుకుంటే మాత్రం..వాళ్ల జాగ కోసం ఈ వీడియో సూడుండ్రి.

08:07 - January 22, 2016

వాస్తవానికి ఒక పార్టీ కార్యకర్తలు దిష్టిబొమ్మలు గాల్చినా..? ఎవ్వలినన్న తిట్టాలనుకున్నా..? ఎవ్వల్ని తిడ్తరు... బైటి పార్టీలోళ్లను దిడ్తరు గదా..? టీఆర్ఎసోళ్లు కాంగ్రెసోళ్లను.. కాంగ్రెసోళ్లు టీఆర్ఎసోళ్లను దిట్టుడు సూశ్నం నిన్నమొన్నటిదాక.. కని జీహెచ్ఎంసీ ఓట్లళ్ల ఇది ఉల్టా అయ్యింది.. టీఆర్ఎసోళ్లు టీఆర్ఎసోళ్లనే.. కాంగ్రెసోళ్లు కాంగ్రెసోళ్లనే.. టీడీపోళ్లు టీడీపోళ్లనే దిడ్తున్నరు.. గమ్మతున్నది ఈ ముచ్చట జూస్తుంటే..మరి ఈ గమ్మత్తును చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

07:45 - January 22, 2016

చెన్నై వరద బాధితుల సహాయార్ధం మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) 5 లక్షల రూపాయల్ని విరాళంగా ప్రకటించిన విషయం విదితమే. ఆ ప్రకటన మేరకు 5 లక్షల రూపాయల చెక్‌ను నడిగర్‌ సంఘం అధ్యక్షుడు విశాల్‌కు 'మా' కార్యాలయంలో బుధవారం అందజేశారు. ఈ సందర్బంగా 'మా' అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ,'కళలకు, కళాకారులకు ప్రాంతీయ, భాషా భేదాలు ఉండవు. వరదల కారణంగా వేలాదిమంది కనీస వసతులు లేకుండా ఉన్న దయనీయమైన పరిస్థితుల్లో టాలీవుడ్‌ నుంచి పవన్‌కళ్యాణ్‌, ప్రభాస్‌, అల్లు అర్జున్‌ ఇలా ఎందరో స్టార్ట్స్‌ ముందుకొచ్చి తమవంతు సహాయాన్ని అందించారు. ఆ సమయంలోనే 'మా' అసోసియేషన్‌ తరఫున కూడా సహాయం అందించాలని 5 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించాం' అని అన్నారు. ''మా' అసోసియేషన్‌కు నడిగర్‌ సంఘం అధ్యక్షుడిగా రావడం ఆనందంగా ఉంది. 'మా' వారు సీనియర్‌ ఆర్టిస్టులకు, డ్రామా ఆర్టిస్టులకు పెన్షన్లు అందజేస్తున్నారు. మా సంఘం కూడా అదే దిశలో పని చేస్తోంది. తమిళనాడు వరద బాధితులకు టాలీవుడ్‌ నుంచి మంచి సహాయ సహకారాలు అందాయి. శక్తి మేరకు అందరూ చేయూతనిచ్చారు. 'మా' అసోసియేషన్‌ అందించిన 5 లక్షల విరాళం అక్కడ ఎన్నో కుటుంబాలకు ఉపయోగపడుతుంది' అని విశాల్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో పరుచూరి వెంకటేశ్వరరావు, శివాజీరాజా, ఏడిద శ్రీరాం పాల్గొన్నారు.

07:43 - January 22, 2016

హర్యాణాకు చెందిన ప్రముఖ మల్లయుద్ధ వీరుడి జీవితం ఆధారంగా అబ్బాస్‌ అలీ జాఫర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'సుల్తాన్‌' చిత్రం షూటింగ్‌ ఏకధాటిగా జరుగుతోంది. ఈ చిత్రం కోసం బాలీవుడ్‌ కండల వీరుడు తన శరీర ఆకృతిని మరింత బలిష్టంగా చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. హాలీవుడ్‌ చిత్రాలు 'క్రీడ్‌', 'రష్‌అవర్‌', 'పర్సన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌' వంటి చిత్రాలకు పని చేసిన స్టంట్‌ మాస్టర్‌ హన్స్‌ మారిరో ఆధ్వర్యంలో సల్మాన్‌ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. ఈ చిత్రాన్ని ఎలాగైనా రంజాన్‌ కానుకగా విడుదల చేసేందుకు షూటింగ్‌ను రాత్రి, పగలనే తేడా లేకుండా చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రంలో సల్మాన్‌ఖాన్‌ సరసన అనుష్కశర్మ నటిస్తోంది.

07:41 - January 22, 2016

మిగిలిన పండగలతో పోలిస్తే 'సంక్రాంతి'కి విడుదలయ్యే సినిమాల మధ్య ఉండే పోటీ అంతా ఇంతా కాదు. సంక్రాంతి బరిలో దిగి విజయం సాధించడానికి దర్శక, నిర్మాతలందరూ విశ్వ ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలో భాగంగా ఈ సంక్రాంతికి ఎవ్వరూ ఊహించని విధంగా ఏకంగా నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. బాలకృష్ణ నటించిన 'డిక్టేటర్‌', నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన 'సోగ్గాడే చిన్ని నాయనాన', ఎన్టీఆర్‌ నటించిన 'నాన్నకు ప్రేమతో..' వంటి భారీ బడ్జెట్‌ చిత్రాలతోపాటు శర్వానంద్‌ నటించిన 'ఎక్స్‌ప్రెస్‌రాజా' చిత్రం సైతం సంక్రాంతి బరిలో అమీతుమీ తేల్చుకునేందుకు దిగింది. ఒకేసారి నాలుగు చిత్రాలు విడుదలవ్వడంతో పోటీ తీవ్రంగా మారింది. అయినప్పటికీ సంక్రాంతి విజేత ఎవరనే ఉత్కంఠకు 'సోగ్గాడే చిన్ని నాయనా' ఎట్టకేలకు తెర దించేశాడు. ఈయేడాది సంక్రాంతి విజేతగా 'సోగ్గాడే చిన్ని నాయనా' నిలిచిందని విశ్లేషకులు ముక్త కంఠంతో చెబుతున్నారు. విడుదలైన నాలుగు సినిమాలు వేటికవే భిన్నమైన జోనర్స్‌లో రూపొంది ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నం చేశాయి. ఈ ప్రయత్నంలో 'డిక్టేటర్‌' మాస్‌ ఆడియెన్స్‌కి ఫుల్‌ ఫ్లెడ్జ్‌ మీల్స్‌లా ఉందని, ముఖ్యంగా 'బి', 'సి' సెంటర్స్‌లో కలెక్షన్లను బాగా రాబడుతోందని, 'నాన్నకు ప్రేమతో..' 'ఏ' క్లాస్‌కి పరిమితమైన సినిమాగానే అభివర్ణిస్తున్నా ఇందులోని తండ్రీకొడుకుల అనుబంధం అందరికీ రీచ్‌ అయ్యిందని, వీటికి కొంచెం భిన్నంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను విశేషంగా ఆకట్టుకోవడంలో 'సోగ్గాడే చిన్న నాయనా' సక్సెస్‌ సాధించాడని సమీక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కథ, కథనంతోపాటు సినిమాకి సంబంధించి కొన్ని విషయాల్లో 'సోగ్గాడే చిన్ని నాయనా' చూపించిన ప్రత్యేకత, నవ్యతే ప్రేక్షకులకు మరింత చేరువ చేసిందని ఫలితాలు చెప్పకనే చెప్పాయి. భారీ పోటీ ఉండే సంక్రాంతి తరుణంలో సైతం నూతన దర్శకుడితో నాగార్జున చేసిన ప్రయోగానికి సత్ఫలితం దక్కిందని చెప్పక తప్పదు. ఒకేసారి నాలుగు సినిమాలు విడుదలవ్వడంతో కలెక్షన్లను షేర్‌ చేసుకోక తప్పలేదు. అయితే ఓవర్‌సీస్‌లో ఏ సినిమాకా సినిమా మంచి స్థాయిలో కలెక్షన్లు వసూళ్ళు చేస్తున్నప్పటికీ ఎన్టీఆర్‌ 'నాన్నకు ప్రేమతో..' ముందంజలో ఉంది. ఇదిలా ఉంటే, ఓ మోస్తరు బడ్జెట్‌తో రూపొందిన 'ఎక్స్‌ప్రెస్‌ రాజా' ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంలో సక్సెస్‌ సాధించింది. అలాగే కలెక్షన్లను కూడా బాగానే రాబట్టి లాభాల బాటలో పయనిస్తోందని తెలుస్తోంది.

07:38 - January 22, 2016

ఒకప్పుడు జుట్టుకి కుంకుడు కాయలు వాడేవారు. నేడు షాంపూలూ, కండీషనర్లు వాడుతున్నారు. అయితే వీటి వాడకం ఎక్కువగా ఉండటం, వాటితో పాటు కాలుష్యం పెరగడంతో.. జుట్టు, మాడు పొడిబారిపోతుంది. దీన్ని నివారించాలంటే...
నిమ్మరసంలోని యాంటీ సెప్టిక్‌ గుణాలు మాడును శుభ్రపరచడంలో సాయపడతాయి. నిమ్మరసాన్ని నేరుగా మాడుకు పట్టించి, పది నిమిషాల తర్వాత కడిగేస్తే సరిపోతుంది.
అర కప్పు బేబీ షాంపూలో ఇరవై చుక్కల టీ ట్రీ నూనె వేసి మాడుకు పట్టించి అరగంటయ్యాక తలస్నానం చేస్తే సరిపోతుంది. టీ ట్రీ నూనెలో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్‌ గుణాలు ఉంటాయి. ఇవి జుట్టుకు మాయిశ్చరైజర్‌ గుణాలను అందించి పొడిబారడం, దురద నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.
కొబ్బరి నూనె అన్నింటికన్నా మంచి చిట్కా. చేతులు శుభ్రంగా కడుక్కుని కొబ్బరినూనె మాడుకు తగిలేలా పట్టించాలి. గంట తర్వాత షాంపూతో కడిగేస్తే సరి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే మంచిది. కలబంద గుజ్జును మాడుకు రాసి అరగంటయ్యాక షాంపూతో కడిగేయాలి.
అవకాడోలో విటమిన్లు, సహజనూనెలు, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టుని మృదువుగా మారుస్తాయి. ఒక అవకాడోని గుజ్జుగా చేసి ఒక స్పూను తేనె, రెండు స్పూన్ల ఆలివ్‌ నూనె కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని మాడుకు పట్టించి అరగంటయ్యాక షాంపూతో తలస్నానం చేసి గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే జుట్టు మెత్తగా తయారవుతుంది.

07:35 - January 22, 2016

పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య నేపథ్యంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో మొదలైన నిరసన జ్వాల ఎగిసిపడుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా విద్యార్థులు ఈ ఘటనపై నిరసన గళమెత్తుతున్నారు. ఉద్యమం ఉధృతమవడంతో వర్సిటీ పాలకమండలి..మిగిలిన నలుగురు విద్యార్థులపై క్రమశిక్షణ చర్యల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో రాజారాం యాదవ్ (టిడిపి), అశోక్ కుమార్ (బీజేవైఎం), మాల్యాద్రి (కేవీపీఎస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

07:30 - January 22, 2016

ఇంట్లో చీమలు ఉన్నాయంటే.. ఎవరికైనా కంగారే. ఎక్కడ ఏది పెట్టినా.. చీమలు చుట్టుముడతాయని ఆందోళనపడాల్సి వస్తుంది. స్వీట్‌ స్నాక్స్‌, హాట్‌.. ఇలా తేడా లేకుండా అన్నింటిపైనా దండెత్తేస్తాయి చీమలు. ఎంతో ఇష్టంగా వండుకున్న ఆహారపదార్థాలకైనా.. చక్కెరకైనా.. కొనుకొచ్చిన మిక్చర్‌ పొట్లానికైనా.. చీమలు పట్టాయంటే.. చాలా చికాకు పుడుతుంది. వంట గది నుంచి హాలు వరకు ఎక్కడ చూసినా వీటి బెడద ప్రతి ఇంట్లో కామన్‌. అయితే చీమలు నివారించడానికి మార్కెట్‌లో దొరికే ఫెస్టిసైడ్స్‌ వల్ల మనుషులకు వాసన పడకపోవడమే కాదు, ఇంట్లో మార్బుల్స్‌, టైల్స్‌ దెబ్బతినే అవకాశముంది. అదే చక్కటి హోం రెమిడీస్‌ ఫాలో అయితే.. ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి అవేంటో తెలుసుకుందామా..!
మిరియాలు లేదా నిమ్మ: బారులు బారులుగా ఉండే చీమలను వదిలించుకోవాలంటే మిరియాలపొడి చక్కగా పనిచేస్తుంది. చీమలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో మిరియాలపొడి చల్లితే సరిపోతుంది. అలాగే చీమలు రాకుండా నిమ్మ తొక్క బాగా పనిచేస్తుంది. నిమ్మ తొక్క లేదా దోసకాయ ముక్కను చీమలు ఉండే ప్రాంతంలో పెడితే వాటి వాసనకు చీమలు మైల్డ్‌ అయిపోతాయి.
కాఫీ: కాఫీ వాసన చీమలకు పడదని మీకు తెలుసా ? నిజమే అందుకే చీమల చిక్కు వదిలించుకోవడానికి ఇదో చక్కటి మార్గం. కాఫీ గింజలు లేదా కాఫీ పౌడర్‌ లేదా కాఫీ వడపోసిన తర్వాత వచ్చే పొడిని గానీ చీమలు ఉన్నచోట చల్లితే.. చీమలను ఈజీగా నివారించవచ్చు.
పుదీనా: పుదీనా వాసనకు చీమలు బెంబేలెత్తిపోతాయి. అందుకే కొన్ని పుదీన ఆకులు తీసుకుని.. కాస్త ఎండనివ్వాలి. ఎండిపోయిన తర్వాత నలిపి.. ఈ పొడిని చీమలు ఉన్న ప్రాంతంలో చల్లితే.. అవి మాయమవుతాయి. లేదా పుదినా టీ తాగే అలవాటు ఉంటే.. ఆ టీ బ్యాగ్‌ చీమలున్న దగ్గర పెట్టినా ఫలితం ఉంటుంది.
వెనిగర్‌: వెనిగర్‌ను కొద్దిగా స్ప్రే బాటిల్లో వేసి చీమలు తిరిగే ప్రదేశంలో స్ప్రే చేయాలి. ఇలా క్రమం తప్పకుండా రెండు మూడు రోజులు చేస్తే చీమలు రావు. లేదా కొన్ని వేడి నీళ్లలో ఉప్పు కలపాలి. ఈ నీటిని చీమలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో చల్లటం వల్ల వెంటనే చీమలు పారిపోతాయి. 

నేడు మహిళా సాధకులకు పురస్కారాల ప్రధానం..

హైదరాబాద్ : వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వంద మందికి కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ శుక్రవారం మహిళా సాధకుల పురస్కారాలు (ఎఛీవర్స్ అవార్డులు) ప్రధానం చేయనుంది. 

కరీంనగర్ లో వ్య.కా.స మహాసభలు..

కరీంనగర్ : తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రథమ మహాసభలు శుక్రవారం నుండి కరీంనగర్ లో ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు మహాసభలు జరగనున్నాయి. త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ ముఖ్యఅతిథిగా పాల్గొని సభలను ప్రారంభించనున్నారు. 

ఏయూ బంద్ కు ఎస్ఎఫ్ఐ పిలుపు..

విశాఖపట్టణం : నేడు ఎయూ బంద్ కు ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ మృతికి కారకులైన మంత్రులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

ప్రభుత్వాసుపత్రిలో చేరిన కామినేని..

గుంటూరు : ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి కామినేని చేరారు. నేడు కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయించుకోవడానికి ఆయన ఆసుపత్రిలో చేరారు. 

నేడు కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మల దహనం..

హైదరాబాద్ : రోహిత్ మృతికి నిరసనగా జస్టిస్ చంద్రకుమార్ నేతృత్వంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, దత్తాత్రేయల దిష్టిబొమ్మలను దహనం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 

06:51 - January 22, 2016

సీనియర్ సిటిజన్ లకు రైలు ప్రయాణ చార్జీల్లో ఇస్తున్న రాయితీల్లో కోతలు కోసే అంశంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. రైల్వే బడ్జెట్ లో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే కొన్ని కోట్ల మంది భారతీయలు మీద దీని ప్రభావం పడే అవకాశం వుంది. సీనియర్ సిటిజన్లకు రైలు ప్రయాణ చార్జీల్లో ఎందుకు రాయితీలివ్వాలి? ఈ రాయితీలు ఎత్తివేస్తే వారి మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? మన దేశంలో ప్రస్తుతం సీనియర్ సిటిజన్లు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? సవాళ్లేమిటి? వీరికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సౌకర్యాలు, సదుపాయాలు అందించాల్సిన అవసరం వుంది? ఇలాంటి అంశాలపై టెన్ టివి జనపథంలో ఆల్ ఇండియా పెన్షనర్స్ అసోసియేషన్ నేత ఎంఎన్ రెడ్డి విశ్లేషించారు. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

06:49 - January 22, 2016

కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం విభిన్నవర్గాలకు ఇస్తున్న రాయితీలకు కత్తెరలు వేస్తోంది. వ్యవసాయ సబ్సిడీలు, గ్యాస్ సబ్సిడీలు తగ్గించి, పెట్రోల్, డీజిల్ పై పన్నులు పెంచుతున్న ప్రభుత్వం తాజాగా వృద్ధులకిచ్చే కన్షెషన్స్ మీద కన్నేస్తోంది. వృద్ధులను గౌరవించడం మానవీయ సంస్కృతి. జీవన సంరంభంలో అరవై వసంతాలు పూర్తి చేసుకున్నవారిని సీనియర్ సిటిజన్ లుగా గౌరవిస్తుంటారు. మన దేశ జనాభాలో సీనియర్ సిటిజన్ ల శాతం పెరుగుతోంది. మన దేశంలో 60 ఏళ్ల వయస్సుపైబడ్డవారు పది కోట్లకు పై మాటే. వీరిలో దాదాపు మూడు కోట్ల మందిది ఏ తోడూ లేని ఒంటరి జీవితం. రాబోయే పదేళ్లలో సీనియర్ సిటిజన్ల సంఖ్య 17 కోట్లు దాటుతుందన్న అంచనాలున్నాయి. సమాజంలో సీనియర్ సిటిజన్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వారికేష్టం రాకుండా అవసరమైన సదుపాయాలు, సౌకర్యాలు కల్పించడం మీద ప్రభుత్వాలు దృష్టిసారించాల్సిన సందర్భమిది.

పోషకాహారం ఎక్కడ ?
దేశంలో 58 ఏళ్లు రిటైర్మెంట్ ఏజ్. కానీ, మన దేశంలోని సీనియర్ సిటిజన్ లలో 90శాతం మందిది తమ రెక్కల కష్టం మీదనే ఆధారపడక తప్పని స్థితి. ఒంట్లో సత్తువ వున్నంతవరకూ పనిచేస్తూనే వున్నప్పటికీ మన దేశంలో ప్రతి ఆరుగురు సీనియర్ సిటిజన్ లలో ఒకరు పోషకాహారం పొందలేకపోతున్నారు. ప్రతి ముగ్గురులో ఒకరు ఆరోగ్య సేవలకు నోచుకోలేకపోతున్నారు. ప్రతి ఇద్దరిలో ఒకరు ఏదో ఒక రూపంలో కుటుంబ సభ్యుల నిరాదరణకు లోనవుతూ కుమిలిపోతున్నారు. సీనియర్ సిటిజన్ల వెంటాడే అతి ప్రధాన సమస్య ఆరోగ్యం. మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, మెడనొప్పి, షుగర్, బీపీ, గుండె జబ్బులు ఇలాంటివన్నీ కాచుకుని కూర్చొంటాయి. నిత్యం ఏదో ఒక మందులు మింగాల్సిన పరిస్థితి. ఈ వయస్సులో పనిచేసినా వచ్చే ఆదాయం తక్కువ. ఓ వైపు పిల్లల చదువుల ఖర్చులు, మరోవైపు వైద్య ఖర్చులు, చుక్కల్లో చేరిన నిత్యావసరాల ధరలు. ఇవన్నీ ప్రతి ఒక్కరి కుటుంబ బడ్జెట్ ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న రోజులివి. అసలే అంతంత మాత్రపు సంపాదనతో రోజులు వెళ్లదీసే కుటుంబాల్లోని వృద్ధుల పరిస్థితి మరింత దయనీయం.

రాయితీలు భారమంట..
ఇలాంటి సందర్బాలలో సీనియర్ సిటీజన్లకు ఎంతో కొంత ఊరట నిస్తున్నవి వృద్ధాప్య పెన్షన్ లు, రైలు చార్జీలలో రాయితీలు వంటివే. మన దేశంలో 60 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్ లకు రైళ్లలో 40 నుంచి 50శాతం కన్సెషన్ లభిస్తోంది. ఏడాది మొత్తం మీద రైళ్లలో ప్రయాణించిన వృద్ధులందరికీ కలిపి ఇస్తున్న కన్సెషన్ 1150 కోట్ల రూపాయలకు మించదు. కార్పొరేట్ సంస్థలకు ఇస్తున్న లక్షల కోట్ల రూపాయల రాయితీలతో పోల్చుకుంటే ఇదెంత? వృద్ధులకిచ్చే ఈ 1150 కోట్ల రూపాయల రాయితీనే భారమైనట్టుగా కేంద్ర ప్రభుత్వం భావించడం ఎంత మాత్రమూ భావ్యం కాదు. సీనియర్ సిటిజన్ లకు ఇచ్చే కొద్దిపాటి రాయితీలను కూడా భారంగా భావించే ప్రభుత్వాలుండడమే ఈ దేశ ప్రజల దురదృష్టం.

దేశ సామాజిక బాధ్యత..
సాధారణంగా సీనియర్ సిటిజన్ లు అత్యవసరమో, తప్పనిసరి పరిస్థితి వస్తేనో తప్ప ప్రయాణాలు పెట్టుకోరు. బంధువుల ఇళ్ల లో జరిగే శుభ కార్యాలకు, పరామర్శలకు వెళ్లేవారే ఎక్కువగా వుంటారు. లేదా వైద్య పరీక్షలు చేయించుకోవడానికి వెళ్తుంటారు. సీనియర్ సిటిజన్లకు పెన్షన్ లు, రాయితీలివ్వడం, వారికి అవసరమైన సదుపాయాలు అందించడం వారిపట్ల దయతోనో, జాలితోనో చేస్తున్న కార్యక్రమం కాదు. అది మన దేశ సామాజిక బాధ్యత. ఎందుకంటే, ఇవాళ, వృద్ధాప్యంలో వున్నవారంతా యవ్వనంలో వున్నప్పుడు ఈ దేశ ఆర్థికాభివృద్ధికో, విద్యాభివృద్ధికో, సాంస్క్రుతికాభివృద్ధికో తమ వంతు సేవలు అందించినవారే. నేటి అభివృద్ది చిహ్నాలన్నీ ఈ దేశ ప్రజల రెక్కల కష్టంతో, రక్తమాంసాలతో నిర్మితమైనవే. ఇలా ఏ కోణంలో చూసినా సీనియర్ సిటిజన్లకు ప్రయాణ రాయితీలివ్వడం, వారి ప్రయాణం మరింత సుఖవంతంగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం మనందరి బాధ్యత. ఈ కర్తవ్యాన్ని కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తుండడమే ఆవేదనాభరిత పరిణామం. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలూ తరచూ సాగించే విదేశీ పర్యటనలు, జల్సాలకు వెచ్చించే మొత్తంతో పోల్చుకుంటే సీనియర్ సిటిజన్లకు ఇస్తున్న రాయితీలు చాలా స్వల్పం.  

06:41 - January 22, 2016

హైదరాబాద్ : నామినేషన్ల పర్వం ముగియడంతో గ్రేటర్‌ఎన్నికల ప్రచార పర్వంపై టీడీపీ దృష్టి సారించింది. ప్రచారంలో పాల్గొనే నేతల జాబితాను పార్టీ ఫైనల్‌ చేసింది. తెలంగాణ నేతలతో పాటు ఏపీ నేతలు కూడా ప్రచారంలో పాలు పంచుకోనున్నారు. స్టార్‌ క్యాంపైయినర్‌గా రేవంత్‌ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు. ఈ నెల 24న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ గ్రేటర్‌ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. మొదట విడతలో మూడు రోజుల పాటు రోడ్‌షోలు నిర్వహిస్తారు. రెండో విడతలో భాగంగా 30వ తేదీ నుంచి రెండు రోజుల పాటు ప్రచారంలో లోకేష్‌ పాల్గొంటారు. 31న లక్ష బైకులతో నిర్వహించే భారీ ర్యాలీకి లోకేష్‌ హాజరవుతారు. మరోవైపు 28,29 తేదీల్లో అధినేత చంద్రబాబు ప్రచారానికి వస్తారు. నగరంలో రోడ్‌షోలతో పాటు పలు బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు.

ప్రచారంలోకి టీ టీడీపీ ముఖ్యనేతలు..
ఇక టీ టీడీపీ ముఖ్య నేతలంతా ప్రచారంలోకి దిగుతున్నారు. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్‌ రమణ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌ రావుతో పాటు మరో పదిహేను మంది ముఖ్య నాయకులను స్టార్‌ క్యాంపెయినర్లుగా బాధ్యతలు అప్పగించారు. ఇది ఇలా ఉంటే టీ టీడీపీ నేతల ప్రచారంలో రేవంత్‌రెడ్డి ప్రధాన ఆకర్షణ కానున్నారు. మరోపక్క గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో టీడీపీకి చెందిన ఆంధ్రప్రాంత నేతలు కూడా పాల్గోనున్నారు. ప్రచారానికి వచ్చే ఏపీ నేతల జాబితాను కూడా సిద్ధం చేశారు. ఇక మిత్రపక్షమైన బీజేపీ కూడా తమ నేతలను రంగంలోకి దింపుతోంది. ఆ పార్టీ ముఖ్య నాయకులు కూటమి తరుపున ప్రచార బరిలోకి రానున్నారు.

06:39 - January 22, 2016

హైదరాబాద్ : ఇప్పటి వరకు సవాళ్లు ప్రతిసవాళ్లతో రసవత్తరంగా మారిన గ్రేటర్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం పూర్తి కావడంతో.. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రచారంపై రాజకీయ పార్టీలన్ని దృష్టి సారించాయి. నామినేషన్లు ముగిసిన గడియ నుండే ప్రజల్లోకి వెళ్లేందుకు నేతలు సిద్దమయ్యారు. ఇప్పటికే అధికార పార్టీ నేతలు తమకు కేటాయించిన డివిజన్లలో ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గ్రేటర్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామని చెప్పకనే చెప్పిన కేటీఆర్ శనివారం నుండి ప్రచార కార్యక్రమాలను మరింత ఉదృతం చేసేందుకు ప్రణాళికలను సిద్దం చేసుకున్నారు. ఇందులో భాగంగా నగర శివార్ల ప్రాంతాల నుంచి సీనియర్ నేతల ప్రచారాన్ని ప్రారంభించాలని ప్లాన్ ఖరారు చేసింది. 23 వ తేదీన శేరిలింగంపల్లిలోకేటీఆర్ రోడ్ షో తో ప్రారంభమై 28 వ తేదీ వరకు నగరంలో 100 డివిజన్లు కలిసి వచ్చేలా.. రోడ్ షోలకు రూట్ మ్యాప్ రెడీ అయింది. వీటితో పాటు నగరంలో అక్కడక్కడ బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

బహిరంగసభలు..
గులాభిపార్టీ చోటే భాయ్ ప్రచారపర్వం ముగియగానే ప్రచారరంగంలోకి కేసీఆర్ దిగనున్నట్లు నేతలు తెలిపారు. సీఎం పర్యటన ఎలా ఉండాలన్న దానిపై పార్టీలో ఇంకా తుది నిర్ణయం కాలేదని మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ నెల23, 24 తేదీలలో శేరిలింగంపల్లి కూకట్ పల్లిలలో ...25, 26 ఎల్ బీనగర్, మహేశ్వరంలలో... 27 ,28 ముషీరాబాద్ , సికింద్రాబాద్ లలో రోడ్ షో లు నిర్వహిస్తారని తెలిపారు. ఈ నెల 30 వ తేదీ నగరంలోని పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఎంపీ బాల్కసుమన్ తెలిపారు. అయితే ఒకటే బహిరంగ సభ పెడితే చాలదని జంటనగరాల్లో రెండు బహిరంగ సభలు పెడితే బాగుటుందని కొందరు నేతలు భావిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. మెజారీటీనేతల అభిప్రాయం మేరకు ఒకటి రెండు రోజుల్లో సీఎం ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉంది. మరో రెండు రోజుల్లో పార్టీ మ్యానిఫేస్టో ను కూడా విడుదల చేయనున్నట్లు టీఆర్ఎస్ పార్టీ నేతలు చెబుతున్నారు. హైదరాబాద్ విశ్వనగరం నినాదంతో రయ్యన దూసుకెళ్లేందుకు కారు పార్టీ ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది. 

06:36 - January 22, 2016

హైదరాబాద్ : సెంట్రల్ యూనివర్సిటీలో సామాజిక వివక్ష అసమానతలు కొనసాగుతోన్న నేపథ్యంలో వీటిని బలపరిచే విధంగా మరిన్ని ఉదంతాలు ఒక్కొక్కటి ఇప్పుడే బయటపడుతున్నాయి. వర్సిటీలో అధ్యాపకులు, ప్రొఫెసర్లు సైతం హెచ్‌సీయూని మత సంస్కృతి, సంప్రదాయాలకు వేదికగా మలుచుకున్నారనే వార్తలు ఇప్పుడు గుప్పుమంటున్నాయి. ఆధునికత, విజ్ఞానానికి ఆలవాలంగా నిలివాల్సిన విశ్వవిద్యాలయాలు ఇలాంటి ఉదంతాలతో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

గణిత శాస్త్ర ఉదంతం..
గతంలో హెచ్‌సీయూ వర్సిటీకి చెందిన గణితశాస్త్ర ప్రొఫెసర్‌ కన్నన్‌ ఉదంతం తెలిస్తే ఆశ్చర్యం కలగకమానదు. వర్సిటీకి చెందిన క్వార్టర్‌ నెంబర్‌ 7బై ఏ లో నివాసం ఉండేవారు. మూడేళ్ల క్రితమే ప్రోఫెసర్‌ కన్నన్‌ పదవీ విరమణ చేసినప్పటికీ ఆయన గురించి తెలిసిన విద్యార్థులు, అధ్యాపకులు రకరకాలుగా చెప్పుకునేవారు. సదరు ప్రొఫెసర్‌ సనాతన ఆచారాలు పాటించడంలో దిట్ట.  విదేశీ యూనివర్సిటీల నుంచి అనేక ఆఫర్లు వచ్చినా సముద్రయానం చేయకూడదనే సంప్రదాయం ప్రకారం ప్రొఫెసర్‌ కన్నన్‌ తిరస్కరించారని చెబుతారు. ఇక అన్నింటికన్నా విచిత్రమైన విషయం వర్సిటీలోనే కన్నన్‌ ఓ బావిని తవ్వించుకున్నారు. అంతేకాదు తన పనులన్నింటినీ ఈ నుయ్యిలోని నీటినే వాడేవారు. ఆయన ఆహార్యంలోనూ సనాతన ఆచారాలు పాటిస్తారని కొట్టొచ్చినట్లు కనిపించేది.

ప్రత్యేక బావి..
ఈ బావిలోని నీటిని వాడొద్దంటూ నిబంధనలేమీ విధంచకపోయినా.. ప్రొఫెసర్‌ కన్నన్‌ గురించి తెలిసిన వారెవరూ బావి పరిసర ప్రాంతాల్లోకి వెళ్లేందుకు సాహసించేవారు కాదని ఆయన గురించి తెలిసిన ప్రొఫెసర్లు, అధ్యాపకులు, సిబ్బంది చెప్పారు. ప్రస్తుతం ఈ బావిని వర్సిటీ యాజమాన్యం చెక్కమూతతో మూయించింది. అయితే తరతరాలుగా దేశంలో కొనసాగుతున్న వివక్షను ప్రతిబింబించే విధంగా ఒక ప్రొఫెసర్‌ ప్రత్యేక బావిని తవ్వించుకోవటానికి వీలుగా విశ్వ విద్యాలయ ఉన్నతాధికారులు, పాలక మండలి అనుమతివ్వడంపై ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

06:33 - January 22, 2016

హైదరాబాద్ : సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ మృతిని నిరసిస్తూ.. విద్యార్థుల పోరాటం మరింత ఉధృతం కానుంది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో రౌండ్ టేబుల్ సమావేశంలో పలు సంఘాల నేతలు విద్యార్థి, యువజన, ప్రజాసంఘాలు జేఏసీగా ఏర్పడ్డాయి. ఈ జేఏసీకి జస్టిస్ చంద్రకుమార్ ను కన్వీనర్ గా ఎన్నుకున్నారు. రౌండ్ టేబుల్ సమావేశానికి పలు విద్యార్థి సంఘాలు, యువజన, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కారామయ్య, కంచె ఐలయ్య, కవి జయరాజ్, సంధ్య, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు, మల్లేపల్లి లక్ష్మయ్య , టీజాక్ ఛైర్మన్ కోదండరామ్, జస్టిస్ చంద్ర కుమార్, వామపక్ష నేతలు, మేధావులు హాజరయ్యారు.

దిష్టిబొమ్మల దహనం..
రోహిత్ మృతికి కారణమైన కేంద్రమంత్రుల దిష్టి బొమ్మల దహనానికి జేఏసీ పిలుపునిచ్చింది. ఇందిరా పార్క్ వద్ద రిలే దీక్షలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. 24న జిల్లా, మండల కేంద్రాల్లో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టనున్నారు. అన్ని యూనివర్శిటీలకు బస్సుయాత్ర చేపట్టాలని కూడా నిర్ణయించారు. రోహిత్ కుటుంబానికి 50 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ , దత్తాత్రేయ రాజీనామా చేయాలని లేకపోతే మోడీనే వారిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు నేతలు. కేంద్ర మంత్రులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ఆరోపించారు. రోహిత్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు... మృతికి గల కారణాలను విశ్లేషించాలని నేతలు డిమాండ్ చేశారు. రోహిత్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ప్రజా సంఘాల జేఏసీ ఉద్యమిస్తుందన్నారు నేతలు.  

06:28 - January 22, 2016

హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున నగరంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా లంగర్‌ హౌస్‌, గోల్కొండ, హుమాయున్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. కార్డన్‌ సెర్చ్‌లో సుమారు తొమ్మిది దేశాలకు చెందిన 82 మంది విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు.వీరిలో టర్కీ, ఆఫ్గనిస్తాన్‌, నైజీరియా, ఇతియోపియా, సోమాలియా దేశాలకు చెందినవారు ఉన్నారు. అలాగే కార్డన్‌ సెర్చ్‌లో డీసీపీ వెంకటేశ్వరరావుతో పాటు ముగ్గురు ఏసీపీలు, 12మంది సీఐలు, 26 మంది ఎస్సైలు, 300 మంది పోలీసులు పాల్గొన్నారు.  

06:27 - January 22, 2016

రంగారెడ్డి : హైదరాబాద్‌-బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో లారీని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలూ పూర్తిగా దగ్ధమయ్యాయి. బషీర్‌బాగ్‌కు చెందిన నలుగురు యువకులు ఇండికా కారులో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వెళుతున్నారు. శంషాబాద్‌ సమీపంలోని శాంతంరాయి దగ్గర ముందు వెళుతున్న లారీని కారు ఢీకొట్టింది. లారీ డ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేక్‌ వేయడంతో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే మంటలు అంటుకోవడంతో లారీ, కారు రెండూ పూర్తిగా కాలి బూడిదయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్‌ బెంగళూరు హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు తీవ్రంగా శ్రమించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

 

భారత్ - శ్రీలకం టీ - 20 మ్యాచ్ షెడ్యూల్..

ఢిల్లీ : భారత్ - శ్రీలంక జట్ల మధ్య టీ - 20 మ్యాచ్ లు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 9న పుణె, 12న ఢిల్లీ, 14న విశాఖలో టీ - 20 మ్యాచ్ లు జరగనున్నాయి. 

ఎంపీ మిథున్ రెడ్డికి పోలీసు కస్టడీ..

చిత్తూరు : ఎయిరిండియా మేనేజర్ దాడి కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఒక రోజు పోలీసు కస్టడీ విధించారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు జిల్లా సబ్ జైల్లో ఉన్నారు. 

నెల్లూరులో మహిళ బ్రెయిన్ డెడ్..

నెల్లూరు : చింతారెడ్డిపాలెంలోని నారాయణ ఆసుపత్రిలో సుభాషిణి (23) అనే మహిళ బ్రెయిన్ డెడ్ కు గురైంది. అవయవదానికి సుభాషిణి కుటుంబసభ్యులు ముందుకొచ్చారు. 

శాంతంరాయి వద్ద లారీని ఢీకొన్న కారు…

రంగారెడ్డి : శంషాబాద్ పీఎస్ పరిధిలోని శాంతంరాయి వద్ద లారీని కారు ఢీకొంది. నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. బెంగళూరు - హైదరాబాద్ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. 

లంగర్ హౌస్ పరిధిలో కార్డన్ సెర్చ్..

హైదరాబాద్ : లంగర్ హౌస్, గొల్కోండ, హుమాయిన్ నగర్ పీఎస్ పరిధిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కార్డన్ సెర్చ్ లో ముగ్గురు ఏసీపీలు, 12 మంది సీఐలు పాల్గొన్నారు. 26 మంది ఎస్ఐలు, 300 మంది పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 

Don't Miss