Activities calendar

27 January 2016

చెన్నైలో ఎమ్మెల్యే రోజా..

చెన్నై : వైసీపీ ఎమ్మెల్యే రోజా చెన్నైకు వచ్చారు. నియోజకవర్గంలో చేపట్టాల్సిన ప్రయాణీకుల వసతి సదుపాయాల గురించి చెన్నైలోని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రోజా విలేకరులతో మాట్లాడారు. గతంలో తాను చేసిన విజ్ఞప్తులకు రైల్వే శాఖ సానుకూలంగా స్పందించిందన్నారు. 

పాక్ గజల్ గాయకుడు గులాం కార్యక్రమం మళ్లీ వాయిదా..

ముంబై : పాకిస్తాన్ గజల్ గాయకుడు గులాం ఆలీఖాన్ కార్యక్రమం మళ్లీ రద్దయ్యింది. 'ఘర్ వాపసీ' కార్యక్రమానికి ఆలీఖాన్ హాజరు కావాల్సి ఉంది. శివసేన హెచ్చరికలతో ఆయన కార్యక్రమం రద్దయ్యింది.

 

జైట్లీ..నిర్మలసీతారామన్ ను కలిసిన మాణిక్యాలరావు..

ఢిల్లీ : కేంద్ర మంత్రులు జైట్లీ, నిర్మలా సీతారామన్ లను ఏపీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు కలిశారు. పామాయిల్ రైతులను ఆదుకోవాలని సీతారామన్ ను కోరడం జరిగిందని, ఫిబ్రవరి 10,11,12 తేదీల్లో ప.గో జిల్లాలో పర్యటిస్తారని నిర్మలా సీతారామన్ హామీనిచ్చారన్నారు. కృష్ణా, పుష్కరాలకు నిధులు కేటాయించాలని జైట్లీని కోరినట్లు తెలిపారు. టెంపుల్ టూరిజం పథకం కింద రాష్ట్రంలో ఏడు దేవాలయాలను అభివృద్ధి చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. 

21:34 - January 27, 2016

ఆస్ట్రేలియా ఓపెన్‌ మహిళల డబుల్స్‌లోనూ భారత మహిళా టెన్నిస్ డబుల్స్ క్వీన్‌ సానియా మీర్జా జోరు కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో టాప్‌ సీడ్‌గా బరిలోకి దిగిన సానియా,స్విస్‌ వెటరన్‌ మార్టినా హింగిస్‌ జోడీకి సెమీస్‌లోనూ ఎదురే లేకుండా పోయింది. సెమీ ఫైనల్‌ రౌండ్‌లో జర్మన్‌- చెక్‌ రిపబ్లిక్‌ జోడీ జూలియా జార్జెస్‌, కరోలినా లిస్కోవా జోడీపై సునాయాస విజయాన్ని నమోదు చేశారు. తొలి సెట్‌ను సునాయాసంగా 6-1తో దక్కించుకున్న సానియా జోడికి రెండో సెట్‌లో అసలే మాత్రం పోటీ లేకుండా పోయింది. సానియా-హింగిస్‌ జోడీ జోరు ముందు కనీస పోటీ కూడా ఇవ్వలేక జూలియా-కరోలినా లిస్కోవా జోడీ తేలిపోయింది. 

21:32 - January 27, 2016

విశాఖపట్టణం : తీరంలో యుద్ధ వాతావరణం నెలకొంది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. భారీ ట్యాంకులు దూసుకువస్తున్నాయి.విమానాలు వదలకుండా రొద చేస్తున్నాయి. బాంబులతో బీచ్‌ దద్దరిల్లిపోతోంది. దాడులను ఎదుర్కొనేందుకు నేవీ దళాలు దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. ఈ వార్‌ సీన్‌ ఇప్పుడు విశాఖ తీరంలో కనిపిస్తోంది. ఇంటర్నేషనల్‌ ఫ్లీట్ రివ్యూ ఫిబ్రవరి 4 నుంచి 8 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో సాగర తీరంలో నేవీ దళాలు రిహార్సల్స్‌ నిర్వహిస్తున్నాయి. ఫ్లీట్ రిహార్సల్స్‌లో భాగంగా విశాఖ సాగర తీరంలో వివిధ విన్యాసాలను ప్రదర్శిస్తున్నారు. ఫిబ్రవరి 2న జరిగే ఫైనల్ రిహార్సల్‌లో వివిధ దేశాల నేవీ దళాలు పాల్గొంటాయి. ఫిబ్రవరి 6న జరిగే ఫ్లీట్ రివ్యూలో ప్రధాని, రాష్ట్రపతి, పలుదేశాల ప్రతినిధులు పాల్గొంటారు. వివిధ దేశాలకు చెందిన నావికాదళాల మధ్య మిత్రత్వం, పరస్పర అవగాహన, మేరీటైమ్ వ్యాపారలావాదేవీలు, పైరేట్స్‌పై పోరు ఫ్లీట్ రివ్యూలో భాగమవుతాయి. ఫిబ్రవరి 6న జరిగే ఫ్లీట్ రివ్యూలో ప్రధాని, రాష్ట్రపతి, పలుదేశాల ప్రతినిధులు పాల్గొంటారు. ఇక ఐఎఫ్‌ఆర్‌తో విశాఖలో పండగ వాతావరణ నెలకొంది.

21:29 - January 27, 2016

విజయవాడ : మార్చి 1 నుంచి ఏపీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి నెలాఖ‌రున కేంద్ర బ‌డ్జెట్ ప్రవేశ పెట్టిన త‌ర్వాత..ఏపికి కేటాయింపులను ప‌రిశీలించి బ‌డ్జెట్‌కు తుది రూపు ఇవ్వాల‌ని ప్రభుత్వం భావిస్తోంది. అయితే బ‌డ్జెట్ స‌మావేశాలు ఎక్కడ జ‌ర‌పాల‌నే దానిపై ప్రభుత్వం ఇంకా త‌ర్జన భర్జన ప‌డుతుంది. సమావేశాల నిర్వహణపై మ‌రో రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం కన్పిస్తోంది. మార్చి 23 వ‌రకు ఈ స‌మావేశాలు జ‌రిగే అవ‌కాశం ఉంది. మార్చి 5న 2016-17 వార్షిక బ‌డ్జెట్‌ను,.మార్చి8న ప్రత్యేక వ్యవసాయ బ‌డ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. మార్చి1న‌ గ‌వ‌ర్నర్ ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్రసంగించటంతో స‌మావేశాలు ప్రారంభం అవుతాయి. మార్చి 23 త‌రువాత స్పీక‌ర్ విదేశాల‌కు వెళ్లే అవ‌కాశం ఉండ‌టంతో. 23న స‌మావేశాలు ముగించాల‌ని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏపికి అందించే ఆర్దిక సాయంపై ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో పార్లమెంటులో ప్రవేశపెట్టే వార్షిక బ‌డ్జెట్ ప్రతిపాదన‌లపై బ‌డ్జెట్ రూపుదిద్దుకోనుంది. ఇప్పటికే ఆర్ధిక శాఖ అధికారులు ఈ అంశంపై శాఖ‌ల వారీగా క‌స‌ర‌త్తు ప్రారంభించారు.

తర్జనభర్జన..
అయితే ఏపీ బడ్జెట్‌ స‌మావేశాలు ఎక్కడ నిర్వహించాలనే దానిపై ప్రభుత్వం ఇంకా త‌ర్జనభర్జన ప‌డుతుంది. ఏపీ రాజ‌ధాని ప్రాంతంలోనే స‌మావేశాలు నిర్వహించే అంశాన్ని స్పీక‌ర్ సీరియ‌స్‌గా ప‌రిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే స్పీకర్ వ‌డ్డేశ్వరంలోని కేఎల్ కాలేజీ, హాయ్‌లాండ్‌ను పరిశీలించి సమీక్షించారు. అయితే వీటిపై ప్రభుత్వానికి ఇంకా స్పష్టత రాలేదు. ఈ ప్రాంతాల్లో స‌మావేశాల నిర్వహ‌ణపై అన్ని కీల‌క శాఖ‌ల అధికారుల‌తో సంప్రదింపులు కూడా సాగుతున్నాయి. ముఖ్యంగా భ‌ద్రత అంశంపై స్పీకర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. పోలీసు అధికారుల నుంచి నివేదిక వ‌చ్చిన త‌రువాత‌ దీనిపై సీఎంతో చ‌ర్చించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు స్పీక‌ర్ కోడెల‌.

హైదరాబాద్ లోనే...
అయితే, తాజాగా జ‌రిగిన క్యాబినెట్ స‌మావేశంలోనూ దీనిపై చ‌ర్చ జ‌రిగింది. అయితే మెజార్టీ మంత్రులు మాత్రం హైద‌రాబాద్‌లోనే సమావేశాలను నిర్వహించాలని అభిప్రాయ‌ప‌డ్డారు. దీంతో స్పీకర్‌ కూడా హైదరాబాద్‌లోనే నిర్వహించాలని దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. అయితే దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకటి రెండు రోజుల్లో ప్రకటన చేస్తారని తెలుస్తోంది. మొత్తానికి ఏపీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానుండడంతో...బడ్జెట్‌ ప్రతిపాదనలపై ఆయా శాఖలతో ఆర్ధిక మంత్రి యనమల ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఏ శాఖకు ఎంత బడ్జెట్‌ కేటాయించాలో కూడికలు -తీసివేతల్లో మునిగిపోయారు. 

21:26 - January 27, 2016

హైదరాబాద్ : వైసిపి ఎమ్మెల్యే రోజా-టిడిపి ఎమ్మెల్యే అనిత మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఒకరిపై మరొకరు ఘాటు వ్యాఖ్యలు చేసుకుంటూ సవాళ్లు-ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. రోజా చేసిన వ్యాఖ్యలపై కోటి రూపాయల పరువు నష్టం దావా వేస్తానని అనిత సవాల్‌ చేస్తే..న్యాయ పోరాటంతో విజయం సాధిస్తానని రోజా ధీమా వ్యక్తం చేశారు. ఇద్దరి వివాదంపై మండలి బుద్ద ప్రసాద్‌ కమిటీ సమావేశమై ఎటూ తేల్చుకోలేక వాయిదా పడింది. టిడిపి ఎమ్మెల్యే అనిత వేసిన రాజకీయ పరువునష్టం కేసుపై ఎమ్మెల్యే రోజా ఫైర్‌ అయ్యారు. తనపై కక్షసాధించేందుకు తెలుగుదేశం పనికిమాలిన రాజకీయాలు చేస్తోందని..అందుకే ఎమ్మెల్యే అనితను పావులా వాడుకుంటుందని మండిపడ్డారు. ఇలా కక్ష సాధించుకుంటూ పోతే 2019లో ప్రభుత్వం మారితే ఇంతకు పదింతలు అనుభవించాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. తనకు మాత్రం నోటీసులేవీ రాలేదన్నారు. వైసిపి ఎమ్మెల్యే రోజా-టిడిపి ఎమ్మెల్యే అనిత వివాదంపై మండలి బుద్ద ప్రసాద్‌ నేతృత్వంలో ఏర్పాటైన క్రమశిక్షణా కమిటీ భేటీ అయి చర్చించింది. ఈ భేటీలో వైసిపి, టిడిపి సభ్యులు ఒకరిపై ఒకరు వాగ్వావాదం చేసుకోవడంతో సమస్య కొలిక్కి రాలేదు. దీంతో సమావేశాన్ని ఫిబ్రవరి 5కు వాయిదా వేశారు. క్రమశిక్షణా కమిటీ సమావేశం రోజే ఎమ్మెల్యే అనిత ప్రెస్‌మీట్‌ పెట్టడంతో.. అధికారపార్టీ రోజాపై చర్యలు తీసుకునేదిశగా వ్యూహాలు పన్నుతున్నట్లు తెలుస్తోంది.

21:23 - January 27, 2016

హైదరాబాద్ : సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధి రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిని శిక్షించాలంటూ కోరుతూ విద్యార్ధి జేఏసీ దేశ వ్యాప్తంగా యూనివర్సిటీల బంద్ కు పిలుపునివ్వగా అనూహ్య స్పందన లభించింది. విద్యార్థులు స్వచ్ఛందంగా తరగతి గదులు బహిష్కరించి రోహిత్‌కు సంఘీభావం తెలిపారు. మరోవైపు హెచ్‌సీయూలో తాత్కాలిక వీసీని అడ్డుకొని విద్యార్థులు తమ నిరసన వ్యక్తం చేశారు. రోహిత్‌కు సంఘీభావంగా దేశవ్యాప్తంగా యూనివర్సిటీల విద్యార్ధులు తరగతులు బహిష్కరించి ఆందోళనలో పాల్గొన్నారు. ఢిల్లీలోని జేఎన్‌యూలో ఆందోళనలు చేస్తున్న విద్యార్ధులు..నేడు యూనివర్సిటీ బంద్ తో పాటు కేంద్ర హెచ్ఆర్డీ కార్యాలయాన్ని కూడా చుట్టుముట్టడించారు. ఇక ఇదే నెల 28,29 తేదీల్లో దేశ వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు నిర్వహించనున్నారు.

నిరసనలు..
ఇక తెలుగు రాష్ట్రాల్లో సైతం రోహిత్‌కు సంఘీభావంగా పలు విశ్వవిద్యాలయాల్లో తరగతి గదులు బహిష్కరించి నిరసనలు తెలియజేశారు. ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీలో బంద్‌ ప్రశాంతంగా నిర్వహించారు. కేంద్రమంత్రులు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీలను అరెస్టు చేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. అలాగే జేఎన్టీయూ హైదరాబాద్‌ వర్సిటీలో సైతం విద్యార్థులు నిరసనలు తెలిపారు. కేంద్ర మంత్రులను తొలగించే వరకూ పోరాటం కొనసాగుతుందని విద్యార్థులు హెచ్చరించారు.

ఏపీ..తెలంగాణలో..
ఇక వరంగల్‌ జిల్లా కాకతీయ యూనివర్సీటిలోనూ బంద్‌ విజయవంతం అయ్యింది. రోహిత్ కుటుం బానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కుల వివక్షను యూనివర్సిటీల నుంచి పారద్రోలాలని విద్యార్థి నేతలు పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లాలోని శాతవాహన యూనివర్సిటి పరిధిలోని కళాశాలలకు బంద్ కు పిలుపునిచ్చి తరగతులను బహిష్కరించారు. పట్టణంలో రాస్తారోకో నిర్వహించారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సైతం విద్యార్థులు రోహిత్‌కు సంఘీభావంగా బంద్‌ పాటించారు. నిర్భయ చట్టం తరహాలో రోహిత్‌ చట్టం తేవాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. కడప జిల్లాలోని యోగి వేమన వర్సిటీలో సైతం విద్యార్థులు తరగతి గదులు బహిష్కరించి రోహిత్‌కు సంఘీభావంగా నినాదాలు చేశారు. ఇక హెచ్‌సీయూలో నిరాహార దీక్షా శిబిరాన్ని సందర్శించేందుకు విచ్చేసిన తాత్కాలిక వీసీ శ్రీవాత్సవను విద్యార్థులు అడ్డుకున్నారు. దీంతో తాత్కాలిక వీసీ శ్రీవాత్సవ
వెనుదిరిగారు.

30న రోహిత్ పుట్టిన రోజు...
ఈనెల 30వ తేదీన రోహిత్ పుట్టినరోజు సందర్భంగా హెచ్‌సీయులో భారీ సభ ఏర్పాటు చేయనున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఛలో ఢిల్లీలో భాగంగా విద్యార్ధి జేఏసీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ, యూనివర్సిటీ యాజమాన్యం తీరుపై ఫిర్యాదు చేయనున్నారు. అయినా కేంద్రం తమకు న్యాయం చేయకపోతే ఇరు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని జేఏసీ నాయకులు తెలిపారు.

21:19 - January 27, 2016

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ నేతల మాటల వాడి పెరుగుతోంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల రాజకీయ వారసులు రోడ్‌ షోలతో హైదరాబాద్‌ వీధులన్నీ చుట్టేస్తున్నారు. ఇద్దరు రాజకీయ వారసుల సత్తాకు గ్రేటర్‌ ఎన్నికలు లిట్మస్‌ టెస్ట్‌లా నిలవడం ఖాయమని రాజకీయ వర్గాలు తేల్చిచెబుతున్నాయి. అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ విమర్శల దాడి పెంచారు. రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలార్‌దేవ్‌పల్లిలో ‌కేటీఆర్‌ రోడ్ షో నిర్వహించారు. టీడీపీ ఎమ్మెల్యేలనే కాదు చంద్రబాబునే ఉరికించామని అన్నారు.

కేటీఆర్ వర్సెస్ లోకేష్..
కోతలు లేని విద్యుత్‌ను అందిస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కిందని, లక్షా 80 వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని, ఆటోలకు రూ. 77 కోట్ల రవాణా పన్ను మాఫీ చేశామని, గ్రేటర్‌లో నల్లా, విద్యుత్ బిల్లులు మాఫీ చేశామని అన్నారు. గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌కు అవకాశం ఇవ్వాలని, అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా అమరావతికే నిధులు తేలేని వారు హైదరాబాద్‌కు నిధులెలా తెస్తారని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌కు కేసీఆర్, కేటీఆర్‌లు గెస్టులని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. . హైదరాబాద్ కు తాను గెస్టును కాదని, తాను పుట్టింది, పెరిగింది హైదరాబాద్ లోనేనని చెప్పారు. కానీ కేటీఆర్ గుంటూరులో చదివారని, తాను హైదరాబాద్ లోనే చదివానని తెలిపారు.

ఎర్రబెల్లి..కవితల విమర్శలు..
లోకం తెలియని నారా లోకేశ్ ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 'కారు'లో ప్లేస్ ఉన్న కారణంగానే చాలా మంది నాయకులు 'సైకిల్' వదిలి తమ పార్టీలోకి వస్తున్నారని అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని కవిత ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు గ్రేటర్‌ ప్రచారంలో సవాళ్లు, ప్రతిసవాళ్ల పరంపర కొనసాగుతోంది. టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి సీఎం కేసీఆర్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. టీడీపీ నుంచి వలస వెళ్లిన ఆరుగురు ఎమ్మెల్యేలను తిరిగి టీఆర్‌ఎస్‌ తరపున గెలిపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎర్రబెల్లి సవాల్‌ విసిరారు.

హరీష్ పై రేవంత్ సెటైర్లు..
ఇక నారాయణ్‌ ఖేడ్‌ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ ర్యాలీలో రేవంత్‌ రెడ్డి పాల్గొని హరీష్‌రావుపై విమర్శలు ఎక్కుపెట్టారు. మొత్తానికి గ్రేటర్‌ ఎన్నికల రాజకీయ చదరంగంలో అటు అన్ని పార్టీలు తమతమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. నగరమంతా ఇప్పటికే రాజకీయ పార్టీల బ్యానర్లతోనూ కార్యకర్తలతో కోలాహలంగా మారింది. ఇక ప్రచార పర్వం ముగిసే సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఓటరు నాడి అర్థం కాక అటు అభ్యర్థుల్లో టెన్షన్‌ కూడా మొదలైంది.   

గెలవకపోతే రాజీనామా చేస్తా - హరీష్ రావు..

మెదక్ : నారాయణఖేడ్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోతే తాను రాజీనామా చేయడానికి సిద్ధమని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. టిటిడిపి నేత రేవంత్..టిపిసిసి చీఫ్ ఉత్తమ్ తన సవాల్ ను స్వీకరిస్తారా అని ప్రశ్నించారు. టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు రావన్నారు.  

జులైలో ఇంటింటికి ఇంటర్నెట్..

చిత్తూరు : ప్రతి ఇంటికి 20 ఎంబీపీఎస్ వేగానికి తగ్గకుండా ఇంటర్నెట్ సర్వీసులను అందిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తిరుపతిలో తొలి ఏపీ సైన్స్ కాంగ్రెస్ సదస్సును తిరుపతిలో ప్రారంభించారు. 

ఆర్ నారాయణమూర్తికి పితృవియోగం..

తూర్పుగోదావరి : సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి తండ్రి చిన్నన్న నాయుడు (97) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం ఎస్.పైడిపాల పంచాయతీ పరిషధిలోని మల్లంపేట గ్రామంలో నివాసం ఉంటున్నారు. 

20:41 - January 27, 2016

రెండు దశాబ్ధాలుగా చిక్కడు దొరకడు అన్నట్లు... వేలది మంది పోలీసులకు ముచ్చెమటలు పోయించాడు. జైలు ఊచలు వణికిపోతుంటాయి. పొరపాటునా దొరికినా అతడిని కాపలా కాయడం అంత తేలిక కాదు..అతడు స్కెచ్ వేస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే..డ్రగ్స్ మాఫియాతో మెక్సికోకు ముచ్చెమటలు పోయించాడు. అంతేగాక అమెరికాను సైతం హఢలెత్తించాడు. ఇప్పటికీ రెండు సార్లు చిక్కినట్టే చిక్కి ఎస్కేప్ అయ్యాడు. ముచ్చటగా మూడోసారి మాత్రం చిక్కాడు. అతడే గాడ్ ఫాదర్ ఆఫ్ డ్రగ్స్ వాల్డ్ ఎల్ చాపో. మళ్లీ గాయబ్ అవుతాడా ? ఇతని గురించి తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి..

20:30 - January 27, 2016

కొత్తపేట డివిజన్ లోని ఎస్సీ కాలనీలో సమస్యలను 'మల్లన్న'తో స్థానికులు ఏకరువు పెట్టారు. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా కాలనీ వాసుల అగచాట్లు...నేతల మాటలు తెలుసుకొనేందుకు 'మల్లన్న' నగరంలోని గల్లీలో తిరుగుతున్నడు. అందులో భాగంగా కొత్తపేట విలేజ్ ఎస్సీ కాలనీలో తిరిగిండు. ఇక్కడ రోడ్లు, డ్రైనేజీ సమస్యలున్నాయన్నారు. 20 ఏండ్ల సందటి నుండి రోడ్డు గిలాగే ఉందని, వస్తున్నరు..పోతున్నరు తప్పించి ఎవరూ ఏమి చేయలేదన్నారు. ఓట్లు పడ్డ తరువాత ఎవరూరారని తమ అక్కసు వెళ్లగక్కారు. 

20:25 - January 27, 2016

గ్రేటర్ ఎలక్షన్స్ పోలింగ్ కు రోజులు దగ్గర పడుతున్నయి. పలు డివిజన్ లలో పార్టీల తరపున నిలబడిన అభ్యర్థులు హామీల మీద హామీలు గుప్పిస్తున్నరు. పలు డివిజన్ లలో ప్రజల సమస్యలు..గాథలు..నేతల అభిప్రాయాలు తెలుసుకొనేందుకు 'మల్లన్న' గల్లీల్లో తిరుగుతున్నడు. ఈ సందర్భంగా వనస్థలిపురం..కొత్తపేట డివిజన్ లలో 'మల్లన్న' పర్యటించాడు. మరి ప్రజల గాథలు..నేతలు ఎలాంటి అభిప్రాయాలు తెలిపారో వీడియో క్లిక్ చేయండి..

20:00 - January 27, 2016

జీహెచ్ఎంసీ ఎన్నికలు..కొద్ది రోజుల్లో పోలింగ్ జరగనుంది. మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోవడానికి అధికార..విపక్ష సభ్యులు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అందులో భాగంగా ఆయా పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ విజయం కోసం సీం కేసీఆర్ కూతురు ఎంపీ కల్వకుంట్ల కవిత, కుమారుడు మంత్రి కల్వకుంట తారకరామారావులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు ? దీనికి సంబంధించిన ప్రణాళిక ఉందా ? ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఏ రకంగా కృషి చేస్తోంది. ? తదితర విషయాలపై నిజామాబాద్ ఎంపీ కవిత టెన్ టివికి విశ్లేషించారు. ఎంపీ కవిత ఎలాంటి అభిప్రాయాలు తెలిపారో వీడియోలో చూడండి.

బెంగళూరు - గోవా విమానానికి బాంబు బెదిరింపు...

ఢిల్లీ : బెంగళూరు - గోవా విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీనితో ఢిల్లీలో ఎయిర్ పోర్టులో ఎయిర్ ఏషియా విమానాన్ని నిలిపివేశారు. విమానం నుండి ప్రయాణీకులను సిబ్బంది ఖాళీ చేయించారు. ఇంతకు ముందే బాంబు బెదిరింపు వల్ల ఎయిర్ పోర్టులో ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్ వేస్ విమానాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. 

ఏపీఎస్ ఆర్టీసీకి బెస్ట్ కేఎంపీఎల్ అవార్డు...

హైదరాబాద్ : ఏపీఎస్ ఆర్టీసీకి బెస్ట్ కేఎంపీఎల్ అవార్డు లభించింది. అవార్డు ప్రధానోత్సవంలో ఎండీ సాంబశివరావు పాల్గొన్నారు.

 

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు...

విజయవాడ : రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. తనిఖీలు నిర్వహించి బాంబు లేదని బాంబు స్క్వాడ్ తేల్చి చెప్పారు.

 

19:10 - January 27, 2016

హైదరాబాద్ : నగరాన్ని పాలకులు సమృద్ధిగా అభివృద్ధి చేయలేదని సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు. జియాగూడలో స్వతంత్ర అభ్యర్థి చెన్నయకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. పాలక వర్గాల్లో ఉన్నటువంటి ప్రతినిధులు హైదరాబాద్ నగరాన్ని సమృద్ధిగా అభివృద్ధి చేయకుండా ధనవంతులు..మినిస్టర్స్ ఉండే ప్రాంతాలు..కాంట్రాక్టర్లు ఉండే కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేశారన్నారు. పాతబస్తీ, మురికవాడలను అభివృద్ధి చేయలేదని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన అవకాశ వాదులకు, ప్రజలపై పెత్తనం చెలాయించే వారికి ఓటు వేయవద్దని ఓటర్లకు సూచించారు. చెన్నయ్యకు వామపక్ష పార్టీలు, లోక్ సత్తా పార్టీలు మద్దతు ప్రకటిస్తున్నాయని జూలకంటి తెలిపారు. 

జూ.సివిల్ జడ్జీల నియాకంపై కోర్టులో విచారణ..

హైదరాబాద్ : జూనియర్ సివిల్ జడ్జీల నియామకాలపై హైకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ అభ్యర్థులకు అన్యాయం జరిగేలా నోటిఫికేషన్ ఉందంటూ ఏజీ వాదనలు వినిపించారు. తెలంగాణ చట్టాలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. తదుపరి విచారణ ఫిబ్రవరి 8కి వాయిదా పడింది. 

ఢిల్లీ ఎయిర్ పోర్టు సమీపంలో బెలూన్ కలకలం..

ఢిల్లీ : ఎయిర్ పోర్టు సమీపంలో అనుమానాస్పద బెలూన్ కలకలం రేపింది. ఎయిర్ పోర్టు అధికారులకు పోలీసులు సమాచారం అందించారు. గుర్గావ్ వైపు నుండి బెలూన్ వచ్చినట్లు సమాచారం. 

ప్రతి ఎన్ఐఆర్ వారి గ్రామాలను దత్తత తీసుకోవాలి - బాబు..

చిత్తూరు : ప్రతి ఎన్ఐఆర్ఐ వారి గ్రామాలను దత్తత తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గ్రాండ్జ్ రిట్జ్ హోటల్ లో ఏపీ ఎన్ఆర్టీ వెబ్ సైట్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఐటీని అభివృద్ధి చేయడం వల్ల ప్రవాసాంధ్రులు ఇక్కడకు రావడం మొదలైందని, జన్మభూమి కార్యక్రమం వారికి ప్రేరణ కలిగించిందన్నారు. 

18:36 - January 27, 2016

విజయవాడ : అధిక బరువు..మరోవైపు పేదరికం..ఆపరేషన్ చేసుకోవాలంటే లక్షల్లో ఖర్చు..దీనితో అతనికి ఏం చేయాలో పాలు పోవడం లేదు. అందుకే ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. లారీ డ్రైవర్ గా పనిచేస్తున్న ప్రసాద్ కు గత పదేళ్లుగా శరీర బరువు పెరుగుతూనే ఉంది. దీనితో బరువు కారణంగా అతను ఉద్యోగం మానేశాడు. అయితే ప్రసాద్ అధిక బరువు తగ్గించాలంటే బెరియాట్రిక్ సర్జరీ ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని ఎండో కేర్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. అయితే ఈ సర్జరీకి చాలా ఖర్చవుతుందని, దాతలు ఎవరైనా ముందుకొస్తే నయం చేయవచ్చని పేర్కొన్నారు. 

ఫైనల్ కు చేరిన సానియా..హింగీస్ జోడి..

న్యూఢిల్లీ: సానియా మీర్జా-మార్టినా హింగీస్ జోడీ ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్ లో ఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్‌లో జర్మన్-సీజెక్ కు చెందిన జూలియాగోర్జెస్-కరోలినా ఫ్లిస్కోవా జోడీపై సానియా-హింగీస్ జోడీ 6-1,6-0 తేడాతో గెలిచి ఫైనల్‌కు చేరింది. 

గ్రేటర్ ఎన్నికలు..7802 పోలింగ్ కేంద్రాలు...

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 7802 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి వెల్లడించారు. పోలింగ్ కేంద్రాలన్నింటికి సిబ్బందిని నియమించామని తెలిపారు. 1600 మంది మైక్రో అబ్జర్వర్స్‌గా నియమించినట్లు, 2500 మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు వెబ్ క్యాస్టింగ్‌లో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు 70 శాతం పూర్తయ్యాయని, మరో రెండు, మూడు రోజుల్లో ఏర్పాట్లన్ని పూర్తి చేస్తామన్నారు. 

18:07 - January 27, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ కు కొత్త సీఎస్ రానున్నారు. ఈనెల 31వ తేదీతో సీఎస్ గా ఐవైఆర్ కృష్ణారావు బాధ్యత తీరిపోనుంది. ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఇదిలా ఉంటే కొత్త సీఎస్ గా ఎస్.పి. టక్కర్ పేపర్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేయనుందని సమాచారం. ఏపీ విభజన జరిగినప్పటి నుండి ఐవైఆర్ నవ్యాంధ్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం టక్కర్ సీఎస్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయకపోయినా ఆయన్నే నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. 1981 బ్యాచ్ కు చెందిన టక్కర్ ప్రస్తుతం ప్లానింగ్ కమిషన్ లో సెక్రటరీగా పనిచేస్తున్నారు. 

త్వరలోనే డీఎస్సీ షెడ్యూల్ - కడియం..

హైదరాబాద్ : ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి డీఎస్సీ షెడ్యూల్ ను త్వరలోనే ప్రకటిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. వచ్చే నెలలో ప్రధాని చేతుల మీదుగా గిరిజన వర్సిటీ, కాళోజీ, ఆరోగ్య వర్సిటీ, వరంగల్ లో టెక్స్ టైల్ పార్కు శంకుస్థాపన నిర్వహించేందుకు యోచిస్తున్నట్లు చెప్పారు. 

17:32 - January 27, 2016

రంగారెడ్డి : కీసర మండలం నాగారంలో ట్రాఫిక్ పోలీసుపై దాడి చేసిన విద్యార్థిని..మరొక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిని కోర్టులో హాజరు పరచగా 14 రిమాండ్ విధించింది. అనంతరం వీరిని చర్లపల్లి జైలుకు తరలించారు. మంగళవారం బీటెక్ విద్యార్థిని హర్షిత..సాయికుమార్ లు నాగారంలో రాంగ్ రూట్ లో వెళుతున్నారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫొటో తీశాడు. దీనికి ఆగ్రహించిన సదరు యువతి కానిస్టేబుల్ ను నానా దుర్భాషలాడింది. అంతేగాక అతనితో ఘర్షణ పడింది. కెమెరాలో ఫొటో డిలీట్‌ చేయాలంటూ కానిస్టేబుల్‌పై దాడికి దిగి.. ఇష్టమొచ్చినట్లు దుర్భాషలాడింది. దీంతో పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నారు.

17:28 - January 27, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో వారసుల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు సెటైర్లు విసురుకుంటున్నారు. యూసుఫ్ గూడాలో అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ విమర్శలపై ఆయన సెటైర్లు విసిరారు. కేసీఆర్..కేటీఆర్ లే నగరానికి గెస్ట్ లు అని విమర్శించారు. నగరంలో పుట్టి పెరిగి చదువుకున్న తానే నిజమైన హైదరాబాదీ అని తెలిపారు. కేటీఆర్ చదువు అంతా గుంటూరులో జరిగిందని, ఇప్పుడు గెస్ట్ లు ఎవరో ఆలోచించుకోవాలని ఆయన పేర్కొన్నారు. 

17:24 - January 27, 2016

హైదరాబాద్ : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు లోకం తెలియదని నిజామాబాద్ ఎంపీ కవిత ఘాటు విమర్శలు చేశారు. నగరాన్ని తామే అభివృద్ధి చేశామని లోకేష్ చెప్పుకుంటున్నారని, ఎన్టీఆర్ కంటే ముందే నగరం అభివృద్ధి జరిగిందన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో టిడబ్ల్యూజే ఏర్పాటు చేసిన ప్రెస్ ద మీట్ లో ఆమె మాట్లాడారు. బీజేపీ తెలంగాణకు చేసేందేమి లేదని, నగరానికి రూ. 20వేల కోట్ల ప్యాకేజీ ఇస్తే తన ఓటు బీజేపీకి వేస్తానని చెప్పడం జరిగిందన్నారు. నగరంలో అన్ని ప్రాంతాల వారు కలిసి మెలిసి జీవిస్తున్నారని, ఇప్పుడు తమ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయవద్దని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు సూచించారు. 

ప్రభుత్వ పాలనతో ప్రజలు సంతృప్తి - ఎంపీ కవిత..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ పాలన పట్ల ప్రజలు సంతృప్తితో ఉన్నారని, మౌలిక వసతుల కల్పనే టీఆర్ఎస్ లక్ష్యమని నిజామాబాద్ ఎంపీ కవిత పేర్కొన్నారు. నగరాన్ని విశ్వనగరంగా చేయాలన్నదే సీఎం ఆలోచన అని, హైదరాబాద్ లో నివాసం ఉండే వారంతా హైదరాబాదీలే అని, ప్రభుత్వానికి ఎవరిపట్ల వివక్ష లేదని చెప్పుకొచ్చారు. ఇన్నాళ్లు హైదరాబాద్ లో సరైన అభివృద్ధి జరగలేదని, ప్రతిపక్షాలు టీఆర్ఎస్ పై దుష్ర్పచారం చేస్తున్నాయని విమర్శించారు. హైదరాబాద్ మేయర్ పీఠం టీఆర్ఎస్ దేనని స్పష్టం చేశారు. 

ఏపీ ఎన్ఆర్టీ వెబ్ సైట్ ఆవిష్కరణ..

తిరుపతి : గ్రాండ్జ్ రిట్జ్ హోటల్ లో ఏపీ ఎన్ఆర్టీ వెబ్ సైట్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు హాజరయ్యారు. 

ట్రాఫిక్ కానిస్టేబుల్ పై దాడి చేసిన యువతి అరెస్టు...

రంగారెడ్డి : కీసర (మం) నాగారంలో ట్రాఫిక్ పోలీసుపై బీటెక్ విద్యార్థిని హర్షితను పోలీసులు అరెస్టు చేశారు. విధి నిర్వాహణలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పై హర్షిత..సాయికుమార్ దాడి చేశారు.

 

ఛత్తీస్ గఢ్ లో ముగ్గురు మావోయిస్టుల మృతి..

ఛత్తీస్ గఢ్ : రాష్ట్ర రాజధానికి 450 కిలోమీటర్ల దూరంలోని కటే కల్యాణ్ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఆ సమయంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారని అధికారులు పేర్కొన్నారు.

వైసీపీ ఎంపీ మిథున్ కు కండిషనల్ బెయిల్..

చిత్తూరు : వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి తిరుపతి కోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. తిరుపతి విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా అధికారిపై దాడి చేసిన కేసులో మిథున్ కొన్ని రోజుల కిందట చెన్నై ఎయిర్ పోర్టులో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 

ఈనెల 31న ఏపీ సీఎస్ పదవీ విరమణ..

విజయవాడ : ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఈనెల 31వ తేదీన పదవీ విరమణ కానున్నారు. ఈయన స్థానంలో కొత్త సీఎస్ గా ఎస్. పి.టక్కర్ ను ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

16:39 - January 27, 2016

ఢిల్లీ : విమానాశ్రయంలో రెండు విమానాలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఢిల్లీ నుంచి నేపాల్ రాజధాని ఖాట్మాండుకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్ వేస్ విమానాల్లో బాంబు ఉందంటూ ఓ అజ్ఞాతవ్యక్తి అధికారులకు ఫోన్‌ చేశాడు. దీంతో అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది బాంబు స్క్వాడ్ కు సమాచారం అందించారు. ఈ రెండు విమానాలను ఎయిర్‌పోర్టులోనే నిలిపివేసి బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. దీంతో రెండు విమానాలు ఆలస్యంగా బయలుదేరనున్నాయి.

16:38 - January 27, 2016

ఢిల్లీ : అరుణాచల్‌ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించడంపై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసు జారీ చేసింది. జనవరి 29 సోమవారం దీనికి సమాధానమివ్వాలని ఆదేశించింది. అంతకుముందు రాష్ట్రపతి పాలనపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు- రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టాల్సి వచ్చిందో నివేదిక ఇవ్వాలని గవర్నర్‌ను ఆదేశించింది. కేంద్రం రాష్ట్రపతి పాలనకు చేసిన సిఫారసుకు సంబంధించిన రిపోర్టును గవర్నర్‌ రాజ్‌ఖోవా కోర్టుకు సోమవారం సమర్పించనున్నారు. దీనిపై సుప్రీం తుది తీర్పు ఫిబ్రవరి1న వెలువడనుంది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనకు నిరసనగా కాంగ్రెస్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. 

16:35 - January 27, 2016

ఢిల్లీ : రోహిత్‌ మృతికి వీసీ అప్పారావు, ఇద్దరు కేంద్రమంత్రులే కారణమంటూ విద్యార్థులు మండిపడుతున్నారు. రోహిత్‌ మృతికి కారణమైన వీసీతో పాటు కేంద్ర మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని ఢిల్లీలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. రేపు విద్యార్థులంతా భారీ ర్యాలీగా తరలివెళ్లి రాష్ట్రపతికి మెమోరాండాన్ని సమర్పిస్తామని విద్యార్థి సంఘాల నేతలు తేల్చిచెప్తున్నారు. 

16:34 - January 27, 2016

హైదరాబాద్ : చిరంజీవి 150 చిత్రం కత్తి తమిళ రీమేక్ వివాదంలో చిక్కుకుంది. ఎన్.నరసింహరావు అనే రచయిత తన పేరిట రిజిస్టర్ అయిన కథ, మురగదాస్ నిర్మించిన కత్తి కథ ఒకటే అని తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేసారు. అయితే తమిళంలో ఈ వివాదం అలాగే ఉండిపోయినా తెలుగులో మాత్రం ఈ వివాదమే చిరంజీవి 150 చిత్రానికి అడ్డంకిగా మారేటట్లు కనపడుతోంది. అయితే కథాహక్కుల వేదిక ఛైర్ పర్సన్ గా ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఉన్నారు. ఈ వివాదం తేలేవరకూ కత్తి చిత్రాన్ని ఏ నిర్మాత తెలుగులో రీమేక్ చేయకూడదని కథా హక్కుల వేదిక తీర్మానించింది. రచయిత నరసింహరావుకు నష్టపరిహారం చెల్లించేవరకు రీమేక్ కు అడ్డంకులు తొలగే అవకాశం లేదు.

16:32 - January 27, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ ఎన్నికల్లో టిడిపి - బిజెపి కూటమి విజయం సాధిస్తుందని ఏపీ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. అభివృద్ధి ఎజెండాతోనే ప్రచారంలో ముందుకెళుతున్నామన్నారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది టిడిపియేనని ఎన్నికల్లో శరవేగంగా దూసుకెళుతోందన్నారు. ఆంధ్రా..తెలంగాణ రాష్ట్రాల మధ్యనున్న సెంటిమెంట్ ను క్యాచ్ చేసుకోవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఎనిమిది నెలల్లో నగరానికి ఏ పరిశ్రమ తీసుకొచ్చారు ? ఎమి అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. నగరంలో నెలకొన్న అభివృద్ధి అంతా బాబు కృషి వల్లే వచ్చిందన్నారు. అభివృద్ధిని చూసి ఓటేయాలని చెబుతున్నామన్నారు. తెలంగాణకు గుండెకాయ హైదరాబాద్ అని, ఈ చెట్టును నిలబెట్టింది టిడిపి పార్టీయేనని, కానీ ఫలాలు మాత్రం ఇతరులు అందుకుంటున్నారని విమర్శించారు. 

16:30 - January 27, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ ఎన్నికల ప్రచారానికి టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధమయ్యారు. రెండు రోజుల పాటు ఆయన నగరంలోని 12 నియోజకవర్గాల్లో విసృతంగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున కార్యకర్తలు హాజరయ్యేలా పార్టీ వర్గాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ మేరకు ఏపీ సీఎం ప్రచార రూట్‌ మ్యాప్‌ పార్టీ సీనియర్‌ నేత రావుల చంద్రశేఖర్‌ రెడ్డి మీడియాకు తెలియజేశారు. బుధవారం మధ్యాహ్నాం పటన్ చెరువు నుండి బాబు ప్రచారం ప్రారంభమౌతుందని, అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రసంగం చేస్తారని తెలిపారు. అనంతరం అక్కడి నుండి మదీనాగూడ, కూకట్ పల్లి ఇలా శిల్పారామం వరకు బాబు ప్రచారం కొనసాగుతుందన్నారు. పర్యటనలో ఆయా డివిజన్ ల అభ్యర్థులు..పొరుగున ఉండే అభ్యర్థులు కూడా పాల్గొంటారని పేర్కొన్నారు. 

16:27 - January 27, 2016

హైదరాబాద్ : ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు నిరంతరం కష్టపడుతుంటే.. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ విమర్శించడం సరికాదని టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడు అన్నారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు జరుగుతున్నా జగన్‌ మాట్లాడరని.. అదే ఏపీలో ఆత్మహత్యలు లేకపోయినా విమర్శిస్తారన్నారు. కేసీఆర్‌- జగన్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకున్నారని గాలి ఆరోపించారు. ఎన్నికల్లో కేసీఆర్‌ పోటీ చేయమంటే పోటీ చేస్తారని.. లేదంటే వూరుకుంటారని గాలి విమర్శించారు. 

16:26 - January 27, 2016

కర్నూలు : జలమండలి దగ్గర కేసీ కాలువ రైతులు ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మార్చి నెల వరకు కేసీ కెనాల్‌కు నీరిస్తామని హామీ ఇస్తే... ఇరిగేషన్ అధికారులు మాత్రం జనవరిలోనే నీటిని నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు కర్నూలు - కడప కాలువకు నీరివ్వాలని రైతులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. 

మార్చిలో ఏపీ ప్రభుత్వ బడ్జెట్ సమావేశాలు..

హైదరాబాద్ : మార్చి ఒకటో తేదీ నుండి ఏపీ ప్రభుత్వ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. మార్చి 5వ తేదీన సాధారణ బడ్జెట్, 8వ తేదీన వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. 23వ తేదీలోపు సమావేశాలు ముగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. 

విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్...

ఢిల్లీ : ఎయిరిండియా, జెట్, ఎయిర్ వేస్ విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీనితో ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా రెండు విమానాలు దిగాయి. 

హెచ్ సీయూ విద్యార్థులతో మాట్లాడేందుకు వచ్చిన ఇన్ చార్జీ వీసీ..

హైదరాబాద్ : హెచ్ సీయూలో విద్యార్థులతో మాట్లాడేందుకు దీక్షా శిబిరానికి ఇన్ ఛార్జీ వీసీ శ్రీవాత్సవ చేరుకున్నారు. వీసీ గో బ్యాక్ అంటూ విద్యార్థులు నినాదాలు చేయడంతో ఆయన తిరిగి వెళ్లిపోయారు. హెచ్ సీయూ విద్యార్థులకు తెలంగాణ సీపీఎం కార్యదర్శి సంఘీభావం ప్రకటించారు. 

టి.సర్కార్ కు సుప్రీం నోటీసులు...

ఢిల్లీ : కొప్పుల వెలమ సామాజిక వర్గాన్ని బీసీ జాబితా నుండి తొలగించడంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కొప్పుల వెలమ అసోసియేషన్ సభ్యులు బాబురావు పిటిషన్ దాఖలు చేశారు. వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 

15:42 - January 27, 2016

హైదరాబాద్ : ఓటు హక్కు ఉండీ.. దాన్ని వినియోగించుకోక పోవడం వల్లే ప్రతి ఎన్నికల్లోనూ పోలింగ్‌ శాతం గణనీయంగా పడిపోతోందని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాశ్‌ నారాయణ అన్నారు. ఓటు వేయకపోవడమే ఫ్యాషన్‌ అన్న రీతిలో కొందరు ఇళ్లకే పరిమితమవుతున్నారని.. అది సరైంది కాదని అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని సరైన నాయకుణ్ణి ఎన్నుకున్నప్పుడే ప్రజాస్వామ్యంలో విలువలు పెరుగుతాయని అన్నారు. దిల్‌సుఖ్‌నగర్‌ పీఅండ్‌కాలనీలో యువతకు క్విజ్ పోటీ నిర్వహించిన జేపీ.. యువతకు విలువైన సూచనలు చేశారు. ఓటు విలువ, నగర బడ్జెట్‌, మేయర్‌ అధికారాలు, స్థానిక సంస్థల అధికారాలు తదితరాలపై అవగాహన కల్పించారు. జేపీ క్విజ్‌ కార్యక్రమ హైలెట్స్‌ వీడియోలో చూడండి..

15:40 - January 27, 2016

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిముందు వైద్యులు ఆందోళనకు దిగారు. ఉద్యోగుల విభజనలో తమకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. కమల్ నాథన్ కమిటీకి డీఎంఈ తప్పుడు సమాచారం ఇచ్చారని మండిపడ్డారు. లంచాలు తీసుకొని ఆంధ్రాకు బదిలీ చేయాల్సినవారిని తెలంగాణకు పంపారని విమర్శించారు. డీఎంఈని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్ల నిరసనతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

15:39 - January 27, 2016

విజయవాడ : రాజధాని భూములిస్తే యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటివరకు ఉద్యోగాలివ్వలేదని రాజధాని యువత మండిపడుతోంది. 7 నెలలు ట్రైనింగ్ పేరుతో తిప్పుకొని ఉద్యోగాలివ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ప్రభుత్వంపై మండిపడ్డారు. రాజధాని యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట రాజధాని యువజన సంఘం ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. శిక్షణ పూర్తి చేసుకున్న మొత్తం 113 మందికి సర్టిఫికెట్లు కూడా ఇవ్వలేదని..ఇప్పటికైనా ప్రభుత్వం రాజధాని యువతకు ఉద్యోగాలిచ్చి తన చిత్తశుద్థిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. 

15:37 - January 27, 2016

హైదరాబాద్ : నగరంలో సామరస్య వాతావరణానికి భంగం కలిగించే విధంగా మజ్లిస్‌, బీజేపీ పార్టీలు వ్యవహరిస్తున్నాయని తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. మతం పేరుతో రాజకీయ లబ్ధి పొందేందుకు ఈ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. కులం..మతం పేరిట రాజకీయాల అవసరాల కోసం మార్చుకుని తరువాత లబ్ధి చేజిక్కించుకుని అధికారం కోసం పీఠమెక్కుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ వి అవకాశ వాద, దుష్ట రాజకీయాలు అని విమర్శించారు. 18 నెలల్లో టీఆర్ఎస్ చేసింది శూన్యమని, సీమాంధ్ర నేతల పేరు పలకడానికే అసహ్యించుకున్న కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల కోసం ప్రేమ కురిపిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ తెచ్చిన గోదావరి నీళ్లు నెత్తిన జల్లుకుని మేమే తెచ్చామని టీఆర్ఎస్ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ను గెలిపించి హైదరాబాద్ ను కాపాడుకుందామన్నారు. 

15:35 - January 27, 2016

కాకినాడ : బాబు వస్తే జాబు వస్తుందని ఎదురుచూసిన యువతకు నిరాశే మిగిలిందని ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌ అన్నారు. కాకినాడలో జరిగిన యువభేరి సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతీ, యువకులతో జగన్‌ ముఖాముఖిగా మాట్లాడారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. నిరుద్యోగులను చంద్రబాబు మోసం చేశారని జగన్‌ అన్నారు. విద్యార్థులు ఎలాంటి ప్రశ్నలు అడిగారో వీడియోలో చూడండి. 

15:15 - January 27, 2016

కాకినాడ : ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు బీజేపీ ప్రభుత్వం, ప్రధాన మంత్రి మోడీపై వత్తిడి తేవాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ సూచించారు. ఉత్తరాఖండ్ లో ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల 30 శాతం అధికంగా పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరిగాయని చెప్పారు. కాకినాడలోని అంబేద్కర్ భవన్ లో బుధవారం నిర్వహించిన యువ భేరీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. హోదా వల్ల ఎన్నో రాయితీలు ఏపీకి వస్తాయని తెలిపారు. వంద శాతం ఇన్ కంటాక్స్ కట్టాల్సినవసరం లేదని, 30 శాతం రాయితీలు కల్పిలంచబడుతాయని, పరిశ్రమలకు ఇచ్చే విద్యుత్ 20 ఏళ్ల పాటు 50 శాతానికి ఇస్తారని పేర్కొన్నారు. ఇలాంటివన్నీ ప్రత్యేక హోదా వస్తేనే వస్తాయని, అలాగే ఏపీ రాష్ట్రానికి కొన్ని వేల కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉందన్నారు. సీఎం చంద్రబాబు మలేషియా..సింగపూర్ దేశాలకు వెళ్లాల్సినవసరం లేదని, బాబు వస్తే జాబు వస్తుందన్నారు..కాని బాబు వస్తే జాబు పోతుందని ఆయనే నిరూపిస్తున్నారని జగన్ అన్నారు. బీజేపీ ప్రభుత్వంపై వత్తిడి తీసుకరావాలని జగన్ తెలిపారు. 

అరుణాచల్ లో రాష్ట్రపతి పాలనపై సుప్రీంలో విచారణ..

ఢిల్లీ : అరుణాచల్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడంపై సుప్రీంలో విచారణ జరిగింది. 15 నిమిషాల్లో నివేదిక ఇవ్వాలని ఆ రాష్ట్ర గవర్నర్ తరపున న్యాయవాదిని సుప్రీం ఆదేశించింది. 

14:57 - January 27, 2016

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అనేది 1989 సంవత్సరంలో వచ్చిందని, ఈ చట్టానికి సవరణలు తీసుకొచ్చారని లాయర్ పార్వతి పేర్కొన్నారు. అసలు ఈ చట్టం అంటే ఏమిటీ ? దీని ప్రాధాన్యత ఏమిటీ ? అనే అంశంపై టెన్ టివిలో ' మైరైట్' కార్యక్రమంలో లాయర్ పార్వతి విశ్లేషించారు. సమాజంలో అనాదిగా అంటరానితనం అనే వివక్ష ఉందని, దీనిపై ఎన్నో పోరాటాలు జరిగాయన్నారు. సమాజంలో వివక్ష చూపిస్తే పౌర హక్కులకు భంగం కలుగుతుందని పేర్కొంటూ ఆనాడే చట్టం వచ్చిందని, సమాజంలో వివక్ష, అంటరానితనానికి గురవుతుంటుంటారని పేర్కొన్నారు. తగినటువంటి శిక్షలు విధించడం కోసం ఈ చట్టం వచ్చిందని, ఇందులో అనేక రకాల అంశాలను పొందుపరిచి ఉంటాయని లాయర్ పార్వతి పేర్కొన్నారు. మరిన్ని విశేషాల కోసం వీడియో చూడండి. 

14:41 - January 27, 2016

కడప : ఎనిమిది పదుల వయస్సు.. మంచానికే పరిమితం .. సహకరించని దేహం..పొట్టకూటికోసం ఆరాటం. కాటికి కాచుకుని బ్రతుకు పోరాటం.. ఈ అభాగ్యురాలికి నిబంధనలే శాపమయ్యాయి. మార్గదర్శకాలే ముమ్మాటికి నోటికూడు..తనకు న్యాయం చేయాలంటూ ఎదురు చూస్తోంది ఓ వృద్దురాలు. వయస్సు.. ఎనిమిదిపదులు దాటుతోంది.. తినడానికి తిండి లేదు. వేసుకోవడానికి బట్టలులేవు. నిత్యం కాలంతో పోరాటం ఆధార్ కార్డు లేకపోవడమే వృద్దురాలిపాలిట శాపంగా మారింది. కడప జిల్లా రాజంపేట పట్టణంలోని కొలిమివీధిలో ఉంటున్న బిల్లుపల్లి వెంగమ్మకు ఎనబై సంవత్సరాలు దాటుతున్నా..ఇంకా ఆమెది బతుకుపోరాటం. కటిక పేదరికం దారుణంగా వేధిస్తోంది.ఆపై తన పనులు తాను కూడా చేసుకోలేని పరిస్థితి. ఆమె కూతురు చెంగమ్మ.. విధి ఈమెను వితంతువును చేసింది. చెంగమ్మ అనారోగ్యంతో మంచానపడింది.

ఫించన్ ఆగిపోయింది..
ఇన్నాళ్లు వారికి ప్రభుత్వం 1000 రూపాయల పింఛను అందింది. రేషన్ షాపు నుండి సరుకులు తెచ్చుకుని అతికష్టం మీద బతుకీడ్చుతున్నారు. అంతా బాగానే ఉన్నా అధికారుల నిర్ణయాల కారణంగా ఆమెకు పింఛన్ ఆగిపోవడమే కాకుండా ఒక్కపూట కూడా తిండి తినలేకపోతున్నారు. అన్నీతానై కూతురు చెంగమ్మ సపర్యలు చేస్తోంది. పింఛన్ ఇవ్వాలంటే ఆధార్ కార్డు తప్పనిసరని అధికారులు చెబుతున్నారని వాపోతోంది కూతురు చెంగమ్మ. తన తల్లి రాలేని పరిస్థితి మంచంపై ఉందని తెలిపినా అధికారులు కుదరదని చెప్పారని.. వారి కాళ్లపై పడి ప్రాదేయపడ్డానని అయినా అధికారుల తమపై కరుణచూపలేదంటోంది చెంగమ్మ. తమకు పింఛను ఇవ్వాలంటూ తిరగని కార్యాలయం లేదని.. విసిగిపోయిన తమకు చావే గతి అంటోంది కూతురు చెంగమ్మ. తమ దీనగాధను ఎవరైనా అధికారులు చూసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. కొన్ని సార్లు ప్రభుత్వ పెద్దలు ఏర్పరచిన నిబంధనలే కొన్నిసార్లు ప్రజలకు అనర్థాలు కూడా తెచ్చిపెడతాయనడానికి ఇదొక నిదర్శనం.. కూటి కోసం బ్రతుకీడ్చుతున్న తమను ప్రభుత్వం ఆదుకుని పింఛను అందించాలని వేడుకుంటున్నారు.

14:38 - January 27, 2016

నెల్లూరు : జిల్లా కొవ్వూరులోని పెళ్లకూరు కాలనీలో కోతులు ఓ బాలిక ప్రాణమీదకు తెచ్చాయి. కోతులనుంచి తప్పించుకోబోయిన పల్లవి రెండో అంతస్తు నుంచి కింద పడిపోయింది. వెంటనే తల్లిదండ్రులను ఆమెను ఆస్పత్రికి తరలించారు. పల్లవి స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. స్కూల్‌కు వెళ్లేందుకు తయారవుతుండగా కోతులు వెంటపడ్డాయి. ఈ ప్రాంతంలో కొంతకాలంగా కోతులు, పందులు స్వైర విహారం చేస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంలేదని ఆరోపిస్తున్నారు.

14:36 - January 27, 2016

విజయవాడ : అంబేద్కర్‌ విగ్రహం దగ్గర దళిత సంఘాల నేతలు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.. హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ మృతికి కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంతో సంబంధంఉన్న కేంద్రమంత్రులు వెంటనే రాజీనామా చేయాలన్నారు.. వీసీ అప్పారావును వెంటనే విధుల్లోనుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

విచారణకు హాజరు కాని అగ్రిగోల్డ్ యాజమాన్యం..

విజయవాడ : అగ్రిగోల్డ్ కేసులో సహకార కమిటీ ముందు విచారణకు అగ్రిగోల్డ్ యాజమాన్యం హాజరు కాలేదు. 20 రోజులు గడువు కావాలని సహకార కమిటీకి ఈమెయిల్ చేసింది. ఈ వేలం పాట కారణంగా యాజమాన్యం గడువు కోరింది. 

కొనసాగుతున్న కేంద్ర మంత్రివర్గ సమావేశం..

ఢిల్లీ : కేంద్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఉగ్రవాద ముప్పు పొంచి ఉన్న రాష్ట్రాల్లో భద్రత పెంచాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గ ఆమోదం తెలిపింది. జాతీయ ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ ఆధీకృత మూలధనం, రూ వెయ్యి కోట్ల నుండి రూ. 1200 కోట్లకు పెంపునకు ఆమోదం తెలిపింది. 

కాకినాడలో వైసీపీ యువభేరీ..

కాకినాడ : వైసీపీ నిర్శహిస్తున్న యువభేరీలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పాల్గొన్నారు. విద్యార్థులతో ముచ్చటించారు. ఆరోగ్య మిత్రల ఆందోళనకు జగన్ మద్దతు పలికారు. ఆరోగ్య మిత్రల పట్ల ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తోందని, ఆరు వేల మంది ఆరోగ్య మిత్ర ఉద్యోగులను తొలగించారని విమర్శించారు. 

బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో భట్టీ ప్రెస్ ద మీట్...

హైదరాబాద్ : బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో భట్టీ మీట్ ది ప్రెస్ నిర్వహించారు. టీఆర్ఎస్ వి అవకాశ వాద, దుష్ట రాజకీయాలు అని విమర్శించారు. 18 నెలల్లో టీఆర్ఎస్ చేసింది శూన్యమని, సీమాంధ్ర నేతల పేరు పలకడానికే అసహ్యించుకున్న కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల కోసం ప్రేమ కురిపిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ తెచ్చిన గోదావరి నీళ్లు నెత్తిన జల్లుకుని మేమే తెచ్చామని టీఆర్ఎస్ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ను గెలిపించి హైదరాబాద్ న కాపాడుకుందామన్నారు. 

పది టన్నుల కలప స్వాధీనం...

మహబూబ్‌నగర్ : జిల్లాలోని జడ్చర్ల పట్టణ సమీపంలోని పారిశ్రామిక వాడలో పోలీసులు అక్రమంగా నిల్వ ఉంచిన కలపను పట్టుకున్నారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు బుధవారం ఉదయం దాడులు చేసిన పోలీసులు 10 టన్నుల బరువున్న 80 దుంగలను సీజ్ చేశారు. అయితే, అవి ఎర్రచందనం దుంగలా? లేక టేకు కలపా అనేది నిర్ధారణ కాలేదు. ఇందుకోసం వారు అటవీ అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించాకనే ఏమిటనేది నిర్ధారణ అవుతుందని చెబుతున్నారు.

 

13:55 - January 27, 2016

దక్షిణాది చలనచిత్ర రంగ అతి పెద్ద అవార్డుల వేడుక ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ అకాడమీ(ఐఐఎఫ్‌ఎ) ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ తారలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. నటీ, నటులతో వేడుక కళకళలాడింది. ఏ భాషలో చూసినా అవార్డులన్నింటినీ పంచుకున్నట్టుగా రెండేసి చిత్రాలకే వచ్చాయి. తమిళం, తెలుగు భాషల్లో బాహుబలి చిత్రం ఎక్కువ అవార్డులను సొంతం చేసుకుంది. తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ కేటగిరీల్లో అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. తెలుగులో ఐదు, తమిళంలో ఆరు కేటగిరీల్లో అవార్డులు లభించాయి. తెలుగులో శ్రీమంతుడు చిత్రానికి అత్యధికంగా అవార్డులు వరించాయి. తమిళంలో కూడా బాహుబలి చిత్రం అవార్డులు సొంతం చేసుకోవడం గొప్పవిషయం. ఈ భాషలో బాహుబలి ఆరు కేటగిరీల్లో ఈ చిత్రం నిలిచింది. తనివరువన్‌ రెండో స్థానంలో ఉంది. కన్నడంలో రంగితరంగ, మిస్టర్‌ అండ్‌ మిస్సెస్‌ రామాచారి చిత్రాలే అవార్డులను గెలుచుకున్నాయి. మలయాళం మాత్రం భిన్నంగా మూడు చిత్రాలకు వచ్చాయి. ఉత్తమ చిత్రం, నటుడు, నటి, సహాయక నటి, గాయని విభాగాల్లో 'ఇందు నిన్‌తే మోయిడీన్‌' చిత్రం అవార్డులను పొందింది. హాస్యం, సంగీతం, గేయ రచయిత, గాయకుడు విభాగాల్లో 'ప్రేమమ్‌'కు వరించాయి. ఉత్తమ దర్శకుడు 'నీనా' సినిమాకు, సహాయ నటి 'ఓరు వదకన్‌సెల్ఫీ' చిత్రాలు సొంతం చేసుకున్నాయి.

తారలు దిగివచ్చిన వేళ
ఐఫా ఉత్సవానికి దక్షిణాది తారలు భారీ సంఖ్యల్లో హాజరయ్యారు. మొదట రోజు తమిళం, మలయాళ భాషల నటులకు అవార్డులు అందజేశారు. రెండో రోజు తెలుగు, కన్నడ భాషల వారికి ఇచ్చారు. సోమవారం తెలుగు తారల హంగామా ఎక్కువగా ఉంది. రామ్‌ చరణ్‌, అఖిల్‌ అక్కినేని, తమన్నా చేసిన డాన్స్‌లు ఆహూతులను ఆకట్టుకున్నాయి. చిరంజీవి, నాగార్జున, మహేష్‌ బాబు, వెంకటేష్‌, బాలకృష్ణ వంటి నటులంతా కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందే అఖిల్‌, రామ్‌ చరణ్‌ డాన్స్ ప్రాక్టీస్‌ చేశారు. వారు ఎంతలా ప్రాక్టీస్‌ చేశారో ఈ కార్యక్రమంలో వారిచ్చిన పెర్ఫార్మెన్సే చెప్పింది. మొత్తానికి మొదట సారిగా ఈ ఐఫా ఉత్సవంగా విజయవంతంగా ముగిసింది.

తెలుగు భాషల్లో ఐఫా అవార్డులు
చిత్రం (సంస్థ)అకిరా మీడియా బాహుబలి
దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి బాహుబలి
నటుడు మహేష్‌బాబు శ్రీమంతుడు
నటి శ్రుతి హాసన్‌ శ్రీమంతుడు
సహాయ నటుడు జగపతి బాబు శ్రీమంతుడు
సహాయ నటి రమ్యకృష్ణ బాహుబలి
హాస్య నటుడు వెన్నెల కిశోర్ భలేభలే మగాడివోయ్
ప్రతినాయకుడు దగ్గుబాటి రానా బాహుబలి
సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ శ్రీమంతుడు
గేయ రచయిత రామజోగయ్యశాస్త్రి శ్రీమంతుడు
గాయకుడు సాగర్‌ శ్రీమంతుడు
గాయని సత్యయామిని బాహుబలి

తమిళ భాషలో
చిత్రం అకిరా మీడియా బాహుబలి
దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి బాహుబలి
నటుడు జయం రవి తనివరువన్‌
నటి నయనతార మాయ
సహాయ నటుడు సత్యరాజ్‌ బాహుబలి
నటి రమ్యకృష్ణ బాహుబలి
హాస్యనటుడు కోవై సరళ తనివరువన్‌
ప్రతినాయకుడు అరవింద్‌ స్వామి తనివరువన్‌
సంగీత దర్శకుడు అనిరుధ్‌ కత్తి
గేయ రచయిత ధనుష్‌ మారి
గాయకుడు హరి చరణ్‌ బాహుబలి
గాయని గీతామాధురి బాహుబలి

13:54 - January 27, 2016

హైదరాబాద్ : రోహిత్‌ ఆత్మహత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా యూనివర్సిటీల బంద్ కొనసాగుతోంది. హెచ్ సీయూను బంద్ చేసిన విద్యార్థులు భారీ సంఖ్యలో క్యాంపస్‌ ఎదుట ఆందోళన చేస్తున్నారు. వీసీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దళిత సంఘాలు, దళిత టీచర్లు ఫెడరేషన్స్, పలు విద్యార్థి సంఘాలు మద్దతిచ్చాయి. రేపటి నుంచి నిరాహారదీక్షలకు పూనుకుంటున్నట్లు టీచర్స్ ఫోరం నేతలు పేర్కొన్నారు.

జెఎన్ టియులో..

హైదరాబాద్‌ జెఎన్ టియులో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది.. విద్యార్థులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొంటున్నారు... హెచ్ సీయూ వీసీని సస్పెండ్‌ చేయాలంటూ జెఎసి బంద్‌ పిలుపుకు విద్యార్థులు మద్దతు పలికారు.. వీసీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.. విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్యకు కారణమైనవారిని శిక్షించాలంటూ ఈ బంద్‌కు పిలుపునిచ్చింది జేఏసీ..

ఏయూలో ప్రశాంతంగా బంద్‌

హెచ్ సీయూలో కొత్త వీసీ రాక కుల వివక్షతకు, మత రాజకీయాలకు ఆజ్యం పోసేలా ఉందన్నారు విశాఖ ఏయూ విద్యార్థులు.. యూనివర్శిటీలో విద్యార్థులు బలికాకుండా నిర్భయ చట్టంలా రోహిత్ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.. జెఎసి పిలుపుతో ఆంధ్ర వర్శిటీలో బంద్‌ కొనసాగుతోంది. విద్యార్థులకు అనుగుణంగా నడచుకునే వీసీ కావాలని విద్యార్థులు కోరారు. రాజకీయ నేతల అనుచరుల్ని వర్శిటీలోకి రానివ్వొద్దన్నారు. నిర్భయ చట్టంలా రోహిత్ చట్టం తేవాలన్నారు. విద్యార్థులు బలికాకుండా ఆపాలని కోరారు. బిజెపి కాషాయ దళమే రోహిత్ మృతికి కారణమన్నారు. బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలను పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అప్పారావు, శ్రీవాత్సవల్ లు బిజెపి ముద్దు బిడ్డలని విమర్శించారు. వీసీ అప్పారావును తొలగించాలని డిమాండ్ చేశారు.

 

 

13:46 - January 27, 2016

మంచు మనోజ్‌, రెజీనా జంటగా దశరథ్‌ దర్శకత్వంలో సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రై.లి బ్యానర్‌పై శివకుమార్‌ మల్కాపురం నిర్మిస్తున్న చిత్రం 'శౌర్య'. త్వరలో ఆడియో విడుదల కానున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ, ' థ్రిల్లర్‌ లవ్‌ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ మొత్తం పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఇటీవల విడుదల చేసిన సినిమా ఫస్ట్‌ లుక్‌, టీజర్స్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో మనోజ్‌ సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్‌ పాత్రలో ఇప్పటి వరకు నటించిన డిఫరెంట్‌ లుక్‌తో కనిపించబోతున్నారు. క్లాస్‌ దర్శకుడు, మాస్‌ హీరోగా కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. మనోజ్‌ నటన, రెజీనా గ్లామర్‌ సిని మాకు హైలైట్‌గా నిలుస్తుంది. వేదా.కె.సంగీతం అందిం చిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని జనవరి 31 శిల్పకళా వేదికలో ఘనంగా నిర్వ హించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఫిబ్రవరి రెండో వారంలో ఈ సినిమాను విడుదల చేస్తాం' అని అన్నారు.

13:43 - January 27, 2016

ఫ్యాషన్‌ పేరుతో జుట్టుకు తరచుగా రకరకాల రంగులు వేసుకోవడం నేటి యువతులకు అలవాటైపోయింది. అందం మనలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని రకరకాల ప్రకటనలు ఊదరగొడుతున్నాయి. చాలా మంది ఈ ప్రకటనలను నమ్మేస్తున్నారు. అయితే అందం, ఆత్మవిశ్వాసం సంగతి పక్కనపెడితే వీటి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ముఖ్యంగా జుట్టుకు రంగులు వేయటం అంత శ్రేయస్కరం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే యువతులు ఫ్యాషన్‌కు ఎంతగా ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ... జుట్టుకు రంగులు వేసుకోవడాన్ని మాత్రం కొన్ని ప్రత్యేక సందర్భాలకు మాత్రమే పరిమితం చేయాలి. లేకపోతే తలకు తరచూ రకరకాల రంగులు వేసుకోవడటం వల్ల జుట్టు పొడిబారిపోయే ప్రమాదం పొంచి ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా కురుల్లో సహజత్వం పోవడమే గాకుండా, కొన్నాళ్లకు జీవం కూడా కోల్పోతాయి. అందుకే రసాయనాలతో కూడిన రంగులు వేసుకోవడాన్ని బాగా తగ్గించాలి. అయితే ఫ్యాషన్‌ కూడా అవసరమే కాబట్టి, అన్ని వేళలా తలంతా రంగు వేసుకోవడానికి బదులుగా ఒకసారి జుట్టు చివర్లు మరోసారి కేవలం ఒక పాయకు మాత్రమే రంగు వేసుకునేందుకు ప్రయత్నించండి. జుట్టు పొడిబారకుండా ఉండేందుకు కొబ్బరి, ఆలీవ్‌ నూనె, ఆముదాన్ని సమపాళ్లలో తీసుకొని బాగా కలపాలి. తలస్నానం చేయడానికి ఒక గంటకు ముందు పైన చెప్పిన మిశ్రమ నూనెను తలకు బాగా పట్టించాలి. ఆ తరువాత కండీషనర్‌ ఉన్న షాంపూతో శుభ్రంగా తలస్నానం చేయాలి. అలాగే... వారానికోసారి కలబందరసం లేదా పెరుగును తలకు పెట్టుకోవడం వల్ల కూడా కురులకు ఎంతగానో మేలు చేస్తాయి. ఇవి జుట్టుకు మంచి కండీషనర్లుగా పనిచేస్తాయి. కాబట్టి ఎలాంటి సైడ్‌ ఎఫెక్టులు ఉండవు. 

13:43 - January 27, 2016

హైదరాబాద్ : హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వివాదాల కేంద్ర బిందువైంది. వివక్షను రూపుమాపేందుకు ఏర్పాటైన విశ్వవిద్యాలయంలోనే కుల వివక్ష ఆరోపణలు ముప్పిరిగొనడం.. విస్మయానికి గురి చేస్తోంది. హెచ్ సీయూలో కుల వివక్ష విద్యార్థుల ప్రాణాలను బలిగొంటోంది. పట్టాలు పుచ్చుకోవాల్సిన విద్యార్థులను పాడెలెక్కిస్తోంది. పరిశోధక కేంద్రంగా భాసిల్లాల్సిన వర్సిటీలో ఎందుకీ పరిస్థితి..? ఇక్కడ పరిశోధన చేస్తున్న దళిత.... గ్రామీణ విద్యార్థుల అవస్థలేంటి..?

రోహిత్ ఆత్మహత్య

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్యతో హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీయే కాదు.. దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలూ అట్టుడుకుతున్నాయి. రోహిత్‌ మృతికి వర్సిటీ పాలక మండలి, కేంద్ర పెద్దలదే బాధ్యత అంటూ విద్యార్థులు ఎక్కడికక్కడ రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నారు. ఇంతకీ రోహిత్‌ మరణానికి కారణాలేంటి..? హెచ్ సీయూలో కులవివక్షపై వాస్తవాలేంటి..? హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీ పరిశోధక విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్యతో.. దేశవ్యాప్తంగా ఆందోళన ప్రారంభమైంది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, లక్నో.. ఇలా అన్ని ప్రధాన నగరాల్లోనూ విద్యార్థుల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. లక్నో వర్సిటీ స్నాతకోత్సవానికి హాజరైన ప్రధాని మోదీకి కూడా నిరసన సెగ చూపారు విద్యార్థులు.

రోహిత్‌ మరణానికి కారణాలేంటి..?

ఇంతకీ రోహిత్‌ మరణానికి కారణాలేంటి..? హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీలో రోహిత్‌ మరణమే మొదటి కాదు. ఇప్పటికే 10మందికి పైగా విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. వర్సిటీలో కొన్నేళ్లుగా పాతుకు పోయిన వివక్ష.. పెరిగిపోతున్న మతోన్మాదం.. పట్టించుకోని పాలకవర్గం.. విద్యార్థుల నిస్సహాయత... ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. రోహిత్‌ విషయంలో... కులవివక్షే అతణ్ణి పొట్టన పెట్టుకుందని సహచర విద్యార్థులు ఆరోపిస్తున్నారు. రోహిత్‌ కూడా తన సూసైడ్‌ నోట్‌లో ఈ అంశాన్నే ప్రధానంగా ప్రస్తావించాడు. నిమ్నకులంలో పుట్టడం తన తప్పు కాదని.. తన పుట్టుకే తనకు శాపంగా మారిందంటూ లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. క్యాంపస్‌లో సైతం తమ పట్ల వివక్ష కొనసాగడం తట్టుకోలేక ఉరికి వేలాడాడు.

హెచ్ సీయూ చరిత్ర....

రోహిత్‌ ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో.. ఎన్నో ప్రశ్నలను లేవనెత్తాడు. ఈ పరిశోధక విద్యార్థి ప్రశ్నలకు జవాబులు వెతికే ప్రయత్నంలో ఓసారి క్యాంపస్‌ చరిత్రను పరిశీలిద్దాం. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ స్థాపన వెనుక పెద్ద కారణమే ఉంది. ప్రాంతాల మధ్య తలెత్తిన వివక్షను రూపుమాపేందుకు ఈ యూనివర్సిటీని ప్రారంభించారు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం.. 1972లో జై ఆంధ్రా ఉద్యమాల నేపథ్యమే హెచ్ సీయూ స్థాపనకు కారణం. ఇరు ప్రాంతాల మధ్య లోకల్‌, నాన్‌లోకల్‌ వివక్ష పెరిగిపోవడంతో.. దానికి సమాధానంగా.. ఇరు ప్రాంతాల విద్యార్థులకు అవకాశం కల్పించే ఉద్దేశంతో.. సిక్స్‌ పాయింట్‌ ఫార్ములా కింద ఈ యూనివర్సిటీని ప్రారంభించారు. 1974లో... రాజ్యాంగంలోని 371 E అధికరణం కింద కేంద్రం... హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీని స్థాపించింది. తొలుత ఆబిడ్స్‌లోని సరోజినాయుడు నివాసం గోల్టోన్‌ త్రెషోల్డ్‌లో దీన్ని ప్రారంభించినా.. తర్వాత గచ్చిబౌలిలోని రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో సొంత క్యాంపస్‌లోకి మార్చారు.

దేశంలోని బెస్ట్‌ యూనివర్సిటీల జాబితాలోకి

ఇంతితై వటుడింతై అన్నట్లుగా హైదరాబాద్‌ యూనివర్సిటీ ఏటికేడు ఎదుగుతూ వచ్చింది. దేశంలోని బెస్ట్‌ యూనివర్సిటీల జాబితాలోకి చేరింది. 2015 సంవత్సరానికి గాను రాష్ట్రపతి అవార్డునూ పొందింది. సైన్స్‌, సోషల్‌ సైన్సెస్‌లో విదేశీ విద్యాలయాలకూ తలమానికంగా నిలిచింది. తొలినాళ్లలో వందల సంఖ్యలోని విద్యార్థుల సంఖ్య నేడు వేలల్లోకి చేరింది. ప్రస్తుతం క్యాంపస్‌లో 4వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అన్ని విభాగాల్లోనూ కలిసి ఐదు వందల మందికి పైగా బోధన సిబ్బంది.. వేయి మందికి పైగా బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన క్యాంపస్‌లో విద్యార్థులు ఉరికొయ్యలకు ఎందుకు వేళ్లాడుతున్నారు..? రెండు ప్రాంతాల మధ్య వివక్షను రూపుమాపేందుకు ఏర్పాటు చేసిన విద్యాప్రాంగణంలోనే వివక్ష రాజ్యమేలుతుండడం ఏమిటి..? ఇదే ప్రశ్న మేధావులను వేధిస్తోంది..

అన్ని అంశాల్లోనూ వివక్ష

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో అన్ని అంశాల్లోనూ వివక్ష కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. కుల వివక్ష.. సాంస్కృతిక వివక్ష.. భాషావివక్ష.. ఇలా ఒకటేమిటి అన్నింటా వివక్షే. దళిత గ్రామీణ విద్యార్థులు... క్యాంపస్‌లోకి అడుగు పెట్టింది మొదలు... అన్నిరకాల వివక్షలతో సతమతమై పోతున్నారు. మారు మూల ప్రాంతాల్లో కష్టపడి చదివి.. ర్యాంకులు సాధించి.. హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీ క్యాంపస్‌కు కోటి ఆశలతో వస్తారు గ్రామీణ విద్యార్థులు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థులతో క్యాంపస్‌ మినీ ఇండియాగా శోభిల్లుతుంటుంది. అయితే.. క్యాంపస్‌కు వచ్చిన మొదటి రోజే వీరికి కల్చరల్‌ షాక్‌ తగులుతుంది. భాషమీద పట్టు లేక.. గ్రామీణ ప్రాంత విద్యార్థులు.. నగరాల్లో కాన్వెంట్‌లలో చదివిన విద్యార్థులతో పోటీ పడలేక సతమతమవుతున్నారు. వీరికి బాసటగా నిలవాల్సిన బోధకులు.. పోటీ పడకపోతే.. స్టేట్‌ యూనివర్సిటీలకు వెళ్లండంటూ హేళన చేస్తుంటారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు క్యాంపస్‌లో కుదుటపడేదాకా వారికి సలహాలు సూచనలు ఇచ్చే మెకానిజం క్యాంపస్‌లో లేదు. ఏదో ఇంగ్లిష్‌ లెర్నింగ్‌ క్లాస్‌.. రెమిడియల్‌ క్లాసులంటూ కాలం వెళ్లదీస్తారు తప్ప.. గ్రామీణ విద్యార్థులకు చేయూతనిచ్చేవారే ఉండరు. అందుకే.. ప్రొఫెసర్‌ హరగోపాల్‌ గ్రామీణ విద్యార్థులను ఆదుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ ఉండాలని కోరుకున్నారు. గ్రేడింగ్‌ విధానం గ్రామీణ విద్యార్థులకు సహాయపడేలా ఉండాలని కోరుకున్నారు. తాను హెచ్ సీయూలో పనిచేస్తున్న రోజుల్లో వీసీలపై ఒత్తిడి కూడా తెచ్చారు. కానీ వర్సిటీ పాలకమండలి పట్టించుకున్న పాపాన పోలేదు.

విద్యార్థుల మానసిక వేదన

ఇక కష్టపడి పీజీలు, ఎంఫిల్‌ పాసై.. పిహెచ్‌డీ స్థాయికి వచ్చిన విద్యార్థులది మరో రకం కష్టం. పిహెచ్ డీలో జాయిన్‌ అయినా గైడ్స్‌ను అలాట్‌ చేయకుండా మానసికంగా వేధిస్తారు. తరుముకొస్తున్న డెడ్‌లైన్‌లు.. మరోవైపు గైడు లేక ప్రారంభమే కాని పరిశోధన.. విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయి. నిర్ణీత గడువులోగా పిహెచ్‌డి రిపోర్ట్‌ సమర్పించకుంటే.. ఫెలోషిప్‌ను ఆపేస్తారు. ఇలాంటి వేధింపులు అధికంగా ఉండడంతో.. తట్టుకోలేని విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం.. సెంథిల్‌ అనే దళిత రిసెర్చ్ స్కాలర్, వెంకటేష్ అనే మరో విద్యార్ధి ఇలాంటి కారణాలతోనే బలవన్మరణాలకు పాల్పడ్డారు. వీరిద్దరే కాదు మరో పది మంది ఇలాంటి వేధింపుల వల్లే ప్రాణాలు తీసుకున్నారు.

వర్సిటీలో మానవత్వం జాడ ఏమైంది...?

విద్యార్థులు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటుంటే.. పాలకవర్గం ఏం చేస్తోంది..? వర్సిటీలో మానవత్వం జాడ ఏమైంది...? సమసమాజాన్ని కాంక్షించే ప్రగతిశీల ప్రొఫెసర్‌లు ఎందుకు మౌనమునులయ్యారు..? వారెందుకు జోక్యం చేసుకోకుండా నిస్సహాయంగా ఉండిపోతున్నారు..? హైదరాబాద్‌ యూనివర్సిటీలో దళిత విద్యార్థుల పట్ల వివక్ష కాదనలేని సత్యం. కులం పేర హాస్టళ్ల నుంచి వెలేయడం... క్యాంపస్ నుంచి సస్పెండ్ చేయడం, గైడ్‌లను అలాట్ చేయకపోవడం.. తద్వారా విద్యార్థులను మానసిక వేదనకు గురిచేయడం హెచ్ సీయూలో పరిపాటిగా మారింది. విద్యార్థులే కాదు.. వారి ప్రొఫెసర్‌లు కూడా కులం, మతం, ప్రాంతాల పేరిట నిట్టనిలువుగా చీలిపోయారన్నది నిష్ఠుర సత్యం. ముఖ్యంగా దళితులు, దళితేతరుల మధ్య అంతరం గీత గీసినట్లుగా ఉంటుంది. ఆ రెండు వర్గాల విద్యార్ధుల మద్య అంతరాలు తీవ్ర స్థాయిలో ఉంటాయి.

కుల వివక్ష..

కులం పేరిట సమాజంలో ఉన్న వివక్ష.. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. ఇరు వర్గాల మధ్య ఎప్పుడూ ఏదో ఒక సంఘర్షణ వాతవారణం నెలకొంటూనే ఉంటుంది. అడపా దడపా ఘర్షణలూ కొనసాగుతుంటాయి. పైకి సహ విద్యార్ధులుగా ప్రవర్తించినా...లోన మాత్రం అవతలి వారి పట్ల అభ్రదతా భావంతో ఉంటారు. ఒకరి డామినేషన్ ఉన్న కోర్సులో మరొకరు అసౌకర్యంగా ఫీలవుతుంటారు. దళితులు, అట్టడుగు స్థాయి విద్యార్థులు అధికంగా ఉన్న శాఖల్లో చేరేందుకు.. ఇతర విద్యార్థులు పెద్దగా ఇష్టపడడం లేదు. ఒకరిద్దరు జాయిన్‌ అయినా.. అక్కడ అయిష్టంగానే కొనసాగుతుంటారు. ఇక దళితులను గైడ్ చేసేందుకు ఇతర కులాల టీచర్లు ముందుకు రారు. ప్రతి శాఖలో ఒకరిద్దరు ప్రొఫెసర్‌లు దళిత విద్యార్థులను గైడ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నా.. యునివర్సిటీ నిబంధనలు వారికి అడ్డంకిగా మారుతున్నాయి. ఏ ప్రొఫెసర్‌ అయినా.. ఇద్దరు విద్యార్థులకు మించి గైడ్‌ చేయరాదన్న నిబంధనలు.. దళిత విద్యార్థులకు శాపంగా పరిణమించాయి. యూజీసీ, సీఐఎస్ ఆర్ లాంటి జాతీయ పరీక్షలు పాసైన దళిత విద్యార్థులకూ ఇక్కడ గైడ్‌లు దొరకడం లేదు.

మానసిక ఒత్తిడితో కుంగిపోతున్న విద్యార్థులు

గైడ్‌లు దొరకని విద్యార్థులు మానసిక ఒత్తిడితో కుంగిపోతున్నారు. ఇలా దళితులు.. అడుగడుగునా వివక్షను ఎదుర్కొంటున్నారు. గైడ్‌లను సాధించుకునేందుకే వారు ఉద్యమించాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే గైడ్‌లను అలాట్ చేయటంలో కూడా... రిజర్వేషన్ పద్దతి పాటించాలని విద్యార్ధులు ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలు సాగిస్తున్నారు. ఇక వసతి గృహాల్లో వివక్ష అయితే అంతా ఇంతా కాదు. దళిత విద్యార్థులుండే గదుల్లో ఉండేందుకు ఇతర విద్యార్థులు అయిష్టత చూపుతున్నారన్నది బహిరంగ రహస్యం.

ప్రొఫెసర్‌లు ఎందుకు మౌనంగా ఉన్నారు..?

గ్రామీణ, దళిత విద్యార్థుల పట్ల వివక్ష రాజ్యమేలుతుంటే.. మేధావులు, ప్రగతిశీల భావాలున్న ప్రొఫెసర్‌లు ఎందుకు మౌనంగా ఉన్నారు..? వివక్షను రూపుమాపేందుకు ఎందుకు చొరవ చూపడం లేదు..? పాలకవర్గాన్ని ప్రభావితం చేయడంలో ఎందుకు విఫలమవుతున్నారు..? దళితులు, దళితేతరుల మధ్య వివాదాలు తలెత్తినప్పుడు.. వర్సిటీ పాలకవర్గం పరిష్కారం దిశగా చొరవ చూపాలి. కానీ ఎప్పుడూ అలాంటి చొరవ తీసుకున్న దాఖలాలు లేవు. ఇక ప్రొఫెసర్‌లూ కులవివక్షను అడ్డుకోవడంలో తగిన శ్రద్ధ చూపడం లేదన్న వాదన ఉంది. దళిత విద్యార్థుల సమస్యలపై స్పందిస్తే తమ కెరీర్‌కు ముప్పు వాటిల్లుతుందన్న భయం ప్రొఫెసర్‌లలో నెలకొని ఉంది. అర్హతలున్నా పదోన్నతులు రాకుండా చేస్తారన్న భయం వారిని మౌనంగా ఉండేలా చేస్తోంది. వర్సిటీలో విద్యార్థి పోరాటాలకు బాసటగా నిలిచిన హరగోపాల్‌ వంటి వారికి ఇతర అవకాశాలు రాకుండా అడ్డుకోవడాన్ని ప్రొఫెసర్‌లు ఉదహరిస్తున్నారు. ఇతర వర్సిటీలకు వీసీలుగా నియమితులయ్యే అవకాశాలొస్తే.. వర్సిటీ పాలకవర్గం పెద్దలు తమ లాబీయింగ్‌తో అడ్డుపుల్లలు వేస్తారన్న ఆందోళనా ప్రొఫెసర్‌లలో ఉంది.

ఉనికి కోసం ప్రొఫెసర్ల పోరాటం

వివక్షకు గురవుతున్న విద్యార్థులకు బాసటగా నిలవాలని మనసులో ఉన్నా.. వర్సిటీ పాలకవర్గానికి వ్యతిరేకంగా పోరాడాలనుకున్నా.. ధైర్యం చేయలేని నిస్సహాయులమని ప్రొఫెసర్‌లు ఆంతరంగిక సంభాషణల్లో వెల్లడిస్తుంటారు. వృత్తిగత పోటీలో తమ మనుగడను కాపాడుకోవడం.. ఉనికి కోసం పోరాడాల్సిన అగత్యం ఏర్పడిందని.. ఈ పరిస్థితుల్లో దళిత విద్యార్థులను పట్టించుకునే పరిస్థితే లేదని అంటున్నారు. అదే సమయంలో వీసీ స్థాయి వ్యక్తులు స్వార్థ ప్రయోజనాల కోసం విద్యార్థి సంఘాల మధ్య చిచ్చు పెడుతున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇలాంటి ఎన్నో కారణాల వల్ల.. వర్సిటీలోని దళిత విద్యార్థులు హక్కుల కోసం ఒంటరి పోరు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. హక్కుల కోసం పోరాటంలో.. మానసిక సంఘర్షణకు గురై.. పోరాడలేని స్థితికి చేరిన విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పిల్లల ప్రాణాలు పోయాక సంఘీభావం తెలిపే ప్రొఫెసర్‌లు సమస్య మూలాలను పరిష్కరించడంలో ముందడుగు వేయడం లేదు.

అంతటా రహస్యమే....

సెంట్రల్‌ యూనివర్సిటీ వ్యవహారాన్ని దగ్గరనుండి పరిశీలిస్తే.. ఇదేదో గండికోట రహస్యమో.. రాజకోట రహస్యమో అన్న భావన కలగక మానదు. వర్సిటీలో ఏమి జరుగుతోందో బయటి వారికి ఎవరికీ తెలియనివ్వరు. అకడమిక్‌ కౌన్సిల్‌ నిర్ణయాల నుంచి.. అమలు వరకు అంతటా రహస్యమే. వివరాలు సేకరించేందుకు వెళ్లే మీడియాకూ అనుమతి ఉండదు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాల్సిన హైదరాబాద్‌ యూనివర్సిటీ.. కొన్ని స్వార్థపర శక్తుల అడ్డాగా మారింది. క్యాంపస్‌లో ఎక్కడా పారదర్శకత కానరాదు. కమిటీల నియామకం.. నిర్ణయాల అమలు.. ఇలా అన్నింటా గోప్యతే. అడుగులకు మడుగులొత్తే వారికి పదవులు కట్టబెట్టడం.. నచ్చని వారికి పొగపెట్టడం.. వర్సిటీలో సర్వ సాధారణమైపోయింది.
 

పది సంవత్సరాలకు ముందు నుంచే దళితులపై వివక్ష

హైదరాబాద్‌ వర్సిటీలో పరిస్థితి చేయి దాటి పోవడానికి పది సంవత్సరాలకు ముందే బీజం పడిందన్నది పరిశీలకుల అభిప్రాయం. 2001లో న్యూ రీసెర్చ్‌ స్కాలర్‌ హాస్టళ్లకు ఏసురత్నం అనే దళిత ప్రొఫెసర్‌ వార్డెన్‌గా ఉండేవారు. అయితే పాలకమండలి ఆయన విధులనూ.. చెక్‌పవర్‌నూ అర్ధంతరంగా కత్తిరించి అవమానించింది. మనస్తాపానికి గురైన ఏసురత్నం పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం సెలవులో వెళ్లిన వర్సిటీ వీసీ అప్పారావు అప్పట్లో చీఫ్‌ వార్డెన్‌గా ఉండేవారు. అప్పారావు కనుసన్నల్లోనే ఏసురత్నంకు అవమానం జరిగిందని ఆరోపిస్తూ దళిత విద్యార్థి సంఘాలు ఆందోళన కూడా నిర్వహించాయి. ఈ క్రమంలో దళిత విద్యార్థులకు అప్పారావుకు మధ్య ఘర్షణ నెలకొంది. అప్పట్లో విద్యార్థుల ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం ఎవరూ చేయలేదు. నామమాత్రపు చర్చలూ జరపలేదు. ఈపరిస్థితుల్లో ఆవేశానికి లోనైన విద్యార్థులు చీఫ్‌ వార్డెన్‌, డిప్యూటీ చీఫ్‌ వార్డెన్‌లపై దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనతో ప్రతిష్ఠకు పోయిన యూనివర్సిటీ పాలకవర్గం.. యుద్ధప్రాతిపదికన పదిమంది దళిత విద్యార్థులను ఐదేళ్ల పాటు బహిష్కరించింది. విద్యార్థుల అభిప్రాయాలనూ తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. మధ్యవర్తిత్వం చేసేందుకు ముందుకొచ్చిన ప్రొఫెసర్‌లనూ బేఖాతరు చేసింది. ఈ వ్యవహారంలో యూనివర్సిటీ పాలకవర్గం వైఖరిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

విద్యార్థుల గైడ్‌లపై ఒత్తిళ్లకు పాల్పడ్డారన్న

విద్యార్థులు.. పాలకవర్గాల మధ్య అప్పట్లో ఏర్పడిన దూరం.. ఏటేటా పెరుగుతూ వచ్చింది. ఇక 2002లో వర్సిటీ రిజిస్ట్రార్‌గా నరసింహ వచ్చాక.. పరిస్థితి మరింత దిగజారిందన్నది విశ్లేషకుల భావన. ఈయన, ఆందోళనలు చేసే విద్యార్థుల అడ్మిషన్‌లు రద్దు చేస్తామన్న బెదిరింపులు.. విద్యార్థుల గైడ్‌లపై ఒత్తిళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. సమస్యలపై మాట్లాడేందుకు వచ్చే విద్యార్థి సంఘాలకు అపాయింట్‌మెంట్‌ కూడా ఇచ్చేవారు కాదన్న ప్రచారం ఉంది. అప్పట్లో వీసీగా ఉన్న హరినారాయణ.. యుద్ధనిపుణుడైన కారణాన.. ఎక్కువకాలం రక్షణశాఖకే పరిమితమయ్యారు. దీంతో రిజిస్ట్రార్‌ నరసింహ ఆడింది ఆట.. పాడింది పాటగా సాగిందన్న ఆరోపణలున్నాయి. హరినారాయణ అనంతరం వచ్చిన వీసీ సయ్యద్‌ హుస్సేన్‌ హయాంలో.. వర్సిటీలో అక్రమాలు పరాకాష్టకు చేరాయన్నఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పట్లో 200 ఎకరాల వర్సిటీ స్థలంలో మైనింగ్‌కు అనుమతించడం.. అది కూడా ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడం వివాదాస్పదమైంది. ఈయన హయాంలోనే వర్సిటీలో లైఫ్‌ సైన్సెస్‌ స్కూలు బిల్డింగ్‌ వెనుక.. పెద్ద టౌన్‌షిప్‌ వెలిసింది. వీటన్నింటితో పాటు.. హెచ్‌సీయులో విద్యార్థుల బలవన్మరణాలపైనా కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు.. అప్పట్లో హెచ్‌ఆర్‌డీకి లేఖ రాశారు.

ఇతర విద్యార్థి సంఘాలను ఎగదోయడం...

వివాదాస్పద వీసీగా పేరు పొందిన సయ్యద్‌ హుస్సేన్‌.. ప్రశ్నించే విద్యార్థులపైకి.. ఇతర విద్యార్థి సంఘాలను ఎగదోయడం.. వ్యతిరేకించే ప్రొఫెసర్‌ల ప్రాధాన్యత తగ్గించడం చేసేవారని ప్రతీతి. ఆయన వైఖరి వల్లే.. వర్సిటీలో దాడుల సంస్కృతి పెరిగిందన్నది విద్యార్థులు ఆరోపణ.అనంతరం వచ్చిన అప్పారావు కూడా ఇదే వైఖరిని అవలంబించడం.. విద్యార్థుల సమస్యలపై దృష్టి సారించక పోవడంతో.. వివక్ష నానాటికీ అధికమవుతూ వచ్చిందన్నది పరిశీలకుల అభిప్రాయం. వీటన్నింటి ఫలితమే.. దళిత విద్యార్థుల సస్పెన్షన్‌.. రోహిత మరణానికి దారి తీసిందంటున్నారు. నిప్పు లేనిదే పొగ రాదన్నది సత్యం. విద్యార్థులు ఇంత పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతున్నారంటే.. వర్సిటీలో కుల కార్చిచ్చు ఏస్థాయిలో రగులుతోందో అన్న భావన సమాజానికి కలుగుతోంది. ఇప్పటికైనా కేంద్ర పాలక పెద్దలు.. పంతాలు, భేషజాలు.. వీడి విద్యార్థుల సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలి. విద్యానిలయాన్ని చదువుల తోటలా మార్చాలి.

 

13:42 - January 27, 2016

నిన్న కాక మొన్నే తీసుకొచ్చా..అప్పుడే బియ్యం పురుగులు పట్టాయి ఛీ..ఛీ' అంటూ విసుక్కునేవారు చాలా మందే ఉన్నారు. పురుగు పట్టిన బియ్యం వాడాలంటే అస్సలు మనసు ఒప్పుకోదు. అంతే కాదు వాటిని శుభ్రం చేయడం కూడా చాలా కష్టమైన పనే. అయితే కొన్ని చిట్కాలతో బియ్యం పురుగు పట్టకుండా కాపాడుకోవచ్చు. అవేంటో మీరే చదవండి...

వేపాకులతో: బియ్యం నిల్వ చేయడానికి ఎక్కువ మంది వేపాకులనే వాడుతుంటారు. ఎందుకంటే వేపాకులో ఉండే క్రిమి సంహారక లక్షణం వల్ల బియ్యంలో పురుగులు పడకుండా ఉంటాయి. అందుకోసం ముందుగా కొన్ని వేపాకులను తీసుకొని బాగా ఎండబెట్టుకొని మొత్తని పొడిగా చేసుకోవాలి. దీన్ని లైనింగ్‌ క్లాత్‌ వంటి కాటన్‌ వస్త్రంలో చిన్న చిన్న మూటలుగా కట్టి బియ్యం మధ్యలో పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల బియ్యంలో తెల్లపురుగులతో పాటు, ముక్క పురుగులు కూడా చేరకుండా ఉంటాయి.

ఇంగువ: వంటకాల్లో విరివిగా ఉపయోగించే ఇంగువ కూడా బియ్యంలో పురుగులు చేరకుండా కాపాడుతుంది. దీనికి కారణం ఇంగువ వెదజల్లే ఘాటైన వాసనే. దీన్ని కొద్దిగా తీసుకొని బియ్యంలో కలిపితే సరిపోతుంది. దీని నుంచి వెలువడే ఘాటైన వాసన వల్ల బియ్యంలో పురుగులతో పాటు, తేమ వల్ల పెరిగే బ్యాక్టీరియాను సైతం సంహరిస్తుంది. ఇవే కాదు..బిర్యానీ ఆకులను ఉపయోగించినా కూడా మంచి ఫలితం కనిపిస్తుంది.

కర్పూరం: కర్పూరం వెదజల్లే ఘాటైన సువాసన వల్ల బియ్యంలో పురుగులు పడవు. అందుకే పది కర్పూరం బిళ్లలను తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. దీన్ని కాస్త మందంగా ఉండే కాటన్‌ వస్త్రంలో చుట్టి, బియ్యం డబ్బాలో పెడితే సరిపోతుంది.

బోరిక్‌ పౌడర్‌: బియ్యంలో పురుగులు పడటానికి తేమ కూడా ఒక కారణమే. సాధారణంగా రెండు, మూడు నెలలకు సరిపడా బియ్యాన్ని ఒకేసారి తెచ్చి ఇళ్లల్లో నిల్వచేసుకుంటుంటాం. ఈ క్రమంలో కొన్ని సార్లు బియ్యంలో తేమ చేరే అవకాశం ఉంటుంది. ఫలితంగా పురుగులు పట్టవచ్చు. అందుకే బియ్యంలో తడిచేరకుండా చూసుకోవాలి. దీనికోసం బియ్యంలో కొద్దిగా బోరిక్‌ పౌడర్‌ని మిక్స్ చేయాలి. ఇది బియ్యంలోని తేమను పీల్చుకుని, పురుగులు పడకుండా ఉంచుతుంది.

వెల్లుల్లి రెబ్బలు: బియ్యంలో పురుగులు పడకుండా ఉండాలంటే కొన్ని వెల్లుల్లి రెబ్బలను పొట్టు తియ్యకుండా బియ్యం డబ్బాలో వేయాలి. లేదా వెల్లుల్లి రెబ్బలను పల్చటి కాటన్‌ వస్త్రంలో మూటకట్టి బియ్యం డబ్బాలో ఉంచాలి.

లవంగాలు లేదా పొడి: లవంగ మరో ఎఫెక్టివ్‌ హోం రెమెడీ. బియ్యం పురుగుపట్టకుండా ఉండాలంటే లవంగాలను లేదా లవంగాల పొడిని పల్చటి కాటన్‌ వస్త్రంలో మూట కట్టి, బియ్యం మధ్యలో వేయాలి.

కాకరకాయ: నిలువ చేసిన బియ్యంలో పురుగులు చేరకుండా ఉండాలంటే ఎండిన కాకరకాయ ముక్కలను పలచని వస్త్రంలో కట్టి ఆ డబ్బాలో వేస్తే సరి.

క్యాస్ట్రోఆయిల్‌ (ఆముదం): బియ్యాన్ని శుభ్రంచేసి కొద్దిగా ఆముదం పట్టించి ఉంచితే అవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. పురుగు పట్టవు.

ఉప్పు: బియ్యంలో రాళ్ల ఉప్పు కలిపి పెడితే పురుగు పట్టదు.

13:38 - January 27, 2016

మనం తరచూ ఏదో ఓ ప్యాక్‌ వేసుకుని ముఖాన్ని కాంతివంతంగా చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ముఖమే కాక పాదాల అందానికి కూడా ఈ ఫ్య్రూట్‌ ప్యాక్‌లు ఉపయోగపడతాయి. అది ఎలాగంటే..
క్యారెట్‌ తురుముకు రెండు టేబుల్‌ స్పూన్ల గ్లిజరిన్‌ చేర్చి ప్యాక్‌లా వేసుకుంటే పాదాలు మృదువుగా తయారవుతాయి. అలాగే అర టీస్పూన్‌ పసుపు, తాజా కొబ్బరి తురుము అరకప్పు తీసుకోవాలి. ఈ రెండింటిని బాగా కలిపి పాదాలకు పట్టించి మర్దనా చేయాలి. తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.
అరి కాళ్ళు మృదువుగా ఉండాలంటే తరచూ కొబ్బరినూనెతో మర్దనా చేస్తుండాలి.
చాలా మందికి మోకాళ్లు నల్లగా ఉంటాయి. దీని నివారణకు నారింజను ముద్దలా చేసి కొబ్బరినూనెలో అరగంట పాటు నానబెట్టి ఆ మిశ్రమాన్ని ప్యాక్‌లా వేయాలి. తర్వాత శనగపిండి, పాలు, తేనె ఒక్కో చెంచాడు చొప్పున కలపాలి. ఈ మిశ్రమాన్ని మోకాళ్లకు పట్టించి ఆరాక కడిగేయాలి.
కీరా జ్యూస్‌లో బియ్యపు పిండిని కలిపి పాదాలకు ప్యాక్‌గా వేసుకుంటే కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయి.
కొందరికి పాదాల మడమలు మోటుగా బిరుసైన చర్మంతో ఉంటాయి. ఇటువంటివారు నిమ్మరసం పంచదార కలిపిన మిశ్రమంతో మర్దనా చేసుకుంటే ఫలితం ఉంటుంది.
టేబుల్‌స్పూన్‌ శనగపిండి, పుల్లటి పెరుగు తీసుకుని కలిపి మిశ్రమంలా చేసి దానికి కాస్త పసుపు కలిపి పాదాలకు రాసి.. ఆరిన తర్వాత గట్టిగా రుద్ది కడిగేస్తే మృతకణాలు తొలగిపోతాయి.

నెల్లూరు జిల్లాలో మళ్లీ భూప్రకంపనలు...

 నెల్లూరు : జిల్లాలో ఇవాళ మళ్లీ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. జిల్లాలోని వింజమూరులో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. దాంతో స్థానికులు భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. భూమి లోపల నుంచి సుమారు 5 కిలో మీటర్ల మేర భూమి కంపించినట్టు వాతావరణ నిపుణులు నిర్ధారించారు. అయితే గత 3 నెలల వ్యవధిలో ఇప్పటికి పదిసార్లు భూమి కంపించింది. దాంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో అని ఇక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

13:18 - January 27, 2016

హైదరాబాద్‌ : జెఎన్ టియులో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది.. విద్యార్థులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొంటున్నారు. హెచ్ సీయూ వీసీని సస్పెండ్‌ చేయాలంటూ జెఎసి బంద్‌ పిలుపుకు విద్యార్థులు మద్దతు పలికారు. వీసీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్యకు కారణమైనవారిని శిక్షించాలంటూ ఈ బంద్‌కు జేఏసీ పిలుపునిచ్చింది.

 

 

13:14 - January 27, 2016

విశాఖ : వైసీపీ ఎమ్మెల్యే రోజాపై కోటి రూపాయల పరువునష్టం దావా వేస్తున్నట్లు పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత ప్రకటించారు. ఈమేరకు టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. మానసికంగా బాధపెట్టి మనశ్శాంతి లేకుండా చేయడమే కాకుండా ప్రజల్లో చులకన చేయడానికి రోజా ప్రయత్నించారని అనిత ఆరోపించారు. అసెంబ్లీలో రోజా ప్రవర్తించిన తీరు అనాగరికమన్నారు. రోజా తీరుతో తన మనసు క్షోభిస్తోందని వాపోయారు.

 

13:03 - January 27, 2016

హైదరాబాద్ : ఇంటర్‌ ప్రయోగ పరీక్షల్లో జంబ్లింగ్‌ విధానాన్ని ప్రవేశపెడుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా జంబ్లింగ్‌ విధానం తప్పదని తేల్చి చెప్పారు. అయితే ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నాయి. రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. జంబ్లింగ్‌ రద్దుకు అన్ని వైపుల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి.

జంబ్లింగ్‌ విధానం అమలు చేయాలని సర్కార్‌ యోచన

ఇంటర్మీడియట్‌ ప్రాక్టిక్‌ పరీక్షల్లో జంబ్లింగ్‌ విధానం అమలుపై ఏపీ సర్కార్‌ పట్టుదలతో ఉంది. చదివే కాలేజీలో ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహిస్తే....విద్యార్ధులకు అనుకూలంగా మార్కులు వేయించు కుంటుర్నాన్న వాదనలున్నాయి. ఇలాంటి అక్రమాలను అరికట్టేందుకు జంబ్లింగ్‌ విధానం తీసుకొచ్చింది. అయితే ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు మాత్రం దీని రద్దుకు పట్టుబడుతున్నాయి. 2013లో ప్రభుత్వం నియమించిన జేఎన్‌టీయూ నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా జంబ్లింగ్‌ విధానాన్ని రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. ఎంసెట్‌ను రద్దుచేస్తే ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షల్లో జంబ్లింగ్‌ విధానం ఉండొచ్చని జేఎన్‌టీయూ మాజీ వీసీ ప్రొఫెసర్‌ దయారత్నం కమిటీ ఇచ్చిన నివేదకను ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ప్రస్తావిస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడా జబ్లింగ్‌ విధానంలేదని కాలేజీల యజమానులు చెబుతున్నారు.

ఇచ్చిన హామీకి భిన్నంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు- ప్రైవేటు కాలేజీలు

చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జంబ్లింగ్‌ విధాన్నాన్ని రద్దు చేస్తామని చెప్పిన విషయాన్ని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు గుర్తు చేస్తున్నాయి. గతంలో ఇచ్చిన హామీకి భిన్నంగా ఇప్పుడు నిర్ణయం తీసుకోడాన్ని తప్పుపడుతున్నాయి. విద్యాశాఖ అధికారులు ముఖ్యమంత్రిని తప్పదోవ పట్టిస్తున్నారన్న వాదాన్ని ప్రైవేటు కాలేజీ యజమానులు వినిపిస్తున్నారు. జంబ్లింగ్‌ పేరుతో విద్యార్ధులతోపాటు, తల్లిదండ్రులను మానసిక ఒత్తిడికి గుర్తు చేస్తున్నారంటున్నారు.

జంబ్లింగ్‌ రద్దు చేసే యోచనలో సర్కార్‌

జంబ్లింగ్‌ రద్దుకు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి తెస్తున్నాయి. జంబ్లింగ్‌పై ప్రస్తుతం సర్కార్‌ బెట్టుతో ఉన్నా తర్వాత మెట్టుదిగొచ్చి దీనిని రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ప్రతి కాలేజీ నుంచి ఏడాదికి లేదా నిర్ణీత కాలానికి 50 లక్షల రూపాయల ఫీజు తీసుకుని జంబ్లింగ్‌ విధానాన్ని రద్దు చేసే అవకాశం ఉందని వినిపిస్తోంది.

జబ్లింగ్‌ విధానం ఉండాలంటున్న విద్యార్ధి సంఘాలు

మరోవైపు విద్యార్ధి సంఘాలు మాత్రం ప్రాక్టికల్స్‌లో జబ్లింగ్‌ విధానం ఉండాలని కోరుతున్నాయి. మరోవైపు ప్రయోగ పరీక్షలకు ఏపీ నుంచి ఈసారి 3.1 లక్షల మంది విద్యార్ధులు హాజరుకానున్నారు. ఇందుకోసం 710 పరీక్షాల కేంద్రాలు ఏర్పాటు చేశారు. బంజ్లింగ్‌ విధానం రద్దు చేయాలన్న ప్రవేటు కాలేజీల యాజమాన్యాల ఒత్తిడిపై చంద్రబాబు సర్కార్‌ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

 

 

12:47 - January 27, 2016

శ్రీకాకుళం : జిల్లా కేంద్రం సమీపంలోని కనుగులవానిపేటలో విషాదం చోటు చేసుకుంది. నారాయణపురం లింక్‌ కెనాల్‌లోని స్నానానికి దిగిన ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. నారాయణపురం గెడ్డలో నాచు ఎక్కువగా ఉండడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులంటున్నారు. మృతులు లావణ్య, మణికంఠ, సంగీతలుగా గుర్తించారు. వీరంతా పదేళ్లలోపు బాలికలే. ఒకేసారి ముగ్గురు బాలికలు మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి. కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులను ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పరామర్శించారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 

12:40 - January 27, 2016

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ టిటిపి యువ నేత లోకేష్ బాబుపై విమర్శల వర్షం కురిపించారు. 'ముందు అమరాతిని అభివృద్ధి చేసుకో తమ్ముడు' అంటూ లోకేష్ కు చురలంటించారు. నగరంలోని మాదాపూర్ లో నిర్వహించిన గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడారు. స్వంత రాష్ట్రానికి నిధులు తెచ్చులోనే వారు… హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర నుంచి నిధులు తీసుకొస్తామనడం హాస్యాస్పదమన్నారు. అమరావతికి నిధులు తెచ్చుకోలేని.. వారు హైదరాబాద్ కు ఎలా తెస్తారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేయడానికి టీఆర్ ఎస్, కేసీఆర్ ఉన్నారని.… తమరు అమరావతిని అభివృద్ధిని చేసుకోవాలని లోకేష్ కు సూచించారు. హైదరాబాద్ లోని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. హైదరాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ ఎంసీ కలిసి పని చేస్తేనే హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమన్నారు.

 

 

12:18 - January 27, 2016

ఢిల్లీ : గ్రాండ్‌ స్లామ్‌ కింగ్‌...స్విస్‌ ఏస్‌ రోజర్‌ ఫెదరర్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో అదరగొడుతున్నాడు. క్వార్టర్‌ఫైనల్‌లో చెక్‌ రిపబ్లిక్‌ స్టార్‌ థామస్‌ బెర్డిచ్‌ను చిత్తు చేసి...సెమీఫైనల్స్‌లో ఎంటరయ్యాడు. ఈ టోర్నీలో హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఫెదరర్‌ మూడు సెట్లలో బెర్డిచ్‌ను ఓడించాడు. తొలి సెట్‌ అతి కష్టంమీద టై బ్రేక్‌లో సొంతంచేసుకున్న ఫెదరర్‌...రెండో సెట్‌ నుంచి ప్రత్యర్ధికి అవకాశమే ఇవ్వలేదు.పవర్‌ఫుల్‌ సెర్వ్‌,ఓలీ గేమ్‌తో చెలరేగిన ఫెడ్డీ....ట్రేడ్‌ మార్క్‌ బ్యాక్‌ హ్యాండ్‌ షాట్లతో అభిమానులను అలరించాడు. వరుసగా 6-2, 6-3తో రెండు,మూడు సెట్లను సొంతం చేసుకుని విజేతగా నిలిచాడు.

 

12:16 - January 27, 2016

ఢిల్లీ : ఆస్ట్రేలియా ఓపెన్‌లో రష్యన్‌ సెన్సేషన్‌...మారియా షరపోవా స్పీడ్‌కు ఫుల్‌స్టాప్‌ పడింది. వరల్డ్‌ నెంబర్‌ వన్‌...అమెరికన్‌ బ్లాక్‌ థండర్‌ సెరెనా విలియమ్స్‌ను అధిగమించడంలో షరపోవా మరోసారి విఫలమైంది. ఉమెన్స్ సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్‌ పోటీలో షరపోవాను వరుస సెట్లలో చిత్తు చేసిన సెరెనా సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. తొలి సెట్‌ను 6-4తో దక్కించుకున్న సెరెనా...6-1తో సునాయాసంగా రెండో సెట్‌ను సైతం సొంతం చేసుకుని షరపోవాను ఇంటిదారి పట్టించింది.

 

ఓయూలో విద్యార్థుల ర్యాలీ

హైదరాబాద్ : ఓయూలో బంద్ విద్యార్థులు బంద్ చేపట్టారు. ఓయూలో విద్యార్థుల ర్యాలీ చేపట్టారు. పోలీసులు వారిని అడ్డుకుని, అరెస్టు చేశారు. 

గాంధీ ఆస్పత్రిలో మెడికల్ జేఏసీ ఆందోళన

హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో మెడికల్ జేఏసీ ఓపీ సేవలను నిలిపివేసింది. ఉద్యోగుల విభజనతో అవకతవకలు జరిగాయని ఆరోపించారు.

 

హెచ్ సీయూలో విద్యార్థుల భారీ ర్యాలీ

హైదరాబాద్ : హెచ్ సీయూలో విద్యార్థులు భారీ ర్యాలీ చేట్టారు. విద్యార్థి సంఘాలు అన్ని విభాగాలను మూసివేయిస్తున్నారు.

 

 

రాష్ట్రపతి పాలనపై 'సుప్రీం'ను ఆశ్రయించిన కాంగ్రెస్

ఢిల్లీ : ఆరుణాచల్ ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించడంపై కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

 

11:14 - January 27, 2016

రంగారెడ్డి : జిల్లాలో ట్రాఫిక్ కానిస్టేబుల్ పై ఓ యువతి దాడికి పాల్పడింది. కీసర మండలం నాగారంలో రాంగ్‌ రూట్‌లో బైక్‌పై వెళ్తున్న యువతి ఫొటోను కానిస్టేబుల్‌ తీయడంతో ఆమె అతనితో ఘర్షణ పడింది. కెమెరాలో ఫొటో డిలీట్‌ చేయాలంటూ కానిస్టేబుల్‌పై దాడికి దిగి.. ఇష్టమొచ్చినట్లు దుర్భాషలాడింది. దీంతో పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నారు.

 

10:43 - January 27, 2016

హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై ప్రభుత్వాలు ఇప్పటికీ స్పందించడం లేదని ది హన్స్ ఇండియా చీఫ్ ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ అన్నారు. గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ కార్యక్రమంలో ఆయన పాల్గొని, పలు విషయాలను విశ్లేషించారు. విద్యార్థులతో చర్చలు జరపడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని ఆరోపించారు. కమిటీ వేసి విద్యార్థుల డిమాండ్లు పరిష్కరించాలన్నారు. సమస్యలు పరిష్కరించే వారిని యూనివర్సిటీల్లో వీసీలుగా నియమించాలని సూచించారు. విద్యార్థులు చని పోకుండా ప్రభుత్వాలు పరిష్కారం చూడాలని కోరారు. మహారాష్ట్రలోని శని శింగానపూర్ గర్భగుడిలోకి మహిళలకు ప్రవేశం నిషేధం అంశంపై మాట్లాడారు. స్త్రీలకు ఆలయాల్లోకి ప్రవేశం లేదనడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. రాజ్యాంగంలో స్త్రీ, పురుషులకు సమాన హక్కులు ఉన్నాయని తెలిపారు. మరిన్ని వివరాలను ఆయన మాటల్లోనే.…

రాజకీయ వ్యూహ, ప్రతి వ్యూహాలతో సమస్య పరిష్కారం కాదు

సమస్యను సమస్యగా గుర్తిస్తే... సమస్య పరిష్కారం అవుతుంది. రాజకీయ వ్యూహ, ప్రతి వ్యూహాలతో సమస్య పరిష్కారం కాదు. రోహిత్ మృతిపై, విద్యార్థుల డిమాండ్లకు సంబంధించిన అంశాంలపై విద్యార్థులతో సంప్రదింపులు జరపడానికి ప్రభుత్వం ఇంతవరకు ముందుకు రాలేదు. రెండు పక్షాల మధ్య సమస్య ఉత్పన్నమైనప్పుడు ఇరు పక్షాలకు ఆమోదయోగ్యంగా చర్చలు జరుపుతారు. కానీ హెచ్ సీయూ ఘటనపై అలాంటి కార్యక్రమానికి ప్రభుత్వం పూనుకోలేదు. ఇదిలావుంటే వీసీ లీవ్ ల మీద వెళ్లాడు. కేంద్రమే వీసీని పంపి ఉంటుందన్న అనుమానం కలుగుతుంది.

ఇంచార్జీ వీసీ శ్రీవాత్సవ్ పై అనేక ఆరోపణలు

ఆయన స్థానంలో ఇంచార్జీగా వీసీ నియమించిన శ్రీవాత్సవ్ పై అనేక ఆరోపణలున్నాయి. గతంలో సెంథిల్ కుమార్ అనే దళిత విద్యార్థి మృతికి శ్రీవాత్సవ్ కారకుడనే ఆరోపణలున్నాయి. అదేవిధంగా ఇటీవల విద్యార్థులను బహిష్కరించిన కమిటీలో శ్రీవాత్సవ్ సభ్యుడు. ఈనేపథ్యంలో అతన్ని ఇంచార్జీ వీసీగా నియమించడం కరెక్టు కాదు. అయితే ఇప్పటికీ ఘటనపై విచారణ జరపడం లేదు. జరిగిన ఘటనపై జరపకుండా.. రోహిత్ కులంపై చర్చ జరుగుతోంది. రోహిత్ తండ్రి ఇప్పుడు మీడియా ముందుకు వస్తున్నాడు. ఆయన వెనకాల రాజకీయ శక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. 

ఆత్మహత్యలపై అధ్యయనం కమిటీ వేయాలి..

యూనివర్సిటీలో వరుసగా జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై అధ్యయన కమిటీ వేయాలి. ఘటనలపై విచారణ చేపట్టి.. నిజానిజాలను వెలికితీయాలి. హెచ్ సీయూ తాజాగా ఘటనను విచారిస్తామని ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రకటించడం లేదు. విద్యార్థులతో చర్చలు జరుపడానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటో చెప్పాలి. రోహిత్ ఆత్మహత్యను రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని.. ప్రభుత్వాలు గగ్గోలు పెడుతుంది… అది సరైన వాదన కాదు. రోహిత్ మృతి ఘటనలో రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవడంతో మరో విద్యార్థి ఆత్మహత్య జరగకుండా రాజకీయాలు ఆపాయి. 'మీ వెనుకాల మేమున్నామనే మనో ధైర్యాన్ని విద్యార్థులకు ఇచ్చారు.

ప్రజాస్వామ్యంలో రాజకీయం సహజం...

ప్రజాస్వామ్యంలో రాజకీయం సహజం. ప్రజాస్వామ్యంలో ప్రతి దాంట్లో రాజకీయం ఉంటుంది. సమస్య ఉన్న చోట.. రాజకీయాలు ఉంటాయి. సమస్యను పరిష్కరిస్తే.. రాజకీయాలు ఉండవు.. మహిళలకు ఆలయ ప్రవేశం లేదనడం రాజ్యాంగం విరుద్ధం.. మహారాష్ట్రలోని శని శింగానపూర్ గర్భగుడిలోకి మహిళలకు ప్రవేశం లేదనడం భావ్యం కాదు. స్త్రీలకు ఆలయాల్లోకి ప్రవేశం లేదనడం రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగంలో స్త్రీ, పురుషులకు సమాన హక్కులు ఉన్నాయి. స్త్రీని.. దేవతగా పూజించే హిందూ మతంలో ఆలయంలోకి స్త్రీలకు ప్రవేశం లేదనడం అర్థం లేని వాదన. ఆచారానికి , చట్టానికి మధ్య ఘర్షణ వస్తే.. చట్టమే గెలుస్తుంది. చట్టాన్ని ఉల్లంఘిస్తే అంగీకరించడానికి ఆస్కారం లేదు..

అరుణాచల్ ప్రదేశ్ లో రాజకీయ అనిశ్చితి

ఆరుణాచల్ లో నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై మాట్లాడారు. స్వార్థపూరితంతో కూడుకున్న రాజకీయాలు చేయడం మంచింది కాదు. ఇలాగే చేస్తూపోతే.. అరుణాచల్ ప్రదేశ్ లో వేర్పాటు వాద ఉద్యమాలు వచ్చే అవకాశం ఉంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.…

 

09:41 - January 27, 2016

పోరాటం ద్వారానే ఎపికి ప్రత్యేకహోదా అంశం పరిష్కారం అవుతుందని వక్తలు పేర్కొన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు.. నడింపల్లి సీతారామరాజు, టిడిపి అధినేత.. రామకృష్ణ ప్రసాద్, వైసీపీ అధినేత మధన్ మోహన్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. ప్రపంచంలో పోరాటం చేయకుండా ఏ సమస్య పరిష్కారం కాలేదని.. పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం అయ్యాయని గుర్తు చేశారు. మౌన పోరాటాలు చేస్తే ప్రత్యేకహోదా రాదని అన్నారు. పోరాటం చేయడం ద్వారానే ప్రత్యేకహోదా అంశం పరిష్కారం అవుతుందని తెలిపారు. ప్రత్యేక హోదా అంశంపై అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ మాట తప్పిందని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. మరిన్ని వివరానలు వీడియోలో చూద్దాం…

నేడు యూనివర్సిటీల బంద్‌..

ఢిల్లీ : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఇవాళ దేశవ్యాప్తంగా వర్సిటీల బంద్‌కు హెచ్‌సీయూ జేఏసీ పిలుపునిచ్చింది. ఇక రేపు, ఎల్లుండి కూడా ర్యాలీలు, ఆందోళనలు చేసేందుకు విద్యార్ధులు సిద్ధమవుతున్నారు. మరోవైపు తన కుమారుడు ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని రోహిత్‌ తల్లి త్వరలోనే రాష్ట్రపతిని కలవబోతున్నారు. 

కేసీఆర్ మీడియా సమావేశం రేపటికి వాయిదా...

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇవాళ తలపెట్టిన మీడియా సమావేశం రేపటికి వాయిదా పడింది.

 

09:06 - January 27, 2016

ఇటానగర్ : అనేక హైడ్రామాల మధ్య ఎట్టకేలకు అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనను విధించారు. తొలుత కేంద్ర కేబినెట్‌ నిర్ణయాన్ని ప్రణబ్‌ వ్యతిరేకించినప్పటికీ.. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను రాజ్‌నాథ్‌సింగ్‌ మరోసారి వివరించడంతో రాష్ట్రపతి పాలనకు ఆమోదముద్ర వేశారు. ఇక ఈ నిర్ణయంపై గుర్రుగా ఉన్న కాంగ్రెస్‌.. ఈ వ్యవహారాన్ని కోర్టులో తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది.

రెండు రోజులు హైడ్రామా

అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. గత ఆరు నెలలుగా రాష్ట్ర అసెంబ్లీ సమావేశం కాకపోవడంతో కేంద్ర కేబినెట్‌ రాష్ట్రపతి పాలన విధించాలని సిఫారసు చేసింది. రెండు రోజుల హైడ్రామాల తర్వాత కేంద్రం సిఫారసులను రాష్ట్రపతి ప్రణబ్‌

కేబినెట్‌ సిఫారసులను అంగీకరించని ప్రణబ్‌

సోమవారం కేంద్ర కేబినెట్‌ సిఫారసులను వివరించేందుకు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రాష్ట్రపతి ప్రణబ్‌తో భేటీ అయ్యారు. అయితే దానిని ప్రణబ్‌ అంగీకరించలేదు. అత్యవసరంగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటూ ప్రశ్నించారు. న్యాయనిపుణులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానన్నారు ప్రణబ్‌. అయితే మంగళవారం మరోసారి ప్రణబ్‌తో భేటీ అయిన రాజ్‌నాథ్‌సింగ్‌.. రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని వివరించారు. దీంతో కేంద్ర కేబినెట్‌ సిఫారసులకు ఆమోద ముద్ర వేశారు ప్రణబ్‌ ముఖర్జీ.

రాష్ట్రపతి పాలనను తప్పుపట్టిన సీఎం సబమ్‌తుకి

రాష్ట్రపతి పాలనను ముఖ్యమంత్రి సబమ్‌తుకి తప్పుబట్టారు. రాష్ట్రపతి పాలనను విధించవద్దంటూ ప్రణబ్‌ను కలిసినా ప్రయోజనం లేకపోవడంతో.. ఇక ఈ వ్యవహారాన్ని కోర్టులోనే తేల్చుకుంటామంటున్నారు కాంగ్రెస్‌ నేతలు. తమ పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో కలవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని కాంగ్రెస్‌ నేతలంటున్నారు. ఎలాగైనా ఈ పరిస్థితి నుంచి బయటపడి అధికారపగ్గాలు దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి

 

08:42 - January 27, 2016

తెలంగాణలో సీఎం కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగుతోందని సీపీఐ నేత విమర్శించారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. హైదరాబాద్‌ లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచార హోరు ఊపందుకుంది. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ, మజ్లిస్‌ ఇలా వివిధ పార్టీలు మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం, లోక్‌సత్తా పార్టీలు వన్‌ హైదరబాద్‌ కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి తమ దగ్గర పరిష్కారాల గురించి సుధాకర్ వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం…

08:10 - January 27, 2016

నల్గొండ : అక్కడ ఎమ్మెల్యే ఓ మహిళ. అక్కడ సర్పంచ్ ఓ మహిళ. కానీ మహిళా సమస్యలపై దృష్టిపెట్టలేదు. ఆ నిర్ల్యక్షమే ఓ ప్రాణాన్ని బలితీసుకుంది. మరుగుదొడ్డి కోసం పోరాడి... నల్లగొండలో ఓ విద్యార్థి తనువు చాలించింది. ఆరు బయట ఆకతాయిల వేధింపులతో... ఆడ కూతురు బలైపోయింది. తల్లిదండ్రుల అవగాహన లోపం, అధికారుల అసమర్థత... రిపబ్లిక్ డే రోజు పెనువిషాదం నింపింది. తెలంగాణలో మొండిగోడలతోనే మరుగుదొడ్లు దర్శనమిస్తున్నాయి. సర్కారీ పథకాలు సామాన్యుడి దరి చేరడం లేదు.

తన ఆవేదన ఎవరికీ అర్థం కాలేదు

తన ఆవేదన ఎవరికీ అర్థం కాలేదు. తన గోసను ఎవరూ గమనించలేదు. తన గోడును ఎవరూ వినిపించుకోలేదు. తన బాధను ఎవరూ పట్టించుకోలేదు. అందుకే ఈ లోకం నుంచి వెళ్లిపోయింది. కాదు కాదు..! ఈ సమాజాన్ని మేల్కొలిపేందుకు ప్రాణత్యాగం చేసింది. తల్లిదండ్రుల పేదరికం, అధికారుల అసమర్థత, పాలకుల నిర్లక్ష్యమే ఈ ఆడబిడ్డ పాలిట శాపమయ్యాయి.

విద్యార్థిని బలవన్మరణం

గణతంత్ర వేడుకలతో యావత్భారతావని ఉంటే తెలంగాణలో మాత్రం ఓ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. షేమ్ ఇండియా అంటూ సిగ్గుతో తలదించుకునేలా చేసింది. నల్లగొండ జిల్లా గుండాలలో... ఇంట్లో మరుగుదొడ్డి కట్టలేదని ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్న కొడపర్తి రేఖ అగ్నికి ఆహుతై సజీవదహనమైంది.

ఆరు బయట బహిర్భూమితో ఆకతాయిల వేధింపులు

ఆరుబయట బహిర్భూమితో ఆకతాయిల వేధింపులకు గురైన రేఖ... ఇంట్లో మరుగుదొడ్డిని నిర్మించాలని ఆరు నెలలుగా తల్లిదండ్రులను అడుగుతోంది. కానీ ఇంటి ఆవరణలో సరిపడా స్థలం లేక, ఆర్థిక స్తోమత సహకరించక... ఆమె తల్లిదండ్రులు మరుగుదొడ్డిని నిర్మించలేకపోయారు. ఈ విషయంమై తల్లితో రేఖ గొడవపడింది. కూతురికి సర్ధిచెప్పి తల్లిదండ్రులు ఉపాధి హామీ పనుల్లోకి వెళ్లిపోయారు. దీంతో మనస్థాపానికి గురైన రేఖ... ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.

తెలంగాణ పల్లెల్లో మరుగుదొడ్ల సమస్య

మరుగుదొడ్ల సమస్య..! ఒక్క రేఖది మాత్రమే కాదు. తెలంగాణ పల్లెల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. అనేకమంది అమ్మలు, ఆడబిడ్డలు ఆరుబయటే అవస్థలు పడుతున్నారు. బహిర్భూమితో నిత్యం నరకం అనుభవిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 60 లక్షల గృహాలకు... మరుగు దొడ్లు లేవని సాక్షాత్తు పంచాయతీరాజ్ శాఖ అధ్యయనమే తెలిపింది. 90 లక్షల గృహాలకు... కేవలం 30 లక్షల గృహాలకే మరుగు దొడ్లు ఉన్నాయంటే... స్త్రీ ఆత్మగౌరవాన్ని కాపాడటంలో మన పాలకులు ఎలా వ్యవహరిస్తున్నారో..? అర్థం చేసుకోవచ్చు.

మరుగుదొడ్ల పథకంలో అవినీతి కంపు

గ్రామీణ ప్రాంతాల్లో ఆరుబయట మలవిసర్జనను అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నాయి. కోట్లాది రూపాయలను కూడా విడుదల చేస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో మరుగుదొడ్ల పథకంలో అవినీతి కంపు కొడుతోంది. "నిర్మల్ భారత్ అభియాన్" కార్యక్రమం పక్కదారి పడుతోంది.

రేఖ మరణానికి కారణం ఎవరు..?

మరుగుదొడ్డిలేని ఇల్లు-మహిళ గౌరవాన్ని ఎలా కాపాడుతుంది..? రేఖ మరణానికి కారణం ఎవరు..? ప్రభుత్వ పథకాల్ని అమలు చేయడంలో విఫలమైన అధికారులదా..? కూతురి నరకాన్ని కళ్లారా చూసినా... ఏం చేయలేని దుస్థితిలో ఉన్న తల్లిదండ్రులదా..? మహిళల అవస్థల్ని పట్టించుకోని సమాజానిదా..? ఇప్పటికైనా టీవీల్లో, పేపర్లలో... ప్రకటనలకే పరిమితమయ్యే లీడర్లకు... రేఖ మరణం ఓ గుణపాఠం కావాలి.

 

 

08:04 - January 27, 2016

హైదరాబాద్ : తెలంగాణ సీఎం పేషీలో మార్పులు మొదలయ్యాయి. పేషీలో మొదటి వికెట్‌ పడింది. ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్‌ను కేసీఆర్ సాబ్‌ సాగనంపారు. సాంస్కృతిక శాఖకు ఆయనను బదిలీ చేశారు. 

సీఎం పేషీలో బదీలీల పర్వం 

సీఎం పేషీలో బదీలీల పర్వం మొదలయ్యింది. మొదటి వేటు కవి,గాయకుడు దేశపతి శ్రీనివాస్ పై పడింది. దేశపతిని ఓఎస్ డీ గా నియమించుకున్న కేసీఆర్‌.. అధికారికంగా జీవో లేకున్నా విద్యా శాఖ బాధ్యతలు అప్పగించారు. విద్యా రంగంపై ఎప్పటి కప్పుడు తనకు సలహాలు సూచనలు ఇచ్చేందుకు తనకు సన్నిహితుడైన దేశపతికి ఓఎస్‌డీగా ఛాన్స్ ఇచ్చారు. 

దేశపతి శ్రీనివాస్‌ సాంస్కృతి శాఖకు బదిలీ

అయితే దేశపతి శ్రీనివాస్‌ను తన పేషీ నుంచి కేసీఆర్‌ బదిలీ చేశారు. ఓఎస్ డీగా తొలగించి అంతగా ప్రాధాన్యత లేని సాంస్కృతిక శాఖ కు బదిలి చేశారు. అయితే ఆయనను ఎందుకు బదిలి చేసారనేది ఆసక్తిగా మారింది. దేశపతి పనితీరు పట్ల సీఎం అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. తన పేషీలోని విషయాలు బయటకు పొక్కుతున్నాయనే విషయంలో సీఎం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పేషీలోని వారందరికి గట్టి వార్నింగ్ ఇచ్చేందుకే దేశపతిపై వేటు వేశారనే ప్రచారం సాగుతోంది. 

అలాంటప్పుడు పేషీలో నాకేంపని : దేశపతి 

మరోపక్క దేశపతికి కూడా పేషీ లో పెద్దగా పని ఉండటం లేదని ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. విద్యా శాఖకు సంబంధించి సీఎం నేరుగా ఆయన సెక్రటరి రాజశేఖరరెడ్డితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నారని ...అలాంటప్పుడు పేషీలో తనకేమి పనని దేశపతి ఆవేదన చెందినట్లు టాక్‌ వినిపిస్తోంది. అందుకే తనను బదిలి చేసారని తన సన్నిహితులకు చెబుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇది ఇలా ఉంటే మరికొందరిపై త్వరలోనే వేటు పడుతుందని సమాచారం. 

 

07:42 - January 27, 2016

హైదరాబాద్ : మాస్టర్‌ ప్లాన్‌ మాయగా మారుతోంది. అర్థం కాని సంకేతాలతో ఆందోళన పుట్టిస్తోంది. ఆంగ్ల పదాలతో అలజడి సృష్టిస్తోంది. ఈ అస్పష్టతకు తాజాగా అగ్రికల్చర్‌ జోన్‌ జోడీ అయ్యింది. గ్రీన్‌ బెల్ట్‌ కూడా జాయింట్‌ అయ్యింది. మొత్తంగా రాజధాని గ్రామాల ప్రజలకు మాస్టర్‌ ప్లాన్‌ మొండి ఘటంగా తయారైంది. సవాలక్ష అభ్యంతరాలకు మూలంగా మారింది.

మాస్టర్‌ ప్లాన్‌పై రాజధాని గ్రామాల ప్రజలు ఆగ్రహం

అమరావతి ముసాయిదా మాస్టర్‌ ప్లాన్‌పై రాజధాని గ్రామాల ప్రజలు ఇప్పటికే ఆగ్రహంతో ఉన్నారు. అధిక సంఖ్యలో అభ్యంతరాలు సీఆర్‌డీఏకు అందుతూనే ఉన్నాయి. తాజాగా అగ్రికల్చర్‌ జోన్‌ మరో చిచ్చు రేపుతోంది. అగ్రిజోన్‌లో ఉన్న గ్రామాల ప్రజలు ముసాయిదా ప్లాన్‌పై మండిపడుతున్నారు. ప్లాన్‌ మార్చాలంటూ పట్టుబడుతున్నారు.

భూముల అమ్మకంపై నిషేధం

మాస్టర్‌ ప్లాన్‌లో 46 మండలాలను అగ్రికల్చర్‌ జోన్‌గా సీఆర్‌డీఏ పేర్కొంది. కృష్ణా జిల్లాలో 22 మండలాలను గ్రీన్‌ బెల్ట్‌ కిందకి తీసుకొచ్చింది. గ్రీన్‌ బెల్ట్‌లో ఉన్న గ్రామాల్లో భూములను వ్యవసాయానికి తప్ప ఇతర అవసరాలకు అమ్మరాదని నిషేధం విధించారు. ఈ నిబంధనపై పలు గ్రామాలు ప్రజలు మండిపడుతున్నారు. భూముల రేట్లను పడిపోయే విధంగా చేయడానికే గ్రీన్‌బెల్ట్‌ నిబంధన విధించారనే విమర్శలు వస్తున్నాయి. ఈ నిబంధనలతో సొంత ఇళ్లను కూడా నిర్మించుకోలేని పరిస్థితి ఏర్పడుతుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

అగ్రిజోన్‌పై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు మండిపాటు

మాస్టర్‌ ప్లాన్‌లోని అ్రగిజోన్‌పై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. కృష్ణా జిల్లాలో 60 శాతం భూములను అగ్రిజోన్‌కు కేటాయించడంపై ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. కంకిపాడు, ఆగిరిపల్లి, తోట్లవళ్లేరు మండలాల ప్రజలు తమ భూములు అగ్రిజోన్‌లోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నారు. కొందరికి లాభం చేకూర్చేలా ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

07:37 - January 27, 2016

హైదరాబాద్ : రిపబ్లిక్‌ డే సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ ఇచ్చిన తేనీటి విందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గైర్హాజరయ్యారు. రాజకీయ వర్గాల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎట్‌ హోమ్‌ కార్యక్రమానికి రాకపోవడంపై రకరకాల ఊహాగాలు వినిపిస్తున్నాయి.

రాజ్‌భవన్‌లో తేనీటి విందు 

స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా రాజ్‌భవన్‌లో ఎట్‌ హోం పేరుతో తేనీటి విందు కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గతంతో మాదిరిగానే ఈసారి కూడా గవర్నర్‌ నరసింహన్‌ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇద్దరు చంద్రులుగా ముద్రపడ్డ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, చంద్రబాబుతోపాటు, పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. గతేడాది ఎట్‌ హోం కార్యమ్రానికి హాజరైన ఇద్దరు చంద్రులు... ఈసారి మాత్రం డుమ్మా కొట్టడంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి.

ఇద్దరు సీఎంల మధ్య భేదాభిప్రాయాలు

రాష్ట్ర విభజన తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య చాలా అంశాల్లో అభిప్రాయభేదాలు తలెత్తాయి. సాగునీరు, విద్యుత్‌ సరఫరా, పరీక్షల నిర్వహణ , ఉద్యోగుల పంపిణీ వంటి అంశాల్లో సమస్యలు వచ్చాయి.ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. అటువంటి సందర్భాల్లో గవర్నర్‌ నరసింహన్‌ చొరవ తీసుకున్నారు. 2014 ఆగస్టు 18న మొదటిసారి కేసీఆర్‌, చంద్రబాబులను రాజ్‌భవన్‌కు పిలిపించి రెండు రాష్ట్రాలపై తలెత్తిన వివాదాలపై సర్దిచేప్పే ప్రయత్నాలు చేశారు. దీనికి ప్రాతిపదిక లేకపోలేదు.

2014 ఆగస్లు 15న ఇద్దరు చంద్రులతో సమావేశం

2014 ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన తేనీటి విందుకు హాజరైన ఇద్దరు చంద్రులు గవర్నర్‌కు ఇరువైపుల కూర్చుని నవ్వుతూ మాట్లాడుకున్నారు. ఇద్దరి మధ్య ఉద్రికత్తలు సడలడానికి ఇది దోహదం చేసింది. ప్రజల్లోకి కూడా మంచి సంకేతాలు వెళ్లాయి. ఆ తర్వాత గవర్నర్‌ మదిలో ఓ కొత్త ఆలోచన వచ్చింది. ఇద్దర్నీ కూర్చేబెట్టి మాట్లాడే మంచిదనుకుని 2014 ఆగస్లు 18న రాజ్‌ భవన్‌లో ఇద్దరు చంద్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. కేసీఆర్‌, చంద్రబాబులను చెరోపక్కన కూర్చోపెట్టుకుని అన్ని విషయాల్లో అరమరికలు లేకుండా చర్చించుకునేలా చేశారు. కొన్ని సున్నితమైన అంశాలపై చర్చల సమయంలో తాను మధ్యన ఉండటం మంచిదికాదన్న ఉద్దేశంతో ఇద్దరు ముఖ్యమంత్రులు ఏకాంతంగా మాట్లాడుకునే అవకాశం కల్పించారు. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పెద్ద మనిషి తరహాలో సూచించారు. ఆ తర్వాత నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సుహృద్భావ వాతావణం ఏర్పడింది. ఇదంతా గతం. ఇప్పుడు పరిస్థితి మారింది.

ఇద్దరు చంద్రుల రాకపోవడంపై చర్చ

మంగళవారం నాటి ఎట్‌ హోం కార్యక్రమానికి ఇద్దరు చంద్రలు గైర్హాజరయ్యారు. ఇద్దరు వస్తారనుకుని ఆహ్వానితులందరూ కూడా చివరక్షణం వరకు ఉత్కంఠతతో ఎదురు చూశారు. కేసీఆర్‌, చంద్రబాబు వస్తే క్లిక్‌ మనిపిద్దామని ఫోటో జర్నలిస్టులు, ఇద్దరినీ తమ కెమెరాల ద్వారా చిత్రీకరించాలని వీడియో జర్నలిస్టులు ఉత్సాహం ప్రదర్శించారు. కానీ ఇద్దరూ రాకపోవడంతో వారి ఉత్సాహం నీరుకారిపోయింది. తేనీటి విందు ప్రారంభించారు. ఇద్దరు చంద్రుల గైర్హాజరుపై ఎట్‌ హోం కార్యక్రమంలోనే పలువురు చర్చించుకున్నారు. అన్ని విషయాల్లో రాజీపడ్డారు కాబట్టి... తేనీటి విందుకు వెళ్లకపోయినా పర్వాలేదనుకుని డుమ్మాకొట్టారంటూ కొందరు గుసగుసలాడుకున్నారు.

గైర్హాజరీకి ఎవరి కారణాలు వారికి ఉంటాయి-గవర్నర్‌

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయన్న ఉద్దేశంతో రాలేదని కొందరు చర్చించుకున్నారు. ఎట్‌ హోం కార్యక్రమానికి కేసీఆర్‌, చంద్రబాబు గైర్హాజరీపై మీడియా ప్రతినిథులు గవర్నర్‌ నరసింహన్‌ దగ్గర ప్రస్తావించినప్పడు.. ఎందుకు రాలేదో తెలియదన్నారు. గైర్హాజరీకి ఎవరి కారణాలు వారికి, ఎవరి సమస్యలు వారికి ఉంటాయని వ్యాఖ్యానించారు. ఎందుకు రాలేదో వారికే తెలుసన్నారు. ఇద్దరు సిఎం పాలన బాగుందని కితాబిచ్చారు. అభివృద్ధిలో దూసుకుపోతున్నారని ప్రశంసించి ఓ పిట్టకథతో ఈ సంభాషణలను ముగించారు.

 

07:26 - January 27, 2016

హైదరాబాద్ : ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో.. గ్రేటర్‌లో పొలిటికల్‌ హీట్‌ పెరుగుతోంది. హైదరాబాద్‌ను మేం అభివృద్ధి చేశామంటే కాదు మేం అభివృద్ధి చేశామంటూ నేతలు ప్రకటించుకుంటున్నారు. అంతటితో ఆగకుండా అధికార విపక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలను సంధించుకుంటున్నారు.

తమది చేతల ప్రభుత్వం : కేటీఆర్

తమది మాటల ప్రభుత్వం కాదని... చేతల ప్రభుత్వమని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. 18 నెలల పాలనలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీలకు టీఆర్‌ఎస్‌ను విమర్శించే అర్హత లేదని కేటీఆర్‌ అన్నారు. 60-65 ఏళ్లలో చేయని పనులను 18 నెలల్లో చేపట్టామన్నారు. మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని కేటీఆర్‌ మండిపడ్డారు. గ్రేటర్‌ ప్రజలను ఓటు అడిగే అర్హత ఆ పార్టీకి లేదన్నారు. 40 దేశాలు తిరిగిన ప్రధానమంత్రికి హైదరాబాద్‌కు వచ్చే తీరిక లేకపోవడం దారుణమని కేటీఆర్‌ అన్నారు.

ఎంఐఎంవి మత రాజకీయాలు : వెంకయ్యనాయుడు

ఎంఐఎం మత రాజకీయాలు చేస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విమర్శించారు. కేంద్రం నిధులిచ్చి రాష్ట్రాలను అభివృద్ధి చేస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన హోర్డింగులు, ఫ్లెక్సీలు చూసి మోసపోవద్దని సూచించారు. తెలంగాణలో 55 వేల 507 ఇళ్లను కేంద్రం మంజూరు చేసిందని వెంకయ్యనాయుడు తెలిపారు.

చంద్రబాబు హయాంలోనే హైదరాబాద్‌ అభివృద్ధి : లోకేష్

చంద్రబాబు హయాంలోనే హైదరాబాద్‌ అభివృద్ధి చెందిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. మల్కాజ్‌గిరి డివిజన్‌ గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాయ మాటలతో ప్రజలను మభ్య పెడుతున్నారని అవి నమ్మి మోసపోవద్దని కోరారు. హైదరాబాద్‌ను తాగునీటి కొరత వేధిస్తోందని... టీడీపీ అభ్యర్థిని గెలిపిస్తే 6నెలల్లోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కారు డబ్బున్నోడిదని, సైకిల్ పేదోడిదని.. టీడీపీ బలహీన వర్గాలకు ఎప్పుడూ అండగా ఉంటుందని లోకేష్‌ చెప్పారు.

ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్‌లో చంద్రబాబు ప్రచారం

ఈ నెల 28, 29 తేదీల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రచారం నిర్వహించనున్నారు. అలాగే సీఎం కేసీఆర్‌ ఈనెల 30న గ్రేటర్‌లో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. ఇక ఇద్దరు సీఎంలు రంగంలోకి దిగితే గ్రేటర్‌లో మరింత హీట్‌ పెరిగే అవకాశం ఉంది.

 

 

 

07:22 - January 27, 2016

ఢిల్లీ : విద్యార్ధుల ఆందోళనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. రోహిత్‌ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఇవాళ దేశవ్యాప్తంగా వర్సిటీల బంద్‌కు హెచ్‌సీయూ జేఏసీ పిలుపునిచ్చింది. ఇక రేపు, ఎల్లుండి కూడా ర్యాలీలు, ఆందోళనలు చేసేందుకు విద్యార్ధులు సిద్ధమవుతున్నారు. మరోవైపు తన కుమారుడు ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని రోహిత్‌ తల్లి త్వరలోనే రాష్ట్రపతిని కలవబోతున్నారు.

అట్టుడుకుతోన్న హెచ్ సీయూ

విద్యార్ధుల ఆందోళనలతో సెంట్రల్‌ యూనివర్సిటీ అట్టుడుకుతోంది. రోహిత్‌ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకునే వరకు ఉద్యమం కొనసాగించాలని స్టూడెంట్స్‌ డిసైడయ్యారు. వర్సిటీ ప్రాంగణంలో పోలీసులు దీక్షలను భగ్నం చేసి ఆస్పత్రికి తరలించినా... విద్యార్ధులు మళ్లీ మళ్లీ దీక్షలు చేస్తూనే ఉన్నారు.

ఏకమైన విద్యార్ధి లోకం

మరోవైపు రోహిత్‌ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్ధి లోకమంతా ఏకమైంది. నేడు దేశవ్యాప్తంగా యూనివర్సిటీల బంద్‌కు హెచ్‌సీయూ జేఏసీ పిలుపునిచ్చింది. ఇక విద్యార్ధుల ఆందోళనలకు దేశంలోని ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలతో పాటు అనేకమంది మద్దతు తెలుపుతున్నారు. స్వచ్ఛందంగా వర్సిటీకి తరలివచ్చి విద్యార్ధులకు సంఘీభావం తెలుపుతున్నారు. రోహిత్‌ కుటుంబానికి న్యాయం జరిగేవరకు అండగా ఉంటామంటూ భరోసా ఇస్తున్నారు.

శ్రీవాస్తవ్‌ నియామకంపై విద్యార్థుల ఆగ్రహం

ఇక హెచ్‌సీయూ వీసీ అప్పారావును సెలవుపై పంపించడం.. ఆయన స్థానంలో ఇన్‌చార్జ్‌ వీసీగా శ్రీవాస్తవ్‌ను నియమించడాన్ని విద్యార్ధులు తప్పుపడుతున్నారు. అప్పారావును రక్షించేందుకు సెలవుపై పంపించారని ఆరోపిస్తున్నారు. ఇన్‌చార్జ్‌గా నియమించిన శ్రీవాస్తవ్‌పై కూడా అనేక ఆరోపణలు ఉన్నాయంటున్నారు. తక్షణమే వీసీ అప్పారావుపై చర్యలు తీసుకోవాలని విద్యార్ధులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇదిలావుంటే వర్సిటీలో మామూలు పరిస్థితి వచ్చేందుకు విద్యార్ధులు సహకరించాలంటున్నారు. విద్యార్ధుల డిమాండ్లపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు ఇన్‌చార్జ్‌ వీసీ శ్రీవాస్తవ్‌.

రేపు, ఎల్లుండి నిరసనలు, ధర్నాలు

మరోవైపు రోహిత్‌ ఆత్మహత్య ఘటనపై విద్యార్ధులు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. నేడు దేశవ్యాప్తంగా వర్సిటీల బంద్‌కు పిలుపునిచ్చిన హెచ్‌సీయూ జేఏసీ, రేపు, ఎల్లుండి కూడా నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు చేయాలని నిర్ణయించారు. రోహిత్ పుట్టిన రోజైన జనవరి 30న హెచ్‌సీయూలో రాష్ట్ర సదస్సు నిర్వహించబోతున్నారు విద్యార్థులు. అనంతరం వారం రోజుల పాటు సంతాప దినాలు పాటిస్తామన్నారు. అలాగే ఫిబ్రవరి మొదటివారంలో... రెండు రోజులు ఢిల్లీలో భారీ నిరసనలు చేపట్టాలని జేఏసీ విద్యార్ధులు నిర్ణయించారు.

రాష్ట్రపతిని కలవనున్న రోహిత్ తల్లి

న్యాయం కోసం, తన కుమారుడు ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్‌ను కలిసేందుకు సిద్ధమవుతున్నారు రోహిత్ తల్లి. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ ఖరారు కాగానే ఆమె ఢిల్లీ వెళ్లి పరిస్థితులను వివరించనున్నారు. ఏదిఏమైనా రోహిత్‌ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకునే వరకు విద్యార్ధుల ఉద్యమం ఆగేటట్లు కనిపించడం లేదు. మరి కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

 

కాకినాడలో నేడు వైసిపి యువభేరీ....

తూర్పుగోదావరి : కాకినాడలో నేడు వైసిపి యువభేరీ జరుగనుంది. ప్రత్యేకహోదా కోసం విద్యార్థులతో జగన్ ముఖాముఖి నిర్వహించనున్నారు.

నేటి నుంచి సింగరేణిలో ఉద్యోగ మేళా

ఆదిలాబాద్ : సింగరేణిలో నేటి నుంచి ఆణిముత్యాలు పేరిట ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 1 వరకు మేళా కొనసాగనుంది. 

నేడు కేరళలో రాజ్ నాథ్ సింగ్ పర్యటన

త్రివేండ్రం : కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇవాళ కేరళలో పర్యటించనున్నారు. త్రివేండ్రంలో జరిగే ఓ సెమినార్ లో పాల్గొననున్నారు. 

Don't Miss