Activities calendar

01 February 2016

గ్రేటర్ ఎన్నికలు..సర్వం సిద్ధం..

హైదరాబాద్ : గ్రేటర్‌ ఎన్నికలకు సర్వం సిద్దమైంది. ప్రత్యేక రాష్ట్రం అనంతరం తెలంగాణలో జరుగుతున్న అతిపెద్ద ఎన్నికలు కావడంతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రేట‌ర్ పరిధిలో ఉన్న 150 డివ‌జ‌న్లలో 7802 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 74ల‌క్షల 23వేల మంది ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకోనున్నారు. 46వేల మంది పోలింగ్ సిబ్బంది ఈ కార్యక్రమంలో భాగ‌స్వాములు అవుతున్నారు. మంగళవారం ఉద‌యం 6గంట‌ల‌కు ఏజెంట్ల స‌మ‌క్షంలో మాక్ పోలింగ్ నిర్వహించ‌నున్నారు. తర్వాత 7 గంట‌ల‌కు పోలింగ్ ప్రారంభమవుతుంది.

తమిళనాడు..కేరళలో మోడీ పర్యటన...

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు కేరళ, తమిళనాడు రాష్ర్టాల్లో పర్యటించనున్నారు. ముందుగా కేరళలోని కోజికోడ్‌లో పర్యటిస్తారు. 3వ గ్లోబల్ ఆయుర్వేద ఫెస్టివల్‌లో ప్రసంగించనున్నారు. తర్వాత అక్కడ నుంచి తమిళనాడు బయలుదేరి వెళ్తారు. అక్కడ కోయంబత్తూరులో ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజీ, ఆస్పత్రి నూతన భవనాన్ని ప్రారంభిస్తారు. 

హైదరాబాద్ సీబీఐ జేడీగా కృష్ణ నియామకం..

హైదరాబాద్: నగర జోన్ సీబీఐ జాయింట్ డైరెక్టర్ (జేడీ)గా కృష్ణ నియమితులయ్యారు. కృష్ణ ప్రస్తుతం చెన్నై సీబీఐ డీఐజీగా పనిచేస్తున్నారు.

21:34 - February 1, 2016

మయన్మార్‌ : 50 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎంపీలతో పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. మిలిటరీ పాలనలో మగ్గిపోయిన మయన్మార్‌లో ప్రజాస్వామ్యం కోసం ఆంగ్‌సాన్‌ సూకీ పోరాడారు. ఆమె నేతృత్వంలోని నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమోక్రసీ పార్టీ ఇటీవలి ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించింది. విదేశీ పౌరసత్వం కారణంగా ఆంగ్‌సాన్‌ సూకీ అధ్యక్ష పదవి పొందే అవకాశం లేదు. అక్కడి రాజ్యాంగ నిబంధనలు ఇందుకు అంగీకరించవు. మయన్మార్‌ పార్లమెంటు సీట్లలో మిలిటరీకి 25శాతం రిజర్వేషన్‌ ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ మార్పిడి సాఫీగా సాగేందుకు సూకీ ఇప్పటికే సీనియర్‌ మిలిటరీ నేతలతో చర్చలు జరిపారు. 

21:33 - February 1, 2016

ఢిల్లీ : గుజరాత్‌ భారతదేశంలో అంతర్భాగం కాదా? అంటూ సుప్రీంకోర్టు ఆ రాష్ట్రాన్ని ప్రశ్నించింది. జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని గుజరాత్‌ అమలు చేయకపోవడంపై సుప్రీం సీరియస్‌ అయింది. పార్లమెంట్‌ తెచ్చిన ఓ చట్టాన్ని అమలు చేయమని ఏ రాష్ట్రమైన చెబుతుందా? జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేయడానికి ఏవైనా ఇబ్బందులున్నాయా అంటూ ప్రశ్నించింది. కరువు పీడిత ప్రాంతాల్లో ఫుడ్‌ సెక్యూరిటీ యాక్ట్‌ను అమలు చేయాలని చూస్తున్నట్టు గుజరాత్‌ చెప్పినపుడు కోర్టు పైవిధంగా స్పందించింది. రేపు వేరే రాష్ట్రాలు కూడా ఇదే సమాధానం చెబుతాయని గుజరాత్‌ కోర్టుకు తెలిపింది. దీన్ని సాకుగా తీసుకుని రేపు మరో రాష్ట్రం సిఆర్‌పిసి, ఐపిసి అమలు చేయమని చెప్పే అవకాశముందని కోర్టు పేర్కొంది. దీనిపై ఫిబ్రవరి 10లోగా వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్రానికి ఆదేశించింది.

21:29 - February 1, 2016

హైదరాబాద్ : కూకట్‌పల్లి హైదర్‌నగర్‌లో డబ్బులు పంచుతున్నారన్న సమాచారం అధికార,విపక్ష నేతల మధ్య ఘర్షణకు దారి తీసింది. నిజాంపేట్ రోడ్‌లోని నాగార్జున హోమ్స్ డి బ్లాకులో అధికార పార్టీకి చెందిన కొందరు మహిళలు డబ్బులు పంచారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఇదే సమయంలో టీడీపీ-టీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు ముష్టి ఘాతానికి దిగారు. డబ్బులు పంచుతున్న వారిని పోలీసులు అరెస్ట్ చెయ్యటం లేదంటూ టిడిపి కార్యకర్తలు, శేర్‌ లింగంపల్లీ టీడీపీ ఎమ్మెల్యే అరికె పూడి గాంధీ రాస్తారోకో నిర్వహించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ ఉన్నతాధికారులకు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. 

21:27 - February 1, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ ఎన్నికలకు సర్వం సిద్దమైంది. ప్రత్యేక రాష్ట్రం అనంతరం తెలంగాణలో జరుగుతున్న అతిపెద్ద ఎన్నికలు కావడంతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రితో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలుతున్నారు సిబ్బంది.గ్రేట‌ర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక‌ల‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది జీహెచ్‌ఎంసీ. గ్రేట‌ర్ పరిధిలో ఉన్న 150 డివ‌జ‌న్లలో 7802 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 74ల‌క్షల 23వేల మంది ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకోనున్నారు. 46వేల మంది పోలింగ్ సిబ్బంది ఈ కార్యక్రమంలో భాగ‌స్వాములు అవుతున్నారు. మంగళవారం ఉద‌యం 6గంట‌ల‌కు ఏజెంట్ల స‌మ‌క్షంలో మాక్ పోలింగ్ నిర్వహించ‌నున్నారు. తర్వాత 7 గంట‌ల‌కు పోలింగ్ ప్రారంభమవుతుంది. అందుకోసం అవ‌స‌రమైన పూర్తి మెటీరియ‌ల్‌తో ఎన్నిక‌ల సిబ్బంది పోలింగ్ కేంద్రాల‌కు ప‌య‌న‌మ‌య్యారు.

7802 పోలింగ్ కేంద్రాలు..
ఇక పోలింగ్ జ‌రిగే 7802 పోలింగ్ కేంద్రాల‌కు 20శాతం అద‌నంగా 9,352 పోలింగ్ పార్టీలను ఏర్పాటు చేశామ‌న్నారు క‌మిష‌న‌ర్. ఒక్కో పోలింగ్ పార్టీలో ఐదుగురు ఉద్యోగులు, ఒక ప్రిసైడింగ్ ఆఫీస‌ర్‌, ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీస‌ర్, ముగ్గురు ఓపిఓలు ఉంటారు. ఈవీఎంలలో స‌మ‌స్యలు వ‌స్తే వెంటనే రిప్లేస్ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలింగ్ స‌ర‌ళిని ప‌ర్యవేక్షించేందుకు 1,500 మైక్రో అబ్జర్వర్స్ ను నియ‌మించారు. మొత్తం సమస్యాత్మక ప్రాంతాలు 1,987, అతి సమస్యాత్మక ప్రాంతాలుగా 867గా గుర్తించారు. స‌మ‌స్యాత్మక కేంద్రాల్లో ప‌టిష్ట భ‌ద్రతా ఏర్పాట్లు చేశారు. 32వేల మంది పోలీసులు పోలింగ్ కేంద్రాల దగ్గర విధులు నిర్వహిస్తారు. అలాగే 3,000 మంది ఇంజ‌నీరింగ్ విద్యార్థుల ద్వారా వెబ్ కాస్టింగ్ నిర్వహించ‌నున్నారు.  గ్రేట‌ర్ ప‌రిధిలో ఓటింగ్ శాతాన్ని పెంచ‌డానికి వివిధ రూపాల్లో ప్రచారం చేసిన జిహెచ్ఎంసి ఓటింగ్ రోజు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడికి వ‌చ్చే విక‌లాంగుల‌కు, వృద్దుల‌కు ప్రత్యేక సౌక‌ర్యాలు సిద్దం చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో ప్రజ‌ల భాగ‌స్వామ్యం పెర‌గాలంటే అంద‌రూ త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోవాల‌న్నారు క‌మిష‌న‌ర్ జ‌నార్థన్ రెడ్డి.

21:23 - February 1, 2016

తూర్పుగోదావరి : కాపు రిజర్వేషన్‌ పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం మళ్లీ ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలోనే ఈనెల 5 నుంచి దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. 1994లో కూడా ఆయన కిర్లంపూడిలోని నివాసంలోనే దీక్ష చేశారు. గతంలో మాదిరిగా ఈసారి కూడా భార్యతో కలిసి దీక్షకు కూర్చుంటానని ప్రకటించారు. ప్రభుత్వం అరెస్టు చేసి జైలుకు తరలించినా, అక్కడే దీక్ష చేస్తామని ముద్రగడ స్పష్టం చేశారు.. కాపు రిజర్వేషన్లపై తాడో పేడో తేల్చుకోడానికి ముద్రగడ పద్మనాభం రెడీ అయ్యారు. కాపుజాతి అభ్యున్నతి కోసం ఇదే ఆఖరి పోరాటమని ప్రకటించారు. జాతి సముద్ధరణ కోసం ఏ త్యాగానికైనా సిద్ధమన్నారు. కాపుల ఆకలి బాధలు తీర్చడమే తన ముందున్న ధ్యేయమని చెప్పుకొచ్చారు. ఈ లక్ష్యసాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష మినహా మరో మార్గంలేదని ప్రకటించారు. ఈనెల 5 నుంచి దీక్ష చేస్తానని ప్రకటించారు.

ప్రభుత్వ కాలయాపన చేస్తోంది..
కాపు రిజర్వేషన్లపై కమిషన్ల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం కాలయాన చేస్తున్నదని ముద్రగడ విమర్శిస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాపు రిజర్వేషన్ల కోసం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇవ్వకపోతే ఇప్పుడు రోడ్డెక్కే పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చకపోడంతోనే మళ్లీ ఉద్యమ బాట పట్టాల్సి వచ్చిందన్న ముద్రగడ.. ఎన్నికల ప్రణాళికలో చేర్చిన రిజర్వేషన్ల అంశాన్ని అమలు చేయాలంటూ చంద్రబాబుకు ఎన్ని లేఖలు రాసినా.. స్పందన లేకపోవడంతోనే ఇప్పుడు దీక్షకు ఉపక్రమించాల్సి వస్తోందని చెప్పుకొచ్చారు. ఇది కాపుల ఆకలి పోరాటమే కానీ, రాజకీయ ఆరాటం కాదంటున్నారు. మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేమే లేదన్నారు.  దీక్ష సందర్భంగా తనకు సంఘీభావం ప్రకటించేందుకు ఏ కాపు నేతకానీ, కార్యకర్త కానీ రావొద్దని ముద్రగడ కోరారు. ఎవరికి వారు, ఎక్కడికక్కడ నిరసన తెలిపితే సరిపోతుందన్నారు. ఆవేశంతో అనర్ధాలు కొని తెచ్చుకోవద్దన్నారు. కేసుల్లో చిక్కుకుని భవిష్యత్‌ నాశనం చేసుకోవద్దని ముద్రగడ పద్మనాభం... కాపులకు విజ్ఞప్తి చేశారు.

టిడిపి నేతల హస్తం ఉంది..
ఆదివారం తునిలో జరిగిన ఘటనల వెనుక టీడీపీ నేతల హస్తం ఉందన్న అనుమానాన్ని ముద్రగడ వ్యక్తం చేశారు. కాపు రిజర్వేషన్‌ పోరాటం ప్రకటించిన తర్వాత చంద్రబాబు తరచూ కాపు నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో భేటీలు నిర్వహించి.. విధ్వంసానికి ముందస్తు పన్నాగం రచించారని ఆరోపించారు. ఉద్యమాన్ని నీరుగార్చేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదని ముద్రగడ దుయ్యబట్టారు. ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష తేదీని ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా దీనిపై ఎలా వ్యవహరించాలన్న అంశంపై సమాలోచనలు చేస్తోంది. 

20:48 - February 1, 2016

ప్రజల సొమ్ముకు నమ్మకమైన జవాబుదారిగా నిలిచే ఆర్థిక సంస్థలుగా పేరొందాయి. నవ భారత నిర్మాణంలో పాలుపంచుకున్న సంస్థలు.. దేశానికి పరుగులు నేర్పిన వ్యవస్థలు..భారతావనికి సాంకేతిక ప్రగతిని అందించిన సంస్థలు..చిమ్మ చీకటి నుండి వెలుగుబాటలోకి నడిపించాయి. గ్రామీణ భారతావనిని కనెక్టు చేసిన సంస్థలు..లక్షల కోట్ల సంస్థలు..భారతీయులంతా ఒక కుటుంబం అనుకుంటే ఇవన్నీ మన ఉమ్మడి ఆస్తులు. కానీ ప్రభుత్వాలు కారు చౌకగా ప్రవేటు శక్తులకు కట్టబెడుతున్నాయి. ప్రపంచీకరణ కుట్రలకు వంత పాడుతున్నాయి. జాతి యావత్తు మేల్కొనాల్సిన అవసరం ఉంది. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:40 - February 1, 2016

అడ్వి జంతువుల నుంచే గావొచ్చు.. పిట్టల నుంచే గావొచ్చు.. ఏశ్న పంటను కాపాడుకోవాల్నంటే రైతులు ఎన్ని ఇక మతులు గడ్తరు.. తెల్లందాకైతే.. కావలి పోతరు. శేను సుట్టు కరంటి షాకులు వెడ్తరు. అట్లనే పొద్దుందాక ఐతే.. వొడిసెల రాళ్లను నింపి ఇస్రి ఇస్రి గొడ్తరు. కీకెలు వెడ్తరు.. వొర్రుతరు. వాళ్ల అవస్త జెప్పరాదు. ఇదంత ఎర్కున్న ముచ్చట్నే గదా.. అగో అవ్విటి బాధవొయ్యెతందుకు వొక రైతు వొక కమాల్ గట్టిండు. ఏందో తెల్వాల్నంటే ఇగో ఇది సూడాలే..

 

20:39 - February 1, 2016

డంగు సున్నంతోని గుడిని అలంకరించినోల్లను సూశి వుంటరు.. కాయిత పువ్వుల్తోని గుడిని సోకు జేశినోల్లను సూశి వుంటరు. చమ్కీలతోని గమ్మతి గమ్మతి డిజైన్లతోని డెకరేషన్ జేశ్న గుళ్లను సూశి వుంటరు. కని.. గుడి మొత్తం పైశల్తోని అలంకరించిన గుడిని సూశిండ్రా సూడ లేదా అయితే మేం సూపెడుతం రాండ్రి.. సూడుండ్రి..

20:39 - February 1, 2016

పోలీసోల్లు శైన్ స్నాచింగులు జర్గకుంట.. రోడ్డ ప్రమాధాలు జర్గకుంట.. కంటి మీద కునుకు లేకుంట తెల్ల వార్లు వృత్తికి అంకితమై.. ఎంత శ్రద్దగ పన్జేస్తున్నరంటే.. దేశంలో ఎవ్వలైన మన తెల్గు పోలీసుల తర్వాతనే.. బైటి దేశాలోల్లు గుడ ఈ ముచ్చట జూశిండ్రనుకో.. పోలీసు అంటే ఇట్లనే ఉండాలె అని పిక్స్ ఐనా ఐతరు. ఎట్లనో మీరు గుడ సూడుండ్రి..

 

20:38 - February 1, 2016

మొన్ననే తెలంగాణలున్న కుక్కల గురించి సూపెడితిమి గదా మన మల్లన్న ముచ్చట్లల్ల అది జూశినట్టున్నై ఆంధ్రలున్న కుక్కలు.. అగో మేం గంత నల్లవడ్డమా అనుకున్నయో ఏమో గని.మొత్తాన్కి మల్లన్న ముచ్చట్లల్లకు వొచ్చినయి. మరి తెలంగాణ కుక్కలైతే.. మందిని కర్శి సర్కారు కుక్కలనే బిరుదును కైవసం జేస్కున్నై.. మరి ఆంధ్ర కుక్కలు ఏం జేశినయి ఏం బిరుదు అందుకోవోతున్నై అనేది వీడియోలో జూడుండ్రి..

20:37 - February 1, 2016

అయ్యా.. గౌరవ ముఖ్య మంత్రి వర్యులైన తెలంగాణ తొట్టతొలి ముఖ్య మంత్రి కల్వకుంట్ల శంద్ర శేఖర్ రావు.. అలియస్ కేసీఆర్ సారు.. నువ్వు వెట్టిన శాధీ ముబారక్ పథకం మంచిగనే వున్నది. అదెవల కందుతున్నదో లేదో అదట్లుండని గని.. ఇగో గీ ముచ్చట జూడుండ్రి..

20:35 - February 1, 2016

జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆఖరి దశ...తెలంగాణలో సమ్మక్క, సారక్కల జాతర..కట్టుబాట్లను మరవని మోడీ..పతంజలి మందుల దుకణంలో పుత్రజీవక్ బీజ్...కరీంనగర్ జిల్లాలో బాలిక వివాహాన్ని ఆపిన పోలీసులు.. ఏపీలో కుక్కల స్వైరవిహారం..మద్యం సేవించి విధులు నిర్వహించిన ఖాకీ..కోటి రూపాయలతో అమ్మవారికి అలంకరణ..వేసిన పంటను కాపాడుకోవడానికి ఓ రైతు చేసిన కమాల్..కుక్క గొప్పతనం..తదితర విశేషాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి..

20:16 - February 1, 2016

ఢిల్లీ : హస్తిన పోలీసులు మరోసారి తమ కండకావురాని చూపించారు. ఆందోళనకారులను ఇష్టమొచ్చినట్లుగా బాదారు. మహిళలపై ఢిల్లీ మగ పోలీసులు తమ ప్రతాపం చూపారు. ఇదంతా హెచ్ సీయూలో రోహిత్ ఆత్మహత్యపై దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఢిల్లీలో విద్యార్థులు ఆందళన చేపట్టారు. ఝండేవాలన్‌లోని ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన విద్యార్థులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీలతో కొట్టారు. అంతేకాదు.. ఓ మహిళను పట్టుకుని పోలీసులు చితకబాదారు. ఆ సమయంలో ఒక్క మహిళా పోలీసు కూడా లేదు. ఓ మహిళపై పోలీసులు చేయిచేసుకోవడంపై మహిళాసంఘాలు మండిపడుతున్నాయి. విద్యార్థులు ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దీనిపై విచారణ జరుపుతామని పోలీసులు చెబుతున్నారు. రోహిత్‌ ఆత్మహత్యకు సంబంధించి కేంద్రమంత్రులు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీ రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పోలీసులు చేసిన కండకావుర దృశ్యాలు నెట్ లో హల్ చల్ సృష్టిస్తున్నాయి. 

20:10 - February 1, 2016

తమిళనాడు : సెల్ఫీ మోజు యువకుడి ప్రాణాలపైకి తెచ్చింది. తమిళనాడులోని చెన్నైలో వేగంగా వెళ్తున్న రైలుతో పాటు సెల్ఫీ తీసుకోబోయి 16ఏళ్ల దినేశ్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఎలక్ట్రిక్‌ ట్రైన్‌ వెనుక వేగంగా వస్తుంటే ముందు సెల్ఫీ తీసుకుందామనుకున్నాడు. కానీ ప్రమాదానికి గురై మృతిచెందాడు. 11వ తరగతి చదువుతున్న దినేశ్‌ చెన్నై శివారులోని జూ పార్క్‌కు స్నేహితులతో కలిసి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇటీవల ముంబైలో కూడా సెల్ఫీ కారణంగా ఓ ప్రేమజంట సముద్రంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. 

20:08 - February 1, 2016

ముంబై : విహారయాత్ర కాస్త విషాద యాత్రగా మారిన ఘటన ముంబై బీచ్‌లో చోటు చేసుకుంది. విహారయాత్రలో భాగంగా పుణెలోని అబేదా ఇనామ్‌దార్‌ కళాశాలకు చెందిన 115 మంది విద్యార్థులు మహారాష్ట్రలోని మరుద్‌ బీచ్‌కు వెళ్లారు. ఇందులో 13 మంది విద్యార్థులు సముద్రంలో మునిగి పోయారు. మృతి చెందినవారిలో పది మంది అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలున్నారు. మరో ఐదుగురిని ఆసుపత్రిలో చేర్చారు. కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది, పోలీసులు, స్థానికులు సముద్రంలో మునిగిపోయిన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

20:07 - February 1, 2016

విజయవాడ : గతంలో ఇచ్చిన జీవో నెంబర్ 30లో ఏమీ లేదని, రిజర్వేషన్లు ఇవ్వాలన్న అంశం మాత్రమే ఉందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆదివారం కాపు గర్జనలో పలు హింసాయుత ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. సోమవారం ఈ ఘటనపై సీఎం బాబు మంత్రులు..డీజీపీలు..అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. కమిషన్ నివేదిక ఆధారంగా జీవోలు జారీ చేశారని, రిజర్వేషన్లు ఇవ్వాలనే ఉద్దేశ్యం మాత్రమే ఉందన్నారు. కమిషన్ నివేదిక ఆధారంగా జీవోలు తయారు చేశారని, జీవో నెంబర్ 30 ఇవ్వాలని కోరుతున్నారని కానీ అందులో ఏమీ లేదన్నారు. కాపులకు మేలు చేసేందుకు తాము ప్రయత్నం ప్రారంభించడం జరిగిందని, ఇలాంటి సమయంలో హింసాత్మక ఘటనలకు పాల్పడితే ఎలా ? అని ప్రశ్నించారు.

తాను వచ్చి 19 నెలలు మాత్రమే అవుతోంది..
లేని సమస్యలను సమస్యగా సృష్టిస్తున్నారని, 25 వాహనాలు దగ్ధం చేశారని తెలిపారు. 2014 వరకు ఎవరూ పట్టించుకోలేదని, వైఎస్ హాయాంలో కమిషన్ వేశారని అప్పుడు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. తాను వచ్చి 19 నెలలు మాత్రమే అవుతోందని, గత 22 ఏళ్లలో ఏమి చేశారని విపక్షాలనుద్ధేశించి ప్రశ్నించారు. కమిషన్ ఏర్పాటు చేయడం..కార్పొరేషన్ ను తగిన నిధులు కేటాయించడం జరిగిందని చెప్పుకొచ్చారు. కమిషన్ కు కూడా తగిన సమయం కేటాయించడం జరిగిందన్నారు. నేరస్తుడిగా ఉండే వ్యక్తి ప్రశాంతంగా ఉండే జిల్లాల్లో విధ్వంసం సృష్టించారని, టిడిపి అసాంఘీక శక్తులను ఎందుకు పంపిస్తుందని ప్రశ్నించారు. ప్రభుత్వం లేని పోని అభాండాలు వేస్తున్నారని పేర్కొన్నారు. కాపు రిజర్వేషన్ ముసుగులో ఇలాంటి దారుణమైన పరిస్థితి తీసుకొచ్చారని తెలిపారు. సాక్షికి మాత్రమే సమచారం ఎందుకు వచ్చిందని, ముందుగానే ప్లాన్ చేసుకుని ఐదారు ఓబీ వ్యాన్ పెట్టుకుని చేశారని ఆరోపించారు.

కఠినంగా ఉంటాం..
చట్ట ప్రకారం చేస్తామని, రాష్ట్రం అభివృద్ధి చెందకుండా ప్రయత్నాలు చేస్తున్నారని, పెట్టుబడులు రాకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఇష్ట ప్రకారం చేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని కఠినమైన చర్యలు తీసుకుంటామని బాబు స్పష్టం చేశారు. కాపు రిజర్వేషన్ల అంశంలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధించిందని, ఇలాంటివి చేసుకోవద్దని సూచించారు. జీఓ నెంబర్ 30పై చర్చ జరగాలని, హైకోర్టు ఏం చెప్పిందనే దానిపై చర్చ జరిగితే బాగుంటుందన్నారు. 9 నెలల తరువాత కమిషన్ నివేదిక అందిన తరువాత ఏం చేయాలో అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. 

శుక్రవారం నుండి ఆమరణ దీక్ష – ముద్రగడ..

తూర్పుగోదావరి : శుక్రవారం ఉదయం నుండి ఆమరణ నిరహార దీక్షకు పూనుకుంటున్నట్లు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. దీక్షలో తన సతీమణి కూడా పాల్గొంటుందన్నారు. తన మరణం తరువాత అయినా కాపులకు రిజర్వేషన్లు వస్తే సంతోషిస్తానన్నారు. 

లేని సమస్యలను సమస్యగా సృష్టిస్తున్నారు. - బాబు..

విజయవాడ : లేని సమస్యలను సమస్యగా సృష్టిస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తుని ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన నుండి ఇప్పుడే కోలుకుంటున్నామన్నారు. తుని ఘటనలో 25 వాహనాలు దగ్ధమయ్యాయని, 15 మంది పోలీసులు, ఐదుగురు రైల్వే సిబ్బంది గాయపడ్డారని తెలిపారు. 

19:25 - February 1, 2016

హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్ పై టిడిపి నేత రామానుజం మండిపడ్డారు. కాపులను చిందరవందర చేయాలనే ఉద్ధేశ్యంతో తుని ఘటన చేశారని, ఇందుకు కారకుడు జగన్ పంపించిన రాయలసీమ గుండాలని ఆరోపించారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీలు ఒక్కొక్కటి జరుగుతున్నాయని, కాపుల కమిషన్ కు వంద కోట్లు ఇవ్వడం జరిగిందని, 40వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. మేలు జరిగే పరిస్థితులు వచ్చినప్పుడు..తాత..తండ్రి..జగన్ అన్యాయం చేస్తూనే వచ్చారన్నారు. చంద్రబాబు నాయుడు న్యాయం చేయడానికి అనేక చర్యలు తీసుకుంటున్నారని రామానుజం పేర్కొన్నారు. 

తుని ఘటనలో సంయమనం పాటించాం - ఎస్పీ..

తూర్పు గోదావరి : జిల్లాలోని తుని ఘటనలో పోలీసులు పూర్తిగా సంయమనం పాటించామని, ఎక్కడా ఫైరింగ్ ఓపెన్ చేయలేదని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. 

18:53 - February 1, 2016

హైదరాబాద్ : కాపుల రిజర్వేషన్ అంశంపై అప్పుడే బీసీలనుంచి వ్యతిరేకత మొదలైంది.. ఇలా కులాలు చేర్చుకుంటూ పోతే బీసీలు అన్యాయమైపోతారన్నారు బీసీ సంఘం నేత ఆర్‌ కృష్ణయ్య.. అప్పుడు బీసీలనుంచి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.. జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని సూచించారు..

18:37 - February 1, 2016

విజయవాడ : కాపు గర్జన అనంతరం జరిగిన హింసను ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తోంది. హింసలో వైసీపీ హస్తం ఉందని ఆరోపించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం డీజీపీ, మంత్రులు..ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సుదీర్ఘ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాపులను బీసీల్లో చేర్చడం అనే అంశంపై ఇతరుల అభిప్రాయాలను బాబు తెలుసుకున్నారు. రాష్ట్రంలో శాంతి భధ్రతలు..కాపులకు రిజర్వేషన్ లపై వచ్చిన..రాబోయే పరిణామాలు..జీవోనెంబర్ 30 అంశాలపై సమావేశం పూర్తిగా చర్చించింది. జీవో వల్ల ఉపయోగం లేదని, కోర్టుకు వెళితే నిలబడదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. స్టే వస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, కమిషన్..ఇతరులను అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోవాలని పలువురు సూచించారు. కాపు కార్పొరేషన్, కాపు కమిషన్ అనే అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది. ఇందుకు కాపు సంఘాలకు చెందిన ప్రతినిధులతో మాట్లాడాలని, కాపులను దూరం చేసుకోవద్దని సమావేశంలో తీర్మానించారు. ఇదిలా ఉంటే తుని ఘటనపై ఎంతమందిపై కేసులు నమోదు చేశారో తదితర వివరాలను డీజీపీ సమావేశానికి వివరించినట్లు తెలుస్తోంది. మరోవైపు కాపు సంఘానికి చెందిన నాయకులు, నేతలు, ప్రతినిధులతో సీఎం బాబు భేటీ కావాలని నిర్ణయించారు. కాపులను బీసీల్లో చేర్చే అంశంలో బీసీల నుండి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు పలు చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. 

18:31 - February 1, 2016

తూర్పు గోదావరి : తాను చేసేది జాతి కోసమే పోరాటమని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో జరిగిన కాపు గర్జన హింసకు దారి తీసింది. రత్నాచల్ ఎక్స్ ప్రెస్, రూరల్ పీఎస్ కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ ఘటన వెనుక వైసీపీ హస్తం ఉందని టిడిపి, సంఘ విద్రోహ శక్తులు ఈ ఘటనకు పూనుకున్నారని ముద్రగడలు పేర్కొన్నారు. టిడిపి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ముద్రగడ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. తాను కేసులకు భయపడేది లేదని, అన్నింటికీ సిద్ధపడే వచ్చానన్నారు. తుని ఘటనలో అధికారపక్షానికి సంబంధించిన శక్తులున్నాయని ఆరోపించారు. పెట్రో బాంబులు వేయించి దహనం చేయించారని, తమ కార్యకర్తలు వెళ్లకుండానే రైలును తగులబెట్టారని ఇదంతా కుట్రలో భాగమన్నారు. ఏ పార్టీకి అనుకూలంగా, వ్యతిరేకంగా తాము చేయడం లేదని, వైసీపీ అధ్యక్షుడు జగన్ సపోర్టు కూడా ఇవ్వలేదని తేల్చిచెప్పారు. ఏపీ పీసీసీ చీఫ్ ఒక్కరే మద్దతు తెలిపారని, పేదోడి కోసం పోరాటమన్నారు. సీఎం ఇచ్చిన హామీలను మాత్రమే అడుగుతున్నామని స్పష్టం చేశారు. ఆత్మహుతి చేసుకోవాలని ప్రోత్సాహించనని, శాంతియుతంగా ఉద్యమాలను చేయాలని పిలుపునిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై ఆత్మహత్య చేసుకోవడం తనను కలిచివేసిందన్నారు. తాను చేసే ఉద్యమంలో సతీమణి భాగస్వామ్యం అయ్యిందని, ఈ ఉద్యమంలో కూడా పాల్గొంటుందని ముద్రగడ స్పష్టం చేశారు. 

18:13 - February 1, 2016

కాకినాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'కాపు' సెగ ప్రకంపనాలు సృష్టిస్తోంది. ఆదివారం కాపు గర్జనలో హింసాయుత ఘటనలు జరిగిన అనంతరం సోమవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది. ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో జరిగిన కాపు గర్జన హింసకు దారి తీసింది. రత్నాచల్ ఎక్స్ ప్రెస్, రూరల్ పీఎస్ కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ ఘటన వెనుక వైసీపీ హస్తం ఉందని టిడిపి, సంఘ విద్రోహ శక్తులు ఈ ఘటనకు పూనుకున్నారని ముద్రగడలు పేర్కొన్నారు. టిడిపి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ముద్రగడ డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే సోమవారం కలెక్టరేట్ ఎదుట వీఆర్ మూర్తి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని జేబులో సూసైడ్ నోట్ లభ్యమైంద.ఇ కాపులను బీసీల్లో చేర్చాలని ఆయన లేఖలో డిమాండ్ చేశారు. 90 శాతం మార్కులు సాధించిన వారికి ఎక్కడా ఉద్యోగులు రావడం లేదని లేఖలో వాపోయాడు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని విమర్శించాడు. ఇతని వివరాలు లభ్యం కాలేదు. మృతుడి జేబులో డైరీ ఫాంకు సంబంధించి ఐడీ కార్డు దొరికింది. ఈ విషయం తెలుసుకున్న ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఎవరూ బలిదానాలు చేసుకోవద్దని, ఆకలితో చేసే పోరాటమని ముద్రగడ పేర్కొన్నారు. 

ఓటర్ గుర్తింపు కార్డు తప్పనిసరి - జీహెచ్ఎంసీ కమిషనర్..

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చే వారు ఓటరు గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకొని రావాలని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి సూచించారు. గుర్తింపు కార్డు లేనిపక్షంలో డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఇతర గుర్తింపు కార్డులు చూపించాలన్నారు. ప్రతి వార్డు జోనల్ అధికారులను నియమించి శిక్షణ ఇచ్చినట్లు, ఈవీఎంలు మొరాయిస్తే వాటి స్థానంలో తక్షణమే కొత్తవి ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. 

17:25 - February 1, 2016

ఖమ్మం : తాగే పాలలో విషరసాయనాలు..! మనం తినే ప్రతి పండులో రసాయనాల ఆనవాళ్లు కన్పిస్తాయి...! చివరకు కూరగాయలు సైతం విషపూరితం అయ్యాయి. కొత్తిమీర కాడినుంచి మొదలుకొని పాలకూర, చిక్కుడు సహా అన్ని కూరగాయాల్లో రసాయన మందులు వాడుతున్నారు. అయితే దీనికి చెక్‌పెట్టేందుకు ఓ గిరిజన మహిళ ముందుకొచ్చింది. సేంద్రియ ఎరువులతో స్వచ్చమైన కూరగాయల్ని పండిస్తూ నలుగురికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పంచుతోంది.  చేతిలో పారపట్టి కూరగాయల్ని పండిస్తున్న ఈమె పేరు రోసు భద్రమ్మ. ఖమ్మం జిల్లా భద్రాచలం మండలం చెరుపల్లి గ్రామానికి చెందిన భద్రమ్మ...రసాయనాల జోలికి వెళ్లకుండా కేవలం సేంద్రియ పద్దతుల ద్వారా స్వచ్చమైన కూరగాయల్ని పండిస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తోంది. ప్రస్తుతం కూరగాయల మార్కెట్లలో లభ్యమయ్యే కూరగాయల్లో విష రసాయనాల్ని వాడుతున్నారని అవి..ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని భద్రమ్మ చెప్తోంది. అందుకే రసాయనాల జోలికి పోకుండా సేంద్రీయ ఎరువులతోనే 14 రకాల కూరగాయల్ని, 10 రకాల పండ్ల మొక్కల్ని సాను సాగుచేస్తూ గిరిజనులకు ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. 

వెలుగులు నింపుతున్న కోవెల సంస్థ..
అయితే ఒక్క భద్రమ్మనే కాదు..గిరిజనులందరూ ఆర్ధిక స్వావలంభన సాధించే దిశగా అడుగులు వేసేందుకు కోవెల అనే స్వచ్చంధ సంస్థ ముందుకొచ్చింది. అన్నపూర్ణ మెడల్‌ పథకం ద్వారా గిరిజనులు కూరగాయాలు, పండ్లను సాగుచేసుకునేందుకు పండ్లు, కూరగాయల విత్తనాల్ని ఉచితంగా అందిస్తూ వారికి అండగా నిలుస్తోంది. సేంద్రియ పద్దతి ద్వారా స్వచ్చమైన కూరగాయల్ని పండిస్తూ..గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది కోవెల సంస్థ. విశాఖపట్నం కేంద్రంగా ఏపీలోని విశాఖ, తూర్పుగోదావరి , కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో గిరిజనాభివృద్ధికి కోవెల సంస్థ చేయూతనందిస్తోంది. అలాగే తెలంగాణలోని ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో వేలాది గిరిజన కుటుంబాలకు తమ సంస్థ ద్వారా గిరిజనులు లబ్ది పొందుతున్నారని నిర్వాహకులు చెప్తున్నారు. గిరిజనులకు ఆహారభద్రత కల్పించడమే లక్ష్యంగా కోవెల సంస్థ చేస్తున్న కృషిని గిరిజనులు అభినందిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఇలాంటి పంటల సాగును మరింత అభివృద్ధి చెందాలంటే ఐటీడీఏ సంస్థ తోడ్పాటు కూడా అవసరం అని గిరిజన సంఘాల నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. 

17:14 - February 1, 2016

నల్గొండ : బోరు వేసిన వెంటనే మూసేయండి..దానిని తెరిచి ఉంచకండి..చిన్నారులు మృత్యువాత పడుతున్నారు..జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఎన్ని సూచనలు చేసినా పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. మెదక్‌ జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెం తండాలో బోరు బావిలో పడి మూడేళ్ల చిన్నారి మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. తాజాగా నల్గొండ జిల్లా శాలిగౌరారం (మం) వల్లాలలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. రెండేళ్ల శాన్వి అనే చిన్నారి నిమ్మతోటలో ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడింది. సుమారు 25 అడుగుల లోతులో బాలిక అరుపులు వినిపిస్తున్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు, 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. జేసీబీ సాయంతో బోరుబావికి సమాంతరంగా గుంతను తవ్వుతున్నారు. వ్యవసాయ బావిలో పూడిక తీసేందుకు శాన్వి తల్లిదండ్రులతో కలిసి వచ్చింది. ఈ నేపథ్యంలో చిన్నారి బోరుబావిలో పడటంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. 

కాపులను బీసీల్లో చేర్చాలని వ్యక్తి ఆత్మహత్య..

కాకినాడ : కలెక్టరేట్ ఆవరణలో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి జేబులో కాపులను బీసీల్లో చేర్చాలని సూసైడ్ నోట్ ఉంది. 

తృణముల్ నేత ఇంట్లో నాటు బాంబులు..

పశ్చిమ బెంగాల్ : తృణముల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇంట్లో నాటు బాంబులు లభ్యమయ్యాయి. బీర్భమ్ జిల్లాలోని పార్టీ కార్యకర్త ఇంట్లో 80 నాటులు బాంబులు దొరికాయి. 

రోహిత్ ఆత్మహత్య బాధించింది - పవన్..

హైదరాబాద్ : హెచ్ సీయూలో దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటన జరగడం చాలా భాదేసిందని సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఘటనకంటే ముందు పరిస్థితులను చూడాలని, ఇది మొదటిసారి జరిగిందని కాదన్నారు. విద్యా వ్యవస్థలో ఇంకా కుల వివక్ష కొనసాగుతోందని, ఈ అంశంపై జరుగుతున్న రాజకీయంలో తాను భాగస్వామిని కాదల్చుకోలేదని పవన్ స్పష్టం చేశారు. 

16:27 - February 1, 2016

హైదరాబాద్ : తుని ఘటనలో సంఘ విద్రోహుల శక్తి ఉందని సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆదివారం ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో జరిగిన కాపు గర్జనలో పలు హింసాయుత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. తునిలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ పూర్తిగా దగ్ధం కాగా, తుని రూరల్ పీఎస్ పై కూడా దాడి చేశారు. కేరళలో ఉన్న పవన్ కళ్యాణ్ ఈ విషయం తెలుసుకుని హుటాహుటిన నగరానికి చేరుకున్నారు. ఘటనపై సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఘటన జరడం చాలా దురదృష్టకరమని, తనను చాలా బాధించిందన్నారు. ఏ ఉద్యమమైనా శాంతియుతంగా జరగాలని, సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకరావచ్చన్నారు.

ఇప్పుడే లేదు..
కాపులు ఇప్పుడే అడగడం లేదని అనేక దశాబ్ధాలుగా ఉందని, ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నారనే భావన వారిలో ఉందన్నారు. పుట్టుస్వామి కమిషన్..ఇలా ఎన్నో కమీషన్ లు వేశారని దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదని వారు భావించారన్నారు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో గొడవలు ఉంటాయని, కానీ ఇలాంటి ఘటన జరగడం అరుదుగా ఉంటాయన్నారు. దీని వెనుక సంఘ విద్రోహ శక్తులున్నాయని, సభకు వచ్చిన కార్యకర్తలు చేసి ఉండరని నమ్ముతానని తెలిపారు. దేశంలో ఎన్నో కుల ఉద్యమాలు జరుగుతున్నాయని, లక్షల మంది ఒక చోట చేరుతున్నప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవని ప్రభుత్వం ఎందుకు భావించిందన్నారు. ముందే తగిన జాగ్రత్తలు తీసుకొంటే ఇలాంటి ఘటనలు జరిగి ఉండేవి కావన్నారు. తమకు ఆడియో పర్మిట్ చేసుకుందామంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.

రెచ్చగొట్టే విధంగా వ్యవహరించకూడదు..
సమస్యను మొగ్గలోనే తుంచేయరని, పెద్దదైన తరువాత వరకు పాలకులు వేచి చూస్తారని విమర్శించారు. సమస్యకు సానుకూలంగా పరిష్కరించాలని, అన్ని పార్టీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశం అనేది అనేక కులాల సమ్మేళనం అని ఇందులో చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అంతేగాకుండా ఉద్యమం నడిపేటప్పుడు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించవద్దని సూచించారు.

ప్రజల కోసం మాట్లాడుతున్నా..
గతంలో సహాయనిరాకరణోద్యమం జరిగినప్పుడు 20 మంది పోలీసులను తగులబెట్టారని, దీనితో గాంధీ వెనక్కి వెళ్లారని స్వాతంత్ర్యం రావడానికి ఎన్నో సంవత్సరాలు పట్టిందన్నారు. ప్రస్తుతం తుని ఘటనపై సరైన పద్ధతుల్లో పోలీసు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మిగతా బీసీ కులాలకు నష్టం వాటిల్లకుండా కాపులకు న్యాయం చేయగలిగితే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వారవుతారని తెలిపారు. ఒకవేళ చేయలేకపోతే పలు కారణాల వల్ల చేయలేకపోతున్నామని చెప్పాలని నేను న్యూట్రల్ గా మాట్లాడడం లేదని, ప్రజల కోసం మాట్లాడుతానన్నారు. 

రోహిత్ మృతి బాధాకరం..
హెచ్ సీయూలో దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటన జరగడం చాలా భాదేసిందని పేర్కొన్నారు. ఘటనకంటే ముందు పరిస్థితులను చూడాలని, ఇది మొదటిసారి జరిగిందని కాదన్నారు. విద్యా వ్యవస్థలో ఇంకా కుల వివక్ష కొనసాగుతోందని, ఈ అంశంపై జరుగుతున్న రాజకీయంలో తాను భాగస్వామిని కాదల్చుకోలేదని పవన్ స్పష్టం చేశారు.

ఏఎస్ఐ మోహన్ రెడ్డికి బెయిల్..

కరీంనగర్ : ఏఎస్ ఐ మోహన్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కెన్ క్రెస్ట్ విద్యా సంస్థల అధినేత ఆత్మహత్య కేసులో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. మనీలాండరింగ్, బెదిరించి ఆస్తులు కాజేసిన కేసులు కూడా ఇతనిపై నమోదు ఉన్నాయి. 

సత్యానందం ముందస్తు బెయిల్ పై సుప్రీం స్టే..

ఢిల్లీ : కాల్ మనీ కేసు నిందితుడు సత్యానందానికి ముందస్తు బెయిల్ పై సుప్రీంకోర్టు స్టే విధించింది. ముందస్తు బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని సత్యానందాన్ని ఆదేశించింది. సత్యానందానికి ముందస్తు బెయిల్ ఇవ్వడంపై ఏపీ పోలీసులు సుప్రీంని ఆశ్రయించారు. 

15:48 - February 1, 2016

క్యాజువల్ వేర్ గా మహిళల వాడ్రోబ్ లో కుర్తీలది ప్రత్యేక స్థానం. సింపుల్ ఉంటూ చక్కటి కంఫర్ట్ నందించే కుర్తీస్ మహిళల ఆల్ టైం ఫేవరైట్ కూడా. అలాంటి కుర్తీస్ లో లేటెస్ట్ వెరైటీస్ తెలియాలంటే వీడియో చూడండి..

15:47 - February 1, 2016

తెలంగాణా రాష్ట్రంలో, ఓ మారుమూల గ్రామంలో ముస్లిం సామాజిక వర్గంలో పుట్టి పెరిగిన ఓ సాధారణ మహిళ, రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన చంచల్ గూడ కారాగారానికి సూపరింటెండెంట్ గా విధులు నిర్వహించే స్థాయికి ఎదిగి, రాష్ట్రపతి పురస్కారానికి ఎంపిక కావడం అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు.. ఈ క్రమంలో ఎన్నో అసాధ్యాలను, సుసాధ్యం చేసుకుని, ప్రతిష్టాత్మక పదవికే వన్నె తెస్తున్న బషీరా బేగం స్పూర్తిదాయక కథనం..
వ్యక్తిగత జీవితాన్ని, ఉద్యోగ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం అంత తేలికైన వ్యవహారమేమీ కాదు. ఈ సమన్వయ ప్రక్రియలో అనేక ఘర్షణలుంటాయి, వేదనలుంటాయి, కన్నీళ్లుంటాయి, త్యాగాలుంటాయి. అవేవీ లేకుండా, సాఫీగా సాగిపోతుందని ఎవరు చెప్పినా అది అబద్ధమే అవుతుంది. అలాంటి సమస్యలన్నింటినీ అధిగమించి, కష్టాలను పంటిబిగువనే భరించి తనని తాను విజేతగా మలుచుకున్నారు బషీరా బేగం. బిడ్డగా అమ్మ కలను నిజం చేసింది. భార్యగా భర్తకు గౌరవాన్ని తెచ్చింది. తల్లిగా పిల్లలను తన పొత్తిళ్లలోనే దాచుకుంది. సూపరింటెండెంట్ గా ఖైదీల మనసు దోచుకుని అమ్మగా అందరి చేత పిలిపించుకుంటోంది. ఇవన్నీ సున్నిత భావాలతో ముడిపడిన బంధాలు. కఠినంగా వ్యవహరించాల్సిన పోలీస్ వృత్తిలోనూ అంతే సున్నితంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్న బషీరా బేగంకు రాష్ట్రపతి పురస్కారానికి ఎంపికైన సందర్భంగా మానవి అభినందనలు తెలియచేస్తోంది. 

15:40 - February 1, 2016

తూర్పుగోదావరి : తుని ఘటనలో జరిగిన విధ్వాంసానికి తాము కారణం కాదని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. ఆదివారం నిర్వహించిన కాపు గర్జనలో పలు హింసాయుత ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇందులో వైసీపీ హస్తం ఉందని టిడిపి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై సోమవారం మధ్యాహ్నం ముద్రగడ మీడియాతో మాట్లాడారు. వారం రోజుల నుండి ప్రభుత్వం టీవీల ద్వారా, పత్రికల ద్వారా దాడులు చేయించడం వల్ల తమకు చాలా బాధ కలిగించడం జరిగిందన్నారు. మీటింగ్ తరువాత వారం రోజులు గడువు ఇచ్చి రోడ్డు మీద..రైలు పట్టాలపై కార్యక్రమం చేద్దామని అనుకున్నామని తెలిపారు. ఈ సమయంలో మరింత దాడులు పెరిగే అవకాశం ఉందని భావించి అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ఈ నిర్ణయం ఎవరీకి చెప్పలేదన్నారు. ఆర్టీసీ బస్సులు అద్దె కావాలంటే ఇవ్వకపోవడం..స్కూల్ బస్సులు అడిగితే బెదిరించడం..వంట చేసుకుందామంటే స్థలం ఇవ్వకుండా సంబంధిత యజమానులకు హెచ్చరికలు జారీ చేయడం వంటివి చేస్తాయన్నారు. రైలు పట్టాలపై కొందరు వ్యక్తులు అప్పటికే చేరుకుని రైలును తగులబెట్టారని వ్యాఖ్యానించారు. ఇలాంటి దుష్టసంప్రదాయం తమకు లేదన్నారు. ప్రైవేటు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే ఉద్యమాలను చేయడం లేదని, మచ్చ తేవాలని ఇలాంటివి చేశారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. టిడిపికి వ్యతిరేకంగా ఉన్న వారిని కేసుల్లో ఇరికించాలని ప్రభుత్వం పయనిస్తోందన్నారు. ఉద్యమాల్లో పొరపాట్లు జరిగితే దానికి సంబంధించి బాధ్యత వహిస్తానని పేర్కొన్నారు. రైతు రుణమాఫి, డ్వాక్రా సంఘాలు..జాబు రావాలంటే బాబు రావాలి..అనేక హామీలిచ్చి పంగనామాలు పెడుతున్నారని తీవ్రంగా విమర్శించారు.  ఇచ్చిన హామీలు అమల చేయాలని, తప్పుడు ఆరోపణలు చేస్తూ పబ్బంగడుపుకోవాలని చూడవద్దన్నారు. 

15:36 - February 1, 2016

హైదరాబాద్ : తుని ఘటనపై ఏపీ కాంగ్రెస్ నేత చిరంజీవి స్పందించారు. కాపు గర్జనలో ఆదివారం పలు హింసాయుత ఘటనలు జరిగిన సంగతి తెలిసందే. దీనిపై సోమవారం సీఎం చంద్రబాబు నాయుడికి చిరంజీవి లేఖ రాశారు. తుని ఘటన తనను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందన్నారు. దీనికి అంతటికీ కారణం ప్రభుత్వ పారదర్శకత లోపించడమేనని తెలిపారు. ఎన్నికల్లో కాపులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. పారదర్శక లోపం వల్లే వర్గ వైషమ్యాలు పెరుగుతున్నాయని, కమిటీ వేసి తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. 20నెలల కాలంలో బాబు వైఖరి ఎన్నో ఘటనలకు కారణమౌతున్నాయని, ఇప్పటికే ప్రభుత్వ కళ్లు తెరవకపోతే అమరావతి రైతులు కూడా ఉద్యమం చేస్తారని లేఖలో చిరంజీవి హెచ్చరించారు.

సీఎం చంద్రబాబుకు చిరంజీవి లేఖ..

హైదరాబాద్ : సీఎం చంద్రబాబు నాయుడికి ఏపీ కాంగ్రెస్ నేత చిరంజీవి లేఖ రాశారు. తుని ఘటన దిగ్ర్భాంతి కలిగించిందన్నారు. విభజించి పాలించు విధానంతో వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వానికి పారదర్శకత లేదని విమర్శించారు. 

14:55 - February 1, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య కేసులో ఏబీవీబీ విద్యార్థులకు హైకోర్టులో ఊరట లభించింది. ఏబీవీపీ కి చెందిన ముగ్గురు విద్యార్థులు సుశీల్ , దివాకర్, కృష్ణచైతన్యల అరెస్టుపై స్టే ఇచ్చిన హైకోర్టు.. ఘటనకు గల కారణాలను దర్యాప్తు చేపట్టాలని కోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది కోర్టు. 

14:35 - February 1, 2016

నల్గొండ : నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశంను హత్య చేసేందుకు మాజీ మావోయిస్టు బొప్పాని రామకృష్ణ 10 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా పోలీసులకు ఓ లేఖ అందింది. మీడియా ద్వారా అందిన ఈ లేఖపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ విక్రమ్‌జిత్‌ దుగ్గల్‌ చెప్పారు. ఎమ్మెల్యే వేముల వీరేశంను జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదని, మీడియా ద్వారా ఈ లేఖ అందిందని ఎస్పీ పేర్కొన్నారు. వీరేశం గతంలో జనశక్తిలో పని చేసిన అనంతరం జనజీవన స్రవంతిలో కలిశారు. తరువాత టీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్యే అయ్యారు. 

14:33 - February 1, 2016

చిత్తూరు : ఆదివారం నాటి తుని ఘటన నేపథ్యంలో మరో ఐక్యవేదిక ఆవిర్భవించింది. తిరుపతి వేదికగా బీసీ-కాపు ఐక్య వేదిక ఆవిర్భవించిన సందర్బంగా అలిపిరి వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు టిడిపి నేతలు. తుని ఘటన దురదృష్టకరమని.. కాపునాడు సంఘం ముసుగులో అరాచక శక్తులు ప్రవేశించి అవాంచనీయ ఘటనలకు పాల్పడ్డాయని తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ అంటున్నారు. నిన్నటి జరిగిన సంఘటన బాధాకరమని, అనుకోకుండా క్షణాల్లో జరిగిపోవడం ఎవరూ ఊహించలేదన్నారు. ఇందుకు కాపులు కారణం కాదని, దీని వెనుక దుష్ట శక్తులున్నాయన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సమపాలన అందించారని, మంజు నాథ కమిషన్ వేసి 9 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారని తెలిపారు.
వైసీపీ నేతలు ఇలాంటివి చేశారని బలిజ కాపు నేత పేర్కొన్నారు. కాపులు చాలా సౌమ్యులు అని, గూండాయిజం, అరాచక శక్తులకు దూరంగా ఉంటారన్నారు. కాపు, బీసీల్లో ఆందోళన నెలకొందని, దీనిపై సీఎం బాబు స్పష్టంగా చెప్పారన్నారు. కాపుల్లో కొంతమంది రాజకీయ విద్రోహ శక్తులు వారిని రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. 

14:30 - February 1, 2016

హైదరాబాద్ : తుని హింసాత్మక ఘటనలో పోలీసులు ఎంతో సంయమనం పాటించారని లా అండ్ ఆర్డర్ అడిషినల్ డీజీ ఠాకూర్ అన్నారు. ఆందోళనకారులు భయానక వాతావరణం సృష్టించారని, రైల్లో ఉన్న ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురి చేశారని చెప్పారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు. ఘటనకు కారకులైన వారిపై కేసులు నమోదు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉద్యమానికి నాయకత్వ వహించిన ముద్రగడను అరెస్టు చేస్తారా అన్న విలేకరుల ప్రశ్నకు సమాధానమిచ్చిన డీజీ...దర్యాప్తు పూర్తయిన తర్వాతనే ఎవరిని అరెస్టు చెయ్యాలో వారిని చేస్తామని స్పష్టం చేశారు. ఇలాంటి విధ్వంసకర ఘటనలకు పాల్పడటం సరికాదని, అలాంటి ట్రాప్‌లో ఎవరూ పడొద్దని సూచించారు ఠాకూర్.

నలుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు..

చిత్తూరు : సోమల (మం) నెల్లిమందలో నలుగురు ఎర్రచందనం స్మగర్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరివద్దనుండి రూ.2 కోట్ల విలువైన వంద ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. 

 

జనగామలో కుంగిన భూమి..

కరీంనగర్ : రామగుండం (మం) జనగామలో భూమి కుంగింది. సింగరేణి, జీడీకే 1,3 భూగర్భ గనుల్లో బొగ్గు వెలికి తీసి ఇసుక నింపకపోవడమే కారణమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి యాజమాన్యం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

వంగవీటి హంతకులు కోడెల..దేవినేనిలే - జగన్..

హైదరాబాద్ : వంగవీటి రంగా హత్య చేసిన వారిలో ప్రధాన నిందితులైన కోడెల శివప్రసాద్ ప్రస్తుతం స్పీకర్ హోదాలో ఉన్నారని, మరో ప్రధాన నిందితుడైన దేవినేని మంత్రిగా ఉన్నారని పేర్కొన్నారు. వంగవీటి రంగా హత్య..అందుకు కారకులైన వారికి సంబంధించి హరి రామజోగయ్య సమగ్రంగా పుస్తకం రాశారని జగన్ పేర్కొన్నారు.

 

13:51 - February 1, 2016

హైదరాబాద్ : కాపు గర్జనలో ఆదివారం చోటు చేసుకున్న పరిణామాలు..టిడిపి, వైసిపి మధ్య చిచ్చు రేపుతున్నాయి. ఈ హింసాత్మక ఘటనలో వైసీపీ హస్తం ఉందని స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు..టిడిపి నేతలు పేర్కొనడంపై వైసీపీ అధ్యక్షుడు జగన్ తీవ్రంగా స్పందించారు. ఎన్నికల హామీలు అమలు నెరవేర్చకపోవడంపై బాబును క్రిమినల్ 1 అని ఎందుకు అనడకూడదని ప్రశ్నించారు. ఒక ఘటనపై సీఎం బాబు ఇంత చీఫ్ గా మాట్లాడుతారని అనుకోలేదని, ఆంధ్ర చరిత్రలో జరగలేదేమో అని తెలిపారు. కాపులు సమన్వయం పాటించాలని, ఎక్కడా కూడా శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని సూచించారు. 

బాబు చిచ్చు పెట్టే ప్రయత్నం..
రకరకాల ఆరోపణలు చేశారని, ప్రాంతాలు..కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని తెలిపారు. తల..తోక లేని మాట్లాడారని, పట్టిసీమ..అమరావతి..కాల్ మనీ వివిధ అంశాలపై బాబు మాట్లాడారని పేర్కొన్నారు. అవినీతి..డబ్బులు..నేరస్తులు..5-10 శాతం వరకు కాపులు హాజరయ్యారని బాబు పేర్కొనడం జరిగిందన్నారు. పులివెందులలో జరిగినా ఫర్వాలేదని అనుకుంటాం కానీ ఈస్ట్ గోదావరి జరగడం ఆశ్చర్యం కలిగించిందని బాబు పేర్కొనడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. బీసీలు ఒప్పుకోవడం లేదని..జీతాలు ఇవ్వడానికే కష్టంగా ఉందని..అప్పులు తెచ్చుకొనే పరిస్థితి లేదని ఇలా బాబు ఏవోవో ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగిందన్నారు. ఈ ప్రెస్ మీట్ లో కాపులకు ఏం చేస్తాను..ఎప్పుడు చేస్తాను..అనే మాట ఎక్కడ రాలేదని విమర్శించారు. తన తప్పిదం బయటకు రాకుండా ఉండేందుకు అవతలి వాళ్లపై అభాండాలు వేస్తున్నారని తెలిపారు.

క్రిమినెల్ నెంబర్ 1...
కాపులకు రిజర్వేషన్ విషయమై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి కమిషన్ వేసి బీసీలకు నస్టం కలుగకుండా చూస్తామని, ఐదు సంవత్సరాల్లో ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని ఎన్నికలకు ముందు టిడిపి మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగిందన్నారు. 22 నెలలు మాసాలైంది. ఎప్పుడు చేస్తారు ? ఎందుకు చేయడం లేదంటూ కాపు ఉద్యమం ప్రారంభమైందన్నారు. ఎన్నికల ముంబదుకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల ప్రతి కులం..మతంలో నిరుత్సాహం నెలకొందన్నారు. డ్వాక్రా సంఘాలకు రుణాలు మాఫీ చేస్తామని..నిరుద్యోగ భృతి..ఇవన్నీ అమలు చేయకపోవడం వల్ల క్రిమినల్ నెంబర్ 1 అని ఎందుకు అనకూడదన్నారు. ప్రతి కులానికి..వర్గానికి..ప్రాంతానికి మోసం చేశారని జగన్ తీవ్రంగా విమర్శించారు.

ప్రతి దానిపై వైసీపీపై అభాండాలు...
అమరావతిలో భూములు సేకరించడానికి ప్రశ్నిస్తే రాజధానికి వ్యతిరేకం అని వైసీపీపై ముద్ర వేస్తారని ఎద్దేవా చేశారు. నారాయణ, మురళీ మోహన్ తదితర టిడిపి నేతలకు చెందిన భూములను మాత్రం తీసుకోరని, ఇతరుల భూములను మాత్రం గుంజుకుంటున్నాడని తీవ్రంగా విమర్శించారు.పోలవరం ముద్దు..పట్టిసీమ వద్దు అని చెబుతుంటే రాయలసీమకు వ్యతిరేకమని అభాండాలు వేస్తారని తెలిపారు. కాల్ మనీ ఘటనలో టిడిపి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వారికి సంబంధం ఉందని ఆధారాలతో సహా బయటకు వచ్చాయని దీనిని వైసీపీ ప్రశ్నిస్తే విజయవాడకు వీరు వ్యతిరేకం అని పేర్కొంటున్నారని తెలిపారు.

ప్రతొక్కరూ కదిలారు
తుని కాపు గర్జనకు అనేక ఇబ్బందులు సృష్టించారని, జనవరి 31వ తేదీన నాలుగైదు నెలల క్రిందటే చెప్పడం జరిగిందన్నారు. మీటింగ్ కు బస్సులు అడిగితే అరకొరగా బస్సులు కల్పించారని, 8 కిలో మీటర్ల దూరంలోనే ఆపివేసి పోనీయకుండా చేశారని తెలిపారు. ఈ ఉద్యమం వల్ల ఉద్యమకారులకు..విపక్షాలకు మంచి పేరు రావద్దని..అలజడి బాబు క్రియేట్ చేశారని ఆరోపించారు. ముద్రగడ పద్మనాభం పిలుపు మేరకు కాపు నేతలు అందరూ రైల రోకో నిర్వహించడం జరిగిందని, ఆ సమయంలో అక్కడ మీడియా ఉందన్నారు. కేవలం ఆరు ఛానెల్ మాత్రమే ఎలా తెలుసని బాబు ప్రశ్నించడం విడ్డూరమన్నారు. 

గ్రేటర్ ఎన్నికలు.. ప్రభుత్వ ఆఫీసులు, పాఠశాలలకు సెలవు

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని ప్రభుత్వ స్కూళ్లు, కార్యాలయాలకు సెలువు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం ఆలస్యంగా ఆఫీస్‌కు వెళ్లేందుకు లేదా సాయంత్రం త్వరగా విధులు ముగించుకునే వీలును కల్పిస్తూ జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఉప్పల్ ఎమ్మెల్యే పై కేసు నమోదు...

హైదరాబాద్ : ఉప్పల్‌ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌పై కేసు నమోదు చేసినట్లు మల్కాజ్‌గిరి ఏసీపీ రవిచందన్‌రెడ్డి తెలిపారు. తమను ఎమ్మెల్యే కొట్టి బంధించారని ఇద్దరు తెరాస నేతలు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. వారి ఫిర్యాదు ఆధారంగా అపహరణ, దోపీడీ నేరాల కింద ఎమ్మెల్యేపై కేసులు పెట్టినట్లు తెలిపారు.

తుని ఘటనకు చంద్రబాబు సిగ్గుపడాలి : జగన్

హైదరాబాద్ : తునిలో జరిగిన కాపు గర్జన సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనకు సీఎం చంద్రబాబు సిగ్గుపడ్డాలని వైసీపీ అధినేత జగన్ మండి పడ్డారు. ఆయన హైదరాబాద్ లో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ పై చంద్రబాబు మాట్లాడిన తీరు బాధాకరం అని… చంద్రబాబు చౌకబారుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. తను చేసిన తప్పులను చంద్రబాబు ఇతరులపై నెట్టివేశారన్నారు. రాజకీయాల కోసం చంద్రబాబు తప్పులు చేస్తూ… అభివృద్ధిని అడ్డుకుంటున్నామని అంటున్నారని విమర్శించారు. కాపులకు ఏం చేస్తారు? ఎపుడు చేస్తారో చెప్పలేదన్నారు. కాపులకు ఐదేళ్లలో 5 వేల కోట్లు ఇస్తామని చెప్పిన హామీని అమలు చేయాలనే కాలుపు సభలు నిర్వహించారు.

తుని ఘటనకు ముద్రగడే బాధ్య వహించాలి : ఏపీ మంత్రులు

విజయవాడ : తుని ఘటనకు మాజీ మంత్రి ముద్రగడపద్మనాభం బాధ్యత వహించాలని ఏపీ మంత్రులు చినరాజప్ప, నారాయణ డిమాండ్ చేశారు. వారు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ...ఇచ్చిన మాట ప్రకారం కాపులను బీసీల్లో చేర్చుతామన్నారు. తుని ఘటనకు టిడిపిదే బాధ్యత టిడిపిదే అని ముద్రగడ అనడం దారుణమని… ముద్రగడ మాటలను ఖండిస్తున్నట్లు తెలిపారు. తుని ఘటనకు టిడిపికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ముద్రగడ బాధ్యత లేకుండా మాట్లాడొద్దని హెచ్చరించారు. ఈజవో ఇచ్చినా అది నిలబడదన్నారు. కమిషన్ వేస్తామని, ఇచ్చిన మాట ప్రకారం కమిషన్ వేశామన్నారు. కాపులను బీసీల్లో చేర్చడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

బాబు సిగ్గుపడాలి - జగన్..

హైదరాబాద్ : కాపు గర్జనలో నెలకొన్న హింసాయుత్మక ఘటనలపై సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడిన తీరు ఆశ్చర్యకరంగా అనిపిస్తోందని..ఇందుకు బాబు సిగ్గుపడాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు. 

13:16 - February 1, 2016

విజయవాడ : తుని ఘటనకు టిడిపికి సంబంధం లేదని హోం మంత్రి చినరాజప్ప స్పష్టం చేశారు. ఆయన విజయవాడలో మంత్రులు మీడియాతో మాట్లాడారు. చినరాజప్పతో పాటు మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. హింసకు పాల్పడింది టిడిపి వారే అని ముద్రగడ అనడం దురదృష్టకరమన్నాని చినరాజప్ప అన్నారు. కాపులు మమ్మల్ని నమ్మండి.. మాదీ బాధ్యత అని హోం మంత్రి చినరాజప్ప విజ్ఞప్తి చేశారు. కాపులను బీసీల్లో చేర్చడానికి సీఎం సిద్ధంగా ఉన్నారన్నారు. ముద్రగడ ఆరోపణలు ఖండిస్తున్నాం ముద్రగడ బాధ్యలేకుండా మాట్లాడొద్దని హెచ్చరించారు… అంతేకాకుండా ముద్రగడ మాటలను ఎవరూ నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తుని ఘటనకు ముద్రగడే బాధ్యత వహించాలని మంత్రి నారాయణ డిమాండ్ చేశారు. తుని లో జరిగిన కాపు గర్జన సభకు వచ్చిన వారిని అప్పటికపుడు రెచ్చగొట్టారని విమర్శించారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు తెలిపినట్లు నారాయణ తెలిపారు. మా ప్రభుత్వం మీద నెపం మోపేందుకు పెద్ద కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తునిలో జరిగిన హింసా కాండపై విచారం వ్యక్తం చేయకుండా ఇతరులపై నెట్టడం దారుణమన్నారు. 

తునికి వెళ్లనున్న బాబు..?

విజయవాడ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు తునికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో నిర్వహించిన కాపు గర్జన తీవ్ర హింసాయుతంగా మారిన సంగతి తెలిసిందే. ఆందోళనకారులు రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కు నిప్పు పెట్టడంతో రైలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

13:03 - February 1, 2016

తూ.గో :కాపులకు రిజర్వేషన్లు కల్పించే వరకు పోరాటం ఆగదని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. ఆయన సోమవారం వారి ఇంటిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....'కాపు ఉద్యమాన్ని అణచివేయాలని గర్జన తేదీ ప్రకటించిన రోజే ఎదురుదాడికి దిగారని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విమర్శించారు. ఉద్యమాన్ని ఎవరూ వెనకుండి నడిపించడం లేదు. అమ్ముడు పోయే మనిషి అని టిడిపి నేతలు వ్యాఖ్యానించడం చాలా బాధాకరం. మాది అమ్ముడు పోయే జాతి కాదు. మా జాతికి సాయం చేయాలనే నేను రేడ్డెక్కానన్నారు. మా ఆశలపై నీళ్లు చల్లారు కాబట్టే ఉద్యమం చేపట్టాల్సి వచ్చింది. ఉద్యమాన్ని ఎవరో వెనుక ఉండి నడిపిస్తున్నారనడం బాధాకరం. మా ఉద్యమం ఎవరికీ వ్యతిరేకం కాదు, మాది ఆకలి బాధ పోరాటం. మేము ఎవరికీ అమ్ముపోలేదు. కమిషన్లు, రిపోర్టు పేరిట సీఎం కాలయాపన చేస్తున్నారు. మా పిల్లల చదువుకునే స్థోమత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. సీఎం చంద్రబాబు ఆశ పెట్టారు కాబట్టే అడుగుతున్నా... మా జాతికి సాయం చేయాలనే రోడ్డు ఎక్కా. సంఘ విద్రోహులకు నాయకత్వం వహించింది టిడిపి నేతలే. నాలుగు రోజుల్లో నేను, నా భార్య ఆమరణదీక్ష చేపడతాం. జైల్లో పెట్టిన ఆమరణ దీక్ష ఆగదు. నేను రాసిన ఏ లేఖకు సీఎం స్పందించలేదన్నారు. రిజర్వేషన్ పొందే వరకూ నా జీవితాన్ని జాతికి అంకితం చేస్తా. సమస్య పరిష్కారమయ్యే వరకు నిద్ర పోను. నేను దీక్షకు దిగితే అభిమానులు కిర్లంపూడికి రావొద్దని… అభిమానులు ఎక్కడికక్కడ సంఘీభావం తెలపాలి. ఈ లోపే అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమయ్యిందని ఆరోపించారు. కాపు జాతిని అవమానించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. ఎదుటి వారి మీద నేరం నెట్టడం సీఎంకు వెన్నతో పెట్టిన విద్య. జైల్లో పెట్టినా భయపడనని… బెయిల్ కు కూడా అప్లై చేయను. ఉద్యమంలో బ్యాడ్ ఎలిమెంట్స్ ను ప్రోత్సహిచింది టిడిపి వారే. ఎన్నికల సందర్భంగా సీఎం ఇచ్చిన హామీ మేరకే ఈ ఉద్యమం చేపట్టామన్నారు. కమిషన్లు, రిపోర్టుల పేరుతో సీఎం తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. నేను రాసిన ఏ లేఖకు సీఎం స్పందించలేదన్నారు. మా జాతికి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని స్పష్టం చేశారు. నాకు సంఘీభావం తెలిపేందుకు ఎవరూ కిర్లంపూడికి రావద్దని విజ్ఞప్తి చేశారు. ఒక పూట భోజనం మానేసి ఆ పళ్లెం పై గంట కొట్టాలని సూచించారు.సంఘీభావానికి వస్తే అక్రమ కేసులు బనాయిస్తారని తెలిపారు. ఉద్యమం పక్కదారి పడుతోందని నిన్న ఉద్యమం విరమించామన్నారు. బెదిరింపులకు, భయకరం వాతావరణానికి భయపడి పారిపోయే పరిస్థితి లేదని హెచ్చరించారు. నిన్న జరిగిన ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలిపారు. మా సభకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని మండి పడ్డారు. ఉద్యమానికి నాదీ బాధ్యత అన్నారు. ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవని సీఎం చెప్పడం హాస్యాస్పదమన్నారు. డబ్బుల్లేకుండానే ఇతర దేశాలు ఎలా చుట్టి వస్తున్నారని మండి పడ్డారు.

'రోహిత్' కేసులో ఏబీవీపీ విద్యార్థులకుహైకోర్టులో ఊరట

హైదరాబాద్ : హెచ్ సియూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య కేసులో ఏబీవీపీ విద్యార్థులకు హైకోర్టులో ఊరట లభించింది. ముగ్గురు ఏబీవీపీ విద్యార్థులు సుశీల్, దివాకర్, కృష్ణ చైతన్య అరెస్టు పై హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ ఘటన పై దర్యాప్తు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి కోర్టు ఆదేశించింది. విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది.

టిఆర్ ఎస్ కు ఏజెంట్ లా ఈసీ : తమ్మినేని వీరభద్రం

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ ఎస్ పార్టీకి ఎన్నికల కమిషన్ ఏజెంట్ లా మారిందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ఆయన సోమవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ… నగరంలో ఫ్లైఓవర్ పిల్లర్స్ పై టిఆర్ ఎస్ ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ ను తొలగించాలని ఈసీకి సీపీఎం ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విమర్శించారు. అధికార పార్టీ ఎన్ని ఆటంకాలు కల్పించినా వన్ హైదరాబాద్ కూటమి గెలుపుకు మావంతు కృష్టి చేశామన్నారు. ప్రజల బాగా స్పందించారని తెలిపారు.

లోహితా ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం

విశాఖ : పరవాడ ఎస్ ఈజెడ్ లోని లోహితా ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు ప్రాథమిక సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

తుని ఘటన ఆందోళన కలిగించింది : మండలి బుద్ధ ప్రసాద్...

విజయవాడ : తుని ఘటన ఆందోళన కలిగించిందని మండలి బుద్ధ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగించారని, దీనికి కొన్ని పార్టీలు మద్దతు ఇవ్వడం ఆశ్చర్యకరమన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టి ఘర్షణలు రేపడం సరికాదన్నారు.

11:37 - February 1, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ ఎస్ పార్టీకి ఎన్నికల కమిషన్ ఏజెంట్ లా మారిందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ఆయన సోమవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ… టిఆర్ ఎస్ పై ఈసీకి సీపీఎం ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విమర్శించారు. అధికార పార్టీ ఎన్ని ఆటంకాలు కల్పించినా వన్ హైదరాబాద్ కూటమి గెలుపుకు మావంతు కృష్టి చేశామన్నారు. ప్రజల బాగా స్పందించారని తెలిపారు.

మైలవరం మండలంలో రైతుల ఆందోళన

విజయవాడ : మైలవరం మండలం సంగ్రగూడెం వద్ద రోడ్డుపై పురుగుల మందుల డబ్బాలతో రైతులు ఆందోళన చేపట్టారు. హైవే వల్ల నష్టపోతున్న వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులు చేస్తున్నారు. రైతుల ఆందోళనకు సీపీఎం, వైసీపీ మద్దతు ప్రకటించారు.

రాజాంలో డిగ్రీ విద్యార్థి తేజ ఆత్మహత్య

శ్రీకాకుళం : రాజాంలో డిగ్రీ విద్యార్థి తేజ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నారాయణరావు డిగ్రీ కాలేజీలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు విజయనగరం జిల్లా తెర్లాం వాసిగా గుర్తించారు.

ముద్రగడ అరెస్టు పై చర్చిస్తున్నాం : ఐజీ విశ్వజిత్...

తూ.గో: కాపుల గర్జన సందర్భంగా హింస జరిగిన ప్రాంతాలను కోస్తా జిల్లాల రేంజ్ ఐజీ విశ్వజిత్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హింసాత్మక ఘటనలు జరుగుతాయని ఊహించలేదని తెలిపారు. హింసకు పాల్పడిన వారిని వీడియో ఫుటేజీల ద్వారా వివరాలు సేకరించి అందరిపై కేసులు పెట్టి అరెస్టు చేస్తామన్నారు. ముద్రగడ పద్మనాభంను అరెస్టు చేసే విషయంలో ఉన్నతాధికారులతో చర్చిస్తున్నామని స్పష్టం చేశారు.

కోనసీమలో భారీగా పోలీసుల మోహరింపు

తూ.గో : కోనసీమలో భారీగా పోలీసుల మోహరించారు. తూగో జిల్లా వ్యాప్తంగా 30 సెక్షన్ (పోలీసు యాక్టు) అమలు చేశారు. జిల్లాలో కేంద్ర బలగాలు మోహరించాయి. అంతే కాకుండా ఢిల్లీ నుంచి వచ్చిన 100 మంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు, ఒడిశా నుంచి వచ్చిన 120 ఇండో టిబెటన్ పోలీసులు చేరుకున్నారు. అదనంగా 10 కంపెనీల ఏపీఎస్సీ బెటాయిన్ల పోలీసులు మోహరించారు. గోదావరి జిల్లాతో పాటు విశాఖ లో నూ పోలీసులు మోహరించారు.

తుని ఘటన ప్రభుత్వ వైఫల్యమే :ఎమ్మెల్సీ రామచంద్రయ్య

విశాఖ : తుని ఘటన ప్రభుత్వ వైఫల్యమే అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ఆరోపించారు. కాపులకు ఇచ్చిన హామీలపై చంద్రబాబు కాలయాపన చేయడం వల్లే తుని ఘటన జరిగిందన్నారు. కాపు రిజర్వేషన్ల పై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.

10:50 - February 1, 2016

కృష్ణా: జిల్లాలో టీడీపీలో విభేదాలు ముదురు పాకాన పడుతున్నాయి. సొంత పార్టీ నేతల మధ్య ప్రచ్చన్నయుద్ధం నడుస్తోంది. తాజాగా కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్‌ నిర్మాణ వ్యవహారం.. వీరి మధ్య మరింత అగ్గిని రాజేస్తోంది. ఇప్పటికే ఎంపీ నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుండగా.. మంత్రి దేవినేని వ్యాఖ్యలు ఈ ఆగ్నికి ఆజ్యం పోస్తున్నాయి.

పార్టీ నేతల మధ్యే మాటల తూటాలు....

కృష్ణ జిల్లా పాలక పక్షంలోని రాజ‌కీయాలు హాట్‌హాట్‌గా మారుతున్నాయి. కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్‌ నిర్మాణ విషయంలో.. తెలుగుదేశం పార్టీ నేతల మధ్యే మాటల తూటాలు పేలుతున్నాయి. కేంద్రం నుంచి అనుమతులు తీసుకొచ్చింది తామంటే.. తామంటూ ఎవరికి వారు ప్రకటనలు గుప్పించుకుంటున్నారు. ఫ్లైఓవర్‌ బ్రిడ్జి క్రెడిట్‌ తమ ఖాతాలో వేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు.. పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారాయి.

రూ. 280 కోట్లు మంజూరు....

సార్వత్రిక ఎన్నికల ముందు బుద్దా వెంకన్న కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్‌ నిర్మించాలంటూ ధర్నాలు, దీక్షలు చేశారు. ఆ తర్వాత ఎంపీ కేశినేని ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి 3 ప్లాన్లు తయారు చేయించి కేంద్రానికి పంపారు. కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి పలుమార్లు విజ్ఞప్తులు చేశారు. ఒక ప్లాన్‌ను ఆమెదించిన కేంద్రం 280 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. ఇదే విషయాన్ని బ్రిడ్జి శంకుస్థాపన సమయంలో కేంద్ర మంత్రి గడ్కరీ ప్రస్తావించారు.

రోడ్డు భద్రతా వారోత్సవాల్లో దేవినేని విసుర్లు....

కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్‌.. మంత్రి శిద్ధా రాఘవరావు, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ముఖ్య కార్యదర్శి శ్యాంబాబుల కృషి వల్లే మంజూరైందంటూ.. మంత్రి దేవినేని ఇటీవల ప్రకటించారు. దేవినేని వ్యాఖ్యలు కృష్ణా జిల్లా టీడీపీలో కలకలం రేపుతున్నాయి. కనకదుర్గ ఫ్లైఓవర్‌ ఘనత ఎంపీ నానికి దక్కకూడదన్న అక్కసుతోనే మంత్రి దేవినేని ఇలా చేశారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

దుర్గమ్మ ఫ్లై ఓవర్‌ చిచ్చు..

కృష్ణా పుష్కరాల నాటికి కనకదుర్గ ఫ్లైఓవర్‌ పూర్తి చేయాలన్నది టీడీపీ సర్కార్‌ ప్రతిపాదన. నత్తనడకన సాగుతున్న పనులను వేగవంతం చేయించాల్సింది పోయి.. కీలక పదవుల్లో ఉన్న నేతలే కీచులాడుకోవడం తమ్ముళ్లను ఆందోళనకు గురిచేస్తోంది. పాలకపక్షంలోని తగవులు.. నగరాభివృద్ధిని దెబ్బతీస్తున్నాయని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. కృష్ణాజిల్లా టీడీపీలో తాజాగా రాజుకున్న దుర్గమ్మ ఫ్లై ఓవర్‌ చిచ్చు.. భవిష్యత్తులో మరెన్ని మలుపులు తీసుకుంటుందోనని.. తెలుగు తమ్ముళ్లు కలవర పడుతున్నారు. 

10:46 - February 1, 2016

హైదరాబాద్ : మంగళవారం జరుగనున్న గ్రేటర్‌ పోలింగ్‌కు ఎన్నికల అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. కాసేపట్లో పోలింగ్‌ సిబ్బందికి ఈవీఎం, ఎలక్షన్‌ సామాగ్రిని పంపిణీ చేయనున్నారు. సామాగ్రి పంపిణీ కేంద్రాలకు పోలింగ్‌ సిబ్బంది చేరుకుంటున్నారు. సిబ్బంది మొత్తం సాయంత్రం 5 గంటలకల్లా పోలింగ్‌ కేంద్రాలకు చేరుకోనున్నారు. 

10:44 - February 1, 2016

విజయవాడ : నిన్నంతా అట్టుడికిన తుని నేటికి చల్లబడింది. కాని అసలు వ్యవహారం మాత్రం వేడి మీదే ఉంది. కాపు రిజర్వేషన్ల సమస్య నివురు గప్పిన నిప్పులా రగులుతూనే ఉంది. నేటి సాయంత్రం వరకు ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ విధించిన ముద్రగడ పద్మనాభం.. 3 గంటలకు మీడియా సమావేశంలో కార్యాచరణ ప్రకటించనున్నారు. ఇప్పటికే ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని ఆయన ప్రకటించారు. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం దీనిపై తర్జనభర్జనలు పడుతోంది. విజయవాడలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రులు, ముఖ్యనేతలతో భేటీకానున్న బాబు..దీనిపై చర్చించనున్నారు. సర్దార్‌ షూటింగ్‌కు బ్రేకిచ్చి హైదరాబాద్‌ చేరుకున్న పవన్‌ కాపు గర్జన ఘటనలపై 11 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. దీంతో అందరి చూపులు నేటి పరిణామాలపైనే ఉంది. సాయంత్రానికి కాపు రిజర్వేషన్‌ ఉద్యమం ఏ రూపం తీసుకుంటుందనేదానిపై ఉత్కంఠ రేగుతోంది.

తునిలో పరిస్థితిని సమీక్షిస్తున్న అదుపు డీజీ ఠాకూర్

తూ.గో : అదుపు డీజీ ఠాకూర్ తునిలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ సమావేశంలో కోస్తా జిల్లాల ఐజీ విశ్వజిత్, గోదావరి జిల్లాల ఎస్పీలు హాజరయ్యారు.

విజయవాడలో 144 సెక్షన్ విధింపు

విజయవాడ : నగరంలో 144 సెక్షన్ విధించారు. వంగవీటి రాధ నివాసం, రైల్వేస్టేషన్, బస్ స్టేషన్ వద్ద పోలీసులకు ప్రత్యేక పహారా నిర్వహిస్తున్నారు. ఉద్యమకారులపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.

మంత్రులతో అత్యవసర భేటీ కాన్ను సీఎం బాబు

విజయవాడ : మంత్రులతో అత్యవసరంగా సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యి తుని సంఘటనపై సమీక్షించనున్నట్లు సమాచారం. 

పంజాబ్ లో ఓ స్కూల్ లో బాంబు లభ్యం

పంజాబ్ : హోషియర్ పూర్ లోని ఓ స్కూల్ లో బాంబు లభ్యం అయ్యింది. విద్యార్థులను పోలీసులు స్కూల్ నుంచి బయటకు పంపించారు. అంతే కాకుండా ఆ గ్రామం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని సోదాలు నిర్వహిస్తున్నారు.

లారీని ఢీ కొన్న కారు : ఇద్దరి మృతి

ప్రకాశం : సింగరాయకొండ కలికివాయి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీని ఢీకొన్న కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా..మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చెన్నై నుంచి విజయవాడ వెళుతుండగా ఘటన జరిగింది. ఈ ఘటనలో మృతి చెందిన వారు ఏ గ్రామస్థులు అన్న విషయం తెలియాల్సి ఉంది.సమాచారం అందుకున్న పోలీసు సంఘటనా స్థలికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

కిర్లంపూడిలో ముద్రగడ కీలకసమావేశం..

తూ.గో : కాపు రిజర్వేషన్ల పై మధ్యాహ్నం 3 గంటలకు కాపు నేతలతో ముద్రగడ పద్మనాభం కీలక సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

పోలీసుల అదుపులో మావోయస్టు కార్యదర్శి

ఖమ్మం: చర్ల మావోయిస్టు కార్యదర్శి సున్నం బొజ్జిని పోలీసులు అరెస్టు చేశారు. చర్ల మండలం బత్తినపల్లిలో బొజ్జిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సున్నం బొజ్జి అలియాస్ అంజన్నను పోలీసులు విచారిస్తున్నారు.

ఢిల్లీని కమ్మేసిన పొగమంచు....

ఢిల్లీ : దేశ రాజధాని దిల్లీని పొగమంచు కమ్మేసింది. పొగమంచు ధాటికి సమీపంలోని వాహనాలు కూడా కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా దిల్లీ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సుమారు 10 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

సెలవుపై విజయవాడ సీపీ

కృష్ణా : విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ సెలవుపై వెళ్లారు. ఆయన స్థానంలో ఇంఛార్జ్ పోలీస్ కమిషనర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి సురేంద్ర బాబును నియమించారు. గౌతం సవాంగ్ సెలవుపై వెళ్లడానికి గల కారణాలు తెలియరాలేదు.

09:31 - February 1, 2016

తూర్పు గోదావరి : తునిలో సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. తుని నుంచి అన్నవరం వరకు భారీగా సీఆర్పీఎఫ్‌ బలగాలను మోహరించారు. ఇటు విజయవాడలోనూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు. ఆదివారం ముద్రగడ పద్మనాభం తునిలో చేపట్టిన కాపు గర్జన సభ హింసాత్మకంగా మారింది. ప్రస్తుతం తునిలో సాధారణ పరిస్థితి ఏర్పడింది. మరోవైపు నేటి సాయంత్రంలోపు ప్రభుత్వ జీఓ రాకపోతే.. ఆమరణ దీక్ష చేస్తానని ముద్రగడ హెచ్చరించారు. మరో వైపు కిర్లంపూడిలో మధ్యాహ్నం 3 గంటలకు కాపు నేతలతో ముద్రగడ పద్మనాభం కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.

కిరణ్ బేడీ భర్త కన్నుమూత...

న్యూఢిల్లీ: తొలి ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ భర్త బ్రిజ్ బేడీ(76) ఆదివారం గుర్గావ్‌లో గుండెపోటుతో మరణించారు. బ్లాడర్‌లో క్యాన్సర్, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన గత 5 నెలలుగా అమృత్‌సర్, ఢిల్లీలలో చికిత్స పొందుతున్నారని కిరణ్ బేడీ వెల్లడించారు. అమృత్‌సర్‌లోని ఫోర్టిస్-ఎస్కార్ట్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన్ను గత నెల 28న ఇక్కడి మేదాంత-మెడిసిటీ ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్సచేస్తుండగా శనివారం ఉదయం 11గంటల సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చి మరణించినట్లు కిరణ్ బేడీ తెలిపారు.

తెరిలో సాధారణ పరిస్థితులు...

తూ.గో : కాపు గర్జన సందర్భంగా తలెత్తిన ఆందోళనలతో రణరంగంగా మారిన తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. నిన్నటి భీతావాహ పరిస్థితితో భయాందోళనలకు గురై ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ గడిపిన పట్టణ ప్రజలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భద్రతా బలగాలు తునిలో పహారా కాస్తున్నాయి. తిరిగి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 3వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ మార్గంలో పలు రైళ్లను అధికారులు పునరుద్ధరించారు. ఆందోళనకారులు తగలబెట్టిన రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను చూసేందుకు పెద్దయెత్తున ప్రజలు తరలివస్తున్నారు.

08:29 - February 1, 2016

హైదరాబాద్ : తునిలో జరిగిన కాపు గర్జన లో జరిగిన హింసాత్మక సంఘటనలకు ఆర్గనైజర్స్ బాధ్యత వహించాల్సిన అవసరం వుందని, హింసాత్మక సంఘటనలు కాపులకే నష్టం చేకూర్చుతాయని 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో ద హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.కె. నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో జరిగిన కాపు ఐక్య గర్జన హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు రెచ్చిపోయి ఏకంగా రైలుకు నిప్పుపెట్టి దగ్ధం చేశారు. తుని పట్టణంలో ఓ పోలీసు స్టేషన్‌పై దాడి చేయడంతో పాటు పెద్ద సంఖ్యలో వాహనాలను తగులబెట్టారు. ఆందోళనకారులు రెచ్చిపోవడంతో తుని, పరిసర ప్రాంతాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయ పార్టీలు ప్రజల భావోద్యోగాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తే ఎప్పటికైనా నష్టమే అని తెలిపారు. తుని లో కాపు గర్జన హింసాత్మకంగా మారింది. దీనికి బాధ్యత ఎవరిది? ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు కాపుల్లో కొత్త ఉత్సాహం కల్పించారు. రిజర్వేషన్ల పేరుతో రాజకీయ పార్టీలు ప్రజలతో ఆడుకోవడం కొత్తకాదు.. కాపు రిజర్వేషన్ల పేరుతో రాజకీయ పార్టీలు ఆడుకున్నాయా? ఏపీలో కాపుల కమ్యూనిటీ నిర్ణయాత్మకమైన పాత్ర వహిస్తున్నారా? హింసాత్మకఉద్యమాలు కాపులకే నష్టమా? ఆశలు కల్పించి… సఫలం కాదన్న భావన చాలా ప్రమాదకరంగా మారుతుందా? కులం ప్రాతిపదికన మాత్రమే రిజర్వేషన్లు అమలు చేయవద్దని సుప్రీం తీర్పు ఇచ్చింది. ఈ రోజు సాయంత్రానికి చంద్రబాబు ప్రకటన చేయాలని ముద్రగడ అల్టిమేటం జారీ చేశారు. అది ఎంత వరకు సాధ్యం అవుతుంది? సమస్య పరిష్కారానికి ప్రభుత్వం నాటకాలు ఆడకుండా అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నాగేశ్వర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇంకా అనేక అంశాలను నాగేశ్వర్ విశ్లేషణ చేశారు. పూర్తి సారాంశం వినాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం...

తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 2 కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట, కాలినడకన వచ్చే భక్తులకు రెండు గంటల సమయం పడుతుంది.

నివురుగప్పిన నిప్పులా తుని

తూ.గో: హింసాత్మకంగా మారిన కాపు ఐక్య గర్జన నిన్న తూర్పు గోదావరి జిల్లా తునిలో పోలీసులు గంటల తరబడి కష్టించి పరిస్థితిని అదుపులోకి తెచ్చినా, అక్కడ పరిస్థితి నివురుగప్పిన నిప్పులానే ఉంది. రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కాపులు నిప్పు పెట్టిన నేపథ్యంలో రైల్వే శాఖ అధికారులు ఈ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం చెవిన వేశారు. అంతేకాక తమ శాఖకు చెందిన ఆస్తులకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. ఈ నేపథ్యంలో ఘటనపై కాస్తంత లోతుగా ఆరా తీసిన కేంద్రం... పారా మిలిటరి బలగాల మోహరింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

యథావిధిగా రైళ్ల రాకపోకలు...

తూర్పుగోదావరి:తుని ఘటన నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే అధికారులు సోమవారం రాకపోకలను పునరుద్ధరించారు. పలు రైళ్లు యథావిధిగా కొనసాగుతున్నాయి. శ్రీకాకుళం మీదుగా రాకపోకలు సాగిస్తున్న ఫలక్‌నుమా, కోణార్క్‌, డిబ్రుఘర్‌, పూరీ-తిరుపతి రైళ్లు యథాతథంగా నడుస్తున్నాయి. ఈస్ట్‌కోస్ట్‌ రైలు షెడ్యూల్‌ సమయానికంటే ఐదు గంటల ఆలస్యంగా నడుస్తోంది.

07:14 - February 1, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికలకు అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి తెలిపారు. పోలింగ్ విధుల్లో 25 వేల మందికిపైగా సిబ్బందిని నియమించినట్లు చెప్పారు.

అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ....

గ్రేటర్ ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు, మార్గదర్శకాలను తూచా తప్పకుండా అమలు చేస్తామని ఆయన వెల్లడించారు. మొత్తం 25,624 మంది సిబ్బందిని బందోబస్తుకు వినియోగిస్తున్నామని తెలిపారు. ఇందులో 16,364 మంది సివిల్ పోలీసులు, 4860 మంది ఎఆర్ పోలీసులు, 1400 మంది ఎన్‌సిసి సిబ్బంది, 3000 మంది ఎన్‌ఎస్ఎస్ సిబ్బంది ఉన్నారని చెప్పారు. సిటీ మొత్తంలో 545 సెన్సిటీవ్, 232 హైపర్ సెన్సిటీవ్ పోలీంగ్ కేంద్రాలను గుర్తించి కట్టుదిడ్డమైన భద్రతను కల్పిస్తున్నామని అన్నారు.

ప్రతి ఘట్టాన్నీ కెమెరాల్లో రికార్డు.....

పోలింగ్ నేపథ్యంలో ప్రతి ఘట్టాన్నీ కెమెరాల్లో రికార్డు చేస్తారు. సమస్యాత్మకంగా భావించిన 3,200 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల సంఘం వెబ్ కాస్టింగ్ చేస్తోంది. ఈ కెమెరాలను కమిషనరేట్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించారు. కమ్యూనిటీ సీసీ కెమెరాల ద్వారానూ పర్యవేక్షిస్తారు. ప్రతి పోలింగ్ బూత్‌లోనూ కనీసం ఇద్దరు చొప్పున యూనిఫాంలో పోలీసు సిబ్బంది ఉంటారు. నామినేషన్ దాఖలు చేసిన వారిలో నేరచరితుల కట్టడికి, సమస్యాత్మకంగా భావించే వారి కదలికలు కనిపెట్టడానికి ప్రత్యేక షాడో పార్టీలు ఏర్పాటు చేశారు.

వరకు నగరంలో 17 కేసులు నమోదు.....

ఎన్నికల ఘట్టం ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు నగరంలో 17 కేసులు నమోదు చేసి రూ.80 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని కమిషనర్‌ తెలిపారు. పోలింగ్ మంగళవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఆ తరువాత కూడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సిబ్బంది విధుల్లో ఉంటారు. బ్యాలెట్ బాక్సులను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌లకు గార్డ్‌లను సైతం ఏర్పాటు చేస్తున్నారు. నగర వ్యాప్తంగా పికెట్లు కొనసాగుతాయి.

పోలింగ్ కేంద్రాల వద్ద 144వ సెక్షన్.....

పోలింగ్ కేంద్రాల వద్ద 144వ సెక్షన్ విధించారు. వీటికి 200 మీటర్ల పరిధిలో నలుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషిద్ధం. మంగళవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇవి అమలులో ఉంటాయి. వీటిని అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయి. ఈ ప్రాంతాల్లో ప్రచారం, గుర్తులు, బ్యానర్లు ప్రదర్శించడం, సైగలు చేయడం నిషిద్ధం.

07:10 - February 1, 2016

విజయవాడ : ఏపీ డిఎస్సీ అభ్యర్థులకు శుభవార్త.. ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న సెలక్షన్ లిస్ట్ తేదీలు ఖరారయ్యాయి.. మెరిట్‌ లిస్ట్ నేడు విడుదల కాబోతోంది.. మార్చి 5న నియామక ఉత్తర్వులు ఇచ్చేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది...

ఫిబ్రవరి 1 డీఎస్సీ అభ్యర్థుల మెరిట్‌ లిస్ట్‌....

ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ షెడ్యూలును మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఫిబ్రవరి 1న డీఎస్సీ అభ్యర్థుల మెరిట్‌ లిస్ట్‌ను విడుదల చేస్తామన్నారు. ఫిబ్రవరి 5న సెలక్షన్‌ జాబితా ప్రకటిస్తామని గంటా తెలిపారు. ఫిబ్రవరి 8న సెలక్షన్‌ లిస్ట్‌ను ఖరారు చేస్తారు. ఫిబ్రవరి 24న ఖాళీల జాబితా... ఫిబ్రవరి 25న సర్టిఫికెట్ల పరిశీలన, ఫిబ్రవరి 29న అభ్యర్థుల తుది జాబితా పూర్తవుతుందని మంత్రి గంటా తెలిపారు. మార్చి 1 నుంచి 4 వరకు వెబ్‌ కౌన్సిలింగ్‌ ఉంటుందని స్పష్టం చేశారు.. మార్చి 5న అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇస్తామని వివరించారు..

గత ఏడాది మేలో పరీక్ష నిర్వహణ.....

రాష్ట్ర విభజన తర్వాత గత ఏడాది మేలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పరీక్ష జరిగింది.. దాదాపు 10 పోస్టుల భర్తీకి ఈ పరీక్ష నిర్వహించారు.. సుమారు 3లక్షల 90వేలమంది పరీక్ష రాశారు.. అప్పటినుంచి ఫలితాలకోసం అభ్యర్థులు ఎదురుచూస్తూనే ఉన్నారు..కొన్ని కారణాలతో డీఎస్సీ ఫలితాల విడుదల ఆలస్యమవుతూ వచ్చింది.. ఎట్టకేలకు ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తేదీలు ప్రకటించడంతో అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. 

07:08 - February 1, 2016

హైదరాబాద్ : దళిత విద్యార్థి రోహిత్ మృతికి కారణమైన వారిని తక్షణమే అరెస్ట్‌ చేయాలి.. విసి అప్పారావు, కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతిఇరానీలను పదవులనుంచి బర్తరఫ్‌ చేయాలి అంటూ హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్శిటీలో ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాలు అవి నెరవేరేదాకా ఉద్యమాన్ని వీడేదే లేదంటున్నాయి. మరోవైపు ఇన్‌చార్జ్‌ విసిగా బాధ్యతలు చేపట్టిన పెరియాస్వామి ఇకనైనా క్లాసులు జరిగేలా సహకరించాలని విద్యార్థులను కోరారు.

ఇన్‌ఛార్జ్‌ విసి పెరియా స్వామితో విద్యార్థి జెఎసి భేటీ .......

విద్యార్థి జెఎసి ఆదివారం ఇన్‌ఛార్జ్‌ విసి పెరియా స్వామితో భేటీ అయింది. ఈ సందర్భంగా జెఎసి డిమాండ్లు కొన్నిటిని విసి ముందుంచింది. వీసీగా మీరుంటే తమకు ఇబ్బంది లేదని, సెలవులపై వెళ్లిన ఇన్‌చార్జ్‌ విసి శ్రీవాత్సవ్‌ మళ్లీ వస్తే సహించేది లేదని జెఎసి తేల్చి చెప్పింది. యూనివర్శిటీల్లో వేసే ప్రతి కమిటీలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు స్థానం కల్పించాలని కోరింది. తమ ఉద్యమానికి మద్దతుగా రాజీనామా చేసిన ప్రొఫెసర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని జెఎసి డిమాండ్‌ చేసింది.

లిఖితపూర్వక హామీ ఇస్తేనే క్లాసులు.....

ఆయా డిమాండ్లు యూనివర్శిటీ పరిధిలోవే కాబట్టి వీటిపై లిఖితపూర్వక హామీ ఇస్తేనే క్లాసులు, అడ్మినిస్ట్రేషన్‌ సజావుగా సాగేందుకు సహకరిస్తామని విద్యార్థి జెఎసి విసికి స్పష్టం చేసింది. ప్రభుత్వంపై మాత్రం తమ పోరు ఆగదని విద్యార్థి సంఘాలు తేల్చి చెప్పాయి. ఇదిలా ఉండగా నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థుల ఆరోగ్యం అంతకంతకూ క్షీణించిపోతోంది.

07:06 - February 1, 2016

.గో : తుని కాపుగర్జన సందర్భంగా జరిగిన ఉద్రిక్త పరిణామాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. కేరళలో జరుగుతున్న తన సినిమా సర్థార్ గబ్బర్ సింగ్ షూటింగ్‌ను అర్థాంతరంగా నిలిపివేసి ఆయన హైదరాబాద్ బయల్దేరారు. ఈ సందర్భంగా పవన్‌ ఏం మాట్లాడనున్నారు అనే అంశంపై సస్పెన్స్‌ నెలకొంది.

సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి .......

కాపు గర్జన సందర్భంగా తునిలో జరిగిన సంఘటనలు శాంతిభద్రతల సమస్యగా మారడంపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో యువత సంయమనంతో వ్యవహరించాలని, సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప హింసకు పాల్పడొద్దని ఆయన సూచించారు.

11 గంటలకు మీడియాతో పవన్...

ఈ ఘటన వల్ల ప్రయాణికులు, వృద్ధులు, పిల్లలు అనేక ఇబ్బందులు ఎదుర్కున్నారని, రాష్ట్ర ప్రజలను కష్టాలకు గురి చేయడం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేరళలో జరుగుతున్న సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ షూటింగ్‌ను అర్థాంతరంగా ఆపివేసి పవన్‌ హైదరాబాద్‌ చేరనున్నట్లు సమాచారం. పవన్ కల్యాణ్ ఉదయం 11 గంటలకు మీడియాతో మాట్లాడతారని సమాచారం. ఈ మేరకు జనసేన కార్యాలయం నుంచి మీడియాకు సమాచారం అందింది. 

07:03 - February 1, 2016

తూ.గో :తునిలో ఆందోళనకారులు రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను దగ్ధం చేయడంతో ఆ మార్గంలో ప్రయాణించాల్సిన పలు రైళ్లను ఎక్కడికక్కడ నిలిపేశారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతూ రైలు మొత్తం దహనమైపోవడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయమేర్పడింది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిపోయే సర్వీసులను సైతం నిలిపేయాల్సొచ్చింది. ఫలితంగా వందలాదిమంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లేవారి ఇబ్బందులు వర్ణనాతీతమయ్యాయి.

రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కు నిప్పు....

సామాజిక రిజర్వేషన్లు కోరుతూ ఆందోళనకు దిగింది ఒకరైతే ఇబ్బందులకు గురైంది మాత్రం వేరొకరు. తూర్పుగోదావరి జిల్లా తునిలో కాపు సామాజిక వర్గం చేపట్టిన ఐక్య గర్జన క్రమంగా హింసకు దారితీసింది. సభ జరుగుతుండగా కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం రైల్‌రోకోకు పిలుపునివ్వడంతో ఆందోళనకారులంతా ఒక్కసారిగా రైల్‌ ట్రాక్‌పైకి ఎక్కారు. అదేసమయంలో అటుగా వచ్చిన రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్ బోగీలకు నిప్పుబెట్టారు. క్రమంగా మంటలు అన్ని బోగీలకు అంటుకోవడంతో రైలు గంటలకొలది తగలబడుతూనే ఉంది. ఈ సంఘటనతో వెంటనే తేరుకున్న రైల్వే అధికారులు ఆ మార్గంలో వచ్చిపోయే రైళ్లను ఎక్కడికక్కడ ఆపేశారు. కొన్నిటిని దారి మళ్లించారు.

గంటల కొలది నిలిచిన రైళ్ళు....

విశాఖ ఎక్స్‌ప్రెస్‌, గోదావరి, పూరీ-వోఖా, విశాఖ-కాకినాడ, హౌరా చెన్నై మెయిల్‌ తదితర ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌ రైళ్లను వివిధ స్టేషన్లలో నిలిపేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటల కొలది రైళ్లు నిలిచిపోవడంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన వారు మరింత ఇబ్బందికి గురయ్యారు.

తప్పనిసరి పరిస్థితిలో రైళ్ల నిలిపివేత....

తప్పనిసరి పరిస్థితిలో ఆ మార్గంలో నడిచే రైళ్లను నిలిపివేయాల్సొచ్చిందని విజయవాడ డివిజనల్‌ మేనేజర్‌ అశోక్‌కుమార్‌ తెలిపారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా పరిస్థితి చక్కబడిన తర్వాతే రైళ్లు నడుపుతామన్నారు. ఇలా సుమారు 20 రైళ్లను వివిధ స్టేషన్లలో నిలిపేసినట్లు వివరించారు. ప్రయాణికులకు ఆహారం, మంచినీరు సరఫరా చేస్తున్నామని చెప్పారు. ప్రయాణాలు రద్దు చేసుకున్న వారి టిక్కెట్‌ డబ్బులను వెనక్కి ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.

హెల్ప్‌లైన్‌ నంబర్లు.....

రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడిన దృష్య్టా ప్రయాణికులు బంధువులు ఆందోళనకు గురయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సమాచారం అందించేందుకు అధికారులు హెల్ప్‌లైన్‌ నంబర్లు ఏర్పాటు చేశారు. విజయవాడకు సంబంధించి 0866-2575038, తుని స్టేషన్‌ 08854- 252172, రాజమండ్రి స్టేషన్‌ 0883-2420451, 0833-2420543 నెంబర్లకు ఫోన్ చేసి రైళ్ల రాకపోకల సమాచారం తెలుసుకోవచ్చు. 

07:00 - February 1, 2016

తూర్పుగోదావరి :తునిలో జరిగిన హింసాత్మక సంఘటనల వెనక ప్రతిపక్ష నేత జగన్‌ హస్తముందని ఏపీ మంత్రులు, టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా ప్రభుత్వానికి ఖ్యాతి దక్కకూడదన్న అక్కసుతో వైసిపి హింసను ప్రేరేపిస్తోందని ఆరోపించారు. ఇతరులు ఎంతగా రెచ్చగొట్టినా పట్టించుకోవద్దని కాపులు సంయమనంతో వ్యవహరించాలని సూచించారు.

ఎవరూ ఊహించని రీతిలో తీవ్ర హింసాత్మకంగా.....

తునిలో నిర్వహించిన కాపు ఐక్యగర్జన ఎవరూ ఊహించని రీతిలో తీవ్ర హింసాత్మకంగా మారింది. ఏకంగా ఎక్స్‌ప్రెస్‌ రైలు మొత్తాన్నీ తగలబెట్టడం పోలీసులు, రైల్వే సిబ్బందిపై దాడి చేయడం లాంటి హింసాత్మక సంఘటలు జరిగాయి. అయితే ఈ ఘటన వెనక ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్సార్‌సిపి హస్తముందని టిడిపి మంత్రులు, నేతలు ఆరోపించారు. కాపుల కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని సహించలేకే కొంతమంది హింసను ప్రేరేపిస్తున్నారని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.

ప్రజాదరణ లేనివారే కాపు ఉద్యమాలు.....

ప్రజాదరణ లేనివారే కాపు ఉద్యమాలు చేస్తున్నారని డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి అన్నారు. తమ ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అరాచకం సృష్టించేందుకు వైసీపీ ప్రణాళికబద్ధంగా తుని ఘటనకు పాల్పడిందని ఏపీ టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. కాపు గర్జన సభకు వచ్చిన నేతలు ఏ విషయాలు చెప్పకుండానే.. ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారని విమర్శించారు. ఈ ఘటన వెనుక వైసీపీ హస్తం ఉందని ఆరోపించారు.

కావాలని రెచ్చొగొట్టే ప్రయత్నం చేస్తున్నారు....

కాపు సోదరులను కొంతమంది కావాలని రెచ్చొగొట్టే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నేత అవంతి శ్రీనివాస్‌ ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు నేతలకు గుర్తుకు రాని సమస్య.. అధికారం లేకపోయేసరికి గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు. తునిలో హింసను ప్రేరేపించినవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఏపీ మంత్రులు స్పష్టం చేశారు. మరి టిడిపి నేతలు చేస్తున్న ఆరోపణలపై వైసిపి అధినేత జగన్మోహన్‌రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి. 

06:57 - February 1, 2016

తూర్పుగోదావరి : తునిలో జరిగిన ఘటన చాలా బాధకరమని ఏపీ సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా లాంటి ప్రశాంతమైన ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమని తెలిపారు. కాపు రిజర్వేషన్‌ కోసం తాము కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.

రాజకీయ దురుద్దేశంతోనే...

కాపు గర్జన సందర్భంగా చోటు చేసుకున్న అల్లర్లపై తన రాజకీయ జీవితంలో తూర్పుగోదావరి జిల్లాలో ఇలాంటి ఘటన జరగలేదని సీఎం చంద్రబాబు అన్నారు. అకారణంగా రాజకీయ దురుద్దేశంతో దారుణ పరిస్థితి సృష్టించారని ఆయన విజయవాడలో ఆరోపించారు.

పెట్టుబడుల సాధన కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్నా....

రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడుల సాధన కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాని చంద్రబాబు అన్నారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు తాము సుముఖంగా ఉన్నామని, అయితే దీనిపై పూర్తిగా సమీక్షించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. అదే విధంగా ప్రస్తుతం ఉన్న బీసీలకు అన్యాయం జరగకుండా కాపుల్లోని పేదలను బీసీల్లో చేర్చేవిధంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. స్వార్థం కోసమే తూర్పుగోదావరి జిల్లా తునిలో విధ్వంసం సృష్టించారని చంద్రబాబు ఆరోపించారు. ఈ ఘటనలో 25 వాహనాలు, రెండు పోలీస్‌స్టేషన్లు తగులబెట్టారని తెలిపారు. సీఐ సహా 15మంది పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారని, పాత్రికేయులపైనా దాడులు చేశారని అన్నారు.

కాపుల కోసం కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి నిధులను కేటాయించాం...

తాము అధికారంలోకి వచ్చాక కాపుల కోసం కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి నిధులను కేటాయించినట్లు చెప్పారు. వారికి రిజర్వేషన్లు ఇచ్చేందుకు ఇప్పటికే మంజునాథ కమిటీని నియమించామన్నారు.

రైళ్లు తగులబెట్టేంత ఆలోచన తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు ఉంటుందా?.....

రైళ్లు తగులబెట్టేంత ఆలోచన తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు ఉంటుందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. పులివెందులలోనో, ఇంకో చోటో ఇలాంటి ఘటనలు జరిగితే ఆలోచించవచ్చు. కానీ ప్రశాంతంగా ఉండే జిల్లాలో జరగాయంటేనే అర్థం చేసుకోవచ్చు అన్నారు. రాజకీయంగా ఎదుర్కొనలేకే దుర్మార్గమైన పనులు చేస్తున్నారని, రెండు వర్గాలను రెచ్చగొట్టి రాష్ట్రం తగలబడుతుంటే ఆనందించాలన్నది వారి ఉద్దేశమని ఆరోపించారు.

తూర్పుగోదావరి జిల్లా ప్రజలు సంయమనం పాటించాలి....

ప్రశాంతతకు మారుపేరైన తూర్పుగోదావరి జిల్లా ప్రజలు సంయమనం పాటించాలని చంద్రబాబు కోరారు. ఒక నేరస్థుడి కుట్ర వల్లే ఇలాంటి ఘటనలు జరగుతున్నాయని చంద్రబాబు అన్నారు. వదంతులను నమ్మకుండా అందరూ సంయమనంగా ఉండండి' అని చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

06:53 - February 1, 2016

తూ.గో : మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో జరిగిన కాపు ఐక్య గర్జన హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు రెచ్చిపోయి ఏకంగా రైలుకు నిప్పుపెట్టి దగ్ధం చేశారు. తుని పట్టణంలో ఓ పోలీసు స్టేషన్‌పై దాడి చేయడంతో పాటు పెద్ద సంఖ్యలో వాహనాలను తగులబెట్టారు. ఆందోళనకారులు రెచ్చిపోవడంతో తుని, పరిసర ప్రాంతాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ముద్రగడ రైలు పట్టాలపై ఉద్యమం....

కాపు రిజర్వేషన్ల సాధన కోసం తూర్పుగోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన కాపు గర్జన సదస్సు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం రైలు పట్టాలపై ఉద్యమాన్ని సాగిద్దామని చెప్పిన వెంటనే వేలాదిగా ఆందోళనకారులు ఒక్కసారిగా అక్కడికి చేరి రెచ్చిపోయారు.

రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ను ముట్టడించిన ఆందోళన కారులు...

తుని రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఆందోళనకారులు ఆ సమయంలో అక్కడే ఆగివున్న రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను ముట్టడించారు. రెచ్చిపోయిన ఆందోళనకారులు ఓ బోగీకి నిప్పు పెట్టారు. ఒక బోగీ తర్వాత మరో బోగీకి మంటలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురై కిందికి దిగిపోయారు. మంటల తీవ్రతతో 14 రైలు బోగీలతో సహా రైలు మొత్తం దగ్ధమైంది. ఇదిలా ఉంటే ఆందోళనకారుల దాడి ఘటనలో రైలు డ్రైవర్‌ అప్రమత్తతతో వ్యవహరించడంతో భారీ

ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. డ్రైవర్‌ సిబ్బందిని అప్రమత్తం చేసి విద్యుత్‌ నిలిపివేయించడంతో పెనుప్రమాదం తప్పింది. ఆందోళనకారులను నియంత్రించేందుకు వచ్చిన నలుగురు రైల్వే పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలను అదుపు చేయడం అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సాధ్యం కాలేదు. అలాగే మీడియా సిబ్బందిపై కూడా ఆందోళనకారులు దాడి చేశారు. ఈ దాడిలో కెమెరాలు సైతం ధ్వంసమయ్యాయి.

తుని రూరల్ పీఎస్ కు నిప్పు......

మరోవైపు ఆందోళనకారులు తుని రూరల్‌ పోలీస్‌స్టేషన్‌పై దాడికి పాల్పడారు. స్టేషన్‌కు నిప్పుపెట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడిలో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలకు తీవ్ర గాయాలయ్యాయి. రాళ్ల దాడిలో ఓ కానిస్టేబుల్‌ మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారంతో పోలీసు ఉన్నతాధికారులు చుట్టుపక్కల పోలీస్‌ స్టేషన్ల నుంచి బలగాలను ఘటనా స్థలానికి పంపాయి. పోలీసులు పరిస్థితి అదుపు చేసేందుకు యత్నించగా, ఆందోళనకారుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆందోళనకారులు 8 పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు.

ఒక్కసారిగా మారిన పరిస్థితి....

ఐక్యగర్జనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోవడంతో పోలీసులు అవాక్కయ్యారు. మరోవైపు సీఎం చంద్రబాబునాయుడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసారు. పరిస్థితిని అదుపు చేయడంలో విఫలమైన పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా కఠినంగా శిక్షిస్తామని డిజిపి రాముడు హెచ్చరించారు. పరిస్థితిపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో చంద్రబాబు మాట్లాడారు. హింసాత్మక సంఘటనల నేపథ్యంలో విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయం చుట్టూ భారీ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. కాగా, మంగళగిరి నుంచి తునికి ఏపీ బెటాలియన్లను పంపించారు.

రాత్రి 10గంటలకు రాస్తారోకో విరమించిన ముద్రగడ....

ఇదిలా ఉంటే ముద్రగడ పద్మనాభం తుని వద్ద జాతీయ రహదారిపై చేపట్టిన రాస్తారోకోను ఆదివారం రాత్రి 10గంటల సమయంలో విరమించారు. దీంతో జాతీయ రహదారిపై తునికి ఇరువైపుల రాకపోకలు మొదలయ్యాయి. ఉద్యమం సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు, నేతలు అనుసరించిన తీరుపై ముద్రగడ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దాదాపు మూడు వేలకు పైగా ప్రత్యేక బలగాలు ఇప్పటికే జిల్లాకు చేరుకున్నాయి.

06:48 - February 1, 2016

హైదరాబాద్ : ఎల్బీనగర్‌లోని ఎన్టీఆర్‌నగర్‌లో బిజెపి-టిఆర్‌ ఎస్‌ కార్యకర్తలు అర్ధరాత్రివేళ ఘర్షణకు దిగారు. టిఆర్‌ఎస్‌ నేతలు డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ బిజెపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి చెందిన వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు స్వల్పంగా ధ్వంసం చేశారు.  

06:46 - February 1, 2016

హైదరాబాద్ : గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభమై రేపటికి సరిగ్గా పదేళ్లు. 2006లో ప్రారంభమైన ఈ పథకం సాధించిన విజయాలేమిటి? మూటగట్టుకున్న అపకీర్తులేమిటి? ఈ పథకాన్ని మరింత విస్తృతం చేయాలా? కొన్ని ప్రాంతాలకు కుదించాలా? ఈ పథకంలో చేయాల్సిన మార్పులేమైనా వున్నాయా? రాబోయే బడ్జెట్‌ కేటాయింపుల్లో ఈ పథకానికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం నేత వి. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మరి వారు ఏఏ అంశాలను చర్చించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

06:45 - February 1, 2016

హైదరాబాద్ : భారతదేశ గ్రామీణ వ్యవస్థలో మంచి మార్పులు తీసుకొచ్చిన గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 2006లో 200 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ పథకం రూపకల్పనలో వామపక్షాలది కీలకపాత్ర. వామపక్షాల మద్దతుతో 2004లో ఏర్పాటైన యూపీఏ 1 ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది. 2008లో దేశంలోని అన్ని జిల్లాలకూ విస్తరించిన ఈ పథకం ప్రపంచబ్యాంక్‌ ప్రశంసలు కూడా అందుకుంది. అనేక యూనివర్సిటీలు, పరిశోధక సంస్థలు ఈ పథకం అమలుతీరు, గ్రామీణ భారతంలో దాని ప్రభావంపై అధ్యయనాలు చేయడం విశేషం. దాదాపు అన్ని అధ్యయనాలూ ఈ పథకాన్ని ప్రశంసించాయి. ఈ పథకం పక్కాగా అమలైన గ్రామాల్లో అభివృద్ధి జరిగిందనీ, మహిళలకు చాలా మంచి జరిగిందనీ, వేతన వ్యత్యాసాలు భారీగా తగ్గాయనీ, రైతులకూ, వ్యవసాయరంగానికి చక్కటి మేలు చేసిందని దాదాపు అన్ని అధ్యయనాలూ, సర్వేలు స్పష్టం చేశాయి. చివరకు నేషనల్‌ శాంపిల్‌ సర్వే కూడా ఈ పథకం వల్ల జరుగుతున్న ప్రయోజనాలను కళ్లకు కట్టింది. 

అవినీతిని నిర్మూలించగలిగితే......

గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కొన్ని లోపాలున్నాయనీ, దానికీ అవినీతి చెదలు పట్టుకుందనీ, దానిని నివారించగలిగితే మరిన్ని సత్ఫలితాలొస్తాయని, ఈ పథకాన్ని పట్టణాలకూ విస్తరించాలనే సూచనలూ వచ్చాయి. ఏడాదిలో కనీసం వంద రోజులు పని కల్పించే ఉద్దేశంతో ప్రారంభమైన ఈ పథకం గ్రామీణ పేదల సామాజిక భద్రతకు భరోసాగా నిలిచింది. ఈ పథకంలో బాగంగా అనేక గ్రామాల్లో లింక్‌ రోడ్లు నిర్మించారు. కాలువలు, బావులు తవ్వారు. చెక్‌ డ్యాంలు ఏర్పాటు చేశారు. చెరువుల్లో పూడికలు తీశారు. సామూహిక మరుగుదొడ్లు నిర్మించారు. ఇంకుడు గుంతలు తీశారు. ఇవన్నీ గ్రామీణ అభివృద్ధికీ, వ్యవసాయరంగ పురోగమనానికి చక్కటి బాటలు వేశాయి. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన వివిధ కార్యక్రమాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయరంగంలో ఉత్పాదకత కూడా పెరిగినట్టు వివిధ అధ్యనాలు వెల్లడించాయి. అయితే ఈ పథకం గిట్టనివారు ఇందుకు భిన్నమైన ప్రచారం సాగిస్తుండడం విశేషం. ఈ పథకం వల్ల కూలీలు దొరకడం లేదనీ, వ్యవసాయ ఖర్చులు పెరిగాయని కొందరు చేస్తున్న వాదనలు వట్టి తాలుగింజల లాంటివేనన్న విషయం అర్ధమవుతోంది. ఎందుకంటే, వ్యవసాయరంగంలో మున్నూట అరవై ఐదు రోజులు పని దొరకదు. వ్యవసాయరంగంలో ఏడాదిలో వంద నుంచి 120 రోజులు పని దొరకడమే మహాభాగ్యం. వ్యవసాయ పనులకు డిమాండ్‌ లేని రోజుల్లోనే ఈ పథకాన్ని అమలుచేస్తున్నారన్న వాస్తవాన్నీ విస్మరించకూడదు.

పంచాయితీలే అమలు చేయడంతో.......

ఈ పథకాన్ని గ్రామ పంచాయితీలే అమలు చేయడంతో కాంట్రాక్టర్ల ప్రమేయం లేకుండా పోయింది. ఈ పథకం రూపకర్తలు యంత్రాలకు 40శాతానికి మించి నిధులు వాడకూడదనే షరతు విధించడంతో ఎక్కువ మంది మనుషులకు పనిదొరికింది. ఈ పథకం ప్రారంభమైన తొలి అయిదేళ్లు ఏటా 40 వేల కోట్ల రూపాయల చొప్పున కేంద్రం నిధులు కేటాయించింది. 2006 నుంచి 2013 దాకా ఒక లక్షా పది వేల కోట్ల రూపాయలు కూలీ కింద చెల్లించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఏటా సగటున దాదాపు 5 కోట్ల మంది వంద రోజుల ఉపాధి పొందారు. 12 కోట్ల మందికి జాబ్‌ కార్డులిచ్చిన ఈ పథకం చాలా గ్రామాల్లో పెత్తందారీ వ్యవస్థను సైతం బద్దలు కొట్టింది. ఈ పథకం కూలీల్లోనూ, గ్రామీణ మహిళల్లోనూ ఆత్మవిశ్వాసం పెంచినట్టు సర్వేలు చెబుతున్నాయి.

పథకంలో వున్న లోపాలు సరిదిద్ది మరింత శక్తివంతంగా .....

గ్రామీణాభివృద్ధి, ప్రజల బాగోగుల పట్ల చిత్తశుద్ధి గల ఏ ప్రభుత్వమైనా ఇలాంటి పథకంలో వున్న లోపాలు సరిదిద్ది మరింత శక్తివంతంగా అమలుచేసేందుకు ప్రయత్నిస్తుంది. కానీ, మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి ఈ పథకం స్పూర్తికి తూట్లు పొడిచే ప్రయత్నాలు మొదలయ్యాయి. మోడీ ప్రభుత్వం పెట్టిన తొలి బడ్జెట్‌లోనే ఆ భయంకర ఛాయలు కనిపించాయి. యూపీఏ ప్రభుత్వం చివరి బడ్జెట్‌లలో ఈ పథకానికి 40 వేల కోట్ల రూపాయల చొప్పున కేటాయిస్తే, మోడీ ప్రభుత్వం తొలి బడ్జెట్‌ లో 30 వేల కోట్ల రూపాయల కంటే దిగువకు తీసుకెళ్లింది. గ్రామీణ పేద ప్రజల పొట్టలు కొట్టడానికి మోడీ సర్కార్‌ సిద్ధమైందన్న సంకేతాలు తొలి బడ్జెట్‌లోనే వెలువడ్డాయి. ఈ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరించాలని వివిధ అధ్యయనాలు సూచిస్తుంటే, మోడీ ప్రభుత్వం ఇప్పుడు అమలవుతున్న ప్రాంతాల్లోనే కోత పెట్టింది. మరోవైపు యంత్రాల వాడకం పెంచింది. పుట్టిన ప్రతి మనిషికీ పని చేసే హక్కు వుంది. ప్రజలకు ఉపాధి కల్పించడం ప్రజాస్వామిక ప్రభుత్వాల కనీస బాధ్యత. కరువు కాలంలో దొరుకుతున్న ఈ కాస్త ఉపాధిని కూడా మాయం చేసేందుకు ప్రయత్నించడం ఎంతమాత్రమూ క్షంతవ్యం కాదు.  

జీలుగుమిల్లి సరిహద్దు చెక్ పోస్టు పై ఏసీబీ దాడి

ప.గో : జీలుగుమిల్లి సరిహద్దు చెక్ పోస్టు పై ఏసీబీ దాడులు చేసింది. లెక్క తేలని రూ.76వేలు స్వాధీనం చేసుకున్నారు.

Don't Miss