Activities calendar

11 February 2016

21:53 - February 11, 2016

హైదరాబాద్ : మహబూబ్ నగర్ జిల్లా నారాయణ పేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరారు. దీంతో టిడిపి నుండి టిఆర్తె ఎస్ లోకి జంప్ అయిన ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరింది. తెలంగాణలోని ముఖ్యనేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సమావేశమై, కార్యకర్తల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేసిన కాసేపట్లోనే మరో టీడీపీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరనున్నారు. మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరడానికి డిసైడ్ అయ్యారు. ఇప్పటికే ఆయన తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. మంత్రి హరీష్ రావు సమావేశం అయి గులాబీ కండువా కప్పుకున్నారు. అయితే సీఎం కేసీఆర్ ఢిల్లీ నుండి వచ్చాక అధికారికంగా టిఆర్ఎస్ చేరనున్నట్లు తెలిపారు.  కాగా, చంద్రబాబునాయుడు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న వెంటనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం టీడీపీని ఇబ్బంది పెట్టే అంశమే. 

21:47 - February 11, 2016

హైదరాబాద్ : కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలమని... వారు ఉన్నంత వరకు పార్టీ ఉంటుందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో టీటీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన పార్టీ పరిస్థితిపై సమీక్షించారు.

ఒక్కరిద్దరు నేతలు వెళ్లిపోయినంత మాత్రాన....

ఒక్కరిద్దరు నేతలు వెళ్లిపోయినంత మాత్రాన పార్టీకి ఎలాంటి నష్టం లేదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీకి కార్యకర్తలే బలం అన్నారు. టీటీడీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ టీడీపీ నేతలంతా హాజరయ్యారు.

సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది టీడీపీనే .....

రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది టీడీపీనే అని చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ పేరుతో గెలిచిన వ్యక్తులు వేరే పార్టీలోకి చేరడం దురదృష్టకరమని చంద్రబాబు అన్నారు. ఎలాంటి సంక్షోభాన్నైనా ఒక అవకాశంగా మలుచుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. పార్టీలో అందరూ అంకితభావంతో పనిచేయాలని... బడుగు, బలహీన వర్గాల కోసం నిరంతరం కృషి చేయాలన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు టీడీపీకి ఉన్నారన్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తానని చంద్రబాబు చెప్పారు.

శాసనసభాపక్ష నేతగా రేవంత్‌రెడ్డి....

టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా.. శాసనసభాపక్ష నేతగా రేవంత్‌రెడ్డిని ప్రకటించారు. పార్టీ పెద్దగా.. తమరి అండ ఎంతో అవసరమని చంద్రబాబును రేవంత్ కోరారు. ప్రజాసేవకు ఏపీకి 5 రోజులు కేటాయిస్తే.. తెలంగాణకు రెండు రోజుల సమయం కేటాయించాలన్నారు.

లోకేష్‌ను కేంద్ర మంత్రిని చేయాలి...

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను కేంద్ర మంత్రిని చేయాలని రేవంత్‌రెడ్డి చంద్రబాబును కోరారు. లోకేష్‌కు పార్టీ బాధ్యతలే కాకుండా అధికారిక బాధ్యతలు కూడా ఉంటే బాగుంటుందన్నారు. తద్వారా తెలంగాణలో అధికారులకు ఆదేశాలిచ్చే పరిస్థితి లోకేష్‌కు ఉంటుందన్నారు. రాజకీయాల్లో హోదా కూడా ముఖ్యమేనన్నారు. సమావేశానికి వచ్చిన నేతలంతా టీడీపీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. ఒకరిద్దరు నేతలు వెళ్లిపోయినంతమాత్రాన టీడీపీ బలహీన పడదని.. కార్యకర్తలు ఉన్నంతకాలం పార్టీ ఉంటుందన్నారు.

21:42 - February 11, 2016

హైదరాబాద్ : చెన్నైలో సాంత్రో కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి వేగంగా దూసుకొచ్చిన ఎర్రటి సాంత్రో కారు రోడ్డుపై వెళ్తున్న పాదాచారులను ఢీకొనగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ఓ అపార్ట్మెంట్లో ఉంచిన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. మంగళవారం రాత్రి ఓ వీధిలో రోడ్డుపక్కన ఐదుగురు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తుండగా అదే సమయంలో సాంత్రో కారు ఓ గోడకు ఢీకొని అదుపు తప్పి వేగంగా పాదాచారులపైకి దూసుకొచ్చింది. అందులో ముగ్గురు చెల్లా చెదురుగా పడిపోగా- మరో ఇద్దరు కొద్ది సేపు కారు బానెట్పైనే ఉండిపోయి ఆ తర్వాత గాల్లోకి బంతుల్లాగా ఎగిరిపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. ఆ కారు డ్రైవర్ను వెంకటేశ్‌గా గుర్తించారు. వెంకటేష్‌ అనుభవజ్ఞుడైన డ్రైవరే అయినప్పటికీ కారు గోడకు గుద్దుకోగానే బ్రేక్‌ మీద పెట్టాల్సిన కాలును ఎక్స్‌లేటర్‌పై పెట్టడం వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

21:41 - February 11, 2016

ఢిల్లీ : కాలుష్య నివారణ కోసం ఢిల్లీలో మరోసారి సరి-బేసి విధానాన్ని అమలు చేయాలని ఆప్‌ ప్రభుత్వం నిర్ణయించింది. 81 శాతం ప్రజలు ఆడ్‌ అండ్‌ ఈవన్‌ ఫార్ములాను అమలు చేయాలని కోరుతున్నారని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ చెప్పారు. ఏప్రిల్‌15 నుంచి ఏప్రిల్‌ 30 వరకు రెండో విడత ఆడ్‌ అండ్‌ ఈవన్‌ ఫార్ములా అమలు చేయనున్నట్టు సిఎం పేర్కొన్నారు. దీన్ని క్రమం తప్పకుండా కొనసాగించాలని, అలాగే టూవీలర్స్‌కు సరి-బేసి విధానాన్ని అమలు చేయాలని చాలామంది కోరుతున్నట్టు కేజ్రీవాల్‌ తెలిపారు. అయితే ట్రాన్స్‌పోర్టు వ్యవస్థను మెరగు పరచాకే పూర్తి స్థాయిలో ఆడ్‌ అండ్‌ ఈవన్‌ ఫార్ములాను అమలు చేసే దిశగా ఆలోచిస్తామన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా కొత్తగా వెయ్యి బస్సులు కొంటున్నామని, దశలవారిగా మరిన్ని బస్సులు కొంటామని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ట్రయల్‌ రన్‌లో భాగంగా జనవరి 1 నుంచి జనవరి 15వ తేదీ వరకు ఢిల్లీలో ఆడ్‌ అండ్‌ ఈవన్‌ ఫార్ములా అమలు చేశారు. సరి తేదీల్లో సరి సంఖ్య గల వాహనాలు.. బేసి తేదీల్లో బేసి సంఖ్యగల కార్లు మాత్రమే ప్రయాణించాలంటూ పెట్టిన నియమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. 

21:40 - February 11, 2016

హైదరాబాద్ : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న టెరి యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ ఆర్‌ కె పచౌరీ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. మార్చ్‌ 7 న జరగాల్సిన స్నాతకోత్సవానికి ఆయన హాజరు కావడం లేదు. పచౌరీ చేతుల మీదుగా డిగ్రీ పట్టా అందుకోవడానికి విద్యార్థులు తీవ్రంగా నిరాకరించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన సెలవు పెట్టారు. ఈ విషయాన్ని టెరి విశ్వవిద్యాలయం తాత్కాలిక వైస్‌ ఛాన్స్‌లర్ రాజీవ్‌ సేథ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. జూనియర్‌ ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో పర్యావరణ వేత్త పచౌరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇటీవలే ఆయన బెయిలుపై విడుదలయ్యారు.

 

21:39 - February 11, 2016

హైదరాబాద్ : ఫేస్‌బుక్‌ తన వివాదస్పద ప్రాజెక్ట్‌ ఫ్రీ బేసిక్స్‌ను భారత్‌లో మూసివేసింది. ఇకపై భారత ప్రజలకు ఫ్రీబేసిక్స్‌ అందుబాటులో ఉండదని ఫేస్‌బుక్‌ ప్రతినిధి ఈమెయిల్‌ ద్వారా ప్రకటించారు. కంటెంట్‌ ఆధారంగా ఇంటర్నెట్‌ యాక్సెస్‌ కోసం వేర్వేరు డాటా చార్జీలు వసూలు చేయడం కుదరదని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా ట్రాయ్‌ స్పష్టం చేసింది. ట్రాయ్‌ ఉత్తర్వులతో ఎయిర్‌టెల్ జీరో, ఫేస్‌బుక్ ఫ్రీ బేసిక్స్ ప్రచారానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిబంధనలు ఉల్లంఘిస్తే రోజుకు 50 వేల జరిమానా విధిస్తామని ట్రాయ్‌ హెచ్చరించింది. నెట్‌ న్యూట్రాలిటీని కోరుతున్న మెజారిటీ నెటిజన్లు - ఫేస్‌బుక్ ఫ్రీ బేసిక్ ప్రచారాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఫ్రీ బేసిక్స్‌ వల్ల కొన్ని సైట్లు మాత్రమే యాక్సెస్‌ అవుతాయన్నారు. 

టిఆర్ఎస్ లోకి మరో టిడిపి ఎమ్మెల్యే

హైదరాబాద్ : నారాయణ పేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి టిఆర్ఎస్ లోకి చేరేందుకు సిద్ధమయినట్లు సమాచారం. ఈ మేరకు మంత్రి హరీష్ రావుతో భేటీ అయ్యారు.

 

20:45 - February 11, 2016

హైదరాబాద్ : అక్కడ మంచే ముంచుతుంది. శత్రువుల తూటాలకంటే బలంగా దిగబడుతోంది. శత్రువు కదలికనైనా వూహించవచ్చేమో గానీ ఈ మంచు కొండల ఉగ్రరూపాన్ని మాత్రం గ్రహించలేం. ఫలితంగా విలువైన సైనికుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. అసలు ఈ ప్రదేశానికి ఎందుకు అంత ప్రాధాన్యత ఏర్పడింది. భారత్, పాక్ ల నుండి కోట్లు ఖర్చు పెట్టిస్తున్న సియాచిన్ ఎందుకు కీలకంగా మారింది. నేటి వైడాంగిల్ ప్రత్యేక కథనం. మరి మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

20:37 - February 11, 2016

హైదరాబాద్ : గ్రేటర్ మేయర్ గా బొంతు రాంమ్మోహన్ డిప్యూటీ మేయర్ గా ఫసియుద్దీన్ ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. కలగనకపోయినా కలం మార్చేసిందా? తెలంగాణలో టిడిపి పరిస్థితి ఏడికెళ్లి... ఏడికొచ్చింది..! తెలంగాణ కాశ్మీర్ ఆదిలాబాద్ లో సీఎం కేసీఆర్ ఏం చెప్పారు? ఏం జరుగుతుంది? మొగులయ్య, మొగులవ్వ పేర్ల ముచ్చట ఏంటి? రెండేళ్లకోసారి వచ్చే మేడారం జాతర.. ప్రభుత్వ ఏర్పాట్లు, ఆనందతోని అంగిలాగేసి ఎగిరితే ఆకలిగున్న కుక్క అరువెత్తుకుపోయిందట అలా తమిళనాడులో ఓ పోలీసు వ్యవహారం ఇత్యాది అంశాలపై 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో మసాల విశేషాలను మల్లన్న అందించారు. సర్కార్ ఆఫీసుల చుట్టూ కాగితాలు పట్టుకుని తిరుగుతున్న ప్రధాని నరేంద్ర మోడీ భార్య జశోదా బెన్.... మరి అలాంటి వివరాలను మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

20:01 - February 11, 2016

విజయవాడ: భూమి నీదే. కానీ భూమిపై నీకు హక్కుండదు. పంటా నీదే. ఏది వెయ్యాలో డిసైడ్ చేసేది నువ్వు కాదు. అమ్ముకోవాల్సిన ఆపద వచ్చినా, అమ్మడానికి వీల్లేదు. భవనాలు కట్టుకోవాలని భావించినా, ఒక ఇంచు కూడా గోడ కట్టకూడదు. ఇది పాకిస్తాన్‌ కాదు. ఉత్తర కొరియా అంతకన్నా కాదు. నియంతృత్వం రాజ్యమేలే దేశమూ కాదు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి. అవును. నాడు రాజధాని కోసమంటూ వేల ఎకరాల జరీబు భూములను సమీకరించిన ప్రభుత్వం....ఇప్పుడు అగ్రిజోన్‌ అంటూ కొత్త పల్లవి ఎత్తుకుంది. అప్పుడు సిరులు పండించే భూములే లాక్కుని, ఇప్పుడు వ్యవసాయ పరిరక్షణ కోసమేనంటూ రైతుల నోట్లో మట్టి కొడుతోంది. భవనాలు, పంటలు, అమ్మకాలు, కొనుగోళ్లు, నిర్మాణాలు అన్నీ బంద్, మేం చెప్పిందే చెయ్యాలి, వెయ్యాలి అంటూ అన్నదాతలను శాసించాలనుకుంటోంది. వారిని అంతులేని ఆందోళనకు, ఆవేదనకూ గురి చేస్తోంది. ఇంతకీ ఈ అగ్రిజోన్‌ ఏంటి...దీనిపై రాజధాని రైతుల ఆందోళన ఏంటి...అగ్రిజోన్ల వెనక పాలకుల తెర వెనక వ్యూహాల్లేంటి..? ఇవాల్టి స్పెషల్‌ ఫోకస్‌లో చూద్దాం.

రాజధాని నిర్మాణం కోసం......

రాజధాని నిర్మాణం కోసం మూడు పంటలు పండే భూములు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తే, అభివృద్ది కోసం వ్యవసాయ భూములైన సరే త్యాగం చెయ్యాల్సిందేనన్నారు. ఇప్పుడు మాస్టర్ ప్లాన్‌లో వ్యవసాయ పరిరక్షణ జోన్లుగా ప్రకటించాక , ఇదేంటని ప్రశ్నిస్తే రాజధాని చుట్టూ వ్యవసాయం సాగు అవ్వాలంటున్నారు. అక్కడ అవసరం లేని వ్యవసాయం , ఇక్కడే ఎందుకు? మొన్నటి దాకా 29 గ్రామాల్లోనే రైతు కన్నీరు పెట్టుకున్నాడు, ఇప్పుడు కృష్ణా ,గుంటూరు జిల్లాలో సగం మందికి పైగా అన్నదాతల కంట నెత్తురు చుక్కలు రాలుతున్నాయి. వ్యవసాయ పరిరక్షణ జోన్ పేరుతో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అమ్మ పెట్టదు, వేరే వారిని పెట్టనివ్వదు అనే సామెత లాగా తయారైంది.

దినదిన గండంగా రాజధాని రైతుల పరిస్థితి.....

ప్రపంచ దేశాలు అబ్బురపడేలా రాజధాని నిర్మాణం..ఆకాశాన్ని తాకాయా అని ఆశ్చర్య పోయేవిధంగా బహుళ అంతస్థులు..21వ శతాబ్ధపు రాజధాని అంటే ఇలానే ఉండాలి అనే విధంగా నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని....ఇవీ ముఖ్యమంత్రి చంద్రబాబు హోరెత్తించిన ప్రకటనలు. దీంతో రాజధాని తమ బతుకుల్లో వెలుగులు తేబోతుందంటూ సీఆర్‌డీఏ పరిధిలోని గ్రామాల్లోని రైతులు, ప్రజలు సంతోషపడ్డారు. రాజధాని చుట్టూ అభివృద్ది కేంద్రీకరిస్తామని పాలకులు చెప్పిన మాటలకు సంబరపడిపోయారు. తమ భూములకు భూమ్ వస్తుంది అని ఆశ పడిన రైతులకు ప్రస్తుతం దినదిన గండంగా మారింది.

రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ ఏర్పాటు......

ఏపీ రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ..సీఆర్‌డీఏను ఏర్పాటు చేసింది. కృష్ణా, గుంటూరు జిల్లాలోని 56 మండలాలు సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చేలా నిర్ణయం చేశారు. రాజధాని చుట్టూ ఉన్న ప్రాంతాన్ని అభివృద్ది చేసి తద్వారా ఉపాధి అవకాశాలు పెంచడం, అభివృద్దిని విస్తరించడం దీని ప్రధాన ఉద్దేశం. దీని కోసం రాజధాని నిర్మాణంతో పాటు సీఆర్‌డీఏని కూడా సమాంతరంగా అభివృద్ది చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం ప్రకటించిన సీఆర్‌డీఏ పరిధిని చూసుకుని ఆ గ్రామాల్లోని రైతులు, ప్రజలు సంతోషించారు. అయితే రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ బృందం ఇచ్చిన మాస్టర్ ప్లాన్ చూసిన తర్వాత రైతుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.

వ్యవసాయ పరిరక్షణ జోన్లు ఏర్పాటు చేయాలని మాస్టర్ ప్లాన్ .....

రాజధాని నిర్మాణంతో పాటు దానిని ఆనుకుని వ్యవసాయ పరిరక్షణ జోన్లు ఏర్పాటు చేయాలని మాస్టర్ ప్లాన్‌లో పొందుపరిచి ఉన్నాయి. మొత్తం మూడు జోన్లుగా విభజించి దాదాపు 5440 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను అభివృద్ది చేయాలని నిర్ణయిస్తూ ప్లాన్‌లో పొందుపరిచారు. అంటే మొత్తం సీఆర్‌డీఏ పరిధిలో 63 శాతం వ్యవసాయ పరిరక్షణ జోన్ కిందకు వెళ్లబోతోందన్న మాట. ఈ మూడు జోన్లను సీఆర్‌డీఏ పరిధిలోని వివిధ ప్రాంతాల మధ్య నుంచి విభజించారు.

మొదటి వ్యవసాయ జోన్‌లో కృష్ణా జిల్లా 17 మండలాలు.....

మొదటి వ్యవసాయ జోన్‌లో అత్యధిక గ్రామాలను వీటిలో చేర్చారు. కృష్ణా జిల్లాలో అధికంగా 17 మండలాలను, గుంటూరు జిల్లాలో 11 మండలాలను కలిపారు. ఈ మొదటి జోన్లో ప్రకటించిన మండలాల్లోని భూములు అత్యంత సారవంతమైనవి. నదీ పరీవాహక ప్రాంతంలో ఎక్కువగా కేంద్రీకృతమైనవి. అత్యధికంగా రైతులు ఈ భూములపైనే ఆధారపడి వ్యవసాయం సాగు చేసుకుంటున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పరిరక్షణ జోన్‌గా ప్రకటించడంతో, ఈ భూములపై రైతులకు హక్కు కొల్పోయే విధంగా మారబోతున్నాయి. కేవలం వ్యవసాయానికి తప్పించి, మరే అవసరాల కోసం ఈ భూములు వినియోగించకుండా పరిరక్షణ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు.

వ్యవసాయ జోన్‌-2లోకి కృష్ణా,గుంటూరు శివారు మండలాలు.....

ఇక రెండవ వ్యవసాయ పరిరక్షణ జోన్‌ను రాజధాని అభివృద్ది కాబోతున్న ప్రాంతాన్ని ఆనుకుని ఉండబోతోంది. కృష్ణా, గుంటూరు జిల్లాలోని కొన్నిశివారు మండలాలు ఈ జోన్ పరిధిలోకి రాబోతున్నాయి. ఈ పరిధిలో ప్రకటించిన మండలాల్లో కూడా రైతులు వ్యవసాయమే సాగు చేసుకుంటున్నారు. జగ్గయ్య పేట, నందిగామ ప్రాంతాల్లో కొన్ని మండలాల్లో భూముల్లో ఇప్పటికే అనేక రియల్ ఎస్టేట్ కంపెనీలు వెంచర్లు వేసుకున్నారు. వీటితో పాటుగా మూడవ వ్యవసాయ పరిరక్షణ జోన్ కూడా రెండు జిల్లాల్లో శివారు ప్రాంతాల్లోనూ ఉండబోతుండడంతో ఆ గ్రామాల్లో కూడా రైతులు తమ భూములపై హక్కులు కోల్పోతున్నారు.

వ్యవసాయ జోన్ ప్రతిపాదన ప్రభుత్వమే తీసుకొచ్చిందా? ....

ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌లో మూడు వ్యవసాయ పరిరక్షణ జోన్లు ఎందుకు ప్రకటించిందో అనేది ఇప్పుడు ఎవ్వరికీ అంతుపట్టని ప్రశ్నగా మారింది. వ్యవసాయం మాత్రమే సాగు చేయాలనే నిబంధనను ప్రభుత్వం కావాలనే తీసుకొచ్చిందా, లేక మాస్టర్ ప్లాన్ తయారు చేసిన సింగపూర్ బృందమే ఈ వ్యవసాయ జోన్లను ప్రతిపాదించిందా అనేది తెలియడం లేదు.

అగ్రిజోన్ల వెనక ప్రభుత్వ వ్యూహం వేరే ఉందా?......

వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే తమకు ఇలాంటి రాజధాని కావాలని, ఇలాంటి ప్రదేశాల్లో ఇలాంటి కట్టడాలు, నిర్మాణాలు జరగాలని ప్రతిపాదిస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన సూచనలు, వారు చెప్పిన వివరాలు ఆధారంగా సింగపూర్ టీం మాస్టర్ ప్లాన్‌ తయారు చేసింది. దీనిని బట్టి చూసినా ప్రభుత్వమే కావాలనే ఈ మూడు వ్యవసాయ పరిరక్షణ జోన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు స్పష్టం అవుతోంది. అగ్రిజోన్లంటూ ప్రభుత్వం వేస్తున్న ప్రణాళికల వెనక చాలా వ్యూహమే ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

భవిష్యత్‌లో ఈ భూముల్లో వేరే నిర్మాణాలు చేపట్టబోతోందా?.....

భవిష్యత్‌లో ఈ భూముల్లో వేరే నిర్మాణాలు చేపట్టడానికి ఈ ప్రతిపాదనలు చేసిందా అనే అనుమానం రైతుల్లో కలుగుతోంది. ప్రస్తుతం మాస్టర్ ప్లాన్‌లో మూడు వ్యవసాయ పరిరక్షణ జోన్లు ఏర్పాటు చేయడంపై కృష్ణా, గుంటూరు జిల్లాలోని రైతుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులపై రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. సీఆర్ డీఏ కార్యాలయం ఎదుట నిత్యం ఏదో ఒక గ్రామం నుంచి రైతులు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు.

వ్యవసాయ జోన్లను ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం.....

ప్రస్తుతం రాజధాని గ్రామ రైతుల అభ్యంతరాలను పరిశీలంచి ప్లాన్‌లో మార్పులు చేస్తామంటోంది ప్రభుత్వం. అలాగే వ్యవసాయ జోన్ల విషయంలో కూడా మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. ప్రభుత్వం వ్యవసాయ పరిరక్షణ జోన్లు ఏర్పాటును ఉపసంహరించుకోకపోతే రైతులందరూ ఏకమై పెద్ద ఉద్యమానికే సిద్దమవుతామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే రాజధాని పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున రావడం, ఇప్పుడు సీఆర్డీఏ పరిధిలోని రైతుల ఆందోళనతో ప్రభుత్వం తన నిర్ణయాలను మార్చుకుంటుందో లేదో వేచి చూడాలి.

ప్రభుత్వం నిర్దేశించిన పంటలు, పరిశ్రమలే పెట్టాలి......

రాజధాని చుట్టూ పచ్చదనం ఉండాలని, కాలుష్యం లేని వాతావరణం సృష్టించాలని వ్యవసాయ పరిరక్షణ జోన్లు ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. మూడు అగ్రిజోన్లను ఏర్పాటు చేయాలని నిశ్చయించింది. దానికి అనుగుణంగానే సింగపూర్ బృందానికి సూచనలు చేసి ప్లాన్‌ను డిజైన్ చేయించింది. మూడు వ్యవసాయ పరిరక్షణ జోన్లను మూడు రకాలుగా విభజించి ఆయా జోన్లలో ప్రభుత్వం ప్రతిపాదించిన పంటలను, చిన్న తరహా పరిశ్రమలను మాత్రమే పెట్టుకోవాలనే నిబంధనలు అమలు చేయాలనుకుంటోంది.

వ్యవసాయ పరిరక్షణ జోన్‌-1లో వ్యవసాయం, పండ్లతోటలు.....

మొదటి వ్యవసాయ పరిరక్షణ జోన్‌లో వ్యవసాయం, పండ్లతోటలు, కోళ్లఫారాలు, డైయిరీలు, ఫామ్ హౌస్ లు కాలుష్యం లేని చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవచ్చు. పెట్రోల్ బంక్ లు, వేబ్రిడ్జిలు, కంకర, ఇసుక, బంకమన్ను ,రాయి క్వారీలనూ నిర్మించుకోవచ్చు. ఇక రెండవ వ్యవసాయ పరిరక్షణ జోన్లో పార్కులు, ఆట స్థలాలు, వినోద కార్యక్రమాలు, సంతలు , ఎగ్జిబిషన్లు, టార్పాలిన్‌తో వేసిన తాత్కాలిక నిర్మాణాలు వంటి వాటికి అనుమతిస్తారు. మూడవ జోన్లో మాత్రం మొదటి రెండు జోన్లలో అనుమతించిన వాటిని దీనిలో అనుమతించే విధంగా చట్టాలు చేయాలనుకుంటోంది ప్రభుత్వం.

జోన్లలో జనజీవనం అస్తవ్యస్తమయ్యే అవకాశం......

ఈ మూడు జోన్లలో ప్రభుత్వం ప్రకటించిన ఈ విధానాల కారణంగా ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో ఉంటున్న జన జీవనం అస్తవ్యస్థమయ్యే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా ఒక్కో ప్రాంతంలో అక్కడి నేలను బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి, నీటి సౌలభ్యాన్ని బట్టి పంటలు పండిస్తూ జీవనం సాగిస్తుంటారు. కాని ప్రభుత్వం వ్యవసాయ పరిరక్షణ జోన్లు ఏర్పాటు ద్వారా ఆ ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా దెబ్బతినే అవకాశముందని పర్యావరణవేత్తలు అంటున్నారు. దీని ద్వారా రైతులు, రైతు కూలీలు వలస వెళ్లే ప్రమాదం ఉంది.

భూములను విక్రయించరాదు.....

భూములను విక్రయించరాదు, ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదంటూ ప్లాన్ లో ప్రకటించింది ప్రభుత్వం. అంటే ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు భవిష్యత్‌లో ఆ భూముల్లో ఇళ్లను నిర్మించుకునే అవకాశం ఉండదు. అంతేకాదు స్థానికంగా ఈ జోన్లలో పారీశ్రామికీకరణ నిలిచిపోతుంది. ఈ ప్రాంతంలో నివశించే వారు విద్యా, ఉపాధి, వైద్యం వంటి అంశాలకు ఇతర ప్రాంతాల వారిపైనే ఆధారపడాల్సి ఉంటుంది. వ్యవసాయ పరిరక్షణ జోన్లు ఏర్పాటు కారణంగా భూముల విలువ పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది. భవిష్యత్‌లో వారికి ఏ కష్టమొచ్చినా భూమి జోలికి మాత్రం వెళ్లకూడదు అనే విధంగా నిబంధనలు పెడుతున్నారు. ఇలాంటి అనేక అంశాలు ఆయా ప్రాంతాల్లోని రైతులు, ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

పచ్చదనం, కాలుష్య నివారణ, స్వయం ఉపాధి కోసమేనా?......

అయితే వ్యవసాయ పరిరక్షణ జోన్ ఏర్పాటు చేస్తే లాభమేంటి..ప్రభుత్వం చెబుతున్నట్టు కేవలం పచ్చదనం, కాలుష్య నివారణ, స్వయం ఉపాధి వంటి అంశాల కోసమే మూడు వ్యవసాయ పరిరక్షణ జోన్లు ఏర్పాటు చేస్తున్నారా? అంటే ...కానే కాదంటున్నారు రైతులు ,విశ్లేషకులు. రాజధాని నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ తెలియదు..కాని రాజధాని చుట్టూ వ్యవసాయ పరిరక్షణ జోన్లు ఏర్పాటు చేసి, అక్కడ ఎలాంటి నిర్మాణాలు జరకుండా తాత్కాలికంగా వాటిని నిలిపేయాలని ప్రభుత్వ పెద్దల ఆలోచనగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

భవిష్యత్‌లో మళ్లీ మామూలు ప్రాంతాలుగా మార్చరన్న గ్యారంటీ ఉందా?.....

ప్రభుత్వం ప్రస్తుతం వందల ఎకరాల భూమిని వ్యవసాయ పరిరక్షణ జోన్లుగా ప్రకటించింది. కాని భవిష్యత్‌లో వీటిని మళ్లీ మాములు ప్రాంతాలుగా మార్చే విధంగా జీవోలు ఇవ్వరూ అనే గ్యారెంటీ ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు రైతుల వద్ద ఉన్న భూములు ఈ వ్యవసాయ పరిరక్షణ జోన్ కారణంగా వేరే వారి చేతుల్లోకి మారాక ,అప్పుడు ఈ జోన్ విధానాన్ని తొలగిస్తే నష్టపోయేది ఎవరు అనే ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుతం వ్యవసాయ పరిరక్షణ జోన్ విధానం కూడా ఇదేననే వార్తలు వినిపిస్తున్నాయి. రైతుల నుంచి భూములు తీసుకుని తర్వాత తాపీగా జీవోలు మార్చుకోవచ్చు అనేది ప్రభుత్వ వ్యూహంగా ఉందనేది రాజకీయ పండితుల అభిప్రాయం. తాజాగా అసైన్డ్ భూముల విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోలే ఇందుకు నిదర్శనం.

జోన్‌ భూముల్లో అమ్మకాలు, కొనుగోళ్లు జరగవని ప్రచారం .....

కృష్ణా, గుంటూరు జిల్లాలో చాలా మండలాలు వ్యవసాయ పరిరక్షణ జోన్ క్రిందకు వెళ్లిపోతున్నాయి. ఇక నుంచి వారి భూముల్లో అమ్మకాలు, కొనుగోళ్లు జరగవనే ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నారు. దీంతో భయపడిపోతున్న రైతన్నలు భవిష్యత్ ఊహించుకుని, ఎంత వస్తే అంతకాడికి భూములను విక్రయిస్తున్నారు. ఈ భూములను కృష్ణా, గుంటూరు జిల్లాల అధికార పార్టీ నాయకులు, వారి అనుచరులే కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం.

వ్యవసాయ పరిరక్షణ జోన్ ఏర్పాటు వెనుక భారీ ప్రణాళిక .....

రైతుల నుంచి భూములు తీసుకుని ,తర్వాతి కాలంలో ఆ భూముల్లో పరిశ్రమలు పెట్టుకోవడానికి అనుమతులు ఇచ్చే విధంగా వేస్తున్న ప్రణాళికలో భాగమే ఈ వ్యవసాయ పరిరక్షణ జోన్ విధానమని అనేక మంది ఆరోపిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో కూడా ముందు ఇలాంటి ప్రచారమే చేసి, వేలాది ఎకరాలు రైతుల వద్ద నుంచి తక్కువ ధరలకే కొనుగోలు చేశారనే విమర్శలు వచ్చాయి. అసెన్డ్, లంక భూముల విషయంలో ఇదే జరిగిందని స్వయంగా ప్రభుత్వ పెద్దలే అంగీంకరించారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయ పరిరక్షణ జోన్ ఏర్పాటు వెనుక భారీ ప్రణాళికే దాగి ఉందనేది విశ్లేషకులు అభిప్రాయం.

వ్యవసాయ పరిరక్షణ జోన్లు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ .....

మరో రెండేళ్ల తర్వాత అధికారం మారినా, తమకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఈ భూములను ముందు తమ అధీనంలోకి తెచ్చుకోవడం కోసమే ఈ వ్యవసాయ పరిరక్షణ జోన్ ఏర్పాటు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వానికి నిజంగా రైతులకు అభివృద్ది ఫలాలు అందించాలనే ఉంటే, వారి భూముల ధరలు పెంచాలని అనుకుంటే, వ్యవసాయ పరిరక్షణ జోన్లు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే భారీ ఉద్యమం చేస్తామని రైతులు, రైతు సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. మరి ప్రభుత్వం వ్యవసాయ జోన్లు ఏర్పాటుపై వెనకడుగు వేస్తుందో, ఆందోళనలు లెక్క చేయకుండా ముందుకే వెళుతుందో వేచి చూడాలి. 

19:53 - February 11, 2016

హైదరాబాద్ : 2014 ఎన్నికల్లో విరిసిన గులాబి పూవు ఇంకా గుప్పుమంటూ పరిమళిస్తూనే ఉంది. తెలంగాణలో జరిగిన ప్రతి ఎన్నికలోనూ విజయాలు దానికే దాసోహమంటున్నాయి. ఆ పరిమళానికి పసుపు కందిరీగలన్నీ జోగుతూ దానిలో లీనమవుతున్నాయి. దీంతో మొదటినుంచీ తెలంగాణలో పసుపు దళం వ్యవహారం నచ్చని కాషాయదళం ఇప్పుడు తమ మనసులో మాట బయటపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడైన కళ్లు తెరిచి కటీఫ్‌ చెప్పకపోతే రాబోయే రోజుల్లో కోలుకోలేని దెబ్బతింటామన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఒంటరిపోరుకు సిద్ధమంటున్న లోటస్ నేతలు ఇప్పుడు ఏం చేయబోతున్నారు.?

వాజ్‌పేయ్‌ హయాంలో పొత్తుతో లాభం....

టీడీపీ - బీజెపి.. కేంద్రంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మిత్రపక్షాలు. వీటి బంధం ఇప్పటిది కాదు.. గతంలో వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రెండు పార్టీలు పొత్తు వల్ల లాభపడినవే.. ఇదే సమయంలో టిడిపి ఎత్తుగడలకు బిజెపి బొక్కబోర్లాపడిన సందర్భమూ ఉంది. అలిపిరి ఘటన నేపథ్యంలో అప్పటి సీఎం చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న నిర్ణయంతో జత కలిసి కేంద్రంలో ఆ పార్టీ పరాజయాన్ని మూటగట్టుకొంది. అయినా బంధము కొనసాగింది. ఇలాంటి రిలేషన్‌షిప్‌ ఇప్పుడు తెలంగాణలో తెగిపోయే పరిస్థితి ఏర్పడింది.

ఏపీ విభజన తర్వాత పొత్తులు....

ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత టిడిపి బిజెపిల మధ్య మళ్లీ పొత్తుకు తెరలేచింది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో కొంత సమ్మతి, తెలంగాణలో మాత్రం తీవ్ర అసమ్మతి వ్యక్తమవుతోంది. విభజన వేళ తెలంగాణ రావడానికి కాంగ్రెస్‌తో పాటు బిజెపి కూడా కారణమని టీడీపీతో పొత్తు పెట్టుకుంటే పార్టీకి నష్టం తప్పదని హెచ్చరిస్తూ పది జిల్లాల బిజెపి అధ్యక్షులు రాజీనామా బాట పట్టారు. కానీ వెంకయ్యనాయుడు దౌత్యంతో అసంతృప్తి ఆగింది. కానీ బిజెపితో పొత్తుతో గ్రేటర్‌లో టీడీపీ బాగానే లాభపడింది. కానీ జిల్లాల్లో మాత్రం బిజెపి ఘోరంగా దెబ్బతింది.

గ్రేటర్‌ ఎన్నికల్లో ఐదు సీట్లకే పరిమితం....

టీడీపీతో పొత్తు నీడలో బిజెపి ఎదగలేకపోతోందని ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది. అయితే గ్రేటర్ ఎన్నికలకు వచ్చేసరికి మళ్లీ పాత పొత్తునే కొనసాగిస్తూ రెండు పార్టీలూ ఉమ్మడిగా బరిలో దిగాయి. కానీ కేవలం ఐదు సీట్లు మాత్రమే గెలుచుకొని ఇరు పార్టీలూ భంగపడ్డాయి. దీంతో బిజెపి క్యాడర్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముందు నుంచీ టీడీపీతో పొత్తుపై బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అయిష్టంగా ఉంటున్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో టీడీపీతో పొత్తే తమ పార్టీని దెబ్బతీసిందని తమ నేతల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం. కొందరు నేతలైతే టీడీపీతో పొత్తుని సమీక్షించుకుంటామని ప్రకటనలూ చేసేశారు. సరిగ్గా ఇలాంటి సమయంలో ఎర్రబెల్లితో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌లో జాయినవడం, మరికొందరు సిద్ధంగా ఉన్నారన్న సంకేతాలతో తెలంగాణలో టీడీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఫలితంగా టిడిపి బిజెపిల మధ్య ఉన్న పొత్తుపై నీలినీడలు అలుముకుంటున్నాయి. టిడిపితో మైత్రిని వ్యతిరేకిస్తున్న కాషాయనేతలు ప్రస్తుత పరిస్థితులను అడ్వాంటేజ్‌గా తీసుకోవాలని చూస్తున్నారు. కానీ టిటిడిపి నేతలు మాత్రం పొత్తులు కొనసాగుతాయంటున్నారు.

కేంద్ర బడ్జెట్‌ తర్వాత అధ్యక్షుల ఎంపిక....

కేంద్ర బడ్జెట్ సమావేశాలు తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో బిజెపికి కొత్త అధ్యక్షులు రాబోతున్నారు. అలాగే పొత్తులపై సమీక్షించే అవకాశం ఉందని బిజెపి నేతలంటున్నారు. టీడీపీతో జాతీయస్థాయిలో పొత్తు కొనసాగించినా తెలంగాణలో వద్దని ఒంటరిగా పార్టీని బలోపేతం చేయాలన్న డిమాండ్‌ను పార్టీ హైకమాండ్‌కు గట్టిగా వినిపించడానికి నేతలు సిద్ధమవుతున్నారని టాక్.

గ్రేటర్ ఎన్నికల్లో అపజయం.....

టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరుతుండటం, టీఆర్ఎస్‌లో టిటిడిఎల్పీ విలీనం అయ్యే ఛాన్స్ ఉండటం, గ్రేటర్ ఎన్నిక ఫలితాలు, జిల్లాల్లో ఏవిధంగా బిజెపి బలహీనపడుతోంది.. తదితర అంశాలతో ఒక డీటైల్డ్ రిపోర్ట్‌ని తీసుకుని తెలంగాణ బిజెపి నేతలు హైకమాండ్‌ను కలవబోతున్నారని తెలుస్తోంది. ఇప్పుడు టీడీపీతో పొత్తుకు కటీఫ్ చెబితేనే 2019 ఎన్నికల నాటికి బలీయశక్తిగా ఎదగొచ్చని.. పార్టీలో లోపాలను పసిగట్టవచ్చనేది కొందరు తెలంగాణ కమలనేతల అభిప్రాయం. వీటిన్నిటి దృష్ట్యా బిజెపి అధిష్టానం టిడిపితో పొత్తుపై ఎలా వ్యవహరిస్తుందో చూడాలి. 

19:50 - February 11, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించింది. కొత్త పాలక మండలి ఇవాళ బాధ్యతలు స్వీకరించనుంది. జీహెచ్‌ఎంసీ 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించివుంది. జనాభా కోటికి చేరింది. హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థలకు 5,500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌ ఉంది. ఇదే సమయంలో సమస్యలు, సవాళ్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి.

పార్కులు, నాలాలు, చెరువులు, ఫుట్‌పాత్‌ల కబ్జా.....

జీహెచ్‌ఎంసీ ఆవిర్భవించిన తర్వాత రెండోసారి కొత్త పాలక మండలి కొలువు తీరుతోంది. పౌరులకు అవసరమైన కనీస మౌలికసదుపాయల కల్పనపై కౌల్సిల్‌ దృష్టి పెట్టాలి. పార్కులు, నాలాలు, చెరువులు, ఫుట్‌పాత్‌లు, ప్రభుత్వ స్థలాలు అక్రమణకు గురయ్యాయి. అనుమతిలేని లేఅవుట్లు, అక్రమ భవన నిర్మాణలు పాలక వర్గానికి పెద్ద సమస్యే. కాలనీల్లో వీధి దీపాలు వెలగవు. ప్రధాన రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. ఇక కాలనీల్లోని రహదారులు పరిస్థితి చెప్పాల్సిన పనిలేదు. వీటి విషయంలో కొత్త పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.

జీహెచ్‌ఎంసీలో పేరుకుపోయిన అవినీతి...

జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీ నుంచి ఇళ్ల నిర్మాణ అనుమతుల, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ వరకు జీహెచ్‌ఎంసీలోని అన్ని విభాగాల్లో అవినీతి పేరుకుపోయింది. లంచం ఇవ్వనిదే ఏ పనీ జరగదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావించారంటే సమస్య తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. అవినీతిని నిర్మూలిస్తామని టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీని అమలు చేయాల్సిన బాధ్యత కొత్త పాలకవర్గంపై ఉంది.

మురికివాడల్లో కనీస సదుపాయాలు మృంగ్యం ....

నగరంలోని చాలా కాలనీలకు ఇంకా మంచినీటి పైపులైన్లు లేవు. మురికివాడల్లో కనీస పౌరసదుపాయలు కూడా అంతంతమాత్రమే. ట్రాఫిక్‌ పెద్ద సమస్య. గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే సిగ్నల్‌ ఫ్రీ జంక్షన్లను తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కొత్త పాలకవర్గంపై ఉంది. పౌరులకు మెరుగైన సౌకర్యాలు కల్పించమే లక్ష్యంగా పనిచేయాలని కొత్త కార్పొరేటర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించిన నేపథ్యంలో ... వీరు ఎంతవరకు బాధ్యగా పని చేస్తారో చూడాలి.

భారీగా నిధులున్నా ఖర్చు చేయని వైనం.....

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిలా ఉంది గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిస్థితి. కార్పొరేషన్‌లో భారీగా నిధులున్నప్పటికీ ఖర్చు చేస్తున్న దాఖలాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. పనుల నిమిత్తం ఒక్కొక్క కార్పొరేటర్‌కు 4 కోట్ల 60 లక్షల రూపాయలు కేటాయిస్తోంది కార్పొరేషన్‌. మొత్తం 150 మంది కార్పొరేటర్లకు 690 కోట్లు కేటాయించింది. కానీ.. కార్పొరేటర్లు ఖర్చు చేసింది మాత్రం కేవలం 240 కోట్లు మాత్రమే. అంటే సగం నిధులు కూడా ఖర్చు చేయని వైనం. ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీలిచ్చి పదవులు పొందిన కార్పొరేటర్లు.. ఆ వైపు దృష్టి సారించడం లేదు. కానీ.. స్టడీ టూర్ల పేరుతో మాత్రం జల్సాలకు లక్షలాది రూపాయలు ఖర్చు చేశారనే ఆరోపణలున్నాయి.

గురువారం కొత్త పాలకమండలి ప్రమాణ స్వీకారం....

అయితే.. తాజాగా గురువారం నాడు కొత్త పాలకమండలి ప్రమాణ స్వీకారం చేయనుంది. మార్చి మొదటి వారంలో జీహెచ్‌ఎంసీ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రేటర్‌ బడ్జెట్‌ ఈసారి 5600 కోట్ల రూపాయలు దాటే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం కూడా కార్పొరేటర్లకు ఏడాదికి కోటిన్నర నుంచి రెండు కోట్లు ఇచ్చే యోచనలో ఉంది. అంటే ఐదేళ్లలో ఒక్కో డివిజన్‌ అభివృద్ధికి దాదాపు 10 కోట్ల నిధులు రానున్నాయి. అయితే గతంలో సగం నిధులు కూడా ఖర్చు చేయని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈసారి నిధులు ఎలా ఖర్చు చేస్తారోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

సిబ్బంది లేకపోవడమే కారణం....

ఇదిలావుంటే.. కార్పొరేటర్లు నిధులు ఖర్చు చేయకపోవడానికి జీహెచ్‌ఎంసీలో సరైన సిబ్బంది లేకపోవడమే కారణమని పలువురంటున్నారు. కార్పొరేటర్లు ప్రతిపాదనలు పంపినా అధికారులు వాటికి క్లియరెన్స్‌ ఇచ్చేందుకు ఏళ్ల తరబడి జాప్యం జరుగుతుందనే ఆరోపణలున్నాయి. మరోవైపు చిన్న పనులకు సైతం అనేక శాఖల నుంచి అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీంతో నిధులున్నా పనులు చేపట్టేందుకు జాప్యం జరుగుతుందంటున్నారు. ఈసారి భారీగా బడ్జెట్‌ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు కనీస అవసరాలు తీర్చేందుకు కార్పొరేటర్లు దృష్టి సారించాల్సిన అవసరముందని గ్రేటర్‌వాసులు కోరుతున్నారు. మేయర్‌తో సహా కార్పొరేటర్లు అందరూ నగర అభివృద్ధి కోసం పాటుపడాలని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ దిశానిర్ధేశం చేశారు. మరి కొత్తగా వచ్చిన కార్పొరేటర్లు తమకు కేటాయించిన నిధులను ఎలా ఖర్చుపెడతారో చూడాలి.

మంగళవారం నుంచి ఆస్తిపన్ను వసూళ్లు ప్రారంభం.....

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆస్తిపన్ను వసూలు ప్రారంభమయ్యింది. ఎన్నికల సందర్భంగా అధికార టీఆర్‌ఎస్‌ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుందుకు ఆర్ధిక వనరులు సమకూర్చుకోవాల్సి ఉంది. ఇందుకు ప్రభుత్వ పరంగా జీహెచ్‌ఎంసీకి అందే నిధులు ఒకమార్గం. మహానగర పాలక సంస్థ సమకూర్చుకునే సొంత వనరులు మరో మార్గం. దీనిలో ఆస్తిపన్ను ప్రధానమైనది. దీంతో మంగళవారం నుంచి పన్ను వసూళ్లను ప్రారంభించారు. వచ్చేనెల 31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను నియమించారు.

ఆస్తిపన్ను వసూలు లక్ష్యం రూ.1150 కోట్లు .....

ఈసారి భారీగా ఆస్తిపన్ను వసూలు చేయాలని జీహెచ్‌ఎంసీ లక్ష్యంగా నిర్ణయించింది. మొత్తం 1150 కోట్లు ప్రాపర్టీ టాక్స్‌ టార్గెట్‌గా పెట్టుకున్నారు. గతేడాది కంటే ఇది 30 కోట్లు అధికం. 2014-15లో 1120 కోట్లు వసూలు చేశారు. 2012-13లో 779 కోట్లు వసూలైన ఆస్తిపన్నును 2013-14లో వెయ్యి కోట్లకు పెంచారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మూడేళ్లలో ఆస్తిపన్నువసూళ్ల లక్ష్యం దాదాపు రెట్టింపు అయ్యింది.

1475 మురికివాడల్లో 5 లక్షల కుటుంబాలు......

ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరుకు పేదల నుంచి నామమాత్రంగా ఆస్తిపన్ను వసూలు చేస్తున్నారు. సర్కార్‌ నిర్ణయంతో జీహెచ్‌ఎంసీ పరిధిలోని 1475 మురికి వాడల్లో నివసిస్తున్న 5 లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుంది. ఏటా 1200 రూపాయలలోపు ఆస్తిపన్ను చెల్లించేవారి నుంచి ఈసారి 101 రూపాయలు మాత్రమే వసూలు చేస్తారు. దీనివల్ల 25 కోట్ల ఆదాయం తగ్గుతుందని అంచనావేశారు. పాతబకాయిలతోపాటు వడ్డీ కలిపితే ఇది 90 కోట్లకు చేరుతుందని లెక్క తేల్చారు. జీహెచ్‌ఎంసీ అధికారులు వసూలుచేసే ఆస్తిపన్ను ఆధారంగా కొత్త పాలకమండలి బడ్జెట్‌ ప్రతిపాదనలు తయారు చేస్తుంది.

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సమస్యల తిష్ట.....

శేర్‌లింగంపల్లి నియోజక వర్గం.. టీఆర్ఎస్ క్లిన్ స్వీప్ చేసిన వాటిలో ఒకటి. ఎమ్మెల్యే స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకున్నా.. క్యాడర్, సెకండ్ స్థాయి లీడర్లు అందరూ టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. మువ్వా సత్యనారాయణ, బండి రమేష్, ఇద్దరూ ఎమ్మెల్యే అభ్యర్ధులే. వీరితో పాటు.. కాంగ్రెస్‌ నుంచి మంచి పట్టున్న నేత జగదీష్‌ గౌడ్ గులాబీ గూటికి చేరారు. టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌లో జీరో స్థానం నుంచి హీరోగా అవతరించింది. అయితే 18 నెలలుగా గ్రేటర్‌ సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయి. ఇప్పుడైనా ప్రభుత్వానికి ఓటు వేశాం.. పనులు పూర్తి చేస్తారా లేదా అని జనం ఆశగా చూస్తున్నారు.

చందానగర్ రైల్వే స్టేషన్‌ వద్ద బ్రిడ్జి లేకపోవడం....

చందానగర్ రైల్వే స్టేషన్‌ వద్ద బ్రిడ్జి లేకపోవడం ఇక్కడ ప్రధాన సమస్య. సగటున నెలకు నలుగురి ప్రాణాలు గాల్లో కలుస్తుంటాయి. ఐదేళ్లుగా ఇదిగో ప్రాజెక్ట్.. అదిగో పూర్తి అంటూ కాలం వెల్లదీస్తున్నారు. కానీ ప్రమాదాలను మాత్రం నిరోదించడంలో విఫలమవుతూనే ఉన్నారు. ఏడాదన్నర క్రితం రాజీవ్ స్వ గృహ వద్ద అండర్ బ్రిడ్జి పనులు చేపట్టారు. అవి మధ్యలోనే తమ ఇళ్లకు ఇబ్బందులు కల్గుతున్నాయని హైకోర్టును ఆశ్రయించడంతో పనులు ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రయత్నం మొదలు పెట్టడం లేదు. దీంతో రోజూ నరకయాతన అనుభవిస్తున్నారు. శేర్‌లింగంపల్లిలో మరో సమస్య వెంటాడుతోంది. పాపిరెడ్డి నగర్‌లో డ్రైనెజ్‌ ఉప్పొంగుతోంది. రోడ్డు పై నడువాలంటేనే భయమేస్తుంది. దోమ కాటుతో జనం రోగాలబారిన పడుతున్నారు. కొత్త ప్రభుత్వం చేస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నా.. ఎప్పుడు పూర్తి అవుతాయో తెలియని పరిస్థితి. నిత్యం ఆస్పత్రి పాలవుతూ జనం కష్టాలు అనుభవిస్తున్నారు. 

ఏయూ మాజీ వీసీ జీఎస్ ఎన్ రాజు పై విచారణకు ఆదేశం

విశాఖ : ఏయూ మాజీ విసీ జీఎస్ ఎన్ రాజు అవినీతి అక్రమాలపై విచారణకు ఆదేశించినట్లు మంత్రి గంటా శ్రీనివాస్ తెలిపారు. జఎస్ ఎన్ రాజు మీద వచ్చిన ఆరోపణలపై త్రిసభ్య కమిటీ వేశామని, ఈ కమిటీలో ఉన్నత విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి కన్నమ్ దాస్, ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ విజయ్ ప్రకాశ్ నియమించినట్లు తెలిపారు. 10 రోజుల్లో రాజు ఆరోపణలపై నివేదిక అందించాలని కమిటీని ఆదేశించామన్నారు. నివేదిక వచ్చేదాకా వీసీ రాజు చేసిన నియామకాలు నిలిపివేస్తామని పేర్కొన్నారు.

టి.టిడిపి శాసనసభా పక్ష నేతగా రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : టి.టిడిపి శాసనసభా పక్ష నేతగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టి.టిడిపి నేతల విస్తృత స్థాయి సమావేశం లో ఈ . ఈ సందర్భంగా టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... టిడిపికి కార్యకర్తలే బలం అని, పదేళ్లు ప్రతిపక్షంగా ఉండి ఎన్నో సమస్యలను ఎదుర్కొని నిలబడ్డామన్నారు. తెలంగాణ లో పార్టీని బలోపేతం చేస్తామన్నారు. కార్యకర్తలు ఉన్నంత కాలం టిడిపి ఉంటుందని స్పష్టం చేశారు.

మంత్రి కేటీఆర్ కు కేంద్ర మంత్రి సుష్మా లేఖ

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ కు కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ లేఖ రాశారు. తెలుగు విద్యార్థులకు అమెరికాలో కలిగిన ఇబ్బందులపై మంత్రి కేటీఆర్ సుష్మాస్వరాజ్ కు లేఖ రాశారు. కేటీఆర్ లేఖకు వివరణ ఇస్తూ సుష్మా లేఖ రాశారు. విద్యార్థుల సమస్యలపై అధికారులతో మాట్లాడం.. ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అమెరికా అధికారులతకు సూచించాం అని తన లేఖ లో సుష్మా తెలిపారు.

ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీవారి కళ్యాణోత్సవం

హైదరాబాద్ : ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీవారి కళ్యాణోత్సవం ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, గవర్నర్ నరసింహన్, ఎంపి కవిత పాల్గొన్నారు.

సినిమా షూటింగ్ కు సింగిల్ విండో అనుమతులు : మంత్రి తలసాని

హైదరాబాద్ : ఉగాదికి నంది పురస్కారాలు ఇవ్వనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. చిన్న సినిమాల కోసం ఇక పై ఐదు షోలు నిర్వహించనున్నట్లు తెలిపారు. చిత్రపురిలో సినీరంగ కార్మికులు ఇండ్లు కట్టిస్తామని పేర్కొన్నారు. నంది అవార్డుల పేరు మార్చే ప్రతిపాదన ఉందన్నారు. 2011 నుంచి పెండింగ్ లో ఉన్న అవార్డులను అందిస్తామన్నారు. సినిమా షూటింగ్ కు సింగిల్ విండో అనుమతులు ఇస్తామన్నారు. 

18:37 - February 11, 2016

విజయవాడ : తాత్కాలిక సచివాలయం వెలగపూడిలోనే నిర్మించడం ఖాయమైపోయింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 20 ఎకరాల్లో కాకుండా 45 ఎకరాల్లో సచివాలయం, 27 ఎకరాల్లో ఇతర ప్రభుత్వ భవనాలు నిర్మించాలని ఆ ఉత్వర్లుల్లో పేర్కొన్నారు. మరో 18 ఎకరాల్లో ప్రజా సదుపాయాలను నిర్మిస్తారు.

18:35 - February 11, 2016

తిరుపతి : బలిజ, కాపులను బీసీల్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ తిరుపతిలో బీసీ సంఘాలు నిరాహార దీక్ష చేస్తున్నారు. అఖిల భారత యాదవ జాతీయ సంఘం ఉపాధ్యక్షుడు అన్నా రామచంద్రయ్య ఆమరణ దీక్ష చేస్తున్నారు. నేడు రెండోరోజు పలు బీసీ సంఘాలు ఈ దీక్షకు మద్దతు ప్రకటించాయి.

17:54 - February 11, 2016

హైదరాబాద్ : మరో సెంట్రల్‌ యూనివర్శిటీలో విద్యార్థుల సస్పెన్షన్‌ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. వర్శిటీ క్రమశిక్షణా చర్యల్ని వ్యతిరేకిస్తూ స్టుడెంట్స్‌ తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.. రోహిత్ ఆత్మహత్యతో ఈ అంశం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది..

లైబ్రరీలో పుస్తకాల సంఖ్య పెంచాలి....

ఇఫ్లూలో హాస్టల్‌ సమస్యలు పరిష్కరించాలని, లైబ్రరీలో పుస్తకాల సంఖ్య పెంచాలని, విద్యార్థి సంఘాల గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని గత సెప్టెంబర్‌లో విద్యార్థులు నిరసనకు దిగారు. ఎన్నిసార్లు ఆందోళన చేసినా వర్శిటీ అధికారులనుంచి స్పందన రాలేదు.. అయినా విద్యార్థులు తమ పట్టువీడలేదు.. దీంతో ఆగ్రహించిన వర్శిటీ పాలకమండలి 11మంది విద్యార్థులపై చర్యలు చేపట్టింది..

క్యాంపస్‌లో ఉండొద్దంటూ ముగ్గురికి ఆదేశాలు.....

క్రమశిక్షణ చర్యల్లోభాగంగా ఉదయం 9నుంచి సాయంత్రం 6వరకూ వర్శిటీ క్యాంపస్‌లో ఉండొద్దని ముగ్గురికి ఆదేశాలందాయి.. హాస్టల్‌లోకి రావొద్దంటూ మరో ఐదుగురిపై బహిష్కరణ వేటు వేశారు అధికారులు.. మరో ముగ్గురు విద్యార్థులకు వార్నింగ్‌తో సరిపెట్టారు.. విద్యార్థి సంఘాల ఎన్నికల్లో ఈ 11 మంది పాల్గొనొద్దని... ప్రచారం చేయొద్దని పాలకమండలి నిబంధనలు పెట్టింది. ఈ శిక్ష ఎప్పటివరకూ ఉంటుందో టైం చెప్పకుండా ఇంకా అమలు చేస్తూనే ఉన్నారు..

పోరాటం కొనసాగిస్తున్న విద్యార్థులు....

పాలకమండలి నిర్ణయంపై విద్యార్థులు భగ్గుమన్నారు.. డే అండ్ నైట్‌ ప్రొటెస్ట్ పేరుతో పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు.. తమపై బహిష్కరణ ఎత్తివేసేవరకూ ఇది కొనసాగుతుందని స్పష్టం చేశారు..

ఇఫ్లూలో స్వేచ్ఛావాతావరణం లేదంటున్న స్టుడెంట్స్....

ఇఫ్లూలో స్వేచ్ఛావాతావరణం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.. ప్రతి చిన్న విషయానికి పోలీసులు వస్తూ ప్రశ్నించే తత్వంలేకుండా చేస్తున్నారని మండిపడుతున్నారు.. మొత్తానికి విద్యార్థుల ఆందోళనతో ఇఫ్లూ దద్దరిల్లుతోంది.. విద్యార్థుల బహిష్కరణపై పాలకమండలి ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి..  

17:52 - February 11, 2016

నిజామాబాద్ : ఆర్మూరులో ఇద్దరు యువకుల మృతిపై కొత్త కోణాలు బయటకొస్తున్నాయి.. ఇది రోడ్డు ప్రమాదం కాదని... తమ బిడ్డల్ని పథకం ప్రకారం హత్య చేశారని మృతుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అంబేద్కర్ చౌరస్తా దగ్గర జనవరి 9న రోడ్డు ప్రమాదం జరిగింది.. బైక్‌పై వెళుతున్న ఇద్దరు యువకుల్ని వెనకనుంచి టిప్పర్‌ ఢీకొట్టింది.. తీవ్ర గాయాలపాలైన తలారి సత్యం, చేపూర్‌ రవి అక్కడే ప్రాణాలు కోల్పోయారు.. వీరి డెడ్‌బాడీలను పోస్ట్‌మార్టంకోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు పోలీసులు.. ఆ తర్వాత ఈ కేసు కొత్త మలుపు తిరిగింది.. ఇది ప్రమాదం కాదని.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ఈ హత్య చేయించారంటూ రవి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు..

తలారి సత్యం, చేపూర్‌ రవి స్నేహితులు.....

ఈ ఘటనలో మరణించిన వేల్పురు మండలం జానకంపేటకు చెందిన తలారి సత్యం, ఆర్మూరుకుచెందిన చేపూర్‌ రవి ఇద్దరూ స్నేహితులు.. కొన్నేళ్లక్రితం బతుకుతెరువుకోసం విదేశాలకు వెళ్లారు.. సాధారణ ఎన్నికల సమయంలో సొంతూరుకు తిరిగివచ్చారు.. అప్పుడు ఎన్నికల హడావుడి కొనసాగుతోంది.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా జీవన్‌ రెడ్డి పోటీకి దిగారు.. రిపబ్లికన్‌ పార్టీనుంచి సత్యం బరిలో నిలిచారు.. ఈ ఇద్దరు అభ్యర్థులకు దుబయ్‌లో పరిచయముంది.. అయితే అక్కడ యునైటెడ్‌ అరబ్‌ బ్యాంక్‌లో అప్పు తీసుకున్న జీవన్‌ రెడ్డి.. ఆ డబ్బు తిరిగి చెల్లించలేదు.. దీనిపై అల్గర్బా పోలీస్‌ స్టేషన్‌లో మూడేళ్లక్రితం కేసు నమోదైంది.. ఈ విషయాన్ని దాచి ఎన్నికల అఫిడవిట్‌ దాఖలు చేశారంటూ ఎన్నికల్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు సత్యం.. జీవన్‌ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలంటూ పోరాటం కొనసాగించాడు.. సత్యానికి రవి మద్దతుగా నిలిచాడు.. ఈలోగా ఎన్నికలు ముగిశాయి.. జీవన్‌ రెడ్డి విజయం సాధించాడు.. దీంతో ఇద్దరు స్నేహితులకు వేధింపులు పెరిగాయి.. అక్రమ కేసులు పెట్టి చంపేస్తామంటూ బెదిరించారు.. ఈ బాధలు భరించలేని సత్యం.. తమకు ప్రాణహాని ఉందంటూ మానవహక్కుల సంఘంలోకూడా ఫిర్యాదు చేశాడు.. చివరకు జీవన్‌రెడ్డి ఎన్నికల విధానాన్ని మోసం చేసి గెలిచారంటూ సత్యం హైకోర్టును ఆశ్రయించాడు..

కేసు నడుస్తుండగానే ప్రతాపం చూపిన ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి....

ఈ కేసు నడుస్తుండగానే జీవన్‌ రెడ్డి తమపై ప్రతాపం చూపాడని సత్యం తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.. కేసు వెనక్కి తీసుకోవాలంటూ తమను బెదిరించారని చెబుతున్నారు.. అయినా ఒప్పుకోకపోవడంతో తమ బిడ్డను ఇలా చంపేశారని మండిపడుతున్నారు.. ఈ కేసును పోలీసులు కావాలనే నీరు గారుస్తున్నారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.. దళిత సంఘాలు, ప్రతిపక్ష నేతల సహకారంతో కలెక్టరేట్‌ దగ్గర రిలే నిరాహారదీక్షలు చేపట్టారు.. సత్యం కేసులో నిజానిజాలు నిగ్గు తేల్చాలని అఖిలపక్షం డిమాండ్ చేస్తోంది.. అటు పోలీసులు కూడా ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.. 

17:48 - February 11, 2016

హైదరాబాద్ : టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తూ పలు అక్రమాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్‌కుమార్‌ విమర్శించారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో పలు అక్రమాలకు పాల్పడి గెలుస్తోందని ఆరోపిస్తూ అందుకు సంబంధించిన ఆధారాలు కొన్నిటిని చూపారు. టిఆర్ఎస్‌ ప్రభుత్వ అక్రమాలను ప్రజలకు చూపాలని కోరారు.  

17:46 - February 11, 2016

హైదరాబాద్ : సినీ పరిశ్రమపై కేబినెట్‌ నియమించిన సబ్‌కమిటీ తొలి సమావేశం ఏర్పాటు చేసింది. మంత్రులు తలసాని అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి కమిటీ సభ్యులు కేటీఆర్‌, తుమ్మల కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో సినీ ప్రముఖులు దాసరి నారాయణరావు, సురేష్‌బాబు, రాజేంద్రప్రసాద్‌, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు పాల్గొన్నారు.  

తెలంగాణ మున్సిపల్ చట్టం సవరింపు...

హైదరాబాద్ : తెలంగాణ మున్సిపల్ చట్టాన్ని సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ముఖ్యంగా ఎన్నికల నామినేషన్ల గడువును మూడు రోజులకు కుదిస్తున్నట్టు జీవోలో పేర్కొంది. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిశాక పరిశీలన ప్రక్రియ చేపట్టాలని తెలిపింది. నామినేషన్ల ఉపసంహరణకు ఒకరోజే గడువు ఇవ్వాలని స్పష్టం చేసింది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసిన 9వ రోజున పోలింగ్ నిర్వహించాలని, ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునే పోలింగ్ సమయాన్ని 8 గంటలుగా నిర్ణయించినట్టు వెల్లడించింది.

బరారిస్క్వేర్ లో హనుమంతప్ప పార్థివ దేహాం

ఢిల్లీ : బరారిస్క్వేర్ లో హనుమంతప్ప పార్థివ దేహాన్ని ఉంచారు. హనుమంతప్పకు రక్షణ మంత్రి, ఆర్మీ అధికారులు నివాళి అర్పించారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు కాసేపట్లో శ్రద్ధాంజలి ఘటించనున్నట్లు సమాచారం.

నారాయణ ఖేడ్ లో ముగిసిన ఎన్నికల ప్రచారం

మెదక్ : నారాయణ ఖేడ్ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. ఈ నెల 13న జరగనున్న పోలింగ్ లో ల బరిలో 8 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

16:53 - February 11, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పాలనను గాడిలో పెట్టేందుకో.. చిన్నగా పాలనా పగ్గాలను కొడుకు కేటీఆర్ కు అప్పజెప్పేందుకో తెలియదు గాని మెల్ల మెల్లగా తన వద్ద ఉన్న అదనపు శాఖలను ఇతరులకు పంచుతున్నారు. పైకి కీలకమైన శాఖల్లో అభివృద్ది ఆగిపోతుందంటూ ప్రచారం చేస్తున్నా.. క్రమంగా కేసీఆర్ రాష్ట్ర పరిపాలనపై దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రం అవతరించిననాటి నుంచి వేగం పుంజుకోని పాలన

కొత్త రాష్ట్రం అవతరించిననాటి నుంచి కూడా పాలన అంత వేగంగా సాగటం లేదు. మొదటి సంవత్సరం అంతా అధికారులు లేకపోవడంతో అనేక ఇబ్బందులు తలెత్తాయి. కొత్త రాష్ట్రం కావడం అందునా కొత్త మంత్రులు కావడం వల్ల అమాత్యులు పాలనపై పట్టు సాధించలేకపోయారు. దీంతో సంక్షేమ పథకాల రూపకల్పనకే ఇంతకాలం గడిచిపోయింది. ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ.. ఒకటో రెండో పథకాలు మాత్రమే ఆశించిన స్థాయిలో క్లిక్ అయ్యాయి. దళితులకు 3 ఎకరాల భూమి అంటూ రాజు తరహాలో గొల్కొండ కోట నుండి అట్టహాసంగా రాష్ట్ర సారథి ప్రారంభించిన పథకం పడకేసింది. కేజీ టు పీజీ ఊసే లేదు.

కీలక శాఖలు సీఎం వద్దనే..

ఇవే కాకుండా నగర అభివృద్ది కూడా అంతగా కనిపించడం లేదు. హైద్రాబాద్ ను విశ్వనగరంగా మారుస్తామంటూ ప్రచారం చేసినా ఆ శాఖ కు పూర్తి స్థాయి మంత్రి లేకపోవడం లోటుగా మారింది. పలు రకాల కీలక శాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉండడం వల్ల ఆయన అన్నింటిపై దృష్టి సారించలేకపోతున్నారన్నది వాస్తవం. అన్నిశాఖలకు న్యాయం చేయలేకపోతున్నామనే ఆలోచన కేసీఆర్ లో ఉందన్నది పలువురి నేతల వాదన. అందులో భాగంగానే తన వారసుడు కేటీఆర్ కు మున్సిపల్ శాఖ నగరఅభివృద్ది శాఖలను కట్టబెట్టారు. కీలక అనుచరుడిగా పేరున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి కి ఎస్సీ అభివృద్ది శాఖను అప్పజెప్పారు.

నారాయణ్ ఖేడ్ ఎన్నికల తర్వాత....

నారాయణ్ ఖేడ్ ఎన్నికల తర్వాత సమాచార శాఖను మంత్రి హరీష్ రావుకు.. మైనార్టీ శాఖను మహ్మద్ అలీకి కట్టబెట్టడానికి రెడీ అయ్యారు కేసీఆర్. దాంతో పాటు మిగిలిన చిన్నాచితక శాఖలను వదిలించుకుని తద్వారా మంత్రులను ఉత్సాహపరుస్తూ తాను రాష్ట్ర అభివృద్దిపై దృష్టి సారించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం సాధారణ పాలన, బొగ్గు శాఖను తన వద్ద ఉంచుకుని పూర్తి స్థాయిలో పాలనపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు.

ఇక పూర్తి స్థాయిలో రాష్ట్ర అభివృద్దికి....

ఎమ్మెల్యే ఎన్నికల్లో విజయం.. గ్రేటర్ లో తిరుగులేని విజయంతో విపక్షాలకు చోటివ్వకుండా దూసుకెళ్లున్న కేసీఆర్ .. ఇక పూర్తి స్థాయిలో రాష్ట్ర అభివృద్దికి పాటుపడాలని.. నిర్ణయించినట్లు తెలుస్తోంది.  

16:49 - February 11, 2016

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ ను ఇప్పుడు వాట్సప్ భయపెడుతోంది. అది పీసీసీ ఛీఫ్ నుండి సందేశం అంటే వణికిపోతున్నారు హస్తం నేతలు. వాట్సప్ లతో ఎంజాయ్ చేయాల్సిన నేతలు ఇంతలా ఎందుకు వణికిపోతున్నారు. అసలు కాంగ్రెస్ లో ఉత్తమ్‌ వాట్సప్ కిరికిరి ఏంటి ..?

అందరికి దగ్గరయిన సోషల్ మీడియా..

వాట్సప్ ఇప్పుడు ప్రపంచ వాప్తంగా అందరికి దగ్గరయిన సోషల్ మీడియా.. ఎలాంటి సమాచారాన్నైనా క్షణాల్లో చేరవేసే ఈ మాద్యమంతెలంగాణ కాంగ్రెస్ ను కలవరపెడుతోంది. అదేంటి ఎప్పటికప్పుడు మనుషులను దగ్గర చేస్తున్న వాట్సప్ కాంగ్రెస్ నేతల మద్య కొత్త కుంపట్లతో మరింత దూరం చేస్తోంది. దీనికి కారణం పీసీసీ ఛీఫ్‌ నుండి వస్తున్న వాట్సప్ సందేశాలు ఆజ్యం పోస్తున్నాయి.

గ్రేటర్ లో పార్టీ ఓటమికి భాధ్యతగా దానం రాజీనామా...

తాజాగా గ్రేటర్ ఎన్నికల తర్వాత ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. గ్రేటర్ అధ్యక్ష పదవికి దానం నాగేందర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఐతే దానం నాగేందర్ ఈనెల 20న టీఆర్ఎస్ లో చేరబోతున్నారంటూ బ్రేకింగ్ న్యూస్ అంటూ ఉత్తమ్‌ పోస్ట్ చేశారు. దీనిపై మీడియా వివరణ కోరగా పొరపాటున వచ్చిందని మరో మెసేజ్ పెట్టారు.

పీసీసీ పై గరంగా ఉన్న దానం బ్యాచ్...

ఈ వ్యవహారంతో దానం బ్యాచ్ అగ్గిలం మీద గుగ్గిలం అవుతోంది. నేతలు.. ఇలాంటి వ్యవహారాలు ఏమైనా ఉంటే.. వారితో చర్చించకుండా మీడియాకు లీకులు ఇవ్వడమేంటని రగిలిపోతున్నారు కార్యకర్తలు. దీనిపై ఉత్తమ్ తో తాడో పేడో తేల్చుకోవడానికిరెడీ గా ఉన్నట్లు తెలుస్తోంది.

వరంగల్ ఎన్నికల్లో 4వ స్థానం వస్తుందంటూ మెసేజ్ లు....

పార్టీ నేతలు మాత్రం ఇది అనుకోకుండా జరిగింది కాదని పార్టీ నేతలు అంటున్నారు. గతంలో వరంగల్ ఎన్నికల ప్రచారం జరుగుతుండగానే తమకు సర్వేల్లో వచ్చిన ఫలితాలను అటాచ్ చేస్తూ కాంగ్రెస్ కు 4వ స్థానం వస్తుందంటూ పోస్ట్ చేశారు.

మీడియాకు లీకులతో క్యాడర్ ను తప్పుదోవ పట్టిస్తున్నారని...

ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ప్రత్యర్థులను డిఫెన్స్ లో పడేయాల్సిన పీసీసీ ఛీఫ్ ఇలా మీడియాకు లీకులతో క్యాడర్ ను తప్పుదోవ పట్టిస్తున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తమ్ కావాలనే చేస్తున్నారని పీసీసీ ఛీఫ్ పదవి నుండి తప్పించకపోతే పార్టీ కి నష్టం జరుతుందని నేతలు అంటున్నారు.  

16:45 - February 11, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తానని.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశీస్సులతో లక్ష్యాన్ని సాధిస్తామని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ చెప్పారు. ఇప్పటికే అనేక అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రారంభించిందని..వీటిని మరింత వేగంగా.. అందరికీ అందేలా చూడటమే తమ కర్తవ్యమని ఆయన వివరించారు.

16:43 - February 11, 2016

విజయవాడ: ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్ విషయంలో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని సిపిఎం రాజధాని ప్రాంత కన్వీనర్‌ సిహెచ్‌.బాబూరావు ఆరోపించారు. ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ... అగ్రికల్చర్ ప్రొటెక్షన్‌ జోన్‌లో, గ్రీన్ బెల్ట్‌ జోన్‌లో ఒకే అంశాలు పొందుపరిచి ఉన్నాయని దీనిని బట్టి మంత్రుల అవగాహన ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. విజయవాడ నగర పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. 

16:41 - February 11, 2016

విజయవాడ : వైసిపి నుంచి వేరే పార్టీలోకి వెళ్తున్నట్లు తనపై వస్తున్న ఆరోపణలను విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎంఎల్ఎ జలీల్‌ఖాన్ ఖండించారు. కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అ మేరకు ఆయన గురువారం మీడియాతో విజయవాడలో మాట్లాడుతూ...ముస్లింలకు సంబంధించిన కొన్ని అంశాలపై చర్చించేందుకు ఈ రోజు సిఎంను కలిశానేతప్ప వేరే ఉద్దేశం ఏదీ లేదని ఆయన అన్నారు. 

రాజమౌళికి కోర్టు సమన్లు...

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రాజమౌళికి నేడు కోర్టు నుంచి సమన్లు జారీ అయ్యాయి. ఓ రియల్ ఎస్టేట్ లావాదేవీ వ్యవహారంలో రాజమౌళి మోసం చేశాడని, భువనేశ్వర్ అనే నిర్మాత కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ సమన్లు జారీ అయ్యాయి. తనకు ప్లాటు అమ్ముతానని చెప్పిన రాజమౌళి ఆపై మోసం చేశారన్నది భువనేశ్వర్ మోపిన అభియోగం. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన నాంపల్లి కోర్టు ఈ 24న విచారణకు హాజరు కావాలని రాజమౌళిని ఆదేశించింది. 

16:31 - February 11, 2016

ఢిల్లీ : మనసు దోచే గులాబీలు, ప్రకృతి కాంత పసుపు చీర కట్టుకున్నట్లు పరుచుకున్న పుష్పాలు, ఎటు చూసినా కళ్లకు విందు భోజనమే. దేశ ప్రథమ పౌరుడి నివాసంలో ఉద్యాన వనం నిజంగా అందాల వనమే. సందర్శకులను చూపు తిప్పుకోనీకుండే చేసే పుష్పరాజాల సమాగమమే మొఘల్ గార్డెన్స్. సందర్శకుల కోసం రాష్ట్రపతి అధికారికంగా ఈ రోజు మొఘల్ పూదోటను ప్రారంభించనున్నారు.

అందమైన ఉద్యానవనాల్లో ఒకటి మొఘల్ గార్డెన్స్. .....

ప్రపంచంలోని అత్యంత అందమైన ఉద్యానవనాల్లో ఒకటి మొఘల్ గార్డెన్స్. ప్రథమ పౌరుని నివాసంలో ప్రకృతి రమణీయతకు అద్దం పడుతోంది. 13ఎకరాల్లో ఉన్న పూదోటలో తామరపూల ఆకారంలో అందమైన ఆరు ఫౌంటైన్‌లు ఉన్నాయి. ప్రకృతిలో లభించే అన్ని రకాల వర్ణాల్లోని పూలు ఈ ఉద్యానవనంలో దర్శనమిస్తాయి. వీక్షకులకు కన్నలపండుగ చేస్తాయి.

300 ఎకరాల్లో రాష్ట్రపతి ప్రాంగణం...

300 ఎకరాలున్న రాష్ట్రపతి ప్రాంగణంలో ఐదువేల చెట్లున్నాయి. దాదాపు 160 రకాల పూలమొక్కలు చూపరులకు కనువిందు చేస్తాయి. మొఘలుల సంప్రదాయం ఆ తర్వాత పాలించిన బ్రిటీష్ పద్ధతుల సమ్మేళనమే ఈ ఉద్యానవనం. సర్‌ ఎడ్వర్ట్‌ ల్యూటిన్స్‌ ఈ ఉద్యానవనం రూపకర్త.

10 సంవత్సరాలనుండి 48 లక్షల మంది సందర్శన...

గడిచిన 10 సంవత్సరాలనుండి 48 లక్షల మంది ఈ మొఘల్‌ గార్డెన్‌ను సందర్శించారు. ప్రతి సోమవారం మినహా ప్రతిరోజు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు సందర్శించేందుకు రాష్ట్రపతి భవన్ సిబ్బంది ఏర్పాట్లు పూర్తిచేసింది. ప్రత్యేకంగా రైతులు, వికలాంగులు,పోలీసులు,రక్షణ శాఖ అధికారులు మొగల్ గార్డెన్ సందర్శించేందుకు మార్చి 20 తేదిని కేటాయించారు. సామాన్య ప్రజానీకం గేట్ నంబర్ 35 ద్వారా మొగల్ గార్డెన్ ను సందర్శించవచ్చు.

16:27 - February 11, 2016

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ భార్య జశోదా బెన్‌ మరోసారి ఆర్టీఐ కార్యాలయం మెట్లెక్కారు. జశోదా బెన్‌ పాస్‌పార్ట్‌ కోసం గత సంవత్సరం దరఖాస్తు చేసుకోగా.. అందులో మోడీతో పెళ్లైనట్లుగా డాక్యుమెంట్లు లేవంటూ సంబంధిత అధికారులు పాస్‌పోర్టును గత నవంబర్‌లో తిరస్కరించారు. గతంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన నరేంద్ర మోడీ తన పాస్‌పోర్ట్‌లో భార్యకు సంబంధించి ఎలాంటి వివరాలు పొందుపరిచారో తెలపాలంటూ జశోదా బెన్‌ ఆర్టీఐ అధికారులను కోరారు.  

అండర్ -19 ప్రపంచకప్ ఫైనల్లో వెస్టిండీస్

హైదరాబాద్ : అండర్ -19 ప్రపంచకప్ ఫైనల్ కు వెస్టిండీస్ చేరింది. బంగ్లాదేశ్ పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ నెల 14వ ఫైనల్ లో భారత్ తో వెస్టిండీస్ తలపడనుంది.

45.129 ఎకరాల్లో ఏపీ సచివాలయం

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయాన్ని మొదట అనుకున్నట్టుగా 20 ఎకరాల్లో కాకుండా 45.129 ఎకరాల్లో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. సీఆర్ డీఏ నివేదిక ఆధారంగా గుంటూరు జిల్లా వెలగపూడిలో 45 ఎకరాల్లో సచివాలయ ప్రాంగణాన్ని నిర్మించేందుకు ఆమోదం తెలిపినట్టు పేర్కొంది. వాటిలో 27.08 ఎకరాల్లో సమీకృత ప్రభుత్వ భవన సముదాయం, 18.17 ఎకరాల్లో ప్రజా సదుపాయాల భవనాలను నిర్మించనున్నట్టు తెలిపింది. మరోవైపు సచివాలయ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.

16:14 - February 11, 2016

హైదరాబాద్ : పెట్టుబడి పెట్టారు..అంతా సవ్యంగానే సాగింది..కాని అందులోనే కొన్ని తేడాలు.. భారీ ఎత్తున పెట్టుబడి పెట్టిన ముగ్గురు మిత్రుల మధ్య వైరం మొదలయింది...ఆ మాటల యుద్దం కాస్త ఘర్షణలకు దారి తీసింది..కలుసుకుందామనుకున్నవారి మధ్య మాటా మాటా పెరిగింది..అప్పటికే ఒకరికొకరు మోసం చేసుకున్నారన్న ఆవేదనలో ఉన్న ముగ్గురి మధ్య ఆవేశాలు పెరిగాయి... ఆ క్షణంలో జరిగిన ఘటన మర్చిపోని చేదు జ్ఞాపకంగా మిగిలింది... నగరంలో జరిగిన కాల్పుల కేసులో పోలీసుల శోధనలో వెల్లడయిన ఆసక్తికర విషయాలు ఎన్నో...

హైదరాబాద్‌ కాల్పుల కేసులో విచారణ వేగం...

హైదరాబాద్‌ : నగరంలోని హిమాయత్‌నగర్‌లో రెండ్రోజుల క్రితం జరిగిన కాల్పుల కేసు కొలిక్కి వస్తుంది...ఇప్పటికే లోతైన దర్యాప్తు చేసిన పోలీసులు ప్రాథమికంగా సమాచారం సేకరించారు.. కాల్పులకు కారణం ఆస్పత్రి నిర్మాణం..ఏర్పాటు విషయంలో ఏర్పడిన తగాదాలు..ఆర్థిక లావాదేవీలేనని నిర్ధారించారు...ముగ్గురు డాక్టర్లైన శశికుమార్,సాయికుమార్, ఉదయ్‌కుమార్‌ల మధ్య గొడవలు ఆ తర్వాత కాల్పులు..కాల్పులు జరిపిన డాక్టర్‌ శశికుమార్‌ ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది...దీనిపై పోలీసులు అన్ని అనుమానాలను నివృత్తి చేసేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పూర్తిగా వివరాలను వెల్లడించారు...

కాల్పులు జరిపింది డాక్టర్‌ శశికుమారే...

వాయిస్...డాక్టర్ ఉదయ్‌కుమార్‌పై కాల్పులు జరిపి ఆ తర్వాత ఫాంహౌస్‌లో కాల్చుకున్నది డాక్టర్ శశికుమారేనని పోలీసులు తేల్చారు.. ఘటన జరిగిన తర్వాత వెంటనే డాక్టర్ ఉదయ్‌ను పోలీసులు ఆస్పత్రిలో విచారిస్తే కారులో వారు కూర్చున్న తీరు.. యాంగిల్స్‌ను బట్టి కాల్పులు జరిపింది శశినేనని నిర్ధారించుకున్నారు..అయితే డాక్టర్ శశి మాత్రం సాయికుమార్ తన రివాల్వర్‌తో కాల్పులు జరిపాడంటూ రాసిన లేఖ ఆధారంగా సైంటిఫిక్‌గా శోధన చేస్తే అతనే కాల్చాడు..కాల్చుకున్నాడని నిర్ధారణఅయినట్లు తేలింది...

డాక్టర్ శశి వెంట ఎప్పుడూ రివాల్వర్...

వాయిస్..డాక్టర్ శశికుమార్‌ తన లైసెస్డ్‌ రివాల్వర్‌ను ఎప్పుడూ వెంటపెట్టుకుంటాడని పోలీసుల విచారణలో తేలింది... కాల్పుల ఘటనకు ముందు తన పార్ట్‌నర్స్‌ అయిన డాక్టర్లను శశికుమారే ఫోన్లు చేసి రప్పించాడని...హిమాయత్‌నగర్‌లో కలుసుకుని ఆ తర్వాత కారులోనే ఆర్థిక లావాదేవీలపై గొడవ పడ్డారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేల్చారు.. ఆ సమయంలో అప్పటికే ఉన్న ఆవేదన,ఆవేశంలో డాక్టర్‌ శశికుమార్‌ కాల్పులు జరిపి తన తప్పు తాను తెలుసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు...ఈ క్రమంలోనే వెంటనే తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన చంద్రకళ వద్దకు వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది...

చంద్రకళ పాత్రపై ఆరా...

డాక్టర్ శశికుమార్‌ కాల్పులు జరిపాక వెంటనే చంద్రకళ వద్దకు వెళ్లాడు..ఆ సమయంలో మూడ్‌ బాగోలేదని చెప్పిన డాక్టర్‌ శశి డిప్రెషన్‌లో ఉన్నట్లు గుర్తించిన ఆమె తన కారులో మొయినాబాద్‌ నక్కలపల్లిలో ఉన్న ఫాంహౌస్‌కు తీసుకువెళ్లింది..అక్కడే దించేసిన ఆమె తిరిగి ఇంటికి చేరాక టీవీ చూస్తే కాల్పుల విషయం తెలిసింది..వెంటనే తన ఇంటిపై ఉన్న రిటైర్డ్‌ ఆర్మీ అధికారి సాయంతో పోలీసులకు సమాచారం అందించింది.. అప్పటికే డాక్టర్ శశికుమార్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది...అయితే చంద్రకళకు ముందే తెలిసి ఫాంహౌస్‌ తీసుకువెళ్లిందా..? లేక ఆ తర్వాత తెలిసిందాన్నది విచారణలో తేలనుంది..దీన్ని బట్టి చంద్రకళ పాత్ర ఎంత ఉంది..? వారి లావాదేవీల్లో ఆమెకు సంబంధం ఉందానేది తేలనుంది...

ఆవేదనలోంచి వచ్చిన ఆవేశం.....

ఆర్థిక లావాదేవీలతో ముగ్గురు మిత్రులైన వైద్యుల మధ్య జరిగిన వైరం చివరకు కాల్పులకు దారి తీసింది..ఆవేదనలోంచి వచ్చిన ఆవేశం..ఆ^సమయంలో ఏం చేస్తున్నామో తెలుసుకోలేని పరిస్థితుల్లో జరిగిన ఘటన వల్లే కాల్పుల కలకలం రేపిందని పోలీసుల విచారణలో తేలింది...అయితే ఇందులో ఇంకా ఏమైనా కోణాలున్నాయాన్నది పోలీసుల లోతైన శోధనలో బయటపడనున్నాయి...

16:09 - February 11, 2016

హైదరాబాద్ : ప్రజలు టీఆర్‌ఎస్‌ వైపు ఉన్నందునే అన్ని పార్టీల నేతలు.. తమ పార్టీలోకి వస్తున్నారని ఎంపీ బాల్కసుమన్‌ స్పష్టం చేశారు. ఆయప గురువారం మీడియాతో మాట్లాడుతూ... రేవంత్‌రెడ్డి తొందరపడనక్కర్లేదని.. ఎటూ భవిష్యత్‌లో ఆయన కూడా టీఆర్‌ఎస్‌ గూటికి చేరాల్సిందేనని సుమన్‌ సెటైర్‌ వేశారు.

16:07 - February 11, 2016

హైదరాబాద్‌ : విద్యానగర్‌ రైల్వేస్టేషన్‌లో దారుణ ఘటన జరిగింది. దంపతులిద్దరు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. వారిద్దరు అక్కడికక్కడే చనిపోయారు. ఆ ప్రదేశంలో బీతావహ వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను గాంధీ మార్చురీకి చేర్చారు.

దొర వారిసత్రం బాలుర గురుకుల పాఠశాలలో దారుణం

నెల్లూరు : దొర వారిసత్రం బాలుర గురుకుల పాఠశాలలో పిచ్చికుక్క కరవడంతో అబ్దుల్లా అనే విద్యార్థికి రాబిస్ వ్యాధి సోకింది. వార్డెన్ నిర్లక్ష్యం వహించడంతో మతి కోల్పోయిన అబ్ధుల్లా ఏడుగురు తోటి విద్యార్థులను కరిచాడు. విషయం బయటకు రాకుండా విద్యార్థులను ఇంటికి పంపించారు.

టిడిపిలో చేరిది లేదు : జలీల్ ఖాన్

విజయవాడ : తాను టీడీపీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తలను వైసీపీ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఖండించారు. ఈ ఉదయం చంద్రబాబును కలసిన అనంతరం విజయవాడలోని గుప్త కల్యాణ మండపంలో జరిగిన ముస్లిం మేధావుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సమయంలో మీడియాతో జలీల్ మాట్లాడుతూ, టీడీపీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. టీడీపీలో చేరేందుకు తాను చంద్రబాబును కలవలేదని స్పష్టం చేశారు. ముస్లిం, మైనారిటీ గర్జన విషయంపై మాట్లాడేందుకే సీఎంను కలిశానని వివరించారు. మున్సిపల్ కమిషనర్, కలెక్టర్ సమక్షంలోనే నియోజకవర్గ సమస్యలపై చర్చించామని ఉద్ఘాటించారు.

14:57 - February 11, 2016

విజయవాడ: పట్టువదలని విక్రమార్కుడి కథ అందరూ వినే వుంటారు. ఆ ప్రాచీన విక్రమార్కుడిని తలపించే నవీన విక్రమార్కుడు ఏపీలో ఉన్నారు. ఈ లేటెస్ట్ విక్రమార్కుడు ఢిల్లీ వెళ్లి ఫలానావి కావాలని కోరతారు. వారు ఓకే అంటారు. తీరా బెజవాడొచ్చాక అవేవీ తాను పొందలేకపోతున్నారు. గత 18 నెలలుగా ఈ ఫెయిలవుతున్న విక్రమార్కుడిని పదేపదే చూస్తున్నాం. ఈసారీ ఆ ఆంధ్రా విక్రమార్కుడు ఢిల్లీ వెళ్లారు. త్వరలో శుభవార్త వింటావని హస్తిన పెద్దలు చెప్పారు. కానీ స్పష్టమైన హామీ మాత్రం దక్కలేదు. మరి ఈసారైనా విక్రమార్కుడి కల ఫలిస్తుందా.?

చేయని ప్రయత్నమంటూ లేదు.....

ఏపీని కష్టాల కడలి నుంచి ఒడ్డున పడేసేందుకు ఈ నవీన విక్రమార్కుడు చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ ఏ ఒక్క ప్రయత్నమూ ఫలించడం లేదు. ఇప్పటికి ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్లొచ్చారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ మొరపెట్టుకున్నారు. కానీ దేశాన్ని పాలిస్తున్న మోడీ మాత్రం ప్రతిసారీ హ్యాండిస్తూనే ఉన్నారు.

18 నెలలుగా ప్రజలతో ఎలా ఆడుకోవాలో....

గత 18 నెలలుగా ఏపీ ప్రజలతో ఎలా ఆడుకోవాలో అలా ఆడుకుంటోంది కేంద్రం. రాష్ట్ర విభజన నేపథ్యంలో చట్ట ప్రకారం నెరవేర్చాల్సిన హామీల విషయంలో మళ్లీ పాత పాటే పాడింది. కేంద్ర ప్రభుత్వం ఏర్పడి ఇప్పటి వరకు ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌తో సహా రెండు బడ్జెట్‌లు ప్రవేశపెట్టారు. ఈ నెల 29న మరో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధమైపోయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబుకు కేంద్రం నుంచి సరైన హామీ లభించనట్టే కనిపిస్తోంది. గత 20 నెలలుగా ఏం చెబుతున్నారో అదే విషయాన్ని మోడీ మరోసారి చెప్పారు. త్వరలో శుభవార్త అంటూ ప్రధాని మోడీ నుంచి కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు దాకా అందరూ ఊరిస్తూనే ఉన్నారు.

కీలకమైంది ప్రత్యేక హోదా. ....

ఏపీకి కావాల్సినవాటిల్లో కీలకమైంది ప్రత్యేక హోదా. ఈ విషయంలో కేంద్రం ఏపీతో దోబూచులాడుతూనే ఉంది. ప్రణాళికా సంఘం అంటూ మొదలుపెట్టి ఇప్పుడు అత్యంత ఇబ్బందికరమైన నీతి అయోగ్‌ ఊబిలోకి తోసి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర విభజన బిల్లు టైంలో ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ హామీ ఇవ్వడం దాన్ని ఖచ్చితంగా ఇస్తామని ఎన్నికల టైంలో ఎన్డీఏ చెప్పడం అందరికీ తెలుసు. తీరా బిజెపికి ఫుల్‌ మెజార్టీదక్కాక ఆ ఊసే ఎత్తడం లేదు. ఇక కాగ్‌ లెక్కల ప్రకారం మన రాష్ట్రానికి గత సంవత్సరం 16 వేల 71 కోట్ల రెవిన్యూ లోటు ఉండగా.. దానిలో గత ఏడాదికి 2వేల300 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇంకా 13 వేల 700కోట్లు ఇవ్వాల్సి ఉంది. దీంతో పాటు 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేటాయింపులు సరైన రీతిలో లేవు. వెనుకబడిన జిల్లాలకు కేటాయింపులు కూడా అంతంత మాత్రమే జరిగాయి.

విశాఖ రైల్వే జోన్‌కు సంబంధించి గత బడ్జెట్ ముందు...

ఇక విశాఖ రైల్వే జోన్‌కు సంబంధించి గత బడ్జెట్ ముందు ఎలాంటి చర్చ జరిగిందో మళ్లీ అదే చర్చ మొదలైంది. రైల్వే బోర్డు నుంచి బంతి ప్రధాని మోడీ కోర్టులో ఉన్నట్లు ఢిల్లీ వర్గాలంటున్నాయి. ఇక రాజధాని శంకుస్థాపనకు వచ్చి ఎలాంటి ప్రకటనా చేయని మోడీ ఈ సారి బడ్జెట్‌లో రాష్ట్రానికి న్యాయం చేస్తారా అంటే అనుమానమే ఎదురవుతుంది. ఇప్పటికే రాష్ట్ర విభజన జరిగి చాలా నెలలు గడిచిపోయాయి. కానీ కేంద్రం నుంచి రావాల్సినవి మాత్రం దక్కట్లేదు. ఇప్పటికైనా చంద్రబాబు సీరియస్‌గా వ్యవహరించకపోతే మొదటికే మోసం వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. కాని ఇక్కడే కొందరు వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు. ప్రధాన హామీలను పక్కనపెడితే ఏపీకి ఐఐటీ, స్మార్ట్ సిటీలు, రోడ్ల అభివృద్ధికి నిధులిచ్చారని సుజనా చౌదరితో పాటు మరికొంత మంది ఎంపీలు మోడీ సర్కార్‌ను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాటితోటే ఏపీ కష్టాలు తీరిపోతాయంటే అంతకన్నా పిచ్చిమాట మరొకటి ఉండదు.

25న రైల్వే బడ్జెట్....

ఈ నెల 25న రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. తమ రాష్ట్రానికి కావాల్సిన వాటిని చంద్రబాబు ఆ శాఖ మంత్రి సురేష్‌ప్రభుతో చర్చించారు. అయితే బడ్జెట్ ప్రతిపాదనలను గత డిసెంబర్‌లోనే పంపించాలని రైల్వే శాఖ మంత్రి స్వయంగా చెప్పినా ఏపీ సర్కార్‌ మాత్రం ఆ ప్రతిపాదనలను ఇప్పుడిచ్చింది. ఇదే టైంలో తెలంగాణ సర్కార్ నిర్ణీత గడవులోనే ప్రతిపాదనలు పంపించేసింది. దీంతో కేంద్రం తీరులాగే చంద్రబాబు వ్యవహారం కూడా ఉందని కొందరు సొంత పార్టీ నేతలే అంటున్నారట. మొత్తానికి గతంలోలాగా మోడీ శుభవార్త ప్రకటన ఈసారి కూడా ఉత్తుత్తుదే అయితే అటు టీడీపీకి ఇటు బీజేపికీ రాష్ట్ర ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. మరి మోడీ సాబ్‌ ఏంచేస్తారో చూడాలి.

14:54 - February 11, 2016

హైదరాబాద్ : ఆధునిక ప్రపంచంలో ఒత్తిడి అనేక సమస్యలకు దారితీస్తోంది. ఇలాంటి సమస్యలలో ఎంతో మంది దంపతులు సంతానలేమితో బాధపడుతున్నట్లు సర్వేలు తేలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంతాన లేమి అంటే ఏమిటి? దీనికి పరిష్కారమార్గాలేమిటో ఇవాళ్టి హెల్త్ కేర్ లో వైద్య నిపుణులు అందించిన వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

14:50 - February 11, 2016

విజయవాడ: ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్‌ డిమాండ్‌ నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ను ఏర్పాటుచేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. కాని ఆ హామీ ఇప్పటి వరకు అమల్లోకి రాలేదు. సోమవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక రైల్వే జోన్‌ అంశాన్ని కూడా ప్రధాని, రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో రైల్వే జోన్‌పై కేంద్రం చర్యలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. రానున్న రైల్వే బడ్జెట్‌లో దీనిపై ప్రకటన చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.

ప్రధాని కార్యాలయం నుంచి రైల్వే శాఖకు ఆదేశాలు....

విశాఖలో రైల్వేజోన్‌ ఏర్పాటుపై ప్రధాని కార్యాలయం నుంచి రైల్వేశాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో రైల్వేజోన్‌ ఏర్పాటుపై రైల్వేశాఖ సాంకేతిక కమిటీ సమావేశమైంది. మిట్టల్‌ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా జోన్‌ ఏర్పాటుపై చర్చ జరిగింది. త్వరలో జరగనున్న కేబినెట్‌ సమావేశానికి రైల్వేజోన్‌ ఏర్పాటుపై ప్రతిపాదనలు పంపే అవకాశం ఉంది.

పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టులపైనా కేంద్రం సానుకూలం!

ప్రత్యేక రైల్వే జోన్‌తో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. రైల్వే ఆధారిత పరిశ్రమలు వచ్చే అవకాశముంది. వేలాది మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. మరోపక్క రాష్ట్రంలోని పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టులపైనా కేంద్రం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాకినాడ-కోటిపల్లి-నరసాపురం రైల్వేలైన్‌కు కేంద్రం అంగీకారం తెలిపినట్లు సమాచారం. మరి విశాఖ రైల్వే జోన్‌ హామీని కేంద్రం నిజంగా నెరవేరుస్తుందా..పెండింగ్‌ ప్రాజెక్టులకు మోక్షం కలుగుతుందా లేదా అనేది రైల్వే బడ్జెట్‌ వరకు వేచి చూడాల్సిందే. 

14:49 - February 11, 2016

ముంబై : స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ట్రేడవుతోంది. మూడురోజులుగా భారీగా నష్టపోయిన సెన్సెక్స్.. ఇవాళ 500పాయింట్లు క్షీణించింది. ఉదయం 200 పాయింట్ల నష్టంతో ట్రేడైన సెన్సెక్స్‌... మిడ్ సెషన్ తర్వాత భారీగా అమ్మకాలకు దిగింది. ఐరోపా మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభం కావడంతో.. దేశీయంగా సెంటిమెంట్ క్షీణించింది. దీంతో సూచీ 500 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టి 130 పాయింట్లు కోల్పోయింది. బ్యాంకింగ్, ఆటోమోబైల్, మెటల్స్, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో భారీగా అమ్మకాలు జరుగుతున్నాయి. గత 4 రోజుల్లో సెన్సెక్స్ వేయి పాయింట్లకు పైగా నష్టపోయింది. 

14:48 - February 11, 2016

కృష్ణా : బెజవాడలోని ఓ వంతెన కింద పోలీసులు తచ్చాడుతున్నారు....ఆ వంతెన కింద చెట్ల పొదల్లో వెతుకుతున్నారు... ఏం పొగొట్టుకున్నారు.. దేనికోసం వెతుకుతున్నారు... వంతెనపై నుంచి చూస్తున్నవారికి అర్థం కాలేదు..ఆ తర్వాత కొద్ది సేపటికి పోలీసులు వెతుకుతున్నది దొరికింది.. అంతే ఆ మూటను పట్టుకుని గట్టుపైకి వచ్చి తెరిచి చూశారు..అది చూసిన జనం షాక్‌ అయ్యారు..ఆ మూటలో ఏముందో తెలుసా..? వేయి రూపాయల నోట్ల కట్టలు...దాదాపు 15 లక్షలు... ఆ డబ్బు ఎక్కడిది...?

ఇంటర్‌ నుంచి దోస్తానా...

స్కార్ప్‌లు కట్టుకుని కన్పించకుండా మేనేజ్ చేస్తున్న వీరిద్దరిలో ఒకరు శిరీష...బీబీఎం రెండో ఏడాది చదువుతోంది...ఇక మరో అమ్మాయి షీలా...ఏంబీఏ చదువుతోంది..వీరిద్దరూ విజయవాడ,ఉయ్యూరులకు చెందినవారే... ఇద్దరూ ఇంటర్‌ చదువుతున్న రోజుల నుంచి స్నేహితులు...అలా ప్రాణస్నేహితులయ్యారు..అన్నీ పంచుకునేవారు..ఇద్దరూ కలిసే ఎంజాయ్ చేసేవారు....ఇలా విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ వీరు అప్పులు కూడా చేశారు....

30 వేలు అప్పు చేసిన షీలా...

ఈనెల 7వ తేదీన శిరీష బాబాయి రమేష్‌ వద్ద 20 లక్షల నగదు ఉన్నట్లు తెలుసుకుని ఆమె వెంటనే రావాలంటూ చెప్పడంతో కారులో వెళ్లాడు...బందరురోడ్డులో వెయిటింగ్‌లో ఉన్న శిరీషను రమేష్ కలిశాడు.. అయితే అప్పటికే మరో స్నేహితుడితో షీలా మరో కారులో వీరిని ఫాలో చేసింది...

రెండుసార్లు ప్రయత్నం విఫలం...

ఇక బందర్‌రోడ్డు నుంచి అక్కడక్కడా ఆగుతూ వెళ్తున్న శిరీష,రమేష్‌లను షీలా ఫాలోచేస్తూనే వెనకాలే వెళ్లింది.. మధ్యలో బిర్యానీ తేవడం కోసం వెళ్లిన సమయంలో శిరీషనే డబ్బు సంచిని తీసుకుని షీలా కారు డ్రైవర్‌కు ఇచ్చింది..ఆ తర్వాత నగదు పోయిందని చెప్పడంతో రమేష్ పోలీసులను ఆశ్రయించాడు... మొత్తం వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తే గుట్టుబయటపడ్డంతో ఆ ఇద్దరమ్మాయిలు దొరికిపోయారు...

రెండు లక్షలు అప్పులు ...

డబ్బు దోచుకున్న షీలా, శిరీషలు అంతకు ముందు జల్సాల కోసం చేసిన అప్పులు తీర్చేసి మూడు లక్షలు షేర్లలో పెట్టుబడి పెట్టాలనుకున్నారు..మిగతా డబ్బు నగరంలోని ఓ ఆస్పత్రి వంతనె కింద చెట్ల పొదల్లో దాచిపెట్టారు... మంచి చదువులతో కన్నవారికి పేరు తీసుకురావాల్సిన అమ్మాయిలు జల్సాల కోసం తప్పటడుగులు వేశారు..దీంతో వారి భవిష్యత్తును నాశనం చేసుకోవడమేగాక కన్నవారికి తలవంపులు తీసుకువచ్చారు...

14:45 - February 11, 2016

గుంటూరు : జిల్లాలో విద్యుత్ షాక్‌కు ఇద్దరు అన్నదాతులు బలయ్యారు. జిల్లాలోని రెంటచింతల మండలం పాల్వాయి గ్రామంలో కరెంట్ మోటార్ అమర్చే క్రమంగా ప్రమాదవశాత్తు షాక్ తలిగింది. ఈ ఘటనలో మందలపు శ్రీనివాసరెడ్డి, మట్టారెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. వారితో పాటు ఉన్న కేశయ్య అనే వ్యక్తి.. గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

14:43 - February 11, 2016

హైదరాబాద్‌ : హెచ్ సియూలో ఆత్మహ్యత చేసుకున్న వేముల రోహిత్‌ పేరిట విద్యా చట్టం తీసుకురావాలన్న డిమాండ్‌తో అంబేద్కర్‌ విద్యార్ధి సంఘం బస్సు యాత్ర చేపట్టింది. ఈనెల 16 వరకు తెలంగాణ యూనివర్సిటీల్లో రోహిత్‌ ఆశయ సాధన కోసం ప్రచారం చేస్తారు. రోహిత్‌ చట్టం కోసం విద్యార్ధుల మద్దతు కూడగడతారు. ఈనెల 17న హైదరాబాద్‌ చేరుకుని హెచ్ సియూ లేదా ఉస్మానియా యూనివర్సిటీలో బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈనెల 22న ఢిల్లీ బయలుదేరతారు. 23న హస్తినలోని జంతర్‌ మంతర్‌ దగ్గర ధర్నా నిర్వహిస్తారు. 24న చలో పార్లమెంటు కార్యక్రమం చేపడతారు. ఈనెల 25న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలిసి రోహిత్‌ ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరతారు. అదేరోజు రాత్రి క్యాండిల్‌ ర్యాలీ నిర్వహిస్తారు.

 

అంబేద్కర్‌ విద్యార్ధి సంఘం ఆధ్వర్యంలో బస్సుయాత్ర

హైదరాబాద్‌ : హెచ్ సియూలో ఆత్మహ్యత చేసుకున్న వేముల రోహిత్‌ పేరిట విద్యా చట్టం తీసుకురావాలన్న డిమాండ్‌తో అంబేద్కర్‌ విద్యార్ధి సంఘం బస్సు యాత్ర చేపట్టింది. ఈనెల 16 వరకు తెలంగాణ యూనివర్సిటీల్లో రోహిత్‌ ఆశయ సాధన కోసం ప్రచారం చేస్తారు. రోహిత్‌ చట్టం కోసం విద్యార్ధుల మద్దతు కూడగడతారు. ఈనెల 17న హైదరాబాద్‌ చేరుకుని హెచ్ సియూ లేదా ఉస్మానియా యూనివర్సిటీలో బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈనెల 22న ఢిల్లీ బయలుదేరతారు. 23న హస్తినలోని జంతర్‌ మంతర్‌ దగ్గర ధర్నా నిర్వహిస్తారు. 24న చలో పార్లమెంటు కార్యక్రమం చేపడతారు.

14:39 - February 11, 2016

హైదరాబాద్ : మహిళలకు ఆలయాల్లో, మసీదుల్లో ప్రవేశంపై ఇప్పుడొక ఉద్యమం మొదలైంది. పురుషులతో సమానంగా స్త్రీలకు కూడా ప్రవేశం కల్పించాలనే డిమాండ్ వస్తోంది. సుప్రీం కోర్టు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇదే సమయంలో స్త్రీ పురుషులిద్దరూ ఆలయంలో, పండుగలో, ఈ సందర్భంగా జరిగే వేడుకల్లో సమానంగా భాగస్వాములయ్యే జాతర తెలంగాణా రాష్ట్రంలో జరుగుతోంది. అదే నాగోబా జాతర. నాగోబా జాతరలో మహిళల భాగస్వామ్యమంపై మానవి ప్రత్యేక కథనం.

గిరిజనులు తమ అస్తిత్వానికి ప్రతీకగా....

నేటికీ అడవినే నమ్ముకుని, ఆ సంపదపైనే ఆధారపడి, ప్రకృతికి దగ్గరగా జీవిస్తున్న వారెవరంటే, గిరిజనులే. దేశంలోనైనా, ప్రపంచంలోని ఏ మూలన ఉన్నా, వారు తమ అస్తిత్వాన్ని నిలుపుకునేందుకే ప్రయత్నిస్తుంటారు. తరతరాలుగా వస్తున్న తమ సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకునేందుకే తాపత్రయపడుతుంటారు. అలా అనేక సంవత్సరాలుగా గిరిజనులు తమ అస్తిత్వానికి ప్రతీకగా కూడా జరుపుకుంటున్న పండుగ నాగోబా జాతర.

నేటికీ మట్టినే నమ్ముకుని.....

మనిషికీ మనిషికీ మధ్య బంధాలు, మనీతోనే లింకవుతున్న దశలో నేటికీ మట్టినే నమ్ముకుని జీవిస్తున్న వారు ఆదివాసీలు. ఆధునిక హంగులకూ, అస్తిత్వాన్ని దూరం చేసే సంస్కృతితో బతుకులీడుస్తున్న వారు ఆదివాసీలు. అందుకే, ఆ పండగను చూస్తే, అంత సంబరంగా అనిపిస్తుంది. మాకు మీరు, మీకు మేమున్నామనే ఐక్యతారాగం వినిపిస్తుంది. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

విజయవాడ ఆర్డీఓ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

విజయవాడ : నగరంలో ఆర్డీఓ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. కార్యాలయంలోని ఎల్ ఎల్ ఆర్ విభాగంతో పాటు 24వ వార్డులోని ఆర్డీవో కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. ఏఎంయూఐ డిపార్ట్ మెంట్ ఇంఛార్జ్ నాయుడు సహా ఏడుగురు బ్రోకర్లను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. రూ. 2.13 లక్షల నగదు, సెల్ పోన్లు స్వాధీనం చేసుకుంది. బ్రోకర్ల ద్వారా ఎల్ ఎల్ ఆర్ ఇప్పిస్తున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

ముండ్లమూరు తహశీల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు

ప్రకాశం : ముండ్లమూరు తహశీల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు నిర్వహించింది. రైతు నుంచి రూ.6వేలు లంచం తీసుకుంటుండగా ముండ్లమూరు వీఆర్ఓ రమాదేవిని పట్టుకున్నారు.

వరంగల్ జిల్లాలో టిడిపికి మరో షాక్

వరంగల్ : జిల్లాలో టిడిపికి మరో షాక్ తగిలింది. గ్రేటర్ వరంగల్ టిడిపి అధ్యక్షడు ఆపార్టీకి రాజానామా చేసి టిఆర్ ఎస్ లోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

14:01 - February 11, 2016

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసుతో తనకు సంబంధం లేదని టిడిపి నేత మాగంటి గోపినాథ్ అన్నారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడనని తెలిపారు. టీఆర్ ఎస్ బెదిరించి నన్ను లొంగదీసుకోవాలని చూస్తోందని ఆరోపించారు. 

13:59 - February 11, 2016

హర్రర్‌తో సిల్వర్‌ స్ర్రీన్‌ను హడలెత్తించాడు. ఫ్యాక్షన్‌తో వెండి తెరకు పట్టం కట్టాడు. స్మగ్లర్ల జీవితాలను చిత్రంగా మార్చి చూపించాడు. అటువంటి దర్శకుడు ఇప్పుడు టాలీవుడ్‌ దరికే రానుంటున్నాడు. చేతిలో ఉన్న ఒక్క చిత్రాన్ని పూర్తి చేసి టాలీవుడ్‌కు టాటా చెప్పేందుకు సిద్ధమవుతున్నాడు.  
వంగవీటి చిత్రం తరువాత తెలుగులో సినిమాలు తీయన్న వర్మ 
తెలుగు సినిమాలకు గుడ్‌బై చెప్పేస్తానంటున్నాడు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. వంగవీటి చిత్రం తరువాత ఇక తెలుగులో సినిమాలు తీయనని వర్మ ప్రకటించాడు. హర్రర్‌, ఫ్యాక్షన్‌తో సిల్వర్‌ స్క్రీన్‌పై సంచనాలు సృష్టించిన రామ్‌గోపాల్‌ వర్మ..వంగవీటి కంటే మంచికథ ఇక దొరకదని చెప్పుకొస్తున్నాడు. విజయవాడ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఆయన దర్శకత్వం వహిస్తున్న వంగవీటి చిత్రాన్ని దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు.
విజయవాడ రౌడీయిజం బ్యాక్ డ్రాప్‌లో 
అనంతపురం ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన రక్తచరిత్రకి ఇప్పుడు విజయవాడ రౌడీయిజం బ్యాక్ డ్రాప్‌లో తీయబోతున్న వంగవీటికి ఉన్న తేడా పగకి, ఆవేశానికి ఉన్న డిఫరెన్సే అంటున్నాడు రామ్‌గోపాల్‌ వర్మ. శివతో మొదలైన తన తెలుగు సినిమా ప్రయాణం వంగవీటితో ముగించాలనుకోవడానికి ప్రత్యేక కారణమే ఉందన్నాడు వర్మ. వంగవీటి కంటే నిజమైన గొప్ప కథ మళ్లీ తన జీవితంలో దొరకదని ఖచ్చితంగా తెలుసునని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని రామ్‌గోపాల్‌ వర్మ ట్విట్టర్లో ప్రకటించాడు.
హాట్‌టాపిక్‌గా వర్మ ప్రకటన 
పలు సంచలన చిత్రానికి దర్శకత్వం వహించిన రాంగోపాల్‌ వర్మ,..తెలుగు సినిమాకి గుడ్‌ బై చెబుతానంటున్నాడు. 'శివ' సినిమాకి ఏ బ్యాక్‌డ్రాప్‌ని ఎలా అయితే ఎంచుకున్నాడో, అదే బ్యాక్‌డ్రాప్‌తో ఓ రియల్‌ స్టోరీని తెరకెక్కిస్తూ అదే తన చివరి చిత్రమని వర్మ ప్రకటించడం హాట్‌టాపిక్‌గా మారింది. విజయవాడ రౌడీ రాజకీయాలు, కాలేజీ గొడవలు..ఇవన్నీ 'శివ' సినిమాలోని ముఖ్యాంశాలు. ఇప్పుడు ఆ రౌడీ రాజకీయాలు, కులాల కుంపట్లను 'వంగవీటి' చిత్రంలో చూపనున్నాడు వర్మ. 

13:55 - February 11, 2016

ఢిల్లీ : సియాచిన్‌ గ్లేషియర్‌లో మంచు తుపానులో చిక్కుకుని ఆరు రోజులకు సజీవంగా బయడపడిన వీర జవాను హనుమంతప్ప ఢిల్లీలోని సైనిక ఆస్పత్రిలో చనిపోయాడు. సియాచిన్‌లో  సహాయ చర్యలు చేపట్టిన ప్రత్యేక సైనిక బృందాలు మంచును తొలగిస్తున్న సమయంలో  హనుమంతప్ప  బయటపడ్డారు. కొనవూపిరితో ఉన్న హనుమంతప్పను ముందుగా జమ్ముసైనిక ఆస్పత్రికి తరలించి, అక్కడ నుంచి ఢిల్లీ తీసుకొచ్చారు. ఢిల్లీలోని సైనిక అస్పత్రి వైద్యలు మూడురోజులు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఇవాళ మధ్నాహ్యం కన్నుమూశాడు.
 

 

13:53 - February 11, 2016

రాజకీయాల్లో సిద్ధాంతాలు లేవని, విలువలు పతనమయ్యాయని ది హన్స్ ఇండియా చీఫ్ ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ అన్నారు. గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పార్టీల్లో ఎవరొస్తే వారిని చేర్చుకుంటున్నారని తెలిపారు. రాజకీయంలో ప్రతిపక్షం ఉండాలని.. అప్పుడే ప్రభుత్వం తప్పులు తెలుస్తాయన్నారు. పార్టీలు మారడం, రాజకీయాలు ముఖ్య కాదని ప్రజల జీవితాలను మార్చాలన్నారు. ఎన్నికలు, గెలుపు, ఓటములు, పార్టీలు మారడం ముఖ్యం కాదని...
ప్రజల జీవితాల గురించి..ఆలోచించాలని చెప్పారు. మౌలిక సమస్యలను పరిష్కరించాలని కోరారు. మరిన్ని వివరాలను ఆయన మాటల్లోనే...

రాజకీయాల్లో సిద్ధాంతాలు లేవు

పార్టీలకు కార్యకర్తల పట్ల, నాయకులకు పార్టీల పట్ల కమిట్ మెంట్ లేదు. పార్టీలు, కార్యకర్తల మధ్య సంబంధాలు వ్యాపార, వాణిజ్య సంబంధాలుగా మారాయి. రాజకీయాల్లో సిద్ధాంతాలు లేవు. విలువలు పతనమయ్యాయి. పార్టీల్లో ఎవరొస్తే వారిని చేర్చుకుంటున్నారు. కొత్తగా చేరిన వారు ఉన్నత పదువులు వస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో తుపాకీ, లాఠీ దెబ్బలు తిన్న వారు అక్కడే ఉన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత టీఆర్ ఎస్ లోకి వచ్చిన వారు... మంత్రులు, ఎమ్మెల్యేలు అయ్యారు. 2018 కల్లా టీఆర్ ఎస్ పట్ల కూడా వ్యతిరేకత పెరుగుతుంది. ఇప్పుడు టీఆర్ ఎస్, కేసీఆరక్ పొగుడుతూ పార్టీలో చేరిన వారే.. రేపు తిడుతూ బయటికి వస్తారు. రాజకీయ సీతాకోక చిలుకలు రివ్వున ఎగిరిపోతాయి. కేసీఆర్ ను తిట్టుకుంటూ వెళ్లిపోతారు.

ప్రతిపక్షమే లేకుండా..
 టీఆర్ ఎస్ రాజకీయ దాదాగిరి చేస్తోంది. టీఆర్ ఎస్ లోకి కొత్తగా వచ్చిన వారు ఎమ్మెల్యేలు అవుతున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలని కేసీఆర్ యోచినస్తున్నాడు. ప్రతిపక్షమే లేని రాజకీయం తెలంగాణ సమాజాకి, ప్రజలు ప్రమాదకరమే అవుతుంది. గతంలో ఇందిరాగాంధీ ఎమెర్జెన్సీ సమయంలో తనకు ఎదురు లేకుండా చేసింది. కానీ తర్వాత ఆమె ప్రభుత్వం పడిపోయింది. ఇప్పుడు మోడీ పరిస్థితి కూడా అలాగే ఉంది. రాబోయే ఎన్నికల్లో గుజరాత్ లో కూడా బిజెపి ఓడిపోతుంది. రాజస్థాన్ తోపాటు బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఆ పార్టీ ఓడిపోతుంది. అందుకని ప్రశ్నించే వారిని లేకుండా చేస్తే.. తనకు నిజం తెలియదు. ప్రతిపక్షాలు, మీడియా రాబోయే సంక్షోభపు ప్రమాద ఘంటికలు మోగిస్తాయి. అందరు టీఆర్ ఎస్ లో చేరినప్పుడు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు లేరు. ప్రజల్లో ఉండే అసహనం, అసంతృప్తిని గుర్తించి.. సమస్యలను పరిష్కరిస్తే.... అధికారి పార్టీ మళ్లీ గెలుస్తుంది. కేసీఆర్ చేస్తాడని ఆశ, నమ్మకం ప్రజల్లో ఉంది. 

టీడీపీ నుంచి పెద్దస్థాయిలో టీఆర్ ఎస్ లోకి

టీఆర్ ఎస్ లోకి టీడీపీ నుంచి పెద్దస్థాయిలో నేతలు వెళ్తున్నారు. కాంగ్రెస్ నుంచి పెద్ద స్థాయిలో టిఆర్ ఎస్ లోకి పోవడం లేదు.. అయితే టీడీపీకి జెన్యూపరమైన సమస్య ఉంది. టీటీడీపీ ఆంధ్రా నేతల చేతుల్లో ఉంది. ఆంధ్రా నేతల కిందనే టీడీపీ నేతలు పని చేయాలి. ఎపి, తెలంగాణల మధ్య ఇంకా అనేక సమస్యలు, వివాదాలున్నాయి. టీటీడీపీ అనివార్యంగా ఎపి ప్రయోజనాల కోసం మాట్లాడాలి. టీడీపీ, బీజేపీ కలవాల్సివస్తుంది. 
టిడిపి కార్యకర్తలో నిరుత్సాహం 
చంద్రబాబు, కేసీఆర్ లు కలవడంతో టిడిపి కార్యకర్తలో నిరుత్సాహం కలిగింది. రేవంత్ రెడ్డి మాట్లాడినట్లుగా చంద్రబాబు మాట్లాడడం లేదు. గతంలో టీఆర్ ఎస్, కేసీఆర్ లపై ఘాటైన విమర్శలు చేసే వారు ఇప్పుడు చేయడం లేదు. 
ఎప్పుడు పరిస్థితి ఒకేలా ఉంటుందని అనుకోలేము. రెండు స్థానాలున్న బిజెపి అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో టిడిపి క్లోజ్ అయిందని చెప్పలేము. కానీ టిడిపి తీవ్రమైన రాజకీయ అవరోధాలను ఎదుర్కొంటుంది. 

నారాయణఖేడ్  ఉప ఎన్నిక..

నారాయణఖేడ్ లో కాంగ్రెస్ లో రెండు గ్రూపులున్నాయి. చాలా కాలంగా వారి మధ్య వివాదాలున్నాయి..
నారాయణఖేడ్ చాలా వెనుకబడిన ప్రాంతం. గిరిజనులు ధీనస్థితిలో ఉన్నారు. తీవ్ర నీటి కటకట ఉంది.  

ప్రజల జీవితాలను మార్చాలి..

ఎన్నికలు, గెలుపు, ఓటములు, పార్టీలు మారడం ముఖ్యం కాదు. ప్రజల జీవితాల గురించి..ఆలోచించాలి. మౌలిక సమస్యలను పరిష్కారం చేయాలి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

13:25 - February 11, 2016

స్వార్థ ప్రయోజనాలు, పదవుల కోసం పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని వక్తలు తెలిపారు. ఇందే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టిడిపి అధికార ప్రతినిధి శ్రీరాములు, టీఆర్ ఎస్ అధికార ప్రతినిధి రాకేష్, బిజెపి అధికార ప్రతినిధి ఎస్.కుమార్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

13:11 - February 11, 2016

బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ అధ్యక్షులు ప్రొఫెసర్ మురళీమనోహర్  డిమాండ్ చేశారు. ఇదే అంశంపై జనపథం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 'బీసీ సబ్ ప్లాన్ కోసం తెలంగాణలో ప్రారంభమైన బస్సు యాత్ర నిన్న హైదరాబాద్ లో ముగిసింది. ఈ యాత్రలో పాల్గొన్న మురళీ మనోహర్ తన అనుభవాలను తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

13:05 - February 11, 2016

బెంగళూరు : భారత సాంకేతిక రాజధాని బెంగళూరు చిరుతల సంచారం ఎక్కువయ్యింది. గత రెండు మూడు రోజులుగా వివిధ ప్రాంతాల్లో వీటి సంచారాన్ని ప్రజలు గుర్తించారు. నగర శివారల్లోని  వైట్‌ఫీల్డ్‌లోని  నల్లురుహళ్లి  ప్రాంతంలో  ఒక చిరుత సంచారం కనిపించింది. మంగళవారం రాత్రి నుంచి మూడు పెద్ద చిరుతల కోసం అటవీ సిబ్బంది గాలిస్తున్నా అవి వారి వలకు చిక్కడంలేదు.  తలదాచుకునేందుకు  పలు ప్రాంతాల్లో నక్కుతూ  ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. మరో రెండు చిరుతలు కూడా విబ్‌గ్యార్ హై మరతహళ్లి  ప్రాంతంలో తిరుగుతున్నట్టు  గుర్తించారు.  దీంతో ఈ ప్రాంతంలోని  135 స్కూళ్లను మూసివేస్తున్నట్టు కర్ణాటక విద్యాశాఖ అధికారులు తెలిపారు. అయితే ఉపాధ్యాయులు యధావిథిగా  విధులకు హాజరవుతున్నారు.  కాగా, చిరుతలను బంధించేందుకు అటవీ సిబ్బంది అక్కడక్కడా బోనులను ఏర్పాటు చేశారు.

 

13:01 - February 11, 2016

కరీంనగర్ : అప్పుల బాధ భరించలేక కరీంనగర్‌ జిల్లాలో ఓ మహిళా రైతు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. జిలాల్లోని వీణవంక మండలం పోతిరెడ్డిపల్లిలో ఆ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందినా కారుపాకల రమ భర్త... రవి అంధుడు. వీరికి ఇద్దరు పిల్లలు. కుటుంబ పోషణ కోసం తమకున్న 40 గుంటల భూమిలో పత్తిసాగు చేశారు. పంటసాగు కోస లక్ష రూపాయల అప్పు చేశారు. ఇచ్చిన అప్పు తిరిగి చెల్లించాలంటూ ఒత్తిడి చేయడంలో మనోవేదనకు గురైన రమ   వారం  రోజుల క్రితం పురుగు మందుతాగి ఆత్మహత్యా యత్నం చేసుకుంది. జమ్మికుంటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న రమను కాపాడేందుకు ఆర్ధిక సహాయం చేయాలని  కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. 

 

12:58 - February 11, 2016

హైదరాబాద్ : మధ్యాహ్నం 3గంటలకు టీటీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. తాజా పరిణామాలపై చంద్రబాబు వారితో చర్చించనున్నారు. ఈ భేటీకి ఎల్.రమణ, రేవంత్ రెడ్డి హాజరై.. తాజా పరిణామాలను వివరించనున్నారు. 

 

మ.3గం.కు టీటీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం

 హైదరాబాద్ : మధ్యాహ్నం 3గంటలకు టీటీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. తాజా పరిణామాలపై చంద్రబాబు వారితో చర్చించనున్నారు. ఈ భేటీకి ఎల్.రమణ, రేవంత్ రెడ్డి హాజరై.. తాజా పరిణామాలను వివరించనున్నారు. 

12:54 - February 11, 2016

హైదరాబాద్ : వైపిపి నుంచి మరో వికెట్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీకి చెందిన విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్.. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. మంత్రి దేవినేనితో కలిసి... చంద్రబాబును క్యాంప్ కార్యాలయంలో కలిశారు. 

12:50 - February 11, 2016

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ కు.. ఓటుకు నోటు కేసులో నోటీసులు జారీ చేసే అవకాశముంది. స్టీఫెన్‌సన్‌కు రేవంత్ రెడ్డి ఇచ్చిన నగదు... గోపీనాథ్ సమకూర్చినట్టు ఏసీబీ... ఆధారాలు సేకరించింది. 

చిక్కుల్లో ఎమ్మెల్యే మాగంటి

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ కు.. ఓటుకు నోటు కేసులో నోటీసులు జారీ చేసే అవకాశముంది. స్టీఫెన్‌సన్‌కు రేవంత్ రెడ్డి ఇచ్చిన నగదు... గోపీనాథ్ సమకూర్చినట్టు ఏసీబీ... ఆధారాలు సేకరించింది. 

12:44 - February 11, 2016

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ మేయర్ గా బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ గా బాబా ఫసియుద్దీన్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవికి ఇతర నామినేషన్ లు రాలేదు. దీంతో మేయర్ గా బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ గా ఫసియుద్దీన్ లు ఏకగ్రీవంగా ఎన్నికయినట్లుగా ప్రిసైడింగ్ అధికారి రాహుల్ బొజ్జా ప్రకటించారు. మొదటగా 150 మంది కార్పొరేటర్లతో రాహుల్ బొజ్జా ప్రమాణస్వీకారం చేయించారు. తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. మొదటగా తెలుగు మాట్లాడే కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం మేయర్ గా కార్పొరేటర్ బొంతు రామ్మోహన్ పేరును 9వ డివిజన్ కార్పొరేటర్ కవితారెడ్డి ప్రతిపాదించారు. ఆమె ప్రతిపాదనను మీర్ పేట డివిజన్ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య బలపరిచారు. వేరెవ్వరూ మేయర్ పదవికి నామినేషన్ వేయలేదు. దీంతో మేయర్ గా బొంతు రామ్మోహన్ ఏకగ్రీంగా ఎన్నికయినట్లు ప్రిసైడింగ్ అధికారి రాహుల్ బొజ్జా ప్రకటించారు. తదనంతరం డిప్యూటీ మేయర్ గా బోరబండ 103 వ డివిజన్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ పేరును అమీర్ పేట.. 98వ డివిజన్ కార్పొరేటర్ మన్నె శేషకుమారి ప్రతిపాదించింది. ఆమె ప్రతిపాదనను రాంనగర్ 87వ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి బలపరిచారు. డిప్యూటీ మేయర్ పదవికి కూడా వేరే నామినేషన్ ను ఎవరూ దాఖలు చేయలేదు. దీంతో డిప్యూటీ మేయర్ గా బాబా ఫసియుద్దీన్ ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు రాహుల్ బొజ్జా ప్రకటించారు. అయితే మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ లకు ఎంఐంఎం కార్పొరేటర్లు మద్దతు తెలిపారు.

గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ మేయర్ గా బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ గా బాబా ఫసియుద్దీన్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

నేడు సినిమా రంగం అభివృద్ధిపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ..

హైదరాబాద్ : సినిమా రంగం అభివృద్ధిపై ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అత్యక్షతన సబ్ కమిటీ సమావేశం కానుంది. 

నేడు గుంటూరు, ప్రకాశం జిల్లాలో జగన్ పర్యటన

హైదరాబాద్ : నేడు గుంటూరు, ప్రకాశం జిల్లాలో వైసిపి అధినేత జగన్ పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 

నేటి నుంచి హెచ్ సీయూ విద్యార్థుల బస్సుయాత్ర

హైదరాబాద్ : నేటి నుంచి హెచ్ సీయూ విద్యార్థుల బస్సుయాత్ర చేయనున్నారు. ఉదయం 10 గంటలకు క్యాంపస్ నుంచి రెండు బస్సులు బయల్దేరనున్నాయి. ఎపి, తెలంగాణల్లోని వర్సిటీల్లో బస్సుయాత్ర సాగనుంది. రోహిత్ మృతికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. 

Don't Miss