Activities calendar

28 March 2016

21:35 - March 28, 2016

ముంబై : స్టాక్‌మార్కెట్ మరోసారి బేర్ మంది. గత 4 సెషన్లలో లాభాలు చూసిన మార్కెట్ ఇవాళ భారీగా నష్టపోయింది. సెన్సెక్స్.. 371 పాయింట్లు నష్టపోయింది. అమెరికాలో వడ్డీరేట్లు పెంచుతారన్న భయం, దేశీయంగా వచ్చేవారం ఆర్బీఐ మీటింగ్ నేపథ్యంలో సెంటిమెంట్ క్షీణించింది. దీంతో మార్కెట్ నష్టాల్లో ప్రారంభమైంది. ఓ దశలో 400 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ చివరకు 371 పాయింట్లు కోల్పోయింది. ఈ సూచీ 24వేల 9వందల 66 పాయింట్ల వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 101 పాయింట్లు పతనమై.. 7వేల 6వందల 15 వద్ద క్లోజైంది. ఎన్ఎస్ఈలో వేదాంత అత్యధికంగా 9శాతం క్షీణించింది. హిండాల్కో, టాటా స్టీల్, సన్ ఫార్మా, సెబీ 4 నుంచి 8 శాతం పడిపోయాయి. కోటక్ మహీంద్రా, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, బాష్ స్వల్పంగా పెరిగాయి.

21:33 - March 28, 2016

ఢిల్లీ : కోల్‌ స్కాం కేసులో ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తొలి తీర్పు వెలువరించింది. ఈ కేసులో జార్ఖండ్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్, ఆ సంస్థ ఇద్దరు డైరెక్టర్లు ఆర్.ఎస్. రంగ్తా, ఆర్సీ రంగాలను కోర్టు దోషులుగా తేల్చింది. తప్పుడు ద్రువపత్రాలను సమర్పించి వీరు విలువైన గనులను దక్కించుకున్నట్లు కోర్టు నిర్థారించింది. ప్రస్తుతం బెయిల్ పై ఉన్న వీరిని కస్టడీలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. మార్చి 31న వెలువరించనున్న తుది తీర్పులో న్యాయమూర్తి వీరికి శిక్ష ఖరారు చేయనున్నారు.

21:32 - March 28, 2016

అప్ఘనిస్తాన్ : ఉగ్రవాదులు విజృభించారు. ఆ దేశ పార్లమెంట్‌ భవనంపై ఉగ్రవాదులు నాలుగు రాకెట్లతో దాడులు చేశారు. ఈ రాకెట్లు పార్లమెంటు ఆవరణలో పేలాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్టు సమాచారం లేదు. భారత్ నిర్మించిన ఈ భవనాన్ని గత డిసెంబర్‌లోనే ప్రధాని మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. 

మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్న కేటీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులతో కేటీఆర్ భేటీ కానున్నారు. 

రేపు ఢిల్లీకి వెళ్లనున్న టి.కాంగ్రెస్ ప్రతినిధి బృందం..

ఢిల్లీ : తెలంగాణ కాంగ్రెస్ ప్రతినిధి బృందం రేపు ఢిల్లీకి వెళ్లనుంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని బృందం కలువనుంది. హెచ్ సీయూ ఘటనలను రాష్ట్రపతి దృష్టికి తేనున్నారు. 

బ్రస్సెల్స్..అదృశ్యమైన ఇన్ఫోసిస్ ఉద్యోగి మృతి..

ఢిల్లీ : బ్రసెల్స్ లో అదృశ్యమైన ఇన్ఫోసిస్ ఉద్యోగి రాఘవేంద్రన్ మృతి చెందినట్లు భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. బ్రస్సెల్స్ లో బాంబు దాడుల అనంతరం రాఘవేంద్రన్ అదృశ్యమైన సంగతి తెలిసిందే. 

మౌలాలీలో యువతి ఆత్మహత్య..

హైదరాబాద్ : మౌలాలి ఆర్టీసీ కాలనీలో రీనా (23) అనే యువతి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియుడు డేంజిల్ మోసం చేశాడని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంది. 

శాసనసభ్యుల ఇళ్ల కేటాయింపుపై భేటీ..

హైదరాబాద్ : శాసనసభ్యులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో శాసనసభ్యుల భేటీ జరిగింది. మూడు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు పరిశీలించాలని నిర్ణయం తీసుకుంది. ఒక్కో శాసనసభ్యుడికి 500 గజాలు ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. 

21:23 - March 28, 2016

విజయవాడ : అమరావతికి ఉద్యోగుల తరలింపునపై ఇంకా స్పష్టత రాలేదు. మంత్రి నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్‌లతో ఇవాళ ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమయ్యారు. తొలిదశలో ఎంతమంది హెచ్ వోడీలను రాజధానికి పంపిస్తారన్న అంశంపై స్పష్టత లేకపోవడంతో ఎటువంటి నిర్ణయానికి రాలేకపోయారు. దీంతో ఏప్రిల్‌2న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఉద్యోగ నేత మీడియాతో మాట్లాడారు. గత మూడు సార్ల నుండి సమావేశాలు జరుపుతున్నారని, హెచ్ వోడీలకు ఎంత స్థలం కావాలనే దానిపై స్పష్టత రాలేదన్నారు. 110 మంది లో 49 హెచ్ వోడీలకు సంబంధించిన డేటా మాత్రమే సమావేశాల్లో చెప్పడం జరిగిందన్నారు. 

21:16 - March 28, 2016

విజయవాడ : అగ్రిగోల్డ్ పై ఏపీ అసెంబ్లీలో హాట్‌హాట్‌గా చర్చ సాగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు సాగాయి. అగ్రిగోల్డ్‌ నిందితులను రక్షించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రతిపక్ష నేత జగన్‌ మండిపడ్డారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. అగ్రిగోల్డ్‌పై సీబీఐ విచారణకైనా సిద్ధమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అంశంపై చర్చ సందర్భంగా టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగింది. అగ్రిగోల్డ్ నిందితులను కాపాడేందుకు సీఎం ప్రయత్నం చేస్తారంటూ జగన్‌ ఆరోపించారు. మంత్రులు దీనికి తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించారు. చర్చకు ముందు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అగ్రిగోల్డ్‌పై ప్రకటన చేశారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలను సభకు వివరించారు. ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా అగ్రిగోల్డ్‌ డిపాజిట్లను సేకరించిందని తెలిపారు. బాధితులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని వివరించారు.

చర్చను ప్రారంభించిన జగన్...
డిప్యూటీ సీఎం ప్రకటన అనంతరం ప్రతిపక్ష నేత జగన్‌ చర్చను ప్రారంభించారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారన్నారు. అధికారంలో వచ్చాక అందుకు విరుద్ధంగా సీఎం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీబీఐతో విచారణ జరిపిస్తే నిజాలు బయటకు వస్తాయన్న భయంతోనే సీఐడీతో విచారణకు ఆదేశించారని మండిపడ్డారు. జగన్‌ వ్యాఖ్యలను మంత్రి అచ్చెన్నాయుడు ఆక్షేపించారు. అగ్రిగోల్డ్‌ అంశాన్ని రాజకీయం చేయడం సరికాదన్నారు. సీఎంపై ఆరోపణలు చేయడం దారుణమని మండిపడ్డారు. సీబీఐ విచారణకైనా తాము సిద్ధమేనని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

సవాళ్లు..
మరోవైపు అగ్రిగోల్డ్ ఆస్తులను మంత్రి ప్రతిపాటి పుల్లారావు కుటుంబ సభ్యులు కొనుగోలు చేశారని జగన్‌ విమర్శించారు. ఆస్తులను అటాచ్‌ చేశామని చెబుతున్నా...మంత్రి కుటుంబ సభ్యులు కొనుగోలు చేసిన ఆస్తులను అటాచ్‌ చేయలేదని ఆరోపించారు. జగన్‌ ఆరోపణలపై మంత్రి ప్రత్తిపాటి స్పందించారు. అగ్రిగోల్డ్ ఆస్తులతో సంబంధముందని నిరూపిస్తే ఆ భూములను వదలుకోవడానికి సిద్ధంగా ఉన్నామని సవాల్‌ విసిరారు. రుజువు చేస్తే జరిమానా కూడా చెల్లిస్తానని మంత్రి ప్రత్తిపాటి స్పష్టం చేశారు. చర్చ అనంతరం స్పీకర్‌ సభను మంగళవారానికి వాయిదా వేశారు. స్పీకర్‌ నిర్ణయంపై వైసీపీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. చర్చించేందుకు తమకు మరింత సమయం ఇవ్వలేదంటూ మండిపడ్డారు.

21:14 - March 28, 2016

పశ్చిమగోదావరి : 2018 నాటికి పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేసి తీరతామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. దీని బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని.. నిర్ణీత గడువులోగా ప్రాజెక్టు పూర్తయ్యేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని అన్నారు. నదుల అనుసంధానం ద్వారా నీటిని ఒడిసి పట్టుకున్న ప్రభుత్వం తమదేనని చంద్రబాబు పునరుద్ఘాటించారు. చరిత్రలో పట్టిసీమ ఒక బృహత్ ప్రాజెక్టుగా నిలుస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. సోమవారం, పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అక్కడి ఇంజనీర్లను అడిగి పనుల పురోగతి వివరాలను అందుకున్నారు. నదుల అనుసంధానం ద్వారా ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి.. విజయం సాధించామని ఆయనీ సందర్భంగా చెప్పారు. ఈ ప్రక్రియలో దుర్భిక్ష ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. తోటపల్లిని అభివృద్ధి చేస్తామని, ప్రజలకు తాగు, సాగునీటి ఇబ్బంది లేకుండా చూస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. రెండేళ్లలో 12 వేల కోట్ల రూపాయలను నీటిపారుదల రంగానికికేటాయించామని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. పట్టిసీమకు భుములివ్వకుండా అడ్డుపడ్డ వారికి ఇది గుణపాఠమన్నారు బాబు. భూగర్భ జలాలు వృద్ధి చెందేలా.. పంట కుంటల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రంలోని చెరువులను గొలుసుకట్టు చెరువులుగా మారుస్తామని, రెయిన్ గన్ ద్వారా మెట్టప్రాంతాలకు నీటిని అందిస్తామని చెప్పారు. ఏపీని కరువు రహిత రాష్ట్రంగా చేసేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోందని చెప్పారు.  ప్రాజెక్టునిర్మాణానికి భూములిచ్చిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని.. వారందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని చంద్రబాబు చెప్పారు. . దేశంలోనే అతితక్కువ తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం ఏపీయే నని.. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరించాలన్నారు. ప్రాజెక్టు చెంత పర్యాటకులు బసచేసేలా అత్యద్భుతమైన గార్డెన్‌ను నిర్మించాలని.. నిర్మాణ సంస్థకు సూచించారు.

ఐసీసీ నిషేధం విధించలేదు - శ్రీశాంత్..

ఢిల్లీ : తనను ఐసీసీ నిషేధం విధించలేదని, బీసీసీ నుండి గ్రీన్ సిగ్నల్ కోసం వేచి చూస్తున్నట్లు తెలిపాడు. ఇటీవలే ఆయన బీజేపీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఓ జాతీయ ఛానెల్ తో ఆయన పై వ్యాఖ్యలు చేశాడు. 

రాష్ట్రపతి పాలనపై కాంగ్రెస్ ఆందోళన..

ఉత్తరాఖండ్ : రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం పట్ల కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేస్తోంది. సోమవారం రాత్రి కాంగ్రెస్ కార్యకర్తలు కాగడాలతో నిరసన ప్రదర్శన చేపట్టింది. 

టి.శాసనసభలో 12 బిల్లులకు ఆమోదం..

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ సోమవారం 12 పద్దులకు ఆమోదం తెలిపింది. పాఠశాల విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్య, క్రీడలు - యువజన సేవలు, వైద్యం - ఆరోగ్యం, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్మిక ఉపాధి కల్పన, మత సంబంధ - ధర్మాదాయాల నిర్వహణ, అడవులు - శాస్త్రం - సాంకేతిక విజ్ఞానం - పర్యావరణం, పరిశ్రమలు - వాణిజ్యం, పర్యటన- కళలు - సంస్కృతి, సమాచార సాంకేతిక విజ్ఞానం - కమ్యూనికేషన్ల పద్దులకు సభ ఆమోదం తెలిపింది.

 

మౌలాలిలో యువతి ఆత్మహత్య..

హైదరాబాద్ : మౌలాలి ఆర్టీసీ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ప్రేమికుడు మోసం చేసినందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్‌లో వెల్లడించింది. 

ఏపీ అసెంబ్లీలో ఆరు బిల్లులకు ఆమోదం..

హైదరాబాద్ : ఏపీ శాసనసభ సోమవారం ఆరు బిల్లులకు ఆమోదం తెలిపింది. దామోదర సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం చట్ట సవరణ బిల్లు..విద్యుత్ చట్టాల సవరణ బిల్లు..భూమి పట్టాదారు పాస్ పుస్తకాల చట్ట సవరణ బిల్లు..ప్రజా గ్రంథాలయాలు..ఇంటర్ విద్య.. అటవీ చట్టం సవరణ బిల్లులకు ఆమోదం తెలిపింది. 

20:22 - March 28, 2016

తెలంగాణ రాష్ట్రం ఎట్లుంటది రేపు రేపు..? పేదల బత్కులు మార్వాల్నంటే ముందుగాళ్ల ప్రభుత్వాన్ని ఏలుతున్నోళ్ల బత్కుమారాలే..మన ముఖ్యమంత్రి సారు కొడ్కు ఏలుతున్న సిరిసిల్ల నియోజకవర్గంల.. రాను రాజు రాజుగుర్రం కంచెర గాడిదైనట్టు..సిరిసిల్లను ఏలుతున్న మన తెలంగాణ శిన్న ముఖ్యమంత్రి కల్వ కుంట్ల తారక రామారావు గార్కి.. వాట్సాప్పుల వొక నేత కార్మికుడు ఏమో మెస్సెజ్ వంపిచ్చిండట..ఆంధ్రప్రదేశ్ రాష్టంల పోలీసుల భార్యలకే రక్షణ లేకుంట పోతున్నది..లంచాలు తీస్కోకుంటె.. కొంత మంది ప్రభుత్వ ఉధ్యోగులు ఎన్కవడి పోతం అన్కున్నరు గావచ్చు.. తిర్మల తిర్పతి గుట్ట మీద దొర్కే.. తీర్థం.. అక్షింతలు.. జిలేబీ.. లడ్డూ.. ఇవ్వే గాదు.. ఎంకన్న శాతి మీద ఉన్న లచ్చిమి దేవి గుడ నకిలిదేనట..నిన్న కంగారులతో ఇండియా కిర్ కేటు...ఈ అంశాలపై టెన్ టివిలో 'మల్లన్న ముచ్చట్లు' లో మల్లన్న ముచ్చట్లు చెప్పిండు. ముచ్చట్లు చూడాలంటే వీడియోలో చూడుండి. 

20:02 - March 28, 2016

గుంటూరు : ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు తక్షణమే పరిహారం చెల్లించాలంటూ గుంటూరులో రైతులు 36 గంటల ధర్నాకు దిగారు. ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రకృతి వైపరిత్యాల కారణంగా పంటలు పండకపోవడం, గిట్టుబాటు ధరలు రావడం లేదన్నారు. వేరే దారిలేకనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రైతు సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామన్న ప్రభుత్వం వెంటనే రైతులకు చెల్లించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. 

20:00 - March 28, 2016

హైదరాబాద్ : గోకుల్ చాట్‌...లుంబినీ పార్కు లలో బాంబులు పేల్చిన ఉగ్రవాదులు వాడింది నకిలీ సిమ్‌కార్డులే...అమ్మాయిలను టీజ్ చేస్తున్న పోకిరీలు వాడేది నకిలీ సిమ్‌కార్డే... మొన్నటికి మొన్న హైదరాబాద్‌లో టెన్త్ స్టూడెంట్‌ అభయ్‌ను కిడ్నాప్ చేసి హత్య చేసిన కుర్రాళ్లు వాడింది కూడా నకిలీసిమ్‌కార్డులే.. విచ్చల విడిగా దొరుకుతున్న సిమ్‌కార్డుల వల్ల నేరాలు కూడా పెరిగిపోయాయి.  దేశభద్రతకు సవాలుగా మారిన ఎన్నో అంశాల్లో ఒకటి ఇప్పుడు సిమ్‌కార్డులు కూడా ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారో ఎవరు..ఎవరికి ఫోన్లు చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి.. వేరొకరిపేరుతో సిమ్‌కార్డులను సృష్టించి విక్రయిస్తున్న మొబైల్‌ షాపుల వారెందరో ఉన్నారు. ఇప్పటికే ఈ విషయం తేలిపోయింది. నకిలీ సిమ్‌కార్డులను తీసుకుంటున్నవారు ఇచ్చే కాసులకు కక్కుర్తి పడుతున్న నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. ఆ నేరం జరిగాక పోలీసులు ఇన్‌వెస్టిగేషన్ చేస్తే ఎలాంటి సమాచారం దొరకడం లేదు. ఇలా ఎన్నో కేసులు మిస్టరీగానే మిగిలాయి. మరెన్నో సంచలన ఘటనలు జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ గోకుల్‌ చాట్‌, లుంబీని పార్కులలో పేలిన బాంబులకు కారణమైన ఉగ్రవాదలు కూడా నకిలీ సిమ్‌కార్డులనే వాడారని తేలింది. నంబర్ల డేటాను సేకరించిన పోలీసులు చూస్తే ఆ సిమ్‌కార్డు అమాయకుల పేరుతో ఉన్నట్లు తేటతెల్లమయింది. దీన్ని బట్టి దేశభద్రతకు ముప్పుగా మారిన వాటిలో సిమ్‌కార్డుల విక్రయాలు కూడా ప్రధానంగా మారాయి.

నకిలీ సిమ్ లు..
మొన్నటికి మొన్న హైదరాబాద్‌ నగరంలోని షా-ఇనాయత్‌గంజ్ చెందిన హవాలావ్యాపారి కుమారుడైన టెన్త్‌ స్టూడెంట్‌ అభయ్‌ను దుండగులు కిడ్నాప్ చేసి పదికోట్లు..ఆ తర్వాత ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు...డబ్బులు డిమాండ్ చేస్తూనే అభయ్‌ను కిరాతకంగా చంపిన దుర్మార్గులు అట్టపెట్టెలో డెడ్‌బాడీ పెట్టి సికింద్రాబాద్‌లో పడేసి రైళ్లో విజయవాడ చేరారు. ఇలా సాగిన దర్యాప్తుతో పోలీసులు నిందితులను పట్టుకున్నారు. అయితే అందులో తేలిన వాస్తవమేంటంటే నిందితులు వాడిన సెల్‌నంబర్‌ నకిలీ సిమ్‌కు చెందినదే. నగరంలోనే ఆ సిమ్‌ను డబ్బులు ఎక్కువగా ఇచ్చి కొనుగోలు చేసినట్లు తేలింది. ఇప్పటివరకు ఎన్నో కేసులు కూడా అయ్యాయి. అమ్మాయిలు..ఇళ్లాల్లను వేధించడం...అసభ్యకర ఫోటోలు పంపడం లాంటి కేసుల్లో సైబర్ క్రైం పోలీసులు ఆరా తీస్తే నకిలీ సిమ్‌కార్డులతో వ్యవహారం నడిపినట్లు తేలింది... దుర్మార్గుల చేతికి దొరుకుతున్న నకిలీసిమ్‌కార్డులతో ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయనడానికి క్రైం రికార్డులే చెబుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా సిమ్ కార్డులు జారీ చేస్తున్న మొబైల్ షాపులపై పోలీసులు దాడులు చేపట్టారు. హైదరాబాద్, సైబరాబాద్‌ పరిధిలోని మొబైల్ దుకాణాల్లో ఈ తనిఖీలు కొనసాగాయి. ఆధారాలు తీసుకోకుండా సిమ్‌లు జారీ చేస్తున్న దుకాణాలపై కేసులు నమోదు చేస్తున్నారు. వేరొకరి పేరు మీద ఉన్న సిమ్‌కార్డులను నేరగాళ్లు ఇచ్చే కాసులకు కక్కుర్తి పడి విక్రయిస్తున్న దుకాణదారులను హెచ్చరించారు.. ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయో పోలీసులు వివరించారు. డబ్బులు ఇస్తే విచ్చలవిడిగా దొరుకుతున్న సిమ్‌కార్డులతో కుర్రాళ్లు పోకిరీ వేషాలేస్తుండగా నేరగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు. నిబంధనల మేరకు సిమ్‌లు జారీ చేయాలి లేదంటే కేసులు పెట్టి జైళ్లో పడేస్తారు జాగ్రత్తా.

19:55 - March 28, 2016

అనంతపురం : ఏకాగ్రతతో పరీక్ష రాస్తుంటే.. బంధువులు తల్లి చనిపోయిందన్న సమాచారాన్ని మోసుకొచ్చారు. క్షణకాలం దిగ్భ్రాంతి.. అంతలోనే.. తల్లిదండ్రులు తన చదువు పట్ల.. తన భవిష్యత్తు పట్ల పెంచుకున్న ఆశలు గుర్తొచ్చాయి. అంతే.. తల్లి మరణ బాధను గుండెల్లోనే దాచుకొని.. పదో తరగతి పరీక్షలు రాసిందా విద్యార్థిని. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. గోరంట్లకు చెందిన భారతి.. స్థానిక పరీక్షా కేంద్రంలో పదో తరగతి పరీక్షలు రాస్తుండగా.. తల్లి మరణవార్త తెలిసింది. అక్కడే కన్నీటి పర్యంతమైన భారతి.. బాధను దిగమింగుకొని.. తల్లి తన భవిష్యత్తుపై పెట్టుకున్న ఆశలు నిలపాలన్న ఉద్దేశంతో ఇంగ్లిష్‌ పరీక్ష పూర్తిగా రాసి.. ఇంటికి వెళ్లింది. తల్లి కర్మకాండల్లో పాల్గొని.. కూతురిగా తన విద్యుక్త ధర్మాన్నీ నిర్వర్తించింది. 

19:53 - March 28, 2016

హైదరాబాద్ : చర్లపల్లి జైల్లో.. రిమాండ్‌లో ఉన్న హెచ్‌సీయూ విద్యార్థులకు మియాపూర్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. వీరి అరెస్టులకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు పలువురు నేతలు విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. జైల్లోని విద్యార్థులను పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మరోవైపు.. హెచ్‌సీయూ ఘటనలపై రాష్ట్రపతిని కలిసేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ ప్రతినిధుల బృందం మంగళవారం ఢిల్లీ వెళ్లనుంది. మియాపూర్‌లోని 25వ మెట్రోపాలిటన్‌ కోర్టు, విద్యార్థులకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. హెచ్‌సీయూ వీసీ అప్పారావు పునరాగమనాన్ని నిరసిస్తూ.. ఆందోళనలో పాల్గొన్న నేరానికి విద్యార్థులపై కేసులు పెట్టి జైలుకు పంపారు. దీంతో యావత్‌ విద్యార్థి లోకం వీసీ చర్యలపై విరుచుకు పడింది. అన్ని వర్సిటీలూ ఆందోళనలు, నిరసలనతో హోరెత్తాయి. ఈ నేపథ్యంలో లభించిన బెయిలుతో 25 మంది విద్యార్థులతో పాటు ఇద్దరు అధ్యాపకులూ జైలు నుంచి విడుదలయ్యేందుకు మార్గం సుగమమైంది.

నేతల పరామర్శలు...
బెయిల్ నిర్ణయం వెలువడక ముందు సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.. చర్లపల్లి జైలుకు వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. ప్రజాస్వామ్యవాదులపైనా, విద్యార్థుల పైనా ప్రస్తుతం జరుగుతున్న దాడులు లౌకికతత్వానికే సవాల్‌గా మారుతున్నాయని తమ్మినేని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే కూడా చర్లపల్లి జైలులో విద్యార్థులను పరామర్శించారు. హెచ్‌సీయూ విద్యార్థుల ఆందోళనలకు తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వర్సిటీలో జరిగిన ఘటనలపై విద్యార్థుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. తమ అరెస్టుకు ముందు.. పోలీసులు వ్యవహరించిన తీరును విద్యార్థులు షిండేకు వివరించారు. మరోవైపు.. హెచ్‌సీయూ వైస్‌ చాన్సిలర్‌ అప్పారావు.. సోమవారం మానవ హక్కుల సంఘం ఎదుట హాజరయ్యారు. యూనివర్సిటీలో ఆందోళనలు.. విద్యార్థులకు ఆహారం అందించకుండా మెస్‌ మూసివేయడం లాంటి ఘటనలపై ఆమ్‌ ఆద్మీ పార్టీ హెచ్‌ఆర్సీని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో వీసీ అప్పారావు సోమవారం హెచ్‌ఆర్సీ ఎదుట హాజరై.. వర్సిటీ ఘటనలపై వివరణ ఇచ్చారు. రెండు రోజుల క్రితం వర్సిటీ రిజిస్ట్రార్‌ కూడా హెచ్‌ఆర్సీ ఎదుట హాజరయ్యారు. 

19:46 - March 28, 2016

విజయవాడ : వైసీపీ విధానాలతో విబేధించే ఆ పార్టీని వీడాలనుకుంటున్నట్లు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. పార్టీని వీడే అంశంపై కార్యకర్తలతో చర్చలు జరుపుతున్నట్లు ఆయన చెప్పారు. టీడీపీలో చేరాలని కార్యకర్తలు ఒత్తిడి తెస్తున్నారని. దీనిపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు ఆయన తెలిపారు. వైసీపీ విధానాల పట్ల తన అసంతృప్తిని ఆ పార్టీ అధినేత జగన్‌ ముందు ఉంచాననీ, ఇక మాట్లాడాల్సిందేమీ లేదని జ్యోతుల చెప్పారు. తన భవిష్యత్ నిర్ణయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆయన ప్రకటించారు. అధికార పార్టీలో చేరితే నియోజకవర్గంలో అపరిష్కృత సమస్యలు పరిష్కారమౌతాయని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. 

రేపు ఢిల్లీకి కేటీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులతో కేటీఆర్ భేటీ కానున్నారు.

 

 

ఢిల్లీకి వెళ్లనున్న టి.కాంగ్రెస్ ప్రతినిధి బృందం..

ఢిల్లీ : తెలంగాణ కాంగ్రెస్ ప్రతినిధి బృందం రేపు ఢిల్లీకి వెళ్లనుంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని బృందం కలువనుంది. హెచ్ సీయూ ఘటనలను రాష్ట్రపతి దృష్టికి తేనున్నారు. 

19:36 - March 28, 2016

విజయవాడ : పోలవరం పూర్తయితే ప్రజల్లో వెలుగులు వస్తాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పట్టిసీమ ప్రాజెక్టును సందర్శించిన అనంతరం ఆయన సభలో మాట్లాడారు. 2015 మార్చి 29వ తేదీన పట్టిసీమకు శంకుస్థాపన చేయడం జరిగిందని, ఏదైనా ప్రాజెక్టు చేపడితే పూర్తయ్యే వరకు తాను నిద్రపోనని వెల్లడించారు. దేశంలో మొదటిసారిగా నదుల అనుసంధానం ఏడాదిలో పూర్తి చేయడం జరిగిందన్నారు. ఒక్కడినే కష్టపడితే లాభం రాదని..ఒక్క ప్రాజెక్టు కడితే లాభం రాదని, ప్రతొక్క రైతుల్లో చైతన్యం రావాలని పేర్కొన్నారు. చరిత్రను మార్చే విధంగా పట్టిసీమను కట్టడం జరిగిందని, రెయిన్ జన్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని బాబు పేర్కొన్నారు. బాబు ప్రసంగం వినాలంటే వీడియో క్లిక్ చేయండి. 

ఫీల్డింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా..

ఢిల్లీ : టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా కొద్దిసేపట్లో సౌతాఫ్రికా - శ్రీలంక జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన సౌతాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది.

 

ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యేకు జైలు శిక్ష..

నెల్లూరు : ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మమ్మ నాయుడుకి 6 నెలలు జైలు శిక్ష పడింది. 2000 సంవత్సరంలో సీఐఐ దాడి కేసులో లక్ష్మయ్య నాయుడితో పాటు 97 మందికి ఆరు నెలల జైలు శిక్ష పడింది. రూ. 10వేల జరిమానను గూడురు సబ్ కోర్టు విధించింది. 

అక్బరుద్దీన్ అనుచిత వ్యాఖ్యలపై హైకోర్టులో పిల్..

హైదరాబాద్ : అక్బరుద్దీన్ అనుచిత వ్యాఖ్యల కేసుపై హైకోర్టులో పిల్ దాఖలైంది. మూడు ఏళ్లు గడిచినా చార్జీషీట్ దాఖలు చేయలేదని పిటిషనర్ పేర్కొన్నారు. ఛార్జీషీట్ దాఖలుకు టీ.ఎస్ ప్రభుత్వం వారం గడవు కోరింది. విచారణ సోమవారానికి వాయిదా వేసింది. 

కాంగ్రెస్ మొసలీ కన్నీరు - వెంకయ్య..

ఢిల్లీ : ఉత్తరాఖండ్ లో ప్రభుత్వం పడిపోవడంపై కాంగ్రెస్ పార్టీ మొసలి కన్నీరు కారుస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో పలు ట్వీట్స్ చేశారు. ఉత్తరాఖండ్ వివాదానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని తెలిపారు. 

ప్రాజెక్టు పూర్తయ్యే వరకు నిద్రపోను - బాబు..

విజయవాడ : 2015 మార్చి 29వ తేదీన పట్టిసీమకు శంకుస్థాపన చేయడం జరిగిందని, ఏదైనా ప్రాజెక్టు చేపడితే పూర్తయ్యే వరకు తాను నిద్రపోనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 

ఏపీ, తెలంగాణ అసెంబ్లీలు వాయిదా..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల శాసనసభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఏపీ అసెంబ్లీలో వాయిదా పడకంటే ముందు అగ్రిగోల్డ్ అంశంపై చర్చ జరిగింది. 

'నిరూపిస్తే నా ఆస్తి మొత్తం జగన్ కు రాసిస్తా'

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ కేసులో ఏపీ అసెంబ్లీలో చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలో జగన్ ఆరోపణలకు సమాధానమిస్తూ మంత్రి ప్రత్తిపాటి జగన్ పై విరుచుకుపడ్డారు. అగ్రిగోల్డ్ ఆస్తులను నా భార్య కొనుగోలు చేసినట్లు  జగన్ నిరూపిస్తే నా ఆస్తి మొత్తాన్ని ఆయనకు రాసిస్తానని మంత్రి టి సవాల్ చేశారు.తనపై ఆరోపణలు చేయకపోతే ఆయనకు నిద్రపట్టదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలకు అవాస్తవాలను చెబితే ఊరుకోమన్నారు.

18:32 - March 28, 2016

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ కేసుకు సంబంధించిన దానిపై అధికార..ప్రతిపక్షాల మధ్య విమర్శలు చేసుకున్నాయి. ఏపీ శాసనసభలో సోమవారం సాయంత్రం దీనిపై చర్చ జరిగింది. అగ్రిగోల్డ్ కేసులో ప్రతిపక్ష నాయకుడు జగన్ చేసిన ఆరోపణలను ప్రభుత్వం తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఇప్పటికే హైకోర్టు ఆదేశాల ప్రకారం ఓ కమిటీ నియమించడం జరిగిందని, ఆస్తుల వేలానికి కూడా తేదీలను కూడా ప్రకటించిందన్నారు. సీబీఐ విచారణకు ఎలాంటి అభ్యంతరం లేదని, లబ్ధిదారులకు ఆలస్యమౌతుందనే ఉద్ధేశ్యంతో తాము విచారణకు ఆదేశించడం లేదన్నారు. ప్రతిపక్షం కోరితే తాము విచారణకు ఆదేశించడం జరుగుతుందని, కానీ ప్రతిపక్షం బాధ్యత వహించాలని మంత్రి అచ్చె నాయుడు సవాల్ విసిరారు. 

18:26 - March 28, 2016

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ కేసుపై ప్రతిపక్ష నాయకుడు జగన్ ఏపీ ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి ఆస్తులను కొనుగోలు చేసినట్లు ఆరోపించారు. దీనిని మంత్రి పుల్లారావు కొట్టిపారేశారు. అనంతరం జగన్ ప్రసంగించారు. మంత్రి భార్య వెంకాయమ్మ పేరిట 2015 జనవరి 19వ తేదీన కొనుగోలు చేశారనని మంత్రి ఒప్పుకోవడం సంతోషమన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు జీవో నెంబర్ 23 విడుదల చేయడం జరిగిందని, కానీ ఇందులో మంత్రికి సంబంధించిన ఆస్తులు లేవని సభకు తెలిపారు. మంత్రికి భూములమ్మిన వ్యక్తిని సీబీసీఐడీ అరెస్టు చేయలేదని సభకు తెలిపారు. ఈ కంపెనీకి రూ. 500 కోట్లు కమర్షియల్ బ్యాంకుల్లో, రూ. 70 కోట్లు నాన్ కమర్షియల్ బ్యాంకుల్లో డిపాజిట్లున్నాయని మంత్రి యనమల పేర్కొన్నారని సభకు జగన్ తెలిపారు. బ్యాంకు అకౌంట్లు సీజ్ చేస్తే కేవలం ఆరు లక్షలు మాత్రమే ఉన్నాయా ? అని కోర్టు ఫిబ్రవరిలో 22వ తేదీన సీఐడీని ఆక్షేపించిందని తెలిపారు. 32 లక్షల మంది బాధితులున్నారని సీఐడీ పేర్కొంటోందని, ఈ సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయన్నారు. ప్రస్తుతం జరుగుతున్న విచారణ సరిగ్గా లేదని సీబీఐచే విచారణ జరిపించాలని జగన్ డిమాండ్ చేశారు. 

'అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని కాపాడటానికే'

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీలో అగ్రిగోల్డ్ వ్యవహారంపై చర్చలో ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడారు. దోషులను కాపాడటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ కేసులో బాధితులు లక్షల్లో వున్నారన్నారు. సీబీఐతో విచారణ చేయించాలనే ఆలోచన ప్రభత్వానికి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ యాజమాన్యానికి అనుకూలంగా సీఐడీపై చంద్రబాబు ఒత్తిడి తెస్తున్నారని జగన్ అన్నారు.

18:18 - March 28, 2016

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ ఆస్తులను తన భార్య కొన్నట్లు నిరూపిస్తే తన ఆస్తులన్నింటినీ రాసిస్తానని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సవాల్ విసిరారు. ఏపీ శాసనసభలో సోమవారం సాయంత్రం అగ్రిగోల్డ్ కేసుకు సంబంధించిన అంశంపై చర్చ జరిగింది. ప్రతిపక్ష నేత జగన్ చేసిన ఆరోపణలపై ఏపీ మంత్రి ప్రత్తిపాటి తీవ్రంగా స్పందించారు.న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని కొనుగోలు చేయడం జరిగిందని, కానీ దీనికి లింకు ఉందా ? అని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ కంపెనీలకు సంబంధం ఉందని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. తాను బినామీ సృష్టికర్తను..పితామహుడిని కాదన్నారు. తనపై ఆరోపణలు చేయనంతవరకు జగన్ కు నిద్ర పట్టదని, అగ్రిగోల్డ్ ఆస్తులు తన భార్య కొన్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనన్నారు. అగ్రిగోల్డ్ మేనేజ్ మెంట్ ను సోనియా గాంధీ వద్దకు జగన్ తీసుకెళ్లి పరిచయం చేశారని, ఇది వాస్తవం కాదా ? అని ప్రశ్నించారు. అనేక సార్లు అగ్రిగోల్డ్ యాజమాన్యంపై వత్తిడి తెచ్చి వందల కోట్లు డబ్బులు కాజేశారని బాధితులు పేర్కొంటున్నారని ఇది వాస్తవం కాదా ? అని ప్రశ్నించారు. గతంలో తనపై రాజధాని భూముల ఆరోపణలు చేసి పరారయ్యారని, ఈ రోజైనా ఆరోపణలపై నిలబడాలని సవాల్ విసిరారు. 32 లక్షల మంది బాధితులను కాపాడే బాధ్యత ఏపీ ప్రభుత్వానిదేనని మంత్రి ప్రత్తిపాటి స్పష్టం చేశారు. 

17:59 - March 28, 2016

ఆదిలాబాద్ : జిల్లాలోని నాలుగు అటవీ డివిజన్ల పరిధిలో గిరిజనులు అనాధిగా తునికాకు సేకరణతో ఉపాధి పొందుతున్నారు. వేసవిలో ఈ పనితో ఒక్కో కుటుంబం సగటున 10 వేల రూపాయల మేర సంపాదిస్తున్నారు. జిల్లాలో 50 నుండి 70 వేల మంది తునికాకును సేకరిస్తున్నారు. కూలీలు సేకరించి న తునికాకు కట్టలను కాంట్రాక్టర్లకు అమ్మేస్తారు. వీటిని అటవీ శాఖ అధికారులు అమ్మగా వచ్చే ఆదాయంలో ఏటా రాయల్టీ బోనస్ రూపంలో ప్రభుత్వం నుండి కూలీలకివ్వాలి కాని అది జరగడం లేదు. జిల్లాలో మొత్తం 88 యూనిట్లను తూనికాకు సేకరణకు టెండర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. 3 ఏళ్లుగా బీడీ ఆకులకు గిట్టు బాటు రాకపోవడంతో బీడీ కంపెనీలు తునికాకు కొనుగోలు చేయకపోవడంతో కాంట్రాక్టర్లు టెండర్లు వేసేందుకు రావడం లేదు. జిల్లాలో 88 యూనిట్లకు గాను 70 వరకు మాత్రమే అమ్ముడుపోయాయి. వాటికి రావాల్సిన రాయల్టీ ఇవ్వలేదు.

2013 నాటికి 12 కోట్ల రాయల్టీ డబ్బులు..
2013 సంవత్సరానికి గాను 12 కోట్ల రాయల్టీ డబ్బులు ఇవ్వాల్సి ఉండగా 4 కోట్లు మాత్రమే చెల్లించారు ప్రభుత్వం. అత్యధికంగా 8 కోట్ల 85 లక్షల వరకు బెల్లంపల్లి డివిజన్ లోని కూలీలకు ఇవ్వాల్సి ఉంది. 2014 లో 40 యూనిట్లు అమ్ముడు పోగా 66 వేల 200 స్టాండర్డ్ బ్యాగులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 59 వేల బ్యాగులు సేకరించారు. 2015 లో 47 యూనిట్లకు గాను 84 వేల బ్యాగులు లక్ష్యంగా పెట్టుకున్న కాంట్రాక్టర్లు 64 వేల బ్యాగులు మాత్రమే సేకరించారు. దీంతో 3 ఏళ్లకు కలిపి 30 కోట్ల వరకు రాయల్టీ డబ్బులు జిల్లాకు రావాల్సి ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో సేకరించిన తునికాకుకు 50 వేల మంది కూలీలు రాయల్టీ డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మొత్తం తక్షణం చెల్లించి కరువు సమయంలో తమను ఆదుకోవాలని కూలీలు డిమాండ్ చేస్తున్నారు.  

17:51 - March 28, 2016

మహబూబ్ నగర్ : చేసేది వారు ప్రభుత్వ ఉద్యోగం..కాని వారి ఆశలు మాత్రం అనంతం. తేలిగ్గా డబ్బులు సంపాదించాలనే ఉద్ధేశ్యంతో దొంగతనానికి పాల్పడ్డారు. వారి వ్యూహం బెడిసి కొట్టడంతో కటకటలాపాలయ్యారు. ఈ ఘటన హన్వాడ మండలం గొండ్యాల గ్రామంలో చోటు చేసుకుంది. ఓ కాలేజీలో పనిచేసే పి.టి.మాస్టర్ చిట్యాల కృష్ణయ్య, లేబర్ ఆఫీసర్ వెంకట రమణలు పురాతన విగ్రహం దొంగిలించారు. అందులో వజ్రాలు ఉన్నాయని భావించి విగ్రహాన్ని ఎత్తుకెళ్లారు. అందులో ఏమీ దొరక్కపోవడంతో విగ్రహాన్ని ముక్కలు చేసి చెరువులో పడేశారు. నిందితుల్లో మూఢ నమ్మకాలు లేవనే ప్రజల్లో చైతన్యం పెంపొందించాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు ఈ విధంగా చేయడం దారుణమని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. 

పెద్దపల్లి వద్ద జీపు బోల్తా, ఇద్దరు మృతి..8 మందికి గాయాలు...

కరీంనగర్ : పెద్దపల్లి మండలం కొత్తపల్లి వద్ద జీపు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఓ మహిళ పరిస్థితి విషమంగా వుంది. మరో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు వీణవంక మండలం చల్లూరు వాసులుగా పోలీసులు గుర్తించారు.

మంత్రి నారాయణ, సీఎస్ లతో ఏపీ ఉద్యోగ సంఘాల భేటీ....

హైదరారబాద్ : ఏపీ సచివాలయంలో మంత్రి నారాయణ, సీఎస్ టక్కర్ లతో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. రాజధాని అమరావతికి ఉద్యోగుల తరలింపు..ఉద్యోగుల డిమాండ్ల విషయంలో చర్చించనున్నట్లు సమాచారం.

విద్యార్ధుల బెయిల్ ను స్వాగతిస్తున్నాం: ఏచూరి..

ఢిల్లీ :  హెచ్ సీయూ లో ఆందోళన నేపథ్యంలో అరెస్ట్ అయిన విద్యార్ధులకు, ప్రొఫెసర్లకు షరతులతో కూడిన బెయిల్ ను  మియాపూర్ న్యాయస్థానం మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేయడంపై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి స్పందించారు. బెయిల్ రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. 

17:19 - March 28, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పోలీసు కానిస్టేబుళ్ల రాత పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది. ఆర్ఆర్ బి పరీక్ష ఉండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మూడో తేదీన జరగాల్సిన పరీక్ష 24కి వాయిదా వేశారు. 17వ తేదీన జరిగే ఎస్ ఐ పోస్టులకు రాత పరీక్ష యదావిధిగా జరగనుంది.
పోలీసు కానిస్టేబుళ్ల రాత పరీక్షలో అవకతవకలకు తావులేకుండా రిక్రూట్‌మెంట్ బోర్డు అన్ని చర్యలు చేపడుతోంది. పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థుల వేలిముద్రలను బయోమెట్రిక్ విధానంలో సేకరించడం ద్వారా భవిష్యత్తులో అక్రమాలు జరగకుండా చూడనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1,131 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. రాత పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని...అభ్యర్థులంతా అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని బోర్డు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 

టీడీపీలోకి మారాలని ఒత్తిడి : జ్యోతుల..

హైదరాబాద్ : వైసీపీ నేత జ్యోతుల నెహ్రూ టీడీపీలోకి చేరుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీలోకి మారాలని కార్యకర్తలు ఒత్తిడి తెస్తున్నారని జ్యోతుల పేర్కొన్నారు. కానీ ఈ విషయంలో తాను ఇంకా ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేదని తెలిపారు. తాను నిజంగా పార్టీ మారాలనుకుంటే నేరుగా సీఎం చంద్రబాబునే కలుస్తాననీ..మధ్యలో ఎవరినీ సంప్రదించవలసిన పనిలేదన్నారు. కాగా జ్యోతుల నెహ్రూ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. 

కానిస్టేబుల్, ఎస్ పోస్టులకు రాత పరీక్ష...

హైదరాబాద్ : పోలీసుల శాఖలో రాత పరీక్షకు టీ.ప్రభుత్వం సన్నాహాలు చేయనుంది. ఏప్రిల్ 24న కానిస్టేబుల్ పోస్టులకు, 17న ఎస్సై పోస్టులకు రాత పరీక్ష నిర్వహించనుంది.  

16:47 - March 28, 2016

హైదరాబాద్ : వైద్య శాఖలో చాలా పోస్టులు ఖాళీలున్నాయని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ఈ పోస్టులను వేగంగా భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి 6 వందల మందికి ఒక డాక్టర్‌ ఉండాలని ప్రస్తుతం 2వేల మందికి ఒక వైద్యులు పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. మహబూబ్‌నగర్‌లో మెడికల్‌ కళాశాల అనుబంధ ఆస్పత్రి దీనావస్థలో ఉందని ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్‌ పేర్కొన్నారు. ఈ ఆస్పత్రిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే జూరాల ద్వారా జిల్లాకు నీరందించాలని విజ్ఞప్తి చేశారు.

16:45 - March 28, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యారంగం సమస్యలమధ్య కొట్టు మిట్టాడుతోందని ఎమ్మెల్యే సున్నం రాజయ్య పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో విద్య అంశంపై మాట్లాడారు. విద్యకు నిధులు పెంచాల్సిందిపోయి తగ్గించారని విమర్శించారు. పాఠశాలలు, కళాశాలల్లో సరైన వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో సరైన వసతులు లేవని, టాయిలెట్స్, మంచినీరు ఇతర వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెట్టాలని సూచించారు. 

16:41 - March 28, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ మంత్రులు రావెల కిశోర్ బాబు, ప్రత్తిపాటి పుల్లారావులు పేర్కొన్నారు. ఏపీ శాసనసభలో సోమవారం వారు వేర్వేరుగా మాట్లాడారు. పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి రావెల కిషోర్‌బాబు చెప్పారు. దళితులు, గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా ప్రత్యేక కార్యక్రమలు చేపట్టామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేస్తున్నామని చెప్పారు. రైతు సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రాష్ట్రంలో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని మంత్రి చెప్పుకొచ్చారు. 

పట్టిసీమ ప్రాజెక్టు పరిశీలించనున్న సీఎం చంద్రబాబు.…

ప.గోదావరి : ఏరియల్ సర్వే ద్వారా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. ఈరోజు హైదరాబాద్ నుండి విమానం ద్వారా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి చేరుకున్న బాబు హెలీకాఫ్టర్ ద్వారా పట్టిసీమ ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. ఎర్త్ కమ్ రాక్ ఫెల్ డ్యామ్ ను పరిశీలించారు. కాసేపట్లో పట్టిసీమకు చేరుకుంటారు. ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. గోదావరి నుంచి రాయలసీమకు నీటిని తరలించే పట్టిసీమ ప్రాజెక్టును చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు.

16:36 - March 28, 2016

నిజామాబాద్ : కన్నతండ్రే కసాయిగా మారాడు. మద్యం మత్తులో చిన్నారిని హత్య చేశాడో ఓ కన్న తండ్రి. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ధర్మారంలో చోటుచేసుకుంది. కూలీ పనులు చేసుకునే నవీన్ తాగుడుకు బానిసై భార్యతో గొడవ పడి.. అర్థరాత్రి సమయంలో నిద్రిస్తున్న చిన్నారిని చంపేశాడు. తెల్లవారుజామున నిర్జీవంగా పడి ఉన్న బాలుడిని చూసిన భార్య మమత భోరున విలపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నవీన్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

16:34 - March 28, 2016

హైదరాబాద్ : నిబంధనలకు విరుద్ధంగా సిమ్ కార్డులు జారీ చేస్తున్న మొబైల్ షాపులపై పోలీసులు దాడులు చేపట్టారు. హైదరాబాద్, సైబరాబాద్‌ పరిధిలోని కీలక మొబైల్ దుకాణాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఆధారాలు తీసుకోకుండా సిమ్‌లు జారీ చేస్తున్న దుకాణాలపై కేసులు నమోదు చేస్తున్నారు. ఆధారాలు లేకుండా సిమ్ కార్డులు తీసుకొని నేరాలకు పాల్పడే వారి సంఖ్య పెరగడంతో పోలీసులు ఈ దాడులకు దిగారు. ఇటీవలే చిన్నారి అభయ్ హత్య జరిగిన సంగతి తెలిసిందే. 

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్....

హైదరాబాద్ : స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. 371 పాయింట్ల నష్టంతో 24,966 వద్ద సెన్సెక్స్ ముగియగా 101 పాయింట్ల నష్టంతో 7,615 వద్ద నిఫ్టీ ముగిసింది.

16:13 - March 28, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్థులకు బెయిల్ మంజూరైంది. ఇటీవల హెచ్ సీయూలో జరిగిన ఆందోళనలో 27 మందిని పోలీసులు అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. అరెస్టు చేసిన వారిలో 25 మంది విద్యార్థులు, ఇద్దరు ఆచార్యులున్నారు. బెయిల్ విషయంలో మియాపూర్ కోర్టులో విచారణ జరిగింది. ప్రతొక్కరూ రూ. 5వేలు పూచికత్తు సమర్పించాలని, సమీప పీఎస్ లో ప్రతి వారం హాజరై సంతకాలు చేయాలని...పోలీసులకు సహకరించాలని విద్యార్థులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు విడుదలవుతారా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది.
హెచ్ సీయూలో వీసీ రీ ఎంట్రీ అప్పారావుపై విద్యార్థులు ఆందోళన చేశారు. వీసీ బస చేసిన గెస్ట్ హౌస్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో కార్యాలయంలో ఫర్నీచర్ ధ్వంసమైంది. అనంతరం పోలీసులు విచాక్షణారహితంగా లాఠీఛార్జీ చేశారు. విద్యార్థినిలను అని చూడకుండా పోలీసులు లాగి పడేశారు. పోలీసుల వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. వెంటనే వీసీ అప్పారావును తప్పించాలని పెద్ద పెట్టున డిమాండ్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆందోళనకు కారణమంటూ 25 మంది విద్యార్థులు, ఇద్దరు ప్రొఫెసర్లను అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. అంతేగాకుండా వర్సిటీల్లో భోజనం, నీరు..ఇతరత్రా సౌకర్యాలపై ఆంక్షలు విధించారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. జైలులో ఉన్న విద్యార్థులను పరామర్శించారు. ఈ అంశంపై తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చర్చ సైతం జరిగింది. వీసీ అప్పారావు వల్లే ఇదంతా జరుగుతోందని ఆప్ నేత ఒకరు హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. సోమవారం అప్పారావు హెచ్చార్సీ ఎదుట హాజరయ్యారు. విద్యార్థులు డిమాండ్ చేస్తున్న విధంగా వీసీ అప్పారావును తొలగిస్తారా ? లేదా ? అన్నది చూడాలి. 

హెచ్ సీయూ విద్యార్ధులకు బెయిల్ మంజూరు....

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్ధులకు న్యాయస్థానం  బెయిల్ మంజూరు చేసింది. అరెస్టు అయిన 27 మందిలో 25 మంది విద్యార్థులు, ఇద్దరు అధ్యాపకులున్నారు. ఒక్కొక్కరికీ రూ. 5 వేలు పూచీకత్తుతతో పాటు విచారణ పూర్తయ్యే వరకూ ప్రతీ వారం పీఎస్ కు హాజరుకావాలనే షరతులతో కూడిన బెయిల్ ను మియాపూర్  న్యాయస్థానం మంజూరు చేసింది.

16:02 - March 28, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వడగాలుల తీవ్రతపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. వడగాలుల కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం కోర్టుకు సమర్పించింది. మండుటెండల్లో పని చేయించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎండ సమయంలో పొలాల్లో కూలీలు పని చేయకుండా చూడాలని సూచించింది. ఎండలకు బయటకు వెళ్లకుండా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆదేశించింది. కార్మికుల కోసం చలివేంద్రాలు, ఎండ నుంచి రక్షణగా షెల్టర్లు ఏర్పాటు చేయించాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది.

పట్టిసీమ ప్రాజెక్టు పరిశీలించనున్న సీఎం చంద్రబాబు....

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు బయల్దేరారు. జిల్లాకు చేరుకున్న అనంతరం ఆయన రాజమండ్రి నుండి హెలికాఫ్టర్ లో బయలుదేరి పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆయన పరిశీలించనున్నారు.

జగన్ ను కలిసిన అగ్రిగోల్డ్ బాధితులు....

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ వద్ద వైసీపీ అధినేత జగన్ ను అగ్రిగోల్డ్ బాధితులు కలిశారు. ఈ సందర్భంగా తమకు న్యాయం జరిగేలా చూడమని  బాధితులు జగన్ ను కోరారు. దానికి తగిన చర్యలు తీసుకుంటానని జగన్ బాధితులకు హామీ ఇచ్చారు.

రోహిత్ తల్లి రాధికను పరామర్శించిన షిండే..

హైదరాబాద్ : ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల తల్లి రాధికను మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే పరామర్శించారు. వర్శిటీల్లో విద్యార్ధులకు రక్షణ కరువైందని, తన కుమారుడి మరణానికి వీసీనే కారణమని రాధిక తెలిపారు. రోహిత్ చట్టం కోసం కృషి చేయాలని తాను షిండే కోరినట్లు రాధిక తెలిపారు.

చర్లపల్లిలో విద్యార్ధులను పరామర్శించిన షిండే...

హైదరాబాద్ : హెచ్ సీయూలో దళిత, యువజన సంఘాల నేతలను కలిసిన అనంతరం మాజీ కేంద్రమంత్రి సుశీల్ కుమార్ షిండే చర్లపల్లి జైలులో వున్న విద్యార్ధులను పరామర్శించారు. విద్యార్ధుల శరీరాలపై లాఠీ దెబ్బలున్నాయన్నాయని షిండే తెలిపారు. పవిత్రమైన యూనివర్శిటీలలో అప్పారావులాంటి వీసీలకు స్థానం వుండకూడదన్నారు. కేంద్రప్రభుత్వాన్ని సంతోషపరచటానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. షిండే వెంట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, మహారాష్ట్ర ఎంపీ రాజీవ సతావ్ ఉన్నారు. 

15:34 - March 28, 2016

హైదరాబాద్ : పాఠశాల విద్యకు చాలా తక్కువ నిధులు కేటాయిస్తున్నారని సీపీఐ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌ అన్నారు. సోమవారం అసెంబ్లీలో విద్యారంగంపై చర్చలో భాగంగా రవీంద్ర కుమార్‌ మాట్లాడారు. రాష్ట్రంలో 17వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి మరింత దారుణంగా ఉందని విమర్శించారు. ఖాళీలుంటే నాణ్యమైన విద్య ఎలా అందుతుందని, మెస్‌ చార్జీలు సరిపోవడం లేదని సభకు తెలిపారు. అంతేగాకుండా రేషనలైజేషన్‌ పేరిట స్కూళ్లు మూసివేస్తున్నారని సభ దృష్టికి తెచ్చారు. 

15:31 - March 28, 2016

విశాఖపట్టణం : కార్మిక వ్యతిరేక నిర్ణయాలే చంద్రబాబు ఎజెండాలా కనిపిస్తోందని సీఐటీయూ ఏపీ ప్రధాన కార్యదర్శి గఫూర్ ఆరోపించారు. నియంతలా వ్యవహరిస్తూ కార్మిక చట్టాలను, విధానాలను తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. జూన్ లో ప్రభుత్వంపై కార్మికుల దండయాత్ర జరుతుందన్నారు. కార్మిక, సంక్షేమం అనేది లేదని, ఎన్నికల ప్రణాళికలో చాలా చాలా రాసుకున్నారని తెలిపారు. పచ్చి కార్మిక వ్యతిరేక ప్రభుత్వం, ఇప్పటి వరకు ఒక్క కార్మిక సంఘంతో మాట్లాడలేదని..సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని తెలిపారు. కోటిన్నర మంది కార్మికుల సహకారం ఏమీ లేదనే ధోరణిలో చంద్రబాబు ఉన్నారని, ధర్నా చేస్తే ఉద్యోగం నుండి తీసివేయి..ఆందోళన చేస్తే అణిచివేయండంటూ బాబు ఆదేశాలిస్తున్నారని విమర్శించారు. అసంఘటిత రంగంలో కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. చట్టాలు ఉల్లంఘించిన వారిపై ఒక్క కేసు పెట్టారా అని ప్రశ్నించారు. ఐక్య కార్యచరణ ద్వారా ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామని గఫూర్ వెల్లడించారు. 

15:26 - March 28, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్థులపై పోలీసులు దాడి చేయడం దారుణమని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. దీని వెనుక కేంద్రం హస్తం ఉందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యవాదులపైనా, విద్యార్థుల పైనా ప్రస్తుతం జరుగుతున్న దాడులు లౌకికతత్వానికే సవాల్‌గా మారుతున్నాయని తమ్మినేని అన్నారు. సోమవారం ఆయన చర్లపల్లి జైలకు వచ్చారు. రిమాండ్ లో ఉన్న విద్యార్థులను ఆయన పరామర్శించారు. ఇటీవల హెచ్ సీయూలో జరిగిన ఆందోళనలు పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీనితో చర్లపల్లి జైలుకు పలువురు నేతలు తరలివచ్చి పరామర్శిస్తున్నారు. విద్యార్థులను పరామర్శించిన అనంతరం తమ్మినేని మీడియాతో మాట్లాడారు. ఇది శాంతి భద్రతల సమస్య అని చెప్పడం సరైంది కాదని, సీఎం, హోం మంత్రిలు రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇలా చేశారని, ప్రజాతంత్ర ఉద్యమాలు ఈ దేశంలో ఉండటానికి లేదు..స్టూడెంట్స్ ఉన్న వారు యూనివర్సిటీ అధికారులను ప్రశ్నించ వద్దఉ..ఉద్యమాలు జరగడానికి వీలు లేదు..అనే ధోరణిలో ప్రవరిస్తున్నారని తెలిపారు. విద్యార్థులపై జరిగిన దాడులు పట్ల ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయని తమ్మినేని తెలిపారు.

నంది విగ్రహం చోరీ కేసులో లేబర్ అధికారి....

మహబూబ్ నగర్ : హన్వాడ మండలం గొండ్యాల  సమీపంలోని శివాలయంలో  నంది విగ్రహం చోరీకి గురైంది.  ఈ విగ్రహం 18వ శతాబ్దం కాలంనాటిదని స్థానికుల సమాచారం. ఈ కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో లేబర్ అధికారి వెంకటరమణతో పాటు ప్రతిభ కళాశాల ఫిజికల్ డైరక్టర్ కృష్ణయ్య కూడా వున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

15:10 - March 28, 2016

తీరిక వేళల్లో మహిళలు తమ సృజనాత్మకతకు పదును పెడుతుంటారు. తమకు ఆసక్తి ఉన్న అభిరుచులకు మెరుగులు దిద్దుతుంటారు. అలాంటి వారి కోసం కాగితాలతో అందమైన పూలు ఎలా తయారు చేయాలో వీడియోలో చూడండి. 

15:09 - March 28, 2016

అనేక రంగాలలో మహిళలు తమ సత్తా చాటుతున్నప్పటికీ ఇంకా కొన్ని రంగాలలో మహిళల ప్రవేశం నామమాత్రమే. అలాంటి రంగంలోకి అడుగుపెట్టి అరుదైన హోదాను సొంతం చేసుకున్న అతివ ప్రత్యేక కథనం. సాధారణంగా తాము చదివిన చదువుకు కెరీర్ కు సంబంధం లేని పరిస్థితే ఎంతో మందిది. కానీ తన విద్యార్హతలతో అటవీ రంగంలోకి అడుగుపెట్టి అరుదైన శిక్షణ ను పొంది ప్రత్యేక కొలువును సాధించిన ఘనత సుభద్రాదేవిది. మహిళలు తమకు ఆసక్తి ఉన్న రంగంలో చక్కగా రాణించగలరని సుభద్రాదేవి మరోసారి రుజువు చేసారు. మహిళలు అరుదుగా రాణించే రంగంలో తనదైన ప్రత్యేకత చాటుతున్న ఆమెను మానవి అభినందిస్తోంది. భవిష్యత్ లో మరిన్ని ఉన్నతశిఖరాలు అధిరోహించాలని ఆశిస్తోంది. ఆమె స్పూర్తి దాయక పయనం ఎలా సాగింది ? విషయాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

హెచ్ఆర్సీ ఎదుట వీసీ అప్పారావు...

హైదరాబాద్ : హెచ్ఆర్సీ ఎదుట వీసీ అప్పారావు హాజరయ్యారు. హెచ్ సీయూలో విద్యార్ధులకు భోజన వసతులు కల్పించడం లేదంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేత విశ్వేశ్వరరావు హెచ్ ఆర్సీని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో వీసీ సోమవారం హెచ్చార్సీ ఎదుట హాజరయ్యారు. 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి....

రంగారెడ్డి : కీసర మండలం రాంపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థినులు మృతి చెందారు.  మరొకరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  గాయాలయిన వ్యక్తిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతులు హర్షిత మూడో తరగతి చదువుతుండగా.… స్నేహ 8వ తరగతి చదువుతున్నట్లు సమాచారం. గాయలయిన వ్యక్తి మృతులు తాత బాలయ్యగా పోలీసులు గుర్తించారు.

14:43 - March 28, 2016

హైదరాబాద్: డీఎస్సీ నోటిఫికేషన్ ఇంకా ఎందుకు వేయలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎన్నికల సమయంలో విద్యారంగానికి టీఆర్‌ఎస్‌ ఎన్నో హామీలిచ్చినా.. ఇంతవరకు ఒక్కటీ కూడా అమలు చేయలేదని డీకే అరుణ విమర్శించారు. సోమవారం ఆమె అసెంబ్లీలో విద్యారంగంపై ప్రసంగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో గణనీయంగా విద్యార్ధుల సంఖ్య తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్‌ మీడియాన్ని ప్రవేశపెట్టాలని సూచించారు. అదేవిధంగా వెంటనే డీఎస్సీ ప్రకటించి.. ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలన్నారు డీకే డిమాండ్ చేశారు. 

14:32 - March 28, 2016

నెల్లూరు : మంత్రి నారాయణకు సొంతూరు నెల్లూరులోనే దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయింది. ఓ విద్యార్థిని వేసిన సూటి ప్రశ్నకు మంత్రి నారాయణ కంగుతిన్నారు. బేసిక్స్‌ చెప్పకుండా ఐఐటీ ఫౌండేషన్‌ కోర్సు పెడితే ప్రయోజనం ఏంటంటూ ఆ విద్యార్థిని వేసిన ప్రశ్నతో మంత్రి నీళ్లు నమిలారు. పిల్లర్లు వేయకుండా బిల్డింగ్‌లు ఎలా కడతారంటూ.. టీచర్ల కొరతను ప్రస్తావించడంతో దిక్కుతోచని మంత్రి ఆ అమ్మాయిని మరో ప్రశ్న వేయకుండా కూర్చోబెట్టేశారు.  
మంత్రికి ఝలక్..
మున్సిపల్‌ మంత్రి నారాయణకు నెల్లూరు విద్యార్థిని ఝలక్‌ ఇచ్చింది. సర్కారీ స్కూళ్ల విద్యార్థులను  కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దేందుకు నిరుడు జిల్లాలోని మున్సిపల్‌, ప్రభుత్వ పాఠశాలల్లో ఐఐటీ ఫౌండేషన్‌ కోర్సును ప్రారంభించారు. వీటి పనితీరును పరిశీలించేందుకు సుంకు చెంగన్న కార్పొరేషన్‌ స్కూలుకు వచ్చిన మంత్రి నారాయణను అక్కడి ఓ విద్యార్థిని కంగు తినిపించింది. తాను ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఐఐటీ ఫౌండేషన్‌ వల్ల ఉపయోగం ఉందా లేదా అని గుచ్చిగుచ్చి ప్రశ్నించినా.. ఆ అమ్మాయి అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ టీచర్ల కొరత అంశాన్నే ప్రస్తావించింది. 
ఎవరా అమ్మాయి..?
మంత్రి నారాయణను నిలదీసిన విద్యార్థిని యజ్ఞశ్రీ స్థానిక ఓ ఆటో డ్రైవర్‌ కుమార్తె. చదువులో ఎంతో తెలివైన, చురుకైన అమ్మాయి.  పదో తరగతి చదువుతోన్న యజ్ఞశ్రీ పరీక్షల్లో టాప్‌ ర్యాంకు సాధిస్తుందని విద్యార్థులు, టీచర్లు గట్టి నమ్మకంతో ఉన్నారు. ర్యాంకు స్టుడెంట్‌ ఎత్తి చూపిన టీచర్ల కొరతను తీర్చేందుకు మంత్రి నారాయణ ఇప్పటికైనా కృషి చేస్తారో లేదో వేచి చూడాలి. 

14:21 - March 28, 2016

అనంతపురం: క్షణికావేశం ఓ విద్యార్థి ప్రాణాన్ని తీసింది. ఫెయిర్వెల్ పార్టీ ఏర్పాట్ల సందర్భంగా ఇద్దరి విద్యార్థుల మధ్య జరిగిన చిన్న వాగ్వాదం పెద్ద గొడవగా మారింది. చివరకు ఓ విద్యార్థి సహచరుడిపై దాడి చేయడంతో తలకు తీవ్రగాయం కావడంతో బాదిత విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని ఎన్ఆర్ఐ ఇంజినీరింగ్ కాలేజీలో ఫెయిర్ వెల్ పార్టీ కోసం జరగాల్సింది ఉంది. ఈ ఏర్పాట్లను చూస్తున్న ధనుంజయ్, సతీష్ ల మధ్య ఫండ్స్ కలెక్షన్ వ్యవహారంలో స్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఈ విషయమై వాదులాడుకున్నారు. ఆవేశంలో సతీష్ దనుంజయ్ పై క్షణికావేశంతో దాడి చేయడంతో తలకు బలమైన గాయమయ్యింది. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. సదరు విద్యార్థి మృతి చెందినట్లు డాక్టర్లు దృవీకరించారు. సమాచారం అందుకుని ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

తెలుగు రాష్ట్రాలకు హైకోర్టు సూచనలు..

హైదరాబద్ : వేసవి సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు హెకోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో మధ్యాహ్నం 12 నుండి 3 వరకూ కూలి పనులు నిషేదించాలని హైకోర్టు పేర్కొంది. పనిప్రదేశాల్లో షెల్టర్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎండల పట్ల ప్రజలకు అవగాహన కల్పించే విధంగా విస్తృంగా ప్రచారం చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ ఆదేశాలు జులై వరకూ పరిగణలోకి తీసుకోవాలని తెలిపింది.

ఫేర్ వెల్ పార్టీలో ఘర్షణ, విద్యార్థి మృతి..

అనంతపురం : ఇంజనీరింగ్ ఫేర్ వెల్ పార్టీలో విషాదం నెలకొంది. ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ధనుంజయ్ అనే విద్యార్థి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఓ విద్యార్థిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

13:51 - March 28, 2016

హైదరాబాద్ : హెచ్.సీ.యూ మెయిన్ గేటు వద్ద విద్యార్థులు నిరసనకు దిగారు. విసి అప్పారావును విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే అక్రమంగా పోలీసులు అరెస్టు చేసిన తమ సాటి విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎప్పుడు హెచ్.సీ.యూలో ధర్నా చేసే విద్యార్థులు నేడు ఎన్నడూ లేని విధంగా మెయిన్ గేటు ముందు ధర్నాకు దిగారు. మీడియాను లోపలికి రానీయకుండా తమపై పోలీసులు జరుపుతున్న దాష్టికాన్ని విద్యార్థులు దుయ్యబట్టారు. హెచ్.సీ.యూలో పరిస్థితులపై వీసీ అప్పారావు నియమించిన ప్రొ.కామయ్య కమిటీని కూడా వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. రోహిత్ వేముల ఘటనలో క్రియాశీలకంగా పనిచేసిన వారిని యాజమాన్యం, పోలీసులు టార్గెట్ చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. వీసీని తొలగించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని విద్యార్థి జేఏసీ స్పష్టం చేసింది. 

13:45 - March 28, 2016

హైదరాబాద్ : ప్రజాప్రతినిధుల జీతాల పెంపు చట్ట సవరణ బిల్లును మంత్రి హరీష్‌రావు సభలో ప్రవేశపెట్టారు. దీంతో ప్రజాప్రతినిధుల జీతభత్యాలకు మూడు లక్షల వరకు పెరగనున్నాయి. దీంతో ప్రభుత్వంపై ఏడాదికి 42.67 కోట్ల భారం పడనుంది. కాగా తమ జీతభత్యాలకు సంబంధించిన బిల్లు కాబట్టి వెంటనే పాస్ అవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కేవలం ప్రజా ప్రతినిధుల జీతభత్యాలపైనే కాకుండా, ప్రజారోగ్యం, విద్య, సంక్షేమంపై దృష్టి సారించాలని సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి. 

సీఎం చంద్రబాబుని కలిసిన టీ.టీడీపీ నేతలు...

హైదరాబాద్ : టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీ.టీడీపీ నేతలు ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా రేపు ఉ.8 గంటలకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో సీఎం చంద్రబాబు పార్టీ పతాక ఆవిష్కరణ చేయనున్నారు. సాయంత్రం ఆవిర్భావ దినోత్సవ సభ జరుగనుంది. అనంతరం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. ఈ సభకు తెలుగు రాష్ట్రాల నుండి పలువురు టీడీపీ నేతలు హాజరుకానున్నారు. 

టీ.అసెంబ్లీలో జీతభత్యాల బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి హరీష్ రావు.

హైదరబాద్ : ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ జీతాల పెంపు బిల్లును టీ. అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు. ఈ బిల్లుతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వేతనాలు రూ.2.30లక్షలకు పెరగనున్నాయి. ఈ బిల్లుతో ప్రభుత్వానికి ఏడాదికి రూ.42.67 కోట్ల అదనపు భారం పడనుంది.

సీఎం చంద్రబాబును కలిసిన సీపీఐ నేతలు...

హైదరాబాద్ : సీపీఐ నేతలు రామకృష్ణ, ముప్పాళ్ల, చంద్రశేఖర్ సీఎం చంద్రబాబును కలిశారు. అగ్రిగోల్డ్ బాధితులు, పోలవరం నిర్వాసితుల సమస్యలపై వెంటనే స్పందించాలని సీఎంను కలిసి వినతిపత్రం అందజేశారు.

ప్రొ.కామయ్య కమిటీ మాకు అవసరం లేదు: విద్యార్థి జేఏసీ

హైదరాబాద్ : హెచ్ సియూ లో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ప్రొ.కామయ్య ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యులతో ఓ కమిటిని వీసీ అప్పారావు నియమించారు.  వీసీ అప్పారావు వేసిన కమిటీ మాకు అవసరం లేదని జేఏసీ తేల్చి చెప్పింది. వెంటనే వీసీ అప్పారావును తొలగించాలని... అప్పటి వరకు తమ ఆందోళన కొనసాగుతుందని విద్యార్థి జేఏసీ స్పష్టం చేసింది. అంతే కాకుండా అరెస్టు చేసిన విద్యార్థులను బేషరతుగా విడిచి పెట్టాలని డిమాండ్ చేస్తోంది.

12:36 - March 28, 2016

హైదరాబాద్ : పేదవాళ్లను ఆదుకోవాలనే సంకల్పంతో 58 జీవో ద్వారా లక్షా 20 వేల మందికి పట్టాలిచ్చిన అంశాన్ని విమర్శించడం సరికాదన్నారు మంత్రి ఈటెల. కాంగ్రెస్‌ హయాంలో దోచుకున్న భూములను.. తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామన్నారు. 

12:34 - March 28, 2016

హైదరాబాద్ : ఆప్ఘానిస్థాన్ నూతన పార్లమెంట్ భవనం పై రాకెట్ దాడి జరిగింది. కొత్త గా నిర్మించిన పార్లమెంట్ భవనం పై నాలుగు రాకెట్లతో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. పార్లమెంట్ భవ నిర్మాణానికి భారత్ ఆర్థిక సాయం చేయగా.. గత డిసెంబర్ లో ఆప్ఘాన్ నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోడీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ దాడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

12:33 - March 28, 2016

హైదరాబాద్ : హెచ్‌సీయూ ఘటనలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు అన్నీ యూనివర్సిటీల్లో విద్యార్ధులు తరగతులను బహిష్కరించారు. హెచ్‌సీయూ వీసీపై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. విద్యార్ధుల డిమాండ్లపై వీసీ అప్పారావు.. ప్రొఫెసర్‌ కామయ్య నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఏడుగురు సభ్యులతో ఏర్పడిన కమిటీ.. హెచ్‌సీయూ ఘటనపై విచారణ చేపట్టనుంది. అయితే.. ఈ కమిటీని విద్యార్ధులు వ్యతిరేకిస్తున్నారు. అప్పారావునే వద్దనుకున్నాం.. ఆయన వేసిన కమిటీ ఎందుకని విద్యార్ధులు ప్రశ్నిస్తున్నారు. అప్పారావు వర్సిటీ విడిచి వెళ్లాల్సిందేనని విద్యార్ధులు పట్టుపడుతున్నారు. వీసీని తొలగించే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేస్తున్నారు. 

12:32 - March 28, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రతి మండలంలోనూ షీ టీమ్‌లు ఏర్పాటు చేస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పారు. రాష్ట్రంలో క్రైమ్‌ రేట్‌, మహిళల భద్రతపై పలువురు అడిగిన సభ్యులకు నాయిని జవాబిచ్చారు. మహిళల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. క్రైమ్‌ రేటు తగ్గించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు నాయిని తెలిపారు. 

చర్లపల్లి జైలులో విద్యార్థులను పరామర్శించిన తమ్మినేని....

హైదరాబాద్ : చర్లపల్లి జైల్లో హెచ్ సీయూ విద్యార్థులను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అక్రమంగా అరెస్ట్ చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని, వీసీ అప్పారావుపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 

డీజిల్ దొంగల ముఠా గుట్టురట్టు...

నల్లగొండ: డీజిల్ దొంగల ముఠాను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హెచ్ సీసీఎల్, ఐసీఎల్ కంపెనీల పైప్ లైన్లను లీక్ చేసి డీజిల్ ను  దొంగిలిస్తున్నట్లు అనుమానించి కంపెనీల సిబ్బందితో పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో బీబీ నగర్ మండలం పడమటి సోమారం వద్ద కాపు కాసి ఏడుగురు సభ్యుల ముఠా ను అదుపులోకి తీసుకున్నారు. రోజుకు 3 నుండి 4 ట్యాంకర్ల డీజిల్ ను డంప్ చేస్తున్నట్లు దార్యప్తులో తెలిసింది. డంపింగ్ చేసిన డీజిల్ సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముఠా సభ్యులలో ముగ్గురు కరీంనగర్ వాసులు గా పోలీసులు గుర్తించారు.

ఆప్ఘానిస్థాన్ పార్లమెంట్ భవనం పై రాకెట్ దాడి

హైదరాబాద్ : ఆప్ఘానిస్థాన్ నూతన పార్లమెంట్ భవనం పై రాకెట్ దాడి జరిగింది. గత డిసెంబర్ లో ఆప్ఘాన్ నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోడీ ప్రారంభించిన విషయం తెలిసిందే.

11:58 - March 28, 2016

ఢిల్లీ : రాష్ట్రపతి భవన్ లో పద్మ అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది. మొత్తం 56 మంది ప్రముఖులకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పద్మ ప్రదానం చేశారు. 5గురికి పద్మవిభూషన్, 8 మందికి పద్మభూషణ్, 43 మందికి పద్మశ్రీ పురస్కారాలు బహూకరించారు. పద్మవిభూషణ్ అందుకున్న వారిలో హీరాచంద్‌ అంబానీ, అవినాశ్‌ కమలాకర్‌ దీక్షిత్‌, జగ్‌మోహన్‌, ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవి శంకర్‌ ఉన్నారు. ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రణబ్‌ వీరికి అవార్డులను ప్రదానం చేశారు. పద్మభూషణ్‌ అందుకున్న వారిలో సైనా నెహ్వాల్‌, అనుపమ్‌ ఖేర్‌, మాజీ కాగ్‌ వినోద్‌ రాయ్‌, రసాయన శాస్త్ర పరిశోధకులు ఆల్ల వెంకట రామారావు, వైద్యులు దువ్వూరు నాగేశ్వర్‌ రెడ్డి తదితర ఎనిమిది మంది ప్రముఖులు ఉన్నారు. పద్మశ్రీ అందుకున్న వారిలో రంగస్వామి అన్నాదొరై, దర్శకుడు మధుర్‌ భండార్కర్‌, నటుడు అజయ్‌ దేవగణ్‌, అజయ్ పాల్ సింగ్ పంగా, ఆర్చర్‌ దీపికా కుమారి సహా 43 మంది వున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రామహాజన్‌, ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, వెంకయ్యనాయుడు, స్మృతీ ఇరానీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, భాజపా సీనియర్‌నేత అద్వాణీ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

వైసీపీది కపట ప్రేమ : బోండా ఉమ

హైదరాబాద్: ఏపీ సెంబ్లీలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ అంశంపై చర్చ జరగాలని ప్రతిపక్షం పట్టుపట్టింది. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడారు. అగ్రిగోల్డ్ బాధితులపై వైసీపీ నేతలది కపటప్రేమని విమర్శించారు. బాధితులకు న్యాయం చేసే విషయంపై ప్రభుత్వం కట్టుబడి వుందని ఆయన తెలిపారు.

ఢిల్లీలో పద్మ వార్డుల ప్రదానోత్సవం

ఢిల్లీ : రాష్ట్రపతి భవన్ లో పద్మఅవార్డుల కార్యక్రమం జరుగుతోంది. రిలయన్స్‌ సంస్థల మూలపురుషుడు ధీరూభాయి హీరాచంద్‌ అంబానీ, జమ్ముకశ్మీర్‌ మాజీ గవర్నర్‌ జగ్‌మోహన్‌, బాలీవుడ్‌ నటులు అనుపమ్‌ ఖేర్‌, అజయ్‌ దేవగణ్‌, బ్యాడ్మింటన్‌ తార సైనా నెహ్వాల్‌ తదితర 56 మంది ప్రముఖులకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పద్మ అవార్డులను అందించనున్నారు.

అగ్రిగోల్డ్ బాధితులపై వైసీపీదీ కపట ప్రేమ: బోండా

హైదరాబాద్ : అగ్రి గోల్డ్ బాధితులపై వైసీపీ నేతలది కపట ప్రేమ అని మంత్రి బోండా ఉమా విమర్శించారు. ఏప అసెంబ్లీలో అగ్రిగోల్డ్ బాధితులపై చర్చ జరగాలని వైసీపీ పట్టుబట్టి సభను జరగకుండా అడ్డుకుంది. ఈ సందర్భంగా బోండా మాట్లాడుతూ.. అగ్రి గోల్డ్ బాధితులందరికీ ప్రభుత్వం న్యాయం చేస్తుందని స్పష్టం చేశారు.

ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న గందరగోళం

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీలో గందరగోళం కొనసాగుతుంది. అగ్రిగోల్డ్ పై చర్చ జరపాలని వైసీపీ సభ్యులు పట్టుబడుతున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని సభలో వైసీపీ సభ్యులు నినాదాలతో హోరెత్తిస్తున్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.

హెచ్ సియూ ఆందోళన పై కమిటి ఏర్పాటు

హైదరాబాద్ : హెచ్ సియూ విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ఓ కమిటీ ఏర్పాటు అయ్యింది. ఈ కమిటీకి ప్రొఫెసర్ కామయ్య నేతృత్వంలో ఏడుగురు సభ్యులు పనిచేయనున్నారు. సమస్యల పరిష్కారానికి విద్యార్థి సంఘాలతో ఈ కమిటి చర్చించనుంది. పలు అంశాలపై ఆరు వారాల్లో ఈ కమిటి నివేదిక ఇవ్వనుంది.

11:02 - March 28, 2016

హైదరాబాద్ : వరకట్న వేధింపులు  ఓ మహిళను బలిగొన్నాయి. అంతేకాకుండా అందరూ ఉన్నా,.. చివరకు ఆమె శవం కూడా అనాథగా మారింది. గత్యంతరంలేని పరిస్థితుల్లో పోలీసులే చివరకు అంత్యక్రియలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ దారుణ విషాద సంఘటన ఆదిలాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది.  వివరాల్లోకి వెళితే.. జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో సాగర్, రాజేశ్వరిలు మూడు సంవత్సరాలుగా నివాసముంటున్నారు. అయితే కొన్ని రోజులుగా వీరి మధ్య గొడవలు జరుగడంతో రాజేశ్వరి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది.
'కట్నం తెమ్మన వేధింపులు.. అక్రమ సబంధం..'
అయితే ఆమె మరణానికి భర్తే కారణమని రాజేశ్వరి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిత్యం అదనపు వరకట్నం తెమ్మని వేధించడంతో పాటు, సాగర్ పనిచేస్తున్న సంస్థలో పనిచేస్తున్న ఓ యువతితో అక్రమ సంబంధం కూడా పెట్టుకున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. అందుకే తమ కూతురు మనోవేదనతో ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్నారు.  
పరస్పర ఆరోపణలు..
ఈ నేపథ్యంలో ఇరువర్గాలు తీవ్ర వాగ్వావాదానికి దిగారు. దీంతో వీరి మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. మృతదేహాన్ని , 'మాకిమ్మంటే.. మాకివ్వాలంటూ' ఇరు వర్గాలు ఆందోళనకు దిగాయి. పోలీసులు గొడవను సద్దుమనిగించే ప్రయత్నం చేసినా వినలేదు. దీంతో పోలీసులే బందోబస్తును ఏర్పాటు చేసి ,మృత దేహాన్ని తమ ఆధ్వర్యంలో ఖననం చెయ్యడానికి స్మశాన వాటికకు తీసుకెళ్లారు.

బాహుబలి కిరీటంలో మరో కలికితురాయి...

హైదరాబాద్ : 63వ జాతీయ చలన చిత్రాల అవార్డులను కేంద్ర ప్రభత్వం ప్రకటించింది. భారతీయ చలన చిత్ర రికార్డులను బద్దలు కొట్టిన తెలుగు చిత్రం ‘బాహుబలి’ కిరీటంలో మరో కలికితురాయి చేరింది. వసూళ్లలో హిందీ చిత్రాల రికార్డులను తిరగరాసి సరికొత్త రికార్డులను తెరతీసిన ఈ చిత్రం జాతీయ ఉత్తమ చలన చిత్రంగా ఎంపికైంది. 63వ జాతీయ చలన చిత్ర అవాఉర్డులలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ, అనుష్క, సత్యారాజ్, నాజర్... ప్రధాన పాత్రధారులుగా ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ తన స్థాయిని మరోసారి నిరూపించుకుంది.

10:48 - March 28, 2016

హైదరాబాద్ : జక్కన్న నిర్మించిన దృశ్య కావ్యం 'బాహుబలి' టాలీవుడ్ లో ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది.. మరెన్నో రివార్డులను సొంతం చేసుకుంది. టాలీవుడ్ స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. ఈ చిత్ర రాజానికి బాలీవుడ్ సైతం సలాం కొట్టింది. ఏ సౌత్ చిత్రం పొందనంత ఆదరణ బాలీవుడ్ లోనూ బాహుబలి సొంతం చేసుకుంది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ సినిమా 600 కోట్ల రూపాయల వసూళ్లు సాధించడంతో పాటు ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉత్తమ చలనచిత్రంగా ఎంపికై, తెలుగు సినిమా కీర్తి ప్రతిష్ఠలను పతాక స్థాయికి తీసుకెళ్లింది. ఇంతకుముందు జాతీయ స్థాయిలో శంకరాభరణం సినిమాకు స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. ఆ తర్వాత ఇప్పటివరకు జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు గుర్తింపు రావడం ఇదే ప్రథమం. అలాగే టాలీవుడ్ ఖ్యాతిని బాలీవుడ్ కు కూడా చాటి చెబుతూ.. నార్త్ చిత్రాల్ని వెనక్కి నెట్టి జాతీయ ఉత్తమ చలన చిత్రంగా ఎంపికయ్యింది. 63వ జాతీయ చలన చిత్ర అవార్డులను నేడు ప్రకటించారు. ఇందులో ఉత్తమ చిత్రంగా బాహుబలి ఎంపికయ్యింది. ఉత్తమ నటుడు కేటగిరీలో అమితాబచ్చన్ (పీకు), ఉత్తమ డైరెక్టర్ గా సంజయ్ లీల బన్సాలీ(బాజారావ్ మస్తానీ), ఉత్తమ నటిగా కంగనా రనౌత్ (తను వెడ్స్ మను రిటర్న్స్) ఎంపికయ్యారు.

బొగ్గుస్కాంలో తొలి తీర్పు...

ఢిల్లీ :దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి భరత్ ప్రశాంత్ తన తీర్పును వెలువరించారు. జార్ఖండ్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ లోని ఇద్దరు డైరెక్టర్లు ఆర్ఎస్ రుంగ్తా, ఆర్సీ రుంగ్తాలు దోషులని, వారిని తక్షణం కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.

చిట్టీల పేరుతో ఘరానా మోసం

హైదరాబాద్ : ఆల్విన్‌ కాలనీలో చిట్టీల పేరుతో ఘరానా మోసం జరిగింది. మల్లిక అనే మహిళ చిట్టీల పేరుతో రూ.6 కోట్లు వసూలు చేసి ఉండాయించారు. దీంతో బాధితులు ఆందోళనలో ఉన్నారు. బాధితులు జగద్గిరిగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ఆరంభించారు. 

ఉత్తమ చిత్రంగా బాహుబలి

హైదరాబాద్ : 63వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించారు. ఉత్తమ చిత్రంగా బాహుబలి ఎంపిక కాగా, ఉత్తమ నటుడుగా అమితాబచ్చన్, ఉత్తమ డైరెక్టర్ గా సంజయ్ లీల బన్సాలీ, ఉత్తమ నటిగా కంగనా రనౌత్ ఎంపికయ్యారు.

నేడు బొగ్గు కుంభకోణంలో తొలి తీర్పు

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన బొగ్గు కుంభకోణంలో తొలి తీర్పు నేడు రానుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ కేంద్ర మంత్రి దర్శకరత్న దాసరి నారాయణరావులు బొగ్గు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

46 ఫైర్ స్టేషన్ల ఏర్పాటు : మంత్రి నాయిని

హైదరాబాద్ : టీ.అసెంబ్లీలో హోమ్ మినిస్టర్ నాయిని అగ్నిమాపక శాఖ గురించి మాట్లాడారు. ఇప్పటికే రాష్ట్రంలో 91 అగ్రిమాపక కేంద్రాలున్నాయన్నాని తెలిపారు. మరో 46 కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. యాదాద్రి, శంషాబాద్ లలో ఫైర్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీటి ఆధునీకరణకు బడ్జెట్ లో రూ.61.84 కోట్లు కేటాయించామన్నారు. ఈ రంగంలో వున్న ఉద్యోగాలను భర్తీ చేయటానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా నాయిని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా యూనివర్సిటీల్లో తరగతుల బహిష్కరణ

హైదరాబాద్: విద్యార్థులపై పోలీసుల దాడిని నిరసిస్తూ హెచ్‌సీయూ విద్యార్థి జేఏసీ సోమవారం దేశవ్యాప్తంగా యూనివర్సిటీల్లో తరగతుల బహిష్కరణకు పిలుపునిచ్చింది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా పలు యూనివర్సిటీల విద్యార్థులు తరగతులను బహిష్కరించి అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన తెలిపారు. వీసీ అప్పారావును తొలగించి, విద్యార్థులపై పెట్టిన కేసులను వెంటనె ఎత్తి వేయాలని ఈ సందర్భంగా హెచ్#సీయూ జేఏసీ డిమాండ్ చేసింది. విద్యార్థులపై దాడికి పాల్పడ్డ పోలీసులపై చర్యలు తీసుకోవాలని జేఏసీ విద్యార్థులు డిమాండ్ చేశారు.

రూ.80లక్షల విలువైన ఎర్రచందనం పట్టివేత...

హైదరాబాద్ : అనంతపురం జిల్లా నుంచి కర్ణాటకకు లారీలో తరలిస్తున్న 3 టన్నుల ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ, కర్నాటక సరిహద్దులో ఉన్న టోల్‌గేట్‌ వద్ద లారీని పట్టుకున్నట్లు బాగేపల్లి పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ రూ.80లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాగేపల్లి పోలీసులు తెలిపారు.

వైసీపీ నేతలకు జగన్ పై నమ్మకం లేదు: చినరాజప్ప

హైదరాబాద్ : అసెంబ్లీ లాబీలో డిప్యూటీ సీఎం చినరాజప్ప మాట్లాడారు. జగన్ పై వైసీపీ నేతలు నమ్మకం కోల్పోయారని అందుకే వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలోకి రావటానికి సిద్ధపడుతున్నారని పేర్కొన్నారు. జ్యోతుల నెహ్రూ వచ్చిన కొద్దికాలంలోనే మరికొందరు వైసీపీ నేతలు టీడీపీలో చేరతారని ఆయన తెలిపారు.

10:21 - March 28, 2016

హైదరాబాద్ : ప్రతి నియోజక వర్గానికి కనీసం ఒక అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే చిన్నా రెడ్డి అడిగిన ప్రశ్నకు హోం మంత్రి సమాధానం ఇచ్చారు. 'అగ్నిమాపక డిపార్టుమెంటకు నిదుల పెంచాము. 18 అసెంబ్లీ నియోకవర్గాల్లో ఫైర్ స్టేషన్లను మంజూరు చేశాము. హైదరాబాద్ 11, వరంగల్ లో 6 కొత్త ఫైర్ స్టేషన్లునిర్మిస్తాం. శంషాబాద్, యాదాద్రిలో ఫైర్ స్టేషన్లు నిర్మించాలనే ప్రతిపాదనలున్నాయి. ఫైర్ డిపార్ట్ మెంట్ లో ఔట్ సోర్సింగ్ పోస్టులను పూర్తి చేయాల్సి ఉంది. కొత్త ఫైర్ స్టేషన్లకు ప్రతిపాదనలు వచ్చాయి వాటిని పరిశీలిస్తున్నాము. ఫైర్ డిపార్ట్ మెంట్లను ఆధునీకరించడం కోసం ఫైర్ మోటార్ సైకిళ్లు, మిస్ట్ బుల్లెట్స్ ను ప్రవేశ పెట్టాము. ఫైర్ యాక్సిండెంట్లను నివారించడానికి అగ్ని మాపక బృంధాలను నగరాలకు విస్తరిస్తాము.' అని నాయిని అసెంబ్లీలో మాట్లాడారు.  

10:18 - March 28, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరో పదినిమిషాలపాటు వాయిదా పడింది. వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైనప్పటికీ వైసీపీ సభ్యులు తమ నినాదాలను ఆపలేదు. ఇంకాస్త ముందుకు వెళ్లి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని వైసీపీ సభ్యులు పట్టుపట్టారు. ఈ నేపథ్యంలో సభలో గందరగోళ వాతావరణం కొనసాగుతుండటంతో స్పీకర్ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కాగా నేటి ఉదయం ప్రశ్నోత్తరాలను ప్రారంభించగానే 'అగ్రి గోల్డు బాధితులకు' న్యాయం చేయాలంటూ.. ఈ అంశంపై సభలో చర్చించాలంటూ వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. ప్రారంభంలో ఓ సారి ఐదు నిమిషాలపాటు సభను వాయిదా వేసిన విషయం తెలిసిందే. 

తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం..

హైదరాబాద్ : నేటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ మధుసూధనాచారి ప్రశ్నోత్తరాల చేపట్టారు. ఫైర్ స్టేషన్లపై అడిగిన ప్రశ్నకు హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి సమాధానం చెబుతున్నారు. 

మరో పది నిమిషాలు వాయిదా..

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. ఈ నేపథ్యంలో సద్దుమనగకపోవడంతో స్పీకర్ మరో 10నిమిషాలపాటు సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 

చిన్నారిని గొంతు నులిమి చంపిన తండ్రి...

నిజామాబాద్ : డిచ్ పల్లి మండలం ధర్మారంలో విషాదం నెలకొంది. మద్యం సేవించిన తండ్రి 4 నెలల వయస్సున్న తన కుమారుడిని గొంతు నులిమి చంపివేసిన ఘటన జరిగింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని  తండ్రిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి...

చిత్తూరు : గంగాధర నెల్లూరు మండలం మెల్లేపల్లిలో ఓ కారు చెట్టును ఢీకొని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా వుంది. మృతుల్లో ఓ కానిస్టేబులు కూడా వున్నారు. గాయపడిన వారిని దగ్గరలో వున్న ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

తిరిగి ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ..

హైదరాబాద్ : అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం మళ్లీ ప్రారంభమైయింది. సభ ప్రారంభమైన తర్వాత కూడా 'అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని' వైసీపీ సభ్యులు పట్టుబడుతూ నినాదాలు కొనసాగిస్తూనే ఉన్నారు. 

09:42 - March 28, 2016

తిరుమల : నకిలీల బాగోతం తిరుమల శ్రీవారినీ వదలటం లేదు. శ్రీవారికి నైవేథ్యంగా పెట్టే జిలేబీలు నకిలీవి పుట్టుకొచ్చేస్తున్నాయి. ఏంటీ ఈ నకిలీ జిలేజీలు అని ఆశ్చర్యపోతున్నారా? పవిత్రమైన తీర్థం, అక్షింతలు,.ఆఖరికి స్వామి వారి వక్షస్థల లక్ష్మీదేవి ప్రతిమనూ వదలటంలేదు నకిలీ తయారీదారులు.
నకిలీ జిలేబీలు..
భక్తులకు స్వామి వారిపై ఉన్న నమ్మకాన్ని కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. తిరుమలలో నకిలీ వ్యవహారం దళారులకు,అర్చకులకు కాసుల వర్షం కురిపిస్తోంది. శ్రీవారి ఆలయంలోని పోటులో పనచేసే ఓ కార్మికుడు ఏకంగా తన ఇంటిలోనే నకిలీ జిలేబీలు అమ్మడం ప్రారంభించాడు. జిలేబీలు తయారుచేయడంలో తనకున్న అనుభవంతో రుచి, రంగు, సైజులో ఏమాత్రం తేడా లేకుండా తయారుచేశాడు. దీంతో భక్తులే కాదు,టీటీడీ ఉద్యోగులు కూడా నమ్మేసారు.చివరికి పోలీసులకు పట్టుబడితేగానీ అసలు విషయం బయటపడలేదు.
తీర్థాన్నీ వదల్లేదు..
ఇక శ్రీవారి తీర్థం అద్భుతమైన పరిమళం వెదజల్లుతూ ఉంటుంది. అలాంటి తీర్థాన్ని కూడా కొందరు ప్రబుద్ధులు నకిలీగా తయారుచేసి అమ్మేస్తున్నారు. తీర్థం ఎలా తయారుచేయాలో ఆలయంలో పనిచేసే అర్చకులకు మాత్రమే తెలుసు. అయినా స్వామివారి అతిపవిత్రమైన తీర్థాన్ని కూడా తమ ఇళ్లల్లో తయారు చేసి, 100 మిల్లీలీటర్ బాటిల్‌ను 200కు అమ్ముతున్నారు మాయగాళ్లు. అంతేకాదు.. లక్ష్మీదేవి నకిలీ ప్రతిమలను సైతం తయారు చేసి అర్చకులు, అధికారులు వ్యాపారం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు..శ్రీవారి వక్ష స్థలంపై ఉండే,లక్ష్మీ దేవికి చందనం ముద్ద అద్ది, అచ్చులాగా తీస్తారు.దీంతో లక్ష్మీ దేవి ప్రతిమ ఏర్పడుతుంది.ఒక్కో ప్రతిమను రూ.500నుంచి రూ.1000 వరకూ అమ్ముతున్నారు. భక్తులే కాదు.., టీటీడీ ఉద్యోగులు కూడా నకిలీ తయారీదారుల చేతిలో మోసపోతున్నారు. ఇలాంటి వారిపై ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.

09:34 - March 28, 2016

ఖమ్మం : 'నేను నాటిక ప్రదర్శించడానికి అమ్మే కారణం.. ఈ నాటికను అమ్మకు అంకితమిస్తున్నానంటూ సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి తెలిపారు. ప్రజానాట్యమండలి, అమరజీవి అన్నాబత్తుల రవీంద్రనాథ్‌ సాంస్కృతిక సంస్ధ ఆధ్వర్యంలో ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో 'వైతరణి' అనే నాటిక ప్రదర్శించారు. జయప్రకాష్‌రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన ఈ నాటిక ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా నాటిక ప్రదర్శించడం చాలా సంతోషంగా ఉందని జయప్రకాష్‌రెడ్డి అన్నారు. చిన్నప్పుడు ఖాళీగా ఉంటే.. నాటికలు వేయొచ్చు కదా అని మా తల్లిదండ్రులు ప్రోత్సహించాని వెల్లడించారు.. ఈ కార్యక్రమానికి పలువురు కళాకారులు హాజరయ్యారు. ఈ నాటికలో జయప్రకాశ్ రెడ్డి ప్రదర్శించిన అద్భుత నటనను వీడియోలో చూడవచ్చు. 

చిక్కిన అవినీతి చేప..

నెల్లూరు : జిల్లాలో ఓ అవినీతి చేప ఏసీబీ అధికారుల గ్యాలానికి చిక్కింది. కావలి జనతాపేటలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దత్తలూరు తహశీల్దార్ లలితకుమారి రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబపడింది. 

09:19 - March 28, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఐదు నిమిషాలపాటు వాయిదా పడింది. నేటి ఉదయం సమావేశాలను ప్రారంభించిన స్పీకర్ ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. ఈ తరుణంలో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై చర్చించాలంటూ పట్టుబట్టారు. స్పీకర్ అనుమతించకపోవడంతో.. 'అగ్రిగోల్డ్ బాధితులకు' న్యాయం చేయాలంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో సభలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. కాగా మధ్యలో కలగజేసుకున్న మంత్రి అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు, బోండా ఉమా సభ సజావుగా సాగేందుకు సహకరించాలని వైసీపీని కోరారు.  ఈ సమస్యపై తర్వాత చర్చిద్దామని పలు మార్లు సహకరించాలని స్పీకర్ కోరారు. కాగా దీనికి వైసీపీ సభ్యులు ఒప్పుకోకుండా 'బాధితులకు న్యాయం చేయాలంటూ' నినాదాలు చేస్తుండటంతో' సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో సభను ఐదునిమిషాలపాటు వాయిదా వేస్తున్నట్లు కోడెల ప్రకటించారు. 

అసెంబ్లీ ఐదు నిమిషాలు వాయిదా..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఐదు నిమిషాలపాటు వాయిదా పడింది. స్పీకర్ సమావేశాలను ప్రారంభించి ప్రశ్నోత్తరాలు నిర్వహిస్తుండగా.. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. పలు మార్లు సహకరించాలని కోరిన స్పీకర్.. పరిస్థితి సద్దుమనగకపోవడంతో సభను ఐదునిమిషాలపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 

09:09 - March 28, 2016

నల్గొండ : జిల్లాలోని పాన్గల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగివున్న మరో బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో 15 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

ఏపీ అసెంబ్లీ ప్రారంభం..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై వైసీపీ వాయిదా తీర్మానం కోరింది. దీనిపై చర్చ చేపట్టాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. కాగా బీఏసీలో నిర్ణయించిన ప్రకారం సభను కొనసాగిస్తామని ప్రకటించారు. సభను సాఫీగా కొనసాగేలా సహకరించాలని స్పీకర్ వైసీపీ సభ్యులను కోరారు.  

తిరుమలలో భక్తుల రద్దీ..

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. కాగా నేటి శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. అలాగే ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం, కాలినడకన వచ్చే భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుందని సమాచారం.

మామను కత్తితో పొడిచి..

గుంటూరు : క్రోసూరు మండలం ఉప్పర్లలో దారుణం చోటు చేసుకుంది. స్వంత మామను ఓ వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా కుటుంబ కలహాలే ఈ హత్యకు కారమని తెలుస్తోంది.

 

08:44 - March 28, 2016

ప్రజల అభివృద్ధే ఆర్థిక అభివృద్ధి అని టాక్స్ పేయర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు ఆంజనేయులు అన్నారు. కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లు తగ్గించడం వలన ప్రజలపై పడే ప్రభావంపై 10టీవీ నిర్వహించిన 'జనపథం'లో ఆయన పాల్గొని మాట్లాడారు. 'కంపెనీల అభివృద్ధిని ఆర్థిక అభివృద్ధి అని అనరు. మార్కెట్ శక్తుల కోసం ప్రజలపై భారాలు వేస్తున్నారు. ఆడపిల్ల పథకంపై కేంద్రం కనికరం చూపడంలేదు. వృద్ధులకు కేంద్రం కుచ్చు టోపీ పెడుతోంది. సుకన్య సమృద్ధి వడ్డీ రేట్లు భారీగా తగ్గించడం వెనక కారణం ఏమిటి?' అంటూ ప్రశ్నించారు. ఈ కార్యక్రమానికి కాల్ చేసిన ప్రేక్షకుల సందేహాలకు ఆంజనేయులు సమాధానాలు చెప్పారు. అదే సందర్భంలో ప్రేక్షకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ అంశంపై మీ సందేహాలను నివృత్తి చేసుకోవాలంటే వీడియోలో చూడండి.  

రెండు పూటలా ఏపీ అసెంబ్లీ..

హైదరాబాద్ : నేడు ఏపీ అసెంబ్లీ రెండు పూటలా జరుగనుంది. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై వైసీపీ వాయిదా తీర్మానం కోరింది. 344 నిబంధన ప్రకారం రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాల అభివృద్ధిపై నేటి సమావేశాల్లో చర్చ జరగనుంది. 

08:24 - March 28, 2016

మిల్కీ బ్యూటీ తమన్నా ఓ మీడియం రేంజ్ హీరోతో నటించాలని ఆశపడుతోందట. అంతేకాదు ఆ హీరోతో నటించడం టఫ్ అంటోంది. అలాగే ఈ బ్యూటీ ఓ స్టార్ డైరెక్టర్ మూవీలో ఛాన్స్ కోసం ఎదురుచూస్తోందట. ఇంతకీ మిల్కీబ్యూటీ నటించాలనుకుంటున్న ఆ చిన్న హీరో ఎవరో ఏ దర్శకుడి మూవీలో ఛాన్స్ కోసం ఈ  భామ ఈగర్ వెయిట్ చేస్తోందో ఈ వార్త చదవండి.

స్టార్ హీరోయిన్ గా తమన్నా ప్రస్తుతం ఎలాంటి రేంజ్ లో ఉందో తెలిసిందే. ఈ భామ తెలుగుతో పాటు తమిళంలోని స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది. అయిన కూడా ఈ భామకు ఓ వెలితి ఉండిపోయిందట. మిల్కీబ్యూటీని ఓ చిన్న హీరోతో నటించాలనే ఆశ తెగ  టెంప్ట్ చేస్తోందట. 

నేచురల్ యాక్టర్ గా యంగ్ హీరో నానికి మంచి పేరుంది. ఈ హీరో ఏ పాత్రలో అయిన ఇట్టే ఒదిగిపోతాడు. తెలుగులో చాలా మంది హీరోలు నాని పర్మామెన్స్ కి ఫిదా అయిపోతారు. అలాగే తమన్నా కూడా నాని పర్మామెన్స్ అభిమానిగా మారిపోయిందట. అంతేకాదు నానితో నటించే ఛాన్స్ ఎప్పుడొస్తోందో అని ఈ భామ తెగ ఆత్రుతగా ఉందట.

తమన్నా నాని గురించి ఇంక చాలా విషయాలే చెప్పుతోంది. నాని చాలా సహజంగా నటిస్తాడని, ఆయనతో నటించడం సవాల్ లాంటిదే అంటోంది. అయితే నానితో నటిస్తే ఎంతో స్ఫూర్తి కూడా లభిస్తుందని చెప్పుతోంది. అలాగే తమన్నాను త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించాలనే కోరిక కూడా తెగ ఊరిస్తోందట. తమన్నాకు ఈ రెండు ఆశలు ఎప్పుడు తీరుతాయో చూడాలి.

08:16 - March 28, 2016

సమ్మర్ ని మరింత హీటెక్కించడానికే సౌత్ సూపర్ స్టార్ ఫిక్స్ అయ్యాడు. అసలే సమ్మర్ వార్ లో బెర్త్ ల ప్రాబ్లమ్ కనిపిస్తోంది. ఇలాంటి టైంలో కూడా రజనీకాంత్ తన బెర్త్ కన్ ఫర్మ్ అంటూ సిగ్నల్ ఇచ్చేశాడు. మరి సమ్మర్ వార్ కోసం రజనీకాంత్ బెర్త్ ఎప్పుడు ఫిక్స్ చేసుకున్నాడో ఈ వార్త చదవండి..

బాషా రాక ఫిక్సైయింది. ఈసారి కొత్త బాక్సఫీసు రికార్డ్స్ ఖాయం  అనిపిస్తోంది. రెండేళ్లుగా సరైన హిట్టు లేని రజినీకాంత్ సమ్మర్ బరిలో దిగడానికే సిద్దమైయ్యాడు. బంఫర్ సక్సెస్ అవుతుందనుకున్న లింగా బాక్సఫీసు వద్ద నిరాశపరిచింది. దీంతో బాగా నిరాశపడిన రజినీ ఫ్యాన్స్ ఆయన కొత్త సినిమాపై కోటీ ఆశలు పెట్టుకున్నారు.

రజీనీకాంత్ రోబో సినిమా తరువాత మళ్లీ అంతటి సక్సెస్ అందుకోలేపోయాడు. కొచ్చాడయాన్ తో సరికొత్త ప్రయోగం చేసిన అది కాస్త బెడిసికొట్టి బొమ్మల సినిమాగా మిగిలిపోయింది. లింగా సంగతి చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి టైంలో ఆయన చేస్తున్న న్యూ మూవీ కబాలిపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.

రజనీకాంత్ కబాలి సినిమాని మంచి గ్యాప్ చూసుకుని రిలీజ్ చేస్తాడని ఊహిస్తే, అందుకు భిన్నంగా ఈ సినియర్ స్టార్ సమ్మర్ బరీలో దిగుతున్నాడు. ఇప్పటికే సమ్మర్ వార్ లో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 2, బన్నీ సరైనోడు, మహేష్ బాబు బ్రహ్మోత్సవం పోటీలో ఉన్నాయి. ఇవి చాలవన్నట్లు ఇప్పుడు రజనీ కూడా సమ్మర్ నే టార్గెట్ చేయడంతో సమ్మర్ వార్ రసవత్తరంగా మారింది.  

కబాలి సినిమాను మే ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేయాలని రజినీకాంత్ ఫిక్స్ అయ్యాడు. ఈ మూవీలో రాధికాఆప్టే హీరోయిన్ గా నటిస్తోంది. చాలా కాలం తరవాత రజనీ కబాలి మూవీలో మోస్ట్ స్టైలీష్ లుక్ తో దర్శనమిస్తున్నాడు . గత రెండు సినిమాలతో తీవ్రంగా నిరాశపరిచిన రజీనీ కబాలి మూవీతో బాక్సఫీసు రికార్డ్స్ ని క్రియేట్ చేస్తాడా అనేది చూడాలి.  

నల్గొండలో రోడ్డు ప్రమాదం..

నల్గొండ : జిల్లాలోని పాన్గల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగివున్న మరో బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఎర్రచందనం లారీ సీజ్..

అనంతపురం : కొడికొండ చెక్ పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న రూ.80లక్షల విలువైన  ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్న పోలీసులు, లారీని సీజ్ చేశారు. పోలీసులను గమనించిన లారీ డ్రైవర్, క్లీనర్ లారీని అక్కడే వదిలేసి పరారయ్యాయరు. 

08:05 - March 28, 2016

ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనిపించుకోవడానికి ఓ జంట మరోసారి కలిసి నటించబోతున్నారు. ఇప్పటికే మూడు సినిమాలు చేసిన ఆ యంగ్ కాంబినేషన్ మరోసారి జోడికట్టాడానికి రెడీ అయ్యారు. ఇంతకీ నాలుగవసారి కలిసి నటించబోతున్న ఆ యంగ్ హీరో హీరోయిన్స్ ఎవరో హావ్ ఏ లుక్.

ప్రస్తుత జనరేషన్ లో సూపర్ హిట్టు జోడి అనిపించుకున్న కాంబినేషన్ చాలా తక్కువ. అలాంటి తక్కువ మందిలో నాగచైతన్య, సమంతల జోడి ఒకటి. వీరు తొలి సినిమా ఏమాయ చేశావే తోనే  ప్రేక్షకుల మనసుపై చెరిగిపోని ముద్ర వేసేశారు. ఈ జనరేషన్ లో ఆడియన్స్ పై వీరి రేంజ్ లో ముద్ర వేసిన జోడి మరొకటి లేదని చెప్పాలి.

చైతూ,సమంత కాంబినేషన్ అంటనే ఆటోమేటిక్ గా అంచనాలు ఏర్పడుతాయి. ఇప్పటికే ఈ జోడి ఏం మయా చేశావే,ఆటోనగర్ సూర్య, మనం మూవీస్ చేశారు. ఇందులో ఆటోనగర్ సూర్య ప్లాప్ అయినప్పటికి ఈ జోడి కాంబినేషన్ కి మాత్రం మంచి డిమాండ్ ఉంది. అయితే ఇప్పుడు వీరు మరోసారి కలిసి నటిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం చైతూ ప్రేమమ్ రిమేక్ లో నటిస్తున్నాడు. ఈ మూవీ తరువాత అక్కినేని వారసుడు సోగ్గాడే చిన్నినాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో నటించడానికి రెడీ అవుతున్నట్లు టాక్. ఈ కొత్త మూవీలో చైతూ మరోసారి సమంతతో నటిస్తున్నడట.ఇందుకు సమంత కూడా ఒకే చెప్పిందని వినికిడి. ఈ హిట్ కాంబినేషన్ ఈసారి ఎలా మెస్మరైజ్ చేస్తుందో చూడాలి.

  

07:58 - March 28, 2016

మెగాహీరోల్లో సాయిధరమ్ పుల్ డిమాండ్ వచ్చేసింది. దర్శక నిర్మాతలందరూ ఈ హీరో కోసం క్యూకడుతున్నారు. మెగా అల్లుడి ఇంత డిమాండ్ ఏర్పడానికి పెద్ద దర్శకనిర్మాతలకు మంచి రిజనే ఉన్నట్లు తెలుస్తోంది. ఏ రిజన్ తో దర్శకనిర్మాతలు మెగాఅల్లుడి చుట్టు ప్రదక్షణలు చేస్తున్నారో ఈ వార్త చదవండి.

టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న మీడియం రేంజ్ యంగ్ హీరోలు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ ఉన్న డిమాండ్ మరో యంగ్ హీరోకి లేదని చెప్పాలి. ఈ మెగా అల్లుడితో సినిమాలు చేయడానికి ఇటు దర్శకులతో పాటు నిర్మాతలు పోటీపడుతుండడం విశేషం. మెగా ఫ్యామిలీలో స్టార్ హీరోలుండగా సాయిధరమ్ కోసం నిర్మాతలు వెంటపడడం ఏంటీ అనుకుంటున్నారా ఇక్కడే చిన్న లాజిక్ ఉంది. మెగాఅల్లుడితో చేసే వారికి బోలెడు బెనిఫిట్స్ ఉన్నాయట.

సాయిధరమ్ తేజ్ చేసింది కేవలం మూడు సినిమాలే. అందులో ఒక ప్లాప్ ఒక హిట్టు, ఒకటి యావరేజ్ .అయిన కూడా  దర్శకనిర్మాతలు ఆయన సినిమాలు చేయడానికి ఇంటరెస్ట్ చూపడంలో పెద్ద మిషన్ ఉన్నట్లు సమాచారం. ఈ యంగ్ హీరో చేస్తే నిర్మాతకు 10కోట్ల ప్రాఫిట్ గ్యారేంటి. అందుకే మెగాఅల్లుడి డేట్స్ కోసం నిర్మాతలు ఆరాటపడుతున్నట్లు తెలుస్తోంది.

సాయిధరమ్ తేజ్ లో ఓ కమర్షయల్ హీరోకి కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. దీనికి తోడు రెమ్యునరేషన్ విషయంలో సాయిధరమ్ తేజ్ పెద్దగా డిమాండ్ చేయడట. ఈ హీరో నిర్మాతలు ఇచ్చినంత మాత్రమే తీసుకుంటాడట. అంతేకాదు 10కోట్ల లోపు బడ్జెట్ తో మెగాఅల్లుడి సినిమా కంప్లీట్ అవుతోందని సమాచారం. లెక్కల వల్లే సాయిధరమ్ తేజ్ ఇప్పుడు దర్శకనిర్మాతల పాలిట బంగారుబాతుగా మారినట్లు వినికిడి.

ఇక మెగాఅల్లుడి సినిమా అంటే కావాల్సినంత ప్రమోషన్ ఉంటుంది. మెగా ఫ్యామిలీలోని పెద్ద హీరోల్లో ఎవరో ఒకరూ ప్రమోషన్స్ లో పాల్గొంటారు. దీనికి తోడు కొత్త దర్శకులు కూడా తమ ఏంట్రీకి సాయిధరమ్ అయితేనే సేఫ్ అని భావిస్తున్నరట. ఇన్ని కారణాల వల్లే మెగాఅల్లుడికి పుల్ డిమాండ్ ఏర్పడింది. అన్నట్లు ఒక్క పెద్ద హిట్టు పడితే సాయిధరమ్ కూడా స్టార్ అవ్వడం ఖాయం.

07:50 - March 28, 2016

గత ఎడాది హవా సాగించిన ఓ బ్యూటీ ఈ ఎడాది మాత్రం బొత్తిగా కనిపించడం లేదు. పోయిన ఎడాది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిన ఆ హీరోయిన్ పేరు ఇప్పుడు కనీసం వినిపించడం లేదు. లైమ్ లైట్ లో లేకుండా సైలెంట్ అయిన ఆ క్రేజీ  హీరోయిన్ ఎవరో చదవండి.
 స్టార్ హీరోయిన్ అనుష్క వార్తల్లో లేక మూడు నెలలు దాటుతోంది. గత ఎడాది బాహుబలి,రుద్రమదేవి సినిమాలతో యావత్తు సౌత్ ఇండస్ట్రీని తన వైపు తిప్పుకుంది. ఈ సినిమాలతో పాటు జీరో సైజ్ లాంటి ప్రయోగత్మక మూవీ నటించి తన ప్రత్యేకతను చాటుకుంది. 
లాస్ట్ ఇయర్ క్రేజీ సినిమాలతో అనుష్క వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ అనిపించుకుంది. అలాంటిది ఈ భామ గత ఎడాది సైజ్ జీరో మూవీ ప్రమోషన్స్ తరువాత ఇప్పటి వరకు ఎక్కడ కనిపించలేదు. అనుష్క మరో ఎడాది వరకు తెరపై కనిపించే ఛాన్స్ లేదని సమాచారం. బాహుబలి 2 మూవీ షూటింగ్ లో ఈ భామ బిజీ బిజీగా ఉన్నట్లు  తెలుస్తోంది.
అనుష్క చేతిలో ప్రస్తుతం బాహుబలి 2 మూవీ మాత్రమే ఉంది.  సింగం3 సీక్వెల్ లో కూడా నటిస్తున్నట్లు ఆ  మధ్య వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటి వరకు ఆ మూవీకి సంబంధించిన అప్ డేట్స్ ఏమి లేవు. అసలే అనుష్కకు వయస్సు33 ఏళ్లు దాటింది. కొత్తగా ఛాన్స్ లు కూడా రావడం లేదు. మరి ఇప్పటికే అనుష్క పెళ్లిపీటలెక్కెందుకు రెడీ అవుతోందా లేక మరింత కాలం సినిమాల కోసం వెయిట్ చేస్తుందా చూడాలి.

07:46 - March 28, 2016

పవన్ కళ్యాణ్ సర్ధార్ గబ్బర్ సింగ్ మ్యానియాతో ఊపేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ సంబంధించిన ఓ న్యూస్ మెగా ఫ్యాన్స్ ని హార్ట్ చేస్తోంది. ఇంతకీ సర్ధార్ పై వినిపిస్తున్న ఆ లేటేస్ట్ న్యూస్ ఏంటో ఈ వార్త చదవండి..

ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ లవర్స్ అందరూ సర్థార్ గబ్బర్ సింగ్ హ్యంగోవర్ లో ఊగిపోతున్నారు. ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో సర్ధార్ గబ్బర్ సింగ్ కి  సంబంధించి ఏ చిన్న విషయం తెలిసిన ఆడియన్స్ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం అలాంటి ఇంట్రెస్ట్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

మొన్న రిలీజైన సర్ధార్ గబ్బర్ సింగ్ థియేటికల్ ట్రైలర్ ఆడియన్స్ లో మరింత ఎమోషన్ నింపింది. రెండున్నర నిమిషాలున్న ఈ ట్రైలర్ లో పవన్ నిమిషం తరవాత కనిపించడం ఎంటర్ అవ్వడం విశేషం. ఓ బిగ్ స్టార్ ఇలా ట్రైలర్ లో లేట్ గా ఎంటర్ అవ్వడమనేది సాహసమనే చెప్పాలి. ఇప్పుడు సేమ్ సినిమాలో కూడా పవన్ ఏంట్రీ చాలా ఆలస్యంగా ఉంటుందని సమాచారం. సినిమా స్టార్ట్ అయ్యాక అరగంట తరువాత పవన్ ఏంట్రీ ఉంటుందని వినికిడి.

కథ పరంగానే సర్ధార్ గబ్బర్ సింగ్ లో ఇలా పవన్ ఏంట్రీ ఆలస్యంగా ఉంటుంది. అప్పటి వరకు విలన్, హీరోయిన్ కాజల్ సీన్స్ తదితరుల సీన్స్ ఉంటాయని సమాచారం. అయితే పవన్ ఏంట్రీ మొదలైయ్యాక మాత్రం సినిమా చాలా స్పీడ్ గా హుషారుగా ఉంటుందని తెలుస్తోంది. పవన్ త్వరగా ఏంట్రీ ఇచ్చిన లేట్ గా ఏంట్రీ ఇచ్చిన సినిమా సూపర్ హిట్టు కావడం ముఖ్యం. సర్ధార్ ఎప్రిల్ 8న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

07:40 - March 28, 2016

కోలీవుడ్ స్టార్ విక్రమ్ ఆడియన్స్ థ్రిల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. డిఫరెంట్ మూవీస్ తో మెస్మరైజ్ చేసే ఈ స్టార్ మరోసారి అలాంటి ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇంతకీ విక్రమ్ చేస్తున్న ఆ మూవీ విశేషాలేంటో ఈ న్యూస్ చదవండి.

గత ఎడాది విక్రమ్ ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన ఐ మూవీ తీవ్రంగా నిరాశపరిచింది. అయిన కూడా ఏ మాత్రం బెదరకుండా కొత్త ప్రయోగాలకు వెల్ కమ్ చెప్పుతున్నాడు. ప్రస్తుతం ఈ కోలీవుడ్ స్టార్ ఓ న్యూమూవీకి కమిట్ అయ్యాడు. ఈ మూవీ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్నట్లు కోలీవుడ్ సమాచారం. 

ఈ విక్రమ్ న్యూ మూవీ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందుతున్నట్లు టాక్. ఆనంద్ శంకర్ అనే దర్శకుడు రూపొందుతున్న ఈ మూవీ లో ఈ స్టార్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు. అయితే ఈ రెండు పాత్రల్లో విక్రమ్ ఓ పాత్రలో విలన్ గా నెగటివ్ రోల్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తోంది. 

80కోట్ల భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ మూవీలో నయనతార, నిత్యమీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. గత ఎడాది చివర్లో విక్రమ్ సమంత జంటగా నటించిన 10ఎంద్రుకుళ్లు మూవీ కూడా నిరాశనే పరిచింది. అయినా కూడా ఏ మాత్రం బెదరకుండా ఈ హీరో ఇంత భారీ బడ్జెట్ మూవీతో మరో ప్రయోగానికి సిద్దం కావడం కోలీవుడ్ లో చర్చానీయాంశంగా మారింది. మరి ఈ ప్రయోగంతో అయినా విక్రమ్ సక్సెస్ కొడుతాడో లేదో వేచి చూడాలి. 
 

పట్టిసీమను పరిశీలించనున్న బాబు..

పశ్చిమ గోదావరి : నేడు సీఎం చంద్రబాబు నాయుడు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. నేటి పర్యటనలో ముఖ్యమంత్రి పట్టిసీమ ప్రాజెక్టును పరిశీలించనున్నారు. 

నామమాత్రపు మ్యాచ్..

హైదరాబాద్ : టీ-20 వరల్డ్ కప్ లో భాగంగా నేడు నామ మాత్రపు మ్యాచ్ లో సౌతాఫ్రికా-శ్రీలంక తలపడనున్నాయి. ఈ మ్యాచ్ నేటి రాత్రి 7.30కు ప్రారంభం అవుతుంది. కాగా గ్రూప్ ఏ, గ్రూప్ బి నుంచి ఇప్పటికే వెస్టిండీస్, ఇంగ్లండ్, ఇండియా, న్యూజీలాండ్ జట్లు సెమీస్ బెర్తును ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే..

నేడు ఎన్ఐఏ, పాకిస్తాన్ బృందం భేటీ..

న్యూఢిల్లీ : నేడు ఎన్ఐఏ అధికారులతో పాకిస్థాన్ అధికారుల బృందం భేటీ కానుంది. పఠాన్ కోట్ దాడికి సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఈ సమావేశం జరగనుంది. 

నేడు పద్మ అవార్డులు ప్రదానం..

హైదరాబాద్ : రాష్ట్రపతి ప్రణబ్ చేతుల మీదుగా నేడు 'పద్మ' అవార్డులు ప్రదానం చేయనున్నారు. 56 మంది ప్రముఖులు పద్మ అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకోనున్నారు.

07:08 - March 28, 2016

హైదరాబాద్ : ఇటీవలి కాలంలో టీ జేఏసీ నుంచి పలు ఉద్యోగ సంఘాలు బయటకు వెళ్లిన నేపథ్యంలో.. తాజాగా జరిగిన తెలంగాణ స్టీరింగ్ కమిటీ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశానికి దాదాపు 20 కి పైగా ప్రజా సంఘాలు వివిధ జేఏసీ నాయకులు హాజరై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. 
నిర్మాణాత్మక పాత్ర : కోదండరామ్..
రాష్ట్రంలో ఇక నుంచి టీ-జేఏసీ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందన్నారు కోదండరామ్ తెలిపారు. ప్రజలు తమపై నమ్మకముంచి అనేక పిలుపులకు స్పందించి మద్దతుగా నిలిచిన వారికి అండగా నిలుస్తామన్నారు. రాష్ట్రంలో సమస్యలు తలెత్తినప్పుడు ప్రభుత్వ లోటుపాట్లు ఎత్తిచూపాలని స్థూలంగా నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో టీ-జేఏసీ నిర్మాణాన్ని విస్తృత పరచాలని, అందుకోసం నిర్మాణాత్మక కమిటీలు వేయనున్నట్లు తెలిపారు. జేఏసీ నుంచి ఇటీవలి కాలంలో పలు ఉద్యోగ సంఘాలు వెళ్లిపోవడాన్ని తప్పు పట్టడంలేదని, ప్రతీ సంఘానికి స్వేచ్ఛ ఉంటుందని, అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుందన్నారు. 
గ్రూప్ 2 పోస్టులు పెంచాలి..
అలాగే ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని.. తమవంతు భాగస్వామ్యం నిర్వహిస్తామని కోదండరామ్‌ అన్నారు. టీచర్ల నియామకాలు చేపట్టడంతోపాటు గ్రూప్ -2 పోస్టులు పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లోని అన్ని పోస్టులకు వయోపరిమితి పెంచాలని టీఆర్ఎస్ ప్రభుత్వానికి కోదండరామ్ విజ్ఞప్తి చేశారు.  
రాజకీయపార్టీలను చేర్చుకోబోం..
తమ టీంను ఇక నుంచి టీ- జేఏసీగానే పిలవాలని కోదండరామ్ కోరారు.  జేఏసీలోకి కలిసి వచ్చే ప్రజా సంఘాలన్నింటినీ కలుపుకుంటామని, రాజకీయ పార్టీలను మాత్రం చేర్చుకోబోమన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువుపై అసెంబ్లీలో సమగ్రమైన చర్చ జరగాలని, అలాగే తమకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఎమ్మెల్యేలకు అందజేస్తామని కోదండరామ్ తెలిపారు. 

06:50 - March 28, 2016

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రజెంటేషన్‌పై అధికార, ప్రతిపక్ష సభ్యులు ఢీ అంటే ఢీ అంటున్నారు. తమకూ అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌ పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై స్పీకర్‌ ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. 
ప్రాజెక్టుల రీడిజైన్..
అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. కొన్ని ప్రాజెక్టులను రీడిజైన్‌ చేసింది. మరికొన్ని ప్రాజెక్టులకు టెండర్లను పిలిచి పనుల ప్రారంభానికి సిద్ధమైంది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌ మార్పునకు ప్రయత్నాలు చేస్తోంది. తమ్మిడిహట్టిదగ్గర ఎత్తును తగ్గించి మూడు బ్యారేజీలు కట్టాలని భావిస్తోంది. ఈ డిజైన్‌ మార్పును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సర్కారు నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి. ఈ విమర్శలకు పవర్‌ పాయింట్ ప్రెజెంటేషన్‌ ద్వారా జవాబు చెప్పాలని సీఎం కేసీఆర్‌ యోచించారు. ఈ నెల 31 ప్రజెంటేషన్‌ ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. బీఏసీ సమావేశంలో అధికార పక్షం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 
మాకూ అవకాశం ఇవ్వండి..
అయితే పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇప్పుడు అధికార, విపక్షాలమధ్య మరో కొత్త లొల్లి రాజేసింది. ఈ విషయాన్ని ముందే అంచనావేసిన ప్రతిపక్షం తమకూ ప్రజెంటేషన్‌ అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ఒకవేళ ఛాన్స్ ఇస్తే ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతి, డిజైన్‌ మార్పువల్ల తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు చెప్పాలని చూస్తోంది. ఈ ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని సభలోకాకుండా కమిటీ హాల్‌లో ఏర్పాటు చేయాలని ఇప్పటికే స్పీకర్‌ను కోరింది ఈ ప్రజెంటేషన్‌పై స్పీకర్‌ మదుసూధనాచారి ఏం నిర్ణయం తీసుకుంటారనేది త్వరలో తేలనుంది.. 

06:46 - March 28, 2016

పశ్చిమగోదావరి :  పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం పరిశీలించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. కాంట్రాక్టర్‌ గడువులోగా ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిచేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ పనులు ఇంకా ఊపందుకోకపోవడం... ఆ ప్రాజెక్ట్‌ కింద ఇప్పట్లో నీళ్లు వచ్చే పరిస్థితి లేకపోవడంతో దానికి ప్రత్యామ్నాయంగా కొంతకాలం గోదావరి నీళ్లను కృష్ణకు మళ్లించేందుకు ప్రభుత్వం పట్టిసీమ పథకాన్ని చేపట్టింది. పోలవరం దిగువన పట్టిసీమ నుంచి నీళ్లను పోలవరం కుడికాల్వకు తరలిస్తారు. ఈ పథకం ద్వారా రాబోయే వర్షాకాలంలో 80 టిఎంసీల గోదావరి నీళ్లను కృష్ణా డెల్టాకు తరలించనున్నారు. తద్వారా కృష్ణా డెల్టాకు ఎగువ నుంచి రావాల్సిన నీటిని ప్రత్యేకించి విడుదల చేయకుండా రాయలసీమకు తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది. 

కాలేజీలకు వేసవి సెలవులు..

హైదరాబాద్ : జూనియర్ కాలేజీలను మార్చి 30వ తేదీ నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది. జూన్ 1వ తేదీ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమౌతుంది. కాగా వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించొద్దంటూ ప్రైవేటు కాలేజీలకు ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. సెలవుల్లో అడ్మిషన్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కాలేజీలకు బోర్డు హెచ్చరికలు జారీ చేసింది.  

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్..

హైదరాబాద్ : నగరంలో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టయ్యింది. ఎల్బీ నగర్ లో క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్దనుంచి పోలీసులు రూ.1.40 లక్షలు, కంప్యూటర్, ఓ టీవీ స్వాధీనం చేసుకున్నారు. 

తపస్య భవనంపై నుంచి దూకిన విద్యార్థిని మృతి..

హైదరాబాద్ : సీఏ విద్యార్థిని శ్రావణి మృతి చెందింది. ఉదయం కే.పీ.హెచ్.బిలోని తపస్య సీఏ అకాడమీలో భవనంపై నుంచి దూకిన శ్రావణి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. 

పేకాట రాయుళ్ల అరెస్ట్..

ఖమ్మం : నేలకొండపల్లి మండలం అప్పలనరసాపురంలో ఆంధ్రా-తెలంగాణ సరిహద్దుల్లో 9 మంది పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 4.13 లక్షలు పోలీసులు సీజ్ చేశారు. 

00:00 - March 28, 2016

హైదరాబాద్ : ఒక వైపు భారీ లక్ష్యం ముందుంది. తొలి మూడు వికెట్లు రోహిత్ 12, ధావన్ 13, రైనా 10 వెంటవెంటనే డగౌట్ కు చేరుకున్నారు. జట్టు ఆపదలో ఉంది.. ఆపోజిషన్ లో ఆసీస్ ఉంది. కానీ ఈ 'చేజింగ్ వీరుడు' మాత్రం పట్టువిడవలేదు. చివరి వరకు అజేయంగా నిలిచి టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ ఇంట్రడక్షన్ అంతా టీమిండియా యంగ్ డైనమైట్ విరాట్ కోహ్లీ గురించి అని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదనుకుంటా.. కేవలం 51 బంతుల్లో 2 భారీ సిక్సర్లు, 9 కళ్లు చెదిరే బౌండరీల సహాయంతో 82పరుగులు చేశాడు విరాటుడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 161 పరుగుల భారీ టార్గెట్ ను టీమిండియాకు నిర్దేశించింది. తదనంతరం టీమిండియా బ్యాట్మెన్లను కట్టడి చేస్తూ 49 పరుగులకే 3 కీలక వికెట్లను తీసేసింది.
యూవీతో కీలక భాగస్వామ్యం..
ఈ తరుణంలో యువరాజ్ సింగ్ (21) కలసి 4వ వికెట్ కు 45 పరుగుల అమూల్య భాగ స్వామ్యాన్ని నిర్మించాడు కోహ్లీ. సింగిల్స్ డబుల్స్ రొటేట్ చేస్తూ.. చెత్త బంతుల్ని బౌండరీలు తరలిస్తూ ఈ జంట కీలక ఇన్నింగ్ నిర్మించింది. 1 సిక్సర్, 1 బౌండరీతో ఊపుమీదున్న యువీ ఫాల్కనర్ వేసిన స్లో బంతిని తప్పుగా అంచనా వేసి షాట్ ను గాల్లోకి ఆడగా.. వాట్సన్ అద్భుత క్యాచ్ తో యూవీ ఫెవిలీయన్ కు చేరుకున్నాడు. ఈ తరుణంలో కెప్టెన్ ధోని క్రీజులోకి వచ్చాడు.  అప్పుడు జట్టు 14 ఓవర్లలో 94/4 పరుగులతో ఉంది. 6 ఓవర్లలో 67 పరుగులు చేయాల్సి ఉంది. రన్ రేట్ 11 పరుగులపైనే. 
కీ.. క్విక్.. బ్లాస్ట్.. 
తీవ్ర ఒత్తిడిలో.. కీలక సమయంలో క్విక్ రన్నింగ్, కీ బౌండరీలతో కోహ్లీ, ధోనిల జోడి చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడింది. వాట్సన్ వేసిన 15వ ఓవర్లో ధోని ఒక బౌండరీ బాదగా 4 సింగిల్స్ తో 8 పరుగులు వచ్చాయి. 16వ ఓవర్లో ఆరు బంతుల్ని ఎదుర్కొన్న కోహ్లీ నాలుగు డబుల్స్, ఒక ఫోర్ తో 12 పరుగులు పిండుకున్నాడు. 17 ఓవర్లో ధోని ఒక బౌండరీతో పాటు నాలుగు సింగిల్స్ మాత్రమే రావడంతో 8 పరుగులు మాత్రమే వచ్చాయి. 
కోహ్లీ విశ్వరూపం..
చివరి 3 ఓవర్లలో 39 పరుగులు చేయాల్సి ఉంది. 13 రన్ రేట్ ఉంది. పిచ్ కూడా బౌలర్లకు బాగానే సహకరిస్తోంది. ఇలాంటి క్లిష్ట సమయంలో కోహ్లీ షో మొదలైంది. 3 ఓవర్లు వేసి కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసిన ఫాల్కనర్ బౌలింగ్ బంతి అందుకున్నాడు. మొదటి బంతిని డీప్ బ్యాక్ వార్డ్ స్క్వేర్ లెగ్ లో కళ్లు చెదిరే బౌండరీ కొట్టాడు కోహ్లీ. రెండో బంతి స్క్వేర్ డ్రైవ్ తో మరో ఫోర్.. మూడో బంతిని క్రీజును వదిలి ముందుకు వచ్చి లాంగ్ ఆఫ్ లో సిక్సర్ గా మలిచాడు. నాలుగో బంతికి రెండు పరుగులు తీయగా, ఐదో బంతి ఒక రుగు వచ్చింది. ఆరో బంతికి ధోని డబుల్ కొల్లగొట్టాడు. ఈ ఓవర్ లో 19 పరుగులు పిండుకోవడంతో సమీకరణాలు మొత్తం మారిపోయాయి. భారత్ 2 ఓవర్లలో 20 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒత్తిడి ఆసీస్ పైకి వెళ్లింది. 19 ఓవర్ మొదటి బంతి కోహ్లీ భారీ షాట్ కు ప్రయత్నించగా డాట్ బాల్ అయ్యింది. స్టేడియం అంతా నిశ్శబ్దంగా మారింది. ఈ తరుణంలో విరాట్ హ్యాట్రిక్ ఫోర్లతో మ్యాచ్ గతిని మార్చాడు. 2వ బంతిని పాయింట్ లో స్వ్కేర్ డ్రైవ్ ద్వారా ఫోర్ కొల్లగొట్టాడు. 3బంతిని ఫైన్ లెగ్ లో బౌండరీ దొరకబుచ్చుకున్నాడు. 4 బంతికి ఎక్స్ ట్రా కవర్ మీదుగా అద్భుత క్రికెటింగ్ షాట్ తో మరో ఫోర్ కొట్టాడు. 5 బంతి డాట్ కాగా.. ఆరో బంతి విరాట్ క్లాసిక్ కవర్ డ్రైవ్ తో బౌండరీని ముద్దాడింది.  ఈ ఓవర్లో కోహ్లీ 16 పరుగులు చేశాడు. ఇక చివరి 6 బంతుల్లో 4 పరుగులు చేయాల్సి ఉండగా. ధోని 20వ ఓవర్ మొదటి బంతిని విన్నింగ్ షాట్ గా బౌండరీకి తరలించాడు. ఈ మ్యాచ్ హీరో కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఏప్రిల్ 2వ తేదీన టీమిండియా సెమీఫైనల్ మ్యాచ్ లో  వెస్టిండీస్ తో తలపడనుంది.

Don't Miss