Activities calendar

30 March 2016

21:32 - March 30, 2016

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఈ-కామర్స్ రంగంలో 100 శాతం ఎఫ్ డీఐ లను అనుమతించడాన్ని సీపీఎం పొలిట్ బ్యూరో ఖండించింది. ఈ రంగంలో ఎఫ్ డీఐ లను అనుమతించడం విదేశీ సంస్థలకు లొంగిపోవడమేనని వ్యాఖ్యానించింది. ఫ్రీ ట్రేడ్ కు సంబంధించి యూరోపియన్ యూనియన్ తో జరుగుతున్న చర్చల కారణంగానే మోడీ ఈ ప్రకటన చేశారని పార్టీ పొలిట్‌ బ్యూరో విమర్శించింది. చిల్లర వ్యాపారులకు నష్టం చేకూర్చే ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. 

నిలిచిన ఉత్తరాఖండ్ బలపరీక్ష..

ఉత్తరాఖండ్ : గురువారం జరగాల్సిన బలపరీక్ష నిలిచిపోయింది. సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై.. ఆ రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది. దీంతో కేంద్రానికి కాస్త ఊరట లభించింది. అయితే.. బలపరీక్షకు ముందు అనేక న్యాయపరమైన అంశాలను పరిశీలించాలని కోర్టు అభిప్రాయపడింది.

21:27 - March 30, 2016

ఢిల్లీ : విశ్వవిద్యాలయాల్లో వివక్షను రూపుమాపేందుకు.. సామాజిక న్యాయం పాటించేందుకు.. తక్షణమే రోహిత్‌ చట్టాన్ని తీసుకు రావాలని.. జెఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ డిమాండ్‌ చేశారు. హెచ్‌సీయూలో విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. రోహిత్‌ ఆత్మహత్యకు కారణమైన మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయలను తక్షణమే పదవుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా ఢిల్లీలో విద్యార్థి జేఏసీ ర్యాలీ నిర్వహించింది. మార్చ్ టు రాష్ట్రపతి భవన్‌ పేరిట మండీ హౌస్‌ నుంచి నిర్వహించిన ఈ ర్యాలీలో వామపక్ష భావజాల విద్యార్థి సంఘాలన్నీ పాల్గొన్నాయి. హెచ్‌సీయూ వైస్‌ చాన్సిలర్‌ అప్పారావును వెంటనే తొలగించాలని విద్యార్థులు ఢిల్లీ వీధుల్లో నినదించారు.

అడ్డుకున్న పోలీసులు...
ఢిల్లీ విద్యార్థి జేఏసీ నిర్వహించిన ర్యాలీలో.. జెఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ కూడా పాల్గొన్నారు. ప్రభుత్వం రోహిత్‌ చట్టాన్ని తీసుకు రావాలని, వీసీ అప్పారావును విధుల నుంచి తక్షణమే తప్పించాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థి జేఏసీ ర్యాలీ సందర్భంగా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. విద్యార్థులను పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీసు స్టేషన్‌ వద్దే అడ్డుకున్నారు. మార్చి 22న అరెస్టు చేసిన విద్యార్థులు, అధ్యాపకులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని జెఏసీ నేతలు డిమాండ్‌ చేశారు. దేశంలోని అన్ని యూనిర్సిటీలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని, రోహిత్ ఆత్మహత్యకు కారణమయిన స్మృతీఇరాని, బండారు దత్తాత్రేయలను పదవుల నుండి తొలగించాలని విద్యార్థి జేఏసీ డిమాండ్‌ చేసింది. విద్యార్థి జేఏసీ ర్యాలీని పురస్కరించుకుని పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మండిహౌస్‌ నుంచి సాగిన ర్యాలీని.. పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీసు స్టేషన్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. 

21:15 - March 30, 2016

హైదరాబాద్ : విద్యావిధానంలో ప్రస్తుత పరిస్థితికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. తమ రాష్ట్రంలో విద్యా విధానాన్ని.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ప్రయోజనకరంగా.. సమూలంగా మార్పు చేయనున్నామని తెలిపారు. ప్రభుత్వ విద్యపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని, దాన్ని రూపుమాపి ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ఈ అంశంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో విపక్ష సభ్యులు సూచించారు. విద్యావ్యవస్థ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు.

విద్యావిధానం మార్చాలన్న లక్ష్మణ్..
రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మారిన విద్యావిధానంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో విశ్వాసం సన్నగిల్లిందని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. రెక్కలొచ్చిన ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యను నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని విపక్ష సభ్యులు అన్నారు. కాలం చెల్లిన విద్యావిధానాన్ని మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు.

అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలన్న సంపత్..
ఈ రోజుల్లో ప్రభుత్వ విద్యను పూర్తిగా చిన్నచూపు చూస్తున్నారని, అలాంటి పరిస్థితులపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌ కృష్ణయ్య అన్నారు. ప్రభుత్వ విద్యను పటిష్టం చేయడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో భారీ మొత్తంలో అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఎస్‌ ఎ సంపత్‌కుమార్‌ విమర్శించారు. డిగ్రీ కాలేజీ అధ్యాపకుల భర్తీ సత్వరమే చేపట్టకపోవడం వల్ల భారీ మొత్తంలో రూసా, యూజీసీ నిధులను కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఆయన అన్నారు. ఉన్నత విద్య బతికి బట్టకట్టాలంటే అధ్యాపకులే కీలకమని, వెంటనే అధ్యాపకుల పోస్టుల భర్తీని చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు.

మంత్రి సమాధానం..
విద్యా వ్వవస్థ పటిష్టతకు ప్రభుత్వం పూనుకోవాలని పలువురు సభ్యులు సూచించారు. ఉన్నత విద్యను ప్రక్షాళన చేయాలని, విద్యారంగంలో ఉన్న ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు సభ్యులు డిమాండ్‌ చేశారు. అనంతరం ఈ అంశంపై మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి.. అక్షరాస్యత పెంపొందించేందుకు, విద్యావిధానంలో సమూల మార్పులు తీసుకురావాలని తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఒక్కో గ్రామపంచాయతీల్లో నాలుగైదు ప్రాథమిక పాఠశాలలున్నాయని, వాటిలో విద్యార్థులు ఎన్‌రోల్‌మెంట్ తక్కువగా ఉందని కడియం చెప్పారు. వాటిని రానున్న రోజుల్లో హేతుబద్ధీకరణ చేస్తామని కడియం చెప్పారు. 

21:13 - March 30, 2016

హైదరాబాద్ : ఇతర పార్టీల బి-ఫారంతో గెలిచిన ఎమ్మెల్యేలను సిగ్గులేకుండా తన పార్టీలో చేర్చుకున్న చంద్రబాబు నైతికంగా ఓటమి పాలయ్యారని ప్రతిపక్ష నేత జగన్ ఘాటైన విమర్శలు చేశారు. బడ్జెట్ సమావేశాల్లో నైతికంగా వైసీపీదే విజయమన్న జగన్, దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజల్లోకి వెళ్లాలని... చంద్రబాబుకి సవాల్ విసిరారు. ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా వేసిన అనంతరం ప్రతిపక్ష నేత జగన్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.

కేటాయింపులు లేవు...
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబును ఘాటుగా విమర్శించారు. ఈ బడ్జెట్ లో ఏ రంగానికి సరైన కేటాయింపులు చేయలేదన్నారు. బడ్జెట్ లో చేసిన కేటాయింపులకు, ప్రభుత్వం చేస్తున్న ఖర్చులకు ఎక్కడా పొంతన లేదన్నారు. అన్ని రంగాలకు అరకొర కేటాయింపులే చేశారని అందుకోసమే ద్రవ్య వినిమయ బిల్లుని వ్యతిరేకించామని జగన్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా 22 వేల కోట్ల రూపాయల పబ్లిక్ డిపాజిట్ మొత్తాన్ని అత్తగారి సొమ్ములా వాడుకుంటున్నారని జగన్ మండిపడ్డారు. ఇది జైలుకి వెళ్లాల్సినంత నేరమని జగన్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి కారణాల వల్లే బిల్లుని వ్యతిరేకించామన్నారు జగన్. అందుకోసమే ఓటింగ్ జరపాలని స్పీకర్ ని కోరితే అయన అనుమతించకపోవడం అన్యాయం అన్నారు. రూల్ బుక్ చదివి వినిపించినప్పటికి మైక్ ఇవ్వకపోవడం దారుణమన్నారు. స్పీకర్ కోడెల టీడీపీ ఎమ్మెల్యేగా వ్యవహారిస్తూ స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచారని జగన్ విమర్శించారు.

సిగ్గులేకుండా చేర్చుకున్నారు..
ఎమ్మెల్యేలు పార్టీ మారడం పైనా జగన్ స్పందించారు. తమ పార్టీ బి-ఫారంతో గెలిచిన ఎమ్మెల్యేలను చంద్రబాబు సిగ్గులేకుండా టీడీపీలోకి చేర్చుకున్నారని మండిపడ్డారు. అవినీతి సొమ్ముతో ప్రలోభాలకు గురి చేసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆరోపించారు. దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబుకి సవాల్ విసిరారు జగన్. బిల్లుపై ఓటింగ్ కి అనుమతిస్తే పార్టీ మారిన ఎమ్మెల్యే లతో ఎవరికి ఓటు వేయించాలనే అయోమయంతోనే ఓటింగ్ కి అనుమతించలేదన్నారు జగన్. తాము విప్ జారీ చేసినందున... బిల్లుకి అనుకూలంగా ఓటేస్తే పరువుపోతుందని, వ్యతిరేకంగా ఓటేస్తే అనర్హత వేటు పడుతుందని భయపడ్డారని అన్నారు. దీనికోసం ఏకంగా రాజ్యాంగ పరంగా ఉన్న బిల్లుని కాలరాశారన్నారు జగన్. చంద్రబాబు చర్యల వల్ల ఆయన గ్రాఫ్‌.. ప్రజల్లో పడిపోయిందని, అందుకే ప్రజల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారని విమర్శించారు..

జగతిలో రాంకీ పెట్టుబడులపై ఈడీ ఛార్జీషీట్..

హైదరాబాద్ : జగతి పబ్లికేషన్స్ లో రాంకీ పెట్టుబడులపై ఈడీ చార్జీషీట్ దాఖలు చేసింది. జగన్, విజయసాయిరెడ్డి, అయోధ్య వెంకటరామిరెడ్డిలపై ఛార్జీషీట్ ను అధికారులు దాఖలు చేశారు. జగతిలో రాంకీ రూ. 10 కోట్లు పెట్టుబడి పెట్టింది. రాంకీ ఫార్మాకు చెందిన రూ. 346 కోట్ల ఆస్తులను అధికారులు జప్తు చేశారు. 

ఇంగ్లాండ్ టార్గెట్ 154 పరుగులు...

ఢిల్లీ : టీ 20 వరల్డ్ కప్ లో తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ - న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. మన్రో 46 పరుగులతో రాణించాడు. విలియమ్సన్ (32), గప్తిల్ (15) రన్లు చేశారు. మిగతా బ్యాట్స్ మెన్స్ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు.

20:35 - March 30, 2016

చెప్పుకోవటానికి చాలా జీవోలున్నాయి కానీ, అమలు కావు.. కాగితాలపై చాలా నిబంధనలున్నాయి.. అసలే అనుసరించరు.. కెజీ నుంచి పీజీ వరకు చదువును వ్యాపారంగా మార్చేశారు... వందలకోట్లు దండుకుంటున్నారు. తల్లిదండ్రుల్ని దోచుకుంటున్నారు.. ఓవరాల్ గా విద్యారంగాన్నే శాసిస్తున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో చదువు పేరు చెప్పి వేల కోట్లలో జరుగుతున్న దందాపై ప్రత్యేక కథనం..లాభార్జనే ధ్యేయంగా, ఫక్తు వ్యాపార ధోరణితో నడుస్తున్న విద్యా సంస్థలు భారీ వ్యాపారాలకే తెరలేపుతున్నాయి. అంతిమంగా తల్లిదండ్రులకు తీరని నష్టాన్ని, ఒత్తిడిని మిగులుస్తున్నాయి.

చట్టాలను తుంగలో తొక్కుతున్నారు...
చట్టాలు తుంగలోతొక్కుతున్నారు.. జీవోలను లైట్ తీస్కుంటున్నారు...అధికారులు నిద్రమత్తులో జోగుతున్నారు.. ప్రైవేటు విద్యా వ్యాపారాన్ని పరిశీలిస్తే కనిపించే సంగతులివి.. నగరంలో స్కూళ్ళ ఫీజులు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.. మెడిసిన్ ఫీజుల కంటే, ఎల్ కేజీ ఫీజు చాలా తక్కువ.. ఇంటర్నేషనల్ స్కూల్ డొనేషన్ కంటే టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫీజు చాలా తక్కువ. పాఠశాల విద్యా ఇంత కాస్ట్ లీ గా ఎందుకు మారింది. సామాన్యులను దోచుకునేలా విద్యాసంస్థలు ఎందుకు మారుతున్నాయి? ఒకనాడు కళకళలాడిన సర్కారీ బడుల స్థానంలో ఈ దోపిడీ సంస్థలెలా వచ్చాయి?

నాణ్యతను కోల్పోతున్న విద్య..
తాము ఎన్ని కష్టాలు పడ్డా.. పిల్లలకు బంగారు భవిత ఇవ్వాలనుకుంటారు తల్లిదండ్రులు.. కానీ, ఇదే ఎలిమెంట్ ప్రైవేట్ స్కూళ్లకు కాసులు కురిపిస్తోంది. లక్షలాది కుటుంబాలను అప్పుల కుప్పలుగా మిగులుస్తోంది. మరో పక్క సర్కారీ విద్య నానాటికీ నాణ్యతను కోల్పోతోంది.. ఇవన్నీ కలిసి విద్యా వ్యాపారానికి ఊతమిస్తున్నాయి. విద్యను ప్రైవేటీకరించే ప్రయత్నాల్లో భాగంగా, ప్రభుత్వం సర్కారీ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తోందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మరో పక్క ప్రైవేటు విద్యాసంస్థలను నియంత్రించకుండా గాలికొదిలేసి విద్యావ్యవస్థను గందరగోళపరుస్తున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒకటి రెండు విద్యా సంస్థలే మోనోపలీ సాధించటమే దీనికి ఉదాహరణ. పైగా ప్రభుత్వ నిర్ణయాలను కూడా ఈ సంస్థలు ప్రభావితం చేయగలిగే పరిస్థితిలో ఉన్నాయంటే ప్రభుత్వాల చిత్తశుద్ధి ఎంత హీనంగా ఉందో పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:33 - March 30, 2016

మమ్మలు కేసీఆర్ సారు అస్సలుకే పట్టిచ్చుకుంటలేడని మెదక్ జిల్లా వాసులు..మన తెలంగాణ కాశ్మీర్ ఆదిలాబాద్ జిల్లాల..ఉచిత నిర్భంద విద్య చాలా చక్కగ అమలైతున్నదట..నీ ఎండలు పాడుగాను దంచి దంచి కొట్టవట్టే ఏం ఎండలు ఏం ఎండలు కాలు బైటి వెడ్తామంటే బుగులై పాడైంతుంది..బంగారి తెలంగాణ స్వర్ణాంద్ర ప్రదేశ్ రొండు జోరు గుర్రాలోలనే ఎగవడ్తున్నై.. అభివృధ్దిల అన్కునేరు సుమా కాదు కాదు.. నీళ్ల కోసం దర్నాలు రాస్తారోకో రిలే నిరాహార దీక్షలు జేసుట్ల..బెదిరిచ్చుడుకు నక్లీకి సంబంధం..ఆంధ్ర ప్రదేశ్ల అదే రిపీట్...ప్రేమకథ.. తదితర అంశాలపై టెన్ టివిలో మలన్న ముచ్చట్లు కార్యక్రమంలో మల్లన్న ముచ్చట్లు చెప్పిండు. ముచ్చట్ల కోసం వీడియో క్లిక్ చేయండి. 

ఛగన్ భుజ్ భల్ పై ఛార్జీషీట్..

మహారాష్ట్ర : రాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత ఛగన్ భుజ్‌భల్‌పై ఛార్జీషీట్ దాఖలైంది. మనీ లాండరింగ్ కేసులో భుజ్‌భల్‌తోపాటు ఆయన కుమారుడు పంకజ్, బంధువు సమీర్, మరి కొంతమందిపై ఈడీ తొలి ఛార్జీషీట్‌ను దాఖలు చేసింది. 

తెలంగాణ అసెంబ్లీ వాయిదా..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ గురువారానికి వాయిదా పడింది. వాయిదా పడటానికంటే ముందు విద్యా విధానంపై మంత్రి కడియం శ్రీహరి సమాధానం చెప్పారు. గురువారం సీఎం కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. 

20:13 - March 30, 2016

అస్సాం : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. వచ్చే సోమవారం అక్కడ తొలి విడత పోలింగ్ జరగబోతోంది. కాంగ్రెస్, బిజెపి లను ఊరిస్తున్న ఈ రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందన్న అంచనాలు కూడా వున్నాయి. కాంగ్రెస్, బిజెపిలకు అస్సాం పోరు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఎన్నికలు జరుగుతున్న అయిదు రాష్ట్రాల్లో ఈ రెండు పార్టీలు ప్రధాన ప్రత్యర్థులై తలపడుతున్నది ఈ ఒక్క రాష్ట్రంలోనే. ఈ రెండు పార్టీలు అస్సాం మీద గట్టిగానే ఆశలు పెట్టుకున్నాయి. గెలుపు ఓటమిలను ఈ రెండు పార్టీల ప్రతిష్టకు సవాలు విసురుతున్నాయి. అస్సాంలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో వుంది. కాంగ్రెస్ వరుసగా మూడుసార్లు విజయం సాధించిన రాష్ట్రమిది. అస్సాంలో నాలుగో విజయం సాధించడం ద్వారా దేశవ్యాప్తంగా దెబ్బతిన్న ప్రతిష్టను ఎంతో కొంత పునరుద్ధరించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అస్సాంలో కూడా ఓడిపోతే, దేశవ్యాప్తంగా తమ శ్రేణులు మరింత కుంగిపోతాయన్న ఆందోళన కాంగ్రెస్ అధిష్టానానికి వుండడం సహజం.

బిజెపిది ఇదే పరిస్థితి..
బిజెపి మానసిక పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే వుంది. ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ప్రధాని నరేంద్ర మోడీ, అధ్యక్షుడు అమిత్ షా ఇమేజ్ గ్రాఫ్ ను కొంత దెబ్బతీశాయి. అస్సాంలో విజయం సాధించడం ద్వారా తమ గ్రాఫ్ ను పెంచుకోవాలని బిజెపి నాయకత్వం భావిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగాయ్ వయస్సు గురించి మాట్లాడుతున్నారు. తరుణ్ గొగాయ్ కూడా లోకల్ లీడర్స్ మీద కాకుండా మోడీ మీదనే విమర్శనాబాణాలు ఎక్కుపెడుతున్నారు. ఈ పోటీ తనకూ మోడీకి మధ్యనే జరుగుతోందన్న వాతావరణాన్ని స్రుష్టించేందుకు తరుణ్ గొగాయ్ ప్రయత్నిస్తున్నారు. హ్యాట్రిక్ సిఎంగా తలపండిన ఈ వ్రుద్ధనాయకుడు పన్నిన వ్యూహం ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి. తరుణ్ గొగాయ్ కుమారుడు, రాహుల్ గాంధీ సన్నిహితుడు, యువ ఎంపి గౌరవ్ గొగాయ్ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరిస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో ఇంజనీరింగ్ , అమెరికాలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివిన గౌరవ్ గొగాయ్ రాజకీయ ఉపన్యాసాలతో ఆకట్టుకుంటున్నారు.

మారిన రాజకీయ సమీకరణాలు..
2011నాటితో పోల్చుకుంటే అస్సాంలో రాజకీయ సమీకరణలు మారాయి. అప్పుడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న బోడోల్యాండ్ పీపుల్స్ పార్టీ ఈసారి బిజెపితో దోస్తీ చేస్తోంది. మరోవైపు సీనియర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హిమంతబిశ్వశర్మ తో పాటు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బిజెపిలో చేరారు. ఇంకోవైపు గతంలో అస్సాం గణపరిషత్ లోనూ, అస్సాం స్టూడెంట్స్ యూనియన్ లోనూ కీలకంగా పనిచేసిన సర్వానంద సోనోవాల్ ఇప్పుడు బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దిగారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో అస్సాం రాష్ట్రంలో కాంగ్రెస్ ని దెబ్బ తీసి, బిజెపికి సగం స్థానాలు సాధించిపెట్టడంలో సర్వానంద సోనోవాల్ పాత్ర చాలా వుంది. ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా రేసులో వున్నారు. మరోవైపు అస్సాం గణ పరిషత్ తో పొత్తు కుదిరింది. 88 సీట్లలో బిజెపి, 24 సీట్లలో ఏజిపి, 14 స్థానాలలో బిపిఎఫ్ పోటీ చేస్తున్నాయి. మిత్రుల అండదండలు, 15 ఏళ్ల కాంగ్రెస్ పాలన మీద వున్న వ్యతిరేకత తమను విజయతీరాలకు చేరుస్తాయన్న అంచనాతో కమలనాధులున్నారు. అస్సాం పాగా వేసి తీరాలన్న పట్టుదలతో వున్న బిజెపి హిందూత్వ సెంటిమెంట్ ను రగిలిస్తోంది. అస్సాంలో కోతి చనిపోయినా జై హనుమాన్ అంటూ అంత్యక్రియలు చేస్తున్నారు విహెచ్ పి కార్యకర్తలు .

126 అసెంబ్లీ స్థానాలు..
అస్సాంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఏప్రిల్ 4న తొలి విడతలో 65 స్థానాలకు, 11వ తేదీన మిగిలిన 61 స్థానాలకు పోలింగ్ జరగబోతోంది. అస్సాంలో అధికారం చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ 63 సీట్లు. 2011 ఎన్నికల్లో కాంగ్రెస్ 78 స్థానాలు గెలుచుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ 122 స్థానాల్లో పోటీ చేస్తూ, నాలుగు సీట్లను మిత్రపక్షానికి కేటాయించింది. బిజెపి 88 స్థానాల్లో మాత్రమే పోటీ చేసి, 38 సీట్లను మిత్రపక్షాలకు వదిలిపెట్టింది.

కూటమిగా ఏర్పడిన వామపక్ష పార్టీలు..
ఒకవైపు ఎన్డీఏ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతుంటే మరోవైపు వామపక్షాలన్నీ కలిసి ఓ కూటమిగా ఏర్పడ్డాయి. సీపీఎం, సీపీఐ, ఎంఎల్, ఎస్ యుసిఐ, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలు వామపక్ష కూటమిలో వున్నాయి. ఇంకోవైపు బద్రుద్దీన్ అజ్మల్ నేత్రుత్వంలోని ఆలిండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తన సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. ముస్లింలలో గట్టి పట్టున్న ఈ పార్టీకి గత అసెంబ్లీలో 18 స్థానాలున్నాయి. కాంగ్రెస్, బిజెపిలలో ఏ ఒక్కరికి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేదని, ఈసారి అస్సాం రాజకీయాల్లో తామే చక్రం తిప్పుతామని బద్రుద్దీన్ అజ్మల్ భావిస్తున్నారు. పెర్ ఫ్యూమ్ వ్యాపారం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన బద్రుద్దీన్ అజ్మల్ బీహార్ తరహాలో కాంగ్రెస్, ఏజిపితో కలిసి సెక్యులర్ కూటమి ఏర్పాటు చేయాలని భావించారు. కానీ, అది సాధ్యం కాలేదు. అస్సాంలో 9 జిల్లాల్లోని 35 అసెంబ్లీ స్థానాల్లో మైనార్టీల ప్రాబల్యం ఎక్కువ. బద్రుద్దీన్ అజ్మల్ తో పాటు కాంగ్రెస్ ముఖ్యమంత్రి తరుణ్ గొగాయ్, బిజెపి సిఎం అభ్యర్థి సర్వానంద సోనోవాల్ భవిష్యత్ కి ఈ 35 సీట్లు అత్యంత కీలకం కాబోతున్నాయి. 

ఇరోం షర్మిలకు ఊరట..

ఢిల్లీ : మణిపూర్ మానవహక్కుల పోరాట కార్యకర్త ఇరోం షర్మిల కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఆత్మహత్యాయత్నం నేరంలో షర్మిలను కోర్టు నిర్ధోషిగా ప్రకటించింది.  

పెద్ద టెలిస్కోప్ ను ప్రారంభించిన మోడీ..

బ్రసెల్స్ : ఆసియాలోనే అతిపెద్ద టెలిస్కోప్ ను భారత ప్రధాని మోడీ బెల్జియం ప్రధానితో కలిసి ప్రారంభించారు. బ్రసెల్స్ నుండి నైనటాల్ లోని ఏరిస్ టెలిస్కోప్ ను రిమోట్ ద్వారా ప్రారంభించారు.

 

పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు హాజరవడం లేదు - సీఎల్పీ..

హైదరాబాద్ : గురువారం సీఎం కేసీఆర్ శాసనసభలో ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు హాజరు కాబోమని కాంగ్రెస్ శాసనసభా పక్షం పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ శాసనసభాపతి మధుసూధనాచారికి లేఖ రాసింది. పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రజెంటేషన్ చేపట్టడాన్ని సీఎల్పీ ప్రశ్నించింది. 

విద్యావిధానంలో మార్పులు - మంత్రి కడియం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో విద్యారంగంపై చర్చ జరిగింది. విద్యావిధానంలో మార్పులు చేపడుతున్నట్లు మంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. పక్కా యాక్షన్ ప్లాన్ తో ముందుకెళుతున్నట్లు, విద్యారంగానికి తగిన ప్రాధాన్యత లభించలేదన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఓటు బ్యాంకు రాజకీయాలు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు..అధికారుల అందరి చొరవతోనే విద్యా వ్యవస్థను గాడిలో పెట్టగలమన్నారు. విద్యా వ్యవస్థను ఐదు భాగాలుగా విభజించడం జరిగిందని, మానవ వనరుల అభివృద్ధికి కృషి చేయాల్సినవసరం ఉందన్నారు. మండలాలు, జిల్లాల వారీగా ఎడ్యుకేషన్ ప్రొఫైల్ తయారు చేసినట్లు తెలిపారు.

ఈవోఆర్డీపై గ్రామస్తుల దాడి..

నల్గొండ : మునగాల ఈవోఆర్డీ నాగేశ్వరరావుపై బర్కత్ గూడెం గ్రామస్తుల దాడి చేశారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాల మంజూరులో అవతవకలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రజాపంపిణీ కేంద్రాలను రిటైల్ అవుట్ లెట్స్ గా మార్చుతాం - బాబు..

హైదరాబాద్ : రిటైల్ సెక్టార్ ప్రభుత్వ శాఖలను సమీకృతం చేసి ఒక పోర్టల్ ద్వారా సింగిల్ డెస్కు క్లియరెన్స్ అందిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రజా పంపిణీ కేంద్రాలను రిటైల్ అవుట్ లెట్స్ గా మార్చుతామన్నారు. చిల్లర వర్తకుల ఆదాయం పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు.   

అమెజాన్ కంపెనీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన..

హైదరాబాద్ : అమెజాన్ కంపెనీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. నగరంలో అమెజాన్ సెకండ్ లార్జెస్ట్ క్యాంపస్ ను నెలకొల్పడం సంతోషకరంగా ఉందని కేటీఆర్ తెలిపారు. దేశంలో అతిపెద్ద ఇంక్యుబేటర్ టీ హబ్ ను నెలకొల్పడం జరిగిందని, పెట్టుబడులకు అనుకూలంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. మేకిన్ తెలంగాణలో భాగంగా ఎలక్ట్రానిక్ పరికరాల తయారీని ప్రోత్సాహిస్తున్నట్లు చెప్పారు. ఎలక్ట్రానిక్స్, యానిమేషన్, గేమింగ్ ఎంటర్ టైన్ మెంట్ పాలసీని తీసుకొస్తామని, స్టాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ తో పాటు ఐటీఐలో నిష్ణాతులైన వారికి ఉజ్వలమైన ఉపాధి అవకాశాలు అందిస్తామన్నారు.

 

ప్రేమ పేరిట ప్రేమికుడు వంచన..

విజయవాడ : సింగ్ నగర్ లో ప్రేమ పేరిట ప్రేమికుడు వంచించాడు. యువతి నగ్న ఫొటోలు, వీడియోలతో బ్లాక్ మెయిలింగ్ కు మండవ రవికాంత్ అనే యువకుడు పాల్పడుతున్నట్లు బాధిత యువతి పీఎస్ లో ఫిర్యాదు చేసింది. రవికాంత్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.

 

రేపే సీఎం కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్..

హైదరాబాద్ : రాష్ట్ర జల విధాన ప్రకటనకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను సీఎం కేసీఆర్ సర్వం సిద్ధం చేసుకున్నారు. అందరికీ అర్థమయ్యేలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రసంగం కోసం అసెంబ్లీలో మూడు భారీ స్ర్కీన్ లు ఏర్పాట్లు చేస్తున్నారు. సమావేశాల లైవ్ కవరేజ్ కోసం రొబోటిక్ కెమెరాలు తాత్కాలికంగా తొలగించే అవకాశం ఉంది. వాటి స్థానంలో ప్రత్యేక కెమెరాల ఏర్పాటు చేయనున్నారు. అసెంబ్లీ గ్యాలరీ నుండి ఎమ్మెల్సీలు వీక్షించే అవకాశాన్ని కల్పించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.

 

ఏపీలో టీచర్, ఏంఈవో పోస్టుల భర్తీ..

విజయవాడ : టీచర్, ఎంఈవో పోస్టుల భర్తీకి ఏపీ సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మాధ్యమిక పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు మండల విద్యాశాఖాధికారి పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.

 

ఏపీలో అభ్యంతరం లేని భూముల క్రమబద్ధీకరణ..

విజయవాడ : అభ్యంతరం లేని భూముల అక్రమణల క్రమబద్ధీకరణకు ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. 500 చ.గజాల స్థలం వరకు రెగ్యులరైజ్ చేసేందుకు రిజిస్ట్రేషన్ ఫీజును ప్రభుత్వం ఖరారు చేసింది. ఒక గజం నుండి 150 చ.గజాల స్థలానికి కనీస ధరలో 60 శాతం రుసుము విధించింది. 151-250 చ.గజముల స్థలానికి కనీస ధరలో 75 శాతం..251-500 చ.గజముల స్థలానికి 100 శాతం రుసుం వసూలు చేయాలని నిర్ణయించారు. 

టాస్ గెలిచిన ఇంగ్లాండ్..

ఢిల్లీ : టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఫిరోజ్ షా కోట్ల మైదానంలో న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాడ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

18:52 - March 30, 2016

ఢిల్లీ : ప్రపంచ నెంబర్ వన్ టీమిండియా..2016 టీ-20 ప్రపంచకప్ ఫైనల్స్ బెర్త్ కు గురిపెట్టింది. రెండో సెమీఫైనల్లో మాజీ చాంపియన్ వెస్టిండీస్ పనిపట్టడానికి సిద్ధమయ్యింది. ముంబై వాంఖెడే స్టేడియం వేదికగా గురువారం రాత్రి 7 గంటలకూ ఈ సూపర్ ఫైట్ ప్రారంభమవుతుంది. కోట్లాదిమంది అభిమానులు మాత్రమే కాదు మార్కెట్, మీడియా వర్గాలు సైతం కోరుకొంటున్నాయి. భారత ఉపఖండ దేశాల అభిమానులకు వేసవి వినోదం లాంటి టీ-20 ప్రపంచకప్ పోటీలు క్లయ్ మాక్స్ దశకు చేరాయి. పది జట్ల సూపర్ టెన్ రౌండ్ ముగియడంతోనే...నాలుగుజట్ల సెమీఫైనల్స్ నాకౌట్ సమరానికి తెరలేచింది. సూపర్ టెన్ గ్రూప్ -1 నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్, గ్రూప్ -2 నుంచి న్యూజిలాండ్, టీమిండియా నాకౌట్ రౌండ్ చేరడంతో సెమీస్ సమరానికి రంగం సిద్ధమయ్యింది. బ్యాట్స్ మన్ స్వర్గధామం ముంబై వాంఖెడే స్టేడియం వేదికగా జరిగే రెండో సెమీఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్ టీమిండియా, రెండోర్యాంకర్ వెస్టిండీస్ ఢీ అంటే ఢీ అంటున్నాయి.

2012లో విండీస్ చాంపియన్...
గ్రూప్ -1 విన్నర్ హోదాలో కరీబియన్ ఆర్మీ సెమీఫైనల్స్ చేరితే...గ్రూప్ - 2 రన్నరప్ గా టీమిండియా నాకౌట్ రౌండ్లో అడుగుపెట్టింది. టీ-20 ఫార్మాట్లో ఈ రెండుజట్ల రికార్డు సైతం ఫిఫ్టీ-ఫిఫ్టీగానే ఉంది. రెండుజట్లూ నాలుగుమ్యాచ్ ల్లో తలపడితే ..చెరో రెండు విజయాలు నమోదు చేసి..సమఉజ్జీలుగా నిలిచాయి. 2007 ప్రారంభ ప్రపంచకప్ లో విజేతగా నిలిచిన రికార్డు మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలోని టీమిండియాకు ఉంటే. శ్రీలంక వేదికగా ముగిసిన 2012 ప్రపంచకప్ లో వెస్టిండీస్ చాంపియన్ గా నిలిచింది.

పోరు రసపట్టు...
అంతేకాదు రెండుజట్లలోనూ క్రిస్ గేల్, డ్వయన్ బ్రావో, డారెన్ సామీ, రోహిత్ శర్మ, సురేశ్ రైనా, యువరాజ్ సింగ్, అశ్విన్ లాంటి టీ-20 స్పెషలిస్ట్ స్టార్లు ఉండడంతో...సెమీఫైనల్స్ పోరు రసపట్టుగా సాగే అవకాశాలు కనపిస్తున్నాయి. ఈమ్యాచ్ కు వేదికగా ఉన్న ముంబై వాంఖెడీ స్టేడియం పిచ్ కు...పరుగుల గనిగా పేరుంది. 180 నుంచి 200కు పైగా స్కోర్లు సాధించే అవకాశం ఉండడంతో...పోటీ హైస్కోరింగ్ గా సాగడం ఖాయమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ హిట్టర్ క్రిస్ గేల్, మర్లోన్ శామ్యూల్స్, బ్రాత్ వెయిట్, డ్వయన్ బ్రావో, యాండ్రీ రస్సెల్,డారెన్ సామీ లాంటి వీరబాదుడు ఆటగాళ్లు విండీస్ జట్టులో ఉన్నారు. ఇప్పటికే..ముంబై వేదికగా ముగిసిన ప్రారంభమ్యాచ్ లో ధూమ్ ధామ్ సెంచరీ సాధించిన క్రిస్ గేల్...అదే దూకుడును కొనసాగిస్తే..ధోనీసేనకు కష్టాలు తప్పవు. బౌలింగ్ లో సైతం..కరీబియన్ టీమ్ సమతూకంతో కనిపిస్తోంది. జెరోమీ టేలర్, యాండ్రీ రస్సెల్, బ్రాత్ వెయిట్, బ్రావో, సామీ పేస్ బౌలింగ్ లోనూ, లెగ్ స్పిన్నర్ శామ్యూల్ బద్రీ, లెఫ్టామ్ స్పిన్నర్ సులేమాన్ బెన్,పార్ట్ టైమ్ ఆఫ్ స్పిన్నర్లుగా మర్లోన్ శామ్యూల్స్, క్రిస్ గేల్ ..విండీస్ బౌలింగ్ ఎటాక్ లో ప్రధాన పాత్ర వహించబోతున్నారు.

టీమిండియా బ్యాటింగే ప్రధాన బలం..
ఇక..ఆతిథ్య టీమిండియా విషయానికి వస్తే...బ్యాటింగే ప్రధానబలంగా, ఛేజింగ్ కింగ్ విరాట్ కొహ్లీ తురుపుముక్కగా పోటీకి సిద్ధమయ్యింది. సూపర్ టెన్ ఆఖరి లీగ్ పోటీలో ఆస్ట్రేలియాపై సాధించిన సంచలన విజయం స్ఫూర్తినే ...సెమీస్ పోరులోనూ కొనసాగించాలని...టీమిండియా కెప్టెన్ ధోనీ భావిస్తున్నాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, వన్ డౌన్ సురేశ్ రైనా ఫామ్ లోకి వస్తే...టీమిండియా బ్యాటింగ్ కు డోకా లేనట్లే. ఒకవేళ యువరాజ్ సింగ్ గాయం నుంచి కోలుకోకుంటే...అజంక్యా రహానేకు తుదిజట్టులో చోటు కల్పించే అవకాశాలు లేకపోలేదు. టీమిండియా బౌలింగ్ సైతం పేస్, స్పిన్ బౌలింగ్ తో అత్యంత సమతూకంతో కనిపిస్తోంది. ఓపెనింగ్ బౌలర్లు అశీష్ నెహ్రా, బుమ్రా ప్రారంభ ఓవర్లలో ఇచ్చే ఆరంభంపైనే టీమిండియా జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి.

వన్ సైడెడ్ గ సాగుతుందా ? 
ఈమ్యాచ్ లో సైతం...టాస్ కీలకం కానుంది.టాస్ నెగ్గినజట్టు మరో ఆలోచన లేకుండా..బ్యాటింగ్ ఎంచుకొని..భారీస్కోరుతో ప్రత్యర్థిని ఒత్తిడికి గురిచేసే వ్యూహాన్ని అనుసరించడం ఖాయమనే చెప్పాలి. బ్యాటింగ్ కు అత్యంత అనువుగా ఉండే ముంబై పిచ్ పైన చేజింగ్ సైతం ఏమంత కష్టం కాదు. ఏది ఏమైనా...ప్రపంచకప్ నాకౌట్ రౌండ్ కే అత్యంత ఆసక్తికరమైన పోటీలో ..నెంబర్ వన్ టీమిండియా, రెండో ర్యాంకర్ వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే ఈ పోటీ...సమఉజ్జీల సమరంలా సాగుతుందా? లేక వన్ సైడెడ్ షోగా ముగిసిపోతుందా? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. ఆతిథ్య టీమిండియానే ఫైనల్స్ చేరాలని దేశంలోని కోట్లాదిమంది అభిమానులు మాత్రమే కాదు...మార్కెట్, మీడియా వర్గాలు సైతం కోరుకొంటున్నాయి.

18:45 - March 30, 2016

ఢిల్లీ : టీ 20 వరల్డ్‌కప్‌లో టీమిండియా, వెస్టిండీస్‌తో అమీతుమీకి సిద్దమైంది. కానీ అందరి దృష్టి మాత్రం యాంగ్రీ యంగ్‌ గన్‌ విరాట్‌ కొహ్లీ, కరీబియన్‌ బుల్ క్రిస్‌ గేల్‌ పైనే ఉంది.ఈ ఇద్దరి ప్రదర్శన మీదనే ఇరు జట్ల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు. కెరీర్‌ బెస్ట్‌ ఫామ్‌లో ఉన్న కొహ్లీ అంచనాలకు మించి అదరగొడుతుండగా గేల్‌ మెరుపు సెంచరీతో మరోసారి రికార్డుల మోత మోగించాడు.
ఈ రెండు జట్ల మధ్య పోటీ అనగానే క్రికెట్‌ వీరాభిమానులందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నది మాత్రం విరాట్‌, గేల్‌ ఆట కోసమే అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలా అని ఈ ఇద్దరి మధ్య వైరం ఏమీ లేదు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఇద్దరూ కలిసి రాయల్‌ చాలెంజర్స్ బెంగళూర్‌ జట్టు తరఫున ఆడిన వారే. ఈ ఇద్దరి స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇద్దరూ ఇద్దరే. ఒకరు సిక్సర్ల వర్షం కురిపిస్తారు. మరొకరు బౌండరీలతోనే స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టిస్తారు.

కీలక పాత్రలు..
క్రీజ్‌లోనే నిలబడి ఎటువంటి బంతినైనా బౌండరీ దాటించడంలో గేల్‌ తర్వాతే ఎవరైనా. ఇక కళ్లు చెదిరే బౌండరీలతో పాటు సింగిల్స్, డబుల్స్ తీస్తూ పరుగులు సాధించడంలో కొహ్లీని మించిన వారు లేరు. పవర్‌ హిట్టింగ్‌ గేల్‌ ప్లస్‌ పాయింట్‌ అయితే పర్‌ఫెక్ట్ టైమింగ్‌ కొహ్లీకి పెద్ద ఎస్సెట్‌. ప్రస్తుత టీ 20 టోర్నీలో ఇప్పటికే ఈ ఇద్దరూ తమదైన ముద్ర వేశారు.ఇంగ్లండ్‌తో ముగిసిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో క్రిస్‌ గేల్‌ మెరుపు సెంచరీతో కరీబియన్‌ టీమ్‌కు ఒంటిచేత్తో విజయాన్నందించాడు. ఇక సూపర్‌ టెన్‌ రౌండ్‌లో కొహ్లీ ఏ రేంజ్‌లో చెలరేగాడో అందరికీ తెలిసిందే. చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌ జట్టుపై చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన విరాట్‌ డూ ఆర్‌ డై మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును సెమీఫైనల్స్ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు.

ఎవరిది పై చేయి..
గేల్‌ క్రీజ్‌లో పాతుకుపోయాడంటే చాలు వెస్టిండీస్‌ జట్టు విజయం ఖాయం. క్రిస్‌ ఒక్కసారి క్రీజ్‌లో కుదురుకున్నాడంటే భారీ సిక్సర్లతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడతాడు. సింగిల్‌ హ్యాండ్‌తో జట్టుకు విజయాన్నందించగల సత్తా ఉన్న కరీబియన్‌ బుల్‌పై వెస్టిండీస్‌ జట్టు ఎన్నో అంచనాలు పెట్టుకుంది.  ఇక కీలక మ్యాచ్‌ల్లో విరాట్‌ కొహ్లీ ఏ స్థాయిలో బ్యాటింగ్‌ చేస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఒత్తిడి సమయాల్లోనూ ఏకాగ్రతతో బ్యాటింగ్ చేయడం విరాట్‌ స్పెషాలిటీ. భారీ సిక్సర్లు కొట్టలేకపోయినా పర్‌ఫెక్ట్ టైమింగ్‌తో ట్రెడిషనల్‌ షాట్లు కొట్టడడంలో ప్రస్తుతం కొహ్లీని మించిన వారు లేరు. ప్రస్తుతం కళ్లు చెదిరే ఫామ్‌లో ఉన్న కొహ్లీ ప్రదర్శన మీదనే భారత జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.
ఈ ఇద్దరిలో ఎవరు చెలరేగినా వారు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టుకు విజయం ఖాయమనడంలోనూ డౌటే లేదు. మరి ఈ ఇద్దరు సూపర్‌స్టార్ల మధ్య జరగనున్న ఆధిపత్య పోరులో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి. 

18:41 - March 30, 2016

ముంబై : టీ 20 వరల్డ్ కప్‌ సెమీస్‌కు ముందే భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. సిక్సర్ల కింగ్‌ యువరాజ్‌ సింగ్‌ కాలి గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా జట్లతో ముగిసిన మ్యాచ్‌లో విరాట్‌ కొహ్లీతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టు విజయంలో కీ రోల్‌ ప్లే చేసిన యువీ...మిగతా రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ సమయంలో బ్యాటింగ్‌ చేస్తుండగా యువీ గాయపడిన సంగతి తెలిసిందే. యువీ స్థానంలో అజింక్యా రహానేకు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిడిలార్డర్‌లో కీలక బ్యాట్స్‌మెన్‌గా ఉన్న యువరాజ్‌ లేకపోవడం భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ లాంటిదే.

18:37 - March 30, 2016

విజయవాడ : మన ప్రాంతంలో మన రాష్ట్ర రాజధాని అనుకున్నారు. రాజధాని కోసం భూములు కావాలంటే ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా ఇచ్చేశారు. భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ సమకూరుస్తామని పాలకులు అన్నారు. తీరా భూములిచ్చాక రైతులకు అసలు కష్టాలు మొదలయ్యాయి. ఇదంతా ఏపీ రాజధాని అమరావతిలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి. ప్రభుత్వం ఇస్తానన్న పరిహారం అందక ఆందోళనకు గురవుతున్న రైతులు అటు ఉపాధి కూడా లేక తీవ్రంగా నష్టపోతున్నారు. రైతే రాజు అన్న ప్రభుత్వం... వారిని సమస్యల్లోకి నెట్టేస్తోందా.? పరిహారం సంగతి పక్కన పెడుతోందా.? మన ప్రాంతంలో రాజధాని అన్న సంబరం అప్పుడే అంతరించిపోతోంది. రైతుల త్యాగానికి విలువలేని పరిస్థితి ఏర్పడుతోంది. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఉదారంగా భూములిచ్చిన రైతన్నకు ఇప్పుడు సవాలక్ష సమస్యలు, అనుమానాలు ఎదురవుతున్నాయి. మూడు పంటలు పండే భూములను మన రాజధాని కోసం అంటూ యజమానులు వదులుకున్నారు. వారిని అన్ని విధాలా ఆదుకుంటామన్న ప్రభుత్వం హామీలను గాలికొదిలేస్తోంది. పైగా ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. భూములిచ్చిన రైతులు తమ పరిహారం కోసం ప్రభుత్వంతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. మరోవైపు సర్కార్ జరీబు భూములకు ఇస్తామన్న పరిహారం విషయంలో మెలికపెట్టింది. జరీబు భూములకు మెట్ట భూములకు ఇచ్చినంతే పరిహారం ఇస్తామంటుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మెట్ట భూములకూ జరీబు భూముల్లాగే పరిహారం..
భూములిచ్చిన వారికి రాజధానిలో ప్లాట్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రకటన ఎందరినో ఆకట్టుకుంది. అయితే ఇంతవరకూ ప్లాట్లు ఇవ్వనే లేదు. పరిహారం ఇస్తామన్న గడువు దాటిపోయినా దానిపై చడీచప్పుడు చేయట్లేదు. ఇక జరీబు భూములకు ఎక్కువ రేటు చెల్లిస్తామన్న ప్రభుత్వం, వారి భూములు ఉన్న చోటే స్థలాలు ఇస్తే ఎక్కువ ఎందుకు చెల్లించినట్లవుతుందని ప్రశ్నిస్తున్నారు. మెట్ట భూములకు కూడా జరీబు తరహాలోనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 31 నుండి రైతులకు లాటరీ పద్ధతిలో ప్లాట్లను కేటాయించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అయితే ప్లాట్ల కేటాయింపుపై రైతులు ఇంకా సందిగ్ధంలో ఉన్నప్పుడే ప్రభుత్వం స్థలాలు కేటాయించడం ఏంటని విపక్షాలు అభ్యంతరం చెబుతున్నాయి. భూములిచ్చిన రైతుల సందేహాలు నివృత్తి చేయకుండా ప్రభుత్వం తన దారిన తను వెళ్లడం సరికాదని హెచ్చరిస్తున్నాయి.

18:33 - March 30, 2016

హైదరాబాద్ : ద్రవ్య వినిమయ బిల్లును వ్యతిరేకించేందుకే డివిజన్ కోరామని ప్రతిపక్ష నేత జగన్ తెలిపారు. అయితే స్పీకర్‌ డివిజన్‌కు అనుమతించకపోవడం అన్యాయమన్నారు. సమావేశాలు ముగిసిన తరువాత.. అసెంబ్లీ లాబీల్లో.. మీడియాతో చిట్‌ చాట్‌లో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం అనుమతి లేకుండా 22వేల కోట్ల పబ్లిక్ డిపాజిట్లను అత్తగారి సొమ్ములా వాడుకున్నారని చంద్రబాబు సర్కారుపై జగన్‌ ఫైర్‌ అయ్యారు. చట్టప్రకారం ఇది జైలుకు వెళ్లాల్సిన నేరమన్నారు. బిల్లును వ్యతిరేకించడానికి ఇంతకంటే కారణం ఏం కావాలని ప్రశ్నించారు. వైసీపీ నుంచి వలస వచ్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా కాపాడుకునేందుకే.. ప్రభుత్వం డివిజన్‌కు అనుమతించలేదని విమర్శించారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు టీడీపీ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ఆ స్థానాన్ని అగౌరవ పరిచారన్నారు. ప్రజల్లో టీడీపీ గ్రాఫ్‌ బాగా పడిపోయిందని.. వైసీపీ నైతికంగా విజయం సాధించిందనీ జగన్‌ వ్యాఖ్యానించారు. అవమాన పర్చడంగా మాట్లాడడం..స్పీకర్ తనకు తాను స్టేట్ మెంట్ ఇవ్వడం చాలా దుర్మాగమని జగన్ తెలిపారు. 

18:31 - March 30, 2016

హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కసరత్తులు చేస్తున్నామని మంత్రి యనమల అన్నారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా యనమల ఈ విషయం తెలిపారు. 20 వేల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 తో పాటు ఇతర శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని తెలిపారు. ఏ డిపార్ట్ మెంట్ లో ఎంత ఖాలీలున్నాయో వివరాలు అడగడం జరిగిందని, త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. మొత్తం ఖాళీలను భర్తీ చేసే అవకాశం లేదని, ఎక్కడైతే అవకాశం ఉంటుందో భర్తీ చేస్తామన్నారు. 

18:28 - March 30, 2016

హైదరాబాద్ : ద్రవ్య వినియమ బిల్లుపై డివిజన్‌ అడిగిన సందర్భం దేశ చరిత్రలో ఇదే తొలిసారని ఆర్థిక మంత్రి యనమల అన్నారు. శాసనసభలో బిల్లుపై డివిజన్ పెట్టాలని వైసీపీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా మంత్రి యనమల మాట్లాడారు. డిమాండ్లు, కట్‌ మోషన్స్‌కే డివిజన్‌ అడుగుతారని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసమే వైసీపీ ఓటింగ్‌కు పట్టుబడుతోందని మండిపడ్డారు. ఒక్కరి సొత్తు కాదని..ప్రజలు..అభివృద్ధి..పేదలకు సంబంధించిన బిల్లు అని తెలిపారు. పార్టీ నుండి వచ్చిన వారిని కట్టుబాటు చేసుకోవడానికి డివిజన్ ఓటింగ్ అడుగుతున్నారని విమర్శించారు. ఇది ఏమాత్రం కరెక్టు కాదని..డివిజన్ మాత్రమే అవకాశం లేదని వాయిస్ ఓటింగ్ ద్వారా వెళ్లాలని మంత్రి యనమల పేర్కొన్నారు. 

18:26 - March 30, 2016

హైదరాబాద్ : ఏపీ బడ్జెట్‌ సమావేశాలు ముగిశాయి. ద్రవ్య వినిమయ బిల్లును ఏపీ అసెంబ్లీ మూజువాణి ఓటుతో ఆమోదించింది. బిల్లుపై సభలో వాడివేడి చర్చ జరిగింది. ద్రవ్య వినిమయ బిల్లుపై డివిజన్‌ చేపట్టాలని వైసీపీ డిమాండ్‌ చేసింది. బిల్లుపై ఓటింగ్‌ నిర్వహించాలని పట్టుబట్టింది. ఓటింగ్‌ అవసరం లేదని యనమల స్పష్టం చేశారు. ద్రవ్యవినిమయ బిల్లుపై డివిజన్‌ చేపట్టిన సందర్భాలు లేవన్నారు. దీనిపై నిర్ణయం తీసుకునే విచక్షణాధికారం స్పీకర్‌ ఉందన్నారు. అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుపై డివిజన్‌ చేపట్టడానికి స్పీకర్‌ నిరాకరించారు. దీనిపై వైసీపీ నిరనస వ్యక్తం చేసింది. ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్యే ద్రవ్యవినిమయ బిల్లును సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ద్రవ వినిమయ బిల్లును సభ మూజువాణి ఓటుతో ఆమోదించిన తర్వాత స్పీకర్‌ సభను నిరవధికంగా వాయిదా వేశారు.

బీజేపీ ఎమ్మెల్యే శర్మ సభ్యత్వం రద్దు : ప్రివిలేజ్ కమిటీ

ఢిల్లీ : బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మ సభ్యత్వం రద్దుకు శాసనసభా హక్కుల కమిటీ సిఫారసు చేసింది. ఆప్ ఎమ్మెల్యే అల్కా లాంబాపై బీజేపీ ఎమ్మెల్యే అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కమిటీ ఈ సిఫారసు చేసింది.

ముగిసిన ఏపీ బడ్జెట్ సమావేశాలు ....

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. సభ 15 రోజులపాటు కొనసాగింది. 86 గంటల 22 నిమిషాల పాటు సభ్యులు పలు విషయాలపై మాట్లాడారు. మొత్తం 124 ప్రశ్నలకు అధికార పక్షం ప్రతిపక్షానికి సమాధానమిచ్చింది. కాగా మండలి సభ కూడా నిరవధిక వాయిదా పడింది. 

బిల్లు వ్యతిరేకించేందుకే డివిజన్ కోరాం : జగన్

హైదరాబాద్ :  ద్రవ్య వినిమయ బిల్లుపై వైసీపీ అధినేత జగన్  మీడియాతో మాట్లాడారు. ఈ బిల్లును వ్యతిరేకించటానికే డివిజన్ కోరామన్నారు. అనుమతించకపోవడం అన్యాయమన్నారు. కేంద్రం అనుమతి లేకుండా రూ.22 వేల కోట్ల పబ్లిక్ డిపాజిట్లు సొంత సొమ్ములా వాడుకున్నారని ఆరోపించారు. బిల్లు వ్యతిరేకించడానికి ఇంతకంటే ఇంకేంకావాలని ప్రశ్నించారు. చంద్రబాబుకు ప్రజల్లో నమ్మకం కోల్పోయారనీ...వైసీపీ మోరల్ గా విజయం సాధించిందనీ ఆయన పేర్కొన్నారు.

బెల్జియంకు అండగా వుంటాం : ప్రధాని మోదీ

హైదరాబాద్ : బెల్జియం రాజధాని బ్రసెల్స్‌ నగరంలో పేలుళ్లు జరిగిన ప్రాంతాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ఈ ఘటనలో మృతులకు ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... బెల్జియం ప్రజల పోరాటస్ఫూర్తిని కొనియాడారు. బెల్జియంకు అండగా వుంటామని భరోసా ఇచ్చారు. కాగా భారత్-ఈయూ శిఖరాగ్ర సదస్సులో మోడీ బెల్జియం పర్యటనలో వున్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు కొనసాగాలని మోదీ ఆకాంక్షించారు.

17:25 - March 30, 2016

ఛత్తీస్ గఢ్ : మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. జవాన్ల వాహనాన్ని మందుపాతరతో పేల్చి ఏడుగురిని పొట్టన పెట్టుకున్నారు. దంతెవాడలోని మైలవాడలో సంత మార్కెట్ నిర్వహిస్తుంటారు. ఈ సంతకు నక్సలైట్లు వస్తున్నారన్న సమాచారంతో సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ నిర్వహించారు. అనంతరం జవాన్లు ఇతర ప్రాంతాలకు వాహనంలో వెళుతున్నారు. మందుపాతర పేలడంతో జవాన్ల వాహనం పేలిపోయింది. పేలుడు ధాటికి రోడ్డుపై భారీ గుంత ఏర్పడింది. వాహనంలో ఉన్న ఏడుగురు జవాన్లు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఘటనలో గాయపడిన మరో నలుగురిని రాయపూర్ ఆసుపత్రికి తరలించారు. జవాన్లు 230 బెటాలియన్ కు చెందిన వారుగా తెలుస్తోంది. 

ఆర్టీఏ రంగాన్ని ఆధునీకరిస్తాం : మంత్రి కేటీఆర్...

హైదరాబాద్ : ఆర్టీఏ ఎం-వాలెట్ యాప్ ను టీ.మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ....ఈ రంగంలో శరవేగంగా మార్పులు తీసుకొస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఎం-వాలెట్ యాప్ ను రూపొందించటం అభినందనీయమనీ.... మొబైల్ లో వాహన పత్రాలను భద్రపరిచే ఎం-వాలెట్ యాప్ ను రవాణా శాఖ తయారుచేసిన విషయం తెలిసిందే. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న క్రమంలో ప్రజలకు సౌకర్యం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు.

17:17 - March 30, 2016

హైదరాబాద్ : పాడి పరిశ్రమను విస్తృతపరచకుండా వ్యవసాయ సంక్షోభాన్ని నివారించలేమని టీ జేఏసీ చైర్మన్ కోదండరాం అభిప్రాయపడ్డారు. పాల రైతుల సమస్యలు - పరిష్కారాలు అనే అంశంపై సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కరవు మూలంగా పశుగ్రాసం, తాగు నీటి సమస్యలతో పాడి రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ప్రభుత్వం వెంటనే రైతులకు ఉచితంగా పశుగ్రాసం సరఫరా చేయాలని జస్టిస్ చంద్రకుమార్ సూచించారు.  

ఢిల్లీలో కాల్పుల కలకలం...

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈరోజు ద్వారాకా కోర్టు వద్ద మధ్యాహ్నం సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు కోర్టు ఎదుట ఉన్న ఇద్దరు వ్యక్తులపై తుపాకీతో కాల్పులకు పాల్పడ్డారు. దీంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. భద్రతాసిబ్బంది పట్టుకునేందుకు ప్రయత్నించగా దుండగులు పరారయ్యారు. ఓ కేసులో నిందితుడిగా వున్న అంకిత్ అనే వ్యక్తిని, మరొక కేసులో సాక్షిగా వున్న వ్యక్తిని చంపటానికే దుండుగులు కాల్పులు జరిపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుల కోసం గాలిస్తున్నారు.

17:03 - March 30, 2016

హైదరాబాద్ : ఏపీ బడ్జెట్ సమావేశాలు గందరగోళం మధ్య ముగిశాయి. బుధవారం ప్రారంభమైన సభలో పలు బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. సాయంత్రం ద్రవ్య వినిమయ బిల్లు విషయంలో వైసీపీ ఆందోళన చేసింది. తాము జారీ చేసిన విప్ అనుమతించాలని వైసీపీ డిమాండ్ చేసింది. 202 నిబంధనల ప్రకారం ఓటింగ్ పెట్టాల్సినవసరం లేదని మంత్రి యనమల పేర్కొన్నారు. ఓటింగ్ తాము అడగడం జరుగుతోందని, దీనిపై తాము కొన్ని రోజుల క్రితమే లెటర్ ఇవ్వడం జరిగిందని వైసీపీ తెలిపింది. కానీ స్పీకర్ ఇవేమీ పరిగణలోకి తీసుకోకుండా మూజువాణి ఓటుతో ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదిస్త్నునట్లు ప్రకటించారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.
ఇప్పటికీ ఏడు శాసనసభా సమావేశాలు జరిగాయి. ప్రశ్నోత్తరాల సమయంలో కొత్త సభ్యులకు అవకాశం కల్పించడం జరిగిందని, కొంత అర్థవంతమైన చర్చ జరిగిందని అధికార పక్షం పేర్కొంటోంది. ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేసిందని, రెండుసార్లు అవిశ్వాస తీర్మానం పెట్టి ఓడిపోయిందని విమర్శలు గుప్పిస్తోంది. ప్రస్తుతం జరిగిన సమావేశాలపై అధికార, విపక్ష సభ్యులు ఒకరినకొరు ఆడిపోసుకొనే అవకాశాలున్నాయి. 

ఎన్ కౌంటర్ లో 7గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి...

హైదరాబాద్ : ఛత్తీస్ ఘడ్ లోని దంతెవాడ జిల్లా మైలవాడలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోలు మందుపాతరతో పేల్చివేశారు. 

16:59 - March 30, 2016

ఛత్తీస్ గఢ్ : మావోయిస్టులు మళ్లీ విజృంభించారు. భద్రతా బలాగాలే లక్ష్యంగా వారు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా జరిగిన దాడిలో ఏడుగురు సీఆర్పీఎఫ్ జవాన్ల ప్రాణాలను బలిగొన్నారు. ఈ ఘటన దంతెవాడలోని మైలవాడలో చోటు చేసుకుంది. ప్రతి వారం మైలవాడలో జరిగే వారపు సంతకు సీఆర్‌పిఎఫ్‌ జవాన్లు వెళుతుంటారు. దీన్ని గమనించిన మావోయిస్టులు మోక్‌పాల్‌ -మైలవాడ కల్వర్టు సమీపంలో మందు పాతర అమర్చి కాపు కాశారు. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం కల్వర్టు సమీపంలోకి రాగానే మందుపాతరను పేల్చారు. పేలుడు ధాటికి వాహనం తునాతునకలయ్యింది. ఆ సయమంలో వాహనంలో 14 మంది జవాన్లు ఉన్నట్లు సమాచారం. ఏడుగురు అక్కడికక్కడనే దుర్మరణం చెందగా మరో నలుగురికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. జవాన్ల శరీరాలు చిధ్రమయ్యాయి. మావోయిస్టుల దాడి నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అధికారులు ఘటనా స్థలానికి అదనపు బలగాలను పంపారు. మావోయిస్టుల కోసం కూంబింగ్ ప్రారంభించారు.

16:55 - March 30, 2016

నెల్లూరు : అంబేథ్కర్ 125 వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం కుల వివక్షకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. టిడిపి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను సక్రమంగా ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిధులు పక్కదారి పట్టించిన వారిపై చర్యలు తీసుకొనే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొన్నారు. వచ్చే నెల 5 నుంచి 14 వరకు కుల వివక్షకు వ్యతిరేకంగా కేవీపీఎస్ చేపట్టే నిరసనకు ఆయన మద్దతు తెలిపారు. 

మూజువాణి ఓటుతో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం...

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాగా సుదీర్ఘ చర్చ అనంతరం మూజువాణి ఓటుతో బిల్లును సభ ఆమోదించింది. అనంతరం సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల ప్రకటించారు.

16:25 - March 30, 2016

హైదరాబాద్ : ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ జీతాల పెంపు సవరణ బిల్లును ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. దీనికి సంబంధించిన సవరణ బిల్లును ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సభలో ప్రవేశపెట్టారు. బిల్లుని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యతిరేకించారు. ప్రస్తుతం లోటు బడ్జెట్‌ ఉన్న నేపథ్యంలో జీతాలు పెంచుకోవడం సరికాదని అన్నారు. అధికారం చేతిలో ఉందని ఇష్టానుసారంగా జీతాలు పెంచుకోవడం తగదన్నారు. శ్రీధర్‌రెడ్డి బిల్లును వ్యతిరేకించడాన్ని టీడీపీ సభ్యులు తప్పుపట్టారు. ఎమినిటీస్‌ కమిటీలో ప్రతిపాదన మేరకే జీతాల పెంపు బిల్లును సభలో ప్రవేశపెట్టామని యనమల చెప్పారు. పెంపు ప్రతిపాదనపై వైసీపీ వైఖరి ఏమిటో చెప్పాలన్నారు. జీతాల పెంపును నిర్ధారించే ప్యానెల్‌తో తమ పార్టీ సభ్యులూ ఉన్నారని..వారు కూడా ప్రతిపాదనను ఆమోదించిన నేపథ్యంలో జీతాల పెంపును తాము వ్యతిరేకించలేకపోతున్నామని జగన్ వ్యాఖ్యానించారు. కమిటీ సూచించినంత కాకుండా కొంత తగ్గించాలని సూచించారు. కమిటీ సూచించిన మేరకు కాకుండా తగ్గించే జీతాలు పెంచుతున్నామని యనమల చెప్పారు. అనంతరం బిల్లును సభ ఆమోదించింది.  

భేటీ కానున్న కేంద్ర కేబినెట్....

ఢిల్లీ : రాత్రి 8 గంటలకు కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. పలు కీలక అంశాలపై చర్చించే అవకాశమున్నట్లు సమాచారం.

టీ-20 వరల్డ్ కప్ నుండి తప్పుకున్న యువరాజ్ ....

హైదరాబాద్ : టీ-20 వరల్డ్ కప్ నుండి యువరాజ్ సింగ్ వైదొలగాడు. చీలమండ గాయంతో బాధపడుతున్న కారణంగా సెమీఫైనల్ కు యూవీ దూరమయ్యాడు. ఆస్ట్రేలియా-భారత్ మ్యాచ్ లో యువరాజ్ కాలికి గాయమయ్యిన విషయం తెలిసిందే. యూవీ స్థానంలో మనీష్ పాండేకు ఆడే అవకాశమున్నట్లు సమాచారం.

కేంద్రానికి న్యాయస్థానం మొట్టికాయలు….

ఉత్తరాఖండ్ : రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనపై హెకోర్టులో విచారణ కొనసాగుతోంది. అసెంబ్లీలో బలనిరూపణకు 3 రోజులు వాయిదా వేయాలని కేంద్రం న్యాయస్థానాన్ని కోరింది. బలాన్ని నిరూపించుకోకుండా ప్రభుత్వాన్ని ఎలా రద్దు చేస్తారని కేంద్రాన్ని న్యాయస్థానం పశ్నించింది. ఏ కారణంతో రాష్ట్రపతి పాలన విధించారనీ...సెక్షన్ 356 ను దుర్వినియోగం చేశారని కేంద్రంపై న్యాయస్థానం మండిపడింది. 31న బలనిరూపణ నిర్వహించాలన్న సింగిల్ బెంచ్ తీర్పుపై ఇద్దరు సభ్యుల ధర్మాసనాన్ని కేంద్రం ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

జలమండలి వద్ద సీపీఐ నిరసన....

హైదరాబాద్ : నగరంలో మంచినీటి సమస్య పరిష్కరించాలని సీపీఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. జలమండలి ఎదుట సీపీఐ ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి చాడ మాట్లాడుతూ...ప్రజల ఇబ్బందులు పడుతున్నా సర్కారు పట్టించుకోవటంలేదని విమర్శించారు.

సెప్టెంబర్ 2న దేశవ్యాప్త సమ్మె : కార్మిక సంఘాలు

ఢిల్లీ: గత సంవత్సరంలో 12 డిమాండ్లను నెరవేర్చాలని..ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎఫ్‌డీఐని అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ సెప్టెంబర్‌ 2న దేశవ్యాప్త సమ్మె చేపట్టాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. కాన్ట్సిట్యూషన్‌ క్లబ్‌లో 11 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జాతీయ కార్మిక సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్‌, సీఐటీయూ కార్మిక సంఘాల జాతీయ కార్యదర్శులు హాజరయ్యారు. కార్మికుల సమస్యలు, సంస్కరణలపై నేతలు చర్చించారు. ఉద్యమాలతోనే కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయని నేతలు అభిప్రాయపడ్డారు. 

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు....

హైదరాబాద్ : స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 400 పాయింట్లకు పైగా, నిఫ్టీ 100 పాయింట్లకు పైగా లాభంలో కొనసాగుతున్నాయి. 

వేర్వేరు చోట్ల పెళ్లి డీసీఎంలు బోల్తా 8మంది మృతి,30మందికి గాయాలు...

రంగారెడ్డి : జిల్లాలో వేర్వేరు చోట్ల రెండు పెళ్లి బృందం డీసీఎంలు బోల్తా పడ్డాయి. పరిగి ఘటనలో 8 మంది మృతి చెందగా 10 మందికి గాయాలయ్యాయి. మరొకప్రాంతం కందుకూరు మండలం గుమ్మడవెల్లిలో కూడా పెళ్లి బృందం డీసీఎం బోల్తా పడింది. ఈఘటనలో 20 మంది గాయాలపాలయ్యారు. మరొక 3 గురి పరిస్థితి విషమంగా వుంది. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

15:22 - March 30, 2016

విజయవాడ : వైద్యులకు డబ్బే ముఖ్యం కాదని ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ హితవు పలికారు. వైద్యులను రోగులు భగవంతుడిగా భావిస్తారని, మానవత్వంతో వైద్యం చేయాలని వైద్యులకు సూచించారు. బుధవారం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రోగిని ముట్టుకుని వైద్యం చేసే విధానం వైద్యులు మరిచిపోయారని... కేవలం పరీక్షల ద్వారానే రోగాన్ని తెలుసుకునేందుకు పరిమితమయ్యారని అన్నారు. డబ్బు సంపాదనే లక్ష్యం కారాదని.. మానవత్వంతో రోగికి చికిత్స అందించాలన్నారు. వైద్య పరికరాల ఖర్చు రాబట్టుకునే యత్నంలో ఎక్కువ ఫీజు వసూలు చేయడం తగదన్నారు. ప్రతి వైద్యశాలలో చికిత్సకయ్యే ఖర్చు వివరాలను నోటీసు బోర్డులో ఉంచాలని సూచించారు గవర్నర్. కొందరు వైద్యాన్ని డబ్బుతో కొలుస్తున్నారని అది వారి వృత్తికే కళంకమన్నారు. వైద్య విధానంలో మార్పులు రావాలనీ...వైద్యులు మెడల్స్ తీసుకునే సమయంలో వుండే చిరునవ్వును రోగులకు చికిత్స చేసేటప్పుడు కూడా వుండాలని సూచించారు. అలాగే గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళటానికి కొందరు వైద్యులు నిరాకరిస్తున్నారనీ అది ఎంతమాత్రమూ సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. వైద్యాన్ని గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించటానికి వైద్యులు సహకరించాలన్నారు. 

15:15 - March 30, 2016

అనంతపురం : వర్సిటీల్లో విద్యార్థులు ఎంత బాధ పడుతున్నారో..వేధింపులు ఎలా ఉన్నాయో ఈ ఘటన చూస్తే తెలుస్తోంది. హెచ్ వోడీ తీరుతో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తాను బతికినా తనను చంపేయాలంటూ..ఘటనకు దారి తీసిన పరిస్థితులను విద్యార్థిని సూసైడ్ నోట్ లో పేర్కొంది. వివరాల్లోకి వెళితే..శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీలో అరుణ పీజీ సెకండియర్ చదువుతోంది. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతుండడంతో క్లాసులకు హాజరు కాలేకపోయింది. హాజరు శాతం తక్కువగా ఉండడంతో పరీక్షలకు అనుమతించబోమని హెచ్ వోడీ వెంకటరాజు పేర్కొన్నారు. తనను పరీక్షలకు హాజరయ్యే విధంగా చూడాలని, అనారోగ్యం కారణంగా తాను క్లాసులకు హాజరు కాలేకపోయానని వేడుకుంది. అవేమీ హెచ్ వోడీ నమ్మలేదు. ప్రిన్స్ పల్ దగ్గరకు వెళ్లి అనుమతి తీసుకొస్తే పరిశీలిస్తానని హెచ్ వోడీ పేర్కొన్నాడు. ప్రిన్స్ పల్ దగ్గరకు వెళ్లిన అరుణ అనుమతి తీసుకొచ్చింది. కానీ హెచ్ వోడీ మాత్రం అనుమతి ఇవ్వలేదు. గంట సేపు కుర్చీలో కూర్చొలేని అనారోగ్యం ఉండడం..కట్టుకథలు చెబుతోందని హెచ్ వోడీ సూటి పోటి మాటలు మాట్లాడడంతో అరుణ తీవ్ర మనస్థాపానికి గురైంది. బుధవారం మధ్యాహ్నం ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. తోటివారు గమనించి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తాను బతికితే మాత్రం చంపేయాలని సూసైడ్ నోట్ లో పేర్కొంది. తనకు అనారోగ్యం ఉందని చెప్పినా హెచ్ వోడీ వినిపించుకోవడం లేదని..చనిపోయిన తరువాతన తన శరీరాన్ని చూపిస్తే అప్పుడన్నా హెచ్ వోడీ నమ్ముతాడని విద్యార్థిని లేఖలో పేర్కొంది. హెచ్ వోడీ తీరుపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కానీ తాను ఎలాంటి వేధింపులకు పాల్పడలేని హెచ్ వోడీ పేర్కొంటున్నారు. 

ఫినాయిల్ తాగి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం...

అనంతపురం : కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం హాస్టల్ లో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేగింది. ఫినాయిల్ తాగి పీజీ విద్యార్థిని అరుణ ఆత్మహత్యకు ప్రయత్నించింది. పరిస్థితి విషమించడంతో తోటి విద్యార్థినిలు ఆసుపత్రికి తరలించారు. హాజరు శాతం తక్కువగా వుండటంతో హెచ్ ఓడీ పరీక్షలకు అనుమతించలేదని అందువల్లనే మనస్తాపంతో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సూసైడ్ నోట్ లో విద్యార్థిని పేర్కొంది. హెచ్ వోడీపై విద్యార్ధి సంఘాలు మండిపడుతున్నాయి.

14:58 - March 30, 2016

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత ల కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్' రూపొందిస్తున్న చిత్రం 'అ ఆ'. ఈ చిత్రం తొలి ప్రచార చిత్రాలను కధానాయకుడు నితిన్ పుట్టినరోజు (30-3-16) సందర్భంగా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతుండగా మే నెలలో అ..ఆ మూవీని రిలీజ్‌ చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. 'అ..ఆ' అనే మూవీ అనసూయ రామలింగం వర్సెస్‌ అనే ట్యాగ్‌ లైన్‌తోనే మంచి క్రేజ్‌ తెచ్చుకుంది. 'మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలం నుండి జాలు వారిన ఒక మంచి ఫీల్ గుడ్ రొమాంటిక్ చిత్రాన్ని ప్రేక్షకులు మే లో చూడబోతున్నారు అని నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) పేర్కొన్నారు. మిక్కీజె. మేయర్ సంగీతం సంగీత ప్రియులను అలరిస్తుందని అన్నారు. మే 6 న చిత్రాన్ని విడుదల చేయనున్నామని నిర్మాత తెలిపారు.

వైద్యాన్ని డబ్బుతో కొలవొద్దు : గవర్నర్ నరసింహన్

విజయవాడ : ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...వైద్యులను రోగులు భగవంతుడిగా భావిస్తారు కావున రోగులకు మానవత్వంతో వైద్యం చేయాలని చెప్పారు. కొందరు వైద్యాన్ని డబ్బుతో కొలుస్తున్నారనీ అది వారివృత్తికే కళంకమన్నారు. వైద్య విధానంలో మార్పులు రావాలనీ...వైద్యులు మెడల్స్ తీసుకునే సమయంలో వుండే చిరునవ్వును రోగులకు చికిత్స చేసేటప్పుడు కూడా వుండాలని సూచించారు. అలాగే గ్రామీణ ప్రాంతలకు వెళ్ళటానికి కొందరు వైద్యులు నిరాకరిస్తున్నారనీ అది ఎంతమాత్రమూ సరికాదని సూచించారు.

14:41 - March 30, 2016

మెంటెనెన్స్...దీనిని తెలుగులో పోషణ..భరణం..మనోవర్తి అనుకుంటున్నామని లాయర్ పార్వతి తెలిపారు. మెంటెనెన్స్ పొందాలంటే ఎలాంటి చట్టాలున్నాయనే దానిపై 'మానవి' వేదికలో ఆమె విశ్లేషించారు. ఇందులో అనేక రకాల చట్టాలున్నాయని, తనంతతాను పోషించుకోలేని వారందరూ దీనికిందకు వస్తారన్నారు. ఎవరైతే పోషించాలో వారు మెంటెనెన్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
హిందూ వివాహ చట్టం ప్రకారం మెంటెనన్స్ పొందవచ్చని, కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు మధ్యంతర మెంటెనెన్స్ కూడా పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే ప్రజలు వెలుబుచ్చిన న్యాయ సలహాలు..సందేహాలను లాయర్ పార్వతి నివృత్తి చేశారు. ఎలాంటి విశ్లేషణ అందించారో వీడియో క్లిక్ చేయండి. 

14:36 - March 30, 2016

పశ్చిమబెంగాల్ : రాష్ట్ర ఎన్నికల్లో తొలి విడత సమరం తుది దశకు చేరుకుంది. వచ్చే సోమవారమే పోలింగ్ ఉండడంతో జంగల్ మహల్ లో అన్ని పార్టీలు మొహరించాయి. పోలింగ్ నాడు మూడు ప్రత్యేక హెలికాప్టర్లతో ఏరియల్ సర్వే చేసేందుకు ఎలక్షన్ కమిషన్ సమాయత్తమవుతోంది. పశ్చిమబెంగాల్ లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ సరిగ్గా ఇదే సంఖ్యలో అసెంబ్లీ స్థానాలుండేవి. ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడూ ఆరేడు విడతల ఎన్నికలు పెట్టలేదు. కానీ, పశ్చిమ బెంగాల్ లో ఆరు విడతలుగా ఎన్నికలు జరగబోతున్నాయి. ఏప్రిల్ 4న అంటే వచ్చే సోమవారంనాడు తొలి విడత పోలింగ్ జరిగితే, మే 5న ఆఖరి విడత పోలింగ్ వుంది. తొలి విడతకి, ఆఖరి విడతకీ మధ్య నెల రోజుల వ్యవధి వుంది. ఇంత సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ అక్కడ నెలకొన్న పరిస్థితికి నిదర్శనం. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతుండడం విశేషం.

చైతన్యం ఎక్కువ..
మావోయిస్టులకు గట్టి స్థావరమనే పేరున్న జంగల్ మహల్ లో తొలి విడత ఎన్నికలు జరగబోతున్నాయి. ఏప్రిల్ 4, 11 ఈ రెండు తేదీలలో తొలి విడత ఎన్నికలున్నాయి. మొదటి రోజు కేవలం 18 అసెంబ్లీ స్థానాల్లోనూ, రెండో రోజు 31 స్థానాల్లోనూ పోలింగ్ పెడుతున్నారు. జంగల్ మహల్ గా ప్రసిద్ధి చెందిన పురిలియా, పశ్చిమ మిడ్నాపూర్, బంకుర జిల్లాల్లో తొలి విడత ఎన్నికల సమరం హోరెత్తుతోంది. పశ్చిమబెంగాల్ లో ఓటరులో చైతన్యం ఎక్కువ. భారీ స్థాయి ఓటింగ్ ఈ రాష్ట్రం ప్రత్యేకత. 80 నుంచి 84 శాతం ఓట్లు పోలవుతుంటాయి. 34 ఏళ్ల పాటు కమ్యూనిస్టులను ఆదరించిన పశ్చిమబెంగాల్ 2011లో మమతాబెనర్జీకి చాన్స్ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళా ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి. ఆ తర్వాత 2014 లోక్ సభ ఎన్నికల్లోనూ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మమతాబెనర్జీ అదే ఊపు కొనసాగించారు. అయితే ఈ ఎన్నికల్లో వామపక్షాల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారన్న టాక్ వినిపిస్తోంది.

6 కోట్ల మందికిపైగా ఓటర్లు..
2011తో పోల్చుకుంటే తమ పరిస్థితి చాలా మెరుగైందన్న విశ్వాసం వామపక్ష నేతల్లో వ్యక్తమవుతుంటే, మళ్లీ అధికారం తమదేనన్న ధీమాతో త్రుణమూల్ కాంగ్రెస్ వుంది. అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న పట్టుదలతో బీజేపీ కదనోత్సాహం ప్రదర్శిస్తుంటే, తన బలాన్ని పెంచుకునేందుకు కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. పశ్చిమబెంగాల్ లో 6 కోట్ల 55 లక్షల 46 వేల మంది ఓటర్లున్నారు. వీరిలో 3 కోట్ల 39 లక్షల మంది పురుష ఓటర్లుండగా, 3 కోట్ల 16 లక్షల మంది మహిళా ఓటర్లున్నారు. 2011తో పోల్చుకుంటే కొత్త ఓటర్ల సంఖ్య 94 లక్షలకు పైగా పెరిగింది. గెలుపు ఓటమిలను ప్రభావితం చేయడంలో ఈ కొత్త తరం ఓటర్లు కీలకంగా మారే అవకాశం వుంది. కొత్త ఓటర్లను ఎక్కువగా ఆకర్షించగలిగిన పార్టీకి విజయతీరాలను చేరుకోగలిగే అవకాశాలు పుష్కలంగా వుంటాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

అధికమైన పోలింగ్ కేంద్రాలు..
పశ్చిమబెంగాల్ లో ఓటర్ల సంఖ్య మాత్రమే కాదు ఈసారి పోలింగ్ కేంద్రాల సంఖ్య కూడా భారీగానే పెరిగింది. 2011 ఎన్నికల్లో సుమారు 52 వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎన్నికల కమిషన్ ఈసారి 77 వేల పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. పోలింగ్ కేంద్రాలు 48శాతం పెరిగాయి. ఓటింగ్ శాతాన్ని మరింత పెంచేందుకు, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ఈసీ ప్రయత్నిస్తోంది. దాదాపు 12వేల పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన ఈసీ, అందుకు తగ్గస్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది. 908 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ను, 624 స్టాటిక్ స్క్వాడ్స్ ను నియమించిన ఈసీ ఆరోపణలున్న అధికారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. పశ్చిమబెంగాల్ ఇప్పటికే 40 మంది ఎన్నికల అధికారులను, పోలీస్ అధికారులను బదిలీ చేయడం అధికార పార్టీకి ఏమాత్రం మింగుడుపడని పరిణామం. అధికారుల బదిలీల విషయంలో ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు.

ధన ప్రవాహం..
హోరాహోరీ పోరు జరుగుతున్న పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో ధన ప్రవాహం కూడా ఎక్కువగానే వున్నట్టు కనిపిస్తోంది. కేవలం 15 రోజుల్లోనే దాదాపు కోటి రూపాయల నగదును ఎన్నికల అధికారులు సీజ్ చేశారు. నాలుగు లక్షల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. భారీ మొత్తంలో డబ్బు, మద్యం పట్టుబడడం అక్కడ నెలకొన్న పోటీ తీవ్రతను సూచిస్తున్నాయి. ఈ అయిదేళ్ల కాలంలో తాను చేసిన అభివ్రద్ధి మరోసారి గెలిపిస్తుందన్న నమ్మకంతో మమతా బెనర్జీ వున్నారు. రోడ్లు వేయడం, మావోయిస్టులను అణచివేయడం, జంగల్ మహల్ లాంటి ప్రాంతాల్లో రేషన్ సరఫరా మెరుగుపర్చడం మొదలైన అంశాలను ఆమె ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. అయితే, మమతా బెనర్జీ పాలనలో అవినీతి రాజ్యమేలిందనీ, ప్రజాస్వామిక హక్కులకు విఘాగం కలిగిందనీ, మహిళల మీద నేరాలు పెరిగాయంటూ వామపక్షాలు విమర్శిస్తున్నాయి. శారదా కుంభకోణం, నారదా స్టింగ్ ఆపరేషన్ లో టీఎంసీ ముఖ్యనేతలు పట్టుబడడం మమతాబెనర్జీ ప్రతిష్టను ఎంత వరకు దెబ్బతీశాయన్నది ఎన్నికల ఫలితాల తర్వాత కాని తేలదు. 

14:30 - March 30, 2016

గుంటూరు : ఆసియాలోనే అతిపెద్ద మిర్చి యార్డ్ అది. ఇప్పుడదే యార్డ్ తన క్రెడిట్‌కు తగ్గట్టే బడా మోసాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. వర్షాభావం లాంటి సవాలక్ష సమస్యలు ఎదుర్కొని పంట పండించిన రైతన్న... తీరా పంటను అమ్మబోయే సమయంలో కొందరు కేటుగాళ్ల చేతిలో నిండా మోసపోతున్నాడు. వ్యాపారులు శాంపిల్స్ పేరుతో పట్టపగలే కేజీల కొద్ది మిర్చిని దోచుకెళ్తున్నారు. కళ్లముందే దోపిడీకి గురవుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. నిన్న మొన్నటిదాకా ఈ రైతులు ప్రకృతి చేతిలో మోసపోయారు.. అష్టకష్టాలు పడి పంటలు పండించి తీరా అమ్మేవేళ వ్యాపారుల చేతిలో దగాపడుతున్నారు.

అతి పెద్ద మిర్చియార్డు..
ఇది ఆసియాలోకెల్లా అతిపెద్ద మిర్చియార్డ్. గుంటూరు మిర్చియార్డ్ గురించి తెలియని మిర్చి రైతు బహుశా ఉండడమే. ఇప్పుడు ఇదే యార్డ్ కేటుగాళ్లకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఓ వైపు వర్షాలు లేకపోయినా గిట్టుబాటు ధర రాకపోయినా రైతులో ఏదోలా శ్రమించి మిర్చి సాగుచేశారు. పంటను అమ్ముకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఇలా మార్కెట్ యార్డుకు తీసుకొచ్చారు. తీరా ఇక్కడికొచ్చాక వ్యాపారుల చేతుల్లో చిత్రవిచిత్రంగా మోసపోతున్నారు.

దోపిడి..
మిర్చికి అధిక రేటు పలుకుతుండడంతో వ్యాపారులు రకరకాలుగా దోపిడీకి పాల్పడుతున్నారు. శాంపిల్స్‌ పేరుతో మిర్చి బస్తాల నుంచి కేజీలకొద్దీ ఫ్రీగా కాజేస్తున్నారు. పగటి పూట ఇలా శాంపిల్స్ పేరుతో దోచుకుంటే, రాత్రి వేళల్లో ఏకంగా ముఠాగా ఏర్పడి కొందరు మిర్చి బస్తాలకు కన్నాలు పెడుతున్నారు. రైతులకు అనుమానం రాకుండా యధాతథంగా కుట్టేస్తున్నారు. ఇలా ప్రతిరోజు 15 నుంచి 20 లక్షల రూపాయల విలువైన సరుకు మాయమవుతోంది. ఎంతోకష్టపడి పంట పండిస్తే ఇలా దోచుకోవడం దుర్మార్గమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తూనికల్లోనూ..
ఇవొక్కటే కాదు వ్యాపారులు తూనికల్లోనూ మోసాలకు పాల్పడుతున్నారనేది రైతుల ఆరోపణ. గుంటూరు మిర్చియార్డుకు గతకొన్ని సంవత్సరాలుగా పాలక వర్గం లేదు. దీంతో తాత్కాలిక అధికారులతోనే యార్డు వ్యవహారాలు సాగిపోతున్నాయి. ఇదే అదనుగా దోపిడీదారులు రెచ్చిపోతున్నారు. జాయింట్ కలెక్టర్‌ను యార్డు పర్యవేక్షణ అధికారిగా నియమించినా, దోపిడీలు తగ్గడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వమే పూర్తి స్థాయిలో దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

14:24 - March 30, 2016

హైదరాబాద్ : విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌ సాధించడంలో టిడిపి ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని వైసీపీ ఎమ్మెల్యే సుజయ కృష్ణరంగారావు ఆరోపించారు. బుధవారం వెనుకబడిన ప్రాంతాలపై ఏపీ అసెంబ్లీలో చర్చ సందర్భంగా రంగారావు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రత్యేక రైల్వే జోన్‌ లేకపోవడం వలన ఉత్తరాంధ్ర జిల్లాలకు అన్ని విషయాల్లో తీరని అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

14:19 - March 30, 2016

హైదరాబాద్ : నిజాం షుగర్స్ పై మంత్రి పోచారం మొసలి కన్నీరు కారుస్తున్నారని కాంగ్రెస్‌ సభ్యుడు జీవన్‌రెడ్డి అన్నారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో నిజాం షుగర్స్ అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పోచారం సమాధానం చ్చారు. తన అభిప్రాయానికి వ్యతిరేకంగా చంద్రబాబు నిర్ణయం తీసుకుంటే.. ఆనాడు పోచారం ఎందుకు రాజీనామా చేయలేదన్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. అయితే.. కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదన్నప్పుడు మీరెందుకు రాజీనామా చేయలేదని కాంగ్రెస్‌ సభ్యులను మంత్రి పోచారం ప్రశ్నించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. 

14:16 - March 30, 2016

రంగారెడ్డి : పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. డీసీఎం బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. పరిగి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు వికారాబాద్‌ మండలం ధ్యాచారం గ్రామస్తులుగా గుర్తించారు. యాచారం గ్రామానికి చెందిన పెళ్లి బృందం డీసీఎంలో బుధవారం ఉదయం పూడూరు గ్రామానికి వెళుతోంది. ఈ డీసీఎం అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 

టి.శాసనసభలో కాగ్ నివేదిక..

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. 2014 జూన్ నుంచి 2015 మార్చి 31 వరకు కాగ్ శాఖల వారీగా విశ్లేషించింది. ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక, సామాజిక సంస్థలు, రాష్ట్ర లెక్కలు, వార్షిక పద్దులపై కాగ్ నివేదికను రూపొందించింది. 2014-15కు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, రెవెన్యూపై కాగ్ నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. కాగ్ వెల్లడించిన నివేదికలోని అంశాలు
2014-15లో రాష్ట్ర రాబడుల మొత్తం రూ. 51,041.80 కోట్లు
రాష్ట్ర పన్నులు రూ. 29,288.30 కోట్లు
పన్నేతర రాబడులు రూ. 6,44.82 కోట్లు

13:55 - March 30, 2016

హైదరాబాద్ : ప్రపంచక్రికెట్లో భారత సంచలనం, ఛేజింగ్ కింగ్ విరాట్ కొహ్లీని క్రికెట్ మాజీ, ప్రస్తుత గ్రేట్లు ప్రశంసల వర్షంతో ముంచెత్తుతున్నారు. ఇయాన్ చాపెల్, సునీల్ గవాస్కర్, సచిన్ టెండుల్కర్, మాక్స్ వెల్, స్టీవ్ స్మిత్, ధోనీ ఒకరేమిటి చేజింగ్ లో కొహ్లీకి కొహ్లీమాత్రమే సాటి అంటూ కొనియాడారు.
టీ-20 ప్రపంచకప్ చరిత్రలోనే ఆల్ టైమ్ గ్రేట్ ఇన్నింగ్స్ గా మిగిలిపోతుంది. 
మారుమోగుతున్న పేరు..
ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం మార్మోగిపోతున్న పేరు విరాట్ కొహ్లీ. మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో ముగిసిన టీ-20 ప్రపంచకప్ సూపర్ టెన్ రౌండ్ పోటీలో టీమిండియాకు కొహ్లీ ఒంటిచేత్తో అందించిన విజయాన్ని చూసి అభిమానులు మాత్రమే కాదు ప్రత్యర్థులు సైతం మురిసిపోతున్నారు. ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్లో ఫార్మాట్ ఏదైనా సరే కొహ్లీకి ప్రత్యర్థులంటూ ఎవ్వరూ లేరు. కొహ్లీకి కొహ్లీమాత్రమే పోటీ. భారతజట్టు ఛేజింగ్ కు దిగిన సమయంలోనే కొహ్లీలోని విరాట్ స్వరూపం బయటకు వస్తుంది.
ముందే పసిగట్టి..
ప్రత్యర్థి కెప్టెన్ వ్యూహాన్ని ముందుగానే పసిగట్టి బౌలర్ ను బట్టి గ్రౌండ్ నలుమూలలకూ షాట్లు కొట్టడం ఏమాత్రం అవకాశం చిక్కినా వికెట్ల మధ్య రేస్ గుర్రంలా పరుగులు తీస్తూ ఫీల్డర్లను ఒత్తిడికి గురిచేయటంలోనే కొహ్లీ ప్రతిభ అంతాదాగి ఉంది. పరిస్థితులను బట్టి ఆట, బంతిని బట్టి షాట్ కొట్టడంలో కొహ్లీకి కొహ్లీ మాత్రమే సాటి. మీర్పూర్ షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో పాకిస్థాన్ తో ముగిసిన ఆసియాకప్ రౌండ్ రాబిన్ లీగ్ పోటీలో ఫాస్ట్ బౌలర్లకు అనువుగా ఉన్న పిచ్ పైన కొహ్లీ ఓ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి సింగిల్ హ్యాండెడ్ గా తనజట్టుకు విజయం అందించాడు.
సెహబాష్ కోహ్లీ.. 
అంతేకాదు కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా పాకిస్థాన్ తో ముగిసిన ప్రపంచకప్ సూపర్ టెన్ రౌండ్లో సైతం కొహ్లీ ఓ స్పెషల్ ఇన్నింగ్స్ ఆడి వావ్ అనిపించాడు. ఇక ప్రపంచకప్ సెమీస్ చేరాలంటే నెగ్గితీరాల్సిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా పై 51 బాల్స్ లోనే మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడి 
 82 పరుగులు చేసిన కొహ్లీ తనఅభిమానులను మాత్రమే కాదు, ప్రత్యర్థుల చేత సైతం సెభాష్ అనిపించుకొన్నాడు.
చేజింగ్ కింగ్..
వన్డేలు, టీ-20లు అన్నతేడా లేకుండా..కొహ్లీ చేజింగ్ లో అరుదైన రికార్డులు నెలకొల్పాడు. ఇప్పటి వరకూ టీమిండియా సభ్యుడిగా 39 టీ-20 ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కొహ్లీ కేవలం ఛేజింగ్ లోనే 737 పరుగులు సాధించాడు. 131 స్ట్రయిక్ రేట్ తో తొమ్మిదిసార్లు నాటౌట్ గా నిలిచిన కొహ్లీ 82 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు.


ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా టీమిండియా డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించడంలో విరాట్ కొహ్లీ ప్రధానపాత్ర వహించాడు.

కంగారూజట్టు ప్రత్యర్థిగా కొహ్లీ 66.83 సగటుతో తొమ్మిదిఇన్నింగ్స్ లో 401 పరుగులు సాధించాడు. మూడుసార్లు అన్ బీటెన్ గా నిలిచాడు.

ఫార్మాట్ ఏదైనా...228.50 సగటు సాధించిన ఏకైక ఆటగాడు విరాట్ కొహ్లీ మాత్రమే.మొహాలీలో విరాట్ కొహ్లీ సాధించిన 82 పరుగుల నాటౌట్ రికార్డు..
టీ-20 ప్రపంచకప్ చరిత్రలోనే ఆల్ టైమ్ గ్రేట్ ఇన్నింగ్స్ గా మిగిలిపోతుంది. 

13:52 - March 30, 2016

మల్లెపూలు... ఈ మాట వినగానే మగువలు మనసు పారేసుకుంటారు. మనకు తెలిసినంత వరకు మల్లెపూలు మహిళలకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఇదొక్కటే కాదండోయ్... ఈ పూలలో అనేక ఔషధగుణాలు ఉన్నాయని మరచిపోకండి. గుభాళింపులకు మారుపేరైన మల్లెపూలలో ఈ గుణాలే కాదు సౌందర్య సాధనాలూ ఉన్నాయి. ప్రతిరోజూ మల్లెపూలను తలలో పెట్టుకోవడం వల్ల ఆహ్లాదంగా ఉండడమే కాదు... వారి కళ్లకూ మేలు జరుగుతుంది. మనతోపాటే మనలోని అవయవాలు అలసిపోతాయి. కళ్లు బాగా అలసినప్పుడు కొన్ని మల్లెపూలను రెప్పలపై పెట్టుకుంటే చల్లగా ఉంటుంది. అంతేకాదు మంచి నిద్ర పడుతుంది.
చుండ్రు సమస్యతో బాధపడేవారు ఎండిన మల్లెపూలతో మెంతులను కలిపి పొడిగా చేయాలి. ఆ పొడిని తలకు పట్టించి కాసేపు ఆగిన తర్వాత తల స్నానం చేయాలి. దీనివల్ల చుండ్రు పోవడమే కాకుండా జుట్టు మెరుస్తూ ఉంటుంది.
కొబ్బరినూనెలో కొన్ని మల్లెపూలు వేసి ఒక రాత్రంతా బాగా నానబెట్టాలి. ఆ మర్నాడు ఆ నూనెను బాగా మరగబెట్టాలి. చల్లారిన తర్వాత ఈ నూనెను తలకు రాసుకుంటే సువాసన వస్తుంది. అలాగే దీని వల్ల తలలో ఉండే మాడుకు మంచిది.
మల్లెపూల రసం, గులాబీల రసంలో గుడ్డులోని పచ్చసొనను రెండు చెంచాల కలిపి దాన్ని ముఖానికి రాసుకుంటే మృదువుగా మారుతుంది.
చర్మానికి అవసరమయ్యే సి విటమిన్‌ మల్లెపూలలో ఉంటుంది.

13:49 - March 30, 2016

హైదరాబాద్ : ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారుడిగా దేశం విడిచిన లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా ఎట్టకేలకు రుణచెల్లింపులపై నోరు విప్పారు. సుప్రీం కోర్టులో మాల్యా కేసు విచారణ సందర్భంగా ఆయన తరపు లాయర్లు మాల్యా రుణ చెల్లింపు ప్రతిపాదనను వెల్లడించారు. నాలుగు వేల కోట్ల రూపాయలను తిరిగి బ్యాంకులను చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని మాల్యా ప్రతిపాదించారు. అయితే ఈ చెల్లింపునకు ఈ ఏడాది సెప్టెంబర్‌ వరకు అనుమతించాలని తెలిపారు. ఇదే విషయాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా బ్యాంకు అధికారులకు స్పష్టం చేసినట్లు తెలిపారు. కాగా మాల్యా ప్రతిపాదనపై వారంలోగా నిర్ణయించుకోవాలని బ్యాంకులకు సుప్రీం ఆదేశించింది. ఇదిలా ఉంటే బ్యాంకులు మాల్యా ప్రతిపాదనపై చర్చించుకునేందుకు సమయం కావాలని న్యాయస్థానాన్ని కోరాయి. 

13:48 - March 30, 2016

ఆరోగ్యానికి వ్యాయామం మంచిదే. అందుకే చాలామంది ఉదయమో, సాయంత్రమో నడవడం అలవాటు చేసుకుంటారు. అయితే రోజు వారీ వ్యాయామంతో పాటు వారానికి ఐదు రోజుల పాటు రోజుకి ఐదు నిమిషాల చొప్పున పరిగెత్తితే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల మహిళలు ఊబకాయం, మధుమేహం, హృద్రోగాలు, బీపీ, పక్షవాతం, క్యాన్సర్‌.. వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ ఐదు నిమిషాల పరుగుతో ఈ రోగాలను నియంత్రించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. పరుగు వల్ల ఎండొకెనాబినాయిడ్లు అనే హార్మోన్లు విడుదలవడంతో ఆనందం లభిస్తుందని పరిశోధనలో తేలింది. పరిగెత్తితే మోకాళ్ల పనితీరు మరింత మెరుగవుతుంది. ఆస్టియో ఆర్థ్రైటిస్‌ను తగ్గించుకోవచ్చు. రోజూ ఐదు నిమిషాలు పరిగెత్తడం వల్ల జీవితకాలం కనీసం ఓ ఐదేళ్లు పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

13:46 - March 30, 2016

హైదరాబాద్ : ప్రత్యేక అభివృద్ధి నిధిపై అసెంబ్లీ తీవ్ర రగడ జరిగింది. ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కేటాయించకుండా టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, నిజయోకవర్గ ఇన్‌చార్జ్‌లకు ఎస్డీఎఫ్ కింది నిధులు కేటాయించడాన్ని ప్రతిపక్ష నేత జగన్‌ తప్పుట్టారు. ఎసీడీపీకి నిధులు కేటాయించకుండా ఎస్డీఎఫ్ కింద నిధుల కేటాయించడం ఎన్నికైన ప్రజా ప్రతినిధులను అగౌరపరచడమే అవుతుందని విమర్శించారు. ఎస్డీఎఫ్ నిధుల కేటాయింపును ప్రభుత్వం సమర్ధించుకుంది. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించలేమని ఆర్ధిక మంత్రి యనమల సభ దృష్టికి తెచ్చారు. దీనిపై వైసీపీ సభ్యులు స్పీకర్‌ పోడియం దగ్గరకు వెళ్లి నిరసన వ్యక్తం చేయడంతో సభను కొద్దిసేపు వాయిదా వేశారు. 

13:46 - March 30, 2016

ప్రతి రోజూ ఉదయం చల్లటి పాలతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ముఖం మీద పాలు చిలకరించి చేత్తో సున్నితంగా మసాజ్‌ చేయాలి. ఇలా రెండు వారాల పాటు క్రమం తప్పకుండా చేస్తే ముఖం మెరిసిపోతుంది. అలాగే చీజ్‌తో కూడా మెరిసే సౌందర్యాన్ని పొందవచ్చు. చీజ్‌ను తురిమి, మెత్తగా చేయాలి. ఇలా మెత్తగా అయిన చీజ్‌ను ముఖం, మెడకు అప్లై చేసి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే నల్లటి మచ్చలు తొలగిపోతాయి. ఇక చర్మ సౌందర్యానికి శెనగపిండి బెస్ట్‌గా పనిచేస్తుంది. శనగపిండి, రోజ్‌ వాటర్‌ రెండు మిక్స్‌ చేసి ముఖానికి పట్టిస్తుంటే నాలుగు వారాల్లో మంచి ఫలితం కనిపిస్తుంది. బాదం పేస్టు కూడా చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. బాదంలో విటమిన్‌ 'ఇ' పుష్కలంగా ఉంటుంది. ఇది ముఖాన్ని కాంతివంతంగా మార్చుతుంది.

13:44 - March 30, 2016

మనకు లభిస్తున్న అన్ని రకాల ఆహార పదార్థాలలోకెల్లా మొలకెత్తిన గింజలు పూర్తిస్థాయి పోషకాలను అందిస్తాయి. శరీరం చురుకుగా ఉండాలంటే వారంలో కనీసం ఒకసారైనా మొలకెత్తిన గింజలను తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. మొలకెత్తిన గింజలు అధిక బరువును తగ్గించేందుకు కూడా చక్కగా ఉపయోగపడతాయి. మొలకెత్తిన గింజలను పచ్చిగానే తినాలి. దీంతో రుచికి రుచి, పోషకాలు కూడా లభిస్తాయి. అలాకాకుండా ఉడకబెట్టినా, వేడి చేసినా వాటిలోని పోషకాలు తొలగిపోతాయి. ఈ గింజలతో పచ్చి క్యారెట్లను కలిపి తింటే శరీరానికి కావాల్సిన బీటా కెరోటిన్‌ సమృద్ధిగా అందుతుంది.
మొలకెత్తిన గింజలను నిత్యం మన ఆహారంలో భాగం చేసుకుంటే వాటితో ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలను పొందొచ్చు. ముఖ్యంగా వీటివల్ల గ్యాస్‌, ఎసిడిటీ తదితర సమస్యలు దూరమవుతాయి. మొలకెత్తిన గింజలలో క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అలాగే విటమిన్‌ బి, సిలు వీటిలో ఎక్కువగా ఉంటాయి.
మొలకెత్తిన గింజలు జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తాయి. మధ్యాహ్న సమయంలో మాంసాహారం తింటే సాయంత్రం స్నాక్స్‌లో మొలకెత్తిన గింజలు తినడం బెటర్‌. ఎందుకంటే మాంసాహారం నుంచి వచ్చే అధిక కొవ్వు బారి నుండి గింజలు మనల్ని రక్షిస్తాయి. మాంసంలోని కొవ్వును పీల్చుకోవడం ద్వారా దాన్ని శరీరంలోని ఇతర వ్యర్థపదార్థాలతో కలిపి బయటికి పంపిస్తాయి. వీటిలో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఇది బరువు తగ్గించుకునేందుకు ఉపయోగపడుతుంది.

13:37 - March 30, 2016

హైదరాబాద్ : నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ ప్రైవేటైజేషన్ విషయంలో వారించినందుకు  ఆనాడు తతను చంద్రబాబు ఇరిటేషన్ తో కొట్టారని తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. 'నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ రీ ఓపెన్' పై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా పోచారం సభలో మాట్లాడారు. ''చంద్రబాబు హయాంలో నిజాం సాగర్ ఫ్యాక్టరీస్ ప్రైవేటైజేషన్ తతంగానికి నేను ప్రత్యక్ష సాక్షిని. ఆరోజు చంద్రబాబు ఇంట్లో కూర్చుని చర్చిస్తున్నాము. చివరి క్షణం ఆలోచించండి సార్ అని అడిగాను. నేను పక్కన సోఫా మీద కూర్చుని ఉన్నాను. నేను ఈ మాట అనగానే చంద్రబాబు నాయుడు లేచి ఇరిటేట్ అయ్యి.. నా తొడమీద కొట్టాడు. తొడ ఎర్రగా కందిపోయింది'' అని పోచారం వెల్లడించారు.
పోచారం ముసలి కన్నీరు.. : జీవన్ రెడ్డి.. 
నిజాం షుగర్స్‌పై మంత్రి పోచారం మొసలి కన్నీరు కారుస్తున్నారని కాంగ్రెస్‌ సభ్యుడు జీవన్‌రెడ్డి అన్నారు. తన అభిప్రాయానికి వ్యతిరేకంగా చంద్రబాబు నిర్ణయం తీసుకుంటే.. ఆనాడు పోచారం ఎందుకు రాజీనామా చేయలేదన్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. అయితే.. కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదన్నప్పుడు మీరెందుకు రాజీనామా చేయలేదని కాంగ్రెస్‌ సభ్యులను మంత్రి పోచారం ప్రశ్నించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.  
పదవి కోసం పడి ఉన్నారా : రేవంత్
ఒకవేళ చంద్రబాబు నాయుడు ఆరోజు పోచారం శ్రీనివాస్ రెడ్డిని కొట్టి ఉంటే.. మళ్లీ ఎందుకు వారి దగ్గరే పడి ఉన్నారని విమర్శించారు. కొట్టినా తిట్టినా పదవి కోసం పడి ఉన్నారా అని సీరియస్ అయ్యారు. రెండు సంవత్సరాలనుండి టీఆరెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాల్సిన బాధ్యత పోచారంపైన ఉందన్నారు. ఎప్పటిలోపు ఆ ఫ్యాక్టరీని తెరిపిస్తారని రేవంత్ మంత్రిని ప్రశ్నించారు. 

అర్పితా ఖాన్ కు పుత్రోదయం...

హైదరాబాద్ : ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, కండల వీరుడుగా పేరున్న సల్మాన్‌ ఖాన్‌ సోదరి అర్పితా ఖాన్‌ కు ఈ ఉదయం పండంటి మగబిడ్డ పుట్టాడు. ఈ విషయాన్ని అర్పిత భర్త ఆయుష్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలుపుతూ ‘మా రాజకుమారుడు వచ్చాడు’ అంటూ పోస్ట్‌ చేశాడు. బాబుకి ‘అహిల్‌’ అని పేరు కూడా పెట్టినట్లు ఆయుష్ పేర్కొన్నాడు. ఆయుష్‌, అర్పితల వివాహం 2014 నవంబర్‌లో హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. కాగా అర్పిత సల్మాన్ తల్లిదండ్రులు దత్తత తీసుకున్న కుమార్తె అన్న విషయం తెలిసిందే. మేనల్లుడు పుట్టినందుకు సల్మాన్ సంతోషంలో మునిగిపోయాడు.

13:34 - March 30, 2016

హైదరాబాద్ : కరువు సహాయక చర్యలు తెలంగాణ ప్రభుత్వం విఫలమయ్యిందని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆరోపించారు. నేటి అసెంబ్లీ సమావేశాల్లో కరువు నివారణపై రాజయ్య మాట్లాడారు. 'కేంద్రం కరువు నిధులు ఇచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టాలి. కరువు నివారణను ఎదుర్కొనడానికి మెట్ట పంటలు వేయాలి. దీనకోసం రైతులకు ఉచిత ఇన్ పుట్ సబ్సిడీలు ఇవ్వాలి. ఉపాది హామీ పనిలో రెండు నెలల కాలంగా బకాయిల చెల్లింపు చేయట్లేదు. కరువు పనులు కూడా కల్పించాలి. గ్రామాల్లో 200 రోజులు కూలీ కల్పించాలి. కనీసం 300 రూ.లు ఇవ్వాలి. మంచినీళ్లు, టెంట్లు, వైద్యం, వాటర్ లాంటి సదుపాయాలు ఉపాధి కూలీలకు కల్పించాలి.  మిషన్ కాకతీయలో కూలీలకు పని కల్పించాలి. రాష్ట్ర వ్యాప్తంగా మంచి నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. భద్రాచలంలో అన్ని కాలనీలకు ట్యాంకర్లద్వారా నీరు అందించాలి. రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాలకుకూడా ట్యాంకర్ల ద్వారా నీళ్లు అందించారు. కరువు నివారణా చర్యల్లో ప్రభుత్వం విఫలమయ్యింది. రాష్ట్రంలో కరువు మండలాలుగా ప్రకటించాలి.' అని సున్నం రాజయ్య తెలిపారు.

ఏపీ సీఎం నా తొడపై కొట్టి క్షమాపణ చెప్పారు : మంత్రి పోచారం

హైదరాబాద్ : టీ.అసెంబ్లీలో నిజాం షుగర్స్ పై చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా మంత్రి పోచారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజాం షుగర్స్ ను ప్రయివేటీకరించవద్దని గతంలో చంద్రబాబు సీఎంగా వున్నప్పుడు చేతులు జోడించి వేడుకున్నాని ఈ సందర్భంగా చంద్రబాబు అసహనంతో నా తొడపై కొట్టారని ఆ తరువాత నాకు క్షమాపణ కూడా చెప్పారని పోచారం అన్నారు. ఈ వ్యాఖ్యలతో అసెంబ్లీలో తీవ్ర దుమారం చెలరేగింది.

13:04 - March 30, 2016

మహిళపై దాడి 20 తులాల బంగారం చోరీ......

కరీంనగర్ : బొమ్మకల్ బైపాస్ రోడ్డులో దోపిడీ దొంగలు హల్ చల్ చేశారు. ఓ మహిళపై దాడి చేసి 20 తులాల బంగారం అపహరించుకుపోయారు. పీఎస్ లో సదరు మహిళ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఆంధ్రా పారిస్ లో బాలయ్య గుర్రపు స్వారీ....

హైదరాబాద్ : తెలుగు ప్రజలు జరుపుకునే పండుగలలో ముఖ్యమైనది 'ఉగాది' దీన్నే మనం యుగాది అనికూడా అంటాం. ఈ సందర్భంగా ఆంధ్రా పారిస్ గా పేరుగాంచిన తెనాలిలో హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య ఎడ్ల పందాలను బాలయ్య ప్రారంభించారు. కాగడాతో జ్యోతిని వెలిగించి బాలయ్య ఎడ్ల పందాలను ప్రారంభించారు. అనంతరం గుర్రపు స్వారీ చేసి అభిమానులను అలరించారు. బాలయ్య గుర్రంపై స్వారీ చేస్తుండగా, ఆయన అభిమానులు గుర్రం వెంట పరుగులు పెడుతూ కేరింతలు కొట్టారు. 

గాన కోకిలకు గిన్నిస్ అవార్ట్....

హైదరాబాద్‌ : తెలుగువారు గౌరవంతో.. 'గాన కోకిల'లగా పిలుచుకునే గాయని సుశీల 'గిన్నిస్ రికార్డు' సాధించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆమెకు అభినందనలు తెలిపారు. సుశీల గిన్నిస్‌ రికార్డు నమోదు చేయడం తెలుగువారందరికీ గర్వకారణమని, ఆరు భాషల్లో 17వేలకు పైగా పాటలు పాడటం సుశీలకే సాధ్యమైందని చంద్రబాబు అన్నారు.

12:24 - March 30, 2016

రంగారెడ్డి : జిల్లా పరిగిలో ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న డీసీఎం బోల్తా పడింది. డీసీఎం మలుపు తిరిగే సమయంలో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో ప్రాణాలు వదిలారు. ఈ ఘటనలో మరో 25మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆసుపత్రి ఆవరణ రోదనలో నిండిపోయింది. ఈ వీడియోని చూస్తే గుండె తరుక్కుపోతోంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.. 

పండ్ల గోదాములపై పోలీసుల సోదాలు...

హైదరాబాద్ : పాతబస్తీలోని అరటిపండ్ల గోదాములలో పోలీసులు సోదాలు చేపట్టారు. వ్యాపారులు రసాయనాలతో కాయలను మగ్గబెడుతున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు బహదూర్ పురా, కాలాపత్తార్, చాంద్రాయణగుట్ట, ఫలక్ నుమా గోదాములలో పోలీసులు సోదాలు చేస్తున్నారు. 

12:14 - March 30, 2016

హైదరాబాద్ : చంద్రబాబు స్వంత నియోజక వర్గం అయిన కుప్పం నియోజక వర్గంలో ఏ ఒక్క స్కూల్లో కూడా బాత్ రూంలు లేవని వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ తెలిపారు. తనకు మంత్రి విసిరిన సవాల్ స్వీకరించి.. అక్కడ సర్వే నిర్వహించగా విస్తుపోయే విషయాలు తెలిశాయని ఎమ్మెల్యే వెల్లడించారు. కుప్పం స్కూల్స్ లో కనీసం వాటర్ లేదని, అక్కడ రోడ్లు కూడా దయనీయ పరిస్థితుల్లో ఉన్నాయని ఫైరయ్యారు. ఏడు సార్లు శాసన సభ్యుడిగా గెలిపించుకున్న కుప్పం ప్రజలను ముందుగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత చంద్రబాబుకు ఉందని అనిల్ కుమార్ గుర్తు చేశారు. 
అవును నిజమే : గంటా...
ఎమ్మెల్యే అనిల్  చెప్పిన విషయాలు నిజమేనని మంత్రి గంటా శ్రీనివాస రావు తెలిపారు. గత ప్రభుత్వాలు కావాలని కుప్పం స్కూళ్లను పట్టించుకోలేదని మంత్రి ఆరోపించారు. ఇప్పుడు ప్రతి స్కూళ్లో టాయిలెట్లు నిర్మిస్తామని తెలిపారు. అలాగే వాటర్ ప్రాబ్లమ్ ని కూడా సాల్వ్ చేస్తామని మంత్రి గంటా హామీ ఇచ్చారు. 

మున్సిపల్ కార్మికుల భారీ ర్యాలీ....

విజయవాడ : మున్సిపల్ కార్మికులు భారీ ర్యాలీ చేపట్టారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి ర్యాలీ కొనసాగుతుంది. కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ర్యాలీ చేపట్టారు. ఏఐటీయూసీ, సీఐటీయూ, పలు కార్మిక సంఘాలు ర్యాలీ పాల్గొన్నాయి.

12:02 - March 30, 2016

హైదరాబాద్ : ఇసుక విధానంలో 2000 కోట్ల కుంభకోణం జరిగిందని స్వయాన మంత్రి యనమల రామకృష్ణుడు సభలో చెప్పాడని జగన్ తెలిపాడు. 'ఇంత పెద్ద కుంబకోణం జరిగితే ఎవరిని పట్టుకున్నారు? వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?. ఈ స్కాంలో ప్రధాన నిందితులుగా ఉన్న వారికి నేరుగా లోకేష్, చంద్రబాబుతో సంబంధాలున్నాయని' జగన్ ఆరోపించారు.
కూకటివేళ్లతో..
అవినీతిని కంటిచూపుతో నరికేసి, కూకటివేళ్లతో పెకిలేసేవ్యక్తి చంద్రబాబు నాయుడు అని పీతల సుజాత అన్నారు. విజిలెన్స్ 5565 కేసులు ఇల్లీగల్ సాండ్ మైనింగ్ చేసినవారిపై కేసులు పెట్టాము. ఉచితి ఇసుక విధానాన్ని తీసుకొచ్చారు. అధికార పక్షం వారు అవినీతికి పాల్పడినా పీడీ యాక్టు బుక్ చేస్తామని తెలిపారు. ప్రజలందరికీ ఉచితి ఇసుకు అందేట్లు చూస్తాం. 

ఉచిత ఇసుక ప్రజల హక్కు : సీఎం చంద్రబాబు

హైదరాబాద్ : ఉచిత ఇసుక విధానంపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడారు. ఉచిత ఇసుక ప్రజల హక్కు అని పేర్కొన్నారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తే వాహనాన్ని సీజ్ చేసి యజమానితో సహా డ్రైవర్ పై పీడీ యాక్ట్  కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఉచిత ఇసుక విధానం దేశంలో ఎక్కడా లేదని పేర్కొన్నారు. ఈ విధానాన్ని శాశ్వతంగా కొనసాగిస్తామని ప్రకటించారు. ఉచిత ఇసుకను భవన నిర్మాణాలకు మాత్రమే వాడాలని సూచించారు. ఇసుక రాష్ట్ర సరిహద్దులు దాడి వెళ్లకుండా నిఘా పెట్టామన్నారు. 491 ఇసుక రీచ్ లకు పర్యావరణ అనుమతులున్నాయని తెలిపారు.

11:51 - March 30, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో ఇసుక వ్యాపారం చేస్తే పీడీ యాక్ట్ బుక్ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. బుధవారం ఉచిత ఇసుక విధానంపై చర్చిస్తున్న సందర్భంగా బాబు మాట్లాడారు. 'అక్రమాలు చేస్తే ఎంతవారైనా వదిలిపెట్టే సమస్యే లేదు. ఇసుక బార్డర్స్ క్రాస్ కాకుండా చర్యలు తీసుకోమని ఆదేశాలిచ్చాము. ఇసుక తరలించే డ్రైవర్ నే కాదు ఓనర్ ను కూడా బుక్ చేస్తాము. తప్పు జరిగితే వదిలిపెట్టే సమస్యే లేదు. ఎవ్వరైనా సరే ఇసుకను అడ్డంపెట్టుకుని డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాము. ఒక్క పైసా అవినీతి జరిగినా వదిలపెట్టము. మీ పొలం లో ఉన్నా అమ్ముకోవడానికి వీలులేదు. ఉచిత ఇసుక ప్రజల హక్కు.' అని చంద్రబాబు తెలిపారు. 

11:44 - March 30, 2016

హైదరాబాద్ : హేయ్ వాట్సాప్ యూజర్స్ మీకో హ్యాపీ న్యూస్.. వాట్సాప్ లో మీకో కొత్త ఫీచర్ వచ్చేసింది. మీరు బిజీగా ఉన్న సమయంలో మీకు వాట్సాప్ లో మెసేజీ వచ్చిందా? మీకు అప్పుడు ఓపెన్ చేసి రిప్లై ఇచ్చే టైం లేదా? అయితే నో ప్రాబ్లం.. నోటిఫికేషన్ వద్దనే రిప్లై ఇచ్చే ఆప్షన్ వాట్సాప్ లో వచ్చింది. 
ప్రస్తుతం ఒక నోటిఫికేషన్ వస్తే దానిని ఓపెన్ చేసి రిప్లే చేయాల్సి ఉంటుంది. కానీ తాజా ఫీచర్ తో నోటిఫికేషన్ నుండి రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుంది. దీంతో మళ్లీ వాట్సాప్ ను ఓపెన్ చేయాల్సిన సమయాన్ని సేవ్ చేయవచ్చు. అయితే ఈ ఫీచర్ 2.12.560 వెర్సన్ లో మాత్రమే ఉంటుంది. 
ఈ వర్షన్ మీకూ కావాలంటే గూగుల్ ప్లే స్టోర్ లో వాట్సాప్ బీటా టెస్టింగ్ కు సైన్ అప్ అవ్వాలి. వాట్సాప్ లేదా రెగ్యూలర్ ప్లేస్టోర్ లో మీరు అప్ డేట్ చేసుకుంటే ఇది పని చేయదు కాబట్టి జాగ్రత్త పడగలరు. 

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు తొలిసారి అసెంబ్లీకి....

హైదరాబాద్ : పార్టీ  మారిన తరువాత  వైసీపీ ఎమ్మెల్యే మొదటిసారి నేడు అసెంబ్లీకి హాజరయ్యారు. భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ, మణిగాంధీ, ఆదినారాయణ రెడ్డి, డేవిడ్ రాజు, జయరాములు అసెంబ్లీకి హాజరయ్యారు.  వైసీపీ నుండి టీడీపీలో మారిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా  వైసీపీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలో  మరింతమంది వైసీపీ నుండి వైదొలగే అవకాశమున్నట్లు సమాచారం.

డీసీఎం బోల్తా 5 మృతి,6 గురి పరిస్థితి విషమం....

రంగారెడ్డి : పరిగిలో పెళ్లి బృందంతో వెళ్తున్న డీసీఎం బోల్తా పడింది. ఈ ఘటనలో 5 మృతి చెందారు. 20 మందికి గాయాలయ్యాయి. 6 గురి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

ఏపీ అసెంబ్లీలో కాగ్ పేర్కొన్న అంశాలు...

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ సభలో ప్రభుత్వం కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. తన నివేదకలో కాగ్ పేర్కొన్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. ఏపీ 2014-15లో రెవెన్యూ లోటు రూ.24,194 కోట్లు, ద్రవ్యలోటు రూ.31,717 కోట్లు, ఎఫ్ఆర్ బిఎమ్ సూచించిన 3 శాతం పరిమితికి రెట్టింపు లోటుగా కాగ్ పేర్కొంది. 2014-15లో మొత్తం 6.10 శాతం లోటు నమోదయిందని కాగ్ తెలిపింది. 2014-15లో రూ. 13.134,68 కోట్లు అదనపు వ్యయం కాగా రూ.13.40 కోట్లు అదనంగా కాంట్రాక్టర్ల కు చెల్లించారని కాగ్ తన నివేదికలో పేర్కొంది.

దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్ ....

విజయవాడ : విజయవాడ ఇంద్రకీలాద్రి కొలువై వున్న కనకదుర్గమ్మను గవర్నర్ నరసింహన్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు గవర్నర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

తెలంగాణలో 443 కరవు మండలాలు : జీవన్ రెడ్డి

హైదరాబాద్ : టీ.అసెంబ్లీలో సమావేశంలో కరవు మండలాలపై చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో 443 కరవు మండలాలుండగా ప్రభుత్వం 231 మండలాలను మాత్రమే గుర్తించిందని సభ దృష్టికి తీసుకువచ్చారు.  ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. సరైన సమయంలో గుర్తిస్తే కేంద్రం నుండి సహాయం పొందే అవకాశముండేదన్నారు. కరీంనగర్ , నల్లగొండ జిల్లాల్లో 50 శాతం మేరకు పంటలు దెబ్బతిన్నాయని ప్రభత్వమే ప్రకటించిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రత్తిరైతుకు నెలకు రూ.5వేలు కరువు భత్యంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కాలువలో పడిన స్కూలు బస్సు, 20 మంది విద్యార్ధులకు గాయాలు...

గుంటూరు : చెరుకుపల్లి మండలం కామినేనివారి పాలెం వద్ద ఓ ప్రయివేటు స్కూలు బస్సు పంటకాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోకి ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

10:35 - March 30, 2016

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూసి ఆంధ్రప్రదేశ్ మంత్రులు చాలా నేర్చుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమర్శించారు. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద చెవిరెడ్డి మంత్రులపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. 'ఎమ్మెల్యేల గ్రాంట్లు మింగేసి టీడీపీ మంత్రులు ఏం సాదిస్తారు?. మూడు బడ్జెట్లలో నియోజకవర్గాలకు నయా పైసా కేటాయించలేదు. తెలంగాణ ప్రభుత్వం నియోజకవర్గాలకు గ్రాంట్లు పెంచితే మేం ఇవ్వం అని మంత్రి యనమల సభలో అనడం సిగ్గు చేటు. ఎమ్మెల్యేల ప్రొటోకాల్ ను గౌరవించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశిస్తుంటే.. ఇక్కడ ప్రభుత్వం, మంత్రులు ఎమ్మెల్యేలను అనగద్రొక్కాలని చూస్తున్నారు' అని చెవిరెడ్డి ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యాడు. 

ఏపీ అసెంబ్లీలో కాగ్ నివేదిక...

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ సభలో ప్రభుత్వం కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. ప్రభుత్వ రంగ సంస్థలు, ఆర్థిక స్థితిగతులు, స్థానిక సంస్థలు, రాష్ట్ర విభజన ఆర్థిక ఖాతాలపై కాగ్ నివేదికలో వున్నట్లు సమాచారం.

10:19 - March 30, 2016

కోల్ కతా : పశ్చిమబెంగాల్  ఎన్నికల్లో తొలి విడత సమరం తుది దశకు చేరుకుంది. వచ్చే సోమవారమే పోలింగ్ ఉండడంతో జంగల్ మహల్ లో అన్ని పార్టీలు మొహరించాయి. పోలింగ్ నాడు మూడు ప్రత్యేక హెలికాప్టర్లతో ఏరియల్ సర్వే చేసేందుకు ఎలక్షన్ కమిషన్ సమాయత్తమవుతోంది. 
ఆరువిడతలు..
పశ్చిమబెంగాల్ లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ సరిగ్గా ఇదే సంఖ్యలో అసెంబ్లీ స్థానాలుండేవి. ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడూ ఆరేడు విడతల ఎన్నికలు  పెట్టలేదు.  కానీ, పశ్చిమ బెంగాల్ లో ఆరు విడతలుగా ఎన్నికలు జరగబోతున్నాయి. ఏప్రిల్ 4న అంటే వచ్చే సోమవారంనాడు తొలి విడత పోలింగ్ జరిగితే, మే 5న ఆఖరి విడత పోలింగ్  వుంది.  తొలి విడతకి, ఆఖరి విడతకీ మధ్య నెల రోజుల వ్యవధి వుంది. ఇంత సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ అక్కడ నెలకొన్న పరిస్థితికి నిదర్శనం. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతుండడం విశేషం. 
మావోయిస్టుల జంగల్ మహల్..
మావోయిస్టులకు గట్టి స్థావరమనే పేరున్న జంగల్ మహల్ లో తొలి విడత ఎన్నికలు  జరగబోతున్నాయి. ఏప్రిల్ 4, 11  ఈ రెండు తేదీలలో  తొలి విడత ఎన్నికలున్నాయి. మొదటి రోజు కేవలం 18 అసెంబ్లీ స్థానాల్లోనూ, రెండో రోజు 31 స్థానాల్లోనూ   పోలింగ్ పెడుతున్నారు. జంగల్ మహల్ గా ప్రసిద్ధి చెందిన పురిలియా, పశ్చిమ మిడ్నాపూర్, బంకుర జిల్లాల్లో తొలి విడత ఎన్నికల సమరం  హోరెత్తుతోంది. 
ఓటరు చైతన్య స్థాయి..
పశ్చిమబెంగాల్ లో ఓటరు చైతన్య స్థాయి ఎక్కువ. భారీ స్థాయి ఓటింగ్ ఈ రాష్ట్రం ప్రత్యేకత. 80 నుంచి 84 శాతం ఓట్లు పోలవుతుంటాయి. 34 ఏళ్ల పాటు కమ్యూనిస్టులను ఆదరించిన పశ్చిమబెంగాల్ 2011లో మమతాబెనర్జీకి  చాన్స్ ఇచ్చింది.  ఆ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళా ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి. ఆ తర్వాత 2014 లోక్ సభ ఎన్నికల్లోనూ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మమతాబెనర్జీ అదే ఊపు కొనసాగించారు. అయితే ఈ ఎన్నికల్లో వామపక్షాల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. 2011తో పోల్చుకుంటే తమ పరిస్థితి చాలా మెరుగైందన్న విశ్వాసం వామపక్ష నేతల్లో వ్యక్తమవుతుంటే, మళ్లీ అధికారం తమదేనన్న ధీమాతో త్రుణమూల్ కాంగ్రెస్ వుంది.  అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న పట్టుదలతో బీజేపీ కదనోత్సాహం  ప్రదర్శిస్తుంటే, తన బలాన్ని పెంచుకునేందుకు కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. 
ఓటర్ల వివరాలు..
పశ్చిమబెంగాల్ లో 6 కోట్ల 55 లక్షల 46 వేల మంది ఓటర్లున్నారు.  వీరిలో 3 కోట్ల 39 లక్షల మంది పురుష ఓటర్లుండగా, 3 కోట్ల 16 లక్షల మంది మహిళా ఓటర్లున్నారు. 2011తో పోల్చుకుంటే కొత్త ఓటర్ల సంఖ్య 94 లక్షలకు పైగా పెరిగింది.  గెలుపు ఓటమిలను ప్రభావితం చేయడంలో ఈ కొత్త తరం ఓటర్లు కీలకంగా మారే అవకాశం వుంది. కొత్త ఓటర్లను ఎక్కువగా ఆకర్షించగలిగిన పార్టీకి విజయతీరాలను చేరుకోగలిగే అవకాశాలు పుష్కలంగా వుంటాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.  
పోలింగ్ కేంద్రాలు పెంపు..
పశ్చిమబెంగాల్ లో ఓటర్ల సంఖ్య మాత్రమే కాదు ఈసారి పోలింగ్ కేంద్రాల సంఖ్య కూడా భారీగానే పెరిగింది. 2011 ఎన్నికల్లో  సుమారు 52 వేల  పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎన్నికల కమిషన్ ఈసారి 77 వేల పైగా  పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. పోలింగ్ కేంద్రాలు 48శాతం పెరిగాయి. ఓటింగ్ శాతాన్ని మరింత పెంచేందుకు, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ఈసీ ప్రయత్నిస్తోంది. దాదాపు 12వేల పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన ఈసీ, అందుకు తగ్గస్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది. 
ఫ్లయింగ్ స్క్వాడ్స్..
908 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ను, 624 స్టాటిక్ స్క్వాడ్స్ ను  నియమించిన ఈసీ ఆరోపణలున్న అధికారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. పశ్చిమబెంగాల్ ఇప్పటికే 40 మంది  ఎన్నికల అధికారులను, పోలీస్  అధికారులను  బదిలీ చేయడం అధికార పార్టీకి ఏమాత్రం మింగుడుపడని పరిణామం.  అధికారుల బదిలీల విషయంలో ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తన అసంత్రుప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు.  
హోరా హోరీ..
హోరాహోరీ పోరు జరుగుతున్న పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో ధన ప్రవాహం కూడా ఎక్కువగానే వున్నట్టు కనిపిస్తోంది. కేవలం 15 రోజుల్లోనే దాదాపు కోటి రూపాయల నగదును ఎన్నికల అధికారులు సీజ్ చేశారు. నాలుగు లక్షల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. భారీ మొత్తంలో డబ్బు, మద్యం పట్టుబడడం అక్కడ నెలకొన్న పోటీ తీవ్రతను సూచిస్తున్నాయి. 
అవినీతి రాజ్యం..
ఈ అయిదేళ్ల కాలంలో తాను చేసిన అభివృద్ధి మరోసారి గెలిపిస్తుందన్న నమ్మకంతో మమతా బెనర్జీ వున్నారు. రోడ్లు వేయడం, మావోయిస్టులను అణచివేయడం, జంగల్ మహల్ లాంటి ప్రాంతాల్లో రేషన్ సరఫరా మెరుగుపర్చడం మొదలైన అంశాలను ఆమె ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. అయితే, మమతా బెనర్జీ పాలనలో అవినీతి రాజ్యమేలిందనీ, ప్రజాస్వామిక హక్కులకు విఘాగం కలిగిందనీ, మహిళల మీద నేరాలు పెరిగాయంటూ వామపక్షాలు విమర్శిస్తున్నాయి. శారదా కుంభకోణం, నారదా స్టింగ్ ఆపరేషన్ లో టీఎంసీ ముఖ్యనేతలు పట్టుబడడం మమతాబెనర్జీ ప్రతిష్టను ఎంత వరకు దెబ్బతీశాయన్నది  ఎన్నికల ఫలితాల తర్వాత కాని తేలదు. 

ఏపీ అసెంబ్లీ సమావేశాల 10 నిమిషాలు వాయిదా....

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ చివరిరోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు. అనంతరం  సమావేశాన్ని 10 నిమిషాలు వాయిదా వేశారు.

పిచ్చి కుక్క దాడిలో ఏడుగురు విద్యార్థులకు గాయాలు....

మహబూబ్ నగర్ : నాగర్ కర్నూల్ లో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. ఏడుగురు విద్యార్ధులు, పంచాయితీ కార్మికులపై పిచ్చి కుక్క దాడి చేసింది. గాయాలపాలయిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స నందిస్తున్నారు. 

09:54 - March 30, 2016

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. నేటి నుంచి ఐదు రోజులు పాటు బెల్జియం, అమెరియా, సౌదీఅరేబియా దేశాల్లో పర్యటిస్తారు. ఇవాళ బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో జరిగే 13వ భారత్‌-ఐరోపా సదస్సులో పాల్గొంటారు.  2012 తర్వాత మొదటిసారిగా ఈ సదస్సు జరుగుతోంది. మనదేశంలో బెల్జియం పెట్టుబడులపై ఆ దేశ ప్రధానితో చర్చలు జరుపుతారు. భారత్‌లో ఐరోపా యూనియన్‌ దేశాల పెట్టుబడుల్లో బెల్జియం రెండోస్థానంలో ఉంది. గురు, శుక్రవారాల్లో మోదీ అమెరికాలో పర్యటిస్తారు. అమెరికాలో జరిగే అణు భద్రతా సదస్సులో పాల్గొంటారు.  వచ్చేనెల 2,3 తేదీల్లో సౌదీ అరేబియలో పర్యటిస్తారు. రియాద్‌లో సౌదీ పాకులతో భేటీ అవుతారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. 

09:52 - March 30, 2016

అదిలాబాద్: సర్కార్‌ బడుల్లో ఉపాధ్యాయులు సరిగ్గా విధులు నిర్వర్తించడం లేదని ఒకపక్క తెలంగాణ ప్రభుత్వం శాసనసభల్లో మొత్తుకుంటోంది. అవును.. ప్రభుత్వం చెప్పేది నిజమేనంటూ ఆదిలాబాద్‌ జిల్లా గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయులు తమ పనితీరుతో నిరూపిస్తున్నారు. జిల్లాలో కొన్ని పాఠశాలలకు ఉపాధ్యాయులు లేరు. ఉన్నవాటిల్లో సార్లు ఎప్పుడు వస్తారో వారికే తెలియదు. మరీ అధ్వాన్నంగా తయారైన ఆ పాఠశాలల్లో విద్యార్థుల భవిష్యత్‌ గాలిలో దీపంలా మారింది. ఇందుకు ప్రభుత్వమే ప్రధాన కారణం కావడం అసలు ట్విస్ట్.
అధ్వాన్నం..
ఈ స్కూల్లో పిల్లలు మాత్రమే టైంకు వస్తారు. సార్‌ ఎప్పటికో వస్తారు. అధ్వాన్నంగా ఉన్న ఇలాంటి పాఠశాలలు ఆదిలాబాద్‌ జిల్లాలో లెక్కలేనన్ని ఉన్నాయి.
అభివృద్ధిలో అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ తీరిది. చాలా పాఠశాలల్లో విద్య అస్తవ్యస్తంగా మారింది. ఉపాధ్యాయుల పనితీరును పరిశీలించే ఎంఇవోలు లేరు. చాలా మండలాల్లో ఇన్‌చార్జ్‌లతోనే నెట్టుకొస్తున్నారు. జిల్లాలోని 52 మండలాలకు గాను, నలుగురే పూర్తి స్థాయి మండల విద్యాధికారులు ఉన్నారు. చాలా మండలాల్లో ప్రధానోపాధ్యాయులే ఇన్‌చార్జ్‌ ఎంఇవోలుగా పనిచేస్తున్నారు. జిల్లా విద్యాధికారి పోస్టు, ఆదిలాబాద్‌, మంచిర్యాల, ఉప విద్యాధికారుల పోస్టులు, రాజీవ్‌ విద్యామిషన్‌ టివో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీన్నిబట్టే విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం ఎంతగా ఉందో అర్థమవుతుంది. ప్రధాన అధికారులు లేకపోవడంతో జిల్లా విద్యా వ్యవస్థ దారి తప్పింది. ఉపాధ్యాయుల పనితీరును పర్యవేక్షించాల్సిన అధికారులు లేకపోవడంతో టీచర్లు విధులకు డుమ్మా కొడుతున్నారు. ఫలితంగా విద్యార్థుల చదువులు ముందుకు సాగడం లేదు.
ఇష్టానుసారంగా బిల్లులు..
ఇక మధ్యాహ్న భోజనం అమలు తీరూ ఘోరంగానే ఉంది. బిల్లుల జారీల్లో భారీగా అవకతవకలు జరుగుతున్నాయి. స్కూల్‌కు ఎంతమంది విద్యార్థులు హాజరవుతున్నారు.? విద్యార్థుల సంఖ్య ఎంత అనే విషయంలో క్లారిటీ లేకపోవడంతో మధ్యాహ్న భోజన నిర్వాహకులు తమకు తోచిన రీతిలో బిల్లులు వసూలు చేయించుకుంటున్నారు. ఇలా ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా చాలాచోట్ల స్కూళ్లు మూతబడుతున్నాయి.  వేలకువేలు ఫీజులు పోసి తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చదివించలేని తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలనే నమ్ముకుంటున్నారు. ఇదే సమయంలో సర్కార్ బడుల పనితీరు ఘోరంగా ఉండడంతో వారు తమ పిల్లల చదువులపట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

కర్నూలో విషాదం..

కర్నూలు : జిల్లాలోని సి.బెళగల్ మండలం ఇనగండ్లలో విషాదం చోటు చేసుకుంది. ఇసుక ట్రాక్టర్ పై నుంచి పడి పదో తరగతి చదివే విద్యార్థి సోమేష్ మృతి చెందాడు. పరీక్ష రాసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

ఔటర్ రింగ్ రోడ్డుపై యాక్సిడెంట్..

రంగారెడ్డి : శంషాబాద్ మండలం తొండుపల్లి వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బోల్తా పడిన ఘటనలో డ్రైవర్  అక్కడికక్కడే మృతి చెందాడు. 

నేటి ఏపీ అసెంబ్లీ ప్రారంభం..

హైదరాబాద్: నేటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ కోడెల శివ ప్రసాద్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. 

విప్ జారీ చేసిన వైసీపీ

హైదరాబాద్ : పార్టీ మారిన ఎమ్మెల్యేలకు వైసీపీ విప్ జారీచేసింది. ద్రవ్య వినిమయ బిల్లుపై నేడు సభలో చర్చించనున్నారు. కాగా నేడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల ముగియనున్నాయి.

నేడు టెట్ దరఖాస్తు ఫీజు చివరి తేదీ..

హైదరాబాద్ : తెలంగాణ టెట్ కు దరఖాస్తు ఫీజు చెల్లించడానికి నేడే చివరి తేదీ. ఈ సందర్భంగా టెట్ కన్వీనర్ జగన్నాథరెడ్డి అభ్యర్థులకు మరోసారి ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా ఫీజు చెల్లించిన వారు 31లోపు దరఖాస్తులను సమర్పించాలని ఆయన తెలిపారు. 

08:47 - March 30, 2016

హైదరాబాద్: నాంపల్లి రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. లోకోషెడ్‌లో ఉన్న రైలు ఓ బోగీలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. ఇప్పటికే ఆ బోగిలోని ఫర్నీచర్, సీటింగ్ 70శాతం దగ్దమయ్యింది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఫుట్ పాత్ పైన నివసించే వ్యక్తులెవరైనా 'బీడీ'తాగి వేస్తే ఈ ప్రమాదం జరిగి ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

08:33 - March 30, 2016

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై  యంగ్ లీడర్ కేటీఆర్ కామెంట్ ఎందుకు చేశారబ్బా అని ఆలోచిస్తున్నారా? అయితే ఇది చదవండి. బాహుబలికి విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో నేషనల్ అవార్డు వచ్చింది. ఈ సందర్భంగా 'బాహుబలి' టీంకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడతూ.. ప్రభాస్ ది మామూలు ఫాలోయింగ్ కాదని.. ఇది ట్విట్టర్ లో కూడా కొనసాగాలని.. 'రానా.. ప్రభాస్ ను కూడా ట్విట్టర్ లోకి తీసుకురా' అంటూ కేటీఆర్ జోక్ పేల్చాడు.
కాగా సోషల్ మీడియాకు దూరంగా ఉండే ప్రభాస్.. ఈమధ్య అఫీషియల్ ఫేస్ బుక్ పేజీ ఓపెన్ చేశాడు. మరోవైపు యంగ్ హీరోలు, హీరోయిన్లు సోషల్ మీడియాలో హల్ చేస్తుంటే మరి ప్రభాస్ కేటీఆర్ సూచనను యంగ్ టైగర్ సీరియస్ గా తీసుకుంటాడేమో చూడాలి. 

టి.అసెంబ్లీలో 2014-15 కాగ్ నివేధిక..

హైదరాబాద్ : నేటి తెలంగాణ అసెంబ్లీలో 2014-15 కాగ్ నివేధిక ప్రవేశపెట్టనున్నారు. ప్రతి బడ్జెట్ సమావేశాల్లో కాగ్ రిపోర్టు ప్రవేశపెట్టడం జరుగుతుంది. 

నాంపల్లి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం..

హైదరాబాద్: నాంపల్లి రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆగిఉన్న రైలు బోగీలో మంటలు ఎగిసిపడ్డాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. 

నేటితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. కాగా నేడు ఏపీ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించనున్నారు.

07:30 - March 30, 2016

తెలంగాణ గవర్నమెంట్ చేనేతకు బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు చేయలేదని.. ఇంక అభివృద్ధి ఎలా చేస్తారని తెలంగాణ చేనేత అఖిలపక్ష ఐఖ్య వేధిక కన్వీనర్ రమేష్ తెలిపారు. తెలంగాణలో చేనేత కార్మికుల సమస్యలు మరోసారి ఎజెండా మీదకు వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో చేనేత రంగానికి తీవ్ర అన్యాయం జరిగిందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. చేనేత కార్మికుల సమస్యలపై పోరాడేందుకు తెలంగాణ చేనేత అఖిలపక్ష ఐక్య వేదిక ఏర్పాటయ్యింది. ఈ వేదిక కన్వీనర్ కూరపాటి రమేష్ నేటి జనపథంలో లైవ్ షో పాల్గొన్నారు.  తెలంగాణ చేనేత అఖిలపక్ష ఐక్య వేదిక ఏర్పాటు కు కారణాలేమిటి? ఈ వేదిక లక్ష్యాలేమిటి? ఇవాళ ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేపట్టడానికి కారణాలేమిటి? తెలంగాణలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? సవాళ్లేమిటి?  ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ చేనేత రంగానికి ఇచ్చిన హామీలేమిటి? వాటి అమలు ఎలా వుంది? పవర్ లూమ్ మగ్గాలకీ, చేనేత మగ్గాలకీ వున్న తేడాలేమిటి? పవర్ లూమ్ మగ్గాల పోటీని చేనేత రంగం ఎంతవరకు తట్టుకోగలదు?  చేనేత రంగాన్ని రక్షించుకోవాలంటే తక్షణం తీసుకోవాల్సిన చర్యలేమిటి? ఇలాంటి అంశాలపై జనపథంలో విశ్లేషించారు. ప్రేక్షకులు ఫోన్లు చేసి తమ అభిప్రాయాన్ని తెలిపారు. పూర్తి వివరాలను వీడియోలో చూడవచ్చు.

 

07:20 - March 30, 2016

హైదరాబాద్: ధూమ్ ధామ్ టీ-20 ప్రపంచకప్ తొలిసెమీఫైనల్స్ సమరానికి న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ఫైనల్లో చోటు కోసం మాజీ చాంపియన్ ఇంగ్లండ్, హాట్ ఫేవరెట్ న్యూజిలాండ్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇవాళ రాత్రి 7 గంటలకు ఈ పోటీ ప్రారంభమవుతుంది. చాంపియన్ ఇంగ్లండ్ కు న్యూజిలాండ్ నుంచి గట్టిపోటీ తప్పదు కాక తప్పదు.
అసలు పోటీ..
క్రికెట్టే ఊపిరిగా భావించే  భారత్ వేదికగా మొట్టమొదటిసారిగా జరుగుతున్న 2016 టీ-20 ప్రపంచకప్ లో అసలు పోటీ ఇప్పుడే ప్రారంభమయ్యింది. మొత్తం పదిజట్ల సూపర్ టెన్ గ్రూప్ లీగ్ పోటీలు విజయవంతంగా ముగియడంతో ఇప్పుడు నాలుగుజట్ల సెమీఫైనల్స్ నాకౌట్ వార్ కు రంగం సిద్ధమయ్యింది.
నాలుగు మ్యాచ్ లు నెగ్గి..
న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా బుధవారం రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే తొలిసెమీఫైనల్లో నాలుగోర్యాంకర్ న్యూజిలాండ్, 6వ ర్యాంకర్ ఇంగ్లండ్ అమీతుమీకి సిద్ధమయ్యాయి. టీమిండియా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి హేమాహేమీజట్లున్న గ్రూప్-2 టాపర్ గా న్యూజిలాండ్ టీమ్ సెమీస్ కు అర్హత సంపాదించింది. నాలుగుకు నాలుగురౌండ్లూ నెగ్గి ఎనిమిదిపాయింట్లతో నాకౌట్ రౌండ్ చేరిన ఒకే ఒక్కజట్టుగా న్యూజిలాండ్ నిలిచింది.
బలాలు.. బలహీనతలు..
కేన్ విలియమ్స్ సన్ నాయకత్వంలోని న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అంశాలలో సమానబలం కలిగిన జట్టుగా కనిపిస్తోంది. లెఫ్టామ్ స్పిన్నర్ సాంట్నర్, లెగ్ స్పిన్నర్ ఇష్ సోథీ, ఆఫ్ స్పిన్నర్ నేథన్ మెకల్లమ్ ల త్రయంతో కూడిన స్పిన్ బౌలింగ్ ఎటాక్ తో కివీస్ టీమ్ అత్యంత ప్రమాదకరమైన జట్టుగా కనిపిస్తోంది. న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియం పిచ్ తీరును బట్టి చూస్తే తొలిసెమీఫైనల్లో న్యూజిలాండ్ జట్టే హాట్ ఫేవరెట్ గా కనిపిస్తోంది.
మాజీ డిపెండింగ్..
మరోవైపు శ్రీలంక, సౌతాఫ్రికా, ఆప్ఘనిస్థాన్, వెస్టిండీస్ జట్లతో కూడిన గ్రూప్-1 జట్టు రన్నరప్ గా నిలిచిన ఇంగ్లండ్ జట్టు సూపర్ టెన్ నాలుగురౌండ్లలో మూడు గెలుపు, ఓ ఓటమి రికార్డుతో ఆరుపాయింట్లు సాధించి సెమీస్ కు అర్హత సంపాదించింది. 2009 ప్రపంచకప్ విజేతగా అనుభవం ఉన్న ఇంగ్లండ్ కు..న్యూజిలాండ్ ను సెమీస్ లోనే ఎదుర్కొనడం అతిపెద్ద సవాలే అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
బలాబలాలు..
ఓపెనర్లు రాయ్, హేల్స్, కెప్టెన్ మోర్గాన్, జో రూట్, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ జో బట్లర్ ల పైనే ఇంగ్లండ్ బ్యాటింగ్ ప్రధానంగా ఆధారపడి ఉంది. అయితే ఫిరోజ్ షా కోట్లా మందకొడి పిచ్ పై కివీ స్పిన్ త్రయాన్ని ఎంత సమర్థవంతంగా ఇంగ్లండ్ టాపార్డర్ ఎదుర్కొనగలదన్న అంశంపైనే జట్టు జయాపజయాల ఆధారపడి ఉన్నాయి. ఢిల్లీ స్లోపిచ్ కు అనుగుణంగా రాణించినజట్టుకే ఈమ్యాచ్ లో విజయావకాశాలు ఉంటాయి. 2009 ప్రపంచకప్ చాంపియన్ ఇంగ్లండ్ కు న్యూజిలాండ్ నుంచి గట్టిపోటీ తప్పదు కాక తప్పదు.

07:12 - March 30, 2016

న్యూఢిల్లీ : సహారా గ్రూపు సంస్థల ఆస్తుల అమ్మకానికి సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సహారా రియల్‌ ఎస్టేట్‌ ఆస్తులను విక్రయించేందుకు చర్యలు ప్రారంభించాలని కోర్టు సెబీని ఆదేశించింది. వేలాది మంది పెట్టుబడిదారుల డబ్బు తిరిగి ఇచ్చేందుకు సంస్థ ఆస్తులు అమ్మేయాలని పేర్కొంది. సహారా గ్రూప్‌ సంస్థల అధినేత సుబ్రతారాయ్‌ 2014 మార్చిలో అరెస్టయ్యారు. సహారా సంస్థకు చాలా ఆస్తులు ఉన్నాయి. మార్కెట్‌ ధరలో 90శాతానికి తక్కువ కాకుండా విక్రయించాలని కోర్టు సెబీకి సూచించింది. సహారా అధికారికంగా 86 ఆస్తుల జాబితాను అందజేసింది. వీటిని మార్కెట్‌ ధరలో 90శాతం కంటే తక్కువకు అమ్మాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని పేర్కొంది.

07:10 - March 30, 2016

హైదరాబాద్: తెలంగాణలో కరువు కోరలు చాచింది. ఎప్పుడూ లేనివిధంగా కరువుతో అల్లాడిపోతోంది. సాగు, తాగునీరులేక వందలాది గ్రామాల్లో ప్రజలు వలసబాటపడుతున్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఈ లెక్కలు ఆ లెక్కలు అంటూ కాలం గడిపేస్తోంది. 
చుక్క నీరు లేక..
గొంతు తడుపుకునేందుకు చుక్కనీరులేక బిందెడు నీళ్లకోసం కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి. మరోవైపు దాణాలేక పశువులను కబేలాలకు తరలిపోతున్నాయి. వ్యవసాయంమీదే ఆధారపడ్డ గ్రామాలు ఇప్పుడు వర్షాభావంతో ఖాళీ అయిపోతున్నాయి. గ్రామస్తులంతా పనులకోసం వలసబాటపట్టారు.
వర్షాభావం..
ఈ ఏడాది తెలంగాణలో సాధారణం కంటే తక్కువగా వర్షాలు కురిశాయి.. ప్రభుత్వ లెక్కలప్రకారం వర్షాభావంతో 443 మండలాలకుగాను 231 మండలాలు కరువు బారినపడ్డాయి.. వాస్తవానికి ఇంతకంటే ఎక్కువ మండలాల్లో కరువు తాండవిస్తోంది.. ప్రాజెక్టుల్లో నీటినిల్వలు అడుగంటాయి.. ఖరీఫ్‌లో నీరులేక 75శాతానికిపైగా పంటలు ఎండిపోయాయి. మహబూబ్‌నగర్‌, మెదక్, నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వర్షాలు లేక తాగునీటి సమస్య తీవ్రమైంది.
సాయం ఏదీ?
కరువుతో ఇలా అల్లాడిపోతున్న ప్రజలకు ప్రభుత్వంనుంచి ఆశించిన స్థాయిలో సాయం అందడంలేదు. కరవు నివేదికలు సిద్ధంచేసి కేంద్రంనుంచి నిధులు రాబట్టడంతో అధికారులు విఫలమవుతున్నారన్న ఆరోపణలొస్తున్నాయి. అసెంబ్లీలో ఈ సమస్యపై సీరియస్‌గా చర్చ జరగడంలేదని ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. 
యత్రాల వాడకాన్ని తగ్గింస్తే..
కరవుతో ఊళ్లో బతకలేక ఎంతోమంది రైతులు ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. పనుల్లో యంత్రాల వాడకాన్ని తగ్గిస్తే వీరందరికీ పని దొరుకుతుందని ప్రజాసంఘాలు ప్రభుత్వానికి సూచిస్తున్నాయి.. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈసారి రాష్ట్రమంతటా కరువు నెలకొందని ప్రజాసంఘాలు చెబుతున్నాయి. తెలంగాణాను కరువు రాష్ట్రంగా ప్రకటించి ఆదుకోవాలని సర్కారును కోరుతున్నాయి.. 

07:04 - March 30, 2016

నెల్లూరు : నమ్మేవాడుంటే చాలు నిరుద్యోగులను నిలువునా మోసంచేసే మహా మాయగాళ్లు రోజుకొకరు పుట్టుకొస్తారు. మొన్న విశాఖ, నిన్న విజయవాడ, నేడు నెల్లూరులో ఇదే తరహాలో యువతకు కుచ్చుటోపి పెట్టడానికి ప్రయత్నించాడు ఓ ప్రబుద్ధుడు. అమాయకులను టార్గెట్ చేసుకుని వెంకీ సినిమా చూపించాడు. ఒక్కో పోస్టుకు ఒక్కో వెల చెప్పి డబ్బు స్వాహా చేయడానికి స్కెచ్‌గీసి అడ్డంగా దొరికిపోయాడు.
అధికారులంతా తెలుసంటూ..
తీరా తన తప్పుడు వ్యవహారం బయటపడేసరికి నేను ఏ తప్పూ చేయలేదంటూ బుకాయిస్తున్నాడు.. సెక్రటేరియట్‌లో అధికారులంతా తనకు తెలుసునని కబుర్లు చెబుతున్నాడు. ఈయన పేరు గౌరీశంకర్. తాను అడ్వకేట్‌నంటూ, సెక్రటేరియట్ లో తనేది చెబితే అది జరుగుతుందంటూ నిరుద్యోగులకు కబుర్లు చెప్పాడు. సీఎస్‌ల నుంచి పీఎస్‌ల వరకు ఎంపికలో తన మాటే తీసుకుంటారని నిరుద్యోగులపై వల విసిరాడు. ఏపీ సెక్రటేరియట్ గుంటూరుకు తరలివస్తుందని,అందులో అటెండర్లు మిగిలిన స్టాఫ్ అవసరమవుతారని తెలిపాడు. ఐదు లక్షల రూపాయలిస్తే ఉద్యోగం ఖాయమంటూ నమ్మబలికాడు. స్థానికంగా ఉన్న సుధాకర్ రెడ్డి ద్వారా నిరుద్యోగులతో పరిచయాలు పెంచుకుని నెల్లూరులోని ఓ ప్రైవేట్ లాడ్జిలో మకాం వేశాడు.
అడ్వాన్సుగా లక్ష.. ఆ తర్వాత..
అటెండర్ ఉద్యోగానికి అడ్వాన్సుగా లక్షరూపాయలు, ఉద్యోగ నియామక పత్రం చేతికి అందగానే మరో నాలుగు లక్షలు అందజేయాలని నమ్మబలికాడు. అన్నింటికీ సిద్ధపడ్డ ఓ యువకుడు తాను చెక్కురూపంలోనూ, బ్యాంకు చెల్లింపు ద్వారానే డబ్బులిస్తానని మెలిక పెట్టాడు. అందుకు అడ్వకేటు కుదరదన్నాడు. దీంతో అనుమానం వచ్చిన నిరుద్యోగి... పోలీసులకు సమాచారం అందించాడు. ఇంకేముంది సార్‌ బాగోతం బట్టబయలైంది. నిరుద్యోగి ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి గౌరీశంకర్‌ వ్యవహారంపై విచారణ మొదలుపెట్టారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు నిజానిజాలు వెలుగులోకి తెస్తామని నెల్లూరు సిఐ తెలిపారు. నిందితుడి వద్దనుంచి కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 

నేటితో ముగియనున్న ఎంసెట్ గడువు

తెలంగాణ : నేటితో తెలంగాణలో ఎంసెట్ గడువు ముగియనుంది. నేడు చివరి రోజు కావడంతో ఆశావాహులందరూ తమ అప్లికేషన్స్ సబ్ మిట్ చేయాలని అధికారులు పేర్కొన్నారు.

06:53 - March 30, 2016

హైదరాబాద్: గ్రేటర్‌లో అధికారులు బిజీ అయ్యారు.. ఎవ్వరిని కదిలించినా ఆస్తి పన్ను వసూళ్ల మాటే వినిపిస్తోంది. టార్గెట్‌ను రీచ్ కావడం కోసం స్పెషల్ టీమ్స్ రంగలోకి దిగాయి. రేపటితో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. మరి ఈలోపే జీహెచ్‌ఎంసి ఆస్తిపన్ను లక్ష్యాన్ని రీచ్ అవుతుందా?...
ఇంకా ఒక్కరోజే..
బిల్లు కలెక్టర్ మొదలుకొని కమిషనర్ వరకు అందరూ టాక్స్ కనెక్షన్లలో మునిగిపోయారు. గత ఏడాది ఇదే సమయానికి 920 కోట్ల రూపాయలు వసూలు అయ్యాయి, ఈ ఏడాది 850కోట్లు మాత్రమే వసూలయ్యాయి. కొన్ని సర్కిళ్లలో పన్నులు బాగా వసూలైతే, మరికొన్ని ప్రాంతాల్లో చాలా మందకొడిగా  సాగుతోంది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి నేటితో కలుపుకుని రేపొక్కరోజే మిగిలి ఉండటంతో అధికారులంతా ఉరుకులు పరుగులు మీద టాక్స్ వసూళ్లు చేస్తున్నారు.
అందుకే ఫోకస్ తగ్గిందా?
ఆస్తి పన్ను వసూలు కోసం సర్కిల్ వారీగా టార్గెట్స్‌ ఫిక్స్ జీహెచ్‌ఎంసీ చేసింది. రికార్డు స్థాయిలో గత ఏడాది 1120 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈసారి 1200 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా అధికారులు పెట్టుకున్నారు. అందుకోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. తొలి దశలో రెడ్ నోటీసులు అధికారులు అందించారు. ప్రాపర్టీ టాక్స్ చెల్లించని వారి ఆస్తులను సీజ్ చేస్తున్నారు. అయితే 80 కోట్ల రూపాయలు మైనస్‌ కావడానికి మరోకారణముంది. జిహెచ్‌ఎంసి ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు తాయిలంగా ప్రభుత్వం ఆస్తి పన్నును 1200 రూపాయలు చెల్లించేవారందరికీ 101 రూపాయల వరకు తగ్గించింది. దీంతో ఆ ఎఫెక్ట్ పడిందని అధికారులు చెబుతున్నారు. మరో వైపు రెండు నెలలు బల్దియా ఎన్నికల వల్ల కూడా పన్ను వసూళ్లపై ఫోకస్ చెయ్యకపోవడానికి కారణమైందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరికొన్ని గంటల్లో అధికారులు 250 కోట్ల వసూళ్ల టార్గెట్‌ను రీచ్ అవుతారా.. లేక వచ్చినకాడికే సర్దుకుపోతారా అనేది చూడాలి. 

ఆఫీసర్స్ తో కేసీఆర్..

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులతో నేడు భేటీ కానున్నారు.ప్రాజెక్టుల రీ డిజైనింగ్, రీ ఇంజనీరింగ్ పై సమీక్ష నిర్వహించనున్నారు.

06:45 - March 30, 2016

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ రాత్రివేళ నగరంలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. నగరంలో వివిధ ప్రాంతాంలో శానిటేషన్‌ పనులను మేయర్ పరిశీలించారు. ఎల్‌బి నగర్‌ నుంచి కూకట్‌పల్లి వరకు వివిధ ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగాయి. కూకట్‌పల్లిలో కొందరు కార్మికులు చెత్త తగులబెట్టడంతో అక్కడికి చేరుకున్న మేయర్‌ కార్మికులపై సీరియస్ అయ్యారు. అక్కడి శానిటరీ సూపర్‌వైజర్‌ను మందలించారు. కాగా అకస్మిక తనిఖీలతో సూపర్ వైజర్స్ అలెర్ట్ అయ్యారు. 

 

నేడు ఎన్టీఆర్ వర్సిటీ స్నాతకోత్సవం..

విజయవాడ : నేడు ఎన్టీఆర్ వర్సిటీ స్నాతకోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిధిగా పాల్గొంటారు. 

మేయర్ అకస్మిక తనిఖీలు..

హైదరాబాద్ : మేయర్ బొంతు రామ్మోహన్ అకస్మిక తనిఖీలు నిర్వహించారు. శానిటేషన్ పనులను మేయర్ పరిశీలించాలి. ఎల్బీ నగర్ నుంచి కూకట్ పల్లి మేయర్ పనుల్ని పరిశీలించారు. వివిధ ప్రాంతాల్లో శానిటేషన్ పనుల్ని పరిశీలించారు. కూకట్ పల్లిలో చెత్త తగులబెట్టినందుకు స్వీపర్లను, సూపర్వైజర్లపై బొంతు  సీరియస్ అయ్యారు. 

నేడు చలో అసెంబ్లీ..

హైదరాబాద్ : చేనేత రంగ సమస్యల పరిష్కారంకోసం నేడు చలో అసెంబ్లీకి తెలంగాణ చేనేతలు పిలుపునిచ్చారు. ఇందిరాపార్కు వద్ద ఉ.11గంలకు దర్నా నిర్వహించనున్నారు. 

రక్తమోడిన రోడ్లు..

మెదక్ : రోడ్లు రక్తమోడాయి. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. న్యాటికల్ మండలంలో మిర్జాపూర్ లో కారుబోల్తా బోల్తాపడి ఇద్దరు మృతి చెందారు. సదాశివపేటలో ఆటో-లారీ ఢీకొని నలుగురు మృత్యువాతపడ్డారు.

నేడు తొలి సెమీఫైనల్

హైదరాబాద్ : టీ-20 వరల్డ్ కప్ లో భాగంగా తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ నేడు జరగనుంది. ఈ ఫస్ట్ ఫైట్ లో ఇంగ్లండ్-న్యూజీలాండ్ లు తలపడనున్నాయి. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో నేటి రాత్రి  7గం.లకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. 

యాక్సిడెంట్.. విద్యార్థి మృతి..

మెదక్ : రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి చెందాడు. గజ్వేల్ మండలం రిమ్మనగూడ సమీపంలోని హైవేలో బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో బాలునికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  

Don't Miss