Activities calendar

31 March 2016

వెస్టిండిస్ విజయం

టీ-20 ప్రపంచకప్: భారత్ పై వెస్టిండిస్ విజయం సాధించింది. భారత్ పై 7 వికెట్ల తేడాతో వెస్టిండిస్ ఘన విజయం పొందింది. భారత్ స్కోర్ 192/2, వెస్టిండిస్ స్కోర్ 196/3. భారత బౌలర్లు విఫలమైయ్యారు. ఆదివారం వెస్టిండీస్-ఇంగ్లండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.  

21:53 - March 31, 2016

ఏప్రిల్ వస్తుందంటే ఒకరిని ఒకరు ఫూల్స్ చేసుకోవడం మనకు తెలుసు. రాజకీయనాయకులు కూడా ప్రజలను ఫూల్స్ చేసేస్తున్నారు. నల్లధనాన్ని ప్రజల ఖాతాలో వేస్తానని వేయకుండా ప్రధాని మోసం చేస్తే, తెలంగాణ ముఖ్యమంత్రి కేజీ టూ పీజీ ఒక్కటే చేయలేదని జనాలను ఫూల్స్ చేసేశారు. పాలమూరులో కుక్కల విహారం... అయ్య ఎన్టీఆర్ మీద బాలయ్య బారీ డైలాగులు... ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలంటే వీడియో చూడాల్సిందే..

21:35 - March 31, 2016

నెల్లూరు: కాంగ్రెస్‌ మాజీ ఎంపీ చింతా మోహన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ వైసీపీతో గాని, జనసేనతో గాని జత కలిస్తే మంచిదన్నారు. ప్రస్తుతం పార్టీ పరిస్థితి బాగా లేనందున ఈ అంశంపై ఆలోచించాలని నేతలకు సూచించారు. నెల్లూరులో ఇందిరా భవన్‌లో జరిగిన ఎస్సీ, ఎస్టీ న్యాయ సాధికారిక సదస్సులో చింతా ఈ వ్యాఖ్యలు చేశారు. చింతా వ్యాఖ్యలపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ద్రోహి అంటూ నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. ఎపిపిసిసి రఘువీరా వెంటనే జోక్యం చేసుకుని కార్యకర్తలను సముదాయించే ప్రయత్నం చేశారు. ఇది చింతా మోహన్‌ వ్యక్తిగత అభిప్రాయంటూ ఆయన సర్దిచెప్పారు. 

21:28 - March 31, 2016

గుంటూరు: పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ అన్నారు. వివా ఇంటర్నేషనల్‌ స్కూల్‌ నిర్వహించిన మోటివేషన్‌ కార్యక్రమానికి నైనా జైస్వాల్‌, ఆమె తమ్ముడు అగస్త్య హాజరయ్యారు. ఇష్టంతో చేస్తే ఏ పనిలోనైనా విజయం సాధించవచ్చని ఆమె పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రారంభమవుతున్న వివా స్కూల్‌కు ఆమె అభినందనలు తెలిపారు. తన లాంటి ఎంతోమంది విద్యార్థులను వివా స్కూల్‌ తయారుచేయగలుతుందనే ఆశాభావాన్ని నైనా వ్యక్తం చేశారు. 

21:19 - March 31, 2016

గుంటూరు: బీటెక్ చదువుతున్న విద్యార్థిని అదృశ్యమైంది. విద్యార్థిని భవన నాలుగు రోజుల క్రితం మిస్యయ్యింది. దీంతో మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకూమారి కళాశాలను సందర్శించారు. విద్యార్థిని ఆచూకి తెలిపిన వారికి రూ.5లక్షలు పారితోషకం ఇస్తామన్నారు. పోలీసులు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.  

21:11 - March 31, 2016

అనంతపురం: ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలు ఆందోళనకు దిగాయి. సిపిఎం, రైతు సంఘం ఆధ్వర్యంలో 36గంటల ధర్నా చేపట్టాయి. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 5లక్షల రూపాయలు ఇచ్చామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, తమకుమాత్రం ఒక్క రూపాయికూడా అందలేదని కన్నీరు మున్నీరవుతున్నాయి.

21:02 - March 31, 2016

హైదరాబాద్ : కూకట్ పల్లి లో బీటెక్ విద్యార్థిని శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. గోకరాజు గంగరాజు కాలేజీలో బీటెక్ చదువుతోంది. మూడు పేజీల సూసైడ్ నోట్ రాసింది. అందులోని వివరాలు తెలియాల్సి ఉంది. శ్రావణి త్రివేణి హాస్టల్లో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

చెలరేగిన విరాట్‌.. విండీస్‌ లక్ష్యం 193

ముంబయి: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లి (89 నాటౌట్‌: 47 బంతుల్లో 11×4, 1×6)చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.

20:44 - March 31, 2016

నల్లగొండ: తుర్కపల్లి మండలం ముల్కలపల్లిలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బైక్‌ను లారీ ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం తర్వాత లారీ డ్రైవర్‌ వాహనంతో సహా పరారయ్యాడు. అతనికోసం పోలీసులు గాలిస్తున్నారు. అన్ని కూడళ్లలో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాలను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

20:40 - March 31, 2016

ఖమ్మం: నగరంలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. కిట్స్ కాలేజీ విద్యార్థులతో అవగాహనా కల్పించారు. ఈ కార్యక్రమాన్ని ఖమ్మం డిఎస్పి సురేష్ కుమార్ ప్రారంభించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిని గుర్తించి గులాబిపువ్వు , చాక్లెట్ ఇచ్చి... సీట్ బెల్ట్ పెట్టుకోవడం , హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పించారు. విద్యార్థులే దేశానికి దిశా నిర్ధేశం అని.. అందుకే ప్రతి ఒక్కరు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండాలని పోలీసులు తెలిపారు. 

తెలంగాణ శాసనమండలి నిరవధిక వాయిదా

హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి నిరవధిక వాయిదా పడింది. ఈసారి శాసనమండలి సమావేశాలు 15రోజులపాటు కొనసాగాయి. మండలి 56గంటల 21 నిమిషాలపాటు పనిచేసింది. 104 ప్రశ్నలపై మండలిలో చర్చ జరగగా 12 బిల్లులు ఆమోదం పొందాయి. వివిధ అంశాలపై 96మంది సభ్యులు ప్రసంగించారు.

ఇంట్లో పేలిన నాటుబాంబులు

నల్లగొండ: డిండిలో ఓ ఇంట్లో నాటుబాంబులు పేలాయి. దీంతో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. జంతువుల వేటకు బాంబులు తయారుచేస్తుండగా ఘటన చోటుచేసుకుంది.   

బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్ : కూకట్ పల్లి లో బీటెక్ విద్యార్థిని శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. గోకరాజు గంగరాజు కాలేజీలో బీటెక్ చదువుతోంది. మూడు పేజీల సూసైడ్ నోట్ రాసింది. అందులోని వివరాలు తెలియాల్సి ఉంది. శ్రావణి త్రివేణి హాస్టల్లో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

క్షతగాత్రులకు ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ సేవలు...

కోల్ కతా : బ్రిడ్జ్ కూలిన ఘటనలో క్షతగాత్రులకు సహాయం చేసేందుకు ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ ప్రజాసంఘాల నేతలు ముందుకొచ్చారు. కోల్ కతాలోని మాణిక్ తలా బ్లడ్ బ్యాంక్ వద్ద అత్యవసర రక్తదాన శిబిరాలను ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ సంఘాల నేతలు ఏర్పాటు చేశారు. కాగా ఈరోజు ఉదయం  కోల్ కతాలోని గణేస్ టాకీస్ సమీపంలో ఓ బ్రిడ్జ్ కూలిన సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్ , జగన్ లను మా పార్టీలోకి ఆహ్వానిస్తాం: చింతా మోహన్

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్ ను, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లను తమ పార్టీలోకి ఆహ్వానిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ నేత చింతా మోహన్ తనదైన శైలిలో మాట్లాడారు. ఓకార్యక్రమంలో సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ... ఏపీలో తమపార్టీకి పటిష్ట నాయకత్వం అవసరమని, అందుకే వారిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. 

నెలకు చేరుకున్న బంగారు వర్తకుల సమ్మె....

ఢిల్లీ : బంగారు ఆభరణాలపై కేంద్రం విధించిన ఒక శాతం ఎక్సైజ్‌ సుంకాన్ని ఎత్తివేయాలని డిమాండ్‌ తో బంగారు ఆభరణాల వర్తకులు చేపట్టిన సమ్మె నేటికి నెలరోజులకు చేరుకుంది. ప్రధాన నగరాల్లోనూ చాలావరకు బంగారం దుకాణాలు మూతపడే ఉన్నాయని ఆల్‌ ఇండియా సరఫా అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సురీందర్‌ కుమార్‌ జైన్‌ మీడియాకు తెలిపారు. ఈ సమ్మెకు మద్దతిస్తూ దుకాణాలు మూసివేసిన బంగారు వర్తకులు కేవలం వెండికి సంబంధించిన అమ్మకాలు మాత్రమే చేస్తున్నారని ఆయన చెప్పారు. నగల వర్తకుల డిమాండును పరిశీలించాలంటూ కేంద్ర ప్రభుత్వం మాజీ ఆర్థిక సలహాదారు అశోక్‌ లహరీ ఆధ్వర్యంలో ఓ ప్యానల్‌ని ఏర్పాటు చేసింది.

కిడ్నాప్ అయిన చిన్నారి క్షేమం...

హైదరాబాద్ : కిడ్నాప్ కు గురైన చిన్నారి కథ సుఖాంతమయ్యింది. హైదరాబాద్ లోని పహాడీ షరీఫ్ కి చెందిన రెండేళ్ల చిన్నారి ఈ నెల 27న కిడ్నాప్ కు గురైయ్యింది. పీఎస్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కర్నాటకలోని బళ్ళారిలో నిందితులను పట్టుకున్నారు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులకు పోలీసులు అరెస్ట్ చేశారు.

17:10 - March 31, 2016

హైదరాబాద్: చిన్నారి కిడ్నాప్ కేసును పహాడిషరీఫ్ పోలీసులు ఛేదించారు. కర్నాటకలోని బళ్లారిలో చిన్నారిని క్షేమంగా రక్షించారు. చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 27 న రెండేళ్ల పాపను అపహరించిన విషయం తెలిసిందే.   

మేయర్ కు షాక్ ఇచ్చిన పోలీసులు....

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ మేయర్ బొంతు రామ్మెహన్ కు ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. హెల్మెట్ లేకుండా బుల్లెట్ నడిపిన మేయర్ కు పోలీసులు రూ.100 జరిమానా  విధించారు.  

సీఎం చంద్రబాబుతో భేటీ అయిన గవర్నర్ కార్యదర్శి....

హైదరాబాద్ : సీఎం చంద్రబాబును గవర్నర్ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కలిశారు. ఈరోజుతో రమేష్ కుమార్ పదవీకాలం ముగియనుంది. రమేష్ కుమార్ ను ఏపీ ఎన్నికల అధికారిగా నియమించే అవకాశమున్నట్లు సమాచారం.

క్యాంపస్ వీసీ రాజ్యాంగమా? : కేరళ ఎంపీలు

హైదరాబాద్ : హెచ్ సీయూకు వచ్చిన కేరళ సీపీఎం ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కేరళ సీపీఎం నేతలు మాట్లాడుతూ.. హెచ్ సీయూలో కేరళ రాష్ట్ర విద్యార్థులు 700ల మంది వున్నారనీ...క్యాంపస్ లో జరుగుతున్న పరిణామాలు తెలుసుకోవటానికే వచ్చామని తెలిపారు.వీసీ అప్పారావు నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. ఎంపీలను క్యాంపస్ లోకి రానియ్యకపోవడానికి క్యాంపస్ ఏమన్నా ఆయన రాజ్యంగం అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. వీసీ వల్లనే ప్రశాంతంగా వుండాల్సిన చోట ఉద్రిక్తత నెలకొందనీ ఆయన్ని వెంటనే రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు.

కాపు ప్రజాప్రతినిధులతో ముగిసిన చంద్రబాబు భేటీ....

హైదరాబాద్ : కాపు ప్రజాప్రతినిధులతో చంద్రబాబు భేటీ ముగిసింది. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ...ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించాలని ఆయన సూచించారు. ఎంపీ నిధులు ఖర్చు పెట్టే విషయంలో స్థానిక ఎమ్మెల్యేల సూచనలను పరిగణలోకి తీసుకోవాలనీ…అవినీతిరహితంగా పనిచేయాలన్నారు. నెలలో రెండుసార్లు జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులతో సమావేశమయి సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ క్రమంలో మూడు నెలలకు ఒకసారి ఎమ్మెల్యేల పనితీరును సమీక్షిస్తామని తెలిపారు.

16:27 - March 31, 2016

సినిమా షూటింగ్ సమయంలో భయమేసిందని హిరోయిన్ నందిత పేర్కొన్నారు. నందితతో టెన్ టివి లైవ్ షో నిర్వహించింది. ఈ సందర్భంగా 'సావిత్రి' సినిమా విశేషాలను ఆమె వివరించారు. సినిమా కు సంబంధించిన పలు విషయాలను తెలిపారు. ఆమె భయానికి కారణాలు.... ఇంకా పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం.....

15:29 - March 31, 2016

హైదరాబాద్ : పోలీసుల తీరు మారదా ? అంటే మారదనే తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా హెచ్ సీయూలో జరుగుతున్న ఆందోళనలపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. విద్యార్థులపై విచక్షణారహితంగా లాఠీఛార్జీ చేసిన ఖాకీలు నేడు ఇతర రాష్ట్రాల ప్రజాప్రతినిధులను అనుమతించలేదు. దీనిపై తీవ్ర నిరసనలు వ్యక్తమౌతున్నాయి. హెచ్ సీయూలో జరిగిన ఆందోళనలో అరెస్టయన విద్యార్థులు బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. గురువారం కేరళ రాష్ట్రానికి చెందిన సీపీఎం ఎంపీలు..సీనియర్ పాత్రికేయురాలు తీస్తా సెతల్వాద్ లు హెచ్ సీయూకు వచ్చారు. కానీ వీరిని అక్కడున్న పోలీసులు వీరిని లోనికి అనుమతించలేదు. దీనితో వారు గేటు దగ్గరే బైఠాయించారు. సమాచారం తెలుసుకున్న సీపీఎం, ఎస్ఎఫ్ఐ నేతలు ఆందోళన చేపట్టారు. వీరిని లోనికి అనుమతించాలని డిమాండ్ చేశారు. లోనికి అనుమతించకపోవడం పట్ల వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. 

15:20 - March 31, 2016

హైదరాబాద్ : కాంతనపల్లి ప్రాజెక్టు వల్ల తమకు ముప్పు ఉందని ఆదివాసీలు చెప్పారని, ఆదివాసీల భూములు మునగకుండా, దేవాదులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. గురువారం తెలంగాణ శాసనసభలో సాగునీటి రంగం..ప్రాజెక్టులపై కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌లో భాగంగా కాంతనపల్లి ప్రాజెక్టును నిర్మించాల్సి ఉందని కేసీఆర్‌ అన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఛత్తీస్‌గఢ్‌తో వివాదం లేకుండా, ఆదివాసీ భూములు మునగకుండా రీడిజైనింగ్‌ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. దీనిపై సమగ్రంగా చర్చించాలని సీఎం సభ్యులకు సూచించారు. 

15:18 - March 31, 2016

హైదరాబాద్ : పాలమూరు జిల్లాలో కల్వకుర్తి ప్రాజెక్టు పెండింగ్‌లో ఉందని, దానికి గత పాలకులు సరైన నిధులివ్వలేదని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. గురువారం తెలంగాణ శాసనసభలో సాగునీటి రంగం..ప్రాజెక్టులపై కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కేవలం లిప్ట్ కాల్వలు పెట్టారని ఆయన దుయ్యబట్టారు. కల్వకుర్తి ప్రాజెక్టుకు ఎక్కడా స్టోరేజీ కెపాసిటీ లేదని, స్టోరేజీ కెపాసిటీని పెంచుతామని సీఎం అన్నారు. దీనిపై సర్వే జరుగుతోందని, కల్వకుర్తి ప్రాజెక్టు ద్వారా లక్షా 50 వేల ఎకరాలకు నీళ్లించేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చెప్పారు. వచ్చే ఏడాదికి కల్వకుర్తి ప్రాజెక్టును సమగ్రంగా పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.

 

15:16 - March 31, 2016

హైదరాబాద్ : ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టులే తెలంగాణకు నీటి కష్టాలను తీర్చుతాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. గురువారం తెలంగాణ శాసనసభలో సాగునీటి రంగం..ప్రాజెక్టులపై కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సభలో కాంగ్రెస్‌ సభ్యులు లేకపోవడాన్ని కేసీఆర్‌ తప్పుబట్టారు. ఈ సందర్భంగా వివిధ ప్రాజెక్టుల్లో ఉన్న పరిస్థితిని విశదీకరించారు. దక్షిణ తెలంగాణకు కూడా నీళ్లించేందుకు ప్రాణహిత చేవెళ్ల ఒక్కటే మార్గమని ఆయన అన్నారు. కాస్ట్‌ పెంచడంపై కాంగ్రెస్‌ విమర్శల్ని సీఎం తిప్పికొట్టారు. 16 టీఎంసీల నుంచి 200 టీఎంసీల కెపాసిటీకి పెంచితే ప్రాజెక్టు కాస్ట్‌ పెరగదా అని ఆయన ప్రశ్నించారు.

15:14 - March 31, 2016

హైదరాబాద్ : ప్రాణం పోయినా సరే తెలంగాణలో కోటి ఎకరాలకు నీరిచ్చి తీరుతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. గురువారం తెలంగాణ శాసనసభలో సాగునీటి రంగం..ప్రాజెక్టులపై కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా వివిధ ప్రాజెక్టుల్లో ఉన్న పరిస్థితిని విశదీకరించారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా తమ ప్రాస్థానం కొనసాగుతోందని కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం కోసమే ప్రాజెక్టులపై దృష్టి పెట్టామని ఆయన చెప్పారు. సమైఖ్య రాష్ట్రంలో ఉన్న అనేక వేల చెరువులు కనిపించకుండా పోయాయని సీఎం అన్నారు. కేసీఆర్ ప్రసంగం తరువాత సభ భోజన విరామం కోసం వాయిదా పడింది. 

2 ఎర్రచందనం దొంగలు అరెస్ట్....

కడప: రైల్వేకోడూరు మండలం వాజేటికోన అటవీప్రాంతంలో పోలీసులు కూంబింగ్‌ చేపట్టారు. ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోందన్న సమాచారం మేరకు కూంబింగ్ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరు కూలీలను అదుపులోకి తీసుకోగా మిగతావారు పరారైయ్యారు. సంఘటనాస్థలం నుంచి 105 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని పరారైన కూలీల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

15:08 - March 31, 2016

హైదరాబాద్ : రూ.216 కోట్ల రూపాయల విద్యుత్‌ ఛార్జీలను ఏపీ ఈఆర్‌సీ పెంచింది. తొలుత 783 కోట్ల రూపాయల విద్యుత్‌ ఛార్జీల పెంపును ప్రతిపాదించిన ఈఆర్‌సీ రూ. 216కు పరిమితం చేసింది. ముఖ్యంగా గృహ వినియోగదారుల విద్యుత్ ఛార్జీలను యాథాతథంగా ఉంచింది. ఏ కేటగిరిలోను ఛార్జీలను పెంచలేదు. గృహేతర వినియోగదారులకు మాత్రం 2 శాతం విద్యుత్‌ ఛార్జీలను పెంచింది. గృహ వినియోగం, 100 యూనిట్లలోపు గృహేతర వినియోగదారులకు, కుటీరపరిశ్రమలకు, వ్యవసాయానికి, ఎన్టీఆర్‌ సృజల స్రవంతి పథకానికి ఛార్జీల పెంపు నుంచి మినహాయింపు ఇచ్చింది. కొత్త విద్యుత్‌ చార్జీల అమలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని ఏపీ ఈఆర్‌సీ ఛైర్మన్‌ భవానీ ప్రసాద్‌ చెప్పారు.

15:06 - March 31, 2016

హైదరాబాద్ : తాము పేర్కొన్న పలు అంశాలు కాగ్ నివేదికలో కూడా ఉన్నాయని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు..పార్టీ వ్యవహరించిన తీరుపై ఆయన మాట్లాడారు. రోజా కోర్టు తీర్పు..పోలవరం ప్రాజెక్టుల అవతవకలు..అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలవడం..కరెంటు ఎక్కువ రేట్లకు కొనుగోలు చేయడం..ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కు కావడం..రాజధాని ప్రాంత భూముల్లో బాబు బినామీలు తక్కువ రేట్లకు కొనుగోలు చేయడం..అనంతరం ఇక్కడే రాజధాని వస్తుందని ప్రకటన చేయడం..బినామీలకు లబ్ధి చేకూర్చే విధంగా చేయడం..రైతులను మోసం చేయడం..రైతుల భూములను అమ్ముకొనే స్వేచ్ఛను హరించడం..ఇసుక మాఫియాను సీఎం బాబు ప్రోత్సాహించడం..తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసినట్లు పేర్కొన్నారు. రూ.2 వేల కోట్ల రూపాయల స్కాంలో జరిగాయని మంత్రి యనమల చేసిన ఆరోపణలు చేశారని తెలిపారు. ప్రస్తుతం ఉచితంగా ఇసుక ఇస్తామని చెబుతున్నారని, చేసిన మోసాలను కవరప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కాగ్ నివేదికలో కూడా అవే అంశాలను ప్రస్తావించడం జరిగిందని జగన్ పేర్కొన్నారు. 

15:01 - March 31, 2016

మారుతున్న జీవనశైలిలో అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. అలాంటి సమస్యలలో ఒకటి ఫ్రోజెన్ షోల్డర్. మరి ఈ సమస్య ఎందుకొస్తుంది? ఎలాంటి చికిత్సా మార్గాలున్నాయో వీడియో క్లిక్ చేయండి. 

కేరళ సీపీఎం ఎంపీలను అడ్డుకున్న పోలీసులు...

హైదరాబాద్ : హెచ్ సీయూ వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. హెచ్ సీయూ విద్యార్ధులను కలవడానికి కేరళ నుండి వచ్చిన సీపీఎం ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ హెచ్ సీయూ ప్రధాన ద్వారం వద్ద ఎస్ఎఫ్ఐ ఆందోళన చేపట్టింది. కాగా క్యాంపస్ లో కొంతకాలంగా జరుగుతున్న ఆందోళన నేపధ్యంలో కొందరు విద్యార్ధులను అరెస్ట్ చేయటం, వారు విడుదల కావటం తెలిసిందే.  వారిని పరామర్శించటానికి కేరళ నుండి సీపీఎం ప్రతినిధులు వచ్చిన క్రమంలో పోలీసులు వారిని గేటు వద్దే అడ్డుకోవటంతో విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

14:58 - March 31, 2016

అట్టడుగు వర్గాల మహిళల అంతర్జాతీయ వేదిక అది. ప్రాంతాలు వేరైనా, భాషలు వేరైనా వారి నినాదమొక్కటే.. అందుకే అక్కడ మాటలు కలిసాయి. పాట కూడా జతగా సాగింది. పరస్పర ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకునే ప్రవాహమై సాగింది. భవిష్యత్ పోరాటాల కార్యాచరణను పదును పెట్టుకునేందుకున్న అవకాశాలను వెతుక్కుంది. మహిళలపై జరుగుతున్న అన్ని రకాల అణచివేతలకు వ్యతిరేకంగా మరింత శక్తిమంతంగా ఉద్యమించేందుకు సరికొత్త ప్రణాళికళను రూపకల్పన చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులు, హింస, అసమాత్వం అంతకంతకూ పెరుగుతున్న దశలో, అణచివేతకుగురవుతున్న ప్రపంచ మహిళలంతా ఒక చోట చేరడం, ఒకే లాంటి సమస్యపై చర్చించడం, పరిష్కార మార్గాలను వెతుక్కోవడం ఆహ్వానించదగిన పరిణామమే. ఖాట్మండులో జరిగిన రెండో ప్రపంచ మహిళా సదస్సుపై ప్రత్యేక కథనం. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ, అన్ని వైపుల నుండీ మహిళలపై జరుగుతున్న దాడులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో, ఖాట్మండులో జరిగిన ప్రపంచ మహిళా సదస్సును ఒక చారిత్రక సందర్భంగానే గుర్తించాలి. అట్టడుగు వర్గాల మహిళలను ఏకం చేసే వేదికగా ఈ సదస్సు మరింత శక్తిమంతంగా, మరింత చైతన్యయుతంగా ముందుకు సాగాలని మానవి ఆకాంక్షిస్తోంది. మరిన్ని విషయాలకు వీడియో క్లిక్ చేయండి. 

కోల్ కతాకు చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు..

కోల్ కతా : గణేష్ టాకీస్ సమీపంలో బ్రిడ్జి కూలిన ఘటనలో 10 మంది దుర్మరణం చెందారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టాయి. రెండు యూనిట్ల ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. 

14:04 - March 31, 2016

హైదరాబాద్ : ఆకాశంలో నుండి ప్రాజెక్టులు వస్తాయా ? అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. గురువారం తెలంగాణ శాసనసభలో సాగునీటి రంగం..ప్రాజెక్టులపై కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా వివిధ ప్రాజెక్టుల్లో ఉన్న పరిస్థితిని విశదీకరించారు. ప్రాణహిత - చేవెళ్ల రూ.38 వేల కోట్లుంటే రూ. 83వేల కోట్లు చేశారని ఆరోపిస్తున్నారని తెలిపారు. ఆనాడు 16 టీఎంసీల నీటిని 16 లక్షల 40 వేల ఎకరాలు పారిస్తామని చెబితే నమ్ముతారా ? అని ప్రశ్నించారు. ప్రస్తుతం తాము 200 టీఎంసీల కెపాసిటి పెడితే ప్రాజెక్టు ఖర్చు పెరగదా ? అని ప్రశ్నించారు. తమ్మిడి హెట్టు దగ్గర 1.82 టీఎంసీలు కెపాసిటీ ఉంటుందని..మేడిగడ్డ దగ్గర 100 మీటర్లు పెంచాలని తెలిపారు. అన్నారం బ్యారేజ్ వద్ద 3.62 టీఎంసీలు..మేడారం దగ్గర 0.58 పెట్టారని దీనిని పెంచుకోవాలని పేర్కొన్నారు. మల్కంపేట 0.3 ఉంటే 3 టీఎంసీలు పెంచామని..హిమంబాద్ 0.80 పెంచాల్సినవసరం ఉంది.. అని కేసీఆర్ పేర్కొన్నారు. 

13:45 - March 31, 2016

కోల్ కతా : అప్పటి వరకు ఆ ప్రాంతం ప్రశాంతంగా ఉంది..ఒక్కసారిగా శబ్ధం..హాహాకారాలతో ఆ ప్రాంతం దద్ధరిల్లింది. గిరీష్ పార్కు సమీపంలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. ఈ ఘటనలో పది మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. శిథిలాల కింద పలువురు కూలీలు చిక్కుకున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. బ్రిడ్జి కూలడానికి కారణాలు తెలియరాలేదు. నిర్మాణంలో లోపాలున్నాయా ? అధికారుల నిర్లక్ష్యం కారణమా ? అనేది తెలియాల్సి ఉంది. 

ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు..

విజయవాడ : ఏపీలో విద్యుత్ ఛార్జీలను పెంచారు. విద్యుత్ చార్జీల అంశంపై ప్రజాభిప్రాయాన్ని సేకరించిన ఏపీ ఎలక్ట్రిస్టిఈ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీఈఆర్సీ) విద్యుత్ ఛార్జీలను పెంచుతూ కీలక ప్రకటన చేసింది. 2016-17 ఏడాదికి సంబంధించిన నూతన టారిఫ్ లను కమిషన్ ఛైర్మన్ భవానీ ప్రసాద్ విడుదల చేశారు. గృహ వినియోగదారులకు ఛార్జీలు పెంచ లేదని తెలుస్తోంది. 

కోల్ కతాలో బ్రిడ్జి కూలి 10 మంది మృతి....

కోల్ కతా: గణేష్ టాకీస్ సమీపంలో నిర్మితమవుతున్న ఓ బ్రిడ్జి కూలిపోయింది. ఈ ఘటనలో 10 మంది అక్కడి క్కడే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

13:27 - March 31, 2016

హైదరాబాద్ : పక్కనే గోదావరి పారుతున్నా నీళ్లు రావని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ శాసనసభలో ఆయన గూగుల్ మ్యాప్ సహాయంతో సాగునీటి రంగం..ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ లున్నాయని, కరవుకు గురయి అల్లాడుతుంటే రీ డిజైనింగ్ చేసి నీళ్లు చేయాలా ? వద్దా ? అనేది తెలపాలని ప్రశ్నించారు. 8000 వేల కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రాజెక్టు దేవాదుల అని, గోదావరి నీళ్లు పారుతున్నా దేవాదుల పంప్ హౌజ్ కు నీళ్లు రావన్నారు. 6 లక్షల 20 వేల ఎకరాలు అని నీటి పారుదల ప్రతిపాదంచడం జరిగిందని, ఇక్కడ 11,500 ఎకరాలు గిరిజనుల భూములు మునిగిపోయే అవకాశం ఉందన్నారు. కాంతనపల్లి లో తాను పర్యటించడం జరిగిందని, ఛత్తీస్ గడ్ రాష్ట్రం ఒప్పుకోదని, దీనిని రీ డిజైనింగ్ చేయాలా ? వద్దా ? అనేది ఆలోచించాలని సూచించారు. తాము ముంపు బారిన పడిన గ్రామాలను రక్షించామన్నారు.

13:17 - March 31, 2016

హైదరాబాద్ : ఎక్కడ చూసినా బ్యారేజీలే ఉన్నాయని..ఇక నీళ్లు ఎలా వస్తాయని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. సాగునీటి రంగం..ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేసీఆర్ శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గూగుల్ మ్యాప్ సహకారంతో ప్రాజెక్టుల పరిస్థితులను విశ్లేషించారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టడం వల్ల నీళ్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఒక్క నదిని వదిలిపెట్టకుండా మహారాష్ట్ర బ్యారేజీలు కట్టాయని, మంజీరాపై కర్నాటకపై బ్యారేజీలు నిర్మాణం చేసిందన్నారు. బీమా నది పై వరుస బ్యారేజీలు ఉన్నాయని, 450 బ్యారేజీలు నిండితే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు వస్తాయన్నారు. అవి ఎప్పుడు నిండాలె అని ప్రశ్నించారు. చుక్క నీరు రాలేదంటే కారణం ఈ బ్యారేజీలు అని తెలిపారు. మిగతా విషయాలకు వీడియో క్లిక్ చేయండి. 

పాలమూరు ఎత్తిపోతల కట్టి తీరుతాం : కేసీఆర్

హైదరాబాద్ : టీ.అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రసంగించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ...ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ..ఆరునూరైనా సరే, పాలమూరు ఎత్తిపోతల కట్టి తీరుతామని సీఎం కేసీఆర్ అన్నారు.హరిత తెలంగాణ సాధించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పాలమూరు ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఆ జిల్లా నేతలే కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారని ఆయన ఈసందర్భంగా గుర్తు చేశారు. కాగా కోర్టు ఆ పిటీషన్ ను కొట్టివేసి అనుమతినిచ్చిందని తెలిపారు.  తొలిసారిగా హెలికాఫ్టర్ లలో సీనియర్ ఇరిగేషన్ అధికారులతో కృష్ణా, గోదావరి నదులపై సర్వే చేయించామని తెలిపారు. 

నిజాంసాగర్ కు నీటి కష్టం సమైక్య పాలకుల వల్లే : కేసీఆర్

హైదరాబాద్ : టీ.అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాటల్లోనే....నిజాంసాగర్ ను వట్టిపోయేలా చేసిన ఘనత సమైక్యపాలకులదే. దుమ్ముగూడెం ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లా 20 వేల ఎకరాలు  కోల్పోవాల్సి వస్తుంది. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు కృష్ణా, గోదావరి నదులపై 450లకు పైనే  భారీ ప్రాజెక్టులను నిర్మించాయి. ఈ ఏడాది పైనుండి దిగువకు ఒక్కచుక్క కూడా నీరు రాలేదు. అలాగే ఏ ఒక్క నదిని కూడా వదిపెట్టకుండా అడుగడుగునా మహారాష్ట్ర, కర్నాటక ప్రభుత్వాలు బ్యారేజీలు కట్టి నీటిని మళ్ళించారు. ఈ ప్రాజెక్టులను నిలువరించే పరిస్థితి ఇప్పుడు లేదు.

12:30 - March 31, 2016

హైదరాబాద్ : ఉభయ రాష్ట్రాలు పెను ప్రమాదంలో ఉన్నాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు. గురువారం శాసనసభలో సాగునీటి రంగంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ప్రమాదంలో ఉన్నాయని, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు 450 మేరకు కృష్ణా, గోదావరి నదుల మీద బ్యారేజీలు నిర్మించారని తెలిపారు. వాటిపై భారీ భారీ లిఫ్ట్ లు ఏర్పాటు చేశారని చెప్పారు. 35 సంవత్సరాల చరిత్రలో ఒక్క నీరు లేకపోవడం వల్ల సింగూర్ ఎండిపోయిందని, పై నుండి ఒక చుక్క నీరు కూడా శ్రీరాంసాగర్ కు రాలేదన్నారు. నీళ్లు రావాలంటే ఏం చేయాలి ? అనే దానిపై ప్రభుత్వం సుదీర్ఘంగా సమీక్ష జరిపిందని తెలిపారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం అడ్డుకుంటున్నాయని, లేనిపోని విషయాలు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ విమర్శించారు. 

ఉద్యమ ఫలితంగానే దేవాదుల ప్రాజెక్టు : కేసీఆర్

హైదరాబాద్ : టీ.అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఇలా ప్రసంగించారు...ఉద్యమ ఫలితంగానే దేవాదుల ప్రాజెక్టు వచ్చింది. నిజాం సాగర్ ప్రపంచంలోనే మొట్టమొదటి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు. జూరాల ప్రాజెక్టు కడితే నీళ్ళు నింపుకోని పరిస్థితి ఏర్పడింది. ప్రాజెక్టులపై వివక్షను ఆనాడే ప్రశ్నించాం. తెలంగాణ ప్రాజెక్టులను ఉమ్మడి పాలకులు అంతర్రాష్ట్ర వివాదాల్లోకి నెట్టివేశారు. రాష్ట్రానికి కాస్తో కూస్తో నీళ్ళు వచ్చాయంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకనే అది సాధ్యమైంది. 75వేలకు పైన చెరువులను కాకతీయులే నిర్మించారు.

12:25 - March 31, 2016

హైదరాబాద్ : తాను కృష్ణా..గోదావరి నదులపై ప్రయాణించే సమయంలో తాను ఒక రూపాయి నాణెం వేసే వాడినని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఉద్యమం..తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని విశదీకరించారు. నదులు దాటే సమయంలో ఎవరైనా ఒక నాణెం వేసే ఆనవాయితీ ఉండేదని తెలిపారు. కానీ తాను వేసిన నాణెలు ఎవ్వరూ వేసి ఉండకపోవచ్చన్నారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని..నీళ్లు పారాలని నిండు మనస్సుతో ప్రార్థించే వాడని తెలిపారు. అనంతరం జరిగిన కారణాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. 

12:15 - March 31, 2016

హైదరాబాద్ : రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఇరిగేషన్ రంగంపై సుదీర్ఘ సమీక్ష చేయడం జరిగిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఈసందర్భంగా ఉద్యమం..తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని విశదీకరించారు. జూరాల ప్రాజెక్టు కడితే పూర్తిగా నింపుకోలేని పరిస్థితి ఉండేదని, ఆర్డీఏస్ ప్రాజెక్టు వద్ద అధికార పార్టీకి చెందిన శాసనసభ్యులే బాంబులే పెట్టి పేల్చివేశారన్నారు. ఆర్డీఎస్ లో జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ పాదయాత్ర చేయడం జరిగిందన్నారు. నాగార్జున సాగర్ కు రెండు కాల్వలకు లిఫ్ట్ లున్నాయని, కుడి కాల్వపై ఉన్న లిఫ్ట్ భారాన్ని ప్రభుత్వమే చెల్లించేదని కానీ ఎడమ కాల్వపై ఉన్న లిఫ్ట్ భారం మాత్రం తెలంగాణ రైతాంగంపై వేయడం వివక్షకు నిదర్శనమన్నారు. దీనిపై నిలదీస్తే జీవో రద్దు చేయడం జరిగిందన్నారు. 

12:10 - March 31, 2016

హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు న్యాయం జరగదనే ఉద్ధేశ్యంతోనే తాను ఉద్యమ బాట ఎంచుకున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఈసందర్భంగా ఉద్యమం..తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని విశదీకరించారు. గత సంవత్సరాల్లో పర్యావరణ సమతుల్యం దెబ్బతినడం వల్ల వర్షపాతం తగ్గిపోవడమే కాక వరసగా కరువులు వచ్చాయన్నారు. దీనితో వలసలు పెరిగాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చెరువులన్నీ ధ్వంసమయ్యాయన్నారు. అప్పర్ మానేర్, కోయిల్ సాగర్ లాంటి ప్రాజెక్టులన్నీ వట్టిపోయాయని, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు రాలేదన్నారు. విపరీతమైన కరెంటు ఛార్జీల వల్ల ప్రజల బతుకులు భారంగా మారాయన్నారు. మహబూబ్ నగర్ జిల్లా నుండి 15-20 లక్షల మంది అన్నమో రామచంద్ర అన్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో డిప్యూటి స్పీకర్ గా ఉండడం జరిగిందని గుర్తు చేశారు. టిడిపి హాయంలో కేబినెట్ మంత్రిగా ఉన్నా కూడా కరెంటు బిల్లులను వ్యతిరేకించడం జరిగిందని తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఉరిశిక్ష అంటూ ఆనాటి సీఎంకు లేఖ రాయడం జరిగిందన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ చలో అసెంబ్లీ రావడం..పట్టపగలే బషీర్ బాగ్ లో కాల్పులు జరపడం..పలువురు చనిపోవడం జరిగిందన్నారు. ఇక న్యాయం జరగదనే ఉద్ధేశ్యంతో తెలంగాణ ఉద్యమం ప్రారంభించడం జరిగిందని కేసీఆర్ వివరించారు.

ఎన్నో సమస్యలు...
ఉద్యమం ప్రారంభించిన సమయంలో అనేక ఒడిదుడుకులు ఎదురయ్యాయని, జాతీస్థాయిలో పలు పార్టీలు కలిసి రావడం జరిగిందన్నారు. పోలీసుల లాఠీఛార్జీలు, ఆత్మబలిదానాలు, ఆత్మహత్యల మధ్య 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఆ సమయంలో ఎన్నికలు జరిగాయని, టీఆర్ఎస్ కు ప్రజలు పట్టం కట్టారని తెలిపారు. నీళ్లు..నిధులు..నియామకాలపై ఉద్యమం జరిగిందని తెలిపారు. ఇప్పటికే రెండు సాధించినట్లు, ఖచ్చితంగా మన రాష్ట్ర పరిధిలో నిధులు ఖర్చు అవుతాయని, నియామకాల విషయంలో పలు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

మ.నగర జిల్లా నుండి 20 లక్షల మంది వలస : కేసీఆర్

హైదరాబాద్ : టీ.అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలా అన్నారు...కేవలం మహబూబ్ నగర్ జిల్లా నుండే 20 లక్షల మంది వలస వెళ్ళారు. టీటీపీలో వున్నప్పుడు కూడా ఆనాడు పెంచిన విద్యుత్ చార్జీలను వ్యతిరేకిస్తూ ఆనాటి సీఎంకు లేఖ రాశాను. చెరువులన్నీ అంతరించిపోయాయి. పర్యావరణ సమతుల్యత దెబ్బతిని వర్షపాతం తగ్గిపోయింది. చిన్న నీటి పారుదల వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఉమ్మడి రాష్ట్రంలో రైతుల పరిస్థితి దుర్భరంగా వుండేది.. అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ ఏర్పడింది. నీళ్ళు, నిధులు, ఉద్యోగాల గురించే తెలంగాణా ఉద్యమం సాగింది.

తిరిగి ప్రారంభమైన టీ.అసెంబ్లీ...

హైదరాబాద్ : ఉదయం 11 గంటలకు మొదలైన టీ.అసెంబ్లీ ప్రాంభమైన కొద్దిసేపటికే స్పీకర్ తేనీరు విరామం ప్రకటించారు. అనంతరం సభ ప్రారంభమయ్యింది.

కాపు ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ....

హైదరాబాద్ : కాపు వర్గానికి చెందిన ప్రజాప్రధునిధులతో సీఎం చంద్రబాబు భేటీ ప్రారంభమయ్యింది. ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులు సీఎం చంద్రబాబును పూలమాలతో సత్కరించారు.  

11:35 - March 31, 2016

హైదరాబాద్ : ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని టిడిపి ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ వాయిదా పడిన అనంతరం మీడియా పాయింట్ వద్ద ఆర్.కృష్ణయ్య మాట్లాడారు. పోలీసు డిపార్ట్ మెంట్ లో 5.70 వేలు, డీఎస్సీకి 4 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. నిరుద్యోగుల 12 -15 లక్షల మంద్రి మాత్రమే ఉన్నారని కొంతమంది పేర్కొంటున్నారని కానీ సీఎం మాత్రం కోటి మందికిపైగా ఉన్నారని చెబుతున్నారని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలతో సమాజాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. నీళ్లు..నిధులు..నియామకాల సమస్యలపై తెలంగాణ ఉద్యమం జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుతం 43 వేల టీచర్ల పోస్టులు..3,755 జూనియర్ లెక్చరర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. రెండు సంవత్సరాల అవుతున్నా ఇంతవరకు ఖాళీలు భర్తీ చేయకపోవడం దారుణమన్నారు. భర్తీ చేయకపోతే కేటాయించిన బడ్జెట్ మిగులుతుందని, నిరుద్యోగుల పొట్ట కొట్టే విధంగా చేయకూడదని ఆర్.కృష్ణయ్య సూచించారు. 

ప్రారంభమైన టీ.అసెంబ్లీ.....

హైదరాబాద్ : తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. చిన్న, సన్నకారు రైతులకు రుణమాఫీకి కమిషన్ ఏర్పాటు బిల్లు, కార్మికులు, గ్రామీణ వృత్తిదారులకు ఆర్థిక సహాయంపై కమిషన్ ఏర్పాటులపై సభలో చర్చ జరుగనుంది. సభ మొదలైన కొద్దిసేపటికే కొన్ని నిమిషాలు వాయిదా పడింది.

11:22 - March 31, 2016

హైదరాబాద్ : చిన్న వ్యవసాయదారులకు రుణ సహాయానికి కమిషన్ ఏర్పాటు చట్టం బిల్లుపై తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చర్చ జరిగింది. బిల్లు ఉద్దేశ్యం విపత్కర పరిస్థితుల్లో రైతులను రుణవిముక్తులను చేయడం..కార్మికులు, గ్రామీణ వృత్తిదారుల రుణ సహాయం కోసం కమిషన్ ఏర్పాటు చేసినట్లు బిల్లును ప్రవేశ పెట్టిన మంత్రి మహమూద్ ఆలీ పేర్కొన్నారు. చిన్న, సన్న కారు రైతులకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, కరవు వల్ల అధిక సమస్యలు ఏర్పడ్డాయన్నారు. రూ. 50 వేల లోపు రుణాలు తీసుకునే వారికి 75 శాతం రుణవిముక్తి అదే విధంగా రూ. 50 వేల నుంచి లక్షలోపు రుణం తీసుకునేవారికి 50 శాతం రుణవిముక్తి కల్పనకే కమిషన్ ఏర్పాటు చేశారు. విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి ఛైర్మన్‌గా, నలుగురు సభ్యులతో రుణవిముక్తి కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు బిల్లుపై అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అనంతరం బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ మదుసూధనాచారి వెల్లడించారు. మరింత విషయాలకు వీడియో క్లిక్ చేయండి. 

కాసేపట్లో టీ.అసెంబ్లీ ప్రారంభం...

హైదరాబాద్ : కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల రీజనింగ్ పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి  హాజరవ్వకూడదని టీడీపీ, కాంగ్రెస్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

శ్రీవారి సేవలో ప్రముఖులు....

తిరుమల: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శనంలో కేంద్ర సహాయమంత్రి శ్రీపాద్‌ నాయక్‌, ఏపీ బీజేపీ ఫ్లోర్‌లీడర్‌ విష్ణుకుమార్‌రాజు దర్శించుకున్నారు. అనంతరం దేవాలయం అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

లాభాల్లో స్టాక్ మార్కెట్లు...

హైదరాబాద్‌ : వరుసగా మూడో రోజు కూడా స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. 109 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్‌, 31 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. ఐటీ, వాహన, ఇంధన రంగాలకు చెందిన షేర్లు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి.

పట్టుబడిన చైన్ స్నాచర్....

హైదరాబాద్‌: నగరంలో గొలుసు దొంగలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. వీరిని అదుపు చేయటానికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం వుండటంలేదు. కాగా గొలుసు చోరీలకు పాల్పడిన ఓ దొంగను ఎట్టకేలకు సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. జంట నగరాల్లో 14చోట్ల గొలుసు దొంగతనాలకు పాల్పడిన ఓ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడ్ని అరెస్టు చేసి అరకిలో బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

పావురాన్ని రక్షించబోయి ఇద్దరు మృతి...

ఢిల్లీ: పావురాన్ని కాపాడబోయి ఇద్దరు వ్యక్తులు కాలువలో పడి చనిపోయారు. ఢిల్లీలోని వజీరాబాద్‌కి చెందిన అనిల్‌ సాహ్ని అనే 19 ఏళ్ల బాలుడు తన ఇంటి వద్ద వాలిన పావురాలకు ఆహారం వేయటానికి వెళ్లాడు. ఓ పావురం డ్రైనేజ్‌ పైప్‌లో చిక్కుకుపోయింది. గమనించిన సాహ్ని దాన్ని రక్షించబోయి అదే కాలువలో పడిపోయాడు. అనిల్ ని రక్షించటానికి కాలువలోకి దూకిన నసీరుద్దీన్‌ అనే వ్యక్తి కూడా మృతిచెందాడు. మురుగు ఎక్కువగావుండటంతో వూపిరాడక ఇద్దరూ మృత్యువాత పడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇద్దరి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఆస్ట్రేలియా ప్రధానితో కేంద్రమంత్రి జైట్లీ భేటీ.....

ఢిల్లీ : భారత ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఈరోజు ఉదయం ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో ప్రధాన మంత్రి మాల్‌కోమ్‌ టర్న్‌బుల్‌తో సమావేశమయ్యారు. భారత ఆర్థిక వ్యవస్థ గురించి జైట్లీ ఆయనకు వివరించారు. భవిష్యత్తులో కూడా ఆర్థిక వృద్ధి సాధిస్తామని తెలిపారు. పలు వాణిజ్య అంశాలపై జైట్లీ ఆయనతో చర్చించారు. పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో భారత్‌కు సహకరించడానికి ఆస్ట్రేలియా సిద్ధంగా ఉందని టర్న్‌బుల్‌ స్పష్టంచేశారు. ఇరుదేశాల మధ్య ఆర్థిక లావాదేవీలు కొనసాగించేందుకు అవకాశముందని తెలిపారు. భారత పర్యటనకు రావాల్సిందిగా జైట్లీ కోరారు. 

హిమాచల్ ప్రదేశ్ లో భూప్రకంపనలు...

హైదరాబాద్ : హిమాచల్‌ప్రదేశ్‌లోని చాంబా ప్రాంతంలో ఈరోజు ఉదయం స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదనీ అకారులు తెలిపారు. ప్రకంపనల తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 3.8గా నమోదైంది.

10:20 - March 31, 2016

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వరసగా భేటీలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఆయన బీసీ సంఘం నేతలతో సమావేశమయ్యారు. కాపులను బీసీల్లో చేర్చితే ఎలాంటి సమస్యలు వస్తాయనే దానిపై సమగ్రంగా చర్చించారు. అనంతరం గురువారం ఉదయం కాపు నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర అధికారులు పాల్గొననున్నారు. కాపులను బీసీల్లో చేర్చుతామని గత ఎన్నికల్లో టిడిపి హామీనిచ్చిన సంగతి తెలిసిందే. కాపులకు కేటాయించిన రూ. వేయి కోట్ల బడ్జెట్ పక్కదారి పడుతోందని..కేవలం పచ్చచొక్కాలకే కేటాయిస్తున్నారనే విమర్శలు పెల్లుబికాయి. బీసీలో చేర్చడం..నిధులు పక్కదారి పక్కకుండా ఉండడం..ఇతరత్రా అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. బీసీలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించవద్దని, ఒక పద్ధతి ప్రకారం నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని బాబు సూచించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం టిడిపి ప్రజాప్రతినిధులతో బాబు సమావేశం కానున్నారు. అసెంబ్లీ జరిగిన తీరు, నీటి ఎద్దడి సమస్యలు..కాపు, బీసీల మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించనున్నారు. 

10:15 - March 31, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాసేపట్లో సంచలనానికి తెరదీయనున్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని పనిని ఆయన చేయబోతున్నారు. శాసనసభలోనే ఏకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి రంగంపై ఆయన ఈ ప్రజెంటేషన్ లో ఇవ్వనున్నారు. ఉదయం 11గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. స్వయంగా సీఎం కేసీఆర్ కంప్యూటర్ ను ఆపరేట్ చేస్తూ వివరించనున్నారు. అసెంబ్లీలో భారీ ఎల్ ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. సమగ్ర జల విధానంపై ఉన్న సందేహాలను కేసీఆర్ నివృత్తి చేయనున్నారు. ఐదు భాగాలుగా విభజించినట్లు తెలుస్తోంది. ఇందులో 108 స్లైడ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రసంగంపై సన్నద్ధమయ్యారు. ఈ ప్రసంగం రెండున్నర గంటల పాటు ఉంటుందని తెలుస్తోంది. మొదటి గంట..గంటన్నర పాటు 1956 ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణకు జరిగిన నష్టం గురించి వివరించనున్నారు. గోదావరి కృష్ణా నదులపై న్యాయమైన వాటా దక్కకపోవడం..ఫలితంగా..రైతాంగం సంక్షోభంలో పడిపోవడంపై ఆయన సమగ్రంగా విశదీకరించనున్నారు. 2014 ప్రాజెక్టుల వారీగా సమగ్ర సమచారాన్ని ఇవ్వనున్నారు. బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేష్ ట్రిబ్యునల్ లో తెలంగాణకు సరైన న్యాయం దక్కిందా ? అనే అంశంపై కూడా మాట్లాడనున్నారు.
మరోవైపు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు టి.కాంగ్రెస్ దూరంగా ఉంది. శాసనభలో కాకుండా ఇతర ప్రాంతాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే హాజరౌతామని పేర్కొంది. టిడిపి, బిజెపి పార్టీలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరి కేసీఆర్ ఇచ్చే 'జలదృశ్యం'పై ఎలాంటి స్పందన వ్యక్తమౌతుందో చూడాలి. 

కాసేపట్లో కాపు మంత్రులతో బాబు భేటీ..

హైదరాబాద్ : కాపు వర్గానికి చెందిన ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు కాసేపట్లో భేటీ కానున్నారు. కాపు కార్పొరేషన్ విధి విధానాలు, కాపులను బీసీలో చేర్చడం కాపుల సమస్యలు..తదితర అంశాలపై చర్చించనున్నారు. అనంతరం టిడిపి ప్రజాప్రతినిధులతో బాబు సమావేశం కానున్నారు. అసెంబ్లీ జరిగిన తీరు, నీటి ఎద్దడి సమస్యలు..కాపు, బీసీల మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించనున్నారు. 

మంత్రి తలసాని తనయుడిపై కేసు నమోదు..

హైదరాబాద్ : పంజాగుట్ట పీఎస్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి యాదవ్ పై కేసు నమోదైంది. బిల్డర్ రామకృష్ణలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంపీ కొత్తపల్లి గీత భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ 384, 342 కింద కేసును నమోదు చేశారు. 

09:22 - March 31, 2016

హైదరాబాద్ : ఎంపీ కొత్తపల్లి గీత భర్త రామకోటేశ్వరరావు కిడ్నాప్ ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ఈ కిడ్నాప్ వ్యవహారంలో తనయుడు ఉన్నట్లు వార్తలు రావడంతో గురువారం ఉదయం మీడియా సమావేశంలో మంత్రి తలసాని ఘటనకు సంబంధించిన పూర్వపరాలు తెలియచేశారు. తన కుమారుడికి కిడ్నాప్ తో సంబంధం లేదని స్పష్టం చేశారు. బలవంతంగా డాక్యుమెంట్లపై సంతకాలు చేయలేదని, తన కుటుంబాన్ని మోసం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఈ విషయంలో కమిషనర్, డీజీపీతో తాను మాట్లాడడం జరిగిందని, విచారణ చేయించాలని..ఈ ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని తాను కోరడం జరిగిందన్నారు.

అసలేం ఏం జరిగింది ? 
బిల్డర్ రామకృష్ణ, తన కుమారుడు సాయి కిరణ్ చిన్న వెంచర్లు చేస్తుండే వారని, 2013 సంవత్సరంలో రాజ రాజేశ్వరీ సంస్థకు చెందిన 53 ఎకరాల స్థలం ఉందన్నారు. ఇన్వెస్ట్ మెంట్ చేస్తే డబ్బులు వస్తాయనే ధోరణితో డబ్బులు పెట్టడం జరిగిందన్నారు. రామ కోటేశ్వరరావుతో డెవలప్ మెంట్ అగ్రిమెంట్ చేయించుకున్నట్లు తెలిపారు. తమతో అప్రోచ్ అయినప్పుడు వాళ్లింట్లోనే మూడు సార్లు చర్చలు జరిగాయని తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న హాయాంలో ఎన్ వోసీ తీసుకొస్తానని చెప్పిన రామ కోటేశ్వరరావు వాయిదాలు వస్తూ వస్తున్నాడన్నారు. తమ దగ్గర 2013 సంవత్సరంలో రూ. 11 కోట్లు తీసుకున్నాడని పేర్కొన్నారు. ఎంపీ కొత్తపల్లి గీత, భర్తలపై బ్యాంకులో ఏదో ఫ్రాడ్ చేశాడని సీబీఐ కేసు బుక్ అయ్యిందని తెలిపారు. ఈ నేపథ్యంలో మాట్లాడడానికి తాజ్ కృష్ణాకు వెళ్లి అక్కడున్న సోఫాలో కూర్చొని మాట్లాడరని తెలిపారు. రూ. 11 కోట్లు ఎప్పుడిస్తారని అడగా తన దగ్గర ఒక డాక్యుమెంట్ ఉందని..లెటర్ రాసిస్తానని చెప్పి సంతకం చేసిచ్చాడని మంత్రి తలసాని తెలిపారు. కానీ బలవంతంగా సంతకాలు చేయించారని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. తాజ్ కృష్ణా హోటల్ లో సీసీ ఫుటేజ్ లుంటాయని, తాజ్ కృష్ణాలో కిడ్నాప్ చేయడం ఏంటీ ? అని తలసాని ప్రశ్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వ్యక్తులు కూడా మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం శుక్రవారం మధ్యాహ్నం వివరాలు అందచేయడం జరుగుతుందన్నారు. 

బలవంతంగా సంతకాలు చేయించారు - రామ కోటేశ్వరరావు...
అంతకంటే ముందు తన భర్త రామ కోటేశ్వరరావును ఎవరో కిడ్నాప్ చేశారని ఎంపీ కొత్తపల్లి గీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి 12గంటల తరువాత వచ్చిన రామ కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. మంత్రి తలసాని తనయుడు తనతో కొన్ని లెటర్స్ పై బలవంతంగా సంతకాలు చేయించుకున్నాడని, డాక్యుమెంట్లు తీసుకున్నారని ఆరోపించారు. 

కిడ్నాప్ వ్యవహారంపై మంత్రి తలసాని స్పందన..

హైదరాబాద్ : ఎంపీ కొత్తపల్లి భర్త రామ కోటేశ్వరరావు కిడ్నాప్ వ్యవహారంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ఈ కిడ్నాప్ ఘటనతో తన కుమారుడికి సంబంధం లేదని స్పష్టం చేశారు. 

పహాడిషరీఫ్ లో చిన్నారి కిడ్నాప్..

హైదరాబాద్ : పహాడిషరీఫ్ షాహిన్ నగర్ లో కిడ్నాప్ కలకలం సృష్టించింది. రెండేళ్ల చిన్నారిని ఇద్దరు మహిళలు ఎత్తుకెళ్లారు. పీఎస్ లో చిన్నారి తండ్రి ఫిర్యాదు చేశారు. 

08:18 - March 31, 2016

ఢిల్లీ : కార్మికవర్గం మరోసారి కన్నెర్రజేసింది. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ...గతేడాది సెప్టెంబర్ 2న దేశ వ్యాప్త సమ్మె నిర్వహించినా..ప్రభుత్వం పట్టించుకోకపొవడంతో మరోసారి సెప్టెంబర్ 2న దేశవ్యాప్త సమ్మెకు దిగాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఢిల్లీలోని కాన్సిట్యూషన్ క్లబ్‌లో జరిగిన కార్మిక సంఘాల జాతీయ సదస్సులో కార్మిక హక్కులకోసం కార్మిక రంగంలో తీసుకురావాల్సిన సంస్కరణ వంటి అంశాలపై కార్మిక సంఘాల నేతలు చర్చించారు. సుదీర్ఘంగా జరిగిన జాతీయ కార్మిక సదస్సుకు ఐఎన్ టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, ఏఐటీయూసీ, టీయూసీసీ, ఎస్ ఈడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, యూటీమయూసీ, ఎల్పీఎఫ్ కార్మిక సంఘాల జాతీయ ప్రధానకార్యదర్శులు అధ్యక్షులు హాజరయ్యారు. వీరితో పాటు జాతీయ కార్మిక సదస్సుకు వివిధ కార్మిక సంఘాల నుండి దేశ వ్యాప్తంగా ఉన్న1200మంది కార్మిక సంఘాల నాయకులు హాజరయ్యారు.

హాజరు కానీ బీఎంఎస్..
అయితే కార్మిక సంఘాల జాతీయ కార్మిక సదస్సుకు మద్దతిచ్చిన బిజెపి అనుబంధ కార్మిక సంఘం బీఎంఎస్ మాత్రం సదస్సుకు హాజరు కాలేదు. ప్రభుత్వం కార్మిక ఐకమత్యాన్ని విచ్చిన్నం చేసేందుకు ప్రయత్నిస్తుందని ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మిక సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మిక సంఘాలు ఉద్యమాల ద్వారానే తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని నిర్ణయించారు. నిరుద్యోగలకు ఉద్యోగ కల్పన, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ, కనీస వేతనాలు, ధరల పెరుగుదలను అరికట్టడం సహా 12 డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో విదేశీ పెట్టుబడులను అనుమతించడాన్ని కార్మిక సంఘాల నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. బడ్జెట్‌లో ఆరు లక్షల కోట్ల రూపాయాలు కార్పోరేట్ సంస్థలకు పన్ను మినహాయింపులిచ్చి పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో కార్మిక పోరాటలకు క్షేత్ర స్దాయి నుండి బలపరిచి ఉద్యమాల ద్వారా తమ డిమాండ్లను సాధించుకుంటామన్నారు కార్మిక సంఘాల నాయకులు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి...తమ సమస్యలు పరిష్కరించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే..ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. 

08:14 - March 31, 2016

హైదరాబాద్ : విశాఖపట్టణం ఎంపీ కొత్తపల్లి గీత భర్త రామ కోటేశ్వరరావు కిడ్నాప్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయి యాదవ్ హస్తం ఉందా ? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. తన భర్తను ఎవరో కిడ్నాప్ చేశారంటూ ఎంపీ కొత్తపల్లి గీత బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం అర్ధరాత్రి 12గంటల సమయంలో రామ కోటేశ్వరరావు వచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను రామ కోటేశ్వరరావు మీడియాకు తెలిపారు. రాయదుర్గంలో తనకు 53 ఎకరాల భూమి ఉందని, 2008-09 రిజిస్ట్రేషన్ అయ్యిందని తెలిపారు. రాజరాజేశ్వరీ కన్ స్ట్రక్షన్ అనే కంపెనీ రెండు సంవత్సరాల క్రితం తనను సంప్రదించడం జరిగిందన్నారు. జాయింట్ వెంచర్ చేయడానికి వీరు సిద్ధమయ్యారని, అడ్వాన్స్ మొత్తం వచ్చేదాక సంతకాలు చేయనని తాను చెప్పడం జరిగిందన్నారు. తరువాత సుమారు రూ. 9 కోట్ల వరకు అందచేసినట్లు, కానీ వెంచర్ విషయంలో నిర్లక్ష్యం వహించారన్నారు. ఈ విషయంలో తాను ఆరు నెలలు ఓపిక పట్టిన అనంతరం కన్ స్ట్రక్షన్ కంపెనీకి చెందిన షేర్ హోల్డర్స్ తో తాను మాట్లాడినట్లు తెలిపారు. అమౌంట్ పే చేయలేదు కనుక తాను ఇతరులతో సంప్రదించడం జరుగుతుందని, ప్రస్తుతమున్న వ్యాపార పరిస్థితుల మధ్య అడ్వాన్స్ గా ఇచ్చిన డబ్బు తాను ఇవ్వలేకపోతున్నట్లు వారికి తెలియచేసినట్లు, ఇందుకు వడ్డీ చెల్లిస్తానని చెప్పడం జరిగిందన్నారు. కానీ డబ్బులు కావాలంటూ వారు వత్తిడి చేశారని, ఈ నేపథ్యంలో బుధవారం తాజ్ కృష్ణ కు రావాలని రామకృష్ణ పిలిచాడని తెలిపారు. అక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి యాదవ్ కూడా ఉన్నారని పేర్కొన్నారు. చాలా రాష్ గా మాట్లాడరని, కానీ తాను మాత్రం స్మూత్ గా హ్యాండిల్ చేయాలనే ఉద్దేశ్యంతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. వర్జినల్ డాక్యుమెంట్లు లేవని పేర్కొనడంతో తాను వెళ్లి తీసుకొస్తానని చెప్పడం జరిగిందన్నారు. వెళితే రావని పేర్కొంటూ అక్కడే కూర్చొబెట్టారని, అనంతరం మంత్రి తలసాని కుమారుడు భూముల రిజిస్ట్రేషన్ పత్రాలను తీసుకున్నాడని ఆరోపించారు. అతను రాసిన మూడు లెటర్స్ పై తాను సంతకాలు చేసినట్లు, లెటర్ లో ఏముందో కూడా చూడలేదన్నారు. అతనితో మాట్లాడడం జరిగిందని, కిడ్నాప్ జరగలేదని ఏసీపీ పేర్కొన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడితో వాగ్వాదం జరిగినట్లు తెలిసిందన్నారు. పూర్తి కంప్లైట్ ఇవ్వలేదని ఏసీపీ పేర్కొన్నారు. ఈ ఘటనపై మంత్రి తలసాని ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

07:30 - March 31, 2016

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై కాగ్ అంక్షితలు వేసింది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి బుధవారం కాగ్ నివేదికలను ఆయా ప్రభుత్వాలు శాసనసభలో ప్రవేశ పెట్టాయి. తెలంగాణలో ఆయా శాఖల వైఫల్యాలను తప్పుబట్టింది. అధికారుల విధానాలతో ఖజానాకు గండి పడుతోందని ఏపీ ప్రభుత్వంపై కాగ్ వ్యాఖ్యలు చేసింది. అనేక రంగాల్లోనూ ఆర్థిక నిర్వాహణ సక్రమంగా లేదని కాగ్ నివేదికలు మరోమారు స్పష్టం చేశాయి. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో శశికుమార్ (విశ్లేషకులు), రామకృష్ణ ప్రసాద్ (టిడిపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

07:24 - March 31, 2016

కివి.. ఎన్నో ఔషధ గుణాలను కల్గిన పండు. ఈ పండు బయట లేత ముదురు రంగులోను, లోపల ఆకుపచ్చ రంగులోను ఉండటం వల్ల చాలా ఆకర్షణీయంగా చూసిన వెంటనే తినాలనిపిస్తుంది. ఇందులో మన శరీరానికి కావలసిన విటమిన్‌ 'సి' పుష్కలంగా లభిస్తుంది. ఈ పండు అరటి, అనాస, స్ట్రాబెర్రీ రుచులను కలిగి ఉంటుంది.

ఎలా ఎంచుకోవాలి?
కివి పండ్లను తీసుకునేటపుడు లేత ఆకుపచ్చ రంగులో ఉండి మెత్తగా, మంచి సువాసన కల్గిన వాటిని మాత్రమే ఎంచుకోవాలి. రంగు మారి, ముడుతలు పడిన వాటిని తీసుకోవద్దు.

చర్మానికి ఎంతో మేలు..

  • ఈ పండులో ఉండే విటమిన్‌ సి, ఇ వ్యాధి నిరోధకాలుగా పనిచేస్తాయి.
  • ఇది శరీరంలోని మలినాలను బయటకు పంపటంతో పాటు చర్మాన్ని మృదువుగా, యవ్వనంగా ఉంచడంలో దోహద పడుతుంది. 
  • కివి పండులో ఉన్న ఒమేగా-3 ఫాటీ ఆమ్లాలు చర్మ వ్యాధులు రాకుండా చేస్తాయి.
  • కివిలో కాపర్‌ ఉండటం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. జుట్టు సహజసిద్ధమైన రంగును కల్గి ఉంటుంది.
  • దీన్ని పేస్టులా చేసి ముఖంపై ఆప్లై చేయటం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి.
  • ఇందులో ఉన్న జింక్‌, ఫాస్పరస్‌, మెగ్నీషియం, ఐరన్‌ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
  • గర్భిణులకు కివిలో ఉన్న ఫోలిక్‌ యాసిడ్‌, పీచు పదార్థాలు బాగా ఉపయోగపడతాయి.
  • ఇందులో ఉన్న సెరాటాయిల్‌కు మనిషి ఆలోచనలను మార్చే శక్తి ఉంది. ఉత్సాహాన్ని పెంచుతుంది. ఎప్పుడన్నా అలసటగా ఉన్నప్పుడు కివి పండు తిని చూడండి. మీ అలసట ఇట్టే దూరమవుతుంది.


మరిన్ని ఉపయోగాలు..
కివిలో విటమిన్‌-సి, విటమిన్‌-ఇ ఉండటం వల్ల కళ్లకు ఏ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఇది గుండెను రక్షిస్తుంది. డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుంది. ఆస్తమాను తగ్గిస్తుంది. బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. క్యాన్సర్‌తో పోరాడుతుంది. దీన్ని అల్పాహారంగా తీసుకోవడం ఎంతో మంచిది. దీన్ని జ్యూస్‌, సలాడ్‌లలో వాడొచ్చు. దీన్ని కట్‌చేసి కమలా పండుతో కలుపుకొని తినొచ్చు. ఇన్ని ఉపయోగాలు ఉన్న కివి పండును రోజూ మీ ఆహారంలో చేర్చుకోండి.

07:22 - March 31, 2016

పెరట్లో ఒక తులసి మొక్క ఉంటే చాలు ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉండవచ్చనే మాటలు అక్షర సత్యాలనవచ్చు. ఎందుకంటే తులసిలో ఉండే ఔషధ గుణాలు సకల రోగాలను నివారిస్తాయి కాబట్టి. ఆరోగ్యపరంగా, సౌందర్యపరంగా తులసి చేసే మేలు అంతా ఇంతా కాదు. లక్ష్మి తులసి, కృష్ణ తులసి అని రెండు రకాలుగా పిలువబడే ఈ తులసి వల్ల మనకు కలిగే లాభాలేంటో తెలుసుకుందామా..?
మానసిక ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు తులసి ఆకులతో తయారు చేసిన కషాయం తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే ఈ ఆకులతో ఆవిరి పట్టినా, వాసన చూసినా మంచి ప్రభావం కనిపిస్తుంది. ఇలా చేయడాన్నే ఆరోమా థెరపీ అంటారు.
నీడలో ఆరబెట్టిన తులసి ఆకులను పొడి చేసి, ఒక స్పూన్‌ పొడికి, చిటికెడు సైంధవ లవణం చేర్చి పళ్ళు తోముకుంటే పంటి నొప్పి, చిగుళ్ళు నొప్పి, నోటి దుర్వాసన వంటి సమస్యల్ని నివారించుకోవచ్చు. తులసి రసంలో కాస్త నిమ్మరసం కలిపి రాసుకుంటే చర్మ సంబంధ సమస్యలు మటుమాయమవుతాయి.
తులసి ఆకుల పొడిని పెసరపిండిలో కలిపి ఒంటికి రాసుకుని స్నానం చేస్తే చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. మొటిమలు తొందరగా తగ్గుతాయి. తులసి ఆకుల కషాయం జ్వరం తీవ్రతను తగ్గిస్తుంది.
తులసి కషాయంలో ధనియాల పొడి, దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకుంటే జ్వరంతో బాధపడేవారి అధిక దాహం సమస్యను నివారిస్తుంది. వీటి ఆకులతో ఆవిరి పడితే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. తులసి కషాయం, అల్లం రసం సమపాళ్ళలో కలిపి తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది. 

07:19 - March 31, 2016

వేసవిలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని రకాల కూరలు, పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు న్యూట్రిషనిస్టులు. ఇందులో ప్రధానమైనది తాజా నిమ్మరసం. దీన్ని తప్పనిసరిగా తాగాలి. అంతేకాదు కొంచెం ఉప్పు, నిమ్మరసం, కొద్దిగా పసుపు కలిపి వారానికి రెండు సార్లయినా పళ్ళు తోముకుంటే పలువరుస మెరవడమే కాకుండా, చిగుళ్ళవ్యాధులు ఉన్న వారికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. 'సి' విటమిన్‌ సమృద్ధిగా లభించి చర్మం కాంతులీనుతుంది.
ప్రతిరోజూ పరగడుపుమృన ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళలో ఒక నిమ్మ రసం కలుపుకొని, కొంచెం ఉప్పు కలిపి తాగితే ఊబకాయం తగ్గుతుంది. అలాగే శరీరంలోని మలినాలను తొలగించడంలో కీరదోస పాత్ర కీలకం. విటమిన్‌ 'సి' తోపాటు ఐరన్‌ సమృద్ధిగా లభించే పుదీనా జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.
నిమ్మరసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే, జీర్ణశక్తిబాగుంటుంది. ఒంట్లో కొవ్వు శాతం తగ్గుతుంది. ఇవే కాకుండా బత్తాయి, క్యారెట్‌, అల్లం, తేనెతో తయారుచేసే రసాలు చర్మానికి మేలు చేస్తాయి. బత్తాయి రోగనిరోధక శక్తిని పెంచితే, అల్లం జీర్ణసంబంధ సమస్యలను దూరం చేస్తుంది. దీంతో చర్మం నిగనిగలాడుతుంది. 

07:13 - March 31, 2016

బాలీవుడ్‌ హీరోయిన్లు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనె ఇప్పటికే హాలీవుడ్‌లో తామేమిటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. 'క్వాంటికో' టెలివిజన్‌ సిరీస్‌తో హాలీవుడ్‌ ప్రేక్షకులకు సుపరిచితురాలైన ప్రియాంక తాజాగా 'బేవాచ్‌' హాలీవుడ్‌ చిత్రంలోనూ నటిస్తోంది. అలాగే దీపికా పదుకొనె 'త్రిఫుల్‌ ఎక్స్' యాక్షన్‌ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. వీళ్ళ మాదిరిగానే మీరూ హాలీవుడ్‌కి వెళ్ళాలనుకుంటున్నారా అని కరీనాకపూర్‌ని మీడియా అడిగితే, ఎవ్వరూ ఊహించని సమాధానం చెప్పింది. ఆ సమాధానం ఆమె మాటల్లోనే, 'నాకు హాలీవుడ్‌ మీద ఆసక్తి లేదు. మన బాలీవుడ్‌ సినిమాల్ని ప్రపంచంలోని ప్రజలందరూ చూస్తున్నారు. పైగా పలు రకాల భాషల్లోకి కూడా అనువాదమవుతున్నాయి. అలాంటప్పుడు ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి నటించాల్సిన అవసరం ఏముంది?. హాలీవుడ్‌లో పని చేయాలంటే మరింత శక్తి, డెడికేషన్‌ అవసరం. అవి నాలో ఉన్నాయని నేననుకోవడం లేదు' అని నిర్మొహమాటంగా చెప్పేసింది. ఆర్‌.బల్కీ దర్శకత్వంలో కరీనా నటించిన 'కీ అండ్‌ కా' చిత్రం ఇటీవల విడుదలై ఆదరణ పొందుతోంది.

07:09 - March 31, 2016

విజయ్‌, సమంత, అమీ జాక్సన్‌ హీరోహీరోయిన్లుగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న 'థెరి' చిత్రాన్ని తమిళ నిర్మాత కలైపులి ఎస్‌.థానుతో కలిసి నిర్మాత దిల్‌ రాజు తెలుగులో విడుదల చేస్తున్న సంగతి విదితమే. తెలుగులో ఈచిత్రానికి 'పోలీసోడు' అనే టైటిల్‌ని ఖరారు చేసినట్టు సమాచారం. సెన్సార్‌ క్లీన్‌ 'యు' సర్టిఫికెట్‌ పొందిన ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 14న తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట.

07:08 - March 31, 2016

'జనతా గ్యారేజ్‌' చిత్రం కోసం ఎన్టీఆర్‌ గడ్డంతో సరికొత్త లుక్‌తో కనిపిస్తున్న ఫొటోలు ప్రస్తుతం సామాజిక మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో 'జనతా గ్యారేజ్‌' చిత్రం రూపొందుతున్న విషయం విదితమే. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి ఓ షెడ్యూల్‌ ముంబైలో జరిగింది. షూటింగ్‌ సందర్భంగా సెట్‌లో తీసిన కొన్ని ఫొటోలిప్పుడు సోషల్‌ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. ఎన్టీఆర్‌ అభిమానులు ఫేస్‌బుక్‌ ద్వారా ఈ ఫొటోలను పోస్ట్ చేసి, 'జనతా గ్యారేజ్‌' ముంబై షూటింగ్‌ షెడ్యూల్‌లో తీసిన ఫొటోలుగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్‌ హైదరాబాద్‌లోని సారధిలో స్టూడియోలో ఏకధాటిగా జరుగుతోంది. వైవిధ్యమైన కథ, కథనంతో సాగే ఈచిత్రంలో ఎన్టీఆర్‌ రెండు భిన్న షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్‌ సరసన సమంత, నిత్యమీనన్‌ నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళనటుడు మోహన్‌లాల్‌ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

07:06 - March 31, 2016

పవన్‌కళ్యాణ్‌ కథానాయకుడిగా కె.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో పవన్‌కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్, నార్త్ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ పతాకాలపై శరత్‌మరార్‌, సునీల్‌ లుల్లా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి రెండు పాటల చిత్రీకరణ స్విట్జర్లాండ్‌లో జరుగుతోంది. పవన్‌కళ్యాణ్‌, కాజల్‌పై ఈ పాటలను చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాంగ్‌ షూటింగ్‌లో దిగిన ఫొటోలను కథానాయిక కాజల్‌ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. స్విట్జర్లాండ్‌ షూటింగ్‌లో సర్దార్‌ గబ్బర్‌సింగ్‌తో రాజకుమారి ఆర్షి అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా పవన్‌కళ్యాణ్‌ నటించిన ఈచిత్రంలో రాజకుమారి ఆర్షిగా కాజల్‌ నటించింది. 'స్విట్జర్లాండ్‌లో పాటల చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. మరో రెండు రోజుల్లో సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తవుతాయి. ఏప్రిల్‌ 8న ఈ చిత్రం తెలుగులోనే కాకుండా హిందీలోనూ విడుదలవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నాం. ప్రేక్షకులకు ఆద్యంతం వినోదాన్ని అందించే పవన్‌ మార్క్ చిత్రమిది' అని నిర్మాత శరత్‌మరార్‌ తెలిపారు.

07:04 - March 31, 2016

ఢిల్లీ : టీ20 ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలో వరుస విజయాలతో సెమీస్‌లోకి దూసుకొచ్చిన న్యూజిలాండ్‌... సెమీ ఫైనల్‌లో చతికిలపడింది. ఢిల్లీ ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో బుధవారం రాత్రి జరిగిన తొలి సెమీస్‌లో ఇంగ్లాండ్ చేతిలో న్యూజిలాండ్ ఘోర పరాజయం చవిచూసింది. టాస్‌ ఓడి న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్‌ గప్తిల్‌ 11 బంతుల్లో 15 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్‌ విలియమ్సన్‌ 28 బాల్స్‌ ఆడి మూడు ఫోర్లు ఒక సిక్సర్‌తో 32 పరుగులు చేశాడు. అయితే గప్తిల్ తర్వాత వచ్చిన మన్రో చెలరేగి ఆడి స్కోర్‌ను అమాంతం పెంచేశాడు. 32 బాల్స్ ఎదుర్కొన్న మన్రో 7 ఫోర్లు ఒక సిక్సర్‌తో 46 పరుగులు చేశాడు. ఐదో ఓవర్‌లో హ్యాట్రిక్‌ ఫోర్లు బాదిన మన్రో... కెప్టెన్‌ విలియమ్సన్‌తో కలిసి రెండో వికెట్‌కి 74 పరుగుల పార్ట్నర్‌షిప్ నెలకొల్పాడు.

జోడిని విడదీసిన ఆలీ..
ఇలా ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని స్పిన్నర్‌ మొయిన్‌ అలీ విడదీశాడు. సరైన షాట్ కొట్టలేక విలియమ్సన్‌ బౌలర్‌ అలీకే క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. కాసేపటికే మన్రో కూడా ఔటవ్వడంతో న్యూజిలాండ్‌ స్కోరు బోర్డు నెమ్మదించింది. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ అండర్సన్‌ కాసేపు కివీస్ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఆండర్సన్ 28 పరుగులు చేసి ఫర్వాలేదనిపించినా ధాటిగా ఆడే టేలర్‌ మాత్రం నిరాశపరిచాడు. టేలర్ 6 పరుగుల వద్ద ఔటవ్వగా రోంచి 3, శాంట్నర్‌ 7 పరుగులే చేసి పెవిలియన్ చేరారు. ఇలా వరుసగా వికెట్లు కూలడంతో భారీ స్కోర్‌ చేయాల్సిన న్యూజిలాండ్‌ 153 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో బెన్‌ స్టోక్స్ 26 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.

జాసన్ మెరుపు ఇన్నింగ్స్..
154 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లాండ్‌ జాసన్ రాయ్ సూపర్‌ బ్యాటింగ్‌తో అలవోకగా విజయం సాధించింది. ఓపెనర్‌ రాయ్‌ ఒక్కడే 44 బంతుల్లో 78 పరుగులు చేసి గట్టి పునాదేశాడు. రాయ్‌ స్కోర్‌లో 11 ఫోర్లు, రెండు సిక్సర్లున్నాయి. జాసన్ మెరుపు ఇన్నింగ్స్ తో లక్ష్యం కరిగిపోయింది. కివీస్ మరో ఓపెనర్‌ హేల్స్ 19 బంతుల్లో 20 పరుగులు చేశాడు. అయితే జట్టు విజయానికి 44 బంతుల్లో 47 పరుగులు అవసరమైన దశలో రాయ్‌ రెండో వికెట్‌ రూపంలో ఔటైనా మిగతా పనిని రూట్‌, బట్లర్ పూర్తిచేశారు. రూట్ 27 పరుగులు చేయగా బట్లర్‌ 2 ఫోర్లు మూడు సిక్సర్లతో మెరుపులు మెరిపించాడు. 17 బంతులాడిన బట్లర్ 32 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో 17.1 ఓవర్లలోనే ఇంగ్లాండ్ లక్ష్యాన్ని ఛేదించింది. నేడు భారత్‌ వెస్టిండీస్‌ మధ్య జరిగే సెకండ్ సెమీ ఫైనల్ విన్నర్‌తో ఇంగ్లాండ్ ఏప్రిల్‌ 3న ఫైనల్లో తలపడనుంది.

బోల్తాపడిన లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..

అనంతపురం : బుక్కరాయ సముద్రం మండలం వడియంపేట వద్ద లారీ బోల్తా పడింది. ఈ లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. 

నేడు బిజెపి, టిడిపి పార్టీల సమావేశం..

హైదరాబాద్ : తెలంగాణ బిజెపి, టిడిపి పార్టీలు ఉదయం 9గంటలకు సమావేశం కానున్నాయి. సీఎం కేసీఆర్ చేపట్టే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు హాజరు కావాలా ? వద్దా ? అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నాయి. 

06:57 - March 31, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ తీరు అతి పేలవంగా ఉందని కాగ్‌ పేర్కొంది. తొలి బడ్జెట్‌ ప్రతిపాదనలకు, ఖర్చుకు మధ్య భారీ అంతరం ఉందని వెల్లడించింది. పాలనాపరమైన అనుమతుల జాప్యంపైనా కాగ్‌ అక్షింతలు వేసింది. తెలంగాణ అసెంబ్లీలో 2014 -2015 ఆర్థిక సంవత్సరపు కాగ్ నివేదికను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో ఆర్థిక నిర్వహణ పేలవంగా ఉందని కాగ్ తన నివేదికలో పేర్కొంది. 2014-15 బడ్జెట్ అంచనాలు అవాస్తవికంగా ఉన్నాయని ఆరోపించింది. తెలంగాణ తొలి బడ్జెట్ కేటాయింపులు ఒక లక్షా పదమూడు వందల ఇరవై మూడు కోట్లు కాగా, ఖర్చు చేసింది 64 వేల 097 కోట్లు మాత్రమేనని కాగ్ పేర్కొంది.విధి విధానాలు, పాలనాపరమైన అనుమతుల మంజూరులో జాప్యంతో తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదని కాగ్ ఆక్షేపించింది.

అనుమతి లేకుండా రూ.304 కోట్లు ఖర్చు..
అసెంబ్లీ అనుమతి లేకుండా రూ. 304 కోట్లు ఖర్చు పెట్టిందని వెల్లడించింది. అలాగే రూ. 2555 కోట్లు గంపగుత్తగా కేటాయించినట్లు కాగ్ గుర్తించింది. ద్రవ్యలోటు మాత్రం ఎఫ్ఆర్బీఎం చట్టం పరిధిలోనే ఉందని స్పష్టం చేసింది.కొన్ని శాఖల్లో కేటాయింపులు, ఖర్చుల మధ్య భారీగా వ్యత్యాసాన్ని గుర్తించినట్లు కాగ్‌ నివేదించింది. రెవెన్యూ వ్యయం బడ్జెట్ అంచనాల కంటే 36.49 శాతం తక్కువగా ఉందని, అలాగే రెవెన్యూ రాబడులు కూడా బడ్జెట్ అంచనాల కంటే 36.27 శాతం తక్కువ అని కాగ్ తన నివేదికలో తెలిపింది. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల్లో ప్రభుత్వ ఉద్యోగులు రెండు సార్లు జీతాలు డ్రా చేశారని కాగ్ గుర్తించింది. ఇలా ఉద్యోగులు రూ.1.58 కోట్ల నిధులను కాజేశారని కాగ్ ఆక్షేపించింది. పౌర సరఫరాల సంస్థ వద్ద బియ్యం నిల్వలు పేరుకుపోయాయని, నిర్వాహణ లోపం వల్లే ఇలా జరిగిందని వెల్లడించింది. ఇక బీబీనగర్‌ నిమ్స్ పనులు ఆగిపోయి 88 కోట్ల ప్రజాధనం వృధా అయినట్లు కాగ్‌ పేర్కొంది. అలాగే సదాశివ్‌ పేట మంచినీటి పథకానికి ప్రణాళిక లోపం వల్ల 6 కోట్లు వృధా అవగా, ప్రైమరీ స్కూల్‌ డ్రా పౌట్స్ సంఖ్య 26 శాతం పెరిగినట్లు కాగ్‌ పేర్కొంది. ఇక సబ్సిడీలు, కేంద్రీయ రోడ్ల నిధి లోపాలు అనేకం ఉన్నాయని, బడ్జెట్ రూపకల్పనలోని లోపాన్ని సూచిస్తోందని కాగ్‌ రిపోర్టు తేల్చింది. 

06:35 - March 31, 2016

ఆంధ్రప్రదేశ్ లో ఉపాధి హామీ కూలీలు పోరుబాటపట్టారు. ఏప్రిల్ 2న అంటే శనివారం నాడు ఛలో విజయవాడ కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం పిలుపునిచ్చింది. వీరి ఆందోళనకు కారణం ఏమిటి? ఉపాధి హామీ పథకంలో వచ్చిన తాజా మార్పులేమిటి? ఉపాధి హామీ పథకంలో వస్తున్న మార్పులు గ్రామీణ పేదల జీవితాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి? కరువు తాండవిస్తున్న ఈ రోజుల్లో ఉపాధి హామీ పథకం అమలు విషయంలో వ్యవసాయ కార్మిక సంఘాలు ఇచ్చే సూచనలేమిటి? ఈ అంశాలపై టెన్ టివి జనపథంలో మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు విశ్లేషించారు. మరిన్ని విషయాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:29 - March 31, 2016

హైదరాబాద్ : ప్రతిపక్ష పార్టీ ఆందోళనలు..ఎమ్మెల్యేల గొడవల మధ్య కొనసాగిన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారంతో ముగిసాయి. ఇవే సమావేశాలు పలు విశేషాలకు కేంద్రమయ్యాయి. సభ ప్రారంభమైన తొలినాళ్లలో జోరుగా వాయిదాల పర్వం కొనసాగినా చివర్లో సజావుగా సాగింది. విపక్షం ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వంపైనా స్పీకర్‌పైనా ఒకే సెషన్‌లో అవిశ్వాస తీర్మానాలు పెట్టి భంగపడింది. కేవలం బడ్జెట్ సమావేశాలే కాదు హైదరాబాద్‌లోనూ ఇవే ఆఖరి ఏపీ అసెంబ్లీ సమావేశాలయ్యాయి. ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ అంశం, ప్రతిపక్షం పెట్టిన అవిశ్వాస తీర్మానాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల జీతాల పెంపు తదితర అనేక అంశాలకు ఈ సమావేశాలు వేదికయ్యాయి. ప్రభుత్వంపైనా స్పీకర్‌పైనా విపక్షం అవిశ్వాస తీర్మానం పెట్టి మైలేజ్ సాధించాలనుకుంది. అయితే అసెంబ్లీ బయటా లోపలా జరుగుతున్న పరిణామాలతో ఇబ్బంది పడిన వైసిపి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టబోయి తనే భంగపడింది. పార్టీ నుంచి వైదొలగినవారిని వేటు వేయించాలని చూసినా అధికార పక్షం ఎత్తుగడల ముందు ఎత్తులు పారలేదు.

వైసిపి అస్త్రాలు..
ద్రవ్య వినిమయ బిల్లు విషయంలో తమ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసినా వైసిపి అస్త్రాలు గురితప్పాయి. చివరకు అధికార పక్షం మూజువాణి ఓటుతో ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదింపజేసుకుని సభను నిరవధికంగా వాయిదా వేసింది. ఇక విపక్ష నేత జగన్ అధికార పక్ష నేత చంద్రబాబు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. రాజధాని భూములు, ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల చర్చ సమయంలో జగన్ ఒక్కరే మాట్లాడడం ఆ పార్టీలో చర్చనీయాంశమైంది. ఒకానొక దశలో మంత్రులపై వచ్చిన ఆరోపణలను నిరూపించేవరకు సభ జరిగేదిలేదని సిఎం తేల్చి చెప్పడంతో సభలో విపక్షం సందిగ్ధంలో పడింది. చివరకు సభ ముందుకు సాగని పక్షంలో చర్చ అసంపూర్ణంగానే ముగించాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే రోజా విషయం మూడు నాలుగు రోజులపాటు సభను కుదిపేసింది. గత సమావేశాల్లో సభ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు స్టే ఇచ్చినప్పటికీ రోజాను స్పీకర్‌ సభలోకి అనుమతించలేదు. దీంతో ఆమె అసెంబ్లీ ఎదుట నిరసనకు దిగారు. అసెంబ్లీ కార్యదర్శి ఏకసభ్య బెంచ్‌ తీర్పుపై డివిజన్ బెంచ్‌కు వెళ్లడంతో ఆ తీర్పుపై స్టే విధించింది. ప్రివిలేజ్‌ కమిటీ ఎమ్మెల్యే రోజాకు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఇదే సమయంలో మిగిలిన సభ్యులు ఇచ్చిన వివరణ పట్ల సంతృప్తి చెందిన కమిటీ... జ్యోతుల నెహ్రూ, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలపై చర్యలను ఉపసంహరించుకుంది. మరో ఎమ్మెల్యే కొడాలి నాని విషయంలో నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టింది.

15 రోజులు..
15 రోజులపాటు సాగిన సమవేశాల్లో 86 గంటలా 22 నిమిషాల పాటు సభ నడవగా 124 ప్రశ్నలకు సమాధానాలు లభించాయి. ముఖ్యమంత్రి 5 నివేదికలను సభ్యులకు అందించగా ప్రభుత్వం రెండు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపింది. ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతభత్యాలు పెంచుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. పెంచిన వేతనాల ప్రకారం సభ్యులకు గతంలో నెలకు 95 వేలు వస్తుండగా అది లక్షా 25 వేలకు చేరింది. సభ్యులకు ప్రతినెలా వసతి భత్యంగా ఇస్తున్న 25 వేలను 50 వేలకు పెంచారు. సభ్యుల ప్రయాణాల కోసం ఏటా ప్రస్తుతం 98,700 రూపాయలు చెల్లిస్తుండగా దాన్ని ప్రభుత్వం లక్ష రూపాయలకు చేర్చింది. మొదటిసారిగా సభ్యులు మ్యాగజైన్లు, పుస్తకాల కొనుగోలు చేసేందుకు కమిటీ సిఫార్సుల మేరకు ఏటా 20 వేల చొప్పున చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇక మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇచ్చే పెన్షన్లు 25 వేల నుంచి 50 వేలకు చేరింది. మృతిచెందిన మాజీల కుటుంబసభ్యులకు గతంలో ఎలాంటి పింఛనూ ఇవ్వలేదు. మారిన నిబంధనలతో ప్రస్తుతం వారికి నెలకు 25వేల వరకు పెన్షన్ అందుతుంది. పెరిగిన వేతనాలతో ప్రభుత్వంపై ఏటా 30 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది.

నగరంలో చివరి సమావేశాలు..
బుధవారంతో ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలే హైదరాబాద్‌లో జరిగిన చివరి సమావేశాలు అయ్యాయి. సమైక్య రాష్ట్రంలో, విభజన తర్వాత రెండేళ్లు కలిపి దాదాపు 60 ఏళ్లపాటు ఏపీ శాసనసభకు హైదరాబాద్ వేదికైంది. ఇకమీదట మండలి, శాసనసభ సమావేశాలు నూతన రాజధాని అమరావతిలో జరుగనున్నాయి. తాత్కాలిక సచివాలయం కోసం నిర్మిస్తున్న భవనాల్లోనే తదుపరి వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో సమావేశాలు ముగిసాయని సిఎం కూడా సభ్యులతో సహచరులతో అన్నారు. కొందరు అసెంబ్లీ ఎదుట సెల్ఫీలు తీసుకుని జ్ఙాపకాలను పదిలం చేసుకున్నారు.  

06:25 - March 31, 2016

హైదరాబాద్ : ఎవ‌రు వ‌చ్చినా రాకున్నా ప్రాజెక్టుల రీడిజైన్‌పై స‌భ‌లో ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేష‌న్ చేసేందుకే టి సర్కార్‌ సిద్ధమైంది. స‌భా సాంప్రదాయాల‌కు విరుద్ధంగా కేసిఆర్ వ్యవవ‌హ‌రిస్తున్నారంటూ ప్రధాన ప్రతిప‌క్షం కాంగ్రెస్ నారాజ్ అవుతోంది. మిగ‌తా పార్టీలు ప్రెజెంటేష‌న్‌కి అటెండ్ కావాలి... అందులోని లోటుపాట్లపై స‌ర్కార్‌ని నిలదీయాలని ఉద్దేశ్యంతో ఉన్నాయి. సిఎం కెసిఆర్ మాత్రం ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేష‌న్‌పై భారీగానే క‌స‌ర‌త్తు చేశారు. అసెంబ్లీ వేదిక‌గా ప్రాజెక్టుల రీడిజైన్లపై గురువారం సిఎం కెసిఆర్ పవ‌ర్ పాయింట్ ప్రజెంటేష‌న్ ఇవ్వనున్నారు. ఈ ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేష‌న్‌పై క్యాంపు కార్యాల‌యంలో సిఎం ఆల్రెడీ రిహార్సల్స్ చేశార‌ని స‌మాచారం. అసెంబ్లీలో ప్రస్తుత‌మున్న వీడియో కెమెరాల స్థానంలో పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేయ‌నున్నారు. గూగుల్ ఎర్త్ మ్యాపు స‌హాయంతో కెసిఆర్ ప్రాజెక్టుల రీడిజైన్ల గురించి వివ‌రించ‌నున్నారు. ముఖ్యమంత్రే స్వయంగా కంప్యూట‌ర్‌ను ఆప‌రేట్ చేస్తూ ప్రాజెక్టుల రీడిజైన్ల గురించి వివ‌రించ‌నున్నారు. గురువారం ఉద‌యం 11గంట‌ల‌కు ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేష‌న్‌ మొదలవుతుంది. పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్‌ త‌ర్వాత రెండుగంటలపాటు భోజ‌న విరామాన్ని ఇవ్వనున్నారు. తర్వాత విప‌క్షస‌భ్యుల సందేహాల‌కు సిఎం సమాధానాలిస్తారు. అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై ప్రధాన విపక్షమైన కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. పార్లమెంటరీ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సరికాదంటూ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అసెంబ్లీ హాల్‌లోనే పవర్ పాయింట్ ఇస్తే సభకు గైర్హాజ‌రు కావాల‌ని కాంగ్రెస్, టిడిపిలు డిసైడ్ అయ్యాయి. బిజేపీ, ఏమ్ఐఎమ్, వైసీపిలు మాత్రం హాజ‌రుకానున్నాయి. దీంతో ప్రధాన ప్రతిప‌క్షం లేకుండానే ఆ కార్యక్రమం కొనసాగనుంది.

వేరొక వేదికపై అయితే అంగీకారం..
అసెంబ్లీ హాల్‌లో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ రెండో సారి స్పీక‌ర్‌కు లేఖ రాసింది. స‌భ‌లో కాకుండా వేదిక‌ను వేరొకచోటకు మార్చితే త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని ప్రక‌టించింది. ఐతే స‌భ నిబంధన‌ల‌కు విరుద్ధంగా వ్యవహరించే సభ్యులపై చర్యలు తీసుకుంటామని చెబుతున్న స‌భాప‌తి...అదే ప‌నిచేస్తున్న సిఎంపై చర్యలు తీసుకోరా అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్ మాదిరే.. టిడిపి కూడా స‌భ‌కు గైర్హాజరు కావాలని స‌భ ప్రారంభానికి ముందు అధికారికంగా ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. స‌భ‌కు హాజ‌రుకావాలా వ‌ద్దా అనేదానిపై లెఫ్ట్ పార్టీలు అభిప్రాయం వ్యక్తం చేయాల్సుంది. అయితే శాస‌నమండ‌లి స‌భ్యులకు అసెంబ్లీ గ్యాల‌రీలో కూర్చునే ఏర్పాటు చేయ‌డంతో మెజార్టీ ఎమ్మెల్సీలు ఆగ్రహంతో ఉన్నారు. మొత్తానికి రాష్ట్రంలో తొలిసారిగా అసెంబ్లీ వేదిక‌గా జరగనున్న ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ అత్యంత చర్చనీయాంశంగా మారింది.

06:20 - March 31, 2016

విశాఖపట్టణం : అరకు ఎంపీ గీత భర్త రామకోటేశ్వరరావును కిడ్నాప్ చేశారన్న వార్త బుధవారం కలకలం రేగింది. ఈ కిడ్నాప్ విషయాన్ని ఎంపీ గీత బుధవారం రాత్రి మీడియాకు వెల్లడించారు. ఓ మంత్రి కుమారుడు, కన్ స్ట్రక్షన్ కంపెనీ యజమాని కలిసి తన భర్తను కిడ్నాప్ చేశారని కమిషనర్ కు గీత ఫిర్యాదు చేశారు. తాజ్ కృష్ణా హోటల్ లో బంధించారని, తన భర్త చేత బలవంతపు సంతకాలు చేయించేందుకు కిడ్నాప్ చేశారని ఆరోపించారు. రాత్రి 12 గంటల అనంతరం ఎంపీ గీత భర్తను దుండగులు విడిచిపెట్టారు.

53 ఎకరాల భూమి ఉంది - రామకోటేశ్వరరావు..
కిడ్నాప్ ఘటనకు సంబంధించిన వివరాలను రామకోటేశ్వరరావు మీడియాకు వివరించారు. రాయదుర్గంలో తనకు 53 ఎకరాల భూమి ఉందని, 2008-09 రిజిస్ట్రేషన్ అయ్యిందని తెలిపారు. రాజరాజేశ్వరీ కన్ స్ట్రక్షన్ అనే కంపెనీ రెండు సంవత్సరాల క్రితం తనను సంప్రదించడం జరిగిందన్నారు. జాయింట్ వెంచర్ చేయడానికి వీరు సిద్ధమయ్యారని, అడ్వాన్స్ మొత్తం వచ్చేదాక సంతకాలు చేయనని తాను చెప్పడం జరిగిందన్నారు. తరువాత సుమారు రూ. 9 కోట్ల వరకు అందచేసినట్లు, కానీ వెంచర్ విషయంలో నిర్లక్ష్యం వహించారన్నారు. ఈ విషయంలో తాను ఆరు నెలలు ఓపిక పట్టిన అనంతరం కన్ స్ట్రక్షన్ కంపెనీకి చెందిన షేర్ హోల్డర్స్ తో తాను మాట్లాడినట్లు తెలిపారు. అమౌంట్ పే చేయలేదు కనుక తాను ఇతరులతో సంప్రదించడం జరుగుతుందని, ప్రస్తుతమున్న వ్యాపార పరిస్థితుల మధ్య అడ్వాన్స్ గా ఇచ్చిన డబ్బు తాను ఇవ్వలేకపోతున్నట్లు వారికి తెలిపారు. ఇందుకు వడ్డీ చెల్లిస్తానని చెప్పడం జరిగిందన్నారు. కానీ డబ్బులు కావాలంటూ వారు వత్తిడి చేశారని, ఈ నేపథ్యంలో బుధవారం తాజ్ కృష్ణ కు రావాలని రామకృష్ణ పిలిచాడని తెలిపారు. అక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి యాదవ్ కూడా ఉన్నారని పేర్కొన్నారు.
ఈ విషయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడి హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కీలకమైన డాక్యుమెంట్లపై సంతకాలు కూడా తీసుకున్నట్లు సమాచారం. 

నేడు రెండో సెమీఫైనల్...

ముంబై : టీ20 వరల్డ్ కప్ లో భాగంగా నేడు రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. వెస్టిండీస్ - భారత్ జట్లు ఢీకొననున్నాయి. వాంఖడే స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు ప్రారంభం కానుంది. 

ఫైనల్ లో ఇంగ్లాండ్..

ఢిల్లీ : టీ 20 ప్రపంచ కప్ గ్రూప్ దశలో న్యూజిలాండ్ జైత్రయాత్రకు సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చెక్ పెట్టింది. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో బుధవారం జరిగిన మ్యాచ్ లో కివీస్ జట్టుపై ఇంగ్లాండ్ జుట్ట విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ జట్టు 17.1 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 159 పరుగులు చేసింది. జట్టు ఓపెనర్ రాయ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 44 బంతుల్లో 78 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

అరకు ఎంపీ భర్త కిడ్నాప్..విడుదల..

విశాఖపట్టణం : అరకు ఎంపీ గీత భర్తను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ విషయాన్ని ఎంపీ గీత బుధవారం రాత్రి మీడియాకు వెల్లడించారు. ఓ మంత్రి కుమారుడు, కన్ స్ట్రక్షన్ కంపెనీ యజమాని కలిసి తన భర్తను కిడ్నాప్ చేశారని కమిషనర్ కు గీత ఫిర్యాదు చేశారు. తాజ్ కృష్ణా హోటల్ లో బంధించారని, తన భర్త చేత బలవంతపు సంతకాలు చేయించేందుకు కిడ్నాప్ చేశారని ఆరోపించారు. ఆరు గంటల నిర్భందం అనంతరం ఎంపీ గీత భర్తను దుండగులు విడిచిపెట్టారు. 

నేడు పఠాన్ కోట్ సాక్షుల వాంగ్మూలం సేకరణ..

పంజాబ్ : పఠాన్ కోట్ ఉగ్రదాడి కేసులో ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాన్ని పాక్ నుండి సంయుక్త దర్యాప్తు బృందం రికార్డు చేయనుంది. ఎస్పీ స్థాయి అధికారి సల్వీందర్ సింగ్, ఆయన స్నేహితుడు రాజేశ్ వర్మ, వంట వాడు మదన్ గోపాల్, దర్గా సంరక్షకుడు తదితరుల నుండి గురువారం వాంగ్మూలాన్ని సేకరిస్తుందని ఎన్ఐఏ చీఫ్ శరద్ కుమార్ వెల్లడించారు. 

నేడే సీఎం కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్..

హైదరాబాద్ : రాష్ట్ర సాగునీటి రంగంపై నేడు సీఎం కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. శాసనసభలో ఏర్పాటు చేసిన భారీ తెరలపై ప్రజెంటేషన్ జరగనుంది. ఇందుకు ప్రత్యేక సాంకేతిక ఏర్పాట్లు చేసింది. సభ్యులందరికీ పెన్ డ్రైవ్ లో వివరాలు ఇవ్వనుంది. అయితే ఈ ప్రజెంటేషన్ కు తాము హాజరు కావడం లేదని సీఎల్పీ ప్రకటించింది. 

ఆలూరులో అర్ధరాత్రి దోపిడి..

ఆదిలాబాద్ : జిల్లా సారంగాపూర్ మండలంలోని ఆలూరులో అర్ధరాత్రి దోపిడి జరిగింది. ఓ ఇంట్లోకి ప్రవేశించి గుర్తు తెలియని దుండగులు రూ.25వేల నగదు, మూడు తులాల బంగారం అపహరించుకపోయారు.

 

Don't Miss