Activities calendar

02 April 2016

21:32 - April 2, 2016

ఢిల్లీ : కింగ్‌ ఫిషర్‌ రుణాల మళ్లింపు వ్యవహారంలో విజయ్‌ మాల్యాకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తాజాగా సమన్లు జారీ చేసింది. ఏప్రిల్‌ 9లోగా తమ ముందు విచారణకు హాజరవ్వాల్సిందిగా ఆదేశించింది. గతంలో జారీచేసిన సమన్ల ప్రకారం మాల్యా... ఈరోజు.. ఈడీ ముందు హాజరుకావాల్సి ఉంది. అయితే తనకు మరికొంత సమయం కావాలని మాల్యా కోరారు. దీంతో ఈడీ 9 వరకు గడువిస్తూ తాజాగా సమన్లు జారీ చేసింది. ఈ వ్యవహారంలో మాల్యాకు ఇప్పటివరకు 3 సార్లు సమన్లు అందుకున్నారు. 

21:27 - April 2, 2016

మహారాష్ట్ర : ఆచారాలు వ్యవహారాల పేరుతో హక్కులను కాలరాస్తారా...? లింగవివక్షను రూపుమాపాలంటూనే వివక్షకు పాల్పడతారా..? ఇవీ ఆలయాల్లో మహిళల ప్రవేశంపై హైకోర్టు సంధించిన ప్రశ్నలు. ఆలయాల్లోకి ప్రవేశించడం మహిళల హక్కని మహారాష్ట్రలోని శని శింగనాపూర్‌ ఆలయం విషయంలో ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. భూమాతా మహిళా సంఘం సభ్యులు ఆలయంలోకి ప్రవేశించడాన్ని కొందరు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మహారాష్ట్రలోని శని శింగనాపూర్ ఆలయంలో ఉద్రిక్తత నెలకొంది. హైకోర్టు ఆదేశాలతో ఆలయంలోకి ప్రవేశించేందుకు వచ్చిన భూమాత మహిళా సంఘం చీఫ్ తృప్తి దేశాయ్‌తో పాటు మహిళలను స్థానికులు, ఎన్సీపీ కార్యకర్తలు, ఆలయ ట్రస్ట్ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు.

అడ్డుకోవడం దారుణం...
కోర్టు అనుమతి ఇచ్చినా తమను అడ్డుకోవటం దారుణమని తృప్తి దేశాయ్ అన్నారు. తాము వెనకడుగు వేసేది లేదని ఆమె స్పష్టం చేశారు. మరోవైపు తృప్తి దేశాయ్‌కి వ్యతిరేకంగా స్థానికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా... తాము మహిళలను ఆలయంలోకి అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని శని సింగనాపూర్‌ ఆలయంలోకి మహిళలను అనుమతించకపోవడం ఇకపై కుదరదని ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. పూజా స్థలాల్లోకి వెళ్లడం అందరి ప్రాథమిక హక్కని, దాన్ని ప్రభుత్వం పరిరక్షించాలని హైకోర్టు సూచించింది. శతాబ్దాల నుంచి ఉన్న సంప్రదాయానికి చరమగీతం పాడుతూ, లింగవివక్షకు పుల్‌స్టాప్ పెట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. శని శింగనాపూర్ లాంటి ఆలయ గర్భగుడిలోకి మహిళలను అనుమతించకపోవడాన్ని సవాల్‌ చేస్తూ వేసిన పిల్‌ను పరిష్కరిస్తూ తీర్పు చెప్పింది. ఆలయంలోకి రాకుండా అడ్డుకుంటే వారికి 6 నెలల శిక్ష విధించేలా చట్టం ఉందని హైకోర్టు గుర్తు చేసింది.  

21:24 - April 2, 2016

ముంబై : చిన్నారి పెళ్లి కూతురు ఫేం ప్రత్యూష బెనర్జీ ఎందుకు ఆత్మహత్య చేసుకుంది..? ఆమెకు వచ్చిన కష్టం ఏంటి? చనిపోయే ముందు ప్రత్యూష.. ప్రియుడు రాహుల్‌ రాజ్‌తో గొడవ పడిందా..? అసలు ఏం జరిగింది. ? బాలికా వధు హిందీ సీరియల్‌ను తెలుగులో చిన్నారి పెళ్లికూతురు పేరుతో ప్రసారం చేస్తున్నారు. ఆనంది పాత్రలో నటించి అనేక మంది మహిళా ప్రేక్షకులకు దగ్గరైన ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడటం అందరినీ కలచివేస్తోంది. అటు సినీ ప్రపంచంలోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ ప్రత్యూష మృతి పట్ల తీవ్ర దిగ్ర్భాంతి నెలకొంది.

వాట్సప్ మెసేజ్ లు..
పలు సీరియల్స్‌లో నటించి, బుల్లితెరపై తిరుగులేని ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ప్రత్యూష పలు టీవీ షోల్లో కూడా నటిస్తోంది. ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో ప్రియుడిపైనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. చనిపోవడానికి ముందు ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ప్రత్యూష ప్రియుడు రాహుల్‌ రాజ్‌ సింగ్‌ను పోలీసులు విచారిస్తున్నారు. అతని సెల్‌ఫోన్‌ మెసేజ్‌లను పరిశీలిస్తున్న పోలీసులకు ప్రత్యూష పంపిన చివరి మెసేజ్‌ను గుర్తించారు. చనిపోయిన తర్వాత కూడా నా మొహం నిన్నే చూస్తుంటుంది అని ప్రత్యూష.. రాహుల్‌ రాజ్‌సింగ్‌కు పెట్టిన వాట్సప్‌ మెసేజ్‌ను పోలీసులు గుర్తించారు. ప్రత్యూష మరణం తననెంతో కలచివేస్తోందని, ఆమె ఎందుకు చనిపోయిందో తనకు అర్ధం కావడం లేదని ఆమె బాయ్‌ఫ్రెండ్‌ రాహుల్‌ రాజ్‌సింగ్‌ పోలీసులతో తెలిపాడు. ప్రత్యూష మరణంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఏదేమైనా..ఈ డెత్‌ మిస్టరీని పోలీసులే చేధించాలి.

21:21 - April 2, 2016

విజయవాడ : టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు నందమూరి హరికృష్ణ విజయవాడ పర్యటన ఏపీ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. విజయవాడలోని బందరు రోడ్డులో దాదాపు నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించిన వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి హరికృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హరికృష్ణతో పాటుగా వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని హాజరయ్యారు. వీరిద్దరూ ఒకే కారులో రావడం టీడీపీ, వైసీపీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది.

జంపింగ్ జిలానీల ట్రెండ్..
ఆస్పత్రి ప్రారంభోత్సవానికి ఎక్కువగా అధికార టీడీపీ నేతలే వచ్చారు. ఏపీలో జంపింగ్‌ జిలానీల ట్రెండ్‌ నడుస్తోన్న నేపథ్యంలో, కొడాలి నాని.. హరికృష్ణ ద్వారా తిరిగి టీడీపీలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, కొడాలి నాని మాత్రం తాను తెలుగుదేశం పార్టీలో చేరేది లేదని తెగేసి చెప్పారు. తాను ఎప్పటికీ వైఎస్‌ జగన్‌ వెంటే వుంటాననీ, ఎన్టీఆర్‌ పేరుతో నిర్మితమైన ఆసుపత్రి కావడంతోనే, తాను ఆ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చినట్లు చెప్పారు. దాంతో, కొడాలి నాని పార్టీ మారతారన్న ఊహాగానాలకు ప్రస్తుతానికైతే బ్రేక్‌ పడిందనే చెప్పాలి.

చర్చనీయాంశం..
అసెంబ్లీలో జరిగిన ఘటన విషయంలో కొడాలి నానిపై సస్పెన్షన్‌ వేటు దిశగా అధికార పార్టీ వ్యూహాల్ని రచిస్తోంది. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ఏడాది సస్పెన్షన్‌ వేటు వేశారు. పార్టీ సీనియర్‌ నేత జ్యోతుల నెహ్రూ పదవిపై ఆశనో మరేమోగానీ టీడీపీ గూటికి చేరారు. నాని ఇప్పటికే ప్రివిలేజ్‌ కమిటీ ముందు విచారణకు హాజరై, క్షమాపణ కూడా చెప్పేశారు. అయినా, క్షమాపణ విషయంలో సభదే అంతిమ నిర్ణయమని ప్రివిలేజ్‌ కమిటీ తేల్చింది. ఈ నేపథ్యంలో కొడాలి నాని, టీడీపీ నేతలు హాజరైన కార్యక్రమంలో కన్పించడం చర్చనీయాంశమయ్యింది.

షోకాజ్ నోటీసులిస్తారా ? 
మరోవైపు హరికృష్ణకు తెలుగుదేశం పార్టీలో సరైన గుర్తింపు లేదు. కొడాలి నానితో ఒకే కారులో రావడం.. హరికృష్ణ చూపు వైసీపీ వైపు మళ్ళిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. తన కుమారుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ విషయంలో టీడీపీ అనుసరిస్తున్న వైఖరిపైనా, తనకు ఇంకోసారి రాజ్యసభ టిక్కెట్‌ విషయంలోనూ హరికృష్ణ టీడీపీపై గుర్రుగా ఉన్నారు. మరి ఈ పరిణామం ఆధారంగా హరికృష్ణని టీడీపీ అధిష్టానం వివరణ అడుగుతుందా? లేక నాని టీడీపీ కార్యక్రమానికి వెళ్లడంపై వైసీపీ షోకాజ్‌ నోటీసు ఇస్తుందా.. రాబోయే రోజుల్లో ఎం జరగనుందని.. జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

21:19 - April 2, 2016

నిజామాబాద్ : అసెంబ్లీలో చర్చకు రమ్మంటే కాంగ్రెస్‌, టీడీపీ నేతలు పారిపోయారన్నారు... సీఎం కేసీఆర్‌. నిజామాబాద్‌లో రెండోరోజు పర్యటించిన సీఎం... త్వరలో తిరుపతి వెంకన్న మొక్కు తీర్చుకుంటామని తెలిపారు. రెండో రోజు పర్యటనలోభాగంగా బీర్కూరు మండలం తిమ్మాపూర్‌ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.. సతీసమేతంగా సుదర్శన యాగంలో పాల్గొన్నారు. ఆలయం అద్భుతంగా ఉందని కేసీఆర్‌ ప్రశంసించారు.. ఈ గుడిని తెలంగాణ తిరుమలగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.. త్వరలో తిరుమలకువెళ్లి స్వామివారికి 5కోట్ల విలువైన ఆభరణాలు సమర్పించి మొక్కు చెల్లించుకుంటానని చెప్పారు. యాగం తర్వాత తిమ్మాపూర్‌లో బహిరంగ సభకు సీఎం హాజరయ్యారు. అసెంబ్లీలో పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌కు ప్రతిపక్ష సభ్యులు రాకపోవడాన్ని కేసీఆర్‌ తప్పుబట్టారు. సభకు రాకుండా బయట పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆరు నూరైనా కోటి ఎకరాలకు సాగునీరందించి తీరతామని మరోసారి కేసీఆర్‌ స్పష్టం చేశారు.  

21:17 - April 2, 2016

విజయవాడ : నిరుద్యోగులకు ఏపీ మంత్రివర్గం తీపి కబురు అందించింది. రాష్ట్రంలో 20 వేల ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇసుక విధానంపై సుధీర్ఘంగా చర్చించిన కేబినెట్‌ ఉచిత ఇసుక విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. అలాగే... కేంద్రం నుంచి రావ‌ల‌సిన నిధుల విష‌యంలోనూ శాఖ‌ల‌వారీగా వివ‌ర‌ణ ఇస్తూ ప్రధాని మోడీకి లేఖ‌ రాయాల‌ని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. రాష్ట్రంలో ప‌లు శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల‌ను ద‌శ‌ల‌వారిగా భ‌ర్తీ చేయాల‌ని కేబినెట్ నిర్ణయించింది...మొత్తం 20 వేల ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు ఇవ్వాల‌ని నిర్ణయించింది. అయితే ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారి వ‌యోప‌రిమితిలో ఎలాంటి పెంపు లేదు.

14న అంబేద్కర్ జయంతి..
ఇక రాజ‌ధాని ప్రాంతంలో ఉన్న సుమారు 13 వేల ఎక‌రాల అట‌వీ భూముల‌ను ఏపీసీఆర్డీఏకు బ‌ద‌లాయించాల‌ని కేంద్ర అట‌వీశాఖ‌ను కోరనుంది స‌ర్కార్. దీనికోసం 1357 కోట్ల రూపాయిల‌ను కేంద్ర అట‌వీ- ప‌ర్యావ‌ర‌ణ శాఖ‌కు చెల్లించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక అభ‌య‌గోల్డ్, అగ్రిగోల్డ్ కేసుల ప‌రిష్కారానికి విజ‌య‌వాడ‌లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుచేయాల‌ని కేబినెట్ నిర్ణయించింది. ప్రస్తుతం అమ‌ల్లో ఉన్న డ‌బుల్ రిజిస్ట్రేష‌న్ విధానంలో మార్పుల‌కు మంత్రివ‌ర్గం ఆమోద‌ముద్ర వేసింది. ఉగాది వేడుక‌ల‌ను విజ‌య‌వాడ‌లో నిర్వహించ‌డంతో పాటు ఈనెల 14న అంబేద్కర్ జ‌యంతి రోజున 6 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాల‌ని కేబినెట్ నిర్ణయించింది.

ఉచిత ఇసుక కోసం యాప్..
ఇక ఉచిత ఇసుక స‌ర‌ఫ‌రా కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించ‌నుంది ప్రభుత్వం. 524 రీచ్‌ల వ‌ద్ద ఏపీఎంఐడీసీ అధికారుల ప‌ర్యవేక్షణ ఉండ‌నుంది. 13 జిల్లాల్లో తాగునీటి ఎద్దడి నివార‌ణ‌కు 45 కోట్లు కేటాయించాల‌ని కేబినెట్‌లో నిర్ణయించారు. ఈనెల 15 త‌ర్వాత సీఎం జిల్లాల ప‌ర్యట‌న చేయ‌నున్నారు. ప్రాజెక్ట్‌ల సంద‌ర్శన‌, జిల్లాల్లో స‌మ‌స్యల ప‌రిష్కారంపై సీఎం దృష్టి పెట్టనున్నారు. ఇక ఉర్ధూ యూనివ‌ర్శిటీ, జాతీయ‌ విద్యా సంస్థల‌కు ఉచితంగా భూముల కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

నిధులపై నివేదిక...
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావ‌ల‌సిన నిధులపై శాఖ‌ల‌వారీగా నివేదిక ఇవ్వాల‌ని చంద్రబాబు అధికారుల‌ను ఆదేశించారు. ఈ నివేదిక ఆధారంగా ప్రధాని మోడీకి సీఎం లేఖ రాయ‌నున్నారు. రాష్ట్ర ఆర్ధిక ప‌రిస్థితిని వివ‌రిస్తూ ఆదుకోవాల‌ని లేఖ‌లో కోర‌నున్నారు సీఎం. ఇక ఉన్నత‌ విద్యామండ‌లి ఆస్తుల విష‌యంలో సుప్రీం కోర్టు ఇటీవ‌ల ఇచ్చిన తీర్పును అమ‌లు చేయాలంటూ తెలంగాణ సీఎస్‌కు లేఖ రాయాల‌ని ఏపీ సీఎస్‌కు సీఎం సూచించారు. భూగ‌ర్భ జ‌లాల పెంపు, నీరు-చెట్టు ప‌థ‌కం అమలుపైనా కేబినెట్‌ చ‌ర్చించింది.

అన్ని రంగాల్లో సిద్ధిపేట అభివృద్ధి - హరీష్..

మెదక్ : సిద్ధిపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశమని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. సిద్ధిపేట అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో హరీష్‌రావు ప్రసంగించారు. సిద్ధిపేట మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

త్వరలో కేసీఆర్ తిరుమలకు..

నిజామాబాద్ : తెలంగాణ రాష్ర్టం సిద్ధిస్తే తిరుమల వస్తానని మొక్కుకున్నానని.. త్వరలోనే తిరుమల వెళ్లి మొక్కు తీర్చుకుంటానని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం రూ. 5 కోట్లు వెచ్చించి బంగారు ఆభరణాలు తయారు చేయించానని చెప్పారు. 

ఒకే కాన్పులో ఐదుగురు ఆడపిల్లలు..

ఛత్తీస్ గఢ్ : అంబికాపూర్ లో 25 సంవత్సరాల మహిళ ఒకే కాన్పులో ఐదుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం పసికందులను వైద్యుల పర్యవేక్షిస్తున్నారు. 

20:23 - April 2, 2016

వరంగల్ జిల్లాలో రోడ్లపై వంట వార్పు...బంగారు తెలంగాణలో ఏడు కుటుంబాల కుల బహిష్కరణ..మల్లొక్క అవినీతి శాప జిక్కింది..కర్నూలు జిల్లా..ఆదోని కాడ..పెద్దదే మాయం అయ్యింది.. ఈ ఎండలు జెయ్యంగ నీడ పట్టు నుండే మన్సుల గాదు.. అడ్వి జంతువులకు గుడ సుక్కనీళ్లు దొర్కక అల్లాడిపోవట్టే..

20:20 - April 2, 2016

ఏదన్న వొస్తువును ఉన్నట్టుండి మాయం జేస్తె ఏమంటరు.. గుడి అంత కలె దిరిగిండు గుల్లె వున్న లింగాన్నే మాయం జేశిండు అని ముచ్చట శెప్పుకుంటరు గదా.. సేమ్ టూ సేమ్ అట్లనే అయ్యింది. కర్నూలు జిల్లా.. ఆదోని కాడ.. ఇంతకు ఏం మాయం అయ్యింది ఏం కత అనే గదా.. మీరు అన్కుంటున్నరు.. పెద్దదే మాయం అయ్యింది. శాన మందిని పర్షాన్లవడేశింది. మీరు సూడాలంటే వీడియో క్లిక్ చేయండి.

కౌన్సిలర్ హత్య కేసులో ఇద్దరు అరెస్టు..

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో 16వ వార్డు టిడిపి కౌన్సిలర్ గోపాల కృష్ణ హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పాతకక్షలు, ఇసుక ర్యాంపు వివాదాలే కౌన్సిలర్ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. 

ఐఎస్ రసాయన ఆయుధ పరిశోధనా కేంద్రంపై దాడి..

ఇరాక్ : మోసుల్ నగరంలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థ రసాయిన ఆయుధ తయారీ కేంద్రంపై అమెరికా వాయుసేన దాడి జరిపింది. 

రియాద్ లో భారతీయ సంతతిని కలిసిన మోడీ..

సౌదీ అరేబియా : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రియాద్ లో పర్యటిస్తున్నారు. అక్కడ భారతీయ సంతతిని కలిసి ప్రసంగించారు. 

19:56 - April 2, 2016

మగ పిల్లలు పుట్టాలంటే గాడిద ఎక్కాలంట.. ఓ రాష్ట్రంలో నిమ్మకాయలు వేలం వేస్తే ఒక్క నిమ్మకాయ ధర 57వేలు పలికిదంట. బాలికల సంరక్షణ కోసం ఓ వ్యక్తి కన్యాకుమారి నుండి ఢిల్లీ వరకు పాదయాత్ర..గోవా రైలు స్టేషన్ లో లైవ్ ఆర్కెస్ట్రా సదుపాయం..డ్యాన్స్ చేస్తున్న కూతురిని చెంప దెబ్బకొట్టిన తల్లి..ఇండిగో ఫ్లైట్ లో ఎక్కిన ఓ వ్యక్తి బీడీ తాగాడంట. క్రికెటర్ శ్రీకాంత్ రాజకీయాల్లో పోటీ చేస్తున్నారంట..బాహుబలికి జాతీయ అవార్డు... సాయికిరణ్ అందించే మరిన్ని వార్తలతో క్రేజీ న్యూస్... మరి మీరు చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

19:26 - April 2, 2016

ఢిల్లీ : పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ తీరుపై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించేలా సీఎం మమత బెనర్జీ వ్యవహరిస్తున్నారని, ఎన్నికలు ముగిశాక ప్రత్యర్థులపై ప్రతికారం తీర్చుకుంటామంటూ మమత బహిరంగంగానే బెదిరింపులు చేస్తున్నారని పేర్కొన్నారు. టీఎంసీ నేతల బెదిరింపుతో సాధారణ ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకొనేందుకు భయపడుతున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్న నేతలపై చర్యలు తీసుకోవాలని కోరారు. టీఎంసీ నేతల పేర్లు..ప్రసంగాలను ఎన్నికల కమిషన్ కు ఏచూరి సమర్పించారు. కోల్‌కతా ఫ్లైఓవర్‌ కూలిపోవడం బాధాకరమని, సహాయక చర్యల్లో సీపీఎం కార్యకర్తలు పాల్గొన్నారని పేర్కొన్నారు. గాయపడిన వారికోసం బ్లడ్‌ డొనేషన్‌ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగిందని, బెంగాల్‌ ప్రభుత్వం ఈ రక్తాన్ని తీసుకోనివ్వలేదన్నారు. టీఎంసీ మానవత్వంలేకుండా వ్యవహరిస్తోంది సీతారం ఏచూరి విమర్శించారు. 

ఫాం హౌస్ కు చేరుకున్న సీఎం కేసీఆర్...

మెదక్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లాలోని ఫాం హౌస్ కు చేరుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించిన సంగతి తెలిసిందే. 

సైనా ఓటమి..

న్యూఢిల్లీ : ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీ సెమీ ఫైనల్‌లో సైనా నెహ్వాల్ పరాజయం చెందింది. చైనా క్రీడాకారిణి లీ జురుయ్ చేతిలో 20-22, 21-17, 19-21 తేడాతో సైనా ఓటమి చెందింది. క్వార్టర్స్ లో 19-21, 21-14, 21-19 తేడాతో కొరియాకు చెందిన సంగ్ జీ హ్యున్‌పై సైనా విజయం సాధించిన విషయం విదితమే.

కోల్ కతాలో విద్యార్థుల కొవ్వొత్తుల ర్యాలీ..

కోల్ కతా : ఇటీవల కూలిపోయిన బ్రిడ్జి వద్ద విద్యార్థులు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. గురువారం గిరీష్ పార్కుకు సమీపంలో నిర్మాణమౌతున్న ఫ్లై ఓవర్ కొంతభాగం కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది మృత్యువాత పడ్డారు. మరణించిన వారికి నివాళులర్పించిన విద్యార్థులు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. 

ప్రత్యూష బాయ్ ఫ్రెండ్ పీఎస్ కు తరలింపు..

ముంబై : టీవీ నటి ప్రత్యూష బెనర్జీ (24) అనుమానాస్పద మృతి ఘటనలో ఆమె స్నేహితుడు రాహుల్ రాజ్ సింగ్ ను బంగూర్ నగర్ పీఎస్ కు తరలించారు. శుక్రవారం ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. 'చిన్నారి పెళ్లి కూతురు' ధారవాహికలో 'ఆనంది'గా ప్రత్యూష బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది. 

ప్రత్యూష బెనర్జీ పోస్టుమార్టం..

ముంబై : టీవీ నటి ప్రత్యూష బెనర్జీ (24) ఊపిరి ఆడకనే మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఊపిరిసలపనీయకుండా చేసి చంపేసినట్లు తెలుస్తోంది. అంతేగాకుండా మెడ చుట్టూ గాయాలున్నట్లు సమాచారం. శుక్రవారం ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. 'చిన్నారి పెళ్లి కూతురు' ధారవాహికలో 'ఆనంది'గా ప్రత్యూష బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది. 

18:07 - April 2, 2016

న్యూఢిల్లీ : నిర్ణీత సమయంలో పోలవరం నిర్మాణం చేసేందుకు సమస్యలు ఏర్పడ్డాయని, ఎలాంటి నిధుల కొరత లేదని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి పేర్కొన్నారు. ప్రాజెక్టు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో చర్చించి గడువు నిర్ణయించాల్సి ఉంటుందన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి మరో రూ. 1500 కోట్లు ఇవ్వాలని నీతి అయోగ్ కు లేఖ రాసినట్లు తెలిపారు. నిర్ణీత గడువులోగా ప్రాజెక్టులు పూర్తి చేస్తే ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు ఉమా భారతి ప్రకటించారు. 

ప్రత్యూష బెనర్జీ అంత్యక్రియలు..

ముంబై : టీవీ నటి ప్రత్యూష బెనర్జీ (24) అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. 'చిన్నారి పెళ్లి కూతురు' ధారవాహికలో 'ఆనంది'గా ప్రత్యూష బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది. 

భీం భరత్ ను అక్రమంగా అరెస్టు చేశారు - విమలక్క...

హైదరాబాద్ : తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ జాయింట్ సెక్రటరీ భీం భరత్ ను అక్రమంగా అరెస్టు చేశారని హెచ్చార్సీ లో విమలక్క ఫిర్యాదు చేసింది. భీం భరత్ ను వెంటనే కోర్టులో హాజరు పరచాలని కోరింది. 24గంటల్లో వివరణ ఇవ్వాలని డీజీపీని హెచ్చార్సీ ఆదేశించింది. 

17:12 - April 2, 2016

నల్గొండ : సీఎల్పీ ఉప నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామానికి 50 ఇళ్లు, హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూం ప్లాట్లు కడితే తాను టీఆర్ఎస్ గెలవాలని ప్రచారం చేస్తానని తెలిపారు. శాసనసభలో సీఎం కేసీఆర్ చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తనకు నచ్చిందన్నారు. ఇది మాటలకు మాత్రం పరిమితం కాకూడదని అభిప్రాయం వ్యక్తం చేశారు. సమస్యల్లో ఉన్న ప్రాజెక్టులకు రీ డిజైనింగ్ చేస్తే తప్పేంటని, ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చ జరిగిన సందర్భంలో ప్రిపేర్ కాలేదని తమ నాయకుడు చెప్పడం విచిత్రంగా ఉందని తెలిపారు. 

17:01 - April 2, 2016

అంబేద్కర్ 125వ జయంత్సోత్సవాల సందర్భంగా ఎపీ ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్ తో టెన్ టివి ప్రత్యేక ఇంటర్వ్యూ చేపట్టింది. అంబేద్కర్ దృక్పథాన్ని సమాజానికి ఎలా అన్వయించాలి ? దృక్పథ పథకానికి ప్రభుత్వ పాత్ర ఏమిటి ? రెండు గ్లాసుల విధానం కోసం ఎన్నాళ్లు మాట్లాడుకోవాలి ? ఎస్సీ విద్యార్థుల భవితకు కార్పొరేషన్ ప్రణాళికేంటీ ? తదితర అంశాలపై జూపూడి విశ్లేషించారు. కౌలు రైతుల్లో మెజార్టీ శాతం దళితులేనని, సులువైన రుణ విధానం అమలుపై ప్రత్యేక దృష్టి నెలకొల్పినట్లు పేర్కొన్నారు. ఎలాంటి అభిప్రాయాలు తెలిపారో వీడియో క్లిక్ చేయండి.

16:54 - April 2, 2016

కోల్ కతా : టీ-20 మహిళా ప్రపంచకప్ ఫైనల్స్ కు మూడుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియా, సంచలనాల వెస్టిండీస్ జట్లు చేరుకొన్నాయి. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే సూపర్ సండే టైటిల్ ఫైట్ లో అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. ఈ పోటీలో నాలుగోసారి ఫైనల్స్ ఆడుతున్న ఆస్ట్రేలియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా ముగిసిన తొలిసెమీఫైనల్స్ లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్ పై మూడుసార్లు విజేత ఆస్ట్రేలియా 5 పరుగుల విజయం సాధించి...నాలుగోసారి ఫైనల్స్ కు అర్హత సంపాదించింది.

పోటీ ఇస్తుందా ? 
టాపార్డర్ బ్యాట్స్ విమెన్ లానింగ్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా టీమ్...గత మూడు ప్రపంచకప్ టోర్నీల్లోనూ విజేతగా నిలిచింది. అంతేకాదు వరుసగా నాలుగోసారి ఫైనల్స్ చేరి సరికొత్త రికార్డు నెలకొల్పింది. మరోవైపు గ్రూప్ లీగ్ దశలో ఆల్ విన్ రికార్డుతో సెమీస్ చేరిన న్యూజిలాండ్ కు మాత్రం ముంబై వాంఖెడీ స్టేడియం వేదికగా ముగిసిన రెండో సెమీఫైనల్లో అనూహ్య పరాజయం ఎదురయ్యింది. సారా టేలర్ నాయకత్వంలోని వెస్టిండీస్ టీమ్ ఆరు పరుగుల తేడాతో న్యూజిలాండ్ ను కంగుతినిపించింది.టీ-20 ప్రపంచకప్ ఫైనల్స్ చేరడం వెస్టిండీస్ మహిళా జట్టుకు ఇదే మొదటిసారి. అయితే...టైటిల్ సమరంలో మూడుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియాకు వెస్టిండీస్ ఏమాత్రం పోటీ ఇస్తుందన్నదే ఇక్కడి అసలుపాయింట్.

16:50 - April 2, 2016

కరీంనగర్ : తన గుడిసె తొలగించారని ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి వాటర్ ట్యాంక్ ఎక్కిన సంఘటన కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో చోటు చేసుకుంది. కేసీఆర్ కాలనీకి చెందిన వేల్పుల రాజకుమారి ఇంటిపక్కనే ఉండే టోపి శ్రీను అనే వ్యక్తి రాజకుమారి ఇంటిని కూల్చివేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులకు పలు మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో జవహర్ నగర్ లోని వాటర్ ట్యాంక్ ఎక్కి న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ... కిందకు దిగింది. 

16:48 - April 2, 2016

హైదరాబాద్ : రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వీసీ అప్పారావును వెంటనే విధుల నుండి తొలగించాలని బహిరంగ క్షమాపణ చెప్పాలని పౌర ప్రజాస్వామిక హక్కుల సంఘాల సమన్వయ సంస్థ డిమాండ్ చేసింది. రోహిత్ మరణంతో ఏర్పడిన ఆందోళనకర పరిస్థితుల్లో మందుకు వచ్చిన డిమాండ్లు నెరవేరక ముందే వీసీ విధుల్లో చేరడంపై సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్ తప్పుబట్టారు. ఈ విషయంలో జ్యుడీషియల్ కమిటీతో ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై అధ్యాపకులపై అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ప్రధాన కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. 

16:47 - April 2, 2016

హైదరాబాద్ : ప్రాజెక్టుల రీడిజైన్‌లో ప్రభుత్వ తీరును ఎండగడుతూ... పవర్‌ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు త్వరలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తామని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా ఉన్నందుకే.. తాము ప్రజంటేషన్‌కు కాంగ్రెస్ దూరంగా ఉన్నామన్నారు. 
తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రజెంటేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ హాజరు కాలేదు. 

రియాద్ లో మోడీ..

సౌదీ అరేబియా : విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు సౌదీ అరేబియాలోని రియాద్ కు చేరుకున్నారు. వాషింగ్టన్ లో రెండు రెండు రోజుల పాటు జరిగిన అణుభద్రతపై శిఖరాగ్ర సదస్సులో మోడీ పాల్గొన్నారు. అనంతరం సౌదీ అరేబియా పర్యటనలో భాగంగా రియాద్ కు చేరుకున్నారు. 

16:13 - April 2, 2016

విజయవాడ : ఏపీ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో పలు విభాగాల్లో ఉన్న 20వేల ఖాళీలను భర్తీ చేయాలని కీలక నిర్ణయం మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మీడియాకు వివరాలు తెలియచేశారు.

  • ఈనెల 15 నుండి జిల్లాల పర్యటనకు బాబు శ్రీకారం.
  • అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ. విశాఖ జిల్లాలో ఐఐఎం..తాడేపల్లి గూడెంలో నిట్ ఏర్పాటుకు నిర్ణయం.
  • ఉచిత ఇసుక విధానం కొనసాగించాలి.
  • ఏప్రిల్ 20,21 తేదీల్లో అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం. బాధితులకు ఉపశమనం కలిగించే విధంగా చూడాలని సీఐడీ అధికారులకు ఆదేశాలు జారీ.
  • డబుల్ టైం రిజిస్ట్రేషన్లు లేకుండా ఉండేందుకు సెక్షన్ 22 బి పరిచయం. రిజిస్ట్రేషన్ ఆపు చేసే అధికారం సబ్ రిజిస్ట్రార్లకు వస్తుంది.
  • విజయవాడలో ఎం కన్వేషన్ హాల్ లో ఘనంగా ఉగాది సంబరాలు.
  • 14వ తేదీన అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలు జరుపుతాం. ఆరు లక్షల ఇళ్లకు శంకుస్థాపనలు.
  • పూలే జయంతి ఉత్సవం..బాబు జగ్జీవన్ రాం జయంతి ఉత్సవాలను హెడ్ క్వార్టర్స్ (విజయవాడ)లో జరపాలి.
  • ఇసుకను అందరికీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు. మొబైల్ యాప్ తయారీ. 

ధన్ బాద్ జిల్లాలో పేలిన ల్యాండ్ మైన్...

జార్ఖండ్ : ధన్ బాద్ జిల్లాలో మావోయిస్టులు ల్యాండ్ మైన్ పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలయ్యాయి. 

ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం..

విజయవాడ : ఏపీ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేయాలని..ప్రత్యేక వెబ్ సైట్ లో బాధితుల వివరాలు ఉంచాలని..బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. విశాఖలో ఐఐఎం, ప.గో.నిట్ కు భూమి కేటాయించాలని..అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు 491 ఎకరాల భూమి కేటాయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 

గోదావరిఖని వద్ద రోడ్డు ప్రమాదం..

కరీంనగర్ : గోదావరిఖని గంగానగర్ ఫ్లై ఓవర్ పై ప్రమాదం చోటు చేసుకుంది. డివైడర్ ను బైక్ ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్ వాసులుగా గుర్తించారు. 

మాల్యాకు ఈడీ మళ్లీ నోటీసులు..

ముంబై : కింగ్ ఫిషర్ ఏయిర్ లైన్స్ అధినేత విజయ్ మాల్యాకు ఈడీ మళ్లీ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 9వ తేదీన హాజరు కావాలని ఆదేశాల్లో పేర్కొంది. మాల్యాకు నోటీసులివ్వడం ఇది మూడోసారి. 

తృప్తి దేశాయ్ నిర్భందం..

మహారాష్ట్ర : శని సింగ్నాపూర్ ఆలయంలోకి ప్రవేశించడానికి వెళ్లిన భూ మాతా బ్రిగేడ్ సంస్థ అధ్యక్షురాలు తృప్తి దేశాయ్ ను పోలీసులు నిర్భందించారు. ఆలయాల్లోకి మహిళలను ప్రవేశించాలని ముంబై హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. 

15:22 - April 2, 2016

నిజామాబాద్ : 'మానవుడు మోయలేని భారం భగవంతుడు మోస్తాడు..పవిత్ర సంఘ నిర్మాణం కోసం ఆధ్యాత్మిక కేంద్రాలు కృషి చేస్తాయి' అంటూ సీఎం కేసీఆర్ వేదాంత ప్రసంగం చేశారు. జిల్లాలోని బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గుట్ట శ్రీవెంకటేశ్వరస్వామిని కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన సుదర్శన యాగంలో కూడా కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడారు. పరమాత్ముడిని ఏ రీతిలోనైనా పూజించవచ్చన్నారు. 

15:17 - April 2, 2016

మహారాష్ట్ర : శని సింగ్నాపూర్ వద్ద శనివారం టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆయల ప్రవేశానికి వచ్చిన భూ మాత బ్రిగేడ్ సంస్థ అధ్యక్షురాలు తృప్తి దేశాయ్..ఇతర మహిళలను స్థానికులు, ఎన్సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీనితో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అడ్డుకోవడంపై తృప్తి దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శనం చేసుకోందే తాము ఇక్కడి నుండి కదలమని హెచ్చరించారు. శాంతిభద్రతలకు భంగం కలుగకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
పలు ఆలయాల్లో మహిళల ప్రవేశించకూడదనే నిషేధాన్ని ఎత్తివేయాలి..వారికి ఆలయంలోకి ప్రవేశించాలి అంటూ భూ మాత బ్రిగేడ్ సంస్థ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా శనిసింగ్నాపూర్ ఆలయంలో మహిళలకు ప్రవేశం కల్పించాలని సంస్థ అధ్యక్షురాలు తృప్తి దేశాయ్ ఆధ్వర్యంలో ఉద్యమాలు జరుగుతున్నాయి. పలుమార్లు ఆలయంలోకి ప్రవేశించాలన్న వీరి ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ముంబై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆలయాల్లో మహిళలకు అనుమతినివ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దీనితో తృప్తిదేశాయ్ ఇతర మహిళలు శనిసింగ్నాపూర్ ఆలయానికి చేరుకున్నారు. మరి వీరు ఆలయ దర్శనం చేసుకుంటారో.. ? లేదో ? చూడాలి. 

శని సింగ్నాపూర్ వద్ద ఉద్రిక్తత..

మహారాష్ట్ర : ప్రముఖ ఆలయం శని సింగ్నాపూర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆలయ ప్రవేశం చేస్తున్న మహిళా సంఘాలను స్థానికులు, ఎన్ సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీనితో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. 

శనిసింగ్నాపూర్ కు చేరుకున్న తృప్తి దేశాయ్..

మహారాష్ట్ర : మహిళలకు ఆలయ ప్రవేశాన్ని కల్పించాలని ఉద్యమం చేపడుతున్న తృప్తి దేశాయ్ శని సింగ్నాపూర్ కు చేరుకున్నారు. ఆలయాల్లో మహిళలకు ప్రవేశం కల్పించాలని ముంబై హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆలయంలో మహిళలకు ప్రవేశం కల్పించకపోతే సీఎం పై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తృప్తి దేశాయ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. 

టీఎంసీ సర్కార్ కు మానవత్వం లేదు - ఏచూరి..

ఢిల్లీ : కోల్ కతా ఫ్లై ఓవర్ దుర్ఘటనపై ఉన్నతస్థాయి విచారణ కమటీతో దర్యాప్తు జరిపించాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి డిమాండ్ చేశారు. క్షతగాత్రుల కోసం రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని, తాము సేకరించిన రక్తాన్ని తీసుకోకుండా టీఎంసీ ప్రభుత్వం మానవత్వం లేకుండా ప్రవర్తించిందని తీవ్రంగా విమర్శించారు.

 

అనుమతినివ్వకపోతే సీఎంపై ఫిర్యాదు చేస్తాం - తృప్తి దేశాయ్..

మహారాష్ట్ర : శని సింగ్నాపూర్ ఆలయంలో మహిళలకు ప్రవేశం కల్పించకపోతే సీఎం పై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తృప్తి దేశాయ్ పేర్కొన్నారు. ఆలయాల్లో మహిళలకు ప్రవేశం కల్పించాలని ముంబై హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

 

త్వరలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ - మల్లు..

హైదరాబాద్ : ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పై ప్రభుత్వ తీరును ఎండగడుతూ త్వరలో తాము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుందని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా ఉన్నందుకే కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు దూరంగా ఉన్నామన్నారు. 

14:31 - April 2, 2016

ఢిల్లీ : అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నేర చరితులకు టిక్కెట్లివ్వడం వివాదస్పదమవుతోంది. పశ్చిమబెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో నేర చరితుల జాబితాను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ విడుదల చేయగా, కేరళలో కళంకితులకు టిక్కెట్లు ఇవ్వడంపై ఆ పార్టీ ముఖ్య నేతలే భగ్గుమంటున్నారు. నేరచరితులకు టిక్కెట్లివ్వడంలో బిజెపి టాప్‌ ప్లేస్‌ లో వుంది. పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో ఏప్రిల్ 4న తొలి విడత పోలింగ్ జరగబోతోంది. తొలి విడతలో పోటీ పడుతున్న అభ్యర్థుల చరిత్రను పరిశీలించిన అసోసియేషన్ ఫర్ డెమోక్రిటిక్ రిఫార్మ్ నేర చరితుల జాబితాను ప్రకటించింది. కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి, అస్సాంలో అధికారంలో వున్న కాంగ్రెస్, పశ్చిమబెంగాల్ లో అధికారంలో వున్న త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీలు నేర చరితులను అధిక సంఖ్యలో పోటికి నెలబెట్టినట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ ప్రకటించింది.

బీజేపీలో అధికం..
అస్సాంలో తొలివిడతలో 539 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, 30 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వీరిలో పాతిక మందిపై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై దౌర్జన్యం లాంటి కేసులున్నాయి. అస్సాంలో అధికార కాంగ్రెస్ పార్టీ 8 మంది నేర చరితులకు టిక్కెట్లు ఇస్తే, అధికారం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న బిజెపి ముగ్గురుని బరిలోకి దింపింది. పశ్చిమబెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్, బిజెపి పోటాపోటీగా నేర చరితులను రంగంలోకి దించాయి. అందరి కంటే ఎక్కువగా బిజెపి 15మంది నేరచరితులకు టిక్కెట్లు ఇస్తే, త్రుణమూల్ కాంగ్రెస్ 12 మంది నేరచరితులను రంగంలోకి దింపింది. వీరంతా మొదటి, రెండో విడత లకు పోటీ చేస్తున్నారు.  ఇక కేరళలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై సొంత పార్టీ నుంచే విమర్శలొస్తున్నాయి. వివిధ కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు, మాజీ మంత్రులకు టిక్కెట్లు ఇవ్వడాన్ని కేరళ పీసీసీ అధ్యక్షుడే తప్పుపడుతున్నారు. ఎక్సయిజ్ మంత్రి కె. బాబు, రెవెన్యూ మంత్రి ఆదూర్ ప్రకాష్, సాంస్క్రుతిక మంత్రి జోసెఫ్ కు టిక్కెట్లు ఇవ్వడాన్ని ఆయన తీవ్ర స్వరంతో ప్రశ్నిస్తున్నారు. 

14:25 - April 2, 2016

విజయవాడ : జిల్లా అంతర్జాతీయ 'విద్యుత్‌ పొదుపు' సదస్సుకు వేదిక కాబోతుంది. ఈ నెల 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ఈ సదస్సును.. సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు 35 దేశాల నుంచి 200 మంది ప్రతినిధులు హాజరుకానున్నట్లు ఇంధన వనరులశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్‌ తెలిపారు. విద్యుత్‌ పొదుపుతో ఏడాదికి 200 కోట్లు ఆదా అవుతుందన్నారు. గేట్ వే హోటల్ లో ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో విద్యుత్ పొదుపు సంస్థను ప్రారంభిస్తామని తెలతిపారు. రైతులకు రెండు లక్షల పంపు సెట్లు ఉచితంగా అందచేయడం జరుగుతుందన్నారు.

14:23 - April 2, 2016

నిజామాబాద్ : తిమ్మాపూర్‌ ప్రాంతం పుణ్యక్షేత్రమవుతదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ నిజామాబాద్‌ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా జిల్లా బీర్కూర్‌ మండలం తిమ్మాపూర్‌లో కొలువై ఉన్న వేంకటేశ్వర స్వామిని కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. తిమ్మాపూర్ వెంకటేశ్వరస్వామి ఆలయం అద్భుతంగా ఉందని, ఆలయం చుట్టూ ఉన్న ప్రభుత్వ భూమిని ఆలయానికే చెందేలా చూస్తానమన్నారు. రూ. పది కోట్లతో కళ్యాణ మండపం నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇంద్రకిరణ్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ కవిత, జిల్లా ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. 

ప్రత్యూష ప్రియుడు అరెస్టు..

ముంబై : టీవీనటి ప్రత్యూష ఆత్మహత్య కేసులో ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇతడిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం.

తిమ్మాపూర్ శ్రీ వారిని దర్శించుకున్న కేసీఆర్ దంపతులు..

నిజామాబాద్ : జిల్లాలో రెండో రోజు సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగింది. బీర్కూరు (మం) తిమ్మాపూర్ వెంకటేశ్వరస్వామిని కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. తిమ్మాపూర్ వెంకటేశ్వరస్వామి ఆలయం అద్భుతంగా ఉందని, ఆలయం చుట్టూ ఉన్న ప్రభుత్వ భూమిని ఆలయానికే చెందేలా చూస్తానమన్నారు. రూ. పది కోట్లతో కళ్యాణ మండపం నిర్మిస్తామన్నారు. తిమ్మపూర్ ఆలయానికి రూ. 10 లక్షల 116 విరాళాన్ని కేసీఆర్ ప్రకటించారు. 

విజయవాడలో అంతర్జాతీయ సదస్సు..

విజయవాడ : విద్యుత్ పొదుపుపై ఈనెల 7,8,9 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు జరగనుందని, ఈసదస్సును సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నట్లు ఇంధన వనరుల శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు. ఈ సదస్సుకు 35 దేశాల నుండి 200 మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో విద్యుత్ పొదుపు సంస్థను ప్రారంభిస్తామని తెలతిపారు. విద్యుత్ పొదుపుతో ఏడాదికి రూ. 200 కోట్లు ఆదా అవుతుందని, రైతులకు రెండు లక్షల పంపు సెట్లు ఉచితంగా అందచేయడం జరుగుతుందన్నారు. 

మమత..టీఎంసీ నేతలపై ఈసీకి ఫిర్యాదు చేసిన ఏచూరి..

ఢిల్లీ : కేంద్ర ఎన్నికల కమిషననర్ తో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి జరిపిన భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించేలా ప్రసంగిస్తున్నారని మమతా బెనర్జీ, టీఎంసీ నేతలపై ఏచూరి ఫిర్యాదు చేశారు. ఎన్నికల తరువాత తన వ్యతిరేకులపై ప్రతికారం తీర్చుకుంటానని మమత బెదిరిస్తున్నారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. బెదిరింపు ప్రసంగాలు చేస్తున్న టీఎంసీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్లు ఏచూరి తెలిపారు. 

13:59 - April 2, 2016

ఢిల్లీ : టీమిండియా కూల్ కూల్‌ కెప్టెన్‌ మహేందర్‌ సింగ్‌ ధోనీ....సిక్సర్లు బాదడంలో మాత్రమే కాదు సెన్స్ ఆఫ్‌ హ్యూమర్‌లోనూ తనకు తాను మాత్రమే సాటి అనిపించుకున్నాడు. టీ 20 ప్రపంచకప్‌ సెమీస్‌లో వెస్టిండీస్‌ జట్టు చేతిలో ఓడిన తర్వాతి ప్రెస్‌ మీట్‌లో మాత్రం ధోనీ ఎన్నడూ లేనంతలా రియాక్ట్‌ అయ్యాడు.
ఇంకెన్నాళ్లు ఆడతారు...... టోర్నీకి ముందు....ఎప్పుడు రిటైరవుతారు......
టోర్నీ తర్వాత........ఇక ఇప్పుడైనా రిటైరవుతారా????? ప్రెస్‌ మీట్ ఎక్కడైనా....టీమిండియా మోస్ట్‌ సక్సెస్‌ ఫుల్‌ కెప్టెన్‌ ధోనీని ప్రతీసారి పలుకరించే ప్రశ్న ఇదే.వికెట్‌ కీపర్‌గా, బ్యాట్స్‌మెన్‌గా, కెప్టెన్‌గా భారత జట్టుకు సేవలందిస్తున్న ధోనీకి ఈ ప్రశ్న అడగని సందర్భమంటూ లేదు. స్థాయికి తగ్గట్టుగానే ఆడుతున్న మహీని ఎప్పటినుంచో  వెంటాడుతున్న ప్రశ్న కూడా ఇదే.2014 టీ 20 వరల్డ్‌కప్ ఫైనల్‌ ఓటమి తరువాతి నుంచి...ఇదే ప్రశ్న పదే పదే వెంటాడుతోంది. 

భారత జట్టును అన్ని ఫార్మాట్లలో నెంబర్‌వన్‌గా నిలపడంతో పాటు రెండు సార్లు  ప్రపంచకప్‌ అందించిన కెప్టెన్‌గా ధోనీ అరుదైన, అసాధారణ రికార్డ్‌ సొంతం చేసుకున్నాడు.ఎంత చేసినా కొంతమంది మాత్రం ఇంకా ధోనీ రిటైరవ్వాల్సిందేనంటూ  విమర్శలు చేస్తూనే ఉన్నారు.

రిటైర్మెంట్‌ క్వశ్చన్‌ విన్నప్పుడల్లా ధోనీ సూటిగానే సమాధానమిస్తాడు.కానీ టీ 20 ప్రపంచకప్‌ సెమీస్‌లో వెస్టిండీస్‌ జట్టు చేతిలో ఓడిన తర్వాతి ప్రెస్‌ మీట్‌లో మాత్రం ధోనీ ఎన్నడూ లేనంతలా 
రియాక్ట్‌ అయ్యాడు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న జట్టు సెమీఫైనల్‌లో ఓడిపోతే ఏ జట్టు కెప్టెన్‌ అయినా సీరియస్‌గా సమాధానమిచ్చేసి వెళ్లిపోతుంటాడు. కానీ ధోనీ మాత్రం ఈ సారి అలా చేయలేదు.

ఆస్ట్రేలియాకు చెందిన మీడియా ప్రతినిధి ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో ఇంకెన్నాళ్లు కొనసాగుతారు? అని అడిగిన వెంటనే  మహీ తనదైన స్టైల్‌లోనే బదులిచ్చాడు. .మునుపెన్నడూ లేనంతలా కాస్త రూటు మార్చి.....ధోనీ ఎలా కౌంటర్‌ ఇచ్చాడో మీరే చూడండి. పిలిచిన వెంటనే భయపడుతూనే  ముందుకొచ్చిన రిపోర్టర్‌ను.....ధోనీనే స్వయంగా ఇంటర్వ్యూ చేసి ఆకట్టుకున్నాడు.  ఇలా ...ఎప్పటివరకూ అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాలనునుకుంటున్నాడో ధోనీ చెప్పకనే చెప్పాడు.తన మైండ్‌లో ఏముందో మీడియా ప్రతినిధితోనే చెప్పించిన మహీ.....తనకు తాను మాత్రమే సాటి అనిపించుకున్నాడు. 

13:54 - April 2, 2016

శ్రీకాకుళం : జిల్లాలోని కొవ్వాడలో నిర్మించతలపెట్టిన అణు విద్యుత్‌ కేంద్రానికి వ్యతిరేకంగా ప్రజా సంఘాలు మళ్లీ ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి. పర్యావరణ వేత్తలు, ప్రజా సంఘాలు  ఈ ప్లాంట్‌ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నా... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం....  బేఖాతర్‌ చేస్తున్నాయి. కొవ్వాడ అణు విద్యుత్‌ కేంద్రం నిర్మాణంపై ముందుకెళ్లాలని పాలకులు నిర్ణయించడంతో తీరప్రాంత గ్రామాల్లో మళ్లీ అలజడి ప్రారంభమయ్యింది. ఈ ప్లాంట్‌కు అవసరమైన భూసేకరణకు 389 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడంతో జనం రోడ్డెక్కుతున్నారు. 
పలుసార్లు రణరంగంగా రణస్థలం 
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పలుసార్లు రణరంగంగా మారింది. ఈ మండలంలోని కొవ్వాడ దగ్గర నిర్మించ తలపెట్టిన అణు విద్యుత్‌ కేంద్రానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తున్నా.... ప్రభుత్వం మాత్రం దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ కేంద్రానికి అవసరమైన భూసేకరణకు ప్రభుత్వం  నిధులు విడుదల చేయడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
భూసేకరణకు రూ. 500 కోట్లు అవసరమని అంచనా 
కొవ్వాడ అణు విద్యుత్‌ కేంద్రం కోసం భారీగా భూమి సేకరించాల్సి ఉంది. దాదాపు రెండువేల ఎకరాల  భూమి అవసరమవుతుందని లెక్క తేల్చారు. ఇందుకోసం 500 కోట్ల రూపాయలు అవసరమవుతుందని అంచనా వేశారు.  భారత్‌ అణు విద్యుత్‌ సంస్థ... ఎన్ పిసీఐఎల్  మూడు రోజులు క్రితం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ ఖాతాకు 389 కోట్ల రూపాయలు జమ చేసింది. మిగిలిన 111 కోట్ల రూపాయలను త్వరలోనే జమ చేస్తామని చెప్పింది.  కొవ్వాడ అణు విద్యుత్‌ కేంద్రం కోసం గ్రామాలకు గ్రామాలనే తరలించాల్సి ఉంది. చిన కొవ్వాడ, పెద కొవ్వాడ, టెక్కలి, రామచంద్రాపురం గ్రామాలను పూర్తిగా ఈ ప్లాంట్‌ పరిధిలోకి వస్తాయి. వీటితోపాటు మరికొన్ని గ్రామాల్లో కూడా భూమి సేకరించాల్సి ఉంది.  ఆయా గ్రామాల్లో ఎనిమిదివేల మంది వరకు  నిర్వాసితులతారని అంచనా వేశారు. వీరంతా పెట్టెబేడ సర్దుకుని, గొడ్డుగోదతో వేరే ప్రాంతాలకు తరలిపోవాల్సి ఉంటుంది. ఉన్నవూరు, పుట్టి పెరిగిన ప్రాంతాన్ని, భుక్తిగడుపుతున్న భూముల్ని  విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్లడం ఇష్టంలేని ఈ ప్రాంత ప్రజలు  కొవ్వాడ అణు విద్యుత్‌ కేంద్రానికి వ్యతిరేకంగా మళ్లీ ఉద్యమానికి సిద్ధమవుతన్నారు.   
కొవ్వాడలో అణు విద్యుత్‌ కేంద్ర సురక్షితం కాదన్న వాదనలు 
కొవ్వాడ భూకంపాల జోన్‌లో ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో అణు విద్యుత్‌ కేంద్రం ఏ మాత్రం సురక్షింతకాదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. జపాన్‌లోని  ఫుకూషిమా అణు విద్యుత్‌ కేంద్రంలో జరిగిన ప్రమాదాన్ని గుర్తు చేస్తున్నారు. అయినా వీటన్నింటిని పెడచెవిన పెడుతున్న పాలకులు... భూసేకరణకు సిద్ధమవుతున్నారు. ఈ అంశంపై ప్రజలకు నచ్చచెబుతామని జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు చెబుతున్నా... వినకపోతే నయానోభయానో బెదిరించి.. భూసేరణ చేపట్టాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. కొవ్వాడ అణు విద్యుత్‌ కేంద్రం భూసేకరణ సమస్య ఏ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. 

13:50 - April 2, 2016

నెల్లూరు : జిల్లాలోని స్టోన్‌హౌస్‌పేట సబ్‌రిజిస్ట్రార్‌ నందకిశోర్‌ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కోటిన్నరకుపైగా అక్రమాస్తులు గుర్తించారు. నందకిశోర్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు, కావలి, కర్నూలు, హైదరాబాద్‌లోని నందకిశోర్‌ బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు నందకిశోర్‌ అక్రమాలు తెలిసిన వారు తమకు తెలపవచ్చని ఏసీబీ అధికారులు ప్రకటించారు. 

13:44 - April 2, 2016

కృష్ణా : విజయవాడలో ఎన్టీఆర్‌ వెటర్నరీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నందమూరి హరికృష్ణ హాజరయ్యారు. ఈ ఆస్పత్రి నిర్మాణానికి ఎంపీ నిధులు ఇచ్చిన హరికృష్ణకు ప్రత్తిపాటి, దేవినేనిలు అభినందనలు తెలిపారు. అయితే.. ఈ కార్యక్రమానికి వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని హాజరుకావడం సంచలనం రేకెత్తించింది. హరికృష్ణతో కలిసి కొడాలి నాని ఒకే కారులో రావడంతో అన్ని వర్గాల్లో అసక్తికర చర్చ కొనసాగింది. అయితే.. దీనికి రాజకీయ ప్రాధాన్యత లేదని కొడాలి తెలిపారు. తనకు హరికృష్ణ గురువులాంటి వారని.. అందుకే ఈ కార్యక్రమానికి వచ్చానన్నారు కొడాలి. 

 

13:42 - April 2, 2016

కోల్ కతా : కోల్‌కతా ఘటన దురదృష్టకరమని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. కోల్‌కతాలో ఆయన పర్యటిస్తున్నారు. ప్లైఓవర్‌ కూలిన ప్రదేశాన్ని రాహుల్ పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందని అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఫ్లై ఓవర్‌ ఘటనలో మృతి చెందిన కుటుంబ సభ్యులను రాహుల్‌ పరామర్శించారు.

 

బస్సులో మంటలు....

హైదరాబాద్‌ : సికింద్రాబ్‌ సమీపంలోని సీతాఫల్‌మండీ వద్ద ప్రైవేటు ఏసీ బస్సులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది పెళ్లి బృందం అద్దాలు పగులగొట్టి బయటకు దూకడంతో పెను ప్రమాదం తప్పింది. ఇంజిన్‌లో సాంకేతికలోపం కారణంగా బస్సులో మంటలు వ్యాపించిచనట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. పెళ్లి బృందం సికింద్రాబాద్‌ నుంచి కర్నూలు వెళ్తుండగా ఘటన జరిగింది.

ప్రత్యూష ఆత్మహత్య ఘటటనపై విచారణ వేగవంతం

ముంబయి : బాలీవుడ్ లో కలకలం రేపిన 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ ఫేం ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యోదంతంలో విచారణ వేగవంతమైంది. నిన్న ముంబైలోని తన ఇంటిలోని ఫ్యాన్ కు ఉరేసుకున్ని ప్రత్యూష చనిపోయింది. ఈ క్రమంలో నిన్నటి నుంచి అడ్రెస్ లేకుండాపోయిన ప్రత్యూష లవర్ రాహుల్ రాజ్ సింగ్ ను నేటి ఉదయం ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఓ గుర్తు తెలియని ప్రాంతంలో ఉంచిన పోలీసులు అతడిని పలు కోణాల్లో విచారిస్తున్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు ప్రత్యూష... రాహుల్ కు ఓ మెసేజ్ పంపినట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో ప్రత్యూష మృతదేహానికి పోస్టుమార్టం జరగనుంది. పోస్టుమార్టం నివేదిక వస్తే...

అలస్కాలో భూకంపం...రిక్టర్ స్కేలుపై 6.2 గా నమోదు

హైదరాబాద్‌ : అలస్కాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.2గా నమోదు అయిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఎక్కడ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కానీ సంభవించినట్లు సమాచారం మాత్రం అందలేదని తెలిపింది. అయితే సునామీ వచ్చే సూచనలు ఏమీ లేవని పేర్కొంది. భూకంప కేంద్రం 58 మైళ్ల అడుగున సంభవించినట్లు గుర్తించామని యూఎస్ జియోలాజికల్ సర్వే చెప్పింది.

ప్లైఓవర్ కూలిన ప్రాంతాన్ని సందర్శించిన రాహుల్

కోల్కతా : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కోల్‌కతాలో పర్యటించారు. ప్లైఓవర్ కూలిన ప్రాంతాన్ని రాహుల్ సందర్శించారు. రాహుల్ వెంట పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉన్నారు.

13:31 - April 2, 2016

వరంగల్ : వరకట్న వేధింపులకు ఓ యువతి బలైంది. ప్రియుడి అదనపు కట్నం వేధింపులతో మనస్థాపం చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లికి చెందిన మమత ఓ ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేస్తోంది. కొత్తగూడెం మండలం ఏలుబెల్లికి చెందిన వెంకటరమణ ఎంబిబిఎస్ డాక్టర్ గా తిరుపతి మెడికల్ కళాశాలలో చదువుతున్నాడు. ఈనేపథ్యంలో వైద్యుడు వెంకటరమణ, మమత నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇరువురు దగ్గరి బంధువులు కావడంతో వెంకటరమణతో మమతకు గతేడాది నిశ్చితార్థం జరిగింది. రూ.25 లక్షల కట్నానికి ఒప్పుకుని నిశ్చితార్థం కుదుర్చుకున్నారు. ఈక్రమంలో వెంటకమరణ మనసు మార్చుకుని అదనపు కట్నం కావాలని... అదనపు కట్నం ఇవ్వకుంటే నిశ్చితార్థం క్యాన్సిల్‌ చేసుకుంటానని, ఇస్తేనే మమతను వివాహం చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డాడు. పెద్దలు పంచాయతీ పెట్టారు. ఇరు వర్గాల మధ్య సయోద్య కుదిర్చి గత నెలరోజుల క్రితం రూ.5 లక్షలను అదనపు కట్నంగా మమత తల్లిదండ్రులు వెంకటరమణకు ఇచ్చారు. అయినప్పటికి కూడా వెంకటరమణ వేరే అమ్మాయితో పెళ్లి చేసుకుంటున్నాడన్న వార్త మమతకు చేరింది. దీంతో మమత అతన్ని నిలదీసింది. అయినా వెంకటరమణ వినలేదు. దీంతో మమత చాలా ఆందోళనకు గురైంది. తనపెళ్లి అవుతుందో.. కాదోనని దిగులు చెందింది. వ్యవహారం పోలీసుల వద్దకు వెళ్లినా... సమస్య కొలిక్కిరాలేదు. మనస్థాపం చెందిన మమత రెండు రోజుల క్రితం క్రిమిసంహారక మందు తాగడంతో స్పృహ తప్పిపడిపోయింది. కుటుంబ సభ్యులు ఆమెను వరంగల్ ఎంజిఎం ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడం చికిత్స పొందుతూ మమత మృతి చెందింది. ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అయితే వెంకటరమణ అదనపు కట్నం తేవాలని వేధించడం, హింసించడం వల్లే మమత ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. మమత పరుగుల మందు తాగినప్పుడే తల్లిదండ్రులు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారిస్తున్నారు. వెంకటమరణ, అతని తల్లిదండ్రులతోపాటు బంధువులు పరారీలో ఉన్నారు. 

 

12:24 - April 2, 2016

హైదరాబాద్ : బంధం మరింత గట్టిపడుతోంది. సంబంధం  మును ముందుకు సాగిపోతోంది. సై అంటే సై  అన్న పరిస్థితి క్రమంగా కనుమరుగవుతోంది. జల జగడం దూరంగా జరిగిపోతోంది. ఇచ్చి పుచ్చుకునే ధోరణి బలం పుంజుకుంటోంది.  మొత్తంగా ఇద్దరు చంద్రుల మధ్య చక్కనైన బంధం చిక్కగా మారుతోంది. 
సాగర్‌ సాక్షిగా యుద్ధ మేఘాలు.. 
ఒకప్పుడు సాగర్‌ సాక్షిగా యుద్ధ మేఘాలు.. ఇప్పుడు అసెంబ్లీ వేదికగా స్నేహ హస్తాలు.. అప్పుడు పట్టిసీమపై వ్యతిరేకత.. ఇప్పుడు అదే పట్టిసీమపై అనుకూలత..
వాటర్‌ వార్‌...?
రాష్ట్ర విభజన జరిగితే రెండు రాష్ట్రాల మధ్య వాటర్‌ వార్‌ జరుగుతోందనే వాదన వచ్చింది. మొదట్లో అది నిజమే అనిపించింది. కాని ప్రస్తుతం  క్రమంగా మార్పు కనిపిస్తోంది. ఇద్దరు  ముఖ్యమంత్రుల చొరవ సత్ఫలితాలను ఇస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత కృష్ణా నీటి విడుదలపై  రెండు రాష్ట్రాల మధ్య వివాదం మొదటి ఏడాదే  మొదలైంది. ఇది నాగార్జున సాగర్‌ దగ్గర ఇరు రాష్ట్రాల  పోలీసులు కొట్టుకునే వరకు వెళ్లింది.  కాని ఆ  సయమంలో ఏపీ సీఎం చంద్రబాబు కేసీఆర్‌తో  ఫోన్‌ మాట్లాడడం..దానికి కేసీఆర్‌ సానుకూలంగా  స్పందించడంతో వివాదానికి తెరపడింది.
'పట్టిసీమ'ను మొదట్లో వ్యతిరేకించిన టీ.ప్రభుత్వం 
పట్టిసీమ ప్రాజెక్టును మొదట్లో తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. దీనిపై కేంద్రానికి లేఖ కూడా రాసింది. కాని ఇప్పుడు టీ.సర్కార్‌ మనసు మార్చుకుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆరే పట్టిసీమను పొగడ్తలతో ముంచెత్తారు. ఆంధ్రప్రదేశ్‌కు పట్టిసీమ ప్రాజెక్టుతో మంచి జరుగుతుందని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. తెలంగాణ ప్రాజెక్టుల రీడిజైనింగ్‌పై పవర్‌ పాయింట్‌  ప్రజెంటేషన్‌ సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు  చేశారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కామెంట్లతో తెలంగాణ, ఏపీ మధ్య సంబంధం మరింత పెరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జల జగడాలు  ఉన్నా...ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించుకుని..పరిష్కరించుకునే చక్కని వాతావరణానికి మార్గం ఏర్పడిందనే వాదనలు  వినిపిస్తున్నాయి. 

 

కొనసాగుతున్న ఎపి కేబినెట్ సమావేశం

హైదరాబాద్ : ఎపి కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. సమావేశం అనంతరం పోలిట్ బ్యూరో సమావేశం జరుగనుంది. 
 

12:11 - April 2, 2016

కృష్ణా : బెజవాడ రాజకీయాల్లో ఒక్కసారిగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్టీఆర్‌ వెటర్నరీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభానికి నందమూరి హరికృష్ణతో కలిసి.. వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని హాజరయ్యారు. దీంతో రాజకీయవర్గాల్లో ఒక్కసారిగా చర్చ మొదలైంది. అయితే... దీనికి రాజకీయ ప్రాధాన్యత లేదదని నాని అంటున్నారు. హరికృష్ణ తనకు గురువులాంటి వారు.. అందుకే ఆయనతో పాటు కలిసి కార్యక్రమానికి వచ్చానని నాని అంటున్నారు. 

 

11:28 - April 2, 2016

గుంటూరు : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది విద్యార్థులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బాపట్లలోని కేర్‌ పాఠశాలకు చెందిన బస్సు కర్లపాలెం, బాపట్ల మండలాలకు చెందిన 40మంది విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో బాపట్ల పట్టణంలోని పటేల్‌నగర్‌ వద్ద ఇవాళ ఉదయం పాఠశాల బస్సును ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 11 మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి బస్సులో ఉన్న విద్యార్థులను బయటకు తీసి 108 వాహనంలో స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన విద్యార్థులకు వైద్యులు చికిత్స అందించారు. విద్యార్థులకు జరిగిన ప్రమాదం తెలుసుకుని పెద్ద సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు. తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. 

 

స్కూల్ బస్సు-లారీ ఢీ...

గుంటూరు : జిల్లాలోని బాపట్ల పట్టణంలోని పటేల్‌నగర్‌ వద్ద ఇవాళ ఉదయం పాఠశాల బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి బస్సులో ఉన్న విద్యార్థులను బయటకు తీసి 108 వాహనంలో స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. 

ప్రారంభమైన ఎపి కేబినెట్ సమావేశం

హైదరాబాద్ : ఎపి కేబినెట్ సమావేశం ప్రారంభం అయింది. ఈ భేటీలో పలు కీలన నిర్ణయాలు తీసుకొనున్నారు. మంత్రివర్గం సమావేశం ముగిసిన అనంతరం టీడీపీ పొలిట్ బ్యూరో భేటీ కానుంది. 

10:46 - April 2, 2016

ప్రభుదేవా, తమన్నా హీరోహీరోయిన్లుగా విజరు దర్శకత్వంలో 'అభినేత్రి' పేరుతో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. కోన ఫిలిం కార్పొరేషన్‌ సమర్పణలో బ్లూ సర్కిల్‌ కార్పొరేషన్‌, బి.ఎల్‌.ఎన్‌.సినిమాతో ఎం.వి.వి. సినిమా పతాకంపై ఈ చిత్రాన్ని ఎం.వి.వి.సత్యనారాయణ తెలుగులో నిర్మిస్తుండగా, ప్రభుదేవా స్టూడియోస్‌ పతాకంపై తమిళం, హిందీ భాషల్లో ప్రభుదేవా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి తమన్నా మాట్లాడుతూ, 'ఫస్ట్‌టైమ్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నాను. ఈ క్యారెక్టర్‌ గురించి డైరెక్టర్‌ విజరు చెప్పినప్పుడు చాలా స్ఫూర్తి పొందాను. మూడుభాషల్లో ఒకేసారి నటించడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. నా కెరీర్‌లో మొదటిసారి హర్రర్‌ కామెడీ చిత్రంలో నటిస్తున్నాను. ఇదొక సెన్సేషనల్‌ చిత్రమవుతుంది' అని అన్నారు. 'ప్రభుదేవా, తమన్నాతోపాటు ఇతర తెలుగు, తమిళం, హిందీకి చెందిన నటీనటులు నటిస్తున్నారు. 'గజిని', 'హ్యాపీ న్యూ ఇయర్‌' వంటి చిత్రాలకు పనిచేసిన మనీష్‌ నందన్‌ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా వర్క్‌ చేయడం, ఎస్‌.ఎస్‌.థమన్‌, జి.వి.ప్రకాష్‌ సంయుక్తంగా సంగీతమందిస్తుండడం, ఎడిటర్‌గా పలు జాతీయ అవార్డులందుకున్న ఆంటోని ఎడిటర్‌గా పనిచేయడం ఈ చిత్రానికి హైలైట్స్‌గా చెప్పుకోవచ్చు. దర్శకుడు విజరు ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. 70కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. ఏప్రిల్‌ 15 నుంచి మూడో షెడ్యూల్‌ను చిత్రీకరించబోతున్నాం. జులైలో సినిమాను రిలీజ్‌ చేస్తాం' అని కోన వెంకట్‌ తెలిపారు. 
'అనుష్కకు 'అరుంధతి', జ్యోతికకు 'చంద్రముఖి'లా తమన్నాకు అంతటి పేరు ఈ చిత్రంతో వస్తుంది' అని నిర్మాత అన్నారు.

10:42 - April 2, 2016

నాని, సురభి, నివేదా థామస్‌ హీరోహీరోయిన్లుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌పై నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ, 'ఇదొక అందమైన రొమాంటిక్‌ థ్రిల్లర్‌. థ్రిల్‌ చేసే ఎలిమెంట్స్, రొమాన్స్, సెంటిమెంట్‌, వినోదం... ఇలా అన్ని అంశాల మేళవింపుతో తెరకెక్కి స్తున్నాం. త్వరలోనే టైటిల్‌ని ప్రకటిస్తాం. డిసెంబర్‌ 2న సినిమాను ప్రారంభించి, ఫిబ్రవరి 14 నుంచి మార్చి 6 వరకు కొడైకెనాల్‌లో ఒక పాటతోపాటు పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. మార్చి 14న హైదరాబాద్‌లో తదుపరి షెడ్యూల్‌ ప్రారంభించాం. ఏప్రిల్‌ 6 వరకు జరిగే ఈ షెడ్యూల్‌లో ఇంపార్టెంట్‌ టాకీపార్ట్ తోపాటు ఒక పాటను చిత్రీకరిస్తాం. దీంతో షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది. మే నెలాఖరున లేదా జూన్‌ మొదటి వారంలో సినిమాను విడుదల చేస్తున్నాం' అని అన్నారు.

 

10:35 - April 2, 2016

ధన్‌రాజ్‌, దీక్షాపంత్‌ జంటగా నెల్లుట్ల ప్రవీణ్‌ చందర్‌ దర్శకత్వంలో ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై కళ్యాణి రామ్‌ నిర్మిస్తున్న చిత్రం 'బంతిపూల జానకి'. ఈ చిత్రం గురువారంతో షూటింగ్‌ పూర్తి చేసుకున్న నేపథ్యంలో గుమ్మడి కాయ ఫంక్షన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ధన్‌రాజ్‌ మాట్లాడుతూ, 'ఇటీవల మాలయాళ సూపర్‌స్టార్‌ మెహన్‌లాల్‌ మా చిత్రం పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. ఆయన పోస్టర్‌ విడుదల చేసిన వేళా విశేషమేంటోగాని షూటింగ్‌ మొత్తం అనుకున్నది అనుకున్నట్లుగా అంతా బాగా జరిగింది. నిర్మాత కళ్యాణిరామ్‌ 
మాపై నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టు కునేలా ఈ చిత్రాన్ని చేశాం. మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రంలో జబర్దస్త్‌ బ్యాచ్‌ చేసే కామెడీ హైలెట్‌గా ఉంటుంది. ఈ చిత్ర కథకు హీరోగా సెట్‌ అవుతానని దర్శకుడు నన్ను సెలక్ట్ చేసుకున్నారు. డబ్బు కోసం కాకుండా వృత్తి సంతృప్తి కోసం ఈ చిత్రంలో నటించాను. అందరిని అలరిస్తుందని నమ్ముతున్నాను' అని అన్నారు. 'నాకిది రెండో చిత్రం. సింగిల్‌ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేశాం. సినిమా కోసం ధన్‌రాజ్‌ అందించిన సహకారం మరువలేనిది. అవుట్‌ అండ్‌ అవుట్‌ థ్రిల్లింగ్‌ కామెడీతో సాగే చిత్రమిది' అని దర్శకుడు తెలిపారు. దీక్షాపంత్‌ మాట్లాడుతూ, 'ఇందులో జానకి పాత్రలో నటిస్తున్నాను. సినిమా విడుదలైన తర్వాత అందరూ నన్ను జానకి అనే పిలుస్తారు. అంతగా నా పాత్ర ప్రేక్షకులను అలరిస్తుందని భావిస్తున్నాను' అని చెప్పారు.

ఈజిప్టులో బాంబు పేలుడు... ఇద్దరి మృతి

కైరో : ఈజిప్టు ఉత్తర ప్రాంతంలోని అల్‌-అరిష్‌ నగరంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ దాడిలో ఓ పోలీసు అధికారి సహా ఇద్దరు మరణించారు. మరో భద్రతా అధికారికి గాయాలయ్యాయి. అల్‌-బహర్‌ వీధిలో పోలీసు క్లబ్‌కు సమీపంలో ఉగ్రవాదులు బాంబును అమర్చారు. పోలీసు వాహనం అటుగా వెళ్తుండగా బాంబును పేల్చినట్లు ఈజిప్టు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

వరంగల్ జిల్లాలో దారుణం

వరంగల్ : జిల్లాలోని భూపాలపల్లిలో దారుణం జరిగింది. మల్లమ్మ అనే వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కొడుకే చంపి పూడ్చి పెట్టాడంటూ కూతుళ్లు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

రోడ్డు ప్రమాదంలో విద్యార్థులకు గాయాలు

గుంటూరు : జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బాపట్లలో లారీ-స్కూల్‌ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 20 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స చేసి ఇళ్లకు పంపించారు.

09:50 - April 2, 2016

మహబూబ్‌నగర్‌ : పని కోసం వెళ్తూ మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. జిల్లాలోని ఎనుగొండ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఐదేళ్ల బాలుడు సహా దంపతులు ఉన్నారు. జిల్లాలోని మగ్దూరు మండలం వీరారంకు చెందిన కొండన్న హైదరాబాద్ లో పని చేస్తుంటాడు. ఈనేపథ్యంలో కొండన్న అతని భార్య శ్రీశైలమ్మ, కొడుకు నరేష్ (5) ముగ్గురు కలిసి... బైక్ పై స్వగ్రామం నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు. మార్గంమధ్యలో జిల్లా కేంద్రం దగ్గర్లో ఎనుగొండ సమీపంలో ఎదురుగా వస్తున్న హెరిటేజ్ పాల వ్యాన్ బైక్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ వెళ్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పాల వ్యాన్ కూడా అదుపు తప్పి పడిపోయింది. అందులోని ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పాల వ్యాన్ డ్రైవర్ తప్పు ఉందని.. నిద్రమత్తులో ఉన్నాడని.. స్థానికులు అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. మృతుల కుటుంబం, బంధువుల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. 

09:44 - April 2, 2016

నెల్లూరు : జిల్లాలో దారుణం జరిగింది. గ్రామీణ మండలం పెద్దచెరుకూరులో జంట హత్యలు కలకలం రేపాయి. వృద్ధ దంపతులను దుండగులు దారుణంగా  హతమార్చారు. వృద్ధ పూజారి దంపతులు చంద్రమౌళేశ్వరరావు, పుష్పవేణమ్మ రూరల్ మండలం పెద్దచెరుకూరు శివాలయం ఆవరణలో నివాసముంటున్నారు. గత కొంతకాలంగా అక్కడే నివసిస్తున్నారు. చంద్రమౌళేశ్వరావు గతంలో శివాలయంలో పూజరిగా పని చేసే వాడు. వయసు మీరడంతో అతని కొడుకు సుబ్బయ్యశర్మ ఆ విధులను నిర్వర్తిస్తున్నాడు. కొడుకు బయటి నివసిస్తున్నాడు. దంపతులు చంద్రమౌళేశ్వరరావు, పుష్పవేణమ్మ శివాలయం ఆవరణలో ఉంటున్నారు. ఈనేపథ్యంలో నిన్న రాత్రి కొంతమంది దుండగులు ఆ దంపతులను సుత్తితో కొట్టి తలపై మోది చంపారు. పాలు పోపే వ్యక్తి వచ్చి తలుపులు తీసి చూడగా.. పూజారి దంపతులు దారుణ హత్యకు గురవ్వడం చూసి.. అతను తీవ్ర ఆందోళన చెంది స్థానికులకు సమాచారం ఇచ్చాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. క్లూస్ టీం వచ్చిన తర్వాతే ఆధారాలు తెలిసే అవకాశముంందని చెబుతున్నారు. అయితే పోలీసులు చెబుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం.. దొంగతనానికి వచ్చిన దొంగలే ఈ పనికి పాల్పడి ఉండవచ్చని... అనుమానిస్తున్నారు. ఇదిలావుంటే అనేక సంవత్సరాలుగా శివాలయంలోనే ఉంటున్నామని... ఎవరికి మనస్పర్థలు గానీ, కక్షలు గానీ లేవని మృతుల కుటుంబ సభ్యులు అంటున్నారు. ఇదిలావుంటే గత నెల రోజలుగా జిల్లాలో 14 దారుణ హత్యలు జరిగాయి. ఈ రెండింటిని కలుపుకుంటే మొత్తం 16 హత్యలు అవుతున్నాయి. 10 కి పైగా హత్యాయత్నాలు జరిగాయి. తరచుగా దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. దేవాలయాల్లో హుండీలను ఎత్తుకుపోవడం, అడ్డుగా వచ్చినవారిని కొట్టడం తరచుగా జరుగుతోంది. ఇటీవలే వెంకటగిరి ఆలయంలో ఐదు కోట్లు విలువుచేసే దక్షిణమూర్తి విగ్రహాన్ని కూడా ఎత్తుకెళ్లడం జరిగింది. ఎట్టకేలకు దొంగలను పట్టుకున్నారు. దొంగతనాలు,  దోపిడీలు, నేరాలు ఘోరాలను అదుపు చేయడంలో పోలీసులు విఫలమవుతున్నట్లు తెలుస్తోంది. పోలీసు వ్యవస్థ నిద్రపోతుందని చెప్పవచ్చు. 

నెల్లూరు జిల్లాలో దారుణం

నెల్లూరు : గ్రామీణ మండలం పెద్దచెరుకూరులో దారుణం జరిగింది. శివాలయం ఆవరణలో పూజారి దంపతులను గుర్తు తెలియని దుండగులు హత్యచేశారు. వృద్ధ దంపతులైన చంద్రమౌళేశ్వరరావు, పుష్పవేణమ్మ తలపై మోది హతమార్చారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

 

09:39 - April 2, 2016

కోల్ కతాలో నిర్మాణంలో ఉన్న ఫ్లైవోవర్ కుప్పకూలిన ఘటనలో ఫ్లైవోవర్ నిర్మిస్తున్న సదరు కంపెనీ, ఆ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని వక్తలు పేర్కొన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో ప్రజాశక్తి మాజీ ఎడిటర్ వినయ్ కుమార్, టీపీసీసీ అధికార ప్రతినిధి విజయ్ కుమార్, బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. దైవేక్ష అంటే దర్యాప్తు జరగదన్నారు. ఘటనను దైవేక్ష అని చెప్పడం వల్ల ఫలితం లేదని చెప్పారు. నిర్ణీత ప్రమాణాలు పాటించారా లేదా అనేది పరిశీలించాలని పేర్కొన్నారు. నిర్మాణ పనులను పర్యవేక్షించాల్సిన బాధ్యత మమతా బెనర్జీ ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. ఘటనకు ఆ కంపెని, ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. సదరు కంపెనీపై కేసులు బుక్ చేయాలని సూచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

శంషాబాద్ ఎయిర్పోర్టులో బంగారం పట్టివేత

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో  కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 450 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అతడిని అదుపులోకి తీసుకున్ని ప్రశ్నిస్తున్నారు.

08:54 - April 2, 2016

ముంబయి : బాలికావధు సీరియల్‌ ద్వారా అందరికి సుపరిచతమైన నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం ఉదయం ముంబైలోని తన ఇంట్లో ఉరేసుకుని ప్రత్యూష చనిపోయింది. ముంబయి శివార్లలో కోకిలా బెన్‌ అంబానీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే వ్యక్తిగత కారణాలతోనే ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రత్యూష తన స్నేహితుడు రాహుల్‌ రాజ్‌సింగ్‌తో ప్రేమాయణం కొనసాగించింది. అయితే త్వరలోనే అతడిని వివాహం కూడా చేసుకోబోతున్నట్లు తన సన్నిహితులకు ప్రత్యూష చెప్పింది. కానీ ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. బాలికావధు సీరియల్‌లో ఆనంది పాత్రతో ఆమె దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. ఈ సీరియల్ తెలుగులో చిన్నారి పెళ్లికూతురు పేరుతో ప్రసారం అవుతోంది. అంతేకాదు...ప్రత్యూష బిగ్‌బాస్‌-7లో కూడా తళుక్కుమన్నారు. 

 

08:50 - April 2, 2016

హైదరాబాద్ : అవినీతి బాబులు.. పేదల పథకాలను సైతం వదలడం లేదు. నకిలీ ధృవ పత్రాలతో నిధులను కాజేస్తున్నారు. దళారులు, అధికారులు కుమ్మక్కై పేదలకు లబ్ది చేకూర్చే పథకాలను పక్కదారి పట్టిస్తున్నారు. తాజాగా ఏసీబీ ఎంక్వయిరీలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నకిలీ లబ్ధిదారులతో పథకం పక్కదారి 
రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లోని షాదీ ముబారక్ లబ్దిదారురాలు సుల్తానా బేగంను ప్రశ్నించిన ఏసీబీ అధికారులకు దిమ్మతిరిగింది. అసలు తాము షాదీముబారక్ పథకానికి దరఖాస్తు చేసుకోలేదని సుల్తానా బేగం చెప్పడంతో ఖంగుతిన్నారు. పథకం కోసం సమర్పించిన పత్రాల్లో ఒక్క ఆధార్ కార్డ్, ఫోటోలు తప్పా మిగతావన్ని తనవి కాదని సుల్తానా బేగం స్పష్టం చేసింది. దీంతో వెంటనే కేసును నమోదు చేసి, అధికారులు దర్యాప్తు  చేస్తున్నారు.  
ఎంక్వయిరీ అధికారి తాహెర్ పై కేసు నమోదు 
షాదీ ముబారక్ అవినీతికి సంబంధించి అన్ని కోణాల్లో తనిఖీలు చేపట్టామని ఏసీబీ డీసీపీ ప్రభాకర్ చెప్పారు. రంగారెడ్డి జిల్లా మైనారిటీ వెల్ఫేర్ కార్యాలయంలో ఎంక్వయిరీ అధికారి తాహెర్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇలాంటి అవకతవకలు ఇంకా చాలా జరిగాయన్న సమాచారం తమ దగ్గర  ఉందని వాటన్నింటిని వెలుగులోకి తీసుకొస్తామని తెలిపారు. ఈ వ్యవహారంలో ఎవ్వరిని వదలబోమని  క్షేత్రస్థాయిలో ఎంక్వయిరీ  జరిపించి అరెస్టు చేస్తామని హెచ్చరించారు.
తనకెలాంటి సంబంధం లేదన్న ఎంక్వయిరీ అధికారి 
ఈ కేసుతో తనకెలాంటి  సంబంధం  లేదని అరెస్టయిన ఎంక్వయిరీ  అధికారి తాహెర్ చెబుతున్నారు. వందల సంఖ్యలో ధరఖాస్తులు వస్తాయని అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించాకే ఆమోదిస్తామని  అన్నారు. అప్లికేషన్ పెట్టుకున్నవారు తప్పుడు ధృవ పత్రాలు అందిస్తే తామేం చెయ్యగలమని ప్రశ్నిస్తున్నారు. అనవసరంగా తనను ఈ కేసులోకి లాగుతున్నారని  ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తిస్థాయి ఎంక్వయిరీ జరపాలి : ప్రజలు  
ప్రభుత్వం అందించే ఇలాంటి పథకాల్లో, నకిలీ లబ్ధిదారుల వల్ల అర్హులైన వారు వాటి ప్రయోజనాలు పొందుకోలేక పోతున్నారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిస్థాయి ఎంక్వయిరీ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

 

08:46 - April 2, 2016

హైదరాబాద్ : బొగ్గు ఉత్పత్తి, రవాణాలో సింగరేణి సంస్థ అన్ని రికార్డులను బ్రేక్‌ చేసింది.. లాభాల పంట పండిస్తూ సరికొత్త గణాంకాలు నమోదు చేసింది.. వచ్చే ఐదేళ్లలో 25 కొత్త బొగ్గు గనుల్లో తవ్వకాల దిశగా ప్రయత్నాలు చేస్తోంది..   
127 ఏళ్ల చరిత్రను తిరగరాసిన సింగరేణి
సింగరేణి సంస్థ 127 ఏళ్ల చరిత్రను తిరగరాసింది.. 603 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది.. దేశంలో ఇప్పటివరకూ ఏ కంపెనీ సాధించని ఘనతను సొంతం చేసుకుంది..  గత ఏడాదికంటే 15శాతం వృద్ధిరేటును నమోదు చేసింది.. బొగ్గు రవాణాలోనూ 11శాతం వృద్ధిరేటు రేటుతో దూసుకుపోతోంది.. ఈసారి వెయ్యి కోట్ల రూపాయల లాభం వస్తుందని సంస్థ యాజమాన్యం అంచనా వేస్తోంది
వచ్చే ఐదేళ్లలో 25 కొత్త గనుల్లో తవ్వకాలకు ప్రయత్నాలు
బొగ్గు ఉత్పత్తే కాదు.. కొత్త గనుల విషయంలోకూడా సంస్థ వేగంగా ముందుకు సాగుతోంది.. వచ్చే ఐదేళ్లలో 25 కొత్త గనుల్లో పనులు మొదలు పెట్టాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది.  వచ్చే ఏడాది 7 గనులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. అంతేకాదు.. సింగరేణి ఏరియా చిరకాల స్వప్నం మణుగూరు, మంచిర్యాల రైల్వే మార్గం పనులకూ శ్రీకారం చుట్టాలని సింగరేణి యాజమాన్యం సంకల్పించింది. మొత్తానికి సింగరేణి... జాతీయ స్థాయిలోని అన్ని కంపెనీలను అధిగమించి.. వచ్చే ఏడాది 66 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు సాగుతోంది.. 

08:41 - April 2, 2016

హైదరాబాద్ :  ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఉగాది వేడుకల నిర్వహణ ప్రధానాంశాలుగా ఏపీ కేబినెట్‌ రేపు భేటీ కానుంది. కొత్త రాజధానిలో నిర్మాణాల డిజైన్ల మార్పుపై కూడా ఇందులో చర్చిస్తారు.. వీటితోపాటు... వేసవిలో తాగునీటి సమస్య, సీఎం జిల్లా పర్యటనలపై కూడా చర్చించనున్నారు. 
ఉద్యోగాల భర్తీపై చర్చ
విజయవాడలో శనివారం ఉదయం పదిన్నరగంటలకు ఏపీ కేబినెట్‌ సమావేశం కాబోతోంది.. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ బేటీ జరగబోతోంది.. ఈ సమావేశంలో ప్రధానంగా ఉద్యోగాల భర్తీపై చర్చించబోతున్నారు.. ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర దాటినా ఇంతవరకూ ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు.. ఈ విషయంపై సీరియస్‌గా దృష్టిపెట్టిన ప్రభుత్వం 20 నుంచి 25వేల ఉద్యోగాల భర్తీకి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.. అలాగే ఉద్యోగాలకు వయోపరిమితిని 45ఏళ్లకు పెంచడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.. ఈ విషయాలపై కేబినెట్‌లో చర్చించనున్నారు.. 
ఉగాది వేడుకల నిర్వహణపై చర్చ
ఉగాది వేడుకల నిర్వహణపైకూడా ఏపీ కేబినెట్‌లో చర్చించనున్నారు.. ఈ వేడుకలకు సంబంధించి చంద్రబాబు... మంత్రులకు కొన్ని సూచనలు ఇవ్వనున్నారు.. అలాగే అంబేద్కర్‌ జయంతిని ఘనంగా జరపాలని సర్కారు భావిస్తోంది.. ఈ విషయంపైకూడా భేటీలో మాట్లాడనున్నారు.. రాజధానిలో నిర్మాణాల డిజైన్‌పైనా సమావేశంలో చర్చిస్తారు.. అలాగే విజయవాడకు ఉద్యోగుల తరలింపు విషయం చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది.. జూన్‌లోపు ఉద్యోగులంతా విజయవాడకు రావాలని సర్కారు ఆదేశాలిచ్చింది.. దీనికి సంబంధించి చంద్రబాబు మంత్రులకు కొన్ని సూచనలు చేయనున్నారు.. 
తాగునీటి సమస్యపై చర్చ
వేసవిలో వేధిస్తున్న తాగునీటి సమస్యపై కేబినెట్‌ భేటీలో చర్చ జరగనుంది.. ఇసుక విధానంలో మార్పుల‌పై ఈ భేటీలో మంత్రుల‌కు మ‌రోసారి సీఎం పూర్తి స్థాయిలో వివ‌ర‌ణ ఇవ్వనున్నారు.. పార్టీ నేతలు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సీఎం ఇప్పటికే హెచ్చరించారు.. కేబినెట్‌లో మళ్లీ ఈ విషయం చెప్పే అవకాశముంది.. అటు మూడు నెలలపాటు జిల్లాల్లో సీఎం పర్యటించబోతున్నారు.. ఈ సమయంలో జిల్లా మంత్రులు అందుబాటులో ఉండాలని చెప్పనున్నారు.. మొత్తానికి వివిధ అంశాలపై చర్చ జరిగేలా భేటీకి అన్నీ సిద్ధం చేశారు.

 

తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటలు, కాలినడక భక్తులకు 2 గంటలు, ప్రత్యేక ప్రవేశదర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని57,133 మంది భక్తులు దర్శించుకున్నారు.

ఆదిలాబాద్‌ జిల్లాలో విషాదం

ఆదిలాబాద్‌ : జిల్లాలోని మందమర్రి మండలం తిమ్మాపూర్‌లో విషాదం నెలకొంది. నిన్న మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయిన ఇద్దరు చిన్నారులు తిమ్మాపూర్‌ శివారు వాగులో శవమై కనిపించారు. పడ్డ నరేశ్‌(9), ఖలీల్‌(6) ఆడుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ వాగులో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

సిడ్నీ పపువాలోని ఉత్తర తీరంలో భూకంపం

ఆస్ట్రేలియా : సిడ్నీ పపువాలోని ఉత్తర తీరంలో భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై తీవ్రత 6.1గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

08:32 - April 2, 2016

నిజామాబాద్ : మిషన్‌ భగీరథ పనుల్లో అలసత్వం వహించొద్దని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌..తొలుత నిజామాబాద్‌ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మిషన్‌ భగీరథ పనులను సకాలంలో పూర్తిచేయాలని జిల్లా సమీక్ష సమావేశంలో సూచించారు. భగీరథ పైప్‌లైన్లు వెళ్లే రైతుల పొలాల్లో ఈ నెల 31లోపు పనులన్నీ పూర్తిచేయాలని ఆదేశించారు.. 
సీఎం  కేసీఆర్‌ జిల్లాల పర్యటనకు శ్రీకారం 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత తొలుత నిజామాబాద్ జిల్లాలో సీఎం పర్యటించారు. జిల్లాలోని నర్సింగ్‌పల్లిలోని  శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సతీ సమేతంగా పాల్గొన్నారు. స్వామివారికి సీఎం పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవంలో సీఎం దంపతులతో పాటు ఎంపీ కవిత, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిత్ర నిర్మాత దిల్‌రాజు ఆధ్వర్యంలో నిర్మించిన ఈ దేవాలయంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రశంసల జల్లు కురిపించారు. అనంతరం ఇక్కడి నుంచి బయలు దేరి మాక్లూరు మండల కేంద్రంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త నూతన గృహ ప్రవేశం కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. అక్కడి నుంచి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకొన్న తర్వాత ఆయన కుమార్తె నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇంటికి వెళ్లి అరగంట సమయం అక్కడే గడిపారు.  
రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు :  సీఎం కేసీఆర్‌  
కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. నగరంలోని జెడ్పీ కార్యాలయంలో జిల్లా అభివృద్ధిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆయన సమీక్షించారు. ప్రస్తుతం దేశంలో జాతి నిర్మాణ ప్రక్రియలో ఉన్నామని..ఇకనుంచి రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాల కోసం చేయాలి. అన్ని అడ్డంకుల్ని తొలగించుకుంటూ సమష్టి కృషితో ముందుకు సాగుతే..అద్భుతమైన ప్రగతి సాధ్యమవుతుందని అధికారులకు ఉద్బోధించారు.   
రాష్ట్ర అభివృద్ధి, లక్ష్యాల కోసం పనిచేయాలి-సీఎం 
ఎన్నో త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు సీఎం కేసీఆర్‌. జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి నిధులను మంజూరు చేస్తుందన్నారు. జిల్లాలో నిజాంసాగర్‌, సింగూర్‌ ప్రాజెక్టులు వట్టిపోయాయన్నారు. కరవు ఏర్పడకుండా శాశ్వత పరిష్కారం కోసం మిషన్‌ భగీరథను పెట్టుకున్నామన్నారు సీఎం. 
జిల్లా అభివృద్ధికి ప్రత్యేక నిధులు  
రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా నేడు ఉదయం బీర్కూర్‌ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానానికి సీఎం సతీసమేతంగా స్వామివారిని దర్శించుకుని పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొంటారు. 

08:28 - April 2, 2016

కడప : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. రాజంపేట నుంచి తిరుపతి వెళ్తున్న ఆర్టీసీ బస్సును రైల్వే కోడూరు వద్ద తిరుపతి నుంచి రాజంపేట వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో లారీ డ్రైవర్, బస్సు కండక్టర్ తోపాటు మరో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 25 మందికి గాయాలయ్యాయి. ప్రాణపాయం లేదు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాజంపేట ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన వారిని వారి బంధువులు మెరుగైన చికిత్స కోసం తిరుపతి ఆస్పత్రితోపాటు వివిధ  ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. లారీ, బస్సు డ్రైవర్లు అప్రమత్తంగా లేకపోవడంతోనే ఈ దుర్ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. 

 

రోడ్డు ప్రమాదం...నలుగురి మృతి

కడప : జిల్లాలోని రైల్వేకోడూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 25 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

నేడు ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి జోగు రామన్న పర్యటించనున్నారు.

ఆదిలాబాద్ : మంత్రి జోగు రామన్న నేడు జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 

నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ నేడు రెండో రోజు పర్యటన

నిజామాబాద్ : జిల్లాలో సీఎం కేసీఆర్ నేడు రెండో రోజు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 

Don't Miss