Activities calendar

05 April 2016

22:32 - April 5, 2016

ఖమ్మం : సీపీఎం నేత, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య మంగళవారం రాత్రి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌ నుంచి సోమవారం రాత్రి బయలుదేరి ఉదయం భద్రాచలం చేరుకున్న రాజయ్యకు ఆరోగ్యంలో కొంత తేడా ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో రాత్రికి ఛాతిలో నొప్పి వస్తున్నట్లుగా భావించడంతో పార్టీ నాయకులు, ఆయన కుటుంబ సభ్యులు ఆయనను భద్రాచలం ఏరియా వైద్యశాలకు తక్షణ వైద్య చికిత్స నిమిత్తం తరలించారు. ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్‌ ఎంవీ. కోటిరెడ్డి ఆయనను పరీక్షించి.. వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా ఈసీజీలో కొంత తేడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే.. తమ వైద్యానికి రాజయ్య స్పందిస్తుండడంతో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పలువురు సీపీఎం, ఇతర పార్టీల నేతలు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 

ఎమ్మెల్యే సున్నం రాజయ్యకు అస్వస్థత

ఖమ్మం :  సీపీఎం నేత, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు  వెంటనే చికిత్స నిమిత్తం ఆయన్ను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు  డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రమాదం ఏమి లేదని, కాస్త విశ్రాంతి తీస్కోవాలని వైద్యులు సూచించారు.. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎక్కువ అలసట చెందటం వల్ల అస్వస్థత గురై ఉంటారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.. 

21:59 - April 5, 2016

ఢిల్లీ : పనామా పేపర్‌ లీక్‌కు సంబంధించి భారత్‌కు చెందిన మరి కొందరు నల్ల కుబేరుల లిస్టు బయటకు వచ్చింది. రెండో జాబితాలో పలువురు పారిశ్రామికవేత్తలున్నారు. వీరంతా విదేశాల్లో బోగస్‌ కంపెనీలు ఏర్పాటు చేసి నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకుంటున్నారు. పైకి మాత్రం చాలామంది పారిశ్రామికవేత్తలు ఆ సంస్థలతో తమకు ఎలాంటి సంబంధం లేదని బొంకుతున్నారు.
పనామా పేపర్‌ లీక్‌లో మరికొందరు భారతీయులు
'పనామా పేపర్' లీక్‌ కు సంబంధించి మరి కొంతమంది భారతీయుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. నిన్న బాలీవుడ్‌ ప్రముఖులు.. అమితాబ్‌ బచ్చన్‌.. ఐశ్వర్యారాయ్‌.. కొందరు వ్యాపారవేత్తల పేర్లు మాత్రమే వెల్లడి కాగా.. ఈ రోజు మరికొందరి పేర్లను  ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక వెల్లడించింది. మెహ్రాసన్స్ జెవెలర్స్ అధినేత అశ్వినీకుమార్ మెహ్రా  పారిశ్రామికవేత్తలు గౌతం, కరణ్ థాపర్‌, సతీష్ గోవింద సంతాని, విష్లవ్ బహదూర్‌, హరీశ్ మొహ్‌నాని, మధ్యప్రదేశ్ రిటైర్డ్ ప్రభుత్వాధికారి ప్రభాష్‌ సంఖ్లా తదితరులు ఉన్నారు. 

1993 నుంచి అశ్వినీకుమార్‌కు అతని కుటుంబ సభ్యుల పేర్లతో కరీబియన్‌ దీవులు.. బ్రిటిష్‌ వర్జిన్‌ దీవుల్లో 7 ఆఫ్‌షోర్‌ సంస్థలు రిజిస్టరై ఉన్నట్లు మొసాక్‌ ఫొన్సెకా పత్రాల్లో వెల్లడైంది. మా పెట్టుబడులకు ఐటి రిటర్న్స్ ఉన్నాయని మెహ్రా కుటుంబం చెబుతోంది. క్రాంప్టన్‌ గ్రీవ్స్ సంస్థకు చెందిన గౌతం, కరణ్‌ థాపర్లకు పనామాలో చార్ల్‌వుడ్‌.. నికామ్‌ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్లు ఉన్నాయి. 2005 జులైలో చార్ల్‌వుడ్‌ ఫౌండేషన్‌ను 10వేల అమెరికన్‌ డాలర్లతో ప్రారంభించినట్లు పత్రాల్లో తేలింది. అదే ఏడాది అక్టోబర్‌లో నికామ్‌ ఇంటర్నేషనల్‌ను కూడా స్థాపించారు. థాపర్‌కు ఎలాంటి ఫౌండేషన్‌ లేదని గౌతం అనుచరులు చెబుతున్నారు.

పుణెకు చెందిన సవా హెల్త్ కేర్ చైర్మన్ వినోద్ రామచంద్ర జాదవ్, రాజీవ్ దహుజా, బెల్లాస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ కు చెందిన కపిల్ సెయిన్ గోయల్‌, వ్యవసాయ పనిముట్లు అమ్మే వివేక్ జైన్ తదితరుల పేర్లు కూడా లీకైన 'పనామా పత్రాల్లో' ఉన్నట్టు వెల్లడైంది. వీరు పన్ను ఎగ్గొట్టేందుకు పలు బోగస్ కంపెనీల్లో డైరెక్టర్లు, షేర్‌ హోల్డర్లుగా ఉన్నారని సమాచారం. పారిశ్రామిక వేత్తల్లో ఎక్కువ శాతం బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్ లో సంస్థలను ఏర్పాటు చేయడం గమనార్హం.

విదేశాల్లో బోగస్ కంపెనీలు ఏర్పాటుచేసి నల్లడబ్బు దాచుకున్న ప్రముఖుల వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇప్పటికే విచారణకు ఆదేశించారు. పనామా లిస్టులో బయటపడ్డ భారతీయులకు సంబంధించిన అకౌంట్లపై విచారణ కమిటీ దర్యాప్తు జరుపుతుందని ఆర్‌బిఐ గవర్నర్‌ రఘురాంరాజన్‌ అన్నారు. నల్లధనంపై ఇప్పటికే విచారణ జరుపుతున్న సిట్‌ -పనామా పత్రాల వ్యవహారంపై కూడా విచారణ చేపట్టనుంది.
నల్లధన కుబేరుల్లో 500 మంది భారతీయులు
పనామా పేపర్స్ తో వెలుగులోకి వచ్చిన నల్లధన కుబేరుల్లో 500 మంది భారతీయులున్నారు. ఇందులో పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు తదితర ప్రముఖులున్నారు. పనామాలోని మొస్సాక్‌ ఫోన్సెకా అనే లా కంపెనీకి చెందిన కోటి 15 లక్షల పత్రాలు లీకవ్వడంతో ప్రముఖుల మనీలాండరింగ్ వ్యవహారం వెలుగు చూసింది.

21:51 - April 5, 2016

అసలే కార్పొరేట్‌ హాస్పిటల్‌.. వారికి సాధ్యం కానిదంటూ ఉంటుందా..? కాసులుంటే ఏదైనా సాధ్యమే అంటూ ఓ యువకున్ని బుట్టలో వేసుకున్నారు. చివరికి తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వకుండా ఎత్తు పెంచేందుకు ఆపరేషన్‌ చేశారు. లక్షల రూపాయలు వసూలు చేశారు. 
గ్లోబల్ హాస్పిటల్ నిర్వాకం...
హైదరాబాద్‌ లక్డికాపూల్‌లోని గ్లోబల్ హాస్పిటల్ ఓ యువకుడికి హైట్ పెంచుతామంటూ ఆపరేషన్‌ నిర్వహించింది. తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వకుండా లక్షల్లో డబ్బులు వసూలు చేసి  ఆపరేషన్‌ చేసిన ఘటన కలకలం రేపుతోంది. 
నిఖిల్ రెడ్డి... 5.7 అడుగుల హైట్ 
నిఖిల్ రెడ్డి అనే యువకుడు 5.7 అడుగుల హైట్ ఉన్నాడు. ఇంకా హైట్ పెరగడానికి గ్లోబల్ ఆసుపత్రి వైద్యులను సంప్రదించాడు. మూడు ఇంచులు పెరిగేందుకు కాళ్లలో రాడ్లు వేసి హైట్ పెంచుతామని డాక్టర్లు చెప్పారు. ఆసుపత్రి యాజమాన్యం 7 లక్షలు ఖర్చు అవుతుందని.. ముందుగా అతని నుంచి 4 లక్షల రూపాయాలు తీసుకున్నారు. తల్లిదండ్రులకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మంగళవారం ఉదయం ఆపరేషన్ చేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆపరేషన్ చేశారు.
పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు
గత మూడు రోజులుగా నిఖిల్ కనిపించకపోవడంతో ఆందోళన చెందిన అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పోలీసులు నిఖిల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా గ్లోబల్ హాస్పిటల్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఆసుపత్రికి చేరుకుని విచారించడంతో ఆపరేషన్ చేసినట్లు వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో ఉన్న కుమారుడిని చూసిన తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
సమాచారం ఇవ్వకుండా ఆపరేషన్ ఎలా చేస్తారు..? 
తమకు సమాచారం ఇవ్వకుండా ఏవిధంగా ఆపరేషన్ చేస్తారని నిఖిల్‌ తల్లిదండ్రులు వైద్యులను ప్రశ్నించారు. అనుమతి లేకుండా ఆపరేషన్ ఎందుకు చేశారని  నిలదీశారు. వైద్యులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని, ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని నిఖిల్ తండ్రి గోవర్థన్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే నిఖిల్ మేజర్ కాబట్టి ఆపరేషన్ చేశామని వైద్యులు సమర్థించుకున్నారు. ఆసుపత్రి నిర్వాకంపై ఫిర్యాదు చేసేందుకు నిఖిల్ తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు.

 

21:41 - April 5, 2016

విజయవాడ : నారా లోకేష్‌ను ఏపీ కేబినెట్‌లోకి తీసుకోవాలని.. అందుకు తన ఎమ్మెల్సీ పదవిని సైతం త్యాగం చేస్తానని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. లోకేష్‌కు అటు పార్టీ తోనూ.. ఇటు ప్రభుత్వంతోనూ సమన్వయం చేసుకునే సత్తా ఉందని ఆయన అన్నారు. లోకేష్‌ను ఎమ్మెల్సీగా గెలిపించుకునే బాధ్యత తాను తీసుకుంటానని బుద్ధా వెంకన్న చెప్పారు.
 

21:39 - April 5, 2016

హైదరాబాద్ : వైసిపికి మరో ఎమ్మెల్యే గుడ్‌బై చెప్పారు. నెల్లూరు జిల్లా గూడురు ఎమ్మెల్యే సునీల్‌ కుమార్ టిడిపిలో చేరారు. కొద్దిసేపటి క్రితం ఆయన సిఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుని చంద్రబాబుతో భేటీ అయ్యారు. బాబు సమక్షంలో సునిల్‌ కుమార్ టిడిపిలో చేరారు. 

నకిలీ ఐపీఎస్ అధికారి మోసం..

గుంటూరు : పోలీస్ ఉద్యోగాలు ఇప్పిస్తానని యువతను మోసం చేస్తున్న నకిలీ ఐపీఎస్ అధికారిని జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిరుద్యోగులను మోసం చేస్తున్న పుల్లారావు అనే వ్యక్తిని తమ విచారణలో నకిలీ ఐపీఎస్‌గా గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు.

21:00 - April 5, 2016

కేసీఆర్ ఖాతల కెల్లి మాయమైన పైకం, నెత్తుటి మర్కలల్ల గవర్నర్ సార్, తమ తప్పును కప్పి వెట్టిన మహానేత తలసాని, పోరగాండ్లకు లడ్డూలు పంచి పెడ్తున్న బంగి, మెల్లె మెల్లెగ ఊర్లల్ల కొస్తున్న జిట్టపులి...ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం..

 

ఆ నినాదాన్ని నేను ఏకీభవించను : వెంకయ్యనాయుడు

ఢిల్లీ : "భారత్ మాతా కీ జై" అనే నినాదాని ఏకీభవించనని బిజెపి నేత, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నాడు. మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ నినాదం ప్రభుత్వం ఇచ్చిన సందేశం కాదని తమ వ్యక్తిగతమన్నాడు. ఇలాంటి విషయాలు ప్రభుత్వం పరిధికి రావని తెలిపాడు. ప్రజాస్వామ్య దేశంలో వ్యక్తులు రకరకాల నినాదాలు చేస్తారు. ఆ నినాదాలు అన్ని ప్రభుత్వాన్నికి సంబంధం లేదన్నాడు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ చేసిన కామెంట్ల గురించి ఒక విలేకరి అడగా ఆయన చేసిన నినాదాలు ప్రభుత్వానికి సంబంధం లేదు. కాబట్టి దాని మీద కేంద్రప్రభుత్వానికి సంబంధం లేదన్నాడు.

ఇథియోపియాలో వరదలు... 28మంది మృతి

హైదరాబాద్ : ఇథియోపియాలోని రెండు ప్రాంతాల్లో సంభవించిన వరదల్లో 28మంది మృతి చెందారు. ఇథియోపియాలోని అడిస్ అబాబా, సోమాలియా ప్రాంతాల్లో వరదల ధాటికి 84మందికి గాయాలయ్యాయని ఇథియోపియన్ బ్రాడ్ కాస్టింగ్ కార్పోరేషన్ వెల్లడించింది. వరదల ధాటికి రెండు ఏరియాల్లోని తీరప్రాంతాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.

రోడ్డు ప్రమాదం... 9 మందికి గాయాలు

ఖమ్మం : జిల్లాలోని జూలూరుపాడు వద్ద ఆటో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

దొంగ అరెస్టు...

కరీంనగర్ : జిల్లాలో పోలీసులు దొంగను అరెస్టు చేశారు. దొంగ నుంచి 6 తులాల బంగారం, అర కిలో వెండి, 12 బైక్‌లు, ఒక టీవీని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దొంగను విచారిస్తున్నారు.

టీడీపీ గూటికి మరో వైసీపీ ఎమ్మెల్యే..?

హైదరాబాద్ : వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీలో మరో వికెట్ డౌన్ అయింది. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాకు చెందిన గూడురు ఎమ్మెల్యే సునీల్ కాసేపట్లో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే విజయవాడలోని సీఎం నివాసానికి ఎమ్మెల్యే సునీల్ చేరుకున్నట్లు తెలిసింది. మరికాసేపట్లో ఎమ్మెల్యే సునీల్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు పచ్చకండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు.

20:14 - April 5, 2016

బాబా రాందేవ్ వ్యాఖ్యలు సరికాదని వక్తలు అభిప్రాయపడ్డారు. 'భారత్ మాతా కీ జై అని అనని వారి తల నరికి చంపేవాడినని, కానీ చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని అలా చేయడం లేదని' బాబా రాందేవ్ వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో విశ్లేషకుడు తెలకపల్లి రవి, బిజెవైఎం నేత విష్ణువర్ధన్ రెడ్డి, టీపీసీసీ నేత కొనగల మహేష్ పాల్గొని,  మాట్లాడారు. రాందేవ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు. భారత దేశం లౌకిక దేశమని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....
  

20:05 - April 5, 2016

మత సహనం హద్దులు దాటుతోంది. రాజ్యాంగంలో పేర్కొన్న లౌకిక స్ఫూర్తికి విఘాతం కలిగేలా..కొందరు చేస్తున్న వ్యాఖ్యలు తరచుగా వివాదస్పదం అవుతున్నాయి. మొన్న ఫడ్నవీస్‌.. నిన్న యోగా గురువు రాందేవ్‌ బాబా...చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 
మాతృ భూమిపై ఆపేక్ష చాటడమే
యోగా గురువు రాందేవ్ బాబా వ్యాఖ్యలపై వివాదం ముదురుతోంది. భారత్ మాతా కీ జై అని అనని వారి తల నరికి చంపేవాడినని, కానీ చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని అలా చేయడం లేదని అన్నారు. భారత్ మాతా కీ జై అనే నినాదం చేయడమంటే మాతృ భూమిపై ఆపేక్ష చాటడమేనని, ఇందులో మతపరమైన కోణమేమీ లేదని రాందేవ్‌ బాబా అన్నారు.
రాందేవ్‌ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ప్రతిపక్ష పార్టీలు
రాందేవ్‌ వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా స్పందించాయి. రాందేవ్ వ్యాఖ్యలు హింసకు పిలుపునివ్వడమేనని కాంగ్రెస్‌ నేత సంజయ్‌ ఝా ట్వీట్‌ చేశారు. ప్రజలను బెదిరిస్తున్న రాందేవ్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఆయన డిమాండ్ చేశారు. భారత్‌మాతాకీ జై అనడం ముస్లిం మతానికి విరుద్ధమని, అందుకే తాము ఆ నినాదం చేయబోమని దేశంలోని అతిపెద్ద ఇస్లాం సంస్థ దారుల్ ఉలూమ్‌ డియోబంద్‌ ఫత్వా జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భారత్‌ మాతాకీ జై బదులు.. తాము  హిందూస్తాన్‌ జిందాబాద్‌ అని నినదిస్తామని ఆ సంస్థ తెలిపిందని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ కూడా గతంలోనే దీనిపై స్పందించారు. మతపరమైన ఆంక్షల వల్ల తాము ఆ నినాదాన్ని చేయబోమని ఇంతకుముందే ప్రకటించారు.
అసదుద్దీన్‌ వ్యాఖ్యలకు దేవేంద్ర ఫడ్నవీస్‌ కౌంటర్‌
అసదుద్దీన్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌గా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ అప్పట్లోనే తీవ్రంగా స్పందించారు. భారత్ మాతాకీ జై అనని వాళ్లు దేశం విడిచి వెళ్లిపోవాలని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రాందేవ్‌ చేసిన వ్యాఖ్యలు మరోసారి తీవ్ర చర్చకు దారి తీశాయి. మరోవైపు భారత్‌ మాతా కీ జై అంటేనే దేశభక్తులా అని ప్రతిపక్షాలు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఇవి ఉద్దేశపూరిత విభజన వ్యూహంతో చేసిన వ్యాఖ్యలుగా సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. మరోవైపు విద్యాసంస్థల్లో ప్రవేశం కావాలంటే దరఖాస్తులో భారత్ మాతాకీ జై అనే నినాదాన్ని తప్పనిసరిగా రాయాలని గుజరాత్‌ బీజేపీ నేత దిలీప్‌ కు చెందిన ట్రస్టు విద్యాసంస్థలు పేర్కొనడం తాజాగా వివాదస్పదమైంది. నినాదాన్ని రాయని వారికి ప్రవేశాలు ఇవ్వబోమని ట్రస్టు స్పష్టం చేయటంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి.

 

ఉద్యోగాల పేరిట వసూళ్లు చేస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్టు

నల్గొండ : రైల్వేలో ఉద్యోగాల పేరిట వసూళ్లు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు రఘురాంరెడ్డి, భిక్షపతి, చంద్రమోహన్ లను మీడియా ఎదుట హాజరుపర్చనున్నారు. వరంగల్, హైదరాబాద్, మెదక్, నల్గొండ జిల్లాలో రూ.కోటి వరకు వసూలు చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. 

 

పనామా పేపర్ లీక్ పై స్పందించిన అమితాబ్

ముంబయి : పనామా పేపర్ లీక్ పై అమితాబ్ బచ్చన్ స్పందించింది. విదేశాల్లో నేను ఎటువంటి కంపెనీకి డైరెక్టర్ గా లేనని అమితాబ్ చెప్పారు. నేను అన్ని రకాల పన్నులు చెల్లించడంతోపాటు విదేశాల్లో ఖర్చు చేసిన డబ్బులకు కూడా పన్ను చెల్లించా.. నా పేరును దుర్వినియోగం చేశారు. 

 

గుడివాడ ఇన్ కంటాక్స్ కార్యాలయంలో సీబీఐ సోదాలు

కృష్ణా : గుడివాడ ఇన్ కంటాక్స్ కార్యాలయంలో సీబీఐ సోదాలు నిర్వహించారు. రెండు గంటల పాటు ఫైళ్లను అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఐటీవోతో సహా సిబ్బందిని బయటకు పంపించకుండా అన్ని ఫైళ్లను సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు. 

 

18:26 - April 5, 2016

ఆదిలాబాద్ : ఆ గ్రామాల్లో తెల్లారిందంటే చాలు... సమస్య మొదలవుతుంది.. ఆడా, మగా తేడాలేదు... మహిళలైతే బిందెలతో... పురుషులైతే ఎడ్లబండ్లతో ఊరి శివార్లకు క్యూ కడతారు.. ఇదంతా ఎందుకనుకుంటున్నారా..? గొంతు తడిపేందుకు గుక్కెడు నీటి కోసం ఈ పాట్లు. ఉదయం బయటకు వెళ్లినవారు నీటితో మధ్యాహ్నానికి గానీ ఇళ్లు చేరరు. ప్రజలకు ప్రతిరోజూ ఇదే .. అయితే అధికారులు మాత్రం ఎప్పట్లాగానే చోద్యం చూస్తూ ఉండిపోతున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా ఏజెన్సీ గ్రామాల్లో తాగునీటి సమస్య వేధిస్తోంది.. ఏ కాలంలోనైనా సరే ఉదయం 5గంటలకు లేచి ఊరిబయటున్న బావిదగ్గరకు క్యూ కట్టాల్సిందే.. అక్కడ జనాలు పెరిగిపోతే వాగులోకి పరుగుపెట్టాలి.. అక్కడ చెలమలు తవ్వి నీటిని తీసుకువెళ్లాలి.. ఇదీ రెబ్బెన మండలం మద్దికుంట ప్రజల తాగునీటి కష్టం. 
నీటి ఎద్దడి కష్టాలు     
జిల్లా ఏజెన్సీలో ఒక్క మద్దికుంటే కాదు.. అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. మిగిలిన రోజుల్లో సంగతేమో కానీ.. ఎండాకాలంలో మాత్రం నీటి ఎద్దడి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ప్రజలు గంటల కొద్దీ సమయాన్ని నీటి కోసం వెచ్చించాల్సిన దుస్థితి. అంతసేపు అక్కడున్నా నీరు దొరుకుతుందన్న గ్యారంటీలేదు.. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ఉన్న కొద్దిపాటి నీరూ గ్రామస్థులకు ఏమాత్రం సరిపోవడంలేదు.   
అల్లాడి పోతున్న ఏజెన్సీ గ్రామాలు
తాగునీటి కట కటతో మద్దికుంట సహా పరిసర ఏజెన్సీ గ్రామాలు అల్లాడి పోతున్నాయి. తెల్లారిందంటే చాలు ఆడా, మగా, చిన్నా, పెద్దా తేడాలేకుండా అంతా నీటికోసం అష్టకష్టాలు పడుతున్నారు.. నీటిని సేకరించడం ఒక ఎత్తయితే... ఆ నీటిని ఇంటికి తీసుకురావడం వీరికి మరో పెద్ద సమస్య.. నీటి బిందెలతో దాదాపు 3కిలోమీటర్లు ప్రయాణిస్తూ మహిళలు నిత్య కష్టాలు ఎదుర్కొంటున్నారు.. ఎడ్ల బండ్లు ఉన్నవారు వాటిద్వారా నీటిని తెచ్చుకుంటున్నారు.. మిగతావారు కాలినడకన సుదూర ప్రాంతాల నుంచి బిందెలతో నీటిని తెచ్చుకుంటున్నారు. 
నీటికోసం భారీగా క్యూ  
అసిఫాబాద్‌ మండలం బనార్‌గొందిలో పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఉంది. ఊరి చివరున్న వాగునీరే ఇక్కడి ప్రజలకు ఆధారం. ఊరంతా నీటికోసం ఇక్కడికి రావడంతో క్యూ భారీగా పెరిగిపోతోంది. గంటలకొద్దీ ఇక్కడ వేచి ఉండలేక.. అలాగని నీటిని తెచ్చుకోవడం మానలేక గ్రామస్థులు నానా కష్టాలు పడుతున్నారు. ప్రజలు ఇలా నీటి కటకటతో అల్లాడుతుంటే నేతలు ఎవ్వరూ ఇటువైపు చూడటంలేదు. ప్రతిసారి ఇంటింటికీ నీరు అందిస్తామంటూ హామీలు ఇవ్వడం.. గెలిచినతర్వాత మర్చిపోవడం సర్వ సాధారణంగా మారింది. 
అధికారుల ఉదాసీనత  
తీవ్ర నీటి ఎద్దడితో విలవిలలాడుతున్న ఏజెన్సీ గ్రామాల ప్రజలు తాగునీటి సరఫరాకోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనేఉన్నారు. తమ గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీటిని సరఫరా చేయాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అయితే అధికారులు ఎప్పట్లాగానే ఉదాసీనంగా వ్యవహరిస్తూ.. ప్రజలను వారి కష్టాలకు వారిని వదిలేస్తున్నారు.  

ఎత్తు పెంచుతామని యువకుడి కాళ్లు తీసివేసిన వైద్యులు...

హైదరాబాద్ :  లక్డీకాపూల్ లోని గ్లోబల్ ఆసుపత్రిలో వైద్యులు దారుణానికి ఒడిగట్టారు. ఎత్తు తక్కువగా వున్నవారిని కొన్ని రకాల సర్జరీలతో ఎత్తు పెంచవచ్చనే ఆసుపత్రులకు ఈ మధ్య కాలంలో కొదవలేకుండాపోతోంది. ఇటువంటి ఉదంతమే గ్లోబల్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. సికింద్రాబాద్ లో నివాసముంటున్న నిఖిల్ (22) అనే యువకుడు ఎత్తు తక్కువగా ఉండడంతో గ్లోబల్ ఆసుపత్రి వైద్యులను సంప్రదించాడు. సర్జరీ ద్వారా ఎత్తు పెంచవచ్చని వైద్యులు చెప్పారు. దీంతో మూడు రోజుల క్రితం స్నేహితుడితో కలిసి వచ్చిన నిఖిల్ ని వైద్యులు ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకున్నారు.

18:11 - April 5, 2016

నిజామాబాద్ : జిల్లాలో తాగు నీటి ఎద్దడి వ్యాపారులకు వరంగా మారింది. వారు ప్రాథమిక నిబంధనలు పాటించరు, ప్రభుత్వానికి పన్నులు చెల్లించరు అయితేనేం కోట్లలో వ్యాపారం చేస్తున్నారు. శుద్ధ జలం పేరిట ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి తమ పనిని కానిచ్చేస్తున్నారు. అసలే తీవ్రమైన నీటి కొరతతో తాగునీటి కోసం ప్రజలు అల్లల్లాడుతున్నారు. ఇదే అదునుగా భావించి కొందరు యథేచ్ఛగా నీటి వ్యాపారం చేస్తూ కాసులు సంపాదిస్తున్నారు. 
పుట్టగొడుగుల్లా వాటర్ ప్లాంట్స్
ఒకపక్క తాగునీటి కోసం ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. మరోపక్క మినరల్ వాటర్ ప్లాంట్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో మినరల్ వాటర్ బిజినెస్ మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతోంది. జిల్లాలోని చాలా ప్లాంట్లలో ప్రమాణాలు పాటించడం లేదు. డబ్బును ఎరగా వేసి అరకొర వసతులున్నా,అనుమతులు తెచ్చుకుంటున్నారు. చిన్నచిన్నగదుల్లో తమకిష్టం వచ్చినట్లు నడిపించేస్తున్నారు. నీటిని నిలువచేసే క్యానులను ప్రతిసారి శుభ్రం చెయ్యకుండానే సరఫరా చేసేస్తున్నారు. కామారెడ్డి,బోధన్,ఆర్మూరు,బాన్సువాడ తదితర ప్రాంతాల్లో ఏ ఒక్కచోటా వాటర్ ప్లాంట్లలో మైక్రోబయాలజిస్టులు అందుబాటులో ఉండటం లేదు.  పీహెచ్,టీడీఎస్ పరీక్షలు అసలే జరగటం లేదు.
కనీసం పదిగదులైనా లేని వాటర్‌ప్సాంట్స్ 
వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే, కనీసం పది గదులు ఉండేలా నిర్మాణం చేపట్టాలి. ఇందులో నీటిని పరీక్షచేసే ల్యాబ్ అందుకు ఉపయోగించే పరికరాల కోసం రెండు గదులు కేటాయించాలి. ఫిల్లింగ్ సెక్షన్ ఆర్‌వో సిస్టంలో 3000లీటర్ల కెపాసిటీ డ్రమ్ములను ఏర్పాటు చెయ్యాలి. శుద్ధి చేసిన నీటిని నిలువ చేసేందుకు 304 గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీలుతో తయారు చేసిన డ్రమ్ములనే వాడాలి. నీటిని ఓజొనైజేషన్ చేయాలి. నీటిని సరఫరా చేసే క్యానులకు ప్రతిసారీ పొటాషియం పర్మాంగనేట్‌తో క్లీనింగ్ చెయ్యాలి. శానిటరీ అధికారుల చేత ప్రతినెలా తనిఖీ చేయించుకుని రిపోర్టును ఐఎస్‌ఐకి పంపాలి. అయితే ఈ నిబంధనల్లో ఏ ఒక్కటీ అమలుచేయని ప్లాంట్ల నిర్వాహకులు చాలామందే ఉన్నారు.
అధికారులు తీరుపై స్థానికుల ఆరోపణ
ప్రభుత్వ నిబంధలు పాటించకుండా నిర్వాహకులు, తమను మోసం చేస్తున్నాసంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వీటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

 

17:58 - April 5, 2016

హైదరాబాద్‌ : ఇటీవల సెల్ఫీ తీసుకోబోయి మరణిస్తున్న సంఘటనలు అధికంగా చోటుచేసుకుంటున్నాయి. ఎంతటి ప్రమాద ప్రదేశాల్లోనైనా సెల్ఫీలు తీసుకోవడానికి భయపడడం లేదు. సెల్ఫీ వీడియోల కోసం వెళ్లి ప్రాణం మీదికి తెచ్చుకుంటున్నారు. సెల్ఫీ సంగతి అటుంచితే.. ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజగా ఇవాళ హైదరాబాద్ లో మరో ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి పరీక్షలు ముగిసాయి. హాయిగా గడపడానికి విద్యార్థి జూపార్క్ కు వెళ్లాడు. అంతలోనే విషాదం నెలకొంది. సెల్ఫీ తీసుకుంటుండగా కరెంట్‌ షాక్‌తో మృతి చెందాడు. పురానాపూల్‌ కు చెందిన మంజిత్‌ కుమార్‌ పదో తరగతి చదువుతున్నాడు. పదోతరగతి పరీక్షలు ముగియడంతో జూపార్క్ కు వెళ్లాడు. అక్కడ సెల్ఫీ దిగుతుండగా.. కరెంట్‌షాక్‌తో మృతి చెందాడు. 108 అంబులెన్స్ సకాలంలో రాలేదని మృతుని బంధువులు ఆరోపించారు. 

 

అకాల వర్షాలతో ప్రజల అగచాట్లు...

హైదరాబాద్ : భానుడి భగ భగలతో అల్లాడిన తెలంగాణ ప్రజలకు వరుణుడు చిరుజల్లులతో పలకరించాడు. వరుణుడి రాకతో కొన్ని ప్రాంతాలలో విషాదం చోటు చేసుకుంది. జుక్కల మండలం కలతల్వాడిలో పిడుగుపాటు ఒకరు మృతి చెందారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు, రామగుండంలలో వడగళ్ళ వాన పడింది. ఎలిగేడు మండంలోని ముప్పిడితోటలో గోడ కూలి ఒక బాలిక మృతి చెందింది. నిన్నటివరకూ ఎండలతో అల్లాడిపోయన ప్రజలు ఇప్పుడు ఈ అకాల వర్షాలతో నానా ఇబ్బందులకూ గురవుతున్నారు.

17:42 - April 5, 2016

గుంటూరు : ఏపీ రాజధాని ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు కలకలం సృష్టించాయి. శంకుస్థాపన జరిగిన గుంటూరు జిల్లా ఉద్ధండరాయునిపాలెం, తాళ్ళాయపాలెంలోని ఓ ఇంట్లో.. అనుమానాస్పద మహిళా మావోయిస్టును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్నపూర్ణ అలియాస్‌ పద్మజతో పాటు ఇంటి యజమాని బాలస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 

17:40 - April 5, 2016

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీలో అక్రమాలపై గతంలో టెన్‌ టీవీ ప్రసారం చేసిన కథనాలకు బల్దియాలో కదలిక వచ్చింది. జీహెచ్‌ఎంసీ శానిటేషన్‌లో బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. అలాగే శానిటేషన్‌లో అక్రమాలకు పాల్పడ్డ మెడికల్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సర్కిల్‌ 14లో గతంలో పనిచేసిన మురళీధర్‌ గుప్తాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. అలాగే సర్కిల్‌ 9లో మెడికల్‌ ఆఫీసర్‌ రామారావును మాతృశాఖకు పంపించేశారు. రామారావు డ్రైవర్‌గా పనిచేసిన సరళేశ్వర్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని అధికారులు ఆదేశించారు.

 

17:30 - April 5, 2016

తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం కార్వే సంస్థ బ్రాంచ్‌కు చెందిన క్యాషియర్‌ రమేష్‌పై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. నగరంలోని జయరామ్‌ థియేటర్‌లో కొంతకాలంగా కార్వే సంస్థ రేసు కోర్స్ గుర్రపు పందాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఈ బ్రాంచ్‌లో పనిచేస్తున్న 20 మంది మహిళలను క్యాషియర్ రమేష్‌ కొంతకాలంగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై మీడియాలో వరుస కథనాలు వచ్చాయి. దీంతో నగరంలోని త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు బాధితుల నుంచి వాంగ్మూలం సేకరించారు. అయితే తనపై మహిళా ఉద్యోగులు చేస్తున్న ఆరోపణలు అవాస్తమని నిందితుడు రమేష్‌ చెబుతున్నారు. 

 

17:20 - April 5, 2016

కడప : రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలన అంతా అవినీతి మయంగా మారిందని జగన్‌ విమర్శించారు. వైఎస్సార్‌సీపి అధినేత వైఎస్‌ జగన్‌ విమర్శించారు. కడప జిల్లా పులివెందులలో ఆయన పర్యటిస్తున్నారు. 3రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ ఎర్రవల్లి గ్రామంలో 20 రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని జగన్‌ పరామర్శించారు. అనంతరం నియోజకవర్గంలోని తన ఆఫీసులో ప్రజా దర్బార్‌ నిర్వహించారు. నియోజకవర్గ ప్రజల సమస్యలను జగన్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం విమర్శలు చేశారు. 

 

17:16 - April 5, 2016

హైదరాబాద్ : కర్నూలు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా టీడీపీలోకి స్వాగతిస్తామని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ మూర్తి అన్నారు. త్వరలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం సత్తా చాటుతుందన్నారు. అసెంబ్లీలో వైసీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలు వీగిపోవడంతో జగన్ డీలా పడ్డారని తెలిపారు. బీసీల మద్దతుతో తాము అధికారంలోకి వచ్చామని అందుకే బీసీ రుణమేళా ద్వారా వారి సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని కేఈ స్పష్టం చేశారు. బీసీల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందని తెలిపారు.

 

17:08 - April 5, 2016

హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలు మిషన్‌ కాకతీయ పథకానికి ఆర్థిక సాయం చేసి రుణం తీర్చుకోవాలని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. మిషన్‌ కాకతీయ పథకానికి శోధన ల్యాబ్‌ అధినేత తోట గిరిధర్‌ ఇప్పటి వరకు 50 లక్షల రూపాయల విరాళం ఇచ్చారని చెప్పారు. ఆయనను హరీష్‌రావు అభినందించారు. వేరే ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ బిడ్డలు చెరువులను దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు. మిషన్‌ కాకతీయకు విరాళం ఇచ్చేవారికి పన్ను మినహాయింపు ఉంటుందని మంత్రి తెలిపారు.

గుర్తు తెలియని వ్యక్తి హత్య....

హైదరాబాద్ : కాటేదాస్ కాలనీలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృత దేహాన్ని దుండగులు కిరోసిన్  పోసి  తగులబెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

16:54 - April 5, 2016

ఢిల్లీ : రిజర్వ్‌ బ్యాంక్ కీలక వడ్డీరేట్లు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం స్టాక్ మార్కెట్‌ను మెప్పించలేకపోయింది. ఆశించిన స్థాయిలో వడ్డీరేట్లు తగ్గకపోవడంతో.. స్టాక్ మార్కెట్ నెగిటివ్‌ గా స్పందించింది. ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు దిగడంతో.. సెన్సెక్స్ 516 పాయింట్లు పతనమై 24వేల 884 వద్ద ముగిసింది. నిఫ్టి 155 పాయింట్లు కోల్పోయి 7వేల 603 వద్ద ముగిసింది. ఆర్బీఐ నిర్ణయానికి తోడు.. క్రూడ్‌ రేట్ల పతనం,  పనామా పేపర్స్‌ లీక్‌ వ్యవహారం కూడా దేశీయంగా ప్రభావం చూపింది. బ్యాంకులు షేర్లు భారీగా పతనమైయ్యాయి. నిఫ్టీలో అదానీ పోర్ట్, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, ఎయిర్ టెల్, యాక్సిస్‌ బ్యాంకు 5శాతం వరకు నష్టపోయాయి. 

16:42 - April 5, 2016

పాట్నా : బీహార్‌లో మద్యపాన నిషేధం అమలులోకి వచ్చింది. మద్యపాన నిషేధంపై ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ క్యాబినెట్‌ ఆమోద ముద్ర వేయడంతో బీహార్‌లో స్వదేశి, విదేశి మద్యం అమ్మకాలకు తెరపడింది. రాష్ట్రంలో మద్యపానం అమ్మడం, కొనడం, తాగడం, వ్యాపారం చేయడాన్ని నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి నితీష్‌ ప్రకటించారు. మద్యం విక్రయాలకు సంబంధించిన లైసైన్స్‌లను ప్రభుత్వం రద్దు చేసింది. దేశంలో మద్యపానంపై నిషేధం విధించిన రాష్ట్రాల్లో బీహార్‌ నాల్గవది. గుజరాత్‌, నాగాలాండ్, మిజోరాంలలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉంది.

16:39 - April 5, 2016

హైదరాబాద్ : పనామా పేపర్స్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించడం హర్షంచదగ్గ విషయమని వైసిపి అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. విదేశాల్లో ఉన్న నల్లదనాన్ని చంద్రబాబు దాచారన్నది జగమెరిగిన సత్యమన్నారు. కేంద్రం జరిపే విచారణలో చంద్రబాబు పేరు ఖచ్చితంగా బయటకు వస్తుందని పేర్కొన్నారు. 9ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు చేసిన అవినీతి బయటపడుతుందని చెప్పారు. ఏపీ రాజధాని పేరుతో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. 

 

16:32 - April 5, 2016

నెల్లూరు : దళితుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. ఈమేరకు ఆయన నెల్లూరులో మీడియాలో మాట్లాడారు. బాబు జగజ్జీవన్ రామ్ 109వ జయంతి సందర్భంగా నేటి నుంచి ఈ నెల 14 వరకు దళితుల సమస్యలపై పోరాడేందుకు సామాజిక చైతన్యయాత్ర చేపట్టిన్నట్లు ప్రకటించారు. దళితుల సమస్యలను పక్కదారి పట్టించేందుకు సీఎం చంద్రబాబు నూతన రాజధానిలో అంబేడ్కర్ పేరుతో ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నట్లు మభ్యపెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఉచిత ఇసుక పేరుతో దోపిడి జరుగుతోందని ఆరోపించారు. 

 

20వేల పోలీసు పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ : మంత్రి చినరాజప్ప

శ్రీకాకుళం :  ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగంలో ఖాళీగా ఉన్న 20 వేల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. గత రెండేళ్లలో ఎర్రచందనం స్మగ్లింగ్ ను 90 శాతం మేర అదుపు చేశామని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ఎన్ఆర్ఐలు చెరువులను దత్తత తీసుకోవాలి : హరీష్ రావు

హైదరాబాద్ : మిషన్ కాకతీయపై మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వున్న చెరువులను దత్తత తీసుకోవాలని ఎన్ఆర్ఐలకు మంత్రి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో మిషన్ కాకతీయ పథకానికి రూ.50లక్షలు భూరి విరాళంగా ఇచ్చిన శోధన ల్యాబ్ అధినేత గిరిధర్ ను మంత్రి అభినందించారు. విరాళం ఇచ్చేవారికి పన్ను మినహాయింపు వుంటుందని హామీ ఇచ్చారు.

అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్...

కడప: కాంట్రాక్టులు ఇప్పిస్తామని నమ్మించి మోసం చేస్తున్న ముఠాను కడప పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీలో కాంట్రాక్టు ఇప్పిస్తామని నమ్మించి ఆన్‌లైన్‌ ద్వారా రూ.15లక్షలు కాజేసిన నలుగురు అంతర్‌ర్రాష్ట్ర దొంగలను కడప చిన్నచౌక్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారిని నుంచి రూ.15లక్షల నగదు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన ముద్దాయిలను డీఎస్పీ అశోక్‌కుమార్‌ మీడియా ఎదుట హాజరుపరిచారు.

 

జూపార్క్ లో విద్యార్థి మృతి...

హైదరాబాద్ : జూపార్క్ లో టెన్త్ విద్యార్థి మృతి చెందాడు. జూపార్క్ ని సందర్శించటానికి వచ్చిన విద్యార్థి పార్క్ లో వున్న బట్టర్ ప్లై పార్క్ లో సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు  కరెంట్ షాక్  తగిలి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని .కేసు నమోదు చేసుకున్నారు. కాగా మృతి చెందిన విద్యార్ధి పురానాపూల్ కు చెందిన మంజిత్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. 

15:59 - April 5, 2016

మహిళలపై ఆంక్షలు రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని గుర్తించాలని వక్తలు తెలిపారు. మహిళలకు పురుషులతో సమానంగా అన్ని ఆలయాలోకి ప్రవేశం లభించాలని కోరారు. ఇదే అంశంపై నిర్వహించిన మానవి వేదిక చర్చా కార్యక్రమంలో సామాజిక కార్యకర్త దేవి, అడ్వకేట్ సురేష్ పాల్గొని, మాట్లాడారు. ఆలయ ప్రవేశాన్ని నిషేధించడం అంటే మహిళల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించటమే అవుతుందని చెప్పారు. అన్ని ఆలయాలలో మహిళల ప్రవేశానికి ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కోరారు. కాలం చెల్లిన ఆచారాలకు వీడ్కోలు పలకాలని సూచించారు. రుతుస్రావం అపవిత్రమనటం మూర్ఖత్వమన్నారు. రుతుస్రావాన్ని శాస్త్రీయ దృక్కోణంతో చూడాలన్నారు. మతాలలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరముందని చెప్పారు. ఆధునిక కాలానికి తగిన సంస్కరణలు జరగాలి కోరారు. పురుషులుకు సమానంగా మహిళలను అర్చకులుగా అంగీకరించాలని తెలిపారు. రాజ్యాంగబద్ధంగా సమాన హక్కులను అన్ని విషయాల్లో అమలు చేయాలన్నారు. చట్టాలు, హక్కులు అమలు తీరు పట్ల ప్రభుత్వం ఖచ్చితంగా వ్యవహరించాలని సూచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఏపీ రాజధాని ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు...

గుంటూరు : రాజధాని ప్రాంతంలో మావోయిస్టు కదలికలు సంచలనం కలిగించాయి.  తాల్లాయపాలెంలోని ఓ ఇంట్లో మహిళా మావోయిస్టు నూనె అన్నపూర్ణ అలియాస్ పద్మజ అనే మహిళా మావోయిస్టును పోలీసులు  అరెస్ట్ చేశారు. 23ఏళ్లుగా అజ్ఞాతంలో ఉంటున్న మహిళా మావోయిస్టు అన్నపూర్ణ తన సోదరి ఇంటి వద్ద వైద్యం చేయించుకోవటానికి వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు నిఘా వేసి అరెస్ట్ చేశారు. దండకారణ్యం స్పెషల్‌ జోన్‌లో సీనియర్‌ కమాండర్‌గా పనిచేస్తున్న నూనె నరసింహారెడ్డి భార్య ఈ అన్నపూర్ణగా పోలీసులు గుర్తించారు. ఈమె డిప్యూటీ కమాండర్‌ స్థాయి వరకు వివిధ విభాగాల్లో పనిచేసింది.

15:43 - April 5, 2016

హైదరాబాద్ : ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈమేరకు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. దళితుల కంటే కూడా ముస్లింలు వెనుకబడి ఉన్నారని సచార్ కమిటీ వెల్లడించిందని తెలిపారు. ముస్లిం రిజర్వేషన్లను మతపరమైన రిజర్వేషన్లుగా కాకుండా కేంద్రం వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లుగా భావించాలన్నారు. ముస్లిం రిజర్వేషన్ల అమలులో అడ్డంకులను అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రభుత్వం పద్ధతి ప్రకారం ముందుకెళ్తోందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను పక్కాగా అమలు చేస్తున్నామని తెలిపారు. గతంలో చేసిన పాపాలు బయటపడతాయని కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుంటుందని విమర్శించారు. ఉత్తమ్ కుమార్ మరో కొత్త డ్రామాకు తెరలేపారని చెప్పారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు. 

 

కాంగ్రెస్ పై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు...

హైదరాబాద్ : తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ...నీటి సమస్యపై అసెంబ్లీలో చర్చకు కూడా హాజరుకాని కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. వరుస ఓటములతో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మైండ్ బ్లాంక్ అయిందని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ముస్లింలను కాంగ్రెస్ ఓటు బ్యాంకు వాడుకుందని విమర్శించారు. ముస్లింలకు రిజర్వేషన్లు కావాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేయటంపై ఆయన మండిపడ్డారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.

15:30 - April 5, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత మరింత పెరిగింది. సాధారణం కంటే 5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనంతపురంలో అత్యధికంగా 44 డిగ్రీలు, మెదక్‌, నిజామాబాద్‌, రామగుండంలో 43 డిగ్రీలు, హైదరాబాద్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని, సాయంత్రం నాలుగు గంటల వరకు జనాలు బయటకు రావొద్దని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

బీహార్ లో సంపూర్ణ మద్య నిషేధం....

హైదరాబాద్ : బీహార్ లో మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు సీఎం నితీశ్ కుమార్ ప్రకటించారు. బార్లు, హోటళ్లలో ఇకమీదట మద్యం సరఫరా వుండదనీ...ఇకపై మద్యం విక్రయాలను అనుమతులు ఇవ్వబోమని సీఎం ప్పష్టం చేశారు. కాగా ఆర్మీ క్యాంటీన్లలో మాత్రం మద్యం అమ్మకాలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. ఈ నిర్ణయంతో రూ.25 వేల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వ కోల్పోవాల్సివస్తుందని సమాచారం. ఇప్పటికే గుజరాత్, నాగాలాండ్, మిజోరాం రాష్ట్రాల్లో మద్యనిషేధం అమలులో ఉన్న విషయం తెలిసిందే.

15:03 - April 5, 2016

హైదరాబాద్ : హైకోర్టు ఆదేశాలతో డ్రంక్‌ డ్రైవ్‌ నిందితులు ట్రాఫిక్‌ను నియంత్రించారు.. తాగిన బండినడిపిన 31మందికి కోర్టు ఈ శిక్ష విధించింది.. వీరికి నగరంలోని వివిధ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర పోలీసులు పనులు అప్పగించారు.. ఐదుగంటపాటు ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేసిన నిందితులకు పోలీసులు మందేసి వాహనాలను నడపొద్దని సూచించారు..

14:58 - April 5, 2016

శ్రీకాకుళం : టీడీపీ పాలనలో నేరాల సంఖ్య చాలా తగ్గిందని ఏపీ హోంమంత్రి చినరాజప్ప అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావుతోకలిసి చినరాజప్ప పర్యటించారు. అరసవెల్లి సూర్యదేవాలయంలో పూజలు చేశారు. అరసవెల్లి కూడలిలో బాబూ జగ్జీవన్‌ రాం విగ్రహానికి పూల మాలలు వేశారు. అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న చినరాజప్ప... పోలీసులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ ఇసుక నిఘా వల్ల పోలీసులపై ఒత్తిడి పెరిగినమాట వాస్తవమేనని అంగీకరించారు. పోలీసుల సంఖ్యను పెంచి నిఘాను పటిష్టం చేస్తామని ప్రకటించారు. సీఎం ఆదేశాల ప్రకారం ప్రతి రౌడీషీటర్‌ కదలికల్ని జియో ట్యాగింగ్‌ ద్వారా గమనిస్తామని చెప్పారు. 

 

మేఘాలయలో భూప్రకంపనలు...

హైదరాబాద్ : ఈశాన్య రాష్ట్రాల్లో మంగళవారం భూకంపం సంభవించింది. మేఘాలయా, అసోం తదితర రాష్ట్రాల్లో కొన్ని క్షణాల పాటు భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 5.4గా నమోదైంది. 

బీహార్ లో సంపూర్ణ మద్య నిషేదం అమలు

పాట్నా : బీహార్ లో సంపూర్ణ మద్య నిషేదం అమలు కానుంది. ఈమేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేదాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. 

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడి...

జమ్మూ కాశ్మీర్ : కుప్వారాలో భద్రతా దళాలు-ఉగ్రవాదులకు మధ్య భారీస్థాయిలో ఎదురు కాల్పులు జరిగాయి. ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను భద్రతాదళాలు అరెస్ట్ చేశాయి. ఉగ్రవాదులు భద్రతా దళాలకు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. 

ఇన్నర్ రోడ్లను పరిశీలించిన బాబు..

విజయవాడ : రాజధాని ప్రాంతంలో ట్రాపిక్ రద్దీని తగ్గించేందుకు శరవేగంగా జరుగుతున్న ఇన్నర్ రోడ్ల పనులకు సీఎం చంద్రబాబు నాయుడు పర్యవేక్షిసంచారు. 

పెరిగిన ఉష్ణోగ్రతలు..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అధికమౌతున్నాయి. గడిచిన 24గంటల్లో అనంతపురం లో 44, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమైంది. మెదక్ లో సాధారణం కంటే 6 డిగ్రీలు, హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్ లో సాధారణం కంటే నాలుగు డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. 

13:23 - April 5, 2016

హైదరాబాద్ : తెలంగాణలో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజుల మోత మోగించేందుకు సిద్ధమవుతున్నాయి. అందుకు కావాల్సిన ఏర్పాట్లు కూడా చకా చకా చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎఎఫ్ఆర్ సీకి ప్రతిపాదనలు కూడా పంపాయి. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. అయితే ఇంజనీరింగ్‌ ఫీజుల పెంపుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే గతేడాది ఉన్న ఫీజులు ఏ మాత్రం సరిపోవడం లేదని..తమకు కొత్త ఫీజు విధానాలు అనుమతించాలని వారు ఎఎఫ్ఆర్ సికి మొరపెట్టుకున్నారు. తెలంగాణలో ఉన్న కాలేజీలన్నీ ఇప్పటికే ఈ ప్రతిపాదనల్ని పంపాయి. గతేడాది లక్షా 6వేలు వసూలు చేసిన కాలేజీలు..ఇప్పుడు ఏకంగా 2 లక్షల 30వేల రూపాయలకు పెంచాలని ప్రతిపాదనలు పంపాయి. తెలంగాణలోని టాప్ కాలేజీలన్నీ లక్షన్నర వరకు ఏ మాత్రం తగ్గకుండా ప్రతిపాదనల్ని పంపాయి.

అప్పుడలా..ఇప్పుడిలా..
అయితే అధికారంలోకి రాకముందు ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల భరతం పడతానని చెప్పిన కేసిఆర్..తీరా అధికారంలోకి వచ్చాకా అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని విద్యార్ధిసంఘాలు మండిపడుతున్నాయి. పేద విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించి వారికి ఉన్నత విద్యలో అవకాశాలను పెంచుతామని హామీఇచ్చిన కేసీఆర్‌ ఇప్పుడు ప్రైవేటు కాలేజీలకు కొమ్ముకాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంజనీరింగ్ కాలేజీల విషయంలో ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయం వివాదాస్పదంగా మారుతోంది. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలన్ని ఫీజులు పెంచాలని ప్రతిపాదనలు పంపితే అందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఫీజులు పెంచేందుకు ప్రైవేటు కాలేజీలు సిద్ధంగా ఉంటే..దానికనుగుణంగా ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ని కూడా పెంచాల్సిన అవసరం ఉందని విద్యార్థి సంఘం నేతలు సూచిస్తున్నారు. లేకపోతే పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్ధులు సాంకేతిక విద్యకు దూరమవడం ఖాయమని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉందంటూ మురిసిపోతున్న కేసీఆర్‌.. విద్యార్ధుల ఫీజు బకాయిలు చెల్లించడానికి మాత్రం డబ్బులు లేవా అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు రీఎంబర్స్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నారన్నారు. 2013 -14 విద్యా సంవత్సరం రీఎంబర్స్‌మెంట్‌ బకాయిలు 370 కోట్ల రూపాయలు, అలాగే 2014-15 విద్యా సంవత్సరం బకాయిలు 120 కోట్లు పేరుకుపోవడంతో అటు విద్యార్థులు ఇటు కాలేజీ యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నాయి.

ఫీజుల భారం విద్యార్థులపై 
ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు పెంచమని కోరుతున్న ఫీజుల భారం మళ్లీ విద్యార్ధుల మీద వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విద్యార్థి సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది విద్యార్ధులు ఇంజనీరింగ్ విద్యకు దూరమవుతారని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం దీనిపై పునరాలోచించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. 

13:18 - April 5, 2016

ఢిల్లీ : దేశంలోనే అత్యధిక వేగవంతమైన రైలు గతిమాన్‌ ఎక్స్ ప్రెస్‌ ప్రారంభమైంది. ఢిల్లీ నిజాముద్దీన్‌ స్టేషన్‌లో రైల్వేమంత్రి సురేశ్ ప్రభు ప్రారంభించారు. ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ రెండువందల కిలోమీటర్ల దూరాన్ని వంద నిమిషాల్లో చేరుకుంటుంది. ఈ రైలులో మల్టిమీడియా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధాన ఆకర్శణగా నిలుస్తోంది. ఈ రైలు వారంలో ఆరు రోజులు నడుస్తుంది. ఈ రైలులో రెండు ఏసీ కోచ్‌లు, ఎనిమిది సాధారణ కోచ్‌లు ఉంటాయి. ఇందులో ట్రైన్‌ హోస్టెస్‌లు సేవలు అందిస్తారు. మైఫ్రీ టీవీ డాన్‌ ఇన్‌ ద్వారా టీవీలో రక రకాల వీడియోలు చూడొచ్చు. వైఫై, బయోటాయ్‌లెట్లు కూడా ఏర్పాటు చేశారు.

13:14 - April 5, 2016

విజయవాడ : జగ్జీవన్ రాంను ఆదర్శంగా తీసుకోవాలని, పదవులకే గౌరవం తెచ్చిన నేత అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 109వ జయంతి సందర్భంగా బాబు జగ్జీవన్ రాం చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. పదవుల కోసం ఆయన తాపత్రయ పడలేదని, నమ్మిన సిద్ధంతాల కోసం ఎక్కడా రాజీ పడలేదన్నారు. ఎమర్జెన్సీని వ్యతిరేకించిన జగ్జీవన్ పదవికి రాజీనామా చేసిన బయటకు వచ్చారని గుర్తు చేశారు. చరిత్ర ఉన్నంత వరకు ప్రతొక్కరూ జగ్జీవన్ రాంను గుర్తు పెట్టుకుంటారని తెలిపారు. పేదల కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తి ఎన్టీఆర్ అని, పేద వాడికి కడుపునిండా తినాలని రెండు రూపాయల కిలో బియ్యం ప్రవేశ పెట్టారని తెలిపారు. బషీర్ బాగ్ లో ఆయన విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందని, జగ్జీవన్ రాం భవన్ ను తన హాయంలో కట్టడమే కాకుండా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ బాబు జగ్జీవన్ రాం, అంబేద్కర్ కు న్యాయం జరగలేదని, టిడిపి హాయాంలో వీరికి న్యాయం జరిగిందన్నారు. 

12:52 - April 5, 2016
12:49 - April 5, 2016
12:48 - April 5, 2016

ప్రకాశం : ఎంతో సంతోషంతో జీవిస్తున్న ఓ కుటుంబానికి అంతులేని కష్టమొచ్చింది. కాటికి చేరే వయసులో చిన్నారుల బాధ్యత మీదపడింది. తల్లిదండ్రులు చనిపోవడంతో పిల్లలు అనాధలయ్యారు. ఆదుకోవాలంటూ ఆసరాకోసం ఎదురుచూస్తున్నారు. ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం రామాపురం గ్రామానికిచెందిన ముప్పూరి వెంకటేశ్వర్లు, శేషమ్మకు ఇద్దరు పిల్లలు. కూతురు వయసు పదకొండేళ్లు. బాబు వయసు నాలుగేళ్లు. ఉన్నదాంట్లో సర్దుకుంటూ ఎంతో సంతోషంగా కాలం గడుపుతున్న ఈ కుటుంబానికి వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. గత ఏడాది జూన్‌లో బహిర్బూమికి వెళ్లివస్తూ తల్లి శేషమ్మ రోడ్డు ప్రమాదంలో చనిపోయింది.

పస్తులుంటూ..
ఓవైపు భార్య మరణం... మరోవైపు ఇద్దరు చిన్నారులను పెంచాల్సిన బాధ్యత. అయినా వెంకటేశ్వర్లు కుంగిపోలేదు. ధైర్యం తెచ్చుకొని తన తల్లి సహాయంతో పిల్లల్ని అల్లారుముద్దుగా చూసుకున్నాడు. మళ్లీ ఇంతలో ఆ కుటుంబానికి మరో షాక్ తగిలింది. తండ్రి వెంకన్నకు క్యాన్సర్‌ సోకింది. చికిత్సకోసం ఎన్ని ఆస్పత్రులు తిరిగినా జబ్బు తగ్గలేదు. పైగా ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. ఈ సమస్యల మధ్యే రెండు నెలల క్రితం అతను మరణించాడు. కొడుకు, కోడలు చనిపోవడంతో పిల్లల బాధ్యత కొండమ్మ మీద పడింది. వృద్ధాప్యంలో తనకు ఆసరా కావాల్సిందిపోయి ఇప్పుడు చిన్నారులకు ఆమె పెద్ద దిక్కయింది. కొండంత కష్టంవచ్చినా కొండమ్మ కుంగిపోకుండా పిల్లల్ని చూసుకుంటోంది. తాను చనిపోతే పిల్లలకు దిక్కెవ్వరన్న ఆందోళనతో ప్రతిక్షణం కుంగిపోతోంది. ఓ పూట తింటూ మరో పూట పస్తులుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది.

ఆదుకోవాలని కోరుతున్న కొండమ్మ..
చిన్నారులకు ఏదైనా ఆసరా చూపి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కొండమ్మ కోరుతోంది.. తను బతికుండగానే సహాయంచేస్తే అదిచూసి కాస్త సంతోషంగా కన్ను మూస్తానని చెబుతోంది. నాన్నమ్మ వృద్ధురాలు కావడంతో తమ్ముడి బాధ్యత ఈ అక్కపై పడింది. ఇంటిపనికి సహాయం చేస్తూ తమ్ముడిని చూసుకుంటూ ప్రస్తుతం పాఠశాలకు వెళుతోంది. నాన్నమ్మ చనిపోతే తమకు దిక్కెవరంటూ ఆందోళన చెందుతోంది. పుట్టెడు కష్టాలమధ్య కొట్టుమిట్టాడుతున్న ఈ కుటుంబం దాతలకోసం ఎదురుచూస్తోంది.. మనసున్న మారాజులు పిల్లలకు సాయం చేయాలని కోరుతోంది.

12:44 - April 5, 2016

ముంబాయి : కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌కు అభిమానుల్లో ఎంత క్రేజ్‌ ఉందో మరోసారి రుజువైంది.. ఈ ఏడాది విడుదలకాబోతున్న చిత్రాలపై ఆర్మాక్స్ మీడియా సర్వేలో ఈ విషయం స్పష్టమైంది. ఈ సర్వే ప్రకారం సల్మాన్‌ మూవీ సుల్తాన్‌కోసం ఎక్కువమంది ఎదురు చూస్తున్నారని తేలింది. ఆ తర్వాత స్థానంలో అమీర్‌ఖాన్‌ సినిమా దంగల్‌ ఉంది. షారూఖ్‌ ఖాన్‌ నటించిన రయీస్‌, ఫాన్ చిత్రాలు మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి.. సల్మాన్‌ సినిమా కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడమే ఈ అభిమానానికి కారణమని సినీ ప్రముఖులు చెబుతున్నారు. ఏ భాషలో మంచి సినిమా వచ్చినా ఈ హీరో ఆ మూవీపై దృష్టిపెడతారు. ఈ మధ్య వచ్చిన క్షణం సినిమాను హిందీలో నిర్మించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. తన స్నేహితులు సాజిద్ నడియాద్‌ వాలాతో చిత్ర హక్కులను కొన్నాడని సమాచారం. అయితే ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కేలా లేదు. మరో నాలుగు సినిమాలో ప్రస్తుతం సల్మాన్‌కోసం క్యూలో ఉన్నాయి.

 

12:41 - April 5, 2016

ఢిల్లీ : నల్లకుబేరుల గుట్టు విప్పుతున్న పనామా తన రెండో జాబితా విడుదల చేసింది. ఈ పత్రాల్లోని భారతీయుల జాబితాను ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ బయటపెట్టింది. ఈ జాబితాలో పలువురు పారిశ్రామికవేత్తలతో పాటు క్రికెటర్‌ పేర్లున్నాయి. క్రామ్టన్‌ గ్రీవ్స్ ఛైర్మన్‌ గౌతం ఠాపర్, మెహ్రాసన్స్ జ్యువెల్సర్స్ అధినేత అశ్వినీ కుమార్ మెహ్రా, పారిశ్రామికవేత్తలు గౌతం, కరణ్ థాపర్‌, సతీష్ గోవింద సంతాని, విష్లవ్ బహదూర్‌, హరీశ్ మొహ్‌నాని మధ్యప్రదేశ్ రిటైర్డ్ ప్రభుత్వాధికారి ప్రభాష్‌ సంఖ్లా పేర్లున్నాయి. పుణెకు చెందిన సవా హెల్త్‌కేర్ చైర్మన్ వినోద్ రామచంద్ర జాదవ్, మాజీ క్రికెటర్ అశోక్ మల్హోత్రా, రాజీవ్ దహుజా, బెల్లాస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్‌కుచెందిన కపిల్ సెయిన్ గోయల్‌, వ్యవసాయ పనిముట్లు అమ్మే వివేక్ జైన్ కూడా ఉన్నారు. వీరు పన్నులు ఎగ్గొట్టేందుకు పలు బోగస్ కంపెనీల్లో డైరెక్టర్లు, షేర్‌ హోల్డర్లుగా ఉన్నారని తెలుస్తోంది. పనామాలోని మొస్సాక్‌ ఫోన్సెకా అనే లా కంపెనీ పత్రాలు లీకవ్వడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

12:39 - April 5, 2016

హైదరాబాద్ : తెలంగాణలో అంతరాష్ట్ర రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు వేగవంతం చేస్తోంది రాష్ట్ర సర్కారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో వివిధ ప్రాంతాల్లో రహదారుల విస్తరణకు కావాల్సిన డీఆర్‌పీలను సిద్ధం చేసింది. కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కారీ ఇటీవలే రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో మూడు ప్రాంతాలలో పూర్తి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పరిపాలనా అనుమతుల కింద ఆరు కోట్ల రూపాయలను విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఖమ్మం జిల్లా సారాపాక నుంచి మణుగూరు, రాజుపేట, రామన్నగూడెం మీదుగా ఏటూరి నాగారం వరకు గోదావరి పరివాహక ప్రాంతం గుండా రోడ్లు విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. అందుకోసం ఒక కోటి,70లక్షల రూపాయాలతో డీపీఆర్‌ తయారుచేసింది ఆర్ అండ్ బీ. మరోవైపు ఏటూరి నాగారం నుంచి కొత్తూరు, సింగూరు, సురారం మీదుగా రహదారి నిర్మించాలని భావించింది. ఇక ప్రాణహిత పరివాహకం వద్దనున్న కాళేశ్వరం నుంచి వెమనపల్లి, బెజ్జూరు, కోరుట్ల మీదుగా మరో 2 కోట్ల 50లక్షల రూపాయలతో ప్రత్యేక డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్‌ తయారు చేయాలని నిర్ణయించింది.
రహదారుల నిర్మాణం కోసం నిధులు విడుదల చేసినప్పటికీ ఇంకా డీపీఆర్ సిద్ధం చేయడానికి ఏ సంస్థకు అధికారికంగా బాధ్యతలు అప్పగించలేదు ఆర్ అండ్ బీ శాఖ. రోడ్ల నిర్మాణం విషయంలో అనుభవం ఉన్న సంస్థలకే ఈ పనులు అప్పగించాలని అధికారులు నిర్ణయించారు.

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీదే విజయం: చినరాజప్ప

కర్నూలు : బీసీలకు టీడీపీ అండగా వుంటుందని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయం టీడీపీదేనని ధీమా వ్యక్తం చేశారు.టీడీపీ అధికారంలోకి రావటానికి బీసీలే కీలకపాత్ర వహించారని తెలిపారు. జగన్ ఏనాడూ బీసీల గురించి మాట్లాడలేదని గుర్తుచేశారు.  ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే విజయాన్ని అందిస్తాయని ఓ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు.

ఆప్ఘన్ లో బాంబు దాడి, 6 గురు మృతి.

ఆఫ్ఘనిస్థాన్ : సేమాగర్డ్ జిల్లా పార్వన్ ప్రాంతంలో ఆత్మాహుతి దళం దాడికి పాల్పడింది. ఈ దాడిలో 6గురు మృతి చెందినట్లు గవర్నర్ తెలిపారు. కాగా మరో 20 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. 

సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్ లో ఐదుగురు అరెస్ట్....

హైదరాబాద్ : సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్ లో ఐదుగురు దళారులను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 2వ తేదీన వీరిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. గతంలో 10మందిని సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా రాష్ట్ర ఆవిర్భావానికి ముందు నకిలీ బిల్లులు సృష్టించి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి అనర్హులు లబ్ది పొందారన్న వార్తల నేపథ్యంలో కేసీఆర్ దీనిపై దృష్టి పెట్టారు. దీంతో సమగ్ర విచారణ జరపమని సీబీఐని సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యంలో సీఐడీ అరెస్ట్ చేసినవారిలో వెన్నంపల్లి రాజేందర్, సింగిరెడ్డి సుభాష్ రెడ్డి, సాగర్, మురిళీ ప్రసాద్,టి.శ్రీనివాస్ లను అరెస్ట్ చేశారు.

ఏపీ పోలీసులకు హోంమంత్రి హెచ్చరికలు..

హైదరాబాద్ : ఏపీ పోలీసులకు హోంమంత్రి హెచ్చరికలు జారీ చేశారు. రౌడీ షీటర్లతో పోలీసులు సంబంధాలు పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ హోంమంత్రి చినరాజప్ప పేర్కొన్నారు. ఉచిత ఇసుక పథకంపై పూర్తిస్థాయిలో నిఘా వుంటుందని తెలిపారు.

డ్రంకర్స్ కు ట్రాఫిక్ డ్యూటి వేసిన కోర్టు...

హైదరాబాద్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 31 మందికి నాంపల్లి న్యాయస్థానం ట్రాఫిక్ డ్యూటీ వేసింది. పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద 5 గంటల పాటు ట్రాఫిక్ కంట్రోల్ డ్యూటీ నిర్వహించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

రైతు కరవు యాత్రను ప్రారంభించిన ప్రొ.కోదండరాం...

ఆదిలాబాద్ : ముథోల్ మండలం బిద్రెల్లిలో రైతు కరవు యాత్రను తెలంగాణా జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం ప్రారంభించారు. రాష్ట్రంలో నెలకొన్న కరవుపై ఈ బృందం పరిశీలించనుంది. ఈ సందర్భంగా స్థానికులు కోదండరాంకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్, కార్యదర్శఇ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఆటోలు ఢీ కొని 10మంది విద్యార్థులకు గాయాలు....

కృష్ణా : పామర్రు జాతీయ రహదారిపై రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 10మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ప్రగతి పబ్లిక్‌ స్కూల్‌లో చదువుతున్న విద్యార్ధులు ఈ రోజు ఉదయం ఆటోలో స్కూలుకు వెళుతుండగా...ఎదురుగా వస్తున్న మరో ఆటో ఢీకొట్టింది. గాయపడిన వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. టీడీపీ నేత కృష్ణబాబు విద్యార్థులను పరామర్శించారు.

జగ్జీవన్ రాం సేవలు మరువలేనివి : కేసీఆర్

హైదరాబాద్ : బాబు జగ్జీవన్ రాం సేవలు మరువరానివని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. జగ్జీవన్ రాం 109 జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. దేశ సామాజిక స్థితిగతులను మార్చటంలో ఆయన కృషి మరువలేదనిదని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా, ప్రజా నాయకుడిగా ప్రజల మనస్సులలో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. 

11:26 - April 5, 2016

ముంబాయి : 'భారతీయ రిజర్వు బ్యాంకు' (ఆర్‌బీఐ) మంగళవారం ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్వహించింది. ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కీలక వడ్డీ రేట్ల సవరణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం రాజన్ మీడియాతో మాట్లాడారు. కీలక వడ్డీ రేట్లను తగ్గించారు. 6.75 ఉన్న రెపో రేటు 6.50 శాతానికి తగ్గించారు. ఇదే సమయంలో రివర్స్ రెపో రేటు బ్యాంకులు దాచుకొనే నిధులపై పొందే వడ్డీను సైతం 5.75 శాతం నుండి 5.50 శాతానికి తగ్గిస్తున్నట్లు రాజన్ వెల్లడించారు. చిల్లర ధరల సూచిక ఆధారిత ద్రవ్యోల్బణం ఐదు శాతం లోపు ఉండడం తగ్గించేందుకు సహకరించిందని ఈ సందర్భంగా రాజన్ వ్యాఖ్యానించారు. సీఆర్ ఆర్ ను యధావిధిగా 4శాతంగా ఉంచింది.. ద్రవ్యోల్బణం 5 శాతంగా రిజర్వ్ బ్యాంక్ అంచనావేసింది. వచ్చే ఏడాది ఆర్ధికవృద్ధిరేటు 7.6శాతంగా ఉంటుందని అంచనా వేసింది.
గత సెప్టెంబర్‌ 29న నిర్వహించిన సమీక్షలో రెపో రేటును 50 బేసిస్‌ పాయింట్లు తగ్గించి 6.75 శాతానికి చేర్చిన సంగతి తెలిసిందే. సర్కారు ఇటీవల చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను 1.3 శాతం వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో తాజా ఆర్‌బీఐ సమీక్షలో వడ్డీ రేట్లను తగ్గించే సూచనలున్నాయని ప్రచారం జరిగింది. మరోవైపు ఆర్బీఐ నిర్ణయాలతో స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి.. సెన్సెక్స్ 200 పాయింట్లు పడిపోయింది.

కీలక వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్బీఐ...

ముంబాయి : ద్రవ్య పరపతి విధానంపై భారత రిజర్వ్ బ్యాంక్ సమీక్షా సమావేశం నిర్వహించింది. కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. రేపో రేటును 6.75 నుండి 6.50 శాతానికి ఆర్బీఐ తగ్గించింది. నగదు నిల్వల నిష్పత్తిని యథాతథంగా ఉంచగా...గృహ, వాహన రుణాలపై వడ్డీరేట్లు తగ్గనున్నాయి. 2016-17 వృద్ధి రేటు 7.6 శాతంగా వుంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది.

ఆర్ఎంపీ డాక్టర్ ఇంటిపై డ్రగ్స్ అధికారుల దాడి...

కృష్ణా : నందివాడ మండలం కోలుకొండ గ్రామంలో ఆర్ఎంపీ ఇంటిపై డ్రగ్ అధికారులు దాడి చేశారు. స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ హరిబాబు ఇంటిపై డ్రగ్స్ ఇన్ స్పెక్టర్  తనిఖీలు చేపట్టారు. రూ.65వేల విలువైన మెడిసిన్స్ ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డాక్టర్ పై కేసు నమోదు చేశారు.

ఓరీస్ హోటల్ సీజ్ చేసిన జీహెచ్ఎంసీ అధికారులు.....

హైదరాబాద్ : బంజారాహిల్స్ రోడ్ నం.12లో ఓరీస్ హోటల్ ని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. హోటల్ కు సంబంధించిన మురుగును రోడ్డుపైకి విడుస్తుండటంతో హోటల్ ను నగరపాలక అధికారుల సీజ్ చేశారు. 

ఘనంగా బాబూ జగ్జీవన్ రాం జయంతి....

హైదరాబాద్‌: బాబూజగ్జీవన్‌రాం 109వ జయంతి సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి, చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్‌, జీహెచ్ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులు బషీరాబాగ్‌లోని జగ్జీవన్‌రాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

పట్టాలెక్కిన గతిమాన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్....

ఢిల్లీ : ఢిల్లీ-ఆగ్రా గతిమాన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ను రైల్వే మంత్రి సురేష్ ప్రభు పారంభించారు. ఈ ట్రైన్ గంటకు 160 కి.మీ వేగంతో దూసుకెళ్ళనుంది. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుండి ఆగ్రాకు ఈ రైలు పరుగులు పెట్టనుంది. శతాబ్ది ఎక్స్ ప్రెస్ తో పోలిస్తే దీనిలో ప్రయాణించేవారికి ధర ఎక్కువనే చెప్పాలి. దీనిలో  మరో ప్రత్యేకత ఏమిటంటే విమానంలో ఎయిర్ హోస్టెస్ ల వలే ఈ రైలులో ప్రతికోచ్ లోనూ హోస్టెస్ లు తమ సేవలను అందించనున్నారు. ఈ రైలులో రెండు ఎగ్జిక్యూటివ్‌ ఏసీ కోచ్‌లు, ఎనిమిది సాధారణ ఏసీ కోచ్‌లు ఉంటాయి. సాధారణ ఏసీ కోచ్‌లో టిక్కెట్‌ ధర రూ.750.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం...

తిరుమల : శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. 9 కంపార్టమెంట్లలో భక్తులు వేచి వున్నారు. నడక దారి భక్తులకు 5 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. 

కల్తీ సాస్ స్థావరంపై పోలీసుల దాడి...

హైదరాబాద్ : కల్తీ సాస్ లు తయారు చేస్తున్న స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఎర్రగడ్డలో కల్తీసాస్ తయారు చేస్తున్న దినేష్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 20 లీటర్లల టమోటా సాస్, 10లీటర్లల చిల్లీ సాస్ , 5 లీటర్లల వెనిగర్, 51 లీటర్ల యాక్టిక్ యాసిడ్ స్వాధీనం చేసుకున్నారు. 

ఎర్ర చందనం దొంగల అరెస్ట్...

కర్నూలు : చాగలమర్రిలో అక్రమంగా తరలిస్తున్న రూ.50లక్షలు విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు ఓ మినీ లారీ ని స్వాధీనం చేసుకున్నారు.

09:52 - April 5, 2016

హైదరాబాద్ : ఎండాకాలం ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో తెలుగు రాష్ట్రాలు భగభగ మండుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ, రాయలసీమల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 నుంచి 43 డిగ్రీలు దాటిపోయాయి. అత్యధికంగా నిజామాబాద్‌లో 43.3 డిగ్రీలు నమోదైంది. దీంతో ప్రజలు మండుటెండలకు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. అనంతపురంలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, కర్నూలులో 42 డిగ్రీలు, హైదరాబాద్‌లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతతో సూర్యుడు నిప్పులు చిమ్మాడు. తిరుపతి, నందిగామలలో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పట్టపగలు సెగలు పెరగడంతో జనం ఇళ్లనుంచి బయటకు రాలేకపోతున్నారు. అనివార్యమైతే తప్ప ప్రజలు బయట తిరగవద్దని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇంకా పెరుగుతాయని, వడగాలులు వీచే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా ఇంతటి గరిష్ట ఉష్ణోగ్రతల సమయంలో అక్కడక్కడ దట్టమైన క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడి అప్పటికప్పుడు వడగండ్ల వర్షాలు కురవడం ఆనవాయితీ. కానీ ఈసారి తెలుగు రాష్ట్రాల్లో అలాంటి మేఘాలు కూడా ఏర్పడ లేదు. ఇటీవల రెండ్రోజులు వాతావరణం చల్లబడినా మళ్లీ వడగాలులు మొదలయ్యాయి. దీంతో భానుడి ప్రతాపాన్ని తట్టుకునేందుకు ప్రజలు.. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. 

09:33 - April 5, 2016

విజయవాడ : ఏపీ క్యాబినెట్ విస్తరణ జరగబోతోందంటూ వస్తున్న వార్తలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌లా మారాయి. ఎప్పటినుంచో ఊరిస్తున్న క్యాబినెట్ విస్తరణ అంశం ఆశావహులకు నిద్రపట్టనీయడం లేదు. ఇంతకి క్యాబినెట్ విస్తరణలో మార్పుచేర్పులు ఎలా ఉండబోతున్నాయి.. మినిస్టర్ పదవిపై ఎవరెవరు కన్నేశారు. ఇప్పటివరకు అధికారానికి దూరంగా ఉన్న చినబాబు క్యాబినెట్‌ రంగప్రవేశం చేస్తారా.? ఇలాంటి అనేక ప్రశ్నలకు కేంద్రమైన మంత్రివర్గ విస్తరణపై టెన్‌ టివి ప్రత్యేక కథనం. ఏపీ క్యాబినెట్‌ విస్తరణ అంశం ఇటు అధికార పార్టీలోనూ అటు ప్రతిపక్ష పార్టీలోనూ చర్చనీయాంశమైంది. తమకు ఛాన్స్‌ దక్కుతుందో లేదో అని అధికారపార్టీ ఎమ్మెల్యేలు, తమ పార్టీలోంచి వెళ్లినవారిలో ఎవరికి బెర్త్‌ దొరుకుతుందో అని ప్రతిపక్ష వైసిపి నేతల్లో ఆసక్తి నెలకొంది. టిడిపి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావొస్తున్న తరుణంలో క్యాబినెట్ విస్తరణపై విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతోంది. గత దసరా పండుగ నాటినుండి అదిగో విస్తరణ.. ఇదిగో విస్తరణ అంటూ ఊహాగానాలు వినిపించినా ఇప్పటి వరకూ ఆ ప్రయత్నాలు జరగలేదు. అయితే సిఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్య విస్తరణ అంశానికి బలం చేకూరుస్తోంది. ప్రస్తుతం ఏపీ క్యాబినెట్‌లో ఆరు ఖాళీలుండగా వాటిని ఆశిస్తున్న వారి సంఖ్యమాత్రం భారీగానే ఉంది.

జిల్లాల వారీగా ఆశావాహులు..
జిల్లాల వారిగా మంత్రి పదవులు అశించే వారి వివరాలు చూస్తే ముందుగా శ్రీకాకుళం జిల్లా నుంచి కళా వెంకట్రావు రేసులో ముందున్నారు. విజయనగరం జిల్లానుంచి మంత్రిగా ఉన్న మృణాళిని కళా వెంకట్రావుకు బంధువు కావడం... ఇతరత్రా అంశాల నేపథ్యంలో ఆమె మంత్రి పదవి కళావెంకట్రావుకు లభిస్తుందనే చర్చ జరుగుతోంది. పైగా కళావెంకట్రావు ఏపి టిడిపి అధ్యక్షుడిగా చినబాబు లోకేష్‌కు సన్నిహితుడిగా ఉండడం కలిసొచ్చే అంశంగా ఉంది. ఇదే జిల్లానుంచి మరో సీనియర్ నేత గౌతు శ్యాంసుందర్ శివాజి కూడా క్యాబినెట్ బెర్త్ ఆశిస్తున్నారు. విజయనగరం జిల్లా విషయానికొస్తే... సీనియర్ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడు, కేఏ నాయుడు రేస్‌లో ఉన్నారు. ఇక విశాఖ జిల్లా విషయానికొస్తే ఇప్పటికే ఆ జిల్లానుంచి గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు మంత్రులుగా ఉండగా సీనియర్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మినిస్టర్ పదవిని ఆశిస్తున్నారు.

మంత్రి పదవి రేసులో..
ఇటీవల వైసిపి ఎమ్మెల్యే రోజా విషయంలో ప్రాచుర్యం పొందిన పాయకరావుపేట ఎమ్మెల్యే, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వంగలపూడి అనిత కూడా విశాఖ జిల్లా నుంచి మంత్రి పదవి రేసులో ఉన్నారు. ఇక ఉభయగోదావరి జిల్లాల నుంచి ఆశావహులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. తూర్పుగోదావరి నుంచి సీనియర్ నేత బుచ్చయ్యచౌదరి, గొల్లపల్లి సూర్యారావు, తోటా త్రిమూర్తులు మంత్రిపదవులు ఆశిస్తున్నారు. అయితే పార్టీ వ్యవస్థాపక సభ్యునిగా ఉన్న తనకు మంత్రిపదవి లభిస్తుందని బుచ్చయ్య చౌదరి ఆశిస్తుండగా... దళిత నేతగా గొల్లపల్లి సూర్యారావు, కాపు కోటాలో భాగంగా తనకు మంత్రిపదవి ఇవ్వాలని తోటా త్రిమూర్తులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే... త్వరలోనే పార్టీలో చేరబోతున్న జ్యోతుల నెహ్రూ కూడా రేసులో ముందున్నారు. ఇక పశ్చిమ గోదావరిజిల్లా నుంచి క్షత్రియ వర్గానికి చెందిన కలవపూడి శివ మినిస్టర్‌ పదవి కోరుతున్నారు. టిడిపి ఆనవాయితీ ప్రకారం కేబినెట్‌లో క్షత్రియులకు తగు ప్రాధాన్యత ఉంటుందని ఆయన భావిస్తున్నారు.

కృష్ణా నుండి పోటీ నామ మాత్రం..
ఇక రాజధాని విషయానికొస్తే కృష్ణా గుంటూరు జిల్లాల పరిధిలో ఐదుగురు మంత్రులు కొనసాగుతుండగా... కృష్ణా నుండి ఆశావహుల పోటీ నామమాత్రంగానే ఉంది. పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అయితే కృష్ణాకు భిన్నంగా గుంటూరు జిల్లాలో పోటీ తీవ్రంగా ఉంది. సీనియర్ శాసనసభ్యులు ధూళిపాళ్ళ నరేంద్ర పేరు ప్రబలంగా వినిపిస్తోంది. 2004 ఎన్నికల్లో జిల్లాలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కావడం...వైఎస్‌కు వ్యతిరేకంగా గట్టిగా గళం వినిపించడం ఆయనకు కలిసొచ్చే అంశంగా ఉంది. ఇక స్పీకర్ కోడెల శివప్రసాద్ సైతం మంత్రివర్గంలోకి వచ్చేందుకు అసక్తి కనబరుస్తున్నారు. వీరితోపాటు జివి అంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్, శ్రావణ్‌కుమార్‌లు మంత్రిపదవిపై కన్నేశారు.

రాయలసీమలో సమీకరణాలు..
ఇక ప్రకాశం జిల్లా విషయానికొస్తే ఒంగోలు ఎమ్మెల్యే దామరచర్ల జనార్దన్, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసరెడ్డి మంత్రిపదవి బరిలో ఉన్నారు. కాగా తనతోపాటు జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన దేవినేని ఉమ, చినరాజప్ప, పుల్లారావులకు మంత్రిపదవులు లభించాయని పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తాను అండగా నిలిచానని జనార్దన్ అంటున్నారు. నెల్లూరు జిల్లా నుంచి సీనియర్ నేత ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఒక్కరే బరిలో ఉన్నారు. మొదటి నుండి వైఎస్ ప్రజావ్యతిరేక విధానాలు ఎండగడుతున్న తనకు ఆ పదవి లభిస్తుందని సోమిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక రాయలసీమలో సమీకరణాలు పరిశీలిస్తే సిఎం సొంత జిల్లా చిత్తూరు నుంచి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయడు, బిసి కోటాలో తంబళ్ళపల్లి ఎమ్మెల్యే శంకర్‌యాదవ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ చిత్తూరు జిల్లానుంచి బీసీలకు అవకాశం రాలేదని ఇసారి ఖచ్చింతగా అవకాశం లభిస్తుందని శంకర్ యాదవ్‌ ఆశిస్తున్నారు. ఇక టిడిపి కంచుకోట అయిన అనంతపురంలో పరిటాల సునీత, పల్లెరఘునాథరెడ్డి మంత్రులుగా ఉండగా... సీనియర్ నేత, జిల్లా అధ్యక్షులు పెనుగొండ ఎమ్మెల్యే పార్ధసారథి, మరో సీనియర్ నేత ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ రేసులో ముందున్నారు. బీసీ కోటాలో తనకు మినిస్టర్‌ గిరీ దక్కుతుందని పార్ధసారథి ధీమా వ్యక్తం చేస్తున్నారు.

భూమాకు మంత్రి పదవి ? 
ఇక పార్టీ బలహీనంగా ఉన్న కర్నూల్, కడప జిల్లాల సమీకరణాలను పరిశీలిస్తే.. కర్నూల్ నుంచి ఇటీవల టిడిపిలో చేరిన భూమా నాగిరెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. కడప విషయానికొస్తే ఏకైక ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి మంత్రిపదవి ఆశిస్తున్నారు. ఇక మైనార్టీలకు మంత్రిమండలిలో చోటు కల్పిస్తామని స్వయానా చంద్రబాబే ప్రకటించడంతో ఆ కోటానుండి ఎవరికి పదవి దక్కుతుందనే అంశంపై చర్చ మొదలైంది. ప్రస్తుతం టిడిపినుంచి ఎమ్మెల్సీ షరీఫ్, ఇటీవల వైసిపి నుండి టిడిపిలో చేరిన జలీల్ ఖాన్ మంత్రిపదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఇక ఎస్టి కోటాలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే పోలవరం శాసనసభ్యులు ముడియం శ్రీనివాస్, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యా రాణి మంత్రిపదవి ఆశిస్తున్నారు. ఈ సమీకరణలన్నీ ఒక ఎత్తైతే చంద్రబాబు తనయుడు లోకేష్‌కు క్యాబినెట్‌లో చోటు కల్పించే విషయంలో విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. చంద్రబాబు సిఎంగా ఉండగానే లోకేష్‌ను క్యాబినెట్‌లోకి తీసుకుంటే ఆయన భవిష్యత్ బాగుంటుందనేది సీనియర్ల వాదన. ఇందుకు రాహుల్‌గాంధీని ఉదాహరణగా చూపుతున్నారు. రెండుసార్లు అధికారంలోకి వచ్చినా రాహుల్‌ మంత్రిపదవి చేపట్టక పోవడంతో ఆయన్ను ఇప్పటికీ అపరిపక్వనేతగానే పిలుస్తున్నారని అలా లోకేష్‌ కాకూడదని అంటున్నారు. అయితే ఎమ్మెల్సీ కోటాలో లోకేష్‌కు కేబినెట్‌లో చోటు కల్పించడంకన్నా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచాక పదవి ఇస్తే బాగుంటుందని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. మరి చివరకు చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.ఇక తీసివేతల విషయానికొస్తే....పలువురు మంత్రులపై అవినీతి ఆరోపణలున్నాయి. కొందరు మంత్రులు సమర్ధవంతంగా పనిచేయడంలేదని స్వయానా చంద్రబాబే అన్నారు. దీంతో వారిని పక్కకు తప్పిస్తారనే ప్రచారం జరుగుతున్నా అందుకు చంద్రబాబు అసక్తిగా లేరని సమాచారం. ఏదేమైనా 2019లో గెలుపే లక్ష్యంగా క్యాబినెట్ కూర్పు ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి విస్తరణ ప్రక్రియ జూన్‌లో ఉండొచ్చని సమాచారం.

09:18 - April 5, 2016

పవన్‌ కళ్యాణ్‌ సినిమా తీయడమే గానీ ప్రమోషన్స్‌కు మాత్రం హాజరుకారని నిర్మాతలు ప్రతిసారీ చెబుతారు. కానీ ఈ సారి మాత్రం ఆయన చేసిన 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌' చిత్రం ప్రమోషన్స్‌లో పాల్గొనేందుకు వస్తున్నారు. సర్దార్‌ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో ఒకే సారి విడుదల చేస్తున్నారు. హిందీ నిర్మాతలు మాత్రం ప్రమోషన్స్‌కు రావాల్సిందేనని పట్టుబట్టారట. కనీసం ఒక్కసారైనా ప్రమోషన్స్‌కు హాజరైతేనే ఈ సినిమాకు మార్కెట్‌ ఉంటుందని పవన్‌ను ఒప్పించారట. దానికి పవన్‌ అంగీకరించారని సమాచారం. అందులో భాగంగా నేషనల్‌ మీడియాకు ఈ సినిమాకు సంబంధించి పవన్‌ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ నాలుగు రోజులు ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటారని సమాచారం. కాజల్‌ కథానాయికగా చేసిన ఈ సినిమా ఈనెల 8న విడుదల కానుంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శరత్‌మరార్‌ నిర్మించారు.

09:16 - April 5, 2016

బాఘి...ఈ చిత్రం ట్రైలర్స్ చూస్తుంటే భారీ పోరాటాలే ఉండేలా కన్పిస్తోంది. హీరో హీరోయిన్లు ఇద్దరూ ఫైట్లు అదరగొడుతున్నారు. హద్దులు మీరిన ముద్దు సన్నివేశాలు కూడా ఆ మాదిరిగానే ఉన్నాయనిపిస్తుంది. సబ్బీర్‌ ఖాన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మొత్తంలో 70శాతం ఫైట్లతోనే కొనసాగుందట. ఇందులో కథానాయకుడు టైగర్‌ ష్రాప్‌తో సమానంగా, కథానాయిక శ్రద్ధా కపూర్‌ ఫైట్లు చేసింది. టైగర్‌ ష్రాప్‌కు అప్పటికే మార్షల్‌ ఆర్ట్స్‌లో పట్టు ఉండడంతో షూటింగ్‌ స్పాట్‌లో తేలిగ్గా స్టంట్స్ చేయగలిగాడు. శ్రద్ధా కపూర్‌ ఎలా చేస్తుందోనని చిత్ర యూనిట్‌ అంతా ఆందోళన చెందుతోంది. ఈ తరుణంలో యాక్షన్‌ చెప్పిన వెంటనే టైగర్‌తో పోటీపోటీగా ఫైట్స్ చేసేసిందట. దీని చూసి దర్శకుడు, నిర్మాత ఆశ్చర్యానికి గురయ్యారట. చిత్రీకరణకు ముందు ఆ సన్నివేశంలో స్టంట్స్ ఎలా చేయాలనే దానిపై బేసిక్‌కు వివరించారట స్టంట్‌ మాస్టర్‌. అక్కడికక్కడే టైగర్‌ కొన్ని సలహాలు ఇచ్చేవారట. మిగిలిన వ్యవహారమంతా శ్రద్ధే స్వయంగా చూసుకునేదట. ఇంకొక విశేషం ఏమిటంటే ఇటువంటి భారీ యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరించే టప్పుడు ఏదైనా రోప్‌లను ఉపయోగిస్తారు. కానీ అవేవీ ఉపయోగించకుండానే చేసేసిందట శ్రద్ధా. మార్షల్‌ ఆర్ట్స్‌లో ఇంతకుముందు అనుభవం ఉండి ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ రెండు వారాలు పాటే ఇందులో శిక్షణ తీసుకుందట. ఈ యాక్షన్‌ సన్నివేశాలన్నీ థాయ్ లాండ్‌లో చిత్రీకరించారు. తనకు తానుగా మార్షల్‌ ఆర్ట్స్‌లో ట్రైన్‌ అయిన టైగర్‌కు ఈ చిత్రం షూటింగ్‌లో బాగా ఉపయోగపడింది. శ్రద్ధా కపూర్‌ ఇప్పటి వరకు తాను చేసిన చిత్రాల్లో ఫైట్లు ఉండే సన్నివేశాలు చేయలేదు. ఇదే మొదటసారి. అయినా తన సహ నటుడు టైగర్‌తో హ్యాండు టు హ్యాండ్‌ ఫైట్‌ చేయడంలో అయినా, కిక్‌లు ఇవ్వడంలోనైనా ఒకరును మించి మరొకరు అన్నట్టు చేశారు. శ్రద్ధా మాట్లాడుతూ '' టైగర్‌ చాలా బాగా చేశాడు. ఈ చిత్రంలో మేజర్‌ ఫైట్స్‌ తీసేటప్పుడు మాత్రం అతను నాకు బాగా సహాయపడ్డారు. నాకర్థమయ్యేలా చెప్పేవాడు'' చెప్పింది. ఈ ట్రైలర్‌ చూసిన తర్వాత శ్రద్ధా కపూర్‌కు ప్రశంసలు లభిస్తున్నారు. 2014లో 'హీరోపంటి' తీసిన నిర్మాత నదియాద్వాలా ఈ సినిమానూ తీశారు. టైగర్‌ ష్రాప్‌, నదియాద్వాలా కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. శ్రద్ధాకపూర్‌, టైగర్‌ మొదటసారిగా జోడీ కట్టిన చిత్రమిది.

09:13 - April 5, 2016

ప్రకాశం : ప్రయాణీకుల నటిస్తున్న దొంగలు రైలు ఛైన్ లాగీ మరీ దోపిడికి పాల్పడ్డారు. కృష్ణంశెట్టిపల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలో ప్రశాంతి ఎక్స్ ప్రెస్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. గిద్దలూరు దిగువమెట్ట వద్దనున్న ప్రాంతానికి చేరుకున్న ఎక్స్ ప్రెస్ లో దొంగలు ఛైన్ లాగారు. అనంతరం ఇద్దరు మహిళల మెడల్లో నుండి బంగారు ఆభరణాలు దొంగిలించారు. అనంతరం దొంగలు రైలు దిగి పరారయ్యారు. దీనితో నంద్యాల రైల్వే పీఎస్ లో బాధితులు ఫిర్యాదు చేశారు. రెండు గంటల నుండి తమతో పాటు ప్రయాణించారని బాధితులు పేర్కొన్నారు.. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు దొంగలకోసం గాలిస్తున్నారు.. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తరచూ రైలు దోపిడీలు జరుగుతున్నాయి.. అయినా పోలీసులు ప్రయాణికులను భద్రతను కల్పించడంలో విఫలమవుతున్నారు.

చిరుత బీభత్సం..

హరిద్వార్ : రూర్కి ప్రాంతంలో చిరుత బీభత్సం సృష్టించింది. గ్రామాల ప్రజలపైకి దాడది చేసింది. ఈ దాడిలో ఓ రైతుకు తీవ్రగాయాలయ్యాయి. తాము ఘటనా ప్రదేశానికి చేరుకునే వరకు ఎంతో మందిని చిరుత గాయపరిచిందని, చిరుత చనిపోయిందని సబ్ డివిజనల్ ఆఫీసర్ ఎన్.బి.శర్మ ఓ జాతీయ ఛానెల్ తో పేర్కొన్నారు. 

అదృశ్యమైన కాలేజీ విద్యార్థి ఆచూకి లభ్యం..

గుంటూరు : నెల రోజులుగా అదృశ్యమైన జుపిటర్ జూనియర్ కాలేజీ విద్యార్థి పవన్ సాయిరెడ్డి ఆచూకి లభ్యమైంది. చిత్తూరులోని ఓ హోటల్ లో సర్వర్ గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. కాలేజీలో వేధింపులు భరించలేక చిత్తూరు వెళ్లిపోయినట్లు పవన్ పేర్కొంటున్నాడు. పవన్ సాయిని తల్లిదండ్రులకు అప్పగించారు. 

ప్రశాంతి ఎక్స్ ప్రెస్ లో దోపిడి..

ప్రకాశం : ప్రశాంతి ఎక్స్ ప్రెస్ లో సోమవారం రాత్రి పొద్దుపోయిన తరువాత దొంగలు దోపిడికి పాల్పడ్డారు. జిల్లా గిద్దలూరు పరిధిలోని కృష్ణంశెట్టిపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే ఛైన్ ను లాగి ప్రయాణీకుల నుండి రెండు గొలుసులను లాక్కెళ్లారు. నంద్యాల రైల్వే పీఎస్ లో బాధితులు ఫిర్యాదు చేశారు. 

దూసుకెళ్లిన ట్రక్..ముగ్గురు మృతి..

పాట్నా : జగ్ దేవ్ పథ్ లో ఓ ట్రక్ వ్యక్తులపైకి దూసుకెళ్లింది. దీనితో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. 

08:19 - April 5, 2016

కాంగ్రెస్ పార్టోళ్లకు కండ్లు లేవట..ఈమాట ఎవ్వలో గాదు సుమా అన్నది.. మన ఆర్ధిక మంత్రి ఈటెల రాజేంద్ర సారు అంటున్నడు..ఊర్లు వంచుకున్న దొంగల లెక్క దొర్కిందమ్మా మొత్తం మీద.. ఎవ్వడెవ్వడు బైటిదేశాల బ్యాంకుల పొంట పైకం దాపెట్టిండు..తెలంగాణ సారథి కళాకారులు గొంగడి శింపులు ఏస్కోని మిమ్ముల్ను చైతన్య పర్చెతందుకు ఊరూరుకు రావోతున్నరట..బుద్దుని బోధిశెట్టుకింద జ్ఞానోదయం ఐతే..ఆంధ్రప్రదేశ్ పెద్ద ముత్తయిదువు రఘువీరారెడ్డికి.. టెంటు బట్టల కింద అయినట్టుంది..బిచ్చగాళ్ల ముచ్చట..ఈ అంశాలపై టెన్ టివిలో మల్లన్న ముచ్చట్లు కార్యక్రమంలో మల్లన్న తనదైన వైలిలో ముచ్చట్లు చెప్పారు. విశేషాల కోసం వీడియోక్లిక్ చేయండి. 

తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం..

చిత్తూరు : నేడు తిరుమల ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఉదయం 11గంటల తరువాతే శ్రీవారి దర్శనానికి టిటిడి అధికారులు అనుమతించనున్నారు.

నేడు బాబు జగ్జీవన్ రాం 109 జయంతి..

హైదరాబాద్ : నేడు బాబు జగ్జీవన్ రాం 109 జయంతి సందర్భంగా బషీర్ బాగ్ లోని జగ్జీవన్ రాం విగ్రహం వద్ద బహిరంగసభ జరగనుంది. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. 

08:01 - April 5, 2016

సన్నీలియోన్‌తో కలిసి నటించడం ఇష్టమే.. కాని ఇప్పటివరకు ఏ సినిమా కోసం ఆమెతో నటించేందుకు ఒప్పందం కుదుర్చుకోలేద'ని అంటున్నారు బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమీర్‌ఖాన్‌. 'ఢిల్లీబెల్లి' దర్శకుడు అభినయ్ డియో దర్శకత్వంలో సన్నీతో కలిసి అమీర్‌ నటించేందుకు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారనే వార్త ప్రస్తుతం సామాజిక మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ వార్తలను ఖండిస్తూ అమీర్‌ పై విధంగా స్పందించారు. సన్నీతో కలిసి నటించేందుకు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయలేదని, అది పూర్తిగా అవాస్తవమని అమీర్‌ తెలిపారు.

07:59 - April 5, 2016

ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కొన్ని కోట్ల మంది ఉద్యోగులకు, కార్మికులకు శాపంలా మారింది. బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే వచ్చే వడ్డీలో సగం కూడా పెన్షన్ గా అందడం లేదు. చాలామంది కేవలం వెయ్యి రూపాయల పెన్షన్ తోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. మరీ ఇంత అన్యాయం చేస్తే తామెలా బతకగలమంటూ పెన్షనర్స్ ఆందోళన చెందుతున్నారు. 1995 నుంచి అమలవుతున్న ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కారణంగా ఇప్పటికే 50 లక్షల మంది బాధితులుగా మారారు. చిన్న కంపెనీలలో పనిచేసే ఉద్యోగులు మొదలుకొని పెద్ద పెద్ద కంపెనీలలో మేనేజర్ స్థాయి ఉద్యోగాలు చేస్తున్నవారు ఈ పెన్షన్ స్కీమ్ బాధితులేనంటే ఆశ్చర్యపోకండి. పేరొందిన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, వివిధ రాష్ట్రాల ఆర్టీసీలు, సహకార రంగ బ్యాంక్ లు, టాటా, బిర్లా, ఎల్ అండ్ టి లాంటి ప్రతిష్టాత్మక సంస్థల ఉద్యోగులు, మీడియా సిబ్బంది ఇలా విభిన్నరంగాల వారికి ఇపిఎస్ 95 శాపంగా మారుతోంది.

నాలుగు రకాల పెన్షన్ స్కీమ్ లు..
మన దేశంలో కేంద్ర ప్రభుత్వం నాలుగు రకాల పెన్షన్ స్కీమ్ లు అమలు చేస్తోంది. డిఫైన్డ్ పెన్షన్ స్కీమ్, నేషనల్ పెన్షన్ స్కీమ్, ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 95, అటల్ పెన్షన్ యోజన స్కీమ్ పేరుతో ఇవి అమలవుతున్నాయి. వీటిలో అత్యంత వివాదస్పదమైంది 1995 నాటి ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ . ఇందులో దాదాపు ఆరున్నర కోట్ల మంది సభ్యులుగా వున్నారు. నిజానికి యవ్వనంలో ఉద్యోగం చేసే రోజుల్లో పెన్షన్ స్కీమ్ ల గురించిన ఆలోచన ఎవరికీ పెద్దగా వుండదు. తమకు ప్రతి నెలా ఎంత కట్ చేస్తున్నారు? తమ నుంచి కట్ చేసిన సొమ్మును దేనికి వినియోగిస్తారు? రిటైరైన తర్వాత తమకు ఎంత ఇస్తారు? ఇలాంటి ఆలోచనలేవీ సాధారణంగా రిటైర్మెంట్ వయస్సు వచ్చే దాకా రావు? దీనివల్ల పెన్షన్ స్కీముల్లో వుండే లోపాలు అంత తొందరగా బయటపడవు. అనుభవంలోకి వస్తేనే ఏదైనా అర్ధమవుతుంది. ఇప్పుడు ఇపిఎస్ 95 విషయంలో అదే జరుగుతోంది. 1995కి పూర్వమే ఉద్యోగంలో వుండి, ఈ స్కీమ్ లో భాగస్వాములైనవారిలో దాదాపు 50 లక్షల మంది ఇప్పటికే రిటైరయ్యారు. వీరిలో చాలా మందికి 500, 600 రూపాయల చొప్పున పెన్షన్ వచ్చింది. అంతకంటే తక్కువ పొందినవారూ వున్నారు. దీంతో పెన్షన్ దారులు ఆందోళనబాటపట్టారు. తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని డిమాండ్ చేశారు. దీంతో కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు ఇచ్చేందుకు యుపిఏ ప్రభుత్వం చివరి రోజుల్లో అంగీకరించింది. అప్పుడు ప్రతిపక్షంలో బిజెపి ఎంపీలు కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు సరిపోదనీ, కనీసం మూడు వేల రూపాయలైనా ఇవ్వాలంటూ పట్టుబట్టారు. అదే బిజెపి ఎంపిలు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నోరు మెదపకపోవడం రాజకీయ వైచిత్రి.

వెయ్యి రూపాయలతో బతకడం చాలా కష్టం..
ఇప్పుడున్న పరిస్థితుల్లో రిటైరైన జంట వెయ్యి రూపాయలతో బతకడం చాలా కష్టం. కనీసం మందుల ఖర్చులకు కూడా సరిపోవు. వారేమి ఉత్త పుణ్యానికే తమకు పెన్షన్ ఇవ్వాలని కోరడం లేదు. ప్రతి నెలా జీతంలో తాము సమకూర్చిన దాని నుంచి ధర్మబద్దంగా తమకు రావాల్సింది ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పుడున్న నిబంధనలు, వడ్డీ రేట్ల ప్రకారం 30 ఏళ్ల సర్వీసున్న ఓ ఉద్యోగి తన జీతం నుంచి పెన్షన్ స్కీమ్ కి జమ చేసే మొత్తం 11 లక్షల 63 వేల రూపాయలకు పైగా వుంటుంది. ఇదే సొమ్మును బ్యాంక్ లో డిపాజిట్ చేసి వుంటే అతనికి ప్రతి నెలా దాదాపు 8500 రూపాయల వడ్డీ వస్తుంది. తాను ఎప్పుడుంటే అప్పుడు అసలు మొత్తాన్ని తీసుకునే సౌలభ్యం వుంటుంది. కానీ, ఈపిఎస్ పెన్షన్ స్కీమ్ లో చేరిన ఉద్యోగి, 11 లక్షల 63 వేల రూపాయలు జమ చేస్తే వచ్చేది కేవలం 4470 రూపాయలు. అసలు సొమ్ము తిరిగి ఇవ్వరు. ఇంతకంటే అన్యాయం మరొకటి వుంటుందా? ఇపిఎస్ 95 స్కీమ్ లో సభ్యులైన ఆరున్నర కోట్ల మంది ఇలాంటి అన్యాయానికే గురవుతున్నారు. ఇలా అన్యాయానికి గురువుతున్నవారిలో తామూ వున్నామన్న విషయం చాలామంది మీడియా సిబ్బందికే తెలవదంటే ఆశ్చర్యపోకండి. కనీస పెన్షన్ 6500 రూపాయలుగా నిర్ణయించి, పెన్షన్ దారుడు చనిపోతే, తన ఖాతాలో జమ అయిన మొత్తాన్ని నామినికి చెల్లించాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. 

07:54 - April 5, 2016

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నల్ల కుబేరులకు సంబంధించిన పనామా పత్రాలు ఇపుడు పెనుదుమారం రేపుతున్నాయి. సినీతారలు, ఆటగాళ్లు, సెలెబ్రిటీలతోపాటు.. వివిధ దేశాలకు చెందిన140 మంది రాజకీయ నేతల సంపద బహిర్గతం కావడం కలకలం రేపుతోంది. యోగా గురువు రాందేవ్ బాబా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ మాతా కీ జై అని అనని వారి తల నరికి చంపేవాడినని, కానీ చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని అలా చేయడం లేదని అన్నారు. ఈ అంశాలపై టెన్ టివి చర్చా వేదికలో నగేష్ (విశ్లేషకులు), రాకేష్ రెడ్డి (బీజేపీ), బాబురావు (సీపీఎం) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

07:52 - April 5, 2016

'బ్రహోత్సవం' షూటింగ్‌ సెట్‌లో మహేష్‌బాబు గారాల పట్టి సితారతో సీనియర్‌ నటి, దర్శకురాలు రేవతి సరదాగా గడిపారు. సితారతో రేవతి కబుర్లు చెబుతున్న ఒక ఫొటోను సోమవారం మహేష్‌బాబు సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలో సితార ఓ చిన్ని బ్యాగ్‌ను భుజానికి వేసుకుని ముద్దుగా కనిపిస్తోంది. నటి రేవతి కూడా చాలా సంతోషంగా సితారతో ఏదో మాట్లాడుతున్నారు. ఈ చిత్రంలో బాల నటిగా సితార కూడా నటిస్తున్నట్లు సమాచారం. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో మహేష్‌బాబు కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం 'బ్రహ్మోత్సవం'. ఈ చిత్రంలో మహేష్‌ సరసన సమంత, కాజల్‌, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్నారు. సమ్మర్‌ స్పెషల్‌గా ఈచిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

07:47 - April 5, 2016

వైవిధ్యమైన పాత్రలకు, సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌ ప్రకాష్‌రాజ్‌ అని వేరే చెప్పక్కల్లేదు. ఆయన దర్శకత్వంలో రూపొందే చిత్రాలు సైతం భిన్నంగా ఉంటాయని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ప్రకాష్‌రాజ్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'ఉలవచారు బిర్యాని'. ప్రకాష్‌రాజ్‌, స్నేహ ప్రధాన పాత్రధారులుగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణతోపాటు విమర్శకుల ప్రశంసలు పొందిన విషయం విదితమే. తాజాగా ఈ చిత్రాన్ని 'తడ్క' పేరుతో ప్రకాష్‌రాజ్‌ బాలీవుడ్‌లోనూ రీమేక్‌ చేస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ బాలీవుడ్‌ విలక్షణ నటుడు నానాపటేకర్‌ ప్రధాన పాత్రధారిగా ఈ చిత్రాన్ని రీమేక్‌గా చేస్తున్నట్లు ప్రకాష్‌రాజ్‌ తెలిపారు. మే నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ కార్యక్రమాలు జరుపుకోనున్న ఈ చిత్రంలో ప్రముఖ నాయికలు శ్రియా, తాప్సిలు నటిస్తున్నారని దర్శక, నిర్మాత ప్రకాష్‌రాజ్‌ పేర్కొన్నారు. ప్రకాష్‌రాజ్‌ ప్రొడక్షన్స్‌, జీ స్డూడియోస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

07:43 - April 5, 2016

మీకు అరటిపళ్ళు తినడమంటే చాలా ఇష్టమా? ఎస్‌ అని సమాధానం ఇచ్చేవారు కొందరైతే, నాకు ఇష్టంలేదు అని మరికొందరు చెబుతారు. అయితే మరి అరటి తొక్కను ఎంతమంది ఇష్టంగా తీసుకుంటారు అని అడిగితే... 'మరీ టూమచ్‌ చేస్తున్నారేంటి' అనుకుంటున్నారా! ఆ అనుమానం వస్తే మీరు తొక్కపై కాలు వేసినట్లే. ఎందుకంటే అరటి తొక్కను తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు షాక్‌ అవుతారు. అవునా అంటూ ముక్కున వేలేసుకుంటారు. అరటితొక్క వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకోండి.
ఒత్తిడిని తగ్గిస్తుంది..
డిప్రెషన్‌, డల్‌గా ఉండటం కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఆనందపడటం సగటు మనిషి జీవితంలో సాధారణం అయింది. అరటి తొక్కలో సేరోటినీన్‌ ఉండటంతో అది తీసుకున్నప్పుడు శక్తివంతంగా, సంతోషంగా ఉండే సామర్థ్యాన్ని కలిగిస్తుంది.
గుండెకు అండగా..
అరటికన్నా అరటితొక్కలో ఎక్కువగా జీర్ణం చేసుకునే పీచు పదార్థాలు ఉంటాయి. అందువల్ల కొవ్వుపదార్థాల స్థాయి తగ్గి, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా సహాయపడుతుంది.
ఫిట్‌గా ఉంచుతుంది..
అరటితొక్కలో పోషకాలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండి, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. దీని కారణంగా బరువు ఒకే విధంగా ఉంటూ మీరు ఆరోగ్యంగా, స్లిమ్‌గా, ఫిట్‌గా ఉంటారు.
బ్యాలెన్స్ చేస్తుంది..
ఇందులో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉండటం వలన మన శరీరంలో ఆమ్ల నియంత్రణను బ్యాలెన్స్ చేస్తుంది.
హాయిగా నిద్ర వస్తుంది..
అరటితొక్కలో ట్రిప్టోఫాన్‌, అమైనో ఆమ్లం సమ్మేళనం ఉండటం వలన రాత్రి సమయాలలో హాయిగా నిద్రపడుతుంది.అలాగే క్యాన్సర్‌ కణితులు రాకుండా రక్షించే సమ్మేళనాలు అరటితొక్కలో ఉన్నాయి.
కంటిచూపు కోసం..
లుటీన్‌ రాత్రి సమయాలలో చూపును పెంచుతుంది. అరటితొక్కలో అది సమృద్ధిగా ఉండటం వలన కంటిచూపు బాగా కనిపించడానికి సహాయపడుతుంది. 

07:33 - April 5, 2016

మారిన జీవన విధానం.. మనిషికి అనేక రోగాలను తెచ్చిపెడుతోంది. అలాగని లైఫ్‌స్టైల్‌ మార్చుకుందామంటే ఆఫీసులో గంటల తరబడి కూర్చోవడం, నైట్‌షిప్ట్ లాంటివెన్నో చేతిలో లేని పనులు. కాబట్టి జీవన విధానాన్ని మార్చుకోలేకపోయినా కొన్ని అలవాట్లను మార్చుకుంటే ఆరోగ్యంగా ఉండగలుగుతారు.
అదేపనిగా కూర్చోవద్దు...
పని ఒత్తిడితో కూర్చున్న చోటు నుంచి లేవకుండా ఉంటారు కొందరు. దానివల్ల ఊబకాయం సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా.. అరగంటకోసారి లేచి రెండు మూడు నిముషాలు అటూ ఇటూ తిరుగుతూ ఉండాలి. దానివల్ల శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. మెడ, వెన్ను నొప్పి వంటివి రాకుండా ఉంటాయి.
అల్పాహారం తప్పనిసరి...
ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తేనే పనుల మీద శ్రద్ధ పెట్టగలం. ఏం కాదులే... ఆకలి, నీరసంతో అలాగే పనిచేసేద్దాం అనుకున్నారంటే అది అనారోగ్యానికి దారితీస్తుంది. టిఫిన్‌ చేయడానికి వీలుకాకపోతే డ్రైఫ్రూట్స్‌ను అయినా తినాలి. ఇవి తినడం వల్ల తక్షణ శక్తి అందుతుంది. పని భారం ఎక్కువగా ఉన్నప్పుడు మనసు టీ, కాఫీల మీదకు లాగుతుంది. అదే పనిగా కాకుండా రోజులో రెండు కప్పులకు మించి తీసుకోకపోవడం మంచిది.
భుక్తాయాసం అనర్థం...
చల్లటి నీళ్లు తీసుకొనే బదులు పని చేసే సమయంలో కాచి చల్లార్చిన నీళ్లు తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల శారీరక నొప్పులు దూరం అయి జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. సాధ్యమయినంత వరకు ఇంటి ఆహారానికి ప్రాధాన్యమివ్వడం మంచిది. అయితే వంట బాగుందనో, కూర రుచిగా ఉందనో భుక్తాయాసంగా తినకుండా కాస్త పొట్ట వెలితిగా ఉంచుకోవడం ఉత్తమం.
లంచ్‌టైమ్‌లో వేపుళ్లు వద్దు...
మధ్యాహ్న లంచ్‌ టైమ్‌లో నూనెలో వేయించిన పదార్థాలను తీసుకోకుండా ఉండాలి. వాటివల్ల కడుపులో గ్యాస్‌ ఏర్పడుతుంది. పని చేయడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని పండ్ల ముక్కలను వెంట తెచ్చుకుంటే సాయంత్రం స్నాక్స్‌కు బదులు అల్పాహారంగా తీసుకోవచ్చు. వాటి నుంచి పోషకాలు అందుతాయి. సులభంగా జీర్ణమవుతాయి కూడా.
కంప్యూటర్‌ ముందు పనిచేస్తే...
కంప్యూటర్ల ముందు గంటల తరబడి పనిచేసేవారు ప్రతి ఇరవై నిమిషాలకోసారి కళ్లు మూసి తెరుస్తూ ఉండాలి. దానివల్ల కళ్లు అలసటకు గురికాకుండా ఉంటాయి. ఇదో చక్కటి వ్యాయామం. కంప్యూటర్ల వల్ల శరీరానికి రేడియేషన్‌ ప్రభావం ఎక్కువగా ఉండి చర్మం పొడిబారుతుంది. అందుకని సన్‌స్క్రీన్‌ లోషన్‌ వెంట పెట్టుకొంటే రెండుమూడు గంటలకోసారి రాసుకొంటే సరిపోతుంది. ఎలాంటి చర్మ సంబంధిత సమస్యలు రావు.
లేట్‌నైట్స్ వద్దు...
రాత్రి ఎనిమిది గంటలలోపే డిన్నర్‌ చేయడం ఉత్తమం. లేట్‌గా తింటే తొందరగా నిద్రపట్టదు. రాత్రి సమయంలో ఎక్కువ నీళ్లు తాగకూడదు. అంతేకాదు రాత్రి సమయంలో ఎక్కువగా టీవీ చూస్తే కళ్లు ఒత్తిడికి గురవుతాయి. కాబట్టి టీవీకి దూరంగా ఉండండి.
ఉదయం నడక, నీళ్లు తప్పనిసరి...
ఉదయాన్నే నిద్ర లేవగానే నీళ్ళు తాగాలి. ఇలా చేయడం వల్ల అనేక జబ్బులు దూరమవుతాయి. రోజూ కచ్చితంగా అరగంటపాటు నడక ఆరోగ్యానికి చాలా మంచిది. బీపీ, షుగర్‌ కంట్రోల్‌లో ఉంటాయి. ఉప్పు అధికంగా తినటం ప్రమాదం. జంక్‌ ఫుడ్స్‌ జోలికి వెళ్లకపోవడం మంచిది. అన్నింటికీ మించి వారానికోసారయినా ఖాళీ సమయాల్లో బంధువులు, ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపేయండి. దీనివల్ల ఒత్తిడి తగ్గి, ఆయుష్షు పెరుగుతుంది.

07:29 - April 5, 2016

ఫేషియల్‌ అనగానే పార్లర్‌కు పరిగెత్తి పర్స్ ఖాళీ చేసుకుంటారు చాలామంది. సింపుల్‌ ప్యాక్స్ తో ఇంట్లో పార్లర్‌లాంటి నిగారింపు పొందవచ్చు. ఇంట్లోనే సహజంగా చేసుకోగలిగే ఫేస్‌ ప్యాక్స్ కొన్ని..

బొప్పాయితో...
చర్మానికి మెరుపునిచ్చే పండ్లల్లో బొప్పాయి ఒకటి. ఈ బొప్పాయి మాస్క్‌ తయారు చేసుకోవడానికి.. మూడు ముక్కలు బాగా పండిన బొప్పాయి తీసుకుని... దానికి రెండు చెంచాల బాదం పొడిని కలుపుకోవాలి. దీనిని ముఖానికి మాస్క్‌లాగా వేసుకుని పది నిమిషాల తరువాత ముఖాన్ని మర్దన చేయాలి. తరువాత చల్లని నీళ్లతో కడిగేయాలి.
పెరుగుతో...
రెండు చెంచాల పెరుగుకు రెండు లేదా మూడు చెంచాల బాదం నూనెను కలపాలి. ఒక చెంచా తేనెను చేర్చాలి. ముఖంపై సమానంగా అప్లై చేయాలి. 15 నిమిషాల తరువాత ముఖానికి మృదువుగా మసాజ్‌ చేసి చల్లని నీటితో కడిగేయాలి. చర్మాన్ని మృదువుగా చేయడమే కాదు... సహజమైన అందాన్నిస్తుంది.
తేనెతో...
వయసును తగ్గించే సహజమైన ద్రావణం తేనె. వారానికి మూడు సార్లు తేనెను ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ఆరిన తరవాత చల్లని నీటితో కడిగేయాలి.
బాదంతో...
బాదంలో విటమిన్‌ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది ఓట్స్‌, మిల్క్‌తో కలిస్తే అద్భుతాలను సృష్టిస్తుంది. ఒక చెంచా బాదం పొడి, ఒక చెంచా ఓట్స్‌ తీసుకోవాలి. ఈ రెండింటిని పాలల్లో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తరవాత చల్లని నీటితో కడిగేయాలి. స్కిన్‌టోన్‌ను పూర్తిగా మార్చేస్తుంది. చర్మానికి నిగారింపునిస్తుంది.
క్యారెట్‌తో...
క్యారెట్‌లో విటమిన్‌ 'సి, 'కె' తోపాటు 'బి' కెరోటిన్‌ ఉంటుంది. క్యారెట్‌ తీసుకుని గుజ్జుగా చేసుకోవాలి. పాలపొడి, చక్కెరతో బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. 

07:17 - April 5, 2016

పెన్షనర్లు పెన్షన్ నిధికి ప్రతి నెలా డబ్బులు జమ చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు మరోసారి పోరుబాట పట్టనున్నారు. ఈనెల 25వ తేదీన జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు చేయబోతున్నారు. పెన్షనర్ల ఆందోళనకు కారణం ఏంటీ ? ప్రస్తుత పెన్షన్ స్కీంలో ఉన్న లోపాలేంటీ ? ఈపీఎస్ 95 వల్ల పెద్ద పెద్ద కంపెనీల ఉద్యోగులతో పాటు చిన్న చిన్న సంస్థల్లో పనిచేసే కార్మికులు ఎలా నష్టపోతున్నారు ? పెన్షన్ విధానంలో రావాల్సిన మార్పులేంటీ ? ఆలిండియా పెన్షన్ అసోసియేషన్ చేస్తున్న ప్రతిపాదనలేంటీ ? ఈ అంశాలపై టెన్ టివి జనపథంలో ఆల్ పెన్షన్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పివి ఎస్ఎల్ఎన్ శాస్త్రి విశ్లేషించారు. ఆయన ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియోలో చూడండి.
 

ఆదిలాబాద్ లో టి.జేఏసీ కరవు అధ్యయన యాత్ర..

ఆదిలాబాద్ : జిల్లాలో తెలంగాణ జేఏసీ కరవు అధ్యయన యాత్ర జరగనుంది. రెండు రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. 

నేడు గతిమాన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం..

ఢిల్లీ : నేడు ఢిల్లీ - ఆగ్రా మధ్య గతిమాన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ను రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించనున్నారు.

నేటి నుండి కృష్ణా ట్రిబ్యునల్ సమావేశాలు..

హైదరాబాద్ : నేటి నుండి కృష్ణా ట్రిబ్యునల్ సమావేశాలు జరగనున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో టీఎస్, ఏపీ, కర్నాటక, మహారాష్ట్రలు వాదనలు వినిపించనున్నాయి.

07:03 - April 5, 2016

ఢిల్లీ : యోగా గురువు రాందేవ్ బాబా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ మాతా కీ జై అని అనని వారి తల నరికి చంపేవాడినని, కానీ చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని అలా చేయడం లేదని అన్నారు. భారత్ మాతా కీ జై అనే నినాదం చేయడమంటే మాతృ భూమిపై ఆపేక్ష చాటడమేనని, ఇందులో మతపరమైన కోణమేమీ లేదని రాందేవ్‌ బాబా అన్నారు. రాందేవ్‌ వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా స్పందించాయి. ఆరెస్సెస్‌ భేటీలో రాందేవ్‌ మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారని, ఇది హింసకు పిలుపునివ్వడమేనని కాంగ్రెస్‌ నేత సంజయ్‌ ఝా ట్వీట్‌ చేశారు. ప్రజలను బెదిరిస్తున్న రాందేవ్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఆయన డిమాండ్ చేశారు. భారత్‌మాతాకీ జై అనడం ముస్లిం మతానికి విరుద్ధమని, అందుకే తాము ఆ నినాదం చేయబోమని దేశంలోని అతిపెద్ద ఇస్లాం సంస్థ దారుల్ ఉలూమ్‌ డియోబంద్‌ ఫత్వా జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భారత్‌ మాతాకీ జై బదులు.. తాము హిందూస్తాన్‌ జిందాబాద్‌ అని నినదిస్తామని ఆ సంస్థ తెలిపిందని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ కూడా మతపరమైన ఆంక్షల వల్ల తాము ఆ నినాదాన్ని చేయబోమని ఇంతకుముందే ప్రకటించారు.
అసదుద్దీన్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌గా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ అప్పట్లోనే తీవ్రంగా స్పందించారు. భారత్ మాతాకీ జై అనని వాళ్లు దేశం విడిచి వెళ్లిపోవాలని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రాందేవ్‌ చేసిన వ్యాఖ్యలు మరోసారి తీవ్ర చర్చకు దారి తీశాయి. మరోవైపు భారత్‌ మాతా కీ జై అంటేనే దేశభక్తులా అని ప్రతిపక్షాలు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాయి. 

06:46 - April 5, 2016

చెన్నై : తమిళనాడులో టిక్కెట్లు ఖరారవుతున్నాయి. ఇప్పటికే ఏఐడిఎంకె జాబితాను ప్రకటించింది. డిఎంకె కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయ్యింది. పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ లో సీట్ల సర్దుబాటు చర్చలు సాగుతున్నాయి. తమిళనాడులో అధికార పార్టీ ఏఐడిఎంకె అధినేత్రి జయలలిత అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ముఖ్యమంత్రి జయలలిత చెన్నైలోని ఆర్ కె నగర్ నుంచి తిరిగి పోటీ చేస్తున్నారు. మొత్తం 227 మంది అభ్యర్థుల పేర్లను ఆమె ప్రకటించారు. మరో ఏడు స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించారు. మిత్రపక్షాల అభ్యర్థులు కూడా ఏఐడిఎంకె ఎన్నికల గుర్తు రెండు ఆకుల గుర్తు మీదనే పోటీ చేయాలని షరతు విధించారు. ఈసారి ఇద్దరు మంత్రులతో పాటు పలువురు ఎమ్మెల్యేలకు టిక్కెట్లు దక్కలేదు. మరో మంత్రి స్థానం మారింది. జయలలితతో కలిపి మొత్తం 31 మంది మహిళలకు టిక్కెట్లు దక్కాయి. విశ్వాసపాత్రులు, నమ్మకస్తులకే ఆమె టిక్కెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చారు. ఈసారి టిక్కెట్ల కేటాయింపులో కొత్త వారికి అవకాశం కల్పించడం విశేషం.

కాంగ్రెస్ కు 41..
మరోవైపు డిఎంకె కాంగ్రెస్ మధ్య కూడా సీట్ల సర్దుబాటు పూర్తయ్యింది. కాంగ్రెస్ కి 41 సీట్లు ఇచ్చేందుకు డిఎంకె అంగీకరించింది. 2011తో పోల్చుకుంటే కాంగ్రెస్ కి కేటాయించిన సీట్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి 63 సీట్లు కేటాయించగా, కేవలం 5 సీట్లలో మాత్రమే గెలిచింది. దీంతో 25 సీట్లు మించి ఇవ్వలేమంటూ తొలుత డిఎంకె బేరం మొదలుపెట్టింది. కాంగ్రెస్ 50 సీట్లు అడగగా, చివరకు 41 సీట్లకు ఒప్పందం కుదిరింది. ఒప్పంద పత్రాల మీద కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, డిఎంకె అధినేత కరుణానిధి సంతకాలు చేశారు. డిఎండికె, ఎండిఎంకె, వామపక్షాలు, విసికె కలిసి ఏర్పాటు చేసిన పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ లో సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయి. విజయ్ కాంత్ సారధ్యంలోని డిఎండికె 124 స్థానాల్లో పోటీ చేసేందుకు ముందే ఒప్పందం కుదిరింది. మిగిలిన 110 స్థానాలను ఎండిఎంకె, వామపక్షాలు, విసికె పంచుకోవాల్సి వుంది. ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేస్తారన్న అంశంపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం వుంది.  

06:41 - April 5, 2016

ఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నల్ల కుబేరులకు సంబంధించిన పనామా పత్రాలు ఇపుడు పెనుదుమారం రేపుతున్నాయి. సినీతారలు, ఆటగాళ్లు, సెలెబ్రిటీలతోపాటు.. వివిధ దేశాలకు చెందిన140 మంది రాజకీయ నేతల సంపద బహిర్గతం కావడం కలకలం రేపుతోంది. భారత్‌కు చెందిన 5 వందల మంది నల్ల కుబేరులు ఉన్నట్లు ఈ పత్రాలు వెల్లడించాయి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు వంద మీడియా గ్రూపులు పనామా పత్రాలను పరిశీలించి నల్ల కుబేరుల గుట్టు విప్పాయి. పనామా బృందం వెలువరించిన జాబితాలో.. బాలీవుడ్‌ ప్రముఖులు అమితాబ్‌ బచ్చన్‌.. ఐశ్వర్యారాయ్‌ ఉండటం సంచలనంగా రింది. వీరితోపాటు ప్రముఖ వ్యాపార దిగ్గజం గౌతం అదానీ సోదరుడు వినోద్‌ అదానీ.. ఇండియా బుల్స్‌ యజమాని సమీర్‌ గుప్తా.. డీఎల్‌ఎఫ్‌ ప్రమోటర్‌ కేపీ సింగ్‌ తదితరులు ఉన్నట్లు చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్ రాజకీయ నేత శిశిర్ బజోరా, ఢిల్లీ లోక్‌సత్తా చీఫ్‌ అనురాగ్ కేజ్రీవాల్ తదితరుల పేర్లు ఈ జాబితాలో ఉండటం కలకలం రేపుతోంది. అలాగే ముంబై గ్యాంగ్‌స్టర్ ఇక్బాల్ మిర్చితోపాటు పంచుకులా, డెహ్రాడూన్‌, వడోదర, మంద్‌సౌర్‌కు చెందిన పలువురు పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.

పనామా పేపర్లలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌, హాలీవుడ్‌ నటుడు జాకీచాన్‌, సౌదీ అరేబియా రాజు పేర్లు కూడా ఉన్నాయి.. లీకైన పత్రాలలో రష్యా అధ్యక్షుడి పేరు నేరుగా లేకపోయినా.. ఆయన బినామీలు.. సన్నిహితుల ద్వారా హవాలా సొమ్మును భారీ మొత్తంలో విదేశాల్లో కూడబెట్టినట్లు సమాచారం. 2 బిలియన్ల అమెరికన్‌ డాలర్లు వేరే మార్గాల్లో తిరిగి పుతిన్‌కు చేరినట్లు వివిధ సంస్థల పరిశోధనల్లో తేలినట్లు సమాచారం. నల్లడబ్బుకు స్వర్గధామమైన పనామాలోని మొసాక్‌ ఫొన్సెకాకు చెందిన కోటి15 లక్షల పత్రాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. విదేశీ కంపెనీలు ఏర్పాటు చేయడంలో దిట్టగా పేరొందిన ఈ లా కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా క్లయింట్స్ ఉన్నారు. గత 40 ఏళ్లుగా రహస్యంగా ఈ దందా సాగుతోంది. దాదాపు ఏడాది పాటు ఈ పత్రాలను పరిశోధించిన అంతర్జాతీయ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌ కన్సార్టియం వీటిని బహిర్గతం చేసింది. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ 36 వేలకు పైగా ఫైళ్లను 8 నెలల పాటు పరిశీలించింది. విదేశాల్లో నెలకొల్పిన కంపెనీలు, ఫౌండేషన్లు, ట్రస్టులలో దాదాపు 5 వందల మంది భారతీయుల పేర్లున్నట్టు పేర్కొంది.

ఖండిచిన ప్రమఖులు..
అయితే తమపై వచ్చిన ఆరోపణలను.. ఈ జాబితాలోని ప్రముఖులు తోసిపుచ్చుతున్నారు. బచ్చన్‌ కుటుంబ కోడలు ఐశ్వర్యారాయ్‌.. ఈ వార్తలను ఖండించారు. పనామా బయటపెట్టిన డాక్యుమెంట్లు అబద్ధమని ఐశ్వర్యారాయ్‌ మీడియా సలహాదారు అర్చనా సదానంద్‌ ఖండించారు. చాలావరకు వ్యాపార లావాదేవీలు చట్టపరంగానే కొనసాగుతున్నట్టు ఐసిఐజె పేర్కొంది. ఇందులో బయటకు వచ్చినవారి పేర్లతో రాజకీయంగా వారికి ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. అక్రమాలకు పాల్పడ్డవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు.

06:38 - April 5, 2016

హైదరాబాద్ : రోడ్లు, షాపింగ్ మాల్స్, ఆఫీసులు, ఇళ్లు ఇలా ప్రతిచోటా సిసి కెమేరాలను విరివిగా ఏర్పాటు చేస్తున్నారు. భద్రతా విషయంలో అవి కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సచివాలయంలో ప్రతి విభాగంలోనూ వాటిని ఏర్పాటుచేయబోతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత సెక్రటేరియట్‌లో ఉన్న బ్లాకులను ఇరు రాష్ట్రాలు చెరి సగం పంచుకుని పరిపాలనా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. వాటిలో తెలంగాణకు ఎ, బి, సి, డి బ్లాకులను కేటాయించారు. అయితే ఈ నాలుగిటిలోనూ సి, డి బ్లాక్‌లకు విఐపిల తాకిడి ఎక్కువగా ఉంటోంది. ముఖ్యమంత్రితో పాటు చీఫ్‌ సెక్రటరీ, జి.ఏ.డి అధికారులు, సిఎంవో అధికారులంతా సి బ్లాకులో ఉంటారు.

డి బ్లాకుకు సందర్శకుల తాకిడి..
ఇక సి బ్లాకుకన్నా ఎక్కువగా డి బ్లాకుకు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. మంత్రుల చాంబర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ప్రభుత్వ సలహాదారులు డి బ్లాక్‌లోనే ఉంటారు. దీంతో మంత్రులను అధికారులను కలిసేందుకు డి బ్లాక్‌కు వచ్చేవారి సంఖ్య భారీగా పెరిగింది. అయితే ఇలా వచ్చే జనంలో రకరకాల వారు ఉంటారని అంచనా వేస్తున్న భద్రతాధికారులు వారిని ఆపడం కంటే ముందుగా వారి కదలికలను పసిగట్టాలని నిర్ణయించారు. ఈ ఉద్దేశంతో నిఘాను మరింత పెంచాలని డిసైడ్ అయ్యారు. దీనిపై ఓ ఉన్నతాధికారుల కమిటీ వేసి రిపోర్టును ప్రభుత్వానికి అందించారు. కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం దాదాపు 67 కెమేరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్క డి బ్లాక్‌లోనే అన్ని ఏరియాలు కవర్ అయ్యేలా మొత్తం 9 కెమేరాలు, సి బ్లాకులో ఫ్లోరుకు 2 కెమేరాలు ఏర్పాటు చేయాలని డిసైడ్ చేశారు. ఇక వెనుకవైపున ఉన్న ఏరియాలను దృష్టిలో పెట్టుకుని ఏ, బి బ్లాక్‌పైన, ప్రధాన గేట్ నుంచి సిఎం కాన్వాయ్ వెళ్ళే దారి వెంట కొన్ని సిసి కెమేరాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం సచివాలయంలో కొన్ని సిసి కెమేరాలు ఉండగా వాటి స్థానంలో అత్యాధునికమైనవి ఏర్పాటుచేయబోతున్నారు. 360 డిగ్రీల కోణంలోనూ అవి అన్ని దృశ్యాలను క్యాప్చర్ చేస్తుంటాయి. ఇలా మొత్తం 67 సిసి కెమేరాలు ఏర్పాటుచేయనుండగా వాటి కోసం ఏకంగా రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే వాటి ఏర్పాటు కోసం టెండర్లు పిలిచామని నెలరోజుల్లో ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. 

06:27 - April 5, 2016

చిత్తూరు : తిరుపతిలో ఐఐడిసఇ రొబొటిక్స్ అండ్‌ ఎనలిటిక్స్‌ విభాగాన్ని ఏర్పాటు చేస్తామని టెక్ మహీంద్రా ప్రకటించింది. ఏపీలో ఐటీ రంగ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని సంస్థ సీఈఓ సీపీ గుర్నాని హామీ ఇచ్చారు. విజయవాడలో సీఎం చంద్రబాబుతో భేటీ అయిన ఆయన ... విశాఖ సెంటర్‌లో మరో వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో హైటెక్‌సిటీని నిర్మించి ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధిని అందించారంటూ సీఎం చంద్రబాబును గుర్నాని ప్రశంసించారు.

06:24 - April 5, 2016

హైదరాబాద్ : పెరుగుతున్న ప్రజల అవసరాలు తీర్చే విధంగా హైదరాబాద్‌ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్నారు సీఎం కేసీఆర్‌. ఇందుకోసం ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. ప్రజాసమస్యలు, పరిపాలనలో పాటించాల్సిన విధి విధానాలపై.. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు శిక్షణా తరగతులు నిర్వహించేందుకు సర్కార్‌ సిద్ధమైంది. జీహెచ్‌ఎంసీ, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌పై సీఎం క్యాంప్‌ ఆఫీసులో నగర మంత్రులు, కేటీఆర్‌, అధికారులు, ఆస్కి డైరెక్టర్లతో కేసీఆర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వచ్చ హైదరాబాద్‌లో భాగంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇక ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలు గుర్తెరిగి.. ప్రజల కోసం పని చేయాలని సూచించారు కేసీఆర్‌. ఇక డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కోసం చాలా చోట్ల స్థలాలను గుర్తించినట్లు కేసీఆర్‌ తెలిపారు. ఈ పథకం సక్సెస్‌ కావాలంటే.. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కలిసి పని చేయాల్సిన అవసరముందన్నారు. వివాదాల మయంగా ఉన్న కంటోన్మెంట్‌ను ఇకపై గ్రేటర్‌లో భాగంగానే చూడాలన్నారు.

కార్పొరేటర్లుకు శిక్షణ..
ఇక వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేయాలని సీఎం భావిస్తున్నారు. ఇందుకోసం ప్రతి ఐదు వేల జనాభాకు ఒక ప్రజాకమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల మధ్య సమన్వయం అవసరమని భావిస్తున్నారు కేసీఆర్‌. ఇందుకోసం కొత్తగా గెలిచిన కార్పొరేటర్లకు మూడు రోజల పాటు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఈనెల 11, 12 తేదీలలో హైదరాబాద్‌ కార్పొరేటర్లకు,... 13వ తేదీన కరీంనగర్‌, ఖమ్మం, నిజామాబాద్‌, రామగుండం కార్పొరేషన్లకు చెందిన టీఆర్ఎస్‌ కార్పొరేటర్లకు ప్రగతి రిసార్ట్స్‌లో ఆస్కీ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఏయే అంశాలపై శిక్షణ ఇవ్వాలో.. ఆ బాధ్యతలను అధికారులకు అప్పగించారు కేసీఆర్‌. ఈ శిక్షణకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా హాజరు కావాలని సూచించారు. అయితే.. కేవలం అధికార పార్టీ తరపున గెలిచిన వారికే శిక్షణ అని పేర్కొనడంతో.. ఇతర పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

06:21 - April 5, 2016

హైదరాబాద్ : గోదావరి నదిపై నిర్మించతలపెట్టిన బ్యారేజీలపై మహారాష్ట్రతో తుది ఒప్పందానికి తెలంగాణ సర్కార్‌ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ కొద్ది రోజుల్లో భేటీ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. బ్యారేజీలపై మున్ముందు ఎలాంటి వివాదాలు తలెత్తకుండా, అభ్యంతరాలు రాకుండా చర్చలు జరిపేందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. ఇందుకు హైదరాబాద్‌ వేదిక కానుంది. సాగునీటి ప్రాజెక్ట్‌ల రీ డిజైనింగ్‌పై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం నేడు సచివాలయంలో భేటీ కానుంది. పథకాల పునరాకృతిపై ఇప్పటి వరకు జరిగిన ప్రగతిని సమీక్షిస్తారు. గోదావరి నదిపై తెలంగాణలో నిర్మించనున్న బ్యారేజీలపై మహారాష్ట్రతో వివాదాలు తలెత్తకుండా చూసే క్రమంలో ఇప్పటికే రెండు రాష్ట్రాలు ప్రాథమిక ఒప్పందాలు చేసుకున్నాయి. వీటి ప్రకారం కొన్ని ప్రాజెక్ట్‌లను రీడీజైనింగ్‌ చేయాలని నిర్ణయించారు. రీడిజైనింగ్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌...అసెంబ్లీలో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ కూడా ఇచ్చారు. రీడిజైనింగ్‌ పూర్తైతే తదుపరి కార్యాచరణలో భాగంగా మహారాష్ట్రతో తుది ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రతిదిపాదించారు. ఇరిగేషన్‌ శాఖ మంత్రి హరీష్‌రావు, ఆర్ధిక మంత్రి ఈటల రాజేంద్ర, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా ఉన్న మంత్రివర్గ ఉపసంఘం భేటీలో మహారాష్ట్రతో కుదుర్చుకునే తుది ఒప్పందంపై చర్చిస్తారు.

రెండుగా ప్రాణహిత - చేవెళ్ల..
రాజీవ్‌సాగర్‌, ఇందిరాసాగర్‌, ప్రాణహిత-చేవెళ్ల పథకాలకు ప్రత్యామ్నాయాలు చేట్టారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌ను రెండుగా విభజించిన సర్కార్‌... తుమ్మిడిహట్టి దగ్గర ఒకటి, కాళేశ్వరం దిగువున మేడిగడ్డ దగ్గర మరొక ప్రాజెక్ట్‌ను చేపట్టాలని నిర్ణయించింది. ప్రాణహిత-చేవెళ్ల రీడిజైనింగ్‌తో 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ దగ్గర రిజర్వాయర్లు నిర్మిస్తారు. వీటి ద్వారా నిజాంసాగర్, శ్రీరాంసాగర్‌, సింగూరు ప్రాజెక్ట్‌ల పరిధితో ఆయకట్టును స్థిరీకరించాలని నిర్ణయించారు. ఖమ్మం జిల్లాలో సమైక్య పాలకులు ప్రతిపాదించిన ఇందిరాసాగర్‌, రాజీవ్‌సాగర్‌కు ప్రత్యామ్నాయంగా చేపట్టనున్న ప్రాజెక్ట్‌ల ద్వారా 5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. కాంతనపల్లి ప్రాజెక్ట్‌ ప్రతిపాదిత స్థలాన్నిమార్చాలని నిర్ణయించారు. దేవాదుల ఎత్తిపోత పథకంలోమార్పులు చేయాలని నిర్ణయించారు. వీటిపై భవిష్యత్‌లో ఏరకమైన సమస్యలు తలెత్తకుండా మంత్రివర్గ ఉంపసంఘంలో చర్చించి, తదుపరి చర్యలు తీసుకుంటారు. 

06:18 - April 5, 2016

ఢిల్లీ : మోడీ సర్కారు మరో సారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచింది. పెట్రోల్‌పై లీటర్‌కు 2 రూపాయల 19 పైసలు, డీజిల్‌పై లీటర్‌కు 98 పైసలు పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ధరల పెరుగుదలతో సామాన్యులపై మరింత భారం పడనుంది. మోడీ సర్కారు 15 రోజుల క్రితమే మూడు రూపాయల చొప్పున పెట్రోల్‌, రెండు రూపాయల చొప్పున డీజిల్‌ ధరలు పెంచింది. 

ఎల్బీ స్టేడియంలో ట్రాఫిక్ ఆంక్షలు..

హైదరాబాద్ : నేడు ఎల్బీ స్టేడియం ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. బాబు జగ్జీవన్ రాం జయంతి సందర్భంగా ఈ ఆంక్షలు విధించనున్నారు. ఉదయం 5 నుండి రాత్రి 10 గంటల వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. 

నేడు నోయిడాలో ప్రధాని మోడీ పర్యటన..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు నోయిడాలో పర్యటించనున్నారు. స్టాండప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 5100 ఈ రిక్షాలను లబ్ధిదారులకు అందచేయనున్నారు. 

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..

ఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ పై లీటర్ కు రూ.2.19, డీజిల్ పై లీటర్ కు 98 పైసలు పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 

రేపు మక్కా ఇమామ్ రాక...

ఢిల్లీ : సౌదీ అరేబియాలోని ముస్లింల పవిత్ర ప్రార్ధనా స్థలం మక్కా ముకర్రమాలో గల హరమ్‌ షరీఫ్ మసీదు ఇమామ్, ఖతీబ్ షేక్ సాల్హే బిన్ మహ్మద్ బిన్ ఇబ్రహీం బుధవారం హైదరాబాద్‌కు రానున్నారు. దేశ పర్యటనలో ఉన్న ఆయన ఇప్పటికే పలు రాష్ట్రాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

జులై 11 నుండి రైల్వే కార్మికుల సమ్మె..

హైదరాబాద్ : రైల్వే కార్మికులపట్ల కేంద్రం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 11నుంచి దేశవ్యాప్త సమ్మె చేయనున్నట్లు రైల్వే కార్మిక సంఘాల ఫెడరేషన్ (ఎన్‌ఎఫ్‌ఆర్‌ఐ) పేర్కొంది. 

Don't Miss