Activities calendar

10 April 2016

21:32 - April 10, 2016

పాకిస్థాన్ : ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్, పాకిస్తాన్‌ సరిహద్దులో భూకంపం జనాల్ని బెంబేలెత్తించింది. ఈ ప్రభావంతో ఉత్తర భారత దేశంలో కొన్ని సెకండ్లపాటు భూమి కంపించింది. భూకంపం ధాటికి జమ్ము కాశ్మీర్‌లోని బారాముల్లా, హంద్వారాలో ఇళ్లు కూలిపోయాయి. కుప్వారాలో ప్రార్థనామందిరం ధ్వంసమైంది.. భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. పాకిస్థాన్‌లో భూప్రకంపనలతో ఇల్లు కూలి ఇద్దరు మృతి చెందగా పది మంది గాయపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూకుశ్‌ పర్వత శ్రేణులు, పెషావర్‌కు 248 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని అధికారులు గుర్తించారు.

ఉత్తర భారతంపై ప్రభావం..
ఈ భూకంపం ఉత్తర భారత దేశంపై ప్రభావం చూపింది. కాశ్మీర్‌, పంజాబ్‌, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌లో దాదాపు 50 సెకండ్లపాటు భూమి కంపించింది. భూప్రకంపనలు గమనించిన ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఢిల్లీలో ముందు జాగ్రత్త చర్యగా మెట్రో సర్వీసులను ఆపేశారు. అయితే ఆస్తినష్టం కానీ ప్రాణనష్టం కానీ లేదని అధికారులు తెలిపారు. కాశ్మీర్ లో భూమి ఎక్కువగా కంపించింది. 

కాటసాని రాంభూపాల్ రెడ్డిపై అపహరణ కేసు..

కర్నూలు : మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిపై జిల్లా మూడో పట్టణ పోలీస్ స్టేషన్ లో అపహరణ కేసు నమోదైంది. 

జమ్మలమడుగులో టీడీపీ వర్గపోరు..

కడప : పెద్దంగూరు శ్రీరామనవమి ఉత్సవాలకు రామసుబ్బారెడ్డిని ఆహ్వానించారని ఆయన అనుచరుల ఇళ్లపై ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి వర్గీయులు దాడి చేశారు. రామసుబ్బారెడ్డి అనుచరుల ఇళ్లలోని సామాన్లను ధ్వంసం చేశారు. 

21:23 - April 10, 2016

హైదరాబాద్ : తెలంగాణ జేఏసీ ఇకపై పరిపూర్ణంగా ఉద్యమ సంస్థగానే కొనసాగబోతోంది. ప్రజల సమగ్రాభివృద్ధి కోసం.. మలిపోరుకు సన్నద్ధమైంది. రాష్ట్ర సాధన కోసం చేసినంతటి పోరాటాన్నే ప్రజల కోసం చేయాలని నిర్ణయించింది. ప్రాజెక్టుల రీ-డిజైన్‌, విద్యుత్‌ ప్రాజెక్టులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని టీ-జేఏసీ డిమాండ్‌ చేసింది. ఆదివారం, హైదరాబాద్‌లోని నాచారంలో ప్రొ.కోదండరామ్‌ అధ్యక్షతన టీ-జేఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై ఏ రాజకీయ పార్టీనీ జాక్‌లో చేర్చుకోరాదని నిర్ణయించారు. అవసరాన్ని బట్టి అంశాలవారీ మద్దతును మాత్రం తీసుకోవాలని తీర్మానించారు.

డిమాండ్లు..
జేఏసీ సమావేశంలో భవిష్యత్‌ ప్రణాళికపై చర్చించారు. మొత్తం 14 అంశాలపై తీర్మానాలు చేశారు. తెలంగాణ సర్కార్‌ మంచి చేస్తే అభినందించాలని,.. ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేస్తే ప్రజలను సమీకరించి పోరాటాలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. సామాజిక తెలంగాణ కోసం ప్రజల గొంతుకగా ఉండాలని టీ-జేఏసీ నిర్ణయించింది. ఇక తెలంగాణకు పెనుముప్పులా మారిన ఓపెన్‌కాస్ట్‌ బొగ్గు తవ్వకాలను ఆపాలని.. దానికి ప్రత్యామ్నాయం ఆలోచించాలని జేఏసీ సూచించింది. అదేవిధంగా బోధన్‌ షుగర్‌ ఫ్యాక్టరీ దాని అనుబంధ పరిశ్రమలను వెంటనే తెరవాలని, తెలంగాణలో స్థాపించే పరిశ్రమల్లో స్థానికులకు 70 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. రాష్ట్రంలో తీవ్రమైన కరవు ఉన్న నేపథ్యంలో.. మరికొన్ని మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని టీ-జేఏసీ కోరింది. తెలంగాణ సాంప్రదాయ వృత్తులను కాపాడుకునేందుకు, విద్య,వైద్య రంగాలను బలోపేతం చేసేందుకు త్వరలోనే సదస్సులు నిర్వహించాలని జేఏసీ నిర్ణయించింది. ముఖ్యంగా సాగునీటి, విద్యుత్‌ ప్రాజెక్టులపై దృష్టి సారించిన జేఏసీ.. ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల రీ-డిజైన్లు, విద్యుత్‌ ప్రాజెక్టులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది. 
మొత్తానికి ప్రజల పక్షాన పోరాడేందుకు తెలంగాణ జేఏసీ మరోసారి భవిష్యత్‌ కార్యాచరణను సిద్దం చేసుకుంది. ఇప్పటికే ప్రభుత్వ తీరుపై ఆచితూచి స్పందిస్తున్న కోదండరామ్‌.. ఇకపై సర్కారు ప్రజా వ్యతిరేక చర్యలపై కఠిన వైఖరితో.. పోరాటం కొనసాగించాలని నిర్ణయించారు. 

 

 

21:21 - April 10, 2016

కేరళ : పుట్టింగల్‌ బాణసంచా పేలుడు ఘటనలో క్షతగాత్రులను ప్రధాని నరేంద్ర మోడీ, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సహా సహా పలువురు నేతలు పరామర్శించారు. ఈదుర్ఘటనలో మృతుల కుటుంబాలకు కేరళ ప్రభుత్వం 10 లక్షల రూపాయలు, ప్రధాని మోదీ 2 లక్షల రూపాయల చొప్పు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మరోవైపు... ఈ ఘటనపై కేరళ ప్రభుత్వం సమగ్ర న్యాయ విచారణకు ఆదేశించింది. రాష్ట్ర హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణన్‌ నాయర్‌ నేతృత్వంలో విచారణ కమిషన్‌ను నియమించింది.  ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వైద్య బృందంతో కలిసి తిరువనంతపురం చేరుకున్న ప్రధాన మంత్రి... అక్కడ నుంచి హెలికాప్టర్‌లో కొల్లం చేరుకున్నారు. పుట్టింగల్‌ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబాలను కలిసి ఓదార్చారు. ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామన్న మోడీ.. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడినవారికి 50 వేల రూపాయల వంతున ఆర్ధిక సహాయం ప్రకటించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పది లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాకు అదనం.

రాహుల్ పరామర్శ..
అటు కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా పుట్టింగల్‌ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీతో కలిసి బాధిత కుటుంబాలను పరామర్శించారు. బీజేపీ అధ్యక్షడు అమిత్‌ షా కూడా బాధిత కుటుంబాలను కలిసి ఓదార్చారు. కొల్లం ఘటనపై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందిచాలని.. ఆయన కేరళ ప్రభుత్వాన్ని కోరారు. పుట్టింగల్‌ ఆలయంలో జరిగిన ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఏచూరి డిమాండ్‌ చేశారు. కేరళ సీపీఎం నాయకులు కూడా ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్న వారిని పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని సీపీఎం నేతలు కోరారు.

న్యాయవిచారణ..
మరోవైపు.. కేరళలోని కొల్లం జిల్లా పరవూర్‌ పుట్టింగల్‌ దేవాలయంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేరళ హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణన్‌ నాయర్‌ నేతృత్వంలో విచారణ జరుగుతుంది. న్యాయ విచారణ కమిషన్‌ విధివిధానాలను త్వరలో ఖరారు చేస్తారు. ఉత్సవాల సందర్భంగా దేవాలయాల్లో బాణసంచా పోటీల నిర్వహణపై కూడా ఈ కమిషన్‌ విచారణ జరుపుతుంది. ఇంకోవైపు... కేరళ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల వంతున పరిహారం చెల్లిస్తుంది. తీవ్రంగా గాయపడినవారికి 2 లక్షల రూపాయలు, స్వల్పగాయాలైన వారికి 50 వేల వంతును ఆర్ధిక సహాయం అందిస్తారు. క్షతగాత్రులకయ్యే వైద్య ఖర్చు మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు ముందుకు వచ్చింది. పుట్టింగల్‌ ఘటనలో మృతదేహాలకు కొల్లం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే శవపరీక్ష పూర్తైన మృత దేహాలను కుటుంబ సభ్యులకు ఆందజేశారు. ఈ ఘటనపై కేరళ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్ కతా..

కోల్ కతా : ఐపీఎల్ 9లో భాగంగా ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతం గంభీర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. 

20:16 - April 10, 2016

ఢిల్లీ : దేశంలో ప్రజా స్వామ్య పోరాటాల ద్వారా ప్రజలకు హక్కులు సంక్రమిస్తాయని ఢిల్లీ వర్సిటీ ప్రొ.డాక్టర్ సాయిబాబా అన్నారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్న తనపై రాజద్రోహ అభియోగం మోపిందని, దీనిని ఎదుర్కొంటూనే భవిష్యత్ లోనూ పోరాటాలు కొనసాగిస్తానని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో బెయిల్ పై విడుదలైన సాయిబాబాతో టెన్ టివి ముచ్చటించింది. నాగ్ పూర్ జైలు జీవితం..అనుభవాలు..ఎదుర్కొన్న పరిస్థితులు..రాజద్రోహం..తదితర అంశాలపై ఆయన అభిప్రాయాలు తెలిపారు. ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేశారో వీడియోను క్లిక్ చేయండి. 

20:11 - April 10, 2016

ఆదిలాబాద్ : బాసర ట్రిపుల్‌ఐటీలో కలుషిత ఆహారం తిని 50మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ట్రిపుల్‌ ఐటీలోని ఎస్ఎస్ మెస్‌లో భోజనం చేసిన విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ వైద్యశాలలకు తరలించారు. ప్రస్తుతం వీరు ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. మరోవైపు ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.

19:41 - April 10, 2016

మెదక్‌ : జిల్లా సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుంది. పదిన్నర గంటల కల్లా ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. పట్టణంలోని 34 వార్డులకుగాను... 6 వార్డులు ఏకగ్రీమయ్యాయి. 28 వార్డుల ఓట్ల లెక్కింపును మూడు రౌండ్లలో చేపడతారు. కౌంటింగ్‌ కోసం 10 టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్‌కు ముగ్గురు సిబ్బందిని నియమించారు. మొత్తం 72 ఈవీఎంలను వార్డుల వారీగా విభజించి ఓట్లు లెక్కిస్తారు. కౌంటింగ్‌ కేంద్రం దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. 

19:39 - April 10, 2016

హైదరాబాద్ : తమ కార్యాచరణను మరింత ఉధృతంగా కొనసాగించాలని టీ-జేఏసీ తీర్మానించింది. సామాజిక న్యాయం పునాదిగా,.. ప్రజలే కేంద్రంగా రాజ్యాంగ స్ఫూర్తితో తెలంగాణ పురోభివృద్ధికి టీ-జేఏసీ కట్టుబడి పని చేస్తుందన్నారు కోదండరామ్‌. విద్యుత్‌ ఒప్పందాలు, విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేయాలని జేఏసీ డిమాండ్‌ చేసింది. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ టీ-జేఏసీ తీర్మానించింది. విద్యుత్‌ ఉద్యోగులపై నిర్బంధాన్ని ఎత్తివేయడంతో పాటు.. ప్రాజెక్టుల డీపీఆర్‌లను బయటపెట్టాలని టీ-జేఏసీ డిమాండ్‌ చేసింది. 

19:35 - April 10, 2016

ఢిల్లీ : ఆధ్యాత్మికతకు నెలవైన దేవాలయాలు నేడు రక్తపు మరకలతో తడిసి ముద్దవుతున్నాయి. నిత్యం భక్తి ప్రవక్తులతో అలరాడాల్సిన ఆలయాలు మరుభూమిగా మారుతున్నాయి. భక్తుల హరినామస్మరణలతో మార్మోగాల్సిన దివ్యక్షేత్రాలు నేడు భక్తుల అర్తనాదాలతో తల్లడిల్లిపోతున్నాయి. ఉత్సవాలు, జాతర సమయాల్లో దేవాలయాల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు పెను ప్రమాదాలకు దారితీస్తున్నాయి. దీంతో వందలు, వేలల్లో ఉండే భక్తులు ఒక్కసారిగా తొక్కిసలాటకు గురై మృత్యువాత పడుతున్నారు. కేరళలో తాజాగా జరిగిన ప్రమాదం.. యావద్దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కనీస జాగ్రత్తలు పాటించక పోవడం వల్ల..వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

నిర్లక్ష్యం..
దేవాలయాల్లో జరిగే ఉత్సవాలకు అనుమతి, నిర్వహణల్లో అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే..ఎలాంటి ఘోర ప్రమాదాలు జరుగుతాయో కేరళ ఉదంతాన్ని చూస్తే అర్థమవుతోంది. కేరళ రాష్ట్రం కొల్లంలోని పుట్టింగల్‌దేవి ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన భారీ అగ్నిప్రమాదం 108 మందికి పైగా ప్రాణాలను బలిగొంది. ఇలాంటి ఘటనలు దేశంలో ఇదే మొదటిసారి కాదు.. గతంలోనూ జరిగిన ఎన్నో ఘటనలు ఇలాగే వందలాది మంది ప్రాణాలను బలితీసుకున్నాయి.

మధ్యప్రదేశ్ లో 115 మంది..
మధ్యప్రదేశ్‌ రాష్ట్రం దాతియాలోని రతన్‌గర్హ్‌ మాతా దేవాలయంలో 2013 అక్టోబరు 13న జరిగిన తొక్కిసలాటలో 115 మంది మృతి చెందారు. కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో 2011 జనవరి 15న జరిగిన తొక్కిసలాటలో 102 మంది మృత్యువాత పడ్డారు. అలాగే 1999 జనవరి 14న కేరళలోని శబరిమల ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో 52 మంది మృతి చెందారు.

ఉత్తర్ ప్రదేశ్ లో 63 మంది..
ఇక ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం కుందాలోని కృపాల్‌ మహారాజ్‌ ఆశ్రమ్‌లో 2010 మార్చి 4న జరిగిన తొక్కిసలాటలో 63మంది మృతి చెందారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని నైనాదేవి దేవాలయంలో 1978 ఆగస్ట్ 3న జరిగిన ప్రమాదంలో 65 మంది మృత్యు వాతపడ్డారు. రాజస్థాన్‌ రాష్ట్రం జోద్‌పూర్‌లోని చాముండాదేవి ఆలయంలో 2008 సెప్టెంబర్‌ 30న జరిగిన అగ్నిప్రమాదంలో 224 మంది మృతి చెందారు.

మహారాష్ట్రలో 291 మంది..
ఇక మహారాష్ట్రలోని మంధీర్‌దేవీ ఆలయంలో 2005 జనవరి 25న జరిగిన తొక్కిసలాటలో 291 మంది మృతి చెందారు. మధ్యప్రదేశ్‌, హరిద్వార్‌, ఉత్తరాఖండ్‌లోని ఉజ్జయినీ దేవాలయాల్లో 1996 జూలై 15న జరిగిన తొక్కిసలాట ఘటనల్లో 60 మంది మృతి చెందారు. తమిళనాడులోని మహామహమ్‌ ఆలయంలో 1992 ఫిబ్రవరి 18న జరిగిన ప్రమాదంలో 48మంది మృతి చెందారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో కుంభమేళా సందర్భంగా 1954 ఫిబ్రవరి 3న జరిగిన తొక్కిసలాట ఘటనలో 500 మందికి పైగా మృత్యువాత పడ్డారు. అలాగే మహారాష్ట్రలోని నాసిక్‌లో కుంభమేళా సందర్భంగా 2003 ఆగస్ట్‌ 27న జరిగిన తొక్కిసలాటలో 39 మంది మృతి చెందారు.

ఇప్పటికైనా మేల్కోంటారా ?
దేశంలో ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నా..ఆలయాల్లో కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. వేలు, లక్షలసంఖ్యలో వచ్చే భక్తుల కోసం కనీస భద్రతా ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వందలాది మంది అమయాకులు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కొల్లాంలో జరిగిన ప్రమాదం తర్వాతనైనా ప్రభుత్వాలు మేల్కొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

19:32 - April 10, 2016

కేరళ : బాణసంచా తయారీ కంపెనీల మధ్య నెలకొన్న అనైతిక పోటీయే కొల్లం పుట్టింగల్‌ ఆలయం వద్ద అగ్ని ప్రమాదానికి కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. కేరళలోని ఆలయాల్లో సంబరాల సందర్భంగా భారీగా బాణాసంచా పోటీలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనే బాణసంచా తయారీ కంపెనీలు తమ సత్తాను చాటుకునేందుకు పోటీపడి బాణసంచా కాలుస్తాయి. ఈ క్రమంలోనే అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని దర్యాప్తు నివేదికలు చెబుతున్నాయి.

కంపెనీల పోటీ..
రాష్ట్రంలోని ఆలయాల్లో సంబరాల సందర్భంగా పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తారు. ఆలయాల్లో జరిగే ఉత్సవాల్లో పాల్గొనడానికి బాణసంచా తయారీ కంపెనీలు పోటీ పడతాయి. తమ సత్తాను చాటుకునేందుకు రకరకాల బాణసంచా సామగ్రిని వినియోగిస్తాయి. ఎక్కువ రంగులతో వెలుగులు విరజిమ్మే బాణసంచా కాల్చిన కంపెనీల యాజమాన్యాలను విజేతలుగా ప్రకటిస్తారు. ఇది కంపెనీకి ప్రచారం లభించడంతోపాటు, వ్యాపారం పెరుగుదలకు దోహదం చేస్తుంది. దీంతో ఉత్సవాల సందర్భంగా ఆలయాల్లో జరిగే బాణసంచా పోటీల్లో పాల్గొనేందుకు ఎక్కువ మంది తయారీదారులు ఆస్తక్తి చూపుతారు. బాణసంచా కాల్చే క్రమంలో అప్పుడప్పుడు పుట్టింగల్‌ లాంటి ప్రమాదాలు జరగుతున్నాయని దర్యాప్తు నివేదికలు చెబుతున్నాయి.

రంగంలోకి దిగిన సైన్యం..
మరోవైపు కొల్లంలోని పుట్టంగల్‌ దేవాలయంలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులను ఆదుకునేందుకు సైన్యం రంగంలోకి దిగింది. ఆలయంలోని శిథిలాలను తొలగించేందుకు సైనిక దళాలు శ్రమిస్తున్నాయి. ఆరు హెలికాప్టర్లు, రెండు విమానాలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. నౌకాదళానికి చెందిన కబ్రా, కల్పని, సునయన నౌకల ద్వారా మందులు, ఇతర సహాయ సామగ్రిని చేరవేస్తున్నారు. క్షతగాత్రులకు వైద్యం అందించేందుకు ఆర్మీ డాక్టర్ల బృందం కూడా ఇప్పటికే కొల్లం చేరుకుంది. కొచ్చిలోని గురుడ నౌకాదళ విమాన స్థావరం నుంచి రెండు అత్యాధునిక హెలికాప్టర్లలో వైద్యులు కొల్లం చేరుకొని సహాయ చర్యలు చేపడుతున్నారు. తిరువంతపురం నుంచి కూడా మరో రెండు కొల్లం చేరుకున్నాయి. పుట్టింగల్‌ క్షతగాత్రులకు మిలటరీ ఆస్పత్రుల్లో కూడా చికిత్స అందిస్తున్నారు. అటు ప్రధాని మోదీ వెంట కూడా 15 మంది వైద్యుల బృందం కొల్లం చేరుకుని.. సహాయక చర్యల్లో పాల్గొంది. 

19:29 - April 10, 2016

కేరళ : పరవూర్‌లో ప్రమాదం జరిగిన పుట్టింగల్‌ దేవి ఆలయాన్ని ప్రధాని మోడీ సందర్శించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ బాధితులను ఆయన పరామర్శించారు. ప్రమాదం ఏ విధంగా జరిగిందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు ప్రధాని. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
కొల్లం ప్రమాద ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరు.. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు.
కొల్లంలో జరిగిన ఘటనపై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరగైన వైద్యసేవలు అందిచాలని.. ఆయన కేరళ ప్రభుత్వాన్ని కోరారు. పుట్టింగల్‌ ఆలయంలో జరిగిన ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఏచూరి డిమాండ్‌ చేశారు. 

బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్..

ఆదిలాబాద్: బాసర త్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ అయింది. ఆదివారం మధ్యాహ్నం మెస్ లో భోజనం చేసిన 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను ఆదిలాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు

సామాజిక తెలంగాణకు కృషి - కోదండరాం..

హైదరాబాద్ : సామాజిక తెలంగాణకు కృషి చేస్తామని టి.జేఏసీ ఛైర్మన్ కోదండరాం వెల్లడించారు. ప్రజా సంఘాలతో ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని, రాష్ట్రంలో కరవు ఎక్కువగా ఉందన్నారు. మిగిలిన కరవు మండలాను ప్రకటించాలని, ఓపెన్ కాస్టుల్లో తవ్వకాలను ఆపాలని కోరారు. బోధన్ చక్కెర ఫ్యాక్టరీని, సిర్పూర్ పేపర్ మిల్లును వెంటనే తెరవాలని డిమాండ్ చేశారు. విద్య, వైద్య రంగాల బలోపేతం కోసం సదస్సులు పెడుతామని, ప్రాజెక్టుల రీ డిజైన్, విద్యుత్ ప్రాజెక్టుల వివరాలను ప్రభుత్వం వెల్లడించాలన్నారు. సర్కార్ మంచి చేస్తే అభినందిస్తామని..చెడు చేస్తే ప్రశ్నిస్తామని కోదండరాం తెలిపారు. 

టిజేఏసీ తీర్మానాలు..

హైదరాబాద్ : నాచారం పరిధిలో గల హెచ్‌ఎంటీ నగర్‌లో తెలంగాణ జేఏసీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రొ. కోదండరాం సహా 45 ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జేఏసీ లక్ష్యం, అంతర్గత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై భేటీలో చర్చించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలకు ఆమోదం తెలిపారు.

18:46 - April 10, 2016

కృష్ణా : టిడిపి, వైసీపీ నేతలు ఘర్షణకు దిగారు. వైసీపీకి చెందిన ఓ కార్యకర్త ఒంటికి నిప్పంటించుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనికంతటికి కారణం స్థల వివాదమే. కంచికర్ల మండలం కీసరలో ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి ఆలయానికి ఓ దాత 59 సెంట్ల భూమి ఇచ్చాడు. ఈ స్థలంలో పేదలు గతకొన్ని రోజులుగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. ఈ స్థలంలో ప్రైవేటు కళ్యాణ మండపం నిర్మాణం చేయాలని స్థానిక టిడిపి నేతలు యోచించారు. దీనిపై కోర్టులో కేసు నడుస్తోంది. పేదలకు అనుకూలంగా కోర్టు తీర్పును చెప్పింది. అయినా పేదలను ఇళ్లను తొలగించి కళ్యాణ మంటపం నిర్మాణం చేయాలని టిడిపి నేతలు భావించారు. పేదలకు అండగా వైసీపీ నిలబడింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఇరు పార్టీలకు చెందిన నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టిడిపి నేతల అరాచకాలను తట్టుకోలేని వెంకటేశ్వర్లు అనే వైసీపీ కార్యకర్త ఒంటికి నిప్పంటించుకున్నాడు. దీనికి ఆగ్రహించిన వైసీపీ నేతలు, కార్యకర్తలు జాతీయ రహదారిపై బైఠాయించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని శాంతిపచేయడానికి ప్రయత్నించారు. గాయపడిన కార్యకర్తను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

18:40 - April 10, 2016

కర్నూలు : జిల్లాలో ఉగాది సంబరాలు అంబరాన్ని అంటుతాయి. వింత వింత ఆచారాలతో ప్రజలు వేడుకలు చేసుకుంటారు. కల్లూరు చౌడేశ్వరిదేవి ఉగాది మహోత్సవాల్లో ప్రజలు వింత మొక్కులు చెల్లిస్తారు. ముఖ్యంగా రైతులు బురదలో ఎడ్ల పందెలు నిర్వహిస్తారు. ఈ పోటీల్లో గాడిదలు కూడా పాల్గొనడం విశేషం. అదేవిధంగా ఆస్పరి మండలం కైరుప్పలో జరిగే పిడకల సమరం చూసేందుకు భారీగా ప్రజలు తరలివస్తుంటారు. ఉగాది పండుగ అంటే.. పల్లెల్లో సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో వింత వింత ఆచారాలు కొనసాగుతున్నాయి. తమ తాత, ముత్తాతల నుంచి వస్తున్న ఆచారాలు కొనసాగించడం తమకెంతో సంతోషంగా ఉందని గ్రామస్తులంటున్నారు. కల్లూరులో వెలిసిన శ్రీచౌడేశ్వరి మాత ఉగాది మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు జిల్లా నలువైపులా నుంచి రైతులు, రజకులు పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు. తమ కోరికలు నెరవేరితే.. కాడి ఎద్దులతో అమ్మవారి ఆలయం చుట్టూ తిరుగుతామని మొక్కుకుంటారు. అయితే ఈ మొక్కులు బురదలో తిరుగుతూ నెరవేర్చడం విశేషం. ఇక రజకులైతే.. తమ గాడిదలతో ఆలయం చుట్టూ తిరిగి మొక్కులు తీర్చుకుంటారు.

భారీగా ప్రజలు..
ఈ విధంగా ఎద్దులు, గాడిదలను ఆలయం చుట్టూ తిప్పడం వల్ల అమ్మవారి కృప తమకు ఉంటుందంటారు గ్రామస్తులు. అదేవిధంగా పశువులకు మంచి ఆరోగ్యం ఉంటుందని వారి నమ్మకం. అంతేకాకుండా పంటలు కూడా బాగా పండుతాయంటున్నారు ఆలయ పూజారి. ఇక ఆస్పరి మండలం కైరుప్పలో వింతైన ఆచారం కొనసాగుతోంది. ఉగాది మరుసటి రోజున పిడకల సమరం జరుగుతుంది. వీరభద్రస్వామి, కాళికాదేవి ప్రేమ వివాహం సందర్భంగా జరిగిన సమరం నేటికీ కొనసాగించడం ఆనవాయితి. ఈ సమరంలో పప్పులదొడ్డి, చెన్నంపల్లి, అలారుదిన్నె, వెంగళాయదొడ్డి, కారుమంచి, కలపరి, బిల్లెకల్లు గ్రామస్తులు ఇరువర్గాలుగా విడిపోయి.. పరస్పరం పిడకలు విసురుకుంటారు. ఈ పిడకల సమరం, ఎద్దుల పోటీలను వీక్షించేందుకు జిల్లా నలువైపులా నుంచి ప్రజలు తరలివస్తుంటారు. 

18:34 - April 10, 2016

విజయవాడ : కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులు రాణించే విధంగా ఫౌండేషన్ కోర్సును ప్రవేశపెడుతున్నామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడలో అమలు జరుగుతున్న ఫౌండేషన్ కోర్సులపై విద్యార్ధులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కోర్సును ఒత్తిడి లేకుండా అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి నారాయణ తెలిపారు. ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వం చేపడతున్న కోర్సులను బాధ్యతగా తీసుకొని విద్యార్ధులకు మేలు జరిగేలా శ్రద్ధ వహించాలని సూచించారు. 

కంచికర్లలో ఉద్రిక్తత..

కృష్ణా : జిల్లాలో కంచికచర్ల మండలం కీసరలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థల విషయంలో గత కొంతకాలంగా వైసీపీ, టీడీపీ మధ్య వివాదం ఉంది. ఆదివారం నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వైసీపీ కార్యకర్త ఒంటికి నిప్పంటించుకున్నాడు. దీనితో మిగతా వైసీపీ నేతలు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. 

18:30 - April 10, 2016

విజయవాడ : ఏ పార్టీకి అమ్ముడు పోవాల్సిన అవసరం తనకు లేదని ముద్రగడను కొనే నాయకుడు లేడని ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారు. విజయవాడలో జరిగిన కాపు ఆత్మీయ సభకు ఆయన హాజరైయ్యారు. చంద్రబాబు హామీలు నిలబెట్టుకుంటారన్న నమ్మకంతోనే, గతంలో ఆందోళన విరమించానని ఆయన తెలిపారు. కాపుల రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం నియమించిన మంజునాథ కమిషన్‌ సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ముద్రగడ కోరారు. 
గత కొద్ది రోజుల నుండి కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఆయన ఉద్యమం చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన చేపట్టిన దీక్ష పలు హింసాయుత సంఘటనలకు దారి తీసింది. దీనిపై విచారణ జరుగుతోంది. అనంతరం ముద్రగడ దీక్ష చేపట్టారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆయన దీక్షను విరమించుకున్నారు. కానీ ప్రభుత్వ వైఖరిపై ఆయన పలుమార్లు విమర్శలు సంధించారు. మరోసారి దీక్షకు సిద్ధమైన ముద్రగడ చివరి నిమిషంలో వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం ముద్రగడ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం..టిడిపి నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

18:23 - April 10, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం రహదారులు రక్తమోడాయి. అతివేగం..నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. ఈ ప్రమాదాలలో పలువురు మహిళలు..చిన్నారులు ఉండడం కలిచివేసింది. మొత్తం మూడు చోట్ల జరిగిన ప్రమాదాల్లో 11మంది మృతి చెందగా 37మందికి గాయాలయ్యాయి. విశాఖ జిల్లాల్లో 11 మంది దుర్మరణం చెందారు. పోస్టుమార్టమ్ పూర్తి చేసి బంధువులకు మృతదేహాల అప్పగించారు.

విశాఖలో...
విశాఖ జిల్లా నక్కపల్లి మండలం కాగిత వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. లారీ-కారు-ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో 11 మంది మృతిచెందారు. విశాఖ నుంచి తుని వైపు వేగంగా వెళ్తున్న కారు టైరు పేలిపోవడంతో అదుపుతప్పి అవతలి వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా బైక్‌ను ఈడ్చుకుటూ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని 9 మంది, ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు మృత్యువాతపడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మృతులు బుచ్చిరాజు పాలెంకు చెందిన ఈదలాడ శ్రీను, దేవి, సాయిధనుంజయ్‌, కడియం పద్మ, రేవంత్‌, సాయిలక్ష్మి, రాజు, సుధీర్‌ వర్మగా గుర్తించారు.

కృష్ణా జిల్లాలో..
కృష్ణా జిల్లా నూజివీడు మండలం ముక్కళ్లపాడు వద్ద పెళ్లి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో 25 మంది గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తూర్పుగోదావరిలో...
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జాతీయ రహదారిపై ఆటోను లారీ ఢీ కొట్టింది.. ఈ ప్రమాదంలో 12మంది గాయపడ్డారు.. ఆటో గండేపల్లినుంచి రాజమండ్రి వెళుతోంది.. పోలీసులు గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

కొల్లం చేరుకున్న రాహుల్..

కేరళ : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కొల్లంకు చేరుకున్నారు. బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. కొల్లంలోని పుట్టింగల్ దేవి ఆలయంలో సంభవించిన అగ్నిప్రమాదంలో 106 మంది దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. 350 మందికి పైగానే గాయాల పాలయ్యారు.

పుట్టింగల్ ఆలయాన్ని పరిశీలించిన మోడీ..

కేరళ : కొల్లంలోని పుట్టింగల్ ఆలయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సందర్శించారు. ఆలయ పరిసరాలను పరిశీలించిన మోడీ ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. 

హర్షాభోగ్లేపై వేటు..

ముంబై : క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లేకు బీసీసీఐ తాజాగా షాకిచ్చింది. ఐపీఎల్ - సీజన్ ఆరంభంలోనే అతని ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. 

పేద కాపులకు రిజర్వేషన్లు కోరుతున్నాం - ముద్రగడ..

విజయవాడ : కాపుల్లోని పేద వర్గాలకు మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలని తమ డిమాండ్ అని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు.

 

ఈతకు వెళ్లిన యువకులు గల్లంతు..

రంగారెడ్డి : మైలార్ దేవులపల్లి లక్ష్మీగూడ హుందా సాగర్ చెరువులో ఈతకు వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. అమీర్, ఫారుఖ్, సల్మాన్, ఆసీఫ్ లుగా గుర్తించారు. 

17:32 - April 10, 2016

హైదరాబాద్ : తమ కార్యాచరణను మరింత ఉధృతంగా కొనసాగించాలని టీ-జేఏసీ తీర్మానించింది. సామాజిక న్యాయం పునాదిగా,.. ప్రజలే కేంద్రంగా రాజ్యాంగ స్ఫూర్తితో తెలంగాణ పురోభివృద్ధికి టీ-జేఏసీ కట్టుబడి పని చేస్తుందన్నారు కోదండరామ్‌. విద్యుత్‌ ఒప్పందాలు, విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేయాలని జేఏసీ డిమాండ్‌ చేసింది. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ టీ-జేఏసీ తీర్మానించింది. విద్యుత్‌ ఉద్యోగులపై నిర్బంధాన్ని ఎత్తివేయడంతో పాటు.. ప్రాజెక్టుల డీపీఆర్‌లను బయటపెట్టాలని టీ-జేఏసీ డిమాండ్‌ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా విద్య, వైద్య రంగాలపై సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని, సదస్సులో వచ్చిన సూచనల ప్రకారం ప్రచారాన్ని నిర్వహిస్తామని కోదండరాం తెలిపారు. మూసివేసిన కంపెనీలను తెరిపించాలని కోరుతూ పాదయాత్రలు, ప్రచారాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుందన్నారు. తెలంగాణ పురోభివృద్ధికి సహకారం అందిస్తామన్నారు. 

17:29 - April 10, 2016

హైదరాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొమ్మిదోసీజన్ హంగామాకు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ముస్తాబయ్యింది. ఏప్రిల్ 16 నుంచి మే 12 తేదీల నడుమ జరిగే మొత్తం ఏడుమ్యాచ్ లకు సన్ రైజర్స్ తరపున హైదరాబాదీ ఫ్రాంచైజీ ఆతిథ్యమిస్తోంది. హైదరాబాద్ అంచె పోటీల వివరాలు..2016 ఐపీఎల్ సీజన్లో జరిగే మొత్తం 60 మ్యాచ్ ల్లో...కేవలం ఏడుమ్యాచ్ లకు మాత్రమే హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. హైదరాబాద్ ఫ్రాంచైజీ...తన హోమ్ మ్యాచ్ లకు ...రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియాన్ని ఎంపిక చేసుకొంది. ప్రస్తుత సీజన్లో హైదరాబాద్ అంచె తొలిపోటీ ఏప్రిల్ 16న సాయంత్రం 4 గంటల మ్యాచ్ గాను ఆఖరిమ్యాచ్ ను మే 12న రాత్రి 8 గంటల మ్యాచ్ గానూ నిర్వహిస్తారు. శిఖర్ ధావన్, అశీష్ నెహ్రా, డేవిడ్ వార్నర్, యువరాజ్ సింగ్, భువనేశ్వర్ కుమార్, మోజెస్‌ హెన్రికేస్, ఇయోన్ మోర్గాన్, కేన్ విలియమ్స్ సన్, ట్రెంట్ బౌల్ట్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ లాంటి ప్రపంచ మేటి టీ-20 స్టార్లున్న హైదరాబాద్ సన్ రైజర్స్ ఆత్మవిశ్వాసంతో 2016 సీజన్ కు సమాయత్తమవుతోంది.

  • రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఏప్రిల్ 16న..సాయంత్రం 4 గంటలకు జరిగే ప్రారంభ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో సన్ రైజర్స్ ఢీ కొంటుంది.
  • ఏప్రిల్ 18న రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తో సన్ రైజర్స్ అమీతుమీ తేల్చుకోనుంది.
  • ఏప్రిల్ 23న..రాత్రి 8గంటల నుంచి జరిగే పోటీలో కింగ్స్ పంజాబ్ తో హైదరాబాద్ సన్ రైజర్స్ పోటీపడుతుంది.
  • ఏప్రిల్ 26న జరిగే పోటీలో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతుంది. ఈ మ్యాచ్ సైతం..రాత్రి 8 గంటలకే ప్రారంభమవుతుంది.
  • ఏప్రిల్ 30న రాత్రి 8గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, హైదరాబాద్ సన్ రైజర్స్ జట్లు ఢీ కొంటాయి.
  • మే 6న రాత్రి 8 గంటల నుంచి జరిగే పోటీలో గుజరాత్ లయన్స్ జట్టుతో సన్ రైజర్స్ తలపడుతుంది.
  • మే 12న రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ ఐసాపైసా తేల్చుకొంటాయి. ఈ మ్యాచ్ తో ఐపీఎల్ 9వ సీజన్ హైదరాబాద్ అంచె పోటీలకు తెరపడుతుంది.
  • హైదరాబాద్ సన్ రైజర్స్ ఆడే మ్యాచ్ ల టికెట్లను ...సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ కౌంటర్లో ..ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ విక్రయించడానికి ఏర్పాట్లు చేశారు.
  • రెండు టికెట్లు కొన్నవారికి...సన్ రైజర్స్ ఆరెంజ్ ఆర్మీ టీ-షర్టును సైతం ఉచితంగా అందచేయాలని హైదరాబాద్ ఫ్రాంచైజీ నిర్ణయించింది. ఈ సదుపాయం ఏప్రిల్ 10వ తేదీ వరకూ మాత్రమే ఉంటుంది.
  • జంటనగరాలలోని పలు ప్రాంతాలలో ఉన్న కేఫ్ కాఫీడే అవుట్ లెట్స్ ద్వారా కూడా టికెట్ల విక్రయిస్తున్నారు.
17:24 - April 10, 2016

ముంబై : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ 9వ సీజన్‌లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. రెండు సార్లు చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టు సవాల్‌ విసురుతోంది.ఇండియన్‌ క్రికెట్‌ మక్కా ఈడెన్‌ గార్డెన్స్‌ స్టేడియం వేదికగా... మరికాసేపట్లో ప్రారంభమయ్యే ఈ సూపర్ సండే ఫైట్ లో...విజయమే లక్ష్యంగా రెండుజట్లూ బరిలోకి దిగుతున్నాయి. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ 9వ సీజన్‌లో డార్క్‌ హార్స్‌గా బరిలోకి దిగబోతున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టు రెండు సార్లు చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు సవాల్‌ విసురుతోంది. సొంత గ్రౌండ్‌లో తిరుగులేని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు అదే జోరు కొనసాగించాలని పట్టుదలతో ఉండగా.....అసలే మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగుతున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు టోర్నీని విజయంతో ఆరంభించాలని తహతహలాడుతోంది. గౌతమ్‌ గంభీర్‌ నాయకత్వంలోని నైట్‌రైడర్స్‌ జట్టులో అందరూ మ్యాచ్‌ విన్నర్లే. రాబిన్‌ ఉతప్ప,గౌతమ్‌ గంభీర్‌, కొలిన్‌ మున్రో, మనీష్‌ పాండే, యూసఫ్‌ పఠాన్‌ వంటి టాప్‌ క్లాస్‌ బ్యాట్స్‌మెన్‌తో పాటు ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్లైన సునీల్‌ నరైన్‌, బ్రాడ్‌ హాగ్‌, మోర్నీ మోర్కెల్‌, ఉనద్కత్‌, జాన్‌ హేస్టింగ్స్‌లతో కోల్‌కతా బౌలింగ్‌ విభాగం సైతం పటిష్టంగా ఉంది. ఇక ఒంటిచేత్తో జట్టును గెలిపించగల ఆండ్రీ రస్సెల్‌, క్రిస్‌ లిన్‌,షకీబ్‌ అల్‌ హసన్‌ వంటి ఆల్‌రౌండర్లతో ఎప్పటిలానే సమతూకంగా ఉంది.నైట్‌రైడర్స్‌ జట్టు సొంతగడ్డపై ఏ స్థాయిలో ఆడుతుందో అందరికీ తెలిసిందే.

జహీర్ ఖాన్ నాయకత్వం..
జహీర్‌ ఖాన్‌ నాయకత్వంలో తొలిసారిగా బరిలోకి దిగబోతున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు పేపర్‌ మీద పటిష్టంగానే కనిపిస్తోంది. జేపీ డుమినీ,క్వింటన్‌ డి కాక్‌, ఇమ్రాన్‌ తాహిర్‌, శామ్‌ బిల్లింగ్స్‌, క్రిస్‌ మోరిస్‌ కౌల్టర్‌నైల్‌ వంటి విదేశీ ఆటగాళ్లతో పాటు....శ్రేయస్‌ అయ్యర్‌, పవన్‌ నెగీ,కరుణ్ నాయర్‌, సంజూ శాంసన్‌, మహమ్మద్‌ షమీ వంటి ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లతో సమతూకంగా ఉంది.ఇక టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో ఆఖరి ఓవర్‌లో వెస్టిండీస్‌ను గెలిపించిన కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టులో ఎన్ని సంచలనాలు సృష్టిస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్‌ 9వ సీజన్‌ వేలంలో పవన్‌ నెగీ కోసం 10 కోట్లు, క్రిస్‌ మోరిస్‌ను 7.5 కోట్ల భారీ మొత్తం వెచ్చించి మరీ సొంతం చేసుకున్న డేర్‌డెవిల్స్ మేనేజ్‌మెంట్‌ ఈ ఇద్దరిపై ఎన్నో అంచనాలు పెట్టుకుంది. మరి తొలిసారి కెప్టెన్‌గా బరిలోకి దిగబోతున్న జహీర్‌ ఖాన్‌, డుమినీ, డి కాక్‌ వంటి సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ రాణించడం పైనే డేర్‌డెవిల్స్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఎవరిదో విజయం..
ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్‌లోనూ కోల్‌కతా నైట్‌రైడర్స్‌దే పై చేయిగా ఉంది. ఇప్పటివరకూ ఇరు జట్లు 16 మ్యాచ్‌ల్లో పోటీపడగా కోల్‌కతా టీమ్‌ 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా...ఢిల్లీ జట్టు 7 మ్యాచ్‌ల్లో నెగ్గింది. కోల్‌కతా హోంగ్రౌండ్‌ ఈడెన్‌ గార్డెన్స్ స్టేడియం వేదికగా మరికొద్దిసేపట్లో ప్రారంభంకానున్న ఈ పోటీలో ఆతిధ్య జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఆల్‌రౌండర్లతో పటిష్టంగా ఉన్న ఢిల్లీ జట్టును సైతం తక్కువ అంచనా వేయలేం. మరి ఈ మ్యాచ్‌లో నెగ్గి టోర్నీని విజయంతో ఆరంభించే జట్టేదో తెలియాలంటే మాత్రం మరికొద్ది గంటలు వెయిట్‌ చేయాల్సిందే .

17:18 - April 10, 2016

కోల్ కతా : పశ్చిమ బెంగాల్ మరో విడత పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. మొదటి విడతలో భాగంగా గత సోమవారం 18 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించగా, ఏప్రిల్ 11న మరో 31 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. వీటిలో ఆరు ఎస్సీ, ఒక ఎస్టీ రిజర్వ్ డ్ నియోజవర్గం వున్నాయి. పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో 13 , బంకుర జిల్లాలో 9, బర్ధమాన్ జిల్లాలో 9 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. బర్ధమాన్ జిల్లాలోని 9 నియోజవర్గాలు పారిశ్రామిక ప్రాంతంలో వుండడంతో కార్మికవర్గం ఓట్లు కీలకం కాబోతున్నాయి.31 నియోజకవర్గాల్లో 69, 90, 900 మంది ఓటర్లున్నారు. మొత్తం 8465 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 163 మంది అభ్యర్థులు పోటీలో వున్నారు.

19 స్థానాల్లో సిపిఎం..
అధికార తృణమూల్ కాంగ్రెస్ అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను రంగంలోకి దింపగా, ప్రధాన ప్రతిపక్షం సిపిఎం 19 స్థానాల్లో అభ్యర్థులను నెలబెట్టింది. సిపిఐ ఒక స్థానంలో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ 8 స్థానాల్లో తన బలాన్ని పరీక్షించుకుంటోంది. బిజెపి 31 స్థానాల్లో అభ్యర్థులను నెలబెట్టింది. సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్ష నేత సూర్యకాంత్ మిశ్రాతో పాటు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్, సినీయర్ కాంగ్రెస్ నేత మనస్ భునియా పోటీ చేస్తున్న ప్రముఖుల్లో వున్నారు.  ఏప్రిల్ 4న జరిగిన తొలి విడత పోలింగ్ లో అధికార త్రుణమూల్ కాంగ్రెస్ భారీ ఎత్తున రిగ్గింగ్ పాల్పడినట్టు బిజెపి ఆరోపిస్తోంది. వంద శాతం పోలింగ్ నమోదైన 12 కేంద్రాల జాబితాను ఆ పార్టీ ఎన్నికల కమిషన్ కు అందజేసింది. కనీసం 30 పోలింగ్ కేంద్రాల్లో త్రుణమూల్ కాంగ్రెస్ భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడట్టు బిజెపి ఆరోపించింది. అటు ప్రధాన ప్రతిపక్షం సిపిఎం కూడా త్రుణమూల్ కాంగ్రెస్ కొన్ని నియోజకవర్గాల్లో భయానక వాతావరణం స్రుష్టిస్తోందంటూ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. కేశ్ పూర్, గార్బెట నియోజకవర్గాల్లో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేకుండా పోతోందంటూ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. తుపాకీలు చూపించి, ఓటర్లను భయభ్రాంతులను చేస్తున్న స్థానిక పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారంటూ సిపిఎం ఫిర్యాదు చేసింది. 

16:59 - April 10, 2016

హైదరాబాద్ : కరవు సాయం కింద కేంద్రం నిధులు విడుదల చేస్తున్నా ఖర్చు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తున్నా సీఎం కేసీఆర్ నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కరవు తీవ్రంగా ఉండడంతో రైతులు ఆత్మహత్యలు పాల్పడుతున్నారని, ఈ ఘటనలు చెప్పడానికి ప్రభుత్వం సిగ్గు పడుతోందన్నారు. ఎండదెబ్బకు పలువురు మృత్యువాత పడుతున్నారని, బీజేపీ బృందాలుగా తిరిగారని, ఇందులో తాను కూడా పాల్గొన్నానని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన నివేదికను సీఎంకు ఇద్దామనుకుంటే అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. 

16:54 - April 10, 2016

విజయవాడ : రాష్ట్రం వాళ్లు కేంద్రాన్ని..కేంద్రం వాళ్లు రాష్ట్రాన్ని విమర్శించుకొంటే ప్రయోజనం లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. విజయవాడలో ఏపీ మహిళా పారిశ్రామిక వేత్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వెంకయ్య నాయుడు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఇటీవల కేంద్రంపై చేస్తున్న విమర్శలపై తనదైన శైలిలో ప్రసంగించారు. ''కేంద్రం రాష్ట్రాన్ని, రాష్ట్రం కేందాన్ని..అది కూడా ఇద్దరూ కలిసి ప్రభుత్వంలో ఉంటే ఎలా ఉంటుందంటే ఆవిడ పోయి ఆయనపైనా..ఆయన పోయి ఆవిడ పైనా రచ్చ పెట్టి పంచాయతీ చేసినట్లుగా ఉంటుంది..ఇది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా' అని తెలిపారు.
కుల రాజకీయాలకు మహిళలు దూరంగా ఉండాలని సూచించారు. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలనే దానిపై తాము కసరత్తు చేయడం జరుగుతోందన్నారు. తెలుగు వారికి అన్యాయం జరిగిందని, వారికి న్యాయం చేయడమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతోందన్నారు. 

16:45 - April 10, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం పలు విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి విజయవాడలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ముక్కలవాడ వద్ద పెళ్లి విందుకు వెళుతున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈఘటనలో 30 మందికి తీవ్రగాయాలయ్యాయి. అమిత వేగంతో వెళ్లడమే కారణమని తెలుస్తోంది. మడిచెర్ల ప్రాంతంలో జరిగే వివాహ విందులో పాల్గొనేందుకు కొంతమంది ట్రాక్టర్ లో వెళుతున్నారు. ట్రాక్టర్ లో మొత్తం 50 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా మహిళలే ఉన్నారు. ముక్కలవాడ వద్ద మూల మలుపు వద్ద ట్రాక్టర్ ఒక్కసారిగా బోల్తా కొట్టింది. అందులో ఉన్న వారు కిందపడిపోవడం..వారిపై ట్రాక్టర్ పడిపోవడం జరిగిపోయాయి. ఇది చూసిన కొంతమంది సహాయక చర్యలు చేపట్టారు. చాలా మందికి కాళ్లు, చేతులు విరిగిపోవడం..తలకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో 4గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

16:40 - April 10, 2016

విశాఖపట్టణం : 'వారిది పేద కుటుంబం..తండ్రి అప్పులు చేసి కుమారుడిని చదివిస్తున్నాడు..తన తండ్రి ఆశయాలను నెరవేస్తానని కుమారుడు చెప్పేవాడు' ప్రస్తుతం వీరంతా అనంతలోకాలకు వెళ్లిపోవడం చాలా బాధగా ఉందని గ్రామస్తులు..స్నేహితులు పేర్కొంటున్నారు. విశాఖపట్టణం నక్కపల్లి జాతీయ రహదారి వద్ద కారు లారీని..బైక్ ను ఢీకొనడంతో 11 మంది దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. మృతి చెందిన వారి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి చెందడం బాధగా ఉందని పలువురు వ్యాఖ్యానించారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు ఉండడం అందర్నీ కలచి వేసింది. కారు పేలడంతో అదుపు తప్పి బైక్ ను ఢీ కొందని, అదే వేగంతో లారీని ఢీకొందని ఆర్డీఓ పేర్కొన్నారు. సీఎం దృష్టికి కలెక్టర్ తీసుకెళ్లారని, ప్రభుత్వం తరపున సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
వడ్రంగి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, గ్రామంలో ప్రతొక్కరితో అనోన్యంగా ఉండేవారని తెలిపారు. ప్రభుత్వం మృతుల కుటుంబానికి సహాయం చేయాలని కోరారు. కుమార్ ఇంజినీరింగ్ చదువుతున్నాడని, తండ్రి అప్పులు చేసి చదివిస్తున్నాడని పేర్కొన్నారు. వీరందరూ మృతి చెందడం బాధగా ఉందన్నారు. 

పెళ్లి ట్రాక్టర్ బోల్తా..

విజయవాడ : నూజివీడులో విషాదం చోటు చేసుకుంది. ముక్కళ్లపాడు వద్ద పెళ్లి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈఘటనలో 25 మందికి తీవ్రగాయాలయ్యాయి. ట్రాక్టర్ లో మొత్తం 50 ఉన్నట్లు తెలుస్తోంది. 

16:25 - April 10, 2016

పాకిస్థాన్ : పాక్ వణికిపోయింది. ఈసారి ఉగ్రదాడితో కాదు. భూ ప్రకంపనాలతో దేశం వణికిపోయింది. ఆదివారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.8 గా నమోదైంది. హిందూకుష్ పర్వత శ్రేణి ప్రాంతంలో భూకంప కేంద్రంగా గుర్తించారు. అప్ఘనిస్తాన్ లో కూడా ఈ ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించి ఉండవచ్చునని తెలుస్తోంది.
ఈ ప్రభావం ఉత్తర భారతంపై కూడా పడింది. కాశ్మీర్, న్యూఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. భూ ప్రకంపనాలకు ఢిల్లీ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రాణాలు రక్షించుకోవడానికి బయటకు పరుగులు తీశారు. ప్రకంపనాల ధాటికి ఎవరైనా మృతి చెందారా ? ఆస్థి నష్టం జరిగిందా ? అనేది తెలియరావడం లేదు. 

16:23 - April 10, 2016

కేరళ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కొల్లంకు చేరుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు. మోడీ వెంట 15 మంది ప్రత్యేక వైద్యుల బృందం ఉంది. అనంతరం అగ్నిప్రమాదం జరిగిన ఆలయాన్ని సందర్శించనున్నారు. కొల్లంలోని పుట్టింగల్ దేవి ఆలయంలో సంభవించిన అగ్నిప్రమాదంలో 106 మంది దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. 350 మందికి పైగానే గాయాల పాలయ్యారు. ఒక్కసారిగా జరిగిన ఈ దుర్ఘటనతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుత పరిస్థితిపై అక్కడి సీపీఎం నేత రాధాకృష్ణన్ టెన్ టివితో మాట్లాడారు. 350 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, మెరుగైన వైద్య చికిత్స కోసం కొంతమందిని చెన్నై, బెంగళూరు రాష్ట్రాలకు తరలించనున్నారని పేర్కొన్నారు. 150 మంది పరిస్థితి విషమంగా ఉందని, 75 మందిని గుర్తించారని, మిగతా వారిని గుర్తించాల్సి ఉందన్నారు.
అగ్నిప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి వూమెన్ చాందీ ప్రకటించారని, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2 లక్షలు..స్వల్పగాయాలైన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ఇస్తామన్నారని తెలిపారు. బాణాసంచా పోటీకి అనుమతిచ్చారని కరపత్రాలతో పంపిణీ చేశారని, పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని వీఎస్ అచ్యుతానందన్ పేర్కొన్నారని తెలిపారు. 

కొల్లంకు చేరుకున్న మోడీ..

కేరళ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కొల్లంకు చేరుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు. మోడీ వెంట 15 మంది ప్రత్యేక వైద్యుల బృందం ఉంది. అనంతరం అగ్నిప్రమాదం జరిగిన ఆలయాన్ని సందర్శించనున్నారు.

పాక్ లో భారీ భూకంపం..

పాకిస్థాన్ : దేశంలో భారీ భూ కంపం సంభవించింది. ఉత్తర భారతంలో కూడా భూ ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. హిందూకుష్ పర్వత శ్రేణి ప్రాంతంలో భూకంప కేంద్రంగా గుర్తించారు. 

కొల్లంకు బయలుదేరిన రాహుల్..

ఢిల్లీ : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన నివాసం నుండి కొల్లాంకు బయలుదేరి వెళ్లారు. బాధితులను ఆయన పరామర్శించనున్నారు. మృతుల కుటుంబాలతో రాహుల్ మాట్లాడనున్నారు. పుట్టింగల్ ఆలయం వద్ద జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 106 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. 

నక్కపల్లి రోడ్డు ప్రమాదంపై చిన రాజప్ప దిగ్ర్భాంతి..

విజయవాడ : విశాఖపట్టణంలోని నక్కపల్లి వద్ద చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంపై ఏపీ మంత్రి చిన రాజప్ప తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతదేహాలను వీలైనంత త్వరగా స్వస్థలాలకు తరలించాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. కారు లారీని..బైక్ ను ఢీకొనడంతో 11 మంది దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. 

14న ఆరు వేల ఇళ్ల నిర్మాణానికి శంకు స్థాపన - రావెల..

విజయవాడ : రాజ్యాంగ నిర్మాణ డా. బీ.ఆర్. అంబేద్కర్ వేడుకలు ఈనెల 14న ఘనంగా నిర్వహించనున్నట్లు సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్ బాబు వెల్లడించారు. ఏప్రిల్ 14న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి ఏ కన్వెన్షన్ సెంటర్ వరకు ర్యాలీ, జక్కంపూడిలో 6 వేల ఇళ్ల నిర్మాణానికి సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. 

మృతులకు రూ. 10 లక్షలు - కేరళ సీఎం..

కేరళ : కొల్లంలోని పుట్టింగల్ దేవి ఆలయంలో సంభవించిన అగ్నిప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వూమెన్ చాందీ ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2 లక్షలు, స్వల్పగాయాలైన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ఇస్తామన్నారు. 

పోలీసు జీపును ఢీకొన్న లారీ..

విశాఖపట్టణం : ఎలమంచిలి తాండాలదిబ్బ వద్ద పోలీసు జీపును లారీ ఢీకొంది. ఐదుగురు పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. 

తీలేరులో విషాదం..

చిత్తూరు : తీలేరులో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు కూతుళ్లలో సహా తల్లి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి సునీత, కూతుళ్లు యశ్విని, నవ్యగా గుర్తించారు. 

సుజనా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నాడు - రఘువీరా..

విజయవాడ : కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఆర్థిక నేరస్థుడని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా వ్యాఖ్యానించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నాడని, సమాజానికి ఆర్థిక నేరస్థుడు అత్యంత ప్రమాదకరమని తెలిపారు. తక్షణమే సుజనా చౌదరిని కేబినెట్ నుండి తప్పించాలని డిమాండ్ చేశారు. బీజేపీ సీఎంలు, కేబినెట్ మంత్రులే నేరాలకు పాల్పడుతుంటే ప్రధాన మంత్రి మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఏపీలో పాలన కుంభకోణాల మయంగా మారిపోయిందని, అవినీతి నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారని తెలిపారు.

 

15:30 - April 10, 2016

విజయవాడ : కేంద్ర మంత్రి సుజనా చౌదరిపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లు వచ్చినా సీఎం చంద్రబాబు నాయుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బ్యాంకులను మోసం చేసినా సుజనా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సినవసరం ఉందన్నారు. ఓటును ధిక్కరించి పలు వాయిదాలను అవాయిడ్ చేస్తున్నా బాబు మాట్లాడడం లేదని తెలిపారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి కేంద్ర మంత్రిగా ఉండి చట్టాలను అధిగమిస్తున్నా..చట్టాలను గౌరవించడం లేదన్నారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఆర్థిక నేరస్థుడని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా వ్యాఖ్యానించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నాడని, సమాజానికి ఆర్థిక నేరస్థుడు అత్యంత ప్రమాదకరమని తెలిపారు. తక్షణమే సుజనా చౌదరిని కేబినెట్ నుండి తప్పించాలని డిమాండ్ చేశారు. బీజేపీ సీఎంలు, కేబినెట్ మంత్రులే నేరాలకు పాల్పడుతుంటే ప్రధాన మంత్రి మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఏపీలో పాలన కుంభకోణాల మయంగా మారిపోయిందని, అవినీతి నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారని తెలిపారు. 
కేంద్ర మంత్రి సుజనా చౌదరి మారిషస్ బ్యాంకుకు రుణం ఎగ్గొట్టారని ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. మూడు సార్లు విచారణకు హాజరు కాకపోవడంతో ఈ వారెంట్ జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఈనెల 26కి వాయిదా వేసింది. సుజనా చౌదరి రూ.106 కోటలు ఎగవేశారని ఆరోపిస్తూ మారిషస్ బ్యాంక్ నాంపల్లి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. 

15:17 - April 10, 2016

విశాఖపట్టణం : నక్కపల్లి జాతీయ రహదారిపై ఘోర దుర్ఘటనకు కారణం కారేనని తేలింది. అతివేగంగా ప్రయాణించడం..అందులో టైర్ పేలిపోవడంతో కారు..బైక్ ను ఢీకొట్టడం అదే వేగంతో లారీని ఢీకొట్టడం జరిగిపోయాయి. దీనితో కారులో ఉన్న 9 మంది అక్కడికక్కడనే దుర్మరణం చెందారు. బైక్ పై ఉన్న తాత, మనవడు కూడా మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలున్నారు. లారీలో ఇరుక్కపోయిన కారును క్రేన్ సహాయంతో బయటకు తీశారు. కారులో ఇరుక్కపోయిన మృతదేహాలను బయటకు తీస్తున్నారు.ప్రమాదానికి గురైన కారు (ఏపీ 16 బీజెడ్ 5624) కృష్ణా జిల్లాకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. 

తిరువనంతపురంకు చేరుకున్న మోడీ..

తిరువనంతపురం : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తిరువనంతపురంకు చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ లో కొల్లంకు బయలుదేరి వెళ్లారు. బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. 

14:57 - April 10, 2016

కథలు రాయాలనే ఆసక్తి మీకుందా? గొప్ప కథలుగా కొన్ని కథలనెందుకు భావిస్తారో, కొందరు రచయితల శైలికి పాఠకుడెందుకు అబ్బురపడతాడో.. తెలుసా మీకు? ఓవరాల్ గా కథ వెనుక కథ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? వీడియో క్లిక్ చేయండి. 

14:37 - April 10, 2016

చెన్నై : తమిళనాడులో ఎండీఎంకే అధినేత వైకో నేతృత్వంలో ఏర్పాటైన ప్రజా సంక్షేమ కూటమిలో మరో పార్టీ చేరింది. తమిళ మానిల కాంగ్రెస్‌ అధ్యక్షుడు జీకే వాసన్‌... పీడబ్ల్యూఎఫ్ తో జట్టు కట్టారు. దీంతో పీడబ్ల్యూఎఫ్ రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. తమిళనాడులో ప్రజా సంక్షేమ కూటమి బలపడుతోంది. ఇప్పటికే తమిళనటుడు విజయ్‌కాంత్‌ నేతృతంలోని డీఎండీకే..పీడబ్ల్యూఎఫ్ తో జట్టు కట్టడంతో ఈ కూటమి బలం పెరిగింది. తాజాగా కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్‌ నేతృత్వంలోని తమిళ మానిల కాంగ్రెస్‌...టీఎంసీ కూడా పీడబ్ల్యూఎఫ్ లో చేరింది. దీంతో ఈ కూటమికి మరింత బలపడినట్టు భావిస్తున్నారు. పీడబ్ల్యూఎఫ్ కూటమి పార్టీల సంఖ్య ఐదుకు చేరింది. ఎండీఎంకే, డీఎండీకే, టీఎంసీ, సీపీఎం, సీపీఐ ఈ కూటమిలో ఉన్నాయి.

ఒప్పుకున్న వాసన్..
అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితో సీట్లు సర్దుబాటు చేసుకోవాలన్న అంశంపై టీఎంసీ అధినేత జీకే వాసన్‌ చాలా కాలం పాటు సందిగ్ధంలో కొట్టుమిట్టాడారు. కరుణానిధి నేతృతంలోని డీఎంకేతో చేతులు కలపాలని ఆలోచించారు. ఆ తర్వాత జయలిత నాయకత్వంలోని ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకుంటే మంచిదని ఆలోచించారు. కానీ ఈ రెండు పార్టీలతో పొత్తు పొసగదని భావించిన జీకే వాసన్‌కు పీడబ్ల్యూఎఫ్ ఆశాకిరణంగా కనిపించింది. టీఎంసీని కలుపుకుంటే తమకూ మంచిదని పీడబ్ల్యూఎఫ్కూటమిలోని పార్టీ నేతలు భావించారు. ముందుగా పీడబ్ల్యూఎఫ్ కూటమిలోని పార్టీల నాయకులు వైకో, తిరుమావళవన్‌, రామకృష్ణన్‌, ముత్తురసులు టీఎంసీ కార్యాలయానికి వెళ్లి.. జీకే వాసన్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత అందరూ కలిసి కెప్టెన్‌ విజయ్‌కాంత్‌లో సమావేశంపై చర్చించారు. పీడబ్ల్యూఎఫ్ లో చేరేందుకు జీకే వాసన్‌ ఒప్పుకోవడంతో... సీట్ల సర్దుబాటుపై సమాలోచనలు జరిపి ఓ అంగీకారానికి వచ్చారు.

విజయకాంత్ సీఎం అభ్యర్థి..
పీడబ్ల్యూఎఫ్ తరుపున విజయ్‌కాంత్‌ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించారు. ముందుగా డీఎండీకే కి 128 సీట్లు కేటాయించినా... టీఎంసీ చేరికతో ఇప్పుడు 104 స్థానాలకు పరిమితమయ్యింది. టీఎంసీకి 26 సీట్లు కేటాయించారు. కూటమిలోనీ ఇతర పార్టీలు ఎండీఎంకే 29, వీసీకే 25, సీపీఎం 25, సీపీఐ 25 సీట్లకు పోటే చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. పీడబ్ల్యూఎఫ్ కూటమి ఇటు అధికార ఏఐఏడీఎంకే, అటు, డీఎంకేకి ప్రత్యామ్నాయంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా హోరెత్తుతున్న పీడబ్ల్యూఎఫ్ ఎన్నికల ప్రచారంతో... ఏఐఏడీఎంకే, అటు డీఎంకే నేతల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. 

14:30 - April 10, 2016

హైదరాబాద్ : జంటనగరాల్లో ప్రయాణం నరకాన్ని తలపిస్తుంది. అసలే ఇరుకు రోడ్లు... ఆపై గుంతలు.. వీటికి తోడు చాలా ప్రాంతాల్లోని బస్టాపుల్లో ప్రయాణికులు వేచివుండేందుకు షెల్టర్లు లేవు. దీంతో ఎండలకు ఎండాల్సి వస్తోంది. వర్షాలకు తడిసిముద్దవ్వాలి. చలికాలంలో గజగజ వణిపోయే పరిస్థితులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో బస్టాప్‌లున్నా... పైకప్పులు పాడైపోయాయి. మరికొన్ని బస్టాప్‌ల దగ్గర షెల్టర్లు సక్రమంగా ఉన్నా కూర్చునేందుకు ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.

ఇబ్బందులు పడుతున్న ప్రయాణీకులు..
శాఖల మధ్య సమన్వయలోపంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్‌ షెల్టర్ల నిర్మాణ బాధ్యతల నుంచి ఆర్టీసీ తప్పుకుంది. ఈ బాధ్యతలను 2008లో జీహెచ్‌ఎంసీకి అప్పగించి చేతులు దులుపుకుంది. జీహెచ్‌ఎంసీ కూడా దీనిని అంతగా పట్టించుకోలేదు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1832 బస్‌ షెల్టర్లు అవసరమని ఆర్టీసీ అధికారులు నగరపాలక సంస్థకు ప్రతిపాదనలు పంపారు. యాడ్‌ ఏజెన్సీల ద్వారా బస్‌ షెల్టర్లను నిర్మించాలనుకున్న జీహెచ్‌ఎంసీ అధికారులు... ఇందుకు టెండర్లు ఆహ్వానించారు. ఇంతవరకు ఐదుసార్లు టెండర్లు పిలిస్తే మొత్తం 840 షెల్టర్ల నిర్మాణం మాత్రమే పూర్తయ్యింది. వాణిజ్య ప్రకటనల ద్వారా ఎక్కడైతే ఎక్కువ ఆదాయం వస్తుందో గుర్తించి, అక్కడే నిర్మించారు. రద్దీగా ఉండే బస్టాప్‌లు చాలా వున్నా... యాడ్‌ ఆదాయం రాదనుకున్న చోట్ల నిర్మాణాలు చేపట్టలేదు. దీంతో ప్రయాణికులు రోడ్లపైనే వేచివుండాల్సి వస్తోంది. కొన్ని చోట్ల అవసరంలేకున్నా బస్‌ షెల్టర్లు నిర్మించారు. అధిక ఆదాయం వస్తుందనుకున్న ప్రాంతాల్లో పరిమితికి మించి ఏర్పాటు చేశారు.

చర్యలు తీసుకుంటున్నామన్న మేయర్..
బస్టాపుల్లో షెల్టర్లు లేకపోవడంతో తమ కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టాపుల్లో బస్‌ షెల్టర్లు నిర్మించడంతోపాటు ఏ రూటు బస్సు ఏ సమయానికి వస్తుందో ప్రయాణికులు తెలుసుకునేందుకు వీలుగా ఎలక్ట్రానిక్‌ డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మరోవైపు ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ చెబుతున్నారు. బస్‌ షెల్టర్ల నిర్మాణంపై యాడ్‌ ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నామంటున్నారు. కొద్ది రోజుల్లో టెండర్లు పిలిచి షెల్టర్లు నిర్మిస్తామని హామీ ఇస్తున్నారు. వచ్చే వర్షాకాలం నాటికైనా ఈ సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. 

14:27 - April 10, 2016

విజయవాడ : ఏపీ రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం వ్యయం తడిసిమోడువుతోందన్న విమర్శలు వినవస్తున్నాయి. దీనికోసం ప్రజా ధనాన్ని మంచినీటిప్రాయంగా ఖర్చు చేస్తున్నారన్న వాదనలున్నాయి. తాత్కాలిక సచివాలయం నిర్మాణం కోసం వందల కోట్ల రూపాయలు దుబారా చేయడం అవసరమా ? అంటూ ప్రతిపక్షాలు.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. తాత్కాలిక సచివాలయం నిర్మాణంతోనే కాలం వెళ్లబుచ్చితే శాశ్వత భవన నిర్మాణాలు ఎప్పుడు చేపడతారంటూ నిలదీస్తున్నారు.

తలకిందలవుతున్న ఖర్చు...
తాత్కాలిక సచివాలయం నిర్మాణం కోసం ప్రభుత్వం వేసుకున్న అంచనాలు తలకిందులవుతున్నాయి. మొదటి 180 కోట్ల రూపాయలు అనుకున్న వ్యయం... ఇప్పుడు 220 కోట్లకు చేరిందని లెక్కవేస్తున్నారు. విస్తరణ విభాగాలతోపాటు, భవనాల లోపల ఏర్పాటు చేసే హంగులు, ఆర్భాటాలను పరిశీలిస్తే... ఇది మరో 591 కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో తాత్కాలికి సచివాలయం కోసం చేసే ఖర్చు 800 కోట్లు అవుతుందని లెక్క తేల్చారు. ఇతరితర వ్యయాలు కలుపుకుంటే వెయ్యి కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్నరెవిన్యూలోటును పూడ్చుకునేందుకు కేంద్ర సహాయం తీసుకురాలేకపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు... తాత్కాలిక సచివాలయం, శాసనసభ భవనాల కోసం ఇంత భారీగా ప్రజాధనాన్ని దుబారా చేయడం అవసరమా? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

హైదరాబాద్‌లో సీఎం పేషీ కోసం కోట్లు ఖర్చు..
మొదట జీ ప్లస్‌ టూ నిర్మాణాలకు టెండర్లు పిలిచిన అధికారులు.. ఇప్పడు మరో రెండు అంతస్తులు వేయాలని నిర్ణయించారు. విజయవాడలో ముఖ్యమంత్రి కార్యాలయం రిపేర్ల కోసం భారీగా నిధులు ఖర్చు చేశారు. హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయ భవనాల్లో సీఎం పేషీ కోసం కోట్ల రూపాయలు వెచ్చించారు. మరమ్మతులు, తాత్కాలిక భవనాల కోసం ఇలా వందలకోట్లు ఖర్చు చేస్తే... శాశ్వత భవనాల నిర్మాణానికి చేతిలో పైసా లేక చివరికి చేతులెత్తేసే పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

మూడేళ్లలో రూ.15వేల కోట్ల ఖర్చు..
ఏపీ రాజధాని అమరావతి మొదటిదశ నిర్మాణాలను 2018 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఇందుకు మూడేళ్లలో 15 వేల కోట్ల ఖర్చు అవుతాయని అంచనావేస్తున్నారు. ఇంత భారీమొత్తంలో నిధులను ప్రభుత్వం ఎలా సమకూర్చుకొంటుందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అంతర్జాతీయ ఆర్ధిక సంస్థల నుంచి అప్పులు తెచ్చి నిర్మాణాలు చేపడతామన్నా... సీఆర్‌డీఏకి నేరుగా రుణాలు ఇచ్చేందుకు ఏ సంస్థా ముందుకురావడం లేదు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల వరకు సచివాయలంతోపాటు అసెంబ్లీ తాత్కాలిక భవనాల్లోనే కొనసాగే పరిస్థితులు లేకపోలేదని భావిస్తున్నారు. 

14:19 - April 10, 2016

విశాఖపట్టణం : జిల్లాలోని నక్కపల్లి రక్తమోడింది. ఓ లారీ సృష్టించిన బీభత్సానికి 11 మంది దుర్మరణం చెందారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం నక్కపల్లి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఏపీ 16 బీజెడ్ 5624 అనే నెంబర్ గల కారు..బైక్ ను లారీ ఢీకొంది. దీనితో బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ప్రమాదం జరగడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. ఆ ప్రాంతమంతా బీభత్సంగా మారిపోయింది. ప్రమాదానికి స్పష్టమైన కారణాలు తెలియరావడం లేదు. కారు.. లారీ కిందికి దూసుకుపోయింది. కారును బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
లారీ డ్రైవర్ ను మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

పార్లమెంట్ ప్రాంగణంలో ఫైర్ ఆక్సిడెంట్..

ఢిల్లీ : పార్లమెంట్ ప్రాంగణంలోని అనెక్స్ భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భవనం రెండో అంతస్తులోని 219 గదిలో మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 

నక్కపల్లి వద్ద రోడ్డు ప్రమాదం..11 మంది మృతి..

విశాఖపట్టణం : నక్కపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు బీభత్సం సృష్టించింది. లారీ, బైక్ ను ఢీకొంది. ఈఘటనలో మొత్తం 11 మంది మృతి చెందారు. 

13:49 - April 10, 2016

హైదరాబాద్ : తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి రెండేళ్ల సుధీర్ఘ విరామం తర్వాత విస్తృతస్థాయి సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించింది. టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి వివిధ భాగస్వామ్య పక్షాల సభ్యులు, జిల్లాల స్టీరింగ్‌ కమిటీల సభ్యులు హాజరయ్యారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండగా..టీ జేఏసి ఈ సమావేశాన్ని నిర్వహించింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపైనా అనుసరించాల్సిన వ్యూహాలను ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో కరువు పరిస్థితులపైనా ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటించిన జేఏసి.. కరువు నివారణ చర్యల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భావిస్తోంది. 

 

13:44 - April 10, 2016

సాహిత్యం సమాజానికి దిక్సూచి లాంటిది. మనిషికి వినోదంతో పాటు విజ్ఞానాన్ని పంచేది సాహిత్యమే... అంతేకాదు ఒక్కోసారి సాహిత్యం ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలుస్తుంది. ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తుంది. అలాంటి సాహిత్యాన్ని సృష్టించిన సృజనకారులెందరో మన మధ్యన ఉన్నారు. కష్టజీవులకు అటు ఇటు నిలిచేవాడే నిజమైన కవి అన్నాడో మహాకవి. దళిత బహుజన కవిత్వాన్ని బలంగా వినిపిస్తూ కష్టజీవుల సంస్కృతిని కవిత్వీకరిస్తున్నారు సిద్ధార్థ. పదునైన భావజాలంతో, అబ్బుర పరిచే శిల్పసోయగంతో, వస్తువైవిధ్యంతో కవిత్వం రాస్తున్న అరుదైన కవి ఆయన. ప్రముఖ కవి, కాలమిస్టు, సినిమా రచయిత సిద్ధార్ధపై ప్రత్యేక కథనం మీకోసం. మరింత విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:42 - April 10, 2016

హైదరాబాద్ : చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాలంటే ఇప్పుడు చులకనభావం కలుగుతోందన్నారు. పదవులను కించరుస్తున్నారని వాపోయారు. రాజకీయాలు పలుచనైపోయాయని తెలిపారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు గౌరవం లేకుండా పోయిందన్నారు. రాజీనామాలు చేయకుండా పార్టీలు మారడం సరికాదన్నారు. అధికార పార్టీ సభ్యులు మైండ్ గేడ్ ఆడుతున్నారని విమర్శించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం కొత్త డ్రామా ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అవినీతితో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలను కలుపుకుని ప్రజామోదం ఉందని చెప్పుకుంటున్నారు. రెండు నెలల కాలంలో విశాఖకు సీఎం 30 సార్లు వెళ్లారని..కానీ ఒక్కసారైనా ఆ జిల్లా ప్రతినిధులను కూర్చుబెట్టి జిల్లా అభివృద్ధిపై చర్చించారా.. అని ప్రశ్నించారు. 

 

13:39 - April 10, 2016

ఎట్టకేలకు బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌, దీపికా పదుకొనెల కాంబినేషన్‌లో త్వరలోనే ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్ళబోతోంది. చాలా కాలంగా వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చే సినిమాని చూడాలని ఆరాటపడుతున్న ఇరువురి అభిమానులు ఈ వార్తతో ఆనందంగా ఉన్నారు. 'ఏక్‌ థా టైగర్‌', 'భజరంగీ భాయిజాన్‌' వంటి విజయవంతమైన చిత్రాలను సల్మాన్‌తో రూపొందించిన కబీర్‌ఖాన్‌ తాజాగా సల్మాన్‌తో ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో సల్మాన్‌కి జోడీగా దీపికాని ఎంపిక చేసినట్లు సమాచారం. అతి త్వరలోనే షూటింగ్‌ ప్రారంభించుకోబోయే ఈ చిత్రాన్ని వచ్చే యేడాది ఈద్‌ కానుకగా విడుదల చేస్తున్నట్లు దర్శకుడు కబీర్‌ఖాన్‌ ట్వీట్‌ ద్వారా సల్మాన్‌ అభిమానులతో పంచుకున్నారు.

13:37 - April 10, 2016

మంచు విష్ణు, సోనారిక, రాజ్‌ తరుణ్‌, హేబా పటేల్‌ హీరోహీరోయిన్లుగా జి.నాగేశ్వర్‌ రెడ్డి దర్శకత్వంలో ఏ టీవీ సమర్పణలో ఏ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రై.లి బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం 'ఈడోరకం ఆడోరకం'. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ, 'ఇటీవల విడుదల చేసిన చిత్ర ఫస్ట్‌లుక్‌, టీజర్‌కు, సాయి కార్తీక్‌ సంగీతమందించిన ఆడియోకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దర్శకుడు జి.నాగేశ్వర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని ఆద్యంతం ఆకట్టుకునేలా తెరకెక్కించారు. అవుట్‌పుట్‌ చాలా బాగా వచ్చింది. మంచు మనోజ్‌, రాజ్‌ తరుణ్‌, నటకిరీటి రాజేంద్రప్రసాద్‌లు చేసే కామెడీ, హీరోయిన్లు సోనారిక, హేబా పటేల్‌ల గ్లామర్‌ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. ముఖ్యంగా విష్ణు ఈ చిత్రంలో చాలా వైవిధ్యంగా కనిపిస్తారు. కన్‌ఫ్యూజన్‌ కామెడీతో సాగే ఈ చిత్రానికి సెన్సార్‌ 'యు/ఏ' సర్టిఫికెట్‌ లభించింది. అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉందంటూ సెన్సార్‌ సభ్యులు అభినందించడం చాలా ఆనందంగా ఉంది. సమ్మర్‌ గిఫ్ట్‌గా ఈ నెల 14న ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రమవుతుందని ఆశిస్తున్నాం' అని అన్నారు.

13:30 - April 10, 2016

పుదీనా ఆకుల రసం మొటిమలపై రాసి రాత్రంతా వదిలేసి ఉదయాన్నే కడిగేయాలి. చెంచా చొప్పున బియ్యం, గసగసాలూ, బాదం గింజలను తీసుకుని మెత్తగా చేయాలి. ఈ మిశ్రమానికి రెండు చెంచాల పెరుగు కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి రాయాలి. పది నిమిషాల తర్వాత కడిగేస్తే మొటిమలతో పాటు వాటి తాలూకు మచ్చలూ మాయమవుతాయి.సమపాళ్లలో శనగపిండీ, పెరుగూ తీసుకుని మిశ్రమంలా చేసి ముఖానికి రాయాలి. ఇలా రెండు రోజులకోసారి చేస్తే సరి. దాల్చిన చెక్క పొడిలో కాసిని నీళ్లు పోసి మొటిమలున్న చోట రాయాలి. ఇలా పది రోజులకోసారి చేయాలి. శనగపిండిలో కొంచెం తేనె వేసి కలిపి ముఖానికి రాయాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే సరిపోతుంది.
తులసి ఆకుల్ని మెత్తగా చేసి ముఖానికి పట్టించినా సరిపోతుంది. మెంతి ఆకుల్ని మెత్తగా నూరి రాత్రి పడుకునే ముందు మొటిమలపై రాసి ఉదయాన్నే కడిగేయాలి. నారింజ తొక్కల్ని ఎండబెట్టి పొడి చేయాలి. దీనికి కొన్ని నీళ్లు చేర్చి రాత్రిపూట మొటిమలపై రాయాలి. చెంచా నిమ్మరసానికి అరచెంచా పచ్చి పాలు చేర్చి ముఖంపై రాసి అరగంట తర్వాత కడిగేసినా మంచిదే. చెంచా కొత్తిమీర రసానికి చిటికెడు పసుపు చేర్చి సమస్య ఉన్నచోట రాయాలి. ఇలా వారం పాటు క్రమం తప్పకుండా చేయాలి. కీరదోస గుజ్జును ముఖానికి రాసి ఇరవై నిమిషాల తర్వాత కడిగేసినా ఫలితం ఉంటుంది.

13:28 - April 10, 2016

అధిక బరువుతో బాధ పడుతున్నారా? ఉదయం పూట వ్యాయామాలు ఏమి చేస్తాంలే... అని చిరాకు పడుతున్నారా? డైటింగ్‌ చేద్దామనే ఆలోచనలో పడ్డారా? తిండితిప్పలు మానేసి రోగిష్టి బతుకు బతుకుతూ క్యాలరీలు, విటమిన్లు మీ చేతులారా వది లేసుకుంటున్నారా? అయితే, సులువైన పద్ధతులను పాటించి బలంగా, ఆరోగ్యంగా, నిత్య యవ్వనంగా, నవ్వుతూ జీవితాన్ని సాఫీగా కొనసాగించండి. అయితే దీనికి చిన్న చిట్కా వైద్యం మీకు అందుబాటులోనే ఉంది. అదేమిటంటే జామ చెట్టు. ఒకవేళ మీ పెరటిలోనే జామ చెట్టు ఉంటే బరువు తగ్గడమే కాకుండా చెడు కొలెస్ట్రాల్‌ని దూరంగా తరిమి కొట్టవచ్చు.
గుప్పెడు జామాకులని తీసుకొని, వాటిని కడిగి కొద్దిగా నీటిని మరిగించి అందులో వేసి చల్లార్చితే జామాకుల టీ తయారు అవుతుంది. ఈ టీని సేవించడం ద్వారా బోలెడు ఫలితాలు ఉంటాయి.
ఈ టీ రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని కరిగించే అత్యున్నత శక్తి ఉంది. దీని ఫలితంగా చాలా సులువుగా బరువు తగ్గుతారు.
జామాకుల టీని తాగితే శ్వాస సంబంధిత సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి.
జామాకులను శుభ్రంగా కడిగి నమిలి తింటూ ఉంటే పంటి నొప్పులు తగ్గుతాయి. నోటి పూత కూడా తగ్గుతుంది.
ఇందులో ఉండే యాంటి యాక్సిడెంట్లు నొప్పులు, వాపును నివారించే గుణాన్ని కలిగి ఉంటాయి.

అమరుల కుటుంబాలకు చేయూతివ్వాలి : కోదండరామ్

హైదరాబాద్ : అమరుల కుటుంబాలకు చేయూత ఇవ్వాలని టీజాక్ చైర్మన్ ప్రొ.కోదండరామ్ అన్నారు. నగరంలోని నాచారంలో టీజాక్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమం సందర్భంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాలన పారదర్శకంగా ఉండాలన్నారు. జిల్లాలను పునర్ వ్యవస్థీకరించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ వ్యవస్థను పటిష్టపర్చాలని కోరారు. ప్రైవేటీకరణ విధానాలకు ప్రభుత్వం స్వస్తిపలకాలని హితవు పలికారు. 

 

13:07 - April 10, 2016

కేరళ : అప్పటిదాకా ఆనందంతో కేరింతలు కొట్టారు. అంబరాన్నంటేలా సంబరాలు చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆ మరుక్షణమే అంతా మారిపోయింది. ఒకే ఒక్క నిమిషంలో ఆనందం ఆవిరైంది. చిన్న నిప్పురవ్వ పెను విషాదాన్ని రగిలించింది. సుందర మందిరం కాస్తా మరుభూమిగా మారిపోయింది. కేరింతల స్థానాన్ని ఆర్తనాదాలు ఆక్రమించాయి. ఇంతటి ఘోరానికి కారణం నిర్లక్ష్యం.. కొందరి నిర్లక్ష్యం అంతకు మించిన లెక్కలేనితనం పుట్టింగల్ దారుణానికి కారణమైంది.
కొల్లాం జిల్లా పారావూర్‌లో అగ్నిప్రమాదం 
కేరళలోని కొల్లాం జిల్లా పారావూర్‌లో ప్రసిద్ధిగాంచిన పుట్టింగల్‌దేవి ఆలయంలో తెల్లవారుజామున 3 గంటలకు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మీనా భరణి ఉత్సవాల కోసం భారీగా తెచ్చి నిల్వ చేసిన బాణాసంచా ఒక్కసారిగా పేలిపోయి వందమందికి పైగా మృతికి కారణమైంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 103కి చేరింది.
తెల్లవారుజామున 3 గం.లకు ప్రమాదం
తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘోర ప్రమాదం జరిగింది. మీన భరణి పండుగ వేడుకల్లో భాగంగా పుట్టింగల్ దేవాలయానికి భారీగా భక్తజనం వస్తారు. సుమారు 20 వేల మందికిపైగా ఆలయ వేడుకలకు హాజరయ్యారు. ఈ వేడుకల్లో భాగంగా పోటాపోటీగా బాణాసంచా పేల్చే సాంప్రదాయం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. పుట్టింగల్‌ దేవస్థానం బోర్డులోనే రెండు విభాగాలు పోటాపోటీగా ఫైర్‌ క్రాకర్స్ పేలుస్తుంటాయి. శనివారం సాయంత్రం నుంచే ఈ వేడుకలు నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్‌ను దేవస్థానం అనుమతి కోరగా ధ్వనికాలుష్యం, ఎన్నికల నేపథ్యంలో తొలుత అనుమతి నిరాకరించారు. స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిళ్ల నేపథ్యంలో బాణాసంచా పేల్చేందుకు అనుమతి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వేడుకలు జరుగుతాయంటూ రాత్రి 10 గంటలకు మైకుల్లో అనౌన్స్ చేశారు. అయితే ఆలస్యంగా ప్రకటన వెలువడడంతో భక్తులు కొంత తక్కువగా వచ్చారు. 
ఒక గదిలో భారీగా బాణాసంచా 
వేడుకల నేపథ్యంలో దేవస్థానం బోర్డు భారీగా బాణాసంచా కొనుగోలు చేసి ఒక గదిలో ఉంచింది. అయితే తెల్లవారుజామునుంచే భక్తుల రాక ఎక్కువగా ఉన్న సమయంలో ప్రమాదవశాత్తు బాణాసంచాపై నిప్పురవ్వలు పడి ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఫైర్‌ క్రాకర్స్‌ ఎగసిపడి సమీపంలోని వారు తీవ్రంగా గాయపడ్డారు. దీనికితోడు భక్తులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీయడంతో పెద్దయెత్తున తొక్కిసలాట జరిగింది. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. 
కొల్లాంకు బయల్దేరిన ప్రధాని మోదీ
ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి కొల్లాంకు బయల్దేరారు. ఆయన వెంట 15 మందితో కూడిన వైద్య బృందం బయల్దేరింది. కొల్లాం పుట్టింగల్‌ ఆలయం విషాదంపై ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 50 వేల రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రధాని ప్రకటించారు.
కొల్లం ప్రమాద ఘటనపై కేరళ సీపీఎందిగ్ర్భాంతి  
కొల్లం ప్రమాద ఘటనపై కేరళ సీపీఎం పార్టీ దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారాన్ని పార్టీ నిలిపివేస్తున్నట్టు రాష్ర్ట కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్‌ చెప్పారు. రెండు రోజులు కొల్లంలో క్షతగాత్రులకు సహాయక చర్యలను అందిస్తామన్నారు.

12:50 - April 10, 2016

విశాఖ : నక్కపల్లి జాతీయరహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. తాజాగా ఇవాళ మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 11 గంటల ప్రాంతంలో నక్కపల్లి వెళ్తున్న బైకు లారీని ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. అనంతరం ఎపి 16 బిజెడ్ 5624 నెంబర్ గల కారు బైక్ ను తప్పించబోయి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. కారు.. లారీ కిందికి దూసుకుపోయింది. కారును బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. కారులో మొత్తం నలుగురు ప్రయాణిస్తున్నారు. వీరిలో ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది. 

 

కొల్లాంకు బయల్దేరిన ప్రధాని

ఢిల్లీ : కొల్లం పుట్టింగల్ ఘటనపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. ప్రధాని ఢిల్లీ నుంచి కొల్లాం బయల్దేరారు. ఘటనాస్థలానికి చేరుకుని అక్కడి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకోనున్నారు. 

 

టీ.జేఏసీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభం

హైదరాబాద్ : తెలంగాణ జేఏసీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభం అయింది.ఈ సమావేశంలో పలు కీలకనిర్ణయాలు తీసుకోనున్నారు. 

11:57 - April 10, 2016

తూర్పుగోదావరి : రాజమండ్రిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోదావరి నాల్గో వంతెనపై లారీ-వ్యాన్‌ ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వ్యాన్‌ పూర్తిగా మంటల్లో చిక్కుకొని కాలిపోయింది. మరోవైపు లారీలో ఉన్న శెనక్కాయల బస్తాలన్నీ మంటలకు కాలిబూడిదయ్యాయి.  

11:52 - April 10, 2016

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో పాత ఎయిర్‌ ఇండియా విమానాన్ని క్రేన్‌ సాయంతో తీసుకెళ్తుండగా అదుపుతప్పి కిందపడిపోయింది. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి విమానాన్ని రోడ్డు మార్గంలో ఫిరోజ్‌గూడ షెడ్డుకు తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. విమానం కిందపడడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో తాడ్‌బండ్‌ నుంచి బోయిన్‌పల్లి వరకు రోడ్డు మార్గాన్ని మూసివేశారు. 

కొల్లాం పుట్టింగల్ మృతుల కుటుంబాలకు ప్రధాని ఆర్థికసాయం

ఢిల్లీ : కేరళలోని కొల్లాం పుట్టింగల్‌ ఆలయం విషాదంపై ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ కొల్లాం వెళ్లనున్నారు. తక్షణమే కొల్లాం వెళ్లాలని కేంద్ర వైద్యశాఖ మంత్రి జెపి నడ్డాను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని సూచించారు. మరోవైపు మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 50 వేల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రధాని ప్రకటించారు.

 

యాదగరిగుట్టకు పోటెత్తిన భక్తులు

నల్గొండ : యాదగరిగుట్టలో భక్తుల రద్దీ పెరిగింది. సర్వ దర్శనానికి 5 గంటల సమయం పడుతుండగా ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు. విద్యార్థులకు పరీక్షలు పూర్తికావడంతోనే భక్తుల సంఖ్య పెరిగినట్లు ఆలయ వర్గాలు తెలుపుతున్నాయి.

వరకట్న వేధింపులకు మహిళ బలి...

రంగారెడ్డి : జిల్లాలోని మంచాల మండలం లింగపల్లి గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. అత్తింటివారి వరకట్న వేధింపులకు తాళలేక కల్పన అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్ర కాలిన గాయాలతో ఉన్న బాధితురాలిని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కల్పన మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోన్నారు.

అమెరికాలో విమానం కూలి ముగ్గురి మృతి

అమెరికా : అలాస్కా ప్రాంతంలో ఓ విమానం కూలిపోయింది. జునో ప్రాంతంలోని అడ్మిరాల్టీ ద్వీపంలో విమానం కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు.

11:20 - April 10, 2016

త్రివేండ్రం : కేరళలోని కొల్లాం పుట్టింగల్ దేవాలయంలో తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్నిప్రమాదం ఘటనలో మృతులు సంఖ్యం క్షణక్షణం పెరుగుతుంది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 103కు చేరింది. 350 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 60 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇందులో 40 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. క్షతగాత్రును కొల్లం, త్రివేండ్రం వైద్ కళాశాలకు తరలించారు. ఆలయంలో మీన భరణి పండుగ వేడుకల్లో భాగంగా నిల్వచేసిన బాణాసంచా ఒక్కసారిగా పేలడంతో ఈ ఘోరం జరిగింది. 
మీన భరణి పండుగ వేడుకలు  
తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘోర ప్రమాదం జరిగింది. మీన భరణి పండుగ వేడుకల్లో భాగంగా పుట్టింగల్ దేవాలయానికి భారీగా భక్తజనం వస్తారు. సుమారు 20 వేల మందికిపైగా ఆలయ వేడుకలకు హాజరయ్యారు. ఈ వేడుకల్లో భాగంగా పోటాపోటీగా బాణాసంచా పేల్చే సాంప్రదాయం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. పుట్టింగల్‌ దేవస్థానం బోర్డులోనే రెండు విభాగాలు పోటాపోటీగా ఫైర్‌ క్రాకర్స్ పేలుస్తుంటాయి. శనివారం సాయంత్రం నుంచే ఈ వేడుకలు నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్‌ను దేవస్థానం అనుమతి కోరగా ధ్వనికాలుష్యం, ఎన్నికల నేపథ్యంలో తొలుత అనుమతి నిరాకరించారు. స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిళ్ల నేపథ్యంలో బాణాసంచా పేల్చేందుకు అనుమతి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వేడుకలు జరుగుతాయంటూ రాత్రి 10 గంటలకు మైకుల్లో అనౌన్స్ చేశారు. అయితే ఆలస్యంగా ప్రకటన వెలువడడంతో భక్తులు కొంత తక్కువగా వచ్చారు. 
ఒకే గదిలో భారీగా బాణాసంచా 
వేడుకల నేపథ్యంలో దేవస్థానం బోర్డు భారీగా బాణాసంచా కొనుగోలు చేసి ఒక గదిలో ఉంచింది. అయితే తెల్లవారుజామునుంచే భక్తుల రాక ఎక్కువగా ఉన్న సమయంలో ప్రమాదవశాత్తు బాణాసంచాపై నిప్పురవ్వలు పడి ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఫైర్‌ క్రాకర్స్‌ ఎగసిపడి సమీపంలోని వారు తీవ్రంగా గాయపడ్డారు. దీనికితోడు భక్తులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీయడంతో పెద్దయెత్తున తొక్కిసలాట జరిగింది. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. 
మరుభూమిని తలపిస్తోన్న పుట్టింగల్ దేవాలయ ప్రాంతం 
ఘోర అగ్నిప్రమాదంతో పుట్టింగల్ దేవాలయ ప్రాంతం మరుభూమిని తలపిస్తోంది. మృతుల బంధువుల ఆర్తనాదాలతో ఆలయ ప్రాంతం విషాదమయమైంది. గాయపడినవారు, వారి బంధువులతో ఆస్పత్రులు నిండిపోయాయి. తీవ్రంగా గాయపడినవారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించడం కోసం త్రివేండ్రం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 
ఘటనా స్థలానికి కేరళ సిఎం ఊమెన్‌చాంది 
ఘటనా స్థలానికి కేరళ సిఎం ఊమెన్‌చాంది, హోం మంత్రి, మంత్రులు, నేతలు చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై హోం మంత్రి జ్యుడీషియల్ విచారణకు ఆదేశించారు. క్షతగాత్రులకు తక్షణ వైద్యసాయం అందేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. 
పుట్టింగల్ విషాదంపై మోడీ దిగ్భ్రాంతి 
కేరళలోని కొల్లంపుట్టింగల్ లో జరిగిన ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ కేరళ వెళ్లనున్నారు. తక్షణమే కేరళ వెళ్లాలని కేంద్ర ఆరోగ్యమంత్రి జెపినడ్డాను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని పీఎం సూచించారు. అవసరమైతే హెలికాప్టర్లను ఉపయోగించి క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించాలని తెలిపారు. కేంద్రం నుంచి పూర్తి సహాయసహాకారాలుంటాయని ఆ రాష్ట్ర సీఎం ఉమెన్ చాందీకి పీఎం తెలిపారు.

 

11:01 - April 10, 2016

ఫ్లోరిడా : కేప్‌ కెనరవల్‌లో అద్భుతం ఆవిష్కృతమైంది. స్పేస్‌లోకి పంపిన రాకెట్‌ సురక్షితంగా.. సముద్రంపై ల్యాండ్‌ అయింది. ఇంధన పొదుపుతో పాటు.. ప్రమాదాల తీవ్రతను నివారించేందుకూ ఈ సరికొత్త విధానం ఉపకరిస్తుందని.. స్పేస్‌ఎక్స్ సంస్థ ప్రకటించింది. 
సముద్రంపైనే రాకెట్‌ ల్యాండ్‌
అంతరిక్షంలోకి పంపిన రాకెట్‌ను.. ఇంతకాలం భూమిపై మాత్రమే ల్యాండ్‌ చేసేవారు. అయితే.. ప్రమాదాలు జరిగినప్పుడు.. దీనివల్ల.. నష్టం భారీ స్థాయిలో ఉండేది. ఈ క్రమంలో.. అమెరికాకు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ.. ఓ అద్భుతాన్ని ఆవిష్కరించింది. నింగి నుంచి నేలపైకి కాకుండా.. సముద్రంపైనే రాకెట్‌ను ల్యాండ్‌ చేయించింది. 
నింగిలోకి ఫాల్కన్‌ 9 అనే రాకెట్‌ ప్రయోగం
నిరుడు డిసెంబర్‌లో స్పేస్‌ఎక్స్ కంపెనీ ఫాల్కన్‌ 9 అనే రాకెట్‌ను నింగిలోకి  ప్రయోగించింది. తాజాగా దాన్ని ఫ్లోరిడాలోని కేప్‌ కెనరవల్‌లో విజయవంతంగా సముద్రంపై ల్యాండ్‌ చేసింది. ఇప్పుడు సముద్రంపై కూడా రాకెట్‌ను క్షేమంగా దించడం వల్ల భవిష్యత్‌లో రాకెట్‌ ప్రయోగాలకు అయ్యే ఖర్చు గణనీయంగా తగ్గుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. రాకెట్‌ను సురక్షితంగా దించడం వల్ల మళ్లీ దాన్ని వాడే అవకాశం ఉంటుందని, దాంతో ఖర్చు కూడా ఆదా చేసుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఒకవేళ సముద్ర ఉపరితలపై రాకెట్‌ పేలినా దాని వల్ల పెద్ద నష్టమేమీ ఉండదని స్పేస్‌ఎక్స్‌ భావిస్తోంది. 
భవిష్యత్ లో పునర్వినియోగ వాహక నౌకల వాడకం..
భవిష్యత్‌లో నిర్వహించే రాకెట్‌ ప్రయోగాల్లో ఎక్కువ శాతం పునర్వినియోగ వాహక నౌకలనే వాడనున్నారు. ఆ రాకెట్లలో మూడో వంతు శాతం మాత్రమే నేలపై దించుతారు. మిగతా అన్ని రాకెట్లను నీటిపై దించేందుకే ప్రయత్నిస్తున్నట్లు స్పేస్ఎక్స్‌ వెల్లడించింది. సముద్రంపై రాకెట్‌ను దింపిన స్పేస్ఎక్స్‌ సంస్థకు అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా అభినందనలు తెలిపారు. భూమి నుంచి ఎగిరిన రాకెట్‌ తిరిగి భూమికి వచ్చే దూరం కన్నా సముద్రాన్ని టార్గెట్‌ చేసుకునే దూరం తక్కువని కూడా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

 

10:48 - April 10, 2016

ఢిల్లీ : సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌పై మరోసారి దాడి జరిగింది. ఓ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ఆమ్‌ ఆద్మీ సేనకు చెందిన ఓ కార్యకర్త కేజ్రీవాల్‌పై షూ విసిరాడు. కాలుష్య నివారణ కోసం మళ్లీ సరి-బేసి విధానాన్ని అమలు చేసేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 
కేజ్రీవాల్‌ షూ విసిరిన ఆప్ కార్యకర్త 
ఏ ముహూర్తంలో రాజకీయాల్లోకి ఎంటరయ్యాడో గానీ.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై అప్పుడప్పుడు దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీలో కాలుష్యం నివారణ కోసం మళ్లీ సరి-బేసి విధానాన్ని అమలు చేసేందుకు కేజ్రీవాల్‌ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమ్‌ ఆద్మీ సేనకు చెందిన కార్యకర్త ఆయనపై షూ విసిరాడు. పక్కనే ఉన్న వ్యక్తులు అడ్డుకోవడంతో షూ పక్కన పడింది. చెప్పు విసిరిన వ్యక్తిపై ఆప్‌ కార్యకర్తలు దాడి చేశారు. 
కేజ్రీవాల్‌ను చెంప దెబ్బ కొట్టిన ఆటో డ్రైవర్‌ 
అయితే.. కేజ్రీవాల్‌పై దాడులు జరగడం కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇలాంటి దాడులు చాలానే జరిగాయి. 2013 నవంబర్‌లో అన్నాహజారే మద్దతుదారునిగా ఉన్న ఓ వ్యక్తి కేజ్రీవాల్‌.. ఇతర ఆప్‌ లీడర్లపై ఇంకు దాడి చేశారు. ఆ తర్వాత 2014 మార్చిలో వారణాసిలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కొందరు వ్యక్తులు కేజ్రీవాల్‌పై కోడిగుడ్లు, ఇంకుతో దాడి చేశారు. అదే ఏడాది ఏప్రిల్‌లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో దక్షిణ్‌పురి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కేజ్రీవాల్‌ వెనక నుంచి దాడి చేశారు. ఇక ఈ దాడి జరిగిన నాలుగు రోజుల అనంతరం ఢిల్లీలోని సుల్తాన్‌పురి ఏరియాలో ఓ ఆటోరిక్షా డ్రైవర్‌ కేజ్రీవాల్‌ను చెంపదెబ్బ కొట్టాడు. 
కేజ్రీవాల్‌పై భావనా అరోరా ఇంక్‌ దాడి  
అదేవిధంగా ఈ ఏడాది జనవరిలో సరి-బేసి విధానం విజయవంతం అయ్యిదంటూ ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆమ్‌ఆద్మీ సేన కార్యకర్త భావనా అరోరా కేజ్రీవాల్‌పై ఇంక్‌ దాడికి పాల్పడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పంజాబ్‌ పర్యటనలోనూ కేజ్రీవాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. కొందరు దుండగులు ఆయన కారుపై దాడి చేయడం జరిగింది. అతి తక్కువ కాలంలో రాజకీయాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. ఢిల్లీ అధిష్టాన పగ్గాలు అందుకున్న కేజ్రీవాల్‌పై వ్యతిరేక శక్తులు దాడులకు పాల్పడుతూనే ఉన్నాయి. మరోవైపు తనపై ఎంతమంది ఎలాంటి దాడులు చేసినా తాను అనుకున్నది చేసి తీరుతానని కేజ్రీవాల్‌ అంటున్నారు. 

10:44 - April 10, 2016

హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పనామా పత్రాల తాకిడి తెలుగు నేలనూ తాకింది. దుబాయి కేంద్రంగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్న పారిశ్రామికవేత్త మధు కోనేరు అవినీతికి సంబంధించిన ఆధారాలను పనామా పత్రాలు బయటపెట్టాయి. పనామ అనుంబంధ సంస్థ  మొసాక్‌ ఫోన్సెకా  ఆయనకు సంబంధించిన పలు వివరాలను ప్రస్తావించినట్లు ఇండియన్‌ ఎక్స్ ప్రెస్‌ కథనం పేర్కొంది.
ఇండియన్‌ ఎక్స్ ప్రెస్ దర్యాప్తులో వెల్లడి
దుబాయిలో నివసిస్తున్న తెలుగు వ్యాపారవేత్త కోనేరు మధు పేరు పనామా పత్రాల్లో బయటపడింది. పనామా న్యాయసంస్థ మొసాక్‌ ఫోన్సెకా ద్వారా వివిధ ప్రాంతాల్లో 12 కంపెనీలను నెలకొల్పినట్టు పనామా పత్రాల్లో వెల్లడైంది. పరిశ్రమలకు ఖనిజాల్ని సమకూర్చే వ్యాపారం చేస్తున్న మధు, ఆయన తండ్రి కోనేరు రాజేంద్ర ప్రసాద్‌లపై రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో గతంలో సిబిఐ ఛార్జిషీట్‌ నమోదైంది. దుబాయిలోని ట్రైమెక్స్‌ గ్రూప్‌ సంస్థల కార్యనిర్వాహక డైరెక్టరయిన కోనేరుపై కేసులను పనామా న్యాయసంస్థ క్షుణ్ణంగా పరిశీలించినట్టు బయటపడింది.ఈ వ్యవహారం నుంచి వారిని చాకచక్యంగా తప్పించడంలో మొసాక్‌ ఫోన్సెకా ప్రధాన పాత్ర పోషించినట్లు ఇండియన్‌ ఎక్స్ ప్రెస్ దర్యాప్తులో వెల్లడైంది.
స్థిరాస్తి ప్రాజెక్టు కోసం
స్థిరాస్తి ప్రాజెక్టు కోసం దుబాయిలోని ఎమ్మార్‌, ఆంధ్రప్రదేశ్‌ ఇండిస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ కార్పొరేషన్‌ల మధ్య కుదిరిన భూ ఒప్పందం కుంభకోణంపై ఫిబ్రవరి, 2012లో ట్రైమెక్స్‌ కంపెనీ అధినేతపై సిబిఐ కేసు నమోదు చేసింది. అయితే రెండు నెలల తర్వాత మధు కోర్టు ముందు హాజరయ్యారు. కోనేరు రాజేంద్ర ప్రసాద్‌ ఏప్రిల్‌లో కోర్టులో లొంగిపోయారు. అనంతరం కోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. అభియోగపత్రం ప్రకారం.. అత్యంత విలాసవంతమైన ఫ్లాట్‌ యజమానుల నుంచి కోనేరు రాజేంద్ర ప్రసాద్‌ 138 కోట్లు తీసుకొని, ఆ మొత్తాన్ని దుబాయిలోని మధు కోనేరుకు పంపించారు. ఈ వివరాలను ట్రైమెక్స్‌ గ్రూప్‌ 2013, ఏప్రిల్‌ 9న మొసాక్‌ ఫోన్సెకాకు అందజేసింది
కేసు కొత్త మలుపు
మాజీ సిబిఐ డైరెక్టర్‌ ఎపి సింగ్‌, ప్రముఖ మాంసం వ్యాపారవేత్త ఖురేషిల మధ్య జరిగిన చాటింగ్‌లో మధు పేరు రావడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. మధును బయటపడేయడానికి సాక్షాత్తూ ఆయన అన్నయ్య ప్రదీప్‌ నేరుగా ఖరేషిని సంప్రదించినట్లు ఆ సందేశాల ద్వారా తెలిసింది. ఇప్పుడు కొత్తగా విడుదలైన పనామా అంతర్గత మెయిళ్లు, పత్రాల్లో మధుకు సంబంధించిన మరెన్నో విషయాలు బయటపడ్డాయి.
విదేశాల్లో పరిశ్రమల ఏర్పాటుకు మధు ప్రయత్నం
2007 నుంచే విదేశాల్లో పరిశ్రమల ఏర్పాటుకు మధు ప్రయత్నించారు. ముఖ్యంగా బ్రిటీష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లో ఎమ్‌ఎఫ్‌ సాయంతో నెలకొల్పినట్లు ఈ పత్రాలు స్పష్టం చేస్తున్నాయి.ఆయన ప్రారంభించిన ఒక కంపెనీలో సుమారు యాభైవేల షేర్లు ఉండేవి. ఒక్కో షేర్‌ ధర 53 వేల దాకా ఉన్నట్లు లెబనాన్‌కు చెందిన ఓ ఉద్యోగి వివరించారు. 
2011-12 లో మధుకోనేరుపై సిబిఐ విచారణ 
2011-12 లో మధుకోనేరుపై సిబిఐ విచారణ జరిగింది. కానీ బివిఐకు చెందిన ఆర్థిక దర్యాప్తు సంస్థ-ఎఫ్‌ఐఎ 2010కు ముందే మోసాక్‌తో ఆయనకు గల సంబంధాల్ని ప్రశ్నిస్తూ వచ్చింది. అయినా సిబిఐ దర్యాప్తులో దీనికి సంబంధించి దర్యాప్తు జరగకపోవడం విశేషం. మధు డైరెక్టర్‌గా ప్రెస్టన్‌ అసెట్స్‌ హోల్డింగ్‌ కంపెనీ ఒకటి రిజిస్ట్రేషన్‌ అయింది. హవాలా, ఉగ్రవాది నిరోధక చట్టం కింద ఆ కంపెనీ రిజిస్ట్రేషన్‌ పత్రాలన్నిటినీ సమర్పించాలని కోరుతూ ఎమ్‌ఎఫ్‌ మనీ లాండరింగ్‌ అధికారిని ఎఫ్‌ఐఎ గతంలో కోరింది. ఈ కంపెనీకి మరో డైరెక్టర్‌గా ఉన్న ఖాతర్‌ మస్సాద్‌ను ఎమ్‌ఎఫ్‌ తన పత్రాల్లో రాజకీయ వ్యక్తిగా పేర్కొంది. అవేగాక షెర్విన్‌ హోల్డింగ్స్‌, గ్లోబల్‌ యాక్సెస్‌ కేపిటల్‌, మినరల్స్‌ ఎనర్జీ కమోడిటీస్‌ లిమిటెడ్‌ సంస్థలు కూడా రిజిస్టర్‌ అయ్యాయి. అయితే సెప్టెంబర్‌, 2012లోనే మసాద్‌ ఆ కంపెనీకి రాజీనామా చేశాడు. ఓ వైపు సిబిఐ దర్యాప్తు జరుగుతున్నప్పటికీ ఎమ్‌ఎఫ్‌ మధు కోనేరుకు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఏప్రిల్‌9, 2013న ట్రైమెక్స్‌ ఎగ్జిక్యూటివ్‌ షోనాలి చౌదరి మధు తరపున వివరణ ఇచ్చింది. ఆయనకు ప్రెస్టన్‌ కంపెనీలో ఎలాంటి పెట్టుబడులు లేవని వివరణిచ్చారు. కేవలం ఆరోపణల ఆధారంగానే తనపై సిబిఐ కేసు నమోదు చేసిందని అందులో పేర్కొన్నారు. మాంసం ఎగుమతిదారు మొయిన్‌ ఖురేషీతో తాను ఎమ్మార్‌ భూ ఒప్పందం కేసు గురించి చర్చించినట్టు వచ్చిన వార్తలపై  సీబీఐ మాజీ చీఫ్‌ ఎ.పి.సింగ్‌ స్పందించారు. కోనేరు కుటుంబసభ్యుల కేసు గురించి, దీనిపై సీబీఐ దర్యాప్తు గురించి బ్లాక్‌బెరీ మెసెంజర్‌ ద్వారా ఎలాంటి సందేశాల మార్పిడి జరగలేదని తెలిపారు. 

 

కేరళలో అగ్నిప్రమాదంలో 102 మందికి చేరిన మృతు సంఖ్య

త్రివేండ్రం : కేరళలోని కొల్లంపుట్టింగల్ దేవి ఆలయంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతంది. ఇప్పటివరకు 102 మంది మృతి చెందారు. మరో 250 మందికి గాయాలయ్యాయి. 

09:47 - April 10, 2016

ఢిల్లీ : కేరళలోని కొల్లంపుట్టింగల్ లో జరిగిన ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ కేరళ వెళ్లనున్నారు. తక్షణమే కేరళ వెళ్లాలని కేంద్ర ఆరోగ్యమంత్రి జెపినడ్డాను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని పీఎం సూచించారు. అవసరమైతే హెలికాప్టర్లను ఉపయోగించి క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించాలని తెలిపారు. కేంద్రం నుంచి పూర్తి సహాయసహాకారాలుంటాయని ఆ రాష్ట్ర సీఎం ఉమెన్ చాందీకి పీఎం తెలిపారు. కేరళలోని కొల్లం పుట్టింగల్ దేవి దేవాలయంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 84 మంది మృతి చెందారు. మరో 200 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను కొల్లం, త్రివేండ్రం ఆస్పత్రులకు తరలించారు. ఆలయంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. 

 

బోయిన్ పల్లిలో తప్పిన ప్రమాదం

హైదరాబాద్ : బోయిన్ పల్లిలో ప్రమాదం తప్పింది. విమానాన్ని తరలిస్తుండగా క్రేన్ బ్యాలెన్స్ తప్పింది. దీందో విమానం కిందపడిపోయింది. 

 

నేడు కోల్ కత్తా-ఢిల్లీ మధ్య మ్యాచ్

ముంబయి : ఐపీఎల్-2016లో భాగంగా నేడు కోల్ కత్తా-ఢిల్లీ మధ్య మ్యాచ్ జరుగనుంది. కోల్ కతా వేదికగా రాత్రి 6 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

09:30 - April 10, 2016

హైదరాబాద్ : రాంగోపాల్‌వర్మ.. సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్‌ అడ్రస్‌..! ఎప్పుడూ తనకు తోచిన వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలిచే వర్మ.. ట్విట్టర్‌ వేదికగా మరోసారి.... సంచలనానికి కారణమయ్యాడు. బాహుబలి మూవీకి బాలీవుడ్‌లో లభించిన క్రేజ్ ను.. పవన్‌ తన సర్దార్‌ గబ్బర్‌సింగ్‌తో దెబ్బతీశాడని ట్వీట్ చేయడంతో.. పవన్‌ అభిమానులు వర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్మ రెండు రోజుల్లో పవన్‌ కళ్యాణ్‌కు క్షమాపణలు చెప్పకపోతే.. వర్మ ఇంటి ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు నెల్లూరు జిల్లా పవన్‌కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు.
సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ తెలుగు సినిమా పరువును పాతాళానికి దిగజార్చింది
మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి రాంగోపాల్‌వర్మ వార్తల్లో నిలిచాడు. సర్దార్‌గబ్బర్‌సింగ్‌ రిలీజ్‌కు ముందు ప్రభాస్‌ కంటే పవన్‌కళ్యాణ్‌కే క్రేజ్‌ ఎక్కువ అని సెలవిచ్చినా వర్మ.. తాజాగా చిత్రం విడుదలైన తర్వాత రివర్స్ అయ్యాడు. సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ తెలుగు సినిమా పరువును పాతాళానికి దిగజార్చిందని వర్మ ట్వీట్‌ చేశారు. బాహుబలి సినిమాతో టాలీవుడ్‌ క్రేజ్‌ ఆకాశానికి పెరిగితే.. పవన్‌ తాజా తెలుగు సినిమా ప్రతిష్టను దిగజార్చిందని వర్మ మండిపడ్డాడు. 
వర్మపై పవన్‌ అభిమానులు ఆగ్రహం 
అయితే.. వర్మ ట్వీట్‌పై పవన్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్మకు పిచ్చి ముదిరి తిక్కతిక్కగా మాట్లాడుతున్నారన్నారు. బాహుబలి సినిమాతో సర్ధార్‌ గబ్బర్‌సింగ్‌ను ఎప్పుడూ పవన్‌కళ్యాణ్‌ పోల్చలేదని.. ఆ విధంగా ముందు పోల్చింది వర్మనే అని పవన్‌ అభిమానులు అంటున్నారు. రాజకీయాల్లో పవన్‌ కళ్యాణ్‌కు పెరుగుతున్న క్రేజ్‌ను దెబ్బతీసేందుకు వర్మ ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని పవన్‌ అభిమానులు మండిపడుతున్నారు. మొత్తానికి పవన్‌కళ్యాణ్‌పై వర్మ ట్వీట్‌లు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచిచూడాలి. 

09:17 - April 10, 2016

గుంటూరు : దుండగుల చేతిలో హత్యకు గురైన అటవీశాఖ ఉద్యోగుల కుటుంబాలను మంత్రి ప్రత్తిపాటితో సహా ఉన్నతాధికారులు పరామర్శించారు. ఘటనపై విచారణకు ఆదేశించిన కలెక్టర్‌.. నిందితులు ఎంతటివారైనా కఠినచర్యలు తప్పవన్నారు. మరోవైపు బాధిత కుటుంబాలకు సర్కార్‌ ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.  
కలప దొంగలు తెగబడ్డారు
గుంటూరు జిల్లాలో కలప దొంగలు తెగబడ్డారు. బొల్లపల్లి అటవీ ప్రాంతంలో ఇద్దరు అటవీశాఖ అధికారులు అత్యంత దారుణంగా నరికిచంపారు. బొల్లపల్లి, కారంపూడి, ఈపూరు, దుర్గి తదితర మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో టన్నులకొద్దీ కలప విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తున్నారు. వీరికి తోడు బొగ్గు తయారు చేసే వారు కూడా నల్లమల అడవుల్లోని కలపను గుట్టుచప్పుడు కాకుండా తరలించుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కొద్దిరోజులుగా అటవీ శాఖ అధికారులు నిఘా పెంచారు. బొల్లపల్లి మండలం నెహ్రూనగర్‌ తండా అడవిలో కలప నరుకుతున్నారన్న సమాచారం ఫారెస్ట్‌ అధికారులకు చేరింది. సమాచారం అందుకున్న వినుకొండ ఫారెస్ట్‌ బీట్‌ సిబ్బంది లాజర్‌, బాజీ షాహీద్‌ హుటాహుటినా అక్కడికి చేరుకుని కలప నరికివేతను అడ్డుకున్నారు. తులసీనాయక్‌ నాయకత్వంలోని కలప స్మగ్లర్లు బీట్‌ అధికారులతో వాదనకు దిగారు. పరిస్థితి విషమిస్తుండటంతో బీట్‌ అధికారులు విషయాన్ని ఉన్నతాధికారులకు ఫోన్‌లో వివరించారు. అదే సమయంలో స్మగ్లర్లు ఇద్దరు ఫారెస్ట్‌ అధికారులను గొడ్డలితో నరికి అక్కడినుంచి పారిపోయారు. 
నిందితులను అరెస్టు చేయాలని : మంత్రి పత్తిపాటి
ఘటనా స్థలాన్ని వినుకొండ ఫారెస్ట్ అధికారులు సందర్శించారు. నిందితులెంతటి వారైనా వదిలేది లేదని, వెంటనే పూర్తిస్థాయి దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేయాలని కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే, మంత్రి పత్తిపాటి పుల్లారావు అధికారులను ఆదేశించారు. !
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా
హత్యకు గురైన అటవీ శాఖాధికారులకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.  లాజర్‌ కుటుంబానికి 25 లక్షలు, ఇంటిస్థలం, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ప్రకటించారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగి అయిన షాహిద్‌ కుటుంబానికి 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా.. కుటుంబ సభ్యుల్లో ఒకరికి కాంట్రాక్ట్‌ ఉద్యోగం కల్పిస్తామని అధికారులు తెలిపారు. ఇక శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్ల అరాచకాలు మరవకముందే గుంటూరు జిల్లాలో కలప స్మగ్లర్ల ఆగడాలు మితి మీరడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

 

కేరళ ప్రమాదంలో 86 కు చేరిన మృతుల సంఖ్య

త్రివేండ్రం : కేరళలోని కొల్లం పుట్టింగల్ దేవి దేవాలయంలో జరిగిన భారీ అగ్నిప్రమాదం ఘటనలో మృతులు సంఖ్యం పెరిగింది. ఇప్పటి వరకు 86 మంది మృతి చెందారు. మరో 200 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను కొల్లం ఆస్పత్రికి తరలించారు. ఆలయ ఉత్సవాల్లో బాణాసంచా పేల్చుతుండగా ఘటన చోటుచేసుకుంది. ఆలయంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. 

 

కేరళ ప్రమాదంలో 84కు చేరిన మృతుల సంఖ్య

త్రివేండ్రం : కేరళలోని కొల్లం పుట్టింగల్ దేవి దేవాలయంలో జరిగిన భారీ అగ్నిప్రమాదం ఘటనలో మృతులు సంఖ్యం పెరిగింది. ఇప్పటి వరకు 84 మంది మృతి చెందారు. మరో 200 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను కొల్లం ఆస్పత్రికి తరలించారు. ఆలయ ఉత్సవాల్లో బాణాసంచా పేల్చుతుండగా ఘటన చోటుచేసుకుంది. ఆలయంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. 

07:57 - April 10, 2016

హైదరాబాద్ : తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి... టీ-జాక్‌ దూకుడు పెంచాలని భావిస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని... తద్వారా తెలంగాణ ప్రజల  మ్యానిఫెస్టో అమలుకు ప్రయత్నించాలని ప్రణాళికలు రచిస్తోంది. రెండేళ్లుగా స్తబ్దుగా ఉండి.. ప్రస్తుతం యాక్టివ్‌ రోల్‌ ప్లే చేయాలని భావిస్తోన్న టీజాక్.. భవిష్యత్‌ 
తెలంగాణ ఉద్యమంలో టీజాక్ కీలకపాత్ర
తెలంగాణ ఉద్యమంలో ప్రధాన రాజకీయ పార్టీలను పరుగులు పెట్టించిన టీజాక్... మళ్లీ అదే స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని భావిస్తోంది.  ఉద్యమంలో కీలక భూమిక నిర్వహించిన టీ-జాక్‌ టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక.. గడచిన రెండేళ్లుగా స్తబ్దుగా ఉంది. దీంతో.. జాక్ నుంచి ప్రధాన భాగస్వామ్య పక్షాలు, ఉద్యోగ సంఘాలు,  రాజకీయ పార్టీలు బయటకు వెళ్లిపోయాయి. దాదాపుగా జాక్‌ ఉనికి లేదన్న భావన ప్రజల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో.. కొత్త వ్యూహాలతో ప్రజలకు చేరువ కావాలని టీ-జాక్‌ నిర్ణయించుకుంది. భవిష్యత్‌ కార్యాచరణ నిర్దేశించుకునేందుకు.. ఆదివారం కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. 
జిల్లా స్టీరింగ్ కమీటిలకు ఆహ్వనం
ఆదివారం నాటి విస్తృత సమావేశానికి జిల్లాల స్టీరింగ్‌ కమిటీలనూ ఆహ్వానించారు. సమావేశపు అజెండానూ ఈసరికే నిర్ణయించేశారు. తెలంగాణలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు..  ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపైనా అనుసరించాల్సిన వ్యూహాలను ఆదివారం నాటి సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపైనా ఇప్పటికే క్షేత్రస్దాయిలో అధ్యయనం చేసిన జేఏసీ.. ప్రస్తుతం  రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన ప్రాజేక్టుల రీడిజైనింగ్ పైనా ప్రత్యేకంగా దృష్టి సారించింది. 
అధికార పార్టీ ఇచ్చిన హమీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి
ఇకపై ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్లాలని టీ-జాక్‌ భావిస్తోంది. వివిధ అంశాల్లో ప్రభుత్వ తీరుపై పోరాడుతూనే.. జాక్‌కు పూర్వ వైభవం తీసుకురావాలన్నది జాక్‌ భాగస్వామ్య పక్షాల ఆలోచనగా తెలుస్తోంది. విద్య, వైద్యం, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం, తదితర అంశాలపై ఎన్నికల సమయంలో టీఆర్ఎస్‌ పార్టీ ఇచ్చిన హమీల అమలుకు ఒత్తిడి పెంచాలని జాక్‌ చూస్తోంది. అదే సమయంలో జిల్లా, మండల స్థాయి కమిటీలను పరిపుష్టం చేయాలని కూడా టీ-జాక్‌ భావిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం నాటి సమావేశంతో భవిష్యత్తులో జేఏసీ ఎలా వ్యవహరిస్త్తుందన్న అంశంపై స్పష్టత  రానుంది. 

కేరళలో భారీ అగ్నిప్రమాదం... 75 మంది మృతి

త్రివేండ్రం : కేరళలోని కొల్లం పుట్టింగల్ దేవి దేవాలయంలో జరిగిన భారీ అగ్నిప్రమాదం ఘటనలో 75 మంది మృతి చెందారు. మరో 150 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఆలయ ఉత్సవాల్లో బాణాసంచా పేల్చుతుండగా ఘటన చోటుచేసుకుంది. ఆలయంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. 

06:42 - April 10, 2016

త్రివేండ్రం : కేరళలో మహా విషాదం నెలకొంది. కొల్లం పుట్టింగల్ దేవి దేవాలయంలో తెల్లవారు జామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. ఇప్పటివరకు 103 మంది మృతి చెందారు. మరో 350 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను కొల్లం, త్రివేండ్రం ఆస్పత్రులకు తరలించారు. ఘోర అగ్నిప్రమాదంతో పుట్టింగల్ దేవాలయ ప్రాంతం మరుభూమిని తలపిస్తోంది. మృతుల బంధువుల ఆర్తనాదాలతో ఆలయ ప్రాంతం విషాదమయమైంది. గాయపడినవారు, వారి బంధువులతో ఆస్పత్రులు నిండిపోయాయి. తీవ్రంగా గాయపడినవారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించడం కోసం త్రివేండ్రం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆలయంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. 
వివరాల్లోకి వెలితే... కొల్లం పుట్టింగల్ దేవి దేవాలయంలో ప్రతి ఏడాది మీనాభరణి పండుగ వేడుకలు నిర్వహిస్తారు. వేలాది మంది ఈ ఉత్సవాలను చూసేందుకు తరలివస్తారు. ప్రతి సంవత్సరం లాగా ఏడాది కూడా ఉత్సవాలను నిర్వహించారు. వేలాది మంది ఉత్సవాలను చూసేందుకు తరలివచ్చారు. అయితే ఈ ఉత్సవాల్లో భాగంగా పుట్టింగల్ దేవస్థానంలో పోటాపోటీగా బాణాసంచా పేల్చుతారు. దేవస్థానం భారీగా బాణాసంచా కొనుగోలు చేసి గదిలో ఉంచారు. అయితే బాణాసంచా పేల్చేందుకు జిల్లా కలెక్టర్ అనుమతి ఇవ్వలేదు. అయితే రాజకీయ నేతల ఒత్తిడి కారణంగా బానాసంచా పేల్చడానికి కలెక్టర్ అనుమతిచ్చారు. ఈనేపథ్యంలో రాత్రి 10 గంటలకు బాణాసంచా పేల్చడానికి అనుమతిస్తున్నట్లు మైక్ ద్వారా అనౌన్స్ మెంట్ చేశారు. దీంతో ఉత్సవాల్లో బాణాసంచా పేల్చారు. ఈక్రమంలో  తెల్లవారుజామున 3.30 గంటలకు ఆలయంలో పక్కనే బిల్డింగ్ పైన ఉంచిన టాపాసులపై నిప్పురవ్వలు ఎగిరిపడ్డాయి. టాపాసులు భారీ మొత్తంలో పేలడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 103 మంది మృతి చెందారు. మృతుల్లో ఒక పోలీసు అధికారి కూడా ఉన్నారు. మరో 350 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్రాకర్స్ సమీపంలో ఉన్నవారిపై పడడంతో వారు పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట జరిగి మృతుల సంఖ్య పెరిగిపోయింది. ఇంకా మృతుల సంఖ్య, క్షతగాత్రుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులను కొల్లం ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉన్నవారిని త్రివేండ్రం తరలించారు. మెరుగైన చికిత్స అందిస్తున్నారు. వివిధ ఆస్పత్రుల్లో 180 మంది చికిత్స పొందుతున్నారు. 
ఘటనాస్థలికి చేరుకున్న సీఎం ఉమెన్ చాంధీ
డీజీపీతో పాటు పోలీసు బలగాలు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. సీఎం ఉమెన్ చాందీ కూడా ఘటనాస్థలానికి వెళ్లారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అవసరమైతే వేరే రాష్ట్రాలకు తరలించైనా వైద్యం అదించాలని నిర్ణయం తీసుకున్నారు. క్షతగాత్రులకు తక్షణ సహాయం అందేలా చూడాలని సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించే అవకాశం ఉంది. ఈఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీకి సీఎం ఆదేశించారు. సీఎం ఉమెన్ చాందీతోపాటు హోమంత్రి రమేష్, మంత్రులు, నేతలు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఆలయంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. శిథిలాల కింద కూడా మృతులు ఉన్నట్లు భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 
పుట్టింగల్ విషాదంపై ప్రధాని నరేంద్రమోడీ దిగ్ర్భాంతి 
కొల్లంపుట్టింగల్ లో జరిగిన ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ కేరళ వెళ్లనున్నారు. తక్షణమే కేరళ వెళ్లాలని కేంద్ర ఆరోగ్యమంత్రి జెపినడ్డాను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని పీఎం సూచించారు. అవసరమైతే హెలికాప్టర్లను ఉపయోగించి క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించాలని తెలిపారు. కేంద్రం నుంచి పూర్తి సహాయసహాకారాలుంటాయని ఆ రాష్ట్ర సీఎం ఉమెన్ చాందీకి పీఎం తెలిపారు.

 

కేరళలో విషాదం....

కేరళ : కొల్లంలోని పుట్టింగల్ దేవి దేవాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 62 మంది మృతి చెందారు. మరో 140 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఆలయ ఉత్సవాల్లో బాణాసంచా పేల్చుతుండగా ఘటన చోటుచేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. 

Don't Miss