Activities calendar

14 April 2016

21:17 - April 14, 2016

హైదరాబాద్ : తెలంగాణలో వేసవి సెలవులను రీషెడ్యూల్ చేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16 నుంచి జూన్ 12వరకు వేసవి సెలవులుగా ప్రకటించింది. జూన్ 13 నుంచి 2016-17 విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. రాష్ట్రంలో ఎండ తీవ్రత, వడగాలుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  

జపాన్ లో భూకంపం

హైదరాబాద్ : జపాన్ లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టరు స్కేలుపై 6.4 గా నమోదైంది. కుష్యూలోని కుమామోటో ప్రాంతంలో భూమిలోపల పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని జపాన్ అధికారులు వెల్లడించారు. అయితే సునామీ హెచ్చరికలు జారీ చేయకపోవడంతో తీరప్రాంతదేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. 

ఎల్లుండి నుండి పాఠశాలకు వేసవి సెలవులు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎల్లుండి నుంచి పాఠశాలలకు వేసవి శెలవులు ప్రకటించింది. ఎండలు మండుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జూన్ 13 నుంచి తిరిగి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.

అంబేద్కర్ జయంతి వేడుకల్లో అపశృతి

గుంటూరు: తుళ్లూరు మండలం బోరుపాలెంలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో అపశృతి దొర్లింది. ట్రక్కులో ఉంచిన బాణాసంచా పేలి ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

20:27 - April 14, 2016

హైదరాబాద్ : జంటనగరాల బీమా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్‌ 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అంబేద్కర్‌ చూపిన మార్గం అందరికీ ఆదర్శనీయమని ఈ సందర్భంగా పలువురు వక్తలు కొనియాడారు. అంబేద్కర్‌ ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకుని ప్రొఫెసర్‌ గాలి వినోద్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఈ సెమినార్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆల్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ వి. రమేష్‌, తెలంగాణ మహిళా ఉప సంఘం కన్వీనర్‌ అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. 

20:26 - April 14, 2016

మధ్యప్రదేశ్ : పల్లెలు పటిష్టంగా ఉంటేనే భారతదేశం ఆర్థికంగా పురోగతి సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోది అన్నారు. కొంతమంది పారిశ్రామికవేత్తలు, కొన్ని నగరాల వల్ల అభివృద్ధి జరగదని స్పష్టం చేశారు. గ్రామీణ వికాసం గాంధీజీ, అంబేద్కర్‌ల ఆశయమని... స్వాతంత్రం వచ్చి 60 ఏళ్లు దాటినా ఆ లక్ష్యానికి ఇంకా చేరుకోలేకపోయామని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని అంబేద్కర్‌ జన్మస్థలం మహూలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ ఓ వ్యక్తి కాదని నైతిక విలువలకు మరో రూపమని మోది అభివర్ణించారు.

 

20:23 - April 14, 2016

అంబేద్కర్ ఆశయాలను సాధిస్తారంట నేతలు..66ఏళ్ల సంధి అవే కూతలు, ఎండలో గడ్డపార పట్టి కష్టపడుతున్న చంద్రాలు...తవ్విన తావులో తవ్వితో చూసిండ్రు జనాలు, ఆంధ్రప్రదేశ్ లో ఇంకా పెరిగిపోతున్న నీళ్ల గోస...లీడర్లు పెడతలేరట జనంధ్యాస, పీనుగుల నడుమ తాగుబోతుల తైతక్కలు... శవాలు చూసినంక తాగరట ఏ ఒక్కరూ., తిరిగే జనం మీద కేసీఆర్ వరాల జల్లు.. తెలంగాణ అంతా మురిసి పోతున్న జనాలు, కవితక్క ఇలాఖలో సరికొత్త దందా... సార్ కు రాబట్టే నింద... ఇత్యాది అంశాలపై మల్లన్న ముచ్చట్లు కార్యక్రమంలో మల్లన్న చెప్పిన మసాల ముచ్చట్లు చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి....

20:21 - April 14, 2016

హైదరాబాద్ : టీఆర్ ఎస్ పాలనలో ఆంధ్రా కాంట్రాక్టర్లకు ప్రాధాన్యం పెరిగిందని తెలంగాణ టీడీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లక్షా 45 వేల కోట్ల రూపాయల విలువైన టెండర్‌ కాంట్రాక్టర్లను ఆంధ్రోళ్లకు కట్టబెట్టబెట్టారని విమర్శించారు. వరంగల్‌లో జరిగిన తెలంగాణ టిడిపి విస్తృత స్థాయి సమావేశంలో రేవంత్‌రెడ్డి... ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండిపడ్డారు. 

20:19 - April 14, 2016

హైదరాబాద్ : ఫ్రైవేటు స్కూళ్ల ఫీజులను నియంత్రించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్య, వైద్యం ప్రజలకు భారంగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణపై విద్యాశాఖ కసరత్తు చేస్తుందని తెలిపారు.  

20:18 - April 14, 2016

హైదరాబాద్‌ : నగర శివారు జవహర్‌నగర్‌లో శాస్త్రి అనే వ్యక్తి పై వైసీపీ నేత బాల్‌రెడ్డి దాడికి పాల్పడ్డాడు. జవహర్‌నగర్‌లోని మైత్రీ అపార్ట్‌మెంట్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై శాస్త్రి అల్వాల్‌ పోలీసులు ఫిర్యాదు చేశారు. 

20:11 - April 14, 2016

కోల్ కతా :ఎన్నికల నిబంధనలను అతిక్రమించిన పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎన్నికల కమిషన్‌ షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. ఓ ఎన్నికల సభ ప్రచారంలో పాల్గొన్న ఆమె అసన్‌సోల్‌ను ప్రత్యేక జిల్లాగా ప్రకటిస్తామని వాగ్దానం చేశారు. ఎన్నికల సమయంలో ఇలా బహిరంగ ప్రకటన చేయడం ద్వారా మమత ఎన్నికల కోడ్‌ అతిక్రమించారు. దీంతో ఆమెకు ఈసీ నోటీసు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్‌లో గెలుపే ధ్యేయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్రమాలకు పాల్పడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

 

19:55 - April 14, 2016

హైదరాబాద్ : సీటు అపరిశుభ్రంగా ఉందన్న కారణంతో నాందేడ్‌ శివసేన ఎమ్మెల్యే హేమంత్‌ పాటిల్‌ దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ రైలును ఆపారు. దీంతో రైలు అరగంట ఆలస్యంగా నడవడంపై ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కారణంగా రైలు ఆలస్యం కావడంపై ఎమ్మెల్యే క్షమాపణ చెప్పారు. ప్రజల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకునే తాను రైలు ఆపానని హేమంత్‌ పాటిల్‌ తెలిపారు. రైలులో చెత్త పేరుకుపోయిందని, బెడ్‌షీట్లు మురికిగా ఉన్నాయని, ఆహారం కూడా సరిగా లేదని ఎమ్మెల్యే ఆరోపించారు. అధికారులు తనకు సరైన్‌ బెర్త్‌ కేటాయించలేదన్నారు. ట్రెయిన్‌లో ఆహారాన్ని ఎలుక తింటున్న దృశ్యాన్ని ఫోన్‌లో తీసి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో తాను రైల్వే మంత్రి సురేష్‌ ప్రభుకు ఫోన్‌ చేస్తే స్పందించలేదన్నారు. 

19:53 - April 14, 2016

ఈసారి తమిళనాడు ఎన్నికలకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. జయలలిత, కరుణానిధి వీరిద్దిరిలో ఎవరు ముఖ్యమంత్రి అయినా ఆరవ సారి ముఖ్యమంత్రి అయిన రికార్డు స్రుష్టిస్తారు. ఒకవేళ హంగ్ ఏర్పడి, విజయ్ కాంత్ పంటపండితే సినీ రంగానికి చెందిన 6వ ముఖ్యమంత్రిగా ఆయన రికార్డుల కెక్కుతారు. ఇంతకీ విజయ్ కాంత్ కి అంత సీన్ వుందా? ఆయనకున్న మైనస్ లేమిటి? ప్లస్ లేమిటి? ఆరు పార్టీల పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రధాన ద్రవిడపార్టీలను ఢీకొడుతున్న విజయ్ కాంత్ ప్రభావమెంత?

1967 నుంచి డిఎంకె, ఏఐఏడిఎంకె....

తమిళనాడును అయిదు దశాబ్ధాలుగా రెండు ద్రవిడ పార్టీలు ఏలుతున్నాయి. 1967 నుంచి డిఎంకె, ఏఐ ఐడిఎంకె మధ్యనే అధికారం తిరుగుతోంది. సినీరంగానికి చెందిన అయిదుగురు తమిళనాడు ముఖ్యమంత్రులయ్యారు. కరుణానిధి, జయలలిత చెరో అయిదుసార్లు ముఖ్యమంత్రులయ్యారు. తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? ఆరవ సారి సింహాసనం అధిష్టించే అద్రుష్టం కరుణానిధి, జయలలితలలో ఎవరికి దక్కుతుంది? వీరద్దరినీ కాదని తమిళ తంబీలు సినీ రంగానికే చెందిన ఆరో వ్యక్తికి ముఖ్యమంత్రి అయ్యే చాన్స్ ఇస్తారా?

ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు .....

ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు చాలామంది రాజకీయ పండితులు జయలలితనే హాట్ ఫేవరేట్ గా భావించారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఏఐఏడిఎంకె క్లీన్ స్వీప్ చేయడమే ఇందుకు కారణం. అయితే, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినతర్వాత రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గాలి మారుతోందన్న అన్న అనుమానాలు కలుగుతున్నాయి. సినీరంగం నుంచే వచ్చిన విజయ్ కాంత్ , ఆరు పార్టీల పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ లో చేరడం, ఆయననే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతో త్రిముఖ పోటీ పసందుగా మారుతోంది. కింగ్ మేకర్ గా కాదు కింగ్ గా అవతరించాలన్న పట్టుదల, కసి విజయ్ కాంత్ మాటల్లో వ్యక్తమవుతోంది. కరుణానిధి, జయలలితల మీద తీవ్రస్థాయిలో ఆయన వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. మాటల తూటాలు పేలుస్తున్నారు. వారిని మోసగాళ్లను, అవినీతిపరులగానూ తూర్పారబడుతున్నారు.

విజయ్ కాంత్ 62 ఏళ్ల కుర్రాడు.....

ఇప్పుడు కరుణానిధి వయస్సు 94 ఏళ్లు. జయలలిత వయస్సు 68 ఏళ్లు. వీరద్దిరితో పోల్చుకుంటే విజయ్ కాంత్ 62 ఏళ్ల కుర్రాడు. స్పైనల్ సర్జరీ చేయించుకున్న తర్వాత కరుణానిధి వీల్ చైర్ దిగి నడవలేకపోతున్నారు. జయలలిత ఎన్నికల ప్రచార సభల్లో తప్ప మరెక్కడా కనిపించడం లేదు. వీరిద్దరి ఆరోగ్య పరిస్థితి మీద ఎన్నో సందేహాలున్నాయి. ఇదే విషయాన్ని విజయ్ కాంత్ ఎన్నికల సభల్లో సూటిగా ప్రశ్నిస్తున్నారు. విజయ్ కాంత్ వాదనను తమిళ ఓటర్లు ఎంత వరకు ఆమోదిస్తారో చూడాలి.

బలహీనతలను క్యాష్ చేసుకునే స్థితిలో విజయ్ కాంత్ వున్నారా?

జయలలిత, కరుణానిధికి బలహీనతలు, మైనస్ పాయింట్లు వున్న మాట నిజమే అయినా వాటిని క్యాష్ చేసుకునే స్థితిలో విజయ్ కాంత్ వున్నారా? అన్నదీ సందేహమే. విజయ్ కాంత్ పార్టీ స్థాపించి పదేళ్లు దాటింది. 2005లో డిఎండికె పార్టీ స్థాపించిన విజయ్ కాంత్, 2006 అసెంబ్లీ ఎన్నికల్లోనే చతికిలపడ్డారు. 234 స్థానాల్లో పోటీ చేస్తే గెలిచింది ఆయన ఒక్కరే. 2009 లోక్ సభ ఎన్నికల్లో నూ ఒక్క ఎంపీ స్థానమైనా గెలిపించుకోలేకపోయారు. కాకపోతే, 2011 అసెంబ్లీ ఎన్నికల్లో 29 సీట్లు గెల్చుకున్నా, అవి జయలలితతో పొత్తు కారణంగా వచ్చినవే. ఆ ఎన్నికల్లో డిఎంకె ఘోరంగా ఓడిపోవడంతో విజయ్ కాంత్ కి ప్రతిపక్ష హోదా లభించింది. కానీ, ప్రతిపక్ష నేతగా వచ్చిన అవకాశాన్ని ఆయన సమర్ధవంతంగా ఉపయోగించుకున్నారని చెప్పలేం. 2014 లోక్ సభ ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకున్న విజయ్ కాంత్ పార్టీ ఒక్క సీటూ గెల్చుకోలేకపోయింది. కాకపోతే, కురువ్రుద్ధ నేత కరుణానిధి సారథ్యంలోని డిఎంకె చాలా స్థానాల్లో మూడో స్థానానికి దిగజారడం ఒక్కటే విజయ్ కాంత్ ని ఊరడించే అంశం. తమిళనాడులో గత ఎన్నికల్లో దాదాపు మూడు కోట్ల ఓట్లు పోలైతే, విజయ్ కాంత్ పార్టీ సాధించింది 30 లక్షల ఓట్లే. అంటే పదిశాతం ఓట్లే. ఆయన కల సాఫల్యం కావాలంటే ఇంకా 15 నుంచి 20శాతం ఓట్లు పెంచుకోవాలి. కోటికి పైగా ఓట్లు కొల్లగొట్టాలి.

1979లో సినీ రంగ ప్రవేశం చేసి....

1979లో సినీ రంగ ప్రవేశం చేసి 150 సినిమాల్లో నటించిన విజయ్ కాంత్ ఫ్యాన్స్ బాగానే వున్నారు. కానీ, ఫ్యాన్స్ అభిమానాన్ని ఓట్లుగా మలచుకోలేకపోవడం విజయ్ కాంత్ పెద్ద బలహీనత. అంకితభావంతో పనిచేసే బలమైన కేడర్ లేకపోవడం మరో పెద్ద మైనస్ పాయింట్. తొలుత ఒంటరి పోరాటం, ఆ తర్వాత జయలలితతో స్నేహం, ఆ తర్వాత బిజెపితో పొత్తు, ఇప్పుడు వామపక్షాలున్న పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ తో చెట్టాపట్టాల్ ఇవన్నీ చూస్తుంటే ఆయనకు స్పష్టమైన ఆదర్శాలుకానీ, సిద్ధాంతాలు కానీ, కమిట్ మెంట్స్ కానీ లేవన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. అయితే, జయలలితతోనో, కరుణానిధితోనో పొత్తు పెట్టుకుంటే విజయ్ కాంత్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెర మీదకు వచ్చేవారు కాదు. ప్రధాన పార్టీలకు తోకగానే మిగిలిపోయేవారు. పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ లో చేరడం వల్ల కెప్టెన్ కాగలిగారు. ఫ్రంట్ కే ప్రధాన ఆకర్షణ కాగలిగారు.

పదేళ్ల పాటు పార్టీని నడపడం...

ఏమాటకామాటే చెప్పుకోవాలి జయలలిత, కరుణానిధి లాంటి హెవీవెయిట్స్ వున్న చోట పదేళ్ల పాటు పార్టీని నడపడం, ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేసులో వుండడం చిన్న విషయమేమీకాదు. అధికారం లేకపోయినా, తెలంగాణలో ఒక్క కేసీఆర్ మాత్రమే అనేక ఆటుపోట్ల మధ్య పదేళ్ల పాటు పార్టీని నడపగలిగారు. ఆయనకు తెలంగాణ సెంటిమెంట్ కొండంత అండగా నిలిచింది. కానీ, విజయ్ కాంత్ కి అలాంటి సెంటిమెంట్లేవీ తోడుగా లేవు. విజయ్ కాంత్ కి మించిన పాపులార్టీ, ఫ్యాన్స్ ఫాలోయింగ్ వున్న మెగాస్టార్ చిరంజీవి కూడా పీఆర్ పి ని ఎక్కువ కాలం నడపలేకపోయారు. మరో టర్మ్ వరకు కూడా వేచిచూడలేకపోయారు. మూడేళ్లకు కాంగ్రెస్ లో విలీనం చేశారు. విజయ్ కాంత్ ని దెబ్బతీసేందుకు జయలలిత, కరుణానిధి తీవ్రంగానే ప్రయత్నించారు. ఇప్పుడు ఎన్నికల ముంగిట్లో కూడా పది మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరేశారు. దీనివెనక కరుణానిధి, ఆయన కుమారుడు స్టాలిన్ వున్నారన్న టాక్ నడుస్తోంది. రాజకీయాల్లో ఎత్తులు, పై ఎత్తులు, కుయుక్తులు సహజం. వాటన్నింటిని తట్టుకుని నిలబడేవాడే నాయకుడు.

బ్యాలెట్ వార్ లో సక్సెస్ కావాలంటే.....

బ్యాలెట్ వార్ లో సక్సెస్ కావాలంటే నాయకుడన్నవాడు ఓటర్ల ముందు ఏదో ఒక స్వప్నాన్ని వుంచాలి. హామీలతో ఆకట్టుకోవాలి. గ్లామర్ , ఛరిస్మా ఇవి మాత్రమే ఓట్లు రాల్చవు. తాము గెలిపిస్తే, ఆ నాయకుడు అందుకు ప్రతిగా తమకు ఏమిస్తాడన్నది ఓటర్లు ఆశించడం సహజం. ఓటర్ల నాడిపట్టుకుని వాగ్ధానాలు గుప్పించి, స్వప్నాలు ఆవిష్కరించేవాడే విజేతగా నిలుస్తాడు. పదేళ్లుగా రాజకీయాల్లో వున్న విజయ్ కాంత్ తమిళతంబీల కన్నుల్లో ఏ ఒక్క స్వప్నాన్నీ నింపలేదు . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్ నినాదాన్ని చాలా ఏళ్లపాటు సజీవంగా వుంచారు. కెసిఆర్ ప్రత్యేక రాష్ట్ర సాధన స్వప్నాన్ని తెలంగాణ ప్రజల కళ్లముందు నిలబెట్టారు. చంద్రబాబునాయుడు తాను మాత్రమే హైదరాబాద్ కి ధీటైన రాజధాని నిర్మించగలనన్న నమ్మకాన్ని కలిగించారు. ఇలాంటి స్వప్నాలేవీ కళ్లముందు నిలపలేకపోవడం విజయ్ కాంత్ కున్న మరో మైనస్ పాయింట్.

విజయ్ కాంత్ ఆరు పార్టీలతో జట్టు...

విజయ్ కాంత్ ఆరు పార్టీలతో జట్టు కట్టారు. డిఎండికె, ఎండిఎంకె, సిపిఎం, సిపిఐ, విసికె, టిఎంసి ఇన్ని పార్టీలను ఏకతాటి మీదకు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించింది విజయ్ కాంత్ కాదు వైకో అన్న విషయాన్ని విస్మరించకూడదు. పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ లో పేరుకు ఆరు పార్టీలున్నా ఆయా పార్టీలు కొన్ని పాకెట్లకే పరిమితం. ఒకరి ఓట్లు ఒకరికి పూర్తి స్థాయిలో ట్రాన్స్ ఫర్ అయితేనే గెలిచే చాన్స్ వుంటుంది. ఈ నెల రోజులు విజయ్ కాంత్ చాలా శ్రమించాలి. తన పార్టీ అభ్యర్థులతో పాటు మిత్రపక్షాల అభ్యర్థులనూ గెలిపించుకోవడానికి అలుపెరగకుండా శ్రమించాలి. తమిళతంబీలకు నమ్మకం కలిగించాలి. విజయ్ కాంత్ కి గత పదేళ్ల రాజకీయ జీవితం ఒక ఎత్తు. రాబోయే 4 వారాలు ఒక ఎత్తు. 

ప్రధాని మోదీపై సీఎం కేజ్రీవాల్ విసుర్లు

ఢిల్లీ : ప్రధాని మోదీపై సీఎం కేజ్రీవాల్ మండిపడ్డారు. అంబేద్కర్ కలలు సాకారం కావాలంటే మోదీ మవు (అంబేద్కర్ స్వస్థలం) వెళ్తే సరిపోదని ఎద్దేవా చేశారు. అంబేద్కర్ పేరుతో సంస్థను ఏర్పాటు చేయడమే హెచ్ సియూ విద్యార్థి రోహిత్ చేసిన తప్పా అని ప్రశ్నించారు. రోహిత్ ను సస్పెండ్ చేయాలని ఇద్దరు కేంద్ర మంత్రులు లేఖలు రాశారని, ఆ ఇద్దరు మంత్రులపై విచారణ జరపాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.

బాణాసంచా కాల్చడానికి కేరళ హైకోర్టు అనుమతి

కేరళ : రాష్ట్రంలోని త్రిశూర్‌ ఆలయ ఉత్సవంలో బాణాసంచా కాల్చడానికి కేరళ హైకోర్టు అనుమతి ఇచ్చింది. నిబంధనలకు లోబడి బాణాసంచా కాల్చాలని, ప్రమాదకర బాణాసంచా కాల్చొద్దని న్యాయస్థానం ఆలయ కమిటీని ఆదేశించింది. కాగా ఇటీవల కొల్లం జిల్లా పరపూర్‌లో పుట్టింగల్‌ దేవీ ఆలయ వేడుకల్లో భాగంగా బాణా సంచా పేలుళ్లలో 110 మంది దుర్మరణం చెందగా, మరో 400 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. దీంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది.

19:20 - April 14, 2016

ఈ సంవత్సరం రిలీజైన సినిమాల్లో ఎక్కువ భాగం ప్రయోగాత్మకంగానూ, ఫ్యామిలీ ఎమోషన్స్ బేస్డ్ గానే సాగాయి. కామెడీ మూవీస్ మీద ఫుల్ గా ఎవరూ ఫోకస్ చేయలేదు. కానీ ఈ సమ్మర్ లో ఆడియన్స్ ను మొదటి నుంచి చివరి వరుకూ ఔట్ అండ్ ఔట్ కామెడీ తో జనాన్ని ఫుల్ ఎంటర్ టైన్ చేస్తుంది ఈడో రకం ఆడో రకం. డైనమైట్ తర్వాత ఒక్క సరైన సినిమాలేని విష్ణు, సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు ప్లాప్ తో కాస్త డల్ అయిన రాజ్ తరుణ్ కి ఈ సినిమా మంచి బూస్టప్ గా నిలిచిపోతుంది. సినిమా టైటిల్ కు తగ్గట్టుగానే హీరోల కేరక్టరైజేషన్ ను అద్భుతంగా డిజైన్ చేసాడు దర్శకుడు నాగే్శ్వరరెడ్డి. కామెడీ సినిమాలు తీయడంలో చెయితిరిగిన ఈ దర్శకుడికి ఈ సినిమా లో కామెడీ ని అలవోకగా పండించాడు. ఈ మధ్యకాలంలో కన్ఫ్యూజన్ కామెడీ సినిమాలు రాలేదు. ఆలోటు ఈడో రకం ఆడో రకం సినిమా తీర్చేస్తుంది. ఎక్కడా బోర్ కొట్టించకుండా రెండున్నర గంటల పాటు నవ్వడమే పనిగా పెట్టుకుంటుందీ చిత్రం.

లాయర్ నారాయణరావు కి ఇద్దరు కొడుకులు. అందులో పెద్ద కొడుకు నారాయణ రావు దగ్గరే అసిస్టెంట్ లాయర్ గా పనిచేస్తుంటాడు. అతడి భార్య. చిన్న కొడుకు అర్జున్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఫ్రెండ్స్ , షికార్లు అంటూ తిరుగుతుంటాడు. అతడికి వదిన దగ్గర చనువెక్కువ. అర్జున్ ఫ్రెండ్ అశ్విన్ ఒక ఆవారా .తండ్రి సర్కిల్ ఇన్సపెక్టర్ . అర్జున్ , అశ్విన్ లు మంచి ఫ్రెండ్స్ . ఎలాంటి పనిచేయాలన్నా వీరిద్దరే కలిసిపనిచేస్తుంటారు. వీరిద్దరూ కలిసి ఒక పెళ్లికెళ్తారు . అక్కడే ఇద్దరూ ఇద్దరమ్మాయిలకి మనసిస్తారు. అందులో అర్జున్ ప్రేమించిన అమ్మాయి నీలవేణి అన్నయ్య ఓ పెద్ద గూండా. తన చెల్లికి ఒక అనాథనిచ్చి పెళ్లిచేయాలనుకుంటాడు. అందుకే అర్జున్ అనాథనని నాటకమాడి ఆమెను అప్పటికప్పుడు రిజిస్టర్ మేరేజ్ చేసుకుంటాడు. ఇక అక్కడినుంచి అర్జున్ కష్టాలు ప్రారంభమౌతాయి. ఇంట్లో పెళ్లి చేసుకొన్నట్టు చెప్పకుండా మేనేజ్ చేద్దామనుకుంటాడు. కానీ నీలవేణి సరిగ్గా నారాయణ రావు ఇంటినే అద్దెకు తీసుకొని అర్జున్ కి కష్టాలు తెచ్చిపెడుతుంది. అక్కడినుంచి జరిగే కన్ఫ్యూజన్ డ్రామాతో సినిమా రసవత్తరంగా మారుతుంది.

అర్జున్ గా మంచు విష్ణు, అశ్విన్ గా రాజ్ తరుణ్ వాళ్ళ తండ్రులు గా రాజేంద్రప్రసాద్, పోసాని క్రుష్ణమురళి అద్భుతంగా సినిమాను రక్తి కట్టించారు. ముఖ్యంగా మంచు విష్ణు తండ్రి గా రాజేంద్రప్రసాద్ కామెడీ సినిమాకి పెద్ద ఎసెట్ . రాజ్ తరుణ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ , మంచు విష్ణు డీసెంట్ యాక్టింగ్ సినిమాకి మంచి రిలీఫ్ ఇస్తాయి. హీరోయిన్స్ గా నటించిన సోనారికా, హెబ్బా పటేల్ జనాన్ని గ్లామర్ తో కట్టిపడేసారు. సీమటపాకాయ స్టైల్లో సాగే కన్ఫ్యూజన్ డ్రామానే ఈ సినిమా లోనూ వాడుకున్నాడు నాగేశ్వరరెడ్డి . అయితే దానికి, దీనికి తేడా ఏంటంటే అందులో హీరో ఒక్కడే , కానీ ఇందులో ఇద్దరు హీరోలతోనూ ఈ డ్రామా నడిపించాడు. ఇంటర్వెల్ నుంచి రాజ్ తరుణ్ కేరక్టర్ కు కూడా అర్జున్ తరహా లోనే కన్ఫ్యూజన్ డ్రామా ను యాడ్ చేసి రెట్టింపు కామెడీ పండించాడు డైరెక్టర్ . ఈ సినిమాలోని మిగతా పాత్రలు సినిమా హాయిగా సాగిపోవడానికి తమ వంతు సాయం చేసారు. పెద్ద కొడుకు గా నటించిన రవిబాబు కూడా కామెడీ బాగా పండించాడు. ఇంకా గీతా సింగ్ , వెన్నెల కిషోర్ , సత్యకృష్ణన్ , ప్రభాస్, శ్రీను , రౌడీలు గా నటించిన అభిమన్యు సింగ్, సుప్రీత్ రెడ్డి తదితరులు తమ పాత్రలకు న్యాయం చేసారు. మొత్తం మీద ఈ నెల లో పైసా వసూలు సినిమాగా బోణి చేసిన మొదటి సినిమా ఈడో రకం ఆడో రకం . సరైనోడు రిలీజ్ వరుకూ ఈ సినిమా థియేటర్స్ లో దుమ్మురేపడం ఖాయం అని చెప్పొచ్చు.

ప్లస్ పాయింట్స్ :

మంచు విష్ణు, రాజ్ తరుణ్ , రాజేంద్రప్రసాద్ నటన

సంగీతం, పాటలు , బ్యాక్ గ్రౌండ్ స్కోర్

కన్ఫ్యూజన్ డ్రామా

ఫోటో గ్రఫీ

హీరోయిన్స్ గ్లామర్

ఔట్ అండ్ ఔట్ కామెడీ

మైనస్ పాయింట్స్ :

ఏవీ లేవు.

రేటింగ్ : 3 

19:15 - April 14, 2016

ఆదిలాబాద్ : బోథ్ మండలంలో రోడ్డు రోడ్డు ప్రమాదం జరిగింది. కనుగుంట వద్ద బ్రిడ్జి పై ఆటో బోల్తా పడి ఐదుగురు మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని తెలుస్తోంది. నేరేడుగొండలో అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో బ్రేక్ ఫెయిల్ కావడంతో బ్రిడ్జి పై నుండి కిందకు బోల్తా పడింది. ప్రమాదం జరిగే సమయంలో ఆటోలో 9 మంది ప్రయాణీకులు ఉన్నారు. మృతులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.

19:14 - April 14, 2016

హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో హోంగార్డ్‌గా పనిచేసిన బాల్‌రాజు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్‌ మహంకాళి దేవాలయం దగ్గర ఘటన చోటు చేసుకుంది. కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు బాల్‌రాజుతో ఓ మహిళ మాట్లాడి వెళ్లింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఈ దారుణం జరిగింది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఈ మహిళ ఎవరన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు. బాల్‌రాజు గతంలో హోంగార్డుల సంఘానికి అధ్యక్షుడుగా పనిచేశారు. ఆర్థిక ఇబ్బందులే బాల్‌రాజు ఆత్మహత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు. హోంగార్డుల సమస్యలు పరిష్కరించేందుకు బాలరాజు తీవ్రంగా శ్రమించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సీఎం మమతాబెనర్జీ కి ఈసీ షోకాజ్ నోటీసులు

కోల్ కతా :బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎన్నికల సంఘం షోకాజ్‌ నోటీసులు పంపించింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు మమతకు నోటీసులు పంపినట్లు రాష్ట్రంలోని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ నసీమ్‌ జైది తెలిపారు. రాష్ట్రంలోని అసన్‌సోల్‌ ప్రాంతాన్ని జిల్లా చేస్తానని మమత బెనర్జీ హామీ ఇచ్చినట్లు, నిబంధనలకు విరుద్ధంగా మరికొన్ని వ్యాఖ్యలు చేసినట్లు తెలిసిందని అందుకే ఆమెకు షోకాజ్‌ నోటీసులు పంపించామని జైది పేర్కొన్నారు. ఏప్రిల్‌ 17న జరగనున్న మూడోదశ ఎన్నికల నిర్వహణపై ఈరోజు ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం సమావేశమై చర్చించారు.

రాజబొల్లారంలో అగ్నిప్రమాదం...

రంగారెడ్డి : జిల్లాలోని మేడ్చల్‌ మండలం రాజబొల్లారంలోని బార్‌ ట్రానిక్స్‌ ఇండియన్‌ లిమిటెడ్‌ కంపెనీలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడుతుండడంతో చుట్టుపక్కల నివాసితులు భయంతో రోడ్డుపైకి పరుగులు తీశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.

తాగునీటి డిస్టిలరీలకు తరలిస్తున్న కేసీఆర్ : రేవంత్ రెడ్డి

వరంగల్ : టీ.సర్కారుపై టీడీపీ నేత రేవంత్ రెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. వరంగల్ లో టీడీపీ విస్తృస్థాయి సమావేశంలో మాట్లాడుతూ...రాష్ట్ర వ్యాప్తంగా గొంతు తడుపుకోవటానికి గుక్కెడు నీరు దొరక్క ప్రజలు అల్లాడుతుంటే సీఎం మాత్రం నీళ్లను డిస్టిలరీలకు అమ్ముకుంటున్నారని తెలంగాణ తెదేపా కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మద్యం కంపెనీలకు నీటి సరఫరాపై హైకోర్టులో న్యాయపోరాటం చేస్తామని ఆయన వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన భిక్షతోనే ఎర్రబెల్లి నాయకుడిగా ఎదిగారని రేవంత్‌రెడ్డి అన్నారు.

18:16 - April 14, 2016

విజయవాడ : ఏపీ రెండేళ్ల ప్రభుత్వ పాలనపై సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ సర్వే నిర్వహించింది. ఇందులో సీఎంగా చంద్రబాబు పనితీరుకు ఫస్ట్‌ క్లాస్‌ మార్కులే వచ్చాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు 67 శాతం మంది అనుకూలంగా తీర్పు ఇచ్చారు. మంత్రివర్గం, ప్రభుత్వం, పథకాలపై సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ సర్వే నిర్వహించి ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. అయితే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి స్థాయిలో సంతృప్తి లేదు. అలాగని ప్రతిపక్షాలపై భరోసా కనబరచలేదు. చంద్రబాబు స్థాయిలో మంత్రివర్గం పని చేయడం లేదని ఏపీ ప్రజలు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు తీసుకుంటున్న పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అనిశ్చితి ఉందని సర్వేలో తేలింది.

అవినీతి పెరిగిందని 33 శాతం ప్రజలు తెలిపారు....

ఏపీలో అవినీతి పెరిగినట్లు సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ సర్వేలో తేలింది. రెవెన్యూ, పోలీసు, విద్య, వైద్య రంగాల్లో అవినీతి పెరిగిందని 33 శాతం ప్రజలు తెలిపారు. ఏపీలో ప్రజల్లోకి చొచ్చుకువెళ్లే స్థాయిలో పథకాలేవీ కనపడటం లేదని జనం అభిప్రాయపడ్డారు. విద్యుత్‌, పెన్షన్ల విషయంలో ప్రజలు సంతృప్తిగానే ఉన్నా.. రుణమాఫీపై రైతుల్లో అనిశ్చితి నెలకొని ఉంది. పెద్ద రాజధాని సామాన్యులకు దూరమవుతుందన్న భావన ప్రజల్లో కనిపించింది. అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందడం లేదనే భావన ప్రజల్లో కనిపించింది.

రాజకీయంగా టీడీపీ గానీ, ప్రతిపక్షం గానీ బలపడలేదు....

ఏపీలో రాజకీయంగా టీడీపీ గానీ, ప్రతిపక్షం గానీ బలపడలేదని సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ సర్వేలో తేలింది. రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందని.. కొత్త రాజకీయ శక్తులకు అవకాశం ఉన్నట్లు సర్వేలో తేలింది. అలాగే ఏపీ సర్కార్‌ ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నట్లు ప్రజల్లో అభిప్రాయం వ్యక్తమైంది. ఏపీతో పోలిస్తే తెలంగాణలో పనులు భాగా జరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. పనితీరులో తెలంగాణకు 43 శాతం, ఏపీకి 34 శాతం ప్రజల మెప్పు లభించింది.   

దీదీ కి ఈసీ నోటీసులు....

హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఈసీ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ర్యాలీలో భాగంగా ఆనన్సోల్ ను జిల్లాగా ప్రకటిస్తామని మమతా బెనర్జీ హామీ ఇచ్చి ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని మమతకు ఈసీ నోటీసులు జారీ చేసింది.

రాజబొల్లారంలో అగ్ని ప్రమాదం.....

రంగారెడ్డి : మేడ్చల్ మండలం రాజబొల్లారంలోని బార్ ట్రాన్సిక్ కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు.

ఐఎస్ఐఎస్ పై పోరాటానికి సిద్ధమైన మహిళలు...

హైదరాబాద్ :  ఐఎస్ఐఎస్ ఉగ్రవాదం పై మహిళా లోకం కదం తొక్కింది. మహిళలపై ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్న క్రమంలో టర్కీ, సిరియా, ఇరాక్, ఇరాన్‌ దేశాలలోని మహిళలు ఐఎస్ఐఎస్ పై పోరాటానికి సిద్ధ‌మ‌య్యారు. త‌మ‌పై దారుణమైన హింసలకు పాల్పడుతున్న ఐఎస్ఐఎస్‌ను అంత‌మొందిస్తామ‌ని చెబుతున్నారు. ఐఎస్ఐఎస్ ఉగ్ర‌వాదుల‌ను స‌మూలంగా నాశ‌నం చేసేవ‌ర‌కు పోరాటాన్ని కొన‌సాగిస్తామ‌ని అంటున్నారు. త‌మ‌ గ్రామాలపై దాడులు చేసి అమాయకుల్ని విచ‌క్ష‌ణార‌హితంగా బాధిస్తోన్న ఉగ్ర‌వాదుల‌ను వ‌ద‌ల‌బోమ‌ని హెచ్చ‌రిస్తున్నారు.

కేసీఆర్ ఫాంహౌస్ లో ఎర్రబెల్లి గూర్ఖా పనిచేస్తున్నారు : రేవంత్ రెడ్డి

వరంగల్ : హన్మకొండలో టీ.టీడీపీ విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ...కేసీఆర్ ఫాంహౌస్ లో ఎర్రబెల్లి గూర్ఖాలా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. కన్నతల్లి వంటి టీడీపీ పార్టీని వదిలి వెళ్ళిన ఎర్రబెల్లిని కేసీఆర్ నమ్మటం లేదన్నారు.

ఐపీఎల్ కు ముస్తాబైన ఉప్పల్ స్టేడియం...

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ ల ఏర్పాటుకు 2 వేలమంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఏప్రిల్, మే నెలల్లో జరుగనున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లకు ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో 100 సీసీ కెమోరాలు ఏర్పాటు చేసామన్నారు. గత సంవత్సరం జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. స్టేడియంలో ఆహార పదార్ధాల ధరలను నియంత్రిస్తామన్నారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

చంద్రబాబు కంటే మెరుగైన నాయకుడు లేరు: సీఎంఎస్ సర్వే సంస్థ

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సీఎంఎస్ సంస్థ సర్వే చేపట్టింది. చంద్రబాబు కంటే మెరుగైన నాయకుడు ప్రస్తుతానికి ఎవరూ లేరనే అభిప్రాయం ప్రజల్లో నెలకొందని సర్వే పేర్కొంది. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వుందని సర్వే సంస్థ పేర్కొంది. అభివృద్ధి కార్యక్రమాల అమలు ఏపీలో కంటే తెలంగాణలోనే మెరుగ్గా వుందనీ...వైద్య , విద్యా రెవెన్యూ విభాగాల్లో అవినీతి పెరిగిందని పేర్కొంది. టీడీపీ ప్రభుత్వం మరింత చురుగ్గా పనిచేయాలనీ..మంత్రుల పనితీరు సంతృప్తికరంగా లేదని తెలిపింది. కొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించే అవకాశమున్నట్లు సర్వే అభిప్రాయపడింది.

17:07 - April 14, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల పై '10 టివి' సమరభేరి మోగించింది. ప్రైవేటు స్కూళ్ల ఆగడాలు,తల్లిదండ్రుల ఆవేదనను వెలుగులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. ఈ అంశంపై కూకట్ పల్లిలో అసోసియేట్ ఎడిటర్ సతీష్ ఓపెన్ డిబేట్ చేపట్టారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

16:48 - April 14, 2016

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాల్లో నైతిక విలువలకు తిలోదకాలిస్తున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ విమర్శించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డిని టిఆర్ ఎస్ లో చేర్చుకోడాన్ని ఆమె తప్పుపట్టారు. రామ్మోహన్‌రెడ్డి తన పదవికి వెంటనే రాజీనామా చేసి తాజా తీర్పు కోరాలని అరుణ డిమాండ్‌ చేశారు. 

16:46 - April 14, 2016

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు... స్టేషన్‌లో డాగ్ స్క్వాడ్, బాంబ్‌ స్వ్కాడ్‌తో తనిఖీలు చేపట్టారు. రాజేంద్ర నగర్ నుంచి నరేష్ అనే వ్యక్తి కంట్రోల్ రూమ్ కి ఫేక్ కాల్ చేసినట్లు అధికారులు గుర్తించారు. నరేష్ ను పట్టుకునేందు ప్రయత్నిస్తున్నారు.

16:43 - April 14, 2016

ప్రకాశం : జిల్లా కేంద్రం ఒంగోలులో అంబేద్కర్ జయంతి వేడుకల్లో ప్రభుత్వతీరు వివాదాస్పదమైంది. ఒంగోలులో అంబేద్కర్ జయంతి వేడుకలకు అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆలస్యంగా హాజరయ్యారు. ఈ వేడుకలకు మధ్యాహ్నం 12 గంటల వరకు మంత్రి శిద్దా రాఘవరావు హాజరుకాలేకపోయారు. దీంతో అప్పటి వరకు వేచి ఉన్న సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు రాఘవులును అడ్డుకున్నారు. మంత్రి శిద్దా రాఘవరావు వచ్చే వరకు ఆగాలని సూచించారు. అయినప్పటికీ రాఘవులు పోలీసులను ప్రతిఘటించి అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. 

పోలీసులపై ఫైర్ అయిన సీపీఎం నేత రాఘువులు...

ప్రకాశం : ఒంగోలు అంబేద్కర జయంతి వేడుకలు వివాదాస్పదంగా మారాయి. అంబేద్కర్ జయంతి వేడుకలకు కమ్యూనిస్టు నాయకులు హాజరయ్యారు. మంత్రి శిద్దా వచ్చేంత వరకూ విగ్రహానికి పూలమాల వెయ్యవద్దని పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘువులు పోలీసుల నిర్భంధాన్ని దాటుకుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...అసమానతలు లేని సమాజం కోసం పోరాడిన అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇటువంటి పరిస్థితి రావటం సిగ్గచేటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండలు మండిపోతుంటే మంత్రిగారు వచ్చేంత వరకూ ఎవరినీ అనుమతించకపోవటంపై ఆయన మండిపడ్డారు.

రాములోరి కళ్యాణానికి కేసీఆర్...

హైదరాబాద్ :  ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు భద్రాచలం వెళ్ళనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా రేపు భద్రాచలం రాములవారి కళ్యాణ మహోత్సవానికి కేసీఆర్ హాజరుకానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రాములోరికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో మ.1.45 గంటలకు ఎర్రవల్లిలోని ఫాంహౌస్ కి చేరుకోనున్నారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి ఈ కళ్యాణ వేడుకలు పట్టువస్త్రాలతో పాటు ముత్యాల తలంబ్రాలు సమర్పించటం ఆనవాయితీగా వస్తున్న ఆచారం అనే విషయం తెలిసిందే.

16:02 - April 14, 2016

హైదరాబాద్ : సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న అలాంటి చిన్నారులకోసం నిర్వహించిన ప్రత్యేక శిక్షణా శిబిరంపై మానవి స్పెషల్ ఫోకస్. 

ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలోనూ .....

ఏ దేశ భవిష్యత్ అయినా, ఆ దేశంలోని తరగతి గదుల్లోనే నిర్ణయమవుతుందం టారు సామాజిక విద్యా వేత్తలు. ఇది అక్షర సత్యం. పాలకులు పూనుకుంటే ఆచరణ సాధ్యం. ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలోనూ ఇది సాధ్యపడింది.

1984 లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో...

1984 లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభమయ్యాయి. ఎస్. సి., ఎస్.టి., ఒ.బిసి కులాల విద్యార్థుల కోసం మొదలైన ఈ విద్యాసంస్థల్లో వేలాది చిన్నారులు తమ భవిష్యత్ ను తీర్చిదిద్దుకుంటున్నారు.. ఈ విద్యాసంస్థల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు ‘స్వారోస్’ పేరుతో ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

నేనెవరికన్నా తక్కువ కాదు. ఎక్కడైనా నేను నాయకత్వం వహిస్తా....

నేనెవరికన్నా తక్కువ కాదు. ఎక్కడైనా నేను నాయకత్వం వహిస్తాను. నేను నమ్మిన దాన్ని విభిన్నంగా చేసి చూపి చూపిస్తాను. శిశాలంగా, ఉన్నతంగా ఆలోచిస్తాను. నిజాయితీ ఉంటాను, కష్టపడతాను. నా వైఫల్యానికి ఎదుటి వారిని నిందించను. ఎవరినీ అర్థించను, మోసం చేయను. తీసుకున్న దాన్ని తిరిగిచ్చేస్తాను. తెలియని వాటిని గురించి భయపడను , సాధించాలనే ఆకాంక్షను ఎప్పటికీ వదులుకోను. ఇదీ స్వారోస్ ఆశలు, ఆశయాలు. ఆకాశమే వారి హద్దు.

సమ్మర్ సమురై’ 2016 పేరిట మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకూ...

సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీలలో జూనియర్ ఇంటర్ చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు ‘సమ్మర్ సమురై’ 2016 పేరిట మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకూ క్యాంప్ నిర్వహించారు . ఇందులో భాగంగా నియోకర్సర్ సొసైటీ సారధ్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రాల్లో ఈ క్యాంప్ విజయవంతంగా కొనసాగింది. తెలంగాణా లోని సొషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ విద్యాసంస్థల్లో చదువుకుంటూ, టాప్ 10 లో ఉన్న వారిని ఈ క్యాంప్ కి ఎంపిక చేయడం జరిగింది. తెలంగాణా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ 'సెక్రెటరీ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ విద్యార్థుల భవిష్యత్ విషయంలో తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ ఎందరో చిన్నారుల భవిష్యత్ కు సానుకూల సంకేతాలిస్తోంది. అందుకే ఈ కృషి ఇలాగే కొనసాగిస్తామంటున్నారు ప్రవీణ్ కుమార్.

గచ్చిబౌలి విజ్ఞాన కేంద్రంలో 451 మంది అబ్బాయిలు.....

సమ్మర్ సమురై లో భాగంగా గచ్చిబౌలి విజ్ఞాన కేంద్రంలో 451 మంది అబ్బాయిలు అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ కోర్సులో శిక్షణ తీసుకున్నారు . అదే సమయంలో బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 210 మంది అమ్మాయిలు , 85 మంది అబ్బాయిలు నియోకర్సర్ సొసైటీ ఆధ్వర్యంలో 15 రోజుల పాటు శిక్షణ తీసుకున్నారు.

అందుబాటులో ఉన్న అవకాశాలేంటో చెప్పడం....

విద్యార్థులకు అందుబాటులో ఉన్న అవకాశాలేంటో చెప్పడం, ఆ అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలో తెలియచేయడం, సామాజిక సమస్యలను వివరించడం, ఆర్థిక ఇబ్బందులను అధిగమించే అంశాలన్నింటినీ క్రోడికరించి ‘హమ్ బనేంగే కరోడ్ పతి’ పేరుతో స్టాక్ మార్కెట్ విధి విధానాలు మార్కెట్ తీరుతెన్నులను విద్యార్థులకు వివరించే ప్రయత్నం చేసారు. కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్ మెంట్, కంప్యూటర్ బేసిక్స్, ఇంటర్ నెట్ విషయాలను వారికి చేరువ చేసారు. శారీరకంగా శక్తిని ఎలా కూడగట్టుకోవాలి? ఆటపాటలతో స్వాంతన పొందడం ఇలా అన్ని అంశాల్లో ఉదయం నుండి సాయంత్రం వరకూ సాగిన శిక్షణలో వారికి నేర్పించారు. వీటన్నింటితో పాటు సినిమా, టీవీ మాధ్యమాల్లో పనిచేస్తున్న కొద్దిమందితో పిల్లలకు ఇంటరాక్షన్ ఏర్పాటు చేసారు. ఈ ఇంటరాక్షన్ పిల్లలను ఎంతో ఉత్సాహపరిచింది... వారికి కొత్త విషయాలపై అవగాహన పెంచింది.

క్యాంప్ కు డిండి స్కూల్ ప్రిన్సిపల్ ధనలక్ష్మి....

సమ్మర్ సమురై 2016 క్యాంప్ కు డిండి స్కూల్ ప్రిన్సిపల్ ధనలక్ష్మి, నియోకర్సర్ అడ్మిన్ మేనేజర్ పి.ఎన్.మూర్తి కోఆర్డినేటర్స్ గా వ్యవహరించారు. నియోకర్సర్ సొసైటీ సభ్యులు బిక్షమయ్య, జగదీష్ అడ్మిన్ ఆఫీసర్ శ్రీలక్ష్మిల పర్యవేక్షణలో ఈ క్యాంప్ విజయవంతంగా జరిగింది .క్యాంప్ చివరి రోజు పిల్లల సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పదిహేను రోజుల శిక్షణలో వారు నేర్చుకున్న ఆటపాటలను ఈ వేదిక మీద ప్రదర్శించారు.

ఉత్సాహభరిత వాతావరణంలో...

ఉత్సాహభరిత వాతావరణంలో ‘సమ్మర్ సమురై‘ 2016 క్యాంప్ విజయవంతంగా ముగిసింది. రెట్టించిన ఉత్సాహంతో, అంతకుమించిన ఆత్మవిశ్వాసంతో ఈ క్యాంప్ నుండి విద్యార్థులు వీడ్కొలు తీసుకున్నారు .  

మాజీ ఎమ్మెల్యే టార్గెట్ గా మావోల దాడి...

హైదరాబాద్ : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు దాడికి తెగబడ్డారు. ఆదివాసీ విద్యార్థి సంఘటన జిల్లా అధ్యక్షుడు, అహేరి మాజీ ఎమ్మెల్యే దీపక్ దాదా ఆత్రం ని టార్గెట్ చేసిన మావోలు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో దీపక్ అంగరక్షకుడు మృతి చెందినట్లు సమాచారం.

అంబేద్కర్ పుట్టిన గ్రామంలో ప్రధాని మోదీ పర్యటన...

హైదరాబాద్ : బాబా సాహెబ్ అంబేద్కర్ జన్మస్థలమైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని  మవు  గ్రామంలో ప్రధాని మోదీ పర్యటించారు. 'గ్రామోదయ్ సే భారత్ ఉదయ్ ' కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం అభివృద్ధి గ్రామాలపైనే ఆధారపడి వుందని ఆయన పేర్కొన్నారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అంబేద్కర్ తన జీవితాన్ని ధారపోశారన్నారు. విద్యావంతులు కండి, ఐకమత్యంతో మెలగండి'అని పలు సందర్భాలలో అంబేద్కర్ అనేవారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.  

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు...

హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు వచ్చింది. కొద్దిసేపట్లో బాంబు పేలుతుందని  రైల్వే కంట్రోల్ రూమ్ కు ఓ అగంతుకుడు ఫోన్ చేశాడు. అప్రమత్తమయిన అధికారులు బాంబ్ స్క్వాడ్ కు సమాచారం అందించారు. స్టేషన్ చేరుకున్న బాంబ్ స్య్వాడ్ తనిఖీలు చేపట్టింది. దీంతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు.

15:30 - April 14, 2016

మహారాష్ట్ర : గడ్చిరోలి జిల్లాల మావోలు రెచ్చిపోయారు. అహేరి లోని లేవాడ ప్రాంతంలో అంబేద్కర్ ఉత్సవాల్లో పాల్గొనేందుకు మాజీ ఎమ్మెల్యే దీపక్ ఆత్రం వెళ్లారు. ఇప్పటికే దీపక్ ఆత్రం మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్నారు. దీపక్ ఆత్రం లక్ష్యంగా మావోలు దాడి చేయగా స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. అయితే ఆయన ఆంగరక్షకుడు ఈ దాడిలో మృతి చెందాడు.

టీ.సర్కార్ పై 'ఫైర్' అయిన డీకే అరుణ...

హైదరాబాద్ : టీ.పీసీసీ చీఫ్ ఉత్తమ్ తో ఎమ్మెల్యే డీకే అరుణ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె టీ. సర్కార్ పై ఫైర్ అయ్యారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి వుంటే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. మా కుటుంబంలో చిచ్చుపెట్టటానికి కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని మండి పడ్డారు. మా తండ్రి ఆశయాలకు రామ్మోహన్ రెడ్డి మచ్చ తెచ్చారనీ...తను చేసిన పనికి మా తండ్రిగారి ఆత్మ క్షోభిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. భిక్షమైన ఎత్తుకుంటాను కానీ టీఆర్ఎస్ లో చేరనని స్పష్టం చేశారు.

15:19 - April 14, 2016

హైదరాబాద్ : నాగ్ పూర్ లో కన్నయ్య కుమార్ సభలో భజరంగ్ దళ్, ఏబీవీపీ కార్యకర్తలు గందరగోళం సృష్టించారు. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా నాగ్ పూర్ నేషనల్ కాలేజీలో జరుగుతున్న సభలో కన్నయ్య కుమార్ మాట్లాడుతుండగా, భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆయనపై చెప్పు విసిరారు. ఈ సందర్భంగా సభలో గందరగోళం నెలకొంది. దీంతో భజరంగ్ దళ్, ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజాస్వామ్య హక్కులపై దాడిగా ఏఐఎస్ ఎఫ్ విద్యార్థి నేతలు అభివర్ణిస్తున్నారు. దాడికి పాల్పడిన వారిని ఏఐఎస్ ఎఫ్ నేతలు పట్టుకుని చితకబాదారు.

నాగ్ పూర్ జేఎన్ యూలో విద్యార్థి నేత కన్హయ్యపై దాడి....

హైదరాబాద్ : నాగ్ పూర్ జేఎన్ యూలో విద్యార్థి సంఘం సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ప్రసంగిస్తున్న విద్యార్థి నేత కన్హయ్యపై ఏబీవీపీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు కన్హయ్యపై దాడికి దిగారు. ఏఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు చితకబాదారు. దీంతో దాడికి యత్నించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా హైదరాబాద్ ఎస్వీకేలో జరిగిన సమావేశంలో కూడా ఇదే సంఘటన జరిగిన విషయం తెలిసిందే. రాజ్యాంగా నిర్మాణ కర్త, వివక్షపై పోరాడిన బాబా సాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి రోజునే ఈ సంఘటన జరగటం గమనించాల్సిన విషయం.

తెలుగు రాష్ట్రాలలో భానుడి ప్రతాపం....

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలలో భానుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. నల్లగొండ, అనంతపురం,కర్నూలు జిల్లాలలో 44 డిగ్రీలు, హైదరాబాద్, నిజామాబాద్, రామగుండంలలో 43, మెదక్,మహబూబ్ నగర్ లలో 43, హన్మకొండ,ఆదిలాబాద్ లలో 42, తిరుపతి, నంద్యాలలో 43, కడపలో 42, తుని, నెల్లూర్లలో 41,విజయవాడలో 40డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా విశాఖలో అత్యల్పంగా 32 డిగ్రీల ఉష్ణోగ్రతలునమోదయ్యాయి. కాగా వాతావరణ శాఖ ఈ ఎండలతో తీవ్రమైన వడగాల్పు వీస్తాయని వీటిపట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

15:00 - April 14, 2016

హైదరాబాద్ : సాప్ట్ వేర్ ఉద్యోగం అనగానే చాలా గొప్పగా ఊహించేసుకుంటాం. కార్పొరేట్ ఆఫీసుల్లో ఉద్యోగం, వేలల్లో జీతం, అందుబాటులో వెహికల్స్ సౌకర్యం...ఇంకేంటి అనుకుంటాం. కానీ తెలియకుండానే పని ఒత్తిడి, గంటల కొద్దీ కూర్చోవడం.. ఇలా వెంటాడే సమస్యలు కూడా వుంటాయి. అందుకే ఇలాంటి ఉద్యోగినులు ఎలాంటి డైట్ పాలో అవ్వాలో ఇవాల్టి హెల్త్ కేర్ లో డాక్టర్ జానకీ వివరించారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

రూ.15 లక్షల విలువైన మత్తు పదార్ధాలు స్వాధీనం...

విశాఖపట్నం : మర్రిపాలెం సాయినగర్ లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో సుమారు రూ.15 లక్షల విలువైన మత్తు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు.

ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య...

నెల్లూరు : కావలి గాయత్రి నగర్ లో విద్యార్ధిని ఆత్మహత్య కలకలం సృష్టించింది. డీబీఎన్ ఇంజనీరింగ్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సాయి వైష్ణవి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు సంఘటానా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

14:51 - April 14, 2016

విజయవాడ : దళితుల సమస్యలు పరిష్కరించడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం దళితులను పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు రావడంతోనే ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు కారెం శివాజీని ఛైర్మన్‌గా నియమించారని ఆయన అన్నారు. రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు అంటరానితనాన్ని నిర్మూలించినపుడే అంబేద్కర్‌కు నిజమైన నివాళులర్పించినట్లని అన్నారు.   

రాజ్యాంగ నిబంధనలతో పనిచేయాలి : చంద్రబాబు

విజయవాడ : ఏ కన్వెన్షన్ లో అంబేద్రర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...రాజ్యాంగానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని తెలిపారు. ఆర్థిక అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవుసముందన్నారు. ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ ను చిత్తశుద్ధితో అములుచేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

14:48 - April 14, 2016

శ్రీకాకులం : మెతుకు దొరక్క...బతుకు బరువై పొట్టచేత పట్టుకొని సిక్కోలు రైతులు వలసపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షాభావ పరిస్దితులతో వేసిన పంటలు పండక నష్టాలపాలైన రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.                                                                                     

వరి, కొబ్బరి, జీడిమామిడి, జొన్న, పత్తి పంటల సాగు....

వ్యవసాయ జిల్లాగా పేరుగాంచిన శ్రీకాకుళం జిల్లాలో కరవు విలయ తాండవం చేస్తోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు రైతులను అప్పుల పాలు చేశాయి. వరి, కొబ్బరి, జీడిమామిడి, జొన్న, పత్తి లాంటి పంటలను సాగుచేసిన రైతులు సరైన నీరు లేక దిగుబడి తగ్గి తీవ్రంగా నష్టపోయారు. వీటికి తోడు జిల్లాకు ప్రధాన నీటి వనరైన వంశధార నది సైతం ఎడారిని తలపిస్తోంది. 2 లక్షల 10 ఎకరాలకు నీరు అందించాల్సిన వంశధార నది ఒట్టిపొవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు భామిని, కొత్తూరు, మెళియాపుట్టి, వీరఘట్టం, లావేరు లాంటి మండలాలతో పాటు తీరప్రాంతంలో మత్య్సకార గ్రామాలు సైతం తాగునీటికి కటకటలాడుతున్నాయి. వ్యవసాయ పనులు లేక చాలా మంది ఇతర ప్రాంతాలకు వలసెల్లిపోతున్నారు.

17 మండలాలను కరవు ప్రాంతాలుగా....

శ్రీకాకుళం జిల్లాలో 17 మండలాలను కరవు ప్రాంతాలుగా అధికారులు గుర్తించినప్పటికి కరవు సహాయ చర్యలు మాత్రం చేపట్టలేదు. రిజర్వాయర్లు, గొట్టాబ్యారేజ్ లాంటి డ్యామ్ లు మరికొన్ని ఎత్తిపోతల పథకాలలో నీటి నిల్వలు నిండుకున్నాయి. భూగర్బ జలాలు అడుగంటిపోయాయి. ఇటు తాగునీరు ఇటు సాగునీరు లేక సిక్కోలు గొంతెండుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితి నుంచి శ్రీకాకుళం జిల్లాను ప్రభుత్వం కాపాడుతుందో లేక చేతులెత్తేస్తుందో చూడాలి.

14:35 - April 14, 2016

నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఈ మధ్య పీఠాధిపతులు వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా శంకరాచార్య స్వరూపానంద సరస్వతి మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హరిద్వార్ యాత్రలో పాల్గొన్న స్వరూపానంద.. 2013లో హరిద్వార్ లో వరదలు రావడానికి కారణం హనీమూన్, విహారయాత్రలకు రావడం వల్లే అని ఆయన అన్నారు. ఇక్కడికి వచ్చిన వారుచేసిన అపవిత్ర కార్యకలాపాల వల్లే కేదార్ నాథ్ లో ప్రకృతి కోపించిందని వ్యాఖ్యానించారు. ఇవే కాకుండా శని సింగనాపూర్ ఆలయంలోకి మహిలలనుఅ నుమతించడం వలనే కేరళలో పుట్టింగల్ ఆలయంలో ప్రమాదం జరిగిందన్నారు. కాగా  శని శింగనాపూర్ ఆలయంలోకి మహిళలు వెల్లడంవల్ల అత్యాచారాలు అధికమవుతాయని ఇటీవలే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గతంలో ఈయన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని ఇప్పటికే కోర్టులో పిటిషన్ దాఖలయింది. 

13:57 - April 14, 2016

హైదరాబాద్ : అంబేద్కర్ కలలుగన్న సామాజిక న్యాయం కోసం తమ పార్టీ పోరాటం చేస్తోందని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. మొట్టమొదటి సారిగా ఐక్యరాజ్యసమితిలో అంబేద్కర్‌ జయంతి ఉత్సవాలు జరగడం ఆ మహనీయుని గొప్పతనమని కీర్తించారు. అంబేద్కర్ ఆలోచనా విధానాలపై ప్రపంచ దేశాలు చర్చిస్తున్నాయని అన్నారు. 

 

అంబేద్కర్ కు తెలంగాణ ప్రజలు రుణపడి వుంటారు: కేసీఆర్

హైదరాబాద్ : ఎన్టీఆర్ పార్కులో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. కేంద్రమంత్రి దత్తాత్రేయ, డిప్టూటీ సీఎం కడియం,హోంమంత్రి నాయిని, జగదీష్ రెడ్డి పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. అంబేద్కర్ కు తెలంగాణ ప్రజలు రుణపడి వుంటారన్నారు. అంబేద్కర్ చిన్న రాష్ట్రాలను పోత్సహించారని ఆయన గుర్తు చేశారు. ఆయన ఏర్పాటు చేసిన చట్టంతో తెలంగాణ ఏర్పడిందని ఆయన తెలిపారు. ఖర్చుకు వెనుకాడకుండా విగ్రహ నిర్మాణం పూర్తిచేస్తామనీ...15 అంతస్తులతో అంబేద్కర్ టవర్ నిర్మిస్తామన్నారు.

13:39 - April 14, 2016

హైదరాబాద్ : డా.బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని సీఎం కేసీఆర్ అన్నారు. 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. అంబేద్కర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేంది కాదన్నారు. తెలంగాణ రాష్ట్ర సమాజం అంబేద్కర్ కు రుణపడి ఉందన్నారు. పేదల సంక్షేమానికి టీసర్కార్ కట్టుబడి ఉందన్నారు. కేజీ టు పీజీ విద్యలో భాగంగా దళితులు, గిరిజునులు, మైనారిటీలకు 250 విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దళిత విద్యార్థినుల కోసం 25 రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దళిత విద్యార్థుల కోసం 5 రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే గిరిజన విద్యార్థుల కోసం 50 రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.   సెంటర్ ఫర్ ద దళిత్ స్టడీస్ కు భూమి పూజ చేసినట్లు చెప్పారు. బలహీనులుగా ఉన్నవారికి కేంద్రం అండంగా ఉండాలన్నారు. దళిత కాంట్రాక్టర్లను తయారు చేస్తామని చెప్పారు. ఈ ఏడాదిపాటు అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఈ ఏడాది 2 లక్షల 25 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఇస్తామని చెప్పారు. 

 

బౌద్ధమతాన్ని స్వీకరించిన రోహిత్ తల్లి, సోదరుడు....

హైదరాబాద్ : హెచ్ సీయూ పీహెచ్ డీ స్కాలర్ విద్యార్థి రోహిత్ వేముల తల్లి రాధిక, సోదరుడు బౌద్ధమతాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా రోహిత్ సోదరుడు మాట్లాడుతూ...అన్నయ్య కూడా బౌద్ధమతం తీసుకుందామని అనుకునేవాడనీ కానీ అది జరుగకుండానే మరణించాడని అవేదన చెందారు. తన సోదరుడికి ఇష్టపడిన బౌద్ధమతాన్ని వివక్షపై పోరాడిన బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తాము బౌద్ధమతాన్ని స్వీకరిస్తున్నామని తెలిపారు. కాగా రోహిత్ వేముల ఆత్మహత్య దేశావ్తాప్యంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

13:23 - April 14, 2016

విజయవాడ : ప్రతి భారతీయుడి హృదయంలో డా.బిఆర్ అంబేద్కర్ చిరస్థాయిగా నిలిచిపోయారని ఎపి సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో నిర్వహించిన అంబేద్కర్ 125 వ జయంతి వేడుకల్లో పాల్గొని, మాట్లాడారు. ఏడాది పాటు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహించాలన్నారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం పోరాడేవారిని ప్రోత్సహిద్దామని చెప్పారు. పేదల్లో చైతన్యం తీసుకువచ్చేలా కార్యక్రమాలు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు సబ్ ప్లాన్ ద్వారా నిధులు కేటాయిస్తామని చెప్పారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా రన్, స్పోర్ట్స్ నిర్వహణతోపాటు ఆయన రాసిన రచనలను తెలుగులోకి అనువాదం చేద్దామని చెప్పారు. 

పార్టీ ఫిరాయింపుదారులపై కోర్టుకు వెళతాం : జానారెడ్డి

హైదరాబాద్ : ప్రతిపక్ష పార్టీ నుండి అధికార పార్టీలోకి ఎమ్మెల్యేలు జంప్ చేయటం సాధారణంగా మారిపోయింది. ఈ క్రమంలోనే మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మెహన్ రెడ్డి తాజాగా టీఆర్ఎస్ లోకి చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం సక్రమంగా అమలు కావటం లేదని ఆయన ఆరోపించారు. దీంట్లో వున్న లొసుగులను ఆధారంగా చేసుకుని కొందరు నేతలు చట్టానికి తూట్లు పొడుతున్నారని ఆయన పేర్కొన్నారు. పార్టీ పిరాయించినవారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. పార్టీ మారినవారిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు.

13:02 - April 14, 2016

హైదరాబాద్ : ఏపీ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా అజయ్ దేవగణ్, కాజోల్ వ్యవహరించనున్నారన్న అంశంపై చర్చ మొదలైంది. టాలీవుడ్‌లో ఎంతోమంది స్టార్లు ఉండగా.. అజయ్‌ నియామకంపై అనేక విమర్శలు తలెత్తుతున్నాయి. మరి అజయ్ ఆయన సతీమణి.. నవ్యాంధ్ర నిర్మాణాన్ని ఉరుకులు పెట్టిస్తారా ?
ఎపికి బ్రాండ్‌ అంబాసిడర్లుగా అజయ్‌ దేవగణ్‌ దంపతులు 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి బ్రాండ్‌ అంబాసిడర్లుగా కొనసాగేందుకు బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ దంపతులు ముందుకు వచ్చారు. మంగళవారం నాడు సీఎం చంద్రబాబును కలిసిన అజయ్‌.. ఈ అంశంపై చర్చించారు. వీరి ప్రతిపాదనను సీఎం అంగీకరించారు. 
అజయ్‌దేవగణ్‌ దంపతుల నియామకంపై సర్వత్రా విమర్శలు 
అయితే.. ఏపీ ప్రచారకర్తలుగా అజయ్‌దేవగణ్‌ దంపతుల నియామకంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్‌లో ఎంతోమంది హీరోలు ఉండగా వారినే ఎందుకు నియమించారని పలువురు సందేహాలు వెలిబుచ్చుతున్నారు. 
ఇప్పుడిదే హాట్ టాఫిక్.. 
అజయ్ దేవగణ్, కాజోల్‌లు ఏపీ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్లుగా పనికివస్తారా.. ఇప్పుడిదే హాట్ టాఫిక్.. చిరంజీవీ, పవన్ కల్యాణ్ వంటి నటులు రాజకీయ పార్టీల్లో ఉన్నందున్న వారిని పక్కన పెట్టారనుకోవచ్చు.. కానీ తెలుగు హీరోలుగా ఓ వెలుగు వెలుగుతున్న మహేష్‌బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్‌చరణ్ తేజ్ లేదంటే అగ్ర హీరోలు నాగార్జున, వెంకటేశ్‌లు ప్రచారకర్తలుగా పనికిరారా ? బాహుబలి ప్రభాస్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనికిరాడా ?... టాలీవుడ్ కు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన దర్శకుడు రాజమౌళి పేరు ఎందుకు పరిశీలించలేదని విమర్శలు వస్తున్నాయి. అయితే ఏపీ తాజా నిర్ణయంపై సర్వత్రా చర్చ మొదలైంది. అజయ్ దేవగణ్, కాజోలు స్వచ్చందంగా ముందుకు వచ్చారని సీఎం కార్యాలయ వర్గాలు చెబుతున్నా.. వారి రాక వెనుక వ్యాపార ప్రయోజనాలు దాగున్నాయనే చర్చ జరుగుతోంది. 
ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్క్, స్టూడియో నిర్మాణానికి ప్లాన్‌
అమరావతిలో ఎంటర్ టైన్‌మెంట్ పార్క్, ఓ స్టూడియోతో మరికొన్ని నిర్మాణాలకు అజయ్ దేవగణ్ ప్లాన్ చేస్తున్నారు.. సీఎంతో భేటీలోనూ అజయ్ అండ్ టీం.. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా  ఏపీలో తాము పెట్టబోయో, ప్రతిపాదిత ప్రాజెక్టుల కోసం వివరించారు.. ఈ ప్రయోజనాన్ని మరింత చేరువగా వినియోగించుకోవడానికి ప్రచారకర్తలుగా అవతారమెత్తారనే విమర్శ వినిపిస్తోంది.. అజయ్ దేవగణ్ పాన్ మసాల కంపెనీలకు ప్రచారకర్తగా ఉన్నారు.. ఆయనపై విమర్శలొచ్చినా.. ఆ యాడ్స్ విషయంలో వెనుకడుగు వేయలేదు.. చివరికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. అజయ్ భార్య కాజోల్ ద్వారా చెప్పించినా అజయ్.. యాడ్స్ నుంచి తప్పుకోలేదు. అలాంటి వ్యక్తి బ్రాండ్ అంబాసిడర్‌గా వర్కవుట్ అవుతాడా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇండియన్ బ్యాడ్మింటన్ కోచ్, ఆల్ ఇంగ్లండ్ టోర్నీ విజేత పుల్లెల గోపీచంద్, మరో క్రీడాకారిణి పీవీ సింధు, కోనేరు హంపి, హరికృష్ణలతో వివిధ రంగాల్లో లబ్ద ప్రతిష్టులుగా ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు.. వీరిలో ఎవరినైనా అంబాసిడర్‌గా నియమించవచ్చు.. వాళ్లు స్వచ్చంధంగా ముందుకు వచ్చారని ఎలా నిర్ణయం తీసుకుంటారనే ప్రశ్న తలెత్తుతోంది.. తెలంగాణలో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు.. ఆమెకు ప్రభుత్వం ముట్టజెబుతున్న మొత్తంపై పెదవి విరుపులున్నా... కేసీఆర్ సెలక్షన్ సరైనదే అనే అభిప్రాయం ఉంది... కానీ ఏపీ సర్కార్ తాజా నిర్ణయంపై విమర్శలు నేపథ్యంలో సీఎం నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.. 

 

12:56 - April 14, 2016

హైదరాబాద్ : డా.బిఆర్ అంబేద్కర్ ఫొటోను పూజించడమే కాకుండా ఆయన ఆశయాలనూ పూజించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. హైదరాబాద్ ట్యాంక్ బంద్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి.. నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సమసమాజం స్థాపన దిశగా ప్రభుత్వాలు పని చేయాలన్నారు. అంబేద్కర్ అశయాలతో ముందుకు సాగుతున్న శక్తులను కేంద్రప్రభుత్వం అణగదొక్కుతుందని ఆరోపించారు. వామపక్షాలను అణగదొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు.  అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు శాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు. 

 

అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కేసీఆర్...

హైదరాబాద్ : ఎన్టీఆర్ పార్కులో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. కేంద్రమంత్రి దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి,హోంమంత్రి నాయిని, జగదీష్ రెడ్డి పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. 

12:36 - April 14, 2016

హైదరాబాద్ : మండుటెండలకు తెలంగాణ మాడుతోంది. హైదరాబాద్‌ సహా ఐదు జిల్లాల్లో ఎన్నడూ లేనంతగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో వేడి సెగలకు జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పైగా రాబోయే రోజుల్లో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తుండడం జనాన్ని మరింత హడలెత్తిస్తోంది. సాధ్యమయినంత వరకు జనం ఎండలకు బయటకు వెళ్లకుండా నీడపట్టున ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 
మరికొన్ని జిల్లాల్లో వడగాలులు
రాబోయే రోజుల్లో హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని మరికొన్ని జిల్లాలను వడగాలులు కమ్మేయనున్నాయి. ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ లేని స్థాయిలో పెరుగుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. భూగర్భ జలాలు అడుగంటడం వల్ల.. ఎండలు మరింతగా ముదరనున్నాయన్నది వాతావరణ శాఖ విశ్లేషణ. హైదరాబాద్‌ సహా.. నిజామాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రజలు ఎండవేళల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడాలని సూచిస్తున్నారు. 
రానున్న రెండు రోజుల్లో 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు
తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రానున్న రెండు రోజుల్లో 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్‌ మధ్యలో నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే సాధారణం కన్నా మూడు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఎండల తీవ్రతకు తెలుగు రాష్ల్రాల్లో ఇప్పటికే 100 కు పైగా మరణించారని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణలో ఎండలు ఎప్పుడూ ఉండేవే అయినా.. ఈసారి మరింత తీవ్రంగా పెరిగాయి. అందుకే వడదెబ్బ మరణాలు కూడా పెరిగాయి. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఎప్పుడైన అడపాదడపా వర్షాలు పడేవి . కానీ ఈసారి ఆ పరిస్థితే కనిపించడం లేదు. అయితే, అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో.. ఈ ఏడాది రుతపవనాలు త్వరగానే వస్తాయని అధికారులు చెప్పడం కాస్తంత ఊరట కలిగించే అంశం. 
అధిక ఉష్ణోగ్రతలు.. అడుగంటిన భూగర్భ జలాలు
మరోవైపు.. అధిక ఉష్ణోగ్రతల ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటి.. తాగు నీటికీ కటకటలాడే పరిస్థితి ఎదురైంది. కూరగాయల సాగూ  పడిపోయి.. వాటి ధరలకు రెక్కలొచ్చేస్తున్నాయి. వారం క్రితం కిలో 7 రూపాయలున్న టమోటా.. ఇప్పుడు 25 రూపాయలకు చేరింది. మున్ముందు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే దారిలో మిగిలిన కూరగాయలూ అధిక ధరలు పలుకుతున్నాయి. 
తగు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు
ఇంకోవైపు... మండుటెండలకు బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మద్యాహ్నం ఒంటిగంట నుంచి మూడు గంటల మధ్య ఇళ్లల్లో ఉండటమే మంచిదంటున్నారు నిపుణులు.  ప్రతిరోజు అధిక మోతాదులో ద్రవపదార్థాలను తీసుకోవాలని, సాధ్యమయినంత వరకు నీడ పట్టున ఉండేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు. ఫ్రిజ్‌లో పెట్టే శీతల పానీయాలను వాడకపోవడం మంచిదని చెబుతున్నారు. మద్యపానానికి ఎంత దూరం ఉంటే అంత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.  కొబ్బరి బొండాలు, మజ్జిగ లాంటివి తప్పకుండా తీసుకోవాలని, లేదండే డీ హైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

12:31 - April 14, 2016

రాజమండ్రి : ఇప్పటిదాకా విజయవాడకే పరిమితమైన బ్లేడ్ బ్యాచ్‌ తూర్పుగోదావరి జిల్లాలోకి కూడా ఎంటరైంది. రాజమండ్రి గోదావరి బ్రిడ్జిపై బ్లేడ్ బ్యాచ్‌ దొంగలు తండ్రీకొడుకులు, ఆటో డ్రైవర్‌పై విచక్షణా రహితంగా దాడి చేశారు. రాజానగరం మండలం కొంతమూరు గ్రామంలోని గోదావరి నాలుగో వంతెనపై ఈ ఎటాక్‌ జరిగింది. విశాఖ జిల్లా నక్కపల్లి నుంచి పశ్చిమగోదావరి జిల్లాకు టాటా ఏస్ వాహనంలో తండ్రీ కొడుకులు దుర్గారావు, సత్యన్నారాయణ ఇంటి సామాన్లతో వెళ్తున్నారు. అర్ధరాత్రి కావడంతో ఆటో డ్రైవర్ వాహనాన్ని నడపలేక బ్రిడ్జి పక్కగా పార్కింగ్ చేసి నిద్రపోయాడు. ఇదే అదునుగా భావించిన బ్లేడ్ బ్యాచ్ ఆటో డ్రైవర్‌తో సహా దుర్గారావు, సత్యన్నారాయణలను తీవ్రంగా గాయపరిచి సామాన్లను ఎత్తుకుపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

 

 

ఆంధ్రాబ్యాంక్ లో మరో కుంభకోణం ....

కృష్ణా: గుడివాడ ఆంధ్రాబ్యాంక్ లో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణంలో వడ్డీతో కలిపి దాదాపు రూ.5 కోట్లు మోసానికి పాల్పడినట్లు బ్యాంక్ సిబ్బంది గుర్తించారు. రుణం తీసుకున్నవారు ఇచ్చిన చిరునామాలు అచూకీ దొరకపోవటంతో బ్యాంక్ వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు బాపట్ల సమీపంలోని నల్లమోతువారిపాలానికి చెందిన ఏడుగురు వ్యక్తులు ఈ అక్రమానికి పాల్పడినట్లు కనుగొన్నారు. రుణం తీసుకున్నవారిలో మడ సుబ్రమణ్యం, పిన్నబోయిన వెంకటేశ్వరరావు, నాగరాజు, పోలారయ్య, తాండ్ర జ్యోతి, అంజనీదేవి నిందితులుగా వున్నారు.

12:23 - April 14, 2016

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు బలహీనవర్గాలపట్ల వివక్షత చూపిస్తున్నారని టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి టిటిడిపి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ అందరికీ కావాల్సిన అంబేద్కర్‌కు కెసిఆర్ నివాళులర్పించే విషయంలోనే ఆయన నిర్లక్ష్యమేంటో బట్టబయలైందని ఆరోపించారు. 

 

12:20 - April 14, 2016

అనంతపురం : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌ జయంతిని ఒక పండుగలా జరుపుకోవడం ఆనందంగా ఉందని మంత్రి పరిటాల సునీత అన్నారు. అంబేద్కర్‌ 125వ జయంతి సందర్భంగా అనంతపురంలోని జడ్పీ కార్యాలయం ఎదుట ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, యామినీబాల, ఎమ్మెల్సీ శమంతకమణి, మేయర్ స్వరూపతో కలిసి మంత్రి పరిటాల సునీత నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమని చెప్పారు. 

 

పార్లమెంట్‌ ప్రాంగణంలో అంబేద్కర్‌ జయంతి వేడుకలు...

ఢిల్లీ : భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్‌ అంబేడ్కర్‌ 125వ జయంతి సందర్భంగా పార్లమెంట్‌ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తదితరులు అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారు.అంబేడ్కర్‌ దేశానికి చేసిన పలు సేవలను కొనియాడారు.

12:17 - April 14, 2016

కృష్ణా : ప్రతి పేదవాడికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పేదలందరికీ పక్కా గృహాలు ఉండాలన్నది అంబేద్కర్ ఆశయమన్నారు. ప్రతి పేదవాడికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. త్వరితగతిన నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద గృహ నిర్మాణ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. 

 

అంబేద్కర్ ట్విన్ టవర్స్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన...

హైదరాబాద్ :  లోయర్ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ ట్విన్ టవర్స్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు.ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, హోంమంత్రి నాయిని, మేయర్ రామ్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవనానికి శంకుస్థాపన చేసిన కేసీఆర్...

హైదరాబాద్ : బోరబండలో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవనానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు జగదీష్ రెడ్డి, నాయిని, తలసాని శ్రీనివాస యాదవ్ పాల్గొన్నారు.

మైక్రోమ్యాక్స్ యూనిట్ ను ప్రారంభించిన కేటీఆర్....

రంగారెడ్డి : మహేశ్వరం మండలంలో మైక్రోమ్యాక్స్ మొబైల్ మాన్యు ఫాక్చరింగ్ యూనిట్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్ రెడ్డి, పలువురు ఐటీ కంపెనీ యజమానులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

11:55 - April 14, 2016

హైదరాబాద్ : కోట్ల బడ్జెట్‌.. భారీ అంచనాలు. సాంకేతిక పరంగా ఎక్కడా రాజీలేని కృషి.. అయినా అభిమానుల ఆశలు అడియాసలయ్యాయి. సూపర్‌ హిట్టవుతుందనుకున్న సర్దార్‌ గబ్బర్‌సింగ్‌.. బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్‌ ప్లాప్‌ అయింది. దీంతో పంపిణీదారులు పీకలోతు ఆర్థిక ఇక్కట్లలో కూరకు పోయారు. 

ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులను సర్దార్‌ గబ్బర్‌సింగ్ సినిమా నిరాశ పరిచింది. టాలీవుడ్‌లో వసూళ్ల రికార్డు సృష్టిస్తుందనుకున్న పవన్‌ సినిమా... పట్టుమని మూడు రోజులు కూడా కలెక్షన్ల పట్టు నిలుపుకోలేక పోయింది. కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఓ కుదుపుగా భావిస్తున్నాయి సినీ వర్గాలు. 

100 కోట్లతో సినిమా కొన్నప్పటికీ పంపిణీదారులకు కనీసం 25 శాతం కూడా సమకూరలేదని సమాచారం. మొత్తం 70 కోట్లతో నిర్మించిన సర్దార్‌ గబ్బర్‌సింగ్ సినిమాకు మరో ముప్పై కోట్లు అదనంగా వెచ్చించి మొత్తం 100 కోట్లకు కొనుగోలు చేశారు. అయితే అంచనాలన్నీ తారుమారయ్యాయి. పెట్టుబడుల్లో పాతిక శాతం కూడా తిరిగి రాని పరిస్థితుల్లో సినిమా డిస్ట్రిబ్యూటర్‌లు  లబోదిబోమంటున్నారు. సినిమా విడుదలై వారం రోజులు కూడా కాలేదు. ఎంత తక్కువగా చూసినా మరో వారం రోజుల పాటు సినిమా ఆడి కలెక్షన్లు వస్తాయని.. ఆరకంగా కొంతలో కొంతైనా తమ పెట్టుబడి తిరిగి వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు డిస్ట్రిబ్యూటర్‌లు.. 

పంపిణీదారులకు భారీ మొత్తంలో నష్టాలొచ్చినప్పుడు సహజంగానే ప్రదర్శకులకు కూడా నష్టం వాటిల్లడం మామూలే. అయితే పంపిణీదారులు, ప్రదర్శకుల మధ్య ఉన్న ఒప్పందాన్ని బట్టి కూడా సినిమా లాభనష్టాలు ఆధారపడి ఉంటాయి. సినిమా హిట్టవుతుందనుకుంటే పంపిణీదారులు ప్రదర్శకుల మధ్య లాభాలపై ఒప్పందం చేసుకుంటారు. భారీ మొత్తాన్ని వెచ్చించి అప్పుడు ప్రదర్శకులు పంపిణీదారుల నుంచి సినిమాను కొంటారు. 

సినిమా రంగంలో ఇవి సర్వసాధారణమేనని, ఇలాంటి ఒడిదొడుకులు వస్తుంటాయని సినీ పండితులు చెబుతున్నారు. అయితే సినిమా అట్టర్‌ఫ్లాప్‌ అయిన సందర్భాల్లో ఆ సినిమాలో నటించిన నటీనటులు తమ రెమ్యునరేషన్‌లో కొంతైనా తిరిగి ఇచ్చే సంప్రదాయం కూడా ఉంది. కానీ ఇప్పటివరకు పవన్‌ కల్యాణ్‌ నుంచి దీనిపై ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.  పైగా ఇటీవలి ఇంటర్వ్యూల్లో తానే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని సాక్షాత్తూ పవన్‌ కల్యాణే చెప్పిన నేపథ్యంలో.. హీరో సైడ్‌ నుంచి ప్రొడ్యూసర్‌, డిస్ట్రిబ్యూటర్‌లకు సపోర్ట్‌ లభించే అవకాశాలు కనిపించడం లేదు. మొత్తానికి ఎంతగానూ ఊరించిన సర్దార్‌ గబ్బర్‌సింగ్‌.. ఇలా ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకోవడంతో.. పవన్‌ అభిమానులే కాదు.. సినీ పరిశ్రమ కూడా ఉసూరుమంటోంది. 

11:51 - April 14, 2016

ఢిల్లీ : భారత్‌, మయన్మార్‌ సరిహద్దుల్లో భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో దేశంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో పలు చోట్ల ప్రకంపనలు వచ్చాయి. జనం భయంతో బయటకు పరుగులు తీశారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ భూ కంప ప్రభావం కనిపించింది. శ్రీకాకుళం, విశాఖ జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది. 
భూకంప తీవ్రత రిక్టార్‌ స్కేలుపై 6.8గా నమోదు
భారత్‌, మయన్మార్‌ సరిహద్దుల్లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టార్‌ స్కేలుపై 6.8గా నమోదైంది. భూ ప్రకంపనలు భారత్‌ను కూడా తాకాయి. గౌహతి, కోల్‌కతా, పాట్నా, ఢిల్లీ, చెన్నై షిల్లాంగ్‌, డెహ్రాడూన్‌, మణిపూర్ ప్రాంతాల్లో భూమి కంపించింది. అరుణాచల్‌ప్రదేశ్‌, నాగాలాండ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి..
భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు
భూకంపంతో ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ఫోన్లలో తమ బంధువులు, సన్నిహితుల క్షేమాన్ని ఆరా తీశారు. కోల్‌కతా నుంచి గౌహతి వరకూ జనం భయంతో రోడ్లపైనే గడిపారు. కోల్‌కతాలో మెట్రో సర్వీసులను నిలిపివేశారు. 
ఏపీలోనూ భూ కంపం ప్రభావం 
భూ కంపం ప్రభావం ఏపీలోనూ కనిపించింది. శ్రీకాకుళం, విశాఖ జిల్లాలో స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయి. 3 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించింది. భూ కంపం ప్రభావంతో విశాఖ వణికిపోయింది. నగరంలోని ఎంవీపీ కాలనీ, ఎండాడ, కిర్లంపూడి, లే అవుట్‌, సాగర్‌ నగర్‌, బీచ్‌ రోడ్డు ప్రాంతంలో భూమి కంపించింది. 

 

టీ.అసెంబ్లీలో అంబేద్కర్ జయంతి వేడుకలు...

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో స్పీకర్ మధుసూధనాచారి, చైర్మన్ స్వామిగౌడ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

11:48 - April 14, 2016

నిజామాబాద్ : ప్రజలకు ఏళ్లుగా తాగు, సాగు నీరు అందిస్తున్న ఎత్తిపోతల పథకం నేడు వెలవెలబోతోంది. గోదావరిలో నీరు లేక లిఫ్ట్ చేయలేక దీనస్థితిలో ఉంది. దీంతో సుమారు 40 వేల ఎకరాలు బీడు భూములుగా మారాయి. ప్రత్యామ్నాయం చూపాలని ఆయకట్టు ప్రాంతాల రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.  
అర్గుల్ రాజారాం గుత్ప ఎత్తిపోధల పథకం 
నిజాంసాగర్ చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలనే ఉద్దేశ్యంతో 204 కోట్ల వ్యయంతో గోదావరి నీటి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం అర్గుల్ రాజారం గుత్ప ఎత్తిపోతల పథకం. నాలుగు, ఐదు సంవత్సరాల పాటు రెండు పంటలకు సాగు నీరందించిన ప్రాజెక్టుకు ఎనిమిది సంవత్సరాలు నిండాయి. నేడు ఈ ప్రాజెక్టు దీనస్థితిలో ఉంది. 
38,792 ఎకరాలకు సాగు నీరు 
నందిపేట మండలం ఉమ్మెడ గ్రామం శివారులోని గోదావరి ఒడ్డున ఎనిమిది సంవత్సరాల క్రితం.. ఆనాటి  ప్రభుత్వం జలయజ్ఞంలో భాగంగా 204 కోట్లతో అర్గుల్ రాజారాం గుత్ప ఎత్తిపోధల పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా నందిపేట మాక్లూరు, జక్రాన్ పల్లి, వేల్పూరు , బాల్కొండ ,ఆర్మూరు  వంటి ఆరు మండలాలకు 38,792 ఎకరాలకు సాగు నీరు అందించేందుకు రెండు పంప్ హౌస్లు ఏర్పాటు చేశారు. ఒకటి ఉమ్మెడలో మరొకటి మాక్లూరు మండలం లక్మాపూర్ బజార్ ,కొత్తురు శివారులో నుండి మాక్లురు మండలం ధర్మోరా చెరువు వరకు సాగు నీరు సమృద్దిగా అందుతుంది. 
నేటికీ సీసీ లైనింగ్ కు నోచుకోని గ్రావిటీ కెనాల్ 
కాని నాలుగు మోటార్లతో నీటిని వదిలితే గ్రావిటీ కెనాల్ కోతకు గురవుతోంది. దీంతో అధికారులు మూడు మోటర్లతోనే సరిపెట్టారు. ఇప్పటికి గ్రావిటి కెనాల్ సీసీ లైనింగ్ కు అభివృద్దికి నోచుకోలేదు. నందిపేట ఆయకట్టుకు సాగు నీరు అందించాలని నిర్మించిన రెండు ప్రత్యేక పైపులైన్లు పనికి రాకుండా పోయాయి. దీంతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందటం కలగానే మిగిలిపోయింది. దీనికి తోడు వర్షాలు లేని కారణంగా.. ఈ సంవత్సరం చుక్కనీరు సైతం విడుదల కాలేదు. సుమారుగా 40 వేల ఎకరాలు బీడుగా మారాయి.
నీటిపరిమాణం సుమారుగా 540 క్యూసెక్కులు
అర్గుల్ రాజారాం పధకం నీటిపరిమాణం సుమారుగా  540 క్యూసెక్కులు.. నీటిఎత్తు 69.32 మీటర్లు, 11.29 కిలోమీటర్ల పైపులైన్ వేశారు. 9.85 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ రెండు  పంప్ హౌస్ లు  ఉన్నాయి. మొదటి పంప్ హౌస్ వద్ద  2250 కిలో వాట్లు సామర్య్దం గలవి నాలుగు ఉన్నాయి.  రెండవ పంప్ హౌస్ వద్ద 1725 కిలోవాట్ల సామర్య్దం గలవి నాలుగు. 18 మెగావాట్ల విద్యుత్ సామర్ద్యం నిజాంసాగర్ ప్రాజెక్టు డిస్ర్టిబ్యూటరీ 74 నుండి 82 వరకు చేశారు. ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో ఈ లిఫ్ట్ ప్రాజెక్ట్ నీళ్లు లేక పట్టించుకునే నాధుడు లేక  నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. వచ్చే ఏడాది వర్షాలు బాగా పడతాయన్న సమాచారం ఉన్నా... అధికారులు దృష్టి సారించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఎనిమిదేళ్లలో కనిపించని దారుణమైన కరువు పరిస్థితులు నెలకొనడంతో .. చుక్క  నీరు అందించలేకపోతోంది. అర్గుల్ రాజారాం ఎత్తిపోతల పధకం ఏర్పాటయి ఎనిమిదేళ్లు గడుస్తున్నా.. నేటికి అధికారులు మరమ్మత్తులపై దృష్టి సారించకపోవడంతో... కెనాల్ లు,ట్యాంక్ లు నీరు లేక వెలవెలబోతున్నాయి.   

 

ఎన్టీఆర్ దయతోనే పేదలకు ఇళ్ళు : చంద్రబాబు

విజయవాడ : జక్కంపూడిలో 6 లక్షల ఇళ్ళ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద ఇళ్ళ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఆయన దయవల్లనే పేదలకు పక్కా ఇళ్లు సమకూరనున్నాయని ఆయన పేర్కొన్నారు. రెండు లక్షల ఇళ్లను ఈ ఏడాదిలోగా పూర్తి చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ఇళ్ళ నిర్మాణంలో అవినీతి రాజ్యమేలిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

11:30 - April 14, 2016

హైదరాబాద్ : ప్రజల కనీస అవసరాలు తీర్చడమే తమ లక్ష్యమని నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ అరవింద్‌ పనగారియా అన్నారు. పేదవారికి నివాసం,  ఉపాధి, ఆహార భద్రత, తాగునీరు సౌకర్యాలు కల్పించేందుకు   కృషి చేస్తున్నామన్నారు. పేదరిక నిర్మూలనపై దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధులతో నీతిఆయోగ్‌ హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించింది. 
నాలుగు అంశాలపై ప్రధానంగా చర్చ
పేదరిక నిర్మూలనపై నీతి ఆయోగ్‌ దక్షిణాది రాష్ట్రాలతో సమావేశమైంది. వైస్‌ ఛైర్మన్‌ అరవింద్‌ పనగారియా అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. దక్షిణాది రాష్ట్రాలతో పాటు పాండిచ్చేరి ప్రభుత్వ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. పేదరిక నిర్మూలనకు సంబంధించి ప్రధానంగా నాలుగు అంశాలను ఈ సమావేశంలో చర్చించారు. పేదరిక కొలమానాలు,ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన పథకాల అమలు తదితర అంశాలపై రాష్ట్రాల అభిప్రాయాలను నీతి ఆయోగ్‌ సేకరించింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి ప్రభుత్వాలు తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించాయి. తమిళనాడులో మధ్యాహ్న పథకం, ఏపీలో స్వయం సహాయక బృందాలు, తెలంగాణలో స్త్రీ నిధి, కర్ణాటకలో పౌష్టికాహార పథకాలు విజయవంతంగా అమలు అవుతున్నాయని నీతి ఆయోగ్‌ గుర్తించింది. ఈ పథకాలను దేశ మొత్తం అమలు చేసేలా కేంద్రానికి సిఫార్సు చేస్తామని నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ హామీ ఇచ్చారు. 
తాగునీటి కొరతపై చర్చ
తాగునీటి కొరతపై నీతి ఆయోగ్‌ సమావేశంలో చర్చించారు. అందరికీ తాగునీటి సౌకర్యం కల్పించేందుకు అవసరమైన నిధులను కేంద్రం అందించాలని రాష్ట్రాలు కోరాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని పనగారియా హామీ ఇచ్చారు.  9 జిల్లాలు వెనుకబడి ఉన్నందున తమకు అధిక నిధులు కేటాయించాలని తెలంగాణ విజ్ఞప్తి చేసింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ కోరింది. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు కూడా తమ డిమాండ్లను వినిపించాయి. ఐతే రాష్ట్రాల వినతులపై నీతి ఆయోగ్‌ ఎటువంటి హామీ ఇవ్వలేదు. కేవలం పేదరికం అంశంపైనే చర్చించాలని పనగారియా సూచించారు. రాష్ట్రాల నుంచి సేకరించిన అభిప్రాయాలు ఆధారంగా నీతి ఆయోగ్‌ కేంద్రానికి నివేదిక సమర్పించనుంది. 

 

11:30 - April 14, 2016

విజయవాడ  :  అమరావతిని అద్భుత నగరంగా నిర్మిస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. వనాలు, విహారయాత్రా స్థలాల సమ్మిళితంగా రాజధానిని సుందరంగా తీర్చిదిద్దుతానంటోంది. అయితే ఈ అభివృద్ధి మాటున కృష్ణమ్మకు ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో ఇంతకూ కృష్ణమ్మకు ఏంటి ప్రాబ్లమ్‌.? దాన్ని సాల్వ్ చేయడం కష్టమా.? దీనిపై నిపుణులు ఏమంటున్నారో చూద్దాం..
వరల్డ్ బ్యూటిఫుల్ సిటీగా ఏపీ రాజధాని
వరల్డ్ బ్యూటిఫుల్ సిటీగా ఏపీ రాజధాని అమరావతిని నిర్మించబోతున్నామంటూ ఏపీ సిఎం చంద్రబాబు పలుమార్లు చెప్పారు. రానున్న రోజుల్లో దశలవారీగా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రాజధాని మాస్టర్‌ ప్లాన్లు, సింగపూర్ దేశంలోని నిపుణులతో డిజైన్ చేయించిన విషయం తెలిసిందే. సింగపూర్ దేశాన్ని తలదన్నే విధంగా అమరావతిని నిర్మిస్తామని దీన్ని ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నిర్మిస్తుందని పేర్కొన్నారు. ఇంత మనోహరంగా నిర్మాణం కాబోతున్న అమరావతి రాబోయే రోజుల్లో కృష్ణానదిని..ప్రకాశం బ్యారేజ్ రిజర్వాయర్‌ను కబళించబోతోందన్న నిపుణల అభిప్రాయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కృష్ణానది ఏ స్థాయిలో కుంచించుకుపోతుందో నిపుణులు లెక్కలతో సహా చెబుతున్నారు.
32.43 చదరపు కిలోమీటర్ల మేర కృష్ణానది
ప్రస్తుతం రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో కృష్ణా బ్యారేజ్‌ కింద 32.43 చదరపు కిలోమీటర్ల మేర కృష్ణానది నీరు విస్తరించి ఉంది. అయితే రానున్న రోజులలో నగరాన్ని విస్తరించే క్రమంలో ఆ నీటి నిల్వల విస్తీర్ణం 25.78 చదరపు కిలోమీటర్లకు కుంచించుకుపోయే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఖచ్చితమైన నిబంధనలు పాటిస్తేనే ఇలా వుంటుందనీ...నిబంధనలను అతిక్రమించిన నిర్మాణం చేపడితే అంతకు మించి రిజర్వాయర్ ముప్పు వాటిల్లే అవకాశముందంటున్నారు నిపుణులు. ఫలితంగా కృష్ణానది, దానిలో కలిసే కొండవీటి వాగుపైనా తీవ్ర ప్రభావం పడుతుంది. ఇలా 6.6 చదరపు కిలోమీటర్ల మేర నీటి నిల్వలు తగ్గిపోవడంతో అటు రాజధాని, ఇటు కృష్ణా డెల్టాకు నీటి సరఫరా గణనీయంగా తగ్గిపోయే ప్రమాదముంది. తద్వారా విజయవాడ, అమరావతి చుట్టుపక్కల ఉన్న 4.54 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని అడవులు కూడా క్రమంగా కనుమరుగైపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పర్యావరణంపై ఇండస్ట్రియల్ ఏరియా ప్రభావం  
ఇక కేపిటల్‌ ఏరియాలో 12 చదరపు కిలోమీటర్ల మేర ప్రభుత్వం ప్రతిపాదించిన ఇండస్ట్రియల్ ఏరియా కూడా ఇక్కడి పర్యావరణంపై.. ముఖ్యంగా కృష్ణా నదిపైనా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలున్నాయని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎన్విరాన్‌మెంట్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ బాడీ అంచనా ప్రకారం అమరావతి పూర్తిగా నిర్మాణమయ్యాక మౌలిక అవసరాలకు కనీసం రోజుకు వెయ్యీ 67 మిలియన్‌ లీటర్ల నీరు అవసరమవుతుంది. పారిశ్రామిక అవసరాల నిమిత్తం 203 మిలియన్‌ లీటర్ల నీరు కావాల్సొస్తుంది. ఇదే సమయంలో సిటీ నుంచి 877 మిలియన్‌ లీటర్లు, పరిశ్రమల నుంచి 175 మిలియన్‌ లీటర్ల మురుగు నీరు విడుదలవుతుంది. ఆ మురుగు నీరంతా నదిలో కలిసే ప్రమాదముంది. ఒక్క మురుగు నీరేగాక సిటీతోపాటు పరిశ్రమల నుంచి విడుదలయ్యే చెత్తా చెదారమంతా కృష్ణానదిలోనే కలిసే అవకాశం ఉందని దీని వల్ల.. కృష్ణ మురుగు కాసారంగా మారే వీలుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే.. విజయవాడ నగరం గుండా ప్రవహిస్తున్న పంట కాల్వలు మురుగునీటి కాసారాలుగాను చెత్తను మోసుకెళ్లే వాహకాలుగాను మారి దుర్భరంగా మారడాన్ని నిపుణులు ఉదాహరణగా చూపిస్తున్నారు. కాల్వలనే కాపాడలేని ప్రభుత్వాలు రాబోయే రోజుల్లో రెండు మహా నగరాల మధ్య ప్రవహించే కృష్ణా నదిని ఎలా కాపాడగలుగుతాయన్నది హండ్రెడ్‌ మిలియన్ డాలర్ల ప్రశ్నే అన్నది నిపుణుల భావన. మరి ఏపీ ప్రభుత్వం ఈ సమస్యను ఎలా అధిగమిస్తుందో వేచి చూడాలి. 

11:23 - April 14, 2016

హైదరాబాద్ : ట్యాంకు బంద్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఎంపీ కవిత నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...అంబేద్కర్ జయంతి, వర్థంతి సందర్భంగా కేంద్రప్రభుత్వం ఉత్సవాలు చేయటంతోనే సరిపెట్టకుండా పార్లమెంట్ లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని ఆమె ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. 

నేడు రోహిత్‌ కుటుంబం బౌద్ధం స్వీకరణ

హైదరాబాద్ : ఆత్మహత్యకు పాల్పడిన హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి రోహిత్‌ వేముల కుటుంబం బౌద్ధమతం స్వీకరించనున్నట్లు బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ బుధవారం తెలిపారు. గురువారం భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ 125వ జయంతి సందర్భంగా రోహిత్‌ తల్లి, సోదరుడు బౌద్ధ బిక్షువుల సమక్షంలో దీక్ష స్వీకరిస్తారని పేర్కొన్నారు. ఇక్కడి దాదర్‌లోని అంబేడ్కర్‌ భవన్‌లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.

ప్రయాణికులు పూర్గిగా ఎక్కకుండానే విమానం టేకాఫ్

హైదరాబాద్ : ప్రయాణికులను పూర్తిగా ఎక్కిచ్చుకోకుండానే ఇండిగోకు చెందిన విమానం బయల్దేరి వెళ్లింది. ఈ ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఘటన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి వయా బెంగళూరు మీదుగా కొచ్చిన్ వెళ్లాల్సిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం ప్రయాణికులు ఎక్కకుండానే టేకాఫ్ తీసుకుంది. బోర్డింగ్ కంప్లీట్ చేసుకున్న 15 మంది ప్రయాణికులు వెళ్లకుండానే గేట్ క్లోజ్ చేశారు. దీంతో సిబ్బంది తీరును నిరసిస్తూ శబరిమల వెళ్లాల్సిన ప్రయాణికులు ఆందోళనకు దిగారు.

11:05 - April 14, 2016

హైదరాబాద్ : స్వాతంత్ర్యం వచ్చి 66 సంవత్సరాలు గడుస్తున్నా సమాజంలో ఇంకా కుల వివక్ష వుండటం దురదృష్టకరమని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు. నెక్లెస్‌రోడ్‌లో ఉన్న పీపుల్స్ ప్లాజాలో అంబేద్కర్‌ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా10 వేలమందితో రన్ నిర్వహించారు. రన్‌ను పీపుల్స్ ప్లాజా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ వివక్షకు గురవుతున్నవారే ఇటువంటి వేడుకల్లో పాల్గొంటున్నారు తప్ప వివక్ష పాటిస్తున్నవారు పాలుపంచుకోవటం లేదన్నారు. వివక్ష పాటిస్తున్నవారు ముందుకొచ్చినప్పుడే సమాజంలో వివక్ష పోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకోసం అందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీజేఏసీ అధ్యక్షులు కోదండరాం కూడా పాల్గొన్నారు.

అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ లోని విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.

ఢిల్లీలో అంబేద్కర్‌కు నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని

ఢిల్లీ : పార్లమెంట్ ఆవరణలో డా. భీమ్‌రావ్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తదితర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ప్రధాని నరేంద్రమోదీ అంబేద్కర్ జై భీమ్, విశ్వ మానవ్ అంటూ ట్వీట్ చేశారు. కాగా అంబేద్కర్ జన్మస్థలం మధ్యప్రదేశ్‌లోని మహూలో ప్రధాని పర్యటించనున్నారు.

 

10:50 - April 14, 2016

కడప : మాజీ ఎంపీ గునిపాటి రామయ్య నిన్న రాత్రి కన్నుమూశారు. ఆయన మరణంతో కడప జిల్లా రైల్వే కోడూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. గునిపాటి కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలోని మంగంపేటకు చెందిన రామయ్య వ్యాపారవేత్తగా, మచ్చలేని రాజకీయ నాయకునిగా అంచెలంచెలుగా ఎదిగారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీల నాయకునిగా రాణించారు. 1999 నుంచి 2004 వరకు రాజంపేట ఎంపీగా ఉన్నారు. 2009లో రాజంపేట ఎమ్మెల్యే స్థానానికి పోటీచేసి ఓడిపోయారు. 2014లో రాజంపేట ఎంపీ స్థానాన్ని ఆశించినా ఆ సీటును దగ్గుపాటి పురందేశ్వరికి కేటాయించడంతో టిడిపి తరపున ప్రచారం కూడా నిర్వహించారు. ప్రస్తుతం టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. రామయ్య మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. 

 

10:04 - April 14, 2016

కేంద్రప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే హెచ్ సీయూ వీసీ అప్పరావును మళ్లీ విధుల్లోకి తీసుకున్నారని వక్తలు తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ నేత విజయ్, కెవిపిఎస్ నేత నటరాజ్, బిజెపి నేత వేణుగోపాల్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. అంబేద్కర్ సంఘం పెట్టుకున్నందుకే రోహిత్ పై వీసీ చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:46 - April 14, 2016

ప్రకాశం : జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి చెందారు. వేగంగా వెళ్తున్న స్విఫ్టు కారు టంగుటూరు వంతెనపైకి వెళ్తున్న లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ వెళ్తున్న మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 

బెల్లంపల్లి శాంతిగని నుంచి మృతదేహాలను బయటకుతీయని యాజమాన్యం

ఆదిలాబాద్ : బెల్లంపల్లి శాంతిగని నుంచి మృతదేహాలను యాజమాన్యం ఇంకా బయటకుతీయలేదు. అధికారులతో చర్చలు జరపాలంటూ కాలయాపన చేస్తోంది. నిన్న సాయంత్రం పై కప్పు కూలి శాంతిగనిలో సింగరేణి కార్మికులు మృతి చెందారు. మృత దేహాల కోసం కుటుంబ సభ్యుల ఆందోళన చెందుతున్నారు. 

 

ఉప్పల్ లోని గేమింగ్ జోన్‌పై ఎస్‌వోటీ పోలీసుల దాడి

హైదరాబాద్ : నగరంలోని ఉప్పల్ పరిధిలో గల గేమింగ్ జోన్‌పై ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా జరిపిన తనిఖీల్లో పోలీసులు రూ. 80,900 నగదుతో పాటు 16 సెల్‌ఫోన్లు, ప్లేయింగ్ కార్డ్స్, టాబ్లెట్స్, పలు ఛైర్లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 16 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు.

ముంబైలో అగ్ని ప్రమాదం

మహారాష్ట్ర : ముంబైలో గల లోఖండ్‌వాలాలోని నివాస భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. భవనం 13వ అంతస్థులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని నాలుగు అగ్నిమాపక యంత్రాలు, 3 నీళ్ల ట్యాంక్‌లతో ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

ఓలా ఆటోరిక్షా బుకింగ్‌ సేవలు

విశాఖ : విశాఖపట్నం, ఉదయ్‌పూర్‌ సహా 12 పట్టణాల్లో తాజాగా ఆటోరిక్షా బుకింగ్‌ సేవలను ఓలా ప్రారంభించింది. దీంతో మొత్తం 24 పట్టణాల్లో ఈ సేవలను అందిస్తున్నట్లు అవుతుంది. 2017 నాటికి రోజుకు 20 లక్షల ఆటోరిక్షా బుకింగ్‌లు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఓలా వెల్లడించింది. సేవలు ప్రారంభించిన పట్టణాల్లో రోజు మొత్తం ఓలా ద్వారా ఆటోలను బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది.

నేడు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ : డా.బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని నేడు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ రాత్రి 8 గంటల వరకు అమల్లో ఉంటాయి. 

నేడు మైక్రోమాక్స్ యూనిట్ ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : నేడు మైక్రోమాక్స్ యూనిట్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. హైదరాబాద్ లో రూ.80 కోట్లతో రెండో యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. 

 

08:41 - April 14, 2016

డా.బిఆర్ అంబేద్కర్ లక్ష్యాలు, ఆశయాలపై దేశ వ్యాప్తంగా తీవ్రమైన చర్చ జరుగుతుందని కుల వివక్ష పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'ఇవాళ ఏప్రిల్ 14. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి. ఇది 125వ జయంతోత్సవాలు జరుగుతున్న సంవత్సరం. అంబేద్కర్ ఆశయాలను సాధించేందుకు కృషి చేస్తామంటూ దాదాపు అన్ని రాజకీయ పార్టీలు చెబుతున్నాయి. కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి, రెండేళ్ల క్రితం వరకు అధికారంలో వున్న కాంగ్రెస్, ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అంబేద్కర్ జయంతి ఉత్సావాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయి.  125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాలు నెలకొల్పేందుకు  సిద్ధమవుతున్నాయి. రాజ్యాంగ రచనలో కీలకపాత్ర పోషించిన అంబేద్కర్ ను మనం ఎలా అర్ధం చేసుకోవాలి? రాజ్యాంగం విషయంలో బాబా సాహెబ్ అంబేద్కర్ అభిప్రాయాలేమిటి? సమాజంలో సగభాగంగా వున్న మహిళల పట్ల ఆయన ద్రుక్పథం ఎలా వుండేది?  కులం, మతం వంటి సామాజికాంశాల విషయంలో అంబేద్కర్ కున్న అభిప్రాయాలేమిటి? దేశాభివృద్ధిని గురించి ఆయన ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారు?  125 అడుగుల ఎత్తయిన భారీ అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయడానికి పూనుకుంటున్న ప్రస్తుత ప్రభుత్వాల పనితీరు అంబేద్కర్ ఆశయాలను ప్రతిఫలిస్తోందా? ఇలాంటి అంశాలపై జాన్ వెస్లీ మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దా....

నేడు గుజరాత్‌ లయన్స్-రైజింగ్‌ పుణే మధ్య మ్యాచ్

హైదరాబాద్ : ఐపీఎల్ 2016 లో భాగంగా ఈరోజు గుజరాత్‌ లయన్స్ వర్సెస్‌ రైజింగ్‌ పుణే జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ ఈరోజు రాత్రి ప్రారంభం కానుంది. రెండు జట్లు చేరో మ్యాచ్‌ గెలిచి మంచి ఫామ్‌ లో ఉన్నాయి. ఈ మ్యాచ్‌ ల్లో కుడా గెలిచి పాయింట్ల పట్టికలో ముందు ఉండాలని రెండు జట్లు చూస్తున్నాయి. కొత్త కెప్టెన్‌ రైనా నా లేక ధోని ఆ అని దానికి మరికోన్ని గంటలు ఆగాల్సిందే 

రాజమండ్రి బ్రిడ్జిపై బ్లేడ్‌ బ్యాచ్ వీరంగం

తూర్పుగోదావరి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని రాజమండ్రి గోదావరి నాలుగో బ్రిడ్జిపై బ్లేడ్‌ బ్యాచ్ వీరంగం సృష్టించారు. టాటాఏస్ వాహనంపై  దాడి చేసి ఆరుగురికి గాయాలు చేశారు. బ్లేడ్‌ బ్యాచ్‌ టాటా ఏస్‌ వాహనంతో ఉడాయించారు.

వరంగల్ జిల్లా కోయిల్‌వాయిలో విషాదం

వరంగల్ : జిల్లాలోని ఆత్మకూరు మండలం కోయిల్‌వాయిలో విషాద ఘటన చోటుచేసుకుంది. పురుగులమందు తాగి ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

08:14 - April 14, 2016

హైదరాబాద్ : ఎస్సై, కానిస్టేబుల్స్ పోటీ పరీక్షలకు మొదటిసారిగా బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టింది తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. ఈ నెల 17న ఎస్సై, 24న కానిస్టేబుల్ పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యం అయినా అనుమతిచ్చేది లేదని స్పష్టం చేసింది. 321 పరీక్ష కేంద్రాల్లో హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా అన్ని వివరాలను పొందుపర్చిన యాప్‌ను డిజిపి ప్రారంభించారు. 
సబ్ ఇన్స్ పెక్టర్ పోటీపరీక్షల్లో లక్ష ముప్పై వేల మంది దరఖాస్తు 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా నిర్వహిస్తున్న పరీక్షలకు టెక్నాలజీని విరివిగా వాడుకుంటుంది తెలంగాణ పోలీస్ రిక్రూర్‌మెంట్‌ బోర్డు. 17న జరిగే సబ్ ఇన్స్ పెక్టర్ పోటీపరీక్షల్లో లక్ష ముప్పై వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో సివిల్, ఏ.ఆర్, పీ.టీ.వో కమ్యూనికేషన్‌కు ప్రాథమిక పరీక్ష నిర్వహించనున్నారు. సివిల్ ఎస్సైల్లో 33 శాతం మహిళలకు కోటా కల్పిస్తున్నారు. గతంలో లాగా 5 కిలోమీటర్ల పరుగును పూర్తిగా రద్దు చేశారు.
మెరిట్ ఆధారంగా నియమాకం 
200 మార్కుల వ్రాత పరీక్షలో 70 మార్కులతో ఉత్తీర్ణులు అయిన వారు ఫిజికల్ పోటీల్లో పాల్గొంటారు. ప్రధాన పరీక్ష నిర్వహించి వీటిలో మెరిట్ ఆధారంగా నియమాక పక్రియను పూర్తి చేస్తారు. అయితే ఇందులో ఎలాంటి అవకతకలు, అరోపణలు రాకుండా ఉండేందుకు మొదటి సారిగా బయో మెట్రిక్ విధానాన్ని ప్రవేశ పెట్టారు.
పరీక్ష సమయానికి గంట ముందే అనుమతి
పరీక్ష సమయానికి ఒక గంట ముందు నుంచే పరీక్ష కేంద్రానికి అనుమతిస్తారు. చేతి వాచ్ తో ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతినివ్వరు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియాల్లో పేపర్లు తయారు చేశారు. ఇక కానిస్టేబుల్ పరీక్షల్లో కూడా ఇలాంటి పద్ధతినే పాటించేందుకు జెఎన్టీయూ సిద్ధమయింది. ఇక అభ్యర్దులు తమ సెంటర్లను ఇంటర్నెట్ లో సర్చ్ చేసుకునేందుకు ఒక ప్రత్యేక మొబైల్‌ యాప్ ను రూపొందించారు. 

 

08:09 - April 14, 2016

విజయవాడ : ఏపీకి ఉద్యోగుల తరలింపు కార్యక్రమానికి కృష్ణా పుష్కరాలు అడ్డు కానున్నాయా..? ఈ ప్రశ్నకు అవునన్న సమాధానమే వస్తోంది. పుష్కరాల సమయాల్లో నూతన గృహ ప్రవేశ ముహూర్తాలు లేకపోవడం... రాజధాని ప్రాంతంలో కాపురాలు పెట్టాలనుకునే ఏపీ ఉద్యోగులకు ఇబ్బందిగా మారిందంటున్నారు. పుష్కరాల సమయంలో కొత్త భవనాల్లోకి వెళ్తే దుష్పరిణామాలు ఎదురు కావచ్చన్న ఆందోళన ఉద్యోగుల్లో కనిపిస్తోంది. 
ఉద్యోగుల తరలింపుపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి
విజయవాడకు ఉద్యోగుల తరలింపు విషయంపై ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్‌గా దృష్టి సారించింది. ఇప్పటికే ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలతో అనేక దఫాలుగా చర్చలు జరిపింది. ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్‌లోగా ఉద్యోగులంతా విజయవాడకు రావాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే.. ఈ ప్రక్రియకు కృష్ణా పుష్కరాలు అడ్డుగా నిలిచే పరిస్థితి కనిపిస్తోంది. 
ఆగస్టు 12 నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభం 
ఆగస్టు 12 నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. పుష్కరాలకు రెండు నెలల ముందు నుంచి ఎలాంటి శుభ కార్యాలూ చేయరాదని పండితులు సూచిస్తున్నారు. ఈ కాలంలో శుభముహూర్తాలే ఉండవని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడకు వెళ్లి.. కాపురాలు పెట్టడం ఎలా అన్నది ఏపీ ఉద్యోగులను వేధిస్తోన్న ప్రశ్న.
జూన్‌ లోగా తరలించాలన్న కృతనిశ్చయం 
అయితే.. ప్రభుత్వం మాత్రం ఎలాగైనా ఉద్యోగులను జూన్‌ లోగా తరలించాలన్న కృతనిశ్చయంతో అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఉద్యోగ సంఘాలకు ఆ విషయాన్ని స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వ సూచనల మేరకు విజయవాడ వెళ్లేందుకు కొంతమంది సిద్ధం కాగా.. చాలామంది 2017 మార్చి వరకూ గడువు ఇస్తే బావుంటుందని కోరుతున్నారు. పైగా ఇప్పటికే ఏప్రిల్‌ నెల సగం పూర్తయింది. కొన్ని విద్యాసంస్థలు పిల్లలకు ఫీజులు కూడా కట్టించుకున్నాయి. పిల్లలను విజయవాడ తరలించాలంటే తమకు ఫీజుల రూపంలో అదనపు భారం పడుతుందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పైగా ఇప్పుడు పుష్కరాల సుముహూర్తాల అంశమూ వారి వాదనకు తోడైంది.  
వారికి ఐదు రోజులు పని దినాలు
అయితే ప్రభుత్వం మాత్రం... ఉద్యోగుల తరలింపునకే కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడ వచ్చే ఉద్యోగులకు ఐదు రోజులు పని దినాలు,.. 30 శాతం హెచ్‌ఆర్‌ఏ ప్రకటించింది. ఈ దశలో.. కృష్ణా పుష్కరాల కారణంగా తరలింపును వాయిదా వేయాలని కోరుతున్న ఉద్యోగుల డిమాండ్‌పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 

 

08:04 - April 14, 2016

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా నిర్మించబోయే డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం వర్క్ షాప్‌ నిర్వహించింది. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో గృహనిర్మాణశాఖ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. నిర్మాణరంగంలో అనుభవం ఉన్న పలు సంస్థలతో పాటు ఇన్వెస్టర్లు, టెక్నికల్‌ నిపుణులు పాల్గొన్నారు. 
తక్కువ సమయం... తక్కువ ఖర్చు.. నాణ్యమైన ఇళ్లు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై వర్క్ షాప్ నిర్వహించింది. తక్కువ సమయంలో..తక్కువ ఖర్చులో నాణ్యమైన ఇళ్లను ఎలా నిర్మించాలి అనే అంశంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ రంగంలో అనుభవం ఉన్న పలు కంపెనీల ఇన్వస్టర్లు .. టెక్నికల్ నిపుణులు హాజరయి  పలు సలహాలు సూచనలు ఇచ్చారు. సాంకేతిక నిపుణుల, వివిధ రంగాల,ఆర్ ఎండ్ బీ అధికారులను, నిర్మాణరంగంలో ఉన్న నిష్ణాతులను ఈ కార్యక్రమానికి పిలవడం జరిగిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నిపుణులకు ఉన్న అనుభవాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని  జోడిస్తే తక్కువ ఖర్చుతో.. తక్కువ సమయంలో .. దృఢంగా ఉండే డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను చేపట్టేందుకు అవకాశం ఉంటుందని మంత్రి అన్నారు. 2లక్షల  65 వేల  ఇళ్లను నిర్మించాలను కున్నామని.. జీ ప్లస్ 7 జీప్లస్ 3 లో నిర్మాణాలను  చేపట్టాలనుకుంటున్నామని.. అందులో భాగంగానే ఈ వర్క్ షాప్ చేపట్టామని అన్నారు మంత్రి. 
కొత్త టెక్నాలజీ వాడకం...
కొత్త టెక్నాలజీని ఉపయోగించి తక్కువ సిమెంట్ వాడుతూ.. ఎక్కువ మన్నికనిచ్చే వాటిపై ప్రభుత్వం చర్చిస్తోందని... ఇది అభినందనీయమని అన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్  జనార్థన్ రెడ్డి. నిర్మాణరంగ కంపెనీలు తమ సలహాలు ప్రభుత్వానికి ఇవ్వాలని.. సలహాలు సూచనలు తీసుకోవడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అనువుగా ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అదీ నగరంలో ఇరుకు గదులలో ఉండే వారికి ఉపశమనం కల్పించేందుకు జీహెచ్ ఎంసీ , రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడిగా పనిచేస్తున్నాయని తెలిపారు.
స్లమ్ ఫ్రీ సిటీస్ గా మార్చేందుకు ప్రయత్నం 
స్లమ్ ఫ్రీ సిటీస్ గా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని.. ఒకే చోట నాలుగైదు ఇళ్లను నిర్మించేందుకు స్థల సేకరణ సమస్యలు వేధిస్తున్నాయని మంత్రి తెలిపారు. ఈ దిశగా అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని...జీ ప్లస్ 3 జీ ప్లస్ 4, జీప్లస్ 7 నిర్మాణాలను కొత్త టెక్నాలజీని ఉపయోగించాలనుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఈ వర్క్‌ షాప్ ద్వారా  వక్తలు తెలిపిన వివరాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందన్నారు మంత్రి.   

 

07:59 - April 14, 2016

కృష్ణా : ఆంధ్రప్రదేశ్‌లోనూ డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ల సందడి ప్రారంభమవుతోంది. 6 లక్షల ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలో డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు.
ఆరు లక్షల డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం
ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా ఆరు లక్షల డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఎన్టీఆర్‌ స్వగృహ పథకం కింద ఈ ఇళ్లను నిర్మించనున్నారు. అంబేడ్కర్‌ 125వ జయంతి సందర్భంగా  ముఖ్యమంత్రి ఇవాళ విజయవాడలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు. 
ఉదయం 8.30 గంటలకు శంకుస్థాపన
కృష్ణా జిల్లా జక్కంపూడిలో 10 వేల ఇళ్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేస్తారు. ఉదయం 8.30 గంటకు శంకుస్థాపన కార్యక్రమం ఉంటుంది. అనంతరం ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన పైలాన్‌ను సీఎం ఆవిష్కరిస్తారు. విజయవాడ నగరంలో కాల్వగట్లపై ఉంటున్న దాదాపు 8,300 కుటుంబాలను జక్కంపూడి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్టీఆర్ గ్రామీణ, పట్టణ గృహ నిర్మాణ పథకాల కింద 4 లక్షల ఇళ్లు, గృహ నవీకరణ కింద 1.50 లక్షల ఇళ్లతో పాటు మరో 50 వేల గృహాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. 
6 లక్షలమంది లబ్ధిదారుల గుర్తింపు
రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించి వారికి ఇళ్లను కేటాయించనున్నారు. మరోవైపు నిర్మాణం ప్రారంభించి మధ్యలోనే వదిలేసిన ఇళ్లను కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

 

తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ

చిత్తూరు : తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఏడుకొండలవాడి దర్శనానికి భక్తులు 10 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వెళ్లే భక్తులకు 3 గంటల సమయం పడుతుంది. స్వామివారిని నిన్న 64,386 మంది భక్తులు దర్శించుకున్నారు.

మాజీ ఎంపీ గునిపాటి రామయ్య కన్నుమూత

కడప : జిల్లాలోని రాజంపేట మాజీ ఎంపీ గునిపాటి రామయ్య కన్నుమూశారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆయన 1999లో టీడీపీ తరుపున ఎంపీగా గెలిచారు. మళ్లీ 2009  2009 లో పీఆర్పీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఓడిపోయారు.

07:51 - April 14, 2016

హైదరాబాద్ : అంబేద్కర్‌ జయంతి ఉత్సవాలను తెలుగు రాష్ట్రాలు ఘనంగా నిర్వహిస్తున్నాయి. పోటాపోటీగా భారీ విగ్రహాలు ఏర్పాటు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే అసలు అంబేద్కర్‌ ఏం కోరుకున్నారు ? ఆయన ఆశయాల సాధన కోసం తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు  ఏం చేస్తున్నాయి ? ప్రభుత్వ పథకాలు దళితులకు సక్రమంగా చేరాలంటే ఏం చేయాలి ? 
హైదరాబాద్‌లో 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటు 
అంబేద్కర్‌ 125వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు రాష్ట్రాలు నిర్ణయించాయి. హైదరాబాద్‌లో 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్‌ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ సర్కార్‌ నిర్ణయించింది. గురువారం తెలంగాణ సీఎం కేసీఆర్‌ భూమి పూజ చేయనున్నారు. ఏడాదిపాటు అంబేద్కర్‌ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించి.. వచ్చే జయంతి నాటికి విగ్రహ శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. అదే విధంగా నవ్యాంధ్ర రాజధానిలోనూ ఎత్తయిన అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ ఆలోచిస్తోంది. 
దళితులకు న్యాయం జరుగుతుందా ?
అయితే.. విగ్రహాల ఏర్పాటు.. అంబేడ్కర్‌ జయంతి రోజున ప్రసంగాల ద్వారా దళితులకు న్యాయం జరుగుతుందా ?. ఎన్నికల సమయంలో దళితుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేస్తామని చెప్పే నేతలు.. అధికారంలోకి వచ్చాక ఆ దిశగా ఎంతవరకు అడుగులు వేస్తున్నారనేది ప్రశ్నార్ధకంగా మారింది. తెలంగాణ సర్కార్‌ దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ.. కొన్ని చోట్ల నామమాత్రంగానే అందించారనే ఆరోపణలున్నాయి. అది పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదని.. దానిపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదనే ఆరోపణలున్నాయి. మరోవైపు ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమానికి కేటాయిస్తున్న నిధులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అదీగాక.. ఆ నిధులను ఖర్చు చేయడంలో కూడా వివక్ష కొనసాగుతోంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలుపై కూడా ఇంతవరకు ప్రభుత్వానికి స్పష్టత లేదు. 
దళితుల పట్ల కొనసాగుతున్న వివక్ష
ఇక స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా దళిత, గిరిజనులపై దాడులు జరుగుతూనే వున్నాయి. ఇప్పటికీ పలు గ్రామాల్లో వారి పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. ఇంకా పలు ప్రాంతాల్లోకి దళితులను రాకుండా అడ్డుకోవడం.. గ్రామాల నుంచి వెలివేయడం కూడా జరుగుతూనే ఉంది. అంతేగాకుండా అనాదిగా వస్తున్న రెండు గ్లాసుల విధానం కూడా కొనసాగుతోంది. ఇంకా దళిత యువతులపై అత్యాచారాలు కూడా జరుగుతున్నాయి. 
రోహిత్‌ ఆత్మహత్యపై జాతీయస్థాయిలో చర్చ
తాజాగా.. హెచ్‌సీయూ దళిత విద్యార్ధి వేముల రోహిత్‌ ఆత్మహత్య వ్యవహారంపై జాతీయస్థాయిలో చర్చ జరిగింది. ఈ అంశంలో బీజేపీ అత్యుత్సాహం ప్రదర్శించిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కేంద్రమంత్రి దత్తాత్రేయ జోక్యంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని పలువురు ఆరోపించారు. ఇక తెలంగాణ సర్కార్‌ స్పందించినా.. అది ఆలస్యమైందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. 
ఏపీలోనూ కార్యరూపం దాల్చని దళిత సంక్షేమం 
ఇక ఏపీలోనూ దళిత సంక్షేమానికి క‌ట్టుబడి ఉన్నామని సర్కార్‌ చెబుతున్నా.. అది కార్యరూపం దాల్చడం లేదనే ఆరోపణలున్నాయి. నవ్యాంధ్ర రాజధానిలో భూములు నష్టపోయిన కౌలురైతుల్లో ఎక్కువమంది దళితులే ఉండడం దీనికి నిదర్శనమంటున్నారు. 
దళితులకందని 'ఉపాధి హామీ' బకాయిలు..
ఇక జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారిలో దళితులు, గిరిజనులు ఉన్నారు. కొంతకాలంగా కూలీ బకాయి ఉండడంతో వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి హామీ కార్మికులకు బకాయి వెంటనే చెల్లించాలని సుప్రీంకోర్టు కేంద్రానికి మొట్టికాయలు కూడా వేసింది. కేంద్రం ఈ పథకాన్ని మొత్తానికి మొత్తంగాత నీరుగార్చే ప్రయత్నం చేస్తోందన్న ఆరోపణలున్నాయి. 
కార్యరూపం దాల్చని సంక్షేమ పథకాలు 
దేశవ్యాప్తంగా అంబేద్కర్‌ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నా.. ఆయన కోరుకున్న సంక్షేమ ఫలాలు ఇంకా ఆ వర్గాలకు దక్కడం లేదు. దళితులకు ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నా అవి కార్యరూపం దాల్చడం లేదు. నిధులు కేటాయించినా.. వాటిని పూర్తిస్థాయిలో ఖర్చు చేయడం లేదు. ఈ దశలోనైనా ప్రభుత్వాలు అంబేడ్కర్‌ ఆశయ సాధనకు చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

 

07:43 - April 14, 2016

ఢిల్లీ : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ 125వ జయంతిని ఇవాళ ఘనంగా జరుపుకుంటున్నారు. 1891 ఏప్రిల్‌ 14న అంబేద్కర్‌ జన్మించారు. రాజ్యాంగ రచనలో ఆయన కీలక పాత్ర వహించారు. స్వతంత్ర భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్‌ పనిచేశారు. 
అంబేద్కర్...దళిత, దీన జనోద్ధారకుడు 
అంబేడ్కర్‌..! రాజ్యాంగ నిర్మాతగానే  కాదు.. దళిత, దీన జనోద్ధారకుడిగానూ తనదైన యశస్సును సొంతం చేసుకున్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. అంటరానితనమనే  వ్యాధిని నిర్మూలించాలని  నినదించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అన్ని రంగాల్లోనూ రిజర్వేషన్‌లను  అమలు చేయాలన్నారు. సమసమాజ స్థాపన దిశగా ఇంకా ఎన్నెన్నో సూచనలు చేశారు. మరి అవన్నీ ఏ మేరకు అమలవుతున్నాయి..? డాక్టర్‌ బీఆర్ అంబేడ్కర్‌ నిర్దేశించిన అజెండాలో మిగిలి పోయినవి  ఏవి..? ఓసారి గుర్తు చేసుకుందాం. 
సమసమాజ భావన
రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేడ్కర్‌ మస్తిష్కంలో.. ఎన్నో సుందర స్వప్నాలు. వాటిలో సఫలమైనవి కొన్నయితే.. నేతల తలపులలోనే కనుమరుగైనవి మరిన్ని. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ మస్తిష్కంలో బలంగా నాటుకున్నది.. తాను రూపొందించిన రాజ్యాంగంలో నిక్షిప్తం చేసినది.. సమసమాజ భావన. సమాజంలో స్త్రీ, పురుష, కుల, మత వివక్ష అన్నదే లేకుండా అందరూ సమాన అవకాశాలు పొందాలని.. భేదాలేవీ లేకుండా జీవించాలన్నది అంబేడ్కర్‌ ప్రథమ లక్ష్యం. సామాజిక న్యాయం కోసం అంబేడ్కర్‌ చూపిన మార్గం ఎప్పటికీ ఆచరణీయం.. అందరికీ మార్గదర్శకం. అణగారిన వర్గాలను అత్యున్నత స్థితికి తీసుకు రావాలని, వారి అభ్యున్నతి కోసం అన్ని రంగాల్లోనూ రిజర్వేషన్లు అమలు చేయాలన్నది అంబేడ్కర్‌ భావన. ప్రభుత్వ రంగంలో కొంతమేర ఈ రిజర్వేషన్‌లు అమలవుతున్నాయి కానీ.. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్‌ల ఊసే లేకుండా పోయింది. దళితులు, అణగారిన వర్గాలు  వివక్షకు  గురికాకుండా.. రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్‌ల విధానాన్ని ప్రైవేటు రంగానికీ విస్తరించాల్సిన అవసరం ఉంది. 
దళితులపై వివక్షను రూపుమాపడం
ఇక డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ స్వప్నించిన మరో అంశం.. దళితులపై వివక్షను రూపుమాపడం. చట్టాల ద్వారానే ఇది సాధ్యమని నమ్మారు. అయితే.. ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్‌ ఆఫ్‌ అట్రాసిటీస్‌ బిల్లు-2015.. ఇప్పటికీ రాజ్యసభ ఆమోదాన్ని పొందలేక పోతోంది. ఈ బిల్లును లోక్‌సభ ఆమోదించినా.. రాజ్యసభ ఆమోదం పొందలేదు. వివక్ష రూపుమాయాలంటే.. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన నిధులను వారికే కేటాయించాలన్నది మరో ప్రధాన భావన. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించాలన్న అంబేడ్కర్‌ ఆశయం నేటికీ నెరవేరడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దీనికి సంబంధించి చట్టం చేసినా.. రాష్ట్ర విభజన తర్వాత దాని ఊసు ఎత్తే పాలకులే లేకుండా పోయారు. 
కులాల నిర్మూల‌న కోర‌లేదు
బాబా సాహెబ్ అంబేడ్కర్‌ దళితులకు సమాన అవకాశాలు కోరారే కానీ.. ఏనాడూ కులాల నిర్మూల‌న కోర‌లేదు. ఇదే విషయాన్ని అనిహిలేషన్‌ ఆఫ్‌ క్యాస్ట్ పేరిట రాసిన పుస్తకంలోనూ స్పష్టం చేశారు. బీసీ, ఎస్సీ,ఎస్టీలు ఆర్థిక‌, రాజ‌కీయ‌, సామాజిక రంగాల్లో అణిచివేత‌కు గుర‌వుతున్నార‌ని గుర్తించిన అంబేద్కర్‌ వారి అభ్యున్నతికి సంపూర్ణ ప్రణాళికలు అమలు చేయాలని సంకల్పించారు. కులాంత‌ర వివాహాల వ‌ల్ల కొన్ని కులాలు అంత‌రిస్తాయే త‌ప్ప ఈ కులాల‌ను పీడిస్తున్న వ‌ర్ణాలు య‌థాత‌థంగా ఉండిపోతాయ‌ని  అంబేద్కర్‌  భావించారు. ఇటువంటి ప్రయత్నాల వల్ల కులాలు అంత‌రించి ఈ వ‌ర్గాలు క‌నీస హ‌క్కుల‌కు సైతం దూర‌మ‌వుతాయ‌ని  అంబేద్కర్‌ ఆలోచించారు.
రాజకీయాధికారంతోనే బహుజనుల జీవితాల్లో మార్పు 
రాజకీయాధికారంతోనే బహుజనుల జీవితాల్లో మార్పు వస్తుందన్నది బాబాసాహెబ్‌ అభిమతం. ఈ పలుకుల స్ఫూర్తితోనే కాన్షీరాం బహుజన సమాజ్‌ పార్టీని స్థాపించారు. ఉత్తర ప్రదేశ్‌ రాజకీయాల్లోనే కాదు.. దేశ రాజకీయాల్లోనూ ఓ మార్క్‌ను సెట్‌ చేశారు. నేడు అంబేద్కర్ వారసత్వం గురించి అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి.  ఆయన జన్మదిన వేడుకలను  యేడాది పాటు నిర్వహించాలని కాంగ్రెస్ నాయకులు, అంబేద్కర్ అంతిమ సంస్కారాలు  జరిగిన చోట స్మారకాన్ని నిర్మించేందుకు  భాజపా నాయకులు ప్రయత్నిస్తున్నారు. అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రానికి  192 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. అంబేద్కర్‌ను జాతీయ వాద నేతగా ప్రచారం చేయాటానికి ఆర్ఎస్ఎస్ ఇప్పటికే నిర్ణయించింది. అయితే.. అమలుకాని అంబేడ్కర్‌ ఆశయాల సాధనకు ఏ పక్షమూ చొరవ చూపడం లేదన్న వేదన బహుజనుల్లో గూడుకట్టుకునే ఉంది. అంబేద్కర్‌ ఆశయాలు కొనసాగించడం అంటే కేవలం ఆయన జయంతికి, వర్థంతికి నివాళులు అర్పించడం కాదు. ఆయన కాంక్షించిన సమసమాజ స్థాపన దిశగా ప్రతి ఒక్కరూ నడుం కట్టడమే.. అంబేడ్కర్‌కు నిజమైన ఘన నివాళి. ఆదిశగా సమాజం పునరంకితం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

 

నేడు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు సీఎం కేసీఆర్ భూమి పూజ

హైదరాబాద్ : టీసర్కార్ నేటి నుంచి అంబేద్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహించనుంది. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటుకు సీఎం కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. ప్రసాద్ ఐమాక్స్ వద్ద భహిరంగ సభ జరుగనుంది. 

నేడు ఇండియా-అమెరికా ఎకనమిక్ ఫైనాన్షియల్ పార్ట్ నర్ షిప్ సమ్మిట్

వాషింగ్టన్ : నేడు న్యూయార్క్ లో ఇండియా-అమెరికా దేశాల ఆరో ఎకనమిక్ ఫైనాన్షియల్ పార్ట్ నర్ షిప్ సమ్మిట్ జరుగనుంది. ఈ కార్యక్రమానికి భారత కేంద్రఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ హాజరుకానున్నారు.   

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

ప్రకాశం : టంగుటూరు వంతెన వద్ద కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. 

Don't Miss