Activities calendar

19 April 2016

22:03 - April 19, 2016

ఢిల్లీ : ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ షెడ్యూలు విడుదల చేసింది. తెలంగాణలోని పాలేరుతో పాటు మేఘాలయ, అరుణాచల్‌ ప్రదేశ్‌, జమ్మూకాశ్మీర్‌, జార్ఘండ్‌, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లో ఖాళీ అయిన అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈనెల 22న పాలేరు ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల కానుంది. ఈనెల 29 వరకు నామినేషన్లు వేసేందుకు చివరితేదీగా నిర్ణయించారు. నామినేషన్లు ఉపసంహరణ గడువు మే 2వ తేదీ, 30న నామినేషన్లు పరిశీలిస్తారు. ఆ తర్వాత మే16న పాలేరుతో దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక పోలింగ్‌ను నిర్వహించి మే 19న ఓట్లు లెక్కిస్తారు. పాలేరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మిక మృతితో  ఉప ఎన్నిక అనివార్యమైంది. పాలేరు ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్‌ విడుదల చేయడంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తక్షణమే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. 

 

22:00 - April 19, 2016

కేరళ : వచ్చే అయిదేళ్లలో పాతిక లక్షల ఉద్యోగాలు,  సంప్రదాయ పరిశ్రమలకు ప్రత్యేక శాఖ ఏర్పాటు, అవినీతి రహిత పాలన ఎజెండాగా  కేరళ లో ఎల్‌ డిఎఫ్‌ మ్యానిఫెస్టో విడుదల చేసింది.  ఐటీ పార్కుల విస్తరణ, ధరల నియంత్రణతో సహా 35 అంశాలకు   ఈ మ్యానిఫెస్టోలో ప్రాధాన్యత ఇచ్చారు. 
అవినీతి రహిత పాలన
సెక్యులర్ విలువలతో కూడిన అవినీతిరహిత పాలన అందించడం, సమగ్రాభివ్రుద్ధికి బాటలు వేసే సరికొత్త కేరళను స్రుష్టించడమే తమ లక్ష్యమంటూ ఎల్ డిఎఫ్ మ్యానిఫెస్టో ప్రకటించింది. వచ్చే ఐదేళ్ల పాటు ధరలు పెరగకుండా  ప్రత్యేక  స్కీమ్ ప్రవేశ పెడతామంటూ  హామీ ఇచ్చింది. ఎవరూ ఆకలితో బాధ పడే పరిస్థితి తలెత్తకుండా చూస్తామంది.  తాగుడు అలవాటు మాన్పించడాన్ని మరో ప్రాధాన్యత అంశంగా చేర్చారు. స్టార్టప్ విలేజెస్ పేరుతో గ్రామీణ ప్రాంతాలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ప్రతి ఏటా ఒక్కొక్క గ్రామానికి  రెండు లక్షల రూపాయల చొప్పున వెయ్యి గ్రామాలకు స్టార్టప్ ప్రోత్సాహకాలు అందిస్తామన్నది ఎల్ డిఎఫ్ వాగ్ధానాలలో మరో ముఖ్యమైన అంశం.  ఆహార భద్రత, వ్యవసాయరంగం సంక్షోభం, నిరుద్యోగం, వైద్యం మొదలైన అంశాలను మ్యానిఫెస్టోలో ప్రధాన్యాతాంశాలుగా చేర్చిన ఎల్ డిఎఫ్  ఐటీ పార్కులను విస్తరిస్తామంటూ హామీ ఇచ్చింది.  మే 16న కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 

 

21:57 - April 19, 2016

విజయవాడ : దేశంలోని మొత్తం 6 వేల గ్రామాలను 300 క్లస్టర్లుగా అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్‌ తెలిపారు. ఒక్కో క్లస్టర్‌ అభివృద్ధికి 125 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నంత కాలం రాష్ట్రానికి అన్యాయం జరగబోదని.. ప్రగతి మార్గంలో దూసుకు పోతుందన్నారు. ఏపీలో గిరిజన మహిళా సర్పంచుల జాతీయ సదస్సులో పాల్గొన్న కేంద్రమంత్రి.. తక్కువ సమయంలోనే ఆర్థికంగా నిలదొక్కుకునే సత్తా ఏపీకి ఉందని కితాబిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. గిరిజన ప్రాంతాల అభివృద్ధితోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని.. ఆ దిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. 
గిరిజనుల అభివృద్ధికి అరకు కాఫీని ప్రోత్సహిస్తున్నామన్న సీఎం
గ్రామీణాభివృద్దిలో పంచాయతీలదే కీలకపాత్ర అని  సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో జరిగిన గిరిజన మహిళా సర్పంచుల జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. మహిళలకు రిజర్వేషన్లు తెచ్చిన ఘనత ఎన్టీఆర్ దేనని అన్నారు. గిరిజనుల అభివృద్దికి అరకు కాఫీని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ప్రతీ కుటుటంబానికి 30 వేల రూపాయలు ప్రోత్సాహకంగా అందిస్తామని తెలిపారు. గిరిజన బాలల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలను అభివృద్ది చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. పాఠశాలలో అత్యున్నత  సాంకేతిక విద్యతో పాటు పౌష్టికాహారం అందిస్తామని తెలిపారు. మెరుగైన సేవలు అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాలను క్లస్టర్లుగా తీర్చిదిద్దుతున్నాం 
జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని ఢిల్లీలో కాకుండా దేశ వ్యాప్తంగా నిర్వహించాలని అన్నారు కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్. ప్రతి పంచాయతీకి ఏటా కనీసం రూ.80 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.2 కోట్ల నిధులు మంజూరు చేస్తామన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధితోనే సమగ్ర అభివృద్ధి ముడిపడి ఉందన్నారు. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలను క్లస్టర్లుగా తీర్చిదిద్దేందుకు రూర్బన్‌ మిషన్‌ను ప్రారంభించినట్లు చెప్పారు.   మొత్తం 6 వేల గ్రామాలను 300 క్లస్టర్లుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అంతేకాకుండా ఒక్కో క్లస్టర్‌ అభివృద్ధికి రూ.125కోట్లు వెచ్చిస్తామన్నారు.  అమరావతిని గిరిజనులకు నిలయంగా మార్చి.. వారి అభివృద్దికి బాటలు వేస్తామన్నారు సీఎం. విభజనసమయంలో జరిగిన అన్యాయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కేంద్రమంత్రులను చంద్రబాబు కోరారు.

 

21:54 - April 19, 2016

హైదరాబాద్ : తెలంగాణ విద్యార్ధులకు తీపి కబురు. ఎన్నో రోజులుగా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న స్కాలర్‌ షిప్‌లు, ఫీజు రియింబర్స్‌మెంట్ నిధులు విడుదలయ్యాయి. బకాయిలను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 
ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల
సంవత్సరాలుగా పేరుకుపోయిన ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలను ఎట్టకేలకు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులకు స్కాలర్ షిప్‌లనూ రిలీజ్ చేసింది. ఎన్నో రోజులుగా ఈ బకాయిల కోసం విద్యార్థులతో పాటు కాలేజీ యాజమాన్యాలూ ఎదురు చూస్తున్నాయి. ఫీజు బకాయిలు చెల్లించనంత కాలం ప్రభుత్వానికి సహకరించేది లేదని కాలేజీ యాజమాన్యాలు స్పష్టం చేశాయి. అటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు... ఇటు కాలేజీల ఒత్తిడితో తలొగ్గిన ప్రభుత్వం మొత్తానికి నిధులు విడుదల చేసింది.
శాఖల వారీగా బకాయిల కేటాయింపులు
పెండింగ్‌లో ఉన్న మూడువేల అరవైరెండు కోట్ల బకాయిలను ఆయా శాఖల వారిగా విడుదల చేసింది ఆర్థికశాఖ. ఇందులో 574 కోట్ల రూపాయలు స్కాలర్‌షిప్‌లకు, 2488 కోట్లు రియింబర్స్‌మెంట్‌ కు కేటాయించారు. శాఖల వారీగా ఎస్సీ వెల్ఫేర్‌కు రూ. 517 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖకు రూ. 289 కోట్లు, బీసీ వెల్ఫేర్‌కు రూ.1954 కోట్లు రిలీజ్ చేసింది. మైనార్టీ శాఖకు రూ.350 కోట్లు విడుదల చేసింది. ఇక వికలాంగుల సంక్షేమానికి 68 లక్షలు కేటాయించింది. 
ఇక నుంచి ప్రతి మూడు నెలలకోసారి స్కాలర్‌షిప్స్
ఇంతకాలం రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో ఎంతో మంది విద్యార్థులు నష్టపోయారు. కోర్సు ముగిసిన విద్యార్థులకూ సర్టిఫికేట్లు ఇవ్వకుండా కాలేజీలు ఇబ్బంది పెట్టాయి. దీనిపై ఎట్టకేలకు స్పందించిన ప్రభుత్వం అన్ని బకాయిలను విడుదల చేసింది. ఇక నుంచి ప్రతి మూడు నెలలకోసారి స్కాలర్‌షిప్స్, ఫీజ్ రియింబర్స్ మెంట్ నిధులను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

 

21:51 - April 19, 2016

ఢిల్లీ : ఇది విజ్ఞాన శతాబ్ధం అని, మానవజాతి విజ్ఞాన యుగంలోకి వెళ్లిన ప్రతిసారి భారత్ దానికి మార్గం చూపిందని ప్రధానమంత్రి నరేంద్రమోది అన్నారు. వైష్ణవదేవి యూనివర్సిటీ ఐదో స్నాతకోత్సవంలో పాల్గొన్న మోది- అక్కడి విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. గతాన్ని మర్చిపోండి...భవిష్యత్‌కు పునాది వేయండని విద్యార్థులకు ప్రధాని పిలుపునిచ్చారు. యువత స్వప్నం దేశ వికాసానికి ఉపయోగపడుతుందన్నారు. చిన్నరాష్ట్రం త్రిపురకు చెందిన అమ్మాయి రియో ఒలింపిక్స్‌కు ఎంపికవ్వడం భారత్‌కు గర్వకారణమని.. జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ను మోదీ కీర్తించారు. అంతకు ముందు  కత్రాలో మాతా వైష్ణవదేవి సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రధాని ప్రారంభించారు.

కోల్ కతా విజయలక్ష్యం 139 పరుగులు

హైదరాబాద్ : ఐపీఎల్-9 లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. పంజాబ్ నిర్ణీత 20 వోవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. కోల్ కతా విజయలక్ష్యం 139 పరుగులుగా ఉంది.  

ప్రైవేట్ విద్యాసంస్థల్లో పోలీసులు దాడులు ఆపాలి : ఎస్ ఎఫ్ ఐ

హైదరాబాద్ : ప్రైవేట్ విద్యా సంస్థల్లో పోలీసులు దాడులు ఆపాలని ఎస్ ఎఫ్ ఐ డిమాండ్ చేసింది. ఈమేరకు ఆ సంఘం నేతలు ఒక ప్రకటన విడుదల చేశారు. టాస్క్ ఫోర్స్ ద్వారానే తనిఖీలు నిర్వహించాలని పేర్కొన్నారు.

తొలి వికెట్ కోల్పోయిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌..

హైదరాబాద్‌ : ఐపీఎల్‌-9లో భాగంగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నారు. మొద‌ట బ్యా‌టింగ్‌కు వ‌చ్చి‌న పంజాబ్ 21 ప‌రుగుల వ‌ద్ద మోర్క‌ల్ 8(12) ఔట‌య్యా‌డు.

21:02 - April 19, 2016

మళ్లొక్కసారి మోగిన ఓట్ల గంట.. ఎవలకు పడుతదో సీటు పంట, దొంగల దగ్గర పోలీసుల బైక్.. 2016 లనే పేద్ద జోకు, సీఐడీ డిపార్టుమెంట్ల చీడ పరుగు... ఆడామను ఏడిపించి కక్కిందినురుగు, మన తెలంగాణ కాశ్మీర్ల నీళ్ల గోస... ఏ వొక్కలీడరుపెడతలేడంట ధ్యాస, సిగరెట్ దాగిన సీమ సింహం... పొగలకూడా కనిపిచ్చిందట అహం..... ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

20:52 - April 19, 2016

హైదరాబాద్ : దేశంలో కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ పథకం నీరు గారుతోంది. దేశంలోని 13 రాష్ట్రాలు నిధులను సక్రమంగా ఖర్చు చేయలేదు. నిధులను సక్రమంగా ఖర్చు చేయని రాష్ట్రాల జాబితాలో బీజేపీ పాలిత రాష్ట్రాలే అధికంగా ఉండడం శోచనీయం. ఈ జాబితాలో తెలంగాణ, ఎపి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఎపి ఖర్చు చేయని నిధులు రూ.62.94 కోట్లు, తెలంగాణ ఖర్చు చేయని నిధులు రూ. 40.75 కోట్లుగా ఉండడం గమనార్హం.

20:39 - April 19, 2016

ఢిల్లీ : పనుల్లేక తెలుగు పల్లెలు వలసెల్లి పోతుంటే.. ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. ఉపాధి హామీ పథకం నిధులను ఖర్చు చేయకుండా.. ప్రజలను వలస బాట పట్టిస్తున్నాయి. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే ఈ విషయాన్ని వెల్లడించింది. తెలుగు రాష్ట్రాలు రెండింటితో కలిపి మొత్తం 13 రాష్ట్రాలు ఉపాధి నిధులను మురిగించేశాయి. దీన్ని బట్టే అర్థమవుతోంది..  ఉపాధి హామీ పథకం ఏమేరకు నీరుగారుతుందో.. 
నిధులు ఖర్చు చేయడంలో రాష్ట్రాలు విఫలం 
తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. కేంద్రం విడుదల చేసిన ఉపాధి హామీ పథకం నిధులను ఖర్చు చేయడంలో రాష్ట్రాలు విఫలమయ్యాయి. తెలుగు రాష్ట్రాలు రెండింటితో పాటు.. మొత్తం 13 రాష్ట్రాలు మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చాయి. ఇది ఏ సంస్థో చేసిన సర్వే కాదు.. విపక్షాలు చేస్తున్న విమర్శ అంతకన్నా కాదు. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం వెలువరించిన నివేదిక సారాంశమిది. 
ఏపీ ప్రభుత్వం 62 కోట్ల 94 లక్షలు-తెలంగాణ ప్రభుత్వం 40 కోట్ల 75 లక్షలు
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కోసం కేటాయించిన నిధుల్లో ఏపీ ప్రభుత్వం 62 కోట్ల 94 లక్షలు, తెలంగాణ ప్రభుత్వం 40 కోట్ల 75 లక్షలు మురిగించేశాయి. ఇక కరవు కరాళ నృత్యం చేస్తున్న మహారాష్ట్రలోనూ పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. మహారాష్ట్ర ప్రభుత్వం వద్ద 390.88 కోట్ల మేర ఉపాధి నిధులు ఖర్చు కాకుండా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. బీహార్‌ వద్ద 169.15 కోట్లు, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం దగ్గర 133 కోట్లు, ఛత్తీస్‌గఢ్‌ వద్ద దాదాపు 50 కోట్లు, ఝార్ఖండ్‌ ప్రభుత్వం 97.21 కోట్ల నిధులను ఖర్చు చేయకుండా అలాగే ఉంచినట్లు కేంద్రం బయటపెట్టింది. 
ఖర్చు చేయని రాష్ట్రాలలో సగం బీజేపీ పాలిత రాష్ట్రాలు 
ఉపాధి హామీ పథకం నిధులు ఖర్చు చేయని రాష్ట్రాలలో సగం బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉండటం విశేషం. ఒడిషా ప్రభుత్వం 84. 53 కోట్లు, యూపీ 416 కోట్లు, గుజరాత్‌ 103.87 కోట్లు, హర్యానా 95.1 కోట్ల మేర ఉపాధి నిధులు ఖర్చు చేయలేదని కేంద్ర ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. పొరుగు రాష్ట్రమైన కర్ణాటక 187.6 కోట్లను, రాజస్థాన్‌ 340.82 కోట్లను ఎలాంటి ఉపాధి పనులకు చేపట్టకుండా నిధులను మిగిల్చినట్లు వెల్లడయింది. 
ఉపాధి హామీ పథకం నీరుగార్చడం పట్ల విమర్శలు 
కరవు తీవ్రత కారణంగా.. పల్లెలు దూర ప్రాంతాలకు తరలిపోతుంటే.. ఆ వలసలను ఆపేందుకు ఉన్న అద్భుత అవకాశమైన ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నీరుగార్చడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి కరవు నివారణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. వలసలను అరికట్టడానికైనా ఉపాధి హామీ నిధులను సక్రమంగా ఖర్చు చేయాలని రైతు, ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.  

 

కేరళ సీఎం ఉమెన్ చాందీకి గాయాలు

త్రివేండ్రం : కేరళ సీఎం ఉమెన్ చాందీకి స్వల్ప గాయాలయ్యాయి. ఈరోజు ఉదయం పెరింతల్మన్న ప్రాంతంలోని షిఫ్పా ఆడిటోరియంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో తిరిగి బయలుదేరారు. అయితే, అక్కడ ఉన్న యువకులు ఆయనతో సెల్ఫీ దిగేందుకని చెప్పి ఒక్కసారిగా ముందుకు రావడం, అదే సమయంలో వారి పక్కనున్న గ్లాసు డోర్ బద్దలవడం జరిగింది. దీంతో గాజు ముక్కలు సీఎం కాలికి గుచ్చుకున్నాయి. వెంటనే చాందీని సమీప ఆసుపత్రికి తరలించారు.

టీఆర్ఎస్ ప్లీనరీపై పార్టీ వర్గాల్లో చర్చలు...

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంపై పార్టీ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ముందు అనుకున్న ప్రకారం ఈ నెల 27న ప్లీనరీ సమావేశం జరగాల్సి ఉంది. అయితే ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ప్లీనరీ సమావేశం నిర్వహించాలా వద్దా అనే ప్రశ్నలు తలెత్తాయి. 
అయితే ప్లీనరీకి, నోటిఫికేషన్కు సంబంధం లేదని టీఆర్ వర్గాలంటున్నాయి. బహిరంగ సభకు ఎన్నికల సంఘం అనుమతి తీసుకునే యోచనలో టీఆర్ఎస్ ఉంది. కాగా రెండు, మూడు రోజుల్లో ప్లీనరీపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

దీపా కర్మాకర్‌పై ప్రధాని ప్రశంసల జల్లు

హైదరాబాద్‌ : ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ మహిళా జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌పై ప్రధాని మోడీ ప్రశంసల జల్లు కురిపించారు. దీపాలాంటి టాలెంటెడ్ మహిళలుంటే మగాళ్లు రిజర్వేషన్లు కావాలంటూ ఆందోళన చేసినా ఆశ్చర్యం లేదని మోడీ చమత్కరించారు. కత్రాలోని శ్రీమాతా వైఫ్ణోదేవి యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ ప్రధాని యువత దీపను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా దీప అనుకున్నది సాధించారని అభినందించారు. 21వ శతాబ్దం భారత్‌దేనన్నారు.

వ్యక్తిపై కానిస్టేబుల్‌ కత్తితో దాడి...

ప్రకాశం : జిల్లలోని చీరాల ఆర్టీసీ బస్టాండ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఎల్‌ఐసీలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న సునీల్‌ అనే వ్యక్తిపై కానిస్టేబుల్‌ శ్రీనివాసరావు కత్తితో దాడికి పాల్పడ్డాడు. మంగళవారం సాయంత్రం బస్సులోనే చోటుచేసుకున్న ఈ ఘటనతో తోటి ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. రక్తపు మడుగులో పడివున్న క్షతగాత్రుడిని స్థానికులు ప్రేవేటు ఆస్పత్రికి తరలించగా... అక్కడి చికిత్స పొందుతూ మృతి చెందాడు.

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌....

హైదరాబాద్‌ : ఐపీఎల్‌-9లో భాగంగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నారు. రైజింగ్‌ పుణెతో జరిగిన మ్యాచ్‌లో గెలుపొంది సీజన్‌లో బోణీ కొట్టిన మిల్లర్‌ నేతృత్వంలోని పంజాబ్‌ ఆ జోరును కొనసాగించాలని ఆశిస్తోంది. మరోవైపు కోల్‌కతా కూడా హైదరాబాద్‌పై అలవోకగా గెలిచి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.

20:20 - April 19, 2016

కోల్ కతా : పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒత్తిడికి లోనవుతున్నారా? ఆమెలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతోందా? ఎన్నికల కమిషన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆమెకు మింగుడుపడడం లేదా?  పశ్చిమబెంగాల్ రణక్షేత్రంలో అధికార పక్షానికి ప్రతిపక్షం గట్టి సవాలు విసురుతోందా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇలాంటి ప్రశ్నలే వస్తున్నాయి. 
2 విడతల పోలింగ్ పూర్తి
పశ్చిమ బెంగాల్ లో రెండు విడతల పోలింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. మరో నాలుగు విడతలుగా పోలింగ్ జరగాల్సి వుంది. మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, 105 స్థానాల్లో పోలింగ్ సమాప్తమైంది. ఇక మిగిలింది 189 నియోజకవర్గాలే.  నిజానికి ఎన్నికల షెడ్యుల్ విడుదల కాకముందే మమతాబెనర్జీ హాట్ ఫేవరేట్ గా కనిపించారు.  త్రుణమూల్ కాంగ్రెస్ కి మెజార్టీ లభిస్తుందనీ, ఆమే తిరిగి ముఖ్యమంత్రి అవుతారంటూ వివిధ సర్వేలు సూచించాయి. తొలుత ప్రత్యర్థి పార్టీలు కూడా   పెద్దగా ఆశలు పెట్టుకోలేదు.  
క్రమంగా మారుతున్న రాజకీయ వాతావరణం
కానీ, ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి క్రమంగా వాతావరణం మారుతోంది. వివిధ పార్టీల, రాజకీయ పరిశీలకుల అంచనాల్లో మార్పులు వస్తున్నాయి. 2011లో మమతాబెనర్జీకి మద్దతిచ్చిన కొంతమంది మేధావులు ఇప్పుడు తమ అభిప్రాయాలు మార్చుకుంటున్నారు. ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. 
మమతాబెనర్జీ ఆత్మవిశ్వాసం కోల్పోతున్నారా?
ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ని తీవ్రమైన ఒత్తిడికి లోనుచేస్తున్నట్టే కనిపిస్తోంది. ఆమె వ్యవహారశైలిని, చేస్తున్న ప్రకటనలను చూస్తుంటే    ఆమె ఒత్తిడికి లోనవుతున్నారన్న అభిప్రాయాన్ని కలిగిస్తోంది.   తేలికగానే సింహాసనం మళ్లీ  చేజిక్కించుకోగలనన్న నమ్మకంతో ఒంటరిగా బరిలోకి దిగిన మమతాబెనర్జీ క్రమంగా ఆత్మవిశ్వాసం కోల్పోతున్నారా? అన్న అనుమానం కలుగుతోంది.  
మమతాబెనర్జీకి దూరమైన కాంగ్రెస్  
2011 ఎన్నికల్లో మమతాబెనర్జీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ ఈసారి ఆమెకు దూరమైంది. తాను పోటీ చేయని స్థానాల్లో  వామపక్షాలకు కాంగ్రెస్ స్నేహ హస్తం అందించడం  ఆమెకు ఏమాత్రం మింగుడుపడని పరిణామం.   మరోవైపు, కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి కూడా ఎన్నికల వేళ విమర్శల హోరు పెంచింది.  పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ప్రధాని నరేంద్రమోడీ మమతాబెనర్జీ మీద   ఘాటు వ్యాఖ్యలే చేశారు.  ఇంకోవైపు వామపక్షాలతో పాటు బిజెపి కూడా పోలింగ్ అక్రమాల మీద ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నాయి.  సాధారణ ప్రజల నుంచి కూడా వేల సంఖ్యలో ఫిర్యాదులు వెళ్తున్నాయి. 
తొలి విడత పోలింగ్...12 హత్యలు 
తొలి విడత పోలింగ్ జరిగిన 49 నియోజకవర్గాల్లో 12 హత్యలు నమోదయ్యాయి.  ఎన్నికల కమిషన్ కు రెండువేలకు పైగా ఫిర్యాదులందాయి. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి రోజుకి సగటున 40 కంప్లయింట్ లు వెళ్తున్నాయి.  పశ్చిమబెంగాల్ లో నెలకొన్న తీవ్ర పరిస్థితులకు ఇది నిదర్శనం. దీంతో  కేంద్ర ఎన్నికల కమిషన్ కు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది.  ఒకటికి రెండుసార్లు క్షేత్రపరిశీలన చేసింది.  భారీ సంఖ్యలో ఫిర్యాదులొచ్చిన నేపథ్యంలో మూడో విడత పోలింగ్ కు నిఘాను కట్టుదిట్టం చేస్తోంది. 
ఓటర్లకు బెదిరింపులు 
ఓటర్లను బెదిరించడం, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల ప్రచారాన్ని అడ్డుకోవడం, పోలింగ్ బూతుల్లో ప్రత్యర్థి పార్టీలకు ఏజెంట్లు లేకుండా చేయడం, రిగ్గింగ్ కు పాల్పడడం లాంటి సంఘటనలపై ఎక్కువగా ఫిర్యాదులొస్తున్నాయి. అనేకమంది పోలీసుల, అధికారుల వ్యవహార శైలి తీవ్ర వివాదస్పదమవుతోంది.   అధికార పక్షానికి కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్ కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్  ను ఎన్నికల కమిషన్ విధుల నుంచి తొలగించింది.  ఎనిమిది మంది ఐఏఎస్, ఐపిఎస్ అధికారులను,   30 మంది సిఐలను  ఎన్నికల కమిషన్ బదిలీ  చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.   పశ్చిమబెంగాల్ లో ఆరు విడతల పోలింగ్ నిర్వహించడం, భారీ స్థాయిలో కేంద్ర బలగాలను తరలించడం ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి ఏమాత్రం ఇష్టం లేదు.  ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మరుక్షణమే ఆమె ఎన్నికల కమిషనర్ మీద ఊగిపోయారు. పోలింగ్ ముగిసే వరకే కేంద్ర బలగాలుంటాయని, ఆ తర్వాత రాష్ట్ర పోలీసులే అన్నీ చూసుకుంటారంటూ ఆమె వ్యాఖ్యానించడం ఓటర్లను బెదిరించే వ్యూహంలో భాగమే. అసలు ఆమె ఎన్నికల కమిషన్ ను లెక్క చేయని రీతిలో మాట్లాడడం చాలామందిని నివ్వెరపరిచింది.  నిబంధనల ఉల్లంఘన విషయంలో ఎన్నికల కమిషన్ తనకు నోటీసులివ్వడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు.  నాకు నోటీసులిస్తారా? మే 19న ప్రజలు మీకే నోటీసులిస్తారంటూ మమతా బెనర్జీ ఊగిపోవడాన్ని ఆమె మద్దతుదారులు సైతం సమర్ధించలేకపోతున్నారు. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ద్వారానే తాను అధికారంలోకి వచ్చానన్న వాస్తవాన్ని బెంగాల్ ముఖ్యమంత్రి పూర్తిగా విస్మరించినట్టే కనిపిస్తోంది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వుంటూ రాజ్యాంగబద్ధ సంస్థలను హేళన చేయడం,  లా అండ్ ఆర్డర్ ను ధ్వంసం చేసేలా మాట్లాడడం ఆశ్చర్యకరం.    
వారిద్దరి మధ్యనే పోటీ జరుగుతోందా? 
ఒకవైపు కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకుంటున్న నిర్ణయాలకు ముఖ్యమంత్రి మమతాబెనర్జీ స్పందిస్తున్న తీరు చూస్తుంటే వారిద్దరి మధ్యనే పోటీ జరుగుతోందా? అన్న అనుమానం కలుగుతుంది. కానీ, క్షేత్రస్థాయి వాస్తవాలు మరోరకం అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకుంటున్న నిర్ణయాలను కోల్ కతాలోని రాష్ట్ర ఎన్నికల అధికారి సీరియస్ గా అమలు చేయడం లేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. రాజ్యసభ అవసరాల కోసం మమతాబెనర్జీతో మెతక వైఖరి అవలంభిస్తున్న బిజెపి కూడా రాష్ట్ర ఎన్నికల అధికారి సునీల్ గుప్తాను తొలగించాలంటూ డిమాండ్ చేయడం, ఎన్నికల అక్రమాలపై భారీ సంఖ్యలో ఫిర్యాదులు చేస్తుండడం విశేషం.  పశ్చిమబెంగాల్ కి 800 కంపెనీల కేంద్ర బలగాలను తరలించారు. ఇటీవల కాలంలో ఇంత భారీ సంఖ్యలో కేంద్ర బలగాలనూ ఏ రాష్ట్రంలోనూ మొహరించలేదు. కానీ, ఆ బలగాలేవీ క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. అవన్నీ క్యాంప్ ల్లోనే కాలక్షేపం చేస్తుండడం రిగ్గింగ్ చేసేవారికీ, దౌర్జన్యాలు సాగించేవారికి ఆయాచితవరంగా మారుతోంది. 

 

20:10 - April 19, 2016

విజయవాడ : ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్శిటీ ఆధ్వర్యంలోనే దేశవ్యాప్తంగా అర్హత పరీక్ష జరుగుతుందని ఏపీ ప్రైవేటు మెడికల్‌, డెంటల్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ కన్వీనర్‌ కొడాలి జయరమేష్‌ తెలిపారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రైవేటు మెడికల్‌ సీట్ల కేటాయింపు, అర్హత పరీక్ష, ఫీజుల విధానం వంటి అంశాలపై జయరమేష్‌ మాట్లాడారు. అర్హత పరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగానే సీట్ల భర్తీ జరుగుతుందన్నారు. ప్రైవేటు మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో ఈ ఏడాది వెయ్యికిపైగా సీట్లను భర్తీచేస్తామని తెలిపారు. ప్రైవేటు యాజమాన్యాల కోటా కింద భర్తీచేసే సీట్ల విషయంలో పూర్తిపారదర్శకత పాటిస్తామని అన్నారు. ఈ ఏడాది మెడికల్లో 665 సీట్లు, డెంటల్లో 350 సీట్లు భర్తీకి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా నిర్వహించే అర్హత పరీక్షకు 36 కేంద్రాలు కేటాయించామని పేర్కొన్నారు.  పూర్తిగా ఆన్‌లైన్‌లోనే అర్హత పరీక్ష ఉంటుందన్నారు. బ్రోకర్లను ఎట్టిపరిస్థితుల్లో నమ్మవద్దని తెలిపారు. 

 

19:58 - April 19, 2016

నిజామాబాద్ : ప్రైవేటు విద్యా సంస్థలపై పోలీసుల దాడులు సమంజసం కాదని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేటు విద్యా సంస్థలపై విజిలెన్స్ పోలీసుల దాడులు సరైంది కాదని... ఈ వ్యవహరాన్ని శాంతి భద్రతల సమస్యగా చూడరాదని కోదండరాం అన్నారు. ప్రభుత్వం ఉన్నత విద్యామండలి, విశ్వవిద్యాలయాల ద్వారా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలి... కాని పోలీసుల ద్వారా కాదని హితవు పలికారు. ప్రభుత్వం, పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.

 

19:54 - April 19, 2016

హైదరాబాద్ : ప్రైవేట్ విద్యా సంస్థలపై పోలీసులతో దాడులు చేయించడం సరికాదని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి అన్నారు. విద్యాసంస్థలు తప్పు చేస్తే.. విద్యాశాఖ అధికారులు విచారణ జరపాలి కానీ... పోలీసులతో ఎంక్వైరీ జరిపించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ తీరుపై విద్యార్థులు నష్టపోయే పరిస్తితి ఉందన్నారు. 

 

తెలంగాణలోనూ ఆంధ్రా కార్పొరేట్ ల కుట్రలా...?

హైదరాబాద్ : ప్రైవేట్ కాలేజీల్లో పోలీసుల తనిఖీలపై జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలోనూ ఆంధ్రా కార్పొరేట్ ల కుట్రలా...? అని ప్రైవేట్ విద్యా సంస్థల జేఏసీ మండిపడింది. తనిఖీల వల్ల కాలేజీ యాజమాన్యాలను ప్రజలు దొంగల్లా చూస్తున్నారని జేఏసీ తెలిపింది. తెలంగాణ విద్యా సంస్థల ఆత్మగౌరవాన్ని సీఎం దెబ్బ తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలకు వివిధ ప్రజా పక్షాలు మద్దతు తెలిపాయి. 

 

19:48 - April 19, 2016

హైదరాబాద్ : ప్రైవేటు విద్యా సంస్థల్లో పోలీసుల తనిఖీలపై ప్రైవేట్ విద్యాసంస్థల జేఏసీ ఆగ్రహం చేసింది. తనిఖీల వల్ల కాలేజీ యాజమాన్యాలను ప్రజలు దొంగల్లా చూస్తున్నారని జేఏసీ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోనూ ఆంధ్రా కార్పొరేట్ ల కుట్రలా...? అని జేఏసీ మండిపడింది. తెలంగాణ విద్యా సంస్థల ఆత్మగౌరవాన్ని సీఎం దెబ్బ తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలకు వివిధ ప్రజా పక్షాలు మద్దతు ప్రకటించాయి. సమస్యను శాంతి భద్రతల కోణంలో చూడరాదని ప్రొ.కోదండరామ్ అన్నారు. ప్రభుత్వ చర్య వల్ల విద్యార్థులు నష్టపోతారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి అన్నారు. 

19:42 - April 19, 2016

హైదరాబాద్ : పీఎఫ్‌ నిర్ణయంపై కేంద్రం వెనక్కు తగ్గింది. పీఎఫ్‌పై నిర్ణయాన్ని మరో మూడు నెలలపాటు పాత నిబంధనల్నే పొడిగించామని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఉద్యోగ సంఘాలు, యాజమాన్యాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయన్నాయని స్పష్టం చేశారు. పీఎఫ్‌ను విత్‌డ్రా చేసేటప్పుడు 12శాతం ఎప్పుడైనా తీసుకోవచ్చన్నారు. 

 

తిరుపతిలో బోర్డు తిప్పేసిన వెరిజో టెక్ కోచింగ్ సెంటర్

చిత్తూరు : తిరుపతిలో వెరిజో టెక్ కోచింగ్ సెంటర్ బోర్డు తిప్పేసింది. కోచింగ్ సెంటర్ వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సిలబస్ పూర్తి చేయకుండానే బోర్డు కోచింగ్ సెంటర్ బోర్డు ఎత్తివేసింది. 

 

పాలేరు ఉప ఎన్నికలో పోటీ చేస్తాం : తమ్మినేని

హైదరాబాద్ : పాలేరు ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బూర్జువ పార్టీలతో పొత్తులుండవని తేల్చి చెప్పారు. 

అమరావతి నగర భూకేటాయింపులపై కమిటీ ఏర్పాటు

విజయవాడ : అమరావతి నగర భూకేటాయింపులపై కమిటీ ఏర్పాటు చేశారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో కమిటీ వేశారు.

గోదావరి బ్రిడ్జిపై బ్లేడ్ బ్యాచ్ కలకలం

తూర్పుగోదావరి : రాజానగరం మండలం కొంతమూరులో గోదావరి బ్రిడ్జిపై బ్లేడ్ బ్యాచ్ కలకలం రేపింది. ముగ్గురు వ్యక్తులను తీవ్రంగా గాయపరిచారు. నలుగురు యువకులను పోలీసులు అదుపలోకి తీసుకున్నారు. బ్లేడ్ బ్యాచ్ ముఠాలో ప్రకాశ్, సూర్యతేజ, వినోద్, దినేష్ లు ఉన్నారు. 

18:40 - April 19, 2016

ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు చట్టాలు తేవాలని పలువురు అభిప్రాయపడ్డారు. ఫీ'జులుం'పై వైజాగ్ లో టెన్ టివి పబ్లిక్ బిబేట్ నిర్వహించింది. పలువురు డిబేట్ లో పాల్గొని, మాట్లాడారు. ప్రభుత్వంలో ఉన్నవారు వారికి అనుకూలంగా చట్టాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రైవేట్ విద్యాలయాలను అరికట్టాలన్నారు. విద్యా హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. ప్రైవేట్ విద్యాలయాలు వేలు, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. విద్యను సరుకుగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం విద్యా వ్యవస్థ ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని సూచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

18:01 - April 19, 2016

వరంగల్ : రూ.40 వేల కోట్ల వ్యయంతో తలపెట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా తెలంగాణలోని ప్రతి గ్రామానికి, తండాకు శుద్ధి చేసిన తాగు నీరు ఇవ్వనున్నట్లు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. వరంగల్ జిల్లా అబ్బాయిపాలెం గ్రామంలో జరుగుతున్న మిషన్ భగీరథ పనులను ఆయన పరిశీలించి, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. 

 

17:57 - April 19, 2016

హైదరాబాద్ : ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందని మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. జేఏసీ డిమాండ్ చేసినట్లుగా విద్యుత్ ఒప్పందాలపై శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. ఒప్పందాల ప్రకారం నిరంతర విద్యుత్ అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు.. 

 

17:51 - April 19, 2016

హైదరాబాద్ : రేపటి నుంచి డిగ్రీ వాల్యువేషన్ ను బహిష్కరించనున్నట్లు ప్రైవేట్ విద్యా సంస్థల జేఏసీ ప్రకటించింది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో పోలీసులు తనిఖీలు నిలిపివేసే వరకు ఆందోళన కొనసాగుతుందన్నారు. ప్రైవేట్ కాలేజీల్లో ఏ పరీక్షను నిర్వహించబోమని తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు తమ పోరాటం ఆగదని జేఏసీ హెచ్చరిస్తోంది. అయితే ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తే...తాము తప్పకుండా చర్చలకు వెళ్తామని చెప్పారు. 

 

17:49 - April 19, 2016

హైదరాబాద్‌ : నెహ్రూ జులాజికల్‌ పార్కులో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. ఫలితంగా సందర్శకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సరైన భద్రత లేకపోవడం.. సరిపడా రక్షణ వలయం లేకపోవడం.. సందర్శకులను క్రూర మృగాల బారిన పడేస్తోంది. కొందరు అవగాహనా రాహిత్యంతో, మరికొందరు అత్యుత్సాహంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వరుస ఘటనలు జరిగినా జూ అధికారుల్లో చలనమే లేకుండా పోయింది. జూ పార్కులో భద్రతపై  10 టివీ ప్రత్యేక కథనం. 
వినోదం వెనుకే.. విషాదమూ...
380 ఎకరాల అటవీ ప్రాంతం...... పదకొండు వందలకు పైగా వివిధ రకాల జంతువులు.. పక్షులు..., విష సర్పాలు.... ఎంత కలియ తిరిగినా విసుగు కలగని ప్రకృతి సౌందర్యం.... అడుగడుగునా వినోదం.. ఇదీ బయటి నుంచి చూసేవారికి హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ ముఖచిత్రం. అయితే ఇక్కడ వినోదం వెనుకే.. విషాదమూ పొంచి వుంటుంది. ఎన్‌క్లోజర్స్‌లో ఉండాల్సిన జంతువులు బయటకు వస్తున్నాయి.... బయట ఉండాల్సిన కొందరు సందర్శకులు ఎన్‌క్లోజర్‌లోకి వెళుతున్నారు. దీంతో వినోదం వెనుకే విషాదం వెంటాడుతోంది. సందర్శకుల నిండు ప్రాణాలు క్రూర మృగాలకు బలి అవుతున్నాయి. గడచిన పదేళ్లలో రకరకాల కారణంగా సందర్శకులు జూ జంతువుల బారిన పడ్డ సంఘటనలు లెక్క లేనన్ని ఉన్నాయి. 
జూలోకి ప్రవేశించిన దుండగులు..  
జూలోకి ప్రవేశించిన కొందరు దుండగులు.. ఇక్కడి పులిని చంపి చర్మాన్ని, గోళ్లను ఎత్తుకెళ్లిన ఘటన నుంచి మొదలు పెడితే.. సోమవారం రాత్రి బస్తీలోకి వచ్చేందుకు ఎలుగుబంటి ప్రయత్నించడం వరకు ఎన్నెన్నో ఘటనలు. సరిగ్గా పదిహేనేళ్ల కిత్రం గాలి పటం కోసం పులుల సఫారిలో దిగిన బాలుడిని ఒక పులి చంపేసింది. గత సంవత్సరం ఆగస్టు నెలలో బెంగాల్‌ టైగర్‌ ఎన్‌క్లోజర్‌ దాటి సందర్శకుల బాట వద్దకు వచ్చింది. పులి బయటకు వచ్చిందన్న వార్తతో సందర్శకులు పడ్డ టెన్షన్ అంతా ఇంతా కాదు. సందర్శకులు.. తాబేళ్లు, చిరుత పులి లాంటి జంతువుల ఎన్‌క్లోజర్లలోకి వెళ్లి...  సెల్పీలు తీసుకుని.. ఫేస్‌బుక్‌లో పెట్టాక గానీ గుర్తించలేని దుస్థితిలో జూ అధికారులు ఉన్నారు.
యువకుడి చేతిని కొరికిన వైట్ టైగర్ 
2009 ఆగస్టు నెలలో ఒక యువకుడు వైట్‌ టైగర్‌ ఎన్‌క్లోజర్‌ సమీపంలోకి వెళ్లి గడ్డి తినిపించే ప్రయత్నం చేయడంతో... పులి అతని చేతిని మణికట్టు వరకు కొరికి వేరు చేసిన ఘటన అప్పట్లో సంచలనం కలిగించింది. మొన్నటికి మొన్న పురానాపూల్‌కు చెందిన ముంజిత్‌కుమార్‌ అనే పదవ తరగతి విద్యార్థి సీతాకోకచిలుకల ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లి.. విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందాడు. సోమవారం రాత్రి ఓ ఎలుగుబంటి ఎన్‌క్లోజర్‌ను దాటుకుని జూ సరిహద్దు గోడపై ఎక్కి కూర్చొంది. బస్తీ వైపు దూకే ప్రయత్నం చేయడంతో స్థానికులు వెంటనే సమాచారం ఇచ్చారు. అర్థరాత్రి సుమారు నాలుగు గంటల పాటు శ్రమించిన తరువాత ఎలుగుబంటిని జూ అధికారులు పట్టుకోగలిగారు. . 
ఎలాంటి భద్రతాపరమైన చర్యలు శూన్యం
జూలో పదే పదే ఇలాంటి ఘటనలు జరుగుతున్నా.. అధికారులు ఎలాంటి భద్రతాపరమైన చర్యలు తీసుకోక పోవడం విమర్శలకు దారితీస్తోంది. సోమవారం నాటి ఎలుగుబంటి ఘటన తర్వాతైనా అధికారులు కళ్లు తెరిచి.. జూలో భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన అసవరం ఎంతైనా ఉంది. 

 

నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం

నెల్లూరు : జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నెల్లూరు ప్రధాన పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీశ్రీనివాస భవన్ హోటల్ ఉంది. ఇక్కడ నిత్యం రద్దీనెలకొని ఉంటుంది. వినియోగదారులకు ఆహారం అందించే క్రమంలో వంట చేస్తుండగా, కళాయిలోని నూనె పొరపాటును బాయిలర్ పై పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో హాటల్ లోకి మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన హోటల్ సిబ్బంది ఖాళీ చేశారు. క్షణాల్లో వ్యాపించిన మంటలు హోటల్ లో ఫర్నిచర్ ను ధ్వంసం చేశాయి. స్థానికుల ఫిర్యాదుతో కదిలిని అగ్నిమాపక సిబ్బంది మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు.

మరుగుదొడ్ల నిర్మాణాన్ని అడ్డుకుంటున్న టీడీపీ : బీజేపీ

హైదరాబాద్‌ : టీడీపీ నేతలపై బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులతో మరుగుదొడ్లు కట్టిస్తామంటే టీడీపీ నేతలు తమను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు, నేతలు కన్నా లక్ష్మీనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్ ఈరోజు మీడియాతో మాట్లాడారు. మరుగుదొడ్ల నిర్మాణం జరిగితే టీడీపీ, బీజేపీ రెండు పార్టీలకు మంచిదని, ఏపీలో 24 గంటల విద్యుత్ కేవలం ప్రధాని నరేంద్ర మోదీ పుణ్యమేనని అన్నారు. మోదీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి 2019లో ఒంటరిగా పోటీ చేసి గెలుస్తామని వెల్లంపల్లి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు.

కొత్త పీఎఫ్ విధానం అమలు ఆదేశాలను నిలిపివేసిన కేంద్రం

ఢిల్లీ : గార్మెంట్స్ సంస్థల్లో పని చేసే కార్మికులు చేసిన ఆందోళనతో కేంద్రం దిగివచ్చింది. తక్షణం కొత్త పీఎఫ్ విధానం అమలులోకి వస్తుందని గతంలో ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసింది. జూలై 31 వరకు కొత్త పీఎఫ్ విధానం అమలులోకి రాదని ప్రకటించింది. అలాగే 58 ఏళ్లు దాటిన వారు మాత్రమే పీఎఫ్ ఖాతాల నుంచి నగదు తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో బెంగళూరులో నెలకొన్న ఆందోళనలు తగ్గుముఖం పడతాయని కేంద్రం భావిస్తోంది. కాగా, గార్మెంట్స్ కార్మికులు చేపట్టిన ఆందోళనతో బెంగళూరు అట్టుడికిపోయింది. వేలాదిగా తరళిన కార్మికులు వాహనాలు ధ్వంసం చేసి, పోలీసులపై దాడులకు దిగిన సంగతి తెలిసిందే.

టీ.సచివాలయంలో దర్శనమిచ్చిన నటుడు జగపతిబాబు

హైదరాబాద్‌ : ప్రముఖ సినీ నటుడు జగపతిబాబు తెలంగాణ సచివాలయంలో దర్శనమిచ్చారు. తన బ్యానర్ ఆవిష్కరణకు మంత్రి కేటీఆర్ ను ఆహ్వానించేందుకు గాను ఆయన అక్కడికి వెళ్లారు. అయితే, కేటీఆర్ అక్కడ లేకపోవడంతో ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ కు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం అక్కడి నుంచి జగపతిబాబు వెళ్లిపోయారు.

చౌటుప్పల్ లోని శాంసంగ్ షోరూమ్‌లో భారీ అగ్ని ప్రమాదం

నల్లగొండ : జిల్లాలోని చౌటుప్పల్ మండల కేంద్రంలోని శాంసంగ్ షోరూమ్‌లో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మధ్యాహ్న సమయంలో షాపు వెనుక భాగంలో చెత్తను తగలబెట్టెందుకు నిప్పు పెట్టగా ఆ మంటలు పక్కనే ఆనుకుని ఉన్న శాంసంగ్ షోరూంకు అంటుకున్నాయి. రెప్పపాటు కాలంలో మొదటి అంతస్తుకు వ్యాపించడంతో షాపులో ఉన్న విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. మంటలు అంటుకున్న సమయంలో సుమారు వందకుపైగా టీవీలు, శాంసంగ్ బ్రాండ్కు పలు రకాల వస్తువులు షోరూంలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం కలిగినట్టు సమాచారం.

17:10 - April 19, 2016

నల్లగొండ : జిల్లాను వెంటనే కరువు జిల్లాగా ప్రకటించాలని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు ఆలేరు మండలంలో ఆ పార్టీ కరువుయాత్రను చేపట్టింది. పటేల్ గూడెం, బహదూర్ పేట ,మంతపురి, గొలనుకొండ గ్రామాల్లో ఎండిన వరిపొలాలను జూలకంటి రంగారెడ్డి పరిశీలించారు. మామిడి, బత్తాయితోటలను పరిశీలించిన ఆయన జిల్లాలో వెంటనే కరువు సహాయకచర్యలు చేపట్టాలని కోరారు. మండలానికి 10 కోట్ల రూపాయలు కేటాయించి ఆదుకోవాలన్నారు. కరువు సహాయ చర్యలు చేపట్టడంతో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈనెల 18న ప్రారంభమైన కరవుయాత్ర ఈనెల 21 వరకు కొనసాగుతోందని తెలిపారు.  500 గ్రామాల్లో యాత్ర ఉంటుందని చెప్పారు. 

16:50 - April 19, 2016

హైదరాబాద్ : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో మునుపెన్నడూ లేనంతలా బ్యాట్స్ మెన్‌ రెచ్చిపోతున్నారు. ఓ వైపు బౌలర్లు వికెట్లు తీయడానికి అష్టకష్టాలు పడుతుంటే.....కొంతమంది బ్యాట్స్‌మెన్‌ మాత్రం అంచనాలకు మించి అదరగొడుతున్నారు. డైనమిక్‌ బ్యాట్స్‌మెన్‌ డి కాక్‌, నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌ గౌతమ్‌ గంభీర్‌, యాంగ్రీ యంగ్‌ గన్‌ విరాట్‌ కొహ్లీ, సఫారీ సూపర్‌ మ్యాన్‌ ఏబీ డివిలియర్స్‌,ఆస్ట్రేలియన్‌ డైనమైట్‌ ఆరోన్‌ ఫించ్‌ పోటీలు పడి మరీ పరుగులు సాధిస్తున్నారు. 
బ్యాట్స్ మెన్‌ దుమ్ములేపుతుంటే...బౌలర్లు తేలిపోతున్నారు
ధూమ్‌ ధామ్‌ టీ 20 లీగ్‌లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో బ్యాట్స్ మెన్‌ దుమ్ములేపుతుంటే...బౌలర్లు తేలిపోతున్నారు. డైనమిక్‌ బ్యాట్స్ మెన్‌ డి కాక్‌, నైట్‌రైడర్స్ కెప్టెన్‌ గౌతమ్‌ గంభీర్‌, యాంగ్రీ యంగ్‌ గన్‌ విరాట్‌ కొహ్లీ, సఫారీ సూపర్‌ మ్యాన్‌ ఏబీ డివిలియర్స్‌,ఆస్ట్రేలియన్‌ డైనమైట్‌ ఆరోన్‌ ఫించ్‌, డు ప్లెసి పోటీలు పడి మరీ పరుగులు సాధిస్తున్నారు. 
అదరగొడుతున్న టాప్ క్లాస్ బ్యాట్స్ మెన్‌   
ఓ వైపు బౌలర్లు వికెట్లు తీయడానికి అష్టకష్టాలు పడుతుంటే.....ఈ టాప్‌ క్లాస్‌ బ్యాట్స్ మెన్‌ మాత్రం అదరగొడుతున్నారు. గౌతమ్‌ గంభీర్‌ ఎప్పటిలానే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ నిలకడగా రాణిస్తున్నాడు. 
విరాట్‌ కొహ్లీ టైమింగ్‌ 
ఇక ఇండియన్‌ యాంగ్రీ యంగ్‌ గన్‌ విరాట్‌ కొహ్లీ టైమింగ్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. కెరీర్‌ బెస్ట్‌ ఫామ్‌లో ఉన్న కొహ్లీ మునుపెన్నడూ లేనంతలా చెలరేగిపోతున్నాడు. ఇక సఫారీ సూపర్‌ మ్యాన్‌ డివిలియర్స్‌ ....ధూమ్‌ ధామ్‌ ఇన్నింగ్స్ తో అలరిస్తున్నాడు. 360 డిగ్రీల షాట్లతో క్రికెట్‌ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు. ఆస్ట్రేలియన్‌ డైనమైట్‌ ఆరోన్‌ ఫించ్‌ అయితే ప్రతీ మ్యాచ్‌లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. హ్యాట్రిక్‌ హాఫ్‌ సెంచరీలతో  గుజరాత్‌  జట్టుకు బ్యాక్‌ టు బ్యాక్ విజయాలందించాడు.తనపై వస్తున్న  విమర్శలకు ఫించ్‌..... బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు. 
కాన్సిస్టెన్సీకి కేరాఫ్‌ అడ్రెస్‌లా మారిన ఫాఫ్‌ డు ప్లెసి 
సౌతాఫ్రికన్‌ డాషింగ్‌ బ్యాట్స్ మెన్‌ ఫాఫ్‌ డు ప్లెసి సైతం కాన్సిస్టెన్సీకి కేరాఫ్‌ అడ్రెస్‌లా మారాడు. పుణే సూపర్‌ జెయింట్స్‌ జట్టుకు ఓపెనర్‌గా డు ప్లెసి....తన వంతు న్యాయం చేస్తున్నాడు. ఇక ఢిల్లీ డేర్‌డెవిల్‌ డైనమిక్‌ బ్యాట్స్ మెన్‌ క్వింటన్‌ డి కాక్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఎందుకంటే 23 ఏళ్ల డి కాక్‌ బ్యాటింగ్‌కు క్రికెట్‌ అభిమానులు ఫిదా అయిపోయారు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ జట్టుపై చేజింగ్‌లో డి కాక్‌ చేసిన సూపర్‌ సెంచరీ టోర్నీకే  హైలైట్‌గా నిలిచిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి టోర్నీ ఆరంభ దశలోనే రికార్డ్ ల మోత మోగిస్తున్న ఈ టాప్‌ క్లాస్‌ బ్యాట్స్ మెన్‌.....మిగతా లీగ్‌ మ్యాచ్‌ల్లో ఇంకెంతలా రెచ్చిపోతారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

16:41 - April 19, 2016

కేరళ : సోషల్ మీడియాను వినియోగించుకోవడంలో కుర్రాళ్లతో సూపర్ సీనియర్ పొలిటీషియన్స్ పోటీ పడుతున్నారు. ఇందుకు నిదర్శనం కామ్రేడ్ అచ్యుతానందన్. 93 ఏళ్ల ఈ వృద్ధ సింహం ఇప్పుడు ఫేస్ బుక్ లోనూ, ట్విట్టర్ లోనూ ప్రవేశించారు. ఫేస్ బుక్ లో తొలిరోజే 17 వేల లైక్ లు రావడం విశేషం. 
కేరళలో ప్రచార హోరు
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో దేశం దృష్టిని ఆకర్షిస్తున్న నేతల్లో అచ్యుతానందన్ ఒకరు. మే 16న పోలింగ్ జరిగే కేరళ రాష్ట్రంలో ప్రచారం పతాకస్థాయికి చేరింది. మండుటెండలను సైతం లెక్కచేయకుండా అధికార యుడిఎఫ్, ప్రతిపక్ష ఎల్ డిఎఫ్, సత్తా చాటాలని చూస్తున్న బిజెపి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.  కేరళ రేసులో ఎల్ డిఎఫ్ ఇప్పటికే హాట్ ఫేవరేట్ గా కనిపిస్తోంది. 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో ఎల్ డిఎఫ్ 80 నుంచి 90 స్థానాలు గెలుచుకోవడం ఖాయమంటూ వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఎల్ డిఎఫ్ కి అచ్యుతానందన్ స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరిస్తున్నారు. 
ఆకర్షిస్తోన్న అచ్యుతానందన్ ప్రచార తీరు 
93 ఏళ్ల వయస్సుల్లో సైతం, మండుటెండలను లెక్క చేయకుండా అచ్యుతానందన్ ప్రచారం సాగిస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తోంది. ఆయన  రోజుకో జిల్లాను చుట్టి వస్తూ, అయిదారు సభల్లో ప్రసంగిస్తున్నారు. తెల్లవారుఝామున నాలుగు గంటలకే  నిద్ర లేచే అలవాటున్న అచ్యుతానందన్ కాసేపు యోగా సాధాన చేసి, ఆ తర్వాత మార్నింగ్ వాక్ పూర్తి చేసుకుని ఆరింటికల్లా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎండవేడి నుంచి తట్టుకునేందుకు మధ్యమధ్యలో కొబ్బరి బోండాలు స్వీకరిస్తున్నారు. మే3 వ తేదీ వరకు ఆయన  కేరళలో సుడిగాలి పర్యటన చేసేలా షెడ్యూల్ ఖరారైంది. ఎల్ డిఎఫ్ అధికారంలోకి వస్తే తనతో పాటు ముఖ్యమంత్రి పదవి రేసులో వుంటే పినరయ్ విజయన్ నియోజకవర్గంలో సైతం ఆయన పర్యటించబోతుండడం విశేషం.   పినరయ్ విజయన్  పోటీ చేస్తున్న ధర్మదం నియోజకవర్గంలో వచ్చే గురువారం అచ్యుతానందన్ టూర్ ఫిక్స్ అయ్యింది.  ఆ రోజు వీరిద్దరూ కలిసి సాగించే ప్రచారం కేరళ ఎన్నికల క్యాంపెయిన్ లో హైలెట్ ప్రోగ్రామ్ గా నిలుస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
అవినీతి మచ్చలేని మాస్ లీడర్ అచ్యుతానందన్
కేరళ రాజకీయాల్లో అవినీతి మచ్చలేని మాస్ లీడర్ గా పేరొందారు అచ్యుతానందన్.  అవినీతిని ఎండగట్టడంలో ఆయన ఎలాంటి మొహమాటాలూ ప్రదర్శించరన్న పేరుంది.  నిజాయితీకి, అంకితభావానికి, సింప్లిసిటీకి  ఆయనను పర్యాయపదంగా చెబుతుంటారు.  భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న విఎస్ అచ్యుతానందన్ 1946లో జైలు జీవితం కూడా గడపడం విశేషం.  
చిరుప్రాయంలోనే అమ్మానాన్నలను కోల్పోయిన అచ్యుతానందన్ 
1923లో జన్మించిన అచ్యుతానందన్ 11ఏళ్ల చిరుప్రాయంలోనే అమ్మానాన్నలను కోల్పోయిన దు:ఖాన్ని అనుభవించారు. దాంతో 7వ తరగతిలోనే చదువు మానేసి, టైలరింగ్ పనికి వెళ్లాల్సి వచ్చింది. చిన్నవయస్సుల్లోనే కార్మిక సంఘాలకు చేరువైన అచ్యుతానందన్ 1940లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు.  ఆ తర్వాత 1964లో సిపిఎం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరయ్యారు. 1967లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన అచ్యుతానందన్ 1992లో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 2006 నుంచి ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగానూ సేవలందించారు. 
ఐటీ పరిశ్రమ అభివృద్ధికీ అచ్యుతానందన్ ప్రాధాన్యత
ఎక్కడ ఏ రైతుకు ఏ కష్టమొచ్చినా వెంటనే స్పందిస్తారన్న పేరు తెచ్చుకున్న అచ్యుతానందన్ ఐటీ పరిశ్రమ అభివృద్ధికీ అంతకు మించిన ప్రాధాన్యతనిచ్చారు. ఫ్రీ సాఫ్ట్ వేర్ ఉద్యమంలో చురుగ్గా  పాల్గొన్న విఎస్   టెక్నాలజీ ని సమర్ధమంతంగా ఉపయోగించుకోవడం ద్వారా కేరళలో చక్కటి అభివ్రుద్ధి సాధించవచ్చని భావిస్తుంటారాయన. కొల్లాం టెక్నోపార్క్, త్రిశూర్ కొరటి ఐటీ పార్క్,  కొచ్చి ఇన్ఫో పార్క్ ల ఏర్పాటుకు క్రుషి చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది.   ఆయన  ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో కేరళ  ఐటీ ఎగుమతుల విలువ జాతీయ సగటును మించిపోవడం పలువురిని ఔరా అనిపించింది.  లాటరీ మాఫియాకు వ్యతిరేకంగా పోరాడిని అచ్యుతానందన్ సినీ పైరసీని అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, సినీ పరిశ్రమకు కొండంత అండగా నిలిచారు. 

 

16:23 - April 19, 2016

ఖమ్మం : పాలేరు ఉప ఎన్నిక షెడ్యూల్ ను ఈసీ విడుదల చేసింది. ఈనెల 22న ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈనెల 29 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు మే 2 వరకు గడువు విధించారు. మే 16న పోలింగ్, 19 కౌంటింగ్ జరుగనుంది. 

పాలేరు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల

ఖమ్మం : పాలేరు ఉప ఎన్నిక షెడ్యూల్ ను ఈసీ విడుదల చేసింది. ఈనెల 22న ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈనెల 29 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు మే 2 వరకు గడువు విధించారు. మే 16న పోలింగ్, 19 కౌంటింగ్ జరుగనుంది. 

 

'సుల్తాన్‌' షూటింగ్‌ లో పడిపోయిన నటుడు రనదీప్‌ హుడా

హైదరాబాద్‌ : బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం సుల్తాన్‌ ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. అయితే సుల్తాన్‌ షూటింగ్‌ సమయంలో నటుడు రనదీప్‌ హుడా అనుకొకుండా పడిపోవడం జరిగింది. దీంతో వెంటనే హాస్పిటల్లో చేర్చిన అతనికి ప్రస్తుతం ఆపరేషన్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాలీవుడ్‌ లో విలక్షణ నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నటుడు రణదీప్‌ హుడా నటిస్తున్న తాజా చిత్రాల్లో సుల్తాన్‌ ఒకటి. ఇందులో ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో రణదీప్‌ సడెన్‌గా కుప్పకూలిపోయాడు.

రష్యాలో కుప్పకూలిన హెలికాప్టర్.. ముగ్గురి మృతి

మాస్కో: రష్యాలో ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమిక సమాచారం మేరకు రష్యాలోని యామల్ అనే ద్వీపకల్పంలో ఈ హెలికాప్టర్ కుప్పకూలింది.  సోమవారం సాయంత్రమే ఈ హెలికాప్టర్ కు బెలీ ఐలాండ్ వద్ద సంబంధాలు తెగిపోయాయని రష్యా అధికారులు చెప్పారు. స్థల పరీశీలన కోసం ముగ్గురు ఆర్మీ అధికారులు ఈ చాపర్లు వెళ్లారని, గాలింపు చర్యలు చేపట్టగా యామల్ ద్వీపకల్పంలో శిథిలాల మధ్య పడి ఉండి విగతజీవులుగా కనిపించారని వెల్లడించారు.

బీజేపీ ఎంపీని చెంపదెబ్బ కొట్టిన యువకుడు

జైపూర్ : రాజస్థాన్లోని బార్మెర్లో ఓ యువకుడు స్థానిక బీజేపీ ఎంపీ సొనారామ్ చౌదరితో గొడవపడి చెంపదెబ్బ కొట్టాడు. ఓ వివాహ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సమక్షంలో ఈ ఘటన జరిగింది. మంగళవారం ఎంపీ సొనారామ్, కలెక్టర్ ఇతర ప్రముఖులు ఓ వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖర్తారామ్ అనే యువకుడు వచ్చి ఎంపీతో ఓ విషయం గురించి మాట్లాడుతూ వాగ్వాదానికి దిగాడు. ఆవేశంతో ఊగిపోయిన ఖర్తారామ్ ఎంపీని చెంపదెబ్బ కొట్టాడు. నిందితుడు వెంటనే అక్కడ నుంచి పారిపోయినట్టు జిల్లా ఎస్పీ పారిస్ దేశ్ముఖ్ చెప్పారు. ఎంపీ వ్యక్తిగత భద్రత సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

16:08 - April 19, 2016

హైదరాబాద్ : పార్టీలో ఎన్ని సమస్యలు ఉన్నా..పార్టీని విడిచిపోయేది లేదని వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. లోటస్‌ పాండ్‌లో జగన్‌ అధ్యక్షతన వైసీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ పార్టీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. పార్టీ మారుతున్నారని ప్రచారం చేస్తూ తమ మనోభావాలు దెబ్బతీస్తున్నారని అన్నారు. జగన్ పై తమకు పూర్తి నమ్మకం ఉందని బాలినేని తెలిపారు. 13 జిల్లాల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నేతలు సమావేశానికి హాజరయ్యారు. 

16:00 - April 19, 2016

విజయవాడ : కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపుకు కేబినెట్‌ సబ్‌కమిటీ ఆమోదం తెలిపిందని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాన్ని 2వేల 500 రూపాయలు పెంచుతామని ప్రకటించారు. జీతాల పెంపువల్ల ప్రభుత్వంపై ఏడాదికి 90కోట్ల భారం పడుతుందని చెప్పారు.. పెరిగిన జీతాలు ఏప్రిల్ 1నుంచి అమల్లోకి వస్తాయని యనమల తెలిపారు. 1003మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామన్నారు.

 

15:57 - April 19, 2016

కర్నాటక : బెంగళూరులో గార్మెంట్‌ ఫ్యాక్టరీ కార్మికుల ఆందోళన హింసాత్మకంగా మారింది. హోసూరు రోడ్డులో ఆందోళనకారులు రెండు బస్సులను తగలబెట్టారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. కార్మికులపై పోలీసులు లాఠీ చార్జి చేశారు. కొత్త ఈపిఎఫ్‌ రూల్స్‌కు వ్యతిరేకంగా కార్మికులు ఆందోళనకు దిగారు. పదవీ విరమణ వయసు పరిమితికి సంబంధించి కార్మికులు యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఎఫ్‌ విత్‌డ్రాకు సంబంధించిన కొత్త నిబంధనలను కార్మికులు వ్యతిరేకిస్తున్నారు.

 

15:48 - April 19, 2016

వేసవికాలంలో ఎక్కువగా ప్లూయిడ్స్ తీసుకోవాలని వక్తలు సూచించారు. ఎండలు బాగా ఉన్నప్పుడు ఫ్లూయిడ్స్ అవసరమని తెలిపారు. 'వేసవికాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి...?' అనే అంశంపై మావని వేదిక నిర్వహించిన చర్చా కార్యక్రమంలో గైనకాలజిస్ట్... పద్మిని, గృహిణి హరిత పాల్గొని, మాట్లాడారు. వేసవిలో తీసుకోవాల్సిన ఆహారపధార్థాలు, జాగ్రత్తలు వివరించారు. ఎండాకాలంలో ఎక్కువగా జూస్, కూలింగ్ వాటర్, కోల్డ్ వాటర్ కాకుండా కూల్ వాటర్ తీసుకోవాలని సూచించారు. ఆకు కూరలు అధికంగా తీసుకోవాలన్నారు. సీ ఫుడ్ కూలింగ్ గా ఉంటాయి కాబట్టి చేపలను  ఎక్కువగా తీసుకోవాలన్నారు. నాన్ వెజ్ ను అధికంగా తీసుకోవద్దని చెప్పారు. ఎండలో తిరగకపోవడం, బయటికి వెళ్లకపోవడం మంచిదని సూంచించారు. మరిన్ని టిప్స్ చెప్పారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

15:31 - April 19, 2016

విజయవాడ : విశాఖ రైల్వే జోన్‌పై వైసీపీ మొసలి కన్నీరు కారుస్తోందని టిడిపి నేత బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ అధినేత జగన్‌ విశాఖ రైల్వే జోన్‌ అంశాన్ని రాజకీయ స్వప్రయోజనాల కోసం వాడుకంటున్నారని విమర్శించారు. తర్వలో జరిగే జీవీఎంసీ ఎన్నిలకు దృష్టిలో పెట్టుకునే వైసీపీ నాయకులు దీనిపపై చేస్తున్నారని టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమా మండిపడ్డారు. విశాఖకు రైల్వే జోన్‌ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

15:24 - April 19, 2016

హైదరాబాద్ : అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేయడం... ఆ తర్వాత మిన్నకుండి పోవడం.. జీహెచ్ ఎంసీ అధికారులకు రివాజుగా మారింది. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో అక్రమ కట్టడాలకు చెక్‌ పెడతామన్నారు. నిబంధనలు ఉల్లంఘించే భవన నిర్మాణదారులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.  కానీ ఇవన్నీ నోటి మాటలకే పరిమితమయ్యాయని జంటనగరాల్లో  తరచు జరుగుతున్న అగ్ని ప్రమాదాలు రుజువు చేస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి.
కమిటీల పేరుతో సమస్య పక్కదారి 
అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడే జీహెచ్‌ఎంసీ అధికారులకు భవన నిబంధనలు గుర్తుకొస్తాయి. నిబంధనలు ఉల్లంఘిచి కళ్లముందే అక్రమకట్టాల నిర్మాణం జరుగుతున్నా....  కళ్లుమూసుకుని  వ్యవహారాలు నడిపే అధికారులు.. ఘోర ప్రమాదాలు జరిగినప్పుడే హడావుడి చేస్తుంటారు.  కమిటీల ఏర్పాటు పేరుతో సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నంచేస్తూ కాలక్షేపం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.  వేసిన కమిటీలు అక్రమార్కులపై చర్యలకు  సిఫారసు చేస్తే.. అలాంటి  నివేదికలను బుట్టదాఖలు చేయడం నగరపాలక సంస్థ అధికారులకు రివాజుగా మారిందన్న విమర్శలున్నాయి. సీతారాం బాగ్‌ అగ్నిప్రమాద ఘటన తర్వాత జీహెచ్‌ఎంసీ అధికారులు మళ్లీ కమిటీల పేరుతో హడావుడి చేస్తున్నారు. 
మామూళ్ల మత్తులో జీహెచ్‌ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం 
జీహెచ్‌ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు.  నిబంధనలకు అనుగుణంగా, ఇచ్చిన ప్లాన్‌ ప్రకారం నిర్మాణాలు జరుగుతున్నాయా? లేదా ? అన్న విషయాలను పర్యవేక్షించాల్సిన  టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ... అన్నింటినీ గాలికొదిలేస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నా పట్టించుకునే దిక్కూ.. మొక్కూ..లేదు. జీ ప్లన్‌ వన్‌కు పర్మిషన్‌ తీసుకుని ఆకాశహార్మ్యాలు నిర్మిస్తున్నా తమకేమీ పట్టదనట్టుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శులున్నాయి. అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర ధృవీకరణ పత్రం, జీహెచ్‌ఎంసీ నుంచి నివాసయోగ్యతా పత్రం లేకున్నా వ్యాపారాలు నిర్వహిస్తున్న వాణిజ్య సముదాలు వెలస్తున్నా.... గుడ్లప్పగిస్తూ చూస్తున్నారన్న ఫిర్యాదులున్నా నాథులే లేరని ప్రజలు చెబుతున్నారు. దీంతో ప్రమాదాలు జరిగినప్పుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. భవన నిర్మాణదారులు ఇచ్చే కాసులకు కక్కుర్తిపడి... జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్న విమర్శులున్నాయి. 
అగ్నిమాపక అనుమతులులేని భవనాలు 18,500 
జంటనగరాల్లో ఆకాశహార్మ్యాల నిర్మాణం పెరిగిపోయినా.... చాలా తక్కువ భవనాల్లో మాత్రమే అగ్మిమాపక చర్యలు పాటిస్తున్నారు. గ్రేటర్‌లో 15 మీటర్ల ఎత్తులోపు నిర్మించే వాణిజ్య సముదాయాలు, 18 మీటర్ల ఎత్తులోపు ఉండే నివాస భవనాలనకు జీహెచ్‌ఎంసీ అగ్నిమాపక నిబంధనలు అమలు చేయాలి. అంతకు మించిన భవనాలకు అగ్నిమాపకశాఖ నుంచి ఎన్‌వోసీ తీసుకోవాలి. కానీ ఎక్కడా కూడా వీటిని పాటించడంలేదన్న ఫిర్యాదులున్నాయి. అగ్నిమాపక అనుమతులున్న భవనాలు రెండువేలుంటే... లేనివి 18,500 వరకు ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి. దీనిని బట్టిపరిశీలిస్తే పరిస్థితి ఎంతదారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 
15-30 మీటర్ల ఎత్తుండే భవనాలకు లక్షల లీటర్ల భూగర్భ నీటి నిల్వ ట్యాంక్‌ 
భవనాల ఎత్తునుబట్టి అక్కడ ఉండాల్సిన అగ్నిమాపక ప్రమాణాలు, పరికరాలను చట్టంలో నిర్దేశించారు. 15 నుంచి 30 మీటర్ల ఎత్తుండే భవనాలకు 75 వేల నుంచి లక్ష లీటర్ల నీటి నిల్వ సామర్ధ్యం కలిగిన భూగర్భ ట్యాంక్‌ ఉండాలి. అలాగే 10 నుంచి 20 వేల లీటర్ల నీటి నిల్వ సామర్ధ్యం కలిగిన టెర్రేస్‌ ట్యాంక్‌ ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. వీటితోపాటు ఆటోమేటిక్‌ స్ప్రింక్లర్‌ సిస్టం, ప్రమాదాలు జరిగినప్పుపడు ప్రజలను అప్రమత్తం చేసేందుకు వీలుగా అలారాలను అమర్చాలి. 10 నుంచి 15 మీటర్ల ఎత్తున నిర్మించే భవనాలనుకు 50 వేల నీటి నిల్వ సామర్ధ్యం కలిగిన భూగర్భ ట్యాంకు ఉండాలన్ని నిబంధన ఉంది. అలాగే ప్రమాదాలు జరిగినప్పుడు నీటిని వెదజల్లేందుకు స్ప్రింకర్లు, అలారం విధానం ఉండాలని చట్టాలు చెబుతున్నాయి. కానీ జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈ నిబంధనలు పాటించకుంటా వెలసిన నిర్మాణమైన భవనాలు చాలా ఉన్నాయని అధికార గణాంకాలు చెబుతున్నాయి. అయినా చర్యలు తీసుకునే దిక్కులేదు.  అక్రమార్కుల ఆటకట్టించేందుకు ట్రైబ్యునల్‌ అంటూ ఓ ప్రతిపాదన ముందుకు తెచ్చారు. 
అక్రమ నిర్మాణాలు, భవనాల్లో తరచు అగ్నిప్రమాదాలు 
హైదరాబాద్‌ను విశ్వనగరంలా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పదేపదే చెబుతున్నా.... అధికారుల చర్యలు మాత్రం దీనికి భిన్నంగా ఉంటున్నాయని చెప్పడానికి అక్రమ నిర్మాణాలు, భవనాల్లో తరచు జరుగుతున్న అగ్నిప్రమాదాలే నిదర్శనమని  ప్రజలు చెబుతున్నారు. మరెన్నో విలువైన ప్రాణాలు పోకముందే, కోట్ల రూపాయల ఆస్తి బుగ్గిపాలు కాకముందే జీహెచ్‌ఎంసీ అధికారులు కళ్లు తెరిచి అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాలని కోరుతున్నారు. 

15:13 - April 19, 2016

హైదరాబాద్ : ఏపీలో ఇంటర్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. చరిత్రలోనే తొలిసారిగా ఈ ఏడాది ఒకేసారి ఫస్టియర్, సెకెండియర్ ఫలితాలను  విడుదల చేశారు. ఈసారి ఫలితాల్లోనూ అమ్మాయిలే పైచేయి సాధించారు. గతేడాది కంటే ఈసారి ఫలితాల్లో ఐదు శాతం ఉత్తీర్ణత పెరిగింది. ఇక ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాల్లో కృష్ణా జిల్లా టాప్‌లో నిలిచింది. 
ఎపిలో ఇంటర్ ఫలితాలు విడుదల 
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియెట్‌ ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. చరిత్రలో తొలిసారి ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలను ఒకేరోజు విడుదల చేశారు. పరీక్షలు ముగిసిన నెలరోజుల్లోపే.. ఫలితాలు విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. నిర్ణయించుకున్న తేదీ కన్నా ముందే. 28 రోజుల్లోపే ఫలితాలను వెలువరించింది. 
ఫస్టియర్‌ లో 68.05 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు
ఇక ఫలితాల విషయానికి వస్తే. ఫస్టియర్‌ లో 68.05 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలికలు-72.09 శాతం, బాలురు 64.2 శాతం ఉన్నారు. మొత్తం 4 లక్షల 67 వేల 747 మంది పరీక్షకు హాజరుకాగా.. 3 లక్షల 18 వేల 120 మంది విద్యార్థులు పాస్‌ అయ్యారు. ఇక గ్రేడ్‌ల వారీగా విడుదల చేసిన ఫలితాల్లో.. ఎ-గ్రేడ్‌లో లక్షా 85 వేల 538 మంది,.. బి-గ్రేడ్‌లో-82,109 మంది ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా సి-గ్రేడ్‌లో 32 వేల 592 మంది,.. డి-గ్రేడ్‌లో 15 వేల 61 మంది ఉత్తీర్ణత పొందారు. 
సెకండియర్‌ ఫలితాల్లో 73.78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత 
ఇక సెకండియర్‌ ఫలితాల్లో 73.78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులోనూ బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 76.43 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 71.12 శాతం ఉత్తీర్ణులయ్యారు. గ్రేడ్‌ల వారీగా చూసుకుంటే.. లక్షా 74 వేల 649 మంది ఏ గ్రేడ్‌ సాధించగా,.. 80 వేల 407 మంది బి-గ్రేడ్‌ సాధించారు. అదేవిధంగా 33 వేల 844 మంది సి గ్రేడ్‌లో.. 11 వేల 14 మంది డి-గ్రేడ్‌లో ఉ‌త్తీర్ణత పొందారు. 
ఈ ఏడాది ఉత్తీర్ణత ఐదు శాతం పెంపు 
గత ఏడాదితో పోలిస్తే.. ఈ సంవత్సరం ఉత్తీర్ణత ఐదు శాతం పెరిగింది. పరీక్షల్లో 78పైగా మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదు చేశారు. అదే విధంగా నలుగురు విద్యార్థులను విత్‌హెల్డ్‌లో ఉంచారు. ఇక ఫలితాల్లో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా నెల్లూరు, విశాఖ జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. ఫస్టియర్ రిజల్ట్స్ లో అనంతపురం జిల్లా, సెకెండియర్ ఫలితాల్లో కడప జిల్లా పూర్ పర్ఫార్మెన్స్ కనబరిచాయి. ఉత్తీర్ణత శాతం తగ్గిన ప్రభుత్వ కాలేజీలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. 
మే 24న సప్లిమెంటరీ పరీక్షలు 
ఫెయిలైన విద్యార్థుల కోసం మే 24న సప్లిమెంటరీ పరీక్ష నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఈనెల 26లోగా విద్యార్థులు ఫీజు చెల్లించాలన్నారు. 

 

14:57 - April 19, 2016

ఢిల్లీ : రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో ఇప్పటికీ కొన్ని సమస్యలున్నాయని.. అవన్నీ ఒక్కొక్కటిగా పరిష్కారమవుతున్నాయని గవర్నర్ నరసింహన్‌ తెలిపారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను గవర్నర్‌ కలిశారు. అనంతరం నరసింహన్ మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లోని పరిస్థితులను రాజ్‌నాథ్‌సింగ్‌కు వివరించినట్లు తెలిపారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకెళ్తున్నాయని నరసింహన్‌ అన్నారు. ఢిల్లీ పర్యటన సాధారణమైనదని గవర్నరక్ తెలిపారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాగా పని చేస్తున్నారని చెప్పారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకు పోతున్నాయని పేర్కొన్నారు. ఇలాగే కొనసాగితే అద్భుత ఫలితాలు వస్తాయన్నారు. ఎపి పునర్విభజన సమస్యలకు త్వరలో పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వీలైతే ప్రధాన మంత్రిని కలుస్తానని చెప్పారు. 

రాజ్ నాథ్ సింగ్ తో ముగిసిన గవర్నర్ నరసింహన్ భేటీ

ఢిల్లీ : కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో గవర్నర్ నరసింహన్ భేటీ ముగిసింది. ఢిల్లీ పర్యటన సాధారణమైనదని గవర్నరక్ తెలిపారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాగా పని చేస్తున్నారని చెప్పారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకు పోతున్నాయని పేర్కొన్నారు. ఇలాగే కొనసాగితే అద్భుత ఫలితాలు వస్తాయన్నారు. ఎపి పునర్విభజన సమస్యలకు త్వరలో పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వీలైతే ప్రధాన మంత్రిని కలుస్తానని చెప్పారు. 

కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు పెంపు : మంత్రి యనమల

విజయవాడ : కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు పెంచుతున్నట్లు ఎపి మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనం రూ.2500 లకు పెంచుతున్నట్లు చెప్పారు. 1003 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామన్నారు. జీతాల పెంపు వల్ల ప్రభుత్వంపై ఏడాదికి రూ.90 కోట్ల భారం పడుతుందన్నారు. పెరిగిన జీతాలు ఏప్రిల్ 1 నుంచి అమలు కానున్నాయని తెలిపారు.  

 

గిరిజన విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ కు రూ.282 కోట్లు మంజూరు

హైదరాబాద్ : గిరిజన విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రూ.282 కోట్లు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 

జింబాబ్వే బయల్దేరిన సీఎస్ రాజీవ్ శర్మ

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సీఎస్ రాజీవ్ శర్మ జింబాబ్వే బయల్దేరారు. ఇక్రిశాట్ డైరెక్టర్ల సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈనెల 25న రాజీవ్ శర్మ తిగిరి హైదరాబాద్ రానున్నారు. 

13:25 - April 19, 2016

గుంటూరు : తూళ్లూరులో తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రౌండ్ ప్లోర్ కు సంబంధించిన శ్లాబ్ నిర్మాణం పూర్తైందని, ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణం కూడా త్వరలో జరగబోతోందని ఆయన తెలిపారు. రెండవ, మూడవ ఫ్లోరులకు సంబంధించిన టెండర్లను రెండు రోజుల్లో పిలువబోతున్నట్లు తెలిపారు. ఆగస్ట్ నెలాఖరుకు మొత్తం మూడు ఫోర్ల నిర్మాణం పూర్తై, ఉద్యోగులను ఇక్కడికి తరలిస్తామని చెప్పారు. 

13:23 - April 19, 2016

హైదరాబాద్ : హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళనకు అధికారులు మరోసారి రంగం సిద్ధం చేశారు. సాగర్‌లోని పూడికను తీసేందుకు మలేషియా నుండి తెప్పించిన లాంగ్‌ భూమ్‌ ఎక్సవేటర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. సాగర్‌లోకి వస్తున్న మురుగును మళ్లించే పనులు పూర్తయ్యాయని.. పూడికను తీసేందుకు మూడు యంత్రాలను ఉపయోగిస్తున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. హుస్సేన్‌సాగర్‌, మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఇందుకోసం మూడు వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు కేటీఆర్‌.

 

13:22 - April 19, 2016

కాబూల్ : అఫ్గనిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. అఫ్గన్‌ భద్రతా సంస్థ లక్ష్యంగా ఈ దాడి జరిగింది. ఆత్మాహుతి దాడిలో 24 మంది మరణించారు. మరో 161 మంది గాయపడ్డారుర. దాడి జరిగిన ప్రాంతానకి కిలో మీటరు దూరంలోనే కాబూల్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఉంది. జనసమర్ధం ఎక్కువగా ఉండే ప్రాంతంలో దాడి జరగడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అకాశం ఉంది. ఈ దాడికి తామే కారణమని తాలిబాన్‌ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. కారులో వచ్చిన ఉగ్రవాదులు తమను తాము పేల్చేకున్నారని కాబూల్‌ అధికారులు ప్రకటించారు. 

13:20 - April 19, 2016

హైదరాబాద్ : రాజేంద్రనగర్‌ అగ్రికల్చర్‌ కాలేజిలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని వెటర్నరీ విద్యార్థులు అడ్డుకున్నారు. జీవో నెం.45 ద్వారా వెటర్నరీ వైద్యుల నియామకాలు చేపట్టాలని.. మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు విద్యార్థులను చెదరగొడుతున్నారు.

12:44 - April 19, 2016

ఢిల్లీ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నీరుగారిపోతోంది. నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమంగా ఖర్చు చేయడం లేదు. ఈ జాబితాలో 13 రాష్ట్రాలున్నాయి. నిధులను ఖర్చు చేయని రాష్ట్రాల్లో జాబితాలో బీజేపీ పాలిత రాష్ట్రాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలు కూడా నిలిచాయి. రాష్ట్రాలలో కరవు తాండవిస్తున్నా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఉపాధి హామీ నిధులను ఖర్చు చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్‌ వద్ద 62.94 కోట్లు,.. తెలంగాణ వద్ద 40.75 కోట్లు నిధులు ఖర్చు చేయకుండా ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే పనులు చేసిన వేలాదిమంది కూలీలు డబ్బుల కోసం వేచి చూస్తున్నారు.

 

నాలుగేళ్ల బాలుడు నీటి సంపులో పడి మృతి

వరంగల్ : మద్దూరు మండలం లడ్నూర్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నాలుగేళ్ల బాలుడు నీటి సంపులో పడి మృతి చెందాడు. బాలుడి తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. లడ్నూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

హైకోర్టు విభజనకు న్యాయశాఖ మంత్రి సుముఖత: దత్తాత్రేయ

ఢిల్లీ : హైకోర్టు విభజనకు న్యాయశాఖ మంత్రి సుముఖతతో ఉన్నారని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడను బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కలిశారు. అనంతరం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి హైకోర్టు విభజనపై కేంద్ర న్యాయశాఖ మంత్రితో చర్చించామని తెలిపారు. ఇరు రాష్ర్టాలకు విడివిడిగా హైకోర్టుల ఏర్పాటు ఆవశ్యకతను వివరించానని చెప్పారు. హైకోర్టు విభజన కోసం జరిగిన ఆందోళనల ప్రాముఖ్యతను తెలియజేశానని పేర్కొన్నారు. 

12:35 - April 19, 2016

హైదరాబాద్ : టీడీపీ ప్రభుత్వంలోని మంత్రులకు ప్రజలు ర్యాంకులివ్వాలి గాని, వారికి వారే ఎలా ఇచ్చుకుంటారని ప్రశ్నించారు. ర్యాంకుల్లో మంత్రి నారాయణ చివరి స్థానంలో నిలవగా... నారాయణ ప్రారంభించిన నారాయణ విద్యా సంస్థలు మాత్రం ఇంటర్ ఫలితాల్లో అందరి కంటే ముందున్నాయన్నారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై చర్చించేందుకు వైసీపీ నేతలతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లోటస్ పాండ్ లో పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన సందర్భంగా అంబటి... చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలపై విమర్శలు గుప్పించారు. హెరిటేజ్ కంపెనీ తయారు చేస్తున్న ఉత్పత్తులను అమ్ముకునేందుకే చంద్రబాబు మజ్జిగ పథకాన్ని ప్రారంభించారని ఆయన విమర్శించారు. అన్నింటిని తన స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్న చంద్రబాబు... చివరకు వేసవి తాపాన్ని కూడా సొంత లాభానికే వాడుకుంటున్నారని అంబటి ధ్వజమెత్తారు. 

12:26 - April 19, 2016

విజయవాడ : గిరిజన సంక్షేమ పథకాల అమల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోని చాలా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. విజయవాడలో గిరిజన మహిళా సర్పంచ్‌ల జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను బాబు వివరించారు. గిరిజన మహిళలకు ఆర్ధికంగా ప్రయోజనం చేకూర్చేందుకు కాఫీ తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. అలాగే స్వయం సహాయ బృందాల ద్వారా అటవీ ఉత్పత్తలు అమ్మకాలు చేపడుతున్నట్టు వివరించారు. రాష్ట్రంలోని గిరిజన బాలబాలికలందరికీ కార్పొరేట్‌ స్థాయి ఉచిత విద్య అందించేందుకు గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు చెబుతున్నారు. 

12:25 - April 19, 2016

హైదరాబాద్ :లోటస్‌ పాండ్‌లో జగన్‌ అధ్యక్షతన వైసీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. 13 జిల్లాల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నేతలు సమావేశానికి హాజరయ్యారు. రాష్ర్టంలో కరవు పరిస్థితులు, పార్టీ ఫిరాయింపులపై చర్చించనున్నారు.పార్టీని వీడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు చేసిన యత్నాలు బెడిసికొట్టిన నేపథ్యంలో... వారిపై చర్యల కోసం ఏ దిశగా అడుగు వేయాలన్న అంశంపై పార్టీ నేతల నుంచి జగన్ సలహాలు తీసుకునే అవకాశాలున్నాయి. అదే సమయంలో తాను చేపట్టబోయే యాత్రకు సంబంధించి కూడా ఈ భేటీలోనే ఓ ప్రణాళికను ఆయన రూపొందించుకోనున్నట్లు సమాచారం.

గిరిజనులతో కలిసి నృత్యం చేసిన సీఎం చంద్రబాబు

విజయవాడ : జాతీయ గిరిజన మహిళా పంచాయితీ అధ్యక్షుల సమావేశం విజయవాడలో ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజనుల్లో ఉత్సాహం నింపేందుకు చంద్రబాబు డప్పు వాయించి నృత్యం చేశారు.

లోటస్ పాండ్ లో పార్టీ నేతలతో జగన్ భేటీ...

హైదరాబాద్ :లోటస్ పాండ్ కార్యాలయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కొద్దిసేపటి క్రితం తన పార్టీ నేతలతో భేటీ అయ్యారు.ఈ భేటీలో పార్టీ ఫిరాయింపులపై ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. పార్టీని వీడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు చేసిన యత్నాలు బెడిసికొట్టిన నేపథ్యంలో... వారిపై చర్యల కోసం ఏ దిశగా అడుగు వేయాలన్న అంశంపై పార్టీ నేతల నుంచి జగన్ సలహాలు తీసుకునే అవకాశాలున్నాయి. అదే సమయంలో తాను చేపట్టబోయే యాత్రకు సంబంధించి కూడా ఈ భేటీలోనే ఓ ప్రణాళికను ఆయన రూపొందించుకోనున్నట్లు సమాచారం.

మంత్రి పోచారం ను అడ్డుకున్న వెటర్నరీ విద్యార్థులు

హైదరాబాద్ : రాజేంద్రనగర్‌ అగ్రికల్చల్‌ ఆడిటోరియం దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని వెటర్నరీ విద్యార్థులు అడ్డుకున్నారు. జీవో 45 ప్రకారం ఉద్యోగ నియామకాలు జరపాలని విద్యార్థులు మంత్రిని డిమాండు చేశారు. 

కాబూల్ లో భారీ పేలుడు...

హైదరాబాద్ : ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో భారీ పేలుడు జరిగింది. అమెరికా దౌత్య కార్యాలయం దగ్గర ఆ పేలుడు సంభవించింది. ఆ ప్రాంతంలో దట్టమైన నల్లటి పొగ వ్యాపించింది. అయితే పేలుడు వల్ల ప్రాణ నష్టం జరిగినట్లు ఇంకా వివరాలు తెలియరాలేదని అధికారులు తెలిపారు. దౌత కార్యాలయం కాంపౌండ్ సమీపం నుంచి సైరన్లు వినిపిస్తున్నాయి. ఇదే దారిలో నాటో ప్రధాన కార్యాలయం కూడా ఉంది. ఏ కారణం వల్ల పేలుడు జరిగిందన్న విషయం ఇంకా స్పష్టం కాలేదు. పేలుడు వల్ల తమకు ఎటువంటి ప్రమాదం జరగలేదని అమెరికా దౌత్య కారాలయం, నాటో ఆఫీసు పేర్కొంది. 

హుస్సేన్ సాగర్ క్లీనింగ్ కి కట్టుబడిఉన్నాం: కేటీఆర్

హైదరాబాద్ : హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కోసం క్లీనింగ్ టెక్స్ యంత్రాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుస్సేన్ సాగర్ క్లీనింగ్ కి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే నాలాల తరలింపు పూర్తి కావొస్తుందని, హైదరాబాద్ లో ఒకే రోజు 25 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. హుస్సేన్ సాగర్, మూసీ ప్రక్షాళనకు రూ.3వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. నగరంలో ఇంకుడు గుంతలు పెంచేందుకు జలమండలి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు.

ఈక్వెడార్ లో 413 చేరిన మృతుల సంఖ్య

హైదరాబాద్ : భారీ భూకంప ధాటికి ఈక్వెడార్‌ అతలాకుతలమైంది. ఇప్పటికే ఈ ఘటనలో మృతుల సంఖ్య 413కు చేరింది. వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.

 

10:27 - April 19, 2016

విజయవాడ : పరీక్షలు నిర్వహించిన నెలలోపే ఫస్టు ఇయర్, సెకండ్ ఇయర్ ఇంటర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసి రికార్డు సృష్టించామని మంత్రి గంటా తెలిపారు. ఆయన మంగళవారం ఉదయం విజయవాడలో ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రేడ్ ల వారీగా ఫలితాలు ఉంటాయని తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ లో 68.05 శాతం ఉత్తీర్ణులయ్యారని, వారిలో బాలికలు 72.09 శాతం, బాలురు 64.2 శాతం ఉత్తీర్ణులయినట్లు తెలిపారు. అలాగే ఇంటర్ సెకండియర్ లో 73.78 శాతం ఉత్తీర్ణత సాధించగా వారిలో బాలికలు 76.43 శాతం, బాలురు 71.12 శాతం ఉత్తీర్ణులయినట్లు పేర్కొన్నారు. గతఏ డాదితో పోల్చితే 5 శాతం ఉత్తీర్ణత శాతం పెరిగినట్లు చెప్పారు. ఫస్టియర్ ఫలితాల్లో కృష్ణా జిల్లాకు మొదటి స్థానం రాగా, తరువాత స్థానాల్లో విశాఖ, నెల్లూరు, చివరి స్థానంలో అనంతపురం జిల్లా ఉన్నాయన్నారు. మే 24న సప్లిమెంటరీ పరీక్ష నిర్వహిస్తామన్నారు. ప్రైవేటు కళాశాలల్లో నామ్స్ పాటించని కళాశాలల్లో కటిన చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల పెంచేందుకు 'మన ఊరు- మనబడి' కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించనున్నట్లు గంటా తెలిపారు.

హుస్సేన్ సాగర్ క్లీనింగ్ కు ప్రభుత్వ చర్యలు

హైదరాబాద్ : హుస్సేన్ సాగర్ క్లీనింగ్ కు కాసేపట్లో సంజీవయ్య పార్కు వద్ద క్లీనింగ్ టెక్స్ సొల్యూషన్ యంత్రాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.

కత్రాలో ప్రధాని మోదీ పర్యటన

జమ్మూకశ్మీర్ : కత్రాలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వైష్ణోదేవి నారాయణ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని మోదీ ప్రారంభించారు. అనంతరం మాతా వైష్ణోదేవి విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవం మోదీ పాల్గొన్నారు.

పోలీసు కాల్పుల్లో మావోయిస్టు మృతి

ఛత్తీస్ గఢ్ : బిజాపూర్ జిల్లా కోదండపల్లిలో ఎదురుకాల్పులు సంభవించాయి. పోలీసు కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు.

ఆ ర్యాంకులు ఏ ప్రాతిపదికన ఇచ్చారో : మంత్రి నారాయణ

అమరావతి : ఏపీ మంత్రులకు ఏ ప్రాతిపాదికన ఇచ్చారో తెలియదని మంత్రి నారాయణ అన్నారు. ఆయన అమరావతి నూతన రాజధాని నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిర్మాణ సంస్థలు అనుకున్న సమయం కంటే వేగంగానే పనులు చేస్తున్నాయని కితాబిచ్చారు. నెలాఖరు కల్లా 5 బ్లాకుల గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ లు పూర్తవుతాయన్నారు. రెండు రోజుల్లో జీ+3 నిర్మాణాలకు సంబంధించి టెండర్లు పిలుస్తామన్నారు. ఆగస్టు చివరినాటికి 12వేల మంది ఉద్యోగులను తరలిస్తున్నామని, ఉద్యోగుల డిమాండ్లకు సీఎం అంగీకరించారని నారాయణ స్పష్టం చేశారు.

ఉపాధి హామీ నిధులు ఖర్చు చేయని రాష్ట్రాలు ఇవే...

ఢిల్లీ : ఈ ఏడాది ఉపాధి హామీ నిధులు ఖర్చు చేయని 13 రాష్ట్రాల జాబితాను కేంద్రం విడుదల చేసింది. ఏపీ రూ,62,94 కోట్లు, తెలంగాణ రూ.40,75కోట్లు, మహారాష్ట్ర రూ.390.88, బీహార్ రూ.169.15 కోట్లు, మధ్యప్రదేశ్ రూ.132.92 కోట్లు, ఛత్తీస్ గఢ్ రూ,49.9 కోట్లు, జార్ఖండ్ రూ.97.21కోట్లు, ఒడిశా రూ.84.53 కోట్లు, ఉత్తర ప్రదేశ్ రూ.418.76 కోట్లు, గుజరాత్ రూ.103.87కోట్లు, హర్యానా రూ.95.1 కోట్లు, కర్ణాటక రూ.187.6కోట్లు, రాజస్థాన్ రూ.340.82 కోట్ల నిధులు చేయలేదని ప్రభుత్వం తెలిపింది.

09:28 - April 19, 2016

హైదరాబాద్ : తమిళనాడులో కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా తయారైంది. తాము ఎదుర్కొంటున్న దుస్థితికి ఆ పార్టీ సీనియర్ నేతలే కుమిలిపోతున్నారు. చివరకు మాజీ ఆర్థికమంత్రి చిదంబరం లాంటి నేతలు కూడా మనస్సులోని బాధను దాచుకోలేకపోతున్నారు. కరుణానిధి తమకు కేవలం 41 సీట్లను విదల్చడం కాంగ్రెస్ నేతలకు ఏమాత్రం మింగుడుపడడం లేదు. కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలో వున్న రోజుల్లో ఇదే డిఎంకె పార్టీ తమకు 63 సీట్లు కేటాయించిన వైనాన్ని తమిళ కాంగ్రెస్ నేతలు గుర్తుచేసుకుంటున్నారు. 2011లో 63 సీట్లు కేటాయించినా అయిదు స్థానాలు కూడా గెలవలేదంటూ డిఎంకె అధినేత కరుణానిధి ఈసారి భారీగా సీట్లు తగ్గించారు. ఒకదశలో 25 సీట్లతో సరిపుచ్చుకోవాలని కూడా సూచించారు. చివరకు 41 సీట్లు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. 2011లో కేటాయించిన సీట్ల కంటే 22 తక్కువ. దీంతో టిక్కెట్లు ఆశించిన కాంగ్రెస్ నేతలకు తీవ్ర నిరాశే మిగిలింది. ఒకప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పిన చిదంబరం లాంటి నేతలు కూడా తమ అనుచరులకు టిక్కెట్లు ఇప్పించుకోలేని పరిస్థితి ఎదురైంది. ఓ వైపు 41 సీట్లు కేటాయించిన డిఎంకె కాంగ్రెస్ కోరిన స్థానాలు కాకుండా ఇతర నియోజకవర్గాలు కేటాయించడం అసంత్రుప్తికి మరింత ఆజ్యం పోస్తోంది. డిఎంకె తీరుపై తీవ్ర అసంత్రుప్తితో రగిలిపోతున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నికల్లో మనస్పూర్తిగా సహకారిస్తారా? అన్న అనుమానమూ కలుగుతోంది. 

09:25 - April 19, 2016

హైదరాబాద్ : ఫుడ్ సెక్యూరిటీ కార్డుల పై తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలను తెరమీదకు తెచ్చింది. తెల్ల రేషన్ కార్డు స్థానంలో ఈ కార్డులను ప్రవేశ పెట్టి గందరగోళం సృష్టించిన ప్రభుత్వం తాజాగా మరో షాక్‌ ఇచ్చింది. ఫుడ్‌ సెక్యూరిటీ కార్డులు సరుకులకు తప్ప ప్రభుత్వ పథకాలకు ఉపయోగ పడవని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది.

అనేక ప్రభుత్వ పథకాలకు అర్హత పొందే అవకాశం....

తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు.. అనేక ప్రభుత్వ పథకాలకు అర్హత పొందే అవకాశం ఉంటుందనే అభిప్రాయం ఇప్పటి వరకు ఉంది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇక ఆ ఛాన్స్ లేకుండా పోయింది. తెల్ల రేషన్ కార్డుల స్థానంలో ప్రవేశ పెట్టిన ఫుడ్ సెక్యూరిటీ కార్డులు కేవలం రేషన్ షాపుల్లో సరుకులకు పొందేందుకే ఉపయోగపడనున్నాయి. ప్రభుత్వ పథకాలకు ఈ కార్డులు పనికి రావని ప్రభుత్వం స్పష్టం చేసింది.

పలు ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులుగా అర్హత పొందేందుకు.....

రేషన్‌ షాపుల్లో సరుకులకు మాత్రమే కాకుండా పలు ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులుగా అర్హత పొందేందుకు ఫుడ్‌ సెక్యూరిటీ కార్డులు ఇప్పటివరకు ఉపయోగపడుతున్నాయి. పెన్షన్లు పొందాలన్నా..ఆరోగ్య శ్రీ కార్డులు తీసుకోవాలన్నా.. డబుల్ బెడ్ రూం వంటి వాటికి అర్హత కావాలన్నా.. ఈ కార్డు అత్యంత ప్రధానం. ఐతే ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం పేదల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ కార్డు ఆధారంగా కార్పొరేట్ వైద్యం సైతం అందుబాటులో ఉంటుందనుకున్న వారికి ప్రభుత్వం నిర్ణయం శరాఘాతంగా మారనుంది. ఐతే ప్రభుత్వ పథకాల లబ్దిదారుల ఎంపిక కోసం సివిల్ సప్లై శాఖ నుంచి డేటాను తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. డేటా ఆధారంగా అర్హుల జాబితా తయారుచేస్తామని స్పష్టం చేస్తున్నారు. 

09:22 - April 19, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 18 మంది గాయపడ్డారు. నల్గొండ జిల్లా చౌటుప్పల్‌ మండలం లక్కారం దగ్గర లారీ, డీసీఎం ఢీ కొన్న ఘటనలో ఇద్దరు కూలీలు మరణించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తకోట మండలం ముమ్మాళ్లపల్లి దగ్గర బోర్‌వెల్‌ వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెండాడు. మరో 11 మందికి గాయాలయ్యాయి. ఏపీలోని అనంపురం జిల్లా తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లి దగ్గర సఫారీ వాహనం బోల్తా పడిన ఘటనలో తండ్రీ కొడులు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఇదే జిల్లాలోని శింగనమల మండలం చక్రాయపేట దగ్గర ఆటో బోల్తా పడిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా... మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి దగ్గర కారు-లారీ ఢీ కొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. 

08:34 - April 19, 2016

ముంబై : రిలయన్స్ అధినేత ముకేష్‌ అంబానీ వాహన శ్రేణిలో సరికొత్త వాహనం చేరింది. 25 కోట్ల రూపాయలతో అంబానీ కొనుగోలు చేసిన బస్సు త్వరలో ముంబయి రోడ్ల మీదకు దూసుకురానుంది. డచ్‌ కంపెనీ తయారు చేసిన ఈ వాహనంలో సకల సౌకర్యాలు ఉన్నాయి. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. బుల్లెట్లు దూసుకొచ్చినా..బాంబులు పేలినా...అగ్ని ప్రమాదాలు సంభవించినా చెక్కుచెదరకుండా ఉండేలా వాహనాన్ని తయారుచేశారు. ఇటీవలే రూ. 1.82 కోట్లతో దీన్ని రిజిస్ర్టేషన్‌ చేయించారు.

08:32 - April 19, 2016

అనంతపురం : జిల్లా హిందూపురంలో దారుణం జరిగింది. ఓ యువతిపై దుండగులు అత్యాచారం చేశారు. అయితే యువతిపై అత్యాచారానికి ముందే తల్లిని హత్య చేశారు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. లాడ్జీలో అపస్మారక స్థితిలో ఉన్న యువతిని లాడ్జీ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. లాడ్జీ రిజిస్టర్‌లో బాబు అనే పేరుతో రూమ్‌ తీసుకున్నట్లుగా ఉంది. ఇదే రూముకు మరో ఇద్దరు గెస్టులు వచ్చినట్లు లాడ్జీ సిబ్బంది చెబుతున్నారు. ఇక కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 

08:27 - April 19, 2016

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ ఆల్ఫా హోటల్‌ వద్ద 2 దుకాణాల్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చెప్పులు, సంచుల దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే.. ఇద్దరు వ్యక్తులు వచ్చి షాపులను తగలబెట్టారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

అల్ఫా హోటల్ సమీపంలో అగ్ని ప్రమాదం...

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ ఆల్ఫా హోటల్‌ వద్ద 2 దుకాణాల్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చెప్పులు, సంచుల దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. దుండగులు నిప్పంటించారని స్థానికులు అనుమానిస్తున్నారు.

08:07 - April 19, 2016

ఎమ్మెల్యేగా కన్నా ఎక్కువగా జబర్దస్త్ షో ద్వారా హీరోయిన్ రోజా పాపులారిటీ సంపాదించుకుంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో.! కానీ ఆ షో నుండి రోజా వెలదొలుగుతోదన్న రూమర్లు షికారు చేస్తున్నాయి. రోజా స్థానంలో మీనా రాబోతోందా? ఇదే అంశం సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీని పై ఓ క్లారిటీ రావాలంటే మరి కొంత సమయం ఆగాల్సిందే మరి... వివరాల్లోకి వెళితే...ఈటీవీలో ప్రసారమవుతున్న ‘జబర్దస్త్’ షో నుంచి వైసీపీ ఎమ్మెల్యే, ఆ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న రోజాను తొలగించవచ్చన్న రూమర్లు జోరందుకుంటున్నాయి. ఎమ్మెల్యేగా కన్నా ఎక్కువగా ఈ షో ద్వారా ఆమె పాపులారిటీ సంపాదించుకుంటోందని, పైగా ఏపీలో అధికార పార్టీని, సీఎం చంద్రబాబును బాహాటంగా దుయ్యబడుతున్న నేపథ్యంలో ఆమెను ఈ షో నుంచి తప్పించాలని పార్టీ (తెలుగుదేశం) నుంచి ఒత్తిడి పెరుగుతోందని అంటున్నారు. ‘జబర్దస్త్’ కార్యక్రమంలో ప్రసారమవుతున్న స్కిట్లలో వల్గర్, చీప్ కామెంట్ల కారణంగా కొన్ని వారాలుగా ఈ ఛానెల్ టీఆర్‌పీ రేటింగ్స్ కూడా తగ్గిపోయాయట. ఈ కార్యక్రమంలో రోజా హావభావాలు ఆడియెన్స్‌కు నచ్చడం లేదని అంటున్నారు. ఒక్కో ఎపిసోడ్‌కు రోజాకు రూ.5 లక్షలు అందుతున్నా ఈ కార్యక్రమానికి అదనంగా ఎలాంటి బెనిఫిట్ చేకూరడంలేదట. దీంతో రోజా స్థానే మీనా వంటివారిని తీసుకోవచ్చునని టాక్.

07:51 - April 19, 2016

హైదరాబాద్ : అడవి జంతువుల మధ్య పెరిగిన మౌగ్లీ అనే అనాథ కుర్రాడి కథతో తెరకెక్కిన హాలీవుడ్‌ చిత్రం ‘ది జంగిల్‌ బుక్‌’ భారత్‌లో విశేషంగా వసూళ్లు రాబడుతోంది. ఏప్రిల్‌ 8న విడుదలైన ఈ చిత్రం ఆదివారానికి రూ. 101.82 కోట్లు వసూలు చేసినట్లు సినీ విశ్లేషకుడు తరణ్‌ఆదర్శ్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపారు. చిత్రం అద్భుతంగా వసూళ్లు రాబడుతోందని ట్వీట్‌ చేశారు. జాన్‌ ఫారో దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ట్‌ డిస్నీ పిక్చర్స్‌ సంస్థ నిర్మించింది.

07:47 - April 19, 2016

రాజ్‌ తరుణ్‌, హేబాపటేల్‌ జంటగా రూపొంది తెలుగునాట ఘనవిజయం సాధించిన చిత్రం 'కుమారి 21 ఎఫ్‌'. సుకుమార్‌ కథ, స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రాన్ని శ్రీమాన్‌ దర్శకత్వంలో సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో సెవెన్‌ ఛానల్‌ మాణిక్యం నారాయణన్‌, శ్రీలక్ష్మీ జ్యోతి క్రియేషన్స్‌ పతాకంపై ఎ.ఎన్‌.బాలాజీ సంయుక్తంగా కన్నడలో రీమేక్‌ చేస్తున్నారు. 'గత 9 ఏండ్లుగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తూ దర్శకత్వ శాఖలో మంచి అనుభవం సంపాదించిన శ్రీమాన్‌ ఈ చిత్రంతో దర్శకుడిగా మారడం ఆనందంగా ఉంది. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ కుమారుడు సాగర్‌ మహతి సంగీతాన్ని అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌ కె.కె.సెంథిల్‌ కుమార్‌ దగ్గర వర్క్‌ చేసి 'గుంటూరు టాకీస్‌', 'ఒక మనసు' చిత్రాలకు కెమెరామెన్‌గా పనిచేసిన రామిరెడ్డి ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో నటించే నటీనటుల వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి' అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె. వెంకటేష్‌.

07:45 - April 19, 2016

విజరు దేవరకొండ, రీతూ వర్మ జంటగా తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో ధర్మపథ క్రియేషన్స్‌, బిగ్‌ బెన్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై రాజ్‌ కందుకూరి, యష్‌ రాగినేని నిర్మిస్తున్న చిత్రం 'పెళ్లి చూపులు'. ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ, 'ఇటీవల విడుదల చేసిన చిత్ర టీజర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. హీరోహీరోయిన్ల నటన, సినిమాటోగ్రఫీ, సంగీతం ఆకట్టుకునేలా ఉన్నాయని అందరూ ప్రశంసిస్తున్నారు. 'ఎవడే సుబ్రమణ్యం' చిత్రంలో కీలక పాత్ర పోషించిన విజరు దేవరకొండ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ సినిమాని ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నారు. తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతుందనడానికి నిదర్శనంగా నిలిచే చిత్రమిది. నవ్యమైన కథతో రూపొందిస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది' అని అన్నారు.

07:18 - April 19, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో వడగాలులు విజృంభిస్తున్నాయి. ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఐనా వడగాడ్పులను ప్రకృతి విపత్తుగా ప్రకటించడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రాలు నివేదికలు పంపిస్తున్నా మోదీ ప్రభుత్వం మౌనంగానే ఉండిపోతోంది. ఇక తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దక్షిణాదిలో ప్రచండ వేడి గాలులను మాత్రం జాతీయ విపత్తుగా గుర్తించడం లేదు ఎందుకు? ఈ అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ద హిందూ మాజీ రెసిడెంట్ ఎడిటర్, సీనియర్ విశ్లేషకులు నగేష్, టిడిపి నేత రామకృష్ణ ప్రసాద్,వైసీపీ నేత కరణం ధర్మశ్రీ పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై చర్చించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

అనంతపురంలో మహిళ దారుణ హత్య

అనంతపురం : నగరంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. నాలుగు రోజుల క్రితం హిందూపురంలోని ఓ లాడ్జిలో లైంగిక దాడికి గురైన యువతి తల్లి గా గుర్తించారు. లైంగిక దాడిలో పరారీలో ఉన్న నిందితులే ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

శ్రీవారిని దర్శించుకున్న అనీల్ అంబాని..

తిరుమల :అడాగ్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. తల్లి కోకిలాబెన్‌, ఇతర కుటుంబ సభ్యులతో వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు. తిరుమల జేఈవో శ్రీనివాసరాజు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

ధర్మిక ఆయోజన సదస్సులోకి దూసుకెళ్లిన కారు :6గురు మృతి

యూపీ : దేవగిరిలో ధర్మిక ఆయోజన సదస్సులోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో 12 మందికి గాయాలయ్యాయ. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

07:06 - April 19, 2016

హైదరాబాద్ : ప్రకృతి ప్రకోపం ఈక్వెడార్‌కు శాపంగా మారింది. ఆదివారం నాటి భూకంపం సృష్టించిన విలయం నుంచి ఈ దేశ వాసులు ఇప్పుడిప్పుడే కొద్దికొద్దిగా తేరుకుంటున్నారు. సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి బాధితులను ఆదుకునేందుకు పలు దేశాలు ఈక్వెడార్‌కు భారీగా సహాయసామాగ్రి పంపిస్తున్నాయి. పలు దేశాలకు చెందిన బృందాలు ఈక్వెడార్‌ చేరుకుని సహయ చర్యల్లో పాల్గొంటున్నాయి. ఈక్వెడార్‌కు సమీపంలో ఉన్న కొలంబియా, ఎల్‌ నాల్వెడార్‌, మెక్సికో దేశాలు అత్యవసర మందులు, ఆహారం పంపిస్తున్నారు. రెడ్‌ క్రాస్‌ బృందాలు కూడా ముమ్మరంగా సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి.

క్షతగాత్రులు 2,500 మంది......

రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 7.8గా నమోదవడంతో భవనాలు పేకమేడల్లా కుప్పకులాయి. వీటి కింద ఎవరైనా సజీవంగా ఉంటే కాపాడేందుకు శిథిలాల తొలగింపుకు ప్రధాన్యత ఇస్తున్నారు. దాదాపు 2,500 మంది గాయపడ్డారు. పశ్చిమ ఈక్వెడార్‌లోని పోర్టోవిజో జైలు కూడా భూకంప తాకిడికి గురైంది. దీంతో భయభ్రాంతులకు గురై... జైలు నుంచి పరారైన వందమంది ఖైదీల్లో కొందరు స్వచ్ఛందంగా తిరిగి వచ్చారు. మరో 30 మందిని ఈక్వెడార్‌ పోలీసులు పట్టుకున్నారు. మిగిలిన వారికోసం గాలిస్తున్నారు.

చమురు అన్వేషణ, తవ్వకాలపై భూకంప ప్రభావం....

భూకంపం సృష్టించిన విలయంతో ఈక్వెడార్‌లో మౌలికసదుపాయాల రంగానికి భారీ నష్టం జరిగింది. రోడ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్‌ వ్యవస్థ కుప్పకూలింది. టెలికమ్యూనికేషన్లు చిన్నాభిన్నమయ్యాయి. చమురు అన్వేషణ, తవ్వకం వ్యవస్థలపై కూడా భూకంప ప్రభావం పడింది. చమురు ఎగుమతి దేశాల సమాఖ్య....ఒపెక్‌లో ఈక్వెడార్‌కు సభ్యత్వం ఉంది. దీంతో ఈ దేశాన్ని ఆదుకునేందుకు ఒపెక్‌ ముందుకొచ్చింది. అపార చమురు, సహజవాయువు నిక్షేపాలున్న ఈక్వెడార్‌ తరచు భూకంపాల భారిన పడుతుండటంతో తీవ్ర ఆర్ధిక ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. చమురు తర్వాత ఎక్కువ ఆదాయం సమకూర్చేది పర్యాటక రంగం. భూకంపాల కారణంగా సముద్రం పోటుకు అందమైన బీచ్‌లు కొట్టుకు పోతున్నాయి. స్వర్గథామంలాంటి బీచ్‌లు కళావిహీనంగా మారుతున్నాయి. దీంతో ఈక్వెడార్‌కు వచ్చే పర్యాటకులు తగ్గిపోతున్నారు. ఈక్వెడార్‌ ఆర్ధిక వ్యవస్థ కుదేలవుతోంది.

1900 తర్వాత ఏడు భారీ భూకంపాలు.....

క్వెడార్‌లో 40 ఏళ్ల తర్వాత ఇంతటి భారీ భూకంపం వచ్చింది. మరుభూమిని తలపిస్తున్న ఈ దక్షిణ అమెరికా దేశంలో 1900 తర్వాత ఏడు భారీ భూకంపాలు సంభవించాయి. ఇవన్నీ కూడా రిక్టర్‌ స్కేలుపై ఏడును మించిన తీవ్రత నమోదైనవే. 1987 మార్చిలో సభవించిన భూకంపంలో వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయారు. చిన్నా చితక భూకంపాలు చాలానే నమోదయ్యాయని అమెరికా భూభౌతిక సర్వే సంస్థ రికార్డులు చెబుతున్నాయి. 

07:04 - April 19, 2016

హైదరాబాద్ : కింగ్‌ ఫిషర్‌ అధినేత విజయ్‌ మాల్యాకు మరింత ఉచ్చు బిగుస్తోంది. మనీలాండరింగ్‌ కేసులో మాల్యాకు నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఈడీ జారీ చేసిన నోటీసులపై సవాల్ చేస్తూ మాల్యా వేసిన పిటిషన్ను ముంబై ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది. ఈడీ చేసిన ఆరోపణలు సమర్థిస్తూ ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం మాల్యాకు వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

ఐడీబీఐ బ్యాంకు నుంచి 9 వందల కోట్ల రుణం....

ఐడీబీఐ బ్యాంకు నుంచి 9 వందల కోట్ల రుణం తీసుకుని విదేశాలకు బదిలీ చేశారన్న కారణంతో మాల్యాపై ఈడీ కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది. ప్రస్తుతం లండన్‌లో ఉన్న మాల్యాకు మానీలాండరింగ్‌ కేసులో విచారణకు గాను ఈడీ మూడుసార్లు సమన్లు పంపినా హాజరుకాలేదు. ఈడీ ముందు విచారణకు హాజరు కావాలని మార్చి 18, ఏప్రిల్‌2, ఏప్రిల్‌ 9న మాల్యాకు ఈడీ సమన్లు జారీ చేసింది. దర్యాప్తు సహకరించడం లేదన్న కారణంతో గతవారం ఈడీ సిఫార్సు మేరకు విజయ్ మాల్యా పాస్ పోర్టును విదేశాంగశాఖ నాలుగు వారాల పాటు రద్దు చేసింది.

యూనైటెడ్‌ బేవరేజస్‌ గ్రూపు కోసం ....

యూనైటెడ్‌ బేవరేజస్‌ గ్రూపు కోసం ఐడిబిఐ బ్యాంకు నుంచి మాల్యా 9 వందల కోట్ల రుణం తీసుకున్నారు. ఇందులో నుంచి 430 కోట్లతో మాల్యా విదేశాలలో ఆస్తులు కొనుగోలు చేశారన్న ఈడీ వాదనలతో మాల్యా తరపు న్యాయవాదులు ఏకీభవించలేదు. బ్యాంకు రుణం మొత్తం వ్యాపారానికే వినియోగించినట్లు, దీనికి సంబంధించి పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. దీనిపై ఈడీ వాదనను సమర్థిస్తూ ముంబై ప్రత్యేక కోర్టు మాల్యాకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ ఇష్యూ చేసింది.

ఎస్‌బిఐతో సహా 17 బ్యాంకులకు 9వేల కోట్లకు పైగా....

మాల్యా ఎస్‌బిఐతో సహా 17 బ్యాంకులకు 9వేల కోట్లకు పైగా బకాయి చెల్లించాల్సి ఉంది. సెప్టెంబర్‌ 30 వరకు 4వేల కోట్లు చెల్లిస్తానన్న విజయ్‌మాల్యా ప్రతిపాదనను బ్యాంకులు తిరస్కరించాయి. బకాయి పడ్డ మొత్తం 9వేల కోట్లు చెల్లించాల్సిందేనని బ్యాంకులు సుప్రీంకోర్టుకు తెలిపాయి. మాల్యా, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించి దేశ, విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలను ఏప్రిల్‌ 21 లోపు వెల్లడించాలని సుప్రీంకోర్టు ఇదివరకే ఆదేశించింది.

07:01 - April 19, 2016

విశాఖ : లెక్కలేనన్ని ఉద్యోగాలు వస్తాయన్నారు. రకరకాల అశలు కల్పించారు. ఎకరం స్థలం కేవలం రూపాయి చొప్పున కట్టబెట్టారు. ముందే చెప్పినట్టుగా ఉద్యోగాలు కల్పించారు. కాకపోతే వారి దృష్టిలో సిబ్బంది కట్టుబానిసలతో సమానం. ఆ బానిస బతుకులను తట్టుకోలేకనే ఉద్యోగులు తిరుగుబాటు మొదలుపెట్టారు. వారి ఆందోళనను విరమింపజేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగినా ఫలితం లేకపోయింది. విశాఖ జిల్లా బ్రాండిక్స్ కంపెనీలో నెలకొన్న ఉద్రిక్తతకు ఎప్పుడు బ్రేక్‌ పడుతుందో చూడాలి.

11 కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులతో....

11 కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులతో ఒక పెద్ద పారిశ్రామిక సంస్థగా వెలుగొందుతోంది. కంపెనీ ఎంత పెద్దదైనా ఉద్యోగుల బతుకుల్లో మాత్రం ఆనందం లేదు. 5 సంవత్సరాల క్రితం రోశయ్య హయాంలో విశాఖ జిల్లా అచ్యుతాపురం వద్ద శ్రీలంకకు చెందిన అండర్ గార్మెంట్స్ కంపెనీ బ్రాండిక్స్‌ను ఏర్పాటు చేశారు. ఎకరానికి రూపాయి చొప్పున ప్రభుత్వం బ్రాండిక్స్‌కు భూమి లీజుకిచ్చింది. దీనిలో బ్రాండిక్స్ కంపెనీకి చెందిన 4 యూనిట్లతో పాటుగా సీడ్స్ కంపెనీ, క్వాంటమ్ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వీటిల్లో పనిచేస్తున్న కార్మికుల్లో మహిళలే ఎక్కువగా ఉంటారు. అయితే కంపెనీ ప్రారంభమైన దగ్గర్నుంచీ కార్మికులకు కనీస వేతనాలైనా ఇవ్వడం లేదు. దీనికి తోడు ఇక్కడ పనిచేస్తున్న వారిలో ఎక్కవ మంది నాలుగైదు సంవత్సరాలు చేసి పని మానేస్తారు. వారికి పీఎఫ్‌లు ఇవ్వడంలోనూ కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో విసిగిపోయిన సిబ్బంది వేతనాలు పెంచాలంటూ ఆందోళనకు దిగారు. బ్రాండిక్స్ పెరల్‌ సిటీలోని 11 కంపెనీలకు చెందిన 15 వేల మంది కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళనల్లో పాల్గొంటున్నారు.

గత వారం రోజులుగా.....

గత వారం రోజులుగా బ్రాండిక్స్ కంపెనీ మొదటి రెండు యూనిట్ల కార్మికులు ఉత్పత్తిని నిలుపుదల చేశారు. దీంతో కంపెనీ 10 రోజుల సెలవులు ఇచ్చి కార్మికులతో చర్చలు మొదలుపెట్టింది. అయితే చర్చలు అసంపూర్ణంగానే ముగిసాయి. కొన్నేళ్లుగా వేతనాలు పెంచనందున ఇకనైనా జీతాలు పెంచాలని పీఎఫ్‌లు ఇవ్వాలని కోరుతున్నారు. తమపై జరుగుతున్న వేధింపుల నిరోధానికి కంపెనీ కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

కార్మికులతో ఎంపీ, ఎమ్మెల్యేల చర్చలు...

కార్మికులతో అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు, యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబుతో పాటు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో చర్చలు జరిపారు. సమస్యను పరిష్కరించడానికి 15 రోజుల సమయం ఇవ్వాలని ప్రజాప్రతినిధులు కోరగా ఇందుకు కార్మికులు నిరాకరించారు. తమ సమస్యలను పరిష్కరించే దాకా అందోళన విరమించబోమని తేల్చి చెప్పారు. దీంలో జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

 

06:58 - April 19, 2016

హైదరాబాద్: నేతల కుమ్ములాటలకు తెలంగాణ కాంగ్రెస్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతోంది. తెలంగాణలో పార్టీ బ‌లోపేతానికోసం వేసిన పీసీసీ కొత్త క‌మిటీ..ఇప్పుడు పార్టీలో భ‌గ‌భగలు రేపుతోంది. ప‌ద‌వులు రాక‌ ఊగిపోతూ కొంద‌రు..భజ‌న‌ప‌రుల‌కే ప‌ద‌వులిచ్చార‌ని మ‌రి కొంద‌రు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఇంకొందరు ఇదేమి కమిటీరా బాబు అంటూ క‌మిటీని టార్గెట్‌గా చేసుకుని ఉడికిపోతున్నారు .

అధికార పార్టీ దూకుడుతో తెలంగాణలో అష్టక‌ష్టాలు ......

అధికార పార్టీ దూకుడుతో తెలంగాణలో అష్టక‌ష్టాలు ప‌డుతున్న కాంగ్రెస్‌కు కొత్త ఊపునిచ్చేందుకు పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించింది. పార్టీ బ‌లోపేతానికి ఈకొత్త టింతో చెక్ పెట్టాల‌నుకున్న పార్టీకి ఇప్పుడు అదే క‌మిటీ అతిపెద్ద సమస్యగా మారింది. కొండంత ఆశ‌తో జంబో క‌మిటీపై..ఇప్పుడు పార్టీలో నేత‌లు కుతకుత ఉడికి పోతుండ‌టం పార్టీలో హ‌ట్ హాట్‌గా మారింది.

రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి చర్యలు .....

6ఏళ్ల తర్వాత పీసిసి కమిటీని ప్రకటించింది ఏఐసీసీ. అదికూడా ఏకంగా 130 మందితో జంబో క‌మిటిని వేసింది. గ‌తంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేనివిధంగా నేత‌ల‌కు ప‌ద‌వులు పంచింది హైక‌మాండ్. అయితే ఈ క‌మిటీ టార్గెట్‌గా ఇప్పుడు నేత‌లు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. అర్థం ప‌ర్థంలేని విధంగా కమిటీ కూర్పు జ‌రిగింద‌ని ర‌గిలిపోతున్నారు. ఎప్పుడు లేనివిధంగా ఒక్కో నేత‌కు రెండు క‌మిటీల్లోనూ బాధ్యతలు క‌ల్పించ‌డం ఏంటని సెటైర్లు గుప్పిస్తున్నారు. పార్టీకి ప‌నిచేసిన వారికి కాకుండా.. భ‌జ‌న ప‌రుల‌కు ప‌ద‌వులు ద‌క్కాయ‌ని కారాలు, మిరియాలు నూరుతున్నారు. కొంద‌రైతే నేరుగా పీసీసీ చీఫ్‌ ఉత్తం ముందు త‌మ ఆసంతృప్తిని వెల్లగక్కుతున్నారు.

ఆరేళ్ల తర్వాత పిసిసి కమిటీ .....

ఇక క‌మిటీలో ఒక్కొక్కరికి రెండేసి పదవులివ్వడాన్ని చాలామంది నేత‌లు త‌ప్పు ప‌డుతున్నారు. జంబో క‌మిటీ వేసిన‌ప్పుడు...అంద‌రికి ప్రాధాన్యత కల్పించాలేల్సింది పోయి..పదవులు ఉన్నవారితో నింపడం ఏంటని రగిలిపోతున్నారు. ఖ‌మ్మం జిల్లాలో పార్టీ ముఖ్య నేత వ‌ర్గానికి మాత్రమే ప్రాధాన్యత క‌ల్పించార‌ని ఇప్పటికే ఎమ్మెల్సీ పొంగులేటి అధిష్టానానికి లేఖ‌ రాశారు. ఇక అధికార పార్టీని కాద‌ని కాంగ్రెస్ ప‌క్షాన ప‌నిచేస్తున్న త‌మ‌కు అవ‌కాశం రాక‌పోవ‌డంపై ఓయు విద్యార్థి నేత‌లు ఆగ్రహంగా ఉన్నారు. గ‌తంలో 8మందితో ఉన్న పిసిసి సమన్వయ కమిటీని ఇప్పుడు ఏకంగా 31 మందితో ఏర్పాటు చేయ‌డంపై సీనియ‌ర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ‌ల్లీ నేత‌ల‌కు కోఆర్డినేష‌న్ క‌మిటీలో స్థానం క‌ల్పించి కమిటీ ప‌రువు తీశార‌ని మండిప‌డుతున్నారు.

ఒక్కొక్కరికి రెండేసి పదవులు ....

కొంద‌రు ముఖ్యనేతలు కూర్చొని కమిటీలో ప‌ద‌వులు పంచుకున్నార‌న్న విమ‌ర్శలు పార్టీలో బలంగా విన్పిస్తున్నాయి. మొత్తానికి పార్టీకి దిక్సూచిగా ఉంటుంద‌నుకున్న క‌మిటీపై ఆదిలోనే అసంతృప్తి సెగ‌లు క‌మ్ముకోవ‌డం ..ఇప్పుడు హ‌స్థం పెద్దలకు పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. అయితే ఇంకా మిగిలి ఉన్న పీసీసీ అధికార ప్రతినిధి, కార్యదర్శి, స‌హాయ కార్యదర్శుల పోస్టుల‌తో ఈ అసంతృప్తిల‌కు బ్రేకులు ప‌డ‌తాయ‌న్న ధీమాతో ఉన్నారు పార్టీ పెద్దలు. 

06:54 - April 19, 2016

ఢిల్లీ : 2011 గ్రూప్స్ పరీక్షలు మళ్లీ నిర్వహించే కేసు విచారణ మే 3కు వాయిదాపడింది. పరీక్ష నిర్వహణపై రెండువారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలంటూ సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2011లో నిర్వహించిన గ్రూప్స్ ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రంలో ఆరు తప్పులు దొర్లాయంటూ కొందరు అభ్యర్థులు గతంలో హైకోర్టును ఆశ్రయించారు.. ఈ సమస్యను పరిష్కరించాలంటూ కోర్టు యూపీఎస్ సీ సిఫార్సు చేసింది.. దీనిపై అప్పటి  ఏపీపీఎస్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పరీక్షను మళ్లీ జరపాల్సిందేనని ధర్మాసనం 2013లో తీర్పు చెప్పింది.. అయినా ఇప్పటివరకూ ఈ పరీక్షను నిర్వహించలేదంటూ అభ్యర్థులు కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు.. అయితే తమ కోటాలో వచ్చిన పోస్టులను భర్తీచేసేందుకు సిద్ధమని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. 

06:53 - April 19, 2016

విజయవాడ: ఏపీలో వైసిపిని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధ్యక్షులు జ‌గ‌న్ సన్నద్ధమ‌వుతున్నారు. ఎన్నిక‌లు ముగిసి రెండేళ్లు అవుతున్నా ఇంత వ‌ర‌కూ పార్టీకి జిల్లా స్థాయి క‌మిటీలు త‌ప్ప మండ‌ల, గ్రామ స్థాయి క‌మిటీలు లేవు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు గ్రౌండ్‌ స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేసేందుకు క‌మిటీల‌పై క‌స‌ర‌త్తు చేస్తున్నారు పార్టీ నేత‌లు...

పార్టీకి గుడ్‌బై టిడిపిలోకి చేరికలు.....

ఒకపక్క ఎమ్మెల్యేలు గెలిపించిన పార్టీకి గుడ్‌బై టిడిపిలోకి చేరిపోతున్నారు. మరోపక్క బలహీనపడుతున్న పార్టీ కంగారు పెడుతోంది. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో వైఎస్సార్‌సిపి దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. భవిష్యత్‌ను దృష్టిలోపెట్టుకుని క్షేత్రస్థాయి నుంచి వైసిపిని బలోపేతం చేసేందుకు జగన్‌ కార్యాచరణ మొదలుపెట్టారు.

హాజరుకానున్న జిల్లా అధ్యక్షులు, ముఖ్య నేతలు..............

పార్టీని బలోపేతం చేసే ప్రక్రియలో భాగంగా నేడు హైద‌రాబాద్ పార్టీ కార్యాల‌యంలో 13 జిల్లాల అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేత‌ల‌తో జగన్ స‌మావేశం నిర్వహించనున్నారు. ఇటీవ‌ల పార్టీలో జ‌రుగుతున్న ప‌రిణామాలు, రాష్ట్రంలో నెల‌కొన్న క‌రువు ప‌రిస్థితులు, ప్రజా స‌మ‌స్యల‌పై ఉద్యమాలు చేసేందుకు వైసీపిని సిద్ధం చేయనున్నారు. ఈ మేర‌కు సమావేశంలో కార్యాచ‌ర‌ణ రూపొందించే అవకాశముంది.

ఇప్పటికీ పూర్తికాని పార్టీ కమిటీల నియామకం..........

ఎన్నిక‌లు ముగిసి రెండేళ్లు అవుతున్నా ఇప్పటి వ‌ర‌కూ పార్టీ క‌మిటీల‌ను పూర్తి స్థాయిలో నియ‌మించ‌క‌పోవ‌డంపై జ‌గ‌న్ ఆగ్రహం వ్యక్తం చేసిన‌ట్లు స‌మాచారం. వ‌చ్చే నెలరోజుల్లో అన్ని ర‌కాల పార్టీ క‌మిటీల ఏర్పాటు పూర్తి కావాల‌ని ముఖ్యనేత‌ల‌కు జ‌గ‌న్ సూచించారు. దీంతో క‌మిటీల నియామ‌కంపై పెద్దలు దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది. రాష్ట్ర, జిల్లా, నియోజ‌క‌వర్గ, మండ‌ల‌, గ్రామీణ స్థాయి పార్టీ క‌మిటీల‌న్నింటినీ పూర్తిస్థాయిలో నియ‌మించ‌డం కోసం పార్టీ నేత‌లు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఇక టిడిపి ప్రభుత్వం అధికారం చేప‌ట్టి రెండేళ్లు అవుతున్నా ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీలను ఒక్కటీ నెర‌వేర్చలేదని ఈ విష‌యాన్ని ప్రజ‌ల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాల‌ని వైసీపి భావిస్తోంది...

ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం..............

మొత్తానికి రానున్న రోజుల్లో జ‌గ‌న్ పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజా స‌మ‌స్యల‌ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల‌ని భావిస్తున్నారు. ముఖ్యంగా ఏపికి ప్రత్యేక హోదా, రాజ‌ధాని నిర్మాణం, రైతు ఆత్మహత్యలు, రుణాల రీషెడ్యూల్‌, విద్యార్థుల ఫీజురీయింబ‌ర్స్‌మెంట్‌ తదితర అంశాలను అస్త్రాలుగా మార్చుకుని ముందుకెళ్లనున్నట్లు వైసిపి వ‌ర్గాలు చెబుతున్నాయి.

06:46 - April 19, 2016

విజయవాడ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత విద్యావ్యవస్థపై ఏపీలో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఇంటర్ ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అనుకొన్న తేదీ కంటే ఎంతో ముందుగా విడుదల చేస్తోంది. వాస్తవానికి ఈ నెల 23న ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలను..ఆ తర్వాత రెండు రోజుల వ్యవధిలో ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ఈ సంవత్సరం మూల్యాంకన డీకోడింగ్‌ అంతా ఆన్‌లైన్‌లో జరగడంతో తక్కువ వ్యవధిలోనే మూల్యాంకనం పూర్తయింది. తొలిసారిగా రాష్ట్రంలో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఒకే రోజు విడుదల చేయనున్నారు.

ఇంటర్మీడియట్ పరీక్షలు గత నెల 2వ తేది నుంచి 21వతేది వరకు.....

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షలు గత నెల 2వ తేది నుంచి 21వతేది వరకు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు పూర్తి భద్రతతో పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1412 కేంద్రాలలో దాదాపు నాలుగు లక్షల 71 వేల మంది విద్యార్థులు ఇంటర్ ప్రధమ సంవత్సరం, 4లక్షల 29 వేల మంది విద్యార్ధులు ద్వితీయ సంవత్సర పరీక్షలకు హాజరయ్యారు. ఇవాళ విడుదలయ్యే ఫలితాల కోసం విద్యార్దులు ఆత్రృతగా ఎదురు చూస్తున్నారు.

నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు..

హైదరాబాద్ : ఏపీ ఇంటర్‌ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఉదయం 10గంటలకు ఇంటర్‌ ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను రాజధాని కేంద్రం విజయవాడ నుంచి విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు. 

06:43 - April 19, 2016

సుప్రీం కోర్టు పున:సమీక్ష నిర్ణయంతో నీట్ (నేషనల్ ఎల్జిబుల్ టెస్ట్ ఎంట్రన్స్) మరో సారి తెరపైకి వచ్చింది. నీట్ ను అమలు చేసే విషయంలో దేశవ్యాప్తంగా ఏకాభిప్రాయం లేదు. దీనివల్ల జరిగే లాభనష్టాల గురించి తెలుగు రాష్ట్రాల విద్యార్థులు బేరీజు వేసుకుంటున్నారు. అస్సలు నీట్ అంటే ఏమిటి? నీట్ వల్ల తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి? నీట్ అమలు అనివార్యం అయితే తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నీట్ అమలు విషయంలో విద్యార్థి సంఘాల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఏపీ ఎస్ ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై చర్చించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

06:35 - April 19, 2016

హైదరాబాద్ : ఎంబిబిఎస్ లో సీటు సాధించడం ఆషామాషీ వ్యవహారం కాదు. మెడికల్ కాలేజీలో సీటు సాధించేందుకు ఇంటర్మీడియట్ బైపిసి విద్యార్థులు నిద్రాహారాలు మాని, శ్రమిస్తుంటారు. ఇంజనీరింగ్ కాలేజీలతో పోల్చుకుంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ, దేశవ్యాప్తంగానూ మెడికల్, డెంటల్ కాలేజీల సంఖ్య తక్కువ. దేశం మొత్తం మీద దాదాపు 400 మెడికల్ కాలేజీలు, 300 డెంటల్ కాలేజీలున్నాయి. దేశవ్యాప్తంగా 63వేల మెడికల్ సీట్లు ఉండగా, వీటిలో పాతిక వేల సీట్లు ప్రభుత్వ కాలేజీల్లోనూ, 38వేల సీట్లు ప్రయివేట్ కాలేజీల్లోనూ అందుబాటులో వున్నాయి. ప్రయివేట్ కాలేజీలలో సీట్లు పెరిగినట్టుగా ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు పెరగడం లేదు. గత 16ఏళ్లలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో కేవలం 9300 సీట్లు మాత్రమే పెరగగా, ప్రయివేట్ కాలేజీల్లో అంతకు రెట్టింపు సంఖ్యలో సీట్లు పెరిగాయి. ప్రయివేట్ కాలేజీలు యాజమాన్య కోట సీట్లను కోట్లాది రూపాయలకు అమ్ముకుంటున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్, టిఎస్ సెట్ తో పాటు ప్రయివేట్ మేనేజ్ మెంట్లు కూడా ప్రవేశపరీక్షలు నిర్వహిస్తున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి వుంది. దేశంలోని మెడికల్ కాలేజీలన్నింటికీ ఒకే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి, దానిలో సాధించిన ర్యాంక్ ల ఆధారంగానే సీట్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో నీట్ ను తెరమీదకు తీసుకొచ్చారు. నీట్ విషయంలో అనేక సందేహాలు, భయాందోళనలు, భిన్నాభిప్రాయాలున్నాయి. నీట్ ను కొంతమందిని వ్యతిరేకిస్తుండగా, మరికొందరు సమర్ధిస్తున్నారు. ఇంటర్మీడియట్ సిలబస్ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా వుంది. నీట్ అమలులోకి వస్తే తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఇప్పుడు చదువుతున్న సిలబస్ కంటే కనీసం మరో 40 పేజీల పాఠాలు అదనంగా చదువుకోవాల్సి వస్తుంది. బాటనీలో 11 టాపిక్స్, ఫిజిక్స్ లో 17 టాపిక్స్ అదనంగా ప్రిపేరవ్వాల్సి వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే ఎంసెట్, దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ సిలబస్ లో 30 నుంచి 50 శాతం సిలబస్ తేడా వుంటుందన్న అభిప్రాయాలున్నాయి. ఈ వ్యత్యాసాన్ని నివారించాలంటే దేశ వ్యాప్తంగా ఒకే సిలబస్ పెట్టాలన్నది కొందరి అభిప్రాయం. అలాచేయడం వల్ల రాష్ట్రాలు స్వతంత్రతను కోల్పోతాయనీ, విద్యను కేంద్రీక్రుతం చేయడం ఎంతమాత్రమూ మంచిదికాదన్నది మరికొందరి అభిప్రాయం. దేశవ్యాప్తంగా ఒకే ఎంట్రన్స్ టెస్ట్ పెడితే, ఇంగ్లీషు మీడియంలో, సిబిఎస్ సిలబస్ చదువుకున్నవారే సీట్లన్నీ తన్నుకుపోతారనీ, గ్రామీణ ప్రాంత విద్యార్థులు, స్టేట్ సిలబస్ చదువుకుంటున్న విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారన్న విమర్శలున్నాయి. ఒకవేళ నీట్ లో సీటు సాధించలేకపోతే, ఇక ఆ విద్యార్థి కి ఆ ఏడాదికి మెడిసిన్ చదువుకోవాలన్న కోరిక కల్లగానే మిగిలిపోతుందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. నీట్ వల్ల జరిగే మంచి చెడుల గురించి లోతుగా అధ్యయనం చేయకుండా, శాస్త్రీయ ద్రుష్టితో ఆలోచించకుండా ఇప్పటికిప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాలున్నాయి. 

06:33 - April 19, 2016

హైదరాబాద్ : విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ కోసం.. ఐదు రోజులుగా దీక్ష చేస్తున్న వైసీపీ నేత అమరనాథ్ ను.. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. ఆదివారం అర్ధరాత్రి అమరనాథ్‌ దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయన్ను కేజీహెచ్‌కు తరలించారు. సోమవారం ఉదయం విశాఖ వచ్చిన జగన్.. కేజీహెచ్‌లో.. అమరనాథ్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు.

మీడియాతో జగన్...

ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడిన జగన్.. విశాఖకు రైల్వే జోన్‌ గురించి చంద్రబాబు ఎందుకు ప్రయత్నించడం లేదని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం అన్ని అంశాల్లోనూ ప్రజలను మోసం చేసిందని, బాబొస్తే జాబొస్తుందని చెప్పి ఇప్పుడు పద్ధతి ప్రకారం ఉద్యోగాలు తొలగిస్తున్నారని జగన్‌ ఆరోపించారు.

ప్రతిపక్ష పార్టీల వారిని కొనేందుకు....

ప్రతిపక్ష పార్టీల వారిని కొనేందుకు ఉపయోగించే అవినీతి సొమ్మును కేంద్రం ఎక్కడ బయటకు లాగుతుందో అన్న భయంతోనే చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి, రైల్వే జోన్ గురించి కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదని జగన్‌ విమర్శించారు.

అమర్‌నాథ్‌ దీక్షను ప్రభుత్వం భగ్నం చేయడంపై విపక్షాలు మండిపాటు...

మరోవైపు అమర్‌నాథ్‌ దీక్షను ప్రభుత్వం భగ్నం చేయడంపై విపక్షాలు మండిపడ్డాయి. ప్రభుత్వ చర్యకు నిరసనగా.. అఖిలపక్షం నేతలు గాంధీ విగ్రహం వద్ద అందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణతో పాటు సీపీఐ, సీపీఎం నేతలు, ఇతర ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.

06:29 - April 19, 2016

కడప : జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం టిడిపి నేతల మధ్య నెలకొన్న వివాదం పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి వచ్చింది. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని, రామసుబ్బారెడ్డిని చంద్రబాబు విజయవాడకు పిలిపించుకుని చర్చలు జరిపారు. శ్రీరామ నవమి వేడుకకు రామసుబ్బారెడ్డిని పిలిచిన వారి ఇళ్లపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గీయులు దాడికి పాల్పడటంపై మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి సిఎంకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరు గ్రూపుల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణాన్ని చక్కబెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ వివాదంపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి స్పందిస్తూ తనకు... రామసుబ్బారెడ్డికి మధ్య ఎలాంటి విభేదాలూ లేవని పార్టీ అభివృద్ధికి కలిసి పనిచేయాలని సిఎం సూచించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా వైసిపి నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కొంతకాలం క్రితం టిడిపిలో చేరారు. ఆదినారాయణరెడ్డికి, రామసుబ్బారెడ్డి కుటుంబాలకు మధ్య ఎప్పటినుంచో వివాదాలు ఉన్నాయి. 

కారుపైకి దూసుకెళ్లిన లారీ: ముగ్గురు మృతి

పశ్చిమగోదావరి :నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద మంగళవారం తెల్లవారుజామున ఓ కారుపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కారు డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. కారు రాజమండ్రి నుంచి ఏలూరు వైపు వెళ్తుండగా అనంతపల్లి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

ఆగివున్న లారీని ఢీ కొట్టిన డీసీఎం

నల్గొండ : చౌటుప్పల్ మండలం లక్కారం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని డీసీఎం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఇబ్రహీంపట్నం కూరగాయల మార్కెట్‌లో అగ్నిప్రమాదం

రంగారెడ్డి : ఇబ్రహీంపట్నం కూరగాయల మార్కెట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. రెండు అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశాయి. ఈ ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది.

 

Don't Miss