Activities calendar

20 April 2016

విలేకరులకు విజయ్ కాంత్ బెదిరింపులు..?

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా మారిన డీఎండీకే చీఫ్‌ కెప్టెన్‌ విజయ్‌కాంత్‌ వివాదానికి తెరతీశారు. సేలం ప్రాంతంలో ప్రచారంలో పాల్గొన్న విజయ్‌కాంత్‌ అక్కడ విలేకరులను బెదిరించినట్లు సమాచారం. ఒక్కసారిగా ఆగ్రహానికి లోనైన విజయకాంత్‌ విలేకరులను చెంపపగలకొడతానన్నట్లు తెలుస్తోంది. అయితే ఆయనకు అంత ఆగ్రహం తెప్పించిన విషయం ఏమిటో తెలియలేదు. డీఎంకే-పీడబ్లు్యఎఫ్‌ కూటమి సీఎం అభ్యర్థి అయిన విజయ్‌కాంత్‌ ఈ ఎన్నికల్లో ఉల్లుండూర్‌పేట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

భారత్ కు పెరుగుతున్న విదేశీ పర్యాటకులు

ఢిల్లీ : భారత దేశానికి విదేశీ పర్యాటకులు పెరుగుతున్నారని కేంద్ర పర్యాటక శాఖ తెలిపింది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు 25.08 లక్షల మంది విదేశీ పర్యాటకులు భారత్ కు వచ్చారని పర్యాటక శాఖ ప్రకటించింది. విదేశీ పర్యాటకుల వల్ల భారత్ కు 5.986 బిలియన్ డాలర్ల విదేశీ మారకం సమకూరిందని ఆ శాఖ తెలిపింది. గత ఏడాది 22.81 లక్షల మంది విదేశీయులు భారత్ లో పర్యటించగా, ఈ ఏడాది వారి సంఖ్య పెరిగిందని పర్యాటక శాఖ తెలిపింది.

 

ముంబై విజయలక్ష్యం 171 పరుగులు

హైదరాబాద్ : ఐపిఎల్ -9 లో భాగంగా బెంగుళూరు, ముంబై మధ్య జరుగుతున్న మ్యాచ్ లో నిర్ణీత వోవర్లలో బెంగుళూరు ఏడు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ముంబై విజయలక్ష్యం 171 పరుగులుగా ఉంది.  

21:42 - April 20, 2016

ఏప్రిల్ లోనే చుక్కలు కనబడుతున్నాయి.. మరి మే నెలలో ఎలా ఉంటుందో ఊహించడానికే భయపడే పరిస్థితి ఏర్పడింది.. ఇల్లు కదలాలంటే భయపడేలా ఎండలు మండిపోతున్నాయి.., వడగాలులు కమ్మేస్తున్నాయి.. ఉదయం పది దాటిటే బయటికి రావడానికి భయపడాల్సిన పరిస్థితి... చాలా చోట్ల 45 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి నిప్పులు చెరుగుతోంది. వడదెబ్బకు పిట్టల్లా అనేకమంది రాలిపోతున్న దృశ్యం.. మరోపక్క ప్రభుత్వాల తీరులో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు వచ్చిన వడగండంపై ఈరోజు వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం... పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

బంజారాహిల్స్‌లో ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం

హైదరాబాద్ : బంజారాహిల్స్‌లో 4ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు యత్నించారు. ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నించిన రిటైర్ట్ సర్వేయర్ రామారావు పై షేక్‌పేట తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో రామారావు సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

భార్యాఇద్దరు బిడ్డలను హతమార్చిన వ్యక్తికి జీవిత ఖైదు శిక్ష

విజయనగరం : జిల్లాలోని బలిజపేటమండలంలోని అర్జాడ గ్రామంలో  2012లో కర్రి సింహాచలం అనే వ్యక్తి తన భార్య లావణ్య, ఇద్దరు బిడ్డలకు పురుగు మందు ఇచ్చి హత్య చేసాడు. దినిపై ఆ వ్యక్తికి జీవిత ఖైది శిక్షను విధిస్తూ పార్వతీపురం ఫాస్ట్‌ ట్రాక్‌ జడ్జి బుధవారం తీర్పు ఇచ్చారు.

 

తమిళనాడు, పుదుచ్చేరిలో ఎన్నికల పర్యవేక్షకుడిగా సీవీ ఆనంద్‌

హైదరాబాద్‌ : తమిళనాడు, పుదుచ్చేరిలో సాధారణ ఎన్నికల పర్యవేక్షకుడిగా సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్‌ నియమించింది. 2014లో తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు చేసిన పలు ప్రయత్నాలను నియంత్రించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అదే సమయంలో అత్యధిక మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న డబ్బును స్వాధీనం చేసుకున్నందుకు గాను కేంద్ర ఎన్నికల కమిషన్‌ సీవీ ఆనంద్‌కు అవార్డును ప్రదానం చేసింది. తాజాగా తమిళనాడు, పుదుచ్చేరిలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పంపిణీ చేస్తున్న తాయిలాలను నిలవరించేందుకు ఆయన్ను ప్రత్యేక పరిశీలకుడిగా నియమించారు.

మూడో వికెట్‌ కోల్పోయిన బెంగుళూరు

హైదరాబాద్‌ : ఐపీఎల్‌-9లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగుళూరు మూడో వికెట్‌ కోల్పోయింది. 93 ప‌రుగుల వ‌ద్ద ఎబి డెవిలియర్స్ 29 (21)  ఔట‌య్యా‌డు

21:21 - April 20, 2016

పుట్టెడు జరాన్ని బుగులువట్టిచ్చిన కేసీఆర్.. ఫామ్ హౌజునిడిచి జనంలకొచ్చిన పెద్దసారు, తెలుగు రాష్ట్రాలను పొగిడిన గవర్నర్.. ఇద్దరు అభివృద్ధి చేసిండ్రంట సూపర్, తెలంగాణ మంత్రుల మీద సర్వే.. ఒర్లంగా కొర్రాయి వాతలు.. ఓపికవట్టిన చంటిపిల్లలు, నిజామాబాద్ జిల్లాలనే కొత్త దందా...ఐస్ వెట్టి ఏసినోళ్ల పని గోవిందా, ఉరుకొచ్చి బాయిలవడ్డ చిరుతపులి..దానికి కోడిపిల్లనిచ్చిండ్రు బలి .. ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం....

21:06 - April 20, 2016

క్యూబా : కమ్యూనిస్టు క్యూబా ఆదర్శాలు ఈ భూమి మీద ఎప్పటికీ నిలిచే ఉంటాయని, నిరంతర మానవ పోరాటంలో సామాజిక, సాంస్కృతిక విజయాలు తప్పక సిద్ధిస్తాయనడానికి క్యూబా ఒక రుజువుగా కొనసాగుతుందని క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో నినదించారు. మంగళవారం నాడు ముగిసిన క్యూబా కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ లో ఫిడెల్ ప్రసంగం జనాన్ని ఉర్రూతలూగించింది. కాస్ట్రో క్రేజ్ ఫరెవర్ అన్నట్లుగా ఉద్యమనేతకు జనం నీరాజనాలు పలికారు.
అర్ధ శతాబ్దం పాటు దేశాన్ని నడిపించిన క్యాస్ట్రో
ఫిడెల్ కాస్ట్రో.. ఈ పేరు వింటే ఒక ఉప్పొంగే సముద్రం గుర్తుకు వస్తుంది. విరుచుకుపడే ఉద్యమ కెరటం స్ఫురణకు వస్తుంది. క్యూబా విప్లవనాయకుడు, బాటిస్టాను గద్దె దింపి.. క్యూబాను ఒకే పార్టీ కమ్యూనిస్టు దేశంగా అర్థ శతాబ్దం పాటు నడిపించిన కాస్ట్రో చాలా రోజుల తరువాత కమ్యూనిస్టు కాంగ్రెస్‌లో చేసిన అరుదైన ప్రసంగం ప్రపంచ దృష్టిని ఆకట్టుకునేలా సాగింది.
లక్ష్యాలను సాధించేందుకు పోరాటం చేస్తూనే ఉండాలన్న క్యాస్ట్రో
కమ్యూనిస్టు పార్టీ ఆదర్శాలు విజయవంతంగా కొనసాగుతాయనడానికి ఈ భూమి మీద క్యూబా ఒక నిదర్శనంగా నిలుస్తుందని కాస్ట్రో అన్నారు. మన లక్ష్యాలను సాధించడానికి మనం తుది లేని పోరాటం చేస్తూనే ఉండాలని ఈ సందర్భంగా కాస్ట్రో పిలుపునిచ్చారు. రాబోయే అయిదేళ్ళలో క్యూబా ఆర్థిక దిశా నిర్దేశం కోసం ఏర్పాటైన కమ్యూనిస్టు కాంగ్రెస్ సదస్సుకు హాజరైన వేయికి పైగా ప్రతినిధులు ఫిడెల్ కాస్ట్రో ప్రసంగాన్ని ఉద్విగ్నంగా విన్నారు. కాన్ఫరెన్స్ హాలు లోకి ఆయన అడుగు పెట్టగానే.. ఫిడెల్ పిడెల్ అంటూ ఉత్సాహంగా నినదిస్తూ.. లేచి నిల్చుని చప్పట్లతో స్వాగతం పలికారు.
సదస్సులో ప్రస్తావనకు రాని నాయకత్వ మార్పు 
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా క్యూబాను సందర్శించిన నెల రోజుల తరువాత జరిగిన కాంగ్రెస్ సమావేశాలలో ఫిడెల్ తన సోదరుడు క్యూబా అధ్యక్షుడైన రాల్ కాస్ట్రోతో కలిసి సమావేశానికి హాజరయ్యారు. నాయకత్వ మార్పు గురించిన ప్రస్తావన ఈ సదస్సులో రానప్పటికీ, ఎనభైలలో ఉన్న వృద్ధ నేతల పొలిట్ బ్యూరోతో రాల్ కాస్ట్రో మరికొంత కాలం అధికారంలో కొనసాగుతారని స్పష్టం చేశారు. అయితే, తొలితరం నేతలతో ఇదే చివరి కమ్యూనిస్టు కాంగ్రెస్ సదస్సు అవుతుందని, కొత్త తరానికి ఉద్యమ వారసత్వాన్ని అందించనున్నట్లు సదస్సు ప్రకటించింది. విదేశీ పెట్టుబడులకు, ప్రైవేటీకరణకు ఇప్పుడిప్పుడే ద్వారాలు తెరుస్తున్న ఈ ద్వీప దేశంలో... 90 ఏళ్ళ ఫిడెల్ కాస్ట్రో స్వరం ఇప్పటికీ ఓ విద్యుత్ తరంగంలా ప్రసరిస్తూ ఉండడం విశేషం.

20:58 - April 20, 2016

చండీగఢ్ : మహిళల కురచ దుస్తుల ధారణపై చండీగఢ్ అధికారులు కొరడా ఝుళిపించనున్నారు. అమ్మాయిలు మినీ స్కర్ట్ లు, అసభ్యకరంగా ఉన్న దుస్తులు ధరించి బార్లు, డిస్కోతెక్ లకు వెళ్లడంపై నిషేధం విధించనున్నారు.  'కంట్రోలింగ్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ పబ్లిక్ అమూజ్ మెంట్ 2016' కింద పోలీసులు ఈ చర్యలు చేపట్టనున్నారు. అంతేకాదు.. బార్లు, డిస్కోథెక్‌లలో రెండు గంటల సమయాన్ని కూడా తగ్గించనున్నారు. ప్రస్తుతం డిస్కోథెక్‌లలో రాత్రి 2 గంటల వరకు అనుమతిస్తున్నారు. ఇకపై 12 గంటలకే పరిమితం చేయనున్నారు. దీనిపై బార్ యజమానులు, మానవ హక్కుల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేరాల అదుపుచేసేందుకు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం సరికాదని వాదిస్తున్నారు. రాత్రి వేళల్లో బార్లు, పబ్బుల్లో పెరిగిపోతున్న అసాంఘిక, జాతివ్యతిరేక కార్యకలాపాలకు నియంత్రించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు.

 

20:56 - April 20, 2016

చెన్నై : తమిళనాడు డీఎండీకే నేత విజయ్‌కాంత్‌ అసహనానికి గురయ్యారు. ఎన్నికల ప్రచారంలో ఉన్నపళంగా తన అంగరక్షకుడిపై చేయిచేసుకున్నారు. సేలంలో ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో విజయ్‌కాంత్‌ అంగరక్షకుడిపై చేయిచేసుకోవడం సంచలనం రేకెత్తిస్తోంది. ఘటనా సమయంలో అక్కడే ఉన్న పలువురు పార్టీనేతలు, కార్యకర్తలు విజయ్‌కాంత్‌ చర్యపై విస్మయం వ్యక్తం చేశారు.  విజయ్‌కాంత్‌ పీపుల్స్‌ వెల్ఫేర్‌ ఫ్రంట్‌ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో ఉన్నారు.  

 

20:53 - April 20, 2016

ఉత్తరాఖండ్ : గత నెల డెహ్రాడూన్‌లో బిజెపి ఆందోళన సందర్భంగా ఆందోళనకారులు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ శక్తి మాన్‌ పోలీసు గుర్రం మరణించింది. బిజెపి చేపట్టిన ఆందోళనలో ఎమ్మెల్యే గణేష్‌ జోషితో పాటు కార్యకర్తలు గుర్రం కాళ్లపై లాఠీలతో కొట్టడంతో శక్తిమాన్‌ కాలు విరిగింది. తీవ్రంగా గాయపడ్డ శక్తిమాన్‌కు వైద్యులు చికిత్స చేసి కృత్రిమ కాలును అమర్చినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనకు సంబంధించి ఉత్తరాఖండ్‌ పోలీసులు బిజెపి ఎమ్మెల్యే గణేష్‌ జోషిని అరెస్ట్ చేసి కేసు కూడా నమోదు చేశారు.

20:49 - April 20, 2016

హైదరాబాద్‌ : నగరంలో గుక్కెడు నీటి కోసం జనం తల్లడిల్లుతున్నారు. నగరానికి తాగునీటిని అందించే నాలుగు రిజర్వాయర్లూ పూర్తిగా ఎండిపోయాయి. రోజుకి 660 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం కాగా.. 330 మిలియన్ గ్యాలన్ల కన్నా తక్కువ నీరే అందుబాటులో ఉంది. వర్షాలు వచ్చి రిజర్వాయర్లలో నీరు చేరేవరకూ.. అంటే.. వచ్చే రెండు నెలల పాటు పరిస్థితి ఎలా ఉండబోతోందోనన్న ఆందోళన జనంలో వ్యక్తమవుతోంది. గడచిన 30 సంవత్సరాల కాలంలో.. భాగ్యనగరానికి ఇలాంటి నీటి కష్టం రావడం ఇదే ప్రథమం.
దాహార్తితో తల్లడిల్లుతోన్న హైదరాబాద్‌
విశ్వనగరం హైదరాబాద్‌.. దాహార్తితో తల్లడిల్లుతోంది. తాగునీటిని అందించే ప్రాజెక్టులన్నీ ఒట్టిపోగా.. బోర్లలో చుక్క నీరు లేక జనం గొంతెండిపోతోంది. హైద్రాబాద్‌లో 80 లక్షల మంది ప్రజలు నీటి కోసం పడరాని పాట్లూ పడుతున్నారు. హైద్రాబాద్ దాహర్తిని తీర్చే నాలుగు రిజర్వాయర్లు అడుగంటి పోయాయి. సింగూరు, మంజీర, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు బీడు భూములుగా మారిపోయాయి. వరుసగా మూడో సంవత్సరమూ తీవ్ర వర్షాభావం   కారణంగా పరిస్థితి దయనీయంగా మారింది. 
రెండు రోజులకొకసారి నీటి సరఫరా
హైదరాబాద్ కు నీరందించే జలశయాలు ఎండిపోవడంతో  క్రిష్ణా, గోదావరి జలాలే నగరానికి దిక్కయ్యాయి. 200 కిలో మీటర్ల దూరంలోని ఆ నదుల నీటిని హైద్రాబాద్ కు తరలిస్తున్నారు. రెండు రోజులకు ఒకసారి నీటిని సప్లై చేస్తూ నెట్టుకొస్తున్నారు. నగరానికి ప్రతి రోజూ 660 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరమవుతుంది. అయితే నీటి ఎద్దడి కారణంగా కేవలం 355 మిలియన్ గాలన్ల నీటినే సరఫరా చేయగలుగుతున్నారు. మరో వైపు 43 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రతలు.. వడగాడ్పుల దెబ్బకు సొమ్మసిల్లి.. గుక్కెడు నీటితో గొంతు తడుపుకుందామన్నా.. అవస్థలు తప్పడం లేదు. 
నీటి సరఫరా కోసం రూ. 6 కోట్లు మంజూరు
హైదరాబాద్ నీటి సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ఇప్పటికే 6 కోట్ల నిధులను మంజూరు చేసింది. నీటి లభ్యత గల ప్రాంతాల నుంచి నీటిని తరలించేందుకు ఈ నిధులను వెచ్చిస్తున్నారు.  అయితే అవి ఏ మూలకూ చాలడం లేదు.  వర్షాలు విస్తారంగా కురిసి రిజర్వాయాలు నిండితే తప్ప  హైద్రాబాద్ ప్రజల నీటి ఇక్కట్లు తీరేలా లేవు. అందుకే నగరజీవులు ముందస్తు వానల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నీటి గండం నుంచి ఎలా గట్టేక్కాలని ప్రజలు, పాలకులు ఆందోళన చెందుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో నీటి అవసరాలు మరింత పెరగనున్నాయని భయపడుతున్నారు. 

 

20:46 - April 20, 2016

హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పాలేరు ఉపఎన్నిక ప్రకటనతో టీఆర్ఎస్ అలర్ట్ అయ్యింది. ఎన్నికల కోడ్  నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీకి అనుమతి కొరకు ఎన్నికల కమిషనర్ భనర్వర్ లాల్ ను హైదరాబాద్ మేయర్ బొంతు రాంమ్మోహన్ కలిశారు. టిఆర్ఎస్ ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఈ నెల 27న నిర్వహించే ప్లీనరీకి సంబంధించి చాలా  ఏర్పాట్లు చేసింది. అయితే ఖమ్మంలో నిర్వహించే ఈ ప్లీనరీకి  ఎన్నికల కోడ్ అడ్డురావడంతో ఎన్నికల సంఘం అనుమతి  కోరింది టిఆర్ఎస్. ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘంతో మాట్లాడి స్పష్టత ఇస్తానని రాష్ట్ర ఎన్నికల అధికారి భనర్వర్ లాల్ చెప్పినట్లు బొంతు రామ్మోహన్ తెలిపారు. 

20:41 - April 20, 2016

హైదరాబాద్ : ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో పోలీసుల తనిఖీలను సీపీఎం తప్పుపట్టింది. విద్యాశాఖకు విస్తృత యంత్రాంగం ఉన్నా.. పోలీసులతో ఎందుకు తనిఖీలు చేయిస్తున్నారని ప్రశ్నించింది. ప్రభుత్వం విద్యారంగాన్ని కాపాడటంలో చిత్తశుద్ధి చూపకుండా.. బెదిరించడానికే ప్రాధాన్యతనిస్తోందని విమర్శించింది.  అక్రమాలకు పాల్పడుతున్న విద్యాసంస్థలపై విద్యాశాఖ విభాగాలతోనే తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్‌ చేసింది.
పోలీసు విభాగాలతో తనిఖీలు సమంజసం కాదు
ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రభుత్వానికి మధ్య తలెత్తిన ఘర్షణపూర్వక వాతావరణం.. విద్యార్థులకు చేటు తెస్తుందని సీపీఎం తెలంగాణ శాఖ అభిప్రాయపడింది. ప్రైవేటు విద్యా సంస్థల్లో తనిఖీలను ఎవరూ తప్పు బట్టడం లేదని, అయితే.. విద్యారంగానికి చెందిన సంస్థలతో కాకుండా.. విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, సీఐడి లాంటి పోలీసు విభాగాలతో తనిఖీలు చేయించడమే సమంజసంగా లేదని అభిప్రాయపడింది. ప్రభుత్వ చర్య బెదిరింపు ధోరణేనని అభిప్రాయపడింది. ప్రైవేట్‌ విద్యాలయాల్లో ఫీజుల నియంత్రణ, విద్యాహక్కు చట్టం అమలుపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఎం డిమాండ్‌ చేసింది. 
చాలా విద్యాసంస్థలు నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు
అటు ప్రైవేట్‌ యాజమాన్యాలు కూడా పోలీసు తనిఖీలను వ్యతిరేకించాలే తప్ప.. పరీక్ష కేంద్రాలను అనుమతించబోమనే వైఖరి తీసుకోవడం సరికాదని సీపీఎం నేతలు సూచించారు. ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామంటూ రాయితీలు పొందుతున్న చాలా ప్రైవేట్‌ విద్యాసంస్థలు.. ఎలాంటి నాణ్యత ప్రమాణాలనూ పాటించడం లేదని సీపీఎం నేతలంటున్నారు. అత్యధిక ఫీజులు వసూలు చేయడమే కాకుండా.. విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయడం లేదంటున్నారు. ప్రభుత్వాలు ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాల అరాచకాలను నియంత్రించకపోగా.. పరోక్షంగా సహాయపడడం వల్లనే విద్యారంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని సీపీఎం నేతలు ఆరోపిస్తున్నారు. 

తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణం

హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరో మూడు రోజులపాటు వడగాలులు వీయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ లో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు, భద్రాచలం, హన్మకొండ, మహబూబ్ నగర్, నల్గొండ, రామగుండంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. హైదరాబాద్, ఖమ్మంలలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదు అయ్యాయి. 

 

పశ్చిమబెంగాల్ రేపు ఎన్నికలు

కోల్ కతా : పశ్చిమబెంగాల్ రేపు మూడో దశ ఎన్నికలు జరగనున్నాయి. ముర్షిదాబాద్‌, నదియా, బుర్ద్వాన్‌, ఉత్తర కోల్‌కతాల్లోని62 నియోజకవర్గాలకు రేపు పోలింగ్‌ జరగనుంది. మొత్తం 418 అభ్యర్థులు బరిలో ఉండగా.. ఇందులో 34 మంది మహిళలున్నారు. 1,37,13,594 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.

మెదక్‌ జిల్లాలో టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ

మెదక్‌ : జిల్లాలోని కంగ్టి మండలం గాజులపాడులో టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. తాగునీటి విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగి ఘర్షణకు దారితీసినట్లు సమాచారం. పరస్పర ఘర్షణలో పలువురికి గాయాలవ్వగా, కిరాణా దుకాణం దగ్ధమైంది. గాయపడిన వారిని నారాయణ్‌ఖేడ్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాజులపాడులో పోలీస్‌ పికెటింగ్‌ ఏర్పాటు చేశారు.

 

ములుగు అటవీ కళాశాల నిర్వహణకు రూ.118 కోట్లు మంజూరు

మెదక్ : జిల్లాలోని ములుగు అటవీ కళాశాల నిర్వహణకు ప్రభుత్వం రూ.118కోట్లు మంజూరు చేసింది. అటవీ కళాశాల నమూనాకు ఆమోదం తెలిపిన అనంతరం ఉద్యానవన విశ్వవిద్యాలయ నమూనాకు సీఎం కేసీఆర్‌  మార్పులు సూచించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే అటవీ కళాశాల ప్రారంభం కావాలని అధికారులకు నిర్దేశించారు. నూతన భవనాన్ని నిర్మించేలోపు అటవీ అకాడమీలో తరగతులు నిర్వహించాలని సూచించారు. హైదరాబాద్ చుట్టుపక్కన ఉద్యానవన సాగుకు దళిత రైతుల్ని ప్రోత్సహించాలని సూచించారు.

బిజెపి ఎమ్మెల్యే చేతిలో గాయపడిన గుర్రం శక్తిమాన్ మృతి

డెహ్రడూన్ : ఉత్తరాఖండ్‌లో మార్చ్ 14న బిజెపి ఎమ్మెల్యే చేతిలో గాయపడిన గుర్రం శక్తిమాన్ చనిపోయింది. బిజెపి కార్యకర్తలు ఆందోళన చేస్తున్న సమయంలో పోలీసులు వారిని అడ్డుకున్నప్పుడు వారిలో బిజెపి ఎమ్మెల్యే శక్తిమాన్‌పై దాడి చేశాడు. ఈ దాడిలో శక్తిమాన్‌ కాలు విరిగిపోవడంతో ఆర్టిఫీసియల్ కాలు అమర్చారు. ఆర్టిఫీసియల్ లెగ్ కారణంగా శక్తిమాన్ ‌నొప్పితో బాధపడిందని పోలీసులు తెలిపారు. శక్తిమాన్ కోలుకోవాలంటూ అభిమానులు పెద్దఎత్తున ప్రార్ధనలు కూడా చేశారు. అయినా కూడా శక్తిమాన్‌ను కాపాడలేకపోయారు.

ఒంటిమిట్టలో అంగరంగవైభవంగా సీతారాముల కల్యాణోత్సవం

కడప : జిల్లాలోని ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణోత్సవం అంగరంగవైభవంగా జరుగుతోంది. ఆలయం నుంచి కల్యాణ మండపానికి శోభాయాత్రగా సీతారాములు బయల్దేరినారు. కాసేపట్లో ఎదుర్కోలు ఉత్సవం ప్రారంభంకానుంది. టీడీడీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఈ మహోత్సవానికి పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కల్యాణమహోత్సవానికి గవర్నర్‌ నరసింహన్, సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు.

19:21 - April 20, 2016

విశాఖ : ఆంధ్రా యూనివర్శిటీ డిగ్రీ సెకండియర్‌ కెమిస్ట్రీ పేపర్‌ లీకయ్యింది. పేపర్‌లీకయ్యిందన్న విషయాన్ని ఏయూ రిజిస్ట్రార్‌ నిర్ధారించారు. ఓ ప్రైవేటు కాలేజీ యాజమాన్యం కెమిస్ట్రీ పేపర్‌ను లీక్‌చేసినట్లు తెలుస్తోంది. పేపర్‌ లీక్‌ ఘటనపై విచారణకు ఓయూ రిజిస్ట్రార్‌ కమిటీని నియమించారు. అనుకోకుండా వాట్సప్ మేసేజ్ వచ్చిందని... దాంట్లో సెకండియర్ పేపర్ వచ్చిందని రిజిస్ట్రార్ తెలిపారు. వాట్సప్ లో వచ్చిన పేపర్ ను తమ పేపరుతో ట్యాలీ చేస్తే.. సేమ్ గా ఉందని.. దీంతో డిగ్రీ సెకండియిర్ కెమిస్ట్రీ పరీక్ష రద్దు చేసినట్లు తెలిపారు. నర్సిపట్నం ఏరియాలోని ప్రైవేట్ కాలేజీల్లో పేపర్ లీక్ అయినట్లు తెలుస్తోందన్నారు. పేపర్ లీక్ కు పాల్పడిన కాలేజీ గుర్తింపును కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.  

19:14 - April 20, 2016

అనంతపురం : జిల్లాలో పరిటాల రవీంద్ర మోమోరియల్‌ ట్రస్ట్ ఆధ్వర్యంలో 300 జంటలకు ఉచిత సామూహిక వివాహాలు జరిపిస్తున్నారు. గురువారం జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఏర్పాట్లను పరిటాల రవీంద్ర కుమారుడు శ్రీరామ్‌ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

19:09 - April 20, 2016

నెల్లూరు : వైసీపీ అధినేత జగన్‌పై ఆనం వివేకానందరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్‌ ఫెయిలయ్యారన్నారు. రాజ్యాంగం, రాజకీయాలు తెలియకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. జగన్‌కు స్పెషల్‌ స్టేటస్‌కు,.. స్పెషల్‌ ప్యాకేజికి మధ్య తేడా తెలియదని ఎద్దేవా చేశారు. 

 

19:03 - April 20, 2016

విజయవాడ : జైలుపాలై బెయిల్‌పై తిరిగే వ్యక్తులు నాయకులా అని కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు ప్రశ్నించారు. బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు టీడీపీలో చేరిన సందర్భంగా అశోక్‌ గజపతిరాజు ఈ వాఖ్యలు చేశారు. తెలుగువాళ్లు ప్రపంచంలో ఉన్నంతవరకు తెలుగుదేశం పార్టీ ఉంటుందని అశోక్‌ గజపతి అన్నారు. 

 

19:00 - April 20, 2016

విజయవాడ : సంక్షేమం విషయంలో రాజీపడేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు అన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి వైసీపీ ఎమ్మెల్యే సుజయ్‌ కృష్ణ రంగారావు, ఆయన సోదరుడు బేబీ నాయనా టీడీపీలో చేరారు. విజయవాడలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... రంగారావు సోదరులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ విజయనగరం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పారు. సంక్షేమానికి చంద్రబాబు పెద్దపీట వేశారని ఎమ్మెల్యే సుజయ్‌ కృష్ణ రంగారావు అన్నారు. రాష్ట్రాన్ని సమర్థవంతంగా పాలించగల సత్తా చంద్రబాబుకే ఉందన్నారు.

 

ఒంగోలులో దారుణం...

ప్రకాశం : భార్యను అన్యోన్యంగా చూసుకోవాల్సిన భర్త దారుణానికి ఒడిగట్టాడు. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు. తన తల్లి మాట వినడం లేదని భార్యను మూడో అంతస్తు నుంచి తోసేశాడు. దీంతో ఆమె పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. భర్తే భవనం పై నుంచి కిందకు తోసేశాడని భార్య మళ్లీశ్వరి చెబుతోంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు విచారిస్తున్నారు. 

ఆంద్రాయూనివర్సిటీ డిగ్రీ సెకండియర్ కెమిస్ట్రీ పేపర్ లీక్

విశాఖ : ఆంధ్రాయూనివర్సిటీ డిగ్రీ సెకండియర్ కెమిస్ట్రీ పేపర్ లీక్ అయింది. పేపర్ లీకేజీపై ఏయూ రిజిస్ట్రార్ కమిటీ వేశారు. పరీక్షను రద్దు చేశారు. అలాగే పేపర్ ను లీక్ చేసిన కాలేజీ గుర్తింపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 

18:40 - April 20, 2016

ప్రకాశం : భార్యను అన్యోన్యంగా చూసుకోవాల్సిన భర్త దారుణానికి ఒడిగట్టాడు. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు. తన తల్లి మాట వినడం లేదని భార్యను మూడో అంతస్తు నుంచి తోసేశాడు. జిల్లాలోని వేటపాలెంకు చెందిన మళ్లీశ్వరి అనే మహిళను బట్టల వ్యాపారి బద్రికి ఇచ్చి వావాహం చేశారు. వీరికి బాబు ఉన్నాడు. అయితే తన తల్లి మాట వినడం లేదని భార్య మళ్లీశ్వరిని ఒంగోలులోని భవనం మూడో అంతస్తు నుంచి బద్రి కిందకు తోసేశాడు. దీంతో ఆమె పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. భర్తే భవనం పై నుంచి కిందకు తోసేశాడని భార్య మళ్లీశ్వరి చెబుతోంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు విచారిస్తున్నారు. 

17:58 - April 20, 2016

ముస్లింల పెళ్లిళ్ల విధానం సివిల్ కాంట్రాక్టు లాంటిదని లాయర్ పార్వతి తెలిపారు. ముస్లింల పెళ్లిళ్లు... అనే అంశంపై మావని మైరైట్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. ఒకరు ప్రతిపాదిస్తే... మరొకరు ఆమోదించాలన్నారు. శారీరక సంబంధాలను లీగలైజ్ చేస్తారని తెలిపారు. 1937 లో ముస్లీంల వివాహం చట్టం వచ్చిందన్నారు. ఇందులో వివాహాలు, విడాకులు, ముస్లిం పురుషుడు నాలుగు వివాహాలు, అంతకంటే ఎక్కువగా కూడా చేసుకోవచ్చు అనే అంశాలను పొందుపర్చారని పేర్కొన్నారు. అయితే నలుగురు మహిళలను సమానంగా చూసే సామర్థ్యం ఉంటేనే పరుషుడు ఒకటి కంటే ఎక్కువ పెళ్లిల్లు చేసుకోవచ్చని పేర్కొన్నట్లు తెలిపారు. కేవలం ముస్లీం మహిళలు, కేవలం ముస్లీం పురుషులను మాత్రమే వివాహం చేసుకోవాలని రాశారని చెప్పారు. విగ్రహారాధన చేసే వారిని వివాహం చేసుకునే వీలులేదని పేర్కొన్నారని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

17:50 - April 20, 2016

ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులను నియంత్రించాలని ప్రజలు కోరారు. ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టాన్ని తేవాలని సూచించారు. 
ఫీ'జులుం'పై అడ్డగుట్టలో టెన్ టివి పబ్లిక్ డిబేట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని, తమ మనోగతాన్ని తెలిపారు. తమ సాదకబాధకాలు వివరించారు. ఫీజుల పెంపుతో డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో అన్ని వసతులు కల్పించాలన్నారు. ప్రైవేట్ స్కూళ్లల్లో ఉన్న సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలలో కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థను నడపడంలో ప్రభుత్వం విఫలం అవుతుందన్నారు. ఫీజుల పెంపు విషయంలో ప్రైవేట్ స్కూళ్లకు ప్రభుత్వం పూర్తిగా స్వేచ్ఛను కల్పించిందని విమర్శించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

17:43 - April 20, 2016

తూర్పు గోదావరి : డిప్యూటీ సీఎం చినరాజప్ప.. సొంతూళ్లో.. సంత వివాదంలో చిక్కుకున్నారు. సంతను ఊరి చివరకు తరలించాలన్న ఆయన హుకుం... విమర్శలకు తావిచ్చింది. సంత  స్థలాన్ని సొంతం చేసుకునేందుకే.. ఈ ప్రతిపాదన తెరపైకి తెచ్చారన్న వాదన వినిపిస్తోంది. 
పెద్దాపురం సంత జిల్లాలోనే ఫేమస్ 
పెద్దాపురం సంత అంటే తూర్పు గోదావరి జిల్లాలోనే ఫేమస్. ఒకప్పుడు జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఈ సంతకు వచ్చి.. కావలసిన సరుకులు కొనుక్కు వెళ్లేవారు. మిగతా ప్రాంతాల సంగతేమో కానీ.. పెద్దాపురం పట్టణ ప్రజలకు, చుట్టుపక్కలనున్న నాలుగైదు మండలాల వారికైతే.. ఈ సంత అత్యంత కీలకం. ఇంతటి ప్రసిద్ధమైన సంత తన ప్రాధాన్యతను కోల్పోయే పరిస్థితి ఎదురైంది. ఈ దిశగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప తీసుకున్న నిర్ణయంపై స్థానికంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 
పెద్దాపురం పట్టణం నడి మధ్యలో సంత స్థలం
పెద్దాపురం పట్టణం నడి మధ్యలో సంత స్థలం ఉంది. మున్సిపాలిటీకి చెందిన ఈ స్థలం ఎంతో విలువైంది. కోట్లల్లో ధర పలుకుతోంది. దీంతో ఈ స్థలంపై కన్నేసిన పెద్దలు సంతను ఇక్కడి నుంచి తరలించాలని ఎత్తుగడ వేసినట్లు ప్రచారం జరుగుతోంది. సంతను ఊరి చివరకు తరలించి.. ఊరికి దూరంగా ఉన్న బస్టాండ్‌ను సంత స్థలంలోకి తీసుకు వస్తున్నామని.. చినరాజప్ప అనుచరులు నమ్మబలుకుతున్నారు. బస్టాండ్‌తో పాటు.. భారీ షాపింగ్‌ కాంప్లెక్స్‌నూ నిర్మించి సొమ్ము చేసుకోవచ్చన్నదే వీరి ఆంతర్యమని స్థానికులు విమర్శిస్తున్నారు. అందుకే ఆర్టీసీ బస్టాండ్‌ నిర్మిస్తున్నామన్న వంకతో.. సంతను ఊరికి దూరంగా తరలిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
స్మశానం పక్కకు సంత తరలింపు...?
సంతను ఊరి చివరకు అదీ శ్మశానం పక్కకు తరలించాలని చినరాజప్ప అనుచరులు హడావుడి చేస్తున్నారు. దీన్ని స్థానిక వ్యాపారులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న సంత తరలింపు ప్రయత్నాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.                                                                                 
సంత తరలింపుపై విపక్షాలు అభ్యంతరాలు 
సంత తరలింపు వ్యవహారంపై విపక్షాల నుంచి ముఖ్యంగా సీపీఎం నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కూడా ఈ అంశంపై సీపీఎం నిరసన తెలిపింది. సంత తరలింపు నిర్ణయాన్ని ఏకపక్షంగా కాకుండా.. ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని సీపీఎం నేతలు సూచిస్తున్నారు. 
ప్రజలను మభ్యపెట్టే పనిలో అధికారులు
అటు అధికారులూ అమాత్యుడి ఆలోచనను తక్షణమే అమలులో పెట్టే పనిలో పడ్డారు. పట్టణ నడిబొడ్డున బస్టాండ్‌ వస్తోందని ఆశ చూపుతూ.. ప్రజలను మభ్యపెట్టే పనిలో పడ్డారు. స్థానికులు మంత్రి, అధికారుల వైఖరిపై మండిపడుతున్నారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.

 

ఈసీ భన్వర్ లాల్ ను కలిసిన జీహెచ్ ఎంసీ మేయర్ రామ్మోహన్

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ మేయర్ రామ్మోహన్ ఈసీ భన్వర్ లాల్ ను కలిశారు. ఖమ్మంలో ఎన్నికల కోడ్ ఉన్నందున టీఆర్ ఎస్ బహిరంగ సభను అనుమతివ్వాలని భన్వర్ లాల్ ను కోరారు. 

అర్హత కలిగిన అధ్యాపకులకు న్యాయం చేస్తాం : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : క్యాంపు ఆఫీస్ లో సీఎం కేసీఆర్ ను ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్షరర్ల సంఘం ప్రతినిధులు కలిశారు. ప్రభుత్వ కళాశాలల్లో పని చేస్తున్న అర్హత కలిగిన అధ్యాపకులకు న్యాయం చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. గత పాలకుల అనాలోచిత నిర్ణయాల వల్ల కళాశాలల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ లెక్షరర్లు శాపగ్రస్తులుగా మారారని తెలిపారు. ఈ నియామకాలు నిరుద్యోగుల జీవితాలను నిర్వీర్యం చేశాయన్నారు. ఉద్యోగుల నియామకం, నియమ నిబంధనలు, రోస్టర్ సిస్టమ్ వంటి న్యాయపరమైన అంశాలను అధిగమించి మానవీయ కోణంలో సహాయం చేస్తామని సీఎం భరోసా ఇచ్చారు. వెంటనే కార్యాచరణ చేపట్టాలని  మంత్రి కడియంను సీఎం ఆదేశించారు. 

 

సినిమా అవార్డుల కోసం కమిటీ ఏర్పాటు

హైదరాబాద్ : ప్రభుత్వం సినిమా అవార్డుల కోసం కమిటీ ఏర్పాటు చేసింది. విధి విధానాలు, పేర్ల ఖరారు కమిటీ ఏర్పాటు చేసింది. కేవీ రమణాచారి అధ్యక్షతన 9 మంది సభ్యులతో కమిటీ వేసింది. కమిటీ సభ్యులుగా తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రామ్మోహన్ రావు, కార్యదర్శి మురళీమోహన్, తమ్మారెడ్డి భరద్వాజ, దిల్ రాజు, శ్యాంప్రసాద్ రెడ్డి, దర్శకుడు శంకర్, సురేష్ కొండేటి ఉన్నారు. కమిటీ కన్వీనర్ గా సమాచార శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ వ్యవహరించనున్నారు.  

సీఎం కేసీఆర్ తో కొనసాగుతున్న మంత్రి కడియం భేటీ

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ తో మంత్రి కడియం శ్రీహరి భేటీ కొనసాగుతోంది. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాల డిమాండ్లపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

సంక్షేమం విషయంలో రాజీపడేది లేదు : సీఎం చంద్రబాబు

విజయవాడ : సంక్షేమం విషయంలో రాజీపడేది లేదని సీఎం చంద్రబాబు అన్నారు. మేలో రెండో విడత రుణమాఫీ అమలు చేస్తున్నామని తెలిపారు. ఉద్యానవన రైతులకు ఒకేసారి రుణమాఫీ చేస్తామని చెప్పారు. నాగావళి, వంశధార నదులను అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు. విభజన చట్టంలోని అంశాలను కేంద్రం అమలు చేయాల్సివుందన్నారు. అన్ని రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందే వరకు సాయం చేయాలని చాలా సార్లు కేంద్రాన్ని కోరామని తెలిపారు. జూన్, జులై నుంచి అమరావతి నుంచే పరిపాలన జరుగుతుందని చెప్పారు. 

16:37 - April 20, 2016

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ ను సినీ హీరో, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణను కలిశారు. తన వందో సినిమా ప్రారంభానికి రావాలని సీఎం కేసీఆర్ ను బాలకృష్ణ స్వయంగా ఆహ్వానించారు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు కేసీఆర్ క్లాప్ కొట్టనున్నారు. సినిమా డైరెక్టర్ క్రిష్ తో కలిసి బాలయ్య కేసీఆర్ ను కలిశారు. ఎపి అభివృద్ధితోపాటు, తాజా రాజకీయ పరిస్థితులు, హిందూపురంలో జరిగిన తెలుగు ఉత్సవాలు, అమరావతి నిర్మాణం పనులు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. 

 

రేపటి 'పాలీసెట్'కు సహకరిస్తాం : జాక్

హైదరాబాద్ : రేపటి పాలీసెట్ కు సహకరిస్తామని ప్రైవేట్ విద్యా సంస్థల జాక్ తెలిపింది. ఈమేరకు హైదరాబాద్ జాక్ నేతలు మీడియాతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజా సంఘాల విజ్ఞప్తుల మేరకు రేపటి పాలీసెట్ కు సహకరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పాలీసెట్ నిర్వహణకు తమ పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. 

16:21 - April 20, 2016

ముంబయి : మహారాష్ట్రలో మండుటెండలు ఓ పాప ప్రాణం తీశాయి. నీళ్ల కోసం ఇంటి నుంచి నీటి పంపు వరకు ఎండలో నడచి వెళ్లడమే ఇందుకు కారణం. తన స్వగ్రామంలో ఇంటి నుంచి అర కిలోమీటరు దూరంలో ఉన్న నీటి పంపు వద్దకు నీళ్ల కోసం యోగితా దేశాయ్ ఐదుసార్లు అటూ ఇటూ తిరిగింది. అప్పటికే అనారోగ్యంతో ఉన్న ఆ బాలికను ఇంట్లో వాళ్లు నీళ్లు పట్టుకుని రమ్మని పంపారు. చివరకు ఐదోసారి వెళ్లినప్పుడు.. పంపు దగ్గరే ఆమె కుప్పకూలిపోయింది. వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్తే.. ఆమె గుండెపోటు, డీహైడ్రేషన్ కారణంగా మరణించినట్లు చెప్పారు. మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బీడ్‌తో పాటు మరాఠ్వాడాలోని ఏడు జిల్లాల్లో గత మూడేళ్లుగా కరువు కరాళ నృత్యం చేస్తోంది. ఆదివారం అక్కడ 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

16:12 - April 20, 2016

మహారాష్ట్ర : మరాఠ్వాడా కరువు ప్రాంతంలో లాతూర్‌కు ట్రెయిన్‌ ద్వారా నీటి సరఫరా కొనసాగుతోంది. సాంగ్లీలోని మిరాజ్‌ నుంచి మంగళవారం బయలుదేరిన జల్‌దూత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇవాళ ఉదయం లాతూర్‌కు చేరుకుంది. 50 వ్యాగన్ల ద్వారా 25 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తోంది. ఈ రైలు ఇప్పటివరకు లాతూర్‌కు 9 ట్రిప్పులు నడిపింది. ట్రిప్పుకు 5 లక్షల లీటర్ల నీటిని ట్రెయిన్‌ మోసుకెళ్తోంది. మునుపెన్నడు లేనంతగా లాతూర్‌ కరువుతో అల్లాడిపోతోంది. లాతూర్‌ ప్రజల దాహార్తిని తీర్చేందుకు మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రైలు ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించేందుకు చర్యలు చేపట్టింది.

 

16:10 - April 20, 2016

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించడాన్ని రాష్ట్ర హైకోర్టు తప్పుబట్టింది. రాష్ట్రపతి నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం కోర్టుకు లేదన్న కేంద్ర ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. రాష్ట్రపతి కూడా ఒక్కోసారి పొరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశముందని, న్యాయసమీక్షకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలని సూచించింది. రాష్ట్రపతి పాలనను కోర్టులు సమీక్షించజాలవని కేంద్రం వాదించింది. రాచరికపాలనలో మాదిరిగా నిర్ణయాలు తీసుకోవడం కుదరదని, రాజ్యాంగ పరిధికి లోబడి వ్యవహరించాలని హైకోర్టు పేర్కొంది.  కేంద్రం నిర్ణయంపై సమీక్షించే హక్కు కోర్టుకు ఉంటుందని పేర్కొంది. మెజారిటీ లేదన్న కారణంతో హరీశ్ రావత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గతనెలలో కేంద్రం రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు   ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించారు. కాంగ్రెస్‌కు చెందిన 9 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి బిజెపి పంచన చేరారు. 

16:05 - April 20, 2016

కర్నూలు : జిల్లాకేంద్రంలోని స్థానిక బంగారుపేట సారా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు దాడి చేశారు. ఈ క్రమంలో సారా తయారీదారులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం నేపథ్యంలో స్థానిక వ్యక్తికి తలకు గాయమైంది. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు ఎక్సైజ్ అధికారుల వాహనాలపైకి రాళ్ళు రువ్వారు. అధికారుల వాహనాల అద్దాలు ద్వంసం అయ్యాయి. టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఎక్సైజ్ పోలీసులు దాడికి పాల్పడ్డ వారిపై పిర్యాదు చేశారు. గాయపడ్డ వ్యక్తి ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర రక్తస్రావంతో తలకు గాయమై చికిత్స పొందుతున్నాడు.

16:01 - April 20, 2016

హైదరాబాద్ : రేపటి పాలీసెట్ కు సహకరిస్తామని ప్రైవేట్ విద్యా సంస్థల జాక్ తెలిపింది. ఈమేరకు హైదరాబాద్ జాక్ నేతలు మీడియాతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజా సంఘాల విజ్ఞప్తుల మేరకు రేపటి పాలీసెట్ కు సహకరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పాలీసెట్ నిర్వహణకు తమ పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. స్కూల్ స్థాయి నుంచి ఉన్నతవిద్యా సంస్థల వరకు నిరవధిక బంద్ పాటిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎంట్రన్స్ పరీక్షలు, పోటీ పరీక్షలకు నిర్వహణ, సెంటర్ల ఏర్పాటును ఉపసంహరించుకుంటున్నట్లు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పోలీసుల తనిఖీలను ఉపసంహంరించుకునేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం, మంత్రులకు విజ్ఞప్తులు చేసాము..కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. ఈనేపథ్యంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సివచ్చిందన్నారు. అయితే ప్రభుత్వం, మంత్రులు, ప్రజా సంఘాలు, తల్లిదండ్రులు కోరిక మేరకు రేపటి పాలీసెట్ ఎగ్జామ్ కు సహకరిస్తామని చెప్పారు. ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని.. ఎగ్జామ్స్ నిర్వహణకు సహకరిస్తామని పేర్కొన్నారు. పాలీసెట్ మెటీరియల్ ను తీసుకుని.. పరీక్షలను నిర్వహణకు సహకరించాలని రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలకు సూచించారు. సంపూర్ణంగా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 22న విద్యా సంస్థల జాక్ జనరల్ బాడీ సమావేశం హైదరాబాద్ లో జరుగుతుందని... 
ఆ సమావేశంలో ఈనెల 24 న జరుగబోయే కానిస్టేబుల్ ఎగ్జామ్, మే1న జరిగే టెట్, మే2న జరిగే ఎంసెట్ ఎగ్జామ్స్ పై తగిన కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. అప్పటివరకు  యధావిధిగా విద్యాలయాల బంద్ చేపట్టాలని సూంచించారు. కానీ రేపటి పాలీసెట్ ఎగ్జామ్ సందర్భంగా మాత్రం కళాశాలలను తెరవాలని సూచించారు. పోలీసుల తనిఖీలు పూర్తిగా ఉపసంహరించుకునే వరకు బంద్ కొనసాగుతోందని హెచ్చరించారు.  

 

టీడీపీ గూటికి రంగారావు సోదరులు

విజయవాడ : బొబ్బిలి వైసీపీ ఎమ్మెల్యే సుజయ్‌ కృష్ణ రంగారావు సోదరులు టీడీపీలో చేరారు. విజయవాడలో సీఎం చంద్రబాబు సమక్షంలో వీరు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

15:45 - April 20, 2016

విజయవాడ : బొబ్బిలి వైసీపీ ఎమ్మెల్యే సుజయ్‌ కృష్ణ రంగారావు సోదరులు టీడీపీలో చేరారు. విజయవాడలో సీఎం చంద్రబాబు సమక్షంలో వీరు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గత కొన్ని రోజులుగా రంగారావు సోదరులు టీడీపీలో చేరనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీడీపీలో చేరినట్లు తెలిపారు. వైసీపీలో అందరూ తమను గౌరవించారని... ఎవరితో విభేదాలు లేవని తెలిపారు. జగన్ అంటే తమకు గౌరవం ఉందని చెప్పారు. 

 

వంద రోజుల ప్రణాళికపై మంత్రి కేటీఆర్ సమీక్ష

హైదరాబాద్ : వంద రోజుల ప్రణాళికపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. కృష్ణా, గోదావరి నీటిని నగరానికి వాడుతామని తెలిపారు. నీటి సరఫరా వృథాను 15 శాతానికి తగ్గించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇంకుడుగుంతలు లేని భవన నిర్మాణాలకు అనుమతి ఇవ్వరాదని జీహెచ్ ఎంసీ అధికారులను ఆదేశించారు. 

 

రాజీవ్ హంతకుల విడుదలకు కేంద్రం విముఖత

ఢిల్లీ : రాజీవ్ హంతకుల విడుదలకు కేంద్రప్రభుత్వం విముఖత వ్యక్తం చేసింది. తమిళనాడు ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించింది. రాజీవ్ హంతకులు 20 ఏళ్లుగా జైల్లో ఉన్నారు.  

15:16 - April 20, 2016

విశాఖ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొమ్మిదో సీజన్ సరికొత్త ఫ్రాంచైజీ.. రెయిజింగ్ పూణే సూపర్ జెయింట్స్ రెండో హోంగ్రౌండ్ గా...స్టీల్ సిటీ విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం ఖాయమయ్యింది. మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలోని పూణేజట్టు ఆడే మూడుమ్యాచ్ లకు విశాఖ స్టేడియం ఆతిథ్యమిస్తుంది....
విశాఖపట్నంలో మూడు మ్యాచులు
మహారాష్ట్రలోని తీవ్రకరువు, దుర్భిక్ష పరిస్థితులు...ఆంధ్రా క్రికెట్ సంఘం పాలిట వరంగా మారాయి. మహారాష్ట్రలోని పూణే, ముంబై, నాగపూర్ నగరాలలో ఏప్రిల్ 30 తర్వాత జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ లపై బాంబే హైకోర్టు నిషేధం విధించడంతో...పూణే ఫ్రాంచైజీ మ్యాచ్ ల్లో మూడింటిని...విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా నిర్వహించడానికి రంగం సిద్ధమయ్యింది.
పూణే ఫ్రాంచైజీ.. రెండో హోంగ్రౌండ్ గా విశాఖ 
ఐపీఎల్ తొమ్మిదోసీజన్లో తొలిసారిగా పాల్గొంటున్న పూణే ఫ్రాంచైజీ రెండో హోంగ్రౌండ్ గా...విశాఖను ఎంపిక చేసుకొంది. మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలోని .. రెయిజింగ్ పూణే సూపర్ జెయింట్స్ జట్టు.. మే నెలలో ఆడాల్సిన మూడు మ్యాచ్ లకు విశాఖపట్నంలోని  ఏసీఏ-వీడీసీఏ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.
తొలిసారిగా స్పైడర్ కెమెరా ఉపయోగం
ఈమ్యాచ్ ల కోసం తొలిసారిగా స్పైడర్ కెమెరాను సైతం విశాఖ స్టేడియంలో ఉపయోగించబోతున్నారు. మే 10న పూణే సూపర్ జెయింట్స్ తో జరిగే పోటీలో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు ఢీ కొంటుంది. మే 17న పూణేజట్టుతో జరిగే పోటీలో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఢీ కొంటుంది. ఈ రెండుమ్యాచ్ లూ ..రాత్రి 8 గంటలకు ఫ్లడ్ లైట్ల వెలుగులో నిర్వహిస్తారు. విశాఖ వేదికగా పూణే జెయింట్స్ ఆఖరిమ్యాచ్ మే 21న కింగ్స్ పంజాబ్ జట్టుతో జరుగుతుంది. ఈమ్యాచ్  సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది.
ఆంధ్ర క్రికెట్ సంఘానికి రూ. కోటీ 80 లక్షల ఆదాయం
ఈ మూడుమ్యాచ్ లకూ ఆతిథ్యమివ్వడం ద్వారా..ఆంధ్ర క్రికెట్ సంఘానికి కోటీ 80 లక్షల రూపాయల ఆదాయం సమకూరనుంది. ఒక్కో మ్యాచ్ కూ...ఫ్రాంచైజీ 30 లక్షల రూపాయలు, బీసీసీఐ 30 లక్షల రూపాయల చొప్పున ఆంధ్ర క్రికెట్ సంఘానికి చెల్లించనున్నాయి. మహారాష్ట్ర క్రికెట్ సంఘానికి జరిగిన నష్టం..ఆంధ్రా క్రికెట్ సంఘానికి జరిగిన లాభంగా మారడం నిజంగా..చిత్రమే మరి.

 

15:08 - April 20, 2016

ఖమ్మం : భానుడు భగ భగ కు ఖమ్మం జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. ఉదయం 7 గంటలనుండే బయటకు రావాలంటే జంకుతున్నారు. చిన్నారుల నుండి వృద్దుల వరకు భయపడుతున్నారు. జిల్లాలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నా.. అధికారికంగా మాత్రం 42  డిగ్రీలుగా నమోదైందని చెబుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జిల్లాలో వడగాలులు పెరిగాయి. సుమారు 100 మంది వరకు అనధికారికంగా మృతి చెందారు. ఈ రెండు రోజులలో 32 మంది మృతి చెందారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

15:06 - April 20, 2016

హైదరాబాద్ : టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎపి సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఎన్టీఆర్ భవన్ లో ఘనంగా జరిగాయి. టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. చంద్రబాబునాయుడు మొక్కవోని ధైర్యంతో అన్ని విధాల ఇరు రాష్ట్రాలను నడిపిస్తున్నారని అన్నారు. చంద్రబాబు మరిన్ని పుట్టిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.   

 

15:02 - April 20, 2016

విజయవాడ : ప్రైవేటు ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలు అందించాలని ఏపీ సీఎం చంద్రబాబు  పిలుపునిచ్చారు. విజయవాడలో సంచార చికిత్స సేవలను ఆయన ప్రారంభించారు. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. సంపూర్ణ ఆరోగ్య సమాజాన్ని నిర్మించాలన్నదే తన లక్ష్యమన్నారు. సంచార వైద్య వాహనాలు గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తాయని తెలిపారు.   తొలిదశలో గుంటూరు, చీరాల, ప్రొద్దుటూరు, టెక్కలిలో సి.టి.స్కాన్‌లు ప్రారంభించామని... దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 

 

14:58 - April 20, 2016

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీలో వంద రోజుల ప్రణాళికపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. నగరానికి అవసరమైన నీటి నిల్వలపై అధికారులతో సమీక్షించారు. నీటి ఎద్దడి దృష్ట్యా పొదుపు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇంకుడు గుంతలు లేకుండా కొత్త భవనాలకు అనుమతి ఇవ్వొద్దని కేటీఆర్‌ సూచించారు. అక్రమ నల్లా కనెక్షన్లపై కఠినంగా వ్యవహరించాలని కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. 

 

కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు

ఢిల్లీ : కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విభజన చట్టంలోని ఆంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తిరుపతి శ్రీనివాసపురంలోని శ్రీరామ్ ఇంజనీరింగ్ కాలేజీలో తాత్కాలిక ఆలిండియా సైన్స్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు, రాజమండ్రిలో వ్యవసాయ విద్యాలయం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. తిరుపతి ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కు రూ.137 కోట్లు కేటాయించింది. 

 

పీసీసీ పదవుల పంపకంపై పొంగులేటి అసంతృప్తి

హైదరాబాద్ : పీసీసీ పదవుల పంపకంపై పొంగులేటి సుధాకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కో ఆర్డినేషన్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ పదవులకు ఆయన రాజీనామా చేశారు.  ఈ మేరకు పొంగులేటి సోనియా, రాహుల్ కు లేఖ రాసారు. పీసీసీ కార్యవర్గంలో నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోవడంపై పొంగులేటి ఆగ్రహంగా ఉన్నారు. పని చేసిన వారికి కాకుండా పైరవీలు చేసుకున్న వారికి పదవులు ఇచ్చారని పొంగులేటి ఆరోపించారు.

 

13:35 - April 20, 2016

ఢిల్లీ : విభజన చట్టంలోని అంశాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం పొందినట్లు కేంద్ర మంత్రి జవదేక్ తెలిపారు. ఈ రోజు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు జవదేకర్ మీడియాకు తెలిపారు. తిరుపతి లోని శ్రీనివాసపురంలోని శ్రీరామ్ ఇంజనీరింగ్ కాలేజీలో తాత్కాలికి ఆలిండియా సైన్స్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు, దీనికి సంబంధించి రూ.137 కోట్లువిడుదల, రాజమండ్రిలో వ్యవసాయ విశ్వ విద్యాలయం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదించిందని జవదేకర్ స్పష్టం చేశారు.

రాజమండ్రిలో వ్యవసాయ విశ్వ విద్యాలయం

తిరుపతి : శ్రీనివాసపురంలోని శ్రీరామ్ ఇంజనీరింగ్ కాలేజీలో తాత్కాలిక ఆలిండియా సైన్స్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు, రాజమండ్రిలో వ్యవసాయ విశ్వ విద్యాలయం ఏర్పాటుకు ఆమోదం పొందాయి.

13:19 - April 20, 2016

ఆదిలాబాద్ : ఇంద్రవెల్లి ఆదివాసుల నేలను రక్తంతో తడిపిన మరో జలియన్ వాలా బాగ్... అడవిబిడ్డలను ఆదుకోవాల్సిన నాగరిక ప్రభుత్వం పాశవికంగా దాడి చేసిన సంఘటన... ప్రజా సభకు తరలిన అన్నెం పున్నెం ఎరగని అమాయకులను పిట్టల్లా వేటాడిన కర్కశత్వానికి సజీవ సాక్ష్యం ... పిడికిళ్లు బిగించి జల్‌ జంగల్‌ జమీన్‌ పోరాటాలకు నాంది పలికిన చారిత్రక మలుపు. మూడున్నర దశాబ్దాల అడవిబిడ్డల త్యాగానికి ఇంద్రవెల్లి ఒక నిత్య చైతన్య

అడవిబిడ్డలను చిదిమేసిన తూటాలు.....

దండుగా కదిలిన ఆదివాసీలపై పోలీసు లాఠీలు నాట్యమాడాయి. అయినా ఎదురొడ్డి నిలిచిన అడవిబిడ్డల దేహాలను తూటాలు చిధ్రం చేశాయి. ఫలితంగా లెక్కకు అందనంత మంది గిరిజనుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. జీవాలు వెళ్తూ వెళ్తూ ఎన్ని యుగాలు గడిచినా తడి ఆరని నెత్తుటి చరిత్రను లిఖించి వెళ్లాయి.

సర్కార్‌,పీపుల్స్‌వార్‌కు మధ్య హోరాహోరీ...

అవి పీపుల్స్‌వార్‌ మావోయిస్టు పార్టీగా అవతరించక ముందు ఉన్న రోజులు. ప్రభుత్వానికి, పీపుల్స్‌వార్‌ నక్సలైట్లకు హోరాహోరీగా పోరు నడుస్తున్న దినదినగండాలు. సరిగ్గా ఇలాంటి తరుణంలోనే అప్పటి నక్సలైట్లు గిరిజన తండాల్లో ఆశ్రయం పొందారు. వారి అండతోనే గిరిజనులు, ఆదివాసీలు సంఘటితమయ్యారు. తమ హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వంపై తిరుగుబాటుకు ఊపిరులూదారు.

ఫారెస్టు భూములు అప్పగించాలని పోరాటం........

ఈ కోవలోనే ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న రిజర్వ్‌ ఫారెస్ట్ భూములను తమకు అప్పగించాలని ఆదివాసీలు పోరాటం తలపెట్టారు. ఇంద్రవెల్లిలో బహిరంగ సభ ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ప్రణాళిక రచించారు. ఇది తెలుసుకున్న ప్రభుత్వం ఆదివాసీల్లో రగిలిన చైతన్యాన్ని రూపుమాపాలని నిశ్చయించుకుంది. వందల సంఖ్యలో బలగాలను ఇంద్రవెల్లికి తరలించింది.

యమికుంట, తోషం, ఖానాపూర్‌, సైద్పూర్‌.....

జరగబోయే నెత్తుటిక్రీడకు తాను సాక్ష్యంగా చరిత్రలో నిలుస్తాననే నిజం ఇంద్రవెల్లికి తెలియదు. అందుకే ఇంద్రవెల్లితోపాటు చుట్టుపక్కల ప్రాంతాలైన యమికుంట, తోషం, ఖానాపూర్‌, సైద్పూర్‌, ఖండాల, హత్తిగుట్ట, తిప్ప, ఉట్నూర్‌, తిర్యాని నుంచి వచ్చిన అడవి బిడ్డలను ఇంద్రవెల్లి అక్కున చేర్చుకుంది. తండోపతండాలుగా వచ్చిన అమాయక ఆదివాసీలకు ఇంద్రవెల్లి ఆశ్రయం కల్పించింది. ఆదివాసీలు తలపెట్టిన సభకు కర్త,కర్మ,క్రియ అన్ని నక్సలైట్లే అని భావించిన పోలీసులు వెల్లువలా తరలి వస్తున్న గిరిజనాన్ని అడ్డుకున్నారు. ఈ తరుణంలో ఓ ఆదివాసీ మహిళతో జవాను అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో మహోగ్రరూపం ధరించిన ఆమె జవాను ప్రాణం తీసింది.

గిరిజనులపై విచ్చలవిడిగా కాల్పులు..........

ఈ హఠాత్పరిణామంతో పోలీసులు విలయతాండవమాడారు. అమాయక గిరిజనులపై విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. ఫైరింగ్‌ జరిపేందుకు ఆర్డీఓ అంబరీష్‌ అనుమతినివ్వకున్నా అప్పటి ఆదిలాబాద్‌ జిల్లా ఎస్పీ కృష్ణారావు పాయింట్ బ్లాంక్‌లో గురిపెట్టి బలవంతంగా అనుమతి తీసుకుని మరణ మృదంగాన్ని మోగించాడు. మరో జలియన్‌వాలాబాగ్‌గా చరిత్ర పుటలకెక్కిన ఇంద్రవెల్లి ఘటనలో వందలమంది అడవిబిడ్డలు అశువులు బాశారు. తూటాల దెబ్బకు వికలాంగులయ్యారు. అమరుల త్యాగానికి గుర్తుగా ఇంద్రవెల్లిలో రైతుకూలీ సంఘం స్ధూపాన్ని నిర్మించింది. 1996లో పోలీసులు ఇంద్రవెల్లి స్ధూపాన్ని కూల్చేశారు. ఆదివాసీలు తిరిగి పోరుబాట పట్టడంతో ITDA తిరిగి ఇంద్రవెల్లి స్ధూపాన్ని పుననిర్మించింది. స్ధూపం నిర్మించిన నాటి నుంచి ప్రతి ఏటా ఆదివాసీలు నివాళులు అర్పించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం అడ్డకుంటూనే ఉంది.

నిర్భంధాన్ని కొంతమేరకు సడలించిన కేసీఆర్....

చివరికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ నిర్భంధాన్ని కొంతమేరకు సడలించారు. ఇంద్రవెల్లి స్ధూపం వద్దకు వెళ్లి నివాళులు అర్పించే విధంగా వెసులుబాటు కల్పించారు.దీంతో దశాబ్దాలు గడుస్తున్నా అమరుల త్యాగాలను మర్చిపోని అభిమానజనమంతా ఇంద్రవెల్లి స్ధూపానికి నివాళులు అర్పించారు. వెలకట్టలేని త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఇన్నాళ్ల నిర్భంధ ప్రతిబంధకం ఒక్కసారిగా తొలగిపోయేసరికి ఆదివాసీల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఆనాటి ఘటనలో గాయపడిన వారికి, నష్టపోయిన వారికి ప్రభుత్వ సాయం చేయాలనే డిమాండ్ అన్నివర్గాల నుంచి వ్యక్తమవుతోంది.

13:12 - April 20, 2016

ఢిల్లీ : జంతర్ మంతర్ వద్ద శ్రీనగర్ నిట్ విద్యార్థులు ధర్నా చేపట్టారు. శ్రీనగర్ నిట్ ను మరో చోటికి తరలించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీనగర్ లో తమకు భద్రతలేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హెచ్ ఆర్డీ మంత్రి తమ సమస్యలను పట్టించుకోవడం లేదని వారు మండిపడుతున్నారు.


 

ఎర్రవల్లిని సందర్శించిన సీఎం కేసీఆర్

మెదక్ : దత్తత గ్రామం ఎర్రవల్లిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకస్మికంగా సందర్శించారు. ఎర్రవల్లిలో ఉన్న గ్రామీణ వికాస్ బ్యాంకును పరిశీలించారు. ప్రభుత్వం తరపున బ్యాంకులో రూ. 5 కోట్లు డిపాజిట్ చేయాలని కలెక్టర్‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఎర్రవల్లి, నర్సన్నపేటలో 2 పడక గదుల ఇళ్ల నిర్మాణాలను సీఎం పరిశీలించారు.

బంగారు రథంపై తిరుమల శ్రీవారు...

తిరుమల : సాలకట్ల వసంతోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీనివాసుడు ఉభయదేవేరులతో కలిసి బంగారు రథంపై ఊరేగారు. అమ్మవార్లతో కలిసి స్వర్ణరథంపై విహరిస్తున్న వైకుంఠవాసున్ని చూసి భక్తులు పులకించిపోయారు. కర్పూర నీరాజనాలు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు.

ఐఎన్‌ఎస్‌ నిరీక్షక్‌ యుద్ధనౌకపై ప్రమాదం

విశాఖ: ఇండియన్‌ నేవీకి చెందిన ఐఎన్‌ఎస్‌ నిరీక్షక్‌ యుద్ధనౌకపై ప్రమాదం జరిగింది. నౌకలో ఆక్సిజన్‌ సిలిండర్‌ పేలి ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు. వీరిలో ఒకరికి కాలు విరిగిపోయింది. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

ఐపీఎల్ మ్యాచ్ ల తరలింపు పై బీసీసీఐకి ఊరట

హైదరాబాద్ : ఐపీఎల్ మ్యాచ్ ల తరలింపు పై బీసీసీఐకి ఊరట లభించింది. మే1 న పుణెలో మ్యాచ్ నిర్వహణకు బాంబే హైకోర్టు అనుమతి ఇచ్చింది.

'మెట్రో' పనుల పరుగోతి పై మంత్రి కేటీఆర్ సమీక్ష

హైదరాబాద్ : మెట్రో రైలు భవన్ లో మెట్రో రైలు పనుల పరుగోతి పై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. వంద రోజుల ప్రణాళికపై, జలమండలి,పురపాలక శాఖ, జీహెచ్ ఎంసీ విభాగాల పైనా అధికారులతో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు.

12:32 - April 20, 2016

ఖమ్మం: గత సంవత్సరకాలంగా ఫింఛన్లు రాకపోవడంతో వృద్దులు, వికలాంగులు ఎంపీడీవో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. లైఫ్ సర్టిఫికెట్ తప్పనిసరంటూ అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ... తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు మండుతున్న ఎండలు..మరోవైపు భారీ క్యూలైన్లలో వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధుల సమస్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. 

12:30 - April 20, 2016

నల్గొం డ: బిల్డింగ్‌ నిర్మాణం కోసం బండరాయిని తొలగిస్తూ జిలెటిన్‌ స్టిక్స్‌ పేల్చిన ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. నల్గొండ జిల్లా ఆత్మకూరు మండలం కోటపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా జిలెటిన్‌ స్టిక్స్‌ పేల్చడం వల్లే ఈ ఘటన చోసుకుందని స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిని వారిని ఆసుపత్రికి తరలించగా, బాలుడి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

12:29 - April 20, 2016

రంగారెడ్డి : కీసర మండలం బోగారంలో హోలీ మేరి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బయటకు వెళుతున్నానని తోటి విద్యార్థులకు మెసేజ్ పంపి.. కాలేజీలోని చెట్టుకు టవల్ తో ఉరి వేసుకుని చనిపోయాడు. తమ కుటుంబసభ్యులకు సమాచారం తెలపాలని మెసేజ్ పెట్టాడు. మృతుడి వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని కేసు నమోదు చేసుకుని దర్యాప్తుప్రారంభించామని కీసర సీఐ తెలిపారు. 

12:27 - April 20, 2016

హైదరాబాద్ : మంత్రి కడియంతో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. కడియంను అతని నివాసంలో కలిసిన యాజమాన్యాలు విజిలెన్స్‌ దాడులను తప్ప తాము ఏ తనిఖీలకైనా సిద్ధమేనని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దాడులను ఆపితే రేపు జరగబోయే పాలిసెట్ పరీక్షతో పాటు త్వరలో జరగబోయే పోలీస్‌ కానిస్టేబుల్ పరీక్షలకు కూడా సహకరిస్తామని చెప్పారు. అయితే మంత్రి కడియం దీనిపై ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. మధ్యాహ్నం ఒంటిగంటకు మరోసారి భేటీ అయి చర్చిద్దామన్నారు. మరో వైపు విద్యా సంస్థల్లోకి పోలీసులు రావడం దుష్పరిణామమని యాజమాన్యాలు అంటున్నాయి. రేపు జరగబోయే పాలిసెట్ పరీక్షను బహిష్కరించాలా వద్దా అన్న విషయాన్ని మరోసారి చర్చల అనంతరం నిర్ణయిస్తామని చెప్పాయి.

జంతర్ మంతర్ వద్ద శ్రీనగర్ నిట్ విద్యార్థులు ధర్నా

ఢిల్లీ : జంతర్ మంతర్ వద్ద శ్రీనగర్ నిట్ విద్యార్థులు ధర్నా చేపట్టారు. శ్రీనగర్ నిట్ ను మరో చోటికి తరలించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీనగర్ లో తమకు భద్రతలేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హెచ్ ఆర్డీ మంత్రి తమ సమస్యలను పట్టించుకోవడం లేదని వారు మండిపడుతున్నారు.

మహబూబ్ నగర్ జడ్పీ సమావేశం రసాభాస

మహబూబ్ నగర్ : జిల్లా పరిషత్ సమావేశం రసాభాస అయ్యింది. నిధులు పెంచి మరిన్ని అధికారాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అన్ని పార్టీల ఎంపీటీసీలు, జడ్పీటీసీలు సమావేశాన్ని బహిష్కరించాయి.

మంత్రి కడియంతో కళాశాలల యాజమాన్యాల చర్చలు

హైదరాబాద్ : ప్రైవేటు కళాశాలల్లో తనిఖీలను వ్యతిరేకిస్తూ యాజమాన్యాలు నిరసన చేపట్టాయి. ఈ నేపథ్యంలో కళాశాలల యాజమాన్యంతో మంత్రి కడియం చర్చలు జరిగాయి. ఈ చర్చలో రేపు జరగాల్సిన పాలిసెట్ పరీక్షకు సహకరించమని మంత్రి కడియం ప్రైవేటు కళాశాలల యాజమాన్యాన్ని కోరారు. ఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు మరోసారి చర్చ జరగనున్నాయి. ఈ చర్చలో ఎలాంటి ఫలితం వస్తుందో వేచి చూడాల్సిందే.

11:34 - April 20, 2016

తిరుపతి : కరవు నివారణ చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయకపోవడం సిగ్గుచేటన్నారు. కేంద్రం కూడా రాష్ట్రంపై వివక్ష చూపుతోందన్నారు. కరవు సాయం అడిగిన దాని కంటే తక్కువ ఇచ్చారని అన్నారు. 

11:29 - April 20, 2016

హైదరాబాద్ : అక్రమ వడ్డీ వ్యాపారానికి పాల్పడి.. తమ ఆస్తులను హస్తగతం చేసుకున్న ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి ఆగడాలను అడ్డుకుని తగిన న్యాయం చేయాంటూ బాధితులు రోడ్డెక్కారు. ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో బాధితుల మూడు రోజుల దీక్ష ప్రారంభమైంది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని... బాధితుల సంఘం సభ్యులు దీక్షా శిబిరంలో తమ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్, బెంగుళూరు, అమరావతి తదితర ప్రాంతాల్లో సుమారు 432 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మోహన్‌రెడ్డి బినామీల పేరుతో ఆస్తులు రిజిస్ట్రర్ అయ్యాయని తెలిపారు. ఇలా సుమారు 1000 కోట్ల రూపాయల బినామీ ఆస్తులను ఆయన సంపాదించాడని ఆరోపించారు. ఈ కేసును సీఐడీ, ఏసీబీకి కాకుండా... సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. 

11:26 - April 20, 2016

కరీంనగర్ : అన్నం పెట్టాల్సిన చేతులు వాతలు పెట్టాయి. అమ్మలా అక్కున చేర్చుకోవాల్సిన ఆయాలు మానవత్వాన్ని మరిచి రాక్షసత్వాని ప్రదర్శించారు. దిక్కులేక అనాథ శరణాలయంలో ఆశ్రమం పొందుతున్న చిన్నారులపై అమానుషంగా ప్రవర్తించారు ఆయాలు. అల్లరి చేస్తున్నారని గరిటెను కాల్చి చేతులపై వాతలు పెట్టారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన కరీంనగర్‌లోని బాలసదన్‌లో జరిగింది. ఇక్కడి అనాథాశ్రమంలో 8 మంది చిన్నారులు ఆశ్రయం పొందుతున్నారు. 8 మంది రెండు నుంచి ఐదు సంవత్సరాల లోపు చిన్నారులే. వీరిని చూసుకునేందుకు 6 మంది ఆయాలతో పాటు తొమ్మిది మంది సిబ్బందిని శిశు సంరక్షణా శాఖ నియమించింది. పిల్లల చేతులపై వాతలు గమనించిన ఓ సామాజిక కార్యకర్త వాకబు చేయగా అసలు విషయం బయటపడింది. సీసీ ఫుటేజ్‌ను గమనించగా ఆయాల రాక్షసత్వం తెలిసింది. అల్లరి చేయకుండా బుద్దిగా కూర్చొని అన్నం తింటున్న ముగ్గురు చిన్నారులు రాజన్‌, గీత, స్వరూపల చేతులపై గరిటెతో వాతలు పెట్టారు ఆయాలు. మరో వైపు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న జిల్లా కలెక్టర్‌ బాధ్యులైన బుచ్చబ్వ, పద్మ అటెండర్లను సస్పెండ్‌ చేశారు. పోలీసులు పిల్లలను విచారిస్తున్నారు.

నకిరేకల్ మార్కెట్ వీధిలో పిచ్చికుక్క స్వైర విహారం

నల్గొండ:నకిరేకల్ మార్కెట్ వీధిలో ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసి... కనిపించినవారినల్లా కరిచింది. బుధవారం ఉదయం పిచ్చికుక్క దాడిలో 10 మంది గాయపడ్డారు. వారిలో ఓ మహిళ కూడా ఉంది. దీంతో స్థానికులు వెంటనే స్పందించి ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

10:57 - April 20, 2016

నెల్లూరు : అనంతవరం వద్ద... ఎన్‌సీసీ పవర్ ప్రాజెక్టులో అగ్నిప్రమాదం జరిగింది. కూలింగ్ బాయిలర్‌లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగడంతో.. సుమారు రూ. 20 నుండి 30 కోట్లు ఆస్తి నష్టం సంభవిచినట్టు అంచనా. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవిచలేదు. సమాచారం అందుకున్న ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి.

10:54 - April 20, 2016

హైదరాబాద్ : మిషన్ భగీరథపై కేంద్రం మరోసారి ప్రశంసల వర్షం కురిపించింది. తాగునీటి సమస్యలు తీర్చే ఈ ప్రాజెక్టుకు అన్నివిధాలా అండగా ఉంటామన్నారు కేంద్రమంత్రులు బీరేంద్ర సింగ్ రామ్ క్రిపాల్ యాదవ్. కొత్తగా ఏర్పడిన తెలంగాణకు నీతి ఆయోగ్ ద్వారా అదనపు నిధులు కూడా కేటాయించే అవకాశం ఉందని భరోసా ఇచ్చారు.

పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను పరిశీలించిన కేంద్ర మంత్రులు....

పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరాశాఖలపై కేంద్రమంత్రులు బీరేంద్రసింగ్ ,రామ్ క్రిపాల్ యాదవ్, రాష్ట్రమంత్రి కేటీఆర్ తో సమీక్ష నిర్వహించారు. మిషన్ భగీరథ, కాకతీయ పనులను పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణాలు, నిధుల సేకరణ, కరువు నివారణ చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను కేంద్రమంత్రులు పరిశీలించారు.

కరువు పరిస్థితులను కేంద్ర మంత్రులకు వివరించిన కేటీఆర్....

తెలంగాణలోని కరువు పరిస్థితులను మంత్రి కేటీఆర్ మంత్రులకు వివరించారు. కరవుకోసం 3064 కోట్ల కేంద్ర సాయం అడిగితే 791 కోట్లు మాత్రమే మంజూరు చేశారని అన్నారు. కేంద్రం మరింత సహాయం అందిస్తే ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు ఉపయోగపడుతుందన్నారు. నదులపై హక్కులు, ప్రాజెక్టుల రీడిజైనింగ్ , అనుసంధానాలపై కేంద్ర మంత్రులకు వివరించారు కేటీఆర్. భారీ ఎత్తున చేపట్టిన ప్రజోపయోగప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కోరారు.

తాగు, నీటి సమస్యకు శాశ్వత పరిష్కారానికి మిషన్ కాకతీయ.....

రాష్ట్రంలో తాగు,నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెట్టేందుకు చేపట్టిన మిషన్ కాకతీయ , మిషన్ భగీరథ ప్రాజెక్టును మంత్రులు ప్రశంసించారు. దేశంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న పరిస్థితులలో తాగునీటి కష్టాలను దూరంచేసే ఈ ప్రాజెక్టు ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని అన్నారు. జైకా, నాబార్డ్ వంటి సంస్థలతో స్వయంగా మాట్లాడతానన్నారు కేంద్ర మంత్రి. ఇంట్రావిలేజ్ పైప్ లైన్ పనులను ఉపాధి హామీ పథకం గ్రామపంచాయతీ నిధులతో చేపట్టే అంశాన్ని పరిశీలిస్తాని హామీ కూడా ఇచ్చారు రామ్ క్రిపాల్ యాదవ్. కొత్తగా ఏర్పడిన తెలంగాణకు నీతిఆయోగ్ మరిన్నినిధులు ఇచ్చే అవకాశం ఉందని కేంద్రమంత్రులు కేటీఆర్ కు తెలిపారు. స్వచ్చభారత్ , స్వచ్చ హైదరాబాద్ కింద టాయిలెట్ల నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని కూడా హామీ ఇచ్చారు. 

10:51 - April 20, 2016

హైదరాబాద్ : బ్లేడే వారి ఆయుధం...బ్లేడు వారి చేతుల్లో ఉందంటే ఎవ్వరి మాట వినరు. ఆ బ్లేడుతోనే రక్తం చిందిస్తారు. క్రూరమైన ఆలోచనలతో రగిలిపోయే వీరు..తమ సరదాల కోసం ఎంతకైనా తెగిస్తారు. ఇతరుల జీవితాలను పణంగా పెడతారు. కాసుల కోసం కర్కశంగా దాడులు చేస్తారు. నిర్మానుష్య ప్రదేశంలో మాటు వేసి పంజా విసురుతారు. రాజమండ్రిలో బ్లేడ్‌ బ్యాచ్‌ దోపిడీ కేసును పోలీసులు చేధించడంతో...వారి దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.

తండ్రీకొడుకులు, ఆటో డ్రైవర్‌పై దాడి.....

రాజానగరం మండలం కొంతమూరు గ్రామంలోని గోదావరి నాలుగో వంతెనపై ఈనెల 13 తెల్లవారుజామున బ్లేడ్ బ్యాచ్‌ రెచ్చిపోయారు. విశాఖ జిల్లా నక్కపల్లి నుంచి పశ్చిమగోదావరి జిల్లాకు టాటా ఏస్ వాహనంలో తండ్రీ కొడుకులు దుర్గారావు, సత్యన్నారాయణ ఇంటి సామాన్లతో వెళ్తున్నారు. తెల్లవారు కావడంతో ఆటో డ్రైవర్ వాహనాన్ని నడపలేక బ్రిడ్జి పక్కగా పార్కింగ్ చేసి నిద్రపోయాడు...అప్పటికే దాడి చేసేందుకు మాటువేసిన ఉన్న బ్లేడ్‌ బ్యాచ్‌ సభ్యులు ప్రకాష్,సూర్యతేజ,దినేష్,వినోద్‌లకు వీరు కన్పించడంతో అటాక్‌ చేశారు. ఆటో డ్రైవర్‌తో సహా దుర్గారావు, సత్యన్నారాయణలను తీవ్రంగా గాయపరిచి సామాన్లను ఎత్తుకుపోయారు. కేసును సవాల్‌గా తీసుకున్న రాజమండ్రి పోలీసులు మూడు ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగారు. అనుమానం ఉన్న ప్రాంతాలను జల్లెడ పట్టారు. చోరీ సొత్తును విక్రయించేందుకు టాటాఎస్‌ వాహనంలో బ్లేడ్‌ బ్యాచ్‌ వెళ్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

పరారీలో ఉన్న బద్రి కోసం గాలింపు..

బ్లేడ్‌ బ్యాచ్‌ ముఠాలో పరారీలో ఉన్న బద్రి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. గతంలో వీరు పలు ప్రాంతాల్లో అరాచకాలు సృష్టించినట్లు విచారణలో బయటపడింది. ఆయా ఘటనల్లో గాయపడిన బాధితులు గానీ, సొమ్ము కోల్పోయిన వారు గాని పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో వీరి దారుణాలు ఇన్నాళ్లు వెలుగులోకి రాలేదు. 

10:49 - April 20, 2016

హైదరాబాద్ : తెలుగులో వ‌చ్చిన ప్రేమ క‌థా చిత్రంలో హీరోగా న‌టించిన సుధీర్ బాబు హిందీలో భాఘీ చిత్రంతో అడుగుపెడుతున్నాడు. ఈ చిత్రం తెలుగులో వ‌చ్చిన వ‌ర్షం చిత్రానికి రీమేక్.. టైగ‌ర్ ష్రాఫ్, శ్రద్ధా క‌పూర్ ఈ మూవీలో హీరో హీరోయిన్ లుగా న‌టిస్తుండ‌గా, సుధీర్ బాబు విల‌న్ పాత్ర పోషిస్తున్నాడు.. బాగీ మూవీలో విల‌న్ రాఘ‌వ గా సుధీర్ బాబుని ప‌రిచ‌యం చేస్తూ చిత్ర యూనిట్ టీజ‌ర్ ను విడుద‌ల చేసింది.. యాక్షన్ స‌న్నివేశాల్లో సుధీర్ బాబు న‌ట‌న హైలెట్ అని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 

గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి పెద్ద పీట వేశాం :వెంకయ్యనాయుడు

రంగారెడ్డి : గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి పెద్ద వేశాం అని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. భౌరవ్ పేటలో జరిగిన గ్రామీ కిసాన్ సభ కు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బడ్జెట్ వ్యవసాయానికి రూ.35వేల కోట్లు కేటాయించామన్నారు. ఇప్పటికే 65వేల గ్రామాలకు రోడ్లు లేవని, 2019 నాటికి అన్ని గ్రాఆమాలకు రోడ్లు నిర్మించాలన్నది లక్ష్యం అని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకానికి రూ.38 వేల కోట్లు కేటాయించామని వెంకయ్య తెలిపారు.

బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు

విజయవాడ : ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మను సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. జన్మదినం సందర్భంగా అమ్మవారికి సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రాయదుర్గ పీఎస్ పరిధిలో చైన్ స్నాచింగ్

హైదరాబాద్: నగరంలోని రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో చైన్‌స్నాచింగ్ జరిగింది. నడుచుకుంటూ వెళుతున్న మహిళ మెడలోంచి బైక్‌పై వచ్చిన దుండగులు నాలుగు తులాల గొలుసు దొంగతనం చేసుకుని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ టీవీ పుటేజీలు పరిశీలిస్తున్నారు.

ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి: ఒకరి మృతి

కర్నూలు: జిల్లాలోని గడివేముల మండలం పెసరవాయిలో ఉపాధికూలీలపై తేనెటీగలదాడి చేశారు. ఈ దాడిలో దొరస్వామి అనే వ్యక్తి మృతి చెందగా, 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

లాతూరుకు మరో నీటి రైలు..

మహారాష్ట్ర : లాతూరు పట్టణంలో తీవ్ర నీటి సంక్షోభం కొనసాగుతోంది. కనీస అవసరాలకు కూడా నీరు దొరక్క ప్రజలు అల్లాడుతున్నారు. కొద్దిరోజుల క్రితం రైలు ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చిన 5లక్షల లీటర్ల నీరు అయిపోవడంతో ప్రజలు నీటికోసం ఎదురుచూపులు చూస్తున్నారు. దీంతో 50 వ్యాగన్లలో 25 లక్షల లీటర్ల నీటితో మరోరైలు ఈరోజు ఉదయం లాతూర్‌ చేరుకుంది. దీంతో లాతూర్‌ ప్రజలకు తాత్కాలికంగా వూరట లభించింది.

శిశుసంరక్షణ కేంద్రంలో దారుణం

కరీంనగర్ : శిశుసంరక్షణ కేంద్రంలో దారుణం జరిగింది. అల్లరి చేస్తున్నారన్న అనధ పిల్లలకు ఆయాలు వాతలు పెట్టారు. బాధిత పిల్లలంతా మూడేళ్లలోపువారే. అయితే ఈ ఘటన కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పరిస్థితి తెలసుకున్న వెంటనే పిల్లల్ని హాస్పటల్‌కి పంపారు అధికారులు. ఐసీడీఎస్ అధికారులు ఆయాలను విధుల నుంచి తొలగించారు.

విమానానికి బాంబు బెదిరింపు

గుజరాత్‌ : అహ్మదాబాద్‌ నుంచి ముంబయి వెళ్లే విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానంలో బాంబు ఉందంటూ అహ్మదాబాద్‌ విమానాశ్రయ కార్యాలయానికి ఓ బెదిరింపు లేఖ అందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు బాంబు నిర్వీర్య బృందాలను రప్పించి విమానంలో తనిఖీలు చేయిస్తున్నారు.

చంద్రబాబుకు శుకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉదయం బాబుకు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

09:42 - April 20, 2016

అమెరికా : అకాల వర్షం అమెరికాలోని హూస్టన్‌ నగరాన్ని అతలాకుతలం చేసింది. ఒక్కసారిగా వరదలు ముంచెత్తడంతో జనజీవనం స్తంభించింది. వరదల కారణంగా ఐదుగురు మృతి చెందారు. టెక్సాస్‌లో ఎమర్జెన్సీ ప్రకటించారు.

46 సెంటిమీటర్ల వర్షపాతం...

అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో ఒక్క రాత్రి కురిసిన భారీ వర్షం హ్యూస్టన్‌ నగరాన్ని వరదలతో ముంచెత్తింది. 46 సెంటిమీటర్ల వర్షపాతం కురియడంతో జన జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. మెరుపు వరదల కారణంగా ఐదుగురు మృతి చెందారు. సమయానికి సహాయం అందక మృతులంతా తమ తమ వాహనాల్లోనే నీట మునగడంతోనే మృతి చెందారు. ప్రధాన రహదారులు జలమయం కావడంతో రోడ్లపై కార్లు నీట మునిగాయి. హ్యూస్టన్‌ డౌన్‌టౌన్‌లో నదులు పొంగి పొర్లుతుండడంతో వరద నీరు నివాస ప్రాంతాల్లోకి చేరింది. హారిస్‌ కౌంటీపై వరద ప్రభావం ఎక్కువగా ఉంది. దాదాపు వెయ్యి ఇళ్లు వరదనీటిలో చిక్కుకున్నాయి. 12 వందల మందిని సహాయ సిబ్బంది కాపాడి పడవల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. డ్రైనేజీలు పొంగి పొర్లుతుండడంతో రోడ్లు జలమయమయ్యాయి. సైప్రస్‌ క్రీక్‌లో చిక్కుకుపోయిన డజన్ల కొద్ది గుర్రాలను వరద నీటి నుంచి కాపాడారు. రహదారులపై ప్రమాదకర స్థాయిలో వరద నీరు ప్రవహిస్తోంది. కొన్ని రహదారులను మూసివేశారు. ప్రజలెవరూ ప్రయాణాలు పెట్టుకోవద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షం కారణంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

తొమ్మిది టెక్సాస్‌ కౌంటీలలో ఎమర్జెన్సీ ప్రకటన...

ఇంతటి భయానక వర్షం తానెప్పుడూ చూడలేదని గవర్నర్‌ గ్రెగ్‌ అబ్బాట్‌ చెప్పారు. తొమ్మిది టెక్సాస్‌ కౌంటీలలో ఎమర్జెన్సీని ప్రకటించారు. వరదల ప్రభావం కొన్ని రోజుల వరకు ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హ్యూస్టన్‌లో పాఠశాలలను తాత్కాలికంగా మూసివేశారు. బుష్‌ ఇంటర్నేషనల్‌, హాబీ విమానాశ్రయంలో 1200కి పైగా విమాన సర్వీసులను రద్దు చేశారు.

09:39 - April 20, 2016

తిరుపతి: ఉద్యోగాల పేరుతో తిరుపతిలో ఓ సాఫ్ట్ వేర్ సంస్థ బోర్డు తిప్పేసింది. సాఫ్ట్ వేర్ కోర్సులు నేర్పించి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురు నిరుద్యోగ యువతీ యువకుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసిన సంస్థ ప్రతినిధులు రాత్రికి రాత్రే ఉడాయించారు. తిరుపతి మాస్క్ రోడ్డులో వెరిజో టెక్ సంస్థ 3 నెలల్లో సాఫ్ట్ వేర్ కోర్సులు నేర్పించి, తామే ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ.. సుమారు వంద మంది దగ్గర 50లక్షల మేర వసూలు చేసింది. 6నెలలు అవుతున్నా... జాబ్‌ లు ఇవ్వకపోవడంతో... బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... ఇనిస్టిట్యూట్ మేనేజరైన విశ్వప్రసాద్ కోసం గాలిస్తున్నారు. 

09:37 - April 20, 2016

నల్గొండ : జిల్లా చివ్వెంల మండలం చందుపట్ల వద్ద బుధవారం ఆర్టీసీ బస్సు... డీసీఎం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు నల్లగొండ నుంచి భద్రాచలం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. డీసీఎం డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

09:35 - April 20, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో బుధ, గురువారాల్లో ఉష్టోగ్రతలు మరింత పెరిగి వడగాల్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్న సమయంలో ఎండలో తిరగరాదని హెచ్చరించింది. వేసవి ఎండలు తీవ్రంగా ఉన్నందున పొడి, వేడిగాలుల ఉధృతి మరింత పెరగనుంది. మంగళవారం వడగాల్పులకు రాష్ట్రంలో 30మంది మరణించినట్టు సమాచారం. అయితే అధికవేడికి అప్పటికప్పుడు క్యుములోనిబంస్ మేఘాలు ఏర్పడి పెనుగాలులతో వడగండ్ల వానలు పడొచ్చని కూడా తెలిపారు. 

09:33 - April 20, 2016

అమరావతి: మన ప్రాంతంలో మన రాష్ట్ర రాజధాని అనుకున్నారు. తమ ప్రాంతం చరిత్ర పుటల్లోకి ఎక్కుతుందని అంతా ఆనందించారు. రాజధాని నిర్మాణానికి భూములు కావాలని ప్రభుత్వం కోరిందో లేదో ఏ మాత్రం వ్యతిరేకత చూపకుండా స్వచ్ఛందంగా భూములిచ్చేశారు. ఇందుకు తగ్గట్టే రైతులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలిస్తానంది. ఇంతకి ఎంతో ఉదారంగా భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం న్యాయం చేయగలుగుతుందా.? ప్లాట్ల కేటాయింపు విషయంలో సర్కార్ అనుసరిస్తున్న విధానం సరైనదేనా?

ప్రపంచ స్థాయి నగరంగా ఏపీ రాజధాని....

ప్రపంచ స్థాయి నగరంగా ఏపీ రాజధాని అమరావతిని నిర్మించుకుందాం... ఇందుకు ప్రతి ఒక్కరి సహకారం కావాలంటూ గతంలో రాజధానిని ప్రకటించే సందర్భంగా సిఎం చంద్రబాబునాయుడు అన్నారు. ప్రతి ఒక్కరి సహకారం కావాలని కోరారో లేదో రాజధాని నిర్మాణానికి అవసరమైన భూములను రైతులు స్వచ్ఛందంగా అందించారు. మీ త్యాగాన్ని మరిచిపోలేమంటూ అందరికీ ఇళ్ల స్థలాలిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడు ఆ ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలోనే రైతుల ఎదుట లెక్కలేనన్ని సమస్యలు అంతకు మించిన అనుమానాలు ప్రత్యక్షమయ్యాయి.

మెట్ట భూములైతే 1300 గజాలు.....

తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని సుమారు 33వేల మంది రైతులు రాజధాని కోసం భూములిచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ప్రకటించిన ప్యాకేజీలను నమ్మి జీవనాధారమైన పంట పొలాలను అప్పగించారు. జరీబు, మెట్ట ప్రాంత రైతులకు విడివిడిగా కౌలు చెల్లింపుతో పాటు ప్లాట్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఎకరం భూమి ఇచ్చిన రైతుకు మెట్ట అయితే నివాసం మరియు వాణిజ్యం కలుపుకుని 1300గజాల ప్లాటు, జరీబు పొలం అయితే 1450 గజాల స్థలం ఇస్తామని ప్రకటించింది. ఆ ప్రకారమే భూములు సేకరించింది.

నవంబర్, డిసెంబర్‌లో ప్లాట్ల పంపిణీ అన్నారు..

గత ఏడాది నవంబర్, డిసెంబర్ మాసాల్లో ప్లాట్ల పంపిణీ చేస్తామన్నా రాజధాని శంఖుస్థాపన, తాత్కాలిక సచివాలయం తదితర కారణాలతో పంపిణీని ప్రభుత్వం ఆలస్యం చేస్తూ వచ్చింది. అయితే కొన్ని దేశాల్లో అనుసరిస్తున్న విధానాల మాదిరే మొత్తం స్థలాన్ని ఏ, బి, సి, డి, ఇ అనే గ్రేడులుగా విభజించి ప్లాట్లు కేటాయిస్తామన్నారు. అందులో నివాసం స్థలంకింద 120 గజాల నుండి ఇవ్వడం ప్రారంభిస్తారు. 120 గజాల నుండి 30 గజాల చొప్పున పెంచుకుంటూ వెళ్లవచ్చు. అదే వాణిజ్య స్థలమైతే 30 గజాలతో మొదలు పెట్టి అన్నేసి గజాలు పెంచుకుంటూ వెళ్తారు. ఇలా ప్లాట్లను విభజించిన తర్వాత వాటికి కచ్చా రోడ్లు వేయడం, డ్రైనేజీ వంటి ప్రాథమిక అవసరాలు మాత్రమే సమకూరుస్తారు. పూర్తి స్థాయి రోడ్లు మరో మూడేళ్లలో నిర్మిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇలా ప్రభుత్వం పలు ప్రకటనలు చేస్తున్నా సామాజికవేత్తలు, అధ్యయనకారులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

10 నుంచి 15 వేల ఎకరాలకు వరద ముప్పు...

గత వంద సంవత్సరాల కాలంలో కృష్ణానదికి వచ్చిన వరదలను అధ్యయనం చేస్తే రాజధాని ప్రాంతంలోని సుమారు 10 నుండి 15వేల ఎకరాలు వరద ముంపుకు గురయ్యే అవకాశముందని అధ్యయనకారులు చెబుతున్నారు. ఫలితంగా 2 నుంచి 4 అడుగుల మేర భూముల్లో నీరు నిలిచిపోతుంది. ప్రభుత్వం వరద ముంపు నుండి రక్షణగా కరకట్ట నిర్మాణాలు పెంచినా, దానికి దిగువ ఉన్న రైతుల ప్లాట్లు పల్లంలోకి వెళ్లిపోతాయి. భవిష్యత్‌లో వరద ముంపు నుండి తట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రస్తుతం నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం భవనాలను 8 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నారని చెబుతున్నారు. వరద ముంపు ఉంటుంది కాబట్టే సచివాలయం భవనాలను 8 అడుగులు ఎత్తులో కడుతున్నారని అధ్యయనకారులు అభిప్రాయపడుతున్నారు. దీన్నిబట్టే రాజధాని ప్రాంతానికి వరద ముంపు ఉందని స్పష్టమవుతోంది.

మిగతా నిర్మాణాలు ఎత్తు పెంచినా రైతుల ప్లాట్లు పల్లం..

తాత్కాలిక సచివాలయ భవనాలు, సీడ్ క్యాపిటల్ నిర్మాణాలు, ఉద్యోగుల క్వార్టర్స్ వంటి అన్ని భవనాలను పరిశీలిస్తే అన్నీ ఎత్తులోనే నిర్మించనున్నారు. ఒకవేళ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన భూములను మినహాయించి మిగతా వాటిని ఎత్తుగా నిర్మిస్తే రైతుల భూములకు వరద ముంపు మరింత పెరిగే అవకాశముంటుంది. దీన్నిబట్టి ప్రభుత్వం రైతులకు ఇచ్చే ప్లాట్లను ఇప్పుడే ఎత్తు పెంచి వాటిల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేసి ఇస్తుందా లేక ఎత్తు పెంచకుండా ప్లాట్లు ఇస్తుందా.? ఈ ప్రశ్నకు సర్కార్ సరైన సమాధానం ఇవ్వాలి. ఆ తర్వాతే ప్లాట్ల కేటాయింపు చేయాలని సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు.

రాజధాని ప్రాంతంలో తాగునీటి సమస్య....

రాజధాని ఏరియాలో నీటి లభ్యత అన్నిచోట్లా ఒకేలా ఉండదు. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో అనేక గ్రామాల్లో తాగునీటి సమస్యలు ఉన్నాయి. మరి ప్రభుత్వం ప్లాట్లు కేటాయించిన తర్వాత నీటి సమస్యను తీరుస్తుందా లేక ప్లాట్లు ఇవ్వకముందే పరిష్కరిస్తుందా అనే అంశాన్ని ఎక్కడా ప్రస్తావించట్లేదు. ఇక ఇబ్రహీంపట్నం నుండి వచ్చే హైటెన్షన్ వైర్లు రాజధాని గ్రామాల మీదుగా వెళ్తున్నాయి. మరి వాటిని అండర్ గ్రౌండ్‌లోకి మారుస్తారా, మారిస్తే ప్లాట్లు డెవలప్ చేశాక మారుస్తారా? లేక మార్చిన తర్వాత ప్లాట్లు కేటాయిస్తారా అనే అంశాన్ని ప్రభుత్వం ఎక్కడా ప్రస్తావించడం లేదు. ఇలా లెక్కకు మిక్కిలిగా ఉన్న ప్రశ్నలకు ప్రభుత్వం ఏం సమాధానమిస్తుందో చూడాలి.

09:29 - April 20, 2016

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ సుభాష్‌ రోడ్డులో అయిదు దుకాణాలను కాల్చి బూడిద చేసిన ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మద్యం తాగి బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం. ఠాణా గోడకు ఉన్న పాత వస్త్రాల దుకాణానికి నిప్పు పెట్టారు. అవి అంటుకుని మరో రెండు దుకాణాలకు వ్యాపించాయి. దాంతో దట్టమైన పొగతో మంటలు వచ్చాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. అక్కడే ఉన్న నిందితులు ఆ వాహనాలు వెళ్లగానే మళ్లీ పక్క దుకాణాలకు నిప్పు పెట్టారు. దాంతో మరో రెండు దుకాణాలకు అంటుకున్నాయి. నిందితుల్లో ఒకరు పోలీసు అధికారి కుమారుడుగా భావిస్తున్నారు. ఇద్దరు యువకులు అర్థరాత్రి నాగోల్‌లో మద్యాన్ని తాగివచ్చి ఈ ఘటనకు పాల్పడినట్లు తేలిందన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటాన్నామని, బాధితులకు న్యాయం చేస్తామన్నారు. 

09:27 - April 20, 2016

ప్రకాశం : చీరాల బస్టాండ్ లో ఓ సంఘటన ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసింది.ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన రక్షకభటుడే కత్తి తో ఓ వ్యక్తి గొంతు కోయడం దిగ్భ్రాంతికి గురిచేసింది. కొన ఊపిరితో కొట్టుకుంటున్న సునీల్ ను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనకు అక్రమ సంబంధమే కారణంగా తెలుస్తోంది.  

09:26 - April 20, 2016

హైదరాబాద్ : తెలంగాణలో ప్రైవేటు విద్యాసంస్థలకు.. సర్కారుకూ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. సహాయ నిరాకరణ ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ప్రైవేటు విద్యాసంస్థలు నిర్ణయించాయి. అటు ప్రభుత్వమూ వెనక్కు తగ్గేది రాదని నిర్ణయించింది. పైగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపైనా దృష్టి సారించింది. ఈ వ్యవహారంలో వివిధ ప్రజా పక్షాలు ప్రైవేటు విద్యా సంస్థలకు మద్దతు ప్రకటించాయి. మరోవైపు సర్కారు, ప్రైవేటు విద్యాసంస్థల పంతానికి విద్యార్థులు, తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు.

సహాయ నిరాకరణ బాటలో ప్రైవేటు విద్యా సంస్థలు....

తెలంగాణలో ప్రైవేటు విద్యాసంస్థలు సహాయ నిరాకరణ బాట పట్టాయి. కాలేజీల్లో పోలీసులతో తనిఖీలు చేయించడాన్ని ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ తీవ్రంగా తప్పుబడుతోంది. తెలంగాణా కోసం ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించిన తమపై టీ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ ఆరోపిస్తోంది. తమ ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నందుకే ఉద్యమబాట పట్టామని అంటున్నారు విద్యాసంస్థల యాజమాన్యాలు. పోలీసు తనిఖీలు ఉపసంహరించుకునే వరకు విద్యాసంస్థల బంద్‌ నిర్వహిస్తామని.. ఎంసెట్ లాంటి ప్రవేశ పరీక్షలకు కూడా తమ కాలేజీలను సెంటర్‌లుగా అనుమతించబోమని ప్రకటించాయి.

ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలి.....

ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి కోరారు. ఇబ్బందులుంటే ప్రభుత్వంతో చర్చించాలి తప్ప.. విద్యార్థులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. తరగతులతో పాటు ప్రవేశ పరీక్షల నిర్వహణకు సహకరించాలని కోరారు.

ప్రైవేట్ విద్యాసంస్థల జేఏసీ నిర్ణయంతో ....

ప్రైవేట్ విద్యాసంస్థల జేఏసీ నిర్ణయంతో డిగ్రీ, ఇంటర్, పాలిటెక్నిక్ , ఇంజనీరింగ్‌ విద్యార్థులపై ప్రభావం చూపుతోంది. బంద్‌ కారణంగా జేఎన్‌టీయూ పరిధిలోని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో 40 శాతం విద్యార్థులు ఇంటర్నల్‌ పరీక్ష రాయలేకపోయారు. డిగ్రీ సహా కొన్ని కోర్సుల తరగతులు నిలిచిపోయాయి. యాజమాన్యాల నిర్ణయాన్ని తల్లిదండ్రులు తప్పు పడుతున్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేలా ప్రభుత్వం నిర్వహించే తనిఖీలు తాము సమర్థిస్తున్నామని, కళాశాలలు నాణ్యత ప్రమాణాలు పాటించి విద్యార్థులకు మంచి విద్యను అందించాలని కోరుతున్నారు. 

09:20 - April 20, 2016

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన సరైనోడు చిత్రం ఈ నెల 22న విడుదలయ్యేందుకు సిద్దమైంది. రిలీజ్ డేట్‌కి ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ స్పీడ్‌ని మరింత వేగవంతం చేసింది. మొదటి నుండి సినిమాను డిఫరెంట్ స్టైల్లో ప్రమోట్ చేస్తున్న మూవీ టీం తాజాగా సరైనోడు డైలాగ్ ప్రోమో అంటూ ఓ వీడియో విడుదల చేసింది. పదకొండు సెకన్లు గల ఈ వీడియో అందరిని ఆకర్షిస్తుంది. మరి ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

జెలిటిన్ స్టిక్స్ ను పేల్చిన కాంట్రాక్టర్ :ఐదుగురికి గాయాలు

నల్గొండ : ఆత్మకూరు(ఎస్) మండలం కోటపాడులో బిల్డింగ్ నిర్మాణం కోసం బండరాయిని తొలగించేందుకు జెలిటిన్ స్టిక్స్ ను కాంట్రాక్టర్ పేల్చాడు. ఈ ఘటనలో ఐదుగురికి గాయలయ్యాయి. క్షతగాత్రులో ఓ బాలుడి పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా జెలిటిన్ స్టిక్స్ పేల్చడం పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్ సీసీ పవర్ ప్రాజెక్టులో అగ్ని ప్రమాదం

నెల్లూరు : తోటపల్లిగూడూరు మండలం అనంతవరం వద్ద ఎన్ సీసీ పవర్ ప్రాజెక్టులో అగ్ని ప్రమాదం సంభవించింది. కూలింగ్ బాయిలర్ లో షార్ట్ సర్క్యూట్ తో మంటల చెలరేగాయి. అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.

బాలుడు యదిత్యరాజు హత్య కేసులో వీడుతున్న మిస్టరీ

గుంటూరు :ఏటీ అగ్రహారంలో బాలుడు యదిత్యరాజు హత్య కేసులో ట్యూషన్ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో డబ్బు కోసమే బాలుడు యదిత్యరాజును కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు వెల్లడించాడు. ఈఘటనలో మరికొందరి నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఆర్టీసీ బస్సు- లారీ ఢీ:10మందికి గాయాలు..

నల్గొండ : జిల్లా చివ్వెంల మండలం చందుపట్ల వద్ద బుధవారం ఆర్టీసీ బస్సు... లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎడ్లబండిని ఢీ కొట్టిన లారీ : ముగ్గురు మృతి

ప.గో : దెందులూరు జాతీయ రహదారిపై చెక్ పోస్టు వద్ద ఎడ్లబండిని లారీ ఢీ కొట్టింది. ఈఘటనలో ముగ్గురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

నేడు, రేపు ఉధృతం కానున్న వడగాడ్పులు...

హైదరాబాద్: ఈ రోజు, రేపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో వడగాల్పుల ప్రభావం మరింత ఉధృతంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. నేడు, రేపు తెలంగాణ, రాయలసీమల్లో గరిష్గ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. వడగాల్పులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. మధ్యాహ్నం ఎండలో తిరగరాదని హెచ్చరించింది.

07:57 - April 20, 2016

వరుణ్‌తేజ్‌ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో 'మిస్టర్‌' పేరుతో ఓ చిత్రం రూపొందనుంది. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై 'ఠాగూర్‌' మధు, నల్లమలుపు శ్రీనివాస్‌(బుజ్జి) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ, 'వరుణ్‌ తేజ్‌, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో రూపొందే ఈ చిత్రంలో వరుణ్‌కి జోడీగా లావణ్య త్రిపాఠి, హేబా పటేల్‌ ఆడిపాడనున్నారు. ఓ అద్భుతమైన సబ్జెక్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ప్రస్తుతం డైలాగ్‌ వెర్షన్‌ రెడీ అవుతోంది. ఊటీలో దర్శకుడు శ్రీనువైట్ల, రచయితలు గోపీమోహన్‌, శ్రీధర్‌ సీపానలతో కలిసి స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ నెలాఖరులో సినిమాను గ్రాండ్‌గా ప్రారంభించి, మే 15నుంచి స్పెయిన్‌లో షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం. తొలి షెడ్యూల్‌లో భాగంగా నెలరోజుల పాటు స్పెయిన్‌లోనే షూటింగ్‌ జరుపుతాం' అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్‌, కెమెరా: జె.యువరాజ్‌. సమర్పణ: బేబీ భవ్య.

07:54 - April 20, 2016

బాలకృష్ణ నటించబోతున్న 100వ చిత్రానికి ముహూర్తం ఖరారైంది. 'గౌతమీపుత్ర శాతకర్ణి' పేరుతో క్రిష్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని ఈ నెల 22న ఘనంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బిబో శ్రీనివాస్‌ సమర్పణలో రాజీవ్‌రెడ్డి, సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ, 'అఖండ భారతదేశాన్ని పరిపాలించిన తొలి తెలుగు రాజు గౌతమీ పుత్ర శాతకర్ణి చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం.

గౌతమీ పుత్ర శాతకర్ణి జీవితాన్ని తెలుసుకుంటే మన శరీరం రోమాంఛితమవుతుంది. కృష్ణానదీ తీరాన అమరావతిని, గోదావరి తీరంలోని కరీంనగర్‌ జిల్లా కోటి లింగాల పల్లిని, మహారాష్ట్రలోని నాసిక్‌ సమీపంలోని ప్రతిష్టానపురంను రాజధానులుగా చేసుకుని ఆయన పరిపాలన సాగించారు. తెలుగు చారిత్రక వీరుని జీవితాన్ని బాలకృష్ణ వందవ చిత్రంగా చేస్తున్నారనే వార్త ఆయన అభిమానులకు కొత్త ఉత్సాహాన్నిస్తోంది. ఇందులో బాలకృష్ణ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారు. మహానటుడు ఎన్టీఆర్‌ పోషించాలనుకున్న

ఈ పాత్ర అప్పుడు కార్యరూపం దాల్చలేకపోయింది. తండ్రి డ్రీమ్‌ ప్రాజెక్టును బాలకృష్ణ చేయడం ఆనందంగా ఉంది. ఉగాది పర్వదినాన ఏపీ రాజధాని అమరావతిలో అధికారికంగా ఈ ప్రాజెక్టు గురించి బాలకృష్ణ ప్రకటించారు. ఈ నెల 22న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నాం. సినీ రాజకీయ ప్రముఖులతో పాటు బాలయ్య అభిమానుల మధ్య ఈ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరుగనుంది. అన్ని వర్గాల ప్రేక్షకులతోపాటు బాలకృష్ణ అభిమానులకు కావాల్సిన అంశాలన్ని ఈ చిత్రంలో తప్పకుండా ఉంటాయి. అందరినీ అలరించే విధంగా ఈచిత్రం ఉంటుంది' అని అన్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం భక్తులు నాలుగు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి మూడు గంటలు, నడకదారిన కొండ ఎక్కి వచ్చిన భక్తులకు రెండు గంటలు, రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. నేడు రెండోరోజు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు జరగనున్నాయి. ఉదయం 8 గంటలకు శ్రీదేవిభూదేవి సమేత మలయప్ప స్వామికి స్వర్ణరథ సేవ నిర్వహించనున్నారు.

07:30 - April 20, 2016

హైదరాబాద్ : తెలంగాణ లో కరువు నివారణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని 'న్యూస్ మార్నింగ్' చర్చలో పాల్గొన్న వ్యక్తలు అభిప్రాయం పడ్డారు. కరువు మండలంగా ప్రకటించాలంటే వర్షపాత లోటు ఉండాలి, కరువు పరిస్థితులు ఉండాలి. కానీ వర్షపాతం ఎక్కువగా ఉన్నా కలెక్టర్లు పంపిన నివేదికను బుట్ట దాఖలు చేసి కరువు మండలాలను మార్చారు. దాని వల్ల కొన్ని జిల్లాల్లో ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ఎంపిక చేయలేదని వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్ర విధానాల ప్రకారమే కరువు మండలాల ఎంపిక జరిగిందా? కరువు నివారణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయా? ఇత్యాది అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, టిఆర్ ఎస్ నేత రాజేకష్, కాంగ్రెస్ నేత మహేష్ గౌడ్ పాల్గొన్నారు. వారి మధ్య ఎలాంటి చర్చ జరిగిందో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

మావోయిస్టులపై విషప్రయోగం !?

విశాఖ : ఆంధ్రా-ఒడిశా సరిహద్దు కటాఫ్ ఏరియాలో సిమిలిపొదరిలో మావోయిస్టులపై విషప్రయోగం జరిగినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్జునమ్మ అనే మహిళా మావోయిస్టు మృతి చెందగా మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. అయితే తప్పించుకున్న మావోయిస్టు దళంపై విషప్రయోగం జరగడంలో పోలీసుల హస్తంపై అనుమానాలు వ్యక్తమవుతన్నాయి.

నేడు సైకిల్ ఎక్కనున్న సుజయకృష్ణ రంగారావు

విజయనగరం : బొబ్బిలి వైసీపీ ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు టీడీపీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. బుధవారం సీఎం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా విజయవాడలో హోటల్‌ మురళీ ఫార్చూన్‌లో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. విజయనగరం నుంచి ఆయనతో పాటు శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఇన్‌చార్జ్‌, సుజయ్‌కృష్ణ సోదరుడు ఆర్‌.వి.ఎస్.కె.రంగారావు కూడా టీడీపీలో చేరుతున్నారు. బొబ్బిలి నియోజకవర్గం నుంచి సుమారు 60 మంది సర్పంచ్‌లు, 30 మంది ఎంపీటీసీలు, ఇద్దరు మండలాధ్యక్షులు, ముగ్గురు జెడ్పీటీసీలు టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం.

 

06:55 - April 20, 2016

ఖమ్మం : పాలేరు ఉప ఎన్నికల నగరా మోగడంతో రాష్ట్రంలో రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. త్వరలో పాలేరు శాసనసభా స్థానం ఉప ఎన్నిక జరగనుంది. బైపోల్‌ కోసం పొలిటికల్‌ పార్టీలు కసరత్తులు ప్రారంభించాయి. సిట్టింగ్‌ స్థానం కావడంతో దివంగత ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట రెడ్డి సతీమణి లేదా అదే కుటుంబం నుంచి మరొకరిని రంగంలోకి దింపాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్ రెడ్డి కూడా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

తమ పట్టును నిరూపించుకునేందుకు రంగంలో వామపక్షాలు....

ఖమ్మం జిల్లాలో తమ పట్టును నిరూపించుకునేందుకు వామపక్షాలు సిద్ధమవుతున్నాయి. పోటీకి సిద్ధమని లెఫ్ట్ పార్టీలు ఇప్పటికే ప్రకటన చేశాయి. తెలుగుదేశం పార్టీ పరిస్థితి మాత్రం అయోమయంగానే కనిపిస్తోంది. పార్టీ పరంగా ఇప్పటికీ ఉప ఎన్నికపై ఎలాంటి కసరత్తు జరుగలేదని తెలుస్తోంది.

తెలంగాణాలో వైసీపీ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం....

పాలేరు ఉప ఎన్నిక తెలంగాణాలో వైసీపీ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం కనిపిస్తోంది. ఖమ్మం వైసీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సోదరుడిని టీఆర్‌ఎస్‌ తరుపున రంగంలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఒక వేళ అధికార పార్టీ గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే తెలంగాణ వైసీపీ ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేసేందుకు సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు ఇస్తున్నట్లు సమాచారం. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యే ల్లో ఇద్దరు ఇప్పటికే గులాబి గూటికి చేరారు. ఉప ఎన్నికతో వైసీపీ విలీన తంతును కూడా గులాబి పార్టీ పూర్తి చేసే ఛాన్స్‌ కనిపిస్తోంది.మరోవైపు టీఆర్‌ఎస్‌ పార్టీలోనూ ఆశావాహుల జాబితా పెద్దగానే ఉంది. 

06:52 - April 20, 2016

హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల కావడంతో రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల వేడి మొదలైంది. వరుసగా వస్తున్న ఉప ఎన్నికలు అధికార పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహం నింపుతున్నాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీ విజయఢంకా మోగించింది. రెండు పార్లమెంట్, ఓ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాలకు షాక్‌నిచ్చేలా ఎన్నికల ఫలితాలొచ్చాయి. ఇదే క్రమంలో ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ స్థానంలో గులాబీ జెండా ఎగరేసేందుకు అధికార పార్టీ పావులు కదుపుతోంది.

ఉప ఎన్నికల్లో సత్తా చాటుతున్న టీఆర్‌ఎస్‌ .....

వరంగల్, మెదక్ జిల్లాల్లో గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీ అంచనాలకు మించి ప్రజల మద్దతును కూడగట్టుకుంది. అంతే ఊపుతో పాలేరు ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధికార గులాబీ పార్టీ నేతలు ఉత్సాహం చూపిస్తున్నారు. రాంరెడ్డి వెంకటరెడ్డి మృతి కారణంగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో.. పాలేరును కాంగ్రెస్ నుంచి లాగేసుకోవాలని గులాబీ దళపతి కేసీఆర్‌ పావులు కదుపుతున్నారు. ఇక మిగిలిన రాజకీయ పక్షాలూ ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాయి. కాంగ్రెస్, తెలుగుదేశం, వామపక్ష పార్టీలు సహా YCP కూడా బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నాయి. అధికార పార్టీ తరపున గత ఎన్నికల్లో పార్లమెంట్‌కు పోటీ చేసిన బేగ్, ఖమ్మం జిల్లా ఇంచార్జ్‌గా గతంలో ఉన్న నరేష్ రెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన మరో నరేష్ రెడ్డిలు రంగంలోకి దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. జిల్లా నుంచి మంత్రిగా కొనసాగుతున్న తుమ్మల కూడా పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.

స్వతంత్ర అభ్యర్థిగా దిగితే మద్దతు ....

దివంగత ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి సతీమణి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగితే అధికార పార్టీ మద్దతు ఇచ్చే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో నిమిత్తం లేకుండా అధికార పార్టీలో ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇదే క్రమంలో.. ఇతర పార్టీల నాయకులూ బేరాలతో సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాను సూచించిన అభ్యర్థికి టిఆర్ఎస్ టికెట్ ఇస్తే.. మరో ఎమ్మెల్యేతో కలిసి కారెక్కేందుకు సిద్ధంగా ఉన్నాననే సంకేతాలు ఇస్తున్నట్లు సమాచారం. పాలేరు ఉప ఎన్నిక ఏకగ్రీవం అవుతుందా..? పోటీ అనివార్యమవుతుందా..? తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. 

06:50 - April 20, 2016

పశ్చిమ గోదావరి : భీమవరంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాద వశాత్తు కారులో ఇరుక్కుపోయిన ఇద్దరు చిన్నారులు ఊపిరాడక మృతిచెందారు. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన భీమవరం బ్యాంక్ కాలనీలో నిన్న రాత్రి జరిగింది. బ్యాంక్ కాలనీకి చెందిన తేజస్విని, నాలుగేళ్ల వయసున్న లక్ష్మీదుర్గ, ఆరేళ్ల వయసున్న ఈశ్వరి కారులో ఆడుకుంటుండగా డోర్‌ లాక్‌ పడింది. అప్పటికే అద్దాలన్నీ క్లోజ్ చేసి ఉండడం... పిల్లలు కారులో ఆడుకుంటున్న విషయం ఎవరూ గమనించకపోవడంతో ఘోరం జరిగిపోయింది. కారులో ఊపిరాడక లక్ష్మీదుర్గ, ఈశ్వరి మృతిచెందారు. తేజస్విని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆలస్యంగా ఇది గమనించిన కుటుంబ సభ్యులు తేజస్వినిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

06:48 - April 20, 2016

హైదరాబాద్ : ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది.ఖమ్మం జిల్లాలో తమ సత్తాను చాటాలని ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఐతే ఎన్నికల కోడ్ అమలు కానుండడంతో...ప్లీనరీకి ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

అధికార పార్టీలో తర్జన భర్జనలు...

గులాబి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకులకు ఎన్నికల కోడ్ పగ్గాలు వేస్తోంది. ఖమ్మం జిల్లాల్లో ఈ నెల 27వ తేదీన నిర్వహించే ఆవిర్భావ సదస్సు, బహిరంగ సభలకు సంబంధించి అధికార పార్టీలో తర్జన భర్జనలు మొదలయ్యాయి. ఈ నెల 20వ తేదీ నుంచి పాలేరు ఉప ఎన్నికల కోడ్ అమలు కానుంది. నేపథ్యంలో ప్లీనరీ, బహిరంగ సభల నిర్వహణపై ఆచి తూచి వ్యవహరించాల్సిన పరిస్థితి అధికార పార్టీకి ఏర్పడుతోంది. బహిరంగ సభకు భారీగా జనసమీకరణ చేయాలని భావించినా..... ఇప్పుడు ఆత్మరక్షణలో పడే పరిస్థితులు తలెత్తాయి. అయితే ఈ సభనే ఎన్నికల సభగా నిర్వహిస్తే ఎలా ఉంటుందనే అంశంపైనా గులాబి పార్టీలో చర్చ మొదలైంది

.కోడ్ నేపథ్యంలో నిరాండబరంగా...

ప్రతినిధుల సభతో పాటు బహిరంగ సభను ఎలా నిర్వహించాలనే అంశపై అధికార పార్టీలో చర్చ మొదలైంది. ఖమ్మం జిల్లాను గులాబి మయం చేయాలనుకున్నా........కోడ్ నేపథ్యంలో నిరాండబరంగా ఈ కార్యక్రమాలను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మరో వైపు అధికార పార్టీ నిర్వహించ తలపెట్టిన సదస్సు, బహిరంగ సభలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారికంగా అన్ని అనుమతులు తీసుకునేందుకు టీఆర్ఎస్ రెడీ అవుతున్నట్లు సమాచారం.

06:45 - April 20, 2016

హైదరాబాద్ : మైనార్టీలకు రిజర్వేషన్లపై కేసీఆర్ ఇచ్చిన హామీని తెలంగాణ కాంగ్రెస్ అస్త్రంగా మలుచుకుంటోంది. దీనిపై ఇప్పటికే మిలియన్ సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టింది. పవర్ పాయింట్‌ ప్రజెంటేషన్‌తో ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. రిజర్వేషన్లకు సంబంధించి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వైఫల్యాన్ని మైనార్టీల్లో తీసుకెళ్ళేదుకు పక్కా ప్లాన్ తో రచిస్తోంది.

కేసీఆర్ ఇచ్చిన హామీని ఇప్పుడు కాంగ్రెస్‌ ఆయుధంగా...

ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని కేసీఆర్ ఇచ్చిన హామీని ఇప్పుడు కాంగ్రెస్‌ ఆయుధంగా వాడుకుంటోంది. టీఆర్‌ఎస్‌ అధికారం లోకి వచ్చి రెండేళ్లైనా .....ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో పోరు బాట పట్టింది. ఇప్పడికే మిలియన్ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి మైనార్టీ వర్గాలనుండి వస్తున్న స్పందన తో స్పీడ్‌ మరింత పెంచింది.

కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్...

ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ముస్లింల రిజర్వేషన్ల అమలు తీరుపై మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ 2004 మేనిఫెస్టోలో 5శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చినా... కోర్టు అంగీకరించకపోవడంతో నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేసిన సంగతిని గుర్తుచేశారు. ముస్లింలపై కేసీఆర్‌ చిన్న చూపు చూస్తున్నారంటున్న హస్తం నేతలు..ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళతామని చెబుతున్నారు.

ముస్లిం రిజర్వేషన్లపై టీఆర్‌ఎస్‌కు చిత్తశుద్ధి లేదు...

ముస్లిం రిజర్వేషన్లపై టీఆర్‌ఎస్‌కు చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు. తమ హయాంలో అమలు చేసిన రిజర్వేషన్ లతో ముస్లింలు లబ్ధిపొందారని చెప్పుకొచ్చారు. ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు త్వరలో జిల్లాల్లో సదస్సులు నిర్వహించాలని పీసీసీ ప్లాన్ చేస్తోంది. దీంతోపాటు గిరిజనులకు కేసీఆర్ ఇస్తామన్న రిజర్వేషన్ల పైనా పోరును ఉధృతం చేసేందుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది.

06:43 - April 20, 2016

విజయవాడ : ఏపీలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌పై సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. వెయ్యి మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని... ఔట్ సోర్సింగ్‌ ఉద్యోగులకు జీతం పెంచాలని కేబినెట్‌ సబ్‌ కమిటీ నిర్ణయించింది. దీని వల్ల.. 90 కోట్ల రూపాయల భారం పడుతుందని సర్కారు చెబుతోంది. మరోవైపు.. ప్రభుత్వ నిర్ణయంపై ఔట్ సోర్సింగ్ సిబ్బంది పెదవి విరుస్తున్నారు. ఎన్నికల హామీని నిలుపుకోవాలని కోరుతున్నారు.

1003 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్.....

అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురందించింది.. వీరి జీతాలు పెంచేందుకు కేబినెట్‌ సబ్‌కమిటీ ఆమోదం తెలిపింది.. అలాగే సుమారు వెయ్యిమంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించింది.. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని దాదాపు 30 వేలమంది ఉద్యోగులకు లబ్ది కలగనుంది..

మొదటి కేటగిరీ వారికి రూ. 6,700 నుంచి 9,200...

అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను సబ్‌కమిటీ మూడు కేటగిరీలుగా విభజించింది.. మొదటి కేటగిరీ వారికి 6వేల 700నుంచి 9వేల 200, రెండో కేటగిరీ ఉద్యోగులకు 8వేల 400నుంచి 10వేల 900, మూడో కేటగిరీ వారికి 11వేల 500 నుంచి 14వేలకు జీతాలు పెంచాలని తీర్మానించింది.. ఈ పెంపుతో ప్రభుత్వంపై ఏడాదికి 90కోట్ల భారం పడనుంది.. పెరిగిన ఈ జీతాలు ఏప్రిల్ 1నుంచి అమల్లోకి రానున్నాయి.

తెలంగాణలో రూ. 5,500 పెంచారంటున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు........

అయితే సర్కార్ నిర్ణయంపై అవుట్‌ సోర్సింగ్ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. పక్క రాష్ట్రం తెలంగాణలో 5వేల 300 రూపాయల జీతం పెంచితే తమకు మాత్రం 2వేల 500 పెంపు ఎంతవరకూ సమంజసమని ప్రశ్నిస్తున్నారు.. కొత్త రాష్ట్రంలో విపరీతమైన పని ఒత్తిడి ఉందని.. ఉదయం 10నుంచి రాత్రి 9వరకూ ఆఫీసులోనే ఉండాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు.. పెరిగిన నిత్యావసరాలతో పోలిస్తే ఈ జీతాలు తమకు ఏమాత్రం సరిపోవంటున్నారు.. అయితే ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని... పెరిగిన జీతాలతో కాస్త సర్దుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది.. ఉద్యోగులుమాత్రం కేబినెట్‌ సబ్‌ కమిటీ సిఫార్సులపై ముఖ్యమంత్రి మరోసారి సమీక్షించాలని కోరుతున్నారు.. చంద్రబాబును కలిసి తమ సమస్యలు చెప్పుకోవాలని చూస్తున్నారు.. 

06:34 - April 20, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం కొత్త యువజన విధానం తీసుకొస్తోంది. నూతన పాలసీపై ఇప్పటికే అధికారులు కసరత్తు చేశారు. యువజనుల కోసం స్త్రీనిధి తరహాలో యువజన బ్యాంక్ ఏర్పాటు చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. యువజనులతో స్వయం సహాయక గ్రూపులు ఏర్పాటు చేసి, ఆయా గ్రూపులకు ఈ బ్యాంక్ ద్వారా రుణాలు ఇప్పించే యోచనలో వున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ తెలంగాణలో యువజనులు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? యువజన విధానం ఎలా వుండాలి? యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? యువశక్తి ని వాడుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం సఫలమవుతోందా? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై ప్రస్థావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

06:31 - April 20, 2016

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 67వ వడిలోకి అడుగుపెడుతున్నారు. బుధవారం ఆయన పుట్టిన రోజు కావడంతో.. ఏపీలో అప్పుడే సంబరాలు మొదలయ్యాయి. బాబు పుట్టిన రోజును ఘనంగా జరిపేందుకు తెలుగు తమ్ముళ్లు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు పుట్టిన రోజును పురస్కరించుకొని నూతన రాజధాని అమరావతి కొత్త శోభను సంతరించుకుంది.

పార్టీ కార్యకర్తలకు ఓ పండగరోజు...

చంద్రబాబు నాయుడు పుట్టిన రోజంటే పార్టీ కార్యకర్తలకు ఓ పండగరోజు. పుట్టిన రోజు వేడుకల్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించేందుకు తెలుగు తమ్ముళ్లు ఇప్పటికే ఏర్పాట్లలో మునిగిపోయారు. వాడ వాడలా..ఊరూరా బాబు జన్మదిన వేడుకల్ని నిర్వహించేందుకు పార్టీ కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు.

చిత్తూరు జిల్లా నారావారిప‌ల్లెలో జననం...

చిత్తూరు జిల్లా నారావారిప‌ల్లెలో నారా ఖ‌ర్జురనాయుడు, అమ్మణమ్మల దంపతులకు జన్మించిన చంద్రబాబు..ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రయ్యారు. ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్ల కాలంలో చంద్రబాబు అనేక సవాళ్లు, ప్రతిసవాళ్లను ఎదుర్కొన్నారు. అయినా వాటన్నింటిని ఒక్కొక్కటిగా అధిగమిస్తూ..పార్టీని ముందుండి నడిపిస్తున్నారని టిడిపి నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఎదురైన,.ఎదురవుతున్న అనేక సమస్యలను అవకాశాలుగా మల్చుకుంటూ విజయవంతంగా ముందుకు సాగుతున్నారని టిడిపి నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత సాధారణ ఎన్నికలకు ముందు ఏకంగా 2,817 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి..ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టాంచారు. నవ్యాంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి రెండేళ్లు కావొస్తుంది. ఈ రెండేళ్ళ కాలంలో కూడా సీఎంగా అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ఇంకా చంద్రబాబు ముందు అనేక స‌వాళ్లు ఉన్నాయి.

రోజుకు 18 గంటలు .....

66 ఏళ్ళ వ‌య‌సులో కూడా చంద్రబాబు రోజుకి 18 గంట‌లు పనిచేస్తున్నారు. తెల్లవారుజామున 4గంట‌ల‌కే నిద్రలేచే చంద్రబాబు యోగాతో తన దిన చర్యను ప్రారంభిస్తారు. ఆ తర్వాత మొదలయ్యే అసలు సిసలైన రాజకీయ దినచర్య రాత్రి 12గంటల వరకు కొనసాగుతుంది. ఓ వైపు జిల్లాల పర్యటనలు చేస్తూనే..మరోవైపు విజ‌య‌వాడ‌లోని క్యాంపు ఆఫీస్‌లో రివ్యూలు చేస్తూ అధికారులకు దిశా నిర్దేశం ఇస్తుంటారు. ఇక 66 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు చాలా యాక్టివ్‌గా ఉండడానికి ప్రధాన కారణం ఆయన తీసుకునే మితాహారం అనే చెప్పాలి. ఉదయం ప్లేటు ఇడ్లీ, మధ్యాహ్నం రెండు పుల్కాలు, పండ్లు, రాత్రిపూట చపాతి, పండ్లతో భోజనాన్ని ముగిస్తారు. అందుకే చంద్రబాబు ఎప్పుడు ఎన‌ర్టీటిక్‌గా ఉంటార‌ని పార్టీ నేత‌లు అంటుంటారు. 66వ‌సంతాలు పూర్తిచేసుకుని 67వ వ‌స‌ంతంలోకి అడుగుపెడుతున్న చంద్రబాబు..పుట్టిన రోజు వేడుకల్ని రాష్ట్ర పండువగా జరిపేందుకు తెలుగు తమ్ముళ్లు ఘనంగా ఏర్పాట్లు చేశారు. 

06:25 - April 20, 2016

కడప : ఒంటిమిట్ట కోదండ రామస్వామి కళ్యాణ రాముడయ్యాడు. చక్కదనాల సీతమ్మను మనువాడబోతున్నాడు.. అన్ని క్షేత్రాలకు భిన్నంగా నేడు ఒంటిమిట్టలో జరిగే సీతారాముల కళ్యాణోత్సవానికి ప్రభుత్వం, టిటిడి బోర్డు ఘనంగా ఏర్పాట్లు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున సిఎం చంద్రబాబునాయుడు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. వివాహంలో పాల్గొనడమేగాక కడప జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సిఎం ప్రారంభించనున్నారు. 

కిలో 800 గ్రాముల బంగారు నగల బహూకరణ

నేడు ఒంటిమిట్ట కోదండ రామస్వామి కళ్యాణం కన్నుల పండుగగా జరగనుంది. సాధారణంగా అన్ని రామాలయాల్లో నవమి రోజున కళ్యాణాన్ని నిర్వహిస్తారు. ఒంటిమిట్టలో మాత్రం నవమి వెళ్లిపోయిన కొద్ది రోజులకు వివాహం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో కోదండ రామస్వామి కళ్యాణానికి టిటిడి అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులు వేలాదిగా తరలివచ్చే అవకాశముండడంతో కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సిఎం చంద్రబాబు, గవర్నర్ నరసింహన్‌, పలువురు ప్రముఖులు వస్తున్నందున ప్రభుత్వం 2,500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసింది.

చంద్రుని సమక్షంలో వివాహం ....

ఆలయ సాంప్రదాయం ప్రకారం చంద్రుని సమక్షంలో వివాహం నిర్వహించాల్సి ఉంది. ఇక ప్రభుత్వం సేకరించిన స్థలంలో టిటిడి బోర్డు శాశ్వత కళ్యాణ మండపాన్ని నిర్మించింది. ఇక రాములవారికి బహూకరించేందుకు టిటిడి కిలో 800 గ్రాముల బరువైన బంగారు నగలను తీసుకొస్తున్నట్లు ఈఓ సాంబశివరావు తెలిపారు. భక్తులందరికీ అక్షింతలు అందించేందుకు వంద కిలోల ముత్యాలు, మూడు టన్నుల బియ్యం సిద్ధం చేశారు. 45 వేల మందికి సరిపడా భోజన ప్యాకెట్లను వేసవి కాలం నేపథ్యంలో భక్తులకు సరఫరా చేసేందుకు 7 లక్షల ప్యాకెట్ల నీరు, 2 లక్షల మజ్జిగ ప్యాకెట్లను రెడీ చేశారు. భక్తుల సౌకర్యార్థం ఉచిత బస్సులు, ఆటోలు ఏర్పాటు చేశారు.

సాయంత్రం మూడు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు....

సాయంత్రం మూడు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కడప నుంచి తిరుపతి, చెన్నై వైపు వెళ్లే వాహనాల రాకపోకలు నిలిపివేయనున్నారు. కేవలం భక్తులకు సంబంధించిన వాహనాలు మాత్రమే అనుమతిస్తారు. ఇక వివాహ మహోత్సవంలో పాల్గొనేందుకు సిఎం చంద్రబాబు సాయంత్రం 4.10కి గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం జిల్లాలో 106 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. 5 గంటలా 30 నిమిషాలకు కడప కలెక్టర్ కార్యాలయాన్ని సిఎం ప్రారంభిస్తారు. అక్కడి నుండి బయలుదేరి సాలాబాద్ క్రాస్ వద్దకు చేరుకుంటారు. అక్కడ ఒంటిమిట్ట చెరువుకు సోమశిల నీటిని పంపింగ్ చేసే ఎత్తిపోతల పథకాన్ని, పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. ఒంటిమిట్టలో కొత్తగా నిర్మించిన శ్రీ కోదండరామ హౌసింగ్ కాలనీ ప్రారంభిస్తారు. సుండుపల్లి మండల ప్రజల దాహార్తిని తీర్చేందుకు రోళ్లమడుగు, అన్నమయ్య ప్రాజెక్ట్‌ల నుంచి నీరు అందించే పథకానికి శంకుస్థాపన చేస్తారు.

కోదండ రామాలయాన్ని సందర్శించనున్న చంద్రబాబు...

పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం సిఎం చంద్రబాబు కోదండ రామాలయాన్ని సందర్శించుకుంటారు. రాత్రి 8 గంటలా 30 నిమిషాల నుండి 10 గంటల వరకు జరిగే సీతారామ కళ్యాణంలో సిఎం పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. రాత్రి కడప నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటారు. 21వ తేది ఉదయం 8 గంటలా 55 నిమిషాలకు కడప విమానాశ్రయం నుండి హైదరాబాద్‌కు బయలుదేరి వెళతారు.  

నేడు ఒంటిమిట్టలో కోదండరామయ్య కళ్యాణం

కడప : ఒంటిమిట్ట క్షేత్రం కోదండరామయ్య కల్యాణానికి సర్వాంగ సుం దరంగా ముస్తాబైంది. ఆకాశమంత పందిళ్లు, భూదేవంత అరుగులు వేసి శ్రీరామచంద్రమూర్తి కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఒంటిమిట్ట సమీపంలోని 70 ఎకరాల స్థలంలో రూ.40 లక్షలతో నిర్మించిన నూతన కల్యాణ వేదిక మండపంలో శాసో్త్రక్తంగా జరిగే ఈ కల్యాణోత్సవాన్ని పాంచరాత్ర ఆగమశాస్త్ర పండితులచే నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. బుధవారం రాత్రి 8 గంటలకు హస్త నక్షత్ర యుక్త శుభలగ్నమున కల్యాణం నిర్వహించేందుకు వేదపడితులు నిర్ణయించారు.

నేడు సీఎం చంద్రబాబు 67వ పుట్టిన రోజు

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు బుధవారం తన 67వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన పదకొండోసారి పుట్టిన రోజు జరుపుకొంటుండటం విశేషం. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొమ్మిదిసార్లు జన్మదినం జరుపుకొన్న ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ ముఖ్యమంత్రిగా రెండోసారి జరుపుకొంటున్నారు.

 

కాచిగూడ నింబోలి అడ్డలో కార్డన్ సెర్చ్

హైదరాబాద్ : కాచిగూడలోని నింబోలిఅడ్డలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సోదాలో 250 మంది పోలీసులు పాల్గొన్నారు. పలువురు అనుమానితులను ప్రశ్నించారు.

 

నెట్ లో టెట్ హాల్ టికెట్

హైదరాబాద్ : టెట్ అభ్యర్థులు ఈ రోజు నుంచి హాల్‌టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ జగన్నాథ్ రెడ్డి తెలిపారు. హాల్ టికెట్‌లో తప్పులు సవరించుకునేందుకు ఈ నెల 25నుంచి 29వరకు గడువు ఇచ్చినట్టు వెల్లడించారు.

Don't Miss