Activities calendar

04 May 2016

పోలీసు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి

విశాఖ : కొయ్యూరు మండలం మర్రిపాఠవలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో తూర్పు డివిజన్ మావోయిస్టు అగ్రనేత ఆజాద్, మరో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు. పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. 

22:08 - May 4, 2016

ఢిల్లీ : బాలీవుడ్‌లో పనామా పేపర్ల ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచాన్ని కుదిపేసిన ఈ వ్యవహారంలో తాజాగా మరికొందరు బాలీవుడ్‌ ప్రముఖలు పేర్లు వెలుగులోకొచ్చాయి. అజయ్‌ దేవ్‌గణ్‌, ఆయన భార్య కాజోల్‌ పేర్లు వెల్లడయ్యాయి. 
బాలీవుడ్‌కు కుదిపేస్తోన్న 'పనామా'  
పనామా పేర్ల వ్యవహారం బాలీవుడ్‌కు కుదిపేస్తోంది. విదేశీ బినామీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినవారి బాలీవుడ్‌ ప్రముఖుల పేర్లు ప్రధానంగా బయటకొస్తున్నాయి. ఇప్పటికే  బిగ్‌ బీ అమితా బచ్చన్‌, ఈయన కోడలు  ఐశ్వర్యారాయ్‌, కరీనా కపూర్‌, ఈమె భర్త సైఫ్‌ అలీఖాన్‌, కరిష్మా కపూర్‌ పేర్లు వెలుగులోకి వచ్చాయి. పనామా పేపర్స్‌ వెల్లడించిన ఆరో జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రచారకర్తగా వ్యవహరించేందుకు ముందుకొచ్చిన అజయ్‌ దేవ్‌గన్‌, ఈయన సతీమణి కాజోల్‌ పేర్లు కూడా బహిర్గతమయ్యాయి. 
2013 అక్టోబర్‌ 29 మేర్లీబోన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఏర్పాటు 
బ్రిటీష్‌ వర్జిన్‌ దీవులకు చెందిన మేర్లీబోన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీలో అజయ్‌ దేవ్‌గణ్‌  వెయ్యి షేర్లు కొన్నట్టు పనామా  పేపర్లులో బయటపడింది.ఈ కంపెనీకి మొసాక్‌ ఫొన్సెకా  సంస్థ రిజిస్టర్ట్‌ ఏజెంట్‌గా వ్యవహరించింది. హసన్‌ ఎన్‌ సయానీ  2013 అక్టోబర్‌ 29న మేర్లీబోన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను నమోదు చేశారు. 2013 అక్టోబర్‌ 31 ఈ కంపెనీలోని మొత్తం షేర్లను అయజ్‌ దేవ్‌గణ్‌ కొనుగోలు చేసినట్టు పనామా పత్రాలు చెబుతున్నాయి. తద్వారా కంపెనీకి డైరెక్టర్‌ అయ్యారు. 
నైసా యుగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ద్వారా పెట్టుబడులు - అనిల్‌ శేఖ్రీ
అయితే  భారతీయ రిజర్వు బ్యాంకు మార్గదర్శకాల ప్రకారమే మన దేశం నుంచి  విదేశాల్లో  ప్రత్యక్ష పెట్టుబడుల పెట్టేందుకు ఈ కంపెనీని ఏర్పాటు చేసినట్టు అజయ్‌ దేవ్‌గణ్‌ చెబుతున్నారు. చట్టప్రకారం పన్నులు కూడా చెల్లిస్తున్నామన్న వాదాన్ని వినిపిస్తున్నారు. అజయ్‌ దేవ్‌గణ్‌, కాజోల్‌ దేవ్‌గణ్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన భాగస్వామ్య సంస్థ  నైసా యుగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ద్వారా పెట్టుబడులు పెట్టిన విషయం వాస్తవమేనని దేవ్‌గణ్‌ కుటుంబానికి చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా పని చేస్తున్న అనిల్‌ శేఖ్రీ చెబుతున్నారు. విదేశాల్లో వ్యాపారాల లావాదేవీలు కొనసాగించడంతోపాటు, హిందీ సినిమాలను విదేశాల్లో ప్రదర్శించేందకు హక్కుల కొనుగోలుకు నైసా యుగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను రిజిస్టర్‌ చేశామన్న వాదాన్ని వినిపిస్తున్నారు. మేర్లీబోన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ డైరెక్టర్‌గా  అజయ్‌ దేవ్‌గణ్‌ 2014 డిసెంబర్‌ 15 రాజీనామా చేశారు.  ఆ తర్వాత ఈఎఫ్‌జీ ట్రస్ట్‌ కంపెనీ లిమిటెడ్‌, ఈఎఫ్‌జీ నామినీస్‌ లిమిటెడ్‌... కంపెనీలు చెందిన ప్రతినిధులు  మెర్లీబోన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కు డైరెక్టర్లు వ్యవహరించారు. 

 

22:04 - May 4, 2016

ఢిల్లీ : అగస్టా స్కాంపై రాజ్యసభలో వాడి వేడి చర్చ జరిగింది. సోనియా గాంధీ టార్గెట్‌గా బిజెపి విమర్శలు సంధించింది. అధికారపక్షం ఆధార్లాలేకుండా ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్‌ ధ్వజమెత్తింది. సోనియాగాంధీపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని స్పష్టం చేసింది. అయితే భారత్‌లో వినియోగించే హెలికాప్టర్లకు విదేశాల్లో ఎందుకు పరీక్షలు నిర్వహించారో అప్పటి ప్రభుత్వం సమాధానం చెప్పాలని బిజెపి డిమాండ్‌ చేసింది. 

22:00 - May 4, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. టీడీపీ ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి జయంత్‌సిన్హా లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. రెవెన్యూ లోటు భర్తీ గురించి విభజన చట్టంలో లేదని..ప్రత్యేక హోదా కోసం నిబంధనలు మార్చలేమని జయంత్‌ సిన్హా  స్పష్టం చేశారు. నీతి ఆయోగ్‌ సిఫార్సులకు అనుగుణంగా ఏపీకి నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు కేంద్రం తీరుపై ఏపీ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
హోదాపై చేతులెత్తేసిన కేంద్రం  
ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం చేతులెత్తేసింది. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కుండబద్దలు కొట్టింది. 14వ ఆర్థిక సంఘం నిబంధనల మేరకు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రక్రియలో.. మార్పులు చేసే ప్రతిపాదన లేదని కేంద్రమంత్రి జయంత్‌ సిన్హా స్పష్టం చేశారు. అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని సిన్హా స్పష్టం చేశారు. అయితే పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి అవసరమైన మేరకు ప్రత్యేక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. నీతి ఆయోగ్‌ సిఫార్సులకు అనుగుణంగా ఏపీకి నిధులు మంజూరు చేస్తామని కేంద్రమంత్రి జయంత్‌ సిన్హా  చెప్పారు.  
కేంద్రం నిర్లక్ష్య వైఖరి పట్ల ఎపి ప్రభుత్వం ఆగ్రహం 
ప్రత్యేక హోదా అంశంలో కేంద్రం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారా ..? లేదా అనే అంశాన్ని స్పష్టం చేయాలని డిమాండ్‌ చేస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రమంత్రి జయంత్‌ సిన్హా చేసిన ప్రకటన తమకు బాధ కలిగించిందని ఎంపీ గల్లా జయదేవ్‌ లోక్‌సభలో ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. కేంద్రమంత్రి ప్రకటన... ఆనాడు సభలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీకి విలువ లేకుండా చేసిందన్నారు.
ఆ రాష్ట్రాలకు ఎలా ఇచ్చారన్న గల్లా..
14వ ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వలేమని ప్రకటన చేసిన కేంద్రమంత్రి... ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాలకు ఎవరి సిఫార్సుతో ప్రత్యేక హోదా ఇచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. యూపీఏ, ఎన్టీయే నేతల మాటలతో మోసపోయామన్న భావన ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో కలుగుతోందని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. అరకొర నిధులతో పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలని గల్లా డిమాండ్ చేశారు.
కేంద్రం రాష్ట్రాన్ని అవమాన పరుస్తోంది : చంద్రబాబు  
ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం రాష్ట్రాన్ని అవమాన పరుస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే హోదా, నిధులు ఇవ్వాలని ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా కేంద్రం పట్టించుకోవడం లేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి ప్రత్యేక హోదా అంశంలో కేంద్ర ప్రభుత్వం, ఏపీ సర్కార్‌ల మధ్య ఢీ అంటే ఢీ అన్న పరిస్థితి తలెత్తినట్లేనని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. 

21:53 - May 4, 2016

జూన్ రెండు నాడు సంపూర్ణ తెలంగాణ...జెండెగిరేసి దండబెట్టవోతున్న సీఎం, మూడు వేల సర్కారు బళ్లకు తాళాలు.. కేజీ టు పీజీ చదువుకు ఇవేనా మేళాలు, దిష్టిగుమ్మడికాయచేతులవట్టిన సునీతక్క.. నిప్పు కిందవడేసి.. కాయవల్గొట్టిన వనిత.. చదువులతల్లికి చదివేరాదంటున్న పెద్దమనిషి..స్మృతిఇరానీ పట్టా కాయిదాలకోసం పట్టు, పాల్వంచ మండలంల నీళ్లు కరువు.. మురుగునీళ్లే అక్కడి జనంకు ఆదెరువు, కరీంనగర్ బాయిల చిరుతపులి గడ్డపార ఈత.. సిరిసిల్ల కాడ ఎవ్వరినోటజూసిన ఇదే మోత... నీఎంక జగదీష్ రెడ్డి వుంటే.. నా ఎంక కేసీఆర్ ఉన్నరు.. ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం..

 

21:37 - May 4, 2016

ఉత్తరాఖండ్‌ : మే 6న ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో బల నిరూపణ జరగనుంది. ఈ విషయాన్ని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో బల పరీక్ష నిర్వహించడానికి మే ఆరులోపు తెలపాలని సుప్రీంకోర్టు మంగళవారం కేంద్రాన్ని ఆదేశించింది. ఈ మేరకు కేంద్రం బలపరీక్షను శుక్రవారం నిర్వహించాలని నిర్ణయించింది. బల పరీక్షను కేంద్రం పర్యవేక్షణలో పారదర్శకంగా నిర్వహించాలని తెలిపింది.  తాను బలపరీక్ష నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి హరీష్‌ రావత్‌ తెలిపారు. కేంద్రమే తాత్సారం చేస్తోందన్నారు. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ  హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే.

 

21:36 - May 4, 2016

హైదరాబాద్ : దర్శకరత్న దాసరి నారాయణరావు 72వ జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. తన పుట్టినరోజు వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికీ దాసరి కృతజ్ఞతలు తెలిపారు. తన కుటుంబసభ్యులతో పాటు.. అభిమానులు, మిత్రులు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ అభిమానులు హాజరయ్యారు.

గజ్వేల్ మార్కెట్ యార్డులో తడిసిన రెండు వేల బస్తాల ధాన్యం

మెదక్ : అకాల వర్షానికి గజ్వేల్ మార్కెట్ యార్డులో రెండు వేల బస్తాల ధాన్యం తడిసింది. అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ రైతులు ఆందోళన చేపట్టారు. 

21:14 - May 4, 2016

హైదరాబాద్ : పైకేమో ప్రాజెక్టులను వ్యతిరేకిస్తుంటారు..! నీటి ప్రాజెక్టుల్ని ఎలా నిర్మిస్తారో చూస్తామంటూ హూంకరిస్తారు. దీక్షలకూ సిద్ధమవుతారు. కానీ అవే ప్రాజెక్టుల కాంట్రాక్టులను తమ అనుయాయులే దక్కించుంటే మాత్రం కిమ్మనరు. తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్న వైఎస్సార్సీపీ ద్వంద్వనీతికి నిదర్శనమిది. రాజకీయం వేరు.. కాంట్రాక్టులు వేరు అన్న తీరులో సాగుతున్న వైసీపీ తంతుపై 10టివి స్పెషల్‌ స్టోరీ.
ప్రాజెక్టులు దక్కించుకున్నది ఎవరో తెలుసా..?
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. మొత్తం 18 ప్యాకేజీల్లో కీలకం.. నర్సాపూర్‌, కరివెన జలాశయాల నిర్మాణం. నర్సాపూర్‌ జలాశయం నిర్మాణ విలువ రూ762.11 కోట్లు.. కరివెన జలాశయం నిర్మాణం విలువ రూ 800 కోట్లు.. ఇంతటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు దక్కించుకున్నది ఎవరో తెలుసా..? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన పిఎల్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్, రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సంస్థలు నర్సాపూర్‌ జలాశయాన్నిసంయుక్తంగా సొంతం చేసుకున్నాయి. ఇక కరివెన జలాశయం పనులను గంపగుత్తగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంస్థే దక్కించుకుంది. ఈ రెండు జలాశయాలపనులు దక్కించుకున్న చిత్తూరు జిల్లా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వీరిద్దరు వైఎస్సార్సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహిత.. నమ్మకస్తులైన.. అనుయాయులు.
కారెక్కిన పొంగులేటి
ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి టెక్నికల్‌గా వైఎస్సార్సీపీ నేతే. పైగా ముందునుంచీ వైసీపీ అధినేత జగన్‌కు అత్యంత సన్నిహితుడు. కానీ ఈయన కారెక్కేశారు. బహుశా కాంట్రాక్టు దక్కడానికి, ఆయన టీఆర్ఎస్‌లో చేరడానికి ఏమైనా సంబంధం ఉందా..?
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై జగన్ విముఖత
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై.. వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి అరిచి గీ పెడుతున్నారు. ప్రజల మద్దతు కోసం కర్నూలులో మూడు రోజుల దీక్షకూ సన్నద్ధమయ్యారు. అయితే ఆయనకు అత్యంత నమ్మకస్తులైన నాయకులే.. ఆయన వ్యతిరేకిస్తున్న ప్రాజెక్టు కాంట్రాక్టులు దక్కించుకోవడం విస్మయాన్ని కలిగించక మానదు. వైసీపీ నాయకులు మాత్రం రాజకీయం వేరు.. వ్యాపారం వేరు అంటూ తమదైన వాదాన్ని వినిపిస్తున్నారు.
వైసీపీ నేతల ద్వంద్వ వైఖరి
వైసీపీ నేతల ద్వంద్వ వైఖరి విమర్శలకు గురవుతోంది. చెప్పేవి శ్రీరంగనీతులు.. దూరేవి అవేవో కొంపలు అన్న చందాన ఆపార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని.. టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. జగన్‌ దీక్షలో చిత్తశుద్ధిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ పోరుపై ప్రజల్లో అనుమానాలు
మొత్తమ్మీద తెలంగాణ నిర్మిస్తోన్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా వైసీపీ తలపెట్టిన పోరుపై ప్రజల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. తాను వ్యతిరేకిస్తున్న ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కించుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఒత్తిడి తెచ్చి.. సదరు పనులు మానుకునేలా చేస్తారా..? లేక తానే రాజీపడతారా..? ఇంతకీ జగన్‌ దీక్షలు, ఆందోళనలు నిజంగానే జనం కోసమా..? ప్రజల నుంచి వెల్లువెత్తుతోన్న ఈ ప్రశ్నలకు జగన్‌ సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

 

21:02 - May 4, 2016

ఢిల్లీ : ఆగస్టా వెస్ట్ లాండ్‌ కుంభకోణంలో గత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి బ్రదర్‌ అనిల్‌ పాత్ర ఉందని ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. 2002లో హస్కీ అనే వ్యక్తి ఖమ్మంలో భూములు కొనుగోలు చేశారని... ఈ వ్యవహారంలో అనిల్‌ కుమార్‌, హస్కీలపై కేసులు నమోదయ్యాయని ఆరోపించారు. హస్కీ... ఆగస్టా స్కాంలో కీలకమైన వ్యక్తని... అతనికి వైఎస్‌తో పాటు... బ్రదర్‌ అనిల్‌తో సంబంధాలున్నారని ఆరోపించారు. ఈ అంశంపై విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

20:43 - May 4, 2016

శ్రీకాకుళం : నీళ్ల విషయంలో ఎపి ప్రజల హక్కుల కోసం పోరాడాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. గోదావరి, నాగావళి, పెన్నానది పై భాగంలో ప్రాజెక్టులు కడితే ఎపి ప్రజలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నాగావళి నుంచి వంశధారకు కాలువలు తవ్వితే గ్రావిటీతో నీళ్లు వస్తాయని తెలిపారు. భారతదేశంలో నూతనంగా రెయిన్ గన్ ప్రాజెక్టును తీసుకొచ్చామని చెప్పారు. నీళ్ల కోసం వినూత్నమైన ఆలోచనలకు ఆజ్యం పోయాల్సిన అవసరముందన్నారు. సంవత్సరంలో పట్టిసీమ పూర్తి చేసి..గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసిన ఘనత ఎపి సర్కార్ దే అన్నారు. సముద్రజలంతో పంటలు పండవని చెప్పారు. ఒక్కో గ్రామంలో వంద పంటకుంటలు చేయాలని సూచించారు. ఇంకుడు గుంతలు బ్రహ్మాండంగా చేశారని ప్రశంసించారు. రెయిన్ గన్ ద్వారా పంటలకు ఒక తడి, రెండు తడుల నీటిని ఇస్తామని చెప్పారు. 15 వేల రెయిన్ మిషన్ గన్ లకు ఆర్డర్ ఇచ్చామని చెప్పారు. భారత దేశంలో వినూత్నంగా రెయిన్ గన్ కాన్సెప్టు తీసుకొచ్చామని తెలిపారు. దూరదృష్టితో ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. 8350 చెరువులున్నాయని.. వాటిని కలపాల్సిన అవసరం ఉందన్నారు.

 

ఈదురు గాలులకు విరిగిపడిన హోర్డింగ్స్

హైదరాబాద్ : నగరంలో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు పలు చోట్ల హోర్డింగ్స్ విరిగిపడ్డాయి. పలు కాలనీల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ప్యారడైజ్ లో చెట్టు విరిగిపడింది. 

19:47 - May 4, 2016

హైదరాబాద్ : జూన్‌ తరుముకొస్తోంది.. కొత్త రాజధాని అమరావతికి ఉద్యోగుల తరలింపు ప్రక్రియకూ సమయం సమీపిస్తోంది. జూన్‌కల్లా 80శాతం ఉద్యోగులను తరలించేందుకు ఏపీ సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. అదే సమయంలో ఉద్యోగుల అభ్యంతరాలనూ తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది. కొత్త రాజధానికి ఎవరెవరు ముందు వెళతారన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.
జూన్‌లోపు ఫస్ట్ బ్యాచ్‌ తరలింపు
తాత్కాలిక సచివాలయానికి ఉద్యోగుల తరలింపుపై ఏపీ సర్కార్‌ దృష్టి పెట్టింది. ఫస్ట్ బ్యాచ్‌ను జూన్‌లో తరలించనుంది. అక్కడికి వెళ్లే ఉద్యోగుల అభ్యంతరాలనూ పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. స్థానికత అంశంపైనే ఉద్యోగులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు హైదరాబాద్‌లో చదవడం వల్ల కొత్త రాజధానికి వెళితే స్థానికేతరులు అవుతారని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. హెచ్‌ఆర్‌తో పాటు ఐదు రోజుల పనిదినాల అంశంపైనా ప్రభుత్వం ఇటీవలే ఓ క్లారిటీ ఇచ్చింది. మిగిలిన సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి నారాయణ భేటీ అవుతున్నారు. ఉద్యోగులను ఒప్పించి మూడు దశల్లో వారిని అమరావతికి తరలించాలని, ప్రక్రియను ఆగస్టు నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల రెండో వారంలో దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

 

19:41 - May 4, 2016

హైదరాబాద్ : ఏపీలో భారీ ఎత్తున ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. 25 మంది ఐపీఎస్ లకు స్థానచలనం కలిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో కొందరికి పదోన్నతులిచ్చి బదిలీ చేసింది. 
పోలీసు శాఖలో భారీ మార్పులు
ఏపీ ప్రభుత్వం పోలీసు శాఖలో భారీ మార్పులు చేసింది. 25 మంది ఐపీఎస్‌లకు స్థానచలనం కల్పించింది. పలువురికి పదోన్నతులు కల్పించిబదిలీ చేసింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఏఆర్ అనురాధను నియమించారు. విశాఖ సీపీగా ఉన్న అమిత్‌ గార్గ్‌ను.. పోలీస్‌ లాజిస్టిక్‌ కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో పి.యోగానంద్‌ను నియమించారు. పీటీవో ఐజీగా  వి.వేణుగోపాలకృష్ణ, సీఐడీ ఐజీగా  కె.సత్యనారాయణను ప్రభుత్వం నియమించింది.  
ఇంటెలిజెన్స్ ఐజీగా మహేష్‌చంద్ర లడ్హా 
ఇంటెలిజెన్స్ ఐజీగా మహేష్‌చంద్ర లడ్హా, ట్రైనింగ్ ఐజీగా ఎ.రవిచంద్ర, ఎస్ఐబీ ఐజీగా వి.శ్రీనివాసులు, సౌత్‌జోన్ ఐజీగా ఎన్.శ్రీధర్, ఐజీ (లీగల్‌) గా ఇ.దామోదర్‌లను నియమించింది. అలాగే ఎక్సైజ్ డైరెక్టర్‌గా కె.వెంకటేశ్వరరావును, కంట్రోలర్ లీగల్‌మెట్రాలజీ ఐజీగా ఎ.సుందరకుమార్ దాస్‌ను, ఏలూరు డీఐజీగా పీఎస్ రామకృష్ణను, విజయవాడ జాయింట్ సీపీ గా  హరికుమార్‌ను, అనంతపురం డీఐజీగా ఎ.ప్రభాకర్‌రావును ప్రభుత్వం నియమించింది. 
విశాఖపట్నం డీఐజీగా శ్రీకాంత్
విశాఖపట్నం డీఐజీగా శ్రీకాంత్, విశాఖ జాయింట్ సీపీగా ఏఎస్‌ఖాన్, శ్రీకాకుళం ఎస్పీగా జె.బ్రహ్మారెడ్డి, కడప ఎస్పీగా రామకృష్ణ, తిరుపతి అర్బన్ ఎస్పీగా ఆర్‌.జయలక్ష్మి, సెక్యూరిటీ డీఐజీగా ఎ.సత్యనారాయణ, ప్రకాశం ఎస్పీగా సీఎం త్రివిక్రమవర్మ, విశాఖ రూరల్ ఎస్పీగా రాహుల్ దేవ్‌శర్మ, రాజమండ్రి అర్బన్ ఎస్పీగా బి.రాజకుమారి, విజయనగరం ఎస్పీగా ఎల్‌కేవీ రంగారావులను ప్రభుత్వం నియమించింది. అగర్వాల్, బీఎన్ దీప్తి, కోయ ప్రవీణ్, హరికృష్ణ, నవీన్ గులాటి, గోపీనాథ్ జెట్టిలను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 

 

19:31 - May 4, 2016

శ్రీకాకుళం : జిల్లాలో నాగావళి, వంశధార నదులను అనుసంధానం చేసి తొమ్మిది లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన తొలుతగా రూరల్ మండలం లోని కిల్లిపాలెం వద్ద పది కోట్ల రూపాయలతో నిర్మించిన సురక్షిత త్రాగునీటి పధకాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ ఇంటికి కుళాయి కనెక్షన్, అందరికీ వంట గ్యాస్ అందించడమే రానున్న రోజుల్లో లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

 

19:28 - May 4, 2016

విశాఖ : అచ్యుతాపురం- బ్రాండెక్స్ కంపెనీ కార్మికులకు వైసీపీ అధినేత జగన్‌ అండగా నిలిచారు. కార్మికులకు కనీస వేతనం 10 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మహిళాకార్మికులపై పని ఒత్తిడి, వేధింపులు సరికాదని జగన్‌ అన్నారు. ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందుతున్న బ్రాండిక్స్ యాజమాన్యం కార్మికుల శ్రమను దోచుకోవడం సరికాదన్నారు. కనీస వేతనం అమలు చేసేవరకు ప్రభుత్వంతో పోరాడుతామని జగన్‌ కార్మికులకు హామీ ఇచ్చారు. 

19:25 - May 4, 2016

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై కేంద్రమంత్రి జయంత్‌ సిన్హా చేసిన ప్రకటన తమకు బాధ కలిగించిందని ఎంపీ గల్లా జయదేవ్‌ లోక్‌సభలో ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. కేంద్రమంత్రి ప్రకటన... ఆనాడు సభలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీకి విలువ లేకుండా చేసిందన్నారు. 14వ ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వలేమని ప్రకటన చేసిన కేంద్రమంత్రి... ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాలకు ఎవరి సిఫార్సుతో ప్రత్యేక హోదా ఇచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. యూపీఏ, ఎన్టీయే నేతల మాటలతో మోసపోయామన్న భావన ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో కలుగుతోందని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. అరకొర నిధులతో పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలని గల్లా డిమాండ్ చేశారు. 

 

గుంటలో కలుషిత నీరు తాగి 25 గొర్రెలు మృతి

నల్గొండ : గుంటలో కలుషిత నీరు తాగి 25 గొర్రెలు మృతి చెందాయి. ఈ సంఘటన నల్గొండ జిల్లా చింతపల్లి మండలం వర్కాల గ్రామంలో చోటుచేసుకుంది. పశువైద్యాధికారులు వచ్చి గొర్రెలకు పోస్టుమార్టం నిర్వహించారు. రెవెన్యూ అధికారులు పంచనామా చేశారు. తనకు ప్రభుత్వం తరపు నుంచి నష్టపరిహారం ఇప్పించాలని గొర్రెల యజమాని సత్తయ్య వేడుకున్నారు.

తిరుపతి మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం....

చిత్తూరు : తిరుమల తిరుపతి మొదటి ఘాట్ రోడ్డు 41వ మలుపు వద్ద బుధవారం ప్రమాదం చోటు చేసుకుంది. భక్తులతో వెళ్తున్న క్వాలీస్ వాహనం పిట్టగోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు భక్తులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.... క్షతగాత్రులను తిరుపతిలోని స్విమ్స్కు తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

ఎమిరేట్స్ విమానంలో భారీ చోరీ

హైదరాబాద్ : ఎమిరేట్స్ విమానంలో సోమవారం భారీ చోరీ జరిగింది. టర్కీ నుంచి హాంగ్ కాంగ్ వస్తున్న ఓ ప్రయాణికుడి వస్తువులు గాల్లోనే మాయం అయ్యాయి. ఆ వస్తువుల విలువ సుమారు 26 వేల డాలర్లు ఉంటుందని అంచనా. అందులో ఖరీదైన రెండు వాచ్‌లు, విదేశీ కరెన్స్ ఉన్నాయి. విమానంలో పెట్టిన లగేజీ నుంచి ఆ వస్తువులు చోరీ అయినట్లు అర్థమవుతోంది. టర్కీకి చెందిన ఓ వ్యాపారవేత్తకు ఆ చేదు అనుభవం ఎదురైంది. తన వస్తువులు కనబడకపోవడంతో అతను హాంగ్‌కాంగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎగురుతున్న విమానాల్లో ఇటీవల దొంగతనాల జరుగుతున్న సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.

హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం

హైదరాబాద్ : నగరంలోని పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. బలంగా ఈదురు గాలులు వీస్తున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. అయితే వర్షం, గాలులతో వాతావరణం చల్లబడింది. 

ప్రాజెక్టులకు అడ్డుపడితే ఊరుకోం : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణలో నిర్మితమవుతున్న ప్రాజెక్టులకు ఎపి సర్కార్, నేతలు అడ్డుపడితే సహించేదిలేదని.. ఎంతకైనా తెగిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. ఎపిలో చంద్రబాబు, జగన్ లు రాజీయ అవసరాల కోసం తమపై యుద్ధ ప్రకటిస్తున్నారని మండిపడ్డారు. ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నదులపై చేపడుతున్న ప్రాజెక్టులకు గత ప్రభుత్వ హయాంలోనే కేటాయింపులు జరిగాయిని.. ఇప్పుడు కొత్తగా కేటాయింపులు లేవన్నారు. తాము ఎలాంటి నిబంధనల ఉల్లంఘనకు పాల్పడం లేదన్నారు.

17:52 - May 4, 2016

హైదరాబాద్ : తెలంగాణలో నిర్మితమవుతున్న ప్రాజెక్టులకు ఎపి సర్కార్, నేతలు అడ్డుపడితే సహించేదిలేదని.. ఎంతకైనా తెగిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. ఎపిలో చంద్రబాబు, జగన్ లు రాజీయ అవసరాల కోసం తమపై యుద్ధ ప్రకటిస్తున్నారని మండిపడ్డారు. ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నదులపై చేపడుతున్న ప్రాజెక్టులకు గత ప్రభుత్వ హయాంలోనే కేటాయింపులు జరిగాయిని.. ఇప్పుడు కొత్తగా కేటాయింపులు లేవన్నారు. తాము ఎలాంటి నిబంధనల ఉల్లంఘనకు పాల్పడం లేదన్నారు. తెలంగాణ ప్రజల దాహార్తిని తీర్చేందుకే, సాగునీరుకోసమే ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని తెలిపారు. వాటికి అడ్డుపొడద్దని హితవు పలికారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మిస్తే ఎపి నేతలకు కడుపు మంటగా ఉందని మండిపడ్డారు. దేనికోసం తమపై ఎపి నేతలు యుద్ధం ప్రకటిస్తున్నారని ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగిందన్నారు. గోదావరి నుంచి తెలంగాణకు నీళ్లు తీసుకోవడం కష్టమైన పని అన్నారు. 500 మీటర్ల ఎత్తుకు తీసుకురావాలన్నారు. తెలంగాణలో 24 లక్షల బోర్ వెల్ పంపు సెట్లు ఉన్నాయని తెలిపారు. 30 నుంచి 35 వేల కోట్ల రూపాయలను బోర్ల కోసం రైతులు భూమిలో పోసిండ్రని ఆవేదన వ్యక్తం చేశారు. జనం తాగు, సాగు నీటి కోసం అల్లాడుతున్నారని పేర్కొన్నారు. ఏది ఏమైనా.. భూకంపం వచ్చినా, ఎవరు అడ్డువచ్చినా ప్రాజెక్టులు నిర్మించి తీరుతామని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరు వచ్చి తీరాలన్నారు. ప్రజల మధ్య విష బీజాలు నాటితే మంచిదికాదన్నారు. తాము పక్క రాష్ట్రాలతో పంచాయతీలు పెట్టుకోదలుచుకోలేదన్నారు. కర్నాటక, మహారాష్ట్రలతో మంచి సంబంధాలను కొనసాగిస్తామని చెప్పారు. ఎపి, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లా ఉందామన్నారు. కానీ ఎపి ప్రభుత్వం, నేతలు ప్రాజెక్టులకు అడ్డుపడితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. దేనికైనా సిద్ధమే అని చెప్పారు.  
చంద్రబాబు కడుపులో కత్తిపెట్టుకుని..నోటితో తీపిగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఎపి సర్కార్ బెదిరింపులకు భయపడబోమని చెప్పారు. 'మీరు ఇటుక కొడితే మేము రాయితో కొడతామని' హెచ్చరించారు. గోదావరిలో నీటిని తీసుకునే దమ్ము చంద్రబాబు, జగన్ లకు ఉందా అని అడిగారు. గోదావరిలో చాలా నీరు ఉందని వాటిని తీసుకోవాలన్నారు. గోదావరి, కృష్ణా నదులపై తెలంగాణ ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులకు ఎపి ప్రభుత్వం అడ్డుపడడం సరికాదన్నారు.

 

17:27 - May 4, 2016

హైదరాబాద్ : ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు టీఆర్ ఎస్ లో చేరారు. తెలంగాణ వైసీపీ శాఖను టీఆర్ ఎస్ లో విలీనం చేశారు. సీఎం కేసీఆర్ సమక్షంలో శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర్లు టీఆర్ ఎస్ లో చేరారు. సీఎం వారిపై గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వీరితోపాటు పలువురు టీఆర్ ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ తెలంగాణలో నిర్మితమవుతున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జగన్ దీక్ష చేస్తున్న తరుణంలో తాను వైసీపీకి రాజీనామా చేశానని తెలిపారు. తెలంగాణ బిడ్డగా రాష్ట్ర అభివృద్ధి కోసమే పార్టీలో చేరారని తెలిపారు. మిషన్ కాకతీయ పథకం అద్భుతమన్నారు. కేసీఆర్ బుల్లెట్ లీడర్ అని అభివర్ణించారు. 'మనం పౌరుషం చూపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం పాటుపడతానని చెప్పారు. తుమ్మల వెంకటేశ్వరరావు గెలుపు కోసం కృషి చేస్తామన్నారు.

ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వలేం : సిన్హా

హైదరాబాద్ : 14వ ఆర్థిక సంఘం నిబంధనల మేరకు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రక్రియలో మార్పులు చేసే ప్రతిపాదన లేదని కేంద్రమంత్రి జయంత్‌ సిన్హా స్పష్టం చేశారు. అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి అవసరమైన మేరకు ప్రత్యేక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. 

వడదెబ్బతో ఇద్దరు ఉపాధికూలీలు మృతి

హైదరాబాద్ : రోజురోజుకూ ఎండ ప్రతాపం పెరగడంతో ఈరోజు ఎండవేడి తట్టుకోలేక వడదెబ్బతో ఇద్దరు ఉపాధికూలీలు మృతిచెందారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా హోలగుండ మండలం వందవాగిలి గ్రామంలో దేవమ్మ(35) అనే మృతిచెందగా, మెదక్‌ జిల్లా నారయణ్‌ఖేడ్ మండలం జూకల్కు గ్రామంలో మాగయ్య (55) అనే కూలీ వడదెబ్బతో మృతిచెందాడు.

ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందిస్తాం : అరికెపపూడి

హైదరాబాద్ : ఎల్లమ్మబండలో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన వెయ్యి పడకల ఆసుపత్రి స్థలాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి పరిశీలించారు. ఆయన వెంట స్థానిక శాసన సభ్యుడు అరికెపూడి గాంధీ ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆసుపత్రి పనులు త్వరగా ముగించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. నగరంలో మరో రెండు పెద్ద ఆసుపత్రులు నిర్మిస్తున్నామని ప్రజలకు ఉచిత, మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు.

16:27 - May 4, 2016

హైదరాబాద్ : ఎపికి ప్రత్యేక హోదా అంశంపై ఇంతకాలం ఆడిన దాగుడు మూతలకు తెరపడింది. ఎపికి కేంద్రం మొండిచేయిచూపించింది. ప్రత్యేక హోదా ఇస్తామని చేసిన హామీలను తుంగలో తొక్కింది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అన్ని హామీలు అమలుకు నోచుకోవని మరోసారి రుజువు అయింది. ఎపిని ఆదుకుంటామని చెప్పిన కేంద్రం మాట వట్టిదే అని తేలిపోయింది. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి జయంత్‌సిన్హా  లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. రెవెన్యూ లోటు భర్తీ గురించి విభజన చట్టంలో లేదని.. ప్రత్యేక హోదా కోసం నిబంధనలు మార్చలేమని జయంత్‌ సిన్హా  స్పష్టం చేశారు. నీతి ఆయోగ్‌ సిఫార్సులకు అనుగుణంగా ఏపీకి నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. 2014-15లో 4 వేల 403 కోట్ల రూపాయలు ఇచ్చామని.. 2015-16 సంవత్సరంలో 2 వేల కోట్లు విడుదల చేసినట్లు సిన్హా  తెలిపారు.

 

16:04 - May 4, 2016

ముస్లీంలు రెండు పద్ధతుల్లో విడాకులు తీసుకుంటారని లాయర్ పార్వతి అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన మానవి మైరైట్ చర్చ కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. కుల, ముబారత్ రెండు పద్ధతుల్లో ముస్లీంలు విడాకులు తీసుకుంటారని చెప్పారు. కుల పద్ధతిలో విడాకుల ప్రతిపాదన భార్య దగ్గర నుంచి రావాలన్నారు. భర్త ఇష్టం లేనప్పుడు అతన్నుంచి మొదట భార్య విడాకులు తీసుకునే విధానం. రెండో పద్ధతిని ముబారత్ అంటారు. ఇద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకునే పద్ధతిని ముబారత్ అంటారు. భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. కోర్టు ద్వారా కూడా విడాకులు తీసుకుంటారని తెలిపారు. నాలుగు సంవత్సరాలుగా భర్త ఆచూకీ తెలియనప్పుడు మహిళలు కోర్టు ద్వారా విడాకులు తీసుకోవచ్చన్నారు. మూడేళ్లుగా భర్త వైవాహిక జీవితానికి దూరంగా, శారరీక సంబంధాలు లేకున్న భర్త నుంచి భార్య విడాకులు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

15:51 - May 4, 2016

అనంతపురం : తాగునీటికి ఇబ్బంది పడుతున్న గ్రామాల్లో ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేస్తున్నామని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. అనంతపురంలోని మున్సిపల్‌ గెస్ట్ హౌస్‌లో శాంతి భద్రతలు, కరవు వంటి అంశాలపై ఆయన సమావేశం నిర్వహించారు. కరవు నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని అన్నారు. వివిధ శాఖల్లో 20 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిందని అన్నారు. పోలీస్‌శాఖలోనే ఎక్కువ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని దశలవారీగా భర్తీ చేస్తామని తెలిపారు. 

 

15:46 - May 4, 2016

విశాఖ : జిల్లాలోని అచ్యుతాపురం మండలంలో బ్రాండిక్స్ కంపెనీ కార్మికులకు మద్దతుగా వామపక్ష నేతలు పర్యటించారు. తిమ్మరాజుపేట, హరిపాలెం, పూడిమడక గ్రామాల్లో పర్యటించి కార్మికుల సమస్యలను అడిగితెలుసుకున్నారు. బ్రాండిక్స్ కంపెనీ కార్మికులకు కనీస వేతనంగా పది వేల రూపాయలు ఇచ్చేవరకు పోరాడతామని అన్నారు.  

 

కావాలని నిబంధనలు మార్చారు : అభిషేక్ మను సింఘ్వీ

ఢిల్లీ : రాజ్యసభలో అగస్టా కుంభకోణంపై చర్చ జరిగింది. ఎంఐ8 హెలికాపర్లను మార్చాలని 1999 లో ప్రతిపాదన వచ్చిందని అభిషేక్ మను సింఘ్వీ తెలిపారు. తొలుత 6 కి.మీ ఎత్తులో ఎగిరే హెలికాప్టర్లు కావాలని ప్రతిపాదన ఉండేదన్నారు. 2003 డిసెంబర్ 22న 4500 కి.మీ ఎత్తులో ఎగిరే హెలికాప్టర్లు కావాలని నిబంధనలు మార్చారని తెలిపారు. 

అగస్టాకు అనుగుణంగా నిబంధనలు మార్చారు : భూపేందర్ యాదవ్

ఢిల్లీ : రాజ్యసభలో అగస్టా కుంభకోణంపై చర్చ జరిగింది. అగస్టాకు అనుగుణంగా నిబంధనలు మార్చారని భూపేందర్ యాదవ్ తెలిపారు. 8 హెలికాప్టర్లు అవసరముంటే 12 హెలికాప్టర్లు కొన్నారని తెలిపారు. ఒక కంపెనీ నుంచే కొనుగోలు చేయాలని నిర్ణయం చేయలేదని చెప్పారు. 

దోపిడీకి ప్రయత్నించి బయపడి పారిపోయారు : సీపీ ఆనంద్

హైదరాబాద్ : కాటేదాన్ కాల్పుల ఘటనలో రాహుల్ శర్మ వికాశ్ లను అరెస్టు చేశామని సైబరాబాద్ సీపీ ఆనంద్ తెలిపారు. దోపిడీకి ప్రయత్నించి బయపడి పారిపోయారని చెప్పారు. రూ.1500 కు యూపీలో తుపాకీ కొనుగోలు చేశారని పేర్కొన్నారు. 

కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి వైసీపీపై అసంతృప్తి

కర్నూలు : వైసీపీకి మరో షాక్‌ తగలనుంది. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. జగన్‌ దీక్షపై సమాచారం ఇవ్వకపోవడమే కారణమని తెలుస్తోంది. దీనిపై ముఖ్యకార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ  సమావేశంలో టీడీపీలో చేరికపై చర్చించినట్టు తెలుస్తోంది. 

14:55 - May 4, 2016

కర్నూలు : వైసీపీకి మరో షాక్‌ తగలనుంది. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. జగన్‌ దీక్షపై సమాచారం ఇవ్వకపోవడమే కారణమని తెలుస్తోంది. దీనిపై ముఖ్యకార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ  సమావేశంలో టీడీపీలో చేరికపై చర్చించినట్టు తెలుస్తోంది. 

 

14:53 - May 4, 2016

హైదరాబాద్ : ఏపీలో 25 మంది ఐపీఎస్‌లను వివిధ శాఖలకు బదిలీ చేశారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఏఆర్ అనురాధ, పోలీస్ లాజిస్టిక్‌ ఐజీగా అమిత్ గార్గ్‌ను బదిలీ చేశారు. ఏలూరు రేంజ్ డిఐజీగా రామకృష్ణ, పీటీవో ఐజీగా వి.వేణుగోపాల్‌ కృష్ణను నియమించారు. ఇంటెలిజెన్స్‌ ఐజీగా మహేష్‌చంద్ర లడ్డా, సీఐడీ ఐజీగా శ్రీనివాసులు, లీగల్ ఐజీగా దామోదర్‌ను నియమించారు. ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌గా కె.వెంకటేశ్వరరావు, సౌత్‌జోన్‌ ఐజీగా శ్రీధర్‌రావుకు పోస్టింగ్ ఇచ్చారు. 

 

తూ.గో జిల్లాలో భారీ మోసం

తూర్పుగోదావరి : జిల్లాలోని అల్లవరం మండలం కొమరగిరిలో భారీ మోసం జరిగింది. దుండగులు మాజీ సైనిక ఉద్యోగుల భూములు తాకట్టుపెట్టి అక్రమంగా రూ.31.83 కోట్ల రుణాలు తీసుకున్నారు.  సీబీఐ విచారణ చేపట్టింది.

మావోయిస్ట్ నేత మధు అరెస్ట్ ....

వరంగల్ : ఏటూరు నాగారంలో ఎదురు కాల్పుల ఘటనలో ఆరెస్ట్ అయిన మావోయిస్ట్ నేత మధు అలియాస్ సడవలయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. మధును పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. మధు ఏటూరు నాగారం, మహదేవ్ పూర్ ఏరియా కమిటీకి చీఫ్ గా పనిచేశాడు.

వ్యాపం కుంభకోణంలో కీలక నిందితుడు అరెస్ట్ ...

ఢిల్లీ : వ్యాపం కుంభకోణంగా పేరొందిన మధ్యప్రదేశ్‌ వృత్తి పరీక్షల బోర్డు అక్రమాలకు సంబంధించిన కేసులో పరారీలో ఉన్న కీలక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సీబీఐతో కలిసి ఉత్తరప్రదేశ్‌ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ చేపట్టిన తనిఖీల్లో భాగంగా వ్యాపం కుంభకోణం ప్రధాన నిందితుల్లో ఒకరైన రమేశ్‌ శివ్‌హరే అనే వ్యక్తిని బుధవారం కాన్పూర్‌లో అరెస్టు చేసినట్లు యూపీ డీజీపీ జావేద్‌ అహ్మద్‌ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రమేశ్‌ వైద్య వృత్తి పరీక్ష రాసేందుకు నకిలీ విద్యార్థులను తీసుకురావడానికి మధ్యవర్తిగా వ్యవహరించాడని అతడిపై ఆరోపణలు ఉన్నాయి.

మరింత ఆలస్యం కానున్న మెట్రో ...

హైదారాబాద్ : జూన్ 2 నాటికి మెట్రోరైలు ప్రారంభించటం సాధ్యం కాదని మెట్రో రైలు ఎండీ గాడ్గిల్ తెలిపారు. 2018 డిసెంబర్ లోగా పూర్తి చేయటానికి కావాల్సిన అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. వివిధ కారణాలతో నిర్మాణ పనులకు ఆటంకం కలుగుతోందనీ...అందుకనే అనుకున్న సమయానికి ప్రారంభించలేకపోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 31 కి ఆయన పదవీకాలం పూర్తికానుంది.

13:33 - May 4, 2016

హైదరాబాద్ : తెలంగాణలో డిగ్రీ కోర్సుల అడ్మిషన్లు మొదలుకుని అటెండెన్స్ వరకు అన్నీ ఆన్‌లైన్ చేద్దామనుకుంటున్న ప్రభుత్వానికి అడుగడుగున అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ విద్యాసంవత్సరం నుంచి డిగ్రీ కాలేజీల్లో కామన్ అడ్మిషన్లు నిర్వహించాలనే ఆలోచనకు, ప్రైవేట్‌ కాలేజీ యాజమాన్యాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ విధానాన్ని అమలుచేసేందుకు విద్యాశాఖ తర్జనబర్జన పడుతోంది.

డిగ్రీ ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ అమలుకు ప్రభుత్వ నిర్ణయం...

డిగ్రీ కోర్సులకు ఆన్ లైన్ అడ్మిషన్‌ ప్రవేశపెట్టాలన్న విద్యాశాఖ నిర్ణయానికి కొత్త చిక్కులు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వానికి ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు పక్కలో బల్లెంలా తయారయ్యాయి. తాజాగా డిగ్రీ కాలేజీల్లో కామన్ అడ్మిషన్ విధానం ప్రవేశపెట్టేందకు చర్యలు తీసుకుంటుంటే అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. యూజీసీ నిబంధనల ప్రకారం టీచింగ్‌ ఫ్యాకల్టీకి వేతనాలు చెల్లిస్తున్నామని, మౌలిక వసతులు కూడా సమకూరుస్తున్నామని కొన్ని యాజమాన్యాలు అంటున్నాయి. ప్రైవేటు కాలేజీలు వసూలుచేసే స్థాయిలోనే ఫీజుల వసూలుకు వీలు కల్పించాలని లేదా ప్రభుత్వమే కొత్త ఫీజులు నిర్థారించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి, ఉన్నత విద్యామండలిపై ఒత్తిడి తెస్తున్నాయి.

ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ విధానంలో మార్కుల మెరిట్‌తో ప్రవేశం...

మరోవైపు ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరంలోనే అన్ని వర్సిటీల్లోని డిగ్రీ కాలేజీల్లో కామన్‌ అడ్మిషన్‌ విధానాన్ని ప్రకటించి ఆన్‌లైన్ ప్రక్రియ నిర్వహించాలని నిర్ణయించింది. ప్రైవేటు కాలేజీలు అధిక ఫీజులు వసూలుచేస్తున్నాయని, ఫీజుల భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డిగ్రీ కోర్సులకు ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ అధికారికంగా ఫీజులు నిర్ణయించాయి. అయితే నాణ్యతనుబట్టి ఆయా యూనివర్సిటీల పరిధిలోని కాలేజీలు 7 వేల నుంచి 50వేల రూపాయల దాకా వసూలు చేస్తున్నాయి. ఆన్ లైన్‌ అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్‌ జారీకి డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఇప్పటికే ఆదేశించారు.

ఇంటర్‌ మార్కుల మెరిట్‌ ద్వారా సీటు...

ఆన్‌లైన్ విధానంలో విద్యార్థి కోరుకున్న కాలేజీకి దరఖాస్తు చేసుకుని ఇంటర్‌ మార్కుల మెరిట్‌ ద్వారా సీటు పొందుతాడు. అందుకు వర్సిటీ నిర్ధారించిన ఫీజు మాత్రమే కౌన్సెలింగ్‌ సమయంలో చెల్లించాల్సి ఉంటుంది. లేదా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ చేసినపుడు కాలేజీ తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల కాలేజీలు అధిక ఫీజు వసూలుచేసే అవకాశం ఉండదు. ఇలాగైతే తాము నష్టపోయే అవకాశముందని ప్రైవేట్‌ కాలేజీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ ప్రకటనకు ముందే ఫీజులు నిర్ధారించాలని ప్రైవేట్‌ కాలేజీలు ఒత్తిడి తెస్తున్నాయి.

ప్రైవేటు కాలేజీలను కట్టడి చేయడానికి...

ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కాలేజీల్లో కామన్ అడ్మిషన్‌ ద్వారా ప్రవేశం కల్పించే విధానాన్ని అమలు చేయడం సాధ్యమేనా అని అధికారులు ఆలోచిస్తున్నారు. ఇది సాధ్యమైతే ప్రైవేటు కాలేజీలను కట్టడి చేయడానికి వీలవుతుందని మరికొంతమంది విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. 

13:30 - May 4, 2016

హైదరాబాద్ : ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్‌ మోడల్‌ అవతారమెత్తాడు. యోగా గురువు, అపర బిజినెస్ మ్యాన్‌ అయిన రామ్‌దేవ్ బాబా పంతజలి ప్రొడక్ట్స్‌లో రెండిటికి లాలూ ప్రసాద్‌ అంబాసిడర్‌గా మానిపోయారు. ఎండార్స్‌మెంట్ సెషన్‌లో భాగంగా నిర్వహిస్తున్న యోగా కార్యక్రమానికి రాందేవ్‌బాబా... లాలూను ఆహ్వానించారు. ఈ సందర్భంగానే లాలూ నుదుటిపై గోల్డ్ క్రీమ్‌ను పూశారు. ఈ క్రీమ్‌ వాడితే ఇన్‌స్టెంట్‌ గ్లో వస్తుందని లాలూతో పరిహాసమాడారు. మిగతా సోపుల్లో సోడా ఉప్పు ఎక్కువగా ఉంటుందని పతంజలి సోప్స్‌లో మాత్రం చర్మానికి మేలు చేసే పదార్థాలుంటాయని లాలూ అన్నారు. ఆ సోప్‌లు వాడితే చర్మం ఆరోగ్యంగా ఉంటుందని ప్రశంసలు కురిపించారు. ఇదే సమయంలో పతంజలి ఉత్పత్తుల్లో ఎముకల పొడి వాడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందంటూ లాలూ సెటైరేశారు. ప్రపంచ స్థాయి కంపెనీలకు దీటుగా పతంజలి ప్రొడక్స్ట్‌ను తీసుకెళ్తానంటూ రామ్‌దేవ్ బాబా ఇప్పటికే ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 10 వేల కోట్ల రూపాయల టర్నోవర్‌ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

కెనడాలో కార్చిచ్చు...30 వేలమంది తరలింపు...

హైదరాబాద్ : కెనడాలో కార్చిచ్చు కారణంగా ఓ నగరాన్నంతా అధికారులు ఖాళీ చేయించారు. ఫోర్ట్‌ మెక్‌ముర్రే అనే నగరంలో దాదాపు లక్ష మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ స్థాయిలో ప్రజలను తరలించటం ఇదే మొదటిసారని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే 30వేల మందిని తరలించారు. ఇప్పటికే ఫోర్ట్‌ మెక్‌ముర్రే నగరంలో చాలా ప్రాంతాల్లో ఇళ్లు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. పెద్ద ఎత్తున పొగ, బూడిద ఎగిసిపడుతోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు కోరుతున్నారు. కెనడా ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడో ప్రజలను జాగ్రత్తగా ఉండాలని..

ఆర్ఐ కోటేష్ ఇంటిపై ఏసీబీ దాడులు...

కరీంనగర్ : మంథనిలో ఆర్ ఐ కోటేష్ ఇంటిపై ఏసీబీ దాడులు చేపట్టింది. అక్రమాస్తులు కలిగి వున్నారని కోటేష్ పై ఆరోపణలు రావటంతో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. కమాన్ పూర్ ఆర్ ఐగా కోటేష్ విధులను నిర్వహిస్తున్నారు.

13:01 - May 4, 2016

శ్రీకాకుళం : ఆర్టీఎస్ పై తెలంగాణ మంత్రి హరీష్ రావు తనను సంప్రదించారని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ తెలిపారు. తమ పోరాటమంతా మహారాష్ట్ర, కర్నాటక ప్రభుత్వాలపైనే నని ఆయన స్పష్టం చేశారు. ఎఫెక్స్ కమిటీ సమావేశం తరువాతనే తాము ఎటువంటి నిర్ణయమైనా తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. తమ పోరాటమంతా మహారాష్ట్ర, కర్నాటక ప్రభుత్వాలపైనే నని ఆయన స్పష్టం చేశారు. అనుమతులు తీసుకున్న తరువాతనే సాగునీటి ప్రాజెక్టులు చేపట్టాలని దేవినేని సూచించారు. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా వుందని ఆయన తెలిపారు.

12:49 - May 4, 2016

విజయశాంతి బిజెపిలో, కొత్త పార్టీ (తల్లి తెలంగాణ పార్టీ), తెరాసలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు తెరాస తనను పార్టీ నుంచి బహష్కరించడంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే, తెలంగాణలోను, కేంద్రంలోను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. దీంతో ఆమె రాజకీయాల్లో క్రియాశీలంగా కనిపించడం లేదు. తాజాగా, మళ్లీ ఆమె క్రియాశీలక రాజకీయాల పైన దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. మరి ఇప్పుడేమనుకుందో గానీ మళ్ళీ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అటు సినీ కెరీర్, ఇటు పొలిటికల్ ఫ్యూచర్ రెండూ కలిసొచ్చేట్టుగా మూవీల్లో నటించేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే విజయశాంతి రెండు పెద్ద సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందదట. తన సినిమా కెరీర్‌లో ఎంతో పేరు తెచ్చిన ‘ఒసేయ్ రాములమ్మ’కు సీక్వెల్‌గా మరో మూవీ ప్లాన్ చేస్తున్నట్టు ఇన్‌సైడ్ సమాచారం. సినిమాల్లో సనే.. మరి రాజకీయాల్లో ఏ మేరకు సక్సెస్ అవుతుందోనన్న కామెంట్స్ పడిపోతున్నాయట.

12:48 - May 4, 2016

వరంగల్ : తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పలుగు పారబట్టి మట్టి తవ్వడమేగాక మట్టి తట్టను తలపై మోసి ట్రక్కులో వేశారు. హరీష్‌రావుతోపాటు పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు యర్రబెల్లి దయాకర్‌రావు, స్థానిక టిఆర్ఎస్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణలో నిర్మించే సాగునీటి ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అడ్డుకోవటానికి ప్రయత్నిస్తోందనీ ఆయన ఆరోపించారు. ఇకనైనా ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని ఆయన పేర్కొన్నారు.

12:40 - May 4, 2016

తెలుగు, తమిళ భాషల్లో వరుస విజయాల్ని సొంతం చేసుకుంటూ...పలు భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న తమన్నా తాజాగా తమిళ హీరో విశాల్‌తో జోడీకట్టబోతుంది. విశాల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కత్తి సందై. సూరజ్ దర్శకత్వం వహిస్తున్నారు. విలక్షణ కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా నటించనుంది. కథానుగుణంగా తమన్నా పాత్ర సహజత్వానికి దగ్గరగా విభిన్న పంథాలో ఉంటుందని తెలిసింది. ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలిసింది

12:40 - May 4, 2016

హైదరాబాద్‌: కాటేదాన్‌ కాల్పుల వ్యవహారంలో పోలీసులు మిస్టరీని చేధించారు. వీడింది. ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బుల దోపిడీ కోసమే ప్రసాద్‌పై నాటు తుపాకీతో కాల్పులు జరిపినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కాల్పులకు సంబంధించిన ఆయుధాలను ఎక్కడ కొనుగోలు చేశారు అనే అంశంపై పోలీసులు నిందితులను రహస్యంగా విచారిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన ముఠాను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశముంది.

దేశ రాజధాని 12 మంది ఉగ్రవాదుల అరెస్ట్

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 12 మంది ఉగ్రవాదులను పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. జాతీయ భద్రతా బలగాలు, దిల్లీ పోలీసులు చేపట్టిన సంయుక్త తనిఖీల్లో భాగంగా జైష్‌-ఏ-మహమూద్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 8 మంది దిల్లీలో పట్టుబడగా... మరో నలుగురిని ఉత్తర్‌ప్రదేశ్‌లోని డియోబాండ్‌ పట్టణంలో అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి బాంబు తయారీ పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.వీరంతా దేశంలోని పలు ప్రాంతాల్లో బాంబు దాడులకు పాల్పడేందుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. 

12:35 - May 4, 2016

ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన పనామా పేపర్స్ లీక్ ఉదంతంలో మరికొందరి బాలీవుడ్ స్టార్ల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఆరోజాబితాలో బాలీవుడ్ నటుడు అజయ్‌దేవ్‌గన్, కాజోల్ కూడా వున్నట్లు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ప్రకటించింది. బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్‌లోని ఓ ఎంటర్ టైన్‌మెంట్ కంపెనీలో వీళ్లిద్దరు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టినట్టు అందులో పేర్కొంది. ఈ విషయాన్ని గతంలోనే అజయ్ అంగీకరించాడు.. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారమే 1000 షేర్లు కొనుగోలు చేసినట్టు తెలిపాడు. బాలీవుడ్‌లో పెద్దగా సినిమాలు చేయని అజయ్, కాజోల్ దంపతులకు అంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? అనేదానిపై ఐటీశాఖ లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కొద్దిరోజుల కిందట విజయవాడలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన అజయ్, అమరావతిలో ఓ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన విషయం తెల్సిందే! ఇటు అజయ్, అటు కాజోల్ ఇద్దరూ ఏపీకి బ్రాండ్ అంబాసిడర్స్‌గా నియమితులయ్యారు. పనామా పేపర్స్‌లో వీళ్ల పేర్లు రావడంతో ఏపీకి ప్రచారకర్తలుగా కొనసాగుతారా? లేదా అనేది తెలియాల్సివుంది. 

12:33 - May 4, 2016

గుంటూరు : గీతా రెసిడెన్సీ హాలులో జరుగుతున్న 13 జిల్లాల డీఈవోల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలన్న ఆలోచనను విరమించుకోవాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నేతలు మాట్టాడుతూ..నేడు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలు గణనీయంగా మూతపడుతున్నాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వం విద్యను ప్రయివేటీకరణ చేయటానికి ప్రయత్నిస్తోందనీ దాన్ని అడ్డుకుంటామని వారు పేర్కొన్నారు.

12:30 - May 4, 2016

రెండు సంవత్సరాల క్రితం ఒక రైతు బిడ్డ, ఒక కాంట్రాక్టర్, ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాజకీయాల్లోకి ప్రజలకు సేవ చేయాలనీ అనిపించినప్పుడు తనకు గుర్తుకు వచ్చిన పేరు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను ఒక్క జగన్ రెడ్డి మాత్రమే నెరవేర్చుతాడు అనే నమ్మకంతో వైసీపీ లో చేరాలని నిర్ణయించుకున్నారు. రెండు సంవత్సరాల అనంతరం తెలంగాణ ప్రయోజనాలు కోసం టిఆర్ ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. అస్సలు లక్ష్యం అదేనా? మరేమైనా కారణాలు ఉన్నాయా? ఇదే అంశంపై పొంగులేటి శ్రీనివాస రెడ్డి తో 'టెన్ టివి' ముఖాముఖీ నిర్వహించింది. ఆ ముఖాముఖీలో పొంగులేటి ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం..

ప్రశ్న : పార్టీ మారడానికి కారణం తెలంగాణ ప్రయోజనాలా? లేక సొంత ప్రయోజనాలా?

వందకు వందశాతం తెలంగాణ కోసమే పార్టీ మారాను. శ్రీనివాసరెడ్డి అంటే ఏమిటి? ఆయన మనస్థత్వం ఏంటి

జవాబు :తెలంగాణ బిడ్డలకు కృష్ణా బేసిన్ వాటర్ విషయంలో జగన్ ఆంధ్రా ప్రజల కోసం ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేతగా ఈ నెల 16, 17,18తేదీల్లో దింటి లాంటి ప్రాజెక్టులు కట్టవద్దని నిరాహార దీక్షకు కూర్చుంటున్న సందర్భంగా తెలంగాణ బిడ్డగా.., తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కృష్ణా నీటి ఎలకేషన్ ను కాదని తెలంగాణ సర్కార్ ఏ ప్రాజెక్టు కట్టడం లేదనేది అందరికీ తెలుసు. అయినా జగన్ తీసుకున్న ఈ నిర్ణయానికి విభేదించి తెలంగాణ బిడ్డల ప్రయోజనాల కోసం వైసీపీకి రాజీనామా చేసి టిఆర్ ఎస్ లో చేరుతున్నాను తప్ప వ్యక్తిగతమైన స్వార్థం ఏమీ లేదన్నారు.

ప్రశ్న :పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఏడు మండలాలను ఏపీలో కలిపినపుడు, పీపీఏలను రద్దు చేసినపుడు, పట్టిసీమలాంటి ప్రాజెక్టులు కట్టినపుడు ఎందుకు శ్రీనివాసరెడ్డికి తెలంగాణ ప్రయోజనాలు గుర్తుకు రాలేదు? ఇప్పుడే ఎందుకు గుర్తుకు వస్తుంది?

జవాబు: ఏడు మండలాలను ఏపీ లో కలిపేప్పుడు వైసీపీ పార్లమెంట్ నేత రాజమోహన్ రెడ్డి సమర్థిస్తే...నేను విభేదించాను. అది జగన్ తో సంబంధం లేకుండా ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇపుడు జగన్ తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మూడు రోజులు దీక్షకు కూర్చోబోతున్నారు.

ప్రశ్న : వైసీపీ ఏపీలో అధికారంలోకి ప్రయత్నించి, జగన్ సీఎం కావడానికి అక్కడే ప్రయత్నించారు. అలాంటి పార్టీ తెలంగాణ ప్రయోజనాల కోసం మాట్లాడుతుందని ఎలా అనుకుంటారు?

జవాబు : రాష్ట్ర విభజనకు ముందు ఏపీలో జగన్ అన్నా, రాజశేఖర్ రెడ్డి కుటుంబం అన్నా ప్రేమా, అభిమానం పెద్దఎత్తున ఉండేది. విభజన అనంతరం కూడా ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపి వైసీపీ బ్యానర్ మీదనే గెలిచాం. ఆరోజుకి తెలంగాణ ప్రజల గుండెల్లో దేవుడిలా వున్న మాట వాస్తవం.

ప్రశ్న :పార్టీకి భవిష్యత్ ఉంటుంది అంటే పార్టీలోనే కొనసాగేవారు కాదా?

జవాబు : పార్టీ భవిష్యత్ లేదని పార్టీ మారలేదు. కృష్ణా వాటర్ విషయంలో వైసీపీతో విభేదించి పార్టీ మారాను.

ప్రశ్న :వ్యాపారం కోసమే పొంగులేటి పార్టీ మారుతున్నారు అని ప్రచారం వుంది ఎంత వరకు కరెక్టు?

జవాబు : వ్యాపారం వేరు.. రాజకీయం వేరు. ఏ రాజకీయ అండ లేని నాడే స్వశక్తితో అంచలంచెలుగా ఎదిగాను.

ప్రశ్న : పొంగులేటిని బెదిరించి పార్టీలో చేర్చుకున్నారా? ఎవరు బెదిరించారు?

జవాబు : ఎవరో బెదిరిస్తే భయపడేవాడు కాదు శ్రీనివాసరెడ్డి.

ప్రశ్న : టిడిపితో వైసీపీ సాఫ్ట్ కార్నర్ గా ఉన్న మాట వాస్తవం కాదా?

జవాబు : వంద శాతం తప్పు.

ప్రశ్న : జగన్ అనుమతితోనే పొంగులేటి టిఆర్ ఎస్ లో చేరారా?

జవాబు : జగన్ కుటుంబంతో ఉన్న సంబంధంతో జగన్ ను అడుగుదామనుకున్న ప్రశ్నలు కూడా అడగలేకపోయాను.

ప్రశ్న : వైసీపీ విలీనం గురించి పొంగులేటితో చర్చిస్తామని కేటీఆర్ తెలిపారు. ఎపుడు విలీనం చేయబోతున్నారు?

జవాబు : పార్టీని విలీనం చేసే అర్హత, హక్కు నాకు ఉన్నది అని అనుకోండం లేదని స్పష్టం చేశారు. ఆపార్టీకి ఓవరాల్ రైట్స్ జగన్ వే.. కాని పొంగులేటివి కావు.

ప్రశ్నలు : గ్రూప్ గా ఎమ్మెల్యేలు టిఆర్ ఎస్ లో చేరుతున్నారు? ఏపీలో అలా చేరితే తప్పు ఎట్లా అవుతుంది? కేసీఆర్ గారు ఎన్ని కోట్లు ఇచ్చి పొంగులేటిని కొన్నారు.

జవాబు : పొంగులేటిని కొనగలిగే దమ్ము, ధైర్యం రాజకీయాల్లో బతికినంత కాలం ఏ ఒక్క నాయకుడికి లేదు.

ప్రశ్న : ఖమ్మంలో జలగం కుటుంబం, తుమ్మల కుటుంబం, పొంగులేటి కుటుంబాలు ఒక వరలో ఇముడుతాయా?

జవాబు : జలగం, తుమ్మల కుటుంబాల కంటే పొంగులేటి కుటుంబం అన్ని వర్గాలతో కలుపుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నారాజకీయం నేను చేసుకుంటాను తప్ప వేరే వ్యక్తుల అంశాల్లో నేను ఇన్వాల్వ్ కాను.

ప్రశ్న : పొగులేటి చేరికకు ప్రధాన కారణం పాలేరు ఉప ఎన్నికేనా?

జవాబు : ఎలాంటి సంబంధం లేదు.

ఇంకా అనేక ఆసక్తి కరమైన విషయాలను పొంగులేటి ప్రస్తావించారు. పూర్తి వివరాలను చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ...

హైదరాబాద్ : సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. ఈ భేటీలో పరిశ్రమల శాఖలో తీసుకోవాల్సిన పలు నిర్ణయాలపై  మంత్రులు చర్చించనున్నారు.

కరవు జిల్లాల్లో ఒక్కో జిల్లాకు రూ.10కోట్లు కేటాయించాం: చినరాజప్ప

అనంతపురం : సీఎం ఆదేశాలతో కరవు జిల్లాలో పర్యటిస్తున్నామని మంత్రి చినరాజప్ప పేర్కొన్నారు. కరవు జిల్లాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు జిల్లాకు రూ.10కోట్ట చొప్పున కేటాయించామని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతూనే వుందనీ ఆయన తెలిపారు.

మా పోరాటమంతా మహారాష్ట్ర, కర్నాటకలపైనే : మంత్రి దేవినేని

శ్రీకాకుళం : ఆర్టీఎస్ పై తెలంగాణ మంత్రి హరీష్ రావు తనను సంప్రదించారని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ తెలిపారు. తమ పోరాటమంతా మహారాష్ట్ర, కర్నాటక ప్రభుత్వాలపైనే నని ఆయన స్పష్టం చేశారు. ఎఫెక్స్ కమిటీ నిర్ణయం తరువాత చర్చిద్దామని తాము తెలిపామని ఆయన అన్నారు. ఈ అంశంపై తమ ప్రభుత్వం చర్చింటానికి సిద్దంగా వుందని ఆయన పేర్కొన్నారు. తమ పోరాటమంతా మహారాష్ట్ర, కర్నాటక ప్రభుత్వాలపైనే నని ఆయన స్పష్టం చేశారు. 

11:27 - May 4, 2016

ఢిల్లీ : భగత్ సింగ్ ను ఉగ్రవాదిగా చిత్రీకరిస్తూ ఓ వార్త పత్రికలో వచ్చిన నేపథ్యంలో ఈ అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టుపట్టాయి. దీంతో రాజ్యసభలో గందరగోళం నెలకొంది.

11:12 - May 4, 2016

ఖమ్మం : వానొస్తే.. వరదొస్తుంది..! కానీ ఓ గూడెపు అమ్మాయికి మాత్రం వానొస్తే పెళ్లవుతుంది. అదేంటి.. వానకు, అమ్మాయి పెళ్లికీ ఏంటి సంబంధం అనుకుంటున్నారా..? అవును సంబంధం ఉంది. ఖమ్మం జిల్లాలో వానకు, ఓ అమ్మాయి పెళ్లికీ లింకు పడింది. తెలంగాణలో తాగు నీటి ఎద్దడి తీవ్రతకూ ఈ పెళ్లి దర్పణంగా నిలు స్తోంది. కాబోయే పెనిమిటి కన్నా.. అతణ్ణి తనకు దగ్గర చేసే వాన కోసమే ఆత్రంగా ఎదురుచూస్తోన్న ఓ సీత కథ ఇది. కాదు కాదు.. సీత వ్యథ ఇది..

ఖమ్మం జిల్లాలో కోరలు చాస్తున్న కరవు...

ఇది ఖమ్మం జిల్లా పాల్వంచ ఏజెన్సీలోని సిర్తనిపాడు గిరిజన గూడెం. ఈ అమ్మాయి పేరే సీత.. ! మనువాడే వాడి కోసం కన్నా.. అతణ్ణి తన దగ్గరకు చేర్చే వరుణుడి రాక కోసం తపిస్తోన్న వధువీమె. సీతే కాదు.. ఈ గూడెంలోని 40 కుటుంబాలూ సీత మనువాడే రోజు కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాయి. వీరందరిలో సీత పెళ్లి కోసం ఎందుకింత ఆత్రం..? వారికి అడ్డుపడుతోన్న అంశం ఏంటి..?

సీత పెళ్లికి అవరోధంగా నీటి ఎద్దడి..

తాగు నీటి ఎద్దడి...! అవును గూడెంలోని తాగునీటి ఎద్దడి సీత పెళ్లికి అవరోధంగా మారింది. నిశ్చితార్థం జరిగినా.. సీతను పెళ్లిపీటల దాకా తీసుకువెళ్లేందుకు అడ్డుపడుతున్నది.. తిప్పాపురానికి చెందిన ఓ యువకుడితో సీత పెళ్లి నిశ్చయమైంది. పెళ్లికి కావలసిన సరుకులన్నీ సిద్ధం చేశారు. గొత్తికోయల పెళ్లిలో తప్పనిసరిగా ఉండాల్సిన భోజనం కోసం లంది అనే నూకల రవ్వనూ సిద్ధం చేశారు. కానీ వంటకాలకు, వచ్చే అతిథులకూ అవసరమైన తాగునీరు గూడెంలో అందుబాటులో లేదు. దీంతో.. పెళ్లి ముహూర్తాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. గూడెం వాసులందరికీ ఇక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలోని బావినీరే అన్ని అవసరాలకూ ఆధారం. వర్షాభావం వల్ల.. భూగర్భజలాలు ఇర్రింకిపోయి.. ఆ బావిలోనూ ఊట తగ్గింది. దీంతో నీరు బురదమయమయ్యాయి. తప్పని పరిస్థితుల్లో ఆ నీటినే తాగుతూ గూడెం ప్రజలు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో వరుణుడు కరుణించి.. భూగర్భజలాలు పెరిగి.. బావిలోకి నీరు అందుబాటులోకి వచ్చాకే సీత పెళ్లి చేయాలని ఆమె కుటుంబ సభ్యులూ.. గ్రామస్థులూ నిర్ణయించుకున్నారు.

కనీస సౌకర్యాలకు ఆమడదూరంలో ఉల్వనూరు ....

పాల్వంచ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉల్వనూరు పంచాయతీ పరిధిలోని సిర్తని గూడెం కనీస సౌకర్యాలకు ఆమడ దూరంలో ఉంది. కరెంట్‌ లేదు.. బడి అంటే తెలియదు. పోడు వ్యవసాయమే వీరి జీవనాధారం. వీరి చెంతకు అధికారులెవ్వరూ రారు. ఈ పరిస్థితుల్లో గూడెం వాసులంతా తమ అవసరాలను వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. సీతలాంటి యువతులు.. మనువాడే ముహూర్తం కోసం ఎదురు చూస్తూ గడిపేస్తున్నారు. అంతేకాదు సీత వ్యథ.. ఇలాంటి గూడేలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరాన్ని చాటుతోంది. 

కాటేదాస్ కాల్పుల ఘటనలో ముగ్గురు అరెస్ట్...

హైదరాబాద్ : కాటేదాస్ కాల్పుల ఘటనలో ముగ్గురికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ముగ్గురు యూపీకి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

కేంద్ర మంత్రులతో ప్రధాని భేటీ..

ఢిల్లీ : కేంద్రమంత్రులు మనోహర్ పారికర్, రాజ్ నాథ్ సింగ్ , వెంకయ్య నాయుడతుతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. రాజ్యసభలో అగస్టా వెస్ట్ ల్యాండ్ పై చర్చ నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

10:22 - May 4, 2016

తిరువనంతపురం: కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం మరో నిర్భయ ఘటన వెలుగులోకి వచ్చింది. తిరువనంతపురం సమీపంలో 19ఏళ్ల నర్సింగ్‌ విద్యార్థినిపై మృగాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె స్నేహితుడు సహా ముగ్గురు వ్యక్తులు మంగళవారం యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో యువతి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల్లో ఇద్దరు.. సుజిత్‌(25), శైజు(24)గా బాధితురాలు పోలీసులకు తెలిపింది. వీరిలో శైజు అనే వ్యక్తి యువతి స్నేహితుడని, అతడు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

10:15 - May 4, 2016

తిరుమల : శ్రీవారికి రూ.1.5 కోట్లు విలువైన సుదర్శన సాలిగ్రామ హారాలను బహుకరించారు. ఒరిస్సా రాష్ట్ర రాజధాని భవనేశ్వర్ కు చెందిన రాజేష్ కుమార్ అనే భక్తుడు బహూకరించారు.

హన్మకొండలో ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ ప్రారంభం..

వరంగల్‌: హన్మకొండలో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీని కలెక్టర్ కరుణ, సీపీ సుధీర్ బాబు, రిక్రూట్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంగ్రహం దాల్విలు ప్రారంభించారు. వివిధ జిల్లాల నుంచి వెయ్యిమందికి పైగా అభ్యర్థులు ఈ ర్యాలీకి హాజరు అయ్యారు. 

భక్తులపైకి దూసుకెళ్లిన స్కార్పియో : ఒకరి మృతి

కడప : రైల్వేకోడూరు మండలం అనంతరాజుపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. తిరుమలకు పాదయాత్రగా వెళ్తున్న భక్తులపై వేగంగా వెళుతున్న స్కార్పియో అదుపుతప్పి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కేరళ లో మరో నిర్భయ ఘటన

తిరువనంతపురం: కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం మరో నిర్భయ ఘటన వెలుగులోకి వచ్చింది. తిరువనంతపురం సమీపంలో 19ఏళ్ల నర్సింగ్‌ విద్యార్థినిపై మృగాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె స్నేహితుడు సహా ముగ్గురు వ్యక్తులు మంగళవారం యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల్లో ఇద్దరు.. సుజిత్‌(25), శైజు(24)గా బాధితురాలు పోలీసులకు తెలిపింది. వీరిలో శైజు అనే వ్యక్తి యువతి స్నేహితుడని, అతడు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

09:42 - May 4, 2016

హైదరాబాద్‌ : శివారు చింతలకుంట వద్ద ఆర్‌టీఏ అధికారులు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న వాహనాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 60 బస్సుల్లో తనిఖీలు చేపట్టగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 21 ప్రైవేట్ బస్సులను గుర్తించారు. వాటిపై కేసులు నమోదు చేశారు.

 

09:39 - May 4, 2016

చిత్తూరు : గంగవరం మండలం కీలపల్లి వద్ద కంటైనర్‌, కారు ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. బెంగళూరు నుంచి చెన్నై వైపు వెళ్తున్న స్విఫ్ట్‌ కారును బెంగళూరు నుంచి చెన్నై వెళ్తున్న కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. 

శ్రీవారికి 1.5 కోట్ల విలువైన హారాల బహూకరణ

తిరుమల : శ్రీవారికి రూ.1.5 కోట్లు విలువైన సుదర్శన సాలిగ్రామ హారాలను బహుకరించారు. భవనేశ్వర్ కు చెందిన రాజేష్ కుమార్ అనే భక్తుడు బహూకరించారు.

09:31 - May 4, 2016

గుంటూరు : ప్రత్తిపాడు నుండి మండలం తుమ్మపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డివైడర్ ను ఢీ కొంది. ఈ సమయంలో డీజిల్ ట్యాంకు మంటలు చెరగేడంతో కంటైనర్ పూర్తిగా దగ్ధం అయ్యింది. కంటైనర్ లో చిక్కుకున్న డ్రైవర్, క్లీనర్ కు తీవ్ర గాయాలయ్యారు. క్షతగాత్రులను పోలీసులు జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. క్షతగాత్రులు హర్యానాకు చెందిన సురేశ్‌, షాహిద్‌గా పోలీసులు గుర్తించారు.

09:25 - May 4, 2016

నల్గొండ : మఠంపల్లి మండలం మట్టపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీలో ఇప్పటికే రెండు యూనిట్లు నడిపిస్తుండగా.. మరో యూనిట్ విస్తరణ చేపట్టేందుకు యాజమాన్యం పై నేడు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ఈ ఫ్యాక్టరీ వల్ల చుట్టు పక్కల వాతావరణం కలుషితం అయ్యి అనారోగ్యం పాలవుతున్నామని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమలో ప్రజాభిప్రాయా సేకరణకు యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోందని స్థానికులు ఆందోళన చేపట్టారు. తమకు అనుకూలమైనవారిని పరిశ్రమలోకి అనుమతిస్తుందని సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఈ కారణంగా ఫ్యాక్టరీ వద్ద భారీగా పోలీసుల మోహరించారు. మరో వైపు యాజామన్యం మాత్రం నిబంధనల ప్రకారమే ప్రజాభిప్రాయం సేకరిస్తున్నామని యాజమాన్యం స్పష్టం చేస్తోంది.

సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ

గుంటూరు : తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జూన్ 27న మొదటి దశ ఉద్యోగులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

 

08:57 - May 4, 2016

హైదరాబాద్ : శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన బ్రహ్మోత్సవం చిత్రంలో మహేష్ బాబు, సమంత, కాజల్, ప్రణీత ప్రధాన పాత్రలుగా నటిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో ఫంక్షన్ మే 7న గ్రాండ్‌గా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మిక్కీ జే మేయర్ అందించిన ట్యూన్స్ సంగీత ప్రియులను మరింతగా అలరిస్తాయని యూనిట్ భావిస్తుంది. మే మూడో వారంలో బ్రహ్మోత్సవం మూవీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తుండగా, ఈ మూవీకు సంబంధించిన పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ లిరికల్ వీడియో విడుదల చేశారు. 

కడపలో మంత్రి గంటా పర్యటన

కడప : మంత్రి గంటా శ్రీనివాస్ కడపలో పర్యటిస్తున్నారు. మురికి కాలువలు, వక్ఫ్ బోర్డు స్థలాల పరిశీలించారు. శాటిలైట్ సిటీ కాలనీలో ప్రజల సమస్యలను తెలుసుకున్న గంటా త్వరలో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.

 

08:39 - May 4, 2016

హైదరాబాద్ : సుధీర్ఘ కాలం త‌ర్వాత తెలుగుదేశం తెలంగాణా శాఖ విస్తృత స‌మావేశం జ‌ర‌గ‌బోతోంది. రాష్ట్ర క్యాడ‌ర్ మొత్తం పాల్గొంటున్న ఈ స‌మావేశంలో క్షేత్ర స్థాయి బ‌లోపేతానికి కార్యాచ‌ర‌ణ రూపొందించనున్నారు. రంగారెడ్డి, గ్రేట‌ర్ న‌గ‌ర అధ్యక్షుల నియ‌మాకం, మండ‌ల స్థాయి పదవుల భర్తీపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు.

వివిధ అంశాలపై చర్చ...

తెలంగాణలో క‌రువు ప‌రిస్థితులు, తాగునీటి కొరత, ప్రాజెక్టుల నిర్మాణాలు వాటి లాభనష్టాలు త‌దిత‌ర అంశాల‌పై విస్తృత స్థాయి స‌మావేశంలో చ‌ర్చించ‌నున్నారు. కరువు పోరాటంపై కార్యాచ‌ర‌ణ, రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులపై కేంద్రానికి నివేదిక ఇవ్వడం, పంటల‌కు క‌నీసం మద్దతు ధ‌ర కూడా ప్రకటించకపోవడం, పంట న‌ష్ట పోయిన రైతుల‌కు ఇంత‌వ‌ర‌కు ప్రభుత్వం స‌హాయం అందించ‌క పోవ‌డం వంటి అంశాలపై టీడిపి లోతుగా అధ్యయనం చేస్తోంది. ఈ అంశాల పైనే స‌మావేశంలో కీల‌క చ‌ర్చ జ‌ర‌పాల‌ని నేతలు భావిస్తున్నారు. పార్టీ సీనియ‌ర్ నేత‌లు య‌ల్ ర‌మ‌ణ‌, రేవంత్ రెడ్డి, రావుల, పెద్ది రెడ్డి, గ‌రిక పాటి, మోత్కుప‌ల్లి త‌దిత‌ర సీనియ‌ర్ నేత‌లు విస్తృత స్తాయి స‌మావేశ విధి విధానాల‌పై పూర్తి క‌స‌ర‌త్తు చేశారు. మొత్తానికి ముఖ్య నేత‌ల‌తో పాలు ఎమ్మెల్యేలు పార్టీ వీడిన త‌ర్వాత జ‌రుగుతున్న విస్తృత స్థాయి స‌మావేశం కావడంతో ఈ మీటింగ్‌ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీనివాసుడి దర్శనానికి వచ్చిన భక్తులు 19 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వెళ్లే భక్తులకు 4 గంటల సమయం పడుతుంది.

ప్రైవేట్ ట్రావెల్స్ పై ఆర్టీఏ కొరడా...

హైదరాబాద్ : రవాణా శాఖ అధికారులు మరోసారి ప్రైవేటు బస్సులపై తనిఖీలు చేపట్టారు. ఎల్బీ నగర్ రింగ్ రోడ్డు సమీపంలో బుధవారం తెల్లవారుజామున తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 21 బస్సులను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు.

టీ.ఎస్ లో శూన్యంకానున్న వైసీపీ...

హైదరాబాద్ : నేడు తెలంగాణ  వైసీపీ ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరనున్నారు.  వైసీపీ ప్రజా ప్రతినిధులుగా ఉన్న ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నేడునేడు టీఆర్ఎస్ లో చేరనున్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు వీరిద్దరూ సీఎం కేసీఆర్ సమక్షంలో అధికార పార్టీలో చేరనున్నారు. వీరిద్దరి పార్టీ మార్పుతో తెలంగాణలో వైసీపీ ప్రజా ప్రతినిధుల సంఖ్య శూన్యంగా మారనుంది. దీంతో వైసీపీ తెలంగాణలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోనుంది.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి...

కృష్ణా: కంచికచర్ల మండలంలోని పరిటాల వద్ద బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతిచెందారు. కంచికచర్లకు చెందిన గాజుల గోపి(19), హర్ష(20) పరిటాల నుంచి ద్విచక్రవాహనంపై కంచికచర్ల వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గోపి అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్ర గాయాలైన హర్షను నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఈశ్వరరావు తెలిపారు.

07:22 - May 4, 2016

హైదరాబాద్ :తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం ముదురుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణ సర్కార్‌ చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులపై కేంద్రానికి లేఖ రాయాలని ఎపి మంత్రివర్గం తీర్మానించడంపై తెలంగాణ నేతల మండిపడుతున్నారు. కృష్ణా, గోదావరి నదుల్లో తమ వాటా నీటిని వాడుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు తెగేసి చెబుతుంటే... తెలంగాణ నిర్మించేవి అక్రమ ప్రాజెక్టులను ఎపి నేతలు వాదిస్తున్నారు. వెరసి తెలుగు నేతల మధ్య విమర్శల యుద్ధం తారా స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఏం చేస్తోంది? కేంద్ర జలసంఘం ఏం చేస్తోంది? ప్రజల మధ్య సమస్యగా ముందుకు వస్తోందా? ప్రజల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనం పొందేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయా? ఇత్యాది అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సీనియర్ విశ్లేషకులు నడింపల్లి సీతారామ రాజు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, టిఆర్ ఎస్ నేత తాడూరి శ్రీనివాస్, టిడిపి నేత సూర్యప్రకాశష్ పాల్గొన్నారు. వారు ఏఏఅంశాలపై చర్చించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

నేడు బ్రాండిక్స్ కార్మికులను పరామర్శించనున్న జగన్

విశాఖ : తమ సమస్యలు పరిష్కరించాలని,కనీస వేతనాలు కల్పించాలని ఆందోళన చేస్తున్న బ్రాండిక్స్ కార్మికులను వైసీపీ అధినేత జగన్ కలవనున్నారు. విశాఖ పర్యటనకు వెళుతున్న జగన్‌..కార్మికుల నిరసనకు సంఘీభావం తెలపనున్నారు. పోలీసుల లాఠీఛార్జ్ చేయడాన్ని ఖండిస్తూ ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు కార్మికులతో కలసి ఆందోళనలో పాల్గొంటారు. 

నేడు శ్రీకాకుళం జిల్లా పర్యటనకు సీఎం చంద్రబాబు

విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. ఒక్క రోజు పర్యటనలో భాగంగా ఆయన సిక్కోలు వస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత సీఎం పర్యటన ప్రారంభమవుతుంది. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఆయన పర్యటన కొనసాగే అవకాశముంది.

హైకోర్టు చీఫ్ జస్టిస్ గా కేఎం జోసెఫ్

హైదరాబాద్: తెలంగాణ, ఏపీ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కేఎంజోసెఫ్ నియమితులు కానున్నారు. ప్రస్తుత తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బీ భోసలే పదోన్నతిపై మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ కానున్నారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి తన ప్రతిపాదనలు పంపింది. జస్టిస్ భోసలే మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 

07:02 - May 4, 2016

విజయవాడ : ఏపీలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. పొత్తు ధర్మాన్ని తోసిరాజని ఇరుపార్టీల నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పడంతో టీడీపీ నేతలు ఫైర్‌ అవుతుండగా.. టీడీపీ నేతల విమర్శలను బీజేపీ నేతలు గట్టిగానే తిప్పికొడుతున్నారు.

బిజెపి..టిడిపి మధ్య మాటల తూటాలు...

గోదావరి తీరంలో తెలుగు తమ్ముళ్లు, కమలనాథుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రెండేళ్ల నుంచి నెట్టుకొస్తున్న కలహాల కాపురం.. ఇకపై కొనసాగుతుందా అన్న అనుమానాలు వెలువడుతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదని తేల్చి చెప్పడంతో నేతల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరాయి.

కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకి పడుతుందని...

కేంద్ర ప్రభుత్వ వైఖరిపై.. రాజమండ్రి రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి సాయం చేయాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా అని ఆయన ప్రశ్నించారు. కేంద్రం దమ్మిడీ నిధులు విడుదల చేసి.. వంద రూపాయలకు లెక్కలు చెప్పాలంటోందని ఫైర్‌ అయ్యారు. కేంద్రం ఇలాగే వ్యవహరిస్తే.. గతంలో కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకి పడుతుందని గోరంట్ల తీవ్ర స్వరంతో హెచ్చరించారు.

గోరంట్ల వ్యాఖ్యలపై.. రాజమండ్రి అర్బన్‌ ఎమ్మెల్యేఫైర్...

గోరంట్ల వ్యాఖ్యలపై.. రాజమండ్రి అర్బన్‌ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ అంతే ఘాటుగా స్పందించారు. మంత్రి పదవుల కోసమే.. మిత్రధర్మాన్ని మరచి టీడీపీ నేతలు బీజేపీపై విరుచుకు పడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధుల లెక్కలను ఖచ్చితంగా చెప్పాల్సిందేనని ఆకుల డిమాండ్‌ చేశారు. ప్రస్తుతానికి రాజమండ్రి నేతల మధ్య మొదలైన మిత్రభేదం.. రాబోయే రోజుల్లో ఎన్నెన్ని మలుపులు తిరగనుందోనన్న ఆసక్తి వ్యక్తమవుతోంది. 

06:58 - May 4, 2016

హైదరాబాద్ : సాగునీటి ప్రాజెక్ట్‌లపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్వాసితులకు చెల్లించే పరిహారాన్ని గతంలో మాదిరిగా విడతలవారీగా కాకుండా... ఒకేసారి ఇవ్వాలని ఆదేశించారు. పరిహారం మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తే ఆ కుటుంబానికి కొంతవరకు ఉపయోగపడుతుందని అధికారులకు సూచించారు. అప్పుడు కొంచం... అప్పుడు కొంచం.. ఇచ్చుకుంటూపోతే అది కుటుంబ అవసరాలకో... ఇతర ఖర్చుకో.. వ్యయం చేసే అవకాశం ఉంటుందని కేసీఆర్‌ అధికారుల దృష్టికి తెచ్చారు. పరిహారాన్ని చెక్‌ల రూపంలో ఇవ్వాలని కోరారు.

కోటి ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యం......

సాగునీటి ప్రాజెక్ట్‌ల భూసేకరణపై అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కేసీఆర్‌ ఆదేశించారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యసాధనకు అందరూ సహకరించాలని కోరారు. ముంపును తగ్గించే లక్ష్యంతోనే ప్రాజెక్ట్‌లను రీ డిజైన్‌ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే రిజర్వాయర్ల సమీపంలో కొంత ముంపు తప్పదన్నారు. ఇలాంటి ప్రాంతాల్లో నిర్వాసితుల భూములతోపాటు, ఇళ్లను కోల్పోవాల్సి వస్తుందన్న విషయాన్ని అధికారుల దృష్టికి తెచ్చారు. గూడుచెదిరిన పక్షుల్లా తయారయ్యే వారు కొత్త జీవితం ప్రారంభించేందుకు వీలుగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న విషయాన్ని అధికారులకు గుర్తు చేశారు. నిర్వాసితులు కోల్పోయే భూములు, ఇల్లు, పశువుల కొట్టంతో పాటు చెట్లకు కూడా వెలకట్టి పరిహారం చెల్లించాలని కేసీఆర్‌ ఆదేశించారు. కొత్త ఇంటి నిర్మాణానికి అవసరమైన ఆర్ధిక సహాయాన్ని కూడా ఒకేసారి చెక్‌ల రూపంలోనే ఇవ్వాలని సూచించారు. సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ... అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పూర్తయ్యే దాకా వేచిచూడకుండా.... పంప్‌హౌస్‌ ద్వారా నీటిని తోడేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వచ్చే ఏడాదిన్నర కాలంలో కాళేశ్వరం నుంచి మిడ్‌మానేరు వరకు పనులు పూర్తి చేయాలని కోరారు. 

సాగునీటి ప్రాజెక్టుల పై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : సాగునీటి ప్రాజెక్ట్‌ల భూ నిర్వాసితులకు పరిహారం మొత్తం ఒకేసారి చెల్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వీరిని అన్ని విధాలుగా ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రాజెక్ట్‌లకు భూములిచ్చిన రైతులకు పరిహారం చెల్లింపులో జాప్యం లేకుండా చూడాలన్నాలన్నారు. 

06:55 - May 4, 2016

విశాఖ : తమ సమస్యలు పరిష్కరించాలని,కనీస వేతనాలు కల్పించాలని ఆందోళన చేస్తున్న బ్రాండిక్స్ కార్మికులను వైసీపీ అధినేత జగన్ కలవనున్నారు. విశాఖ పర్యటనకు వెళుతున్న జగన్‌..కార్మికుల నిరసనకు సంఘీభావం తెలపనున్నారు. పోలీసుల లాఠీఛార్జ్ చేయడాన్ని ఖండిస్తూ ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు కార్మికులతో కలసి ఆందోళనలో పాల్గొంటారు. 

06:54 - May 4, 2016

విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. ఒక్క రోజు పర్యటనలో భాగంగా ఆయన సిక్కోలు వస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత సీఎం పర్యటన ప్రారంభమవుతుంది. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఆయన పర్యటన కొనసాగే అవకాశముంది.

వివిధ అభివృద్ధి కార్యక్రమంల్లో సీఎం...

వివిధ అభివృద్ధి కార్యక్రమంల్లో సీఎం పాల్గోనున్నారు. కిల్లిపాలెంలో తాగునీటి పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. శ్రీకాళంలోని కోడి రామ్మూర్తి స్టేడియం ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం నీటి ఆవశ్యతకపై ఏర్పాటుచేసే సదస్సులో ఆయన పాల్గొంటారు. ఆ తరువాత పార్టీ కార్యకర్తలతో సీఎం సమావేశమవుతారు. ఈ కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఆర్‌ అండ్‌ బి అతిథి గృహంలో చంద్రబాబు బస చేస్తారు. తిరిగి గురువారం ఉదయం పదిన్నరకు గెస్ట్‌హౌస్‌ నుంచి హెలికాప్టర్‌లో విజయనగరం జిల్లా పర్యటనకు వెళతారు.

పటిష్ట ఏర్పాట్లు...

సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటుచేశారు. సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు, ఉన్నతాధికారులు సంతృప్తి వ్యక్తంచేశారు. 

06:51 - May 4, 2016

హైదరాబాద్ : రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు ఘన నివాళి అర్పిస్తూ ఆవిర్భావ వేడుకలు జరపాలని కేసీఆర్‌ సూచించారు. అమరవీరుల సంస్మరణార్థం హుస్సేన్‌సాగర్ తీరాన భారీ స్తూపాన్ని నిర్మించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. జూన్‌ 2న కేసీఆర్‌ తన చేతుల మీదుగా స్తూపం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా సాగర్‌ తీరంలో 12 ఎకరాల విస్తీర్ణంలో స్మృతివనం ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ నిర్మాణ పనులను ఆర్‌అండ్‌బీ అధికారులకు అప్పగించారు. ఇప్పటికే అక్కడ ఉన్న పర్యాటక శాఖ, బుద్ద పూర్ణిమ, విద్యుత్‌ శాఖలకు చెందిన కార్యాలయాలను వేరే ప్రాంతాలకు తరలించాలని సీఎం సూచించారు.

స్మృతివనంలో తెలంగాణ చరిత్ర, సంస్కృతి.....

హుస్సేన్‌ సాగర తీరాన కొత్తగా ప్రతిపాదించిన స్మృతివనంలో.. వివిధ రూపాల్లో నిక్షిప్తమైన తెలంగాణ చరిత్ర, సంస్కృతి సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని కేసీఆర్‌ సూచించారు. స్మృతివనంలో తెలంగాణ కోసం జీవిత కాలం పోరాడిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ వంటి ప్రముఖుల జీవిత చరిత్రలను పొందుపరచాలన్నారు.

అతి పెద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని ...

రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా హుస్సేన్‌సాగర్‌ అవతల సికింద్రాబాద్‌ వైపు ఉన్న ప్రాంతంలో అతి పెద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తానికి ఈసారి రాష్ట్ర అవతరణ వేడుకలను అంబరాన్నంటేలా నిర్వహించేందుకు సర్కార్‌ కార్యాచరణ రూపొందిస్తోంది. 

06:48 - May 4, 2016

హైదరాబాద్ :టీడీపీని సంకట స్థితిలోకి నెట్టారు.. రాజ్యసభ ఎంపీ కేవీపీ. ప్రత్యేక హోదాపై ఏదో ఒక నిర్ణయం తీసుకునేలా ఒత్తిడిని పెంచారాయన. ఈనెల 13న రాజ్యసభలో హోదా అంశంపై చర్చ సందర్భంగా తమకు మద్దతునివ్వాలని కేవీపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఇప్పుడు మిత్రధర్మం పాటించి హోదాపై చర్చకు దూరంగా ఉంటారా..? లేక ప్రజాభీష్టాన్ని గౌరవించి బీజేపీకి వ్యతిరేకంగా వెళతారా..? ఇప్పుడీ అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది.

ఏపీలో కోలుకోలేని దెబ్బతిన్న కాంగ్రెస్‌..

రాష్ట్ర విభజనతో ఏపీలో కోలుకోలేని దెబ్బతిన్న కాంగ్రెస్‌.. మళ్లీ పునరుత్తేజం కోసం అన్ని అవకాశాలనూ ఉపయోగించుకుంటోంది. అసెంబ్లీలో తమకు ప్రాతినిథ్యం లేకపోయినా.. ప్రభుత్వంపై విమర్శల దాడి కొనసాగిస్తూనే ఉంది. రాష్ట్ర పునర్విభజన చట్టం హామీల కోసం పోరాటాన్ని నెత్తికెత్తుకున్న హస్తం నేతలు.. ప్రత్యేక హోదాపై ఊరూ..వాడా తిరిగి నిరసనలు తెలిపారు.. కోటి సంతకాలు సేకరించారు. అంతేకాకుండా.. మట్టి సత్యాగ్రహ యాత్రనూ చేపట్టి.. ప్రజాభీష్టాన్ని డిమాండ్‌ను ఢిల్లీ నేతల దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ సమావేశాల్లోనూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టం అమలుపై రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రారావు సభలో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్రం ప్రకటించడంతో.. పోరాటాన్ని ఉధృతం చేసేందుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది.

టీడీపీ, బీజేపీలను ఉక్కిరిబిక్కిరి చేయాలని భావిస్తోన్న కాంగ్రెస్....

ఇదే ఊపుతో పార్లమెంట్‌లో టీడీపీ, బీజేపీలను ఉక్కిరిబిక్కిరి చేయాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. మొన్న కోరం లేదని వాయిదా పడిన చర్చ.. ఈనెల 13న రాజ్యసభ ముందుకు రానుంది. అదేరోజు సవరణలపై ఓటింగ్‌ కూడా జరగనుంది. దీంతో టీడీపీని వ్యూహాత్మకంగా ఇరుకున పెట్టాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది. ఇందులో భాగంగానే కేవీపీ.. చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. రాజ్యసభలో ప్రత్యేక హోదాపై ఓటింగ్‌ సమయంలో మద్దతివ్వాలని కోరారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

టీడీపీ కలిసి రాకపోతే ప్రజల ముందు ఎండగట్టవచ్చని ..

ఒకవేళ టీడీపీ కలిసి రాకపోతే ప్రజల ముందు ఎండగట్టవచ్చని .. పనిలో పనిగా బీజేపీని కూడా దోషిగా నిలబెట్టవచ్చని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఒకవేళ టీడీపీ కలిసిరాకుంటే.. రాష్ట్ర ప్రయోజనాలపై ఆపార్టీకి చిత్తశుద్ధి లేదని చాటాలని యోచిస్తోంది. దీని ద్వారా.. ప్రజలకు చేరువ కావొచ్చని ఆశపడుతోంది హస్తం పార్టీ. ఈ తరుణంలో చంద్రబాబు ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

06:43 - May 4, 2016

హైదరాబాద్ : కాశీ యాత్రికుల కథ ఎట్టకేలకు సుఖాంతం అయ్యింది. బాధితులు ఓ సత్రంలో ఉన్నట్టు కుటుంబసభ్యులు జిల్లా ఎస్పీ రవిప్రకాశ్‌కు తెలిపారు. యాత్రికులు క్షేమంగా ఉన్నట్టు తమకు సమాచారం ఇచ్చారని కుటుంబసభ్యులు చెప్పారు. గాయాలతో ఉన్న లోవరాజు రెండ్రోజుల క్రితం తమ దగ్గర నుంచి ఆదృశ్యమయినట్టు తమ వారు తెలిపారని కుటుంబసభ్యులు ఎస్పీకి వెల్లడించారు.

తమపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారని....

కాశీయాత్రకు వెళ్లిన తమపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారని లోవరాజు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తీవ్రంగా గాయపడ్డ లోవరాజు ప్రస్తుతం వారణాసి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. డాక్టర్ ఫోన్ నుంచి కుటుంబసభ్యులకు బాధితుడు సమాచారం అందించాడు. దీంతో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌కు బంధువులు ఫిర్యాదుచేశారు. దీనిపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ స్పందించారు. వారణాసి పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని కోరారు.

కాకినాడ గొల్లపేటకు చెందిన వారు...

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గొల్లపేటకు చెందిన అప్పల నర్సమ్మ, నారాయణమ్మ, మాణిక్యం, లక్ష్మి, మంగమ్మ, లోవరాజు, అప్పారావు, పేరంటాలు... గత నెల 29న వారణాసి బయలుదేరి వెళ్లారు. చివరిసారిగా మే 1న వారణాసి మొగల్‌రైల్వే స్టేషన్‌లో యాత్రికులు దిగారు. అప్పటి నుంచి తాను తప్ప మిగిలిన వారు కనపడకుండా పోయారని లోవరాజు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చాడు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. తమ వారిని రక్షించాలని బాధితుల బంధువులు కలెక్టర్‌ను కోరారు.

కాకినాడ వాసుల కాశీ యాత్ర సుఖాంతం ...

యాత్రికుల ఆదృశ్యంపై వారణాసి ఉన్నతాధికారులతో కలెక్టర్ అరుణ్‌కుమార్ మాట్లాడుతున్నారు. ఈ సమయంలోనే తాము క్షేమంగా ఉన్నట్టు బాధితుల నుంచి కుటుంబసభ్యులకు సమాచారం అందింది. మొత్తానికి కాశీ యాత్రకు వెళ్లిన కాకినాడ వాసుల యాత్ర సుఖాంతం అయ్యింది. గయలోని ఓ సత్రంలో బాధితులు ఉన్నట్టు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ తెలిపారు. యాత్రికులతో స్వయంగా జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ మాట్లాడారు. 

06:41 - May 4, 2016

హైదరాబాద్ : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడో విచిత్రకర వాతావరణం కనిపిస్తోంది. ఓ వైపు ప్రయివేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతామంటూ మంత్రులు, ముఖ్యమంత్రులు చెబుతున్నారు. మరోవైపు విద్యార్థుల సంఖ్య తక్కువగా వున్నదంటూ వేల సంఖ్యలో స్కూళ్లను మూసివేస్తున్నారు. ఇంకోవైపు ప్రయివేట్ స్కూళ్లలో ఫీజులు మండిపోతున్నాయి. ప్రయివేట్ స్కూళ్ల ఫీజులను నియంత్రించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయి. ఆ మాటకొస్తే విద్యావ్యాపారంలో నాలుగు చేతులా సంపాదిస్తున్నవారే ఎమ్మెల్యేలుగా, ఎంపిలుగా, మంత్రులుగా అవతరిస్తున్నారు. రెండు మూడు కార్పొరేట్ విద్యా సంస్థలు, ఇద్దరు ముగ్గురు విద్యావ్యాపారులే ప్రభుత్వ నిర్ణయాలను శాసిస్తున్న పరిస్థితి.

విద్యారంగం ఖర్చు తగ్గించే ఉపాయాల గురించి ఆలోచన....

పిల్లలకు చదువు అత్యంత ముఖ్యం. విద్య నేర్పడం ప్రభుత్వాల బాధ్యత. అయితే, దురద్రుష్టవశాత్తు విద్యకు కేటాయించే మొత్తాలను ప్రభుత్వాలు ఖర్చుగా భావిస్తున్నాయి. విద్యారంగం ఖర్చు తగ్గించే ఉపాయాల గురించి ఆలోచిస్తున్నాయి. తగినంత సంఖ్యలో విద్యార్థులు లేరంటూ కొన్ని పాఠశాలలను మూసివేస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఈ ధోరణి కనిపిస్తోంది. కానీ, మంత్రులెవ్వరూ తమతమ శాఖల్లో జరుగుతున్న దుబారాను నివారించడం లేదు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేక విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్ లలో పర్యటిస్తూ ఇష్టమొచ్చినట్టు ప్రజల సొమ్మును ఖర్చు చేస్తున్నారు. మంత్రులు, ముఖ్యమంత్రులకు సమయం ఎంత విలువైనదో, పిల్లలకు చదువు కూడా అంతే విలువైంది. ఎక్కడా టైమ్ వేస్ట్ చేయకుండా త్వరత్వరగా గమ్యాలను చేరుకోవడానికి ప్రత్యేక హెలీకేప్టర్లలో తిరుగుతున్న ముఖ్యమంత్రులు పిల్లల చదువుకు వెచ్చించాల్సిన నిధుల్లో కోతలేయడం అభ్యంతరకరం. ముఖ్యమంత్రులు, మంత్రులు తాము వ్రుధాగా పెడుతున్న ఖర్చును తగ్గించుకుని, అదే డబ్బుతో ప్రభుత్వ పాఠశాలలను ఎందుకు అభివ్రుద్ధి చేయకూడదు?

విద్యార్థుల సంఖ్య తక్కువగా వుందన్న పేరుతో ...

విద్యార్థుల సంఖ్య తక్కువగా వుందన్న పేరుతో స్కూళ్లను మూసివేయడమే పెద్ద దుర్మార్గం. ఏ స్కూళ్లో ఎంత మంది విద్యార్థులున్నారన్నది ముఖ్యం కాదు వారికి ఎంత నాణ్యమైన విద్యను బోధించామన్నది ముఖ్యం. ఆ మాట కొస్తే చాలా ప్రభుత్వ పాఠశాలలు తొలినాళ్లలో అయిదారుగురు విద్యార్థులతోనే ప్రారంభమయ్యాయన్న వాస్తవాన్ని విస్మరించకూడదు. ప్రతి ఊరిలోనూ ఒక పాఠశాల పెట్టాలన్న ధ్యేయంతో తొలి తరం నాయకత్వం పనిచేసింది. వాటిలో చదువుకుని పైకొచ్చిన నేటి తరం నాయకత్వం వాటిని మూసివేస్తోంది. ఇవాళ ప్రభుత్వాలు చేయాల్సింది స్కూళ్లను మూసివేయడం కాదు. విద్యార్థుల సంఖ్య తక్కువ వున్న పాఠశాలల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి, విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం. నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడాలేకుండా ఊడలు వేసిన విద్యా వ్యాపారాన్ని నియంత్రించడం. 

06:38 - May 4, 2016

హైదరాబాద్ : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్ల మూసివేత వ్యవహారం మళ్లీ తెర మీదకు వచ్చింది. మూసివేయాల్సిన స్కూళ్ల మీద ప్రభుత్వాలు ఇప్పటికే కసరత్తు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 5 వేల స్కూళ్లను మూసివేసే అవకాశం వుంది. దీంతో స్కూళ్ల మూసివేతకు వ్యతిరేకంగా విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు ఆందోళన బాటపడుతున్నాయి. స్కూళ్లను మూసివేతను విద్యార్థి సంఘాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ప్రభుత్వ స్కూళ్లను మూసివేయడం వల్ల సమాజానికి జరిగే హాని ఏమిటి? ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు మెరుగుపడాలంటే ప్రభుత్వం తక్షణం చేపట్టాల్సిన చర్యలేమిటి? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఆంధ్రప్రదేశ్ ఎస్ఎఫ్ఐ నేత మహేష్ విజయవాడ నుండి పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

కాశీ యాత్రకు వెళ్లిన కాకినాడ వాసుల యాత్ర సుఖాంతం

హైదరాబాద్ : కాశీ యాత్రకు వెళ్లిన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వాసుల కథ సుఖాంతం అయ్యింది. బాధితులు ఓ సత్రంలో ఉన్నట్టు అధికారులు తెలియజేశారు. తాము క్షేమంగా ఉన్నట్టు యాత్రికులు సమాచారం ఇవ్వడంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయాన్ని అధికారులు కూడా ధృవీకరించారు. 

Don't Miss