Activities calendar

08 May 2016

22:16 - May 8, 2016

మల్లన్న ముచ్చట్లు : పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు. ఇక ఆ పల్లెల్లో పాడుకునే పాటలు ఎంతో ఆహ్లాదకరంగా..విజ్ఞానదాయంగానూ వుంటాయి. ఆ పల్లెపదాలతో కూడిన పాటలు వింటువంటే మనసుకు చాలా హాయిగా వుంటుంది. వాటిని వ్రాయాలన్నా, పాడాలన్నా , ఊరుపట్ల ప్రేమ, ఆర్తి, ఇష్టం, తపన వుంటేనే అవి సాధ్యమవుతాయి. పల్లె పాటలు పాడుతున్నా..వింటున్నా.. మనల్ని మనమే మరచిపోతాం..మైమరచిపోతాం. ఈ పాటలు  వ్రాయాలంటే పల్లెల సంప్రదాయాలు, స్థితిగతులు, వారి సున్నితమైన మనస్సులు, పల్లెల పరిసరాలు వీటన్నింటి పట్ల ఒక నిగూఢమైన నిబద్ధత వుంటేనే ఆ స్వచ్ఛత వారి గళంలోనూ...కలంలోనూ కనపడుతుంది. మరి అటువంటి వాగ్గేయకారులు ఈనాటి మన మల్లన్నతో ముచ్చట్లాటానికి కాదు కాదు పాటలాడ్డానికి జానపదాల వాగ్గేయకారులు బుచ్చన్న, సోమన్న, జయరాజు మన 10టీవీ స్టూడియోకి వచ్చారు. మరి వారి పాడుతూ ఆటలాడిన ముచ్చట్లను మనమూ విందాం.... చూద్దాం... మనం పల్లెలలో మనం ఆడుకుని పాడుకున్న దృశ్యాలను నెమరువేసుకుందాం....మరి ఇంకెందుకు ఆలస్యం వారితో పాటు పాటలాడ్డానికి ఈ వీడియోను క్లిక్ చేద్దాం..పల్లెల స్వచ్ఛతను ఆస్వాదిద్దాం....

22:06 - May 8, 2016

కర్నూలు : జిల్లా దోన్‌లో విషాదం చోటుచేసుకుంది. చండ్రపల్లి గ్రామంలోని బలపమురాయి క్వారీలో పనిచేసే ముగ్గురు మహిళ కార్మికులు మృతి చెందారు. క్వారీలోని మట్టిదిబ్బలు పైన పడడంతో మహిళలు అక్కడిక్కడే మృతివాత పడ్డారు. క్వారీ అధికార పార్టీకి చెందిన వ్యక్తిది కావడంతో పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారని గ్రామస్థులు చెబుతున్నారు.

21:49 - May 8, 2016

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు కేంద్ర వైఖరికి నిరసనగా ఆందోళనలు చేస్తున్నాయి. దీక్షలు నిరసనలతో జిల్లాలు హోరెత్తుతున్నాయి. అటు మంత్రులు సైతం ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై పెదవి విరుస్తున్నారు. ప్రత్యేకహోదాపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్రవైఖరికి నిరసనగా ప్రజలు రోడ్డెక్కుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి ప్రత్యేకహోదాకోరుతూ,అనంతపురం ఆర్డీఓకార్యాలయం ఎదుట నిరవధికనిరాహారదీక్షలు ప్రారంభమయ్యాయి.ఈ దీక్షలో చలసాని శ్రీనివాస్ తోపాటుగా పలువురు పాల్గొన్నారు.ఈ దీక్షకు సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ మద్దతు తెలిపారు.

ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మోసం చేసింది: సీపీఎం మధు

ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజలను బిజెపి ప్రభుత్వం మోసంచేసిందని, బిజెపితో స్నేహం వలన రాష్ట్రానికి ఒరిగేదేంలేదని తేలిపోయిందని ఈ సందర్భంగా మధు అన్నారు.

రాష్ట్రానికి ముష్టి వేశారు : చలసాని శ్రీనివాస్

రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేకప్యాకేజీ ఇవ్వకుండా, జిల్లాకు యాభైకోట్లరూపాయలు ముష్టి వేశారని చలసాని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక భాగం కాదేమోనని కేంద్రం భావిస్తున్నట్టు అనిపిస్తోందని చలసాని శ్రీనివాస్ అన్నారు.

విభజన హామీలపై టీడీపీ నేతలు నోరు మెదపడం లేదు: వైసీపీ నేత పెద్దిరెడ్డి

అటు ప్రతిపక్ష వైసీపీ పార్టీ నేతలు సైతం తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడ్డారు. బీజేపీ విభజన హామీలు నెరవేర్చకపోయినా టీడీపీ నేతలు నోరు మెదపడం లేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. కేంద్రంతో సయోధ్య చేస్తూ ఏపీ ప్రభుత్వం ఏం సాధించిందని... అంబటి రాంబాబు ప్రశ్నించారు.. కేంద్ర పదవుల్ని వదలమంటున్న సీఎం చంద్రబాబు.. ఈ రెండేళ్లలో ఎన్ని నిధులు తెచ్చారని ప్రశ్నించారు.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కలిసిపనిచేయడం కొందరికి ఇష్టంలేదు: అశోక్ గజపతిరాజు

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలసిపనిచేయడం కొందరికి ఇష్టంలేదని కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా అవసరమని.. దీని గురించి కేంద్రాన్ని ప్రణాళిక బద్ధంగా అడుగుతున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలకులు అశాస్త్రీయంగా విభజించడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.

ప్రత్యేక హోదా సాధించేవరకూ పోరాడతా: డిప్యూటీ సీఎం కేఈ

ఇదిలా ఉంటే కేంద్రం నీతి ఆయోగ్‌ను అడ్డంపెట్టుకొని ఏపీకి స్పెషల్ స్టేటస్, స్పెషల్ ప్యాకేజీపై జాప్యం చేయడం తగదని ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ప్రత్యేకహోదా సాధించే వరకూ పోరాడతామని ఆయన తెలిపారు.

కేంద్రంపై మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి : చంద్రబాబు

ఇదిలా ఉంటే సీఎం చంద్రబాబు మాత్రం మంత్రులతో భేటీ సందర్భంగా కేంద్రంపై మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలన్నారు. అంతేకాదు కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు, ఒత్తిడి ద్వారానే నిధులు రాబట్టాలన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను తిప్పిగొట్టాలని సూచించారు.

20:15 - May 8, 2016

విశాఖ : ఆర్కే బీచ్‌లో ఐదుగురు గల్లంతయ్యారు. సముద్రంలో స్నానానికి వెళ్లిన శ్రావణ్‌, శేషు, ప్రసాద్‌, బాబర్‌, సీతనలు గల్లంతయినట్లు గుర్తించారు. వీరు ఫిషింగ్‌ హార్బర్‌ వద్ద ఐస్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు సమాచారం. వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

20:08 - May 8, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయపై ఉత్తమ వార్తా కథనాలకు అవార్డులు ఇచ్చింది. ఈ సందర్భంగా టెన్ టీవిలో ప్రసారమైన చెరువే ఆదరువు కథనానికి ప్రథమ బహుమతి లభించింది. జలసౌధలో జరిగిన మీడియా అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం లో టెన్‌ టీవీ ప్రోగ్రాం ప్రొడ్యూసర్‌ వంగపల్లి పద్మ మంత్రి హరీష్‌ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సీనియర్ జర్నలిస్టులు రామచంద్రమూర్తి, మల్లేపల్లి లక్ష్మయ్య పాల్గొన్నారు.

19:57 - May 8, 2016

హైదరాబాద్ : సంచలనం సృష్టించిన దేవిరెడ్డి మృతి కేసు మిస్టరీ వీడింది. దేవి రెడ్డి మృతికి కారు యాక్సిడెంటే కారణమని సీపీ మహేందర్‌ రెడ్డి తేల్చి చెప్పారు. సీట్‌బెల్ట్‌ పెట్టుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తేల్చారు. మెడికల్‌, ఫోరెన్సిక్, మోటార్‌ వెహికిల్‌ విభాగాల అధికారులు ఘటనపై క్షుణ్ణంగా తనిఖీ చేసి తేల్చారని ఈ సందర్భంగా సీపీ ప్రకటించారు. దేవిరెడ్డి మృతిపై నెలకొన్న పలు సందేహాలు నేపథ్యంలో హైదరాబాద్‌ సీపీ మహేందర్‌ రెడ్డి ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేవి రెడ్డి మృతి వెనుక కారణాలను సుదీర్ఘంగా విశ్లేషించారు. హత్య, లైంగికదాడి లాంటి పలు అంశాలపై దర్యాప్తు ఆరు టీంలచే దర్యాప్తు జరిపించినట్లు కమిషనర్‌ తెలిపారు.

ఈ విషయంగా దేవీరెడ్డి తండ్రి ప్రెస్ మీట్ నిర్వహించారు....

ఇంజనీరింగ్ విద్యార్థిని దేవీరెడ్డి మృతి కేసు పలు కీలక పరిణామాల మధ్య విచారణ కొనసాగింది. దీనిపై సమగ్రంగా విచారణ చేసిన పోలీసు యంత్రాంగం ఈ రోజు ప్రెస్ మీట్ లో సీపీ అన్ని వివరాలను వెల్లడించారు. ఈ విషయంపై దేవీరెడ్డి తండ్రి కూడా మీడియాతో మాట్లాడారు. వాస్తవం ఏమిటనే విషయంపై మీడియా వ్యవహరించిన తీరుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. మీడియా చొరవతోనే తన బిడ్డ మృతి కేసు త్వరగా విచారణ జరిగిందనీ ఆయన పేర్కొన్నారు. లోకల్ పోలీసులు అత్యుత్సాహంతో కారును వేరే ప్రదేశంలోకి తరలించేసరికి తాను అనుమానపడ్డానని ఆయన తెలిపారు. ఈ విషయంలో తనకు ఇంకా అనుమానాలున్నాయన్నారు.ఈ ఘటనపై మరింతగా విచారణ జరుపుతామని సీపీ మహేందర్ తెలిపారని ఆయన అన్నారు. 

19:53 - May 8, 2016

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు విదేశీపర్యటనకు వెళ్ళనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పర్శనల్ టూర్ కు బాబు థాయ్ లాండ్, స్విట్జర్లాండ్ వెళ్ళనున్నారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన నేపథ్యంలో పార్టీ సీనియర్లు, మంత్రులతో 3 గంటల పాటు సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రులకు కీలక బాధ్యతలు సీఎం చంద్రబాబు అప్పగించారు. విభజన చట్టం హామీలపైనా సమావేశంలో చర్చించారు. బీజేపీతో వైఖరిపై ఎలా ఉండాలనే అంశంపై చర్చ జరిగింది. కేంద్రంపై మాట్లాడేటప్పుడు సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు. కేంద్ర సహాయంపై సమగ్ర నివేదిక రూపొందిచాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్లతో, మంత్రులతో 3 గంటల పాటు సీఎం భేటీ అయ్యారు. ఈ క్రమంల సీఎం మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించారు. విభజన చట్టం హామీలు, బీజేపీతో వైఖరిపై ఎలా ఉండాలనే అంశంపై చర్చించారు. కేంద్రంపై కీలకనేతలు మాట్లాడేటప్పుడు సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు.

19:26 - May 8, 2016

అనంతపురం : జిల్లా తాడిపత్రిలో విషాదం చోటుచేసుకుంది. 3వ తరగతి చదువుతున్న మహేంద్ర అనే బాలుడు చీరతో కట్టిన ఉయ్యాలలో ఊగుతుండగా ప్రమాదవశాత్తు చీర గొంతుకకు చుట్టుకోవడంతో ఊపిరాడక మృతి చెందాడు. ఈ హఠాత్ పరిణామానికి మహేంద్ర తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించుకోలేదని బంధువులు విలపించారు. దీంతో వారి కుటుంబం విషాదంలో మునిగిపోయారు.

19:21 - May 8, 2016

శ్రీకాకుళం  :మందస మండలంలోని సముద్రతీరానికి భారీ తిమింగలం కొట్టుకొచ్చింది.శుక్రవారం చనిపోయిన ఈ చేప ఇవాళ మత్స్యకారులకు కనిపించింది. సుమారు యభై అడుగుల పొడవుతో వింత ఆకారంలో ఉన్న ఇలాంటి భారీ చేపను తామెన్నడూ చూడలేదని మత్స్యకారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సముద్రంలో ఓడ తగిలి,ఇది చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ భారీ చేపను చూడటానికి సముద్ర తీరానికి పెద్ద సంఖ్యలో స్థానికులు వచ్చారు.

19:14 - May 8, 2016

అనంతపురం : రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోరుతూ, అనంతపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరవధిక నిరాహారదీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ దీక్షకు సిపిఎం రాష్ట్రకార్యదర్శి మధు మద్దతు పలికారు. ప్రత్యేకహోదా విషయంలో రాష్ట్రప్రజలను బిజెపి ప్రభుత్వం మోసం చేసిందని మధు అన్నారు. బిజెపితో స్నేహం వలన రాష్ట్రానికి ఒరిగేదేం లేదంటున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పేర్కొన్నారు.

19:00 - May 8, 2016

విజయవాడ : కేంద్రం నీతి ఆయోగ్‌ను అడ్డంపెట్టుకొని ఏపీకి స్పెషల్ స్టేటస్, స్పెషల్ ప్యాకేజీపై జాప్యం చేయడం తగదని ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ప్రత్యేకహోదా సాధించే వరకూ పోరాడతామని ఆయన తెలిపారు. విభజన చట్ట ప్రకారం తెలంగాణలో కొత్త ప్రాజెక్టులు నిర్మించాలంటే ఎపెక్స్ కౌన్సిల్, కృష్ణా, గోదావరి బోర్డుల పర్మిషన్‌తోనే నిర్మించాలి.. కానీ తెలంగాణ సర్కారు నిబంధనలకు విరుద్ధంగా రంగారెడ్డి, పాలమూరు ఎత్తిపోతల నిర్మాణాలను చేపడుతోందని విమర్శించారు. ఇప్పటికే కర్ణాటక అక్రమ ప్రాజెక్టులు, జలచౌర్యం వల్ల సీమలో ఆయకట్టుకు తీవ్రంగా నష్టం వాటిల్లిందన్నారు. ఇక డిండి, పాలమూరు కడితే రాయలసీమ ఎడారిగా మారడం ఖాయమన్నారు కేఈ. తెలంగాణ ప్రజల మెప్పు కోసం కేసీఆర్ ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు కడుతూ ఆ నెపాన్ని చంద్రబాబు మీదకు నెట్టడం సరికాదన్నారు. 

18:57 - May 8, 2016

విజయనగరం : రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని.. దీని గురించి కేంద్రాన్ని ప్రణాళిక బద్ధంగా అడుగుతున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేయడం కొందరికి ఇష్టం లేదని కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలకులు అశాస్త్రీయంగా విభజించడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ను ఛత్తీస్‌ఘడ్‌, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని.. పోలవరం సాధనకు అందరినీ కలుపుకుంటూ పోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

18:45 - May 8, 2016

విజయవాడ  : రవాణాశాఖలో అన్ని కార్యకలాపాలను ఆన్‌లైన్ చేసి అవినీతిని పూర్తిగా నిర్మూలిస్తామని ఆ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు అన్నారు. విజయవాడలో, 13 జిల్లాల రవాణాశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీని బలోపేతం చేసి, ఈ ఏడాది ఆదాయం పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు నెలలో పదిరోజులు డ్రంక్ అండ్‌ డ్రైవ్‌, స్పీడ్ డ్రైవ్‌లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఆర్టీసీని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. రవాణాశాఖలో అవినీతిని పూర్తిగా నిర్మూలిస్తామని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ కార్యకలాపాల్నీ ఆన్‌లైన్‌ చేస్తామని తెలిపారు. ఆర్టీసీని అభివృద్ధిచేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. 

18:35 - May 8, 2016

హైదరాబాద్ : నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌... సర్కిళ్ల వారీగా కార్పొరేటర్లు, అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఇలాంటి సంయుక్త సమావేశాలు ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో వీటికి శ్రీకారం చుట్టారు.

జంటనగరాల్లో నాలాల్లో పూడికతీత.....

జంటనగరాల్లోని నాలాల్లో పూడికతీతకు మేయర్‌ ప్రాధాన్యత ఇస్తున్నారు. వచ్చే వర్షకాలంలో నగరంలోని ఏ నాలా కూడా పొంగిపొర్ల కుండా చూడాల్సిన బాధ్యత అధికారులు, కార్పొరేటర్లపై ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇద్దరూ కలిసి సమన్వయంతో పనిచేసి.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచిస్తున్నారు. ఇంటింటికీ ఇంకుడు గుంత ఉండేలా చూసే బాధ్యత కార్పొరేటర్లపైనే ఉందని, ప్రజలతో మమేకమై పనిచేసే కార్పొరేటర్లకు ఇది పెద్ద సమస్య కాబోదంటూ హితబోధ చేస్తున్నారు. తీవ్ర వర్షాభావంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్న తరుణంలో... ఇంకుడు గుంతల నిర్మాణంతో ఈ సమస్య కొంతవరకు పరిష్కారం అవుతుందని సూచిస్తున్నారు. మేయర్‌ రామ్మోహన్‌ సూచనల మేరకు ఎంతమంది కార్పొరేటర్లు తమ ఇళ్లలో ఇంకుడు గుంతలు తవ్వించి ఆదర్శంగా నిలుస్తారో వేచి చూడాలి.

18:07 - May 8, 2016

రంగారెడ్డి  : మదర్స్ డే రోజు కన్నపేగును మరచిన ఓ తల్లి ఏడాది వయసున్న బాబును బస్టాండ్‌లో వదిలేసి వెళ్లిపోయింది.. రంగారెడ్డి జిల్లా పరిగి బస్టాండ్‌లో చిన్నారి ఏడుపుతో స్థానికులు అతన్ని అక్కున చేర్చుకున్నారు.. పోలీసులు, ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చారు.  

18:02 - May 8, 2016

ఖమ్మం : అమ్మ సృష్టికి మూలం. అమ్మ పిలుపులో ఎంతో కమ్మదనం ఉంది. అమ్మ పదంలో వెన్నెలకన్నా చల్లననైన ఓ మధురమైన అనుభూతి ఉంది. బువ్వ పెట్టి, బుజ్జగించి.. లాలించి.. పాలించి మనల్ని ప్రయోజకులను చేసేవరకు విశ్రమించని అమ్మకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. అందుకే అమ్మను మించిన దైవం లేదు. కాబట్టే అమ్మను దైవసమానంగా భావిస్థారు. అందుకే మాతృదేవో భవః అన్నారు. అమ్మతో తనకున్న అనుబంధాన్ని మరచిపోలేని ఓ యువకుడు అమ్మకోసం విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిత్యం అమ్మను దైవంలా కొలుస్తున్నాడు.

అమ్మ అంటే ....

అమ్మ పేరు వింటేనే మరపురాని అనుభూతి మన సొంతమవుతోంది. అమ్మంటే సృష్టికి మూలం. అమ్మలేని లోటు.. తీర్చడం ఎవరితరం కాదు. అమ్మను దైవసమానంగా భావిస్తూ.. మాతృదేవోభవః అంటున్నాం. అలాగే ..ఖమ్మం జిల్లాలో అమ్మకోసం విగ్రహాన్ని స్థాపించాడో యువకుడు. అమ్మ ప్రేమను మరిచిపోలేని అతను అమ్మపేరిట ఓ కిరాణం షాపును నడుపుతూ అమ్మజ్ఞాపకాలతో జీవనం కొనసాగిస్తున్నాడు. పాల్వంచ ఇందిరానగర్‌కు చెందిన రుక్మాంగధరరావుకు అమ్మంటే అంతులేని ప్రేమ. అమ్మ తన కోసం పంచిన ప్రేమ, ఆప్యాయతలను నెమరేసుకుంటూనే అమ్మకోసం ఇదిగో ఇలా.. విగ్రహాన్ని స్థాపించాడు.

తల్లికి విగ్రహం ప్రతిష్టించిన రుక్మాంగధర రావు....

రెక్కలొచ్చాక ఎక్కడికో ఎగిరిపోయే పక్షుల్లాగా చాలామంది తల్లి దండ్రులను వదలేసి వెళ్లి పోతున్న ఈ రోజుల్లో రుక్మాంగధరరావు మాత్రం తన తల్లికి విగ్రహాన్ని నెలకొల్పి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అంతేకాదు ..తన అమ్మ పేరిట స్థాపించిన కిరాణం షాపే తనకు కాస్త కడుపు నింపుతోందని అంటున్నాడు.

అమ్మ జ్ఞాపకాలను మరవకుండా తన అమ్మ రూపాన్ని తన ఇంటిముందే ప్రతిష్టించి అమ్మకు సరైన నిర్వచనం చెపుతున్నాడీ యువకుడు. అమ్మ విగ్రహం వల్లనే తన షాపు లాభాలలో నడుస్తోందని రుక్మాంగధర రావు అంటున్నాడు.  

17:54 - May 8, 2016

హైదరాబాద్ : పాముల ఫోటోలను తీసి, ఆన్‌లైన్‌లో అమ్మకాలు పెడుతున్న వ్యక్తిని ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ ఘట్‌కేసర్‌కి చెందిన పల్లం నరేష్ అనే వ్యక్తి రెండు తలల పాములు మూడు తీసుకు వచ్చి వాటిని ఫోటోలు తీసి ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టాడు. ఆన్ లైన్ లో లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. వైల్డ్ ఇన్ ట్రాఫిక్ ఇండియా ద్వారా బాలాజీ అనే వ్యక్తి కొనుగోలు చేస్తానని ఖమ్మం రప్పించాడు. తీరా ఖమ్మం వచ్చాక బాలాజీ, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో నరేష్ ను ఫారెస్ట్ రేంజ్ అధికారి కోటేశ్వరరావు అరెస్ట్ చేసి అతని కారును కూడా సీజ్ చేశారు.

17:51 - May 8, 2016

హైదరాబాద్  : సంచలనం సృష్టించిన దేవిరెడ్డి మృతి కేసు మిస్టరీ వీడింది. దేవి రెడ్డి మృతికి కారు యాక్సిడెంటే కారణమని సీపీ మహేందర్‌ రెడ్డి తేల్చి చెప్పారు. సీట్‌బెల్ట్‌ పెట్టుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తేల్చారు. మెడికల్‌, ఫోరెన్సిక్, మోటార్‌ వెహికిల్‌ విభాగాల అధికారులు ఘటనపై క్షుణ్ణంగా తనిఖీ చేసి తేల్చారని ఈ సందర్భంగా సీపీ ప్రకటించారు. దేవిరెడ్డి మృతిపై నెలకొన్న పలు సందేహాలు నేపథ్యంలో హైదరాబాద్‌ సీపీ మహేందర్‌ రెడ్డి ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేవి రెడ్డి మృతి వెనుక కారణాలను సుదీర్ఘంగా విశ్లేషించారు. దేవిరెడ్డి కాల్‌ డేటాను సేకరించి విచారణ చేపట్టామనీ..సీట్‌ బెల్ట్‌ పెట్టుకోకపోవడమే దేవిరెడ్డి మృతికి కారణమనీ ఆయన పేర్కొన్నారు. అన్ని కోణాల్లో విచారించాకే ప్రమాదంలో మృతి చెందినట్లు నిర్ధారణకు వచ్చామనీ  ఆయన తెలిపారు.

17:38 - May 8, 2016

ఖమ్మం : పాలేరు ప్రచారంలో సీపీఎం దూసుకుపోతోంది. వామపక్షాలు బలపర్చిన సీపీఎం అభ్యర్థి పోతినేని సుదర్శన్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో వామపక్షాలు బలంగా ఉన్నాయి కాబట్టే ఎమ్మెల్సీ, మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల్లో పోటీకి దిగారని పోతినేని విమర్శించారు. కరవుతో ప్రజలు అల్లాడుతుంటే ఇప్పటి వరకు మంత్రులు,ఎమ్మెల్యేలు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేదని అన్నారు. పాలన వదిలేసి మంత్రులు,ఎమ్మెల్యేలు పాలేరులో తిరుగుతున్నారని పోతినేని మండిపడ్డారు. ఓటమి భయంతోనే టీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. 

17:35 - May 8, 2016

ఖమ్మం : పాలేరు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలిస్తే రాజీనామా చేయాలన్న కేటీఆర్‌ సవాల్‌పై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ స్పందించారు. పిల్లకాకి మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఉత్తమ్‌ మండిపడ్డారు. శ్రీకాంతాచారి తల్లిని ఎమ్మెల్సీగా ఎందుకు నామినేట్‌ చేయలేదని ఆయన విమర్శించారు. కేటీఆర్‌ ఓ బచ్చా.. అతనికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. తమ అభ్యర్థి రాంరెడ్డి సుచరితకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారనీ..ఈ ఎన్నికలలో తమ పార్టీ విజయం సాధిస్తుందనీ ధీమా వ్యక్తం చేశారు.

వృద్ధురాలిని హత్య చేసి దోపిడీ .....

మెదక్ : కొండపాక మండలం బందారం గ్రామంలో ఇమ్మడి మల్లవ్వ(80) అనే వృద్ధురాలిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. అనంతరం రెండున్నర తులాల బంగారు, 50 వేల రూపాయల నగదు దోచుకెళ్లారు. మల్లవ్వ కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

రోడ్డుప్రమాదంలో ఇద్దరి మృతి...

నల్గొండ: జిల్లాలోని సూర్యాపేట మండలం రాయినిగూడెం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను వెనుక నుండి వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ఘటన సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. కాగా మృతులు ఇద్దరూ నడిగూడెం మండల కేంద్రానికి చెందిన వారి పోలీసులు గుర్తించారు.

ఐపీఎల్-2016 ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ ...

విశాఖపట్నం : ఐపీఎల్‌-9లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. సీజన్‌లో తొమ్మిది మ్యాచ్‌లాడిన ముంబయి ఇండియన్స్‌ ఐదింట్లో గెలుపొందగా.. 8 మ్యాచ్‌లాడిన డేవిడ్‌ వార్నర్‌ నేతృత్వంలోని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐదింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. తాజా సీజన్‌లో విశాఖపట్నం వేదికగా ఇదే తొలి మ్యాచ్‌ కావడం విశేషం.

16:01 - May 8, 2016

హైదరాబాద్ : జంటనగరాల్లో రోజురోజుకు పేరుకుపోతున్న చెత్త.. కొత్త సమస్యలు సృష్టిస్తోంది. స్వచ్ఛ్ సిటీగా నెంబర్ వన్‌గా నిలపాలన్న లక్ష్యం సుసాధ్యం కావాలంటే.. కఠిన చర్యలు తప్పవని బల్దియా సంకేతాలిస్తోంది. పర్యావరణానికి ప్రధమ శత్రువైన ప్లాస్టిక్‌ సంచులు ఉత్పత్తి, వినియోగంపై పూర్తిగా నిషేధించే అంశాన్ని జీహెచ్ఎంసీ పరిశీలిస్తోంది.

బహిరంగ ప్రదేశంలో చెత్త వేస్తే జరిమానా : మేయర్ బొంతు రామ్మోహన్...

ప్లాస్టిక్‌ సంచుల ఉత్పత్తిదారులతో త్వరలో సమావేశమవుతున్నట్లు మేయర్‌ రామ్మోహన్‌ తెలిపారు. ప్లాస్టిక్‌ వ్యర్ధాలతో ప్రజారోగ్య, పర్యావరణ సమస్యలొస్తాయని ఆయన ఈ సందర్భంగా ఆయన తెలిపారు. బహిరంగంగా చెత్తవేసే ప్రదేశాల్లో డంపర్‌ బిన్ల ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఎక్కడపడితే అక్కడ చెత్తవేసేవారిపై జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

జంట నగరాల్లో రోజురోజుకు పెరుగుతున్న ప్లాస్టిక్‌ వినియోగం....

జంటనగరాల్లో రోజురోజుకు పెరుగుతున్న ప్లాస్టిక్‌ వినియోగంపై జీహెచ్ఎంసీ స్పందించింది. నగరంలో ఉపయోగించిన ప్లాస్టిక్‌ సంచులను ఎక్కపడితే అక్కడ విచ్చలవిడిగా పారేయడం వల్ల... అవి నాలాల్లోకి చేరి మురుగునీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. దీంతో నాలాలు పొంగి పరిసర ప్రాంతాల్లోని కాలనీలకు మురుగు నీరు చేరుతోంది. ఈ సమస్య అటు ప్రజారోగ్యంతో పాటు, ఇటు పర్యావరణంపై తీవ్ర ప్రభావంచూపుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్లాస్టిక్‌ సంచుల ఉత్పత్తి, వినియోగాన్ని పూర్తిగా నిషేధించే అంశాన్ని జీహెచ్‌ఎంసీ పరిశీలిస్తోంది.

2011లో ప్లాస్టిక్ పై నిషేధం...

జంటనగరాల్లో 40 మైక్రాన్ల మందం కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ సంచుల తయారీ, వినియోగంపై నాలుగేళ్ల కిత్రమే నిషేధం విధించారు. 2011 జులై 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దీనిని ఉల్లంఘించిన ఉత్పత్తిదారులకు 25 వేల నుంచి 50 వేల రూపాయల జరిమానా విధించే నిబంధనలు తీసుకొచ్చారు. వ్యాపారులపై 2 వేల నుంచి 5 వేల ఫైన్‌ వేసే విధంగా ఉత్తర్వులు జారీ చేశారు. వ్యక్తులపై 250 నుంచి 500 రూపాయల జరిమానా విధించేలా నిబంధనలు తీసుకొచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా... ప్లాస్టిక్‌ నిషేధాన్ని అమలు చేయడంలో జీహెచ్‌ఎంసీ అధికారులు విఫలమయ్యారు. ఇటు ఉత్పత్తిదారులు అటు వినియోగదారులు నిషేధాన్ని ఉల్లంఘించారు. దీంతో గ్రేటర్ అధికారుల ఉద్దేశం నీరుకారిపోయింది. విపరీతమైన వాడకంతో... నాలాలన్ని ప్లాస్టిక్‌ సంచులతో నిండిపోయాయి. వీటిని తొలగించడం జీహెచ్‌ఎంసీకి ఇప్పుడు తలకుమించిన భారంగా మారింది. దీంతో మరోసారి పాస్టిక్‌ నిషేధం అంశం తెరమీదకు వచ్చింది.

1116 ప్రాంతాల్లో బహిరంగ చెత్త వేస్తున్న ప్రదేశాలను గుర్తించిన అధికారులు...

మరోవైపు స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమంలో భాగంగా బహిరంగంగా చెత్తవేసే ప్రదేశాలను పూర్తిగా లేకుండా చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఓపెన్‌ డంపింగ్‌ ప్రదేశాలున్న చోట్ల డంపర్‌ బిన్లు ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో 1116 చోట్ల బహిరంగంగా చెత్త వేస్తున్న ప్రాంతాలను గుర్తించిన అధికారులు... ఇంతవరకు 754 ప్రాంతాల్లో డంపర్‌ బిన్లు ఏర్పాటు శారు. ఈ విషయంలో ముందున్న కాప్రా సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ సరోజ, వైద్యాధికారి డాక్టర్‌ మల్లికార్జున్‌, పర్యవేక్షకుడు సుదర్శన్‌లను జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అభినందించారు. సామ, ధాన, బేధ, దండోపాయాలు ఉపయోగించైనా బహిరంగంగా చెత్తవేసే వారిలో మార్పు తీసుకురావాలని నిర్ణయించారు. ఇటు ప్లాస్టిక్‌ నిషేధం, అటు బహిరంగ ప్రదేశాల్లో చెత్త నిర్మూలనపై జీహెచ్‌ఎంసీ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. ఈ రెండూ విజయవంతమైతేనే స్వచ్ఛ హైదరాబాద్‌ లక్ష్యం సాకారమవుతుందని నిపుణులు చెబుతున్నారు. 

15:30 - May 8, 2016

విశాఖపట్నం: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో సంచలనాలకు మారుపేరైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు మరో కీలక సమరానికి సన్నద్ధమైంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో పోటీ ఆరెంజ్‌ ఆర్మీ రెడీ అయింది. వరుస విజయాలతో జోరు మీదున్న సన్‌రైజర్స్‌ జట్టు ...ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి దాదాపుగా ప్లే ఆఫ్‌ రేస్‌లో టాప్‌ ప్లేస్‌లో నిలవాలని తహతహలాడుతోంది. స్టీల్ సిటీ విశాఖ ఏసీఏ - వీడీసీఏ స్టేడియం వేదికగా సాయంత్రం 4 గంటలకు ఈ పోటీ ప్రారంభమవుతుంది....

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో మరో హాట్‌ హాట్‌ ఫైట్‌కు సిద్థం....

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో మరో హాట్‌ హాట్‌ ఫైట్‌కు వైజాగ్‌లో రంగం సిద్ధమైంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో సంచలనాలకు మారుపేరైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు కీలక పోటీకి సన్నద్ధమైంది. బ్యాక్‌ టు బ్యాక్‌ విజయాలతో ఆరెంజ్‌ ఆర్మీ జోరు మీదుండగా...సక్సెస్‌ ట్రాక్‌లో దూసుకుపోతున్నముంబై ఇండియన్స్‌ జట్టు విశాఖపట్నంలోనూ జైత్రయాత్ర కొనసాగించాలని పట్టుదలతో ఉంది.ఇప్పటివరకూ సన్‌రైజర్స్ జట్టు ఆడిన 8 లీగ్‌ మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించగా....ముంబై జట్టు 9 లీగ్‌ మ్యాచ్‌ల్లో 5 విజయాలు నమోదు చేసింది.

ఆత్మవిశ్వాసంతో ఉరకలేస్తున్న సన్ రైజర్స్ ....

ప్రస్తుత సీజన్‌లో అసలే మాత్రం ఎక్స్‌పెక్టేషన్స్‌ లేకుండా బరిలోకి దిగి అంచనాలకు మించి రాణిస్తోన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టు... ప్రస్తుతం రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉరకలేస్తోంది. డేవిడ్‌ వార్నర్‌ , శిఖర్‌ ధావన్‌, కేన్‌ విలియమ్‌సన్‌, మోసెస్‌ హెన్రిక్స్‌, యువరాజ్‌ సింగ్‌, దీపక్‌ హుడా, నమన్‌ ఓజా వంటి టాప్‌ క్లాస్‌ బ్యాట్స్‌మెన్‌తో రైజర్స్‌ బ్యాటింగ్‌ లైనప్‌ మునుపెన్నడూ లేనంత పటిష్టంగా ఉంది. ఇక డేవిడ్‌ వార్నర్‌ కళ్లు చెదిరే ఫామ్‌లో ఉండటంతో పాటు....శిఖర్‌ ధావన్‌ నిలకడగా రాణిస్తుండటంతో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ధీమాగా ఉంది. బ్యాటింగ్‌లో ఎలా ఉన్నా.....ఆరెంజ్‌ ఆర్మీ బలం మాత్రం బౌలింగ్‌ అనే చెప్పాలి. ఎందుకంటే భువనేశ్వర్‌ కుమార్‌, ముస్తఫిజుర్‌ రెహ్మాన్‌, అశిష్‌ నెహ్రా, బరీందర్‌ సింగ్‌ శ్రణ్‌ వంటి బౌలర్లతో కూడిన రైజర్స్‌ పేస్‌ బౌలింగ్‌ ఎటాక్‌ను ఎదుర్కోవడం ఎటువంటి బ్యాట్స్‌మెన్‌కైనా పెద్ద సవాలే చెప్పడంలో ఎటువంటి సందేహంలేదు. పేస్‌ బౌలర్లందరూ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడం మాత్రమే ప్రతీ మ్యాచ్‌లోనూ వికెట్లు తీస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.ఇక ఆరంభ ఓవర్లలో భువీ...డెత్‌ ఓవర్లలో యువ సంచలనం ముస్తఫిజుర్‌ రెహ్మాన్‌ ఎలా ప్రత్యర్ధి బ్యాట్స్‌మెన్‌కు చెక్‌ పెడుతున్నారో అందరికీ తెలిసిందే. యువరాజ్‌ సింగ్‌ రాకతో అటు బ్యాటింగ్‌ లైనప్‌తో పాటు, స్పిన్‌ విభాగం సైతం బలోపేతమైంది.

అన్ని విభాగాల్లోనూ స్ట్రాంగా వున్న ఆరెంజ్‌ ఆర్మీ ...

నలుగురు పేస్‌ బౌలర్లతో పాటు బ్యాటింగ్‌లో డేవిడ్‌ వార్నర్‌, శిఖర్‌ ధావన్‌ ఎలాగూ ఫామ్‌లో ఉన్నారు, మోసెస్‌ హెన్రిక్స్‌ సైతం ఆల్‌రౌండ్‌ షోతో ఆకట్టుకుంటున్నాడు.ఇక సిక్సర్ల కింగ్‌ యువరాజ్‌ సింగ్‌, కేన్‌ విలియమ్‌సన్‌ సైతం మెరుపులు మెరిపిస్తే...సన్‌రైజర్స్ జట్టుకు తిరుగుండదు. అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తోన్న ఆరెంజ్‌ ఆర్మీ....ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి దాదాపుగా ప్లే ఆఫ్‌ రేస్‌లో ముందు వరుసలో నిలవాలని తహతహలాడుతోంది. ఇక డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ జట్టు సైతం సెకండ్‌ హోంగ్రౌండ్‌ విశాఖపట్నంలో క్యాంపెయిన్‌ను విజయంతో ఆరంభించాలని పట్టుదలతో ఉంది. రోహిత్‌ శర్మ, పార్థీవ్‌ పటేల్‌, అంబటి రాయుడు, పోలార్డ్‌, జో బట్లర్‌, కృనాల్‌ పాండ్య, హార్ధిక్‌ పాండ్యలతో ముంబై బ్యాటింగ్‌ లైనప్‌ జోరు మీదుంది. రోహిత్‌ శర్మ ఇప్పటికే 5 హాఫ్‌ సెంచరీలు నమోదు చేసి...కెప్టెన్‌గా తనవంతు న్యాయం చేస్తున్నాడు. అంబటి రాయుడు,కీరన్‌ పోలార్డ్‌, జో బట్లర్‌ సైతం ఫామ్‌లో ఉన్నారు. ప్రస్తుత టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన కివీ స్పీడ్‌గన్‌ మిషెల్‌ మెక్‌లెనగన్‌, టిమ్‌ సౌథీలతో కూడిన పదునైన పేస్‌ బౌలింగ్‌ ఎటాక్‌ పదునుగా ఉంది.

నిలకడగా రాణిస్తున్నా హర్భన్ సింగ్...

టర్బోనేటర్‌ హర్భజన్‌ సింగ్‌ నిలకడగా రాణిస్తున్నా...వికెట్లు తీయడంలో మాత్రం విఫలమవుతూ వస్తున్నాడు. ఇప్పటివరకూ ఎవరో ఒక ఆటగాడు అద్భుత ప్రదర్శన చేయడంతోనే 5 విజయాలు నమోదు చేయగలిగిన ముంబై టీమ్‌....ఇకనైనా సమిష్టిగా రాణించాలని ప్లాన్‌లో ఉంది. విశాఖపట్నంలోని ఏసీఏ -VDCA స్టేడియం వేదికగా మరికొద్దిగంటల్లో ప్రారంభం కానున్న ఈ పోటీలో నెగ్గి.... ఏ జట్టు సెమీస్‌ రేస్‌లో ముందువరుసలో నిలుస్తుందో చూడాలి. ప్రస్తుతం ఇరు జట్లు సూపర్‌ ఫామ్‌లో ఉండటంతో హోరాహోరీ పోరు మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.

15:09 - May 8, 2016

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్‌, టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్‌.. గతంలో ప్రజాప్రతినిధులు మృతి చెందిన స్థానాల్లో ఈ పార్టీలు పోటీ చేయలేదా అని ప్రశ్నించారు.. పాలేరులో తాము ఓడిపోతే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తానని ప్రకటించారు... మరి కాంగ్రెస్‌ నేతలు ఎవరు రాజీనామా చేస్తారని సవాల్‌ విసిరారు.

14:53 - May 8, 2016

హైదరాబాద్ : సుమన్ ఆర్ట్స్ థియేటర్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఆడిటోరియంలో వైద్య రత్న, కృషి రత్న అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.. టెన్ టీవీ అసిస్టెంట్ ఎడిటర్ సతీష్ కుమార్ ను 2016 సంవత్సరానికి కృషి రత్నా అవార్డుతో నిర్వాహాకులు ఘనంగా సన్మానించారు.. మదర్స్ డే సందర్బంగా ఈ అవార్డులు జన్మనిచ్చిన తల్లికి అంకితమిచ్చారు సతీష్. అవార్డులు బాధ్యత పెంచుతాయన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన ప్రముఖ వైద్యులను అవార్డులతో సత్కరించారు.. 

14:50 - May 8, 2016

అనంతపురం:  శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఏపీఎస్ ఎస్ పీసీ ఆధ్వర్యంలో జాబ్‌ మేళా నిర్వహించారు. ఈ మేళాకు 4,500 మంది విద్యార్థులు హాజరయ్యారు. పదిహేను ఐటీ కంపెనీలకు చెందిన హెచ్ ఆర్ అధికారులు విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తం 352 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. పరిటాల రవీంద్ర ట్రస్ట్‌ ఆధ్వర్యంలో తమకు శిక్షణ ఇచ్చినందునే ఉద్యోగాలు వచ్చాయని విద్యార్థులు తెలిపారు. 

14:47 - May 8, 2016

గుంటూరు : ప్రిన్స్ మహేశ్ బాబు గుంటూరు జిల్లా బుర్రిపాలెం చేరుకున్నారు.తమ అభిమాన హీరోను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు.  ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు భారీగా మోహరించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా సినీ హీరో మహేష్ బాబు తన స్వంత గ్రామమయిన బుర్రిపాలాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించటానికి మహేష్ బాబు బుర్రిపాలెం చేరుకున్నారు.  గ్రామంలోని పేదలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేసి ..పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పైలాన్‌ ఆవిష్కరిస్తారు. మహేష్ బాబుతో పాటు ఆయన బావ, టీడీపీ ఎంపీ అయిన గల్లా జయదేవ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహేష్ బాబు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతుగా గల్లా జయదేవ్ ఎంపీ నిధులను కూడా కేటాయించే ఆలోచనలో జయదేవ్ వున్నట్లుగా సమాచారం. అభివృద్ధి పనులలో భాగంగా దాదాపు రెండు కోట్ల 16 లక్షల నిర్మించిన స్కూలు భవనాన్ని మహేష్ ప్రారంభిచనున్నారు. అనంతరం స్కూలు ప్రాంగణంలో మొక్కలు నాటుతారు. అలాగే ఇంకుడు గుంతల ఏర్పాటుకు మహేష్ శంకుస్థాపన చేయనున్నారు. యువతకు అవసరమయిన ఓ శిక్షణా కార్యక్రమాన్ని మహేష్ బాబు బుర్రిపాలెం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు మహేష్ బాబుని ఈసందర్భం గా కోరుతున్నారు. సినీ రంగానికి సంబంధించి ఓ విభాగాన్ని తెనాలిలో ఏర్పాటు చేసే ఉద్ధేశ్యంలో సూపర్ స్టార్ కృష్ణ కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం.

 

13:36 - May 8, 2016

వరంగల్ : బీఎస్ ఎన్ ఎల్ ప్రైవేటీకరణకు ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని బీఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్‌ యూనియన్‌.... ఉద్యోగులకు పిలుపు ఇచ్చింది. నష్టాలు వస్తున్నాయన్న నెపంతో... సంస్థను ప్రైవేటీకరిస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని యూనియన్‌ నాయకులు హెచ్చరించారు. వరంగల్‌ జిల్లా హన్మకొండలో సంస్థ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఎన్నికల సన్నాహక సభ జరిగింది. యూనియన్‌ నేత సంపత్‌రావు, జిల్లా కార్యదర్శి సురేందర్‌రెడ్డి, 24 బ్రాంచిలకు చెందిన కార్యదర్శులు ఈ సభకు హాజరయ్యారు. నష్టాల్లో ఉన్న బీఎస్ ఎన్ ఎల్ ను గట్టెక్కించేందుకు... సంస్థకు ప్రభుత్వం నుంచి రావాల్సిన 20 వేల కోట్ల రూపాయలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 

13:33 - May 8, 2016

నల్గొండ :అనుముల మండలం అలవాల గ్రామంలో సీఎల్పీ నేత జానారెడ్డి పర్యటించారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లు, పంటలను పరిశీలించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. వర్షాలకు ఇళ్లు కోల్పోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. సర్కార్‌ స్పందించకపోతే పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని విన్నవించారు. 

13:32 - May 8, 2016

హైదరాబాద్ : తెలంగాణలో మరోసారి వర్షం బీభత్సం సృష్టించింది. శనివారం రాత్రి కురిసిన వర్షానికి హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, సికింద్రాబాద్‌, కూకట్‌పల్లి, మాదాపూర్‌, కొండాపూర్‌, ఉప్పల్‌, చందానగర్‌ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల అండర్‌గ్రౌండ్‌ పనుల కోసం ట్రాన్స్‌కో తవ్విన గుంతల్లో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇక వర్షంతో పాటు భారీగా ఈదురుగాలులు వీయడంతో విద్యుత్‌ స్తంభాలు నెలకొరిగాయి. పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

పిడుగుపాటుకు తోల్కట్లలో రైతు కూలీ భిక్షపతి మృతి.....

ఆదిలాబాద్‌ జిల్లాలో వాన బీభత్సం సృష్టించింది. మెరుపులు, ఉరుములతో భారీ వర్షం కురిసింది. లోకేశ్వరం మండలం పోత్‌పల్లిలో పిడుగుపాటుకు రైతు ఒక్కన్న మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం తోల్కట్లతో రైతు కూలీ తెన్నం భిక్షపతి పిడుగుపడి మృతి చెందాడు.

తెగిన నల్లకుంట వాగు ...

మహబూబ్‌నగర్‌ జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. జడ్చర్లలో రాత్రి కురిసిన వర్గానికి నల్లకుంట వాగు తెగడంతో.. ప్రధాన రహదారిపై వర్షపు నీరు చేరింది. పలు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలులు, వర్షంతో శివాజీనగర్లో ఓ ఇల్లు కూలింది. పలు కాలనీల్లోకి వర్షపు నీరు చేరింది. అలంపూర్‌లో చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

60 గ్రామాలకు నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరా .....

మెదక్‌ జిల్లాలో భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. 60 గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

తిర్మలాపూర్‌లో పిడుగుపాటుకు గొల్ల సంతు మృతి ......

నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలంలోని తిర్మలాపూర్‌లో పిడుగుపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. నిజామాబాద్ మండలంలోని గౌరారం, తండాలో ఈదురు గాలులకు చెట్లు, కరెంటు స్తంభాలు నేలకూలాయి. ఆర్మూర్- కరీంనగర్ రోడ్డులో విద్యుత్ తీగలు తెగిపడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు అనేక ప్రాంతాల్లో పంటలు ధ్వంసమై భారీ నష్టం వాటిల్లింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజుల నుంచి వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడింది. అయితే.. మరో రెండు రోజులు ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

13:29 - May 8, 2016

కర్నూలు : జిల్లాలో భారీ వర్షం జనాల్ని బెంబేలెత్తించింది.. వరదనీటికి సల్కాపురం గ్రామంలోని కల్వర్టు కొట్టుకుపోయింది.. దీంతో కర్నూలు నుంచి కొడుమూరుకు రాకపోకలు నిలిచిపోయాయి.. ఈ మార్గం మరమ్మత్తులకు మరో మూడు గంటల సమయం పడుతుందని అధికారులు చెప్పారు..

13:27 - May 8, 2016

కర్నూలు :కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ వైసీపీలో చేరారు.. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ మారారు.. జగన్‌ ఆయనకు కండువా కప్పి స్వాగతం పలికారు.. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, పలువురు ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు.. 

13:26 - May 8, 2016

హైదరాబాద్ : కేంద్రంతో సయోధ్య చేస్తూ ఏపీ ప్రభుత్వం ఏం సాధించిందని... వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు.. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ...కేంద్ర పదవుల్ని వదలమంటున్న సీఎం చంద్రబాబు.. ఈ రెండేళ్లలో ఎన్ని నిధులు తెచ్చారని విమర్శించారు.. ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌ ఏమైందని మండిపడ్డారు..

క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుత్ను ఇద్దరు అరెస్టు

హైదరాబాద్ : క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. శాలిబండ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో బెట్టింగ్ జరుగుతుందని పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో పోలీసులు సదరు ఇంటిపై దాడి చేశారు. వారిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1.4 లక్షల నగదు, ఐదు సెల్ ఫోన్లతోపాటు రెండు టీవీలను పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు.

'రవాణా అధికారులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు'

విజయవాడ : రవాణా అధికారులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు హెచ్చరించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో రూ. 19 కోట్లతో నూతన డ్రైవింగ్ స్కూల్‌ను నిర్మిస్తామని, జూన్ 10న రోడ్డు భద్రతపై సమావేశం జగరనుందని, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. 

అనంతపురంలో చలసాని శ్రీనివాస్ దీక్ష ప్రారంభం.

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ... ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసానివాస్‌ దీక్ష చేపట్టారు. అనంతపురంలోని టవర్‌క్లాక్‌ సెంటర్‌లో ఈ దీక్షను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే వరకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా... చలసాని శ్రీనివాస్ దీక్షకు సీపీఐ, సీపీఎం పార్టీల నేతలు మద్దతు తెలిపారు.

మిషన్ కాకతీయ మీడియా అవార్డుల ప్రదానోత్సవం

హైదరాబాద్: మిషన్ కాకతీయ మీడియా అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. నగరంలోని జలసౌధలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్‌రావు హాజరయి విజేతలకు అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణతోపాటు పలువురు సీనియర్ జర్నలిస్టులు, నేతలు పాల్గొన్నారు. 

12:27 - May 8, 2016

హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్‌ భద్రత చర్యలకు 45 కోట్లు కేటాయించినట్లు సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి తెలిపారు. చార్మినార్‌ డివిజన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భద్రతావారోత్సవాల ముగింపు కార్యక్రమంలో డైరెక్టర్లు జలీల్‌ఖాన్‌, శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఈ ఆనందర్‌ పాల్గొన్నారు. విద్యుత్‌ కార్మికులు తమ భద్రతతో పాటు.. ప్రజల భద్రతను కూడా దృష్టిలో పెట్టుకుని పని చేయాల్సిన అవసరముందని శ్రీనివాసరెడ్డి అన్నారు. చార్మినార్‌ డివిజన్‌లో ఉద్యోగులు, కార్మికుల కృషితో నాణ్యమైన విద్యుత్‌ సేవలందిస్తున్నట్లు ఆనంద్‌ తెలిపారు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు జరగకుండా చూసుకోవచ్చాన్నారు. 

12:20 - May 8, 2016

గుంటూరు : ఏపీలో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలన్న నిర్ణయం వ్యతిరేకిస్తూ.. జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాల ధర్నా నిర్వహించాయి. కార్యాలయంలో మంత్రి ప్రత్తిపాటి రివ్యూ సమావేశాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు...

పాఠశాలలను మూసివేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన

గుంటూరు : జిల్లా పరిషత్ సర్వసభ్యసమావేశం జెడ్పీ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టాయి. ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. పోలీసులు, విద్యార్థి సంఘాల నేతలకు మధ్య వాగ్వాదం చేసుకుని.. అరెస్టుకు దారి తీసింది.

తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి

హయత్‌నగర్: తాటిచెట్టుపై నుంచి పడిపోవడంతో ఓ గీత కార్మికుడు మృతి చెందాడు. హయత్‌నగర్ మండలం మాజీద్‌పూర్ గ్రామంలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. బత్తిని బిక్షపతిగౌడ్ కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కగా మోపు తెగిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న గ్రామస్తులు మృతదేహాన్ని చెట్టుపై నుంచి కిందకు దించే ప్రయత్నం చేస్తున్నారు.

రైఫిల్స్ ను ఎత్తుకెళ్లిన ఉగ్రవాదులు..

జమ్మూకశ్మీర్ : కుల్గాం జిల్లాలో పోలీస్ పికెట్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. 2 ఎస్సెల్లార్, ఒక ఇన్సాస్ రైఫిల్‌ను నలుగురు ఉగ్రవాదులు ఎత్తుకెళ్లారు. ఉగ్రవాదుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. 

ఏయూ సెట్ 2016 ఫలితాలు విడుదల

విశాఖ : ఏయూ సెట్ 2016 ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఇన్‌చార్జ్‌ వైస్ చాన్స్‌లర్ నారాయణ వీటిని విడుదల చేశారు. కాగా... ఈ నెల 28 నుంచి 30 వరకు స్పెషల్‌ కేటగిరి కౌన్సెలింగ్‌, జూన్‌ 1 నుంచి జనరల్‌ కౌన్సెల్సింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే శ్రీకాకుళం, విశాఖ, కాకినాడ, విజయవాడలో కౌన్సెలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

10:43 - May 8, 2016

హైదరాబాద్ : డాక్టర్‌ కావడమే మీ లక్ష్యమా? డబ్ల్యు హెచ్ ఓ గుర్తింపు, ఎంసీఐ అంగీకారంతో తక్కువ ఫీజుతో ఎంబీబీఎస్ పూర్తిచేసే అవకాశం కల్పిస్తోంది యూఎస్‌ మెడికో... ఈ సంస్థలో చేరడంఎలా? ఫీజులెలా ఉంటాయి? సర్టిఫికేట్‌కు భారత్‌లో గుర్తింపు ఎలా ఉంది? పూర్తివివరాలు మనకు యూఎస్‌ మెడికో డైరెక్టర్‌ ప్రేమ్‌ కుమార్‌ అందించారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

10:39 - May 8, 2016

హైదరాబాద్ : బంగారం ధర ఆకాశాన్ని అంటుతోంది. దేశీయ, అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో పుత్తడికి అమ్మకాలు భారీగా పెరిగాయి. దీంతో బంగారం ధర రెండేళ్ల గరిష్టానికి ధర చేరింది.శనివారం 99.9శాతం స్వచ్ఛతగల పది గ్రాముల పసిడి ధర 225రూపాయలు పెరిగి 30వేల 350 రూపాయలకు చేరింది. 2014 మే 10తర్వాత ఇదే అత్యధిక ధర...

ప్రపంచ మార్కెట్ల ప్రభావం, పెళ్లిళ్ల సీజన్‌...

బంగారం ధర ఇలా పెరగడానికి ప్రపంచ మార్కెట్ల ప్రభావం, పెళ్లిళ్ల సీజన్‌, దేశీయంగా నగల వ్యాపారులు కొనుగోళ్లు పెంచడమే కారణమని బులియన్‌ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు సోమవారం అక్షయ తృతీయ కావడం కూడా కారణమైంది. మొన్నటి వరకు పెళ్లిళ్ల సీజన్ కావడంతో... అమ్మకాలు పెరిగాయి. దీనికి తోడు అంతర్జాతీయ పరిస్థితులు కూడా కలిసొచ్చాయి. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 12వందల 87 యూఎస్‌ డాలర్లకు చేరింది. గత 3 నెలల్లో ఈ ధర 30 డాలర్లకు పైగా పెరిగింది.

కిలో వెండి రూ. 41వేల 550కి చేరింది....

స్వర్ణం దారిలోనే వెండికూడా నడుస్తోంది.. కిలో వెండి 510 రూపాయలు పెరిగి 41వేల 550కి చేరింది.. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల కొనుగోళ్లతో ధర పెరిగిందని మార్కెట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అంతర్జాతీయంగా న్యూయార్క్ బులియన్‌ మార్కెట్‌లో ఔన్సు వెండి ధర దాదాపు 17 యూఎస్‌ డాలర్లుగా ఉంది.. 

10:36 - May 8, 2016

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జిల్లాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. కొత్త జిల్లాల ప్రకటనకు మహూర్తం ఖరారైనా... ప్రాంతాల ఎంపికపై చర్చలు కొనసాగుతున్నాయి.. ప్రస్తుతమున్న 10 జిల్లాలను 25 జిల్లాలుగా మారడం ఖాయమని తేలిపోయింది. కొత్త జిల్లాల కోసం దాదాపు 20 డిమాండ్లు సర్కారు ముందున్నాయి. ఇవి ఎలా ఉన్నా సీఎం కేసీఆర్‌ నిర్ణయమే ఫైనల్‌ కానుంది.

ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్‌ హామీ...

ఉద్యమ సమయం, ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్‌ కొన్ని కొత్త జిల్లాల ఏర్పాటుకు హామీ ఇచ్చారు.. ఇందులో నాగర్‌ కర్నూలు, వికారాబాద్‌, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌, కొత్తగూడెం ప్రాంతాలున్నాయి.. అలాగే సూర్యాపేట, కామారెడ్డి, మంచిర్యాలతో పాటు... భూపాల్‌పల్లిని జయశంకర్‌ జిల్లాగా మారుస్తామన్నారు.. కేసీఆర్‌ హామీ ప్రకారం ఇవి కొత్త జిల్లాలు కావడం ఖాయంగా తెలుస్తోంది... ఇక తెలంగాణకు రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను నాలుగు జిల్లాలుగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటికి గోల్కొండ, లష్కర్, భాగ్యనగర్ పేర్లను కూడా పరిశీలిస్తున్నారు.

ములుగు, గద్వాల, వనపర్తి, జనగామ, మహబూబాబాద్‌, యాదాద్రి...

తెలంగాణ ఏర్పాటయ్యాక కొత్త జిల్లాలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగింది. ములుగు, గద్వాల, వనపర్తి, జనగామ, మహబూబాబాద్‌, యాదాద్రిలను జిల్లాలుగా చేయాలంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. గద్వాల ధర్నాలతో హోరెత్తిపోతోంది... మాజీమంత్రి డీకే అరుణ కేసీఆర్‌ను కలిసి ఈ విషయంపై విజ్ఞప్తికూడా చేశారు. ఆ తర్వాత కల్వకుర్తిని జిల్లా చేయాలంటూ మాజీమంత్రి చిత్తరంజన్‌ దాస్ నేతృత్వంలో నిరసనలు జరిగాయి. ఇదే జిల్లాలో వనపర్తిని జిల్లాగా చేయాలన్న డిమాండ్ కూడా ఉంది..

జనగామలో స్థానికులు రిలే దీక్షలు ....

తెలంగాణలో హైదరాబాద్‌ తర్వాత రెండో ముఖ్యమైన జిల్లా వరంగల్‌కూడా కొత్త జిల్లాల డిమాండ్‌తో ఉద్యమం నడుస్తోంది.. జనగామలో స్థానికులు రిలే దీక్షలు చేపట్టారు.. మహబూబాబాద్‌, ములుగులో అప్పుడప్పుడు నిరసనల గళం వినిపిస్తోంది.. వరంగల్‌ జిల్లాలోని ములుగును జిల్లాగా చేయాలంటూ మంత్రి చందూలాల్‌ ఆధ్వర్యంలో ఉద్యమాలు జరిగాయి. ఇదే జిల్లాలోని మహబూబాబాద్‌ను జిల్లా చేయాలన్న డిమాండ్ బలంగా ఉంది.. స్థానిక ఎంపీ సీతారాం నాయక్‌ మాత్రం పార్లమెంట్‌ నియోజకవర్గాలనే జిల్లాలుగా మార్చాలని ప్రతిపాదించారు. అటు మహబూబాబాద్‌ను జనగామలో కలుపుతారన్న వార్తలతో స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది..

ఖమ్మంను కూడా రెండుగా విడగొట్టాలంటూ డిమాండ్లు....

ఈ జిల్లాలతో పాటు ఖమ్మంను కూడా రెండుగా విడగొట్టాలన్న వాదనలున్నాయి.. గిరిజన ప్రాంతమైన భద్రాచలాన్ని జిల్లాగా మార్చాలన్న అంశం ప్రభుత్వం దగ్గర పెండింగ్‌లో ఉంది.. అటు అదిలాబాద్‌లో నిర్మల్‌, కరీంనగర్‌ జిల్లాలో మెట్‌పల్లి, కోరుట్ల డిమాండ్లున్నాయి. నల్గొండ జిల్లాలో ఆలేరు కేంద్రంగా యాదాద్రి జిల్లాను ఏర్పాటు చేయాలని స్థానిక నేత మోత్కుపల్లి నర్సింహులు పాద యాత్ర చేశారు.. రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌ను జిల్లా చేయాలని స్థానికులు కోరుతుండగా... ఇబ్రహీంపట్నంను జిల్లా చేయాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రజల అవసరాలు, పాలన సౌలభ్యం ఆధారంగా విభజన.......

అయితే సీఎం కేసీఆర్‌ మాత్రం ఒత్తిళ్లకు తలోగ్గకుండా శాస్త్రీయ పద్దతిలో జిల్లాల పునర్విభజనకు ప్రయత్నిస్తున్నారు.. ప్రజల అవసరాలు, పాలన సౌలభ్యం ఆధారంగా మార్గ దర్శకాలు రూపొందించాలని సీఎస్ రాజీవ్ శర్మను ఆదేశించారు.. అన్ని అంశాలు పరిశీలించిన ప్రభుత్వం కొత్త జిల్లా కేంద్రాలపై ఓ అంచనాకొస్తారని తెలుస్తోంది.. 

జిల్లాల జాబితా ఇదేనంటూ సెక్రటేరియట్‌లో వార్తలు ....

కొత్త జిల్లాలపై ప్రభుత్వ ప్రయత్నాలు నడుస్తుండగా... మరోవైపు జిల్లాల జాబితా ఇదేనంటూ సెక్రటేరియట్‌లో వార్తలు ప్రచారమవుతున్నాయి.. ఇందులో హైదరాబాద్ సెంట్రల్, లష్కర్, భాగ్యనగర్, గోల్కొండగా నాలుగు జిల్లాలు... వికారాబాద్, రంగారెడ్డి ఈస్ట్‌గా రెండు జిల్లాలు కానున్నట్లు తెలుస్తోంది.. అదిలాబాద్, కొమురంభీం పేరుతో రెండు జిల్లాలుగా విడగొడుతున్నట్లు సమాచారం.. అలాగే మెదక్, సంగారెడ్డి రెండు జిల్లాలు... కరీంనగర్, జగిత్యాల రెండు జిల్లాలు... ఖమ్మం, భద్రాచలం రెండు జిల్లాలు... వరంగల్, భూపాలపల్లి ప్రాంతాలను రెండు జిల్లాలుగా మారుస్తారని సమాచారం.. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తిగా మూడు జిల్లాలు... నల్గొండ, సూర్యాపేట పేర్లతో రెండు జిల్లాలు అవుతాయంటూ ఓ లిస్ట్ వార్తల్లో హాట్‌టాపిక్‌ గా మారింది.. తెలంగాణలో ఈ జిల్లాలతోపాటు.. మరో రెండు జిల్లాలు కొత్తగా వచ్చే అవకాశం ఉంది.. జూన్‌ 2న నూతన జిల్లాల పేర్లు, ఆయా కేంద్రాల వివరాలపై క్లారిటీ రానుంది.. 

10:33 - May 8, 2016

మెదక్‌ : జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి... అర్ధరాత్రినుంచి ఉరుములు, మెరుపులతోకూడిన వర్షం జనాల్ని బెంబేలెత్తించింది. ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పలు ఇండ్లు కూలిపోయాయి.. అకాలవర్షంతో మామిడి రైతులకు భారీ నష్టం జరిగింది.. చేతికివచ్చిన కాయలు నేలపాలయ్యాయి.. సిద్ధిపేటలో 40 నిమిశాల పాటు ఏకధాటిగా వర్షం పడింది.. రంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు... ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా... మరో ముగ్గురు గాయపడ్డారు. మరో 48గంటలపాటు ఈ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

10:32 - May 8, 2016

కరీంనగర్‌ : వంగపల్లి వద్ద బోర్‌వెల్‌ లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా...8 మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులంతా బీహార్ వాసులని స్ఘానికులు చెప్తున్నారు. డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ఈఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చినట్లు తెలుస్తోంది.

10:26 - May 8, 2016

హైదరాబాద్ : హిమాచల్‌ ప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9మంది దుర్మరణం పాలయ్యారు. సిమ్లాకు 250కిలోమీటర్ల దూరంలో... జోగిందర్ నగర్ వద్ద రాత్రి ఈ ప్రమాదం జరిగింది. 55 మంది ప్రయాణికులతో వెళ్తున్న హిమాచల్ ప్రదేశ్ స్టేట్ ట్రాన్స్ పోర్ట్ బస్‌.. బ్రిడ్జిపై నుంచి కింద పడింది. ఈ ఘటనలో 9మంది చనిపోగా... 39మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో... మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. 

గ్యాస్ సిలిండర్ పేలి మహిళ సజీవదహనం

గుంటూరు : క్రోసూరులోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఓ మహిళ సజీవ దహనమైంది. ప్రమాందోల రెండు పూరిళ్లు కూడా దగ్ధమయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ఓ మహిళ ఉదయన్నే టీ కాచుకునేందుకు గ్యాస్ స్టౌవ్ వెలిగించగానే మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

10:23 - May 8, 2016

గుంటూరు : క్రోసూరు బీసీ కాలనీలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మహిళ సజీవ దహనమైంది. ఐదు రోజుల క్రితమే మహిళకు వివాహమైంది. ఈ ప్రమాదంలో మరో రెండు గుడిసెలు దగ్ధమయ్యాయి. దాదాపు 6 లక్షల మేర ఆస్తినష్టం సంభవించినట్లు తెలుస్తోంది.

 

09:47 - May 8, 2016

గుంటూరు: నగరంలో వస్త్ర దుకాణాలు నిర్వహిస్తున్న గుడివాడ శివనాగేశ్వరరావు, సుభాషిణిల పెంపుడు కుమారుడు మూడేళ్ల రేవంత్‌ సాయి కుమార్‌ శనివారం మధ్యాహ్నం కిడ్నాప్‌కు గురయ్యాడు. దుకాణంలోకి ప్రవేశించిన ఓ యువకుడు బట్టలు కొంటున్నట్టు నటించాడు. షాపులో ఉన్న సుభాషిణితో బేరసారాలు ఆడాడు. షాపులో ఆడుకొంటున్న రేవంత్‌ ను... బైక్‌పై తిప్పుకొస్తానని తీసుకెళ్లాడు. గుమస్తా వచ్చేలోపే బైక్‌పై పారిపోయాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు... సీసీ టీవీ ఫుటేజ్ ను పరిసీలించారు. అర్బన్‌ ఎస్పీ త్రిపాఠి ఆదేశాల మేరకు 10 ప్రత్యేక పోలీసు బృందాలను నియమించారు. బాలుడి ఫోటోతో పాటు కిడ్నాపర్‌ ఉపయోగించిన బైక్‌ నంబర్‌ను అన్ని పోలీసు స్టేషన్లకు పంపించారు. శనివారం రాత్రి 8.30 గంటలకు రేవంత్‌ సాయికుమార్‌ పట్నబజార్‌లో ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు.. బాలుడిని లాలాపేట పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించడంతో కథ సుఖాంతమయ్యింది.

కిడ్నాపర్‌ గురించి ఆరా తీస్తున్న పోలీసులు .....

బాలుడి కిడ్నాప్‌ చేసిన యువకుడు రేవంత్‌ను ఒక వ్యక్తికి అప్పగించనట్టు గుర్తించిన పోలీసులు... అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అతని ద్వారా బాలుడిని అపహరించిన యువకుడి గురించి ఆరా తీస్తున్నారు. శివనాగేశ్వరరావు కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ఆస్తి గొడవలే కిడ్నాప్‌కు కారణమా? ఇంకేమైనా కారణాలున్నా? అన్న కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి కిడ్నాప్‌ కథ సుఖాంతం కావడంతో... అటు పోలీసులు.. ఇటు కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

09:43 - May 8, 2016

హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీలను అవమానించారనే కేసులో... రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్నపై అట్రాసిటీ కేసు నమోదైంది. జిల్లా కోర్టు ఆదేశాల మేరకు ఆదిలాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లాలోని పిప్పల్‌ధరి గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ శంకుస్థాపన సందర్భంగా... మంత్రి తమకు సమాచారం ఇవ్వకుండా అవమానించారంటూ... ఆదివాసీ దళిత వర్గం నేతలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో... కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ విచారించిన న్యాయమూర్తి.. మంత్రితో పాటు మరో 26 మందిపై కూడా కేసు నమోదు చేయాలంటూ ఆదేశించారు. దీంతో వీరందరిపై కేసు నమోదైంది. 

09:42 - May 8, 2016

నెల్లూరు :వెంకటగిరి రైల్వేస్టేషన్‌ సమీపంలో రైల్వే ట్రాక్‌ దాటుతుండగా.. గూడ్స్‌ రైలు ఢీకొని ఇద్దరు మహిళలు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న రైల్వే, సివిల్‌ పోలీసులు.. సంఘటనాఘటానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుల్లో ఒకరు గుండ్ల సముద్రానికి చెందిన రమణమ్మగా గుర్తించగా.. మరో మహిళను గుర్తించాల్సి ఉంది. 

09:40 - May 8, 2016

నల్లగొండ : చౌటుప్పల్‌ మండలంలోని డిస్కవరీ ఫార్మా కంపెనీలో సెక్యూరిటీ సూపర్‌వైజర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మద్యంలో కలుపుకునేందుకు నీరు ఇవ్వలేదని.. సురేందర్‌ అనే సూపర్‌వైజర్‌ను.. బీహార్‌కు చెందిన మరో సూపర్‌వైజర్‌ తలపై బండరాయితో మోదాడు. దీంతో తీవ్రగాయాలైన సురేందర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు నెల్లూరు జిల్లావాసిగా గుర్తించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

గూడ్స్ రైలు ఢీకొని ఇద్దరు మహిళలు మృతి

నెల్లూరు : గూడ్స్ రైలు ఢీకొని ఇద్దరు మహిళలు మృతిచెందారు. జిల్లాలోని వెంకటగిరి రైల్వేస్టేషన్‌లో ఆదివారం తెల్లవారుజామున గూడ్స్ రైలు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. అయితే...మృతిచెందిన వారిలో ఒకరు గుండ్లసముద్రం గ్రామానికి చెందిన రమణమ్మగా గుర్తించగా... మరో మహిళను గుర్తించాల్సి ఉంది. పట్టాలు దాటుతుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న రైల్వే, సివిల్ పోలీసులు మృతదేహాలను పరిశీలించి మరో మహిళను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

07:30 - May 8, 2016

భారత సూపర్‌మ్యాన్‌ 'శక్తిమాన్‌' పేరు విననివారుండరు. చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ళ వరకు అందర్నీ ఎంతగానో ఆకట్టుకున్న 'శక్తిమాన్‌' త్వరలోనే బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీ అవుతున్నాడు. 'శక్తిమాన్‌' ధారావాహిక తొలిసారిగా 1997లో దూరదర్శన్‌లో ప్రసారమైంది. 2005 వరకు ఈ సీరియల్‌ కొనసాగింది. కేవలం హిందీలోనే కాకుండా ఇంగ్లీష్‌, ఒరియా, తమిళ భాషల్లోనూ ప్రసారమై బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువైంది. నటుడు ముఖేష్‌ఖన్నా ఈ సీరియల్‌ను నిర్మించడమే కాకుండా శక్తిమాన్‌ పాత్రలో నటించారు. ఈ సందర్భంగా ముఖేష్‌ఖన్నా మాట్లాడుతూ,'త్వరలోనే బుల్లితెరపై శక్తిమాన్‌ రాబోతున్నాడు. కొత్తగా సిక్స్‌ ప్యాక్‌ బాడీతో కాకుండా 15 ఏండ్ల క్రితం ఎలా ఉన్నానో అలాగే కన్పిస్తాను. ప్రస్తుతం పలు ఛానెళ్ళ వారితో సంప్రదింపులు జరుపుతున్నాను. త్వరలోనే అన్ని విషయాలు ఫైనలైజ్‌ అవుతాయి' అని చెప్పారు.

07:26 - May 8, 2016

'జగ్గా జాసూస్‌', 'బార్‌ బార్‌ దేఖో', '22 ట్యాంగో' వంటి చిత్రాల్లో నటిస్తున్న బాలీవుడ్‌ నటి కత్రినాకైఫ్‌ తాజాగా షారూఖ్‌ఖాన్‌కి జోడీగా ఓ చిత్రంలో నటించేందుకు అంగీకరించింది. 'జబ్‌ తక్‌ హై జాన్‌' చిత్రం తర్వాత షారూఖ్‌తో కత్రినా నటిస్తున్న చిత్రమిది. షారూఖ్‌ మరుగుజ్జుగా నటించే ఈచిత్రాన్ని ఆనంద్‌.ఎల్‌.రాయ్ రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు రాయ్ మాట్లాడుతూ,'ఆసక్తికరంగా సాగే వినోదాత్మక ప్రేమకథా చిత్రమిది. ఈ సినిమాలోనైనా కమర్షియాలిటీతో ఉండే పాటలు, రొమాన్స్‌ ఉంటుందా అని చాలా మంది నన్ను అడుగుతున్నారు. షారూఖ్‌లాంటి బిగ్‌స్టార్‌తో సినిమా అంటే అవన్ని తప్పకుండా ఉంటాయి. ప్రేక్షకుల్ని, ఆయన అభిమానుల్ని ఎంటర్‌టైన్‌ చేసే చిత్రమిది. ఇక ఈ చిత్రంలో మరుగుజ్జుగా షారూఖ్‌ కనిపించ బోతున్నారు. ఈ కథ విన్న తర్వాత వెంటనే సినిమా చేద్దామని షారూఖ్‌ చెప్పారు. ఓ ఛాలెంజింగ్‌తో క్లిష్టతరమైన పాత్రలతో సినిమాలను చేయడాన్ని షారూఖ్‌ బాగా ఇష్టపడతారు. ఇటీవల ఫైనల్‌ వర్షెన్‌ నెరేట్‌ చేశాను. షారూఖ్‌ చాలా హ్యాపీగా ఫీలయ్యారు' అని చెప్పారు. ఇదిలా ఉంటే, కత్రినా ఈ చిత్రంతోపాటు సల్మాన్‌ఖాన్‌, కబీర్‌ఖాన్‌ కాంబినేషన్‌లో రూపొందబోయే తాజా చిత్రంలోనూ నటిం చేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. మొత్తమ్మీద ఖాన్‌ల ద్వయంతో కత్రినా బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేయనుందన్నమాట..!

07:25 - May 8, 2016

మంచు లక్ష్మి తాజాగా 'బాస్మతి బ్లూస్‌' అనే హాలీవుడ్‌ చిత్రంలో నటిస్తోంది. ఆ వివరాలను చిత్ర యూనిట్‌ తెలియజేస్తూ, 'చాలా రోజుల తర్వాత మంచు లక్ష్మి మరో హాలీవుడ్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ ఎక్కువ భాగం ఇండియాలో జరిగింది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి డబ్బింగ్‌ వర్క్‌ను మంచు లక్ష్మీ పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. బ్రీ లార్సన్‌, డోనాల్డ్‌ సుతర్‌లాండ్‌, స్కాట్‌ బాకుల ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి డాన్‌ బారోస్‌ దర్శకత్వం వహిస్తుండగా, మేనిక్యూ కాల్‌ ఫీల్డ్‌ నిర్మిస్తున్నారు. ఓ సైంటిస్ట్‌ కథా నేపథ్యంలో సినిమా సాగుతుంది. తాను సృష్టించిన వరి వంగడాన్ని మార్కెట్‌ చేసుకోవడానికి ఇండియాకి వచ్చిన ఆ శాస్త్రవేత్త ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, అతని జీవితం, ప్రేమ ఎలాంటి మలుపులు తిరిగిందనే ఇతివృత్తంతో ఈ చిత్రం రూపొందింది. ఇందులో మంచు లక్ష్మి సీతగా ఓ కీలక పాత్రలో నటించింది' అని పేర్కొన్నారు.

07:23 - May 8, 2016

'స్వర్గం నరకం' చిత్రంతో హీరోగా ప్రేక్షకులకు పరిచయమైన మోహన్‌బాబు గతేడాది(2015 నవంబర్‌ 22)తో నటుడిగా 40ఏండ్లు పూర్తి చేసుకున్నారు. నలభై వసంతాల వేడుకల్లో భాగంగా ఏడాది పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మోహన్‌బాబు సినిమాల్లోని పాపులర్‌ డైలాగ్‌లన్నింటినీ ఒక బుక్‌గా తయారు చేశారు. 'డైలాగ్‌ బుక్‌' పేరుతో రూపొందించిన ఈ పుస్తకాన్ని ఈ నెల 11న బ్రిటన్‌ పార్లమెంట్‌ 'హౌస్‌ ఆఫ్‌ కామన్‌'లో ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 6.30 నుంచి 8.30గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో ఏసియన్‌ లైట్‌ అనే సంస్థ, బ్రిటన్‌ పార్లమెంట్‌ సభ్యుడు బాబ్‌ బ్లాక్‌ మన్‌ సంయుక్తంగా డా||మోహన్‌బాబును సత్కరించనున్నారు. అలాగే శ్రీ విద్యానికేతన్‌ విద్యాసంస్థను నెలకొల్పి అనేకమంది విద్యార్థులకు విద్య అందిస్తున్న మోహన్‌బాబుకు మార్చి 19న ఆయన పుట్టిన రోజు సందర్భంగా బెస్ట్‌ టీచర్‌ అవార్డును అందజేశారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 7 గంటల, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శనానికి ఇప్పటి వరకు 13 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

07:21 - May 8, 2016

ఎక్కువ సేపు కంప్యూటర్‌ ముందు పనిచేస్తూ కూర్చునే వారికి కంటికి సంబంధించి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కళ్ల నుండి నీరు రావడం, వేడిగా అనిపించడం, మంట, నల్లని వలయాలు వంటి సమస్యలు బాధిస్తుంటాయి. వీటి నుండి ఉపశమనం పొందేందుకు నిపుణులు చెబుతున్న సలహాలు...

  • కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడితే కమలాపండు రసంలో నాలుగు చుక్కల పాలు కలిపి కళ్లకింద సున్నితంగా రాయాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
  • గుండ్రంగా కోసిన దోసకాయ ముక్కలను కళ్ల కింద పెట్టుకుని ఒక పదిహేను నిమిషాలు ఉంచాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే కళ్ల కింద ఏర్పడిన ముడతలు పోయి వలయాలు తగ్గుముఖం పడతాయి.
  • రాత్రిపూట పడుకునే ముందు కొద్దిగా ఆల్మండ్‌ క్రీమ్‌ను కంటి చుట్టూ రాసి నెమ్మదిగా మసాజ్‌ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే డార్క్‌ సర్కిల్స్‌ తగ్గుముఖం పడతాయి.
  • రోజ్‌వాటర్‌లో ముంచిన దూదిని కళ్లపై పెట్టుకుని ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకుంటే ముంచిది.
  • పడుకునే ముందు కీరదోస రసాన్ని కంటి చుట్టూ పట్టించినా మంచి ఫలితం వుంటుంది.
  • టమాటా గుజ్జు, పసుపు, నిమ్మరసం, శనగపిండి పేస్టుగా చేసి, కళ్ల చుట్టూ రాసుకుని ఆరిన తర్వాత నీటితో కడిగేస్తే మంచి ఫలితం వుంటుంది.
  • ఈ చిట్కాలన్నీ ఐదు, పది నిమిషాలు మించి చేయాల్సిన అవసరం లేదు. పైగా వస్తువులన్నీ ఇంట్లో దొరికేవే. కాబట్టి క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఓయూ సెట్ దరఖాస్తు స్వీకరణ గుడువు పెంపు

హైదరాబాద్ : ఓయూసెట్-2016 ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 12 వరకు పొడిగించినట్లు పీజీ అడ్మిషన్స్ డెరైక్టర్ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ చివరి గడువు శనివారంతో (7న)తో ముగిసినా విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రూ.500 అపరాధ రుసుముతో ఈ నెల 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

డ్రంక్ అండ్ డ్రైవ్ లో 10 మంది పై కేసు

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో గడిచిన రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌ను చేపట్టారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 10 మంది వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదేవిధంగా 8 కార్లు, 2 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.

06:37 - May 8, 2016

కరీంనగర్ : ఒకప్పటి శాతవాహనుల ఖిల్లా ఉత్తర తెలంగాణ రాజకీయాల అడ్డా...పరిశ్రమల పుట్టినిల్లు...తెలంగాణ ధాన్యాగారం...విప్లవాలకు కేరాఫ్ అయిన కరీంనగర్ జిల్లా తన భౌగోళిక స్వరూపాన్ని కోల్పోనుందా...కొత్త జిల్లాల ఏర్పాటుతో కళ తప్పనుందా... ఆయువుపట్టుగా ఉన్న పరిశ్రమలు, పేరుగాంచిన ఆలయాలు కొత్త జిల్లాలకు వెళ్లడంతో జిల్లా పరిస్థితి ఏ విధంగా మారబోతుంది.. అన్న దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ సర్కార్ పరిపాలనా సౌలభ్యం కోసం ...

సమైక్య రాష్ట్రం విడిపోయిన తరవాత తెలంగాణ సర్కార్ పరిపాలనా సౌలభ్యం కోసం 15 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై అందరూ ఆశలు వదులుకున్న తరుణంలో.. సీఎం జూన్ 2 నాటికి కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి వాటిని ప్రకటిస్తానన్నారు. దీంతో కరీంనగర్ జిల్లా ఎన్ని భాగాలు కానుందన్న దానిపై జిల్లాలో చర్చ మొదలైంది.

శాతవాహనుల నుండి నిజాంరాజుల వరకు....

శాతవాహనుల నుండి నిజాం రాజుల మొదలుకొని నేటి రాజకీయ పార్టీల వరకు అందరికి ఓనమానాలను దిద్దించిన ఘనత కరీంనగర్ ది. అంతెందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆదరించి రాజకీయ భవిష్యత్తును అందించింది ఈ కరీంనగరమే. దేశ ప్రధాని పి.వి.నరసింహరావు సైతం ఈ జిల్లా బిడ్డడే. ఎంతో పురాతనమైన ప్రాశస్త్యం కలిగిన వేములవాడ రాజన్న, ధర్మపురి లక్ష్మినర్సింహ స్వామి, కాళేశ్వర ముక్తేశ్వర ఆలయాలు, కొండగట్టు అంజన్న ఆలయాలు కొత్త జిల్లాలకు తరలివెళ్ళనున్నాయనే బాధ జిల్లా వాసులను వెంటాడుతోంది.

జిల్లాల లిస్టులో జగిత్యాల పేరు ......

జగిత్యాల జిల్లాగా ఏర్పడితే జగిత్యాలతో పాటు ధర్మపురి, కోరుట్ల, వేములవాడ నియోజకవర్గాలతో పాటు ఇతర నియోజక వర్గాల్లోని మండలాలను జగిత్యాల జిల్లా కింద కలిపే అవకాశముంది. వీటితో పాటు సిరిసిల్ల నియోజక వర్గం, చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాలను జిల్లా పరిధిలోకి తీసుకుపోనున్నారు. మంచిర్యాల కేంద్రంగా ఏర్పడే జిల్లాలో రామగుండంను కలుపుతారనే ప్రచారం జోరుగా ఉంది. వరంగల్ జిల్లాలోని భూపాల్ పల్లి జిల్లాగా ఏర్పడితే మంథని నియోజకవర్గంలోని కాటారం, మహదేవపూర్ మండలాలతో పాటు అవసరమైతే మంథని నియోజకవర్గాన్ని భూపాలపల్లిలో కలిపే అవకాశం ఉంది.

మెదక్ జిల్లా సిద్దిపేట జిల్లాగా ఏర్పడే అవకాశం...

ఇక మెదక్ జిల్లా సిద్దిపేట జిల్లాగా ఏర్పడే అవకాశం ఉండటంతో.. జిల్లాలోని సిరిసిల్ల, హుస్నాబాద్ నియోజక వర్గాలతో పాటు , హుజురాబాద్, మానకొండూరు నియోజకవర్గాల్లోని కొన్ని మండలాలు సిద్దిపేటలో కలవనున్నాయి. దీంతో జిల్లా భౌగోళిక, నైసర్గిక, రాజకీయ స్వరూపాలే మారిపోనున్నాయి. 

06:34 - May 8, 2016

ప్రకాశం : అధిక వ‌డ్డీ ఆశ ‌చూపాడు.. 14 సంవ‌త్సరాలు ఎంతో న‌మ్మకంగా ఫైనాన్స్ వ్యాపారం చేశాడు. కోటిన్నరకు పైగా వ‌సూలు చేసి బోర్డు తిప్పేశాడు. శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన ఒక వ్యాపారి కొత్తూరు కేంద్రంగా వై.వి.ఆర్ ఫైనాన్స్ పేరుతో వ్యాపారం చేసి నిండాముంచి ఉడాయించడంతో ... బాధితులు ల‌బోదిబోమంటున్నారు.

పాఠాలు నేర్వని ప్రజలు..
అక్షయ , ఎస్ మార్ట్ లాంటి గొలుసు కట్టు సంస్థల నుండి పాఠాలు నేర్వని ప్రజలు.. తాజాగా ఒంగోలులో ఇదే రకమైన ఏజీస్ కంపెనీ మోసానికి బలయ్యారు. కట్టిన డబ్బులకు రెండింతలు ఇస్తామని చెప్పి అంగన్ వాడీలు , హౌస్ వైఫ్ లనే టార్గెట్ గా చేసుకుని వలవిసిరి చెల్లని చెక్కులు ఇచ్చి ఉడాయించారు.

హిర‌మండ‌లం మండ‌లం కొండ‌రాగోలు గ్రామానికి చెందిన వైవిఆర్.....
హిర‌మండ‌లం మండ‌లం కొండ‌రాగోలు గ్రామానికి చెందిన వై.వి.ఆర్ కొత్తూరు కేంద్రంగా ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. అధిక వ‌డ్డీ ఎర చూపి మ‌హిళ‌ల‌నే టార్గెట్ చేస్తూ కేవ‌లం కొత్తూరు ప‌రిస‌ర ప్రాంతాల్లోనే కోటి రూపాయ‌లు సేక‌రించాడు. 2010 నుండి విజయవాడలో ఏజీస్ పరివార్ అనే పేరుతో గొలుసుకట్టు వ్యాపారం చేస్తున్నాడు. దీనికి బ్రాంచ్ లుగా అద్దంకి, చిమకుర్తి, సింగరాయకొండ, ఒంగోలును వ్యాపార కేంద్రాలుగా మలుచుకున్నాడు. నమ్మకంతో వ్యాపారం చేస్తున్నట్లు నమ్మించి కోట్లతో ఉడాయించాడు.

ఏజీస్ సంస్థలోని డిపాజిట్లు...
ఏజీస్ సంస్థలోని డిపాజిట్లను ఏజీస్ అవనీ మల్టిసొసైటీ లోకి మార్చినట్లు నమ్మబలికి మొండిచేయి చూపించారని బాధితులు వాపోతున్నారు. తమ డబ్బుల కోసం ప్రధాన కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంస్థకు జిల్లాకు చెందిన కొంత మంది ప్రధాన సూత్రదారులుగా వ్యవహరించి.. తమను మోసం చేశారని అంటున్నారు బాధితులు.

చెల్లని చెక్కులు, బాండ్ పేపర్లను అంటకట్టిన కంపెనీ.....
తమకు చెల్లని చెక్కులు, బాండ్ పేపర్లు సైతం ఇచ్చారని.. వాటిలో బ్యాలెన్స్ ఒక్కరూపాయి కూడా లేవని తెలిపారు. ఈ విషయంపై కంపెనీ ప్రతినిధులను నిలదీస్తే.. రెండు రోజుల క్రితం ఉడాయించారని అన్నారు. ఈ కంపెనీ మొదటి సంవత్సర ఉత్సవాలకు కొందరు సినీ ప్రముఖులు సైతం వచ్చారని.. వారి ప్రోద్భలంతోనే ఇదంతా జరుగుతుందని ఆరోపించారు బాధితులు. దీనిపై ప్రకాశం జిల్లాలో ఉన్న బాధితులు గ్రీవెన్ సెల్ కు ఫిర్యాదు చేశామని.. అయినా తమకు న్యాయం జరగలేదని వాపోతున్నారు.

కంపెనీల పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్న బాధితులు....
తమ సంస్థలో పెట్టుబడులు పెట్టండి.. రెండింతలు తిరిగి ఇస్తామనే కంపెనీల పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు బాధితులు. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామంటున్నారు. ఏజీస్ కంపెనీ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని.. తమ డిపాజిట్లు తిరిగి ఇప్పించాలని వేడుకుంటున్నారు.  

06:31 - May 8, 2016

హైదరాబాద్ : జంటనగరాల్లో అర్థరాత్రి నుండి ఎడతెరపిలేని వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు జలమయం అయ్యాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాల కారణంగా పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి.

06:29 - May 8, 2016

హైదరాబాద్ : శ్రీమంతుడి రాకకోసం బుర్రిపాలెం వేయికళ్లతో ఎదురుచూస్తోంది.. సుదీర్ఘకాలం తర్వాత మహేశ్ బాబు రాక వార్తతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.. ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాలను రాజకుమారుడు ప్రారంభించబోతున్నాడు..

దత్తత తీసుకున్న తర్వాత మొదటిసారి గ్రామానికి ....

ప్రిన్స్ మహేశ్ బాబు ఈ ఆదివారం గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో పర్యటించబోతున్నాడు.. దత్తత తీసుకున్న తర్వాత మొదటిసారి గ్రామానికి వస్తున్నాడు.. ఎప్పుడూ బిజీబిజీగా ఉండే సూపర్‌ స్టార్ పదిహేనేళ్లకాలంలో కేవలం రెండుసార్లు మాత్రమే గ్రామానికి వచ్చాడు.. రాజకుమారుడు సినిమా విడుదల సమయంలో ఒకసారి... బంధువు చనిపోయినప్పుడు మరోసారి గ్రామాన్ని సందర్శించాడు..

మహేశ్‌ రాక వార్తతో గ్రామస్తులు సంతోషం .....

మహేశ్ భార్య నమ్రత మార్చిలో ఈ గ్రామానికి వచ్చారు.. గ్రామస్తులతో సమావేశమై అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.. ఇప్పుడు సుదీర్ఘకాలం తర్వాత మహేశ్‌ రాక వార్తతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..

26 అభివృద్ధి పనులకు సంబంధించిన పైలాన్‌ ఆవిష్కరణ...

శ్రీమంతుడు గ్రామానికి రాగానే ముందు కొత్తగా నిర్మించిన స్కూల్‌ అదనపు గదులతోపాటు.. సీసీ రోడ్లను ప్రారంభిస్తారు.. 2 కోట్ల 16లక్షలతో చేపట్టబోతున్న 26 అభివృద్ధి పనులకు సంబంధించిన పైలాన్‌ ఆవిష్కరిస్తారు.. ఇది పూర్తికాగానే గ్రామస్తులతో సమావేశమవుతారు.

తెనాలికి నాలుగు కిలోమీటర్ల దూరంలో బుర్రిపాలెం...

నాలుగు వేల జనాభాతో ఉన్న బుర్రిపాలెం తెనాలికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది.. ఈ గ్రామంలో ఉన్న కొద్ది సౌకర్యాలను మహేశ్ బాబు కుటుంబమే కల్పించింది.. అయినా ఈ గ్రామం పూర్తిస్థాయి అభివృద్ధికి నోచుకోలేదు.. ఇక్కడి పరిస్థితి చూసిన మురారి.. గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చారు.. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ సహకారంతో సౌకర్యాల కల్పనకు సిద్ధమయ్యారు.. అటు ప్రిన్స్ టూర్‌ ఏర్పాట్లలో ప్రజాప్రతినిధులు, అధికారులు బిజీ బిజీగా ఉన్నారు.. తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ స్వయంగా ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు..  

06:25 - May 8, 2016

విజయవాడ : ఎగువ రాష్ట్రాలు కడుతున్న ప్రాజెక్టులతో కృష్ణా డెల్టా ప్రమాదంలో పడనుందని సీఎం చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ప్రభుత్వం నదుల అనుసంధానం చేసి పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా కృష్ణా డెల్టాను కాపాడుతోందని అన్నారు. కృష్ణా జిల్లాలో నిర్వహించిన నీరు ప్రగతి కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు.

గన్నవరం మండలం చిక్కవరంలో ఏపీ సీఎం పర్యటన...

కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. చిక్కవరంలో పంట సంజీవని కింద తవ్విన కుంటను పరిశీలించారు. బ్రహ్మయ్యలింగం చెరువులో నీరు-ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ఇంకుడుగుంతను ప్రారంభించారు.

ప్రదర్శనను పరిశీలించిన సీఎం...

చెరువులో మట్టి తవ్వకాలకు వెళ్లేముందు అటవీశాఖ, నీటిపారుదల బిందు సేద్యం, సౌర విద్యుత్తు, డ్వామా శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శనను పరిశీలించారు. అనంతరం మట్టి కట్టల పనులు పరిశీలించి బహిరంగ సభలో పాల్గొన్నారు. కృష్ణా డెల్టాను కాపాడేందుకు, పంటలకు నీరు అందించేందుకు ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోందని చంద్రబాబు అన్నారు.

కృష్ణా డెల్టా ఆయకట్టు ప్రమాదంలో పడే అవకాశం ...

ఎగువ రాష్ట్రాలు కృష్ణా నీటిపై ఇష్టారీతిన ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని ఫలితంగా కృష్ణా డెల్టా ఆయకట్టు ప్రమాదంలో పడే అవకాశం ఉందని చంద్రబాబు అన్నారు. తీర ప్రాంతాల్లో వర్షపాతం అధికంగా ఉండటం వరమని ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జలాలను పెంచవచ్చని పేర్కొన్నారు. అంతేకాదు కేవలం ప్రాజెక్టులపై ఆధారపడకుండా పంట కుంటలు, మైనర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల ద్వారా సైతం సాగునీరు అందుబాటులో తెచ్చుకోవచ్చని అన్నారు.

నీరు ప్రగతి కార్యక్రమంలో చంద్రబాబు...

అనంతరం సీఎం చంద్రబాబు నీరు ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎనర్జీ సేవింగ్‌ పంప్‌ సెట్లను పంపిణీ చేస్తామని, వీటి రిపేరింగ్‌ తో సహా పూర్తి బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని అన్నారు. భూగర్భ జలాలను పెంచడం ద్వారానే సమస్యను పరిష్కరించవచ్చని అన్నారు. వ్యవసాయం ఖర్చు తగ్గించి, ఆదాయం పెంచే మార్గాలను ప్రభుత్వం సూచిస్తుందని తెలిపారు. అలాగే సాంకేతికతను జోడించి రైతుకు లాభాలు అందించే ప్రయత్నం చేస్తామన్నారు. 

06:21 - May 8, 2016

ఆదిలాబాద్ : మానవత్వానికే మచ్చ తెచ్చిన సంఘటన ఇది. మనవరాళ్ల వయస్సు ఉన్న బాలిక మీద ఓ వృద్ధుడు తన కొడుకుతో పాటు కలసి హత్యాచారం చేసిన దారుణ ఘటన ఇది. సభ్యాసమాజం తలదించుకునేలా చేసిన అమానుష ఘటన ఇది.

బడికి వెళ్తున్న బాలికను లోబర్చుకున్న ఆటోడ్రైవర్‌...

ఆదిలాబాద్‌ జిల్లా కాసిపేట మండలం పల్లంగూడా గ్రామంలో 14 ఏళ్ల బాలికను ఆటో డ్రైవర్ లోబర్చుకొన్నాడు.. ఆ తరువాత అతడి మిత్రుడు మరో ముగ్గురు యువకులు బాలికపై హత్యాచారం చేసి గర్భవతిని చేశారు. అత్యంత దారుణం ఏంటి అంటే బాలిక పై లైంగిక దాడికి పాల్పడిన వారిలో తండ్రి కొడుకులున్నారు. ఈ క్రమంలో బాలిక అనారోగ్యం చెందడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. వైద్యులు బాలికను గర్భవతిగా నిర్థారించారు. దీంతో షాక్‌కు గురైన తల్లిదండ్రులు బాలికను నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

గ్రామపెద్దలను ఆశ్రయించిన బాలిక తల్లిదండ్రులు..

బాలిక తల్లిదండ్రులు న్యాయం కోసం గ్రామ పెద్దలను ఆశ్రయించారు. లైంగిక దాడికి పాల్పడిన నలుగురు వ్యక్తులు ఒక్కొక్కరు తల యాభై వేల రూపాయల చొప్పున 2 లక్షల 50 వేల రూపాయలు కట్టాలని బాలిక శీలానికి వెలకట్టారు.. దీనిపై తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో హత్యాచారం చేసిన ఐదుగురు నిందితులను, పంచాయితీ నిర్వహించిన 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఐదుగురి పై నిర్భయ కేసు నమోదు చేశామని... పంచాయితీ నిర్వహించిన వారిపై కేసు పెట్టామని DSP రమణారెడ్డి చెప్పారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే దోషులను కఠినంగా శిక్షించాలని సామాజిక వేత్తలు డిమాండ్ చేస్తున్నారు. 

06:17 - May 8, 2016

హైదరాబాద్ : ఎండకు ఎండుతూ...వానకూ తడుస్తూ కంపును భరిస్తూ.. నిత్యం యంత్రాలతో నరకం చూస్తున్నారు. వేల ట‌న్నుల చెత్తని సిటి బ‌య‌ట‌కు పంపి న‌గ‌రాన్ని శుభ్రంగా ఉంచుతారు. కాని వారి బతుకులు మాత్రం చిధ్రంగా ఉంటున్నాయి... చెత్తలోనే తిండి తిప్పలు... ఆవాసాలు... ఇలాంటి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న గ్రేటర్ ట్రాన్స్‌పోర్ట్ కార్మికులపై ప్రత్యేక కథనం..

ప్రతిరోజు ఉత్పత్తి అవుతున్న చెత్త 4 వేల ట‌న్నులు...

హైద‌రారాబాద్ లో ప్రతిరోజు ఉత్పత్తి అవుతున్న చెత్త 4 వేల ట‌న్నులు. న‌గ‌రంలోని వివిధ ప్రాంతాల‌ నుంచి చెత్తను సేక‌రిస్తున్న వాహ‌నాలు ఐదు వందలు. ఈ వాహనాలను నడపడానికి ఉన్న డ్రైవర్లు 600 మంది.

ప‌లువురు ప్రమాదాల బారినప‌డి ప్రాణాలు కోల్పోయారు..

ఇదిగో ఇక్కడ మొరాయించిన ఈ వాహ‌నాన్ని తోస్తే కాని ముందుకు క‌ద‌ల‌డంలేదు. గతంలో జీహెచ్ఎంసీ వాహ‌నాలు ఢీకొనడంతో ప‌లువురు ప్రమాదాల బారినప‌డి ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి వాహనాలతో చాలా ఇబ్బంది పడుతున్నామని డ్రైవర్లు వాపోతున్నారు.

ట్రాన్స్ ఫ‌ర్ కేంద్రాల వ‌ద్ద ఎలాంటి సౌక‌ర్యాలు లేవు. ..

ఇక వాహ‌నాలే కాదు ట్రాన్స్ ఫ‌ర్ కేంద్రాల వ‌ద్ద ఎలాంటి సౌక‌ర్యాలు లేవు. ఇక్కడ అన్నం తిన‌డానికి కార్మికుల‌కు ఎలాంటి ఏర్పాట్లను అధికారులు చేయడం లేదు. దీంతో చెత్త నుంచి వ‌చ్చే దుర్వాసననూ భ‌రిస్తూనే అన్నం తినాల్సిన ప‌రిస్థితులున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు వంద‌ల మంది కార్మికులు పనిచేస్తున్న.. కనీసం టాయిలెట్స్ కూడా లేవని... వాటికితోడు ఎల‌క‌లు, పాములు భ‌యం ఉందంటున్నారు.

కనీస సౌకర్యాలు కల్పించి ఆదుకోవాలని ..

ఏసీ కార్యాల‌యాల్లో కూర్చుని సక‌ల సౌక‌ర్యాలు అనుభ‌విస్తున్న అధికారులు.. తమ క‌ష్టాలను గుర్తించి కనీస సౌకర్యాలు కల్పించి ఆదుకోవాలని ట్రాన్స్ పోర్ట్‌ కార్మికులు వేడుకుంటున్నారు.   

06:14 - May 8, 2016

గుంటూరు: ఎపీ రాజధాని అమరావతిలో దేవుడి సొమ్ము కాజేసేందుకు కొందరు పెద్దలు కన్నేశారు. దేవుడి భూములు కాజేసి కుబేరులయ్యేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. వందల కోట్ల రూపాయల భూములు మింగేందుకు కంకణం కట్టుకున్నారు. ఇక్కడ ఎన్నో శతాబ్దాల నుంచి చారిత్రకమైన అమరేశ్వస్వరాలయానికి సంబందించిన సదావర్తి నిత్య అన్నదాన సత్రం ఉంది.

ఈ సత్రం పరిసరాలలోని స్థలాల కబ్జాకు ప్లాన్ చేశారు.

అమరేశ్వరాలయంలో ఆదాయం లేక....

నిన్న మొన్నటి వరకు ఈ అమరేశ్వస్వరాలయాలయంలో ఆదాయం లేక కార్యక్రమాలన్నీ అరకొరగా నిర్వహించేవారు. అయితే సదావర్తి నిత్యఅన్నదాన సత్రానికి చెందిన మద్రాసు లోని 471 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో షుమారు 100 ఎకరాలు,గుంటూరు జిల్లాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఉన్న వందల ఎకరాల అమరేశ్వరుని దేవాలయం భూములు సైతం ఇప్పుడు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లబోతున్నాయి.

500 వందల కోట్ల విలువైన 83 ఎకరాల భూముల అమ్మకానికి ప్లాన్......

500 వందల కోట్ల విలువైన 83 ఎకరాల భూములను కారుచౌకగా 22 కోట్ల 40 లక్షలకే చేజిక్కించుకోవాలని చూస్తున్నారు. నామమాత్రపు వేలంతో నేతలు,అధికారులు కుమ్మక్కై కొందరు ప్రజా ప్రతినిధులు బినామీ పేర్లతో అప్పనంగా కొట్టేయ్యాలని ప్లాన్ వేసి రిజిస్ట్రేషన్ లు చేయించుకునేందుకు ఆరాటపడుతున్నారు.

ఆయల ఆస్తులు కళ్లముందే కనుమరుగయ్యే పరిస్ధితి...

తక్షణమే ఉన్నతాధికారులు,ప్రభుత్వం స్పందించి రిజిస్ట్రషన్ లు నిలిపివేయకపోతే ఆయల ఆస్తులు కళ్లముందే కనుమరుగయ్యే పరిస్ధితి నెలకొంది. పురాతన దస్తావేజుల్లో ఈ భూములు అమ్మరాదని,వీటిపై వచ్చే ఆదాయంతో ఆలయంలో పూజలు,భక్తులకు నిత్యఅన్నదానం చేయాలని మాత్రమే ఉండగా ఒకేసారి అమ్మి వచ్చిన డబ్బును జేబులు నింపుకోవాలని అక్రమార్కులు తలంచారు.

జంటనగరాల్లో అర్థరాత్రి నుంచి ఎడతెరపిలేని వర్షం

హైదరాబాద్ : జంటనగరాల్లో అర్థరాత్రి నుండి ఎడతెరపిలేని వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు జలమయం అయ్యాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాల కారణంగా పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి.

Don't Miss