Activities calendar

10 May 2016

సిమ్లాలో విరిగిన కొండ చెరియలు:10 మంది మృతి

హైదరాబాద్ : సిమ్లాలో కొండచరియలు విడిరిగి పడి 10 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

మహారాష్ట్రతో మంత్రి హరీష్ రావు చర్చలు సఫలం

హైదరాబాద్ : మహారాష్ట్రతో మంత్రి హరీష్ రావు చర్చలు సఫలం అయ్యాయి. అంతరాష్ట్ర మండలి భేటీకి సీఎం ఫడ్నవీస్ ను హరీష్ ఆహ్వానించారు. హరీష్ విజ్ఞప్తిపై ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించారు. అంతర్ రాష్ట్ర మండలి భేటీ తేదీని నిర్ణయించాలని హరీష్ కోరారు.

ఎల్ అండ్ టీ కార్మికుల ధర్నా లో ఉద్రిక్తత

గుంటూరు : ఎల్ అండ్ టీ కార్మికుల ధర్నా లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీపీఎం నేతలు బాబూరావు, పాశం రామారావు, లెనిన్ లపై లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనలో లెనిన్ కు తీవ్ర గాయాలు అవడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ, పోలీసుల తీరుకు నిరసనగా బాబూరావు, రామారావు, నవీన్ అమరావతి పీఎస్ లోనే నిరసన తెలుపుతున్నారు.

దేశంలో కరువుపై ప్రధాని సమీక్ష

ఢిల్లీ : హోంమంత్రి, వ్యవసాయ మంత్రులతో ప్రధాని భేటీ అయ్యారు. వీరి భేటీలో దేశంలో నెలకొన్న కరువు పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తున్నారు.

మొఘల్రాజపురంలో పోలీసులు కార్డన్ సెర్చ్

విజయవాడ : మొఘల్రాజపురంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అల్లరి మూలకల దాడులు, శాంతి భద్రతల పరిరక్షణ కోసం మూడు బృందాలతో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

'మహానాడు నిర్వహణకు 16 కమిటీలు'

హైదరాబాద్: తిరుపతిలో ఈనెల 27, 28, 29 తేదీల్లో తిరుపతి వేదికగా జరిగే మహానాడును ఘనంగా నిర్వహించేందుకు 16 కమిటీలు ఏర్పాటయ్యాయి. తీర్మానాలు, వేదిక ప్రాంగణం, సభా నిర్వహణ, భోజన వసతి, ఆర్థిక వనరులు, రవాణా, పార్కింగ్‌, సాంస్కృతిక కార్యక్రమాలు మొదలైన వాటి నిర్వహణ కోసం కమిటీలను ఏర్పాటు చేసినట్లు మహానాడు సమన్వయ కమిటీ నేత టీడీ జనార్దన్‌ హైదరాబాద్‌లో తెలిపారు. మహానాడుకు సన్నాహకంగా నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాలను ఈనెల 18, 20 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ సమావేశానికి రాష్ట్ర పరిశీలకులు హాజరవుతారని తెలిపారు.

20:12 - May 10, 2016

ఆర్డీఎస్ కాడ రాజుకున్న నీళ్ల రగడ... కుర్చీ వేసి సీఎం ను పిలుస్తున్న రైతులు, రాజకీయాలనుండి తప్పుకుంటవా ఉత్తమ్... మీ అయ్యకు సమాధానం చెప్తారా బచ్చా, ఉత్తరాఖండ్ రాజకీయం ఆఖరి అంకం..సుప్రీం కోర్టుకు చేరిన బలపరీక్ష ఫలితం, ఆలోచన లేని పని చేసిన ఆంధ్ర మేధావి...ప్రత్యేక ప్యాకేజీ కోసం ఒప్పుడు పాసు, హైదరాబాద్ రోడ్ల మీదకొచ్చిన యమధర్మరాజు..ముందుగాల దులపాలే సర్కారోళ్లు బూజు, సజీవ పరీక్షకు దిగిన వేణు మాధవ్..పోయిండని ప్రచారం చేసిన బట్టేబాజులు. ఇత్యాది అంశాలపై మల్లన్న ముచ్చట్లు కార్యక్రమంలో మల్లన్న చెప్పిన హాట్ హాట్ కబుర్లు వినాలనుకుంటే ఈ వీడీయోను క్లిక్ చేయండి..

నీ అసొంటి వెయ్యి మంది చంద్రబాబులు అడ్డం బడ్డా..?

ఏయ్ చంద్రబాబు ఖబడ్దార్.. నీ అసొంటి వెయ్యి మంది చంద్రబాబులు అడ్డం బడ్డా..? పాలమూరు జిల్లా జనానికి నీళ్లు ఇయ్యకుంట అడ్డుకోలేరు.. ఇయ్యాళ తెలంగాణ బిడ్డనే ముఖ్యమంత్రి.. ఎవ్వడు ఆపుతడో సూస్తా.. నీ ఆర్డీఎస్ తూముల సంగతి తేలుస్త.. త్వరలోనే కర్ణాటక రాష్ట్రానికి బోతున్న.. కుర్చేసుకోని కట్టిపిస్త పాలమూరు ప్రాజెక్టులు పదిహేను రోజులకు ఒకపారి వస్త.. అర్థమైందిగదా.?? ఈ ముచ్చటెవ్వలు జెప్పిండ్రో.. అగో ఆముచ్చట పంచాదే ఇది..

జంపింగులు సుర్వైనయ్..

నీయక రాజకీయాలు ఏ యాళ్లకు ఎట్లమార్తయో ఎవ్వలికి అర్థమైతలేవు.. ఇయ్యాళ ఈ పార్టీలున్నోళ్లు.. రేపు ఏపార్టీలుంటరో తెల్వకుంటైంది.. ఒక్క మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముచ్చటనే గాదు బైటిరాష్ట్రాల పొంటి గూడ ఇట్లనే మోపైనయ్.. ఉత్తరాఖండ్ సర్కార్ మైనార్టీల వడ్డసంది ఆడగూడ జంపింగులు సుర్వైనయ్.. ఇయ్యాళ విశ్వాస పరీక్ష నాటికి ఇంక రంజుకొచ్చింది అక్కడి రాజకీయం..

పర్వు దీస్కుంటున్నరు లీడర్లంత..

పాలేరు ఉపఎన్నికలేమోగని.. పర్వు దీస్కుంటున్నరు లీడర్లంత.. ఎవ్వలు గెలుస్తరో ఎవ్వలు ఓడిపోతరో జనం డిసైడ్ జేస్తరుగని.. అటు ముఖ్యమంత్రి కొడ్కు తారక రామారావు... ఇటు కాంగ్రెస్ ప్రెసిడెంటు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఇద్దరు గల్సి గమ్మతి గమ్మతి మాటలు దిట్టుకుంటున్నరు.. మరి వీళ్లు ఎందుకు తిట్టుకుంటున్నరో అందరికి ఎర్కేగని.. ఆ తిట్లు ఒక్కపారి జూద్దాం..

ఆ బిడ్డకు మన టెట్ సిలబసే ఉరితాడైంది....

శ్రీయుత గౌవరనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగారికి నమస్కరించి వ్రాయునది ఏమనగా.. అయ్యా నాపేరు ప్రమీల... నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను దయచేసి నా చివరి కోరిక తీర్చగలరు.. నిజమే సర్కారు బడిపంతులమ్మ గావాలె అని కళలు గన్న ఆ బిడ్డకు మన టెట్ సిలబసే ఉరితాడైంది.. తమిత ముచ్చట జూడుండ్రి..

నిజంగ బ్రహ్మదేవుడు రాస్తడో లేదు..

అందరి తలరాతలను బ్రహ్మదేవుడు రాస్తడంటరు.. నిజంగ బ్రహ్మదేవుడు రాస్తడో లేదు సూశినోళ్లకు ఎర్క రాపిచ్చుకున్నోళ్లకు ఎర్కగని.. బ్రహ్మదేవుని తలరాత మాత్రం.. మన ఆంధ్రమేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ సారు రాయగలడు అంత ధమ్మున్న మన్షి ఒక్కడే ఉన్నడు ఈ భూమ్మీద అంటుంటరు అభిమానులు.. అగో ఆ మేధావి వార్త ఒక్కటొచ్చింది మనతానికి.. పాండ్రి..

యమున్ని జూశిండ్రా మీరు ఎన్నడన్న..? ...

యమలోకంలుండే యమున్ని జూశిండ్రా మీరు ఎన్నడన్న..? ఆయినను జూస్తె మళ్ల భూమ్మీదెందుకుంటంగని.. అయితే యముడే భూమ్మీదికి దిగొచ్చిండు.. అది మన హైద్రావాద్ రోడ్ల పొంటనే దిర్గుతున్నడు.. తిర్గుడే గాదు ఆయిన కర్తవ్యం.. విధుల గురించి జానినికి పాఠాలు గూడ జెప్తున్నడు.. యమపాఠాలు మీరు గూడ ఇంటరా..? సూస్కుంట ఇనుండ్రి..

కని ఏడుకొండల ఎంకన్న సామి ఎంత అదురుష్టం జేస్కున్నడో.. ఎక్కట ఆయనను పొగిడిపిచ్చుకునెతందుకు తాళ్లపాక అన్నమాచార్యులను ఈ భూమిమీదికి దీస్కొచ్చింది ఆయిననే అంటరు.. తాళ్ల పాక తరం అయిపోయింది.. ఇప్పుడు నర్సింహాన్ తరమొచ్చింది.. అదే ఇంకో భక్తున్ని తయ్యారు జేస్కున్నడన్నట్టు.. మరి ఆ భక్తుడు ఎవ్వలు ఏం కథ అనేది సూద్దాం..

కుషాయిగూడ పీఎస్ కు వాట్సప్ పంచాదే...

ఈ సెల్ ఫోన్లు.. అండ్లుండె వాట్సప్లు.. ఫేస్ బుక్కులు ట్విట్టర్లు జెయ్యంగ లాభం ఎంతున్నదో తెల్వదిగని.. నష్టం మాత్రం నషాలం దాకున్నది.. మన్షిని బద్నం జెయ్యాల్నన్నా.. వాట్సప్పే.. మన్షి ఇజ్జత్ దీయాల్నన్నా వాట్సప్పే.. లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టు అంత అబ్రకదబ్ర.. అదే వాట్సప్.. అగో గా వాట్సప్ పంచాదే కుషాయిగూడ పోలీస్ స్టేషన్ దాకొచ్చింది..

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: మంత్రి లక్ష్మారెడ్డి

హైదరాబాద్: సీజనల్ గా వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి లక్ష్మారెడ్డి అధికారులకు, ప్రజలకు సూచించారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు మంచి వైద్యమందించాలని అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టు వైద్యులకు సమయానికి వేతనాలివ్వాలని..ఉద్యోగాల్లో అలసత్వాన్ని ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల పోస్టులను పునర్వ్యవస్థీకరిస్తామని అన్నారు. అవసరమైన చోట వైద్యులను నియమిస్తామని స్పష్టం చేశారు.

ఢిల్లీలో మళ్లీ డీజిల్ ట్యాక్సీలు పరుగు

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ డీజిల్ ట్యాక్సీలు పరుగెత్తనున్నాయి. ఢిల్లీలోని డీజిల్ ట్యాక్సీలపై విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేసింది. తానే విధించిన నిషేధాన్ని తానే ఎత్తివేస్తూ ఇవాళ తీర్పు చెప్పింది. డీజిల్ ట్యాక్సీల ఆల్ ఇండియా పర్మిట్ గడువు ముగిసే వరకు ఢిల్లీ రోడ్లపై ట్యాక్సీలను నడుపుకోవచ్చని పేర్కొంది. ఇకపై కొత్త వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించుకోరాదని ఆదేశించింది. కాగా, డీజిల్ ట్యాక్సీలపై నిషేధం విధిస్తూ ఏప్రిల్ 30న సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. 

కర్ణాటక సీఎంతో టీ.కాంగ్రెస్ నేతల భేటీ....

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు మంగళవారం భేటీయ్యారు. ఆర్డీఎస్ పనులను వెంటనే చేపడతామని కర్ణాటక సీఎం చెప్పినట్లు కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. తీవ్ర కరవుతో అల్లాడుతున్న మహబూబ్ నగర్ జిల్లాకు తాగునీటి కోసం ఒక టీఎంసీ నీరు విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. సీఎంను కలిసిన వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఉన్నారు.

19:26 - May 10, 2016

విజయవాడ : రాష్ట్రంలోని ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి లేదని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు ఘాటైన విమర్శలు చేశారు. ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ....రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే చూసి ఓర్వలేకనే జగన్ విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలను మభ్యపెట్టేందుకే ధర్నాలంటూ జగన్‌ కొత్త డ్రామాకు తెరలేపారన్నారు. హంద్రీనీవా, హిందూపూర్, కుప్పం కాలువల నిర్మాణాన్ని పూర్తి చేసి రాయలసీమ ప్రజలకు నీరందిస్తామని తెలిపారు. ఏడాదిలోపు పట్టిసీమను పూర్తి చేసి చూపామని.. మిగతా ప్రాజెక్టుల విషయంలోనూ అదే విధమైన అంకితభావముందని చెప్పారు.

 

19:24 - May 10, 2016

తూర్పుగోదావరి: కాకినాడ‌లో ఖ‌రీదైన ఏరియాలో ఉన్న భూమి. వంద‌ల కోట్ల రూపాయల విలువ చేసే ఈ భూమి ఇప్పుడు కబ్జాదారుల కోరల్లో చిక్కుకుంది. ఆఖ‌రికి మా భూమేనంటూ దేవాదాయ శాఖ అధికారులు బోర్డులు పెట్టినా కబ్జారాయుళ్లు యథేచ్ఛగా తమ పని తాము చేసుకుపోతున్నారు. ఇంత జరుగుతున్నా ఏమీ చేయలేక దేవాదాయ శాఖ అధికారులు గుడ్లప్పగించి చూస్తున్నారు.

పలు సంస్థల ఆధీనంలో 38 ఎకరాల స్థలం......

ఈ ల్యాండ్‌ ఎండోమెంట్‌ క‌మిష‌న‌ర్ కార్యాల‌యానికి సమీప‌ంలో ఉంది. సుమారు 38 ఎక‌రాల ఈ స్థలం ప‌లు సంస్థల ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఇందులో 11.44 సెంట్ల స్థలంలో ఆశ్రమ ప‌బ్లిక్ స్కూల్ పేరుతో ఓ విద్యాసంస్థ స్కూల్‌ నిర్వహిస్తోంది. 29 సంవ‌త్సరాలుగా ఈ స్కూల్‌ నిర్వహిస్తూ భారీగా ఫీజులు వ‌సూలు చేస్తున్నారు. అయితే ఎండోమెంట్‌ స్థలాల్లో ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు చేయ‌కూడ‌ద‌న్న నిబంధ‌న‌ ఉన్నప్పటికీ అదిక్కడ అమలు కావట్లేదు.

అధికారులు కాల‌యాప‌న తో....

ఈ అక్రమ వ్యవహారంపై గ‌తంలో ఓమారు వివాదం త‌లెత్తగా విద్యా సంవ‌త్సరం మ‌ధ్యలో విద్యార్థులకు ఇబ్బందులు ఏర్పడాయన్న పేరుతో అధికారులు కాల‌యాప‌న చేశారు. అయితే ప్రస్తుతం ఎకడమిక్ ఇయర్ ప్రారంభం కాకపోయినా అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారు. ఇందుకు కారణం అధికార పార్టీ పెద్దలు ఈ వ్యవహారంలో భాగస్వాములు కావడమేనన్న ఆరోపణలున్నాయి.

నిజాయతీగా పనిచేసే ఓ అధికారిణి బదిలీ....

ఈ స్థలంలో వ్యాపార వ్యవహారాలు నిర్వహించకూడదంటూ నిజాయతీగా పనిచేసే ఓ అధికారిణి అడ్డుపడగా ఆమెను హఠాత్తుగా బదిలీ చేశారు. దీంతో ఈ భూ కబ్జా వ్యవహారంలో పెద్దల ప్రమేయముందన్న వాదన బలపడుతోంది. అప్పట్లో ఆమె ఈ భూముల‌ను స్వాధీనం చేసుకోబోతున్నట్లు మీడియాతో స్పష్టంగా చెప్పారు.

నిబంధనలు పట్టించుకోని మున్సిపల్ అధికారులు......

దేవాదాయ శాఖ భూములను ఎవరు ఆక్రమించినా సహించేది లేదని వాటిని స్వాధీనం చేసుకుంటామని ఇప్పటికే ఆ శాఖ మంత్రి మాణిక్యాలరావు పలుమార్లు ప్రకటనలు చేశారు. అయితే ఆ ప్రకటనలన్నీ మాటలకే తప్ప చేతల్లో అమలు కావడం లేదనడానికి ఈ స్కూల్‌ వ్యవహారమే ఉదాహరణ. నిజాయతీగా పనిచేసే అధికారులు అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దేవాదాయ శాఖ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా భవంతులు నిర్మించరాదు. కానీ ఇక్కడ భవంతులు నిర్మించారంటే మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నట్లు.. భవనాల నిర్మాణానికి ఎలా అనుమతులు ఇచ్చారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికైనా ఈ కబ్జా పర్వానికి అడ్డుకట్ట వేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

అద్దె భవనాల్లో ప్రభుత్వ సంస్థలు.....

ఒకవైపు ప్రభుత్వ సంస్థలు అద్దె భవనాల్లో కాలం వెళ్లదీస్తున్నాయి. కేంద్రీయ విద్యాల‌యం కూడా ఇలాగే నడుస్తోంది. మరో ఏడాది లోగా స్థలం చూపకపోతే కేంద్రీయ విద్యాల‌యాన్ని తరలిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ ఇక్కడ మాత్రం ప్రైవేట్ విద్యాసంస్థ ప్రభుత్వానికి చెందిన భూమిలో యథేచ్ఛగా స్కూల్ నిర్వహించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆశ్రమ స్కూల్‌ వ్యవహారంలో ప్రభుత్వం స్పందించాలని సిపిఎం డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే ఆక్రమిత దేవాదాయ స్థలాన్ని ప‌రిశీలించిన ఆ పార్టీ బృందం త్వర‌లో ఆందోళనలకు దిగుతామ‌ని చెబుతోంది.

కోట్ల రూపాయల విలువ చేసే స్థలంలో ఓ ప్రైవేట్ సంస్థ నిర్భయంగా .....

కోట్ల రూపాయల విలువ చేసే స్థలంలో ఓ ప్రైవేట్ సంస్థ నిర్భయంగా స్కూల్ నడుపుతుంటే దేవాదాయ శాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.? ఈ కబ్జా వ్యవహారంలో ఎవరెవరికి ప్రమేయం ఉంది.? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు. ఇకనైనా ఎండోమెంట్‌ డిపార్ట్‌మెంట్‌ కళ్లు తెరుస్తుందా.. లేక విపక్షాలు ఆందోళనలు చేసిన దాకా చేతులు కట్టుకుని కూర్చుంటుందా అన్నది చూడాలి. 

19:22 - May 10, 2016

హైదరాబాద్ : ప్రస్తుతం ఎక్కడ చూసినా నీట్ పై చర్చ జరుగుతోంది. అస్సలు రెండు తెలుగు రాష్ట్రాలకు నీట్ పరీక్ష లాభమా? నష్టమా? ఇదే అంశంపై హెడ్ లైన్ షోలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిసాంబశివ, గాయత్రీ విద్యా సంస్థల ఛైర్మన్ మూర్తి, విద్యారంగ నిపుణులు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను చర్చకు తీసుకువచ్చారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

18:09 - May 10, 2016

విశాఖ :ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో మరో హాట్‌ హాట్‌ ఫైట్‌కు వైజాగ్‌లో రంగం సిద్ధమైంది. సంచలనాలకు మారుపేరైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు ధోనీ నాయకత్వంలోని పూణే రైజింగ్‌ జెయింట్స్‌ జట్టు సవాల్‌ విసురుతోంది.

జోరుమీద ఆరెంజ్....

బ్యాక్‌ టు బ్యాక్‌ విజయాలతో ఆరెంజ్‌ ఆర్మీ జోరు మీదుండగా......పూణే రైజింగ్‌ జెయింట్స్‌ ఇప్పటికే ప్లే ఆఫ్‌ రేస్‌కు దూరమైంది. సక్సెస్‌ ట్రాక్‌లో దూసుకుపోతున్న సన్‌రైజర్స్‌ జట్టు విశాఖపట్నంలోనూ జైత్రయాత్ర కొనసాగించాలని పట్టుదలతో ఉంది.ఇప్పటివరకూ సన్‌రైజర్స్ జట్టు ఆడిన 9 లీగ్‌ మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించగా....పూణే జట్టు 10 లీగ్‌ మ్యాచ్‌ల్లో 3 విజయాలు మాత్రమే నమోదు చేయగలిగింది.

అంచనాలకు మించి రాణిస్తోన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు...

ప్రస్తుత సీజన్‌లో అసలే మాత్రం ఎక్స్‌పెక్టేషన్స్‌ లేకుండా బరిలోకి దిగి అంచనాలకు మించి రాణిస్తోన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు... ప్రస్తుతం రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉరకలేస్తోంది. డేవిడ్‌ వార్నర్‌ , శిఖర్‌ ధావన్‌, కేన్‌ విలియమ్‌సన్‌, మోసెస్‌ హెన్రిక్స్‌, యువరాజ్‌ సింగ్‌, దీపక్‌ హుడా, నమన్‌ ఓజా వంటి టాప్‌ క్లాస్‌ బ్యాట్స్‌మెన్‌తో రైజర్స్‌ బ్యాటింగ్‌ లైనప్‌ మునుపెన్నడూ లేనంత పటిష్టంగా ఉంది. ఇక డేవిడ్‌ వార్నర్‌ కళ్లు చెదిరే ఫామ్‌లో ఉండటంతో పాటు....శిఖర్‌ ధావన్‌ నిలకడగా రాణిస్తుండటంతో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ధీమాగా ఉంది.

ఆరెంజ్‌ ఆర్మీ బలం మాత్రం బౌలింగ్‌ ...

బ్యాటింగ్‌లో ఎలా ఉన్నా.....ఆరెంజ్‌ ఆర్మీ బలం మాత్రం బౌలింగ్‌ అనే చెప్పాలి. ఎందుకంటే భువనేశ్వర్‌ కుమార్‌, ముస్తఫిజుర్‌ రెహ్మాన్‌, అశిష్‌ నెహ్రా, బరీందర్‌ సింగ్‌ శ్రణ్‌ వంటి బౌలర్లతో కూడిన రైజర్స్‌ పేస్‌ బౌలింగ్‌ ఎటాక్‌ను ఎదుర్కోవడం ఎటువంటి బ్యాట్స్‌మెన్‌కైనా పెద్ద సవాలే చెప్పడంలో ఎటువంటి సందేహంలేదు.పేస్‌ బౌలర్లందరూ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడం మాత్రమే ప్రతీ మ్యాచ్‌లోనూ వికెట్లు తీస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.ఇక ఆరంభ ఓవర్లలో భువీ, నెహ్రా...డెత్‌ ఓవర్లలో యువ సంచలనం ముస్తఫిజుర్‌ రెహ్మాన్‌ ఎలా ప్రత్యర్ధి బ్యాట్స్‌మెన్‌కు చెక్‌ పెడుతున్నారో అందరికీ తెలిసిందే. యువరాజ్‌ సింగ్‌ రాకతో అటు బ్యాటింగ్‌ లైనప్‌తో పాటు, స్పిన్‌ విభాగం సైతం బలోపేతమైంది.

ప్లే ఆఫ్‌ రేస్‌లో ముందు వరుసలో నిలవాలని...

అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తోన్న ఆరెంజ్‌ ఆర్మీ....ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి దాదాపుగా ప్లే ఆఫ్‌ రేస్‌లో ముందు వరుసలో నిలవాలని తహతహలాడుతోంది. మరోవైపు రైజింగ్‌ పూణే సూపర్‌ జెయింట్స్‌ జట్టు....మాత్రం వరుస ఓటములతో ఢీలా పడింది. నిలకడలేని బ్యాటింగ్‌ లైనప్‌ ......బౌలర్ల వైఫల్యంతో పూణే జట్టు అసలేమాత్రం ప్రభావం చూపలేకపోయింది.

పసలేని బౌలింగ్‌ ఎటాక్‌తో పూణే ఫ్లాప్‌ షో..

రహానే, తిసెరా పెరీరా, ధోనీ,జార్జ్‌ బెయిలీ, ఉస్మాన్‌ కవాజా వంటి మ్యాచ్‌ విన్నర్లున్నా.....పూణే జట్టుకు ఇప్పటివరకూ ఏదీ కలిసి రాలేదు. ప్లే ఆఫ్‌ చేరే అవకాశాలు ఎలాగూ లేకపోవడంతో పూణే జట్టు...చెలరేగి ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇకనైనా సమిష్టిగా రాణించి, ప్లే ఆఫ్‌ రేస్‌లో ఉన్న మిగతా జట్ల అవకాశాలను దెబ్బతీయాలని పూణే జట్టు పట్టుదలతో ఉంది. విశాఖపట్నంలోని ఏసీఏ – విడిసీఏ స్టేడియం వేదికగా మరికొద్దిగంటల్లో ప్రారంభం కానున్న ఈ పోటీలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.సన్‌రైజర్స్ జట్టు సూపర్‌ ఫామ్‌లో ఉండటంతో పోటీ ఏకపక్షంగా ముగిసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.   

17:53 - May 10, 2016

హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఇవాళ సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులపై ప్రధానికి వివరించారు. తెలంగాణలో నెలకొన్న కరవు పరిస్థితులను ఎదుర్కొవడానికి, కరవు నివారణ కోసం చేపట్టే పనులకు అవసరమైన నిధులను సమకూర్చాలని ప్రధానిని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరవును ఎదుర్కొవడానికి తాత్కాలికంగా చేపట్టిన కార్యక్రమాలను సీఎం కేసీఆర్ ప్రధానికి వివరించారు. కరవును ఎదుర్కొవడానికి మంచినీటి సరఫరా, ఇన్‌పుట్ సబ్సిడీ, పశుగ్రాసం పంపిణీ, పిల్లలకు మధ్యాహ్న భోజనంలాంటి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ప్రజలకు మంచినీరు, పొలాలకు సాగునీరు అందించే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కార్యక్రమాలను ప్రధాని అభినందించారు. ఏడు జిల్లాల్లో 231 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించామని సీఎం తెలిపారు. నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ, మంచినీటి సరఫరా, పశుగ్రాసం అందజేయడానికి ప్రజలకు ఉపాధి కల్పించడానికి రూ.3064 కోట్లు కావాలని కేంద్రాన్ని కోరామని, కానీ కేంద్రం కేవలం రూ.712 కోట్లు మాత్రమే ఇచ్చిందని వివరించారు. మిగతా నిధులను విడుదల చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. 

17:51 - May 10, 2016

హైదరాబాద్ : జీరో స్కూల్స్‌పై తెలంగాణ ప్రభుత్వ తీరును సుప్రీం కోర్టు తప్పుపట్టింది. తెలంగాణలోని 400 ప్రభుత్వ పాఠశాలల్లో కనీస విద్యార్థులు లేరని.. విద్యార్థులు పాఠశాలకు వచ్చేలా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని సుప్రీం కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇంగ్లీష్‌ మాధ్యమం కోసమే విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లను ఆశ్రయిస్తున్నారని టీ-సర్కార్‌ కోర్టుకు తెలిపింది. విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లకు వచ్చేందుకు రవాణా సౌకర్యం, యూనిఫాం, పుస్తకాలు ఇస్తున్నామని తెలంగాణ తరపు న్యాయవాది శెట్టి కోర్టుకు తెలిపారు. టీ ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు తెలంగాణలో జీరో స్కూల్స్‌పై అమికస్‌క్యూరీ కమిటీ మధ్యంతర నివేదికను సమర్పించింది. మాతృభాషలో బోధన మంచిదే అయినా వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలని అభిప్రాయపడిన సుప్రీం కోర్టు సమగ్ర నివేదికతో రావాలని అమికస్‌ క్యూరీ కమిటీని ఆదేశించింది. విచారణను జులై 13కు వాయిదా వేసింది. అమికస్‌ క్యూరీ కమిటీ మరోసారి తెలంగాణలో పర్యటించి వివరాలు సేకరించనుంది.

17:50 - May 10, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌విభజన బిల్లులో పేర్కొన్న అంశాలను కేంద్రం నెరవేర్చకుండా నాటకాలాడుతోందన్నారు. సిపిఐ నల్లగొండ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరయ్యారు. బిజెపి, కాంగ్రెస్ ఒకరుపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకోవడం తప్ప పార్లమెంటు సమావేశాల్లో ప్రజాసమస్యలు చర్చకు రావడం లేదని చాడ విమర్శించారు. 

17:48 - May 10, 2016

హైదరాబాద్ : నగరంలోని విస్పర్ వ్యాలీ మహా ప్రస్థానం స్మశాన వాటికలో చెన్నమనేని రాజేశ్వరరావు అంత్యక్రియలు ముగిశాయి. అధికార లాంఛనాలతో రాజేశ్వర్ రావు అంత్యక్రియలు నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఆయన ఇంటి నుంచి ప్రారంభమైన చెన్నమనేని అంతిమయాత్ర... మహా ప్రస్థానం స్మశానవాటిక వరకు కొనసాగింది. అంత్యక్రియలకు మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు, తెలంగాణ మంత్రులు నాయిని, కేటీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్, టీటీడీపీ అధ్యక్షుడు రమణ, కాంగ్రెస్ నేతలు శ్రీధర్ బాబు, షబ్బీర్ అలీ వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు హజరయ్యారు.

 

17:46 - May 10, 2016

హైదరాబాద్ : సివిల్‌ సర్వీసెస్‌-2015 ఫలితాలను యూపీఎస్‌సీ విడుదల చేసింది. విశాఖకు చెందిన చేకూరి కీర్తికి 14వ ర్యాంకు, హైదరాబాద్‌కు చెందిన విద్యాసాగర్‌ నాయుడుకు 101వ ర్యాంకు, జొన్నలగడ్డ స్నేహజకు 103వ ర్యాంకు లభించింది. 2015 డిసెంబరు 18 నుంచి 23 వరకు యూపీఎస్‌సీ సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్‌ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాలను యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. 

ఐసెట్ పరీక్షా తేదీలు..

హైదరాబాద్ : ఐసెట్ పరీక్షా తేదీలను తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఈ నెల 19వ తేదీన పరీక్ష జరగనుంది. 21వ తేదీన ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు. ఐసెట్ నిర్వాహణకు 127 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విద్యా కేంద్రాల్లోనే ఐసెట్ పరీక్ష జరగనుండగా తొలిసారిగా బయోమెట్రిక్ విధానం ప్రవేశ పెట్టనున్నారు. 

టి.ఎంసెట్ షెడ్యూల్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 15వ తేదీన పరీక్ష జరగనుంది. ఉదయం 10 నుండి 01.గంట వరకు ఇంజనీరింగ్, మధ్యాహ్నం 02.30 నుండి సాయంత్రం 5.30 వరకు అగ్రికల్చర్, మెడికల్ పరీక్ష జరగనుంది. 

యూపీఎస్సీ ఫలితాల విడుదల..

ఢిల్లీ : సివిల్ సర్వీసెస్ - 2015 ఫలితాలను మంగళవారం సాయంత్రం యూపీఎస్సీ విడుదల చేసింది. విశాఖకు చెందిన చేకూరి క్తీరికి 14వ ర్యాంకు, హైదరాబాద్ కు చెందిన విద్యాసాగర్ నాయుడుకు 101వ ర్యాంకు వచ్చింది.

 

16:59 - May 10, 2016

ఢిల్లీ : నీట్ పై సందిగ్ధత కొనసాగుతోంది. నీట్ నిర్వాహణపై మళ్లీ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ఏడాది ఇప్పటికే ఎంసెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించిన రాష్ట్రాలకు నీట్ నుండి మినహాయింపు ఇవ్వాలని కేంద్రం కోరింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశం కోసం నీట్ లో ప్రాంతీయ భాషలకు అవకాశం కల్పించాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. కేంద్ర విజ్ఞప్తులపై సుప్రీం త్రిసభ్య ధర్మాసనం స్పందించింది. కేంద్ర అభ్యర్థనను పరిశీలిస్తామని తెలిపింది.

16:47 - May 10, 2016

బీహార్‌: షోహర్‌ జిల్లాలో మూడు అంతస్థుల భవనం ఉన్నట్టుండి కుప్పకూలింది. ఘటనలో పలువురు గాయపడి ఉంటారని భావిస్తున్నారు. భవనం కింది భాగం ధ్వంసమై పూర్తిగా భవనమంతా ఉన్నపళాన ఒకపక్కకు ఒరిగిపోయింది. దాంతో ఆ ప్రాంతమంతా దుమ్ము, ధూళితో నిండిపోయింది. భవనం కుప్పకూలిన దృశ్యం మొత్తం కెమెరా కంటికి చిక్కింది. నిటారుగా ఉన్న భవనం కొద్ది క్షణాల్లోనే నేలమట్టమవుతున్న దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. 

16:45 - May 10, 2016

హైదరాబాద్ : మే 15న ఎంసెట్‌ పరీక్ష యథావిధిగా జరుగుతుందని తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి తెలిపారు. మధ్యాహ్నం నిర్వహించే మెడిసిన్‌ పరీక్షకు అగ్రికల్చర్‌, వెటర్నరీ, హోంసైన్స్‌, ఫార్మసీ విద్యార్థులు కూడా హాజరవుతున్న నేపథ్యంలో ఆ పరీక్షను కూడా నిర్వహిస్తామని చెప్పారు. మెడికల్‌ విద్యార్థులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. 

నీట్..కొనసాగుతున్న సందిగ్ధత..

ఢిల్లీ : నీట్ పై సందిగ్ధత కొనసాగుతోంది. నీట్ నిర్వాహణపై మళ్లీ కేంద్రం సుప్రీంను ఆశ్రయించింది. ఈ ఏడాది ఇప్పటికే ఎంసెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించిన రాష్ట్రాలకు నీట్ నుండి మినహాయింపు కేంద్రం కోరింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశం కోసం నీట్ లో ప్రాంతీయ భాషలకు అవకాశం కల్పించాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. కేంద్ర విజ్ఞప్తులపై సుప్రీం త్రిసభ్య ధర్మాసనం స్పందించింది. కేంద్ర అభ్యర్థనను పరిశీలిస్తామని తెలిపింది. 

రూ.3064.75 కోట్లు అడిగాం - మంత్రి కడియం..

ఢిల్లీ : రాష్ట్రానికి కరవు సాయం కింద ప్రధాని మోడీని రూ. 3064.75 కోట్లు అడిగినట్లు డిప్యూటి సీఎం కడియం శ్రీహరి వెల్లడించారు. కరవు నివారణకు శాశ్వ చర్యలపై ప్రధానికి సలహాలివ్వడం జరిగిందని, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హెల్త్ కార్డ్ పథకాలను ప్రధాని మోడీ అభినందించారని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ పథకాలు అమలు చేయడంపై అధ్యయనం చేయాలని ఆదేశించారని తెలిపారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులలో ఒక్క ప్రాజెక్టైనా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కోరినట్లు తెలిపారు. రైతుల ఆత్మహత్యలకు అనేక కారణాలున్నాయని, వాటిని కరవుకు లింకు పెట్టవద్దని తెలిపారు.

సీఎం ఫడ్నవీస్ తో మంత్రి హరీష్ భేటీ..

ముంబై: మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌తో తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్‌రావు భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయమై ఆయన ఫడ్నవిస్‌తో చర్చించారు. కాగా, రెండు రాష్ర్టాల మధ్య ఉన్న ప్రాజెక్టుల అంశంపై చర్చించేందుకు హరీష్‌రావు మహారాష్ట్రకు వెళ్లిన విషయం తెలిసిందే. 

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 84 పాయింట్లు లాభ పడి 25,773 వద్ద ముగియగా నిఫ్టీ 22 పాయింట్లు లాభ పడి 7,888 వద్ద ముగిసింది. 

కరవు సహాయ నిధులు అందించాలని కోరా - కేసీఆర్..

ఢిల్లీ : తెలంగాణ రావాల్సిన కరవు సహాయక నిధులను అందచేయాలని తాను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యంమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ఢిల్లీకి వచ్చిన సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి మోడీతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో సాధారణం కన్నా 14 శాతం వర్షాలు తక్కువగా పడ్డాయని, దీనితో కరవు నెలకొందని వివరించినట్లు పేర్కొన్నారు. ప్రత్యేకంగా నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పరిస్థితి దారుణంగా ఉందని తెలిపినట్లు పేర్కొన్నారు. 

16:07 - May 10, 2016

ఏదో ఒక సంచలన వార్త ప్రచురించాలి..ప్రసారం చేయాలని వివిధ టివి ఛానళ్లు పోటీ పడుతుంటున్న సంగతి తెలిసిందే. ఆ వార్త కరెక్టా ? కాదా ? అనేది తెలుసుకోకుండానే ప్రసారం చేస్తూ ప్రజలను గందరగోళ పరిస్థితుల్లో పడేస్తుంటారు. పలు సందర్భాల్లో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. 
తాజాగా ఓ ఘటన ఇలాగే జరిగింది. ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ యాక్టర్ వేణు మాధవ్ చనిపోయాడంటూ సోమవారం ఓ ఛానెల్, సోషల్ మీడియా వెబ్ సైట్లు కథనాలు ప్రసారం చేశాయి. ఈ విషయం ఆ నోటా..ఈ నోట పాకింది. చివరకు వేణు మాధవ్ కు చేరింది. దీనిపై వేణు ఆగ్రహం వ్యక్తం చేశారంట. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడని వార్తలు వస్తున్నాయి. సదరు టివి ఛానెల్, మీడియా వెబ్ సైట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరినట్లు సమాచారం. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. 

16:03 - May 10, 2016

వరంగల్ : కాకతీయుల కళా ప్రాభవానికి ఆ కళాఖండ సజీవ సాక్ష్యం. కాకతీయ వీరుల ప్రరాక్రమానికి ప్రతీక. చరిత్రకారులు, పర్యాటకుల మదిలో చెరగని ముద్రవేసుకున్న అపురూప కట్టడం. ప్రాచీన శిల్పకళా నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనం. అటువంటి కట్టడం ఇప్పుడు నిర్లక్ష్యపు చీకట్లలో మగ్గిపోతోంది. ఆ కళాఖండానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు పదేళ్ల క్రితం ప్రారంభించిన పనులు సజావుగా ముందుకు పడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. నత్తనడక నడుస్తున్న వరంగల్‌ వేయి స్తంభాల గుడి అభివృద్ధి పనుల్లో జరుగుతున్న జాప్యంపై 10 టీవీ ప్రత్యేక కథనం.

ఆలయ ప్రాంగణంలో నెలకొన్న సౌకర్యాల కొరత...
వరంగల్‌లోని వేయి స్తంభాల గుడి. అద్భుత కట్టడం. ఇక్కడ ఉన్న శిల్పకాళా సంపదను చూసేందుకు నిత్యం వందలాది మంది పర్యాటకులు ఉత్సాహంగా వస్తుంటారు. కానీ ఈ గుడిలో విరిగిపడి ఉన్న స్తంభాలు, ఆలయ ప్రాంగణంలో నెలకొన్న సౌకర్యాల కొరతను చూసి నిరుత్సాహానికి లోనవుతున్నారు.

1400 మీటర్ల వైశాల్యంలో 250 శిలలు, శిల్పాలు.....
1163లో కాకతీయ రుద్రుడు నిర్మించిన ఈ ఆలయంలో రుద్రేశ్వరుడు, వాసుదేవుడు, సూర్యుడు కొలువుతీరడంతో ఇది త్రికూట ఆలయంగా పేరు పొందింది. 1400 మీటర్ల వైశ్యాలంలో 250 శిలలు, శిల్పాలతో చెక్కిన ఈ ఆలయం మహ్మదీయుల పాలనాకాలంలో తుగ్లక్‌ సేనల దండయాత్రతో పాక్షికంగా దెబ్బతింది. కల్యాణ మండపంలోని దక్షిణ ప్రవేశ ద్వారం కుంగిపోయింది. దీని పునర్నిర్మాణానికి ప్రభుత్వం ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేసినా.. పనులు మాత్రం సవ్యంగా సాగడంలేదన్న విమర్శలున్నాయి.

2005 జులై 13న కల్యాణ మండపం పునర్నిర్మాణం ప్రారంభం......
ఈ గుళ్లో పునరుద్ధరణ పనులు ప్రారంభించి దశాబ్ధ కాలం గడిచిపోయింది. కానీ ఇంతవరకు ఒక కొలిక్కిరాలేదు. కల్యాణ మండపం పునరుద్ధరణ పనుల పరిస్థితీ అంతే. పురావస్తు శాఖ అధికారుల నిర్లక్ష్యంతో పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. నిధుల కొరత కారణంగా పైకప్పు నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. కల్యాణ మండలం పునర్నిర్మాణ పనులు 2005 జులై 13న ప్రారంభమయ్యాయి. పాత కల్యాణ మండపం శిలలను ఒక్కొక్కటిగా తొలగించిన తర్వాత ఏళ్లతరబడి పనులు ముందుకు సాగలేదు. 2010 ఫిబ్రవరి 25న మళ్లీ మొదలు పెట్టారు. తమిళనాడుకు చెందిన 50 మంది శిల్పులు 132 కొత్త స్తంభాలు, 160 బీమ్‌లు చెక్కారు. శాండ్‌బాక్స్‌ టెక్నాలజీ ఆధారంగా పనులు చేపట్టారు. డంగుసున్న, గ్రాన్యువల్‌ ఫైల్స్‌తో కూడిన లేయర్‌ను నిర్మించారు. ఏడు వరుసల రాతి నిర్మాణంతో ప్రదక్షిణ పథకం నిర్మించారు. ఆపై రాతి గోడ నిర్మాణం పూర్తి చేశారు. భూకంపాలను సైతం తట్టుకుని నిలిచే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. శిలలను రాతి పట్టీలతో అమర్చారు. కిందా మీద పడుతూ 2015 ఆగస్టు నాటికి పైకప్పు మినహా, మిగిలిన పనులు పూర్తయ్యాయి. నిధుల కొరతతో మూడు నెలలుగా పైకప్పు పనులు నిలిచిపోయాయి. వేయి స్తంభాల దేవాలయానికి వచ్చిన సందర్శకుల్లో ఎవరూ కూడా సంతృప్తితో తిగిరి వెళ్లడంలేదు.

పునరుద్ధరణ పనుల కారణంగా...
పునరుద్ధరణ పనుల కారణంగా దేవాలయం చుట్టూ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో సందర్శకులు దూరం నుంచే చూడాల్సి వస్తోంది. ఇక్కడున్న అద్భుత శిల్పకళా సంపదనను దగ్గరుండి చూస్తే కలిగే అనుభూతి వేరు. వేయి స్తంభాల గుడిని దూరం నుంచి కాకుండా దగ్గర నుంచి చూసి తరించే మహద్భాగ్యం కలిగించాలని కోరుతున్నారు.

ఆగిపోయిన పునర్నిర్మాణ పునఃప్రారంభించాలని...
వరంగల్‌ వేయి స్తంభాల గుడికి పూర్వ వైభవం తీసుకురావడానికి ఆగిపోయిన పునర్నిర్మాణ పునఃప్రారంభించాలని సందర్శకులు, ప్రజలు కోరుతున్నారు. చారిత్రక, వారసత్వ సంపద కాలగర్భంలో కలిసిపోకుండా చూడాలని విన్నవిస్తున్నారు. ఇక్కడున్న అపురూ శిల్పకళా సంపంద శిథిలసమాధికాక ముందే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పాలకులు, అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. 

15:59 - May 10, 2016

హైదరాబాద్ : ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో బలపరీక్ష ముగిసింది. సుప్రీంకోర్టు పరిశీలకుడి ఆధ్వర్యంలో విశ్వాస ఓటింగ్‌ జరిగింది. వివరాలను సీల్డు కవర్‌లో సుప్రీంకోర్టుకు పంపారు. అత్యున్నత న్యాయస్థానం బుధవారం అధికారికంగా ఫలితాలు ప్రకటిస్తుంది. దీంతో నెలన్నర రోజులుగా నెలకొన్న ఉత్తరాఖండ్‌ రాజకీయ సంక్షోభానికి తెరపడుతుంది. ఈ బలపరీక్షలో ముఖ్యమంత్రి హరీష్‌ రావత్‌ నెగ్గారని కాంగ్రెస్‌ సభ్యులు ప్రకటించుకుంటున్నారు.

ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో 70 మంది సభ్యులు

ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో బలపరీక్షకు ముందు రాజకీయ సమీకరణలు చకచకా మారిపోయాయి. అసెంబ్లీలో మొత్తం 70 మంది సభ్యులుంటే... 9 మంది కాంగ్రెస్‌ రెబల్‌పై అనర్హతవేటు పడింది. దీంతో అసెంబ్లీలో జరిగిన బలపరీక్షకు 61 మంది సభ్యులు హాజరయ్యారు. కాంగ్రెస్‌కు 27 మంది సభ్యులుంటే.. బలపరీక్షకు ముందు రేఖా ఆర్య బీజేపీకి మద్దతు ప్రకటించారు. బీజేపీ 28 ఎమ్మెల్యేలు ఉండగా, బీమ్‌లాల్‌ ఆర్యను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. దీంతో ఆయన కాంగ్రెస్‌కు మద్దుతు ప్రకటించారు. అసెంబ్లీలోని ఇద్దరు బీఎస్‌పీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఇండిపెండెట్లు కూడా రావత్‌కు అనుకూలంగా నిలించారు.

రావత్‌కు అనుకూలంగా 33 ఓట్లు ...

ఉత్తరాఖండ్‌ క్రాంతి దళ్‌ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్‌కే అనుకూలంగా ఓటేస్తానని ప్రకటించారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్‌ బలం 33కు చేరినట్టు అయ్యింది. బలపరీక్షలో నెగ్గేందుకు మేజిక్‌ ఫిగర్‌ 31 ఓట్లు కాగా, రావత్‌కు అనుకూలంగా 33 ఓట్లు వచ్చాయని బలనిరూపణ తర్వాత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రకటించుకున్నారు. బలపరీక్ష తర్వాత సుప్రీంకోర్టుకు చేరిన ఫలితాను బుధవారం అధికారికంగా ప్రకటిస్తారు.

రెండు గంటలపాటు రాష్ట్రపతి పాలన సడలింపు...

బలపరీక్ష కోసం ఉత్తరాఖండ్‌లో రెండు గంటలపాటు రాష్ట్రపతి పాలనను సడలించారు. అసెంబ్లీ ఆవరణతోపాటు, పరిసరాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తంమీద కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చెబుతున్న విషయాలను పరిశీలిస్తే హరీశ్‌ రావత్‌ పంతం నెగ్గించుకున్నట్టు స్పష్టమవుతోంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించారన్న ఆరోపణలు ఎదుర్కొటున్న బీజేపీకి భంగపాటు ఎదురైనట్టు కనిపిస్తోంది. ఉత్తరాఖండ్‌ పర్యవసనాలు బీజేపీ నాయకత్వానికి కూడా చెంపపెట్టుగా భావిస్తున్నారు. 

తెలంగాణకు వర్ష సూచన..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో చిరుజల్లులు, అకస్మిక వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం పేర్కొంది. రాగల 48గంటల్లో అన్ని జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. 

15:58 - May 10, 2016

హైదరాబాద్ : జర్మనీలోని మ్యూనిచ్‌ రైల్వేస్టేషన్‌లో ఓ ఆగంతకుడు కత్తితో స్వైర విహారం చేశాడు. ఈ దాడిలో ఒకరు మరణించగా... మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దాడి అనంతరం ఆ వ్యక్తి 'అల్లా హు అక్బర్‌' అంటూ నినాదాలు చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ దాడి ఘటనను ఉగ్రవాద కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జగన్ మానసిక పరిస్థితి బాగా లేదన్న ఆనం..

నెల్లూరు : జగన్ మానసిక పరిస్థితి బాగా లేదని టిడిపి నేత ఆనం వివేకానందరెడ్డి వ్యాఖ్యానించారు. మరో పది మందికి పైగా వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతారని జోస్యం చెప్పారు. జగన్ ప్రవర్తన నచ్చకే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారని పేర్కొన్నారు. 

15:55 - May 10, 2016

హైదరాబాద్ :బీహార్‌లో వాహనాన్ని ఓవర్ టేక్ చేసినందుకు యువకుడిని కాల్చి చంపిన ఘటనలో ప్రధాన నిందితుడైన జేడీయూ ఎమ్మెల్సీ మనోరమా దేవి కుమారుడు రాకీ యాదవ్‌ను సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడి వద్ద నుంచి గన్తో పాటు ఎస్‌యువి వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. రాకీ నేరాన్ని అంగీకరించాడని పోలీసులు చెప్పారు. రాకీ యాదవ్‌ మాత్రం మీడియాతో మాట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశాడు. తాను ఎవరిని కాల్చలేదని, ఆ ఘటన జరిగినప్పుడు ఢిల్లీలో ఉన్నట్లు పేర్కొన్నాడు. తన తల్లి రమ్మనడంతోనే ఇక్కడికి వచ్చినట్లు తెలిపాడు. శనివారం నాడు 20 ఏళ్ల ఆదిత్య సచ్ దేవా గయ సమీపంలో రాకీ యాదవ్ వాహనాన్ని ఓవర్ టేక్ చేయడంతో ఆగ్రహించిన ఎమ్మెల్సీ కొడుకు తుపాకీతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. తమకు న్యాయం చేయాలని ఆదిత్య తండ్రి ముఖ్యమంత్రి నితీష్‌కు విజ్ఞప్తి చేశారు.

15:26 - May 10, 2016

హలో...మీ ఫ్యాన్ ను..ఆ సినిమాలో ఎంత బాగా నటించారండి.. మీ యాక్టింగ్ కు ఫిదా అయిపోయాం..అని చెబితే ఎలా ఉంటుందా ? ఆ యాక్టర్ కు సంతోషం అవధులు దాటుతుంది కదా ? కానీ ఆ ఫోన్ కాల్ తీసుకున్న వ్యక్తి మాత్రం చిరాకు పడ్డారంట. ఎందుకు ? అంటే ఇది చదవండి..
మరాఠీ హీరోయిన్ రింకూ రాజ్ గురూ విపరతమైన అభిమానుల ఫాలోయింగ్ ఉంది. ఇటీవలే 'సాయిరత్' సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. ఇంకేముంది అమ్ముడిగా ఒకటే ఫోన్లు వచ్చేశాయి. కానీ అభిమానులు చేసిన ఫోన్స్ కాల్స్ అన్నీ మహారాష్ట్ర పరిశ్రమల మంత్రి సుభాష్ దేశ్ కు వెళ్లాయి. ఫోన్లు..మేసేజ్ లతో సదరు మంత్రి విసిగిపోయారు. హీరోయిన్ కు ఫోన్ చేస్తే తనకు రావడం ఏంటీ ? అని ఆరా తీశారు. చివరకు సైబర్ క్రైం పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆ నటి వెబ్ సైట్లో ఈ మంత్రిగారి ఫోన్ నెంబర్ ఉందంట. ఇదంతా ఆ నటికి తెలియదని..ఎవరో హ్యాకర్స్ చేసి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అందండి అసలు విషయం. 

14:55 - May 10, 2016

ఆదిలాబాద్‌ : జిల్లాలో భైంసాలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్యకు గురయ్యారు. ఆస్తి తగాదాలే హత్యకు కారణమని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ముగ్గురుమహిళలు ఉన్నారు. స్క్రాప్ దుకాణంలో అన్నదుమ్ముల మధ్య గొడవ 5గురి హత్యకు దారితీశాయి. ఈ ఘటన ఈ రోజు ఉదయం11-12 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగా ఈ ఘటన జరిగింది. సంఘటనా స్థలంలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.

 

14:53 - May 10, 2016

మహబూబ్‌ నగర్‌ : వర్షాలు బీభత్సం సృష్టించాయి... గత పదేళ్లలో ఎన్నడూలేనివిధంగా ఈసారి వర్షాలు కురిశాయి... భారీగా చేరిన వరదనీటితో రోడ్లన్నీ జలమయమయ్యాయి...లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు.

లిఖితపూర్వక హామీనివ్వాలన్న కార్మికులు..

గుంటూరు : రూ. 20 లక్షల పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. కానీ లిఖిత పూర్వకమైన హామీనివ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. 

వెలగపూడిలో ఖాకీల అత్యుత్సాహం..

గుంటూరు : వెలగపూడి తాత్కాలిక సచివాలయం వద్ద పోలీసులు అత్యుత్సాహం చూపారు. సమావేశమైన కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. సీపీఎం నేతలు బాబురావు, రామారావులను అరెస్టు చేశారు.

 

 

14:49 - May 10, 2016

ఢిల్లీ : ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు.. రాష్ట్రంలో కరవు పరిస్థితులు, విభజన చట్టంలోని హామీలపై చర్చించారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ వివరాల్ని మోదీకి వివరించినట్లు తెలుస్తోంది.

14:48 - May 10, 2016

తుళ్లూరు : గుంటూరు జిల్లా వెలగపూడి తాత్కాలిక సచివాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి 20 లక్షలు పరిహారం ఇచ్చేందుకు ఎల్‌అండ్‌టీ సంస్థ,.. ప్రభుత్వం ఒప్పుకుంది. అయితే.. కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వడంతో పాటు.. భద్రత విషయంలో లిఖితపూర్వకమైన హామీ ఇవ్వాలంటూ కార్మికులు ఆందోళన చేపట్టారు. కార్మికుల ఆందోళనకు సీపీఎం నేతలు మద్దతిచ్చారు. మరోవైపు సమావేశమైన కార్మిక నేతలపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సీపీఎం నేతలు బాబురావుతో పాటు పలువురిని అరెస్ట్‌ చేశారు. దీంతో కార్మికులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 

14:45 - May 10, 2016

హైదరాబాద్ : క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ మధ్య కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ మహిళలు ఎక్కువగా బాధపడుతున్నారు. రీసెంట్ గా మెడికల్ కౌన్సిల్ వెల్లడించిన నివేదిక ప్రకారం సర్వేకల్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు 'వేదిక' లో ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో నిమ్స్ ఆంకాలజిస్టు డాక్టర్ మెహర్ లక్ష్మి, గాంధీ ఆసుపత్రి గైనకాలజిస్టు డాక్టర్ నర్మద పాల్గొన్నారు. వారు ఎలాంటి అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

సీఎం బాబుపై జగన్ విమర్శలు..

కాకినాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ అధ్యక్షుడు జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాకినాడలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్ని ప్రసంగించారు. అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చాక ప్రజలకు పంగనామాలు పెట్టారని తెలిపారు. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలకు బాబు తాకట్టు పెడుతున్నారని తెలిపారు. 

ఆదిలాబాద్ లో కుటుంబంలో ఐదుగురు హత్య..

ఆదిలాబాద్ : భైంసాలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్యకు గురయ్యారు. ఆస్తి తగాదాలే కారణమని తెలుస్తోంది. 

ప్రధాన మంత్రితో సీఎం కేసీఆర్ భేటీ..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. పునర్ విభజన హామీలు..రాష్ట్రానికి కరవు నిధులు..అధికారుల విభజన తదితర అంశాలపై ఆయన గంటపాటు చర్చించారు. 

ముంబైకి వెళ్లిన మంత్రి హరీష్..

హైదరాబాద్ : మంత్రి హరీష్‌రావు ముంబై బయలుదేరి వెళ్లారు. సాయంత్రం ఆయన మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రితో భేటీ కానున్నారు. తెలంగాణ రాష్ట్రం, మహారాష్ట్రల మధ్య ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల విషయమై చర్చించనున్నారు. 

ముగిసిన చెన్నమనేని అంత్యక్రియలు..

హైదరాబాద్ : స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ పోరాట ధీరుడు చెన్నమనేని రాజేశ్వర్‌రావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఫిల్మ్ నగర్‌లోని మహాప్రస్థానం స్మశాన వాటికలో అధికారికంగా ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. చెన్నమనేని కుమారుడు రమేష్ చితికి నిప్పంటించారు. ఈ సందర్భంగా పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి శ్రద్ధాంజలి ఘటించారు.

ప్రజాస్వామ్యం గెలిచింది - ఆజాద్..

న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌లో ప్రజాస్వామ్యం గెలిచిందని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఇది సాధ్యమైందన్నారు. కోర్టు తీర్పు వల్ల సభలో విశ్వాస పరీక్ష సాధ్యమైందని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌లో హరీష్‌రావత్ బలనిరూపణ పరీక్ష జరిగిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేందుకు బీజేపీ సర్కారు కుట్ర పన్నిందని వివరించారు. 

కాకినాడ కలెక్టరేట్ వద్ద వైసీపీ ధర్నా ...

తూ.గోదావరి : కాకినాడ కలెక్టరేట్ వద్ద వైసీపీ ధర్నా చేపట్టింది. ఈ కార్యాక్రమంలో ఆపార్టీ అధినేత జగన్ పాల్గొన్నారు. ఏపీ ప్రత్యేక హోదా ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు. 

కుటుంబ కలహాలతో ఇద్దరి దారుణ హత్య...

ఆదిలాబాద్ : జిల్లాలోని భైంసాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో ఇద్దరిని కిరాతకంగా హత్య చేశారు. తుక్కు దుకాణంలో ఉన్న ఇద్దరిపై కళ్లలో కారం చల్లి కత్తులతో దాడి చేశారు. దాడిని అడ్డుకోబోయిన మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వ్యక్తులు అటు నుంచి పరారీ అయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

దొంగల ముఠా అరెస్ట్ భారీగా సొత్తు స్వాధీనం...

హైదరాబాద్ : సైబరాబాద్ పీఎస్ పరిధిలో నలుగురు బృందంతో వున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రెండు కిలోల వెండి, 60 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఏపీ సీఎం కు మరోసారి లేఖ సంధించిన కాపునేత ముద్రగడ....

విజయవాడ : కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోమారు రంగంలోకి దిగారు. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు ఆయన కొద్దిసేపటి క్రితం మరో లేఖాస్త్రాన్ని సంధించారు. ఎన్నికల సందర్భంగా కాపులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేరలేదు కదా? అంటూ ఆ లేఖలో ఆయన నిరసన గళం వినిపించారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో లేఖను విడుదల చేసిన ముద్రగడ... తమకు ఇచ్చిన హామీలను ఇప్పటికైనా నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

13:22 - May 10, 2016

హైదరాబాద్ : స్నేక్ గ్యాంగ్ నిందితులపై రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు వెల్లడించింది. ఎనిమిది మంది నిందితులు దోషులుగా నిర్ధారించింది. ఒకరిని మాత్రం నిర్ధోషులుగా ప్రకటించింది. కానీ శిక్షలను మాత్రం రేపు ఖరారు చేయనుంది. 2014 జూలై 31వ తేదీన వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఫైజల్ దయానీ నేతృత్వంలో 8 మంది సభ్యుల గల ముఠా పహాడీషరీఫ్ పోలీసుస్టేషన్ పరిధిలో చేసిన అరాచకాలు ఒక్కసారిగా బయటపడడంతో అప్పట్లో పెద్ద కలకలం రేపింది. పహాడీషరీఫ్ ప్రాంతంలో షాహీన్ నగర్‌లోని ఓ ఫాం హౌస్‌లో కుటుంబం ఉండేది. కుటుంబ సభ్యులందరూ వెళ్లిపోగా పెళ్లి చేసుకోబోతున్న ఓ జంట సాయంత్రం వరకు అక్కడే ఉండిపోయింది. విషయం తెలుసుకున్న స్నేక్ గ్యాంగ్ అక్కడికి వెళ్లి వాచ్‌మన్‌పై దాడి చేసి జంట ఉన్న గదిలోకి వెళ్లారు. అక్కడ వికృతమైన చేష్టలతో ఆ యువతిపై విరుచుకుపడి గ్యాంగ్ రేప్‌నకు పాల్పడ్డారు. అంతేకాకుండా వీడియోలు తీసి తమ పైశాచికత్వాన్ని బయటపెట్టారు. ఈ జంట ఎంత ప్రాధేయపడినా గ్యాంగ్ వినిపించుకోకుండా యువతిపై అఘాత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత వారి నుంచి రూ.60 వేల నగదుతో పాటు బంగారు ఆభరణాలను దోచుకున్నారు. తమకు అవసరం ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వకపోతే ఈ వీడియోలను బయటపెడతామని బెదిరించారు. ఈ విషయంపై బాధితులు ఫిర్యాదు ఇవ్వడంతో సైబరాబాద్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రధాన సూత్రధారి ఫైజల్ దయానీతో పాటు 8 మంది మీద కేసును నమోదు చేశారు. దయానీ గ్యాంగ్ అడ్డాపై పోలీసులు దాడి చేసి నాలుగు గుర్రాలతో పాటు పలు పాములను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసులు కూడా నమోదైయ్యాయి. ఈ కేసుతో పాటు గ్యాంగ్ చేసిన మరిన్ని ఆకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం రేపు వీరికి కోర్టు ఎలాంటి శిక్ష ఖరారు చేయనుందోనన్న ఉత్కంఠ నెలకొంది. 

వెలగపూడిలో ముగిసిన కార్మికుడి మృతి వివాదం....

విజయవాడ : తాత్కాలిక రాజధాని నిర్మాణ ప్రాంతంలో కార్మికుడి మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాదవశాత్తు కాంక్రీటు మిక్సర్ లో పడి మృతి చెందిన కార్మికుడి కటుంబానికి రూ.25లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మిగిలిన కార్మికులు ఆందోళన చేట్టారు. ఈ క్రమంలో ఎల్ అండ్ టీ కార్యాలయం లోని ఫర్నీచర్రి ధ్వంసం చేశారు. మంత్రి నారాయణ స్పందించిన రూ. 5లక్షలు ప్రకటించినా శాంతించని కార్మికులు ఆందోళన కొనసాగించటంతో దిగిన వచ్చిన ప్రభుత్వం మృతుడి కుటుంబానికి రూ.25 లక్షలు ఇవ్వటానికి ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఆ ప్రాంతంలో వివాదం ముగిసింది.

స్నేక్ గ్యాంగ్ కేసు మరోసారి వాయిదా...

హైదరాబాద్ : దాదాపు 37 మంది యువతులపై దురాగతానికి పాల్పడి సంచలనం సృష్టించిన స్నేక్ గ్యాంగ్ కేసులో రంగారెడ్డి కోర్టు 8 మందిని దోషులుగా నిర్థారించింది. శిక్షను ఖరారు చేయటానికి కోర్టు విచారణను రేపటి వాయిదా వేసింది. మరో నిందితుడు ఏ 9 సలాం హందిని నిర్ధోషిగా కోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో కోర్టు వద్ద పోలీసు యంత్రాంగం భారీ గా మోహరించారు. స్నేక్ గ్యాంగ్ కేసులో మొత్తం 9మంది నిందితులుగా వున్న విషయం తెలిసిందే.  స్నేక్ గ్యాంగ్ సూత్రధారి అయిన ఫైజల్ దయానీని…. ఏ1 గా నమోదు చేశారు పోలీసులు.

వైసీపీ నేత పిటీషన్ ను తిరస్కరించిన సుప్రీంకోర్టు...

ఢిల్లీ : విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ పై భారీ వాహనాలను అనుమతింవద్దని వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ ను దేశ ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. హైకోర్టు ఆశ్రయించాలని పిటీషనర్ కు కోర్టు సూచించింది. కాగా రాజకీయ కారణాలతో పిటీషన్ వేసినట్లుందని కోర్టు అభిప్రాయపడింది.

మోదీతో కేసీఆర్ భేటీ...

ఢిల్లీ : ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులు, విభజన నేపథ్యం ప్రకటించిన హామీలు  వంటి పలు  అంశాలపై చర్చించనున్నారు.

12:50 - May 10, 2016

ఉత్తరాఖండ్ : రాష్ట్రంలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. రెండు గంటల పాటు రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. అనంతరం హరీష్ రావత్ బలపరీక్ష ఎదుర్కొంటున్నారు. ఈ బలపరీక్షలో ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ సభ్యులు బీజేపీకి..బీజేపీ సభ్యులు కాంగ్రెస్ కు ఓటు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ముగ్గురు ఇండిపెండెంట్లు రావత్ వైపు మొగ్గు చూపుతున్నారు. బలపరీక్ష సమయంలో బీజేపీకి మద్దతునిచ్చే వారందరూ ఒక వైపు..కాంగ్రెస్ కు మద్దతినిచ్చే వారందరూ మరోవైపు నిలబడాల్సి ఉంటుంది. మంగళవారం ఉదయం బీజేపీ నేతలతో ఎమ్మెల్యే రేఖా ఆర్యా కలిసి రావడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు షాక్ తిన్నారు. బలపరీక్ష వివరాలను సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్ లో సమర్పించాల్సి ఉంటుంది. క్రాంతి దళ్..పీడీఎఫ్..ఇతర స్వతంత్ర ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు సపోర్టు ఇస్తారా ? లేదా ? ఉత్కంఠ నెలకొంది. 

12:47 - May 10, 2016

గుంటూరు : వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణంలో పనిచేస్తున్న కార్మికుడి మృతిపై హోం మంత్రి చిన రాజప్ప స్పందించారు. మృతుడికి కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం అందచేస్తామని, మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని ప్రకటించారు. మంగళవారం ఉదయం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దేవేందర్ కాంక్రీట్ మిషన్ పై వేలాడుతూ కనిపించాడు. రహస్యంగా మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు యత్నించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కార్మికులు పోలీసులపైకి రాళ్లు రువ్వడమే కాకుండా ఎల్ అండ్ టి కార్యాలయంపై దాడి చేశారు. దీనితో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు తమ వారిని ఆపివేశారని టెన్ టివితో కార్మికులు తెలిపారు. మృతదేహాన్ని తీసుకెళుతామని వారికి చెప్పిన అనంతరం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కానీ అలా చేయలేదని పేర్కొన్నారు.
ఘటన జరిగిన వెంటనే సీపీఎం నేతలు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటన జరగడం చాలా దారుణమని, పనిచేస్తున్న కార్మికులకు భద్రత లేదన్నారు. ఇక్కడున్న వారికి రూ.295 వేతనం ఇస్తున్నారని, కనీస వేతనం ఇవ్వడం లేదన్నారు. మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి రూ. 25 లక్షలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. మొత్తం ఘటనకు కంపెనీలకు ఎంత బాధ్యతఉం దో అంతే పెద్ద బాధ్యత ప్రభుత్వానిదేనని సీఐటీయు నేత పేర్కొన్నారు. మేడే ఉత్సవాలు ఘనంగా జరపడం కాదని..కార్మికులను కూడా పట్టించుకోవాలని సూచించారు. ఈ ఘటనపై అధికారులు కూడా టెన్ టివితో మాట్లాడారు. 

రాజధాని నిర్మాణ ప్రాంతం వెలగపూడిలో వైద్యశాల ఏర్పాటు...

గుంటూరు : తాత్కాలిక రాజధాని వెలగపూడిలో తక్షణమే వైద్యశాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఉదయం ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు మృతి చెందిన నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కాసేపట్లో స్నేక్ గ్యాంగ్ కు శిక్ష ?.....

హైదరాబాద్ : నగరంలో సంచలనం సృష్టించిన స్నేక్ గ్యాంగ్ ను రంగారెడ్డి జిల్లా కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ముందస్తు జాగ్రత్త చర్యగా పోలీసులు భారీగా మోహరించారు. మరికొద్దిసేపట్లో స్నేక్ గ్యాంగ్ నిందుతులకు కోర్టు శిక్ష ఖరారు చేయనుంది.

స్నేక్ గ్యాంగ్ అకృత్యాలు ..

బల పరీక్షలో నెగ్గిన సీఎం హరీష్ రావత్...

హైదరాబాద్ : ఉత్తరాఖండ్ లో రాజకీయ బలపరీక్ష ముగిసింది. ఎట్టకేలకు సీఎం హరీష్ రావత్ బలపరీక్ష నెగ్గారు. బలపరీక్షల వివరాలను సీఎస్ సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్లో అందజేశారు. దీనికి సంబంధించిన ఫలితాలను ఉన్నత న్యాయస్థానం రేపు ప్రకటించనుంది. బలపరీక్ష నిర్వహించినందుకు సుప్రీంకోర్టుకు సీఎం హరీష్ రావత్ ధన్యవాదాలు తెలియజేశారు. ఓటింగ్ లో మొత్తం 62 మంది ఎమ్మెల్యేలు పాల్గొనగా.. కాంగ్రెస్ కు 33, బీజేపీకి22 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొన కూడదని దేశ ఉన్నత న్యాయస్థానం ఆదేశించిన కారణంగా హరీష్ రావత్ ఈ బలపరీక్షలో విజయం సాధించారు.

ఆందోళన బాటలో న్యాయవాదులు..

హైదరాబాద్ : న్యాయమూర్తులకు ఆప్షన్స్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నాంపల్లి, రంగారెడ్డి కోర్టుల వద్ద న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి ఆందోళన బాట పట్టారు.

ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం...

అనంతపురం : ఓడీసీ తహశీల్దార్ రత్నమయ్య ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. హిందూపురంలోని ఆయన నివాసంలో దాదాపు రూ.10కోట్ల అక్రమాస్తులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. రూ.30 లక్షల చెక్కులు, రూ.50 లక్షల ప్రామిసరీ నోట్లు,బెంగుళూరు, హిందూపురంలో రత్నమయ్యకు స్థిరాస్తులు వున్నట్లుగా అధికారులు గుర్తించారు. అవినీతి ఆరోపణలో గతంలో మూడు సంవత్సరాలపాటు రత్నమయ్య సస్పెండ్ అయిన విషయం గమనించాల్సిన విషయం. 

రాంగ్ రూట్ కు జేబు ఖాళీ....

హైదరాబాద్ : రాంగ్ రూటులో డ్రైవ్ చేస్తున్నారా..! వెయ్యి రూపాయలు ఫైన్ కట్టాల్సి వస్తుంది జాగ్రత్త. అంతేకాదు.. రాంగ్ రూటులో ప్రయాణించే వారిపై సెక్షన్ 184(డేంజరస్ డ్రైవింగ్) కింద కేసును నమోదు చేయనున్నారు. తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా రాంగ్ రూటు డ్రైవింగ్ చలాన్ రుసుం పెంచడంతో పాటు కేసులను నమోదు చేయనున్నట్లు సైబరాబాద్ ట్రాఫీక్ డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాలను దృష్టిలో పెట్టుకుని రాంగ్ రూట్ ప్రయాణాన్ని ఇక నుంచి నేరంగా పరిగణిస్తామని డీసీపీ వివరించారు. 

శ్రీవారి సేవలో ప్రముఖులు...

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి దంపతులు, సినీనటి నమిత స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ప్రముఖులకు తితిదే అధికారులు స్వాగతం పలికి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

వెలగపూడి కార్మికుడి కుటుంబాన్ని అదుకుంటాం : చినరాజప్ప

విజయవాడ : ఏపీ తాత్కాలిక రాజధాని నిర్మాణంలో ప్రమాదవశాత్తు ఓ కార్మికుడు మృతి చెందాడు. దీంతో ఆ కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ మిగిలిన కార్మికులు ఆందోళన చేపట్టారు. అ విషయంపై డిప్యూటీ ముఖ్యమంత్రి చినరాజప్ప స్పందించారు. కార్మికుడి మృతి విచారం వ్యక్తం చేశారు. అనంతరం కార్మికుడి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

11:37 - May 10, 2016

ప్రస్తుతం బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా నడుస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా త్వరలోనే మరో బయోపిక్‌ తెరకెక్కనుంది. నిజ జీవిత కథలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా సినిమాలను రూపొందించడంలో దర్శక, నిర్మాత సంజరు లీలా భన్సాలీ దిట్ట. ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన బయోపిక్‌ 'బాజీరావ్‌ మస్తానీ' చిత్రం విశేష ప్రేక్షకాదరణతో సంచలన విజయం సాధించడంతోపాటు జాతీయ అవార్డుల బరిలోనూ పలు అవార్డులను సొంతం చేసుకుని సత్తా చాటింది. విషాదాంత ప్రేమకథలను ఎంతో ఇష్టంగా తెరకెక్కించే భన్సాలీ తాజాగా అల్లాఉద్దీన్‌ ఖిల్జీ జీవితం ఆధారంగా ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఖిల్జీ వంశానికి చెందిన రెండో రాజు అల్లావుద్దీన్‌ 1296-1316 మధ్య ఢిల్లీని పాలించాడు.
ఈ సమయంలో మేవార్‌ రాణి పద్మిని (పద్మావతి)ని ప్రేమించారు. ఆ ప్రేమకథే ప్రస్తుతం భన్సాలీ చిత్రానికి కథా వస్తువైంది. ప్రకాష్‌ కపాడియా సంభాషణలు సమకూరు స్తున్న ఈచిత్రాన్ని 2017 డిసెంబర్‌ 15న విడుదల చేసేందుకు భన్సాలీ సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇందులో అల్లాఉద్దీన్‌ ఖిల్జీగా ఎవరు నటిస్తారనే విషయం కంటే పద్మినిగా నటించబోయే కథానాయిక మీదే అందరిలోనూ ఆసక్తి ఉంది. ఆ ఆసక్తికి అనుగుణంగా ప్రస్తుతం దీపికా పదుకొనె పేరు బలంగా వినిపిస్తోంది. కథ విని బాగా ఎగ్జైటైన దీపికా సైతం ఈ చిత్రంలో నటించేందుకు సుముఖంగా ఉన్నట్టు సమాచారం. దీపికా ఈ చిత్రంతోపాటు హాలీవుడ్‌లో 'త్రిఫుల్‌ఎక్స్' చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉంది.

11:35 - May 10, 2016

'ఈ రోజు నా జీవితంలో ఓ ప్రత్యేకమైన రోజు. దర్శకుడు తేజ దర్శకత్వంలో మళ్లీ నటించడం చాలా ఆనందంగా ఉంది. తొమ్మిదేండ్ల క్రితం ఎలా ఫీలయ్యానో..ఈ రోజు కూడా అలాగే ఫీలయ్యాను. ఒక్కమాటలో చెప్పాలంటే నా జీవితంలో ఒక ఫుల్‌ సర్కిల్‌ పూర్తయినట్లు భావిస్తున్నా' అనంటూ కాజల్‌ ట్వీట్‌ పెట్టి అభిమానులతో షేర్‌ చేసుకుంది. రానాకి జోడీగా తేజ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సందర్భంగా తొలిరోజు షూటింగ్‌లో కాజల్‌ పాల్గొంది. ఈ నేపథ్యంలో కాజల్‌ స్పందిస్తూ, 'దర్శకుడు తేజతో కలిసి పని చేస్తుంటే కెరీర్‌లో తొలి రోజులా అనిపిస్తోంది. 9 సంవత్సరాల తర్వాత కూడా ఆయన దర్శకత్వంలో నటిస్తుంటే తొలి రోజు కలిగిన అనుభూతే ఈ రోజూ కలిగింది' అని చెప్పింది. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన 'లక్ష్మీకళ్యాణం' చిత్రంతో కాజల్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విషయం విదితమే. కాజల్‌ ప్రస్తుతం ఈచిత్రంతోపాటు తెలుగులో మహేష్‌బాబుతో 'బ్రహ్మోత్సవం', తమిళంలో 'గరుడా', 'కవాలై వేండమ్‌', హిందీలో 'దో లఫ్జోమ్‌కీ కహానీ' చిత్రాల్లో నటిస్తోంది.

11:33 - May 10, 2016

'అవినీతి పరుడైన పోలీస్‌ ఆఫీసర్‌కు, నిజాయితీగల కానిస్టేబుల్‌కు మధ్య ఏం జరిగిందో తెలియాలంటే 'నాటుకోడి' చిత్రం చూడాల్సిందే'నని అంటున్నారు దర్శకుడు నాని కృష్ణ. శ్రీకాంత్‌, మనో చిత్ర జంటగా స్వీయ దర్శకత్వంలో బండారు బాబీతో కలిసి నాని కృష్ణ నిర్మిస్తున్న చిత్రం 'నాటుకోడి'. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ, 'ఇందులో కోటా శ్రీనివాసరావు కానిస్టేబుల్‌గా, అవినీతి పరుడైన పోలీస్‌ ఆఫీసర్‌గా శ్రీకాంత్‌ నటించారు. వీరిద్దరు తండ్రీకొడుకులు. ఇద్దరి మధ్య చోటు చేసుకునే ఆసక్తికర సన్నివేశాల సమాహారమే ఈ చిత్రం. కథ, కథనాలు ఆద్యంతం ఆకట్టు కుంటాయి. సంగీత దర్శకుడు యాజమాన్య వినసొంపైన సంగీతాన్ని అందిం చారు' అని అన్నారు. 'మాస్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. పాలకొల్లు పరిసరాల్లో సినిమాను తెరకెక్కించాం' అని నిర్మాత బాంగారు బాబీ తెలిపారు.

ఇన్ కమ్ ట్యాక్స్ కార్యాలయాన్ని ముట్టడించిన సీపీఐ...

అనంతపురం : ఏపీ కి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం స్పష్టం చేయటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలతో అట్టుడికిపోతోంది. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేని కోరుతూ సీపీఐ ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో ఇన్ కమ్ ట్యాక్స్ కార్యాలయాన్ని ముట్టడించి కార్యాలయంలోని ఫర్నీచర్ని కార్యకర్తలు ధ్వంసం చేశారు. దీంతో కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

11:30 - May 10, 2016

హైదరాబాద్ : ఎన్నిసార్లు ఏసీబీ అధికారులు దాడులు చేసినా లంచగొండి అధికారులు మారడం లేదు. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూనే లంచాలకు ఏగబడుతున్నారు. కోట్లకు కోట్లు గడిస్తున్నారు. లంచాలు తీసుకుంటున్న జీహెచ్ఎంసీ అధికారులను ఏసీబీ అధికారులు పట్టుకుంటున్నారు. తాజాగా కూకట్ పల్లి జీహెచ్ఎంసీ టాక్స్ ఇన్స్ పెక్టర్ విజయ్ కుమార్ ఇంటిపై తనిఖీలు నిర్వహించారు. పని చేసిన కాలంలో ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు గుర్తించారు. ఆరు బృందాలుగా విడిపోయిన అధికారులు మియాపూర్ లోని విజయ్ కుమార్ ఇంటిపై తెల్లవారుజామున దాడులు చేశారు. ఐదంతస్తుల ఈ భవనంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. పటన్ చెరు, యాదగిరి గుట్ట, సంగారెడ్డి జిల్లాల్లో స్థలాలు..పెద్దమొత్తంలో బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఐదు కోట్ల రూపాయల వరకు అక్రమార్జన ఉంటుందని తెలుస్తోంది. కొన్ని లాకర్స్ కూడా ఉన్నాయని సమాచారం. ఈ లాకర్స్ ఓపెన్ చేస్తే ఇంకా వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 

11:25 - May 10, 2016

గుంటూరు : ఏపీ తాత్కాలిక సచివాలయ నిర్మాణ ప్రాంగణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన కార్మికుడు మృతి చెందడంతో తోటి కార్మికులు ఆందోళన చేశారు. కార్మికుడి మృతదేహాన్ని రహస్యంగా తరలించడాన్ని వారు తట్టుకోలేకపోయారు. పోలీసులపైకి రాళ్లదాడి చేశారు. అంబులెన్స్ కు నిప్పు పెట్టారు. ఎల్ అండ్ టి కార్యాలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని తోటి కార్మికులు..ఇతరులు డిమాండ్ చేస్తున్నారు. మృతదేహాన్ని తరలిస్తున్న వాహనాన్ని కార్మికులు అడ్డుకున్నారు. అసలు కార్మికుడు మృతి ఎలా చెందాడో తెలియరాలేదు. 
వివరాల్లోకి వెళితే..వెలగపూడిలో ఏపీ తాత్కాలిక సచివాలయ నిర్మాణం చేపడుతున్న సంగతి తెలిసిందే. వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఈ నిర్మాణంలో పనులు చేస్తున్నారు. మంగళవారం ఉదయం ఉదయం ఐదు గంటలకు కాంక్రీట్ మిక్సర్ పై ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ధర్మతేజ కార్మికుడు వేలుడుతూ కనిపించాడు. తమ తోటి కార్మికుడు మృతి చెందాడని..కిందకు తీయాలని ఇతర కార్మికులు కోరినా అధికారులు స్పందించలేదు. పోలీసులు వచ్చేదాక తీయవద్దని ఎల్ అండ్ టి అధికారులు స్పష్టం చేయడంతో తోటి కార్మికులు అక్కడనే వేచి ఉన్నారు. అనంతరం 9గంటలటకు వచ్చిన పోలీసులు మృతదేహాన్ని కిందకు తీసి రహస్యంగా తరలించే ప్రయత్నం చేశారు. తమ ప్రాంతానికి చెందిన వ్యక్తి చనిపోతే రహస్యంగా తరలించే ప్రయత్నం చేస్తారా ? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. అక్కడనే ఉన్న ఎల్ అండ్ టి కార్యాలయంపై దాడి చేశారు. సుమారు నాలుగు వందల మంది కార్మికులు ఆందోళన చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శవాన్ని ఎందుకు రహస్యంగా ఎందుకు తరలించే ప్రయత్నం చేశారని ప్రశ్నించారు. ప్రస్తుతం నాలుగు బ్లాక్ లకు చెందిన పనులు నిలిచిపోయాయి. దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

బలపరీక్షకు సిద్ధమైన సీఎం రావత్...

హైదరాబాద్ : రసవత్తరంగా సాగుతున్న ఉత్తరాఖండ్ రాజకీయాలకు ఇకపై తెర పడనుంది. సీఎం రావత్ బలపరీక్షకు సిద్ధపడ్డారు. బలపరీక్ష నెగ్గేందుకు కావాల్సిన సంఖ్య 32 కాగా వాటిలో బీజేపీ-28, కాంగ్రెస్ 27, పీడీఎఫ్ -6 గా వున్నారు. మరి కాసేపట్లో అసెంబ్లీలో బలపరీక్ష జరుగనుంది. ఉత్తరాఖండ్ లో గత కొన్ని రోజులుగా రాజకీయ సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ సంబంధించిన 9 మంది రెబల్ అభ్యర్థులు బీజేపీకి మద్ధతిచ్చారు. దీంతో వారిని స్పీకర్ అన్హలుగా ప్రకటిస్తూ సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అక్కడ మార్చి 27 నుండి రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది.

11:17 - May 10, 2016

హైదరాబాద్ : టీడీపీ  తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణ శాఖ‌కు శ‌రాఘాతంలా ప‌రిణ‌మిస్తున్నాయి. తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణం విష‌యంలో ఎపి ప్రభుత్వం వ్యవ‌హ‌రిస్తున్న తీరు టీటీడీపి నేత‌లకు ఇబ్బందిక‌రంగా మారుతున్నాయి. నిబంధన‌ల‌కు లోబ‌డే ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంద‌ని చెప్పుకొస్తున్నప్పటికీ ఆ సున్నిత‌మైన అంశాన్ని ఎలా డీల్‌ చేయాలో అంతుబట్టక ప్రజలకు వాస్తవ పరిస్థితులు వివరించలేక తెలంగాణ తమ్ముళ్లు వర్రీ అవుతున్నట్లు సమాచారం. టీడీపీ తరపున గెలిచి ఆనక ముగ్గురు తప్ప ఎమ్మెల్యేలంతా టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోవడంతో తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి ఘోరంగా తయారైంది. కనీసం ఉన్న కేడర్‌నైనా పరిరక్షించుకుంటూ పార్టీని బతికించుకోవాలనుకుంటున్న టీటీడీపీ నేతలకు అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు మరింత సమస్యాత్మకంగా మారుతున్నాయి.

కార్యకర్తల్లో మనోస్థైర్యం నింపే యత్నం....

క‌రవు ప‌ర్యట‌న‌లు, రైతు స‌మ‌స్యల పేరుతో తెలంగాణ వ్యాప్తంగా ప‌ర్యట‌న‌లు నిర్వహిస్తూ ఉనికిని కాపాడుకునేందుకు తెలంగాణ టిడిపి నేతలు నానా తిప్పలు పడుతున్నారు. స‌ర్వ స‌భ్య స‌మావేశం నిర్వహించుకుని పార్టీ శ్రేణుల్లో భ‌రోసా కల్పించే ప్రయ‌త్నాలు కూడా చేస్తున్నారు. 2019 ఎన్నిక‌ల్లో నిర్ణయాత్మక శ‌క్తిగా టీడిపి అవ‌త‌రిస్తుంద‌ని కార్యకర్తల్లో మ‌నోస్థైర్యాన్ని నింపే యత్నం చేస్తున్నారు. అయితే అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు వారికి ఇబ్బందికరంగా మారుతున్నాయి..

అధిష్టానానికి చెప్పుకోలేక టీడీపీ నేతల పాట్లు....

తెలంగాణ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం విష‌యంలో ఏపి ప్రభుత్వ స్పంద‌న‌ను టిఆర్ఎస్ సర్కార్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అన్ని అనుమ‌తుల‌తోనే నిర్మాణాలు చేప‌డుతున్నా ఏపి ప్రభుత్వం కావాల‌నే మోకాలు అడ్డుతోందని తెలంగాణ నేత‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో గులాబీ నేతల దృష్టి టిటిడిపి నేతలపై పడుతోంది. తెలంగాణ ప్రయోజనాలను గండికొట్టేలా ఏపీలోని టిడిపి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే టీటీడిపి నేత‌లు ఎందుకు నోరు మెద‌ప‌డంలేద‌ని టీఆర్ఎస్ నేతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ శ్రేయ‌స్సును కాంక్షించే నేత‌లే అయితే చంద్రబాబును ఎందుకు ఒప్పించ‌డంలేద‌ని నిల‌దీస్తున్నారు. ఇలా అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్న టిటిడిపి నేతలు అటు అధిష్టానానికి చెప్పలేక సతమతమవుతున్నారు. ఒకపక్క ఇతరత్రా టీడీపీ నేతలు కూడా టిఆర్ఎస్‌లో జ అవుతున్నారు. మరోపక్క గులాబీ పార్టీ విసురుతున్న ప్రశ్నలకు బదులివ్వలేక తెలంగాణ తెలుగు తమ్ముళ్లు వర్రీ అవుతున్నారు. ఇలాంటి సమయంలో తమకెదురవుతున్న సున్నితమైన సమస్యలను ప్రధాన నేతలు ఎలా డీల్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారుతోంది.

11:14 - May 10, 2016

ఉత్తరాఖండ్ : రాష్ట్ర రాజకీయ సంక్షోభానికి కొద్దిసేపట్లో తెరపడనుంది. హరీష్ రావత్ బలపరీక్షకు సిద్ధమయ్యారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ బలపరీక్ష జరగనుంది. హరీష్ రావత్ తో సహా ఇతర ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకు చేరుకున్నారు. ఆరుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కీలకంగా మారారు. వీరు ఎవరికి మద్దతినిస్తే వారు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు మద్దతినిస్తే ఆ బలం 33కు చేరుతుంది. తాను సునాయసంగా పరీక్ష నెగ్గుతానని హరీష్ రావత్ పేర్కొంటున్నారు.

మొత్తం 70 మంది ఎమ్మెల్యేలు...
ఉత్తరాఖండ్‌ శాసనసభలో మొత్తం 70 మంది ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్‌కు 27 మంది, బీజేపీకి 28 మంది ఎమ్మెల్యేలున్నారు. 9 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడంతో 61 మంది బలపరీక్షలో ఓటు వేయనున్నారు. తనకు 33 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని సీఎం రావత్‌ చెప్పు కుంటున్నారు. ఇదిలా ఉండగా ఉత్తరాఖండ్‌ అసెంబ్లీని రద్దు చేసి, తాజాగా ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి బహుగుణ డిమాండ్‌ చేశారు. ఉత్తరాఖండ్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడిందనే సాకుతో కేంద్రం మార్చి 27న రాష్ట్రపతి పాలన విధించింది. అయితే, రాష్ట్రపతి పాలనను రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. సుప్రీం కోర్టు ఈ తీర్పును వ్యతిరేకించింది. దీంతో, రాష్ట్రపతి పాలనను ఆ రాష్ట్రంలో తిరిగి పునరుద్ధరించారు. బీజేపీకి అసెంబ్లీలో మెజారిటీ లేకున్నా, కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలదోసి దొడ్డిదారిన అక్కడ తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశం కేంద్రానికి ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఈ లక్ష్యం కోసమే కాంగ్రెస్‌కు చెందిన 9 మంది ఎమ్మెల్యేలకు గాలం వేసి, బీజేపీ తన వైపునకు తిప్పు కుందనే ఆరోపణలున్నాయి. అయితే, స్పీకర్‌ కుంజ్వాల్‌ మాత్రం పార్టీ ఫిరాయింపు చట్టం కింద తిరుగు బాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. దీంతో, బీజేపీ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసినట్లయింది.

11:13 - May 10, 2016

ఎం.ఎస్‌.రాజు.. తెలుగునాట భారీ చిత్రాల నిర్మాతగా పేరొందారు. ఆయన నిర్మించిన ఎన్నో చిత్రాలు ఘనవిజయాలు సాధించాయి. నిర్మాతగా 'సంక్రాంతి'రాజుగా గుర్తింపు పొందిన ఆయన ప్రస్తుతం దర్శకుడిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ పరిశ్రమలో తన ఉనికిని కాపాడుకుంటున్న ఎం.ఎస్‌.రాజు. పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి ప్రత్యేక కథనం..
1990లో వచ్చిన 'శత్రువు' చిత్రంతో నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ఎం.ఎస్‌.రాజు. సుమంత్‌ ఆర్ట్ ప్రొడక్షన్‌ స్థాపించి ఈ చిత్రాన్ని నిర్మించారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వెంకటేష్‌, విజయశాంతి జంటగా రూపొందిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది. తొలి చిత్రమే భారీ విజయం సాధించడంతో నిర్మాతగా వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. ఆ తర్వాత కె.వి.రాజు దర్శకత్వంలో 'పోలీస్‌ లాకప్‌' చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు. ఈ సినిమా కూడా ఫర్వాలేదనిపించుకుంది. ఆయన రూపొందించిన 'స్ట్రీట్‌ ఫైటర్‌' చిత్రం ఆశించిన ఫలితానివ్వలేదు.

సినిమాలకు దూరం..
నిరాశతో ఐదేండ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఎం.ఎస్‌రాజు పని అయిపోయిందనుకున్న టైమ్‌లో 'దేవి' వంటి ప్రయోగాత్మక చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమయ్యారు. తొలి విజయాన్ని అందించిన కోడిరామకృష్ణ దర్శకత్వంలోనే 'దేవి' వంటి డివోషనల్‌ చిత్రాన్ని తెరకెక్కించి నిర్మాతగా సత్తా చాటారు. 1999లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంతో తెలుగులో మొదటిసారి గ్రాఫిక్స్ ను పరిచయం చేశారు. గ్రాఫిక్స్ పరంగా ఈ చిత్రం ఒక ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. అంతేకాదు బెస్ట్ స్క్రీన్‌ప్లే చిత్రంగా నిలిచింది. సౌందర్య, రమ్యకృష్ణ ఇందులో నటించి ఆకట్టుకున్నారు. ఈ చిత్రంతోనే సంగీత దర్శకుడికి సంగీత దర్శకుడు ప్రసాద్‌ 'దేవి' తన ఇంటిపేరుగా మార్చుకుని దేవిశ్రీ ప్రసాద్‌ అయ్యారు. ఈ చిత్రం తెలుగులోనే కాదు తమిళ్‌, హిందీలోనూ భారీ విజయం సాధించింది. ఈచిత్రంతో ఎం.ఎస్‌.రాజు ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. ఆ తర్వాత 'దేవిపుత్రుడు'. స్పెషల్‌ ఎఫెక్ట్స్‌తో ఆర్కియాలజీ నేపథ్యంలో రూపొందించిన ఈ ప్రయోగాత్మక చిత్రం విమర్శకుల ప్రశంసలందుకున్నప్పటికీ కమర్షియల్‌గా సక్సెస్‌ కాలేకపోయింది. దీంతో మరోసారి ఎం.ఎస్‌.రాజుకి కోలుకోలేని దెబ్బ తగిలింది. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో, అనుకున్నది సాధించాలన్న లక్ష్యంతో 'మనసంతా నువ్వే' చిత్రాన్ని రూపొందించారు. తెలుగులో సక్సెస్‌ సాధించిన ఈ చిత్రం ఇటు తనకు, అటు హీరో ఉదయ్ కిరణ్‌కు మంచి బ్రేక్‌నిచ్చింది. ఉదరు కిరణ్‌తో చేసిన 'నీ స్నేహం' కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో నిర్మాతగా నిలదొక్కుకున్నారు.

పలువురి హీరోలకు బ్రేక్...
ఈ క్రమంలో మహేష్‌తో 'ఒక్కడు', ప్రభాస్‌తో 'వర్షం', 'సిద్ధార్థ్‌తో 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రాలను నిర్మించి వరుస పరాజయాలతో ఉన్న మహేష్‌కు, ప్రభాస్‌, సిద్ధార్థ లకు బ్రేక్‌నిచ్చారు. దీంతో 'సంక్రాంతి'రాజుగా పరిశ్రమలో పేరొందారు. ఈ క్రమంలో ప్రభాస్‌తో చేసిన 'పౌర్ణమి', సిద్ధార్థ్ తో చేసిన 'ఆట' వంటి చిత్రాలు ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో మళ్ళీ ఎం.ఎస్‌.రాజుకు ఇబ్బందులు మొదలయ్యాయి. భిన్న కథాంశాలతో రూపొందినప్పటికీ ఆశించిన ఫలితాన్ని రాబట్టలేక నిరాశపరిచాయి. దర్శకుడిగా మారి రూపొందించిన 'వాన' చిత్రం సైతం ఆయనకు నిరాశనే మిగిల్చింది. రామ్‌ హీరోగా, బి.గోపాల్‌ దర్శకత్వంలో వచ్చిన 'మస్కా' కూడా నిర్మాతగా ఎం.ఎస్‌.రాజుని గట్టెక్కించలేకపోయింది. తన కొడుకును సుమంత్‌ అశ్విన్‌ను హీరోగా పరిచయం చేస్తూ దర్శకత్వం వహించిన 'తూనీగ తూనీగ' ఫర్వాలేదనిపించుకుంది. 'ఆకాశంలో చుక్కల్ని చూస్తూ కూర్చోవడమే నాకు తెలుసు. అంతే తప్ప ఆ చుక్కల కిందకొచ్చి నన్ను కూడా తీసుకెళ్ళి వాటి సరసన కూర్చోబెట్టాలని మాత్రం కోరుకోను. అది నా నైజాం కాదు' అని తన కెరీర్‌ను విశ్లేషిస్తూ ఎం.ఎస్‌.రాజు పలు సందర్భాల్లో చెప్పారు.

తుమ్మలపై ఎందుకు చర్యలు తీసుకోరు? : సీపీఎం అభ్యర్తి పోతినేని

ఖమ్మం : పాలేరు నిజయోజక వర్గంలో ఉప ఎన్నికలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారం సీపీఎం పార్టీ దూసుకుపోతోంది. ఈ క్రమంలో సీపీఎం అభ్యర్థి  పోతినేని సుదర్శన్ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో నిబంధనలు అతిక్రమిస్తూ వాహనాలు ఎక్కువ సంఖ్యలో వాడుతున్నారని ఆ వాహనాలను సీజ్ చేస్తామని ఎన్నికల పరిశీలకు వెంకటేశ్వర్రావు పేర్కొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల తమకన్నా ఎక్కువ వాహనాలను ఉపయోగిస్తున్నారని మరి వారిపై ఎందుకు చర్యలు తీసుకోవాటంలేదని పరిశీలకుడి పోతినేని ప్రశ్నించారు.

10:47 - May 10, 2016

చింతచిగురు రుచికే కాదు ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. చింతచిగురులో యాంటీసెప్టిక్‌ గుణాలు అధికంగా ఉంటాయి. ఇది యాస్ట్రింజెంట్‌ మాదిరి పని చేసి, మన శరీరంలోని వ్యర్థాలను బయటకు తొలగిస్తుంది. అన్ని వయసుల వారూ దీన్ని తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు.
చింత చిగురుతో కూర, పచ్చడి ఇతరత్రా వాటితో కలిపి పదార్థాల్ని చేసుకోవచ్చు. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. వీటిలోని ఆమ్లాలు రక్తంలోని మలినాలను తక్షణమే తొలగిస్తాయి.
చిన్నారుల కడుపులో నులిపురుగులు ఉంటే ఎంతగానో బాధిస్తాయి. అలాంటి వారికి తరచూ చింత చిగురుతో చేసిన కూరలూ, పచ్చళ్లూ తినిపిస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుంది. అలానే కళ్లు దురదగా అనిపించినా ఈ చిగురు తింటే సమస్య తగ్గుముఖం పడుతుంది.
చింతపండులో కంటే చిగురులో విటమిన్‌ 'సి' శాతం అధికంగా ఉంటుంది. చింత చిగురులోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థాలను దూరం చేస్తాయి. చింత చిగురు రెగ్యులర్‌గా తీసుకుంటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అందుకే పలు అనారోగ్య సమస్యలతో బాధపడేవారి చింతను చిగురు ఇట్టే తీర్చేస్తుంది.

ఎన్ హెచ్ పై రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి....

ఆదిలాబాద్ : జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం మృతదేహాలను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతులను మహారాష్ట్ర కిన్వట్ట వాసి గణపతి, సీగొండ వాసి సోలంకిగా పోలీసులు గుర్తించారు.

10:45 - May 10, 2016

అందమైన అమ్మాయి మోముపై.. ఓ చిన్ని మొటిమ ముత్యంలా మెరిసిపోతుంది. అదే ముఖమంతా వ్యాపిస్తే.. మచ్చలు, యాక్ని (తొలిదశలో ఉండే మొటిమలు, వైట్‌, బ్లాక్‌ హెడ్స్‌ కలిపి)తో నిండి పోతే అమ్మో.. కౌమారంలో అడుగు పెడుతున్న అమ్మాయిలకు ఇదో పెద్ద కలవరపాటు ఆ మాటకొస్తే 80 శాతం పెద్దవారిలోనూ ఇటువంటి సమస్యలున్నాయని నిపుణులు అంటున్నారు.
యుక్త వయసులో మొదలైన ఈ సమస్య మూడు పదుల వరకు ఉంటుందట. విద్యార్థినులు, ఉద్యోగినుల్లో కొన్నిసార్లు మానసిక ఒత్తిడి కారణంగా ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాలేయం, మూత్రపిండాలపై అధిక భారం పడటం, ఆహారంలో లోపం, హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా వస్తుంటాయని చెబుతున్నారు. ఏవో పైపై పూతలు.. చికిత్సలు మొటిమలు, యాక్నేలని అరికట్టలేవు. చక్కని ఆహారపు అలవాట్లతో పాటు ఒత్తిడి నిరోధించే మార్గాలు, చికిత్సలు తోడవ్వాలి. అప్పుడే మేని నిగారింపు సాధ్యమని ఈ అధ్యయనంలో తేలింది.

ఇలా చేస్తే మొటిమలు మాయం...
మంచి నీరు సమృద్ధిగా తాగడం వల్ల చర్మంలోని వ్యర్థాలు బయటకుపోతాయి. రోజులో ఎనిమిది గ్లాసుల నీరు తాగితే యాక్ని నివారణలో మనం తొలి అడుగు వేసినట్టే. చర్మంపై పేరుకున్న వ్యర్థాలు తొలగిపోవాలంటే ఆహారంలో విటమిన్‌ ఎ ఎక్కువగా తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్స్, బి కాంప్లెక్స్ ఒత్తిళ్లు తగ్గించి మెరిసే మేనుని మీ సొంతం చేస్తుంది. తాజా కాయగూరలు, పండ్లలో ఇవి పుష్కలంగా ఉంటాయి.
ముఖ్యంగా యాపిల్‌, బొప్పాయి, అనాస, సలాడ్లు, ముదురాకు పచ్చని ఆకుకూరల్లో తగినంత పీచు పదార్థం కూడా ఉంటుంది. విటమిన్‌ సి, ఇ లకు చర్మాన్ని శుభ్రపరిచి కొత్త కాంతి, నిగారింపుని ఇచ్చే శక్తి ఉంటుంది. తాజా కాయగూరలు, తృణధాన్యాలు, గింజలని తీసుకొనే వారికి ఈ విటమిన్లు అందుతాయి. అలాగే జింక్‌ అధికంగా ఉండే పుట్టగొడుగులు, గింజలు కూడా మేలు చేస్తాయి.

10:43 - May 10, 2016

ప్రతి రోజు ఉదయాన్నే బ్రేక్‌ ఫాస్ట్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఉదయం పూట తినే ఆహారమే రోజంతా మనలో ఉత్తేజాన్ని నింపుతుంది. కనుక తప్పనిసరిగా బ్రేక్‌ ఫాస్ట్ తీసుకోవాలి. అయితే ఉదయం పూట కేకులు తినడం సరికాదు. చక్కెర, వెన్నతో చేసినవి పొద్దున్నే తినడం వల్ల శరీరంలోకి ఎక్కువ కెలోరీలు చేరతాయి. వేయించిన బంగాళాదుంపల్నీ అల్పాహారంలో తీసుకుంటే అరుగుదల అంతగా ఉండదు. పొట్టకి ఇబ్బందిని కలిగిస్తుంది. ముఖ్యంగా ప్రయాణ సమయాల్లో ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, బంగాళాదుంపలతో చేసిన స్నాక్స్‌కి దూరంగా ఉండటం ఉత్తమం.
త్వరగా తయారవుతాయని నూడుల్స్‌ను చాలా మంది తీసుకుంటారు. వాటిల్లో సొడియం అధికంగా ఉంటుంది. ఇలాంటి మసాలా కలగలిసిన వాటిని తీసుకుంటే ఎండలో వెళ్ళినప్పుడు వికారంగా ఉంటుంది. వీలైనంత వరకు తేలిగ్గా జీర్ణమయ్యే అల్పాహారం తీసుకోవడం మంచిది. కొందరు రాత్రి మిగిలిన చికెన్‌ వంటకాలను మర్నాడు వేడి చేసి తింటారు. ఇలా చేస్తే హాని చేసే ట్రాన్స్ ఫ్యాట్లు శరీరంలోకి చేరిపోతాయి.
కొందరు పండ్ల రసాలను తయారుచేసి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తుంటారు. కానీ ఎప్పటికప్పుడు చేసిన వాటికే ప్రాధాన్యమివ్వాలి. ముందురోజు చేసిన వాటిని మర్నాడు ఉదయం తాగడం వల్ల పొట్టలో బ్యాక్టీరియా చేరుతుంది. పోషకాలు సరిగా అందవు.
ఇక ఉదయం పూట గుడ్డు తినడం మంచిదే. అయితే నూనెలో ఫ్రై చేయకుండా ఆరగించవచ్చు. మధ్యాహ్నం, రాత్రి పూట అలా తీసుకోవడం బాగానే ఉంటుంది. ఉదయం తీసుకోవడం వల్ల అధిక శాతం కొలెస్ట్రాల్‌ శరీరానికి చేరుతుంది. అందుకే ఉడికించిన గుడ్డు తీసుకొంటే చాలు.

ఏసీబీ వలలో జీహెచ్‌ఎంసీ అధికారి ...

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ట్యాక్స్‌ ఇన్స్‌పెక్టర్‌ విజయ్‌కుమార్‌ నివాసాల్లో ఏసీబీ దాడులు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న సమాచారం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో విజయ్‌కుమార్‌కు సుమారు రూ.కోటిన్నర అక్రమాస్తులు ఏసీబీ గుర్తించింది. విజయ్‌కుమార్‌ బ్యాంకు లాకర్లలో నగదు, బంగారు ఆభరణాలు ఇంకా గుర్తించాల్సి ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు.

వెలగపూడి సచివాలయ నిర్మాణప్రాంగణంలో ఉద్రికత్త...

గుంటూరు : ఏపీ  తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనుల్లో ఉద్రిక్తత  చోటు చేసుకుంది. భవన నిర్మాణ పనుల్లో పాల్గొంటున్న ఓ కార్మికుడు కాంక్రీట్‌ కలిపే యంత్రంలో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ కార్మికులు కార్మికులు అందోళన చేపట్టారు. కార్మికుడి మృతదేహాన్ని తరలిస్తున్న అంబులెన్స్ కు నిప్పు పెట్టారు. దీంతో ఆ ప్రదేశంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రముఖ కంపెనీ ఎల్ అండ్ టీ సంస్థ ఈ నిర్మాణ పనులను చేపట్టిన విషయం తెలిసిందే. కోపోద్రిక్తులైన కార్మికులు ఎల్ అండ్ టీ కార్యాలయంలోని ఫర్నీచర్ ను ధ్వంసం చేసినట్లు సమాచారం.

టెన్త్ ఉత్తీర్ణతలో కడప విద్యార్ధుల హవా....

విశాఖపట్నం :  బాంబులు బ్రద్దలయ్యే కడపలో ఈసారి టెన్త్ క్లాస్ ఉత్తీర్ణతలో విద్యార్థులు ర్యాంకుల బాంబులు బాంబులు పేల్చారు. ఏపీ టెన్త్ క్లాస్ ఫలితాలలో కడప జిల్లా ఉత్తీర్ణతలో మొదటిస్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ లో టెన్త్ క్లాస్ ఫలితాలు విడదల అయ్యాయి. మంత్రి గంటా శ్రీనివాస రావు ఈ ఫలితాలను విడదలు చేశారు. మొత్తంగా ఉత్తీర్ణత శాతం 94.54 శాతం ఉండగా బాలికలు 94.52 శాతం ఉత్తీర్ణత సాధించగా బాలురు 94.30 శాతంగా ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలలో కడప జిల్లా ప్రథమ స్థానం సాధించింది. ఉత్తీర్ణతలో మొదటి స్థానం కడప జిల్లా (98.89) సాధించగా చివరి స్థానంలో చిత్తూరు జిల్లా (90.11)గా నిలిచాయి.

ఏపీలో టెన్త్ ఫలితాలు విడదల...

విశాఖ: ఆంధ్రప్రదేశ్ లో టెన్త్ క్లాస్ ఫలితాలు విడదల అయ్యాయి. మంత్రి గంటా శ్రీనివాస రావు ఈ ఫలితాలను విడదలు చేశారు. మొత్తంగా ఉత్తీర్ణత శాతం 94.54 శాతం ఉండగా బాలికలు 94.52 శాతం ఉత్తీర్ణత సాధించగా బాలురు 94.30 శాతంగా ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి గంటా ప్రకటించారు. 

10:16 - May 10, 2016

విశాఖపట్టణం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం ఉదయం మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఫలితాలను విడుదల చేశారు. అనంతరం మీడియాతో మంత్రి గంటా ఫలితాల వివరాలను తెలియచేశారు. రికార్డు టైంలో ఫలితాలను విడుదల చేయడం జరిగిందని తెలిపారు. పరీక్ష జరిగిన తరువాత 20వ తేదీన ఫలితాలను విడుదల చేయాలని భావించామని, కానీ అందరి కృషితో తొందరగానే ఫలితాలను విడుదల చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర మొత్తం మీద 94.52 శాతం ఉత్తీర్ణత నమోదైందన్నారు. 98.89 శాతంతో కడప జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా 90.11 శాతంతో చిత్తూరు జిల్లా చివరిస్థానంలో నిలిచిందన్నారు. 

  • 6,17,030 మంది విద్యార్థులు హాజరు కాగా వీరిలో 5,83,266 మంది ఉత్తీర్ణత.
  • బాలురు 3,16,961 మంది పరీక్ష రాస్తే 94.33 శాతం ఉత్తీర్ణతతో 2,98,884 మంది ఉత్తీర్ణత.
  • బాలికలు 3,00,065 మంది హాజరు కాగా 2,44,388 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణతశాతం 94.77 శాతంగా ఉంది. 
  • 4217 పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి.
  • జూన్ 16వ తేదీ నుండి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్ష జరగనుంది.
  • ప్రభుత్వ పాఠశాలలో 90.31 శాతం ఉత్తీర్ణత సాధించాయి.
  • గత ఏడాదితో పోలిస్తే మూడు శాతం పెరుగుదల.
10:07 - May 10, 2016

ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పాలేరుకు తరలివెళ్లింది. ఉప ఎన్నికలను ఎదుర్కొనేందుకు ప్రత్యేక వ్యూహాలను అమలు చేసే గులాబి బాస్ పాలేరు పైనా ప్రత్యేక దృష్టి పెట్టారు. పార్టీకి చెందిన మెజార్టీ నేతలు ఖమ్మంలోనే మకాం వేసి అధినేత ఆదేశాలను అమలు చేసే బాధ్యతల్లో బిజీ అయ్యారు.

పాలేరు గెలుపుపై టీఆర్ఎస్ పక్కా వ్యూహం...

ఖమ్మం జిల్లాలో ఇటీవల గులాబి పార్టీ నిర్వహించిన ప్లీనరీ సమావేశంతోనే ఎన్నికల వాతావరణంలోకి కార్యకర్తలను దించిన అధికార పార్టీ అదే దూకుడు కొనసాగిస్తోంది. ఖమ్మం జిల్లా కేంద్రాన్ని అధికార పార్టీ గులాబిమయంగా మార్చేందుకు పక్కా ప్లాన్ తో ముందుకు వెళుతోంది. పట్టణానికి అతి సమీపంలో ఉండే పాలేరులో గులాబి జెండా ఎగురవేసేందుకు ప్రణాళికలను రచిస్తోంది.

కేటీఆర్ కు పార్టీ ఇంచార్జ్ బాధ్యతలను అప్పగించిన అధినేత....

పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో.. ఎమ్మెల్సీగా ఉంటూ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న.. తుమ్మల నాగేశ్వర్ రావు ఎన్నికల రంగంలోకి దిగక తప్పలేదు. మరో కీలక మంత్రి కేటీఆర్ కు పార్టీ ఇంచార్జ్ బాధ్యతలను అప్పగించారు అధినేత కేసీఆర్ . అసలే అధికార పార్టీ కావడం.. అన్ని రాజకీయ పార్టీల నేతలు గులాబి పార్టీ వైపే చూస్తుండడంతో పాలేరు ఎన్నికలను గులాబి బాస్ కూడా సీరియస్‌గానే తీసుకుంటూ.. పార్టీ నేతలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.

పాలేరులో గులాబి నేతల ముమ్మర ప్రచారం....

పాలేరు ఉప ఎన్నికల్లో మామూలు విజయం కంటే భారీ విజయం దక్కించుకోవాలన్న లక్ష్యంతో పార్టీ నేతలను పాలేరులో గులాబి బాస్ మోహరించారు. గులాబి పార్టీ తరపున మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రముఖ నేతల్లో సగానికి పైగా పాలేరులోనే మకాం వేశారు. గులాబి నేతలంతా పాలేరులో ముమ్మర ప్రచారం నిర్వహిస్తుండడంతో.. బరిలో ఉన్న మంత్రి తుమ్మల కూడా రిలాక్స్ గా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సాధారణ ఎన్నికల్లో జిల్లాలో ఒకే స్థానాన్ని దక్కించుకున్న గులాబి పార్టీ ఉప ఎన్నిక ద్వారా వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. 

వైసీపీ నేత విజయసాయి రెడ్డి కారు బోల్తా.....

హైదరాబాద్ : రాజేంద్ర నగర్ వద్ద ఓ ఆర్ ఆర్ వద్ద కారు బోల్తా పడింది. ఈ ఘటనలో వైసీపీ నేతలు విజయవసాయిరెడ్డి తో పాటు మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని వెంటనే అపోలో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద జరుగనున్న ఆందోళన కార్యక్రమానికి హాజరవటానికి ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

09:04 - May 10, 2016

ప్రకాశం : జిల్లాలో శాంతి భద్రతలను కాపాడేందుకు చట్టం తన పని తాను చేసుకుపోతుందని జిల్లా ఎస్పీ త్రివిక్రమవర్మ అన్నారు. జిల్లా నూతన ఎస్పీగా త్రివిక్రమ వర్మ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో పోలీసు సిబ్బంది కొరత ఉందని జిల్లాలో ఉన్న వనరులను ఉపయోగించుకొని ప్రజలకు మెరుగైన సేవలందిస్తానని వెల్లడించారు. శాంతిభద్రతలను కాపాడే విషయంలో బాధ్యతగా వ్యవహరిస్తానని ఆయన అన్నారు.

08:57 - May 10, 2016

తూ,గోదావరి : ప్రత్యేక హోదా అంశంపై వైసీపీ దూకుడు పెంచుతోంది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల వైఖ‌రికి నిరసనగా నేడు అన్ని కలెక్టరేట్ల ఎదుట ధ‌ర్నాలు నిర్వహించనుంది. కాకినాడ క‌లెక్టరేట్ వ‌ద్ద జరిగే ధ‌ర్నాలో పార్టీ అధినేత జ‌గ‌న్ పాల్గొంటారు.

ప్రత్యేక హోదాపై వైసీపీ దీక్ష....

ప్రత్యేక హోదా అంశాన్ని అనుకూల అస్ర్తంగా మ‌లుచుకునే ప్రయ‌త్నం చేస్తోంది ప్రతిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికే... ప్రత్యేక హోదా కోసం గుంటూరులో దీక్షతో పాటు కాకినాడ‌, విశాఖ‌, తిరుప‌తి ప‌ట్టణాల్లో జగన్‌ యువ‌భేరీలు నిర్వహించారు. స్పెష‌ల్ స్టేట‌స్ వ‌స్తే రాష్ట్రానికి చేకూరే ప్రయోజ‌నాల గురించి ప్రజ‌లతో పాటు యువ‌తకు వివ‌రించే ప్రయత్నం చేస్తున్నారాయ‌న‌.. ఇక తాజాగా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదంటూ.. కేంద్ర మంత్రులు చేసిన ప్రకటనతో.. చంద్రబాబు సర్కారును ప్రజాక్షేత్రంలో నిలదీయాలని వైసీపీ నిర్ణయించింది.

హోదాపై ఉమ్మడి ఉద్యమానికి టీడీపీ ముందుకు రావాలి-వైసీపీ

ప్రత్యేకద్యమానికి టీడీపీ ముందుకు రావాలి-వైసీపీ హోదాపై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల‌ వైఖరికి నిర‌స‌న‌గా అన్ని క‌లెక్టరేట్ల ముందు ధ‌ర్నాలు చేయ‌నున్నారు వైసీపీ నేత‌లు. కాకినాడ క‌లెక్టరేట్ వ‌ద్ద జ‌రిగే ధ‌ర్నాలో జ‌గ‌న్ పాల్గొంటున్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు స‌ర్కార్ ను నిల‌దీస్తూనే.... మ‌రోవైపు ప్రత్యేక కార్యచ‌ర‌ణ‌తో ముందుకెళ్లాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నట్లు స‌మాచారం. ఇందులో భాగంగా... కేంద్రంపై పోరాటానికి తమతో కలిసి రావాలంటూ.. పాలక పక్షాన్నే ఆహ్వానించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ ఫిరాయింపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న వైసీపీకీ.. ప్రత్యేక హోదాపై కేంద్రం చేసిన ప్రక‌ట‌న‌ బాగా కలిసొచ్చింది. ఇక దీనిపై టీడీపీని ఇర‌కాటంలో పెట్టేందుకు చురుగ్గా పావులు కదుపుతోంది.

సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ రైల్లో దోపిడి..

వరంగల్‌ :  గుండ్రాతిమడుగు రైల్వే స్టేషన్‌ దగ్గర సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ రైల్లో దోపిడి జరిగింది. మహబూబాబాద్‌-డోర్నకల్‌ స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి పాట్నా వెళ్తున్న సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కిన 10 మంది దోపిడీ దొంగలు గుండ్రాతిమడుగు దగ్గర చైన్‌లాగి రైలును ఆపారు. ఎస్ -2, ఎస్ -11 బోగీల్లో ప్రయాణికులను బెదిరించి బంగారం, నగదు దోచుకున్నారు. ఈ ఘటనపై ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

08:52 - May 10, 2016

వరంగల్‌  :  గుండ్రాతిమడుగు రైల్వే స్టేషన్‌ దగ్గర సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ రైల్లో దోపిడి జరిగింది. మహబూబాబాద్‌-డోర్నకల్‌ స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి పాట్నా వెళ్తున్న సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కిన 10 మంది దోపిడీ దొంగలు గుండ్రాతిమడుగు దగ్గర చైన్‌లాగి రైలును ఆపారు. S-2, S-11 బోగీల్లో ప్రయాణికులను బెదిరించి బంగారం, నగదు దోచుకున్నారు. ఈ ఘటనపై ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

08:44 - May 10, 2016

హైదరాబాద్  : ఎన్నికల తేదీ సమీపిస్తున్నకొద్ది తమిళ రాజకీయాలు ఉత్కంఠ భరితంగా మారుతున్నాయి. ఈసారి ఏ గాలీ వీయకపోవడం, ఓటర్ల నాడి పసిగట్టడం రాజకీయ పండితులకే కష్టంగా మారుతోంది. ఎప్పుడూ ద్రవిడ పార్టీల హవా నడిచే తమిళనాడు గడ్డపై ఈసారి జాతీయ పార్టీల నేతలు సైతం ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు.

అంతుచిక్కని తమిళనాడు రాజకీయం...

తమిళనాడు ఓటర్లు ఆగ్రహించినా, అనుగ్రహించినా తట్టుకోవడం కష్టం. అనుకూల పవనాలో, ప్రతికూల పవనాలో వీయడం తమిళనాడు రాజకీయాల ప్రత్యేకత. అయితే ఈసారి తమిళనాడులో ఏవిధమైన పవనాలూ వీయడం లేదు. 1984 నుంచి జయలలిత, కరుణానిధిని చెరోసారి గెలిపిస్తూ వచ్చిన తమిళ ఓటర్ల మనోగతం ఈసారి ఎవరికీ అంతుచిక్కడం లేదు. జయలలిత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 1984 నుంచి ఇప్పటి దాకా ఏడుసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇది ఎనిమిదో యుద్ధం. నాలుగుసార్లు జయలలిత విజయం సాధిస్తే, మూడుసార్లు కరుణానిధి విజేతగా నిలిచారు. 1984, 1991, 2001, 2011 ఎన్నికల్లో జయలలిత అపూర్వ విజయాలు సాధిస్తే, 1989, 96, 2006 ఎన్నికల్లో కరుణానిధి అధికారంలోకి వచ్చారు. సంప్రదాయం ప్రకారం 2016 కరుణానిధికి అనుకూలంగా మొగ్గాలి. కానీ, అలాంటి వాతావరణం స్పష్టంగా కనిపించడం లేదు. ఆగ్రహమైనా, అనుగ్రహమైనా కడుపులో దాచుకోవడం తెలియని తమిళ ఓటర్లు ఈసారి చాలాగుంభనంగా వ్యవహరిస్తున్నారు. పోటాపోటీగా ఫ్రీ ఆఫర్లు గుప్పిస్తున్న జయలలిత, కరుణానిధి లోలోపల తెగ టెన్షన్ పడుతున్నారు. గత 32 ఏళ్లుగా జయలలిత, కరుణానిధి మధ్య యుద్ధంలా సాగిన తమిళ సంగ్రామం ఈసారి ముక్కోణపు పోటీతో రసవత్తరంగా మారింది. కెప్టెన్ విజయకాంత్ , వైగో, వామపక్షాలతో కూడిన పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ తమిళనాడులో తన ముద్ర వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ కి ప్రధాన ఆకర్షణ శక్తిగా మారిన విజయ్ కాంత్ కింగ్ గా అవతరిస్తారా? కింగ్ మేకర్ గా మిగిలిపోతారా? అంచనాలను అందుకోలేక చతికిలపడతారా? అన్న ప్రశ్నలకు రాజకీయ పండితులెవరూ ఠక్కున సమాధానం చెప్పలేకపోతున్నారు. మరోవైపు తమిళనాడులో తన ప్రాబల్యం పెంచుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న బిజెపి ఎవరి ఓట్లు ఎంత చీలుస్తుందో చెప్పలేం. అయితే, 2014 లోక్ సభ ఎన్నికల నాటి ఉత్సాహం కమలదళంలో కనిపించడం లేదు. బిజెపి తరపున ప్రధాని నరేంద్రమోడీ, ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ప్రచారం సాగించారు. డిఎంకెతో పొదు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ తరపున సోనియా, రాహుల్ గాంధీ ప్రచారం సాగించారు. బిఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ప్రచారాన్ని హీటెక్కించారు. పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ లో భాగస్వాములైన కామ్రేడ్స్ కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సిపిఎం అగ్రనేతలు సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్ ఇప్పటికే పలు సభలకు కార్యకర్తలను హుషారెక్కించారు. ఎవరికీ అనుకూల పవనాలు కనిపించని తమిళనాడులో ఈసారి ధన ప్రవాహమూ ఎక్కువగానే కనిపిస్తోంది. ఇప్పటికే దాదాపు 60 కోట్ల రూపాయలకు పైగా నగదు పట్టుబట్టింది. 

08:34 - May 10, 2016

హైదరాబాద్ : ఉత్తరాఖండ్‌లో పార్టీ ఫిరాయించిన 9 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హైకోర్టు వారిపై అనర్హత వేటు వేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో మంగళవారం ఉత్తరాఖండ్ అసెంబ్లీలో జరగనున్న బలపరీక్షలో వీరు ఓటు వేసే అవకాశాన్ని కోల్పోయారు. అంతకుముందు హరీశ్‌రావత్ పై తిరుగుబాటు చేసిన రెబల్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ అనర్హులుగా ప్రకటించడాన్ని హైకోర్టు సమర్థించింది. తొమ్మిది మంది రెబల్ ఎమ్మెల్యేలు బలపరీక్షకు అనర్హులంటూ ఆ కోర్టు తీర్పు నిచ్చింది. దీనిపై రెబెల్స్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మంగళవారం జరిగే విశ్వాస పరీక్షలో తమకు ఓటు వేసే అవకాశం కల్పించాలన్న రెబెల్స్‌ అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు- హైకోర్టు తీర్పును సమర్థించింది. తదుపరి విచారణను జూలై 12కు వాయిదా వేసింది.

ఉత్తరాఖండ్‌లో ఉ.11 నుంచి మ. ఒంటిగంట వరకు బలపరీక్ష....

ఉత్తరాఖండ్‌ శాసనసభలో మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు బలపరీక్ష జరగనుంది. విశ్వాసపరీక్షను పారదర్శకంగా నిర్వహించాలని సుప్రీంకోర్టు గత తీర్పులో ఆదేశించింది. ఓటింగ్ సరళిపై అసెంబ్లీలో వీడియో తీయాలని కూడా స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్ శాసనసభలో మొత్తం 70 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ కు 27 మంది, బీజేపీకి 28 మంది, బిఎస్పీకి ముగ్గురు, మరో ముగ్గురు ఇండిపెండెంట్లున్నారు. 9 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడంతో 61 మంది బలపరీక్షలో ఓటు వేయనున్నారు.

విశ్వాస పరీక్ష నేపథ్యంలో ఎమ్మెల్యేలకు బీజేపీ ముడుపులు...

విశ్వాస పరీక్ష నేపథ్యంలో ఎమ్మెల్యేలకు ముడుపులిస్తున్నారని బిజెపి, తమను బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్నారని కాంగ్రెస్‌ పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్‌కు ఊరటనిచ్చింది. తనకు 33 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని హరీష్‌రావత్ ధీమాగా చెబుతున్నారు. రేపు జరగనున్న బలపరీక్షలో రావత్ గట్టెక్కుతారా...లేదా..అన్నది వేచి చూడాలి.

08:18 - May 10, 2016

హైదరాబాద్ : ఆప్కో పేరవినగానే చేనేత వస్త్రాలు ఒక్కసారిగా కళ్లల్లో మెదులుతాయి. కొన్ని దశాబ్ధాలుగా తెలుగు ప్రజలకు అత్యంత సుపరిచితమైన పేరు ఆప్కో. చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలను మార్కెటింగ్ చేయడం, చేనేత కార్మికులకు ఆర్డర్లివ్వడం, వారు తయారుచేసిన వస్త్రాలను దేశ విదేశాల్లో విక్రయించడం, వారి ఉపాధికి ఊతమివ్వడం దీని లక్ష్యాలు. తెలంగాణలో దాదాపు మూడు లక్షల మంది జీవితాలు ఆప్కోతో ముడిపడి వున్నాయి. ప్రభుత్వ విభాగాలు ఆప్కో చేనేత వస్త్రాలను కొనుగోలు చేస్తున్న సంప్రదాయం వుంది. సర్వ శిక్షా అభియాన్ పథకం కింద స్కూల్ స్టూడెంట్స్ కి యూనిఫారాలను ఆప్కోనే సరఫరా చేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు 172 కోట్ల రూపాయల విలువైన బెడ్ షీట్లు, తువాళ్లు, కార్పెట్లు, షూటింగ్స్, షర్టింగ్స్ కొనుగోలు చేస్తుండేవి. స్కూల్ విద్యార్థుల యూనిఫారాలకు సాధారణంగా డిసెంబర్, జనవరి నెలల్లోనే ఆర్డర్లిస్తుంటారు. వేసవి సెలవులు ముగిసి, పాఠశాలలు పున: ప్రారంభమయ్యే లోగా చేనేత కార్మికులు ఆయా వస్త్రాలను అందుబాటులో వుంచుతారు. అయితే, ఈ ఏడాది ఇంత వరకు ఆప్కోకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్లివ్వలేదు. వ్యక్తిగత టెండర్లు ఓపెన్ టెండర్ల విధానానికి శ్రీకారం చుట్టింది. స్కూళ్ల రీ ఓపెన్ కి ఇక నెల రోజుల సమయమే వుంది. ఈ ముప్పై రోజుల్లో స్కూల్ యూనిఫారాలు తయారుచేసివ్వడం అంత ఈజీ కాదు. ప్రభుత్వ నూతన విధానం వల్ల చేనేత కార్మికుల ఉపాధి దెబ్బతినే ప్రమాదం వుంది.

పలు జిల్లాలో వలసలు పోతున్న చేనేత కార్మికులు....

ఇప్పటికే మహబూబ్ నగర్, మెదక్ , వరంగల్, నల్లగొండ జిల్లాల్లోని చేనేత కార్మికులు ఉపాధి దొరక్క సూరత్, ముంబై లాంటి ప్రాంతాలకు వలసపోతున్నారు. తెలంగాణలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచి, వీరందరినీ వెనక్కి రప్పిస్తామంటూ ముఖ్యమంత్రి కెసిఆర్ అనేకసార్లు హామీలిచ్చారు. కానీ, ఆచరణ మరో రకంగా వుంది. ఇంతకాలమూ ఆప్కోకి ఇస్తున్న ఆర్డర్లు ఇవ్వకపోవడం చేనేతరంగానికి ఎలా మేలు చేస్తుందో ప్రభుత్వమే చెప్పాలి.

08:08 - May 10, 2016

హైదరాబాద్ : తెలంగాణలో చేనేత కార్మికులు మరోసారి ఆందోళనబాట పట్టారు. నిన్నటి నుంచి హైదరాబాద్ లోని ఆప్కో ప్రధాన కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్నారు. అక్కడ నిన్న ప్రారంభమైన వంటా వార్పు కార్యక్రమం ఇవాళ కూడా కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు చేనేత రంగానికి ఆయువు పట్టులాంటి ఆప్కోకి కొత్త కష్టాలు తెస్తున్నాయనది చేనేత కార్మికుల ఆవేదన. హైదరాబాద్ లో చేనేత కార్మికుల వంటా వార్పు కార్యక్రమానికి కారణం ఏమిటి? తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులతో వ్యవహరిస్తున్న తీరు ఎలా వుంది? చేనేత రంగం సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు తెలంగాణ చేనేత అఖిలపక్ష ఐక్య వేదిక కన్వీనర్ కూరపాటి రమేష్ గారు చర్చలో పాల్గొన్నారు. మరి ఈ చర్చలో చేనేత కార్మికుల గురించి ఎటువంటి అంశాలను చర్చించారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి సమగ్ర సమాచారం తెలుసుకోండి.

 

07:52 - May 10, 2016

ఢిల్లీ : వైద్య విద్యలో ప్రవేశానికి నీట్‌ పరీక్షను సుప్రీంకోర్టు తప్పనిసరి చేసింది. దేశ వ్యాప్తంగా ఒకే పరీక్షను నిర్వహించాలని స్పష్టం చేసింది. రాష్ట్రాలు ప్రత్యేకంగా ప్రవేశపరీక్షలు నిర్వహించుకోవడం కుదరదని తేల్చి చెప్పింది. ఈ కేసు విషయంలో దాఖలయ్యే పిటీషన్లను విచారణకు స్వీకరించబోమని స్పష్టం చేసింది.

రాష్ట్రాలు, ప్రైవేటు విద్యా సంస్థల హక్కులపై ప్రభావం చూపదు : సుప్రీంకోర్టు

ఎట్టకేలకు వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ నిర్వహణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2016 ఏప్రిల్ 11న ఇచ్చిన తీర్పులో మార్పులు చేయాలంటూ దాఖలైన రిట్ పిటిషన్లను జస్టిస్ అనిల్ ఆర్.దవే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కొట్టివేసింది. నీట్ నిర్వహణ నియమావళి రాష్ట్రాలు, ప్రైవేటు విద్యా సంస్థల హక్కులపై ప్రభావం చూపడం లేదని కోర్టు స్పష్టం చేసింది. రిజర్వేషన్లు, మైనార్టీల హక్కులకు నీట్ వల్ల ఎటువంటి నష్టం జరగదని కోర్టు అభిప్రాయపడింది.

ఎంబీబీఎస్, బీడీఎస్ లో ప్రవేశాలకు నీట్ పరీక్షే మార్గం-సుప్రీంకోర్టు

నీట్ 1కి హాజరైన విద్యార్థులు నీట్ 2కి సైతం హాజరు కావొచ్చని ఆ విద్యార్థులు నీట్ 1 పరీక్షను వదులుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. సీబీఎస్ఈ నీట్ పరీక్షను పగడ్భందీగా నిర్వహించాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎం.లోధా పర్యవేక్షణలో పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. అవసరమైతే నీట్ 2 పరీక్ష నిర్వహణ తేదీని మార్చుకోవచ్చని కోర్టు సూచించింది. ఎంబీబీఎస్, బీడీఎస్ లో ప్రవేశాలకోసం నీట్ పరీక్ష మాత్రమే మార్గమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఏప్రిల్ 11న ఇచ్చిన తీర్పులో మార్పులుచేయాలంటూ దాఖలైన రిట్ పిటీషన్లను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ప్రాంతీయ భాషల్లోనూ ప్రశ్నాపత్రం ఉండాలన్న రాష్ట్రాల విజ్ఞప్తులను అత్యున్నత న్యాయస్థానం పరిగణలోకి తీసుకోలేదు. ఈ కేసు విషయంలో దాఖలయ్యే పిటిషన్లను విచారణకు స్వీకరించబోమని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.

07:45 - May 10, 2016

ఢిల్లీ సీఎం కేసీఆర్ బిజీ బిజీ...

రెండు రోజుల హస్తిన పర్యటన కోసం సిఎం కేసిఆర్ ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులను ప్రధాని దృష్టికి తీసుకెళతారు. బుధవారం సాయంత్రం కేసీఆర్‌ తిరిగి హైదరాబాద్‌ వస్తారు.

కరువు పరస్థితులపై చర్చ....

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన బిజీబిజీగా సాగనుంది. మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగే సీఎంల సదస్సులో కేసీఆర్ పాల్గొంటారు. కరవు పై జరిగే ఈ సమావేశానికి 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నెలకొన్న కరవు పరిస్థితులు, సహాయక చర్యలను ఈ సమావేశంలో చర్చిస్తారు.

మిగిలిన నిధులను మంజూరు చేయాలని కోరనున్న సీఎం...

తెలంగాణలో కరవు పరిస్థితులను కేసీఆర్‌ ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. కరవు నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న స్వల్ప, దీర్ఘ కాలిక చర్యలను వివరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 3090 కోట్ల కరవు సాయం కోరగా, కేంద్రం రూ. 800 కోట్లు మాత్రమే మంజూరు చేసి చేతులు దులుపుకుంది. తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో ఈ సహాయం ఏ మాత్రం సరిపోదని రాష్ట ప్రభుత్వం భావిస్తోంది. మిగిలిన 2290 కోట్ల రూపాయలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి పలుమార్లు లేఖలు రాసింది. ఇదే విషయాన్ని కేసీఆర్‌..మరోసారి ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. ప్రధాని దృష్టికి హరిత హారం, మిషన్ కాకతీయ,మిషన్ భగీరథ కార్యక్రమాలు

పలువురు కేంద్రమంత్రులను కలవనున్న సీఎం...

జల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను సీఎం ప్రధానికి వివరించనున్నారు. వాటర్ హార్వెస్టింగ్, ఇంకుడు గుంతల ఏర్పాటు, వ్యవసాయానికి డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్లతో నీటి వృథాను అరికట్టడం వంటి చర్యలను ప్రధానికి వివరించనున్నారు. హరిత హారం, మిషన్ కాకతీయ,మిషన్ భగీరథ కార్యక్రమాలను కేసీఆర్‌ మోడీ దృష్టికి తీసుకెళతారు. పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కేసీఆర్‌ కలిసే అవకాశం ఉంది. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్న సీఎం బుధవారం సాయంత్రం హైద్రాబాద్ చేరుకుంటారు. 

Don't Miss