Activities calendar

12 May 2016

21:22 - May 12, 2016

అనంతపురం : హిందూపురంలో భారీ వర్షం కురిసింది. గంటసేపు ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో మురుగునీరు కూడా రహదారిపై నిలిచిపోయింది. దీంతో పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

21:19 - May 12, 2016

హైదరాబాద్ : ఆరోగ్య శ్రీ సిబ్బంది వేతనాలను పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిబ్బంది వేతనాల పెంపునకు మంత్రి లక్ష్మారెడ్డి ఆమోదం తెలిపారు. పెరిగిన వేతనాలు ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి అమలులోకి రానున్నాయి. ఆరోగ్య మిత్రలకు నెలకు రూ. 12 వేల వేతనం , ఆఫీస్ అసోసియేట్, డీటీఎల్, ఎన్ టీఎల్ కు నెలకు రూ.15 వేల వేతనం, జిల్లా మేనేజర్లకు 28 వేల 9 వందల 40 రూపాయలు వేతనం పెరిగినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. 

21:18 - May 12, 2016

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా ఉండేందుకు కేంద్రంలోని బీజేపి కుట్రలు పన్నుతోందని కాంగ్రెస్‌ సీనియర్ నేత దిగ్విజయ్‌ సింగ్ అన్నారు. రాజ్యసభలో కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చ జరపాల్సొస్తుందని బీజేపీ... లోక్‌సభను వాయిదా వేసిందని ఆరోపించారు. రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లవుతున్నా బీజేపీ ఏపీకి ఇచ్చిన హామీలు అమలు జరపకుండా మోసం చేస్తోందని కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ విమర్శించారు.

 

20:34 - May 12, 2016

హైదరాబాద్ : విచ్చల విడిగా డ్రగ్స్ వాడేస్తున్నారు. నిత్యం రేవ్‌ పార్టీలు సందడి చేస్తున్నాయి. మాదక ద్రవ్యాల మత్తులో యువత… ఊగిపోతోంది.. వెరసి హైదరాబాద్‌ నగరం డ్రగ్స్‌ ముఠాలకు అడ్డాగా మారుతోందా..? డ్రగ్స్ బానిసలకు నిలయమవుతోందా? మత్తులో చిత్తయ్యేవాళ్లు పెరుగుతున్నారా? ముఖ్యంగా సంపన్న వర్గాల పిల్లలు, ఫిల్మ్ ఇండస్ట్రీ సంబంధీకుల్లో మాదకద్రవ్యాల వినియోగం అపరిమితంగా పెరుగుతోందని అనేక ఆధారాలు లభించటం ఆందోళన కలిగిస్తోంది. ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ లో విశ్లేషణ చేశారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

బీఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ఘన విజయం

హైదరాబాద్ : బీఎస్ ఎన్ ఎల్ ఉద్యోగుల అఖిలాభారత యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో బీఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ఘన విజయం సాధించింది. వరుసగా ఆరోసారి బిఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ విజయం సాదించింది.

20:12 - May 12, 2016

పాలేరు ఉపఎన్నికల పంచాది ఇంకా రంజుకొచ్చిందుల్లా.. ఇంకో నాల్గైదు రోజులున్నయ్ ఓట్లు అనంగ.. కత్తులు ఆకురాయి వెట్టి నూరుకుంటున్నరు టీఆర్ఎస్ పార్టోల్లు.. కాంగ్రెస్ పార్టోల్లు.. మాటలు మాత్రం పెద్దపెద్దయ్.. పొడ్గుపొడ్గుయి మాట్లాడుకుంటున్నరు.. పది మందికి వొయ్యవల్సిన సల్లవొట్టు.. ఇర్వైమందికి వొయ్యాల్నంటే ఏం జెయ్యాలే..? అదే సల్లల ఇన్ని నీళ్లువోశి కల్పిపొయ్యాలే అంతేనా..? అగో టీఆర్ఎస్ పార్టీ పనిగూడ ఇదే అయ్యింది.. ఊరంత ఒకదిక్కుంటే.. ఊసుగండ్లోడు ఇంకోదిక్కన్నట్టు.. తెలంగాణ రాష్ట్రంల తొమ్మిది జిల్లాల పోలీసోళ్లు ఒక తొవ్వలవోతుంటే.. కరీంనగర్ జిల్లా పోలీసోళ్లు మాత్రం వేరే తొవ్వల వోతున్నరు..కరీంనగర్ జిల్లా పోలీసోళ్ల కథలు ఎట్లున్నయో జూడుండ్రిగ..పురుషులందు పుణ్యపురుషులున్నట్టే.. కోతులందు గూడ పుణ్యకోతులు.. దొంగకోతులు ఉంటుండొచ్చునా అని డౌటొచ్చిందుల్లా.. అందుకే ఆ కోతులళ్ల దొంగకోతులు ఎట్లుంటయ్. కథలు జూడుండ్రిగ.. మల్లన్న ముచ్చట్లు కార్యక్రమంలో మల్లన్న చెప్పిన వివరాలు చూడాలనుకుంటే ఈ వీడియోని క్లిక్ చేయండి..

19:57 - May 12, 2016

విజయవాడ: ఏపీలో తాత్కాలిక సచివాలయ నిర్మాణంలో కార్మికులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారా? కార్మికుల ప్రాణాలకు భరోసా లేదా? రోజుకు 12 గంటల పని... అరకొర సౌకర్యాలు, రేకుల డబ్బాలాంటి షెడ్‌లో నివాసం... అటు రోజంతా పని.. మరోవైపు ఎండ వేడి. కార్మికుల సంక్షేమమే మా ధ్యేయమంటూ.. చెప్పుకునే బాబు సర్కార్... వెలగపూడిలో కార్మికులకు కల్పిస్తున్న సౌకర్యాలు ఇవి. కనీస సౌకర్యాలు కూడా లేకుండా దుర్భర పరిస్థితుల్లో పనిచేస్తున్న కార్మికుల స్థితిగతులపై విజయవాడ స్టూడియో నుండి 'టెన్ టివి' లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సీపీఎం నేత బాబూరావు, వైసీపీ నేత గౌతం రెడ్డి, ప్రముఖ న్యాయవాది సుంకర పాల్గొన్నారు. మరిన్ని వివరాలు చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

ఆరోగ్యశ్రీ సిబ్బంది వేతనాలు పెంపు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సిబ్బంది వేతనాలు పెంచుతున్న మంత్రి లక్ష్మారెడ్డి ప్రకటించారు. ఆరోగ్య మిత్రులకు రూ.12వేలు, ఆఫీస్ అసోసియేట్, డీటీఎల్, ఎన్ టీఎల్ ల కు రూ. 15వేలు, జిల్లా మేనేజర్లకు నెలకు రూ.28,940 పెంచినట్లు మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. 100 శాతం ప్రజావైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని స్పష్టం చేశారు.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. అన్ని కంపార్ట్ మెంట్లు నిండి భుక్తుల క్యూలైన్ బయటకు వచ్చారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

19:05 - May 12, 2016

హైదరాబాద్ : ఇళ్లు వెతుక్కోవడం, తదితర అవసరాల కోసం అమరావతికి మూడు రోజుల పాటు వెళ్లడానికి అయ్యే షిఫ్టింగ్ చార్జీలను ప్రభుత్వం ముందస్తుగా చెల్లించాలని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం కోరింది. ఎలాగో జూన్‌, జూలైలో తమకు ఇచ్చే షిఫ్టింగ్‌ అలెవెన్సులు ఈ నెలలోనే ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. జూన్ నుంచి రాజధానికి వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని.. తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలం వ్యక్తం చేసిందని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ తెలిపారు.ఉద్యోగుల తరలింపు విషయంలో గందరగోళానికి తెరదించేందుకు ఈ నెల 16 లేదా 17 న విజయవాడలో సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నట్లు ఆయన వెల్లడించారు.

సంక్షేమ రుణాలు పొందే వారి వార్షికాదాయ పరిమితి పెంపు..

విజయవాడ : ఏపీలో సంక్షేమ రుణాలు పొందే లబ్ధిదారుల వార్షికాదాయ పరిమితి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.60వేల నుంచి రూ.81 వేలకు పెంచింది. పట్టణ ప్రాంతాల్లో రూ.75 వేల నుంచి రూ.1.3 లక్షలకు పెంచింది.

వాటర్ ట్యాంకర్ ఢీకొని ఇంజనీరింగ్ విద్యార్థి మృతి

ప్రకాశం : ఒంగోలులో వాటర్ ట్యాంకర్ ఢీకొని ఇంజనీరింగ్ విద్యార్థి రవితేజ అక్కడిక్కడే మృతి చెందాడు. ఓ ప్రైవేటు కాలేజీకి చెందిన వాటర్ ట్యాంకర్. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ఆ ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోండి : వైసీపీ

హైదరాబాద్ : పార్టీ పిరాయించిన కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కోడెలను వైసీపీ నేతలు కలిసి ఫిర్యాదు చేశారు.

హెచ్ ఎండీఏకు రూ.100 కోట్లు విడుదల...

హైదరాబాద్ : మహానగ రాభివృద్ధి సంస్థ వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక కోసం పలు అంశాలను ఎంచుకుంది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కేటీఆర్‌ 100 రోజుల కార్యాచరణ ప్రణా ళికను రూపొందించాలనే ఆయా శాఖల అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. హెచ్ఎండీఏకు రూ.100 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక సహాయం కోసం బడ్జెట్ నుంచి నిధులు విడుదల చేసినట్లు సీఎంవో అధికారలు తెలిపారు.

18:47 - May 12, 2016

ఢిల్లీ : రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది. 15 రాష్ట్రాల నుంచి 57 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ఈసీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. మే 24న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మే 31 నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. జూన్‌ 11న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. అదే రోజు కౌంటింగ్‌ ఉంటుంది. ఏపీలో 4, తెలంగాణలో 2 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి జేడీ శీలం, జైరాం రమేష్‌, నిర్మలా సీతారామన్‌, సుజనా చౌదరి, తెలంగాణ నుంచి వీహెచ్‌, గుండు సుధారాణి రాజ్యసభ పదవీ కాలం ముగియనుంది. 

18:46 - May 12, 2016

కర్నూలు : చాగలమర్రి మండలం గడిగనూరులో ఉద్రిక్తత నెలకొంది. భూమా, గుంగుల వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో కానిస్టేబుల్‌ సహా ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సీసీ రోడ్డు నిర్మాణ విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. అప్రమత్తమైన పోలీసులు గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

18:43 - May 12, 2016

నెల్లూరు : ప్రత్యేక హోదా అంశం ఏపీలో రెండు మిత్రపక్షాల మధ్యనున్న స్నేహ బంధాన్ని బ్రేక్‌ చేస్తోందా.? స్టేట్‌ మొత్తం ఎలా ఉన్నా నెల్లూరు జిల్లాలో మాత్రం స్పెషల్‌ స్టేటస్‌ ఇష్యూ లీడర్ల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. ఇరు పార్టీల నేతలు పరస్పర విమర్శల బాణాలు సంధించుకుంటున్నారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తోంది మీరంటే మీరంటూ విరుచుకుపడుతున్నారు.

మోడీ ప్రభంజనంతోనే ఏపీలో తెలుగుదేశం అధికారంలోకి...

బిజెపి.. టిడిపి..! నెల్లూరు జిల్లాలో ఇప్పుడీ రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటున్నారు. మోడీ ప్రభంజనంతోనే ఏపీలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందని కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్ర పాలక వర్గం పబ్బం గడుపుకుంటోందని కాషాయ పార్టీ నేతలు కామెంట్‌ చేస్తున్నారు. అంతటితోనే ఆగక కేంద్ర నిధులు అవినీతికి హారతి కర్పూరమవుతున్నాయంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పనిలో పనిగా రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందనీ దుయ్యబడుతున్నారు. ఇందుకు చింతమనేని ప్రభాకర్‌ వృత్తాంతాన్ని ఉదహరిస్తున్నారు.

లీడర్లూ అగ్గిమీద గుగ్గిలం....

బీజేపీ అగ్రనేతల వ్యాఖ్యలతో టీడీపీ లీడర్లూ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. కేంద్రంలోని బీజేపి నేతలు ఆడిన మాట తప్పుతున్నా రాష్ట్రంలోని నేతలు నోరువిప్పడం లేదని అవసరమైతే బీజేపీ నమ్మక ద్రోహంపై ఉద్యమం చేస్తామంటున్నారు. మొన్న జిల్లాకే చెందిన మంత్రి నారాయణ నెల్లూరుకు రాగానే కమలం నేతల తీరుపై ఆగ్రహించారు. మిగతా నేతలూ బీజేపీ తీరుపై కయ్‌మంటున్నారు.

టీడీపీ బిజెపి నేతల మధ్య వివాదం ఇప్పటిది కాదు....

నిజానికి నెల్లూరు జిల్లాలో టీడీపీ బిజెపి నేతల మధ్య వివాదం ఇప్పటిది కాదు. టీడీపీ చేపట్టిన పథకాలలో జన్మభూమి కమిటీల పెత్తనం పెరిగిపోయిందంటూ రాష్ట్రలోనే తొలిసారిగా ఇక్కడ బిజేపి నిరసన స్వరం వినిపించింది. ఇసుక విధానం, మద్యం మాఫియాపైనా ఆ పార్టీ విమర్శలు చేసింది. అంతేగాక ఉద్యమాలకు సైతం తెరలేపింది. ఇలా మాటామాటా పెరిగి పరస్పర దాడుల దాకా వెళ్లింది. కావలి మున్సిపల్ చైర్మన్‌గా ఉన్న భరత్‌కుమార్‌పై టీడీపీ అధికార ప్రతినిధి ఆత్మకూరు బ్రహ్మయ్య దాడి చేసే దాకా పరిస్థితులు దిగజారాయి. ఇలా అంతకంతకూ నేతలమధ్య వివాదాలు పెరిగి పోతుండడంతో టీడీపీ అధినాయకత్వం జిల్లా పరిస్థితులపై దృష్టి సారించింది. మున్సిపల్‌ చైర్మన్‌పై దాడి చేసిన బ్రహ్మయ్యను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయినా కమల నేతల్లో ఆగ్రహం తగ్గలేదు.

ఏపీలో మరే జిల్లాలోనూ లేనంతగా నెల్లూరులో.....

ఏపీలో మరే జిల్లాలోనూ లేనంతగా నెల్లూరులో టీడీపీ, బీజేపీల మధ్య జరుగుతున్న జగడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. జిల్లాలో ఇరు పక్షాల మధ్య అంతకంతకూ పెరుగుతున్న వైరాన్ని తగ్గించేందుకు అగ్రనేతలు ఏ చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. 

రాక్షస పాలనకు చరమగీతం పాడాలి: ఎమ్మెల్యే సున్నం రాజయ్య

ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలనకు చరమగీతం పాడాలని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. కార్మికులను, రైతులను టీఆర్ ఎస్ ప్రభుత్వం విస్మరించిందని మండి పడ్డారు.

'రాజకీయాల్లో విలువలకు పాతరేసింది కాంగ్రెస్, టీడీపీలే'

ఖమ్మం: రాజకీయాల్లో విలువలకు పాతరేసింది కాంగ్రెస్, టీడీపీలే అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. పాలేరు ప్రజలకు మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. లేఖలో కాంగ్రెస్, టీడీపీలకు గుణపాఠం చెప్పేందుకు పాలేరు ఉప ఎన్నిక సరైన వేదిక అని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు అభినవ శైల్యుడి అవతారం ఎత్తారు అని ఎద్దేవా చేశారు.

భూమా, గంగుల వర్గీయుల మధ్య ఘర్షణ

కర్నూలు : సీసీ రోడ్డు నిర్మాణ విషయంలో భూమా, గంగుల వర్టీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరి పై ఒకరు పరస్పరం రాళ్ల తో దాడి చేసుకున్నారు. కానిస్టేబుల్ సహా ఇద్దరికి గాయాలు అవడంతో వారి ఆసుపత్రికి తరలించారు. 

17:39 - May 12, 2016

ఖమ్మం : పాలేరులో టిఆర్ ఎస్ నాయకులు డబ్బు పంపిణీ చేయకుండా గెలుస్తుందా అన్ని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. పాలేరు ఉప ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెన్ టివి తో మాట్లాడుతూ...డబ్బులేకుండా ప్రచారం చేస్తే టిఆర్ ఎస్ కు డిపాజిట్ వస్తుందా అన్ని ప్రశ్నించారు. దీనికి కేటీఆర్ స్పందించాలి. వామపక్షాలకు పాలేరు నియోజకవర్గంలో వామపక్షాలకు బలం వుందని తెలిపారు. సామాజిక, వ్యాపార వర్గాల వారిగా సభలూ, సమావేశాలు పెట్టి మంత్రులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తమ సవాల్ కు స్పందించడమే కాదు. దాని అమలుకు గ్రామాల వారిగా నిఘా కార్యవర్గాలను ఏర్పాటు చేయాలని తమ్మినేని వివరించారు. ఆ కమిటీ పర్యవేక్షణలో చట్టబద్దంగా ఎన్నికలు జరగాలన్నారు. పాలేరులో అధికార దుర్వినియోగం సైలెంట్‌గా కొనసాగుతోందన్నారు. చట్టబద్దంగా రాజకీయాలు చేస్తే అభ్యంతరం లేదన్నారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

మాల్యా విల్లా స్వాధీనానికి ఉత్తర్వులు జారీ..

గోవా: కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాకు చెందిన ఓ విల్లాను బ్యాంకులు స్వాధీనం చేసుకోనున్నాయి. ఈమేరకు ఉత్తర గోవా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మాల్యాకు రుణాలిచ్చిన బ్యాంకులు విల్లాను స్వాధీనం చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

సీఎంను కలిసిన ఆర్టీసీ ఛైర్మన్..

హైదరాబాద్ : ఆర్టీసీ ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ, విప్ నల్లాల ఓదేలు, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్ లు సీఎం కేసీఆర్ ను కలిశారు. సింగరేణి డిపెండెంట్లకు ఉద్యోగాలివ్వాలని, సింగరేణిలో దాదాపు 28 వందల మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారని తెలిపారు. వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరగా కొద్ది రోజుల్లోనే సింగరేణి అధికారులతో సమావేశమై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం నేతలకు హామీ ఇచ్చారు.

 

బ్రిటన్ పార్లమెంట్ లో మోహన్ బాబు కు అరుదైన గౌరవం..

లండన్ : బ్రిటన్ పార్లమెంట్‌లో ప్రముఖ టాలీవుడ్ నటుడు మోహన్‌బాబుకు అరుదైన గౌరవం దక్కింది. మోహన్‌బాబు కెరీర్‌లో బెస్ట్ డైలాగ్స్‌తో కూడిన పుస్తకాన్ని బ్రిటన్ పార్లమెంట్ లో ఆవిష్కరించారు. ఏషియన్ లైట్ 10వ వార్షికోత్సవాల్లో భాగంగా ఈ పుస్తకాన్ని రిలీజ్ చేశారు. 

16:55 - May 12, 2016

వరంగల్‌ : స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం పామునూరులో దారుణం జరిగింది. భార్య కాపురానికి రావడం లేదని తన ఇద్దరు పిల్లలకు కిరోసిన్‌ పోసి నిప్పంటించి భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో రసజ్ఙ, అక్షిత తో పాటు తండ్రి బత్తిలి శ్రీనివాస్‌ మృతిచెందాడు. 

16:53 - May 12, 2016

విశాఖ : ల్యాండ్‌ మాఫియా నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ విశాఖలో లీలావతి అనే మహిళ మీడియా ముందుకు వచ్చారు. తమ స్థలాన్ని కబ్జా చేయడంతో పాటు హత్య చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. స్థలం కోసం బంధవులే తమను చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.తన భర్తపై దాడి చేసి గాయపరిచారని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గంటా శ్రీనివాసరావు, అతని కుమారుడు తమకు తెలునంటూ, పోలీసులు కూడా ఏమీ చేయలేరంటూ తమని బెదిరిస్తున్నారని లీలావతి చెప్పారు. 

16:52 - May 12, 2016

నల్గొండ :దేవరకొండ మండంల పెండ్లిపాకలో విషాదం జరిగింది. పిల్లలు ఊయల ఊగుతుండగా విద్యుత్ వైర్లు తెగిపడి ఇద్దరు చిన్నారులు క్రాంతి, అశ్విని సజీవ దహనం అయ్యారు. మంటల చెలరేగి పూరిగుడిసె దగ్ధమైంది.

 

16:50 - May 12, 2016

కరీంనగర్ : మేడిపల్లి మండలం దమ్మన్నపేటలో నకిలీ విఆర్‌ఓను పోలీసులు అరెస్ట్ చేశారు. దమ్మన్నపేట గ్రామానికి చెందిన మార్గం గంగారాజం గతంలో విఆర్‌ఓ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశాడు. ఆ అనుభవంతో ఎమ్మార్వో ఆఫీసులో ఉన్న స్టాంపులను పోలిన నకిలీ స్టాంపులు తయారు చేసి వాటి సాయంతో పలు మోసాలకు పాల్పడుతున్నాడు. పత్రాలపై సంతకాలు చేయడం, స్టాంపు వేయడం లాంటి వ్యవహారాలకు పాల్పడుతూ అమాయక రైతులను మోసం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో విశ్వసనీయ సమాచారంతో అతని ఇంటిపైన దాడిచేసిన పోలీసులు 132 పట్టాదారు పాసు పుస్తకాలు, స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. ఎంఎ బిఇడి చేసిన గంగారాజం ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తూ ఆ జీతం సరిపోక ఇలా అక్రమ మార్గంలో సంపాదన చేస్తున్నాడని డిఎస్పీ రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. 

16:49 - May 12, 2016

ఢిల్లీ : రాజ్యసభకు కొత్తగా ఎంపికైన బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆర్బీఐ గవర్నర్‌ రఘురాం రాజన్‌ను టార్గెట్‌ చేశారు. ఆర్బీఐ గవర్నర్ మన దేశానికి అనుకూలమైన వ్యక్తి కాదని, ఆయనను వెంటనే తొలగించాలన్నారు. భారత్‌లో విదేశీ బ్యాంకుల బ్రాంచీలు తెరవకుండా ఆపాలని, తక్షణమే ఆర్థిక వ్యవస్థను అదుపులోకి తెచ్చేందుకు వడ్డీ రేట్లు పెంచానని రాజన్‌ చెప్పడం సరియైందని కాదని స్వామి అన్నారు. ఆయన నిర్ణయంతో దేశం ఇబ్బందులు పాలవుతోందని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా ఆర్బీఐ గవర్నర్‌ను సెలవుపై చికాగో పంపించివేయడం ఉత్తమమని పేర్కొన్నారు. రాజన్‌ లండన్‌ కేంబ్రిడ్జి యూనివర్సిటీలో బుధవారం ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

16:30 - May 12, 2016

నందమూరి బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి' చిత్ర షూటింగ్ కొద్ది రోజుల క్రిందట మొదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మొరాకోలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమ అభిమాన హీరో ఈ చిత్రంలో ఎలా ఉంటాడో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన 'ఫస్ట్ లుక్' త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. బాలయ్య పుట్టిన రోజు (జూన్ 10)వ తేదీన ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో నయనతార నటించనున్నట్లు తెలుస్తోంది. ఆ రోజునే ఫస్ట్ లుక్ విడదలువుతుందా ? లేదా ? అన్నది కొద్ది రోజుల్లో తెలియనుంది. 

16:21 - May 12, 2016

హైదరాబాద్ : 57 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ లో 4, తెలంగాణ లో 2 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈనెల 24 నుంచి 31 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. జూన్ 3న నామినేషన్ల ఉపసంహరణ, జూన్ 11న ఎన్నికలు, అదే రోజు కౌంటింగ్ నిర్వహించబడును. తెలుగు రాష్ట్రాల్లో జూన్ 21తో జేడీ శీలం,సుజనా చౌదరి, నిర్మలా సీతారామన్, జైరాం రమేష్, గుండు సుధారణి, వీహెచ్ ల పదవీ కాలం ముగియనుంది. మరో వైపు జూన్ 21తో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పదవీ కాలం కూడా ముగియనుంది.

16:09 - May 12, 2016

ఖమ్మం : పాలేరు ఉప ఎన్నిక మానవత్వానికి, అహంకారానికి మధ్య పోరు అని టీడీపీ సీనియర్‌ నేత రేవంత్‌ రెడ్డి అన్నారు. ఆయన పాలేరు ఉప ఎన్నిక ప్రచారం పొల్గొనేందుకు వచ్చి 'టెన్ టివి'తో మాట్లాడారు. ఖమ్మం జిల్లా అభివృద్ధి చెందినా... చెందకపోయినా మంత్రి తుమ్మలదే బాధ్యతన్నారు.. రాజకీయ నాయకులను కొనుగోలు చేసి వుండవచ్చు. కానీ పాలేరు ప్రజల్ని టిఆర్ ఎస్ పార్టీ కొనుగోలు చేయలేదని ఎద్దేవా చేశారు. ణలపై న్యాయస్థానంలో సమాధానం చెప్తానని తెలిపారు. సాంప్రదాయాలను కాపాడేందుకే కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చినట్లు పేర్కొన్నారు. వాణిజ్య పన్నులనుంచి తలసానిని ఎందుకు తొలగించారు అని ప్రశ్నించారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

 

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల..

ఢిల్లీ : రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 24న 57 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్ల స్వీకరణకు మే 31 తుది గడువు కాగా, జూన్ 11న ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభలో 57 మంది ఎంపీల పదవీ కాలం జూన్ 21తో ముగియనుంది. తెలంగాణలో 2, ఆంధ్రప్రదేశ్‌లో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

కోల్ కతాలో కలాం మొబైల్ లైబ్రరీ ప్రారంభం..

పశ్చిమ బెంగాల్ : దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలం పేరిట మొబైల్ లైబ్రరీని కోల్ కతాలో ప్రారంభించారు. 

16:04 - May 12, 2016

హైదరాబాద్ : ప్రత్యేక హోదాపై రాజ్యసభలో కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు వెంకయ్యనాయుడు మద్దతు తెలపాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్‌ చేశారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడు పిరికివాళ్లలా వ్యవహరించడం సరికాదన్నారు. ఇప్పటికైనా కేంద్రం ఏపీకి ప్రత్యేక హాదా ప్రకటించాలని, లేకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని నారాయణ హెచ్చరించారు. 

'డిప్యూటి సీఎం తేజస్వీ యాదవ్ న్యాయం చేయాలి'

బీహార్ : రాష్ట్ర డిప్యూటి సీఎం తేజస్వీ యాదవ్ తమకు న్యాయం చేయాలని మృతి చ ఎందిన ఆదిత్య సచ్ దేవ్ తండ్రి పేర్కొన్నారు. తన వాహనాన్ని ఓవర్ టేక్ చేశాడన్న కోపంతో జేడీయూ ఎమ్మెల్సీ మనోరమదేవి తనయుడు రాకీ యాదవ్ ఆదిత్య సచ్ దేవ్ ను కాల్చిచంపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 

ఆగ్రాలో సినీ నటి ప్రీతి జింతా..

ఉత్తర్ ప్రదేశ్ : ప్రముఖ నటి ప్రీతి జింతా ఆగ్రాలో పర్యటించారు. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన తాజ్ మహల్ ను సందర్శించి ఫొటోలు దిగారు. 

ఆ కేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తాం - తేజస్వీ యాదవ్..

బీహార్‌ : నడిరోడ్డుపై ఓ యువకున్ని అధికార జేడీయూ ఎమ్మెల్సీ మనోరమాదేవీ కుమారుడు రాకీ యాదవ్ కాల్చి చంపడంపై డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ స్పందించారు. నడిరోడ్డుపై యువకున్ని కాల్చిచంపడం దురదృష్టకరం, విచారకరమని వ్యాఖ్యానించారు. ఈ కేసులో నిందితులు ఎంతటి వారైన వదలబోమని, కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. 

నియోజవకర్గ అభివృద్ధి నిధులు పెంపు..

హైదరాబాద్ : నియోజకవర్గ అభివృద్ధి నిధులు రూ. 3 కోట్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

బీజేపీపై సీఎం నితీష్ విమర్శలు..

వారణాసి : బీజేపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు నడుచుకోవడంలేదని బీహార్ సీఎం నితీష్‌కుమార్ విమర్శించారు. బీజేపీ హామీతో యువత వాళ్లకు ఓటు వేశారని, కానీ ఇవాళ యువత ఆశలపై నీళ్లు చల్లిందని ఆరోపించారు. బీజేపీ నేతలు చెప్పేదొకటి చేసేది మరొకటి అని దుయ్యబట్టారు.

15:43 - May 12, 2016

అమరావతి :ప్రత్యేక హోదాపై అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది టిడిపి పరిస్థితి. విభజన హామీలు అమలు చేయాలని కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు ప్రస్తుతం టిడిపి నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈనెల 13న రాజ్యసభలో చర్చకు రానున్న బిల్లులో టిడిపి ఎలా వ్యవహరిస్తుందనే దానిపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది.

వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోన్న టిడిపి సర్కార్....

విభజన సమయంలో 5 ఏళ్ల ప్రత్యేక హోదా, ఆర్థికలోటు భర్తీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పరిశ్రమలకు రాయితీ వంటి హామీలు ఇచ్చింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. అనంతరం వచ్చిన బీజేపీ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో ఆసక్తి చూపడం లేదు. ఓ ప్రక్క హోదా ఇచ్చేది లేదంటూ కేంద్రం ప్రకటన చేసింది. ఆర్థిక లోటుపై కూడా ఆశించిన మేర సహాయం అందించలేదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో బీజేపితో వివాదాలకు పోకుండా సానుకూలంగా నిధులు రాబట్టేందుకు టిడిపి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

రాజ్యసభలో కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లులు .....

ప్రస్తుతం రాజ్యసభలో కేవీపీ ప్రవేశపెట్టిన ప్రయివేట్ బిల్లుకు మద్దతు తెలిపితే.. మిత్రపక్షంగా ఉండి మిత్ర ధర్మాన్ని వీడినట్లవుతోందని.. మద్దతు తెలపకుండా ఉంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని భావిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు . ప్రస్తుతం కేంద్ర మంత్రి సుజనా చౌదరి, సీఎం రమేష్ , గరికపాటి మోహనరావు, గుండు సుధారాణి, తోట సీత రామలక్ష్మి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. వీరిలో పలువురు బిల్లుకు మద్దతు తెలుసుతామని ప్రకటించారు. కానీ చంద్రబాబు ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపాలని డిసైడ్...

ఒకవేల బిల్లు రాజ్యసభలో చర్చకు వస్తే .. నాటి ఏకపక్ష విభజన కాంగ్రెస్ వైఫల్యాల గురించి చర్చించాలని యోచిస్తోంది. ప్రత్యేక హోదా అంశం చట్టంలో చేర్చకపోవడం పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపి అశ్రద్ద వహించడం వంటి కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపాలని ఆలోచిస్తున్నారు.

ఒకే దెబ్బకు రెంటు పిట్టల్లా టార్గెట్ చేయాలని కాంగ్రెస్....

ఒక వైపు టీడీపీని మరోవైపు బీజేపీని..ఒకే దెబ్బకు రెంటు పిట్టల్లా టార్గెట్ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. బిల్లుకు పాజిటీవ్‌గా ఓటు వేయాలని కాంగ్రెస్ ఇప్పటికే తమ ఎంపీలకు విప్ జారీ చేసింది . అలాగే మద్దతు తెలపాలని అటు చంద్రబాబుకు ఇటు వెంక్యయ్యనాయుడుకు కేవీపీ లేఖలు రాశారు. మరోవైపు బీజేపీ వ్యతిరేక పక్షాల వారి మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్ నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.

రాష్ట్ర లెక్కలు తప్పుగా ఇస్తున్నారని..

రాష్ట్ర లెక్కలు తప్పుగా ఇస్తున్నారని..సాక్షాత్తు ఆర్థిక మంత్రే లోక్ సభలో ప్రకటించారు. ప్రత్యేక హోదా లేదన్నారు. పెండింగ్ నిధులు రావన్నారు. చేయాల్సిన దాని కంటే ఎక్కువే చేశామన్నారు. అయినా టీడీపీ దీనిపై స్పందించలేదు. మరిలాంటి సమయంలో టీడీపీ తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుంది. మరి ఇలాంటి సమయంలో టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. 

15:40 - May 12, 2016

ఉత్తర్ ప్రదేశ్ : బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ పోస్టర్లు ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసిలో వెలిశాయి. మహాభారతంలో అర్జునుడిలా నితీష్‌, ఆయన రథసారథిగా శరదయాదవ్‌ పోస్టర్లలో దర్శనమిచ్చారు. శ్రీకృష్ణుడిగా శరద్ యాదవ్ రథాన్ని నడుపుతుండగా అర్జునుడిగా తన విల్లమ్ములో నుంచి బాణాన్ని తీస్తున్న పోజులో నితీశ్ కుమార్ కనిపించారు. 'ప్రధాని నరేంద్రమోదీపైన మత శక్తులపైన యుద్ధం' అని ఈ ఫ్లెక్లీలకు ట్యాగ్ లైన్ గా.. పెట్టారు. వారణాసిలో జెడియు కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ పోస్టర్‌ ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో జేడీయూ భారీ ఎత్తున ప్రచారానికి దిగేందుకు సిద్ధమవుతోంది. బీహార్ లో దెబ్బకొట్టినట్లుగానే ప్రధాని మోదీని ఉత్తరప్రదేశ్లో లౌకికవాదులను ఏకం చేసి దెబ్బకొట్టాలని అనుకుంటోంది.

 

15:31 - May 12, 2016

హైదరాబాద్ :బాధ్యతలు ఒక కొలిక్కి వచ్చినప్పటికీ శారీరక మార్పులతో సతమతమయ్యే దశ మెనోపాజ్. మహిళలు తీవ్ర ఆందోళనకు గురయ్యే ఈ దశలో ఆహారానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇవాళ్టి 'హెల్త్ కేర్' లో ప్రముఖ న్యూటీషినిస్టు జానకీ వివరించారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

15:29 - May 12, 2016

హైదరాబాద్ : అమ్మలు కాని అమ్మలు వారు.. అయినవారు కాదన్నా, అన్నీ తామై కంటికి రెప్పలా కాపాడే కారుణ్యమూర్తులు.. ఏ స్థితిలోనూ, ఏ పరిస్థితులోనూ సేవ చేయడమే లక్ష్యంగా పనిచేసే ఆరోగ్య సైనికులు.. పిలవగానే ఆత్మీయ స్పర్శను అందించే కరుణామయిలు.. వారే మనమంతా ప్రేమగా పిలుచుకునే నర్సులు.. ఈ రోజు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం.. ఈ సందర్భంగా మానవి స్పెషల్ ఫోకస్ నైటింగేల్స్..

సేవా భావంతో చేయాల్సిన వృత్తి నర్సింగ్...

ఓర్పు, నేర్పు, అంతకు మించిన సేవా భావంతో చేయాల్సిన వృత్తి నర్సింగ్. ఆరోగ్యరంగంలో వీరిది విశిష్ట స్థానం. ఈ నేపథ్యంలో వైద్యరంగంలో కీలక పాత్ర పోషిస్తున్న నర్స్ లకు ఉన్న సౌకర్యాలేంటి? వారి సమస్యలేంటి? వారి డిమాండ్లేమిటో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా తెలుసుకునే ప్రయత్నం చేసింది మానవి.

ఊపిరి నిలిచి పోయే దశలోనూ ...

వ్యాధితో ఆసుపత్రి గుమ్మం తొక్కే రోగికి సేవలు చేసి, ప్రాణాంతక వ్యాధులతో బాధపడే వారికి మీకేమీ కాదని భరోసానిచ్చి, ఊపిరి నిలిచి పోయే దశలోనూ చెదరని ధైర్యంతో సేవలందించి,నిరంతరం వ్యాధిగ్రస్తులను కంటికి రెప్పలా కాపాడుతూ ఆరోగ్య రంగానికి ఆయువు పట్టుగా నిలుస్తున్న ఫ్లోరెన్స్ నైటింగేల్ వారసులకు మానవి అభినందనలు తెలియచేస్తోంది.. కారుణ్యమూర్తుల కష్టాలు తీరాలని, వారి న్యాయమైన డిమాండ్లనుప్రభుత్వం తక్షణమే పరిష్కారించాలని మానవి కోరుకుంటోంది.. ప్రపంచ నర్సుల దినోత్సవం సందర్భంగా పేరుపేరునా ప్రతిఒక్క నర్సుకీ శుభాకాంక్షలు తెలియచేస్తోంది. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

కాపుల విషయంలో చిత్తశుద్ధితో ఉన్నాం - చిన రాజప్ప..

తూర్పుగోదావరి : కాపుల విషయంలో టిడిపి చిత్తశుద్ధితో పనిచేస్తోందని, కాపుల స్థితిగతులపై జూన్ 1 నుండి రాష్ట్ర వ్యాప్త సర్వే నిర్వహించనున్నట్లు హోం మంత్రి చినరాజప్ప వెల్లడించారు. పిఠాపురం, తుని నియోజకవర్గాల్లో కరవు ప్రభావిత ప్రాంతాల్లో టిడిపి బృందం పర్యటించింది. 

విద్యుత్ వైర్లు తాకి చిన్నారుల మృతి..

నల్గొండ : దేవరకొండ (మం) పెండ్లిపాకలో విషాదం చోటు చేసుకుంది. ఊయల ఊగుతుండగా విద్యుత్ వైర్లు తెగిపడడంతో కరెంటు షాక్ తో ఇద్దరు చిన్నారులు సజీవ దహనమయ్యారు. క్రాంతి (2), అశ్విని (5) మృతులుగా గుర్తించారు. 

పార్టీ మారడం లేదు - కావలి వైసీపీ ఎమ్మెల్యే..

హైదరాబాద్ : తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను కావలి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఖండించారు. జగన్ అండతో తాను ఎమ్మెల్యేగా గెలిచానని, కేసులకు భయపడి వైసీపీని వీడేది లేదని స్పష్టం చేశారు. జైలు కైనా వెళుతానని టిడిపిలోకి వెళ్లనని తెలిపారు. 

15:12 - May 12, 2016

బంగాళాదుంపతో అధిక బరువు, రక్తపోటును దూరం చేసుకోవచ్చు. పలు పరిశోధనలు జరిపిన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు పెన్సిల్వేనియాలోని స్క్రాన్టన్‌ యూనివర్సిటీ శాస్త్రజ్ఞులు. చాలామంది బంగాళాదుంపను ఫ్రై, చిప్స్ రూపంలో తీసుకుంటారు. నూనెలో వేయించిన బంగాళాదుంపను తినడం వల్ల ఉపయోగాలు లేకపోగా అది ఎటువంటి క్యాలరీలను అందజేయదని నిర్ధారించారు. ఊదా రంగులో ఉండే బంగాళాదుంపను నూనెలో వేయించకుండా కూర వండుకుని తింటే మంచిదని సూచిస్తున్నారు. ఒక బంగాళాదుంపలో 110 క్యాలరీ పోషకాలు ఉంటాయి. అలాగే పన్నెండుకు పైగా పైటోకెమికల్స్‌ను ఇది కలిగి ఉంది. ఊబకాయం ఉన్న పద్దెనిమిది మందికి నాలుగు వారాలపాటు ఊదా రంగులో ఉన్న బంగాళాదుంప కూరను ఆహారంలో ఇచ్చారు. తర్వాత వారిలో రక్తపోటు స్థాయి తగ్గుముఖం పట్టిందని శాస్త్రజ్ఞులు తేల్చారు. బంగాళాదుంపను వేపుళ్లుగా తీసుకోవడం కన్నా మామూలుగా దాని కూరను తినడమే మేలని చెబుతున్నారు.

15:10 - May 12, 2016

పెద్దపెద్ద హోటళ్లు, రెస్టారెంట్లుకు వెళ్లినప్పుడు ఆరగింపు అయిపోయాక టేబుల్‌పై ఉండే సోంపును ఎంతోకొంత నోట్లో వేసుకుంటాం. ఇలా హోటళ్లకు వెళ్లి భోజనాలు, బిర్యానీలు తిన్నప్పుడే కాదు... ఇళ్లల్లో భోజనం చేసిన తర్వాత దీన్ని నోట్లో వేసుకోవాలంటున్నారు నిపుణులు. భోజనం చేసిన తర్వాత రోజూ పది గ్రాముల సోంపును తినాలి. దీనివల్ల జీర్ణక్రియ, శ్వాసక్రియ సాఫీగా జరుగుతాయని చెబుతున్నారు. అంతేగాకుండా శరీరంలో ఉండే కొవ్వును ఇది అదుపులో ఉంచుతుంది. ఆస్తమా, దగ్గు వంటి వ్యాధులు ఉన్న రోగులు సోంపును తినడం వల్ల ఉపశమనం పొందుతారు. కఫాన్ని నివారించే గుణం ఇందులో ఉంది. కాళ్లు, చేతులకు మంట పుట్టినప్పుడు సొంపు పొడిని, చక్కెరను సమపాళ్లలో నీటిలో కలుపుకుని తాగితే ఉపశమనం కలుగుతుంది. దీనివల్ల కడుపు శుభ్రంగా ఉండడమే కాకుండా కడుపుబ్బరం సమస్య పూర్తిగా మాయమవుతుంది. బెల్లంతో సోంపును కలిపి తింటే మహిళలకు నెలసరిలో ఉన్న సమస్యలు తొలగిపోతాయని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు.

14:59 - May 12, 2016

నందమూరి బాలకృష్ణ సరసన హీరోయిన్స్ గా నటించడానికి ఇప్పుడు సీనియర్ హీరోయిన్స్ ఎవరూ ఒప్పుకోవడంలేదు. కాల్షీట్స్ వంకతో తప్పించుకుంటున్నారు. లెజెండ్, లయన్, డిక్టేటర్ సినిమాల విషయంలో అదే జరిగింది. ఇప్పుడు వందో సినిమా విషయంలోనూ అదే సమస్య రిపీట్ అవుతోంది. బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'కి ఇంకా కథానాయికని ఎంపిక చేయలేదు. ఆ చిత్రానికీ నయనతార, అనుష్కల పేర్లే ప్రచారంలో ఉన్నాయి. మధ్యలో కాజల్‌ని కూడా పరిశీలించినట్టు తెలిసింది. ఇలియానాను సైతం సినిమాకోసం సంప్రదించారట. కానీ ఇది చరిత్ర కు సంబంధించిన సినిమా కాబట్టి, తెలుగు రాజైన శాత కర్ణి పక్కన మహారాణిగా మెప్పించే హీరోయిన్ కావాలి, దాంతో పాటు ఆ హీరోయిన్ కి హార్స్ రైడింగ్, కత్తి సాము లాంటి విద్యలు వచ్చి ఉండాలి. అందుకే ఈ సినిమాకి ఇప్పుడు హీరోయిన్ ఎంపికే సమస్యగా మారింది. అనుష్క, నయనతార ల్లో ఎవరో ఒకరు హీరోయిన్ అయినా బాగుండేది. కానీ వాళ్లిద్దరూ వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమాకి నో చెప్పారు. ఇంకా మరికొంత మంది హీరోయిన్స్ పేర్లను పరిశీలిస్తున్నారు దర్శక, నిర్మాతలు. మొత్తం మీద బాలయ్య వందో సినిమాకి అన్నీ కుదిరినా హీరోయిన్ ప్లేస్ ఇంకా బ్లాంక్ గానే ఉంది. మరి రేపోమాపో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాలో కథానాయికగా నటించే అవకాశం ఎవరిని వరిస్తుందో? 

14:56 - May 12, 2016

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మొన్నటి వరకు అసలు హీరోయిన్ సమస్యే లేదు. ఆయన సరసన నటించడానికి ఎవరైనా రెడీ గా ఉండేవారు. కానీ ఇప్పుడు ఆయనకీ హీరోయిన్ సమస్య ఎదురౌతోంది. సాధారణంగా పవర్ స్టార్ తనతో నటించిన హీరోయిన్స్ లో ఎవరికో గానీ రిపీటెడ్ గా నటించే ఛాన్స్ ఇవ్వడు. కానీ ఇప్పుడు ఆయన తరువాత సినిమాకీ హీరోయిన్స్ కొరత కనిపిస్తోంది. సర్దార్ గబ్బర్ సింగ్ డిజాస్టర్ తో విమర్శలు ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్, ఇప్పుడో ఫ్రెష్ మూవీతో తన అభిమానుల్ని ఖుషీ చేయాలని డిసైడయ్యాడు. తరువాత సినిమా విషయంలో మీన మేషాలు లెక్కపెట్టకుండా వెంటనే రంగంలోకి దిగిపోయాడు. అందుకే పవన్‌కల్యాణ్‌ కొత్త చిత్రం ఇటీవలే మొదలైంది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఓ లవ్ స్టోరీని ఈ సినిమా కోసం ఎంచుకున్నాడు పవర్ స్టార్. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ మేకప్ లేకుండా తన ఒరిజినల్ లుక్ లోనే నటించడానికి సిద్ధపడుతున్నాడు. తమిళ్ మూవీ వీరంలో అజిత్ స్టైల్లో సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్ లో వైట్ హెయిర్, వైట్ గెడ్డంతో తన అభిమానులకు కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమా కోసం ఆయనకీ కథానాయికని వెదుకుతున్నారు. ఎస్‌.జె.సూర్య దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రం కోసం దక్షిణాది భామనే ఎంచుకోవాలని సినిమా వర్గాలు నిర్ణయించాయని సమాచారం. మరి ఆ భామ ఎవరో తేలాల్సి ఉంది. స్టార్ హీరోయిన్స్ అందరూ వాళ్ళ వాళ్ల సినిమాలతో బిజీగా ఉండడం వల్ల పవర్ స్టార్ కి సైతం హీరోయిన్ కొరత ఏర్పడింది.  

14:49 - May 12, 2016

హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించిన జగపతి బాబు. ఆ దశ దాటిన తరువాత ఆఫర్స్ కోసం చాలా కష్టపడ్డారు. వయసు మీద పడ్డంతో హీరో రోల్స్ కు డిమాండ్ తగ్గింది. ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోవాలనుకునే టైమ్ లో బోయపాటి శ్రీను రూపంలో జగపతి బాబు ను అదృష్టం వరించింది. విలన్ గా కొత్త అవతారం ఎత్తారు. జగపతిబాబు హీరోగా నటించిన సినిమాలు వచ్చినవి వచ్చినట్టే టపా కట్టేస్తోన్న రోజులవి. కొన్ని సినిమాలైతే విడుదల కూడా కాకుండా ఆగిపోవడంతో జగపతిబాబుకి కనీసం పారితోషికం కూడా గిట్టకుండా పోయిన సినిమాలున్నాయి. అలాంటి టైమ్‌లో జగపతిబాబు ఒక సూపర్ డెసిషన్ తీసుకున్నాడు. బాలకృష్ణ లెజెండ్‌లో విలన్‌గా నటించడానికి సై అన్నాడు. అంతే దాంతో జగపతిబాబు రాతే మారిపోయింది. ఇప్పుడు జగపతిబాబు తెలుగు చిత్ర సీమలో కాస్ట్‌లీయస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ విలన్. ఆయన్ను విలన్ గా తీసుకోడానికి టాలీవుడ్ లో దర్శక, నిర్మాతలందరూ పోటీ పడిపోతున్నారు. అయితే జగపతి బాబు ప్రస్తుతం విలన్ గా స్టార్ హీరోల సినిమాల్లోనే నటిస్తూ బిజీగా ఉన్నారు.

రెండు కోట్లు ? 
జగపతిబాబుకి కనీసం రెండు కోట్లు ఇవ్వనిదే సినిమా చేయట్లేదట. కేవలం తెలుగు చిత్రసీమలోనే కాదు ఇప్పుడు జగపతిబాబుకి తమిళ, మలయాళ చిత్ర సీమల నుంచి కూడా ఆఫర్లు వెల్లువలా వచ్చి పడిపోతున్నాయి. విజయ్‌తో, విశాల్‌తో చెరో సినిమాలో విలన్‌గా నటించడానికి జగపతిబాబు అంగీకరించాడు. మలయాళంలో మోహన్ లాల్ సినిమాలో కూడా విలన్ గా నటిస్తున్నాడు. జగపతిబాబుని విలన్‌గా పెట్టుకుంటే తెలుగులో ఆటోమేటిగ్గా మార్కెట్ పెరుగుతుందని తమిళ హీరోలు తెలివిగా జగపతిబాబుని సైనప్ చేసుకుంటున్నారు. ఒకానొక టైమ్‌లో ఆస్తులన్నీ పోయి ఇబ్బందుల్లో వున్న జగపతిబాబు ఇప్పుడు రెండు చేతులా కోట్లు వెనకేస్తున్నాడంటే అదంతా లెజెండ్ మహిమే మరి. ఈ సంవత్సరం నాన్నకు ప్రేమతో జగపతి బాబు మరోసారి విలన్ గా తన విశ్వరూపం చూపించాడు. అయితే లెజెండ్ లో క్రూయల్ విలన్ గా మెప్పిస్తే , నాన్నకు ప్రేమతో సినిమాలో పాలిష్డ్ , స్టైలిష్ విలన్ గా అదరగొట్టాడు. ఇప్పుడు టాలీవుడ్ లో ప్రకాష్ రాజ్ చేయాల్సిన పాత్రల్ని తనే చేస్తూ ఖరీదైన విలన్ గా దూసుకుపోతున్నాడు. త్వరలో వక్కంతం వంశీ డైరెక్షన్ లో యన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమాలో కూడా జగపతి బాబు విలన్ గా నటించబోతున్నట్టు తెలుస్తోంది. సో.. జగపతి బాబు హీరో టు విలన్ గా టాలీవుడ్ లో బెస్ట్ అనిపించుకుంటున్నాడు.  

14:37 - May 12, 2016

ఢిల్లీ : రాజ్యసభలో శుక్రవారం నాడు ఏపీ ప్రత్యేక హోదాపై చర్చ జరిగే అవకాశం లేదని కేంద్ర వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వచ్చే వర్షాకాల సమావేశాల్లోనే ప్రత్యేక హోదా బిల్లుపై చర్చ జరగనుందని తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌ మాత్రం ప్రత్యేక హోదా బిల్లుపై చర్చించాల్సిందే అంటూ అధికార పక్షంపై ఒత్తిడి తెస్తూ.. విపక్షాల మద్దతు కూడగడుతోంది. 

14:32 - May 12, 2016

మెదక్ : వైద్యం వికటించి బాలింత మృతి చెందిన సంఘటన మెదక్‌ జిల్లా సిద్ధిపేటలో జరిగింది. జలజ అనే గర్భిని ప్రసవం కోసం సిద్ధిపేట విజయ ఆసుపత్రికి తన బంధువులతో కలిసి వచ్చింది. ఆపరేషన్‌ చెయ్యగా ఆడశిశువుకు జన్మనిచ్చింది. కొద్దిసేపటికి జలజ పరిస్థితి విషమంగా ఉందని, ఆమె గర్భసంచి తొలగించాలని, భర్త సుధాకర్‌తో కాగితాలపై సంతకాలు పెట్టించుకొని వైద్యులు గర్భసంచి తొలగించారు. బాలింత పరిస్థితి మరింత విషమించడంతో, హైదరాబాదు యశోద ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు చెప్పారు. హుటాహుటీన తరలించగా అక్కడ వైద్యులు పరీక్షించి,ఆమె మార్గం మధ్యలోనే మృతి చెందిందని తెలిపారు. విజయ ఆసుపత్రి డాక్టర్లు, గవర్నమెంట్ డాక్టర్లుగా పనిచేస్తూ ఇక్కడ ప్రైవేట్‌ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారని తెలిసిందని మృతురాలి భర్త ఆరోపించారు. తమకు న్యాయం జరగాలని డిమాండ్‌ చేశారు.ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని, ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని మృతురాలి బంధువులు కోరారు.

పనామా పేపర్ లో జగన్ కుంభకోణాలు - యనమల..

హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్ అవినీతి కుంభకోణాలు పనామా పేపర్ లో వచ్చాయని, దర్యాప్తు సంస్థలు వాటిని పరిగణలోకి తీసుకోవాలని ఏపీ మంత్రి యనమల సూచించారు. అరబిందో కంపెనీ ముడుపులు, మనీ ల్యాండరింగ్ లో జగన్, విజయసాయిరెడ్డి, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఉన్నట్లు సీబీఐ 9,10,11 ఛార్జీషీట్ లలో వెల్లడైందని పేర్కొన్నారు. జగన్ బినామీ రాం ప్రసాద్ రెడ్డిని సీబీఐ, ఈడీ విచారించాలని మంత్రి యనమల తెలిపారు. 

14:30 - May 12, 2016

ఖమ్మం : పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్ధి రామిరెడ్డి సుచరితారెడ్డి గెలుపు ఖాయమని పార్టీ ఎమ్మెల్యే గీతారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమానికి దూరంగా ఉన్న టిఆర్ఎ స్ అభ్యర్ధి తుమ్మల నాగేశ్వరరావు పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉదందని, సుచరితా రెడ్డి పట్ల ప్రజల్లో అపారమైన గౌరవం ఉందని తెలిపారు. పాలేరు ఎన్నికల్లో మా కార్యకర్తలు అంకిత భావంతో పని చేస్తున్నారు. మంత్రిగా, ఎమ్మెల్సీ గా ఉండి ఎమ్మెల్యేగా తుమ్మల ఎందుకు పోటీ చేశారని ప్రశ్నించారు. సుచరితా రెడ్డిపై ప్రజల్లో ఎంతో ఆదరణ ఉంది. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన ఎంతో మంది విద్యార్థులను పట్టించుకోవడం లేదని...దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు.

బేవరేజ్ కార్పొరేషన్ లో 79 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..

హైదరాబాద్ : టీఎస్ పీఎస్సీ ద్వారా బేవరేజ్ కార్పొరేషన్ లో 79 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

ఢిల్లీలో గవర్నర్ నరసింహన్..

ఢిల్లీ : పార్లమెంట్ లో ప్రధాన మంత్రి మోడీ, రక్షణ శాఖ మంత్రిని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కలిశారు. తెలుగు రాష్ట్రాల కరవు పరిస్థితులను ప్రధాన మంత్రి మోడీకి ఆయన వివరించారు. ప్రధానితో సాధారణ అంశాలే చర్చించడం జరిగిందని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల్లో కరవు ఎక్కువగా ఉందని, కరవు నివారణకు రెండు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయన్నారు. పార్టీ ఫిరాయింపుల అంశంపై గవర్నర్ స్పందించలేదు. 

మంత్రివర్గ నిర్ణయం ద్వారా 'హోదా' ప్రకటించవచ్చు - దిగ్విజయ్..

న్యూఢిల్లీ : మంత్రివర్గ నిర్ణయం ద్వారా ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించవచ్చని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. ఏపీ పట్ల చిత్తశుద్ధి ఉంటే కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లుకు బీజేపీ మద్దతివ్వాలని డిమాండ్ చేశారు. 

గుట్కా తయారీ కేంద్రంపై దాడి..

హైదరాబాద్ : రాజేంద్రనగర్ కిస్మత్‌పూర్‌లో గుట్కా తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. గుట్కా తయారు చేస్తున్న ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీ అయ్యారు. వీరి వద్ద నుండి లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు, తయారీ సామాగ్రీని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 

ఆర్టీసీ బస్సు - డైక్ ఢీ..ఇద్దరు మృతి..

మహబూబ్‌నగర్ : జిల్లాలోని మిడ్జిల్ మండలం బోయినపల్లి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సు - బైక్ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు

కేంద్ర మంత్రి అనంత్ గీతేతో రాష్ట్ర మంత్రుల భేటీ..

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అనంత్ గీతేతో రాష్ట్ర మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి భేటీ అయ్యారు. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూనిట్‌ ను పునరుద్దరించాలని మంత్రులు కేంద్ర మంత్రిని కోరారు. ఆదిలాబాద్ జిల్లా సమస్యలను అనంత్ గీతే దృష్టికి తీసుకెళ్లామని జోగు రామన్న తెలిపారు.

హరీష్ రావత్ తొలి కేబినెట్ సమావేశం..

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన హరీష్ రావత్ గురువారం తొలి కేబినెట్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో రావత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి అధిక్యం దక్కిన సంగతి తెలిసిందే. 

సినీ రంగ ప్రముఖులు..వాహన యజమానుల మధ్య చర్చలు సఫలం..

హైదరాబాద్ : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో గత మూడు రోజులుగా సినీ రంగ ప్రముఖులు..వాహన యజమానుల మధ్య జరుగుతున్న చర్చలు గురువారం సఫలమయ్యాయి. డిమాండ్ తగ్గట్లుగానే వాహనాలు తీసుకుని అద్దె చెల్లిస్తామని సినీ ప్రముఖులు స్పష్టం చేశారు. 

కుప్పకూలిన ఫైటర్ జెట్..

బీజింగ్ : చైనా దేశానికి చెందిన ఫైటర్ జెట్ కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ ప్రాణాలతో బయటపడ్డాడు. నైట్ డ్రిల్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.  

13:33 - May 12, 2016

హైదరాబాద్ : విపత్తుల నివారణకు జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. 31 డిపార్ట్‌మెంట్ల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏ విభాగంలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు? ఎలాంటి పరికరాలు అందుబాటులో ఉన్నాయో బల్దియా కమిషనర్‌ జనార్ధన్‌ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. వేగంగా సమాచారాన్ని చేరవేసేందుకు ప్రత్యేక యాప్ రూపొందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

13:30 - May 12, 2016

హైదరాబాద్ : సోషల్‌మీడియాలో, న్యూస్‌ఛానల్లో తనపై వస్తున్న రూమర్స్‌పై సినీనటుడు వేణుమాధవ్ తీవ్రంగా స్పందించారు. చిత్ర పరిశ్రమలో ప్రముఖులతో నటించిన తనను అగౌరవంగా ప్రస్తావించడాన్ని ఖండించారు. తాను బ్రతికున్నా, ఓ న్యూస్‌ఛానల్‌ మరణించినట్టు ప్రకటించడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయంపై సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని తాను సీరియస్‌కు తీసుకుంటున్నానని వేణుమాధవ్‌ అన్నారు.

ప్రమాదంలో యువతి మృతి....

హైదరాబాద్‌ : నగరంలోని బంజారాహిల్స్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మరణించింది. కర్నూలు జిల్లా శ్రీశైలం సున్నిపెంటకు చెందిన అంబిక హైదరాబాద్‌లోని శ్రీనగర్‌కాలనీలో జీఐ సిసిరో ఇండియాలో హెచ్‌ఆర్‌లో నెలకు రూ.18 వేల జీతంతో ఆమెకు ఉద్యోగం వచ్చింది. బుధవారం హాస్టల్‌ నుంచి ఉద్యోగానికి వెళ్తూ..  చెవిలో ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకొని నడుచుకుంటూ వెళుతోంది. అదే దారిలో ఓ వ్యక్తి ఒక కారును ఎత్తుగా ఉన్న ప్రాంతంలో హ్యాండ్‌ బ్రేక్‌ వేసి పార్కింగ్‌ చేశాడు. అయితే హ్యాండ్‌ బ్రేక్‌ సరిగా పడకపోవడంతో.. పార్క్‌ చేసిన కారు వెనక్కి, వేగంగా జారిపోయింది. కారు వేగంగా అంబిక వైపు వెళుతుండటంతో..

13:26 - May 12, 2016

హైదరాబాద్ : డ్రైవర్ల వేతనాల పెంపుపై తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌, వాహన యజమానులకు మధ్య తలెత్తిన వివాదం ముగిసింది. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సమక్షంలో రెండు వర్గాలకు మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. వాహన డ్రైవర్ల వేతనాల పెంపుల బాధ్యత తమదికాదని చిత్ర నిర్మాతల మండలి వాదించింది. సినీ కార్మికుల వేతనాల పెంపు వరకే ఫిల్మ్‌ చాంబర్‌ బాధ్యత తీసుకుంటుందని నిర్మాతలు తేల్చి చెప్పడంతో వాహన యజమానులు దిగొచ్చారు. 

బేవరేజ్ కార్పొరేషన్‌లో ఖాళీల భర్తీ....

హైదరాబాద్ : రాష్ట్రంలోని బేవరేజ్ కార్పొరేషన్‌లో ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో 79 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ ఉద్యోగాల భర్తీ టీఎస్‌పీఎస్సీ ద్వారా జరగనుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఖాళీల వివరాలు.. అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్(గ్రేడ్-2) -13, అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్(గ్రేడ్-2)-56, స్టెనోగ్రాఫర్ -1, డాటా ప్రాసెసింగ్ అసిస్టెంట్(గ్రేడ్-2) -9 పోస్టులు.

13:12 - May 12, 2016

తమిళనాడు : తమిళనాడు  రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. కెప్టెన్‌ విజయ్‌ కాంత్‌ నేతృత్వంలోని డీఎండీకే, రాందాస్‌ నాయకత్వంలోని పీఎం పార్టీలు ప్రధాన రాజకీయ కూటములకు సవాల్‌గా మారాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు ఈ రెండు పార్టీలు చేస్తున్న ప్రయత్నాలతో... డీఎంకే, ఏఐడీఎంకే లకు భయం పట్టుకుంది.

హోరెత్తుతున్న ప్రచారం...
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల రాజకీయ ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన పార్టీలన్నీ భారీ బహిరంగ సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. కెప్టెన్‌ విజయ్‌కాంత్‌ నేతృత్వంలోని డీఎండీకే, కేంద్ర మాజీ మంత్రి రాందాస్‌ నాయకత్వంలోని పీఎంకే గ్రామీణ ప్రాంతాల్లోకి చొచ్చుకుపోతున్నాయి. దీంతో ప్రధాన పార్టీలకు కలవరం పట్టుకుంది.

8 శాతానికి చేరిన డీఎండీకే ఓటు బ్యాంకు....
తమిళ చిత్ర పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నటుడు విజయ్‌ కాంత్‌ 2005 సెప్టెంబర్‌ 14న డీఎంకే పార్టీని ఏర్పాటు చేశారు. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో 234 సీట్లకు పోటీచేసినా, విజయ్‌ కాంత్‌ ఒక్కరే విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో 4 శాతం ఓటు బ్యాంకు సాధించారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత నాయకత్వంలోని ఏఐడీఎంకే పొత్తు పెట్టుకుని 41 స్థానాలనకు పోటీ చేశారు. 29 సీట్లలో విజయం సాధించిన డీఎంకే .... తన ఓటు బ్యాంకును 8 శాతానికి పెంచుకుంది. ముఖ్యమంత్రి జయలలితతో విబేధించి, ఏఐడీఎంకేతో తెగదెంపులు చేసుకున్న కెప్టెన్‌ విజయ్‌కాంత్‌... అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర పోషించారు. అయినా డీఎంకే బలం పుంచుకోలేకపోయిందన్న విమర్శలు వచ్చాయి. ఈసారి ఎన్నికల్లో ప్రజా సంక్షేమ కూటమితో డీఎంకే పొత్తుపెట్టుకుంది. కెప్టెన్‌ విజయ్‌ కాంత్‌ను పీడబ్య్లూఎఫ్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించారు. ముఖ్యమంత్రి పీఠంపై ఎప్పటి నుంచో కన్నేసిన విజయ్‌ కాంత్‌.. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో ఇటు పట్టణాలు, అటు గ్రామాలు... అన్న తేడా లేకుండా ప్రచారంలో దూసుకుపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కెప్టెన్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతుండటంతో ప్రధాన పార్టీలైన డీఎంకే, ఏఐడీఎంకేలకు ముచ్చెమటలు పట్టిస్తోంది.

కుల రాజకీయాల ఆధారంగా పీఎంకే...
ఇక కుల రాజకీయాల ఆధారంగా ఏర్పాటైన రాందాస్‌ నేతృత్వంలోని పీఎంకే కూడా ఈసారి గ్రామీణ ఓట్లరపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. కేంద్ర మాజీ మంత్రి అన్బుమణి రాందాస్‌ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని భంగపాటుకు గురైన పీఎంకే .. ఈసారి ఒంటరిగా బరిలో దిగింది. ఇంతవరకు ఏ ఎన్నికల్లో కూడా 2 రెండు శాతం ఓటు బ్యాంకు సాధించని పీఎంకే ... ఈసారి గ్రామీణ ప్రాంతాల్లోకి బాగా చొచ్చుకుపోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో అటు డీఎంకే , ఇటు పీఎంకేతో ప్రధాన పార్టీల ఓటు బ్యాంకు చీలిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ అంశం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు ఎలా ఉంటాయో పరిశీలించేందుకు ఈనెల 19 వరకు వేచి చూడాలి. 

మంత్రి తలసానితో సినీ నిర్మాతలు భేటీ

హైదరాబాద్ : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో సినీ నిర్మాతలు దిల్ రాజ్, సురేష్ బాబు భేటీ లారీ ఓనర్ల సమస్యపై చర్చిస్తున్నారు. 

13:02 - May 12, 2016

నిజామాబాద్ : చెరుకు కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులకు చేదు కష్టాలు ఎదురవుతున్నాయి. యాజమాన్యాల తప్పుడు నిర్ణయాలు కార్మికులకు శాపంగా మారుతున్నాయి. నిజాం షుగర్స్‌ను స్వాధీనం చేసుకుంటామన్న ప్రభుత్వ హామీలు షుగర్‌ఫ్యాక్టరీ కార్మికులను ఆదుకోలేకపోతున్నాయి. నిజామాబాద్‌లో షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం లే ఆప్ పేరుతో చేతులెత్తేయడంతో ,రోడ్డున పడ్డ ఫ్యాక్టరీ కార్మికులపై ప్రత్యేక కథనం....

నిజామాబాద్‌ షుగర్‌ఫ్యాక్టరీ లే ఆఫ్‌పై కార్మికుల ఆందోళన....
ఒకప్పుడు ఆసియాఖండంలోనే అతిపెద్ద వ్యవసాయ ఆధారిత పరిశ్రమగా ఘన చరిత్ర కలిగిన నిజాంషుగర్స్‌ ఫ్యాక్టరీ కథ ముగిసినట్లేనా... ప్రస్తుత పరిణామాలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రైవేటు పరమైన షుగర్‌ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగ మారింది. షుగర్‌ఫ్యాక్టరీలు ప్రభుత్వ పరం చెయ్యాలంటే తమకు 500కోట్ల నుంచి వెయ్యికోట్లు చెల్లించాలని ప్రైవేటు యాజమాన్యాలు డిమాండ్‌ చేస్తు్న్నాయి. గతంలో 500కోట్ల విలువైన పరిశ్రమలను కేవలం 67కోట్ల రూపాయలకే యాజమాన్యం దక్కించుకుంది. చెరుకు రైతుల పేరిట బ్యాంకు రుణం పేరుతో సుమారు 270 కోట్ల రూపాయలను తమ సొంత వ్యాపారాలకు వినియోగించుకున్నారనే విమర్శలు ఉన్నాయి. గత డిసెంబర్ 23 అర్ధరాత్రి నుంచి యాజమాన్యం లేఆఫ్‌తో చేతులెత్తేయడంతో, 500మంది కార్మికులు రోడ్డున పడ్డారు.

నీటికొరత కారణంగా ఫ్యాక్టరీలను నడపలేమన్న యాజమాన్యం....
ఎన్ డీఎస్ఎల్ ప్రైవేటు యాజమాన్యం బోధన్ ఫ్యాక్టరీతోపాటు కరీంనగర్‌జిల్లాలోని ముత్యంపేట, మెదక్‌జిల్లాలోని ముంబోజిపల్లి ఫ్యాక్టరీలను లేఆఫ్ ప్రకటిస్తూ నోటీసులు జారీచేసింది. నీటి కొరత కారణంగా ఫ్యాక్టరీలను నడపలేకపోతున్నామని పేర్కొన్నారు. ఆ కారణంతో ఫ్యాక్టరీలను మూసివేశారు. ప్రైవేటు యాజమాన్యం చేతులెత్తేసినా ప్రభుత్వమే ఫ్యాక్టరీని నడిపిస్తుందని ప్రభుత్వ నాయకులు అప్పట్లో ప్రకటనలూ చేశారు. లేఆఫ్‌ ప్రకటనకు సరిగ్గా నెలరోజుల ముందు 2015 నవంబర్‌ 23న వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చెరుకు రైతులకు హామి కూడా ఇచ్చారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. యాజమాన్య వైఖరిని నిరసిస్తూ గత 170 రోజులుగా ఫ్యాక్టరీ ఎదుట రిలే దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వమే తమను ఆదుకోవాలని డిమాండ్....
ఫ్యాక్టరీ లే ఆఫ్ తరువాత ఎన్ డీఎస్ఎల్  యామన్యం కార్మిక సంఘాలతో రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ అధికారులు 6 దఫాలుగా చర్చలు జరిపినా ఫలితం లేకుండాపోయింది. 2016 ఏప్రిల్‌ నెలలో 3సార్లు హైదరాబాద్‌లోని కార్మికసంక్షేమ శాఖ కార్యాలయంలో చర్చలకు పిలవగా యాజమాన్యం హాజరుకాలేదు. లేఆఫ్‌ ఎత్తివేతపై నిర్ణయం తీసుకునేందుకు మరికొంత గడువు కావాలని కోరుతూ యాజమాన్యం కాలయాపన చేస్తోందని కార్మికులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి,తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

12:55 - May 12, 2016

ఖమ్మం : పోలింగ్ కేంద్రాల్లో వీడియో రికార్డింగ్, వెబ్ కాస్టింగ్ ను నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ దానకిషోర్ తెలిపారు. పాలేరు ఎన్నికలపై నిర్వహించిన  ప్రెస్ మీట్ లో  ఆయన మాట్లాడారు. సిబ్బంది తరలింపుకు దాదాపు 87 బస్సులను ఏర్పాటు చేసామన్నారు. ఐవీఆర్ నుండి దాదాపు 40 ఫిర్యాదులు అందాయని తెలిపారు. వీటిని  పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. 25 వాహనాలను సీజ్ చేశామని చెప్పారు. ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లోనవకుండా అవగాహనా కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. 

12:48 - May 12, 2016

హైదరాబాద్ : జిహెచ్‌ఎంసి మహాప్రస్థానాలకు మహర్దశ పట్టనుంది. స్మశానాల్లో ఉండే భయానక వాతావరణాన్ని తొలగించి సుందరంగా మార్చేందుకు బల్దియా ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే జూబ్లీహిల్స్‌ గ్రేవ్‌ యార్డ్‌ పట్ల మంచి స్పందన రావడంతో అదే పద్ధతిలో మిగతా వాటినీ అభివృద్ధి చేయాలని కార్పోరేషన్‌ ప్లాన్ చేస్తోంది. అస్తవ్యస్తంగా ఉండే మహాప్రస్థానాలు ఇకముందు అసౌకర్యంగా ఉండకూడదు. ఆప్తులను చివరిసారిగా చూసేందుకు వచ్చేవారు ఇబ్బందులు పడకూడదు.. ఇలాంటి లక్ష్యాలతో గ్రేవ్‌ యార్డ్స్‌లో మౌలిక వసతుల రూపకల్పనకు గ్రేటర్‌ హైదరాబాద్‌ రంగం సిద్ధం చేస్తోంది.

ప్రహరీలకు నోచుకోని స్మశానాలు
రోజురోజుకూ విస్తరిస్తూ పోతున్న హైద‌రాబాద్‌లో చివరకు చాలా స్మశానాలు కుచించుకుపోయాయి. ఉన్నవాటిల్లో సౌక‌ర్యాలు శూన్యమైపోతున్నాయి. దీంతో అంత్యక్రియల వేళ త‌మ ఆప్తుల‌ను చివ‌రిసారిగా చూసుకోవ‌డానికి వ‌చ్చేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని స్మశాన వాటికల్లో ప్రహరీలు సరిగ్గా లేక దహన సంస్కారాలు రోడ్లపై వెళ్లేవారికి కనిపిస్తున్న సందర్భాలూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో వాటిని పునరుద్ధరించేందుకు యంత్రాంగం కదిలింది.

కబ్జాకు గురైన 960 స్మశానాలు ...
గ్రేట‌ర్ హైదరాబాద్ ప‌రిధిలో చిన్నాపెద్దా కలిపి మొత్తం 960 దాకా స్మశాన వాటికలున్నాయి. ఇవిగాక చాలా వాటికలు కబ్జాకు గురయ్యాయి. ఇదిలా ఉంటే పంజాగుట్ట, అంబ‌ర్‌పేట లాంటి పెద్ద పెద్ద గ్రేవ్‌ యార్డ్స్‌లో ఎల‌క్ట్రిక‌ల్ స్మశాన వాటిక‌ల‌ను ఏర్పాటు చేసినా వాటిని ప్రారంభించ లేదు. దీంతో లక్షల రూపాయలు వెచ్చించి చేసిన నిర్మాణాలు, వాటిల్లోని యంత్రాలు నిరుప‌యోగంగా మారాయి.

స్మశానాల ఆధునీకరణ...
ఇలాంటి నేపథ్యంలో స్మశాన వాటికలను మోడ్రనైజ్‌ చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని జిహెచ్ఎంసి మేయ‌ర్ బొంతురామ్మోహ‌న్ అన్నారు. ముందుగా పంజాగుట్ట, అమీర్‌పేట్, మూసాపేట్, బ‌ల్కంపేట్, మారేడుప‌ల్లి, నాగోల్, అంబ‌ర్‌పేట్ ప్రాంతాల్లోని స్మశాన వాటిక‌ల‌ను మోడ‌ల్ గ్రేవ్ యార్డులుగా అబివృద్ధి చేసేందుకు చ‌ర్యలు తీసుకుంటున్నామన్నారు. అయితే స్మశాన వాటిక‌లను అభివృద్ధి చేయడం అనంతరం వాటిని ప్రైవేట్‌ వ్యక్తుల‌కు అప్పజెబుతారనే వాద‌న‌లు స‌రికావంటోంది బ‌ల్దియా. మొత్తమ్మీద హైదరాబాద్‌లో మహాప్రస్థానాలకు మహర్దశ పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

హుస్సేన్ సాగర్ లోకి దూకి వివాహిత ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్ : భర్త వేధింపులు భరించలేని భార్య ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. భర్త పెట్టే హింసలు తాళలేక కార్వాన్‌కు చెందిన అమృత అనే వివాహిత ఆత్మహత్య చేసుకోదలచి హుస్సేన్‌సాగర్‌లో దూకింది. గమనించిన లేక్ పోలీసులు అమృతను రక్షించారు. వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.

టెన్త్ క్లాస్ ఫెయిల్ కావడంతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం...

ఖమ్మం : జిల్లాలో విషాదం నెలకొంది. పదో తరగతి ఫెయిల్ కావడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అశ్వారావుపేట మండలం నెమలిపేట గ్రామానికి చెందిన సవనం మౌనిక (16) అనే విద్యార్థిని టెన్త్ పరీక్ష తప్పింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె గురువారం పరుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఆ విషయం గమనించిన కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో కోలుకుంటోంది.

ప్రధాని మోడీతో గవర్నర్ నరసింహన్ భేటీ

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీతో గవర్నర్ నరసింహన్ భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోని తాజా పరిస్థితులపై వివరణ ఇచ్చారు.

11:56 - May 12, 2016

ఢిల్లీ : లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు ఉచ్చు బిగుస్తోంది. మాల్యాకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇంటర్ పోల్ ను కోరింది. బ్యాంకుల నుండి వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్న విజయ్ మాల్యా లండన్ కు పారిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాల్యా పాస్ పోర్ట్ రద్దుకు ఈడీ ఆదేశాలు జారీ చేసింది. మే నెల వరకూ ఇండియా రానని మొండికేస్తున్న మాల్యాపై ఈడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మాల్యాకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇంటర్ పోల్ ను కోరింది.

మాల్యాను వెనక్కి పంపించమన్న బ్రిటన్ .....

విజయ్‌ మాల్యాను బ్రిటన్‌ నుంచి వెనక్కి రప్పించే ప్రక్రియలో భారత్‌కు తాత్కాలికంగా చుక్కెదురైంది. దేశ బహిష్కరణ విషయంలో తాము ఏమీ చేయలేమని..బ్రిటన్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎవరైనా ఒక వ్యక్తి సరైన పాస్‌పోర్ట్‌తో బ్రిటన్‌లోకి ప్రవేశిస్తే ఆ తర్వాత ఆ పాస్‌పోర్టు రద్దు అయినా కూడా బహిష్కరణ సాధ్యం కాదని యూకే ప్రభుత్వం తెలిపింది. కావాలంటే దోషుల అప్పగింత ఒప్పందం ద్వారా ప్రయత్నం చేసుకోవచ్చని తెలిపింది. మాల్యాపై ఉన్న నేరారోపణల తీవ్రత తమకు తెలుసునని.. ఈ విషయంలో భారత ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని బ్రిటన్‌ ప్రభుత్వం తెలిపింది. మాల్యాను దేశం నుంచి బహిష్కరించమంటూ భారత్‌ విజ్ఞప్తి చేసిన పక్షం రోజులకు బ్రిటన్‌ పై విధంగా స్పందించింది. మనీలాండరింగ్‌ కేసులో బెయిలుకు వీలు లేని అరెస్టు వారెంట్‌ను ప్రభుత్వం జారీ చేసిన సంగతి తెలిసిందే. ‘ఇమిగ్రేషన్‌ చట్టం 1971 ప్రకారం బ్రిటన్‌లోకి ఎవరైనా వ్యక్తి అడుగుపెట్టిన సమయంలో అతని వద్ద సరైన పాస్‌పోర్టు ఉంటే అతన్ని దేశం బయటకు పంపడానికి వీలు కాదు. అయితే మాల్యా విషయంలో పరస్పర న్యాయ సహకారం దిశగా అడుగులు వేయొచ్చని భారత ప్రభుత్వానికి సూచిస్తున్నామని బ్రిటన్‌ ప్రభుత్వం తెలిపినట్లు విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ పేర్కొన్నారు.

ముగిసిన విపత్తు నివారణ సమావేశం

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ కార్యాలయంలో విపత్తు నివారణ సమావేశం ముగిసింది. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని నిర్ణయించారు. 

పనామా పేపర్లలో జగన్ అవినీతి కుంభకోణాలు : యనమల

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్ అవినీతి కుంభకోణాలు పనామా పేపర్లలో వచ్చాయని ఎపి ఆర్థికమత్రి యమనమల రామకృష్ణుడు చెప్పారు. జగన్ బినామీ రాంప్రసాద్ రెడ్డిని సిబిఐ, ఈడీ విచారించాలన్నారు. 

11:35 - May 12, 2016

హైదరాబాద్ : అక్రమ సంపాదనతో టీఆర్ఎస్ నాయకుల్ని కొనగలరు గానీ ప్రజల్ని కొనలేరని టీడీపీ నేత రేవంత్ రెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈరోజు మానవత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్య పోటీ జరుగుతోందని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో అభివృద్ధి జరగలేదంటే.. దానికి తుమ్మల నాగేశ్వర రావు బాధ్యత వహించాలన్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు న్యాయస్థానంలోనే సమాధానం చెబుతానని చెప్పారు. ఖమ్మం జిల్లా వెనకబాటుకు మంత్రి తుమ్మలదే బాధ్యత అన్నారు. మంత్రి పదవి ఇచ్చినా తుమ్మల జిల్లాను అభివృద్ధి చేయలేదని ఎద్దేవా చేశారు. తమ హయాంలో రైతులకు 9గంటలు విద్యుత్ ఇచ్చామని... కరవు వచ్చినా విద్యుత్ సరఫరా చేశామన్నారు. నిమిషం తక్కువగా కరెంట్ ఇచ్చామని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధంగా వున్నామని సవాలు చేశారు.

11:32 - May 12, 2016

హైదరాబాద్‌ :  విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు చిచ్చుబుడ్డుల్లా పేలుతున్నాయి. సడెన్‌గా ట్రాన్స్‌ఫార్మర్లు పేలి మంటలు ఎగిసిపడుతుండటంతో గ్రేటర్‌ వాసులు బెంబేలెత్తుతున్నారు. ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లపై కమిటీ సిఫారసులు కూడా అమలు కాకపోవడంతో నగరవాసులకు రక్షణ లేకుండా పోయింది. దీంతో వర్షాకాలంలో మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

వరుసగా పేలుతున్న ట్రాన్స్‌ఫార్మర్లు.....
గ్రేటర్‌ హైదరాబాద్‌లో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు పేలి ప్రమాదాలు జరుగుతున్నాయి. కొంతకాలంగా వరుసగా ట్రాన్స్‌ఫార్మర్లు పేలుతుండటంతో నగరవాసులు బెంబేలెత్తుతున్నారు. రోడ్లు, వ్యాపార సముదాయాలు, నివాస సముదాయాల వద్ద వీటిని ఏర్పాటు చేయడంతో.. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న భయంతో నగరవాసులు ఉన్నారు. దీనికి తోడు చిన్న పాటి గాలివాన వచ్చినా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతోంది.

డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు....
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఉన్న విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సమస్యలపై అధ్యయనం చేసిన కమిటీ సిటీలోని విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద గట్టి కంచె ఏర్పాటు చేయాలని, ప్రమాదకరంగా మారిన ట్రాన్స్‌ఫార్మర్లను పూర్తిగా మార్చేయాలని సూచించింది. ఇళ్లపై నుంచి వెళ్తున్న హైటెన్షన్‌ వైర్లను తొలగించాలని కమిటీ సిఫారసు చేసింది. కానీ ఏ ఒక్క సిఫారసు కూడా ఇంతవరకు విద్యుత్‌శాఖ అధికారులు అమలు చేయలేదు. స్వచ్ఛ్‌ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని నిర్వహించి ఏడాది కావొస్తున్న తరుణంలో.. ఇప్పటికైనా విద్యుత్‌ ప్రమాదాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. 

రాజ్యసభ రేపటికి వాయిదా..

ఢిల్లీ : రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. అంతకముందు సభలో పలు అంశాలపై చర్చించారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. 

 

శ్రీవారి సేవలో ప్రముఖులు....

తిరుమల: తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ తెదేపా ఆధ్యక్షుడు కళా వెంకట్రావు, తిరుపతి అర్బన్‌ జిల్లా ఎస్పీ జయలక్ష్మి తదితరులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. 

యాప్ ద్వారా ఆత్మహత్యను ప్రత్యక్ష ప్రసారం చేసిన యువతి

హైదరాబాద్‌ : ఓ యువతి తన ఆత్మహత్యను పెరిస్కోప్ అనే యాప్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసిన సంఘటన దక్షిణ పారిస్లోని ఇగ్లీలో చోటుచేసుకుంది. పారిస్కు చెందిన 19 ఏళ్ల యువతి తాను అత్యాచారానికి గురయ్యానని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఫోన్లో రికార్డు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ యువతి మంగళవారం ఇగ్లీలోని సబర్బన్ రైలు కిందపడి మృతి చెందినట్లు వెల్లడించారు. పోలీసులు ఆమె ఫోన్ను స్వాధీనం చేసుకుని, అందులోని వీడియోను పరిశీలిస్తున్నారు. అలాగే లైవ్లో ఈ ఆత్మహత్యను వీక్షించినవారిని విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు.

10:52 - May 12, 2016

శ్రీకాకుళం : సిక్కోలు మామిడికి కష్టాలు వెంటాడుతున్నాయి... ఒకప్పుడు ఎంతోమందిని తమ టేస్ట్‌తో వాహ్‌వా అనిపించిన పండ్లు ఇప్పుడు రైతుల్ని నష్టాల్లో ముంచేస్తున్నాయి.. కార్బైడ్‌ పండ్లతో పోటీ పడలేక... వ్యాపారుల జిమ్మిక్కులు ఎదుర్కోలేక నానా కష్టాలు పడుతున్నారు రైతన్నలు.

శ్రీకాకుళం మామిడిపండ్లకు దేశవ్యాప్తంగా డిమాండ్....
శ్రీకాకుళం మామిడిపండ్లకు దేశవ్యాప్తంగా చాలా డిమాండ్ ఉంటుంది.. మంచి రంగు, రుచితో ఉండే బంగినపల్లి, చెరుకురసాలు, సువర్ణరేఖలు ఇతర జిల్లాలకు భారీగా ఎగుమతి అయ్యేవి.. ఈసారిమాత్రం పరిస్థితి తలకిందులైంది.. ఎగుమతులకుబదులు దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.. మామిడి తోటలు తగ్గిపోవడం, హోల్‌సేల్‌ వ్యాపారం, పండ్లను మగ్గబెట్టేందుకు రసాయనాల వాడకంతో సిక్కోలు మామిడి కష్టాల్లో పడింది..

తగ్గిపోయిన మామిడి దిగుమతి....
జిల్లాలో ఉద్దాన ప్రాంతం, గార, హిర మండలం, సీతంపేట, నరసన్నపేటలో ఎక్కువగా మామిడి తోటలున్నాయి.. గత ఏడాది జిల్లాలోని 9వేల హెక్టార్లలో మామిడి తోటలుసాగయ్యాయి.. ఈసారి ఆ విస్తీర్ణం 7వేల హెక్టార్లకు పడిపోయింది.. ఈ తోటల్లోని పండ్లకూ గిరాకీ తగ్గిపోయింది.. ఆలస్యంగా పక్వానికి రావడంతో వ్యాపారులు ఇతర జిల్లాలనుంచి పండ్లను దిగుమతి చేసుకుంటున్నారు..

దళారుల రాకతో రైతులకు నష్టాలు....
దళారుల రాకతో రైతులకు నష్టాలు తప్పడంలేదు.. వ్యాపారులు కాల్షియం కార్బైడ్‌ వాడుతూ పండ్లు త్వరగా పండేలా చేస్తున్నారు.. మంచి రంగుతోఉన్న ఈ పండ్లనే జనాలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.. దీంతో స్వతహాగా పండే పండ్ల రైతులకు నష్టాలు తప్పడంలేదు. ఇలా వివిధ రకాల కారణాలతో శ్రీకాకుళం మామిడిపండ్లకు డిమాండ్ తగ్గుతోంది.. ఈ పండ్లకు పూర్వ వైభవం తెచ్చేదిశగా ఉద్యానవన అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.. అలాగే దాడులు పెంచి కార్బైడ్‌ వాడకాన్ని నిరోధించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

పార్లమెంట్ ఆవరణలో మృత దేహం లభ్యం...

ఢిల్లీ : పార్లమెంట్ దగ్గర ఎంపీల కారు పార్కింగ్ స్థలంలో చెట్టుకు వేలాడుతున్న ఓ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడు మధ్యప్రదేశ్‌లోని శివపురి టౌన్‌కు చెందిన రామ్ దయాల్‌వర్మ(39)గా గుర్తించారు. 30 పేజీల సూసైడ్ నోటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పటిష్ట భద్రత ఉండే పార్లమెంట్ ఆవరణ సమీపాలు, ఉన్నతాధికారుల నివాస సముదాయాల నడుమ ఈ ఘటన చోటుచేసుకోవడం భద్రతా వైఫల్యాన్ని తెలియజేస్తుంది.

10:46 - May 12, 2016

తూర్పుగోదావరి  : ఆ నేరగాడితో జాగ్రత్త అని చెప్పారు... ఏ మాత్రం అవకాశం దొరికినా మాయమవుతాడని హెచ్చరించారు. ముగ్గురు ఎస్కార్ట్‌ను ఏర్పాటు చేసిన అధికారులు మాత్రం డేంజర్‌ నేరగాడిని బస్సులో పంపారు. తిరుగు ప్రయాణంలో అధికారులు అనుమానించిందే నిజమైంది. ఆ నేరగాడు ఎస్కార్ట్‌పై అటాక్ చేసి పారిపోయాడు. ఇది అధికారుల నిర్లక్ష్యమా..?? లేక ఎస్కార్ట్‌ వైఫల్యమా...?
ఎస్కార్ట్‌పై అటాక్ చేసిన ప్రిసన్..
కరుడుగట్టిన ఖైదీ ముగ్గురు పోలీస్ ఎస్కార్ట్ సిబ్బందిపై దౌర్జన్యం చేసి బేడీలు విడిపించుకుని పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల క్రితం రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి జీవితఖైదీ శ్రీనివాస్ ను గుంటూరులోని ఓ చోరీ కేసుకు సంభందించి న్యాయస్థానంలో హజరుపరిచేందుకు ముగ్గురు ఎస్కార్ట్ సిబ్బందితో పంపారు. ఆర్టీసీ బస్సులో గుంటూరుకు తీసుకువెళ్లిన ఎస్కార్ట్‌ కోర్టులో హాజరుపర్చి తిరిగి రాజమండ్రి తీసుకువచ్చారు. బస్టాండ్‌లో దిగి ఆటో ఎక్కుతున్న సమయంలో ఖైదీ ఎస్కార్ట్‌ సిబ్బందిపై దాడి చేసి పారిపోయాడు. క్షణాల్లో జరిగిన ఉదంతంతో ఖంగుతిన్న ఎస్కార్ట్‌ సిబ్బంది వెంటనే పోలీసులను ఆశ్రయించారు.
అధికారుల తప్పిదమా..? ఎస్కార్ట్‌ నిర్లిప్తతా..??
హత్య కేసులో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్న శ్రీనివాస్ కరుడుగట్టిన నేరస్థుడని అతడిని కోర్టులో హజరుపరిచే ఎస్కార్ట్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముందుగానే పోలీసులు హెచ్చరించారు. ఈ విషయాన్ని ఎస్కార్ట్ సిబ్బంది తమ ఉన్నతాధికారులకు తెలిపి, కోర్టుకు తరలించడానికి జీపును ఇవ్వడంతో పాటు సాయుధ ఎస్కార్ట్ ను పెంచాలని కోరినా అధికారులు పట్టించుకోలేదని ఎస్కార్ట్ గా వెళ్లినవారు చెబుతున్నారు.

10:38 - May 12, 2016

హైదరాబాద్ : అవినీతి అక్రమాల్లో మునిగిపోయిన బల్దియాలోని కొందరిలో ఇప్పుడు ఏసీబీ ఫీవర్ పట్టుకుంది..ఇంతకాలం దొరికింది దోచేసిన ఆఫీసర్లలో ఏసీబీ రైడ్స్‌ షాక్‌నిస్తోంది... రోజుకో ఆఫీసర్ పట్టుబడుతూ కోట్లాది రూపాయల ఆస్తులు బయటపడుతుండడంతో రేపు ఎవరి వంతోనని అవినీతికి పాల్పడ్డారి వెన్నులో వణుకుపుడుతోంది.

హైదరాబాద్‌ బల్దియాలో కలకలం...
హైదరాబాద్‌లోని అతిపెద్ద వ్యవస్థగా ఉన్న జీహెచ్‌ఎంసీలో ఇప్పుడు ఏసీబీ ఫీవర్ పట్టుకుంది... సర్కిళ్లవారిగా విస్తరించిన బల్దియాలో అవినీతి పేరుకుపోయింది..కూకటివేళ్లతో పెకిలించాలని ఏసీబీ చేస్తున్న ప్రయత్నాలు ఆరంభంలోనే హంసపాదులా మారుతోంది..దీంతో చిన్న ఉద్యోగులపై దృష్టిని పెడుతూనే అధికారులపై కన్నేసింది. ఈ క్రమంలోనే కరప్షన్ ఆఫీసర్ల డేటాను సేకరించిన ఏసీబీ అధికారులు ఒక్కొక్కరి అవినీతి జాతకాలు బయటపెడుతున్నారు...నిన్నటికి నిన్న కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టిన కూకట్‌పల్లి సర్కిల్‌లోని టాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌ విజయ్ అక్రమాలను బయటపెట్టింది.

భారీ మొత్తంగా ఆస్తులు స్వాధీనం....
ఐదు ఫ్లోర్లు నిర్మించిన ఓ అపార్ట్‌మెంట్...అందులో 11 ఫ్లాట్లు ఆయన సొంతమే.. ఇక యాదాద్రి, పటాన్ చెరువు ప్రాంతాలతో పాటు కూకట్‌పల్లిలో ఇండిపెండెంట్‌ ఇల్లు... వీటికి తోడు కార్లు, బంగారం,లక్షల కొద్దీ క్యాష్...వీటిన్నింటినీ చూసిన ఏసీబీ ఖంగుతింది... ఇక రైడ్స్‌ కంటిన్యూయేషన్‌లో భాగంగా కొన్ని గంటల్లోనే మరో అధికారి అవినీతి భాగోతం బయటపెట్టింది.

కృపానందం ఆస్తులు బయటపెట్టిన ఏసీబీ...
జీహెచ్‌ఎంసీ ఉత్తర మండలం జోన్‌లో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న కృపానందం ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు గుర్తించిన ఏసీబీ దాడులు చేసింది... సోదాల్లో కేజీ బంగారం..మూడు చోట్ల మూడంతస్తుల భవనాలు..12 ఎకరాల భూమితో పాటు కారు వాహనాలున్నాయిని గుర్తించారు.. దీంతో పాటు బెంగళూరులో కూడా ఆస్తులున్నట్లు పత్రాలు సంపాదించిన ఏసీబీ దర్యాప్తు చేస్తుంది... ఈ దాడుల్లో కృపానందం నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగం సంపాదించినట్లు అధికారులు గుర్తించారు.. స్వీపర్‌గా మొదలయిన కృపానందం శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతులు పొందాడు.

ఏసీబీ దాడులతో అవినీతి అధికారుల ఆందోళన....
ఏసీబీ దాడులతో జీహెచ్‌ఎంసీలోని అవినీతి అధికారులు..ఉద్యోగుల్లో ఆందోళన మొదలయింది..రోజుకో ప్రాంతంలో దాడులు చేస్తుండడంతో అక్రమార్కులు తమ గుట్టుబయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది...కాని ఇప్పటికే ఏసీబీ వద్ద ఎందరివో అవినీతి డేటా ఉన్నట్లు సమాచారం.

మహారాష్ట్రలో 29 వేల కరువు ప్రాంతాలను ప్రకటించిన ప్రభుత్వం

ముంబై : మహారాష్ట్రలో 29 వేల కరువు ప్రాంతాలను ప్రభుత్వం ప్రకటించింది. 

సినీ నటుడు గిరిబాబు సతీమణి కన్నుమూత

హైదరాబాద్ : సినీ నటుడు గిరిబాబు సతీమణి ఎర్ర శ్రీదేవి కన్నుమూశారు. కొంత కాలంగా శ్రీదేవి కిడ్ని వ్యాధితో బాధపడుతున్నారు. ఆమె భౌతికకాయాన్ని ప్రకాశం జిల్లా రావినూతలకు తరలించనున్నారు.  

 

09:47 - May 12, 2016

హైదరాబాద్ : తెలంగాణాలో అధికార పార్టీ నేతలను ఊరిస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీ మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్లీనరీకి ముందు కొన్ని పదవుల్ని భర్తీ చేసిన కేసీఆర్‌..ప్రస్తుతం వాటికి తాత్కాలికంగా బ్రేక్ వేశారు. సెంటిమెంట్‌లకు ఎక్కువ ప్రాధాన్యత నిచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్‌..ఇప్పుడు మంచి రోజులు లేనందున తర్వాత భర్తీ చేయనున్నారని సమాచారం.

గులాబీ నేతల్లో ఆశలు నింపుతున్న నామినేటెడ్ పదవులు...
గులాబీ నేతల్లో రెండేళ్లుగా ఆశలు నింపుతున్న నామినేటెడ్ పదవుల వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రావడం లేదు. దాదాపు 4వేల పదవులు కార్యకర్తలకు దక్కే అవకాశం ఉందని పార్టీ అధినేత కేసీఆర్‌ స్వయంగా ప్రకటన చేయడంతో నేతలు పదవులపై గంపెడాశలు పెట్టుకున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉండే పదవులు ప్లీనరీ నాటికి భర్తీ చేస్తామన్న సంకేతాలను అధికార పార్టీ కీలక నేతలు ఇచ్చారు. కానీ ప్లీనరీకి ముందు నామమాత్రంగా మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకంతో పాటు..రాష్ట్ర పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్న నేతలంతా త్వరలో తమకు పదవులు దక్కుతాయని ఆశపడ్డారు. దీంతో పార్టీ కీలక నేతలను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు పోటీ పడ్డారు. దాదాపు ఆరు నెలలుగా పార్టీలో ఈ తంతు ఓ వైపు జరుగుతూనే ఉంది. అయితే కొన్ని పదవులు మాత్రమే ప్లీనరీకి ముందు భర్తీ చేయడంతో ప్లీనరీ అనంతరం పదవులు దక్కడం ఖాయమని నేతల్లో ధీమా కూడా కనిపించింది. కానీ పార్టీలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలతో పదవుల భర్తీ మరింత జాప్యం కాక తప్పదనే సంకేతాలు ఇస్తున్నట్లు నేతలు అంటున్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌ సెంటిమెంట్‌లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని నేతలు బలంగా నమ్ముతారు. దీని కారణంగానే మరో 3 నెలల పాటు నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియకు బ్రేక్‌ పడిందని తెలుస్తోంది. అంతేకాదు..మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు కూడా అప్పుడే ఉంటుందని పార్టీ నేతలు అంటున్నారు.

పదవుల భర్తీపై నేతల్లో ఉత్కంఠ....
దీంతో పదవుల భర్తీ ఎప్పుడు ఉంటుందోనన్న ఉత్కంఠ నేతల్లో మరో సారి మొదలైంది. పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్న నేతలు మాత్రం నైరాశ్యంలో కనిపిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు పూర్తయినా పదవులు దక్కకపోవడం నేతలను అయోమయానికి కూడా గురిచేస్తోంది.

ఎమ్మెల్యే సున్నం రాజయ్య వాహనాన్ని అడ్డుకున్న ఎన్నికల పరిశీలకుడు

ఖమ్మం : రూరల్ మండలం గొల్లపాడులో సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య వాహనాన్ని ఎన్నికల పరిశీలకుడు అడ్డుకున్నారు. వాహనానికి అనుమతి లేదని ఆపారు. వాహనానికి అనుమతి ఉందని చెప్పినా అధికారులు వినలేదు. సున్నం రాజయ్య వాహనాన్ని వదిలేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. టీఆర్ ఎస్ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నా... ఎన్నికల పరిశీలకుడు పట్టించుకోవడం లేదని రాజయ్య ఆవేశదన వ్యక్తం చేశారు. 

09:41 - May 12, 2016

హైదరాబాద్  : తెలంగాణాలో ఇవాళ జరగనున్న టీఎస్ ఈసెట్ -2016 పరీక్షకు సెట్ కోడ్ వై2ను ఎంపిక చేశారు. కూకట్ పల్లిలోని జె.ఎన్.టి.యు లో తెలంగాణా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ సెట్ కోడ్ ను ఎంపిక చేశారు. రాష్ట్రంలోని 7 ముఖ్య పట్టణాలలో 8 రీజినల్ సెంటర్లు ఏర్పాటు చేసామని ఆయన తెలిపారు. పరీక్షకు 26,994 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని వారందరి కోసం 54 పరీక్ష కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసామని అన్నారు. పరీక్ష విధులను ప్రభుత్వ ఉద్యోగులు నిర్వహించనున్నారని చెప్పారు. నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను లోనికి అనుమతించబోమని తెలిపారు.

నేడు గుంటూరు జిల్లాలో ఎపి మంత్రులు పర్యటన

గుంటూరు : ఎపి మంత్రులు దేవినేని ఉమా, అయ్యన్నపాత్రుడు, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబు నేడు జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొననున్నారు. 

09:34 - May 12, 2016

కర్నూలు : తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కర్నూలులో వైసీపీ తలపెట్టిన దీక్ష సక్సెస్ అవుతుందా ? దీక్ష కంటే ముందు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోవడం జగన్ కు ఇబ్బందికరంగా మారిందా..? జిల్లా అధ్యక్షుడు సైతం అధికారపార్టీ తీర్థం పుచ్చుకోవడంతో జగన్ దీక్షను లీడ్ చేసే నేతలు కరువయ్యారా..టీ సర్కార్ ప్రాజెక్టుల నిర్మాణంపై చంద్రబాబును ఇరకాటంలో పెట్టాలన్న జగన్ వ్యూహం ఎంత మేరకు వర్క్ అవుట్ అవుతుంది. తెలంగాణలో పలు ప్రాజెక్టులు , ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంపై వైఎస్ జగన్ దీక్షకు పిలుపునిచ్చారు. పార్టీ ఫిరాయింపులతో వైసీపీ సైతం సతమతమవుతోంది. మరికొందరూ పార్టీ మారతారనే ప్రచారంతో జగన్ ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వంపై ఒత్తడి చేసే కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు జగన్.

పాలమూరు డిండి ప్రాజెక్టులకు వ్యతిరేంగా జగన్ దీక్ష....
మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు, నల్లగొండ జిల్లాలోని డిండి ప్రాజెక్టుల నిర్మాణాలకు వ్యతిరేకంగా ఈ నెల 16, 17, 18 తేదీలలో కర్నూలులో జగన్ దీక్ష చేయాలని నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులను అక్రమంగా నిర్మిస్తున్నా.. చంద్రబాబు ఎందుకు నోరు మెదపడంలేదని మండిపడుతున్నారు వైసీపీ నేతలు.

దీక్షకు ముందే జగన్‌కు కర్నూలు జిల్లా వైసీపీ నేతలు షాక్ ...
అయితే దీక్షకు ముందే జగన్‌కు కర్నూలు జిల్లా వైసీపీ నేతలు షాక్ ఇచ్చారు. ఇప్పటికే భూమానాగిరెడ్డి ఫ్యామిలీతో పాటు మరో ఎమ్మెల్యే మణిగాంధీ అధికార పార్టీలో చేరడంతో కర్నూలు వైసీపీ నేతలు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. ఇక తాజాగా కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి టీడీపీ లో చేరిపోయారు. ఎప్పటినుంచో పార్టీ మారాలని చూస్తున్న నేతలకు ఈ జగన్ దీక్ష అస్తంగా మారింది. దీనిపై తమకు సమాచారం లేదన్న అసంతృప్తితో ఎమ్మెల్యేలు కండువా మార్చేశారు.

నాయకులు కరవయ్యారన్న ఆందోళనలో వైసీపీ...
మహబూబ్ నగర్ జిల్లాకు పక్క జిల్లా కర్నూల్ కావడంతో దీక్ష ప్రాంగణాన్ని ఎంచుకున్నారు జగన్. అయితే ఎమ్మెల్యేల ఫిరాయింపులతో జగన్ దీక్షను లీడ్ చేసే నాయకుడు కరువయ్యారన్న ఆందోళన వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. దీంతో తాజాగా జగన్ దీక్షను విజయవంతం చేసే బాధ్యతను ఆ జిల్లాకు చెందిని ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీసుకున్నారు. అయితే అనుకున్న స్థాయిలో దీక్షకు రాకపోతే ఎంటన్న ప్రశ్న జగన్ ను ఆందోళనకు గురిచేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చేపడుతున్న దీక్షతో చంద్రబాబును ఇరకాటంలోకి నెట్టాలని ఆలోచిస్తున్నారు జగన్. అయితే ప్రతికూల పరిస్థితుల్లో జగన్ చేయబోతున్న మూడు రోజుల దీక్ష ఎంతమేరకు విజయవంతం అవుతుందో చూడాలి. 

బ్రిడ్జి పైనుంచి కిందపడిన ఆయిల్ ట్యాంకర్.. డ్రైవర్ మృతి

వరంగల్ : ఉర్సు బైపాస్ రోడ్డులోని ఫ్లైఓవర్ బ్రిడ్జి పైనుంచి ప్రమాదవశాత్తు ఆయిల్ ట్యాంకర్ కింద పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా క్లీనర్ తీవ్రంగా గాయపడ్డాడు. 

పిడుగుపాటుకు ఇద్దరు గొర్రెల కాపరులు మృతి

విజయనగరం : జిల్లాలోని సాలూరు మండలం జీగిరాం వద్ద ఈరోజు తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. పిడుగు పడి ఇద్దరు గొర్రెల కాపరులు అక్కడికక్కడే మృతిచెందారు.

సికింద్రాబాద్‌ - గౌహతి మధ్య మరో 8 ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌ : వేసవి కాలంలో ప్రయాణికుల అదనపు రద్దీని తట్టుకోవడానికి సికింద్రాబాద్‌ - గౌహతి మధ్య మరో 8 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణమధ్యరైల్వే ముఖ్యప్రజాసంబంధాల అధికారి ఎం.ఉమాశంకర్‌ కుమార్‌ తెలిపారు. ఈ రైళ్లు... ప్రత్యేక చార్జీలతో నడుస్తాయి. సికింద్రాబాద్‌-గౌహతి స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07149) జూన్‌ 3, 10, 17, 24వ తేదీల్లో (శుక్రవారం) ఉదయం 7.30 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరి, ఆదివారం ఉదయం 8.45 గంటలకు గౌహతికి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో...

09:22 - May 12, 2016

హైదరాబాద్ : ఇవాళ తెలంగాణ మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు అక్కడే ఉండి కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఆర్మూర్‌ నుంచి నిర్మల్‌ మీదుగా ఆదిలాబాద్‌కు రైల్వే లైన్ నిర్మాణం, సిమెంటు కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా యూనిట్‌ పునరుద్ధరణతో పాటు పలు అంశాలపై మంత్రులతో చర్చలు జరపనున్నారు.

09:18 - May 12, 2016

విజయవాడ : వివాహేతర సంబంధం ఒకరి ప్రాణం బలితీసుకుంది. ఎ.కొండూరులో భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో భూక్యాజాను  అనే వ్యక్తిని నాయర్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. అడ్డుకోవటానికి ప్రయత్నించిన భార్యను, కుమారుడిపై కూడా కత్తితో దాడి చేశాడు. దీంతో భూక్యాజాను మృతి చెందాడు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.  తీవ్ర గాయాలయిన భార్య, కుమారుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.  హత్యకు పాల్పడిన నాయర్ పరారీలో వున్నాడు. భార్యపై అనుమానం పెంచుకున్న నాయర్ కుటుంబానికి భూక్యాజా కుటుంబానికి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలోనే నాయర్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని..

కృష్ణా : తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆగ్రహించిన భర్త భూక్యాజా కుటుంబంపై దాడి చేశాడు. ఈ ఘటన జిల్లాలోని ఎ.కొండూరులో చోటు చేసుకుంది. ఈ దాడిలో భూక్యాజా మృతి చెందగా ఇద్దరికి కత్తిపోట్లకు గురయ్యారు. 

09:00 - May 12, 2016

ఢిల్లీ  : మహిళా హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్‌ అనుకున్నది సాధించారు. తన భూమాత బ్రిగేడ్‌ సభ్యులతో కలిసి ముంబయిలోని హజీ అలీ దర్గాలో ప్రవేశించారు. గతంలో దేవాలయాల్లో మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధానికి వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించిన తృప్తి దేశాయ్‌... ఇప్పుడు హజీ అలీ దర్గాలో ఎంటరయ్యారు. గత నెల 28న ఈ దర్గాలో ప్రవేశించేందుకు చేసిన ప్రయత్నం విఫలమయ్యింది. తృప్తి దేశాయ్‌ని కమిటీ సభ్యులు, పోలీసులు అడ్డుకున్నారు. ఈ దర్గాలో మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని తృప్తి ఆందోళన చేస్తున్నారు. గురువారం ఉదయం భూమాత బ్రిగేడ్‌ సభ్యులతో కలిసి దర్గాలో ప్రవేశించారు. పోలీసులు దగ్గరుండి దర్గాలోకి తీసుకెళ్లారు. అయితే బాబాల సమాధుల దగ్గరకి మాత్రం తృప్తి దేశాయ్‌ బృందాన్ని అనుమతించలేదు.

08:44 - May 12, 2016

విజయవాడ : రోజుకు 12 గంటల పని... అరకొర సౌకర్యాలు, రేకుల డబ్బాలాంటి షెడ్‌లో నివాసం... అటు రోజంతా పని.. మరోవైపు ఎండ వేడి. కార్మికుల సంక్షేమమే మా ధ్యేయమంటూ.. చెప్పుకునే బాబు సర్కార్... వెలగపూడిలో కార్మికులకు కల్పిస్తున్న సౌకర్యాలు ఇవి. కనీస సౌకర్యాలు కూడా లేకుండా దుర్భర పరిస్థితుల్లో పనిచేస్తున్న కార్మికుల స్థితిగతులపై ప్రత్యేక కథనం..
కోటలు దాటుతున్న సర్కారు మాటలు....
అత్యాధునిక రాజధాని నిర్మాణమంటారు... సకల సౌకర్యాలంటూ ఊదరగొట్టేస్తారు.. లేటెస్ట్ టెక్నాలజీ.. ఇంటర్నేషనల్ కంపెనీలు.. ఇవన్నీ పైపై మాటలే అని తేలిపోతోంది. చంద్రబాబు సర్కార్ మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయన్న సంగతి అక్కడ సౌకర్యాలు చూస్తే ఇట్టే తెలిసిపోతుంది అవన్నీ ఉత్తుత్తి మాటలేనని. శరవేగంగా రాజధాని నిర్మాణం కోసం.. యూపీ, బీహార్, జార్ఖండ్ నుంచి తీసుకొచ్చిన కార్మికులు పడరాని పాట్లు పడుతున్నారు. పొట్టకూటి కోసం వచ్చిన వీరు ఇరుకిరుకుగా ఉన్న ఐరన్‌ షెడ్లలోనే సర్దుకోవాల్సి వస్తోంది. ఎర్రటి ఎండల్లో ఇనుప రేకులతో తాత్కాలికంగా నిర్మించిన షెడ్డూల్లోనే వారి బస. ఒక్కో గదిలో 10 నుంచి 15 మంది వరకు ఉండాల్సి ఉంటుంది.

ఒక్కో రేకుల షెడ్డులో 10నుంచి 15 మంది కార్మికులు....
తాత్కాలిక సచివాలయం నిర్మాణం కోసం ఎల్ అండ్ టి సంస్థలో 800 మంది కార్మికులు, షాపుర్ జీ పల్లోంజీ సంస్థలో మరో 400 మంది కార్మికులు పని చేస్తున్నారు. ఇంత మందికి కనీసం మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేయకపోవడం దారుణం. దీంతో పాటు రోజు 8 గంటల పని కాకుండా వీరితో షిప్ట్ కు 12గంటల వరకు పనిచేయిస్తున్నారు. దీనికి తోడు రేకుల షెడ్డులో ఎండ వేడితో... కార్మికుల పాట్లు అన్నీ ఇన్నీ కావు. దీంతో పాటు ఒకవేళ ఎవరైనా కార్మికుడు ప్రమాదవశాత్తు చనిపోతే, వారికి ఇన్సురెన్స్ వంటి సదుపాయాలు కల్పించడం లేదు. ఇప్పటికే తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనుల్లో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. గత నెలలో చనిపోయిన వ్యక్తి కనీసం నష్టపరిహారం ఇవ్వకుండా చేతులు దులిపేసుకున్నారు.

కార్మికులకు కనీస వసతులు కల్పించాలి : సీపీఎం
తాజాగా జరిగిన దుర్ఘటనపై సిపియం నాయకులు పోరాటం చేస్తే , ఎల్ అండ్ టీ ఇచ్చే నష్టపరిహారం, ఇన్సూరెన్స్ ,ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం , లేబర్ డిపార్ట్ మెంట్ ఇచ్చే నష్టపరిహారం వంటి వాటిని అందజేశారు.. ఎవరు ప్రశ్నించకపోతే , చనిపోయిన వారి శవాలను కూడా మాయం చేసేలాగా సంస్థలు ప్రవర్తిస్తున్నాయని నాయకులు విమర్శిస్తున్నారు. కార్మికులకు కనీస వసతులు కల్పించాలని, కార్మిక చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న వామపక్ష నాయకులు చేసిన పోరాటాలపై పోలీసులు జులుం చూపించారు. విచక్షణా రహితంగా సిపియం నాయకులపై లాఠీచార్జీ చేశారు. కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకోవడానికి వచ్చిన ఎమ్మెల్సీ బృందాన్ని సైతం అడ్డుకున్నారు. రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చిన కార్మికులను కనీస వసతులు కల్పించి ,వారి శ్రమకు తగ్గ జీతం ఇవ్వడం అనేది న్యాయమైనది. ఇప్పటికైనా పాలకులు, కంపెనీ ప్రతినిధులు కార్మికులు డిమాండ్లును వెంటనే పరిష్కరించాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

హైదరాబాద్ పాతబస్తీలో పోలీసులు కార్డన్ సెర్చ్

హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీ, ఫలక్ నుమా ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 16మంది రౌడీషీటర్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్ కి తరలించారు. సౌత్ జోన్ డీసీపీ వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దాదాపు 400 మంది పోలీసులు పాల్గొన్నారు.

 

నెల్లూరు జిల్లాలో స్వల్ప భూకంపం..

నెల్లూరు : జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఉదయగిరి, వింజమూరు, దుత్తలూరు, వరికుంటపాడు మండలాల్లో 4 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు.

08:19 - May 12, 2016

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కడప నుండి వస్తున్న లారీ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో భారత్ గార్డెన్ వద్ద ఆగివున్న మరో లారీని ఢీకొంది. అనంతరం ఈ రెండు లారీలు రోడ్డు పక్కన ఆగివున్న బైక్ బైక్ ఢీకొన్నాయి. దీంతో లారీలోని ముగ్గురు వ్యక్తులు, బైక్ పై ఉన్న వ్యక్తి మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని గాయపడిన వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మృతుల్లో కొందరు అనంతపురం జిల్లా వాసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఫలక్‌నుమాలో పోలీసుల నిర్బంధ తనిఖీలు

హైదరాబాద్ : ఫలక్‌నుమా పరిధిలో తెల్లవారుజామున పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. దక్షిణ మండల డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో 200 మంది పోలీసులు పాల్గొన్నారు. విస్తృత తనిఖీలు జరిపి సోదాలు చేపట్టిన పోలీసులు 16 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా సరైన ధ్రువపత్రాలు లేని 60 ద్విచక్రవాహనాలు, 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు.

08:04 - May 12, 2016

అశోక్‌రాయల్‌, అవంతిక, కీర్తిక హీరో హీరోయిన్లుగా సాయి సింధు క్రియేషన్స్ పతాకంపై పులి అమృత్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'సింధూర'. బుధవారం హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో ఈ చిత్రం ప్రారంభమైంది. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన తొలి షాట్‌కు తెలంగాణ మండలి చైర్మన్‌ కనకమామిడి స్వామిగౌడ్‌ క్లాప్‌నివ్వగా, మామిడి హరికృష్ణ కెమెరా స్విచాన్‌ చేశారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత పులి అమృత్‌ మాట్లాడుతూ..'నూతన నటీనటులతో తెరకెక్కిస్తున్న నా పదవ చిత్రమిది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ను 25 రోజుల పాటు బాచుపల్లిలో తొలి షెడ్యూల్‌ను నిర్వహిస్తాం. ఈ చిత్రం ద్వారా అమర్‌నాథ్‌, విశ్వనాథ్‌లను సినిమాటోగ్రాఫర్స్ గా పరిచయం చేస్తున్నాం' అని చెప్పారు. 'ప్రపంచానికి మంచి సందేశం ఇచ్చే రంగం సినిమానే. కళకు హద్దులు లేవు. దర్శకుడు పులి అమృత్‌కి పది సినిమాలు చేసిన అనుభవం ఉంది. ఈ సినిమా విజయవంతమై చిత్రయూనిట్‌కు మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాను' అని స్వామిగౌడ్‌ అన్నారు. 'దర్శక,నిర్మాత అమృత్‌ మంచి స్క్రిప్ట్ సిద్ధం చేశారు. ఐదు నెలల్లో సినిమాని పూర్తి చేసి ప్రేక్షకులకు అందిస్తాడని భావిస్తున్నాను' అని మామిడి హరికృష్ణ చెప్పారు. 'కామెడీ, హర్రర్‌ మిక్స్ చేసిన సినిమా ఇది. ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మ్యూజిక్‌కి మంచి స్కోప్‌ ఉంది' అని సంగీత దర్శకుడు సాకేత్‌ సాయిరామ్‌ అన్నారు.

 

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ...

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. 25 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6గంటలు, ప్రత్యేక ప్రవేశదర్శనానికి 2గంటలు, కాలినడక భక్తులకు 3గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 71,185 మంది భక్తులు దర్శించుకున్నారు.

07:58 - May 12, 2016

టైగర్‌ షరాఫ్‌, శ్రద్ధాకపూర్‌ జంటగా నటించిన చిత్రం 'బాఘీ'. ఇటీవల విడుదలైన ఈచిత్రం ఘనవిజయం సాధించి 100 కోట్ల క్లబ్‌కి చేరువలో ఉంది. ఈ నేపథ్యంలో ఈచిత్రానికి సీక్వెల్‌గా 'బాఘీ2' చిత్రాన్ని రూపొందించేందుకు దర్శక, నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ చిత్రానికి సీక్వెల్‌ తీస్తే బాగుంటుందని, దాని షూటింగ్‌ కూడా చైనాలో చిత్రీకరించాలని దర్శక, నిర్మాతలు సబీర్‌ఖాన్‌, సాజిద్‌ నడియడ్‌వాలాను చైనా ప్రభుత్వం కోరింది. చైనా ప్రభుత్వం కోరినట్లుగానే 2017 నుంచి 'బాఘీ2' చిత్రం షూటింగ్‌ షాంఘైలో ప్రారంభం కానుంది. అలాగే ఈచిత్రం కోసం కథానాయకుడు టైగర్‌ చైనాలో మార్షల్‌ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకోనున్నాడు. టైగర్‌ షరాఫ్‌తోపాటు శ్రద్ధా కూడా శిక్షణ తీసుకోనుందని దర్శక, నిర్మాతలు తెలిపారు. 

07:54 - May 12, 2016

హైదరాబాద్ :  ఏపీ తాత్కాలిక రాజధాని వెలగపూడిలో కార్మికులపై పని ఒత్తిడి పెంచుతున్నారని వక్తలు పేర్కొన్నారు. రాజధాని నిర్మాణ ప్రదేశంలో కార్మికుడి మృతికి నిరసనగా సీపీఎం నేతల ఆందోళన నేపథ్యంలో వారిని అరెస్ట్ చేయటం సరికాదన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన ఈనాటి న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో గౌతమ్ (ఏపీ పీసీసీ అధికార ప్రతినిధి ), రామకృష్ణ ప్రసాద్ (టీడీపీ నేత), ముజఫర్ అహ్మద్ (సీఐటీయూ నేత) పాల్గొని మాట్లాడారు.కార్మికులపై పని ఒత్తిడి పెంచుతున్నారనీ..ఇది కార్మిక చట్టాలకు విరుద్ధమన్నారు. కార్మిక చట్టాలను అమలు పరిచి తీరాలన్నారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

07:35 - May 12, 2016

ఛార్మి ప్రధాన పాత్రధారిణిగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన 'జ్యోతిలక్ష్మి' చిత్రాన్ని రచయిత్రి మంగళగౌరీ విమర్శనాత్మకంగా పుస్తక రూపంలో రాశారు. ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తనికెళ్ళభరణి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'పీహెచ్‌.డీ చేయదగిన స్థాయిలో మంగళగౌరీ ఈ పుస్తకాన్ని రాశారు. ఈ సినిమాకు కావ్యగౌరవం కల్పించిన మంగళగౌరీ అభినందనీయురాలు. 'ఇట్లు..శ్రావణీ సుబ్రమణ్యం' చిత్రంలోని డైలాగులు చూసొచ్చి, నేను సినిమా చేస్తే డైలాగులు మీరే రాయాలని పూరి దగ్గర మాట తీసుకున్నాను. ఉత్తమ సంభాషణలకుగాను ఆ చిత్రం నంది అవార్డును కైవసం చేసుకుంది. 'అనుకోకుండా ఒక రోజు', 'జ్యోతిలక్ష్మి' చిత్రాలు ఛార్మీ కెరీర్‌లో నిలిచిపోతాయి. ఇదే కాంబినేషన్‌లో 'జ్యోతిలక్ష్మి పార్ట్ 2' కూడా రావచ్చేమో' అని అన్నారు. 'పుస్తకంతో మొదలైన 'జ్యోతిలక్ష్మి' సినిమా పుస్తకంతోనే ముగుస్తుంది. 
 ఈ సినిమాను పూరిగారు ఎంతో స్ఫూర్తితో రూపొందించారు. ఈ సినిమా తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినా జ్యోతిలక్ష్మి అని పిలుస్తున్నారు' అని కథానాయిక ఛార్మి చెప్పారు. 'మల్లాదివారితో మాట్లాడిన తర్వాతే పూరి ఈ చిత్రాన్ని చేశారు. ఆధునిక కన్యాశుల్కం అని నేను జ్యోతిలక్ష్మి గురించి చెబుతాను. ఈ సినిమా చూసిన ప్రతి పురుషుడు చాలా నేర్చుకోవాలి. తమ భార్యలో ఉన్న గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి. వారిని ప్రోత్సహించాలి. ఈచిత్రంలోని క్లైమాక్స్‌ నన్ను కదిలించింది. భవిష్యత్‌లోనూ పూరిజగన్నాథ్‌ చిత్రాల గురించి, ఛార్మి గురించి పుస్తకాలు రాయాలనుకుంటున్నాను' అని రచయిత్రి మంగళగౌరీ అన్నారు. ఈ కార్యక్రమంలో టార్జన్‌, గాయత్రి, అపూర్వ, సునీల్‌కశ్యప్‌, శాండీ, పి.జి.విందా, సత్యదేవ, ఆకాష్‌పూరి తదితరులు పాల్గొన్నారు. '40 సంవత్సరాల క్రితం మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన 'మిస్టర్‌ పరాంకుశం' కథను 20 ఏళ్ళ క్రితం నేను సినిమాగా తీయాలనుకున్నాను. ఏడేండ్ల కిందట ఛార్మితో కలిసి ఈ సినిమాను తీద్దామనుకున్నాను. ఫైనల్‌గా సినిమా తీశాం. ఈ క్రమంలో జరిగిన ప్రతి విషయంతోపాటు సినిమాపై మంగళగౌరీ పుస్తకం రాయడం చాలా ఆనందంగా ఉంది. దీంతో మా సినిమాపై మరింత గౌరవం పెరిగింది. ఛార్మి పాత్రను మధురవాణితో పోల్చడం మరింత సంతోషంగా ఉంది. ఈ పుస్తకానికి ముందుమాట రాసిన భరణిగారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. సినిమాపై పుస్తకం రాయడమనేది మా అందరికి ఓ స్ఫూర్తినిస్తుంది. అవార్డులు వచ్చిన దానికంటే చాలా ఆనందంగా ఉంది' అని వీడియో సందేశంలో పూరీజగన్నాథ్‌ తెలిపారు.

 

ఉన్నతాధికారులతో నేడు జీహెచ్‌ఎంసీ కమిషనర్ భేటీ..

హైదరాబాద్ : ప్రకృతి విపత్తుల నివారణకు చేపట్టాల్సిన చర్యలు, పరస్పర సహకారం, సమన్వయం తదితర అంశాలపై సుమారు 31శాఖల ఉన్నతాధికారులతో నేడు జిహెచ్‌ఎంసీ కమిషనర్ డా.జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన జిహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఓ ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఉదయం 8.45 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశం సందర్భంగా ప్రకృతి విపత్తుల సందర్భంగా చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించనున్నారు. 

నేడు హైదరాబాద్‌తో తలపడనున్న ఢిల్లీ...

హైదరాబాద్‌ : ఐపీఎల్‌-9లో భాగంగా నేడు హైదరాబాద్‌ సన్‌ రైజర్స్ తో ఢిల్లీ డేర్‌డేవిల్స్ తలపడనుంది. హైదరాబాద్‌ జట్టు పాయిట్స్ టెబులోలో ఇప్పటికే టాప్‌లో ఉండగా ఢిల్లీ జట్లు ఐదవ స్థానంలో ఉంది. ఢిల్లీకి నెట్‌ రన్ రేట్‌ మెరుగ్గ ఉండటంతో ఈమ్యాచ్‌లో ఎలాగైన గెలిచి మూడో స్థానానికి వెళ్లలని చూస్తుంది. రాత్రి 8.00గంటలకు హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడీయంలో మ్యాచ్‌ ప్రాంరభం కానుంది. 

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 25 కంపార్టుమెంట్లలో భక్తుల వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. నడకదారి భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది.

 

07:15 - May 12, 2016

విజయవాడ : రెండంకెల వృద్ధిరేటు సాధించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కష్టపడ్డారు. అధికారులను పరుగులు పెట్టించారు. గణనీయమైన అభివృద్ధిని సాధించామంటూ లెక్కలు చూపించారు. అయితే స్టేట్ గ్రోత్‌ రేట్‌లో చూపిన ఆ లెక్కలన్నీ సక్రమం కాదంటూ కేంద్రం తేల్చి చెప్పింది. ఇప్పుడా లెక్కలు అధికారుల తలకు చుట్టుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ పలు శాఖల్లో అద్భుతమైన ప్రగతి సాధించిందంటూ ప్రభుత్వం లెక్కలు తయారు చేసింది. అన్ని స్టేట్స్‌ మాదిరే ఏపీ ప్రభుత్వం కూడా లెక్కల చిట్టాను కేంద్రానికి పంపింది. ఆ ఎకౌంట్స్‌లో స్టేట్‌ గ్రాస్‌ డొమెస్టిక్‌ ప్రొడక్ట్‌ విలువను ఏకంగా 6.95 లక్షల కోట్ల రూపాయలుగా చూపించారు. అయితే ఆ ఎకౌంట్స్‌ను పరిశీలించిన కేంద్రం మాత్రం జిఎస్‌డిపి 6.26 లక్షల కోట్లేనని అంటోంది. 2014-15 సంవత్సరానికి సంబంధించిన జిఎస్‌డీపీలో ఏకంగా 50 వేల కోట్ల రూపాయలు అదనంగా చూపించారని కేంద్ర ఆర్థిక శాఖ చెబుతోంది.

ఇంత జిఎస్‌డీపీ ఎలా సాధ్యమైంది..?
రాష్ట్ర విభజన జరిగిన ఏడాదికే ఇంతలా జిఎస్‌డిపి ఎలా సాధ్యమైందని కేంద్రం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దీంతో సరైన లెక్కలు అడిగేందుకు సిద్ధమవుతున్నట్లు సామాచారం. దీంతో ఏపీ అధికారులు ఉలిక్కిపడుతున్నారు. కొందరి ఒత్తిళ్లతోటే ఇలా లెక్కలు తయారు చేయాల్సొచ్చిందని గుట్టు బయటపెడుతున్నారు.

తప్పుడు లెక్కల ప్రభావం చంద్రబాబుపై పడనుందా? ..
ఈ తప్పుడు లెక్కల ప్రభావం ముందు సిఎం చంద్రబాబుపైనే పడుతోంది. సర్కారులో ఏ తప్పు జరిగినా దాని ఎఫెక్ట్‌కు గురయ్యేది ఆయనే. ఈ నేపథ్యంలో ఫారిన్‌ టూర్‌ నుంచి తిరిగి రాగానే ఈ వ్యవహారంపై సమీక్ష చేసే అవకాశముంది. 17వ తేదీ మంత్రివర్గ సమావేశానంతరం ఢిల్లీ వెళ్లేందుకు వీలుగా ఆర్థిక, గణాంక శాఖల అధికారుల నుంచి నివేదికలు కోరుతున్నట్లు సమాచారం. మరీ అంకెల గోల్‌మాల్ వ్యవహారం ఎటు దారితీస్తుందో చూడాలి.

నేడు ఢిల్లీ వెళ్లనున్న మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న

హైదరాబాద్ : తెలంగాణ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై కేంద్రమంత్రులతో చర్చించనున్నారు. 

నేడు ఎపి వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ

ఢిల్లీ : రాజ్యసభలో కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు మద్దతు కోరుతూ నేడు ఎపి వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు.

 

06:59 - May 12, 2016

హైదరాబాద్  :ఇది కరవు కాలం. భారతదేశమంతటా కరవు విలయతాండవం చేస్తోంది. త్రిలింగ దేశంగా పేరొందిన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఘోరం. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. చుక్కనీరు లేక భూమాత గుండెచీల్చుకుంటోంది. అక్క పెళ్లి చూసేందుకు అమ్మతో కలిసి కాలినడకన బయలుదేరిన ఇద్దరు చిన్నారులు గుక్కెడు నీళ్లు దొరక్క, దాహం తీరక ఆదిలాబాద్ అడవుల్లో చనిపోయినతీరు హ్రుదయవిదారకం. త్రిలింగదేశంలో ఇలాంటి విషాదాన్ని ఎవరిమైనా ఊహించామా?

గుక్కెడు నీళ్ల కోసం అల్లాడుతున్న జనం....

అడవిలో ప్రయాణించే బాటసారులకే కాదు ఇంటికి వచ్చిన అతిథికీ కాళ్లు కడుక్కోవడానికి చెంబు నీళ్లు ఇవ్వలేని దుస్థితిలో చిక్కుకున్న కుటుంబాలెన్నో. వేసవి సెలవుల్లో ఇంటికి బంధువులొస్తున్నారంటే పట్టణవాసులు భయపడాల్సిన పరిస్థితిలో చిక్కుకున్నారు. నీళ్లకు ఖర్చు చేస్తున్న మొత్తం ఇంటి అద్దెను మించిపోతోందంటూ పట్టణప్రాంతాల్లో కొన్ని కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. కరువు కాలంలో నీళ్ల వ్యాపారం విరాజిల్లుతోంది.

40 ఏళ్లలో లేని కరువు.....

పల్లెల్లో ఎక్కడా పచ్చదనం లేదు. పంటల్లేవు. తెలంగాణలో మామిడితోటలు కూడా వెక్కిరిస్తున్నాయి. నేరేడు పండ్లూ కానరావడం లేదు. పశువులకు గడ్డిలేదు. తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్రల్లోని ఏ పల్లెలోనూ మేకలు గొర్రెలు కనిపించడం లేదు. ఎక్కడెక్కడికో వలసపోయారు. 40 ఏళ్లలో ఇంత కరువు ఎప్పుడూ చూడలేదంటున్నారు.

ఇంగుడు గుంతలంటూ నాయకుల హడావిడి.....

ఇంత కరవు వున్నప్పుడు ఏ ప్రభుత్వమైనా ఏం చేయాలి? నీళ్ల వ్యాపారాన్ని నిరోధించి వున్న నీళ్లను అందరికీ సమానంగా పంపిణీ చేయాలి. బీర్లు కూల్ డ్రింక్ కంపెనీలకు మంచి నీటి సరఫరాను బంద్ పెట్టాలి. పశువుల కోసం నీటి తొట్టిలు ఏర్పాటు చేయాలి. పనిదొరక్క, చేతిలో చిల్లిగవ్వలేక, కాలే కడుపులతో నకనకలాడుతున్నవారికి భోజన ఏర్పాట్లు చూడాలి. అది సాధ్యంకాకపోతే, కనీసం అంబలి కేంద్రాలైనా ఏర్పాటు చేయాలి. కానీ, అంబలి కేంద్రాల ఏర్పాటును ప్రభుత్వం చిన్నతనంగా భావిస్తోంది. ఇది ఇమేజ్ కోసం పాకులాడాల్సిన సమయం కాదు. కరవు కోరల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరినీ ఆదుకోవాల్సిన సమయం. గంజి పిల్లలకు, వ్రుద్ధులకు బాలింతలకు పాలపొడి, పోషకపదార్ధాలు అందించాలి. పంటలు పండక నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి. తుపాన్ లు, వరదలు సంభవించిన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఉడతాభక్తిగా ఇతోధిక సాయం చేస్తారు. ప్రభుత్వాలు ప్రత్యేక సహాయక శిబిరాలు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ సాయం అందిస్తాయి. మరి కరవు కాటకాలతో కుమిలిపోతున్న వారిని ఆదుకునే విషయంలో ఎందుకింత తాత్సర్యం. అసలు కరవును కప్పిపుచ్చే ప్రయత్నాలెందుకు? ఒకవైపు జనం నీళ్లో రామచంద్రా అంటూ కలవరిస్తుంటే, ఇంగుడు గుంతల పేరుతో ఇప్పుడు ఈ బాగోతాలేమిటి? జలాశయాల్లోనూ, భూగర్భంలోనూ ఉన్న కొద్దిపాటి నీళ్లను ఓ వైపు వ్యాపారులు విచ్చలవిడిగా తోడేస్తూ, అడ్డగోలుగా అమ్ముకుంటుంటే వాటిని నియంత్రించకుండా, ఇంకుడు గుంతల పేరుతో డ్రామాలడడం ఎవరిని మభ్యపెట్టడానికి? ఇప్పుడు ఇంకుడు గుంతల పేరుతో హడావిడి చేస్తున్న అపరభగీరధులంతా ఇంతకాలం ఏమైపోయారు? ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న మంచినీటి సమస్య అనావ్రుష్టి సగం కారణమైతే, ప్రభుత్వ విధానాలు సగం కారణం. అందుకే ప్రభుత్వాలు, సలహాదారులు తమ విధానాలు మార్చుకోవాలి. తక్షణం తీసుకోవాల్సిన చర్యల మీద ద్రుష్టి సారించాలి. 

06:53 - May 12, 2016

హైరదాబాద్  : తెలుగు ప్రజలు కరవు కష్టాల్లో కూరుకుపోయారు. నాయకులు పార్టీలు మారే పనిలో బిజీగా వున్నారు. పొట్ట చేతబట్టుకుని, పిడికెడు మెతుకుల కోసం జనం వలసపోతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీలు మార్చేస్తూ పాత కండువాలు పక్కనపడేసి, కొత్త కండువాలు కప్పుకుంటున్నారు. నీళ్ల వ్యాపారులు ఏం చక్క బిజినెస్ చేసుంటున్నారు. అపరభగీరధుల్లా ఇంకొందరు ఇంకుడుగుంతలు తవ్వుతున్నారు. మరి జనం కష్టాల గురించి ఆలోచించేందెవరు? కరవు కష్టాలకు పరిష్కారం ఏమిటి? రైతు సంఘం నాయకులు విశ్వేశ్వర రావు చర్చలో పాల్గొన్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

పసుపు బోర్డు ఏర్పాటు, మద్దతు ధరపై నేడు అధికారులతో ఎంపీ కవిత భేటీ

హైదరాబాద్ : పసుపు బోర్డు ఏర్పాటు, మద్దతు ధరపై నేడు అధికారులతో ఎంపీ కవిత భేటీ కానున్నారు.

 

ఈసెట్ (ఎఫ్ డీహెచ్)-2016 పరీక్షకు సెట్-వై2 కోడ్ విడుదల

హైదరాబాద్  : ఈసెట్ (ఎఫ్ డీహెచ్)-2016 పరీక్షకు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి సెట్-వై2 కోడ్ ను విడుదల చేశారు.  ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు టీఎస్ ఈసెట్ పరీక్ష జరుగనుంది. 

06:47 - May 12, 2016

హైదరాబాద్ : నగరంలోని హుక్కా సెంటర్లపై పోలీసులు చేసిన మెరుపు దాడిలో పలువురు మైనర్లు పట్టుబడ్డారు. పదవ తరగతి రిజల్ట్స్‌ వచ్చిన నేపథ్యంలో మైనర్లు హుక్కా సెంటర్లకు వెళ్ళినట్లు చాంద్రాయణగుట్ట పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసలు హుక్కా సెంటర్లపై దాడి చేశారు. 28 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. హుక్కా సెంటర్ల నిర్వాహకులను కూడా అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. పట్టుబడిన 28 మందిలో ఆరుగురు మైనర్లు ఉన్నారు. మైనర్ల తల్లిదండ్రులను పిలిపించిన పోలీసులు వారి ఎదుట మైనర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ రైడ్‌లో చాంద్రాయణగుట్ట అడిషనల్ ఇన్‌స్పెక్టర్ శంకర్, ఎస్‌ఐ చంద్రమోహన్ తదితరులు ఉన్నారు.

06:42 - May 12, 2016

విజయవాడ : ఏపీలో రాజకీయ వలసలకు ఇప్పట్లో బ్రేకులు పడేలా కన్పించడంలేదు. వైసిపి నుంచి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా కావలి వైసిపి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి టిడిపి తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. మరోవైపు అటు కాంగ్రెస్ నేతలు కూడా సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి కూడా పసుపు కండువా కప్పుకుంటానని ప్రకటించారు.

టీడీపీలో చేరనున్న కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి...
ఏపీలో వైసిపి నుంచి టిడిపిలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. కావలి వైసిపి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆ పార్టీకి ఝులక్‌ ఇచ్చి సైకిల్‌ స్వారీ చేసేందుకు రెడీ అవుతున్నారు. అందుకు మహూర్తం కూడా ఈనెల 18న ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మంత్రి నారాయణ, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిలను కలిసి పలుమార్లు చర్చించినట్లు సమాచారం. పార్టీ మార్పుపై చంద్రబాబు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే కావలి నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను టిడిపిలోకి వెళ్లేందుకు సిద్ధమైనట్లు రామిరెడ్డి స్పష్టం చేస్తున్నారు.

కాంగ్రెస్ నుండి కూడా టీడీపీలోకి వలసలు....
ఇదిలా ఉంటే అటు కాంగ్రెస్ నుంచి కూడా టిడిపిలోకి వలసలు ఊపందుకున్నాయి. ప్రకాశం జిల్లాలో కనిగిరి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కాంగ్రెస్ డిసిసి అధ్యక్షుడు ఉగ్రనరసింహారెడ్డి టిడిపి తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే అధికార పార్టీ నేతలతో సంప్రదింపులు కూడా పూర్తయ్యాయని సమాచారం. ఈయనతో పాటు మరికొంతమంది జిల్లా కాంగ్రెస్ నేతలు పసుపు కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే మరోవైపు కనిగిరి నియోజకవర్గానికి చెందిన టిడిపి నేతలు ఉగ్రనరసింహారెడ్డి పచ్చజెండా పార్టీలోకి వస్తే అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో టిడిపి నేతలను ఉగ్రనరసింహారెడ్డి ఇబ్బందులకు గురిచేశాడని నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తానికి రాష్ట్రంలో అధికారపార్టీ టిడిపిలోకి చేరేందుకు వైసిపి, కాంగ్రెస్‌ నేతలు క్యూ కడుతున్నారు. అయితే ఈ వలసల పర్వానికి ఎప్పుడు తెరపడుతందనేది చూడాలి. 

06:35 - May 12, 2016

ఖమ్మం : పాలేరులో అన్ని పార్టీలూ ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నాయి. కాంగ్రెస్‌ పట్ల ప్రజల్లో సానుభూతి కూడా ఉంది. కానీ ఈ సెంటిమెంట్ ఓట్లుగా మారుతాయా..? ఇప్పుడిదే హస్తం పార్టీలో టెన్షన్‌ పుట్టిస్తోంది. ఇప్పటికే అధికార పార్టీ అస్త్రశస్త్రాలను ఉపయోగిస్తుండటంతో.. పాలేరు గండం గట్టెక్కాలన్న దానిపై హస్తం పార్టీ నేతలు తర్జన భర్జన పడుతున్నారు.

వరుస ఓటములతో డీలా పడిన కాంగ్రెస్‌..
వరుస ఓటములతో డీలా పడిన కాంగ్రెస్‌.. పాలేరు ఉప ఎన్నికలో కొత్త ఆశలతో బరిలోకి దిగింది. రాంరెడ్డి వెంకటరెడ్డి అకాల మరణంతో వచ్చిన ఈ ఎన్నికలో గెలిచి.. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలన్న ఆశతో హస్తం పార్టీ ఉంది. ఈ క్రమంలోనే పొత్తులు, ఎత్తులతో స్పీడ్‌ పెంచింది. టీఆర్‌ఎస్‌ పాలిట్రిక్స్‌తో వైసీపీ దూరమైనా.. టీడీపీతో దోస్తీ కుదుర్చుకోవడంలో మాత్రం కాంగ్రెస్‌ సక్సెస్‌ అయింది. జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్న ఆ పార్టీకి ఇపుడో టెన్షన్‌ పట్టుకుంది.

గడప గడపకూ సుచరిత ప్రచారం....
విజయమే లక్ష్యంగా కాంగ్రెస్‌ నేతలందరూ పాలేరులో మోహరించారు. ప్రచారంలో గడపగడపకు వెళ్లి, అభ్యర్థి సుచరితారెడ్డి గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ప్రజలనుంచి లభిస్తున్న స్పందన చూసి మరింత జోష్‌ పెంచారు కాంగ్రెస్‌ నేతలు. మహిళల నుంచి వస్తోన్న ఆదరణను చూసి గెలుపు ఖాయమన్న ధీమాలో హస్తం పార్టీ ఉంది. గతంలో తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన తుమ్మల నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కావడంతో దాన్ని కూడా తమకు అనుకూలంగా మలచుకోవాలని భావిస్తోంది కాంగ్రెస్‌. ఓ వైపు తెలంగాణ సెంటిమెంట్, మరోవైపు మహిళా సెంటిమెట్‌తో పాటు రాంరెడ్డిపై ఉన్న సానుభూతి తమకు అనుకూలిస్తోందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అంతా బాగానే ఉన్నా.. పోల్‌ మేనేజ్‌మెంట్ మాత్రం హస్తం పార్టీ నేతలను వణికిస్తోంది. ఇప్పటికే అధికార పార్టీ పోల్‌మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టింది. ఇప్పటికే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను కారెక్కుంచుకున్న టీఆర్‌ఎస్‌... ప్రజాసంఘాలు, కుల సంఘాలతో కూడా మంత్రాంగం నడిపిస్తోంది. దీంతో పాటు కొన్ని గ్రామాల్లో గంపగుత్తగా ఓట్లు వేయించేందుకు.. తీర్మానాలు కూడా చేపిస్తున్నారు గులాబీ నేతలు. అధికార పార్టీ ధన ప్రవాహంతో పాటు ఓటర్లను ప్రలోబాలకు గురిచేస్తోందని ఆరోపిస్తున్న కాంగ్రెస్‌కు ఇప్పుడు ఆర్థిక కష్టాలు కూడా వెంటాడుతున్నాయి.

టీఆర్‌ఎస్‌ పవర్‌ పాలిటిక్స్‌తో దూకుడు.....
పోలింగ్‌ దగ్గర పడుతున్న కొద్దీ టీఆర్‌ఎస్‌ పవర్‌ పాలిటిక్స్‌తో దూకుడు పెంచుతుంటే.. కాంగ్రెస్‌ మాత్రం సానుభూతి, సెంటిమెంట్‌పై ఆశలు పెట్టుకుంది. ఇంతకి హస్తం పార్టీ ఆశలు పాలేరులో ఫలిస్తాయా...? సానుభూతి ఓట్లను తెచ్చిపెడుతుందా ? కాంగ్రెస్‌ గెలుపు జెండా ఎగురవేస్తుందా అన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది. 

రెండు లారీలు ఢీ...నలుగురు మృతి...

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రోడ్డులోపి భారత్ గార్డెన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న  రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని చేస్తున్నారు.

Don't Miss