Activities calendar

03 June 2016

22:01 - June 3, 2016

విజయవాడ : కేంద్రంనుంచి మరింత సాయం అందాల్సివుందన్నారు. బాబుఏపీకి కేంద్రంనుంచి మరింత సాయం అందాల్సి ఉందన్నారు... సీఎం చంద్రబాబు నాయుడు.. చట్టంలో పొందుపరిచిన హామీలు నెరవేరలేదని చెప్పుకొచ్చారు.. టీడీపీ వల్లే పోలవరం ప్రాజెక్టు కల సాకారమవుతోందని తెలిపారు.. విజయవాడలో రెండోరోజు నవ నిర్మాణదీక్షకు బాబు హాజరయ్యారు. విభజనతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. విశాఖ రైల్వే జోన్‌కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. 

21:53 - June 3, 2016

తమిళనాడు : కృష్ణగిరి సమీపంలో గల మేలుమళైలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సును వేరుశనగ లోడుతో వెళ్తున్న లారీ ఢీకొంది. ఈ దుర్ఘటనలో 17 మంది మృతిచెందారు. మరో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. మృతుల్లో చిన్నారితో పాటు ఆరుగురు మహిళలు ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కృష్ణగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతులు తమిళనాడులోని హోసూరు వాసులుగా గుర్తించారు. 

21:50 - June 3, 2016

మెదక్‌ : మల్లన్న సాగర్‌ ప్రాజెక్ట్‌ భూ నిర్వాసితులతో కలెక్టర్‌ చర్చలు జరపారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి రెండు గంటల పాటు కలెక్టర్‌ చాంబర్‌ లో సుదీర్ఘ చర్చ కొనసాగింది. కలెక్టర్‌తో జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేదంటున్న ముంపు గ్రామాల ప్రజలు పేర్కొన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు అంశంపై కొంతకాలంగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా శుక్రవారం మల్లన్న సాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాలలో ర్యాపిడ్ ఏక్షన్ ఫోర్స్ పోలీసులు భారీగా మోహరించారు. దీంతో గ్రామస్థులు భయాందోళనలకు లోనయ్యారు. కాగా గ్రామస్థులతో కలెక్టర్ రొనాల్డ్ రోజ్ సుదీర్ఘ చర్చలు జరిపారు. కానీ చర్చలలో ఎటువంటి పురోగతీ లేదని గ్రామస్థులు తెలిపారు. 123 జీవో ప్రకారమే భూముల సేకరణ జరుగుతందని కలెక్టర్ పేర్కొన్నట్లుగా గ్రామస్థులు తెలిపారు. కానీ స్వచ్ఛంధంగా భూములిచ్చే రైతులను ఆపవద్దని కలెక్టర్ నిగూఢంగా మాట్లాడినట్లు సమాచారం. ఈ భూ నిర్వాశితులకు సీపీఎం పార్టీ మద్ధతు తెలిపిన విషయం తెలిసిందే.

21:41 - June 3, 2016

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్‌ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గోదావరినదిపై నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌లకు సంబంధించి మహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పందానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సాగునీటి ప్రాజెక్ట్‌ల రీడిజైనింగ్‌ను ఆమోదముద్ర వేసింది. కృష్ణా, గోదావరి నదులపై ఏపీ ప్రభుత్వం ఆరోపణలపై ధీటుగా స్పందించాలని నిర్ణయించింది.

16 అంశాలపై కీలక నిర్ణయాలు ...
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్యక్షతన మూడున్నర గంటలపాటు జరిగిన మంత్రివర్గ సమావేశంలో 16 అంశాలపై కీలక నిర్ణయం తీసుకుంది. కోటి ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా చేపడుతున్న ప్రాజెక్ట్‌లపై విస్తృతంగా చర్చించింది. మహారాష్ట్ర అభ్యంతరాలు, నీటి లభ్యత, ఎక్కువ భూమిని సాగులోకి తెచ్చేందుకు వీలుగా రీడిజైనింగ్‌ చేస్తున్న ప్రాజెక్ట్‌పై ప్రతిపక్షాలు చేస్తున్నా అరోపణలు, విమర్శలను తిప్పికొట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రాణహిత-చేవెళ్ల, దేవాదుల-కంతనపల్లి, రాజీవ్‌సాగర్‌, ఇందిరాసాగర్‌, ఎస్‌ఆర్‌ఎస్‌పీ వరదకాల్వ ప్రాజెక్ట్‌ల రీడిజైనింగ్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఏపీ ప్రభుత్వంపై కేబినెట్‌ మండిపాటు..
కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణకు కేటాయించిన వాటాల ప్రకారం కడుతున్న ప్రాజెక్ట్‌లను ఏపీ ప్రభుత్వం రాజకీయం చేస్తుండటంపై కేబినెట్‌ మండిపడింది. అసత్యాలు, అర్ధరహిత వాదనలలో కేంద్రానికి లేఖలు రాస్తుండటంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం గట్టిగా స్పందించాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఏపీ ప్రభుత్వం చేస్తున్నవాదనల్లోని వాస్తవాలను కేంద్రంతో పాటు, కృష్ణాబోర్డు దృష్టికి తీసుకెళ్లేందుకు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఢిల్లీకి ప్రతినిధి బృందాన్ని పంపాలని నిర్ణయం తీసుకుంది. అవసరమైతే ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో కూడా మరో బృందం ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసే అంశంపై చర్చించింది. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలాల వారీగా టెండర్లు పిలవాలని నిర్ణయించింది. నిర్మాణ బాధ్యతలను స్థానికులకు అప్పగిస్తారు.

నిరుద్యోగుల సంఖ్య పెరిగటంపై ఆందోళన....
రాష్ట్రంలో అవసరానికి మించి ఉన్న ఇంజినీరింగ్‌, బీఈడీ, డీఈడీ కాలేజీలపై ఏమిచేయాలన్న అంశంపై కూడా మంత్రివర్గంలో చర్చించారు. తెలంగాణకు ఎంతమంది ఇంజినీర్లు, ఎంతమంది ఉపాధ్యాయులు అవసరమో అధ్యయనం చేసే బాధ్యలను విద్యాశాఖకు అప్పగించారు. ఉద్యోగావకాశాలు లేకున్నా... ఇంజినీరింగ్‌, బీఈడీ, డీఈడీ కాలేజీలతో ఏటేటా నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుండటంపై సమావేశంలో ఆందోళన వ్యక్తమయ్యింది. వరంగల్‌లో వ్యవసాయ, మామూనూరులో పశువైద్య కళాశాలల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మిషన్‌ కాకతీయలో భాగంగా పునరుద్ధిరించిన చెరువుల్లో చేపల పెంపకానికి అనుమతించిన మంత్రివర్గం... రాష్ట్రంలో మత్స్యశాస్త్ర కాలేజీని ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. మెదక్‌లో పెట్టుబడులు, ఉత్పత్తి మండలి, హైదరాబాద్‌లో ఫార్మా నిమ్జ్‌కు అవసరమైన భూసేకరణకు టీఎస్‌ఐఐసీకి 784 కోట్ల హడ్కో రుణానికి ప్రభుత్వ గ్యారంటీకి ఆమోదం ముద్ర లభించింది. సూక్ష్మనీటి పారుదలను ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖకు వెయ్యి కోట్ల రూపాయల నాబార్డు రుణానికి కూడా ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది.

నిర్లక్ష్యానికి గురైన దేవాలయాలకు పూర్వవైభవం...
దేవాలయాలకు సంబంధించి కూడా కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అర్చకులకు ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు చెల్లించేందుకు అవసరమైన విధానాన్ని రూపొందించేందుకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘాన్నిఏర్పాటు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన దేవాలయాలకు పూర్వవైభవం తీసుకురావాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఏటా పాతిక లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఆదాయం ఉన్న దేవాలయ కమిటీల్లో సభ్యుల సంఖ్యను 9 నుంచి 14కు పెంచారు. ఆలోపు ఆదాయం ఉన్న కమిటీల సభ్యుల సంఖ్యను మూడు నుంచి ఐదుకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

భూముల వివరాల సేకరణ బాధ్యతను రెవిన్యూశాఖకు అప్పగింత..
ఆహారశుద్ధి కార్మాగారాల ఏర్పాటు, శుద్ధి చేసిన ఆహారం నిల్వ చేసేందుకు శీతలగిడ్డంగుల నిర్మాణానికి అవసరమైన విధి విధానాల రూపకల్ప బాధ్యతలను మార్కెటింగ్‌ శాఖకు అప్పగించింది. కమతాల ఏకీకరణ, భూముల క్రమబద్ధీకరణ, ప్రభుత్వ శాఖల దగ్గర ఖాళీగా ఉన్న భూముల వివరాల సేకరణ బాధ్యతను రెవిన్యూశాఖకు అప్పగిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఆక్రమణలకు గురైన అసైన్డ్‌ భూములను గుర్తించే పనిని కూడా ఈ శాఖకే అప్పగించారు.

భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో వర్షం..

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది. పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్‌.ఆర్‌.నగర్‌, ఎర్రగడ్డ, సనత్‌నగర్‌, నాచారం, కాప్రా, మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, షేక్‌పేట తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. కొన్నిచోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

తెగిపడిన విద్యుత్‌ తీగలు..నిలిచిపోయిన రైలు..

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లా కమలాపూర్‌ మండలం దండేపల్లి వద్ద ఈదురుగాలులకు రైల్వే విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. దీంతో సిర్పూర్‌-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ దండేపల్లి వద్ద రెండు గంటలుగా నిలిచిపోయింది. రైలును డీజిల్‌ ఇంజిన్‌తో నడిపేందుకు రైల్వే అధికారులు ప్రయత్నిస్తున్నారు. రైలు గంటల తరబడి రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

20:53 - June 3, 2016

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం న్యూస్ మేకర్ఎవరూ అంటే కాపునేత ముద్రగడ అనే చెప్పవచ్చు. అన్ని రాజకీయ పక్షాలను కలుపుకుని మరోసారి కాపు రిజర్వేషన్ గురించి ఉద్యమానికి ముద్రగడ సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ముద్రగడతో టెన్ టీవీ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించింది. మరి ముద్రగడ మనసులో ఏమనుకుంటున్నారో ...భవిష్యత్ కార్యాచరణ ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి ...మరింత సమాచారాన్ని తెలసుకోండి...

20:49 - June 3, 2016

హైదరాబాద్: రాజకీయాల్లో ధనబలమే కొనసాగుతోందా..? కోట్లు పెట్టినవాళ్లకే సీట్లు దక్కుతున్నాయా..? రాజకీయాలు వ్యాపారంగా మారిపోయి.. సీట్లను అమ్ముకుంటున్నారా..? పెద్దల సభకు ఎన్నికవుతున్న వారిలో నాణ్యత కొరవడుతోందా..? ఇటీవల రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి ప్రశ్నలే సగటు పౌరున్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏపీ రాజ్యసభ సభ్యుల ఎంపిక తాజాగా అటు పార్టీల్లోనూ.. ఇటు ప్రజల్లోనూ చర్చకు దారితీస్తోంది...!

ఉమ్మడి రాష్ట్రంలో 18గా ఉన్న రాజ్యసభ స్థానాలు..
ఉమ్మడి రాష్ట్రంలో 18గా ఉన్న రాజ్యసభ స్థానాల సంఖ్య..రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు 11, తెలంగాణకు 7 గురు సభ్యులుగా విభజించారు. అయితే పెద్దలసభ శాశ్వత సభ కాబట్టి ప్రతి ఆరేళ్లకోసారి సభ్యుల సభ్యత్వం ఆటోమేటిక్‌గా రద్దవుతుంది. దీంతో ఆ ఏడాది సభ్యత్వం కోల్పోయే సభ్యుల ఎంపికకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి ఇద్దరు సభ్యుల ఎంపిక జరిగింది. ఏపీ నుంచి టీడీపీ తరపున సుజనాచౌదరి, టీజీ వెంకటేష్, సురేష్ ప్రభు, వైసీపీ నుంచి విజయసాయి రెడ్డిలు ఏకగ్రీవంగా రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. కానీ టీడీపీలో మాత్రం రాజ్యసభకు అభ్యర్థుల ఎంపిక వివాదాలకు దారి తీసింది.

వివిధ రంగాలకు చెందిన 12 మందిని రాజ్యసభకు నామినేట్‌...
మొత్తం 250 మంది సభ్యులుండే రాజ్యసభలో వివిధ రంగాలకు చెందిన 12 మందిని రాష్ట్రపతి నామినేట్‌ చేస్తారు. మిగతా సభ్యులను ఆయా రాష్ట్రాల శాసనసభ్యులు ఎన్నుకుంటారు. తాజాగా టీడీపీ నుంచి ముగ్గురు ఎన్నికైతే వారిలో ఇద్దరు వ్యాపారవేత్తలే. ఒకరు కేంద్ర మంత్రిగా ఉన్న సుజనాచౌదరి మరొకరు మాజీ మంత్రి టీజీ వెంకటేశ్. చంద్రబాబుకు సన్నిహితుడుగా ఉన్న సుజనాచౌదరి రెండోసారి రాజ్యసభకు ఎంపికయ్యారు. మారిషష్ బ్యాంకును మోసం చేసిన కేసులో ఆయనపై దర్యాప్తు నడుస్తోంది. దాంతో పాటు మరికొన్ని వ్యవహారాల్లో ఆయనపై ఆరోపణలున్నాయి. కానీ ఎన్నికల సమయంలో పార్టీ ఫండ్ సమకూర్చడం, చంద్రబాబుకు చేదోడు వాదోడుగా ఉండటం.. 2014 ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల ఖర్చు బాధ్యతలు తీసుకోవడంతో సుజనాకు బాబు మళ్లీ అవకాశం ఇచ్చారన్న వాదన సొంతపార్టీలో ఉంది.

సడెన్ ఎంట్రీ ఇచ్చిన టీజీ...
ఈసారి టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుల ఎంపికలో సడెన్‌గా తెరపైకి వచ్చిన పేరు టీజీ వెంకటేశ్‌ది. మాజీ మంత్రి అయిన టీజీ కాంగ్రెస్ నుంచి టీడీపీ గూటికి వచ్చారు. రాయలసీమ హక్కుల కోసం ప్రశ్నించే నాయకుడిగా ఆయనకు పేరుంది. రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూస్తానని టీజీ చెబుతున్నారు.

పార్టీ మారిన వారికే బాబు టిక్కెట్లిచ్చారని విమర్శ....
పార్టీలో కష్టపడ్డవారికి కాకుండా.. పార్టీ మారిన వారికే చంద్రబాబు టిక్కె‌ట్లిచ్చారని సొంత పార్టీలోనే ఆగ్రహం వెల్లువెత్తింది. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్ టీజీకి సీటు ఎలా కేటాయిస్తారంటూ కర్నూలులో రోడ్డుపైకే వచ్చారు. ఇలాగైతే టీడీపీకి అండదండగా ఉన్న బీసీలు పార్టీ మారడం ఖాయమంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు కూడా జారీ చేశారు. మొత్తానికి టీజీ ఎంపిక కర్నూలు టీడీపీలో తీవ్ర విబేధాలకు దారితీసింది. రానున్న నామినేటెడ్‌ పదవుల్లో బీసీలకు 50 శాతం పదవులు ఇవ్వకపోతే ఉద్యమం తప్పదంటున్నారు కేఈ.

జగన్ అక్రమాస్తుల కేసులో ఎ2 నిందితుడిగా విజయసాయిరెడ్డి...
ఇక వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన విజయసాయిరెడ్డి, జగన్ అక్రమాస్తుల కేసులో ఎ2 నిందితుడుగా ఉన్నారు. వైసీపీ నుంచి నెల్లూరుకు చెందిన వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మైసూరారెడ్డిలు కూడా రాజ్యసభ సీటు కోసం ప్రయత్నించారు. వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే ఈ విషయమై జగన్ కు కొంత ముట్టజెప్పారనే ప్రచారం కూడా నెల్లూరు జిల్లాలో ఉంది.. కానీ ఈ మధ్యనే వేంరెడ్డి టీడీపీలోకి చేరిపోయారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలతో నాలుగో సీటుకు స్కెచ్ వేశారనే ప్రచారమూ జరిగింది.

నాలగవ అభ్యర్థి హడావిడి చేసిన టీడీపీ ...
ఈసారి బలం లేకపోయినా నాలుగో సీటుకు అభ్యర్థిని నిలబెడతామంటూ టీడీపీ కొంత హడావిడి చేసింది.. కానీ చివరికి వెనక్కి తగ్గింది.. గతంలో రాజ్యసభ ఎన్నికల్లోనూ ఒక పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థికి వేరే పార్టీ ఎమ్మెల్యేలు ఓటు వేసిన సందర్భాలున్నాయి. ఈ మధ్యనే ఉత్తరాఖండ్‌కు సంబంధించి సుప్రీంకోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఇచ్చిన తీర్పు, అలాగే రాజ్యసభ ఎన్నికల్లో పార్టీవిప్‌కు చూపించి ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సి ఉంటుందన్న మరో తీర్పు నేపథ్యంలో టీడీపీ వెనక్కి తగ్గిందనే ప్రచారం జరుగుతోంది..! 

20:41 - June 3, 2016

తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు అందరికంటే మంచిగా హిజ్రాలు సంబురాలు చేస్కున్నరు. తీన్మార్ డాన్సులతో తెలంగాణ పండుగను దుమ్ములేపినరు. నేర్చుకోవాలని ఆశ వుండాలి గానీ వయసుతోని సంబందమేముంది అని నిరూపించనీకి రెడీగా వుంది..కరీంనగ్ జిల్లాలోని కోరుట్ల సత్తెమ్మ నిరూపించినాది. కొడుకులు అమెరికాలో వున్న తన పిల్లలతో మాట్లాడటానికి నేర్చుకుని ఇప్పుడు కంప్యూటర్ లో అన్ని విషయానలు తెలుసుకుందంట 50 సంవత్సరాల కోరుట్ల సత్తెమ్మ. తిరుమల కుంట ఊరోల్లు ప్రతీ ఐదేండ్లకోసారి వలస పోతారట రోజంతా అడవిలోన వుండి వంటలుచేస్కోనీ...తిని...తాగి ఎంజాయ్ చేస్తారట...మరి గిసువంటి ఎన్నో ముచ్చట్లు చెప్పనీకీ మన మల్లన్న ముచ్చట్లతో రెడీ గున్నాడు మరిన్ని ముచ్చట్లు తెలుసుకోవాలంటే ఈ వీడియోను ఒత్తండి...మరిన్ని ముచ్చట్లనుతెలుసుకోండ్రి...మరి జాగెతందుకు తొందరగా క్లిక్ చేయుండ్రి....

20:02 - June 3, 2016

ఢిల్లీ: రాజ్యసభను పెద్దల సభ అని కూడా అంటారు. దేశాభివృద్ధికి దోహదపడేలా చట్టాలు చేయడంలో రాజ్యసభ సభ్యుల సూచనలు అవసరమని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. ముప్పై ఏళ్లు నిండిన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పార్లమెంటులో ఉంటే.. దేశానికి సరైన దిశానిర్దేశం చేయగలరని రాజ్యాంగ నిపుణులు భావించారు. కానీ ఆ దిశగా సభ్యుల ఎంపిక జరగడం లేదని ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి.

శాసన నిర్మాణ ప్రక్రియలో రాజ్యసభది ప్రత్యేక పాత్ర...
భారత పార్లమెంటులోని ఎగువసభను రాజ్యసభ అంటారు. రాజ్యసభ అంటే రాష్ట్రాల సభ అని అర్థం. రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసనసభల సభ్యులు ఎన్నుకుంటారు. ఆర్థిక బిల్లు మినహా మిగతా బిల్లుల విషయంలో లోక్‌సభతో పాటు రాజ్యసభకూ ప్రాధాన్యత ఉంటుంది. శాసన నిర్మాణ ప్రక్రియలో రాజ్యసభకు కీలక పాత్ర ఉందన్నది ఎవరూ కాదనలేని వాస్తవం.

సభ్యుల ఎంపికలో తగ్గుతున్న ప్రామాణికత...
కీలకమైన పెద్దలసభకు సభ్యుల ఎంపికలో రోజురోజకు ప్రామాణికత తగ్గిపోతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎన్నికలే ఇందుకు నిదర్శనం. చాలా సమయాల్లో వ్యాపార వేత్తలు, కోటీశ్వరులు, ధనబలం ఉన్నవారే అందలమెక్కుతున్నారు. కేవలం సీటు కోసమే బేరసారాలాడి పార్టీలు మారుతున్నారనే విమర్శలు ఉన్నాయి. నిస్వార్థపరులు, నిజాయితీ, ప్రతిభ ఉన్న మేధావులు రాజ్యసభ ముఖం కూడా చూడటం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇందిరాగాంధీ హయాం నుంచే వ్యాపారవేత్తలకు అవకాశాలు కల్పించడం రివాజుగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌ హయాంలో గానీ, అంతకుముందు సీఎంలుగా పనిచేసినవారు గానీ రాజ్యసభ ఎంపికలో కొంత జాగరూకతతో వ్యవహరించేవారన్న పేరుంది. ఇప్పుడలాంటి పరిస్థితి కనిపించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

వ్యాపారవేత్తలకే రాజ్యసభ సీటు...
ఎన్టీఆర్ హయాంలో యలమంచిలి శివాజీ, సోలిపేట రామచంద్రారెడ్డి, యాళ్ల శశిభూషణ్ రావు, ప్రొఫెసర్‌ లక్ష్మన్న, రుమాండ్ల రామచంద్రయ్య లాంటి వారు సభ్యులుగా ఎంపికయ్యారు. కానీ చంద్రబాబు హయాం వచ్చే సరికి వ్యాపారవేత్తలే రాజ్యసభ సీట్లను దక్కించుకుంటున్నారు. సీఎం రమేష్‌, సుజనాచౌదరి, గరికపాటి రామ్మోహనరావు లాంటి వాళ్లే ఉదాహరణ. వీరు టీడీపీ నేతలే అయినప్పటికీ ప్రాథమికంగా వ్యాపారవేత్తలు.

కష్టపడేవారికి మెజారిటీ సీట్లు ఇచ్చే సంస్కృతి కాంగ్రెస్ ...
ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కొంత నయమనే చెప్పాలి. పార్టీలో కార్యకర్తగా ఆఫీసు వ్యవహారాలు చూసే రాపోలు ఆనందభాస్కర్‌ను నేరుగా రాజ్యసభకు ఎంపిక చేశారు. కానీ సుబ్బరామిరెడ్డి, గిరీష్‌ సంఘీ లాంటి వ్యాపార వేత్తలకు కూడా కాంగ్రెస్ అవకాశం కల్పించింది. అయినప్పనటికీ పార్టీ కోసం కష్టపడేవారికి మెజారిటీ సీట్లు ఇచ్చే సంస్కృతి కాంగ్రెస్ ఇంకా ఉందనే చెప్పాలి.

రాజ్యసభ సీట్లలో సినీ గ్లామర్...
జయప్రద, మోహన్ బాబు, చిరంజీవి, దాసరి నారాయణరావు వంటి సినీ తారలు కూడా రాజ్యసభ సీట్లు దక్కించుకున్నారు. వారిలో కొందరు మంత్రులు కూడా అయ్యారు. అయితే రాను రాను రాజ్యసభ సీట్ల ఎంపికలో ధనబలమే ప్రధాన పాత్ర పోషిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారవేత్తలు రాజ్యసభ సీటు దక్కించుకోవడానికి ఎలాంటి చర్యలకైనా పాల్పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ సభ్యుడి కంటే రాజ్యసభ సభ్యుడికి ప్రోటోకాల్ విషయంలో ఎక్కువ గౌరవం లభించడం, అలాగే దేశ వ్యాప్తంగా ఎవరినైనా నిలదీసే అధికారం ఉండటం, జీత భత్యాలు, ఆరేళ్ల పదవీకాలం, కేంద్ర విద్యా సంస్థల్లో ప్రత్యేక కోటా ఉండటం, తదితర కారణాలతో వ్యాపారాలు విస్తరించుకునే అవకాశం కూడా ఉండటంతో వ్యాపారులు రాజ్యసభ సీట్లపై కన్నేస్తున్నారు. పార్టీలు కూడా తమ అవసరాలను గుర్తు పెట్టుకుని పిలిచి మరీ సీట్లిచ్చిన సందర్భాలూ ఉన్నాయి.

వ్యాపారవేత్తలకు సీట్లివ్వటానికి అధికార, ప్రతిపక్షాలు రెడీ..
విజయ్‌ మాల్యా లాంటి బడా వ్యాపారవేత్తలు పోటీకి సిద్ధమైతే... అధికార, ప్రతిపక్ష పార్టీ అన్న తేడా లేకుండా మద్ధతివ్వడానికి రాజకీయ పార్టీలు సిద్ధమైతాయి. మొత్తానికి మన రాజకీయ నేతాశ్రీలే.. ధనబలంతో సీట్లు పొంది.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడవడం బాధాకరమన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి. 

19:49 - June 3, 2016

విశాఖ : జీవీఎంసీ కార్మికులు రోడ్డెక్కారు.. 279 జీవోను రద్దు చేయాలంటూ జీవీఎంసీ కార్యలయాన్ని ముట్టడించారు.. కార్యాలయం గేటు దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు.. వీరిని పోలీసులు అడ్డుకున్నారు..ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న చంద్రబాబు కడుపు కాలి చేస్తున్న మా ఆందోళనను పోలీసులతో అణిచివేయటం అన్యాయమని కార్మికులు వాపోయారు. యంత్రాలతో పనిచేయటాన్ని మానుకోవాలని వారు కోరారు. లేకుంటే మా పోరాటాన్ని ఉదృదం చేస్తామని వారు తెలిపారు. పోలీసుల లాఠీ చార్జ్ లో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. దళితులకోసం పనిచేస్తున్నామన్న బాబు తమ కోరికలను వెంటనేఅమలు చేయాలనీ..279 జీవోను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. 

19:19 - June 3, 2016

మెదక్ : మల్లన్న సాగర్ ప్రాజెక్టు ముంపు ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ర్యాపిట్ ఏక్షన్ ఫోర్స్ పోలీసులు భారీగా మోహరించారు. గ్రామస్థులతో కలెక్టర్ రోలాన్డ్ రోజ్ చర్చలు జరిపారు. 123 జీవో ప్రకారమే రైతుల నుండి స్వచ్ఛంధంగా భూములు సేకరిస్తామని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్లు రేపటి నుండే అంటే శనివారం నుండే ప్రారంభిస్తామని కలెక్టర్ తెలిపారు. ముంపు గ్రామాల ప్రజలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను రూపొందించాలని నిర్వాశితుల పోరాట సమితి నిర్ణయించింది.

123 జీవో ప్రకారమే భూసేకరణ : కలెక్టర్

మెదక్ : మల్లన్న సాగర్ ప్రాజెక్టు ముంపు ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ర్యాపిడ్  ఏక్షన్ ఫోర్స్ పోలీసులు భారీగా మోహరించారు. గ్రామస్థులతో కలెక్టర్ రోలాన్డ్ రోజ్ చర్చలు జరిపారు. 123 జీవో ప్రకారమే రైతుల నుండి స్వచ్ఛంధంగా భూములు సేకరిస్తామని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్లు రేపటి నుండే అంటే శనివారం నుండే ప్రారంభిస్తామని కలెక్టర్ తెలిపారు. ముంపు గ్రామాల ప్రజలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను రూపొందించాలని నిర్వాశితుల పోరాట సమితి నిర్ణయించింది.

'జగన్ వ్యవహార శైలి శాడిజాన్ని తలపిస్తోంది'

నెల్లూరు : జగన్ వ్యవహార శైలి శాడిజాన్ని తలపిస్తోందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందటం జగన్ కు ఇష్టంలేదనేట్లుగా వుందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంతో తెగతెంపులు చేసుకోవాలని ప్రజలనుజగన్ రెచ్చగొడుతున్నారన్నారు. కేంద్రం సహాయం లేకుంటే రాష్ట్రాభివృద్ధి సాధ్యపడదని జగన్ తెలుసుకోవాలని సూచించారు. కాగా జగన్ అనంతపురం జిల్లా సందర్భంగా సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్రంగా మండిపడుతున్నారు.

ఉగ్రదాడిలో ఇద్దరు బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది మృతి...

శ్రీనగర్‌ : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అనంత్‌నాగ్‌ జిల్లా బిజ్బెహరా పట్టణంలో ఘాతుకానికి పాల్పడి గస్తీ నిర్వహిస్తున్న బీఎస్‌ఎఫ్‌ సిబ్బందిపై దాడికి దిగారు. ఈ ఘటనలో ఇద్దరు బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది మృతి చెందగా.. ఐదుగురికి గాయాలయ్యాయి.

జగన్ పై కేసు నమోదు...

అనంతపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి టీడీపీ అధినేత, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై ఈరోజు ఏపీ మంత్రుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింది. అయితే, కొద్ది సేప‌టి క్రితం జగన్ పై కేసు నమోదయింది. అనంతపురంలోని పుట్టపర్తి పోలీస్ స్టేషన్ లో జగన్ పై టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ తీవ్ర అభ్యంతరమైన వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు పేర్కొన్నారు. మరోవైపు కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లోనూ ఇదే అంశంపై జగన్ పై కేసు నమోదయింది.

18:39 - June 3, 2016

ఆంధ్రప్రదేశ్ : ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్‌ కామెంట్లు దుమారం సృష్టించాయి.. జగన్‌పై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. మరోసారి మాట జారితే ఊరుకోమని హెచ్చరించారు..వీటిపై రాష్ట్రంలో పలు ప్రాంతాలలో టీడీపీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

చంద్రబాబును చెప్పుతో కొడితే తప్పేంటి : జగన్
ప్రజలను మోసం చేసిన సీఎం చంద్రబాబును చెప్పుతో కొడితే తప్పేంటని వైసీపీ అధినేత జగన్ అన్నారు. అనంతరపురం జిల్లాలో నిర్వహించిన రైతు భరోసా యాత్రలో ఆయన ప్రసంగించారు. రైతులు, డ్వాకా మహిళలు, చేనేత కార్మికులు, విద్యార్థులను చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు...కానీ చంద్రబాబుకు అధికారం వచ్చికా ఉన్న జాబులను ఊడదీస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికలప్పుడు ఎం చేప్పారు.. ఇప్పుడు చేస్తున్నదేమిటీ అని ప్రశ్నించారు. ఎన్నిలక్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. విమర్శించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందన్నారు. మృతుల కటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు ప్రభుత్వానిది కాదా.. అన్నారు.

జగన్‌ మానసిక పరిస్థితి బాగాలేదు: పయ్యావుల
జగన్‌ మానసిక పరిస్థితి బాగాలేదని అందుకే అభ్యంతర వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ విమర్శించారు. జగన్‌ తన పార్టీని ఓఎల్‌ఎక్స్‌లో అమ్మేస్తే మానసిక ప్రశాంతత మిగులుతుందని హితవు పలికారు.

బాలకృష్ణలకు మానసిక పరిస్థితి బాలేదు : వైసీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన
ప్రజలకు 300 హామీలు ఇచ్చి మరిచిపోయిన చంద్రబాబు ప్రతిపక్ష నేత జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని వైసీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన విమర్శించారు. చంద్రబాబు సోదరుడు, బావమరిది బాలకృష్ణలకు మానసిక పరిస్థితి బాలేదని గతంలో డాక్టర్లు సర్టిఫికేట్లు ఇచ్చారంటూ కల్పన విమర్శించారు.

పర్సనాలిటీ రిజార్టర్ తో జగన్ బాధపడుతున్నాడు: దేవినేని
వైసీపీనేత జగన్ మోహన్‌రెడ్డి మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని టీడీపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. అందుకే సీఎం చంద్రబాబుపై పత్రికల్లో అగౌరవంగా రాసారని అన్నారు. ప్రతిపక్షనేత హోదాలో ఉన్న జగన్‌ అలామాట్లాడటం సబబు కాదని తెలిపారు.

యనమల మానసిక పరిస్థితి బాగాలేదు: బొత్స
ఏపీ ఆర్థిక మంత్రి యనమల మానసిక పరిస్థితి బాగాలేదని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఎదురుదాడికి దిగారు. రాష్ట్రం అప్పుల్లో ఉంటే రెండంకెల వృద్ధిరేటు ఎలా సాధ్యమయ్యిందో చెప్పాలని చురకలంటించారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడం, అలాగే రాజ్యసభ సీట్లను అమ్ముకున్నారని సాక్షాత్తూ టీడీపీ నేత పుష్పరాజ్‌ పేర్కొనడం గమనించవచ్చని తెలిపారు.

17:52 - June 3, 2016

ఉత్తరప్రదేశ్ : పార్క్‌ స్థలాన్ని ఖాళీచేయించే సందర్భంలో జరిగిన ఘర్షణ విషాదంగా మారింది. ఆందోళనకారుల తీవ్ర ప్రతిఘటన కాల్పులకు దారితీసింది. ఘర్షణలో 22 మందిని మృత్యువాత పడగా...వారిలో ఎస్పీతో పాటు ఎస్‌ఐ కూడా ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌ మథురాలో జరిగిన ఘర్షణలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని మథురా పార్కు స్థల వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రెచ్చిపోయిన ఆందోళనకారులు పోలీసులతో పోటాపోటీగా తలపడ్డారు...ఆ ప్రాంతం రణరంగాన్ని తలపిస్తోంది.

ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో మొత్తం 22 మంది మృతి...
ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 11 మంది అగ్నికి ఆహుతయ్యారు. ఆందోళనకారులు పోలీసులపై జరిపిన కాల్పుల్లో సిటి ఎస్పీ ముకుల్‌ ద్వివేది, ఎస్‌ఐ సంతోష్‌ యాదవ్‌ మృతి చెందారు. ఈ ఘటనలో 23 మంది పోలీసులు, 40 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు.

జవహర్‌బాగ్‌ పార్కు స్థలం విషయంలో ఘర్షణ...
మధురలోని జవహర్‌బాగ్‌ వద్ద ఉన్న 280 ఎకరాల పార్కు స్థలం విషయంలో ఈ ఘర్షణ చెలరేగింది. రెండేళ్ల క్రితం పార్కును ఆక్రమించుకుని కొందరు స్థానికులు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే పార్కుస్థలం కావడంతో మధుర మున్సిపాలిటీ అధికారులు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆక్రమణదారుల్ని ఆ స్థలం నుంచి ఖాళీ చేయించాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో స్థలాన్ని ఖాళీ చేయించడానికి కొంతకాలంగా ప్రయత్నిస్తున్నా.. సాధ్యం కాలేదని అంటున్నారు అధికారులు. దీంతో తిరిగి మరోసారి గట్టిగా ప్రయత్నించడంతో... పోలీసులకు, ఆక్రమణదారులకు మధ్య హింస చెలరేగింది.

పోలీసులపై రాళ్లు రువ్విన ఆందోళన కారులు...
గురువారం స్థలాన్ని ఖాళీ చేయించేందుకు పార్కు వద్దకు చేరుకున్న పోలీసులపై దాదాపు 3 వేలమంది ఆందోళనకారులు... రాళ్లురువ్వారు. తమపై కాల్పులు కూడా జరిపారని పోలీసులు చెబుతున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు ముందుగా లాఠీచార్జ్ చేశారు. ఆ తర్వాత భాష్పవాయువు ప్రయోగించారు. అనంతరం కాల్పులు జరిపారు. ఘర్షణల సమయంలో గ్యాస్‌ సిలిండర్‌ పేలడం, కాల్పుల కారణంగా మృతుల సంఖ్య పెరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం జవహర్‌ భాగ్‌ ఖాళీ అయింది. లోపల భారీ ఎత్తున ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరింపు...
మథురలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. ఈ ఘటనలో 124 మందిని అరెస్ట్‌ చేశారు. మరో 336 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ విచారణకు ఆదేశించారు. ఘర్షణల్లో మృతిచెందిన పోలీసు కుంటుంబాలకు 20లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. 

17:42 - June 3, 2016

మొన్నటివరకు మన తెలుగు హీరోల ఆలోచనలన్నీ లోకల్ గానే ఉండేవి. టాలీవుడ్ ప్రేక్షకుల్ని మెప్పిస్తే చాలు అనుకునేవారు. మనకు తెలుగు పరిశ్రమ ఒక్కటి చాలులే అని సర్దుకుపోయేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. కేవలం తెలుగులోనే సినిమాను రిలీజ్ చేస్తే లాభాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పొరుగు రాష్ట్రాల్లో కూడా మార్కెట్ పెంచుకుంటేనే హీరోగా ఓ స్థాయిలో నిలబడే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే మన స్టార్ హీరోలంతా ఇంతా రూటు మార్చారు. కేవలం తెలుగు ప్రేక్షకులే కాకుండా… పరాయి రాష్ట్రంలో ఉన్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కూడా కథలు ఎంపిక చేసుకుంటున్నారు. పక్క రాష్ట్రాల్లో కూడా మార్కెట్ ను పెంచుకునే హీరోల్లో బన్నీ మొదటి స్థానంలో ఉన్నాడు. ఈ హీరో సినిమాలు ఎప్పటినుంచో కేరళలో కూడా విడుదలవుతున్నాయి. అక్కడ ప్రేక్షకుల ఆదరణను కూడా నోచుకుంటున్నాయి. దాంతో పాటే తమిళ్, కన్నడలో కూడా తన స్టామినాను ప్రూవ్ చేసుకొనే ప్లాన్స్ తో ఉన్నాడు. ప్రభాస్ బాహుబలితో టాలీవుడ్ బిజినెస్ లెక్కల్ని, మార్కెట్ పరిధిని తారుమారు చేసి పడేసాడు. ఇంతకు ముందు టాలీవుడ్ సినిమాలకి పరిమితమైన బడ్జెట్ లెక్కలుండేవి. బడ్జెట్ రేంజ్ ఒక ఫిగర్ దగ్గరే ఆగిపోయేది. కానీ బాహుబలి టాలీవుడ్ బిజినెస్ రేంజ్ ను ఎక్కడికో తీసుకెళ్లి స్టార్ హీరోలందరికీ ఒక డెస్టినేషన్ ని సెట్ చేసింది.

మహేష్ బాబు సైతం..
నిన్న మొన్నటి వరకూ టాలీవుడ్ లో లోకల్ గానే ఉండిపోయిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు తన మార్కెట్ ను పక్క రాష్ట్రాలకు కూడా విస్తరించాలనుకుంటున్నాడు. ఓవర్సీస్ లో తిరుగులేని హీరోగా చెలరేగిన మహేష్ బాబు అదొక్కటే చాలనుకొనే వాడు. కానీ ఇప్పుడు తమిళ్, హిందీ మార్కెట్ మీద కూడా కన్నేస్తుండడం విశేషం. యంగ్ టైగర్ యన్టీఆర్ కూడా నిన్న మొన్నటి వరుకు తన మార్కెట్ పరిధిని విస్తరించే ప్రయత్నాలు సీరియస్ గా చేయలేదు. నాన్నకు ప్రేమతో సినిమాతో యన్టీఆర్ ఓవర్సీస్ లోనూ కలెక్షన్స్ ఓ రేంజ్ లో కొల్లగొట్టాడు. అందుకే తరువాత సినిమాతో ఓవర్సీస్ మార్కెట్ తో పాటు తమిళ్, మలయాళ, కన్నడ మార్కెట్లను కూడా కేప్చర్ చేసే ప్రయత్నాలు సాగిస్తున్నాడు. ఇక వీళ్లందరినీ చూసి టాలీవుడ్ లో మరో ఇద్దరు స్టార్ హీరోలు కూడా తమ తమ సినిమాల్ని ఇతర భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దాన్ని బట్టే తమ సినిమాల బడ్జెట్ లను భారీగా పెంచబోతున్నారు. సో.. మొత్తం మీద ఇప్పటివరకు ఇక్కడ అక్కడ కూడా కలెక్షన్స్ కొల్లగొట్టేందుకు రెడీ అయిపోతున్నారు. యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథ, పెర్ఫెక్ట్ ప్లానింగ్, మార్కెట్ స్ట్రాటజీ పక్కాగా అమలు లో పెడితే టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఇండియన్ మార్కెట్ ను కేప్చర్ చేయగలిగే మొనగాళ్ళవుతారు.  

17:37 - June 3, 2016

ఆయనొక పాటల పాఠశాల..సుస్వరాల కళాశాల..నవరసాల పానశాల..పాటలు పాడటంలో ఆయనదొక ప్రత్యేకమైన ఒరవడి..
పాటలోని భావాన్ని, సాహిత్యాన్ని, సంస్కృతిని, ఆలోచనను, ఆవేశాన్ని ఇలా ఏ రసాన్నయినా మేళవించి మూడు నిమిషాల పాటను మూడుతరాలు గుర్తుంచుకునేలా చేయగల గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆ ఆబాల గోపాల బాలుడి సినీ ప్రస్థానం పై కథనం..

50 ఏళ్లుగా...
నవరసాలూరంచే గాత్రం, తేనెలూరో పాట. కోయిల కూడా చెవులు రిక్కించే వినేలా పాడడం ఆయన స్పెషాలిటీ. 50 ఏళ్లుగా ఆయన గాత్రం పాడుతూనే ఉంది. సంగీత ప్రియులను అలరిస్తూనే ఉంది. బాలు పాట అమృతం కన్నా తీయగా ఉంటుంది. అతని పలుకులు భాషకు పట్టాభిషేకం చేస్తాయి.
ఎంతోమంది సంగీత దర్శకులకు బాలు పాట ప్రయోగశాల. బాలు పాడితే ఎన్నో సినిమాలు రికార్డులు బద్దలు కొట్టాయి. అసలు బాలూ పాటే ఓ రికార్డు. ప్రపంచంలోనే అత్యధిక పాటలు పాడిన సింగర్ గా ఆయన గిన్నిస్ రికార్డులకెక్కారు. తరాలు మారినా, స్వరాలు మారినా తెలుగు వారికి బాలు పాట నిత్యనూతనమే. ఎలాంటి పాటనైనా అలుపు, సొలుపులేకుండా అలవోకగా పాడగల ఆయన ఘంటసాల మాస్టారు తర్వాత ఎవరు పాడతారన్న ప్రశ్నకు సమాధానంగా దొరికారు. ఘంటసాల తర్వాత తెలుగు సినిమా సంగీతాన్ని దశాబ్దాల పాటు ఏలారు. తెలుగు పాటను శాసించారు బాలు.
ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తొలినాళ్లలో చిన్న చిన్న హీరోలకు పాడిన బాలు …. అతి కొద్ది కాలంలోనే అగ్రహీరోలందరికీ స్వరాలు అందించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, చిరంజీవి, అల్లు రామలింగయ్య ఇలా నటుడెవరైనా సినిమా ఏదైనా అందులో బాలు పాట ఉండి తీరాల్సిందే.

1946లో జననం...
1946 జూన్ 4 న పుట్టిన బాలు మర్యాద రామన్న సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. విరహాన్ని అద్భుతంగా పలికిస్తాడు. వయ్యారాలను గొంతులో ఒలికిస్తాడు. ఏ హీరోకి తగినట్టుగా వాయిస్ చేంజ్ చేసి గమ్మత్తుగా పాడడం ఆయనకే సాటి. ఎన్‌.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్‌బాబు, నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ ఇలా ఆయా హీరోల వాయిస్‌కు అతుక్కుపోయేలా పాటలు పాడి నిజంగా ఆహీరోలే పాడారా అన్నంత ఫీలింగ్‌ని కలిగించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ముఖ్యంగా అల్లు రామలింగయ్యకు , రాజబాబుకు, మాడా వెంకటేశ్వరరావు కు ఆయన పాడిన వైవిధ్యమైన పాటల్ని తెలుగు శ్రోతలు ఎప్పటికీ మరచిపోలేరు. అంతేకాదు కమల్‌హాసన్‌ నటించిన 'ఇంద్రుడు-చంద్రుడు' చిత్రంలో గొంతుని మార్చి డబ్బింగ్‌ చెప్పడమే కాకుండా, జీరగొంతుతో ఒక పాటను కూడా పాడి తనేంటో, తన సత్తా ఏమిటో నిరూపించుకున్నారు. బాలు రాత్రికి రాత్రే గాయకుడయిపోలేదు. ఎవరి రికమెండేషన్ తోనూ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వలేదు. కేవలం తన గాత్రంలోని వైవిధ్యతతోనూ, గానంలోని మాధుర్యంతోనూ అన్నిటికీ మించి సొంత ప్రతిభతోనే సినీ పరిశ్రమలోకి అచ్చతెలుగు పాటలా ప్రవేశించారు. బాల్యం నుంచి చక్కగా పాడడాన్ని నేర్చుకున్నారు. ఖాళీ సమయంలో పాటలు పాడేవారు. ఈ ఆసక్తితోనే ఆయన హార్మోనియం, ఫ్లూట్‌ వంటి సంగీత వాయిద్యాలను వాయించడాన్ని నేర్చుకున్నారు. టైఫాయిడ్‌ రావడంతో బాలసుబ్రమణ్యం తన ఇంజినీరింగ్‌ చదువుని మధ్యలోనే ఆపివేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన పలు పాటల పోటీల్లో పాల్గొని ఎన్నో అవార్డులను గెలుపొందారు. ఆ టైమ్ లోనే మద్రాస్‌కు చెందిన తెలుగు కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ నిర్వహించిన సంగీత పోటీల్లో పాల్గొని బాలసుబ్రమణ్యం మొదటి బహుమతిని గెల్చుకున్నారు. ఈ గెలుపుతో ఆయన అందరి దృష్టిలో పడ్డారు. ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు ఎస్‌.పి.కోదండపాణి ఆయనకు సినిమాల్లో పాడేందుకు తొలి అవకాశాన్ని ఇచ్చారు.1966 డిసెంబరు 15న ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న చిత్రం’ కోసం మద్రాసులోని వి.యాగార్డెన్స్‌ థియేటర్లో ‘ఏమి వింత మోహము’ అనే పాటను తొలిసారిగా సుశీల, పి.బి.శ్రీనివాస్‌, ఈలపాట రఘురామయ్యలతో కలిసి పాడారు.

గట్టిపోటినిచ్చిన వి.రామకృష్ణ..
బాలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన టైమ్ లో ఆయనకు వి. రామకృష్ణ గట్టిపోటీ నిచ్చేవారు. ఆయన్ను ఘంటసాల కు వారసుడిగా భావించేవారు. అందుకే ఇండస్ట్రీలోని అగ్రకథానాయకులంతా రామకృష్ణతో పాడించుకోవాలనుకునేవారు. దాంతో బాలు కెరీర్ ప్రశ్నార్ధంగా మారింది. బాలు కెరీర్ బిగినింగ్ లో చిన్నహీరోలకు, కమెడియన్స్ కు ఎక్కువగా పాడేవారు. ఘంటసాల వాయిస్ కు దగ్గరగా ఉండడం చేత అగ్రహీరోలంతా తమ సినిమాలకు రామకృష్ణ చేతనే పాడించుకొనే వారు. కొన్నాళ్ళు బాలుని ఇది చాలా బాధించింది. ఏం చేయాలో పాలుపోని ఆ టైమ్ లో యస్పీ కోదండపాణి ఇచ్చిన అద్భుతమైన సలహా మేరకు అగ్ర హీరోల గొంతులను అనుకరించడం మొదలు పెట్టారు బాలు. ఇది బాగా ఎఫెక్టివ్ గా పనిచేయడంతో అక్కడనుంచి బాలు తన విశ్వరూపం చూపించారు. అందరి హీరోలకు వారి వారి వాయిస్ లకు అనుగుణంగా పాడడం మొదలు పెట్టిన నాటినుంచి బాలు ఇక వెనుదిరిగి చూసుకోలేదు. అప్పటినుంచి ఇప్పటివరుకూ బాలు తెలుగు తెరమీద తనకు మరో ఆల్టర్ నేట్ గాయకుడు లేడని నిరూపించుకున్నారు. పాడడం తగ్గించేసినా.. ఇప్పటికీ ఏ పాటైనా ఇది బాలు పాడితేనే బాగుంటుందని అనిపిస్తే ఆ పాట బాలుని వెతుక్కుంటూ వస్తుంది. దటీజ్ బాలు.

సంగీత దర్శకుడిగా..
బాలసుబ్రహ్మణ్యం ఒక్క పాటలు పాడడమేకాదు చాలా సినిమాల్లో గెస్ట్ రోల్స్ దగ్గరనుంచి, కీ రోల్స్ వరుకూ ఎన్నో పాత్రలు పోషించి మెప్పించారు. కాకపోతే ఆయన కాస్త పుష్టిగా ఉంటారు కాబట్టి, ఎక్కువగా ఆయనకు కామెడీ పాత్రలే వచ్చేవి. అయినా సరే ఆ పాత్రల్ని సమర్ధవంతంగా పోషించి రక్తి కట్టించారు. యస్పీబాలు మొట్టమొదటి సారిగా మహ్మద్ బీన్ తుగ్లక్ అనే సినిమాలో ఒక స్టేజ్ మీద పాటపాడుతూ కనిపిస్తారు. ఆ తరువాత జంధ్యాల మల్లెపందిరి లో ఒక కామెడీ ప్రొఫెనల్ కిల్లర్ గా కనిపించి నవ్వులు పూయించారు. ఇక ఆ తరువాత పక్కింటి అమ్మాయి సినిమాలో కథను మలుపు తిప్పే ఒక కీ రోల్ పోషించారు. అక్కడి నుంచి వివాహ భోజనంబు, ప్రేమ, పర్వతాలు పానకాలు, రాజహంస, చిరుజల్లు, పవిత్రబంధం లాంటి ఎన్నో చిత్రాల్లో మంచి మంచి పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు. అంతేకాదు గుణ, తిరుడా తిరుడా, కేళడి కణ్మణి, అవ్వై షణ్ముగి, కాదలన్ లాంటి సినిమాలతో తమిళ్ లోనూ నటించి తన సత్తా చాటుకున్నారు. యస్పీ బాలు సంగీత దర్శకుడిగానూ మెరుపులు మెరిపించారు. కేవలం తెలుగు చిత్రాలకే కాకుండా తమిళ, కన్నడ చిత్రాలకూ తన బాణీలందించి అక్కడి శ్రోతల్నీ ఉర్రూతలూగించారు. సంగీత దర్శకుడిగా బాలు 40 చిత్రాలకు పనిచేశారు. కన్యాకుమారి చిత్రంతో మొట్టమొదటి సారిగా బాలు సంగీత దర్శకుడిగా తెలుగు తెరమీద ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత బాపు తూర్పు వెళ్ళే రైలు, జాకి,సీతమ్మ పెళ్లి, చిత్రాలకూ బాలు మ్యూజిక్ అందించారు. ఆ తరువాత భార్యామణి, మయూరి, చిరంజీవి మగధీరుడు, నాగార్జున జైత్రయాత్ర, సందర్భ, రామన్న శ్యామన్నా, క్షీరసాగర, దెవరల్లె దానె, బెల్లియప్ప బంగారప్పముద్దిన మావ, సింగారం, ఉన్నయ్‌ చరనదైతయెన్‌ వంటి హిట్‌ తమిళ, కన్నడ చిత్రాలకు ఆయన సంగీతాన్ని అందించారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ బాలు తెలుగు, తమిళ్ చిత్ర పరిశ్రమలో చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. కుర్రవాయిస్ లనుంచి ముసలి వాయిస్ ల వరుకూ ఎన్నో పాత్రలకు గాత్రదానం చేసి బాలు అక్కడా బాలు తన సత్తా చాటుకున్నారు.

డబ్బింగ్ ఆర్టిస్టు..ఎన్నో బిరుదులు..
బాలసుబ్రమణ్యం డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా సైతం పాపులారిటీ సంపాదించారు. మన్మద లీల చిత్రంలో స్టార్‌ హీరో కమల్‌హాసన్‌కు అనుకోకుండా డబ్బింగ్‌ చెప్పారు. అనంతరం బాలు పాపులర్‌ నటులు కమల్‌హాసన్‌, రజనీకాంత్‌, సల్మాన్‌ఖాన్‌, కె.భాగ్యరాజ్‌, మోహన్‌, అనిల్‌ కపూర్‌, గిరీష్‌ కర్నాడ్‌, జెమినీ గణేషన్‌, అర్జున్‌ సర్జ, నగేష్‌, కార్తిక్‌, రఘువరన్‌లకు పలు సినిమాల్లో డబ్బింగ్‌ చెప్పి అందరి చేత శెభాష్‌ అనిపించుకున్నారు. ముఖ్యంగా కమల్‌హాసన్‌ చిత్రాల్లో ఆయనకు ఎక్కువగా డబ్బింగ్‌ చెప్పారు బాలు. దశావతారం చిత్రంలో కమల్‌హాసన్‌ ఏడు పాత్రలకు బాలూనే డబ్బింగ్‌ చెప్పడం విశేషం. అన్నమయ్య, శ్రీ సాయి మహిమ చిత్రాలకుగాను ఆయన బెస్ట్ డబ్బింగ్‌ ఆర్టిస్ట్ అవార్డులను అందుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన బాలుకి అవార్డులు, రివార్డులు రావడం పెద్ద విశేషమేమీ కాదు. ఆయన వైవిధ్య గాత్రానికి అవే ఆయన్ను వరించి తరించాయి. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు ఎన్నో బిరుదులు ఆయన దరిచేరి గౌరవాన్ని సంపాదించాయి. ఐదు దశాబ్దాల సినీ కెరీర్‌లో 15 భాషల్లో ఆయన 40వేలకు పైగా పాటలు పాడారు బాలు. నాలుగు భాషల్లో జాతీయ సినీ అవార్డులను అందుకున్న దేశంలోని ఏకైక సినీ నేపథ్యగాయకుడు బాలసుబ్రమణ్యం. ఒక ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు, మూడు దక్షిణాది ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులను తెలుగు, తమిళం, కన్నడ భాషా చిత్రాలకుగాను ఆయన అందుకున్నారు. అత్యధికంగా పాటలు పాడిన సినీ నేపథ్యగాయకుడిగా సైతం బాలు రికార్డు సృష్టించారు. ఆయన ప్రతిభాపాటవాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్‌ అవార్డులు అందజేసి ఘనంగా సత్కరించింది. ఆ గాన గంధర్వుడికి ఎన్నో యూనివర్సటీలు గౌరవ డాక్టేరేట్లు అందించాయి. గాయకుడిగానే కాకుండా, నటుడిగా, సంగీత దర్శకుడిగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఆయా విభాగాలలో 29 సార్లు నంది పురస్కారాన్ని అందుకున్న భాహుముఖ ప్రజ్ఞాశాలి ఈ గాన గంధర్వుడు.
ఇప్పటికీ బాలు పాట లో ఎంతో మాధుర్యం ఉంటుంది. ఏ పాట పాడినా అందులో ఆర్ధ్రత నిండి ఉంటుంది. వయసు ఎంత పెరిగినా, ఆ గొంతులో అణువంత అపశృతైనా పలకదు. అందుకే ఇప్పటివరుకూ అన్ని భాషల్లోనూ కలుపుకొని రికార్డ్ స్థాయిలో 40 వేలకు పైగా పాటలు పాడి శ్రోతల్ని ఉర్రూతలూగించారు. దటీజ్ బాలు. ఆ గాన గంధర్వుడికి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేస్తోంది 10 టివి.  

17:36 - June 3, 2016

హైదరాబాద్ : అగ్రికల్చర్ కమిషనర్ కార్యాలయం ముందు ఉద్యోగి ఆత్మహత్యకు యత్నించాడు. డిప్యుటేషన్ పై ఆంధ్రాకు వెళ్లాలని తెలంగాణ ఉద్యోగికి ఆదేశాలు అందటంతో నిరసనగా ఉద్యోగి ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు అడ్డుకోవటంతో ప్రమాదం తప్పింది.

తమిళనాడు ఘోర రోడ్డు ప్రమాదం..

తమిళనాడు : ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కృష్ణ‌గిరి స‌మీపంలోని మేలుమ‌లైలో ఓ ప్రైవేటు బ‌స్సు, లారీ ఒకదానికొకటి ఢీ కొన్నాయి. దీంతో వీటి వెనుక వస్తున్న మరో కారు కూడా ప్రమాదానికి గురైంది. ప్ర‌మాదంలో 14 మంది ప్ర‌యాణికులు అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయారు. మృతుల్లో ఓ చిన్నారితో పాటు ఆరుగురు మ‌హిళ‌లు ఉన్నారు. మ‌రో 30 మందికి తీవ్ర‌గాయాలయ్యాయి. వీరిని కృష్ణ‌గిరి ప్రభుత్వాసుపత్రికి త‌ర‌లించి, చికిత్స అందిస్తున్నారు. ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. వేరుశ‌న‌గ‌ లోడుతో వెళుతోన్న లారీ మేలుమ‌లైలో ఒక్క‌సారిగా బస్సుని ఢీ కొట్ట‌డంతో ప్ర‌మాదం సంభ‌వించిన‌ట్లు తెలుస్తోంది. 

కమిషనర్ కార్యాలయం ఉద్యోగి ఆత్మహత్యాయత్నం...

హైదరాబాద్ : అగ్రికల్చర్  కమిషనర్ కార్యాలయం ముందు ఉద్యోగి ఆత్మహత్యకు యత్నించాడు. డిప్యుటేషన్ పై ఆంధ్రాకు వెళ్లాలని తెలంగాణ ఉద్యోగికి ఆదేశాలు అందటంతో నిరసనగా ఉద్యోగి ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు అడ్డుకోవటంతో ప్రమాదం తప్పింది.

17:09 - June 3, 2016

మెదక్ : మల్లన్న సాగర్ వద్ద మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మల్లన్న ముంపు గ్రామాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది భారీగా మోహరించారు. దీంత గ్రామస్థులు తీవ్రంగా భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే సీపీఎం పార్టీ నిర్వాశితులకు మద్దతు పలికిన విషయం తెలిసిందే. కాగా గ్రామంలోని కొందరు యువకులను కలెక్టర్ పిలిచి సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. 

17:07 - June 3, 2016

బాలకృష్ణ..ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న వందో సినిమా 'గౌతమీ పుత్ర శాతకర్ణీ' చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. 'క్రిష్' దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ కూడా కొద్ది రోజుల్లో పూర్తి కాబోతోంది. కానీ బాలయ్య సరసన ఎవరు నటించనున్నారనే వార్త బయటకు రావడం లేదు. ఇంకా చిత్ర యూనిట్ హీరోయిన్ కోసం అన్వేషణలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. నయనతార నుండి మొదలుకొని అనుష్క..ఇలియానా..అంజలి..శృతి హాసన్..ఇలా చాలా పేర్లు వినిపించాయి. తాజాగా 'శ్రియ' పేరు వినిపిస్తోంది. వీలైనంత త్వరలో చిత్ర కథానాయికను చిత్ర యూనిట్ ప్రకటించే అవకాశం ఉంది. మరి ఈ చిత్రంలో 'శ్రియ' ..లేదా ఎవరనేది తెలుస్తుంది. 

మల్లన్నల సాగర్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు..

మెదక్ : మల్లన్న సాగర్ ముంపు ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. భారీగా ర్యాపిడీ యాక్షన్ ఫోర్స్ బలగాలు మోహరించాయి. ముంపు గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. 

నగరంలో భారీ వర్షం..

హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. చైతన్యపురి, కొత్తపేట, దిల్‌సుఖ్‌నగర్, ఆర్‌కేపురం, సరూర్ నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం భారీ వాన మొదలైంది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురస్తుండటంతో పలుచోట్ల ఫ్లెక్సీలు విరిగిపోయాయి. 

పెదపప్పూరులో ఉద్రిక్తత ...

పెదపప్పూరులో ఉద్రిక్తత ...

అనంతపురం : పెదపప్పూరులో ఉద్రిక్తత నెలకొంది. జగన్ పర్యటనను అడ్డుకోవటానికి టీడీపీ నేతలు భారీగా పెద్దపప్పూరుకు చేరుకున్నారు. ఈ క్రమంలో గ్రామం బయటనే జగన్ ను పోలీసులు నిలిపివేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.

జూన్ 6న వాషింగ్టన్ కు మోడీ - ఎంఈఏ..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జూన్ ఆరో తేదీన వాషింగ్టన్ కు వెళ్లనున్నారని ఎంఈఏ వెల్లడించింది. ఏడో తేదీన అమెరికా అధ్యక్షుడు ఒబామాతో మోడీ భేటీ కానున్నారని, సాయంత్రం బిజినెస్ ప్రముఖలతో భేటీ ఉంటుందని పేర్కొంది. రేపు అప్ఘనిస్తాన్ కు వెళ్లనున్నారని, సాయంత్రం ఖతర్ కు వెళుతారని తెలిపింది. 

టి. కేబినెట్ నిర్ణయాలు..

హైదరాబాద్ : తెలంగాణ కేబినేట్ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండు గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది.

గ్రామం బయటే జగన్ ను నిలిపివేసిన పోలీసులు..

అనంతపురం : జగన్ పర్యటనను అడ్డుకోవడానికి టిడిపి శ్రేణులు యత్నిస్తున్నాయి. జగన్ ను పెదపప్పూరు గ్రామం బయటనే పోలీసులు నిలిపివేశారు. 

రాష్ట్ర సమస్యలను ప్రస్తావిస్తా - టీజీ..

హైదరాబాద్ : పార్లమెంట్ లో ఏపీ సమస్యలను ఏకరువు పెట్టి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని టీజీ వెంకటేశ్ పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చినందుకు టిడిపి పార్టీకి, సీఎం చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. 

ఏపీ అభివృద్ధికి సహకరిస్తా - సురేష్ ప్రభు..

హైదరాబాద్ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని ఏపీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. బీజేపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

 

15:54 - June 3, 2016

హైదరాబాద్ : తెలంగాణ కేబినేట్ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండు గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. 

 • ప్రాణహిత, చేవెళ్ల, దేవాదుల ప్రాజెక్టుల పునరాకృతికి ఆమోదం.
 • కంతనపల్లి, సీతారామ, భక్తరామదాసు, రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్, ఎస్ఆర్ఎస్పీ వరద వరద కాలువ రీడిజైన్ పనులకు ఆమోదం. 
 • మొత్తం 19 ప్యాకేజీల్లో మార్పులు చేర్పులకు మంత్రివర్గం ఆమోదం.
 • గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణం కోసం మహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పందాలకు ఆమోదం.
 • రాష్ర్టంలో ఫిషరీస్ సైన్స్ కళాశాల ఏర్పాటుకు నిర్ణయం.
 • వరంగల్ లో అగ్రికల్చర్ కళాశాల, మామునూరులో వెటర్నరీ కళాశాలల ఏర్పాటు.
 • రూ. వెయ్యి కోట్ల నాబార్డ్ రుణానికి పూచీకత్తుగా ఉండాలని నిర్ణయం.
 • మెదక్ లో నిమ్జ్, హైదరాబాద్ లో ఫార్మానిమ్జ్ కోసం టీఎస్ఐఐసీ రూ. 784 కోట్ల హడ్కో రుణం పొందడానికి గ్యారంటీ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం.
 • అసైన్డ్ భూములు, కమతాల ఏకీకరణకు కొత్త విధానం రూపొందించాలని రెవెన్యూ శాఖకు ఆదేశాలు. 
 • భూముల క్రమబద్దీకరణ, నిరుపయోగ భూముల వినియోగానికి విధానం రూపొందించాలని ఆదేశం.
 • శీతల గిడ్డంగుల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయాలని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖకు సూచనలు. మరిన్ని వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి....
15:50 - June 3, 2016

విజయవాడ : ప్రజల రక్షణ కోసం నిరంతరం పాటుపడే..రక్షకభటులకే రక్షణ లేకుండా పోయింది. కుటుంబాలను వదిలి ఎక్కడి నుంచో.. ఏపీ రాజధాని ప్రాంతానికి వచ్చిన పోలీసుల జీవితాలు దినదిన గండం.. నూరేళ్ల ఆయుష్సులా తయారైంది. ఏపీ రాజధానిలో పలుచోట్ల భధ్రతా విధులు నిర్వర్తిస్తోన్న రక్షకభటులకు కనీస సౌకర్యాలు కూడా లేక అష్టకష్టాలు పడుతున్న వైనంపై టెన్‌ టీవీ స్పెషల్‌ స్టోరీ...

కనీస సౌకర్యాలు కూడా లేక అష్టకష్టాలు...
ఇళ్లు, పిల్లలను వదిలి.. ఎక్కడో ఏపీ రాజధాని ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తోన్న రక్షకభటులకు రక్షణ లేకుండా పోయింది. రాజధాని ప్రాంతంలోని సీఎం ఇంటి దగ్గర, తాత్కాళిక సచివాలయం, భూమి పూజ చేసిన ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తోన్న పోలీసులకు కనీస సౌకర్యాలు కూడా లేక అష్టకష్టాలు పడుతున్నారు. చెట్లు, గుట్టలు, పొలాలు, రోడ్లపై గుడారాలు వేసుకుని అందులోనే ఉంటున్న పోలీసులు.. ఎండలకు ఎండుతూ.. వర్షాలకు తడుస్తూ నానా అవస్థలు పడుతున్నారు. ఎక్కడో..ఊరికి దూరంగా.. రాత్రివేళ పాములు, తేళ్లు సంచరించే ప్రదేశాల్లో గుడారాల్లో ఉంటూ బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ గుడారాలు కూడా కూలిపోవడంతో.. రోడ్లపైనే నివిసించాల్సిన దుస్థితి నెలకొంది.

సేదతీరేందుకు గూడు లేకపోయినా స్పందించని యంత్రాంగం..
చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం తదితర జిల్లాల నుంచి వచ్చిన పోలీసులు కనీస సౌకర్యాలు కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు. టెంట్లు కూలిపోయి సేదతీరేందుకు గూడు లేకపోయినా.. ఉన్నతాధికారులు స్పందించడం లేదని పోలీసులు వాపోతున్నారు. విష కీటకాలు, పాములు, తేళ్ల మధ్య రక్షకభటులకే రక్షణ లేకుండా పోయిందని, వెంటనే ఉన్నతాధికారులు స్పందించి కనీస వసతులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. 

15:45 - June 3, 2016

ఢిల్లీ : ఆమె పాట పాడితే అది ఎవరు పాడారో చెప్పక్కర్లేదు. దేశంలో అందరూ ఆమె పాటే అని గుర్తు పడతారు. బాలీవుడ్ సింగర్స్ లో ఆమె ఒక లెజెండ్. ఆమే గాన కోకిల లతామంగేష్కర్. కొన్ని వేల పాటలు పాడినా ప్రతి పాటపైనా లత ముద్ర ఉంది. భారతదేశంలో, ఆ మాటకొస్తే ప్రపంచ స్థాయిలో కూడా ఆమె పేరు తెలీని వారు లేరంటే అతిశయోక్తి లేదు. అంతటి ప్రఖ్యాత గాయనిని ప్రముఖ అమెరికన్ పత్రిక న్యూయార్క్ టైమ్స్ అవమానించింది.

'సో కాల్డ్ ప్లేబ్యాక్ సింగర్' అంటూ ఓ స్టోరీ...
దేశం గర్వించదగ్గ గాయని లతా మంగేష్కర్. ఏడు దశాబ్దాలుగా సినిమాల్లో పాటలు పాడుతున్నారు. అంతటి గొప్ప గాయనిని కించపరిచే విధంగా ...అమెరికా పత్రిక న్యూయార్క్ టైమ్స్ 'సో కాల్డ్ ప్లేబ్యాక్ సింగర్' అంటూ ఓ స్టోరీని ప్రచురించింది. ఈ కథనంపై మన దేశంలో ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

భారతీయుల ఆగ్రహంతో దిగోచ్చిన న్యూయక్క్ టైమ్స్...
1940లలోనే లతా మంగేష్కర్ సినిమాల్లో పాటలు పాడడం ప్రారంభించారు. ఇప్పటికి కొన్ని వేల పాటలు పాడారు. దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ పాటలు పాడిన లతామంగేష్కర్ ను సో కాల్డ్ సింగర్ అంటూ న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అంటే ఆమె ఒక అనామక గాయని అర్థం. భారతీయులు ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో దిగోచ్చిన న్యూయక్క్ టైమ్స్ తాము లతా మంగేష్కర్ ను అవమానించే ఉద్దేశంతో ఆ కథనాన్ని ప్రచురించలేదని వివరణ ఇచ్చింది.

లతామంగేష్కర్ ను కించపరిచే ఉద్దేశం తమకు లేదని పత్రిక...
న్యూయార్క్ టైమ్స్ ఆ కథనం ప్రచురణ చేయడానికి ఓ కారణం ఉందట. లత, సచిన్‌ టెండూల్కర్‌ లపై బ్లాక్ కామెడీతో...కమెడియన్‌ తన్మయ్‌ భట్‌ వీడియో విడుదల చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆ వివాదంపై న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని రాస్తూ ...లతా ఓ అనామక గాయని అని అర్థం వచ్చేలా 'సోకాల్డ్‌' అని పేర్కొంది. 'సోకాల్డ్‌' అనే మాటను తప్పుగా అర్థం చేసుకున్నారని, లతామంగేష్కర్ ను కించపరిచే ఉద్దేశం తమకు లేదని ఆ పత్రికలో పనిచేసే ఇండియన్ రైటర్ అసీమ్ చాబ్రా సంజాయిషీ ఇచ్చాడు. 

15:32 - June 3, 2016

ప్రముఖులు..నటులు..ప్రజాప్రతినిధులు..ఇతరులకు ఆదర్శంగా ఉండాలి..కానీ కొంతమంది మాత్రం అలా ఉండడం లేదు. వివాదాస్ప వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. సామాజిక మాధ్యమాల పుణ్యమా అని అవి మరింత దుమారం రేపుతున్నాయి. తాజాగా ఓ వివాదంలో నటి, బీజేపీ ఎంపీ హేమామాలిని చిక్కుకున్నారు. ఆమె మధుర నియోజకవర్గం నుండి ఎంపికైన సంగతి తెలిసిందే. శుక్రవారం ఆమె కొన్ని ఫొటోలు ట్విట్టర్ లో పోస్టు చేశారు. మద్ ఐలాండ్ లో ఫొటో షూట్ అంటూ ట్వీట్ చేశారు. కానీ ఆమె నియోజవకర్గంలో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ సంగతి తెలియకుండా పోస్టు చేశారా ? లేదా ? అన్నది తెలియరాలేదు. కానీ దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలోనే మండిపడ్డారు. మధురలో జరిగిన హింసలో మొత్తం 21 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇంత దారుణమైన ఘటన జరిగితే ఆమె మాత్రం ఫొటో షూట్లంటూ పట్టనట్లు ఉండమేంటన్న విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే విషయం తెలుసుకున్న హేమమాలిని నాలికకరుచుకున్నారు. ట్విట్టర్ లో ఉన్న ఫొటోలను తొలగించారు. తనకెంతో ఇష్టమైన మధురలో జరిగిన ఈ ఘటన తనను దిగ్ర్భాంతికి గురి చేసిందని..అవసరమైతే అక్కడకు వెళుతానంటూ ట్వీట్ చేశారు. 

15:30 - June 3, 2016

శ్రీకాకుళం : తాము చెల్లించామంటున్నారు అధికారులు... తమకు మాత్రం డబ్బులు అందలేదు అంటున్నారు రైతులు. నాలుగునెలల నుంచి అధికారులు, మిల్లర్లు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు ధాన్యం అమ్మిన రైతులు. ప్రభుత్వం నాలుగు నెలల క్రితం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసినా ఇప్పటి వరకు రైతులకు డబ్బులు అందలేదు. దీంతో శ్రీకాకుళం జిల్లా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది..

రైతులకు ఝలక్ ఇచ్చిన అధికారులు ....
వ్యయ ప్రయాసలకోర్చి పండించిన వరి రైతులకు శ్రీకాకుళం జిల్లా అధికారుల మరోసారి షాకిచ్చారు. జిల్లావ్యాప్తంగా 114 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది ప్రభుత్వం. సర్కారు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం అమ్మితే సకాలంలో డబ్బు చేతికొస్తుందని....దళారుల ప్రమేయం ఉండదన్న నమ్మకంతో రైతులు తమ ధ్యానం అమ్మారు. జిల్లాలో వెలుగు పరిధిలో 41, పి.ఏ.సి.ఎస్ ద్వారా 51, డి.సి.ఎం.ఎస్ ల ద్వారా 9, ఐ.టి.డి.ఏ పరిధిలో జి.పి.సి.ల ద్వారా మరో 13 కొనుగోలు కేంద్రాలు 30 మండలాల పరిధిలో ధాన్యం కొనుగోళ్లు చేశాయి.

రైతుల డబ్బులు చెల్లింపుల విషయంలో సమస్య..
ఇంతవరకు బాగానే ఉంది.... ధాన్యం అమ్మిన రైతులు డబ్బులు చెల్లింపుల విషయంలోనే వచ్చింది అసలు సమస్య . ఈ కేంద్రాల ద్వారా దాదాపు 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాయి. ఇందుకుగాను రైతులకు 829 కోట్ల రూపాయల చెల్లించామని అధికారులు చెబుతున్నారు. పదహారు మందికి మాత్రమే బకాయి ఉందని డి.సి.ఎం.ఎస్ అధికారులు చెబుతున్నారు. కానీ వందలాది మంది రైతులు ఇంకా ధాన్యం డబ్బులు అందలేదంటున్నారు. మిల్లర్లు, డి.సి.ఎం.ఎస్ కార్యాలయాల చుట్టూ నాలుగు నెలలుగా ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం 16 మందికే బకాయి పడ్డట్లు లెక్కలు చెబుతుంటే ...డబ్బులు అందని చాలా మంది నివ్వెరపోతున్నారు. . ఈ తతంగంపై విచారణ జరిపి...బాధితులకు డబ్బులు అందేలా చర్యలు తీసుకోని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి..

ఫిబ్రవరి నెలలో ధాన్యం అమ్మినా ఇంతవరకూ చేతికి రాని సొమ్ము...
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ధాన్యం అమ్మినా ఇప్పటి వరకు సొమ్ము అందలేదని బాధిత రైతులు వాపోతుంటే...బకాయిలు లేవని మార్కెటింగ్ శాఖ అధికారులు కాకి లెక్కలు చూపిస్తున్నారు. దీంతో ఎవరి మాటలు నమ్మాలో అంతుపట్టక నాలుగు నెలలుగా డబ్బులు అందని రైతులు లబోదిబోమంటున్నారు. 

15:18 - June 3, 2016

హైదరాబాద్ : ఒకప్పుడు పాలిటెక్నిక్‌కు ఫుల్ క్రేజ్ ఉండేది. ఇంజినీరింగ్‌ కోర్సుకు దీటుగా పాలిటెక్నిక్‌ కోర్సును విద్యార్థులు ఎంచుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం విద్యార్థులకు రోజురోజుకు పాలిటెక్నిక్ మీద క్రేజ్ తగ్గిపోతోంది. ఐఐటి, ట్రిపుల్ ఐటి, మెడిసిన్, ఇంజనీరింగ్ కోర్సులకు ఇచ్చే ప్రాధాన్యత పాలిటెక్నిక్‌కు ఇవ్వడం లేదా? తాజాగా తెలంగాణ ప్రభుత్వ లెక్కలు చూస్తుంటే నిజమేమోనిపిస్తోంది.

ప్రొఫెషనల్ కోర్సులదే హవా..
ఈ రోజుల్లో హవా అంతా ప్రొఫెషనల్ కోర్సులదే... విద్యార్థులు చాలా మంది ఇంజనీరింగ్‌ లేదా మెడిసిన్ వైపు వెళ్లడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఎందుకంటే ఆ కోర్సులు చదివితే భవిష్యత్ బాగుంటుందని గాఢంగా నమ్ముతారు. అయితే ఆర్ధికంగా బలహీనంగా వున్న విద్యార్ధులు మాత్రం పదో తరగతి పూరైన తర్వాత పాలిటెక్నిక్ కోర్సును ఎక్కువగా ఎంచుకుంటారు. అయినా కానీ ఇటీవలి కాలంలో ఈ కోర్సు చదివే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది.

మిగిలిపోయిన పాలిటెక్కిక్ సీట్లు...
తాజాగా తెలంగాణాలో పాలిటెక్నిక్ కోర్సులో సీట్ల కేటాయింపులు పూర్తయ్యాయి.. గతేడాదితో పోలిస్తే ఈ యేడాది భారీగా సీట్లు మిగిలిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 205 కాలేజీలు ఉండగా అందులో 50వేల 632 సీట్లు ఉన్నాయి.. 2016-17 విద్యా సంవత్సరానికి 37వేల 467 మంది విద్యార్థులు పాలిటెక్నిక్‌ కాలేజీల్లో సీట్లు పొందగా... 13వేల 165 సీట్లు మిగిలిపోయాయి.

ప్రొఫెషనల్ విద్యలోనూ కొత్త ఒరవడి...
రానురాను విద్యార్ధులు ప్రొఫెషనల్ విద్యలోనూ కొత్త ఒరవడిని ఎంచుకుంటున్నారు. జాతీయ స్థాయిలో కొంత క్రేజ్ వుండి విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించి లక్షల్లో జీతాలుండే కోర్సుల కోసం క్యూలు కడుతున్నారు తప్పితే తక్కువ బడ్జెట్ కోర్సుల జోలికే పోవడం లేదని విద్యావేత్తలు అంటున్నారు. 

ఢిల్లీలో కిడ్నీ రాకెట్..

ఢిల్లీ : కిడ్నీలను అక్రమంగా కొనుగోలు చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు అపోలో సిబ్బంది కూడా ఉన్నారు. 

ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ..

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ప్రాజెక్టు రీ డిజైన్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. వరంగల్ అగ్రికల్చర్ వెటర్నరీ కాలేజీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

14:58 - June 3, 2016

విజయవాడ : అనుకున్న సమయం రానే వస్తుంది..కానీ ఆసక్తిగా ఎదురుచూసే ఏపీ ప్రజలకు ఆశా భంగం కానుందేమో అనిపిస్తుంది. ముహూర్తం ముంచుకొస్తున్నా.. పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. దీంతో ఏం జరుగుతుందోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది.

ఏపీ సచివాలయ పనుల్లో జాప్యం...
గుంటూరులోని వెలగపూడిలో జూన్ 27 నాటికి తాత్కాలిక సచివాలయంలో పాలన ప్రారంభం అవుతుందన్న ప్రభుత్వం మాటలు నిజం అయ్యేలా కనిపించడం లేదు. ఇంకా చాలా పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. 25 రోజుల్లో రెండు బ్లాక్‌లకు శ్లాబులు, వాటిలో గదులు, ఫర్నిచర్, ఎలక్ర్టిసిటీ లాంటి సదుపాయాలు ఏర్పాటు చేయాల్సి ఉంది.

షెడ్యూల్‌ ప్రకారం పనులు పూర్తి చేయని సంస్థలు...
వాస్తవానికి జూన్ 15 కల్లా పనులు పూర్తి చేస్తామని నిర్మాణ సంస్థలు చాలా గట్టిగానే చెప్పాయి. అయితే ఫిబ్రవరి నుంచి మే 15 వరకు షెడ్యూల్ ప్రకారమే పనులు పూర్తి చేసిన నిర్మాణ సంస్థలు, తర్వాత మాత్రం షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయలేకపోతున్నాయి. ఇప్పటి వరకు ఎల్అండ్‌టీకి చెందిన మూడు బ్లాక్ లకు మాత్రమే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ శ్లాబ్‌లు పూర్తి అయ్యాయి. షాపుర్ జీ పల్లోంజి సంస్థలు నిర్మిస్తున్న మొదటి, రెండో బ్లాక్‌ల మొదటి అంతస్థుల శ్లాబ్ పనులు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి.అయితే గత నెల కార్మికుడు మృతి చెందడం.. వర్షాల కారణంగా పనుల్లో జాప్యం జరిగిందని తెలుస్తోంది.

కొనసాగుతున్న శ్లాబ్‌ పనులు, గదుల నిర్మాణం...
రెండు బ్లాక్‌ల శ్లాబ్‌లు పూర్తి కావడానికి జూన్ 8 వరకు సమయం పట్టే అవకాశం ఉంది.. గదుల నిర్మాణం పూర్తయిన తర్వాత వాటికి ప్లాస్టింగ్ చేయడం, సీలింగ్ ఏర్పాటు చేయడం , ఫర్నీచర్, ఎలక్ట్రీసిటీ , బాత్ రూమ్స్, లిఫ్ట్ లు, రోడ్లు, డ్రైనేజీ, పార్కింగ్ లాంటి పనులు 25 రోజుల్లో పూర్తి కావడం కష్టమేనని అంటున్నారు.

డైలమాలో సర్కారు...
అయితే జూన్ 27 నాటికి తాత్కాలిక సచివాలయం పూర్తి కాకపోతే ఏం చేయాలో ప్రభుత్వానికి పాలుపోవడం లేదు..జూన్ 27 నాటికి ఎన్ని బ్లాక్ లు అందుబాటులోకి వస్తే అన్ని బ్లాక్ ల్లో విధులు నిర్వర్తించడమా? లేక మరో 15 రోజుల సమయాన్ని పొడిగించడమా అనే మీ మాంసలో ప్రభుత్వం ఉంది.

నిర్మాణ సంస్థలను అనలేక, ఉద్యోగులు ఒప్పించలేక ఇబ్బందిలో పడిన సర్కారు...
ఒకవేళ రెండు , మూడు బ్లాక్ లు పూర్తి చేసి అందులో విధులు నిర్వర్తించాలని ఉద్యోగులను కోరితే వారు ఒప్పుకుంటారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి..ఉద్యోగులకు ఇచ్చిన తేదీ కంటే మరో 15 రోజుల పెంచితే వారి నుంచి వ్యతిరేకత వస్తుందేమో అన్న భయం ప్రభుత్వంలో నెలకొంది..అటు నిర్మాణ సంస్థలను అనలేక, ఇటు ఉద్యోగులు ఒప్పించలేక ప్రభుత్వం ఏం చేస్తుందనే ఉత్కంఠ నెలకొంది.  

14:56 - June 3, 2016

న్యూఢిల్లీ : టీమ్‌ ఇండియా జులైలో వెస్టిండీస్‌కు వెళ్లనున్నది. బీసీసీఐ, వెస్టిండీస్‌ బోర్డుల భేటీతో షెడ్యూల్‌ ఖరారయ్యింది. విరాట్‌ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు జులై 6 నుంచి ఆగష్టు 22 వరకు వెస్టిండీస్‌లో నాల్గు టెస్టుల సిరీస్‌లో తలపడనున్నది. కరీబియన్‌ పర్యటనలో భాగంగా సన్నాహకంలో రెండు, మూడు రోజుల వార్మప్‌ మ్యాచుల్లోనూ టీమ్‌ ఇండియా ఆడనున్నది. ఈ నెల 11న ఆరంభమయ్యే జింబాబ్వే టూర్‌ ముగిశాక.. టీమ్‌ ఇండియా కరీబియన్‌ సవాల్‌కు సిద్ధం కానున్నది.

14:53 - June 3, 2016

లండన్‌: భారత్‌, పాకిస్థాన్‌ క్రికెట్‌ పోరు అంటే అందరికీ సంబరమే!. అభిమానులకు పసందైన పోటీ, స్పాన్సర్లకు కొత్త ఆశలు, బ్రాడ్‌కాస్టర్లకు భరోసా సహా ఐసీసీ ఖాతాలోకి డబ్బు ప్రవాహం. అందుకే ప్రపంచ క్రికెట్‌ పాలిక చిరకాల ప్రత్యర్థుల సవాల్‌ను సదవకాశంగా మలుచుకున్నది. ఐసీసీ టోర్నీలపై ఆసక్తి పెంచటంతో పాటు ఆదాయాన్నీ రాబట్టుకోవచ్చని ఆలోచించింది. దాని ఫలితమే వరుసగా ఐసీసీ టోర్నీల్లో దాయాదుల ముఖాముఖి పోరు. తాజాగా 2017 ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలోనూ భారత్‌, పాక్‌లు తమ తొలి పోరులోనే తలపడనున్నాయి. వీటికి తోడు మరో గ్రూప్‌లో చిరకాల ప్రత్యర్థులు ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాలూ కయ్యానికి కాలు దువ్వనున్నాయి. ఇక భారత్‌, పాక్‌ మ్యాచ్‌కు వేదికగా ఆసియా సంతతి ప్రజలు ఎక్కువగా నివసించే బర్మింగ్‌హామ్‌ను ఎంచుకోవటం సైతం ఐసీసీ ఆదాయ ఆలోచనకు అద్దం పడుతున్నది. ఐతే భారత్‌, పాక్‌లను ఒకే గ్రూప్‌లో ఉంచడానికి ఐసీసీ ప్రయత్నించిందని స్వయంగా వరల్డ్ క్రికెట్‌ బాడీ బాహాటంగా అంగీకరించటం విశేషం. ద్వైపాక్షిక సంబంధాల దృష్ట్యా భారత్‌, పాక్‌లు కొన్నాండ్లుగా కేవలం ఐసీసీ టోర్నీలలోనే ముఖాముఖికి సిద్ధమవుతున్నాయి. ఈ హైప్‌ను ఐసీసీ చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నది.  భారత్‌, పాక్‌లను ఒకే గ్రూప్‌లో చేర్చడానికి ప్రయత్నించామనటంలో ఎలాంటి సందేహం లేదు. ఐసీసీ పరంగా ఇది పెద్ద ఈవెంట్‌. ప్రపంచవ్యాప్తంగా అభిమానులూ ఇది కోరుకుంటున్నారు. చాంపియన్స్ ట్రోఫీకే ఈ పోరు హైలైట్‌, గొప్ప స్పందన లభించనున్నది' అని ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రిచర్డ్ సన్‌ పేర్కొన్నారు.

14:50 - June 3, 2016

ఫేస్‌ప్యాక్‌లు మార్కెట్‌లో ఎన్ని అందుబాటులో ఉన్నా... ఇంట్లో చేసుకున్నవి ఎంతో మేలు. ఎప్పుడూ అందుబాటులో ఉండే అరటిపండుతో ఫేషియల్‌ ముఖానికి ఎంతో కాంతినిస్తుంది. ముఖాన్ని కడిగి... అరటిపండు గుజ్జును పట్టించాలి. పది నిమిషాల తరువాత తొలగించాలి. ఆ తరువాత ముఖానికి కొంత ఆవిరిపట్టి... అరటిపండు తొక్కతో ముఖంపై మృదువుగా మర్దన చేయాలి. దీనివల్ల ముఖంపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. ఆ తరువాత మసాజ్‌ క్రీమ్‌కి అరటిపండు గుజ్జు కలిపి పది నిమిషాలపాటు మసాజ్‌ చేయాలి. దీంతో చర్మం మృదువుగా తయారవుతుంది. చివరకు మళ్లీ బనానా ఫేస్‌ ప్యాక్‌ ముఖానికి మెడకు వేసుకని... పది నిమిషాల తరువాత కడిగేస్తే ముఖానికి కొత్త నిగారింపు వస్తుంది. 

14:47 - June 3, 2016

'నాకు నటించడం తప్ప మరేది రాదు. జీవితాంతం సినిమాల్లోనే కొనసాగుతాన'ని అంటోంది బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌. బాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్‌, జీవిత కథా చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన విద్యాబాలన్‌ ప్రస్తుతం రిభు దాస్‌గుప్తా రూపొందిస్తున్న 'తీన్‌' చిత్రంలో నటిస్తోంది. అమితాబ్‌ బచ్చన్‌, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. ఈ చిత్రం కోసం స్పెషల్‌ పోస్టర్‌ని డిజైన్‌ చేసి అందర్ని ఆశ్చర్యపరిచిన విద్యా తన కెరీర్‌ గురించి స్పందిస్తూ, 'నాకు నటించడం ఒక్కటే తెలుసు. ఇప్పుడదే చేస్తున్నా. ఇకపై కూడా నటిస్తూనే ఉంటాను. కథానాయికలకు అవకాశాలు కొద్దికాలమే వస్తాయి. కాబట్టి సాధ్యమైనన్ని ఎక్కువ సినిమాల్లో నటించమని చాలా మంది చెబుతుంటారు. కానీ నేనది నమ్మను. జీవితాంతం పరిశ్రమలోనే ఉంటా. ప్రస్తుతం నా దగ్గరికి బయోపిక్‌ల స్క్రిప్ట్‌లే ఎక్కువగా వస్తున్నాయి. వాటిల్లో తాజాగా అలనాటి నటి మీనాకుమారి బయోపిక్‌ కోసం ఓ కథ వచ్చింది. నాకెంతో బాగా నచ్చింది' అని తెలిపింది.ప్రస్తుతం 'కహాని 2', 'ఏక్‌ అల్బేలా' చిత్రాలతో పాటు తాజాగా 'బేగంజాన్‌' చిత్రంలోనూ నటించేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. పీరియాడిక్‌ ఎపిక్‌గా తెరకెక్కబోయే ఈచిత్రంలో నసీరుద్దీన్‌షా నటించనున్నారు.

 

బాబుది నయవంచన దీక్ష - మల్లాది విష్ణు..

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబుది నయవంచన దీక్ష అని ఏపీ కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు పేర్కొన్నారు. హామీల నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకు బాబు యత్నిస్తున్నారని, బాబు దీక్ష పెట్టిన చోటే కాంగ్రెస్ సభ పెట్టి విభజన చట్టంలో చెప్పిందేంటో ప్రజలకు చెబుతామన్నారు. 

కోర్టుకు హాజరైన విజయసాయిరెడ్డి..

హైదరాబాద్ : వైసీపీ నేత విజయసాయిరెడ్డి నాంపల్లిలోని సీబీఐ కోర్టు ఎదుట హాజరయ్యారు. రోడ్డు ప్రమాదంలో గాయపడినందుకే హాజరు కాలేకపోయానని రీకాల్ పిటిషన్ లో పేర్కొన్నారు. అంతకుముందు కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. 

జైలుకెళ్లినా జగన్ కు జ్ఞానోదయం కాలేదు - పయ్యావుల..

విజయవాడ : జైలుకెళ్లినా జగన్ కు జ్ఞానోదయం కాలేదని టిడిపి నేత పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. జగన్ డ్రిపెషన్ లో ఉన్నారని, జగన్ పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు రాళ్లతో కొడుతారని తెలిపారు. 

సంబరాలకు వేల కోట్ల ఖర్చా - షబ్బీర్ ఆలీ...

హైదరాబాద్ : రాష్ట్ర అవతరణ వేడుకలకు వంద కోట్లు ఖర్చు చేయడం సరికాదని టి.కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఎన్నికల హామీలేవీ పూర్తిగా అమలు కాలేదని, రెండేళ్లలో జరిగిన అభివృద్ధి, అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడం ఖాయమని, ఉప ఎన్నికలకు బదులుగా అసెంబ్లీని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలిపారు. అందుకే 2022 కల్లా హామీలు అమలు చేస్తామంటున్నారని పేర్కొన్నారు. 

మత్తయ్యకు కోర్టులో ఊరట...

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన 'ఓటుకు నోటు' కేసులో నిందితుడు మత్తయ్యకు హైకోర్టు నుంచి ఊరట లభించింది. ఈ కేసులో మత్తయ్యను నిందితుడిగా చేరుస్తూ, ఏసీబీ కేసును నమోదు చేయగా, తనకు కేసుతో ఎలాంటి సంబంధమూ లేదని, రాజకీయ కారణాలతోనే తనను ఇరికించారని చెబుతూ, మత్తయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించి వాదోపవాదాలను విన్న హైకోర్టు, మత్తయ్య తరఫు న్యాయవాది వాదనతో ఏకీభవించింది. ఆయనపై ఏసీబీ పెట్టిన కేసును కొట్టివేస్తున్నట్టు తెలియజేసింది.

విజయసాయిరెడ్డికి నాన్‌బెయిలబుల్ వారెంట్‌...

హైదరాబాద్ : జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డిపై నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను సీబీఐ కోర్టు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో విచారణకు హాజరు కానందుకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు కోర్టు పేర్కొంది. అనారోగ్యం వల్ల విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు విజయసాయిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. విజయసాయిరెడ్డి తీరుపై సీబీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయసాయిరెడ్డి పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. జగన్ అక్రమాస్తుల కేసు విచారణను కోర్టు ఈ నెల 10కి వాయిదా వేసింది.

14:17 - June 3, 2016

అనంతపురం : ప్రజలను మోసం చేసిన సీఎం చంద్రబాబును చెప్పుతో కొడితే తప్పేంటని వైసీపీ అధినేత జగన్ అన్నారు. అనంతరపురం జిల్లాలో నిర్వహించిన రైతు భరోసా యాత్రలో ఆయన ప్రసంగించారు. రైతులు, డ్వాకా మహిళలు, చేనేత కార్మికులు, విద్యార్థులను చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు...కానీ చంద్రబాబుకు అధికారం వచ్చికా ఉన్న జాబులను ఊడదీస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికలప్పుడు ఎం చేప్పారు.. ఇప్పుడు చేస్తున్నదేమిటీ అని ప్రశ్నించారు. ఎన్నిలక్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. విమర్శించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందన్నారు. మృతుల కటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు ప్రభుత్వానిది కాదా.. అన్నారు. 

 

14:09 - June 3, 2016

దర్శకుడు ముప్పలనేని శివతో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా శ్రీశ్రీ సినిమా విశేషాలను తెలిపారు. తన సినీ ప్రస్థానం, అనుభవాలు వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

14:05 - June 3, 2016

మెదక్ : ఓ వ్యక్తి  బ్యాంకు ఖాతా నుంచి ఏకంగా  6.5 లక్షలు మాయమైన ఘటన మెదక్ జిల్లా రామచంద్రపురంలో చోటుచేసుకుంది. బీరంగూడ కమాన్ వద్ద లక్ష్మీ విలాస్ బ్యాంకులో మల్లేష్ అనే వ్యక్తికి అకౌంట్  ఉంది. తన ఖాతాలో చూసుకుంటే 6.5 లక్షల డబ్బులు మాయమైనట్లు తెలిసింది. దీంతో ఖంగుతిన్న మల్లేష్ బ్యాంకు అధికారులను ప్రశ్నించారు. వారి నుంచి సరైన సమాచారం రాలేదు. బ్యాంకు అధికారులే తన ఖాతాలోని డబ్బులు మాయం చేశారని మల్లేష్ ఆరోపించారు.  మాకు న్యాయం చేయాలంటూ లక్ష్మీ విలాస్ బ్యాంకు ఎదుట మల్లేష్ కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. 

 

14:03 - June 3, 2016

హైదరాబాద్ : నకిలీ విత్తానాలిచ్చి తమను  మోసం చేసిన మహికో, నూజివీడు విత్తన కంపెనీల లైసెన్స్ లను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులు హైదరాబాద్ వ్యవసాయశాఖ కమిషనర్‌ కార్యాలయం ముందు బైఠాయించారు. ఈ కంపెనీలు నకిలీ విత్తనాలు ఇచ్చాయని, తమకు నష్టపరిహారం ఇవ్వాలని అధికారులు ఆదేశించినా ఎలాంటి స్పందన లేదని మండిపడ్డారు. గత డిశంబర్‌లోనే నష్టపరిహారమిస్తామని పేర్కొన్నా, ఇంతవరకూ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యను విన్నవించుకుందామని, ఎన్నిసార్లు కమిషర్ ప్రియదర్శినిని కలవడానికి వచ్చినా ఆమె ఉండటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

 

14:00 - June 3, 2016

హైదరాబాద్ : తెలంగాణ నుంచి రాజ్య సభ సభ్యులుగా డీఎస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఏకగ్రీవం అయ్యారు. ఏపీ నుంచి సురేష్ ప్రభు, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, విజయాసాయి రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాపేట్లో ఎన్నికల కమీషన్ నుంచి వీరు అధికార పత్రం అందుకోనున్నారు. 

 

13:55 - June 3, 2016

హైదరాబాద్ : వైసీపీ నేత విజయసాయి రెడ్డికి వారెంట్ జారీ అయింది. జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయి రెడ్డి కోర్టుకు హాజరు కాలేదు. దీంతో నాంపల్లి కోర్టు ఆయనకు వారెంట్ జారీ చేసింది. 

టీఎస్ ఆర్టీసీలో అధికారుల బదిలీలు..

హైదరాబాద్ : టీఎస్ ఆర్టీసీలో పలువురు అధికారుల బదిలీలు, పదోన్నతులపై ఆర్టీసీ జేఎండీ రమణారావు ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వేణు నియామకం అయ్యారు. హైదరాబాద్ జోన్ ఈడీగా ఉన్న నాగరాజు బస్‌భవన్‌కు బదిలీ అయ్యారు. ఆర్టీసీ పరిపాలన నిర్వహణ ఈడీగా నాగరాజుకు బాధ్యతలు అప్పజెప్పారు.

ఇండో అమెరికరన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సదస్సు..

హైదరాబాద్‌ : నగరంలో ఇండో - అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సదస్సును కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. సదస్సుకు గవర్నర్ నరసింహన్ హాజరయ్యారు. భారత్, అమెరికా మధ్య సంబంధాల్లో వాజ్‌పేయి, బిల్ క్లింటన్ కొత్త శకానికి తెరతీశారని, ప్రస్తుతం భారత్, అమెరికా మధ్య సంబంధాల్లో మోడీ - ఒబామా కొత్త అధ్యాయం సృష్టిస్తున్నారని చెప్పారు. 

ఘనంగా మంత్రి హరీష్ బర్త్ డే..

మెదక్ : నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు 44వ జన్మదినాన్ని హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. మంత్రుల నివాస ప్రాంగణంలో పెద్ద ఎత్తున తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు, అభిమానుల మధ్య ఈ వేడుక జరిగింది. 

మధుర ఘర్షణలపై విచారణ జరపాలి - హేమమాలిని..

ఉత్తర్ ప్రదేశ్ : మధురలో జరిగిన ఘర్షణలపై సీబీఐ విచారణ జరిపించాలని మధుర బీజేపీ ఎంపీ, సినీ నటి హేమమాలిని డిమాండ్ చేశారు. మధురలో ఓ పార్కు వద్ద ఆక్రమణ దారులకు, పోలీసులకు మధ్య పెద్దఎత్తున జరిగిన ఘర్షణల్లో ఇద్దరు పోలీసులతో సహా 21 మంది ప్రాణాలు కోల్పోన సంగతి తెలిసిందే. 

జగన్ కు రోజులు దగ్గరపడ్డాయి - ఏపీ మంత్రి యనమల..

తూర్పు గోదావరి : జగన్ కు రోజులు దగ్గరపడ్డాయని ఏపీ మంత్రి యనమల పేర్కొన్నారు. జిల్లా కాకినాడలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా జగన్ పై యనమల నిప్పులు చెరిగారు. త్వరలోనే జగన్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఖాయమన్నారు.

13:26 - June 3, 2016

విజయవాడ : ఆశ పెట్టింది.. ఆనందపరిచింది.. అంతబాగానే ఉందనుకునేటప్పటికీ కాపు తగ్గి కన్నీరు మిగిల్చింది. దీంతో మామిడి రైతుల ఆశలన్నీ అడియాసలయ్యాయి. కాపు లేక.. పండిన పంటకు గిట్టుబాటు ధర రాక  నష్టమే మిగిలింది. ప్రతి ఏటా ఆశగా ఎదురుచూస్తున్న మామిడి రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. ఈ సంవత్సరం అనుకున్న స్థాయికంటే అధికంగానే పూత పూసినప్పటికీ మామిడి కాయలు చెట్లకు నిలవలేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కాపు పది శాతం లోపే ఉండడంతో మామిడికి సీజన్‌ ప్రారంభంలో మంచి ధర కూడా లభించింది. తర్వాత కాపు తగ్గిపోయింది.. ధర పడిపోయింది. 
ఈ ఏడాది కాపు దిగుబడి పది శాతం లోపు 
కృష్ణా జిల్లాలో 1.60 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లోనూ మామిడి తోటలు ఉన్నాయి. పశ్చిమ కృష్ణాలోనే 1.20 లక్షల ఎకరాల్లో మామిడి పంట సాగు ఉంది. కానీ ఈ ఏడాది కాపు దిగుబడి పది శాతంలోపు మాత్రమే ఉంది.  
ఆశించిన స్థాయిలో లభించన ధర
బంగినపల్లి మామిడి పండ్లకు.. టన్నుకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ధర లభించింది. రానురాను ధర తగ్గుముఖం పట్టి టన్ను రూ.25 వేల నుంచి రూ.30 వేల మధ్య కొద్దిరోజులు నిలబడింది. తోతాపురికి మాత్రం ఆశించిన స్థాయిలో ధర లభించలేదు. ప్రారంభంలో టన్నుకు రూ.20 వేల నుంచి రూ.25 వేల ధర లభించినప్పటికీ క్రమేణా దిగజారి రూ.8 వేల నుంచి రూ.12 వేల మధ్య నిలబడింది. 
గతేడాది కంటే భారీగా తగ్గిన ఎగుమతి 
గతేడాది మామిడి సీజన్‌లో విజయవాడలోని నున్న మార్కెట్ నుంచి 53 వేల టన్నుల మామిడికాయలు ఎగుమతి చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 13 వేల టన్నుల మాత్రమే ఎగుమతి చేయగలిగారు. మామిడి అధికంగా ఉన్న నూజివీడు, రెడ్డిగూడెం, ఎ.కొండూరు, విస్సన్నపేట, ఆగిరిపల్లి, గంపలగూడెం, తిరువూరు, మైలవరం తదితర ప్రాంతాల్లోని మామిడి తోటల్లో కాపు చాలా తక్కువగా ఉండడమే దీనికి కారణం. ఖమ్మం జిల్లాలోనూ కాపు తీవ్రంగా పడిపోయింది. వర్షాభావం కారణంగానే దిగుబడులు బాగా తగ్గిపోయాయని రైతులు చెబుతున్నారు. సకాలంలో వర్షాలు కురిసి ఉంటే ఈ పరిస్థితి ఉండకపోయేదని అంటున్నారు. కాపు పడిపోవడంతో రైతులు.. కూలీలు సంక్షోభంలో పడిపోయారని ఆవేదన చెందుతున్నారు.  

 

13:10 - June 3, 2016

వరంగల్ : నీళ్లు.. నిధులు.. నియామకాల కోసం పోరాడి సాధించిన తెలంగాణలో ఆవిర్భావ సంబురాలు అంబురాన్నంటితే... వరంగల్‌లో మాత్రం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వినూత్నంగా సంబురాలకు శ్రీకారం చుట్టారు. నిరుదోగ్యుల కోసం జాబ్ మేళా నిర్వహించారు..  ఆవిర్భావ వేళ.. ఉద్యోగ మేళాతో వరంగల్ బిజీ బిజీగా మారింది.. యువతలో సంతోషం వెళ్లి విరిసింది... జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది..
జాబ్‌ మేళా 
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా వరంగల్‌ మహా నగరపాలక సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. హన్మకొండ నందనా గార్డెన్‌లో జరిగిన జాబ్‌మేళాకు నిరుద్యోగ యువతీ, యువకులు వేలాదిగా హజరయ్యారు. ఈ జాబ్‌మేళాలో 23 కంపెనీలు పాల్గొన్నాయి. 4,500 మంది నిరుద్యోగ యువత జాబ్‌మేళాకు హజరయ్యారు. వీరిలో 2,163 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించగా 708 మందికి ఉద్యోగాలు లభించాయి. మేయర్ నన్నపునేని నరేందర్, పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ జాబ్‌మేళాను ప్రారంభించారు.   
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం
రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించేందుకు జాబ్‌మేళాను నిర్వహించామన్నారు మేయర్ నన్నపునేని నరేందర్. స్వరాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఇచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. నగరంలోని నిరుద్యోగులకు ఆవిర్భావ వేళ ఉద్యోగాలు లభించడం ఆనందంగా ఉందని తెలిపారు. 
జాబ్‌మేళా నిర్వహించడం అభినందనీయం : ఎమ్మెల్యే దాస్యం 
ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాబ్‌మేళా నిర్వహించడం అభినందనీయమని పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. సీఎం కేసీఆర్ నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలు స్మార్ట్‌సిటీ, హృదయ్, అమృత్ పథకాలతో నగరం మరింత అభివృద్ధి దిశలో ముందుకు పోతుందన్నారు. 
అభ్యర్థులు ఆనందం 
వరంగల్ నగరంలో ఇంత పెద్ద ఎత్తున జాబ్‌మేళా నిర్వహించడం ఇదే మొదటిసారని, జాబ్‌మేళా నిరుద్యోగ యువతకు ఎంతో ఉపయోగ పడుతుందని అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేశారు. మొదటిసారిగా బల్దియా ఏర్పాటు చేసిన జాబ్‌మేళాకు  విశేష స్పందన వచ్చిందని, ఇలాంటి జాబ్‌మేళాలు నిరంతరం నిర్వహించాలని, ఒకే రోజు ఇంత మందికి ఉద్యోగాలు రావడం చాలా ఆనందంగా ఉందని యువత సంతోషం వ్యక్తం చేసింది. బల్దియా పాలకవర్గం మంచి ప్రయోగం చేసిందని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా జాబ్‌మేళా నిర్వహించడం హర్షణీయని ప్రశంసించారు.
 

ఏపీ, తెలంగాణ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం..

ఢిల్లీ : తెలంగాణ నుండి డీఎస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావులు ఏకగ్రీవమయ్యారు. ఏపీ నుండి సురేష్ ప్రభు, సుజనా చౌదరి, టి.జి.వెంకటేష్, విజయసాయిరెడ్డిలు ఏకగ్రీవమయ్యారు. కాసేపట్లో ఎన్నికల సంఘం నుండి అధికారికపత్రాలు అందుకోనున్నారు. 

శామిర్ పేటలో అగ్నిమాపక కేంద్రం ప్రారంభం..

రంగారెడ్డి : జిల్లాలోని శామీర్‌పేటలో అగ్నిమాపక కేంద్రాన్ని మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. జిల్లాలో 14 అగ్నిమాపక కేంద్రాలకు సొంత భవనాలు నిర్మిస్తామన్నారు. 

తెలంగాణ కేబినెట్ ప్రారంభం..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అధ్యక్షతనలో కాసేపటి క్రితం తెలంగాణ కేబినెట్ ప్రారంభమైంది. సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో ముఖ్యంగా అమరవీరుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే నిర్ణయానికి కేబినేట్ ఆమోద ముద్ర వేయనుంది. దాంతో పాటు ప్రభుత్వం ఇటీవల తీసుకున్న 180 రెసిడెన్షియల్‌ పాఠశాలలకు సైతం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వనుంది. భూమి పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్న పేద రైతులకు ప్రభుత్వం ఆవిర్భావ కానుకగా ఇచ్చిన సాదాబైనామా రిజిస్ట్రేషన్లకు మంత్రిమండలి ఆమోదముద్ర వేయనుంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

12:37 - June 3, 2016

హైదరాబాద్ : ప్రపంచ నెంబర్ వన్, సెర్బియన్ టెన్నిస్ వండర్ నొవాక్ జోకోవిచ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రొఫెషనల్ టెన్నిస్ చరిత్రలోనే వందమిలియన్ డాలర్లు ఆర్జించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ నాలుగోరౌండ్ విజయంతో జోకోవిచ్ ఈ ఘనతను సొంతం చేసుకొన్నాడు.....
జోకోవిచ్ రికార్డుల మోత
సెర్బియన్ వండన్ నొవాక్ జోకోవిచ్... గ్లోబల్ గేమ్ టెన్నిస్ కోర్టు లోపలా...వెలుపలా రికార్డుల మోత మోగిస్తున్నాడు. 
నెగ్గడంలోనే కాదు...సంపాదనలోనూ తనకుతానే సాటిగా నిలిచాడు. తన కెరియర్ లో ఇప్పటికే ఎనిమిది గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన 29 ఏళ్ల జోకోవిచ్...100 మిలియన్ డాలర్లు...అంటే మనరూపాయల్లో 674 కోట్లు సంపాదించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
జోకో ఆదాయం 100 మిలియన్ డాలర్లు 
2016 ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభానికి ముందు వరకూ...97 మిలియన్ డాలర్లు గా ఉన్న జోకోఆదాయం...నాలుగోరౌండ్ విజయంతో...ఒక్కసారిగా 100 మిలియన్ డాలర్ల మార్క్ ను అందుకొంది. ఫ్రెంచ్ ఓపెన్ నాలుగోరౌండ్లో...స్పెయిన్ ఆటగాడు బాటిస్టాను నాలుగు సెట్లలో అధిగమించిన జోకోవిచ్...క్వార్టర్స్ ఫైనల్స్ కు అర్హత సాధించడం ద్వారా...3 లక్షల 28 వేల 303 డాలర్లు సంపాదించాడు. దీంతో జోకోవిచ్ సంపాదన ఒక్కసారిగా...వంద మిలియన్ డాలర్ల మార్క్ ను దాటిపోయింది.
రోజర్ ఫెదరర్ ఆదాయం 98 మిలియన్ డాలర్లు 
మరోవైపు...జోకోవిచ్ ప్రధాన ప్రత్యర్థి, స్విస్ ఆల్ టైమ్ గ్రేట్ స్టార్.. రోజర్ ఫెదరర్ 98 మిలియన్ డాలర్లతో రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. తన కెరియర్ లో ఇప్పటికే 17 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన ఫెదరర్...తొలిసారిగా గాయంతో..ప్రస్తుత ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీకి దూరంగా ఉన్నాడు. ప్రస్తుత సీజన్లోని మిగిలిన రెండు గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో పాల్గొనడం ద్వారా...ఫెదరర్ సైతం వంద మిలియన్ డాలర్ల రికార్డును అందుకోడం ఖాయం గా కనిపిస్తోంది. ప్రపంచ టెన్నిస్ లో సూపర్ స్టార్ల సంపాదన ఈ రేంజ్ లో ఉందంటే ..వావ్ అనుకోవాల్సిందే మరి.

 

12:26 - June 3, 2016

అనంతపురం : తాడిపత్రిలో ఉద్రిక్తత పరిస్థతి నెలకొంది. చుక్కలూరులో జగన్‌ రైతు భరోసా యాత్రను అడ్డుకునేందుకు పలువురు ప్రయత్నించారు. అయితే యాత్రను అడ్డుకునేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులను పోలీసులు అడ్డుకున్నారు.

 

12:23 - June 3, 2016

నిజామాబాద్‌ : నీటి కటకటతో నిజామాబాద్‌ జిల్లా అతలాకుతలమవుతోంది. తీవ్ర వర్షాభావంతో భూగర్భ జలాలు అడుగంటి.. చెరువులు, కుంటలు ఎడారిని తలపిస్తున్నాయి. అటు పశుగ్రాసం, దాణా లేక పశువులు కబేళాలకు తరలడం అన్నదాతలకు కంటనీరు పెట్టిస్తోంది. వ్యవసాయం మూలన పడి పల్లెలు అలమటిస్తున్నాయి... కరవు కోరల్లో చిక్కిన ఇందూర్‌ జిల్లా రైతాంగం కష్టాలపై టెన్‌ టీవీ స్పెషల్ ఫోకస్‌....!
కరవు కరాళనృత్యం 
ఉత్తర తెలంగాణ ధాన్యాగారంగా పేరున్న నిజిమాబాద్‌ జిల్లాలో కరవు కరాళనృత్యం చేస్తోంది. మూడేళ్లుగా నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుతో జిల్లా రైతాంగం తల్లడిల్లుతోంది.  అకాల వర్షానికి ఖరీఫ్‌  పంటలు దెబ్బతినడం.. రబీలో క్రాప్‌ హాలిడే నెలకొనడంతో పల్లెలు పనుల్లేక పట్టణాలకు వలస బాట పడుతున్నాయి. చిన్న, సన్నకారు రైతులు అడ్డాకూలీలుగా మారుతున్నారు. కనీసం తాగేందుకు నీరు కూడా దొరక్క పల్లెలు ఖాళీ అవుతున్నాయి. భూగర్భజలాలు ఇంకిపోయి పచ్చని బయళ్లన్నీ ఎండిపోయాయి.  
దర్శనమిస్తున్న ఎడారి భూములు
నిజామాబాద్ జిల్లాలో చెరువులు, కుంటలు ఎండిపోయి ఎక్కడ చూసినా ఎడారి భూములే దర్శనమిస్తున్నాయి. చుక్కనీరు లేక ప్రాజెక్టులు సైతం బోసిపోయాయి. జలసిరులతో గలగలలాడిన ప్రాజెక్టులు బీటలు వారి నోళ్లు తెరిచాయి. దీంతో ఖరీప్‌ పంటలు పూర్తిగా ఎండిపోయి, అటు రబీ సీజన్‌ నాటికి కూడా సాగు చేయలేని పరిస్థితి తలెత్తింది. గతేడాది రబీలో 6లక్షల ఎకరాలు సాగైతే.. ఈ సారి అసలు వరి సాగే లేదని చెప్పాలి. అక్కడక్కడా ఒకటీ అరా ఎకరాల్లో వరిసాగు చేసినా ఎకరాకు ఇరవై బస్తాల ధాన్యం కూడా దిగుబడి రాలేదు. 
మూగజీవాల రోదన వర్ణనాతీతం
నోరు లేని మూగజీవాల రోదన వర్ణనాతీతం. మేత లేక, తాగడానికి నీళ్లు అందించలేక చంటిబిడ్డల్లా సాదుకున్న పశువులను రైతులు సంతలకు తరలిస్తున్నారు. బాన్సువాడ, కామారెడ్డి, ఇందల్వాయి, సాటాపూర్‌ మార్కెట్‌లలో జరిగే వ్యాపారాలు పరిశీలిస్తే.. జిల్లాలో పశువిక్రయాలు ఏమేరకు జరుగుతున్నాయో అర్థమవుతుంది. 40 నుంచి 50 వేల రూపాయల ధర పలికే పశువులనూ రైతుల వెతల దృష్ట్యా 15వేలు కూడా ఇవ్వబోమని వ్యాపారులు తెగేసి చెబుతున్నారు. దీంతో వాటిని పోషించే దారిలేక.. అయినకాడికే అమ్మేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలతో ఉపాధికోసం రైతులు వలసల బాట పడుతున్నారు.  పశుగ్రాసం, దాణా లేకపోవడంతో ఆ ప్రభావం పాడిపరిశ్రమపై పడింది. కరవు పరిస్థితుల్లో పాల ఉత్పత్తి కూడా తీవ్ర స్థాయిలో పడిపోయింది. లింగంపేట్‌ మండలంలో అనేక గ్రామాలు పశువులను విక్రయించి పనులకోసం పొట్ట చేతపట్టుకుని వలస పోయారు. 
వలసెల్లుతున్న కుటుంబాలు 
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పనులు జరుగుతున్నా, కూలీ భరోసా లేకపోవడంతో కుటుంబాలు వలస వెళ్లక తప్పని పరిస్థితి. భిక్కనూరు మండలంలో దాదాపు 5600 మంది మాత్రమే ఉపాధి పనులు చేస్తున్నారు. వీరికి రోజుకు వచ్చే సగటున కూలీ 106 రూపాయలు మాత్రమే. వాటితో ఇల్లు గడవక కూలీలు వలసబాట పడుతున్నారు. జుక్కల్‌, బిచ్కుంద, పిట్లం, నాగిరెడ్డిపేట్‌, గాంధారి, మాచారెడ్డి, తాడ్వాయి, మోర్తాడ్‌, బాన్సువాడ, సదాశివనగర్‌, భిక్కనూరు, ధర్పల్లి, డిచ్‌పల్లి, సిరికొండ, భీంగల్‌, కమ్మర్‌పల్లి, ఎల్లారెడ్డి, లింగంపేట్‌ మండలాలతో పాటు తదితర ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు 30 వేల కుటుంబాలు పొట్టకూటి కోసం పట్టణాలకు వలసవెళ్లాయి.  
పడిపోయిన భూగర్భ జలాలు 
కామారెడ్డి డివిజన్‌లో ప్రమాదకర స్థాయికి భూగర్భ జలాలు పడిపొయాయి. దీంతో తాగునీటి ఎద్దడి  ముంచుకొచ్చింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 800కుపైగా చేతిపంపుల్లో నీరు ఇంకిపోయింది.  నిజామాబాద్‌ అర్బన్‌, కామారెడ్డి, బోధన్‌, ఆర్మూర్‌, బాన్సువాడ పట్టణాల్లోని పలు కాలనీల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. వ్యవసాయానికి పెట్టింది పేరైన ఇందూర్ జిల్లా ఇప్పుడు కరువుకోరల్లో చిక్కి  కనీసం తాగడానికి కూడా నీరు దొరకని దుస్థితి నెలకొంది.  రాష్ట్రంలో భూగర్భజలం అడుగంటిన జిల్లాలో నిజామాబాద్ తొలిస్థానంలో ఉంది. వర్షాల్లేక వేసిన పంటలు ఎండిపోయి పంటపొలాలన్నీ బీడు భూములను తలపిస్తున్నాయి.  
ప్రాజెక్టుల్లో చుక్కనీరు లేదు... 
జిల్లాలో సరాసరి భూగర్భజలమట్టం19.01 మీటర్లకు చేరింది. నిజామాబాద్ జిల్లాలో 19.00 మీటర్లు పడిపోయాయి. ప్రాజెక్టుల్లో చుక్కనీరు లేక పంటలు ఎండిపోతుంటే రైతులు గుండెలు బాదుకుంటున్నారు. ఈ ఏడాది వర్షాలు పడకపోవడంతో ఎక్కడ చూసినా కరవు విలయ తాండవం చేస్తోంది. 

 

12:17 - June 3, 2016

విజయవాడ : వైసీపీనేత జగన్ మోహన్‌రెడ్డి మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని టీడీపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఈమేరకు మంత్రి దేవినేని మీడియాతో మాట్లాడారు. పర్సనల్‌డిజార్డర్ అనే మానసిక వ్యాధితో జగన్ బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. అందుకే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబుపై పత్రికల్లో అగౌరవంగా రాసారని అన్నారు. ప్రతిపక్షనేత హోదాలో ఉన్న జగన్‌ అలామాట్లాడటం సబబు కాదని హితవు పలికారు.

 

జగన్ సంస్కారహీనుడు - వర్లరామయ్య..

విజయవాడ : వైసీపీ అధినేత జగన్‌ సంస్కారహీనుడని టీడీపీ నాయకుడు వర్ల రామయ్య విమర్శించారు. త్వరలో జగన్ కు జైలు జీవితం తప్పదని పేర్కొన్నారు. 

12:11 - June 3, 2016

కర్నూలు : జిల్లాలోని అహోబిలం ఆలయ ఈవో కార్యాలయం, ఈవో ఇంటిపై 100 మంది గ్రామస్తులు దాడి చేశారు. ఈ ఘటనలో అసిస్టెంట్‌ ఈవో రాముడుకు గాయాలు అయ్యాయి. కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. 15 మంది మహిళలు, 5 మంది పరుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆక్రమణల తొలగింపు చేపట్టినందుకే దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.

 

లక్ష్మీ విలాస్ బ్యాంకులో వ్యక్తి ఖాతా నుండి రూ. 6.5 లక్షలు మాయం..

మెదక్ : లక్ష్మీ విలాస్ బ్యాంకులో బీరంగూడ కమాన్ ప్రాంతానికి చెందిన మల్లేష్ ఖాతా నుండి రూ. 6.5 లక్షలు మాయమయ్యాయి. విషయం తెలుసుకున్న మల్లేష్ కుటుంబసభ్యులు బ్యాంకు వద్ద ధర్నాకు దిగారు. 

మధురలో పోలీసుల అదుపులో 366 మంది..

ఉత్తర్ ప్రదేశ్ : మధురలో పోలీసుల దాడి కేసులో 366 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 47 తుపాకులు, 5 రైఫిళ్లు, 100 తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మధుర సిటీలో భూ ఆక్రమణకు వ్యతిరేకంగా జరిగిన డ్రైవ్ హింసాత్మకంగా మారింది. ఆ ఘటనలో మొత్తం 21 మంది మరణించారు. పోలీసులకు సుమారు మూడు వేల మంది ఆందోళనకారులకు మధ్య ఘర్షణ చెలరేగింది.

12:04 - June 3, 2016

డెహ్రడూన్ : ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఓ పార్కు వద్ద పోలీసులకు, సుమారు 3వేల మంది ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఇద్దరు పోలీసు అధికారులు సహా 21 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల మృతుదేహాలకు నేడు పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మృతి చెందిన ఇద్దరు పోలీసు అధికారుల్లో ఒకరు ఎస్పీ స్థాయి అధికారి కాగా, మరొకరు ఎస్సై కావటం గమనార్హం.మధురలోని జవహర్‌బాగ్‌ వద్ద ఉన్న 260 ఎకరాల పార్కును స్థానికులు రెండేళ్ల క్రితం ఆక్రమించుకున్నారు. అప్పటి నుంచి పోలీసులు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశాల మేరకు ప్రయత్నిస్తున్నప్పటికీ సాధ్యం కాలేదు. అయితే గురువారం పోలీసులు పార్కు వద్దకు వెళ్లగా ఆక్రమణదారులు రాళ్లు విసిరి ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. 

 

12:00 - June 3, 2016

విజయవాడ : ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ.. లక్ష్మీ కటాక్షం లేకపోతే చదువుల బండి సాగదనేది జగమెరిగిన సత్యం. నిరుపేదల చదువులు సాగాలంటే.. మాత్రం ఎంతో కొంత ఆర్థిక సాయం తప్పనిసరి. అలాంటి నిరుపేదలకు తోడ్పాటునందించే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి ఏపీలో టీడీపీ ప్రభుత్వం మంగళం పాడేలా కనిపిస్తోంది. విద్యార్థులెంత గగ్గోలు పెట్టినా పైసా కూడా విదిల్చకుండా తాత్సారం చేస్తోంది. 
బకాయిలు చెల్లించని ప్రభుత్వం 
ఏపీలో ఫీజు రీయింబర్స్ మెంట్ పథకానికి టీడీపీ ప్రభుత్వం మంగళం పాడేలా ఉంది. కొంత కాలంగా విద్యార్థులెంత ఆందోళన చేసినా, ప్రతిపక్షాలు నిలదీసినా..  కాగ్‌ సైతం మొట్టికాయలు వేసినా... విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను మాత్రం చెల్లించడం లేదు. 2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించి 1,690 కోట్ల రూపాయల బకాయిల చెల్లింపులను ప్రభుత్వం  పెండింగ్‌లో పెట్టింది. అటు కాలేజీ యాజమాన్యాలు ఫీజులపై ఒత్తిడి తేవడం, ఇటు ప్రభుత్వం పైసా చెల్లించకోపోవడంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.  
విద్యార్థుల పరిస్థితి మరీ దయనీయం
తెలంగాణలో చదువుతున్న ఏపీ విద్యార్థుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్ మెంట్ రాకపోవడంతో కోర్సులు పూర్తయినా విద్యార్థుల సర్టిఫికెట్లు మాత్రం చేతికి రావడం లేదు. సర్టిఫికెట్లు లేక చాలామంది ఉద్యోగాల్లో చేరలేని పరిస్థితి నెలకొంది. కానీ ప్రభుత్వం మాత్రం పొంతన లేని షాకులు చెప్పి రీయింబర్స్‌మెంటు బకాయిలను విడుదల చేయడంలో తీవ్ర జాప్యం చేస్తోంది.  
నిధుల విడుదలపై ప్రభుత్వ నిర్లక్ష్యం
ఫీజు రీయింబర్స్ మెంట్ నిధుల విడుదలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ పలు సందర్భాల్లో తప్పుపట్టింది. 2012-13లో ఫీజు రీయింబర్స్ మెంట్‌ను కాగ్‌ సమీక్షించింది. ప్రభుత్వం సకాలంలో ఫీజులు చెల్లించకపోవడంతో ప్రైవేట్ కాలేజీలు విద్యార్థుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నాయని తేల్చింది. 2015-16లోనైనా విద్యా సంవత్సరం ముగిసేలోగా ఫీజులు రీయింబర్స్ చేయాలని 2015 ఆగస్టు 7న ప్రభుత్వానికి లేఖ రాసింది. కాగ్  కడిగి పారేసినా ప్రభుత్వానికి మాత్రం కనువిప్పు కలగకపోవడం లేదన్న విమర్శులున్నాయి. 
60.15 కోట్ల రూపాయల బకాయిలు
2014-15 విద్యా సంవత్సరానికి సంబంధించి 60.15 కోట్ల రూపాయల బకాయిలను ఇంతవరకు చెల్లించలేదు. మరోవైపు రాష్ట్ర విభజనకు ముందు 2011 -2014 వరకు బకాయిలు కూడా ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం 58 శాతం, తెలంగాణ ప్రభుత్వం 42 శాతం బకాయిలను చెల్లించేలా ఒప్పందం ఉంది. కానీ ఏపీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. తెలంగాణ సర్కార్‌ సైతం బకాయిలను విడుదల చేయడం లేదు.  

 

పెట్రోల్ బంక్ క్యాషియర్ హత్య కేసులో అరెస్టులు..

హైదరాబాద్ : కూకట్ పల్లిలోని సుమిత్రానగర్ పెట్రోల్ బంక్ క్యాషియర్ సంగమేశ్వర్ హత్య కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో మైనర్ ఉన్నాడు.

యాడికిలో 144 సెక్షన్..

అనంతపురం : యాడికిలో 144 సెక్షన్ ను పోలీసులు అమలు చేశారు. తాడిపత్రి (మం) చుక్కలూరులో జగన్ రైతు యాత్రను అడ్డుకొనేందుకు ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్లారు. ఆయనను, ఆయన అనుచరులను పోలీసులు అడ్డుకున్నారు. 

11:55 - June 3, 2016

హైదరాబాద్ : జూన్ నెల ఉరుముతోంది. తొలకరి వర్షాలను తీసుకొస్తూకాదు...గుదిబండలాంటి ఫీజులను నెత్తినపెడుతూ..తల్లిదండ్రుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి స్కూళ్లు. జూన్‌లో పాఠశాలలు తెరవడంతో...తల్లిదండ్రులకు ఇక ఫీజుల మోత మోగనుంది. చదువులంటేనే సామాన్యుడి గుండెల్లో సుడిగుండం రేగుతున్న రోజులివి. జూన్‌ నెల అంటేనే పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు హడలిపోతున్నారు. సంవత్సరమంతా ఒక ఎత్తైయితే జూన్  నెల ఒక్కటే ఒక ఎత్తు. బుక్స్, స్కూల్ డ్రెస్‌లు, షూస్ , టిఫెన్ బాక్సులు, వాటర్ బాటిళ్లు ఇంకా ట్రాన్స్ పోర్టు ఫీజులు. వీటన్నింటికీ మించి తాటతీసే స్కూల్‌ ఫీజులు. అయితే రాబోయే ఫీజుల భారాన్ని భరించాలంటే అప్పుచేయక తప్పదని తల్లిదండ్రులు అంటున్నారు. 
ఫీజుల బ్యాండ్‌ బాజా
పిల్లలు స్కూల్లో అడుగుపెట్టింది మొదలు. ఫీజుల బ్యాండ్‌ బాజా మోగుతుంది. స్కూలు యాజమాన్యాలు ఇష్టం వచ్చినట్టు ఫీజుల్ని పెంచి వసూలు చేస్తుంటే. సామాన్య, మధ్యతరగతి తల్లిదండ్రులు బిక్కమొహం వేసుకొని చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పైసా పైసా కూడబెట్టినదంతా బడిఫీజులకే పోస్తున్నామని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఫీజుల భారంతో  అప్పుల పాలవుతున్నామని వాపోతున్నారు. తమ పిల్లలకు ప్రైవేటు విద్య అందని ద్రాక్షలా మారిందని పేరెంట్స్‌ తలలు పట్టుకుంటున్నారు. అసలు ఫీజుల వసూళ్లలో ఒక విధానమంటూ లేకుండా పోయింది. స్కూల్‌ బ్రాండ్‌ నేమ్‌ను బట్టి ఒక్కో స్కూలుకు ఒక్కో రేటు కడుతున్నారు‌. మా స్కూలు గొప్పదంటే...మా స్కూలే గొప్పదంటూ తల్లిదండ్రుల దగ్గరనుంచి వేలకు వేలు వసూలు చేస్తున్న వైనం తెలుగు రాష్ట్రాల్లో మామూలైపోయింది. ప్రైవేట్‌ బడులు ఇష్ట్రారాజ్యంగా వ్యవహరిస్తూ ఫీజుల్ని వసూలు చేస్తున్నా..అధికారులు  మాత్రం పట్టించుకోవడంలేదు. ఏదో నాలుగు రోజులు హడావుడి చేసి చేతులు దులుపుకుంటూ సైలెంట్‌ అయిపోతారని పేరెంట్స్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
స్కూల్లో అడుగుపెట్టగానే ఫీజుల మోత 
ఫీజుల సంగతి ఇలాఉంటే..కార్పొరేటు స్కూళ్లలో పుస్తకాలు, ఇతర  స్టేషనరీ అమ్మకాల దందా అంతాయింతా కాదు. మాదగ్గరే బుక్స్‌ కొనాలనే నిబంధన పెట్టి,..ఇష్టం వచ్చిన ధరలకు విద్యార్థులకు అంటగట్టడం మామూలైపోయింది. స్కూళ్లలో పుస్తకాలుగాని స్టేషనరీ గాని  అమ్మడానికి వీల్లేదని అధికారులు చెప్తున్నా..అన్ని కార్పొరేట్ స్కూల్స్ ఇదే పనిగా పెట్టుకుని డబ్బులు  దండుకునే పనిలో పడ్డాయి.
ఫీజుల్ని దండుకుంటున్న కార్పొరేట్‌ స్కూళ్లు 
విద్యాహక్కు చట్టం ప్రకారం  25శాతం మంది విద్యార్ధులకు ఉచిత విద్యను అందించాలి. ప్రతి ప్రైవేటు పాఠశాలలో ఇది అమలు కావాలి. కానీ ఆ విషయాలేవి ప్రైవేటు పాఠశాలలు పట్టించుకోవడంలేదు. ఫీజు రియంబర్స్ మెంట్ ఇవ్వాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తాత్సారం చేస్తున్నాయనే విమర్శలున్నాయి. ప్రైవేట్ స్కూళ్ల అత్యాశ. ప్రభుత్వాల ఉదాశీనత ఇలాగే కొనసాగితే...సమరశీల  పోరాటాలకు సన్నద్ధమవుతామని ప్రజాసంఘాలు  హెచ్చరిస్తున్నాయి.
విద్యాహక్కు చట్టానికి తూట్లు 
ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దందాకు ఈసారైనా అధికారులు  అడ్డుకట్ట వేయాలని  విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మొత్తానికి జూన్ అంటేనే... ఎందరికో అప్పులు మిగిలిస్తే... కొందరికి  మాంత్రం కాసులు కురిపిస్తోంది.

 

11:47 - June 3, 2016

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ లో టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై కేసు నమోదు అయింది. హైకోర్టు ఉత్తర్వులను ఉల్లఘింస్తూ ఓయూలో నిర్వహించిన జన జాతర సభలో పాల్గొన్న రేవంత్ పై కేసు నమోదు చేశారు. ఓయూ జన జాతరకు హాజరైన పలువురు నేతలపై ఎకూడా కేసు నమోదు అయింది. రేవంత్ తోపాటు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, చెరుకు సుధాకర్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, బెల్లయ్యనాయక్ లపై 188, 290, 21/76 సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. సభ నిర్వహించిన ఓయూ జేఏసీ నేతలపై కూడా కేసు నమోదు అయింది. హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ ఓయూలో సభ నిర్వహించారని ఆరోపణలు ఉన్నాయి. నిన్న ఓయూలో నిర్వహించిన జన జాతర సభలో రేవంత్ పాల్గొని, మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే అనుమతి లేని సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాత్రి 11.30 గంటలకు ఆయనపై కేసు నమోదు చేశారు. న్యూసెన్స్ క్రియేట్ చేశారని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, లేట్ నైట్ మీటింగ్ నిర్వహించారని... మూడు కేసులు నమోదు అయ్యాయి. రేవంత్ కు స్టేషన్ బెయిల్ మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది. మీటింగ్ కు ఎలాంటి అనుమతి లేదని నిన్న ఓయూ రిజిస్ట్రార్ అన్నారు. 

 

11:47 - June 3, 2016

ఓ దారుణం సభ్యసమాజాన్ని నివ్వెరపోయేలా చేసింది. ఓ కిరాతకం ఎందరో నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపింది. ఓ దుర్మార్గం మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. వేరొకరి స్వార్థం ఆ కుటుంబాల్లో కన్నీటికి కారణమైంది. ఆ భర్తను ఒంటరి చేసింది. మరో కుటుంబంలో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. వారు కన్నకలలను కల్లలను చేసింది. ఇలాంటి దుర్మార్గులు ఎంతో మంది ఉన్నారు. అమాయకురాల్లు బలై పోతూనే ఉన్నారు. మనిషిలో పెరిగిన స్వార్థం..అత్యాశ ఎన్నో కుటుంబాల్లో చిచ్చు రేపుతోంది. మరెన్నో కుటుంబాలకు ద్రోహం చేస్తోంది. ఆర్థిక సంబంధాలు..అత్యాశలే మానవ సంబంధాలు దెబ్బతీస్తూ శాసిస్తున్నాయి. మనుషుల మధ్య అంతరాలను ఏర్పరుస్తున్నాయి. ఏం సాధిస్తాం ? ఏం కావాలని కోరుకుంటున్నాం ? ఉన్నంతలో హాయిగా బతకే అవకాశం ఉన్నా ఎందుకీ దారుణాలు ? ఎందుకీ రాక్షసత్వం ? మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

11:22 - June 3, 2016

భర్త కువైట్ వెళ్లాడు...మంచి భవిష్యత్ కోసం ప్రయత్నం..మొగుడు డబ్బు పంపిస్తుంటే ఆలీ అడ్డదారులు..
తమ జీవితాలను తీర్చిదిద్దడం కోసం...తమ పిల్లల కోసం కష్టపడే వారిని చూసుంటాం. భర్త కష్టాల్లో పాలుపంచుకుంటూ వారి కాపురాన్ని చక్కదిద్దుకుంటూ వారి సమస్యలను పరిష్కరించుకుని అందమైన జీవితం కోసం అహర్నిశలు కాలంతో పాటు పోరాటం చేసే వారున్నారు. ఇలా ఎందరో తాము కూడా హాయిగా బతకాలనే వారు కష్టపడుతూనే ఉన్నారు. కానీ ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. కొందరు మహిళలు అడ్డదారులు తొక్కుతూ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. ఇంకొందరు అబలల బతుకులను ఛిద్రం చేస్తున్నారు. జరుగుతున్న నేరాల్లో మహిళలు బలవుతున్నారు. మహిళలే నేరస్థులవుతున్నారు. కష్టపడాలి..డబ్బు సంపాదించాలి..కొంతకాలం ఎడబాటు వచ్చినా ఆ తరువాత అందమైన జీవితం మనదే. ఇలా ఎన్నో భార్యకు చెప్పి భర్త కువైట్ వెళ్లాడు. అక్కడ పనులు చేసుకుంటూ పస్తులు ఉండుకుంటూ డబ్బులను భార్యకు పంపేవాడు. ఈ డబ్బుతో కాపురం చక్కదిద్దుకోవాల్సిన ఇళ్లాలు గడపదాటకుండానే నేరస్తురాలైంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి..

కేరళ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక..

కేరళ : రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా ఎల్డీఎఫ్ అభ్యర్థి పి.రామకృష్ణన్ ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎల్డీఎఫ్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 

అహోబిలం ఆలయ అధికారులపై దాడి..

కర్నూలు : జిల్లాలోని అహోబిలం ఆలయ ఏఈవో, పరిపాలనాధికారిలపై ఆక్రమణ దారులు గురువారం రాత్రి దాడి చేశారు. ఆలయ భూముల ఆక్రమణదారులు కర్రలతో ఈవో కార్యాలయంపై దాడికి యత్నించారు. ఈ దాడిలో ఏఈవోకు గాయాలయ్యాయి. 

యాడికిలో ఉద్రిక్తత..

అనంతపురం : జిల్లాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. యాడికిలో ప్రారంభమైన జగన్ యాత్రను అడ్డుకునేందుకు పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు రోడ్డెక్కారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి టిడిపి కార్యకర్తలను అడ్డుకున్నారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని చెప్పులతో కొట్టాలని నిన్న పెద్ద వడుగూరులో జగన్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 

10:41 - June 3, 2016

తూర్పు గోదావరి : పోలవరం ప్రాజెక్టు మన్యం ఆదివాసీల జీవితాల్లో చిచ్చు రేపుతోంది. చెట్లు..పుట్టలనే నమ్ముకుని..అడవితల్లి ఒడిలో సేదతీరుతున్న ఆదివాసీల గుండెల్లో   గుబులు పుట్టిస్తోంది. మన్యం తప్ప.. మరో ప్రపంచం తెలియని వేలాది కుటుంబాలను బలవంతగా పునరావాస కాలనీలకు తరలించిన ప్రభుత్వం.. వాళ్లకివ్వాల్సిన ప్యాకేజీ విషయంలో మాత్రం తీరని అన్యాయం చేస్తోంది. ఊరు, ఇళ్లు, భూముల్ని వదిలి.. గూడు చెదిరిన పక్షులైన పోలవరం ప్రాజెక్టు ఆదివాసీలపై టెన్‌ టీవీ స్పెషల్‌ ఫోకస్‌....!
చిచ్చు రేపుతున్న పోలవరం ప్రాజెక్టు.. 
అడవితల్లి బిడ్డల్లో.. చిచ్చు రేపుతున్న పోలవరం ప్రాజెక్టు.. ఉన్న ఊళ్లను.. భూముల్ని వదులుకుని.. గూడు చెదిరిన పక్షులైన ఆదివాసీలు... అదిస్తాం.. ఇదిస్తామని హామీలిచ్చిన ఏలికలు.. ఆచరణలో చేసిందేమిటి..? పన్నేండళ్ల క్రితం.. ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడంతో ప్రారంభమైన గుబులు.. ఇప్పటికీ వాళ్ల గుండెలు దాటడం లేదు. పోలవరం ప్రాజెక్టు కోసం ప్రజాభిప్రాయం చేపట్టిన పాలకులు తూర్పు మన్యం ఆదివాసీల జీవితాల్లో ఎప్పటికీ మరిచిపోని చేదు గుర్తులను మిగిల్చారు. తమ బతుకులకు పూచీ కావాలన్న ప్రాజెక్టు నిర్వాసితులను మాటలతోనే ఏమార్చారు. ఫలితంగా ప్రాజెక్టు డిజైన్‌ మొదలుకొని.. ప్యాకేజీ వరకు ఆదివాసీలు సమిధలుగా మారారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సరైన ప్యాకేజీ అందక నిర్వాసితుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.   
నిర్వాసితుల నోట్లో ప్రభుత్వం మట్టి
భూమికి భూమి.. ఇంటికి ఇల్లు ఇవ్వాల్సిన అధికారులు ఆదివాసీలకు మాయమాటలు చెప్పి... పునరావాస కాలనీలకు తరలించారు. ఎలాంటి పరిహారం ఇవ్వకుండానే బలవంతంగా తరలించి నిండా ముంచారు. కొత్తగా తెచ్చిన 2013 చట్టం ప్రకారం పునరావాస ప్యాకేజీ ఇస్తామంటూనే నిర్వాసితుల నోట్లో ప్రభుత్వం మట్టి కొడుతోంది. పచ్చని భూముల్ని, నివాసముండే ఇళ్లను వదులుకుని దిక్కులేని పక్షుల్లా మారిన వారి వెతల్ని తీర్చేదెవరు...?  ఇదేనా ప్రభుత్వ నిర్వాకం. ఇక మా గోడు వినేవారా లేరా అంటున్నారు బాధితులు.
పునరావాస కల్పనలో ప్రభుత్వం నిర్లక్ష్యం 
తూర్పు గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు కింద దేవిపట్నం, చింతూరు, కూనవరం వరరామచంద్రపురం, యటపాక మండలాల పరిధిలో 234 ఆవాసాల్లో 30,164 కుటుంబాలకు ఆర్‌ ఆండ్‌ ఆర్‌ ప్యాకేజీ కింద పునరావాసం కల్పించాల్సిన ప్రభుత్వం అలాంటి చర్యలేమీ తీసుకోకుండానే చేతులు దులుపేసుకుంది. దాదాపు 60వేల మంది ఆదివాసీలకు పునరావాసం కింద ఇంటి నిర్మాణంతో పాటు భూమికి భూమి పరిహారంగా ఇవ్వాలి. అలాగే ఆదివాసేతరులకు భూమికి, ఇంటికి పరిహారాన్ని చెల్లించాలి. కానీ ఇప్పటివరకు కేవలం ఆరు ఆవాసాల ఆదివాసీలకు 887 ఇళ్లను నిర్మించి పునరావాస కాలనీలకు తరలించింది. కానీ ఆ పునరావాస కాలనీలు ఏ మాత్రం నివాసయోగ్యంగా లేవని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
ఆదివాసీల నుంచి కమీషన్ల రూపంలో వసూళ్లు 
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస కల్పన కోసం 2004లో రాజమండ్రి కేంద్రంగా పోలవరం ప్రాజెక్టు స్పెషల్‌ కలెక్టర్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో పోలవరం ముంపు గ్రామాల్లో పర్యటించి ఆదివాసీలు, ఆదివాసేతరుల వివరాలు సేకరించడం వారి విధి. కానీ  కొందరు సిబ్బంది దళారులతో కుమ్మక్కైన సిబ్బంది ప్యాకేజీ విషయంలో పలు అవకతవకలకు పాల్పడ్డారు. అమాయక ఆదివాసీల నుంచి 20 శాతం కమీషన్ల రూపంలో వసూళ్లు చేశారు. అసలే భూములు కోల్పోయి, ఇళ్లు పోగుట్టుకుని పట్టెడు దుఃఖంలో ఉన్న నిర్వాసితుల నుంచి కమీషన్ల రూపంలో దండుకుని నిండా ముంచారు. 
సిబ్బంది చేతివాటం 
నిర్వాసితులకు భూమికి భూమి, ఇంటికి ఇల్లు ఇవ్వాల్సిన పోలవరం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్‌ కార్యాలయం సరిగా పనిచేయడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివాసీలకు ఆర్‌ అండ్‌ ఆర్‌ కింద మంజూరు చేయాల్సి పరిహారం విషయంలోనూ స్పెషల్‌ కలెక్టర్‌ కార్యాలయ సిబ్బంది చేతివాటం చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 
ఆదివాసీలను నిండా ముంచారు
మాటలతో నమ్మించారు.. అదిస్తాం.. ఇదిస్తామంటూ ఏమర్చారు. చివరికి ఆదివాసీలను నిండా ముంచారు. ఏపీ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి సైతం లెక్కలేకపోవడంతో.. తమకు ఇక దిక్కెవరని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. చట్ట ప్రకారం పరిహారం చెల్లించి తమను ఆదుకోవాలని నిర్వాసితులు కోరుతున్నారు. పోలవరం ప్రాజెక్టు పరిధిలో ఉభయగోదావరి జిల్లాల్లో నిర్వాసితులయ్యే ఆదివాసీలకు.. ఇళ్లకు ఇళ్లు నిర్మించడానికి 1685 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు కేవలం 41 ఎకరాల భూమిని మాత్రమే సేకరించారు. ఆదివాసీల భూమికి భూమి పరిహారం కోసం 32,222 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 10 శాతం భూ సేకరణ కూడా కాలేదు. గతంలో ముంపు మండలం చింతూరులో  ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా 2013 కొత్త చట్టం ప్రకారం బాధితులకు పరిహారం ఇచ్చి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కానీ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకే మోక్షం లేకుండా పోయింది. 
ఇళ్లు నిర్మించడానికి 1685 ఎకరాల భూమి సేకరించాలి

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన భూసేకరణ స్పెషల్‌ కలెక్టర్‌ తీరు మాత్రం మరోలా ఉంది. 2013 చట్టం ప్రకారం దేవిపట్నం మండలంలో నిర్వాసితుల భూములకు ఇచ్చిన పరిహారం అధికంగా ఉందని మెలిక పెట్టారు. దాని ప్రకారం ఇవ్వడం కుదరదని, సమీక్ష పేరుతో సుమారు 13 కోట్ల రూపాయలను వెనక్కి తీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో సర్వం కోల్పోయిన ఆదివాసీలు, ఆదివాసేతరులు లబోదిబోమంటున్నారు. కొత్తచట్టం ప్రకారం పరిహారం ఇచ్చి ఆదుకుంటారనుకుంటే అసలుకే ఎసరు పెట్టి అన్యాయం చేస్తున్నారని వాపోతున్నారు. 
భూసేకరణ స్పెషల్ కలెక్టర్‌ కార్యాలయం ముందు ఆందోళనలు
అన్నీ కోల్పోయిన తమకు 2013 చట్టం ప్రకారం.. పట్టిసీమ తరహా ప్యాకేజీని అమలు చేయాలని ప్రాజెక్టు నిర్వాసితులు భూసేకరణ స్పెషల్ కలెక్టర్‌ కార్యాలయం ముందు ఆందోళనలు చేపట్టారు. 2013 భూ సేకరణ చట్టం నోటిఫికేషన్‌ ప్రకారం దేవిపట్నం బిట్‌1, బిట్‌2 భూములకు  2014లో డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. దేవిపట్నం మండలాన్ని ఆనుకుని ఉన్న సీతానగరం సబ్‌రిజిస్ట్రార్‌ పరిధిలోని పురుషోత్తపట్నంలో ఎకరా భూమి విలువ 3.50 లక్షలుగా నిర్ణయించారు. దాని ప్రకారమే దేవిపట్నం బిట్‌1, బిట్‌2 ముంపు భూములకు అవార్డు మంజూరు చేశారు. అయితే..2013 చట్టం ప్రకారం.. ఒక మండలంలోని ముంపు గ్రామంలో ఎకరాకు నిర్ణయించిన ధరను.. అదే మండలంలోని ఇతర ముంపు గ్రామానికి వర్తింపచేయరాదన్న నిబంధన ఉంది. ఒకవేళ అలా చేయాల్సి వస్తే.. గతంలో నిర్ణయించిన ధరకంటే.. ఎక్కువ ధరను నిర్ణయించాలని కూడా ఉంది. కానీ, అందుకు విరుద్ధంగా 2009లో దేవిపట్నం మండలంలోని తొయ్యేరులో ముంపు భూములకు ఎకరాకు నిర్ణయించిన 2.50 లక్షల ధరను 2013 చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా దేవిపట్నం బిట్‌1, బిట్2 భూములకు వర్తింపజేసేలా ఆదేశాలు జారీ అయ్యాయి. 
పోలవరం నిర్వాసితులు ఆగ్రహం 
కొత్తగా బాధ్యతలు చేపట్టిన పోలవరం ప్రాజెక్టు భూసేకరణ స్పెషల్‌ కలెక్టర్‌ చట్టం అమలుకు కొర్రీలు పెట్టడంపై పోలవరం నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిహారం ఇవ్వకుండా తమ పొట్ట కొడుతున్నారని ఆదివాసీలు, ఆదివాసేతరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని, సర్వం కోల్పోయిన తమకు అన్యాయం చేయవద్దని బాధితులు కోరుతున్నారు. 

10:26 - June 3, 2016

సోనూసోద్ ఎక్కువగా విలన్ పాత్రలు పోషిస్తారు ? కదా ఆయన ఎప్పుడు హీరో అయ్యాడు ? ఆయనతో తమన్నా డ్యాన్స్ చేసిందా ? అనే ప్రశ్నలు వస్తున్నాయి కదా.. హీరోయిన్..హీరోతోనే డ్యాన్స్ చేయాలా ? విలన్ తో చేయవద్దా ?. అరుంధతి...దూకుడు లాంటి సినిమాతో విలన్ గా తెలుగు ప్రేక్షకులకు సోనూసూద్ సుపరిచితుడు. ఈయన ప్రస్తుతం ఓ తెలుగు సినిమాలో నటిస్తున్నాడు. ఎ.ఎల్ దర్శకుడిగా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న 'అభినేత్రి' చిత్రంలో సోనూసూద్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో 'తమన్నా' కూడా నటిస్తోంది. వీరిద్దరూ ఈ చిత్రంలో డ్యాన్స్ చేశారంట. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. సోనూసూద్, తమన్నా జంటగా కనబడుతున్నారు. సోనూ విలన్ నుండి హీరోగా మారిపోయాడా ? అనేది తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. 

ఢిల్లీలో ఆరుగురు మృతి..

ఢిల్లీ : దేశ రాజధానిలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అలిపూర్ లోని జీటీ కర్నాల్ రోడ్డులో ఢిల్లీ నుండి కర్నాల్ వెళుతున్న స్పోర్ట్స్ కారు స్టేషనరీ వాహనాన్ని వెనుక నుండి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. 

10:22 - June 3, 2016

గుంటూరు : ఈ నెల 27 నుంచి ఎట్టి పరిస్థితుల్లో వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం నుంచి ప్రభుత్వ పాలన ప్రారంభమవుతుందని మంత్రి నారాయణ తెలిపారు. వెలగపూడిలోని తాత్కాలికి సచివాలయ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. నిర్మాణాలు అనుకున్న సమయానికి పూర్తి కావనే అపోహలను ఎవరూ నమ్మవద్దని మంత్రి నారాయణ చెప్పారు. రైతుల ప్లాట్ల పంపిణీ ఇప్పటికే ఆలస్యమయ్యిందని, ఇక గడువు పొడగించే అవకాశం లేదన్నారు. 

 

10:15 - June 3, 2016

పా రంజిత్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం కబాలి. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఎప్పుడు విడుదలవుతుందా ? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. జూన్ 12వ తేదీన చిత్ర ఆడియో విడుదల చేయనున్నట్లు నిర్మాత కలైపులి ఎస్ ధాను ట్విట్టర్ లో ప్రకటించారు. దీనితో అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్ రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి స్వరాలు సమ కూరుస్తున్నారు. మరోవైపు ఈ చిత్రం తెలుగు ఆడియో విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ చిత్రాన్ని జూలై 1 న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రంలో రజనీ సరసన రాధికా ఆప్టే జంటగా నటిస్తోంది.

10:15 - June 3, 2016

విజయవాడ : ఏపీలో ఒక వైపు విపరీతమైన ఎండలు.. మరోవైపు అకాల వర్షాలు కురుస్తున్నాయి.  రాష్ట్రంలోని  కొన్ని ప్రాంతాలలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడడంతో పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు చనిపోగా.. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.
లోతట్టు ప్రాంతాలు జలమయమం
అకాల వర్షాలు మరోసారి ఆంధ్రప్రదేశ్‌ను తడిపేశాయి. రాష్ట్రంలోని కడప, కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీవర్షాలు కురిశాయి. ప్రకాశం జిల్లా కనిగిరిలో భారీవర్షం కురిసింది. దీంతో పలుచోట్ల చెట్లు విరిగిపడిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణంలో విద్యుత్‌ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్నిచోట్ల పూరిళ్లు నేలకొరిగాయి.
కడపలో
ఇటు కడప పట్టణంలోనూ రెండు గంటలపాటు భారీవర్షం కురిసింది. ఆర్టీసీ డిపోలోకి భారీగా నీరు చేరింది. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. దీంతో రెండు గంటలసేపు బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. నగరంలోని మృత్యుంజయకుంట కాలనీలోకి భారీగా వర్షపునీరు వచ్చి చేరింది. కాలనీ మొత్తం జలమయమయింది. 
విజయవాడలో 
వర్షాలకు విజయవాడలో కొండచరియలు విరిగిపడి ఓ మహిళ దుర్మరణం పాలైంది. గుణదలలోని బెత్తెహామ్ కాలనీలో నివసిస్తున్న ఓ కుటుంబంపై కొండచరియలు విరిగిపడ్డాయి. నిద్రిస్తున్న కుటుంబసభ్యులపై పడడంతో నాగమణి అనే మహిళ మృతి చెందింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. 
గుంటూరులో  
అటు గుంటూరుజిల్లా బాపట్లలో ఓ మున్సిపల్‌ పారిశుధ్య కార్మికుడు విద్యుత్‌ షాక్‌తో మృతి చెందాడు. వర్షాలకు విద్యుత్ స్తంభం తెగిపడింది. ఇదే సమయంలో స్థానిక రామాలయం వద్ద పరిసరాలను శుభ్రం చేస్తుండగా విద్యుత్‌ తీగ తెగిపడి 20 ఏళ్ల బాణాల సత్తిబాబు మృతి చెందాడు. అధిక వేడి వల్ల క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి... అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

 

10:05 - June 3, 2016

కరీంనగర్ : జిల్లాలోని ధర్మారం మండలం అబ్బాపూర్ లో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తన ప్రియురాలితో పాటుగా ఆమె తల్లిపై కత్తి, ఇటుకలతో దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డిన ఇద్దరిని అత్యవసర చికిత్స నిమిత్తం కరీంనగర్ జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో నివాసం ఉండే రామకృష్ణ రెండేళ్లుగా ప్రేమ పేరుతో మైత్రి వెంట పడుతున్నాడు. వేధింపులు ఎక్కువవ్వడంతో తన అమ్మమ్మ ఊరు అబ్బాపూర్ కు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఉన్మాది రామకృష్ణ తన మిత్రులు 8 మందితో కలిసి ప్రియురాలు, ఆమె తల్లిపై దాడికి పాల్పడ్డాడు. గ్రామస్థులు రాకతో అతని మిత్రులు పారిపోగా సైకో రామకృష్ణ పోలీసుల అదుపులో ఉన్నాడు. మైత్రి, ఆమె తల్లికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు కరీంనగర్ ప్రభుత్వఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

 

10:03 - June 3, 2016

సైకిల్‌ ఒకనాటి రవాణా అవసరం. ఇప్పుడది వ్యాయామ సాధనం... అవును! శారీరక వ్యాయామానికే కాదు ఎంతో మానసిక ప్రశాంతతనీ ఇస్తుంది. మీరే చదవండి...
సైకిల్‌ తొక్కడం వల్ల శరీరంలోని అన్ని భాగాలకు కావాల్సిన వ్యాయామం దొరుకుతుంది. ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి. రోజుకి కనీసం ఐదు నిమిషాలపాటు సైకిల్‌ తొక్కినా జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. బరువూ తగ్గుతారు.
నడుము చుట్టుకొలత ఎక్కువగా ఉన్న వాళ్లకి సైకిల్‌ తొక్కడం ఔషధంలా ఉపయోగపడుతుంది. సైకిల్‌ తొక్కేప్పుడు మనసు ఉల్లాసంగా మారి... రక్త పోటు స్థాయిని అదుపులో ఉంచుతుంది. చెమట ఎక్కువగా రావడం వల్ల శరీరంలోని టాక్సిన్‌లు బయటకెళతాయి.
మధుమేహం రోగులకి ఇది మంచి చికిత్స కూడా... సైకిల్‌ తొక్కడం వల్ల రాత్రిపూట నిద్ర సక్రమంగా పడుతుంది. పొద్దుటిపూట సైకిల్‌ తొక్కడం వల్ల మనలో శక్తిస్థాయిలు పెరుగుతాయి. ఎండ నుంచి వచ్చే రేడియోషన్‌ కిరణాల ధాటిని తట్టుకోగలం కూడా.గుండెకి రక్తప్రసరణ స్థాయిని పెంచడంలో సాయపడుతుంది. తద్వారా ఆక్సిజన్‌ మెదడుకు సరిగ్గా అందుతుంది. మతిమరుపు సమస్యలు, పరధ్యానం వంటివి తగ్గుతాయి.

09:59 - June 3, 2016

నిద్రలేచీలేవగానే అద్దంలో ముఖం చూసుకునేవారు ఎందరో ఉన్నారు. వెంటనే ముఖం కడుక్కుంటారు. కారణం.. పొద్దున్నే ఫ్రెష్‌గా కనిపించాలని కోరుకుంటారు. ఎటువంటి ఇబ్బందుల్లేకుండా ఆ రోజు మొదలవ్వాలనుకుంటారు. అలా జరగాలంటే ముందు రోజు పడుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా ముఖానికి ఎలాంటి మేకప్‌ ఉన్నా దానిని తప్పనిసరిగా తొలగించుకోవాలి. తర్వాత కొద్దిగా మాయిశ్చరైజర్‌ని ముఖానికి రాసుకోవాలి. ముఖం కడుక్కున్న వెంటనే రాసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కొందరికి పొద్దున్నే నిద్రలేవగానే ముఖం ఉబ్బినట్లుగా ఉంటుంది. ఆ సమస్యను తగ్గించుకోవాలంటే రాత్రిపూట తీసుకునే భోజనంలో ఉప్పుశాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. రాత్రిళ్లు కొద్దిగా పాలమీగడను ముఖానికి రాసుకుని మర్దన చేయాలి. మర్నాడు కడిగేసుకోవాలి. ఇలా కొన్ని రోజులు పాటించడం వల్ల చర్మం మృదువుగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది.

09:58 - June 3, 2016

విశాఖ : జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య సాధారణం కంటే ఈసారి అధిక వర్షాపాతం నమోదు అవుతుందని ఐఎండీ డైరెక్టర్ లక్ష్మణ్ సింగ్ రాథోడ్ తెలిపారు. ఈమేరకు టెన్ టివితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. దక్షిణ భారత దేశంలో 6 శాతం అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఆయన వెల్లడించింది. దేశవ్యాప్తంగా జూన్, జూలై నెలల్లో సుమారు  అధిక వర్షపాతం నమోదు అవుతుందని తెలిపారు. వాయవ్య ప్రాంతంలో 108 శాతం వర్షం నమోదు కానుంది. అలాగే మధ్య భారత్‌లో 113 శాతం, ద్వీప ప్రాంతాల్లో 113 శాతం, ఈశాన్య రాష్ర్టాల్లో 94 శాతం వర్షం నమోదు కానున్నట్లు ఐఎండీ తెలిపింది. రుతుపవనాలు ఈ మరో నాలుగు రోజుల్లో కేరళను తాకనున్నట్లు ఐఎండీ డైరెక్టర్ తెలిపారు. 

మధురలో ఘర్షణలు..21 మంది మృతి...

మధుర : ఉత్తర ప్రదేశ్‌లోని మధుర సిటీలో భూ ఆక్రమణకు వ్యతిరేకంగా జరిగిన డ్రైవ్ హింసాత్మకంగా మారింది. ఆ ఘటనలో మొత్తం 21 మంది మరణించారు. పోలీసులకు సుమారు మూడు వేల మంది ఆందోళనకారులకు మధ్య ఘర్షణ చెలరేగింది. చనిపోయినవారిలో మధుర ఎస్పీ ముకుల్ ద్వివేది కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

09:54 - June 3, 2016

వాషింగ్టన్ : అమెరికా పర్యటనలో భాగంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కాలిఫోర్నియా గవర్నర్ ఎడ్మండ్ జెర్రి బ్రౌన్‌ను కలిశారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో జరుగుతున్న క్లీన్ ఎనర్జీ మినిస్టీరియల్ సమావేశాల సందర్భంగా కాలిఫోర్నియా గవర్నర్ సమక్షంలో సాంప్రదాయేతర ఇంధన రంగంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతకు ముందు శాన్‌ఫ్రాన్సిస్కోలోని ప్రఖ్యాత సాఫ్ట్ వేర్ కంపెనీ సేల్స్ ఫోర్స్ ప్రధాన కార్యాలయంలో కంపెనీ ప్రతినిధి బృందంతో కేటీఆర్ సమావేశమై హైదరాబాద్ నగరంలో ఐటీ కంపెనీలకు ఉన్న విస్తృత అవకాశాలను వివరించారు. 

09:51 - June 3, 2016

అనంతపురం : జిల్లాలో జరుగుతున్న వైసీపీ అధినేత జగన్ రైతు భరోసా యాత్ర ఇవాల్టికి  మూడోరోజుకు చేరుకుంది. నవనిర్మాణ దీక్ష చేపట్టిన చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబే దోషి అని ప్రజలకు తెలిసినా, ఇంకా సీఎం పదవిలో బాబు కొనసాగడమంటే ప్రజలను అవహేళన చేయడమేనని ఆరోపించారు. నిన్న ఆయన తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దవడుగూరు, యాడికి మండలాల్లో పర్యటించారు. 

 

రాజస్థాన్ లో వికటించిన పెళ్లి భోజనం..

రాజస్థాన్ : సిఖర్ ప్రాంతంలోని మక్సుద్ పురా లో ఓ వివాహ వేడుకల్లో భోజనం వికటించడంతో 250 మంది ఆసుపత్రి పాలయ్యారు. వీరందరికీ చికిత్స అందిస్తున్నారు. ఎలాంటి ప్రాణాపాయ ప్రమాదం లేదని, ఘటనా ప్రాంతానికి ఓ వైద్య బృందాన్ని పంపించినట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరిసింగ్ ఓ జాతీయ ఛానెల్ తో తెలిపారు. 

09:41 - June 3, 2016

నటిగా, దర్శకురాలిగా బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్నారు నందితా దాస్‌. 2002లో గుజరాత్‌ అల్లర్ల నేపథ్యంలో 'ఫిరాక్‌' చిత్రాన్ని రూపొందించి సంచలనం సృష్టించారు. చాలా రోజుల తర్వాత మరో రియల్‌ లైఫ్‌ ఆధారంగా సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పాకిస్తాన్‌ రచయిత సాదత్‌ హసన్‌ మంటో జీవితం ఆధారంగా 'మంటో' అనే చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి స్క్రిప్టు వర్క్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. సాదత్‌ వృత్తిపరమైన జీవితం ప్రధానంగా తెరకెక్కించే ఈ చిత్రంలో నవాజుద్దీన్‌ సిద్ధిఖీ నటించనున్నారు. ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది. దీనిపై నందితా దాస్‌ స్పందిస్తూ, 'నేను చాలా రోజులుగా మంటో జీవితం ఆధారంగా సినిమా చేయాలనుకుంటున్నాను. సాంప్రదాయ రచనలను బ్రేక్‌ చేస్తూ, ధైర్యంగా, స్వేచ్ఛగా వాటికి భిన్నంగా రచనలు రాయోచ్చని నిరూపించారాయన. తన రచనల్లోని పాత్రలు సున్నితంగా సానుభూతితో ఉంటాయి. ఆయన రాసిన పుస్తకాలు చదివేటప్పుడు చాలా పాశ్చాత్తాపం చెందాను. మన జీవితాలకు చాలా దగ్గరగా ఆయన రచనలున్నాయి. ఆయన స్ఫూర్తివంతమైన జీవితానికి నేను బాగా ఆకర్షితురాలినయ్యాను. అయితే నేను తీయబోయే సినిమాలో సాదత్‌ జీవితంలోని ముఖ్యమైన ఏడు ఏండ్ల జీవితాన్ని మాత్రమే చూపించబోతున్నాను. ఆ సమయంలో ఆయన లాహోర్‌, ముంబైలో ఉన్నారు. ఆయన జీవితంలో అది కీలకమైన సమయం. అయితే ఏదో ఒక పుస్తకం ఆధారంగానో ఈ చిత్రాన్ని చేయడం లేదు. ఆయన గురించి మా రచయిత అలీ మిర్‌తో కలిసి మూడేండ్ల పాటు పరిశోధన చేశాను. దాని ఆధారంగా స్క్రిప్టును రెడీ చేసుకున్నా. ఆయన జీవితం చాలా స్ఫూర్తివంతంగా ఉంటుంది. సాదత్‌ పాత్రలో నవాజుద్దీన్‌ని ఎంపిక చేశాం. ఎందుకంటే ఇదొక ఛాలెంజింగ్‌ రోల్‌. దానికి నవాజ్‌ అయితే న్యాయం చేయగలడని నా నమ్మకం. భిన్నమైన హావభావాలను ఎక్స్‌ప్రెస్‌ చేయడంలో నవాజ్‌ దిట్ట. సాదత్‌ భార్య సాఫియా పాత్రలో రసికా దుగల్‌ నటించనున్నారు' అని తెలిపారు.

 

09:37 - June 3, 2016

భిన్న చిత్రాల దర్శక, నిర్మాతగా రాజ్‌కుమార్‌ హిరానీకి బాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉంది. ఆయన రూపొందించిన '3 ఇడియట్స్‌' చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంలో అమీర్‌ఖాన్‌, మాధవన్‌, శర్మన్‌ జోషీ ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఈ సినిమా కేవలం బాలీవుడ్‌కే పరిమితం కాకుండా పలు భారతీయ భాషల్లోనూ రీమేకై మంచి విజయాన్ని సాధించింది. ఇదిలా ఉంటే, ఈ చిత్రానికి సీక్వెల్‌ రూపొందించేందుకు రాజ్‌కుమార్‌ హిరానీ రంగం సిద్ధం చేశారు. దీని గురించి అభిజిత్‌ జోషి మాట్లాడుతూ,'నేను, హిరానీ కలిసి సీక్వెల్‌కి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ని పూర్తి చేశాం. ప్రస్తుతం హిరానీ సంజరుదత్‌ బయోపిక్‌ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈ సినిమా తర్వాత '3 ఇడియట్స్‌' సీక్వెల్‌ ఉంటుంది' అని చెప్పారు.

 

09:34 - June 3, 2016

'ఇప్పటి వరకు ఎవరూ టచ్‌ చేయని ఒక కొత్త పాయింట్‌తో 'జక్కన్న' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఇందులో ఊహించని ట్విస్టులు చాలా ఉంటాయి. అవేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే' అని అంటున్నారు నిర్మాత ఆర్‌.సుదర్శన్‌ రెడ్డి. సునీల్‌, మన్నార్‌ చోప్రా జంటగా వంశీ కృష్ణ ఆకేళ్ల దర్శకత్వంలో ఆర్‌.పి.ఎ.క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఆర్‌.సుదర్శన్‌ నిర్మిస్తున్న చిత్రం 'జక్కన్న'. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ, 'సునీల్‌ నటించిన మంచి ఎనర్జిటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. ఇటీవలే దుబారులో ఓ సాంగ్‌ షూటింగ్‌ చేశాం. ఈ వారంలోనే వైజాగ్‌లో మరో సాంగ్‌ను షూట్‌ చేయబోతున్నాం. దీంతో సినిమా షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది. సునీల్‌ నటనలో అన్ని రకాల షేడ్స్‌ ఉంటాయి. సునీల్‌ కామెడీ టైమింగ్‌కి డైరెక్టర్‌ వంశీ రాసిన సీన్స్‌ థియేటర్స్‌లో క్లాప్స్‌ పడతాయి. ఎవరూ టచ్‌ చేయని పాయింట్‌తో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 'ప్రేమ కథా చిత్రం' తర్వాత మా బ్యానర్‌ నుంచి వస్తున్న ఈ చిత్రం ఆద్యంతం వినోదభరితంగా సాగుతూ, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హీరోయిన్‌ మన్నార్‌ చోప్రా పాత్రని కూడా దర్శకుడు చాలా అందంగా తీర్చిదిద్దాడు. డిఫరెంట్‌ గెటప్‌తో సప్తగిరి చేసే కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఈ నెల రెండోవారంలో ఆడియోను, జూలైలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు. కబీర్‌ సింగ్‌, సప్తగిరి, పోసాని, నాగినీడు, రాజ్యలక్ష్మి, ప్రభాస్‌ శీను, చిత్రం శ్రీను, అదుర్స్‌రఘు, సత్యప్రకాష్‌, రాజా రవీంద్ర తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సి.రాంప్రసాద్‌, సంగీతం: దినేష్‌, ఆర్ట్‌: మురళి, ఎడిటర్‌: ఎం.ఆర్‌.వర్మ.

 

టి.టిడిపి నేత రేవంత్ పై కేసు నమోదు..

హైదరాబాద్ : టి.టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై ఉస్మానియూ యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఆర్ట్స్ కళాశాల వద్ద జరిగిన జనజాతర కార్యక్రమంలో రేవంత్ పాల్గొన్న విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల ధిక్కరణ కింద రేవంత్‌రెడ్డితో ఇతరులపై కేసు నమోదు చేశారు. 

నేడు నగరానికి కేంద్ర రైల్వే మంత్రి..

హైదరాబాద్ : రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు హైదరాబాద్ కు రానున్నారు. రాజ్యసభ ఎన్నిక ఏకగ్రీవం అవుతున్న నేపథ్యంలో ఆయన ఎన్నికల అధికారి నుండి ధృవీకరణ పత్రం అందుకోనున్నారు. అనంతరం హైదరాబాద్ నుండి తిరుమలకు వెళ్లనున్నారు. శుక్రవారి రాత్రి తిరుమలలో బస చేస్తారు. శనివారం శ్రీవారి దర్శన అనంతరం విజయవాడకు వెళ్లనున్నారు. అక్కడ సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం మంత్రి సురేష్ ప్రభు ఢిల్లీకి పయనం కానున్నారు. 

ఎర్రచందనం దొంగలు అరెస్టు..

చిత్తూరు : జిల్లాలోని చిన్న గొట్టిగల్లు మండలం జవాది కొండల్లో ప్రత్యేక కార్యదళం సిబ్బంది నిర్వహించిన కూంబింగ్ లో ఇద్దరు ఎర్రచందనం దొంగలను అదుపులోకి తీసుకున్నారు. వీరివద్ద 24 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. 

09:26 - June 3, 2016

విచ్చల విడిగా పరిశ్రమలను ఏర్పాటు చేయడం వల్లే విశాఖలో కాలుష్యం ఏర్పడిందని ప్రముఖ సోషల్‌ యాక్టివిస్ట్ రత్నం తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. పరిశ్రమలలో కాలుష్యాన్ని కంట్రోల్ చేసే మెకానిజాన్ని సరిగ్గా అపరేట్ చేయడం లేదన్నారు. 'ప్రకృతి సౌందర్యాన్ని తనలో నింపుకున్న విశాఖపట్టణంలో కాలుష్యం పడగవిప్పింది. విశాఖలో కాలుష్యం లెవల్స్ అత్యంత ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. విశాఖలో కాలుష్యం లెవల్స్ పెరగడానికి కారణం ఏమిటి? కాలుష్యం కారణంగా విశాఖవాసులు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? విశాఖలో కాలుష్యం నివారణకు తీసుకోవాల్సిన చర్యలేమిటి?' ఇలాంటి అంశాలపై రత్నం మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

శ్రీకాకుళంలో భారీ వర్షం..

శ్రీకాకుళం : జిల్లాలో శుక్రవారం భారీ వర్షం కురుస్తోంది. వీరఘట్టం, పాలకొండ, రాజాం, పాతపట్నం, ఆముదాలవలస, ఇచ్చాపురం, పలాస, టెక్కలి, రణస్థలంలో భారీ వర్షం కురుస్తోంది. దీనితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 

రోడ్డు ప్రమాదంలో ఎంపీఈవో మృతి..

అనంతపురం : కొందుర్పి మండలం తీగలపల్లి - నాగేపల్లి మధ్య గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో బసాపురం ఎంపీఈవో లక్ష్మీనారాయణ మృతి చెందారు. 

09:21 - June 3, 2016

రాష్ట్రంలో ఏపార్టీ లేకుండా టీఆర్ ఎస్ నిరంకుశంగా వ్యవహరిస్తోందని వక్తలు విమర్శించారు. దేశ, రాష్ట్ర రాజకీపరిస్థితులపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య, బీజేపీ నేత ఆచారి, టీఆర్ ఎస్ నేత తాడూరి శ్రీనివాస్, టీడీపీ అధికార ప్రతినిధి రామకృష్ణప్రసాద్ పాల్గొని, మాట్లాడారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాల వల్లే తెలంగాణ సాకారమైందని తెలిపారు. అప్పారావును వెంటనే ఓ ఎస్ డీ పదవి నుంచి తొలిగించాలని డిమాండ్ చేశారు. ఆశోక్ గజపతిరాజు, ప్రధాని ఇద్దరు ఓ ఎస్ డీ అప్పారావు విషయంలో నిజాయితీ నిరూపించుకోవాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

09:17 - June 3, 2016

ఉక్కు నగరం  విశాఖకు పెద్ద ఆపదే వచ్చింది. హుద్‌ హుద్‌ తుపాన్‌ ను సైతం తట్టుకుని నిలబడ్డ ఈ మహానగరాన్ని ఇప్పుడో సమస్య ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విశాఖ పేరు వినగానే సముద్రం గుర్తుకొస్తుంది. ప్రకృతి సౌందర్యం   కళ్లల్లో మెదులుతుంది. స్టీల్‌ ప్లాట్‌, షిప్‌ యార్డు, పోర్టు, ఆంధ్రా యూనివర్సిటీ ఇలా ఎన్నెన్నో  గుర్తుకొస్తాయి. ఇప్పుడిది స్మార్ట్‌ సిటీగానూ ప్రపంచానికి పరిచయమవుతోంది.  పాతిక నుంచి ముప్పై లక్షల మందికి నీడ, బతుకుదెరువు కల్పిస్తున్న నగరమిది. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యపాత్ర పోషిస్తున్న నగరాలలో విశాఖది ఎవరూ చెరపలేని స్థానం.  ప్రతి రోజూ లక్షమందికి పైగా విశాఖకు వచ్చిపోతుంటారు 
విశాఖను కలవరపెడుతున్న కాలుష్యం 
ఇంత ఘనకీర్తిని సంపాదించుకున్న విశాఖను ఇప్పుడో సమస్య కలవరపెడుతోంది. ఇప్పుడో సమస్య ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అదే కాలుష్యం. మన దేశంలో ముంబై తర్వాత ఎక్కువ కాలుష్యకారక ప్రాంతంగా విశాఖ రికార్డులకెక్కడం అత్యంత ఆందోళనకర పరిణామం. గాలి, నీరు, భూమి అన్ని విషతుల్యమవుతున్నాయి . గాలిలో 57పాయింట్లు, నీటిలో యాభైఏడున్నర పాయింట్లు, భూమిలో 55 పాయింట్లు కాలుష్యం వున్నట్టు కేంద్ర కాలుష్య మండలి లెక్కకట్టింది. కాలుష్యం లెవల్స్‌ మరో పది పదిహేను పాయింట్లు పెరిగితే నివసించడం కష్టమే. 
విశాఖవాసులను చుట్టుముడుతున్న ఆరోగ్య సమస్యలు 
కాలుష్యం విపరీతంగా పెరగడంతో శ్వాస కోశ, చర్మసంబంధ వ్యాధులు కిడ్నీ సమస్యలూ విశాఖవాసులను చుట్టుముడుతున్నాయి. చిన్నపిల్లల్లో ఆస్తమా వ్యాధులు పెరుగుతున్న  తీరు కలవరపెడుతోంది. అయిదారేళ్ల క్రితం కేజీహెచ్‌ ఆస్పత్రికి వారానికి సగటున పది మంది పిల్లలు ఆస్తమా వ్యాధితో వస్తే ఇప్పుడు ఆ సంఖ్య 40 దాటింది. విశాఖపట్టణంలోని ప్రతి నలుగురు పిల్లల్లో ఒకరు శ్వాసకోశ సంబంధ వ్యాధితో  బాధపడుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.. కాలుష్యకారక వ్యాధుల వైద్యానికే ఏటా 200 కోట్ల రూపాయలకు పైగా ధారపోయాల్సిన  దుస్థితి విశాఖవాసులది. 

 

అహోబిలం ఈవో కార్యాలయంపై గ్రామస్తులు దాడి

కర్నూలు : అహోబిలం ఈవో కార్యాలయంపై గ్రామస్తులు దాడి చేశారు. ఈ ఘటనలో అసిస్టెంట్ ఈవో రాముడుకు గాయాలయ్యాయి. ఫర్మిచర్ ధ్వంసం అయింది. ఆక్రమణల తొలగింపు చేపట్టినందుకే దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

 

09:14 - June 3, 2016

విశాఖ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కశింకోట మండలం అచ్యుతాపురం వద్ద అతి వేగంగా వస్తున్న యామని ప్రైవేట్ వోల్వో బస్సు ట్రక్కు వెనుకభాగంలో ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను అనకాపల్లి ఎన్ టిఆర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వేగాన్ని అదుపు చేసుకోలేక పక్కనున్న ఓ ఇంటి వైపు ట్రక్కు దూసుకెళ్లి ఆగింది. ఒకవేల ఇంట్లోకి దూసుకెళ్లినట్లైతే ఇంట్లో ఉన్న వారు మృతి చెందేవారని భావిస్తున్నారు. వోల్వో బస్సు, ట్రక్కు అతివేగంగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. 

 

07:20 - June 3, 2016

నల్లగొండ : జిల్లాలో సంచలనం సృష్టించిన ఝాన్సీరాణి అనుమానాస్పద మృతి కేసు చిక్కుముడి వీడింది. ఝాన్సీది ఆత్మహత్య కాదు.. హత్యేనని తేలిపోయింది. కట్టుకున్నవాడు, కనిపెంచిన తల్లే ఈ కిరాతకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. విషం తాగించి హతమార్చారని నిర్దారించారు. 
పురగుల మందు తాగించి మర్డర్‌.. 
అందరి అనుమానాలే నిజమయ్యాయి. ఆత్మహత్య కాదు.. హత్యేనని తేలింది. ఎన్నో మలుపులు తిరిగిన ఝాన్సీరాణి సస్పెక్ట్‌ డెత్‌ కేసులో మిస్టరీ విడింది. ఝాన్సీ తల్లి, భర్తే ఈ ఘోరానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ ఇద్దరూ కలసి ఝాన్సీకి బలవంతంగా పురుగుల మందు తాగించి ప్రాణం తీశారన్న విషయం బట్టబయలైంది. 
4 లక్షల అప్పు కోసం కూతురు గొంతుకోసిన తల్లి.. 
2014 ఆగస్ట్‌ 22న విజేందర్‌రెడ్డితో ఝాన్సీ పెళ్లి జరిగింది. ఝాన్సీ తల్లి గుర్రం పద్మ, దీపకుంట్లకు చెందిన విజేందర్‌రెడ్డి తండ్రి దగ్గర 4 లక్షలు అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించలేకపోయింది. విజేందర్‌ రెడ్డి ఒత్తిడి తేవడంతో కూతురు ఝాన్సీరాణికి ఇష్టంలేకపోయిన  విజేందర్‌ రెడ్డితో వివాహం చేసింది. పెళ్లైన తర్వాత రాక్షసుడిగా మారిన భర్త ఇల్లాలిని శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు. ఇష్టం లేకున్నా తనతో కాపురం చేయాలని లైంగికంగా హింసించేవాడు. ఫైనల్‌ ఇయర్‌ పూర్తయ్యేవరకు తనను ఇబ్బందిపెట్టొద్దని ఝాన్సీ వేడుకుంది. 
పురుగుల మందుతాగించిన భర్త, తల్లి..
గతనెల 23న ఫైనల్‌ ఇయర్‌ చివరి పరీక్ష రాసిన ఝాన్సీ ఫేర్‌వెల్‌ పార్టీకి వెళ్లాలనుకుంది. అదే రోజు ఝాన్సీ చదివే కాలేజీకి వచ్చిన భర్త విజేందర్ రెడ్డి..ఆమెను బలవంతంగా ఇంటికి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించాడు. ఝాన్సీ నిరాకరించడంతో ఆమెను హతమార్చాలని ఫిక్సయ్యాడు. మరుసటిరోజు ఝాన్సీ తల్లి సాయంతో బాలాజీ ఫెర్టిలైజర్‌ షాపులో పురుగుల మందు కొనుగోలు చేశాడు. సాయంత్రం 4 గంటలకు భర్త, తల్లి కలిసి ఝాన్సీరాణికి విషం తాగించడంతో ఆమె చనిపోయింది.
నేరాన్ని అంగీకరించిన నిందితులు..
ఆ తర్వాత హడావుడిగా డెడ్‌బాడీని దీపకుంట్ల తీసుకెళ్లి ఈనెల 25న దహనం చేశారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించడంతో ఝాన్సీ భర్త విజేందర్‌రెడ్డి, మామ జానకిరామ్‌ రెడ్డి, తల్లి గుర్రం పద్మ, అన్న గుర్రం శివశంకర్‌ రెడ్డి, అత్త జయమ్మ, మరిది అజేందర్‌ రెడ్డి, బంధువు గుర్రం కిరణ్‌రెడ్డిలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 

07:12 - June 3, 2016

హైదరాబాద్ : ప్రభుత్వ అనుమతులు లేకున్నా కోర్టు వద్దని వారించినా ఉస్మానియా యూనివర్శిటీలో జన జాతర సభ జరిగింది. పోలీసులు పహారా కాస్తున్నా టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి సభకు హాజరయ్యారు. విజయనగరంలో మూలాలున్న కేసిఆర్ తనను తెలంగాణ ద్రోహి అనడం విచిత్రంగా ఉందని తన 30 తరాలు తెలంగాణకు చెందినవే అంటూ రేవంత్‌రెడ్డి ఫైరయ్యారు. వేలాది మంది ఆత్మబలిదానాలతో రాష్ట్రం ఏర్పడ్డా వారి ఆత్మ త్యాగాలకు తగిన ప్రతిఫలం కేసిఆర్‌ పాలనలో కనిపించడం లేదని విద్యార్థి సంఘాల నేతలు విమర్శించారు. 
ప్రభుత్వ అనుమతి లేకున్నా సభ నిర్వహణ
ప్రభుత్వ అనుమతి లేకున్నా ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు ఓయూ క్యాంపస్‌లో జన జాతర నిర్వహించారు. ఓయూలో ఎలాంటి సభలకూ అనుమతి ఇవ్వొద్దని హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఉత్తర్వులను ఖచ్చితంగా అమలు చేయాలని ఓయూ రిజిస్ర్టార్, పోలీసులకు సూచించింది. ఇలాంటి ఆదేశాలు ఉన్నా ఆర్ట్స్‌ కాలేజీ ఎదుట ఓయూ విద్యార్థులు సభను నిర్వహించారు.
కళా ప్రదర్శనలు
తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలను ప్రతిబింబించేలా వేదికపై వివిధ రకాల కళా ప్రదర్శనలు జరిపారు. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులు పలు అంశాలను ప్రస్తావించారు. వేలాది మంది ఆత్మబలిదానాలతో తెలంగాణ ఆవిర్భవించిందని అయితే వారి త్యాగాలకు తగిన గుర్తింపు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసిఆర్ ఇప్పటికీ అమరవీరులకు న్యాయం చేయలేదని విమర్శించారు. 
పోలీసుల కళ్లుగప్పి సభకు హాజరైన రేవంత్‌రెడ్డి
జన జాతరకు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని విద్యార్థి నాయకులు ఆహ్వానించారు. అయితే సభకు హాజరయ్యేందుకు రాజకీయ నేతలకు అనమతులు లేనందున ముందస్తు జాగ్రత్తగా టీటీడీపీ రేవంత్‌రెడ్డి ఇంటివద్ద పోలీసులను మోహరించారు. అయినా రేవంత్‌రెడ్డి పోలీసుల కళ్లుగప్పి సభకు హాజరయ్యారు. రేవంత్‌తోపాటు నేతలు చెరుకు సుధాకర్‌, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ కోసం పోరాడామని చెప్పుకుంటున్న కేసిఆర్ కుటుంబం... 2 సంవత్సరాలు అయినా అమరవీరులను పూర్తిగా ఎందుకు గుర్తించలేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. 
ఆ భూముల లెక్క తేల్చాలి : రేవంత్ రెడ్డి 
ఉస్మానియా భూములను లాక్కుంటామని చెప్పిన కేసిఆర్ అక్కినేని కుటుంబానికి అప్పగించిన భూముల లెక్క తేల్చాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేసిఆర్ తాతలు, ముత్తాతల మూలాలు విజయనగరంలో ఉన్నాయని కానీ తన ముప్పయి తరాలు తెలంగాణలోనే ఉన్నాయని అన్నారు. అయినా తనను తెలంగాణ ద్రోహి అనడం విచిత్రంగా ఉందని రేవంత్ అన్నారు. సభకు కాంగ్రెస్ నాయకులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు వస్తుండగా ఎన్.ఆర్.ఎస్ హాస్టల్ వద్ద పోలీసులు వారిని నిలిపేశారు. భట్టి, శ్రీధర్‌బాబులను అదుపులోకి తీసుకున్న పోలీసులు అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

 

07:06 - June 3, 2016

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్‌ సమావేశం ఇవాళ జరగనుంది. తెలంగాణ  అమరవీరుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చే విషయంతో పాటు.. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సర్కార్‌ ఆమోదం తెలపనుంది. కొత్త జిల్లాలపై కూడా  ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశం 
సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన శుక్రవారం తెలంగాణ కేబినేట్‌ సమావేశం కానుంది. సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో ముఖ్యంగా అమరవీరుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే నిర్ణయానికి కేబినేట్ ఆమోద ముద్ర వేయనుంది. దాంతో పాటు ప్రభుత్వం ఇటీవల తీసుకున్న 180 రెసిడెన్షియల్‌ పాఠశాలలకు సైతం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వనుంది.
సాదాబైనామా రిజిస్ట్రేషన్లకు ఆమోదముద్ర వేయనున్న కేబినెట్  
భూమి పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్న పేద రైతులకు ప్రభుత్వం ఆవిర్భావ కానుకగా ఇచ్చిన సాదాబైనామా రిజిస్ట్రేషన్లకు మంత్రిమండలి ఆమోదముద్ర వేయనుంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త జిల్లాల డిమాండ్‌ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకున్న మరో కీలక నిర్ణయంపై కూడా భేటీలో పచ్చజెండా ఊపే అవకాశం కనిపిస్తోంది. 
మంత్రులకు దిశానిర్దేశం చేయనున్న సీఎం
ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లైన సందర్భంగా... ముందున్న లక్ష్యాలు, ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై కూడా కేసీఆర్‌ మంత్రులతో చర్చించనున్నట్లు సమాచారం. ప్రాజెక్టులపై ప్రతిపక్షాల ఆరోపణలు తిప్పికొట్టడంతో పాటు పాలనపై పట్టుబిగించేలా మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం. వీటితో పాటు ఇతర అంశాలపై ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌ మంత్రులకు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు.

 

07:00 - June 3, 2016

హైదరాబాద్‌ : నగరంలోని ట్యాంక్‌బండ్ వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి.  హుస్సేన్‌సాగర్‌ కొత్త శోభను సంతరించుకుంది. సాగర్ చుట్టూ ప్రాంతాలన్ని విద్యుత్ దీపాలతో కళకళలాడాయి.. సంజీవయ్య పార్కులో సీఎం కేసీఆర్ ఆవిష్కరించిన దేశంలోని అతి పెద్ద జాతీయ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేలాదిగా ప్రజలు వేడుకల్లో మునిగితేలారు.
విద్యుత్‌ దీప కాంతుల ధగధగలు   
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ట్యాంక్‌బండ్‌, లుంబినీ పార్క్, నెక్లెస్‌ రోడ్డు పరిసర ప్రాంతాలు విద్యుత్‌ దీప కాంతులతో మెరిసిపోయాయి. ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన రంగురంగుల ప్రత్యేక లైటింగ్‌ అమితంగా ఆకట్టుకుంది. నగరంలోని ప్రధాన రహదారులు సైతం విద్యుత్‌ దీప కాంతులతో ధగధగలాడాయి.  
ప్రత్యేక ఆకర్షణగా బాణాసంచా
ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో బాణాసంచా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గంటన్నర పాటు సాగిన ఈ బాణాసంచా నగర వాసులను అమితంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా రంగు రంగుల కాంతులతో విరజిమ్మిన బాణాసంచా సందర్శకులను అలరించింది.
పలు కళారూపాల ప్రదర్శన 
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా పలు కళారూపాలను ట్యాంక్‌బండ్‌పై ప్రదర్శించారు. ముఖ్యంగా పీపుల్స్‌ ప్లాజాలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు నృత్యాలు, కళారూపాలను ప్రదర్శించారు. ఈ కళారూపాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకున్నాయి. 
వేడుకలకు తరలివచ్చిన ప్రజలు 
తెలంగాణ ఆవిర్భావ వేడుకులకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నెక్లెస్‌ రోడ్డు, ట్యాంక్‌ బండ్‌ పరిసరాలు జనంతో కిక్కిరిసిపోయాయి. పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలు చూసేందుకు జనాలు తండోపతండాలుగా తరలివచ్చారు. సంజీవయ్య పార్కులో ఏర్పాటు చేసిన అతిపెద్ద జెండా విద్యుత్‌ దీప కాంతులతో సందర్శకులను ఆకట్టుకుంది. వేడుకల్లోనే ఈ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ట్యాంక్‌బండ్ పరిసరాలలో నుంచి ఎటు వైపు చూసినా జెండా కనువిందు చేసింది. 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

విశాఖ : కశింకోట మండలం అచ్చుతాపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వోల్వో బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 

నేడు హైదరాబాద్ రానున్న కేంద్రమంత్రి సురేష్ ప్రభు

హైదరాబాద్ : కేంద్రమంత్రి సురేష్ ప్రభు నేడు హైదరాబాద్ రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన ఆయన పాల్గొననున్నారు. 

Don't Miss