Activities calendar

15 June 2016

21:59 - June 15, 2016

ఢిల్లీ : వివిఐపి హెలిక్యాప్టర్ల కొనుగోళ్ల వ్యవహారానికి సంబంధించిన అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ స్కాంపై ఈడీ చార్జిషీటు దాఖలు చేసింది. క్రిస్టియన్‌ మిషేల్‌ జేమ్స్‌తో పాటు మరో ఇద్దరిపై చార్జిషీట్‌ నమోదు చేసింది. మిషేల్‌పై భారత్‌లోని అధికారులకు ముడుపులు చెల్లించారన్న ఆరోపణలున్నాయి. ఈ స్కాం నుంచి బయటపడేందుకు తాను భారత విచారణ సంస్థలకు సహకరిస్తానని మిషేల్‌ ఇదివరకే వెల్లడించారు. తాను కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఎప్పుడూ కలవలేదని ఆయన చెప్పారు. ఇటీవల మిషేల్‌కు సన్నిహితుడైన సూరజ్‌ ప్రకాశ్ మెహ్రా ఇంటిపై ఈడీ దాడులు నిర్వహించింది.

21:57 - June 15, 2016

రంగారెడ్డి : కుక్క కాటుతో ఫీవర్‌ ఆస్పత్రిలో మృతిచెందిన బాలుడి ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ తీవ్రంగా స్పందించింది.. ఈ ఘటనను సుమటోగా తీసుకున్న కమిషన్‌... బాలుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని సూచించింది.

21:52 - June 15, 2016

హైదరాబాద్ : విమ‌ర్శ, ప్రతి విమర్శ, ఆత్మ విమర్శ ఇలా పార్టీని బ‌లోపేతం చేసేందుకు గాంధీభ‌వ‌న్ లో తెలంగాణ కాంగ్రెస్ స‌మ‌న్వయ క‌మిటీ సమావేశం సాగింది. దిగ్విజయ్ దిశానిర్ధేశంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యనేత‌లే వాగ్వాదానికి దిగడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన డిగ్గీరాజా... తీరు మార్చుకోండి అంటూ హిత‌బోధ చేస్తూ నేత‌ల‌కు యాక్షన్ ప్లాన్ ఇచ్చారు.

విబేధాలపై దిగ్విజయ్ సీరియ‌స్...
ఒక‌వైపు వ‌ల‌స‌లు .. మ‌రోవైపు పార్టీలో నేత‌ల మ‌ధ్య త‌గాదాల‌తో తెలంగాణ కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిర‌వుతోంది. వీట‌న్నింటితో.. డైలామాలో ప‌డ్డ పార్టీని బ‌లోపేతం చేసే అంశంపై దృష్టిపెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. దీనిలో భాగంగా గాంధీభ‌వ‌న్ లో పీసీసీ స‌మ‌న్వయ క‌మీటి భేటీ అయ్యింది. ఈస‌మావేశానికి పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ దిగ్విజ‌య్ సింగ్ హాజ‌ర‌య్యారు.

జానారెడ్డిపై సర్వే ఎదురుదాడి....
ఐదు గంట‌ల‌పాటు హాట్ హాట్ గా సాగిన స‌మ‌న్వయ క‌మిటీ భేటీ ఒక‌రిపై ఒక‌రు ఆరోపణలు చేసుకున్నారు. ఐదు రూపాయ‌ల భోజ‌నంతో జానారెడ్డి పార్టీకి న‌ష్టం చేశారంటూ సర్వే ధ్వజం ఎత్తితే.. షబ్బీర్‌ క్రమశిక్షణా చర్య తీసుకుంటామంటూ హెచ్చరించారు. దీంతో జానా, ష‌బ్బీర్ ఒక వైపు స‌ర్వే స‌త్యానారాయ‌ణ మరో వైపుగా వాగ్వాదం జ‌ర‌గింది. మ‌రో వైపు ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి కూడా జానారెడ్డి స‌మ‌ర్థవంత‌ంగా వ్యవహ‌రించ‌డంలేద‌ని విసుర్లు విసిరారు. అటు రేణుకా చౌద‌రి ప‌రోక్షంగా భ‌ట్టి విక్రమార్క టార్గెట్ గా సెటైర్లు విస‌రండంతో సమావేశంలో విబేధాలు బయటపడ్డాయి.

నేత‌లు సంయమ‌నం పాటించాల‌ని దిగ్విజయ్ సూచన..
ఈ గొడవల మధ్య దిగ్విజయ్ సీరియ‌స్ అయిన‌ట్లు సమాచారం. నేత‌లు సంయమ‌నం పాటించాల‌ని సూచించారు. నేతలు గాంధీభ‌వ‌న్‌కు ప‌రిమితం కాకుండా.. క్షేత్రస్థాయికి వెళ్లాల‌ని దిశానిర్దేశం చేశారు. వలస వెళ్లిన నేత‌ల నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌భ‌లు నిర్వహించాలన్నారు. ప్రభుత్వం ప్రాజెక్టు అంచానాలను పెంచి అవినీతికి తెర‌లేపింద‌న్న దిగ్విజ‌య్ ..దీనిపై ప్రజ‌ల‌కు ఆవ‌గాహ‌న క‌ల్పించాల‌ని చెప్పారు.

మల్లన్నసాగర్‌ బాధితులకు అండగా ఉండాలని నిర్ణయం...
మ‌ల్లన్న సాగ‌ర్ విష‌యంలో ప్రభుత్వం దారుణంగా వ్యవ‌హ‌రిస్తుందని.. ఆ బాధితుల‌కు కాంగ్రెస్ అండ‌గా ఉండాల‌ని సూచించారు. అంతేకాకుండా జిల్లాల పున‌ర్విభ‌జ‌న పై శాస్త్రియ బ‌ద్దంగా చేసేందుకు జుడిషియ‌రి క‌మిష‌న్ ద్వారా ఏర్పాటు చేయాల‌న్న డిమాండ్ ను ప్రజ‌ల‌ల్లోకి తీసుకువెళ్ళాల‌ని డిసైడ్ అయ్యింది కాంగ్రెస్.

టీపీసీసీకి యాక్షన్ ప్లాన్...
మొత్తానికి క‌ష్టాకాలంలో ఉన్న పార్టిని గ‌ట్టెక్కించడంపై దృష్టిపెట్టిన కాంగ్రెస్ హైక‌మాండ్ టీపీసీసీకి యాక్షన్ ప్లాన్ ఇచ్చింది. అయితే.. ఒక‌ వైపు గులాబి దూకుడుకు దిగ్విజ‌య్ చేసిన మంత్రాంగం ఎంత‌వ‌ర‌కు వ‌ర్కౌట్ అవుతుందో చూడాలి.

21:45 - June 15, 2016

హైదరాబాద్ : తెలంగాణలో మరో లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక రానుందా ? నల్గొండ కాంగ్రెస్‌ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి టీఆర్ఎస్ లో చేరినా... గులాబీ కండువా కప్పుకోపోవడానికి కారణం ఏంటి ? ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత టీఆర్ఎస్ కండువా కప్పుకుంటానని గుత్తా చెప్పడాని బట్టి పరిశీలిస్తే... నల్గొండ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక తప్పదని ప్రచారం జరుగుతోంది. ఈ విషయం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్‌కు మరో గట్టి ఎదురు దెబ్బ ...

తెలంగాణలో కాంగ్రెస్‌, సీపీఐకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నల్గొండ, కరీంనగర్‌ జిల్లాలకు చెందిన కాంగ్రెస్‌, సీపీఐ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. నల్గొండ కాంగ్రెస్‌ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మిర్యాలగూడ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రనాయక్‌తోపాటు, కరీంనగర్‌ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ మాజీ ఎంపీ వివేక్‌, మాజీ మంత్రి వినోద్‌ గులాబీ గూటికి చేరారు. పలువురు జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

కారెక్కిన కాంగ్రెస్‌ ఎంపీ గుత్తా ...
అయితే ఇక్కడ ఒక ట్విస్ట్‌ జరిగింది. పార్టీలో చేరిన అందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గలాబీ కండువాలు కప్పినా... నల్గొండ కాంగ్రెస్‌ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాత్రం కండువా కప్పించుకోలేదు. సాంకేతికంగా కొన్ని సమస్యలు ఉండటంతో గుత్తా ఈ విధంగా చేశారని చెబుతున్నారు. గులాబీ కండువా కప్పుకుంటే ఆ వీడియో ఆధారంగా ఎవరైనా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తే సుఖేందర్‌రెడ్డి పై అనర్హతవేటు పడే అవకాశం ఉంది. దీనిని నుంచి తప్పించుకునేందుకు గుత్తా... గులాబీ కండువా కప్పించుకోలేదని చెబుతున్నారు. కేసీఆర్‌ గుత్తాకు గులాబీ కండువా కప్పడానికి ప్రయత్నించినప్పుడు... ఇప్పుడొద్దు తర్వతా కప్పుకంటానని చెప్పడంతో ముఖ్యమంత్రి కూడా ఒప్పుకున్నారు.

నల్గొండ లోక్‌సభ స్థనానికి ఉప ఎన్నికల వచ్చే అవకాశం ..
చేరికల కార్యక్రమం ముగిసిన తర్వాత గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా ఇదే విషయం చెప్పారు. ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత గులాబీ కండువా కప్పించుకుంటానని స్పష్టం చేయడంతో... నల్గొండ లోక్‌సభ స్థనానికి ఉప ఎన్నికల వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

జానారెడ్డిపై విరుచుకుపడ్డ కేసీఆర్....
కాంగ్రెస్‌, సీపీఐ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు, సీఎల్‌పీ నేత జానారెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. టీఆర్‌ఎస్‌ వలసలను ప్రోత్సహిస్తోందంటూ జానారెడ్డి చేసిన విమర్శలపై కేసీఆర్‌ తీవ్రంగా స్పందించారు. వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 16 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లో 10 మందిని కాంగ్రెస్‌లోకి లాగేసుకున్నప్పుడు...జానా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. 2019కి ముందే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూలిపోతుందని చంద్రబాబునాయుడు దుష్రచారం చేశారంటూ మండిపడ్డారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ.. సమైక్యవాదుల కుట్రలకు బలికాకుండా చూసుకోవాల్సిన అవసరాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. వరుసగా అన్ని ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ను ప్రజలు గెలిపిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాజకీయ, ఆర్ధిక సుస్థిరతను బలపరిచే క్రమంలోనే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు.
వలసలతో కాంగ్రెస్‌ సతమతం...
2019 నాటికి పంట కాల్వలు మినహా సాటునీటి ప్రాజెక్ట్‌ నిర్మాణం పూర్తవుతుందని కేసీఆర్‌ మరోసారి స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా 2019లో కూడా టీఆర్‌ఎస్‌దే విజయమని చెప్పిన కేసీఆర్‌.. వలసలతో సతమతమవుతున్నకాంగ్రెస్‌ నేతలను మరింత కలవరానికి గురి చేశారు.

21:36 - June 15, 2016

కరుడు గట్టిన కాంగ్రెస్ లీడర్లు కారెక్కుతున్నరంటే మతులావేంది..? కాంగ్రెస్ పార్టీల పదవులన్ని ఏలి ఇప్పుడెందుకు ఆ పార్టీని పతనం జేస్తున్నరు..? బంగారు తెలంగాణల భాగమయ్యెతందుకా..? భవిష్యత్తును బాగుజేస్కునెతందుకా..? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మన్సులళ్ల ముచ్చట ఇది.. ఇంతకు కేసీఆర్ మన్సుల ఏమున్నదనేది ఒక్కపారి మా మల్లన్న జెప్తడట ఇందాం..

ఇద్దుమున్నప్పుడు ఇద్దరు పెండ్లాలు.. ఇద్దుమొడ్సినంక ఇడ్పుగాయిదాలన్నట్టు.. భళే ఉన్నది మన కుందూరు జానాలు ముచ్చట.. సీఎల్పీ పదవిని త్యాగం జేస్తడట సారూ... దానికి పార్టీ ఫిరాయింపుల కలర్ జోడిండు.. కథగట్టుకొచ్చిండు.. అసలు జానాలు సారు ఇప్పుడే ఎందుకు త్యాగాలు జేస్తాంటున్నడు అనేది ఒక్క ముచ్చట జూద్దాం పటుండ్రి....

పుణ్యానికొస్తె ఒక్క ఫినాయిలే గాదు..? ఫామాయిల్ ఇడ్సిపెట్టమని నిరూపించిండ్రు గుంటూరు జిల్లాల ఒక ఊరోళ్లు.. ఒక లారీ ట్యాంకర్ తొవ్వొంట వోకుంట.. ఆయింత బోర్లవడ్డది.. ముందే అది పామాయిల్.. జనం కండ్ల ముంగట బోర్లవడ్తె ఎట్లుంటది కథ.
.మంత్రాలకు చింతకాయలు రాయలియా నాయనా..? మూతిపండ్లే రాల్తయని ఎన్నిమాట్ల జెప్పిండు మా మల్లన్న.. అయినా ఇంటరా జనం ఇనరు.. ఎంత మొత్తకున్నా మానోరే వోతదిగని వాళ్లు మాత్రం మంత్రాల తొవ్వ ఇడ్వరు.. మోసపోంగనే అయ్యో అయ్యో ఎంతపనైపాయే అని మళ్ల ఏడుస్తా ఉంటరు..

చట్టం ముంగట అందరు సమానమే..? చట్టం ఎవ్వలికి సుట్టంగాదు అనెతందుకు మనకొక సరైన ఆధారం దొర్కిందుల్లా.. ఏందంటే..? ఒక మన్షిని ఇంకో మన్షి సంపితె కేసులు వెట్టినట్టే.. మన్సులను సంపే సింహాల మీద గూడ కేసులు బుక్ జేశిండ్రు గుజరాత్ రాష్ట్రంల.. సింహాల మీద కేసులా..? అని పర్శానయ్యేరు...మరి గిసువంటి ఇసిత్రమైన మచ్చుట్లెన్నో మన మల్లన్న మోసుకొచ్చిండు.. మల్లన్న చెప్పిన మరిన్ని ముచ్చట్ల కోసం ఈ వీడియో క్లిక్ చేయుండ్రి....

21:22 - June 15, 2016

వందేళ్లకు పైబడిన ఘన చరిత్ర.. దేశమంతా చక్రం తిప్పిన పార్టీ..కానీ, విభజనతో సీన్ రివర్సయింది.. ఊహించని దుస్థితిలో పడింది. అక్కడ ఉనికి కోసం నానా పాట్లు.. ఇక్కడ రోజు రోజుకూ గోడదూకుతున్న నేతలతో ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి. పదేళ్ల పాలన తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్... రాష్ట్రాల ఎన్నికల్లోనూ దిక్కుతోచని పరిస్థితిలో పడింది. ఓవరాల్ గా చెప్పాలంటే అక్కడ పొమ్మన్నారు.. ఇక్కడ పోతున్నారు. ఇదీ హస్తవ్యస్తంగా మారిన కాంగ్రెస్ పరిస్థితి. ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం..రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడెలా మారతాయో ఊహించటం కష్టమే. కాంగ్రెస్ పార్టీ ప్రజెంట్ స్టేటస్ చూస్తే ఇది స్పష్టంగా అర్ధమవుతుంది. ఒకనాటి ప్రాభవం మాయమయింది. ఒక చోట ఉనికి కోసం పోరాటం.. మరో చోట కేడర్ ని, నేతలను కాపాడుకునే డిఫెన్స్ మోడ్. ఓవరాల్ గా దేశమంతా కాంగ్రెస్ పార్టీ ఇంతటి దుస్థితిలో గతంలో ఎన్నడూ లేదని చెప్పాలి.. రెండేళ్ల క్రితం జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ చావు దెబ్బ తిన్నది.. దేశమంతటా కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుగాలి వీచింది.. మిగతా ప్రాంతాల సంగతేమిటో కానీ.. ఏపీలో మాత్రం రాష్ర్ట విభజన పుణ్యాన్ని మూటగట్టుకున్న ఫలితాన్ని అనుభవించింది. ఏపీ ప్రజల ఆగ్రహాన్ని బలైంది.. ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది.. భవిష్యత్తులో ఇతర రాష్ర్టాలలో ఆ పార్టీ పుంజుకునే ఛాన్సుందేమో కానీ.. ఏపీలో మాత్రం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదనే చెప్పాలి..విభజన తర్వాత విలీనం చేస్తుందనుకున్నారు.. కానీ, రివర్స్ లో జరుగుతుందని ఊహించలేదు..తెలంగాణ వస్తే టీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం అవుతుందనుకుంటే రివర్స్ లో కాంగ్రెసే తెలంగాణలో టీఆర్ఎస్ లో విలీనం అయ్యే పరిస్థితులు దాదాపుగా సమీపించాయి. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ కు చెందిన హేమాహేమీలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మిగిలిన వారందరిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. వారికి చెందిన బలమైన క్యాడర్, నమ్మకమైన అనుచరులంతా టీఆర్ఎస్ లో చేరారు. కాబట్టి వారు కూడా నేడో రేపో టీఆర్ఎస్ లో చేరక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడతాయి.రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశమంతా కాంగ్రెస్ ఇదే పరిస్థితిలో ఉంది. 2004, 2009 లోనూ వరుసగా కేంద్రంలో అధికారాన్ని పొందిన 2014 ఎన్నికల్లో చతికిలపడింది. 2009 ఎన్నికల తర్వాత సోనియా గాంధీ దేశంలో బలమైన నాయకురాలిగా ప్రచారం పొందారు. ఇప్పుడు పరిస్తితి చెల్లాచెదురైంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నడిపించగల నాయకుడు ఎవరనే సమస్య రాజకీయ వర్గాల్లో పెద్ద ప్రశ్నగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా ఉంటే.. దేశమంతా కూడా కొంచెం అటూ ఇటూగానే కనిపిస్తోంది. ఒక రాష్ట్రంలో అసలే కనుమరుగైన పరిస్థితి, మరో రాష్ట్రంలో సంపాదించుకున్న ప్రతిపక్షహోదా కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి. ఈ పరిస్థితిలో కూడా వర్గ విభేదాలు, గ్రూపులు, సీమాంద్రాలో కూడా వర్గవిభేదాలు, గ్రూపులు కనిపిస్తున్నాయి. సీమాంద్రలో కాంగ్రేస్ కు ఎవరు మెయిన్ లీడర్ అంటే... మేం కాదంటూ అందరూ తలుపులు మూసుకుంటుంటే, తెలంగాణాలో ఎవరికి వారే లీడర్ గా ఫీలవుతున్న పరిస్థితి. ఇలాంటి సమయంలో 2019 లో కాంగ్రెస్ తరపున ఎన్నికల్లో పోటీ చేయడానకి తెలుగు రాష్ట్రాల్లో సరైన అభ్యర్థులు ఉన్నారా అంటే దానికి కాంగ్రెస్ కండువాల దగ్గర సమాధానం లేదు.  

21:10 - June 15, 2016

గుజరాత్ : ముగ్గురిని హతమార్చాయన్న అభియోగంపై..గుజరాత్‌ గిర్‌ నేషనల్ పార్కులోని 18 సింహాలను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. ఇప్పటికే మనుషుల్ని చంపి తిన్నాయని భావిస్తున్న 18 సింహాల పాద ముద్రలను సేకరించే పనిలో ఉన్నారు. మనుషుల్ని చంపిన క్రూర మృగాన్ని శిక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మాంసం రుచి మరిగిన మృగాలు.. సాధారణంగా మనుషుల్ని చూడగానే విజృంభిస్తాయని, కస్టడీలో ఉన్న సింహాలలో ఏది మనుషుల్ని తినేసిందో గుర్తించి దానికి జూపార్క్‌లో జీవిత ఖైదు వేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మిగతా సింహాలను ఫారెస్ట్‌లో వదిలేస్తామని అధికారులు చెబుతున్నారు.

21:07 - June 15, 2016

గుంటూరు : రోహిత్‌ వేముల కులంపై నెలకొన్న సస్పెన్స్‌ తొలగింది. రోహిత్‌ వేముల దళితుడేనని అధికారికంగా వెల్లడైంది. దీనికి సంబంధించిన వివరాలను గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌ దండే జాతీయ షెడ్యూల్‌ కులాల కమిషన్‌కు పంపారు. రోహిత్‌ చక్రవర్తి వేముల హిందూ మతానికి చెందిన మాల కులస్తుడని, పేద కుటుంబంలో పుట్టాడని గుంటూర్‌ తహసిల్దార్ నిర్ధారించిన కుల ధృవీకరణ పత్రాన్ని కలెక్టర్‌ ఎస్‌సి కమిషన్‌కు పంపారు. ఎస్‌సి కమిషన్‌ ఈ రిపోర్టును పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టనుంది. హైదరాబాద్‌ యూనివర్సిటీలో రిసెర్చ్‌ స్కాలర్‌ అయిన రోహిత్‌ ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్‌ వడ్డెర కులస్తుడని, బిసి వర్గానికి చెందినవాడన్న వాదనలు తెరపైకి వచ్చాయి.

21:04 - June 15, 2016

వరంగల్ : చిన్న బడిని కాపాడుకునేందుకు ఆ గ్రామం పెద్ద నిర్ణయం తీసుకుంది.. తమ పిల్లల్ని సర్కారు పాఠశాలలకే పంపాలని గ్రామ సభలో చేసిన తీర్మానం మూతబడుతున్న పాఠశాలల సమస్యకు సరికొత్త పరిష్కారం చూపింది. గ్రామస్తులంతా తీసుకున్న నిర్ణయంతో స్కూల్‌ రూపురేఖలే మారిపోతున్నాయి..

సర్కారు బడిని కాపాడుకోవాలని గ్రామసభలో తీర్మానం...
వరంగల్‌ జిల్లా ఏటూరు నాగారం మండలంలోని పప్కాపురం గ్రామం ఇది.. నూట ఇరవై కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నాయి.. అన్ని ఊర్లలాగే ఇక్కడా ఓ సర్కారు బడి ఉంది.. శిధిల భవనం... అరకొర విద్యార్థులతో చదువు నడుస్తూ ఉండేది.. తాజాగా గ్రామసభ చేసిన తీర్మానంతో పాఠశాల రూపురేఖలే మారిపోతున్నాయి..

బడిబాటలో భాగంగా ఊరంతా తిరిగిన టీచర్లు...
స్కూల్‌ ప్రారంభానికి ముందు బడిబాటలో భాగంగా ఊరంతా తిరిగారు ఈ స్కూల్‌ టీచర్లు.. ప్రభుత్వ బడి ప్రాముఖ్యతను గ్రామస్తులకు వివరించారు.. తమ స్కూల్‌కు పంపిస్తే చక్కగా చదువు చెబుతామని నచ్చజెప్పారు.. ఈ స్కూల్‌ మూతబడితే వచ్చే నష్టాలను వివరించారు.. సర్పంచ్‌తో పాటు గ్రామ పెద్దలకు కూడా ఇదే విషయం చెప్పారు.. టీచర్ల మాటలు స్థానికులను ఆలోచింపజేశాయి.. ఈ విషయంపై గ్రామసభలో చర్చించిన ప్రజలు... సర్కారు బడిని కాపాడుకోవాలని తీర్మానం చేశారు.. ఇందుకోసం తమ పిల్లలనందరినీ ఈ స్కూల్‌కు పంపేందుకు నిర్ణయించారు.. దీనిని ఉల్లంఘిస్తే శిక్షకూడా ఖరారు చేశారు... ప్రైవేటు స్కూల్‌కు పిల్లల్ని పంపితే వారి కుటుంబాలకు రేషన్ బియ్యం, ఆసరా పెన్షన్ నిలిపివేయాలని తీర్మానించారు..

ఉపాధ్యాయులపై ప్రశంసలు...
ప్రభుత్వ బడిని కాపాడుకునేందుకు గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం మిగతా పల్లెలకు ఆదర్శంగా నిలుస్తోంది.. ఇక్కడి గ్రామస్తులతోపాటు... ఉపాధ్యాయులపై జిల్లావ్యాప్తంగా ప్రశంసలొస్తున్నాయి..

 

20:56 - June 15, 2016

హైదరాబాద్ : సేవే పరమార్థమన్నారు.. భావిభారత పౌరులను తీర్చి దిద్దేందుకే పాఠశాల పెట్టామన్నారు.. కానీ మిగిలిన కార్పొరేట్‌ స్కూళ్లకు ఏమాత్రం తీసిపోకుండా దోపిడికి తెగబడ్డారు. అంతేనా..? ఫీజులు చెల్లించలేదంటూ.. 27 మంది విద్యార్థులకు టీసీలు ఇచ్చి పంపేశారు. హైదరాబాద్‌లో.. అమృతామయి విద్యాలయం నిర్వాహకుల ఈ చర్య.. కలకలం సృష్టించింది. విద్యాలయంపై చర్యలు తీసుకోవాలంటూ.. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు.

వివాదంలో అమృతామయి విద్యాలయం...
సేవ ముసుగులో... అమృతామయి ట్రస్టు సాగిస్తున్న దోపిడి బట్టబయలైంది. మఠం పేరిట స్కూలును నెలకొల్పి.. పేద విద్యార్థులకు విద్యను అందిస్తూ క్రమశిక్షణ కల్గిన భావి భారత పౌరులను తయారు చేస్తున్నామన్న మాటలు ఉత్తుత్తివేనని తేలిపోయింది. ఈ సంస్థ ఇతర ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్లకు ఏమాత్రం తక్కువ కాదని నిరూపితమైంది. ఫీజు చెల్లించలేదంటూ.. అమృతామయి ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న స్కూలు నుంచి నిబంధనలకు పూర్తి విరుద్ధంగా 27 మంది పిల్లలకు టీసీలు ఇచ్చేశారు.

విద్యార్థుల జీవితాలతో చెలగాటం...

విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న అమృతామయి విద్యాలయం పై చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వామపక్షాలు, ప్రజాసంఘాలు, విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు హైద్రాబాద్‌లోని మారేడ్‌పల్లిలోని మహేంద్రహిల్స్ లోని అమృతామయి విద్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

తల్లిదండ్రులు ఆందోళన...
బుధవారం ఉదయం నుంచి విద్యార్థులు వారి తల్లిదండ్రులు ధర్నా చేస్తున్నా.. యాజమాన్యంలో ఎలాంటి కదలిక లేదు... వామపక్ష నేతలు, విద్యార్ధి, యువజన సంఘాలు తల్లిదండ్రులతో కలిసి యాజమాన్యంతో చర్చలకు వెళితే నిర్వాహకులు కనీస మానవత్వం లేకుండా ప్రవర్తించారు. క్షమాపణ చెపుతూ లేఖ రాసిస్తే పిల్లలను మళ్లీ చేర్చుకునే అంశాన్ని పరిశీలిస్తామంటూ నిర్లక్ష్యపు సమాధానమిచ్చారు.

నిరాహారదీక్షకు సిద్ధమైన తల్లిదండ్రులు..
విద్యార్ధులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం కూడా స్కూల్‌ యాజమాన్యానికి సపోర్టు చేస్తున్నట్టుగానే వుందని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ గాని హైద్రాబాద్ స్కూల్‌ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గాని ఇప్పటికీ స్పందించలేదని.. దీన్నిబట్టి చూస్తే.. స్కూల్ యాజమాన్యంతో అధికారులు కుమ్మక్కయ్యారన్న భావన కలుగుతోందని తల్లిదండ్రులు ఆరోపించారు. పిల్లల్ని తిరిగి చేర్పించుకోకపోతే నిరాహారదీక్షకు కూర్చుంటామని పేరెంట్స్ హెచ్చరించారు.

సేవ ముసుగులో అప్పనంగా భూములు ....
ఇక్కడి రెండు ఎకరాల భూమిని.. ఏడాదికి గజానికి రెండు రూపాయల చొప్పున.. 30 సంవత్సరాల వరకు లీజుకు తీసుకుంది అమృతామయి మఠం. సేవాదృక్పథంతో స్కూలు నిర్వహిస్తామనేసరికి ప్రభుత్వం కూడా ఈ సంస్థకు 2000 సంవత్సరంలో భూమిని అప్పగించేసింది. ఇలా సేవ ముసుగులో ప్రభుత్వం నుంచి అప్పనంగా భూములు పొంది ఇప్పుడు విద్యార్థులని ఫీజుల పేరుతో వేధించడం ఎంతవరకు సమంజసమని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. విద్యార్ధులకు న్యాయం జరిగేంత వరకు ఉద్యమాన్ని ఎంతవరకైనా తీసుకెళతామని విద్యార్థి సంఘాలు స్పష్టం చేశాయి.

20:28 - June 15, 2016

విజయవాడ : ఏపీ ప్రభుత్వం ప్రయివేటు ఇంజనీరింగ్ కళాశాలలపై కొరడా ఝుళింపించింది. ఏపీలో ప్రయివేటు ఇంజనీరింగ్ కళాశాలలో సర్కార్ తనిఖీలు చేపట్టింది. కళాశాలల్లో ఫ్యాకల్టీ, వసతులను పరిశీలించేందుకు ఓ కమిటీని ఏపీ సర్కారు వేసింది. ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో ఈ కమిటీ పనిచేయనుంది. 

ముద్రగడను అరెస్టు చేయలేదు: ఎస్పీ

తూ.గోదావరి : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను పోలీసులు అరెస్టు చేయలేదని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాశ్‌ తెలిపారు. ఆయన పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించడంతో అడ్డుకుని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఆయనపై ఆత్మహత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

భద్రతాబలగాలపై ఉగ్రవాదుల గ్రెనేడ్లతో దాడి ..

జమ్మూకశ్మీర్ : జమ్మూకశ్మీర్‌లోని షాపియాన్‌లో భద్రతాబలగాలపై ఉగ్రవాదులు గ్రెనేడ్లతో దాడి చేశారు. పది నిమిషాల వ్యవధిలోనే రెండుచోట్ల దాడులు జరిపారు. షాపియాన్ పోలీస్ స్టేషన్‌తో పాటు బట్‌పోరా చౌక్‌లో ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసిరారు. ఈ దాడిలో భద్రతాబలగాలు గాయపడలేదు. కానీ ముగ్గురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో భద్రతాబలగాలు అప్రమత్తమయ్యాయి.

నకిలీ గోదాంలపై ఎస్‌వోటీ దాడులు...

హైదరాబాద్ : నగరంలోని ఇంజాపూర్‌లో ఓ నకిలీ గోదాంలపై ఎస్‌వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 840 సర్ఫ్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోదాంను సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

19:29 - June 15, 2016

విజయవాడ : ఏపీ సచివాలయ ఉద్యోగులను హైదరాబాద్‌ నుంచి అమరావతి తరలించేందుకు రంగం సిద్ధమయ్యింది. ఈనెల 27 నుంచి అమరావతి నుంచి ఏపీ పాలన సాగునున్న తరుణంలో అన్ని శాఖలను ఒకేసారి కాకుండా దశలవారీగా పంపాలని నిర్ణయించారు. ముందుగా మూడు ముఖ్యశాఖలను తరలిస్తారు. ఆర్ధిక, ప్రణాళిక, మున్సిపల్‌ శాఖలు వీటిలో ఉన్నాయి. ఆ తర్వాత దశలవారీగా ఒక్కో శాఖ సిబ్బందిని అమరావతి పంపుతారు.

తరలింపుకు మార్గదర్శక సూత్రాలు...
ఏపీ రాజధాని అమరావతిలోని వెలగపూడిలో తాత్కాలిక సచివాల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరో పది రోజుల్లో రాజధాని నుంచే పాలన సాగించేందుకు వీలుగా ఉద్యోగులు తరలింపుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శక సూత్రాలు జారీ చేసింది. ప్రజలతో దగ్గర సంబంధం ఉన్న శాఖలను ముందుగా అమరావతి తరలించాలని అధికారులు నిర్ణయించారు.

27న మూడు శాఖలు వెలగపూడి నుంచి విధులు నిర్వహణ...
ఏపీ సచివాలయంలో మొత్తం 32 శాఖలు ఉన్నాయి. అందరూ అనుకుంటున్నట్టుగా అన్ని శాఖల ఉద్యోగులను ఒకేసారి తరలించడంలేదు. వెలగపూడిలో నిర్మాణమవుతున్న తాత్కాలిక సచివాలయ భవానల్లో పనులు పూర్తయ్యే పరిస్థితిని బట్టి ఉద్యోగులను రాజధానికి పంపుతారు. ఈనెల 27న ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ ఆగస్టు 15 వరకు కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముందుగా ఆర్ఢిక, ప్రణాళిక, మున్సిపల్‌ శాఖల సిబ్బంది అమరావతి నుంచి విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బిల్లుల మంజూరు, సంక్షేమ పథకాల అమలు, పట్టణాభివృద్ధి కీలకం కావడంతో వెలగపూడి తరలివెళ్లే శాఖల తొలిజాబితాలో వీటిని చేర్చారు. ఆ తర్వాత ప్రతివారం లేదా పది రోజులకు ఒక్కోశాఖ సిబ్బందిని పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వానికి అన్ని విధాల సహకరిస్తామని సచివాలయ ఉద్యోగలు సంఘం నేతలు చెబుతున్నారు.

మార్గదర్శకాల పట్ల ఉద్యోగులు సంతృప్తి...
సచివాలయ ఉద్యోగుల తరలింపునకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల పట్ల ఉద్యోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే అమరావతి నుంచి పూర్తి స్థాయి పాలన సాగడానికి రెండు నెలలు పట్టొచ్చని భావిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన భరోసాతో ఇప్పటికే అమరావతి తరలివెళ్లిన ఉద్యోగులు ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే అవకాశం కల్పిస్తూ ఆదేశాలు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించడం మంచిపరిమాణగా భావిస్తున్నారు. 

ఇంజనీరింగ్ కళాశాలలపై ఏపీ సర్కార్ కొరడా..

విజయవాడ : ఏపీ ప్రభుత్వం ప్రయివేటు ఇంజనీరింగ్ కళాశాలలపై కొరడా ఝుళింపించింది. ఏపీలో ప్రయివేటు ఇంజనీరింగ్ కళాశాలలో సర్కార్ తనిఖీలు చేపట్టింది. కళాశాలల్లో ఫ్యాకల్టీ, వసతులను పరిశీలించేందుకు ఓ కమిటీని ఏపీ సర్కారు వేసింది. ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో ఈ కమిటీ పనిచేయనుంది. 

19:00 - June 15, 2016

తూ.గోదావరి : అడ్డకత్తెరలో పోకచెక్కలాగా ఏపీ ప్రభుత్వం పరిస్థితి ఇరుక్కుపోయినట్లుగా కనిపిస్తోంది. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా కాపుల రిజర్వేషన్ల అంశం కొనసాగుతోంది. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కాపునేత ముద్రగడ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. పలు పరిణామాల మధ్య ఈ అంశం కొనసాగుతున్న విషక్ష్మీం తెలిసిందే.కాగా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తే తూర్పుకాపులు నష్టపోతారంటూ తూర్పుకాపుల నాయకులు రంగంలోకి దిగారు. కాపు ఉద్యమంలో తమ జనాభాను కూడా చూపించి ఓసీ కాపులు రాజకీయ, ఆర్థిక లబ్ధి పొందుతున్నారని తూర్పు కాపులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాపు కార్పొరేషన్ లో, కాపు భవనాల్లో తూర్పు కాపులకు ప్రవేశం లేదని, తమపై వివక్ష జరుగుతుందని తూర్పు కాపులు ఆరోపిస్తున్నారు. ఓసీ కాపులను బీసీల్లో చేరిస్తే తమకు ఒరిగేది ఏమీ ఉండదని, పైగా రాజకీయంగా, ఉద్యోగాలపరంగా తాము నష్టాలకు గురవుతామంటున్న తూర్పు కాపుల వాదన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓసీ కాపులను బీసీలో చేరిస్తే తాము నష్టపోతామని తూర్పు కాపు నాయకులు వెంకటరమణ పేర్కొన్నారు. రాష్ట్రంలో 30లక్షల మంది తూర్పుకాపులున్నారని ఆయన తెలిపారు. హక్కుల విషయంలో తూర్పుకాపులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు. కాపు కార్పొరేషన్ కు రూ.1000 కోట్లు కేటాయించారని అంతా సంతోషించామనీ...కానీ ఇది కేవలం ఓసీ కాపులకు మాత్రమే వర్తిస్తుందని తెలిసి తూర్పుకాపులందరూ తీవ్రంగా నిరాసపడ్డామన్నారు.తూర్పు కాపుల వర్గానికి చెందిన బొత్స,కళావెంకట్రావు తూర్పుకాపులకు జరుగుతున్న అన్యాయం..వారి ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరముందన్నారు. దీనిపై సీఎం చంద్రబాబును కలిసి వినతిపత్రం ఇచ్చామన్నారు. తూర్పుకాపులకు ఎటువంటి అన్యాయం జరిగినా ఉద్యమం చేపడతామని తూర్పు కాపు నాయకులు డిమాండ్ చేశారు. మరి ఈ పరిస్థితిలో సీఎం చంద్రబాబు ఎటువంటి నిర్ణయాలు తీసుకుని ఇరు వర్గాల కాపులకు ఎటువంటి న్యాయం చేస్తారో వేచిచూడాలి.

 

18:45 - June 15, 2016

తూ.గోదావరి : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైద్య పరీక్షలకు అంగీకరించినట్లు రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తెలిపారు.జేఏసీ సభ్యులుగా తాము పలు దఫాలుగా ముద్రగడతో చర్చలు జరిపినట్లు వెల్లడించారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ముద్రగడకు వివరించామని... దీంతో శరీరంలోకి ఐవీ ఫ్లూయిడ్స్‌ ఎక్కించేందుకు ఆయన అంగీకారం తెలిపినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అయితే ఆయన దీక్ష మాత్రం కొనసాగుతోందని స్పష్టం చేశారు. చర్చలపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు.

జగన్ కు సవాల్ విసిరిన భూమా ...

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్ కు భూమా నాగిరెడ్డి సవాల్ విసిరారు. పార్టీ మారిన తమ కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరినైనా ఓడిస్తే తామంతా రాజీనామా చేస్తామనీ....తాము గెలిస్తే జగన్ రాజకీయాల నుండి తప్పుకుంటావా? అని సవాల్ విసిరారు. మాటకు ముందుగా డబ్బుకు అమ్ముడయిపోయారని పార్టీ మారిన నేతల పట్ల జగన్ విపరీత వ్యాఖ్యలు చేస్తుండటం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బుకు అమ్ముడుపోవాల్సిన ఖర్మ తమ కుటుంబానికి పట్టలేదనీ...తాము బ్రిటీష్ కాలం నుండి ధనవంతులమేనని తెలిపారు. అసెంబ్లీఓ నీ తండ్రిని ఒంటరిని చేసివారిని ఇప్పుడు నీవు పక్కన పెట్టుకుని మాపై నిందలు వేయటం సరికాదన్నారు.

18:04 - June 15, 2016

ఆదిలాబాద్ : ఓ విద్యా కుసుమానికి ఇబ్బందులు వెంటాడుతున్నాయి. కష్టపడి చదివి.. ప్రపంచంలోనే ప్రఖ్యాతి కలిగిన అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీలో సీటు సంపాదించింది. కానీ.. బెంగళూరు వెళ్లేందుకు ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ఈ చదువుల తల్లి.

అజీం ప్రేమ్ జీ యూనివర్సిటీలో సీటు సంపాదించిన నర్సన్ ..
ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం ధర్మాజీపేటలో అద్భుత ప్రతిభ కలిగిన విద్యాకుసుమం వికసించింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అజీం ప్రేమ్ జీ యూనివర్సిటీలో సీటు సంపాదించింది. అయితే తెలంగాణ నుండి సీటు సంపాదించిన నర్సన్‌ను విధి వెక్కిరిస్తోంది. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో బెంగళూరు వెళ్లేలేని పరిస్థితి తలెత్తింది.

పదోతరగతిలో స్కూల్ టాపర్...
చదువులో ఎప్పుడు ముందుండే నర్సన్ ఐదవ తరగతి నుండి ఇంటర్ మీడియట్ వరకు సాంఘిక సంక్షేమ పాఠశాల నచ్చన్ ఎల్లపూర్ లో చదివింది. అన్ని తరగతుల్లో ముందుండే నర్సన్ పదోతరగతిలో స్కూల్ టాపర్ గాను ఇంటర్ మీడియట్ లో కాలేజిటాపర్ గాను నిలిచి అందరి మన్ననలు పొందింది. అయితే అన్ని పరీక్షల్లో ముందుండే నర్సన్‌కు ప్రేమ్‌జీ యూనివర్సిటీలో సీటు లభించింది. కానీ.. ఆమె వెళ్లేందుకు ఆర్ధికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

నర్సన్ ఆదుకోవాలంటున్న ప్రిన్సిపాల్...
తెలంగాణలో మొత్తం పదిమందికి బెంగుళూర్ లోని ప్రేమ జి యూనివర్సిటిలో సీటు రావడం.. అందులో నర్సన్ ఒకరు కావడం విశేషమని అన్నారు నర్సన్ చదవిన సాంఘీక సంక్షేమ పాఠశాల ప్రిన్సిపాల్ . ఇలాంటి విద్యార్థులకు ఆర్థికంగా మరింత చేయూత నివ్వడం ద్వారా మరిన్ని శిఖరాలు అధిరోహిస్తారని.. ప్రభుత్వం విద్యార్థిని ఆదుకోవాలని కోరుతున్నారు.

తనను ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్న నర్సన్ ..
తనకు అజీంప్రేమ్ జీ యూనివర్సిటీలో సీటు రావడం సంతోషంగా ఉందని.. కాని తన ఆర్థికస్థితి కారణంగా.. తాను యూనివర్సిటీకి వెళ్లేందుకు కూడా శక్తి లేదని...ఫెరోజి స్వచ్చందసంస్ధ వారు 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారని.. ప్రభుత్వం కాని.. స్వచ్చందసంస్థలు.. ఆదుకునేందుకు ముందుకురావాలని కోరుతోంది నర్సన్ .

ప్రభుత్వం ముందుకురావాలని కోరుతున్న స్థానికులు....
తాను అనుకున్న గమ్యస్థానానికి చేరుకునేందుకు నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ ఆర్గనైజేషన్ లో పనిచేయాలనుకుంటున్న తన కోరికకు చేయూత నివ్వాలని కోరుతోంది నర్సన్ . ఈ విద్యార్థిని చదువుకునేందుకు ప్రభుత్వం ముందుకురావాలని స్థానికులు కోరుతున్నారు. 

కోర్టు ప్రాగంణంలో బాంబు పేలుడు కలకలం..

కేరళ : కేరళలోని కొల్లాం డిస్ట్రిక్ట్ కోర్టు ప్రాగంణంలో బాంబు పేలుడు అలజడి రేపింది. కోర్టు ప్రాంగణంలో ఉన్న రాష్ట్ర కార్మిక శాఖకు చెందిన జీపు కింద బాంబు పేలుడు సంభ‌వించింద‌ని పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డార‌ని వారు తెలిపారు. బాంబు పేలుడు స‌మ‌యంలో సాబు అనే వ్య‌క్తి గాయాల‌పాల‌య్యాడ‌ని చెప్పారు. ఓ కేసు గురించి కోర్టుకు హాజరయ్యేందుకు వ‌చ్చిన సాబు జీపుకి సమీపంలో నిల్చుని ఉండగా ఈ ఘటన జరిగింద‌ని పేర్కొన్నారు. గాయ‌ప‌డ్డ వ్య‌క్తిని పోలీసులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. బాంబు పేలుడుతో సాబుకి క‌ళ్లు, ముక్కుపై గాయాల‌య్యాయ‌ని చెప్పారు.

వైద్యానికి అంగీకరించిన ముద్రగడ...

తూ.గోదావరి : కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వైద్య పరీక్షలకు అంగీకరించారని ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తెలిపారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ, ముద్రగడతో తాము, కాపు జేఏసీ నేతలు పలు దఫాలుగా చర్చలు జరిపామని అన్నారు. అరెస్టైన 17 మందికి బెయిల్, సీబీసీఐడీ విచారణ నిలిపివేతపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆయన తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, తుని ఘటనలో అరెస్టైన వారిని విడుదల చేయాలంటూ గత ఏడు రోజులుగా ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.

మధుర హింస ఘటనలో ప్రధాన నిందితుడి అరెస్టు...

ఉత్తరప్రదేశ్‌ : మథురలో చోటుచేసుకున్న అల్లర్లలో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. రామ్‌వృక్ష్ యాదవ్‌ తర్వాత ఈ అల్లర్లలో కీలక పాత్ర పోషించిన చందన్‌ బోస్‌, అతడి భార్యను బుధవారం అక్కడి చైత్వాలియా గ్రామంలో అరెస్టు చేసినట్లు ఎస్పీ కృపా శంకర్‌ సింగ్‌ తెలిపారు. ఈ అల్లర్ల వెనక ప్రధాన పాత్రధారి అయిన రామ్‌వృక్ష్ యాదవ్‌ ఆ గొడవల్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. అతడితోపాటు, బోస్‌ కూడా మథురకు చెందిన వాడేనని పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ దల్జీత్‌ సింగ్‌ గతంలో ఈ విషయమై మాట్లాడారు.

వైసీపీ కి మరో షాక్ తగలనుందా?....

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి మరో ఎమ్మెల్యే షాక్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీ కండువా కప్పుకోనున్నారు. రేపు(గురువారం)అమర్‌నాథ్‌రెడ్డి అధికారికంగా టీడీపీలో చేరనున్నట్లు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఇప్పటి వరకు వైసీపీ నుంచి టీడీపీకి వెళ్లిన ఎమ్మెల్యేల సంఖ్య 19 కాగా, అమర్‌నాథ్ చేరికతో ఆ సంఖ్య 20కు చేరనుంది.

17:33 - June 15, 2016

సికింద్రాబాద్ : ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర తేదీలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. జులై 24న బోనాల జాతర 25న రంగం కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ఈ జాతర సంబంధించిన అన్ని ఏర్పాట్లను మంత్రి పద్మారావు అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలీస్ శాఖ, జిహెచ్ఎంసి, వాటర్ బోర్డ్, ఆర్టీసి. ఎలక్ట్రిసిటి, సాంస్కృతిక శాఖల అధికారులతో రివ్యూ ను ఏర్పాటు చేశారు. గత ఏడాది కంటే ఈ సారి ఇంకా ఎక్కువగా భక్తుల వచ్చే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని సూచించారు.

ఆర్టీసీ బస్సు - బైక్ ఢీ..3గురు మృతి..

వరంగల్ : ఆర్టీసీ బస్సు - బైక్ ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన తాడ్వాయి మండలంలో చోటు చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఘటనాస్థలిని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీలు సీతారాం నాయక్, పసునూరి దయాకర్ పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇస్తామని హామీ ఇచ్చారు. 

ముద్రగడతో చర్చలు సాగుతున్నాయి - ఎమ్మెల్యే ఆకుల..

తూర్పుగోదావరి : ముద్రగడతో చర్చలు ఫలప్రదంగా సాగుతున్నాయని ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పేర్కొన్నారు. రక్తనమూనాలు ఇచ్చేందుకు ముద్రగడ అంగీకరించారని, ముద్రగడకు ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారని తెలిపారు. ఫ్లూయిడ్స్ ఎక్కించినా ముద్రగడ దీక్ష కొనసాగిస్తున్నారని, రెండు రోజుల్లో సమస్య పూర్తిగా పరిష్కారం కానుందన్నారు.

భారత్ 70/0...

హరారే : జింబాబ్వే నిర్ధేశించిన 123 పరుగుల లక్ష్యాన్ని చేరుకోవడానికి టీమిండియా బ్యాటింగ్ ఆరంభించింది. భారత ఓపెనర్లు రాహుల్, ఫజలు మెల్లిగా ఆడుతున్నారు. ప్రస్తుతం 14.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 70 పరుగులు చేసింది.

50 కుక్కలు సజీవదహనం ....

చెన్నై : మనిషి సహనం కోల్పోతే ఏమవుతుంది? దేనికి దారి తీస్తుంది? ఈ నేపథ్యంలోనే గ్రామస్తులు అందరూ కలిసి ఓ దారుణానికి పూనుకున్నారు.చెన్నైకి 50 కిలోమీటర్ల దూరంలోని కీజ్‌హమూర్ గ్రామంలో దారుణం జరిగింది. 50 కుక్కలను గ్రామస్తులు సజీవదహనం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కీజ్‌హమూర్ గ్రామస్తుల్లోని కొందరు తమ గొర్రెలు, మేకలపై కుక్కలు దాడి చేస్తున్నాయనే కోపంతో జూన్ 5న ఈ ఘటనకు పాల్పడ్డారు. గొర్రెలు, మేకలపై దాడి చేస్తున్న సుమారు 50 శునకాలకు ఆహారంలో క్రిమిసంహారక మందులు పెట్టి చంపారు. అనంతరం కుక్కలపై కిరోసిన్ పోసి నిప్పంటించారు.

17:17 - June 15, 2016

తాళి కట్టించుకున్న అమ్మాయి కొన్ని గంటల్లోనే..నాలుగు గోడల మధ్య రోదిస్తోంది. పాతికేళ్లుగా పెంచుకున్న ప్రేమ..కన్నకలలు అడియాశలై ఓ కుటుంబం తల్లడిల్లిపోతోంది.. కూతురిని ఇచ్చి కట్టబెట్టిన ఆమె కన్నవారు భవిష్యత్ ఏంటీ అని ప్రశ్నించుకుంటున్నారు. ఎందరిలోను విషాదం నింపింది ప్రేమ నేనా ? ఆ ప్రేమ పగబట్టిందా ? ఆ ప్రేమనే ప్రతికారం తీర్చుకుందా ? లేక మరైదేనా జరిగిందా ? నెల రోజులుగా వారి కళ్లల్లో కన్నీరు ఆగడం లేదు. వారి ఎదురుచూపులన్నీ న్యాయం కోసమే. వారి ఆరాటమంతా తమకు జరిగిన అన్యాయంపై ఓదార్పు మాత్రమే. పీఠల మీద పెళ్లి కొడుకు కొన్ని గంటల్లోనే..పాడె మీదకు ఎలా చేరాడు ? ఎన్నో అనుమానాలు నేటికి తీరలేదు. వాస్తవాలు బయటపడలేదు. ఓ ఘటన ఎందరిలోను విషాదం నింపింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి..

17:14 - June 15, 2016

హైదరాబాద్ : రైతులకు విత్తనాలు అందించడానికి యాక్షన్‌ ప్లాన్‌ను రెడీ చేసింది తెలంగాణ సర్కార్‌. విత్తనాలకోసం ఇక రోజులకు రోజులు పడిగాపులు పడాల్సిన అవసరం లేదని తెలంగాణ వ్యవసాయశాఖా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మనతెలంగాణ -మనవ్యవసాయం కార్యక్రమంలో భాగంగా.. గ్రామాల్లోనే సొసైటీ అధికారులు విత్తనాలు అందిస్తారని పోచారం చెప్పారు. రాష్ట్రంలో 9లక్షల క్విటాళ్ల విత్తనాలు సిద్ధం చేశామన్నారాయన. ఈరోజు హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో .. 2016-17 సంత్సరానికి సంబంధించిన ఎగ్రికల్చర్‌ యాక్షన్‌ప్లాన్‌ ను ఆయన రిలీజ్‌ చేశారు. 

17:11 - June 15, 2016

హైదరాబాద్ : ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమపై పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్‌ అయ్యారు. భూ సేకరణపై ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించాలని బుగ్గన విమర్శించారు. నిర్వాసితులకు హక్కులను గుర్తించకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. 

17:09 - June 15, 2016

హైదరాబాద్ : టీఆర్ఎస్ పాలనలో దేశంలో ఎక్కువగా రైతు ఆత్మహత్యలకు పాల్పడుతున్న రెండో రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్బవించిందని అని రేవంత్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 2 లక్షల 15 వేల కోట్ల బడ్డెట్ ఖర్చు చేసినప్పటికి పేదప్రజలకు సంక్షేమ పథకాలు అందివ్వటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. తెలంగాణలో ఇప్పటివరకు పూర్తి స్ధాయిలో రైతు రుణమాఫీ కాలేదని, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం చేపట్టలేదని, దళితులకు మూడెకరాలు భూమి లాంటి పథకాలు ఆచరణకు నోచుకోలేదని రేవంత్ రెడ్డి చెప్పారు. పేదలకు చేరాల్సిన ప్రతి రూపాయి వారికి చేరడం లేదని ఆవిషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత టీ-టీడీపీ నాయకులపై ఉందని వర్క్ షాపులో రేవంత్ రెడ్డి కర్తవ్య బోధ చేశారు. 

రేపటి నుండి ఏపీలో బడి పిలుస్తోంది..

విజయవాడ : గురువారం నుంచి రాష్ట్రంలో బడి పిలుస్తోంది కార్యక్రమం ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని, దీనికి ఉపాధ్యాయులందరూ సహకరించాలని సూచించారు.

 

ఆగస్టా కేసులో మధ్యవర్తిపై ఈడీ ఛార్జ్ షీట్..

ఢిల్లీ : అగ‌స్టా వెస్ట్‌ ల్యాండ్ హెలికాప్ట‌ర్ కేసులో మ‌ధ్య‌వ‌ర్తి క్రిస్టియ‌న్ మైఖేల్ జేమ్స్‌తో పాటు మ‌రో ఇద్ద‌రిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్ ఇవాళ ఛార్జ్‌షీట్ దాఖ‌లు చేసింది.

16:56 - June 15, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారు.. తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది.. కానీ పాలకులు మాత్రం ఇంకా తెలంగాణ సెంటిమెంట్ ను వదలడం లేదనిపిస్తోంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బాంబు లాంటి వార్త పేల్చారు. తెలంగాణలో రాష్ట్రపతి పాలన తెచ్చేందుకు కుట్రలు పన్నుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలను ఏకం చేస్తానని ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ లో కుట్రలు పన్నుతున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. బుధవారం టీకాంగ్రెస్.. ఇతర నేతలు పార్టీలో చేరిన సందర్భంగా కేసీఆర్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారో ఆయన మాటల్లోనే..
''గులాబీ బాస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ ఫుల్ గా అమలయ్యింది. తెలంగాణ రాష్ట్రం డిమాండ్ తో ఉద్యమం ప్రారంభమయింది. పిడికెడు మందితో ప్రారంభమయిన ఉద్యమం ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని నూతన రాష్ట్రం సాధించుకున్నాం. పార్టీలకు అతీతంగా జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యమం మొదలు పెట్టి టీఆర్ఎస్ కు చెందిన ఎంపీలు..ఎమ్మెల్యేలు రాజీనామా చేశం. రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఏపార్టీతోనూ పొత్తులు లేకుండా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా పలువురు ఇంకా కుట్రలు పన్నుతున్నారు. రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని ఇప్పటికీ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. కానీ బంగారు తెలంగాణ కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పాటు పడుతోంది. సమైక్యవాదుల కుట్ర నుండి సాధించుకున్న తెలంగాణ మరోమారు బలవ్వకూడదు. తెలంగాణకు పొలిటికల్ స్టెబులిటికల్ గా..ఎకనామికల్ గా పటిష్టం కావాలి. దశాబ్దాల తరబడి బలహీన వర్గాల వారు 6 లక్షల మంది ఆర్ ఓ ఆర్ చేయమని ప్రజల నుండి విజ్ఞప్తులు వస్తున్నాయి. పొడిగించేందుకు ఆలోచన చేస్తున్నాం. 2019లో కూడా టీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుంది'' అంటూ తనదైన శైలిలో కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. 

రాష్ట్రపతి పాలన తెచ్చేందుకు కుట్రలు - కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తెచ్చేందుకు కుట్రలు పన్నుతున్నారని సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్..ఇతర పార్టీలకు చెందిన నేతలు టీఆర్ఎస లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆంధ్ర, తెలంగాణను ఏకం చేస్తానని సీఎం చంద్రబాబు అంటున్నారని, టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం సుస్థిర పడుతుంటే కాంగ్రెస్ భయపడుతోందని తెలిపారు.

 

టీఆర్ఎస్ లో చేరిన ఎంపీ గుత్తా..

హైదరాబాద్ : కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్, ఎమ్మెల్యేలు రవీంద్ర నాయక్, భాస్కరరావులు కూడా గులాబీ కండువా కప్పుకున్నారు. తదనంతరం జిల్లాల నుండి మరికొందరు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

27 నాటికి వీలైనన్ని శాఖలు వస్తాయి - బాబు..

గుంటూరు : రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన ప్రతొక్కరిలో రావాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఈనెల 27 నాటికి వీలైనన్నీ శాఖలు అమరావతికి వస్తాయని, 22 నాటికి ఎన్ని శాఖలు తరలివస్తాయనే దానిపై స్పష్టత వస్తుందన్నారు.

కేంద్ర కేబినెట్ నిర్ణయాలు..

ఢిల్లీ : కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ వైద్యుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్ల నుండి 65 ఏళ్లకు పెంచుతూ..ఏవియేషన్ విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. స్వాతంత్ర్యం అనంతరం మొదటి ఏవియేషన్ విధానం అమల్లోకి రానుంది. ఎస్ బీఐలో ఐదు అనుబంధ బ్యాంకుల విలీనానికి కేంద్ర మంత్రివవర్గం ఆమోదం తెలిపింది.

ఉభయగోదావరి జిల్లాలో 144 సెక్షన్..

తూర్పుగోదావరి : ఉభయ గోదావరి జిల్లాల్లో 144 సెక్షన్ ను అమలు చేస్తున్నారు. ముద్రగడ అరెస్టుపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ముద్రగడను పరామర్శించేందుకు అనుమతినివ్వడం లేదని పిటిషనర్ పేర్కొన్నారు. ముద్రగడను కలిసేందుకు అందిరికీ అనుమతి ఇస్తున్నామని పోలీసులు కోర్టుకు తెలిపారు. పోలీసులు ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారో తెలపాలని పిటిషనర్ కు కోర్టు సూచించింది.

15:56 - June 15, 2016

ఢిల్లీ : కొత్త ఏవియేషన్‌ పాలసీకి మోది ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విమాన ప్రయాణీకులను దృష్టిలో పెట్టుకుని దీన్ని రూపొందించారు. ఈ పాలసీ ప్రకారం గంటసేపు ప్రయాణానికి 2 వేల 5 వందలుగా టికెట్‌ ధర నిర్ణయించారు. 2022 నాటికి డొమొస్టిక్‌ సెక్టార్‌లో 30 కోట్లు, 2027 నాటికి 50 కోట్ల ఎయిర్‌ టికెట్లను విక్రయించడమో కొత్త పాలసీ లక్ష్యం. అంతర్జాతీయ ప్రయాణానికి సంబంధించి 2027 నాటికి 20 కోట్ల టికెట్లు విక్రయించాలన్నది ధ్యేయం. దేశంలోని చిన్న పట్టణాలకు విమానాల రాకపోకలను పెంచాలనే లక్ష్యంతో వైమానిక సంస్థలకు రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించారు.

15:52 - June 15, 2016

న్యాయ సలహాలు సూచనలు..చట్టంలో వుండే వెసులుబాటులు...చట్టాలను ఉపయోగించుకునే విధానం... వాటి పట్ల అవగాహక కల్పించే కార్యక్రమం మైరైట్ కార్యక్రమం ఈరోజు మన మందుకు వచ్చేసింది. మరి ఈరోజు మైరైట్ కార్యక్రమంలో 'విడాకులు-ద్వితీయ వివాహాలు' అనే అంశంపై న్యాయసలహాలు ఇవ్వటానికి అడ్వకేట్ పార్వతి గారు మనతో వున్నారు...మరి పార్వతి ఏఏ సలహాలు..సూచనలు ఇచ్చారు తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...ఈ చట్టం గురించి తెలుసుకోండి...

15:43 - June 15, 2016

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఐటీరంగం రెట్టింపు వృద్ధి సాధించిందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హెదరాబాద్ లో ఐటీరంగం సాధించిన వార్షిక వృద్ధి నివేదికను ఆయన వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు ఐటీ వృద్ది 57 వేల కోట్లు ఉంటే ఈ సంవత్సరం 75 వేల కోట్లు సాధించిందని ఆయన తెలిపారు. నిర్ధిష్టమైన ఆలోచనలతో ఏటీ దిగ్గజాల మధ్య ఐటీ పాలసీని తీసుకోచ్చామని ఆయన తెలిపారు.

15:41 - June 15, 2016

హైదరాబాద్ : ఆర్టీసీని లాభాలబాట పట్టించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు తెలంగాణ రవాణాశాఖామంత్రి మహేందర్‌ రెడ్డి.. ఈ నెల 17న ఈ అంశంపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారని ప్రకటించారు.. కొన్ని ప్రాంతాల్లోని పల్లె వెలుగు బస్సుల విషయంలో నష్టాలు వస్తుస్తన్న విషయం వాస్తమే కానీ..పల్లెల్లో వుంటే ప్రజలకు ఎటువంటి అసౌక్యం కలుగకూడదనే ఉద్ధేశ్యంలో బస్సులను నడుపుతున్నామన్నారు. నష్టాలను భర్తీ చేయటానికి తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీలో పని చేస్తున్న అధికారులు...క్రిందిస్థాయి సిబ్బందితోనూ సమావేశం ఏర్పాటు చేసిన సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్ తిరగని గ్రామాలు ఇంకా వున్నాయనీ..ఆ ప్రాంతాలకు కూడా త్వరంలో బస్సులను నడుపుతామని తెలిపారు. కేవలం లాభలనే కాకుండా ప్రజల సౌకర్యం కూడా పరిగణలోకి తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.

భారత్ టార్గెట్ 124..

హరారే : భారత్ తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో జింబాబ్వే 123 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తొలుత టాస్ గెలిచిన జింబాబ్వే బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ ఈ మ్యాచ్ లో కూడా జింబాబ్వే బ్యాట్స్ మెన్స్ ఘోరంగా విఫలం చెందారు. సిబంద ఒక్కడే (38) రాణించగా మిగతా బ్యాట్స్ మెన్స్ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. భారత బౌలర్ల బౌలింగ్ ను ధాటికి చతికిలపడ్డారు. భారత బౌలర్లలో శరణ్, కులకర్ణి చెరో మూడు, బుమ్రా, చహల్ తలా ఒక వికెట్ తీశారు.

 

మంత్రి ఉమ చేసిన ఆరోపణలు అవాస్తవం - బుగ్గన

విజయవాడ : తనపై మంత్రి దేవినేని ఉమ చేసినా ఆరోపనలు అవస్తావమని వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకోలేదని, ఆరోపణలు చేసే ముందు నిజాలు తెలుసుకోవాలని సూచించారు. మంత్రిగా ఉండి తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. దేవినేని ఉమ అవినీతిపై టిడిపి ఎంపీ సీఎం రమేష్ ప్రభుత్వానికి లేఖ రాసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

15:15 - June 15, 2016

గుంటూరు : వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు పరిశీలించారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు ముందుగు సాగడం లేదని కాంట్రాక్టర్లపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. పనులు వేగవంతం చేసి.. వెంటనే భవనాలు అప్పగించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ నెలఖరుకు ఉద్యోగులను తరలించితీరాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ క్రమంలో తలెత్తిన పలు సమస్యలను కూడా అధిగమించి ఉద్యోగుల తరలింపుకు అన్ని చర్యలూ తీసుకున్న విషయం తెలిసిదే. ఈ నేపథ్యంలో భవన నిర్మాణాల పనులు ఆలస్యం కావటంపై ఆయన కాంట్రాక్టర్లపై కోపోద్రిక్తులయ్యారు. 

జింబాబ్వే 110/9..

హరారే : భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో జింబాబ్వే ఆలౌట్ కు దగ్గరగా ఉంది. 38 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. భారత బౌలర్లలో శరణ్, కులకర్ణి చెరో మూడు, బుమ్రా, చహల్ తలా ఒక వికెట్ తీశారు.

సీఎం బాబు నారాజ్..

గుంటూరు : తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు ముందుకు సాగడం లేదని, వేగవంతం చేసి భవనాలను వెంటనే అప్పగించాలని బాబు ఈ సందర్భంగా కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

పోలియో వైరస్ పై కేంద్రం స్పందన..

హైదరాబాద్ : నగరంలో పొలియో వైరస్ పై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పందించింది. గడిచిన ఐదేళ్లలో దేశంలో ఎక్కడా పోలియో వైరస్ బయటపడలేదని కేంద్రం పేర్కొంది. సికింద్రాబాద్ లో గుర్తించిన వైరస్ వాక్సిన్ కారణంగా ఏర్పడినదేనని, ఈ వైరస్ ప్రభావానికి చిన్నారులెవరూ గురికాలేదని తెలిపింది. తాజా పరిణామాల నేపథ్యంలో హైదరబాద్, రంగారెడ్డి జిల్లాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. మూడు లక్షల మందికి చిన్నారులకు పోలియో వ్యాక్సినేషన్ వేసినట్లు పేర్కొంది.

మళ్లీ జింబాబ్వే విఫలం..

హరారే : భారత్ తో జరుగుతున్న మూడో వన్డేలో కూడా జింబాబ్వే విఫలం చెందుతోంది. కేవలం 34.3 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం 34.3 ఓవర్లలో 108 పరుగులు చేసింది.

14:38 - June 15, 2016

అసోం: రాష్ట్రంలోని సోనాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 26 మంది ప్రయాణికులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయచర్యలు కొనసాగుతున్నాయి. 

వెలగపూడికి చేరుకున్న సీఎం బాబు...

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెలగపూడికి చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు.

14:35 - June 15, 2016

గుంటూరు : పోరుదీక్ష పేరుతో గుంటూరు జిల్లాలో అగ్రిగోల్డ్‌ బాధితులు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బైబిల్‌ మిషన్‌ గ్రౌండ్‌లో ఈ సభ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్‌ చేశారు. వెయ్యి కోట్లు ఆర్థిక సహాయం అందించాలని ... సీఐడీ దగ్గర బాధితుల లిస్టును ఆన్‌లైన్‌లో పెట్టాలని డిమాండ్‌ చేశారు. కాగా అగ్రిగోల్డ్ బాధితులు ఐదు రాష్ట్రాలలో కలిపి 32 లక్షల మంది కస్టమర్లు, 8 లక్షల మంది ఎజెంట్లు ఉంటారని ప్రాథమిక అంచనా. బాధితులకు వామపక్షాలు, ప్రజాసంఘాలు మద్ధతు లెలిపారు. జాతీయ రహదారిపై బైటాయించిన ఆందోళన చేపట్టారు. దీంతో ఆప్రాంతంలో వాహనాలు భారీగా నిలిచిపోటంలో ట్రాఫిక్ భారీగా స్థంభించిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తమకు న్యాయం చేసేవరకూ ఆందోళన కొనసాగిస్తామని వారు పేర్కొంటున్నారు. తమకు వెంటనే స్పందించకపోతే ..సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని బాధితులు పేర్కొంటున్నారు. 

అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు
అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమైన చర్య అని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. 20లక్షల మంది బాధితులు రోడ్కెక్కి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని ఆయన ఆరోపించారు. ప్రజల సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదన్నారు.

అగ్రిగోల్డ్‌ బాధితుల ఆవేదనని ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదు.చలసాని
అగ్రిగోల్డ్‌ బాధితుల ఆవేదనని ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదని ఏపీ మేధావుల సంఘం చలసాని ప్రసాద్‌ అన్నారు. హింసాత్మకంగా వెళ్లడం ఇష్టం లేకే.. శాంతియుతంగా తమ ఆవేదనన వ్యక్తం చేస్తున్నామని ఆయన అన్నారు. అయినా బాధితుల ఆక్రోషాన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదని అన్నారు. మొదటగా బాధితుల లిస్టును ఆన్‌లైన్‌లో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలని అన్నారు. 

జింబాబ్వే 94/3...

హరారే : భారత్ తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో కూడా జింబాబ్వే అదే ఆటతీరును కనబరుస్తోంది. ప్రస్తుతం మరో వికెట్ కోల్పోయింది. 89 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. తొలుత టాస్ గెలిచిన జింబాబ్వే బ్యాటింగ్ ఎంచుకుంది. మసకద్జ 8, చిబాబా 27, సిబంద 38 పరుగులతో అవుట్ అయ్యారు. ప్రస్తుతం 30 ఓవర్ ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది.

జాతీయ రహదారిపై బైఠాయించిన అగ్రిగోల్డ్ బాధితులు..

గుంటూరు : జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతంగా సాగుతోంది. జాతీయ రహదారిపై బాధితులు బైఠాయించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

 

 

రూ.వేయి కోట్లు విడుదల చేయాలి - అగ్రిగోల్డ్ బాధితుల సంఘం..

గుంటూరు : రూ. వేయి కోట్లు విడుదల చేయాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం డిమాండ్ చేసింది. జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితులు భారీ బహిరంగసభ నిర్వహించారు. ఈ సభకు సీపీఎం, సీపీఐ ఇతర పార్టీల నేతలు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని, సీఎం క్యాంపు ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించింది. కావాలనే ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులతో ఆడుకొంటోందని తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులకు అన్ని పార్టీల మద్దతు ఉంటుందని బాధితుల సంఘం పేర్కొంది.

నూతన పౌర విమానయాన విధానానికి గ్రీన్ సిగ్నల్..

ఢిల్లీ : నూతన పౌర విమానయాన విధానాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ప్రయాణీకులకు అందుబాటులో ఛార్జీలతో మెరుగైన సేవలు అందించాలని, గంటలోపు ప్రయాణానికి రూ. 2500 ఛార్జ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ - విజయవాడ మధ్య విమాన ఛార్జీలు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.

రెండో వికెట్ కోల్పోయిన జింబాబ్వే...

హరారే : భారత్ తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో జింబాబ్వే మరో వికెట్ కోల్పోయింది. 56 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. తొలుత టాస్ గెలిచిన జింబాబ్వే బ్యాటింగ్ ఎంచుకుంది. మసకద్జ 8, చిబాబా 27 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ప్రస్తుతం సిబంద 15 క్రీజులో ఉన్నారు.

జింబాబ్వే 51/1..

హ‌రారే : భారత్ - జింబాబ్వే మూడో వన్డే కొనసాగుతోంది. ఒక వికెట్ నష్టానికి జింబాబ్వే 51 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచిన జింబాబ్వే బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం 18 ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే 1 వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది. క్రీజులో చిబాబా 25, సిబంద 12 పరుగులతో క్రీజులో ఉన్నారు.

13:47 - June 15, 2016

గుంటూరు : పోరుదీక్ష పేరుతో గుంటూరు జిల్లాలో అగ్రిగోల్డ్‌ బాధితులు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బైబిల్‌ మిషన్‌ గ్రౌండ్‌లో ఈ సభ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తమకు న్యాయం  చేయాలని బాధితులు డిమాండ్‌ చేశారు. వెయ్యి కోట్లు ఆర్థిక సహాయం అందించాలని ... సీఐడీ దగ్గర బాధితుల లిస్టును ఆన్‌లైన్‌లో పెట్టాలని డిమాండ్‌ చేశారు. కాగా అగ్రిగోల్డ్ బాధితులు ఐదు రాష్ట్రాలలో కలిపి 32 లక్షల మంది కస్టమర్లు, 8 లక్షల మంది ఎజెంట్లు ఉంటారని ప్రాథమిక అంచనా.
అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు ప్రభుత్వానికి పట్టడంలేదు-మధు 
అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమైన చర్య అని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. 20లక్షల మంది బాధితులు రోడ్కెక్కి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని ఆయన ఆరోపించారు. ప్రజల సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు సీపీఎం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. 
బాధితులు 
'మా బాధను అధికార పక్షం పట్టించుకోవడం లేదు. కస్టమర్ల చేత 50 లక్షలు కట్టించామని బాధితురాలు వాపోయారు. హాయ్ లాండ్ ను ముట్టడిస్తాం. ఎవరు బాధ్యత వహిస్తారు. సీఎం ఆఫీస్ ముందు ధర్నా చేస్తాం. మాకు న్యాయం జరగాలి. 17 లక్షలు కట్టించామని బాధిత వృద్ధురాలు తెలిపింది. సీఎంకు నీతి, నిజాయితీ ఉంటే బాధితుల డబ్బులు ఇప్పించాలన్నారు.

 

13:46 - June 15, 2016

హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులు మళ్లీ ఆందోళన బాటపట్టారు. సచివాలయంలో ఏఎస్‌వోలకు ప్రమోషన్లు ఇవ్వాలని ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ప్రమోషన్ల విషయంపై సీఎం కేసీఆర్‌ సానుకూలంగా ఉన్నా కొంతమంది అధికారుల తీరుతో ప్రమోషన్లు ఆగిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సచివాలయంలో పనిచేస్తున్న 105మంది ఉద్యోగులను ఏపీకి పంపించాలని వారు డిమాండ్ చేశారు. 

 

13:45 - June 15, 2016

విశాఖ : ప్రజాకవి శ్రీశ్రీ 33వ వర్థంతిని విశాఖ బీచ్ రోడ్డులో శ్రీశ్రీ విజ్జాన కేంద్రం సాహితి స్రవంతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీశ్రీ లాంటి మహా గొప్ప కవి విశాఖలో జన్మించడం అదృష్టమన్నారు. ఆయన రాసిన కవితలు పాటలు యువతకు, సాహితి వేత్తలకు కొత్త దారి చుపించాయని  కొనియాడారు. శ్రీశ్రీ ఇంటిని లైబ్రరిగా రూపొందించాలని సాహితి వేత్తలు విజ్ఞప్తి చేశారు. 

అమృత విద్యాలయం వద్ద కొనసాగుతున్న ఆందోళన..

హైదరాబాద్ : అమృత విద్యాలయం వద్ద తల్లిదండ్రులు నిర్వహిస్తున్న ఆందోళన కొనసాగుతోంది. ఫీజుల పెంపు, 27 మంది విద్యార్థులకు టీసీలు ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యంతో విద్యార్థి సంఘం నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. విద్యార్థులకు ఇచ్చిన టీసీలను వెనక్కి తీసుకోమని, విద్యార్థుల తల్లిదండ్రులు క్షమాపణ చెప్పి పెంచిన ఫీజు చెల్లిస్తేనే టీసీలను వెనక్కి తీసుకుంటామని యాజమాన్యం తేల్చిచెప్పింది. తల్లిదండ్రుల ఆందోళనకు వివిధ సంఘాలు మద్దతు ప్రకటించాయి.

13:41 - June 15, 2016

హైదరాబాద్ : 27మంది విద్యార్థులకు టీసీలిచ్చి పంపించిన హైదరాబాద్‌లోని అమృత విద్యాలయం ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనను ఉధృతం చేశారు. విద్యార్థులకు ఇచ్చిన టీసీలను వెంటనే వెనక్కి తీసుకొని విద్యార్థులకు రీ అడ్మిషన్‌ ఇవ్వాలని తల్లిదండ్రులు ఆందోళన చేశారు. దీంతో అమృత విద్యాలయం ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఈ ఘటనపై స్కూలు యాజమాన్యం మాత్రం స్పందించడంలేదు. స్కూలు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు ఎంటరయ్యారు. తల్లిదండ్రులు ఆందోళనకు ఎస్‌ఎఫ్ఐ, ఎస్‌ఎఫ్‌ఆర్‌, యూటీఎఫ్‌, డీవైఎఫ్‌ఐ పూర్తి మద్దతు ప్రకటించాయి. 
విద్యార్థులు తల్లిండ్రులు..
'క్షపమాపణ చెప్పినా.. ఆలోచిస్తామని యజమాన్యం చెబుతోంది. ఇంత అన్యాయం జరుగతుంటే... సీఎం కేసీఆర్ పడుకున్నారా...అని ప్రశ్నించారు. మీ ఇంటి ముందుకు వచ్చి కూర్చుకుంటాం. మాకు న్యాయం కావాలి'.  
డివైఎఫ్ నేత.. మహేందర్
'సేవాదృక్పథం పేరుతో స్థాపించిన అమృత విద్యాలయం వ్యాపారం చేస్తోంది. మానవత్వ దృక్పథంతో విద్యార్థులను చేర్చుకోవాలి. విద్యార్థులను స్కూల్ లో చేర్చుకునేవరకు పోరాటం కొనసాగిస్తామని' హెచ్చరించారు. పేదోడు గుడిసె వేసుకుంటే.. పీకేస్తున్న ప్రభుత్వం... రెండు ఎకరాల్లో స్కూల్ ఏర్పాటు చేసి... అమ్మ ఆశ్రమం పేరుతో విద్యను అందిస్తామని చెప్పి... వ్యాపారం చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని' ఎస్ ఎఫ్ ఐ నేత నిలదీశారు. 

 

జింబాబ్వే 19/1..

హ‌రారే : భారత్ - జింబాబ్వే మూడో వన్డే కొనసాగుతోంది. తొలుత టాస్ గెలిచిన జింబాబ్వే బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరు ఓవ‌ర్ల‌లో జింబాబ్వే వికెట్ నష్టానికి 19 ర‌న్స్ చేసింది. ఈ మ్యాచ్‌కు టీమిండియాలో ఒక మార్పు చేశారు. నాగ‌పూర్‌కు చెందిన బ్యాట్స్‌మెన్ ఫ‌యిజ్ ఫ‌జ‌ల్ అరంగేట్రం చేస్తున్నాడు.

 

బెజవాడలో కాపు నేతల కీలక భేటీ ?

విజయవాడ : కాపు ఉద్యమ నేత ముద్రగడ చేస్తున్న దీక్షపై కాపు నేతలు స్పందిస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం కాపు నేతలైన చిరంజీవి, దాసరి నారాయణ రావు, బోత్స, అంబటి రాంబాబు తదితర నేతలు భేటీ అయిన సంగతి తెలిసిందే. తాజాగా చిరంజీవి, బోత్స సత్యనారాయణ, దాసరి నారాయణ రావులు రహస్యంగా భేటీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

నల్గొండలో శ్రీ సాయి చిట్ ఫండ్స్ నిర్వాహకుల అరెస్టు..

నల్గొండ : శ్రీ సాయి చిట్ ఫండ్స్ నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. రూ. 4.26 కోట్లు వసూలు చేసి పరారైన ముగ్గురు నిందితులను పోలీసులు మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. నిందితులు నర్సింహ, లీలాకుమారి, ఆనందరెడ్డిల నుండి రూ. 4.2 కోట్ల విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. 11 కేసులు నమోదు చేశారు.

పౌర విమానశాఖలో సంస్కరణలు..

ఢిల్లీ : ప్రధాని కార్యాలయంలో కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. పౌర విమానశాఖలో సంస్కరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే వివిధ అంశాలపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది.

టి.సచివాలయంలో ఉద్యోగుల ఆందోళన..

హైదరాబాద్ : తెలంగాణ సచివాలయంలో ఏఎస్ వోలకు ప్రమోషన్లు ఇవ్వాలని ఉద్యోగులు ఆందోళనకు దిగారు. సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నా కొంతమంది అధికారుల తీరుతో ప్రమోషన్లు ఆగిపోయాయని నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సచివాలయంలో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగులను ఏపికి పంపించాలని డిమాండ్ చేస్తున్నారు.

వడ్డీ వ్యాపారుల వేధింపులకు తాళలేక..

కరీంనగర్ : వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక హౌసింగ్ బోర్డు కాలనీలో నర్సవ్వ అనే వ్యక్తి యాసిడ్ తాగారు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు.

లోయలో పడిన బస్సు..26 మంది దుర్మరణం..

అసోం : సోనాపూర్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు లోయలో పడిపోవడంతో 26 మంది మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

12:51 - June 15, 2016

హైదరాబాద్ : రేపు కాపు నేతలు అత్యవసర సమావేశం కానున్నారు. విజయవాడ లేక రాజమండ్రిలో సమావేశం కానున్నారు. కాపు నేత ముద్రగడ ఆరోగ్యం, కాపు ఉద్యమంపై సర్కార్ కు పెట్టిన 2 రోజుల డెడ్ లైన్ ముగిసిన నేపథ్యంలో మరోసారి సమావేశం అవ్వనున్నారు. ముద్రగడ ఆరోగ్యం, కాపు ఉద్యమంపై ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపు కార్యాచరణ ప్రకటిస్తామని నేతలు ప్రకటించారు. 

 

12:50 - June 15, 2016

ఒక సినిమా..సిద్ధం కావడానికి ఉన్న ఓ సినిమాకు ఎన్నో వివాదాలు చుట్టుముడుతున్నాయి. చిత్ర దర్శకులు..ఇతరులు కోర్టుల మెట్లు ఎక్కుతున్నారు. రెండు రోజుల్లో విడుదల కావాల్సిన సినిమాపై నీలి మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఆ సినిమాయే 'ఉడ్తా పంజాబ్'...బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ దర్శకత్వ వహించి షాహీద్ కపూర్ హోరీగా నటించిన చిత్రం 'ఉడ్తా పంజాబ్' వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. పంజాబ్ లో డ్రగ్ మాఫియా నేపథ్యంలో ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక సినిమా షూటింగ్ అనంతరం సెన్సార్ కు వెళ్లింది. అయితే ఈ సినిమాలో పంజాబ్‌ స్టేట్‌ కు సంబంధించిన అంశాలన్నింటిని తీసివేయాలని సెన్సార్‌ బోర్డు స్పష్టం చేసింది. దాదాపు 89 సీన్స్‌ ను కట్‌ చేయాలని పేర్కొంది. దీనితో చిత్ర బృందం బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చివరకు 13 కట్ లతో సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అయితే ఈ సినిమాలో ఎలాంటి వివాదస్పద సీన్లు లేవని ఒక్క కట్ తో 48 గంటల్లోగా 'ఉడ్తా పంజాబ్' కు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని న్యాయస్థానం సెన్సార్ బోర్డును ఆదేశించింది. దీనితో ఈ సినిమా జూన్ 17న విడుదలవుతుందని కోర్టు స్పష్టం చేసింది. బాంబే హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఓ ఎన్జీవో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సినిమాపై స్టే విధించాలని ఎన్జీఓ కోరినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా విడుదలవుతుందా ? లేదా ? అనేది వెయిట్ అండ్ సీ. మరోవైపు సెన్సార్ బోర్డు 40 కట్స్.. రివైజ్డ్ కమిటీ ఏకంగా 89 కట్స్ చెప్పిందంటే సినిమాలో అంత వివాదాస్పద అంశాలు ఏమున్నాయో చూద్దామని జనాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ముద్రగడతో చర్చలు - హోం మంత్రి చినరాజప్ప..

విజయవాడ : కాపు ఉద్యమ నేత ముద్రగడ చేపడుతున్న దీక్షపై హోం మంత్రి చిన రాజప్ప మరోసారి స్పందించారు. మరో దఫా చర్చలకు ప్రభుత్వ బృందాన్ని పంపిస్తామని తెలిపారు. ముద్రగడ ఆరోగ్యాన్ని కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని, షరతులను సానుకూలంగా పరిశీలిస్తుందని చెప్పారు.

12:40 - June 15, 2016

పశ్చిమగోదావరి : ప్రాథమిక విద్యకు పెద్డపీఠ వేస్తామన్న ప్రభుత్వ ప్రకటనలు మాటలకే పరిమితమవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లాలంటేనే విద్యార్ధులు భయపడుతున్నారు. ఏ క్షణాన భవనం కూలుతుందో తెలియని పరిస్థితి. దీంతో విద్యార్థులు చదువుపై దృష్టి నిలపలేకపోతున్నారు. స్కూలుకెళ్తే ఏం జరుగుతుందోనన్న భయం విద్యార్థులను వెంటాడుతోంది. 
బడికి వెళ్లడానికి భయపడుతున్న విద్యార్థులు
పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని ప్రభుత్వ పాఠశాల పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. దీన్ని చూసి విద్యార్థులు స్కూల్‌కు రావడానికి భయపడుతున్నారు. దీంతో పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య రాను రాను తగ్గిపోతోంది. ఈ మండలంలోని 5 గ్రామాలలో 67 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. అందులో 49 ప్రాథమిక, 8 ప్రాథమికోన్నత పాఠశాలలు, 10 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో సుమారు 6 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో పాఠశాలకు వెళ్దామంటేనే భయపడే స్థితిలో విద్యార్థులు ఉన్నారు. 
రేకుల షెడ్డుల్లోనే పాఠశాలల నిర్వహణ
మండలంలోని వేంపాడు, గోపాలపురం, కొత్తపల్లి మొదలైన గ్రామాలలో చాలా పాఠశాలలు రేకులషెడ్‌లలోనే కొనసాగుతున్నాయి. వేసవి కాలం ఎండకు తట్టుకోలేక విద్యార్ధులు స్కూలుకు రావడం మానేశారు. మరికొన్ని పాఠశాలలు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యార్ధులు వ్యవసాయ కూలీలుగాను మారుతున్నారు. 
ఫీజలు చెల్లించలేక అనేక ఇబ్బందులు 
ఇటు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కూడా లేక, అటు ప్రైవేటు స్కూల్స్ కు ఫీజలు చెల్లించలేక అనేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సర్కారు బడులను మెరుగుపరచాలని డిమాండ్‌ చేస్తున్నారు.

 

టాస్ గెలిచిన జింబాబ్వే..

హరారే : భారత్ తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో జింబాబ్వే టాస్ గెలిచింది. కెప్టెన్ క్రీమర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా భారత్ రెండు వన్డేలో గెలిచి 2-0 తో సిరీస్ ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

ముద్రగడకు వైద్యం అందించేందుకు సిద్ధం - కామినేని..

విజయవాడ : కాపు ఉద్యమ నేత ముద్రగడ చేపడుతున్న దీక్షపై మంత్రి కామినేని స్పందించారు. ముద్ర‌గ‌డ, ఆయ‌న కుటుంబ స‌భ్యుల ఆరోగ్యం క్షీణిస్తోందని తెలిపారు. అత్య‌వ‌స‌ర వైద్యం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని పేర్కొన్నారు. వైద్య ప‌రీక్ష‌ల కోసం కాకినాడ నుంచి అద‌న‌పు వైద్య నిపుణులను తీసుకొచ్చామ‌ని ఆయ‌న తెలిపారు.

గాంధీభవన్ లో పీసీసీ సమన్వయ కమిటీ..

హైదరాబాద్ : గాంధీ భవన్ లో పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి దిగ్విజయ్, ఉత్తమ్, జానారెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ ఆలీ..ఇతరులు హాజరయ్యారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.

అత్యవసరంగా ల్యాండైన జెట్ ఎయిర్ వేస్ విమానం..

బెంగళూరు : జెట్ ఎయిర్ వేస్ విమానంలో పొగలు వచ్చాయి. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సిబ్బంది గుర్తించారు. దీనితో ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండైంది. విమానంలో 65 మంది ప్రయాణీకులున్నారు.

జులై 24న మహంకాళి బోనాలు..

హైదరాబాద్ : సికింద్రాబాద్ మహంకాళి బోనాలపై అన్ని శాఖల అధికారులతో మంత్రి తలసాని సమావేశం నిర్వహించారు. జులై 24న బోనాలు, 25న రంగం కార్యక్రమం జరగనుంది. ప్రభుత్వమే బోనాల జాతర నిర్వహిస్తుందని మంత్రి తలసాని ప్రకటించారు.

రేపు కాపు నేతల సమావేశం..

హైదరాబాద్: విజయవాడ లేదా రాజమండ్రిలో కాపు ముఖ్యనేతల అత్యవసర సమావేశం జరగనుంది. భవిష్యత్ కార్యాచరణను కాపు నేతలు ప్రకటించనున్నారు. ముద్రగడ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై కాపు నేతలు నిరసన వ్యక్తం చేయనున్నారు.

టి.ఐటీ శాఖ రెండో వార్షిక నివేదిక...

హైదరాబాద్ : తెలంగాణ ఐటీ శాఖ రెండో వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఐటీ రంగంలో మంచి వృద్ధి రేటు సాధించామని చెప్పుకొచ్చారు. ప్రతిష్టాత్మక ప్రపంచ ఐటీ కంపెనీలన్నీ హైదరాబాద్ కు వచ్చాయన్నారు. గత ఏడాది ఐటీ ఎగుమతులు రూ. 67 వేల కోట్లుగా ఉందని, ఈ ఏడాది ఐటీ ఎగుమతులు రూ. 75వేల కోట్లు సాధించామన్నారు.

 

12:25 - June 15, 2016

హైదరాబాద్ : నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న స్కూళ్లు బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝలిపించారు. రామంతాపూర్, హబ్సిగూడ, మేడిపల్లి, చెంగిచర్ల, ఘట్ కేసర్ ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని, ఫిట్ నెస్ లేని బస్సులను అధికారులు సీజ్ చేస్తున్నారు. అయితే తనిఖీల్లో భాగంగా వేడ స్కూల్ బస్సును సీజ్ చేశారు. 

నాగార్జున వర్సిటీ ఎదుట అగ్రిగోల్డ్ బాధితుల ధర్నా..

గుంటూరు : నాగార్జున యూనివర్సిటీ ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ బాధితులు మహాధర్నా చేపట్టారు. ప్రభుత్వం రూ. వెయ్యి కోట్లు విడుదల చేసి బాధితులను ఆదుకోవాలని సీపీఐ నేత నాగేశ్వరర రావు డిమాండ్ చేశారు.

గాంధీభవన్ లో టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం

హైదరాబాద్ : గాంధీభవన్ లో టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి  దిగ్విజయ్ సింగ్, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ హాజరు అయ్యారు. 

పీఎం ఆఫీసులో కేంద్ర కేబినెట్ సమావేశం..

ఢిల్లీ : ప్రధాని కార్యాలయంలో కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. వివిధ అంశాలపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది.

12:01 - June 15, 2016

కరీంనగర్ : ప్రైవేట్ స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కు చెందిన బస్సు ఉదయం జ్యోతినగర్ నుంచి విద్యార్థులను తీసుకెళ్తోంది. మార్గంమధ్యలో బస్సు టైరు ఊడిపోయింది. దీంతో పలువురు విద్యార్థులకు స్వల్పగాయాలయ్యాయి. విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో అధికారుల నిర్లక్ష్యం, తనిఖీల్లో ఉదాసీనత స్పష్టంగా కనిపిస్తోందని పలువురు అంటున్నారు. నామమాత్రంగా బస్సుల తనిఖీలు చేస్తున్నారని చెబుతున్నారు.

11:43 - June 15, 2016

హైదరాబాద్ : మారేడ్ పల్లిలోని అమృత విద్యాలయం ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఫీజుల పెంపు, 27 మంది విద్యార్థులకు టీసీలు ఇవ్వడానికి నిరసనగా ధర్నా చేపట్టారు. పెంచిన ఫీజులను తగ్గించాలని, టీసీలను వెనక్కి తీసుకుని విద్యార్థులను స్కూల్ లో చేర్చుకోవాలని కోరుతున్నారు. తల్లిదండ్రులకు మద్దతుగా ఎస్ ఎఫ్ఐ, డివైఎఫ్, పలు విద్యార్థి సంఘాలతోపాటు ప్రజా సంఘాలు ధర్నా చేపట్టాయి. అధిక ఫీజులు తగ్గించేవరకు, టీసీలను వెనక్కితీసుకుని విద్యార్థులను చేర్చుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలను నిర్వహిస్తామని హెచ్చరించారు. 
తల్లిండ్రులు...
'ఫీజులు అధికంగా పెంచారు. 40 వేల నుంచి 50 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఫీజు కట్టలేదని 27 మంది విద్యార్థులకు పోస్టులో టీసీలు పంపించారు. పిల్లలపై స్కూలు యాజమాన్యం కనికరం చూపడం లేదు. ఈ విషయంపై స్కూల్ యాజమాన్యం, డీఈవోతో మాట్లాడినా... ఎలాంటి స్పందన లేదు. కలెక్టర్ ను కలిసినా ఎలాంటి స్పందన లేదు. 
ఫీజులు తగ్గించాలి, టీసీలను వెనక్కి తీసుకుని విద్యార్థులను తిరిగి స్కూల్ లో చేర్చుకోవాలి. అప్పటి వరకు ఆందోళన చేస్తామని'.. విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. 
ఎస్ ఎఫ్ ఐ నేత.. 
'అమృత స్కూల్ యాజమాన్యం దరుసుగా..ప్రవర్తిస్తోంది. డబ్బులు కట్టేవారు అమృత విద్యాలయంలో చేర్పించాలి. డబ్బుల్లేని వారు ప్రభుత్వ స్కూళ్లలో చదివించాలని స్కూల్ యాజమాన్యం చెబుతోంది. పెంచిన ఫీజులను తగ్గించాలి. టీసీలను వెనక్కి తీసుకుని, 27 మంది విద్యార్థులను తిరిగి స్కూల్ లో చేర్చుకోవాలి. అప్పటి వరకు పోరాటం చేస్తామని' హెచ్చరించారు. 

 

11:38 - June 15, 2016

మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగేంద్ర బాబు..కూతురు కొణిదెల నిహారిక ఇటీవలే టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. 'ఒక మనసు' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల ఎదుట రాబోతోంది. ఈ చిత్రంలో నాగశౌర్య హీరోగా నటిస్తున్నాడు. అంతేగాక నిహారిక టీవీ 'ముద్దపప్పు ఆవకాయ' అనే యూ ట్యూబ్ సీరియల్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే కూతురు నిహారికకు నాగబాబు ఓ గిఫ్ట్ ఇచ్చారు. తనకో ఓ కారు ఉండాలని అనుకున్నారో ఏమో కానీ 'ఆడి' కారును నాగబాబు గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇది నాన్న గిఫ్ట్ అంటూ నిహారిక పేర్కొంది. కారు పక్కన తండ్రితో దిగిన ఫొటోను ఫేస్ బుక్ లో పోస్టు చేసింది.

11:36 - June 15, 2016

మెగాస్టార్ కుటుంబం నుండి వచ్చిన 'వరుణ్ తేజ్' తాజా చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈయన హీరోగా చేస్తున్న 'మిస్టర్' సినిమా చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ అంతా స్పెయిన్ కు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక్కడ ఓ విశేషం దాగుంది. ఈ సినిమా కోసం ఓ ప్రత్యేకమైన ఇంటిని తీసుకున్నారు. ఈ ఇంట్లోనే భారీ షెడ్యూల్ కు ప్లాన్ చేశారు. కథలో ఈ ఇల్లు కీలక భూమిక పోషిస్తుందంట. వరుణ్ సరసన లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరి ఆ ఇంట్లో ఏముంది ? ఇంటికి ఈ సినిమా కథకు సంబంధం ఏమిటన్నది తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాలి.

నీరు - చెట్టు..పంట సంజీవనిపై బాబు టెలికాన్ఫరెన్స్..

విజయవాడ : నీరు - చెట్టు, పంట సంజీవనిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రుతుపవనాలు మరింత జాప్యమైతే రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని, వారు ఆందోళన చెందకుండా చూడాలని సూచించారు. అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరించారు.

అమృత విద్యాలయం వద్ద తల్లిదండ్రుల ఆందోళన..

హైదరాబాద్ : అమృత విద్యాలయం వద్ద తల్లిదండ్రులు ఆందోళన నిర్వహిస్తున్నారు. వెంటనే పిల్లలను స్కూల్లో చేరిపించుకోవాలని..వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఫీజుల పెంపు, 27 మంది విద్యార్థులకు టీసీలు ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం ఇచ్చిన టీసీలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తల్లిదండ్రుల ఆందోళనకు వివిధ సంఘాలు మద్దతు ప్రకటించాయి.

ముద్రగడ హెల్త్ బులెటిన్ విడుదల..

తూర్పుగోదావరి : కాపు ఉద్యమ నేత ముద్రగడ చేపట్టిన దీక్ష ఏడో రోజుకు చేరుకుంది. బుధవారం ఉదయం వైద్యులు హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. ముద్రగడ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. బీపీ చెక్ చేయించేందుకు ముద్రగడ అంగీకరించారని, కానీ రక్త పరీక్షలకు మాత్రం అనుమతించలేదని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన డిప్యూటి సీఎం..

వరంగల్ : మంగపేటలో ప్రభుత్వ పాఠశాలలో డిప్యూటి సీఎం కడియం, ఎంప సీతారాం నాయక్ తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలకు గైర్హాజరైన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిప్యూటి సీఎం కడియం ఆదేశాలు జారీ చేశారు. గైర్హాజరయిన ఉపాధ్యాయుడు సాంబశివరావును సస్పెన్షన్ చేయగా హెచ్ఎం బుచ్చయ్యకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. బడిబాట క్యాక్రమంలో వంద శాతం ఎన్ రోల్డ్ సాధించాలని ఈ సందర్భంగా కడియం శ్రీహరి పేర్కొన్నారు.

 

10:49 - June 15, 2016

లక్షల రూపాయల కట్నం తీసుకున్నారు..నీతి వ్యాఖ్యలు చెప్పారు..కోడలు కాదు కూతురన్నారు..ఇదంతా కట్నం చేతిలో పడ్డాకే..ఆ తరువాత..

లక్షలకు లక్షలు కట్నం తీసుకున్నాడు..ఆర్నేళ్లుగా అరాచకం సృష్టిస్తున్నాడు..నట్టింట్లో నవ వధువుకు నరకం చూపించాడు. ధనదాహం తీరని మెట్టినింట్లో అడుగు పెట్టిన ప్రతిక్షణం నరకం చూసింది. అయినా సర్దుకుని ఉంటున్న ఆ ఇల్లాళిని కోటి రూపాయలు తేవాలంటున్నారు. లేదంటే విడాకులు ఇవ్వమంటున్నారు. ఇదంతా చెబుతోంది ఎవరో కాదు..సంపన్న కుటుంబం..అందులో వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ.
ఇక మరో ఘటనలో...కాళ్లు నేలకు తాకే ఉన్నాయి. ఫ్యాన్ కు ఉన్న ఒక రెక్కకు ఉరి ఎలా వేసుకుంది ? ఆత్మహత్య చేసుకుంటే పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఎందుకు దించేశారు ? సరైన భోజనం పెట్టకుండా వేధిస్తున్నారంటున్న కుటుంబీకుల ఆరోపణలకు సమాధానం ఏదీ ? లక్షలకు లక్షలు కట్నం తీసుకుని నట్టింట్లో నరకం చూపించిన వారే హత్య చేశారా ? లేక ఆ వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందా ? ఈ విషాద ఘటనలకు సంబంధించిన మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

కాసేపట్లో వెలగపూడికి సీఎం బాబు..

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో వెలగపూడికి చేరుకోనున్నారు. అక్కడ జరగుతున్న తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. అనంతరం ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

వెలగపూడిలో మంత్రి నారాయణ..

గుంటూరు : ఏపీ మంత్రి నారాయణ వెలగపూడికి చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలిస్తున్నారు. కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు కూడా రానున్నారు.

లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. 100పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్, 25 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి.

10:35 - June 15, 2016

ఒక్క నోటు విలువ కోట్లలో...కేవలం 20వేలకు ఒక్క లీరా కరెన్సీ..ముఠాల గాలానికి పడిపోతున్న అమాయకులు..

మన దగ్గర ఒక నోటు విలువ రూపాయి నుండి మొదలు కొని వేయి రూపాయల వరకు ఉంది. అదే టర్కీలోని 'లీరా' అంటే మాములు నోటు కాదు. ఒక్క నోటు విలువ రెండు కోట్లు. భారీ ముఖ విలువ కలిగిన ఈ నోట్లను ఎప్పుడో నిషేధించింది. ఆ తరువాత మార్చుకోవడానికి కూడా నాలుగేళ్లు గడవు ఇచ్చింది. కానీ మహానగరంలో మాత్రం పదేళ్లు తరువాత బయటకు వచ్చి అమాయకులను పుట్టిముంచుతున్నాయి. తాజాగా 'లీరా' నోట్లు భారీగా పట్టుబడ్డాయి. ఇందులో స్థిరాస్తి వ్యాపారులే సూత్రధారులా ? జంటనగరాలతో పాటు మిగతా నగరాలకు తెలుగు రాష్ట్రాల్లో చలామణికి సిద్ధంగా ఉంచారా ? మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి.

10:35 - June 15, 2016

మహానగరానికి తరలివచ్చిన ముఠాలు..భారీ ముఖవిలువ కలిగిన నోట్లు..ఈ నోట్లన్నీ నిషేధించబడినవి..పోలీసుల అనుమానాలు నిజమైతే సూత్రధారులెవరు ?

విదేశీ కరెన్సీ అంటే చాలు..చాలా క్రేజీ..ఎందుకంటే అక్కడి కరెన్సీతో పోలిస్తే ఎక్కువే. దీనితో తక్కువలో తీసుకుని ఆ తరువాత మార్పిడి చేసుకుంటే ఊహించనంత డబ్బు వస్తుందని గ్యాంగులు ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పుడు మహానగరంపై పడ్డాయి. టర్కీనోట్లను చెలామణి చేస్తూ దందా నిర్వహిస్తున్నాయి. లీరా కరెన్సీని పదేళ్లుగా దాచిపెట్టారు. భారీ మొత్తంలో ఉన్న నోట్లను మార్కెట్లోకి వెదజల్లుతున్నాయి. మాయమాటలతో గ్యాంగ్స్ బోల్తా కొట్టిస్తున్నాయి. పోలీసులకు సమాచారం అందడంతో రెండు..మూడు ముఠాలు దొరికాయి. నగరంలో ఇంకా ఎన్నో ముఠాలు సంచరిస్తున్నాయని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

10:27 - June 15, 2016

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఆహార పధార్థాల ధరలు మండిపోతున్నాయి. పెరిగిన ధరలపై ఇవాళ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ సమీక్ష చేయనున్నారు. పప్పు ధాన్యాలు సహా ఇతర ఆహార పదార్థాల ధరలపై చర్చించనున్నారు. ధరలను అదుపులోకి తెచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీ, నిర్మలాసీతారామన్ లు హాజరయ్యే అవకాశం ఉంది. 

 

కాసేపట్లో అమృత విద్యాలయం వద్ద తల్లిదండ్రుల ఆందోళన..

హైదరాబాద్ : అమృత విద్యాలయం వద్ద కాసేపట్లో తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించనున్నారు. ఫీజుల పెంపు, 27 మంది విద్యార్థులకు టీసీలు ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేయనున్నారు. యాజమాన్యం ఇచ్చిన టీసీలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తల్లిదండ్రుల ఆందోళనకు వివిధ సంఘాలు మద్దతు ప్రకటించాయి.

10:16 - June 15, 2016

హైదరాబాద్ : ఇంజనీరింగ్ కాలేజీలపై టీఆర్‌ఎస్‌ సర్కార్‌ కొరడా ఝుళిపించడంతో యాజమాన్యాలు విలవిలలాడుతున్నాయి. కనీస సౌకర్యాలు లేని కాలేజీల భరతం పట్టడంతో అవన్నీ మూతపడుతున్నాయి. ఇప్పటికే 58 కాలేజీలు చేతులెత్తేశాయి. మరో 50 ఇంజనీరింగ్‌ కాలేజీలకు తాళాలు పడనున్నాయి. 
మౌలిక సదుపాయాలు లేని కాలేజీలపై వేటు
తెలంగాణాలో ఇంజనీరింగ్ కాలేజీల్లో జరుగుతున్న తనిఖీల్లో  ఫేక్ కాలేజీల భాగోతాలన్నీ బయటపడుతున్నాయి. రెండు నెలల నుంచి జేఎన్‌టియు హైద్రాబాద్, విజిలెన్స్ అధికారుల బృందం ఆధ్వర్యంలో జరుగుతున్న  తనిఖీల్లో ఇంజనీరింగ్ కాలేజీల్లోని అనేక అవకతవకలు  వెలుగు చూస్తున్నాయి.  సరైన మౌలిక సదుపాయాలు లేకుండా,  పైపై మెరుగులతో నడుస్తున్న కాలేజీల బండారం బయట పెట్టేందుకు రంగం  సిద్దమవుతోంది.  తనిఖీలు ఇప్పటికే పూర్తికావడంతో నివేదికలు కూడా జేఎన్‌టీయూ అధికారుల చేతికి చిక్కాయి.. దీంతో జేఎన్‌టీయు స్పీడ్ పెంచింది. 
తనిఖీల నివేదికల పరిశీలనలో అధికారులు నిమగ్నం 
జేఎన్‌టీయూ, విజిలెన్స్ అధికారులు జరిపిన తనిఖీల నివేదికలను పరిశీలించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. పరిశీలన పూర్తయ్యాక ఈ నెల 18వ తేదీన అఫిలియేషన్‌ కాలేజీలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. మొదట  అఫిలియేషన్‌ పొందిన కాలేజీల జాబితాను  విడుదల చేసి, ఆ తరువాత అఫిలియేషన దక్కని కాలేజీల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలని భావిస్తున్నారు. 
కాలేజీల్లో పకడ్బందీగా తనిఖీలు 
అయితే ఇప్పటికే కాలేజీల్లో పకడ్బందీగా తనిఖీలు నిర్వహించిన అధికారులు అఫిలియేషన్‌ విషయంలోను అలాగే ఉండాలని నిర్ణయించారు. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగకుండా జాగ్రత్త వహిస్తున్నారు. ఇప్పటికే ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిన ఇంజనీరింగ్‌ కాలేజీల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం తనిఖీలను ఆసరాగా చేసుకుంటోంది. ఇక నాలుగైదు కాలేజీలున్న గ్రూపు విద్యా సంస్థలకు కూడా ఈ ఏడాది నిరాశే మిగలనుంది. వీటిలో ఒకటి లేదా రెండు కాలేజీలకు మించి అఫిలియేషన్‌ ఇవ్వకూడదని నిర్ణయించారు. అధికారులు పకడ్బందీగా నిర్వహిస్తున్న ఈ తనిఖీలతో నిబంధనలు పాటించే ఇంజనీరింగ్‌ కాలేజీలు మాత్రమే కొనసాగనున్నాయి. అదే జరిగితే ఇంజనీరింగ్‌ విద్యావ్యవస్థకు మంచి జరిగినట్టే.

10:09 - June 15, 2016

నిండా నూరేళ్లు బతకాలి..సంతోషంగా ఉండాలి అని అందరూ కోరుకుంటూ ఉంటారు. కానీ మధ్యలోనే వారి జీవితం ముగుస్తుంది. ఇందుకు మనం తినే ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారంట. ముడి ధాన్యం ఇందుకు చక్కటి పరిష్కారమంట. రోజు ముడి ధాన్యంతో చేసిన ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. దంపుడు బియ్యం..రాగులు..జొన్నలు..సజ్జలు..కొర్రలు వంటి ముడి ధాన్యాలను రోజుకు కనీసం 48 గ్రాముల చొప్పున తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు దూరమయ్యే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు. కేన్సర్ తో మరణించే అవకాశం 14 శాతం..ఇతర కారణాల వల్ల ప్రాణం కోల్పోయే అవకాశం 20 శాతం తగ్గుతుందని చెబుతున్నారు. ఇప్పటికే అనే అధ్యయనాలు ఫలితాలు చూస్తే ఈ విషయం వెల్లడైనట్లు హార్వర్డ్ టీ హెచ్ ఛాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శాస్త్రవేత్త వెల్లడించారు. ముడిధాన్యాన్ని ఆహారంగా తీసుకుంటే రకరకాల జబ్బులను నివారించవచ్చని, ముడిధాన్యాలు..ఓట్స్, గోధుమలు వంటి వాటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందని..ఇది రక్తంలోని కొలెస్ట్రాల్ ను ..గుండె జబ్బులు..మధుమేహాన్ని నియంత్రించవచ్చంటున్నారు.

10:07 - June 15, 2016

విజయవాడ : వైసీపీ అధినేత వైఎస్ జగన్ కొంగ జపం దీక్షలు చేస్తున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎపి అభివృద్ధికి జగన్ అడ్డుపడుతున్నారని పేర్కొన్నారు. వైసీపీ చేసిన తీర్మానాలు ఆ పార్టీ డొల్లతనాన్ని తెలియచేస్తున్నాయన్నారు. వివిధ కేసుల్లో సెంచల్ గూడ జైలుకు వెళ్లిన జగన్ మధ్యలో ఎంటర్ టైన్ మెంట్ కోసం బయటికి వచ్చారని.. మళ్లీ జైలు వెళ్తాడని చెప్పారు. చంచల్ గూడలోనే జగన్ కథ సుఖాంతం అవుతుందన్నారు. 14 వ రీల్ లో కూడా చంద్రబాబే హీరో అని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలపై ఎక్కడా చర్చ లేదన్నారు. రాష్ట్రంలో ఎలాంటి వివక్ష లేకుండా చంద్రబాబు పరిపాలన చేస్తున్నాడని చెప్పారు. జగన్.. ఆయన నియోజకవర్గంలో పర్యటించి.. ఎపి సర్కార్ ఆయన నియోజకవర్గంపై ఎమైనా వివక్షా చూపించిందో చెప్పాలన్నారు. జగన్ నియోజకవర్గంలో నిమ్మతోటలతోపాటు తదితర తోటలకు నీళ్లు ఇచ్చామా లేదా చెప్పాలన్నారు. 

 

నేడు పెరిగిన ధరలపై జైట్లీ సమీక్ష..

ఢిల్లీ : పెరిగిన ధరలపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమీక్ష నిర్వహించనున్నారు. పప్పు ధాన్యాలు, సహా ఇతర ఆహార పదార్థాల ధరలు..ధరలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కరి, సీతారామన్ లు హాజరు కానున్నారు.

ఎన్టీపీసీ రెండో యూనిట్ లో సాంకేతిక లోపం..

విశాఖ: సింహాద్రి ఎన్టీపీసీ రెండో యూనిట్‌లో సాంకేతికలోపం ఏర్పడింది. దీంతో 500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం వాటిల్లింది.

09:51 - June 15, 2016

నెల్లూరు : ప్రకాశం, నెల్లూరు జిల్లాలో భూమి కంపించింది. పలు గ్రామాల్లో కొన్ని సెకన్ల పాటు భూ ప్రకంపనలు సంభవించాయి. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, వింజమూరు, వరికుంటపాడు, దుత్తలూరు గ్రామాల్లో నాలుగు సెకన్లపాటు భూమి కంపించింది. ప్రకాశం జిల్లా పామూరు మండలంలో మోపాడు, కొండారెడ్డిపల్లి, ఇనిమెర్ల, బలిజపాలెం, వర్గంపల్లి, నర్రమారెళ్ల, పీఎస్‌ పురంలో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ఇళ్ల నుంచి జనం భయంతో పరుగులు తీశారు. ఈ ప్రాంతాల్లో భూమి కంపించండం 24 గంటల్లో ఇది మూడో సారి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వరుసుగా సంభవిస్తున్న భూ ప్రకంపనలతో ప్రజలు భయంగుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. 

  

 

మరోమారు వెలగపూడికి వెళ్లనున్న సీఎం బాబు..

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోమారు మారు వెలగపూడికి వెళ్లనున్నారు. అక్కడ జరుగుతున్న తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించనున్నారు. ఇప్పటికే పలుమార్లు ఆయన నిర్మాణ పనులను పరిశీలించిన సంగతి తెలిసిందే.

కుప్వారలో ఎన్ కౌంటర్..

జమ్మూ కాశ్మీర్ : కుప్వారలో భారత బలగాలు..ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈఘటనలో ఒక ఉగ్రవాది హతం కాగా ఒక జవాన్ వీరమరణం పొందాడు. మరో నలుగురు జవాన్లకు గాయాలైనట్లు సమాచారం. సంఘటనా స్థలం నుండి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కూంబింగ్ కొనసాగుతోంది.

ఊడిపోయిన స్కూల్ బస్సు టైరు..

కరీంనగర్ : జ్యోతినగర్ లో ప్రమాదం చోటు చేసుకుంది. కృష్ణవేణి టాలెంట్ స్కూల్ బస్సు టైరు ఊడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.

 

ఏడో రోజుకు చేరిన ముద్రగడ దీక్ష..

తూర్పుగోదావరి : కాపు ఉద్యమ నేత ముద్రగడ చేస్తున్న దీక్ష ఏడో రోజుకు చేరుకుంది. ప్రభుత్వాసుపత్రిలో ఆయన దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. వైద్యం చేయించుకొనేందుకు ఆయన నిరాకరిస్తున్నారు. దీనితో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది.

 

డొల్లతనాన్ని తెలియచేస్తున్న వైసీపీ తీర్మానాలు : దేవినేని

విజయవాడ : వైసీపీ చేసిన తీర్మానాలు ఆ పార్టీ డొల్లతనాన్ని తెలియచేస్తున్నాయని మంత్రి దేవినేని ఉమా విమర్శించారు.  చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలపై ఎక్కడా చర్చ లేదన్నారు. జగన్ కొంగ జంపం దీక్షలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 

 

మహంకాళి బోనాలపై నేడు మంత్రి తలసాని సమీక్ష..

హైదరాబాద్ : సికింద్రాబాబ్ మహంకాళి బోనాలపై ఇవాళ ఉదయం 10.30 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష చేయనున్నారు.  

నేటి యూరోకప్ మ్యాచ్ లు...

హైదరాబాద్ : యూరోకప్ భాగంగా నేడు రష్యా వర్సెస్ స్లోవేకియా.. సా.6.30కి మ్యాచ్, రొమేనియా వర్సెస్ స్విట్జర్లాండ్ రాత్రి 9.30 గంటలకు మ్యాచ్, ఫ్రాన్స్ వర్సెస్ ఆల్బేనియా రాత్రి 12.30 గంటలకి మ్యాచ్ లు జరుగనున్నాయి. 

 

09:13 - June 15, 2016

రెండు సంవత్సరాలు గడిచినా ఇచ్చిన హామీలను ఎపి సర్కార్ నెరవేర్చలేదని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి రామకృష్ణ ప్రసాద్, వైసీపీ ఎస్ సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జున పాల్గొని, మాట్లాడారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కేంద్ర ప్రభుత్వాన్ని తప్పకుండా అడుగుతామని చెప్పారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

నేడు 2 గం.లు ఆలస్యంగా వెళ్లనున్న తెలంగాణ ఎక్స్ ప్రెస్

హైదరాబాద్ : తెలంగాణ ఎక్స్ ప్రెస్ నేడు 2 గంటలు ఆలస్యంగా వెళ్లనుంది. ఉదయం 6.25 కి బదులు ఉదయం 8.25కి బయల్దేరనుంది. 

08:42 - June 15, 2016

హరారే : జింబాబ్వే సఫారీలో వన్డే నాలుగో ర్యాంకర్ టీమిండియా...మూడుమ్యాచ్ ల సిరీస్ క్లీన్ స్వీప్ కు గురిపెట్టింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న ఈ సిరీస్ మొదటి రెండువన్డేలూ అలవోకగా నెగ్గడం ద్వారా ఇప్పటికే టీమిండియా 2-0తో సిరీస్ ఖాయం చేసుకొంది. అయితే ..ఇవాళ జరిగే ఆఖరివన్డేలో మాత్రం 11వ ర్యాంకర్ జింబాబ్వే స్థాయికి తగ్గట్టుగా ఆడి..ధోనీసేనకు గట్టిపోటీ ఇవ్వాలన్న పట్టుదలతో ఉంది. రిజర్వ్ ఆటగాళ్లలో ఒకరిద్దరికి భారత టీమ్ మేనేజ్‌ మెంట్ తుదిజట్టులో చోటు కల్పించే అవకాశాలు ఉన్నాయి...
బ్రౌన్‌ వాష్ కు గురిపెట్టిన టీమిండియా
హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఆతిథ్య జింబాబ్వేతో ఏకపక్షంగా సాగుతున్న మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ లో టీమిండియా బ్రౌన్‌ వాష్ కు గురిపెట్టింది. వన్డే ర్యాంకింగ్స్ నాలుగోస్థానంలో ఉన్న టీమిండియా, 11వ ర్యాంకర్ జింబాబ్వే జట్ల ఈ సిరీస్ ఏమాత్రం మజాలేకుండా సాగుతోంది. సీమర్ ఫ్రెండ్లీ హరారే వికెట్ పైన సైతం జింబాబ్వే బ్యాట్స్ మన్ దారుణంగా విఫలమవుతూ వస్తున్నారు. భారత బౌలర్లను జింబాబ్వే టాపార్డర్ దీటుగా ఎదుర్కొనలేకపోతోంది.
టీమిండియా బౌలర్ల ఆధిపత్యం 
తొలివన్డేలో 49.5 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైన జింబాబ్వే...రెండోవన్డేలో కేవలం 34.3 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలడం చూస్తే.. టీమిండియా బౌలర్ల ఆధిపత్యం ఏస్థాయిలో ఉందీ మరి చెప్పాల్సిన పనిలేదు. సీమ్ బౌలింగ్ కు అనువుగా ఉన్న హరారే పిచ్ పైన.. టాస్ ఓడటమే తమ వరుస పరాజయాలకు కారణమని..రెండో వన్డే ఓటమి తర్వాత జింబాబ్వే కెప్టెన్ క్రెమర్ వాపోవడం చూస్తే... ఆఖరి వన్డేలో సైతం టాస్ ఎంత కీలకమో మరి చెప్పాల్సిన పనిలేదు. తొలివన్డేలో 9 వికెట్లతో నెగ్గిన టీమిండియా...రెండో వన్డేలో 8 వికెట్ల విజయం సాధించి..జింబాబ్వే బౌలింగ్ లో ఏమాత్రం పసలేదని చెప్పకనే చెప్పింది.
రాహుల్ తొలివన్డేలో అజేయ సెంచరీ
ఓపెనర్ రాహుల్ తొలివన్డేలో అజేయ సెంచరీతో రాణిస్తే...వన్ డౌన్ రాయుడు..మొదటి రెండువన్డేల్లోనూ నాటౌట్ ఇన్నింగ్స్ తో తనజట్టుకు అండగా నిలిచాడు. తొలివన్డేలో 62 పరుగుల నాటౌట్ స్కోరు నమోదు చేసిన రాయుడు...రెండో వన్డేలో 41 పరుగులతో అజేయంగా నిలిచాడు.
రాయుడు 369 పరుగులు
అంతేకాదు...జింబాబ్వే ప్రత్యర్థిగా రాయుడు ఏడు ఇన్నింగ్స్ లో నాలుగు నాటౌట్ స్కోర్లతో 369 పరుగులు సాధించాడు. ఏకంగా 123 సగటు సైతం నమోదు చేశాడు. ఇక..సీమర్ ఫ్రెండ్లీ హరారే పిచ్ పైన భారత పేస్ త్రయం ధవళ్ కులకర్ణీ, శ్రణ్, బుమ్రా ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు.
యుజువేంద్ర చాహల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు  
లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ తొలివన్డేలో ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టినా..రెండోవన్డేలో 25 పరుగులిచ్చి 3 వికెట్లు సాధించాడు. ఏకంగా.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకొన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో టీమిండియా అత్యంత పటిష్టంగా ఉండడంతో...జింబాబ్వే ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోతోంది. బ్యాటింగ్ లో కుదురుకొని 240కి పైగా స్కోర్లు సాధించగలిగితేనే..టీమిండియాకు గట్టిపోటీ ఇవ్వగలమని జింబాబ్వే టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది.
ఆఖరివన్డే తూతూమంత్రంగా ముగిసిపోతుందా? 
టీమిండియాను నిలువరించాలంటే టాస్ నెగ్గడం అనివార్యమని జింబాబ్వే కెప్టెన్ భావిస్తున్నాడు. ఏదిఏమైనా...ఈ ఆఖరి వన్డే లో జింబాబ్వే పరువుకోసం పోరాడుతుంటే..టీమిండియా మాత్రం సిరీస్ స్వీప్ కు గురిపెట్టింది. రిజర్వ్ ఆటగాళ్లలో ఒకరిద్దరికి తుదిజట్టులో భారత టీమ్ మేనేజ్ మెంట్ చోటు కల్పించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే టీమిండియా 2-0తో సిరీస్ ఖాయం చేసుకోడంతో..ఆఖరివన్డే తూతూమంత్రంగా ముగిసిపోతుందా? లేక హోరాహోరీగా సాగుతుందా?..తెలుసుకోవాలంటే కొద్ది గంటలపాటు వేచిచూడాల్సిందే..

08:35 - June 15, 2016

ఢిల్లీ : కేజ్రీవాల్‌ ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. 21 మంది ఎమ్మెల్యేలను కాపాడేందుకు తీసుకొచ్చిన పార్లమెంటరీ కార్యదర్శుల నియామకపు బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపలేదు. దీంతో 21 మంది ఎమ్మెల్యేల సభ్యత్వం ఉంటుందా...ఊడుతుందా అనేది ఆసక్తిగా మారింది. కేజ్రీవాల్‌ తీరుపై విపక్షాలు ధ్వజమెత్తాయి. 
21 మంది ఆప్‌ ఎమ్మెల్యే సభ్యత్వంపై నీలి నీడలు
2015లో కేజ్రీవాల్ ప్రభుత్వం 21 మంది ఆప్‌ ఎమ్మెల్యేలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించింది. వారికి లాభం చేకూర్చేందుకే ఈ పదవిని కట్టబెట్టారని బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలు విమర్శించాయి. దీంతో కంగుతిన్న కేజ్రీవాల్‌ తన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఈ పదవికి లాభాపేక్ష లేకుండా ఆఫీస్‌ ఆఫ్‌ ప్రాఫిట్‌ బిల్లు తెచ్చింది. వారిపై అనర్హత వేటు పడకుండా తప్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తిరస్కరించారు. దీంతో 21 మంది ఆప్‌ ఎమ్మెల్యే సభ్యత్వంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. వీరి సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉంది.
ఆప్‌ అంటే బీజేపీ భయపడుతోంది : కేజ్రీవాల్
దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ...ఆప్‌ అంటే బీజేపీ భయపడుతోందని...ఢిల్లీలో ఓటమిని ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతోందన్నారు. రాష్ట్రపతి ఏ నిర్ణయమూ చేయరని, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలైన హరియాణా, నాగాలాండ్‌, రాజస్థాన్, పంజాబ్‌, గుజరాత్‌ సహా ఇతర రాష్ట్రాల్లోనూ ఎమ్మెల్యేలను పార్లమెంట్‌ కార్యదర్శులుగా నియమించారు. కానీ మోది సర్కార్‌ కేవలం ఢిల్లీలోని పార్లమెంట్‌ కార్యదర్శల పదవులనే రద్దు చేయిస్తున్నారని కేజ్రీవాల్‌ మండిపడ్డారు. ఆప్‌ ఎమ్మెల్యేలు ఎలాంటి లాభాపేక్ష లేకుండానే పార్లమెంట్‌ కార్యదర్శులుగా వివిధ రంగాల్లో సేవలందిస్తున్నారని తెలిపారు. దీనిపై ఎన్నికల కమిషన్‌ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కేజ్రీవాల్‌ చెప్పారు.
కేజ్రీవాల్ పై బిజెపి మండిపాటు 
కేజ్రీవాల్‌ ప్రభుత్వం దీనిపై రాజకీయం చేస్తోందని బిజెపి మండిపడింది. రాష్ట్రపతి పదవి విశ్వసనీయతను ప్రశ్నించవద్దని హితవు పలికింది. ముందు చట్టం తీసుకొచ్చాక, ఆ తర్వాత పార్లమెంట్ కార్యదర్శులుగా నియామకం చేయాల్సి ఉందని...ఆప్‌ అలా చేయలేదని బిజెపి పేర్కొంది. ఎమ్మెల్యేలకు లాభం చేకూర్చేందుకే పార్లమెంట్‌ కార్యదర్శులుగా ఆప్‌ నియమించిందని కాంగ్రెస్‌ దుయ్యబట్టింది.
ఈసీ నిర్ణయంపై ఆసక్తి 
ఈ బిల్లు కారణంగా ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దయితే కొత్త ముఖాలతో తిరిగి ఎన్నికలు జరపాల్సి ఉంటుందని సమాచారం. పార్లమెంటరీ కార్యదర్శుల నియామకపు బిల్లును రాష్ట్రపతి ఎన్నికల కమిషన్‌కు సిఫారసు చేయడంతో ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది.

08:28 - June 15, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాల పురోగతి మందగించింది. కరిమబ్బులు వేగంగా విస్తరించి భారీ వర్షాలు కురిపిస్తాయన్న రైతులు, ప్రభుత్వాల ఆశలు నీరుగారాయి. రుతుపవనాల ప్రభావంతో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలే తప్ప భారీ వర్షాలు ఎక్కడా నమోదు కాలేదు. దీంతో రుతుపవనాలు ఈసారీ హ్యాండిస్తాయా అన్న మీమాంస రైతుల్లో నెలకొంది. 
బలహీనపడ్డ రుతుపవనాలు 
ఎన్నో ఆశలు రేకెత్తించిన రుతుపవనాలు అనూహ్యంగా బలహీనపడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే విస్తరించాల్సిన రుతుపవనాలు ఎలాంటి పురోగతి లేకుండా నిలిచిపోయాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్లే రుతుపవనాలు విస్తరించడం లేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరో వారం రోజుల పాటు పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశాలున్నాయి.
నిపుణుల అంచనాలు తారుమారు  
ఈనెల 8న కేరళలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు 48 గంటల వ్యవధిలోనే దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు విస్తరించాయి. రుతుపవనాల కదలిక సానుకూలంగా ఉండి మూడు నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో విస్తరిస్తాయని వాతావరణ కేంద్రం తొలుత అంచనా వేసింది. అయితే నిపుణుల అంచనాలు తారుమారయ్యాయి. నైరుతి రుతుపవనాల విస్తరణకు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు సానుకూలంగా లేదని తాజాగా నిర్ధారిస్తున్నారు. 
తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు 
దక్షిణ హిందూ మహాసముద్రంలో గాలుల వేగం తక్కువగా ఉండటం రుతుపవనాల కదలికను ప్రభావితం చేస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. గాలుల తీవ్రత వేగంగా ఉంటే ముందుకు విస్తరించే ఉండేవని చెబుతున్నారు. రుతుపవనాలు స్తంభించిపోవడంతో.. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. అనేక చోట్ల  ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. మరో రెండు మూడు రోజులు ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

08:24 - June 15, 2016

తమ్మారెడ్డి భరద్వాజ్‌, రామచంద్రు, సురేష్‌బాబు, బి.గోపాల్‌, లగడపాటి శ్రీధర్‌, రచ్చరవి, ఆర్‌.పి.పట్నాయక్‌, శివారెడ్డి తదితరులు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రాణాంతక వ్యాధుల్లో తలసేమియా వ్యాధి ఒకటి. ఈ వ్యాధి బారిన పడిన వారు ప్రతి మూడు వారాలకొకసారి తప్పనిసరిగా రక్తం ఎక్కించుకోవాలి. లేని పక్షంలో ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా తలసేమియా వ్యాధిగ్రస్తుల సహాయార్ధం హైదరాబాద్‌ తల్వార్స్ (సెలబ్రిటీ క్రికెట్‌ టీం) మంగళవారం ఫిల్మ్ ఛాంబర్‌లో బ్లడ్‌ డొనేషన్‌ క్యాంప్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా డి.సురేష్‌బాబు మాట్లాడుతూ, 'తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన హైదరాబాద్‌ తల్వార్స్ చైర్మన్‌ అభినవ సర్దార్‌ బృందంతోపాటు రక్తదాతలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వీరిని ఆదర్శంగా తీసుకుని మరికొంతమంది రక్తదానం చేసేందుకు ముందుకొస్తారని ఆశిస్తున్నాను' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ సంచాలకులు రామచంద్రుతోపాటు సినీ రంగ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ, బి.గోపాల్‌, లగడపాటి శ్రీధర్‌, మధుర శ్రీధర్‌రెడ్డి, ఆర్‌.పి.పట్నాయక్‌, శివారెడ్డి, లోహిత్‌, శాని, శ్రీధర్‌రావు, రచ్చరవి తదితరులు పాల్గొన్నారు.

 

08:22 - June 15, 2016

ఎన్టీఆర్‌, రాజమౌళి కాంబినేషన్‌కి టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందిన 'స్టూడెంట్‌ నెం.1', 'సింహాద్రి', 'యమదొంగ' చిత్రాలు ప్రేక్షకుల్ని విశేషంగా అలరించాయి. తాజాగా ఈ కాంబినేషన్‌లో మరో మాస్‌ సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుందని సమాచారం. ఇప్పటికే రాజమౌళి ఫాదర్‌ విజయేంద్రప్రసాద్‌ ఓ మాస్‌ కథని రెడీ చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి తనయుడు నిర్మాతగా మారుతూ తొలి ప్రయత్నంగా వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఎన్టీఆర్‌ ప్రస్తుతం 'జనతా గ్యారేజ్‌' సినిమాలో నటిస్తుండగా, 'బాహుబలి2' సినిమా షూటింగ్‌లో రాజమౌళి బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందబోయే సినిమా పట్టాలెక్కనుంది.

 

08:21 - June 15, 2016

బాలీవుడ్‌లో బయోపిక్‌ల స్పీడ్‌ మరింత ఊపందుకుంటోంది. రోజుకొక బయోపిక్‌ సినిమా గురించి వార్తలొస్తున్నాయి. తాజాగా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ జీవితం ఆధారంగా ఓ బయోపిక్‌ రూపొందనుంది. 'ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ : ది మేకింగ్‌ అండ్‌ అన్‌మేకింగ్‌ ఆఫ్‌ మన్మోహన్‌సింగ్‌' పేరిట ఇండియన్‌ పొలిటికల్‌ ఎనలిస్ట్‌ సంజరుబారు రాసిన వివాదాస్పద పుస్తకం ఆధారంగా ఈ బయోపిక్‌ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా 12 భాషల్లో ఈ బయోపిక్‌ని విడుదల చేసేందుకు కూడా ప్లాన్‌ చేశారని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి మన్మోహన్‌సింగ్‌, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ సహా పలు ప్రధాన పాత్రల కోసం నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఆగస్ట్‌ 30వ తేదీన టీజర్‌ను విడుదల చేసేందుకు నిర్మాత సునీల్‌ బోహ్రా సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ టీజర్‌ కూడా పలువురు కాంగ్రెస్‌ పెద్దలకు ఝలక్‌ ఇచ్చేదిగా ఉండబోతుందన్న వార్తలూ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దేశ ప్రధానిగా పని చేసిన తెలుగు నేత పి.వి. నరసింహారావు అంత్యక్రియలను దేశ రాజధానిలో కాకుండా హైదరాబాద్‌లో నిర్వహించడం వెనుక ఉన్న వివాదాస్పద కారణాలను టీజర్‌లో చూపించనున్నారట. 'ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలంటేనే ఎంతో అంగబలం, అర్థబలం కావాలి. కనీసం తాను ప్రధాని అవుతానని కలలో కూడా ఊహించని ఓ వ్యక్తి కథ ఇది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా స్వామ్య దేశానికి తాను ప్రధానిగా ఎన్నిక కాబోతున్నాడని ఒక రోజు ముందు వరకు తనకూ తెలియదు' అనే వాయిస్‌ ఓవర్‌తో సినిమా ప్రారంభం అవుతుందని చిత్రయూనిట్‌ తెలిపింది.

08:08 - June 15, 2016

జడ్పీటీసీలకు నిధులివ్వాలని తెలంగాణ జడ్పీటీసీల ఫోరం రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఏనుగు జంగారెడ్డి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'జిల్లా సమగ్రాభివృద్ధిలో అత్యంత కీలకపాత్ర పోషించేది జిల్లా పరిషత్‌. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి మండలం నుంచి ఒక్కొక్క జడ్పీటీసీ చొప్పున జిల్లా పరిషత్‌ లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు వీరిని ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు. అయితే తమకు నిధులు, విధులు, బాధ్యతలు అప్పగించకపోవడంతో తాము ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతామన్న ఆవేదన జడ్పీటీసీలలో వ్యక్తమవుతోంది. తమకు విధులు. నిధులు అప్పగించాలంటూ కొంతకాలంగా వీరు విభిన్న రూపాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏకరువు పెడుతున్నారు. జిల్లా, మండల అభివృద్ధిలో జడ్పీటీసీల ప్రాధాన్యత ఏమిటి? జడ్పీటీసీలకున్న అధికారాలేమిటి? విధులేమిటి? తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో  అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడానికి వారికున్న నిధులేమిటి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జడ్పీటీసీలు కోరుతున్నదేమిటి? ఇలాంటి అంశాలపై జంగారెడ్డి మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....
 

తెలంగాణలో నేటితో ముగియనున్న డిగ్రీ ఆన్ లైన్ అడ్మిషన్ల గడువు

హైదరాబాద్ : తెలంగాణలో నేటితో డిగ్రీ ఆన్ లైన్ అడ్మిషన్ల గడువు ముగియనుంది. 

నేడు టీఆర్ ఎస్ లో చేరనున్న పలువురు నేతలు

హైదరాబాద్ : నేడు పలువురు నేతలు గులాబీ గూటికి చేరనున్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్, సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రనాయక్ లు నేడు టీఆర్ ఎస్ లో చేరనున్నారు. 

నేడు టీకాంగ్రెస్ కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం

హైదరాబాద్ : నేడు టీకాంగ్రెస్ కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి దిగ్విజయ్ సింగ్ హాజరుకానున్నారు. పలు అంశాలపై చర్చించనున్నారు. 

మహిళ నుంచి బ్యాగ్ లాక్కెళ్లిన స్నాచర్లు

హైదరాబాద్ : బంజారాహిల్స్ అపోలో బస్టాప్ వద్ద ఆటోలో వెళ్తున్న మహిళను స్నాచర్లు వెంబడించి బ్యాగ్ లాక్కెళ్లారు. 5 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.4 వేలను అపహరించారు. బాధితురాలు పీఎస్ లో ఫిర్యాదు చేసింది. 

తెలంగాణలో నేటి నుంచి టెన్త్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు

హైదరాబాద్ : తెలంగాణలో నేటి నుంచి టెన్త్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయి. 

07:44 - June 15, 2016

హైదరాబాద్ : మున్సిప‌ల్ శాఖ మంత్రిగా బాధ్యత‌లు చేప‌ట్టిన వెంట‌నే డిపార్ట్ మెంట్‌లోని అన్ని విభాగాల‌కు టార్గెట్ హండ్రెడ్‌ డేస్ ఫిక్స్ చేశారు మంత్రి కేటిఆర్. జూన్ రెండునాటికి 100 రోజులు పూర్తయిన‌ప్పటికీ, అమెరికా ప‌ర్యట‌న‌లో ఉన్నందున ఈ ప్రక్రియ ఆల‌స్యమైంది. ప్రస్తుతం వంద‌రోజుల ప్రణాళిక ప్రోగ్రెస్ ప్రజ‌ల‌ మందు ఉంచేందుకు సిద్ధమ‌య్యారు మంత్రి కేటీఆర్‌.
మొత్తం 27ప‌నుల్లో సింహ‌భాగం పూర్తి 
గ్రేటర్‌ ఎన్నికల గెలుపు అనంతరం మున్సిపల్‌ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌ మహానగర అభివృద్ధిపై వందరోజుల ప్రణాళిక ప్రకటించారు. ఫిబ్రవ‌రి18న ప్రక‌టించిన వంద‌రోజుల ప్రణాళిక జూన్ రెండు నాటికి పూర్తయ్యింది. వంద రోజుల్లో హైద‌రాబాద్ ప‌రిధిలో జిహెచ్ఎంసి, హెచ్ఎండిఎ, వాట‌ర్ బోర్డు, మెట్రోరైల్ వంటి సంస్థలు ఇప్పటివ‌రకు పూర్తి చేసిన ప‌నుల వివ‌రాల‌ను వెల్లడించేందుకు మంత్రి సిద్ధమ‌య్యారు. గ్రేట‌ర్ ప‌రిధిలో జిహెచ్ఎంసి చేప‌ట్టిన‌ పనులు మొత్తం 27ప‌నుల్లో సింహ‌భాగం పూర్తయిన‌ట్లు అధికారులు చెబుతున్నారు. 
ప‌లు నిర్మాణాల్లో పురోగ‌తి లేదు..
ఇక మోడ‌ల్ మార్కెట్లు, ఓపెన్ ల్యాండ్స్ కాంపౌండ్ వాల్స్, మోడ‌ల్ గ్రేవ్ యార్డులతో పాటు ప‌లు నిర్మాణాల్లో పురోగ‌తి లేదనే విమ‌ర్శలున్నాయి. ఇక సిటీలోని హెచ్ఎండిఎ తీసుకున్న 9ప‌నుల్లో 8 ప‌నులు పూర్తిచేసింది. ఇందులో  ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ దరఖాస్తులను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే స్వీకరించింది. 
ఫిర్యాదుల ప‌రిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం 
ఫిర్యాదుల ప‌రిష్కారానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది.  ఫిబ్రవరి 21 నుంచి మే 31వ తేదీ వరకు ఘట్ కేసర్ నుంచి షామీర్ పేట్ వరకు మిగిలిపోయిన 21కిలోమీట‌ర్లు అవుటర్ రింగ్ రోడ్డు ప‌నులు పూర్తి  చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నానక్‌రామ్ గూడ నుంచి కొల్లూరు వరకు 25 కిలోమీటర్ల పొడవు సైకిల్ ట్రాక్ నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయింది హెచ్ఎండిఎ.   
ఇంకుడు గుంత‌ల నిర్మాణంలో పురోగ‌తి
ఇక వాట‌ర్‌బోర్డు చేప‌ట్టిన ప‌నుల్లో హుస్సేన్‌సాగర్‌లోకి వ‌చ్చే రసాయన మురుగును పూర్తిస్థాయిలో మ‌ళ్లించారు. ఇంకుడు గుంత‌ల నిర్మాణంలో పురోగ‌తి కనిపించింది. అయితే నూత‌న క‌నెక్షన్ల పెంపు, 100శాతం చార్జీల వ‌సూలు విష‌యంలో అనుకున్నంత‌గా మార్పులేన‌ట్లు తెలుస్తుంది. అయితే ఇటీవ‌ల హైద‌రాబాద్ రోడ్లను ప‌రిశీలించిన మంత్రి  అధికారుల ప‌నితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.  
ప‌నుల‌పై మంత్రి కేటిఆర్ ఆసంతృప్తి వ్యక్తం 
అమెరికా వెళ్లే ముందు వంద‌రోజుల ప్రణాళిక‌లో జ‌రుగుతున్న ప‌నుల‌పై మంత్రి కేటిఆర్ ఆసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికైనా అధికారులు పూర్తిస్థాయిలో విజయం సాధించారా లేదా అనేది మాత్రం మంత్రి కేటీఆర్‌ రిపోర్ట్ కార్డు బ‌యట పెడితే తేలిపోతుంది.

07:35 - June 15, 2016

విజయవాడ : రాష్ట్రంలో సంక్షేమం కోసం ఖర్చు పెట్టే  ప్రతీ రూపాయిని ఆన్ లైన్  ద్వారానే చెల్లింపులు జరపాలని ఇందుకోసం ఒకే విధానాన్ని రూపొందించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఎక్కడా అవకతవకలు జరగకుండా లబ్దిదారులు సంక్షేమ ఫలాలను సద్వినియోగం చేసుకునేలా చేయాలని అన్నారు.
80 శాతం జనాభాకు సంక్షేమ ఫలాలు అందడమే లక్ష్యం : సీఎం   
ప్రభుత్వం అందిస్తున్న రేషన్, పెన్షన్, బీమాతో సామాన్యులు సంతోషంగా వున్నారని సమాజంలో కనీసం 80 శాతం జనాభాకు సంక్షేమ ఫలాలు అందించాలనేది తమ ప్రభుత్వ ధ్యేయమని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ ఫలాలు పేద ప్రజలకు అందాలంటే..ప్రతి దాన్ని ఆన్ లైన్ చేయడం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. 
ఈ ఏడాది 30 లక్షల గ్యాస్ కనెక్షన్లు
డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందని.. ఈ ఏడాది 30 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. విద్యాప్రమాణాలను పెంచాలని.. నాణ్యమైన విద్యను అందించాలని అన్నారు. విద్యా వ్యవస్థలో పారదర్శకతకు బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని అన్నారు. 
సాంఘీక గిరిజన సంక్షేమ శాఖల నిధులపై చర్చ
వివిధ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. సాంఘీక గిరిజన సంక్షేమ శాఖల నిధులను సరైన క్రమంలో వినియోగించాలని మంత్రి రావెల కిషోర్ బాబు దృష్టికి తీసుకెళ్లారు.  స్వయం ఉపాధి యూనిట్లు విజయవంతమైతేనే సమాజంలో ఊహించని మార్పు వస్తుందని అన్నారు .  ఈ సమావేశంలో రెండేళ్ల పాలనలో విజయాలపై వివిధ శాఖలు రూపొందించిన పుస్తకాలను సీఎం ఆవిష్కరించారు. రాష్ట్రం మొత్తం తెలిసేలా.. చర్యలు తీసుకోవాలని ప్రజల్లోకి పథకాలు తీసుకెళ్లాలని అన్నారు బాబు. 

07:29 - June 15, 2016

తూర్పుగోదావరి : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న నిరాహారదీక్షపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ముద్రగడ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని.. ఆయన చేత దీక్ష విరమింపజేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది ప్రభుత్వం. ముద్రగడ, కాపు జేఏసీ నేతలతో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ ప్రభుత్వ ప్రతినిధిగా చర్చలు జరిపారు. రెండు డిమాండ్లపై ముద్రగడ పట్టుబడడంతో సర్కార్‌ యత్నాలు ఫలించలేదు. తుని ఘటనలో కేసులను పూర్తిగా ఎత్తివేయడం సాధ్యంకాదని.. సీఐడీ దర్యాప్తుతో సంతృప్తి చెందకపోతే.. మళ్లీ దర్యాప్తు చేయించేందుకు సిద్ధమని ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా అరెస్ట్‌ చేసినవారికి బెయిల్‌ ఇప్పించేందుకు సానుకూలంగా వ్యవహరించనున్నట్లు తెలిపింది. ముద్రగడ మాత్రం పెట్టిన కేసులు ఎత్తివేయాలని.. అరెస్ట్‌ చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు కూడా ముద్రగడతో ప్రభుత్వం చర్చలు కొనసాగించనుంది. 

 

07:27 - June 15, 2016

హైదరాబాద్ : సీఎల్పీ పదవి నుంచి తప్పుకుంటానని జానారెడ్డి ప్రకటించడం కలకలాన్ని సృష్టిస్తోంది. నేతలు వలస వెల్లి పోవడమే ఆయన వ్యాఖ్యలకు కారణమని భావిద్దామా అంటే.. గడచిన రెండేళ్లలో ఎంతోమంది కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరారు. ఇప్పుడే జానాలో ఎందుకీ నిర్వేదం..? ఇంతకీ జానారెడ్డిది నిస్సహాయతా..? లేక పార్టీని నియంత్రించే వ్యూహమా..? 
రాష్ట్రంలో వలసలతో జానా నిర్వేదం
నిండు కుండలా తొణకని బెణకని నేతగా జానారెడ్డికి పేరుంది. కానీ ఆయనలో ఇప్పుడు విపరీతమైన ఆందోళన వ్యక్తమైంది. ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ మనోవేదనను ఉద్విగ్నంగా వ్యక్తీకరించారు. ఈ సందర్భంగా.. జానారెడ్డి వదనంలో.. గతంలో ఎన్నడూ లేనంతటి ఆందోళన.. నిస్సహాయత కొట్టొచ్చినట్లు కనిపించాయి. రాష్ట్రంలో వలసలతో రాజకీయాలు భ్రష్టు పట్టాయని.. ఈ రాజకీయాలను చూసి ఆత్మ క్షోభిస్తోందనీ అన్నారు. పదవులకు రాజీనామా చేసి క్షేత్రస్థాయి పర్యటన చేపడతానన్నారు. ఇంతకీ జానారెడ్డి ఉద్వేగానికి కారణమేంటి..? నిజంగానే ఆయనలో నిస్సహాయ, నిస్సత్తువలు ఆవరించాయా..? లేక ఇదేమైనా వ్యూహాత్మక ఎత్తుగడా..? 
టీడీపీ, కాంగ్రెస్‌ ఉక్కిరిబిక్కిరి
రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది మొదలు.. గులాబీ బాస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్ కు తెర లేపారు. తెలుగుదేశం పార్టీతో పాటే.. హస్తం పార్టీ కూడా టీఆర్ఎస్‌ ఆకర్షాస్త్రంతో ఉక్కిరి బిక్కరి అవుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తాజా మాజీలు ఎంతోమంది గులాబీ గూటికి చేరుకున్నారు. తాజాగా జానారెడ్డి సొంత జిల్లా నల్లగొండకు చెందిన ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జానా సొంతమనిషిగా పేరున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావుతో పాటు.. మాజీ ఎంపీ వివేక్‌ బ్రదర్స్‌ టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. మిగిలిన వారికంటే.. భాస్కరరావు పార్టీ మారాలని నిర్ణయించుకోవడం జానారెడ్డిని తీవ్రంగా కలిచివేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 
భాస్కరరావు పార్టీ మార్పుతో జానాకు ఇబ్బందులు
భాస్కరరావు టీఆర్ఎస్‌లోకి వెళ్లడం.. జానారెడ్డిని రాజకీయంగా ఇరుకున పెడుతోందని ఆయన సన్నిహితుల సమాచారం. జానారెడ్డి తన సొంత మనుషులను వ్యూహాత్మకంగానే టీఆర్ఎస్‌లోకి పంపుతున్నారంటూ ప్రత్యర్థులు సరికొత్త వాదనను తెరపైకి తెచ్చారు. ఇది జానాలో విపరీతమైన ఆందోళనను, ఆవేదనను కలిగించిందని చెబుతున్నారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని నిలువరించేందుకే మీడియా మీట్‌లో ఆయనిలా మాట్లాడారని చెబుతున్నారు. పదవులన్నీ వీడి.. క్షేత్రస్థాయిలో పర్యటనలు జరుపుతానని చెప్పడం వ్యూహాత్మకమేనని అంటున్నారు. 
జానా అస్త్ర సన్యాసంతో మొదలైన చర్చ
పాలక టీఆర్ఎస్‌పై ఇక దూకుడుగా వ్యవహరిస్తారని భావిస్తున్న తరుణంలో జానారెడ్డి అస్త్ర సన్యాసానికి సిద్ధపడడం కాంగ్రెస్‌ నేతల్లో చర్చనీయాంశమైంది. సుదీర్ఘ రాజకీయానుభవం ఉన్న జానా.. ఆకర్ష రాజకీయాలపై స్పందించిన తీరు.. నైతిక విలువలను చాటి చెప్పేలా ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అంతేకాదు.. వలస రాజకీయాలను.. విద్యార్థులు, మేధావులు నిరసించాలన్న జానా వ్యాఖ్యలు.. ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచే వ్యూహమని అంటున్నారు. మొత్తానికి పదవులను వదిలి పెట్టాలన్న జానా నిర్ణయం.. భవిష్యత్తులో కాంగ్రెస్‌పైనా... రాష్ట్ర రాజకీయాలపైనా ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. 

 

07:20 - June 15, 2016

హైదరాబాద్ : ఇవాళ మరో ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు కారెక్కబోతున్నారు. అలాగే ఓ మాజీ ఎంపీ, మాజీ మంత్రి కూడా కేసీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోబోతున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరుతుండడంతో.. హస్తం పార్టీ అధిష్టానం అయోమయంలో పడింది. 
టీఆర్ ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు.. కాంగ్రెస్ విలవిల
తెలంగాణలో అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు.. కాంగ్రెస్ విలవిలలాడుతోంది. రెండేళ్లలో నలుగురైదుగురు కాంగ్రెస్ నేతలు..  ఎమ్మెల్యేలు.. గులాబి గూటికి చేరుకున్నారు. నేడు ఆ పార్టీకి చెందిన నేతలు  పెద్ద ఎత్తున కారెక్కుతున్నారు. తెలంగాణలో  తాము క్షేత్ర స్థాయిలో బలంగా ఉన్నామని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నా.. కీలక నేతలు ఒక్కొక్కరు  అధికార పార్టీ వైపు అడుగులు వేస్తుండడంతో పరిణామాలు  భవిష్యత్తులో ఎలా ఉంటాయన్నది అంతు చిక్కడం లేదు.
అధికార పార్టీలోకి ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి  అధికారపార్టీలో చేరుతుండడంతో పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ సభ్యుల సంఖ్య 14 కు పెరుగనుంది. కొద్దిరోజుల క్రితం ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మల్లారెడ్డిలు కారెక్కారు.  నల్గొండ ఎంపీతో పాటు ఆ జిల్లాకు చెందిన ఇద్దరు శాసనసభ్యులు అధికార పార్టీలో చేరుతున్నారు.
మరోసారి గులాబిగూటికి చేరుతున్న వివేక్ సోదరులు
తెలంగాణ రాష్ట్రసాధన కోసం  TRS తో పని చేసిన  మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్ లు   రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి  పెరిగిన వత్తిళ్లతో గులాబి పార్టీకి గుడ్ బై చెప్పారు.  సాధారణ ఎన్నికల్లో ఓటమి నుంచి  వివేక్ సోదరులు తప్పించుకోకపోవడంతో...మరోసారి గులాబి గూటికి చేరుకోవాలనే నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే తాముపార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్నామని వివేక్ బ్రదర్స్ అంటున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన ఓ ఎంపీ, ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లాలో తమకంటూ గుర్తింపు  ఉన్న  ఓ మాజీ ఎంపీ, మాజీమంత్రి ఒక్కసారిగా పార్టీని వీడుతుండడం కాంగ్రెస్ నేతలను కూడా ఆయోమయంలో పడేస్తోంది.

07:16 - June 15, 2016

హైదరాబాద్ : తెలంగాణ ఆదాయం పెరుగుతోంది... గత ఏడాది నిర్దేశించుకున్న లక్ష్యం కన్నా అధిక ఆదాయం ఖజానాకు సమకూరింది. కమర్షియల్, అబ్కారీ శాఖలు లక్ష్యాన్ని అధిగమించి ఆదాయాన్ని సమకూర్చిపెట్టాయి. 
గణనీయంగా పెరిగిన ఆదాయం 
తెలంగాణ ఆదాయం గతంతో పోలిస్తే..ఈ ఏడాది గణనీయంగా పెరిగింది. ఎక్సైజ్‌, కమర్షియల్‌ ట్యాక్స్ శాఖల నుంచి గణనీయంగా ఆదాయం వచ్చి చేరింది. వాణిజ్య శాఖ ఆర్థిక స్థితిగతులపై క్యాంపు కార్యాలయంలో సీఎం రివ్యూ నిర్వహించారు. ఈ ఆర్థికసంవత్సరం ప్రారంభమైన రెండు నెలల్లోనే అంటే ఏప్రిల్, మే నెలల్లోనే వాణిజ్య పన్నుల శాఖ 7 వేల  687 కోట్లు గడించిందని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే.. ఇది 16 శాతం అధికమని  సీఎం అన్నారు. 
ఈ ఏడాది పెరిగిన ఆదాయం 7 వేల కోట్లు 
2015 ఏప్రిల్ , మే నెలల్లో కమర్షియల్ ఎక్సైజ్ స్టాంప్స్ గనులు తదితర శాఖల  నుండి 6వేల 31 కోట్ల ఆదాయం సమకూరగా.. ఈ ఏడాది..  7 వేల కోట్ల  పెరిగింది. ఇదే విధంగా సుస్థిర ఆదాయ వృద్ది రేటు కొనసాగితే..   ప్రస్తుత ఆర్థిక సంవత్సరం  ముగిసే నాటికి స్ట్రీట్ ఓట్ రెవున్యూ....కంటే ప్రస్తుతం 11 వేల 500 కోట్ల ఆదాయం  పెరుగుతందని. అధికారులు అంచనా వేశారు. 
పెరిగిన 30 శాతం ఆదాయం
ఈ ఏడాది మద్యం అమ్మకాల ద్వారా 14 వేల 161 కోట్ల రూపాయల ఆదాయాన్ని రాబట్టాలని టార్గెట్ పెట్టుకుంది ప్రభుత్వం...అయితే ఈ రెండు నెలల్లో ఎక్సైజ్ శాఖ  2  వేల 391 కోట్ల రూపాయల ఆదాయాన్ని సముపార్జించింది. గత ఏడాది రెండు నెలలతో పోలిస్తే.. ఇది 30 శాతం అధికం.                
అధికారులు హ్యపీ
హైదరాబాద్ నగరం అనేక అంతర్జాతీయ సదస్సులకు వేడులకు వేదిక అవుతుండడంతో.. విదేశీ  మద్యం.. స్టార్ హోటళ్లు కిక్కిరిసిపోయాయి. దీంతో ఆదాయం 120 శాతం పెరిగింది. మొత్తానికి గత ఏడాదితో పోలిస్తే ముఖ్యమైన ఆదాయ వనరులు పెరుగుతుండటం పట్ల అధికారులు హ్యపీగా ఫీలవుతున్నారు. 

 

నేడు జింబాబ్వేతో భారత్ చివరి వన్డే మ్యాచ్

హరారే : నేడు జింబాబ్వేతో భారత్ చివరి వన్డే మ్యాచ్ జరుగనుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.  

నేడు వెలగపూడికి వెళ్లనున్న సీఎం చంద్రబాబు

గుంటూరు : సీఎం చంద్రబాబు నేడు వెలగపూడి వెళ్లనున్నారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించనున్నారు. 

నెల్లూరు జిల్లాలో మళ్లీ భూ ప్రకంపనలు

నెల్లూరు : జిల్లాలో మళ్లీ భూ ప్రకంపనలు సంభవించాయి. ఉదయగిరి, వరికుంటపాడు, వింజమూరు, దత్తలూరు మండలాల్లో 3 సెకన్లపాటు భూమి కంపించింది. భయంతో ఇళ్ల నుంచి ప్రజలు పరుగులు తీశారు. 

నేడు ఢిల్లీలో నదుల అనుసంధానంపై టాస్క్ ఫోర్స్ సమావేశం

ఢిల్లీ : కేంద్ర జల సంఘం కార్యాలయంలో మధ్యాహ్నం టాస్క్ ఫోర్స్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో నదుల అనుసంధానంపై చర్చించనున్నారు. 

Don't Miss