Activities calendar

03 July 2016

22:37 - July 3, 2016

శివమాస్టర్ హత్య గురించిన వివరాలను మన డిటెక్టివ్ టీం తెలుసుకుందా... ఎవరు చేశారీదారుణం.? ఇంతటీ కిరాతకమైన ఆలోచన చేసింది ఎవరు..? ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ఎటువంటి రిపోర్టు వచ్చింది. ఎటువంటి ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

22:31 - July 3, 2016

ఇరాక్ : బాంబు మోతలతో బాగ్దాద్‌ దద్దరిల్లింది. వరుస పేలుళ్లతో 125 మంది మృతి చెందగా.. దాదాపు 200 మంది గాయపడ్డారు. రంజాన్ మాసం సందర్భంగా షాపింగ్ మాల్స్ రద్దీ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఈ దాడులకు తెగబడ్డారు. ఈ దాడులు తామే జరిపామని ఇస్లామిక్‌  స్టేట్‌ ఉగ్రవాదులు ప్రకటించుకున్నారు. 
వరుస బాంబు పేలుళ్లు
ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. శనివారం అర్థరాత్రి బాగ్దాద్‌లో వరుస బాంబు పేలుళ్లతో రాక్షసకాండ సాగించారు. షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని బాంబు దాడులకు పాల్పడ్డారు. రద్దీగా ఉన్న వాణిజ్య సముదాయాల్లో బాంబు దాడులు జరిపారు. 
మరో కారుబాంబు దాడి.. ఐదుగురు మృతి 
రంజాన్ మాసం సందర్భంగా షాపింగ్ మాల్స్ ప్రాంతాలు రద్దీగా ఉండటంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కర్రాడ ప్రాంతంలో జరిగిన మొదటి దాడిలో ఉగ్రవాదులు రిఫ్రిజిరేటర్లు, కారులో పేలుడు పదార్థాలను నింపి పేల్చారు. ఈ ఘటనలో వంద మందిపైగా మృతి చెందారు. భారీ పేలుడు దాటికి చుట్టుపక్కల భవనాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎటుచూసినా మృతదేహాలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. అల్ షాబ్ ప్రాంతంలోని మార్కెట్ వద్ద జరిగిన మరో కారుబాంబు దాడిలో ఐదుగురు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు.
దాడికి పాల్పడినట్లు ఐసిస్ ప్రకటన
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు ప్రకటించారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఘటనా స్థలానికి వచ్చిన ప్రధాని హైదర్ అల్-అబాదిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నుంచి ఫాజుల్లా నగరాన్ని ఇరాక్ బలగాలు స్వాధీనం చేసుకున్నందుకు ప్రతీకారంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు.

 

22:27 - July 3, 2016

ఉత్తరాఖండ్‌ : వరదలతో అతలాకుతలం అవుతున్న ఉత్తరాఖండ్‌లో ... వరుస ప్రమాదాలు విషాదాన్ని నింపుతున్నాయి. కొద్దిరోజులుగా  ఎడతెరిపిలేకుండా పడుతున్న వర్షాలకు పలుప్రాంతాల్లో రోడ్లు కోతకు గురైయ్యాయి. చక్రాప్రాంతంలో రోడ్డు కోతకు గురవడంతో ఓ బస్సు లోయలోకి పడిపోయింది. ఈప్రమాదంలో 18 మంది ప్రయాణీకులు మృత్యువాత పడ్డారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

22:24 - July 3, 2016

విజయవాడ : సదావర్తి భూముల వ్యవహారంలో వైసీపీ లేనిపోని రాద్ధాంతం చేస్తోందని మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. భూముల వేలాన్ని రద్దు చేయాలని కోరుతున్న వైసీపీ.. ఆ భూములు అంతకంటే ఎక్కువకు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తే మళ్లీ వేలం నిర్వహిస్తామన్నారు. యడవల్లిలో దళితులకు న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 

 

22:21 - July 3, 2016

మెదక్ : మల్లన్న సాగర్‌ ముంపు గ్రామాల్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేస్తున్న పాదయాత్ర మూడోరోజు విజయవంతంగా కొనసాగింది. పాదయాత్ర చేస్తున్న గ్రామాల్లో తమ్మినేనికి ఘనస్వాగతం లభించింది. మహిళలు భారీగా తరలివచ్చి పాదయాత్రకు స్వాగతం పలికారు. పలు ప్రజాసంఘాల నేతలతో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు.
ముంపు గ్రామాలకు అండగా సీపీఎం : తమ్మినేని  
మెదక్‌ జిల్లా మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాలకు అండగా నిలుస్తూ సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేస్తున్న పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. మూడోరోజు వేముల ఘాట్‌ నుంచి బయలుదేరిన తమ్మినేని.. తుర్కపల్లి బంజరు మీదుగా పాదయాత్ర చేశారు. గ్రామాల్లో ప్రజలు పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ తమ్మినేనితో కలిసి నడిచారు. మహిళలు మంగళహారతులు పట్టి గ్రామాల్లోకి ఆహ్వానించారు. గ్రామాల్లో ప్రజల సమస్యలను తమ్మినేని వీరభద్రం అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు పొలాల్లో నాగలి పట్టి దున్ని రైతులతో కలిసి ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై పోరాటం చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. 
తమ్మినేనికి చాడవెంకట రెడ్డి మద్దతు 
మరోవైపు తుర్కపల్లి చేరుకున్న తమ్మినేనికి సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడవెంకట రెడ్డి మద్దతు తెలిపారు. అనంతరం గ్రామంలో జరిగిన సభలో పాల్గొన్నారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలను నీట ముంచుతారా అని తమ్మినేని ప్రశ్నించారు. అలాగే సీఎం స్వంత జిల్లా ప్రజలను నిండా ముంచేందుకే 123 జీవో తెచ్చారని విమర్శించారు. మూడోరోజు సీపీఎం పాదయాత్రలో గ్రామస్తుల నుంచే కాకుండా ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీల నుంచి అనూహ్యమైన మద్దతు లభించింది. 

 

22:16 - July 3, 2016

డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణతో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. జెంటిల్ మన్ సినిమా వివరాలు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలను వీడియోలో చూద్దాం..

22:13 - July 3, 2016

నిజామాబాద్ : అసలే కరవు నేల.. అందులోనూ కొద్దిపాటి భూమే వారికి ఆధారం. ఇప్పుడా భూముల్లోనే ఎయిర్‌పోర్టు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో జీవనాధారమైన  పంట పొలాలను కోల్పోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. సర్కారు తన నిర్ణయాన్ని మార్చుకోవాలని, లేదంటే ప్రాణాలొడ్డైనా సరే భూముల్ని కాపాడుకుంటామని సంబంధిత రైతులు హెచ్చరిస్తున్నారు. 
జక్రాన్‌పల్లి పరిసరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మాణం
నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి పరిసరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయం స్థానిక రైతుల్లో ఆందోళనను పెంచుతోంది. బంగారం లాంటి పంటలు పండే పొలాలను నాశనం చేసి ఎయిర్‌పోర్టు నిర్మించాల్సిన అగత్యం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. 
కరవు పీడిత ప్రాంతాలు
జక్రాన్‌పల్లి పరిసరాలు.. కరవు పీడిత ప్రాంతాలు. ఇక్కడ వర్షం వస్తే పంట.. లేకుంటే గల్ఫ్‌ దేశాలకు వలస.. అన్నది ఆనవాయితీగా మారింది. ఆర్మూరు, నందిపేట్, జక్రాన్ పల్లి, సిరికొండ, బాల్కొండ, మోర్తాడ్ మండలాల నుంచి ఏటా వేలాది మంది విదేశాలకు వెళుతుంటారు. వీరంతా ఆకలి బాధలు తీర్చుకునేందుకే సుదూర దేశాలకు వలస వెళుతున్నారన్న వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించలేదు. పైగా ఇక్కడి నుంచి గల్ఫ్‌ దేశాలకు భారీ సంఖ్యలో వెళుతున్నారంటూ.. జక్రాన్‌పల్లి చెంత మినీ విమానాశ్రయాన్ని నిర్మించాలని నిర్ణయించింది. దీనికి కేంద్ర ప్రభుత్వమూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 
మినీ విమానాశ్రయం
ఢిల్లీ నుంచి వచ్చిన విమానయాన శాఖ అధికారులు ఈ ప్రాంతంలో పర్యటించి.. మినీ విమానాశ్రయానికి జక్రాన్‌పల్లి పరిసరాలు అనువైనవని తేల్చారు. ఇక్కడ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి దాదాపు 2400 ఎకరాల భూమి అవసరమని అధికారులు తేల్చారు. కానీ ఇక్కడ ప్రభుత్వ భూమి దాదాపు 1400 ఎకరాలు మాత్రమే ఉంది. మిగతా వేయి ఎకరాల భూమిని రైతుల నుంచి తీసుకుంటే తప్ప.. ఎయిర్‌పోర్టు నిర్మాణం కుదరదు.  
విమానాశ్రయం కోసం..
అధికారులు విమానాశ్రయం కోసం.. తొర్లికొండ, అర్గుల్‌, కొలిప్యాక్‌, మనోహరాబాద్‌, జక్రాన్‌పల్లి గ్రామాల పరిధిలోని భూముల సేకరణకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే స్థానిక రైతులు అధికారుల కసరత్తును వ్యతిరేకిస్తున్నారు. తమ జీవనాధారమైన భూములను ఇచ్చేందుకు స్థానిక రైతులు ససేమిరా అంటున్నారు.
తమ ప్రాంతంలో ఫ్యాక్టరీలు
తమ ప్రాంతంలో ఫ్యాక్టరీలు, ఐఐటీలు ఏర్పాటు చేస్తే కనీసం ఉపాధి అయినా లభిస్తుందని.. విమానాశ్రయం వల్ల తమకేమీ ఒరగదని గ్రామస్థులు అంటున్నారు. ఉన్న కొద్దిపాటి భూముల్ని సర్కార్‌ కొట్టేసే ప్రయత్నం చేస్తోందని, వెంటనే నిర్ణయాన్ని మార్చుకోకపోతే.. ప్రాణాలొడ్డైనా భూముల్ని కాపాడుకుంటామని రైతులు చెబుతున్నారు. 
అత్యంత విలువైన భూములు
అత్యంత విలువైన భూములను.. ప్రభుత్వం నామమాత్రపు ధరలు చెల్లించి హస్తగతం చేసుకోవాలని చూస్తోందని, దీంతో తమ కుటుంబాలు రోడ్డుపాలయ్యే ప్రమాదం ఉందని సంబంధిత గ్రామాల రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమ భూముల జోలికి వస్తే.. పోరుబాట పడతామని హెచ్చరిస్తున్నారు. 

 

22:04 - July 3, 2016

బీజింగ్ : కుండపోత వానలు చైనాలో బీభత్సం సృష్టిస్తున్నాయ్.గత మూడు రోజులుగా కురుస్తున్న వానలతో దాదాపు 50 మంది మృతి చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి..12 మంది ఆచూకీ గల్లంతైనట్లు వెల్లడించాయి.. వర్షాలతో  యాంగ్జీ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది..ఈ నదీ పరివాహాక ప్రాంతలన్నీ జలమయం అయ్యాయి.. అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు.

22:02 - July 3, 2016

హైదరాబాద్ : ఏపీ సచివాలయం ఉద్యోగుల పట్ల ప్రజలకు అభద్రతాభావం నెలకొని ఉందని ఇది సబబుకాదని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. సచివాలయం ఉద్యోగులు ఎన్నో బంధాలను వదులుకొని అమరావతికి వస్తున్నారని ఆయన తెలిపారు.  కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని అశోక్ బాబు తెలిపారు.

 

21:52 - July 3, 2016

కరీంనగర్ : అప్పుడే పుట్టిన బిడ్డను కన్న తండ్రి విక్రయించిన సంఘటన కరీంనగర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సైదాపూర్ మండలానికి చెందిన జువ్వాజి హైమావతి గత నెల 10న ఓ హాస్పిటల్‌లో మగ బిడ్డకు జన్మినిచ్చింది. అయితే వైద్యులు బిడ్డకు ఆరోగ్యం బాలేదని చెప్పడంతో తండ్రి జయరాజు బిడ్డను విక్రయించాడు. అప్పటి నుంచి ఇంతవరకు తల్లికి, బంధువులెవరికీ ఇంతవరకు బిడ్డను చూపించకపోవడంతో విక్రయింపు విషయం బయటకు వచ్చింది. జయరాజు మాత్రం బిడ్డ చనిపోయాడని బుకాయిస్తున్నాడు. 

21:46 - July 3, 2016

కృష్ణా : విజయవాడలో దేవాలయ కూల్చివేతపై ఐదుగురు సభ్యుల కమిటీ సమావేశం ముగిసింది. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, మాణిక్యాలరావు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ, కామినేని శ్రీనివాస్‌ భేటీకి హాజరయ్యారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం నడుస్తుందని తెలిపారు.

21:44 - July 3, 2016

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా  వచ్చే సెప్టెంబర్‌ 2న నిర్వహించ తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని కార్మిక సంఘాల సదస్సు  నిర్ణయించింది. దేశంలోని అన్ని వ్యవస్థలు స్తంభించేలా.. పాలకుల కళ్లు తెరిపించేలా సమ్మె చేయాలని ప్రతిపాదించారు.
సన్నాహక సమావేశం
సెప్టెంబర్‌ 2న జాతీయ స్థాయిలో జరిగే సమ్మెకు కార్మికులను సమాయత్తం చేసేందుకు హైదరాబాద్‌లో వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. దీనికి సీఐటీయూతోపాటు ఎఐటీయూసీ, టీఎన్ టీయూసీ, హెచ్ ఎంఎస్, టిఆర్ ఎస్ కెవి, ఐఎఫ్ టీయూ, ఐఎన్ టీయూసీలకు చెందిన నాయకులు హాజరయర్యారు. 
సమ్మె నిర్వహణకు ఏర్పాట్లు 
సార్వత్రిక సమ్మెకు పెద్ద ఎత్తున్న ప్రచారం  నిర్వహిచాలని సమావేశంలో నిర్ణయించారు. సమ్మెను బంద్‌ వాతావరణంలో నిర్వహిస్తారు. ఇందుకోసం ఈనెల 4 నుంచి 10వ తేదీ వరకు జిల్లాల్లో సదస్సులు ఏర్పాటు చేయనున్నారు. వచ్చే నెల 8న క్విట్‌ ఇండియా డే రోజు జిల్లా కేంద్రాలతోపాటు, పారిశ్రామిక కేంద్రాల్లో సత్యాగ్రహాలు నిర్వహిచాలని నిర్ణయించారు. ఆగస్టు  1 నుంచి 20 వరకు రంగాల వారీగా సదస్సులు నిర్వహిస్తారు. ఆగస్టు 30న రాష్ట్ర వ్యాప్తంగా మోటారు సైకిల్‌ ర్యాలీలు నిర్వహిచాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో నాయకులతోపాటు, కార్మికులు పాల్గొనాలని తీర్మానించారు. 
స్వదేశీ సంస్థలు నిర్వీర్యమయ్యే ప్రమాదం
కనీస వేతనం 18 వేల రూపాయలు ఉండాలంటూ జస్టిస్‌ మాథుర్‌ కమిటీ చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని సమావేశంలో ప్రసంగించిన కార్మిక నేతలు విమర్శించారు. రక్షణ, రైల్వేలు, బీమా వంటి కీలక రంగాల్లో వందశాతం ఎఫ్‌డీఐలను అనుమతించడం వలన స్వదేశీ సంస్థలు నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక హక్కులపై దాడి చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఈ సమ్మె ద్వారా గుణపాఠం  చెప్పాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. 

 

21:18 - July 3, 2016

శ్రీకాకుళం : ఆమె విధిని జయించింది. ప్రమాదం అవిటితనాన్ని తెచ్చి పెట్టినా.... సడలని ఆత్మవిశ్వాసంతో లక్ష్యాన్ని చేరుకుంది. అనూహ్యంగా జరిగిన ప్రమాదంలో కాలు కోల్పోయినా నాట్యమయూరిగా గుర్తింపు పొందింది. అంగవైకల్యమే తలదించుకునేలా నర్తిస్తోన్న యువతిపై 10టీవీ ప్రత్యేక కథనం. 
విశేష ప్రతిభ కనబరిచిన పావని 
అద్భుతంగా నర్తిస్తోన్న ఈ అమ్మాయి పేరు పావని. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంకు చెందిన పావని.. సంగీతానికి అనుగుణంగా పదములు కదిపిందంటే ఆడిటోరియం అదిరిపోవాల్సిందే. కూచిపూడి, భరతనాట్యంలో విశేష ప్రతిభ కనబరిచి ఇప్పటికే అనేక బహుమతులు గెలుచుకుంది. కాలికి గజ్జె కట్టి పావని ప్రదర్శన ఇచ్చిందంటే.. ప్రేక్షకులంతా మంత్రముగ్ధులై చూడాల్సిందే. అపార ప్రతిభతో అభిమానులను అలరిస్తోందీ యువతి. ఇది నాణానికి ఓ వైపు మాత్రమే. రెండో వైపు.. అంతులేని విషాదం.. అందులోంచి పుట్టుకొచ్చిన ఆత్మవిశ్వాసం.. అది అందించిన విజయమూ కనిపిస్తాయి. 
బస్సు ప్రమాదం... కాలు విరిగిపోయింది
పావని నాలుగో తరగతి చదువుతుండగా బస్సు ప్రమాదం జరిగి.. ఓ కాలు విరిగిపోయింది. తల్లిదండ్రులు ఆమెకు కృత్రిమ కాలిని అమర్చారు. దాంతో నడవడమే కష్టం.. అయితే.. పావని దాన్ని పెద్దగా పట్టించుకోకుండా.. కృత్రిమ కాలితోనే  కూచిపూడి, భరతనాట్యం నేర్చుకుంది. ఓవైపు కుటుంబ పేదరికం.. మరోవైపు అంగవైకల్యం వెక్కిరిస్తున్నా... ఆత్మవిశ్వాసంతో నాట్య సాధన చేసి.. తన పట్టుదలకు ఎలాంటి అంగవైకల్యం లేదని నిరూపించింది. మెండైన  ఆత్మవిశ్వాసంతో వేదికలపై ప్రదర్శనలు  ప్రారంభించింది. ఎవరైనా చెపితే తప్ప.. పావని అంగవైకల్యం గురించి ఎవరికీ తెలియదు. అంతలా నాట్యంతో అలరిస్తోంది పావని. పావని స్థానిక నటరాజ్ డాన్స్ స్కూల్ లో ఇప్పటికీ శిక్షణ పొందడమే కాకుండా.. పర్లాకిమిడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. కష్టాలను ఎదుర్కొని.. బాధలను దిగమింగుకుని తనలోని టాలెంట్‌ని ప్రదర్శించి ఔరా అనిపించుకుంటోంది పావని. ఆర్థికంగా  ప్రోత్సహిస్తే మరిన్ని ప్రదర్శనలతో రాష్ట్రానికి ఖ్యాతిని సముపార్జించి పెడతానని అంటోంది. ప్రముఖ నృత్యకారిణి సుధా తనకు స్ఫూర్తి అని పావని చెబుతోంది. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా బద్ధకంతో ఏ పని చేయకుండా ఉండే ఈ రోజుల్లో కాలు లేకపోయినా కలత చెందకుండా ఎంతో కృషితో నాట్యంలో రాణిస్తున్న పావని ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. పేదరికంలో మగ్గుతున్న పావని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవడం ద్వారా.. ఆమె నాట్య సాధనకు అడ్డంకులు లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.  

20:54 - July 3, 2016

హైదరాబాద్ : రెండేళ్ల పాటు నైజీరియాలో బందీలుగా చిక్కుకున్న 11 మంది భారతీయులు స్వదేశానికి తిరిగివచ్చారు. వీరిలో తెలంగాణకు చెందిన మనోజ్‌కుమార్‌ కూడా ఉన్నారు. ఢిల్లీకి చేరుకున్న మనోజ్‌కుమార్‌ తాము భారత్‌ కు చెందిన నితిన్‌ సందేశ్‌ సహకారంతో స్వదేశానికి తిరిగి వచ్చినట్లు తెలిపారు. పాలమూరుకు చెందిన మనోజ్‌ 2013లో మెరైన్‌ ఇంజనీర్‌గా కంటెయినర్‌ షిప్‌ పనిచేస్తున్నాడు. మనోజ్‌ పనిచేస్తున్న షిప్‌ నైజీరియాలో సముద్ర జలాల్లో ప్రవేశించడంతో అక్కడి కోస్ట్‌ గార్డ్స్‌ అక్రమంగా అరెస్టు చేసారు.

 

20:51 - July 3, 2016

మహబూబ్ నగర్ : డబ్బు పోగేయగానే సంబరం కాదు.. దాన్ని సమాజశ్రేయస్సుకోసం ఉపయోగించినవాడే... శ్రీమంతుడు. పాలకుల దశాబ్దాల నిర్లక్ష్యానికి సాక్ష్యంగా నిలిచిన గ్రామాన్ని మార్చి చూపించారు. ఆ పారిశ్రామికవేత్త. జిల్లా చిత్రపటంలో అసలు ఉందో లేదోకూడా తెలియనంత మూరుమూల పల్లె... అభివృద్ధికి చిరునామాగా మారిందిపుడు. 
అభివృద్ధిపథంలో దూసుకుపోతున్న గ్రామం
ఇది మహబూబ్‌నగర్‌ జిల్లా మాగనూర్‌ మండలంలోని మురహరిదొడ్డి. ఒకపుడు కనీస సౌకర్యాలు లేక.. కునారిల్లిన గ్రామం ఇది. ఎన్నికల సమయంలో తప్పించి.. మరో సందర్భంలో  నాయకులకు గుర్తుకు రాని మారుమూల పల్లెఇది. ఇది నిన్నటిదాకా ఉన్న పరిస్థితి. నేడు అభివృద్ధిపథంలో దూసుకుపోతోంది. 
గ్రామాన్ని దత్తత తీసుకున్న మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీ
మురహరిదొడ్డి గ్రామాన్ని మెఘా ఇంజనీరింగ్‌ కంపెనీ దత్తతకు తీసుకోవడంతో ఈ ఊరి పరిస్థతి అమాంతం మారిపోయింది. గ్రామంలోని రోడ్లన్నిటినీ సిమెంట్‌రోడ్లుగా మార్చారు. ప్రతిఇంట్లో సోలార్‌దీపాల వెలుగుల్ని నింపారు. అంతేకాదు... ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఇంటింటికీ నల్లా కనెక్షన్‌ ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి కట్టించారు. 
పేదలందరికీ పక్కా ఇండ్లు
1983లో మొదటిసారిగా గ్రామంలోకి అడుగుపెట్టారు మెఘాఇంజనీరింగ్‌ కంపెనీ వ్యవస్థాపకులు. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో చిన్న చిన్న కాంట్రాక్టులు చేస్తూ... పెద్ద కంపెనీ మెఘా ఇంజనీరింగ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ను స్థాపించే స్థాయికి ఎదిగారు పీపీ రెడ్డి. కృష్ణాజిల్లా  నుంచి వచ్చిన  ఈయన మురహరిదొడ్డి గ్రామంతో అనుబంధాన్ని పెంచుకున్నారు. తనకు అన్నంపెట్టిన ఊరిని మర్చిపోకుండా... తిరిగి ఇచ్చేస్తున్నారు పీపీ రెడ్డి. మంచినీటి కోసం  ప్రజలు పడుతున్న అవస్థల్ని కళ్లారా చూశారు. అంతే... గ్రామంలో తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. ఊరిలో 1లక్షా 40 వేల లీటర్ల  ఓవర్‌హెడ్‌ ట్యాంకును ఏర్పాటు చేసింది మెగా ఇంజనీరింగ్‌ కంపెనీ.   రోజుకు  ఒక్కో ఇంటికి 20లీటర్ల తాగునీటిని అందిస్తున్నారు. అలాగే.. పూరిగుడిసెలు ఉన్నవారిని గుర్తించి పక్కాఇండ్లు ఏర్పాటు చేయిస్తున్నారు. ఇప్పటికే గ్రామంలో దదాపు 3కోట్ల 50 లక్షల రూపాయలు ఖర్చుచేసినట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీ..  ఒక్క మురహరదొడ్డి గ్రామాన్నే కాదు.. చుట్టుపక్కలున్న గ్రామాల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది. సంస్థ నిర్ణయంతో.. ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

దత్తాత్రేయను కలిసిన కోదండరాం

హైదరాబాద్ : కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను టీజేఏసీ చైర్మన్ కోదండరాం కలిశారు. పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. 

పెరిగిన గోదావరి వరద ఉధృతి

తూర్పుగోదావరి : గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం 8 అడుగులకు చేరింది. 175 గేట్లు ఎత్తి 2.02 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. 

20:36 - July 3, 2016

ఖమ్మం : అట్టహాసంగా ప్రారంభించిన భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌ నిర్మాణం నత్త నడకను గుర్తుకు చేస్తోంది... పనులను హడావుడిగా ప్రారంభించిన తెలంగాణ సర్కారు.. పర్యావరణ అనుమతులు సాధించడంలో మీనమేషాలు లెక్కించింది. దీంతో.. ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి.. అటు ప్లాంటూ రాక... ఇటు భూములూ కోల్పోయి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.. 
అనుమతులు లేక ఆగిపోయిన పనులు  
ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గంలో భద్రాద్రి పవర్‌ప్లాంట్‌ నిర్మాణం అయోమయంలో పడింది... పర్యావరణ అనుమతులు లేక పనులు ఆగిపోయాయి.. ఇక్కడ 270 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన నాలుగు ప్లాంట్ల ద్వారా.. 1080 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  2015లో సీఎం కేసీఆర్‌ ఈ ప్లాంట్‌ల నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు.. ఆ తర్వాత నిర్మాణ పనులు వేగంగా సాగాయి.. అయితే.. ప్లాంట్ల నిర్మాణంలో నిబంధనలు పాటించలేదంటూ పర్యావరణశాఖ అనుమతులకు నిరాకరించింది. దీంతో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
ఉపాధి లేక రోడ్డున పడ్డ స్థానిక రైతు కుటుంబాలు 
విద్యుత్‌ అవసరాల దృష్ట్యా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం తొలుత ప్రతిష్ఠాత్మకంగానే తీసుకుంది. దీనికి అవసరమైన వెయ్యీ 30 ఎకరాల భూమినీ సేకరించింది. ప్రాజెక్టు వస్తే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని... ఉద్యోగాలొస్తాయని ఎంతోమంది రైతులు తమ భూముల్ని ప్రాజెక్టు కోసం ఇచ్చేశారు. అయితే.. వారికి ఇప్పటి వరకూ పరిహారమూ అందలేదు.. పనులు ముందుకు సాగక.. ఉద్యోగాలూ రాలేదు.. భూముల్ని కోల్పోయి ఉపాధి లేక స్థానిక రైతు కుటుంబాలు రోడ్డునపడ్డాయి. మరోవైపు ఈ ప్రాజెక్టు పనుల కోసం భారీ ఇనుప సామగ్రి ఇక్కడికి చేరుకుంది.. నిర్మాణ పనులకోసం 10 అడుగుల మేర గోతులు కూడా తవ్వారు.. ఇటీవల కురిసిన భారీవర్షాలతో ఈ గుంతలన్నీ నీటితో నిండిపోయాయి.. సామగ్రి అంతా తుప్పు పట్టే పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తిచేసి తమకు ఉద్యోగాలు కల్పించాలని.. పెండింగ్‌లో ఉన్న పరిహారం కూడా సత్వరమే చెల్లించాలని స్థానికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు..

 

20:31 - July 3, 2016

హైదరాబాద్ : ప్రైవేట్ ఆస్పుత్రుల దోపిడీని ఆరికట్టాలని గాంధీ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్‌ డాక్టర్ రమాదేవి డిమాండ్ చేశారు. ఈమేరకు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొని, ఆమె మాట్లాడారు. ప్రైవేట్ ఆస్పుత్రులపై ఢిల్లీ ప్రభుత్వం కొరడా ఝళిపించడం ఆహ్వానించదగ్గ విషయమని అభిప్రాయపడ్డారు. పేదలకు ఉచిత వైద్యం అందజేస్తామని ప్రభుత్వం నుంచి అప్పనంగా భూములు తీసుకుని కోట్ల రూపాయలు స్వాహా చేస్తున్న కార్పొరేట్ ఆస్పుత్రులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఐద్వా ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ప్రైవేటు వైద్య దోపిడిని ఆరికట్టాలని ఐద్వా, గిరిజన సంఘం, డివైఎఫ్‌ఐ సంఘాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి పూనుకున్నాయి. 

 

20:25 - July 3, 2016

నల్గొండ : మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు 123 జీవో వర్తింపజేస్తే చూస్తూ ఊర్కోమని సీఎల్పీ నేత జానారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉదయం యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహస్వామిని జానారెడ్డి సతీసమేతంగా దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన మనవడికి అన్నప్రాసన చేయించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు 2013 చట్టం వర్తింప జేసేంత వరకు రైతుల తరపున పోరాడతామన్నారు. 

 

19:57 - July 3, 2016

మెదక్ : మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాలకు అండగా నిలుస్తామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం భరోసా ఇచ్చారు. తమ్మినేని చేస్తున్న మూడో రోజుకు చేరుకుంది. వేములఘాట్‌ నుంచి బయలుదేరిన పాదయాత్ర తుర్కపల్లి బంజరు మీదుగా కొనసాగుతోంది. గ్రామాల్లో మహిళలు పెద్ద ఎత్తున హారతులతో తమ్మినేని వీరభద్రం పాదయాత్రకు స్వాగతం పలికారు. తుర్కపల్లి చేరుకున్న అనంతరం తమ్మినేని పాదయాత్రకు మద్దతు ప్రకటిస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడావెంకటరెడ్డి కలిశారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడారు. ముంపు గ్రామాల్లో అత్యధిక భూములు వేములఘాట్‌ ప్రజలేనని గుర్తు చేశారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలను సీఎం కేసీఆర్‌ నీట ముంచుతాడా అని చాడా విమర్శించారు.

19:49 - July 3, 2016

వరంగల్ : కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రీసెర్చ్‌ స్కాలర్‌ శ్యామ్ మృతికి యూనివర్సిటీ అధికారులే బాధ్యత వహించాలని విద్యార్థులు రోడ్డెక్కారు. కేయూ క్రాస్ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. యూనివర్సిటీ బాత్ రూంలో క్లిన్ చేయకపోవడం వల్ల పాకురు పేరుకోవడం వల్లే శ్యాం కాలుజారి పడిపోయాడని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్యాం కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతో పాటు ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు విద్యార్థులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. చివరకు యూనివర్సిటీ రిజిస్ర్టార్ బెనర్జీ హామీ మేరకు విద్యార్థులు ఆందోళన విరమించారు.

 

19:45 - July 3, 2016

విజయవాడ : దేవాలయ కూల్చివేతపై ఐదుగురు మంత్రుల కమిటీ భేటీ ముగిసింది. కూల్చిన ఆలయాలను మంత్రులు పరిశీలించారు. భక్తుల మనోభావాల ప్రకారమే ప్రభుత్వం నడుచుకుంటుందని మంత్రులు చెప్పారు.  

తొలగించిన ఆలయాలు, గోశాలలను పరిశీలించిన మంత్రులు

విజయవాడ : తొలగించిన ఆలయాలు, గోశాలలకు మంత్రులు దేవినేని, కామినేని, ప్రత్తిపాటి, మాణిక్యాలరావు, కొల్లు రవీంద్ర పరిశీలించారు. ఆలయాలను అంగుళం కూడా కదపమని మాణిక్యాలరావు అన్నారు. అధికారుల ఉత్సాహం వల్లే కొంత ఇబ్బంది ఏర్పడిందని చెప్పారు. దక్షిణాముఖ మందిరం వద్ద ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా మందిరం నిర్మిస్తామని పేర్కొన్నారు. కూల్చిన ఆలయాలను పునర్ నిర్మిస్తామని తెలిపారు. పుష్కరాలకు 2 కోట్లకు పైగా భక్తులు వస్తారని అంచనా వేశారు. 

19:32 - July 3, 2016

హైదరాబాద్ : దేశంలోని వివిధ నగరాల అభిమానులను అలరిస్తున్న...ప్రోకబడ్డీ లీగ్ నాలుగోసీజన్ షో....ముంబై, జైపూర్ నగరాల మీదుగా...మన హైదరాబాద్ నగరానికి చేరుకోనుంది. ఆదివారం నుంచి నాలుగురోజులపాటు జరిగే హైదరాబాద్ అంచె పోటీలకు గచ్చిబౌలీ ఇండోర్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది... హైదరాబాద్ అంచెలో భాగంగా..మహిళల చాలెంజ్ మ్యాచ్ ప్రత్యేక ఆకర్షణ కానుంది. హైదరాబాద్ అంచెపోటీల వివరాలు మీకోసం..
హైదరాబాద్ నగరానికి మరికొద్ది గంటల్లో     
ప్రపంచ వ్యాప్తంగా...99 దేశాల మంది అభిమానులను ప్రత్యక్షప్రసారాల ద్వారా అలరిస్తున్న ప్రోకబడ్డీ నాలుగోసీజన్ సర్కస్...ముంబై, జైపూర్ నగరాల మీదుగా...
తెలుగు రాష్ట్రాల ఉమ్మడిరాజధాని హైదరాబాద్ నగరానికి మరికొద్ది గంటల్లో చేరుకోనుంది. జులై 3 నుంచి 6 వరకూ జరిగే హైదరాబాద్ అంచె పోటీల్లో ...తెలుగు టైటాన్స్ జట్టు హోంటీమ్ హోదాలో బరిలోకి దిగనుంది. ఎనిమిదిజట్ల పురుషుల రౌండ్ రాబిన్ లీగ్ పోటీలతో పాటు...మూడుజట్ల మహిళల కబడ్డీ చాలెంజ్ పోటీకి సైతం హైదరాబాద్ గచ్చిబౌలీ స్టేడియం వేదిక కానుంది.
తెలుగు టైటాన్స్ తో పట్నా పైరేట్స్ ఢీ
హైదరాబాద్ అంచెలో భాగంగా జరిగే తొలిరోజు పోటీల్లో...ఆతిథ్య తెలుగు టైటాన్స్ తో డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ తలపడుతుంది.
జులై 3న జరిగే రెండోమ్యాచ్ లో బెంగాల్ వారియర్స్ తో యూ-ముంబా అమీతుమీ తేల్చుకోనుంది. జులై 4న జరిగే తొలిపోటీలో.. బెంగళూరు బుల్స్ తో పూణేరీ పల్టాన్, రెండో పోటీలో  తెలుగు టైటాన్స్ తో బెంగాల్ వారియర్స్ తలపడతాయి. జులై 5న జరిగే పురుషుల సింగిల్స్ షో లో తెలుగు టైటాన్స్ తో బెంగళూరు బుల్స్ పోటీపడుతుంది. అంతేకాదు...మూడుజట్ల మహిళల కబడ్డీ చాలెంజ్ సమరంలో భాగంగా మమతా పూజారీ నాయకత్వంలోని ఫైర్ బర్డ్స్, స్టార్మ్ క్వీన్స్ జట్ల పోటీ జరిగే అవకాశం ఉంది.
జులై 6న ఆఖరిరోజు పోటీలు 
హైదరాబాద్ అంచె ఆఖరిరోజు పోటీలను జులై 6న నిర్వహిస్తారు. తొలిపోటీలో దబాంగ్ ఢిల్లీతో జైపూర్ పింక్ పాంథర్స్ పోటీపడుతుంది.
రాత్రి 9 గంటలకు ప్రారంభమయ్యే రెండో పోటీలో ఆతిథ్య తెలుగు టైటాన్స్ తో యూ-ముంబా తలపడుతుంది. మొత్తం నాలుగురోజుల్లో ఏడు పురుషుల మ్యాచ్ లు, ఒక మహిళా మ్యాచ్ నిర్వహించనున్నారు. 
సెమీఫైనల్స్, ఫైనల్స్ కు వేదిక గచ్చిబౌలీ స్టేడియం 
ఇక...సెమీఫైనల్స్, ఫైనల్స్ కు సైతం హైదరాబాద్ గచ్చిబౌలీ స్టేడియమే వేదిక కానుంది. జులై 29 నుంచి 31 వరకూ సెమీఫైనల్స్, ఫైనల్‌స్ పోటీలు జరుగుతాయి. జులై 29 న సెమీఫైనల్స్ పోటీలు నిర్వహిస్తారు. జులై 31న లూసింగ్ సెమీఫైనలిస్ట్ లకోసం..3,4 స్థానాల ప్లేఆఫ్ మ్యాచ్ జరుగుతుంది. అదేరోజున..పురుషుల టైటిల్ సమరంతో పాటు..మహిళల చాలెంజ్ ఫైనల్స్ ను సైతం నిర్వహిస్తారు.పురుషుల, మహిళల ఫైనల్స్ తో కబడ్డీలీగ్ నాలుగోసీజన్ పోటీలకు..హైదరాబాద్ లోనే తెరపడుతుంది.

19:16 - July 3, 2016

విశాఖ : ఏసీబీ అధికారుల దాడులలో మాములుగా ఇతర ప్రభుత్వ శాఖ ఉద్యోగులు దొరుకుతారు. కానీ విశాఖ లో రొటీన్ కు భిన్నంగా పోలీసుశాఖ అధికారులే ఏసీబీకి చిక్కుతున్నారు. ఇదే కాకుండా విశాఖ పోలీసులపై ఒక్క సారిగా అనేక అరోపణలు గుప్పుమంటున్నాయి..మొన్న గాజువాక  లా ఎండ్ ఆర్డర్ సీఐ, మరియు ఎస్ఐ లను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోగా..... తాజాగా నగర పరిధిలో ఓ సీఐ ఏసీబీ అధికారులకు దొరికాడు..మహిళలను వేధిస్తున్నాడని ఓ ఏసీపీ స్థాయి వ్యక్తిపై కూడా కేసును నమోదు చేశారు విశాఖ పోలీసులు.  
పోలీసులు సంచలన నిర్ణయం 
విశాఖ జిల్లాలో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు..న్యాయానికి తమ పర బేధం ఉండదనీ చట్టం ముందు అందరూ సమానమే అని నిరూపించారు..అన్యాయాన్ని కొమ్ముకాస్తున్నారనే నెపంతో తమ డిపార్ట్ మెంట్ కు చెందిన ఇద్దరు అధికారులను విశాఖ కమిషనర్ సస్పెండ్ చెయ్యగా మరో ఇద్దరు కానిస్టేబుల్స్ ను జిల్లా పోలీసులు సస్పెండ్ చెశారు..అవినీతి అరోపణలు ఎదుర్కోని ఏసీబీకి దొరికిన సీఐ పై, మహిళను వేధించిన కేసులో మరో ఏసీపీ పై వేటు వేశారు పోలీసు ఉన్నాతాధికారులు..
సీఐ మళ్ల అప్పారావు, ఎస్సై సురేష్ లను సస్పెండ్
తమ వారిని ఎలాగైనా కేసుల నుంచి బయట పడేస్తారు అనేది పోలీసు మీద ఉన్న అపవాదు..దానితో పాటుగా అవసరం అయితే కేసులను తారుమారు చేస్తారనే ప్రధాన అభియోగం కూడా..జనాల నుంచి వస్తున్న వ్యతిరేకతలకు చెక్ పెట్టాలనుకున్నారో లేక..అందరూ ఒకే విధంగా ఉండరనుకున్నారో ఏమో గానీ విశాఖ సిటీ పోలీసులతో పాటు రూరల్ పోలీసులు కూడా ఒకే సారి తమ కొరడ ఝళిపించారు..విశాఖ సిటీ పరిధిలోని  గాజువాక లా ఎండ్ ఆర్డర్  పోలీస్ స్టేషన్ లో సీఐగా పనిచేస్తున్న మళ్ల అప్పారావు, ఎస్సై సురేష్ ను నగర సీపీ యోగానంద్ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొన్ని కేసులలో వారిపై వచ్చిన అరోపణల నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.
సాధారణ సీఐ స్ధాయి అధికారికి వందల కోట్ల ఆస్తులు 
కేవలం ఇదొక్కటే కాదు ఇటీవల కాలంలో విశాఖ సముద్రం అంత లోతున పోలీసు శాఖలో అవినీతి పెరిగి పోయింది..సాధారణ సీఐ స్థాయి వ్యక్తి వందల కోట్లలో ఆస్తులు సంపాదించాడు..దీంతో ఆ ఆస్తులు చూసి  పోలీసులే నోరేళ్ల బెట్టారు...విశాఖ నగర ఫోర్త్ టౌన్ స్టేషన్ లో సీఐగా పనిచేస్తున్న బాలకృష్ణపై గత కొద్ది కాలంగా అవినీతి అరోపణలు గుప్పు మన్నాయి..ఇంతే కాకుండా ఏకంగా స్టేషన్ లో ఓ షాడో మనిషినే పెట్టుకున్నాడు ఈ సీఐ..దీంతో కన్ను వేసిన ఏసీబి అధికారులకు  బాలకృష్ణ ఆస్తులు  చూసి దిమ్మ దిరిగిపోయుంది...ఈ బాలకృష్ణ ఉదంతంలో పోలీస్ శాఖ ఒక్క సారిగా ఉలిక్కి పడింది..ఇదే సమయంలో రూరల్ పోలీసులు కూడా  అవినీతి అధికారులను ఎట్టి పరిస్థితులలోను ఉపేక్షించడం లేదు..నర్సీపట్నం పరిధిలోని నాతవరంలో గంజాయి సరఫరాకు సహాకరిస్తున్నారనే నెపంలో ఓ హెడ్ కానిస్టేబుల్స్ కొండయ్య, కానిస్టేబుల్ సత్యనారాయణను జిల్లా పోలీసులు సస్పెండ్ చేశారు. నగర కమిషనరేట్‌ పరిధిలోని మూడు నెలల కాలంలో ఇద్దరు సీఐలు ఏసీబీ అధికారులకు దొరకడం మరో సీఐ, ఎస్ లు అవినీతి అరోపణలతో  సస్పెండ్ కావడం విశాఖ జిల్లా పోలీసుశాఖలో సంచలనం సృష్టించింది. విశాఖలో పోలీసుల అవినీతి ఉదంతాలను నగరవాసులు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.

 

18:53 - July 3, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేనేత రుణమాఫీకి సన్నాహాలు చేస్తోంది. ఇంతకాలం హామీకే పరిమితమైన చేనేత రుణమాఫీ... ఎట్టకేలకు ఆచరణలోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అన్నీ అనుకూలిస్తే.. ఈ కార్యక్రమాన్ని జులై 5న అనంతపురంలో ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. 
రెండేళ్ల తర్వాత చేనేత రుణమాఫీపై కదలిక
ఆంధ్రప్రదేశ్‌లో చేనేత కార్మికులకూ రుణమాఫీ అమలు కానుంది. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఆచరణలో పెట్టేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. అధికారంలోకొచ్చి  రెండేళ్లు గడిచినా... ఇచ్చిన హామీని మరిచారనే  విమర్శలొస్తుండటంతో ఎట్టకేలకు చేనేత రుణాలమాఫీకి రాష్ట్రప్రభుత్వం  సిద్ధమైంది.  
జూలై 5న ధర్మవరంలో చేనేత రుణమాఫీ ప్రారంభం
జులై 5న అనంతపురం జిల్లా ధర్మవరంలో రుణమాఫీ పథకానికి శ్రీకారం చుట్టాలని ఏపీ సీఎం  చంద్రబాబునాయుడు నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 25 వేల మంది చేనేత  కార్మికులు ఉంటే... దాదాపు 111 కోట్ల రూపాయల రుణం  మాఫీ కానుంది.  అనంతపురం జిల్లాలోని లబ్దిదారులకే సుమారు  50 కోట్ల రూపాయల మేర రుణం మాఫీ కానుంది. కృష్ణాజిల్లాలో 1207 మందికి చేనేత రుణమాఫీ వర్తించనుంది. వీరితోపాటు మరో ఆరు చేనేత గ్రూపులకు రుణమాఫీ పథకం అమలు కానుంది. 
ఒక్కో లబ్ధిదారునికి రూ.1లక్ష రుణం మాఫీ
చేనేత రుణాల్లో 2014 మార్చి 31 వరకు ఉన్న రుణాలు రద్దవుతాయి. ఒక్కొక్క లబ్దిదారునికి  గరిష్టంగా లక్ష రూపాయల వరకు రుణం మాఫీకానుంది. ఇందుకు  సంబంధించిన ప్రక్రియను చేనేత జౌళిశాఖ అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. లబ్దిదారుల ఎంపికతో పాటు ఆధార్ కార్డుల అనుసంధానం తదితర కార్యక్రమాలు పూర్తయ్యే  విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. రుణమాఫీకోసం ఇంతకాలం ఎదురుచూసిన చేనేత కార్మికులు... అప్పుల నుంచి కొద్దిగానైనా బయటపడొచ్చని సంతోషపడుతున్నారు. ఇప్పటికైనా తమ కష్టాలపై తీరతాయనే  ఆశతో ఉన్నారు. 

18:30 - July 3, 2016

కృష్ణా : బెజవాడ మెట్రో పనులకు ఆదిలోనే హంసపాదు పడింది. ఆర్థిక సాయం చేస్తామంటూ ముందుకు వచ్చిన జపాన్‌ ఆర్థిక సంస్థ, జైకా రుణం ఇచ్చేందుకు సరికొత్త మెలికలు పెడుతోంది. ఇప్పటికే ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పోరేషన్‌ కన్సల్టెంట్‌గా ఉన్న ఈ ప్రాజెక్టుకు మరో జనరల్‌ కన్సల్టెంట్‌ ఏర్పాటు చేయాలని జైకా డిమాండ్‌ చేసింది. ఈ నిబంధనతో బెజవాడ మెట్రో కన్సల్టెంట్‌లా వ్యవహరిస్తున్న ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పోరేషన్‌ భాగస్వామ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. 
విజయవాడ మెట్రో రైలుకు అడ్డంకులు 
నూతన రాజధాని రవాణా అవసరాలు తీర్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన విజయవాడ మెట్రో రైలుకు వరుస అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు రుణమిచ్చేందుకు ముందుకొచ్చిన జపాన్‌ ఆర్ధికసంస్థ జైకా కొత్త నిబంధనలు ప్రవేశపెడుతోంది. ఎన్నో మెట్రో ప్రాజెక్టులను విజయవంతంగా చేపట్టిన ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ను కాదని.. మరో జనరల్‌ కన్సల్టెంట్‌ను నియమించాలని జైకా పట్టుబడుతోంది. 
స్పష్టం చేసిన జైకా ప్రతినిధులు
ఇదే విషయాన్ని ఢిల్లీలో జైకా ప్రతినిధులు అమరావతి మెట్రో రైల్‌ కార్పోరేషన్‌ అధికారులకు స్పష్టం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పటికే సలహాదారుగా ఉన్న ఢిల్లీ మెట్రో రైలు కార్పోరేషన్‌ ఈ మెలికపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పోరేషన్‌ పర్యవేక్షించే మెట్రో ప్రాజెక్టుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను భాగస్వామ్యం చేస్తుంది. ప్రాజెక్టుల వ్యయంలో 14 శాతం అలాగే పన్ను మినహాయింపుల భారం తప్ప పూర్తి ప్రైవేటీకరణను అంగీకరించదు. అయితే తాజా జైకా నిబంధనతో ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పోరేషన్‌ను పొమ్మనకుండా పొగ పెట్టే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. 
ప్రాధాన్యత తగ్గిపోతున్న ఢిల్లీ మెట్రో రైల్‌ సంస్థ 
ఇదిలా ఉంటే దేశంలో అతి తక్కువ వడ్డీకి రుణాలను ఇచ్చే ఆర్థిక సంస్థగా జైకాకు పేరుంది. అమరావతి మెట్రో రైల్‌ కార్పోరేషన్‌ ప్రస్తుతం జైకా అందిస్తున్న రుణానికి వడ్డీ కేవలం 0.3 శాతమే ఉంది. అయితే ఇక్కడే అసలు మెలిక ఉంది. రుణం పొందిన ప్రాజెక్టు సామాగ్రిలో సుమారు 30 శాతం జపాన్‌లోనే కొనుగోలు చేయాలనే నిబంధన ఉంది. ప్రస్తుతం అమరావతి మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు జైకా నిబంధన ప్రకారం జనరల్‌ కన్సల్టెంట్‌ను నియమిస్తే ఢిల్లీ మెట్రో రైల్‌ సంస్థ ప్రాధాన్యత తగ్గిపోతుంది. మరోవైపు జపాన్‌ ఆర్థిక సంస్థ జైకా నుంచి మరో ఐదు నెలల వరకు రుణం మంజూరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. డిసెంబర్‌ మొదటి వారంలో కానీ నిధులు విడుదలయ్యే అవకాశం లేదు.

 

18:25 - July 3, 2016

విశాఖ : స్మార్ట్‌ సిటీ హవా రోజురోజుకు పెరిగిపోతోంది. సముద్ర తీర ప్రాంతమున్న వైజాగ్‌తో పర్వత దేశమైన నేపాల్‌ వాణిజ్య లంకె తగిలించబోతుంది. ఇకనుంచి విదేశాల నుంచి సరుకులను విశాఖ పోర్ట్‌కు దిగుమతి చేసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే వసతులను పరిశీలించిన బృందం.. సానుకూలత వ్యక్తం చేసింది.
విశాఖను ఆశ్రయిస్తున్న తూర్పు, పశ్చిమాసియ దేశాలు
కేంద్ర ప్రభుత్వం లుక్‌ ఈస్ట్‌ పాలసీలో భాగంగా విశాఖకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు వైజాగ్‌ను ప్రభుత్వం సన్‌రైజ్‌ సిటీగా ప్రమోట్‌ చేస్తోంది. దీంతో తూర్పు, పశ్చిమ ఆసియా దేశాలు సముద్ర మార్గం ద్వారా సరుకు రవాణాకు విశాఖను ఆశ్రయిస్తున్నాయి. 
ఇప్పటివరకు కోల్‌కతా పోర్ట్‌ ద్వారా రవాణా
తీరప్రాంతం లేని నేపాల్‌ ఇప‌్పటివరకు తమ సరుకుల రవాణాకు కోల్‌కతా పోర్టును ఉపయోగించుకునేది. అయితే గతంతో పోల్చుకుంటే కోల్‌కతా పోర్టు బిజీగా మారడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాయి. ఈ తరుణంలో కోల్‌కతాపోర్టుకు ఇన్‌చార్జ్‌గా ఉన్న వైజాగ్‌ పోర్ట్‌ ఇన్‌చార్జ్‌ కృష్ణబాబు.. నేపాల్‌కు విశాఖ గురించి వివరించారు. దీంతో నేపాల్‌ ఉన్నత స్థాయి బృందం విశాఖలో పర్యటించి..వసతులను పరిశీలించింది. పోర్ట్‌తో పాటు.. రైల్వే, రోడ్డు, వాయుమార్గాలను పరిశీలించి అధికారులు పూర్తి వివరాలు సేకరించారు. కోల్‌కతాలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో.. విశాఖ బెటరని నేపాల్‌ బృందం అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. 
త్వరలో ఖాట్మాండ్‌లో బిజినెస్‌ మీట్‌ 
నేపాల్‌ బృందం వైజాగ్‌ పోర్ట్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. బిజినెస్‌ పెంచుకునేందుకు త్వరలోనే ఖాట్మాండ్‌లో బిజినెస్‌ మీట్‌ ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నారు. ఈ ప్రాజెక్టు లభిస్తే.. పోర్టు సామర్ధ్యం కొంతమేర పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. మొత్తానికి స్మార్ట్‌ సిటీగా గుర్తింపు పొందిన వైజాగ్‌.. ఇక సముద్ర మార్గం ద్వారా కూడా మరింత ఆదాయం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

 

18:10 - July 3, 2016

కరీంనగర్ : జిల్లాలోని మేడిపల్లి మండలంలో దారుణ జరిగింది. దుండగులు నవ వధువును దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దేశాయ్ పేట్ కు చెందిన మహేష్ తో మోత్కురావుపేటకు చెందిన మౌనికతో మూడు నెలల క్రితం వివాహం జరిగింది. భార్యభర్తలు అనోన్యంగా ఉంటున్నారు. దంపతుల మధ్య ఎలాంటి గొడవలు లేవు. అయితే ఆషాఢమాసం రావడంతో పుట్టింటికి తీసుకెళ్లేందుకు మౌనిక తండ్రి మల్లయ్య వచ్చాడు. కూతురు మౌనికను బైక్ తీసుకుని తండ్రి మల్లయ్య మోత్కురావుపేటకు వెళ్తున్నాడు. మార్గంమధ్యలో దేశాయ్ పేట్ శివారులోని గోవిందరావుపేట అటవీప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు ముఖానికి ముసుగులు ధరించి వారిపై మత్తు మందు ప్రయోగించారు. తండ్రి మల్లయ్య, కూతురు మౌనికలు స్పృహ కోల్పోయాక... దుండగులు మౌనికను కిడ్నాప్ చేశారు. ఆమెను దారుణంగా హత్య చేశారు. గోవిందరావుపేట అటవీప్రాంతంలో ఆమె మృతదేహం లభ్యం అయింది. అత్యాచారం చేసినట్లు  అనుమానిస్తున్నారు. కానీ అత్యాచారం జరిగినట్లు ప్రాథమికంగా ఆనవాళ్లు లేవని పోలీసులు చెబుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరిపై అనుమానం లేదని మౌనిక భర్త అంటున్నారు. 

 

17:55 - July 3, 2016

హైదాబాద్ : శంషాబాద్ మండలంలో దారుణం జరిగింది. కామాందులు దారుణానికి ఒడిగట్టారు. బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి.. ఆపై పరుగుల మందు తాగించారు. శాతంరాయిలో 18 ఏళ్ల బాలికను అదే ప్రాంతానికి చెందిన జగన్ (21) యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ప్రేమ పేరుతో ఆమెను మోసం చేసి.. లొంగదీసుకున్నాడు. తనతోపాటు మరో ఇద్దరితో కలిసి ఉండాలని బాలికకు చెప్పాడు. ఈనేపథ్యంలో రెండు రోజుల క్రితం జగన్ తోపాటు మరో యువకుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాలికకు పురుగుల మందు తాగించి, హత మార్చే ప్రయత్నం చేశారు. బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాలిక చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. 12 గంటలు గిడిస్తే తప్ప తామే ఏమీ చెప్పలేమని వైద్యులు అంటున్నారు. పోలీసులు జగన్ ను అదుపులోకి తీసుకున్నారు. మరో యువకుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

 

16:52 - July 3, 2016

విశాఖ : అల్లూరి సీతారామరాజు జిల్లాను ఏర్పాటు చేయాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు డిమాండ్ చేశారు. విశాఖ ఏయూలో జరిగిన అల్లూరి జయంతి ఉత్సవాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. వైఎస్ఆర్ జిల్లాను ఏర్పాటు చేస్తే లేనిది ఎప్పటి నుంచో ప్రజల కోరికగా ఉన్న అల్లూరి జిల్లాను ఏర్పాటు చెస్తే వచ్చిన ఇబ్బందేమిటనీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్వాతంత్య్రం కోసం కులాలకు అతీతంగా పోరాడిన నేతలను ఇప్పటి నేతలు కులాల పేరుతో విభజించడం బాధకరమని అన్నారు. అభివృద్ధి అంతా అమరావతి ప్రాంతంలో కేంద్రీకృతమై ఉండడం వల్ల రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర, రాయలసీమలలో ఉద్యమాలు జరిగే అవకాశం ఉందన్నారు.

 

16:46 - July 3, 2016

మహబూబ్‌నగర్‌ : జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటిస్తున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.. మక్తల్‌లోని పెద్ద చెరువుపై మినీ ట్యాంక్‌బండ్‌ నిర్మాణానికి హరీశ్‌రావు భూమి పూజ చేశారు.  ఈ కార్యక్రమంలో మక్తల్‌ ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి, పాలమూరు జడ్పీ ఛైర్మన్‌ బండారు భాస్కర్‌, ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

16:42 - July 3, 2016

విజయవాడ : ఎపిలో బిజెపి నాయకులు అభివృద్ధి నిరోధక శక్తులుగా మరారని విజయవాడ టిడిపి ఎంపీ కేశినేని నాని ఘాటుగా విమర్శించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. హిందూధర్మ పరిరక్షణ పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ట్రాఫిక్‌కు అవరోధంగా మారిన దేవాలయాలను తొలగిస్తుంటే... బిజెపి నాయకులు అడ్డుపడటాన్ని నాని తప్పుపట్టారు. భాగస్వామ్యపక్షంగా ప్రభుత్వానికి సహకరించాల్సిన కమలనాథులు... ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

16:35 - July 3, 2016

కృష్ణా : విజయవాడలో రోడ్డు విస్తరణలో భాగంగా ఆలయాల కూల్చివేతలపై వివాదం ముదురుతోంది. ఆలయాలను తొలగిస్తున్నారంటూ బీజేపీ నేతలు దుర్గగుడి, గోశాల ప్రాంతాల్లో పర్యటించారు. అధికారులను బీజేపీ నేతలు నిలదీయడంతో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుని, రాజకీయం చేయవద్దని వెంకన్న అన్నారు. అయితే తాము అభివృద్ధికి అడ్డుకాదని, ఆలయాలను తొలగించడం ప్రజల మనోభావాలకు ఇబ్బందికరంగా ఉందని, ప్రభుత్వం దీనిపై ఆలోచన చేయాలని బీజేపీ నేతలు అన్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల కార్యకర్తలు పరస్పర దూషణలు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

 

16:33 - July 3, 2016

హైదరాబాద్ : ఆరోగ్యశ్రీ విషయంలో సమ్మె కొనసాగిస్తున్నట్లు ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రకటించాయి. ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించలేమని యాజమాన్యాలు తెలిపాయి. మరోసారి ప్రభుత్వంతో చర్చించాకే నిర్ణయాన్ని చెబుతామని యాజమాన్యాలు తేల్చి చెప్పాయి. బకాయిలు మొత్తం చెల్లించాలని... ఆరోగ్యశ్రీ ప్యాకేజీ 20 శాతం పెంచాలని యాజమాన్యాలు డిమాండ్‌ చేశాయి. 

 

16:28 - July 3, 2016

ఇరాక్ : ఉగ్రవాదులు బరి తెగిస్తున్నారు. వరుసగా బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా బాగ్దాద్ లో ఉగ్రవాదులు మారణకాండను సృష్టించారు. జంట పేలుళ్లకు తెగబడ్డారు. సెంట్రల్ బాగ్దాద్, నార్త్ వెస్టు బాగ్దాద్ అనే రెండు ప్రాంతాల్లో  ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 82 మంది మృతి చెందారు. మరో 200 మందికి గాయాలయ్యాయి. ఈ దాడులకు తమదే బాధ్యతని ఐసిస్ ప్రకటించింది. 

మహిళ దారుణ హత్య

కరీంనగర్ : జిల్లాలోని మేడిపల్లి మండలంలో దారుణ జరిగింది. దేశాయ్ పేట్ శివారులో మహిళ దారుణ హత్యకు గురైంది. మౌనిక ను దుండగులు కిడ్నాప్ చంపేశారు. ఇటీవలే మహేష్ తో మౌనికకు వివాహం అయింది. 

బాలికపై సామూహిక అత్యాచారం..

హైదాబాద్ : శంషాబాద్ మండలం శాతంరాయిలో దారుణం జరిగింది. బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాలికకు పురుగుల మందు తాగించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

 

విజయవాడ గోశాల వద్ద ఉద్రిక్తత

కృష్ణా : విజయవాడ గోశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆలయాల తొలగింపు ప్రదేశాలను బీజేపీ నేతలు పరిశీలించారు. రోడ్డు విస్తరణ కోసం ఆలయాల తొలగింపుపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నా, సోము వీర్రాజు ప్రెస్ మీట్ ను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. 

మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు బాధితులు బహిరంగ సభ

మెదక్ : వేముల ఘాట్ లో మల్లన్న సాగర్ ప్రాజెక్టు ముంపు బాధితులు బహిరంగ సభ నిర్వహించారు. 'ప్రాజెక్టు పేరిట భూములు తీసుకున్నట్లు కాకుండా మన అవసరాల కోసం భూములు అమ్ముతున్నట్లు సంతకాలు తీసుకుంటున్నారని' సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. దీని వల్ల భూ నిర్వాసితులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఎట్టిపరిస్థితుల్లో సంతకాలు చేసే ప్రయత్నం చేయొద్దన్నారు. 'మనం ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వమే మనల్ని బెదిరిస్తుందని' తెలిపారు.  రెండేళ్లలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మిస్తామమని సీఎం కేసీఆర్ చెప్పారని....

15:43 - July 3, 2016

కర్నూలు : హమాలీలకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని ఏపీ సీఐటియూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఏ గఫూర్ డిమాండ్ చేశారు. కర్నూలులోని సుందరయ్య భవనలో ఏర్పాటు చేసిన హమాలీల యూనియన్ల సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. రాష్ట్రంలో 4లక్షల మంది హమాలీలు ఉద్యోగ భద్రత లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గఫూర్ తెలిపారు. వీరి సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించి వారీని కార్మికులుగా గుర్తింపునివ్వాలని ఆయన ప్రభుత్వాని కోరారు. 

 

15:39 - July 3, 2016

రంగారెడ్డి : హరిత హారంతో భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు కలుగుతుందని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా బోడుప్పల్ మున్సిపల్ పరిధిలో నిర్వహించిన హరితహారం అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హరిత హారంపై అవగాహన ర్యాలీని పద్మాదేవేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవిష్యత్తు తరాలు ఆరోగ్యకర వాతావరణంలో ఉండాలంటే ప్రస్తుత తరాల వారు చెట్లను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. 
 

 

15:28 - July 3, 2016

విజయవాడ : కేంద్రప్రభుత్వం అబద్ధాలతో కార్మికులను మభ్య పెడుతోందని... సీఐటీయూ అఖిలభారత కార్యదర్శి తపన్‌సేన్‌ ఆరోపించారు. హైదరాబాద్‌ గాంధీ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల కార్మిక సంఘాలు సమావేశమయ్యాయి. సెప్టెంబర్‌ 2 సమ్మె ఏర్పాట్లపై చర్చించారు. ఈ సమావేశంలో పాల్గొని, తపన్ సేన్ మాట్లాడారు. సెప్టెంబర్‌ 2 సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 12 ప్రధాన డిమాండ్లతో ఈ ఆందోళన చేపట్టామని వివరించారు. గత ఏడాది కూడా ఇవే డిమాండ్లతో ఆందోళన చేపట్టామని చెప్పామన్నారు. కొన్ని డిమాండ్లను పరిష్కరిస్తామన్నారని... కానీ కార్మికుల ఏ ఒక్క సమస్యనూ పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదని విమర్శించారు. దేశంలో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమలు మూసివేతతో వేలాది కార్మికులు రోడ్డునపడుతున్నారని మండిపడ్డారు. కనీస వేతనాన్ని 18 వేలు చేయాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి తపన్‌సేన్‌తోపాటు.. పలు కార్మిక సంఘాల నేతలు హాజరయ్యారు.

 

14:56 - July 3, 2016

ఢిల్లీ : న్యాయాధికారులు సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ను కలిశారు. ఈ  భేటీలో వకీళ్ల సమస్యలను అడిగితెలుసుకున్నారు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి. తాము చెప్పిన విషయాలు సానుకూలంగా విన్నారని.. తెలంగాణ లాయర్లు అంటున్నారు. మామీద నమ్మకం ఉంచి ప్రస్తుతానికి ఉద్యమాన్ని వాయిదా వేసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచించినట్టు తెలంగాణ లార్లు తెలిపారు. త్వరలో తమ సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుందని తెంగాణ అడ్వొకేట్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

బాగ్దాద్ లో కారు బాంబు పేలుడు

ఇరాక్ : బాగ్దాద్ లో కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 78 మంది మృతి చెందారు. ఈ కారు  బాంబు పేలుళ్లకు పాల్పడినట్లు ఐసిస్ ప్రకటించింది. 

 

రేపు జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా

విజయవాడ : రేపు జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. 8 వ తేదీకి ఉదయం 10.30 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. 

తమ్మినేని పాదయాత్రలో పాల్గొన్న సీపీఐ నేత చాడ..

మెదక్ : మల్లన్న సాగర్ ప్రజలకు మద్దతుగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేస్తున్న పాదయాత్రలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ వచ్చి రెండేళ్లయినా పేదల బతుకుల్లో మార్పు లేదని, నాయకుల జీవితాలు వెలిగిపోతున్నాయని చాడ పేర్కొన్నారు. 2013 చట్టం ప్రకారమే నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని పేర్కొన్నారు.

వేముల ఘాట్ లో ముంపు బాధితుల సభ..

మెదక్ : వేముల ఘాట్ లో మల్లన్న సాగర్ ప్రాజెక్టు ముంపు బాధితుల బహిరంగసభ జరుగుతోంది. ప్రాజెక్టు పేరిట భూములు తీసుకున్నట్లు కాకుండా మన అవసరాల కోసం భూములు అమ్ముతున్నట్లు సంతకాలు తీసుకుంటున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. దీనివల్ల భూ నిర్వాసితులు నష్టపోతారని, ఎట్టి పరిస్థితుల్లో సంతకాలు చేసే ప్రయత్నం చేయవద్దని సూచించారు. ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వమే బెదిరిస్తోందని, రెండేళ్లలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మిస్తామని సీఎం కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు.

గిరిజనులను పట్టించుకోవడం లేదు - రాఘవులు...

విశాఖపట్టణం : అల్లూరి జయంతి ఉత్సవాల పేరిట జ్ఙాపికలు, విగ్రహాల గురించి ప్రభుత్వం ఆలోచిస్తోందని, గిరిజనులను పట్టించుకోవడం లేదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు విమర్శించారు. స్మార్ట్ సిటీ పేరిట విశాఖను అభివృద్ధి చేస్తున్నారని, గిరిజనుల సంగతి ఏంటనీ నిలదీశారు. అభివృద్ధి అంతా అమరావతిలో కేంద్రీకృతమవుతోందని, ఉత్తరాంధ్ర, రాయలసీమ నుండి పోరాటాలు తప్పదేమోనని అభిప్రాయం వ్యక్తం చేశారు.

13:26 - July 3, 2016

ఉత్తరాఖండ్ : గత నాలుగు రోజులు గా ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరద మృతుల సంఖ్య 45కు పెరిగింది. ఆ రాష్ట్రంలో ఇంకా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నైనిటాల్‌, చంపావత్, అల్మోరా, పౌరీ, హరిద్వార్‌, డెహ్రాడూన్, ఉత్తర కాశీ, పితోరగఢ్, ఛమోలీ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు గంటల్లోనే 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. మరోవైపు ఉత్తరాఖండ్‌లోని చక్రతాలో బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు.

విరిగిపడుతున్న కొండచరియలు..
ఉత్తరాఖండ్ గ్రామాలు భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన సహాయ, పునరావాస కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర విపత్తు స్పందన దళాలు, సైన్యం, భారత్-టిబెటన్ సరిహద్దు పోలీసులు,రాష్ట్ర పోలీసులు, రెవిన్యూ బృందాలు సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. రాష్ట్రంలోని దాదాపు 10 నదులు, ఉప నదులు ఉద్రిక్త స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దీంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి.

దిగ్భందంలో హృషీకేశ్..
హృషీకేశ్ బదరీనాథ్ జాతీయ రహదారి కొన్ని చోట్ల ఇప్పటికీ దిగ్బంధంలోనే ఉందని అధికారులు తెలిపారు. ఉత్తర కాశి జిల్లాలో గంగోత్రి, యమునోత్రి జాతీయ రహదారిపై గండ్లు పడటంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఈ యాత్రా రహదారులను పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని అధికారులు సూచించారు.

13:23 - July 3, 2016

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ బొల్లారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం జరిగింది. పదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసి హత్యచేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బొల్లారం కలాసిగూడకు చెందిన రామకృష్ణ దంపతులు నిన్న కూలికి వెళ్లగా కూతురు ఒక్కతే ఇంట్లో ఉంది. అది గమనించిన అదే ప్రాంతానికి చెందిన అనిల్‌కుమార్‌ ఇంటి ముందు ఉన్న బాలికకు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఘటన బయటకు వస్తుందనే నెపంతో బాలికను గొంతు నులిమి హత్యచేశాడు అనిల్‌కుమార్.నిర్మానుష్య ప్రదేశంలో బాలిక మృతదేహాన్నిచూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.. తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడు అనిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాయమాటలు చెప్పి తమ బిడ్డను నిందితుడు బయటకు తీసుకువెళ్లాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిందితున్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

13:20 - July 3, 2016

విజయవాడ : నగరంలో ఆలయాల తొలగింపు బిజెపి, టిడిపి మధ్య చిచ్చు రేపుతోంది. రోడ్డు విస్తరణ కోసం ఆలయాల తొలగింపుపై బిజెపి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆదివారం ఉదయం బిజెపి నేతలు కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజులు నగరానికి చేరుకున్నారు. అక్కడ గోశాలను సందర్శించారు. అదే సమయంలో అక్కడే ఉన్న టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఉన్నారు. బిజెపి నేతల ప్రెస్ మీట్ ను అడ్డుకున్నారు. దీనితో బుద్దా వెంకన్న వర్గీయులు బిజెపి నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకనొక సందర్భంలో కలియపడే పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఇరువర్గాలను శాంతింప చేశారు.

 

విజయవాడ గోశాల వద్ద ఉద్రిక్తత..

విజయవాడ : గోశాల ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆలయాల తొలగింపు ప్రదేశాలను బీజేపీ నేతలు పరిశీలించారు. రోడ్ల విస్తరణలో ఆలయాల తొలగింపుపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

బోనాలపై మంత్రి తలసాని సమీక్ష..

హైదరాబాద్ : ఈనెల 7వతేదీ నుంచి గొల్కొండ అమ్మవారి బోనాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు బోనాల ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా బోనాల సందర్బంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భక్తులకు కల్పించాల్సిన ఏర్పాట్లపై సమీక్షా సమావేశంలో చర్చించారు.

పాలెం దగ్గర రోడ్డు ప్రమాదం..

మహబూబ్ నగర్ : జిల్లాలోని పాలెం దగ్గర ఇన్నోవా- లారీ ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు.

కడపలో బీసీ సంఘాల జేఏసీ రౌండ్ టేబుల్ మీటింగ్..

కడప : జిల్లాలో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా కాపులను బీసీల్లో చేర్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని సమావేశం తీర్మానించింది.

12:44 - July 3, 2016

ఖమ్మం : చెరువుల అభివృద్ధితోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్‌ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది. ఖమ్మం జిల్లాలో రెండో విడత పనుల పురోగతి, ఆటంకాలు, పర్యవేక్షణ తీరుపై టెన్‌టీవీ ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. ఈ కథనం ప్రభుత్వంపై ప్రభావం చూపెట్టింది... వెంటనే మిషన్ కాకతీయ పనులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

చెరువుల అభివృద్ధి కోసం మిషన్ కాకతీయ..
చెరువుల అభివృద్ధితోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రెండో దశలో 921 చెరువులకు ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.320 కోట్లు మంజూరు చేసింది. గత ఐదు నెలల నుంచి చెరువుల్లో పూడిక తొలగించే పనులు చురుగ్గా సాగుతున్నాయి. దీంతో పాటు చెరువు కట్టలు పటిష్టపర్చటం, తూములు, అలుగులకు శాశ్వత మరమ్మతులు చేస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభానికి చెరువులను సిద్ధం చేసేందుకు నీటిపారుదల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. వర్షాలు కురిస్తే వచ్చే వాననీటిని చెరువుల్లో నిల్వ ఉండే విధంగా తూములకు షట్టర్లు బిగించే పనులు సాగుతున్నాయి. 2015 మార్చి 13న జిల్లాలో చెరువుల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అయితే అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో క్షేత్రస్థాయిలో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోందంటూ మిషన్ కాకతీయపై 10 టీవిలో ప్రసారం అయిన కథనం ప్రభుత్వంలో చలనం తీసుకోచ్చింది...దీనిపై జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు స్పందించారు. జిల్లాలో జరుగుతున్న మిషన్ కాకతీయ పనులపై వివరించారు.

పనులలో తప్పు జరిగితే చర్యలు తప్పవు- తుమ్మల ..
ఖమ్మం జిల్లాలో మిషన్‌ కాకతీయ పథకంపై 10 టీవీ కథనం ప్రసారం చేయడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. అధికారులు నిర్లక్ష్యంతో మిషన్ కాకతీయ పనులపై పడుతున్న ప్రభావాన్ని కళ్లకు టెన్‌టీవీ కథనం కట్టినట్లు చూపించింది.... దీనిపై ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరణ ఇచ్చారు మంత్రి తుమ్మల. కాకతీయ పనులను వర్షాకాలం రావడంతో హడావిడిగా చేస్తున్నారని అపోహలు పడుతున్నారని మంత్రి అన్నారు. మిషన్ కాకతీయ పనులను పూర్తిగా పరిశీలించిన తర్వాతనే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తామని తెలిపారు. మిషన్ కాకతీయ పనులలో ఖమ్మం జిల్లా రాష్ట్ర స్ధాయిలోనే ముందు వరుసలో ఉంది. అయితే కొన్ని చెరువుల పనులు అసంతృప్తిగా జరుగుతున్నాయి. వీటీని కూడా విశ్లేషించుకోని త్వరగా పనులు పూర్తిచేస్తే ఆయకట్టు దారులకు ఖరీఫ్ కు నీటిని అందించే అవకాశం ఉంది.

12:39 - July 3, 2016

నల్గొండ : సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజలు నీరాజనం పడుతున్నారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ ఆయన మూడో రోజు పాదయాత్ర జరుగుతోంది. తుర్కపల్లిలో ఉదయం తమ్మినేని పాదయాత్ర చేపట్టారు. యాదగిరి పొలంలో నాగలిదున్ని పాదయాత్ర చేపట్టారు. దారి పొడుగునా ముంపు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తమ సమస్యలు ఏకరువు పెడుతున్నారు. 2013 చట్టం, జీవో 123 గురించి అవగాహన కల్పిస్తూ తమ్మినేని ముందుకెళుతున్నారు. మొగిలిచర్ల, బంజర్‌, తిరుమలగిరి, రాంపూర్‌ గ్రామాల్లో ఆ పార్టీ తెలంగాణ కార్యదర్శి తమ్మినేని ఆధ్వర్యంలో యాత్ర సాగుతోంది. పాదయాత్రకు సీపీఐ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి..తమ్మినేని కలుసుకున్నారు. సీపీఐ నేతలు కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. అంతేగాకుడా ఇతర ప్రజా సంఘాలు, ఇతర నేతలు మద్దతు పలికారు. రాత్రి లక్ష్మీపూర్ లో తమ్మినేని బస చేయనున్నారు. సోమవారం ఏటిగడ్డ కిష్టాపూర్ లో పాదయాత్ర ముగియనుంది. ఇందుకు పార్టీ బహిరంగసభ నిర్వహించనుంది.

12:34 - July 3, 2016

విశాఖపట్టణం : హైకోర్టు విభజన సమస్య పరిష్కారానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్, ఇద్దరు సీఎంలు, సుప్రీంకోర్టు చోరవ తీసుకోవాలని సీపీఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పేర్కొన్నారు. హైకోర్టు విభజన.. రాష్ట్ర విభజన వల్ల ఏర్పడిన సున్నితమైన సమస్య అని, హైకోర్టును తక్షణం ఏపీలో ఏర్పాటు చేయాలని, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబును కోరుతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సాంకేతిక కారణాల వల్ల తిరస్కారం అనటం సరికాదన్నారు. అయితే... పార్టీ ఫిరాయింపులకు తమ పార్టీ వ్యతిరేకమన్నారు. గుజరాత్‌ రాష్ట్రం తిరస్కరించిన అణువిద్యుత్‌ కేంద్రాన్ని కొవ్వాడలో ఏర్పాటు చేస్తామనటం ఏమాత్రం సరికాదని రాఘవులు వ్యాఖ్యానించారు.

12:30 - July 3, 2016

హైదరాబాద్ : ఎంఐఎం గుర్తింపును రద్దు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్ చేశారు. నగరంలో ఐసిస్ అనుమానితులు పట్టుబడిన సంగతి తెలిసిందే. దీనిపై ఆదివారం ఎమ్మెల్యే రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదులకు ఎంఐంఎం మద్దతిస్తోందని, అన్ని విధాలుగా పార్టీ సపోర్టు చేస్తుందని బహిరంగంగా వ్యాఖ్యానించారని పేర్కొన్నారు. అసదుద్దీన్‌ ఓవైసీపై దేశద్రోహం కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్‌ చేయాలన్నారు. కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి తెలంగాణలోని పరిస్థితిని వివరిస్తానని చెప్పారు. బంగారు తెలంగాణ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ కష్టపడుతున్నారని, ఉగ్రవాదులకు సపోర్టునిచ్చే పార్టీతో మిత్రపక్షంగా ఉంటే బంగారు తెలంగాణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.

 

12:27 - July 3, 2016

హైదరాబాద్ : ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తూ బెదిరిస్తున్నారని బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ పాలమూరులో ఆయనపై టీఆర్ఎస్ నేతలు దాడికి దిగిన సంగతి తెలిసిందే. దీనిపై ఆదివారం ఉదయం నాగం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రాజెక్టుల నిర్మాణంలో భారీగా అవినీతి జరుగుతోందని నాగం తెలిపారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పనులను తాను అడ్డుకోలేదని స్పష్టం చేశారు.. 18 ప్యాకేజీల్లో తాను కేవలం 4 ప్యాకేజీలపైనే కోర్టుకు వెళ్లానని తెలిపారు.. ప్రశ్నించినవారిపై దాడులు చేస్తూ బెదిరిస్తున్నారని మండిపడ్డారు.

12:24 - July 3, 2016

ఢిల్లీ : సుప్రీం ప్రధాన న్యాయమూర్తితో బార్ అసోసియేషన్ సభ్యుల భేటీ కొద్దిసేపటి క్రిందట ముగిసింది. ఆందోళన విరమించాలని తెలంగాణ న్యాయవాదులను సీజేఐ కోరారు. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. న్యాయాధికారుల కేటాయింపులు, హైకోర్టు విభజనలపై వీరు ఆందోళన చేపట్టారు. న్యాయవాదులు చేస్తున్న ఆందోళనలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టి సారించారు. తనతో చర్చించాలని టి.బార్ అసోసియేషన్ బృందానికి సూచించారు. దీనితో బృందం ఢిల్లీకి చేరుకుని ఆదివారం ఉదయం సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ను కలిశారు. ఈ భేటీలో వకీళ్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమావేశం సందర్భంగా న్యాయవాదులు జడ్జీల నియామకంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సుప్రీంకోర్టు సీజేకు వివరించారు. హైకోర్టును తక్షణమే విభజించాలని కోరిన న్యాయవాదులు సస్పెండ్ చేసిన న్యాయాధికారులను విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తాము చెప్పిన విషయాలు సానుకూలంగా విన్నారని.. తెలంగాణ లాయర్లు తెలిపారు. తమ మీద నమ్మకం ఉంచి ప్రస్తుతానికి ఉద్యమాన్ని వాయిదా వేసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచించినట్టు తెలిపారు. త్వరలో తమ సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుందని తెలంగాణ అడ్వకేట్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మూడు డిమాండ్లు..
తెలంగాణ న్యాయాధికారులు సుప్పీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌ఠాకూర్‌ను కలిశారు. 9మంది తోకూడిన న్యాయమూర్తుల బృందం సుప్పీం సీజేకు సమస్యలను వివరించింది. ప్రధానంగా మూడు డిమాండ్లను సీజేముందు ఉంచినట్టు అడ్వోకేట్లు తెలిపారు. ఇప్పటిదాకా చేపట్టిన న్యాయాధికారుల నియామకాలను రద్దు చేయాలి, న్యామూర్తులపై సస్పెషన్‌ ఎత్తివేయాలి, అలాగే హైకోర్టు విభజనను త్వరగా తేల్చాలని కోరినట్టు తెలంగాణ న్యాయవాదులు అంటున్నారు. మరింత విశ్లేషణ కోసం వీడియో చూడండి.

కొనసాగుతున్న సీపీఎం పాదయాత్ర..

మెదక్ : మల్లన్న సాగర్ నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ సీపీఎం పార్టీ చేపట్టిన పాదయాత్ర నాలుగో రోజుకు చేరుకుంది. తుర్కపల్లిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాదయాత్ర ప్రారంభించారు. భూ నిర్వాసితులతో మాట్లాడుతూ తమ్మినేని ముందుకు సాగుతున్నారు. నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొగిలిచర్ల, బంజర్, తిరుమలగిరి, రాంపూర్ లో పాదయాత్ర జరగనుంది.

ఎంఐఎం గుర్తింపు రద్దు చేయాలి - రాజ్ నాథ్ సింగ్..

హైదరాబాద్ : పాతబస్తీ ఉగ్రవాదుల అడ్డాగా మారిందని, పాతబస్తీలో 50 ఉగ్రవాదులు అరెస్టయ్యారని ఎమ్మెల్యే రాజా సింగ్ పేర్కొన్నారు. పాతబస్తీలో పోలీసులు ఎంఐఎంకు భయపడి పనిచేస్తున్నారని ఆరోపించారు. చిత్తశుద్ధితో పనిచేస్తే స్లీపర్ సెల్స్ బయటపడుతాయని, టెర్రరిస్టులకు మద్దతునిచ్చే ఎంఐఎం గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అసదుద్దీన్ పై దేశద్రోహం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, ఎంఐఎంతో టీఆర్ఎస్ మిత్రపక్షంగా ఉండొద్దని సూచించారు.

సమస్యలు పరిష్కరిస్తామన్నారు - టీఎస్ బార్ అసోసియేషన్..

ఢిల్లీ : సమస్యలు పరిష్కరిస్తామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ హామీనిచ్చారని హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. న్యాయాధికారుల నియామకాలపై కేంద్రం గైడ్ లైన్స్ లేకుండా నియామకాలు జరపడంపై న్యాయశాఖ మంత్రితో చర్చిస్తానని హామీనిచ్చారని, ఆందోళన విరమణపై సమావేశమై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

భద్రాచలానికి పెరుగుతున్న వరదనీరు..

ఖమ్మం : భద్రాచలానికి వరదనీరు పెరగుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 26.5 అడుగులుగా ఉంది. ఎగువ రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో వరద నీరు పోటెత్తుతోంది.

రెండు చిరుతలను చంపిన వేటగాళ్లు..

ఖమ్మం : చండ్రుగొండ (మం) అబ్బుగూడెం అటవీ ప్రాంతంలో రెండు చిరుతలను వేటగాళ్లు చంపారు. ఫారెస్టు అధికారులు కేసు నమోదు చేశారు. వేటగాళ్లు పరారీలో ఉన్నారు.

 

యాదాద్రి అభివృద్ధిని స్వాగతిస్తున్నాం - జానారెడ్డి..

నల్గొండ : లక్ష్మీనరసింహ స్వామిని టి.కాంగ్రెస్ నేత జానారెడ్డి దర్శించుకున్నారు. యాదాద్రి అభివృద్దిని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. మల్లన్న సాగర్ ముంపు బాధితులకు 2013 భూ సేకరణ చట్టం కింద పరిహారం చెల్లించాలని, పార్టీ ఫిరాయింపులపై లక్ష్యంగా టీఆర్ఎస్ పనిచేస్తోందన్నారు.

ముగిసిన సుప్రీం చీఫ్ జస్టిస్ తో టి.బార్ అసోసియేషన్ సమావేశం..

ఢిల్లీ : సుప్రీం చీఫ్ జస్టిస్ తో తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ జరిపిన సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. న్యాయాధికారుల కేటాయింపులు, విభజనలపై చర్చించారు. న్యాయ నియామకాల వివాదంపై సీజేకు లాయర్లు వివరించారు.

11:29 - July 3, 2016

నార్త్ ఇండియాలో పెంపుడు జంతువుల కిడ్నాప్ కలకలం సృష్టిస్తున్నాయి..పీఎస్ లో కొండచిలువ..టాయిలెట్ లో కొండచిలువ..ప్రియాంక చంకలపై చర్చ..కొత్త కారు కొన్న షారుఖ్..కడుపులో శివుడు ఉన్నాడంటున్న సోఫియా..చంద్రబాబును తిట్టేసిన ఎమ్మెల్యే రోజా...అరవింద్ కేజ్రీవాల్, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మధ్య ముదురుతున్న కొట్లాట.. తదితర అంశాలపై విశ్లేషణ చూడాలని అనుకొంటే వీడియో క్లిక్ చేసేయండి..

11:25 - July 3, 2016

ప్రియాంక చోప్రా మాజీ ప్రపంచ సుందరి..'రాం చరణ్' తుఫాన్ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ హాలీవుడ్ లో కూడా హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం ఈమెపై సోషల్ మీడియాలో ఓ చర్చ జరుగుతోంది. ప్రియాంక చోప్రా మాగ్జిమ్ కవర్ పేజీ పై కళ్ళు బైర్లు కమ్మేలా ఓ ఫోజిచ్చింది. అయితే ఆ ఫోటోలో ప్రియాంక ఆర్మ్ పిట్ (చంకలు) చాలా నున్నగా ఉండటంతో ఫోటో షాప్ లో చేసి మన మీదకు వదిలారు అంటూ నెటిజన్లు రెచ్చిపోయారు. దీనిపై తెగ చర్చ జరిగింది. ఈ ఆర్మ్ పిట్ లపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

11:16 - July 3, 2016

నార్త్ ఇండియాలో పెంపుడు జంతువుల కిడ్నాప్ లు అధికమౌతున్నాయి. ఇటీవలే ఉత్తర్ ప్రదేశ్ లో గుర్తు తెలియని వ్యక్తులు గొర్రెను కిడ్నాప్ చేశారు. తన గొర్రెను కిడ్నాప్ చేశారంటూ సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగతనం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపులు చేపట్టారు. నార్త్ ఇండియాలో పెంపుడు పందిని కూడా కిడ్నాప్ చేశారు. ఇది చూసిన పక్కింటి కుక్క కారును వెంబడించిందంట. కారు ఆపిన ఆ వ్యక్తులు కుక్కను కూడా ఎత్తుకెళ్లారు. ఈ కుక్క ఖరీదు కావడం..ప్రముఖలది కావడంతో పోలీసులు విస్తృతంగా గాలింపులు చేపట్టారు. తాము దొరికపోతామనే ఉద్దేశ్యంతో ఆ కుక్కకు బొచ్చెను మొత్తం తీసేశారు. చివరకు కుక్క దొరికింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం పలు ప్రాంతాల్లో కుక్కల కోట్లాట చేస్తున్నారంట. ఢిల్లీలో కుక్కల కిడ్నాప్ లు అధికమయ్యాయంట. గతంలో ఓ మంత్రి బర్రెను కూడా దొంగిలించారు. ఈ కేసులో ముగ్గురు పోలీసులను కూడా సస్పెండ్ చేశారు. ఏడాదిన్నర తరువాత బర్రె దొరికింది. మరోవైపు మారుతీ కారులో ఓ బర్రెను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. దీని గురించి మరింత తెలుసుకోవాలని అనుకుంటున్నారా ? ఆలస్యం దేనికి వీడియో క్లిక్ చేయండి.

11:00 - July 3, 2016

బాలకృష్ణ..వందో చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి' చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే మొరాకో వెళ్లి వచ్చిన చిత్ర యూనిట్ నగరంలోని పలు ప్రాంతాల్లో షూటింగ్ జరిపింది. తాజాగా జార్జియాకు వెళ్లనుంది. అక్కడ భారీ షెడ్యూల్ నిర్వహించనుంది. ఈనెల 4వ తేదీ నుండి మూడో షెడ్యూల్ జరుగుతుందని, ఈ షెడ్యూల్ లో క్లైమాక్స్ చిత్రీకరించడం జరుగుతుందని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ భారీ షెడ్యూల్ లో శాతవాహన సైనికులకు, గ్రీకు సైనికులకు మధ్య పోరాట సన్నివేశాలుంటాయని పేర్కొన్నారు. సుమారు వేయి మంది సైనికులు 300 మంది గుర్రాలు..20 రథాలతో జార్జియాలోని మౌంట్ కజ్ బెగ్ పర్వతం వద్ద సన్నివేశాల చిత్రీకరణ ఉంటుందన్నారు. మొరాకోలో మొదటి షెడ్యూల్ లో యాక్షన్ పార్ట్ చిత్రీకరించినట్లు తెలిపారు. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్ ప్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై.లి. పతాకంపై వై. రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి బాలయ్య పోరాటాలు ఎలా ఉన్నాయో చూడాలంటే తెరపై చూడాల్సిందే..

పేకాట ఆడుతూ చిక్కిన మాజీ ఎమ్మెల్యే..

హైదరాబాద్ : పంజాగుట్టలోని హరితప్లాజాలో పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన వారిలో మాజీ ఎమ్మెల్యే ఉండడం గమనార్హం. రూ. 5 లక్షలు, రెండు కార్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు.

10:48 - July 3, 2016

ఢిల్లీ : సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ మళ్లీ వార్తలో నిలిచారు. ఆయన తీసిన 'వీరప్పన్' చిత్రంపై స్మగ్లర్‌ వీరప్పన్‌ భార్య ముత్తులక్ష్మి మండిపడ్డారు. తన భర్తపై తీసిన సినిమా పూర్తిగా కల్పితంగా ఉందని, దర్శకుడు అసత్యాలను తన భర్తకు అంటగట్టేవిధంగా సినిమా తీశారని ఆరోపించారు. రామ్‌గోపాల్‌ వర్మ సినిమా తీసేముందు చెప్పింది ఒకటి.. సినిమాలో చూపించింది మరొకటని ఆమె తప్పుబట్టారు. రామ్‌గోపాల్‌ వర్మ నమ్మకద్రోహి అని ముత్తులక్ష్మి తీవ్రంగా విమర్శించారు.

10:41 - July 3, 2016

రంగారెడ్డి : జిల్లాలోని కీసరలో విషాదం నెలకొంది. కుందన్‌పల్లిలో ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో భార్యను చంపి.. తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. మహేష్, రజనీ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. మహేష్ కూలి పనిచేస్తూ మద్యానికి బానిసయ్యాడు. శనివారం రాత్రి మద్యం తాగి వచ్చిన మహేశ్‌ భార్యతో తీవ్రంగా గొడవపడ్డాడు. కోపంతో ఊగిపోతూ కత్తితో భార్య గొంతుకోసేశాడు. ఆ తర్వాత తానుకూడా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. చిన్నారుల అరుపులతో స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మహేశ్‌ కూడా ఆస్పత్రిలో మృతి చెందాడు. దీనితో పిల్లలు ఒంటరయ్యారు. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

 

10:37 - July 3, 2016

ఖమ్మం : జిల్లా భద్రాచలం దగ్గర జీవనది గోదావరి నది నీటిమట్టం పెరుగుతోంది. ప్రస్తుతం నది నీటిమట్టం 28 అడుగులకు చేరింది. దీంతో స్నానఘట్టాలు మునిగిపోయాయి. భద్రాచలం ఎగువ ప్రాంతాలైన మణుగూరు, ఏటూరునాగారం తదితర ప్రాంతాల్లో గత నాలుగు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తుండడం, వాగులు, వంకలు పొంగిపోర్లడంతో ఆ నీరంతా గోదావరిలోకి చేరింది. అంతేగాక గోదావరి నదికి ఉప నదులైన కిన్నెరసాని, తాలిపేరు నదుల గేట్లు తెరవడంతో ఆ నీరంతా గోదావరి నదిలోకి వచ్చి చేరింది. అంతేగాక మహరాష్ర్టలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరవడంతో ఎగువ నీరంతా గోదావరి నదిలోకి భారీగా చేరింది.

10:35 - July 3, 2016

ఢిల్లీ : ఉత్తరాది రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. కొండచరియలు విరిగిపడటంలో పలువురు సజీవ సమాధి అయ్యారు. ముంబయి పట్టణంలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో వర్షాల కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో 11 మంది మృత్యువాతపడ్డారు. ఇందులో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. పిలిభిత్‌ జిల్లాలో పిడుగుపాటుకు గురై ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అలహాబాద్‌లో గోడకూలి ఐదుగురు కూలీలు సజీవ సమాధి అయ్యారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు భవనాలు దెబ్బతిన్నాయి.

అల్పపీడనం..
ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 24 గంటల్లో తెలంగాణ, కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు.

10:32 - July 3, 2016

ఢిల్లీ : ఉత్తరాఖండ్‌ను వరద విలయం మళ్లీ కుదిపేస్తోంది. రెండేళ్ల క్రితం విధ్వంసం సృష్టించిన భారీ వర్షాలు, వరదలను మరువకముందే మరోసారి అలాంటి పరిస్థితులే అక్కడ నెలకొన్నాయి.ఉత్తరాఖండ్‌లో ... వరుస ప్రమాదాలు విషాదాన్ని నింపుతున్నాయి. కొద్దిరోజులుగా ఎడతెరిపిలేకుండా పడుతున్న వర్షాలకు పలుప్రాంతాల్లో రోడ్లు కోతకు గురైయ్యాయి. చక్రాప్రాంతంలో రోడ్డు కోతకు గురవడంతో ఓ బస్సు లోయలోకి పడిపోయింది. ఈప్రమాదంలో 18 మంది ప్రయాణీకులు మృత్యువాత పడ్డారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గత నాలుగు రోజులు గా ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వానల కారణంగా వరదల తాకిడీకి పలుచోట్ల రోడ్లు నీట మునిగాయి. పలు చోట్ల ఇళ్లు కూలిపోయాయి. ఇప్పటి వరకు 17 మంది మృతి చెందినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి హరీష్‌రావత్ ప్రకటించారు. మరో పదిహేను మంది తప్పిపోయినట్టు వెల్లడించారు. వరదలను పర్యవేక్షించేందుకు కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పరిస్తితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు వెల్లడించారు..మరో పక్కఎన్డీఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి..

10:24 - July 3, 2016

ఢిల్లీ : ఉమ్మడి హైకోర్టును విభజించి తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని న్యాయాధికారులు, న్యాయవాదులు చేపడుతున్న ఆందోళన తెరపడనుందా ? అనేది కొద్దిసేపటిలో తేలనుంది. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో న్యాయవాదులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఠాకూర్ దృష్టి కేంద్రీకరించారు. సమస్యను చర్చించాలని తెలంగాణ న్యాయవాదులకు సూచించారు. దీనితో మోహన్ రావు అధ్యక్షతన 9 మంది హైకోర్టు బార్ అసోసియేషన్ బృందం ఢిల్లీకి చేరుకుంది. ఆదివారం ఉదయం ఠాకూర్ తో భేటీ అయ్యారు. న్యాయాధికారుల కేటాయింపులు, హైకోర్టు విభజన అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. అందులో భాగంగా న్యాయవాదులు ఓ నివేదిక కూడా సమర్పించనున్నారు.

విభజన జరిగే వరకు ఆందోళన ఆపమంటున్న న్యాయవాదులు...
కేంద్రం హైకోర్టు విభజన విషయంలో తాత్సారం చేస్తుండటంతో విధిలేక తాము ఆందోళన చేయాల్సి వస్తోందని చెప్పారు. హైకోర్టు విభజన జరిగే వరకు ఆందోళన ఆపబోమని న్యాయవాదులు స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ కేంద్రానికి సంబంధం లేదని, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకోవాలని నేతలు పేర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుగానే తెలుగు రాష్టాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బోంస్లే ఢిల్లీకి చేరుకుని సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో వరుసగా భేటీలు నిర్వహించారు. శనివారం ఉదయం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమావేశమై ఉమ్మడి హైకోర్టు పరిధిలో జరుగుతున్న పరిణామాలను భోంస్లే సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం సుప్రీం చీఫ్ జస్టిస్ తో జరుగుతున్న చర్చలు ఓ కొలిక్కి వస్తాయా ? రావా ? అనేది వేచి చూడాలి.

హైకోర్టు విభజనలో సుప్రీం జోక్యం చేసుకోవాలి - రాఘవులు..

విశాఖపట్టణం : హైకోర్టు విభజన అంశాన్ని న్యాయవాదులు వివాదాస్పదం చేస్తే న్యాయవ్యవస్థపై గౌరవం పోతుందని, సమస్య పరిష్కారానికి సుప్రీం జోక్యం చేసుకోవాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు పేర్కొన్నారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణం హడావుడిగా చేసిన ఏపీ సర్కార్ హైకోర్టు నిర్మాణం విషయంలో ఎందుకు చొరవ చూపడం లేదని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులను సీపీఎం వ్యతిరేకిస్తుందని తెలిపారు.

ఉత్తరాఖండ్ లో బస్సు ప్రమాదం..

ఉత్తరాఖండ్ : ఉత్తరాదిన వానలు కుంభవృష్టిగా కురుస్తున్నాయి. చక్ర ప్రాంతంలో రోడ్డు కోతకు గురికావడంతో 20 మంది మృతి చెందగా మరో 9 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

సుప్రీం చీఫ్ జస్టిస్ తో టి.బార్ అసోసియేషన్ బృందం భేటీ..

ఢిల్లీ : సుప్రీం చీఫ్ జస్టిస్ తో తెలంగాణ బార్ అసోసియేషన్ బృందం భేటీ అయ్యింది. న్యాయాధికారుల కేటాయింపులు, విభజనలపై చర్చించనున్నారు.

09:34 - July 3, 2016

ఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదులు చేస్తున్న ఆందోళన పతాకస్థాయికి చేరుకుంది. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని సుప్రీం చీఫ్ జస్టిస్ ను తెలంగాణ బార్ అసోసియేషన్ బృందం వివరించనుంది. న్యాయాధికారుల కేటాయింపులు, విభజనలపై చర్చించనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా న్యాయవాదులు రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. న్యాయాధికారుల కేటాయింపులు జరపాలని, హైకోర్టును విభజించాలని వారు ఆందోళన చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న పలువురు న్యాయాధికారులను హైకోర్టు సస్పెండ్ చేసింది. దీనితో న్యాయవాదులు ఆందోళనను మరింత ఉధృతం చేశారు. సమస్యలను చర్చించాలని సుప్రీం చీఫ్ జస్టిస్ సూచించారు. తెలంగాణ బార్ అసోసియేషన్ బృందం ఢిల్లీకి చేరుకుంది. వీరు పరిష్కరించాలంటున్న సమస్యలపై చీఫ్ జస్టిస్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

08:48 - July 3, 2016

వింబుల్డన్‌లో మరో సంచలనం చోటు చేసుకుంది. వరుస విజయాలతో జోరుమీదున్న సెర్బియా స్టార్, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్‌కు అనూహ్యమైన షాక్ తగిలింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన జకోవిచ్... ఓ తక్కువ ర్యాంక్ ఆటగాడి చేతిలో ఊహించని రీతిలో ఓటమిపాలయ్యాడు పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో ప్రపంచ 41వ ర్యాంకర్ సామ్ క్వెరీ , టాప్‌సీడ్ జొకోవిచ్‌పై సంచనల విజయం సాధించి ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. 2008లో మారన్ చేతిలో రెండో రౌండ్‌లోనే ఓడిన జొకోవిచ్.. ఆ తర్వాత జరిగిన ప్రతి టోర్నీలో కనీసం క్వార్టర్స్‌కైనా చేరుకున్నాడు. కానీ ఈసారి మూడో రౌండ్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2009 ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత గ్రాండ్‌స్లామ్‌లో ఇంత తొందరగా జొకోవిచ్ వెనుదిరగడం ఇదే మొదటిసారి. మొత్తానికి 1969 తర్వాత క్యాలెండర్ స్లామ్ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాలన్న కల నెరవేరలేదు. అలాగే గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో 30 వరుస విజయాలకూ బ్రేక్ పడింది.

08:46 - July 3, 2016

బెంగళూరు : నగరంలో జాతీయ క్రికెట్‌ అకాడమీలో జరుగుతున్న శిక్షణా శిబిరంలో భారత జట్టు యోగా సాధన చేసింది. బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ఆధ్వర్యంలో జట్టు సభ్యులంతా యోగా ప్రాక్టీస్ చేశారు. త్వరలో టీమిండియా వెస్టిండిస్ టూర్ కి వెళ్లనుంది.. రెండు జట్లు మొత్తం 4 టెస్టుల్లో తలపడనున్నాయి. నూతన కోచ్‌ కుంబ్లే సారథ్యంలో వెస్టిండిస్‌ టూర్‌కి సన్నద్ధం అవుతున్నారు.

08:45 - July 3, 2016

విజయవాడ : కృష్ణా పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా విజయవాడలో ఆలయాల తొలగింపు వివాదాలకు దారి తీస్తోంది. దేవాలయాలు కూల్చివేయడంపై బీజేపి స్వరం పెంచింది. దీంతో టిడిపి, బిజెపి మధ్య చిచ్చు మొదలయ్యింది. ఇప్పటి వరకు కిందిస్థాయి నేతలే టీడీపీ చర్యల్ని ఖండిస్తుంటే తాజాగా బీజేపీ నేతలు స్వరం పెంచి టిడిపి చర్యలను తప్పుబట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. పుష్కరాల పనులు, రోడ్ల అభివృద్ధి పనుల్లో భాగంగా సుమారు 25కిపైగా చిన్న చిన్న ఆలయాలను, ఒక గోశాలను అధికారులు తొలగించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేయడంతో ఇది వివాదాస్పదమైంది. గోశాలను కూల్చేయొద్దంటూ ఎంపీ నానికి విన్నవించేందుకు వెళ్లిన గోశాల నిర్వాహకుల విజ్ఞప్తిని పట్టించుకోలేదు. తీసుకున్నారు. ఈ ఘటన టీడీపీ, బీజేపీకి మధ్య ఉన్న విభేదాలను మరింతగా పెంచింది. అధిష్టానం ఆదేశాల మేరకు నరసాపురం బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు రంగంలోకి దిగి టీడీపీపై విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే దేవాలయాల తొలగింపును పీఠాధిపతులు సీరియస్‌గా తీసుకున్నారు. గోకరాజు గంగరాజుతో కలిసి ఈ నెల 4న 352 మంది స్వాములు, పీఠాధిపతులు నగరంలో ప్రదర్శన నిర్వహించనున్నారు. అయితే... పుష్కరాల కోసం నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే భాగంలోనే ఆలయాలను తొలగిస్తున్నామని... ప్రతిపక్ష నేతలు కావాలనే అడ్డుకునేందుకు కుతంత్రాలు పన్నుతున్నారన్నారంటున్నారు టీడీపీ నేతలు. ఎంపీ గంగరాజు వ్యాపారంలోంచి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తని, ఆయనకు గ్రౌండ్ లెవల్లో ఏం జరిగిందనేది తెలియదన్నారు. ఆలయాల తొలగింపు సహించబోమని బీజేపీ నేతలు హెచ్చరిస్తుంటే నగరాభివృద్ధికి అడ్డు వస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే వీరిద్దరి మధ్య వివాదం ఎంత వరకు దారి తీస్తుంది అనేది చర్చనీయాంశంగా మారింది.

08:42 - July 3, 2016

విజయవాడ : వారు సమాజంలో ఉన్నత వ్యక్తులు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రజలకు ప్రాణభిక్ష పెట్టే మహోన్నత వ్యక్తులు. అలాంటి వారు ఇప్పుడు సిగ్గుతో తలదించుకున్నారు. దోషులుగా న్యాయస్థానం ముందు నిలబడ్డారు. తాము చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతున్నారు. ఎవరు వారు? ఏంటి వారనుభవిస్తున్న శిక్ష..? తెలుసుకోవాలంటే చదవండి..సమాజంలో వైద్యులకు ఎంతో పేరు ఉంది. సామాన్య ప్రజలు వారిని దేవుళ్లుగా భావిస్తారు. అటువంటి వైద్యులు తాగుబోతులుగా మారారు... ప్రజల ప్రాణాలతో నడిరోడ్ల మీద చెలగాటమాడారు. ఫూటుగా పీకల మద్యం తాగి రోడ్ల మీద అతి వేగంతో కార్లను నడుపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు.. కోర్టు తీర్పుతో.. సమాజ సేవకు నడుం బిగించారు.

బెజవాడలో డ్రంక్ అండ్ డ్రైవ్..
బెజవాడలో డ్రంక్ అండ్ డ్రైవ్ పై.. స్పెషల్‌ డ్రైవ్‌ పెట్టిన పోలీసులు.. తనిఖీలు చేస్తుండగా ముగ్గురు వైద్యులు అతిగా మద్యం సేవించి కారు డ్రైవ్‌ చేస్తూ పట్టుబడ్డారు. నగరంలోని ప్రముఖ హాస్పిటల్స్‌కు చెందిన రమేష్, సునీల్, సతీష్ అనే ఈ ముగ్గురు డాక్టర్లను డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కింద అరెస్టు చేసి మూడవ మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరిచారు. బందరు రోడ్డులోని నిర్మల హృదయ్ భవన్ లో రెండు రోజుల పాటు వృద్ధులకు ఉచితంగా సేవ చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో ముగ్గురు వైద్యులు అక్కడ సేవలందిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే ఎంతటి వారినైనా వదిలేది లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

08:37 - July 3, 2016

ఆదిలాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ రోజుకో మలుపు తిరుగుతోంది. ఆదిలాబాద్‌ జిల్లాలో ఇప్పటివరకు మంచిర్యాల జిల్లా ఒకటే ఏర్పాటు కాబోతుందనుకుంటుండగా తెరపైకి నిర్మల్‌ జిల్లా వచ్చి చేరింది. దానికి సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించడంతో ఆదిలాబాద్‌లో ఎన్ని జిల్లాలు ఏర్పడుతాయనే టెన్షన్‌ నెలకొంది. ఆదిలాబాద్‌ జిల్లాలో కొమరంభీమ్‌ పేరున కొత్త జిల్లా ఏర్పాటు కన్‌ఫామ్‌ అయ్యింది. అయితే తాజాగా నిర్మల్‌ను కూడా జిల్లాగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం కోరడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. ఈనెల 5న కలెక్టర్ల సమావేశంలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

నిర్మల్‌ జిల్లాలో 17 మండలాలు..
ఇక జిల్లా విస్తీర్ణాన్ని, జనాభాను మూడు జిల్లాలకు పంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు అధికారులు. మొత్తం 16,105 చదరపు కిలోమీటర్లు ఉన్న విస్తీర్ణాన్ని, 27,34,239 మందిని మూడు జిల్లాలకు పంచబోతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 52 మండలాలుండగా కొత్తగా ఐదు మండలాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో 18 మండలాలు, కొమరం భీమ్‌ జిల్లాలో 22 మండలాలు,.. నిర్మల్‌ జిల్లాలో 17 మండలాలు ఉండనున్నాయి.

ఉట్నూరు, వాంకిడి మండలాలు..
కొత్తగా నిర్మల్‌ జిల్లా ఏర్పాటు చేయబోతున్న తరుణంలో.. మంచిర్యాలకు కేటాయించిన మండలాలను ఆదిలాబాద్‌లోనే ఉంచబోతున్నారు. అలాగే ఆదిలాబాద్‌, మావల, బజర్‌హత్నూర్‌, బేల, బోథ్‌, గుడిహత్నూర్‌, ఇచ్చోడ, జైనథ్‌, తాంసీ, తలమడుగు, ఇంద్రవెల్లి, జైనూరు, కెరమెరి, నార్నూర్‌-యు, తిర్యాణి, ఉట్నూరు, వాంకిడి మండలాలు ఆదిలాబాద్‌లో ఉండనున్నాయి.

నిర్మల్‌లోనే దండేపల్లి మండలం..
కొమరం భీమ్‌ జిల్లాకు 22 మండలాలు కేటాయించినట్లు తెలుస్తోంది. కొత్తగా ఏర్పడనున్న పెంచికల్‌పేట, హాజీపూర్‌, నస్పూర్‌ మండలాలు కూడా ఇదే జిల్లాలో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. జన్నారం మంచిర్యాలలో కలపాలని నిర్ణయించినా.. తాజా ప్రతిపాదనల ప్రకారం నిర్మల్‌లో కలిపేలా ప్రణాళికలు రూపొందించారు. సీఎం హామీ ఇచ్చినా.. తర్వాత లెక్కలు మారాయి. దీనితో పాటు దండేపల్లి కూడా నిర్మల్‌లో కలపబోతున్నారు.

నిర్మల్‌ జిల్లా కోసం ప్రతిపాదనలు కోరిన ప్రభుత్వం..
కొత్త జిల్లాగా చేయాలనుకుంటున్న నిర్మల్‌లో 17 మండలాలు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో కొత్తగా ఏర్పడే సోన్‌ మండలం కూడా ఉండబోతుంది. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్‌ను జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. వైశాల్యంలో మహబూబ్‌నగర్‌ జిల్లా తర్వాత రెండో స్థానంలో ఉన్న ఆదిలాబాద్‌ను మూడు జిల్లాలుగా చేస్తే బాగుంటుందని కేసీఆర్‌కు సూచించారు. దీంతో సీఎం కార్యాలయం నుంచి.. నిర్మల్‌ జిల్లా ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపాలని అధికారులను కోరడం.. వెంటనే ప్రతిపాదనలు పంపించడం జరిగిపోయాయి.

సంతోషం వ్యక్తం చేస్తున్న నిర్మల్‌ వాసులు..
పెద్ద జిల్లా అయిన ఆదిలాబాద్‌ను రెండు జిల్లాలుగా ఏర్పాటు చేసినా పెద్దగా ప్రయోజనమేమీ ఉండదని జిల్లావాసులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా నిర్మల్‌ను కూడా జిల్లా చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో నిర్మల్‌వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నిర్మల్‌ జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచిస్తుండడంతో నిర్మల్‌వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి నిర్మల్‌వాసుల కల నెరవేరుతుందా లేదా తెలియాంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.

08:26 - July 3, 2016

గండె నిండా గాయాలు మండుతున్న గేయాలు అంటూ సమాజంలోని అవినీతి, అక్రమాలు, రాజకీయాలు, మహిళా సమస్యలపై కవితలు రాస్తున్న కవయిత్రి డా.వరలక్ష్మి. ఆమె ఇటీవలే భావతరంగాలు అనే కవితా సంపుటిని వెలువరించారు. వృత్తి వైద్యం అయినప్పటికీ ప్రవృత్తిగా కవిత్వం రాస్తున్న కవయిత్రి డా.వరలక్ష్మి వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి.

08:24 - July 3, 2016

పాటను తూటాల పేల్చితే ప్రజల గుండెల్లో చైతన్యం విస్ఫోటిస్తుంది. విషాదమైనా... వినోదమైనా పాటలోనే పరిపూర్ణత్వం చెందుతుంది. రాగ తాళ భావా యుక్తమైన గేయాలు మన మనో ప్రాంగణంలో చైతన్యదీపాలు వెలిగిస్తాయి. రసానందాన్ని కలిగిస్తాయి. అలాంటి పాటలు రాసిన గేయకవి విఠల్ రెడ్డి. సమాజంలోని అనేక విషాద దృశ్యాలను గాయాల బతుకులను గేయాలుగా మలిచిన విఠల్ రెడ్డి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

 

 

08:22 - July 3, 2016

వెయ్యేళ్ల తెలుగు సాహిత్యం ఏం చేసింది? రాజులనో మతాలనో కీర్తించింది. వర్ణ వ్యవస్థను పోషించింది. కులవ్యవస్థ ముసుగులో దళితులను వెలివాడలకు బలి చేసింది. కనిపించని మానవ హింసకు సాహిత్యం పరోక్షంగా దోహదపడింది. అయితే అనుకోని విధంగా అస్తిత్వవాదాలు సాహిత్యంలో ప్రవేశించాయి. అట్టడుగు కులాలనుండి అణువిస్ఫోటనంలా కలాలు ఎగసిపడ్డాయి. తమకు జరిగిన చారిత్రక విద్రోహాలను ఎండగట్టాయి. అలాంటి వారిలో దళిత ధిక్కార స్వరతరంగం ఎజ్రాశాస్త్రి ఒకరు. దళితులు దేవాలయాల్లో ప్రవేశించకూడదని శాసిందెవరు? అలాంటి మనువాదులే నేడు అదే దేవుణ్ణి ఎత్తుకొని దళిత వాడల్లో ఊరేగిస్తున్నారు. దళిత గోవిందం అనమంటున్నారు. ఎందుకు ? వారి కన్నీళ్లు తుడిచిన మతాలనుండి మళ్లి హిందూమతంలో చేర్చుకుని వంచించడానికా ? అంటూ దళిత రచయితలు ప్రశ్నిస్తున్నారు. రాజులు, పూజారులు అగ్రకుల దేవతలు అందరూ కలిసి దళిత బహుజనులకు చేసిన చారిత్రక విద్రోహాలను కవిత్వంగా శిల్పీకరించాడు ఎజ్రాశాస్త్రి. అంబేద్కరిజమే నిజమైన హ్యూమనిజం అంటూ చాటి చెబుతూ నిజాల ఇజాల భాస్వరం లాంటి కవిత్వం రాసిన ఎజ్రాశాస్త్రి కవిత్వాన్ని ప్రముఖ సాహితీ విమర్శకులు జి.లక్ష్మీనర్సయ్య విశ్లేషించారు. ఈయన గురించి మరింత తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

శంషాబాద్ లో పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్...

రంగారెడ్డి : శంషాబాద్ లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. 8మందిపై కేసు నమోదు చేశారు. మూడు కార్లు, ఆరు బైక్ లు, ఒక ఆటోను సీజ్ చేశారు.

కీసరలో దంపతుల ఆత్మహత్యాయత్నం...

రంగారెడ్డి : కీసరలో దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రజిత, మహేష్ దంపతులు కత్తితో గొంతు కోసుకున్నారు. వీరిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

 

08:11 - July 3, 2016

హైదరాబాద్ : ఎన్ని చట్టాలు వచ్చినా మృగాళ్లు మారడం లేదు. అభం శుభం తెలియని పసివాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా బొల్లారం పీఎస్ పరిధిలో పదేళ్ల బాలికపై అత్యాచారం జరిపి హత్య చేశాడు. శనివారం రాత్రి కలాసిగూడలో నివాసం ఉంటున్న పదేళ్ల బాలికను కిడ్నాప్ చేసిన అనీల్ కుమార్ నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. అనంతరం అత్యాచారం జరిపాడు. జరిగిన విషయం ఎవరికైనా చెబుతుందని బాలిక గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం నిందితుడు అనీల్ కుమార్ పరారయ్యాడు. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపులు చేపడుతుండగా బాలిక మృతదేహం కనిపించినట్లు స్థానికులు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు అనీల్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. నిర్భయ, హత్య కేసును నమోదు చేశారు. అనీల్ కరీంనగర్ జిల్లా వాస్తవ్యుడని తేలింది. ఇతనికి మూడు హత్య కేసులో సంబంధం ఉందని, పలుమార్లు జైలుకు వెళ్లినట్లు తెలుస్తోంది. కరీంనగర్ లో పోలీసుల గాలింపులు అధికం కావడంతో అనీల్ కుమార్ మకాం బొల్లారంకు మార్చాడు. నిందితుడు అనీల్ కుమార్ ను కోర్టులో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.

07:56 - July 3, 2016

నవ్వు వల్ల ఎన్నో ప్రయోజనాలు దాగున్నాయి. నవ్వు నాలుగు విధాల కాదు..నలభై విధాలుగా గ్రేట్ అని అంటున్నారు. మనస్పూర్తిగా నవ్వే నవ్వులో ఎక్కువ కండరాలు ముడిపడి ఉంటాయని, నవ్వు అనేది జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఒకసారి నవ్వు వల్ల ఎలాంటి ప్రయోజనాలు దాగున్నాయో చూద్దాం..
నవ్వడం వల్ల హాయిగా ఉండడమే కాకుండా పని చురుగ్గా చేసుకోగలుగుతారు. హాయిగా నవ్వుతున్న చిన్న పిల్లల ఫొటోలు, ముద్దు ముద్దు జంతువుల ఫొటోస్ చూడడం వల్ల ఆనందంగా ఉంటుంది.
నవ్వడం వల్ల ఎండోర్ఫిన్స్ విడుదలవుతాయి. ఇవి వత్తిడిని తగ్గించడానికి తోడ్పడుతాయి. నవ్వు వల్ల విడుదలయ్యే ఎండోర్ఫిన్స్ వల్ల మూడ్ లిఫ్ట్ అవుతుంది.
నవ్వు అనేది ఆరోగ్యకరమైన వ్యాయామం. బ్లడ్ ఫ్రెషర్ ను తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది.
నవ్వు వల్ల సంఘంతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. ఆనంద వెల్లివెరిస్తుంది. నమ్మకం పెంపొందించబడుతుంది.
నవ్వు వల్ల మనస్పర్థలు తొలగిపోతాయి. స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. ఇతరుల ఆలోచనలకూ గౌరవం ఇవ్వడం వల్లే వారేం అనుకుంటున్నారు అనే దానిపై దృష్టి సారించగలుగుతాం.

07:54 - July 3, 2016

వర్షాకాలం వచ్చేసింది. ఈ కాలంలో ముఖం జిడ్డుగా మారడం..ఇతరత్రా సమస్యలు ఎదుర్కొంటుంటారు. దీనివల్ల మొటిమలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఇందుకు ఇంట్లోనే కొన్ని ఫేస్ ప్యాక్ లు తయారు చేసుకోవచ్చు.
మూడు స్పూన్ల ఓట్ మీల్, ఒక గుడ్డు, ఒక స్పూను తేనె, పెరుగును ఓ బౌల్ లోకి తీసుకోవాలి. వీటన్నింటినీ కలిపి ఫ్రిజ్ లో పది నిమిషాలు ఉంచాలి. అనంతరం ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని ఈ ప్యాక్ ను రాసుకోవాలి. అనంతరం చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
ఇక చర్మం మీద మచ్చలున్న వారు ఒక స్పూన్ గంధం పొడి, అరకప్పు రోజ్ వాటర్, చిటికెడు పసుపు తీసుకోవాలి. వీటన్నింటినీ ఓ బౌల్ లో తీసుకుని పేస్టులా తయారు చేసుకోవాలి. అనంతరం ఈ పేస్ట్ ను ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాలు ఉంచాలి. అనంతరం చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

07:52 - July 3, 2016

ఇంటిలో వాతావరణం ఎంత మంచిగా ఉంటుందో కుటుంసభ్యులు ఆహ్లాదంగా..ఆరోగ్యకరంగా ఉంటారు. కళకళలాడే ఇళ్లు కంటికి ఇంపునే కాదు..ఒంటికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇంటి చుట్టూ చెట్లు ఉంటే ఇంటికి అందాన్ని తెస్తాయి. ఇంట్లో చెట్లు ఉండడం వల్ల కొన్ని లాభాలు..
ఇంట్లో కొన్ని రకాల మొక్కలు పెట్టుకోవడం వల్ల ఇంట్లోకి దోమలు రాకుండా ఉంటాయి.
ఇంటి చుట్టూ పూల మొక్కలు, తీగ మొక్కలు పెట్టుకోవడం వల్ల ఇల్లు ఒక ఉద్యానవనంలా ఉంటాయి. అంతేకాదు, వాతావరణం కాలుష్యం కూడా తగ్గించుకుంది.
కొన్ని మొక్కలు ఔషధగుణాలు ఉండి ఎంతో ఉపయోగపడుతాయి. తులసి, కలబంద, బ్రహ్మజముడు లాంటి మొక్కలు ఇంటి బయటపెట్టుకోవడడం వల్ల మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుంది.
ఏదైనా ఫంక్షన్ ఉన్న సమయంలో ఇతరులకు బహుమతులు ఇచ్చే బదులు పూల మొక్కలు ఇవ్వాలి. వీటినివ్వడం వల్ల ఆ మొక్కలను చూడగానే మనమే గుర్తొస్తాం.
మనీప్లాంట్, క్రోటాన్స్ మొక్కలు గుమ్మానికిరువైపులా పెట్టడం వల్ల ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది.
ఇంట్లోకి గాలి వెలుతురు బాగా వచ్చేలా తలుపులు, కిటికీలు తెరిచి ఉంచాలి.

బొల్లారంలో దారుణం..

హైదరాబాద్ : బొల్లారంలో దారుణం చోటు చేసుకుంది. పదేళ్ల బాలికపై నిందితుడు అత్యాచారం జరిపి హత్య చేశాడు. నిందితుడు అనీల్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సుప్రీం చీఫ్ జస్టిస్ ను కలువనున్న టి.బార్ అసోసియేషన్..

ఢిల్లీ : నేడు సుప్రీం చీఫ్ జస్టిస్ ను తెలంగాణ బార్ అసోసియేషన్ సభ్యులు భేటీ కానున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొద్ది రోజుల కిందట నుండి న్యాయవాదులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. హైకోర్టును విభజించాలని, న్యాయాధికారులపై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

 

మంత్రి లక్ష్మారెడ్డితో మరోసారి ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాల భేటీ..

హైదరాబాద్ : నేడు మంత్రి లక్ష్మారెడ్డితో మరోసారి ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు భేటీ కానున్నాయి. వీరి సమస్యలు నేడు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

సివిల్ సర్వీసెస్ సర్టిఫికేట్ల పరిశీలన..

విజయవాడ : సివిల్ సర్వీసెస్ లో ఉచిత కోచింగ్ కోసం ఎంపికైన కాపు, ఒంటరి, తెగల, బలిజ యువతకు సర్టిఫికేట్ల పరిశీలన జరగనుంది. ఉదయం 10గంటలకు అధికారులు పరిశీలన చేయనున్నారు.

కాకతీయ వర్సిటీలో విషాదం..

వరంగల్ : కాకతీయ యూనివర్సిటీలో విషాదం నెలకొంది. బాత్ రూంలో జారిపడిన పాలిటెక్నిక్ రీసెర్చ్ స్కాలర్ మృతి చెందాడు. ఇతని మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు.

06:44 - July 3, 2016

హైదరాబాద్ : గోదావరి నదిపై నిర్మించే ప్రాజెక్టులపై తెలంగాణ-మహారాష్ట్ర మధ్య మహా ఒప్పందానికి రంగం సిద్ధమైంది. ఇందుకోసం అధికారులు డీపీఆర్‌ రెడీ చేశారు. మరోవైపు ముఖ్యమంత్రుల సమావేశం ఖరారైన నేపథ్యంలో తుమ్మిడిహట్టి, కాలేశ్వరం, కొరటా చనాఖా బ్యారేజీలు పూర్తి చేయడంపై ఇరిగేషన్‌ శాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈనెల 15న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పందం చేసుకోనున్నారు. దీని కోసం ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని అంశాలపై కేసీఆర్‌ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.

మేడిగడ్డ..
ఇక మేడిగడ్డ దగ్గర తెలంగాణ నిర్మిస్తున్న బ్యారేజీకి మహారాష్ట్ర సర్కార్‌ ఇప్పటికే హైడ్రాలజీ అనుమతులిచ్చింది. దీంతో కీలక అంకం పూర్తయింది. తెలంగాణ పంపిన ప్రాజెక్టు డిజైన్లపై ఇప్పటికే మహారాష్ట్ర ఇంజనీర్లు, ఇరు రాష్ట్రాల సీడీవోల సంయుక్త భేటీలో అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌ వల్ల మహారాష్ట్రలో కేవలం 55 హెక్టార్లు మాత్రమే ముంపు ఉండడంతో పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. ఇరురాష్ట్రాలకు నష్టం లేకుండా.. ప్రయోజనకరంగా ఉండేవిధంగా తెలంగాణ సర్కార్‌ ప్లాన్‌ చేస్తోంది. ఈ మేరకు ఈనెల 15న ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పందం చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

కాలేశ్వరం పనులు..
మరోవైపు కాలేశ్వరం పనుల్లో వేగం పెంచాలని హరీష్‌రావు అధికారులను ఆదేశించారు. 18 నెలల్లో 9 విద్యుత్‌ సబ్‌స్టేషన్లు పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు మంత్రి.. కేసీఆర్‌కు తెలిపారు. అదేవిధంగా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం రిజర్వాయర్ల పనులు కూడా వేగం పుంజుకున్నాయి. సబ్‌స్టేషన్ల నిర్మాణానికి భూసేకరణ పనులు కూడా జరుగుతున్నాయి. ఇక ప్యాకేజీ 6, ప్యాకేజీ-8లకు చెందిన పంపుహౌస్‌లను వచ్చే ఏడాది జులై చివరినాటికి పూర్తి చేయాలని హరీష్‌రావు అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ప్యాకేజీ 10, 11, 12 పంప్‌హౌస్‌లను 2017 సెప్టెంబర్‌ నాటికి, ప్యాకేజీ-20 పంప్‌హౌస్‌ నిర్మాణం వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి పూర్తి చేసేందుకు లక్ష్యం పెట్టుకున్నారు.

06:41 - July 3, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ సచివాలయం తరలింపు వేగం పుంజుకుంది. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కొత్త రాజధానికి చేరుకోగా మరికొన్ని తరలింపుకు సిద్ధమవుతున్నాయి. సచివాలయానికి సంబంధించి నాలుగు శాఖలు ఇప్పటికే వెలగపూడిలో కొలువుదీరగా మరిన్ని శాఖలు అమరావతికి వెళ్లేందుకు రెడీ అవుతున్నాయి. అవాంతరాలన్నీ అధికమించి జులై చివరికల్లా అక్కడినుంచి పాలన సాగేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక్క సచివాలయం తప్ప మిగిలిన చాలా కార్యాలయాలు హైదరాబాద్‌ నుంచి బెజవాడకు మకాం మార్చాయి. ఐ అండ్‌ పీఆర్‌ శాఖనుంచి ప్రజారోగ్య సంక్షేమశాఖ.. హౌసింగ్‌ భూగర్భ జలవనరుల తదితర శాఖలు విజయవాడకు వెళ్లిపోయాయి.. ఇక మిగిలిన సెక్రటేరియట్‌ తరలింపు పనులు కూడా వేగంగా సాగుతున్నాయి.

సీఎస్ సమీక్షలు..
వెలగపూడిలో బ్లాకులవారీగా నిర్మాణాలు పూర్తిచేసి శాఖలన్నీ తరలించాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. జులై 6న కొన్ని... 15న మరికొన్ని... 21న మిగిలిన శాఖల్ని పంపేందుకు కసరత్తు నడుస్తోంది.. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వెలగపూడిలో పనులకు కొంత ఆటంకం కలిగే అవకాశముంది. అప్పుడు తరలింపు మరికాస్త ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఏపీకి సంబంధించి 125కి పైగా విభాగాధిపతుల కార్యాలయాలున్నాయి. ఇందులో దాదాపు 50శాతం ఆఫీసులు కొత్త రాజధానికి వెళ్లిపోయాయి. మిగిలిన శాఖలను ఈ నెల 21లోగా అక్కడికి పంపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. 9, 10 షెడ్యూల్‌లోని సంస్థలు మినహా అన్ని సంస్థల్ని అమరావతికి పంపేలా ప్లాన్‌ చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్‌ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు.. జులై చివరికల్లా షిఫ్టింగ్ పూర్తిచేసి పాలన సాగించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.

06:37 - July 3, 2016

హైదరాబాద్ : కుర్చీలో కూర్చున్నాక అసలు రంగు బయటపడుతోంది. పార్టీపై ఉద్యమం నాటి క్రేజ్‌లేదు. భావోద్వేగాలను రెచ్చగొట్టి లాభపడటానికి ఛాన్స్‌ లేకుండా పోతోంది. అన్నం పెట్టని నినాదాలు ఎందుకని జనం ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వంపై పోరుబాట పడుతున్నారు. దీన్ని ఎదుర్కొనేందుకు అధికారపార్టీ ప్రజాఉద్యమాలకు కౌంటర్‌ ఉద్యమాలు సృష్టిస్తోంది. అన్యాయం గురించి అడిగితే దాడులు తప్పవనే సిగ్నల్స్‌ ఇస్తోంది. తెలంగాణా ఉద్యమం సమయంలో ప్రతి చిన్న సమస్యపై తీవ్రంగా రియాక్టైన టీఆర్‌ఎస్‌ నాయకులు... అధికారంలోకి వచ్చాక కూడా అదే తీరును కొనసాగిస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలపై ప్రతిదాడే వ్యూహంగా అమలు చేస్తున్నారు. ప్రాజెక్టుల నిర్మాణాలపై వస్తున్న వివాదాల్ని ఎదుర్కొన్నేందుకు పార్టీశ్రేణుల్ని కౌంటర్‌ ఉద్యమాలకు పురికొల్పుతోందంటున్నారు జనం.

నోళ్లు మూయించేందుకు అన్ని దారులు..
ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు సరైన సమాధానాలు ఇస్తున్నామా.....లేదా అనేదాని కంటే... ఆరోపణలు చేసిన వారినోళ్లు మూయించేందుకు అన్ని దారులను అధికార పార్టీ నేతలు వెతుకుతున్నారు. ఓవైపు మల్లన్న సాగర్ భూసేకరణ విషయంలో టీజాక్ చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూనే మరో వైపు ప్రాజెక్ట్‌ నిర్మాణాన్నిత్వరగా పూర్తి చేయాలనే డిమాండ్‌తో పార్టీ శ్రేణుల్ని రోడ్డెక్కిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు, టీజాక్ నేతలు గ్రామాల పర్యటనకు వస్తే గ్రామ స్థాయి కార్యకర్తలతోనే అడ్డుకునే వ్యూహాన్ని అమల్లోపెడుతోంది అధికారపార్టీ. ఈ ఎత్తుగడలో భాగంగానే పాలమూరు జిల్లా పెండింగ్ ప్రాజెక్టులపై గళం విప్పుతున్న నాగం జనార్ధన్ రెడ్డిపై భౌతిక దాడికి యత్నించినట్టు తెలుస్తోంది. ప్రాజెక్టులు అడ్డుకునేందుకు ఎవరు ప్రయత్నం చేసినా నాగం కు పట్టిన గతే పడుతుందని ఆ పార్టీ నేతలు హెచ్చరించడం గులాబీ పార్టీ ఉద్దేశాన్ని వెల్లడిస్తోంది.
ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు... అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అనుసరిస్తున్న పంథా ప్రజల్లోకి రాంగ్‌మెసేజ్‌ను పంపుతోంది. ఉద్యమానికి కౌంటర్‌ ఉద్యమాలు చేయడం... చివరికి తమను ప్రశ్నించడమే నేరం అన్నట్టు... భౌతిక దాడులకు దిగుతామంటూ బెదిరించడంపై జనం మండిపడుతున్నారు. అధికారంలోకి వచ్చాక గులాబీ పార్టీ అసలు రూపం క్రమంగా బయటపడుతోందంటున్నారు తెలంగాణ ప్రజలు.

06:33 - July 3, 2016

మహబూబ్ నగర్ : పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుపై నాగం కోర్టుకు వెళ్లడం బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య చిచ్చుపెట్టింది. నాగం తీరుపై భగ్గుమన్న గులాబీ కార్యకర్తలు మహబూబ్‌నగర్‌లో ఆయనపై దాడికి దిగారు.. దీనిని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.. రెండు వర్గాలమధ్య తోపులాటతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పాలమూరు-రంగారెడ్డి పథకంపై నాగం కోర్టుకు వెళ్లడంతో... రెండు రోజులుగా.. గులాబీ కార్యకర్తలు నాగం దిష్టిబొమ్మలను దహనం చేశారు. శనివారం ఏకంగా నాగంపై దాడికి ప్రయత్నించారు. ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో నాగం ప్రెస్‌మీట్‌ జరుగుతున్న సమయంలో... టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు హాల్‌లోకి దూసుకొచ్చారు. అద్దాలు ధ్వంసం చేసి నాగంపై దాడికి ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన బీజేపీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. రెండు వర్గాల మధ్య తోపులాటతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘర్షణలో ఫర్నిచర్‌తో పాటు మీడియా కెమెరాలు పగిలిపోయాయి.

ఖండించిన టీడీపీ..
పోలీసులు ఇరువర్గాల్ని చెదరగొట్టి... టీఆర్‌ఎస్‌ కార్యకర్తల్ని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తల తీరుపై నాగం మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ అంటే తెలంగాణ రజాకార్ల సంఘం అని ఆరోపించారు. ప్రాజెక్టులో 18 ప్యాకేజీలకుగాను తాను 4 ప్యాకేజీలపైనే కోర్టుకు వెళ్లానని నాగం స్పష్టం చేశారు. అది కూడా అనుభవంలేని కాంట్రాక్టర్లకు అప్పగించడంవల్లే కోర్టులో పిటిషన్ వేశానని తెలిపారు. నాగంపై దాడిని టీడీపీ ఖండించింది.. ప్రాజెక్టుల్లో అవినీతిని బయటపెడుతున్నందుకే ఇలా చేస్తున్నారని ఆరోపించింది. తనపై దాడి చేసినవారిపై టూటౌన్‍ పోలీస్టేషన్‌లో నాగం ఫిర్యాదు చేశారు. మరోసారి ఇలా చేస్తే ఊరుకోమని హెచ్చరించారు.

06:27 - July 3, 2016

హైదరాబాద్ : తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవల పునరుద్ధరణపై ప్రైవేటు యాజమాన్యాలతో మంత్రి లక్ష్మారెడ్డి జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ప్రతి నెల చెల్లించే 40 కోట్ల రూపాయలతో పాటు.. అదనంగా ఇప్పటికే 100 కోట్లు చెల్లించినట్లు మంత్రి తెలిపారు. విడుదల చేసే బకాయిలు సోమవారం ఆస్పత్రులకు చేరుతాయని లక్ష్మారెడ్డి తెలిపారు. మిగతా మొత్తాన్ని దశలవారీగా చెల్లిస్తామన్నారు. దీంతో అన్ని ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు యధాతథంగా కొనసాగనున్నాయి. ఇప్పటివరకు నిర్వహించని సేవలను కూడా తిరిగి కొనసాగించేందుకు ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ యాజమాన్యాల ప్రతినిధులు అంగీకరించారు. ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే మరోసారి చర్చించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆదివారం చర్చలు కొనసాగనున్నాయి. కాగా ఈనెలలోనే వందకోట్ల నిధుల చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. మిగతా 200 కోట్లు ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత విడుదల చేస్తామని మంత్రి అన్నారు. అయితే మంత్రి ప్రకటనపై ప్రైవేటు యాజమాన్యాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. బకాయిల మొత్తం 300 కోట్లు విడుదల చేయాలని ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో పాటు సర్జరీ చార్జీలను కూడా పెంచాలని డిమాండ్ చేశాయి. దీనికి ప్రభుత్వం అంగీకరించలేదు.

 

06:26 - July 3, 2016

హైదరాబాద్ : నగరంలో కుర్రకారు అర్ధరాత్రి వేళ బైక్‌లపై చక్కర్లు కొడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో పలువురు మైనర్ లు కూడా ఉంటున్నారు. బైక్ లను రోడ్డెక్కిస్తూ హుషారుగా చక్కర్లు కొడుతూ ప్రమాదం బారిన పడుతున్నారు. కళాశాలల విద్యార్థుల ఆకతాయితనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విద్యార్థులు బైక్ జోరుతో రేసింగ్‌లకు పాల్పడుతూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. నగరంలో వరుస ఘటనలు పోలీసుల్ని, అటు విద్యార్థుల తల్లిదండ్రులను బెంబేలెత్తిస్తున్నాయి. బైక్ రైసింగ్ లకు అనుమతి లేదంటూ పోలీసులు హెచ్చరిస్తున్నా యువత పెడచెవిన పెడుతోంది. శనివారం అర్ధరాత్రి జూబ్లీ హిల్స్ చెక్‌పోస్ట్‌ దగ్గర జరుగుతున్న బైక్‌ రేసింగులపై పోలీసులు దృష్టి సారించారు. అర్ధరాత్రి తనిఖీలు చేపట్టారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతున్న యువకుల నుంచి 18 బైకులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్న క్రమంలో పోలీసులతో యువకులు వాగ్వాదానికి దిగారు. దీంతో ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గాంధీభవన్ లో కార్మిక, ఉద్యోగ సంఘాల రాష్ట్ర సదస్సు...

 

హైదరాబాద్ : గాంధీభవన్ లో ఉదయం 11గంటలకు కార్మిక, ఉద్యోగ సంఘాల రాష్ట్ర సదస్సు జరగనుంది. సెప్టెంబర్ 2 సార్వత్రిక సమ్మె సందర్భంగా సన్నాహక సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జాతీయ కార్మిక సంఘాల నేతలు హాజరు కానున్నారు.

 

బైక్ ను ఢీకొన్న లారీ..ఇద్దరు ఇంజినీర్ విద్యార్థుల మృతి..

కృష్ణా : గుడ్లవల్లేరు మండలం పెంజండ్ర వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. ప్రమాదంలో మరో విద్యార్థికి గాయాలయ్యాయి.

ఆరోగ్య శ్రీ చర్చలు సఫలం..

హైదరాబాద్ : ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి ప్రైవేటు హాస్పిటల్స్ యాజమాన్యాల ప్రతినిధులతో శనివారం రాత్రి సచివాలయంలో మంత్రి లక్ష్మా రెడ్డి జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ప్రతి నెల చెల్లించే రూ.40 కోట్లతోపాటు అదనంగా రూ.100 కోట్లను ప్రభుత్వం విడుదల చేయనుంది.

జూబ్లీహిల్స్ లో బైక్ రైసింగ్..

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ లో బైక్ రైసింగ్ లు నిర్వహిస్తున్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం రాత్రి మితిమీరిన వేగంతో వాహనాలు డ్రైవింగ్ చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీనితో పోలీసులు తనిఖీలు చేపట్టి 18 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంలో యువకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నేడు, రేపు పాలీసెట్ చివరి దశ కౌన్సెలింగ్..

హైదరాబాద్ : పాలీసెట్ చివరి దశ కౌన్సెలింగ్ ను ఆది, సోమవారాల్లో నిర్వహించనున్నారు. మొదటి కౌన్సెలింగ్ లో సీటు దక్కని విద్యార్థులు, కాలేజీని మార్చుకోవాలని అనుకొనే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

5న వెటర్నరీ పాలిటెక్నిక్ కోర్సులకు కౌన్సెలింగ్...

హైదరాబాద్ : పీవీ నర్సింహరావు పశువైద్, మత్స్యశాస్త్ర విశ్వవిద్యాలయంలో పశు సంవర్థక, మత్య్స శాస్త్ర పాలిటెక్నిక్ లో చేరడానికి అర్హులైన అభ్యర్థులకు ఈనెల 5వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

 

Don't Miss