Activities calendar

12 July 2016

22:08 - July 12, 2016

ఏనుగులు దారంట ఎల్తే కుక్కలు మొరుగుతాయని సామెత..ఇట్లనే జరిగింది ఓ చోట..ఊరిపై పడి గలాటా చేస్తున్న గజరాజులను తరికొట్టింది ఓ శునకరాజం ..గబ్బర్ సింగ్ పాటకు గంతులేసిన ఎంపీ మల్లారెడ్డి... తెలంగాణ సర్కార్ గల్లా పెట్టి ఖాళీ అయ్యిందంట..ఆడబిడ్డపై గుస్సయిన ఆరోగ్య మంత్రి... రంగు రంగుల మద్యపానం మనముంగట లేసిందంటే ఎట్టుంటది? తెలంగాణల  బందుబాబుల తాగుడూ..ఊగుడూ...ఏపీలో అమ్మకానికి సర్కారు కొలువులు..వరద నీటిలో తానమాడుతున్న బుడ్డోడు..సెల్ఫీలు దిగుతున్న పోరగాల్లు...మాటమీద నిలబడని మనిషెవరు అంటే మల్లారెడ్డి అంటున్నరు జనాలు..ఇటువంటి మస్తు ముచ్చట్లును మరిన్ని ముచ్చట్లను సూడాలంటే మల్ల ఈ వీడియోను క్లిక్ చేయండ్రి..మస్తు ఖుషీ అవుండ్రి...

22:03 - July 12, 2016

ఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో కేంద్ర ఆర్థిక శాఖ ఇతర సంస్థలు కింది కోర్టు తీర్పు ఆధారంగా కాంగ్రెస్ నేతలకు ఇచ్చిన సమన్లను కోర్టు తప్పుపట్టింది. ఈ కేసుకు సంబంధించి పిటిషనర్‌ సుబ్రహ్మణ్యస్వామి సాక్షుల లిస్టుతో పాటు బలమైన ఆధారాలను పొందుపరచలేక పోయారని తెలిపింది. సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ దాఖలు చేయడానికి ఒక కారణం, లక్ష్యం అంటూ లేదని కాంగ్రెస్ తరపు న్యాయవాది హైకోర్టులో తన వాదనలు వినిపించారు. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికకు కాంగ్రెస్‌ పార్టీ తరపున రుణం పేరిట సోనియా, రాహుల్‌ 2 వేల కోట్ల ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని బిజెపి ఎంపి సుబ్రహ్మణ్య స్వామి కేసు వేశారు. ఈ కేసులో సోనియా, రాహుల్‌తో పాటు ఐదుగురు కాంగ్రెస్ నేతలను నిందితులుగా చేర్చారు. 

22:01 - July 12, 2016

ఢిల్లీ : కోల్‌ స్కాంలో సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హాకు ఉచ్చు బిగుస్తోంది. బొగ్గు కుంభ‌కోణం విచార‌ణ‌ను సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా ప్రభావితం చేసే ప్రయ‌త్నం చేశార‌ని సుప్రీంకోర్టు నియ‌మించిన పానెల్ స్పష్టం చేసింది. అడ్వొకేట్ ప్రశాంత్ భూష‌ణ్ కోర్టుకు అందించిన రంజిత్ సిన్హా ఇంటి విజిట‌ర్స్ డైరీ అస‌లైన‌దేన‌ని పానెల్ తేల్చింది. ఈ మేర‌కు సీల్డ్ క‌వ‌ర్‌లో త‌మ విచార‌ణ‌కు సంబంధించిన అంశాల‌ను సుప్రీంకోర్టుకు అంద‌జేసింది. సీబీఐ మాజీ స్పెష‌ల్ డైరెక్ట‌ర్ ఎంఎల్ శ‌ర్మ నేతృత్వంలోని పానెల్ రంజిత్ సిన్హా కేసు విచార‌ణ జ‌రుపుతోంది. ఈ పానెల్ నివేదిక ఆధారంగా తదుప‌రి విచార‌ణ‌లో కోర్టు త‌మ తీర్పు వెలువ‌రించ‌నుంది. కోల్‌ స్కాం నిందితులను రంజిత్ సిన్హా త‌న అధికారిక నివాసంలో చాలాసార్లు క‌లిశార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 

21:57 - July 12, 2016

కరీంనగర్‌ : హుస్నాబాద్‌ నియోజకవర్గంలో.. గౌరవెల్లి, గండుపెల్లి ప్రాజెక్టుల నిర్వాసితుల ఉద్యమానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మద్దతునిచ్చారు. ముంపు గ్రామాల్లో రెండు రోజుల పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా గుడాటిపల్లి గ్రామం నుంచి పాదయాత్రను మొదలుపెట్టారు. తెనుగుపల్లి, చింతల్‌ తాండా, కొత్తపల్లి మీదుగా గండిపెల్లి గ్రామం వరకు మొదటి రోజు పాదయాత్ర కొనసాగింది. అలాగే గుడాటిపల్లి యువకులు చేపట్టిన నిరాహారదీక్షలను తమ్మినేని ప్రారంభించారు. నిర్వాసితుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకులు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారంటూ విమర్శించారు. 

21:53 - July 12, 2016

హైదరాబాద్ : ఎన్‌ఐఏ మరో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. ఇంతకుముందే అరెస్టు చేసిన ఐదుగురు నిందితులను 12 రోజుల పాటు విచారించిన ఎన్ఐఏ కీలక ఆధారాలతో మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. దేశంలో విధ్వంసం సృష్టించడమే వీరి టార్గెట్‌ అని ఎన్ఐఏ రిమాండ్ రిపోర్టులో తెలిపింది. మరో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్...

నగరంలో పలు పేలుళ్లకు కుట్ర పన్నిన ఐసిస్‌..
నగరంలో పలు పేలుళ్లకు కుట్ర పన్నిన ఐసిస్‌ ఉగ్రవాదుల నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. 12 రోజుల విచారణ తర్వాత.. తమ కస్టడీలో ఉన్న నిందితులను ఎన్‌ఐఏ అధికారులు మంగళవారం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణలో లభించిన ఆధారాల బండ్లగూడకు చెందిన హత్తుల్లా రెహ్మాన్‌, మొగల్‌పురాలో నివాసముంటున్న నయామత్ హుల్లా హుస్సెయిన్‌ను అరెస్ట్ చేసి.. వారినీ కోర్టులో హాజరు పరిచారు. రెహ్మాన్ హైదరాబాద్‌లో ఉగ్ర కార్యకలాపాలకు హెడ్‌గా ఉన్నారని ఎన్‌ఐఏ రిమాండ్‌ రిపోర్టులో వెల్లడించింది. రెహ్మాన్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో బాంబులు పేల్చాలని కుట్రపన్నాడని, హుస్సెయిన్ ఆర్ధిక సహాయం చేశాడని తెలిపింది. వీరిద్దరిని విచారిస్తే దేశంలో ఐసిస్ ఉగ్రవాదుల మూలాలు బయటపడే అవకాశాలు ఉన్నట్లు ఎన్.ఐ.ఏ. భావిస్తుంది. హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్రపన్నిన ఇబ్రహిం, ఇలియాస్ బ్రదర్స్ ని 8 రోజుల కస్టడీ కావాలని ఎన్ఐఏ  పిటిషన్ దాఖలు చేసింది. 8 రోజులు పోలీస్ కస్టడికి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మిగిలిన ముగ్గురు నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించారు.

పశ్చాత్తాపం ప్రకటించని నిందితులు..?
పన్నెండు రోజుల ఎన్ఐఏ కస్టడీలో నిందితులు ఎక్కడా పశ్చాత్తాప పడలేదని సమాచారం. జిహాదీ కోసం ఎంతమందిని చంపితే అంత పుణ్యం వస్తుందంటూ ఐఎస్ఐఎస్ వారికి నూరిపోసినట్లు విచారణలో తేలిందని భోగట్టా. హైదరాబాద్‌లో ఇప్పటికే ఐసిస్‌ పట్ల అకర్షితులైన కొందరిని.. పోలీసులు గతంలో కౌన్సింగ్ ఇచ్చి వదిలేశారు. ఇప్పుడు వారిపైనా దృష్టి సారించారు. దేశంలో ఉన్న ఒక్క ఐసిస్ మాడ్యూల్ ను మాత్రమే ఎన్.ఐ.ఏ విచారిస్తుంది. ఇలాంటి మాడ్యూల్స్ మరిన్ని ఉన్నాయని ఎన్.ఐ.ఏ దర్యాప్తులో తెలినట్లు సమాచారం.

మహారాష్ట్ర, రాజస్థాన్‌, గుజరాత్‌లకు నిందితుల తరలింపు?..
తాజా కస్టడీ పీరియడ్‌లో నిందితులను మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్‌లకు తీసుకెళ్లి విచారించే అవకాశాలున్నాయి. అక్కడ లభించే ఆధారాల ద్వారా.. ఉగ్రవాదులకు సహకరించిన మరికొంత మందిని అరెస్ట్ చేయొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ఏడుగురు నిందితులపై ఐ.పి.సి. 121ఏ, 122 సెక్షన్స్ తో పాటు పేలుళ్ల చట్టంలోని సెక్షన్ 4,5 ప్రకారం... ఎన్.ఐ.ఏ స్పెషల్ యాక్ట్ లోని 18,18 బి, 38,39 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. వీరిపై దేశ ద్రోహం కేసు నమోదు చేసిన ఎన్.ఐ.ఏ. వీరికి కఠిన శిక్షలు వేయించేందుకు అవసరమైన పటిష్ట సాక్ష్యాధారాల సేకరణపై ప్రత్యేక దృష్టిని సారించింది. 

21:42 - July 12, 2016

హైదరాబాద్ : మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల ధాటికి మధ్యప్రదేశ్‌లో 22 మంది, మహారాష్ట్రలో నలుగురు మృతి చెందారు. వారణాసిలో గంగానది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మధ్యప్రదేశ్‌లో వరదల కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం...
మధ్యప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనెక జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. వరదల తాకిడికి నదులు పొంగి పొర్లుతుండడంతో రోడ్లు వంతెనలు తెగిపోయి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. 59 వ జాతీయ రహదారిపై బైతుల్‌ వద్ద ఓ బొలేరో వాహనం నదిలో పడిపోయింది. అందులో ఉన్నవారు ప్రాణాలు రక్షించుకోవడానికి వాహనంపైకి ఎక్కారు.రిస్క్యూ ఆపరేషన్‌ ద్వారా పోలీసులు స్థానికులతో కలిసి తాడు సహాయంతో ముగ్గురిని ఒడ్డుకు సురక్షితంగా చేర్చారు. బుల్‌డోజర్‌ కూడా నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. విదిషలో వరద తాకిడికి రోడ్లన్ని కొట్టుకుపోయాయి. అక్కడ పరిస్థితిని భూంకంపాన్ని తలపిస్తోంది. ఖర్గావ్‌ జిల్లాలో రోడ్డుపై నుంచి వరద నీరు ప్రవహిస్తున్నా నిర్లక్ష్యంగా వాహనాలను నడపుతున్నారు. దీంతో ప్రయాణీకులు బిక్కు బిక్కుమంటున్నారు.

ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు...
ఉజ్జైన్‌లో క్షిప్రా నది, శివపురి జిల్లాలో పార్వతి నది ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీరు రోడ్డుపై ప్రవహిస్తుండడంతో ఎంపి సరిహద్దు రాష్ట్రం రాజస్థాన్‌తో సంబంధాలు తెగిపోయాయి. హోషంగాబాద్‌ జిల్లాలో తవా డ్యాం 13 గేట్లను తెరచి నీటిని వదిలి పెట్టారు.

వరదల తాకిడికి 22 మంది మృతి...
మధ్యప్రదేశ్‌లో వరదల తాకిడికి 22 మంది మృతి చెందారు. మరో 9 మంది ఆచూకి తెలియడం లేదు. 60 వేల మంది పునరావాసం కేంద్రాల్లో తల దాచుకుంటున్నారు.

మరో 24 గంటల పాటు వర్షాలు...
వరద తాకిడికి నాసిక్‌ జిల్లాలోని నందూర్‌బార్‌లో నలుగురు మృతి చెందారు. పలు గ్రామాల్లో వరద నీరు చేరడంతో పట్టణ ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. మరో 24 గంటల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

3 రోజుల్లో 30 అడుగుల పెరిగిన నీటి మట్టం...
అటు వారణాసి గంగానదిలో నీటి సామర్థ్యం పెరిగింది. గత 3 రోజుల్లో 30 అడుగుల నీటి మట్టం పెరిగింది. దీంతో బనారస్‌లోని 84 ఘాట్లతో సంబంధం లేకుండా పోయింది. గంగానదిలో పడవలను నడపకుండా నిషేధించారు. దక్షిణ గుజరాత్‌లోని చాలా జిల్లాలో భారీ వర్షాలు కురియడంతో నదులు కళకళలాడుతున్నాయి. వరద ముంపుకు గురైన కొన్ని గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. 

21:32 - July 12, 2016

తూ.గోదావరి : తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వానలతో ఇరురాష్ట్రాల్లోని వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరదనీటితో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. దీనికితోడు ఎగువ రాష్ట్రాల నుంచి వరదనీరు పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. కుండపోత వానలకు గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 14.63 అడుగులు...
తెలుగురాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజుల నుంచి ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా వానలు కురుస్తుండడంతో గోదావరి ఉరకలెత్తుతోంది. కుండపోత వర్షాలతో రాజమండ్రిలోని గోదావరి నదికి వరదనీరు పోటెత్తుతుంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 14.63 అడుగులకు చేరింది. రెండో ప్రమాద హెచ్చరికకు చేరువగా వరద నీరు చేరడంతో.. అధికారులు ప్రాజెక్టు 175 గేట్లను ఎత్తివేశారు. బ్యారేజీ నుంచి 11లక్షల 89వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

దేవీపట్నం మండలంలో 22 గ్రామాలు జలదిగ్భంధం...
మరోవైపు తూర్పు మన్యంలోని దేవీపట్నం మండలంలో 22 గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. అలాగే ఖమ్మం జిల్లాలో కూనవరం భద్రాచలం ప్రధాన రహదారిని వరద నీరు ముంచెత్తింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

వరద ప్రవాహానికి కొత్తూరు కాజ్‌వే జలమయం..
పశ్చిమగోదావరి జిల్లాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలకు గోదావరి ఉగ్రంగా ప్రవహిస్తోంది. గోదావరి వరద ప్రవాహానికి కొత్తూరు కాజ్‌వే జలమయం అయింది. 29 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ముంపు గ్రామాల్లోని కాజ్‌వేను దాడి ప్రయాణించే అవకాశంలేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి నుండి పోలవరంలోనే ఉండిపోయిన ప్రయాణికులు కాజ్‌వేను దాటేందుకు నాటు తెప్పలమీద ఆధారపడుతున్నారు. కనీసం పడవలైనా ఏర్పాటు చేస్తే తమ గ్రామాలకు వెళ్లేవాళ్లమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆదిలాబాద్‌ జిల్లా జలదిగ్బంధం...
ఇటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అడవుల జిల్లా ఆదిలాబాద్‌ను భారీవర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో..ఆదిలాబాద్‌ జిల్లా జలదిగ్బంధంలో చిక్కుకుంది. లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. పెన్‌గంగ, ప్రాణహిత నదుల్లో వరద ఉద్ధృతి పెరిగింది. వాగులు, వంకలు పొంగి పొర్లడంతో జన జీవనం స్తంభించింది. వరదనీటిలో భైంసా పట్టణం చిక్కుకుపోయింది. వందల ఎకరాల పంటలు నీట మునిగాయి. పలు మండలాలకు రాకపోకలు నిలిచి పోయాయి. ఇప్పటిదాకా డెడ్‌స్టోరేజీకి చేరుకున్న ప్రాజెక్టులు, నిండుకుండలను తలపిస్తున్నాయి. జిల్లాలోని కడెం ప్రాజెక్టు భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది. డ్యాంలోకి ఇన్‌ఫ్లో 90వేల క్యూసెక్యులు ఉండటంతో మూడుగేట్లు తెరిచిన అధికారులు 24,500 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతంలోకి వదిలేస్తున్నారు. అటు తాంసి మండలంలోని మత్తడివాగుప్రాజెక్టు వరదనీటితో పొంగిపొర్లుతోంది. 4గేట్లను ఎత్తివేసిన అధికారులు 11,500 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలేశారు. మత్తడివాగు పొంగడంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. అటు నిర్మల్‌ నియోజకవర్గంలో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. లక్ష్మణచాంద మండలం కనకాపూర్ వద్ద నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద వరదనీరు పోటెత్తింది. జిల్లాలో వరద పరిస్థితిని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరిశీలించారు.

వర్షాలతో తడిసి ముద్దవుతోన్న వరంగల్ జిల్లా...
తెలంగాణలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వరంగల్ జిల్లా తడిసి ముద్దవుతోంది. జిల్లాలో 5 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో ఏజెన్సీలోని వాగులు, వంకలన్నీ పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు, జలకళతో ఉట్టిపడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదారమ్మ ఉగ్రరూపం దాల్చుతోంది. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక జారీచేయడంతో లోతట్టు ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. పరివాహక ప్రాంతాల్లో వరదనీరు పోటెత్తడంతో వేల ఎకరాల పంటలన్నీ నీటమునిగాయి. ఏటూరునాగారం ప్రధాన జలాశయంలోకి వరదనీరు పోటెత్తుతుండడంతో సమీపంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. ఇక జిల్లాల్లోని చెరువులన్నీ వరదనీటితో నిండిపోయాయి. లక్నవరం, పాకాల, రామప్ప చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. వరద నీటితో జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

కుండపోత వర్షాలతో కరీంనగర్ జిల్లా...
కుండపోత వర్షాలతో కరీంనగర్ జిల్లాలో ప్రవహిస్తున్న గోదావరి ఉదృతి ఇంకా అలాగే కొనసాగుతుంది. రెండు మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని ప్రాజెక్టులన్నీ వరద నీటితో నిండు కుండలా మారాయి. ఎగువన ఉన్న కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదలడంతో కరీంనగర్ జిల్లాలో గోదావరి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో కరీంనగర్ జిల్లా మరియు ఆదిలాబాద్ జిల్లాలను కలుపుతూ ఉన్న రాయపట్నం వంతెన వద్ద గోదావరి ఉదృతి పెరిగింది. దీంతో వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. కొత్త వంతెన నిర్మాణపు పనులు కొనసాగుతుండగా..వరద ఉధృతిలోనే ఓ ప్రోక్లైన్ చిక్కుకు పోయింది.

శ్రీరాంసాగర్ కు జలకళ...
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కూడా జలకళను సంతరించుకుంటోంది. వరుసగా రెండు సంవత్సరాలు తీవ్ర వర్షాభావం కారణంగా డెడ్ స్టోరేజీకి చేరుకున్న ప్రాజెక్టు..తాజాగా కురుస్తున్న కుండపోత వర్షాలతో శ్రీరాంసాగర్‌ జలకళను సంతరించుకుంది. నాలుగు రోజుల నుండి మహరాష్ట్రలో వర్షాలు కురుస్తుడటంతో సుమారు 4 టీఎంసీల వరద నీరు వచ్చిచేరింది. దీంతో రైతులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

విస్తార వర్షాలతో రైతులు హర్షం...
మొత్తానికి ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రాజెక్టులు కూడా జలకళను సంతరించుకోవడంతో ఇక సాగు, త్రాగునీటికి ఇబ్బందులుండవని ప్రభుత్వాలూ భావిస్తున్నాయి.

'టీజీఐ ఫ్రైడే' బార్ పై కేసు...

హైదరాబాద్ : చిన్నారి రమ్య మృతి ఘటనలో మైనర్లకు మద్యం సరఫరా చేసిన టీజీఐ ఫ్రైడే బార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. రమ్య తల్లి ఫిర్యాదు మేరకు ఎక్సైజ్ చట్టం 36(1)(జి) కింద కేసు నమోదు చేశారు. 

ఇద్దరు కేంద్రమంత్రులు రాజీనామా...

ఢిల్లీ : ఇద్దరు కేంద్రమంత్రులు రాజీనామా చేశారు. మైనార్టీ శాఖ మంత్రి నజ్మాహెప్తుల్లా..భారీ పరిశ్రమల శాఖ మంత్రి జీఎం సిద్ధేశ్వర్ లు తమ పదవులకు రాజీనామా చేశారు. మైనార్టీ శాఖ కొత్త మంత్రిగా ముక్తార్ అబ్బాస్ నఖ్వీ బాధ్యతలు అప్పగించారు. భారీ పరిశ్రమల శాఖను సుప్రియోకు అప్పగించారు. 

'మధ్య' మంత్రికి కరెంట్ షాక్...

మధ్యప్రదేశ్ : విద్యా శాఖా మంత్రి విజయ్ షాకు కరెంట్ షాక్ తగిలింది. తన అధికారిక నివాసంలో లైట్ స్విచ్ వేస్తుండగా విజయ్ షా ఈ ప్రమాదానికి గురయ్యారు. ఈ సంఘటనలో ఆయన చెయ్యి కాలడంతో గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స నందించారు. ప్రస్తుతం మంత్రి విశ్రాంతి తీసుకుంటున్నారు.

20:14 - July 12, 2016

స్వచ్ఛమైన రాజకీయ సంస్కృతితోనే తెలంగాణ అభివృద్ధి : తమ్మినేని

తెలంగాణ అభివృద్ధి చెందాలంటే స్వచ్ఛమైన రాజకీయ సంస్కృతి రావాల్సిన అవసరముందని తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితం..ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ లీడర్ గా..రాష్ట్ర కార్యదర్శిగా.. ప్రజా ఉద్యమాలతో మమేకమవుతూ...పలు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్న తమ్మినేని వీరభద్రంతో ఈరోజు వన్ టూ వన్ కార్యక్రమంలో చూద్దాం...ఈ నేపథ్యంలో తమ్మినేని పాలుపంచుకున్న ఉద్యమ విశేషాలను తెలుసుకుందాం...రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై వరుస పాదయాత్రలు చేస్తూ అలసిపోని అలలా ఉద్యమాలలో పాల్గొంటున్న తమ్మినేని రాష్ట్ర పరిస్థితులపై ఎటువంటి అభిప్రాయాలను వెల్లడించారో తెలుసుకుందాం..

తెలంగాణలో సీపీఎం పాదయాత్రల అజెండా ఏమిటి? ఈ అంశంపై తమ్మినేని చెప్పిన వివరాలేంటి? మల్లన్నసాగర్‌ నిర్వాసితుల కన్నీళ్ళకు కారణమేంటి? దీనికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై సీపీఎం పార్టీ సూచనలేమిటి? సాగునీటి ప్రాజెక్టులు ప్రజల కోసమా.. కాంట్రాక్టర్ల కోసమా..? రాష్ట్ర కార్యదర్శి సొంత జిల్లా అయిన ఖమ్మంలో కమ్యూనిస్టులు ఎందుకు ఓడిపోతున్నారు? తెలంగాణ రాష్ట్రంలో సీపీఎం భవిష్యత్‌ ఏంటి? కార్యాచరణ కార్యాచరణ ఏమిటి? ఈ అంశాలపై సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో వన్‌ 2 వన్‌లో ఎటువంటి అభిప్రాయాలను వెల్లడించారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...మరిన్ని వివరాలు తెలుసుకోండి... 

తుమ్మల-మదన్ లాల్ వర్గీయుల మధ్య దాడి..

ఖమ్మం : వైరాలో టీఆర్ఎస్ కార్యకర్తలు వీధి గూండాల్లా కొట్టుకున్నారు. మంత్రి తుమ్మల వర్గీయులను ఎమ్మెల్యే మదన్ లాల్ అనుచరులు పరిగెత్తించి కొట్టారు. మంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫెక్సీలో మదన్ లాల్ ఫోటో లేదని ఆగ్రహించిన ఎమ్మెల్యే వర్గీయులు ఈ దాడికి పాల్పడినట్లుగా సమాచారం. 

19:39 - July 12, 2016

విజయనగరం : భోగాపురం రైతులపై ప్రభుత్వం నిర్బంధకాండకు తెగబడుతోంది. ప్రతిపాదిత విమానాశ్రయం కోసం భూసేకరణకు సిద్ధమైన ప్రభుత్వం.. రైతులపై ఆంక్షలు విధిస్తోంది. భూములను ప్రభుత్వానికి తప్ప మరెవరికీ విక్రయించకుండా కుట్రలు చేస్తోంది. విమానాశ్రయ ప్రతిపాదిత గ్రామాల్లో.. క్రయ విక్రయాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో రిజిస్ట్రేషన్‌లు నిలిచిపోయాయి. పైగా తమ మాట కాదని ఎవరికైనా అమ్మితే.. ఆ సొమ్ము బ్లాక్‌మనీగా పరిగణిస్తామంటూ బెదిరిస్తోంది. దీంతో విద్య, వివాహాది అత్యవసర కార్యక్రమాలకూ భూములు అమ్ముకోలేని దయనీయ స్థితిలో రైతులు కలవర పడుతున్నారు.
భూముల క్రయ విక్రయాలపై ఆంక్షలు...
ఇదీ విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు.. పరిసర ప్రాంతాల రైతుల దుస్థితి. విమానాశ్రయం కోసం భూములివ్వాలంటూ అధికారుల ఒత్తిళ్లు ఓ వైపు.. మాట వినని రైతులపై పోలీసుల నిర్బంధం మరోవైపు.. రైతులను తీవ్ర ఆందోళనలో పడేస్తున్నాయి. గట్టిగా నిలదీస్తే రైతులపై కేసులు.. ఆపై వేధింపులు సర్వసాధారణమై పోయాయి. ఇప్పుడు సరికొత్తగా ఈ ప్రాంతంలో భూముల క్రయవిక్రయాలపైనా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ప్రభుత్వానికి తప్ప మరెవరికీ అమ్మరాదన్న రీతిలో కుట్ర చేసి.. రిజిస్ట్రేషన్లను నిలిపి వేయించింది. ఒకవేళ రిజిస్ట్రేషన్ ద్వారా కాకుండా మరే రూపంలో క్రయవిక్రయాలు జరిగినా.. రైతులకు సమకూరే సొమ్ము బ్లాక్‌ మనీయే అవుతుందని బెదిరిస్తున్నారు.

రైతుల ఆందోళనతో 2004 ఎకరాలు చాలన్న ప్రభుత్వం...
భోగాపురం ఎయిర్ పోర్ట్ కోసం తొలుత 15 వేల ఎకరాల భూమిని సేకరిస్తామన్న ప్రభుత్వం.. ఆ తర్వాత 5,300 ఎకరాలే సేకరిస్తామంది. కానీ రైతుల ఉద్యమంతో.. ఇప్పుడు 2004 ఎకరాలకే పరిమితమవుతున్నామని వెల్లడించింది. అయితే.. రైతులు మాత్రం ఒక్క ఎకరా కూడా ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. భూసేకరణకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలను వారు తిప్పికొడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం భూములు లాక్కునేందుకు రకరకాల ఆంక్షలను పెడుతూ రైతులను చక్రబంధంలో ఇరికించేస్తోంది. ప్రభుత్వ చర్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎకరాకు రూ.28 లక్షల ఇస్తామంటున్న ప్రభుత్వం..
ఎయిర్ పోర్టు కోసం సేకరించే భూములకు ప్రభుత్వం నష్టపరిహరం ప్రకటించింది.. ఎకరాకు కనిష్టంగా 28 లక్షలు ఇస్తామంటోంది. అయితే ప్రస్తుతం ఆప్రాంతంలో ఎకరా కోటి రూపాయలకు పైగా రేటు పలుకుతుంది. దీంతో రైతులు ప్రభుత్వానికి భూములు ఇవ్వడానికి ససేమిరా అంటున్నారు. అయినా అధికారులు సర్వేలతో రైతుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. పైగా సేకరించతలపెట్టిన 2004 ఎకరాల్లో ఐదు వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని.. మరో ఐదు వందల ఎకరాలు ఇచ్చేందుకు రైతులు ముందుకొచ్చారని అధికారులు చెబుతున్నారు. దీన్ని రైతులు తప్పుబడుతున్నారు.

రైతులకు శాపంగా మారిన ఎయిర్ పోర్ట్ నిర్మాణం..
ఎయిర్‌పోర్టు నిర్మాణం సంగతేమో కానీ.. ఆ ప్రతిపాదనే ఇక్కడి రైతులకు శాపంగా మారింది. మొన్నటి వరకూ దర్జాగా బతికిన ఈ ప్రాంత రైతులు.. ఇప్పుడు అనుక్షణం ఆందోళనతో కంటిమీద కునుకు లేకుండా బతుకుతున్నారు. ప్రభుత్వం వీరి జీవితాలతో చెలగాటమాడరాదని.. వామపక్ష, ప్రజాసంఘాలు హెచ్చరిస్తున్నాయి.

 

19:25 - July 12, 2016

రష్యా : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు రష్యా పర్యటనలో బిజీబిజీ ఉన్నారు. నాలుగో రోజు పర్యటనలో భాగంగా చంద్రబాబు చెలబిన్స్‌ ప్రావిన్స్‌ గవర్నర్‌ బోరిస్‌తో సమావేశమయ్యారు. ఇరు ప్రాంతాల పక్షాన ఐదుగురు సభ్యులతో త్వరలో వర్కింగ్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఏపీ ఐటీ సాంకేతిక పరిజ్ఞానాన్ని చెలబిన్స్‌ ప్రావిన్స్‌కు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అనంతరం మాస్కో నగరపాలక సంస్థ విజ్ఞాన, పారిశ్రామిక విధాన విభాగాధిపతి ఒలెగ్‌ బొచరోవ్‌తో చంద్రబాబు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. నూతన రాజధానిని ప్రపంచ స్థాయిలో నిర్మించడానికి తమ వంతు పూర్తి సహాకారం అందిస్తామని ఈ సందర్భంగా ఒలెగ్‌ చంద్రబాబుకు తెలిపారు. 

19:00 - July 12, 2016

ఢిల్లీ : ఏపీకి మరో కొత్త రైలును కేటాయించింది కేంద్రం. విజయవాడ నుంచి అనంతపురంజిల్లా ధర్మవరం వరకు కొత్త ఎక్స్ ప్రెస్ రైలును కేటాయించింది. ఈ రైలు వారంలో3 రోజులు సర్వీసు అందిస్తుందని తెలిపారు. ఈ రైలును కేంద్రమంత్రులు సురేష్ ప్రభు, సుజనాచౌదరి ప్రారంభించారు. రాయలసీమ నుండి ఇప్పుడున్నరైళ్లతో పాటు అదనంగా రైలు సేవలు అందించనుంది. ఉదయం రాజధానికి వచ్చి తిరిగి సాయంత్రం వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ప్రయాణానికి అనుకూలంగా ఉండేందుకు ఎల్ ఎచ్ వీ బోగీలలను ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. ఈ రైలు ద్వారా కృష్ణా, గుంటూరు, ప్రకాశం అనంతపురం జిల్లాలకు ప్రయోజనం కలగనుంది.

మత్తు ఇంజక్షన్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్...

ఖమ్మం : మణుగూరులో మత్తు ఇంజక్షన్లు విక్రయిస్తున్న మురళీమోహన్ అనే వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ. 4 వేలు నగదుతోపాటు 300 మత్తు ఇంజక్షన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పీఎస్ కు తరలించారు. మురళీమోహన్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆలపల్లి ప్రభుత్వాసుపత్రిలో మురళీమోహన్ ఫార్మసిస్ట్ గా పని చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.

18:47 - July 12, 2016

కడప : 10టీవీ ప్రసారం చేసిన కథనాలకు స్పందన. జిల్లాలోని జీఎన్ఎం పోస్టుల నియామకాల్లో జరుగుతున్న అక్రమాలపై 10టీవీ ప్రసారం చేసిన కథనాలకు జిల్లాల కలెక్టర్ స్పందించారు. అక్రమాలపై కలెక్టర్ సత్యనారాయణ విచారణకు ఆదేశించారు. ఆరోపణలు నిరూపితమైతే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి అధికారులతో కలెక్టర్ కోఆర్డినేటన్ పాండురంగయ్యతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం దీనిపై విచారణ జరిపించమని ఆదేశాలు జారీ చేశారు. క్లర్క్ మోహన సింగ్ చేస్తున్నటువంటి అక్రమాలపై కమిటీ వేసి నిజానిజాలను విచారించాలని కలెక్టర్ ఆదేశించారు.

10 టీవీ ఆపరేషన్ లో బుక్ అయిన మోహన్ సింగ్...
టెన్ టివి నిర్వహించిన ఆపరేషన్ లో మోహన్ సింగ్ బుక్కయ్యాడు. జీఎన్ఎం పోస్టులు కాంట్రాక్టు ఉద్యోగాలని, చేస్తూంటే పోతే జాబ్ పర్మినెంట్ అవుతుందని మోహన్ సింగ్ పేర్కొన్నాడు. నా ఇళ్లు చూపించా..వారంలో ఇంటర్వూ కార్డు వస్తుందని..మొత్తం డబ్బు ఒకేసారి చెల్లించాలని డిమాండ్ చేశాడు. 

వైసీపీలోకి 'ఉండవల్లి'?!!..

తూర్పు గోదావరి : రాజమండ్రిలో కొత్త రాజకీయ రంగు పులుముకుంటోంది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌తో వైసీపీ అధినేత జగన్ భేటీ కాబోతున్నారు. మంగళవారం జగన్ పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు వెళుతున్నారు. అలాగే ఉండవల్లిని కలవనున్నారు. ఉండవల్లి తల్లి మార్చిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఉండవల్లిని పరామర్శించేందుకు మాత్రమే జగన్ కలుస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. కాకుంటే ఈ భేటీతో ఉండవల్లిని వైసీపీలోకి చేరతారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

10టీవీ కథనాలకు స్పందన...

కడప : 10టీవీ ప్రసారం చేసిన కథనాలకు స్పందన. జిల్లాలోని జీఎన్ఎం పోస్టుల నియామకాల్లో జరుగుతున్న అక్రమాలపై 10టీవీ ప్రసారం చేసిన కథనాలకు జిల్లాల కలెక్టర్ స్పందించారు.అక్రమాలపై కలెక్టర్ సత్యనారాయణ విచారణకు ఆదేశించారు. ఆరోపణలు నిరూపితమైతే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

123జీవో కు మల్లన్న నిర్వాశితుల అంగీకారం?!..

మెదక్ : ఏటిగడ్డకిష్టాపూర్ గ్రామస్తులతో మంత్రి టి.హరీష్ రావు సాగించిన చర్చలు సఫలమయ్యాయి. మంగళవారం గ్రామాస్తులతో మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. జీవో నం 123 ప్రకారం భూముల ఇచ్చేందుకు గ్రామస్థులు అంగీకరించారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ... ఏటిగడ్డకిష్టాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని హరీష్ రావు తెలిపారు.

 

18:00 - July 12, 2016

నిజామాబాద్ : అడవి తల్లే వారికి సర్వస్వం...పోడు భూములే వారి జీవనాధారం..పుడమి తల్లిని నమ్ముకొని బతుకు జీవనం సాగిస్తున్న గిరిపుత్రులపై పోలీసులు అధికార ప్రతాపం చూపించారు. తాము చేసిన తప్పేంటని ప్రశ్నించినందుకు కేసులు నమోదు చేశారు. పోడు సాగు జీవనమే నేరమా...ప్రశ్నించడమే పాపమా.. అధికారుల పెత్తనానికి బలవుతున్న నిజామాబాద్‌ జిల్లా నేరేడ్‌ తాండ గిరిజనుల బతుకులపై ప్రత్యేక కథనం....

గిరిజనులపై అధికారులు పెత్తనం ...
తరతరాలుగా పోడువ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న గిరిజనులపై అధికారులు పెత్తనం చెలాయిస్తున్నారు. ఆ భూమిపై సర్వహక్కులు తమవేనని అటవీశాఖ అధికారులు గిరిజనులపై ఆగ్రహం చూపిస్తున్నారు. 40 ఏళ్లుగా సాగుచేస్తున్న తమకు ఈ బాధలేంటని గిరిపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

40 సంవత్సరాలుగా పోడు వ్యవసాయం సాగు...
నిజామాబాద్ జిల్లా గాందారి మండలం నేరేడ్ తండాలో పోడువ్యవసాయమే జీవనంగా గిరిజనులు బతుకు సాగిస్తున్నారు.సర్వే నంబర్ 679 లో 120 ఎకరాలు , 679 సర్వేలో 70 ఎకరాల భూమిని 40 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నారు. అయితే కొద్ది రోజుల క్రితమే అకస్మాత్తుగా ...పోడు భూములను సాగు చేయరాదని అటవీ శాఖాధికారులు గిరిజనులకు హూకుం జారీ చేసారు. దీనిపై స్పందించిన ఆదివాసీలు, తాము ఎందుకు వ్యవసాయం చేయకూడదని అధికారులను ప్రశ్నించారు. ప్రశ్నించిన గిరిజనులతో పాటు, సీపీఎం నాయకులను లెక్కచేయకుండా అటవీశాఖ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీపీఎం నాయకులపైనా కేసు నమోదు...
అటవీశాఖ అధికారులు ఇంతటితో ఆగకుండా తమశాఖ భూములనే గిరిజనులు ఆక్రమించుకున్నారని గాందారి పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలితో సహా మరో ఏడుగురిపై నాన్‌బెయిల్‌ కేసులు నమోదు చేశారు. అధికారుల తీరుపై పోడు భూముల సాధన కమిటి ,ఆది వాసి గిరిజన సంఘం రైతు సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిరిజనులకు న్యాయం జరగాలని తాము పోరాటం చేస్తుంటే తమపైనా కేసులు నమోదు చెయ్యడం ఎంతవరకూ న్యాయమని సీపీఎం నాయకులు ప్రశ్నిస్తున్నారు.

18 అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు పోడు ఆందోళనలు...
పోడు భూముల్లొ వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు పోడు ఆందోళనలు నిర్వహించనున్నట్లు ఆది వాసి గిరిజన సంఘం రైతు సంఘం నాయకులు తెలిపారు.

17:54 - July 12, 2016

నిజామాబాద్: తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ జలకళను సంతరించుకుంటోంది. వరుసగా గత రెండు సంవత్సరాలు తీవ్ర వర్షాభావం కారణంగా డెడ్ స్టోరేజీకి చేరింది. అయితే గత నాలుగు రోజుల నుండి మహరాష్ర్టలో తెలంగాణలో వర్షాలు కురుస్తుడటంతో సుమారుగా 4 టీఎంసీల వరద నీరు వచ్చిచేరింది. దీంతో రైతులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో జలకళను వీక్షించాలంటే ఈ విజువల్ ను క్లిక్ చేయండి..మరిన్ని వివరాలతో పాటు వీనులవిందుగా శ్రీరాంసాగర్ అందాలను తిలకించండి..

గ్రేటర్ పరిధిలో వాల్టా?!...

హైదరాబాద్ : గ్రేటర్ పరిధిలో వాల్టా చట్టం ప్రకారం ఇంటి నిర్మాణంలో భాగంగా మొక్కలు నాటడాన్ని తప్పనిసరి చేస్తామని కమిషనర్ జనార్థన్ రెడ్డి తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వానికి ప్రతిపాదలను పంపామన్నారు. అనుమతులు రాగానే జీహెచ్ఎంసీ పరిధిలోని ఇళ్లు, పరిశ్రమలు, రెసిడెన్షియల్ కాంప్లెక్సులలో మొక్కలు నాటడం తప్పనిసరి అన్నారు. 

తొలి సర్వీసుపై సుజనా హర్షం...

హైదరాబాద్ : విజయవాడ - ధర్మవరం మధ్య సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ పరుగులు పెట్టనుంది. ఢిల్లీ రైల్ భవన్ నుండి కేంద్ర మంత్రి సురేష్ ప్రభు రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర మంత్రి సుజనా చౌదరి రైల్వే శాఖా మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ-ధర్మవరం మార్గంలో ఇదే తొలి రైలు సర్వీసు కావడం విశేషమని ఆయన చెప్పారు. ఏపీకి మరోరైలు రావటం సంతోషంగా ఉందన్నారు. సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఈ రైలులో ఎల్‌హెచ్‌వీ బోగీలు ఏర్పాటు చేశారు.

కారు - బైక్ ఢీ..ఇద్దరు మృతి..

అనంతపురం : సోమందేపల్లి సమీపంలో మంగళవారం కారు - బైక్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. యువకుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

కాసులకోసం కన్నతండ్రిపై కత్తి .....

చెన్నై : మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా పని చేసే మణిమారన్ తో అతని కుమారుడికి గత కొంత కాలంగా వారి మధ్య ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి. హైకోర్టులోకి కత్తితో వచ్చిన మణిమారన్ కుమారుడు.. తండ్రి ఛాంబర్ నుంచి బయటకు రాగానే స్నేహితులతో కలిసి అతనిపై కత్తులతో దాడికి దిగాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. వెంటనే స్పందించిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మణిమారన్ ను ఆసుపత్రిలో చేర్పించారు.

పడవ మునక..13మంది గల్లంతు..

మహారాష్ట్ర : గడ్చిరోలీ జిల్లాలో ఉన్న వైనగంగ నదిలో పడవ మునిగిపోయిన విషాద సంఘటన చోటుచేసుకుంది. వైనగంగ నదిలో పడవ బోల్తాపడటంతో 13 మంది నీటిలో మునిగిపోయారు. వీరిలో పది మందిని స్థానికులు కాపాడగలిగారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. వారి జాడ తెలియడంలేదు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది.

వరదలకు 22మంది మృతి..

మధ్యప్రదేశ్‌ : రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్ఠిస్తున్నాయి. వరదల్లో కొట్టుకుపోయి 22 మంది మృతి చెందారు. మరో 9 మంది జాడ తెలియలేదు. 7వేల మందిని ప్రభుత్వ సిబ్బంది కాపాడారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్ చెప్పారు. రాజధాని భోపాల్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. మధ్యప్రదేశ్‌లో దాదాపు 4 లక్షల మందిపై వరద ప్రభావం పడింది.

''ఇస్లామిక్ రీసర్చ్ ఫౌండేషన్ ''పై హోంశాఖ ఆరా..

ఢిల్లీ : వివాదాస్పద ఇస్లాం మత గురువు జకీర్ నాయక్ పై కేంద్ర హోం శాఖ విచారణను ముమ్మరం చేసింది. జాకీర్ నాయక్ స్థాపించిన ''ఇస్లామిక్ రీసర్చ్ ఫౌండేషన్ కు చందాల రూపంలో యూకే, సౌదీ అరేబియానుండి 2012 వరకూ రూ.15కోట్ల నిధులు సమకూరినట్లుగా గుర్తించారు. నిధులను ఏరూపంలో ఖర్చు చేశారు అనే అంశంపై హోంశాఖ ఆరా తీస్తున్నట్లుగా సమాచారం.

ఎన్ఐఏ కస్టడీకి ఐసిస్ నిందితులు...

హైదరాబాద్ : నలుగురు ఐసిస్ సానుభూతిపరులుగా భావిస్తున్న ఇక్బాల్, ఇలియాస్, నయముతుల్లా, అసతుల్లాకు నాంపల్లికోర్టు 8రోజులు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది. వీరిని 19న కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. 

17:02 - July 12, 2016

హైదరాబాద్: కళ్లు చెదిరే అందాలు... జిగేల్‌మనిపించే లైట్ల మధ్య ..క్యాట్ వాక్ వయ్యారాలు..వింటుంటే..ఇదేదో మోడళ్ల షో గురించి చెబుతున్నట్టుంది కదూ... అలా అనుకుంటే మీరు ర్యాంప్‌లో కాలేసినట్టే...మోడళ్లకు తామేమి తగ్గమన్నట్టు ఠీవిగా నడుస్తూ..వీక్షకులని ఆకట్టుకున్న రాజసాల నడకలెవరవీ... విశేషలేంటీ... అని తెలుసుకోవాలనుందా ..వాచ్‌దిస్ స్టోరీ....

అదరగొట్టిన ఒంగోలు గిత్త ...
ఆహార్యంలో...రాజసం, గోపురంలాంటి...మూపురం, నడకలో ఠీవితో హైదరాబాద్‌లో జరిగిన డ్రీమ్‌ బుల్‌ షో వీక్షకులని ఆకట్టుకుంది. తెలంగాణకు చెందిన తూరుపు గిత్తల ర్యాంప్‌వాక్‌తో ప్రారంభమైన ప్రదర్శన వివిధ రాష్ట్రాలకు చెందిన గిత్తలతో వేడుకగా జరిగింది. కేరళకు చెందిన వెంచూర్, పంగనూరు గిత్త, ఒంగోలు గిత్త, దేవరకోట, గుజరాత్ గిర్ జాతుల ప్రదర్శనతో ర్యాంప్‌ షో అదిరిపోయింది. మొత్తం పది జాతులకు చెందిన 19 గిత్తలను షోలో ప్రదర్శించారు. ర్యాంప్‌పై గిత్తల రాజసాన్ని వీక్షించేందుకు పలువురు ప్రముఖులు షోకు హాజరయ్యారు.

ఒంగోలు గిత్తకు అంతర్జాతీయంగా గుర్తింపు..
ఒంగోలు జాతి గిత్తకు అంతర్జాతీయంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అయితే ఉమ్మడి రాష్ట్ర విభజనానంతరం తెలంగాణకు ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న గో జాతి లేదు. ఈ కారణంగా అంకుష్ అనే సంస్థ మహబూబ్‌నగర్ జిల్లాలోని మన్ననూరు ప్రాంతంలో తూర్పు జాతి గిత్తను అభివృద్ధి చేస్తున్నారు. మేలు రకపు జాతిగా తూర్పు జాతి గిత్తను తీర్చిదిద్దేందుకు అంకుష్ సంస్థ కృషి చేస్తోంది.

బుల్‌షోకు విశేష స్పందన...
అరుదైన, మేలు రకమైన గిత్తల బుల్‌షోకు విశేష స్పందన వచ్చింది. పలువురు ప్రముఖులు ప్రదర్శనకు వచ్చి అరుదైన జాతి గిత్తల గురించి అడిగి తెలుసుకున్నారు. దీంతోపాటు గోరక్షణ ప్రయోజనాలు , గోఆధారిత వ్యవసాయం గురించి నిర్వాహకులు వివరించారు. 

16:54 - July 12, 2016

హైదరాబాద్ : మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పోలీసులు కఠనంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నారు. వరుస రోడ్డుప్రమాదాలు ప్రాణాలను కబళిస్తున్న నేపథ్యంలో తాగి వాహనాలు నడిపే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదంటున్నారు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ. డ్రంకన్‌ డ్రైవ్‌ చేపట్టి ఇప్పటికే వేయికి పైగా కేసులు నమోదు చేశామని చెబుతున్న డీసీపీ చౌహాన్‌ నగరవాసులకు సూచనలిచ్చారా? హెచ్చరించారా?? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..జాగరూకతతో మెలగండి...

16:49 - July 12, 2016

తూ.గోదావరి : పెరుగుతున్న ధరలు, నిరుద్యోగంపై సీపీఎం చేపట్టిన నిరసన వారోత్సవాల్లో భాగంగా రాజమండ్రిలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై సీపీఎం కార్యకర్తలు నగర ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర ధరలను అదుపు చేయడంలో విఫలమయ్యాయని మాజీ ఎంపీ మిడియం బాబూరావు అన్నారు. ప్రస్తుతం సామాన్యుడు బతికే పరిస్థితి లేదని ఆయన అన్నారు. సమస్యలపై 

16:45 - July 12, 2016

ఢిల్లీ : నీట్‌ పరీక్ష నిర్వహణకు ఈ ఏడాది మినహాయిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఆర్డినెన్స్‌..సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉందంటూ.. సామాజిక వేత్త ఆనంద్‌ రే, సంకల్ప్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ వేర్వేరుగా రిట్‌ పిటిషన్లు దాఖలు చేశారు. కేంద్రం తన వైఖరిని తరచుగా మార్చుకోవడం వల్ల విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌ సరైనదేనంటూ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, గుజరాత్‌, క ర్ణాటక, తమిళనాడు విద్యార్థులు కేవియట్‌ పిటిషన్లు దాఖలు చేశారు. 

మైనర్లు మద్యం సేవిస్తే జైలుకే?!...

హైదరాబాద్ : 21 ఏళ్లలోపువారికి మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎంవో కార్యదర్శి శాంత కుమారి ఆదేశించారు. దీనికి సంబంధించి కొత్త చట్టం తీసుకురావాలని నిర్ణయించారు. బార్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పెనాల్టీకి బదులుగా ఏడేళ్ల జైలు శిక్ష విధించేలా చట్టం తేవాలని సమావేశంలో ప్రతిపాదించారు. చిన్నారి రమ్య ప్రమాద ఘటన నేపథ్యంలో మద్యం అమ్మకాలపై సీఎంవో కార్యదర్శి శాంత కుమారి సమీక్ష లో ఇలా పేర్కొన్నారు.

పోలీస్ కస్టడీకి రూపేష్...

హైదరాబాద్ : నగరంలో సంచలనం కలిగించిన సింథియా హత్య కేసులో నిందితుడు భర్త రూపేష్ ను మూడు రోజులపాటు కస్టడీకి అప్పగించటానికి రాజేంద్రనగర్ కోర్టు ఆనుమతించింది. సానియాకు డీఎన్ ఏ పరీక్షలు నిర్వహించేందుకు కూడా న్యాయస్థానం అనుమతిని ఇచ్చింది. ఎఫ్ఎస్ఎల్ పరీక్ష తర్వాత పూర్తి సమాచారంతో కోర్టుకు నివేదికను అందజేయాలని పోలీసు యంత్రాగానకి ఆదేశాలు జారీ చేసింది. సానియాను 15వ తేదీన కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించింది.

 

ఏపీకి సూప్ ఫాస్ట్ ...

ఢిల్లీ : విజయవాడ-ధర్మవరం మధ్య సూపర్ ఫాస్ట్ రైలును రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించారు. ఢిల్లీలోని రైల్ భవన్ నుండి ఆన్ లైన్ ద్వారా జెండా ఊపి రైలును ప్రారంభించారు.

మంటలతో కాలిపోయిన వాహనం....

విజయవాడ : విజయవాడ నగరంలోని రహదారులకు మార్కింగ్ చేస్తున్న వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో వాహనం మొత్తం కాలిపోయింది. మంగళవారం ఉదయం ఐదో నెంబర్ రహదారి సమీపంలోని రమేష్ ఆస్పత్రి వద్ద మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. 

భార్యను చంపి భర్త ఆత్మహత్య...

చిత్తూరు : శ్రీకాళహస్తిలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రయివేటు హోటల్ లో భార్యను చంపి అనంతరం భర్త రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. కుటుంబ కలహాలతోనే ఈ సంఘటన జరిగివుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

15:59 - July 12, 2016

సారీస్, ఎవర్ గ్రీన్ కాస్ట్యూమ్. అందుకే రెగ్యులర్ వేర్ కైనా, పార్టీవేర్ కైనా చాలా మంది మహిళలు ఇష్టపడుతుంటారు. ఎప్పుడూ తమ వార్డ్ రోబ్ లో అందంగా పేర్చుకుంటారు. అతివలు మెచ్చే అందమైన, వెరైటీ శారీస్ తో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి సొగసు. 

15:58 - July 12, 2016

ఎవరి జీవితానికైనా బాల్యమే పునాది. ఆ బాల్యంలో పడిన అడుగులే భవిష్యత్ జీవితానికి సోపానాలు. అలాంటి పునాదులను సిరిసిరిమువ్వలతోనూ, మురిపాల పాటలతోనూ పెనవేసుకుంటూ ముందుకు సాగుతోంది ఓ చిన్నారి. ఆ చిన్నారి ఆట,పాట,మాటలతో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి స్పూర్తి.

మూడేళ్ల చిన్నారి ఏం చేయాలి? అమ్మ గోరు ముద్దలు తినాలి. నాన్న భుజాలెక్కి గారాలు పోవాలి. స్నేహితులతో ఆటలాడుకోవాలి. అలసిపోయి అమ్మ లాలి పాటలు వింటూ పడుకోవాలి. ఈ చిన్నారి లాలి పాటలు వినే వయసులోనే నాట్యం చేయడం నేర్చుకుంది. లాలిపాటల నిధిగా పేరు తెచ్చుకుంది.

పిట్ట కొంచం కూత ఘనం అంటారు. లాలి పాటల నిధికి ఈ మాట అక్షరాలా సరిపోతుంది. అమ్మ తన కోరికలకు రెక్కలిచ్చి, ఈ చిట్టితల్లికి తొడిగింది. ఆ చిట్టితల్లి ఆ రెక్కలతో అందంగా ఎగురుతోంది. తన లాలి నృత్యంతో అలరిస్తోంది. ఈ చిన్నారి భవిష్యత్ ఇలాగే కొనసాగాలని మానవి ఆకాంక్షిస్తోంది. 

15:48 - July 12, 2016

టెక్నాలజీ రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. అన్ని రంగాలలోనూ...అన్ని వర్గాల వారూ టెక్నాలజీని విరివిగా ఉపయోగించుకుంటున్నారు. కమ్యూనికేషన్ కోసం టెక్నాలజీ ఉపయోగించుకునే విధానం పలురకాలుగా వుంటోంది. ఇంతవరకూ బాగానే వుంది. కానీ ఈ టెక్నాలజీ అనేది మంచికి ఉపయోగిస్తే సమస్యే లేదు...ఇది వెర్రితలలు వేసి సైబర్ నేరగాళ్ళు పుట్టుకొస్తున్నారు. ఈ సైబర్ క్రైమ్ ద్వారా ఎందరో జీవితాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి కూడా. ఈ సైబర్ నేరాలు మహిళలపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి? అనే అంశంపై ఈరోజు వేదిక చర్చతో మనముందుకు వచ్చింది. ఈ చర్చలో కృష్ణ చైతన్య (సైక్లోప్స్ ఇండియా సీఈఓ) రామ్మోహన్( సీఐడీ ఎస్పీ) జెఎల్ఎన్ మూర్తి (అడ్వకేట్) పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న వక్తలు ఎటువంటి సలహాలను..సూచనలు అందించారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి సైబర్ నేరాగాళ్ళ వలలో పడకుండా తగు జాగ్రతలు తీసుకోండి... 

15:45 - July 12, 2016

ప.గోదావరి  :  గోదావరి వరద ఉధృతికి పర్యాటక శాఖకు గట్టి దెబ్బ తగిలింది. పోలవరం నుంచి పాపి కొండల వరకూ సాగే విహార యాత్రకు బ్రేక్‌ పడింది. గత మూడు రోజులుగా గోదావరి ఉధృతి పెరిగిపోవడంతో పోలవరంలో టూరిజం బోట్లు నిలిచిపోయాయి. పోలవరంలో గలగలల గోదారమ్మ పరవళ్ల కోసం ఈ వీడియోను చూడండి...

15:39 - July 12, 2016

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీ నివాసంలో కశ్మీర్‌ అంశంపై జరిగిన ఉన్నతస్థాయి సమావేశం ముగిసింది. కశ్మీర్‌ శాంతి నెలకొల్పేందుకు సహకరించాలని ప్రధాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అన్నివిధాలా సహకరిస్తుందని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. అమర్‌నాథ్‌ యాత్ర సాఫీగా కొనసాగేందుకు తీసుకున్న చర్యలపై మోది సంతృప్తి వ్యక్తం చేసినట్లు కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అరుణ్‌జైట్లీ, మనోహర్‌ పారికర్‌, సుష్మాస్వరాజ్‌ హాజరయ్యారు. కశ్మీర్‌ అల్లర్లపై హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఎన్‌ఎస్‌జి జీఫ్‌ అజిత్‌ దోవల్‌తో ప్రధాని చర్చించారు. 

15:37 - July 12, 2016

కృష్ణ : ల్యాండ్‌ పూలింగ్‌ అంటే దోపిడీ తప్ప మరొకటి కాదని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు మండిపడ్డారు. భూపరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో మచిలీ పట్నంలో భూ దోపిడీ వ్యతిరేకంగా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పలు పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్రకార్యదర్శి మాట్లాడుతూ కృష్ణా పుష్కరాల పేరిట పేదల ఇళ్లను కూల్చేస్తున్న టీడీపీ ప్రభుత్వం ఒక్క పేద కుటుంబానికి కూడా పునరావాసం కల్పించలేదన్నారు. కార్పోరేట్‌ కంపెనీలకు మాత్రం లక్షల ఎకరాలు కట్టబెడుతున్నారని మధు మండిపడ్డారు. 

15:35 - July 12, 2016

చిత్తూరు : ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవ చేయటానికే రాజకీయాల్లోకి వచ్చామని ప్రతీ రాజకీయ నాయకుడూ చెబుతారు. కానీ తమకున్న సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తేమాత్రం వారు ఇరిటేషన్ కు లోనవుతారు. ఇటువంటి సంఘటన చిత్తూరు జిల్లా రేణిగుంటలో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా లో మూడురోజులు పర్యటనలో భాగంగా మంత్రి కామినేని తిరుపతి సమీపంలోని రేణిగుంట ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని పరిస్థితులపై ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో వైద్యులు సకాలంలో రావటంలేదని లీలావతమ్మ అనే జెడ్పీటీసీ సభ్యురాలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. లీలావతమ్మకు రకరకాలు కామినేని సర్ధిచెప్పారు. అంతటితో వదలని ఆమె మంత్రిని నిలదీయంతో అసహనానికి గురయిన మంత్రి కామినేని తన చేతిలో వున్న మైకు విసిరేశారు. దీంతో అక్కడి వారంతా ఒక్కసారిగా మ్రాన్పడిపోయారు. తేరుకున్న కొంతసేపటికి అందరికీ సర్ధిచెప్పటంతో వాతావరణం సద్దుమణిగింది. కానీ స్థానిక సమస్యలను పాలకుల దృష్టికి తీసుకొస్తే ఇలా వ్యవహరించటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతగా వారికి ఇబ్బందులున్నా ప్రజల మధ్య వారి సమస్యల విషయంలో ఒక మంత్రి వ్యవహరించిన తీరు ఎంతమాత్రం సమంజసం కాదని పలువురు పేర్కొంటున్నారు.

మైకు విసిరేసిన మంత్రి కామినేని...

చిత్తూరు : తిరుపతి రేణిగుంట ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మంత్రి కామినేని సమావేశంలో గందరగోళం ఏర్పడింది. ఆసుపత్రి వైద్యులు సకాలంలో రావటంలేదని మంత్రిని జెడ్పీటీసీ సభ్యురాలు లీలావతమ్మ నిలదీశారు. దీంతో అసహనానికి గురయిన మంత్రి కామినేని మైకు విసిరేశారు.  

15:11 - July 12, 2016

చిత్తూరు : శ్రీకాళహస్తి గంగ కాలనీలో కిడ్నాప్‌ కలకలం చెలరేగింది. సరస్వతీబాయి ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పుష్పను దుండగులు కిడ్నాప్‌ చేశారు. ఆటోలో వచ్చి ముగ్గురు దుండగులు కిడ్నాప్‌నకు పాల్పడినట్లు పుష్ప సోదరి చెబుతోంది. 

సుప్రీంకోర్టులో నీట్ ఆర్డినెన్స్ ను రద్దు పిటీషన్ ...

ఢిల్లీ : కేంద్రం జారీ చేసిన నీట్ ఆర్డినెన్స్ ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలయ్యింది. ప్రయివేట్ వైద్య కళాశాల యాజమాన్యాలు సంకల్ప్ స్వచ్ఛంధ సంస్థ, సామాజిక వేత్త ఆనంద్ రే పిటీషన్ దాఖలు చేశారు. కాగా పిటీషన్ విచారణను కోర్టు వాయిదా వేసింది. జస్టిస్ అనిల్ ఆర్ దవే, జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ లతో కూడిన బెంచ్ కు నీటి ఆర్డినెన్స్ రద్దు పిటీషన్ సుప్రీం బదాలాయింపు చేసింది. 

కశ్మీర్ లో శాంతి కోసం చర్యలు : ప్రధాని

ఢిల్లీ : కశ్మీర్‌లో తిరిగి శాంతియుత ప‌రిస్థితులు నెల‌కొనేలా చూడాల‌ని ప్ర‌ధాని మోదీ ఆకాంక్షించిన‌ట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. క‌శ్మీర్‌లో నెల‌కొన్న ఉద్రిక్త‌త ప‌రిస్థితుల‌పై ఇవాళ ఢిల్లీలో ప్ర‌ధాని మోదీ ఉన్న‌త స్థాయి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఆ స‌మావేశానికి ప్ర‌భుత్వాధికారులు, క్యాబినెట్ మంత్ర‌లు హాజ‌ర‌య్యారు. క‌శ్మీర్‌లో అమాయ‌కులు ఎవ‌రూ బలికావొద్ద‌ని ప్ర‌ధాని మోదీ సూచించారు. 

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య...

హైదరాబాద్: భర్తతో గొడవపడిన భార్య ఆత్మహత్య చేసుకుంది. నగరంలోని చిక్కడపల్లి పరిధిలో గల జవహర్‌నగర్‌లో జరిగింది. భార్యాభర్తల మధ్య తలెత్తిన ఘర్షణ పడిన భార్య మనాస్థపానికి గురయి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.

కాళహస్తిలో కిడ్నాప్ కలకలం...

చిత్తూరు : కాళహస్తిలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. తొమ్మిదవ తరగతి చదువుతునన విద్యార్తిని కిడ్నాప్ కు గురయ్యింది. గుర్తు తెలియని దుండగులు ఆటోలో వచ్చి విద్యార్థినిని ఎత్తుకెళ్లినట్లుగా తెలుస్తోంది.  

మరో ఇద్దరు సానుభూతిపరులు అరెస్ట్..

హైదరాబాద్ : నగరంలో మరో ఇద్దరు ఐసిస్ సానుభూతిపరులు అరెస్ట్ అయ్యారు. మొఘల్ పురాకు చెందిన హుస్సేన్ బహదూర్ పురాకు చెందిన రెహ్మాన్ లను ఎన్ఐఏ పోలీసులు అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టులో ఎన్న ఐఏ అధికారులు హాజరుపరిచారు. వీరిద్దరికీ 26 వరకూ కోర్టు రిమాండ్ విధించింది. ఇప్పటికి నగరంలో ఐసిస్ సానుభూతిపరులను అరెస్ట్ అయ్యారు. 

డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు - ట్రాఫిక్ డీసీపీ..

హైదరాబాద్ : డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ డీసీపీ చౌహాన్ పేర్కొన్నారు. 15 నెలల్లో 850 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని, ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్ లో మైనర్లు పట్టుబడితే 36 సబ్ క్లాస్ 1, సబ్ క్లాస్ జీ కింద కేసులు నమోదు చేస్తామన్నారు. 36 సబ్ క్లాస్ 1, సబ్ క్లాస్ జీ కింద కేసులు నమోదు చేస్తామన్నారు.

హోం గార్డుల వెట్టిచాకిరిపై డీఐజీ విచారణ..

రంగారెడ్డి : ఎస్పీ నవీన్ కుమార్ ఇంట్లో హోం గార్డుల వెట్టిచాకిరిపై డీఐజీ అకున్ సబర్వాల్ విచారణ చేపట్టారు. 18 మంది హోం గార్డులు విచారణకు హాజరయ్యారు.

13:23 - July 12, 2016

కడప : ఏపీ రాష్ట్రంలో అవినీతికి ఆస్కారం ఉండదు..అవినీతి లేని రాష్ట్రంగా మారుస్తాం అంటూ ప్రభుత్వం పేర్కొంటున్న సంగతి తెలిసిందే. కానీ కొంతమంది ఉద్యోగులు అవినీతి చేస్తూ రెండు చేతులా డబ్బులను సంపాదిస్తున్నారు. తాజాగా కడప జిల్లాలో వైద్య విధాన పరిషత్ లో జీఎన్ఎం పోస్టుల నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. జీఎన్ఎం పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఈ పోస్టులను క్లర్క్ మోహన్ సింగ్ అమ్ముకొంటున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై అక్కడ పనిచేసే క్లర్క్ మోహన్ సింగ్ డబ్బులివ్వాలని ఓ వ్యక్తిని డిమాండ్ చేశాడు. దీనితో సదరు వ్యక్తి టెన్ టివిని ఆశ్రయించాడు.

ఎలా బుక్కయ్యాడు...
టెన్ టివి నిర్వహించిన ఆపరేషన్ లో మోహన్ సింగ్ బుక్కయ్యాడు. జీఎన్ఎం పోస్టులు కాంట్రాక్టు ఉద్యోగాలని, చేస్తూంటే పోతే జాబ్ పర్మినెంట్ అవుతుందని మోహన్ సింగ్ పేర్కొన్నాడు. నా ఇళ్లు చూపించా..వారంలో ఇంటర్వూ కార్డు వస్తుందని..మొత్తం డబ్బు ఒకేసారి చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఇప్పటికే నాలుగు పోస్టులను భర్తీ చేయడం జరిగిందని, చివరి పోస్టు ఒకటే ఉందని తెలిపాడు.

తన దృష్టికి రాలేదు - పాండుంగ..
వైద్య విధాన పరిషత్ లో జరుగుతున్న అక్రమాలపై పాండురంగయ్య (జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి) స్పందించారు. టెన్ టివితో ఆయన ఫోన్ లో మాట్లాడారు. సెలక్షన్ అయిన అనంతరం రిజిష్టర్ పోస్టు చేయడం జరుగుతుందని, అభ్యర్థులకు ఫోన్ కూడా చేయడం జరుగుతుందన్నారు. టెన్ టివి చెబుతున్నది తనకు తెలియదన్నారు. తన దృష్టికి ఇంతవరకు రాలేదని, ప్రస్తుతం అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నానన్నారు. అక్కడకు వెళ్లిన అనంతరం చూస్తానని తెలిపారు.

లక్షా 50వేలు అడిగాడు..
తన సతీమణికి జీఎన్ఎం జాబ్ వచ్చిందని విజయానంద్ అనే వ్యక్తి టెన్ టివికి తెలిపారు. మోహన్ సింగ్ తమకు కాల్ చేశాడని, సతీమణికి జాబ్ వచ్చిందని తెలిపాడన్నారు. ఆఫీసుకు వెళితే టెన్ మంత్స్ వేతనం ఇవ్వాల్సి ఉంటుందని డిమాండ్ చేశాడని, మొత్తంగా లక్షా 50వేలు ఇవ్వాల్సి ఉంటుందని మోహన్ సింగ్ పేర్కొన్నాడని వాపోయారు. తన దగ్గర అంత డబ్బు లేదని చెప్పిన అనంతరం ఫైనల్ గా రూ. 75వేలు ఇవ్వాలని, డబ్బు ఇచ్చిన అనంతరం అపాయింట్ మెంట్ కార్డు ఇంటికి పంపిస్తానని మోహన్ సింగ్ పేర్కొన్నాడని తెలిపారు.
వైద్య విధాన పరిషత్ లో గత వారం రోజుల నుండి ఈ తతంగం సాగుతున్నట్లు సమాచారం. మోహన్ సింగ్ వెనుక ఉన్నతాధికారుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అక్రమాలపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

అమర్ నాథ్ యాత్రకు భద్రత పెంపు..

ఢిల్లీ : శ్రీనగర్ లో నెలకొన్న పరిస్థితులపై ప్రధాన మంత్రి మోడీ జరిపిన ఉన్నతస్థాయి సమీక్ష కొద్దిసేపటి క్రితం ముగిసింది. కాశ్మీర్ లో నెలకొన్న పరిస్థితి..అంతర్గత భద్రతపై మోడీ చర్చించినట్లు తెలుస్తోంది.

లంక గ్రామాల పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్..

కాకినాడ : గోదావరి వరద ఉధృతి నేపథ్యంలో లంక గ్రామాల్లో పరిస్థితులను కలెక్టర్ సమీక్షించారు. అవసరమైతే గన్నవరం, రాజోలు, ముమ్మిడివరం, అల్లవరం, మామిడికుదురు మండలాల్లోని లంక వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

 

బీసీ జాబితాల నుండి కులాల తొలగింపుపై సుప్రీం విచారణ..

ఢిల్లీ : తెలంగాణ బీసీ జాబితా నుండి కులాల తొలగింపుపై దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణనను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

 

హెల్త్ కార్డుల తీరుపై టీఎస్ సమీక్ష..

హైదరాబాద్ : కార్పొరేట్ ఆసుపత్రుల్లో ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డుల అమలు తీరుపై అధికారులతో టీ సీఎస్ సమీక్ష నిర్వహించారు.

 

కరకట్ట ప్రాంతంలో ఇళ్ల తొలగింపుపై ఆందోళన..

విజయవాడ : కరకట్ట ప్రాంతంలో ఇళ్ల తొలగింపుపై వామపక్షాల ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం ముట్టడి జరిగింది. కరకట్ట ప్రాంతంలో ఇళ్లు తొలగిస్తే సీఎం క్యాంప్ ఆఫీసును ముట్టడిస్తామని సీపీఎం నేత బాబురావు హెచ్చరించారు.

బండ్లగూడలో బాల కార్మికులకు విముక్తి..

రంగారెడ్డి : మైలార్ దేవులపల్లి పీఎస్ పరిధిలోని బండ్లగూడలో 20 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించారు. బిస్కెట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఈ బాల కార్మికులను బాలల హక్కుల సంఘం ప్రతినిధులు రక్షించారు.

శ్రీకాళహస్తిలో విద్యార్థిని కిడ్నాప్ కలకలం...

తిరుపతి : శ్రీకాళహస్తి తెలుగు గంగ కాలనీలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. సరస్వతీబాయి ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని పుష్ప కిడ్నాప్ కు గురైంది. పాఠశాల వద్ద ఆటోలో వచ్చి బాలికలను దుండగులు ఎత్తుకెళ్లారు.

భూమిని కాపాడుకొనే శక్తి ప్రజలకే ఉంది - తమ్మినేని..

కరీంనగర్ : భూమని కాపాడుకొనే శక్తి ప్రజలకు మాత్రమే ఉందని, భూ నిర్వాసితులంతా ఐక్యంగా కలిసిపోరాడాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. జీవో 123 పేరిట ప్రభుత్వం నిర్వాసితులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని, గౌరవెల్లి, గండుపెల్లి, మల్లన్న సాగర్ రిజర్వాయర్లు వద్దని మేధావులు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.

 

12:35 - July 12, 2016

కృష్ణా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అసహ్యం వేస్తోందని కాంగ్రెస్ నేత సీ.హెచ్.రామచంద్రయ్య పేర్కొన్నారు. బందరు పోర్టు ముసుగులో భూ దోపిడికి నిరసనగా మచిలీపట్నంలో భూ పరిరక్షణ పోరాట సమితి సదస్సు జరిగింది. ఈ సదస్సుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ నేత రామకృష్ణ, వైసీపీ మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని, కాంగ్రెస్ నేత సీ.హెచ్.రామచంద్రయ్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య మాట్లాడారు. భూదందా కొనసాగితే రాష్ట్రం అల్లకల్లోలం జరుగుతుందని, పీఎస్ కు ఫిర్యాదు చేస్తే పట్టించుకొనే నాథుడు ఉండడని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఉండే నాలుగు సెక్షన్స్ వారి చేతుల్లో ఉన్నాయని ప్రభుత్వం ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. నందిని పందిని రాసే కొంతమంది మీడియా వాళ్లు సైతం ఉన్నారని, భార్య..భర్త సంసారం చేయాలంటే జీవోలు ఇచ్చే పరిస్థితి నెలకొందన్నారు. తప్పు చూపిస్తే పరిశీలించాల్సింది పోయి తుడుచుకుంటూ పోతున్నారని ఎద్దేవా చేశారు. అప్పు తీర్చడానికి పట్టిసీమ ప్రాజెక్టు కడుతారా ? అని ప్రశ్నించారు. ప్రజలు ఉద్రేకపడి బయటకు రావాలని రామచంద్రయ్య పిలుపునిచ్చారు.

12:24 - July 12, 2016

కరీంనగర్ : వైఎస్ హయాంలో నిర్మాణం ప్రారంభించిన గౌరవెల్లి రిజర్వాయర్ డిజైన్ ను కెసిఆర్ ప్రభుత్వం మార్చేయడంతో నిర్వాసితుల సమస్య మరోసారి ఎజెండా మీదకు వచ్చింది. 2007లో భూములు కోల్పోయినవారికే ఇంతవరకు సరైన పరిహారం అందకపోవడం, రైతులు కూలీలుగా మారడంతో కొత్తగా నిర్వాసితులయ్యేవారు మరింత ఆందోళన చెందుతున్నారు. గౌరవెల్లి నిర్వాసితులకు మద్దతుగా సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రెండు రోజుల పాదయాత్రకు సిద్ధమయ్యారు. కాసేపటి క్రితం పాదయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలువురు టెన్ టివితో మాట్లాడారు. ఎత్తు పెంచడం వల్ల భారీగా నష్టం కలుగుతుందని నిర్వాసితులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టు వల్ల సర్వం కోల్పుతామని, ఎత్తు పెంచడం కాకుండా ఉన్న ప్రాజెక్టుతో సరిపెట్టుకోవాలని సూచించారు. ఎత్తు పెంచాలని ప్రభుత్వం భావిస్తే ప్రాణత్యాగానికైనా సిద్ధమేనన్నారు. అప్పుడు సగం తీసుకుని కాళ్లు విరగొట్టారని, ఇప్పుడు సగం తీసుకుంటే ఎలా అని ప్రశ్నించారు.

బర్డ్స్ ఆసుపత్రిలో మంత్రి కామినేని అకస్మిక తనిఖీలు..

చిత్తూరు : తిరుపతి బర్డ్స్ ఆసుపత్రిలో మంత్రి కామినేని అకస్మిక తనిఖీలు నిర్వహించారు. వైద్యశాలలో పారిశుధ్యంపై కామినేని సంతృప్తి వ్యక్తం చేశారు. రోగులకు అందుతున్న సేవలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. న్యూరో సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ వైద్యులను నియమిస్తామని పేర్కొన్నారు.

మచిలీపట్నంలో భూ పరిరక్షణ పోరాట సమితి సదస్సు..

కృష్ణా : బందరు పోర్టు ముసుగులో భూ దోపిడికి నిరసనగా మచిలీపట్నంలో భూ పరిరక్షణ పోరాట సమితి సదస్సు జరుగుతోంది. ఈ సదస్సుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ నేత రామకృష్ణ, వైసీపీ మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

కాశ్మీర్ లో కొనసాగుతున్న అల్లర్లు..

కాశ్మీర్ : కాశ్మీర్ లో అల్లర్లు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య 30కు చేరింది. మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు.

సచివాలయం ఐదో బ్లాక్ ప్రారంభోత్సవం మళ్లీ వాయిదా ?

గుంటూరు : సచివాలయం ఐదో బ్లాక్ మొదటి అంతస్థు ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడే అవకాశం ఉంది. మహూర్తాలు బాగా లేనందున ఈనెల 21 లేదా 29న ప్రారంభించాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతున్నారు.

గుడాటిపల్లిలో నిరహారదీక్షను ప్రారంభించిన తమ్మినేని..

కరీంనగర్ : హుస్నాబాద్ (మం) గుడాటిపల్లిలో గ్రామస్తుల నిరహార దీక్షను సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ప్రారంభించారు. గౌరవెల్లి రిజర్వాయర్ ఎత్తు పెంపునకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు.

 

ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం..

హైదరాబాద్ : నగరం నుండి కోల్ కతాకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీనితో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

విద్యుత్ సౌధాలో హరితహారం..

హైదరాబాద్ : విద్యుత్ సౌధలో హరితహారం కార్యక్రమం జరిగింది. మంత్రి జగదీష్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సీఎండీలు ప్రభాకర్ రావు, రఘుమారెడ్డి పాల్గొన్నారు.

ఏపీ వైద్య విధాన పరిషత్ లో పోస్టుల అమ్మకాలు..

కడప : ఏపీ వైద్య విధాన పరిషత్ లో ఒక్కో పోస్టును రూ. 70వేల నుండి రూ. 1.70 లక్షలకు అధికారులు అమ్ముకుంటున్నారు. ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్లు 10టివి వద్ద క్లర్క్ మోహన్ సింగ్ వెల్లడించారు.

11:57 - July 12, 2016

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. టి.టిడిపి నేతలు ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను ఈ రోజు ఉదయం కలిశారు. గత కొద్ది రోజుల కిందట టి.టిడిపి శాసనసభ కార్యాలయాలను స్పీకర్ ఇతరులకు కేటాయించిన సంగతి తెలిసిందే. దీనిపై వారు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, తమకు కేటాయించిన కార్యాలయాలను ఇత కమిటీలకు కేటాయించారని గవర్నర్ కు తెలియచేసినట్లు తెలిపారు. బలవంతంగా లోనికి వచ్చి తమ సిబ్బందిపై దాడి చేశారని ఆరోపించారు. ఇతరులకు కేటాయించాల్సి వస్తుందని స్పీకర్ భావిస్తే శాసనసభా పక్షానికి తెలియచేసి సమయం ఇస్తే బాగుండేదన్నారు. దీనిపై సమీక్షించి తగిన ఆదేశాలు జారీ చేయాలని తాము గవర్నర్ ను కోరడం జరిగిందన్నారు. దీనిపై స్పీకర్ కార్యాలయం నుండి సమాచారం తెప్పించుకుని పరిశీలిస్తానని గవర్నర్ పేర్కొనడం జరిగిందన్నారు. అధికారం శాశ్వతం కాదని, తీసుకున్న నిర్ణయాలపై సమాధానం చెప్పాల్సినవసరం ఉంటుందన్నారు. భవిష్యత్ లో ఇలాంటి సంప్రదాయాలుగా మారే అవకాశం ఉంటుందని, కాంగ్రెస్ చెబుతున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. తప్పుడు పనులకు ఆదర్శంగా ఉండవద్దని రేవంత్ సూచించారు.

11:37 - July 12, 2016

విశాఖపట్టణం : కొవ్వాడలో అణువిద్యుత్ ప్లాంట్ నిర్మాణం చేపడితే ఎలాంటి ఉపద్రవం రానుందో ప్రజలకు తెలియచేయడానికి సీపీఎం నడుం బిగించింది. అందులో భాగంగా జీపు జాతాను ఏర్పాటు చేసింది. ఈ జీపు జాతాను మద్దిలపాలెంలో మంగళవారం సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సీ.హెచ్.నర్సింగరావు ప్రారంభించారు. కొవ్వాడలో పెట్టే అణురియాక్టర్ల ఖరీదు 2,80,000 కోట్లు అవుతుందని పేర్కొంటూ పోస్టర్లతో ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధాన కూడళ్లలో నాటికలు, ప్రదర్శనలు ఇస్తూ ప్రజలను చైతన్యవంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా నర్సింగరావు మీడియాతో మాట్లాడారు. ప్లాంట్ కోసం ఉత్తరాంధ్రను నాశనం చేయవద్దని సూచించారు. ప్లాంట్ కు వ్యతిరేకంగా ఈనెల 17వ తేదీన విశాఖలో జాతీయ సెమినార్ ను నిర్వహించడం రుగుతుందన్నారు. ఈ సెమినార్ కు సీపీఎం మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కరత్ హాజరౌతారని, ప్రజలందరూ హాజరు కావాలని జీపు జాతా నిర్వహించడం జరుగుతుందన్నారు.

గవర్నర్ ను కలిసిన టి.టిడిపి నేతలు..

హైదరాబాద్ : ఉభయ రాష్ట్రాల గవర్నర్ ను టి.టిడిపి నేతలు కలిశారు. అసెంబ్లీలో తమ కార్యాలయాన్ని ఇతరులకు కేటాయించడంపై ఫిర్యాదు చేయనున్నారు.

దేశభద్రతపై ప్రధాని మోడీ సమీక్ష..

ఢిల్లీ : కాశ్మీర్ లో శాంతిభద్రతలపై ప్రధాని మోడీ కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు. నాలుగు ఆఫ్రికా దేశాల పర్యటన ముగించుకుని ఢిల్లీకి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేరుకున్నారు. దేశభద్రత, ఉగ్రవాదుల అణిచివేతపై ప్రధానంగా చర్చించనున్నారు. కాశ్మీర్ లో ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయి. వరసగా నాలుగో రోజు కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆందోళనల్లో 29 మంది మృతి చెందారు.

కొవ్వాడలో సీపీఎం జీపుజాత ప్రారంభం..

విశాఖపట్టణం : కొవ్వాడలో అణువిద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా జీపుజాత ప్రారంభమైంది. మద్దెలపాలెంలో జీపు జాతాను సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సీ.హెచ్.నర్సింగరావు ప్రారంభించారు.

 

ఏనుగులు బీభత్సం..

చిత్తూరు : వి.కోట మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మోట్లపల్లి, కృష్ణాపురం, వెంకటపల్లి, నాగిరెడ్డి గారిపల్లిలో మూడు ఏనుగులు పంట పొలాలపై దాడి చేశాయి. భారీగా పంట పొలాలు నాశనం చేయడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు.

11:13 - July 12, 2016

ఢిల్లీ : దేశ అంతర్గత భద్రతపై ప్రధాని నరేంద్ర మోడీ సమీక్ష నిర్వహిస్తున్నారు. నాలుగు ఆఫ్రికా దేశాల పర్యటన అనంతరం ఆయన మంగళవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రివర్గ ప్రత్యేక సమావేశం జరిగింది. ప్రధానితో పాటు హోం మంత్రి, రక్షణ శాఖ మంత్రి, ఆర్థిక మంత్రి, జాతీయ భద్రత సలహాదారు, హోం శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాశ్మీర్ లో నెలకొన్న పరిస్థితులపై అధికారులను ప్రధాని మోడీ అడిగి తెలుసుకోనున్నారు. అమర్ నాథ్ యాత్ర, ఉగ్రవాదం అణిచివేయడం, కాశ్మీర్ లో శాంతియుత పరిస్థితులు నెలకొల్పడంపై చర్చించనున్నారు.
మిలిటెంట్ కమాండర్ బుర్హాన్ వనీ కాల్చివేత దరిమిలా కాశ్మీర్ లోయలో హింసాత్మక నిరసనలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 32 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. 12 చోట్ల వేర్పాటు వాదులు జరిపిన దాడుల్లో అమాకులు బలయ్యారని సమాచారం. దీనిపై సీపీఎం స్పందించింది. అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయాలని, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉంటే కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింఘ్ ను మంగళవారం ఉదయం కొంతమంది మత పెద్దలు కలిసి చర్చలు చేపట్టారు. కాశ్మీర్ లో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు సహకరిస్తామని వారు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ అత్యున్నత సమావేశంలో ప్రధాని మోడీ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో కాసేపట్లో వెల్లడి కానుంది.

10:48 - July 12, 2016

బాలీవుడ్ నటి అనుష్క శర్మపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సల్మాన్ ఖాన్, అనుష్క శర్మ జంటగా నటించిన 'సుల్తాన్' ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అనుష్క శర్మ మల్లయోధురాలిగా నటించింది. సుల్మాన్ కు ధీటుగా కుస్తీ సన్నివేశాల్లో నటించిందనే ప్రశంసలు కురుస్తున్నాయి. సుల్తాన్ సినిమాలో అనుష్క తప్ప ఇతరులెవరూ న్యాయం చేయలేరని, అత్యద్బుతమైన ప్రతిభ దాగి ఉన్న సహజ నటి అని దర్శకుడు అబ్బాస్ జాఫర్ పేర్కొన్నారు. ప్రతిభా వంతులైన నటులతో నటించడం చాలా ఆనందంగా ఉంటుందని సల్మాన్ కితాబిచ్చాడు. సినీ ప్రముఖలతో పాటు నెటిజన్లు సైతం అనుష్కపై ప్రశంసలు కురిపిస్తున్నారు. హర్యాణ మల్లయోధుడు సుల్తాన్‌ ఆలీఖాన్‌ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం రూపొందింది. మరోవైపు 'సుల్తాన్' రికార్డులు సృష్టిస్తున్నాడు. జులై 6న విడుదలైన ఈ చిత్రం నాలుగు రోజుల్లో దేశవ్యాప్తంగా 142.6 కోట్ల రూపాయల్ని కలెక్ట్‌ చేసింది.

భైంసా గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు..

ఆదిలాబాద్ : భైంసా గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. రెండు గేట్లను ఎత్తివేశారు. ఇన్ ఫ్లో 12 వేలు, ఔట్ ఫ్లో 12 వేల క్యూసెక్కులగా ఉంది.

కొమరం భీం ప్రాజెక్టుకు వరద ఉధృతి..

వరంగల్ : కొమరం భీం ప్రాజెక్టుకు వరదనీరు చేరుతోంది. ఇన్ ఫ్లో 3608 ఉండగా ఔట్ ఫ్లో 3608 గా ఉంది. మూడు క్రస్ట్ గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 10.393టీఎంసీలుగా ఉంది.

 

కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత..

ఆదిలాబాద్ : కడెం ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. దీనితో రెండు గేట్లను ఎత్తివేశారు. ఇన్ ఫ్లో 42,934 ఉండగా ఔట్ ఫ్లో 25,668 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం 696 అడుగులుగా ఉండగా పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులుగా ఉంది.

10:40 - July 12, 2016

నల్గొండ : జిల్లాలో రూ. 35 లక్షల దోపిడి కేసును పోలీసులు చేధించారు. ఇండిక్యాష్ సిబ్బందే దోషులని తేల్చారు. ఏటీఎంలో జమ చేయడానికి తీసుకెళుతున్న తమ కళ్లలో కారం చల్లి రూ. 35 లక్షలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారని ఇండిక్యాష్ సిబ్బంది ఇద్దరు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మునుగోడు మండలంలో సోమవారం చోటు చేసుకుంది. దీనితో పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో సిబ్బంది ప్రవర్తనపై అనుమానం కలిగింది. దీనితో వారే పథకం ప్రకారం డబ్బును అపహరించారని పోలీసులు నిర్ధారించారు. మొత్తం నలుగురు డబ్బును దోచేందుకు పథకం పన్నారని పోలీసులు తేల్చారు. కాసేపట్లో ఇద్దరిని మీడియా ఎదుట ప్రవేశ పెట్టనున్నారు. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు. కానీ ఆ నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు, నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

10:34 - July 12, 2016

ఆదిలాబాద్  : జిల్లాను భారీవర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో.. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ప్రాణహిత నదుల్లో వరద ఉధృతి పెరిగింది. వాగులు, వంకలు పొంగి పొర్లడంతో జన జీవనం స్తంభించింది. వరదనీటిలో భైంసా పట్టణం చిక్కుకుపోయింది. వందల ఎకరాల పంటలు నీట మునిగాయి.. పలు మండలాలకు రాకపోకలు నిలిచి పోయాయి. జిల్లాలోని కడెం ప్రాజెక్టు భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది. డ్యాంలోకి ఇన్‌ఫ్లో 90వేల క్యూసెక్యులు ఉండటంతో మూడుగేట్లు తెరిచిన అధికారులు 24వేల5వందల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతంలోకి వదిలేస్తున్నారు. అటు తాంసి మండలంలోని మత్తడివాగుప్రాజెక్టు వరదనీటితో పొంగిపొర్లుతోంది. 4గేట్లను ఎత్తివేసిన అధికారులు 11వేల 5వందల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలేశారు. మత్తడివాగు పొంగడంతో ప్రాజెక్టువద్దకు చేరుకుని జలకళను ఆస్వాదిస్తున్నారు జనం. అటు నిర్మల్‌ నియోజకవర్గంలో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. లక్షణచాంద మండలం కనకాపూర్ వద్ద నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద వరదనీరు పోటెత్తింది. జిల్లాలో వరద పరిస్థితిని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరిశీలించారు. భైంసా పట్టణం వద్ద గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి వరద వెల్లువత్తడంతో అధికారులు 4 గేట్లను ఎత్తివేశారు. దీంతో పట్టణాన్ని వరదనీరు ముంచెత్తింది. అటు ఆసిఫాబాద్‌ డివిజన్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతో కొమురం భీమ్ ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివేశారు. ఆదిలాబాద్‌జిల్లాలో పెన్‌గంగ, ప్రాణహితలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు మండలాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లడంతో తట్టు ప్రాంతాలు జలమయ్యాయి. పంట భూములు నీటమునిగాయి. అటు బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ప్రాంతాల్లోని ఆరు ఓపెన్‌కాస్టు గనుల్లో బొగ్గుఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. క్వారీల్లో చేరిన నీటిని ఎప్పటికప్పుడు పంపుల ద్వారా బయటికి పంపిస్తున్నారు.

10:32 - July 12, 2016

పశ్చిమగోదావరి : గోదావరి పరవళ్లు తొక్కుతోంది. గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ఏజెన్సీ గ్రామాలు బిక్కుబిక్కుమంటున్నాయి. వరద ఉధృతి పెరగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరిలో వరద వల్ల ఏజెన్సీ గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పోలవరం ప్రాజెక్టు కడుతున్న ప్రాంతంలో భారీగా వరదనీరు చేరింది. కొత్తూరు కాజ్ వేపై భారీగా వరదనీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదనీరు రావడంతో పోలవరం ఏజెన్సీలో 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏజెన్సీ గ్రామాల్లో ఉన్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 30 అడుగుల వరకు నీరు పెరిగిపోవడంతో అధికారులకు ఏం చేయాలో అర్థం కావడం లేదని తెలుస్తోంది. ఖమ్మం భద్రాచలం వద్ద 175 గేట్లను ఎత్తివేయడంతో నిన్నటి నుండి 10 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ధవళేశ్వరం ప్రాజెక్టు కిందనున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

నాంపల్లిలో పబ్లిక్ గార్డెన్ లో హరితహారం..

హైదరాబాద్ : నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్ లో హరితహారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ ఆలీ, రాష్ట్ర మంత్రులు పోచారం, తలసాని, పద్మారావు, మేయర్ బొంతు రామ్మోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

 

వరద ప్రవాహంపై చంద్రబాబు ఆరా..

విజయవాడ : గోదావరి నది ఉగ్రరూపం దాలుస్తుండడంపై సీఎం చంద్రబాబు రష్యా నుండి సమీక్ష నిర్వహించారు. అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

10:10 - July 12, 2016

జమ్మూ కాశ్మీర్ : శ్రీనగర్ లో ఇంకా తెలుగు యాత్రికులు చిక్కుకుని ఉన్నారు. అమర్ నాథ్ యాత్రకు వెళ్లిన వారు..తిరుగు ప్రయాణమవుతున్న వారు చిక్కుకున్న వారిలో ఉన్నారు. ప్రభుత్వ సహాయం కోసం వీరంతా ఎదురు చూపులు చూస్తున్నారు. మిలిటెంట్ కమాండర్ బుర్హాన్ వనీ కాల్చివేత దరిమిలా కాశ్మీర్ లోయలో హింసాత్మక నిరసనలు తలెత్తిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ వాతావరణం ఉండడంతో యాత్రికులను తరలించడం కష్టసాధ్యంగా మారింది. బల్తాల్, పహల్గావ్, శ్రీనగర్ ప్రాంతాల్లో యాత్రికులు చిక్కుకున్నారు. ఇదిలా ఉంటే 46 మంది తెలుగు వారు సోన్ మార్గ్ లో చిక్కుకపోయారు. ఐదు రోజులుగా వీరంతా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. నెట్ వర్క్ లేకపోవడంతో వీరి బాగోగులు తెలియడం లేదు. వీరంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల నుండి సుమారు మూడు వేల మంది అమర్ నాథ్ యాత్రకు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బల్తాల్ రెండు బేస్ క్యాంపుల నుండి యాత్రను తాత్కాలికంగా పునరుద్ధరించారు.
సోమవారం బల్తాల్ నుండి 79 బస్సుల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య జమ్మూకు యాత్రికులను తరలించారు. జమ్మూ రైల్వే స్టేషన్ నుండి వీరిని స్వస్థలాలకు తరలించారు. నెల్లూరు, ప్రకాశం, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన వారున్నారు. వేర్పాటు వాదులు మరో రెండు రోజుల పాటు ఆందోళనలు కొనసాగిస్తామని ప్రకటించడంతో కర్ఫ్యూ కొనసాగుతోంది. నాలుగు ఆఫ్రికా దేశాల పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోడీ శ్రీనగర్ అంశంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

తుంగభద్ర రిజర్వాయర్ లోకి స్వల్పంగా వరదనీరు..

కర్నూలు: వర్షాల కారణంగా తుంగభద్ర రిజర్వాయర్‌లోకి స్వల్పంగా నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుత రిజర్వాయర్ నీటిమట్టం 1607 అడుగులు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 29.90 టీఎంసీలుగా ఉంది.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరదనీరు...

నిజామాబాద్ : జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరుతోంది. ఇన్‌ఫ్లో 14 వేలు ఉండగా ప్రస్తుత నీటిమట్టం 1050 అడుగులుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1090 అడుగులుగా ఉంది.

రూ. 35 లక్షల దోపిడి ఘటనలో కొత్త మలుపు..

నల్గొండ : మునుగోడు (మం) కొంపల్లిలో సోమవారం జరిగిన దారిదోపిడి ఘటనలో కొత్త మలుపు చోటు చేసుకుంది. ఇండిక్యాష్ సిబ్బందే నిందితులని పోలీసులు తేల్చారు. సిబ్బంది శ్రీను, నాగరాజు మరో ఇద్దరితో కలిసి దోపిడికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇండిక్యాష్ ఏటీఎంలో నగదు పెట్టేందుకు వెళుతుండగా కళ్లలో కారం చల్లి రూ. 35 లక్షలు ఎత్తుకెళ్లారని సిబ్బంది ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

రామన్నగూడెం పుష్కరఘాట్ కు వరదనీరు..

వరంగల్ : ఏటారు నాగారం రామన్నగూడెం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. రామన్నగూడెం పుష్కరఘాట్‌ దగ్గర నీటిమట్టం 9.90 మీటర్లకు చేరింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

నేడు పోలీసు కస్టడీకి శ్రావెల్..

హైదరాబాద్ : నేడు ఇంజినీరింగ్ విద్యార్థి శ్రావెల్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. పంజాగుట్ట కారు ప్రమాదం కేసులో శ్రావెల్ అరెస్టయిన సంగతి తెలిసిందే.

09:32 - July 12, 2016

ఏలూరు : గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ఏజెన్సీ గ్రామాలు బిక్కుబిక్కుమంటున్నాయి. వరద ఉధృతి పెరగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మరోవైపు గోదావరి పరివాహక ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. గోదావరిలో వరద వల్ల ఏజెన్సీ గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. భారీ వర్షాల కారణంగా గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 52 అడుగులకు చేరుకుంది. మరో అడుగు చేరుకుంటే అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో స్నానఘట్టాలు నీట మునిగాయి. ఇప్పటికే ఖమ్మం జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వరదల సమయంలో విపత్కర పరిస్థితుల్లో సేవలందించేందుకు అవసరమైన లాంచీలు భద్రాచలం చేరుకున్నాయి. రెండు రోజులుగా గోదావరి ఎగువన ఉన్న ప్రాణహిత, ఇంద్రావతి నదులు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు ధవళేశ్వరం వద్ద కాటన్‌ బ్యారేజీకి వరద తాకిడి భారీగా పెరిగింది. ధవళేశ్వరం వద్ద 175 గేట్లను నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. తూర్పుమన్యం దేవీపట్నం, కూనవరం మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పశ్చిమగోదావరి జిల్లాలోనూ పోలవరం ఏజెన్సీ గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి.

09:27 - July 12, 2016

మెదక్ : జిల్లాలో నిమ్జ్‌ భూ పోరాటం రోజు రోజుకు ఉధృతమవుతోంది. నిమ్జ్‌ పేరిట వందలాది ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. రైతుల పొట్టకొడుతూ వందలాది ఎకరాలను సేకరిస్తున్న సర్కార్‌..పరిహారం చెల్లించడంలో మాత్రం కుంటిసాకులు చెప్తోంది. 2013 చట్టం ప్రకారం నష్టపరిహారం ఇస్తే రైతులే నష్టపోతారంటూ రైతుల నోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేస్తోంది. అయితే 2013 చట్టం ప్రకారమే పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి భూ దాహం ఎంతకీ తీరడంలేదు. రైతుల పొట్టకొడుతూ వందలాది ఎకరాలను సేకరించేందుకు ప్రయత్నిస్తోంది. నిమ్జ్‌ పేరిట మెదక్ జిల్లాలోని జహీరాబాద్‌ నియోజకవర్గంలో వందలాది వేలాది ఎకరాలను సేకరించేందుకు సర్కారు ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. అయితే సర్కారు భూ దాహంపై స్థానిక రైతులు మండిపడుతున్నారు. పచ్చటి పంటలు పండే సారవంతమైన భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వానికి ఇచ్చే ప్రసక్తేలేదంటూ రైతులు తెగేసి చెప్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలను మరింత ఉధృతం చేశారు.

పచ్చటి భూముల్ని ఇచ్చేది లేదన్న రైతులు...
నిమ్జ్‌ పేరిట భూములను సేకరిస్తున్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గత 13 రోజులుగా గంగ్వార్‌ చౌరస్తాలో రైతులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ దీక్షలకు సీపీఎం తెలంగాణ రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం మద్దతు తెలిపారు. అంతేకాదు రైతులు దీక్ష చేస్తున్న దీక్షా శిబిరానికి చేరుకొని వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రభుత్వం పనిచేస్తుందని తమ్మినేని విమర్శించారు. మామా, అల్లుళ్లు కలిసి రోజుకో విరుద్ధ ప్రకటన చేస్తూ..రైతుల నోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేస్తున్నారని తమ్మినేని మండిపడ్డారు. 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తే రైతులు నష్టపోతారంటూ బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. 123 జీవో కాకుండా 2013 ప్రకారమే రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 2013 చట్టం ప్రకారం రైతులకు నష్టపరిహారం చెల్లించాలని లేకపోతే..పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని రైతులు, సీపీఎం నేతలు హెచ్చరిస్తున్నారు.

09:04 - July 12, 2016

చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తున్నారు. 150వ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే. ఇంకా ఈ చిత్రం షూటింగ్ ముగియకముందే చిరు మరో చిత్రానికి సైన్ చేశారని టాక్ వినిపోస్తోంది. తొలుత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరు 150వ సినిమా చేస్తారని మొదట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆటో జానీ' కథను పూరీ నెరేట్‌ చేశారు. ఇక సినిమా ట్రాక్‌ ఎక్కేస్తుంది అనే తరుణంలో ఉన్నట్టుండి వినాయక్‌తో చిరంజీవి 150వ చిత్రమని మీడియాలో వచ్చింది. మొదటి భాగం విన్న చిరు రెండో భాగం తరువాత వింటానని చెప్పారని టాక్ వినిపించింది. అనంతరం సెకాండాఫ్ చిరుకు నచ్చలేదని, అందుకే వివి వినాయక్ తో చిరు చిత్రం చేస్తున్నారని గుసగుసలు వినిపించాయి. ఇదిలా ఉంటే ఇటీవలే చిరును పూరి కలిశారని, పూర్తి కథను వినిపించారని టాలీవుడ్ టాక్. కథ బాగా నచ్చడంతో చిరు 151 సినిమాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట. అంతే కాకుండా ఇద్దరి మధ్యనున్న మనస్పర్థలు కూడా తెరదించేశారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరి ఇది నిజమా ? కాదా ? అనేది తెలియాలంటే వేచి ఉండాలి.

09:00 - July 12, 2016

వర్షాకాలం..సీజనల్ వ్యాధులకు కాలంగా చెప్పవచ్చు. అనేక రోగాలు ఈ కాలంలో వస్తుంటాయి. రోగాలు రాగానే వైద్యుల దగ్గరకు పరుగుడుతుంటారు. జ్వరం..చిన్న రోగాలకు కూడా యాంటీ బయోటిక్స్ మందులు ఇస్తున్నారు. కానీ యాంటీబయోటిక్స్ సహజంగానే దొరుకుతుంటాయి. పసుపు..తేనే, వెల్లుల్లి, అల్లం లాంటివి కొన్నింటిని మనంలో వంటల్లో వాడుకోవాలి.
అల్లం : ఇందులో యాంటీబయోటిక్ గుణాలు బ్యాక్టిరీయా వల్ల కలిగే పలు రకాల ఆరోగ్య సమస్యల నుండి కాపాడుతుంది. చిగుళ్ల ఇన్ ఫెక్షన్లను తగ్గిస్తుంది. శ్వాస కోశ సంబంధిత సమస్యలు తీరుతాయి.
తేనె : దాల్చిన చెక్క, తేనె సమపాళ్లలో తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని రోజు చెంచా చొప్పున తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. యాంటీ మెక్రోబియల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్ గుణాలు బాక్టీరియాను నశింపచేస్తాయి.
వెల్లుల్లి : యాంటీఫంగల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఖనిజాలు, విటమిన్లు, పోషకాలతో వెల్లుల్లి నిండి ఉంటుంది. రోజు తయారు చేసుకొనే వంటకాల్లో వెల్లుల్లిని భాగం చేసుకోవడంతో పాటు ఉదయాన్నే పరగడపున రెండు, మూడు వెల్లుల్లి రెబ్బల్ని పాలలో ఉడకబెట్టి తీసుకోవడం మంచిది.
వేప : యాంటీమయోటిక్ గుణాలు చర్మంపై ఏర్పడే ఇన్ ఫెక్షన్లు, మొటిమలను తగ్గిస్తాయి. పళ్లను బలంగా మారుస్తాయి. చిగుళ్ల సమస్యను కూడా తగ్గిస్తుంది.

 

106 మందుబాబులపై కేసులు నమోదు..

హైదరాబాద్ : బంజారాహిల్స్ రోడ్డు ప్రమాదం నేపథ్యంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ డీసీపీ -1 ఆధ్వర్యంలో 13 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 106 మందిపై కేసులు నమోదు చేశారు.

నేడు కోర్టుకు ఐసిస్ అనుమానిత ఉగ్రవాదులు..

హైదరాబాద్ : నగరంలో విధ్వంసానికి పథక రచన చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన ఐదుగురు ఐఎస్ అనుమానిత ఉగ్రవాదులకు కోర్టు విధించిన పోలీసు కస్టడీ ముగిసింది. మంగళవారం ఉదయం ఐదుగురు ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు నాంపల్లి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచనున్నారు. కోర్టు అనుమతితో ఐదుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ 12 రోజుల పాటు విచారించింది.

08:49 - July 12, 2016

సునీల్..మన్నార్ చోప్రా జంటగా నటించిన 'జక్కన్న' షూటింగ్ తుది దశకు చేరుకుంది. వంశీ ఆకెళ్ల దర్శకత్వంలో ఆర్.సుదర్శన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్.సుదర్శన్ మీడియాతో మాట్లాడారు. ఇటీవలే ఈ చిత్ర ఆడియోను మెగస్టార్ చిరంజీవి చేతులు మీదుగా విడుదల చేయడం జరిగిందని, ఆడియోకు మంచి స్పందన వస్తోందన్నారు. చిత్రంలో పంచ్ డైలాగ్స్ చాలా ఉన్నాయని, సునీల్ నటించిన ఎనర్జిటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అవుతుందన్నారు. దర్శకుడు అకెళ్ల కొత్త పాయింట్ ను ఎంటర్ టైనింగ్ గా చిత్రీకరించడం జరిగిందని, 'ప్రేమ కథా చిత్రమ్' తరువాత తమ బ్యానర్ లో వస్తున్న 'జక్కన్న'ను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు. ప్రస్తుతం ఆర్ఎఫ్ సీలో చిత్రానికి సంబంధించిన ఆఖరిపాట చిత్రీకరణ జరుగుతోందని, ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేయడం జరుగుతున్నాయన్నారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి 22న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు.

ఢిల్లీకి చేరుకున్న మోడీ..

ఢిల్లీ : నాలుగు ఆఫ్రికా దేశాల పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. దక్షిణాఫ్రికా, టాంజానియా, మొజాంబిక్, కెన్యా దేశాలలో మోడీ పర్యటించారు. కాసేపట్లో జమ్ము కాశ్మీర్ పరిస్థితిపై మోడీ సమీక్ష నిర్వహించనున్నారు. మిలిటెంట్ కమాండర్ బుర్హాన్‌వనీ కాల్చివేత దరిమిలా కాశ్మీర్ లోయలో హింసాత్మక నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

 

08:20 - July 12, 2016

ఖమ్మం : గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. వరద ప్రవాహం పోటెత్తుతోంది. గోదావరి వరద ఉధృతికి పలు చోట్ల వాగులు పొంగుతున్నాయి. వాజేడు, చర్ల, వెంకటాపురం మండలాల్లో వాగులు పొంగుతున్నాయి. దీనితో భద్రాచలం, వెంకటాపురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతికి భద్రాచలంలోని స్నానఘట్టాలు నీట మునిగిపోయాయి. వరదల కారణంగా ఖమ్మం జిల్లా అధికారయంత్రాంగం అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్తలో భాగంగా పలు లాంచీలను సిద్ధం చేశారు. ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లే రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మరో అడుగు పెరిగితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. సూయిజ్ కరకట్టలు లీక్ కావడంతో కొత్తకాలనీకి వరద ముంపు ఏర్పడింది. ఎన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు ఏర్పడినా అధికారులు శాశ్వత చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు.

రాజమండ్రిలో...
జులై రెండో వారం నుండే గోదావరి నదికి వరద తాకిడి తీవ్రమవుతోంది. దీనితో ప్రజలుత తీవ్రభయాందోళనలు చెందుతున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 12.10 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరుకుంది. 175 గేట్లు ఎత్తి 10.34 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ఇంద్రావతి, ప్రాణహిత నదులు పొంగిపొర్లుతున్నాయి. కరకట్టలు పటిష్టంగా ఉండేటట్లు చూసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 20 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. మన్యం ప్రాంతంలో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ అధికారులు సూచనలు జారీ చేశారు. 12.1 నీటిమట్టం చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. 13.75 అడుగులకు నీటిమట్టం చేరితో రెండో ప్రమాద హెచ్చరిక..నీటిమట్టం 17.75 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే కోనసీమలోని సుమారు 25 లంక గ్రామాలకు..మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే కోనసీమలోని మొత్తం 50 లంక గ్రామాలు జల దిగ్భందంలో చిక్కుకుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

08:03 - July 12, 2016

చర్మం బిగువుగా ఉండడం..నిగారింపు..మెరుపు కోసం అతివలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ వారి ప్రయత్నాలు కొన్నిసార్లు బెడిసి కొడుతుంటాయి..ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని చిట్కాలు పాటిస్తే పూర్వ నిగారింపు..మెరుపు సొంతం చేసుకుంటాయి. మరి చిట్కాలు చూద్దామా..
రెండు స్పూన్ల పాలు, కొన్ని చుక్కల విటమిన్ ఇ ఆయిల్ తీసుకోవాలి. అంతే మోతాదులో తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. ఆరిన తరువాత చల్లటి నీటితో కడిగేయాలి.
గుడ్డులోని తెల్లసొన తీసుకుని కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి బ్రష్ తో ముఖానికి, మెడకు, చేతులకు రాసుకోవాలి. ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
చందనం పొడిలో కొన్ని చుక్కల రోజ్ వాటర్ కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ పేస్టును ముఖానికి, మెడకు, చేతులకు అప్లై చేసి ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల చర్మం బిగువుగా మారి నిగారింపును సంతరించుకుంటుంది.

 

07:51 - July 12, 2016

బ్యూటీ పార్లర్ కు వొయ్యి అందంగ ముస్తాబైదాం అని అనుకునెటోళ్లు ఎవ్వలున్నరో జర్ర గీ ముచ్చట మీకోసమే.. కొండనాల్కెకు మందేస్తె ఉన్ననాల్కె ఊశిపోయినట్టు.. కాకినాడ కాడ ఒక ఆడివిల్ల పరిస్థితి ఆగానికొచ్చింది.. ఆ బుజ్జి ముచ్చట జూశ్నంక బ్యూటీ పార్లర్ కు వోవాల్నా వద్దా... పోతె ఏం జెయ్యాలే అనేది గమనించుకోండ్రి.. ఏం జరిగిందో వీడియోలో చూడండి.

గవర్నర్ ను కలవనున్న టి.టిడిపి నేతలు..

హైదరాబాద్ : నేడు ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను టి.టిడిపి నేతలు కలవనున్నారు. అసెంబ్లీలో టి.టిడిఎల్పీ గదుల వివాదంపై నేతలు ఫిర్యాదు చేయనున్నారు.

07:42 - July 12, 2016

నకిలీ అల్లమెల్లిగడ్డ.. నకిలీ పాలు, నకిలీ నూనె, నకిలీ బియ్యం, నకిలీ నోట్లున్నట్టే.. హిజ్రాలళ్ల గూడ నకిలీ హిజ్రాలు తయ్యారైండ్రట. ఇది ఎవ్వలు గుర్తువట్టవొయ్యిండ్రంటే ? నిన్న యాదగిరి గుట్టకాడ పెద్ద యుద్దమే అయ్యింది. ఆడ బైటవడ్డది ఈ కథ. తర్వాయి ముచ్చట తెలుసుకోవాలంటే వీడియో సూడుండ్రి...

మూతి పక్కకు మూతున్న పాము..
రెండు మూతుల పామును జూశిండ్రా మీరు. రెండు మూతులంటే ఇటు కొనకు ఒక మూతి.. అటు కొనకు ఒకమూతి ఉండేది అనుకునేరు కాదు కాదు. అవ్వి మస్తుగుంటయ్ మన ఊర్లపొంటిగని. మూతి పక్కకు మూతున్న పామును జూశిండ్రా..? జూడాలంటే వీడియో క్లిక్ చేయండి.

07:36 - July 12, 2016

కాశ్మీర్ లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. గత కొద్ది రోజులుగా అక్కడ హింసాత్మక ఘర్షణలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. మిలిటెంట్ కమాండర్ బుర్హాన్ వనీ కాల్చివేత దరిమిలా కాశ్మీర్ లోయలో హింసాత్మక నిరసనలు తలెత్తాయి. నాలుగు ఆఫ్రికా దేశాల పర్యటన ముగించుకుని వస్తున్న ప్రధాని మోడీ నేడు ఉన్నతస్థాయి అధికారులో కాశ్మీర్ అంశాన్ని సమీక్షించనున్నారు. హింసాత్మక ఘర్షణలు తలెత్తకుండా కేంద్రం చొరవ చూపాలని, చర్చలు ప్రారంభించాలనే సూచనలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో నగేష్ (విశ్లేషకులు), ప్రేమేందర్ రెడ్డి (బీజేపీ), లక్ష్మణ్ రావు (మాజీ ఎమ్మెల్సీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారు ఎలాంటి అభిప్రాయాలు తెలియచేశారో వీడియోలో చూడండి.

శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం..

చిత్తూరు : తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఉదయం 11గంటల నుండి భక్తులకు అనుమతినించనున్నారు.

చిత్తూరులో కారెం శివాజీ రెండో రోజు పర్యటన..

చిత్తూరు : నేడు జిల్లాలో కారెం శివాజీ రెండు రోజు పర్యటన చేయనున్నారు. అన్ని యూనివర్సిటీల అధికారులతో కారెం శివాజీ భేటీ కానున్నారు. మధ్యాహ్నం టిటిడి అధికారులతో సమీక్ష చేయనున్నారు.

 

పోలీసుల అదుపులో మగశిశువును కొనుక్కొన్న ఆయా..

హైదరాబాద్ : ఆబిడ్స్ ఆదిత్య ఆసుపత్రిలో మగ శిశువును ఆయా రేణుక రూ. 40వేలకు కొనుక్కొంది. సిటీ బస్సులో వెళుతుండగా రేణుకను పోలీసులు పట్టుకున్నారు. శిశువును నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.

పశ్చిమగోదావరిలో పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి..

పశ్చిమగోదావరి : గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. కడమ్మ ఔట్ఫాల్స్ ఫ్లూయిస్ వద్ద 14 అడుగులకు నీటిమట్టం చేరింది. దీనితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్తూరు కాజ్ వే పై వరద ప్రవాహంతో 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

విజయవాడ నుండి ధర్మవరానికి కొత్త రైలు ప్రారంభం..

విజయవాడ : నేడు విజయవాడ నుండి ధర్మవరం వరకు కొత్త రైలు ప్రారంభం కానుంది. ఢిల్లీ నుండి రిమోట్ వీడియో లింక్ ద్వారా కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించనున్నారు. వారానికి నాలుగు రోజుల పాటు రైలు నడవనుంది.

07:17 - July 12, 2016

నిత్యావసరాల ధరలు దిగిరాలేదు. మరింత పైపైకి ఎగబాకుతున్నాయి. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వున్న ధరలతో పోల్చుకుంటే ఇప్పుడు రెండు రెట్లు మూడు రెట్లు పెరిగాయి. పప్పు, ఉప్పు, నెయ్యి ఇలా ఏదీ సామాన్యులు కొనుక్కోలేని పరిస్థితి ఏర్పడింది. పప్పు ధాన్యాలతో పాటు అన్ని రకాల నిత్యావసరాల ధరలు ఇంత భారీగా పెరగడానికి కారణం ఏమిటి? ఇది ప్రకృతి శాపమా? ప్రణాళికా లోపమా? ప్రభుత్వ వైఫల్యమా? పెరుగుతున్న ధరలను అదుపు చేయాలంటే ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? స్వల్పకాలిక వ్యూహా లేమిటి? దీర్ఘకాలిక వ్యూహాలేమిటి? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో అఖిల భారత రైతు సంఘం నేత సారంపల్లి మల్లారెడ్డి విశ్లేషించారు. ఆయన ఎలాంటి సూచనలు..సలహాలు అందచేశారో వీడియోలో చూడండి.

06:46 - July 12, 2016

హైదరాబాద్ : హోం గార్డుల వెట్టి చాకిరి అంశం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఎస్పీ నవీన్‌కుమార్‌ ఇంట్లో జరిగినట్లు వెలుగులోకి వచ్చిన దృశ్యాలు పోలీస్ ఉన్నతాధికారుల్లో ఆందోళన రేపుతోంది. ఇప్పటికే కొందరు అధికారుల తీరుతో పోలీస్‌ శాఖ పరువు బజారున పడింది. తాజాగా ఎస్పీ నవీన్‌ కుమార్‌ వ్యవహారం తలలు పట్టుకునేలా చేస్తోంది. మీడియాలో వస్తున్న కథనాలతో పోలీస్‌ బాసులు అలెర్ట్‌ అవుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఎస్పీ నవీన్‌ కుమార్‌ ఇంట్లో హోంగార్డుల చాకిరి అంశంపై ఇన్‌ఛార్జి డిజిపి అంజనీకుమార్‌ తీవ్రంగా స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు డిఐజి అకున్‌ సబర్వాల్‌ను విచారణ చేపట్టారు. హోంగార్డులు, ఎస్పీ నవీన్‌ కుమార్‌ నుంచి వేర్వేరుగా వాంగ్మూలాలను డీఐజీ నమోదు చేశారు. నాలుగైదు రోజుల్లో ఇన్‌ఛార్జి డీజీపీకి డీఐజీ నివేదిక సమర్పించనున్నారు. మరోవైపు ఎస్పీ నవీన్‌ కుమార్‌ ఏ తప్పు చేయలేదని చెబుతున్నారు. తాను ఎస్పీగా బాధ్యతలు చేపట్టాక అధికారుల్లో లోపాలు గుర్తించానని..నివేదిక తయారు చేస్తున్నసమయంలో పక్కా ప్రణాళికతో ఇరికించారని ఆరోపిస్తున్నారు.

వెట్టిచాకిరి చేయలేదని చెప్పమన్నారా?
ఇక డీఐజీ విచారణకు ముందు హోంగార్డులను రంగారెడ్డి జిల్లా స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులు బెదిరించినట్లు వస్తున్న వార్తలు దుమారం రేపుతున్నాయి. బాధిత హోంగార్డులను పిలిపించి హెచ్చరికలు జారీ చేశారట. ఎస్పీ ఇంట్లో వెట్టిచాకిరి చేయలేదని చెప్పాలని ఒత్తిడి పెట్టినట్లు సమాచారం. సుమారు నాలుగు గంటల పాటు వారిని ప్రశ్నలతో వేధించినట్లు తెలుస్తోంది. సోషల్‌ మీడియాలో విజువల్స్‌ ఎవరు అప్‌లోడ్‌ చేశారో చెప్పాలని..కానిస్టేబుల్‌ మహేష్‌పై అనుమానం రావడంతో అతనిపై చర్యలకు ఉపక్రమించారు...ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేడుక్కుతున్న ఈ అంశంపై డీఐజీ నివేదికలో ఎలాంటి విషయాలు బయటపడతాయన్నది ఉత్కంఠ రేపుతోంది.

06:44 - July 12, 2016

హైదరాబాద్ : ఒక్కసారి దమ్ము పీల్చితే చాలు..మత్తులో మునిగిపోవచ్చు..కలల లోకంలో తేలిపోవచ్చు.. హుక్కా కిక్కుపై జరుగుతున్న ప్రచారం మైనర్లను ఆకర్షిస్తోంది. ఆ సెంటర్ల వైపు పరుగులు తీసేలా చేయిస్తోంది. కిక్కు కోసం వెంపర్లాడుతూ వారికి తెలియకుండానే ఆ వ్యసనానికి బానిసలుగా మారుతున్నారు..పోలీసుల దాడుల్లో దొరుకుతున్నవారిలో మైనర్లు ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

పద్ధతి మార్చుకోని నిర్వాహకుల తీరు..
హుక్కా కిక్కు..పీల్చుతున్న వారికే కాదు..నిర్వాహకులకు ఆ మత్తు వదలడం లేనట్లుంది. మైనర్లకు సరఫరా చేస్తే కఠిన చర్యలుంటాయని పోలీసులు పదే పదే ఇస్తున్న హెచ్చరికలు చేస్తున్నా నిర్వాహకుల తీరు మారడం లేదు. నెల రోజుల క్రితం హుక్కా సెంటర్లపై వరుస దాడులు చేసిన పోలీసులు. పదుల సంఖ్యలో మైనర్లను పట్టుకున్నారు...సీన్‌ రిపీట్‌ అయితే సహించేదిలేదంటూ వార్నింగ్‌లు ఇచ్చారు. అయినా జూబ్లీహిల్స్‌లో హుక్కా సెంటర్లలో మార్పు లేదు మళ్లీ మైనర్లు పట్టుబడటం తీవ్ర కలకలం రేపింది.

పదుల సంఖ్యలో పట్టుబడ్డ మైనర్లు..
జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లోని హుక్కా సెంటర్లపై పోలీసులు దాడులు చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఓ సెంటర్‌లో హుక్కా పీల్చుతూ మైనర్లు దొరికిపోయారు. పట్టుబడ్డ వారిలో నలుగురు బాలికలు ఉన్నారు. బాలబాలికలకు హుక్కా సరఫరా చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని రెండోసారి పట్టుపడితే లైసెన్స్‌లు రద్దు చేస్తామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

అలంకారప్రాయంగా సీసీ కెమెరాలు..
జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌ ప్రాంతాల్లో 30కి పైగానే హుక్కా సెంటర్లు ఉన్నాయి. జిహెచ్‌ఎంసి నుంచి అనుమతి పొందిన నిర్వాహకులు నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా దందా చేస్తున్నారు. హుక్కా పీల్చేందుకు వచ్చే కస్టమర్ల వివరాలు కూడా కొన్ని సెంటర్లు నమోదు చేయడం లేదు. సిసి కెమెరాలు ఆర్భాటానికే కనిపిస్తున్నాయి. దృశ్యాలు రికార్డు చేయడం లేదని తెలుస్తోంది. మైనర్లను హుక్కా సెంటర్లలోకి అనుమతించకూడదు. పొగాకు వినియోగచట్టం కింద వినియోగదారులకు హానీ కలగని మోతాదులో మాత్రమే హుక్కాను అందించాల్సి ఉంటుంది. కానీ ఇవేవీ నిర్వాహకులకు పట్టడం లేదు.

06:39 - July 12, 2016

హైదరాబాద్ : నగరంలో పేలుళ్లకు కుట్రపన్నిన ఐసిస్ నిందితుల ఎన్ఐఏ కస్టడీ పూర్తయింది. మంగళవారం మధ్యాహ్నాం 2గంటలకు కోర్టులో ఎన్ఐఏ పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చనున్నారు. 12 రోజుల పోలీసుల విచారణలోఐసిస్‌ నిందితుల కీలక విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది. ఐసిస్ సానుభూతిపరుల నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా ఎన్ఐఏ అధికారులు మహారాష్ట్రంలోని నాందేడ్, ఏపీలో లోని అనంతపురం తో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లి దర్యాప్తు చేశారు. నిందితులపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించకుండా విచారణ కొనసాగించాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. దీంతో ఈనెల 1న నిందితులు మహ్మద్‌ ఇబ్రహీం యజ్దానీ, హబీబ్ మహ్మద్‌, మహ్మద్‌ ఇలియాస్‌ యజ్దానీ, అబ్దుల్ బిన్‌ అహ్మద్ అల్‌ అమోదీ, ముజ్ఫుర్ హుస్సేన్‌ రిజ్వాన్‌లను కస్టడీలోకి తీసుకుంది ఎన్‌ఐఏ. శామీర్ పేట్ లోని హెడ్ క్వార్టర్స్ కు తీసుకెళ్లి విచారణ మొదలు పెట్టారు. ఎన్‌ఐఏ అధికారాలు తమదైన శైలిలో విచారణ చేపట్టి విలువైన సమాచారం రాబట్టినట్టు తెలుసోంది. ప్రధాన నిందితుడు ఇబ్రహీం.. పరిచయాలపై, హైదరాబాద్‌తో వీరికి ఉన్న అనుబంధం పై ఆరా తీశారు. హావాలా రూపంలో ఆర్ధిక సహాయం చేసేందుకు మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి డబ్బులు వచ్చినట్లు విచారణలో తేలింది. బ్యాంకు అకౌంట్లు ఎవరి పేరు మీద తీశారో ఆరా తీసి తలాబ్ కట్టలోని బ్యాంకు అధికారులను సంప్రదించినట్లు సమాచారం.

9 ఎం.ఎం. పిస్తోల్ ల కొనుగోలు పై ఆరా..
9 ఎం.ఎం. పిస్తోల్ కొనుగోలు పై ఎన్‌ఐఏ అధికారులు ఆరా తీశారు. నాందేడ్ నుంచి 9 ఎం.ఎం. పిస్తోల్ ఎలా తీసుకొచ్చారు, అక్కడ ఏవరెవరు సహాకరించారు అనే కోణంలో అక్కడికి ప్రధాన నిందితుడు ఇబ్రహాంను తీసుకెళ్లి మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పిస్తోల్ వ్యవహరాన్ని ఎన్.ఐ.ఏ.చాలా సిరీయస్ గా తీసుకున్నారు. నాందేడ్‌లో జరిపిన విచారణతో హైదరాబాద్ లో ని ఇబ్రహీం, ఇలియాస్ ఇళ్లలో సోదాలు నిర్వహించారు. మరో 17 బుల్లెట్లు, 2 కంప్యూటర్లు , రెండు స్కానర్లను స్వాధీనం చేసుకున్నారు. జూలై 5న నిందితులు వాడిన అండర్ గ్రౌండ్ హాకింగ్ నెట్‌వర్క్‌ పై దృష్టి పెట్టారు. నిఘా వర్గాల కంట పడకుండా సమాచార మాధ్యమాలు ఎలా వాడారనే అంశాన్ని తేటతెల్లం చేశారు. వీరికి సహకరించిన ఐటీ నిఫుణులను గుర్తించేందుకు కసరత్తు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది.

అనంతపురం లో ఎన్ఐఏ విచారణ..
ఎన్.ఐ.ఏ. టీం అనంతపురం వెళ్లి నంది లాడ్జి సేఫ్ గా భావించినందున అక్కడ ఎవరెవరిని కలిశారో విచారణలో రాబట్టారు. మీ సేవా కేంద్రం నుంచి మరొకరి పేరుతో ఐ.డీ. ప్రూప్ సమర్పించి లాడ్జిలో స్థావరం పొందారు. ఏ.పి. ఇంటెలిజెన్స్ పోలీసుల సహాకారంతో విచారణ కొనసాగుతోంది. రంజాన్ పండుగ నేపథ్యంలో నిందితులకు ఒక్కొక్కరికి ఇద్దరి బంధువులకు కలిసేందుకు అవకాశం ఇచ్చారు. వారికి ఇష్టమయిన ఆహారం తెచ్చి పెట్టారు. షీర్‌కుర్మా, బిర్యానీ, ఖీర్.. తెచ్చి పెట్టారు. దేశవ్యాప్తంగా చిక్కిన 30 మంది ఐసిస్ సానుభూతిపరులు, అనుమానితులలో యూసుఫ్ అల్ హింద్ పేరుతో ఒకరు పరిచయమయ్యాడు. అతను షఫీ ఆర్మర్ అని ఎన్.ఐ.ఏ. భావిస్తుంది. ఇబ్రహీం సైతం తాను గడిచిన ఆరు నెలల్లో అనేకసార్లు ఈ అల్ హింద్‌తో నాలుగైదుసార్లు ఐసిస్ అధినేత అబు బకర్ అల్‌బాగ్దాదీగా చెప్పుకున్న వ్య క్తితో సంప్రదింపులు జరిపానని చెప్పుకొచ్చినట్లు సమాచారం.
మొత్తానికి హైదరాబాద్ లో ఐసిస్ మూలాలను కూకటి వేళ్లతో పెలికించేలా ఎన్.ఐ.ఏ. ప్రయత్నం చేస్తుంది. అయితే కోర్టులో హాజరుపర్చిన తర్వాత అవసరమైనప్పుడు మళ్లీ కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టును అభ్యర్ధించే అవకాశం ఉంది. కస్టడీ రిపోర్టులో కీలక విషయాలను పొందుపరచనున్నారు.

06:35 - July 12, 2016

హైదరాబాద్ : వైఎస్ హయాంలో నిర్మాణం ప్రారంభించిన గౌరవెల్లి రిజర్వాయర్ డిజైన్ ను కెసిఆర్ ప్రభుత్వం మార్చేయడంతో నిర్వాసితుల సమస్య మరోసారి ఎజెండా మీదకు వచ్చింది. 2007లో భూములు కోల్పోయినవారికే ఇంతవరకు సరైన పరిహారం అందకపోవడం, రైతులు కూలీలుగా మారడంతో కొత్తగా నిర్వాసితులయ్యేవారు మరింత ఆందోళన చెందుతున్నారు. గౌరవెల్లి నిర్వాసితులకు మద్దతుగా సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రెండు రోజుల పాదయాత్రకు సిద్ధమయ్యారు. జులై 12, 13 తేదీలలో ఈ పాదయాత్ర వుంటుంది. హుస్నాబాద్ మండలంలోని గౌరవెల్లి, గుండువెల్లి పచ్చటి పొలాలున్న గ్రామాలు. ఏడాదికి రెండు పంటలు పండే భూములున్నాయి. ఇక్కడ రిజర్వాయర్ నిర్మించాలన్నది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయం. అప్పట్లో 1.4 టిఎంసిల సామర్థ్యంతో గౌరవెల్లి రిజర్వాయర్ ను డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్ట్ వల్ల గుడాటిపల్లి, తెనుగుపల్లి గ్రామాలు, 2300 ఎకరాల భూమి మునిగిపోతాయని లెక్కలేశారు. ఆనాటి జలయజ్ణంలో భాగంగా 2007 సెప్టెంబర్ 9 రిజర్వాయర్ నిర్మాణానికి పునాదిరాయి వేశారు. 116 కోట్ల 30 లక్షల రూపాయలతో రిజర్వాయర్ నిర్మాణం పూర్తవుతుందన్నది అప్పటి అంచనా. సీరియస్ గా పనులు చేసి వుంటే, ఇప్పటికే నిర్మాణ పూర్తయ్యేది. గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణం పనులు వారిగేట్స్ కంపెనీకి అప్పగించారు. ఈ ప్రాజెక్ట్ కోసం కొంతమందిని ఇళ్లు ఖాళీ చేయించారు. వారి నుంచి భూమిని తీసుకున్నారు. ఇప్పుడు వారిలో చాలామంది రోజు కూలీలుగా మారిపోయారు.

డిజైన్ మార్చారు..
బెజ్జంకి మండలం తోటపల్లి రిజర్వాయర్ నుంచి సొరంగమార్గంలో లిఫ్ట్ ద్వారా గౌరవెల్లి ప్రాజెక్ట్ కి నీటిని సరఫరా చేయాల్సి వుంటుంది. కాలువలు నిర్మించారు. కానీ, లిఫ్ట్ కోసం పంప్ హౌస్ పనులు పూర్తి చేయలేదు. మొత్తానికి 60శాతం పనులు పూర్తయ్యాయి. నిధులు విడుదల చేయడం లేదంటూ కాంట్రాక్ట్ కంపెనీ పనులు ఆపేసింది. సరిగ్గా ఏడాది క్రితం హుస్నాబాద్ లో పర్యటించిన ముఖ్యమంత్రి కెసిఆర్ గౌరవెల్లి, గండువెల్లి ప్రాజెక్ట్ నిర్మించి, 9 టీఎంసీ లకు నీటి నిల్వ సామర్థ్యం పెంచుతామన్నారు. జీవో జారీ చేసి, 1300 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఎత్తు పెంచడం వల్ల లక్ష ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నది ప్రభుత్వం వాదన. డిజైన్ ప్రాజెక్ట్ మార్చడం వల్ల ముంపు గ్రామాల సంఖ్య పెరిగింది. గుడాటిపల్లి, తెనుగుపల్లి గ్రామాలతో పాటు చింతల్ తండా, బోంద్యానాయక్ తండా, జాల్వాయ్ తండా, సేవనాయక్ తండాలతో పాటు మరో 1500 ఎకరాలు మునిగిపోతాయి. గౌరవెల్లి ప్రాజెక్ట్ కి అయిదు కిలోమీటర్ల దూరంలో వున్న గండుపెల్లి దగ్గర నిర్మించే రిజర్వాయర్ సామర్థ్యాన్ని 0.4 టిఎంసిల నుంచి 1 టీఎంసికి పెంచడం వల్ల 8 గిరిజన తండాలకు ముంపు సమస్య తప్పదు. వీరంతా ప్రభుత్వ భూమిని సాగుచేసుకుంటూ జీవిస్తున్నారు. తమకు పరిహారం చెల్లిస్తారో లేదో నన్న భయం వీరిని వెన్నాడుతోంది. 123 జీవో ప్రకారం కాకుండా, 2013 భూ సేకరణ చట్టం ప్రకారమే తమకు పరిహారం చెల్లించాలన్నది వీరి కోరిక. గౌరవెల్లి ప్రాజెక్ట్ నిర్వాసితులకు వామపక్షాలతో పాటు టిడిపి, కాంగ్రెస్ నేతలు కూడా మద్దతు ప్రకటిస్తున్నారు.

06:32 - July 12, 2016

హైదరాబాద్‌ : మీర్‌పేటలో శిశువు విక్రయానికి పాల్పడిన ఆయాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అబిడ్స్‌లోని ఆదిత్య హస్పిటల్లో ఆయాగా పనిచేస్తున్న రేణుక కాన్పుకోసం వచ్చిన ఓ మహిళనుంచి శిశువును కొన్నట్టు పోలీసులు తెలిపారు. 40 వేల రూపాయలకు మగశిశువును కొని మరొకచోటికి తరలిస్తుండగా స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహిళను అదుపులోకి తీసుకున్న మీర్‌పేట పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

06:30 - July 12, 2016

హైదరాబాద్ : హరితహారం కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మహాయజ్ఞంపై అవగాహన ప్రజలకు కల్పించేలా వార్తా కథనాలు ప్రచురించి, ప్రసారం చేసే మీడియా సంస్థలు, జర్నలిస్టులకు హరితహారం అవార్డులు ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఈ విషయంలో మీడియా పాత్ర కీలకం కావడంతో పత్రిక, ప్రసార మాధ్యమాలను ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. హరితహారంపై మంచి కార్యక్రమాలు, కథనాలు, వార్తలు ప్రచురించి, ప్రసారం చేసిన మీడియా సంస్థలకు అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. విశ్లేషణాత్మక కథనాలు, ఆర్టికల్స్‌కు ఎడిటర్లతోపాటు, విలేకర్లకు అవార్డులు ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఈ ఏడాది నుంచి ప్రతి ఆగస్టు 15వ తేదీన అవార్డులు అందజేస్తారు. వాతవరణ సమతూకాన్ని కాపాడేందుకు మొక్కల అవశ్యకతను ప్రజలకు వివరించాలని సీఎం మీడియాను కోరారు. హరితహారంతో చేకూరే బహుళ ప్రయోజనాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని విన్నవించారు.

పనులు చేపట్టేందుకు సల్వ వ్యవధి టెండర్లు..
మరోవైపు హరితహారం ప్రారంభోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీ అమలుకు కేసీఆర్‌ చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని మూడు కాల్వల వ్యవస్థ పునరుద్ధరణకు 350 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. పోచంపల్లి మండలంలోని పిల్లాయిపల్లి కాల్వకు 45 కోట్ల రూపాయలు కేటాయించారు. బీబీనగర్‌ మండలంలోని బునియాదిగని కాల్వ పునురుద్ధరణకు 40 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. వెలిగొండ మండలంలోని ధర్మారెడ్డి కాల్వకు 38 కోట్లు కేటాయించారు. ఈ పనులను చేపట్టేందుకు వెంటనే స్వల్ప వ్యవధి టెండర్లు పిలవాలని కృష్ణానది పరీవాహక ప్రాంత చిన్ననీటి వనరుల చీఫ్‌ ఇంజినీర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మూడు కాల్వల పునరుద్ధరణ పూర్తైతే నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాలకు సాగునీటితో పాటు, తాగునీరు అందుతుంది.

06:28 - July 12, 2016

హైదరాబాద్ : హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఒక్క రోజే కోటి మొక్కలు నాటాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కోటి మొక్కలు నాటే హరితహారం మహాక్రతువును మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రారంభించనున్నారు. నారాయణపేట అసెంబ్లీ నియోజవర్గ పరిధిలోని దామరగిద్దలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ కార్యక్రమాన్ని చేపడతారు. మహోద్యమంగా చేపట్టే హరితహారం అమలుపై హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంత్రి సమీక్షించారు. హరితహారంలో ఇందిరా కాంత్రిపథం గ్రూపులు, ఉపాధి కూలీలను భాగస్వాములను చేయాలని నిర్ణయించారు. మొక్కలు నాటడంతో పాటు వీటిని సంరక్షించే బాధ్యతను వీరే తీసుకోవాలని కోరారు. నాటిన మొక్కలు, వీటి పరిరక్షణపై పూర్తి సమాచారంతో రిజిస్టర్లు నిర్వహించాలని ఆదేశించారు.

రంగారెడ్డి జిల్లాలో 6 లక్షల మొక్కలు..
హైదరాబాద్‌ మినహా మిగిలిన 9 జిల్లాల్లోని 8 వేలకు పైగా గ్రామాల్లో కోటి మొక్కలు నాటతారు. 4లక్షల 14వేల 406 మహిళా సంఘాలకు చెందిన 47లక్షల 20 వేల 342 మంది సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రతిగ్రామంలో కూడా వెయ్యి నుంచి 1200 మొక్కలు నాటాలని నిర్ణయించారు. మొక్కలు నాటడానికి జిల్లాల వారీగా లక్ష్యాలు నిర్ధారించారు. వరంగల్‌ జిల్లాలో అత్యధికాంగా 16 లక్షలు, మహబూబ్‌నరగ్‌ 15 లక్షల మొక్కలు నాటతారు. నల్గొండలో 12 లక్షలు, ఖమ్మం, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో 10 లక్షల వంతున మొక్కలు నాటతారు. రంగారెడ్డిలో 6 లక్షలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కార్యక్రమాన్ని అన్ని స్థాయిల్లో విజయవంతం చేయాలని జూపల్లి కృష్ణారావు పంచాయతీరాజ్‌ శాఖ అధికారులను ఆదేశించారు.

06:26 - July 12, 2016

ఖమ్మం : భారీ వర్షాలు, వరదలతో ఖమ్మంజిల్లా అతలాకుతలం అవుతోంది. భద్రాచలం డివిజన్‌లోని గిరిజనులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకీడుస్తున్నారు. పలుగ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద గోదారవరి 51 అడుగులు దాటిపోయింది. దీంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వారం రోజులగా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీగా వరదనీరు ముంచెత్తడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గంట గంటకూ పెరిగిపోతున్న వరదతో గోదావరి నీటిమట్టం సోమవారం సాయంత్రానికి 51అడుగులకు చేరుకుంది. గోదావరికి వరద పోటెత్తడంతో భద్రాచల పట్టణంలోని పలుకాలనీల్లోకి వరదనీరు చేరింది.

వరదలో చిక్కుకున్న గొర్రెల కాపరులు..
చర్ల మండలంలో పరిధిలోని పలుగ్రామాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వరదనీరు రోడ్లను ముంచెత్తడంతో పలుగ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చర్లమండలం కోరెగడ్డలంకలో గొర్రెల కాపరులు చిక్కుకు పోయి రెండు రోజుల పాటు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడిపారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య చొరవతో గొర్రెలమందతో సహా కాపరులు ప్రాణాలు దక్కించుకున్నారు.

రాకపోకలు బంద్‌.. అవస్థలు పడుతున్న జనం..
అటు వెంకటాపురం, వాజేడు మండలాల మధ్య పలు గ్రామాలకు బయటిప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కొండాపురం, కుక్కతొర్రివాగులు ప్రమాదకరస్థాయిలో ఉరకలెత్తుతున్నాయి. దీంతో రాకపోకలు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఎగువన మహరాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉధృతి గంటగంటకూ పెరిగిపోతోంది. సోమవారం అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీచేశారు. దీంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.

06:20 - July 12, 2016

హైదరాబాద్ : నగరంలో పేరుగాంచిన ఆర్టీసీ క్రాస్ రోడ్డులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అస్టోరియా హోటల్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున వంటగది నుండి పొగలు వచ్చాయి. ఒక్కసారిగా మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఆస్టోరియా హోటల్ పక్కనే ఇతర వాణిజ్య, అపార్ట్ మెంట్లు ఉన్నాయి. ఆ భవనంలోనే ఉన్న హాస్టల్ విద్యార్థులు అప్రమత్తమై బయటకు పరుగులు తీశారు. దీనితో వారికి ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు. హోటల్ లో ఉన్న ఫర్నీచర్ మంటలకు దగ్ధమైంది. మంటలు భారీగా ఎగిసిపడడంతో ఆస్తినష్టం భారీగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును పోలీసు ఉన్నతాధికారి మీడియాకు వివరించారు. వంటగదిలో షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుని ఉండవచ్చునని భావిస్తున్నారు.

అస్టోరియా హోటల్ లో అగ్నిప్రమాదం..

హైదరాబాద్ : అస్టోరియా హోటల్ లో మంటలు ఎగిసిపడ్డాయి. మంగళవారం తెల్లవారుజామున ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఫర్నీచర్ దగ్ధమైంది. పక్కనే ఉన్న హాస్టల్ విద్యార్థులు అప్రమత్తమై ప్రాణాలు రక్షించుకున్నారు. ప్రాణనష్టం కలగలేదు కానీ భారీగానే ఆస్తినష్టం కలిగి ఉంటుందని తెలుస్తోంది.

నేడు పశ్చిమగోదావరి జిల్లాకు వైఎస్ జగన్...

కాకినాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాకు రానున్నారు. హైదరాబాద్ నుంచి మధురపూడి ఎయిర్‌పోర్టుకు సాయంత్రం చేరుకోనున్నారు. అనంతరం ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆయన పశ్చిమ గోదావరి జిల్లాకు వెళతారు.

నేడు హార్ధిక్ పటేల్ విడుదల..

గుజరాత్ : పటేళ్ల నాయకుడు హార్దిక్ పటేల్ నేడు విడుదల కానున్నారు. మరో రెండు కేసుల్లోనూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మూడు రోజుల క్రితం దేశద్రోహం కేసులో హార్దిక్ కు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. మంగళవారం జైలు నుంచి ఆయన విడుదల కానున్నారు. బెయిల్ మంజూరు చేస్తూ, గుజరాత్ నుంచి 6 నెలల పాటు హార్దిక్ రాష్ట్రం బయట వుండాలని కోర్టు షరతు విధించిన విషయం తెలిసిందే.

నేడు కోటి మొక్కల హరితహారం..

ఢిల్లీ : హరితహారంలో భాగంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ రాజ్ ఆధ్వర్యంలో ఒక్కరోజే కోటి మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట నియోజకవర్గం దామరగిద్ద మండల కేంద్రంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శ్రీకారం చుట్టనున్నారు.

ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా..

హైదరాబాద్ : ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగుల రెండ్రోజుల సమ్మె వాయిదా పడింది. ఈనెల 12, 13 తేదీల్లో తలపెట్టిన దేశవ్యాప్త సమ్మె ప్రతిపాదనను నిరసిస్తూ సోమవారం ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయిస్ యూనియన్ అసోసియేషన్ వెల్లడించింది. ఎస్బీఐలో అనుబంధ బ్యాంకులు విలీనంతో పాటు ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బ్యాంకుల ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

నేడు కాశ్మీర్ పై ప్రధాని మోడీ సమీక్ష..

కాశ్మీర్ : జమ్మూ కాశ్మీర్ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఉన్నత స్థాయి భేటీలో సమీక్షించనున్నారు. నాలుగు ఆఫ్రికా దేశాల పర్యటన ముగించుకుని మంగళవారం ఉదయం ఢిల్లీకి తిరిగి రానున్నారు. మిలిటెంట్ కమాండర్ బుర్హాన్ వనీ కాల్చివేత దరిమిలా కాశ్మీర్ లోయలో హింసాత్మక నిరసనలు తలెత్తిన సంగతి తెలిసిందే.

 

13 వరకు డిగ్రీ ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు..

హైదరాబాద్ : తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశం కోసం విద్యార్థులు ఈనెల 13వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించినట్లు అధికారులు వెల్లడించారు.

రెండు రోజుల పాటు బ్యాంకులు బంద్..

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా జాతీయ బ్యాంకుల ఉద్యోగుల సమ్మె కారణంగా రేపు, ఎల్లుండి బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ మేరకు బ్యాంకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అనుబంధ బ్యాంకుల విలీనం, ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణను ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగిన చర్చలు విఫలమయ్యాయి.

Don't Miss