Activities calendar

17 July 2016

కర్నూలులో పర్యటించనున్న సీఎం బాబు...

కర్నూలు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో పుష్కర పనులను సమీక్షించనున్నారు. ఉదయం 10.30గంటలకు కర్నూలు నగరానికి చేరుకోనున్నారు.

 

ప్రధానితో భేటీ కానున్న సీఎం కేసీఆర్...

ఢిల్లీ : భారత ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సోమవారం భేటీ కానున్నారు. అంతర్రాష్ట మండలి సమావేశంలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 12.40 గంటలకు మోడీతో కేసీఆర్ సమావేశమవుతారని తెలుస్తోంది. 

సోమవారం ఎన్డీఏ పక్ష నేతల సమావేశం..

ఢిల్లీ : రేపు సాయంత్రం ఏడు గంటలకు ప్రధాని మోడీ అధ్యక్షతన ఎన్డీఏ పక్ష నేతలు సమావేశం జరగనుంది. రేపటి నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే,.

 

బాబుతో భేటీ కానున్న టి.టిడిపి నేతలు..

హైదరాబాద్ : సోమవారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తో టి.టిడిపి నేతలు సమావేశం కానున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. 

కొద్దిగంటల్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం..

ఢిల్లీ : రేపటి నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రధాని నరేద్రమోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఉభయ సభల్లో చర్చలు సజావుగా సాగేందుకు సహకరించాలని అఖిలపక్ష నాయకులకు ప్రధాని విజ్ఞప్తి చేశారు.

 

సోమవారం నగరంలో ఆర్బీఐ గవర్నర్ పర్యటన..

హైదరాబాద్ : సోమవారం నగరంలో ఆర్బీఐ గవర్నర్‌ పర్యటించనున్నారు. వివిధ ప్రాంతాలను ఆయన సందర్శించనున్నారు. రాజేంద్రనగర్‌ ఎన్‌ఐఆర్డీలో సెమినార్‌లో ఆర్బీఐ గవర్నర్ పాల్గొని ప్రసంగించనున్నారు. 

21:34 - July 17, 2016

హైదరాబాద్ : దేశంలోని అన్ని హైకోర్టులలో రానున్న రోజుల్లో ఈ-కోర్టులను ప్రారంభిస్తామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి మదన్ బి లోకూర్ అన్నారు. హైదరాబాద్‌లో ఈ-కోర్టును ఆయన ప్రారంభించారు. దేశంలోనే మొదటిసారిగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో పేపర్‌లెస్ ఈ-కోర్టును ప్రారంభించడం శుభపరిణామని జస్టిస్ లోకూర్ తెలిపారు. కార్యక్రమంలో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దిలీప్‌ బి భోసలే, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

21:31 - July 17, 2016

ఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై మరోసారి ఘాటైన విమర్శలతో విరుచుకుపడ్డారు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌. టాక్ టు ఏకే కార్యక్రమం వేదికగా..కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం సాధించిన ఘనతలను ప్రశ్న-జవాబుల రూపంలో ప్రజలకు తెలియజేసేందుకు అరవింద్ కేజ్రీవాల్ నిర్వహించిన 'వెబ్ టాక్ షోకు భారీ స్పందన వచ్చింది. లైవ్ వెబ్ ప్రసారంలో ప్రజలు అడిగిన ప్రశ్నలకు కేజ్రీవాల్‌ సమాధానాలు ఇచ్చారు. మోదీ సర్కారు ఢిల్లీలో భారత్-పాకిస్థాన్ లాంటి పరిస్థితిని సృష్టించి ఢిల్లీలో పరిపాలన స్తంభింపజేయాలని మోదీ చూస్తున్నారన్నారని విమర్శించారు. తాము నిజాయితీగా, నిర్భీతిగా ఉండటం మోదీ సర్కారుకు ఇబ్బందిగా మారినట్టుందని కేజ్రీవాల్ అన్నారు. ప్రజలు డిమాండ్ చేస్తే వచ్చే ఏడాది గుజరాత్‌లో జరిగే ఎన్నికల్లో ఆప్‌ పోటీ చేస్తుందన్నారు.

 

21:30 - July 17, 2016

ఢిల్లీ : అరుణాచల్‌ప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా పెమా ఖండూ ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని ఈటానగర్‌లో ఈ కార్యక్రమం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి నబాంగ్ టుకీపై శనివారం అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి ఓ గంట ముందు నాటకీయ పరిణామాల మధ్య ఆయన ముఖ్యమంత్రి పదవితో పాటు కాంగ్రెస్ లీడర్ పదవికి రాజీనామా చేశారు. టుకీని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌లో రెబల్స్‌గా మారిన 30 మంది ఎమ్మెల్యేలలో ఖండూ కూడా ఒకరు. వారి సపోర్టుతో గవర్నర్‌కు లేఖను సమర్పించిన ఖండూ అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమయ్యారు. కాగా అరుణాచల్‌ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి పీఠం మార్పు వెనుక కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చక్రం తిప్పినట్లు సమాచారం. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు కలిగిన అరుణాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ 45 స్థానాలను గెలుపొందింది.

21:24 - July 17, 2016

హైదరాబాద్ : తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి హరీష్‌రావు సచివాలయంలో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులను లక్ష్యం ప్రకారం పూర్తి చేయకపోతే 60శాతం బిల్లుల చెల్లింపులను నిలిపివేస్తామని మంత్రి అధికారులను హెచ్చరించారు. ఖరీష్‌ సీజన్‌ ప్రారంభం కావడంతో అత్యవసర ప్రాజెక్టులను పూర్తిచేసి రైతులకు నీరివ్వాలన్నారు. మరో రెండు రోజుల్లో ఆల్మట్టి నుంచి పాలమూరు ప్రాజెక్టుకు కృష్ణా జలాలను అందించాలన్నారు. జూరాల, బీమా, నెట్టెంపాడు పథకాలపై ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.

21:21 - July 17, 2016

గుంటూరు : జిల్లాలో దారుణం జరిగింది. 17ఏళ్ల మైనర్‌ బాలికను ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారం చేసి ఆ తర్వాత అత్యంత దారుణంగా హత్యచేసి ఉరేసి చంపేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు..ఇద్దరు యువకులను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకొని చితకబాదారు. విషయం పోలీసులకు తెలియడంతో అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం మహ్మదీయపాలెంలో ఈ ఘటన జరిగింది. ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయాన్ని గమనించిన సాయి, పవన్ కుమార్‌ అనే ఇద్దరు యువకులు ఇంట్లో ఒంటరిగా ఉన్న జాస్మిన్‌ అనే మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత క్రికెట్‌ బ్యాట్‌తో అత్యంత దారుణంగా జాస్మిన్‌ తలపై కొట్టి ఆ తర్వాత ఇంట్లోనే ఉరేసి చంపేశారు. అయితే బాలిక అరుపులు విన్న స్థానికులు ఇంట్లోకి వచ్చి చూసేసరికి ఇద్దరు యువకులు అక్కడే ఉన్నారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు, బంధువులు ఇద్దరు యువకులను చెట్టుకు కట్టేసి చితకబాదారు. కంట్లో కారంపోసి మరీ చితకబాదారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి యువకులను అదుపులోకి తీసుకున్నారు. తమ కూతురు మృతికి కారణమైన ఇద్దరు యువకులను ఉరిశిక్ష వేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. 

హెచ్ సీయూలో కొవ్వొత్తుల ర్యాలీ..

హైదరాబాద్ : దళిత విద్యార్థి రోహిత్‌ వేముల చనిపోయి 6 నెలలైన సందర్భంగా వర్సిటీలో విద్యార్థుల కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు భారీగా మోహరించారు. 

21:11 - July 17, 2016

ఢిల్లీ : పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలకు అధికార.. విపక్షాలు అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. జీఎస్‌టీ సహా పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నింటినీ ఆమోదించుకోవాలని బీజేపీ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బిల్లుల ఆమోదానికి సహకరించాలని.. ఉభయ సభల్లో చర్చలు సజావుగా జరిగేందుకు సహకరించాలని అఖిలపక్ష నేతలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఏ ప్రభుత్వానికి లాభం చేకూరింద‌న్న అంశం క‌న్నా జాతి ప్రయోజ‌నాలు ముఖ్యమ‌ని మోదీ ఈ సంద‌ర్భంగా అన్నారు.  మరోవైపు జీఎస్‌టీ బిల్లు కాంగ్రెస్‌, బీజేపీలు నిర్ణయించేది కాదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ అన్నారు.

సీపీఎం విమర్శ..
దీనిపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని రెండేళ్లుగా కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. జీఎస్టీపై రాష్ట్రాలు, కేంద్రం మ‌ధ్య స‌యోధ్య లేద‌ని, ఇలాంటి ప‌రిస్థితుల్లో ఎలా ముందుకెళ్తార‌ని కాంగ్రెస్ ఎంపీ గులాంన‌బీ ఆజాద్ ప్రశ్నించారు. జీఎస్టీ బిల్లులోని మూడు వివాదాస్పద అంశాల‌ను కేంద్రం ఎలా ప‌రిష్కరిస్తుందో తెలపాలని మరో కాంగ్రెస్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా కోరారు. జీఎస్టీపై పూర్తిస్థాయి ముసాయిదా ప్రతిపాద‌న కావాలని ఆయన డిమాడ్‌ చేశారు. ప‌న్ను రేటును 18 శాతానికి ప‌రిమితం చేయాల‌న‌డంతో పాటు ప‌లు కీల‌క స‌వ‌ర‌ణ‌లను కాంగ్రెస్‌ సూచిస్తోంది. అయితే భ‌విష్యత్‌లో మ‌ళ్లీ స‌వ‌ర‌ణ చేయాల్సిన అవ‌స‌రం త‌లెత్తకుండా ప‌న్ను రేటును ప‌రిమితం చేయాల‌ని అనుకోవ‌డం లేద‌ని ప్రభుత్వం చెబుతోంది.

తెలుగు రాష్ట్రాల ఎంపీలు..
అటు తెలుగు రాష్ట్రాల ఎంపీలు మాత్రం విభజన హామీలపైనే ప్రధానంగా ఫోకస్‌ చేస్తున్నారు. విభజన బిల్లులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలపై సమావేశంలో చర్చించినట్లు టీడీపీ ఎంపీ తోటనరసింహం చెప్పారు. రాష్ట్రానికి సంబంధిచిన అన్ని అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు. టీఆర్‌ఎస్‌ సైతం విభజన హామీలపైనే ప్రధానంగా దృష్టి సారించింది. ప్రత్యేక హైకోర్టు, 9, 10 వ షెడ్యూల్‌లో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారంతో పాటు రాష్ట్రానికి రావల్సిన నిధులపై సభలో ప్రస్థావించనుంది. అఖిల పక్ష భేటీ అనంతంరం తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఆ పార్టీ ఎంపీలంతా భేటీ అయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. విభజన హామీలతో పాటు పార్టీ ఫిరాయింపుల సవరణ బిల్లును సభలో చర్చించాలని వైసీపీ డిమాండ్‌ చేస్తోంది. ఈ మేరకు తాము ప్రైవేట్‌ బిల్లును సైతం సభలో ప్రవేశపెట్టనున్నట్లు ఆ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. పార్టీ ఫిరాయింపులతో రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతింటుందని మేకపాటి అన్నారు. మొత్తానికి అధికార విపక్షాల వ్యూహ ప్రతివ్యూహాలతో పార్లమెంట్‌ సమావేశాలు హాట్‌ హాట్‌గా జరగనున్నాయి. 

20:41 - July 17, 2016

జులాయిలుగా..హంతకులుగా..దొంగలుగా..మారుతున్నారు. దీనికి కారణం ఒక్కటే ఒళ్లు వంచి కష్టపడకుండా సంపాదించాలన్న ఆలోచనే ఈ దుర్మార్గాలకు కారణం. కొంతమంది ఎంత కష్టపడినా కాలం కలిసిరాక ఇబ్బందులు పడుతుంటారు. కొందరు ఎలాంటి కష్టం చేయకపోయినా జల్సాగా సరదాగా బతికేస్తుంటారు. మరికొందరు సునాయసంగా డబ్బులు సంపాదించుకుంటూ ఇళ్లు..వాకిలి లేకుండా వీధుల వెంట తిరుగుతూ ఉంటారు. ఇంకొంత మంది ఎదుటి వ్యక్తులకు ఇబ్బందులు కలిగిస్తుంటారు. వీధుల్లో తిరుగుతూ దోపిడి దారులుగా..దొంగలుగా..హంతకులుగా మారుతుంటారు. అలాంటి ఆవారాగాళ్ల కథే..మరి దీని గురించి తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

సోమవారం నగరంలో ఆర్బీఐ గవర్నర్ పర్యటన..

హైదరాబాద్ : సోమవారం నగరంలో ఆర్బీఐ గవర్నర్‌ పర్యటించనున్నారు. వివిధ ప్రాంతాలను ఆయన సందర్శించనున్నారు. రాజేంద్రనగర్‌ ఎన్‌ఐఆర్డీలో సెమినార్‌లో ఆర్బీఐ గవర్నర్ పాల్గొని ప్రసంగించనున్నారు. 

20:30 - July 17, 2016

బాలీవుడ్ లో నటీ నటుల వివాహం అనగానే ఆ నటుడి పేరు గుర్తుకొస్తుంది. ఏదైనా వివాహం జరిగినా ఆ నటుడు వస్తే పెళ్లి అప్పుడు అని మీడియా అడుగుతుంటుంది. 50 ఏళ్ళు వచ్చినప్పటికీ బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఎవరంటే సల్మాన్ పేరే చెబుతారు. అలాంటి వ్యక్తి పెళ్లి చేసుకోబోతున్నాడంట. అవును నిజం. స్వయంగా ఈ విషయాన్ని కండల వీరుడు సల్లూ భాయ్ పేర్కొన్నాడు. సల్మాన్ తాజాగా నటించిన  'సుల్తాన్' రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసింది. రిలీజైన రెండు, మూడు రోజుల్లో వందల కోట్ల క్లబ్ లో చేరిపోయింది. 
ముంబైలో భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఆత్మకథ 'ఏస్ అగైనెస్ట్ ఆడ్స్' పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్ ముఖ్యఅతిథిగా విచ్చేశాడు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని స్వయంగా 'సానియా' ప్రశ్నించింది. వెంటనే 'నవంబర్ 18' అని వెల్లడించాడు. తన తండ్రి సలీం ఖాన్, తల్లి సల్మా నవంబర్ 18న వివాహం చేసుకున్నారని, అదే డేట్ లో తాను వివాహం చేసుకోబోతున్నట్లు వెల్లడించాడు. వివాహం చేసుకోవాలని అమ్మ..చెలెళ్లు వత్తిడి తెస్తున్నారని పేర్కొన్నాడు. నవంబర్ 18 అంటే ఈ సంవత్సరమా ? ఏ సంవత్సరంలోనో తెలియదని సల్మాన్ పేర్కొన్నాడు.

షీలా దీక్షిత్ కు స్వల్ప గాయాలు..

ఉత్తరప్రదేశ్‌ : రాష్ట్ర కాంగ్రెస్ సీఎం అభ్యర్ధి షీలా దీక్షిత్‌ గాయపడ్డారు. లక్నోలో రోడ్‌షో కోసం ట్రక్కుపై ఏర్పాటు చేసిన స్టేజీ కూలిపోవడంతో ఆమెకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె బాగానే ఉన్నారని వైద్యులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. 

20:17 - July 17, 2016

తాను కోరుకున్న వ్యక్తి తనకు నచ్చినట్లు ఉండాలని టాలీవుడ్ నటి సదా పేర్కొన్నారు. పెళ్లి అయితే ఒకేసారి కావాలి..విడిపోవడం ఇష్టం లేదని..పెళ్లి విషయంలో తన నిర్ణయమే ఫైనల్ ఇని..ఇందుకు కుటుంబసభ్యులు కూడా సమ్మతించారని పేర్కొన్నారు. సదాతో టెన్ టివి ముచ్చటించింది. సదా సినిమాలకు ఎందుకు దూరమైంది..? సదా అప్పుడు ఎందుకు ఏడ్చింది..? సదా బాలీవుడ్ నుంచి రియల్టీషోలకు ఎందుకు వచ్చింది..? తదితర అంశాలపై ఈ ముద్దుగుమ్మ ముచ్చటించింది. మరి ఈ భామ ఎలాంటి విషయాలు చెప్పారు ? ఎలాంటి అభిప్రాయాలు వెల్లడించారో వీడియో క్లిక్ చేయండి. 

అమెరికాలో గన్నవరం ఫాస్టర్ మిస్...

అమెరికా : గన్నవరం ఫాస్టర్ జాన్సన్ చౌదరి ఆచూకీ తెలియడం లేదు. ఈ నెల 8వ తేదీన జాన్సన్ చౌదరి అమెరికా వెళ్లారు. 15న తిరిగి గన్నవరం చేరుకోవాల్సి ఉంది. జాన్సన్ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంసభ్యులు ఆందోళన చెందుతున్నారు. 

19:58 - July 17, 2016

విజయవాడ : పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఎ.పి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేసారు. గోదావరి వరద నీటిని పట్టిసీమ ద్వారా రాయలసీమకు తరలించాలని చంద్రబాబు చూస్తుంటే... విపక్ష నేత జగన్ అనవసర విమర్శలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. జగన్ వాస్తవాలు గ్రహించాలని దేవినేని సూచించారు.

19:57 - July 17, 2016

విశాఖపట్టణం : కొవ్వాడ అణు విద్యుత్‌ ప్లాంట్‌కు వ్యతిరేకంగా రోజు రోజుకు ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. అణుపార్కును వ్యతిరేకిస్తూ వామపక్ష, ప్రజాసంఘాలు ఇప్పటికే బాధిత గ్రామాల్లో పర్యటిస్తూ..వారికి అండగా పోరాడుతున్నాయి. అందులో భాగంగానే ఆదివారం విశాఖలో జాతీయ సదస్సును నిర్వహించాయి. ఈ సదస్సుకు వివిధ రాజకీయ పక్షాలతో పాటు మేధావులు, శాస్త్రవేత్తలు హాజరయ్యారు. కొవ్వాడలో అణుపార్కు ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని మేధావులంతా ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు. కొవ్వాడలో అణు విద్యుత్‌ కేంద్రం ఏర్పాటును అడ్డుకుంటామని వామపక్ష, ప్రజాసంఘాలు స్పష్టం చేశాయి.

సదస్సుకు హాజరైన కరత్...
కొవ్వాడ అణు విద్యుత్‌ కేంద్రానికి వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో విశాఖలో జాతీయ సదస్సు నిర్వహించారు. నగరంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ అసెంబ్లీ హాల్లో జరిగిన ఈ సదస్సుకు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌ కరత్‌తో పాటు మేధావులు, నిపుణులు, వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నేతలు హాజరయ్యారు. సదస్సులో మాట్లాడిన కరత్.. కొవ్వాడ, అణు విద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకు అనువైన ప్రాంతం కాదన్నారు. అక్కడ ప్లాంట్‌ ఏర్పాటుచేస్తే ఉత్తరాంధ్ర మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అణు విద్యుత్‌ కేంద్రం ఏర్పాటు వల్ల మత్స్యసంపద పూర్తిగా నాశనం అవుతుందన్నారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో వెనక్కి తగ్గాలని ఆయన విజ్ఞప్తి చేశారు.అమెరికా, జపాన్‌లాంటి అభివృద్ధి చెందిన దేశాలు అణు విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుతో అభివృద్ధి కుంటుపడిందని ప్రకాశ్‌ కరత్ గుర్తు చేశారు. అణువిద్యుత్‌ కేంద్రం ఏర్పాటుపై గుజరాత్‌లో వ్యతిరేకత రావడంతో కొవ్వాడలో ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారని ప్రకాశ్‌ కారత్‌ విమర్శించారు. 

వక్తలు హెచ్చరికలు...
ప్రపంచ దేశాలన్నీ అణు విద్యుత్‌ను వ్యతిరేకిస్తుంటే.. ఉత్తరాంధ్రలో అణు కుంపటిని ఏర్పాటు చెయ్యడం ఏమిటని రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఈఎస్‌ శర్మ ప్రశ్నించారు. అణు రియాక్టర్లలో పుకుషిమా లాంటి ప్రమాదం జరిగితే లక్షలాది మంది ప్రజలు నాశనం అవుతారని ఆయన అన్నారు. కొవ్వాడలో అణుపార్కు నిర్మిస్తే..ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఆర్ధికపరంగా దివాళా తీయం ఖాయమని ఆయన అన్నారు. కొవ్వాడలో అణు విద్యుత్‌ ప్లాంటును నెలకొల్పితే ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి కుంటుపడడం ఖాయమని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 101 అణు విద్యుత్‌ ప్లాంట్లలో విస్పోటనాలు సంభవించాయన్నారు. వాటిలో 21 విస్పోటనాలు భారీ ఎత్తున విధ్వంసం సృష్టించాయన్నారు. అలాంటి అణు విద్యుత్‌ ప్లాంట్లను ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకోవాలని దాడి వీరభద్రరావు సూచించారు. అణు విద్యుత్‌ను ప్రముఖ శాస్త్రవేత్తలు ప్రోత్సహిస్తున్నారని.. వారి సూచనల మేరకు అణు విద్యుత్‌ ప్లాంటులు పెట్టడం శాస్త్రీయత అనిపించుకోదని మేధావులు సూచించారు. లక్షలాది మంది ప్రజల ప్రాణాలను హరించే అణు విద్యుత్‌ ప్లాంట్లను నెలకొల్పడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కొవ్వాడలో అణుపార్కు ఏర్పాటు ప్రతిపాదనలను విరమించుకోవాలని సదస్సుకు హాజరైన వామపక్షాల నేతలు సూచించారు. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి సిద్ధమని హెచ్చరించారు. 

19:21 - July 17, 2016

సుడిగాడు తరువాత అల్లరి నరేష్ నుంచి ఒక్కటంటే ఒక్క జెన్యూన్ హిట్టు కూడా రాలేదు. జేమ్స్ బాండ్ ఏదో యావరేజ్ గా నడిచిపోయింది కానీ, అల్లరి నరేష్ స్థాయిలో హిట్టు అయితే ఈ మధ్యకాలంలో రాలేదనే చెప్పాలి. అందుకే ఈ సారి మనోడు ఫుల్ కామెడీతో సెల్ఫీరాజాగా మరోసారి తనను తాను నిరూపించుకొనే పనిలో పడ్డాడు. మరి ఇంతకీ సినిమా జనాన్ని ఎంటర్ టైన్ చేసిందా ? లేక రొటీన్ గా బోర్ కొట్టించిందా ? చూద్దాం. అల్లరినరేష్ మంచి నటుడు, అంతకు మించి కమెడియన్. అదేంటోగానీ, అతడు తనను తాను పూర్తిగా నమ్ముకోవడం మానేసి స్ఫూఫ్ కామెడీల్ని ఎందుకు పట్టుకొని వేళ్లాడుతున్నాడో అసలు తెలియడంలేదు. కథేమీ లేకపోయినా చక్కటి కామెడీ సీన్స్ పెట్టుకొంటే, రెండున్నర గంటలు జనాన్ని హాయిగా నవ్వించొచ్చు అనే ఆలోచన అతడికి ఇంకా ఇప్పటికీ కలగకపోవడం నిజంగా విచారించదగ్గ విషయం. అందరూ వాడిపాడేస్తున్న స్ఫూఫ్ కామెడీలతో సినిమా మొత్తం నడిపించేయొచ్చు అనుకుంటే మాత్రం అల్లరి నరేష్ కి ఇకపై పప్పులుడకకపోవచ్చు. సెల్ఫీరాజా సినిమాను అలాగే స్పూఫ్ లతోనూ, అర్ధం పర్ధం లేని కామెడీ సీన్స్ తోనూ నింపేసి..గతుకుల రోడ్డుమీద పడేసిన అతుకుల బొంతలా తయారు చేశారు. కామెడీ డైలాగ్స్ లో పంచుల్ని కావాలని ఇరికించినట్టు ఇరికించి పడేసారు. సినిమాలో ఎవరు పడితే వాళ్ళు పంచుల్ని పేలుస్తునే ఉంటారు. జనం నవ్వలేక నవ్వుతారు లెండి.

కథ..
కథగా చూసుకుంటే ఈ సినిమాలో ఏమీలేదు. సెల్ఫీల పిచ్చి ఉన్న ఒక కుర్రోడు ఒక అందమైన అమ్మాయిని చూడగానే మనసు పడేసుకుంటాడు. అతడి ఫ్రెండ్ పొరపాటు వల్ల అతడు కమిషనర్ కూతుర్నని అబద్ధం కంటిన్యూ చేయవల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ అందరికీ తెలిసిన ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి నిజంగా కమీషనర్ కూతురే. లాజిక్కుల్లేని పెళ్లిచూపులతో వాళ్ళిద్దరికీ పెళ్లిచేసేస్తాడు కమీషనర్. అయితే శోభనం రాత్రే వీళ్లిద్దరి మధ్య గొడవలు., కట్ చేస్తే హీరోని హీరోయిన్ అసహ్యించుకుంటుంది. దాంతో ఆత్మహత్య చేసుకోలేక ఒక కిల్లర్ ను ఏర్పాటు చేసుకుంటాడు. తీరా కిల్లర్ ఎంట్రీ ఇచ్చే టైమ్ కి హీరో, హీరోయిన్ల మధ్య అపార్ధాలు తొలగిపోతాయి. ఇదిలా ఉంటే కమీషనర్ అంటే పీకలదాకా పగ ఉన్న ఒక క్రిమినల్ కమీషనర్ అల్లుడైన నరేష్ ను చంపడానికి తిరుగుంటాడు. అదీ కథ. ఇలాంటి కథ మధ్యలో అర్ధం పర్ధంలేని సీన్స్ కోకొల్లలు. ఇందులో హీరోకి సెల్ఫీల పిచ్చి చాలా ఉందని సినిమా ఓపెనింగ్ లో ఒక ఎస్టాబ్లిష్ మెంట్ సీన్ ఉంది. జనాలంతా ఇతడ్ని కొట్టడానికి వస్తారు. అయితే అదేం విచిత్రమో గానీ, హీరోయిన్ పరిచయం సీన్స్ లోగానీ, ఆ తరువాత గానీ సెల్ఫీ మ్యానరిజమ్ ను అసలే మాత్రం వాడుకోలేదు. అసలు టైటిల్ కే జస్టిఫికేషన్ జరగలేదు.

పాత్రల విశ్లేషణ..
ఇక కట్టప్ప కామెడీ స్పూఫ్ పేరుతో మాటి మాటికీ తాగుబోతు రమేష్ అల్లరినరేష్ కాలును తన నెత్తి మీద పెట్టుకోవడం జనానికి నిజంగా కంపరమెత్తిస్తుంది. ఈ సినిమాలో రిలీఫ్ ఇచ్చేది కాస్తో కూస్తో పృధ్వి పాత్రే అని చెప్పొచ్చు. పోలీసాఫీసర్ అంకుశం పాత్రను పృధ్వీ ఉతికి ఆరేసాడు. ఇక అజయ్ ఘోష్ లాంటి మంచి విలన్ ను ఈ సినిమాతో చాలా కామెడీ చేసారు. పవర్ ఫుల్ గా విలన్ గా ఎంట్రీ ఇచ్చి జోకర్ లా తయారవుతాడు. సినిమా లో మెయిన్ ట్విస్ట్ అల్లరినరేష్ డ్యూయల్ రోల్. దీన్ని కూడా సరిగ్గా వాడుకోలేదు. రవిబాబు కామెడీ కూడా బోర్ కొట్టిస్తుంది. ఇంకా ఇలా వచ్చి అలా వెళ్లిపోయే బోలెడంత మంది జబర్దస్త్ కమెడియన్లు కూడా ఏమీ ఆకట్టుకోలేకపోయారు. ఫైనల్ గా అల్లరి నరేష్ నుంచి ఈసారి కూడా రొటీన్ బోరింగ్ సినిమాగా సెల్ఫీ రాజా నిలిచిపోయిందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
ఇదే రోజు త్రిష నటించిన నాయకి చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంపై కూడా రివ్యూ చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

ప్లస్ పాయింట్స్ :
పృధ్వీ, కృష్ణ భగవాన్ కామెడీ
సాంగ్స్
మైనస్ పాయింట్స్ :
కథ, కథనాలు
స్పూఫ్ కామెడీ
బోరింగ్ సీన్స్ 

19:11 - July 17, 2016

పంజాబ్ : ఉత్తర భారతంలో కొన్ని ప్రాంతాలతో పాటు పాక్ లో భూ ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్ పై 4.6గా నమోదైంది. పంజాబ్ లోని అమృత్ సర్, జలంధర్ తోపాటు పాకిస్థాన్లోని లాహోర్, షేకుపురాల్లో భూమి కంపించింది. లాహోర్ కు నైరుతి దిశలో 37 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైనట్లు తెలుస్తోంది. భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు రక్షించుకోవడానికి బయటకు పరుగులు తీశారు.

పోలీస్ లైన్ లో పెట్రోల్ బంక్ ప్రారంభించిన డీజీపీ రాముడు...

కడప : పోలీస్ లైన్ లో పెట్రోల్ బంక్..ఆధునాతన జిమ్ ను డీజీపీ రాముడు, డీఐజీ రమణకుమార్ ప్రారంభించారు. 

19:03 - July 17, 2016

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ను గ్రీన్ సిటీగా త‌యారు చేయడమే ప్రధాన లక్ష్యమంటోంది బల్దియా. పోల్యూష‌న్‌ ఫ్రీ సిటీగా మార్చడానికి పౌరులంద‌రూ సహకరించాలని కోరుతోంది.. మెరుగైన సేవ‌లు అందించ‌డంకోసం టెక్నాల‌జీని విరివిగా ఉప‌యోగిస్తున్న కార్పొరేష‌న్... కొత్తగా 'మై జీహెచ్‌ఎంసీ' యాప్‌ను కూడా విడుదల చేసింది. ఈ సందర్భంగా కమిషనర్ జనార్ధన్ రెడ్డితో టెన్ టివి ముచ్చటించింది. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ చేపడుతున్న..చేపట్టే వాటిపై విశ్లేషించారు. అలాగే పలువురు ప్రజలు కాల్ చేసి జీహెచ్ఎంసీ కమిషనర్ తో మాట్లాడారు. ప్రధానంగా రోడ్లపై ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదులు...సూచనలను నోట్ చేసుకున్న కమిషనర్ పరిష్కారం చేస్తానని హామీనిచ్చారు. కమిషనర్ ఎలాంటి విషయాలు వెల్లడించారు ? తదితర విషయాల కోసం చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

18:56 - July 17, 2016

హైదరాబాద్ : గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ను గ్రీన్ సిటీగా త‌యారు చేయడమే ప్రధాన లక్ష్యమంటోంది బల్దియా. పోల్యూష‌న్‌ ఫ్రీ సిటీగా మార్చడానికి పౌరులంద‌రూ సహకరించాలని కోరుతోంది.. మెరుగైన సేవ‌లు అందించ‌డంకోసం టెక్నాల‌జీని విరివిగా ఉప‌యోగిస్తున్న కార్పొరేష‌న్... కొత్తగా 'మై జీహెచ్‌ఎంసీ' యాప్‌ను కూడా విడుదల చేసింది. నగర వాసులకు మెరుగైన సేవలు అందించడమే ప్రధాన లక్ష్యమంటోంది బల్దియా..! తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం గ్రేటర్‌ హైదరాబాద్‌లో విజయవంతం కావడానికి జీహెచ్‌ఎంసీ కీలకపాత్ర పోషించింది. గ్రేట‌ర్ ప‌రిధిలో ఒకేరోజు 25 ల‌క్షల మొక్కలు నాటాల‌నే టార్గెట్‌తో ముందుకెళ్లిన బ‌ల్దియా అనుకున్న దాని కంటే 4 ల‌క్షల మొక్కలు ఎక్కువే నాటించింది. స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు, రాజకీయ నాయకులు, వీఐపీలు హరితహారంలో ఉత్సాహంగా పాల్గొనడంలో జీహెచ్‌ఎంసీ ఎంతో కృషి చేసింది. ముఖ్యంగా పబ్లిక్‌ నుంచి హరితహారానికి విశేష స్పందన లభించింది. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ కూడా మొక్కలు నాటారు. ఈ వర్షాకాలమంతా మొక్కలు నాటేడమే కాకుండా వాటి పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది బల్దియా.

కార్పొరేష‌న్‌లో ఈ ఫైలింగ్ విధానం అమలు..
హైదరాబాద్‌ వాసులకు మెరుగైన సేవలు అందించడం కోసం జీహెచ్‌ఎంసీ గతంలో ఎన్నడూ లేనివిధంగా టెక్నాలజీని విరివిగా ఉపయోగిస్తోంది. పబ్లిక్‌కు సులువుగా, వేగంగా సౌకర్యాలు అందించడం టార్గెట్‌గా పెట్టుకుంది. ఇటు కార్పొరేష‌న్‌లో ఈ- ఫైలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిన మొద‌టి కార్పొరేషన్‌గా నిలిచింది జీహెచ్‌ఎంసీ... అంతేకాదు.. టౌన్‌ప్లానింగ్‌లో ఉన్న అవినీతిని అరికట్టేందుకు, భ‌వ‌న నిర్మాణ అనుమ‌తులు వేగంగా ఇచ్చేందుకు ఈ-టౌన్ ప్లానింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల వినియోగం భారీగా పెరిగిన దృష్ట్యా ఫింగ‌ర్ టిప్‌పై త‌న సేవ‌లందిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన 'మై జీహెచ్‌ఎంసీ యాప్‌'ను ప్రారంభించిన రెండ్రోజుల్లోనే వేలాది మంది సిటిజన్స్‌ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. దీని ద్వారా నగర పౌరులు ఎదుర్కొంటున్న ఏ సమస్యనైనా ఫోటోలతో సహా ఫిర్యాదు చేయవచ్చు.. ఇక ఆస్తి ప‌న్ను, ట్రేడ్ లైసెన్స్‌ వివ‌రాలు కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవ‌డంతో పాటు ఆన్‌లైన్ చెల్లింపులు చేయ‌వ‌చ్చు. బ‌ర్త్‌ అండ్ డెత్ స‌ర్టిఫికేట్స్ కూడా ఈ స్పెష‌ల్ యాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఈ విధంగా స్మార్ట్ సేవ‌ల‌ను హైద‌రాబాదీల‌కు అందిస్తోంది బ‌ల్దియా.

ఓపెన్‌ డంప్‌లను తొలగించే ప్రక్రియ షురూ..
గ్రేటర్‌లో పారిశుధ్య నిర్వహణ చర్యల్లో భాగంగా జీహెచ్‌ఎంసీ ఓపెన్‌ డంప్‌లను తొలగించే ప్రక్రియ చేపట్టింది. ప్రతి ఇంటికి 2 డస్ట్‌బిన్స్ కూడా పంపిణి చేసింది. రెండువేల ఆటో టిప్పర్లను చెత్తసేకరణకు వినియోగిస్తోంది. ముఖ్యంగా గ‌తేడాది చేప‌ట్టిన స్వచ్ఛ హైద‌రాబాద్ గ్రేట‌ర్ శానిటేషన్‌పై ప్రత్యేక ముద్రవేసింది. ఈ వర్షాకాలంలో గుంతలు పడ్డ రోడ్లను పునరుద్ధరణ చర్యలకు శ్రీకారం చుట్టింది. ట్రాఫిక్‌ జామ్‌ నివారణపై కూడా ప్రత్యేక ఫోకస్‌ చేసింది. మొత్తంగా హైదరాబాద్‌ వాసులకు మెరుగైన సేవలు అందించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది..!

జయరాం రమేష్ రచించిన పుస్తకావిష్కరణ కార్యక్రమం..

హైదరాబాద్ : తెలుగు విశ్వవిద్యాలయంలో జయరాం రమేష్ రచించిన గడిచిన చరిత్ర తెరిచిన అధ్యాయం పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ పుస్తకాన్ని జస్టిస్ సుదర్శన్ రెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఉండవల్లి, ప్రొ.కోదండరాం హాజరయ్యారు. 

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి - మంత్రి హరీష్...

హైదరాబాద్ : రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఇరిగేషన్ శాఖ అధికారులతో మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర ప్రాజెక్టులకు ప్రాధాన్యతనివ్వాలని, మరో రెండు రోజుల్లో ఆల్మట్టి నుండి పాలమూరు ప్రాజెక్టుకు కృష్ణా జలాల నీరు విడుదలవుతాయన్నారు. ఈ సీజన్ లో రైతులకు నీరందించాల్సిందేనని, నీరివ్వకపోతే అధికారులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

హైకోర్టు విభజనే ప్రధాన అజెండా - టీఆర్ఎస్ ఎంపీలు..

ఢిల్లీ : హైకోర్టు విభజనే ప్రధాన అజెండాగా ముందుకెళ్లాలని సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేశారని టీఆర్ఎస్ ఎంపీలు పే ర్కొన్నారు. అంశాల వారీగా కేంద్రానికి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మిషన్ కాకతీయ, హరితహారం కార్యక్రమానికి కేంద్రం నుండి ఆర్థిక సాయం అందించాలని కోరనున్నట్లు తెలిపారు.

కాసేపట్లో స్పీకర్ అధ్యక్షనత అఖిలపక్ష సమావేశం..

ఢిల్లీ : కాసేపట్లో లోక్ సభ స్పీకర్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. సభా మర్యాదలు పాటించాలి..సమావేశాలకు సహకరించాలని అన్ని పార్టీల నేతలను స్పీకర్ సుమిత్రా మహజన్ కోరనున్నారు. 

ప్రామిసింగ్ స్కూల్ కు నోటీసులు ఇస్తాం - వెస్ట్ జోన్ డీసీపీ...

హైదరాబాద్ : టౌలిచౌకిలోని ప్రామిసింగ్ స్కాలర్స్ స్కూల్ లో జరిగిన ఘటనపై డీసీపీ వెంకటేశ్వరరావు స్పందించారు. ఒకటో తరగతి విద్యార్థి ఇబ్రహీం మృతి ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్కూల్ యాజమాన్యానికి నోటీసులు ఇస్తామని, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖను కోరడం జరిగిందన్నారు. 

స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే కొడుకు మృతి - తండ్రి..

హైదరాబాద్ : స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తన కొడుకు మృతి చెందాడని తండ్రి ముజీబ్ పేర్కొన్నారు. ప్రామిసింగ్ స్కాలర్స్ స్కూల్ లో ఒకటో తరగతి విద్యార్థి ఇబ్రహీం మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం వెంటనే స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, తన కుటుంబంలో జరిగిన విషాదం మరే కుటుంబంలో జరగకూడదన్నారు. తన కొడుకుపై దాడి జరిగిందనే విషయం ప్రామిసింగ్ స్కాలర్స్ స్కూల్ యాజమాన్యం తనకు చెప్పలేదన్నారు. 

చాలా అంశాలు పెండింగ్ లో ఉన్నాయి - ఎంపీ తోట నర్సింహం..

ఢిల్లీ : ఏపీకి సంబంధించిన చాలా అంశాలు పెండింగ్ లో ఉన్నాయని టిడిపి ఎంపీ తోట నర్సింహం వ్యాఖ్యానించారు. కేంద్రం ఏపీని ప్రత్యేక దృష్టితో చూస్తోందని, ఇంకా బాగా చూడాలన్నదే తమ ఉద్ధేశ్యమన్నారు. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ సీఎం విభజన సమస్యలన్నీ ప్రస్తావించారని తెలిపారు.

 

ముగిసిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం..

న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఢిల్లీలోని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నివాసంలో ఆయన అధ్యక్షతన సమావేశం కొనసాగుతోంది. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ ఎంపీలకు దిశానిర్ధేశం చేశారు. 

ఎంపీలకు కేసీఆర్ దిశా నిర్దేశం..

ఢిల్లీ : సీఎం కేసీఆర్ ఎంపీలందరికీ దిశానిర్దేశం చేశారని ఎంపీ జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో టీఆర్‌ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ సమావేశమైన విషయం తెలిసిందే. పార్లమెంట్ సమావేశాల్లో ఏ వ్యూహంతో ముందుకెళ్లాలన్న అంశంపై చర్చించినట్లు ఎంపీ జితేందర్‌రెడ్డి తెలిపారు. 

17:12 - July 17, 2016

ప్రొఫెషనల్ బాక్సింగ్ సూపర్ మిడిల్ వెయిట్ విభాగంలో భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. న్యూఢిల్లీ వేదికగా ముగిసిన డబ్ల్యూబీఓ ఆసియా - పసిఫిక్ చాంపియన్ టైటిల్ ..10రౌండ్ల ఫైట్ లో డబ్ల్యూబీసీ యూరోపియన్ చాంపియన్, ఆస్ట్రేలియన్ బాక్సర్ కెర్రీ హోప్ పై విజయం సాధించాడు. ఈ విజయంతో విజేందర్ డబ్ల్యూబీవో ర్యాంకింగ్స్ లో 15వ స్థానం సంపాదించాడు. న్యూఢిల్లీ త్యాగరాజ ఇండోర్ స్టేడియంలో ముగిసిన 10 రౌండ్ల ఈ సమరంలో ఆస్ట్రేలియా బాక్సర్ కెర్రీ హోప్ ను ఓడించిన అనంతరం విజేందర్ తీవ్రభావోద్వేగాలకు గురయ్యాడు. తాను సాధించిన ఈ టైటిల్ ను ఇటీవలే కన్నుమూసిన బాక్సింగ్ గ్రేట్ మహ్మద్ అలీకి అంకితమిస్తున్నట్లు తెలిపాడు.

పోటీని వీక్షించిన ప్రముఖులు..
భారతగడ్డపై జరిగిన మొట్టమొదటి ప్రొఫెషనల్ బాక్సింగ్ ఫైట్ లో తాను విజేతగా నిలవడం వెనుక దేశంలోని కోట్లాదిమంది అభిమానుల ప్రోత్సాహం, అభిమానం ఉన్నాయని ...డబ్ల్యూబీఓ ఆసియా- పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ చాంపియన్ విజేందర్ కుమార్ చెప్పాడు. ఈ పోటీకి రాహుల్ గాంధీ, రాజీవ్ శుక్లా, వీరేంద్ర సెహ్వాగ్, మేరీ కోమ్, సురేశ్ రైనా, యువరాజ్ సింగ్, రణవీర్ సింగ్ తో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

17:07 - July 17, 2016

తెలుగు, తమిళం, కన్నడం సినిమాలలో వందకు పైగా పాటలు పాడిన ప్రముఖ సినీ గాయకుడు 'రాంకీ'. రాంకీ అంటే తమిళ పేరులాగా అనిపిస్తుంటుంది. తెలుగు సినిమాల్లో అందరికీ పరిచయమైనా వంద పాటలు పాడడమంటే అంత చిన్న విషయం కాదు. టెన్ టివిలో 'జనం పాట' కార్యక్రమంలో రాంకీ పలు విశేషాలను తెలియచేశారు. రాంకీ ఓ హీరో పేరు అని..తన అసలు పేరు రామకృష్ణ అని తెలిపారు. తనకు 'గుండె జారి గల్లంతయ్యిందే' పాట తొలి హిట్ ఇచ్చిందని పేర్కొన్నారు. ఇంకా ఎలాంటి విషయాలు వెల్లడించారో...ఆయన ఎలాంటి పాటలు పాడారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

ఇరిగేషన్ శాఖ అధికారులతో మంత్రి హరీష్ సమావేశం..

హైదరాబాద్ : ఇరిగేషన్ శాఖ అధికారులతో రాష్ట్ర మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

 

16:42 - July 17, 2016

విశాఖపట్టణం : కొవ్వాడలో అణు విద్యుత్‌ ప్లాంటును నెలకొల్పితే ఉత్తరాధి ప్రాంతమంతా అభివృద్ధి కుంటుపడడం ఖాయమని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 101 అణు విద్యుత్‌ ప్లాంట్లలో ప్రమాదాలు జరిగి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని దాడి వీరభద్రరావు అన్నారు. అలాంటి అణు విద్యుత్‌ ప్లాంట్లను మన ప్రభుత్వాలు ఎందుకు పెడుతున్నాయో అర్థం కావడంలేదన్నారు. ఇప్పటికైనా వాటి ప్రతిపాదనలను విరమించుకోవాలని ఆయన సూచించారు.

ప్లాంటులు పెట్టడం సబబు కాదు..
అణు విద్యుత్‌ను శాస్త్రవేత్తలు ప్రోత్సహిస్తున్నారని వారి సూచనల మేరకు కొవ్వాడలో అణు విద్యుత్‌ ప్లాంటులు పెట్టడం సబబు కాదన్నారు నిపుణులు. అనిల్‌ కకోద్కర్‌ లాంటి గొప్పశాస్త్రవేత్త చెప్పాడు కాబట్టి ఏమీ కాదనుకోవడం శాస్త్రీయత అనుపించుకోదని విశాఖ సదస్సుకు వచ్చిన వివిధ రంగాల నిపుణులు అన్నారు. లక్షలాది మంది ప్రజల ప్రాణాలను హరించే ఇలాంటి ప్రాజెక్టులు నెలకొల్పడం శాస్త్రీయత అనిపించుకోదన్నారు. 

16:39 - July 17, 2016

విశాఖపట్టణం : జపాన్‌లోని పుకుషిమాలో జరిగిన ప్రమాదం..కొవ్వాడలో జరిగితే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దివాళా తీయడం ఖాయమని మాజీ ఇందన ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఈఎస్‌ శర్మ అన్నారు. కొవ్వాడ విద్యుత్‌ ప్లాంట్‌కు వ్యతిరేకంగా విశాఖలో నిర్వహించిన జాతీయ సదస్సులో పాల్గొన్న శర్మ..కొవ్వడ అణుపార్క్‌పై కీలక ప్రసంగం చేశారు. లక్షల కోట్లు ఖర్చుతో కొవ్వాడ అణు విద్యుత్‌ ప్లాంట్‌ను నెలకొల్పితే వేలాది మంది మత్స్యకారుల జీవితాలు సర్వనాశనం అవుతాయని అన్నారు. అంతేకాదు వేలాది ఎకరాల పచ్చటి భూములు భుగ్గిపాలవుతాయన్నారు. తాను శ్రీకాకుళం చెందిన వాడినని, అక్కడ సస్యశ్యామలైన భూములు నాశనమౌతాయని తెలిపారు. 20 గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టరని, ఈ విషయాన్ని జీవోలో పేర్కొనడం జరిగిందన్నారు. ఏదో బాధ్యతారాహిత్యంగా తాను ఈ వ్యాఖ్యలు చేయడం లేదన్నారు. 

16:37 - July 17, 2016

విశాఖపట్టణం : కొవ్వాడలో అణువిద్యుత్‌ ప్లాంట్‌కు వ్యతిరేకంగా సీపీఎం ఆందోళనలను ఉధృతం చేసింది. అణుపార్కును వ్యతిరేకిస్తూ నిన్న శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన సీపీఎం పోలిట్‌ బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కరత్‌..ఇవాళ విశాఖలో నిర్వహించిన జాతీయ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..కొవ్వాడలో అణువిద్యుత్‌ ప్లాంటును నెలకొల్పితే వేలాది మంది మత్స్యకార కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. అంతేకాదు ఏదైనా ప్రమాదం జరిగితే లక్షలాది మంది ప్రజల ప్రాణాలు హరించుకుపోయే ప్రమాదం ఉందన్నారు. జపాన్‌లోని పుకుషిమా అణురియాక్టర్‌లో జరిగిన ప్రమాదంలో ఎంత నష్టం జరిగిందో అందరికి తెలిసిందే అన్నారు. అలాంటి ప్రమాదకర అణు విద్యుత్‌ ప్లాంట్లను ఏపీలోని నెలకొల్పేందుకు కేంద్రంలోని మోదీ, రాష్ట్రంలోని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు. అణు విద్యుత్‌ ప్లాంటు ఏర్పాటుకు విరమించుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని కరత్ హెచ్చరించారు. 

రేపు ఎన్డీఏ పక్ష నేతల సమావేశం..

ఢిల్లీ : రేపు సాయంత్రం ఏడు గంటలకు ప్రధాని మోడీ అధ్యక్షతన ఎన్డీఏ పక్ష నేతలు సమావేశం జరగనుంది. రేపటి నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే,. 

బాబుతో రేపు టి.టిడిపి నేతల భేటీ..

హైదరాబాద్ : సోమవారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తో టి.టిడిపి నేతలు సమావేశం కానున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు.

 

16:07 - July 17, 2016

ముగ్గురు భార్యల మధ్య విబేధాలా ? కట్టుకున్న వాడి హత్యకు కారణాలేంటీ ? ఎవరు చంపారు ? ఎందుకు చంపారు ?

తాళి ఎగతాళి అవుతుంది. మూడుముళ్ల బంధం మూన్నాళ్ల ముచ్చటే అవుతుంది. అనురాగం..అప్యాయతలు ఉండాల్సిన చోట అనుమానం..ధ్వేషాలు రాజ్యమేలుతున్నాయి. వాటి పరిణామాలు..దారుణాలకు పురిగొల్పుతున్నాయి. మాంగళ్య పవిత్రతను చూసిన విదేశీలు ముచ్చటపడుతున్నారు. అక్కడ మన గురించి గొప్పలుగా చెప్పుకుంటుంటే మరి మనం చేస్తున్నది ఏమిటీ ? ఎందుకీ రాక్షసం..
ఖమ్మంలో కళ్యాణి రమేష్ దారుణ హత్యకు గురయ్యాడు. ఒకే ఇంట్లో ముగ్గురు భార్యలతో కలిసి ఉంటున్నాడు. భార్యలే ఈ దారుణానికి ఒడిగట్టారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఈ దుర్ఘటన గురించి..రంగారెడ్డి జిల్లా, గుంటూరు జిల్లాలో జరిగిన ఘోరాల గురించి..తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

16:06 - July 17, 2016

ఆస్ట్రేలియాలో అనుమానస్పదంగా మృతి చెందిన 'సుప్రజ' కేసు ఇంకా మిస్టరీగానే ఉంది. మరో రెండు రోజుల్లో సుప్రజ..ఆమె ఆరు నెలల పసికందు మృతదేహాలను నగరానికి తరలించే పనిలో ఉన్నారు. అయితే అక్కడ ఏం జరిగిందో స్పష్టంగా తెలియకపోవడంతో పాటు సుప్రజ మరణం ఇంట్లో..బంధువుల్లో విషాదాన్ని నింపింది.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కు చెందిన ఇంజినీర్ శ్రీనివాస్ ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. పదేళ్లుగా అక్కడే సెటిల్ అయిన శ్రీనివాస్ కు నగరానికి చెందిన మాజీ సైనిక ఉద్యోగి కూతురు సుప్రజతో 9ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఆరు నెలల క్రితం కుమారుడు జన్మించాడు. ఈనెలలో స్వస్థలానికి వచ్చే ఏర్పాట్లలో ఉన్నట్లు బంధువుల ద్వారా తెలిసింది. ఇదిలా ఉంటే సుప్రజ..ఆరు నెలల పసికందుతో 30వ అంతస్తు నుండి కిందపడిపోయి అనుమానస్పద మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇప్పటికే వారు మెల్ బోర్న్ కు వెళ్లారు. మెల్ బోర్న్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరి సుప్రజ ఎలా మృతి చెందింది ? అనేది దర్యాప్తులో తేలనుంది. 

16:02 - July 17, 2016

మ్యారేజ్..పెళ్లి..జీవితంలో మరుపురాని ఘట్టం. ఈ ఘట్టాన్ని చిరస్మరణీయంగా గుర్తుండిపోవాలని చాలా మంది రకరకాలుగా పెళ్లిళ్లు చేసుకుంటుంటారు. ఇందులో ప్రముఖ పాత్ర పోషించేది 'డబ్బు'. నీళ్లలా డబ్బును ఖర్చు చేస్తూ అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుంటారు. కానీ ఇటీవలే వివాహం చేసుకున్న ఓ నూతన జంటకు వినూత్నమైన ఆలోచన వచ్చింది. సింపుల్ గా మ్యారేజ్ చేసుకుందామని..పెళ్లికి అయ్యే ఖర్చును ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఇవ్వాలని ఆ దంపతులు నిర్ణయించారు.
అభయ్ దివారే..ఇటీవలే ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) కి ఎంపికయ్యారు. నాగ్ పూర్ బేస్డ్ నేషనల్ అకాడమీ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (ఎన్ఏడీటీ)లో ట్రైనింగ్ కు వెళ్లనున్నాడు. ఐడీబీఐ ముంబై బ్రాంచ్ లో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్న ప్రీతి కుంభారేను అభయ్ లు ఒక్కటి కానున్నారు. మహారాష్ట్రలోని అమరావతిలోని అభియంత భవన్ లో పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ ఎలాంటి హంగులు..ఆర్భాటాలు ఏమీ లేవు. చాలా సాదాసీదాగా ఒక్కటయ్యారు. ఆత్మహత్యలు చేసుకున్న పది రైతు కుటుంబాలను ఎంచుకుని..ఒక్కో కుటుంబానికి రూ. 20 వేల చొప్పున అందించారు. అంతేగాకుండా రూ. 52 వేల విలువ చేసే వివిధ పోటీ పరీక్షల పుస్తకాలను ఐదు లైబ్రరీలకు అందించారు. సింపుల్ గా స్టేజ్ పై రిజిష్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వధూవరులు కష్టపడి సంపాదించిన సొమ్ముతోనే ఇదంతా చేశారు. ఇక విందుకు వచ్చిన వారికి చపాతి..అన్నం..పప్పు..కూరగాయలను మాత్రమే వడ్డించారు. వీరు చేసిన పనిని అందరూ శభాష్ అంటూ ఆశ్వీరదించారు.

15:54 - July 17, 2016

ముంబై : ఒక తోటి నటుడైన రణవీర్ సింగ్ పై బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎందుకు కోపంగా ఉంటాడు ? ఏమి జరిగింది ? అని ఆలోచిస్తున్నారు కదా..అవును ఇది నిజమేనంట. రణ్ వీర్ సింగ్ పై సల్మాన్ ఖాన్ తీవ్రంగానే మండిపడ్డాడంట. కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన 'సుల్తాన్' ఇటీవలే విడుదలైన సంగతి తెలిందే. ఇది విడుదలైన రెండు..మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరి రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా పారిస్ లో విడుదలైంది. ఈ చిత్రాన్ని అక్కడ రణ్ వీర్ చూశాడు. సినిమాకు వెళ్లిన రణ్ వీర్ సల్మాన్ ఖాన్ పాట రాగానే స్ర్కీన్ ముందు స్టెప్పులు వేస్తూ నానా హంగామా చేశాడంట. ఈ విషయపై మీడియా సల్మాన్ ను ప్రశ్నించింది. దీనిపై సల్మాన్ ఖాన్ తీవ్రంగానే స్పందించాడు. రణవీర్ ను తల పగులగొట్టి చంపేయాలని ఉందని, ప్రేక్షకులు సినిమా చూస్తున్న సమయంలో రణ్ వీర్ అలా చేసి ఉండాల్సి కాదని వ్యాఖ్యానించాడంట. రణ్ వీర్ సినిమా చూడకుండా ప్రేక్షకులను తన డ్యాన్స్ తో ఎంటర్ టైన్ చేయించాడని, ఇలా చేసినందుకు జరిమాన విధించాల్సింది అంటూ సల్మాన్ తన దైన శైలిలో వ్యాఖ్యానించాడు. దీనిపై రణ్ వీర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

 

మల్లన్న సాగర్ అవసరం లేదు - వరవరరావు..

మెదక్ : మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం అవసరమే లేదని విరసం నేత వరవరరావు పేర్కొన్నారు. పరిశ్రమలు, ఫాంహౌస్‌ల్లో వ్యవసాయం చేయడానికి మాత్రమే ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. 

2018 నాటికి పోలవరం పూర్తి - దేవినేని ఉమ..

విజయవాడ : 2018 నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తెలిపారు. రెండేళ్లలో పోలవరం ప్రాజెక్ట్‌ కోసం రూ. 2,639 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. 

జీఎస్టీ బిల్లు కాంగ్రెస్, బిజెపి నిర్ణయించేది కాదు - ఏచూరి..

ఢిల్లీ : జీఎస్టీ బిల్లు కాంగ్రెస్, బిజెపి నిర్ణయించేది కాదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ఈ బిల్లుపై రెండేడ్లుగా అఖిలపక్షం ఏర్పాటు చేయాలని కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

 

15:34 - July 17, 2016

హైదరాబాద్ : నగరంలోని గోల్కొండ కోటలో బోనాల సందడి వైభవంగా సాగుతోంది. డప్పుచప్పుళ్లు.. మువ్వల సవ్వళ్లతో.. గోల్కొండకోట సరికొత్తశోభను సంతరించుకుంది. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. బోనమెత్తి అమ్మవారికి నైవేద్యం పెట్టి.. మము సల్లంగా సూడు తల్లి అంటూ భక్తులు వేడుకుంటున్నారు. సాంప్రదాయ వస్త్రాలు ధరించి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

15:30 - July 17, 2016

ఢిల్లీ : పెండింగ్ లో ఉన్న బిల్లుల ఆమోదానికి సహకరించాలని కేంద్రం ప్రతిపక్షాలను కోరింది. కాసేపటి క్రితం ప్రధాని మోడీ అధ్యక్షతనలో అఖిలపక్ష సమవేశం జరిగింది. రేపటి నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా జీఎస్టీ బిల్లు గురించి ప్రధాని మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ బిల్లు దేశానికి ఎంతో కీలకమని, ప్రజల అభివృద్ధికి ఉపయోగపడే అన్ని బిల్లుకు సహకరిస్తామని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. అయితే జీఎస్టీ బిల్లును కాంగ్రెస్..బీజేపీ నిర్ణయించలేవని సీపీఎం సభ్యుడు సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ఈ బిల్లుపై రెండేడ్లుగా అఖిలపక్షం ఏర్పాటు చేయాలని కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. 

15:23 - July 17, 2016

ఢిల్లీ : ఏపీని ఆదుకోవాలని అఖిలపక్ష సమావేశంలో ప్రస్తావించినట్లు టిడిపి ఎంపీ తోట నర్సింహం పేర్కొన్నారు. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ఎంపీ తోట నర్సిహం టెన్ టివితో మాట్లాడారు. కేంద్రం ఇచ్చిన హామీలపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించడం జరుగుతుందని, ప్రజారంజకమైన బిల్లులకు టిడిపి మద్దతినిస్తుందన్నారు. గత రెండు సంవత్సరాలుగా ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని హామీలు అమలు చేయాలని తాము కోరడం జరుగుతోందన్నారు. ప్రత్యేక హోదా, స్పెషల్ జోన్..ఇతరత్రా అంశాలను సమావేశాల్లో ప్రస్తావించేందుకు అనుమతినివ్వాలని కోరినట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాలను కేంద్రం ఆదుకోవాలని, అన్ని రకాలుగా తోడ్పాటునివ్వాలని కోరినట్లు తెలిపారు. నాయకులు..అధినాయకుడి మధ్య విబేధాలు రావడంతో తమ గూటిన చేరుతున్నారని, జీఎస్టీ బిల్లుపై సంపూర్ణ సహకారం ఇస్తామన్నారు. 

15:15 - July 17, 2016

విజయవాడ : తెలుగు రాష్ట్రాల్లో ఘోరాలు వెలుగుచూస్తునే ఉన్నాయి. క్షణికావేశంలో ఘోరాలకు పాల్పడుతున్నారు. కట్టుకున్న భార్యలను అతికిరాతకంగా చంపేస్తున్నారు. తాజాగా విజయవాడలోని పెజ్జోనిపేటలో అందరూ చూస్తుండగానే భార్యను ఓ భర్త కత్తితో నరికేశాడు. స్థానికంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. మహేష్ తో తేజస్వినికి ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. వివాహం అయిన అనంతరం దంపతుల మధ్య విబేధాలు చోటు చేసుకున్నాయి. భర్త ప్రవర్తనతో తేజస్విని విసిగివేసారినట్లు తెలుస్తోంది. దీనితో మహేష్ ను శాశ్వతంగా వదిలించుకోవాలంటే విడాకులు ఒక్కటే పరిష్కారమని భావించిన తేజస్విని కోర్టు మెట్లు ఎక్కింది. మూడు నెలల క్రితం విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. కోర్టులో ఈ కేసు నడుస్తోంది. ఇదిలా ఉంటే ఆదివారం ఉదయం ప్రార్థన కోసం తేజస్విని చర్చీకి వెళ్లింది. ప్రార్థనల అనంతరం బయటకు వచ్చిన తేజస్విని అక్కడే కాపు కాసిన మహేష్ కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. అందరూ చూస్తున్నా ఎవరూ తేజస్విని కాపాడేందుకు ముందుకు రాలేకపోయారు. తీవ్రరక్తస్రావంలో కొట్టుమిట్టాడుతున్న తేజస్విని ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. పరారీలో ఉన్న మహేష్ కోసం సత్యనారాయణపురం పోలీసులు గాలింపులు చేపట్టారు. 

పెజ్జోనిపేటలో దారుణం..

విజయవాడ : పెజ్జోనిపేటలో దారుణం చోటు చేసుకుంది. మహేష్ అనే వ్యక్తి భార్య తేజస్వినిపై కత్తితో దాడి చేశాడు. తేజస్విని పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న మహేష్ కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు.

రేపు ప్రధానితో సీఎం కేసీఆర్ భేటీ..

ఢిల్లీ : భారత ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సోమవారం భేటీ కానున్నారు. అంతర్రాష్ట మండలి సమావేశంలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 12.40 గంటలకు మోడీతో కేసీఆర్ సమావేశమవుతారని తెలుస్తోంది. 

టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం..

న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఢిల్లీలోని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నివాసంలో ఆయన అధ్యక్షతన సమావేశం కొనసాగుతోంది. 

మోడీని కలిసిన చినజీయర్..

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీని చినజీయర్ స్వామి కలిశారు. హైదరాబాద్ లోని శంషాబాద్ సమీపంలో నిర్మించనున్న సమతా మూర్తి విగ్రహ ప్రాముఖ్యతపై మోడీకి వివరించారు. ఆగస్టు 19వ తేదీన సమతా స్నానం కార్యక్రమానికి ప్రధానిని ఆహ్వానించామని చినజీయర్ స్వామి తెలిపారు.

 

సీఎంగా పెమా ఖండూ ప్రమాణ స్వీకారం..

అరుణాచల్ ప్రదేశ్ : రాష్ట్ర కొత్త సీఎంగా పెమా ఖండూ ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కుమారుడై దోర్నీ ఖండూ కుమారుడైన పెమా ఖండూతో గవర్నర్ తథాగత్ రాయ్ ప్రమాణ స్వీకారం చేయించారు. 

14:37 - July 17, 2016

ఆదిలాబాద్ : హైదరాబాద్ సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో శస్త్ర చికిత్స వికటించి 13 మంది చూపును కొల్పోయిన ఘటన మరవకముందే ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో మరో ఘటన చోటు చేసుకుంది. జైసూరు మండలం పాట్నాపూర్‌కు చెందిన రోజా వాంతులు, విరేచనాలు, జ్వరంతో ఈ నెల 8 న రిమ్స్ చేరింది. చికిత్స నిర్వహించిన డాక్టర్లు రక్తం తక్కువగా ఉండటంతో ఎనిమియా పేషంట్‌గా గుర్తించి బి పాజిటివ్ రక్తాన్ని ఎక్కించారు. 7 రోజుల చికత్స అనంతరం ఇంటికి పంపించారు. అయితే కంటికి ఇన్పెక్షన్ రావడంతో దీంతో మళ్లీ రిమ్స్ లో చూపించడంతో చూపు కొల్పోయిందని డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యంగానే రోజా చూపు పోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తుంటే, డాక్టర్లు మాత్రం ఆ నిర్లక్ష్యం లేదంటున్నారు. దీనిపై కమిటీ వేసి 24 గంటల్లో నివేదక ఇస్తామని రిమ్స్ ఇంఛార్జీ డైరెక్టర్ అనంత్ రావు తెలిపారు .

14:34 - July 17, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సీరియస్ అంశాల్లో 'హైకోర్టు విభజన' ఒకటి. హైకోర్టును విభజించాలని తెలంగాన రాష్ట్రంలో గత కొద్ది రోజుల కిందట న్యాయవాదులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర మంత్రి దత్తాత్రేయ క్లారిటీ ఇచ్చారు. నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మీడియాతో మాట్లాడారు. హైకోర్టు విభజన అంశం రాష్ట్ర పరిధిలో లేనిదని.. కేంద్రం పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. హైకోర్టు విభజన జరగాలని ఇందుకు గవర్నర్ బాధ్యతగా తీసుకోవాలన్నారు. కేంద్ర హోం శాఖ రాజ్ నాథ్ సింగ్ చెప్పడం..గవర్నర్ చొరవ తీసుకుని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడడం అడుగు ముందుకు పడినట్లేనని తెలిపారు. రాష్ట్ర పరిధిలోనే ఒక కమిటీ వేయాలని ఇందుకు చీఫ్ జస్టిస్ చొరవ చూపాలని కోరారు. 

14:26 - July 17, 2016

ఢిల్లీ : అమర్‌నాథ్ యాత్రకు వెళ్లి శ్రీనగర్‌లో చిక్కుకున్న యాత్రికులు సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నారు. విజయవాడ, చీరాల పాయకరావు పేటకు చెందిన దాదాపు 42 మంది యాత్రకులు ఈరోజు సాయంత్రం ఢిల్లీ నుంచి విజయవాడకు బయలుదేరనున్నారు. జులై 6న అమర్‌నాథ్ కు వెళ్లిన వీరు శ్రీనగర్‌లో అల్లర్ల నేపథ్యంలో అక్కడే చిక్కుకున్నారు. ఏపీ ప్రభుత్వం, విజయవాడ ఎంపీ కేశినేని చొరవతో స్వస్థలాలకు చేరనున్నారు. వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

14:22 - July 17, 2016

విశాఖపట్టణం : కొవ్వాడలో అణువిద్యుత్‌ కేంద్రం ఏర్పాటును వ్యతిరేకిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఏయూలో సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీపీఎం జనరల్ సెక్రటరీ ప్రకాశ్‌ కారత్‌ హాజరయ్యారు. అణు విద్యుత్‌ కేంద్రం ఏర్పాటు వల్ల ఉత్తరాంధ్రకు ముప్పువాటిల్లుతుందని ప్రకాశ్‌ కారత్ అన్నారు. మత్స్య సంపద పూర్తిగా నాశనమవుతుందని తెలిపారు. అమెరికా, జపాన్‌లాంటి అభివృద్ధి చెందిన దేశాలు అణు విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటు వద్దనుకుంటున్నాయని గుర్తు చేశారు. అణువిద్యుత్‌ కేంద్రం ఏర్పాటుపై గుజరాత్‌లో వ్యతిరేకత రావడంతో కొవ్వాడలో ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారని ప్రకాశ్‌కారత్‌ విమర్శించారు. ప్రకాష్ కారత్ ఇంకా ఎలాంటి విషయాలపై మాట్లాడారో వీడియో లో చూడండి. 

14:20 - July 17, 2016

ఢిల్లీ : రేపటి నుండి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. అందులో భాగంగా ఆదివారం కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి రాజకీయ పార్టీల నేతలంతా హాజరయ్యారు. వారి వారి అభిప్రాయాలను వెల్లడించారు. పెండింగ్ బిల్లులకు సహకరించాలని ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను కోరింది. ప్రధానంగా ఈ సమావేశంలో జీఎస్టీ బిల్లుపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ప్రధానంగా జీఎస్టీ బిల్లు, ధరల పెరుగుదల, నిరుద్యోగం తదితర బిల్లులపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రజలకు ఉపయోగపడే బిల్లుల కోసం సహకరిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్ పేర్కొన్నారు. జీఎస్టీ బిల్లుకు కాంగ్రెస్..బీజేపీ పార్టీలు ఆమోదం తెలిపితే సరిపోదని.. అఖిలపక్ష సమావేశం నిర్వహించి చర్చించిన తరువాతే బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టాలని సీపీఎం పేర్కొంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల నుండి పార్లమెంట్ నేతలు పాల్గొన్నారు. పార్టీ ఫిరాయింపుల సవరణ బిల్లు, ఎంపీ ల్యాడ్స్ పెంచాలని, కేంద్రం హామీలు నెరవేర్చాలని వైసీపీ ఎంపీ మేకపాటి సూచించారు. కేంద్రం ఇస్తామన్న నిధులు తిరిగి వెంటనే చెల్లించాలని టిడిపి ఎంపీలు సూచించారు. హైకోర్టు విభజన, ఉమ్మడి వెనుకబడిన జిల్లాల అభివృద్ది, ఏయిమ్స్, తదితర అంశాలను టీఆర్ఎస్ ఎంపీలు ప్రస్తావించారు. ఇక పార్లమెంట్ సమావేశాలు 20 రోజుల పాటు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో 25 బిల్లులను ఆమోదించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం జరిగిన ఈ అఖిలపక్ష సమావేశం సంతృప్తిపరంగా సాగినట్లు ప్రభుత్వం పేర్కొంటోంది. 

ఏపీని ఆదుకోవాలి - ఎంపీ తోట నర్సింహం..

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, ఏపీని ఆదుకోవాలని కోరినట్లు టిడిపి ఎంపీ తోట నర్సిహం పేర్కొన్నారు. కాసేపటి క్రితం అఖిలపక్ష సమావేశం ముగిసిన సంగతి తెలిసిందే. 

చంద్రబాబు..కేసీఆర్ ఆలోచనలు సరికావు - వీహెచ్..

గుంటూరు :ప్రతిపక్షాలు లేకుండా చేయాలన్న చంద్రబాబు, కేసీఆర్ ఆలోచనలు సరైనవి కావని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ పేర్కొన్నారు. ప్రజలు నమ్మి ఓటు వేస్తే కొందరు ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. ఏపీ ప్రయోజనాల కోసం చంద్రబాబు ప్రతిపక్షాలను కలుపుకుని కేంద్రంపై ఒత్తిడి తేవాలని, ప్రజాస్వామ్య పరిరక్షణకు టర్కీ తరహాలో తెలుగు రాష్ట్రాల్లో తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. 

కూతురిపై తండ్రి అత్యాచారయత్నం..

అనంతపురం : పుట్టపర్తి (మం) ఆమగుండపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఐదేళ్ల కూతురిపై తండ్రి అత్యాచారయత్నం చేశాడు. కూతురిని ఆసుపత్రికి తరలించారు. 

ప్రతి బిల్లును ఆమోదించడం కుదరదు - ఆజాద్..

ఢిల్లీ : పార్లమెంట్ లో అఖిలపక్ష సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ప్రజల అభివృద్ధికి ఉపయోగపడే అన్ని బిల్లులకు సహకరిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్ పేర్కొన్నారు. ఏ బిల్లును ఆపాలని తాము కోరుకోవడం లేదని, బిల్లు ప్రయోజనాలను బట్టి దానిని ఆమోదించాలని సూచించారు. ప్రతి బిల్లును ఆమోదించడం కుదరదని, పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన బిల్లులను ఆమోదించాలన్నారు. ప్రజల అభివృద్ధికి ఉపయోగపడే బిల్లులకు సహకరిస్తామన్నారు. 

నెల్లూరులో రోడ్డు ప్రమాదం...

నెల్లూరు : జిల్లా నెలబెల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కలగుంట రైల్వే బ్రిడ్జిపై వెళుతున్న కంటైనర్‌ లారీని కారు ఢీ కొట్టింది. కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు

మొక్కలు నాటిన మంత్రి తుమ్మల..

ఖమ్మం : నేలకొండపల్లి మండలం కొనాయిగూడెం సాంఘీకసంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు.

 

అనంతరాంలో మంత్రుల పర్యటన..

నల్గొండ : గుండాల మండలం అనంతారంలో సీసీ రోడ్డు, యువజన సంఘ భవనానికి మంత్రులు జూపల్లి, జగదీశ్వర్‌రెడ్డి, విప్‌ సునీతా మహేందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. 

13:43 - July 17, 2016

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తీసిన శ్రీమంతుడు చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. తాజాగా జూ.ఎన్ టిఆర్ హీరోగా జనతా గ్యారేజ్ అనే చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన సమంత, నిత్య మీనన్‌ లు నటించనున్నారు. నవీన్‌.యెర్నేని, వై.రవిశంకర్‌, సి.వి.మోహన్‌ నిర్మాతలుగా మైత్రి మూవీస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం విడుదల తేదీ మారింది. మొదటగా ఈ చిత్రాన్ని ఆగస్టు 12న విడుదల చేయాలనుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా షూటింగ్‌ ఆలస్యమైంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇంకా మిగిలిఉన్న నేపథ్యంలో సినిమాను సెప్టెంబర్‌ 2న విడుదల చేయాలనుకుంటున్నారు. ఎన్ టిఆర్, సమంత, నిత్య మీనన్ లు నటిస్తున్న జనతా గ్యారేజ్ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలంటే... సినిమా విడుదలయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే మరి...

 

13:27 - July 17, 2016

మోడీ ఆఫ్రికా టూర్, ఒసామాబిన్ లాడెన్ అబ్బాయి... 'రివేంజ్ తీసుకుంటా... అని ఆడియో రికార్డు చేశాడంట. బెంగళూరులో గొయ్యిలకు పూజలు, నన్ను మించిన నటుడు లేడన్న లల్లూ ప్రసాద్ యాదవ్..,. డ్రంన్ ఆండ్ డ్రైవ్ లో యువత.. శునకాలకు భక్తి వచ్చింది... వంటి కేజ్రీ న్యూస్ ను వీడియోలో చూద్దాం...

 

13:12 - July 17, 2016

పాట ఒక పూలతోటలా రాగాల పరిమాళాలను వెదజల్లుతుంది. ఒక్కోసారి పాట విప్లవాల పోరుబాటను చూపిస్తుంది. పాటకు అంతటి శక్తి ఉంది. అలాంటి పాటలు రాసిన గేయకవి జినుకల సదానందం. ఆయన ప్రకృతి, రైతులు, అమ్మప్రేమ, దేశభక్తి మెుదలైన అంశాలపై అనేక పాటలు రాశాడు. మానవత్వం, ప్రేమతత్వం పరిమళించే పాటలు రాసిన జినుకల సదానందంను పరిచయం చేస్తున్నాడు ప్రముఖ గేయరచయిత స్ఫూర్తి నేటి జనంపాటలో... మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

13:00 - July 17, 2016

ఆకాశంలోసగం అక్షరానికి దూరం అన్న మాటను నేడు మహిళలు వమ్ముచేశారు. చాలామంది స్త్రీలు అక్షరసేద్యం చేస్తూ అద్భుతమైన కవితలు రాస్తున్నారు. అలాంటి వారిలో సుజలగంటి ఒకరు. మానవసంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిన నేటి దుర్మార్గపు సమాజంపై ఆమె నిప్పులు చెరిగారు. ప్రేమ, స్నేహం ,అనుబంధాలు అన్నీ పవిత్రంగా ఉండాలని ఆమె కథలు రాశారు. శత్రుపూరిత వైఖరివల్ల మానవసంబంధాలు దెబ్బతిని కుటుంబాలు విచ్చిన్నమవుతాయని ,ఎక్కడ సమస్య ఉంటుందో అక్కడే పరిష్కార ముంటుందని తెలియచేస్తూ అనేక కథలు రాశారు.`ప్రియే చారుశీలే` పేరుతో కథల సంపుటిగా వెలువరించిన ప్రముఖ కథారచయిత్రి సుజలగంటి పరిచయకథనం నేటి కొత్త కెరటంలో.. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

12:56 - July 17, 2016

సాహిత్యం మనుషుల ప్రవర్తనలో మార్పు తెస్తుందా? సమాజాన్ని సమున్నత విలువలవైపు నడిపిస్తుందా? అంటే నిజమేనంటారు సాహితీ విమర్శకులు. అయితే గొప్పభావాలు, సమున్నత ఆశయాలు, మానవతా విలువలు కలిగి ఉన్న సృజనకారులవల్లనే సమాజం బాగుపడుతుంది.అలాంటి వారిలో అద్భుత కవిత్వం రాస్తూ దళిత ధిక్కారస్వరం వినిపిస్తున్న దుర్గాప్రసాద్ అవధానం.. 

యేమీ జరగనట్టుగానే పైకేమీ కనిపించనికుండానే అమాయక దు:ఖం వెనుక అమానుష నిర్ణయం పొంచి అకాల మృత్యువు తలాపున దీపం పెడుతుంటే తెగని ముడిపడని కన్నీళ్ల వెతల్నిండా సంపాదన దరిద్రాలు, చదువుల అజ్ఞానాలు, స్నేహాల శత్రుత్వాలు, కామమోహాల కలహాలు సుఖాల ఉచ్చుల్లో తన్నుకు చచ్చే సంసార సాగరాలు.... అంటూ మానవ సంబంధాల మీద, సమాజంలోని అసమానతల మీద అద్భుత కవిత్వం రాసిన కవి దుర్గా ప్రసాద్ అవధానం.మనువాదుల దురంహంకారం మీద నిప్పులు చెరిగి ధిక్కారస్వరం వినిపిస్తున్న దుర్గాప్రసాద్ కవిత్వాన్ని విశ్లేషిస్తున్నారు ప్రముఖ సాహితీ విమర్శకులు జి.లక్ష్మీనర్సయ్య నేటి ధిక్కార స్వరంలో...  ఆ వివరాలను వీడియోలో చూద్దాం....

12:49 - July 17, 2016

చద్దన్నం. అంటే అందరికీ తెలిసిందే. కదా. రాత్రి పూట మిగిలిన అన్నాన్ని పొద్దున్నే తినేదే చద్దన్నం. అప్పట్లో ఈ చద్దన్నాన్ని ఎంతో ఇష్టంగా తినేవారు. కానీ ఇప్పుడు రాత్రి వేళలో మిగిలిన ఆహారాన్ని పడేస్తున్నారు. కొంతమంది ఎవరికైనా పెడుతుండడం చేస్తుంటారు. అయితే ఈ చద్దన్నం తీసుకోవడం వల్ల కొన్ని ఉపయోగాలున్నాయి. అవేంటో తెలుసుకోండి....

 • మలబద్దకం, నీరసంగా ఉన్నవారు చద్దన్నం తీసుకోవడం వల్ల ఆ సమస్యలు పోతాయి.
 • చద్దన్నం తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
 • చద్దన్నంలో పెరుగు, పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకుని తింటే వేడి త్వరగా పోతుంది.
 • శరీరం తేలికగా మారి కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది.
 • పేగుల్లో పెరుగుతున్న అల్సర్ల ప్రభావాన్ని తగ్గిస్తుంది.
 • బ్లడ్ ప్రెషర్ అదుపుతో హైపర్ టెన్షన్ గణనీయంగా తగ్గిస్తుంది.
 • అధిక వేడితో కడుపులో కలిగే దుష్ఫలితాలు తగ్గుతాయి.
 • పలు చర్మ వ్యాధులు చద్దన్నం కాపాడుతుంది.
 • పీచు అధికంగా ఉడి మలబద్ధకం, నీరసం తగ్గుతాయి.
 • దేహాన్ని త్వరగా అలసిపోనివ్వదు, తాజాగా ఉంచుతుంది.
 • అలర్జీ కారకాలను, చర్మ మలినాలను తొలగిస్తుంది. 

దక్షిణ గుజరాత్ లో భూ ప్రకంపనలు

గుజరాత్ : దక్షిణ గుజరాత్ లో పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.7 గా నమోదు అయింది. సూరత్ కు 14 కిమీ దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. 

 

కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా సీపీఎం సెమినార్

విశాఖ : ఏయూలోని అంబేద్కర్ హాల్ లో కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా సీపీఎం సెమినార్ నిర్వహించింది. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాష్ కరత్ హాజరయ్యారు.

టీఎస్ టెన్త్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల

హైదరాబాద్ : తెలంగాణ టెన్త్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ అశోక్ ఫలితాలను విడుదల చేశారు. 

12:24 - July 17, 2016

పాకిస్థాన్ : మత్తెక్కించే అందంతో.. మైమరపించే మ్యూజిక్‌ మ్యాజిక్‌తో.. ఫేస్‌బుక్‌ సెలెబ్రిటీగా గుర్తింపు పొందిన ఖందిల్‌ బలోచ్‌.. హత్యకు గురైంది. మ్యూజిక్‌ ఆడియోతో ఇంటర్నెట్‌ సెన్సెషన్‌గా పేరొందిన ఖందిల్‌.. సోదరుడి చేతిలోనే ప్రాణాలు కోల్పోయింది. పరువు కోసం జరిగిన హత్యగా  ప్రాథమిక విచారణలో తేలింది.
అత్యంత ప్రాచుర్యం పొందిన సెలబ్రిటీ బలోచ్‌ 
ఖందిల్‌ బలోచ్‌. పాకిస్థాన్‌లో సోషల్‌ మీడియాలో అత్యంత ప్రాచుర్యం పొందిన సెలబ్రిటీ. ఈమె అనూహ్యంగా హత్యకు గురైంది. ముల్తాన్‌లోని ముజఫర్‌బాద్‌ గ్రీన్‌టౌన్‌కు చెందిన ఈమె కొంతకాలంగా ఇంటర్నెట్‌లో ఫొటోలు పెడుతూ వస్తోంది. ఈ విషయం ఆమె సోదరుడికి నచ్చక ఆమెను పలుమార్లు హెచ్చారించాడు. అయినా తీరు మార్చుకోకపోవడంతో.. ఆమె సోదరుడే బలోచ్‌ను హతమార్చాడు. 
'బ్యాన్ మ్యూజిక్ వీడియో... సోషల్ మీడియాలో వైరల్ 
ఖందిల్ తాజాగా విడుదల చేసిన బ్యాన్ అనే మ్యూజిక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో పాకిస్థాన్‍ లో పెద్ద చర్చను లేవనెత్తింది. సోషల్‌ మీడియాలో ఫొటోలు పెట్టి.. కామెంట్లు చేయడం ద్వారా ఫేమస్ అయిన ఖందిల్ పాక్ పూనం పాండేగా పేరు తెచ్చుకుంది.
సోషల్ మీడియాలో ఫేమస్‌ కావడంతో ఖందిల్ బలోచ్‌కు గతంలోనే పలుసార్లు ఛాందసవాదుల నుంచి చంపేస్తామని కూడా బెదిరింపులు వచ్చాయి. 
భద్రత కోరిన ఖందిల్... పట్టించుకోని హోంశాఖ
తనకు బెదిరింపులు రావడంతో ఖందిల్‌.. తన భద్రత కోసం పాక్ హోంశాఖకూ విజ్ఞప్తి కూడా చేసింది. కానీ హోంశాఖ స్పందించలేదు. రంజాన్‌ అనంతరం ఆమె విదేశాల్లో స్థిరపడాలని నిశ్చయించుకున్నారు. ఈ తరుణంలోనే ఆమె హత్యకు గురికావడం సంచలనం సృష్టిస్తోంది.  

12:13 - July 17, 2016

నిజాబాబాద్ : మనిషి అనుకుంటే సాధించలేనిదంటూ ఏది ఉండదని నిరూపిస్తున్నారు నిజామాబాద్ జిల్లాలోని పడగల్ గ్రామంలో పాఠశాల ఉపాధ్యాయులు. మూతపడుతుందనుకున్న ప్రభుత్వ పాఠశాలకు ప్రాణం పోశారు. బడిబాట ద్వారా తిరిగి తెలుగుమీడియంను ఇంగ్లీష్ మీడియంగా మార్చి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.
తెలుగుమీడియం ఇంగ్లీష్ మీడియంగా మార్పు 
నిజామాబాద్ జిల్లాలోని పడగల్ గ్రామంలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో.. మూసివేద్దామనుకున్న పాఠశాలను తిరిగి వృద్ధిలోకి తీసుకువచ్చారు ఉపాధ్యాయులు. విద్యాశాఖ నిర్ణయానికి ఎదురెల్లి గ్రామస్తుల ప్రొద్భలంతో.. తెలుగుమీడియంను ఇంగ్లీష్ మీడియంగా మార్చి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. 
1956 వ సం.లో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు  
పగడల్  గ్రామంలో 1956 వ సంవత్సరంలో ఆనాటి అధికారులు పిల్లల ఉన్నత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాలను ఏర్పాటు చేశారు. కాని మారుతున్న టెక్నాలజీతో పాఠశాల మనుగడ ప్రశ్నార్థకంగా మరింది. దీంతో పాఠశాలను మూసివేయాలనుకుంది విద్యాశాఖ. పాఠశాలను మూసివేస్తే... పిల్లల భవిష్యత్ పై ప్రభావం పడుతుందని భావించిన సర్పంచ్ గ్రామాభివృద్ది కమిటీ ద్వారా పాఠశాల సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పాఠశాలకు పూర్వ వైభవం తీసుకురావాలని నిర్ణయించారు. అనుకున్నదే  బడిబాట ద్వారా తడవుగా పిల్లల తల్లిదండ్రులలోను అవగాహన కల్పించడం మొదలు పెట్టారు. 
తెలుగు మీడియంను ఇంగ్లీష్ గా మారుస్తూ ఉత్తర్వులు  
కాని గ్రామస్తులు ఇంగ్లీష్ మీడియం అయితేనే తమ పిల్లలను పాఠశాలకు పంపిస్తామని చెప్పడంతో.. ఉపాధ్యాయులు డైలమాలో పడ్డారు. దీంతో ప్రాధానోపాధ్యాయురాలు రాజశ్రీ వెంటనే ఉన్నతాధికారులకు విషయం చెప్పి.. ఇంగ్లీష్ మీడియంగా మార్చాలని కోరడంతో.. అధికారులు ఇంగ్లీష్ మీడియంగా మారుస్తున్నట్లు ప్రకటించారు. గ్రామసర్పంచ్ తన పిల్లలను సైతం ఈ ప్రభుత్వ పాఠశాలకే పంపడంతో.. అందరిలోను కదలిక వచ్చింది. దీంతో  ఉపాధ్యాయులు ఒక అడుగు ముందుకేసి కంప్యూటర్ ద్వారా డిజిటల్ విద్యను అందిస్తున్నారు.
రీజనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అనే సాఫ్ట్ వేర్ ద్వారా
ఇలా రిజినల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అనే సాఫ్ట్ వేర్ ద్వారా విద్యానందించడంతో.. 2014 ,15 సంవత్సరానికి 80 మంది ఉన్న విద్యార్థులు.. 2016 నాటికి 260 మందికి చేరుకున్నారు.  ఉపాధ్యాయుల సంఖ్య పెరిగింది. గ్రామాభివృద్ది కమిటీ ఒక వాలంటీరును నియమించి 5 వేల వేతనం  ఇస్తూ.. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీస్తున్నారు. అందరి సమిష్టికృషితోనే తాము ఈ  విద్యను అందిస్తున్నామని ప్రధానోపాధ్యాయురాలు అంటున్నారు. ప్రస్తుతం పాఠశాలలో గదుల మూత్రశాలల సమస్య ఉందని.. వాటినిప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నారు. 
దృఢ నిశ్చయంతో.. ముందడుగు
చూశారుగా దృఢ నిశ్చయంతో.. అడుగులు ముందుకు వేస్తే.. ఉత్తమ విద్యమనముందే  ఉంటుంది. రాష్ట్రంలోని ప్రతిగ్రామపాఠశాల ఇలా సమిష్టికృషితో పనిచేస్తే .. ప్రభుత్వ పాఠశాలలు మారవా కార్పోరేట్ స్థాయికి. అందరికి ఆదర్శంగా నిలుస్తున్న ఈ పడగల్ పాఠశాల ఉపాధ్యాయులు కృషి అమోఘం.       

 

12:00 - July 17, 2016

పశ్చిమగోదావరి : రెండు వైపులా నదీ పాయలు ...మధ్యలో లంక గ్రామాలు ... ఆ లంకల్లో వేలసంఖ్యలో నిరుపేద కుటుంబాలు... గ్రామాల్లోని ప్రజలు బయట ప్రపంచాన్ని చూడాలంటే రెండు గోదావరి పాయల్ని దాటాల్సిందే..! ఏళ్ళు గడుస్తున్నా.. లంక గ్రామాల ప్రజల తలరాతలు మారడం లేదు. ప్రమాదకరమైన నాటు పడవల్లో గోదావరికి ఎదురీదుతూ గుండెల్ని గుప్పెట్లో పెట్టుకుని.. రాకపోకలు సాగిస్తున్న గోదావరి లంక గ్రామాల ప్రజల అవస్థలపై 10టీవీ స్పెషల్‌ ఫోకస్...!
వణుకుతున్న అయోధ్య లంకవాసులు
కొన్నేళ్లుగా గోదావరి లంక గ్రామాల ప్రజలు గోదావరి వరద ఉధృతికి వణికిపోతున్నారు. లంక గ్రామాల్ని వదిలి బయటకు రావాలంటే ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని ఏటికి ఎదురీదుతున్నారు...! గోదారిని దాటడానికి సరైన రవాణా సౌకర్యం లేక నాటు పడవల్లో ప్రమాదకరమైన ప్రయాణం చేస్తూ ప్రాణాల్ని పోగొట్టుకుంటున్నారు.
ప్రమాదకరమైన నదీ పాయల్లో ప్రయాణం 
పశ్చిమగోదావరి జిల్లాలో ప్రవహించే వశిష్ట గోదావరి రెండు పాయలుగా చీలిపోవడంతో అయోధ్య లంక, పుచల లంక, మర్రిమూల, ఆగర్ లంకతో పాటు అనేక లంక గ్రామాలు గోదావరి మధ్యలో చిక్కుకుపోయాయి. ఈ నాలుగు లంక గ్రామాల్లో దాదాపుగా 3,500 మందికి పైనే ప్రజలు ఉంటారు. వీరంతా వివిధ పనుల నిమిత్తం ప్రతి రోజూ ప్రమాదకరమైన నదీ పాయల్లో ప్రయాణం చేయాల్సి వస్తోంది. లంక గ్రామాలకు బ్రిడ్జ్‌ నిర్మిస్తామని హామీలిస్తున్న నాయకులు.. ఎన్నికల తర్వాత ఆటువైపు కన్నెత్తి చూడడం లేదు. 
వరద ఉధృతితో గాల్లో కలుస్తున్న మనుషుల ప్రాణాలు
గోదావరికి వరద పెరిగినా..ఉధృతంగా ప్రవహించినా ఇక్కడివారు భయంతో వణికిపోతున్నారు. ఎందుకంటే.. గతంలో వరద ఉధృతికి చాలామంది ప్రాణాలు పోయాయి.. కొందరు పడవల్లో ప్రయాణం చేస్తూ.. మరికొందరు నాటు పడవలు ఎక్కేటప్పుడు జారిపడి చనిపోయినవాళ్లు చాలామందే ఉన్నారు.
ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే.. ఆస్పత్రి తీసుకెళ్లాలంటే.. చుక్కలు కనిపిస్తున్నాయి.. సరైన వసతుల్లేక, పడవలో రోగులను తీసుకెళ్లేటప్పుడు.. పరిస్థితి విషమించి ప్రాణాలు వదులుతున్నారు. లంకవాసుల దుర్భర పరిస్థితుల గురించి స్థానిక యంత్రాంగానికి తెలిసినా.. పట్టించుకోవడం లేదు. 
2014లో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాన 
అయోధ్య లంకవాసుల కష్టాలను పరిష్కరించేందుకు 2014 మార్చిలో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాన చేసి.. చేతులు దులుపుకోవడంతో.. ఇక్కడ ప్రజలు కష్టాలు తెల్లారడం లేదు. ఈ లంకల్లోని ప్రజలు గోదావరిని దాటే సమయంలో ఏదైనా ప్రమాదం జరిగినా, ఏదైనా సమస్య ఉన్నా పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల అధికారుల మధ్య నలిగిపోతున్నారు. రెండు గోదావరి పాయలను దాటలేని ఈ లంక గ్రామాల ప్రజలు తమను పశ్చిమ గోదావరి జిల్లా నుండి తమకు దగ్గరగా ఉండే తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలో కలిపేయాలని కోరుతున్నారు. ఇప్పటికైనా టీడీపీ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని అయోధ్య లంకవాసులు మొరపెట్టుకుంటున్నారు. 

 

11:55 - July 17, 2016

తూర్పుగోదావరి : మద్యం మత్తులో కత్తితో దాడి చేయడంతో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన పండూరులో చోటుచేసుకుంది. పండూరు సెంటర్ లో మద్యం సేవించిన వీరవెంకట సత్యనారాయణ, ఉలవల దుర్గాయి మధ్య చిన్న వివాదం కారణంగా ఘర్షణ పడ్డారు. దీన్ని సహించకలేకపోయిన సత్యనారాయణ కత్తితో దాడిచేయడంతో.. దుర్గాయి అక్కిక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  

 

11:51 - July 17, 2016

కడప : రాయచోటి పట్టణంలోని క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. గత 15 రోజులుగా క్రికెట్ బుకీలపై దాడులు చేసి 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి ఒక లక్ష 90వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడితే.. కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. 

 

11:47 - July 17, 2016

నల్లగొండ : జిల్లాలో దారుణం జరిగింది. మైనర్ బాలికను నెలరోజులుగా నిర్బంధించి ఆమెపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మేనత్తకొడుకు బాలికను డిండి మండలం చిన్న శేషాయికుంటలో నెలరోజులుగా నిర్బంధించి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ బాలిక తప్పించుకుని ఆమనగల్ లోని తన తల్లివద్దకు చేరుకుంది. దీంతో బాలిక తల్లి డిండి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

 

మంత్రి కామినేని శ్రీనివాస్ చైనా పర్యటన..

విజయవాడ : ఈనెల 18 నుంచి 20 వరకు మంత్రి కామినేని శ్రీనివాస్ చైనా పర్యటన చేయనున్నారు.  వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, విశాఖ మెడ్ టెక్ సీఈవో జితేందర్ శర్మ, షాంఘైలో ఏర్పాటైన వైద్య పరికరాల తయారీ పార్కుపై కామినేని బృందం అధ్యయనం చేయనుంది. నవ్యాంధ్రలో పారిశ్రామికాభివృద్ధి లక్ష్యంగా పర్యటన జరుగనుంది. 

 

 

10:31 - July 17, 2016

హైదరాబాద్ : కుర్రకారు జోరుకు చెక్‌ పెడుతున్నారు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు. ర్యాష్‌ డ్రైవింగ్‌తో జనాల్ని భయపెడుతున్న కంత్రీగాళ్లకు క్లాస్‌లు తీసుకుంటున్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండానే.. సిటీ రోడ్లపై రయ్‌.. రయ్‌మంటూ దూసుకెళ్తున్న పోకిరీలకు పగ్గాలేస్తున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా.. వెకిలి చేష్టలు వేస్తున్న నూనూగు మీసాల కుర్రాళ్లకు ట్రాఫిక్‌ పోలీసులు కళ్లెం వేస్తున్నారు.
చిన్నారి రమ్య మృతి... చట్టాలు కఠినతరం 
హైదరాబాద్‌లో తాగుబోతుల నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల ఈ మధ్యే చిన్నారి రమ్య మృతిచెందడంతో నగర పోలీసులు చట్టాలను కఠినతరం చేశారు. నిన్నటి వరకూ రోడ్లపై గిర్రున దూసుకుపోతున్న మైనర్లకు కళ్లెం వేసిన పోలీసులు.. ఈసారి పంథా మార్చారు. రాంగ్‌ రూట్‌లో డ్రైవింగ్‌ చేస్తున్న వారిని, ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తున్న మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో వరుసగా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు.. గోషామహాల్‌ ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో 250 మంది మైనర్లకు, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ నిర్వహించారు. 
625 మంది వాహనదారులకు జరిమానా 
ఇటు నార్త్‌ జోన్‌ పరిధిలో కూడా 625 మంది వాహనదారులకు జరిమానా విధించారు. రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌కు వెయ్యి రూపాయలు, అతివేగానికి రెండువందలు కలిపి ఒక్కో వాహనదారునికి 12 వందల చలానా విధించారు. ఒక్కసారి కౌన్సిలింగ్‌తో సరిపెడుతామంటున్న పోలీసులు.. వరుసగా పట్టుబడితే.. ఊచలు లెక్కపెట్టిస్తామని గట్టిగా హెచ్చరిస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలను ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు. ఒకవేళ మద్యం తాగి.. వాహనం నడుపుతూ పట్టుబడితే.. పిల్లలతో పాటు తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.
నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు
అంతేకాదు.. ప్రతిసారి పట్టుబడితే.. లైసెన్స్‌ రద్దుతో పాటు... సంబంధిత పాఠశాలల విద్యార్థుల ప్రవర్తనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. స్కూల్‌ లేదా కాలేజీ యాజమాన్యానికి ఆదేశాలు ఇస్తామన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని చట్ట రిత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. కేవలం నాలుగైదు రోజులే కాకుండా.. తరచూ తనిఖీలు నిర్వహిస్తామని చెబుతున్నారు పోలీసులు. చిన్నారి రమ్యతో హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు చట్టాలను మార్చి.. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నారు. 

 

కాసేపట్లో టీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ

ఢిల్లీ : కాసేపట్లో టీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. 

నేడు టీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ

ఢిల్లీ : నేడు టీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు అటవీశాఖ మంత్రి మాధవ్ దవేతో కేసీఆర్ భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. రేపు మధ్యాహ్నం 1.15 గంటలకు ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ తో భేటీకానున్నారు. 

 

వైద్యం వికటించి కంటిచూపు కోల్పోయిన యువతి

ఆదిలాబాద్ : రిమ్స్ ఆస్పత్రిలో వారం క్రితం జ్యోతి అనే యువతికి వైద్యులు రక్తం ఎక్కించారు. వైద్యం వికటించి జ్యోతి కంటిచూపు కోల్పోయింది. బాధితురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. 

కరీంనగర్ జిల్లాలో విషాదం

కరీంనగర్ : రామగుండం మండలం పుట్నూరులో విషాదం నెలకొంది. ఏడాదిన్నర బాలుడితోపాటు బావిలో దూకి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది.

నల్గొండ జిల్లా డిండి మండలంలో దారుణం

నల్గొండ : డిండి మండలం చిన్నిశేషాయికుంటలో దారుణం జరిగింది. బాలికను నెల రోజులు నిర్బంధించి మేనత్తకొడుకు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తప్పించుకుని ఆమన్ గల్ లోని తల్లి వద్దకు చేరింది. బాలిక తల్లి డిండి పీఎస్ లో ఫిర్యాదు చేసింది. 

ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు ప్రారంభం

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. మూడు రోజుపాటు శాకాంబరిగా అమ్మవారు దర్శనమివ్వనున్నారు. దుర్గగుడికి భక్తులు పొటెత్తారు. 

09:45 - July 17, 2016

నిజామాబాద్ : డబ్బు..! ఓ తమ్ముడిని హంతకుడిని చేసింది.. అతడి వదినను కటకటాల్లోకి నెట్టింది. కాసుల కోసం రక్తసంబంధాన్ని మరచిన తమ్ముడు.. సొంత అన్ననే అత్యంత క్రూరంగా హతమార్చాడు. భర్తను కడదేర్చిన మరిదిపై పగతో రగిలిపోయిన వదిన.. అతణ్ణీ అంతం చేయించింది. ఈ పగ, ప్రతీకార ఘటనలు నిజామాబాద్‌ జిల్లాలో వెలుగు చూశాయి. 
అన్నదమ్ముల మధ్య రగిలిన రక్తచరిత్ర
నిజామాబాద్ జిల్లా పోచారం తండాలో ఇటీవల జరిగిన శ్రీనివాస్‌ దారుణహత్య కేసు మిస్టరీ వీడింది. ఈ కేసులో నిందితుడు సాక్షాత్తు మృతుడు శ్రీనివాస్‌ సోదరుడు గాండ్లరాములేనని పోలీసులు నిర్ధారించారు. 
అన్నదమ్ముల మధ్య వైరం ఎందుకొచ్చింది? 
అసలు అన్నదమ్ముల మధ్య వైరం ఎందుకొచ్చింది? ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునేంతంగా వారి మధ్య ఏం జరిగింది? ఈ ప్రశ్నలకు ఆన్సర్‌ దొరకాలంటే ఓ సారి ఫ్లాష్‌ బ్యాక్‌లోకి వెళ్లాలి. నిజామాబాద్‌ జిల్లా  బాన్సువాడ మండలం దేశాయ్‌పేటలో గాండ్ల బాల్‌శెట్టి గంగవ్వ దంపతులకు నలుగురు కుమారులు.. ఇద్దరు కూతుళ్లు. బాల్‌శెట్టి పేరిట ఉన్న 39 ఎకరాల భూమి కోసం.. కుమారులు రక్తచరిత్రను రాశారు. ఆత్మహత్యలతో మొదలైన గొడవ హత్యల దాకా వెళ్లింది. 
ఆత్మహత్యలతో మొదలై హత్యల దాకా...
ఆస్తి తగాదాల వల్ల.. బాల్‌శెట్టి రెండో కుమారుడు, అతడి భార్యతో సహా 10 ఏళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత నాలుగో కుమారుడూ బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. మిగతా ఇద్దరు కుమారులు గాండ్ల రాములు,  గాండ్ల శ్రీనివాస్.. 39 ఎకరాల భూమిని తల్లిదండ్రులతో కలిసి 3 భాగాలుగా పంచుకున్నారు. అయితే.. తల్లిదండ్రుల భూమిపై కన్నేసిన రాములు.. సోదరుడు శ్రీనివాస్‌కు తెలియకుండా తల్లిదండ్రులకు చెందిన ఓ మూడెకరాల పొలాన్ని తన భార్య పేరిట రిజిస్టర్‌ చేయించాడు. ఈ విషయం తెలిసిన తమ్ముడు శ్రీనివాస్‌.. అన్న రాములుతో గొడవపడి..  గతేడాది నవంబర్‌ 26న దేశాయ్‌పేట్ శివారులో బండరాయితో మోది హతమార్చాడు. 
అన్నను హతమార్చిన తమ్ముడు
అన్న హత్య కేసులో అరెస్టయిన శ్రీనివాస్ బెయిల్‌పై బయటికొచ్చి తన పొలాన్ని గోవింద్‌కు కౌలుకు ఇచ్చాడు. ఇరువురి మధ్య పంపకాల్లో తేడా రావడంతో.. గోవింద్‌ను మధ్యవర్తిగా ఉన్న బీమానాయక్‌లను చంపేస్తానని శ్రీనివాస్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. ఇదేక్రమంలో.. తన భర్తను చంపేశాడన్న పగతో రగులుతున్న శ్రీనివాస్‌ వదిన స్వరూప.. మరిది హత్యకు స్కెచ్‌ వేసింది. సోదరుడు శ్యాంసుందర్‌తో పాటు గోవింద్‌,  బీమానాయక్‌లకు లక్ష సుపారీకి ఒప్పుకుని అడ్వాన్స్‌గా 50 వేలు చెల్లించింది. పక్కా ప్రణాళిక ప్రకారం.. పోచారం తండాలో వారు శ్రీనివాస్‌ను కత్తితో పొడిచి చంపారు. 
శ్రీనివాస్‌ దారుణహత్య 
డాగ్‌స్క్వాడ్‌తో వేట  ప్రారంభించిన పోలీసులు.. గోవింద్‌, బీమనాయక్‌, శ్యాంసుందర్‌ను అరెస్ట్ చేశారు. స్వరూప సహా పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. మొత్తానికి భూమి తగాదా.. గాండ్ల బాల్‌శెట్టి కుటుంబంలో కుమారులు హతమైపోవడం.. కోడలు హత్యానేరంలో ఇరుక్కోవడానికి దారితీసింది. భూ తగదాలను పరిష్కరించుకోవడానికి ఎన్నో మార్గాలున్నా కుటుంబ సభ్యులు ఆవేశానికి లోనవడం వల్ల.. వారి కుటుంబం మొత్తం ఛిన్నాభిన్నమైంది. 

 

09:39 - July 17, 2016

హైదరాబాద్‌ : నగరంలో ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా బైక్‌రైడ్స్‌ నిర్వహిస్తున్న యువకుల్ని జూబ్లీహిల్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 22 బైక్‌లు, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. బైక్‌లను అతివేగంగా నడుపుతూ.. రోడ్డుప్రమాదాలకు కారణం అవుతున్నారని పోలీసులు అంటున్నారు. అదుపులోకి తీసుకున్న యువకులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్‌ ఇస్తామని పోలీసులు అంటున్నారు.

 

09:33 - July 17, 2016

టర్కీ : అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు సైన్యంలోని ఒక వర్గం చేసిన తిరుగుబాటు టర్కీలో భారీ రక్తపాతానికి దారితీసింది. సైనికులు, పోలీసుల మధ్య జరిగిన రణరంగంలో 265 మంది మరణించారు. వీరిలో41 మంది పోలీపులు, ఇద్దరు సైనికులు, 47 మంది పౌరులు ఉన్నారు. పలువురు తిగుబాటుదారులు కూడా హతమయ్యారు. దాదాపు మూడు వేల మంది గాయపడ్డారు. తిరుగుబాటు చేసిన సైనికుల్లో 1500 మందిని అదపులోకి తీసుకున్నట్టు టర్కీ ప్రభుత్వం ప్రకటించింది. 
ప్రభుత్వంపై సైన్యంలోని ఒక వర్గం తిరుగుబాటు 
టర్కీ అధ్యక్షుడు ఎర్డొనాగ్‌ నేతృత్వంని ప్రజాస్వామ్య ప్రభుత్వంపై సైన్యంలోని ఒక వర్గం తిరుగుబాటు చేసింది. దేశంలో ఉగ్రవాదం పెరిగి, శాంతి భద్రతలు క్షీణించాయన్న నెపంతో సైన్యం తిరబడింది. ఎర్డొగాన్‌ పాలనలో నిరంకుశం పెరిగిపోయి, ప్రజస్వామ్య హక్కులు మృగ్యమయ్యాయని తిరుగుబాటుకు కారణమైన సైనికాధికారులు ఆరోపిస్తున్నారు. 
గగనతలంలో సైనిక విమానాలు చక్కర్లు
తిరుగుబాటు తర్వాత టర్కీ రాజధాని అంకారా గగనతలంలో సైనిక విమానాలు చక్కర్లు కొట్టాయి. వీధుల్లో తిరుగుతూ హోరెత్తించిన యుద్ధ ట్యాంకులు జనాన్ని హడలెత్తించాయి. టర్కీ పార్లమెంటుపై సైన్యం బాంబు దాడులకు పాల్పడింది. పోలీసుల లక్ష్యంగా వైమానిక దాడులు జరిగాయి. దీంతో టర్కీలో ఒక్కసారిగా ఉద్రిక్తపరిస్థితి నెలకొంది. 
యుద్ధ క్షేత్రంగా మారిన టర్కీ 
ఓవైపు సైనిక దాడులు, మరోవైపు తిరుగుబాటు చేసిన సైనికులు అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రతిదాడులు, కాల్పులకు దిగడంతో టర్కీ యుద్ధక్షేత్రంగా మారింది. దీంతో కొన్ని గంటలపాటు దేశం అతలాకుతలం అయ్యింది. దేశం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు తిరుబాటు చేసిన సైనిక వర్గం ప్రకటించుకున్నా, ఆ తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చినట్టు అధ్యక్షుడు ఎర్డొగాన్‌ ప్రకటించారు. 
తిరుగుబాటును నిరసించిన టర్కీ ప్రజలు 
సైనిక తిరుబాటు ఖండించిన ఎర్డొగాన్‌... ప్రజలంతా వీధుల్లోకొచ్చిన తనకు మద్దతు ఇవ్వాలన్న పిలుపుకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. జనం వీధుల్లోకి వచ్చి సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా నినరస వ్యక్తం చేశారు. సైనిక వాహనాలు, మిలటరీ ట్యాంకులకు అడ్డంగా పడుకున్నారు. అంకారా నుంచి ఇస్తాంబుల్‌ చేరుకున్న అధ్యక్షుడు ఎర్డొగాన్‌ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు.   సైనిక తిరుబాటు తర్వాత కొద్ది గంటలపాటు  మూసివేసిన ఇస్తాంబుల్‌లోని అటాటర్క్‌ విమానాశ్రయాన్ని ఆ తర్వాత తిరిగి తెరిశారు. తిరుబాటుకు కారణమైన సైనికాధ్యక్షుణ్ణి తొలగించి, సైనిక దళాల కొత్త ప్రధానాధికారిగా జనరల్‌ ఉమిత్‌ దుందర్‌ను నియించారు. సైనిక చర్యలకు పాల్పడిన 29 మంది కల్నన్స్‌, ఐదుగురు ఆర్మీ జనరల్స్‌ను విధుల నుంచి తొలగించారు. దేశవ్యాప్తంగా 1500 మంది సైనికులు అరెస్టు చేసి, జైల్లో పెట్టారు. టర్కీలో పరిస్థిని చక్కదిద్దేందుకు పోలీసులు, ప్రభుత్వాధికారులు ప్రయత్నిస్తున్నారు. 
భారతీయులెవరూ టర్కీ వెళ్లొద్దు : సుష్మాస్వరాజ్  
సైనిక తిరుబాటు నేపథ్యంలో భారతీయులెవరూ టర్కీ వెళ్లొద్దని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ కోరారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు టర్కీలోని భారతీయులెవరూ ఇళ్ల నుంచి  బయటకు రావొద్దని సూచించారు. టర్కీ సైనిక చర్యలను అమెరికా అధ్యక్షుడు ఒబామా ఖండించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఎర్డొగాన్‌ ప్రభుత్వానికి మద్దతు ఉంటుందని ప్రకటించారు. టర్కీలో సాధారణ పరిస్థితులు నెలకోడానికి నాలుగైదు రోజులు పట్టొచ్చిన భావిస్తున్నారు. 

 

09:26 - July 17, 2016

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ ఆరు కేబినెట్‌ కమిటీలను పునర్వస్థీకరించారు. వీటిలో అత్యంత కీలకమైన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ నుంచి జౌళి శాఖ మంత్రి స్మృతీ ఇరానీని తప్పించారు. ఈనెల 5న జరిగిన మంత్రివర్గ పునర్వస్థీకరణలో స్మృతీ ఇరానీని హెచ్ ఆర్ డీ మంత్రిత్వ శాఖ నుంచి తప్పించిన ప్రధాని మోడీ... ఇప్పుడు సీసీపీఏ లో కూడా స్థానం లేకుండా చేశారు. హెచ్ ఆర్ డీగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ప్రకాశ్‌ జావదేకర్‌తోపాటు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ నిర్వహిస్తున్న అనంతకుమార్‌కు సీసీపీఏలో స్థానంలో కల్పించారు. ఎన్ డీఏ పక్షాల్లో రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌కు ఈ కమిటీలోకి తీసుకున్నారు. కేంద్ర మంత్రులు ఎస్ ఎస్.అహ్లువాలియా, పీపీ. చౌదరి, ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీలకు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీలో స్థానం కల్పించారు. రాజకీయ, ఆర్ధిక, భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీల్లో మరి కొందరు మంత్రులకు స్థానం కల్పించారు. భద్రతా వ్యవహారాలు, నియామకాల కేబినెట్‌ కమిటీల్లో మార్పులు లేవు. 

09:19 - July 17, 2016

విశాఖ : నిరుపేదల ఆందోళనతో విశాఖ సర్క్యూట్‌ హౌజ్‌ హోరెత్తింది. ఇళ్లు కోల్పోయి రోడ్డునపడ్డ తమ గోడును మంత్రిగారు వింటారా? వినరా? అంటూ పేదలు నినదించారు. గంటలకొద్దీ వేచిచూస్తున్నా మంత్రిగారు బయటకు రావడంలేదని ఆగ్రహించారు. వీరి సమస్యపై స్పందించిన మంత్రి గంటా... పేదలందరికీ ప్రభుత్వమే ఇళ్లు కట్టిస్తుందని హామీ ఇచ్చారు. 
ఇళ్ల కూల్చివేత...ఉద్రిక్తత
విశాఖ జిల్లా భీమిలి మండలంలో ఇళ్ల కూల్చివేత అంశం ఉద్రిక్తతకు దారితీసింది.  అక్రమ నిర్మాణాలంటూ.. మండలంలోని మారికవలస, మంగమూరిపేట, ఎండాడ, తిమ్మాపురం ప్రాంతాల్లోని చాలా ఇళ్లను అధికారులు రెండు రోజుల క్రితం కూల్చివేశారు..  పైసా పైసా కూడబెట్టి ఇటుక ఇటుకా పేర్చి కట్టుకున్న ఇళ్లు కళ్లముందే నేలకూలడంతో బాధితులంతా కన్నీరుమున్నీరయ్యారు.. 
ప్రభుత్వ ప్రకటనను స్వార్థానికి వాడుకున్న అక్రమార్కులు
తాజాగా పేదల ఇళ్లను రెగ్యులరైజ్‌  చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన బాధితుల్లో ఆశలు నింపింది.. అయితే.. కొందరు అక్రమార్కులు ఈ ప్రకటనను తమ స్వార్థానికి ఉపయోగించుకున్నారు...... ఇళ్లను రెగ్యులర్‌ చేయిస్తామంటూ నిరుపేదలను నమ్మించి డబ్బు వసూలు చేశారు.. ఒక్కొక్కరినుంచి 50వేలనుంచి 4లక్షలవరకూ లాగేశారు... పట్టాలు ఎప్పుడిప్పిస్తారని అడిగినవారిపై దాడి చేశారు..  వీరి తీరుతో విసిగిపోయిన స్థానికులు డైరెక్టుగా మంత్రి గంటానే కలవాలని బయలుదేరారు.. మంత్రితో తమ గోడు చెప్పకునేందుకు సర్క్యూట్‌ హౌజ్‌ముందు బారులు తీరారు.. బైట్ః vsp 
మంత్రి గంటా దర్శనంకోసం పేదల ఎదురుచూపులు
బాధితులు సర్క్యూట్‌హౌస్‌ వద్దకు చేరుకున్న సమయంలో మంత్రి గంటా శ్రీనివాసరావు.. జిల్లా అధికారులతో సమీక్ష సమావేశంలో ఉన్నారు. మంత్రి దర్శనంకోసం ఎంతసేపు ఎదురుచూసినా ఆయన బయటకు రాలేదు.. గంటలు గడిచాయి... మహిళలు, చిన్నారులతో సహా బాధితులంతా
ఎండలో నిలబడి నిలబడి అలసిపోయారు.. దీంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.. గూడు చెదిరిపోయి రెండురోజులుగా రోడ్లమీద ఉంటున్నా తమను పట్టించుకోరా అంటూ ఆందోళనకు దిగారు.. మంత్రి మీటింగ్‌నుంచి వస్తారా? రారా అంటూ నినాదాలు చేశారు.. మీటింగ్‌హాల్‌లోకి వెళ్లే ప్రయత్నం చేశారు.. వీరిని పోలీసులు అడ్డుకున్నారు..
ముందస్తు హెచ్చరికలు లేకుండా ఇళ్లు కూల్చడం సరికాదన్న మంత్రి
బాధితుల ఆందోళనతో మంత్రి గంటాశ్రీనివాసరావు సమావేశం నుంచి బయటకొచ్చారు.. బాధితుల ఆక్రందన విన్నారు.. ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఇళ్లు ఎలా కూలుస్తారని అధికారుల్ని ప్రశ్నించారు.. ఎవ్వరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరంలేదని... పేదలందరికీ ప్రభుత్వం ఇళ్లు కట్టిస్తుందని హామీ ఇచ్చారు.. నిబంధనలకు అనుగుణంగాఉన్న స్థలాలను రెగ్యులరైజ్‌ చేస్తామన్నారు.. 
ఇళ్లకూల్చివేతపై పలు సందేహాలు 
అయితే ఈ ఇళ్లకూల్చివేతపై స్థానికులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.. మంత్రులు, ఉన్నతాధికారులకు తెలియకుండా ఓ ఎమ్మార్వో ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని.. ఇన్ని ఇళ్లను ఎలా కూలుస్తారని బాధితులు అనుమానిస్తున్నారు. 

 

09:12 - July 17, 2016

మహబూబ్‌ నగర్‌ : జిల్లాలోని సిద్ధాపూర్‌ ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్‌ క్లాస్‌ రూంల నిర్వహణకు నిధులు విడుదల చేశామని... సినీనటి నమ్రతా శిరోద్కర్‌ ప్రకటించారు. మహేశ్‌ బాబు ట్రస్ట్‌ ద్వారా ఈ డబ్బు విడుదలైందని తెలిపారు. గ్రామస్తులంతా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సూచించారు. హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న నమ్రత... కలెక్టర్‌ శ్రీదేవితోకలిసి విద్యార్థులకు హరితహారం ప్రతిజ్ఞ చేయించారు. ఈ గ్రామాన్ని ప్రిన్స్ దత్తత తీసుకున్నారు. 

 

09:05 - July 17, 2016

అనంతపురం : గుంతకల్‌ లో థియేటర్‌ సమీపంలోని టింబర్‌ డిపోలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు వేగంగా వ్యాపించడంతో డిపోలోని సామగ్రి అంతా కాలిబూడిదైంది. ఈ ప్రమాదంలో దాదాపు 40లక్షలవరకూ నష్టం జరిగిఉంటుందని అధికారులు అంచనావేస్తున్నారు. మంటల్ని ఆర్పేందుకు ఫైర్‌ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. 

 

 

09:00 - July 17, 2016

కాకినాడ : ఆంధ్రప్రదేశ్‌లో వేర్వేరు చోట్లా రెండు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని ద్విచక్రవాహనం ఢీకొనడంతో.. ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. ఇక నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం ఇద్దరి ప్రాణాలను తీసింది. దొరవారిసత్రం మండలం కలగుంట జాతీయ రహదారిపై లారీని స్కార్పియో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా... మరో ఇద్దరు గాయపడ్డారు. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో డ్రైవర్‌తోపాటు... ఏలూరుకు చెందిన మహిళా డాక్టర్‌ ఉన్నారు. డ్రైవర్‌ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.. 

 

నేడు కొవ్వాడ అణువిద్యుత్ ప్లాంట్ పై జాతీయ స్థాయి సెమినార్

విశాఖ : నేడు కొవ్వాడ అణువిద్యుత్ ప్లాంట్ పై జాతీయ స్థాయి సెమినార్ నిర్వహించనున్నారు. ఈ సెమినార్ కు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కరత్ హాజరుకానున్నారు. 

నేడు భారత్ కు రానున్న మలేషియా ఉప ప్రధాని అహ్మద్ జహీద్

ఢిల్లీ : మలేషియా ఉప ప్రధాని అహ్మద్ జహీద్ నేడు భారత్ కు రానున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 

నేడు పార్లమెంట్ ఉభయ సభల ఫ్లోర్ లీడర్ల సమావేశం

ఢిల్లీ : ఇవాళ ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ఉభయ సభల ఫ్లోర్ లీడర్ల సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నాను.

నేడు నర్సీపట్నంలో పీసీసీ కార్యవర్గ సమావేశం

విశాఖ : నేడు నర్సీపట్నంలో పీసీసీ కార్యవర్గ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి పాల్గొననున్నారు. రాష్ట్రంలో రాహుల్ పర్యటనపై చర్చించనున్నారు. 

08:46 - July 17, 2016

హైదరాబాద్ : నిన్నటి వరకూ ఆ రెండు పార్టీలు చెట్టాపట్టాలేసుకుని తిరిగాయి. గ్రేటర్‌ ఎన్నికల వరకూ భాయి భాయీ అంటూ పెనవేసుకుని తిరిగాయి.. కానీ, ఉన్నట్టుండి.. ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య దూరం అంతకంతకూ పెరుగుతోంది. ప్రజా ఉద్యమాల్లో కలిసి పనిచేసిన ఆ పార్టీలు ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తుండడం.. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 
టీడీపీ, బీజేపీల మధ్య పెరుగుతోన్న దూరం 
ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన టీడీపీ, బీజేపీల మధ్య దూరం పెరుగుతోంది. రాష్ర్ట ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం ఉద్యమాలు చేస్తుంటే.. కమలం పార్టీ మాత్రం కారులోనే కంఫర్టుగా ఉందంటోంది. ప‌నిగ‌ట్టుకుమ‌రీ గులాబీ ద‌ళాన్ని ఆకాశానికి ఎత్తేస్తోంది. మిత్రప‌క్షాన్ని ప‌క్కనపెట్టి అధికార పార్టీని పోగ‌డ్తల‌తో ముంచెత్తుతోంది. దీనికి తోడు ఆ పార్టీ అధ్యక్షులు తెలంగాణ‌లో తామే టిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం అంటూ మాట్లాడ‌డం టీడీపీకి అస్సలు మింగుడుపడడం లేదు..!
టీఎన్‌ఎస్‌ఎఫ్‌లో చేరిన ఏబీవీపీ విద్యార్థులు
ఈ మధ్యే ఏబీవీపీకి చెందిన స్టూడెంట్స్‌ కొంతమంది టీఎన్‌ఎస్‌ఎఫ్‌లో చేరారు. దీంతో టీడీపీ తీరుపై బీజేపీ అగ్గిమీద గుగ్గులమవుతోందట..! కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలతో రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేయకపోయినా.. భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చసాగుతోంది. అంతేకాదు.. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని బీజేపీ పొగడ్తలతో ముంచెత్తుంటే.. టీ.టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ మిత్రపక్షం బీజేపీపై ఘాటు విమర్శలు చేస్తున్నారు.  
కార్యక్రమాలను సింగిల్‌గా ప్లాన్‌ చేస్తున్న టీడీపీ  
ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించే కార్యక్రమాలను కూడా టీడీపీ సింగిల్‌గానే ప్లాన్‌ చేసుకుంటోంది. మిత్రపక్షం బీజేపీ కలిసి రాకపోయినా.. ప్రజాసమస్యలపై ఉద్యమిస్తూనే ఉంది. అటు బీజేపీ కూడా టిఆర్ఎస్‌ను ఆకాశానికి ఎత్తేస్తోంది. తాజాగా సిఎం కేసీఆర్‌కు నెంబ‌ర్ వ‌న్ ర్యాంకు క‌ట్టబెట్టింది. అటు కేంద్రమంత్రులు సైతం కేసిఆర్ పాల‌న‌ను తెగ‌ పోగిడేస్తుండ‌డం టీడీపీకి ఇబ్బందిగా మారింది. దీంతో ఈ వ్యవ‌హ‌రాల‌ను ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ త‌మ్ముళ్ళ. ఒకవేళ చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్‌ వస్తే.. కమలం పార్టీపై క‌త్తులు దూయ‌డానికి సిద్ధమవుతున్నారు తెలుగుదేశం నేతలు. 
తెలంగాణలో తలోదారి 
అటు కేంద్రంలోనూ ఇటు ఏపీలోనూ బీజేపీ, టీడీపీల మధ్య మైత్రి కొనసాగుతున్నా.. తెలంగాణలో మాత్రం తలోదారి అన్నట్టుగా తయారైంది పరిస్థితి. తాజాగా బీజేపీపై టీడీపీ ఎదురుదాడి చూస్తుంటే తెలంగాణ‌లో వీరి బంధానికి ముగింపు పడ్డట్టే అని రాజ‌కీయ వ‌ర్గాల్లో చర్చసాగుతోంది. 

08:40 - July 17, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు జీహెచ్‌ఎంసీ ప్రవేశపెట్టిన మై జీహెచ్‌ఎంసీ యాప్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. ఒక్క రోజులోనే కొన్ని వేల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. వందల సంఖ్యలో యాప్ ద్వారా ఫిర్యాదులు అందాయి. 
సమస్యల సత్వర పరిష్కారం కోసం యాప్‌ 
పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విడుదల చేసేని మై జీహెచ్‌ఎంసీ యాప్‌కు భారీ స్పందన లభిస్తోంది. సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు యాప్‌ను బల్దియా అందుబాటులోకి తెచ్చింది.. ఇందులో ట్రేడ్ లైసెన్స్‌, ఆస్తిపన్ను వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే డిజిటల్‌ సైన్‌తో కూడిన జనన, మరణ ధృవీకరణ పత్రాలను పొందవచ్చు. దీంతో 8347 మంది జనన ధృవప్రతాలు, 923 మంది మరణ ధృవపత్రాలను డౌన్‌లోడ్ చేసుకున్నారు. 
25 వేల మంది యాప్‌ డౌన్‌లోడ్ 
ఇప్పటివరకు 25 వేల మంది యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. విడుదలైన కొన్ని గంటల్లోనే 149 మంది 3,52,483 రూపాయల ఆస్తిపన్నును మై యాప్ ద్వారా చెల్లించారు. సమస్యలపై ఫోటోలతో సహా బల్దియాకు ఫిర్యాదు చేయవచ్చు. ఇప్పటికే 755  ఫిర్యాదులు జీహెచ్‌ఎంసీకీ అందగా.. 72 సమస్యలను సత్వరమే అధికారులు పరిష్కరించారు.  ఏ సమస్యను ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారో తెలియజేస్తే బాగుంటుందని గ్రేటర్ వాసులు అభిప్రాయపడుతున్నారు.

 

08:36 - July 17, 2016

హైదరాబాద్ : టీఎస్ ఆర్ టీసీ లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఈనెల 19 న జరిగే  ఈ ఎలక్షన్లకు ఎస్ డబ్ల్యు ఎఫ్, ఈయూ ఐక్య కూటమి క్యాంపెయిన్‌లో ముందుంది. సంస్థలో కార్మికులకు జరుగుతున్న అన్యాయాలను ఈ రెండు సంఘాల నేతలు ఎత్తిచూపుతో  అందరి మద్దతు కూడగడుతున్నారు. 
ఎన్నికల ప్రచారం తారా స్థాయికి 
టీఎస్‌ ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరింది. మంగళవారం జరిగే ఎలక్షన్లకు యూనియన్లు సిద్ధమవుతున్నాయి. స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌ కలిసి పోటీ చేస్తున్నాయి. ప్రచారంలో భాగంగా  శనివారం సీబీఎస్‌ దగ్గర జరిగిన భహిరంగ సభలో ఈరెండు సంఘాల ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభకు ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. 
ఆర్టీసీలో కార్మిక వ్యతిరేక విధానాలు
ఆర్టీసీలో రోజు రోజుకు ఎక్కువవుతున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఐక్య కూటమి నేతలు ఎత్తి చూపారు. కొన్ని సంఘాలు యాజమాన్యానికి తొత్తులుగా మారి, స్వార్ధ ప్రయోజనాల కోసం కార్మిక హక్కులను తాకట్టు పెడుతున్న వైనాన్ని వివరించారు. స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్ ఫెడరేషన్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌ కలిసి చేసిన ఫోరాటాల ఫలితంగానే వేతన సవరణలో 44 శాతం ఫిట్‌మెట్‌ను సాధించగలిగామని ఎస్ డబ్ల్యు ఎఫ్ నేతలు చెబుతున్నారు. టీఆర్ ఎస్ అనుబంధ టీఎంయూ దీనిని తమ గొప్పగా చెప్పుకోడాన్ని తప్పుపట్టారు. 
ఆర్టీసీలో ప్రైవేటీకరణ విధానాలు 
ఆర్టీసీలో జరుగుతున్న ప్రైవేటీకరణ విధానాలను కూడా ఐక్య కూటమి నేతలు ప్రస్తావించారు.  సంస్థ నష్టాల పేరుతో అద్దె బస్సుల సంఖ్యను పెంచడాన్ని తప్పుపట్టారు. కొందరు నాయకులు యాజ్యమాన్యం మెప్పుకోసం 
కార్మిక హక్కలు తాకట్టు పెడుతున్నారని ఐక్య కూటమి నేతలు మండిపడ్డారు. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో గెలుపుపై స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌, ఎంప్లాయిస్‌ యూనియన్‌ నేతలు ధీమాతో ఉన్నారు. 
 

 

08:26 - July 17, 2016

హైదరాబాద్ : ముద్దుమాటలతో నవ్వులు పూయించాడు.  కేరింతలు కొడుతూ.. తల్లిదండ్రులకు కొండంత సంతోషం పంచాడు. ఆకలైతే..  అమ్మాని ఏడవటం...కడుపునిండితే ఆడుకోవడం మాత్రమే తెలిసిన  ఆ పసివాడిని..  ఓ ప్రైవేట్‌ పాఠశాల కబళించింది. తల్లిదండ్రులకు తీరనిశోకం మిగిల్చింది.  చదువులు వ్యాపారంగా మారిన నేపథ్యంలో ... చిన్నారుల ప్రాణాలు పోతున్నా.. ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు  డబ్బులు లెక్కపెట్టుకోవడంలోనే బిజీగా గడిపేస్తున్నాయి. ప్రైవేట్‌ పాఠశాలు చిన్నారుల పాలిట మృత్యుకుహరాలుగా మారాయి. వేలకు వేలు ఫీజులు వసూలు చేసుకోవడంలో ఉండే ఆతృత... పిల్లల మంచిచెడులను గ్రహించడంలో ఉండదు. 
ఇద్దరు విద్యార్థులు ఘర్షణ... ఒకరి మృతి
ఇదే.. ఓ పసివాడి ప్రాణాలను బలిగొన్న ప్రైవేట్‌పాఠశాల. హైదరాబాద్‌ టోలీచౌకీలో ఉన్న దీ  స్కూలు. మూడోతరగతి చదువుతున్న  ఓ పిల్లవాడితో ఒకటోతరగతి చదువుతున్నఇబ్రహీం తగవుపడ్డారు. ఈ కీచులాటలో ఇబ్రహీంకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఈనెల 12నుంచి బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో   చికిత్స చేయుస్తున్నారు తల్లిదండ్రులు . దెబ్బలు బలంగా తగలడంతో  ఇబ్రహీం కోలుకోలేక పోయాడు. చివరికి ప్రాణాలు విడిచాడు. పాఠశాల బాధ్యతారాహిత్యం వల్లే తమ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని విద్యార్థి తండ్రి కన్నీరు పెట్టుకుంటున్నాడు. 
అసలింతకీ స్కూల్లో ఏం జరిగింది..?
అసలింతకీ స్కూల్లో ఏంజరిగింది... 5ఏళ్లు, 8ఏళ్ల వయసున్న ఇద్దరు  చిన్నారులు ప్రాణాలు పోయేంత తీవ్రంగా దెబ్బలు కొట్టుకోగలరా... స్కూల్లో పిల్లలు  కీచులాడుకోవడం.. తర్వాత కలిసి స్నేహంగా గంతులేయడం సహజమే. కాని... ప్రాణాలు పోయేంత తీవ్రంగా  తగవుపడ్డారంటేనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పాఠశాలలో పిల్లల ఆలనా పాలన పట్టించుకోరా..పసివాళ్లను అనుక్షణం కనిపెట్టి ఉండాల్సిన టీచర్లు.. సంరక్షకులు ఏంచేస్తున్నట్టు... అని ప్రశ్నిస్తున్నారు బాధితులు.
గుట్టుగా వ్యవహరిస్తోన్న స్కూల్‌ యాజమాన్యం 
ఇంతజరిగినా ...విషయం బటికి రాకుండా స్కూల్‌ యాజమాన్యం గుట్టుగా వ్యవహరిస్తోంది. టీచర్లు, సిబ్బంది ఎవరూ నోరువిప్పి నిజం చెప్పని విధంగా కంట్రోల్‌ చేస్తోందనే ఆరోపణలొస్తున్నాయి. అసలు పిల్లవాళ్లు  దెబ్బలాడుకున్న  విషయమే  తమకు తెలిదని అమాయకత్వం నటిస్తున్నారు.. స్కూల్‌ సిబ్బంది.  స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి 
ఇంత జరిగినా.. కనీసం మృతి చెందిన విద్యార్థి తల్లిదండ్రులకు కూడా సరైన సమాధానం చెప్పడం లేదు ప్రామిసింగ్‌స్కూల్ యాజమాన్యం. ఏదన్నా ఉంటే.. పోలీస్టేషన్లో మాట్లాడుకోండి అంటూ... మాటమాటకీ పోలీసులను గుర్తుకు చేస్తూ బెదిరించే ప్రయత్నం చేస్తున్నట్టు మృతుని బంధువులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. 

 

08:13 - July 17, 2016

హైదరాబాద్ : మల్లన్నసాగర్ భూసేకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ మరింత దూకుడు పెంచనుంది. ఇప్పటికే అక్కడి రైతులతో కలిసి ఆందోళనలు కొనసాగిస్తున్న హస్తం పార్టీ. ప్రభుత్వ తీరును...అక్కడి రైతుల గోడును జాతీయ స్ధాయిలో వినిపించేందుకు సిద్ధమవుతోంది. 
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్షకు ప్లాన్
తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య టామ్ అండ్ జెర్రిలా పైట్ సాగుతోంది. ప్రతిపక్షాన్ని మరింత బలహీనపరచాలని  టీఆర్ఎస్ చూస్తుంటే..సర్కార్ పై అప్పర్ హ్యాండ్  సాధించాలని   కాంగ్రెస్ తహతహలాడుతోంది. దీని కోసం కాంగ్రెస్ మల్లన్నసాగర్ అంశాన్ని తమకు అనుకూలంగా మలచుకుంటోంది. హస్తం పార్టీ. ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న ప్రాజెక్టుల రీడిజైన్ నిర్ణయంపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్న హస్తం నేతలు..ఇప్పుడు మల్లన్నసాగర్ ఎపిసోడ్ పూర్తిగా క్యాష్ చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. 
రైతుల ఆందోళనకు కాంగ్రెస్ మద్దతు
మల్లన్నసాగర్ భూసేకరణ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో అక్కడి రైతులు ఆందోళన బాట పట్టడంతో వారికి మద్దతుగా కాంగ్రెస్ ముందుకు వచ్చింది. అన్నదాతలతో కలిసి ఆందోళనలు కూడా చేసింది. అయితే ఇదే అంశంపై టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో  చేసిన దీక్ష తమకు అంతగా  మైలేజ్ తీసుకు రాలేదన్న భావన కాంగ్రెస్ పార్టీని వెంటాడుతుంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకున్న హస్తం పార్టీ మరింత దూకుడు పెంచాలని డిసైడ్ అయ్యింది . మల్లన్న సాగర్ ఆందోళనలను జాతీయస్ధాయికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. 
హైదరాబాద్ మల్లన్నసాగర్ రైతులతో కలిసి దీక్ష 
దీనిలో భాగంగా ఈ నెలాఖరులో హైదరాబాద్ ధర్నాచౌక్ లో మల్లన్నసాగర్ రైతులతో కలిసి దీక్ష చేయాలని డిసైడ్ అయ్యింది కాంగ్రెస్. అక్కడితో ఆగకుండా ఢిల్లీ జంతర్ మంతర్ లో కూడా దీక్ష చేయాలని భావిస్తున్నారు. దీనికి సోనియా, రాహుల్ గాంధీలను ఆహ్వనించడం ద్వారా మల్లన్న సాగర్ అంశాన్ని  జాతీయ స్దాయికి తీసుకెళ్లాలని ప్లాన్‌ చేస్తున్నారు.  ఇంతే కాకుండా ఏకంగా రాహుల్ గాంధీనే మల్లన్న సాగర్ కు రప్పిస్తే ఎలా ఉంటుందన్న విషయంపై కూడా చర్చిస్తున్నారు.   భూసేరణకు అంశంపై ఎక్కువగా దృష్టి పెట్టకుండా,  ప్రాజెక్టుల రీడిజైన్ పైన్ పోరు చేయాలని భావిస్తున్నారు. మొత్తానికి రాహుల్ రప్పించాలా వద్దా అన్న విషయాన్ని   పక్కనబెడితే..మల్లన్నసాగర్ అంశాన్ని జాతీయ స్ధాయికి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్‌ చేస్తున్న యత్నాలు ఎంతవరకు కార్యరూపం దాల్చుతాయో చూడాలి.

07:57 - July 17, 2016

హైదరాబాద్ : హైకోర్టు విభజన అంశంపై అధికార పార్టీ దృష్టి పెట్టింది. సోమవారం నుంచి ప్రాంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఇదే అంశంపై కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలని ప్లాన్‌ సిద్ధం చేస్తోంది. దీనికోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో పార్టీ ఎంపీలు ఇవాళ ఢిల్లీలో సమావేశం అవుతున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై గులాబి బాస్ దృష్టి పెట్టారు. కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు అనుసరించాల్సిన  వ్యూహంపై తమ పార్టీ ఎంపీలతో భేటీ కానున్నారు.  
మొదటి ప్రాధాన్యతగా హైకోర్టు విభజన అంశం
పార్లమెంట్ సమావేశాల్లో ప్రధానంగా హైకోర్టు విభజన అంశాన్ని మొదటి ప్రాధాన్యతగా ప్రస్తావించేందుకు టీఆర్‌ఎస్‌ ఎంపీలు సిద్ధమవుతున్నారు. అటు 9,10 షెడ్యూల్ లో ఉన్న సంస్థల విభజన ఇంకా కొలిక్కి రాకపోవడం, ఉద్యోగుల విభజనకు సంబంధించి  కమల్‌నాథన్ కమిటీ చేస్తున్న ప్రక్రియలో  జాప్యం జరుగుతుండడం... తదితర అంశాలను కూడా లేవనెత్తేందుకు గులాబి దళం రెడీ అవుతోంది.  మరోవైపు  ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలనే డిమాండ్ నుకూడా గట్టిగా వినిపించాలని పార్టీ ఎంపీలకు సూచిస్తున్నారు గులాబీ దళపతి. 
అనుకున్నవి రాబట్టాలనే ప్లాన్‌
ఈ సమావేశాల్లోనే జీఎస్‌టీ బిల్లును గట్టెక్కించాలని కేంద్ర ప్రభుత్వం  పట్టుదలగా ఉంది.  దీన్ని అవకశంగా తీసుకుని  జీఎస్‌టీ బిల్లువిషయంలో మద్ధతుగా మాట్లాడి... కేంద్రాన్ని ప్రసన్నం చేసుకోవాలని కేసీఆర్‌ తమ ఎంపీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. 

 

07:51 - July 17, 2016

హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి  బోనాల జాతర ప్రారంభమయ్యింది. తెల్లవారుజామున 4 గంటలకు మహా హారతి ఇచ్చిన తర్వాత అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతినిచ్చారు. ఈ బోనాల జాతర రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. 
ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి బోనాలు ప్రారంభం
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి  బోనాల జాతర ప్రారంభమయ్యింది. మహంకాళీ దేవాలయం విద్యుత్ కాంతులతో మిరుమిట్లుగొలుపుతుంది. ఆదివారం భక్తులు అమ్మవారికి బోనాలు, సాక సమర్పిస్తారు. సోమవారం రంగం కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో అవివాహిత మహిళ భవిష్యవాణి వినిపిస్తుంది. రెండు రోజుల పాటు ఈ జాతర అంగరంగవైభవంగా జరుగుతుంది.
సికింద్రాబాద్ లో బోనాల కళ
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతరతో పాటు  ఈ ప్రాంతంలోని 40 దేవాలయాల్లో బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. దీంతో సికింద్రాబాద్ కు మొత్తం బోనాల కళ వచ్చింది. మరోవైపు జాతరకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. దీంతో జాతరకు తరలివచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. 
పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాట్లు 
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల్ని ప్రతిబింబించే ఈ జాతరలో వస్తున్న  భక్తలకు ఇబ్బందులు కలగకుండా వివిధ శాఖల అధికారులు  పర్యవేక్షిస్తున్నారు.  హైదరాబాద్ లో తీవ్రవాదుల కదలికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగుకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 

 

తూ.గో జిల్లాలో రోడ్డు ప్రమాదం... ముగ్గురి మృతి

తూర్పుగోదావరి : జగ్గంపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్, ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 

గుంతకల్ లో అగ్నిప్రమాదం...

అనంతపురం : గుంతకల్ ఎస్ ఎల్ వీ థియేటర్ సమీపంలోని టింబర్ డిపోలో అగ్నిప్రమాదం జరిగింది. ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. రూ.40 లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. 

 

నేడు తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

హైదరాబాద్ :  ఇవాళ ఉదయం 11 గంటలకు తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి. 

తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్టుమెంట్లు నిండి భక్తులు వెలుపల వేచివున్నారు. శ్రీవారి సర్వ దర్శననానికి 10 గంటల సమయం పడుతుంది. నడకదారి భక్తులకు 8 గంటల సమయం పడుతుంది. 

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం...

నెల్లూరు : దొరవారి సత్రం  మండలం కలగుంట వద్ద జాతీయ రహదారిపై కంటెయినర్, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు.

Don't Miss