Activities calendar

01 August 2016

22:17 - August 1, 2016

జీఎస్టీ కోసం బీజేపీ ఎందుకు తహతహలాడుతోంది..? అఖిలక్షం ఏర్పాటు చేయటానికి ఎందుకు వెనకాడుతోంది..? వస్తు సేవల పన్నుతో రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావముంటుంది..?  జీఎస్టీతో ప్రజలకు లాభమా...? నష్టమా...? ఈ అంశంపై ఈరోజు వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

22:12 - August 1, 2016

గుంటూరు : దేశంలోని ఎస్సీ, ఎస్టీలకు ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాల్సిందే అన్నారు సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కరత్‌. గుంటూరు జిల్లాలో జరుగుతున్న పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలకు హాజరైన కరత్.. దేశంలోని వివిధ అంశాలపై స్పందించారు. దళితులపై దాడులు, కొవ్వాడలో అణు విద్యుత్‌ కేంద్రాల నిర్మాణాలపై కేంద్రాన్ని తప్పుపడుతూ ప్రకాశ్‌ కరత్ తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. 
ప్రకాశ్‌ కరత్‌ హాజరు..
గుంటూరు జిల్లాలో జరుగుతున్న సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలకు హాజరైన పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కరత్‌..దేశంలోని వివిధ అంశాలపై స్పందించారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూములు కోల్పోతున్న దళితులకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు.. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులన్నీ వారి అభివృద్ధికి మాత్రమే ఖర్చయ్యేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో 6 అణు విద్యుత్‌ కేంద్రాలను నిర్మించాలనే ప్రతిపాదనలను ప్రకాశ్‌ కరత్ తీవ్రంగా తప్పుపట్టారు. ఏపీని అణువిద్యుత్‌ కేంద్రాల డంపింగ్‌ యార్డుగా మార్చాలని మోడీ, చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ప్రకాశ్‌ కరత్ విమర్శించారు. గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌లో అక్కడి ప్రజలు తిరస్కరించిన అణు విద్యుత్‌ కేంద్రాలను ఏపీలో ఏర్పాటు చేయాలని మోదీ ప్రయత్నిస్తున్నారన్నారు. 
దళితులపై దాడులను ఖండించిన ప్రకాశ్‌ కరత్ 
దేశంలో ప్రస్తుతం దళితులపై జరుగుతున్న దాడులను ప్రకాశ్‌ కరత్ తీవ్రంగా ఖండించారు. గుజరాత్‌లోని ఊనా ప్రాంతంలో దళితులపై జరుగుతున్న దాడుల్లో బీజేపి, ఆర్‌ఎస్‌ఎస్‌ హస్తం ఉందన్నారు. గో రక్షక్‌ దళ్‌ ముసుగులో బీజేపి, ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన కార్యకర్తలు దళితులపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దళితులపై దాడులు అమానుషమన్న ప్రకాశ్‌ కరత్‌..దాడిచేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు రాష్ట్ర సమస్యల పరిష్కారానికీ సీపీఎం పోరాటం చేస్తుందని ప్రకాశ్‌ కరత్ స్పష్టం చేశారు.  

22:06 - August 1, 2016

హైదరాబాద్ : ఎంసెట్‌-2 రద్దుపై సీఎం కేసీఆర్‌ మంగలవారం అధికారికంగా ప్రకటన చేస్తారని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఎంసెట్‌ లీకేజీలో దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తేలేదని మంత్రి కడియం స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా సంస్థాన్‌నారాయణపూర్‌ మండలం సర్వేల్‌ గ్రామంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో మంత్రి కడియం శ్రీహరి ఆకస్మిక తనిఖీలు చేశారు. అదే గ్రామంలో ఉన్న గురుకుల జూనియర్ కాలేజీని కూడా మంత్రి సందర్శించారు. తరగతి గదుల్లోకి వెళ్లి కాసేపు ఉపాధ్యాయుడి అవతారం ఎత్తారు. 

 

22:03 - August 1, 2016

మహబూబ్‌నగర్‌ : జిల్లాలో జలసాధన సమితి మహాపాదయాత్ర ముగింపు సభ జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మాజీమంత్రి జైపాల్‌రెడ్డి, సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కాంగ్రెస్‌ నేత డీకే అరుణ, టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్‌ రమణ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌తోపాటు జలసాధన సమితి సభ్యులు హాజరయ్యారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. పెండింగ్‌లోఉన్న ప్రాజెక్టుల్ని పక్కనబెట్టి కొత్త ప్రాజెక్టుల పేరుతో ప్రజల్ని ఇబ్బంది పెడుతోందని నేతలు ఆరోపించారు. భూనిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 

 

21:59 - August 1, 2016

ప్రత్యేకహోదా మీద చంద్రాలు డ్రామా... పార్టీ ఎంపీల ధర్నాకు మంత్రుల డుమ్మా, పాతబొమ్మలు పాతవెట్టిన కేసీఆర్... కొత్త సచివాలయం డిజైన్లు మళ్ల మార్పు,  గజ్వేల్ కాడికి కావోతున్న మోడీ....ఉంటదామరి ఈ పర్యటనల వాడి,  ఊర్లపోంటిదిరిగిన ఆరడుగుల బుల్లెట్... జర్రసేపటికే బీసీ చెక్ జేసీ తోలిన డాక్టర్లు, పిల్లను పెండ్లీ జేసుకుని పర్షానైన పోరడు.. శోభనం గదిలోకిపోంగనే ఒక్కటే పరార్, హోటల్ రూంలో అద్దెకు దిగిన చిరుతపులి.... బాత్ రూంల కాలువెట్టిన పోరడు గాలి గాల...ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను మీడియోలో చూద్దాం...

 

 

21:38 - August 1, 2016

'పెళ్ళి చూపులు' చిత్రం టీమ్ తో టెన్ టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా సినిమా హీరో విజయ్ దేవర కొండ, హీరోయిన్ రీతూ వర్మ తమ అనుభవాలను వివరించారు. పలు అసక్తికర విషయాలు చెప్పారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

 

21:34 - August 1, 2016

ఢిల్లీ : రియో ఒలింపిక్స్ టెన్నిస్ కు నలుగురు సభ్యుల భారత జట్టు సిద్ధమయ్యింది. పురుషుల, మహిళల డబుల్స్, మిక్సిడ్ డబుల్స్ అంశాలలో మాత్రమే భారత్ తన అదృష్టం పరీక్షించుకొంటోంది. 43 ఏళ్ల లియాండర్ పేస్ ఏడోసారి ఒలింపిక్స్ బరిలోకి దిగుతూ..రెండో పతకం కోసం తహతహలాడుతున్నాడు. 2016  
ఒలింపిక్స్ టెన్నిస్ లో భారత అవకాశాలపై 10 స్పోర్ట్స్ స్పెషల్ ఫోకస్.....
ఒలింపిక్స్ ప్రధానక్రీడల జాబితాలో రాయల్ గేమ్ టెన్నిస్ 
రాయల్ గేమ్ టెన్నిస్ మరోసారి ఒలింపిక్స్ ప్రధానక్రీడల జాబితాలో చేరిపోడంతో...సూపర్ స్టార్లు నొవాక్ జోకోవిచ్, సెరెనా విలియమ్స్ తో సహా ప్రపంచ మేటి సూపర్ స్టార్ ప్లేయర్లంతా రియో ఒలింపిక్స్ పతకాలకు గురిపెట్టారు. అంతేకాదు....ప్రపంచ మహిళల డబుల్స్ టాప్ ర్యాంకర్ సానియా మీర్జా, భారత డబుల్స్ జోడీ లియాండర్ పేస్, రోహన్ బొపన్న సైతం తమ అదృష్టం పరీక్షించుకోడానికి సిద్ధమయ్యారు.
ఆగస్టు 7 నుంచి పోటీలు
రియో ఒలింపిక్స్ టెన్నిస్ సెంటర్ వేదికగా ఆగస్టు 7 నుంచి జరిగే  పోటీల పురుషుల, మహిళల డబుల్స్, మిక్సిడ్ డబుల్స్ విభాగాలలో మాత్రమే భారత జట్టు పాల్గొంటోంది. లియాండర్ పేస్,రోహన్ బోపన్న, సానియా మీర్జా, తాంబ్రేలతో కూడిన నలుగురు సభ్యుల భారత బృందం ఒలింపిక్స్ సమరానికి పూర్తిస్థాయిలో సిద్ధమయ్యింది. ఒలింపిక్స్ టెన్నిస్ చరిత్రలో భారత్ గెలుచుకొన్న ఒకే ఒక్క పతకాన్ని సాధించిన మొనగాడు లియాండర్ పేస్..రికార్డుస్థాయిలో ఏడోసారి పతకం వేటకు సిద్ధమయ్యాడు.
పురుషుల డబుల్స్ బరిలోకి పేస్
రోహన్ బొపన్న జంటగా పురుషుల డబుల్స్ బరిలోకి పేస్ దిగుతున్నాడు. దక్షిణ కొరియాతో ఈమధ్యనే ముగిసిన ఆసియా-ఓషీనియాజోన్ డేవిస్ కప్ సమరంలో కొరియాపై రోహన్ తో జంటగా సాధించిన విజయం స్ఫూర్తితో పేస్ పాల్గొనబోతున్నాడు. ఇక...మహిళల డబుల్స్ లో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ సానియా మీర్జా ...మహిళల డబుల్స్, మిక్సిడ్ డబుల్స్ విభాగాలలో పోటీకి దిగుతోంది. తన కెరియర్ లో ఇప్పటికే రెండు ఒలింపిక్స్ లో పాల్గొని ఉత్తచేతులతో తిరిగి వచ్చిన సానియా...రియో గేమ్స్ మిక్సిడ్ డబుల్స్ లో ఏదో ఒక పతకం సాధించగలనన్న ధీమాతో ఉంది. మహిళల డబుల్స్ లో ప్రార్థనా తాంబ్రేజంటగాను, మిక్సిడ్ డబుల్స్ లో రోహన్ బొపన్న జోడీగాను పోటీకి దిగుతోంది. మిక్సిడ్ డబుల్స్, పురుషుల డబుల్స్ లో ..అదృష్టం కలసివస్తే భారత్ ఏదో ఒకపతకం గెలుచుకొనే అవకాశాలు లేకపోలేదు. ఏదిఏమైనా తమ కెరియర్ లో ఆఖరి ఒలింపిక్స్ ను లియాండర్ పేస్, సానియా మీర్జా చిరస్మరణీయంగా మిగుల్చుకోవాలని కోరుకొందాం.

21:28 - August 1, 2016

ఢిల్లీ : రియో ఒలింపిక్స్‌ డోపింగ్‌ టెస్ట్‌లో విఫమలైన నర్శింగ్‌ యాదవ్‌కు నేషనల్ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. నర్శింగ్‌ యాదవ్‌పై కుట్ర జరిగిందని...ఉద్దేశపూర్వకంగా ఎటువంటి నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకోలేదని నాడా డైరెక్టర్‌ జనరల్‌ నవీన్‌ అగర్వాల్‌ ప్రకటించారు.కానీ నర్శింగ్‌ యాదవ్‌ రియో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగేది, లేనిది ఇంకా తేలలేదు. 74 కేజీల రెజ్లింగ్‌ విభాగంలో నర్శింగ్‌ స్థానంలో భారత ఒలింపిక్‌ సమాఖ్య ఇప్పటికే ప్రవీణ్‌ రాణా పేరును ప్రకటించిన సంగతి తెలిసిందే. 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తి రూ.2 కోట్లు విలువైన కొకైన్ ను డీఆర్ ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

 

21:13 - August 1, 2016

కర్నూలు : జిల్లాలో వడ్డీ వ్యాపారులు చెలరేగుతున్నారు..అంగబలం..అర్థబలం చూసుకుని రెచ్చిపోతున్న వారు సామాన్యులపై తెగబడుతున్నారు..ఓ ఆటోవాలాను వేధించి..వేధించి చివరకు ఆటో లాక్కోవడంతో ఆత్మహత్యాయత్నం చేశాడు..అతని భార్య గమనించకుంటే క్షణాల్లో ఉరితాడుకు వేలాడేవాడే...
అసలు వడ్డీ చెల్లించినా వేధింపులు..
కర్నూలు జిల్లాలో వెలుగుచూసిన మరో దారుణం..ఉండేది రేకుల షెడ్డు..ఆటో నడుపుకుంటూ జీవనం..ఇక పిల్లలను కాస్తైనా చదివించాలనుకున్న మక్బూల్‌ బాషా అప్పు  చేశాడు..ఆ అప్పును వడ్డీతో సహా నెలనెలా చెల్లిస్తున్నాడు..కాని చివర్లోకి వచ్చేసరికి మొత్తంగా అప్పు ఉందని...అసలుకు రెట్టింపు చెల్లించకుంటే చంపేస్తామంటూ వడ్డీ వ్యాపారుల బెదిరింపులకు తట్టుకోలేకపోయాడు..దీంతో ఇంట్లో భార్య చున్నీతో ఉరేసుకోబోయాడు...కొద్ది క్షణాల్లో వేలాడబోయే బాషాను గమనించిన ఇల్లాలు కాపాడింది..ఆమె అరుపులు కేకలతో జనం పరుగున చేరారు...
పిల్లల చదువు కోసం 40 వేలు అప్పు 
కర్నూలు జిల్లా డోన్‌లోని సుందర్‌ సింగ్‌ కాలనీ చెందిన మక్బూల్ బాషా ఆటోనడుపుతుంటాడు...పిల్లల చదువు కోసం వడ్డీ వ్యాపారి నాగరాజు వద్ద 40 వేలు అప్పు చేశాడు..10 నెలలుగా డబ్బు చెల్లిస్తున్నాడు...అయితే చివర్లో ఉన్న డబ్బు చెల్లించకపోవడంతో నాగరాజు 70 వేలు అప్పు చెల్లించాలంటూ ఒత్తిడి తేవడం మొదలుపెట్టాడు..బలవంతంగా ఆటో లాక్కెళ్లాడు..జీవనాధారమైన ఆటో వడ్డీవ్యాపారి తీసుకెళ్లడంతో పాటు మరో వ్యాపారి 10 వేలు చెల్లించాలంటూ బెదిరింపులకు దిగాడు..దీంతో మనస్తాపం చెందిన బాషా ఉరేసుకోబోవడంతో తృటిలో బయటపడ్డాడు... జరిగిన ఘోరంపై ..వడ్డీ వ్యాపారుల వేధింపులపై ఆ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది...
సామాన్యుల బతుకులతో వ్యాపారుల చెలగాటం  
డబ్బు కోసం తెగబడుతున్న వ్యాపారులు సామాన్యుల బతుకులతో ఆడుకుంటున్నారు...ఇలాంటి నాగరాజుల అరాచకాలు ప్రతీ పట్టణంలో ఉన్నాయి..అయినా వడ్డీ వ్యాపారులు చెలరేగుతున్నారంటే వారికి సహకరిస్తున్నది ఎవరు..? ఎందుకీ దుర్మార్గం...

 

21:08 - August 1, 2016

హైదరాబాద్ : లాల్‌దర్వాజలోని మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమం ఘనంగా జరిగింది. అమ్మవారి భక్తురాలు అనురాధ భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురుస్తాయని చెప్పారు. పండుగను బాగా నిర్వహిస్తున్నారని... రంగం కార్యక్రమాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. అమ్మవారికి నచ్చినట్లు చేయడంలేదని చెప్పారు. ఆలయానికి స్థలం కావాలని ఏనాడో అడిగానని ఇంతవరకూ ఇవ్వలేదని రంగంలో అనురాధ భవిష్యవాణి వినిపించారు. 

 

21:04 - August 1, 2016

హైదరాబాద్‌ : నగరంలో వాలంటరీ రిటైర్మెంట్‌ సర్వీస్‌ డిపెండెంట్‌ సభ్యులు సింగరేణి భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు.. సభ్యుల్ని అరెస్ట్‌ చేశారు. 1990నుంచి వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకున్న ఉద్యోగుల డిపెండెంట్స్‌కు పోస్టింగ్‌ ఇవ్వలేదంటూ సభ్యులు ఈ ఆందోళన చేపట్టారు. రెండేళ్లుగా ప్రభుత్వానికి వినతిపత్రాలిచ్చినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు.

21:00 - August 1, 2016

ఖమ్మం : భూ నిర్వాసితులకు అండగా ఉంటామని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. జిల్లాలోని మణుగూరు, పినపాక మండలాల్లో ఆయన పర్యటించారు. భద్రాద్రి పవర్‌ప్లాంట్‌ను సందర్శించిన చాడా.. భూనిర్వాసితులు ఏర్పాటుచేసిన సదస్సులో పాల్గొన్నారు. ప్లాంట్‌ కోసం భూములిచ్చిన రైతులకు సీపీఐ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆ తర్వాత పినపాక మండలంలోని తొగ్గూడెం అటవీప్రాంతంలో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనుల్ని కలిశారు. వారికి వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్కడి నుంచి ఏడూళ్ల బయ్యారంలో నిర్వహించిన సమావేశంలో చాడా పాల్గొన్నారు.

 

20:48 - August 1, 2016

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆందోళనలు ఉధృతంగా సాగుతూనే ఉన్నాయి. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తెలుగుదేశం ఎంపీలు నిరసనలు తెలిపారు. విభజన చట్టంలోని హామీలన్నీటిని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ ఎంపీలు ఢిల్లీలో ఆందోళనలను ఉధృతం చేశారు. 
ఊపందుకుంటున్న 'హోదా' డిమాండ్లు
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం ఎంపీలు పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. విభజన హామీలను కచ్చితంగా అమలు చేయాలని టీడీపీ ఎంపీలు డిమాండ్‌ చేస్తున్నారు. అంతకుముందు పార్లమెంటులోని పార్టీ కార్యాలయంలో ఎంపీలు సమావేశమయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ధర్నా చేపట్టడంతో పాటు పార్లమెంటు సమావేశాల్లో ఎలా వ్యవహరించాలి...? కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడికి అనుసరించాల్సిన కార్యాచరణపై చాలాసేపు చర్చించారు. 
లోక్‌సభలోనూ టీడీపీ ఎంపీలు ఆందోళన 
ఇటు లోక్‌సభలోనూ టీడీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని, తక్షణమే ప్రత్యేక హోదా కల్పించాలని స్పీకర్‌ పోడియం వద్ద నిరసన తెలిపారు. నాటి యూపీఏ ప్రభుత్వ వైఖరీ కారణంగానే ప్రస్తుతం ఏపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నారు టీడీపీ ఎంపీ తోట నరసింహం. ఎన్డీఏలో ఉంటూనే నిరసనలు కొనసాగిస్తామన్నారు ఎంపీ మురళీమోహన్‌. ఏపీ ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామన్న ఆయన.. తమకు పదవులు ముఖ్యం కాదన్నారు. ప్రత్యేక హోదాపై ప్రధాని మోడీ నుంచి ఎలాంటి స్పందన లేకపోతే.. తమ అధినేత చంద్రబాబు సూచనల ప్రకారం ముందుకెళ్తామన్నారు. ఏపీ రాష్ర్ట ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తామన్నారు ఎంపీ అవంతి శ్రీనివాస్‌.
రాష్ర్ట ప్రయోజనాల కోసం పోరు : ఎంపీ శివప్రసాద్‌ 
అప్పుడు విభజనను ఆపేందుకు.. ఇప్పుడు రాష్ర్ట ప్రయోజనాల కోసం పోరాడుతున్నామన్నారు ఎంపీ శివప్రసాద్‌. తమ సహనాన్ని ఇంకా పరీక్షించవద్దన్న ఆయన టీడీపీ-బీజేపీల మధ్య అభిప్రాయభేదాలు ఇప్పుడే మొదలయ్యాయి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకూ దశలవారీగా పోరాటం చేస్తామన్నారు ఎంపీ గల్లా జయదేవ్‌. హోదా కోసం ఎన్డీఏ నుంచి కూడా బయటకు రావడానికి సిద్ధమన్నారు. 
ప్రత్యేక హోదాపై నిరసనలు సెగలు 
మొత్తంగా ప్రత్యేక హోదాపై నిరసనలు సెగలు అగ్గిరాజుకుంటున్నాయి. కేంద్రంపై అన్ని పార్టీలు ఒత్తిడి పెంచే దిశగా ముందుకెళ్తున్నాయి. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయలేదనే అపవాద భవిష్యత్తులో రాకుండా టీడీపీ ఆచితూచి అడుగులు లేస్తూ ముందుకెళ్తోంది. కేంద్రం మాత్రం ప్రత్యేక హోదాపై జరుగుతున్న పరిణామాలన్నీటిని నిశితంగా పరిశీలిస్తోంది.. మరి హోదాపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి...!

 

20:44 - August 1, 2016

గాంధీనగర్ : గుజరాత్‌ ముఖ్యమంత్రి పదవికి ఆనందిబేన్‌ రాజీనామా చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడికి ఈ మేరకు ఆమె తన రాజీనామాను సమర్పించారు. వయసు మీద పడుతుందని, తనను పదవి నుంచి తప్పించాలని ఆమె అధిష్టానానికి ఫేస్ బుక్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు. వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని హైకమాండ్‌ను కోరారు. ఆనందీ బెన్‌ అభ్యర్థనపై స్పందించిన బీజేపీ వెంటనే ఆమె రాజీనామాను ఆమోదించింది. ఈ నవంబర్‌ కు ఆనందీబెన్ 75వ పుట్టిన రోజు జరుపుకోనుంది. 

గుజరాత్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆనందిబేన్‌

గాంధీనగర్ : గుజరాత్‌ ముఖ్యమంత్రి పదవికి ఆనందిబేన్‌ రాజీనామా చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడికి ఈ మేరకు ఆమె తన రాజీనామాను సమర్పించారు. వయసు మీద పడుతుందని, తనను పదవి నుంచి తప్పించాలని ఆమె అధిష్టానానికి 
ఫేస్ బుక్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు. వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని హైకమాండ్‌ను కోరారు. ఆనందీ బెన్‌ అభ్యర్థనపై స్పందించిన బీజేపీ వెంటనే ఆమె రాజీనామాను ఆమోదించింది. ఈ నవంబర్‌ కు ఆనందీబెన్ 75వ పుట్టిన రోజు జరుపుకోనుంది. 

20:35 - August 1, 2016

విజయవాడ : ఏపీలో విద్యార్థుల ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్‌ కొనసాగుతోంది.. సంక్షేమ హాస్టళ్ల మూసివేత, ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫీజుల పెంపు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపాధ్యాయ అధ్యాపక ఖాళీల భర్తీ డిమాండ్లతో ఈ నిరసన చేపట్టారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

20:33 - August 1, 2016

ఢిల్లీ : ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. కేంద్ర వైఖరిపై మండిపడుతున్న టీడీపీ నేతల వ్యాఖ్యలపై తాను స్పందించనని స్పష్టం చేశారు. ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పారు. ప్రత్యేక హోదావల్ల ఎలాంటి ప్రయోజనాలు వస్తాయో అన్నీ నెరవేర్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులతో ప్రత్యేక హోదాకు ఇబ్బందులు కలిగాయన్నారు. ఇబ్బందులను అధిగమించి అభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. 

 

20:28 - August 1, 2016

ఢిల్లీ : ఏపీలో పరిణామాలపై కేంద్రం దృష్టిపెట్టింది. ఇవాళ తాజా పరిస్థితులపై కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి.. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. మరోవైపు 
ఢిల్లీలో టీడీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. విభజన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేశారు. 

 

20:19 - August 1, 2016

హైదరాబాద్ : సెప్టెంబర్ 2 సమ్మెను జయప్రదం చేయాలంటూ కార్మికసంఘాలు పిలుపునిచ్చాయి. హైదరాబాద్‌ హెచ్ ఎంఎస్ కార్యాలయంలో కార్మికసంఘాలన్నీ సమావేశమై... సమస్యలు, సమ్మె వ్యూహంపై చర్చించాయి. కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నిరసన చేపట్టామని ప్రకటించాయి. ఈ సమ్మెద్వారా కార్మిక సంఘాల మధ్య ఐక్యతను చాటిచెప్పాలని సూచించాయి.

 

20:16 - August 1, 2016

హైదరాబాద్ : అణచివేతకు ముగింపు పలకాలంటే మహిళలు చైతన్యవంతులు కావాలని ప్రొఫెసర్‌ కాత్యాయని అన్నారు. హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో యూటీఎఫ్ మహిళావిభాగం నిర్వహిస్తున్న వర్క్‌షాప్‌కు కాత్యాయని హాజరయ్యారు. 'పీడించేవాళ్లు మన చుట్టూ ఉంటూనే ఉంటారని... అవన్నీ దాటుకొని ఉద్యమబాటకు సిద్ధం కావాలని' ఆమె సూచించారు. 

 

20:09 - August 1, 2016

ఢిల్లీ : బాబ్లీ ప్రాజెక్టు పర్యవేక్షక కమిటీలో ఆంధ్రప్రదేశ్‌ సభ్యత్వం కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ను తొలగించాలన్న మహారాష్ర్ట, తెలంగాణ ప్రభుత్వ వాదనలతో సుప్రీం విభేదించింది. రాష్ర్టం విడిపోయిన తర్వాత ఏపీకి బాబ్లీ ప్రాజెక్టు పట్ల ఎటువంటి ఆసక్తి లేదని తెలంగాణ తరపు న్యాయవాది వైద్యనాథన్‌ న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు ఆంధ్రకు సంబంధం లేనప్పుడు.. బాబ్లీ పర్యవేక్షక కమిటీలో కొనసాగించడంలో అర్థం లేదన్నారు. మహారాష్ర్ట తరపున వాదించిన న్యాయవాది సైతం ఏపీని తొలగించాలన్నారు. అయితే గోదావరి నదీ జలాల వివాదం ట్రిబ్యునల్‌ ముందు విచారణలో ఉందా..? అని ధర్మాసనం ప్రశ్నించింది. లేదని వివరించిన తెలంగాణ సర్కార్‌... మహారాష్ర్టతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఏపీని బాబ్లీ పర్యవేక్షక కమిటీలో ఉంచడం వల్ల భవిష్యత్తులో సమస్యలు తలెత్తుతాయని వాదించింది. కమిటీలో ఏపీని తొలిగిస్తే... తమ రాష్ర్ట ప్రయోజనాలకు నష్టం చేకూరుతుందని ఏపీ తరపున ఏకే గంగూలీ వాదనలు వినిపించారు. తెలుగు రాష్ర్టాల విరుద్ద వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాలు పరస్పరం అసహనంతో ఉన్నాయని వ్యాఖ్యానించింది. అంతరాష్ర్ట నదీ జలాల వినియోగంలో దిగువ రాష్ర్టాలు సైతం భాగస్వాములేనని స్పష్టం చేసింది. 

 

20:02 - August 1, 2016

హైదరాబాద్‌ : నగరంలో ఫిలింనగర్‌ భవనం కూలిన ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఎఫ్ ఎన్ సీసీ అధ్యక్షుడు కేఎస్‌ రామారావు నుంచి.. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించారు బంజారాహిల్స్ పోలీసులు. విచారణలో భాగంగా పీఎస్‌కువచ్చిన రామారావు... పోలీసుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. పోలీసులకు అన్నివిధాలుగా సహకరిస్తామని తెలిపారు.. భవన నిర్మాణంలో నాణ్యతలోపం లేదని... దురదృష్టవశాత్తూ ఈ సంఘటన జరిగిందని చెప్పారు. ప్రమాదంలో చనిపోయినవారికి 5లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియాతోపాటు.. మృతుని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని కేఎస్ రామారావు తెలిపారు.

 

20:00 - August 1, 2016

హైదరాబాద్ : నగరంలో మరో కన్సల్టెన్సీ సంస్థ బోర్డు తిప్పేసింది. కూకట్‌పల్లిలో లోరా కన్సల్టెన్సీ సంస్థ .. ఉద్యోగాల పేరుతో సుమారు 70 మంది నుంచి లక్ష రూపాయల చొప్పున వసూలు చేసింది. ఇవాళ సంస్థకు తాళం వేసి ఉండటంతో.. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కూకట్‌పల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. 

 

అరుణ్‌ జైట్లీతో వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి భేటీ

ఢిల్లీ : ఏపీలో పరిణామాలపై కేంద్రం దృష్టిపెట్టింది. ఇవాళ తాజా పరిస్థితులపై కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి.. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. 

19:44 - August 1, 2016

కాకినాడ : తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలమధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది.. శంఖవరం మండలం మండపం గ్రామంలో విద్యాకమిటీ, పాఠశాల అభివృద్ధి కమిటీ ఎన్నికల్లో ఈ గొడవ జరిగింది.. రెండువర్గాలు ఒకరిపై మరొకరు కర్రలతో దాడిగి దిగడంతో 20మందికి గాయాలయ్యాయి.. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు..

 

19:27 - August 1, 2016

అనంతపురం : ప్రత్యేక హోదా అంశంపై అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హోదా వస్తుందని ఎంతో మంది ఆశపెట్టుకున్నారని, తనకైతే హోదా వస్తుందన్న నమ్మకం లేదన్నారు. హోదా కోసం బంద్‌ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ఏ పార్టీ అయినా బంద్‌కు పిలుపునిస్తే.. ప్రజలు వారిని క్షమించకూడదన్నారు. 

19:21 - August 1, 2016

హైదరాబాద్ : ఎంసెట్ వ్యవహారంలో తప్పులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నయి. ఎగ్జామ్ ప్రింటింగ్‌.. టెండర్ విధానంలో అనుభవం ఉన్న సీజీవీని ఉన్నత విద్యామండలి.. పక్కన పెట్టిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇంటర్ బోర్డ్, ఎస్ఎస్‌సీ బోర్డ్ డిస్‌ క్వాలిఫై చేసిన ప్రైవేటు సంస్థకు ఇంటర్ పేపర్ ప్రింటింగ్ పనులు అప్పగించారు. ఈ వ్యవహారంపై గత ఫిబ్రవరిలనే ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డికి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరికి ఐటీ సంస్థలు ఫిర్యాదు చేశాయి. 

 

19:09 - August 1, 2016

విజయవాడ : ఏపీపీఎస్సీ ద్వారా జరిపే ప్రత్యక్ష నియామకాలకు ఏపీ ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేసింది. 825 మార్కులతో గ్రూప్‌-1ఏ పరీక్ష, 450 మార్కులతో గ్రూప్‌-1బి పరీక్ష, 450 మార్కులతో గెజిటెడ్ క్యాటగిరీ పరీక్ష నిర్వహించాలని తెలిపింది. ఈ మేరకు ఏపీపీఎస్సీకి మార్గదర్శకాలు జారీచేసింది. 

 

ఏపీపీఎస్సీ..ప్రత్యక్ష నియామకాలకు ఏపీ ప్రభుత్వం విధి విధానాలు ఖరారు

విజయవాడ : ఏపీపీఎస్సీ ద్వారా జరిపే ప్రత్యక్ష నియామకాలకు ఏపీ ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేసింది. 825 మార్కులతో గ్రూప్‌-1ఏ పరీక్ష, 450 మార్కులతో గ్రూప్‌-1బి పరీక్ష, 450 మార్కులతో గెజిటెడ్ క్యాటగిరీ పరీక్ష నిర్వహించాలని తెలిపింది. ఈ మేరకు ఏపీపీఎస్సీకి మార్గదర్శకాలు జారీచేసింది. 

రాజీనామాకు సిద్ధమన్న గుజరాత్ సీఎం ఆనందీబెన్

గుజరాత్ : రాజీనామాకు సిద్ధమని గుజరాత్ సీఎం ఆనందీబెన్ పటేల్ ప్రకటించారు. ఫేస్‌బుక్‌ ద్వారా ఆమె రాజీనామాకు సిద్ధమన్నారు.

 

బోర్డు తిప్పేసిన లోరా కన్సల్టెన్సీ సంస్థ...

హైదరాబాద్‌ : నగరంలో మరో కన్సల్టెన్సీ సంస్థ బోర్డు తిప్పేసింది. కూకట్‌పల్లిలో లోరా కన్సల్టెన్సీ సంస్థ .. ఉద్యోగాల పేరుతో సుమారు 70 మంది నుంచి లక్ష రూపాయల చొప్పున వసూలు చేసింది. ఇవాళ సంస్థకు తాళం వేసి ఉండటంతో.. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. 

17:59 - August 1, 2016

తూర్పుగోదావరి : చుట్టూ ఎత్తైనకొండలు.. పరవశింపజేసే గిరులు .. పచ్చదనపు పలకరింపులు.. అందమైన పూలవనాలు.. పాలనురగలు పారే అందమైన జలపాతాలు తూర్పుగోదావరి జిల్లా సొంతం. తూర్పుకనుమల నడుమ జలపాతాలు పరవళ్లు తొక్కుతూ.. పర్యటకులను రారమ్మని పిలుస్తున్నాయి.
అందాలకు నెలవు..
తూర్పుగోదావరి జిల్లాలో అన్నవరం సుప్రసిద్ద పుణ్యక్షేత్రం. సార్లంక రిజర్వు ఫారెస్టులో ఉన్న నాగులకొండ జలపాతాలు ప్రకృతి ప్రేమికులను అందంగా ఆకర్షిస్తున్నాయి. వేళంగి మళ్లిఖార్జున క్షేత్రంగా పేరొందింది ఈ పర్యాటక ప్రాంతం. ఆహ్లాదకరమైన వాతావరణంలో పచ్చదనపు వనాల మద్య ప్రవహించే జలపాతాల జల్లుల్లో తడుస్తూ.. సేదతీరుతున్నారు పర్యాటకులు.
చూపరులను ఆకర్షిస్తున్న జలపాతాలు
కొండవాలులో ప్రవహిస్తున్న నీరే నాగులకొండలోని చిరుజలపాతాలై చూపరులను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. అన్నవరం జాతీయ రహదారికి 15 కిలోమీటర్ల దూరంలో నాగులకొండ అందంగా ఉండడంతో.. వనవిహారానికి వస్తున్నామని పర్యాటకులు చెబుతున్నారు. రోడ్డు సౌకర్యం సరిగా లేకపోయినా.. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక్క రోజైనా ఉండాలనే కుతుహలంతో వస్తున్నామంటున్నారు పర్యాటకులు.
నాగులకొండకు మరింత అందం.. గిరిజన జీవనవిధానాలు
పెద్దమల్లాపురం, వేళంగి గ్రామాల గిరిజన జీవన విధానాలు నాగులకొండకు మరింత అందాన్ని తెచ్చిపెడుతుండడంతో పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. విద్యార్థులకు విజ్ఞానపరంగాను ఈప్రాంతం వారికి ఉపయోగపడుతుందని.. సర్కార్ దృష్టి పెడితే బాగుంటుందని  పర్యాటకులు కోరుతున్నారు. 
సౌకర్యాలు కల్పనలో ప్రభుత్వ నిర్లక్ష్యం 
తూర్పు కనుమల నడుమ ఉన్న అందాలను చూడడానికి వస్తున్న పర్యాటకులకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటున్నారు. దీంతో ఆధునిక సమాజానికి దూరంగా ఉన్నా.. పర్యాటకులు వస్తున్నారని.. మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే..  పర్యాటకుల సంఖ్య మరింత  పెరుగుతుందంటున్నారు ప్రకృతి ప్రేమికులు. 

 

17:35 - August 1, 2016

హైదరాబాద్ : అదే నిర్లక్ష్యం..అదే అల‌స‌త్వం..నిద్రమ‌త్తు వీడ‌టం లేదు బ‌ల్దియా అధికారులు. వెర‌సి గ్రేట‌ర్ ప్రజ‌ల‌కు ఇబ్బందులు త‌ప్పడంలేదు. వీరి నిర్లక్ష్యం కొంతమంది ప్రాణాలపై తెస్తోంది. ప్రజా సమ‌స్యల‌పైనే కాదు..త‌మ కార్పొరేషన్‌ ఉద్యోగుల సంక్షేమం కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు. ఎన్నో ఏళ్లుగా ప్రమోష‌న్ల కోసం ఆశ‌తో ఎదురుచూస్తున్న ఉద్యోగుల‌కు అధికారుల నిర్లక్ష్యం వారికి శాపంగా మారింది. లిస్ట్‌లో ఉన్న వారిని కాద‌ని..రిటైర్ అయినవారికి, ఎప్పుడో చనిపోయిన వారికి ప్రమోష‌న్లు క‌ట్టబెట్టడంపై సర్వత్ర విమర్శలకు దారి తీస్తోంది. 
నిర్లక్ష్యానికి కేరాఫ్‌ అడ్రస్‌..జీహెచ్‌ఎంసీ
బ‌ల్దియా అనగానే నిర్లక్ష్యానికి నిలువుట‌ద్దంగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది అధికారుల చర్యలతో ఇది నిజమేననిపిస్తుంది. ప‌నుల్లో నిర్లక్ష్యం, పౌర సేవ‌ల్లో నిర్లక్ష్యం, అడుగ‌డుగునా అవినీతిమ‌యం. అన్నింటిలో ఆరితేరిన కొందరు బల్దియా అధికారులు..త‌మ తోటి ఉద్యోగుల‌ను కూడా నిలువునా మోసం చేస్తున్నారు. తాజాగా జీహెచ్ఎంసీ ట్రాన్స్‌పోర్ట్ విభాగంలో డ్రైవ‌ర్లకు ప్రమోష‌న్లు ఇచ్చారు. అయితే ఈసారి అధికారుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. ఏకంగా చ‌నిపోయిన వారికే ప్రమోష‌న్లు కట్టబెట్టడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. 
సీనియార్టీని పక్కన పెట్టి...
ఇటీవల జీహెచ్‌ఎంసీ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌లో ప్రమోష‌న్ల కోసం ఫైల్‌ మూవ్‌ అయ్యింది. సీనియార్టీ లిస్ట్ ప్రకారం ప్రమోష‌న్లు ఇవ్వాలి. కానీ, త‌మ ఇష్టానుసారంగా 78మందికి ప్రమోష‌న్లు ఇచ్చేశారు అధికారులు. సీనియార్టీ లిస్ట్ ప్రకారం ప్రమోష‌న్లు పొందాల్సిన 19మందిని ప‌క్కన పెట్టారు. ప్రమోషన్ల విషయంలో కనీస పద్ధతులు కూడా పాటించలేదు. నాలుగేళ్ల క్రితం చనిపోయిన ఎండీ రషీద్‌కు, రెండేళ్ల క్రితం పదవి విరమణ చేసిన జంగయ్యకు ప్రమోషన్లు కట్టబెట్టడంపై బల్దియాలో బాధ్యతా రహిత్యానికి అద్దం పడుతోంది. జీహెచ్‌ఎంసీ తీసుకున్న ఈ నిర్ణయంపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిపై చ‌ర్యలు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. 
2019లో రిటైర్డ్‌ కావాల్సి ఉండగా..ముందే రిటైర్డ్‌ చేశారు..
ఇదిలా ఉంటే.. రాములమ్మ అనే పారిశుద్ధ్య కార్మికురాలు 2019లో రిటైర్డ్‌ కావాల్సి ఉండగా..ఆమెను రిటైర్డ్‌ చేసి..వేతనం ఆపేశారు. దీంతో ఖంగుతిన్న ఆమె కమిషన్‌కు తన గోడును వెళ్లబోసుకోవడంతో తిరిగి పనిలోకి చేర్చుకున్నారు. ఈ ఒక్క విషయమే జీహెచ్‌ఎంసీ అధికారులు..విధుల పట్ల ఎంత బాధ్యతగా ఉంటున్నారో అర్థమవుతోంది. జీహెచ్‌ఎంసీలో సీనియార్టీ ప్రకారం ప్రమోషన్లు పొందాల్సిన వారికి తక్షణమే న్యాయం చేయాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు.

 

17:31 - August 1, 2016

కృష్ణా : పోలవరం కుడికాల్వకు కృష్ణా జిల్లా నూజివీడు మండలం పల్లెర్లమూడి వద్ద గండిపడిన ఘటననను ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. రామిలేరు అండర్ టన్నెల్ వద్ద కాలువకు గండిపడిన సమాచారాన్ని తెలుసుకున్న నీటి పారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిశీలించారు. ఎవరో కావాలనే గట్టును బలహీన పరిచి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అండర్ టన్నెల్ వలన ఎక్కడ దెబ్బతిని ఉండకపోవచ్చని..కేవలం గట్టు ప్రాంతంలోనే  గండిపడిన అంశం అనేక సందేహాలను రేకెత్తిస్తోందన్నారు. ఘటనపై లోతైన విచారణ జరిపిస్తామన్నారు. 

 

17:26 - August 1, 2016

ఢిల్లీ : ఏపీ ప్రయోజనాలే తమకు ముఖ్యమని దశల వారీగా పోరాటం కొనసాగుతుందని తెలుగు దేశం ఎంపీ తోట నర్సింహం పేర్కొన్నారు. తమ ఆక్రందనను తెలియజేసేందుకే పోరాట మార్గం ఎంచుకున్నామని, ప్రభుత్వం నుంచి వైదొలిగితే ఫలితం లేదని తోట నర్సింహం పేర్కొన్నారు. 
ఎపి ప్రయోజనాలకే ముఖ్యం : మురళీమోహన్
తమకు పదవులు ముఖ్యం కాదని ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలే ముఖ్యమని ఎంపీ మురళీ మోహన్‌ తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తామంతా కలిసి కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని ఆయన అన్నారు. 
తెగదెంపులు సమస్యకు పరిష్కారం కాదు : గల్లా  
కేంద్రంతో అంశాల వారీగా తమ పోరాటం కొనసాగిస్తామని ఎంపీ గల్లా జయదేవ్‌ పేర్కన్నారు. కేంద్రం తమ విజ్ఞప్తిని తోసిపుచ్చకుండా అంగీకరిస్తుందనే విశ్వాసం ఉందని గల్లా అన్నారు. ప్రభుత్వంతో తెగదెంపులు చేసుకోవడం సమస్యకు పరిష్కారం కాదన్నారు.

 

16:31 - August 1, 2016

ఢిల్లీ : ఢిల్లీ విమానాశ్రయంలో డీఎంకే ఎంపీ తిరుచ్చి శివపై చేయి చేసుకున్నందుకు అన్నాడీఎంకే ఎంపీ శశికళ పుష్ప రాజ్యసభలో క్షమాపణలు చెప్పారు. తమ పార్టీ నేతలను విమర్శించేలా మాట్లాడినందుకే చేయి చేసుకున్నానని వివరణ ఇచ్చారు. మరోవైపు తనకు ప్రాణహాని ఉందని శశికళ రాజ్యసభలో ఆరోపించారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు. ఎంపీనైన తనకు రక్షణలేకుండా పోతే ఎలా అని డిప్యూటీ ఛైర్మన్‌ కురియనన్‌ ప్రశించడంతో.. ఈ విషయంపై రాజ్యసభ ఛైర్మన్‌కు లేఖ రాయాలని ఆయన సూచించారు. మరోవైపు డీఎంకే ఎంపీ శివను కొట్టారన్న ఆరోపణపై ఎంపీ శశికళపై సస్పెన్షన్‌ వేటు పడింది. పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తించారంటూ సీఎం జయలలిత ఆమెను సస్పెండ్ చేశారు. 

 

16:23 - August 1, 2016

ఢిల్లీ : రాజ్యసభలో రేపు జీఎస్టీ బిల్లును ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఈ సారి  జీఎస్టీ బిల్లును ఎలాగైనా ఆమోదింప చేసుకోవాలని అధికార పక్షం గట్టిపట్టుదలతో ఉంది. దీంతో రానున్న మూడు రోజులు సభ్యులంతా సభకు హాజరవ్వాలని బీజేపీ విప్‌ జారీ చేసింది.   

 

16:03 - August 1, 2016

విజయవాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని వైసీపీ ఎంపీ మేకపాటి విమర్శించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ చిత్త శుద్ధిగా ప్రయత్నిస్తోందని చెప్పారు. 

15:57 - August 1, 2016

గుంటూరు : కేంద్రంలో నరేంద్రమోడీ, ఎపిలో చంద్రబాబు అణు విద్యుత్ కేంద్రాలను ప్రోత్సహిస్తున్నారని సీపీఎం పొలిట్ బ్యూర్ సభ్యులు ప్రకాశ్ కరత్ పేర్కొన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొవ్వాడలో ఆరు అణు విద్యుత్ కేంద్రాలను నిర్మించాలనుకోవడం అన్యాయమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అణు విద్యుత్ కేంద్రాలపై వ్యతిరేకత వస్తుందన్నారు. ప్రపంచంలోని ఆయా దేశాలు అణు విద్యుత్ కేంద్రాలను మూసివేస్తున్నాయని తెలిపారు. ఎపిలోని ప్రజా సమస్యలపై పోరాడుతామన్నారు. రాష్ట్రంలో సీపీఎంను బలోపేతంపై చర్చిస్తున్నామని చెప్పారు. 

 

మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకున్న ఎబివిపి కార్యకర్తలు

కరీంనగర్ : మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ను ఎబివిపి కార్యకర్తలు అడ్డుకున్నారు. కేటీఆర్ కరీంనగర్ జిల్లా పర్యటన వెళ్లారు. 

ప్రజా సమస్యలపై సీపీఎం పోరాటం : ప్రకాశ్ కరత్

గుంటూరు : ఎపిలోని ప్రజా సమస్యలపై పోరాడుతామని సీపీఎం పొలిట్ బ్యూర్ సభ్యులు ప్రకాశ్ కరత్ అన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎపిలో సీపీఎంను బలోపేతం చేయడంపై చర్చిస్తున్నామని చెప్పారు. 

 

ఎంసెట్ 2 వ్యవహారంలో లోపభూయిష్టత..

హైదరాబాద్ : ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంలో లోప భూయిష్టత బయటపడుతోంది. ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ఎంసెట్ వ్యవహారం ఉన్నత విద్యామండలికి చుట్టుకుంటోంది. టెండర్ విధానంలో అనుభవం ఉన్న సీజీవిని ఉన్నత విద్యామండలి పక్కనపెట్టింది. 

ఆస్ట్రేలియాలో మేయర్ బొంతు పర్యటన.

హైదరాబాద్ : నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబోట్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చి దిద్దే విషయంలో ఆస్ట్రేలియా సహకారం కావాలని కోరారు. 

13:54 - August 1, 2016

కాలేజీ అమ్మాయిల నుండి కార్పొరేట్ కంపెనీల ఎంప్లాయిస్ దాకా అందరూ ఇష్టంగా, కంఫర్ట్ గా ఫీల్ అయ్యే డ్రెసె చుడీదార్.. అలాంటి చుడీదార్స్ ఎన్నున్నా రోజువారీ వాడకానికి సరిపోవు. అలాంటి వెరైటీ చుడీదార్స్ తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

13:50 - August 1, 2016

తొమ్మిది నెలల నిరీక్షణకు తెరపడే రోజు. ఓ కొత్త మనిషికి జన్మనిచ్చే రోజు. ఇలాంటి సమయంలో తల్లీబిడ్డల ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యకరమైన వాతావరణంలో ప్రసవాలు జరగాలి. ఇదే లక్ష్యంతో జుబేదాబాయి ముందుకు సాగుతోంది. ప్రసవమంటేనే ఒక యాతన. ఒక బాధ. మరో ప్రాణికి జన్మనివ్వడం. అలాంటి సమయంలో తల్లీ బిడ్డల ఆరోగ్యం కోసం ఎంతో శ్రద్ధ అవసరం. కానీ మన దేశంలో అనేకానేక కారణాలతో మహిళల కాన్పులు అసౌకర్యంగా, అపరిశుభ్రమైన పరిస్థితుల్లోనే జరుగుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో కొంతైనా మార్పులు తేవాలని ప్రయత్నంలో అడుగులు ముందుకేస్తోంది జుబేదా.
ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో ప్రసవాలు జరిగితేనే తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉండేది. ఏ మాత్రం అపరిశుభ్రంగా, తగిన జాగ్రత్తలు తీసుకోకుండా చేసే డెలివరీలు ఇద్దరికీ ప్రమాదమే. అలాంటి పరిస్థితులను నివారించేందుకు కృషి చేస్తున్న జుబేదాకి మానవి అభినందనలు తెలియచేస్తోంది. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

అమ్మవారి ఘటాల ఊరేగింపు..

హైదరాబాద్: లాల్ దర్వాజలో ఘనంగా బోనాలు జరిగాయి. సోమవారం మధ్యాహ్నం ఘటాల ఊరేగింపు జరగనుంది. అక్కన్న, మాదన్న ఆలయం నుంచి ఘటాల ఊరేగింపు ప్రారంభంకానుంది.

13:38 - August 1, 2016

ఢిల్లీ : ప్రత్యేక హోదా విషయంలో ప్రతి రోజు ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయని టిడిపి ఎంపీలు స్పష్టం చేశారు. హోదా..విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ ఆ పార్టీకి సంబంధించిన ఎంపీలు లోక్ సభలో ఆందోళన చేపట్టారు. సభ వాయిదా పడిన అనంతరం వారు మీడియాతో మాట్లారు. సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయాల మేరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, నిరసనలో భాగంగా మొదటి రోజు తాము సభను స్తంభించచేశామన్నారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఇచ్చిన సమాధానంతో ఏపీలో నెలకొన్న పరిస్థితులను ప్రధాన మంత్రికి తెలియచేయడం జరుగుతుందన్నారు. ఈ మేరకు అపాయింట్ మెంట్ అడగడం జరిగిందన్నారు. డ్రామాలు అని విపక్షాలు అనడం కరెక్టు కాదని పేర్కొన్నారు. పదవులకు రాజీనామ చేయకుండా పోరాటం కొనసాగిస్తామని, ప్రధాని స్పందన సరిగ్గా లేకపోతే సీఎం చంద్రబాబు నిర్ణయం మేరకు నడుచుకుంటామని పేర్కొన్నారు.

13:34 - August 1, 2016

ఢిల్లీ : ఏపీకీ ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీల నిరసనలతో లోక్‌సభ హోరెత్తింది. సభ్యుల నినాదాలతో మార్మోగింది. బీజేపీ మంత్రి కంభంపాటి హరిబాబు సభకు హాజరు కాలేదు. మరో మంత్రి గోకరాజు గంగరాజు చోద్యం చూస్తూ కూర్చొన్నారు. టీడీపీ ఎంపీల ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. జీరో అవర్‌లో మాట్లాడేందుకు స్పీకర్‌ అవకాశం ఇచ్చినా.. టీడీపీ ఎంపీలు ఆందోళన విరమించలేదు. సభ్యులు తమ సీట్లో కూర్చుంటేనే హోదాపై చర్చించేందుకు అవకాశం ఇస్తామన్నారు. అయినా సభ్యులు వెనక్కి తగ్గకుండా ఆందోళన కొనసాగించారు. జీరో అవర్‌లో పలు రాష్ట్రాల సభ్యులు స్థానిక సమస్యలపై మాట్లాడిన అనంతరం సభను మధ్యాహ్నం 2 గంటల వరకు స్పీకర్‌ వాయిదా వేశారు.
అంతకుముందు పార్లమెంట్‌ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ ఎంపీలు ధర్నా నిర్వహించారు. కేంద్ర మంత్రులు సుజనా, అశోక గజపతి రాజు మినహా ఎంపీలంతా ప్ల కార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, రాయితీలు ఇవ్వాలంటూ ఎంపీలు డిమాండ్‌ చేస్తున్నారు. అంతకు మునుపు టీడీపీపీ కార్యాలయంలో ఎంపీలంతా భేటీ అయి భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు.   

13:30 - August 1, 2016

కరీంనగర్ : జిల్లా పర్యటనకు మంత్రి కేటీఆర్ తరలివెళ్లారు. తిమ్మాపూర్‌ మండలం కొత్తపల్లిలో ఇసుక క్వారీ వద్ద మంత్రి కేటీఆర్‌ అకస్మిక తనిఖీలు నిర్వహించారు. మార్గమధ్యంలో వాహనం నిలిపి ఇసుక డంప్‌లను పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇకపై అక్రమ క్వారీలపై దాడులు జరుగుతాయని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. అక్రమాలను సహించేది లేదని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఇసుక మాఫియాపై ప్రభుత్వంపై పలు విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాక ఇటీవలే కొంతమంది అధికారులపై ఇసుక మాఫియా దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి కేటీఆర్ దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే ఈ తనిఖీలు చేసినట్లు సమాచారం. 

13:25 - August 1, 2016

ప్రేమ..ఆకర్షణనే ప్రేమగా అనుకుని జీవితాలను నాశనం చేసుకుంటుండగా అదే భ్రమలను కల్పించి వారి జీవితాలతో ఆడుకొనే వారు ఉన్నారు. ఇలా ముళ్లు గుచ్చుకుని విలవిలలాడుతున్న చిగురుటాకుళ్లా ఎందరో అమాయకురాళ్లు చీకటి గదిలో కుమిలిపోతూనే ఉన్నారు. నయవంచకులకు కనువిప్పు కలిగించే ఓ ప్రేమ జంట ఉంది. ప్రేమకు అసలు నిర్వచనం వారే. ప్రేమకు సిసలైన రూపం వారే. వంశీ..గీతలకు ప్రేమే జీవితం. ప్రేమే సర్వస్వం. ప్రేమే ప్రాణం..ఎప్పటికైనా ఏనాటికైనా వారి ప్రేమ కావ్యం ఆరో వేదంలా నిలవాలన్నదే వారి తపన. వారి ప్రేమను చూసైనా మార్పు రావాలి. ప్రేమంటే పెడర్థాలు తీసే వారికి తెలిసిరావాలి. వీరి ప్రేమ కథ ఆదర్శం కావాలి. వీరి కన్నీటి వ్యథ ప్రేమికుల హృదయాలను కదిలించాలి. కనువిప్పు కలిగించాలి. విషాదం కలిగించే దీనిపై పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

13:22 - August 1, 2016

హైదరాబాద్ : ప్రత్యేక హోదా..నిధులు లేకపోతే ఏపీ రాష్ట్రం ఏడారిగా మారుతుందని వైసీపీ నేత బోత్స పేర్కొన్నారు. వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రేపటి బంద్ లో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాజకీయ స్వార్థంతో కార్యక్రమం చేయడం లేదని పేర్కొన్నారు. బంద్ లో మేధావులు..ప్రజా సంఘాలు..కార్మికులు అందరూ పాల్గొని నినదించాలని కోరారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా..నిరుద్యోగ సమస్య తీరాలన్నా..పారిశ్రాకాభివృద్ధి జరగాలన్నా..ప్రత్యేక హోదా రావాల్సిందేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మాటలు స్వార్థపూరిత అవసరాల కోసం ఉన్నాయని, రావాల్సిన జలాలను ఎగువ రాష్ట్రాలకు తాకట్టు పెట్టారని ఆరోపించార. ముఖ్యమంత్రి తీరు..మాటల్లో మార్పు రాలేదని, కేవలం పత్రికా ప్రకటనలు చేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారని విమర్శించారు. అధికారంలోకి రాకముందు ఇచ్చిన వాగ్ధానాలపై ప్రభుత్వాలు నయవంచననకు గురి చేశాయని తెలిపారు. బంద్ జయప్రదం చేసే విధంగా అందరూ సహకరించాలని బోత్స సూచించారు. 

బంద్ కు సహకరించాలి - బోత్స..

విజయవాడ : రేపటి బంద్ కు అందరూ సహకరించాలని వైసీపీ నేత బోత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ బంద్ కు వ్యాపార సంఘాలు, ప్రజా సంఘాలు, పార్టీల నేతలు మద్దతు ఇచ్చారని తెలిపారు. 

లోక్ సభ వాయిదా..

ఢిల్లీ : లోక్ సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రత్యేకహోదా కోసం వైసీపీ, టిడిపి ఎంపీలు నిరసన చేపట్టాయి. పలు ఆందోళన మధ్య మధ్యాహ్నం 2గంటలకు వాయిదా పడింది. 

బీజేపీ పార్టీ సభ్యులకు విప్..

ఢిల్లీ : పార్టీ రాజ్యసభ ఎంపీలకు బీజేపీ విప్ జారీ చేసింది. ఈ వారమంతా సభకు హాజరు కావాలని విప్ జారీ చేసింది. రాజ్యసభలో జీఎస్టీ బిల్లు చర్చకు వచ్చే అవకాశం ఉంది. 

ఏపీ కాంగ్రెస్ విద్రోహ సదస్సు..

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా దక్కకుండా టీడీపీ, బీజేపీలు నాటకాలాడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. బెజవాడలో విద్రోహ సదస్సు నిర్వహించింది. సదస్సుకు ముందుగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించింది. సదస్సులో ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, పార్టీ ఎంపీలు, మాజీ మంత్రులు పాల్గొన్నారు. 

రాజ్యసభలో ఎంపీ శశికళ కన్నీరు...

న్యూఢిల్లీ : త‌మిళ‌నాడు ఎంపీ శ‌శిక‌ళ రాజ్యస‌భ‌లో క‌న్నీళ్లు పెట్టారు. డీఎంకే ఎంపీ తిరుచి శివ‌పై చేయిచేసుకున్న ఘ‌ట‌న ప‌ట్ల ఆమె స‌భ‌లో వివ‌ర‌ణ ఇస్తూ ఏడ్చారు. త‌న‌కు ప్రాణ హాని ఉంద‌ని రాజ్యసభలో ఆరోపించారు. మరోవైపు అన్నాడీఎంకే పార్టీకి చెడ్డ పేరు తెచ్చార‌న్న ఆరోప‌ణ‌ల‌పై ఎంపీ శ‌శిక‌ళ‌ను ఆ పార్టీ అధినేత్రి జ‌య‌ల‌లిత స‌స్పెండ్ చేశారు. 

12:41 - August 1, 2016

కృష్ణా : జిల్లా మచిలీపట్నం పోర్టు భూముల కోసం రేపో, మాపో నోటిఫికేషన్ జారీ చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. తొలివిడతగా ఆరు గ్రామాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. నోటిఫికేషన్ విడుదలైతే తాము రోడ్డున పడాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోను భూములు కోల్పోయేందుకు తాము సిద్ధంగా లేమని రైతులు స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ తమ అంగీకారం లేకుండా..భూములు తీసుకుంటే..ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.  ఇంతకాలంగా భూమే జీవనాధారంగా బ్రతుకుతున్న వేలాది మంది రైతుల జీవితాలు ఇక అంధకారం కాబోతున్నాయి. మచిలీపట్నం నౌకాశ్రయం అభివృద్ధి, దాని అనుబంధ పరిశ్రమల పేరుతో రాష్ర్ట ప్రభుత్వం రైతుల నుంచి లక్షా 5వేల ఎకరాల భూములను తీసుకొనేందుకు రంగం సిద్ధం చేసింది. దీంతో రైతుల మెడపై పూలింగ్ కత్తి బిగియనుంది. మచిలీపట్నం మండలంలోని మేకవానిపాలెం, పోతేపల్లి, గోపువానిపాలెం, మంగినపూడి, కరగ్రహారం, తపసిపూడి గ్రామాల్లో తొలివిడతగా 4,636 ఎకరాల భూమిని సమీకరించేందుకు చర్యలు చేపట్టామని జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు జులై 24న ప్రకటించారు. దీనిపై ఐదురోజులుగా మచిలీపట్నం ఆర్డీవో కార్యాలయం పరిధిలో ముమ్మర కసరత్తు జరిగింది. నోటిఫికేషన్ జారీపై కలెక్టర్ బాబు, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు సూచనల మేరకు ఆర్డీవో కార్యాలయ సిబ్బంది భూ సమీకరణ తాలూకూ ప్రక్రియను పూర్తిచేశారు. రేపోమాపో నోటిఫికేషన్ విడుదలకు లైన్ క్లియర్ చేస్తున్నారు.

4,636 ఎకరాల్లో 2,283 ఎకరాలు పట్టా భూములు..
4,636 ఎకరాల్లో 2,283 ఎకరాలు పట్టా భూములు, 413 ఎకరాలు అసైన్డ్ భూములు, 1,940 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భూముల్లో తొలివిడతగా పోర్టుకోసం నోటిఫికేషన్ జారీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ కల్లా సీఎం చంద్రబాబు చేతులమీదుగా శంకుస్థాపన చేయించి, తదుపరి పనులు ప్రారంభమయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. గతంలో మాదిరిగా కాకుండా భూములకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన తర్వాత నిర్మాణ సంస్థకు అప్పగించిన వెంటనే పనులు చేపట్టాలని భావిస్తున్నారు. 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని..2018 నాటికి బందరుకు షిప్ తీసుకురావాలనే ప్రయత్నంలో ప్రభుత్వం ముందస్తుగా పోర్టు భూములను త్వరితగతిన రైతుల వద్ద నుంచి సేకరించే పనిలో నిమగ్నమైంది. ల్యాండ్ పూలింగ్ పేరుతో ప్రభుత్వం ఈ భూములను సేకరించడం కోసం ముందుకు సాగుతోంది. అయితే, ఎటువంటి చట్టబద్ధత లేని ఈ ల్యాండ్ పూలింగ్ విధానాన్ని విపక్షాలు, రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బందరు పోర్టు నిర్మాణాన్ని ప్రభుత్వ భూముల్లో నిర్మించాలని సూచిస్తున్నారు.

ప్రభుత్వ ప్రకటనతో అయోమయంలో రైతులు..
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మచిలీపట్నం పోర్టుకు లక్షా 5వేల ఎకరాలు ఎందుకని సూటిగా ప్రశ్నిస్తున్నారు. పోర్టు నిర్మాణంతో పాటు కోస్టల్ కారిడార్ అంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలతో రైతుల్లో అయోమయం నెలకొంది. ప్రభుత్వ భూముల్లోనే పోర్టు నిర్మించాలని, పారిశ్రామిక అవసరాల కోసం భూములు కావాల్సి వస్తే ఆయా పారిశ్రామికవేత్తలు నేరుగా రైతుల వద్దే కొనుగోలు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ఎన్ని ఒత్తిళ్లొచ్చినా తమ భూములను ఇచ్చేది లేదని రైతులు తేల్చిచెబుతున్నారు. భూమినే నమ్ముకుని జీవిస్తున్న తమను రోడ్డున పడేసి..బలవంతంగా భూమలను తీసుకోవద్దని రైతులంతా వేడుకుంటున్నారు. ఒకవేళ భూములను తీసుకుంటే..తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. 

12:38 - August 1, 2016

హైదరాబాద్ : నగరంలోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు ఒక్కసారిగా భద్రత పెరిగింది. పార్టీ ఆఫీస్‌కు సందర్శకుల తాకిడి ఎక్కువ కావడం.. వారంలో మూడు రోజులు లోకేష్ ఇక్కడే ఉండటంతో భద్రతపై పార్టీ మరింత దృష్టిసారించింది. నగరంలో ఐసిస్ జాడలు వెగులుచూస్తుండడంతో ఏపీ పోలీసులు ట్రస్టు భవన్‌ భద్రత పెంచాలని నిర్ణయించారు. ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌కు నిత్యం దాదాపు మూడు వందల మంది వస్తుంటారు. వీరిలో కార్యకర్తలు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ క్లాసులకు వచ్చే విద్యార్థులుంటారు. అయితే ప్రతిరోజు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉండటంతో.. ఎవరు ఎందుకు వస్తున్నారో తెలుసుకోవడం ఇక్కడి సెక్యూరిటీకి అగ్నిపరీక్షగా మారింది. దీనికి తోడు వారంలో మూడురోజులు పాటు పార్టీ జనరల్ సెక్రటరీ లోకేష్ ఇక్కడ ఉంటున్నారు. తాజాగా నగరంలో ఐసిస్‌ నీడలు వెలుగుచూడటంతో ట్రస్టు భవన్‌ భద్రతపై ఏపీ పోలీసు ఉన్నతాధికారులు సమీక్షించారు. రక్షణను పెంచాలంటూ తెలంగాణ పోలీసులకు నివేదిక ఇచ్చారు.

భద్రత పెంచలేమన్న తెలంగాణ పోలీసులు..
అయితే ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల్లో భద్రతను పెంచటం సాధ్యంకాదని తెలంగాణ పోలీసులు తేల్చి చెప్పారు. వినాయక చవితి ఉండటంతో భద్రత పెంచలేమని స్పష్టం చేశారు. దీంతో ఏపీ ప్రభుత్వమే పార్టీ కార్యాలయ భద్రతను చేపట్టాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా కార్యాలయంలోని ప్రతి అంతస్తులో ఆయుధాలతో కూడిన ఏపీ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.

వెనుక గేటు తెరిచి పెట్టాల్సిన పరిస్ధితి..
ఇదీలా ఉంటే ప్రస్తుతం చంద్రబాబు కుటుంబం పార్క్ హయత్ హోటల్ లో నివాసం ఉంటోంది. అయితే భోజన వసతులకు అవసరమయిన ఏర్పాట్లను ట్రస్ట్ భవన్‌లోనే చేస్తున్నారు. దీంతో ప్రతిరోజు చంద్రబాబు సతీమణి పార్టీ కార్యాలయానికి రావడంతో వెనుక గేటు సైతం తెరిచి పెట్టాల్సిన పరిస్ధితి ఏర్పడింది. దీంతో అంతగా నిఘా ఉండని ఆ గేటు నుంచి ఎవరైనా ప్రవేశించే అవకాశం ఉంటుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీంతో ఏపీ పోలీసులతో ట్రస్ట్ భవన్ కు ఏపీ పోలీసులతో భద్రత కల్పించారు. 

12:34 - August 1, 2016

ఢిల్లీ : దేశ రాజధాని పార్లమెంట్‌ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ ఎంపీలు ధర్నా నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రులు సుజనా, అశోక గజపతి రాజు మినహా ఎంపీలంతా ప్ల కార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, రాయితీలు ఇవ్వాలంటూ ఎంపీలు డిమాండ్‌ చేస్తున్నారు. అంతకు మునుపు టీడీపీపీ కార్యాలయంలో ఎంపీలంతా భేటీ అయి భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు.
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం అన్యాయమని ఎంపీ మాగంటి బాబు వాపోయారు. ఎంపీలంతా కలిసి సంఘటితంగా పోరాడి కేంద్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకతను తెలియజేస్తామని మాగంటి తలిపారు. 

12:30 - August 1, 2016

ఆదిలాబాద్ : అడవి పందుల నుంచి పంట పొలాలను రక్షించుకునేందుకు సర్కార్‌ వినూత్న ప్రయోగం చేపట్టింది. జంతువుల అరుపులు వినిపించే యంత్రాన్ని వినియోగంలోకి తెచ్చింది. ఈ యంత్రం ద్వారా కిలోమీటర్ల మేర అరుపులు వినిపించడంతో దాదాపు 80 శాతం మేర పంటను రక్షించుకోవచ్చని అధికారులంటున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో అటవీశాఖ వినూత్నంగా ప్రయోగిస్తున్న బయో అకాస్టిక్‌ యంత్రంపై ప్రత్యేక కథనం. అడవి పందుల నుంచి పంట పొలాలను కాపాడుకునేందుకు తెలంగాణ అటవీశాఖ వినూత్న ప్రయోగం చేపట్టింది. ఆదిలాబాద్‌ జిల్లా బెజ్జూరు ఫారెస్ట్‌ రేంజ్‌ పరిధిలోని సోలార్‌ బయో అకాస్టిక్‌ మిషన్‌ను వినియోగంలోకి తీసుకువచ్చింది. ఈ యంత్రాన్ని పంట పొలాల వద్ద అమర్చితే పులి, సింహం, కుక్కలు, తోడేళ్ల అరుపులు వినిపిస్తాయి. దీంతో పంట పొలాల దగ్గరకు వచ్చే అడవిపందులు పారిపోతాయి. ఈ యంత్రం దాదాపు 60 ఎకరాలకు రక్షణ కల్పిస్తుంది. అంతేకాకుండా సోలార్‌ ద్వారా పని చేయడంతో విద్యుత్‌ కూడా ఆదా అవుతోంది. ఇది మంచి ఫలితాలు ఇవ్వడంతో ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాలోని పలు ఫారెస్ట్‌ రేంజ్‌లలో ఈ యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు.

తగ్గిన విద్యుత్ తీగల కంచె ఏర్పాటు...
ఈ యంత్రాన్ని ప్రొఫెసర్‌ జయశంకర్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. జంతువులు చేసే శబ్ధాలను ఇందులో రికార్డు చేసి.. స్పీకర్లు అమరుస్తారు. దీంతో కిలోమీటర్ల వరకు అరుపులు వినిపిస్తాయి. దీన్ని ఉపయోగించడం వల్ల అడవి పందుల కోసం కంచెవేసి.. వాటికి విద్యుత్‌తీగలు అమర్చాల్సిన అవసరం లేదు. అలాగే క్రిమిసంహారక మందులు పెట్టడం లాంటివాటికి స్వస్తిపలకవచ్చు. ఈ యంత్రం ద్వారా చాలా మేలు జరుగుతుందని రైతులంటున్నారు.

అకాస్టిక్ యంత్రం ధర రూ. 20 వేలు..
అయితే.. ఈ యంత్రం ధర 20 వేల రూపాయలు ఉండడంతో కొనేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 10 మంది రైతులు ఉమ్మడిగా కొనుగోలు చేస్తే భారం తగ్గుతుందని అటవీశాఖ అధికారులంటున్నారు. ఈ యంత్రం ఉపయోగంపై రైతులకు మరింత అవగాహన కల్పిస్తే మెరుగైన ఫలితాలుంటాయని పలువురు భావిస్తున్నారు. 

12:25 - August 1, 2016

గుంటూరు : రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా రేపటి బంద్‌ను విజయవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. బీజేపీ ఇచ్చిన హామీలు తుంగలో తొక్కిందని.. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు అవసరమైన కార్యాచరణను రాష్ట్ర కమిటీ సమావేశాల్లో రూపొందిస్తామన్నారు. బలవంతపు భూసేకరణ, కనీస వేతనాల బోర్డు ఏర్పాటులో జాప్యం తదితర అంశాలపై చర్చిస్తామన్నారు. సమావేశాల సందర్భంగా మధు టెన్ టివితో మాట్లాడారు. ప్రజా పునాదిని బలోపేతం చేయడానికి, అవసరమైన నిర్మాణం చేయడానికి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. 64 రకాల కార్మికులకు వర్తించే కనీస వేతన బోర్డును నియమించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తూ వస్తోందన్నారు. దీనివల్ల కోట్ల రూపాయల నష్టం జరుగుతోందన్నారు. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామన్నారు. 

మున్పిపాల్టీ శాఖపై మంత్రి కేటీఆర్ సమీక్ష..

కరీంనగర్ : మున్పిపాల్టీ శాఖపై మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మున్సిపాల్టీల అభివృద్ధి, సాగునీటి సరఫరా, రెవెన్యూ వసూళ్లు, పారిశుధ్యం, భవిష్యత్ ప్రణాళికలపై చర్చిస్తున్నారు. 

ఎంసెట్ 2 లీకేజ్ పై హైకోర్టులో పిటిషన్..

హైదరాబాద్ : ఎంసెట్ 2 లీకేజ్ వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నేడు విచారణ జరిపాలని కోర్టును పిటిషనర్ కోరారు. రేపటి లిస్టులో పెట్టాలని రిజిస్ట్రార్ కు ఆదేశాలు జారీ చేసింది. 

మంత్రి కేటీఆర్ కాళ్లపై పడిన సర్పంచ్...

కరీంనగర్ : ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై మంత్రి కేటీఆర్ కు మొగిలిపాలెం సర్పంచ్ ఫిర్యాదు చేశారు. మానసికంగా వేధించడంతో పాటు పార్టీ నుండి తొలగిస్తానని బెదిరిస్తున్నారని మంత్రి కేటీఆర్ కాళ్లపై సర్పంచ్ పడ్డారు. 

ఇసుక క్వారీలో మంత్రి కేటీఆర్ అకస్మిక తనిఖీ..

కరీంనగర్ : తిమ్మాపూర్ (మం) కొత్తపల్లిలో ఇసుక క్వారీని మంత్రి కేటీఆర్ అకస్మికంగా తనిఖీ చేశారు. 

12:03 - August 1, 2016

నెల్లూరు : విక్రమసింహపురి యూనివర్సిటీ వెబ్ సైట్ హ్యాక్ కు గురైంది. తీవ్రవాదులు హ్యాక్ చేశారు. హోం పేజీలో ప్రధాని, బాలీవుడ్ నటుడు షారుఖ్ కు హెచ్చరికలు జారీ చేశారు. కాశ్మీర్ బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు. బెంగళూరుకు చెందిన శ్రీవా టెక్నాలజీస్ వెబ్ సైట్ ను నిర్వహిస్తోంది. శనివారం సాయంత్రమే వెబ్ సైట్ హ్యాక్ గురైనట్లు గుర్తించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి....
విక్రమసింహ యూనివర్సిటీకి సంబంధించిన వెబ్ సైట్ ను బెంగళూరుకు చెందిన శ్రీవా టెక్నాలజీస్ నిర్వహిస్తోంది. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు చెందిన సమాచారం పొందుపరుస్తుంటారు. యూనివర్సిటీ కింద ఏ ఏ కాలేజీలు పని చేస్తున్నాయి..ఎంత మంది విద్యార్థులు ఉన్నారు..వారి డేటా..సంవత్సరం వారీగా ఎంత మంది చదివారు.. ఉత్తీర్ణులు..ఫెయిల్ అయిన వారి సమాచారం ఈ వెబ్ సైట్ లో నిక్షిప్తమై ఉంటుంది. కానీ వెబ్ సైట్ హోం పేజ్ ఓపెన్ చేయగానే ప్రధాన మంత్రి మోడీ, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ చిత్రాలు దర్శనమిచ్చాయి. మోడీ కళ్లకు గంతలు కట్టినట్లు..గాయపరిచినట్లు..షారుఖ్ కళ్లు పీకేసి ముఖంపై గాయపరిచినట్లు ఉన్న పొటోలున్నాయి. అంతేగాకుండా 1947 కంటే ముందు కాశ్మీర్ ఏ విధంగా ఉండేది ? భారత సైనికులు దారుణాలు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ప్రకటనలు గుప్పించారు. సమీర్ అనే పిల్లవాడిని భారత సైనికులు దారుణంగా హత్య చేశారని, పలువురు మహిళలపై సైనికులు అత్యాచారానికి పాల్పడ్డారని..బాధితుల కుటుంబీకులను ఈ విషయాలు అడిగితే తెలుస్తుందని పేర్కొన్నారు. వెంటనే ఈ విషయాన్ని వైస్ ఛాన్స్ లర్ కు తెలిపారు. వెంటనే ఆయన శ్రీవా టెక్నాలజీస్ కు సమాచారం అందించారు. ఆదివారం వెబ్ సైట్ ను పునరుద్ధరించారు. 

11:32 - August 1, 2016

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన మరోసారి సోనాక్షి సిన్హా నటించనుంది. అది కూడా 'దబాంగ్ 3' లో. వీళ్లద్దరి కాంబినేషన్ లో 'దబాంగ్'...'దబాంగ్ 2' వచ్చిన సంగతి తెలిసిందే. 'దబాంగ్ 2' కి సీక్వెల్ గా 'దబాంగ్ 3' తెరకెక్కనుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా 'సోనాక్షి సిన్హా'ను ఎంపిక చేశారు. కానీ సల్మాన్ ఖాన్, సోనాక్షి మధ్య విబేధాలున్నాయని, అందుకే 'పరిణితి చోప్రా'ను ఎంపిక చేశారని ఆ ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ ఇవన్నీ నిజం కాదని సల్మాన్ సోదరుడు ఆర్బాజ్ ఖాన్ పేర్కొంటున్నాడు. దబాంగ్ 3లో కూడా సోనాక్షి నటిస్తుందని, ఆమెతో పాటు మరొక నాయిక కూడా ఈ సినిమాలో నటించనుందని తెలిపాడు. ఈ సినిమాలో సల్మాన్ పవర్ పుల్ ఆఫీసర్ గా ప్రేక్షకులను అలరిస్తాడని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సోనాక్షఙ లేడీ ఓరియెంటెండ్ చిత్రం 'అకీరా'తో పాటు 'నూర్' చిత్రంలో నటిస్తోంది. కబీర్ ఖాన్ దర్శకత్వంలో 'సల్మాన్' 'ట్యూబ్ లైట్' చిత్రంలో కూడా నటించేందుకు సోనాక్షి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి 'దబాంగ్ 3' లో సల్మాన్..సోనాక్షి కాంబినేషన్ ప్రేక్షకులను మురిపిస్తుందా ? లేదా ? అన్నది చూడాలి. 

లోక్ సభలో గందరగోళం..

ఢిల్లీ : లోక్ సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రత్యేక హోదా కల్పించాలంటూ టిడిపి ఎంపీలు నిరసన చేపట్టారు. వి వాంట్ జస్టిస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నిరసనల మధ్యే స్పీకర్ సుమిత్రా మహజన్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. 

వీవీఐపీల వసతి సదుపాయంపై సుప్రీం తీర్పు..

ఢిల్లీ : వీవీఐపీల వసతి సదుపాయంపై సుప్రీం సంచలన తీర్పు వెలువరించింది. మాజీ సీఎంలకు ప్రభుత్వ వసతి కుదరదని కోర్టు పేర్కొంది. మాజీ సీఎంలు రెండు నెలల్లోపు ప్రభుత్వ భవనాలను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 

11:11 - August 1, 2016

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని..విభజన హామీలు అమలు చేయాలంటూ ఎన్డీయే మిత్రపక్షమైన టిడిపి పోరుబాట పట్టింది. ఆ పార్టీకి చెందిన లోక్ సభ, రాజ్యసభ సభ్యులు గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు చేపట్టి నిరసన చేపట్టారు. ఈ నిరసనలో కేంద్ర మంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిలు గైర్హాజర్ కావడం చర్చనీయాంశమైంది.
ఇటీవలే కేవీపీ ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లుపై రాజ్యసభలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం ఇచ్చారు. జైట్లీ సమాధానంపై టిడిపి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ పార్టీకి చెందిన ఎంపీలతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే ఒత్తిడి చేయాలని బాబు నిర్దేశించారు. ప్రధాన మంత్రి అపాయింట్ మెంట్ తీసుకుని ఆయనతో సమస్యలు చర్చించాలని సూచించారు. బాబు ఆదేశాల ప్రకారం ఆపార్టీ ఎంపీలు నిరసన చేపట్టారు. ప్రధాన మంత్రి అపాయింట్ మెంట్ పై క్లారిటీ రాలేదు. విభజన సమయంలో కేంద్ర మంత్రులు జైట్లీ, వెంకయ్య నాయుడు కీలక పాత్ర పోషించారని, ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రత్యేక హోదా, విభజన హామీలపై చర్చ చేపట్టాలంటూ వైసీపీ లోక్ సభలో వాయిదా తీర్మానం ఇచ్చింది. టిడిపి ఎంపీలు చేపట్టిన నిరసనపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి. 

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం..

ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పలు పార్టీలు పలు అంశాలపై తీర్మానాలు ఇచ్చాయి. ఏపీ ప్రత్యేక హోదా, విభజన హామీలపై చర్చించాలంటూ వైసీపీ లోక్ సభలో తీర్మానం ఇచ్చింది. 

ఏపీ సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు ప్రారంభం..

గుంటూరు : సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు సీపీఎం జాతీయ నేతలు ప్రకాశ్ కరత్, రాఘవులు హాజరయ్యారు. 

ఢిల్లీలో ఇళ్లు కూలి ముగ్గురి మృతి..

ఢిల్లీ : ఉత్తమ్ నగర్ లో ఓ ఇళ్లు కూలడంతో ముగ్గురు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. భారీ వర్షాల కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. 

పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద టిడిపి ఎంపీల నిరసన...

ఢిల్లీ : పార్లమెంట్ గాంధీ విగ్రహం ఎదుట టిడిపి ఎంపీలు నిరసన చేపట్టారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి పాల్గొన్నారా ? లేదా ? అనేది తెలియరావడం లేదు. 

వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన తీవ్రవాదులు...

నెల్లూరు : విక్రమసింహపురి యూనివర్సిటీ వెబ్ సైట్ హ్యాక్ కు గురైంది. తీవ్రవాదులు హ్యాక్ చేశారు. హోం పేజీలో ప్రధాని, బాలీవుడ్ నటుడు షారుఖ్ కు హెచ్చరికలు జారీ చేశారు. కాశ్మీర్ బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు. బెంగళూరుకు చెందిన శ్రీవా టెక్నాలజీస్ వెబ్ సైట్ ను నిర్వహిస్తోంది. శనివారం సాయంత్రమే వెబ్ సైట్ హ్యాక్ గురైనట్లు గుర్తించారు. ఆదివారం వెబ్ సైట్ ను పునరుద్ధరించారు. 

వర్షాలతో భూగర్భ జలాలు అధికం - చంద్రబాబు..

విజయవాడ : వర్షాలతో భూగర్భ జలాలు అధికమయ్యాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఉపరితల జలాలను లెక్కిస్తున్నట్లు, గత రెండేళ్లుగా ప్రభుత్వం చేసిన పనులకు ఫలితం దక్కుతోందన్నారు. కరవు వచ్చినా ఎదుర్కొనే పరిస్థితి తీసుకరావడం జరిగిందన్నారు. వాటర్ అడిటింగ్ కు కస్టోడియన్ గా జలవనరుల శాఖ వ్యవహరించాలని సూచించారు. తాగు, సేద్యం, పరిశ్రమలకు నీరు పుష్కలంగా ఉండేలా చూడాలన్నారు. 

ఎంసెట్ లీకేజ్ పై కొనసాగుతున్న సీఐడీ విచారణ..

హైదరాబాద్ : ఎంసెట్ -2 లీకేజ్ పై సీఐడీ విచారణ కొనసాగుతోంది. విచారణలో 8 సీఐడీ బృందాలు రంగంలోకి దిగాయి. 

సెప్టెంబర్ మొదటి వారంలో ఎంసెట్ 3 ?

హైదరాబాద్ : సెప్టెంబర్ మొదటి వారంలో ఎంసెట్ 3 పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంసెట్ 3 నిర్వాహణపై నేడు సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. ఎంసెట్ 2 రిజిస్ట్రేషన్లపైనే కొత్త హాల్ టికెట్లను జారీ చేయనున్నారని సమాచారం. 

10:41 - August 1, 2016

కొత్తగా పెళ్లైన జంటకు హనీమూన్‌లో అనుకోని అతిథి షాక్‌ ఇచ్చాడు. ఉత్తరాఖండ్లోని నైనిటాల్ ఓ జంట బస చేసిన హోటల్‌ గదిలోకి చిరుతపులి దూరింది! పిల్లిలా అడుగులు వేస్తూ బాత్రూంలో ప్రవేశించి భయం భయంగా ఓ మూల నక్కి కూర్చుంది. గదిలో చిరుతను చూడగానే ఉలిక్కిపడ్డ దంపతులు దుప్పటి కప్పేసుకుని దాక్కున్నారు. చిరుతపులి నేరుగా వెళ్లి బాత్రూంలో దాక్కుంది. ఇది గమనించిన వెంటనే వెళ్లి బాత్రూం తలుపు గడియ పెట్టి హోట్ యాజమన్యానికి ఈ విషయం చెప్పారు ఆ దంపతులు.  

10:40 - August 1, 2016

శ్రీకాకుళం : మొక్కలు నాటండి, పర్యావరణాన్ని కాపాడంటూ చైతన్యం తీసుకొస్తున్న ప్రభుత్వాలు, నరికివేతకు గురవుతున్న వనాలను మాత్రం పట్టించుకోవడం లేదు. వనం మనం అంటూ కార్యక్రమాలు చేపడుతున్నా..వృక్షాలను కాపాడే చర్యలపై మాత్రం దృష్టి సారించడం లేదు.ఇందుకు నిదర్శనమే శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న అడవుల నరికివేతపై ప్రత్యేక కథనం..శ్రీకాకుళం జిల్లాలోని ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో వన సంపద తరిగిపోతోంది. అడవుల్లోని వృక్షాలు వేటుకు గురవుతున్నాయి. గడచిన రెండు దశాబ్దాలతో పోలిస్తే నరికివేతకు గురవుతున్న చెట్ల మూలంగా అటవీ విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతోంది. పాతపట్నం, మెళియాపుట్టి, పాలకొండ, భామిని, సీతంపేట, మందస ప్రాంతాల్లోని అడవుల్లో ఉండే చెట్లను నరికి స్మగ్లర్లు జేబులు నింపుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

దృష్టిసారించని అటవీశాఖ..
ఎర్రచందనం, టేకు, అకేషి, మద్ది, మామిడి లాంటి భారీ వృక్షాలతో పాటు, వెదురు, వంట చెరకు కు సంబంధించిన కలప ను గిరిజనుల సహాయంతో దళారులు నరికివేస్తున్నారు. చెక్ పోస్ట్ అధికారుల కళ్ళు గప్పి సరిహద్దులు దాటించేస్తున్నారు. ఆంధ్రా నుంచి పర్లాఖిమిడి మీదుగా రాయఘడ, బిలాస్ పూర్, లాంటి ప్రాంతాలకు ఖరీదైన కలప తరలిపోతోంది. విలువైన వనసంపద తరిగిపోతున్నా అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

వనాలను పర్యవేక్షించని అధికారులు..
మెళియాపుట్టి, మందస ప్రాంతాల్లో ఎర్రచందనం చెట్లు ఎక్కువుగా ఉన్నాయి. వీటిలో ఎనభై శాతం వేటుకు గురవుతున్నావీటిపై కేసులు నమోదు కావడం లేదు. పాలకొండ అటవీశాఖ సబ్ డివిజన్ పరిధి లో పలు ఫారెస్ట్ బీట్లు ఉన్నాయి. అటవీశాఖ అధికారులు అడవులు, కొండ ప్రాంతాల్లో వనాలను పర్యవేక్షించడం మానేశారు. దీంతో స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు.ఆంధ్రా- ఒడిస్సా సరిహద్దు ప్రాంతం లో విలువైన వన సంపదను స్మగ్లర్లు తరలించుకపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వనసంపదను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు. స్మగ్లర్లపై దృష్టి సారించే విధంగా అటవీశాఖ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. 

10:36 - August 1, 2016

అనంతపురం : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బుక్కరాయసముద్రం మండలం కొట్టాలపల్లికి చెందిన భారతి అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంది. 5ఏళ్ల పాపకు, 5నెలల బాబుకు విషమిచ్చి చంపేసిన తల్లి.. తర్వాత తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త తాగుడుకు బానిసై అప్పలు చేయడంతో.. దంపతుల మధ్య వివాదం మొదలైనట్టు తెలుస్తోంది. అయితే.. తల్లీకూతుళ్ల మృతిపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి భార్యాభర్తలు గొడవపడినట్టు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. 

10:34 - August 1, 2016

గుంటూరు : జిల్లాలో ఇవాళ, రేపు సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో సీపీఎం సీనియర్‌ నేత ప్రకాష్ కారత్‌ పాల్గొననున్నారు. రాష్ట్ర కమిటీ భేటీలో భవిష్యత్‌ కార్యాచరణపై పార్టీ నేతలు చర్చించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు టెన్ టివితో మాట్లాడారు. కేంద్రం, రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసపూరిత విధానాలు అవలింబిస్తున్నాయని పార్టీ నేత తులసీదాస్ పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై కేంద్రం మాటమార్చిందని, దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. భూ దాహం అధికంగా ఉందని, 55 వేల ఎకరాలను ప్రభుత్వం సమీకరించిందని, మచిలీపట్నంలో లక్ష ఎకరాలకు నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. కానీ ఇక్కడ ఎంత భూమి సమీకరిస్తున్నారో నోటిఫికేషన్ లో పేర్కొనలేదన్నారు. పేదల నుండి అన్యాయంగా భూముల నుండి గుంజుకొంటోందని, దీనికి వ్యతిరేకంగా సీపీఎం ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. కొవ్వాడలో అణువిద్యుత్ పై పెద్ద ఎత్తున్న ఉద్యమం కొనసాగుతోందని, సముద్ర తీరం వద్ద కెమికల్ హబ్, న్యూక్లియర్ హబ్ గా ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఈ అంశాలతో పాటు ఇతర అంశాలు సమావేశంలో చర్చిస్తామన్నారు. రాష్ట్రంలో పార్టీని ఎలా పటిష్టం చేయాలి అనే దానిపై చర్చించనున్నట్లు తెలిపారు. భూమి అనేది ముఖ్యాంశంగా ఉందని, వేలాది ఎకరాలు భూ సమీకరణ చేశారని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్ రావు పేర్కొన్నారు. ప్రస్తుతం భూ సేకరణ చేస్తున్నారని, ఏపీలో అనేక సమస్యలు ముందుకు వచ్చాయన్నారు. ప్రధానంగా పెరుగుతున్న ధరలపై ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని ఉద్యమాలుగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

10:30 - August 1, 2016

అమెరికా : ఈ ఏడాది నవంబర్‌ 8న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ప్రచారం హోరెత్తుతోంది. డెమోక్రాటిక్‌ పార్టీ తరుపున అధ్యక్ష అభ్యర్ధిగా పోటీ చేస్తున్న హిల్లరీ క్లింటన్‌, రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్ధిగా బరిలో దిగిన డోనాల్డ్ ట్రంప్‌ హోరాహోరీ ప్రచారం చేస్తున్నారు. ఇద్దరి మధ్య నువ్వా... నేనా.. అన్న రీతిలో పోటీ కొనసాగుతోంది. తాజాగా నిర్వహించిన సర్వే ప్రకారం ప్రజాభిమానంలో హిల్లరీ కొద్దిగా ముందంజలో ఉన్నారు. ట్రంప్‌ కంటే ఐదు పాయింట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు. పబ్లిక్‌ పాలసీ పోలింగ్‌లో హిల్లరీ 50 శాతం పాయింట్లు సాధించగా, ట్రంప్‌ 45 పాయింట్లు పొందారు. రెండు పార్టీల జాతీయ సమావేశాలు ముగిసిన తర్వాత నిర్వహించిన మొదటి సర్వేలో హిల్లరీ ప్రతిష్ఠ కొద్దిగా పెరిగింది. ట్రంప్‌ ప్రతిష్ఠ మసకబారినట్టు వెల్లడయ్యింది. 

10:12 - August 1, 2016

ఢిల్లీ : ప్రత్యేక హోదా పోరుకు టిడిపి సిద్ధమైంది. పార్లమెంట్ సాక్షిగా నిరసన చేపట్టాలని టిడిపి ఎంపీలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాజ్యసభలో ప్రత్యేక హోదా..ఇతర అంశాలపై కేంద్ర మంత్రి జైట్లీ ఇచ్చిన సమాధానంపై టిడిపి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం పార్టీ ఎంపీలతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా చర్చించారు. ప్రధాన మంత్రి మోడీ అపాయింట్ కోరాలని బాబు నిర్ణయించారు. కానీ అపాయింట్ మెంట్ పై ఇంకా స్పష్టత రాలేదు. కేంద్రంతో సఖ్యతతో ఉంటూనే సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేద్దామని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్న నేపథ్యంలో టిడిపి ఎంపీలు నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. కాసేపట్లో గాంధీ విగ్రహం ఎదుట ప్లకార్డులు చేపట్టి నిరసన చేపట్టనున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిలు పాల్గొంటారా ? లేదా ? అన్నది ఉత్కంఠగా మారింది. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేయనున్నారు. గతంలో కూడా టిడిపి ఎంపీలు నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రత్యేక హోదా..ఇతరత్రా అంశాలపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. టిడిపి ఎంపీలు నిరసన కార్యక్రమంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ ట్విట్టర్ లో పలు ట్వీట్స్ చేశారు. టిడిపి ఎంపీల నిరసనపై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

పోలీసుల ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం..

ప్రకాశం : టీసీపల్లె పోలీసుల ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. భూ వివాదం కేసులో ఓ వర్గానికే కొమ్ముకాస్తున్నారంటూ ఎస్ఐ ముందే ఎంకమ్మ అనే మహిళ పురుగుల మందు తాగింది. పరిస్థితి విషమించడంతో కనిగిరి ఆసుపత్రికి తరలించారు.

 

టీడీపీ ఎంపీల నిరసనపై దిగ్విజయ్ ఆగ్రహం..

ఢిల్లీ : టీడీపీ ఎంపీల నిరసన కార్యక్రమంపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు నాటకాలు ఆపాలని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటే కేంద్రం నుండి టీడీపీ బయటకు రావాలని ట్వీట్ చేశారు. 

ఢిల్లీలో మాదకద్రవ్యాల పట్టివేత..

ఢిల్లీ : రాష్ట్ర స్పెషల్ పోలీసులు మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాల విలువ రూ. 16 కోట్లు ఉంటుందని అంచనా. ఈ ఘటనలో ఇద్దరు నైజీరియన్లతో పాటు మరికొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 

కాబూల్ లో ముగ్గురు ఉగ్రవాదుల హతం..

కాబూల్ : ముగ్గురు తాలిబన్ ఉగ్రవాదులను పోలీసులు మట్టుబెట్టారు. విదేశీయుల గెస్ట్ హౌస్ పై ఉగ్రవాదులు దాడికి ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు గెస్ట్ హౌస్ ను చుట్టుముట్టి కాల్పులు చేపటాటరు. సుమారు మూడు గంటల అనంతరం ఉగ్రవాదులను మట్టుబెట్టారు. 

ఢిల్లీలో వర్షం..స్తంభిస్తున్న ట్రాఫిక్..

ఢిల్లీ : దేశ రాజధానిలో కురుస్తున్న వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. 

సీఎం బాబు టెలికాన్ఫరెన్స్...

విజయవాడ : 'నీరు - ప్రగతి' కార్యక్రమంపై సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ కాన్ఫరెన్స్ లో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

09:19 - August 1, 2016

తిరుపతి : ఓ వికలాంగుడు సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. తన సమస్యను పరిష్కరించాలని లేనిపక్షంలో టవర్ దూకేస్తానని బెదిరిస్తున్నాడు. దీనితో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఘటన నవాబ్ పేటలో చోటు చేసుకుంది. మాధవన్ అనే వ్యక్తి వికలాంగుడు కావడంతో అతనికి ప్రభుత్వం పట్టా ఇచ్చింది. ఇంటి స్థలం చూపించాలంటూ గత కొంతకాలంగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ చాలాసార్లు తిరిగాడు. కానీ అధికారుల నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో మాధవన్ తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడని కొడుకు తెలిపాడు. ఈ నేపథ్యంలో సెల్ టవర్ ఎక్కాడని పేర్కొన్నాడు. గత ఆరు గంటలుగా టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మాధవన్ ను బతిమాలే ప్రయత్నం చేస్తున్నారు. టవర్ దిగి రావాలని, సమస్యను పరిష్కరిస్తామని హామీనిచ్చినా మాధవన్ వినిపించుకోవడం లేదు. సెల్ టవర్ దిగాలని కొడుకు కోరినా అతను పట్టించుకోవడం లేదు. సబ్ కలెక్టర్ ఘటనాస్థలికి చేరుకుని మాధవన్ తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కలెక్టర్ తో మాట్లాడి సమస్య పరిష్కారమయితేనే కిందకు దిగుతానని మాధవన్ తేల్చిచెబుతున్నాడు. మరి మాధవన్ సమస్యను అధికారులు ఇప్పటికైనా తీరుస్తారా ? లేదా ? అనేది చూడాలి. 

09:11 - August 1, 2016

హైదరాబాద్ : వలస వచ్చి జీవనం సాగిస్తున్న వారిని లారీ కబళించి వేసింది. సోమవారం తెల్లవారుజామున మదీనాగూడలో లారీ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే రాజమండ్రిలోని కడియం ప్రాంతానికి చెందిన కృష్ణ తన కొడుకులు సురేష్, శ్రీనివాస్ లతో మియాపూర్ ప్రాంతానికి వచ్చాడు. అక్కడ ఓ నర్సరీ ఏర్పాటు చేసి మొక్కలు విక్రయిస్తున్నాడు. ఇతని దగ్గర ఆదిబాబు పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగానే ఆదివారం రాత్రి వీరంతా నిద్రపోయారు. సోమవారం తెల్లవారుజామున సమయంలో వేగంగా వచ్చిన ఓ లారీ వీరిమీదకు దూసుకెళ్లింది. దీనితో ఆదిబాబు, చీకట్ల శ్రీనివాస్ లు అక్కడికక్కడనే దుర్మరణం చెందారు. కృష్ణ, సురేష్ ల పరిస్థితి విషమంగా ఉండడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. వెంటనే అక్కడి నుండి డ్రైవర్ పరారయ్యాడు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. 

08:59 - August 1, 2016

టాలీవుడ్ సామ్స్..సమంత కు విశ్రాంతి కావాలంట...ఈ విషయాన్ని ఆమెనె పేర్కొందంట. టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ లలో సమంత ఒకరు. సినిమా ఫీల్డ్ కొచ్చి ఏడేళ్లే అయినా... టాప్ పొజిషన్ కి ఎప్పుడో వచ్చేసింది సమంత. ఆమె యాక్ట్ చేసిన దాదాపు అన్ని సినిమాలు హిట్టయ్యాయి. ఒక్క తెలుగులోనే కాక, తమిళం, హిందీలో కూడా మంచి పేరు తెచ్చుకుంది సామ్స్...ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమంత.. ఫస్ట్ సినిమాతోనే హోల్ ఇండస్ట్రీని తన మాయలో పడేసుకుంది. ఆ సినిమా విక్టరీతో ఈ కుందనపు బొమ్మ రన్నింగ్ కి బ్రేకులు లేకుండా పోయాయి. ఒకదాని వెంట ఒకటి వరుసగా అవకాశాలు అమ్మడి ఒళ్లో వచ్చిపడ్డాయి. టాప్ హీరోలు అమ్మడి కాల్షిట్ల కోసం క్యూ కట్టారు. ఫలితంగా బృందావనం, దూకుడు, ఈగ, ఎటో వెళ్ళిపోయింది మనసు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, అల్లుడు శీను, మనం, సన్నాఫ్ సత్యమూర్తి వంటి బ్లాక్ బ్లాస్టర్లు అమ్మడి ఖాతాలో పడ్డాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ తో 'జనతా గ్యారేజ్' సినిమాలో నటిస్తోంది. దీని తరువాత ఎలాంటి సినమాలు ఒప్పుకోవడం లేదు.
సినిమా షూటింగ్ లతో బిజీ అయిపోవడం వల్ల మానసికంగా చాలా ఇబ్బంది పడ్డానని..నిద్రపోవడానికి సమయం కూడా లేదని..అందుకే విశ్రాంతి తీసుకోవాలని సమంత పేర్కొందని టాక్. విశ్రాంతి వెనుక బలమైన కారణం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే వివాహానికి సంబంధించిన పనులు ఉండడం వల్లే విశ్రాంతి తీసుకోవాలని అనుకొంటోందని టాక్. నాగ చైతన్య, సమంతల వివాహం జరుగుతుందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మరి నిజమా ? కాదా ? అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే. 

08:27 - August 1, 2016

బేకింగ్ సోడా...అనగానే పిండి వంటలు గుర్తుకు వస్తాయి. ఏదైనా పిండి వంటకంలో ఈ సోడాను వాడుతుంటుంటారు. కానీ అందానికి కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు. అదెలాగో చదవండి..
దూర ప్రయాణాలు చేసే సమయంలో కొంతమందికి వికారం కలిగించే వాసనలు వస్తుంటాయి. చిటికెడు సోడాను భుజాల కింద వేసుకుంటే తాజా భావన కలుగుతుంది.
మగవారు షేవింగ్ చేసిన అనంతరం చర్మం మంటగా అనిపిస్తుంటుంది. అంతేగాక ఎర్రబడుతుంది. ఈ సమయంలో వేడి నీటిలో కొద్దిగా సోడా వేసి కాటన్ బట్టను అందులో ముంచి చర్మానికి కాపాలి. తొందరగా మంట తగ్గిపోయి సహజమైన రంగును పొందుతారు.
బేకింగ్ సోడాతో మసాజ్ చేసుకుంటే శరీరంపై ఉండే మృతకణాలు పోతాయి.
ఏదైనా పనిమీద తొందరగా బయటకు వెళ్లాల్సి ఉంటే తల మాడుకు బేకింగ్ సోడా రాసుకుని కొద్దిసేపు ఆగి తల దువ్వుకుంటే తలస్నానం చేసినంత ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది.  

కాబూల్ లోని నార్త్ గేట్ హోటల్ వద్ద పేలుడు..

కాబూల్ : నార్త్ గేట్ హోటల్ వద్ద పేలుడు సంభవించింది. సమాచారం తెలుసుకున్న భద్రతా దళాలు హోటల్ వద్దకు చేరుకున్నాయి. ఈ ఘటనలో దుండగులు..భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇద్దరు ఆత్మహుతి సభ్యులను హతమార్చినట్లు అక్కడి మీడియా పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. 

పోలవరం కుడి కాల్వకు భారీ గండి..

కృష్ణా : నూజివీడు (మం) సీతారామపురం - రాములేరు మధ్య పోలవరం కుడి కాల్వకు భారీ గండి పడింది. దీనితో స్థానిక గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. వేల ఎకరాల పంట పొలాలు నీట మునిగిపోయాయి.

 

నిలిచిన మోనో రైల్..

ముంబై : సాంకేతిక కారణాలతో భక్తి పార్క్ స్టేషన్ వద్ద మోనో రైల్ నిలిచిపోయింది. ఉదయం 6.30 గంటలకు రైలు నిలిచిపోయింది. దీనితో సమస్యను పరిష్కరించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. 

హిమాచల్ లో విరిగి పడుతున్న కొండచరియలు..

హిమాచల్ ప్రదేశ్ : జాతీయ రహదారి 5పై భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీనితో రహదారిని మూసివేశారు. దీనితో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. 

07:57 - August 1, 2016

రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామన్నంత హడావుడి చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు... అంత తీవ్రమైన నిర్ణయం తీసుకోలేదు. పార్టీ ఎంపీల భేటీతో జరిగిన భేటీలో ఎన్డీయేతో తెగతెంపులు చేసుకుంటారని ప్రచారం జరిగినా... ఈ సాహసం చేయలేకపోయారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో తెలకపల్లి రవి (విశ్లేషకులు), రఘునాథ్ బాబు (బీజేపీ), పార్థసారధి (వైసీపీ), రామకృష్ణ ప్రసాద్ (టిడిపి), పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియోలో క్లిక్ చేయండి....

 

తోటపల్లి ప్రాజెక్టుకు వరద నీరు..

విజయనగరం : తోటపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరింది. ప్రస్తుత నీటిమట్టం 104 అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో 8,450 క్యూసెక్కులు ఉండగా నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. 

మదీనాగూడలో లారీ బీభత్సం..

హైదరాబాద్ : మియాపూర్ లోని మదీనాగూడలో లారీ బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన మొక్కలు విక్రయించే వారిపై లారీ దూసుకెళ్లింది. ఇద్దరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. మృతులు శ్రీనివాస్, ఆదిబాబులుగా గుర్తించారు. వీరు తూర్పుగోదావరి జిల్లా కోరుమల్లి వాసులని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

సెల్ టవర్ ఎక్కిన వికలాంగుడు..

చిత్తూరు : తిరుపతి నవాబ్ పేటలో వికలాంగుడు సెల్ టవర్ ఎక్కాడు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రజాప్రతినిధులు అధికారులు తనను ఆదుకోవడం లేదని మాధవ్ ఆవేదన వ్యక్తం చేశారు. మాధవ్ ను కిందకి దించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. 

నేడు లోక్ సభకు రుణ రికవరీ బిల్లు..

ఢిల్లీ : నేడు లోక్ సభలో రుణ రికవరీ బిల్లు ప్రవేశ పెట్టనున్నారు. వ్యాపారాన్ని సులభతరం చేయడానికి ఈ బిల్లును రూపొందించారు. రుణ రికవరీ బిల్లు ఆమోదింపబడితే రూ. 5లక్షల కోట్ల లోపు మొండి బకాయిల రికవరీకి ఆవకాశం రానుంది. 

తూర్పు ముంబైలో అగ్నిప్రమాదం..

ముంబై : తూర్పు ముంబైలో ఉన్న కామా ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఉన్న ఓ భవంతిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం నాలుగు ఫైరింజన్లతో సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. 

నేడు తేలనున్న నర్సింగ్ యాదవ్ భవితవ్యం..

ఢిల్లీ : భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ పై జాతీయ డోపింగ్ నిరోధక ఏజెన్సీ తీర్పును వెలువరించనుంది. డోపింగ్ టెస్టులో ఆయన విఫలం చెందింన సంగతి తెలిసిందే. 

నేటి నుండి ఏపీఎస్ ఆర్టీసీ - టీటీడీ కొత్త సౌకర్యం...

విజయవాడ : నేటి నుండి ఏపీఎస్ ఆర్టీసీ - టీటీడీ కొత్త సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు వెళ్లే భక్తులకు శ్రీవారి శీఘ్రదర్శనం సదుపాయాన్ని కల్పించనున్నారు. రిజర్వేషన్ తో పాటు రూ. 300 విలువైన శీఘ్రదర్శనం టికెట్ పొందే అవకాశం కల్పించనున్నారు. 

ఏపీలో పాఠశాలల బంద్ కు ఎస్ఎఫ్ఐ పిలుపు..

విజయవాడ : నేడు ఏపీలో విద్యా సంస్థల బంద్ కు ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తోంది. 

నేటి నుండి రూపాయికే నల్లా కనెక్షన్..

హైదరాబాద్ : గ్రేటర్ లో నేటి నుండి రూపాయికే నల్లా కనెక్షన్ ప్రారంభం కానుంది. దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారికే రూపాయికి నల్లా కనెక్షన్ ను ఇవ్వనున్నారు. 

07:07 - August 1, 2016

మధ్యాహ్న భోజనం పథకాన్ని అమెరికా లాంటి దేశాల్లో సైతం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు. మన దేశ పిల్లలను పోషకాహారం సమస్య వెన్నాడుతున్నట్టే అమెరికా పిల్లలను ఊబకాయం కలవరపెడుతోంది. ఊబకాయాన్ని నివారించే విధంగా అమెరికన్ స్కూళ్లలో మెనూ రూపొందిస్తున్నారు. కానీ, మన దగ్గర మధ్యాహ్న భోజనం పథకాన్ని నిర్వీర్యం చేసి, క్రమంగా ఎత్తేసే చర్యలు చేపడుతున్నారు. స్కూల్స్ లో డ్రాపవుట్స్ సంఖ్యను తగ్గించడం, బడి ఈడు పిల్లలను బడికి వచ్చేలా ప్రోత్సహించడం, స్కూల్ పిల్లలకు నాణ్యమైన పోషకాహారాన్ని అందించడం అనే ఉదాత్త ఆశయాలతో ప్రారంభించిందే మధ్యాహ్న భోజన పథకం. 1995లో కొన్ని స్కూళ్లల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ పథకం దేశ వ్యాప్తంగా విస్తరించింది. మన దేశంలో దాదాపు 13 కోట్ల మంది విద్యార్థులకు ఇది వర ప్రసాదంగా మారింది. కరువు ప్రాంతాల్లో, వేసవి సెలవుల్లోనూ ఈ పథకాన్ని అమలు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించడంతో దీని ప్రాధాన్యతను చాటుతోంది. ఈ పథకం ప్రారంభమైన తర్వాత మధ్యలోనే బడిమానేసివారి సంఖ్య తగ్గినట్టు అనేక అధ్యయనాల్లో వెల్లడయ్యింది.

పోషకాహార లోపం..
ఈ పథకానికి కేంద్రం 75శాతం, రాష్ట్రం 25 శాతం నిధులు సమకూరుస్తున్నాయి. ఈ పథకాన్ని మరింత సమర్ధవంతంగా నిర్వహించడం ద్వారా స్కూల్ స్టూడెంట్స్ లో పోషకాహార లోపాన్ని నివారించే వీలుంది. ఇప్పటికే 40శాతం మందికి పైగా పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్న నేపథ్యంలో ఇలాంటి పథకాల ప్రాధాన్యత మరింత పెరుగుతోంది. సంపన్న దేశం అమెరికాలో సైతం మధ్యాహ్న భోజనం పథకాన్ని నిర్వహిస్తుండడం విశేషం. అమెరికాలోని స్కూల్ స్టూడెంట్స్ లో ఊబకాయం సమస్య తీవ్రంగా వుండడంతో దానిని దృష్టిలో వుంచుకుని మధ్యాహ్న భోజనం మెనూ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొవ్వు పదార్థాలు తక్కువగానూ, ఐరన్, కాల్షియం, విటమిన్లు తగు మోతాదులో వుండే విధంగానూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా వుండేలా మెనూ రూపొందిస్తున్నారు.

ఆందోళన కలిగిస్తున్న ప్రభుత్వాల తీరు..
అయితే, మన దేశంలో మధ్యాహ్న భోజనం పథకాన్ని మొక్కుబడి తంతులాగా అమలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. నాణ్యతా ప్రమాణాలను గాలికొదిలేస్తున్నాయి. పిల్లలకు ఏవో నాలుగు మెతుకులు పెడితే చాలన్నట్టుగా మన ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. సగానికిపైగా స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వండడానికి, నిల్వ చేయడానికి, వడ్డించడానికి అవసరమైన సదుపాయాలే కల్పించని దుస్థితి. మరోవైపు మధ్యాహ్న భోజనం వర్కర్లకు, నిర్వాహకులకు నెలనెలా జీతాలు చెల్లించకుండా మూడు నాలుగు నెలలకొకసారి బిల్లులు మంజూరు చేస్తుండడం ఈ పథకం నిర్వహణపైనే ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే గుర్తించిన లోపాలను సరిదిద్దాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకపోగా, ప్రయివేట్ ఏజెన్సీలకు అప్పగించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ప్రయివేట్ ఏజెన్సీలు లాభాపేక్షతో పనిచేస్తాయన్నది జగమెరిగిన సత్యం. దీంతో పిల్లలకు సరఫరా చేసే ఆహారంలో క్వాలిటీ పడిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అదే జరిగితే పథకం స్పూర్తే దెబ్బతింటుంది. 

06:48 - August 1, 2016

మధ్యాహ్న భోజన పథకంలో అనేక మార్పులొస్తున్నాయి. ఈ పథకాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయివేట్ ఏజెన్సీలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఈ పథకాన్ని ప్రయివేట్ సంస్థలకు అప్పగించారు. ఈ చర్యలను వ్యతిరేకిస్తూ మధ్యాహ్న భోజనం వర్కర్లు ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో జీపు జాతాలు నిర్వహించిన మధ్యాహ్న భోజనం వర్కర్ల యూనియన్ నేతలు రేపు ఆగస్టు 2న హైదరాబాద్ లో ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్నారు. వీరి ఆందోళనకు కారణం ఏమిటి? మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రయివేట్ ఏజెన్సీలకు అప్పగిస్తే ఏమవుతుంది? దీనివల్ల ఎవరు ఎలా నష్టపోతారు? మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరులో వున్న లోపాలేమిటి? ఈ పథకాన్ని మరింత సమర్ధవంతంగా అమలు చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఈ అంశాలపై టెన్ టివి జనపథంలో తెలంగాణ మధ్యాహ్న భోజనం వర్కర్ల యూనియన్ నేత రమ విశ్లేషించారు. ఎలాంటి అభిప్రాయాలు తెలిపారో వీడియోలో చూడండి. 

06:45 - August 1, 2016

కింగ్ స్టన్ : రెండో టెస్టులోనూ భారత్‌ హవా కొనసాగుతోంది. భారత్‌ బౌలర్ల ధాటికి వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 196 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. అశ్విన్‌ ఐదు వికెట్లు తీయగా.. ఇషాంత్‌శర్మ, షమీ రెండేసి వికెట్లు తీశారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ బ్యాట్స్ మెన్లలో కెఎల్‌ రాహుల్‌ 158 పరుగుల చేశాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ ఐదు వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. ఇప్పటికే భారత్‌ 162 పరుగుల ఆధిక్యంలో ఉంది. 

06:44 - August 1, 2016

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీకి సమీపాన నోయిడా వద్ద ఘోరం జరిగింది. బులంద్‌షహర్‌ వద్ద దుండగులు తల్లీకూతుళ్లపై లైంగికదాడికి పాల్పడ్డారు. నోయిడా నుంచి ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు కారులో వెళ్తున్న ఓ కుటుంబంపై దుండగులు.. కారుపై రాడ్లు విసిరి అడ్డుకున్నారు. భయపడి కారు ఆపడంతో.. పక్కనే ఉన్న పొలాల్లోకి కారును తీసుకెళ్లారు. మగవాళ్లను కట్టేసి.. తల్లీకూతుళ్లపై అత్యాచారానికి పాల్పడ్డారు. కట్లు విప్పుకున్న ఒకరు.. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సమాచారమిచ్చారు. పోలీసులు రావడంతో దుండగులు పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు 15 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో దారుణానికి పాల్పడిన ముగ్గురు నిందితులను బాధితులు గుర్తించారు. ఈ ఘటనతో అఖిలేష్‌యాదవ్‌ సర్కార్‌పై విపక్షాలు మండిపడుతున్నాయి. 

06:41 - August 1, 2016

చెన్నై : మోడర్న్ కార్ల లుక్కు ఎలా ఉన్నా... పాత తరం కార్ల స్టేలే వేరు. చెక్కుచెదరని నాణ్యత... రాజ వైభవాన్ని తలపించే ఇలాంటి కార్లను డ్రైవ్‌ చేస్తే ఆ కిక్కేవేరు. దీంతో పాత కార్లపై యువత మోజు పెంచుకొంటోంది. నేటి తరానికి పాత తరం కార్లను చూపించి.. జోష్‌ నింపేందుకు ఓ కార్ల ర్యాలీ సిద్ధమైంది. ఏంటా.. ర్యాలీ.. ఎలాంటి కార్లవి అని తెలుసుకోవాలనుందా... అయితే చదవండి.. ఆంగ్లేయుల కాలంలో కార్లు ఎలా ఉండేవి.. వాటి రాజసం.. ఇప్పటికీ చెక్కుచెదరని నాణ్యత ఎలా ఉంటుందో తెలిపేందుకు చెన్నైలో వింటేజ్ కార్ల ర్యాలీ జరిగింది. స్వాతంత్ర్యానికి ముందు తర్వాత సంపన్నులు వినియోగించిన ఆ కార్ల రాజసం చూసి ఔత్సాహికులు అబ్బురపడ్డారు. 1920 నుంచి 1970 మధ్య కాలంలో తయారైన కార్లను ఇక్కడ ప్రదర్శించారు. నాటితరం ప్రముఖ నటులు ఎంజీఆర్, ప్రఖ్యాత ఏవిఎం మేయప్పన్, బ్రిటీషర్ల కాలంలో మేజర్ జనరల్ గా పనిచేసిన రంజిత్ ప్రతాప్ వంటి సంపన్నులు వినియోగించిన కార్లను ఈ ప్రదర్శనలో ఉంచారు.

వీక్షకులని ఆకట్టుకున్నకార్ల ర్యాలీ..
చెన్నైలో జరిగిన ఈ కార్ల ప్రదర్శనలో జాగ్వార్, ఎంజీ, డోడ్గే బ్రదర్స్, చెవర్లెట్, ఫోర్డ్, పియెట్, ఆస్టిన్, మెర్సిడెస్ తదితర సంస్థలకు చెందిన 150కి పైగా కార్లు పాల్గొన్నాయి. అంతేకాదు.. నైజాం నవాబులు వినియోగించిన కార్లను కూడా ఇక్కడ ర్యాలీకి తీసుకు రావటం అందరినీ ఆకట్టుకుంది. నాటి రాజసంతో కూడిన కార్లను నేటికి వినియోగిస్తూ వివిధ ప్రాంతాల్లో జరిగే ప్రదర్శనలకు ర్యాలీలకు తీసుకెళుతుండటం ఆనందంగా ఉందని పలువురు యజమానులు తెలిపారు. ఇప్పటి తరానికి పాత తరం కార్లను చూపిండం వల్ల అప్పటి తరాలను చూసినంత అనుభూతి కలుగుతుందని, ఇలాంటి ప్రదర్శల వల్ల తమకు ఆనందం కలుగుతుందని ర్యాలీలో పాల్గొన్న ఔత్సాహికులు హర్షం వ్యక్తం చేశారు.

06:39 - August 1, 2016

వారాణాసి : వచ్చే ఏడాది జరిగే ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్‌ సిద్ధమయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నుంచి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఈనెల 2న ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. దీనిలో భాగంగా సోనియా 8 కి.మీ. మేర రోడ్‌ షో నిర్వహించేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. యూపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి షీలా దీక్షిత్‌, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ గులాంనబీ ఆజాద్‌, పార్టీ నేతలు సోనియా వెంట ఉంటారు.

ప్రధాని మోదీ విధానాలపై విరుచుకుపడే అవకాశం..
వారణాసిలో జరిగే రోడ్‌ షోలో సోనియాగాంధీ మహాత్మాగాంధీ, రాజీవ్‌గాంధీ, సర్దార్‌ పటేల్‌ విగ్రహాలకు పూలమాలలు వేస్తారు. ఇంగ్లీష్‌యలైన్‌ దగ్గర యూపీ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి కమలాపాటి త్రిపాఠి విగ్రహానికి కూడా పూలమాల వేసి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా సోనియా... ప్రధాని మోదీ విధానాలపై విరుచుకుపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. గంగానది ప్రక్షాళ నుంచి స్వచ్చ భారత్‌ ప్రచారం, ధరల పెరుగుదల, నల్లధనం వెలికితీత వంటి అంశాలపై సోనియా విరుచుకుపడే చాన్స్ ఉంది.

రోడ్‌ షో విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు..
సోనియాగాంధీ వారణాసి రోడ్‌ షో ఏర్పాట్లపై పార్టీ నేతలు తలమునకలై ఉన్నారు. కాంగ్రెస్‌ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడు రాజ్‌ బబ్బర్‌ వంటి హేమాహేమీలంతా.. వారణాసిలో మకాంవేసి... సోనియా రోడ్‌ షోను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ జన సమీకరణకు చర్యలు చేపట్టారు. వారణాసి రోడ్‌ షో ద్వారా బీజేపీకి తమ బలాన్ని చూపించాలని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు.

06:35 - August 1, 2016

హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపుల నిరోధం కోసం రాజ్యాంగ సవరణ జరగాలని న్యాయనిపుణులు, మేధావులు అభిప్రాయపడ్డారు. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేసే అధికారాన్ని స్పీకర్‌కు కాకుండా, ఎన్నికల కమిషన్‌కు అప్పగించాలని సూచించారు. ప్రజాస్వామ్యానికి ప్రమాదంగా మారిన ఫిరాయింపులు...ప్రజాస్వామ్యానికి ప్రమాదంగా మారిన పార్టీ ఫిరాయింపులపై సమగ్ర చర్చ జరగాలని పులువురు మేధావులు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'పార్టీ ఫిరాయింపులు- స్పీకర్ పాత్ర' అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో సుప్రీంకోర్ట్ రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్‌ జీవన్ రెడ్డి, జస్టిస్‌ సుదర్శన్ రెడ్డి, కేంద్రమాజీమంత్రి జైపాల్‌రెడ్డి, లోక్‌సత్తా ఫౌండర్ జయప్రకాష్‌ నారాయణ మరికొంతమంది మేధావులు ప్రసంగించారు. పార్టీ ఫిరాయింపులను పూర్తిగా ఖండించారు. ఫిరాయింపుల చట్టాన్ని సవరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సూచించారు.

నేతల విమర్శలు..
స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజాప్రతినిధులు పార్టీలు మారుతున్నారని కేంద్రమాజీ మంత్రి జైపాల్‌రెడ్డి విమర్శించారు. అలాంటి వారిపై వేటు వేయకుండా వ్యవహరిస్తుండటంతో.. స్పీకర్ పదవికి ఉన్న మర్యాద పోతుందన్నారు. స్పీకర్లు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తే కోర్టులు జోక్యం చేసుకోవాలని కోరారు. పార్టీ ఫిరాయింపులను అడ్డుకోకపోతే అది ప్రజాస్వామ్యానికే ముప్పుగా మారే ప్రమాదముందని జస్టిస్ సుదర్శన్‌ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకైనా ప్రజాప్రతినిధుల ఫిరాయింపులను అడ్డుకునేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. అధికార పార్టీలోకి వచ్చేందుకు ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్యెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయడం ఇంతవరకూ చరిత్రలో జరగలేదని లోక్‌సత్తా ఫౌండర్ జయప్రకాష్‌ నారాయణ్‌ అన్నారు. రాజకీయాలు వ్యాపారమయం కావడమే ఫిరాయింపులకు అసలు కారణమని తెలిపారు.ఎమ్యెల్యేల ఫిరాయింపులు ఆగాలంటే సీఎంలను పరోక్ష పద్ధతిలో కాకుండా ప్రత్యక్ష ఎన్నికల పద్ధతి ద్వారా నియమించాలని సూచించారు. రాజ్యాంగ పదవిలో ఉన్నంత మాత్రాన స్పీకర్‌కు అపరిమిత అధికారాలుండవని పలువురు మేధావులు అభిప్రాయ పడ్డారు. ఫిరాయింపులపై పూర్తి అధికారం ఎలక్షన్‌ కమిషన్‌కే అప్పగించాలని సూచించారు.

06:33 - August 1, 2016

ఢిల్లీ : దేశ రాజధానిలో రెండు రోజుల పాటు సాగిన సీపీఎం పొలిట్ బ్యూరో సమావేశాలు ముగిసాయి. ఈ సమావేశాలలో స్వతంత్రంగా పార్టీ బలోపేతానికి పలు నిర్ణయాలు తీసుకున్నారు. గో సంరక్షణ పేరుతో జరుగుతున్న దాడులను ఖండించటమే కాకుండా..కశ్మీర్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్ధితులను పొలిట్ బ్యూరో సమీక్షించింది. స్వతంత్రగా పార్టీ బలోపేతం చేయడం, రాజకీయ సామర్ధ్యాన్ని పెంపొందించుకోవడం కోసం పలు నిర్ణయాలు తీసుకున్నట్లు సీపీఎం పొలిట్‌ బ్యూరో తెలిపింది. ఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో అనేక అంశాలపై సీపీఎం పొలిట్‌ బ్యూరో చర్చించింది.

గోసంరక్షణ పేరిట దాడులపై ఖండన..
ఈ ఏడాది సెప్టెంబర్ 17 నుంచి 19 వరకు జరగనున్న కేంద్ర కమిటీ సమావేశాల్లో ఈ నిర్ణయాలపై చర్చించి తదుపరి కార్యాచరణను రూపొందించనున్నారు. గోసంరక్షణ పేరుతో దేశంలో పలు ప్రాంతాల్లో జరుగుతున్న దాడులను పొలిట్ బ్యూరో ఖండించింది. ఉత్తరప్రదేశ్‌లోని దాద్రిలో మహ్మద్ అఖ్లాక్ హత్య తర్వాత గుజరాత్, మధ్యప్రదేశ్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో దళితులు, మైనార్టీలపై గోరక్షణ బృందాల దాడులు పెరిగిపోయాయని పొలిట్ బ్యూరో పేర్కొంది. కశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్ధితులపై సీపీఎం పొలిట్ బ్యూరో సమీక్షించింది. బుర్హాన్ వనీ ఆయన సహచరులు ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన తర్వాత జరిగిన పరిణామాలపై చర్చించింది. అక్కడి ఆందోళనల్లో మృతులు, బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో భద్రతా దళాలు వ్యవహరిస్తున్న తీరుపై సందేహలు వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు పరిహారంతో పాటు గాయపడిన వారికి తగిన చికిత్స అందించాలని కోరింది.

దేశ వ్యాప్తంగా ర్యాలీలు..
విద్యా వ్యవస్ధలోకి ప్రత్యేకించి ఉన్నత, పరిశోధన స్ధాయిలో మతాన్ని చొప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని పొలిట్ బ్యూరో విమర్శించింది. కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు విద్యావేత్తలు- విద్యార్థి- ఉపాధ్యా సంఘాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పొలిట్ బ్యూరో తెలిపింది. పశ్చిమ బెంగాల్ లో వామపక్ష పార్టీల కార్యకర్తలపై వరుసగా జరుగుతున్న దాడులను ఖండించింది. గత ఐదేళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలనలో 176 మంది కామ్రేడ్లు చనిపోయిన విషయాన్ని పొలిట్ బ్యూరో గుర్తుచేసింది. ఈ ఏడాది మే 19న చివరి దశ ఎన్నికలు పూర్తియిన తర్వాత మరో 11 మంది కామ్రేడ్లు హత్యకు గురయ్యారని తెలిపింది. బెంగాల్ లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినందుకు నిరసనగా కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఆగస్ట్ మొదటివారంలో దేశవ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాలని పొలిట్ బ్యూరో కోరింది. 

06:28 - August 1, 2016

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా కానీ, అదనపు నిధులు కానీ ఇచ్చేది లేదని కేంద ప్రభుత్వం తెగేసి చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వంపై ముప్పేట దాడి మొదలయ్యింది. విపక్షాల నుంచే కాదు... స్వపక్షం నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే మార్చిలో జరిగే పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల తర్వాతైనా ఎన్డీఏతో విడాకులు తీసుకోవడం మంచిదని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చేసిన సూచన టీడీపీని ఇబ్బందుల్లోకి నెట్టినట్టు అయ్యిందని భావిస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని వైసీపీ మండిపడింది. హోదా సాధన కోసం చంద్రబాబు చేసిన ప్రయత్నమేదీలేదని విమర్శించింది.

విపక్షాల ఆగ్రహం..
ప్రత్యేక హోదా విషయంలో పజలను నమ్మించి మోసం చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా ప్రజలు ప్రత్యక్ష కార్యాచరణకు దిగక తప్పని పరిస్థితి ఏర్పడిందని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు చెప్పారు. రాష్ట్ర విభజన బిల్లుపై చర్చ సందర్భంగా ప్రత్యేక హోదా విషయంలో రాజ్యసభలో వాదించిన వెంకయ్యనాయుడే.... ఇప్పుడు దానికి విరుద్ధంగా మాట్లాడటాన్ని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తప్పుపట్టారు. ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఖరి ఎండగట్టేందుకు ప్రతిపక్షాలు ఈనెల 2న ఏపీ బంద్‌కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. 

06:26 - August 1, 2016

విజయవాడ : రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామన్నంత హడావుడి చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు... అంత తీవ్రమైన నిర్ణయం తీసుకోలేదు. పార్టీ ఎంపీలతో భేటీతో జరిగిన భేటీలో ఎన్డీయేతో తెగతెంపులు చేసుకుంటారని ప్రచారం జరిగినా... ఈ సాహసం చేయలేకపోయారు. అయితే హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు టీడీపీ పార్లమెంటు సభ్యులతో ఆందోళన కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. దీనిలో భాగంగా ఇవాళ ఢిల్లీలో పార్లమెంటు దగ్గర ధర్నా చేయాలని నిర్ణయించారు. మరోవైపు ప్రత్యేక హోదాతోపాటు, రాష్ట్రానికి సంబంధించిన వివిధ సమస్యలు చర్చించేందుకు ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్‌ కోరుతూ కేంద్రలోని టీడీపీ మంత్రులు, ఎంపీలు లేఖ రాశారు.

ఒత్తిడి తేవాలని నిర్ణయం..
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై.. కేంద్రం తీరును తప్పుబడుతోన్న టీడీపీ నిరసనల ద్వారా కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఇవాళ పార్లమెంటులో గాంధీ విగ్రహం వద్ద.. పార్టీ ఎంపీలు ధర్నా చేయనున్నారు. టీడీపీ ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయిన చంద్రబాబు... రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యంకాదని రాజ్యసభలో కేంద్రం స్పష్టం చేసిన అంశంపై చర్చించారు. ప్రత్యేక హోదాకు 14 వ ఆర్ధిక సంఘం సిఫారసు చేయలేదన్న ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ చెప్పడంపై.. చంద్రబాబు మండిపడ్డారు. ఏపీకి పుష్కలంగా నిధులు ఇచ్చామంటూ బీజేపీ నేతలు.. ముఖ్యంగా రాజ్యసభ సాక్షిగా అరుణ్‌ జైట్లీ చేసిన ప్రకటనను చంద్రబాబు ఆక్షేపించారు. ఏపీకి ఉదారంగా నిధులేమీ ఇవ్వలేదని, వాటాగా వచ్చే మొత్తాన్నే సమకూర్చారని ఆయన సభ్యులకు వివరించారు. రాష్ట్ర సమస్యలపై మాట్లాడేందుకు పీఎం అపాయింట్‌మెంట్ కోరాలని, ఆయన స్పందన చూశాక.. ఆలోచించి భవిష్యత్‌ నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.

ఎంపీలపై బాబు ఆగ్రహం ? 
రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై రాజ్యసభలో చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీల తీరుపై చంద్రబాబు ఒకింత అసంతృప్తి వెళ్లగక్కారు. ఎంపీలు సరిగా వ్యవహరించలేదని, ప్రజల ఆకాంక్షను కేంద్రానికి తెలపడంతో విలఫమయ్యారని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. రాజ్యసభలో అరుణ్‌ జైట్లీ సమాధానం చూసిన తర్వాత బయట ఉన్న తనకు రక్తం ఉడికిపోతే... లోపల ఉన్న మీ రక్తం ఎంత మరిగిపోయి ఉండాలని ప్రశ్నించడంతో సమాధానం చెప్పలేక ఎంపీలు నీళ్లు నమిలారని ప్రచారం జరుగుతోంది. కొందరు ఎంపీలు తాము సరిగానే హోదా వాదనలు వినిపించామని చెప్పడానికి ప్రయత్నించగా చంద్రబాబు వినిపించుకోలేదని సమాచారం. ప్రత్యేక హోదాపై ప్రజల్లో ఉన్న కసికి తగ్గట్టుగా సభలో వ్యవహరించలేకపోయారని కొద్దిగా కళ్లెర్ర చేశారని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. ప్రధాని మోదీ, ఎన్టీయే ప్రభుత్వం, బీజేపీల్లో ఎవరి మీద ఎలాంటి వ్యక్తిగత వ్యతిరేకత లేదన్న విషయాన్ని ప్రస్తావించారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటే ఎవరి మాటా వినేది లేదన్న వాదాన్ని వినిపించారు. తాను ప్రధాని కావాలనుకుంటే ఏప్పుడో అయ్యేవాడినని,.. కానీ తనకు పదవి కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమంత్రి చంద్రబాబు...ఎంపీల భేటీలో స్పష్టం చేశారు.

అపాయింట్ మెంట్ కోసం లేఖ..
మరోవైపు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, టీడీపీ ఎంపీలు ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్‌ కోసం లేఖ రాశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని రాజ్యసభలో ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ తేల్చి చెప్పిన తర్వాత ఉత్పన్నమైన పరిణామాలను చర్చించడంతోపాటు, ప్రజల మనోభావాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లేందుకు మోదీ అపాయింట్‌మెంట్‌ కోరారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయంలోని ప్రత్యేకాధికారికి లేఖ రాశారు. ప్రధాని ఇవాళే సమయం కేటాయిస్తే రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించాలని భావిస్తున్నారు.

నేడు టీడీపీ ఎంపీల నిరసన...

ఢిల్లీ : ప్రత్యేక హోదాపై రాజ్యసభలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఇచ్చిన సమాధానంపై టీడీపీ ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోమవారం పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు నిరసన చేపట్టనున్నారు. 

భారత్ 358/5...

కింగ్ స్టన్ : వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో భారత్ భారీ స్కోరు దిశగా ముందుకెళుతోంది. 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా 358 పరుగులు చేసింది. ఓపెనర్ రాహుల్ అద్భుత సెంచరీతో 158 పరుగులు చేశాడు. ధావన్ 27, పుజారా 46, కోహ్లీ 44, అశ్విన్ 3 పరుగులు చేసి అవుట్ అయ్యారు. రహానే 42, సామా 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

2న వారణాసిలో సోనియా రోడ్ షో..

వారణాసి : వచ్చే ఏడాది జరిగే యూపీ ఎన్నికలపై అన్ని పార్టీలు దృష్టిసారించాయి. మంగళవారం మోడీ సొంత నియోజకవర్గమైన వారణాసిలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రోడ్ షో నిర్వహించనున్నారు. 8 కిలోమీటర్ల మేర సోనియా రోడ్ షో కొనసాగుతుందని జిల్లా కాంగ్రెస్ పేర్కొంది. 

నేడు మేయర్లు..ఛైర్మన్ల సమావేశం..

కరీంనగర్ : రాష్ట్రస్థాయి కార్పొరేషన్, మున్సిపల్ మేయర్లు, ఛైర్మన్ లతో మంత్రి కేటీఆర్ సమావేశం కానున్నారు. సోమవారం ఉదయం 10గంటలకు కరీంనగర్ ప్రతిమ మల్టిప్లెక్స్ లో ప్రారంభం కానున్న సమావేశంలో పలు అంశాలపై మంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. 

ప్రొ.కబడ్డీ విజేత పాట్నా పైరేట్స్..

హైదరాబాద్ : ప్రొ. కబడ్డీ సీజన్ 4లో డిఫెడింగ్ చాంపియన్ పాట్నా పైరేట్స్ విజేతగా ఆవిర్భవించింది. నగరంలోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టుపై 37-29 పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

భారీ స్కోరు దిశగా భారత్..

కింగ్ స్టన్ : టీమిండియా ఓపెనర్ లోకేశ్ రాహుల్ (210 బంతుల్లో 114 నాటౌట్) అద్భుత సెంచరీతో మెరిశాడు. 126/1 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమ్ ఇండియా వికెట నష్టానికి 194 పరుగులు చేసింది. 

భీవండి ప్రమాద ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య..

ముంబై : భారీ వర్షాల కారణంగా ఠాణే జిల్లాలోని భీవండిలో ఓ భవనం కుప్పకూలిన ఘటనలో 9మంది దుర్మరణం చెందారు. మృతుల్లో నలుగురు పిల్లలు, ముగ్గురు మహిళలున్నారు. ఈ ఘటనలో మరో పది మందికి గాయాలయ్యాయి. 

నేడు బోనాల ఘటాల ఊరేగింపు..

హైదరాబాద్ : పాతబస్తీలో బోనాలు అంగరంగవైభవంగా సాగాయి. సోమవారం నగర వీధుల్లో ఘటాల ఊరేగింపు ఉంటుంది. ఊరేగింపు మీర్ చౌక్ నుండి ప్రారంభమై మీరాలం మండి, చార్మినార్ మీదుగా పురానాపూల్ కు చేరుకుంటాయి. ఘటోత్సవానికి ముందు లాల్ దర్వాజ మహంకాళి ఆలయంలో మధ్యాహ్నం 12గంటలకు ఆలయ కమిటీ రంగం కార్యక్రమం జరగనుంది.

 

బంగాళాఖాతంలో అల్పపీడనం..

హైదరాబాద్ : బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాదు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ అల్పపీడనానికి రుతుపవనాలు జతకలిశాయని, దీంతో అల్పపీడనం బలంగా ఉందని తెలిపింది. దీని కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు పేర్కొన్నారు. 

Don't Miss