Activities calendar

29 August 2016

21:50 - August 29, 2016

తమిళనాడు : తన పుట్టినరోజు సందర్భంగా తమిళ హీరో విశాల్‌ -విశాల హృదయంతో పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరువల్లికేని ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించిన 20 మంది చిన్నారులకు బంగారు ఉంగరాలు తొడిగారు. రిటైర్‌మెంట్‌ హోమ్స్‌కి వెళ్లి దుస్తులు, ఆహారం పంపిణీ చేశారు. ఈ పుట్టినరోజు వేడుకల్లో విశాల్‌ ప్రేయసిగా ప్రచారం జరుగుతున్న వరలక్ష్మి శరత్‌కుమార్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన కొన్ని ఫొటోలను వరలక్ష్మి తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. విశాల్‌ మంచి నటుడిగానే కాదు... తోటి వారికి చేయూతనిస్తూ మనసున్న మనిషిగా అభిమానుల హృదయాన్ని చూరగొన్నారు.  

21:47 - August 29, 2016

ఢిల్లీ : బులంద్‌షహర్‌లో జరిగిన సామూహిక అత్యాచారానికి సంబంధించి ఎస్పీ నేత ఆజంఖాన్‌ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మండిపడింది. గ్యాంగ్‌ రేప్‌ను విపక్షాల కుట్రగా ఆజాంఖాన్‌ పేర్కొనడాన్ని తప్పు పట్టింది. బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్న ఆజంఖాన్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలను కూడా రాజకీయం చేయడం దురదృష్టకరమని పేర్కొంది. ఓ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలా అనుమతించిందని కోర్టు ధ్వజమెత్తింది. ఆజాంఖాన్‌ ప్రకటన కేసును ఢిల్లీకి బదలాయించాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఇటీవల బులంద్‌షహర్‌లో తల్లీ కూతుళ్లపై జరిగిన గ్యాంగ్‌ రేప్‌ను విపక్షాల కుట్రగా యుపి మంత్రి ఆజంఖాన్‌ పేర్కొన్న విషయం తెలిసిందే.

21:41 - August 29, 2016

హైదరాబాద్ : వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగుల విభజన అంశం... మళ్లీ వాయిదా పడింది. ఈరోజు సమావేశమైన కమలనాథన్‌ కమిటీ ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం కనుక్కోలేక పోయింది. ముఖ్యంగా ఉద్యోగుల సంఖ్యకు సంబంధించిన సమాచారం లేకపోవడం, సిబ్బందిపై కోర్టుల కేసుల వ్యవహారం.. సమస్య పరిష్కారానికి అవరోధంగా నిలుస్తున్నాయి.

151 శాఖల్లో విభజనను పూర్తిచేసిన కమల్‌నాథన్‌ కమిటీ
తెలుగు రాష్ట్రాల ఉద్యోగుల విభజనకు సంబంధించి కమల్‌నాథన్‌ కమిటీ మరోసారి సమావేశమైంది.. విభజన పూర్తికాని శాఖలు, అందులోని ఉద్యోగుల సమస్యలపై కమిటీ చర్చించింది. ఇప్పటివరకూ 151 శాఖల్లో విభజనను ఫైనల్‌ చేసిన కమిటీకి.. వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగుల విభజన కష్టంగా మారింది.. అసలీ శాఖలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారో కూడా స్పష్టమైన లెక్కలు లేక పోవడం ప్రధాన అవరోధంగా మారింది.

కోర్టుకు లేఖ రాయాలని అడ్వకేట్‌ జనరల్స్‌కు సూచన
వైద్య ఆరోగ్య శాఖలోని సిబ్బందిపై కోర్టు కేసులు కూడా విభజనకు అవరోధంగా మారింది. రెండు రాష్ట్రాల్లో ఉద్యోగుల సమస్యలపై.. కోర్టుల్లో నడుస్తున్న కేసులు త్వరగా తేలితేనే విభజన ముందుకు సాగే అవకాశముంది.. ఈ విషయంపై సీరియస్‌గా దృష్టిపెట్టిన కమల్‌నాథన్‌ కమిటీ.. కేసులు సత్వరమే పరిష్కరించాల్సిందిగా కోర్టులకు లేఖ రాయాలంటూ అడ్వకేట్‌ జనరల్స్‌కు సూచించింది..

ఏపీ సీఎస్‌ను కలిసిన శ్రీనివాస్‌ గౌడ్‌
మరోవైపు.. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల సమస్యలపై.. టీఎస్‌ ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాసగౌడ్‌.. ఏపీ చీఫ్‌ సెక్రెటరీని కలిశారు. అమరావతిలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల్ని తెలంగాణ రాష్ట్రానికి రప్పించాలని ఆయన కోరారు..

రెండురోజుల్లో ముగుస్తున్న కమల్‌నాథన్‌ కమిటీ గడువు
ఇంకోవైపు.. ఉద్యోగుల విభజనపై ఏర్పాటైన కమలనాథన్‌ కమిటీ గడువు రెండురోజుల్లో ముగిసిపోతోంది.. అయితే ఇంకా కీలక విభాగాల్లో విభజన పూర్తికాకపోవడంతో కేంద్రం ఈ కమిటీ గడువును పెంచే అవకాశముంది.. మొత్తానికి ఈ నెల 31లోపు ఉద్యోగుల విభజన పూర్తిచేస్తామన్న కమిటీ వివిధ కారణాలతో ఆపని చేయలేకపోయింది. సమస్యల్ని వారంరోజుల్లోగా పరిష్కరించి మిగిలిపోయిన విభాగాల్లో ఉద్యోగుల విభజనను త్వరగా పూర్తిచేయాలని కమిటీ ప్రయత్నాలు చేస్తోంది..

21:36 - August 29, 2016

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఏడాదిన్నర క్రితం జరిగిన ఈ వ్యవహారంలో AP ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును నిందితునిగా చేర్చాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైదరాబాద్‌లోని ACB కోర్టు విచారణ ప్రారంభించింది. టేపుల్లో ఉన్న చంద్రబాబు స్వరం, స్వరపరీక్షల్లో ఉన్న కంఠం ఒకటేనన్న పిటిషనర్‌ వాదనతో కోర్టు ఏకీభవించింది. దీనిపై నెలరోజుల్లో పునఃవిచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ను ఆదేశించింది.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు
ఏడాదిన్నర క్రితం జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు కీలక మలుపు తిరిగింది. నామినేటెడ్‌ ఎమ్మెల్యీ స్టీఫెన్‌ సన్‌ను లోబరచుకుని, తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నించిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీకి అడ్డంగా దొరికి, జైలుకు వెళ్లొచ్చారు. స్టీఫెన్‌ సన్‌ను లోబరచుకునేందుకు చంద్రబాబు ఈయనతో జరిపిన సంభాషణల రికార్డులు ఉన్నాయి. అయినా ఏసీబీ ఈ కేసులో చంద్రబాబును నిందితునిగా చేర్చకపోవడాన్ని తప్పుపడుతూ గుంటూరు జిల్లా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈనెల 8న ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది.

ఓటుకు నోటు కేసులో 52 చార్జిషీట్లు దాఖలు చేసిన ఏసీబీ
ఓటుకు నోటు కేసు ఎఫ్‌ఐఆర్‌లో ఏసీబీ అధికారులు.... చంద్రబాబు పేరును చేర్చని విషయాన్ని పిటిషనర్‌ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. దర్యాప్తు చేసిన ఏసీబీ ఇప్పటి వరకు 52 చార్జిషీట్లు దాఖలు చేసినా... ఒక్కదానిలో కూడా చంద్రబాబు పేరును ప్రస్తావించలేదని విన్నివించారు. చంద్రబాబు.. స్టీఫెన్‌ సన్‌తో జరిపిన సంభాషణల ఆడియో టేపులను కోర్టుకు అందజేశారు. ఆడియో టేపుల్లోని స్వరంతో చంద్రబాబు స్వరాన్ని పరీక్షించి.. రెండూ ఒకటేనంటూ ప్రైవేటు ఫోరెన్సిక్‌ ల్యాబ్స్‌ ఇచ్చిన ధృవీకరణ ప్రతాలను కోర్టుకు సమర్పించారు.

ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ
పిటిషనర్‌ తరుపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ప్రాతపై ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ... ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసును తిరిగి దర్యాప్తు చేసి ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు చేర్చనున్నాలో... లేదో..తెలుపుతూ నివేదిక ఇవ్వాలని ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ను ఆదేశించింది.

పునఃదర్యాప్తుపై మరోసారి రాజకీయంగా చర్చ..
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై ఏసీబీ న్యాయస్థానం పునఃదర్యాప్తుకు ఆదేశించడంతో ఈ వ్యవహారం రాజకీయంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది. 

21:28 - August 29, 2016

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సీఎల్పీ నాలుగు గంటల పాటు సమావేశమైంది. కరవు, ఇన్‌పుట్‌ సబ్సిడీ, మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్‌, మహా ఒప్పందంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కాంగ్రెస్‌ నేతల నిర్ణయించారు. అయితే అసెంబ్లీ సమావేశాల్లో ఒక్కరోజే నిర్వహిస్తే ఊరుకోమని.. 15 రోజులు సమావేశాలు నిర్వహించాల్సిందేనని కాంగ్రెస్‌ నేతలంటున్నారు. మరోవైపు సీఎల్పీ సమావేశంలో జానారెడ్డి వ్యాఖ్యలపై చర్చ జరిగింది. జానారెడ్డి తీరును పొంగులేటి, రంగారెడ్డిలు ప్రశ్నించారు. అయితే దీనిపై జానారెడ్డి సుదీర్ఘ వివరణ ఇచ్చారు. 

21:26 - August 29, 2016

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలుపుతూ... తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. రెండుగా విభజించిన సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ల ఆర్డినెన్స్‌కు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రేపు జరిగే అసెంబ్లీ సమావేశంలో వీటిని ప్రవేశపెట్టనున్నారు. దీంతో అసెంబ్లీ సమావేశం ఒకేరోజు మాత్రమే జరగనుంది.

అసెంబ్లీ ఒక్కరోజే నిర్వహించాలని కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఒక్కరోజే నిర్వహించాలని కేబినెట్‌ సమావేశంలో నిర్ణయించారు. దాదాపు రెండున్నర గంటల పాటు సమావేశమైన కేబినెట్‌.. జీఎస్టీ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్ ఆమోదం కోసమే మంగళవారం అసెంబ్లీ సమావేశం జరుగుతోంది. జీఎస్టీ బిల్లుకు మద్దతుగా అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత.. బీఏసీ సమావేశం జరగనుంది.

పలు అంశాలపై కేబినెట్‌ సమావేశంలో చర్చ
కేబినెట్‌ సమావేశంలో పలు అంశాలను చర్చించారు. ముఖ్యంగా కొత్త జిల్లాల ఏర్పాటు, సిబ్బంది నియామకం, కేటాయింపులపై మంత్రివర్గంలో చర్చించారు. కొత్త జిల్లాల ఏర్పాటు చేసే వరకు రేషన్‌కార్డుల జారీ ప్రక్రియను నిలిపివేయాలని నిర్ణయించారు. కొత్త జిల్లాలు ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ శాఖల విభజన, ఉద్యోగుల కేటాయింపుపై సీఎస్‌ రాజీవ్‌శర్మ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీలో స్మితా సబర్వాల్‌, శాంతికుమారి, రెవెన్యూశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, సీసీఎల్‌ఏ కమిషనర్‌, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల కలెక్టర్లను సభ్యులుగా నియమించారు. ప్రభుత్వ శాఖల విభజన, ఉద్యోగుల కేటాయింపుపై ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఇక దేవాదాయ పాలకమండళ్ల సభ్యుల పెంపునకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

మిడ్డే మీల్స్ పాయిజన్ కేసులో 17ఏళ్ళ జైలు..

బిహార్: మధ్యాహ్న భోజనం కలుషితమై 23 మంది విద్యార్థులు చనిపోయిన ఘటనలో అప్పటి ప్రిన్సిపాల్‌ను దోషిగా తేల్చలి కోర్టు 17 ఏళ్లు జైలుశిక్ష విధించింది. సరన్ జిల్లాలోని ధర్మసతి గండమన్ ప్రాథమిక పాఠశాలలో జూలై 16, 2013లో మధ్యాహ్న భోజనం కలుషితమైంది. అది తిన్న విద్యార్థుల్లో 23 మంది మృతి చెందారు. ఈ కేసును విచారించిన కోర్టు ఈనెల 24 తీర్పు వెలువరించింది. అప్పటి ప్రిన్సిపాల్ మీనాదేవిని దోషిగా తేల్చింది. 17 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సరైన ఆధారాలు లేకపోవడంతో ఆమె భర్త అర్జున్ రాయ్‌ను నిర్దోషిగా విడుదల చేసింది.

20:57 - August 29, 2016

పట్వారికి లంచం ఇవ్వటానికి భిక్షమెత్తుకుంటున్న కర్నాటక పోరగాడు..మల్లా మొదటికొచ్చిన ఓటుకు నోటు కేసు..తెలుగు రాష్ట్రాలలో రైతులను వెంటాడుతున్న కరవు..హర్యానా అసెంబ్లీలో దిగంబర బాబా..ఎమ్మెల్యేలకు సూక్తులు చెబుతున్న..బాబా..తెలంగాణ రాష్ట్రంలో చెలరేగిపోతున్న చోరగాళ్లు. నల్లగొండ జిల్లాల దేవాలమ్మ నగరం నుంచి అల్లాపురం గ్రామానికి వెళ్లేదారిలో బైటపడ్డ టిఫిన్ బాక్స్ బాంబులు..గిసువంటి మస్తు మస్తు ముచ్చట్లను చూడాలంటే గీ వీడియో క్లిక్ చేయుండ్రి..మస్తు ఖుషీ అవుండ్రి..

20:53 - August 29, 2016

డైలాగులు అదిరాయి.. పంచ్ లు పేలాయి.. అభిమానుల చప్పట్లు మిన్నంటాయి.. కానీ, అదే సమయంలో ప్రశ్నలు వర్షిస్తున్నాయి..సడన్ ఎంట్రీ.. సడన్ మీటింగ్ పై అనేక రకాలుగా చర్చలు మొదలయ్యాయి. పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజా తిరుపతి మీటింగ్ పై విశ్లేషణాత్మక కథనమే.. ఈ రోజు వైడాంగిల్ స్టోరీ..ప్రశ్నిస్తానన్నాడు.. ప్రజల తరుపున ఉంటానన్నాడు. కానీ ప్రశ్నలకే పరిమితమయ్యాడు.. ప్రజల్లోకి మాత్రం ఏ ఆర్నెళ్లకో వచ్చి అనేక రివర్స్ ప్రశ్నలకు కారణమయ్యాడు. ఇప్పటికైనా పవన్ తీరులో మార్పు వచ్చినట్టేనా? పవన్ కల్యాణ్ ప్రజాప్రయోజనాలకోసం పోరాటానికి దిగినట్టేనా? భారీ అంచనాలు.. పెద్ద పెద్ద చర్చలు.. తీరా స్పీచ్ వరకు వచ్చేసరికి పసలేదంటూ స్పందనలు. పైగా మీటింగ్ తర్వాత... కొన్నాళ్ల పాటు అదృశ్యం.. ఇదీ ఇప్పటివరకు పవన్ కల్యాణ్ గమనించిన వారికి కనిపించే దృశ్యం. కానీ ఇప్పుడు స్పీచ్ లో డైలాగులు అదిరాయి. ప్రశ్నల్లో సూటిదనం వచ్చింది. మరి కార్యాచరణలో ఈ కూడా ఇది రిఫ్లెక్ట్ కాబోతోందా? ఇదే అసలు ప్రశ్న. మాటలు చేతలుగా మారనున్నాయా? కాకినాడ మీటింగ్ వెనుక వేరే ఎజెండా ఉందా? చిన్న బ్రేక్ తర్వాత..అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ప్రభుత్వాలు ఏర్పడిన రెండేళ్ల కాలం దాటిపోయింది. రెండున్నరేళ్ల కాలంలో పలు సందర్భాల్లో ఆవేశంగా స్పీచ్ లు దంచిన పవన్ కల్యాణ్ ఆచరణ విషయం ఆదినుంచి అనేక ప్రశ్నలు ఎదుర్కొంటూనే ఉన్నారు. మాటలు చేతలుగా మారటం లేదనే విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు. కానీ, ఇప్పుడు తిరుపతి సభ అనేక ప్రశ్నలు రేకెత్తిస్తోంది. తిరుపతి వేదిక నుంచి కులమతాల అంశాన్ని ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. పవన్ కల్యాణ్ ఇప్పటికైనా ప్రజాసమస్యలపై పోరాడుతానంటే స్వాగతించాల్సిన విషయమే. తాను సపోర్ట్ చేసిన ప్రభుత్వాలు అధికారంలో ఉన్న సమయంలో.. జనసేన అంటూ చేసిన హంగామా అంతా నిశ్శబ్దంగా మారిన తరుణంలో పవన్ ఇలా ప్రజల్లోకి వస్తాను.. పోరాడతాను అని చెప్పటం ప్రజలకు సంతోషం కలిగించే విషయమే. ప్రజా సమస్యలపై ఎవరైనా పోరాడుతానంటే ఆహ్వానించదగ్గ విషయమే. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో నిలువునా హాండిచ్చిన కేంద్రం.. మోడీ సర్కారుని ప్రశ్నించలేని ఏపీ సర్కారు.. ఇలాంటి సందర్భంలో పవన్ కల్యాణ్ తాను పోరాడుతానంటూ.. ఒత్తిడి తెస్తానంటూ చెప్పటం పోరాడుతానని చెప్పటం ఆహ్వానించదగ్గ విషయమే. అయితే.. ఇది గతంలోలా మాటలకే పరిమితం కాకుండా, ప్రశ్నలకే అంకితం కాకుండా.., కార్యాచరణగా మారాల్సిన అవసరం ఉంది.. 

20:40 - August 29, 2016

విశాఖ : కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్మికుల ఉనికికే ప్రమాదంగా పరిణమిస్తున్న తరుణంలో కార్మిక లోకం గళమెత్తనుంది. కనీస వేతన చట్టం అమలు, కార్మికుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా సెప్టెంబర్ 2 న సమ్మె సైరన్ మోగించనుంది..సమస్యల సాధనే లక్ష్యంగా దేశ వ్యాప్త సమ్మెకు రంగం సిద్ధమయ్యింది.

కదం తొక్కనున్న కార్మిక దండు
కార్మిక దండు కదం తొక్కనుంది.. సమస్యల సాధనే లక్ష్యంగా దేశ వ్యాప్త సమ్మెకు రంగం సిద్ధమైంది... దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతోంది, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం ప్రశ్నార్థకంగా మారుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కార్మికుల హక్కులను కాలరాయడంలో ఇద్దరు సీఎంలు పోటీ పడుతున్నారు.. ఇవీ సెప్టెంబర్ 2 సమ్మెకు కార్మిక సంఘాలు చెబుతున్న కారణాలు.. ఎన్నిసార్లు ఆందోళనలు చేసినా సర్కారు స్పందించడం లేదంటూ పలు సంఘాలు దేశవ్యాప్తంగా ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి.. సిఐటియు, ఎఐటియుసి, ఐఎన్‌టియుసి,హెచ్‌ఎంఎస్‌,ఎఐయుటియుసి, ఐఎఫ్‌టియు, టియుసిసి, వైఎస్‌ఆర్‌టియు,బ్యాంకులు, ఇన్సూరెన్స్‌, బిఎస్‌ఎన్‌ఎల్‌, ఎఫ్‌ఆర్‌ఏఐ,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగ సంఘాలు, బ్యాంకు, ఇన్సూరెన్స్ , బిఎస్‌ఎన్‌ఎల్‌, ఎఫ్‌ఎంఆర్‌ఏఐ,లతో పాటు ఇతర స్వతంత్ర సంఘాలు, ఫెడరేషన్లు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి.. రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలూ సమ్మెకు మద్దతు ప్రకటించాయి.
45 కార్మిక చట్టాలను రద్దు చేసిందంటూ ఆరోపణ
బిజెపి అధికారంలోకి వచ్చాక 45 కార్మిక చట్టాలను రద్దు చేసిందని... 50 మంది కంటే తక్కువ కార్మికులుంటే చట్టాలు వర్తింప జేయకుండా కొత్త చట్టం తెచ్చిందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. సామాజిక భద్రతా పథకాలపై పలు ఆంక్షలు పెట్టిందని మండిపడుతున్నాయి. కార్మికుల హక్కులన్నింటినీ రద్దు చేయడంతో పాటు పనిగంటలు మార్చడం... సాంఘిక భద్రతను కల్పించే పథకాలు నీరుగారేలా చేయడంపై కార్మిక సంఘాలు కన్నెర్ర చేస్తున్నాయి.. సమ్మెల్లోకి వెళ్లేవారిని కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శిస్తున్నాయి.. సమ్మె చేస్తే కఠిన కారాగార శిక్ష విధించే క్లాజును తీసుకురావడాన్ని తప్పుబడుతున్నాయి..

గతేడాది సెప్టెంబరు సమ్మెలో పాల్గొన్న 15 కోట్ల మంది కార్మికులు
గతేడాది సెప్టెంబరు సమ్మెలో 15 కోట్ల మంది పాల్గొన్నారు. ట్రేడ్‌ యూనియన్‌ రంగాల్లో సభ్యత్వం లేని లక్షలాది కార్మికులూ సమ్మెకు మద్దతుగా నిలిచారు. ఏ కార్మిక సంఘాల్లోలేని కోట్లాది మంది కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలోకివచ్చారు.. అయినా కార్మిక సంఘాలతో మాట్లాడాలనే స్పృహ కూడా కేంద్రానికి లేకుండా పోయిందని యూనియన్లు వ్యాఖ్యానిస్తున్నాయి.. విధిలేని పరిస్థితుల్లోనే సమ్మెకు వెళ్తున్నామని సంఘాలు చెబుతున్నాయి..

కనీస చట్టాలు అమలు చేయకుండా చర్యలు
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తే పూర్తిగా ప్రైవేటీకరణ రాజ్యమేలుతుంది. ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్లు ఉండవు. కనీస చట్టాలు అమలు చేయరు. ఉన్న చట్టాలనూ రద్దు చేస్తున్నారు. ఇది కార్మిక రంగానికి పెనుముప్పు తెచ్చిపెడుతుందనేది కార్మిక సంఘాల వాదన.. దేశాన్ని ఆర్థికంగా ఆదుకునే అనేక ఇన్సూరెన్స్‌ సంస్థలు దెబ్బతినే ప్రమాదం ఉందని దీని వల్ల బ్యాంకింగ్‌ రంగం మూతపడుతుందని సమ్మెలో పాల్గొంటున్న వివిధ సంఘాల నాయకులంటున్నారు. ఇలా పలు సమస్యలపై పోరు బాట పడుతున్నామని... సంఘాలు చెబుతున్నాయి.. 

20:33 - August 29, 2016

కేంద్ర ప్రభుత్వ విధానాలతో కార్మికుల ఉనికికి పెను ప్రమాదంగా పరిణమిస్తున్న తరుణంలో కార్మిక లోకం గళమెత్తనుంది. కనీస వేతన చట్టం అమలు, కార్మికుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా సెప్టెంబర్ 2 న సమ్మె సైరన్ మోగించనుంది..సమస్యల సాధనే లక్ష్యంగా దేశ వ్యాప్త సమ్మెకు రంగం సిద్ధమయ్యింది. సిఐటియు, ఎఐటియుసి, ఐఎన్‌టియుసి, హెచ్‌ఎంఎస్‌, ఎఐయుటియుసి, ఐఎఫ్‌టియు, టియుసిసి, వైఎస్‌ఆర్‌టియు,బ్యాంకులు, ఇన్సూరెన్స్‌, బిఎస్‌ఎన్‌ఎల్‌, ఎఫ్‌ఆర్‌ఏఐ, స్వతంత్ర సంఘాలు, ఫెడరేషన్లు సమ్మెకు పిలుపు నిచ్చాయి. రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల మద్దతు పలికాయి ఈ అంశంపై టెన్ టీవీ ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో సాయిబాబా (సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి), థామస్ రెడ్డి (టీఎంయూ రాష్ట్ర అధ్యక్షులు), బాల్ రెడ్డి (టీఎంయూ జాయింట్ సెక్రటరీ), పాల్గొన్నారు. ఈ అంశంపై వక్తలు వెలిబుచ్చిన అభిప్రాయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి మరింత సమాచారం తెలుసుకోండి..

లైంగిక వేధింపుల కేసులో సంచలన తీర్పు..

విజయవాడ: 2015 సెప్టెంబర్‌ 9న పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురం పాఠశాలలో జరిగిన లైంగిక వేధింపుల ఘటనకు సంబంధించి విజయవాడలోని ప్రత్యేక న్యాయస్థానం సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న ప్రధానోపాధ్యాయుడు యతిరాజువర్మకు కోర్టు ఏడేళ్ల జైలుశిక్ష, రూ.9లక్షలు జరిమానా విధించింది. అంతేకాకుండా వేధింపులకు గురైన నలుగురు విద్యార్థినులకు రూ.1.75లక్షలు చొప్పున పరిహారం అందజేయాలని తీర్పులో పేర్కొంది. జరిమానా చెల్లించని పక్షంలో అతని ఆస్తుల జప్తునకు ప్రత్యేక న్యాయస్థానం పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేసింది.

20:10 - August 29, 2016

మునగనూరులో దారుణ హత్య..

రంగారెడ్డి : హయత్‌నగర్ మండలం మునగనూరులో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కత్తులతో కిరాతకంగా పొడిచి చంపారు. మృతుడిని వెంకటేశ్‌గా పోలీసులు గుర్తించారు. వెంకటేశ్ డీసీఎం డ్రైవర్‌గా పని చేస్తున్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఆధారాల కోసం ఘటనాస్థలిని క్షుణ్ణంగా పరిశీలించారు.

పిడుగుపాటుకు 300 జింకలు మృతి..

నార్వే : ఓ జాతీయ పార్కులో పిడుగుపాటుకు 300 జింకలు బలి అయ్యాయి. పార్కులో జింకల మృతదేహాలు మందలు మందలుగా పడి ఉన్నాయి. ఈ జాతీయ పార్కులో పది వేల జింకలు సంచరిస్తుంటాయి. శుక్రవారం భారీ తుపాను రావడంతో పార్కులో జంతువులు ఉండేందుకు వాతావరణం అనుకూలించలేదు. దీనికి తోడు పిడుగులు పడటంతో 300లకు పైగా జింకలు ప్రాణాలు కోల్పోయాయి. 

జీఎస్టీకి ఆమోదం తెలిపిన టీఎస్ కేబినెట్..

హైదరాబాద్ : సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. జీఎస్‌టీ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దేవాలయాల పాలకమండళ్లలో సభ్యుల సంఖ్య పెంపునకు నిర్ణయం తీసుకుంది. సైబరాబాద్ కమిషనరేట్ విభజన ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోదించింది. రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం జీఎస్‌టీ బిల్లును ప్రవేశపెట్టనుంది.

19:41 - August 29, 2016
19:33 - August 29, 2016

విశాఖ : విశాఖపట్నంలో తృటిలో ప్రమాదం తప్పింది. నౌకా స్థావరం నుంచి బయలుదేరిన మిగ్‌ 29కే యుద్ధ విమానం నుంచి డ్రాప్‌ ట్యాంక్‌ పడిపోయింది. టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే ఈ ఘటన చోటు చేసుకుంది. పడిపోయిన డ్రాప్ ట్యాంక్.. సీఐఎస్ఎఫ్‌ క్వార్టర్స్‌లో లభించింది. ఈ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై నేవీ అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. 

19:30 - August 29, 2016

అనంతపురం : అనంతపురం జిల్లాలో కరవును ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికపై చర్యలు చేపట్టింది. కరవుపై సమాచారం అందుకునేందుకు జిల్లా కేంద్రంలో కంట్రోల్‌ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటు పుల్లారావు చెప్పారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, పంటలు కాపాడేలా చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక అధికారులతోపాటు, మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. రెయిన్‌ గన్లు, స్ప్రింక్లర్ల సాయంతో పంటలు కాపాడతామని పుల్లారావు చెబుతున్నారు. 

19:27 - August 29, 2016

గుంటూరు : వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మానవ వనరుల శాఖ కార్యాలయాన్ని, ఆ శాఖ ముఖ్య కార్యదర్శుల చాంబర్‌లను.. మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రపంచంలోని ఉన్నత విద్యా ప్రమాణాలతో ఉన్నటువంటి ప్రవేటు యూనివర్సిటీలు ఏపీలో ఏర్పాటు చేయడానికి ఆశక్తి చూపుతున్నాయన్నారు. విద్య ప్రమాణాలు మెరుగుపడితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, అందుకోసమే ముఖ్యమంత్రి విద్యాశాఖ పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక..ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌లు, ఎంపీ అవంతి శ్రీనివాస్ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

19:20 - August 29, 2016

గుంటూరు : జిల్లాలో టీడీపీ- వైసీపీ నేతల మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. కృష్ణాపుష్కరాల్లో అవినీతి జరిగిందని ఒకరు.. నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని మరొకరరు సవాల్‌కు ప్రతిసవాల్‌ విసురుతున్నారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేనిపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి అవినీతి ఆరోపణలు చేశారు. ఇద్దరి మధ్యా మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఇవాళ దాచేపల్లిలో చర్చ జరుపుదామని ఇరువురు నేతలు సవాళ్లు విసురుకున్నారు. పరిస్థితి సీరియస్‌గా మారుతుండటంతో.. ఉదయం పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గృహనిర్బంధం చేశారు. అలాగే గురజాల ఎమ్మెల్యేను సైతం పోలీసులు అరెస్ట్‌ చేశారు. పల్నాడు పరిధిలోని మాచర్ల, గురజాల, దాచేపల్లిలో రాత్రి నుంచి 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. 

19:16 - August 29, 2016

గుంటూరు : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించిన ఉద్యమ కార్యాచరణను ఏపీ హెచ్ ఆర్డీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్వాగతించారు. అయితే ఈ విషయంలో ప్రతిపక్ష నేత జగన్‌ తరహాలో అభివృద్ధిని అడ్డుకునేలా కాకుండా... పవన్‌ కల్యాణ్‌ నిర్మాణాత్మకంగా పని చేయలని గంటా సూచించారు. 

19:12 - August 29, 2016

విజయవాడ : ఓటుకు నోటు కేసును వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని ఏపీ టీడీపీ విమర్శించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై బురద చల్లేందుకే ఏసీబీ కోర్టులో కేసు వేశారని పార్టీ ఎమ్మెల్యే బొండా ఉమ మండిపడ్డారు. చంద్రబాబు నిప్పులాంటి మనిషన్నారు. వైఎస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబుపై 25 సభా సంఘాలు వేసిన ఒక్కటి కూడా తమ నేతను వేలెత్తిచూపలేకపోయిందని చెప్పారు. నీతి, నిజాయితీయే చంద్రబాబు నైజమని బొండా ఉమ చెబుతున్నారు. 

19:06 - August 29, 2016

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఏసీబీ కోర్టులో కేసు నమోదైన నేపథ్యంలో ఆయన వెంటనే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువలపై చంద్రబాబుకు నమ్మకం ఉంటే పదవి నుంచి వైదొలగాలని బొత్స కోరారు. 

19:01 - August 29, 2016

మహబూబ్‌ నగర్‌ : అత్యాచారానికి గురై ఆత్మహత్య చేసుకున్న వర్షిణి కేసులో న్యాయం చేయాలంటూ మహబూబ్‌ నగర్‌ జిల్లా కొల్లాపూర్‌లో బంద్‌ నిర్వహించారు.. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ నిరసన కొనసాగింది.. పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఈ బంద్‌కు మద్దతు ప్రకటించాయి.. వర్షిణిపై సామూహిక అత్యాచారం జరిగితే కేవలం ఒక్క వ్యక్తినే అరెస్ట్‌ చేశారని సంఘం సభ్యులు ఆరోపించారు.. ఈ కేసులో విచారణతీరుపై సందేహం వ్యక్తం చేశారు.. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నిందితులందరినీ శిక్షించాలని డిమాండ్ చేశారు.. 

18:57 - August 29, 2016

వరంగల్ : తెలంగాణ మంత్రి కడియం శ్రీహరి ఇంటిని ముట్టడించారు రెండో ఏఎన్ఎం... పెద్దసంఖ్యలో వీరంతా ఆయన ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.. వీరిని పోలీసులు అడ్డుకున్నారు.. దీంతో ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు.. ఈ నిరసనతో స్పందించిన కడియం.. రెండో ఏఎన్ఎం లను అడిగి వారి సమస్యను తెలుసుకున్నారు.. వీరి సమస్యపై సమగ్ర నివేదిక అందించాలని అధికారుల్ని ఫోన్‌లో ఆదేశించారు.. 

18:54 - August 29, 2016

ఖమ్మం : ఖమ్మం జిల్లాలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులపై అటవీ అధికారుల దాడులు ఆపాలని.. సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.. లేకపోతే సీపీఎం తరపున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.. హరితహారం పేరుచెప్పి గిరిజనులు సాగుచేసుకునే భూమిని ప్రభుత్వం లాగేసుకుంటోందని ఆరోపించారు. ములకలపల్లి మండలంలోని పలు గ్రామాల్లో తమ్మినేని బృందం పర్యటించింది.. అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంది..

18:52 - August 29, 2016

మహబూబ్‌నగర్‌ : సాగుకు నీరందించాలని డిమాండ్‌ చేస్తూ మహబూబ్‌నగర్‌ జిల్లా పెద్దమందడి మండలం వెల్దూరు జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. పాలకుల నిర్లక్ష్యంతో పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శంకరసముద్రం రిజర్వాయర్‌ నుండి పొలాలకు నీరు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సాగుకు వెంటనే నీరివ్వకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు రైతుల రాస్తారోకోతో హైవేపై గంటకుపైగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. 

18:49 - August 29, 2016

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించాలని బీజేఎల్సీ డిమాండ్‌ చేసింది. కేవలం జీఎస్టీ బిల్లుపై చర్చించడానికే పరిమితం చేయొద్దని బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి కోరారు. సాగునీటి ప్రాజెక్ట్‌లు, డబుల్‌ బెడ్‌ రూము ఇళ్లు, మిషన్‌ భగీరథ, కరవు వంటి అంశాలను సభలో చర్చించాల్సి ఉందంటున్నారు.

18:46 - August 29, 2016
18:45 - August 29, 2016

హైదరాబాద్ : ఉద్యోగుల విభజనపై ఏపీ సచివాలయంలో రెండు రాష్ట్రాల చీఫ్‌ సెక్రటరీలతో కమలనాథన్‌ కమిటీ సమావేశమైంది. సెక్షన్‌ ఆఫీసర్లు, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్ల విభజనపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కమల్‌నాథన్‌ కమిటీ గడువు మరో రెండు రోజుల్లో ముగుస్తున్న నేపథ్యంలో.. కమిటీని కొనసాగిస్తారా ? లేదా సందిగ్ధత కొనసాగుతోంది. అయితే... మొదటినుంచి ఉద్యోగుల అంశంపై స్పష్టత ఉన్న ఇదే కమిటీని కొనసాగిస్తేనే విభజన త్వరగా పూర్తవుతుందని అధికారులంటున్నారు. ఇదిలావుంటే కమల్‌నాథన్‌ కమిటీ పారదర్శకంగా వ్యవహరించడం లేదని తెలంగాణ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ ఆరోపించారు. ఏ ప్రాంత ఉద్యోగులు ఆ ప్రాంతానికి వెళ్తామన్నా కమల్‌నాథన్‌ కమిటీ అడ్డుపడుతుందన్నారు శ్రీనివాస్‌గౌడ్‌. 

18:42 - August 29, 2016
18:39 - August 29, 2016
18:34 - August 29, 2016

బాబు ఆమరణదీక్ష చేస్తే హోదా వస్తుంది : ముద్రగడ

హైదరాబాద్: దాసరి నారాయణరావుతో ముద్రగడ సమావేశమయ్యారు. సీఎం చంద్రబాబు ఆమరణ దీక్ష చేస్తే ప్రత్యేక హోదా ఖాయమని ఆయన అన్నారు. చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ ఆమరణ దీక్ష చేస్తే ఆ దీక్షలో నేనూ పాల్గొంటానని ముద్రగడ పద్మనాభం తెలిపారు. కాపుల కోసం ఉద్యమం కొనసాగుతుందని ముద్రగడ అన్నారు. కాపులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఆయన అన్నారు. సెప్టెంబర్‌ 11న రాజమండ్రిలో కాపు సమావేశం నిర్వహిస్తున్నట్లు ముద్రగడ పద్మనాభం వెల్లడించారు.

అమేథీలో పర్యటించనున్న రాహుల్..

ఢిల్లీ : కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ మూడు రోజుల అమేథీ పర్యటనకు సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్టు 31 నుంచీ ఆయన పార్లమెంటరీ నియోజక వర్గంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రికి రాహుల్ అమేథీ చేరుకోనున్నట్లు జిల్లా కాంగ్రెస్ ఛీఫ్ యోగేంద్ర మిశ్రా తెలిపారు. మర్నాడు ఆయన మున్షిగంజ్ గెస్ట్ హౌస్ లో స్థానిక ప్రజలను కలుసుకుంటారని, తర్వాత జగదీష్ పూర్ అసెంబ్లీ సెగ్మెంట్ లోని జఫర్ గంజ్ లో జరిగే బహింరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు.

ప్రారంభమయిన తెలంగాణ కేబినెట్ భేటీ..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సోమవారం సమావేశమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలోని సీ బ్లాక్‌లో మంత్రివర్గం భేటీ అయ్యింది. మంగళవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ, కౌన్సిల్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సమావేశాల ప్రాధాన్యం, ఆమోదించాల్సిన కీలక అంశాలను భేటీలో చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన జీఎస్‌టీ బిల్లును ఆమోదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ముగిసిన చంద్రబాబు పర్యటన..

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన ముగిసింది. ఆయన ముదివేడు నుంచి బెంగళూరు బయల్దేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరువులు అమ్మే డీలర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టమాట రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని..మార్కెట్‌లో టమాట మద్దతు ధర తగ్గితే కనీస మద్దతు ధర చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

బాబును విచారించండి : ఏసీబీ

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును విచారించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఆడియో టేపులో ఉన్న ఏపీ సీఎం చంద్రాబాబుపై విచారణ జరిపించాలని ఏసీబీ డీజీని న్యాయమూర్తి ఆదేశించారు. దీనిపై చర్యలు తీసుకుని సెప్టెంబర్ 29 లోపు నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. 

బోల్తా పడిన ఆటో..8మందికి గాయాలు..

వరంగల్ : జిల్లాలోని కొడకండ్ల - మొండ్రాయ్ ప్రధాన రహదారిపై ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ సహా ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ మినహాయిస్తే మిగతా ఏడుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ ప్రమాదం  జరిగినట్లుగా తెలస్తోంది. 

ఏపీ, టీఎస్ సీఎస్ ల పదవీకాలం పొడిగింపు..

ఢిల్లీ : ఏపీ, తెలంగాణ సీఎస్ ల పదవీకాలన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ ప్రధాని నరేంద్రమోదీ ఉత్తర్వులు జారీ చేశారు. 

మ.నగర్ టూ హైదరాబాద్ కు నయీం భార్య..

హైదరాబాద్ : మహబూబ్ నగర్ జిల్లా జైలు నుండి గ్యాంగ్ స్టర్ నయీం భార్య హసీనా బేగం, సోదరి సలీమా బేగంలను హైదరాబాద్ నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. 

దొంగల బైక్ ను ఢీకొన్న వాహనం..

నెల్లూరు : అలూరులో దొంగల ముఠా ల్యాబ్ టాప్ చోరికి పాల్పడ్డారు. అనంతరం బైక్ పై పారిపోతున్నవారిని సమాచారం అందుకున్న పోలీసులు వెంబడించారు. ఈ క్రమంలో బోగోలు మండలం కప్పరాతిప్ప వద్ద ఓ వాహనాన్ని ఢీకొన్న బైక్ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు దొంగలకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడినవారిని పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. చికిత్స పొందుతూ యేసేపు అనే దొంగ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. 

ఊడిపడిన విమానం ఆయిల్ ట్యాంక్..

విశాఖ : మిగ్ విమానం అదనపు ఆయిల్ ట్యాంక్ ఒకటి ఊడిపడిపోయిన సంఘటన విశాఖపట్టణంలో జరిగింది. మల్కాపురం సీఐఎస్ఎఫ్ సిబ్బంది నివాసాల సముదాయం ఆవరణలో ఈ విమానం ఆయిల్ ట్యాంక్ పడిపోయింది. అయితే, ట్యాంక్ లోని ఇంధనం అంతా బయటికి వచ్చినప్పటికీ మంటలు చెలరేగలేదు. సాంకేతిక సమస్యల వల్లనే ఈ సంఘటన జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు, నౌకాదళ సిబ్బంది దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఈ విమానం ఐఎన్ఎస్ డేగ వద్ద క్షేమంగా ల్యాండ్ అయినట్లు సమాచారం.

ఖమ్మంలో కుల బహిష్కరణ!..

ఖమ్మం : గ్రామంలో అమ్మవారి చల్లకుండను పట్టలేదన్న కారణంతో రజక (చాకలి) కుటుంబాలను గ్రామ పెద్దలు సాంఘికంగా బహిష్కరించారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా, నెలకొండపల్లి మండలం, ఆరెగూడెం గ్రామంలో జరిగింది. ఆ గ్రామంలో ముత్యాలమ్మ పండుగ జరుపుకునేందుకు గ్రామంలో అన్ని కులాలవారితో గ్రామ పెద్దలు సమావేశం నిర్వహించారు. ప్రతి ఏడాదిలానే గ్రామంలోని అన్ని కులాలవారు ఇంటింటిరి తిరిగి చల్లకుండను మోయాలని సూచించారు. అయితే తాము చల్లకుండ పట్టలేమని రజక కుటుంబంలోని వృద్ధులు, పిల్లలు, చదువుకున్నవారు తెలిపారు.

ట్రంప్ గెలవాలంటున్న ఐసిస్?!..

అమెరికా : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ను గెలిపించాలని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కోరుకుంటున్నారని ఐసిస్ మీడియా సంస్థ తెలిపింది. ఈ మేరకు పలువురు ఉగ్రవాదుల ఇంటర్య్యూలు ప్రసారం చేసింది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలని వారు కోరుకున్నారు. ట్రంప్ అధ్యక్షుడైతే అమెరికా తనంతట తానుగా పతనమవుతుందని వారు అభిప్రాయపడ్డారు. ట్రంప్ నిలకడ లేని మనిషని, చంచల స్వభావంతో ఆయన తీసుకునే దూకుడు నిర్ణయాలు అమెరికాను బలహీన పరుస్తాయని వారు పేర్కొంటున్నారు.

భేటీ కానున్న తెలంగాణ కేబినెట్..

హైదరాబాద్ : కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. త్వరలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నేడు కేబినెట్ భేటీ అవుతోంది. అసెంబ్లీలో జీఎస్టీ బిల్లు ఆమోదంపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందాలు, ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పై ప్రతిపక్షాలు అభ్యంతరం చెబుతున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలను ఎదుర్కొనే వ్యూహంపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. అలాగే కాంగ్రెస్ ను ఇరుకునపెట్టేందుకు కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లోని లోపాలపై కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది.

జైల్లో గడపాలనుందా?రూ.500 కట్టండి..

హైదరాబాద్ : జైలు జీవితం ఎలాగుంటుందో తెలుసుకోవాలనుకునే వారి కోసం తెలంగాణ జైళ్ల శాఖ ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ‘ఫీల్ ద జైల్’ పేరిట ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. సంగారెడ్డి జైల్ మ్యూజియంలో ఇందుకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జైలు జీవితం ఎలా ఉందో తెలుసుకోవాలనే వారు ఒక్కరోజు జైలు జీవితం గడపవచ్చని, అందుకుగాను రూ.500 చెల్లించాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు చెప్పారు. జైళ్లలో నెలకొన్న వాతావరణంపై ఉన్న అపోహలను పోగొట్టే ప్రయత్నంలో భాగంగానే ‘ఫీల్ ద జైల్’ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు.

నయీం బాధితుల ఆందోళన..

నల్గొండ: భువనగిరి ఆర్డీవో కార్యాలయం వద్ద నయీం బాధితులు ఆందోళన చేపట్టారు. నయీం అనుచరలు కబ్జా చేసినట్లు ఆరోపణలున్న శ్రీ లక్ష్మీనరసింహా వెంచర్‌ బాధితులు ఆందోళన చేపట్టారు. వెంచర్‌కు చెందిన 418 ఎకరాలను నయీం అనుచరులు కబ్జా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఇప్పటికే 19 మందికి నోటీసులు జారీ అయ్యాయి. నేడు జరగాల్సిన ఆర్డీవో విచారణ వాయిదా పడటంతో బాధితులు నిరసన తెలిపారు. 

16:28 - August 29, 2016

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ చిత్రం సెప్టెంబర్ 2న విడుదల తేదీని  ప్రకటించారు. కానీ ఒకరోజు ముందే అంటే సెప్టెంబర్ 1న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటన వచ్చేసరికి ఎన్టీఆర్ అభిమానుల్లో  పండుగ వాతావరణం నెలకొంది. సినిమా విడుదల దగ్గర పడుతున్నకొద్దీ  ప్రమోషన్ల జోరు పెరుగుతోంది. ఇప్పటికే ట్రైలర్, ఆడియో, పోస్టర్స్ రిలీజ్ చేయగా.... తాజాగా మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు. ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు, హీరోయిన్లు సమంతా, నిత్యామీనన్ ల నటన గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ప్రకృతిని ప్రేమించే వ్యక్తి, మనుష్యులను ప్రేమించే వ్యక్తి కలిస్తే ఎలా వుంటుందో అటువంటి ఇద్దరు వ్యక్తులు కలిస్తే భూమి ఇంకెంత సుభిక్షంగా వుంటుందో తెలిపేలా వుండబోతున్న ఈ  చిత్రంపై అన్ని వర్గాల్లో అంచనాలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదల అయిన చిత్రాలు ఆశించినంతగా ఆడకపోవటంతో ఎన్టీఆర్ కొంత అసంతృప్తిగా వున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధిస్తుందని తారక్  భావిస్తున్నాడు.  

ఆడియన్స్ లో హైప్ క్రియేట్ చేస్తున్న టీజర్స్..
ఇప్పటికే పోస్టర్స్, టీజర్స్ ద్వారా ఆడియన్స్ లో మంచి హైప్ క్రియేట్ చేసుకున్న జనతా గ్యారేజ్ చిత్రం ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలుగు, మలయాళంలో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని సినీ పరిశ్రమలో అంచానాలు వేస్తున్నారు. సినిమాకు జూనియర్ ఎన్టీఆర్, మోహన్ లాల్ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండగా, సమంత, నిత్యామీనన్, కాజల్ ల అందాలు ఆడియన్స్ ని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యేలా చేస్తాయి. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో యూనిట్ వినూత్న ప్రచార కార్యక్రమాలు చేస్తోంది. తాజాగా ఈ చిత్ర మేకింగ్ వీడియోని విడుదల చేసి ఆడియన్స్ లో సినిమాపై మరింత ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసింది..

ఎన్టీఆర్ అభిమానులు..చిత్రపరిశ్రమ ఆశక్తి..
ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే కాక తెలుగు సిని పరిశ్రమ మొత్తం ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం 'జనతా గ్యారేజ్'. కొరటాల, ఎన్టీఆర్ కాంబినేషన్‌తో ఈ చిత్రం టీజర్, ట్రైలర్, పాటలు ఈ సినిమాపై అంచనాలను ఒక రేంజ్‌కి పెంచాయి. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ ఈ చిత్ర కథ విభిన్నంగా కొరటాల మార్క్‌తో ఉండబోతోందని మెచ్చుకుంటున్నారు.

కొరటాల శివ బ్లాక్ బస్టర్ లిస్ట్ జనతా గ్యారేజ్ కూడా చేరుతుందా?..
అంతేకాకుండా కచ్చితంగా కొరటాల గత చిత్రాల స్టేజ్ కు ఈ చిత్రం కూడా చేరి  బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోతుందని సినీ వర్గాలు..అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రంపై మేకింగ్ వీడియోని రిలీజ్ చేసారు.

జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ 'అభయ్ రామ్'?!
జూ
నియర్ ఎన్టీఆర్ కుమారుడు 'అభయ్ రామ్' జనతా గ్యారెజ్ సెట్స్ లో సందడి చేశాడు. తండ్రి నటిస్తున్న సినిమా సెట్స్ లో తొలి సారిగా చిన్నారి అభయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. సాధారణంగా పబ్లిసిటీకి, సినిమా సెట్స్ కు దూరంగా ఉండే తారక్ సతీమణి లక్ష్మీ ప్రణతి కూడా కుమారుడికి తోడుగా రావడం మరింత స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. దీంతో ఈ అరుదైన సంబరాన్ని ఎంజాయ్ చేసిన ఎన్టీఆర్ తన ఆనందాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. తన ఫేస్ బుక్ పేజీలో ముద్దుల కొడుకు సెట్స్ లో హల్ చేసిన ఫోటోలను పోస్ట్ చేశాడు. దీంతో తమ అభిమాన హీరో వారసుడి ఫోటోలకు లైక్ లు, షేర్లతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

16:04 - August 29, 2016

ప్రకాశం : పాఠశాల అంటేనే పనిష్మెంట్‌ కేంద్రంగా మారింది పరిస్థితి. మోయలేని బరువులతో కూలిపనులకు పోతున్నట్టు బడి అంటేనే భారంగా ఫీలవుతున్నారు చిన్నారులు.

బడిఅంటేనే భయపడుతున్న చిన్నారులు
ప్రకాశం జిల్లాలో బడి అంటేనే హడిలిపోతున్నారు చిన్నారులు. కిలోలకొద్దీ పుస్తకాలు, వాటర్‌ బాటిళ్లు.. టిఫిన్‌ బాక్స్‌లు. ఇలా పనికొచ్చేవి.. పనికిరానివన్నీ కొని పిల్లల నెత్తిన రుద్దేస్తున్నారు. ఇక తరగతిలో పడిన టార్చర్‌ చాలదన్నట్టు ..ఇంటికి వెళ్లగానే ట్యూషన్‌కు వెళ్లూ.. అని అమ్మానాన్నల గద్దింపులు..దీంతో బడిఅంటేనే గుదిబండగా ఫీలవుతున్నారు.

2వ తరగతి పిల్లలకు 10కేజీల పుస్తకాలా..?
ఒకటి నుంచి 5వ తరగతి వరకు స్కూల్‌ పిల్లలకు పుస్తకాల బరువు 1నుంచి 3 కేజీలకు మించరాదని యశ్‌పాల్‌ కమిటీ గతంలోనే చెప్పింది. కాని.. ఈ చిన్నారులు తగిలించుకున్న బ్యాగులు ఒక్కోటి కనీసం 10కేజీలకు తక్కువేం ఉండవు. చట్టాలు, సూచనలు ఎన్ని ఉన్నా.. విద్యార్థులకు అవస్థలు తప్పడంలేదు. రోజూ పిల్లలు గాడిదబరువుల మోస్తున్నా.. అటు ఉపాధ్యాయులుగాని.. విద్యాధికారులకు గాని చీమకుట్టినట్టైనా లేదు. గంపెడు పుస్తకాలతో లేలేత నడుములు ఒంగిపోయి... తీపులు నొప్పులతో చిన్నారులు కన్నీరు పెట్టుకోవడం అందరి తల్లిదండ్రులకు తెలిసిందే. అయినా.. తమవాడు ఎక్కడ వెనుబడిపోతాడోనని .. అవసరం ఉన్నా లేకున్నా.. గంపెడు పుస్తకాలు కొని పడేస్తున్నారు.

చదువులతో మానసిక వికాసమా.. మనోవికారమా..
నానాతిప్పలు పడి ఇంటికెళ్లిన చిన్నారులకు కొండంత హోంవర్క్‌ ఊపిరి సలపనీయడంలేదు. చదువుల తీరుతో పసివాళ్లు ఆటపాటలకు దూరంఅవుతున్నారు. మానసిక వికాసాన్ని కలిగించాల్సిన చదువులు.. విద్యార్థులకు మనోవికారాన్ని రంగరించి పోస్తున్నాయని.. తల్లిదండ్రులు వాపోతున్నారు.

బరువులతో పడుతూలేస్తూ బడిబాటలో సాగుతున్న చిన్నారులు ..
మోయలేని బరువులతో పడుతూలేస్తూ బడిబాటలో సాగుతున్న చిన్నారులు .. చదువులంటేనే కంపించిపోతున్నారు. అస్తవ్యస్తమైన విద్యావిధానంలో ఈ రేపటి పౌరులు దేశానికి ఏవిధంగా సేవలు చేయాలో విద్యాధికారులే చెప్పాలి. 

15:58 - August 29, 2016

ఢిల్లీ : తెలంగాణలో విశ్వవిద్యాలయాల వీసీల నియామకానికి సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. ఈరోజు సుదీర్ఘ వాదనలు విన్న సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ వీసీల కొనసాగింపునకు ఆమోదం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తరపున ముకుల్‌ రోహిత్గి, విశ్వనాథ శెట్టిలు వాదనలు వినిపించారు. వీసీలను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని వీళ్లు వాదించారు. కాగా గతంలో వీసీల నియామకంపై తెలంగాణ ప్రభుత్వంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

వీసీల నియామకంపై హైకోర్ట్ ఆగ్రహం..
తెలంగాణలో వీసీల నియామకంపై హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వైస్‌ ఛాన్స్‌లర్ల నియామకం రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వీసీల నియామకానికి సంబంధించిన అర్హతలు, నియమ నిబంధనలను ఉద్దేశిస్తూ జారీ చేసిన జీవో నిలుపుదల చేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ఛాన్స్‌లర్లు, వీసీల నియామకాలకు సంబంధించిన చట్టాలపై దాఖలైన పిటిషన్లను విచారిస్తుండగా... నియామకాలు చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని అడిగింది. విచారణ పూర్తయ్యే దాకా నియామకాలు జరపబోమని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హామీ ఇచ్చారని.. దాన్ని పక్కనబెట్టి ఎందుకు నియామకాలు చేపట్టారని న్యాయస్థానం ప్రశ్నించిన విషయం తెలిసిందే.

15:52 - August 29, 2016

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని కేంద్రంతో పాటు తెలంగాణ ప్రభుత్వాలకు తాకట్టు పెట్టారని వైసీపీ ఆరోపించింది. ఈకేసులో చంద్రబాబునాయుడుని విచారించాలని కోరుతూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించిందని ఆ పార్టీ నేత అంబటి రాంబాబు చెప్పారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఎప్పటికైనా దోషిగా తేలడం ఖాయమని అంబటి తెలిపారు. 

15:46 - August 29, 2016

ఖమ్మం : సీజనల్‌ విష జ్వరాల డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నాయి. మలేరియా, టైఫాయిడ్‌తో పాటు డెంగ్యూ మహమ్మారితో అనేక మంది పేదలు ప్రాణాలను కోల్పోతున్నారు. ఇప్పటికే విషజ్వరాల బారిన పడి 20 మందికి పైగా మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది. ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోయాయి. ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడంలో విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
అంటు వ్యాధులతో అట్టుడుకుతున్ ఏజెన్సీ..
ఖమ్మం జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా మలేరియా, టైఫాయిడ్‌తో పాటు చికెన్‌గున్యా, డెంగ్యూ లాంటి విష జ్వరాలు సోకడంతో ఇప్పటికే అనేక మంది మృత్యువాత పడ్డారు. ప్రధానంగా ఏజెన్సీలో రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. భద్రాచలం ఏజెన్సీలోని వెంకటాపురం, చర్ల, వాజేడు, పినపాక, అశ్వారావుపేట, పాల్వంచ, మణుగూరు తదితర ప్రాంతాల్లో ఎక్కువగా డెంగ్యూ అనుమానిత కేసులు నమోదయ్యాయి. కొణిజర్ల మండలం సింగరాయపాలెం, బోనకల్‌ మండలం ఆళ్లపాడు, రఘునాథపాలెం మండలం వేపకుంట్ల తదితర ప్రాంతాల్లో ఎక్కువగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామంలోని మహిళలు, చిన్నారులు, విద్యార్థులు విషజ్వరాలకు గురికావడం ఆందోళనకు గురిచేస్తోంది.

అంటువ్యాధులతో నిండిపోయిన ఆసుపత్రులు
సీజనల్‌ వ్యాధులు ప్రబలడంతో జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోయాయి. కొన్ని ఆసుపత్రుల్లో బెడ్స్‌ ఖాళీ లేక రోగులను తిప్పిపంపుతున్న పరిస్థితి నెలకొంది. తెల్లరక్తకణాలు తగ్గిపోయి పరిస్థితి విషమించిన రోగులను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఆర్థిక స్థోమత లేని నిరు పేదలు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రులనే నమ్ముకుని వైద్యులపై భారం వేస్తున్నారు. పారిశుధ్య చర్యలు సరిగా లేకపోవడం వల్లే విష జ్వరాలు ప్రబలుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

వైద్యల జాడలేదని 27 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు
ఏజెన్సీలో 38 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలుంటే వాటిలో 27 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో కనీసం వైద్యులు కూడా లేరు. జిల్లాలో అనేక మంది విష జ్వరాలతో అల్లాడిపోతుంటే..వైద్యశాఖ మాత్రం స్పందించిన దాఖలాలు కనబడటం లేదు. విషజ్వరాలు ప్రబలుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాల్సిన అధికారులు ఆ దిశగా పట్టించుకున్న పాపాన పోలేదు. పరిసరాల పరిశుభ్రత, మురుగునీరు నిల్వ తదితర అంశాలపై ప్రభుత్వం అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా ప్రజలను రోగాల భారి నుంచి కాపాడాలని కోరుతున్నారు.

వ్యాధులు వచ్చాక చర్యలు తీసుకుంటామంటున్న పారిశుద్ధ్య శాఖ
గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా ఎక్కడా ఫాగింగ్‌ కూడా చేసిన ఆనవాళ్లు కనిపించడం లేదు. ఓవైపు విషజ్వరాలు విజృంభిస్తుంటే.. పారిశుధ్య శాఖ వారు మాత్రం ఇప్పుడు చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచేలా చర్యలంటున్న అధికారులు
గ్రామాల్లో విష జ్వరాలు పెరుగుతున్న దృష్ట్యా వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. పారిశుధ్య పరిశుభ్రతతో పాటు ప్రజలు కూడా అనారోగ్యం బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 

15:41 - August 29, 2016

తూర్పుగోదావరి : ఏపీ మంత్రి నారాయణ ఆస్తుల చిట్టాను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ బయట పెట్టారు. తనకు సొంతంగా 474 కోట్ల ఆస్తులు ఉన్నట్లు స్వయంగా నారాయణ ప్రకటించారని, ఆ డబ్బు ఎలా సంపాదించారో బయటపెట్టాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. సొసైటీలకు వేల కోట్ల నిధులు ఉండొచ్చు గానీ, ఆ సొసైటీలను నడిపేవారికి వేలకోట్లు ఉండటానికి వీలుండదని అన్నారు. ఇక ఏపీ రాజధాని నిర్మాణం గురించి కూడా ఉండవల్లి తీవ్రంగా మండిపడ్డారు. అసలు ఏ నివేదిక ఆధారంగా అమరావతిలో రాజధాని కడుతున్నారని ప్రశ్నించారు. శివరామకృష్ణన్ కమిటీ ఏం నివేదిక ఇచ్చిందో చెప్పగలరా అని అడిగారు.

15:39 - August 29, 2016

తిరుమల : శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తి, కేంద్రముంత్రులు జేపీ నడ్డా, ఫాగన్ సింగ్‌లు విఐపీ బ్రేక్ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఘనంగా వీరికి స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేసారు. ఈసందర్భంగా కేఈ క్రిష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకూ అందరం కలిసి పోరాడుతామని అన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమం చేస్తానన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆయన కృతజ్ఙతలు తెలిపారు. కాగా శనివారం నాడు తిరుపతిలో పవన్ కళ్యాణ్ సభలో ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో చేసిన వ్యాఖ్యలు టీడీపీ నేతలకు గుబులు పుట్టించింది. కాగా వవన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సమర్ధిస్తుంటే మరికొందరు మండిపడుతున్నారు. ఇప్పటికే టీజీ ఎంపీలు వెంకటేశ్, అవంతి పవన్ వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు పరుషంగా కాకపోయని ఆసున్నితంగానే పవన్ వ్యాఖ్యలపై మందలించినట్లుగా తెలుస్తోంది. 

తలకాయలేని కాంగ్రెస్ నేతలు : గొంగడి

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోన్న ఇరిగేషన్ ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, విప్ గొంగిడి సునీత మండిపడ్డారు. వాళ్లు కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రాజెక్టులపై అగ్రిమెంట్ జరిగిందని ఒకరు, లేదు జరగలేదని మరొకరు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. అసలు కాంగ్రెస్ నేతలకు ఇరిగేషన్‌పై అవగాహనే లేదన్నారు. కాంగ్రెస్ నేతలు జోకర్లలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ఒంగోలులో భూప్రకంపనలు..

ప్రకాశం : ఒంగోలులో స్వల్ప భూకంపం సంభవించింది. రెండు సెకన్ల పాటు భూ ప్రకంపనలు నమోద వడంతో ప్రజలు భయంతో ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, రిక్టర్ స్కేల్ పై భూ కంప తీవ్రత ఎంత నమోదైందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

బాబును ఎవ్వరూ కాపాడలేరు :అంబటి

హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎవరూ కాపాడలేరని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ఓటుకు కోట్లు కేసుకు సంబంధించి తమ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్ని సాక్ష్యాధారాలతో కోర్టును ఆశ్రయించారన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోది, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ జోక్యం చేసుకున్నా ఈ కేసు నుంచి చంద్రబాబు తప్పించలేరన్నారు.

సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు..

కడప : వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై సోమవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా స్టాంప్ వెండర్లు, దస్తావేజు లేఖరులు, సబ్‌ రిజిస్ట్రార్ సిబ్బంది దాదాపు 15 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి మితిమీరిందని ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు.  

కేసీఆర్ కసాయి : రేవంత్

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ మనిషి కాదు కసాయి అని టీడీపీ నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన రేవంత్.. కేసీఆర్‌ సీఎం అయ్యాక ప్రాణహిత-చేవెళ్లను పక్కనబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రయోజనాలను మహారాష్ట్రకు తాకట్టు పెట్టారని ఆయన మండిపడ్డారు. బాబ్లి వల్ల ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిందని రేవంత్ చెప్పుకొచ్చారు. ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ల్లో అవినీతిపై న్యాయపోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. 

తంబళ్లపల్లిలో చంద్రబాబు పర్యటన..

చిత్తూరు: రాయలసీమ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలం ముదివేడులో పర్యటించారు. ఈ సందర్భంగా పంట సంజీవని పంటకుంటలను పరిశీలించారు.

యూపీ మంత్రికి సుప్రీం నోటీసులు..

ఢిల్లీ: బులంద్‌షహర్‌ అత్యాచార ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఉత్తరప్రదేశ్‌ మంత్రి ఆజంఖాన్‌కి, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి.. సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అత్యాచార ఘటనకు సంబంధించి చేసిన వ్యాఖ్యలపై బాధితురాలి తండ్రి వేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.

విద్యార్థులపై స్కూల్ యాజమాన్యం దాష్టీకం..

రాజస్థాన్‌ : ఉదయ్‌పూర్‌లోని వివేకానంద పబ్లిక్‌ స్కూల్‌ యాజమాన్యం పిల్లల పట్ల అమానుషంగా ప్రవర్తించింది. స్కూల్‌కు ఆలస్యంగా వచ్చిన విద్యార్ధులను ఎండలో నిలబెట్టి..విద్యార్ధులతో మోకాలు దండ వేయించింది..విద్యార్థినిలతో గుంజీలు తీయించారు. దీంతో పలువురు విద్యార్థులు స్పృహ తప్పి పడిపోయారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు యాజమాన్యంపై కేసు పెట్టారు. దీంతో స్కూల్‌ ప్రిన్స్‌పాల్‌తోపాటు ఇద్దరు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు.

పవన్ వ్యాఖ్యలు సరైనవే : కేఈ

తిరుమల : సోమవారం ఉదయం తిరుమల శ్రీవాని దర్శించుకున్న అనతరం కేఈ ఈ మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని సరైనవేనని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. దీంతో బీజేపీ తప్పించునే వీలులేదని ఆయన తెలిపారు. ఏపీలో జిల్లాల పెంపు విషయంలో వచ్చే అసెంబ్లీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నామని ఆయన తెలిపారు. కాగా శనివారం నాడు తిరుపతిలో పవన్ కళ్యాణ్ సభలో ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో చేసిన వ్యాఖ్యలు టీడీపీ నేతలకు గుబులు పుట్టించింది. కాగా వవన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నదిలో కొట్టుకుపోయిన 300ల గొర్రెలు..

నల్లగొండ : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మూసి నది పొంగిపొర్లుతోంది. మిర్యాలగూడ మండలం ముల్కలకాలువ సమీపంలోని మూసి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇది గుర్తించని గొర్రెల కాపరి సోమవారం ఉదయం తన గొర్రెల మందతో వాగు దాటడానికి యత్నిస్తుండగా..300 గొర్రెలు నీటిలో కొట్టుకుపోయాయి. ఒక్క సారిగా వరద పెరగడంతో ఈ దుర్ఘటన జరిగింది. గొర్రెల గల్లంతు యజమాని కన్నీరుమున్నీరవుతున్నాడు. 

ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అరెస్ట్..

అనంతపురం: హంద్రీనీవా ఆయుకట్టుకు నీరివ్వాలంటూ ఆందోళన చేపట్టిన అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. హంద్రీనీవా పరిధిలోని 70 వేల ఎకరాలకు నీరివ్వాలంటూ వజ్రకరూరు మండలం రాగులపాడు పంప్‌హౌస్‌ వద్ద ఎమ్మెల్యే ఆందోళన చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం వైకాపా శ్రేణులతో లిఫ్టు వద్దకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, వైకాపా శ్రేణుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.

మరోసారి దద్దరిల్లిన బ్రసెల్స్..

బ్రసెల్స్ : బెల్జియం రాజధాని బ్రసెల్స్ మరోసారి బాంబు పేలుడుతో ఉలిక్కిపడింది. జాతీయ క్రిమినాలజీ ఇనిస్టిట్యూట్‌ ప్రాంగణంలో పేలుడు సంభవించింది. స్థానిక కాలమాన ప్రకారం ఉదయం రెండు గంటల ప్రాంతలో ఒక కారు ఇనిస్టిట్యూట్‌ ప్రాంగణంలోకి వేగంగా దూసుకువెళ్లింది తర్వాత కారు పేలిపోయింది. పేలుడు ధాటికి ఇనిస్టిట్యూట్‌ భవనం దెబ్బతింది. ఉగ్రవాదులే దాడికి పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు. ఇటీవలె బ్రస్సెల్స్‌ విమానాశ్రయం, మెట్రో స్టేషన్‌లో భారీ పేలుళ్లు సంభవించడంతో 32 మంది మరణించారు.

ముగిసిన కమల్ నాథన్ కమిటీ భేటీ..

హైదరాబాద్ : కమల్ నాథన్ కమిటీ సమావేశం ముగిసింది. ఇరు రాష్ట్రాల సీఎస్ లు హాజరయ్యారు. ఈ నెల 31తో కమల్ నాథన్ కమిటీ గడువు పూర్తికానున్న నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లుగా సమాచారం.

కరవుపై మంత్రుల సమావేశం..

అనంతపురం : కరవుపై ఏపీ మంత్రులు సమావేశమయ్యారు. పల్లె రఘునాథ రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత ఈ సమావేశానికి హాజరయ్యారు. సీఎం చంద్రబాబు మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలకు అదనంగా 1900 అదనసు రెయిన్ గన్స్ ఏర్పాటు చేయనున్నారు. రెండు నియోజకవర్గాల బాధ్యతను సీఎం ఓ మంత్రికి అప్పగించారు. ఈ సందర్భంగా మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ వేరుశనగ పంటను ఎండనివ్వమని దానికి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 

ఆత్మాహుతి దాడికి 45మంది బలి..

యెమెన్ : యోమెన్ వాసులను ఉద్రదాడులు భయం వీడటం లేదు. యెమెన్ దేశంలో ఉగ్రవాదులు మరోసారి విరుచుకుపడ్డారు. దక్షిణ యోమెన్ లోని ఆడెన్ ప్రాంతంలోని సైనిక శిబిర ప్రాంతం రక్తసిక్తంగా మారిపోయింది. దుండగులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 45మంది బలయ్యారు. మరో 60మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన చికిత్సనందిస్తున్నారు. కాగా మృతుల సంఖ్య మంరిత పెరిగే అవకాశమున్నట్లుగా సమాచారం.

పిన్నెల్లిది బస్సు దోపిడీల చరిత్ర : యరపతి

గుంటూరు: ఎమ్మెల్యే కాకముందు బస్సుల్లో దోపిడీలు చేయించిన పిన్నెల్లి ఇప్పుడు నీతులు చెబుతున్నారని ఎమ్మెల్యే యరపతినేని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీబీఐ, కోర్టులు ఎక్కడుంటాయో మీ నేతకే బాగా తెలుసని చురకలంటిచారు. తనపై ఆరోపణలకు ఆధారాలుంటే నిరూపించాలని సవాల్ విసరారు. వచ్చే ఎన్నికల్లో పిన్నెల్లిపై ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధమని యరపతినేని స్పష్టం చేశారు.

కశ్మీర్‌ లో కర్ఫ్యూ ఎత్తివేత..

కశ్మీర్‌ : కశ్మీర్ లోయలో కర్ఫ్యూ ఎత్తివేశారు. గత 51 రోజులుగా కొనసాగుతున్న కర్ఫ్యూ ఎత్తివేయడంతో ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుక్కునేందుకు షాపుల వద్ద బారులు తీరారు. అయితే శ్రీనగర్‌, పుల్వామా జిల్లాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. అటు పాకిస్తాన్ సరిహద్దు నుంచి చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను జవాన్లు కాల్చివేశారు. మరోవైపు కశ్మీర్‌ పరిస్థితిపై సమీక్షించేందుకు లోయలో అఖిలపక్షం పర్యటించనుంది. సెస్టెంబర్‌ 4వ తేదీన కేంద్రహోంమంత్రిరాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో అఖిలపక్షం కశ్మీర్‌ వెళ్లనుంది.

వీసీల నియామకానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్ ..

ఢిల్లీ: వీసీల నియామకానికి గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో వీసీలను నియమకాన్ని కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం తరపున ముకుల్ రోహిత్గి, విశ్వనాథ శెట్టిలు వాదనలు వినిపించారు. ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 

13:40 - August 29, 2016

జర్నలిస్టుగా, వ్యాఖ్యాతగా, రెడియో నిర్వాహకురాలిగా, అధ్యాపకురాలిగా, రచయిత్రిగా, కాలమిస్టుగా, యాంకర్ గా..ఇలా భిన్న రంగాల్లో మృణాళిని తనదైన ముద్ర వేశారు. అడుగు పెట్టిన ప్రతి రంగంలో తనకంటూ ప్రత్యేకతను చాటుతూనే ఉన్నారు. ఎంచుకున్న ప్రతిపనికి వన్నె తెచ్చారు. ఆరు పదులకు దగ్గరైనా తరగని ఉత్సాహంతో..చెదరని చిరునవ్వుతో..మాటల్లో ఆలోచనల్లో అంతే చురుకుదనంతో కదిలే బహుముఖ ప్రజ్ఞాశాలి 'మృణాళిని' మానవి ముచ్చటించింది. మరి ఆమె ఎలాంటి విశేషాలు..అనుభవాలు తెలియచేశారో వీడియోలో చూడండి. 

13:33 - August 29, 2016

ఢిల్లీ : 2016 రాజీవ్‌ఖేల్‌రత్న అవార్డులను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అందజేశారు. పీవీసింధు (బ్యాడ్మింటన్), దీపాకర్మాకర్ (జిమ్మాస్టిక్), సాక్షిమాలిక్ (రెజ్లింగ్), జీతూరాయ్ (షూటింగ్‌) రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు. ఈ అవార్డుతోపాటు ద్రోణాచార్య అవార్డులను ఆయా కోచ్‌లకు, అర్జున అవార్డులను ఆయా క్రీడాకారులకు రాష్ట్రపతి అందజేశారు. 

13:31 - August 29, 2016

ఢిల్లీ : భారత్‌కు వచ్చే విదేశి మహిళలు స్కర్ట్స్ ధరించకూడదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేశ్ శర్మ సూచించారు. అంతేకాదు...రాత్రి వేళలో కురచ దుస్తులు వేసుకుని ఒంటరిగా తిరగొద్దని సలహా ఇచ్చారు. పర్యాటకుల భద్రతపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా సమాధానమిచ్చారు. భారత్‌లో పర్యటనకు వచ్చే పర్యాటకులకు విమానాశ్రయంలో దిగగానే వెల్కం కిట్ అందజేస్తామని... పర్యాటక ప్రాంతాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపే కార్డు కూడా ఇందులో ఉంటుందని మంత్రి మహేష్‌ శర్మ పేర్కొన్నారు. 

13:29 - August 29, 2016

కర్నూలు : జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పై టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ మండిపడ్డారు. రాజకీయాలంటే నెలనెలా జీతం తీసుకోవడం కాదని ఆయన అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పవన్‌ కుంభకర్ణుడిలా నిద్రపోయారా అంటూ ప్రశ్నించారు. ఇప్పడు నిద్రలేచి ఎంపీలు రాజీనామా చేయాలనడం పవన్‌ అవివేకానికి నిదర్శనమని చెప్పారు. ఎంపీలపై పవన్‌కల్యాణ్‌వి చౌకబారు విమర్మలని అన్నారు. మరి దీనికి జనసేన అధినేత పవన్ కౌంటర్ ఇస్తారా ? లేదా ? అనేది చూడాలి. 

13:17 - August 29, 2016

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసు మళ్లీ తెరమీదకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలో స్టీఫెన్ రవీంద్రకు డబ్బులు ముట్టచెబుతూ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రెడ్ హ్యాడెండ్ గా దొరికిన సంగతి తెలిసిందే. అనంతరం వాయిస్ టేపులు కూడా బయటపడ్డాయి. ఈ వాయిస్ లో సీఎం చంద్రబాబు నాయుడు పేరు బయపడడం సంచలనం సృష్టించింది. దీనిపై ఏసీబీ విచారణ చేపట్టింది. దీనిని మెల్లిమెల్లిగా మరిచిపోయారు. తాజాగా మళ్లీ తెరమీదకు వచ్చింది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. కేసును పున:పరిశీలించాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను కోర్టు స్వీకరించింది. సీఎం చంద్రబాబు పాత్రపై కేసు నమోదు చేయాలని పిటిషనర్ కోరారు. ఆడియో టేపులను లండన్ లో ఫోరెన్సిక్ పరీక్షలు చేయించి చంద్రబాబు వాయిస్ అని తేల్చారని, నివేదికను గతంలో కోర్టుకు కూడా సమర్పించామని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. పిటిషనర్ వాదనలో కోర్టు ఏకీభవించింది. సెప్టెంబర్ 29వ లోగా విచారణ పూర్తి చేయాలని ఏసీబీకి ఆదేశించింది.

సాక్ష్యాధారాలను సేకరించాం - ఆళ్ల రామకృష్ణారెడ్డి..
ఈ సందర్భంగా టెన్ టివితో ఆళ్ల రామకృష్ణారెడ్డి, న్యాయవాది మాట్లాడారు. తెలంగాణలో బలం లేకపోయినా ఎమ్మెల్యేలను కొంటూ దొరికిపోయారని ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఉన్న సాక్ష్యాధారాలను సేకరించి కోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు. చంద్రబాబు నాయుడును ముద్దాయిగా ఎందుకు చేర్చలేదని అడిగినట్లు తెలిపారు. చంద్రబాబు వాయిస్ తీసుకెళ్లి ల్యాబ్ కు తీసుకెళ్లి ఇవ్వడం జరిగిందని, క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత చంద్రబాబు వాయిస్ అని తేలిందని, దీనిని కోర్టులో ప్రవేశ పెట్టడం జరిగిందని తెలిపారు.

 • ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు డబ్బు ఎరచూపి 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ గా ఇస్తున్నారన్న ఆరోపణపై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేయడంతో ఒక్కసారిగా సంచలనం రేగింది.
 • దర్యాప్తులో భాగంగా ఖమ్మం జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను కూడా అరెస్టు చేశారు.
 • ఈ కేసుతో సంబంధం ఉందని మరో ఐదుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
 • 5 కోట్లకు స్టీఫెన్‌సన్‌తో బేరం కుదుర్చుకుని 50 లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చారని ఎసిబి ఛార్జిషీటులో స్పష్టం చేసింది.
 • ఈ కేసులో ఏపీ సీఎం చంద్రబాబునాయుడితో పాటు ఓ కేంద్రమంత్రికి, మరికొందరు ఎంపీలకు నోటీసులు ఇచ్చి విచారిస్తారని ప్రచారం జరిగింది.
 • ఓటుకు నోటు కేసుకు కౌంటర్‌గా ఏపీ సిఐడి ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును నమోదు చేసింది.
 • సీఎం హోదాలో ఉన్న చంద్రబాబునాయుడితో పాటు పలువురి ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్‌ చేసిందని సీఐడి అధికారులు కేసులు నమోదు చేశారు.
 • ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో నమోదైన కేసులన్నీ ఒకేసారి పరిశోధించి పూర్తి స్థాయిలో కేసు నమోదు చేయడానికి వీలుగా సిట్‌ను కూడా ఏర్పాటు చేశారు.
 • ఈ కేసులో తెలంగాణ సిఎంతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా విచారించే అవకాశం ఉందని ఊహాగానాలు రేగాయి.
 • రెండు ప్రభుత్వాలకు చెందిన దర్యాప్తు సంస్థలు దూకుడుగా దర్యాప్తును సాగించడంతో ఉత్కంఠతకు దారితీసింది.
 • ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య జరుగుతున్న వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సైతం రంగంలోకి దిగిందని... కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇద్దరి మధ్య సయోధ్యకు ప్రయత్నాలు చేశారని ప్రచారం జరిగింది.


మరి దీనిపై ఏపీ ప్రభుత్వం..టిడిపి నాయకత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

13:02 - August 29, 2016

హైదరాబాద్ : ప్రపంచంలోనే.. జనాభాలో రెండో అతిపెద్ద దేశమైన భారత్ లో.. యువజన జనాభా కూడా చాలా ఎక్కువే. అయితే..వాలెంటైన్స్ డే, ఫ్రెండ్ షిప్ డేల గురించి మన నవతరంలో చాలామందికి తెలిసినంతగా..నేషనల్ స్పోర్ట్స్ డే గురించి తెలియదనడంలో ఏమాత్రం సందేహం లేదు. భారత హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి రోజునే మనం జాతీయక్రీడాదినోత్సవంగా జరుపుకొంటూ వస్తున్నాం. ఈ నేపథ్యంలో 69 సంవత్సరాల స్వతంత్ర భారతంలో మన క్రీడారంగ బాగోతం, 1947 నుంచి 2016 వరకూ ప్రపంచ క్రీడారంగంలో భారత ప్రస్థానం పై ప్రత్యేక కథనం..భారత్...ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం. 125 కోట్ల జనాభా, అదీకాకుండా అరవైశాతం యువజనశక్తితో కేరింతలు కొడుతున్న దేశం. అంతరిక్ష విజ్ఞానం, ఐటీ, రక్షణ, సాంకేతిక రంగాలలో భారత్ కు భారత్ మాత్రమే సాటి. అయితే క్రీడా రంగంలో మాత్రం మనదేశ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది.

చెర...
ఏ క్రీడ చూసినా ఏమున్నది గర్వకారణం అనుకొనేలా చేస్తోంది. జాతీయ క్రీడ హాకీ, గ్లోబల్ గేమ్ టెన్నిస్ నుంచి దేశవాళీ క్రీడల వరకూ...క్రీడారంగాన్ని రాజకీయవేత్తలు, బిజినెస్ మాగ్నెట్లు, బ్యూరోక్రాట్లే కబ్జా చేసి చెరపడుతున్నారు. క్రీడల ద్వారా లక్షలు, కోట్లు ఆర్జించిన క్రీడాకారులు సైతం స్పాట్ ఫిక్సింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ ల్లో దోషులుగా దొరికిపోతూ..భారత క్రీడారంగ గౌరవాన్ని మంటగలుపుతున్నారు. ఇటీవలే ముగిసిన 2016రియో ఒలింపిక్స్ లో 118 మంది అథ్లెట్ల భారీ బృందంతో పాల్గొన్న భారతజట్టు..రెండంటే రెండు పతకాలు మాత్రమే. అదీ తెలుగుతేజం పీవీ సింధు అందించిన రజత, హర్యానా రెజ్లర్ సాక్షీ మాలిక్ సాధించిన కాంస్య పతకాల పుణ్యమాఅంటూ పతకాల పట్టికలో చోటు సంపాదించడం ద్వారా తలెత్తుకోగలిగింది.

రియో ఒలింపిక్స్...
రియో ఒలింపిక్స్ లో మొత్తం 206 దేశాలు పోటీకి దిగితే ఏదో ఒక పతకం సాధించిన దేశాలు 78 ఉంటే...అందులో భారత్ స్థానం 67 అంటే..ముక్కుమీద వేలేసుకోవాల్సిందే. మనదేశంలో ఓ జిల్లా, ఓ డివిజిన్ జనాభా సైతం లేని ఫిజీ, కొసావో లాంటి బుల్లిదేశాలు ఓ వైపు బంగారు మోత మోగిస్తుంటే మనదేశం మాత్రం చివరకు మొదటి యాభై దేశాల సరసన నిలువలేకపోతోంది. దేశానికి ఓ పిచ్చిలా పట్టిన క్రికెట్లో అదీ సాంప్రదాయ టెస్ట్, ఇన్ స్టంట్ వన్డే ఫార్మాట్లలో మాత్రమే టీమిండియా పడుతూ లేస్తూ తన ప్రస్థానం కొనసాగిస్తూ వస్తోంది. 2011 వన్డే ప్రపంచ టైటిల్..2013 ఐసీసీ మినీ ప్రపంచకప్ సాధించిన భారత్..2016 టీ-20 ప్రపంచ కప్ సెమీస్ లోనే నిష్క్రమించింది.

పలు ఆరోపణలు..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పేరుతో వ్యాపారం చేస్తున్న భారత క్రికెట్ బోర్డు ప్రతిష్ట స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో పాతాళానికి పడిపోయింది. సుప్రీంకోర్టు మెట్టికాయలు, లోథా కమిటీ సిఫారసులతో భారత క్రికెట్ నియంత్రణ మండలి..గాడిలో పడటానికి నానాపాట్లు పడుతోంది. రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో గతంలో ఎన్నడూలేనంతగా ఏడుగురు సభ్యుల జట్టుతో మూడు విభాగాలలో పోటీకి దిగిన భారత్...చివరకు మహిళల సింగిల్స్ లో పీవీ సింధు సాధించిన రజత పతకంతో తలెత్తుకోగలిగింది. షూటింగ్, కుస్తీ, బ్యాడ్మింటన్, బాక్సింగ్ లాంటి ఒకటి రెండు క్రీడలు మాత్రమే భారత్ కు పతకాలు అందిస్తూ పరువు నిలుపుతున్నాయి.

పలు అవార్డులు సైతం వివాదాస్పదం..
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తూ దేశానికి పేరు తెచ్చే క్రీడాకారులకు ఇచ్చే..అర్జున, రాజీవ్ ఖేల్ రత్న లాంటి అవార్డుల ఎంపికలోనూ వివాదాలు చోటు చేసుకొంటూ..విమర్శలకు తావిస్తున్నాయి. గతంలో ..బాక్సర్ మేరీకోమ్, అథ్లెట్ కృష్ణ పూనియా లాంటి మహిళలు ..క్రీడాపురస్కారాల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి తలెత్తింది. మనదేశంలో జనాభా పెరిగినంత వేగంగా.. క్రీడాసౌకర్యాలు, నైతికవిలువలు పెరగకపోవడం ఓ ప్రధాన లోపంగా, శాపంగా ఉంది. ఇదే పరిస్థితి ఇకముందు ఇలానే ఉంటే క్రీడా రంగంలో కొన్ని దశాబ్దాలపాటు వెనుకపడిపోయే ప్రమాదం లేకపోలేదు. చక్ దే ఇండియా అంటూ సగర్వంగా..ఎలుగెత్తి చాటుకొనే రోజు రావాలని..కనీసం ఈ 70వ స్వాతంత్ర్యదినోత్సవ రోజు నుంచైనా పరిస్థితి మారాలని...ప్రతిభకు పట్టంకట్టే, అవినీతిరహిత, మచ్చలేని క్రీడాభారతాన్ని చూడాలని కోరుకొందాం.

12:56 - August 29, 2016

హైదరాబాద్ : ఆగస్టు 29...జాతీయ క్రీడాదినోత్సవమని...భారత హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ ను గౌరవిస్తూ..ఆ మహనీయుడి జయంతి రోజునే స్పోర్ట్స్ డే వేడుకలు జరుపుకొంటామని.. నేటిమన నవయుతరంలో ఎంతమందికి తెలుసు ?. వలెంటైన్స్ డే, ఫ్రెండ్ షిప్ డేలకు మన మీడియా, కుర్రకారు ఇస్తున్న ప్రాధాన్యం.. జాతీయ క్రీడాదినోత్సవానికి ఇస్తోందా?...సమాధానం కష్టమే. ఈ సందర్భంగా నేషనల్ స్పోర్ట్స్ డే ప్రత్యేక కథనం.. ఆగస్టు 15..స్వాతంత్ర్య దినోత్సం...జనవరి 26 ..భారత గణతంత్ర దినోత్సవం... అయితే అంతే ప్రాధాన్యమున్న ఆగస్టు 29, జాతీయ క్రీడాదినోత్సవాన్ని...మన సమాజం, క్రీడావ్యవస్థ, నవతరం ఏమాత్రం పట్టించుకోడం లేదు. ప్రపంచీకరణ పుణ్యమా అంటూ మనదేశంలో పిజ్జా, బర్గర్ సంస్కృతి..ఓ మహమ్మారిలా అంటుకొంది. మన వాతావరణానికి ఏమాత్రం సరిపడని వలెంటైన్స్ డేకి మీడియా, స్పాన్సర్లు ఇస్తున్న ప్రాధాన్యం...జాతీయ క్రీడాదినోత్సవానికి ఏమాత్రం ఇవ్వడంలేదు. తన దేశగౌరవమే తన గౌరవమన్న స్పృహ రానురాను మనలో తగ్గిపోతోంది. ఆగస్టు 29కి ఉన్న ప్రాముఖ్యత, ధ్యాన్ చంద్ గొప్పతనం ఏమిటో తెలియని ప్రస్తుత ఈ దుస్థితికి..మన ప్రభుత్వాన్ని, సమాజాన్ని, వ్యవస్థల్ని మాత్రమే తప్పుపట్టాలి.

ఒకే ఒక్క క్రీడ హాకీ..
ఒలింపిక్స్ చరిత్రలోనే మనకు అత్యధికంగా..ఎనిమిది బంగారు పతకాలు అందించిన ఒకే ఒక్క క్రీడ హాకీ. అందులో మూడు బంగారు పతకాలు సాధించిన రికార్డు.. మణికట్టు మాంత్రికుడు ధ్యాన్ చంద్ కు మాత్రమే ఉంది. 1928 ఆమ్ స్టర్ డామ్ ఒలింపిక్స్, 1932 లాస్ ఏంజెలిస్, 1936 బెర్లిన్ ఒలింపిక్స్ లో భారత్ వరుసగా మూడు బంగారు పతకాలు గెలుచుకోడంలో ధ్యాన్ చంద్ ప్రధానపాత్ర పోషించారు. బెర్లిన్ ఒలింపిక్స్ లో ధ్యాన్ చంద్ ఆటతీరు, స్టిక్ వర్క్, మణికట్టు మాయాజాలాన్ని చూసి..అలనాటి నాజీ నియంత హిట్లర్ సైతం మంత్రముగ్దుడై పోయాడు. అప్పటికే భారత్ లోని బ్రిటీష్ ఆర్మీలో సిపాయి హోదాలో ఉన్న ధ్యాన్ చంద్ కు మేజర్ హోదా ఇస్తానంటూ ఆశ పెట్టాడు, జర్మన్ సైన్యంలో చేరాలంటూ ప్రలోభ పెట్టాడు. అయితే ధ్యాన్ చంద్ మాత్రం..జర్మన్ సైన్యంలో మేజర్ హోదా కంటే..భారత సైన్యంలో సిపాయిగా ఉండటమే తనకు గౌరవమని సమాధానం చెప్పి..తన దేశభక్తిని చాటుకొన్నారు.

జాతీయ క్రీడాపురస్కారాలు..
బ్రిటీష్ సిపాయిల ద్వారా...మనదేశంలోకి వచ్చిన హాకీ క్రీడకే .. ధ్యాన్ చంద్ మరో పేరుగా నిలిచాడు. ప్రపంచ వ్యాప్తంగా...భారత్ కు, సాంప్రదాయ భారతహాకీకి గుర్తింపు తీసుకువచ్చాడు. భారత హాకీకి ఖ్యాతి తీసుకురావడమేకాదు..జాతీయ క్రీడారంగానికే స్ఫూర్తిగా నిలిచిన ధ్యాన్ చంద్..జన్మించిన రోజు.. ఆగస్టు 29న జాతీయ క్రీడాదినోత్సవం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదేరోజున దేశఅత్యున్నత క్రీడాపురస్కారాలు .. రాజీవ్ ఖేల్ రత్న, అర్జున, ధ్యాన్ చంద్‌ అవార్డులు ప్రదానం చేయడాన్ని ఓ ఆనవాయితీగా ఏర్పాటు చేసింది. అయితే..ఈ ఏడాది సైతం...ఆగస్టు 29న న్యూఢిల్లీ లోని రాష్ట్రప్రతి భవన్ అశోకా హల్ లో జాతీయ క్రీడాపురస్కారాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికైనా...భారత హాకీ పితామహుడు ధ్యాన్ చంద్ ను...భారత రత్న పురస్కారంతో గౌరవించాలని దేశంలోని కోట్లాదిమంది క్రీడాభిమానులతో కలసి 10 టీవీ సైతం కోరుకొంటోంది. హాకీ విజార్డ్ మేజర్ ధ్యాన్ చంద్ కు శాల్యూట్ చేస్తోంది.

రాష్ట్రపతి భవన్ లో ఖేల్ రత్న అవార్డుల ప్రధానం.

ఢిల్లీ : రాష్ట్రపతి భవన్ లో ఖేల్ రత్న అవార్డుల ప్రధానం కార్యక్రమం జరుగుతోంది. అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు గ్రహీతలు అందుకుంటున్నారు.

ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం..

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసును పున:పరిశీలించాలని ఏసీబీ కోర్టులో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సెప్టెంబర్ 29వ లోగా విచారణ పూర్తి చేయాలని ఏసీబీకి ఆదేశించింది. 

రైతులతో బాబు ముఖాముఖి..

చిత్తూరు : జిల్లా పర్యటనలో భాగంగా శెట్టిపల్లిలో రైతులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఫాంపాండ్స్, రెయిన్‌గన్‌లతో పంటలను కాపాడతామని, పంటలను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.  

అమరావతిపై ఎన్జీటీలో పిటిషన్..రేపటికి వాయిదా..

ఢిల్లీ : అమరావతి నిర్మాణంపై నేషనల్‌ గ్రీన్‌ట్రిబ్యునల్‌లో దాఖలైన పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది. రెండు వైపుల న్యాయవాదులు సకాలంలో చేరుకోకపోవడంతో విచారణను గ్రీన్‌ట్రిబ్యునల్‌ రేపటికి వాయిదా వేసింది.

12:12 - August 29, 2016

హైదరాబాద్ : టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఓటుకు నోటు కేసులో అనుకోకండి. జలసౌధ ముట్టడి కార్యక్రమంలో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్ర ఒప్పందాన్ని టి.టిడిపి నిరసన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల విషయంలో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. 'మహా' ఒప్పందాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై ఇప్పటి వరకు విమర్శలు గుప్పించిన టిటిడిపి నేడు రోడ్డెమీదకెక్కింది. ఆ పార్టీకి చెందిన నేతలు..కార్యకర్తలు ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నుండి ఎర్రమంజిల్ వద్దనున్న జలసౌధ కార్యాలయయం ముట్టడికి బయలుదేరారు.
దీనితో పోలీసులు భారీగా మోహరించారు. జలసౌధ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. 'ఇదేమి రాజ్యం..దోపిడి రాజ్యం' అంటూ నినాదాలు మిన్నంటాయి. ఇరువర్గాల మధ్య వాగ్వాదం..తోపులాట చోటు చేసుకుంది. అనంతరం టిడిపి నేతలను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చీకటి రోజు అని, తెలంగాణ రైతాంగాన్ని మహారాష్ట్రకు తాకట్టు పెట్టారని తెలిపారు. దీనిపై శాసనసభలో సమాధానం చెబుతామని, ఈ అంశాన్ని సభలో ప్రస్తావిస్తామన్నారు. 

జలసౌధ వద్ద ఉద్రిక్తత..

హైదరాబాద్ :జలసౌధ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టిడిపి నిర్వహించిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారు. దీనితో అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. 

పవన్ పై ఎంపీ టీజీ ఫైర్..

హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎంపీ టీజీ వెంకటేష్ ఫైర్ అయ్యారు. ఎంపీలపై పవన్ కళ్యాణ్ చేసింది చౌకబారు విమర్శలని, పవన్ అవివేకానికి నిదర్శనమన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు తమిళనాడులో చేస్తే జయలలిత కాళ్లు..చేతులు విరగ్గొట్టించేది అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలని సూచించారు. 

శెట్టిపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటన..

చిత్తూరు : గుడిపల్లి (మం) శెట్టిపల్లిలో వేరుశనగ పంటలను సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. రెయిన్ గన్ పనితీరును అధికారులు, రైతులను అడిగి తెలుసుకున్నారు. 

అనంతలో మంత్రి దేవినేని పర్యటన...

అనంతపురం : గొల్లపల్లి రిజర్వాయర్ ను మంత్రి దేవినేని ఉమ పరిశీలించారు. హంద్రీనీవా రెండవ దశ కాల్వ పనుల పురోగతిపై క్షేత్రస్థాయిలో పరిశీలన ఉంటుందని తెలిపారు. 

రేపటి నుండి అనంతలో బాబు మకాం..

అనంతపురం : రేపటి నుండి జిల్లాలో సీఎం చంద్రబాబు మకాం వేయనున్నారు. కరవు పరిస్థితులను ప్రత్యక్షంగా సీఎం చంద్రబబు పర్యవేక్షించనున్నారు. అనంతకు అదనంగా 1950 రెయిన్ గన్ లను తరలించారు. ప్రకాశం నుండి 1200, గుంటూరు 500, కృష్ణా 150, కర్నూలు నుండి 100, అవసరమైన మండలాలకు రెయిన్ గన్ లను నేరుగా తరలించనున్నారు. 

ఎమ్మెల్యే యరపతినేని హౌస్ అరెస్టు..

గుంటూరు : పిడుగురాళ్ల టిడిపి కార్యాలయంలో గురజాల ఎమ్మెల్యే యరపతినేని పోలీసులు గృహ నిర్భందం చేశారు. పోలీసులు భారీగా మోహరించారు. 

'హోదా' ఇవ్వాలి - కేఈ..

చిత్తూరు : కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిప్యూటి సీఎం కేఈ పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడడం హర్షణీయమన్నారు. ప్రత్యేక హోదాపై వెనక్కి తగ్గేది లేదని, హోదాపై కేంద్రం సాకులు చెబుతోందన్నారు. 

సచివాలయంలో సీపీఎం కరపత్రాల పంపణీ..

గుంటూరు :సెప్టెంబర్ 2 సార్వత్రిక సమ్మె సందర్భంగా సచివాలయంలో సీపీఎం నాయకులు కరపత్రాలను పంపిణీ చేశారు. సార్వత్రిక సమ్మెలో కార్మికులు అందరూ పాల్గొనాలని రాజధాని ప్రాంత సమన్వయ కమిటీ కార్యదర్శి బాబురావు పేర్కొన్నారు. కనీస వేతనం, కార్మిక చట్టాల డిమాండ్లతో సమ్మె చేపట్టినట్లు తెలిపారు. 

కాశ్మీర్ లో కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ ఎత్తివేత..

కాశ్మీర్ : కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూను ఎత్తివేశారు. పుల్వామా జిల్లా, శ్రీనగర్ లోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. 52 రోజులుగా జనజీవనం స్తంభించిన సంగతి తెలిసిందే. సాధారణ పరిస్థితులు నెలకొల్పోందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేపట్టాయి. 

11:28 - August 29, 2016

హైదరాబాద్ : 'మహారాష్ట్ర' ప్రభుత్వంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై టి.టిడిపి గుర్రుగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు..మభ్యపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. మహా ఒప్పందం ఒక బూటకమని, పచ్చి అబద్ధమని నేతలు తెలిపారు. మహా ఒప్పందాన్ని నిరసిస్తూ నేడు టి.టిడిపి జలసౌధ ముట్టడికి పిలుపునిచ్చింది. అందులో భాగంగా టి.టిడిపి నేతలు భారీగా ఎన్టీఆర్ ట్రస్టు భవన్ వద్దకు చేరుకున్నారు. ముందస్తుగా పోలీసులు భారీగా మోహరించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ మీడియాతో మాట్లాడారు.

కొత్త నాటకం - రమణ.
రీ డిజైన్ లో భాగంగా ప్రభుత్వం కొత్త నాటకానికి తెరలేపిందని, అందులో భాగమే మహారాష్ట్రతో ఒప్పందం అని పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని, ఇందుకు మినిట్స్ సాక్ష్యమన్నారు. రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తోందని, రైతు రుణమాఫీ అమలు కావడం లేదన్నారు. ఇవన్నీ పక్కదారి పట్టించేందుకు ఇలా చేస్తున్నారని తెలిపారు. అందులో భాగంగా జలసౌధ ముట్టడి చేపట్టినట్లు తెలిపారు. ఒక జిల్లాకు పరిమితమయ్యే విధంగా ప్రాజెక్టు రూపకల్పన చేస్తున్నారని, ఉన్నత వర్గాలకు మేలు చేసే విధంగా ప్రభుత్వం యత్నిస్తోందన్నారు.

కాంట్రాక్టుల కోసమే - రేవంత్..
కొద్ది మంది కాంట్రాక్టుల కోసం ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని, ప్రస్తుతం మహారాష్ట్రతో ఒప్పందం వల్ల ప్రాజెక్టు విలువ రూ. 50వేల కోట్లకు పెరిగిందని టి.టిడిపి నేత రేవంత్ తెలిపారు. 4700 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని, విద్యుత్ కోసం కోట్ల వ్యయం అవుతుందన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం వత్తిడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గిందని, ప్రపంచ బ్యాంకు..ఇతరత్రా నుండి అప్పులు తీసుకొచ్చి ప్రజలపై పెనుభారం మోపుతుందన్నారు. బీజేపీ సహకారంతో అఖిలపక్షాన్ని ప్రధాన మంత్రి వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు. రెండు వేల ఎకరాలను మహారాష్ట్ర నుండి భూమి ఇచ్చే ఏర్పాటు ప్రధాన మంత్రి చేయరా ? ప్రధాన మంత్రిని సీఎం కేసీఆర్ ఎందుకు కలువలేదని ప్రశ్నించారు. పెంచే విద్యుత్ ఛార్జీలను తెలంగాణ రైతాంగం భరించే అవసరం ఏర్పడుతుందని రేవంత్ తెలిపారు. 

అన్యాయం జరుగుతోంది - శోభారాణి..
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతోందని తెలుగు మహిళా అధ్యక్షురాలు శోభారాణి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటామని, లాఠీలతో ఉద్యమాలు అణిచివేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నించడం సరికాదన్నారు. పోలీసులను పెట్టి ర్యాలీని ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించారు. ఆ రోజు పోలీసులు వస్తే అన్యాయం అన్నారు..ఇప్పుడు మాత్రం పోలీసుల చేత అణిచివేసే విధంగా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. 

11:20 - August 29, 2016

తూర్పుగోదావరి : ఏపీ మంత్రి యనమల సొంత నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దివిస్ ల్యాబ్స్ నిర్మాణం వద్దని గ్రామస్తులు చెబుతున్నా ప్రభుత్వం వినిపించుకోవడం లేదు. కాలుష్యం వెదజల్లే ప్రాజెక్టులను ఎలా నిర్మిస్తారంటూ గత కొన్ని రోజులుగా స్థానికులు ఆందోళన చేపడుతున్నారు. అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నా ప్రాజెక్టును ఎందుకు చేపడుతున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సోమవారం గ్రామల్లోకి చేరుకున్న పోలీసులు పలువురు ఆందోళనకారులను అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. పోలీసులపై గ్రామస్తులు తిరగబడ్డారు. ఇద్దరిని అరెస్టు చేసి తీసుకెళుతుంటే ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీనితో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. 

టి.టిడిపి ర్యాలీ..ఉద్రిక్తత...

హైదరాబాద్ : జలసౌధ ముట్టడికి టి.టిడిపి నేతలు బయలుదేరారు. వీరి ర్యాలీని అడ్డుకోవడానికి పోలీసులు మోహరించారు. దీనితో ఎన్టీఆర్ ట్రస్టు భవన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. 

పంపాదిపేటలో ఉద్రిక్తత..

తూర్పుగోదావరి : దివిస్ ల్యాబ్స్ నిర్మాణానికి వ్యతిరేకంగా తొండంగి మండలం పంపాదిపేటలో స్థానికులు ఆందోళన నిర్వహించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇద్దరిని అరెస్టు చేసి తీసుకెళుతుంటే ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీనితో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. 

10:57 - August 29, 2016

అమెరికా : మళ్లీ అమెరికాలో కాల్పుల మోత వినిపించింది. లాస్ ఏంజిల్స్ ఎయిర్ పోర్టులో కాల్పులు కలకలం సృష్టించాయి. భద్రతా దళాలు, ఎయిర్ పోర్టును మూసివేసి ప్రయాణికులను బయటకు పంపించి వేశారు. కాల్పులకు పాల్పడ్డాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అసలు తుపాకితో ఎయిర్ పోర్టులోకి ఎలా ప్రవేశించాడనేది తెలియరాలేదు. ఈ ఘటనలో ఎవరికి ప్రాణహాని కలుగలేదని తెలుస్తోంది. ఎయిర్ పోర్టును తమ అధీనంలోకి తీసుకున్న భద్రతా దళాలు అణువణువూ గాలిస్తున్నాయి. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

10:54 - August 29, 2016

గుంటూరు : పల్నాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాచర్ల..గురజాల నియోజకవర్గాల్లో 144 సెక్షన్ అమలులో ఉంది. మాచర్లలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు ఇప్పటికే హౌస్ అరెస్టు చేశారు. టిడిపి నేత యరపతినేని శ్రీనివాసరావు ఇంటి ఎదుట భారీగా పోలీసులు మోహరించారు. దీనికంతటికి కారణంగా వీరిద్దరూ సవాల్ విసురుకున్నారు. వీరిద్దరి మధ్య కొద్ది రోజులుగా మాటల యుద్ధం నడుస్తోంది. కృష్ణా పుష్కారాల్లో భారీగా అవినీతి జరిగిందని, యరపతనేని భాగస్వామ్యం ఉందని పిన్నెల్లి ఆరోపణలు గుప్పించారు. దీనిపై బహిరంగచర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. పిన్నెల్లి విసిరిన సవాల్ ను యరపతనేని స్వీకరించారు. ఇందుకు నడికుడి మార్కెట్ యార్డు వేదికగా నిర్ణయించారు. చర్చకు వెళ్లేందుకు వీరు సిద్ధపడ్డారు. దీనితో సోమవారం ఉదయం పోలీసులు రంగ ప్రవేశం చేసి ముందస్తుగా నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఒక్కసారిగా నియోజకవర్గాల్లో హై టెన్సన్ వాతావరణం నెలకొంది. 

10:49 - August 29, 2016

హైదరాబాద్ : ఎన్ కౌంటర్ లో హతమైన గ్యాంగ్ స్టర్ నయీం అనుచరులను పట్టుకొనేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 39 మందిని అరెస్టు చేసిన సిట్ తాజగా మరొకరిని అదుపులోకి తీసుకుంది. వనస్థలిపురంలో నయీం మరో అనుచరుడు నరేందర్ రెడ్డి ఉన్నట్లు సిట్ అధికారులకు సమాచారం అందించింది. వెంటనే అక్కడకు చేరుకున్న సిట్ అధికారులు నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకన్నారు. ఆదిభట్ట ప్రాంతంలో భూ కబ్జా కేసులో సంజీవరెడ్డితో కలిసి నయీంకు నరేంద్ర రెడ్డి సహకరించాడని సిట్ భావిస్తోంది. నయీం ఆగడాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 60 మంది పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇందులో ఆదిభట్ట ప్రాంతానికి చెందిన ఫిర్యాదులు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

చైనాలో బస్సు ప్రమాదం..

చైనా : గువాంగ్జీ జువాంగ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణీకులతో వెళుతున్న బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈఘటనలో పది మంది మృత్యువాతపడ్డారు. 

లాస్ ఏంజిల్స్ లో కాల్పులు..

అమెరికా : లాస్ ఏంజిల్స్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. వెంటనే స్పందించిన భద్రతా దళాలు, ఎయిర్ పోర్టును మూసివేసి ప్రయాణికులను బయటకు పంపించి వేశారు. కాల్పులకు పాల్పడ్డాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

గుంటూరులో హై టెన్షన్..

గుంటూరు : జిల్లాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మాచర్లలో స్థానిక ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు గృహ నిర్భందం చేశారు. టిడిపి నేత యరపతినేని శ్రీనివాసరావు ఇంటి ఎదుట భారీగా పోలీసులు మోహరించారు. 

వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు..

కరీంనగర్ : చివరి శ్రావణ సోమవారం కావడంతో వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి దర్శనానికి 8గంటల సమయం పడుతోంది. 

వెంకన్న బావి వద్ద రోడ్డు ప్రమాదం..

కర్నూలు : వెంకన్న బావి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ - అంబులెన్స్ లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. 

రాజధానిలో శిశు సంక్షేమ శాఖ ఆఫీసు ప్రారంభం..

గుంటూరు : వెలగపూడి తాత్కాలిక సచివాలయం మూడో బ్లాక్ మొదటి అంతస్తులో శిశు సంక్షేమ శాఖ కార్యాలయాన్ని మంత్రి పీతల సుజాత ప్రారంభించారు. తన శాఖకు చెందిన కార్యదర్శుల ఛాంబర్లను మంత్రి పీతల ప్రారంభించారు. 

09:24 - August 29, 2016

హైదరాబాద్ : నెల రోజుల క్రితం ఫిల్మ్ నగర్ లో ఘటన ఇంకా మరిచిపోక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న పిల్లర్లు కూలిపోయాయి. ఈఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మాదపూర్ అయ్యప్ప సొసైటీ లోని సరోజినగర్ లో ఓ భవంతి నిర్మాణం అవుతోంది. మూడు ఫ్లోర్ ల నిర్మాణం కోసం అనుమతిని తీసుకున్నట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం విధుల్లోకి 20 మంది కూలీలు చేరుకున్నారు. పనులు చేస్తుండగా ఓ పిల్లర్ అకస్మాత్తుగా కూలిపోయింది. దీనితో అక్కడ పనిచేస్తున్న నలుగురు కూలీలకు గాయాలయ్యాయి. వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వీరు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వారని తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

నగరంలో కుప్పకూలిన మరో భవనం..

హైదరాబాద్ : మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని సరోజినగర్ లో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. ఈఘటనలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించారు. 

09:13 - August 29, 2016

డీజే అంటే ? డీజే అంటే తెలియదా ? డిస్కో జాకీ అంటారు. పార్టీలు..క్లబ్బులో కనిపిస్తుంటారు కదా. అని అంటారు. కదా కానీ డీజేకి 'బన్నీ' కొత్త అర్థం చెబుతున్నాడు. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ న్యూ ఫిలిం 'డీజే' ప్రారంభమైంది. ఈ చిత్రానికి సంబంధించిన ముహర్తపు షాట్ సన్నివేశ ఫొటోలను 'బన్నీ' తన ట్విట్టర్ ద్వారా ట్వీట్స్ చేశారు. డీజే అంటే పార్టీలు..క్లబ్బులో కనిపించే డిస్కో జాకీ మాత్రం కాదు. డీజే..అంటే 'దువ్వాడ జగన్నాథమ్' అని బన్నీ అంటున్నాడు.
'సరైనోడు' సక్సెస్ తరువాత 'బన్నీ' ఈ చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నాడు. 'మిరపకాయ్', 'గబ్బర్ సింగ్', 'సుబ్రమణ్యం ఫర్ సేల్' లాంటి సినిమాలతో కమర్షియల్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న 'హరీష్', 'బన్నీ' స్టైల్‌కి సరిపడేలా మంచి కమర్షియల్ కథను సిద్ధం చేశారని టాక్. 'బన్నీ' కోసం డిజైన్ చేసిన పాత్ర కూడా అదిరిపోయేలా ఉందని చిత్ర యూనిట్ భావిస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దిల్ రాజు ప్రోడక్షన్ లో వస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. డీజే అంటే ఏమిటీ ? అల్లు అర్జున్ సరసన హీరోయిన్ ఎవరు ? తదితర వివరాలు కొద్ది రోజుల్లో తెలవనున్నాయి. 

నేడు చిరు..దాసరిని కలువనున్న ముద్రగడ..

హైదరాబాద్ : కాపు ఉద్యమ నేత ముద్రగడ నేడు చిరంజీవి, దాసరి నారాయణరావులతో భేటీ కానున్నారు. ఏపీలో కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ముద్రగడ ఉద్యమం చేపడుతున్న సంగతి తెలిసిందే. 

కాసేపట్లో టి.టిడిపి జలసౌధ ముట్టడి..

హైదరాబాద్ : హైదరాబాద్‌లోని జలసౌధ వద్ద టీ టీడీపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా, నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టనుంది. 

08:58 - August 29, 2016

అందమైన చిరునవ్వు..ఆకట్టుకొనే రూపం..రొమాంటిక్ లుక్..మ్యాన్లీ నేచర్..కలగలిస్తే 'నాగార్జున'..ఎంత వయసొచ్చినా ఇంకా నవ యువకుడిలా కనిపించడం ఆయన స్టైల్ . అందుకే ఆయన్ను టాలీవుడ్ 'మన్మథుడు' అంటూంటారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా 'నాగార్జున' సినీ ప్రస్థానంపై ప్రత్యేక కథనం..ఇమేజ్ చట్రంలో బందీ అయిపోయిన టాలీవుడ్ హీరోయిజాన్ని సైకిల్ చెయిన్ తో బైటికి లాగిన న్యూ వేవ్ హీరో 'నాగార్జున'. కొత్తదనానికి పెద్ద పీట వేయడమే తన సిద్ధాంతమని చాటిచెప్పిన ట్రెండ్ సెట్టర్ ఆయన. ప్రయోగాలకు ఏ మాత్రం భయపడని హీ మ్యాన్ 'నాగార్జున'. గోల్డెన్ స్పూన్ తో పుట్టిన 'నాగార్జున' కి అసలు సినిమాల్లోకి రావల్సిన అవసరం లేదు. తన కుంటూ ఒక మార్కు ఉండాలనుకున్నారు. అలా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చారు.

బాధ్యత...
చదువు సంధ్య కలిగినోణ్ణి 'అక్కినేని' అంతటోడ్ని అని ఆయన 'విక్రమ్' టైమ్ లోనే కాలర్ ఎగరేసి ఉంటే ఇంత సుదీర్ఘమైన కెరీర్ ను కొనసాగించేవారే కాదు. హిట్టైతే హీరో, ప్లాపైతే జీరో అనే ఫీలింగ్సేమీ పెట్టుకోకుండా తన బాధ్యత తాను సక్రమంగా నిర్వర్తించారు 'నాగార్జున'. కొత్తదనానికి పెద్ద పీట వేయడం, కొత్త దర్శకులకు అవకాశమివ్వడం 'నాగ్' తన కెరీర్ బిగినింగ్ నుంచి చేస్తూ వచ్చారు. కమర్షియల్ సూత్రాల్ని పాటిస్తూనే కొత్త కథలతో సినిమాలు తీసే చాలా మంది దర్శకుల్ని ప్రోత్సహించారు 'నాగార్జున'. ఆ ప్రయత్నంలో కొన్ని ప్లాపులొచ్చినా, చాలా వరకూ సక్సెస్ అందుకున్నారు. 'నాగార్జున' కెరీర్ ను అనూహ్యమైన మలుపు తిప్పిన సినిమా 'శివ'. ఈ సినిమాతో టాలీవుడ్ లో మూస మాస్ ట్రెండ్ పూర్తి గా తుడిచిపెట్టుకుపోయింది. అప్పటివరకు తెలుగు సినిమా కథ ఫార్ములానే మారిపోయింది.

మాస్, క్లాస్ ఏదైనా సరే 'నాగార్జున'కి ఒకటే. అవసరమనుకుంటే పక్కా మాస్ గా మారగలడు, లేకుంటే పెర్ఫెక్ట్ క్లాస్ గా రాగలడు. ఈ రెండింట్లోనూ 'నాగార్జున' బోలెడన్ని సక్సెసుల్ని ఆస్వాదించారు. 'నాగార్జున' క్లాస్, మాస్ లాంటి జానర్స్ లోనే కాదు డివోషనల్ జానర్ లో కూడా సమర్ధవంతంగా రక్తి కట్టించగలనని నిరూపించుకున్నారు. అంతేకాదు ఆ జానర్ ను రొటీన్ కు భిన్నంగా ఉంటుందని కూడా ఆయన భావిస్తుంటారు. ఆ ట్రెండ్ నుంచి ఈ ట్రెండ్ వరకూ తన పర్సనాలిటీతో గ్రీకు వీరుడిగానే కొనసాగుతున్న 'అక్కినేని నాగార్జున', తన తనయులతో కూడా పోటీ పడగలనని నిరూపించుకుంటున్నారు. 'నాగచైతన్య', 'అఖిల్' లకన్నా 'నాగే' ఇంకా స్టైలిష్ గా కనిపిస్తుండడం నిజంగా చాలా గ్రేట్. అందుకే 'నాగార్జున' ఎప్పుడూ టాలీవుడ్ కు గ్రీకు వీరుడే. మరోసారి 'నాగార్జున' కు బర్త్ డే విషెస్ తెలుపుకుంటోంది 10 టివి. 

08:35 - August 29, 2016

హైదరాబాద్ : కేసీఆర్‌ తన బంధువుల భూములను ముంపు నుంచి తప్పించేందుకు పాములపర్తి రిజర్వాయర్‌ను 21 టీఎంసీల నుంచి 7 టీఎంసీల సామర్థ్యానికి తగ్గించారని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి విమర్శించారు. పాములపర్తి రిజర్వాయర్‌ సామర్థ్యం తగ్గింపు విషయం అబద్దమైతే తనపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసుకోవచ్చని రేవంత్‌ సవాల్‌ విసిరారు. మహా ఒప్పందం వల్ల తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరగదని మామా, అల్లుళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి జిలాల్లో తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టి కేసీఆర్‌ సర్కార్‌ సంబురాలు చేసుకుంటుందని టీ - టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మహా ఒప్పందాల వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్న ప్రతిపక్షాలను సీఎం బెదిరిస్తున్నారని ఆయన అన్నారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే ఆదిలాబాద్‌ జిల్లాలోని రెండు లక్షల ఎకరాలకు మాత్రమే నీరందుతుందని, మిగతా జిల్లాలకు నీరు అందదని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు.

మహా ఒప్పందాలు అక్రమం..
రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు డీపీఆర్‌ లేకుండానే సంబంధిత రైతులకు నష్టపరిహారం చెల్లించి భూ సేకరణ చేస్తున్నారని, ఎవరూ కోరకపోయినా పాములపర్తి రిజర్వాయర్‌ నీటి సామర్థ్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోందని రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. పక్కనే ఉన్న మల్లన్నసాగర్‌ను తక్కువ సామర్ధ్యంతో నిర్మించాలని స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే వారిపై లాఠీఛార్జ్‌ చేయించి అక్రమ కేసులు బనాయించారని ఆయన ఆరోపించారు. పాములపర్తి రిజర్వాయర్‌ భూముల్లో ముఖ్యమంత్రి బంధువులకు సంబంధించిన 263 ఎకరాల భూమి ఉండటంతో రిజర్వాయర్‌ను 7 టీఎంసీలకు తగ్గించారని రేవంత్‌ ఆరోపించారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో కేసీఆర్‌ చేసుకున్న ఒప్పందాలు అక్రమం అన్న రేవంత్‌రెడ్డి.. అందుకు నిరసనగా సోమవారం హైదరాబాద్‌లోని జలసౌధ వద్ద టీ టీడీపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. కేసీఆర్‌ది కుటుంబ పాలన అంటూ రేవంత్‌ విరుచుకుపడ్డారు. జీఎస్టీ బిల్లు ఆమోదం కోసమే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నా... మహా ఒప్పందాలు, కరవు, రైతు రుణమాఫీ అంశాలపై సుదీర్ఘ చర్చ జరగాల్సి ఉందని రేవంత్‌రెడ్డి అన్నారు. 

08:29 - August 29, 2016

విజయవాడ : ముందుకు ఒకటి చెప్పడం..తరువాత మరొకటి చేయడం అంటే ఇదేనేమో...అధికారంలోకి రాకముందు ఒక మాట..అధికారంలోకి వచ్చిన తరువాత పాలకులు మరొక మాట మాట్లాడుతుండడం తెలిసిందే. ఇందుకు తాజా ఉదాహరణ ఏపీ ప్రభుత్వం. మచిలీపట్నం బందర్ పోర్టులో భూములును భూ సమీకరణ ద్వారా తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం మాట తప్పింది. భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. 14,427.06 ఎకరాల భూ సేకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 6 గ్రామాల్లో మచిలీపట్నం ఓడరేవు అభివృద్ధికి 2282.20 ఎకరాలు... 21 గ్రామాల్లో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు 12,144.86 ఎకరాల భూమి సేకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 12 నెలల పాటు నోటిఫికేషన్ అమలులో ఉండనుంది. రాజధాని రైతులకు ఇచ్చిన ప్యాకేజీ అమలు చేస్తామని తొలుత ప్రభుత్వం పేర్కొంది. కానీ భూ సమీకరణ అని భూ సేకరణకు నోటిఫికేషన్ ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 

08:09 - August 29, 2016

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై టీడీపీ ముప్పేట దాడి ప్రారంభించింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనపై ఏపీ ఎంపీలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటూ పవన్ కల్యాణ్‌ చేసిన విమర్శలపై పార్టీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. అవగాహనాలోపం, అనుభవరాహిత్యంతో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు. మరోవైపు ఏపీ రాజధానిలో స్విస్ ఛాలంజ్ విధానంపై హైకోర్టు తీర్పును వెలువరించనుంది. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో తులసీరెడ్డి (కాంగ్రెస్), శ్రావణ్ కుమార్ (టిడిపి), తెలకపల్లి రవి (విశ్లేషకులు), నల్లబోలు విష్ణు (బీజేపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారు ఎలాంటి అభిప్రాయాలు వెల్లడించారో వీడియోలో చూడండి. 

స్విస్ ఛాలెంజ్ బిడ్ల దాఖలకు గడువు పెంపు...

విజయవాడ : స్విస్ ఛాలెంజ్ బిడ్ల దాఖలుకు గడువు పెంపుకు నిర్ణయం తీసుకున్నారు. సవరణ ప్రకటనను సీఆర్డీఏ విడుదల చేసింది. రాజధాని ప్రధాని అభివృద్ధి దారి ఎంపిక వ్యవహారంలో పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. 

వనస్థలిపురంలో నయీం మరో అనుచరుడు..

హైదరాబాద్ : వనస్థలిపురంలో నయీం మరో అనుచరుడు నరేందర్ రెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదిభట్ట ప్రాంతంలో భూ కబ్జా కేసులో సంజీవరెడ్డితో కలిసి నయీంకు నరేంద్ర రెడ్డి సహకరించాడని సిట్ భావిస్తోంది. 

బందర్ పోర్టు భూ సేకరణకు నోటిఫికేషన్..

విజయవాడ : బందర్ పోర్టు భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. 14,427.06 ఎకరాల భూ సేకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మచిలీపట్నం ఓడరేవు అభివృద్ధికి 2282.20 ఎకరాలు...పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు 12,144.86 ఎకరాల సేకరణకు నిర్ణయం తీసుకున్నారు. 12 నెలల పాటు నోటిఫికేషన్ అమలులో ఉండనుంది. భూ సమీకరణ అని భూ సేకరణకు నోటిఫికేషన్ ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 

07:46 - August 29, 2016

తృణధాన్యాలైన రాగులు శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. కాల్షియం, ప్రొటీన్లు, మినరల్స్‌తో పాటు శరీరానికి కావల్సిన పోషకాలన్నీ రాగుల్లో ఉంటాయి. అందుకే మనం తీసుకునే ఆహారంలో రాగులతో తయారు చేసే రాగి సంగటి, రాగితో చేసిన వంటకాలను తీసుకుంటే బాగుంటుందని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. మరి రాగులు వాడడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు దాగున్నాయో చూద్దాం..
రాగుల్లో ప్రొటీన్స్, మినరల్స్, ఫైబర్ అధికంగా ఉంటాయి. రాగులలో లో ఫ్యాట్ తక్కువగా ఉండటమే కాదు.. ఇవి త్వరగా జీర్ణమవుతాయి.
రాగి పిండితో తయారు చేసే ఆహారాలు తీసుకోవడం వల్ల అదనపు క్యాలరీలు గ్రహించకుండా చూస్తుంది.
రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. రాగులు బలవర్దకమయిన ధాన్యం. నిలోని కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది.
మహిళల ఎముకల పటుత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్ ను తాగడం మంచిది. రాగి మాల్ట్ ఎముకల పటుత్వానికి ధాతువుల నిర్మాణానికి తోడ్పడుతుంది.
రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలు రాగి గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం తీసుకోవడం వల్ల మధుమేహానికి చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. 

నేడు రాజీవ్ ఖేల్ రత్న అవార్డుల ప్రధానం..

ఢిల్లీ : నేడు ఒలింపిక్స్ విజేతలకు రాజీవ్ ఖేల్ రత్న అవార్డుల ప్రధానం జరగనుంది. ఖేల్ రత్న అవార్డులను రాష్ట్రపతి ప్రధానం చేయనున్నారు. 

07:05 - August 29, 2016

భారతీయ ఫార్మా రంగాన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల భయం వెన్నాడుతోంది. 1970 తర్వాత మంచి వృద్ధి రేటు సాధించిన స్వదేశీ ఫార్మా రంగాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వ నిర్ణయాలు చివరకు ఏ గతి పట్టిస్తాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. భారతదేశ ఫార్మారంగం భవిష్యత్ ఏమిటి? అన్న ప్రశ్న కొంతకాలంగా చర్చకు వస్తోంది. 1970 కి పూర్వపు రోజులు వస్తాయోమనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇందుకు కారణం కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలే. 1970 కి పూర్వం మన దేశంలోని ఫార్మారంగాన్ని, మందుల ధరలను విదేశీ బహుళజాతి సంస్థలే శాసించేవి. అప్పట్లో తీసుకొచ్చిన పేటెంట్ చట్టం చక్కటి మార్పులు తీసుకొచ్చింది. స్వదేశీ ఫార్మారంగం నిలదొక్కుకోవడమే కాకుండా, విదేశీ బహుళజాతి సంస్థలకు ధీటైన జవాబిచ్చింది. ప్రభుత్వరంగంలోని ఐడిపిఎల్, కెఏపిఎల్, హెచ్ఏఎల్, బెంగాల్ కెమికల్స్ లాంటి సంస్థలు అత్యుత్తమ మందులను అతి తక్కువ ధరలకే తీసుకొచ్చాయి. టీబీ వ్యాధి నిర్మూలనలో దివ్య ఔషధంలా పని చేసే స్టెప్టోమైసిన్ అనే మందును ఐడిపిఎల్, హెచ్ఏఎల్ సంస్థలు అతి తక్కువ ధరకే ఉత్పత్తి చేసి, అనేక మంది ప్రజల ప్రాణాలను కాపాడాయి.

నిర్ణయాల మార్పు...
అధిక రక్తపోటు నివారణకు ఉద్దేశించిన ఆమ్లోడిపిన్ అనే మందును 10 టాబ్లెట్ల షీట్ ను ఫైజర్ అనే విదేశీ బహుళ జాతి కంపెనీ 300 రూపాయలకు అమ్మితే, మన దేశానికి చెందిన రెడ్డీస్ ల్యాబ్ కేవలం పాతిక రూపాయలకే అమ్మింది. బ్లడ్ కేన్సర్ ట్రీట్ మెంట్ కు వాడే గ్లేవిక్ అనే మందును నోవర్టిస్ అనే విదేశీ కంపెనీ లక్షా 18 వేలకు అమ్మితే, నాట్కో అనే భారతీయ కంపెనీ కేవలం 8200కే అమ్మింది. ఇలా అనేక సంచలనాలు సృష్టిస్తూ, తక్కువ ధరకే మందులు ఉత్పత్తి చేయగలగడానికి కారణం 1970లలో ఆనాటి భారత ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలే. మోడీ ప్రభుత్వం వీటిన్నింటినీ మార్చేస్తోంది. ఫార్మారంగంలో వందశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతిస్తోంది. ఫార్మా రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు రెండు రకాల అనుమతులున్నాయి. వీటిలో ఒకటి గ్రీన్ ఫీల్డ్ కాగా మరొకటి బ్రౌన్ ఫీల్డ్ విధానం. గ్రీన్ ఫీల్డ్ పద్ధతిలో పెట్టుబడి పెట్టాలంటే సాంకేతికతను తీసుకురావాలి. కర్మాగారాలు స్థాపించాలి. ఉత్పత్తి చేసి అమ్ముకోవాలి.

వంద శాతం పెట్టుబడులు..
ఈ విధానంలో వందశాతం పెట్టుబడులకు అవకాశమిచ్చారు. బ్రౌన్ ఫీల్డ్ విధానంలో వచ్చేవారు ఇవేవీ చేయకుండానే నేరుగా ఇక్కడి కంపెనీలను కానీ, అవి తయారు చేసే బ్రాండ్ లను కాని కొనుక్కోని నేరుగా అమ్ముకోవచ్చు. బ్రౌన్ ఫీల్డ్ లో 74శాతం పెట్టుబడులకు అవకాశం కల్పించింది మోడీ ప్రభుత్వం. దీనివల్ల భారతదేశ వినియోగదారులకు జరిగే మేలేమీ లేదు. స్వదేశీ కంపెనీలు విదేశీ సంస్థల చేతుల్లోకి వెళ్లడం ఖాయం. వాటి గుత్తాధిపత్యం పెరిగితే ధరలు అమాంతం పెరుగుతాయన్న భయాలున్నాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయంటూ చేస్తున్న ప్రచారంలోనూ నిజం లేదు. 2006 నుంచి 2015 వరకు 48వేల కోట్ల రూపాయల విలువైన ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినా కొత్త ఉద్యోగాలేవీ పెరగలేదు. పైగా ఉద్యోగుల సంఖ్యను కుదిస్తున్నారు. ఇందుకు ఉదాహరణ అబోట్ కంపెనీ. 2010లో అబోట్ కంపెనీ నిచోలాస్ పెరమాల్ అనే కంపెనీని కొనుక్కుంది. అప్పుట్లో నిచోలస్ పరమాల్ కంపెనీలో 7200 మంది ఉద్యోగులుండేవారు. అది అబోట్ చేతిలోకి వెళ్లిన తర్వాత ఉద్యోగుల సంఖ్య 4వేలకు పడిపోయింది. ఫార్మా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కొత్త ఉద్యోగాలను సృష్టించకపోగా, వున్న ఉద్యోగాలనే పీకేస్తున్నాయి. రానురాను ఈ ధోరణి మరింత పెరగే ప్రమాదం వుందంటున్నాయి. 

06:47 - August 29, 2016

సెప్టెంబర్ 2 సమ్మె సన్నాహాలు జోరందుకున్నాయి. దేశ వ్యాప్త సమ్మెను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్మిక సంఘాలు అందుకు తగ్గట్టే ప్రచారం సాగిస్తున్నాయి. ఈ సమ్మెలో మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ కూడా పాల్గొంటున్నారు. సెప్టెంబర్ 2 సమ్మె సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముందు మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ పెడుతున్న ప్రధాన డిమాండ్స్ ఏమిటి? ఫార్మా రంగంలోకి వంద శాతం ఎఫ్ డిఐలను అనుమతించడం, ఆన్ లైన్ బిజినెస్ ను ప్రోత్సహించడం వల్ల ఎలాంటి ప్రభావం పడుతోంది? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ నేత కామేశ్వరరావు విశ్లేషించారు. ఎలాంటి విశ్లేషణ అందించారో వీడియోలో చూడండి. 

06:43 - August 29, 2016

ఫ్లోరిడా : అనూహ్య ఓటమికి ప్రతికారం తీర్చుకోవాలని టీమిండియా భావించింది. అనుకున్నట్లుగానే టీ-20 రెండో మ్యాచ్ లో విండీస్ ను తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. అందరూ టీమిండియాదే విజయం అనుకున్నారు. కానీ వరుణుడు షాక్ ఇచ్చాడు. రెండు మ్యాచ్ ల సిరీస్ ను కరీబియన్లు 1-0తో కైవసం చేసుకున్నారు. అమెరికా గడ్డపై తొలిసారి జరుగుతున్న టీ.20 సిరీస్‌ లో మొదటి మ్యాచ్ లో భారత్ ఒక్క పరుగు తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. రెండో టీ -20 మ్యాచ్ లో విజయం సాధించాలని ధోని సేన బరిలోకి దిగింది. తొలుత టాస్ గెలుచుకున్న ధోని ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ విండీస్ బ్యాట్స్ మెన్స్ ను కట్టడి చేశారు. బిన్నీ స్థానంలో జట్టులోకి వచ్చిన స్పిన్నర్ మిశ్రా బౌలింగ్ ను ఎదుర్కొనలేక విండీస్ బ్యాట్స్ మెన్స్ అష్టకష్టాలు పడ్డారు. సిమన్స్(17), శామ్యూల్స్(5), పొలార్డ్(13), ఫ్లెచర్(3) బ్రావో(3) రస్సెల్స్(13), బ్రాత్‌వైట్(18), బద్రీ(1).. ఇలా వెంటవెంటనే అవుటవడంతో 143 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో అమిత్ మిశ్రా 3, అశ్విన్, బుమ్రా, షమీ రెండేసి వికెట్లు తీసుకున్నారు.

వర్షం దెబ్బ...
144 పరుగుల స్వల్ప లక్ష్య చేధనకు భారత్ బరిలోకి దిగింది. రెండు ఓవర్లు ముగిసే సరికి భారత్ 15 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం పడడంతో ఆట నిలిచిపోయింది. వర్షం తగ్గినా మైదానం తడిగా ఉండడంతో ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో రెండు మ్యాచ్‌ల టీ20ని 1-0తో విండీస్‌ సిరీస్ ను చేజిక్కించుకుంది.

వెస్టిండీస్‌ ఇన్నింగ్స్: చార్లెస్‌ (సి) రహానె (బి) అమిత్‌ మిశ్రా 43, లెవిస్‌ (సి) మిశ్రా (బి) షమి 7, శ్యామ్యూల్స్ (సి) ధోని (బి) బుమ్రా 5, సిమ్మన్స్ (స్టంప్‌) ధోని (బి) అశ్విన్‌ 19, ఆండ్రీ ఫ్లెచర్‌ (బి) బుమ్రా 3, కీరన్‌ పొలార్డ్ ఎల్బీ (బి) అశ్విన్‌ 13, రస్సెల్‌ (సి) కోహ్లి (బి) భువనేశ్వర్‌ కుమార్‌ 13, డ్వేన్‌ బ్రావో (బి) మిశ్రా 3, బ్రాత్‌వైట్‌ (బి) మిశ్రా 18, సునీల్‌ నరైన్‌ నాటౌట్‌ 9, బద్రీ (బి) షమి 1, ఎక్స్ ట్రాలు 9, మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్‌) 143.
వికెట్ల పతనం: 1-24, 2-50, 3-76, 4-76, 5-92, 6-98, 7-111, 8-123, 9-133
బౌలింగ్‌: భువనేశ్వర్‌ కుమార్‌ 4-0-36-1, షమి 2.4-0-31-2, అమిత్‌ మిశ్రా 4-0-24-3, రవీంద్ర జడేజా 2-0-11-0, అశ్విన్‌ 3-0-11-2, బుమ్రా 4-0-26-2.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (నాటౌట్) 10; రహానే (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 15.
బౌలింగ్: రసెల్ 1-0-7-0; బద్రీ 1-0-7-0.

06:41 - August 29, 2016

నల్గొండ : కుదిరితే కప్పు కాఫీ.. వీలైతే నాలుగు మాటలు అంటాడు. మాయమాటలు చెప్పి ప్రేమ ముగ్గులోకి దింపుతాడు. తనకూ ఎవరూ లేరని కట్టుకథలు అల్లుతాడు. అత్తామామలు దైవంతో సమానమని కోతలు కోస్తాడు. అచ్చటముచ్చట తీర్చుకుని రెండు నెలలకే చెక్కేస్తాడు..ఆ తర్వాత మరో అమ్మాయి వేటలో పడతాడు. నల్లగొండ జిల్లాలో నిత్య పెళ్లికొడుకు భాగోతం బట్టబయలైంది.
ఇతగాడు..తాళి కట్టిన భార్యకే కాదు..పిల్లనిచ్చిన అత్తామామలకు చుక్కలు చూపిస్తాడు. ఫేస్ ఇన్నోసెంట్‌గా పెట్టినా.. ఇతగాడు చేసే చేష్టలు వింటే ఎవ్వరైనా ఖంగుతినాల్సిందే. పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకోవడమంటే మహా సరదా. నక్క వినయాలు ప్రదర్శించి, మాయమాటలతో ఆకట్టుకుని యువతులను మోసం చేయడంలో దిట్ట. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం ఎస్‌ లింగోటం గ్రామానికి చెందిన చీకూరి ప్రవీణ్‌ కారు డ్రైవర్‌. ఈజీగా మనీ వేటలోపడ్డ ఇతగాడికి పెళ్లిళ్లు చేసుకోవడమే సరైన రూట్‌ అనుకున్నాడు. పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుని కట్నం పేరుతో భారీగా డబ్బు గుంజవచ్చని ప్లాన్‌ చేశాడు. రెండేళ్ల క్రితం నల్లగొండ జిల్లా లింగారెడ్డి గ్రామానికి చెందిన కృష్ణవేణిని పెళ్లి చేసుకున్నాడు. 2 నెలలు కాపురం చేశాక..కృష్ణవేణి ఆత్మహత్య చేసుకుంది. ప్రవీణ్ వేధింపులు భరించలేకే బలవన్మరణం చేసుకుందన్న ఆరోపణలున్నాయి.

2 నెలలు కాపురం చేసి ఎస్కేప్‌..
సంవత్సరం తిరగకుండానే ఖమ్మం జిల్లా జగ్గయ్యపేటకు చెందిన యువతిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు ప్రవీణ్‌. 2 నెలలు గడవకముందే అక్కడి నుంచి ఎస్కేప్‌ అయ్యాడు. ఆర్నేళ్ల తర్వాత వరంగల్‌ జిల్లాకు చెందిన ఉమారాణిని ప్రేమ ముగ్గులోకి దింపి పెళ్లి చేసుకున్నాడు. పలు కారణాలు చెప్పి అత్తామామల నుంచి డబ్బులు గుంజాడు. పెళ్లి ముచ్చట తీరకుండా ఇల్లాలికి నరకం చూపించాడు. హైదరాబాద్‌ ఎల్బీనగర్‌కు మకాం మార్చి 2 నెలలు కాపురం చేశాక పారిపోయాడు. ఆ తర్వాత భార్యకు ఫోన్‌ చేసి తక్కువ కులానికి చెందిన నీతో కాపురం చేయాలంటే 10 లక్షల కట్నం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆ తర్వాత ఎంతకీ కనిపించకపోవడంతో బాధితురాలు చౌటుప్పల్‌ పోలీసులను ఆశ్రయించింది. పెళ్లిళ్ల పేరుతో యువతుల జీవితాలతో ఆడుకుంటున్న ప్రవీణ్‌ను కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.  

06:37 - August 29, 2016

హైదరాబాద్ : పాతబస్తీలో హైదరాబాద్‌ పావురాల ఎగ్జిబిషన్‌ షో.. ఉత్సాహంగా సాగింది. నగరంలోని వందలాది మంది పావురాల ప్రేమికులు.. ఈ షోకు హాజరైయ్యారు. పావురాల విశిష్టతను .. ప్రత్యేకంగా హైదరాబాద్‌లో తిరుగాడే దక్కనీ ఖబుత్తర్‌లను షోలో ప్రదర్శించారు. ఈషోలో పలువురు పావురాల పెంపకందార్లను సన్మానించారు. తొలకరి మబ్బుల్లోని చినుకులంతటి స్వచ్ఛత.. తెలిమంచుతెరల్లో పూమొగ్గలంతటి సుకుమారం.. చిన్నారుల బోసినవ్వులు.. చిగురించే తొలిప్రేమల మాధ్యుర్యం..అన్నీ కలిపితే.. పావురం.. అవును పావురమంటే ప్రపంచశాంతి. పావురమంటే.. ప్రేమ..ఆహ్లాదం ..ఆనందం.. పావురానికి మనిషికి శతాబ్దాల అనుబంధం. ఇదే గుర్తు చేస్తున్నారు..హైదరాబాద్‌ లోని పీగన్‌ ఫ్రెండ్స్ క్లబ్‌వారు. పావురాలకు హైదరాబాద్‌కు విడదీయరాని అనుబంధం ఉంది. శతాబ్దాలుగా నగరవాసులకు కువకువల స్నేహాన్ని ఈ ఫ్రెండ్లీబర్డ్స్ పంచుతోంది. ఇప్పుడంటే .. ఎస్‌ఎమ్మెస్‌లు, ఈమెయిల్స్ వచ్చాయి కాని.. ఏలాంటి టెక్నాలజీ లేని కాలంలో.. సమాచారం పంపడానికి ఈ పావురాలనే ఉపయోగించేవారు. సమాచారం పంపడానికి ఉపయోగపడేవి ఉమ్మర్‌ పావురాలు. ఈ జాతి పావురాలు గంటకు రెండు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయంటున్నారు.

నిజాం కాలం నుండే...
నిజాం కాలం నుంచే హైదరాబాద్‌లో పావురాల షో జరుపుకుంటున్నట్టు నిర్వాహకులు అంటున్నారు. హైదరాబద్‌లో ఉండే పావురాల జాతి బబ్రా. వీటిని దక్కనీజాతిగా కూడా పిలుస్తారట. అప్పట్లో భాగ్యనగరంలో సుమారు 4వందల జాతులకు చెందిన పావురాలు ఉండేవట. ప్రస్తుతం కాలుష్యం పెరిగిపోవడంతో ఈ ప్రేమ పక్షులు అంతరిస్తున్నాయంటున్నారు. ప్రస్తుతం 200 రకాలు మాత్రమే మిగిలాయంటున్నారు. అనాది కాలంనుంచి మనిషితో అనుబంధం ఏర్పరచుకున్న పావురాలు ఎప్పటికీ మంచి స్నేహితులే. ఈ ప్రేమపక్షుల గొప్పదనాన్ని భావితరాలకు అందించడానికి వీటిని కాపాడాల్సిన అవసరం ఉందంటున్నారు హైదరాబాద్‌లోని పావురాల ప్రేమికులు. 

06:33 - August 29, 2016

వరంగల్ : కనులు మనకు లోకాన్ని చూపించే ఏకైక మార్గాలు. కనులే మనకు మార్గదర్శకాలు. కనులే మనకు అన్ని. ఇలాంటి కళ్ల నుండి రాళ్లు వస్తే భరించగలమా ? కాని వరంగల్‌లో ఓ చిన్నారి ఇలాంటి వింత సమస్యతో బాధపడుతోంది. వినడానికి చిత్రంగా ఉన్నా.. ఇదినిజం. చిన్నారిని ఎందరో వైద్యులకు చూపించినా.. దీనికి కారణాలేంటో బయటపడడం లేదు. దీంతో చిన్నారిని ఆదుకునే దాతలకోసం ఎదురుచూస్తున్నారు తల్లిదండ్రులు. కంట్లో చిన్ననలక పడితేనే తట్టుకోలేని మనం ..అదే కళ్ల నుండి రాళ్లు వస్తే తట్టుకోగలమా...ఊహించడానికే భయమేస్తున్నా వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్‌లో ఓ చిన్నారి ఇలాంటి వింతపరిస్థితితో ఇబ్బందిపడుతోంది. మహబూబాబాద్ పట్టణంలోని లెనిన్‌నగర్‌ కాలనీకి చెందిన విజయ, రామ్మూర్తి దంపతుల సంతానమే స్పందన. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటూ.. పాపను లాల్‌బహదూర్‌ విద్యానికేతన్‌లో 2 వతరగతి చదివిస్తున్నారు. 6 ఏళ్ల ఆ పాప కళ్ల నుండి నీళ్లకు బదులు రాళ్లు వస్తున్నాయి.

వ్యాధిని నిర్థారించలేకపోతున్న వైద్యులు..
మొదట పరిస్థితి అర్థం కాక తల్లిదండ్రులు... దగ్గరలోని ఆస్పత్రులన్నింటిలో చూపించారు. కాని సమస్య తగ్గకపోగా రోజుకు 15 నుండి 20 రాళ్లు వస్తుండడంతో చిన్నారి పరిస్థితిని చూస్తున్న తల్లిదండ్రులు కుంగిపోతున్నారు. సమస్య ఏమిటో డాక్టర్లు సైతం చెప్పలేకపోతుండడంతో బాధను దిగమింగుకుని జీవిస్తున్నారు. ఇన్నాళ్లు తమ కళ్లముందు అందరిలాగే ఆడుతూ ఉండే చిన్నారి వింత వ్యాధితో బాధ పడుతోందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. తమలాంటి పేదవారికి కార్పొరేట్ వైద్యం చేయించే స్థోమతలేదని.. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి చిన్నారిని ఆదుకోవాలని కోరుతున్నారు. 

06:30 - August 29, 2016

నిజామాబాద్ : అది పేరుకే బస్టాండ్. అక్కడ కనీస వసతులు ఉండవు.. బస్సులు నిలిపేందుకు స్థలం ఉండదు. బస్టాండ్ శిథిలావస్థకు చేరటంతో అధికారులు కూల్చివేశారు. కాని ఇప్పటివరకు తిరిగి నిర్మించిన దాఖలాలు లేవు. దీంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన తడకల షెడ్లలోనే ప్రయాణికులు వేచిఉండాల్సిన దుస్థితి నెలకొంది. తెలంగాణ జిల్లాలోనే నిజామాబాద్ బస్టాండ్ పేరు గాంచింది. నిత్యం వేలాది మంది ప్రయాణీకులు వందలాది బస్సులలో ప్రయాణాలు చేస్తుంటారు. అలాంటి బస్టాండ్‌కు కష్టకాలం వచ్చింది. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్మించిన బస్టాండ్ శిథిలావస్థకు చేరింది. దీంతో బిల్డింగ్‌ను కూల్చివేశారు అధికారులు. బస్టాండ్‌ కూల్చేసి సంవత్సరం కావస్తున్నా ఇంతవరకు కొత్తభవన నిర్మాణం జరగడంలేదు. బస్సు కోసం వేచి చూసే ప్రయాణికులు నిలువ నీడలేక అవస్థలు పడుతున్నారు.

నిర్మాణంపై జాప్యం..
దాదాపు 60 వేల నుండి లక్ష మంది ప్రయాణీకులకు నీడనిచ్చే నిజామాబాద్ బస్టాండ్ నిర్మాణంపై జాప్యం జరుగుతూనే ఉంది. నిత్యం ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్ పరిసరాల్లో మురికినీరు నిలిచి దుర్గందం ముక్కుపుటాలు అదరగొడుతుంటే... మురుగునీటి నుంచి వస్తున్న దోమలతో ప్రయాణీకులు బస్టాండ్‌దగ్గరకు రావాలంటేనే ఒణికిపోతున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకుల వారి బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయి. జిల్లాలోని భోధన్, కామారెడ్డి, ఆర్మూర్, బాల్కొండ, డిచ్‌పల్లితో పాటు వర్ణి ,నందిపేట్, బాన్సువాడ, బిచ్కుంద మండలాల బస్సులు ఈ బస్టాండ్ నుండే వెళతాయి. ఈ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన తడకల నీడలోనే వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. హైదరాబాద్, వరంగల్ అటు మహారాష్ట్రకు వెళ్లే బస్సులు, రెంజల్‌, పిట్లం, నిజాంసాగర్‌, నవీపేట్‌కు వెళ్లే బస్సులు నిలిపే స్థలం లేని పరిస్థితి నెలకొంది.

అధికారుల నిర్లక్ష్యం..
గతంలో ప్లాట్‌ ఫారాలు ఉంటే ఏ బస్సు ఎక్కడ ఆగేది తెలిసేది. కాని ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. నిత్యం వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులు వందలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడే ఈ బస్టాండ్‌వైపు ఉన్నతాధికారులు, నాయకులు ఎవరూ కన్నెత్తి చూడటం లేదని పలువురు ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే నిజామాబాద్ బస్టాండ్ నిర్మాణానికి టెండర్లు పిలవకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వెంటనే బస్టాండ్ నిర్మాణపనులు చేపట్టి పూర్వ వైభవం తీసుకురావాలని కోరుతున్నారు. 

06:26 - August 29, 2016

హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వ వైద్య రంగం అత్యంత బలహీనంగా ఉందని ఐద్వా నిర్వహించిన ఓ సర్వేలో తెట తెల్లమైంది. వైద్యరంగంపై ఐద్వా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు అందుబాటులో ఉండటంలేదని సదస్సులో పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై రిటైర్డ్ ఐఏఎస్ ఛాయరతన్ నేతృత్వంలో ఉద్యమ కమిటి ఏర్పాటయ్యింది. ప్రభుత్వ ఆసుపత్రుల స్థితి గతులను పరిశీలించేందుకు ఐద్వా, గిరిజన సంఘం, యువజన సంఘం నెల రోజుల పాటు సర్వే నిర్వహించారు. ఆదివారం జరిగిన సదస్సులో ..సర్వే నివేదికను కేరళ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి పీ కే శ్రీమతి, జస్టిస్ చంద్ర కుమార్, ప్రొఫెసర్ నాగేశ్వర్ విడుదల చేసారు. తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితికి సర్వే నివేదిక అద్దం పట్టింది. డాక్టర్ల తో పాటు ఉద్యోగుల కొరత ఆసుపత్రులను పట్టి పీడిస్తుందని.. అలాగే వివిధ ఆసుపత్రుల్లో 1600 డాక్టర్ పోస్టులు, 271 కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పోస్టులు, 1928 నర్సు పోస్టులు ఖాళీగా ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది. తెలంగాణలో వైద్యాన్ని ప్రైవేట్ రంగం శాసిస్తుండటంతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రొఫెసర్‌ నాగేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. అవసరం ఉన్నా లేకున్నా పరీక్షలు నిర్వహిస్తూ..పేషెంట్లతో అసవసర మందులు కొనిపిస్తూ..కార్పోరేట్ హస్పిటల్స్ కొట్లు గడిస్తున్నాయన్నారు.

ఉద్యమ కార్యాచరణ...
కేరళలో అనుసరిస్తున్న ఉచిత వైద్య విదానాన్ని తెలంగాణలో అమలు చేయాలని మాజీ మంత్రి పీకే శ్రీమతి డిమాండ్ చేసారు. ప్రతి గ్రామపంచాయితీకి ఓ పీహెచ్ సీ ని ఏర్పాటు చేసి ఉచిత వైద్యం, మందులు అందించాలన్నారు. ప్రజా వైద్యం బలహీనపడితే మొదలు నష్టపోయేది మహిళలు, పిల్లలేనని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా దశల వారిగా ఉద్యమాలను బలోపేతం చేయడం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులను పరిరక్షించుకుందామని చాయ రతన్ పిలుపు నిచ్చారు. ప్రజా వైద్య పరిరక్షణ కోసం ఐక్య ఉద్యమాలు చేయాలని సదస్సు తీర్మానించింది. అందు కోసం ఉద్యమ కార్యచరణను సైతం రూపొందించింది. రిటైర్డ్ ఐఏఎస్ చాయ రతన్ నేతృత్వంలో ఉద్యమ కమిటీ ఏర్పాటయ్యింది. 

06:23 - August 29, 2016

హైదరాబాద్ : తెలంగాణా అసెంబ్లీ సమావేశాలపై ఉత్కంఠ నెలకొంది. కేంద్ర ప్రభుత్వ సూచనలతో జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలుపాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. సభను సమావేశ పరచాలని నిర్ణయించింది. అయితే..ఎన్ని రోజులు సభ ఉంటుందన్న దానిపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జీఎస్‌టీ బిల్లుకు ఆమోదం తెలపాల్సిన నేపథ్యంలో.. శాసనసభను సమావేశపరచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 30నుంచి సమావేశాలు మొదలవుతాయిని తెలుస్తున్నా.. సభ ఎన్ని రోజులు జరపాలన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. జీఎస్టీ బిల్లు ఆమోదానికి అసెంబ్లీని సమావేశపరచాలని గవర్నర్‌ ఇప్పటికే నోటిఫికేషన్‌ కూడా జారీచేశారు. జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం ఈ సమావేశాలు జరుగుతున్నందున మొదటిరోజు సభకు అడ్వకేట్ జనరల్ ను ఆహ్వానించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.

రెండు పూటలా సమావేశాలు ? 
అయితే.. సెప్టెంబర్‌ 5నుంచి గణేశ్‌ నవరాత్రులు మొదలవడంతోపాటు బక్రీద్‌పండుగ కూడా వస్తున్న నేపథ్యంలో సమావేశాలను నాలుగు లేదా ఐదు రోజుల్లోనే ముంగించాలని.. ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అసలు ఒకరోజు మాత్రమే సభను నిర్వహించి జీఎస్టీ బిల్లును ఆమోదించిన వెంటనే వాయిదా వేసే అవకాశం కూడా ఉందని అధికారపార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఏ నిర్ణయమైన జీఎస్టీ బిల్లు ఆమోదం తర్వాత జరిగే సభా వ్యవహారాల కమిటీ భేటీ తర్వాతే సమావేశాలు ఎన్నిరోజులు అనేదానిపై క్లారిటీ రానుంది. ఇక ..నీటి ప్రాజెక్ట్‌లపై మహరాష్ట్రతో జరిగిన ఒప్పందాల విషయంలో విమర్శలు వెల్లువెత్తున్న నేపథ్యంలో శాసనసభ వేదికగానే విపక్షాలకు తగిన సమాధానం ఇచ్చేందుకు వ్యూహం రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా వుంటే.. సభను 15 రోజుల పాటు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. విపక్షాల డిమాండ్‌ను ప్రభుత్వం మన్నించకపోయినా... సభ జరిగే నాలుగైదు రోజులు రాత్రి పగలు రెండు పూటలా సమావేశాలు నిర్వహించాలని కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. 

నేడు యూఎస్ ఓపెన్..

న్యూయార్క్ : సోమవారం నుండి సీజన్ చివరి గ్రాండ్ స్లామ్ యూఎస్ ఓపెన్ మ్యాచ్ లు జరగనున్నాయి. ఇప్పటికే ఆరు సార్లు యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచిన సెరెనా ఏడో టైటిల్ కోసం బరిలోకి దిగుతోంది. 

సిరీస్ విండీస్ కైవసం..

ఫ్లోరిడా : రెండు మ్యాచ్ ల టీ 20 సిరీస్ ను విండీస్ 1-0 కైవసం చేసుకుంది. రెండో మ్యాచ్ కు వర్షం ఆటంకం ఎదురైంది. దీనితో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 19.4 ఓవర్లలో 143 పరుగులు చేసింది. భారత్ రెండు ఓవర్లలో 15 పరుగులు చేసింది. అనంతరం వర్షం కురవడంతో మ్యాచ్ ను రద్దు చేశారు. 

నేడు రాష్ట్ర ఎన్నికల సంఘం భవనానికి శంకుస్థాపన..

హైదరాబాద్ : గచ్చిబౌలిలోని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయాన్ని నిర్మించనున్నారు. ఈ భవన నిర్మాణానికి సంబంధించి సోమవారం మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 11గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, మంత్రులు తదితరులు పాల్గొననున్నారు. 

నేడు కమల్ నాథన్ విభజన అడ్వయిజరీ కమిటీ భేటీ..

హైదరాబాద్ : నేడు కమల్ నాథన్ విభజన అడ్వయిజరీ కమిటీ భేటీ కానుంది. ఈ భేటీలో సెక్రటేరియట్ ఎస్ వోల విభజనపై చర్చ జరగనుంది. కమల్ నాథన్ సారథ్యంలో సోమవారం జరగనున్న ఉద్యోగుల విభజన అడ్వయిజరీ కమిటీ సమావేశంలో సెక్రటేరియట్ సెక్షన్ ఆఫీసర్స్ (ఎస్ వో) ల విభజన వివాదం మరోసారి తెరమీదకు రానుంది. 

ఉత్తర తెలంగాణకు భారీ వర్ష సూచన..

హైదరాబాద్ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాగల 48గంటల పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా రానున్న రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

నేడు క్యాబినెట్ సమావేశం..

హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గం సోమవారం సమావేశం కానుంది. సాయంత్రం ఐదు గంటలకు సచివాలయంలోని సీ బ్లాక్ లో జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించనున్నారు. మంగళవారం నుండి అసెంబ్లీ నిర్వహించాలని అనుకుంటున్న నేపథ్యంలో సభలో ప్రవేశ పెట్టే డ్రాఫ్ట్ బిల్లులపై క్యాబినెట్ లో చర్చిస్తారు.

తెలంగాణ రాష్ట్రానికి మరో జాతీయస్థాయి గుర్తింపు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి మరో జాతీయస్థాయి గుర్తింపు లభించింది. సీఎన్ బీసీ టీవీ 18 నిర్వహించే ఇండియా బిజినెస్ లీడర్ అవార్డ్స్ విభాగంలో తెలంగాణ మరోసారి అవార్డును సొంతం చేసుకుంది. రేపు ఆర్థిక మంత్రి జైట్లీ చేతుల మీదుగా అవార్డు ప్రధానం చేయనున్నారు. 

చౌటుప్పల్ లో టిఫిన్ బాంబులు..

నల్లగొండ : జిల్లా చౌటుప్పల్ మండలం అల్లపురం వద్ద ఆదివారం రాత్రి టిఫిన్ బాంబులు కలకలం రేపాయి. రోడ్డుపై మట్టి కొట్టుకుపోవడంతో భూమిలో పాతిపెట్టిన బాంబులు పైకి తేలి రైతులకు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని ఆరు బాంబులను గుర్తించారు. అనంతరం జిల్లాలోని ప్రత్యేక బాంబ్ స్కాడ్ బృందానికి సమాచారం అందించి బాంబులను స్వాధీనం చేసుకున్నారు. 

నిర్మాత నట్టికుమార్ కు తీవ్ర అస్వస్థత..

హైదరాబాద్ : తెలుగు సినీ నిర్మాత మండలి సభ్యులకు మాఫియా డాన్ నయీంతో సంబంధాలున్నాయని పలు ఆరోపణలు గుప్పించిన చిన్న నిర్మాతల మండలి నాయకుడు, నిర్మాత నట్టికుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

Don't Miss