Activities calendar

31 August 2016

21:55 - August 31, 2016

హర్యానా : కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రాకు ఉచ్చు బిగుస్తోంది. వాద్రా-డిఎల్‌ఎఫ్‌ భూ ఒప్పందానికి సంబంధించిన రిపోర్టును జస్టిస్‌ ధీంగ్రా కమిటీ ప్రభుత్వానికి సమర్పించింది. భూ ఒప్పందంలో అవకతవకలు జరిగినట్లు కమిటీ పేర్కొంది. భూఒప్పందంలో మాజీ సిఎం భూపేందర్‌ హుడ్డా, వాద్రాలకు వ్యతిరేకంగా ధింగ్రా కమిటీ సాక్ష్యాలు సేకరించినట్లు సమాచారం.
నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన ధింగ్రా కమిటి  
హర్యానాలో వాద్రా భూ కొనుగోళ్ల వ్యవహారంలో జరిగిన అక్రమాలపై ధింగ్రా కమిటి 182 పేజీలతో కూడిన తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. జస్టిస్‌ ధింగ్రా నివేదికను మూడు భాగాలుగా విడదీశారు. మొదటి భాగంలో భూఒప్పందంలో అవకతవకల గురించి పేర్కొనగా.... రెండో భాగంలో సాక్ష్యాలకు సంబంధించిన అంశాలు... మూడో భాగంలో దస్తావేజులకు సంబంధించిన వివరాలున్నాయని ధింగ్రా తెలిపారు. నివేదికకు సంబంధించి జస్టిస్‌ ధింగ్రా ఎవరి పేర్లను వెల్లడించలేదు. ప్రభుత్వం నివేదికను బహిర్గతం చేసేవరకు తానేమి మాట్లాడనని స్పష్టం చేశారు. ఒకవేళ భూ ఒప్పందంలో అవకతవకలు జరగకపోతే 182 పేజీల నివేదికను ఇవ్వాల్సిన అవసరమే రాదన్నారు. భూ ఒప్పందంలో అవకతవకలకు సంబంధించిన ఆధారాలు లభించాయని, దానివల్ల ఎవరు లబ్ది పొందారన్నదానిపై విచారణ జరిపినట్లు ధింగ్రా చెప్పారు.
మాజీ సిఎం భూపేందర్‌ హుడ్డాపై తీవ్ర వ్యాఖ్యలు 
వాద్రా డిఎల్‌ఎఫ్‌ భూఒప్పందంలో మాజీ సిఎం భూపేందర్‌ హుడ్డాపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. భూఒప్పందంలో అనేక అవకతవకలు జరిగినా అప్పటి సిఎం హుడ్డా చూసి చూడనట్లు వ్యవహరించారు. భూఒప్పందంలో మాజీ సిఎం భూపేందర్‌ హుడ్డా, వాద్రాలకు వ్యతిరేకంగా ధింగ్రా కమిటీ సాక్ష్యాలు సేకరించినట్లు తెలుస్తోంది.
వాద్రాకు లాభం చేకూర్చేలా వ్యవహరించిందని ఆరోపణలు 
అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వాద్రాకు లాభం చేకూర్చేలా వ్యవహరించిందన్న ఆరోపణలున్నాయి. 2008లో గుడ్గావ్‌లో వాద్రాకు చెందిన స్కైలైట్‌ హాస్పిటాలిటీ సంస్థ 3.5 ఎకరాల ప్లాట్‌ను 7 కోట్ల 50 లక్షలకు కొని రియల్‌ ఎస్టేట్ సంస్థ డిఎల్‌ఎఫ్‌కు 58 కోట్లకు అమ్ముకున్నారని ప్రధాన ఆరోపణ. దీనిపై విచారణ జరిపేందుకు 15 నెలల క్రితం బిజెపి ప్రభుత్వం రిటైర్డ్‌ న్యాయవాది జస్టిస్‌ ధింగ్రా నేతృత్వంలో కమిటీ నియమించింది. 

 

21:50 - August 31, 2016

హర్యానా : సింగూరు భూవివాదంపై టాటా మోటార్స్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సింగూరులో టాటా మోటార్స్‌కు కేటాయించిన భూములను న్యాయస్థానం రద్దు చేసింది. 12 వారాల్లోగా భూములను రైతులకు తిరిగి ఇచ్చివేయాలని బెంగాల్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు...రైతులకు ఇచ్చిన భూ పరిహారం తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. గత పదేళ్లుగా రైతులు తమ భూములు కోల్పోవడంతో వారికి ఉపాధి లేకుండా పోయిందని పేర్కొంది. సింగూరులో నానో కార్ల తయారీ ప్లాంట్‌ కోసం 2006లో అప్పటి బెంగాల్‌ ప్రభుత్వం వెయ్యి ఎకరాల భూమిని టాటా మోటార్స్‌కు కేటాయించింది. దీన్ని రైతులు వ్యతిరేకించడంతో టాటా మోటార్స్‌ నానో ప్లాంట్‌ను గుజరాత్‌కు మార్చింది.

 

21:48 - August 31, 2016

ఢిల్లీ : వాహనదారులకు కేంద్రం మరో షాక్‌ ఇచ్చింది. పెట్రో ధరలు భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ లీటర్‌కు 3 రూపాయలా 38 పైసలు పెరిగింది. డీజిల్ లీటర్‌కు 2 రూపాయలా 67 పైసలు పెరిగింది. పెరిగిన ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి.

 

21:46 - August 31, 2016

మెదక్ : మేడ్చల్‌ సదాశివపేట్‌ టోల్‌గేట్‌ దగ్గర రోడ్డు ప్రమాదం ఎనిమిది నిండు ప్రాణాలను బలిగొంది. డీసీఎం డ్రైవర్‌ నిర్లక్ష్యం.. ఎనిమిది మంది ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్ల పాలిట మృత్యుపాశమైంది. లారీ, డీసీఎంల మధ్య చిక్కుకున్న మృతదేహాలు నుజ్జు నుజ్జయ్యాయి.. డీసీఎం డ్రైవర్‌తోపాటు.. టోల్‌గేట్‌ నిర్వాహకులపై కేసులుపెట్టిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  
యమపాశంగా మారిన డీసీఎం 
సోదరి రిసెప్షన్‌కు హాజరయ్యారు. సరదాగా గడిపారు. సొంతూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. మరికొన్ని గంటల్లో గమ్యం చేరుకునేవారు. ఇంతలో డీసీఎం వారిపాలిట యమపాశంగా మారింది. ఎనిమిది మంది ప్రాణాల్ని బలితీసుకుంది.. 
ఓ డ్రైవర్‌ అతివేగం, టోల్‌ప్లాజా నిర్వహకుల నిర్లక్ష్యం.. 
ఓ డ్రైవర్‌ అతివేగం, టోల్‌ప్లాజా నిర్వహకుల నిర్లక్ష్యం.. ఎనిమిది మంది ప్రాణాలను బలిగొన్నాయి. మెదక్‌ జిల్లా సదాశివపేట్‌కుచెందిన ఇర్ఫాన్‌ తన స్నేహితులతోకలిసి టవేరా వాహనంలో హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని తన సోదరి రిసెప్షన్‌కు హాజరయ్యాడు.. రిసెప్షన్‌ పూర్తయ్యాక తిరుగు ప్రయాణమయ్యాడు.. రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌ మండలం సుతారిగూడ ఔటర్‌ రింగ్‌రోడ్డు టోల్‌ప్లాజా దగ్గర టోల్‌ రుసుము చెల్లించేందుకు.. అప్పటికే అక్కడ ఆగివున్న లారీ వెనుక తన వాహనాన్ని ఆపాడు. ఈలోగా వెనకనుంచి అతి వేగంగావచ్చిన డీసీఎం వాహనం టవేరాను ఢీకొట్టింది.. డీసీఎం తాకిడితో అదుపుతప్పిన టవేరా ముందున్న లారీని ఢీకొట్టింది.. ఈ రెండు వాహనాల మధ్య టవేరా నుజ్జునుజ్జయింది.. ఇందులో ప్రయాణిస్తున్న ఎనిమిదిమంది అక్కడే ప్రాణాలు విడిచారు.. తీవ్రంగా గాయపడ్డ మరో వ్యక్తిని పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు.
డబ్బువసూలు చేయడమే టోల్‌గేట్‌ నిర్వాహకుల లక్ష్యం 
వాహనాల దగ్గర నుంచి డబ్బువసూలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న టోల్‌గేట్‌ నిర్వాహకులు.. అక్కడి అత్యవసర సౌకర్యాలపై ఏమాత్రం దృష్టిపెట్టలేదు.. కనీసం లైట్లైనా లేకపోవడం, వేగాన్ని నియంత్రించే స్పీడ్‌బ్రేకర్లు ఏర్పాటు చేయకపోవడంవల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.. ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్‌కోసం గాలిస్తున్నారు.. 
ఈ ఘటనపై సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి
డీసీఎం డ్రైవర్‌ అతివేగం... టోల్‌ప్లాజా నిర్వాహకుల నిర్లక్ష్యం ఎనిమిది కుటుంబాల్లో విషాదం నింపింది.. తమ బిడ్డల మృతితో తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.. మృతదేహాలకు గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్‌, భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

 

21:39 - August 31, 2016

హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో వర్షాలు తెలుగురాష్ట్రాలను ముంచెత్తుతున్నాయి. 15 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షంతో పలు గ్రామాలు నీటమునిగాయి.. వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి.. 
రంగారెడ్డి జిల్లాలో 
రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసింది. తాండూరు నియోజకవర్గంలో వాగులు, వంకలు పొంగిపొర్లడంతో మహబూబ్‌నగర్‌, సంగారెడ్డిలకు రాకపోకలు నిలిచిపోయాయి.. మంచనపల్లి వాగు ఉప్పొంగడంతో చుట్టుపక్కల గ్రామాలు నీటమునిగాయి.
నల్లగొండ జిల్లాలో 
నల్లగొండ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి.. పులిచింతల ప్రాజెక్టు నీటిమట్టం 12 టీఎంసీలకు చేరుకుంది... దీంతో ముంపు గ్రామాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.. నెమలిపురి, వెల్లటూరు, అడ్డూరు ముంపు గ్రామాల్లోకికూడా వరద నీరు చేరింది. రెండురోజులుగా విద్యుత్‌లేక ఈ గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయి.. జిల్లాలో పరిస్థితిని మంత్రి జగదీశ్‌ రెడ్డి సమీక్షించారు.. 
కరీంనగర్‌ జిల్లాలో
కరీంనగర్‌ జిల్లాలోనూ భారీ వర్షాలు కురిశాయి. కోతిరాంపూర్‌లో ఆటోగ్యారేజీలోకి భారీగా వరదనీరు చేరడంతో కార్లు నీటిలో మునిగిపోయాయి.. సిరిసిల్లలో వర్షాలకు హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై చెట్టు కూలిపోయింది.. ఈ సమయంలో అక్కడ వాహనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.. చెట్టు రోడ్డుపై పడిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది.
వరంగల్‌ లో 
వరంగల్‌ లో భారీ వర్షం కురిసింది. వరదనీరు చేరడంతో రోడ్లు చెరువుల్లా మారాయి.. వ‌రంగ‌ల్ రైల్వే బ్రిడ్జి దగ్గర వర్షపు నీరు నిల‌వ‌డంతో రాక‌పోక‌ల‌కు ఇబ్బంది ఏర్పడింది.
మెదక్‌ జిల్లాలో 
మెదక్‌ జిల్లాలో రెండు రోజులనుంచి వర్షాలు కురుస్తున్నాయి.. సిద్దిపేట్‌ నియోజకవర్గంలో వర్షాలతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరుతోంది.. వర్షాలపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. 
గుంటూరు జిల్లాలో 
నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గుంటూరు జిల్లా.. పిడుగురాళ్లలో వాగులు.. కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. మాచవరం..పిడుగురాళ్ల మండలాల్లో పలు గ్రామాలు చిత్తడిగా మారాయి. దాచేపల్లిలో ఇళ్లలోకి నీరు చేరింది. దుకాణాలలో నీరు చేరడంతో వ్యాపారులు భారీగా నష్టపోయారు.. గ్రామాల్లో పలు పంటలు నీటమునిగాయి.. కారెంపూడిలో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాగులు పొంగిపొర్లడంతో ఎక్కడికక్కడ రోడ్లు కొట్టుకుపోయాయి... వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.  
తిరుమల, తిరుపతిలో 
తిరుమల, తిరుపతిలోనూ కుండపోత వర్షం కురిసింది. ఎడతెరిపిలేకుండా కురిసిన కుండపోత వర్షంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆలయం ముందు భారీగా చేరిన వర్షపు నీటిని అగ్నిమాపక సిబ్బంది తోడేశారు. ఎడతెరిపి లేని వర్షం కారణంగా.. భక్తులు బయటకే రాకపోవడంతో.. ఆ ప్రాంతం నిర్మానుష్యంగా కనిపించింది. 

 

21:35 - August 31, 2016

హైదరాబాద్ : భాగ్యనగరంలో కుండపోతగా కురిసిన వర్షం పెను విషాదం నింపింది. భోలక్‌పూర్‌, రామాంతపూర్‌లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో  ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. రెండు గంటలపాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి జంటనగరాలు చిగురుటాకులా వణికిపోయాయి. జనజీవనం స్తంభించింది. రోడ్లపై మోకాలిలోతున వర్షం నీరు చేరడంతో వాహనచోదకులు తీవ్ర అవస్థలు పడ్డారు. హుస్సేన్‌సాగర్‌ ప్రమాద స్థాయికి చేరడంతో గేట్లు తెరిచి, నీటిని బయటకు విడుదల చేశారు. 
జనజీవనం అస్తవ్యస్తం 
ఇటీవలికాలంలో కనీవినీ ఎరుగని రీతిలో కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్‌లో జనజీవనం అస్తవ్యస్తమైంది. సికింద్రాబాద్‌ భోలక్‌పూర్‌లో పాత ఇల్లు కూలిన ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. చుట్టుపక్కల వారు శిథిలాలను తొలగించి తల్లి, పిల్లలను ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఇంట్లో నివసిస్తున్న తల్లితో సహా ఇద్దరు  కూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు. మృతులను బిల్‌కిష్‌, మారియా, ఫాతిమాలుగా గుర్తించారు. ఈ విషాద ఘటనపై జీహెచ్‌ఎంసీ మేయర్‌  బొంతు రామ్మోహన్‌ విచారం వ్యక్తం చేశారు. 
ప్రహారీగోడ కూలిన ఘటనలో నలుగురు మృతి 
అటు రామాంతపూర్‌ ప్రగతి నగర్‌లోనూ ప్రహారీగోడ కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో దంపతులు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వీరిని బాలస్వామి, చిన్నమ్మ, శ్రీకర్‌, పార్వతిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని కూలిన ప్రహరీగోడ శిథిలాను తొలగించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. భోలక్‌పూర్‌, రామాంతపూర్‌ ఘటనలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ విచారం వ్యక్తం చేశారు. మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ గాంధీ ఆస్పత్రికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ రెండు ఘటనల్లో మృతుల కుటుంబాలకు జీహెచ్‌ఎంసీ లక్ష రూపాయల చొప్పున,  తెలంగాణ ప్రభుత్వం రెండు లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాయి.  
ప్రమాద స్థాయికి చేరిన హుస్సేన్‌సాగర్‌ 
భారీ వర్షాలకు హుస్సేన్‌సాగర్‌ ప్రమాద స్థాయికి చేరింది. నీటిమట్టం అనూహ్యంగా నాలుగు అడుగుల మేర పెరగడంతో చుట్టు పక్కల ప్రాంతాల వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో హుస్సేన్‌సాగర్‌ గేట్లను తెరిచి, నాలాల్లోకి నీటిని వదిలారు. నాలాల గట్లతోపాటు వీటి పరిసర ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. 
స్తంభించిన జనజీవనం 
ఆకాశం చిల్లుపడినట్టుగా కురిసిన వర్షానికి భాగ్యనగరంలో జనజీవనం స్తంభించింది. రోడ్లపైన మోకాలిలోతున నీరు చేరడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హయత్‌నగర్‌, పటాన్‌చెరు, మియాపూర్‌, కూకటపల్లి, మేడ్చల్‌, అల్వాల్‌ ప్రాంతాల నుంచి నగరానికి చేరుకోడానికి వీలులేని పరిస్థితి ఉత్పన్నమైంది. వాన కారణంగా జలమయమైన రోడ్లు వాహనచోదకులకు చుక్కలు కనిపించాయి. కొన్ని చోట్ల కార్ల ఇంజిన్లలోకి నీరు చేరింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు వెళ్లాల్సిన ఉద్యోగులు తీవ్ర అవస్థపడ్డారు. వర్షం కారణంగా కొన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బక్కెట్లతో నీటిని బయటతోడి పోశారు. ప్రధాన కూడళల్లో మోకాలి లోతున చేరిన నీటిని అగ్నిమాపక సిబ్బంది తోడేసింది. 
జంటనగరాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం 
జంటనగరాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదయ్యింది. అంబర్‌పేటలో గంట వ్యవధిలో అత్యధికంగా 118  మి.మీ. వర్షం కురిసింది.   పలు ప్రాంతాల్లో 70 మి.మీ. వర్షపాతం నమోదయ్యింది. కేవలం 20 మిల్లీ మీటర్ల వర్షపాతాన్ని మాత్రమే తట్టుకునే జంటనగరాల డ్రైనేజీ వ్యవస్థ.. మూడింతలకు పైగా కురిసిన వర్షపాతం అస్తవ్యస్తమైంది. ఎక్కడికక్కడ డ్రెయిన్లలో నీరు పొంగిపొర్లింది. మురునీరు రోడ్ల మీదకు చేరడంతో చాలా ప్రాంతాలు దుర్గంధభూయిష్టంగా మారాయి. చాలా ప్రాంతాల్లో నాలాలు పొంగిపొర్లుతున్నాయి. ప్రమాదకరమైన మ్యాన్‌హోళ్లను తెరవొద్దని జీహెచ్‌ఎంసీ కమిషన్‌ జనార్దన్‌రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ముంపు పరిస్థితిని పర్యవేక్షించాలని డిప్యూటీ కమీషనర్లను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు సమాచారం అందించేందుకు హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశారు. 040-21111, 111 లేదా 100 నంబర్లకు ఫోన్‌ చేయాలి సూచించారు. 
ఎంఎంటీఎస్‌ రైలు సర్వీసులు రద్దు 
కుంభవృష్టి కారణంగా జంటనగరాల్లోని కొన్ని చోట్ల  రైల్వే ట్రాక్‌పైకి నీరు చేరడంతో కొన్ని  ఎంఎంటీఎస్‌ రైలు సర్వీసులను పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంకా రద్దు చేశారు. ఖైరతాబాద్‌ రైల్వే స్టేషన్‌  బుకింగ్‌ ఆఫీసులోని నీరు చేరింది. దీంతో సిబ్బందితోపాటు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షంనీటిలోనే సిబ్బంది విధులు నిర్వహించారు. బుకింగ్‌ ఆఫీసు పల్లపు ప్రాంతంలో ఉండటంతో ఈ దుస్థితి ఎదురయ్యింది. జంటనగరాల్లో భారీవర్షం కురిసిన బీభత్సంపై ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో బాధితులను ఆదుకునేందుకు సహాయ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని  కోరారు. మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ వర్షాలపై ఉన్నతస్థాయి  సమీక్షా సమావేశం నిర్వహించారు. మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని కోరారు. బాధితులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  డ్రెయిన్లు, మ్యాన్‌హోల్స్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. మొత్తంమీద చాలాకాలం తర్వాత కురిసిన కుంభవృష్టి జంటనగరాల వాసులకు కడగండ్లనే మిగిల్చింది.

మహిళా శిశు సంక్షేమశాఖపై మంత్రి తుమ్మల సమీక్ష

హైదరాబాద్ : మహిళా శిశు సంక్షేమశాఖపై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సమీక్ష చేశారు. అంగన్ వాడీ కేంద్రాలకు సరఫరా చేయాల్సిన కోడిగుడ్లు, పౌష్టికాహారం పక్కదారి పడుతుందని మంత్రి ఆగ్రహం వ్యక్తుం చేశారు. ఈ శాఖల విభాగాలన్ని సమన్వయంతో పని చేయాలన్నారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్త జిల్లాలకు వెళ్లే అధికారుల సీనియార్టీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. 

 

ఆ మూడు నెలల్లో ఆశించిన విధంగా పడని వర్షాలు : మంత్రి దేవినేని ఉమా

విజయవాడ : జూన్, జులై, ఆగస్టులో ఆశించిన విధంగా వర్షాలు పడలేదని ఎపి మంత్రి దేవినేని ఉమా అన్నారు. రాయలసీమలో రెయిన్ గన్స్ తో పంటల్ని బతికిస్తున్నామని చెప్పారు. సీమలో కరువుపై ప్రభుత్వం యుద్ధం చేస్తుందన్నారు. తమ సంకల్పంతో వరుణుడు కూడా కరుణించాడని తెలిపారు. 

 

హోంమంత్రి నాయిని కాన్వాయ్ ఢీకొని ఆటో డ్రైవర్ మృతి

నల్గొండ : చింతపల్లి మండలం కుర్మేడు వద్ద హోంమంత్రి నాయిని కాన్వాయ్ ఓ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ జంగయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతన్ని హైదరాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. 

 

హోంమంత్రి నాయిని కాన్వాయ్ ఢీకొని ఆటో డ్రైవర్ మృతి

నల్గొండ : చింతపల్లి మండలం కుర్మేడు వద్ద హోంమంత్రి నాయిని కాన్వాయ్ ఓ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ జంగయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతన్ని హైదరాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. 

 

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం..

చిత్తూరు : తిరుమల మొదటి ఘాట్ రోడ్డు 22వ మలుపు వద్ద ఆర్టీసి బస్సు పిట్టగోడను ఢీకొని పక్కకు దూసుకెళ్లింది. భక్తులకు ప్రమాదం తప్పింది. 

20:58 - August 31, 2016

చినుకుపడితే భాగ్యసాగరమే..!! సంద్రాన్ని తలపించే రోడ్డు, నోళ్లు తెరుచుకున్న మ్యాన్ హోళ్లు, చిగురుటాకులా వణుకుతున్న నగరం, భూలోకంలో నరకం, ఈ దుస్థితికి కారణమెవరు ? ఈ కష్టాలకు బాధ్యులెవరు ? ఇదే అంశంపై ఇవాళ వైడాంగిల్ ప్రత్యేక కథనం... పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

20:52 - August 31, 2016

తెర్లు తెర్లైతున్న తెలంగాణ గుండెకాయ...ఏడుగిరి జీవిదీసిన వాన దేవుడు, ఆంధ్రరాష్ట్రంల అదరగొట్టిన వానలు...అన్ని ఊర్లల్ల అవస్తలపాలైన జనాలు, జిజ్జుమీదైతున్న జిల్లాల పంజాదీ..నేతలకు పాడెలు, మంత్రులకు శ్రీమంతం, ఊపందుకుంటున్న బీసీ ఉద్యమాలు.. రెండు రాష్ట్రాలల కదిలిన ఎనుకవడ్డోలు, మామూలు ఇయ్యకుండా మార్కెటు వెట్టిండ్రు.. ట్రాఫిక్ పోలీసులొచ్చి అన్ని చెడగొట్టిండ్రు... ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం....

 

 


 

20:48 - August 31, 2016

ప్రకాశం : జిల్లాలోని గిద్దలూరులో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన మున్సిపల్ ఆఫీసర్ ఏఈకి దేహశుద్ధి చేశారు. గిద్దలూరు మున్సిపల్‌ ఆఫీస్‌లో ఏఈగా పనిచేస్తున్న విక్టర్‌ ఇమ్మానుయేల్‌ ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆగ్రహించిన మహిళ బంధువులు ఆయనకు దేహశుద్ధి చేశారు. అనంతరం ఆయన పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

20:35 - August 31, 2016

హైదరాబాద్ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల 24 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ  డైరెక్టర్‌ వైకే రెడ్డి చెప్పారు. ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పడుతాయని చెప్పారు. ఈమేరకు ఆయన ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:31 - August 31, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. జీహెచ్ ఎంసీ కాల్‌ సెంటర్‌కు 4వందల ఫిర్యాదులురాగా.. అందులో 70 సమస్యల్ని పరిష్కరించామని స్పష్టం చేశారు. మిగతాచోట్ల అధికారులు పనులు పూర్తి చేస్తున్నారని చెప్పారు. గ్రేటర్‌లో భారీవర్షాలు కురుస్తున్నాయని.. 15ఏళ్ల తర్వాత భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. గ్రేటర్‌ వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని...అన్ని డిపార్ట్‌మెంట్లు కలిసి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. 24గంటలు యాక్షన్‌ టీంలు మానిటరింగ్ చేస్తున్నాయన్నారు. వరద ప్రభావంతో ఏడుగురు మృతి చెందారని తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ. 4.50లక్షల పరిహారం అందిస్తామని చెప్పారు. 

 

20:22 - August 31, 2016

తూర్పుగోదావరి : జిల్లాలోని తొండంగి మండలం పంపాదిపేటలో ఏర్పాటు చేయతలపెట్టిన దివీస్‌ లేబలేరటీస్‌ భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన ఉ్రదిక్తతలకు దారితీసింది. పరిహారం చెల్లించకుండా బలవంతంగా  భూములు లాక్కునేందుకు దివీస్‌ ల్యాబ్స్‌ చేస్తున్న ప్రయత్నాలపై రైతులు మండిపడుతున్నారు. అన్నతాదల ఉద్యమానికి సీపీఎం మద్దతు ఇచ్చింది. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు పంపాదిపేట వచ్చిన పార్టీ కార్యదర్శి మధును అరెస్టు చేసి, అన్నవరం పోలీసు స్టేషన్‌కు తరలించి, ఆ తర్వాత విడుదల చేశారు. దివీస్‌ ల్యాబ్స్‌తో తూర్పుగోదావరి జిల్లాలో 300 హేచరీస్‌ మూతపడే ప్రమాదం ఉందని మధు ఆందోళన  వ్యక్తం చేశారు. దీంతో 30 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోతారని  చెప్పారు.

 

జిన్నూరు సబ్ పోస్టు ఆఫీస్ లో అధికారి రూ.50 లక్షల స్వాహా

తూర్పుగోదావరి : పోడూరు మండలం జిన్నూరు సబ్ పోస్టు ఆఫీస్ లో అధికారి రూ.50 లక్షలను స్వాహా చేశాడు. ప్రజలు డిపాజిట్ చేసిన సొమ్మును అధికారి కాజేశాడు. ఉన్నతాధికారుల తనిఖీల్లో భారీ మోసం బయటపడింది. 

సీఎస్ రాజీవ్ శర్మకు సీసీఎల్ ఏ కమిషనర్ గా అదనపు బాధ్యతలు

హైదరాబాద్ : సీఎస్ రాజీవ్ శర్మకు సీసీఎల్ ఏ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు టీసర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. 

కుటుంబ సమస్యతో విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్ : ఎస్ ఆర్ నగర్ అనుపమ హాస్టల్ లో నవీన్ కుమార్ (26) అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యూట్యూబ్ లో చూసి నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సమస్యతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నోట్ రాశాడు. నల్గొండ జిల్లా మోత్కూరుకు చెందిన నవీన్ కుమార్ వాడిగా గుర్తించారు.  

ఓరుగల్లు భద్రకాళి అమ్మవారికి రూ.3 కోట్లతో కిరీటం

హైదరాబాద్ : ఓరుగల్లు భద్రకాళి అమ్మవారికి రూ.3 కోట్లతో కిరీటాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

19:58 - August 31, 2016
19:57 - August 31, 2016
19:38 - August 31, 2016

ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి నీటి విడుదల

విజయవాడ : ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి నీటిని విడుదల చేశారు. 20 గేట్లు ఎత్తివేసి 14,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. 14 నెలల తర్వాత బ్యారేజీ వద్ద నీటి మట్టం 12 అడుగులకు చేరింది. 

నయీం అనుచరుడు ఎం.ఎ రహీం అరెస్టు

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. పలువురు నయీం అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భువనగిరికి చెందిన సీనియర్ న్యాయవాది ఎం.ఎ రహీంను పోలీసులు అరెస్టు చేశారు. ఉప్పల్ లో రహీంను పోలీసులు అరెస్టు చేశారు. రహీంపై అక్రమ ఆయుధాల కేసుతోపాటు 120బి, 386, 384 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వలిగొండ ఎంపీపీ శ్రీరాముల నాగరాజును అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో ఇవాళ నయీం అనుచరుడు శ్రీహరి లొంగిపోయాడు.   

19:21 - August 31, 2016

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. పలువురు నయీం అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భువనగిరికి చెందిన సీనియర్ న్యాయవాది ఎం.ఎ రహీంను పోలీసులు అరెస్టు చేశారు. ఉప్పల్ లో రహీంను పోలీసులు అరెస్టు చేశారు. రహీంపై అక్రమ ఆయుధాల కేసుతోపాటు 120బి, 386, 384 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వలిగొండ ఎంపీపీ శ్రీరాముల నాగరాజును అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో ఇవాళ నయీం అనుచరుడు శ్రీహరి లొంగిపోయాడు.   

19:13 - August 31, 2016

 ఢిల్లీ : ఎపికి ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్రమోడీతో కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు సమావేశం అయ్యారు. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరాన్ని ప్రధాని మోడీకి వెంకయ్యనాయుడు వివరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు సంతృప్తి కలిగించే విధంగా త్వరలో నిర్ణయం వెల్లడిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. 

 

19:06 - August 31, 2016
19:04 - August 31, 2016

గుంటూరు : జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసాయి. కారెంపూడిలో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాగులు పొంగిపొర్లడంతో ఎక్కడికక్కడ రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వేలాది ఎకరాల్లో పంట పొలాలు కూడా నీటమునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.  

19:01 - August 31, 2016

గుంటూరు : జిల్లాలోని వెలగపూడి తాత్కాలిక సచివాలయానికి నేరుగా చేరుకోవడానికి నూతన రహదారి పనులు వేగవంతమయ్యాయి. వచ్చే నెలాఖరు నుంచి ఏపీ సచివాలయంలో పాలన ప్రారంభమయ్యే అవకాశాలు ఉండటంతో.. అధికారులు ప్రత్యేక రహదారులను సిద్ధం చేస్తున్నారు. సచివాలయం ఉండే వెలగపూడి, మందడం గ్రామాల్లోకి వాహనాలు రాకుండా.. 4 కిలోమీటర్ల ముందే కొత్తగా బైపాస్ రోడ్డు నిర్మిస్తున్నారు. నూతన రహదారులపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం..

 

నయీం అనుచరుడు వెలిగొండ ఎంపీపీ శ్రీరాములు నాగరాజు అరెస్టు

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం అనుచరుడు వెలిగొండ ఎంపీపీ శ్రీరాములు నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీరాములుతోపాటు అతని కుమారుడు నితిన్ ను అరెస్టు చేశారు. 

ఉల్లి రైతుల కష్టాలపై టెన్ టివి కథనాలకు స్పందించిన ఎపి ప్రభుత్వం

కర్నూలు : ఉల్లి రైతుల కష్టాలపై టెన్ టివి ప్రసారం చేసిన కథనాలకు ఎపి ప్రభుత్వం స్పందించింది. కర్నూలు మార్కెట్ లో రోజూ 100 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని ప్రభుత్వ నిర్ణయించారు. క్వింటాకు రూ.600లుగా నిర్ణయించారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జేసీకి ఆదేశాలు జారీ చేశారు. 

 

ఎపికి ప్రత్యేకహోదాపై ప్రధానితో అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు సమావేశం

ఢిల్లీ : ఎపికి ప్రత్యేకహోదాపై ప్రధాని నరేంద్రమోడీతో కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు సమావేశం అయ్యారు. ఎపికి ప్రత్యేకహోదా అవసరాన్ని వెంకయ్యనాయుడు ప్రధానికి వివరించినట్లు తెలుస్తోంది.   

18:23 - August 31, 2016

హైదరాబాద్‌ : ఎస్‌వీకేలో కవి, విరసం నేత కాశీపతి సంతాప సభ ఘనంగా నిర్వహించారు. విరసం నేతలు, కుటుంబ సభ్యులు తదితరులు కాశీపతికి ఘన నివాళులు అర్పించారు. పౌర ఉద్యమాల్లో కాశీపతి చురుగ్గా పాల్గొని, అంకితభావంతో పనిచేశారని విరసం నేత వరవరరావు అన్నారు. విప్లవోద్యమంలో కాశీపతి కృషి మరువలేనిదని..కమ్యూనిస్టు రాజకీయాలను ప్రస్పుంటిచేలా చేశారని తెలిపారు.

 

18:19 - August 31, 2016

హైదరాబాద్ : సెప్టెంబర్‌ 2 సార్వత్రిక సమ్మెను విజయవంతం చేసేందుకు సింగరేణి జాతీయ కార్మిక సంఘాలు, ప్రాంతీయ సంఘాలు బొగ్గు గనులపై ప్రచారం చేపట్టాయి. సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్‌ వెంకట్రావ్‌ టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగానే కార్మికులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. సమ్మెతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని తేల్చి చెప్పారు.  

 

18:14 - August 31, 2016

హైదరాబాద్ : కార్మికులకు కనీస వేతనం 18 వేలు చెల్లించాలని సీఐటీయూ కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ డిమాండ్ చేశారు. సెప్టెంబర్‌ 2 సమ్మెకు మద్దతుగా హైదరాబాద్ సుందరయ్య కళా నిలయంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 12 డిమాండ్లు కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టామని ఏ ఒక్క డిమాండ్‌పై స్పష్టమైన హామీ ఇవ్వలేదన్నారు. ఈ నేపథ్యంలో సమ్మెకు సన్నద్ధమయ్యామని చెప్పారు. కార్మిక హక్కులపై దాడిచేస్తున్నారని..సమ్మె విచ్చిన కుట్రలను తిప్పికొట్టాలన్నారు.  

 

ముగిసిన శిశువుల మార్పిడి వివాదం

హైదరాబాద్ : కోఠి మెటర్నటీ ఆస్పత్రిలో శిశువుల మార్పిడి వివాదం ముగిసింది. చత్రు, రజిత దంపతులకు పుట్టింది ఆడ శిశువని డీఎన్ ఏ టెస్టులో నిర్ధారణ అయింది. రమాదేవి, జంగయ్యలకు మగ శిశువును అప్పగించారు. 

17:51 - August 31, 2016

రంగారెడ్డి : గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ తర్వాత అతని అనుచరులు ఒక్కొక్కరుగా లొంగిపోతున్నారు. నేటి ఉదయం నయీం ప్రధాన అనుచరుడు శ్రీహరి రంగారెడ్డి కోర్టుల్లో న్యాయమూర్తి ఎదుట లొంగిపోయాడు. ఈ సందర్భంగా శ్రీహరి సెటిల్మెంట్లు, భూ దందాలకు సంబంధించిన కొన్ని సీడీలను మీడియాకు అదజేశాడు. ఆదిభట్ల రైతు భూముల కబ్జా కేసులో శ్రీహరి కీలకపాత్ర పోషించాడు. కొండాపూర్ భూముల కేసుల్లో కూడా అతనికి సంబంధాలున్నట్లు తెలుస్తోంది. 

 

17:41 - August 31, 2016

ఢిల్లీ : రియో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులు, కోచులను ఢిల్లీ సచివాలయంలో సీఎం కేజ్రీవాల్‌ సన్మానించారు. ఈ కార్యక్రమంలో గోపీచంద్‌, పీవీ సింధు, సాక్షి మాలిక్‌, సుశీల్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. పీవీ సింధుకు 2 కోట్ల చెక్కును సీఎం కేజ్రీవాల్ బహుకరించారు. సింధు కోచ్‌ గోపీచంద్‌, సాక్షిమాలిక్‌ కోచ్‌ మనజీత్‌తో పాటు ఒలింపిక్స్‌ క్రీడల్లో పాల్గొన్న ఢిల్లీకి చెందిన లలిత్‌ కుమార్‌ను సత్కరించారు.  

 

17:39 - August 31, 2016

అనంతపురం : జిల్లా తనకు ప్రత్యేక అభిమానమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీకి అనంతపురం కంచుకోట అని సీఎం కొనియాడారు. అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. అనంతపురం జిల్లా వాసుల కష్టాలను శాశ్వతంగా దూరం చేయాలనే ధృడ సంకల్పంతో ముందుకెళ్తున్నానని తెలిపారు. జిల్లాను అభివృద్ధి చేస్తానని చెప్పారు. కరవును చూసి భయపడకూడదని చెప్పారు. జిల్లాలో కరవును తరిమికొట్టేందుకు వివిధ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ప్రకటించారు. హంద్రినీవా ప్రాజెక్టు పూర్తిచేసి నీటి సమస్యలేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. విత్తనాల కొరత లేకుండా చేస్తున్నామని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో విత్తనాలు అందించే ఏర్పాటు చేస్తామని తెలిపారు. అన్ని చెరువులకు నీళ్లిస్తామన్నారు. జిల్లాలో వేరుసెనగ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 

 

 

17:35 - August 31, 2016

కరీంనగర్‌ : జిల్లాలోని జైలు ఆవరణలో ఓ కానిస్టేబుల్‌ ఓవరాక్షన్‌ చేశాడు. జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే విజయరమణ రావును కలిసేందుకు వెళ్లిన చొప్పదండి నియోజకవర్గ ఇంచార్జీ సత్యంపై తుపాకీ ఎక్కుపెట్టాడు. సుల్తానాబాద్‌ డిప్యూటీ ఇంజనీర్‌ కార్యాలయం ధ్వంసం కేసులో టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణ రావుతో పాటు మరో 16 మంది కార్యకర్తలపై కేసులు నమోదు చేసి మంగళవారం జైలుకు పంపారు. వీరిని పరామర్శించేందుకు టీటీడీపీ నేతలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలు వెళ్లారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. 

 

17:33 - August 31, 2016

హైదరాబాద్ : భారీ వర్షాలతో హైదరాబాద్‌లో మృతి చెందినవారి కుటుంబాలను మంత్రి కేటీఆర్‌ పరామర్శించారు. గాంధీ ఆస్పత్రిలో వారి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. అధికారులను అడిగి ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకున్నారు. మృతుల కుంటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. భారీవర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వచ్చే రెండురోజులు ప్రయాణాలు మానుకోవాలని కోరారు. వర్షాలతో నగరంలోని వేర్వేరు చోట్ల ఏడుగురు మృతిచెందారు.

17:28 - August 31, 2016

హైదరాబాద్‌ : నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు కురుస్తున్నాయని..ఆస్తినష్టం కన్నా ప్రాణనష్టం జరగడం బాధకరమని మంత్రి కేటీఆర్ అన్నారు. భోలక్‌పూర్‌, రామాంతాపూర్‌లో ఇళ్లు కూలిపోయి జనం చనిపోవడం బాధకరమన్నారు. లోయర్‌ ట్యాంక్‌బండ్‌లో మేయర్‌, బల్దియా కమిషనర్‌తో కలిసి మంత్రి కేటీఆర్ పర్యటించారు. శిథిలావస్థలో ఉన్న భవంతులను తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ను చేపడుతున్నట్లు చెప్పారు. మృతులకు 2 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. వర్షాల వల్ల ఏ సమస్య తలెత్తినా సత్వరం స్పందించేందుకు కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని మంత్రి అన్నారు. ప్రజలు 100 లేదా 2111111 నెంబర్‌కు ఫోన్‌ చేస్తే అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను తొలగించేందుకు గతంలో చేపట్టిన డ్రైవ్‌ను కొనసాగిస్తామన్నారు. ఇప్పటికే నోటీసులు అందుకున్న వారు వెంటనే తమ ఇళ్లను ఖాళీ చేయాలని కోరారు. 

 

17:22 - August 31, 2016

చంఢీఘర్ : వర్షాకాల సమావేశాలు చివరి రోజున హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సైకిల్‌పై అసెంబ్లీకి వచ్చారు. తన అధికార నివాసం నుంచి ఖట్టర్‌ సైకిల్‌పై బయలుదేరారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా సీఎం బాట పట్టారు. సీఎం ముందు వరుసలో సైకిల్‌పై వస్తుండగా మిగతా వారందరూ ఆయనను అనుసరించారు. కిలోమీటర్ దూరం వరకు సీఎం సైకిల్ తొక్కారు. పర్యావరణాన్ని కాపాడటం కోసం ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క రోజైనా సైకిల్‌ను వినియోగించుకోవాలని ఈ సందర్భంగా మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ప్రజలకు సూచించారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఈరిక్షాలో అసెంబ్లీకి చేరుకున్నారు. 

 

17:20 - August 31, 2016

ఢిల్లీ : భారత పర్యటనలో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ.. ఢిల్లీ ఐఐటీ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ''మీరు ఇక్కడికి ఎలా వచ్చారు.. బోట్లలో వచ్చారా'' అని జాన్ కెర్రీ ప్రశ్నించగానే ఒక్కసారిగా సమావేశం హాల్లో నవ్వులు విరబూశాయి. అర్థవంతమైన డిబేట్‌ పెట్టడం భారతీయులకే సాధ్యమని కెర్రీ ప్రశంసించారు. భారత అమెరికా సంబంధాలు, ఉగ్రవాదాన్ని అణిచేయడం, వాణిజ్య సంబంధాలు.. తదితర అంశాలపై తన అభిప్రాయాలను విద్యార్థులతో పంచుకున్నారు. భారత ప్రభుత్వం జీఎస్టీ బిల్లుతో పాటు కొత్త దివాలా చట్టాలను ఆమోదించించడం ద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి మార్గం సుగమమైందని కెర్రీ పేర్కొన్నారు.

17:11 - August 31, 2016

కృష్ణా : జిల్లాలోని మచిలీపట్నంలో దొంగలు బీభత్సం సృష్టించారు. చందనగిరిపేటలోని ఓ ఇంట్లోకి చొరబడ్డ దొంగలు..వృద్ధ దంపతులపై కత్తులతో కిరాతకంగా దాడి చేశారు. ఈ ఘటనలో భార్య మృతి చెందగా.. భర్తకు తీవ్రగాయాలయ్యాయి. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.  

'మహా' గవర్నర్ తమిళనాడును కూడా..

హైదరాబాద్ : తమిళానాడు గవర్నర్ రోషయ్య పదవి కాలం నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మహారాష్ట్ర గవర్ణర్ విద్యాసాగర రావుకు తమిళానాడు గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది. తమిళనాడుకు ప్రత్యేక గవర్నర్ ను కేటాయించే వరకూ విద్యాసాగర్ రావు ఆ బాధ్యతల్లో ఉంటారు. 

లొంగిపోయిన నయీం ప్రధాన అనుచరుడు..

హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ తర్వాత అతని అనుచరులు ఒక్కొక్కరుగా లొంగిపోతున్నారు. నేటి ఉదయం నయీం ప్రధాన అనుచరుడు శ్రీహరి రంగారెడ్డి కోర్టుల్లో న్యాయమూర్తి ఎదుట లొంగిపోయాడు. ఈ సందర్భంగా శ్రీహరి సెటిల్మెంట్లు, భూ దందాలకు సంబంధించిన కొన్ని సీడీలను మీడియాకు అదజేశాడు. 

ఓటుకు నోటు కేసులో ఏసీబీ కోర్టుకు మెమో దాఖలు

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఏసీబీ కోర్టుకు మెమో దాఖలు చేసిన ఏసీబీ..మరో ఎఫ్‌ఐఆర్‌ అవసరం లేదని కోర్టుకు స్పష్టం చేసింది. ప్రస్తుత దర్యాప్తుతోనే 29వ తేదీన నివేదిక సమర్పిస్తామని పేర్కొంది. పీసీ నెంబర్‌ 15/2016 ప్రకారం రేవంత్‌రెడ్డి, ఉదయ్‌ సిన్హా, సెబాస్టియన్‌లు..వచ్చే నెల 29న తమ ఎదుట హాజరుకావాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది.   

వర్షం.. ఎమర్జెన్సీ నెంబర్లు ఇవే..

హైదరాబాద్ : భాగ్యనగరం భారీ వర్షంతో అతలాకుతలం అయ్యింది. నేటి ఉదయం కుంభవృష్టిగా కురిసిన వర్షంతో నగరం అస్తవ్యస్తమయ్యింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అత్యవసర సేవల విభాగాన్ని ఏర్పాటు చేసింది. నిత్యావసర సేవలకు ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ కమీషనర్ బొంతు రామ్మోహన్ అధికారులతో సమావేశమయ్యారు. అత్యవసర పరిస్థితులను కో-ఆర్డినేట్ చేసుకునేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేశారు.
టోల్ ఫ్రీ నెంబర్ : 040-21111111
లేదా 100కు డైల్ చేసి కూడా సమస్యలను తెలియజేవచ్చు. 

16:57 - August 31, 2016

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఏసీబీ కోర్టుకు మెమో దాఖలు చేసిన ఏసీబీ..మరో ఎఫ్‌ఐఆర్‌ అవసరం లేదని కోర్టుకు స్పష్టం చేసింది. ప్రస్తుత దర్యాప్తుతోనే 29వ తేదీన నివేదిక సమర్పిస్తామని పేర్కొంది. పీసీ నెంబర్‌ 15/2016 ప్రకారం రేవంత్‌రెడ్డి, ఉదయ్‌ సిన్హా, సెబాస్టియన్‌లు..వచ్చే నెల 29న తమ ఎదుట హాజరుకావాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది.   

 

16:54 - August 31, 2016

హైదరాబాద్ : భాగ్య నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. ఆకాశానికి చిల్లుపడ్డట్లు నగరంపై వరుణుడు తన జోరును చూపించాడు. నగరంలోని నాలాలు పొంగిపోరలాయి. చారిత్రాత్మక హుస్సేన్ సాగర్ లో కూడా నీటి మట్టం ప్రమాదకరస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో నాలుగు వందల ఏళ్ల తర్వాత హుస్సేన్‌ సాగర్‌ తూములను తెరచి దిగువకు నీటిని వదిలారు అధికారులు. భారీ వర్షాలకు హుస్సేన్‌ సాగర్‌కు గరిష్టంగా నీరు వచ్చి చేరింది. వర్షంలో ఎమర్జెన్సీ కోసం జీహెచ్ఎంసీ ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్లను విడుదల చేసింది. టోల్ ఫ్రీ నెంబర్ : 040-21111111 లేదా 100కు డైల్ చేసి కూడా సమస్యలను తెలియజేవచ్చు.
హుస్సేన్ సాగర్ వరద నీటికి సంబంధించిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

16:51 - August 31, 2016

హైదరాబాద్ : తెలంగాణ సచివాలయం ముట్టడికి రెండవ ఏఎన్‌ఎంలు యత్నించారు. వీరిని పోలీసులు అరెస్ట్‌ చేయడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జూలై 18 నుంచి తెలంగాణ వ్యాప్తంగా రెండవ ఏఎన్‌ఎంలు సమ్మె చేస్తున్నారు. 10వ పీఆర్సీ ప్రకారం 21,300 వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో సమ్మె చేస్తున్న వీరిని పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేశారు. 

సింధూకు చెక్ ఇచ్చిన కేజ్రీ

న్యూ ఢిల్లీ : ఒలింపిక్ రజిత పతక విజేత పీవీ సింధూకు ఢిల్లీ ముఖ్యమంత్రి 2 కోట్ల రూపాయల చెక్ అందజేశారు. బుధవారం ఢిల్లీలో తన కార్యాలయంలో కేజ్రీవాల్ సింధూ, సాక్షిమాలిక్ ను ఆహ్వానించారు. సాక్షికి రూ. కోటి, సింధూకు రెండు కోట్ల రూ.ల చెక్ అందజేశారు. విజేతలను అభినందించిన కేజ్రీవాల్.. దేశంలో క్రీడలు విరాజిల్లాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. 

16:49 - August 31, 2016

చిత్తూరు : తిరుమల, తిరుపతిలోనూ కుండపోత వర్షం కురిసింది. ఎడతెరిపిలేకుండా కురిసిన కుండపోత వర్షంతో తిరుమలలో ఉన్న భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులు..భారీ వర్షానికి వణికిపోయారు. అటు తిరుపతిలోనూ భారీ వర్షం కురవడంతో నగరంలోని పలు కాలనీలు నీటమునిగాయి. 

16:47 - August 31, 2016

విజయవాడ : ప్రకాశం బ్యారేజీ దగ్గర నీటిమట్టం గంట గంటకు పెరుగుతోంది. దీంతో ఇరిగేషన్ అధికారులు బ్యారేజ్‌ నుంచి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.  ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా పెద్ద ఎత్తున ప్రకాశం బ్యారేజీకి నీరు చేరుతోంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

అలెర్ట్ గా ఉండండి..

హైదరాబాద్ : భాగ్యనగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ డిసీపీ రంగనాథ్ ప్రయాణీకులకు హెచ్చరికలు జారీ చేశారు. రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు రానున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సాధ్యమయితే ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరారు. సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ హెవీగా స్థంభించే అవకాశాలు ఉన్నాయని రంగనాథ్ సూచించారు. 

ఒడిశా, ఛత్తీస్ గడ్ మీదుగా వాయవ్య దిశగా కదులుతున్న ఉపరితల ఆవర్తనం

హైదరాబాద్ : ఒడిశా, ఛత్తీస్ గడ్ మీదుగా వాయవ్య దిశగా ఉపరితల ఆవర్తనం కదులుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మరో 48 గంటల పాటు తెలంగాణ, కోస్తా, రాయలసీమలో భారీ వర్ష సూచన చేసింది. 

తెలంగాణలో నమోదైన వర్షపాతం వివరాలు

హైదరాబాద్ : తెలంగాణలో నమోదైన వర్షపాతం వివరాలు. పెద్దేముల్ లో 22 సెం.మీ, పరిగిలో 21 సెంమీ, గండేడులో 13 సెంమీ, పర్వతిగిరిలో 13 సెం.మీ, మిర్యాలగూడలో 11 సెంమీ, కొత్తగూడెంలో 10 సెంమీ వర్షపాత నమోదు అయింది. 

16:36 - August 31, 2016

హైదరాబాద్ : తెల్లవారు జామునుండి కురుస్తున్న భారీ వర్షానికి నగరం తడిసి ముద్దైంది. కుండపోతగా కురుస్తున్న వర్షానికి జనజీవనం అతలాకుతలం అయింది. ఒక పక్క వరదనీరు, మరోపక్క డ్రైనేజి నీరుతో నగరంలోని పలు కాలనీలు నీట మునిగాయి. ఇండ్లలోకి వరదనీరు చేరుకోవడంతో లోతట్టు ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క మెట్రో పనుల నేపథ్యంలో తీసిన గుంతలలో చేరిన వర్షపునీరుతో రోడ్లపైకి రావాలంటే జనం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. చాదర్ ఘాట్, ఓల్డ్ మలక్ పెట్, మూసి నగర్, చంపాపేట్, కర్మన్ ఘాట్, సరూర్నగర్, కట్టుకొని కుంట, సరస్వతి నగర్ , లింగోజిగూడ, శాలివాహన నగర్, ఓల్డ్ దిల్ షుఖ్ నగర్, చైతన్య పురి, పీఅండ్‌టీ కాలనీ, ఆర్.కే.పురం, నాగోల్, కొత్తపేట, ఆదర్శ నగర్ కాలనీ, సాయి నగర్, చింతల్ కుంట నగరంలోని పలుప్రాంతాలలో వరద నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మల్కాజ్గిరి, నేరడ్ మెట్, కుషాయిగూడ, ఈసీఎల్‌, నాగారం, కీసర, చర్లపల్లిలో భారీ వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో మూడు గంటల పాటు ఇలాగే కుండపోత వర్షం కురుస్తుందని హైదరాబాద్‌ వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారు. 

అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు

అనంతపురం : జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. అనంతపురం టీడీపీకి కంచుకోట అని అన్నారు. 

 

వృద్ధ దంపతులపై దాడి..

కృష్ణా : జిల్లాలోని మచిలీపట్నం చందనగిరిలో వృద్ధ దంపతులపై దుండగులు మారణాయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో వృద్ధురాలు మృతి చెందింది. వృద్ధుడి పిరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించారు. 

 

16:29 - August 31, 2016

హైదరాబాద్ : ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న కుండపోత వర్షానికి హైదరాబాద్‌ రామాంతపూర్‌లో ప్రహరీ గోడ కూలిన ఘటనలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బాలస్వామి, శేఖర్‌, పార్వతి, మరొక వ్యక్తి మృతి చెందారు. రామంతాపూర్‌ ప్రగతి నగర్లో గుడిసె వేసుకొని కూలి పని చేసుకుంటు  జీవనం సాగిస్తున్నారు. అయితే ఉదయం నుండి కురుస్తున్న కుండపోత వర్షం కారణంగా పక్కనే ఉన్న పురాతన ప్రహరీగోడ కూలింది. అందులో నివాసం ఉంటున్న నలుగురు శిథిలాల కింద చిక్కుకొని మృతి చెందారు. దీంతో ప్రగతి నగర్‌ కాలనీలో విషాద చాయలు అలుముకున్నాయి. మరోవైపు భోలక్‌పూర్‌లో ఇళ్లు కూలి తల్లి, ఇద్దరు కూతుళ్లు మృతి చెందారు. మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. 

 

16:08 - August 31, 2016

హైదరాబాద్‌ : వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోతగా కురిసిన వర్షంపై సీఎస్‌కు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ నివేదిక అందచేశారు. మరో 48 గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ తెలిపారు. అందువల్ల నగర ప్రజలు 48 గంటలపాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రామంతాపూర్‌, భోలక్‌పూర్‌ ఘటనల్లో చనిపోయిన వారికి లక్ష నష్టపరిహారం చెల్లిస్తామని కమిషనర్‌ ప్రకటించారు. ప్రభుత్వ స్కూళ్లకు సెలవు మంజూరుపై సీఎంతో చర్చించిన తర్వాత ప్రకటిస్తామన్నారు. వాతావరణశాఖతో కోఆర్డినేట్‌ చేసుకొని పనిచేస్తున్నామని కమిషనర్‌ తెలిపారు. కంట్రోల్‌ రూం ఏర్పాటుతో అన్ని శాఖలతో సమన్వయం చేస్తున్నామన్నారు. ఇదిలా ఉంటే మరోవైపు జంటనగరాల్లో తాజా పరిస్ధితిపై విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి విద్యుత్‌శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పనిచేసే విద్యుత్‌ సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశాలు జారీచేశారు. విద్యుత్‌ స్తంభాలు నెలకొరుగుతాయి అనుకున్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసి వారిని కాపాడాలని ఆదేశించారు. షార్ట్‌సర్క్యూట్‌తో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున..వాటి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. మరో రెండు రోజులపాటు వర్షాలు కురవనుండడంతో విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి జగదీశ్వర్‌రెడ్డి విద్యుత్‌ అధికారులను ఆదేశించారు. 

 

15:56 - August 31, 2016

టీ.సచివాలయం ముట్టడికి యత్నించిన రెండవ ఏఎన్ ఎంల అరెస్టు

హైదరాబాద్ : తెలంగాణ సచివాలయం ముట్టడికి యత్నించిన రెండవ ఏఎన్ ఎంలతోపాటు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.   

ముషీరాబాద్ లో మంత్రి కేటీఆర్ పర్యటన

హైదరాబాద్ : ముషీరాబాద్ లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. భోలక్ పూర్ లో మృతుల కుటుంబాలను మంత్రి పరామర్శించారు. హైదరాబాద్ లో గతంలో ఎన్నడూలేనంత వర్షం కురిసిందని.. భారీ వర్షం వల్ల ప్రాణనష్టం జరగడం బాధాకరమన్నారు. 

08:01 - August 31, 2016

విజయవాడ : ఏపీని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వర్షాభావంతో సతమతమవుతున్న రైతులకు రెయిన్‌గన్ల ద్వారా పరిష్కారం చూపిస్తున్నామన్నారు. రైతులకు వ్యవసాయ ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచేందుకు కృషి చేస్తామన్నారు.

ఇప్పటివరకు 64,990 పంట కుంటలు పూర్తి
రాయలసీమ వర్షాభావ ప్రాంతాల్లో రెయిన్‌గన్ల ద్వారా పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు అన్నారు. పంట సంజీవిని కార్యక్రమంపై విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు 64,990 పంట కుంటలు పూర్తయినట్లు తెలిపారు. మరో 3.50 లక్షల పంటకుంటల పనులు పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. వర్షపు నీటిని సద్వినియోగం చేసుకునేందుకు గొలుసుకట్టు చెరువులు తీసుకొచ్చామని, చెక్‌డ్యామ్‌లు పూర్తిచేస్తున్నామన్నారు. కరవు పరిస్థితుల్లోనూ రైతులు వలసపోకుండా చేయగలిగామన్నారు. సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచుకునేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు చంద్రబాబు

రెయిన్‌గన్ల ద్వారా పంటలను కాపాడేందుకు చర్యలు-చంద్రబాబు
విజయవాడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లాకు చేరుకున్నారు. వేరుశనగ పంటలను పరిశీలించారు. పెద్దమంతూరులో నిర్వహించిన పంట సంజీవని కార్యక్రమంలో పాల్గొన్నారు. పాదయాత్రలో రైతుల కష్టాలు చూసి చలించిపోయానని.. రుణవిముక్తి చేస్తానని ఆనాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని చెప్పారు. రాష్ట్రంలో కరువులేకుండా చేసే బాధ్యతను తాను తీసుకుంటానని ప్రకటించారు. నేలలోని తేమను గుర్తించే సెన్సార్లను అందుబాటులోకి తెస్తామన్నారు. నీటివనరులను ఆన్‌లైన్‌లో ఉంచుతామన్నారు.

వినూత్న ప్రయోగాలతో రాష్ట్రాన్ని అగ్రపథంలోకి : బాబు
అర్బన్‌, మున్సిపాల్టీ ప్రాంతాల్లో ఎల్‌ఈడీ దీపాల నిర్వహణను సెన్సార్లు ఉపయోగించి కంట్రోల్‌ రూమ్‌ ద్వారా చేపడతామన్నారు. ఏ లోపం తలెత్తినా సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి వినూత్న ప్రయోగాలతో రాష్ట్రాన్ని అగ్రపథంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. 

07:56 - August 31, 2016

ఢిల్లీ : సీఎన్ బీసీ నిర్వహించిన ఇండియన్‌ బిజినెస్‌ లీడర్‌ అవార్డ్స్‌ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. 'మోస్ట్‌ ప్రామిసింగ్‌ స్టేట్‌' అవార్డును కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ చేతుల మీదుగా కేటీఆర్‌ అందుకున్నారు. తెలంగాణను అవార్డుకు ఎంపిక చేసినందుకు కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర పురోగమనం, అభివృద్ధికి ఈ అవార్డు నిదర్శనమన్నారు కేటీఆర్‌. 

07:54 - August 31, 2016

విజయవాడ : కృష్ణాపుష్కరాల కాంట్రాక్ట్‌ల్లో అవినీతి ఆరోపణలు.. ఇపడు ఏపీలో రాజకీయవాతావరణాన్ని వేడెక్కించాయి. పుష్కర పనుల్లో విజయవాడ మేయర్ అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మేయర్‌రాజీనామా చేసి ఆరోపణలపై సమగ్ర విచారణకు సహకరించాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

పుష్కరాల్లో మేయర్‌ అధికార దుర్వినియోగం..!
కృష్ణాపుష్కరాల ఏర్పాట్లలో అవినీతి ఆరోపణలు ..విజయవాడలో రాజకీయాన్ని ఉడికిస్తున్నాయి. విజయవాడ నగర మేయర్‌ కోనేరు శ్రీధర్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని .. వైసీపీ ఆరోపణలు సంధిస్తోంది. పుష్కర పనుల్లో కేఎంకే కార్వొరేట్‌ కంపెనీకి సుమారు 5కోట్ల రూపాయల కాంట్రాక్టులు దక్కేలా మేయర్‌ అధికార దుర్వినయోగానికి పాల్పడ్డారని వైసీపీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు.

కే ఎం కే కంపెనీకి డైరెక్టర్‌గా ఉన్న మేయర్‌ సతీమణి రమాదేవి
మేయర్‌ కోనేరు శ్రీధర్‌ సతీమణి డైరెక్టరుగా ఉన్న కేఎంకే కంపెనీ .. పుష్కరాల్లో పలు పనులు చేపట్టింది. పుష్కర నగర్లఏర్పాటుతోపాటు వీఐపీ విందుభోజనాలు, వివిధరకాల స్టాళ్లను నిర్వహించింది. దీనిలో భాగంగా కేఎంకే కంపెనీ కోట్లరూపాయలు లబ్దిపొందేలా మేయర్‌ కోనేరు శ్రీధర్‌ నిబంధనలు ఉల్లంఘించారని విపక్ష కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. మేయర్‌పైనే అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుడంతో... విజయవడా కార్పొరేషన్‌ రాజకాయాలు మరోసారి వేడెక్కాయి. 

07:51 - August 31, 2016

ఢిల్లీ : మెడికల్ విద్యలో సమూల మార్పులు తెచ్చేందుకు కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు భర్తీ చేసే అడ్మిషన్ల ప్రక్రియకు స్వస్తి పలికి దేశవ్యాప్తంగా నీట్ ద్వారానే వైద్య విద్య సీట్ల ను భర్తీ జరగాలని నిర్ణయించింది. తాజాగా మెడికల్ విద్య ప్రక్షాళనకు కొత్త కౌన్సిల్ ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

వైద్య విద్యపై దృష్టి పెట్టిన కేంద్రం..ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటుకు యోచన
దేశవ్యాప్తంగా వైద్య విద్యను గాడిన పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా నీట్ ద్వారానే వైద్య విద్య సీట్ల ను భర్తీ జరగాలని నిర్ణయించింది. అలాగే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మెరుగుపర్చేందుకు.. జాతీయ స్థాయిలో వైద్య విద్యారంగం, ఆరోగ్య రంగంలో విధానాలను రూపొందించేందుకు ఒక ప్రత్యేక కౌన్సెల్‌ ఏర్పాటుకు ఎన్‌డిఏ ప్రభుత్వం యోచిస్తోంది.

శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే యోచన?
అయితే దేశవ్యాప్తంగా వైద్య విద్యారంగంపై అనేక ఆరోపణలు వస్తున్నాయి.. విచ్చలవిడిగా ప్రైవేటు మెడికల్ కాలేజీలకు సీట్లు కేటాయించడం.. కాలేజీలకు అనుమతులు ఇవ్వడం.. వంటివి చేస్తున్నారనే మెడికల్ కౌన్సిల్‌పై అనేక ఆరోపణలు వున్నాయి.. వీటన్నింటికి స్వస్తి పలకాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం జాతీయ మెడికల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది. అంతేకాకుండా ఎన్‌ఎంసీని చట్టబద్ధంగా ఏర్పాటు చేసేందుకు నీతి ఆయోగ్‌ డ్రాప్ట్‌ బిల్లును సిద్ధం చేసినట్లు సమాచారం. మరోవైపు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే యోచనలో వున్నట్టు తెలుస్తోంది. ఈలోగా బిల్లుపై మరింత చర్చ జరపాలని నీతి ఆయోగ్‌ నిర్ణయించింది.

కేంద్రం ఆధీనంలోనే బిల్లు ఉండేలా చర్యలు
అయితే కేంద్రం వైద్య విద్యారంగంలోని ప్రముఖులు... నిపుణులు... సామాజికవేత్తలతో సంప్రదింపులు జరిపి నీతి ఆయోగ్‌ డ్రాప్ట్‌బిల్లును రూపొందించింది. మరోవైపు ఎన్‌ఎంసీ పూర్తిగా కేంద్రం ఆధీనంలో ఉండేవిధంగా చర్యలు చేపడుతోంది. అంతేకాకుండా కమిషన్‌ చైర్మన్‌, సభ్యులు, ఆయా బోర్డుల ప్రతినిధులను కూడా కేంద్రప్రభుత్వమే నియమించే విధంగా బిల్లులో మార్పులు చేర్పులు చేసినట్టు సమాచారం. ఇందుకోసం సెర్చ్‌ కమిటీలు వేసేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. అయితే ఈ ప్రక్రియల్లో నీతి ఆయోగ్‌ కూడా భాగం చేసేందుకు మోడి సర్కార్ ప్లాన్ చేస్తోంది.

వైద్యరంగంలో నిష్ణాతులైన వ్యక్తిని చైర్‌పర్సన్‌గా నియమించేలా కసరత్తు
అంతేకాకుండా వైద్యరంగంలో నిష్ణాతులైన వ్యక్తిని చైర్‌పర్సన్‌గా నియమించేందుకు కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. కమిషన్‌ చైర్‌పర్సన్‌, బోర్డుల అధ్యక్షుల ఎంపిక కోసం ప్రత్యేకంగా సెర్చ్‌కమిటీని నియమిస్తున్నారు. చైర్‌పర్సన్‌ కాలపరిమితి నాలుగేళ్లుగా వుండేవిధంగా కమిటి సూచనలు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ కమిటీలు బోర్డులు ఎన్ని వున్నా తుది నిర్ణయాలను మాత్రం కేంద్రమే తీసుకునే విధంగా బిల్లులో సర్దుబాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా దేశంలోని వైద్య విద్యారంగంపై పట్టు సాధించేందుకు మోడి ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. 

07:45 - August 31, 2016

హైదరాబాద్ : జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం శాసనసభను సమావేశపరిచడంలో టీఆర్‌ఎస్ పార్టీ పూర్తిగా సక్సెస్ అయింది. ఇందుకోసం తాను అనుకున్న ప్లాన్ పక్కాగా అమలు చేసింది. అసెంబ్లీ సమావేశాలను పొడగించాలనన్న విపక్షాల డిమాండ్‌కు ససేమిరా అన్న ప్రభుత్వం సమావేశాలను సెప్టెంబర్ నెలాఖరునే నిర్వహిస్తామని తేల్చేసింది.

ఫలించిన టీఆర్ఎస్ వ్యూహం..
కేంద్రంలో ఆమోదం పొందిన జీఎస్టీ బిల్లుకు తెలంగాణా శాసనసభ, శాసనమండలి కూడా ఆమోదం తెలిపాయి. కేంద్ర ప్రభుత్వ సూచనలతో బిల్లు ఆమోదం కోసం ఒక రోజ శాసనసభ, మండలి సమావేశాలను ప్రభుత్వం నిర్వహించింది. వర్షాకాల సమావేశాల మాదిరిగా నాలుగైదు రోజుల పాటు సమావేశాలు ఉంటాయని అంచనా వేసినా.....అధికార పార్టీ మాత్రం తాను అనుకున్నట్లుగానే ఒక రోజు సభతో సభను వాయిదా వేసింది.

కేంద్రంతో సయోధ్య కోసం గులాబీ బాస్ తహతహ?
కేంద్ర ప్రభుత్వంతో మరింత సయోధ్యగా మెలిగేందుకు గులాబి బాస్...... ఈ సమావేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన అనంతరం బీజేపీతో దగ్గరయ్యేందుకు అధికార పార్టీ మరింత ఉత్సాహం చూపిస్తోంది. అందుకే త్వరత్వరగా జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారనే వార్తలు జోరందుకున్నాయి.

పదిరోజులు సమావేశాలు నిర్వహించాలన్నా విపక్షాల డిమాండ్‌ బేఖాతరు
మరోవైపు విపక్ష పార్టీలు 15 రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని డిమాండ్ చేసినా... బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రతిపాదనలతో విపక్షాలు కూడా సైలెంట్ కాక తప్పని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో ముఖ్యమైన అంశాలపై సభను కొనసాగించాలన్న విపక్షాల ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరిస్తూనే తమకు కూడా ఆ అంశాలు ప్రధానమైనవే అని చెప్పుకొచ్చారు. ఇందుకోసం పది రోజుల పాటు సమావేశాలను నిర్వహించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.

వినాయక నిమజ్జనం, బక్రీద్ పండుగల దృష్ట్యా..
అదీ కాక వినాయక నిమజ్జనం, బక్రీద్ పండుగలను దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 20వ తేదీ నుంచి శాసనసభ, శాసనమండలి సమావేశాలను ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ ప్రతిపాదనకు అన్ని పార్టీలు అంగీకరించడంతో ఒక రోజుతో సభ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. 

07:40 - August 31, 2016

ఢిల్లీ : అధికారిక టీఆర్‌ఎస్‌ పార్టీలో సుప్రీం నోటీసులు కలకలం రేపుతున్నాయి. పెద్ద ఎత్తున పార్టీ ఫిరాయింపుదారులను టీఆర్‌ఎస్ ప్రోత్సహిస్తుందని విపక్ష పార్టీల పిటిషన్‌లతో సుప్రీం ఫిరాయింపుదారులకు నోటీసులు జారీచేసింది. దీంతో ఇప్పడీ నోటీసులు చర్చనీయాంశంగా మారాయి.

ఆపరేషన్ ఆకర్ష్‌పై చిక్కుల్లో టీఆర్‌ఎస్ పార్టీ
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత తొలిసారి ఆపరేషన్ ఆకర్ష్‌పై టీఆర్‌ఎస్ పార్టీ చిక్కుల్లో పడింది. కాంగ్రెస్, తెలుగుదేశం సహా ఇతర పార్టీలకు చెందిన శాసనసభ్యులు గులాబి గూటికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. వలసలపై విపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. కాని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు అధికార పార్టీ నేతలను అయోమయానికి గురి చేస్తోంది.

ఫిరాయింపుదారులకు నోటీసులు జారీ చేసిన సుప్రీం
కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించిన శాసనసభ్యులు గులాబి తీర్థం పుచ్చుకోవడాన్ని సవాల్ చేస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యే సంపత్ సుప్రీం గడప తొక్కడం.... సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేయడం వెంటవెంటనే జరిగిపోయాయి. అయితే నోటీసుల జారీని ఎమ్మెల్యే సంపత్ స్వయంగా పార్టీ మారిన నేతలకు దస్తీ నోటీసులు అందచేయడం హాట్ హాట్ గా మారింది. నోటీసులు అందుకున్న అనంతరం నోటీసులపై సంతకం చేయించుకొని వాటిని ఫోటోలు సైతం తీయించి సాక్ష్యంగా ఉంచుకునేలా టీ కాంగ్రెస్‌ ప్లాన్‌ వేసింది.

నోటీసుల ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై టీఆర్‌ఎస్‌లో మొదలైన చర్చ
ప్రత్యక్షంగా నోటీసులు అందుకున్న శాసనసభ్యులు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు అధికార పార్టీలో చర్చనీయంశంగా మారింది. నోటీసులు స్వయంగా ఎమ్మెల్యేలకు అందడంతో ఎలాంటి సమాధానం ఇస్తారన్న అంశం అసక్తి రేపుతోంది. పార్టీ మారిన శాసనసభ్యులు భారీ సంఖ్యలో ఉండడంతో ఈ ప్రభావం అందరిపై ఉంటుందా అన్న చర్చ గులాబి దళంలో మొదలైంది. అయితే....ఇలాంటి వ్యవహరాల్లో తుది నిర్ణయం సభాపతిదే ఉంటుందన్న ధీమా వలస నేతలతో పాటు అధికార పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది.

07:06 - August 31, 2016

హైదరాబాద్ : రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరుగుతూనేవుంది. రోడ్డు నెత్తుటేర్లుగా మారుతున్నాయి. బయటకు వెళ్ళిన వారు సురక్షితంగా ఇంటికి చేరుకుంటారో లేదోనని భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రమాదాలు జరిగే తీరు గమనిస్తే మద్యం త్రాగి వాహనం నడపడంతో జరిగే ప్రమాదాలే ఎక్కువగా వున్నాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కాగా వాహనం నడిపేవారి బాధ్యరాహిత్యం..నిద్రలేమి..నిర్లక్ష్యంతో జరిగేవి మరికొన్ని..ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవటంతో మరికొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు ఎలా జరిగినా ప్రాణాలు మాత్రం గాల్లో కలిసిపోతున్నాయి. దీంతో బాధితుల కుటుంబాలలో విషాదాలు నెలకొంటున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు రోడ్డు ప్రమాదాల సంఖ్య మాత్రం పెరుగుతూనే వుంది. తాజాగా నగర నగరశివారులోని రంగారెడ్డి జిల్లా మేడ్చల్ టోల్‌గేట్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న ఆగివున్న టవేరా వాహనాన్ని ఓ డీసీఎం ఢీకొంది. ఈ ఘటనలో ఎనిమిదిమంది మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా వుంది. గాయపడినవారిని మేడ్చల్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. మృతులు అఖిల్, ఇమ్రోజ్ , షెఖావత్,ఇర్ఫాన్, ఫిరోజ్,నినషాద్, అక్బర్ గుర్తింపు. బాధితులంతా మెదక్ జిల్లా సదాశివపేట వాసులు గా గుర్తింపు.  కొంపల్లిలోని ఏఎమ్మార్‌ గార్డెన్‌లో ఫంక్షన్‌కి వెళ్లివస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లుగా తెలుస్తోంది. సమాచారం మేరకు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి కారణమైన లారీతోపాటు.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన టోల్‌గేట్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రమాదానికి గురయిన టవేరా వాహనం నంబరు : ఏపీ9 ఏడబ్ల్యూ 567. టోల్ గేట్ టోల్ రుసుము చెల్లించేందుకు ఓ లారీ వెనుక ఆగివున్న టవేరా వాహనాన్ని వెనుకగా వచ్చిన డీసీఎం వేగంగా ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. 

బాలకృష్ణ కారుకు తప్పిన ప్రమాదం..

హైదరాబాద్ : బంజారాహిల్స్ క్యాన్సర్ ఆసత్రి వద్ద ఓ కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. తప్పిన ప్రమాదం, కారులో వున్నవారంతా సురక్షితంగా వున్నారు. కాగా ఈ కారు సినీనటుడు బాలకృష్ణ కుటుంబానికి చెందినదిగా గుర్తింపు. 

ఘోర రోడ్డు ప్రమాదం..8మంది మృతి..

రంగారెడ్డి : మేడ్చల్ సుతారిపేట టోల్ గేట్ వద్ద రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆగివున్న టవేరా వాహనాన్ని ఓ డీసీఎం ఢీకొంది. ఈ ఘటనలో ఎనిమిదిమంది మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా వుంది. గాయపడినవారిని మేడ్చల్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. మృతులు అఖిల్, ఇమ్రోజ్ , షెఖావత్,ఇర్ఫాన్, ఫిరోజ్,నినషాద్, అక్బర్ గుర్తింపు. బాధితులంతా మెదక్ జిల్లా సదాశివపేట వాసులు గా గుర్తింపు.   

00:01 - August 31, 2016

శ్రీకాకుళం: జిల్లా లక్ష్మింపేటలో దళితులపై దాడి జరిగి నాలుగేళ్లు గడుస్తున్నా నిందితులకు శిక్ష పడకపోవడం దారుణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. లక్ష్మింపేటలో బాదితులకు న్యాయం కోసం జరుగుతున్న సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దళితులపై దాడి చేసి మారణహోమం సృష్టించిన వారికి త్వరగా శిక్షపడేలా చూడాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేకపోతే 'చలో శ్రీకాకుళం' నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. 

Don't Miss