Activities calendar

11 October 2016

20:07 - October 11, 2016

రాహుల్ రవీంద్రన్ సౌత్ ఇండియన్ నటుడు. తమిళం, తెలుగు భాషల్లో నటించాడు. 1981, జూన్ 23వ తేదీన జన్మించిన రాహుల్ పలు సినిమాల్లో నటించాడు. సింగర్ చిన్మయి తో రాహుల్ వివాహం జరిగింది. దసరా పండుగ సందర్భంగా రాహుల్ తో టెన్ టివి చిట్ చిట్ నిర్వహించింది. ఈ సందర్భంగా రాహుల్ తన జీవిత విశేషాలు..సినిమాలు ఇతరత్రా వాటిపై రాహుల్ వివరించాడు. ఆ విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

వేములవాడ మాజీ ఎంపీపీపై దాడి..

సిరిసిల్ల : వేములవాడ మాజీ ఎంపీపీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అంజన్ కుమార్ పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. 

దేవరగట్టుకు కలెక్టర్..ఎస్పీ..

కర్నూలు : దేవరగట్టులో కర్రల సమరానికి రంగం సిద్ధమైంది. దేవరగట్టుకు కలెక్టర్, ఎస్పీ చేరుకున్నారు. ప్రశాంతంగా బన్ని ఉత్సవాన్ని నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భారీగా పోలీసులు మోహరించారు. 

ఉగ్రవాదులకు మనస్సు ఉండదు - మోడీ..

ఢిల్లీ : దసరా విజయానికి చిహ్నమని, రావణ దహనం అంటే చెడును పారద్రోలడమేనని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఆచార వ్యవహారాలు, దురాచారాల రూపంలో రావణుడు ఇంకా బతికే ఉన్నాడన్నారు. ఉగ్రవాదులు మానవజాతి విధ్వంసకారులని పేర్కొన్నారు. ఉగ్రవాదులకు మనస్సు ఉండదని, మానవజాతి నాశనమే వారి లక్ష్యమన్నారు. 

19:25 - October 11, 2016

బోనాలు రాగానే 'మాయదారి మైసమ్మ' పాట అంతటా మార్మోగుతుంటుంది. ఈ పాటను ఎందరో పాడుతుంటారు..వాయిస్తుంటారు. కానీ 'వీణ'పై ఈ పాట వాయించడం సాధ్యమేనా ? సాధ్యమేనని 'శ్రీవాణి' నిరూపించింది. వీణపై ఈ పాటను అలవోకగా వాయించింది. కేవలం శాస్త్రీయ సంగీతమే వాయిస్తారా ? తీన్మార్..సినిమా పాటలు కూడా వాయించవచ్చు కదా అని 'శ్రీవాణి' ఆలోచించింది. సినిమా పాటలు..తీన్మార్ పాటలు అలవోకగా వాయిస్తూ అలరిస్తోంది. దసరా పండుగ సందర్భంగా 'శ్రీవాణి'తో ముచ్చటించింది. మరి ఆమె ఈ పాటను ఎలా వాయించింది ? వీడియో క్లిక్ చేయండి. 

19:17 - October 11, 2016

'వీణ' మీద శాస్త్రీయ సంగీతం మాత్రమే కాదు.. తీన్మార్...సినిమా పాటలు కూడా పలికించొచ్చు. 'వీణ' అనగానే ఓన్లీ క్లాసిక్ పాటలు మాత్రమే వాయించగలమని అనుకుంటుంటారు. గిటార్..తబల.జాస్ ఇవన్నీ రెగ్యులర్ గా చూస్తుంటాం. ప్రస్తుతం ఉన్న సమాజంలో 'వీణ' కనుమరుగు అవుతోంది. ఎక్కడో ఆకాశంలో విహరిస్తున్న 'వీణ'ను భూమిపై దివింప చేసే విధంగా 'శ్రీవాణి' చేశారు..'వీణ' మీద పాటలకు నేపథ్య సంగీతమే కాదు.. పాటలు కూడా పాడొచ్చు.. మాటలను సైతం 'వీణ' మీద పలికించొచ్చు అని నిరూపిస్తోంది. దసరా పండుగ సందర్భంగా 'శ్రీ వాణి'తో టెన్ టివి ముచ్చటించింది. మరి 'శ్రీవాణి' ఎలాంటి విశేషాలు వెల్లడించారో వీడియో క్లిక్ చేయండి. 

19:05 - October 11, 2016

ఆదిలాబాద్‌ : జిల్లా ఇప్పుడు నాలుగు జిల్లాలుగా ఏర్పాటైంది. కొత్తగా మూడు జిల్లాలు వచ్చి చేరాయి. ఒక్కో జిల్లాకు రెండు చొప్పున మొత్తం జిల్లాను ఎనిమిది రెవిన్యూ డివిజన్‌లుగా విభజించారు. నాలుగు జిల్లాలకూ కలిపి 71 మండలాలు పండుగ వేళ పనిచేయడం ప్రారంభించాయి. ఆదిలాబాద్‌ నాలుగు జిల్లాలుగా మారింది. కొత్తగా ఏర్పాటైన నిర్మల్‌ జిల్లాను మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రారంభించారు. మొత్తం ఏడు లక్షల 30వేల 286 మంది జనాభాతో ఈ జిల్లా ఏర్పాటైంది. రెండు రెవిన్యూ డివిజన్‌లతో పాటు 20 మండలాలతో ఈ జిల్లా ఏర్పాటు చేశారు. జ్ఞానసరస్వతి కొలువైన బాసర ఈ జిల్లాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పెయింటింగ్‌లు, కొయ్యబొమ్మల తయారీకి కూడా ఈ ప్రాంతం ప్రపంచ ఖ్యాతి పొందింది. ఇదే జిల్లాలో కొత్తగా ఏర్పాటై మరో జిల్లా మంచిర్యాలను ఎక్సైజ్‌ మంత్రి పద్మారావు ప్రారంభించారు. మొత్తం ఏడు లక్షల ఏడు వేల యాభై మంది జనాభా ఉన్న ఈ జిల్లాలో రెండు రెవిన్యూ డివిజన్‌లు, 18 మండలాలు ఉన్నాయి. గోదావరి, ప్రాణహిత నదుల ప్రవాహంతో సుసంపన్నమైన ఈ జిల్లా అపారమైన బొగ్గు నిక్షేపాలకు ప్రసిద్ధి. రెండో అన్నవరంగా పిలుచుకునే గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం కూడా మంచిర్యాల పర్యాటక శోభను పెంచుతోంది.

ఆసిఫాబాద్..
ఆసిఫాబాద్‌ కేంద్రంగా ఏర్పాటైన నయా జిల్లా కొమురంభీంను మంత్రి జోగురామన్న ప్రారంభించారు. మొత్తం రెండు రెవిన్యూ డివిజన్లు, 15 మండలాలతో ఏర్పడ్డ ఈ జిల్లా మొత్తం జనాభా ఐదు లక్షల 92వేల 831 మంది. ఇది ఒకప్పటి గోండుల రాజధాని. పేపర్‌ మిల్లులు, జిన్నింగ్‌ మిల్లుల కేంద్రంగా ఆసిఫాబాద్‌ సుప్రసిద్ధం. గోండుల కోరిక మేరకు ఈ జిల్లా ఏర్పాటైంది. కొత్తగా ఏర్పాటైన మూడు జిల్లాలకు పంచగా పోను.. కొత్త, పాత కలిపి మొత్తం 18 మండలాలు పాత ఆదిలాబాద్‌ జిల్లాకు లభించాయి. పునర్య్వస్థీకరణ తర్వాత రెండు రెవిన్యూ డివిజన్‌లతో, ఏడు లక్షల 21 వేల 433 మందితో ఆదిలాబాద్‌ జిల్లా స్థిరపడింది. అడవులు, ప్రకృతి అందాలే ఈ జిల్లాకు మిగిలాయి. 

19:02 - October 11, 2016

కరీంనగర్ : నాలుగు జిల్లాలుగా రూపాంతరం చెందిన కరీంనగర్‌లో కొత్త జిల్లాల ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. సిరిసిల్ల మినహా.. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ రెండేసి చొప్పున రెవిన్యూ డివిజన్‌లు ఏర్పాటయ్యాయి. సిరిసిల్లా జిల్లాను మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆవిష్కరించారు. ఒక్క రెవిన్యూ డివిజన్‌, 13 మండలాలతో ఈ జిల్లా ఏర్పాటైంది. ఐదు లక్షల 43వేల 694 మంది జనాభా ఉన్న సిరిసిల్ల చేనేత రంగానికి ప్రసిద్ధి. అగ్గిపెట్టెలో ఆరు గజాల చీరను నేసిన ఖిల్లా సిరిసిల్ల. చేనేత, మరమగ్గాలకు ప్రసిద్ధి. దక్షిణకాశిగా పిలుచుకునే వేములవాడ క్షేత్రం ఇప్పుడు సిరిసిల్ల పరిధిలోకి వచ్చింది. ప్రజల ఆకాంక్షల మేరకే.. ప్రభుత్వం జిల్లాల పునర్య్వవస్థీకరణ చేపట్టిందని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. కొత్తగా ఏర్పాటైన జగిత్యాల జిల్లాను ఉపముఖ్యమంత్రి మహ్మూద్‌ ఆలీ ప్రారంభించారు. మొత్తం రెండు రెవిన్యూ డివిజన్లు, 18 మండలాలతో ఏర్పాటైన ఈ జిల్లా జనాభా 9,83,414 మంది. జగ్గదేవుడి పేరిట ఏర్పడ్డ జగిత్యాలే కేంద్రంగా ఈ జిల్లా పనిచేయనుంది. ప్రసిద్ధ ఆధ్యాత్మిక, పర్యటక ప్రాంతాలు..ధర్మపురి లక్ష్మీనృసింహస్వామి, కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రాలు ఈ జిల్లా పరిధిలోకి వచ్చాయి.

పెద్దపల్లి..
మరో కొత్త జిల్లా పెద్దపల్లిని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ ప్రారంభించారు. రెండు రెవిన్యూ డివిజన్లు, 14 మండలాలతో ఆవిర్భవించిన ఈ జిల్లా జనాభా ఏడు లక్షల 95వేల 332 మంది. పెద్దపల్లి నిజాం కాలంలో ప్రత్యేక సంస్థానంగా వెలుగొందింది. ఇప్పటికే పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలకు ప్రధాన కేంద్రంగా భాసిల్లుతోంది. పెద్దపల్లి జిల్లా పరిధిలోకి వచ్చిన ఎల్లంపల్లి, ఎల్‌మడుగు జలాశయాలు, రామగిరి ఖిల్లా, సబితం జలపాతం.. పర్యటకులను అమితంగా ఆకట్టుకోనున్నాయి. అటు రామగుండం పోలీసు కమిషనరేట్‌ను డీజీపీ అనురాగ్‌శర్మ ప్రారంభించారు. మొత్తానికి మూడు ప్రాంతాలు జిల్లాలుగా విడిపోవడంతో.. పాత కరీంనగర్‌ జిల్లా ప్రాధాన్యత బాగా తగ్గింది. రెండు రెవిన్యూ డివిజన్లు, 16 మండలాలతో మిగిలిన కరీంనగర్‌ జిల్లా జనాభా తొమ్మిది లక్షల 86వేల 204 మంది. నగర శివార్లలోని దిగువ మానేరు జలాశయం ఒక్కటే ఈ జిల్లాకు మిగిలింది. వెండితో వస్తువులు తయారు చేసే ఫిలిగ్రీ కళాకారులు ఈ జిల్లాలోనే ఉన్నారు. దాదాపు రెండు వందల గ్రానైట్‌ పరిశ్రమలు, క్వారీలూ నయా కరీంనగర్‌ జిల్లాకు ఆర్థిక పరిపుష్టిని చేకూర్చనున్నాయి. 

19:00 - October 11, 2016

ఖమ్మం : జిల్లానుంచి కూడా మరో జిల్లా ఏర్పాటైంది. భద్రాచలం శ్రీరాముడి క్షేత్రం పేరిట ఈ జిల్లా ప్రారంభమైంది. కొత్తగూడెం కేంద్రంగా జిల్లా కార్యకలాపాలు సాగనున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. రెండు రెవెన్యూ డివిజన్లు, 23 మండలాలతో ఏర్పాటైన ఈ జిల్లా జనాభా 11,02,094 మంది. భద్రాచలం రామయ్య కొలువైన క్షేత్రం ఇకపై కొత్తగూడెం జిల్లాలో కొనసాగనుంది. సింగరేణి సంస్థ ప్రధాన కార్యాలయం, మణుగూరు, ఇల్లెందు, టేకులపల్లి, కోయగూడెంలలో బొగ్గు గనులు ఈ జిల్లాకు తరగని గని. విభజన అనంతరం ఖమ్మం జిల్లా.. రెండు రెవిన్యూ డివిజన్లు, 21 మండలాలతో మిగిలింది. ప్రస్తుతం ఈ జిల్లా జనాభా 13 లక్షల 89వేల 566 మంది. సత్తుపల్లిలో ఉపరితల బొగ్గుగని జిల్లాకు ఆర్థిక పరిపుష్టిని కలిగించనుంది. నేలకొండపల్లిలోని బౌద్ధస్తూపం, భక్తరామదాసు నివాసం, స్తంభాద్రి లక్ష్మీనృసింహ క్షేత్రాలు జిల్లాకు వచ్చే పర్యటకులను అలరించనున్నాయి. 

18:58 - October 11, 2016

మహబూబ్‌ నగర్‌ : జిల్లా నాలుగు జిల్లాగా విభజితమైంది. మంత్రులు ఆయా జిల్లాలను అధికారికంగా ప్రారంభించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి ఏర్పడ్డ వనపర్తి జిల్లాను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. వనపర్తిలో జరిగిన కార్యక్రమాల్లో ఆయన జిల్లా పాలన కేంద్రాలను ప్రారంభించారు. ఒక రెవిన్యూ డివిజన్‌ 14 మండలాలతో ఏర్పాటైన వనపర్తి జిల్లా ప్రస్తుత జనాభా ఏడు లక్షల డెభ్బై వేల 334 మంది. ఒకప్పటి సంస్థానాధీశుల ఏలుబడికి నిదర్శనంగా నిలిచే కోట ఈ ప్రాంతానికి పర్యటకులను ఆకర్షిస్తుంది. తాగు,సాగునీటిని అందించే రామన్‌పాడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌, చక్కెర, మొలాసిస్‌ పరిశ్రమలకూ వనపర్తి కేంద్రంగా నిలుస్తోంది.

నాగర్ కర్నూలు..గద్వాల..
కొత్తగా ఏర్పాటైన నాగర్‌ కర్నూలు జిల్లాను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో జిల్లాను ప్రారంభించిన మంత్రి.. ప్రజల ఆకాంక్షల మేరకే తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మూడు రెవిన్యూ డివిజన్‌లు, 20 మండలాలతో ఏర్పాటైన నాగర్‌కర్నూలు జిల్లా ప్రస్తుత జనాభా ఎనిమిది లక్షల 60వేల 613 మంది. నాగార్జున సాగర్‌ పులుల అభయారణ్యం ఈ ప్రాంతానికి విశిష్టతను తెచ్చిపెడుతోంది. తెలంగాణలో బెల్లం ఉత్పత్తి చేసే ఏకైక ప్రాంతం నాగర్‌ కర్నూలు జిల్లాలోకే చేరింది. గద్వాల కేంద్రంగా ఏర్పాటైన జోగులాంబ జిల్లాను మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఒక రెవిన్యూ డివిజన్‌, 12 మండలాలతో ఏర్పాటైన జోగులాంబ జిల్లా జనాభా ఆరు లక్షల అరవై నాలుగు వేల 971 మంది. మగువల మనసు దోచే పట్టు చీరల తయారీకి గద్వాల పేరెన్నికగన్నది. కృష్ణా నదిపై తెలంగాణలో ఉన్న ఏకైక జలాశయం.. ఇప్పుడు గద్వాల జిల్లా పరిధిలోకి చేరింది. ఇక్కడ ఏటా 200 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. సందర్శకులను ఆకట్టుకునే బీచుపల్లి, ఆలంపూరు ఆధ్యాత్మిక క్షేత్రాలు ఈ జిల్లా పరిధిలోకే వచ్చాయి. విభజనకు పూర్వం అతి పెద్ద జిల్లాగా ఉన్న మహబూబ్‌నగర్‌.. ఇప్పుడు రెండు రెవిన్యూ డివిజన్‌లు 26 మండలాలకు పరిమితమైంది. ప్రస్తుత జనాభా 12 లక్షల తొంభై వేల 467 మంది. పాల ఉత్పత్తితో పాలమూరుగా ఖ్యాతిగాంచిన ఈ జిల్లా పరిధిలోనే విశ్వవిఖ్యాత పిల్లలమర్రి క్షేత్రం ఉంది. పేదల తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన మన్యంకొండ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం కూడా మహబూబ్‌నగర్‌ జిల్లాలోకే చేరింది. 

18:55 - October 11, 2016

మెదక్‌ : జిల్లా పునర్వ్యవస్థీకరణ అనంతరం మూడు జిల్లాలుగా మారింది. జిల్లా కేంద్రంగా మెదక్‌ ఉండాలన్న స్థానికుల దశాబ్దాల కోరిక ఇన్నేళ్లకు నెరవేరింది. మెదక్‌ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన సిద్దిపేట జిల్లా ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతులమీదుగా ప్రారంభమైంది. మొత్తం మూడు రెవిన్యూ డివిజన్‌లు, 23 మండలాలతో ఏర్పాటైన సిద్దిపేట జిల్లా జనాభా పది లక్షల రెండు వేల 671 మంది. వాణిజ్య కేంద్రంగా ఖ్యాతిగడించిన సిద్ధిపేట జిల్లాలో.. కోటి లింగేశ్వరాలయం, కోమటి చెరువులు పర్యాటకులను అలరించనున్నాయి. మెదక్‌ జిల్లాను డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఇంతకాలం ఈ ప్రాంతం మెదక్‌ జిల్లాగానే గుర్తింపు పొందినా.. అధికారిక కార్యక్రమాలన్నీ సంగారెడ్డి నుంచే జరిగేవి. తాజా నిర్ణయంతో.. మూడు రెవిన్యూ డివిజన్లు 19 మండలాలతో మెదక్‌ జిల్లా కొత్తగా ఏర్పాటైంది. ప్రస్తుతం మెదక్‌ జిల్లా జనాభా ఏడు లక్షల 67వేల 428 మంది. ఈ జిల్లాలో దాణా, విత్తన తయారీ పరిశ్రమలున్నాయి. ఏడుపాయల వనదుర్గ జాతర, మెదక్‌ చర్చి, ఖిల్లా, జైనమందిరం, నర్సాపూర్‌ అడవులు.. మెదక్‌ జిల్లా పర్యాటక రంగాభివృద్ధికి ఊతమివ్వనున్నాయి. ఇంతకాలం మెదక్‌ జిల్లా కేంద్రంగా సాగిన సంగారెడ్డి.. విడిగా జిల్లాగా ఏర్పాటైంది. మూడు రెవిన్యూ డివిజన్‌లు, 26 మండలాలతో ఉన్న ఈ జిల్లా ప్రస్తుత జనాభా పదిహేను లక్షల 23 వేల 758 మంది. మొసళ్ల పెంపక కేంద్రం ఈ జిల్లాకు ప్రత్యేకతను తెస్తోంది. అన్నింటికన్నా ముఖ్యమైనది.. ఆసియాలోనే అగ్రగామిగా నిలిచే పటాన్‌చెరు పారిశ్రామిక వాడ, ఇక్రిశాట్‌, ఐఐటీ, ఆయుధ తయారీ కర్మాగారం, భెల్‌ సంస్థలు సంగారెడ్డి జిల్లా యశస్సును విశ్వవ్యాప్తం చేసేవే.  

18:54 - October 11, 2016

నల్లగొండ : జిల్లా మూడు జిల్లాలుగా విభజితమైంది. మంత్రులు నాయిని నరసింహారెడ్డి, జగదీశ్‌రెడ్డి కొత్త జిల్లాలను ప్రారంభించారు. కొత్తగా ఏర్పాటైన యాదాద్రి జిల్లాను హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి ప్రారంభించారు. రెండు రెవిన్యూ డివిజన్‌లు, 16 మండలాలతో ఏర్పాటైన ఈ జిల్లా జనాభా ఏడు లక్షల 26వేల 465 మంది. భువనగిరి కేంద్రంగా కొనసాగే ఈ జిల్లాలో శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఏకశిలపై వెయ్యేళ్ల క్రితం నిర్మించిన భువనగిరికోట, చారిత్రక కొలనుపాక జైన దేవాలయం కూడా యాదాద్రి జిల్లా పరిధిలోనే ఉన్నాయి. సూర్యాపేట జిల్లాను మంత్రి జగదీశ్వరరెడ్డి ప్రారంభించారు. సూర్యాపేటలో జరిగిన కార్యక్రమాలో ఆయన మాట్లాడుతూ.. చిన్న జిల్లాల వల్ల బంగారు తెలంగాణ లక్ష్య సాధన సులభమవుతుందన్నారు. రెండు రెవిన్యూ డివిజన్‌లు, 23 మండలాలతో ఏర్పాటైన సూర్యాపేట జిల్లా జనాభా పది లక్షల 99వేల 560 మంది. ఈ జిల్లా సిమెంట్‌ పరిశ్రమలకు ప్రసిద్ధి. కాకతీయుల నాటి శివాలయాలూ జిల్లాను పర్యటకంగా ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. నల్లగొండ జిల్లా ఇకపై మూడు రెవిన్యూ డివిజన్‌లు, 31 మండలాలతో కొనసాగనుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనంతరం జిల్లా జనాభా పదహారులక్షల 31వేల 399 మంది. సాయుధ రైతాంగ పోరాటానికి పేరుగాంచిన నల్లగొండ జిల్లా.. ఇకపై కూడా ఫార్మా పరిశ్రమలకు నిలయంగానే భాసిల్లనుంది. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు ఈ జిల్లా పరిధిలోకే వచ్చి చేరింది. 

18:52 - October 11, 2016

నిజామాబాద్‌ : జిల్లాలో కొత్తగా ఏర్పాటైన కామారెడ్డి జిల్లా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ జిల్లాను రెండు జిల్లాలుగా విభజించారు. 22 మండలాలు, రెండు రెవిన్యూ డివిజన్‌లతో కామారెడ్డి కేంద్రంగా ఏర్పాటైన ఈ జిల్లాలో అధికారిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కామారెడ్డి జిల్లాను వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌గా సత్యనారాయణ, ఎస్పీగా శ్వేతారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు సరిగ్గా అందేందుకు.. చిన్న జిల్లాలు అవసరమని మంత్రి పోచారం అన్నారు. మొత్తం మూడు రెవిన్యూ డివిజన్లు.. 22 మండలాలతో ఏర్పాటు చేసిన కామారెడ్డి జిల్లా జనాభా 9,74,227 మంది. ఈ ప్రాంతం మెదక్‌, సిరిసిల్ల, నిజామాబాద్‌, సిద్దిపేట జిల్లాలకు కూడలిగా నిలుస్తోంది. తెలంగాణలో బెల్లం ఉత్పత్తి చేసే ఏకైక ప్రాంతమిది. బి-టెక్‌ డెయిరీ టెక్నాలజీ కాలేజీ కామారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చింది. విభజన తర్వాత నిజామాబాద్‌ మూడు రెవిన్యూ డివిజన్‌లు, 27 మండలాలతో మిగిలింది. ప్రస్తుతం ఈ జిల్లా జనాభా 15,77,108 మంది. ఈ జిల్లా పసుపు సాగుకు పెట్టింది పేరు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నీరు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తోంది. బ్రిటిష్‌కాలంలో ఏర్పాటు చేసిన రుద్రూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం.. జిల్లాకు ప్రత్యేకంగా నిలుస్తోంది. 

18:49 - October 11, 2016

హైదరాబాద్ : జంటనగరాలు.. నాలుగు జిల్లాలుగా విభజితమయ్యాయి. కొత్తగా ఏర్పాటైన జిల్లాలను మంత్రులు ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో కొనసాగిన మేడ్చల్‌ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటైంది. దీన్ని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రారంభించారు. రెండు రెవిన్యూ డివిజన్‌లు, 14 మండలాలతో ఏర్పాటైన మేడ్చల్‌ జిల్లా జనాభా 25 లక్షల 42వేల 203 మంది. ద్రాక్ష తోటలు, అందమైన విల్లాలకు ఈ జిల్లా పెట్టింది పేరు. బాలానగర్‌, జీడిమెట్ల, ఉప్పల్‌ పారిశ్రామిక వాడలు ఈ జిల్లాకు ఆర్థిక దన్నుగా నిలుస్తున్నాయి. జిల్లా పరిధిలోని సుప్రసిద్ధ కీసరగుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి క్షేత్రం ఆధ్యాత్మికవేత్తలను ఆకర్షిస్తుంది.

వికారాబాద్..
కొత్తగా ఏర్పాటైన వికారాబాద్‌ జిల్లాను మంత్రి మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. రెండు రెవిన్యూ డివిజన్‌లు, 18 మండలాలతో కూడిన ఈ జిల్లా జనాభా ఎనిమిది లక్షల 81వేల 250 మంది. ఈ జిల్లాలోని అనంతగిరి కొండలే మూసీనది జన్మస్థానం. జిల్లాలోని తాండూరు కందిపంటకు పేరెన్నికగన్నది. ఇక్కడి నాపరాళ్లు, సుద్ద, ల్యాటరైట్‌ గనులు జిల్లా ఆర్థిక వృద్ధికి దోహదపడేవే. పునర్వ్యవస్థీకరణ తర్వాత.. రంగారెడ్డి జిల్లా ఐదు రెవిన్యూ డివిజన్‌లు, 28 మండలాలతో మిగిలింది. ప్రస్తుతం ఈ జిల్లా జనాభా 25 లక్షల 51వేల 731 మంది. రాష్ట్రానికే తలమానికమైన ఐటీ పరిశ్రమ ఈ జిల్లాలోనే కేంద్రీకృతమైంది. వ్యవసాయ పరిశోధన సంస్థలు, ఇంజనీరింగ్‌ కాలేజీలు, వైద్య విద్యాసంస్థలు రంగారెడ్డి జిల్లా పరిధిలోనే కొనసాగుతున్నాయి. పర్యటకులను అలరించే చిలుకూరు బాలాజీ, నర్కూడ అమ్మపల్లి ఆలయాలు.. రంగారెడ్డి జిల్లాలోనే కొనసాగుతున్నాయి. అటు హైదారాబాద్‌ జిల్లా కూడా పునర్వ్యవస్థీకరణల అనంతరం.. రెండు రెవిన్యూ డివిజన్‌లు, 16 మండలాలతో మిగిలింది. ప్రస్తుతం హైదరాబాద్‌ జిల్లా జనాభా 39 లక్షల 43వేల 323 మంది. విద్యా, వైద్య రంగాల్లో విశ్యఖ్యాతితో పాటు.. ఐటీ రంగం, 425 ఏళ్ల సుదీర్ఘ చారిత్రక సంపదలు హైదరాబాద్‌ జిల్లా పరిధిలోనే ఉన్నాయి. 

18:47 - October 11, 2016

వరంగల్ : జిల్లా ఐదు జిల్లాలుగా మారింది. కొత్తగా నాలుగు జిల్లాలు అస్థిత్వంలోకి వచ్చాయి. అట్టహాసంగా జరిగిన కార్యక్రమాల్లో.. నయా జిల్లాలను మంత్రులు ప్రారంభించారు. వరంగల్‌ రూరల్‌ జిల్లాను మంత్రి కడియం శ్రీహరి ప్రారంభించారు. జిల్లా వెబ్‌సైట్‌నూ ఆయన ప్రారంభించారు. రెండు రెవిన్యూ డివిజన్లు, 15 మండలాలతో ఏర్పాటైన ఈ జిల్లా జనాభా ఏడు లక్షల 16వేల 457 మంది. ఆదర్శ గ్రామ పంచాయతీ గంగదేవిపల్లి ఈ జిల్లా పరిధిలోకి వచ్చింది. భీమునిపాదం జలపాతం, కొమ్మాల జాతర ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రాలుగా ఈ జిల్లాకు ఖ్యాతిని తేనున్నాయి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే కేసీఆర్‌ ప్రభుత్వం... జిల్లాల ఏర్పాటులోనూ ప్రజాభిప్రాయానికి పెద్దపీట వేసిందని జిల్లా ప్రారంభోత్సవంలో మంత్రి కడియం అన్నారు.
ఆచార్య జయశంకర్‌ పేరిట ఏర్పాటైన జిల్లాను అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి ప్రారంభించారు. భూపాలపల్లి కేంద్రంగా ఏర్పాటైన ఈ జిల్లాలో రెండు రెవిన్యూ డివిజన్లు, 20 మండలాలు ఉన్నాయి. మొత్తం ఏడు లక్షల ఐదు వేల యాభైనాలుగు మంది ప్రజలున్న జయశంకర్‌ జిల్లాలో.. రాష్ట్రంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం ఉంది. ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర జరిగే మేడారం ఈ జిల్లా పరిధిలోకే చేరింది. దీంతోపాటే.. చారిత్రక రామప్ప ఆలయం, కాళేశ్వరం ముక్తేశ్వరాలయాలూ జయశంకర్‌ జిల్లాలోకే చేరాయి.

జనగాం జిల్లా..
కొత్తగా ఏర్పాటైన జనగాం జిల్లాను శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ ప్రారంభించారు. రెండు రెవెన్యూ డివిజన్లు, 14 మండలాలతో ఏర్పాటైన ఈ జిల్లాజనాభా 5,82,457 మంది. సాహిత్య జగత్తుకు ఎనలేని సేవలు అందించిన ప్రముఖ కవులు పోతన, పాల్కురికి సోమనాథుల స్వగ్రామాలు ఈ జిల్లా పరిధిలోకే వచ్చాయి. లోహ హస్తకళలో ఖండాతర ఖ్యాతిని గడించిన పెంబర్తి కూడా జనగాం జిల్లాకే చెందింది. పాలకుర్తి సోమేశ్వరాలయం, లక్ష్మీనరసింహ ఆలయం, జీడికల్‌ వీరాచల సీతారామ చంద్రస్వామి ఆలయాలు కూడా జనగాం జిల్లా పర్యాటక రంగానికి ఊతమివ్వనున్నాయి.

మహబూబాబాద్..
మహబూబాబాద్‌ కేంద్రంగా ఏర్పాటైన జిల్లాను మంత్రి చందూలాల్‌ ప్రారంభించారు. మొత్తం రెండు రెవెన్యూ డివిజన్లు, 16 మండలాలున్న ఈ జిల్లా ప్రస్తుత జనాభా 7,70,170 మంది. గిరిజనులు అత్యధికంగా ఉండే ఈ జిల్లా అటవీ సంపదకు నెలవు. కురవి శ్రీ వీరభద్రస్వామి కూడా మహబూబాబాద్‌ జిల్లాలోనే కొలువైనాడు.

వరంగల్ అర్బన్ జిల్లా..
నాలుగు కొత్త జిల్లాలు ఏర్పాటు కాగా మిగిలిన వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఒక రెవిన్యూ డివిజన్‌, 12 మండలాలు ఉన్నాయి. ప్రస్తుతం ఓరుగల్లు అర్బన్‌ జిల్లా జనాభా 11,35,707 మంది. హైదరాబాద్‌ తర్వాత రాష్ట్రంలో అతి పెద్ద నగరంగా ఓరుగల్లు నిలుస్తోంది. ఇక్కడి ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ ఆసియాలోనే అతి పెద్దది. భద్రకాళి ఆలయం, చారిత్రక వేయి స్తంభాల గుడి.. ఓరుగల్లు అర్బన్‌ జిల్లాకు ఆధ్యాత్మిక, పర్యాటక శోభను తెచ్చిపెడుతున్నాయి. 

18:44 - October 11, 2016

సిద్ధిపేట: తెలంగాణ చరిత్రలో అతి గొప్ప పరిపాలనా సంస్కరణలు సిద్దిపేట నుంచే ప్రారంభం కావడం ఎప్పటికీ మరిచిపోలేనన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. సిద్దిపేట జిల్లాను ప్రారంభించిన ఆయన..కొత్త జిల్లాపై వరాల జల్లు కురిపించారు. సిద్దిపేట అభివృద్ధికి 100కోట్లు కేటాయించడంతో పాటు మెడికల్‌ కాలేజీని, ఓ యూనివర్సిటీనీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య సిద్దిపేట జిల్లాను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ప్రారంభించారు. అంబేద్కర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక జిల్లా కలెక్టరేట్‌ను సీఎం ప్రారంభించారు. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీష్‌రావు సమక్షంలో కలెక్టర్‌గా వెంకటరామ్ రెడ్డి, పోలీస్‌ కమిషనర్‌గా శివకుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌గా హనుమంతరావు విధుల్లో చేరారు. ఆ తర్వాత సిద్దిపేట బస్టాండ్‌ వరకు కేసీఆర్ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దిపేట సంబురాలు లోగోను సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు. ఆ తర్వాత మంత్రి హరీష్‌రావుతో కలిసి రోడ్‌ షో నిర్వహించారు.

అద్భుత నగరం కావాలి..
సిద్దిపేట అద్భుతమైన నగరంగా రూపుదిద్దుకోవాలని ఆకాంక్షించారు. సిద్దిపేట జిల్లా ప్రత్యేకంగా ఉండాలని..తాను పుట్టిన గడ్డకు ఓ ప్రత్యేకత చేకూరాలని అభిలషించారు. సిద్దిపేట డివిజన్‌కు 100 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. సిద్దిపేటకు మెడికల్‌ కాలేజీ మంజూరు చేస్తానని, వచ్చే ఏడాదిలోనే కాలేజీని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో సిద్దిపేటకు మెడికల్ యూనివర్సిటీ రాబోతోందన్నారు. సిద్దిపేటలో పోలీస్ కమిషనరేట్‌ను కూడా ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. హామీ ఇచ్చినట్లుగానే సిద్దిపేటను జిల్లాను చేశామని.. ఇక గోదావరి నీళ్లు రావడం, రైలు మార్గం మిగిలి ఉన్నాయని తెలిపారు. సిద్ధిపేటను జిల్లాగా చేయాలని మూడు దశాబ్దాల క్రితమే ఎన్టీఆర్‌కు ఇదే చౌరస్తాలో వినతిపత్రం సమర్పించానన్నారు. తాను ఎక్కడ ఉన్నా సిద్దిపేటను మరచిపోనని అన్నారు. మరోవైపు సీఎం కేసీఆర్‌ను మంత్రి హరీష్‌రావు ప్రశంసలతో ముంచెత్తారు. కేసీఆర్ అన్న అక్షరాలకు తనదైన శైలిలో కొత్త అర్థాన్ని వెల్లడించారు. అనంతరం, మర్కూక్ మండలం ఆవిర్భావ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. పట్టుబడితే.. జట్టుకడితే.. సాధించలేనిదంటూ ఏమీ లేదనన్నారు. 2020 కల్లా తెలంగాణ బడ్జెట్ 5 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందన్నారు. సంక్షేమ ఫలాలు చిట్ట చివరి వ్యక్తికి చేరాలన్నదే కొత్త జిల్లాల ఉద్దేశమని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

రామ్ లీలా మైదానానికి చేరుకున్న మోడీ..

ఢిల్లీ : రామ్ లీలా మైదానానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ చేరుకున్నారు. రావణ దహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. 

రామ్ లీలా మైదానంలో రావణ దహనం..

ఢిల్లీ : రామ్ లీలా మైదానంలో రావణ దహన కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రజలు తరలివచ్చారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. 

రాంపూర్ లో నవ తెలంగాణ ఎడిషన్ ప్రారంభం..

వరంగల్ : రాంపూర్ లో నవ-తెలంగాణ ఎడిషన్ ను డిప్యూటి సీఎం కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య, పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. నవ తెలంగాణ ఎడిషన్ ప్రారంభం కావడం మంచి పరిణామమని, ప్రజా సమస్యలను ప్రతిబింబించేలా వార్తలుండాలని కడియం శ్రీహరి పేర్కొన్నారు. 20 ఏళ్ల క్రితం ఫోర్త్ ఎస్టేట్ అంటేనే మీడియా అని, ఇప్పుడు పేపర్లు నింపేందుకు వార్తలు రాస్తున్నారని తెలిపారు. సామాన్యుల గొంతుక నవ తెలంగాణ పత్రిక అని ఎడిటర్ వీరయ్య పేర్కొన్నారు. సమాజంలోని సమస్యలను లేవనెత్తేందుకు ఈ పత్రిక ప్రజలకు మరింత చేరువవుతోందన్నారు. 

17:49 - October 11, 2016

మైసూర్ : దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రఖ్యాత మైసూర్ ప్యాలెస్ వద్ద కళాకారులు రకరకాల రూపాలతో పరేడ్ నిర్వహించారు. అనంతరం అమ్మవారిని ఏనుగు అంబారీపై ఉంచి ఊరేగించారు. ఈ ప్రదర్శనను తిలకించేందుకు మైసూర్ వాసులు..పర్యాటకులు భారీగా తరలివచ్చారు. 

17:46 - October 11, 2016

హైదరాబాద్ : మత సంప్రదాయం ప్రకారం ఆరాధన ఉపవాస దీక్ష చేసిందని, ఎవరి ఒత్తిడితో దీక్ష చేయలేదని జైన మత గురువు రవీంద్ర మునిశ్రీ పేర్కొన్నారు. ఇటీవలే 64 రోజుల పాటు ఉపవాసం చేసిన ఆరాధన కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఉపవాసం చేయిస్తే లాభాలు వస్తాయని..వ్యాపారంలో అభివృద్ధి చెందుతానని తండ్రి భావించి ఆరాధనతో ఉపవాస దీక్ష చేయించినట్లు ఆరోపణలు వినిపించాయి. దీనిపై రవీంద్ర మునీశ్రీ నేడు మీడియాతో మాట్లాడారు. దీక్ష ముగిసిన తరువాత అనారోగ్యంతో ఆరాధన మృతి చెందిందని, వ్యాపారంలో నష్టాలు రావడం వల్లే దీక్ష చేసిందనడంలో ఎలాంటి నిజం లేదన్నారు. ఉపవాస దీక్ష చేయడం వల్ల పాపాలు పోతాయనే నమ్మకం ప్రజల్లో ఉందని, ఇలా ఎంతో మంది దీక్ష చేసి ఆరోగ్యంగానే ఉన్నారని రవీంద్ర మునిశ్రీ పేర్కొన్నారు.

 

దుర్గమ్మ ఉత్సవ విగ్రహాల ఊరేగింపు నిలిపివేత..

విజయవాడ : కొబ్బరికాయ కొట్టకుండానే ఉత్సవ విగ్రహాల ఊరేగింపు నిర్వహించడం పట్ల వన్ టౌన్ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊరేగింపును నిలిపివేశారు. ఆలయ అధికారుల వ్యవహరించిన తీరును వారు తప్పుబడుతున్నారు. 

17:27 - October 11, 2016

విజయవాడ : దుర్గమ్మ ఉత్సవ విగ్రహాల ఊరేగింపు వివాదాస్పదమైంది. కొబ్బరి కాయ కొట్టకుండానే ఊరేగింపును ఎలా ప్రారంభిస్తారని పోలీసులు ప్రశ్నించారు. అర్జున వీధిలో ఉత్సవ విగ్రహా ఊరేగింపు పోలీసులు నిలిపివేశారు. తమకు కేటాయించిన టైంలో రావడం జరిగిందని, కానీ అప్పటికే ఊరేగింపును ప్రారంభించారని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారి టెన్ టివితో మాట్లాడారు. ప్రతి సంవత్సరం పోలీసు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శివాలయం దగ్గరకు వెళ్లడం జరుగుతుందని, వన్ టౌన్ పోలీసులకు ఉత్సవ విగ్రహాలను అందచేయడం..అక్కడ కొబ్బరికాయ కొట్టిన అనంతరం ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందన్నారు. దుర్గాఘాట్ కు వెళ్లిన అనంతరం హంస వీధిలో ఊరేగింపు ఉంటుందన్నారు. ఇలా తెల్లవారుజాము వరకు విగ్రహాల ఊరేగింపు ఉంటుందన్నారు. తాము రాకముందే ఆలయ అధికారులు కొబ్బరికాయ కొట్టి ఉత్సవ విగ్రహాలతో కూడదిన ఊరేగింపు మంటపాన్ని మోసుకుంటూ మహామంటపం వరకు వచ్చేశారని, ఆనాదిగా వస్తున్న ఆచారాన్ని..కట్టుబాట్లను అమలు చేయాలని సూచించారు. ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, వారు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. 

17:18 - October 11, 2016

ఇండోర్ : భారత జట్టు చారిత్రక విజయం సాధించింది. టెస్టు సిరీస్ లో కివీస్ ఘోర పరాజయం పాలైంది. మూడు టెస్టుల సిరీస్ ను 3-0 తేడాతో భారత్ క్లీన్ స్వీప్ చేసింది. రవిచంద్రన్ అశ్విన్ మరోసారి విజృంభించి ఆడాడు. స్పిన్ మాయజాలానికి కివీస్ బ్యాట్స్ మెన్స్ చేతులెత్తేశారు. ఏడు వికెట్లు తీసి న్యూజిలాండ్ నడివిరిచాడు.
మొదటి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు పడగొట్టిన అశ్విన్ రెండో ఇన్నింగ్స్ లో కూడా విజృంభించాడు. ఏకంగా ఏడు వికెట్లు తీశాడు. ఇతడికి రవీంద్ర జడేజా (2 వికెట్లు) సహకారం అందించాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో కోహ్లీ డబుల్ సెంచరీ, రహానే సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. 5 వికెట్ల నష్టానికి 557 పరుగులకు డిక్లేర్డ్ చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు కుప్పకూలింది. అశ్విన్ ధాటికి న్యూజిలాండ్ 299 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ మూడు వికెట్లు కోల్పోయి పూజారా సెంచరీ చేయగానే 216 పరుగులకు డిక్లేర్డ్ చేసింది. రెండు ఇన్నింగ్స్ లో 8 వికెట్లు కోల్పోయి 773 పరుగులు చేసినట్లైంది. డ్రా చేద్దామని బ్యాటింగ్ ఆరంభించిన కివీస్ జట్టుకు రవిచంద్రన్ అశ్విన్ మరోసారి చుక్కలు చూపించాడు. ఏడు వికెట్లు తీసి కివీస్ నడ్డి విరిచాడు. రెండో ఇన్నింగ్స్ లో కేవలం 153 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మూడో టెస్టును టీమిండియా 321 పరుగుల భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. దీనితో టెస్టు సిరీస్ ను భారత్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.
భారత్ మొదటి ఇన్నింగ్స్ : 557/5 (కోహ్లీ 211, రహానే 188, శర్మ 51 నాటౌట్)
న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ : 299 ఆలౌట్ (గుప్తిల్ 72, లాథమ్ 53, జేమ్స్ నీషమ్ 71)
భారత్ రెండో ఇన్నింగ్స్ : 216 డిక్లేర్డ్ (గంభీర్ 50, పుజారా 101 నాటౌట్)
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ : 153 ఆలౌట్

భారత్ ఘన విజయం..

ఇండోర్ : న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్ లోనూ ఆరు వికెట్లు తీసిన అశ్విన్ కివీన్ నడ్డిని విరిచాడు. మూడు టెస్టుల సిరీస్ లో 3-0 తేడాతో భారత్ క్లీన్ స్వీప్ చేసింది. కోహ్లీ డబుల్ సెంచరీ, రహానే సెంచరీతో రాణించడంతో ఐదు వికెట్ల నష్టానికి 557 పరుగులకు డిక్లేర్డ్ చేసింది. రవిచంద్రన్ అశ్విన్ ధాటికి న్యూజిలాండ్ 299 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీనితో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ మూడు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఇందులో పూజారా సెంచరీ చేశాడు. అశ్విన్ మరోసారి శాసించాడు. ఏడు వికెట్లు తీసి న్యూజిలాండ్ నడ్డివిరిచాడు.

గోవాకు పుతిన్..

ఢిల్లీ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఈనెల 14 నుండి 17 వరకు గోవాలో పర్యటించనున్నారు. గోవాలో జరిగే బ్రిక్స్ సదస్సుతో పాటు భారత్ - రష్యా 17వ వార్షిక సదస్సులో ఆయన పాల్గొనున్నారు. 

గట్టుప్పల్ గ్రామస్తుల ఆందోళన..

నల్గొండ : చండూరు (మం) గట్టుప్పల్ గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. గట్టుప్పల్ మండల కేంద్రంగా ప్రకటించకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళన కార్యక్రమానికి సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి మద్దతు తెలిపారు. ప్రజాభిప్రాయాలకనుగుణంగా కాకుండా ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడం తగదని, గట్టుప్పల్ ను తొలి జాబితాలో మండల కేంద్రంగా నిర్ణయించి తుదిజాబితాలో తొలగించడంపై సీఎం వివరణనివ్వాలని డిమాండ్ చేశారు. 

15:38 - October 11, 2016
15:36 - October 11, 2016
15:35 - October 11, 2016
15:32 - October 11, 2016

విజయవాడ : ఏపీ కొత్త సచివాలయంలో సీఎం చంద్రబాబు కార్యాలయం రేపు ప్రారంభకానుంది. ఫస్ట్‌ బ్లాక్‌ లోని మొదటి అంతస్థులో ఉదయం 8గంటల 9నిమిషాలకు తన ఛాంబర్‌ ను చంద్రబాబు ప్రారంభించనున్నారు. వాస్తవానికి దసరా రోజే ప్రారంభించాల్సిన ఉండగా నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతుండటంతో ఒక రోజు వాయిదా వేశారు. రేపు కేవలం సీఎం ప్రారంభం మాత్రమే చేస్తారు. పూర్తి స్థాయిలో పాలన చేయడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

15:30 - October 11, 2016
15:17 - October 11, 2016

లాల్ దర్వాజలో అగ్నిప్రమాదం..

హైదరాబాద్ : పాతబస్తీ లాల్ దర్వాజలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గోమతి ఎలక్ట్రానిక్స్ షాపులో మంటలు ఎగిసిపడుతున్నాయి. మూడో అంతస్తుకు మంటలు వ్యాపించాయి. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పుతున్నారు. 

తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగుంది - కేసీఆర్..

మెదక్ : తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అందుకే పెట్టుబడులకు ముందుకొస్తున్నారని, 2024 నాటికి రాష్ట్ర బడ్జెట్ రూ. 5 లక్షల కోట్ల ఉంటుందని తెలిపారు. అమ్మవారి దయతో బ్రహ్మాండమైన వర్షాలు పడ్డాయని, రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు నేర్చుకోవాలన్నారు. 

14:52 - October 11, 2016

బాలయ్య వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి టీజర్‌ హల్‌చల్‌ చేస్తోంది. బాలయ్య కేరీర్‌లో ఈ చిత్రం వందో చిత్రం కావడంతో ..అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు క్రిష్‌. నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చారిత్రాత్మక చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. ఇందులో శాతకర్ణి భార్య వశిష్ఠిదేవిగా శ్రియ నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం మధ్యప్రదేశ్‌లో చిత్రీకరణ జరుగుతోంది. బాలకృష్ణ, హేమమాలిని, శ్రీయ తదితరులపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు క్రిష్‌. ఈ చిత్రాన్ని వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబా నిర్మిస్తున్నారు.

14:50 - October 11, 2016

హైదరాబాద్ : తెలంగాణ చరిత్రలో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. ఇప్పటివరకు ఉన్న 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 21 జిల్లాలు వచ్చి చేరాయి. దాదాపు 38 ఏళ్ల తర్వాత తెలంగాణలో భారీ ఎత్తున జిల్లాల పునర్విభజన జరిగింది. దీంతో తెలంగాణ రాష్ట్రం 31 జిల్లాల సరికొత్త రాష్ట్రంగా అవతరించింది. సరిగ్గా 11 గంటల 13 నిమిషాలకు తెలంగాణలోని 21 కొత్త జిల్లాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. సిద్ధిపేట జిల్లాను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. సిద్ధిపేట నుంచి జిల్లాల ప్రారంభోత్సవానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. దీంతో తెలంగాణలో సరికొత్త జిల్లాల పాలనకు నూతన అధ్యాయం ప్రారంభమైంది. మొదట జాతీయ జెండాను ఆవిష్కరించిన కేసీఆర్..తరువాత జిల్లాను ప్రారంభించారు.

  • తెలంగాణలో ఘనంగా నూతన జిల్లాలు ప్రారంభమయ్యాయి. మేడ్చల్‌ జిల్లాను మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రారంభించారు.
  • తెలంగాణలో కొత్త జిల్లాలను సీఎం కేసీఆర్, మంత్రులు ప్రారంభించారు. ఆసిఫాబాద్‌ జిల్లాను మంత్రి జోగు రామన్న ప్రారంభించారు.
  • తెలంగాణ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. నిర్మల్‌ జిల్లాను మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రారంభించారు.
  • పెద్దపల్లి జిల్లాను ఎంపీ బాల్కా సుమన్‌, మంత్రి ఈటెల ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా వాసులకు బాల్కా సుమన్‌, మంత్రి ఈటెల విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.
  • వరంగల్‌ రూరల్‌ జిల్లాను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి లాంచనంగా ప్రారంభించారు. కలెక్టరేట్‌లో జరిగిన ప్రత్యేక కార్యకర్మంలో కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్‌ ప్రశాంత జీవన్‌ పాటిల్‌ పోలీసులు నుంచి గౌవర వందనం స్వీకరించారు. జాతీయ జెండాను ఎగురవేసి కలెక్టర్‌ కార్యాలయాన్ని కడియం శ్రీహరి ప్రారంభించారు. కలెక్టరేట్‌లోని అన్ని గదులను పరిశీలించారు. కలెక్టరేట్‌ను ప్రారంభించిన తర్వాత కడియం శ్రీహరి సమక్షంలో జిల్లా కలెక్టర్‌ ప్రశాంత జీవన్‌ పాటిల్‌ బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌కు పక్కనే ఏర్పాటు చేరసిన వరంగల్‌ రూరల్‌ ఆర్డీవో కార్యాలయ్యాన్ని కూడా కడియ శ్రీహరి పరిశీలించారు. ఎమ్మెల్యేలు కొండా సురేఖ, ఆరూరి రమేశ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
  • తెలంగాణలో జిల్లాల పండగ ఘనంగా జరుగుతోంది. సీఎం కేసీఆర్‌ తో పాటు మంత్రులు, ప్రజా ప్రతినిధులు 21 జిల్లాలను ఏక కాలంలో ప్రారంభించారు. కొత్తగా ఏర్పడిన యాదాద్రి జిల్లాను హోం మినిస్టర్‌ నాయిని నర్సింహ రెడ్డి ప్రారంభించారు. కలెక్టర్‌, ఎస్పీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.
  • కామారెడ్డి జిల్లా ప్రారంభోత్సవ సంబురాలు అంబరాన్నంటాయి. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి.. కామారెడ్డి జిల్లాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులతో పాటు భారీ సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.
  • మహబూబాబాద్‌ కొత్త జిల్లాగా అవతరించింది. వరంగల్ జిల్లాలో ఎక్కువ రైస్‌ మిల్లులతో వాణిజ్య కేంద్రంగా ఎదిగిన మహబూబాబాద్‌ ఇప్పుడు జిల్లా కేంద్రం అయ్యింది. జిల్లాల పునర్వవస్థీకరణంలో భాగంగా వరంగల్‌ జిల్లాను విభజించి మహబూబాబాద్‌ను కొత్త జిల్లాగా ఏర్పాటు చేశారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి జిల్లాను ప్రారంభించారు. మహబూబాబాద్‌ ఎంపీ సీతారాం నాయక్‌, ఎమ్మెల్యేలు శంకర్‌ నాయక్‌, రెడ్యానాయక్‌ జిల్లా కలెక్టర్‌ ప్రీతీ మీనా, ఎస్‌పీ మురళీధర్‌, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి రాంచంద్రనాయక్‌, పలువురు అధికారులు, అనధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహబూబాబాద్‌ ప్రారంభోత్సవానికి ప్రజలు భారీగా తరలి వచ్చారు.
  • మెదక్ జిల్లాను డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. అంతకుముందు జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన పద్మా దేవేందర్‌ రెడ్డి..మెదక్‌ జిల్లాను తన చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
  • జిల్లాల పునర్వస్థీకరణలో భాగంగా ఏర్పాటైన జనగామ జిల్లాను శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ లాంచనంగా ప్రారంభించారు. వరంగల్‌ జిల్లాను విభజించి జనగామ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌ ప్రారంభోత్సవానికి వచ్చిన స్వామిగౌడ్‌కు అధికారులు స్వాగతం పలికారు. కలెక్టరేట్‌ ఆవరణంలో జాతీయ జెండాను ఆవిష్కరించి జిల్లాను ప్రారంభించారు. జనగామ కలెక్టర్‌గా దేవసేన, జాయింట్ కలెక్టర్‌గా జేజీకే ప్రసాదరావు బాధ్యతలు స్వీకరించారు. పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, అధిక సంఖ్యంలో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

తెలంగాణ అభివృద్దికి కృషి చేస్తా - కేసీఆర్..

మెదక్ : బతికున్నంత వరకు తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మర్కూక్ మండల కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. మర్కూక్ ను అద్భుతమైన మండలంగా తీర్చిదిద్దుతానని, రూ. 10 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మర్కూక్ అభివృద్ధి కోసం ఓ అధికారిని నియమిస్తామన్నారు. 

14:20 - October 11, 2016

మెదక్ : సిద్ధిపేట జిల్లాలోని మర్కూక్ లో సీఎం కేసీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా నిధులు మంజూరు చేశారు. మర్కూక్ అద్భుతమైన మండలంగా తీర్చిదిద్దాలని, కావాల్సిన వసతులు, హంగులు ఏర్పాటు చేసుకోవాల్సినవసరం ఉందని తెలిపారు. అందుకోసం మర్కూక్ మండల కేంద్రానికి రూ. 10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అనంతరం తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, రాష్ట్రం ఏర్పడినందు వల్లే జిల్లాలు..మండలాలు ఏర్పాటవుతున్నాయన్నారు. 584కొత్త మండలాలు ఏర్పాటయ్యాయని, 68 రెవెన్యూ డివిజన్స్ అవుతున్నట్లు, 31 జిల్లాలు ఏర్పాటయ్యాయని తెలిపారు. మిషన్ భగీరథకు డబ్బులు ఇచ్చేందుకు బ్యాంకులు క్యూ కట్టాయని, కమర్షియల్ బ్యాంక్ రూ. 20వేల కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చారని తెలిపారు. ప్రతొక్క కుటుంబాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు కృషి చేయడం జరుగుతుందని, రాబోయే రోజులు అద్భుతంగా ఉంటాయని పేర్కొన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు నేర్చుకుని ముందుకెళ్లాలని కేసీఆర్ సూచించారు.

13:54 - October 11, 2016

ఆదిలాబాద్ : దసరా అనగానే రావణ దహనం. చెడును కాల్చేయడం, రాముని విజయం అని రావణుడి ఓటమి అని చెప్తుంటారు. కానీ..అదే రావణున్ని తమ చక్రవర్తిగా కీర్తిస్తూ వర్థంతి కూడా జరుపుతున్నారు ఏజెన్సీ ప్రాంతాల్లోని గోండు ఆదివాసీలు. ప్రతిఏటా రావణ ఉత్సవాలు నిర్వహిస్తూ.. బాహ్యప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలను వెలుగులోకి తెస్తున్నారు. దసరా సందర్భంగా ఆదివాసీ గోండుల రావణ పూజలపై 10TV ప్రత్యేక కథనం..!

రావణుడే మా రాజు
రావణుడిని రాక్షసుడిగా చూడటం మాత్రమే మనం ఇంతవరకు చూశాం. కానీ అదే రావణున్ని దేవుడిగా.. తమ పూర్వికుడిగా చూసే ఆదివాసీలున్నారు. రావణుడికి ఆలయాలూ ఉన్నాయి. అంతేకాదు... రావణుడిపై రాక్షస ముద్ర వేసి చరిత్ర వక్రీకరించి సాంస్కృతిక దాడి చేశారన్నది ఆదివాసీల వాదన. ఇప్పటికీ చాలా చోట్ల ఆదివాసీల రావణ ఆలయాలు ఉన్నాయంటే.. రావణుడిని వారెంత ఆదరిస్తారో అర్ధం చేసుకోవచ్చు.

రావణుడిని ఆరాధ్య దైవంగా పూజిస్తూన్న గోండులు
మధ్యప్రదేశ్‌లోని విదిశ జిల్లా రావణ్‌ గ్రామంలోని ఆలయం, రాజస్థాన్‌లో జోధ్‌పూర్‌ సమీపంలోని.. స్థానికులు రామరావణ యుద్ధం తర్వాత శ్రీలంక నుంచి జోధ్‌పూర్‌కు వచ్చి స్థిరపడినట్లు చెబుతారు. వీరితో పాటు మరికొన్ని తెగల వారు కూడా రావణుడిని గొప్ప వీరుడిగా గౌరవిస్తారు. కాన్పూర్‌లోనూ రావణ ఆలయం ఉంది. ఆ ఆలయాన్ని దసరా రోజు మాత్రమే తెరిచి పూజలు నిర్వహిస్తారు. చాలా ప్రాంతాల్లో రావణుడిని ఆరాధ్య దైవంగా పూజిస్తూ.. తమ విశిష్టతను చాటుతున్నారు.

తొలి పెళ్లి పత్రిక రావణుడికే
కొన్ని గ్రామాల్లో రావణుడంటే ఆదివాసీలకు అమితమైన భక్తి. ఊళ్లో ఎవరికి పెళ్లి కుదిరినా తొలి పెళ్లిపత్రికను అందించేది ఆ రావణ దేవుడికే. చాలా మంది తమ ఆరాధ్యదైవంగా రావణుడిని భావించి కొలుస్తుంటారు. రాముడి పాత్రను వీరోచితంగా.. రావణుడి పాత్రను రాక్షసుడిగా, ప్రతినాయకుడిగా చూపడంపై ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చరిత్ర వక్రీకరించడం తగదని వాపోతున్నారు.

దేశంలో రెండో అతిపెద్ద ఆదివాసి తెగ అయిన గోండులు
రావణుని వారసులమని చెబుతున్న తెగ ఆదిలాబాద్‌ జిల్లాలోనూ ఉంది. దేశంలో రెండో అతిపెద్ద ఆదివాసి తెగ అయిన గోండులకు రావణుడు రాజు, దేవుడు. పశుపక్ష్యాదులను పూజించే అడవి బిడ్డలకు రావణుడే ప్రకృతి దైవంగా.. పదో ధర్మగురువుగా గోండులు కొలస్తుంటారు. కుపార్‌లింగో వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లినందుకు గుర్తుగా రావణమహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

30లక్ష జనాభాతో గోండులు..భాషకు  మాత్రం లిపి లేదు...
జానపదాల్లో రావణుడు మహావీరుడు. రావణున్ని వనదేవుడిగా భావించి ఆదివాసీలు.. అతన్ని దేవుడిగా కొలవడం ఇక్కడ ఆనవాయితీ. తెలంగాణలోని ఆదిలాబాద్‌, మహారాష్ట్రలోని గడ్చిరోలి, అమరావతి, మధ్యప్రదేశ్‌లోని విదిశా, మందసార్‌లతో పాటు గోండుల జనాభా అధికంగా గల గోండియా, చందర్‌పూర్‌, భండార్‌లో రావణ పూజ ఘనంగా నిర్వహిస్తారు. దాదాపు 30 లక్షల మంది గోండు తెగ జనాభా ఉన్న ఇప్పటికీ వారికి లిపి లేదు. అందుకే చరిత్ర అక్షరబద్ధం కాలేదని ఆదివాసీలు చెబుతున్నారు.

రావణుడు ఆదర్శప్రాయుడంటున్న గోండులు..
గోండుల జానపదాల్లో రావణుడిది ఆదర్శ వ్యక్తిత్వం. అతనో పోరాట యోధుడు. ధర్మగురువు. అలాంటి రావణుడి కోసం ఆదివాసీలు ప్రత్యేక సంబురాలు నిర్వహిస్తుంటారు. ఎంతో శోభాయమానంగా సాగే సంబురాలు అబ్బురపరుస్తుంటాయి. గడ్చిరోలిలోని పరస్వాది గ్రామంలోని వేడుక ప్రత్యేకంగ ఉంటుంది. రావణుడి రెండున్నర అడుగుల ప్రతిరూపాన్ని అంగరంగవైభవంగా అలంకరించి పూజలు చేస్తారు. ఎక్కడ ఊరేగింపు సాగిందో అక్కడ ఇంద్రధనుస్సు జెండాను స్థాపించి.. పూజారి ధాన్యపు గింజల్ని ఊరంతా చల్లుతూ.. అంతా శుభం కలగాలని దీవిస్తాడు. పదిరోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో పసుపు రంగే కీలకం. గోండులు ఈ వేడుకల్లో ఎద్దుకొమ్ములతో చేసిన విగ్రహాన్ని కూడా ప్రదర్శించడం విశేషం.

దండయాత్రలతో తమ చరిత్రకు బీటలు : గోండులు
తమ సంస్కృతిని కాపాడుకోవడంలో భాగమే రావణ మహోత్సవం అని, వలసలు, దండయాత్రలతో తమ చరిత్ర దెబ్బతిందని గోండులు చెబుతున్నారు. అడవితల్లిని, కొండదేవతల్ని పూజించే గోండులు తమ సంస్కృతిని కాపాడుకునేందుకే ఇలాంటి ఉత్సవాలు నిర్వహిస్తోందని అంటున్నారు. తమ ఆరాధ్య దైవమైన రావణుడిని దసరా రోజు దహనం చేయడంపై గోండులు మండిపడుతున్నారు.రావణున్ని దసరా రోజు దహనం చేయడం తగదని ఆదివాసీ గోండులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిఏటా తమ రాజును కాల్చే పద్ధతిని విడనాడాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

13:46 - October 11, 2016

హైదరాబాద్ : తెలంగాణ చరిత్రలో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. ఇప్పటివరకు ఉన్న 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 21 జిల్లాలు వచ్చి చేరాయి. దాదాపు 38 ఏళ్ల తర్వాత తెలంగాణలో భారీ ఎత్తున జిల్లాల పునర్విభజన జరిగింది. దీంతో తెలంగాణ రాష్ట్రం 31 జిల్లాల సరికొత్త రాష్ట్రంగా అవతరించింది. సరిగ్గా 11 గంటల 13 నిమిషాలకు తెలంగాణలోని 21 కొత్త జిల్లాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. సిద్ధిపేట జిల్లాను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. సిద్ధిపేట నుంచి జిల్లాల ప్రారంభోత్సవానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. దీంతో తెలంగాణలో సరికొత్త జిల్లాల పాలనకు నూతన అధ్యాయం ప్రారంభమైంది. మొదట జాతీయ జెండాను ఆవిష్కరించిన కేసీఆర్..తరువాత జిల్లాను ప్రారంభించారు. అలాగే సిరిసిల్లను కేటీఆర్ ప్రారంభించారు.

జిల్లా ప్రారంభోత్సవాలు ..
నవ తెలంగాణకు సర్కార్‌ శ్రీకారం చుట్టింది. దసరా పండుగ రోజున రాష్ట్రంలో కొత్తగా 21 జిల్లాలను ప్రారంభించారు. సీఎం కేసీఆర్‌ సిద్ధిపేట జిల్లాను ప్రారంభించగా.. ఆసిఫాబాద్‌ జిల్లాను మంత్రి జోగు రామన్న ప్రారంభించారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు 21 జిల్లాలను ఏక కాలంలో ప్రారంభించారు. కొత్తగా ఏర్పడిన యాదాద్రి జిల్లాను హోం మినిస్టర్‌ నాయిని నర్సింహ రెడ్డి ప్రారంభించారు. కలెక్టర్‌, ఎస్పీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా ప్రారంభోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఆడపడుచుల బతుకమ్మలు, డప్పు చప్పుళ్లు, కోలాటాలతో మార్మోగాయి. ఎద్దుల బండిపై విచ్చేసిన మంత్రి జూపల్లి నాగర్‌ కర్నూలు జిల్లాను ప్రారంభించారు.   

కేసీఆర్ పేరు ఏమిటో తెలుసా?..

మెదక్ : కేసీఆర్ పేరుకు మంత్రి హరీష్ రావు కొత్త అర్థం చెప్పారు. కే అంటే నాలెడ్జ్, సీ అంటే కమిట్ మెంట్, ఆర్ అంటే రీ కన్ స్ట్రక్షన్ అని కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తారు హరీష్ రావు. సిద్ధిపేట జిల్లాను ప్రారంభించిన అనంతరం భారీ బహిరంగ సభకు మంత్రి హరీష్ రావు, కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతున్న సందర్భంగా కేసీఆర్ అంటే కొత్త మీనింగ్ ను హరీష్ రావు పేర్కొన్నారు. ప్రధానిమంత్రి చేతుల మీదుగా రైల్వేలైన్ సాకారమైతే ఈరోజున సిద్ధిపేట జిల్లాగా మన ముఖ్యమంత్రిగారి చేతిపై ప్రారంభించబడిందని పేర్కొన్నారు.

ఊపిరున్నంత వరకూ మీకోసమే : కేసీఆర్

మెదక్  : సిద్దిపేట జిల్లా ఏర్పాటైన సందర్బంగా ఆయన రోడ్‌షోలో మాట్లాడారు. బతికున్నంతం వరకు మీ కోసం పనిచేస్తా, మీరు దీవిస్తూ ఉండండి, మీ కోసం పనిచేస్తూ పోతా. నేను రాజీనామా చేసి పోయేటపుడు కళ్లల నీల్లు వచ్చినయి. సిద్దిపేటకు ఎలా అని బాధపడ్డాను. కానీ యువకుడు హరీష్ చేతిలో సిద్దిపేట అభివృద్ధి చెందడం సంతోషంగా ఉందన్నారు. వచ్చే సంవత్సరం మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామన్నారు. తాను సిద్దిపేటలో తిరగని గ్రామంలేదని, తిరగని గల్లిలేదని వివరించారు. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకేనని తెలిపారు. మీరు తెలంగాణ కోసం పంపించారు. ‘నేను తెలంగాణ సాధించుకొచ్చానని’ తెలిపారు.

12:58 - October 11, 2016

మెదక్  : తెలంగాణలో జిల్లాల సంబురం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాలో ఆవిర్భాంగా వున్న సిద్ధిపేటను జిల్లాగా ఏర్పాటు చేశారు. ఈక్రమంలో కేసీఆర్ సిద్ధిపేట జిల్లాను గుమ్మడికాయ కొట్టి సంప్రదాయ బద్దంగా ప్రారంభించారు. అనంతరం ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సిద్ధిపేటకు వరాల జల్లు కురిపించారు. సిద్ధిపేట జిల్లాగా ఆవిర్భవించినందుకు దసరా, జిల్లాల పండుగను జరుపుకుంటున్న ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అద్భుతమైన సిద్ధిపేట జిల్లాగా తన చేతులమీద ఏర్పటైనందుకు సంతోషంగా వుందన్నారు. ఇదొక అద్భుతమైన ఘట్టమని పేర్కొన్నారు. సిద్ధిపేట అభివృద్ధి కోసం రూ.100కోట్లను కేటాయిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. సిద్ధపేట పట్టణం పోలీస్ కమిషనరేట్ ను కూడా ఏర్పాటు చేశామన్నారు. సిద్ధిపేటలో వచ్చే ఏడాదికల్లా మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని జిల్లాలకూడా ఏర్పాటయ్యాయని తెలిపారు.

సిద్ధిపేట జిల్లాకో ఈ చేత్తోనే దరఖాస్తు ఇచ్చా :కేసీఆర్
30 ఏళ్ల క్రితమే సిద్ధిపేట జిల్లాను ఏర్పాటు చేయాలని ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ను కోరానని... కానీ, అప్పట్లో అది సాధ్యం కాలేదని కేసీఆర్ చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై కొందరు అవాకులు, చెవాకులు మాట్లాడారని... ఈరోజు దసరా కావడంతో, వారి గురించి ఏమీ మాట్లాడనని అన్నారు. 21 కొత్త జిల్లాల ఏర్పాటుతో తెలంగాణలోని మొత్తం జిల్లాల సంఖ్య 31కి పెరిగిందని... దీని వల్ల, రాష్ట్రంలో అదనంగా 21 మంది కలెక్టర్లు, 21 మంది ఎస్పీలు వచ్చారని... దీంతో, పరిపాలన మరింత మెరుగవుతుందని చెప్పారు.

నేను మీబిడ్డనే...
నేను మీరు పెంచిన బిడ్డను, మీ చేతుల మీదుగా పెరిగాను’ అని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. మీ దీవెనల వల్లే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకొచ్చానని తెలిపారు. ఇవాళ సిద్దిపేట జిల్లా ఏర్పాటైన సందర్బంగా ఆయన రోడ్‌షోలో మాట్లాడారు. తాను సిద్దిపేటలో తిరగని గ్రామంలేదని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకేనని తెలిపారు.తెలంగాణ రాష్ట్రం సాధించుకోవటంలో సిద్ధిపేట పాత్ర కీలకమన్నారు. ఘనత సిద్దిపేట ప్రజలకు దక్కుతుందన్నారు. మీరిచ్చిన ప్రోత్సాహం తోనే తెలంగాణ సాధించుకున్నాం. నా చేతుల మీదుగా తెలంగాణ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. బతికున్నంతం వరకు మీ కోసం పనిచేస్తానని కేసీఆర్ అన్నారు. యువకుడు హరీష్ చేతిలో సిద్దిపేట అభివృద్ధి చెందడం సంతోషంగా ఉందన్నారు. వచ్చే సంవత్సరం మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామన్నారు.

12:47 - October 11, 2016

మెదక్ : కేసీఆర్ పేరుకు మంత్రి హరీష్ రావు కొత్త అర్థం చెప్పారు. కే అంటే నాలెడ్జ్, సీ అంటే కమిట్ మెంట్, ఆర్ అంటే రీ కనస్ట్రక్షన్ అని కేసీఆర్ పై హరీష్ రావు ప్రశంసించారు. సిద్ధిపేట జిల్లాను ప్రారంభించిన అనంతరం భారీ బహిరంగ సభకు మంత్రి హరీష్ రావు, కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతున్న సందర్భంగా కేసీఆర్ అంటే కొత్త మీనింగ్ ను హరీష్ రావు పేర్కొన్నారు. ప్రధానిమంత్రి చేతుల మీదుగా రైల్వేలైన్ సాకారమైతే ఈరోజున సిద్ధిపేట జిల్లాగా మన ముఖ్యమంత్రిగారి చేతిపై ప్రారంభించబడిందని పేర్కొన్నారు. ఇవాళ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సిద్దిపేటలో అడుగుపెట్టడంతో ఈ నేల పులకించి పోతోందని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఇవాళ సిద్దిపేట జిల్లా ప్రారంభమైన సందర్బంగా ఆయన రోడ్‌షోలో మాట్లాడారు. తనకు మాట్లాడడానికి మాట రావడంలేదన్నారు. అంత ఆనందంగా ఉందని తెలిపారు. మన సిద్దిపేట జిల్లాను సీఎం చేతుల మీదుగా ప్రారంభింపజేయడం ఆనందంగా ఉందన్నారు. సిద్దిపేట అభివృద్దిలో సీఎం కేసీఆర్ పాత్ర మరవలేదనిదన్నారు. ఏ జిల్లానేతే కావాలని 1983లో పిటిషన్ ఇచ్చారో ఇవాళ అదే జిల్లా ఏర్పాటు జీవోపై సీఎం కేసీఆర్ సంతకం చేశారని వివరించారు. చరిత్రలో సీఎం కేసీఆర్ పేరు నిలిచి పోతోందని తెలిపారు.ఈసందర్భంగా సీఎం కేసీఆర్ మరొక్క కోరిక కోరుతున్నాననీ..అత్యంత చికిత్స సేవలు అందించే ఓ ఆసుపత్రిని..మంచి విద్యకోసం ఓ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని సిద్ధిపేట ప్రజల తరపున కోరుతున్నానని సీఎం కేసీఆర్ కు హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. 

పారామిలటరీ కాన్వాయ్ పై గ్రనేడ్ల దాడి!..

జమ్మూకశ్మీర్ : జమ్మూకశ్మీర్‌లోని సోపియాన్‌లో పారామిలటరీ కాన్వాయ్ లక్ష్యంగా ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసిరారు. గ్రెనేడ్ల దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు, మరో నలుగురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గ్రెనేడ్ల దాడి నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యారు.

22 మూగ జీవాలు బలి!..

అనంతపురం : కనగానపల్లి మండలం, మామిళ్లపల్లి సమీపంలో పెనుప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ మనుషులు తప్పించుకున్నా.. దురదృష్టవశాత్తూ మూగజీవాలు బలయ్యాయి. హిందూపురం వైపు నుంచి ఏపీ02జడ్‌205 నెంబరు గల ఆర్టీసీ బస్సు అనంతపురం వైపు బయల్దేరింది. బస్సు గ్రామంలోకి రావడానికి సమీపంలోని ఆర్డీటీ కార్యాలయం వద్ద జంక్షన్ దాటే ప్రయత్నంలో ఉండగా అదే సమయంలో అనంతపురం నుంచి గొర్రెలను తీసుకొస్తున్న ఏపీ02టీసీ0185 నెంబరు గల బొలెరో వాహనాన్ని ఢీకొంది. దీంతో వాహనంలో ఉన్న 30 గొర్రెల్లో 22 అక్కడికక్కడే మృతి చెందాయి.

సిరిసిల్ల జిల్లాను ప్రారంభించిన కేటీఆర్..

కరీంనగర్ : సిరిసిల్లా జిల్లాను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ..నీళ్లు, నిధులు,నియామకాల ఎజెండాతో తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా ప్రజలకు మరింత మెరుగైన, సౌలభ్యమైన పాలన అందించేందుకు ముఖ్యమంత్రి జిల్లాల ఏర్పాటు చేశారని తెలిపారు.

12:04 - October 11, 2016

కరీంనగర్ : సిరిసిల్లా జిల్లాను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ..సిరిసిల్ల జిల్లాను ప్రారంభించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. సిరిసిల్లను జిల్లాగా ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు. కేసీఆర్ కృషితోనే తెలంగాణ ఏర్పడిందని... ఆయన చలవతోనే సిరిసిల్ల జిల్లా ఆవిర్భవించిందని చెప్పారు. జిల్లాలు, మండలాలు చిన్నగా ఉంటే ప్రతి కుటుంబ పరిస్థితి ఎలా ఉందో అధికారులకు తెలిసే అవకాశం ఉంటుందని తెలిపారు. సిరిశాల కార్మికులు ఒకనాడు పనిచేసిన పట్టణం సిరిసిల్ల, వేములవాడ రాజన్న ఈ రెండు పేర్లు కలసి రాజన్న సిరిసిల్ల జిల్లా అని నామకరణం చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.నీళ్లు, నిధులు,నియామకాల ఎజెండాతో తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా ప్రజలకు మరింత మెరుగైన, సౌలభ్యమైన పాలన అందించేందుకు ముఖ్యమంత్రి జిల్లాల ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రజామోదయోగ్యమైన పాలన కోసమే జిల్లాల ఏర్పాటు ఆవిర్భవించిందన్నారు.కార్మిక ధార్మిక క్షేత్రాలను కలిపి వేముల వాడ, సిరిసిల్లాలను కలిపి జిల్లాగా ఏర్పడిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన చేనేత కార్మికులున్న క్షేత్రానికి ఈ అరుదైన అద్భుతం దక్కిందని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ రూపకల్పనకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. చిన్న జిల్లాలతోనే అభివృద్ధి జరుగుతుందని..మరింత సౌలభ్యమైన పాలన అందించబడుతుందని మన ముఖ్యమంత్రి నమ్మినందువల్లనే చిన్న జిల్లాల ఏర్పాటు విభజనకు శ్రీకారం చేశారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో జిల్లాల ఉత్సవం ప్రారంభమయ్యింది. కాగా ఆయా జిల్లాలో ఎవరికి ఏర్పాటు చేసిన జిల్లాలలో ఆయా ప్రతినిథులు ప్రారంభోత్సవం చేశారు. 

అంబరాన్నంటిన జిల్లాల సంబురాలు..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌ 11 గంటల 13 నిమిషాలకు సిద్దిపేట జిల్లాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. ఇదే ముహూర్తానికి ఎరికి కేటాయించిన జిల్లాలను వారు ప్రారంభోత్సవం చేశారు. జయశంకర్‌ జిల్లాను అసెంబ్లీ స్పీకర్‌ మధుసూధనాచారి, మెదక్‌ జిల్లాను డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి, జనగామ జిల్లాను మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వరంగల్‌ రూరల్‌ జిల్లాను...

సిద్ధిపేటను ప్రారంభించిన కేసీఆర్..

మెదక్ : సిద్ధిపేట జిల్లాను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. జిల్లా ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావు, కలెక్టర్ వెంకట్రామరెడ్డితో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గుమ్మడి కాయను కొట్టిన అనంతరం సీఎం రిబ్బన్ కట్ చేసి కలెక్టరేట్ లోకి ప్రవేశం చేశారు. కలెక్టరేట్ ప్రారంభోత్సవం కంటే ముందు సీఎం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. బహిరంగ సభ ప్రాంగణం కళాకారుల ఆటపాటలతో మార్మోగిపోతుంది. సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. 

11:23 - October 11, 2016

మెదక్ : తెలంగాణలో జిల్లాల సంబురం ప్రారంభమయ్యింది. ఈ నేపథ్యంలో దశాబ్దాల కల అయిన సిద్దిపేట జిల్లా ఆవిషృతమయ్యింది. ఉదయం 11.13 గంటలకు సీఎం కేసీఆర్ సంప్రదాయబద్ధంగా సిద్ధిపేట జిల్లాను ప్రారంభించారు. మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు సీఎం కేసీఆర్‌కు భారీ ఏర్పాట్లతో ఘనంగా స్వాగతం పలికారు. గంట పాటు పటాకుల మోత మోగించారు. దీంతో పాటు ప్రారంభం సందర్భంగా 50 వేల లడ్డూలు పంచనున్నారు. సిద్దిపేట పట్టణాన్ని విద్యుత్ దీపాల కాంతులతో అలంకరించారు. ఎటుచూసినా సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు కటౌట్లు, ప్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. కొత్త జిల్లాకు వచ్చే ఉద్యోగులంతా సిద్దిపేటకు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ సభ, స్వాగత ఏర్పాట్లపై  నిరంతరమూ సీఎం కేసీఆర్ వెన్నంటే వన్న హరీష్ రావు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.  కలెక్టర్ వెంకట్రామరెడ్డితో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గుమ్మడి కాయను కొట్టిన అనంతరం సీఎం రిబ్బన్ కట్ చేసి కలెక్టరేట్ లోకి ప్రవేశం చేశారు. కలెక్టరేట్ ప్రారంభోత్సవం కంటే ముందు సీఎం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. బహిరంగ సభ ప్రాంగణం కళాకారుల ఆటపాటలతో మార్మోగిపోతుంది. సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. 
ఆయా జిల్లాలలో..ఆయా ప్రనిథులతో ప్రారంమైన జిల్లా ప్రారంభోత్సవాలు..
సీఎం కేసీఆర్‌ 11 గంటల 13 నిమిషాలకు సిద్దిపేట జిల్లాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. శుభ ముహూర్తాన కేసీఆర్ సిద్ధిపేట జిల్లాను ప్రారంభించారు. ఆయా జిల్లాలకు ఏర్పాటు చేసిన ప్రతినిథులు జయశంకర్‌ జిల్లాను అసెంబ్లీ స్పీకర్‌ మధుసూధనాచారి, మెదక్‌ జిల్లాను డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి, జనగామ జిల్లాను మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వరంగల్‌ రూరల్‌ జిల్లాను... మరో డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ జగిత్యాల జిల్లాను,యాదాద్రి జిల్లా నాయిని నర్సింహారెడ్డి, పెద్దపల్లి జిల్లాను ఈటల రాజేందర్‌, కామారెడ్డి జిల్లాను పోచారం శ్రీనివాసరెడ్డి, మంచిర్యాల జిల్లాను పద్మారావు, ఇక వికారాబాద్‌ జిల్లాను మహేందర్‌రెడ్డి, సిరిసిల్ల జిల్లాను కేటీఆర్‌, ఆసిఫాబాద్‌ జిల్లాను జోగు రామన్న,సూర్యాపేట జిల్లాను జగదీష్‌రెడ్డి, కొత్తగూడెం జిల్లాను తుమ్మల నాగేశ్వరరావు, నిర్మల్‌ జిల్లాను ఇంద్రకరణ్‌రెడ్డి, నాగర్‌కర్నూలు జిల్లాను జూపల్లి కృష్ణారావు, మహబూబాబాద్‌ జిల్లాను చందూలాల్‌, జోగులాంబ జిల్లాను లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి జిల్లాను తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, వనపర్తి జిల్లాను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, కొత్తగూడెం జిల్లాను తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఉదయం జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఇప్పటికే కార్యాలయాలన్నీ ముస్తాబయ్యాయి. 

 

 

సిద్ధిపేట చేరుకున్న కేసీఆర్..

మెదక్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎర్రవల్లి నుంచి సిద్ధిపేట బయల్దేరారు. మరికాసేపట్లో సిద్ధిపేట జిల్లాను సీఎం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావు పాల్గొననున్నారు. 11.12 గంటలకు సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు.

11:02 - October 11, 2016

మెదక్ : సిద్ధిపేట జిల్లా ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ రానున్ననేపథ్యంలో అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల సమయంలో కేసీఆర్ జిల్లాను ప్రారంభించనున్నారు. ప్రారంభ కార్యక్రమం అనంతరం భారీ ఊరేగింపు, ర్యాలీ నిర్వహించనున్నారు. పాత బస్టాండ్‌ వద్ద జరిగే బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద 50 వేల మందితో సభ ఏర్పాటు చేశారు. దీనిపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కేసీఆర్ కు ఘనంగా స్వాగత ఏర్పాట్లు
దశాబ్దాల కల అయిన సిద్దిపేట జిల్లా మరికొన్ని గంటల్లో ఆవిర్భవించనుంది. ఉదయం 11.12 గంటలకు సీఎం కేసీఆర్ జిల్లాను ఆవిష్కరించనున్నారు. జిల్లాతో పాటు మర్కూక్ మండలాన్ని కూడా ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు సీఎం కేసీఆర్‌కు ఘనంగా స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు.. గంట పాటు పటాకుల మోత మోగించడంతో పాటు 50 వేల లడ్డూలు పంచనున్నారు. సిద్దిపేట పట్టణాన్ని విద్యుత్ దీపాల కాంతులతో అలంకరించారు. ఎటుచూసినా సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు కటౌట్లు, ప్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతో పాటు ఇతర జిల్లా కార్యాలయాలు విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. కొత్త జిల్లాకు వచ్చే ఉద్యోగులంతా సిద్దిపేటకు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ సభ, స్వాగత ఏర్పాట్లపై మంత్రి హరీశ్‌రావు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించి.. అధికారులతో సమీక్షించారు.మరింత సమాచారానికి వీడియో చూడండి..

10:50 - October 11, 2016

వరంగల్ : వరంగల్ జిల్లాలో పాంచ్ పటాకా షూరూ అయ్చింది. చారిత్రిక నగరంలో ఇకపై ఐదు జిల్లాలుగా ఆవిర్భవించనుంది. తెలంగాణ లోగిళ్లన్నీ బతుకమ్మ పండుగతో కళకళలాడుతూ జేజేయమానంగా వెలిగిపోతున్న శుభతరుణంలోనే కొత్త జిల్లాల ఆవిర్భావ పండుగ వరంగల్ జిల్లా ప్రజల్లో ఆనందాన్ని నింపుతోంది. జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు జనం ఆశలకు జీవం పోస్తున్నాయి. ఇక నుంచి పథకాలు శరవేగంగా తమ ముంగిళ్లలోకి నడిచొస్తాయన్న ఆశ తెలంగాణవాసుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. కొత్త జిల్లాల విభజన ప్రక్రియ వరంగల్ జిల్లాలో పూర్తయింది. ఏన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న కల  నెరవేరబోతోంది.. ఓరుగల్లులో మరో ఉషోదయానికి తెర లేచింది.. విజయ దశమి రోజు పోరు జిల్లాలో నవ శకానికి నాంది పలుకబోతోంది... కొత్త జిల్లాలు కొలువు దీరనున్నాయి... పోరుగల్లు లో పాంచ్ పటాకా మోగబోతోంది...నేటి నుంచి 5 కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. అన్ని జిల్లాల పాలనాధికారులు, ఎస్పీలతోపాటు ఇతర అధికారుల నియామకాలు పూర్తయ్యాయి. కొత్త జిల్లాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పూర్తయ్యాయి. ప్రజలు విజయోత్సాహంలో మునిగి తేలేందుకు విజయ దశమి తొలి అడుగు వేసింది. సరిగ్గా 28 నెలల క్రితం తెలంగాణ ఏర్పాటుతో ఏర్పడిన సంబరాలు మళ్లీ అంతే రూపును సంతరించుకున్నాయి. వరంగల్ జిల్లా ఐదు జిల్లాలుగా అవతరించబోతోంది. జయశంకర్, మహబూబాబాద్, జనగామ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలుగా ఏర్పాటు అవుతున్నాయి. మరింత సమాచారానికి వీడియో చూడండి. 

10:40 - October 11, 2016

కర్నూలు : దసరా అనగానే అందరికీ గుర్తొచ్చేది కర్నూలు జిల్లాలోని బన్ని ఉత్సవం. దేవుడి కోసమంటూ గ్రామాలకు గ్రామాలు.. కర్రలతో కొట్టుకునే ఆచారం గగుర్పాటును కలిగిస్తుంది. సంప్రదాయాలు, ఆచారాల కలబోతగా సాగే ఈ తతంగాన్ని ఆపాలని.. మేధావులు, పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఏటా విఫలమవుతూనే ఉన్నాయి. ఈక్రమంలో.. మరోసారి దేవరగట్టు బన్ని ఉత్సవానికి రెడీ అయింది...

ఆధునిక యుగంలోనూ.. ఆటవిక ఆచారం
అనాదిగా వస్తున్న ఆచారంతో ఆగని హింస....స్వామివారి విగ్రహం కోసం గ్రామాల మధ్య కర్రలతో యుద్ధం. చూశారుగా.. శత్రు సైన్యంపై యుద్ధానికి వెళుతున్నట్లు ఎలా... కర్రలు చేబూని దూసుకెళుతున్నారో...! కర్నూలు జిల్లా దేవరగట్టులో ప్రతి ఏటా దసరా పండగ రోజు రాత్రిపూట జరిగే ఈ తంతును బన్ని ఉత్సవం అని పిలుస్తారు. పేరుకే ఇది ఉత్సవం. కానీ నెత్తురోడేలా కర్రలతో పొరుగు గ్రామాల ప్రజల తలలు పగులగొట్టడమే దీని అంతిమ లక్ష్యం. ఎందుకిలా అంటే.. ఇలవేల్పు మాళమలేశ్వరుని మా ఊరికి తీసుకెళ్లేందుకే అంటారు వారు.

ఉత్సవమూర్తి కోసం గ్రామాల గలాటా
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కేంద్రానికి 15కిలోమీటర్ల దూరంలో.. పచ్చని కొండల మధ్య వెలసిన దేవరగట్టు క్షేత్రం.. ప్రతి దసరా సందర్భంలోనూ చర్చనీయాంశంగా మారుతుంటుంది. పండగ నాటి అర్ధరాత్రి.. కాగడాల వెలుతురులో.. దేవుడి ఉత్సవమూర్తిని తమ గ్రామానికి తీసుకుపోవాలని దేవరగట్టు.. దాని పరిసర గ్రామాల ప్రజలు కర్రలతో విపరీతంగా దాడులు చేసుకోవడం ఆనవాయితీ.. కర్రలతో విపరీతంగా బాదుకుంటూ.. ఒంటి నుంచి ఎంత రక్తం చిందిస్తే అంత మేలు జరుగుతుందన్న స్థానికుల భావన.. ప్రస్తుత హైటెక్‌ రోజుల్లో విస్మయాన్ని కలిగించక మానదు. కానీ, చూసే వాళ్లకు హింసలా అన్పించినా.. అనాదిగా వస్తున్న సంప్రదాయమని.. ఇలా చేయడం తమకెంతో ఆనందదాయకమని స్థానికులు చెబుతుండడం బయటి వారిని విస్తుపోయేలా చేస్తుంది.

మాళమలేశ్వరునికి స్థలపురాణం..
ఈ క్షేత్రంలో వెలసిన మాళమలేశ్వరునికి సంబంధించి స్థలపురాణం కూడా చెబుతారు. పూర్వం మణి, మల్లాసురులనే రాక్షసులు.. స్థానికంగా రుషుల యజ్ఞయాగాదులను నిత్యం భగ్నం చేస్తుండేవారట. వారి ఆగడాలను భరించలేని మునులు.. తమను రక్షించమని పరమ శివుడిని అభ్యర్థించారట. దీంతో.. అసుర సంహారార్థం..శివుడు ఈ ప్రాంతంలో మాళమలేశ్వరుడిగా అవతరించి.. కార్యాన్ని పూర్తి చేశారట. అందుకే ఈ కొండపై వెలసిన దేవరను అత్యంత భక్తితో.. పూజిస్తారిక్కడి ప్రజలు.

విజయదశమి రోజున శ్రీ మాళమల్లేశ్వర స్వామి కల్యాణం
ప్రతిఏటా విజయదశమి రోజున శ్రీ మాళమల్లేశ్వర స్వామి కల్యాణం జరుగుతుంది. ఈ కల్యాణం అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తుల ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా యద్ధంలో శత్రుసైన్యంపై విరుచుకుపడ్డట్లు.. ఓ గ్రామం యువకులు..మరో గ్రామాల ప్రజలపై కర్రలతో దాడులు చేస్తూనే ఉంటారు. కొత్తపేట, నెరిణికి, నెరిణికితండా వాసులు బలమైన పొడవాటి కర్రలకు ఇనుప రింగులు తొడిగి, అగ్గి కాగడాలు చేతపట్టి మాళమల్లేశ్వరుని ఊరేగింపుగా తీసుకువస్తారు. స్వామి వారి ఉత్సవ విగ్రహాలను దక్కించు కోవాలనే ఉద్దేశంతో విరుపాపురం, సులువాయి, ఎల్లార్తి, హరికెర వాసులు కూడా పోటాపోటీగా కర్రయుద్ధంలో పాల్గొంటారు. విగ్రహం మాదంటే మాదంటూ.. ప్రజలు అగ్గి దివిటీలు, కర్రలతో అడ్డుకుంటారు. ఆ ప్రయత్నంలో తలలు పగిలేలా కొట్టుకుంటారు. కర్రలతో కొట్టుకోవడం హింస కాదని....ఇది అనాదిగా వస్తున్న ఆచారమని భక్తులు చెబుతున్నారు. హింసాత్మక ఘటన అనేది అపోహ మాత్రమేనని కొట్టిపడేస్తున్నారు.

పేరుకు మాత్రమే భారీ ఎత్తున పోలీసు బందోబస్తు
నవ నాగరికత కొత్త పుంతలు తొక్కుతున్న.. నేటి ఆధునిక యుగంలో కూడా ఇలాంటి మూఢనమ్మకాలుంటాయా అంటూ.. పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కర్రయుద్ధంలో హింస జరుగుతుందనే పోలీసులు కూడా దీన్ని నిలువరించేందకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈసారి కూడా భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.

జనవిజ్ఞాన వేదిక అభ్యంతరం
ఆచారాలు, సంప్రదాయల పేరిట హింసను ప్రేరేపించేలా వ్యవహరించడం సరికాదని జనవిజ్ఞాన వేదిక అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆనందం కోసం జరుపుకోవాల్సిన ఉత్సవాలను హింసాత్మకంగా నిర్వహించడం తగదని జనవిజ్ఞాన వేదిక సభ్యులు అభిప్రాయపడుతున్నారు.

బన్ని ఉత్సవంలో ఎందరి తలలు పగులనున్నాయో..
పూర్వీకులు ఏర్పాటు చేసిన విధి విధానాలను క్రమం తప్పకుండా ఆచరించడమే ఆచారం. ఇలాంటి ఆచారాల్లో కొన్ని మైమరిపిస్తే.. మరికొన్ని ఒళ్లు జలదరింపజేస్తాయి. వాటిలో రెండో కోవకు చెందుతుంది.. దేవరగట్టు జాతర. ఈసారి కూడా బన్ని ఉత్సవంలో ఎందరి తలలు పగులుతాయో.. వాటిని తగ్గించేందుకు పోలీసులు తీసుకున్న చర్యలు ఏ మేరకు ఫలితాన్నిస్తాయో వేచి చూడాలి.

 

10:32 - October 11, 2016

నల్లగొండ : గట్టుప్పల్‌లో ఆందోళన జరిగింది. గట్టుప్పల్‌ను మండల కేంద్రంగా ప్రకటిచంకపోవడాన్ని నిరసిస్తూ..అఖిలపక్షం ఆధ్వర్యంలో గట్టుపల్‌వాసులు నిరసన వ్యక్తం చేశారు. ఆరు ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. 

10:29 - October 11, 2016

మెదక్ : సిద్ధిపేట జిల్లా ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ రానున్ననేపథ్యంలో అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల సమయంలో కేసీఆర్ జిల్లాను ప్రారంభించనున్నారు. ప్రారంభ కార్యక్రమం అనంతరం భారీ ఊరేగింపు, ర్యాలీ నిర్వహించనున్నారు. పాత బస్టాండ్‌ వద్ద జరిగే బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు.  

పూలవనంలా సిద్ధపేట
జిల్లా ఆవిర్భావం సందర్భంగా సిద్దిపేటను పూలవనంగా తీర్చిదిద్దారు. పట్టణం నలుమూలలా కేసీఆర్‌ కటౌట్లను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు, ప్రధాన చౌరస్తాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. జిల్లా ఆవిర్భావ సంబరాలను పురష్కరించుకుని ప్రభుత్వం 30 వేల లడ్డూలను పంచనుంది. మరో 30 వేల లడ్డూలు, జిలేబిలను పంచేందుకు పలు సంఘాలు ముందుకువచ్చాయి. సిద్దిపేట జిల్లా ప్రారంభోత్సవం అనంతరం సీఎం కేసీఆర్‌ ములుగు మండలం ముర్కుక్‌లో పర్యటించనున్నారు. తహశీల్దార్‌, పోలీస్ స్టేషన్‌తో పాటు.. ప్రభుత్వ ఆస్పత్రిని కేసీఆర్‌ ప్రారంభిస్తారు. సిద్దిపేటలో సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. 

10:22 - October 11, 2016

హైదరాబాద్ : మరి కొద్దిసేపట్లో పది జిల్లాల తెలంగాణ రాష్ట్ర అంతర్గత భౌగోళిక స్వరూపం మారబోతుంది. పది జిల్లాల తెలంగాణ 31 జిల్లాల తెలంగాణగా అవతరించబోతుంది. సరికొత్త పరిపాలనా ముఖచిత్రం ఆవిష్కృమవుతోంది. పాలనను ప్రజల చెంతకు చేర్చే లక్ష్యంతో చేపట్టిన కొత్త జిల్లాలు... విజయదశమి రోజున సాకారమవుతున్నాయి.

పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన
పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేపట్టింది ప్రభుత్వం. ఎన్నో తర్జనాభర్జనాల తర్వాత 31 జిల్లాలును ఖరారు చేస్తూ తుది నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియలో భాగంగా అధికారికంగా 27 జిల్లాలతో ఆగష్టు 20న డ్రాప్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే.. ఇందులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియచేసేందుకు వీలుగా.. ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందించింది. దీనికోసం ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం, సీఎస్ రాజీవ్ శర్మ అధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించింది. ఈ రెండు కమిటీలు జిల్లాల ఏర్పాటులో ఉద్యోగుల సర్దుబాటు, కార్యాలయాల ఏర్పాటుపై సమావేశాలు చేపట్టాయి.

డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో లేని జనగాం, గద్వాల, సిరిసిల్లలు
ఇక ఈ డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌లో జనగాం, గద్వాల, సిరిసిల్లలు లేకపోవడంతో ఆయా ప్రాంతాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పెద్ద ఎత్తుగా ఉద్యమాలు వచ్చాయి. ఇక గద్వాల జిల్లా కోసం మాజీ మంత్రి డికే ఆరుణ ఉద్యమాలతో పాటు.. యాగాలు కూడా చేసింది. చివరి ప్రయత్నంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేశారు.

సిరిసిల్ల జిల్లా ఏర్పాటుకు పెల్లుబికిన నిరసన జ్వాలాలు
ఇది ఇలా ఉంటే మధ్యలో సిరిసిల్ల జిల్లా కూడా కావాలని పెద్ద ఎత్తున నిరసన జ్వాలాలు పెల్లుబికాయి. దీంతో సిరిసిల్ల, జనగామ,గద్వాల జిల్లాలతో పాటు.. అసిఫాబాద్ జిల్లాల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరీశీలించాలని రాజ్యసభ సభ్యుడు కేశవరావు నేతృత్వంలో హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు.

31 జిల్లాలకు పూర్తైన కలెక్టర్ల నియామకం
ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు.. సీఎం ఏర్పాటు చేసిన కమిటీల నివేదికల అధారంగా 31 జిల్లాలను ఫైనల్ చేసిన ప్రభుత్వం ఆయా జిల్లాలకు కలెక్టర్లను కూడా ప్రభుత్వం నియమించింది. కొత్తగా రామగుండం, కరీంనగర్, నిజమాబాద్, సిద్దిపేటలను కూడా కొత్తగా పోలీసు కమిషనరేట్‌లుగా ఏర్పాటు చేసింది. మొత్తమ్మీద ఇవాళ్టి నుంచి 31 జిల్లాల తెలంగాణగా రాష్ట్ర రూపు రేఖలు మారడంతో పాటుగా.. కొత్త జిల్లాల నుంచి పాలన కూడా ప్రారంభమవుతుంది. 

కొత్త జిల్లాల కోడ్‌లు ..

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జిల్లాలను ప్రకటించిన ప్రభుత్వం ఆయా జిల్లాలకు సంబంధించి వాహన రిజిస్ట్రేషన్ కోడ్ నంబర్లను కూడా ప్రకటించింది. ప్రభుత్వం కేటాయించిన ప్రకారం.. కామారెడ్డి-17, నిర్మల్-18, మంచిర్యాల-19, కొమురం భీం(ఆసిఫాబాద్)-20, జగిత్యాల-21, పెద్దపల్లి-22, రాజన్న(సిరిసిల్ల)-23, వరంగల్ రూరల్-24, జయశంకర్(భూపాలపల్లి)-25, మహబూబాబాద్-26, జనగామ-27, భద్రాద్రి(భద్రాచలం)-28, సూర్యాపేట-29, యాదాద్రి-30, నాగర్‌కర్నూలు-31, వనపర్తి-32, జోగులాంబ-33, వికారాబాద్-34, మెదక్-35, సిద్ధిపేట-36, మేడ్చల్-8.గా ప్రకటించబడ్డాయి.

కోలుకుంటున్న చిన్నారి సంజన..

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వారం రోజులుగా కోమాలో ఉన్న చిన్నారి సంజన సోమవారం కళ్లు తెరిచింది. దీంతో కుటుంబ సభ్యుల్లో ఆనందం నెలకొంది. ఈనెల 2వ తేదీన పెద్ద అంబర్‌పేట వద్ద రోడ్డు దాటుతున్న సంజన, ఆమె తల్లి శ్రీదేవిలను కారు ఢీకొట్టిన సంగతి తెలిసిందే. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ వేగంగా వచ్చి వారిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో చిన్నారి తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయింది. కాగా అప్పటి నుంచి ఆస్పత్రిలో ఉన్న సంజన కళ్లు తెరిచి చూసింది. సంజన త్వరగా కోలుకుని క్షేమంగా ఇంటికి చేరుకోవాలని కోరుకుందాం.

ఒకేరోజు రెండు పండుగలు..

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఒకేరోజు రెండు పండుగలు జరుపుకోనుంది. ఒకటి దసరా ..రెండు కొత్త జిల్లాల ఆవిర్భావ పండగ..దీంతో తెలంగాణ లోగిళ్లన్నీ బతుకమ్మ పండుగతో కళకళలాడుతూ జగజ్జేయమానంగా వెలిగిపోతున్న శుభతరుణంలోనే కొత్త జిల్లాల ఆవిర్భావ పండుగ జనజీవితాలను రాగరంజితం చేస్తోంది... శుభప్రదమైన మంగళవారం రెండు పండుగలతో తెలంగాణ మురిసిపోతోంది... ఒకటి విజయదశమి.. రెండోది కొత్త జిల్లాల పుట్టుక. పది జిల్లాల తెలంగానం నేటి నుంచి ముప్పయి ఒక్క జిల్లాల గొంతు నుంచి పల్లవించనుంది. 

హోదా కన్నా ప్యాకేజీ మిన్న : బాబు

విశాఖ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీతోనే ఎక్కువ మేలు జరిగే అవకాశం ఉందని భావించే దానికి మొగ్గుచూపినట్టు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న అంతరిక్ష వారోత్సవాల ముగింపు కార్యక్రమం సందర్భంగా చంద్రబాబు ఇలా అన్నారు. గోదావరిలో నీరు వృథా కాకుండా పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తిచేస్తామన్నారు. రాజకీయాలు చేసేవారు ఎక్కువకాలం మనుగడ సాగించలేరంటూ ప్రతిపక్షాల తీరును ముఖ్యమంత్రి ఎండగట్టారు.

దసరా వచ్చినా పట్టాలెక్కని మెట్రో..

హైదరాబాద్ : బైటకు వెళ్లాలంటే చాలు గుండెల్లో గుబులు ఎందుకు? రోడ్డెక్కితే ఇంటికెప్పుడొస్తామో తెలీని స్థితి..గుంతలమయంగా మారిన నగర రోడ్లు..పావుగంటలో చేరుకోవాల్సిన ప్రయాణానికి గంటల సమయం..మరి నగరవాసుల కష్టాలు ఎప్పుడు గట్టెక్కనున్నాయి? మెట్రో రైలు ఎప్పుడు పట్టాలెక్కనుంది? మా కష్టాలు ఎప్పుడు గట్టెక్కుతాయని భాగ్యనగర ప్రజలంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మెట్రో ప్రాజెక్టు పూర్తవడం అటుంచితే.. సిద్ధమైన మార్గంలో పరుగులు పెడుతుంటే చూసి మురిసిపొవాలని నగర ప్రజలు భావిస్తున్నారు. దసరాకి మెట్రోను పరుగులు పెట్టిస్తామన్న సర్కార్ మాట ఏమైందో తెలీదు. 

రేపే సీఎం ఎంట్రీ..

గుంటూరు : వెలగపూడి సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయం ఈ నెల 12వ తేదీన ప్రారంభం కానుంది. ఆరోజు ఉదయం 8 గంటల 9 నిమిషాలకు శాస్త్రోక్తంగా అందులోకి అడుగుపెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. సచివాలయ భవన సముదాయంలోని ఒకటో బ్లాకు మొదటి అంతస్తులో ఈ కార్యాలయం ఉంది. సీఎం చాంబర్, సమావేశ మందిరాలు, కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఒకేచోట ఏర్పాటు చేశారు. 

కశ్మీర్ లో 250మంది ఉగ్రవాదులు..

ఢిల్లీ: దాదాపు 250మందికి పైగా ఉగ్రవాదులు కశ్మీర్ వ్యాలీలో దాగుకున్నట్లుగా భారత్ ప్రభుత్వానికి సమాచారం అందింది. నిర్దేశిత దాడులకు ప్రతీకారంగా ఆర్మీపై దాడులు నిర్వహించేందుకు పెద్ద సంఖ్యలో పాక్‌ ఆక్రమిత కశ్మీర్ నుంచి ఉగ్రవాదులు కశ్మీర్ లోకి వచ్చినట్లు తెలిసింది.

ఘనంగా శ్రీవారి చక్రస్నానం..

తిరుమల : తిరుమలలోని శ్రీవారి పుష్కరిణిలో స్వామి వారి చక్రస్నాన కార్యక్రమం మంగళవారం ఉదయం ముగిసింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. శ్రీవారి ఆలయంలో నేటి రాత్రి ధ్వజావరోహణం జరగనుంది. దీంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

కేసీఆర్ పర్యటన షెడ్యూల్..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సిద్దిపేట జిల్లా ఈ రోజు ఉదయం 11:12 గంటలకు పురుడు పోసుకోనున్నది. ఉ.9:30 గంటలకు ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి బయలుదేరుతారు. 10:30 గంటలకు సిద్దిపేట పట్టణానికి చేరుకుంటారు.11:12 గంటలకు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవం. సభలో ప్రసంగం.మధ్యాహ్నం 12 గంటలకు సిద్దిపేట నుంచి బయలుదేరుతారు.మధ్యాహ్నం 12.45 గంటలకు ములుగు మండలం మర్కూక్ మండల కార్యాలయం, పీహెచ్‌సీ ప్రారంభం, స్థానికులతో సమావేశం. మధ్యాహ్నం 1.15 గంటలకు మర్కూక్‌కు నుంచి తిరుగు ప్రయాణం.

నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..

హైదరాబాద్ : మొహరం సందర్భంగా నగరంలో12న పాతబస్తీలో నిర్వహించే బీబీ-కా-ఆలం ఊరేగింపు సందర్భంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. 

08:30 - October 11, 2016

నల్లగొండ : మరికొన్ని గంటల్లో భువనగిరి కేంద్రంగా యాదాద్రి జిల్లాగా అవతరించబోతోంది. ఇప్పటికే దాదాపు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సిద్ధమయ్యాయి. యాదాద్రి జిల్లా అవుతుండటంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ రియల్‌ ఎస్టేట్‌ కూడా ఒక్కసారిగా ఊపందుకుంది.

భువనగిరి కేంద్రంగా యాదాద్రి, మరో జిల్లా సూర్యాపేట
రె
వెన్యూ డివిజన్ నల్లగొండ జిల్లా... పునర్ వ్యవస్థీకరణలో భాగంగా మూడు జిల్లాలవుతోంది. ప్రస్తుత నల్లగొండ జిల్లాతో పాటు భువనగిరి కేంద్రంగా యాదాద్రి, సూర్యాపేట జిల్లాలుగా విడిపోతోంది. యాదాద్రి.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉండటంతో పాటు తెలంగాణ తిరుమలగా పేరుగాంచిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉండటం జిల్లాకు కలిసి వచ్చే అవకాశం ఉంది. యాదాద్రి భువనగిరి పేరుపై చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం భువనగిరి రెవెన్యూ డివిజన్‌గా ఉండగా.. నూతనంగా చౌటుప్పల్‌ను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ రెండు రెవెన్యూ డివిజన్‌ల పరిధిలోని భువనగిరి, ఆలేరు, మునుగోడు నియోజకవర్గాలకు చెందిన 13 మండలాలతో పాటు తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని మోత్కూర్, నకిరేకల్ నియోజకవర్గంలోని రామన్నపేటలతో కలుపుకోని 15 మండలాలతో యాదాద్రి జిల్లా ఏర్పాటవుతోంది.

పాత బీఈడీ కళాశాల ప్రాంగణంలో ఎస్పీ కార్యాలయం
యాదాద్రి జిల్లా ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపాదికన ఏర్పాట్లు సాగుతున్నాయి. కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయం అవసరాల మేరకు భవనాలను తీర్చిదిద్దుతున్నారు. పగిడిపల్లి సమీపంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలెక్టరేట్‌ కార్యాలయం, జగదేవ్‌పూర్‌ రోడ్డులోని పాత బీఈడీ కళాశాల ప్రాంగణంలో ఎస్పీ కార్యాలయం భవనాలు పూర్తవుతున్నాయి. దాదాపు 70 శాతం కార్యాలయాలు జిల్లా కలెక్టర్‌ కార్యాలయ భవన సముదాయంలోనే ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్‌-వరంగల్ జాతీయ రహదారిపై సుమారు 22 ఎకరాల స్థలంలో 70 గదులతో కూడిన భవన సముదాయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. యాదాద్రి జిల్లాగా ఏర్పడుతుండడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

యాదాద్రి సమీపంలో పెరిగిన రియల్‌భూమ్‌
తెలంగాణ ఏర్పాటు తర్వాత యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామీ ఆలయ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇప్పటికే చాలాసార్లు ఆలయాన్ని సందర్శించారు. టెంపుల్ సీటి నిర్మాణంలో భాగంగా ఆలయ పునర్‌నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దీంతో సమీప ప్రాంతాల్లో రియల్ భూమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

భువనగిరిలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వ ఏర్పాట్లు
భువనగిరిలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ఇప్పటికే పారిశ్రామికవేత్తలను ఆహ్వానించింది. రాజధానికి 50 కిలోమీటర్ల దూరంలోనే ఉండటం, రోడ్డు, రైలు మార్గం ఉండటం, శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి దాదాపు గంటన్నర సమయంలోనే చేరుకునే అవకాశం లాంటివి భువనగిరి ప్రాంతానికి కలిసొచ్చే అంశాలని ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు తెలియజేస్తోంది.మొత్తంగా వివిధ పార్టీలు, స్థానికుల డిమాండ్ల మేరకు యాదాద్రి జిల్లాగా ఏర్పడుతుండటంతో అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

08:22 - October 11, 2016

తిరుమల : తిరుమలేశుని నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నాన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ వేకువ జామున శ్రీవారి ఆలయం నుంచి శ్రీదేవీ, భూదేవీ సమేత మల‌యప్పస్వామివారిని  వరాహపుష్కరిణి చెంతకు వూరేగింపుగా తీసుకేళ్లారు.  అక్కడ ఉత్సవమూర్తులకు, చక్రతాళ్వారుకు అభిషేకాలు, స్నపనతిరుమంజనంను అర్చకులు వేడుకగా నిర్వహించారు. అనంతరం మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్చరణల నడుమ  పెద్దజీయార్ సమక్షంలో అర్చకులు చక్రత్తాళ్వారుకు పుష్కరస్నానం చేయించారు. ఈ సమయంలో చక్రస్నానంలో పాల్గొన్న వేలాది మంది భక్తులు గోవిందనామస్మరణలతో పుష్కరస్నాన‌మాచ‌రించారు. రాత్రి తొమ్మిది నుంచి పది గంటల మద్య శ్రీవారి ఆలయంలో నిర్వహించే ధ్వజావరోహణముతో శ్రీ‌వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగుస్తాయి. శ్రీవారి చక్రస్నానాన్ని వీక్షించి స్వామివారి కృపకు పాత్రులు కండి..

08:19 - October 11, 2016

విజయవాడ : దసరా శరన్నవరాత్రి వేడుకలు నేటితో ముగుస్తాయి. నిన్న ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 వరకూ లక్ష మంది వరకూ భక్తులు మహిషాసురమర్దని రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. చివరి రోజు రాజరాజేశ్వరిదేవి రూపంలో అమ్మవారిని అలంకరించనున్నారు. ఇక సాయంత్రం 5 గంటలకు ఉత్సవమూర్తులను కృష్ణానదిలో హంసవాహనంపై తిప్పుతూ తెప్పోత్సవం నిర్వహించనున్నారు. విజయవాడలోని దసరా శరన్నవరాత్రి వేడుకలపై మరింత సమాచారానికి ఈ వీడియో చూడండి..

08:15 - October 11, 2016

గుంటూరు : మార్కెట్‌ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. చైర్మన్‌గా మన్నవ సుబ్బారావు, వైస్‌ చైర్మన్‌గా కొత్తూరి వెంకట్‌, డైకెర్టర్లు బాధ్యతలు స్వీకరించారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, ఎంపీలు రాయపాటి సాంబశివరావు, గల్లా జయదేవ్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త పాలకవర్గం రైతు సంక్షేమం, మార్కెట్‌ యార్డు అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి పుల్లారావు కోరారు. మార్కెట్‌ యార్డులో అవినీతిని నిర్మూలిస్తానని చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన మన్నవ సుబ్బారావు హామీ ఇచ్చారు.

08:13 - October 11, 2016

విజయవాడ : కృష్ణానదిలో శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల జలవిహారానికి హంస వాహనం సిద్ధమైంది. విజయదశమి పర్వదినం సందర్భంగా ఇవాళ సాయంత్రం తెప్పోత్సవం కన్నుల పండువగా జరగనుంది. దసరాన్నవరాత్రులు పూర్తైన తర్వాత విజయదశమి రోజు హంసవాహనంపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్లు జలవిహారం చేయనున్నారు. ఇందుకు సిద్ధం చేసిన హంసవాహనాన్ని అధికారులు ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారానికి వీడియో చూడండి..

08:10 - October 11, 2016

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు పురుడు పోసుకోబోతున్నాయి. పాత జిల్లాతో ఉన్న సంబంధ భాందవ్యాలు, అనుబంధాలు కాస్త తెగిపోతున్నాయి. ఇన్నాళ్లు అంతర్భాగంగా ఉన్న ప్రాంతాలన్నీ కొత్త జిల్లాలుగా అవతరిస్తుండటంతో కరీంనగర్ ప్రాంత వాసులు గుండెలు బరువెక్కుతున్నాయి. అభివృద్ధి పేరుతో కొన్ని ప్రాంతాలు దూరం అవుతున్నప్పటికీ పేరుకు పెద్దన్నగా ఉన్న కరీంనగర్ మాత్రం తన పూర్తి స్వరూపాన్ని కొల్పోతోంది.

కరీంనగర్ జిల్లాలో మూడు కొత్త జిల్లాలు
కరీంనగర్ జిల్లా ఇక చరిత్రకు మాత్రమే పరిమితం కానుంది. భవిష్యత్ తరాలకు చెప్పుకునేందుకు ఓ చరిత్రను మిగిల్చి... తన స్వరూపాన్ని కొల్పోనుంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. కరీంనగర్‌ జిల్లా జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లా కేంద్రాలుగా ఏర్పాడుతున్నాయి. జిల్లాలకు సంబంధించి శాఖల వారీగా భవనాలు కేటాయించడంతో పాటు ఆయా కేంద్రాల్లో కార్యాలయాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొత్త జిల్లాల ప్రారంభ వేడుకలను పండుగల నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.

ఎస్పీ జోయల్ డేవిస్ కొత్త కమిషనరేట్లకు కమిషనర్
పోలీస్ శాఖ విభజన ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. కరీంనగర్, రామగుండం కమిషనరేట్లతో సహా మూడు జిల్లాలో ఐదు సబ్ డివిజన్‌లతో సహా పలు సర్కిళ్లు, పలు ఠాణాలు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం ఉన్న ఎస్పీ జోయల్ డేవిస్ కొత్తగా ఏర్పడిన రెండు కమిషనరేట్లకు కమిషనర్ గా కొనసాగనున్నారు. విభజన పక్రియ పూర్తి అయిన తరువాత అధికారుల సంఖ్య ప్రకారం హోదాను బట్టి పోస్టింగ్ కల్పించే ఆవకాశం ఉంది. జగిత్యాల సిరిసిల్లకు కొత్తగా ఎస్పీలు రానుండగా కరీంనగర్ కు ప్రస్తుత ఎస్పీ కమిషనర్ గా కొనసాగుతారు. మొత్తానికి దసరా పండుగ వాతావరణంలో గులాబీ బాస్ కొత్తజిల్లాలతో సందడి చేస్తున్నారు. 

08:07 - October 11, 2016

నిజామాబాద్ : కామారెడ్డి కొత్త జిల్లాగా ఏర్పాటు అవుతుండటంతో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారబోతోంది. రెండు జిల్లాలోని రాజకీయ సమీకరణల్లో భారీగా మార్పులు చోటు చేసుకోనున్నాయి. కొంతమంది రాజకీయ నేతలకు ప్రాధాన్యత తగ్గితే... మరి కొంతమంది నేతలకు ప్రాధాన్యత పెరిగే అవకాశముంది. రాజకీయంగా అధికార పార్టీ టీఆర్ఎస్‌తో పాటు ప్రతిపక్ష పార్టీల్లోనూ భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి.

రెండు జిల్లాల్లో కీలకం కానున్న మంత్రి పోచారం
కొత్త జిల్లాల ఏర్పాటుతో నిజామాబాద్ జిల్లా రాజకీయం మారనుంది. జిల్లా రాజకీయ కమీకరణలో మార్పులు రానున్నాయి. కొంతమంది నేతలకు ప్రాధాన్యత తగ్గనుండటం మరికొంతమంది నేతలకు ప్రాధాన్యత పెరగనుంది. నిజామాబాద్‌ జిల్లా రెండు జిల్లాలుగా ఏర్పాటు కానుండటంతో కొత్త వారికి అవకాశాలు రానున్నాయి. అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలో కూడా రాజకీయ సమీకరణలు మారనున్నాయి. జిల్లాలో ప్రస్తుతం తొమ్మిది నియోజకవర్గాలతో పాటు జహీరాబాద్ ఎంపీ నియోజకవర్గ పరిధిలో జిల్లాలోని 4 నియోజకవర్గాలు ఉన్నాయి. బాన్సువాడ నియోజకవర్గం నుంచి ఎంపికైన పొచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ర్ట క్యాబినెట్ లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన నియోజకవర్గంలోని రెండు మండలాలు బాన్సువాడ, బీర్కూరు, కామారెడ్డి జిల్లాల్లోకి వెళ్తున్నాయి. మిగతా మండలాలైన కొటగిరి, వర్నీ కొత్తగా ఏర్పడుతున్న రుద్రూరు మండలాలు నిజామాబాద్ పరిధిలోనే కొనసాగుతున్నాయి. మంత్రి పోచారం రెండు జిల్లాలకు ప్రజాప్రతినిధిగా వ్యవహరించే అవకాశం ఏర్పడింది.

కీలకంగా మారనున్న ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ
కామారెడ్డికి సంబంధం లేకుండా నిజామాబాద్ లోనే ఐదు నియోజకవర్గాలతో పాటు కొత్తగా ఏర్పడనున్న జగిత్యాల జిల్లా పరిధిలోని రెండు నియోజకవర్గాలు నిజామాబాద్ ఎంపీ కవిత లోక్ సభ నియోజవర్గ పరిధిలో ఉన్నాయి. ఈ రెండు జిల్లాలకు కవిత కీలక ప్రతినిధి కానున్నారు. మండలి ప్రతిపక్ష నేతగా ఉన్న షబ్బీర్ అలీ స్వస్థలం కామారెడ్డి కావటంతో ఆయన కామారెడ్డి జిల్లాకే ప్రాతినిధ్యం వహించనున్నారు. రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన సీనియర్ నేత డి. శ్రీనివాస్ నిజామాబాద్ పరిధిలో ఉన్నారు. నిజామాబాద్ జిల్లా రాజకీయ సమీకరణల్లో ముందుండే అవకాశం ఉంది.

జిల్లాల ఏర్పాటుతో ఎక్కువ మందికి పార్టీ పదవులు..
కొత్త జిల్లా కామారెడ్డిలో ప్రస్తుతం ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు మంత్రి కీలకంగా మారే అవకాశం ఉంది. నిజామాబాద్ జిల్లాలోనూ ఎంపీ కవితతో పాటు మంత్రి పోచారం, జిల్లా ఎమ్మెల్యేలు కీలకమయ్యే అవకాశం ఉంది. రెండు జిల్లాలతో అన్ని పార్టీలకు కార్యవర్గాలు వచ్చే అవకాశం ఉండటంతో ఎక్కువ మందికి పార్టీ పదవులు రానున్నాయి. రాబోయే కొన్ని రోజుల్లొ ఈ మార్పులు స్పష్టంగా కనిపించే ఛాన్స్ ఉంది.

08:02 - October 11, 2016

వరంగల్ : ఏన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న కళ నెరవేరబోతోంది.. వరంగల్ జిల్లాలో మరో ఉషోదయానికి తెర లేచింది.. విజయ దశమి రోజు పోరు జిల్లాలో నవ శకానికి నాంది పలుకబోతోంది... కొత్త జిల్లాలు కొలువు దీరనున్నాయి... పోరుగల్లు లో పాంచ్ పటాకా మోగబోతోంది...
ఐదు జిల్లాలుగా వరంగల్ జిల్లా
కొత్త జిల్లాల విభజన ప్రక్రియ వరంగల్ జిల్లాలో పూర్తయింది. నేటి నుంచి 5 కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. అన్ని జిల్లాల పాలనాధికారులు, ఎస్పీలతోపాటు ఇతర అధికారుల నియామకాలు పూర్తయ్యాయి. కొత్త జిల్లాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పూర్తయ్యాయి.

విజయోత్సాహంలో ఓరుగల్లు ప్రజానీకం
ప్రజలు విజయోత్సాహంలో మునిగి తేలేందుకు విజయ దశమి తొలి అడుగు వేసింది. సరిగ్గా 28 నెలల క్రితం తెలంగాణ ఏర్పాటుతో ఏర్పడిన సంబరాలు మళ్లీ అంతే రూపును సంతరించుకున్నాయి. వరంగల్ జిల్లా ఐదు జిల్లాలుగా అవతరించబోతోంది. జయశంకర్, మహబూబాబాద్, జనగామ, వరంగల్ అర్భన్, వరంగల్ రూరల్ జిల్లాలుగా ఏర్పాటు అవుతున్నాయి.

మరో నాలుగు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు
ప్రస్తుతం 51 మండలాలతో కొనసాగుతున్న వరంగల్ జిల్లాను కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల మండలాల భాగస్వామ్యంతో ఐదు జిల్లాలుగా ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాలుగు జిల్లాలుగా అనుకున్న ప్రతిపాదన జనగామ జిల్లాతో ఐదుకు చేరింది.. సర్కా ర్ తాజా ఆదేశాలు, మార్గదర్శకాలతో జిల్లా యంత్రాంగం సుధీర్ఘ కసరత్తు చేసి ఐదు జిల్లాల ప్రక్రియను పూర్తి చేసింది. ఒకవైపు ఉద్యోగుల విభజనకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తూనే మారిన సమీకరణాల నేపథ్యంలో కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాల ఏర్పాటు ప్రక్రియను కొలిక్కి తెచ్చింది. ప్రస్తుతం ఉన్న ఐదు రెవెన్యూ డివిజన్లకు అదనంగా మరో నాలుగు రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేస్తూ తొమ్మిది రెవెన్యూ డివిజన్లతో ఐదు జిల్లాలు కొలువుదీరుతున్నాయి.

సర్వ్ టూ ఆర్డర్ పద్థతిన ఉద్యోగుల కేటాయింపులు
ఉద్యోగుల విభజనకు సంబంధించి ఇప్పటికే ఆయా శాఖల ఉన్నతాధికారుల నుంచి జిల్లా యంత్రాంగానికి సర్వ్ టూ ఆర్డర్ పద్ధతిన కేటాయింపులు జరిగాయి. అయితే జిల్లాలకు సంబంధించి జనాభా పరంగా వరంగల్ అర్బన్ అతిపెద్ద జిల్లాగా అవతరించింది. అతి చిన్న జిల్లాగా జనగామ ఉంటుంది. అదే విస్తీర్ణం దృష్ట్యా చూస్తే జయశంకర్ భూపాలపల్లి జిల్లా అతిపెద్ద జిల్లాగా, వరంగల్ అర్బన్ అతిచిన్న జిల్లాగా ఉంది. మరోవైపు ఆసక్తికరమైన పరిణామం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి జనగామ జిల్లాకు విస్తరించింది. కమిషనరేట్ వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగామ ఈ మూడు జిల్లాలకు విస్తరించారు.

విజయోత్సాహాలు, స్వీట్స్ పంపిణీలు
కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తూ మహబూబాబాద్, భూపాలపల్లి, జనగామ, వరంగల్ రూరల్ కార్యాలయాల హెడ్ క్వార్టర్స్, పట్టణాలు గులాబీ మయమయ్యాయి. ఆయా జిల్లాల్లో ర్యాలీలు, విజయోత్సాహాలు జరుపుతున్నారు.

 

07:57 - October 11, 2016

 

నల్లగొండ : మరికొన్ని గంటల్లో భువనగిరి కేంద్రంగా యాదాద్రి జిల్లాగా అవతరించబోతోంది. ఇప్పటికే దాదాపు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సిద్ధమయ్యాయి. యాదాద్రి జిల్లా అవుతుండటంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ రియల్‌ ఎస్టేట్‌ కూడా ఒక్కసారిగా ఊపందుకుంది.
మూడు జిల్లాలుగా నల్గొండ జిల్లా
నల్లగొండ జిల్లా... పునర్ వ్యవస్థీకరణలో భాగంగా మూడు జిల్లాలవుతోంది. ప్రస్తుత నల్లగొండ జిల్లాతో పాటు భువనగిరి కేంద్రంగా యాదాద్రి, సూర్యాపేట జిల్లాలుగా విడిపోతోంది. యాదాద్రి.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉండటంతో పాటు తెలంగాణ తిరుమలగా పేరుగాంచిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉండటం జిల్లాకు కలిసి వచ్చే అవకాశం ఉంది. యాదాద్రి భువనగిరి పేరుపై చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం భువనగిరి రెవెన్యూ డివిజన్‌గా ఉండగా.. నూతనంగా చౌటుప్పల్‌ను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ రెండు రెవెన్యూ డివిజన్‌ల పరిధిలోని భువనగిరి, ఆలేరు, మునుగోడు నియోజకవర్గాలకు చెందిన 13 మండలాలతో పాటు తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని మోత్కూర్, నకిరేకల్ నియోజకవర్గంలోని రామన్నపేటలతో కలుపుకోని 15 మండలాలతో యాదాద్రి జిల్లా ఏర్పాటవుతోంది.

22 ఎకరాల స్థలంలో 70 గదులతో కూడిన భవన సముదాయం
యాదాద్రి జిల్లా ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపాదికన ఏర్పాట్లు సాగుతున్నాయి. కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయం అవసరాల మేరకు భవనాలను తీర్చిదిద్దుతున్నారు. పగిడిపల్లి సమీపంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలెక్టరేట్‌ కార్యాలయం, జగదేవ్‌పూర్‌ రోడ్డులోని పాత బీఈడీ కళాశాల ప్రాంగణంలో ఎస్పీ కార్యాలయం భవనాలు పూర్తవుతున్నాయి. దాదాపు 70 శాతం కార్యాలయాలు జిల్లా కలెక్టర్‌ కార్యాలయ భవన సముదాయంలోనే ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్‌-వరంగల్ జాతీయ రహదారిపై సుమారు 22 ఎకరాల స్థలంలో 70 గదులతో కూడిన భవన సముదాయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. యాదాద్రి జిల్లాగా ఏర్పడుతుండడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

యాదాద్రి సమీపంలో పెరిగిన రియల్‌భూమ్‌
తెలంగాణ ఏర్పాటు తర్వాత యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామీ ఆలయ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇప్పటికే చాలాసార్లు ఆలయాన్ని సందర్శించారు. టెంపుల్ సీటి నిర్మాణంలో భాగంగా ఆలయ పునర్‌నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దీంతో సమీప ప్రాంతాల్లో రియల్ భూమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

భువనగిరిలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వ ఏర్పాట్లు
భువనగిరిలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ఇప్పటికే పారిశ్రామికవేత్తలను ఆహ్వానించింది. రాజధానికి 50 కిలోమీటర్ల దూరంలోనే ఉండటం, రోడ్డు, రైలు మార్గం ఉండటం, శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి దాదాపు గంటన్నర సమయంలోనే చేరుకునే అవకాశం లాంటివి భువనగిరి ప్రాంతానికి కలిసొచ్చే అంశాలని ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు తెలియజేస్తోంది.మొత్తంగా వివిధ పార్టీలు, స్థానికుల డిమాండ్ల మేరకు యాదాద్రి జిల్లాగా ఏర్పడుతుండటంతో అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

07:52 - October 11, 2016

హైదరాబాద్ : జిల్లాల పునర్వ్యవస్థీకరణ తుది నోటిఫికేషన్‌కు సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కర్కాటక లగ్నంలో 12 గంటల 21 నిమిషాల నుంచి 2 గంటల 20 నిమిషాల మధ్య ముహూర్తంగా నిర్ణయించారు. ఆ సమయంలోనే రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ప్రదీప్‌చంద్ర తుది నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఒక్కో జిల్లాకు ఒక్కో జీవో చొప్పున జీవో నెంబరు 221 నుంచి 250 వరకూ మొత్తం 30 జీవోలు విడుదల చేశారు. అనంతరం గెజిట్‌ నోటిఫికేషన్‌కు అప్పటికప్పుడే ప్రభుత్వ ముద్రణాలయానికి పంపారు. నోటిఫికేషన్‌ ప్రతులను అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో సీఎస్‌ రాజీవ్‌ శర్మ పరిశీలించారు. అయితే, జీవోలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయడానికి సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దాంతో, రెవెన్యూ శాఖ జిల్లాల నోటిఫికేషన్‌ ఆధారం చేసుకుని ఆర్థిక శాఖ ఆయా జిల్లాల్లో పోస్టులను మంజూరు చేస్తూ జీవోలు విడుదల చేసింది. దీని ఆధారంగా దాదాపు 31 శాఖలు, అనుబంధ విభాగాల ద్వారా విడివిడిగా మాన్యువల్‌గా జీవోలను విడుదల చేయాల్సి వచ్చింది. తుది నోటిఫికేషన్‌ ప్రకారం, హైదరాబాద్‌ మినహా 9 జిల్లాలను పునర్వ్యవస్థీకరించి 30 జిల్లాలు చేశారు. దాంతో, పది జిల్లాల తెలంగాణ 31 జిల్లాల రాష్ట్రంగా ఆవిర్భవించింది.

07:48 - October 11, 2016

హైదరాబాద్ : మరి కొద్దిసేపట్లో పది జిల్లాల తెలంగాణ రాష్ట్ర అంతర్గత భౌగోళిక స్వరూపం మారబోతుంది. పది జిల్లాల తెలంగాణ 31 జిల్లాల తెలంగాణగా అవతరించబోతుంది. సరికొత్త పరిపాలనా ముఖచిత్రం ఆవిష్కృమవుతోంది. పాలనను ప్రజల చెంతకు చేర్చే లక్ష్యంతో చేపట్టిన కొత్త జిల్లాలు... విజయదశమి రోజున సాకారమవుతున్నాయి.

27 జిల్లాలతో ఆగష్టు 20న డ్రాప్ట్ నోటిఫికేషన్ జారీ
పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేపట్టింది ప్రభుత్వం. ఎన్నో తర్జనాభర్జనాల తర్వాత 31 జిల్లాలును ఖరారు చేస్తూ తుది నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియలో భాగంగా అధికారికంగా 27 జిల్లాలతో ఆగష్టు 20న డ్రాప్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే.. ఇందులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియచేసేందుకు వీలుగా.. ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందించింది. దీనికోసం ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం, సీఎస్ రాజీవ్ శర్మ అధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించింది. ఈ రెండు కమిటీలు జిల్లాల ఏర్పాటులో ఉద్యోగుల సర్దుబాటు, కార్యాలయాల ఏర్పాటుపై సమావేశాలు చేపట్టాయి.

డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో లేని జనగాం, గద్వాల, సిరిసిల్లలు

ఇక ఈ డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌లో జనగాం, గద్వాల, సిరిసిల్లలు లేకపోవడంతో ఆయా ప్రాంతాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పెద్ద ఎత్తుగా ఉద్యమాలు వచ్చాయి. ఇక గద్వాల జిల్లా కోసం మాజీ మంత్రి డికే ఆరుణ ఉద్యమాలతో పాటు.. యాగాలు కూడా చేసింది. చివరి ప్రయత్నంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేశారు.

సాధ్యాసాధ్యాలపై కేకే నేతృత్వలో హైపర్ కమిటీ ఏర్పాటు
ఇది ఇలా ఉంటే మధ్యలో సిరిసిల్ల జిల్లా కూడా కావాలని పెద్ద ఎత్తున నిరసన జ్వాలాలు పెల్లుబికాయి. దీంతో సిరిసిల్ల, జనగామ,గద్వాల జిల్లాలతో పాటు.. అసిఫాబాద్ జిల్లాల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరీశీలించాలని రాజ్యసభ సభ్యుడు కేశవరావు నేతృత్వంలో హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు.

31 జిల్లాలకు పూర్తైన కలెక్టర్ల నియామకం
ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు.. సీఎం ఏర్పాటు చేసిన కమిటీల నివేదికల అధారంగా 31 జిల్లాలను ఫైనల్ చేసిన ప్రభుత్వం ఆయా జిల్లాలకు కలెక్టర్లను కూడా ప్రభుత్వం నియమించింది. కొత్తగా రామగుండం, కరీంనగర్, నిజమాబాద్, సిద్దిపేటలను కూడా కొత్తగా పోలీసు కమిషనరేట్‌లుగా ఏర్పాటు చేసింది. మొత్తమ్మీద ఇవాళ్టి నుంచి 31 జిల్లాల తెలంగాణగా రాష్ట్ర రూపు రేఖలు మారడంతో పాటుగా.. కొత్త జిల్లాల నుంచి పాలన కూడా ప్రారంభమవుతుంది. 

07:44 - October 11, 2016

హైదరాబాద్ : కొత్త జిల్లాల ఆవిర్భావానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. మరికొన్ని గంటల్లో ప్రారంభమయ్యే జిల్లాలకు కలెక్టర్లు, కమిషనర్లు, డీసీపీలు, ఎస్పీలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తుర్వులు జారీ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ దాదాపు పూర్తైంది. ఇప్పటికే జిల్లాలను ప్రారంభించనున్న ప్రజాప్రతినిధుల పేర్లు ప్రకటించిన సర్కార్‌..21 జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కొత్త జిల్లాకు కొత్త కలెక్టర్లు..

వరంగల్ జిల్లా కలెక్టర్‌గా అమ్రపాలి, వరంగల్‌ రూరల్ జిల్లా కలెక్టర్‌గా ప్రశాంత్‌,మహబూబాబాద్‌ జిల్లాకు ప్రీతిమీనా, జనగాం జిల్లాకు దేవసేనా,భూపాలపల్లి జిల్లాకు మురళిని కలెక్టర్లుగా నియమించింది. ఆదిలాబాద్ జిల్లాకు జ్యోతి బుద్ధ ప్రకాష్‌, మంచిర్యాల జిల్లాకు ఆర్‌.వి. కర్ణన్‌, నిర్మల్‌ జిల్లాకు ఇలంబర్తి, ఆసిఫాబాద్‌ జిల్లాకు చంపాలాల్‌, నిజామాబాద్ జిల్లాకు యోగితరాణ, కామారెడ్డి జిల్లాకు సత్యన్నారాయణ, ఖమ్మం జిల్లాకు లోకేష్‌, కొత్తగూడెం జిల్లాకు రాజీవ్‌ జీ హన్మంత్, హైదరాబాద్ జిల్లాకు రాహుల్‌ బొజ్జా కలెక్టర్లుగా నియమితులయ్యారు.

కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌గా సర్పరాజ్‌ అహ్మద్‌
కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌గా సర్పరాజ్‌ అహ్మద్‌, జగిత్యాల జిల్లాకు శరత్‌, పెద్దపల్లి జిల్లాకు వర్షిణి, సిరిసిల్ల జిల్లాకు కృష్ణా భాస్కర్‌, మహబూబ్‌ నగర్‌ జిల్లాకు రోనాల్డ్‌ రాస్, నాగర్‌ కర్నూలు జిల్లాకు శ్రీధర్‌, వనపర్తి జిల్లాకు శ్వేత మహాంతి, గద్వాల జిల్లాకు రత్‌ కుమార్‌ శైనీ, మెదక్‌ జిల్లాకు భారతీ హోళీ కేరి, సిద్ధిపేట జిల్లాకు వెంకట్‌ రామిరెడ్డి, సంగారెడ్డి జిల్లాకు మాణిక్‌ రాజ్, రంగారెడ్డి జిల్లాకు రఘునందన్‌ రావ్‌, వికారాబాద్‌ జిల్లాకు దివ్య, మాల్కాజ్‌గిరి జిల్లాకు ఎంవీ రెడ్డి, నల్లగొండ జిల్లాకు గౌరవ్‌ ఉప్పల్‌, సూర్యాపేట జిల్లాకు సురేంద్ర మోహన్, యాదాద్రి జిల్లాకు అనిత రామచంద్రన్‌ కలెక్టర్లుగా నియమించారు.

కొత్త పోలీస్ బాస్ లు ..
కొత్తగా ఏర్పడిన జిల్లాలకు కమిషనర్లు, డీసీపీలు, ఎస్పీలను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. సిద్దిపేట కమిషనర్‌గా శివకుమార్‌, కరీంనగర్ కమిషనర్‌గా కమలహాసన్ రెడ్డి, నిజామాబాద్ కమిషనర్‌గా కార్తీకేయ, రామగుండం కమిషనర్‌గా విక్రజిత్ దుగ్గల్, ఖమ్మం కమిషనర్‌గా షానవాజ్ ఖాసీం నియమితులయ్యారు.అలాగే శంషాబాద్ డీసీపీగా పద్మజారెడ్డి, సూర్యాపేట ఎస్పీగా పరిమళ నూతన్, నల్లగొండ ఎస్పీగా ప్రకాశ్ రెడ్డి.. యాదాద్రి ఎస్పీగా యాదగిరి, సిరిసిల్ల ఎస్పీగా విశ్వజిత్, నిర్మల్ ఎస్పీగా విష్ణు వరియార్, మెదక్ ఎస్పీగా చంద్రదీప్తి, కొత్తగూడెం ఎస్పీగా అంబర్ కిషోర్ ఝా, జగిత్యాల ఎస్పీగా అనంత్ శర్మ, ఆదిలాబాద్ ఎస్పీగా శ్రీనివాస్, వనపర్తి ఎస్పీగా రోహిణి, నాగర్ కర్నూల్ ఎస్పీగా సింగన్ వార్‌ను నియమించారు. సంగారెడ్డి ఎస్పీగా చంద్రశేఖర్‌రెడ్డి, గద్వాల ఎస్పీగా విజయ్‌కుమార్, మహబూబన్‌నగర్ ఎస్పీగా రెమా రాజేశ్వరి, రంగారెడ్డి ఎస్పీగా నవీన్‌కుమార్‌, కామారెడ్డి ఎస్పీగా శ్వేత, మంచిర్యాల ఎస్పీగా జాన్‌వెస్లీ, అసిఫాబాద్ ఎస్పీగా సన్‌ప్రీత్ సింగ్‌, పెద్దపల్లి ఎస్పీగా విజయేందర్‌రెడ్డి, వరంగల్, వరంగల్ సెంట్రల్, వరంగల్ ఈస్ట్ ఎస్పీలుగా సుధీర్‌బాబు, వేణుగోపాల్, ఇస్మాయిల్ నియమితులయ్యారు. ఇక మహబూబాబాద్‌ ఎస్పీగా మురళీ, భూపాలపల్లి ఎస్పీగా భాస్కరన్‌లను ప్రభుత్వం నియమించింది. 

07:38 - October 11, 2016

హైదరాబాద్ : కొత్త జిల్లాల ప్రారంభ ముహుర్తం దగ్గరపడింది. సిద్ధిపేట జిల్లాను ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా ప్రారంభించనుండగా.. మిగతా జిల్లాల ప్రారంభ బాధ్యతలను మంత్రులకు అప్పగించారు. సిద్దిపేటకు కేసీఆర్‌ వెళ్తున్న సందర్భంగా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద 50 వేల మందితో సభ ఏర్పాటు చేశారు.

జిల్లాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు..
తెలంగాణలో నూతన జిల్లాల ప్రారంభానికి ముహుర్తం ఖరారైంది. మంగళవారం ఉదయం కర్కాటక లగ్నంలో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ధనుర్‌ లగ్నంలో ఉదయం 11 గంటల 13 నిమిషాలకు ముఖ్యమంత్రి, మంత్రుల చేతుల మీదుగా కొత్త జిల్లాలు ప్రారంభం కానున్నాయి.

11 గంటల 13 నిమిషాలకు సిద్దిపేట ప్రారంభం
సీఎం కేసీఆర్‌ 11 గంటల 13 నిమిషాలకు సిద్దిపేట జిల్లాను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావు పాల్గోనున్నారు. ఇక జయశంకర్‌ జిల్లాను అసెంబ్లీ స్పీకర్‌ మధుసూధనాచారి, మెదక్‌ జిల్లాను డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి, జనగామ జిల్లాను మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ ప్రారంభించనున్నారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వరంగల్‌ రూరల్‌ జిల్లాను... మరో డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ జగిత్యాల జిల్లాను ప్రారంభిస్తారు. అలాగే యాదాద్రి జిల్లా నాయిని నర్సింహారెడ్డి, పెద్దపల్లి జిల్లాను ఈటల రాజేందర్‌, కామారెడ్డి జిల్లాను పోచారం శ్రీనివాసరెడ్డి, మంచిర్యాల జిల్లాను పద్మారావు ప్రారంభించనున్నారు. ఇక వికారాబాద్‌ జిల్లాను మహేందర్‌రెడ్డి, సిరిసిల్ల జిల్లాను కేటీఆర్‌, ఆసిఫాబాద్‌ జిల్లాను జోగు రామన్న ప్రారంభించనున్నారు. సూర్యాపేట జిల్లాను జగదీష్‌రెడ్డి, కొత్తగూడెం జిల్లాను తుమ్మల నాగేశ్వరరావు, నిర్మల్‌ జిల్లాను ఇంద్రకరణ్‌రెడ్డి, నాగర్‌కర్నూలు జిల్లాను జూపల్లి కృష్ణారావు, మహబూబాబాద్‌ జిల్లాను చందూలాల్‌, జోగులాంబ జిల్లాను లక్ష్మారెడ్డి ప్రారంభిస్తారు. మల్కాజిగిరి జిల్లాను తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, వనపర్తి జిల్లాను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, కొత్తగూడెం జిల్లాను తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించనున్నారు. మంగళవారం ఉదయం జిల్లాల ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఇప్పటికే కార్యాలయాలన్నీ ముస్తాబయ్యాయి. 

07:37 - October 11, 2016

హైదరాబాద్ : విజయానికి ప్రతీక అయిన విజయదశమి నుంచే తెలంగాణకు కొత్త దశ.. పది జిల్లాల తెలంగాణ సిగలో మరో 21 జిల్లాలు చేరాయి. 31 జిల్లాలతో సరికొత్త తెలంగాణ ఆవిర్భవించింది. విజయదశమి రోజున ఉదయం 11 గంటల 13 నిమిషాలకు సీఎం కేసీఆర్‌ సిద్ధిపేట జిల్లా ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఇతర జిల్లాలను మంత్రులు ప్రారంభిస్తారు.

ముస్తాబైన తెలంగాణ..
కొత్త జిల్లాల ఆవిర్భావానికి తెలంగాణ ముస్తాబైంది. మంగళవారం ఉదయం ధనుర్లగ్నంలో 11 గంటల 12 నిమిషాలకు జిల్లాలను ప్రారంభించేందుకు ముహుర్తం ఖరారు చేశారు. జిల్లాల ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది.

సిద్ధిపేటను ప్రారంభించనున్న కేసీఆర్..
ముఖ్యమంత్రి కేసీఆర్‌... సిద్దిపేట జిల్లాను ప్రారంభించనున్నారు. కేసీఆర్‌ సిద్దిపేటలో గంటసేపు పర్యటించనున్నారు. జిల్లా ఆవిర్భావం సందర్భంగా ఏర్పాట్లను హరీష్‌రావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. భారీ ఎత్తున సంబరాలు నిర్వహించడంతో పాటు.. కేసీఆర్‌కు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగ, కుల సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించాయి. 6,200 మంది మహిళా సంఘాల సభ్యులు దారి పొడవునా మంగళహారతులతో సీఎంకు స్వాగతం పలకునున్నారు. 50 వేల బుడగలను గాల్లోకి ఎగురవేస్తూ.. భారీ ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు జరపాలని నిర్ణయించారు. సికింద్రాబాద్‌ లష్కర్‌ బోనాల్లో పాల్గొనే వెయ్యిమంది కళాకారులతో కళారూపాలను ప్రదర్శించనున్నారు. జిల్లా ప్రారంభం నేపథ్యంలో 200 మంది వేద పండితులతో పాటు.. తొమ్మిది మంది వివిధ వర్గాలకు చెందిన పెద్దలతో సర్వమత ప్రార్ధనలు నిర్వహించనున్నారు.

పూలవనంలా సిద్ధిపేట..
జిల్లా ఆవిర్భావం సందర్భంగా సిద్దిపేటను పూలవనంగా తీర్చిదిద్దారు. పట్టణం నలుమూలలా కేసీఆర్‌ కటౌట్లను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు, ప్రధాన చౌరస్తాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. జిల్లా ఆవిర్భావ సంబరాలను పురష్కరించుకుని ప్రభుత్వం 30 వేల లడ్డూలను పంచనుంది. మరో 30 వేల లడ్డూలు, జిలేబిలను పంచేందుకు పలు సంఘాలు ముందుకువచ్చాయి.

ముర్కుక్ లో పర్యటించనున్న కేసీఆర్
సిద్దిపేట జిల్లా ప్రారంభోత్సవం అనంతరం సీఎం కేసీఆర్‌ ములుగు మండలం ముర్కుక్‌లో పర్యటించనున్నారు. తహశీల్దార్‌, పోలీస్ స్టేషన్‌తో పాటు.. ప్రభుత్వ ఆస్పత్రిని కేసీఆర్‌ ప్రారంభిస్తారు. సిద్దిపేటలో సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.

 

రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ..

విజయవాడ : దసరా ఉత్సవాలు తుది దశగా చేరుకున్నాయి. తొమ్మిది రోజులపాటు తొమ్మిది అలకంకారాలతో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు 10వ రోజు దుర్గమ్మరాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. 

ఢిల్లీలో ఉగ్ర కలకలం?!..

ఢిల్లీ: దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందనే వార్త దేశవ్యాప్తంగా అలజడి సృష్టిస్తోంది. దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఉగ్రవాదులు ఇప్పటికే ఢిల్లీలో చొరబడ్డారని నిఘావర్గాలు స్పష్టం చేశాయి. కశ్మీర్‌ లోయలో 250 మంది ఉగ్రవాదుల మొహరించారని, రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. సర్జికల్ స్ట్రైక్స్ అనంతరం పగతో రగులుతున్న పాకిస్థాన్ ఉగ్రవాదులను భారత్‌పైకి దాడులకు ఉసిగొల్పుతోందని నిఘావర్గాలు పేర్కొంటున్నాయి.

యాదాద్రి గోపురానికి శ్రీకారం..

నల్లగొండ : యాదాద్రి పుణ్యక్షేత్రాభివృద్ధిలో భాగంగా విజయదశమి సందర్భంగా మంగళవారం ఆలయ రాజగోపురాల నిర్మాణం మొదలు కానుంది. శాస్త్రోక్త పూజలతో ఉత్తర, తూర్పు దిశల్లో గోపురాల నిర్మాణానికి శ్రీకారం చుడతామని ‘యాడా’ ఉపాధ్యక్షుడు కిషన్‌రావు తెలిపారు. రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పనులను ప్రారంభిస్తారని వెల్లడించారు. 

గుట్టుప్పలో అఖిలపక్షం ఆందోళన..

నల్లగొండ : గుట్టుప్పల్ లో అఖిలపక్ష నేతలు ఆందోళన చేపట్టారు. గుట్టుప్పల్ ను మండల కేంద్రంగా ప్రకటించకపోవటంపై అఖిల పక్ష నేతలు ఆందోళన చేపట్టారు. నాలుగు బస్సుల అద్దాలను ఆందోళన కారులు ధ్వంసం చేశారు. 

ప్రజలకు దసరా శుభాకాంక్షలు..

విజయవాడ : విజయదశమిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపైన విజయానికి ప్రతీకగా గవర్నర్‌ పండుగను అభివర్ణించారు. విజయదశమి రోజున మొదలుపెట్టే ఏ కార్యక్రమమైనా విజయవంతమౌతుందని, తెలుగు ప్రజలందరికీ విజయాలు కలగాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

9వ స్థానంలో తెలంగాణ..

హైదరాబాద్‌: కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత తెలంగాణలో జిల్లాల సగటు విస్తీర్ణం 3,704 చదరపు కిలో మీటర్లుగా ఉంది. జనాభా, విస్తీర్ణాలు పరిశీలిస్తే..మనకన్నా తక్కువ విస్తీర్ణంలోనే జిల్లాలు ఏర్పాటైన రాష్ట్రాలున్నాయి. తెలంగాణ జనాభా దాదాపు 3.5 కోట్లు. కేరళ, ఝార్ఖండ్‌, అసోం రాష్ట్రాల్లో జనాభా సంఖ్య మనతో దాదాపు సమానంగా ఉంది. విస్తీర్ణం పరంగా చూస్తే..తెలంగాణలో సగటు జిల్లా విస్తీర్ణం 3,704 చ.కి.మీ. కేరళ రాష్ట్ర విస్తీర్ణం తెలంగాణ విస్తీర్ణంలో మూడోవంతు. అక్కడ నాలుగు జిల్లాలే ఉండగా..సగటు జిల్లా విస్తీర్ణం 2775 చ.కి.మీగా ఉంది. ఝార్ఖండ్‌ విస్తీర్ణం తెలంగాణ కన్నా తక్కువే.

డీసీఎస్ వో ల కేటాయింపు..

హైదరాబాద్ : పాతవాటితోపాటు కొత్తజిల్లాలకు సివిల్ సైప్లె అధికారులను (డీసీఎస్‌వో)లను ప్రభుత్వం కేటాయించింది. వారికి కేటాయించిన ఆయాజిల్లాల్లో రిపోర్టు చేయాల్సిందిగా కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశించారు. దసరారోజు నుంచే కొత్త కార్యాలయాల్లో విధుల నిర్వహణ మొదలుకావాలని సూచించారు.

కొత్త జిల్లా తుది నోటిఫికేషన్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. నవ తెలంగాణ సమగ్ర స్వరూపం ఆవిష్కృతమైంది. తెలంగాణ రాష్ట్రం 31 జిల్లాలతో సరికొత్త స్వరూపాన్ని సంతరించుకుంది. బంగారు తెలంగాణకు వడివడిగా అడుగులు పడుతున్న సందర్భంలో రాజకీయాలకు అతీతంగా, ప్రజాభిష్టాలకు అనుగుణంగా జిల్లాల పునర్విభజన జరిగింది. ప్రతీ పల్లె స్వయంసమృద్ధి సాధించే దిశగా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల పునర్విభజన చారిత్రాత్మక నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Don't Miss