Activities calendar

20 October 2016

ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి : తమ్మినేని

రంగారెడ్డి : సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా స్థానికులు తమ బాధలను సీపీఎం నాయకులకు తెలియపరుస్తున్నారు. నాలుగోరోజుకు చేరిన పాదయాత్ర మంచాల మండలం లోయపల్లిలో ముగిసింది. నాలుగోరోజు నాలుగు గ్రామాలలో 20.6 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ..కేసీఆర్ గిరిజనులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తండాలను పంచాయితీలుగా గుర్తించాలనీ..ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 

21:51 - October 20, 2016

తమిళనాడు : డీఎంకే అధినేత కరుణానిధి తన రాజకీయ వారసుడెవరో ప్రకటించేశారు.. 93ఏళ్ల వయసులో ఎట్టకేలకు తన వారసుడు స్టాలిన్‌ అంటూ స్పష్టం చేశారు.. పార్టీ పటిష్టతకోసం స్టాలిన్‌ ఎంతో కష్టపడ్డారని కరుణ కితాబిచ్చారు.. పెద్దకొడుకు ఆళగిరి భయానికి ఇన్నాళ్లూ కలైంజర్‌ తన వారసుడి పేరు ప్రకటించలేదు... తాజాగా స్టాలిన్‌ పేరును చెప్పడంతో ఆళగిరి ఏం చేస్తారోనని డీఎంకే లో చర్చ నడుస్తోంది.. ఆళగిరికి దక్షిణ తమిళనాడులో గట్టి పట్టుంది.. స్టాలిన్‌కు బాధ్యతలిస్తే పార్టీ పరిస్థితి ఏంటోనని టెన్షన్ పడుతున్నారు..

21:49 - October 20, 2016

ఢిల్లీ : మహిళల వలలో పడి దేశరక్షణ రహస్యాలను లీక్‌ చేశారన్న ఆరోపణలు బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీని వెంటాడుతున్నాయి.విదేశీ ఎస్కార్ట్‌ మహిళలు, వ్యభిచారిణులతో ఉన్న ఫొటోల ఆధారంగా వరుణ్‌ను బ్లాక్‌మెయిల్ చేసి కొందరు రహస్యాలను సంపాదించారంటూ ప్రధాని మోదీ కార్యాలయానికి ఓ లేఖ వచ్చింది. అమెరికా న్యాయవాది సి ఎడ్మండ్స్ ఎలెన్ సెప్టెంబర్ 16న ఈ ఫిర్యాదు చేశారు. వివాదాస్పద ఆయుధ వ్యాపారి అభిషేక్ వర్మ వరుణ్ గాంధీని ఉపయోగించుకుని, ఇండియాతో కాంట్రాక్టులు కుదుర్చుకోవాలని ప్రయత్నిస్తున్న ఆయుధ తయారీదారులకు రక్షణ వివరాలను అందించాడని ఆ లేఖలో పేర్కొన్నారు. పార్లమెంటరీ రక్షణ కమిటీ సభ్యుడిగా వరుణ్‌కు కొంత సమాచారం తెలుసని, జాతీయ భద్రతను పణంగా పెట్టి ఈ సమాచారం చేరవేశాడని ఎలెన్ ఆరోపించారు. ఎలెన్‌ ఆరోపణలను వరుణ్ గాంధీ తీవ్రంగా ఖండించారు. యూపీ ఎన్నికల్లో తన ప్రాధాన్యతను తగ్గించడానికే దురుద్దేశంతో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. 

21:46 - October 20, 2016

తూర్పు గోదావరి : తొండంగి మండలం దివిస్‌ ప్రభావిత గ్రామాల్లో ఐద్వా మహిళలు పాదయాత్ర చేపట్టారు.. ఈ గ్రామాల్లో 144 సెక్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ.. పాదయాత్రగా వెళ్తున్న ఐద్వా నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వందమంది మహిళల్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం వరకూ మహిళల్ని పీఎస్‌లోనే ఉంచారు.. ఆ తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు.. తొండంగి మండ‌లంలోని పంపాది పేట‌, దాన‌వాయిపేట ప‌రిసర గ్రామాల్లో 2 నెలలుగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.. ఈ సెక్షన్‌ ఎత్తివేయాలంటూ ఐద్వా మహిళలు ఆందోళనబాటపట్టారు.

21:38 - October 20, 2016

మహబూబ్ నగర్ : రైతులకు ఇచ్చిన హమీలను విస్మరించిన తెలంగాణ ప్రభుత్వంపై టీ- కాంగ్రెస్ గర్జించింది. రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులకు కేసీఆర్ మొండిచేయి చూపారని మండిపడ్డారు. ఇకపై రైతులకు అండగా నిలిచి ప్రభుత్వంపై పోరాడేందుకు కాంగ్రెస్ సిద్ధమైయ్యిందంటూ మహబూబాబాద్ రైతు గర్జన బహిరంగసభలో టీ కాంగ్రెస్ సమరశంఖం పూరించింది.

మహబూబాబాద్‌లో టీ- కాంగ్రెస్ రైతు గర్జన సభ
మహబూబాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ రైతు గర్జన సభ నిర్వహించింది. సీనియర్ నేత జైపాల్‌ రెడ్డి, టీపీసీసీ అధినేత ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి హాజరయ్యారు. రైతులకు అండగా ఉంటామని ఎన్నికల్లో చెప్పిన కేసీఆర్.. ఆ తరువాతే ఆ ఊసే ఎత్తలేదని హస్తం నేతలు మండిపడ్డారు. రాబోయే రోజుల్లో రైతు సమస్యలపై తమ పోరాటం ఉధృతం చేస్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు.

రైతులకు ఇచ్చిన హమీలను కేసీఆర్ తుంగలోతొక్కారు- జానారెడ్డి
రైతులకు ఇచ్చిన హమీలను కేసీఆర్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మండిపడ్డారు. పూర్తిస్ధాయి రుణమాఫీ చేయకుండా ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు.
కేసీఆర్ రైతులకు ద్రోహం చేశాడు- జైపాల్ రెడ్డి
రైతులకు కేసీఆర్ ద్రోహం చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి మండిపడ్డారు. ద్రోహం, మోసం టీఆర్ఎస్ రక్తంలోనే ఉన్నాయని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని జైపాల్ రెడ్డి జోస్యం చెప్పారు.

తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్- ఉత్తమ్
కేసీఆర్ ప్రభుత్వానికి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికి డబ్బులుంటాయి కానీ.. ప్రజలకు ఉపయోగపడుతున్న రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలకు మాత్రం డబ్బులుండవా అని టీ-పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. గిరిజనులు, బీసీలు, ఎస్సీలు, ముస్లీంలు ఇలా అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు.

రైతు గర్జన సభలో నేతల మధ్య విభేదాలు
మరోవైపు కాంగ్రెస్‌ రైతు గర్జన సభలో నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. రైతు గర్జన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను బలరాంనాయక్‌ చింపివేశారని సభలో గొడవ జరిగింది. దీనిని కాంగ్రెస్‌ నేతలు ఏఐసీసీ దృష్టికి తీసుకువెళ్లారు.

21:34 - October 20, 2016

అనంతపురం : పది రోజుల్లోగా అనంతపురం జిల్లాలో సోలార్ ప్లాంట్ బాధితుల సమస్యలు పరిష్కరించకుంటే... పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు హెచ్చరించారు. నిర్వాసితులకు అండగా రాఘవులు చేపట్టిన పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సీపీఎం నేతలను పోలీసులు అడ్డుకోవడంతో.. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఎన్వీకుంట భూ నిర్వాసితులకు మద్దతుగా రాఘవులు పర్యటన
సీపీఎం నేత రాఘవులు అనంతపర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఎన్పీకుంట భూ నిర్వాసితులను కలిసేందుకు వెళ్లిన రాఘవులు, వారికి మద్దతుగా బైక్‌ ర్యాలీ నిర్వహించారు. నిర్వాసితులను కలిసేందుకు ప్రయత్నించిన రాఘువులును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సీపీఎం కార్యకర్తలు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకానొక దశలో పోలీసులు సీపీఎం కార్యకర్తలపై లాఠీచార్జ్‌ చేశారు. సీపీఎం నేత రాఘవులు, మరికొందరు నేతలను పోలీసులు అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అక్కడ రాఘవులుతో పాటు సీపీఎం నేతలు, రైతులు ధర్నాకు దిగారు.

మార్కెట్‌ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి : రాఘవులు
భూములు కోల్పోయిన రైతులకు మార్కెట్‌ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ రాఘవులు డిమాండ్‌ చేశారు. దీంతో స్థానిక ఆర్డీవో పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి రాఘవులుతో చర్చించారు. కుటుంబానికి లక్ష రూపాయలు ఎలా సరిపోతాయని రాఘవులు ఆర్డీవోను ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని రాఘవులు మండిపడ్డారు. పది రోజుల్లోగా ప్రభుత్వం సమస్య పరిష్కరించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.

హిందూపురంలో సీపీఎం నేతలు ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
టీడీపీ ప్రభుత్వం ఏం చేసినా చెల్లుతుందన్న దోరణిలో ఉందని, రైతుల సమస్యలపై ఆందోళనలు చేయడం కూడా తప్పన్నట్లు వ్యవహరిస్తోందని రాఘవులు దుయ్యబట్టారు. నిర్వాసితులతో మాట్లాడటానికి వచ్చిన సీపీఎం నేతల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించడం దారుణమని ఆయన అన్నారు.

రాఘవులు అరెస్ట్‌కు నిరసనగా హిందూపురంలో సీపీఎం ఆందోళన
రైతులకు ఇచ్చే నష్టపరిహారం విషయంలో ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని, ఇప్పటికీ మూడు కమిటీలు వేసినప్పటికీ ఫలితం లేదని రాఘవులు ప్రశ్నించారు. ఎకరాలకు పది లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు పదిరోజుల్లోగా పరిష్కారం చూపకపోతే సీపీఎం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని రాఘవులు హెచ్చరించారు. మరోవైపు రాఘవులు అరెస్ట్‌కు నిరసనగా హిందూపురంలో సీపీఎం నేతలు ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపారు.

రాఘవులు అరెస్ట్ పై మధు ఆగ్రహం
రెండు సంవత్సరాల నుంచి సేకరించిన భూములకు నష్టపరిహారం ఇవ్వకుండా ఏపీ ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన సీపీఎం పొలిట్ బ్యూరో నేత రాఘవులను అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. భూసేకరణ పట్ల సీఎం చంద్రబాబు మొండి వైఖరికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. 

21:10 - October 20, 2016

భూములు కొల్లగొట్టడమే లక్ష్యం.. ఎకరాల్లెక్కన కబళించటమే టార్గెట్. సామాన్యుల బతుకులను చిదిమి బడాబాబుల బొక్కసాలు నింపటమే తమ ధ్యేయమంటోంది. ఓ పద్ధతి లేదు.. ఓ పరిహారం లేదు. అధికారం ఉంది కదా అని.. పోలీసులు చేతిలో ఉన్నారు కదా అని.. బల ప్రయోగంతో.. ప్రజలను చెదరగొట్టి, బెదరగొట్టి భూములనుండి వెళ్లగొట్టి.. గ్రామాలను ఖాళీచేసే కుట్రలు అడుగడుగునా సాగుతున్నాయి. ఏపీలో అనేక జిల్లాల్లో ఇదే తంతు స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై ప్రజలు భగ్గుమంటున్నారు. పోరాటమార్గం తప్పదంటున్నారు.. ఏ పాపం చేశారు వాళ్లు.. ఏ నేరం చేశారు వాళ్లు.. భూములు ఎందుకు పోగొట్టుకోవాలి? జీవితాల్ని ఎందుకు పణంగా పెట్టాలి? తమ బతుకుల్ని ఎందుకు కోల్పోవాలి.. సరైన జీవనోపాధిని చూపకుండా, పరిహారాన్ని ఇవ్వకుండా సర్కారు భూముల్ని గుంజుకోవాలని చూసే ప్రయత్నాలు అడుగడుగునా వివాదాస్పదమౌతున్నాయి. భూమితో బతుకుల్ని అల్లుకున్న దేశంలో సర్కారు కర్కశంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్కడ పరిశ్రమ నెలకొల్పాలన్నా సామాన్యుల భూములే కావాలా? ప్రజల జీవితాలనే పణంగా పెట్టాలా? మరో మార్గం లేదా? ఇంతా చేసి సర్కారు సాధిస్తున్నదేంటి? ఓ పక్క అనంతపురం జిల్లా ఎన్పీకుంట లో, మరో పక్క కాకినాడ దివీస్ గ్రామాల్లో ఈ రోజు అరెస్టుల పర్వం.. నిరసనల అణచివేత యధేచ్చగా సాగింది. ప్రజలకు అన్యాయం చేయటంలో సర్కారు యమాజోరుగా ముందుకు సాగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ గ్రామాల్లో అడుగడుగునా పోలీసు బూట్ల చప్పుళ్లే.. ఎక్కడ చూసినా తనిఖీలే.. నిర్భందపు ఆనవాళ్లే.. వణిపోతున్న ప్రజల ఎక్కడ చూసినా కనిపిస్తారు.. బాధితులనే నేరస్తులుగా చిత్రిస్తున్న క్రూరత్వం అక్కడ కనిపిస్తుంది. ఏ పాపం చేశారు వాళ్లు? ఏ నేరం చేశారు వాళ్లు? ఓ పరిశ్రమ వస్తుంటే గుండె ఝల్లుమనే పరిస్థితి. ఓ ఎయిర్ పోర్ట్ వస్తుందంటే గ్రామాలు వణికిపోయే సమయం. ఒకటా రెండా.. ఏపీలో ఎక్కడ చూసినా భూముల వివాదాలే.. వేలకు వేల ఎకరాలు సామాన్యుల నుండి గుంజుకునే ప్రయత్నాలే. అభివృద్ధి పేరు చెప్పి.. సామాన్యుల బతుకులను చిదిమేసే యత్నాలే. పోనీ భూములకు తగిన పరిహారం ఇస్తారా అంటే.. కారుచవకగా కొట్టేసి రోడ్డున పడేసే ప్రయత్నాలు తప్ప మరొకటి కనిపించదు. ఎన్ని వెతలు.. ఎన్ని కన్నీళ్లు.. ఎన్ని పోరాటాలు... ఓ పరిశ్రమ వస్తుంటే గుండె ఝల్లుమనే పరిస్థితి. ఓ ఎయిర్ పోర్ట్ వస్తుందంటే గ్రామాలు వణికిపోయే సమయం. లక్షలాది ప్రజల బతుకులను ప్రశ్నార్ధకం చేస్తూ సర్కారు చేస్తున్న భూముల పందేరంలో సామాన్యులు బలవుతున్నారు. జీవనాధారాన్ని కోల్పోయి రోడ్డున పడుతున్నారు..అభివృద్ధి అంటే ప్రజా సంక్షేమం.. అంతే కానీ, నున్నటి రోడ్ల మెరుపులు.. ఆకాశ హర్మ్యాలు.. పారిశ్రామిక కారిడార్లు, వేలకు వేల ఎకరాల సెజ్ లు కాదు. భూమంటే బతుకైన దేశంలో ప్రభుత్వాలు ఎంలత బాధ్యతగా వ్యవహరించాలి. కానీ ఇక్కడ అడుగడుగునా నిర్లక్ష్యం... కర్కశత్వం కనిపిస్తోంది. ప్రజల బతుకులేమైనా తమ పబ్బం గడుపుకునే విధంగా సర్కారు తీరు కనిపిస్తోంది. 

గ్రూప్ 2 దరఖాస్తుల పొరపాటులు దిద్దుకోండి..

హైదరాబాద్: గ్రూప్ 2 కొలువులకు దరఖాస్తు చేసుకున్న పలువురు అభ్యర్థుల వివరాల్లో తప్పులు దొర్లినందున వాటిని సవరించుకోవాలని టీఎస్‌పీఎస్‌సీ సూచించింది. పలువురు అభ్యర్థులు పేరు, తండ్రి పేరు, విద్యార్హత, జోన్, ఫొటో, వంటి వాటిల్లో తప్పులు నింపినట్లుగా కమిషన్ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఈనెల 22వ తేదీలోగా సదరు అభ్యర్థులు తమ వివరాలను సరిదిద్దుకోవాలని టీఎస్‌పీఎస్‌సీ సూచించింది. తప్పులు దొర్లిన దరఖాస్తుదారుల వివరాలు తమ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు టీఎస్‌పీఎస్‌సీ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

20:45 - October 20, 2016

సీఎం కేసీఆర్ జీవిత చరిత్రను సిన్మా తీస్తన్నారంట..బడికి పోయింది...బండాటాడింది...గంతా తీత్తారంట సిన్మాల..జేసీ దివాకరన్న సీపురట్టుకోని రోడ్లుడిసిండు..కేసీఆర్ వరాల జల్లుతో తడిసి ముద్దయిన యాదాద్రి నర్సన్న సామి..రకరకాల ఇసిత్ర ఏసంగట్టే బంగి అనంతయ్య..గీదినం చంద్రబాబు ఏసంగట్టిండు..సీఎం సారు జిల్లాల ఓపక్క కందిసేను..మరోపక్క గంజాసేను..సిద్ధిపేటల దొంగోల్లతో ప్రమాణాలు చేయించిన పోలీసోల్లు..పానాల్ని కాపాడాల్సిన పోలీసులు పానాలు తీస్తుండ్రు ఫిలిప్పీన్స్ ల..డాన్సర్ల తో గలీజుగా ఏసం ఏసిన ఎమ్మెల్యే..

20:44 - October 20, 2016

తాతినేని సత్యప్రకాష్ దర్శకత్వంలో నారా రోహిత్ నటించి 'శంకర'సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. సమాజంలో జరిగే అన్యాయాలను ప్రశ్నించే యువకుడి పాత్రలో నారా రోహిత్ నటించాడు. హీరోగా రోహిత్.. హీరోయిన్ రెజీనాలు నటించిన ఈ సినిమా పోస్టర్లు సినిమా మీద బాగానే ఆసక్తి రేకెత్తించాయి. తాతినేని సత్య రూపొందించిన ఈ సినిమాకు చంద్రమౌళి ప్రసాద్ నిర్మాత. తమిళంలో సూపర్ హిట్టయిన 'మౌనగురు'కు రీమేకే ఈ 'శంకర'. తమిళంలో కరుణానిధి మనవడు అరుల్ నిధి హీరోగా నటించాడు. ఆవేశపరుడైన ఓ సాధారణ యువకుడు వ్యవస్థలో జరిగే అన్యాయాలపై తిరగబడటం.. ఈ క్రమంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం.. కథనం చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందనే విషయం ట్రేలర్ ను చూస్తే అర్థమవుతుంది. అక్టోబర్ 21ల ప్రేక్షకుల ముందుకు శంకర సినిమా రానున్నతరుణంలో టెన్ టీవీ నారా రోహిత్ తో చిట్ చాట్ చేసింది. మరి శంకర గురించి రోహిత్ ఏమంటున్నాడో తెలుసుకోవాలంటే వీడియో చూడండి..

20:35 - October 20, 2016

గుంటూరు : వచ్చే సంవత్సరం నుంచి ఏపీ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తానని వైసీపీ ఆధినేత జగన్‌మ్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి అన్నారు. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న వివేకా.. పార్టీ అదేశిస్తే త్వరలో జరగనున్న స్ధానిక సంస్ధలు, ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమన్నారు. ఒక పార్టీ తరుపున ఎన్నికై మరో పార్టీలోకి మారడం వంటి దిగజారుడు రాజకీయాలు చూస్తే బాధ కలుగుతుందని వివేకానందరెడ్డి పేర్కొంటున్నారు.

20:30 - October 20, 2016

హైదరాబాద్ : సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాల అమలుకు సీఎం ఆదేశిస్తే... యాజమాన్యం మాత్రం హమీకి బ్రేక్ వేసేందుకు యత్నిస్తోంది. సర్కార్‌ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కార్మికుల వారసులకు ఉపాధి రాకుండా మెలికలు పెడుతోంది. అర్ధం పర్దం లేని షరతులు పెడుతూ వీఆర్‌ఎస్‌ అమలు కాకుండా చేస్తోంది. షరతులు వద్దంటూ సింగరేణి గుర్తింపు సంఘం కోరుతున్నా యాజమాన్యం పట్టించుకోకపోవడంతో సింగరేణి వారసులు అయోమయంలో పడ్డారు.

కొత్త సంస్కరణలతో ప్రయోజనాలు కోల్పోతున్న కార్మిక వర్గం
సింగరేణి సంస్థలో నూతన పారిశ్రామికీకరణ పేరుతో ప్రవేశ పెట్టిన కొత్త సంస్కరణలతో కార్మిక వర్గం చాలా ప్రయోజనాలను కొల్పోయింది. సంస్థ అభివృద్దికి కార్మిక వర్గం మూలం అయినప్పటికీ అధికారులదే ఇష్టారాజ్యంగా నడుస్తోంది. నల్ల చట్టాల అమలుతో కార్మికుల గొంతు నొక్కుతున్న అధికారులు.. కార్మిక సంఘాలకు ఉనికి లేకుండా చేస్తున్నారు..

1997 తరువాత సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాలను రద్దు
1997 తరువాత సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాలను రద్దు చేయడంతో వేలమంది కార్మికులు తమ వారసులకు ఉపాధి కల్పించలేకపోయారు. అప్పటి వరకు ఉన్న వారసత్వ ఉద్యోగాల కల్పనతో తండ్రి ఉద్యోగం కోడుకులకు లేదా కుటుంబంలో మరొకరికి వచ్చేది. దీంతో కోల్ బెల్ట్ ప్రాంతంలో చాలా వరకు నిరుద్యోగ సమస్య ఉండేది కాదు. అప్పటి టిడిపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను రద్దు చేశారు. దీంతో నిరుద్యోగ సమస్య పెరిగి పోయి చాలా మంది వలస బాట పట్టారు. సింగరేణి వ్యాప్తంగా వారసత్వ ఉద్యోగాల సాధన కోసం ఉవ్వెత్తున ఉద్యమాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌.. వారసత్వ ఉద్యోగాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

వారసత్వ ఉద్యోగాల అమలుపై సంబురాలు చేసుకుంటున్న కార్మిక కుటుంబాలు
సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాల అమలుపై కోల్ బెల్టు వ్యాప్తంగా కార్మికులు వారి కుటుంబ సభ్యులు సంబరాలు జరుపుకున్నారు. సింగరేణి యాజమాన్యం మాత్రం విఆర్ఎస్ స్కిమ్ అమలుకు మెలికలు పెడుతూ బ్రేక్ వేయాలని చూస్తోంది. వాస్తవానికి వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ప్రభుత్వ రంగ సంస్థల్లో అమలు చేసే ఆవకాశాలు లేకపోవడంతో విఆర్ఎస్ ఆన్ మెడికల్ గ్రౌండ్స్ ద్వారా వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం భావించింది. ప్రస్తుతం మెడికల్ ఆన్ ఫిట్ ద్వారా వారసులకు ఉద్యోగాలు ఇస్తుండటంతో ఆ ప్రక్రియ ద్వారానే విఆర్ఎస్ కోనసాగించాలంటూ ప్రభుత్వం ఆదేశించింది.

అభ్యర్ధి పరీక్షలో ఉత్తీర్ణుడైతే 3 ఏళ్ల పాటు రూ.3వేల స్టై ఫండ్‌
మెడికల్ బోర్డు నిబంధనల ప్రకారం విఆర్ఎస్ ద్వారా ఉద్యోగ విరమణ పోందే కార్మికులు రెండేళ్ల సర్వీస్ ను సంస్థకు వదులుకుంటే వారసులకు ఉద్యోగం లభించే పరిస్థితి ఉంది. అయితే.. కోల్ ఇండియాలో చేసిన మాహిళా విఆర్ఎస్ స్కిమ్ మాదిరిగానే సింగరేణిలో అమలు చేయాలని యాజమాన్యం పట్టుబట్టే అవకాశాలు ఉన్నాయి. కోల్ ఇండియా ఒప్పందం ప్రకారం రెండేళ్లకు బదులు ఐదేళ్ల సర్వీస్ ను వదులు కోవడంతో పాటు అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణత సాధించిన వారికి ఉద్యోగంతో పాటు మూడేళ్ల పాటు కేవలం 3 వేల రూపాయల స్టై ఫండ్ చెల్లించి పనులు చేయించడం జరుగుతోంది. ఈ విధానాన్నే వారసత్వ ఉద్యోగాల కింద పెట్టి అమలు చేయాలని యాజమాన్యం పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది.

అధికారంలోకి వచ్చి రెండేళైనా సింగరేణి సమస్యలపై పట్టించుకోని కేసీఆర్‌
సింగరేణి ఎన్నికలు సమీపిస్తుండటంతో టీఆర్ఎస్ అనుబంధ సంస్థ అయిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి కలిసి వచ్చే విధంగా వ్యవహరించాలన్నది సీఎం ఆలోచనగా కనిపిస్తోంది. నిజానికి, అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైనా సింగరేణి సమస్యలపై కేసీఆర్‌ పెద్దగా పట్టించుకోలేదు. గత ఎన్నికల్లో టిఆర్ఎస్ తో పాటు పార్టీ అనుబంధ సంఘం టీబీజీకేఎస్‌ వారసత్వ ఉద్యోగాల హామీతో మెజారిటీ స్థాయిలో యూనియన్ ను గెలిపించుకుంది. ప్రస్తుతం విఆర్ఎస్ స్కిమ్ పై యాజమాన్యం ఎలాంటి షరతులు లేకుండా రెండేళ్ల సర్వీస్ తో అమలు చేయడం ద్వారా ఎక్కువ మంది కార్మికులకు ప్రయోజనం కల్గుతుందని గుర్తింపు సంఘం విన్నవించింది. అయితే యాజమాన్యం అందుకు సానుకూలంగా లేకపోవడంతో గుర్తింపు సంఘ నాయకులు అయోమయంలో పడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ యాజమాన్యం వైఖరి వల్ల కార్మికుల్లో వ్యతిరేకత వస్తుందనే హైరానాలో పడుతున్నారు.

ఉద్యోగాలు కొల్పోయిన కార్మికులకు మెలిక పెడుతున్న యాజమాన్యం
అదే విధంగా విధులకు హజరుకాకుండా ఉద్యోగాలు కొల్పోయిన కార్మికులకు తిరిగి ఉద్యోగాలు ఇచ్చే అంశంపై కూడా యాజమాన్యం మెలిక పెట్టే ప్రయత్నం చేస్తోంది. రెండేళ్లలో వంద మాస్టర్లు పూర్తి చేయడంతో పాటు 45ఏళ్ల వయోపరిమితి వరకు ఉన్న వారికి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని యాజమాన్యం యోచిస్తోంది. ఈ నిబంధనలతో కొద్ది మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండడంతో గుర్తింపు సంఘం టిజిబికేఎస్ వ్యతిరేకిస్తోంది. తప్పనిసరి పరిస్థితిలో నిబంధనలు అమలు చేయాల్సి వస్తే వయో పరిమితిని 50ఏళ్లకు పొడిగించి 50 మాస్టర్లు చేసి ఉంటేనే ఉద్యోగాలు కల్పించడం మేలని కార్మికులు భావిస్తున్నారు.

వారసత్వ ఉద్యోగాల్లో పాత విధానాన్నే అమలు చేయాలని డిమాండ్‌
ఏమైనా.. 1997-2001 మధ్య విఆర్ఎస్ ద్వారా పదవి విరమణ పొందిన కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలనే డిమాండ్ ను సింగరేణి యాజమాన్యం పూర్తిగా పక్కన పెట్టె అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గుర్తింపు సంఘం మాత్రం ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతోంది. గతంలో ఇచ్చిన విఆర్ఎస్ విధానాన్నే అమలు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సీఎం ఇచ్చిన హామీకి యాజమాన్యం నిబంధనల పేరుతో కొత్త మెలికలు పెడితే విఆర్‌ఎస్‌ నిష్ప్రయోజనంగా మారుతుంది. మరి, సింగరేణి యాజమాన్యం పాత విఆర్ఎస్ అమలు చేస్తుందా..? లేదా... అన్నది వేచి చూడాల్సిందే...

20:11 - October 20, 2016

హైదరాబాద్ : మరికొద్ది రోజుల్లో తెలంగాణలో నూతన సచివాలయం నిర్మాణానికి ప్రభుత్వం స్వీకారం చుడుతుండడంతో ప్రస్తుతం పని చేస్తున్న విభాగాలకి ప్రత్యామ్నాయాలు వెతుకుతుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి అధర్ సిన్హా తో కలసి ఇప్పటికే బూర్గుల రామకృష్ణరావు భవన్, ఆరణ్య భవన్, ఉర్ధు గల్లీలోని ప్రభుత్వ కార్యాలయాలు, బుద్ద భవన్, హాకా భవన్ లను స్వయంగా పరిశీలించారు. ఇక్కడ ఉన్న పరిస్థితులపై రేపు జరగబోయే క్యాబినేట్ కి ఆయన సమగ్ర నివేదిక అందించనున్నారు.

20:00 - October 20, 2016

తూర్పుగోదావరి : ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు గల్లీ పోరగాళ్ళలా తిట్టుకుంటే ఎలా వుంటుందో తెలుసుకోవాలనుందా? వీరిని చూస్తే ఆ విషయం చక్కగా అర్థమవుతుంది. ప్రజల సమస్యలు తీర్చేందుకు వీరికి అధికారాన్నిస్తే తిట్టుకోవాటానికి..కొట్టుకోవటానికి ఉపయోగపడుతోంది వారి అధికారం. ఇద్దరు ప్రజాప్రతినిధులు మాటలు వింటే సభ్య సమాజం సిగ్గుపడేలా వుంది. కాకినాడలో ఇరిగేషన్‌ ఎడ్వైజరీ బోర్డు సమావేశం రసాభాసగా మారింది.. ఎమ్మెల్సీ పిల్లి సుభాశ్ చంద్రబోస్, ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మధ్య వాగ్వాదం యుద్ధవాతావరణాన్ని తలపించింది.. ఎమ్మెల్సీపై తీవ్రస్థాయిలో ఆగ్రహించిన త్రిమూర్తులు... వాగ్వాదానికి దిగారు. 

'పిల్లి'ని చెప్పుతో కొడతానన్న తోట..

కాకినాడలో ఇరిగేషన్‌ ఎడ్వైజరీ బోర్డు సమావేశం రసాభాసగా మారింది.. ఎమ్మెల్సీ పిల్లి సుభాశ్ చంద్రబోస్, ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మధ్య వాగ్వాదం యుద్ధవాతావరణాన్ని తలపించింది.. ఎమ్మెల్సీపై తీవ్రస్థాయిలో ఆగ్రహించిన త్రిమూర్తులు... వాగ్వాదానికి దిగారు. 

వరుణ్ గాంధీపై ఆరోపణలు..

ఢిల్లీ : భారత రక్షణ శాఖ రహస్యాలను ఆయుధాల డీలర్ అభిషేక్ వర్మకు లీక్ చేస్తున్నారంటూ బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీపై ఆరోపణలు వచ్చాయి. అమెరికాకు చెందిన లాయర్ సి ఎడ్మండ్స్ అలెన్ ఈ మేరకు ఆరోపిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కు లేఖలు రాశారు. ఈ లేఖలను అలెన్ బయటపెట్టారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన 1 బిలియన్ డాలర్ల డీల్ ను తన క్లయింట్ కు దక్కించుకునేందుకు ఆయుధాల డీలర్ అభిషేక్ వర్మ ప్రయత్నిస్తున్నాడని, ఈ నేపథ్యంలో వరుణ్ గాంధీ, సీనియర్ మాజీ అధికారి ఎయిర్ మార్షల్ హరీష్ మాసంద్ ల సాయం పొందుతున్నాడని ఆరోపించారు.

బీసీ గురుకుల విద్యాసంస్థల్లో పోస్టుల భర్తీ..

హైదరాబాద్: బీసీ గురుకుల విద్యాసంస్థల్లో113 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. జూనియర్ లెక్చరర్లు 83, లైబ్రేరియన్-16, ఫిజికల్ డైరెక్టర్లు-8, ప్రిన్సిపల్ పోస్టులు-6 ఇందులో ఉన్నాయి.

18:49 - October 20, 2016

విశాఖపట్నం : విశాఖ నుంచి రాజమండ్రి వరకు పెట్రో హబ్ గా మారుబోతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖకు మరో 40 కంపెనీలకు పైగా రాబోతున్నాయని ఆయన తెలిపారు. పెద్ద ఎత్తున కంపెనీల ఏర్పాటుతో దాదాపు చాలా మంది యువకులకు ఉపాధి దొరికే అవకాశముందన్నారు. విశాఖలో జరిగిన పెట్రో యూనివర్సిటీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న బాబు... సబ్బవరాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చి మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని బాబు సూచించారు. 

18:36 - October 20, 2016
18:33 - October 20, 2016

అనంతపురం : ఉద్రిక్తతల మధ్య ఎన్పీ కుంటలో సీపీఎం నేత రాఘవులు పర్యటన ముగిసింది. ఈక్రమంలో టెన్ టీవీతో రాఘువులు మాట్లాడుతూ.. ఎకరానికి రూ.10లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని ఆర్డీవో ను డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. దాదాపు 8 వేల ఎకరాలను రైతుల నుండి తీసుకున్నారని వారికి ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం రైతులను వేధింపులకు గురిచేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసలే వెనకబడిన ప్రాంతం అయిన అనంతపురం జిల్లాలో రైతుల భూముల్ని లాక్కుంటే వారెలా జీవిస్తారని ఆయన ప్రశ్నించారు. సోలార్ ప్లాంట్ ద్వారా 3వేల ఉద్యోగాలలో కనీసం స్థానికులకు ఒక్క ఉద్యోగం కూడా కేటాయించలేదని ఈ సందర్భంగా రాఘవులు ఆరోపించారు. రైతులను బాధపెట్టిన ఎవరి కోసం అభివృద్ధి చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భూములు తీసుకున్న రైతులకు కనీస నష్టపరిహారమన్నా ఇవ్వకుండా భూములు లాక్కోవటం సరికాదని ఆయన సూచించారు. కాగా ఎన్ పీ కుంటలోని ఎన్టీపీసీ సోలార్ ప్లాంట్ సందర్శనకు వెళుతున్న సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులును పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు సీపీఎం ఇతర నేతలను కూడా అరెస్టు చేశారు. పీఎస్ లో రాఘవులు దీక్షకు దిగారు.ఈ క్రమంలో రాఘవులు తో స్థానిక ఆర్డీవో భేటీ అయ్యారు. భూసేకరణ, నష్టపరిహారంపై రాఘవులుకు ఆర్డీవో వివరణ ఇచ్చారు. స్థానికంగా తహశీల్దార్ కు సమాచారం లేకుండా కలెక్టర్ ద్వారానే సర్వే చేయించనట్లుగా ఆర్డీవో పేర్కొన్నారని రాఘవులు తెలిపారు. 

18:07 - October 20, 2016

అన్ని చోట్లా, విక్టరీ కోసం వేట సాగుతుంటుంది. సినిమా పరిశ్రమలో అయితే మరీనూ. ఇక్కడ ఓ హిట్టు పడితే జాతకాలు మారిపోతాయి. ఒక్కసారి ఫామ్‌లోకి వస్తే.. చెలరేగిపోతుంటారు. విజయం ఉన్నవారి మాటే... చెల్లుబాటు అవుతుంటుంది. వాళ్లకే గిరాకీ కూడానూ. 2016లో విజయఢంకా మోగించిన తారలు చాలామంది ఉన్నారు. వాళ్లిప్పుడు సూపర్‌ ఫామ్‌లో చెలరేగిపోతున్నారు.

నాగార్జున..
తన కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నారు నాగార్జున. యువతరం దూసుకొస్తున్నా... ధీటుగా నిలబడగలిగారు. వాళ్లతో పోటీపడి సినిమాలు తీశారు.. తీస్తున్నారు. అయితే ఆ మధ్య కొంతకాలంగా నాగ్‌ని జయాపజయాలు దోబూచులాడాయి. 'కింగ్‌' తరవాత సరైన విజయాన్ని అందుకోలేకపోయారు. మరో మధురమైన విజయం కోసం 'మనం' వరకూ ఆగాల్సివచ్చింది. ఆ సినిమా 'అక్కినేని' అభిమానులనే కాదు, తెలుగు సినీ ప్రేమికులకూ బాగా నచ్చింది. 'ఏఎన్నార్‌' చివరి చిత్రం కావడంతోనూ, మూడు తరాల కథానాయకుల్ని ఒకేసారి తెరపై చూపించిన అరుదైన కథ కావడంతో ప్రేక్షుకులు పట్టం కట్టారు. ఆ ఫామ్‌ కొనసాగిస్తూ 'సోగ్గాడే చిన్నినాయనా', 'వూపిరి' చిత్రాలతో వరుస విజయాలు అందుకొని హ్యాట్రిక్‌ కొట్టారు. ఈ ఏడాది 'నాగ్‌'కి బాగా కలిసొచ్చినట్టే చెప్పాలి.

సమంత..
టాలీవుడ్‌లోని అగ్రశ్రేణి కథానాయికల్లో 'సమంత' పేరు కూడా ఉంటుంది. అయితే ఆ మధ్య కథలు, పాత్రల ఎంపికలో తడబడి కొన్ని తప్పులు చేసింది. వాటి నుంచి త్వరగానే పాఠాలు నేర్చుకొని బయటపడింది. 'త్రివిక్రమ్‌' దర్శకత్వంలో రూపొందిన 'అ ఆ' సమంతకు కొత్త దారి చూపించింది. '24', 'జనతా గ్యారేజ్‌' చిత్రాల రూపంలోనూ ఆమె ఖాతాలో విజయాలు నమోదయ్యాయి. తొందర తొందరగా సినిమాలు చేసేయాలన్న హడావుడి తగ్గించింది 'సమంత'. తనకు నచ్చిన కథలనే ఎంచుకొంటోంది. దాంతో విజయాల బాట పట్టగలిగింది.

ఎన్టీఆర్..
వరుసగా మూడు విజయాలు. అందులో ఒకటి రూ.వంద కోట్ల సినిమా. ఇదీ ఎన్టీఆర్‌ స్టామినా. 'టెంపర్‌', 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్‌'తో తన కెరీర్‌లో ఇది వరకెప్పుడూ లేని సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. అయితే 'టెంపర్‌'కి ముందున్న పరిస్థితి వేరు. వరుసగా అన్నీ పరాజయాలే. ఆశలు, అంచనాలు మోసుకొచ్చిన చిత్రాలు సైతం బాక్సాఫీసు దగ్గర బోల్తా పడ్డాయి. ఈ దశలో 'ఎన్టీఆర్‌' చాలా మారాల్సి వచ్చింది. తన ఇమేజ్‌కి భిన్నంగా ఆలోచించాల్సి వచ్చింది. తనలోని నటుడికి కొత్త మార్గం చూపించే కథలు ఎంచుకొన్నాడు. 'టెంపర్‌' అందులో భాగంగా వచ్చినదే. ఆ మార్పు చక్కటి ఫలితాన్ని ఇచ్చింది. 'నాన్నకు ప్రేమతో' కూడా విభిన్నమైన ప్రయత్నమే. దానికి కమర్షియాలిటీ జత చేసి తీసిన చిత్రం 'జనతాగ్యారేజ్‌'. ఇలా విభిన్నమైన ఆలోచననలే 'ఎన్టీఆర్‌'కి వరుస విజయాల్ని అందించిపెట్టాయి.

రకుల్..
నవతరం కథానాయికల్లో దూసుకెళ్తున్న యువ కెరటం.. 'రకుల్‌ప్రీత్‌ సింగ్‌'. ఈ మధ్య తన జోరుకి అడ్డే లేకుండా పోయింది. 'నాన్నకు ప్రేమతో', 'సరైనోడు'తో ఈ ఏడాది మంచి విజయాల్ని అందుకొంది. 'నాన్నకు ప్రేమతో' సినిమాతో తొలిసారి డబ్బింగ్‌ కూడా చెప్పుకొంది. ఇప్పుడు 'మహేష్‌ బాబు'తో ఓ సినిమాలో నటిస్తోంది. మరోవైపు హైదరాబాద్‌లో ఓ ఫిట్‌నెస్‌ సెంటర్‌ని నిర్వహిస్తోంది. అటు సినిమాలూ, ఇటు వ్యాపారంతో 'రకుల్‌' మహా బిజీ అయిపోయింది. 'ఖాళీగా కూర్చోవడం నాకు నచ్చదు. కష్టపడే మనస్తత్వమే నా విజయానికి సోపానం. అంతకు మించి సీక్రెట్‌ ఏం లేదు' అంటోంది 'రకుల్‌'.

బన్నీ..
మెగా హీరోల్లో అందరికంటే ఫామ్‌లో ఉన్నోడు.. 'సరైనోడు' 'అల్లు అర్జున్‌'. 'సన్నాఫ్‌ సత్యమూర్తి', 'రుద్రమదేవి' మంచి ఫలితాన్నే అందించాయి. 'రుద్రమదేవి' ఆర్థికంగా లాభాలు తీసుకురాకపోయినా, అందులో గోనగన్నారెడ్డి పాత్రకు ప్రసంశలు దక్కాయి. బన్నీలోని మరో కోణం బయటపడింది. 'సరైనోడు'తో సరైన హిట్‌ కొట్టేశాడు 'బన్నీ'. ఇప్పుడు 'డీజే'గా సిద్ధం అవుతున్నాడు. ప్రతీ సినిమాలోనూ ఏదో ఓ కోణంలో కొత్తదనం చూపించడానికి చేస్తున్న ప్రయత్నమే తన విజయాలకు కారణం అంటున్నాడు బన్నీ. 'ఒక్కోసారి కథ కొత్తగా ఉంటుంది. మరోసారి కథనాన్ని, కథ చెప్పే విధానాన్ని కొత్తగా చూపించాలి. అప్పుడే విజయాలు మన వశం అవుతాయి' అనేది 'బన్నీ' మాట.

నాని..
యువ హీరోల్లో మినిమం గ్యారెంటీ ట్యాగ్‌లైన్‌ సంపాదించుకొన్నాడు 'నాని'. ఈమధ్య ఇతనికి ఎదురే లేకుండా పోయింది. 'ఎవడే సుబ్రమణ్యం', 'భలే భలే మగాడివోయ్‌', 'కృష్ణగాడి వీర ప్రేమగాథ', 'జెంటిల్‌మేన్‌' విజయాల్ని అందుకొన్నాయి. 'మజ్ను' కూడా ఓకే అనిపించుకొంది. ఈ ఏడాదిలో 'నాని' మూడు సినిమాలు చేశాడు. ఇప్పుడు చేస్తున్న 'నేను లోకల్‌' కూడా ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని భావిస్తున్నారు. ఆ లెక్కన ఒకే ఏడాది 4 సినిమాలు చేసిన హీరో అవుతాడు నాని. 'ఎవడే' కి ముందు 'నాని' కెరీర్‌ అటూ ఇటుగా సాగింది. 'పైసా', 'ఆహా కళ్యాణం' ఒకే నెలలో విడుదలై... పరాజయం పాలయ్యాయి. అదే సమయంలోనే వచ్చిన 'జెండా పైకపిరాజు' కూడా నిరాశ పరిచింది. దెబ్బకు దెబ్బ అన్నట్టు ఈ పరాజయాలకు వరుస విజయాలతో బదులు తీర్చుకోగలిగాడు 'నాని'. స్వచ్ఛమైన వినోదం..నాని ఆయుధం. దానికి కాస్త కొత్తదనం జోడించి విజయాల బాట పట్టాడు.

రాశీ ఖన్నా..
'సుప్రీమ్‌', 'హైపర్‌' విజయాలతో ఈ ఏడాది మెరుగైన ఫలితాలనే సాధించింది 'రాశీ ఖన్నా'. మరోవైపు తమిళం నుంచి కూడా ఆమెకు జోరుగా అవకాశాలు వస్తున్నాయి. రెండు తమిళ చిత్రాలనూ అంగీకరించింది. గ్లామర్‌ పాత్రలకు అడ్డుచెప్పకపోవడం, మోడ్రన్‌ అమ్మాయి పాత్రలకు సూటైపోవడం రాశీలోని ప్రత్యేకతలు. అవే ఆమెకు మంచి అవకాశాల్ని తెచ్చిపెడుతున్నాయి. 'మంచి పాత్రల్ని ఎంచుకొంటున్నా అని చెప్పడం విడ్డూరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈదశలో నా దగ్గరకు వచ్చిన ప్రతీ అవకాశం గొప్పదే. వాటికి నేనెంతవరకూ న్యాయం చేస్తాను అనేదే కీలకం. అవకాశాల్ని గౌరవించడం కూడా విజయానికి మార్గం వేస్తుంది' అని చెప్పుకొచ్చింది 'రాశీఖన్నా'.

రామ్...
'రామ్‌' ఆమధ్య కెరీర్‌లో బాగా ఇబ్బందిపడ్డాడు. వరుస వైఫల్యాలు వెక్కిరించాయి. 'ఒంగోలు గిత్త', 'ఎందుకంటే ప్రేమంట', 'మసాలా', 'పండగ చేస్కో', 'శివమ్‌'... ఇలా అన్నీ నిరాశ పరిచాయి. దాంతో 'రామ్‌' పునరాలోచనలో పడ్డాడు. తనకు సరిపోయే కథతో.. 'నేను శైలజ' తీశాడు. దాంతో ఫలితం కనిపించింది. 'నేను శైలజ' ప్రేక్షకులకు బాగా నచ్చింది. దాంతో 'రామ్‌' మళ్లీ ఫామ్‌ అందుకొన్నాడు. ఈమధ్య విడుదలైన 'హైపర్‌' కూడా ప్రేక్షకులకు వినోదాలు పంచింది. యువతరానికి నచ్చే కథలు ఎంచుకొంటూనే, కుటుంబ బంధాలకు ప్రాధాన్యం ఇవ్వడం, తన జోరు ఎక్కడా తగ్గకుండా జాగ్రత్త పడడం రామ్‌కి బాగా కలిసొచ్చాయి.

శృతి హాసన్..
సమంతలానే 'శృతిహాసన్‌' కూడా సినిమాల్ని ఎంచుకొనేటప్పుడు ఆచి తూచి స్పందిస్తుంటుంది. అటు తమిళం నుంచీ, బాలీవుడ్‌ నుంచి అవకాశాలు వరుసకట్టడంతో తెలుగు సినిమాల్ని కాస్త తగ్గించుకోవాల్సివస్తోంది. అయితే చేసిన చిత్రాలు మాత్రం మంచి ఫలితాన్నే అందిస్తున్నాయి. గతేడాది 'శ్రీమంతుడు'తో విజయాన్ని అందుకొంది 'శృతి'. ఆ తరవాత ఈమె నటించిన 'ప్రేమమ్‌' హిట్‌ బాట పట్టింది. ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ వేషధారణ, ఆమె శరీర భాష కొత్తగా అనిపించాయి. 'పాత్రల ఎంపికలో పరిపక్వత వచ్చింది. ఇదివరకటికంటే భిన్నంగా ఆలోచిస్తున్నా. అందుకే విజయాలు సాధిస్తున్నానేమో' అంటూ తన విజయ రహస్యం బయటపెట్టింది శృతి.
ఇండస్ట్రీలో సక్సెస్ ఇచ్చిన కిక్ మరేదీ ఇవ్వదు. అందుకే ఒక్కసారి హిట్టు కొట్టిన తారలు ఆ కిక్ కలకాలం ఉండాలని కలలు కంటుంటారు. అయితే అలా సక్సెస్ ను కంటిన్యూ చేసే తారలు కొంత మందే ఉంటారు. మంచి కథల్ని ఎంపిక చేసుకుంటూ, మంచి మంచి దర్శకుల్ని పక్కనుంచుకుంటే విజయాలకు హద్దే ఉండదు. సో.. అలా మిగతా స్టార్స్ కూడా సూపర్ ఫామ్ లోకి రావాలని ఆశిద్దాం. 

18:00 - October 20, 2016
17:57 - October 20, 2016

హైదరాబాద్ : తెలంగాణ సీఎం క్యాంపు ఆఫీస్‌లో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సీఎం కేసీఆర్‌ దంపతులు పోచమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అనంతరం పోచమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

17:54 - October 20, 2016

చెన్నై బ్యూటీ 'త్రిష' కెరీర్ మొదలెట్టింది తమిళ్ లోనే అయిన తెలుగు సినిమాలతోనే స్టార్ హీరోయిన్ అయింది. తమిళ్, తెలుగు బ్యాలన్స్ చేసిన ఈ బ్యూటీ రెండు ఇండస్ట్రీస్ లో స్టార్ హీరోయిన్ గా హవా సాగింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కెరీరేం బాగలేదు. అరకొరా ఛాన్స్ లు వచ్చిన పెద్దగా లాభం లేకుండా పోయింది. గతేడాది 'బాలయ్య'తో చేసిన 'లయన్' తర్వాత తెలుగులో మరో ఛాన్స్ రాలేదు. అయితే మోహిని తన కెరీర్ ని మంచి మైలేజ్ ఇస్తుందని ఈ చెన్నై బ్యూటీ నమ్ముతుంది. 'త్రిష' ఈ ఎడాది చేసిన 'నాయకి' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకుంది. కానీ ఈ మూవీ మాత్రం డిజాస్టర్ గా మారి 'త్రిష'ను తీవ్రంగా నిరాశపరిచింది. అయిన కూడా తమిళంలో ఈ చిన్నది పుల్ బిజీగా ఉంది. కోలీవుడ్ లో 'త్రిష' ఏకంగా ఆరు క్రేజీ సినిమాల్లో నటిస్తుంది. 'ధనుష్' తో 'కోడి', 'విక్రమ్' 'సామి' సీక్వెల్, 'క్వీన్' ఇలా ఆరు సినిమాలతో పుల్ బిజీగా ఉంది. ఇందులో 'త్రిష' లీడ్ రోల్ ప్లే చేస్తున్న 'మోహిని' సినిమాపై భారీ ఆశలు పెట్టుకుంది. 'త్రిష' టైటిల్ రోల్ ప్లే చేసిన మోహిని ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఎనిమిది చేతుల్లో ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధంతో ఈ బ్యూటీ లుక్ సింప్లీ సూపర్బ్ అనాల్సిందే. ఈ చిత్రం కచ్చితంగా హిట్టు అవుతుందని 'త్రిష' కాన్పిడెంట్ గా ఉంది. ఈ చిత్రం వచ్చే ఎడాది స్టార్టింగ్ లో రిలీజ్ కానుంది. అంతకంటే ముందే ఈ దీపావళికి 'ధనుష్' కి జోడిగా 'త్రిష' నటించిన 'కోడి' రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాలైనా ఈ చెన్నై పొన్నుకి సక్సెస్ అందిస్తాయో చూడాలి.

17:54 - October 20, 2016

మహబూబ్ నగర్ : రైతులకు ఇచ్చిన హమీలను కేసీఆర్ ప్రభుత్వం తుంగలోతొక్కిందని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మండిపడ్డారు. పూర్తిస్ధాయి రుణమాఫీ చేయకుండా ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. మహబూబాబాద్‌లో పార్టీ నాయకత్వంలో రైతు గర్జన సభ నిర్వహించింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్, సీనియర్ నేత జైపాల్‌ రెడ్డి, టీపీసీసీ అధినేత ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. రాబోయే రోజుల్లో రైతు సమస్యలపై తమ పోరాటం ఉధృతం చేస్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు.

17:51 - October 20, 2016

తూర్పుగోదావరి : అక్కడ సామాన్యులు పోరుబాట పట్టారు. అధికారం కోసమో, ఆధిపత్యం కోసమో కాదు.. తమ ప్రాంతం కాలుష్యం కోరల్లో చిక్కుకోకుండా కాపాడుకోవడానికి ఒక సాధారణ మహిళ..పెట్టుబడిదారుల ఆగడాలకు అడ్డం తిరిగితే నిర్దాక్షిణ్యంగా జైల్లో పెట్టారు. గ్రామస్తులకు అండగా ఉన్నందుకు కుమారుడిని కూడా జైలు పాలుచేశారు. ప్రస్తుతం వాళ్లిద్దరూ నెల రోజులుగా జైలులో మగ్గిపోతుంటే..క్యాన్సర్ రోగి అయిన భర్త ఏ దిక్కు లేక నానా కష్టాలు పడుతున్నాడు. ఈ దయనీయ ఘటనపై 10 టీవీ ప్రత్యేక కథనం..!

రణరంగంగా మారిన తుందుర్రు గ్రామం
పశ్చిమగోదావరి జిల్లాలోని తుందుర్రు గ్రామమిది. ప్రశాంతమైన వాతావరణం..పచ్చని పంట పొలాలతో హాయిగా జీవిస్తున్నారు ఇక్కడి గ్రామస్తులు. ఈ ప్రశాంతమైన వాతావరణమే ఇప్పుడు రణరంగంగా మారిపోయింది.

అక్రమ కేసులు పెడుతున్న ప్రభుత్వం
తుందుర్రులో ఆక్వాఫుడ్ పార్క్ ఏర్పాటు వద్దంటూ 33 గ్రామాల ప్రజలు రెండున్నర ఏళ్లుగా అలుపెరగకుండా పోరాటం చేస్తున్నారు. వివిధ రూపాల్లో నిరసనలు, ఆందోళనలు తెలియజేస్తున్నారు. అయినా ఇక్కడి వారి గోడును ప్రభుత్వం పట్టించుకోకపోగా..వీరిపై కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తోంది. ఆక్వాఫుడ్‌ పార్క్‌పై ఇక్కడ ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళను నిర్దాక్షిణ్యంగా జైల్లో పెట్టేస్తున్నారు పోలీసులు.

తుందుర్రుకు చెందిన ఆరేటి సత్యవతి ఒక సాధారణ మహిళ
పార్క్ ఏర్పాటు చేస్తే తమ ప్రాంతం కాలుష్యం కోరల్లో చిక్కుకుంటుందని మొరపెట్టుకుంటున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ పోరాటంలో సామాన్యులు చితికిపోతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఒక కుటుంబాన్ని చీకటి మయం చేసేసింది ప్రభుత్వం. తుందుర్రుకు చెందిన ఆరేటి సత్యవతి ఒక సాధారణ మహిళ. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. గతంలో ఉద్యమాలు చేసిన చరిత్ర లేదు. కానీ, తుందుర్రులో ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణం చేపట్టడం వల్ల తమ సమీప గ్రామాలన్నీ కాలుష్యమయవుతాయని యాజమాన్యంపై తిరగబడింది. 33 గ్రామాల తరుపున పోరాటంలో చురుగ్గా పాల్గొంది. అంతే..ఆమెతో పాటు సత్యవతి కుటుంబం ఈ రోజు నరకయాతన అనుభవిస్తోంది. ఆక్వాఫుడ్‌ పార్క్‌ వద్దంటూ ఆందోళన చేస్తున్న ఆరేటి సత్యవతిని నెలరోజుల క్రితం పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. తల్లి సత్యవతి బాటలోనే ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న కుమారుడు వాసును కూడా జైల్లో పెట్టారు. దీంతో సత్యవతి కుటుంబంలో చీకటి అలుముకుంది.
ఇబ్బందులు పడుతున్న సత్యవతి భర్త సత్యనారాయణ
సత్యవతి భర్త సత్యనారాయణ క్యాన్సర్ రోగి. భార్య, కొడుకు ఇద్దరు జైలులో ఉండటంతో చూసేవాళ్లు లేక నానా కష్టాలు పడుతున్నాడు. ఆస్పత్రికి వెళ్లి.. మందులు కూడా తీసుకొచ్చే వాళ్లు లేక ఇబ్బంది పడుతున్నాడు.

బాధితుల పక్షాన అండగా నిలుస్తోన్న సీపీఎం
ఆక్వా ఫుడ్ పార్క్ వద్దంటూ ఆందోళన చేస్తున్న బాధితుల పక్షాన సీపీఎం అండగా నిలుస్తోంది. వారి ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉంటోంది. బాధితుల్లో భరోసాను, ధైర్యాన్ని నింపుతోంది. బాధితుల పక్షాన పోరాటం చేస్తున్న సీపీఎం ఏపీ రాష్ర్ట కార్యదర్శి పీ. మధుతో పాటు ఇతర నేతలను కూడా అరెస్ట్‌ చేశారు. ఈ మధ్య సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందకారత్‌ కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించి.. బాధితుల గొడును తెలుసుకున్నారు. వారికి ధైర్యాన్ని చెప్పారు. ఇటు జైల్లో ఉన్న సత్యవతిని కూడా బృందకారత్‌ బృందం పరామర్శించింది.

ఉద్యమాన్ని అణచేందుకు ప్రభుత్వం యత్నం
ఉధృతంగా సాగుతున్న పోరాటాన్ని అణిచివేయాలని ప్రభుత్వం కుట్రలు పన్నినా.. దాన్ని ఐక్యమత్యంగా తిప్పికొడుతామంటున్నారు ఇక్కడి గ్రామస్తులు. పోలీసులు అక్రమంగా అరెస్ట్‌ చేసి.. జైల్లో పెట్టినా.. భయపడేది లేదంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తుందుర్రులో ఆక్వాఫుడ్‌ పార్క్‌ నిర్మాణం చేపట్టవద్దంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

 

17:43 - October 20, 2016

కడప : జూవైనల్ హోంలో బాల నేరస్తుడు అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు. బాత్‌రూంలో జారిపడడం వల్లే మృతిచెందాడని జూవైనల్ హోం నిర్వాహకులు చెబుతుండగా.. నిర్వాహకులు కొట్టడం వల్లే మృతిచెందాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన ముస్తాఫా చైన్ స్నాచింగ్ కేసులో ఇక్కడ శిక్షను అనుభవిస్తున్నాడు.

మార్కెట్ యార్డు ఛైర్మన్ ప్రమాణస్వీకారోత్సవం రసాభాస..

నాగర్ కర్నూలు : కల్వకుర్తి మార్కెట్ యార్డు ఛైర్మన్ ప్రమాణస్వీకారోత్సవం రసాభాసగా మారింది. ఫ్లెక్సీలో తమ నాయకుడి ఫొటో లేదని మరో వర్గం నిరసనకు దిగింది. ఇరువర్గాలకు కుర్చీలు విసురుకున్నాయి. 

భారత్ విజయలక్ష్యం 243 పరుగులు..

ఢిల్లీ : భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 242 పరుగులు చేసింది. భారత్ 243 పరుగులు చేయాల్సి ఉంది. విలియమ్సన్ 118, లాథమ్ 46, టేలర్ 21, అండర్సన్ 21, సాట్నర్ 7, డేవిసిచ్ 7, రోంచి 6, హెన్రీ 5 పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో మిశ్రా, బుమ్రాలకు తలో మూడు వికెట్లు తీశారు. యాదవ్, అక్షర్ పటేల్, జాదవ్ లకు చెరో ఒక వికెట్ తీశారు. 

17:40 - October 20, 2016

నల్లగొండ : తెలంగాణలో మరో ఆందోళనకు సిద్ధమైంది కాంగ్రెస్‌ పార్టీ... రైతులు, విద్యార్థులపట్ల ప్రభుత్వ వైఖరికి నిరసనగా సంతకాల సేకరణ చేస్తామని... తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించారు.. రైతులకు ఒకేసారి రుణమాఫీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.... ఫీజ్‌రీయింబర్స్‌మెంట్‌ నిధుల్ని వెంటనే విడుదల చేయాలని ఉత్తమ్‌ ఆలేరులో డిమాండ్ చేశారు.. 

జీహెచ్ఎంసీ వాసులపై చెత్త భారం !

హైదరాబాద్ : స్వచ్ఛ భారత్ కూడా 0.5టాక్స్ విధించనున్నారు. చెత్తను సేకరించడం..నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రభుత్వ విధి. కనీస విధుల నుండి కూడా సర్కార్ తప్పుకొనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ వాసులపై చెత్త భారం వేసేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయి. చెత్తపై నెలనెలా యూజర్ ఛార్జీల వసూలుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రేటర్ లో ప్రతి ఇంటికి నెలకు రూ. 50.. వ్యాపార సముదాయాలకు రూ. 500..గెస్ట్ హౌస్ లకు రూ. 750..ఆసుపత్రులకు రూ. 500..మూడు అంతస్తుల హోటల్, రెస్టారెంట్ లకు రూ. 1500..మూడు అంతస్తులకు పైగా ఉన్న హోటల్..రెస్టారెంట్ లకు రూ.

17:37 - October 20, 2016

అనంతపురం : జగన్‌కు ధైర్యం ఉంటే తన ఆస్తులను ప్రకటించాలంటూ ఏపీ మంత్రులు సవాల్‌ విసిరారు. అక్రమాలకు, అరాచకాలకు అవినీతికి జగన్ కేరాఫ్ అడ్రస్ అని అలాంటి జగన్... లోకేశ్ ను విమర్శించే అర్హత లేదంటూ అనంతపురంలో మంత్రులు పల్లె, కామినేని, పత్తిపాటి, కొల్లు రవీంద్రలు విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ హయాంలో వాతావరణ బీమాను తీసుకువచ్చి రైతులకు పరిహారం అందకుండా చేశారంటూ కాంగ్రెస్ నేతలపై మంత్రులు మండిపడ్డారు.

లోయలో పడ్డ బస్..22మంది మృతి..

జమ్మూ కశ్మీర్: బ జమ్ముకాశ్మీర్ రీసి జిల్లాలో బస్సు లోయలో పడి 22 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని జమ్ముకాశ్మీర్ మంత్రి అజయ్ నందా తెలిపారు. మృతుల కుటుంబీకులు విషాద సాగరంలో మునిగిపోయారు. అటు ప్రభుత్వం మృతుల కుటుంబీకులకు పరిహారం ప్రకటించింది. 

పెట్రో యూనివర్సిటీకి బాబు శంకుస్థాపన..

విశాఖపట్టణం : వంగలిలో పెట్రో యూనివర్సిటీకి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. డిజిటల్ క్లాసులు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. కేంద్ర మంత్రులు ధర్మాన ప్రదాన్, వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజు పాల్గొన్నారు. 

టి.శాఖల తరలింపుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు..

హైదరాబాద్ : తెలంగాణ సచివాలయంలో వివిధ శాఖల కార్యాలయాల నిర్వాహణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరుగుతున్నాయి. హాకా భవన్, సెర్సు కార్యాలయాలకు బుద్దభవన్, బీఆర్కే భవనాలను సీఎస్ రాజీవ్ శర్మ, జీఏడీ ప్రిన్స్ పల్ సెక్రటరీ ఆధార్ సిన్హాలు పరిశీలించారు. 

ఏ వర్గం సమస్యలు తీరలేదు - ఉత్తమ్..

మహబూబాబాద్ : టీఆర్ఎస్ పాలనలో ఏ వర్గం సమస్యలు తీరలేదని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతల పట్ల కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, అధికారం కోసం అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేస్తున్నారని తెలిపారు. కమీషన్ల కోసం రాష్ట్రాన్ని అప్పులోకి నెడుతున్నారని తెలిపారు.

కుంటుపడిన వ్యవసాయం - జానా..

మహబూబాబాద్ : టీఆర్ఎస్ పాలనలో వ్యవసాయం కుంటుపడిందని జానారెడ్డి పేర్కొన్నారు. రైతులకు ప్రయోజనాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీనేనని, తాము వద్దంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు. 

రైతులను కేసీఆర్ ద్రోహం చేశారు - జైపాల్ రెడ్డి..

మహబూబాబాద్ : కేసీఆర్ రైతులకు ద్రోహం చేశారని మోసం, ద్రోహం టీఆర్ఎస్ రక్తంలోనే ఉందని మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ టికెట్ పై గెలిచిన వాళ్లు టీఆర్ఎస్ లోకి వెళ్లారని విమర్శించారు.

17:00 - October 20, 2016

కరీంనగర్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని ఓ దేవాలయంలో దారుణం జరిగింది. ప్రేమ వివాహం చేసుకునేందుకు వచ్చిన మౌనిక అనిల్ అనే ప్రేమజంటపై వివాహం చేసుకునేందుకు దేవాలయానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న మౌనిక బంధువులు దాదాపు 15మందికి పైగా దేవాలయానికి చేరుకుని అనిల్ పై ఒక్కసారిగా కత్తులతో దాడిచేసి గొంతుకోసి దారుణంగా హత్య చేసారు. ఈ ఘటలో అనిల్ అక్కడి కక్కడే మృతి చెందాడు. అనిల్ తండ్రి ఎల్లయ్యను కూడా తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనలో స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటానాస్థలికి చేరుకున్న సీఐ కేసు నమోదు చేసుకుని విచారణచేపట్టారు. అనిల్ విజయపురి కాలనీ వాసిగా పోలీసులు గుర్తించారు. పరారీలో వున్న నిందితుల కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. కాగా గతంలోనే వీరిద్దరూ వివాహానికి సిద్ధపడ్డారు. దీంతో మౌనిక బంధువులు మౌనిక మైనర్ అని వివాహం చేసుకోవటానిక వీల్లేదని పీఎస్ లో ఫిర్యాదు చేశారు. పోలీసుల కౌన్సెలింగ్ తో గొడవ సద్దుమణిగింది. కాగా ఇటీవల మౌనిక మేజర్ కావటంతో వివాహానికి ఇద్దరూ తిమ్మాపూర్ దేవాలయంలో వివాహం చేసుకునేందుకు యత్నించటంతో ఈ దారుణహత్య చోటుచేసుకుంది. 

16:41 - October 20, 2016

అనంతపురం : ఎన్ పీ కుంటలోని ఎన్టీపీసీ సోలార్ ప్లాంట్ సందర్శనకు వెళుతున్న సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులును పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు సీపీఎం ఇతర నేతలను కూడా అరెస్టు చేశారు. పీఎస్ లో రాఘవులు దీక్షకు దిగారు. కాగా ఎన్టీపీసీ సోలార్‌ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. జిల్లాలోని కదిరి నుంచి ఎన్‌పీ కుంట వరకు ఆయన బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీపీసీ సోలార్‌ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని, బాధితులకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని రాఘవులు డిమాండ్‌ చేశారు. బాధిత రైతులతో రాఘవులు ముఖాముఖిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా భూ నిర్వాసితులకు ప్రభుత్వం.. రూ.లక్షల పరిహారం ప్రకటించడం దారుణమన్నారు. రైతులకు సీపీఎం అండగా వుండి పోరాడుతుందని చెప్పారు. 

16:36 - October 20, 2016

తమిళనాడు : శివకాశి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది బాణసంచా పటాసులు. దీపావళి పండుగకు నెలల ముందుగా శివకాశీలో బాణసంచా పటాసులు తయారీకి సిద్ధమయిపోతుంది. శివకాశీలో కుటీర పరిశ్రమగా బాణసంచా తయారుచేస్తుంటారు. దీపావళి పండుగ వస్తోందంటే చాలు పిల్లలతో సహా పెద్దలు కూడా ఆనందోత్సాలలో మునిగిపోతారు. కానీ చెన్నైలోని శివకాశీలో మాత్రం దాదాపుగా ప్రతీ దీపావళి పండుగకు కొన్ని కుంటుంబాలు విషాదంలో మునిగిపోతాయి. దీనికి కారణం శివకాశీలో వందలాదిమంది తయారు చేసే బాణసంచా గోడౌన్లలో తరచూ అగ్రిప్రమాదాలు సంభవిస్తూంటాయి. అ క్రమంలోనే శివకాశిలోని ఓ బాణసంచా గోడౌన్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఎనిమిదిమంది మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను శివకాశీలోని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్సనిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.ఈ ఘటనలో 20 ద్విచక్ర వాహనాలు, ఓ లారీ దగర్థమయ్యింది.

శివకాశిలో ప్రమాదం..8మంది మృతి..

చెన్నై : దీపావళి పండుగ సమీపిస్తోంది. ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా శివకాశి బాణాసంచా గోదాంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 8మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. 

16:13 - October 20, 2016

తూర్పుగోదావరి : తొండంగి మండలం దివీస్ ప్రభావిత గ్రామాల్లో ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు పాదయాత్ర చేపట్టారు. దివీస్ ప్రభావిత గ్రామాల్లో 144 సెక్షన్ ఎత్తివేయాలని మహిళలు డిమాండ్ చేశారు. మహిళల పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు దాదాపు 250మందిని అరెస్ట్ చేశారు. తొండంగి ప్రాంతంలో గత రెండు నెలలుగా 144 సెక్షన్ అమలులోవుంది. అన్నవరం పీఎస్ కు తరలించారు. దీంతో ఆగ్రహించిన ప్రజాసంఘాలు ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్థం చేసి నిరసన వ్యక్తం చేశారు. దీనిపై ఏపీ ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ప్రభావతి మాట్లాడుతూ..ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సామాన్యుల కోసం కాకుండా శత కోటీశ్వరుల కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. తొండంగి ప్రాంత గ్రామాలలో ప్రభుత్వం నిర్భంధ కాండ విధిస్తోందని ఆమె విమర్శించారు. ఈ పరిశ్రమలతో వేలాదిమంది చేతి వృత్తులు నిర్వీర్యమైపోతున్నాయని.. పచ్చని వాతావరణం అంతా కలుషితమైపోతోందనీ..చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నవారు రోడ్డు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

బాణసంచా గోడౌన్‌లో ప్రమాదం..6గురు మృతి..

తమిళనాడు : శివకాశిలోని ఓ బాణసంచా గోడౌన్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

దేవాలయంలో దారుణం..

కరీంనగర్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని ఓ దేవాలయంలో దారుణం జరిగింది. ప్రేమ వివాహం చేసుకునేందుకు వచ్చిన ప్రేమజంటపై యువతి బంధువులు దాడి చేసి యువకుడి గొంతు కోశారు. ఈ ఘటలో యువకుడు అక్కడి కక్కడే మృతి చెందాడు. యువకుడు విజయపురి కాలనీకి చెందిన అనిల్ గా గుర్తించారు. 

15:48 - October 20, 2016

హైదరాబాద్ : పారిశుధ్యం విషయంలో జీహెచ్ ఎంసీ సంస్కర‌ణ‌ల‌కు పెద్ద పీట వేస్తూందా..శానిటేష‌న్‌ను పూర్తి స్థాయిలో ప్రయివేటు ప‌రం చేయ్యబోతుందా..అంటే అవున‌నే అంటున్నాయి గ్రేట‌ర్ వ‌ర్గాలు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న రాంకీ ఒప్పందానికి రాష్ట్ర స‌ర్కారు సై అనడంతో ఇది నిజమే అనిపిస్తోంది. గ‌తంలో తీవ్రంగా వ్యతిరేకించిన నాటి ఉద్యమ పార్టీ..నేడు అధికార పార్టీగా మారి సై అంటుండ‌టంతో కార్మిక సంఘాలు ఏ స్థాయిలో స్పందిస్తాయనేది ఇప్పుడు గ్రేట‌ర్ లో హాట్ టాపిక్‌గా మారింది.

శానిటేషన్ విషయంలో రాంకీ జోక్యానికి రాష్ట్ర సర్కారు సై
జీహెచ్ ఎంసీలో రాంకీ రాజ‌కీయం మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. ముందునుంచి రాంకీ కార్యకలాపాలను వ్యతిరేకిస్తున్న అధికారపార్టీ ఇప్పుడు రాంకీకి సై అన్నట్లు క‌నిపిస్తోంది. ఆంధ్ర కంపెనీ అంటూ రాంకీ ఒప్పందాన్ని వ్యతిరేంచిన టిఆర్ఎస్ పార్టీ... అధికారంలోకి రాగానే త‌న స్వరం మార్చినట్లు వ్యవ‌హ‌రిస్తోంది.

నాడు కార్మిక సంఘాల వ్యతిరేకతతో రాంకీకి శానిటేషన్ పనుల నిరాకరణ
న‌గ‌రంలో శానిటేష‌న్ ను రాంకీకి ఇవ్వాల‌ని ఇప్పటికే డిసైడ్ చేసిన జీహెచ్ ఎంసీ,కార్మిక సంఘాల వ్యతిరేకత‌తో వెన‌క్కి త‌గ్గింది. పూర్తి స్థాయిలోకాకుండా డంపింగ్ యార్డు వ‌ర‌కే రాంకీ త‌న కార్యక‌లాపాలు కొనసాగిస్తోంది. అయితే కొన్ని రోజులుగా న‌గ‌రంలో చెత్త పేరుకుపోవ‌డంతో ట్రాన్స్ పోర్ట్ ప‌నుల‌ను రాంకీకి ఇచ్చేందుకు అధికారులు రంగం సిద్దం చేస్తున్నారు. కార్మిక సంఘాలు..పార్టీల ఒత్తిడితో జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్ డంపింగ్ యార్డుకు మాత్రమే ప‌రిమిత‌మైన రాంకీ సంస్థ ఇప్పుడు ట్రాన్స్ పోర్టును చెజిక్కించుకునేందుకు పావులు క‌దుపుతుంది. ఇందుకు బల్దియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

రాంకీ వాహనాలను రంగంలోకి దించిన కేటీఆర్
ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా కాప్రా స‌ర్కిల్లో రాంకీ సంస్థ చెత్తను త‌ర‌లిస్తోంది. కొద్ది రోజుల క్రితం పాత వాహ‌న‌ల‌ తొల‌గింపు పేరుతో రాంకీకి చెందిన 37 పాత కాంపాక్టర్లను మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటిఆర్ రంగంలోకి దింపారు. వీటి సంఖ్యను మ‌రింత పెంచేందుకూ అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఒప్పందంలో భాగంగా శానిటేషన్ ప్రాసెస్..తరువాత ట్రాన్స్ పోర్టు ప‌నుల‌ను మొత్తం రాంకీకి అప్పజెప్పేందుకు రంగం సిద్ధమైంది. వీలైనంత త్వర‌గా ఈ వ్యవ‌హారాల‌న్ని రాంకీకి క‌ట్టబెట్టి త‌మ చేతులు దులుపుకునేందుకు ప్లాన్ చేస్తోంది రాష్ట్ర సర్కారు.

ప్రభుత్వం నిర్ణయంపై కార్మికసంఘాలు ఎలా స్పందించనున్నాయో
అయితే ఈ కాంట్రాక్టును కార్మిక సంఘాలు మొద‌టి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. బ‌ల్దియా కార్మికుల పోట్టకొట్టొద్దంటూ ఆందోళ‌న‌ల‌కు దిగాయి. మరి రాంకీ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కార్మికసంఘాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. 

15:40 - October 20, 2016

హైదరాబాద్ : స్వచ్చ భార‌త్ ర్యాంకింగ్స్‌లో టాప్ 10 ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్న బ‌ల్దియా,.చెత్త నిర్వహణకోసం స‌రికొత్త నిబంధనలను రూపొందిస్తోంది. కేంద్రం చేసిన చ‌ట్టానికి లోబ‌డి 1955 హైద‌రాబాద్ మున్సిప‌ల్ యాక్టును స‌వ‌ర‌ణ చేయాలని నిర్ణయించారు. ఇష్టమొచ్చినట్లుగా ఎక్కడపడితే అక్కడ చెత్త వేసే వారిపై ఇకనుంచి క‌ఠిన చ‌ర్యలు తీసుకోవడానికి బ‌ల్దియా రంగం సిద్దం చేసింది.

2016 నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలని నిర్ణయం
స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఘనవ్యర్థాల నిర్వహణ-2016 నిబంధనలను మరింత పటిష్టంగా అమలు చేయాలని జీహెచ్ ఎంసీ నిర్ణయించింది. 1955 హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ యాక్ట్‌ నిబంధ‌న‌ల‌పై అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆస్కిలో జీహెచ్ ఎంసీఉన్నతస్థాయి స‌మావేశం నిర్వహించింది. స్వచ్ఛ హైద‌రాబాద్ పేరుతో గ్రేట‌ర్ పారిశుద్ద్యాన్ని ర‌క్షించాల‌నే లక్ష్యంతో బ‌ల్దియా కేంద్రం యాక్టుకు రూల్స్ రూపొందించేందుకు నిపుణులు, ప్రొఫెసర్లతో సమావేశమైంది. ఇందులో భాగంగా నగరంలో ఇళ్లు, వ్యాపార సముదాయాలు, పలు సంస్థల నుంచి వచ్చే చెత్తపై నెలనెలా యూజర్‌ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. నగరంలో ప్రతిఇంటికి నెలకు 50రూపాయ‌లు, దాబా, స్వీట్‌షాపులు, కిరాణా దుకాణాల లాంటి వ్యాపార స‌ముదాయాల‌కు 500 రూపాయ‌లు, గెస్ట్ హౌస్‌ల‌కు 750 రూపాయ‌లు, ఆసుపత్రులకు 500, హోట‌ల్, రెస్టారెంట్‌లకు 750రూపాయ‌లు, 3 అంత‌స్తుల హోట‌ల్, రెస్టారెంట్‌ల‌కు 1,500, మూడు అంత‌స్తుల‌కుపైగా ఉన్న హోట‌ల్, రెస్టారెంట్‌ల‌కు 3వేల రూపాయ‌లు, ప్రభుత్వ కార్యాల‌యాలు, బ్యాంకులు, విద్యాసంస్థలు, కోచింగ్ సెంట‌ర్లకు 700, క్లీనిక్‌లు, డిస్పెన్సరీలు, ల్యాబ్‌ల‌కు 4వేల రూపాయ‌లు, 3వేల చ‌ద‌ర‌పు మీట‌ర్ల విస్తీర్ణం ఉన్న మ్యారేజ్‌హాల్‌, ఫెస్ట్‌వ‌ల్ హాళ్లు, ప్రదర్శనలకు 5వేల రూపాయ‌లు ఫీజుగా నిర్ణయించింది బ‌ల్దియా. ఈ రేట్లను ప్రతి మూడేళ్లకోసారి పదిశాతం పెంచాలని కూడా

1955 మున్సిపల్‌ యాక్టు నిబంధనలపై జీహెచ్ ఎంసీ ఉన్నతస్థాయి స‌మావేశం
ప్రస్తుతం నగరంలో ఉత్పత్తి అయ్యే తడి, పొడి చెత్తను వేరుచేసి డంపింగ్‌ యార్డులకు రవాణాచేసే కాంట్రాక్టర్లను ఇంటి యజమానులు, రెసిడెన్షియల్ వెల్ఫేర్‌ అసోసియేషన్లు, స్వచ్చంద సంస్థలు ప్రోత్సహించాలని జీహెచ్ఎంసీ  నిర్ణయించింది. వ్యర్థాల తొల‌గింపుకు సంబంధించి జీహెచ్ఎంసీ  ప్రమేయం లేకుండా చెత్త నిర్వహణ చేస్తూ..ఏవిధ‌మైన ఫిర్యాదులు లేకుండా ప‌ని చేసే గృహా స‌ముదాయాలు, హౌసింగ్‌ సొసైటిల‌కు ఆస్తిప‌న్నులో త‌గు రాయితీ ఇవ్వాల‌ని రూల్స్ మూసాయిదాలో ప్రతిపాదించారు. నిబంధనలను ఉల్లంఘించి వ్యర్థాలను రోడ్లపై, నాలాలపై వేస్తే 500 నుంచి 10వేల వరకు కూడా జరిమానాలు విధించాలని నిబంధనల్లో పొందుపర్చారు. తరచుగా నిబంధనలు ఉల్లంఘించిన వారి ట్రేడ్ లైసెన్సులను రద్దు చేయడం తదితర నిబంధనలను చట్టంలో పొందుపర్చారు. జీహెచ్ ఎంసీ ఘనవ్యర్థాల నిర్వహణ, నిబంధనలు -2016ను అతిక్రమించిన వారికి వెంట‌నే త‌గు జ‌రిమానాల‌ను విధించేలా హెల్త్ ఆఫీస‌ర్‌, శానిట‌రీ ఇన్‌స్పెక్టర్లకు అధికారాలు కూడా కల్పించింది బ‌ల్దియా.  

15:35 - October 20, 2016

కర్ణాటక : బెంగళూరులో మద్దెల చెరువు సూరి ప్రధాన అనుచరుడిపై దాడి జరిగింది. మధుసూదన్‌ రెడ్డిని మంజూనాథ్‌ గ్యాంగ్‌ బట్టలూడదీసి చితకబాదింది. గ్యాంగ్‌ స్టర్‌ భాను కిరణ్‌ పేరుతో మధు సెటిల్‌ మెంట్లు చేస్తున్నాడు. దీంతో మంజూనాథ్‌ గ్యాంగ్‌ మధును కిడ్నాప్‌ చేసి దాడి చేసింది. ఇకపై సెటిల్‌ మెంట్లు చేయనని మధు వేడుకున్నా వదలని రౌడీలు.. రక్తం వచ్చేలా కొట్టారు. సూరి హత్య తర్వాత మధుసూదన్ రెడ్డి బెంగుళూరుకు మకాం మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. రెడ్డప్పరెడ్డి అనే వ్యక్తితో కలిసి పేకాట క్లబ్ కూడా నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఓ భూ వివాదంలో సెటిల్‌మెంట్ చేసేందుకు ప్రయత్నించిన మధుసూదన్ రెడ్డి బెంగుళూరులో పేరు మోసిన గ్యాంగ్‌స్టార్ బెట్టు మంజు అనుచరులను బెదిరించాడు. దీంతో ఆగ్రహించిన బెట్టు మంజు, మదుసూదన్ రెడ్డిని కిడ్నాప్ చేయించాడు. నిర్మానుస్య ప్రాంతానికి తీసుకువెళ్లి చితకబాదారు. ఇక భూ దందాలకు పాల్పడబోనని మధుసూదన్ రెడ్డి వేడుకున్నా వినకుండా కర్రలతో ఇష్టమొచ్చినట్లుగా చితకబాదారు. 

15:29 - October 20, 2016

కృష్ణా : గన్నవరం మండలం ముస్తాబాద్‌లో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కిరాతకంగా ప్రవర్తించాడు. ఒక్కరోజు స్కూల్‌కు రాలేదని పదో తరగతి విద్యార్థిని తనూజను హెడ్‌మాస్టర్‌ ఆలపాటి వెంకటేశ్వరరావు తలపై కొట్టాడు. దీంతో తనూజ అస్వస్థతకు గురైంది. నిన్న ప్రాథమిక వైద్యం చేయించి ఇంటికి పంపించారు. మళ్లీ ఈరోజు స్కూల్‌కు వచ్చిన తనూజ అస్వస్థతకు గురైంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వెంకటేశ్వరరావు పరారీలో ఉన్నాడు. 

15:17 - October 20, 2016

అమ్మాయిల్లాగా తాము అందంగా ఉండాలని అబ్బాయిలు ప్రయత్నిస్తుంటారు. ఇందుకు ఏవో ఏవో సౌందర్య సాధనాలు వాడుతుంటారు. మరికొందరు ఖరీదైన బ్యూటీ పార్లర్లకు వెళుతుంటారు. కానీ స్టార్ట్ లుక్ రావాలంటే కొన్ని ఫేస్ ప్యాక్ లు వేసుకుంటే సరిపోతుంది.
పాలు, తేనె కలిపి ప్యాక్ లా తయారు చేయాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. చాలా మందంగా ఉండాలి. పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా ఆలివ్ ఆయిల్ లేదా ఆల్మండ్ ఆయిల్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి.
అరటిపండుని మెత్తటి పేస్ట్ లా చేసుకోవాలి. అనంతరం చర్మానికి రాసుకోవాలి. కొద్దిసేపు తరువాత శుభ్రం చేసుకోవాలి. అలాగే ముఖానికి, మెడకు రాసుకోవచ్చు. చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే చర్మానికి కొత్త మెరుపు వస్తుంది.
పెరుగుని డైరెక్ట్ గా ఫేస్ కి అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే ఫలితం ఉంటుంది.
ఒక గుడ్డులోని పచ్చసొన తీసుకుని దీనికి కొద్దిగా నిమ్మరసం లేదా తేనె కలపాలి. ఈ ప్యాక్ ని అప్లై చేసి.. 30 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. 

15:09 - October 20, 2016

శ్రీకాకుళం : సోంపేట మండలం బారువా రైల్వే స్టేషన్ సమీపంలో పాలవలస వద్ద ఘోర ప్రమాదం తప్పింది. రైల్వే ట్రాక్ దాటుతూ ట్రాక్ పైనే ఓ ఆర్టీసీ బస్ నిలిచిపోయింది. దీంతో ప్రయాణీకులు భయాందోళనలకు లోనయ్యారు. బస్ లో వున్న 40మంది ప్రయాణీకుల్లో 10మంది ప్రయాణీకలు దిగిపోగా.. మరో 30మంది ప్రయాణీకులు బస్ లో చిక్కుకుపోయారు. అదే సమయానికి దురంతో ఎక్స్ ప్రెస్  దూసుకువస్తోంది. దూరం నుండే ట్రాక్ పై నిలిచి వున్న బస్ ను గమనించిన దురంతో ఎక్స్ ప్రెస్ లోకో పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించి బస్ కు 10 అడుగుల దూరంలో రైలును నిలిపివేశారు. దీంతో ప్రమాదం తప్పిపోవటంతో బస్ లోని ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. దురంతో ఎక్స్ ప్రెస్ ట్రైన్ వచ్చే సమయానికి రైల్ గేట్ వేయకపోవటంతో బస్ ట్రాక్ పై నుండి దాటే సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా స్టేషన్ మాస్టర్ పై చర్యలు తీసుకోవాలని ప్రయాణీకులు డిమాండ్ చేశారు. 

కేసీఆర్ జీవిత చరిత్రతో సినిమా..

హైదరాబాద్ : కేసీఆర్ జీవిత చరిత్రతో సినిమా రూపొందనుంది. నిర్మాత రాజ్ కుందుకూరి ఈ సినిమా తీయనున్నారు. మధుర శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. 2017 జూన్ 2వ తేదీన సినిమా ప్రారంభం కానుంది. కేసీఆర్ జన్మదినమైన 2018 ఫిబ్రవరి 17 సినిమాను విడుదల చేయనున్నారు. 

8 ఐటీ కంపెనీలను ప్రారంభించిన సీఎం బాబు..

విశాఖపట్టణం : 8 ఐటీ కంపెనీలను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. మరో 32 కంపెనీలతో ఎంవోయూ కుదుర్చుకున్నామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏపీ మరో సిలికాన్ వ్యాలీ కావాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇన్నోవేషన్ చాఫ్టర్లు ఏర్పాటు చేస్తామని, అన్ని వర్సిటీల్లో వైఫై సేవలు ఏర్పాటు చేస్తామన్నారు. మైక్రో సాఫ్ట్ 11వ డెవలప్ మెంట్ సెంటర్ ను ఏపీలో ప్రారంభించనున్నారని తెలిపారు. 

రైల్వే ట్రాక్ పై బస్సు..తప్పిన ప్రమాదం..

శ్రీకాకుళం : జిల్లా సోంపేట మండలం బారువాలో రైల్వే ట్రాక్ దాటుతూ బస్సు నిలిచిపోయింది. పట్టాలపై బస్సును చూసి అప్రమత్తమైన దురంతో ఎక్స్ ప్రెస్ లోకో పైలట్ హెచ్చరికలు చేశాడు. లోకోపైలట్ హెచ్చరికతో బస్సుకు పది అడుగుల దూరంలో రైలును డ్రైవర్ నిలిపివేశాడు. దీనితో బస్సులో ఉన్న 30 మంది ప్రయాణీకులు ఊపిరిపీల్చుకున్నారు. 

బాబుకు మధు లేఖ..

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మదు లేఖ రాశారు. మల్లపల్లి భూముల సర్వే లిస్టులు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధికి మార్గం చూపకుండా భూములు తీసుకోవడంపై ఆయన ఆక్షేపించారు. 

రాఘవులు అరెస్టు..

అనంతపురం : ఎన్ పీ కుంటలోని ఎన్టీపీసీ సోలార్ ప్లాంట్ సందర్శనకు వెళుతున్న సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులును పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు సీపీఎం నేతలను కూడా అరెస్టు చేశారు. పీఎస్ లో రాఘవులు దీక్షకు దిగారు. 

ఐద్వా ర్యాలీని అడ్డుకున్న పోలీసులు..

తూర్పుగోదావరి : తొండంగి (మం) దివీస్ ప్రభావిత ప్రాంతాల్లో ఐద్వా ఆధ్వర్యంలో మహిళల పాదయాత్ర జరిగింది. 144 సెక్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. 200 మంది మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. 

విద్యార్థినిని చితబాదిన హెడ్ మాస్టర్..

కృష్ణా : గన్నవరం (మం) ముస్తాబాద్ లో విద్యార్థినిని హెడ్ మాస్టర్ ఆలపాటి వెంకటేశ్వరరావు చితకబాదాడు. స్కూల్ కు రాలేదని పదో తరగతి విద్యార్థిని తనూజ తలపై ఆయన కొట్టాడు. అనంతరం వెంకటేశ్వరరావు పరారయ్యాడు. తనూజకు వాంతులు కావడంతో వైద్యం చేసిన టీచర్లు ఇంటికి పంపించారు. అనంతరం ఈ రోజు మళ్లీ తనూజ అనారోగ్యానికి గురైంది. 

టి.కాంగ్రెస్ లో ముసలం..

మహబూబాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ లో ముసలం చోటు చేసుకుంది. రైతు గర్జనకు భట్టి, పోన్నాల, షబ్బీర్ ఆలీ, డీసీపీ నేత రాజేందర్ రెడ్డిలు గైర్హాజరయ్యారు. 

14:00 - October 20, 2016

విశాఖ : జిల్లాలోని సబ్బవరం మండలం వంగలి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పెట్రో యూనివర్సిటీ వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. బలవంతపు భూసేకరణను నిరసిస్తూ ఇళ్లపై నల్ల జెండాలను ఎగురవేశారు. సెజ్‌ల పేరిట సేకరించిన భూములు ముందు తీసుకోవాలని సీపీఎం డిమాండ్‌ చేస్తోంది. నిరసన తెలుపుతున్న సీపీఎం నేతలను, గ్రామస్తులను పోలీసులు అరెస్టు చేశారు. మరి కాసేపట్లో పెట్రో వర్సిటీకి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:59 - October 20, 2016

రంగారెడ్డి : సామాజిక న్యాయ సాధనే లక్ష్యంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేపట్టిన మహాజన పాదయాత్ర రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. ఇవాళ యాచారం మండలంలో పాదయాత్ర పూర్తి చేసుకుని మంచాల మండలంలోకి ప్రవేశిస్తుంది. పేద ప్రజలు భూ సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. నలభై ఏళ్ల  క్రితం కొనుగోలు చేసి  సాగుచేసుకుంటున్న భూములపై పెద్దల కన్ను పడిందని గిరిజనులు సీపీఎం నేతలకు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. పేద ప్రజలు భూ సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. పేదల భూములపై భూస్వాములు కన్నేశారని తెలిపారు. భూముల కబ్జా చేసేందుకు పేదలపై పెద్దలు కేసులు పెడుతున్నారని వాపోయారు. 
నల్లవెల్లిలో పాదయాత్ర 
సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేపట్టిన మహాజన పాదయాత్ర నాల్గవ రోజుకు చేరుకుంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని నల్లవెల్లిలో పాదయాత్ర కొనసాగుతోంది. యాత్ర చేస్తున్న నేతలుకు ప్రజలు తమ సమస్యలు విన్నవిస్తున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు సీపీఎం నేతలకు సమస్యలు చెబుతున్నారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇవ్వలేదంటూ ఫిర్యాదుల వెల్లువెత్తాయి. రేషన్ కార్డులు లేవని తెలిపారు. మంచినీరు, వ్యవసాయ సమస్యలను ప్రస్తావించారు. 
ఎస్సీ, ఎస్టీలకు భూములు ఇవ్వకుంటే..ఎర్రజెండాలు పాతి పంచిపెడుతాం : తమ్మినేని  
యాచారం (మ) మంతన్‌ గౌరెల్లి పాదయాత్ర చేరుకుంది. పాదయాత్ర బృందానికి రైతులు తమ సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ ఆదివాసీలు, ఎస్టీలపై ఫారెస్ట్‌ అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న..ఎస్టీ రైతుల భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలకు భూములు ఇవ్వకుంటే..ఎర్రజెండాలు పాతి పంచిపెడుతామని అన్నారు. మంతన్‌ గౌరెల్లిలో ఫ్లోరైడ్‌ సమస్య తీవ్రంగా ఉందన్నారు. అధికారంలోకివచ్చి రెండున్నరేళ్లవుతున్నా.. ఫ్లోరైడ్‌ సమస్యను పరిష్కరించకపోవడం సిగ్గుచేటన్నారు. 
మహాజనపాదయాత్ర బృందానికి ఘనస్వాగతం
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మంతన్‌గౌరెల్లి తండా వాసులు మహాజన పాదయాత్ర బృందానికి ఘనస్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లతో, నృత్యాలతో తమ్మినేని బృందాన్ని సాదరంగా ఆహ్వానించారు. తండావాసులతో  కలిసి మహాజనపాదయాత్ర బృందం కదంలో కదం కలిపింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

13:48 - October 20, 2016

అనంతపురం : ఎన్టీపీసీ సోలార్‌ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. జిల్లాలోని కదిరి నుంచి ఎన్‌పీ కుంట వరకు ఆయన బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీపీసీ సోలార్‌ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని, బాధితులకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని రాఘవులు డిమాండ్‌ చేశారు. బాధిత రైతులతో రాఘవులు ముఖాముఖిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా భూ నిర్వాసితులకు ప్రభుత్వం.. రూ.లక్షల పరిహారం ప్రకటించడం దారుణమన్నారు. రైతులకు అండగా సీపీఎం పోరాడుతుందని చెప్పారు. మరిన్న వివరాలను వీడియోలో చూద్దాం..

 

13:43 - October 20, 2016

వరంగల్ : మహబూబాబాద్‌లో కాంగ్రెస్‌ రైతు గర్జన సభ సందర్భంగా నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. కేంద్ర మాజీ మంత్రి బలరామ్‌నాయక్‌, డీసీసీ ప్రెసిడెంట్‌ భరత్‌ చందర్‌రెడ్డి ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్నారని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. రైతు గర్జన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను బలరాంనాయక్‌ చింపివేశారని.. కాంగ్రెస్‌ నేతలు ఏఐసీసీ దృష్టికి తీసుకువెళ్లారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:41 - October 20, 2016

ఫ్లెక్సీలపై మండిపడిన మంత్రి మాణిక్యాలరావు..

పశ్చిమగోదావరి : తాడేపల్లిగూడెంలో ఫ్లెక్సీల వివాదం చోటు చేసుకుంది. తన ఫ్లెక్సీలకు ఎదురుగా సత్యనారాయణ ఫ్లెక్సీలు పెట్టడంపై మంత్రి మాణిక్యాలరావు మండిపడ్డారు. పోలీసులను మాణిక్యాలరావు అనుచిత వ్యాఖ్యలు చేశారు. మంత్రి వ్యాఖ్యలు సరికాదని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.

 

13:25 - October 20, 2016

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్‌ అమెరికాలో బిజీబిజీగా పర్యటిస్తున్నారు. ఫార్మా సిటీ గురించి ఫార్మా దిగ్గజాలను కలుస్తున్న కేటీఆర్‌.. అమెరికాలో జరుగుతున్న అడ్వమేడ్‌ 2016 సదస్సులో పాల్గొన్నారు. వెయ్యి మంది మెట్‌ టెక్‌ ప్రతినిధులు పాల్గొన్న సదస్సులో కేటీఆర్‌ ప్రసంగించారు. వైద్య పరికరాల పరిశ్రమలు స్థాపించేందుకు తెలంగాణ అనువైన ప్రదేశమన్నారు. అదేవిధంగా అధునాతన వైద్య పరికరాలు తయారు చేసే యూనిట్‌ను స్థాపించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని కేటీఆర్‌ అన్నారు.

 

13:24 - October 20, 2016

పాట్నా : బీహార్‌లో ఓ దళిత విద్యార్థిపై తోటి అగ్రవర్ణ విద్యార్థుల దౌర్జన్యం పరాకాష్టకు చేరింది. క్లాస్‌ రూమ్‌లో దళిత విద్యార్థిని ఇద్దరు విద్యార్థులు కొట్టడం, ముఖంపై ఉమ్మి వేయడం నిత్యకృత్యమైంది.  దాడికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో ఇపుడు చక్కర్లు కొడుతోంది. తోటి విద్యార్థుల దాడికి భయపడి దళిత విద్యార్థి స్కూలుకెళ్లడమే మానేశాడంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. స్కూళ్లో తనపై జరుగుతున్న అన్యాయాన్ని ఆ విద్యార్థి మీడియా ముందు  వెల్లడించాడు.
అన్యాయంపై చాలారోజులుగా మౌనం వహించాను
'నేను 16 ఏళ్ల విద్యార్థిని. బీహార్‌ ముజఫర్‌పూర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాను. ఆ స్కూళ్లో నాపై జరుగుతున్న అన్యాయంపై చాలారోజులుగా మౌనం వహించాను. నాపై జరుగుతున్న దాడిని పోలీసులకు, మిత్రులకు, మీడియాకు చెప్పినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో నిరాశ చెందాను. నాపై దాడి చేసిన వీడియో మాత్రం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
క్లాస్‌ రూమ్‌లో నిత్యం నరకం 
నా తండ్రి ఓ టీచర్. చదువు కోసమని ముజఫర్‌నగర్‌లోని నానమ్మ ఇంట్లో నన్ను ఉంచారు. ఇద్దరు చెల్లెల్లతో పాటు మా నాన్న ఊళ్లోనే ఉన్నారు. నేను బాగా చదవాలన్నది ఆయన కోరిక. తండ్రి కోరికను నెరవేర్చేందుకే నేను ప్రయత్నించా. బాగా చదివి మంచి మార్కులు సాధించా. దళిత విద్యార్థిగా నేను తెచ్చుకుంటున్న మార్కులు చూసి నాన్నతో పాటు ఇంట్లో అందరూ మెచ్చుకున్నారు. ఇది ఒక కోణం మాత్రమే...కానీ నేను క్లాస్‌ రూమ్‌లో మాత్రం నిత్యం నరకం అనుభవిస్తున్నాను.
ఇద్దరు విద్యార్థులు నాపై దాడి 
గత రెండేళ్లుగా క్లాస్‌రూమ్‌లో ప్రతిరోజు అగ్ర వర్ణానికి చెందిన ఇద్దరు విద్యార్థులు నాపై దాడి జరుపుతున్నారు. ఇద్దరు సోదరుల్లో ఒకడు నా క్లాస్‌మేట్‌ కాగా...మరొకడు జూనియర్...ప్రతి రోజు నన్ను కొడుతున్నారు. కనీసం వారానికోసారైన తన ముఖంపై ఉమ్ముతున్నారు. బూతులు తిడుతున్నారు.
టీచర్‌కు చెబితే నిస్సహాయత వ్యక్తం 
మా టీచర్‌కు ఈ విషయం చెబితే నిస్సహాయత వ్యక్తం చేశారు. ఉన్నత వర్గాలకు చెందిన ఆ ఇద్దరు పిల్లల తండ్రి పవర్‌ఫుల్‌ క్రిమినల్‌ అని, వారిపై ఎలాంటి చర్యలు చేపట్టలేమని చేతులెత్తేశారు. నా కుటుంబానికి వారేమైనా హాని తలపెడతారన్న భయంతో నేను చేసిన ఫిర్యాదును బలవంతంగా వెనక్కి తీసుకున్నా. నాపై దాడికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
నన్ను కొట్టడమంటే వాళ్లకెంతో ఇష్టమట
నన్ను కొట్టడమంటే వాళ్లకెంతో ఇష్టమట. అందుకే ఒకరు కొడుతుంటే...మరొకరు వీడియో తీశారు. క్లాస్‌ రూములో నేను ముందు బెంచీలో కూర్చుంటే అతనెప్పుడు వెనక బెంచీలోనే కూర్చుంటాడు. పరీక్షల్లో కాపీ కొట్టినా అతడిని సరైన మార్కులు రావు. నాకు మార్కులు వస్తుంటే వాళ్లు ఓర్వలేక పోతున్నారు. పైగా నేను దళితుడిని. ఈ కారణంతో నాపై దాడి చేస్తున్నారు.
తాతయ్య పోలీసులకు ఫిర్యాదు 
ఈ వీడియో చూసి చలించిపోయిన తాతయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాని కేసును వెనక్కి తీసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కొందరు మమ్మల్ని హెచ్చరించారు. ప్రస్తుతం నేను స్కూలుకెళ్లడం మానేశాను. మార్చిలో పరీక్షలున్నాయి. ఈ టార్చర్‌ను ఎలా ఎదుర్కోవాలి...పరీక్షలకు ఎలా ప్రిపేర్‌ కావాలో మీరే చెప్పండి.

 

రైతుల అండగా సీపీఎం - రాఘవులు..

అనంతపురం : దేశంలో ఎక్కడా లేని విధంగా భూ నిర్వాసితులకు ప్రభుత్వం రూ. లక్షల పరిహారం ప్రకటించడం దారుణమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు ప్రశ్నించారు. రైతులకు అండగా సీపీఎం పోరాడుతుందని స్పష్టం చేశారు. 

13:10 - October 20, 2016

ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు..ఆపై..

చిత్తూరు : కురలబకోట మండలం తెట్టు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలు గాయత్రిని హత్య చేసి ప్రియుడు శ్రీనివాసులు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

బీహెచ్ఎల్ అధికారులతో వేముల ప్రశాంత్ సమావేశం..

హైదరాబాద్ : బీహెచ్ఎల్ అధికారులతో మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. 

టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ను ప్రారంభించిన బాబు..

విశాఖపట్టణం : జాతీయ ర్యాకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడులు పాల్గొన్నారు. 

13:01 - October 20, 2016

కర్నూలు : జిల్లాలోని నంద్యాలలో శాంతిరామ్‌ ఆస్పత్రి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని గురురాజ విద్యాసంస్థల బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

రాజంపేట ఎంవీఐ ఆఫీసులో ఏసీబీ సోదాలు..

కడప : రాజంపేట ఎంవీఐ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఎనిమిది మందిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 

12:58 - October 20, 2016

ఢిల్లీ : ధోనీ అండ్‌ కో న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌ ఆరంభమ్యాచ్‌లోనే అదరగొట్టింది. ధర్మశాల వన్డేల బౌలర్ల షోతో కివీస్‌ టీమ్‌ను చిత్తు చేసిన భారత్‌ రెండో మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించాలని పట్టుదలతో ఉంది. వన్డేల్లో ఈ రెండు జట్ల ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్‌ ఓ సారి చూద్దాం....

స్వదేశంలో ఫార్మాట్‌ ఏదైనా తిరుగులేని టీమిండియా...న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లోనూ తన దైన స్టైల్‌లోనే బోణీ కొట్టింది.ధర్మశాల వన్డేలో ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన ధోనీసేన  రెండో వన్డేకు పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. 

ఆల్‌రౌండర్లు, మ్యాచ్‌ విన్నర్లతో  పటిష్టంగా ఉన్న కివీస్‌ టీమ్‌ తొలి మ్యాచ్‌లో తేలిపోయినా.....వన్డేల్లో ఎప్పటికీ  ప్రమాదకరమైనా జట్టే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వన్డే ఫార్మాట్‌లో భారత్‌కు గట్టి పోటీనిచ్చిన జట్లలో న్యూజిలాండ్‌ ముందువరుసలోనే ఉంది. 

ఎటువంటి జట్టుతో అయినా అద్భుతాలు సృష్టించగల ధోనీ...ధర్మశాల వన్డేలో అనుభవం లేని బౌలర్లతో ఎలా న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌కు చెక్‌ పెట్టాడో అందరికీ తెలిసిందే. పవర్‌ఫుల్‌ బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన భారత జట్టు రెండో వన్డేలోనూ సమిష్టిగా రాణించి సిరీస్‌పై పట్టు బిగించాలని తహతహలాడుతోంది.

ఇక న్యూజిలాండ్‌తో వన్డే ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్‌లోనూ భారత్‌దే కాస్త పై చేయిగా ఉంది.ధర్మశాల వన్డే టివరకూ ఇరు జట్లు 92 మ్యాచ్‌ల్లో పోటీపడగా...భారత్‌ 47 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. న్యూజిలాండ్‌ 41 మ్యాచ్‌ల్లో నెగ్గింది.

ఢిల్లీ ఫిరోజ్‌ షా కోట్లా స్టేడియం వేదికగా జరుగనున్న రెండో వన్డే అయినా  హోరాహోరీగా సాగుతుందో లేక తొలి వన్డేలా ఏకపక్షంగా ముగుస్తుందో చూడాలి.

12:55 - October 20, 2016

కర్నూలు : పోలీసు సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కర్నూలులో పోలీసులు 20కే సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎంపీలు టీజీ వెంకటేష్‌, రేణుక, ఎమ్మెల్యే మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా ఇక్కడ ర్యాలీ నిర్వహించడం సంతోషంగా ఉందని టీజీ అన్నారు. 

 

12:39 - October 20, 2016
12:08 - October 20, 2016
12:07 - October 20, 2016
11:52 - October 20, 2016

ఎస్సీ, ఎస్టీలకు భూములివ్వాలి - తమ్మినేని..

రంగారెడ్డి : సీపీఎం మహాజన పాదయాత్ర నాలుగో రోజు కొనసాగుతోంది. నల్లవెళ్లి నుం డి మంతన్ గౌరెల్లికి పాదయాత్ర బృందం చేరుకుంది. పాదయాత్ర బృందానికి రైతులు తమ సమస్యలు తెలియచేశారు. ఈ సందర్భంగా సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడారు. ఆదివాసీలు, ఎస్టీలపై ఫారెస్ట్ అధికారులు వేధింపులు ఎక్కువయ్యాయని, ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న ఎస్టీ రైతుల భూములు లాక్కొనేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలకు భూములివ్వకుంటే ఎర్రజెండాలు పాతి భూములు పంచిపెడుతామని హెచ్చరించారు. మంతన్ గౌరెల్లిలో ఫ్లోరెడ్ సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు.

అడ్వామేడ్ సదస్సులో మంత్రి కేటీఆర్..

అమెరికా : అడ్వామేడ్ సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. వైద్య పరికరాల ఉత్పత్తి పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ అనువైన ప్రాంతమని తెలిపారు. వైద్య పరికరాల తయారీ యూనిట్ నెలకొల్పేందుకు వైద్య పరికరాల తయారీ యూనిట్ నెలకొల్పేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. దీనికి అవసరమైన ప్రణాళికలు రూపొందించడం జరిగిందని తెలిపారు. 

సాయంత్రం విజయవాడకు గవర్నర్..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ విజయవాడకు వెళ్లనున్నారు. రేపు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన సాయంత్రం బయలుదేరనున్నారు. 

జేఎన్ యూలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన..

హైదరాబాద్ : జేఎన్ యూకు చెందిన పది మంది విద్యార్థులు నిన్న మధ్యాహ్నం 2.30 గంటల నుండి వీసీ, రిజిస్ట్రార్ లను నిర్భందించారు. 20 గంటలుగా వారు గదిలోనే ఉన్నారు. జేఎన్ యూ విద్యార్థి నజీబ్ అదృశ్యంపై వీసీ, రిజిస్ట్రార్ లను విద్యార్థులు ఘెరావ్ చేశారు. ఈనెల 15వ తేదీ నుండి విద్యార్థి నజీబ్ కనిపించకుండా పోయాడు. తమను నిర్భందించిన విద్యార్థులపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని వీసీ జగదీష్ హెచ్చరించారు. 

11:50 - October 20, 2016

రాష్ట్రంలో రైతు రుణమాఫీ పథకాన్ని ఇంత వరకు పూర్తిగా అమలు చేయలేదని వక్తలు అన్నారు. ఇవాళ్టి న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ నేత గోస్లాస్ శ్రీనివాస్ యాదవ్, టీఆర్ ఎస్ నేత తాడూరి శ్రీనివాస్, బీజేపీ నేత రాకేష్ పాల్గొని, మాట్లాడారు. రైతులకు కొత్త రుణాలు రావడం లేదన్నారు. అంతకముందు ఎపి, తెలంగాణలకే కృష్ణా జలాల పున:పంపిణీ అని వెల్లడించిన బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పుపై వక్తలు చర్చించారు. వారు తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

11:34 - October 20, 2016

పశ్చిమగోదావరి : ఏలూరు ఆశ్రమ ఆస్పత్రిలో హౌస్ సర్జన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజమండ్రికి చెందిన బలభద్ర రితేష్ అనే యువకుడు ఏలూరు ఆశ్రమ ఆస్పత్రిలో హౌస్ సర్జన్ గా పని చేస్తున్నాడు. ఎంబిబిఎస్ ఫైనల్ ఇయిర్ చదువుతున్నాడు. గత కొంతకాలంగా అతను మానసికంగా బాధపడుతున్నారని.. మందులు కూడా వాడుతున్నారని తోటి విద్యార్థులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హాస్టల్ మూడో అంతస్తు నుంచి దూకి రితేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే కాలేజీ యాజమాన్యం అతని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లి.. పోస్టుమార్టం నిర్వహించారు. రితేష్ మృత దేహాన్ని రాజమండ్రికి తరలిస్తున్నారు. అతని తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లు కావడం గమనార్హం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

రాజ్ నాథ్ ను కలువనున్న కరణ్ జోహార్..

న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను నేడు కలువనున్నారు. ఆయన దర్శకత్వం వహించిన యే దిల్ హై ముష్కిల్ చిత్రం విడుదలకు ఆటంకాలు కలుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రణబీర్, అనుష్క, ఐశ్వర్య రాయ్ తో పాటు పాక్ నటుడు ఫవద్ ఖాన్ నటించిన సంగతి తెలిసిందే. 

జమ్మూ కాశ్మీర్ లో అధికారులపై వేటు..

జమ్మూ కాశ్మీర్ : 12 మంది అధికారులపై వేటు పడింది. వీరిపై జాతి వ్యతిరేక ఆరోపణలు రావడం..వాటికి సంబంధించిన నివేదికలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పోలీసులు అందించారని తెలుస్తోంది. 

10:49 - October 20, 2016

వాషింగ్టన్ : డెమాక్రాట్ల పాలనలో అమెరికా అప్పుల కుప్పగా మారిందని రిపబ్లికన్‌ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ విమర్శించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటర్‌ అధికారంలోకి వస్తే దేశ అప్పుల కుప్పలుగా మారుతుందని ఆరోపించారు. పన్నులు పెంచి, ఉపాధి, ఉద్యోగాలకు గండికొడతారని విమర్శించారు. అవుట్‌ సోర్సింగ్‌ పేరుతో మెక్సికోకు ఉద్యోగులు అప్పగిస్తారని లాస్‌వేగాస్‌లోని నెవాడ యూనివర్సిటీలో జరిగిన మూడవ బహిరంగ చర్చలో మండిపడ్డారు. డెమోక్రాటిక్‌ అధ్యక్ష అభ్యర్థి  హిల్లరీ క్లింటన్‌ దీనికి బదులిస్తూ అమెరికా అప్పుల భారం తగ్గించడమే తన లక్ష్యమని హిల్లరీ చెప్పారు. ఉద్యోగాలు సృష్టించి, ఉపాధి పెంచడమే ధ్యేయమన్నారు. డెమాక్రాట్లు అధికారంలో ఉండగా అప్పులు భారం తగ్గిందని గుర్తు చేశారు. 
పోలింగ్‌లో రిగ్గింగ్‌ జరిగే అవకాశం : ట్రంప్ 
వచ్చే నెల 8న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌లో రిగ్గింగ్‌ జరిగే అవకాశం ఉందని రిపబ్లికన్‌ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ అనుమానం వ్యక్తం చేశారు. ప్రైమరీ ఎన్నికల పోలింగ్‌లోనే డెమాక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీ రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ట్రంప్‌ ఆరోపించారు. అధ్యక్ష ఎన్నికల్లో హింసను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని హిల్లరీతోపాటు అధ్యక్షుడు ఒబామా ప్రయత్నిస్తున్నారని.. ట్రంప్‌  తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటర్ల జాబితా నుంచి పది లక్షల మందిని తొలగించారని లాస్‌ వేగాస్‌లోని నెవాడా యూనివర్సిటీలో జరిగిన మూడో బహిరంగ చర్చలో ట్రంప్‌ ఆరోపించారు. 
అమెరికా ప్రజాస్వామ్యాన్ని ట్రంప్‌ అపహాస్యం : హిల్లరీ 
దీనికి హిల్లరీ క్లింటన్‌  బదులిస్తూ... రిగ్గింగ్‌ ఆరోపణలతో అమెరికా ప్రజాస్వామ్యాన్ని ట్రంప్‌ అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా ఎన్నికల్లో చరిత్రలో హింస, రిగ్గింగ్‌కు తావులేదన్నారు. 240 సంవత్సరాల అమెరికా ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నికలు శాంతియుతంగా జరిగిన విషయాన్ని హిల్లరీ క్లింటన్‌ ప్రస్తావించారు. నీతి, నిజాయితీలకే అమెరికా ప్రజలు పట్టం కడతారని చెప్పారు. 

 

పాఠశాల బస్సును ఢీకొన్న లారీ..

కర్నూలు : జిల్లా పాణ్యంలో పాఠశాల బస్సు ప్రమాదానికి కారణమైంది. పాణ్యం నుండి నంద్యాల వైపు వెళుతున్న పాఠశాల బస్సును ఓ లారీ ఢీకొంది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ తో పాటు ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. 

గొల్లపల్లిలో ఉద్రిక్తత..

కడప : మైలవరం (మం) వద్దిరాల, గొల్లపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయసేకరణ చేపట్టింది. కడపలో నిన్న రాత్రి సీపీఐ నేత ఈశ్వర్యను హౌస్ అరెస్టు చేశారు. వద్దిరాల, గొల్లపల్లిలో పోలీసులు భారీగా మోహరించారు. 

ఏలూరులో యువకుడు ఆత్మహత్య

పశ్చిమగోదావరి : ఏలూరు ఆశ్రమ ఆస్పత్రిలో హౌస్ సర్జన్ బలభద్ర రితేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్ లో మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు రితేష్ రాజమండ్రి వాసి. 

రేపే తెలంగాణ కేబినెట్ సమావేశం..

హైదరాబాద్ : రేపు మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. కృష్ణా జలాల బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు..సచివాలయం తరలింపు అంశాలపై చర్చించనున్నారు. 

హౌస్ సర్జన్ ఆత్మహత్య..

పశ్చిమగోదావరి : ఏలూరు ఆశ్రమ ఆసుపత్రిలో హౌస్ సర్జన్ జలభద్ర రితేష్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. హాస్టల్ మూడో అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు రితేష్ రాజమండ్రి వాసి. 

09:19 - October 20, 2016

హైదరాబాద్ : ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఉస్మానియా వైద్య కాలేజీలో వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన శ్రావణి (27) అనే విద్యార్థిని ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ అనస్తీషియా ఫైనల్ ఇయర్ చదువుతోంది. జాంబాగ్ లోని ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఉంటుంది. అయితే శ్రావణి ఓ యువకుడి ప్రేమించుకుంటున్నారు. శ్రావణి విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. తన ప్రేమ వ్యవహారాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వారు పెళ్లికి ఒప్పుకోలేదు. తనకు నచ్చని వేరే వివాహానికి సన్నదం కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రావణి నిన్న రాత్రి తను నివాసముంటున్న హాస్టల్ లోనే సెలైన్ లో అనస్తీషియా అధిక మోతాదులో తీసుకుని ఆత్మహ్యత చేసుకుంది. తన ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడమే కారణమని తోటి స్నేహితులు అంటున్నారు. శ్రావణి డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

 

08:42 - October 20, 2016

ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణరంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్ స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ నేత వి. ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. 'ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణ రంగ కార్మికుల సమస్యలు మరో సారి ఎజెండా మీదకు వచ్చాయి. త్వరలో  అన్ని కార్మిక సంఘాల నేతలతో కార్మిక శాఖ అధికారులు సమావేశం నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. నిర్మాణరంగ కార్మికుల సంక్షేమ నిధికి సంబంధించిన నిధులు దారిమళ్లితున్నాయంటూ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. చంద్రన్న బీమా పేరుతో ఇప్పటికే 150 కోట్ల రూపాయలు దారి మళ్లించారన్నది కార్మిక సంఘాల ఆరోపణ. ఆంధ్రప్రదేశ్ లో 50 లక్షల మంది నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారన్న అంచనాలుండగా, కేవలం 8 లక్షల మంది పేర్లు మాత్రమే నమోదు చేయడం వివాదస్పదమవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణరంగం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

నాలుగో రోజు కొనసాగుతున్న సీపీఎం మహాజన పాదయాత్ర

రంగారెడ్డి : సీపీఎం మహాజన పాదయాత్ర నాలుగో రోజు కొనసాగుతోంది. నల్లవెల్లి గ్రామం నుంచి నాలుగో రోజు పాదయాత్ర ప్రారంభించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో 8 మంది నేతలు పాదయాత్ర చేస్తున్నారు. ఈనెల 17న ఇబ్రహీంపట్నంలో పాదయాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. 

 

08:23 - October 20, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాలతో ముడిపడ్డ నయీం ఎన్‌కౌంటర్ అనంతర పరిణామాలు అధికార పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఇప్పటివరకు విచారణ పేరుతో స్పష్టమైన సమాచారం రాక..ఎంతో మంది పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కానీ, కోర్టుకు సిట్‌ సమర్పించిన నివేదికతో అధికార పార్టీ నేతలుండడం... ఆ పార్టీ నేతలకు కొత్త చిక్కులు తెచ్చి పెట్టేలా కనిపిస్తోంది. 
నయూం ముఠాతో పలు పార్టీల నేతలకు సంబంధాలు
గ్యాంగ్‌స్టార్‌ నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత బాధితులు ఒక్కొక్కరుగా బయటికొచ్చారు. ఆయా పరిధిలోని పోలీస్‌స్టేషన్‌లలో ఫిర్యాదులు చేయడంతో ప్రభుత్వం నయీం కేసు విచారణను సిట్‌కు అప్పగించింది. సిట్ అధికారులు దర్యాప్తు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు రాజకీయ పార్టీల నేతలకు నయూం ముఠాతో సన్నిహిత సంబంధాలున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతూ వచ్చింది. దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నేతల పేర్లు ప్రముఖంగా వినిపించాయి.
అధికార పార్టీ ఇద్దరు నేతల పేర్లు అందజేత
నయీం ముఠాతో సంబంధాలున్న వారి వివరాలను న్యాయస్థానానికి సిట్‌ సమర్పించింది. ఇందులో అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతలతో సహా పలువురు పోలీసు అధికారుల పేర్లు కోర్టుకు ఇచ్చిన నివేదికలో ఉన్నాయి. ఇంకా నయూం ముఠాతో ఇతర నేతలకు కూడా సంబంధాలున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ఉన్న నేతి విద్యాసాగర్‌ పేరు చర్చనీయాంశంగా మారింది. మరో నేత చింతల వెంకటేశ్వర్ రెడ్డి..నయీం ఎన్ కౌంటర్ అనంతరం అజ్ఙాతంలోనే ఉన్నారు. కీలక పదవిలో ఉన్న నేత పేరు కోర్టు వరకు వెళ్లడంతో నయీం ముఠాతో సంబంధాలున్న నేతలందరిలోనూ గుబులు రేగుతోంది. పూర్వపు నల్గొండ జిల్లాకు చెందిన మరికొంత మంది అధికార పార్టీ నేతలకు కూడా సంబంధాలున్నాయనే ప్రచారం సాగుతోంది. 
నిరూపించే ఆధారాలు లేవన్న ధీమా 
మరికొందరు నేతలు కూడా నయీం ముఠాతో సంబంధాలు కొనసాగించారన్న ప్రాథమిక సమాచారం సిట్‌కు అందింది. అయితే..వాటిని నిరూపించే ఆధారాలు లేవన్న ధీమా కొంత మంది నేతల్లో కనిపిస్తోంది. ఇటు నయీంతో సంబంధాలున్న నేతలందరి వివరాలు సీఎం కేసీఆర్‌కు పోలీసులు అందించారని సమాచారం. ఇప్పుడు నయీం కేసులో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా.. సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొందని అధికార పార్టీ నేతలే అంటున్నారు. 
డిప్యూటీ ఛైర్మన్‌పై చర్యలకు పార్టీ రంగం సిద్ధం
మొత్తంగా డిప్యూటీ ఛైర్మన్‌పై చర్యలు తీసుకునేందుకు పార్టీ పరంగా రంగం సిద్ధమైందని, సమయం కోసం వేచి చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. నేతి విద్యాసాగర్ అనంతరం ఇంకెంతమంది మెడకు నయీం ఉచ్చు బిగుసుకుంటోందో అన్న ఆందోళన అన్ని రాజకీయ పార్టీల నేతల్లోనూ మొదలైంది. ఇంతకాలం స్తబ్దుగా ఉందనుకున్న నయీం కేసులో కీలక మలుపు ఎలాంటి సంచనాలు సృష్టించనుందో.

 

08:11 - October 20, 2016

హైదరాబాద్ : 2017 చివరికల్లా పెండింగ్ మీడియం ప్రాజెక్టులు పూర్తిచేయాలని అధికారులను ఇరిగేషన్‌శాఖ మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, డిండి ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేయాలని కోరారు. రబీ పంటకు సాగునీటి సరఫరాపై మంత్రి హరీశ్‌రావు సమీక్షించారు. 15 భారీ, 36 మధ్యతరహా ప్రాజెక్టుల నుంచి నీటి లభ్యతపై చర్చించారు. రబీ యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేయాలని అధికారులకు సూచించారు. కొత్తగా జిల్లాల వారీగా ఆయకట్టు ఖరారు చేయాలని అన్నారు.
నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి.. 
సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడూ సమీక్షిస్తున్నారని, నిర్ణీత గడువులోపు ప్రాజెక్టులను పూర్తి చేయాలని అధికారులను ఇరిగేషన్‌శాఖ మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. హైదరాబాద్‌లోని జలసౌధలో ప్రాజెక్టుల పురోగతిపై దాదాపు 9 గంటలకుపైగా హరీష్‌రావు సమీక్షించారు. 
ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష  
భక్తరామదాసు, ఎస్ ఆర్ ఎస్ పీ రెండోదశ, సింగూరు కెనాల్, కల్వకుర్తి, నెట్టింపాడు, కోయిల్ సాగర్, బీమా ప్రాజెక్టులను వచ్చే ఖరీఫ్ లోపు పూర్తిచేసి... నిర్దేశించిన ఆయకట్టుకు నీరు ఇవ్వాలని మంత్రి కోరారు. 2018లోగా వరద కాలువ, శ్రీపాద ఎల్లంపల్లి, కాళేశ్వరం పనులు పూర్తి చేయాలని కోరారు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు టన్నెల్ పనులు వేగవంతం చేయాలన్నారు. ఏళ్ల తరబడి పూర్తి కాకుండా ఉన్న దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని యేడాదిలో పూర్తి చేయాలన్నారు. మీడియం ప్రాజెక్టులైన కిన్నెరసాని, పాలెం వాగు, గొల్లవాగు, ర్యాలివాగు, నీల్వాయి, కొమురం భీమ్, పెద్దవాగు, మత్తడి వాగు ప్రాజెక్టులను కూడా వచ్చే ఏడాది కల్లా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. లెండి, మొండికుంట వాగు పథకాలను 2018 లోపు పూర్తి చేయాలన్నారు. లోయర్ పెనుగంగ, సీతారామ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేయడానికి కృషి చేయాలని కోరారు.
రైల్వే క్రాసింగ్ సమస్యలను 6 నెలల్లో పరిష్కరిస్తామని హామీ
మహబూబ్‌నగర్, కరీంనగర్‌లోని సాగునీటి పథకాలకు అడ్డంకిగా ఉన్న రైల్వే క్రాసింగ్ సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. టెండరు విధానంలో పాత పద్ధతులకు స్వస్తి చెప్పాలని, నెలల కాల పరిమితితోనే టెండర్లు పిలిచి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని సి.ఇ, ఎస్. ఇ ఇతర అధికారులను మంత్రి కోరారు. ప్రాజెక్టుల భూసేకరణ కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం బ్యారేజీలు, పంప్ హౌజ్‌లు, మిడ్ మానేరు, ఎల్లంపల్లి, తదితర ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులపై మంత్రి సమీక్షించారు. మొత్తంగా గడువులోగా సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి... రైతులకు నీరు ఇవ్వాలని అధికారులను మంత్రి హరీష్‌ ఆదేశించారు. 

08:04 - October 20, 2016

హైదరాబాద్ : భక్తులకు ఇబ్బంది కలగకుండా యాదాద్రి టెంపుల్ సిటీ అభివృద్ధి చేయాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. భక్తుల తాకిడికి అనుగుణంగా యాదాద్రిలో వసతి, రహదారులు, క్యూలైన్ల వ్యవస్థ ఉండాలన్నారు. యాదాద్రి టెంపుల్ సిటీ అభివృద్ధి పనులపై అధికారులతో కేసీఆర్‌ సమీక్షించారు.. 
అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన సీఎం 
యాదాద్రిలో పర్యటించిన సీఎం కేసీఆర్‌ కొండపై జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. కాటేజీలు, టెంపుల్‌ సిటీ నిర్మాణ పనులు, రాజగోపురాలకు శంకుస్థాపన చేసిన ప్రాంతాలు, ప్రధాన ఆలయ విస్తరణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. 
యాదాద్రి భువనగిరి జిల్లాగా యాదాద్రి జిల్లా
యాదాద్రి అభివృద్ధి పనులపై సీఎం అధికారులతో సమీక్షించారు.. రోజుకు లక్ష మందికిపైగా భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించారు.. యాదాద్రి జిల్లాను ఇక నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాగా పిలవాలని సూచించారు.. టెంపుల్ సిటీగా యాదగిరిగుట్ట, జిల్లా కేంద్రంగా భువనగిరి జంటగా అభివృద్ధి చెందుతాయని... ఇందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు..
మిషన్ కాకతీయ ద్వారా చెరువుల అభివృద్ధి
గుట్టను ఆనుకొనిఉన్న చెరువులను మిషన్ కాకతీయ ద్వారా అభివృద్ధి చేయాలని కేసీఆర్‌ ఆదేశించారు. గుట్టకు నలువైపులా నాలుగు వరుసల రహదారులను నిర్మించాలన్నారు. ఆగమ శాస్త్ర నియమాల ప్రకారమే యాదాద్రిలో నిర్మాణాలు జరగాలని సూచించారు. మొదటి దశలో చేపట్టే 200 కాటేజీల నిర్మాణానికి దాతలు ముందుకు వస్తున్నారని తెలిపారు.. త్వరగా లే అవుట్లను రూపొందించి నిర్మాణాలు ప్రారంభించాలని అధికారులకు కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి గుట్టలో కేసీఆర్‌ బిజీ బిజీగా గడిపారు.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

 

07:58 - October 20, 2016

గుంటూరు : మౌలికవసతుల కల్పనతో నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రూపురేఖలు మారిపోనున్నాయి. వచ్చే నాలుగేళ్లలో 32 వేల 500 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించాలని సీఎం చంద్రబాబు , అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమయ్యే నిధులను వేగవంతంగా సేకరించాలని, తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే అంతర్జాతీయ సంస్థలతోనూ సంప్రదింపులు జరపాలని సూచించారు. 
మౌలికవసతులు కల్పనకు ఆదేశాలు
ఏపీ రాజధాని అమరావతి దేశానికే తలమానికంగా నిలిచేలా మౌలికవసతులు కల్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇందుకోసం పదేళ్లలో సుమారు 43 వేల కోట్లు రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించామని,..ఇందులో అధికభాగం వచ్చే నాలుగేళ్లలోనే వినియోగిస్తామని అన్నారు. రహదారుల అనుసంధానం, 24 గంటలు నాణ్యమైన విద్యుత్, మంచినీటి సరఫరా, మెరుగైన మురుగునీటి పారుదల వ్యవస్థ, వ్యర్ధాల నిర్వహణపై ప్రధానంగా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అమరావతిలో అన్ని వసతులు ఉంటే పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ప్రవాస భారతీయులు ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. 
టాప్ 10 విద్యాసంస్థలను అమరావతిలో నెలకొల్పేలా కృషి : చంద్రబాబు
దేశంలోని టాప్ 10 విద్యాసంస్థలను, అంతర్జాతీయ విద్యాసంస్థలను అమరావతిలో నెలకొల్పేలా అధికారులు కృషి చేయాలని చంద్రబాబు చెప్పారు. కార్పొరేట్ ఆస్పత్రులు, పరిశ్రమలు, స్టార్ హోటళ్ల ఏర్పాటుతో అమరావతి సత్వరంగా అభివృద్ధి చెందుతుందన్నారు. 15 ఏళ్లలో అమరావతిని మెగాసిటీగా మలచాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే అన్నిరంగాల్లో వృద్ధి చెందేలా చూడాలన్నారు. కోర్ కేపిటల్‌లో భూములను రాజధానికి తలమానికంగా నిలిచే సంస్థలకే కేటాయించాలని ముఖ్యమంత్రి సూచించారు. 2018 నాటికి  5 విభాగాలలో మొత్తం 21 ప్రాజెక్టులు ప్రారంభమయ్యేలా ప్రత్యేకంగా దృష్టి పెట్టామని సీఎం చెప్పారు.
భూములను తాకట్టు  పెట్టి రుణాలు : ప్రభుత్వ నిర్ణయం
అయితే అమ‌రావ‌తి నిర్మాణానికి భూములను తాకట్టు  పెట్టి రుణాలు తీసుకోవాల‌ని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు  6వేల 500 కోట్లు, హ‌డ్కో 7 వేల 178 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వడానికి   అంగీక‌రించాయి. కేంద్రం 2వేల 500 కోట్లు, ఏపీ బ‌డ్జెట్ లో 4వేల 400 కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి  కేటాయించారు. మిగిలిన నిధుల‌ను సీఆర్డీఏ ప‌రిధిలోని 4వేల ఎక‌రాల భూమిని తాక‌ట్టు  పెట్టడం ద్వారా అంత‌ర్జాతీయ సంస్థల నుంచి రుణం తీసుకోవాల‌ని నిర్ణయించారు. 

 

07:52 - October 20, 2016

హైదరాబాద్ : బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్‌  తీర్పుపై తెలుగురాష్ట్రాలు అసంతృప్తితో  ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రానికి చెందిన కృష్ణా జలాలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్యే పంపిణీ జరగాలని ట్రైబ్యునల్ స్పష్టం చేయడంతో..రానున్న నీటి కష్టాలపై రెండు రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. ట్రైబ్యున‌ల్ తీర్పు వల్ల ఎగువ రాష్ఠ్రాలకు మేలు జరగడమే కాకుండా దిగువరాష్ట్రాలు ఎడారిగా మారే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. 
తెలుగు రాష్ట్రాల మధ్యే కృష్ణా జలాల పంపిణీ
కృష్ణా జ‌లాల పంప‌కాలపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యున‌ల్  తీర్పు తెలుగురాష్ట్రాలకు తీవ్ర నిరాశ‌ను క‌లిగించింది. విభ‌జ‌న చ‌ట్టం ప్రకారం నీటి పంపకాలు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌కే వ‌ర్తిస్తుంద‌ని చెప్పడంతో..రెండు రాష్ట్రాలు అసంతృప్తితో ఉన్నాయి. కృష్ణా జ‌లాల పంప‌కాల్లో నాలుగు రాష్ట్రాల‌ను దృష్టిలో ఉంచుకొని  పున‌: కేటాయింపులు జ‌ర‌పాల‌ని తెలుగురాష్ట్రాలు ట్రైబ్యునల్‌ ను ఆశ్రయించాయి. విభ‌జ‌న చ‌ట్టంలోని సెక్షన్  89 ప్రకారం కర్ణాటక, మహారాష్ట్రల‌కు సంబంధం లేద‌ని ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. 
రెండు తెలుగు రాష్ట్రాలకు కీలకంగా మారిన కృష్ణా జలాలు 
బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్‌  ప్రకారం  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు కృష్ణా జ‌లాల్లో 1001 టీఎంసీలు కేటాయించారు. రెండు తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడ్డాక  ఏపీకి 512 టీఎంసీలు...తెలంగాణ  299 టీఎంసీలు వినియోగించుకోవాలని నిర్ణయించారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల‌కు కృష్ణా జ‌లాలు కీల‌కంగా మారడంతో... నీటి వినియోగంలో వివాదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే కృష్ణా రివ‌ర్ బోర్డు..కేంద్ర జ‌ల వ‌న‌రుల శాఖ‌ల వ‌ద్ద రెండు రాష్ట్రాల‌ పంచాయితీలు న‌డుస్తున్నాయి. 
నీటి పంపకాలపై కోర్టులను ఆశ్రయించిన రెండు రాష్ట్రాలు
ఇప్పటికే రెండు రాష్ట్రాలు నీటి పంప‌కాలు..వినియోగాల‌పై న్యాయ‌స్థానాల‌ను ఆశ్రయించాయి..ఇవే ఇంకా ఏటూ తేల‌ని ప‌రిస్థితిలో ఉంటే..భ‌విష్యత్తులో ప్రాజెక్టుల వారీగా నీటి పంప‌కాలు జరగడం అంత సులువైన అంశం కాద‌న్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా బ్రిజేష్ కుమార్  తీర్పుతో..సుప్రీం కోర్టును ఆశ్రయించాలని ఏపీ సర్కారు భావిస్తోంది. అయితే అంత‌కు ముందుగా ట్రైబ్యున‌ల్ ముందు మ‌రోసారిత‌న వాద‌న‌లు వినిపించేందుకు కూడా సిద్ధమవుతోంది.

 

నేటి నుంచి కాంగ్రెస్ ఆధ్వర్యంలో దరఖాస్తుల ఉద్యమం

హైదరాబాద్ : నేటి నుంచి కాంగ్రెస్ ఆధ్వర్యంలో దరఖాస్తుల ఉద్యమం నిర్వహించనున్నారు. ఒకే విడతలో రైతు రుణమాఫీ చేయాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. 

 

అమెరికా అధ్యక్ష పీఠం అభ్యర్థుల మూడో డిబేట్ ప్రారంభం

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష పీఠం అభ్యర్థుల మూడో డిబేట్ ప్రారంభం అయింది. లావెగాస్ లోని నెవెడా యూనివర్సిటీలో డిబెట్ జరుగుతోంది. ఇది హిల్లరీ, ట్రంప్ ఫైనల్ డిబేట్. 

 

నేటి నుంచి ఆసియా ఛాంపియన్ షిప్ పురుషుల హాకీ టోర్నీ

ఢిల్లీ : నేటి నుంచి ఆసియా ఛాంపియన్ షిప్ పురుషుల హాకీ టోర్నీ జరుగనుంది. తొలి మ్యాచ్ లో జపాన్ తో భారత్ తలపడునుంది. 

నేడు ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాసుల ప్రారంభం

విశాఖ : నేడు ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాసులను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఎన్నారైల భాగస్వామ్యంతో ఎపి వ్యాప్తంగా 5 వేల స్కూళ్లల్లో డిజిటల్ క్లాసులు నిర్వహించనున్నారు. తొలి విడుతలో 1280 డిజిటల్ క్లాసులు ప్రారంభించనున్నారు. 

 

నేటి నుంచి జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ పోటీలు

విశాఖ : నేటి నుంచి జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. 

నేడు భారత్, న్యూజిలాండ్ రెండో వన్డే

హైదరాబాద్ : నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే మ్యాచ్ జరుగనుంది. కోట్ల మైదానం వేదికగా మ.1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మొదటి వన్డే మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. 

 

ఓయూలో వైద్య విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్ : ఓయూలో వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పీజీ మెడికల్ కాలేజీ హాస్టల్ లో శ్రావణి (27) అనే విద్యార్థిని సెలైన్ లో అనస్తీషియా అధిక మోతాదులో తీసుకుని ఆత్మహ్యత చేసుకుంది. తన ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడమే కారణమని తోటి స్నేహితులు అంటున్నారు. 

Don't Miss