Activities calendar

31 December 2016

22:23 - December 31, 2016

ఢిల్లీ : పెద్ద నోట్లను రద్దు తర్వాత బయట పడ్డ నల్లధనం ఎంత..? ఇంతవరకు ఆర్థికంగా భారత్‌కు జరిగిన నష్టం ఎంత..? పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎంత మంది ప్రాణాలు వదిలారు...? వారి కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించిందా..? లేదంటే ఎందుకు చెల్లించలేదు...? పెద్ద నోట్లను రద్దు చేయాలని నిర్ణయం తీసుకునే ముందు ప్రధాని ఎవరిని సంప్రదించారు....? ఇప్పుడివే ప్రశ్నలను ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వంపై సంధిస్తున్నాయి.

బ్యాంకులు, ఏటీఎంల ముందు ఇంకా బారులు తీరుతున్న జనం
నోట్ల రద్దుతో నల్లధనం మాటెలా ఉన్నా.. ప్రజల ఇబ్బందులు మాత్రం పెరిగిపోయాయి. డిసెంబర్‌ 30ని డెడ్‌లైన్‌గా ప్రకటించిన ప్రధాని మోదీ.. ఆ తర్వాత అన్ని మంచి రోజులే అన్నారు. కానీ వాస్తవంలో అలాంటి పరిస్థితి ఏ మాత్రం కనిపించడం లేదు. ఇంకా బ్యాంకులు, ఏటీఎంల ముందు జనం బారులు తీరుతూనే ఉన్నారు. మరి దీనికి ప్రధాని మోదీ ఏం సమాధానం చెబుతారు...?

యాభై రోజుల దాటినా... ఇంకా ఏటీఎంల ముందు నో క్యాష్‌ బోర్డులే
మోదీ చెప్పినట్లు పెద్ద నోట్లు రద్దై యాభై రోజుల దాటినా... ఇంకా ఏటీఎంల ముందు నో క్యాష్‌ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే చిన్న వ్యాపారులు చితికపోయారు. పెద్ద వ్యాపారుల అమ్మకాలు తగ్గాయి. సామాన్యులకు ఇల్లు గడవడం గగనంగా మారింది. ఓ పక్క జనాలంతా తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉందని, చాలా చక్కగా సహకరిస్తున్నారని ప్రధాని చెప్పడం ఎంతవరకు సమంజసమని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
అన్ని రంగాల్లో క్షీణత నమోదై ఎకానమీ పూర్తిగా దెబ్బతింది..
కేంద్రం పూర్తి స్థాయిలో డబ్బు విడుదల చేసి బ్యాంకుల ద్వారా నల్ల కుబేరుల డబ్బును తెల్ల డబ్బుగా మార్చిందని, ఈ క్రమంలో ప్రజలు గుర్తించకుండా ఉండేందుకే అక్కడక్కడా ఐటీ దాడులు చేయించి వాటిని బయటపెట్టి ప్రజల దృష్టిని మరల్చిందన్న వాదనలూ వినిపిస్తన్నాయి. ఒకవేళ అలా జరగకుంటే ఇప్పటికే అన్ని ఏటీఎంలు, బ్యాంకులు పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉండాలి కదా..? అని ప్రశ్నిస్తున్నవారూ ఉన్నారు. మరోవైపు పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై భారీ ప్రచారం నిర్వహించేందుకు కేంద్రం సంసిద్దమవుతోంది. దీనికి మంత్రులను కూడా సన్నద్ధం చేస్తోంది. దీనికి సంబంధించి 60 పేజీల డాక్యుమెంట్ ను మంత్రులందరికీ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే పంపిణీ చేసింది. ఇందులో పెద్దనోట్ల రద్దుకు సంబంధించిన ప్రతీ అంశాన్నీ పాయింట్ టు పాయింట్ చేర్చినట్టు తెలుస్తోంది. పెద్ద నోట్ల రద్దుతో పంటకు ధరలేక రైతన్నలు కుదేలైపోయారు. దాదాపు అన్ని రంగాల్లో క్షీణత నమోదై ఎకానమీ పూర్తిగా దెబ్బతింది. రేటింగ్‌ సంస్థలు వృద్ధి అంచనాలను తగ్గించేశాయి. దీర్ఘకాలంలో మాత్రం లాభాలుంటాయని కొన్ని ఆంచనాలు చెబుతున్నాయి.

దేశ జీడీపీలో పనికిరాకుండా పోయిన 12 శాతం నగదు
దేశ జీడీపీలో 12 శాతం నగదు పనికి రానిదైపోయి ఇప్పటికి యాభై రోజులు దాటింది. చెలామణిలో ఉన్న 86 శాతం కరెన్సీ చెల్లనిదైపోయి నేటికి యాభైరోజులు పూర్తయింది. నవంబర్‌ 8న తమ దగ్గరున్న 500, వెయ్యి నోట్లను మార్చుకోవడానికి పరుగులెత్తిన జనం... కొత్త నోట్ల కోసం తమ పరుగు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే క్యూ లైన్లలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.ఇక సామాన్యుడి బతుకు బండి చతికిలపడింది. నిత్యం నగదుతో సాగే చాలా వ్యాపారాలు తీవ్రంగా పడిపోయాయి. ప్రసార మాధ్యమాల్లో డిజిటల్‌ చెల్లింపులపై సర్కారు చేసిన ప్రచారం కొంతమేర పనిచేసింది. పేటీఎం, మొబిక్విక్, ఫ్రీచార్జ్‌ వంటి మొబైల్‌ వాలెట్లు తామే ప్రత్యామ్నాయమనే రీతిలో ముప్పేట సాగిస్తున్న పబ్లిసిటీ ప్రభావమూ కనిపిస్తోంది. 26% మంది అక్షరాలకే నోచుకోని మన ఆర్థిక వ్యవస్థలో... 18 శాతానికి కూడా స్మార్ట్‌ఫోన్లు లేని మన ఆర్థిక వ్యవస్థలో మొబైల్‌ పేమెంట్లు, ఇంటర్నెట్‌ లావాదేవీలు ఎందరు చేయగలరనేది ఆలోచనలకు అందని విషయమేమీ కాదు.నగదుపై, కార్మికులపై ఎక్కువగా ఆధారపడ్డ ప్రతి రంగమూ దెబ్బతింది. దీంతో భారత్‌ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా వెనకబడింది. ఈ కొత్త నోట్ల కొరత.. ఇలాగే 2017లో కూడా కొనసాగితే... ప్రస్తుత మందగమనం వచ్చే ఏడాది కూడా కొనసాగవచ్చనే అంచనాలున్నాయి. నోట్ల రద్దు వల్ల అసంఘటిత రంగంలోని కార్మికులు, తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. ఈ రంగాల్లో ఎగుమతి- దిగుమతులు రెండూ తగ్గి.. ఆర్థికంగా కుదేలైపోయాయి. నోట్ల రద్దు ప్రకటన వెలువడ్డాక మొదట్లో బాగా డబ్బున్న వారంతా పరుగులెత్తింది బంగారం దుకాణాలకే. దానిపై నిఘా పెరగటంతో అమ్మకాలూ తగ్గాయి. ఇపుడు ధర తగ్గినా కొనేవారూ తగ్గారు. దుకాణాల్లో నిల్వలు పెరిగి తయారీ కంపెనీలు ఉత్పత్తినీ పరిమితం చేశాయి.  

22:11 - December 31, 2016

బ్యాంకులు, ఏటీఎంల ముందు ఇంకా బారులు తీరుతున్న జనం..ఏటీఎంల ముందు ఇంకా నో క్యాష్‌ బోర్డులే..అన్ని రంగాల్లోనూ నెగిటివ్ గ్రోత్ ..వృద్ధి అంచనాలను తగ్గించేసిన రేటింగ్‌ సంస్థలు..డిజిటల్‌ పేమెంట్ వ్యవస్థలకు పెరిగిన గిరాకీ.. దేశ జీడీపీలో పనికి రాకుండా పోయిన 12 శాతం నగదు ..పేటీఎం, మొబిక్విక్, ఫ్రీచార్జ్‌ వంటి మొబైల్‌ వాలెట్లు ముప్పేట పబ్లిసిటీ..నోట్ల రద్దు వల్ల అసంఘటిత రంగంలోని కార్మికులకు తీవ్ర ఇబ్బందులు..ఈ క్రమంలో నోట్ల రద్దు ప్రకటించిన తరువాత ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఈ ప్రసంగంలో మోదీ వరాల  ప్రకటన వుండబోతోందా? అసలు ప్రధాని ప్రసంగంలో ఎటువంటి విశేషాలుంటాయి అనే అంశంపై దేశమంతా తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. ఈ అంశంపై టెన్ టీవీ చర్చను చేపట్టింది ఈ చర్చలో ప్రేమేందర్ రెడ్డి (బీజేపీ నేత ),తెలకపల్లి రవి(రాజకీయ విశ్లేషకులు),తులసీరెడ్డి (కాంగ్రెస్ నేత) పాల్గొన్నారు. చర్చలో ఎటువంటి విశ్లేషణలు సాగాయో తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి..

22:01 - December 31, 2016

విజయవాడ : ఏపీ కేబినెట్ ముగిసిన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలను వివరించారు. ప్రజలందరికీ ఆరోగ్యం అందించాలనే ఉద్దేశ్యంతో కొత్త సంవత్సరంలో కొన్ని ఆరోగ్య పథకాలు ప్రవేశపెడుతున్నామనీ..ఒకో కుటుంబానికి నెలకు రూ.100ల ఆరోగ్య పాలసీ ఇస్తున్నట్లుగా చంద్రబాబు తెలిపారు. మార్చి నుండి ఆరోగ్య రక్ష పథకం ప్రారంభిస్తున్నామన్నారు. ఆరోగ్య పాలసీ కోసం జనవరి 1 నుండి ఫిబ్రవరి 28 లోపు పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. వైద్యసేవలపై ప్రజలకు భరోసాను కల్పిస్తున్నామన్నారు. అనంతపురం, చిత్తూరులో పెట్టుబడులకు భూములు కేటాయించేందుకు కేబినెట్ లో నిర్ణయించామన్నారు. గుజరాత్ భూసేకరణ తరహాలో 2013 భూసేకరణ చట్టాన్ని సవరించేందుకు కేబినెట్ లో నిర్ణయించామన్నారు. 

22:00 - December 31, 2016

కృష్ణా : సమాజంలో మానవ సంబంధాలపై నానాటికి విలువలు దిగజారిపోతున్నాయి. తండ్రి స్థానంలో వున్నవారు..వుండాల్సినవారు కూడా పశువుల్లా వ్యవహరిస్తున్నారు. తండ్రీ..సోదరుడు..మామ అనే వరుసలు మరచిపోయి మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఇటువంటి ఘటనే కృష్ణా జిల్లా పెనమలూరులో జరిగింది. కోడలిపై మామ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మామ వేధింపులు తట్టుకోలేని కోడలు కిరోసిన పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మామ వేధింపుల పట్ల భర్తకు...అత్తకూ చెప్పినా ఫలితం లేకపోవటంతో దిక్కుతోచని మనస్తాపానికి గురై ఆ అమాయకురాలు ఏడే సంవత్సరాల బిడ్డను అనాధను చేసి ఆత్మహత్య చేసుకుని ప్రాణం విడిచింది. మల్లంపాటి కిరణ్ కు ఫణికి 2007 వ సంవత్సరంలో వివాహం అయ్యింది. వీరికి ఏడు సంవత్సరాల బాబుకూడా వున్నాడు. ఫణిశ్రీ ఓ ప్రయివేటు కంపెనీలో పనిచేస్తోంది. అత్తకు ఈ విషయాన్ని తెలిపినా ఫలితం లేకపోయింది. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఫణిశ్రీ మృతి చెందింది. ఫణిశ్రీ పుట్టింటివారి ఫిర్యాదు మేరకు ఫణి భర్త కిరణ్ ..అత్త రమాదేవి, ప్రధాన నిందితుడు మా నాగేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టిరు. మృతికి కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పుట్టింటివారు కోరుతున్నారు. 

21:53 - December 31, 2016

నెల్లూరు : పొర్లుకట్ట వద్ద బాణసంచా పేలుడు సంభవించిన ఘటన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో 14మంది గాయపడ్డారు. వీరిని నెల్లూరు నారాయణ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. కలెక్టర్ ముత్యాల రాజు చికిత్సను పరిశీలిస్తున్నారు. 14మందికి తీవ్రగాయాలపాలయ్యారు. 11.30కు కలెక్టర్ ఫోన్ చేశారనీ..బాధితులకు చికిత్సనందించేందుకు అన్ని చర్యలూ తీసుకున్నామని వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో 13 మందికి 80 శాతం గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. 72 గంటలు గడిస్తేనే గానీ బాధితుల పరిస్థితి చెప్పలేమంటున్నారు. బాధితులకు చికిత్సనందిస్తున్న నారాయణ ఆసుపత్రికి చేరుకన్న కలెక్టర్ ముత్యాల రాజు చికిత్సను పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం తరపునుండి బాధితులకు నష్టపరిహారం ప్రకటించే అవకాశాలున్నాయని తెలిపారు. వైసీపీ నేత మేకపాటి కూడా ఆసుపత్రిలో బాధితులకు చికిత్సను పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం తరపునుండి బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. 

21:49 - December 31, 2016

కరీంనగర్ : సీపీఎం తీసుకున్న సామాజిక న్యాయం ఎజెండాపై కేసీఆర్ ప్రభుత్వం భయపడిందని పేర్కొన్నారు. పాదయాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని కలిగించామన్నారు. ప్రభుత్వంపై ప్రశ్నించాలనే చైతన్యం ప్రజల్లో వచ్చిందనీ. సీపీఎం మహాజన పాదయాత్ర విజయమని తెలిపేందరు ఇదే నిదర్శనమని తమ్మినేని పేర్కొన్నారు. అలాగే పాదయాత్ర సందర్భంగా కేసీఆర్ కు రాసిన లేఖలకు కూడా భారీగా ప్రభుత్వం స్పందించిందన్నారు.సీపీఎం మహాజన పాదయాత్ర 17 జిల్లాల్లో గుండా కొనసాగి 2000 కి.మీటర్ల పూర్తి చేసుకున్న సందర్భంగా తమ్మినేని స్పందన ఆయన మాటల్లోనే విందాం..ఏ ఆటంకాలు లేకుండా 2000 పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా వుందన్నారు. కేసీఆర్ పిలుపుమేరకు టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకుంటారని అభిప్రాయపడ్డానన్నారు. ఇంత దూరం పాదయాత్ర కొనసాగింపులో ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాలేదనీ..రానున్న రోజుల్లో కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఎటువంటి వాగ్ధానాలు నెరవేరలేదనీ అభిప్రాయం ప్రజల్లో వుందన్నారు. ప్రతీ ప్రాంతంలోనూ ఈ అభిప్రాయముందని తెలిపారు. ముఖ్యంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళపై ప్రజలు ఆశపడుతున్నారన్నారు. మరొక్క ముఖ్యాంశం పలు ప్రాంతాల్లో శ్మశాన ససమ్యలు న్నాయన్నారు. 
ప్రజల్లో చైతన్యం తేవడంలో పాదయాత్ర విజయవంతం:తమ్మినేని
ప్రభుత్వాన్ని నిలదీసేలా ప్రజల్లో చైతన్యం తేవడంలో పాదయాత్ర విజయవంతం అయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి ధ్యేయంగా సాగుతున్న పాదయాత్ర 2000 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. సీపీఎం యాత్రతో ప్రభుత్వంలో ఎంతో చలనం వచ్చిందని ఈ సందర్భంగా తమ్మినేని అన్నారు. ప్రతిచోట ప్రజలను కదిలించగలిగామని, సీపీఎం ఎజెండాను చూసి కేసీఆర్‌ భయపడుతున్నాడని తమ్మినేని అన్నారు.

21:46 - December 31, 2016

హైదరాబాద్ : సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో బల్దియా ముందు వరసలో ఉంది. పాతనోట్ల రద్దు నేపథ్యంలో ఆన్‌లైన్‌ చెల్లింపులకు తెర లేపిన జీహెచ్‌ఎంసీ... ఇప్పుడు స్వైపింగ్‌ యంత్రాల ద్వారా చెల్లింపులకు శ్రీకారం చుట్టింది. అలాగే ఇ-టాయిలెట్స్‌ను గ్రేటర్‌ వాసులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.

ఐటీ వినియోగంలో ముందున్న జీహెచ్‌ఎంసీ
దేశంలోని కార్పొరేషన్లలో... ఐటీ వినియోగంలో జీహెచ్‌ఎంసీ ముందంజలో ఉంది. ఇప్పుడు మరిన్ని ఆన్‌లైన్‌ సేవలు అందించేందుకు సిద్ధమవుతుంది. క్యాష్‌లెస్‌ చెల్లింపుల్లో భాగంగా బల్దియా నిర్వహిస్తున్న 19 సిటిజన్‌ సర్వీస్‌ సెంటర్లలో స్వైపింగ్‌ యంత్రాలను ప్రవేశపెడుతున్నారు. దీంతో డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా పన్నులు.. ఫీజులను చెల్లించవచ్చు..అలాగే గ్రేటర్‌ పరిధిలో పనిచేస్తున్న 350 మంది బిల్‌ కలెక్టర్లకు స్వైపింగ్‌ యంత్రాలను సమకూర్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇ-టాయిలెట్స్‌ ద్వారా అతి తక్కువ నీటి వినియోగం అవుతుందని.. ఆటో ప్రెస్‌, ఆటో క్లీనింగ్‌ సౌకర్యంతో ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంటాయని గ్రేటర్‌ అధికారులు అంటున్నారు.

సిటీలోని 15 ప్రాంతాల్లో ఇ-టాయిలెట్స్‌
టెండర్ల ప్రక్రియ ప్రారంభం.ఎలక్ట్రానిక్ టాయిలెట్లను నగరవాసులకు అందుబాటులోకి తెచ్చేందుకు బల్దియా ప్రయత్నిస్తుంది. సిటీలోని ప్రముఖ పర్యాటక స్థలాలు.. ప్రధాన వ్యాపార కూడళ్లలో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. మొత్తం 15 ప్రాంతాల్లో జనవరి 26లోగా వీటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుంది. ఇ-టాయిలెట్స్‌ ఏర్పాటుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌, ఇండియన్‌ ఆయిల్ కార్పొరేషన్లు ముందుకు వచ్చాయి. మహిళలు ఉపయోగించే ఒక్క ఇ-టాయిలెట్‌ ఏర్పాటుకు 7 లక్షల 30 వేలు.. పురుషుల ఇ-టాయిలెట్‌కు 6 లక్షల 35 వేల రూపాయలు ఖర్చు కానుంది. ఇప్పటికే బల్దియా దీనికోసం టెండర్ల ప్రక్రియ ప్రారంభించింది. ఇ-టాయిలెట్‌లో అన‌రోబిక్ బ‌యోడీగ్రేడేష‌న్ ద్వారా వ్యర్థాల నిర్వహణ జరుగుతుంది. మ్యాన్‌వ‌ల్ క్లీన్‌, రెగ్యుల‌ర్ మెయింట‌నెన్స్ వీటికి అవ‌స‌రం ఉండదు. ఏదిఏమైనా అభివృద్ధి చెందిన నగరాలకే పరిమితమైన ఇ-టాయిలెట్లు ఇక్కడ ఎంతవరకు ఉపయోగపడతాయో వేచి చూడాలి.

 

21:45 - December 31, 2016
21:44 - December 31, 2016

ఉత్తరప్రదేశ్ : సమాజ్ వాద్ పార్టీలో సంక్షోభానికి తెరపడింది. ములాయం సింగ్ యాదవ్ అఖిలేశ్ ల మధ్య సయోధ్య కుదిరింది. శుక్రవారం నాడు సీఎం అఖిలేశ్, రాంగోపాల్ యాదవ్ లపై పార్టీ ప్రధాన కార్యదర్శి ములాయం ఆరేళ్ళపాటు సస్పెండ్ వేటు వేసిన సంగతి తెలిసిందే. కాగా అఖిలేశ్ బల ప్రదర్శన తరువాత ములాయం వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. అఖిలేశ్ , రంగోపాల్ యాదవ్ లపై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లుగా ములాయం ప్రకటించారు. దీంతో వీరిద్దరూ తిరిగి పార్టీలోకి రానున్నారు. కాగా గత కొంతకాలంగా బాబాయ్ శివపాల్ యాదవ్ అఖిలేశ్ ల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న నేపథ్యంలో పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా అఖిలేశ్ వ్యవహార శైలి వుందనీ తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీని కాపాడుకునేందుకు అఖిలేష్, రాంగోపాల్ యాదవ్ లను సస్పెండ్ చేస్తున్నట్లుగా ములాయం తెలిపారు. శనివారం నాడు ములాయం సింగ్ యాదవ్ ఆదేశాలతోనే షోకాజ్ నోటీసులు వెనక్కి తీసుకున్నామని శివపాల్ తెలిపారు. అఖిలేశ్, రాంగోల్ యాదవ్ లపై నోటీసులు వెనక్కి తీసుకున్నామని పార్టీ తెలిపింది.

 

21:40 - December 31, 2016

ఢిల్లీ: కొత్త సంవత్సరం నుండి బ్యాంకులు సామాన్య స్థితికి చేరుకుంటాయనీ..నన్ను మీవాడిగా భావించి నా బాధను అర్థం చేసుకున్నారన్నారనీ..నోట్ల రద్దు అనంతరం సామాన్యులు పడ్డ కష్టానికి ప్రతిఫలం వారికి భవిష్యత్తులో లభిస్తుందన్నారు. గంటల తరబడి లైన్లలో నిలబడినా ప్రజలు చూపిన మనోనిబ్బరం ప్రశంసనీయని కొనియాడారు. నోట్ల రద్దు తరువాత ప్రధాని నరేంద్రమోదీ జాతినుద్ధేశించి ప్రసంగించారు. ముందుగా దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నల్లధనం, అవినీతి దేశాన్ని పట్టి పీడిస్తున్నాయన్నారు. నోట్ల రద్దు ఓ శుద్ధి యజ్ఞంగా మోదీ పేర్కొన్నారు. సమాజంలో అవినీతి పెచ్చుమీరిపోయిందన్నారు. బ్లాక్ మనీ నుండి దేశం విముక్తి కావాల్సిన అవుసరముందన్నారు. కొత్త సంవత్సరం నుండి బ్యాంకులు సామాన్య స్థితికి చేరుకుంటాయనీ..నన్ను మీవాడిగా భావించి నా బాధను ప్రజలు అర్థం చేసుకున్నారనీ..నోట్ల రద్దును ప్రజలు అర్థం చేసుకున్నారనీ..ఈ విషయంలోసామాన్యులు పడ్డ కష్టానికి ప్రతిఫలం వారికి భవిష్యత్తులో లభిస్తుందన్నారు. గంటల తరబడి లైన్లలో నిలబడినా వారు చూపిన ప్రజలు చూపిన మనోనిబ్బరం ప్రశంసనీయని కొనియాడారు.

బ్లాక్ మనీ,అవినీతికి వ్యతిరేకంగా పోరాడి తీరుతాం : మోదీ
బ్లాక్ మనీ,అవినీతికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని ప్రధాని స్పష్టం చేశారు. అవినీతి పరులను వదిలే ప్రసక్తే లేదన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళయినా ప్రజలకు సొంత ఇళ్లు లేనిన్నారు. ప్రధానమంత్రి అవాసయోజన క్రింద పట్టణాల్లో నివసించే నిరు పేద, దిగువ మధ్య తరగతి, మధ్య తరగతి ప్రజల కోసం రెండు పథకాలు అమలులోకి తీసుకొస్తున్నామని చెప్పిన ఆయన, వారు కట్టించుకునే ఇంటికి తీసుకునే 9 లక్షల రూపాయల వడ్డీలో 4 శాతం రాయితీ ఇస్తామని చెప్పారు. 12 లక్షల రుణానికి సంబంధించిన వడ్డీలో 3 శాతం రాయితీ ఇస్తామని చెప్పారు. గ్రామాల్లో నిర్మించే ఇళ్ల రుణాల వడ్డీలో 3 శాతం రాయతీ ఇస్తామని ఆయన చెప్పారు. చిరు వ్యాపారులకు 50 శాతం క్రెడిట్ పెంచుతామని చెప్పారు. కిసాన్ క్రెడిట్ కార్డులను రూపే కార్డులుగా మారుస్తామని అయన అన్నారు. 

పెద్ద నోట్ల రద్దు ఓ శుద్ధి యజ్ఞం: మోదీ

ఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు ఓ శుద్ధి యజ్ఞమని, నోట్ల రద్దు వల్ల దేశ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, వారి త్యాగం వృథా పోదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. నల్లధనంపై యుద్ధం ఆగదని, నల్లధనం రూపు మాపితే భవిష్యత్తులో ధేశం రూపురేఖలు మారతాయన్నారు. పెద్ద నోట్ల రద్దు ముగిసిన నేపథ్యంలో ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించారు. 

ప్రజలకు ప్రధాని నూతన సంవత్సర శుభాకాంక్షలు..

ఢిల్లీ: నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. పెద్ద నోట్ల రద్దు ముగిసిన నేపథ్యంలో ప్రధాని నేడు జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు. కొత్త ఏడాదికి స్వాగతం పలికిన ప్రధాని నూతన సంవత్సరంలో నూతనోత్తేజంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దీపావళి తర్వాత నల్లధనంపై ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నామన్న ఆయన దేశ ప్రజల సహకారంతో ప్రక్షాళన యజ్ఞం సాగిందన్నారు. ఆ నిర్ణయం భవిష్యత్తులో ఉత్తమ ఫలాలు అందిస్తుందని తెలిపారు. అవినీతి అంతం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నరన్న ప్రధాని చెడును ఓడించడానికి పోరాటం కొనసాగుతుందన్నారు. 

19:31 - December 31, 2016
19:27 - December 31, 2016

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కదలికలపై మావోయిస్టులు కన్ను వేశారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన సమయంలో..ఆయన కదలికలపై మావోయిస్టులు రెక్కి నిర్వహించినట్టు ..ఏపీ భవన్‌ పరిసరాల్లో మావోయిస్టులు తచ్చాడినట్టు ఢిల్లీ పోలీసుల నిఘాలో తెలిసింది. ఇప్పటివరకు ఆరుసార్లు రెక్కి నిర్వహించినట్టు పోలీసులు గుర్తించారు. మీడియా ముసుగులో సీఎంపై దాడికి పాల్పడే అవకాశం ఉన్నట్టు గుర్తించారు.. అలాగే ఏపీ భవన్‌లో భద్రతా లోపాలు ఎక్కువగా ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. దీనిపై ఏపీ భవన్‌ అధికారులకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. కాగా ఏపీ భవన్ పై మావోల రెక్కిపై తమకు ఎటువంటి సమాచారం లేదని ఏపీ పోలీసులు చెబుతున్నారు. ఏవోబీ భారీ ఎన్ కౌంటర్ నేపథ్యంలో వచ్చిన హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని భద్రత విషయంలో పట్టిష్ట చర్యలు తీసుకున్నామీనీ.. ఢిల్లీ హెచ్చరికలతో భద్రతను మరింత కట్టుదిట్ట చేస్తామని ఏపీ డీజీపీ సాంబశివరావు పేర్కొన్నారు. 

బాధ్యతలు చేపట్టిన శశికళ

చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఈరోజు మధ్యాహ్నం బాధ్యతలు చేపట్టారు. పోయెస్‌ గార్డెన్‌ నుంచి పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఆమెకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అనంతరం జయలలిత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి.. ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వంతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.

గుడివాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాస

కృష్ణా : గుడివాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాస గా మారింది. ఈ సమావేశంలో టిడిపి, వైసీపీ సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. సమావేశానికి వచ్చిన మున్సిపల్ ఛైర్మన్ యలవర్తిని వైసీపీ ఎమ్మెల్యే కొడాలినాని, వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు. ఇటీవలే వైసీపీ నుండి యలవర్తి శ్రీనివాసరావు టీడీపీలోకి జంప్ అయిన సంగతి తెలిసిందే..

అఖిలేష్ కు 220 మంది ఎమ్మెల్యేల మద్దతు

యూపీ : అఖిలేష్ కు 220 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. అఖిలేష్ యాదవ్ తన నివాసంలో ఎమ్మెల్యేలు, మద్దతుదారులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో అఖిలేష్ కన్నీళ్లు పెట్టుకుని కుప్పకూలారు. నేతాజీ నుంచి నేను దూరం కాలేదుఅని, యూపీ లో గెలిచి నా తండ్రికి బహుమానంగా ఇస్తానని పేర్కొన్నారు. ఎవరి వల్ల పార్టీలో గొడవలు వచ్చాయో అందరికీ తెలుసన్నారు. అమర్ సింగ్ ను ఉద్దేశించి అఖిలేష్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

నెల్లూరులో పేలుడు ఘటనపై విచారణకు చినరాజప్ప ఆదేశం...

విజయవాడ: నెల్లూరులో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనపై డిప్యూటీ సీఎం చినరాజప్ప ఆరాతీశారు. నెల్లూరు ఎస్పీతో ఆయన ఫోన్‌లో ఘటనపై పూర్తి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై విచారణ జరిపి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అనుమతిలేని బాణాసంచా తయారీ కేంద్రాలపై చర్యలు తీసుకోవాలన్నారు.

ముగిసిన రాష్ట్రపతి శీతాకాల విడిది

హైదరాబాద్ : రాష్ట్రపతి శీతాకాల విడిది ముగిసింది. కొద్ది సేపటి క్రితం హకీంపేట ఎయిర్ పోర్టు నుండి ఢిల్లీకి బయలుదేరారు. సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రి దత్తాత్రే, రాష్ట్ర మంత్రులు, స్పీకర్ మధుసూదనాచారి తదితరులు రాష్ట్రపతికి వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు.

టీ.పీసీసీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం

హైదరాబాద్ : గాంధీభవన్ లో టీ.పీసీసీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం అయ్యింది. నోట్ల రద్దు విషయంలో కేంద్రానికి వ్యతిరేకంగా చేపట్టనున్న కార్యక్రమాలపై కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

ప్రారంభమైన ఏపీ కేబినెట్

అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభం అయ్యింది. ఈభేటీలో ఈ ఏడాదిలో సాధించిన పురోగతి, వృద్ధి అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. గండికోట ముంపు బాధితులకు పరిహారంపై, అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి సంబంధించి, వివిధ సంస్థలకు భూకేటాయింపులపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మంత్రి మాణిక్యాలరావుకు మాతృవియోగం

ప.గో: బీజేపీ ఎమ్మెల్యే, మంత్రి మాణిక్యాలరావుకు మాతృవియోగం. కొన్ని రోజులుగా ఆయన తల్లి రంగనాయకమ్మ (75) ఆరోగ్యం పూర్తిగా దెబ్బ‌తినడంతో ఆమెను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. శనివారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తల్లి మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

11:49 - December 31, 2016

కరీంనగర్ : సామాజిక న్యాయమే లక్ష్యంగా సీపీఎం మహాజన పాదయాత్ర..75వ రోజు కరీంనగర్ జిల్లాలో కొనసాగుతోంది. సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో కొనసాగుతున్న పాదయాత్ర జిల్లాలోని పలు గ్రామాల గుండా సాగింది. ఈ సందర్భంగా 75వ రోజు తమ్మినేని కరీంనగర్ జిల్లా సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. 
కరీంనగర్ జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్ర 
సామాజిక న్యాయమే లక్ష్యంగా సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర 75వ రోజు కరీంనగర్ జిల్లాలోని పలు గ్రామాల గుండా సాగింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం..ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాదయాత్ర..జిల్లాలోని అలుగునూరు, సదాశివపల్లి ఎక్స్‌రోడ్‌, మానకొండూరు, అన్నారం, లలితాపూర్‌, దేవరపల్లి, కొండపాకల, ఎరడపల్లి, గ్రామాల్లో పర్యటించారు. 
పాదయాత్రకు ఆరేపల్లి మోహన్‌ సంఘీభావం 
75వ రోజు సీపీఎం మహాజన పాదయాత్ర..1985 కిలోమీటర్ల దూరం పూర్తిచేసుకుంది. మానకొండూరుకు పాదయాత్ర బృందం చేరుకున్నాకా.. మానకొండూరు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్‌ పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ తాను కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం దళిత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని విమర్శించారు. 
సీఎం కేసీఆర్‌కు తమ్మినేని ప్రత్యేక లేఖ 
ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం...సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక లేఖ రాశారు. కరీంనగర్ జిల్లా సమస్యలను వివరిస్తూ...ఇదేనా ఢల్లాస్‌ పేరుతో లేఖను కేసీఆర్‌కు రాశారు. ఇక శనివారంరోజు జిల్లాలోని జమ్మికుంట ప్రాంతంలో పాదయాత్ర బృందం 2వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకోనుంది. దీంతో జమ్మికుంటలో పాదయాత్ర బృందానికి ఘనస్వాగతం పలికేందుకు స్థానికులు, పార్టీ శ్రేణులు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. 

 

ఏపీలో గ్రూప్-1, గ్రూప్ -3 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

అమరావతి: అమరావతి: ఏపీలో గ్రూప్-1, గ్రూప్ -3 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేశారు. 78 పోస్టులతో గ్రూప్ -1, 1055 పోస్టులతో గ్రూప్ -3 నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 1337 పోస్టులకు 10 నోటిఫికేషన్లను ఏపీపీఎస్సీ జారీ చేసింది. త్వరలో 4009 మెడికల్ పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటిచింది.

కాసేపట్లో ఢిల్లీకి పయనమవ్వనున్న రాష్ట్రపతి

హైదరాబాద్ : శీతాల విడిది ముగించుకుని హైదరాబాద్ నుండి కాసేపట్లో రాష్ట్రపతి ఢిల్లీకి పయనం అవ్వనున్నారు. రాష్ట్రపతికి వీడ్కోలు పలికేందుకు సీఎంకేసీఆర్, కేంద్ర మంత్రి దత్తాత్రే, స్పీకర్, మంత్రులు హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.

సీఎం చంద్రబాబును కలిసిన కృష్ణా డెల్టా రైతులు

అమరావతి: సీఎం చంద్రబాబును కృష్ణా డెల్టా రైతులు కలిశారు. పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు నీరు ఇచ్చినందుకు సీఎం కు కృతజ్ఞతలు తెలిపారు. వరి, అటుకులు, పొంగలి ని రైతులు చంద్రబాబుకు అందజేశారు.

ఉబెర్ క్యాబ్ ఆఫీసు ముందు డ్రైవర్ల ధర్నా

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ లోని ఉబెర్ క్యాబ్ కార్యాలయలం ముందు డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. భారీ పోలీసులు మోహరించారు.

11:32 - December 31, 2016

నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈఘటనలో ముగ్గురు మృతి చెందారు. జిల్లాలోని పొర్లుకట్ట సమీపంలో భాస్కర్ అనే వ్యక్తి బాణాసంచా తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. ఎలాంటి అనుమతి లేకుండా బాణాసంచా తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. ఈనేపథ్యంలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ముగ్గురు మృతి చెందారు. మరో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. 13 మందికి ముఖం, చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. భారీ మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. పేలుడు సంభవించగానే భాస్కర్ అక్కడి నుంచి పరారయ్యాడు. నిర్వహకుడు ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించడంతోనే ప్రమాదం చేటుచేసుకుందని పలువురు అంటున్నారు. భాస్కర్ పూర్తి నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని తెలుస్తోంది. ఘటన వెనుకాల అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందని సమాచారం. నిర్వహికుడు భాస్కర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

ఆటో బోల్తా: 9మందికి గాయాలు

నల్గొండ: స్ధాయికి మించి జనాలను ఎక్కించుకోవడంతో అదుపు తప్పి ఆటో బోల్తా పడిన ఘటన నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి గ్రామంలో జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది గాయాలపాలవగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్ధానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.

బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు: ఇద్దరి మృతి

నెల్లూరు: పోర్లుకట్ట సమీపంలో విషాదం నెలకొంది. బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సభవించింది. ఈ పేలుళ్లలో ఇద్దరు మృతి చెందగా.. 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనుమతిలేకుండా బాణాసంచా తయారు చేస్తున్నట్లు సమాచారం.

11:24 - December 31, 2016

మునగాకులో ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి. మునగాకు కొంచెం కారంగా, వెగటుగా అనిపిస్తుంది. ఈ రెండు లక్షణాలే మునగాకును కొంతమంది ఇష్టపడకపోవడానికి కారణం అవుతున్నాయి.. కానీ, అది అందించే ఆరోగ్యం మాత్రం అపారం. మునగాకులో ఎ, సి విటమిన్లు పుష్కలంగా వున్నాయి. ఇతర ఏ ఆకుకూరల్లోనూ మునగాకులో వుండే విటమిన్లు వుండవు. అలాగే కాల్షియం, పాస్పరస్, ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా వుంటాయి. వందగ్రాముల మునగాకులో వుండే పోషక పదార్థాలను ఒక్కసారి పరిశీలిద్దాం.

మునగాకులో ఉన్న పోషకవిలువలు....

నీరు 75.9 శాతం, పిండి పదార్థాలు 13.4 గ్రాములు, ఫ్యాట్స్ - 17 గ్రాములు, మాంసకృత్తులు 6.7 గ్రాములు, కాల్షియం 440 మిల్లీ గ్రాములు, పాస్పరస్ 70 మిల్లీ గ్రాములు, ఐరన్7 మిల్లీ గ్రాములు‘సి’ విటమిన్, 200 మిల్లీ గ్రాములు, ఖనిజ లవణాలు 2.3 శాతం, పీచు పదార్థం 0.9 మిల్లీ గ్రాములు, ఎనర్జీ 97 కేలరీలు వున్నాయి.

మునగాకు దివ్య ఔషధం..

ప్రారంభ దశలో వున్న కీళ్ళ నొప్పులకు మునగాకు దివ్య ఔషధం. మునగాకును నూరి కట్టుకడితే తగ్గిపోతాయి. మునగాకును నూరి లేపనంగా రాయడం, కట్టు కట్టడం ద్వారా చర్మరోగాలు, వ్రణాలు నివారణ అవుతాయి. మునగాకు రసాన్ని సేవించడం ద్వారా దృష్టి మాంద్యము, రేచీకటి తొలగిపోతాయి. మునగ ఆకులలో అమినో ఆమ్లాలు వుంటాయి. అందువల్ల మాంసకృత్తుల లోపాల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు. గర్భిణులకు, బాలింతలకు మునగాకు రసం అమృతంతో సమానం. మునగాకు రసాన్ని దోసకాయ రసంతో కలిసి ప్రతిరోజూ సేవిస్తే గుండె, కాలయం, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. మునగ రసం రక్తహీనతను నివారిస్తుంది.

మునగాకుతో మరికొన్ని ఉపయోగాలు...

మునగాకుల రసాన్ని పాలలో కలసి పిల్లలకు అందిస్తే వారి ఎముకలు బలంగా తయారవుతాయి. గర్భిణులు, బాలింతలకు ఇస్తే వారికి అవసరం అయిన కాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. తల్లులతోపాటు, పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా వుంటారు. పాలిచ్చే తల్లులకు మునగాకును కూరగా వండి పెడితే పాలు పెరుగుతాయి. గుప్పెడు మునగాకులను వంద మిల్లీలీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు ఆ నీటిని కాచి చల్లారనివ్వాలి. ఆ నీటిలో కొంచెం ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం కలిపి తాగితే ఆస్థమా, టీబీ, దగ్గు తగ్గుతాయి. మునగాకు రసం ఒక స్పూన్ తీసుకుని దాన్ని గ్లాసు కొబ్బరినీళ్ళలో కలిపి, కాస్తంత తేనె కలిపి ఇస్తే విరోచనాలు తగ్గిపోతాయి. మునగాకు రసానికి నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, బ్లాక్ హెడ్స్ పోతాయి. ముఖ్యంగా కాల్షియం లోపాన్ని ఎదుర్కొనే మహిళలకు మునగాకు వరప్రదాయిని. అలాంటివారు విరివిగా మునగాకును ఏదో ఒక రూపంగా ఉపయోగిస్తూ వుంటే వారిలోని కాల్షియం పెరుగుతుంది. మరి ఇన్ని మంచి లక్షణాలున్న మునగాకును నిర్లక్ష్యం చేయడం తగునా?

11:23 - December 31, 2016

ఉత్తరప్రదేశ్ : యూపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సమాజ్ వాది పార్టీలో సంక్షోభం ముదురుతోంది. పార్టీ ఎమ్మెల్యేలతో అఖిలేష్ యాదవ్ సమావేశం నిర్వహించనున్నారు. అఖిలేష్ కు 212 మంది ఎమ్మెల్యేలున్నట్లు సమాచారం. ఉదయం 11.30 ములాయం కీలకం సమావేశం నిర్వహించనున్నారు. కొత్త సీఎం ఎంపికపై చర్చించే అవకాశం ఉంది. ములాయం సింగ్ నివాసం వద్ద భారీగా పోలీసలు మోహరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

11:21 - December 31, 2016

చెన్నై : చిన్నమ్మ శిశకళ ఇవాళ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. పార్టీ కార్యకర్తలను ఉద్ధేశించి చిన్మమ్మ ప్రసంగించనున్నారు. నాల్గో వ్యక్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. జయలలిత మరణంతో దాదాపు 600 మంది మృతి చెందారు. వారి కుటుంబాలను ఓదార్చడంతోపాటు నష్టపరిహారం అందజేసే యోచనలో శశికళ ఉన్నట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. పార్టీ ఎమ్మెల్యే, నేతలు,కార్యకర్తల నడుమ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను స్వీకరించనున్నట్లు సమాచారం. 

10:42 - December 31, 2016

ప్రముఖ నటుడు షారుఖ్‌ఖాన్‌ కు యశ్‌చోప్రా 4వ జాతీయ పురస్కారం వరించింది. దివంగత బాలీవుడ్ దర్శకనిర్మాత యశ్‌చోప్రా పేరిట టీఎస్‌ఆర్ ఫౌండేషన్ ఈ అవార్డును ప్రదానం చేయనుంది. ఈ సారి షారుఖ్‌ఖాన్‌ను ఈ అవార్డుకు ఎంపికచేసినట్లు టీఎస్‌ఆర్ పౌండేషన్ అధ్యక్షుడు టి. సుబ్బిరామిరెడ్డి పేర్కొన్నారు. 2017 ఫిబ్రవరి 25న ముంబయిలో జరిగే వేడుకలో షారుఖ్‌ఖాన్‌కు ఈ అవార్డును అందజేయనున్నట్లు సుబ్బిరామిరెడ్డి తెలిపారు. ఈ అవార్డుతో పాటు పది లక్షల నగదు బహుమతి, బంగారు పతాకాన్ని షారుఖ్‌ఖాన్‌కు అందించనున్నట్లు పేర్కొన్నారు. గతంలో గాయని లతామంగేష్కర్, నటులు అమితాబ్‌బచ్చన్, రేఖ ఈ అవార్డును రేఖ స్వీకరించారు.

10:40 - December 31, 2016

మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా,కాజల్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ పతాకంపై ‘ఖైదీ నంబర్‌ 150’ రామ్‌చరణ్‌ నిర్మింస్తున్న, వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రంలోని ప్రత్యేక గీతంలో రాయ్‌లక్ష్మితో కలిసి చిరు చిందేశారు. ఐటెం సాంగులను ఇరగదీయడంలో స్పెషలిస్ట్ అయిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్.. 'రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు.. నిను చూస్తే నిలబడనంటాయ్ నా చొక్కా బొత్తాలు' అంటూ సాగే పాటు అదిరిపోయే ట్యూన్ ఇచ్చాడు. బీట్ నుంచి ట్రాక్ వరకూ ప్రతీ యాంగిల్ లోనూ ఇరగదీసేసింది ఈ ఐటెం పాట. ‘రత్తాలు రత్తాలు.. ఓసోసీ రత్తాలు’ అని సాగే ఈ పాటకు ప్రస్తుతం యూట్యూబ్‌లో మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటికే ఈ పాటను 2 లక్షల మందికి పైగా చూడగా, 15 వేల మంది లైక్‌ చేశారు.రాఘవా లారెన్స్‌ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు. రత్తాలు పాటలో చిరు స్టెప్పులు ఏ రేంజ్ లో ఉంటాయో అని మెగా ఫ్యాన్స్ ఊహించేసుకుని తెగ మురిసిపోతున్నాయి. ఇక ఈ పాటకు లక్ష్మీ రాయ్ అందాలు స్పెషల్ అట్రాక్షన్ అనే సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. జనవరి 4న ఈ చిత్రం ప్రీ-రిలీజ్‌ వేడుకను నిర్వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది.

10:28 - December 31, 2016
10:23 - December 31, 2016

గుంటూరు : ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది. సచివాలయంలో కొద్దిసేపట్లో సమావేశం ప్రారంభం కానుంది. ఏడాది పాలనలో పురోగతిపై సమీక్ష చేయనున్నారు. భూ కేటాయింపులు, జన చైతన్య యాత్రలపై చర్చించనున్నారు. గండికోట ముంపు బాధితులకు అందించే నష్టపరిహారంపై నిర్ణయం తీసుకోనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

బాబు నివాసంలో టీడీపీ సమన్వయ కమిటీ భేటీ

అమరావతి: ఏపీ సీఎం బాబు నివాసంలో టీడీపీ సమన్వయ కమిటీ భేటీ అయ్యింది. ఈ భేటీ జన్మభూమిలో చర్చించాల్సిన అంశాలు, ప్రభుత్వ పథకాల ప్రచారం, నేతల మధ్య సమన్వయం పైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

మంత్రులు, ఎమ్మెల్యేలతో అఖిలేష్ యాదవ్ భేటీ

యూపీ : తన నివాసంలో ఎమ్మెల్యేలు, మద్దతుదారులతో సీఎం అఖిలేస్ యాదవ్ సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి 25 మంది మంత్రులు, 100 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈసమావేశానికి హాజరయ్యే వారికి సెల్ పోనులకు అనుమతి నిరాకరించారు. అఖిలేష్ యాదవ్ ఇంటి వద్ద భారీగా పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. మరో వైపు ఎస్పీ పార్లీమెంటరీ పార్టీ, ఎమ్మెల్యేలు, తన అనుచరులతో ఉ.10.30 గంటలకు ఆ పార్టీ చీఫ్ ములాయంసింగ్ భేటీ కానున్నారు.

బక్సర్ జైలు నుంచి 5గురు ఖైదీల పరార్

హైదరాబాద్ :బీహార్ లోని బక్సర్ సెంట్రల్ జైలు నుంచి ఐదుగురు ఖైదీలు పరారయ్యారు. పరారైన ఐదుగురు ఖైదీలలో ఒక వ్యక్తికి మరణ శిక్ష కూడా పడింది. మిగిలిన నలుగురు వివిధ కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. పరారైన ఖైదీల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఆటో డ్రైవర్ దారుణ హత్య

సంగారెడ్డి : ఆటో డ్రైవర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన మునిపల్లి మండలం బుధేరలో జరిగింది. బండరాయితో తలపై మోది హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

09:49 - December 31, 2016

ఢిల్లీ : హస్తినను చలి వణికిస్తోంది. ఢిల్లీ అంతర్జాతీయ విమానశ్రయాన్ని మంచు కమ్మేసింది. దీంతో 9 అంతర్జాతీయ విమానాలు, మూడు దేశీయ విమానాలను అధికారులు డిలే చేయగా.. ఒక్క అంతర్జాతీయ విమానం, రెండు దేశీయ విమానాలను రద్దు చేశారు. అలాగే పొగమంచు కారణంగా 69 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. నాలుగు రైళ్లను రద్దు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూడండి. 

09:46 - December 31, 2016

ఢిల్లీ : కరెన్సీ కోసం కష్టాలు పడుతున్న ప్రజలకు.. కేంద్రం నూతన సంవత్సర కానుక ప్రకటించింది. ఏటీఎంల నుంచి విత్‌ డ్రా పరిమితి 2,500 నుంచి 4,500కు పెంచారు. రేపటి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. అయితే.. వారానికి విత్‌ డ్రా చేసే 24 వేల పరిమితిలో ఎలాంటి మార్పు లేదని ఆర్బీఐ ప్రకటించింది. కాగా కరెన్సీ కష్టాల నడుమే ప్రజలు నూతన సంవత్సరానికి వెల్‌కమ్‌ చెప్పనున్నారు. ఇప్పటికే ఈ వేడుకలకు అవసరమయ్యే నగదు కోసం ప్రజలకు ఏటీఎంల వద్ద క్యూలు కడుతున్నారు. గంటలకొద్ది ఏటీఎంలు... బ్యాంక్‌ల వద్ద నిరీక్షిస్తున్నారు. అలాగే న్యూ ఇయర్‌ సెలబ్రెషన్స్‌పై కూడా కరెన్సీ ఎఫెక్ట్ పడింది. నగరంలో న్యూఇయర్‌ ఈవెంట్స్‌ సంఖ్య తగ్గింది. ఈ నేపథ్యంలో ఏటీఎంల నుంచి విత్‌ డ్రా పరిమితి 4,500కు పెంచడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ జాతిని ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

09:42 - December 31, 2016

ఉత్తరప్రదేశ్ : ములాయం ఇంట్లో ముసలం అంతకంతకు ముదురుతోంది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ అఖిలేశ్, పార్టీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్‌పై వేటు వేయడంతో.. యూపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. దీంతో తండ్రీకొడుకులు పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాసేపట్లో అనుచరులతో సీఎం అఖిలేష్‌ భేటీ అయి భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్నారు. లక్నోలోని సీఎం నివాసానికి క్యూ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు క్యూ కడుతున్నారు. మరోవైపు కొత్త సీఎంను ఎంపికచేసే పనిలో ఎస్పీ చీఫ్‌ ములాయం బిజీగా ఉన్నారు. ఉదయం 11.30 గం.లకు ములాయం కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ములాయం స్వగ్రామంలో భారీగా పోలీసుల మోహరించారు. అఖిలేష్‌ను బహిష్కరించడంతో పార్టీలో చీలిక దిశగా పరిణామాలు చేటుచేసుకున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....
 

అఖిలేష్ తో ఫోన్ లో మాట్లాడిన మమతా బెనర్జీ

ప.బెంగాల్ : అఖిలేష్ యాదవ్ తో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫోన్ లో మాట్లాడారు. అఖిలేష్ యాదవ్ కు అండగా ఉంటానని మమత హామీ ఇచ్చారు. 

 

ములాయంకు నా పూర్తి మద్దతు : అమర్ సింగ్

యూపీ : సమాజ్ వాదీ పార్టీలో విభేదాలపై అమర్ సింగ్ తొలిసారి స్పందించారు. ములాయం ఎంతో కష్టపడి పార్టీ స్థాపించారని తెలిపారు. పార్టీలో విభేదాలు రావడం బాధకలిగిస్తోందన్నారు. అఖిలేష్ యాదవ్ నేతాజీని అవమానించారని పేర్కొన్నారు. ములాయంకు తన పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. 

 

ఉత్తరప్రదేశ్ లో మారుతున్న రాజకీయాలు

లక్నో : ఉత్తరప్రదేశ్ లో రాజకీయాలు క్షణ క్షణం మారుతున్నాయి. తన వర్గం ఎమ్మెల్యేలతో వేరుకుంపటికి అఖిలేష్ సన్నాహాలు చేస్తున్నారు. కాసేపట్లో తన వర్గం నేతలతో అఖిలేష్ సమావేశం కానున్నారు. తన అనుయాయులతో 10.30 ములాయం భేటీ కానుంది. 

08:46 - December 31, 2016

పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలే ఇబ్బందులు పడుతున్నారని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో విశ్లేషకుడు వినయ్ కుమార్, టీకాంగ్రెస్ నేత రామచందర్ రెడ్డి, బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి, టీఆర్ ఎస్ నేత మన్నె గోవర్థన్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. టీఅసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరుపై మాట్లాడారు. అనుకున్న మేరకు సమావేశాలు జరగడం లేదని అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

08:32 - December 31, 2016

ఢిల్లీలో దట్టంగా పొగమంచు

ఢిల్లీ : హస్తినలో దట్టంగా పొగమంచు అలుముకుంది. 69 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 16 రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. 9 అంతర్జాతీయ, 3 దేశీయ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఒక అంతర్జాతీయ విమానం, ఒక దేశీయ విమానం రద్దు చేశారు. 

 

ఉ.11 గం.లకు టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం

హైదరాబాద్ : ఉదయం 11 గంటలకు టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరుగనుంది. పలు అంశాలపై చర్చించనున్నారు. 

08:12 - December 31, 2016

నేటితో ముగియనున్న రాష్ట్రపతి శీతాకాల విడిది

హైదరాబాద్ : నేటితో రాష్ట్రపతి శీతాకాల విడిది ముగియనుంది. ఉదయం 11 గంటలకు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు రాష్ట్రపతికి వీడ్కోలు పలుకనున్నారు. 

అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన క్యాబ్ డ్రైవర్ల సమ్మె

హైదరాబాద్ : క్యాబ్ డ్రైవర్ల సమ్మె అర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. 

07:50 - December 31, 2016
07:49 - December 31, 2016

హైదరాబాద్ : 2016 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ...కొత్త..కొత్త ఆశలతో 2017 సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ సిద్ధమయ్యారు. న్యూ ఇయర్ వేడుకలను చాలా గ్రౌండ్‌గా జరుపుకునేందుకు చిన్నా..పెద్ద అంతా ఏర్పాట్లలో తలమునకలయ్యారు. అయితే న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పోలీసులు అనేక భద్రత ఏర్పాట్లు చేపట్టారు. 
న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమైన ప్రజలు
హుషారెత్తించే గీతాలు.. మత్తెక్కించే పాటలు.. స్టార్‌ హోటళ్లలో పార్టీలు.. ఇలా నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు అందరూ సిద్ధమయ్యారు. రిసార్ట్‌లలో ఆనందంగా గడిపేందుకు ఇప్పటికే అందరూ ప్లాన్‌ చేసుకున్నారు. ఈరోజు సాయంత్రం నుంచి 2016 సంవత్సరానికి వీడ్కోలు పలికి నూతన సంవత్సరం 2017 కు స్వాగతం పలకనున్నారు.  
మద్యం షాపులు, బార్ల సమయం పొడగింపు
నూతన సంవత్సరం సందర్భంగా ఈరోజు, రేపు మద్యం దుకాణాలు, బార్ల సమయాన్ని ప్రభుత్వం పొడిగించింది.  బార్లలో మద్యం సరఫరాకు రాత్రి ఒంటిగంట వరకు, మద్యం దుకాణాల్లో రాత్రి 12గంటల వరకు విక్రయాలకు అనుమతించారు. హైదరాబాద్‌ నగరంలో నూతన సంవత్సర వేడుకలు శాంతియుత వాతావరణంలో నిర్వహణకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. మద్యం మత్తులో వాహనాలు నడపకుండా చూసేందుకు నగర వ్యాప్తంగా వాహన తనిఖీల నిర్వహణకు 50 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. 31వ తేదీ అర్ధరాత్రి 2గంటల వరకు నూతన సంవత్సర వేడుకలకు జరుపుకునేందుకు పోలీస్ శాఖ అనుమతిచ్చింది. మరోవైపు అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఈరోజు రాత్రి నగరంలోని అన్ని ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు. 
మాదకద్రవ్యాలు అనుమతిస్తే కఠిన చర్యలు 
కొత్త సంవత్సర వేడుకల్లో మాదక ద్రవ్యాలు వాడేందుకు అవకాశం ఉందని అంచనావేస్తున్న అధికారులు నిఘా పెంచారు. మాదక ద్రవ్యాలు లభ్యమైతే వేడుకల నిర్వాహకులనే బాధ్యులను చేస్తామని హెచ్చరించారు.  మద్యం సేవించిన మందుబాబులు వాహనాలు నడపకుండా క్యాబ్‌లు ఏర్పాటు చేసి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడితే భారీ జరిమానా, జైలుశిక్ష తప్పదంటున్నారు.  
న్యూ ఇయర్ వేడుకలపై నోట్లరద్దు ఎఫెక్ట్ 
ఈ ఏడాది స్టార్‌ హోటళ్లు న్యూఇయర్‌ వేడుకల టిక్కెట్‌ ధరలు సుమారు 2 నుంచి 3శాతం తగ్గించాయి. అహ్మదాబాద్‌, హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, దిల్లీ, ఇండోర్‌, జైపూర్‌, కోల్‌కతా, లక్నో, ముంబయి సహా దేశ వ్యాప్తంగా మెట్రో నగరాల్లోని పలు స్టార్‌ హోటళ్లలో అసోచామ్‌ సర్వే నిర్వహించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది స్టార్‌ హోటళ్లలో న్యూఇయర్‌ బుకింగ్స్‌ 5 నుంచి 7శాతం వరకు పడిపోయాయి. ధరలు తగ్గించినా.. వివిధరకాల డిస్కౌంట్లు ప్రకటించినా స్టార్‌ హోటళ్ల న్యూయర్‌ బుకింగ్స్‌ వెల వెలబోతున్నాయి. నోట్ల రద్దు కారణంగానే పలువురు న్యూఇయర్‌ వేడుకలను సాధారణంగా నిర్వహించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

 

07:43 - December 31, 2016

హైదరాబాద్ : తెలంగాణా అసెంబ్లీ  సమావేశాల్లో అధికార  టీఆర్‌ఎస్‌ ఆధిపత్యం కొనసాగిస్తోంది. తన వ్యూహాలను సమర్ధవంతంగా అమలు చేస్తోంది. సమస్య ఏదైనా ప్రతిపక్ష పార్టీలకు పగ్గాలు వేయడమే లక్ష్యంగా ముందుకుసాగుతోంది.  12 రోజుల సమావేశాల్లో   తొలుత ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా... చివరికి తమదే పైచేయి అన్న చందంగా గులాబీ పార్టీ వ్యవహరిస్తోంది.
విపక్షాలను ధీటుగా ఎదుర్కొంటున్న అధికారపక్షం
శాసనసభ సమావేశాలు రోజు రోజుకు రాజకీయంగా హీట్ పెంచుతున్నాయి.  సమావేశాల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలను  గులాబి బాస్ ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ముందుకు సాగుతున్నారు.  తన రాజకీయ చతురతతో  ప్రతిపక్ష పార్టీలకు బ్రేకులు వేస్తున్నారు. విపక్ష పార్టీలు లేవనెత్తే అంశాలపై పూర్తి స్థాయి కసరత్తు చేస్తూ....  ధీటుగా జవాబునిస్తూ విపక్ష నేతలను ఆత్మరక్షణలో వేసే ప్రయత్నం చేస్తోంది  అధికార టీఆర్‌ఎస్‌.
అధికారపార్టీని ఇరుకున పెట్టేందుకు విపక్షాల యత్నం
అధికార పార్టీని ఇరుకున  పెట్టేందుకు విపక్ష పార్టీలు  నోట్లరద్దు, రైతు సమస్యలు, నయీం ఎన్ కౌంటర్‌ అనంతర పరిణామాలపై  చర్చకు పట్టుబట్టాయి. సీఎం కేసీఆర్‌, మంత్రులను టార్గెట్‌ చేశాయి.  అయితే అధికారపార్టీ కూడా చర్చకు సై అనడంతో ప్రభుత్వాన్ని ఎలాగైనా  ఇరుకున పెట్టాలని విపక్షాలు భావించాయి.  ముఖ్యమంత్రి కెసిఆర్‌ కీలక అంశాలపై చర్చలో  పాల్గొంటూ విపక్ష పార్టీల నేతలను కట్టడి చేయడంలో సక్సెస్‌ అయ్యారనే చెప్పాలి.
భూసేకరణ బిల్లుపై చర్చలో ఇరకాటంలోపడ్డ అధికారపక్షం
ఇక  భూసేకరణకు బిల్లు సందర్భంగా జరిగిన చర్చలో అధికారపార్టీ ఇబ్బందికర పరిస్థితులనే ఎదుర్కొంది.  సభలో జరుగుతున్న పరిణామాలు  అందరినీ అయోమయంలో పడవేశాయి.  విపక్ష పార్టీలు భూసేకరణ చట్టంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా.....అధికార పార్టీ అవేమీ పట్టించుకోకుండా బిల్లు ఆమోదంపైనే దృష్టిపెట్టింది. అంతేకాదు.. అభివృద్ధి కోరుకుంటే బిల్లుకు మద్దతు ఇవ్వాలనే వాదనను తెరపైకి తెచ్చింది.  బిల్లుపై స్పష్టత ఇవ్వాలని విపక్ష పార్టీలు కోరినా.....ఆ స్థాయిలో అధికార పార్టీ   స్పష్టమైన సమాధానం ఇవ్వకుండానే బిల్లుకు ఆమోదం  తెలిపింది.  గులాబి పార్టీ వ్యవహరించిన తీరును నిరసిస్తూ విపక్ష పార్టీలు ఒక రోజు శాసనసభను బహిష్కరించే వరకు వెళ్లాయి.
జనవరి 11 వరకు సమావేశాలు పొడిగింపు
అసెంబ్లీ సమావేశాలను పొడగించాలనే డిమాండ్ ను విపక్ష పార్టీలు ముందు నుంచి చేస్తుండడంతో....అధికార పార్టీ అందుకు కూడా రెడీగా ఉన్నామన్న సంకేతాలు ఇచ్చింది.  జనవరి 11 వరకు సమావేశాలను నిర్వహించాలనే నిర్ణయానికి అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించాయి. రాబోయే రోజుల్లో ఫీజు రీఎంబర్స్ మెంట్, రైతు రుణమాఫి,దళితుల భూపంపిణీపై  అసెంబ్లీలో  రాజకీయ  దూమారం చెలరేగే అవకాశం కనిపిస్తోంది. 
 

07:38 - December 31, 2016

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో అసమ్మతి అనే అగ్నిపర్వతం పేలింది. ఎస్పీ అధినేత ములాయంసింగ్‌.. తన కుమారుడు, సీఎం అయిన అఖిలేష్‌యాదవ్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. సోదరుడు రాంగోపాల్‌ యాదవ్‌పైనా వేటువేశారు.  ఇద్దరినీ ఆరేళ్లపాటు.. పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు  ప్రకటించారు.  దీంతో ఎవరి సమీకరణాల్లో వారు మునిగిపోయారు. ఇవాళ  పార్టీ నేతలతో  ములాయంసింగ్‌ సమావేశం అవుతుండగా...  అటు అఖిలేష్‌ కూడా మద్దతునిచ్చే ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు. దీంతో యూపీ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.
సమాజ్‌వాదీ పార్టీలో ముసలం 
ఉత్తరప్రదేశ్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీలో ముసలం పుట్టింది.  రాజకీయ సమీకరణాలు గంటగంటకూ శరవేగంగా మారుతున్నాయి. మొన్నటి వరకు చిన్నపాటి విభేదాలతో ఉన్న ములాయం, అఖిలేష్‌ల గొడవ చినికి చినికి గాలివానైనట్టు చివరికి కన్నకొడుకునే పార్టీ నుంచి బహిష్కరించే వరకు పరిస్థితులు దారితీశాయి. అఖిలేష్‌ యాదవ్‌ సీఎం సీటులో ఉండగానే బహిష్కరణకు గురయ్యారు.  సీఎం అఖిలేష్‌యాదవ్‌తోపాటు, రాజ్యసభ సభ్యుడు రాంగోపాల్‌ యాదవ్‌ను పార్టీ నుంచి ములాయంసింగ్‌ బహిష్కరించారు. ఆరేళ్లపాటు ఇద్దరిపై వేటు వేశారు.
ములాయం ఆగ్రహం 
రాంగోపాల్‌ యాదవ్‌ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ములాయం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి నిర్మించుకున్న పార్టీని అఖిలేష్‌ భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. సమాజ్‌వాదీ పార్టీని కాపాడుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇద్దరినీ సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే సీఎం అభ్యర్ధిని ప్రకటిస్తామని ములాయం స్పష్టం చేశారు.
వివాదానికి ఆజ్యంపోసిన అభ్యర్ధుల జాబితా
సమాజ్‌వాదీ పార్టీలో తండ్రి, కొడుకుల మధ్య వార్‌ గత కొద్ది రోజులుగా కొనసాగుతోంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 325 మంది అభ్యర్థుల జాబితాను ములాయం సింగ్‌ రెండు రోజుల క్రితం విడుదల చేశారు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం అఖిలేశ్‌ సొంతంగా గురువారం రాత్రి మరో 235 మంది సభ్యుల జాబితాను విడుదల చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ములాయం షోకాజు నోటీసులు పంపించారు. మీడియా ఎదుట పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని సోదరుడు రాంగోపాల్‌ యాదవ్‌కు షోకాజ్‌ నోటీసులు పంపించారు.  ఆ వెంటనే ఇద్దరినీ  సస్పెండ్‌ చేస్తూ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. 
అఖిలేష్‌కు 100 మంది ఎమ్మెల్యేల మద్ధతు
బహిష్కరణ వేటువేయగానే ఆగ్రహానికిలోనైన అఖిలేష్‌ అభిమానులు, కార్యకర్తలు, మద్దతుదారులు ములాయంకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.  పార్టీలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అఖిలేష్‌ ఇంటికి క్యూ కట్టారు.  మరోవైపు అఖిలేష్‌ మద్దతుదారులంతా రాజీనామాల బాట పడుతున్నారు.  ఇప్పటికే ఎస్పీ అధికార ప్రతినిధి సిద్దిఖీ రాజీనామా చేశారు. 100 మంది ఎమ్మెల్యేలు అఖిలేష్‌ ఇంటికెళ్లి నేరుగా కలిశారు. పార్టీకి రాజీనామా చేయవద్దని వారు అఖిలేష్‌ను కోరారు.  సీఎం పదవికి తాను రాజీనామా చేసే ప్రసక్తేలేదని, సైకిల్‌ గుర్తు మనదేనంటూ అనుచరులతో చెప్పినట్టు తెలుస్తోంది. జనవరి 1న భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్టు రాంగోపాల్‌ ప్రకటించారు.
అఖిలేష్‌ యాదవ్‌ కొత్త పార్టీ పెడతారా?
జనవరి 1న నిర్వహించే సభ వెనుక ఉద్దేశ్యమేంటి, ఎందుకు సడన్‌గా సభ నిర్వహించాల్సి వస్తోందన్న విషయం ఎందుకున్నది మాత్రం  ఇప్పటికి సస్పెన్స్‌గానే ఉంది. బహిరంగసభలో కొత్తపార్టీ పెడుతున్నట్టు ప్రకటిస్తారా, లేక సమాజ్‌వాదీ పార్టీలోనే కొనసాగాలా అన్నది సభలో ప్రస్తావనకు వచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.  కొత్తపార్టీ పెడితే పరిస్థితి ఏంటీ,  మళ్లీ అధికారంలోకి వస్తామా అన్నదానిపై అనుచరులతో అఖిలేష్‌ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. శనివారం కూడా మద్దతునిచ్చే ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అవుతున్నారు. అయితే బహిష్కరణ వేటు తర్వాత అఖిలేష్‌ భవితవ్యం ఏమిటి, ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు శనివారం లక్నోలో పార్టీ సభ్యులతో సమావేశం ఏర్పాటుకు ములాయం సింగ్‌ పిలుపునిచ్చారు. ఇందులో అభ్యర్థుల తుది జాబితాను ఖరారు చేయనున్నారు.

07:31 - December 31, 2016

ఢిల్లీ : కరెన్సీ కోసం కష్టాలు పడుతున్న ప్రజలకు.. కేంద్రం నూతన సంవత్సర కానుక ప్రకటించింది. ఏటీఎంల నుంచి విత్‌ డ్రా పరిమితి 2,500 నుంచి 4,500కు పెంచింది. రేపటి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. అయితే.. వారానికి విత్‌ డ్రా చేసే 24 వేల పరిమితిలో ఎలాంటి మార్పు లేదని ఆర్బీఐ ప్రకటించింది. ఇవాళ జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ  ప్రసంగించనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

Don't Miss